Parabrahma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణ వేదాంతర్గత

11     పరబ్రహ్మోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। పరబ్రహ్మోపనిషది వేద్య ‘‘అఖండ సుఖాకృతీ’’!
పరివ్రాజక హృత్ - గేయం హరితః త్రైపదం భజే।।

అఖండ - ఆత్మసుఖాకృతీ స్వరూపము, పరివ్రాజక హృత్ గానము, అజ్ఞానమునకు సింహము వంటిది-అగు ఈ ‘‘పరబ్రహ్మోపనిషత్’’చే తెలియజేయ బడుచున్న ‘‘త్రైపద - ఆత్మతత్త్వము’’ భజించుచున్నాము. హరిత్ - దిక్కులన్నీ విస్తరించియున్న పరబ్రహ్మమునకు-నమస్కరిస్తున్నాము.

గురుబ్రహ్మా। గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ ‘‘పరబ్రహ్మ’’ తస్మై శ్రీగురవే నమః।।

ఓం
1. అథ హి ఏనం (అథ-హైనం) మహాశాలః
శౌనకో, అంగిరసం -
భగవంతం
పిప్పలాదం…,
విధివత్ ఉపసన్నః
పప్రచ్ఛ :-
ఒక సందర్భములో మహాదాశయుడు, మహావిశాలహృదయుడు, లోక శ్రేయోభిలాషి (గృత్స్యమదుని మనుమడు, శునకముని కుమారుడు అగు) -శౌనకుడు తీర్థయాత్రలకు బయల్వెడలారు.

దధీచికుమారుడు, పిప్పలవృక్షము క్రింద లోపాముద్ర కు జన్మించినవాడు, (వేదాంగములలో నిష్ణాతుడగుటచే) అంగీరసుడు, బ్రహ్మజ్ఞాని, భగవంతుడు - అగు పిప్పలాద మహర్షిని అనుకోకుండా విధివశాత్తు కలిసారు.

మహనీయులు మహాపురుష సంశ్రయమును వృధాచేసుకోరు కదా! అందుచేత శౌనకుడు పిప్పలాద మహర్షిని సమీపించినవారై, ఈ విధంగా పరిప్రశ్నంచసాగాడు.
దివ్యే బ్రహ్మపురే
కే సంప్రతిష్ఠితా భవంతి?
కథం సృజ్యంతే నిత్యాత్మనః। -
ఏష మహిమా విభజ్య? ఏష మహిమా
విభుః క ఏషః?
శౌనకుడు :
(1) దివ్యమగు ‘బ్రహ్మపురము’ నందు సుప్రతిష్ఠితులై ఉన్నవారు ఎవరు?
(2) జీవులంతా నిత్యము, ఏకము అగు ఆత్మ నుండి అనిత్యము, అనేకముగా ఎట్లా సృష్టియందు సృష్టించబడుచున్నారు? ఎట్లా ప్రవేశము పొందుచున్నారు?
(3) అట్టి సృష్టికి కారణమగు బ్రహ్మపురము యొక్క మహిమ ఎట్టిది? ఆ మహిమకు విభుడు ఎవరు? ఆ మహిమ ఎవరికి చెందినది?
దయతో ఈ విశేషాలు వివరించండి.
తస్మై సహోవాచ (పిప్పలాదౌ వాచ):
ఏతత్ సత్యం యత్ ప్ర-బ్రవీమి,
బ్రహ్మవిద్యాం వరిష్ఠామ్।
దేవేభ్యః ప్రాణేభ్యః
పరంబ్రహ్మ పురే విరజన్
నిష్కళగ్ం శుభ్రమ్ అక్షరం
విశోకం విభాతి।।
పిప్పలాదుడు :
వరిష్ఠము (పరాకాష్ఠ సత్యము, శ్రేష్ఠాతిశ్రేష్ఠము) అగు బ్రహ్మ విద్య గురించియే నీవు అడుగుచున్నావని నేను అనుకుంటున్నాను.
సమస్తమునకు ఆవల పరబ్రహ్మము విరాజమానమై ఉన్నది. అట్టి బ్రహ్మపురము దేవతలను, ప్రాణశక్తిని కూడా ప్రకాశింపజేస్తోంది. అదియే శ్రేష్ఠము. పరాకాష్ఠ కూడా.
అట్టి ‘బ్రహ్మపట్టణము’ అనే బ్రహ్మస్థానము - నిష్కళమై (విభాగములేనట్టిదై), గుణములచే పరిమితము కానిదై, శుభ్రమై (నిర్దోషమై), మార్పు చేర్పులు పొందక, అక్షరమై, విశోకమై (వగుచుటయే లేనిదై), ఆనందమయమై విరాజిల్లుచున్నది.
2. స నియచ్ఛతి మధుకరః
‘శ్వే’వ వికర్మకః,
అకర్మాస్వాపీవ స్థితః। -
కర్మకరః।
ఆ బ్రహ్మపురమును పాలించు పరబ్రహ్మమే-ఈ సమస్త జగత్ వ్యవహారమునకు కర్త.
- తేనెటీగవలె తన మాధుర్యముతో ఈఈ జగత్తులను పరబ్రహ్మ పురుషుడే నిర్మిస్తూ ఉన్నారు. ఆయనయే సమస్త కర్మలకు అధికారి. నియామకుడు. (కుక్కవలె) కాపలాకాయుచూ, కర్మరహితుడై కూడా కర్మలన్నీ పర్యవేక్షించుచు, ఈ సమస్తము నిర్వర్తించుచున్నారు.
సమస్త సృష్టి చమత్కారము నిర్వర్తిస్తూ కూడా ఆయన కర్మరహితులు. (నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకామ్।) నిద్రాముద్ర ధరించి ఉండియే జగత్తును పర్యవేక్షిస్తూ రక్షిస్తూ ఉంటారు.
కర్మకవత్ ఫలమ్ అనుభవతి।
కర్ష మర్శ జ్ఞాత్వా కర్మ కరోతి।
కర్మ మర్మ జ్ఞాత్వా, కర్మ కుర్యాత్।
రైతువలె, కర్మలన్నీ నిర్వర్తిస్తూ కర్మఫలములను అనుభవించునది కూడా తానే అయి ఉంటారు. తత్త్వజ్ఞులు (కర్మ రహస్యముతెలిసి, కర్మ-కర్మఫలములు మొదలే లేవని తెలిసియే) ‘సృష్టి’ అనే లీలా-వినోద- క్రీడను దర్శిస్తూ, వారు కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు.
కలలో జరిగే కర్మ సంఘటనలకు కర్మ-కర్మఫల యుక్తాయుక్తము (Logic) ఏముంటుంది? జాగ్రత్ కూడా స్వప్నము వంటిదేనని కర్మ - మర్మము తెలిసియే, యోగులు కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. కర్మ-మర్మము ఎరిగియే మీ అందరిచే కర్మలు నిర్వర్తించబడు గాక!
క్షోజాలం విక్షిపేత్ ఏకో।
నైనమ్ అపకర్షతి। అపకర్షతి।
(నైనమ్ అపకర్షత్యపకర్షతి)
ప్రాణ దేవతా చత్వారః।
తాః సర్వా నాడ్యః।
ఏకమే అయి ఉన్న ఆత్మయే అనేక రకములుగా అనేక జీవులుగా, అనేకములతో కూడిన జగత్తుగా క్షోజాలమై - సంప్రదర్శనమౌతోంది.
చేపలు పట్టే వలకు ఎటువంటి ఆకర్షణలు, వికర్షణలు ఉండవు కదా!
అట్లాగే, ఆత్మ దేనినీ ఆకర్షించుటలేదు. తీసుకొనిపోవటము లేదు. ఎవ్వడూ ఆత్మకు దూరమవటములేదు. ఆత్మను మరొకచోటికి లాగటము లేదు.
ప్రాణ దేవతలు నలుగురు. (ముఖ్యప్రాణ-ఆపాన-వ్యాన ఉదానములు) వారే ఇడ పింగళ సుషుమ్న-ఇత్యాది నాడి - ఉపనాడుల ద్వారా దేహ కార్యక్రమములు నిర్వర్తిస్తున్నారు.
సుషుప్తః శ్యేన ఆకాశవత్
యథా శ్యేనః ‘ఖమ్’ ఆశ్రిత్య,
యాతి స్వమ్ ఆలయం కులాయమ్।
ఏవగ్ం సుషుప్తం బ్రూత, అయన్చ పరశ్చ।
ఈ జీవుడు సుషుప్తి నుండి జాగ్రత్‌స్వప్నములకు వెళ్ళి రావటము జరుగుతూ ఉన్నది. ఒక డేగ తిరిగి తిరిగి వచ్చి తన గూడులో ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఈ జీవుడు జాగ్రత్ స్వప్నములలో ప్రవేశించి, నామరూపాత్మకమైన (భౌతికమైన) విశేషాలన్నీ ఆస్వాదించి- తిరిగి సుషుప్తి అనే గూటికి చేరుచున్నాడు. ఇతి భ్రూతం. ఈవిధమైన రాకపోకలు అనుభవజ్ఞుల గమనిక. స్వానుభవము.
స సర్వత్ర హిరణ్మయే
పరేకోశే అమృతో హి।
ఏష నాడీ త్రయగ్ం సన్చరతి। (సఞ్చరతి)।
తస్య త్రిపాదం బ్రహ్మ।
ఆత్మభగవానుడు అన్నమయ-ప్రాణమయ-మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయ పంచకోశములకు ఆవల పరస్వరూపుడై, అమృతస్వరూపుడై సర్వత్రా అన్నివైపులా అమృతధారలు కురిపిస్తూ ఉన్నారు.
ఆయనయే ఇడ-పింగళ-సుషుమ్న త్రినాడులలో సంచరించే కుండలినీశక్తి స్వరూపుడు.
ఆ పరమపురుషుడే ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్త’’ (‘‘భూ-భువర్-సువర్, ‘‘జీవాత్మ-ఈశ్వర-పరమాత్మ’’) త్రిపాదములు ధరిస్తున్న బ్రహ్మము.
ఏషా త్రేష్య తతో అనుతిష్ఠతి।
అన్యత్ర బ్రూతా-యన్చ పరన్చ।
సర్వత్ర హిరణ్మయే పరే కోశే।
ఇక్కడి త్రి గుణములు, త్రి లోకములు, త్రి అవస్థలుగా అవతిష్ఠము (Established) అయి ఉన్నది - ఆ పరబ్రహ్మమూర్తియందే. ఆయనయే అయము (ఇహము), పరము (Here and there) కూడా అయి, సమస్తము తానేగా అగుచూ, సమస్తమునకు వేరై ఉన్నారు కూడా. ఆయన కిరణములే (చైతన్యమే) పంచ కోశములందు, పంచ ప్రాణ-ఉపప్రాణములందు, పంచేంద్రియములందు చేతనస్వరూపమై, అన్నిటినీ సచేతనము చేస్తూ వెలుగొందుచున్నాయి.
యథైష దేవదత్తో యష్ట్యాచ
తాడ్యమానో నైవ ఇత్యేవమ్
ఇష్టా పూర్త కర్మ
శుభ - అశుభైః న లిప్యతే।
దేవదత్తుడు (జీవుడు) - శుభకర్మలచే శుభము, అశుభకర్మలచే అశుభములు పొందుచూ ఉంటాడు. ఇష్టములచేతను (యజ్ఞ, ఉపనయన, ఆతిధ్యము, మొదలైన విహిత కార్యములచేతను), పూర్తములచేతను (తటాకములు మొదలైనవి త్రవ్వించటము, గుడి కట్టించటము, అన్న-వస్త్రదానములు చేతను) శుభ-అశుభ ఫలములు అనుభవిస్తూ ఉంటాడు.
పరమాత్మయో? శుభాశుభ కర్మలకు నిమిత్తమై ఉండరు. కర్మల దోషములు పొందరు. సమస్త జన్మ-కర్మలకు ‘సాక్షి’ అయి ఉంటారు.

యథా కుమారకో
నిష్కామ ఆనందమ్ అభియాతి,
తథైష దేవః (తథా ఏషత్ ఏవ)
స్వప్న ఆనందం అభియాతి।

ఒక చిన్నపిల్లవాడు ఏవిధంగా నిష్కాముడై (జగత్తులో ఏదో పొందాలనే ఆశ-దురాశలు లేకుండా) నిష్కామానందము అనుభవిస్తూ ఉంటాడో, ఆ విధంగా ఈ జీవుడు స్వప్నములో - బాహ్యవస్తువులేవీ పొందకుండానే, ఆనందము మొదలైనవి పొందుచూ ఉంటాడు.

[ ఆ విధంగా ముముక్షువు జాగ్రత్‌లో కూడా నిష్కారణానందము (ఆత్మ జ్ఞానముచే) పొందు అభ్యాసము కలిగి ఉంటాడు. ఆత్మజ్ఞానముచే శుభ-అశుభ కర్మల, కర్మఫలముల పరిధులను దాటివేసినవాడై ఉంటాడు. ]
3. వేద ఏవం పరంజ్యోతిః।
జ్యోతిషామా జ్యోతిః (జ్యోతిషామపి తత్ జ్యోతిః)
ఆనంద యత్యేవమేవ।
తత్పరం యచ్చిత్తం
పరమాత్మానమ్ ఆనందయతి।
ఆత్మ గురించి ఎరిగినవాడు ఆత్మను ‘‘జ్యోతికే జ్యోతి’’గా అగుచు, సమస్త జీవులను ఆత్మజ్యోతిగా దర్శిస్తూ, పరమానంద జ్యోతిస్వరూపులై వెలుగొందుచున్నారు.
ఎవరి చిత్తము (పరమగు) పరమాత్మయందు సంలగ్నము అవుతుందో అట్టివాడు సమస్తము తత్పరానందముగా దర్శిస్తూ ఆత్మానందుడగు చున్నాడు. ఈ జగత్తతంతా ఆతనికి ఆత్మానంద-వైభవానుభవమే। (ఆతనిపట్ల ఇక బంధ మోక్షముల ప్రసక్తి ఎక్కడిది?).
శుభ్రవర్ణమ్ ఆజాయత ఈశ్వరాత్।
భూయః తేనైవ మార్గేణ
స్వప్న స్థానం నిగచ్ఛతి।
ఈశ్వరుని నుండి శుభ్రవర్ణమై జనించిన ఈ జీవుడు త్రిగుణములలో ప్రవేశించి తిరిగి అదే మార్గములో (తమో-రజో-సత్త్వ గుణములనుండి) స్వప్నస్థానమును పొందుచున్నాడు. స్వప్న దృశ్యమును తనకు తానే కల్పించుకొని ఆ స్వప్నములో సంచారములు చేస్తూ స్వప్నానందము (గుణయుతుడై) ఆస్వాదిస్తున్నాడు.
జలూకా భావవత్ యథా కామమ్
ఆజాయత ఈశ్వరాత్,
తావతా ఆత్మానమ్ ఆనందయతి।
ఒక జలగ పిపాసి అయి జంతువు శరీరమును గట్టిగా పట్టుకొనుతీరుగా ఈ జీవుడు సర్వాత్మకుడగు ఈశ్వరుని దృఢముగా ఆశ్రయించినప్పుడు ఆత్మతత్త్వము గ్రహించి ఆత్మానందుడు కాగలడు.
పరసంధి యత్ అపరసంధీతి,
తత్పరం నాపరం, (నాపరం) త్యజతి।
తథైవ కపాల-అష్టకగ్ం సంధాయ
య ఏష స్తన ఇవ ఆలమ్బతే। (ఇవాలమ్బతే)।
ఏది పరము (ఆవల గల పరమాత్మకు) సంధియో, ఏది అపరమునకు సంధియో అట్టి సర్వాత్మకుడు - పర, అపరములు (ఉభయము) తనవై ఉంటాడు. ఉభయము త్యజించడు.

అపరతత్త్వమే కపాలాష్టకమును (అష్టవిధ ప్రకృతిని పంచభూతములు, ప్రాణ, మనో చిత్తములను) సంధింపజేయుచు అవి స్తనములవలె ఆత్మగా తానే వాటికి ఆలంబనము అయి ఉంటున్నారు.

పర-అపరములు ఆతనికి రెండు స్తనములు (ఎదురు రొమ్ములు) వంటివి.
స ఇంద్ర యోనిః (సేంద్రయోనిః)।
స ఏవ యోనిః ఇతి అత్ర జాగ్రతి।
శుభ - అశుభ అతిరిక్తః
శుభ-అశుభైరపి కర్మభిః న లిప్యతే।।
అట్టి పరమాత్మయే త్రిలోకాధిపతి అగు ఇంద్రునికి (పంచేంద్రియతత్త్వముల విశ్వాధినేతకు) కూడా యోని (జనన) స్థానము.
ఈ సమస్త జాగ్రత్ జగత్తుకు కూడా జననస్థానము అట్టి పరతత్త్వమే। ఆ పరమాత్మయే। ఆ కేవలమగు పరస్వరూపమే।
అట్టి పరమాత్మ స్థానము శుభ అశుభములకు ఆవలిదై, శుభ - అశుభకర్మలచే స్పృశించబడనిదై ఉన్నది. కర్మలదోషములు ఆత్మకు అంటజాలవు.
య ఏష దేవో అన్యదేవస్య
సంప్రసాదో అంతర్యామిః।
అసంగ చిద్రూపః పురుషః।
(బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే సంప్రసాదము (Root material) అయినట్లుగానే), పరమాత్మయే సమస్త దేవతలయొక్క సంప్రసాదుడు. సమస్త జీవులకు అంతర్యామి (The Inner Recess of self of all). అట్టి ఆత్మపురుషుడు బాహ్య - అంతరంగములలో ఏ ఒక్క విశేషమునకు సంగుడు (Attached and bound) కాడు. సమస్తము ఆ పరమాత్మయొక్క చిద్రూప పురుషకారమే।
ప్రణవహగ్ంసః పరంబ్రహ్మ।
న ప్రాణహగ్ంసః।
ప్రణవో జీవః।
ఆద్యా దేవతా నివేదయతి।
య ఏవం వేద,
తత్ కథం నివేదయతే?
జీవస్య బ్రహ్మత్వం ఆపాదయతి।
ప్రణవస్వరూపుడు (ఓంకారస్వరూపుడు) అగు పరబ్రహ్మము సర్వ దేహములలో ప్రాణేశ్వరుడు. అట్టి ప్రణవమే ఈ జీవుడు కూడా. ఆయన దేవతలకే ఆదిస్వరూపుడు, దేవాది దేవుడు. అట్టి ఆత్మభగవానుని తెలుసుకొన్నవాడు ఏ బాహ్య (అన్య) దేవతకు సమర్పితుడు అవుతాడు? అన్యోపాసనామాత్రుడై ఉండడు. సర్వతత్త్వ స్వరూపుడగు పరమాత్మకే నివేదితుడు అవుతాడు. అనన్యోపాసకుడు అవుతాడు.

‘‘ఈ జీవుడు - బ్రహ్మమే’’ (జీవోబ్రహ్మేతినాపరః) అని సిద్ధాంతీకరించ బడుతోంది. బ్రహ్మముపై ‘జీవుడు’ అనునది ఆపాదితము మాత్రమే.
4. సత్త్వమ్ అథాస్య
పురుషస్య అంతః - శిఖ
ఉపవీతత్వం అహ్రాహ్మణస్య!
ముముక్షోః అంతశ్శిఖ-ఉపవీత ధారణమ్।
బ్రహ్మమును ఉపాసన, అధ్యయనము, సర్వత్రా సందర్శనము చేయువాడే- బ్రాహ్మణుడు. (అంతేగాని కుల- జన్మమాత్రంగా ‘బ్రాహ్మణ’ శబ్దార్థము పరిమితము కాదు).
ఈ జీవునికి సత్త్వమే (పరబ్రహ్మమే) అంతఃశిఖ. బాహ్యమైన శిఖ (పిలక) సత్త్వము కాదు (సాత్వికత కాదు).
బ్రహ్మము గురించి జ్ఞాన, ఉపాసన, భావనలే ఉపవీతము. బ్రహ్మమే (సమస్త జీవుల స్వస్వరూపమే అయినట్టి బ్రాహ్మీతత్త్వమే) బ్రాహ్మణునకు ఉపవీతము (లేక) బ్రహ్మసూత్రము.
‘‘జీవన్ముక్తి, జన్మరాహిత్యము, ముక్తి, మోక్షము’’ - అనునది ఆశయముగా కలిగియున్న ముముక్షుత్వమే అంతఃశిఖ, ఉపవీతధారణము కూడా ముముక్షువు అట్టి అంతఃశిఖోపధారణ చేయటమే ముఖ్యము.
బహిర్లక్ష్యమాణ
శిఖా-యజ్ఞోపవీత ధారణం
కర్మిణో గృహస్థస్య।
కర్మిష్ఠుడైన గృహస్తుడు బాహ్య లక్షణములగు యజ్ఞోపవీతము, శిఖ ధరించటము కర్మవిధి మాత్రమే. వాటియొక్క అంతరార్థము మాత్రము బ్రహ్మీదృష్టి, సత్వగుణమే అని గ్రహించి, అసలైన శిఖ-యజ్ఞోపవీతములను- ముముక్షువులు ఎరిగి ఉండెదరు గాక!
అంతరుపవీత లక్షణం తు
బహిః తంతువత్ అవ్యక్తమ్
అంతస్తత్వమేళనమ్।
‘‘అంతర్-ఉపవీతము సమస్తము ఏకము - అఖండము అగు బ్రహ్మమే’’ - అనే బ్రాహ్మీ దృష్టి పెంపొందే ఉపాసన - (బాహ్యమున ధరించే ఉపవీతము వలె) బయటకు కనిపించేది కాదు. అది అంతరమున ఆత్మజ్ఞానము యొక్క ఉపాసన - అభ్యాసమునకు సంబంధించినది. భౌతికమైన ఉపవీతము వలె వ్యక్తీకరణమయ్యేది కాదు. (భౌతిక ఉపవీతము ‘సంజ్ఞ’ వంటిది మాత్రమే).
అనగా ఉపవీతము అంతఃకరణమునకు సంబంధించినదేగాని, బయటకు భౌతికమైన (లేక) శారీరకమైన ఉపవీతము చేత వ్యక్తీకరించబడునది కాదు.
న సత్। న అసత్। న సదసత్-
భిన్న-అభిన్నం-న చ। ఉభయమ్ (q)
అట్టి బ్రాహ్మీభావన, (బ్రహ్మోపాసన) లేక పరబ్రహ్మతత్త్వము (అంతర్- ఉపవీతము) ఎటువంటిది?

బ్రహ్మము సత్తు (భౌతికంగా ఉనికి కలిగినది) కాదు. అసత్తు (లేనిది) కాదు. అది కొంత సత్, కొంత అసత్ కూడా కాదు. భిన్నము, అభిన్నము, ఉభయము కూడా కాదు. ఆత్మకు అన్యమైనదేదీ అందుకు గుర్తువంటిది కాదు. (స్వస్వరూపము గురించిన నిశ్చలానుభవమే అది).
న స భాగం। న నిర్భాగం।
న చా2పి ఉభయరూపకమ్।
అట్టి ‘‘బ్రహ్మము’’ అనబడే ‘‘పరతత్త్వము’’ మరొక దేనిలోనో ఒకానొక భాగము కానేకాదు. తాను భాగ - విభాగములుగా (Partitioned) అగుచున్నదా? అవదు. సమస్తము అద్దాని స్వరూపమే కాబట్టి నిర్భాగము కూడా కాదు. (ఏకము, అనంతము, సమస్తము అయి ఉన్నట్టిది).
బ్రహ్మాత్మైకత్వ (బ్రహ్మాత్మా-ఏకత్వ) విజ్ఞానాత్
హేయం మిధ్యాత్వకారణాత్, ఇతి।
‘‘అటు తాను భాగము, ఇటు తనలో భాగము’’ అను ఉభయము కూడా కాదు.
ఇక్కడ కనిపించే అనేకత్వమంతా కలలోని దృశ్యమువలె మిధ్య (Illusion) మాత్రమే. కాబట్టి బ్రహ్మము సర్వదా ఏకమే గాని అనేకముగా అగుటలేదు - అనునదే బ్రాహ్మీతత్త్వము (లేక) బ్రహ్మవిద్య. అందుచేత బ్రహ్మమునకు వేరుగా కనిపించే ‘అన్యము’ - ‘మిధ్య’యే కారణముగా కలిగి ఉన్నది.
పన్చపాద్ బ్రహ్మణో న కించన।
అట్టి ఆత్మ యొక్క పంచపాదములలో ఐదవది తురీయాతీతము. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములగు నాలుగింటికి ఆవలగల తురీయాతీత స్వరూపమునకు మరొకటి అన్వయము అనునదే లేదు.
చతుష్పాద్ అంతర్వర్తినో,
అంతర్జీవ బ్రహ్మణః చత్వారిస్థానాని।
నాభి హృదయ కంఠ మూర్థసు।
అంతర్వర్తి అగు ఆత్మకు నాలుగు పాదములు, (లేక) బ్రహ్మము యొక్క శరీర-అంతర్జీవన తత్త్వమునకు (ఉపాసనకై) నాలుగు ముఖ్య స్థానములు
(1) నాభి (2) హృదయము, (3) కంఠము, (4) మూర్థము.
జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయావస్థాః
ఆహవనీయ గార్హపత్య దక్షిణ సభ్య అగ్నిష।।
★ అవస్థలు 4 :- (1) జాగ్రత్ (2) స్వప్నము, (3) సుషుప్తి (4) తురీయము.
★ ముఖ్యమైన అగ్నులు (4) :- (1) ఆహవనీయాగ్ని (2) గార్హపత్యాగ్ని (3) దక్షిణాగ్ని (4) సభ్యాగ్ని
జాగరతే బ్రహ్మా।
స్వప్నే - విష్ణుః।
సుషుప్తౌ - రుద్రః।
తురీయమ్ - అక్షరం చిన్మయమ్।
అధిదేవతలు
(1) జాగ్రత్‌కు - బ్రహ్మదేవుడు. (2) స్వప్నమునకు - విష్ణుభగవానుడు.
(3) సుషుప్తికి - రుద్రభగవానుడు.
(4) తురీయమునకు - అక్షర - చిన్మయమగు ఆత్మపురుషుడు.
తస్మాత్ చతురవస్థా
చతురంగుల వేష్టనమ్ ఇవ।
షణ్ణవతి (షట్ నవతి–96)
తత్త్వాని తంతువత్
విభజ్య తదా హితమ్,
ఈ విధంగా చతుర్ (4) అవస్థలు నాలుగు వ్రేళ్ళను చుట్టి ఉన్నట్లుగా ఉంటున్నాయి. (మూడు పేటలు = జాగ్రత్, స్వప్న, సుషుప్తులు)
‘‘96’’ తత్త్వములు 96 తంతువులవలె (96 ధారములవలె) విభజనము కలిగినవై నాలుగు వ్రేళ్లను చుట్టుకొని ఉంటున్నాయి. విభజించి కలుపబడినవై ఉంటున్నాయి.
త్రిగుణీకృత్య ద్వాత్రింశత్ (32) తత్త్వ నిష్కర్షమ్
ఆపాద్య, జ్ఞాన పూతం త్రిగుణ స్వరూపం।।
32 తత్త్వములు - మూడు పేటల గొలుసువలె (ఆత్మచే) ధరించబడినవై ఉంటున్నాయి. (కొందరు బ్రహ్మమును ‘32’ తత్త్వములుగా విభాగిస్తున్నారు)
త్రిగుణములు = సత్త్వ రజో తమో ‘‘త్రిగుణములు’’ - జ్ఞానము (ఎరుక) అను దానిచే అంతటా పూతపూయబడి ప్రదర్శనమగుచున్నాయి. జ్ఞానము త్రిగుణములచే పూత పూయబడి ఉంటోంది.
5. త్రిమూర్తిత్వం పృథక్ విజ్ఞాయ,
నవ బ్రహ్మాఖ్య, నవగుణోపేతమ్ జ్ఞాత్వా,
నవమానమితః త్రిః,
పునః త్రిగుణీకృత్య,
బ్రహ్మము గురించిన ఉపాసన అధ్యయనము
బ్రహ్మసూత్రము యజ్ఞోపవీతము (ధారణ విశేషములు)

సృష్టియొక్క (దృశ్యముయొక్క) (1) సృష్టి (2) స్థితింపబడటము (3) లయించటము అను బ్రహ్మ - విష్ణు - రుద్ర అధిదేవతా కల్పనా కార్యక్రమ చమత్కారమును ముందుగా గమనించి తెలుసుకొందురు గాక!

సృష్టి కార్యమునకు కారణభూతులగు నవబ్రహ్మ ప్రసిద్ధులు, నవ ప్రజాపతులు (మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుల గురించి), నవ ఆత్మగుణములు అగు జ్ఞాన, సుఖ, దుఃఖ, ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ సంస్కారముల గురించి- విజ్ఞాయ- తెలుసుకోబడుగాక। (సత్వ-రజ-తమ) 9 తత్త్వములను మరల త్రిగుణీకృతము (9x3=27) చేసి, ముప్పేటగా చేసి ధరించుదురు గాక! ఇదియే యజ్ఞసూత్ర ధారణము.

[నవబ్రహ్మలు - (పౌరాణికంగా)
నవ(9) బ్రహ్మమానస పుత్రులు
సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, ఋభుష, నారదుడు, హంసుడు, అరుణి, యతి ]

సూర్య ఇన్దు అగ్ని కళా స్వరూపత్వేన
ఏకీకృత్య
ఆద్యంతర ఏకత్వమ్-అపి।
మధ్యే త్రిరావృత్య,
సూర్యచంద్ర అగ్నుల కళారూపత్వమును (పింగళ, ఇడ, సుషుమ్నలను) ఏకీకృతము (United) చేసి యోగులు ధారణ చేయుచున్నారు.
(ఆది - అంతముల ఏకత్వమును ధ్యానిస్తూ, - మధ్యగా త్రిరావృత్యము పింగళ, ఇడ, సుషుప్నులయందు నిర్వర్తించి ఇడ-పింగళలతో కుండలినీశక్తిని సుషుమ్ననాడిలో ప్రవేశింపజేయుచున్నారు).
బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వమ్
అనుసంధాయ
ఆద్యంతమ్ ఏకీకృత్య,
చిద్గ్రంథ - అద్వైత గ్రంథిం కృత్వా,
సృష్టి స్థితి లయ తత్త్వ స్వరూపులగు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరత్వమును అనుసంధానము చేసి,
సృష్టియొక్క ఆది - అంతములను, ఏకీకృతము చేసి వేయాలి. మొదలు చివర కలిపివేయాలి.
ఆ మూడిటిని ఒక స్థానమునకు తెచ్చి చిద్గంధములను (సృష్టి-స్థితి- లయ-ప్రజ్ఞలను) అద్వైత- (బ్రహ్మమునకు వేరుకాదు అను) స్థితి - అవగాహనలకు తెచ్చి వేయాలి. అద్వైత గ్రంథిగా చేయాలి. (ఇదియే యజ్ఞోపవీతము యొక్క ‘బ్రహ్మముడి’).
నాభ్యాది బ్రహ్మ బిల
ప్రమాణం పృథక్ పృథక్
సప్తవిగ్ంశతి (27)
తత్త్వ సంబంధం, త్రిగుణోపేతం
త్రిమూర్తి లక్షణ లక్షితమపి
ఏకత్వం ఆపాద్య,
నాభి (బొడ్డు) నుండి - బ్రహ్మబలము (శిరస్సుయొక్క ఉపరిస్థానమునగల బ్రహ్మరంధ్రము) వరకుగల వేరువేరైన ‘‘27’’ తత్త్వముల సంబంధమును త్రిగుణోపేతము (సత్త్వ రజో తమో త్రిగుణోపేతము - మూడు ప్రోగులు) చేసి త్రిగుణోపేతమైన త్రిమూర్తుల లక్షణములను (సత్త్వరజోతమోములను), సృష్టి-స్థితి-లయములను) వాటివాటి లక్షితములను (బ్రహ్మమునందు) ఆపాదించాలి (Attributions on Brahmam). బ్రహ్మమునకు అద్వితీయముగా దర్శించెదరు గాక।
వామాగ్ంసాది దక్షిణ కట్యంతం విభావ్య
ఆద్యంత గ్రహసమ్మేళనమ్ ఏకం జ్ఞాత్వా,
వామ (ఎడమ) నుండి దక్షిణ (కుడి) కటి (మొల) వరకు బ్రహ్మసూత్రము (లేక) యజ్ఞోపవీతమును భావనచేసి (బ్రహ్మముడి నుండి బ్రహ్మముడివరకు) ఆద్యంతము గ్రహసమ్మేళనమును (సూర్య-చంద్ర- అంగారక- బుధ-గురు-శుక్ర-శని-రాహు-కేతువులను) ఏకమగు బ్రహ్మముగా తెలుసుకొంటూ (అనుకుంటూ) ఉండెదరు గాక.
మూలమ్ ఏకగ్ం సత్యం మృణ్మయం విజ్ఞాతగ్ంస్య-

యత్ వాచా2రమ్భణం,
వికారో నామధేయం
‘మృత్తిక’ - ఇత్యేవ సత్యం।

మట్టి బొమ్మలో మూలమగు మట్టియే (మృణ్మయము) సత్యము. ‘మృత్తికేవ సత్యమ్’. ఆకారము, దానికి పెట్టిన పేరు సత్యము కాదు. అట్లాగే బ్రహ్మమే సత్యము. (మట్టిబొమ్మలో ‘బొమ్మ’ అను విభాగము వాచారంభము. మట్టి యొక్క ఒక ఆకారమునకు (వికారమునకు) పెట్టిన పేరువలె), ‘‘ఈ నామ-రూపాత్మకమైనదంతా బ్రహ్మమే’’.
బ్రహ్మమే సత్యమై తదితరమైనదంతా కూడా - వికారోనామధేయము-అని మననము చేస్తూ ఉండాలి. బంగారపు ఉంగరములో బంగారము సత్యమయినట్లు ‘‘జీవుడు- అని కనబడుచున్న దానిలో బ్రహ్మమే సత్యము’’ అని గమనిస్తూ ఉండాలి.
‘‘హంస’’ ఇతి వర్ణద్వయేన
అంతః శిఖ-ఉపవీతిత్వం నిశ్చిత్య,
బ్రాహ్మణత్వం బ్రహ్మధ్యాన అర్హత్వం యతిత్వమ్।
అలక్షిత అంతః శిఖ-ఉపవీత్‌త్వమ్
ఏవం బహిర్లక్షిత (బహిః లక్షిత)
కర్మశిఖా జ్ఞానోపవీతం -
హంసో = అహమ్ + సః-లో - అహమ్ ఆభరణము వంటిది. ‘‘సో’’ బంగారము వంటిది. హంసో (సో2హం)లో ‘‘సః’’. ‘‘పరమాత్మయే జీవాత్మ-జగత్తుల రూపము’’ అనునదే అంతఃశిఖి ఉపవీతములు. యతి బ్రాహ్మమును ధారణ చేసి, ‘బ్రాహ్మణుడు’గా అగుచున్నాడు.

బ్రహ్మము యొక్క ధ్యానమే బ్రాహ్మణత్వము. బ్రహ్మభావనయొక్క సిద్ధిచే ‘యతి’ అగుచున్నాడు.
బాహ్యమున ధరించి శిఖ - ఉపవీతములు (జందెము/జందియము) కర్మరూపంగా ధరిస్తూ, భౌతికంగా ధరిస్తూనే - భౌతికంగా లక్షింపక, జ్ఞాన యజ్ఞోపవీతమే లక్ష్యము (Objective) గా కలిగి ఉండాలి.

‘ఆత్మ’గా అయి ఉన్న నేను - ఈ సమస్తమును ‘ధారణ’గా కలిగి ఉంటున్నాను-అనునదే నిజమైన ‘‘యజ్ఞోపవీతధారణ’’.
గృహస్థస్య అభాస బ్రాహ్మణత్వస్య
కేశ సమూహ శిఖా
ప్రత్యక్ష కార్పాస తంతు కృత ఉపవీతత్వం।
(కార్పస=నూలు/ప్రత్తి)।
ఒక గృహస్థుడు ధరించే ప్రత్తితో చేసిన ఉపవీతము (జందియము) కేశములచే తీర్చిదిద్దుకొనే శిఖాసమూహముపట్ల (‘‘ఈ దృశ్యమును బ్రహ్మముగా ధారణ చేయటము") - అనే బ్రహ్మ త్రిసూత్ర దృష్టి కలిగి ఉండాలి. లేకుంటే అది అభాసమాత్రమే .
గృహస్థుడై, అభాసబ్రాహ్మణత్వము వహించువానికి భౌతికమైన శిఖ నూలుప్రోగు ఉపవీతమే పవిత్రము అని అనిపిస్తోంది. జ్ఞానదృష్టితో అంతరార్థము అంతరార్థము తెలిసి ధరించటము - అవసరము సుమా!
చతుర్గుణీ కృత్య, చతుర్విగ్ంశతి (24)
తత్త్వాపాదన తంతు కృత్యం
నవ తత్త్వమ్ ఏకమేవ
‘‘పరంబ్రహ్మ’’।
ఓ శౌనకా! జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ చతుర్గుణీయ క్రియలు, ‘24’ తత్త్వములు (పంచమహాభూత, పంచప్రాణి-పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, అంతరంగ చతుష్టయములను) - ఆత్మతత్త్వోపాసనకు ఉపకరణములుగా అవగలవు - అని నీవు గ్రహించి ఉండాలి.
ఏకమగు పరబ్రహ్మమే నవతత్త్వములుగా [నవాత్మలుగా - (దృశ్యాత్మ, భూతాత్మ, జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ (కేవలాత్మ), జ్ఞానాత్మ, మహాత్మలుగా] ప్రదర్శనమౌతోంది.
6. తత్ ప్రతిసరయోగ్యత్వాత్
బహుమార్గ ప్రవృత్తిం
కల్పయంతి।
(కేవలాత్మ), జ్ఞానాత్మ, మహాత్మలుగారి ప్రదర్శనమౌతోంది.
అట్టి ఉపవీతము [ (లేక) బ్రహ్మసూత్రము (లేక) యజ్ఞసూత్రము లేక జందియము ] యొక్క (త్రిసూత్రముయొక్క) ప్రతి పేట (ప్రతి పోగు) - అనేక మార్గములలో (భక్తి, ప్రపత్తి, యోగాభ్యాసము, అధ్యయనము, జ్ఞాన విచారణ మార్గములో) బ్రహ్మోపాసనకు ‘యోగ్యత’ అగుచున్నది.
సర్వేషాం బ్రహ్మాదీనాం, దేవర్షీణాం
మనుష్యాణాం-ముక్తిః ఏకా।

(కింతు) బ్రహ్మమ్-ఏకమేవ। (బ్రహ్మైకమేవ)।
(కింతు) బ్రాహ్మణత్వమ్ (హి) ఏకమేవ।
వర్ణాశ్రమ ఆచార విశేషాః
పృథక్ పృథక్।
ఈ జగద్దృశ్యములో వర్ణ - ఆశ్రమ విధానంగా వేరువేరైన ఆచార విశేషాలు ఉండవచ్చుగాక! సమస్తము ‘తానే’ అయి ఉన్న బ్రహ్మము ఏకమేగాని, ‘అనేకము’ కాదు. బ్రహ్మదేవుడు మొ।।వారికి గాని, దేవర్షులకుగాని, మనుష్యులకుగాని - ‘ముక్తి’, అనునది ఒక్కతీరైనదే. బ్రహ్మము, బ్రాహ్మణత్వము ఒక్కటే! బ్రహ్మతత్త్వభావనయే బ్రాహ్మణము. అట్టి బ్రహ్మోపాసన జన్మ - జాతి - లోక - ఆశ్రమ - నివాస భేదములకు చెందినది కానేకాదు.
శిఖా వర్ణాశ్రమిణామ్ ఏకైవ।
అపవర్గస్య యతేః - శిఖా।
యజ్ఞోపవీత మూలం
ప్రణవమ్ ఏకమేవ వదంతి।।
హంసః శిఖా, ప్రణవం ఉపవీతం।
నాదః సంధానమ్, ఏష ధర్మో।
నేతరో (న ఇతరో) ధర్మః।।
బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస చతురాశ్రమములవారికి, చాతుర్వర్ణములవారికి ‘అపవర్గము’ (లేక) ‘మోక్షము’ ఒక్కటే!
అట్టి మోక్షము గురించిన ఆశయమే శిఖ.
అందరికీ (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములకు ఆవల సాక్షి అగు- ఆత్మయే అర్థముగా గల) ప్రణవమే → యజ్ఞోపవీతము.
అన్ని ఆశ్రమములవారికి, అన్ని లోకవాసులకు, దేవ-మానవ-జంతు ఇత్యాది అన్ని జాతులజీవులకు కూడా ‘‘హంస-సో2హమ్’ - అనునదే ‘‘శిఖ’’.
కేవలాత్మ యొక్క సంజ్ఞయే - ‘ఉపవీతము’. నాదమే ప్రణవము. ప్రణవమే - ఆత్మతో అనుసంధానము.
ఆత్మయే అందరికి ధర్మము. (Main Feature). ఆత్మకు వేరైన ధర్మము ఎక్కడా కూడా ఎవ్వరికి ఏదీ లేదు. అఖండమగు ఆత్మభావనయే అందరికి ఉండవలసిన నిష్ఠ। అట్టి నిష్ఠయే పరమ ధర్మము.
తత్ కథమ్? - ఇతి। ప్రణవో హగ్ంసో;
నాదః త్రివృత్ సూత్రమ్।

హృది చైతన్యే తిష్ఠతి -
త్రివిధం బ్రహ్మ। - తత్ విద్ధి।
అది ఎట్లా? అంటే….(1) ప్రణము (ఓం) (2) హంస (సో2హమ్) (3) నాదము (అనుసంధానము) - ఇవియే యజ్ఞోపవీత → త్రివృత్-సూత్రము. ఈ మూడు జాతి-మత కుల భేదం లేకుండా (మానసికంగా) ధరించవలసినది. కనుక సర్వవర్గములవారు ధరించవలసిన యజ్ఞ సూత్రము- సర్వత్రా త్రిసూత్రాత్మ దర్శనమే।

ఈ ప్రణవ హంస నాదములుగా ప్రతి జీవుని హృదయములోను, ఆత్మచైతన్యమే సర్వదా వేంచేసినదై వెలుగొందుచున్నది. అట్టి త్రివిధ రూపమగు ఆత్మయే తెలుసుకోవలసిన, చూడవలసిన, ఉపసించవలసిన - బ్రహ్మము, సత్యము, నిజస్వరూపము.
ప్రాపంచిక శిఖ, ఉపవీతం
త్యజేత్। స శిఖం వపనం కృత్వా,
బహిః సూత్రం త్యజేత్ బుధః।

యత్ అక్షరం పరం బ్రహ్మ
తత్ సూత్రమ్ - ఇతి ధారయేత్।

ఈ జీవుడు ధారణ చేయవలసినది ప్రాపంచకమైన శిఖ, నూలు యజ్ఞోపవీతము కాదు. బాహ్యమగు శిఖ-(నూలుపోగు) ఉపవీతముల బాహ్య సంశుద్ధి సంసిద్ధత కొరకు ‘శాస్త్రీయ నియమములు’ మాత్రమే. అసలైన యజ్ఞసూత్రము అక్షరపరబ్రహ్మ భావనయే।

బాహ్యసూత్రమును బయటనే వదలి ‘‘అక్షరపరబ్రహ్మము’’ అనబడే యజ్ఞసూత్రమును (లేక యజ్ఞోపవీతము, లేక బ్రహ్మసూత్రము)ను అంతరంగా ధరించాలి.
పునర్జన్మ నివృత్త్యర్థం
మోక్షస్య అహర్నిశం స్మరేత్।
మరల పుట్టకుండా ‘‘పునర్జన్మ నివృత్తి’’ లేక ‘జన్మరాహిత్యము’ కొరకై, సర్వబంధముల భేదన రూపమగు మోక్షభావము (లేక) ఆత్మభావమును సదా స్మరించాలి.
‘‘సూచనాత్ సూత్రమ్’’
ఇతి ఉత్యుక్తగ్ం
సూత్రం నామ ‘పరం పదమ్’।
యజ్ఞసూత్రము అనగా ఏది?
సూత్రము అనగా సూచన. దేనిని గురించి సూచన? సందర్భ రూపములన్నిటికీ ఆవలగల కేవల (కైవల్య) రూపమగు పర స్వరూప ధారణయే యజ్ఞోపవీతధారణలోని సూత్రము (లేక) సూచన. ‘పరబ్రహ్మము’ను నేను ధారణ చేస్తున్నాను - అనునదే యజ్ఞ సూత్రధారణ. పరబ్రహ్మమై జగత్తును సూత్రముగా ధారణ చేస్తున్నాను- అనునదే ‘పరమపదము’.
తత్ సూత్రం విదితం యేన
- స ముముక్షుః।
- స భిక్షుకః।
- స వేదవిత్। (స) సదాచారః।
స విప్రః పంక్తి పావనః।।
ఎవ్వరైతే పరమాత్మ స్థానము (లేక) ‘‘పరమపదము’’ అనే వేద ఉపనిషత్తుల సూచన గ్రహిస్తారో, తత్ త్వమ్ (నీవుగా కనిపించేది బ్రహ్మమే), నేను బ్రహ్మమే (సో2హమ్) మొదలైన మహావాక్యముల (లేక) ఆత్మతత్త్వ వాక్యముల ధారణచేస్తూ ఉంటాడో, ఆతడే - ముముక్షువు. ఆతడే భిక్షకుడు. (చీకటి తొలగినవాడు)
అట్టి ఆత్మగురించిన ‘సూచన’ అగు ఉపవీతము /(యజ్ఞసూత్రము) ఎరిగినవాడే వేద హృదయము తెలుసుకొన్న వేద విహితుడు. ‘సత్’ను ఆచారముగా సిద్ధించుకున్న సదాచారుడు. అట్టివిప్రుడు ఉన్న పంక్తిలోని జనులంతా పవిత్రులు కాగలరు.
7. యేవ సర్వం ఇదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ,
తత్ సూత్రం ధారయేత్ యోగీ, -
యోగవిత్ బ్రాహ్మణో యతిః।
సంయోగ వియోగాతీత తత్త్వము తెలిసిన యోగి, (బ్రాహ్మణుడు, యతి) అయినట్టివారు ధరించవలసిన సూత్రము ఏది? నూలుప్రోగు సూత్రము కాదు. మరి? ఈ సమస్త విశ్వము, విశ్వజీవులు, ఏ సూత్రపు త్రాడు (దారము)నకు గ్రుచ్ఛబడి ఉన్నారో - మణిహారమునకు మణులవలె సకల జీవులు ఏ బ్రహ్మము అను సూత్రము (సూచన)కు అల్లబడిఉన్నారో - అట్టి సూత్రమును నిత్యము ధారణ చేయువారై ఉండాలి. అదియే వాస్తవమైన ఉపవీతము (లేక) బ్రహ్మసూత్రము.
బహిస్సూత్రం త్యజేత్ విప్రో
యోగవిజ్ఞాన తత్పరః।
బ్రహ్మభావమయం సూత్రం
ధారయేత్ యః సముక్తిభాక్।
న అశుచిత్వం, న చ ఉచ్ఛిష్టం
తస్య సూత్రస్య ధారణాత్।
విప్రుడు (వేదమును అధ్యయనము చేసినవాడు) బాహ్యసూత్రమును త్యజించి యోగవిజ్ఞానతత్పరుడై
(1) ‘‘సమస్తము బ్రహ్మమే। (2) నేను బ్రహ్మమే। (3) ఇదంతా నేనే’’
అనే బ్రహ్మభావమయమైన ‘త్రి’-సూత్రమును ధరించును గాక!
అట్టివాడే ముక్తి సిద్ధించుకోగలడు.

బాహ్యముగా ధరించే నూలు జందియమును - (అశుచి - మైల వంటి సందర్భములలో మార్చుకోవటమనే ఆచారం ఉండవచ్చుగాక. కానీ బ్రహ్మమే, బ్రహ్మతత్త్వజ్ఞానమే సూత్రముగా ధరించినవానికి ‘అశుచి, సూత్రము మార్చాలి’ - మొదలైనవేవీ ఉండవు. ఆతడు నిత్యబ్రహ్మసూత్ర (లేక) యజ్ఞసూత్రధారుడై ఉంటాడు.

సూత్రం అంతర్గతం యేషాం
జ్ఞానయజ్ఞోపవీతినామ్।
యే తు సూత్రవిదో లోకే
తే చ యజ్ఞోపవీతినః।

యోగి అయినవాడు - తన హృదయములో- ‘‘జ్ఞాన యజ్ఞోపవీతము’’నే యజ్ఞసూత్రంగా, జందియముగా ధరించాలి. అట్టి బ్రహ్మసూత్రము ధరించినవాడే ‘‘యజ్ఞోపవీతుడు’’. ప్రత్తిదారపు జందియము ధరించినంత మాత్రంచేత యజ్ఞోపవీతుడు కాడు. (ప్రత్తి సూత్రము సూచక ద్రవ్యము మాత్రమే)
జ్ఞాన శిఖినో, జ్ఞాన నిష్ఠా,
జ్ఞాన యజ్ఞోపవీతినః।
జ్ఞానమేవ పరం తేషాం,
పవిత్రమ్ జ్ఞానము ఈరితమ్।।
ఆత్మజ్ఞానమే శిఖ, నిష్ఠ కూడా. జ్ఞానయజ్ఞోపవీతము ధరించినవానికి ఆత్మగురించిన నిష్ఠ-జ్ఞానములే పరమపవిత్రము. ఆత్మజ్ఞాన-ఆత్మాను సంధానమే పరమాశయము, చేరవలసిన స్థానము. (ఇక కర్మభక్తి జ్ఞాన క్రియా యోగాలన్నీ అందుకు ప్రయాణ పరికరములు).
అగ్నేరివ శిఖా, న - అన్యా
యస్య జ్ఞానమయీ శిఖా,
స శిఖీ-ఇతి ఉచ్యతే విద్వాన్।
నేతరే కేశ ధారిణః।
(న ఇతరే కేశధారిణః।)
అగ్నికి శిఖవలె, ఎవరు జ్ఞానాగ్నియొక్క శిఖయే-శిఖగా కలిగి తమ హృదయములోని అజ్ఞానాంధకారమును పారత్రోలివేస్తూ ఉంటారో - వారే శిఖధారులు. కేశ శిఖ వాస్తవమైన శిఖ కాదు. జ్ఞానాగ్ని శిఖలచే ఎవ్వరైతే ప్రారబ్ద -ఆగామి- సంచిత్ కర్మ - కర్మఫలములనేవన్నీ భస్మము చేసివేస్తారో, వారే విద్వాంసులు (పరమశివుని చితాభస్మధారణ - త్రివిధ కర్మలను జ్ఞానాగ్నిచే భస్మము చేసి త్రిరేఖలుగా ధరించటము).
కర్మణి అధికృతా యే తు
వైదికే లౌకికే2పి వా
బ్రాహ్మణ-ఆభాసమాత్రేణ
జీవంతే కుక్షి పూరకాః।
ప్రజంతే నిరయం తే తు
పునర్జన్మని జన్మని।
ఎవ్వరైతే వైదికమైన (వేద సూచకమైన) యజ్ఞ - యాగ - మంత్రోచ్ఛారణ మొదలైనవి - లౌకిక (లోక) ప్రయోజనముల కొరకు(ధన-జన-పేరు ప్రతిష్ఠలకొరకై) మాత్రమే చేస్తారో, (బ్రాహ్మీభావము సిద్ధించుకొనే ఆశయము కలిగి ఉండరో), పొట్టనింపుకోవటమే లక్ష్యముగా కలిగి ఉంటారో - అట్టి వారు ఆభాసబ్రాహ్మణులే గాని బ్రహ్మసూత్రజ్ఞులగు బ్రాహ్మణులు కారు. వారు ‘నిరయము’ అను పేరుగల పునర్జన్మ నరకరూప పరంపరల చక్రమునుండి విడివడలేరు. ఒక దేహము నుండి - మరొక దేహమువైపుగా ప్రయాణాలు చేస్తూ సొలసిపోతూనే ఉంటారు.
8. వామాగ్ంస దక్ష కట్యంతం
బ్రహ్మసూత్రం తు సవ్యతః।
అంతర్బహిరివ అత్యర్థం
తత్త్వ తంతు సమన్వితమ్।
నాభ్యాది - బ్రహ్మరంధ్రాంతం
ప్రమాణం ధారయేత్ సుధీః।
ఎడమ భుజము నుండి కుడి మొల వరకు బ్రహ్మసూత్రమును ధరించుచున్నారు. అట్టి సూత్రము ‘‘అంతరము నుండి బాహ్యము వరకు, దృశ్యమునుండి - ద్రష్టవరకు, సందర్భము నుండి కేవలము వరకు సమస్తము పరబ్రహ్మతత్త్వమే’’ అను అర్థముతో కూడుకొన్నవారై ధరించాలి. నాభి నుండి (బొడ్డు నుండి, మణిపూరక చక్రమునుండి) - బ్రహ్మరంధ్రము వరకు బ్రహ్మసూత్రమును బుద్ధిమంతుడైనవాడు (యోగి)-యోగ బుద్ధితో ధరించుచున్నాడు. (ఆత్మతో సంయోగమే - యోగము).
తేభిః ధార్యమ్ ఇదగ్ం సూత్రం
క్రియాంగం తంతు నిర్మితమ్।
శిఖా జ్ఞానమయీ యస్య
ఉపవీతన్చ తన్మయమ్,
బ్రాహ్మణ్యగ్ం సకలం తస్య
నేతరేషాం తు కిన్చన। (న-ఇతరేషాం తు కిన్చన)।
అట్టివాడు క్రియాంశముగా తంతు నిర్మితమైన సూత్రము ఒకవైపు ధరిస్తూనే, మరొకవైపు నాభి నుండి బ్రహ్మరంధ్రము వరకు ఉపాసన-ధారణలచే బ్రహ్మసూత్ర భావన కలిగి ఉండాలి. అప్పుడే బ్రాహ్మణ్యము అనబడుతోంది.
జ్ఞానమయమైన ‘శిఖ’, బ్రహ్మజ్ఞాన సిద్ధి కొరకు క్రియా సూచకమైన సూత్రము ధరించినవాడే అసలైన బ్రాహ్మణ్యుడు. కేవలము భౌతిక శిఖ యజ్ఞోపవీతము లచే కొంచము కూడా బ్రాహ్మణ శబ్దార్ధము అవజాలదు.
ఇదం యజ్ఞోపవీతం తు
పరమమ్ యత్ పరాయణమ్,
విద్వాన్ యజ్ఞోపవీతీ -
సంధారయేత్ యః, స ముక్తిభాక్।।
అట్టి బ్రహ్మ యజ్ఞోవీతధారణయే పరమము (The Finest). అదియే పారాయణము (That which is to be practised). అట్టి బ్రహ్మసూత్రము ధరించినవాడు ముక్తి (Relived of all worldly shackles) ఇక్కడే సిద్ధించుకో గలడు.
బహిరంతశ్చ ఉపవీతీ
విప్రః సన్న్యస్తుమ్ అర్హతి।
ఏకయజ్ఞోపవీతీ తు
నైవ సన్న్యస్తుమ్ అర్హతి।
విప్రుడైనవాడు ‘‘భేదదృష్టి’’కి సంబంధించిన ఉపవీతమును సన్న్యసించి ఉండటమే ఉచితము, ఉపాయము. అనేకముగా కనిపిస్తూన్న ఈ జగత్- దృశ్యమును ఏకమగు బ్రాహ్మీదృష్టితో చూడాలి.
(‘‘సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్’’). అనేకముగా కనిపిస్తూ, ఏకమే అయి ఉన్న దృష్టిచే నిర్మితమగు అంతర్ - యజ్ఞోపవీతమును ఏ క్షణమందు విడచి ఉండరాదు. అదియే అనునిత్య యజ్ఞోపవీతధారణ.
తస్మాత్ సర్వ ప్రయత్నేన
మోక్షాపేక్షీ (మోక్ష-అపేక్షి) భవేత్ యతిః।
బహిః సూత్రం పరిత్యజ్య
స్వాంత స్సూత్రం (స్వ-అంతః సూత్రం)
తు ధారయేత్।
అందుచేత ముముక్షువు (1) సర్వభేదములపై ‘జయము’ సంపాదించాలి. (2) ‘‘నాకు బంధమే ఉండజాలదు’’ అని నిర్ణయాత్మకము అగు ‘మోక్షము’ పట్ల సర్వదా లక్ష్యము కలిగి ఉండు గాక!

బాహ్యసూత్రమును త్యజించి ‘‘సమస్తము మమాత్మానంద స్వరూపమే’’ అను ‘‘స్వ-అంతఃసూత్రము’’ను అంతరమున సర్వదా ధరించి ఉండును గాక!
బహిః ప్రపన్చ శిఖోపవీతిత్వం
అనాదృత్య
ప్రణవ హగ్ంస
శిఖ-ఉపవీతిత్వమ్
అవలంబ్య, మోక్షసాధనం
కుర్యాత్।
ఇతి ఆహ భగవాన్ శౌనకః।
ఓ శౌనకా!

బాహ్యమైన ప్రాపంచక శిఖ- ఉపవీతములపట్ల ఆదరణ కలిగి ఉండట మెందుకు? ముఖ్యార్థమును, (లేక) సూచనను ఎట్లా ఏమరుస్తారు? (1) తత్త్వమ్-ప్రణవ (2) సో2హం (3) త్వమేవాహమ్ - అనబడే ‘‘శిఖ ఉపవీతము’’లను -త్రిసూత్రములను అవలంభించి మోక్షముకొరకై సాధనపరుడవై ఉండుము.

ఈ విధంగా భగవంతుడు అంగీరస పిప్పలాదమహర్షి - శునకముని కుమారుడు, పవిత్ర హృదయుడు అగు శౌనకునికి బోధించాడు.

🙏 ఇతి పరబ్రహ్మోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।


అధర్వణ వేదాంతర్గత

11     పరబ్రహ్మ ఉపనిషత్

అధ్యయన పుష్పము

అఖండ మండలాకారం
వ్యాప్తం ఏన చరాచరమ్।

Om

తత్పదం దర్శితం ఏన,
తస్మై శ్రీ గురవే నమః।।

అఖండమైన - అవ్యాజమైన సుఖాకృతి కలిగినట్టిది, ‘సత్’నందు (స్వస్వరూపమునందు) సమస్తమును న్యాసము (దాచి ఉంచటము) ఎరిగిన సత్-న్యాసకులగు పరివ్రాజకుల అంతర హృదయములో సర్వదా- నిశ్చలముగా, సుస్థిరముగా స్వయంప్రకాశము- అయి వెలుగొందుచున్నట్టిది, జగదారణ్యములో సింహమువలె పచార్లు చేయుచున్నట్టిది - అగు త్రైపదమునకు (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నావై, స్వకీయ రచనా వ్యాసంగ - వినోద చమత్కారమైన ‘నేను’ నకు) నమస్కారము.

‘‘ముందుగా’’ - ‘‘మహర్షుల స్తుతి’’

శ్రీ శౌనకమహర్షి గురించి కొన్ని పౌరాణిక విశేషములు

మహాభారతము : వీతహవ్యుడు ‘శర్యాతి’ అను పేరుగల వంశములోని వారు. ఒకానొక రాజు. హయహయుడు అనే పేరు కూడా కలవారు. వత్సదేశమును పాలించేవారు.

ఒకానొక సందర్భములో వారి శత్రురాజు (కాశీరాజు) - (దివోదాసుని పుత్రుడు) ప్రతర్దనుడు అనే ఆయన - వత్సరాజ్యముపై దండెత్తాడు. యుద్ధములో వీతహవ్యుని జయించాడు. వీతహవ్యుని సంహరించటానికై సైన్యసమేతుడై వెంటబడ్డాడు. అప్పుడు వీతవావ్యుడు పారిపోయి ‘భృగు ఆశ్రయము’లో దాగుకున్నాడు. ఆ ఆశ్రమమునకు ప్రతర్దనుడు సైనికాధికారుల సమేతుడై వచ్చి - ‘‘ఓ భృగుమహర్షీ! వీతహవ్యుడు అనే రాజరికమునకు చెందిన రాజవంశీయుడు, రాజసుడు - పారిపోయివచ్చి ఇక్కడి మీ ఆశ్రమములో దాగుకొన్నట్లున్నాడు. మీ అనుజ్ఞ అయితే ఆశ్రమము ప్రవేశించి బందీగా తీసుకువెళ్ళుతాము’’ అన్నారు.

అప్పుడు భృగుమహర్షి - ‘‘నాయనా! మా ఆశ్రమములో రాజసుడు ఎవ్వడూ లేరే? ఇక్కడంతా బ్రహ్మసూత్రధారులే ఉంటారు।’’ - అని సమాధానము చెప్పారు.

అప్పుడు ప్రతర్దనుడు - ‘‘మహర్షీ! నాతండ్రి దివోదాసరాజును యుద్ధములో చంపిన వీతవావ్యమహారాజును చంపి పగతీర్చుకోవాలని వచ్చాను. వీతహవ్య మహారాజు తమ ఆశ్రమములో ప్రవేశించి కూడా, ‘‘నేను రాజవంశీయుడను’’ అని అతడు మీకు చెప్పుకోవటానికి భయపడి ఉంటాడు. ‘‘రాజవంశీయుడను’’ - అని చెప్పుకోలేకపోవటంచేత, ఆతడు రాజసుడుగా మరణించినవానితో సమానము. అతనికి తగిన పరాభవము జరిగినట్లే. నా పగ తీరినట్లే.
హే భృగుమహర్షీ! నమో నమః। మాకు శెలవు ఇప్పించండి. దయతో మా ఈ ప్రదక్షిణ నమస్కారము స్వీకరించి, ఆశీర్వాదము ప్రసాదించండి!’’ అని పలికి బ్రహ్మమానస పుత్రులగు భృగుమహర్షికి ప్రణామములు సమర్పించారు. ఆశీర్వదించబడినవారై అక్కడి నుండి నిష్క్రమించారు. (వెళ్ళిపోయారు).

అది విన్న వీతహవ్య మహారాజు కొద్దిసేపటికి ఆశ్రమమునుండి బయటకు వచ్చి, మహర్షికి నమస్కరించి ఇట్లా పలుకసాగారు.

వీతహవ్యుడు : హే భృగుమహర్షీ! ‘‘నేను రాజసుడను కాను’’ అని మీరు అనియున్న మాటకంటే రాజవంశీయుడునగు నాకు చావే మేలు కదా!
మరొక విషయం. మీరు అసత్యము పలుకరు. మరి, ఎందుకట్లా పలికారు? దయతో వివరించి చెప్పండి.

భృగుమహర్షి : నాయనా! వీతహవ్యా! ఇక్కడి రాజవంశములు, రాజ్య పాలనలు, గెలుపు ఓటములు కలలోని విషయములవంటివే కదా! అది మరచావా? ఎవ్వరైనా సరే, బ్రహ్మజ్ఞానము సంపాదించి ‘‘ఈ విశ్వమంతా, ఈ జాగ్రత్ స్వప్న సుషుప్త వ్యవహారమంతా కూడా ఆత్మస్వరూపుడనగు నేను ధారణ చేయు ఉపవీతము వంటిది’’ అని భావిస్తే, అట్టివాడు ఏ జాతివాడైనా బ్రాహ్మణుడే అవుతాడు. అందుచేత నీయొక్క బ్రహ్మజ్ఞానము కొరకై ‘‘విశ్వయజ్ఞోపవీతుని’’గా బోధచేసి తీర్చదిద్ద తలచాను. అప్పుడు నీవు సాత్త్వికుడవేగాని, రాజసుడవు కావు. అందుచేత ప్రతర్ధనునితో అట్లా అన్నాను.

అది విని ఆనంద భరితుడైన వీతహవ్యుడు భృగుమహర్షికి శిష్యుడిగా ప్రకటించుకొని, బ్రహ్మతత్త్వము శ్రవణం చేసి బ్రహ్మజ్ఞానమును సిద్ధించుకున్నారు. ‘బ్రాహ్మణుడు’ అయ్యాడు.

అట్టి వీతహవ్యుని కుమారుడు గృత్స్నమదుడు. ఆయన కుమారుడు ‘శునకుడు’. శునకుని కుమారుడు ‘శౌనకుడు’.

అట్టి శౌనకమహర్షి ఒకసారి నైమిశారణ్యములో 12 సంవత్సరముల సత్రయాగము నిర్వర్తించారు. ఆ సందర్భములో పౌరాణికుడగు శూతమునీశ్వరులు ప్రవచనము చేసిన అనేక పురాణ గాథలు శ్రవణం చేయటం జరిగింది. అవన్నీ గ్రంథస్తమై, అనేక పురాణములుగా సుదీర్ఘకాలంగా (ఇప్పటికీ) పఠణము, పారాయణము చేయబడుచూ ఉన్నాయి. మానవాళికి మంగళప్రదమౌచున్నాయి.

సూతుడు - రోమహర్షుణుని కుమారుడు. ‘ఉగ్రవసుడు’ అనే పేరు కలవారు. శౌనకునితో సహా సత్రయాగము సందర్భంగా పురాణ ప్రవచనము చేసినవారు.

పై విశేషాలు భారతములో చెప్పబడ్డాయి.

అట్టి శౌనకుడు బాల్యంలో విద్య పూర్తి చేసుకొని, అప్పటి ఆచారములను అనుసరించి లోక జ్ఞానము కొరకై తీర్ధయాత్రలకు బయల్వెడలారు. అనేక పుణ్యనదులలో స్నానం చేస్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ - సంచారములు చేస్తూ ఉండసాగారు. ఆ సందర్భములో ఒకసారి దైవయోగంగా బ్రహ్మమానసపుత్రులగు అంగీరస పిప్పలాదమహర్షి పుణ్యాశ్రమము దర్శించారు.


శ్రీ పిప్పలాద మహర్షి గురించిన కొన్ని పౌరాణిక విశేషాలు

భారతము: (శివపురాణము):

దధీచి : దధీచి ఒక మునీశ్వరుడు. ‘చ్యవనుడు’ అను వాని కుమారుడు. ఆ దధీచి సరస్వతీ నది ఒడ్డునగల ‘‘సారస్వతము’’ అనే పేరు గల తీర్థములో అత్యంత నియమ - నిష్ఠలతో తపస్సు చేస్తూ ఉండేవారు.

ఆతని మహత్తరమైన తపో - ఏకాగ్రతను గమనించిన ఇంద్రుడు, ‘‘ఈతడు తపస్సు చేస్తున్నది ఇంద్రపదవి కోసమేమో?’’ అని శంకించారు. ఆయన తపస్సుకు భంగం కలిగించటానికై ‘‘అలంబుస’’ అనే అప్సరసను సారస్వత తీర్ధమునకు పంపారు. ఆ ఆలంబుసయొక్క అప్సరస సౌందర్యమును క్షణకాలము చూచిన దధీచికి వీర్యము స్కలించింది. అది గమనించిన సరస్వతీ నదీమాత ‘‘ఈ మహనీయుని స్కలనము నేలరాలటము లోకమునకు శుభప్రదం కావాలి’’ - అని తలచింది. ఆ స్కలనమును స్వీకరించి తన గర్భమున దాల్చింది. కాలానంతరము ఒక కుమారుని కన్నది. ఆతనికి సారస్వతుడు - అవి నామకరణం చేసింది. యుక్తవయస్సు రాగానే ఆతనిని దధీచిమునివర్యునకు ఇచ్చింది. ఇస్తూ సారస్వతుని ముద్దుపెట్టుకొని ‘‘బిడ్డా! సారస్వతా! నీవు ఎక్కడ ఉంటే అక్కడ 12 సంవత్సరములు అనావృష్టి కలిగినా కూడా జనులకు ఆపదలు రాకుండు గాక!’’ - అని మాతృవాత్సల్యంగా దీవించింది.

ఆ తరువాత కూడా దధీచి తపో-ఆనందమును కొనసాగించసాగారు. ఆయన భార్య లోపాముద్ర. పతిసేవజేస్తూ భర్త తపస్సుకు విఘ్నములు కలుగకుండా సేవిస్తూ ఉండేది.

ఒకప్పుడు దేవతలు, దేవలోక భోగములు అనుభవిస్తున్న సమయములో రాక్షసులు మాయా ఉపాయములతో కపటముగా వారి దివ్యాస్త్రములను దొంగిలించటానికి ప్రయత్నించనారంభించారు. అది గమనించిన దేవతలు తమ దివ్యాస్త్రములను మహాతపశ్శాలి అగు దధీచికి పంపి దాచిపెట్టవలసినదిగా ప్రార్థించారు. అందుకు దధీచి అంగీకరించారు. అప్పటినుండి దేవతలు స్వర్గలోకపు ఆనందములలో, మునిగితేలసాగారు.

ఆ దేవతలు భోగములను అనుభవిస్తూ ఎంతకాలానికీ తిరిగిరాలేదు. సుదీర్ఘకాలము అయిన తరువాత ఆ దేవతల అస్త్రములు కాపలా - తన తపో ఆనందమునకు విఘాతము కలిగిస్తూ ఉన్నదని దధీచి గమనించారు. ఆ దేవతల దివ్యాస్త్రములను అభిమంత్రించి పాయసమువలె పానము చేసివేశారు (త్రాగివేశారు). (అస్త్రములు = మనన రూపమగు మంత్ర బలముచే రూపుదిద్దుకొనే దివ్యశక్తులు).

చాలాకాలము తరువాత దేవతలు స్వర్గలోక భోగక్రీడలను చాలించి తమ అస్త్రములను తిరిగి తీసుకువెళ్ళటానికి దధీచిని సమీపించారు. అప్పటికి లోపాముద్ర గర్భవతి. అప్పుడు దధీచి దేవతలతో ఇట్లా పలికారు.

దధీచి : ఓ దేవతలారా! మీరు మీ అస్త్రములను చాలాకాలం కాపాడాను. కానీ కొద్దికాలములో వచ్చి, అస్త్రములను తీసుకువెళ్ళవలసిన మీరు సుదీర్ఘకాలము రానే లేదు. అందుచేత రాక్షసుల బారిన పడకుండా అవన్నీ అవపోసన పట్టివేశాను.

దేవతలు : మహాత్మా! దధీచీ! అంతటి సుదీర్ఘకాలము మేము రాకపోవటము మా తప్పే. అయితే ఆ అస్త్రములు లేకపోతే మేము రాక్షసులముందు ఏమాత్రము నిలువలేము. అది లోకములకు శుభము కాదు. అందుచేత మీరు అవపోసనపట్టి తాగిన దేవతాస్త్రములను మాకు మీ తపోశక్తిచే తిరిగి మాకు ప్రసాదించక తప్పదు. ఏదో ఉపాయముతో మీరే మాపట్ల కనికరించి తిరిగి మా అస్త్రములను మాకు ప్రసాదించండి.

❤︎ అప్పుడు దధీచి తన ప్రక్కనే ఉన్న అర్ధాంగి లోపాముద్రను ఆశ్రములోనికి వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించి, ఆమె లోనికి వెళ్ళిన తరువాత దేవతలతో ఇట్లా పలికారు.

దధీచి : ఓ దేవతలారా! నేను అవపోసనపట్టి త్రాగివేసిన అస్త్రములను నేనుగా తిరిగి ఇవ్వలేను. అవి జీర్ణమైపోయినాయి. కనుక తిరిగి ఇవ్వటము నాకు సాధ్యపడేది కాదు. ఎందుకంటే, అవన్నీ నా వెన్నెముకను, ఎముకలను అంతర్లీనంగా ఆశ్రయించి ఉన్నాయి. వాటిని బయటకు తేవటము ఈ దేహమున్నంతవరకు నా వలన కాదు. అయితే మీరు లోక కళ్యాణమూర్తులు కాబట్టి మీ అస్త్రములు మీకు చేరవలసిందే. అది నేను ఒప్పుకుంటున్నాను. అందుకు ఒక్కటే ఉపాయము. నా వెన్నెముకను, ఎముకలను బయటకు తీసి మీమీ అస్త్రములు తీసుకువెళ్ళండి.

దేవతలు : హే మహానుభావన్! దధీచీ! మీరు బ్రతికి ఉండగానే మీ వెన్నెముక - ఎముకలను బయటకు ఎట్లా తీయగలుగుతాము?

దధీచి : మీరు నన్ను చంపి, నా యముకలను ఆశ్రయించి ఉన్న దేవతా అస్త్రములను తిరిగి తీసుకోవటానికి నేను ఎంతో సంతోషముగా అంగీకరిస్తున్నాను. ‘‘త్యాగే నైవతు కైవల్యమ్’’ అను వేదసూత్రానుసారం ఇది నాకు కూడా మోక్షోపాయము. కనుక, మీరు నేను చెప్పినట్లు చేయండి.

దేవతలు : అదెట్లా మహర్షీ! మేము బ్రాహ్మణ వధ చేసి పాపము కట్టుకోవటముకన్నా రాక్షసుల చేతులలో మరణమే ఉచితము కదా! మా కొరకై దేహమునే త్యాగము చేయటానికి సిద్ధపడుచున్న మిమ్ములను చంపటము కుదిరేదే కాదు. అందుచేత అందుకు మేము సిద్ధము కాదు. విధివశాత్తు ఏది ఎట్లా జరగాలో అది అట్లాగే జరుగునుగాక. మాకు శలవు ఇప్పించండి.

దధీచి : ఓ దేవతలారా! ఆగండి! ఆగండి! మీరుగాని, మహర్షులు - మునులు అగు మేముగాని, యజ్ఞకర్తలుగాని, ఋత్విక్కులుగాని - మనమంతా మన మన దైవీ - తపో - యజ్ఞ కార్యక్రమములన్నీ ‘‘సర్వే జనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని సంతు!’’ అని పరమాత్మకే సమర్పిస్తాము కదా! సమస్తము శివమయము, శివప్రసాదము అయి ఉండగా శివునికి చెందినది - శివునికి సమర్పించటానికి వెనుకాట ఎందుకు? అందుచేత నేను స్వకీయ తపోశక్తిచే యోగాగ్నిని జనింపజేసి ఈ నా భౌతికదేహమును ఆ యోగాగ్నిలో కాల్చివేస్తాను. అప్పుడు బొమికలు మాత్రమే మిగులుతాయి. వెన్నెముకను, తక్కిన యెముకలను భస్మమునుండి బయటకు తీసి మీమీ అస్త్రములను విడదీసుకొని స్వీకరించ ప్రార్థన.

ఈ విధంగా పలికి మహనీయుడు ‘‘త్యాగేనేవైవతు కైవల్యమ్’’ అను వేదవాక్యమును, వేద హృదయమును ఎరిగినవాడు కాబట్టి, దేవతల సమాధానమునకు వేచి చూడకుండా ఒక్క క్షణంలో ‘యోగాగ్ని’ని ఆహ్వానించి తన భౌతిక శరీరమును సమర్పించి వేశారు. ఆ యముకల నుండి దేవతా-అస్త్రములే కాకుండా, బ్రహ్మచక్రము, ‘‘వజ్రాయుధము’’ మొదలైనవి కూడా విశ్వకర్మచే నిర్మితమైనాయి.

శివపురాణము:

అప్పుడు దధీచి యొక్క ధర్మపత్ని లోపాముద్ర ఆశ్రమము నుండి బయటకు వచ్చింది. తన భర్త యోగాగ్నిలో భౌతికదేహము సమర్పించివేసి, దేవతలకు వారివారి అస్త్రములతోబాటుగా బ్రహ్మాయుధము, వజ్రాయుధము మొదలైనవి కూడా లాభింపజేసినట్లు తెలుసుకొన్నది. వెంటనే తాను చితిని పేర్చి దేహము సమర్పించుటకు సిద్ధమైనది.

అప్పుడు అశరీరవాణి ‘‘అమ్మా! లోపాముద్రాదేవీ! నీవు గర్భవతివి! నీ గర్భములో గొప్ప బాలుడు ఉన్నాడు. అందుచేత తొందరపడి చితిలో ప్రవేశించకు!’’ అని వినిపించింది. అయినాకూడా లోపాముద్ర వెనుకకు మరల లేదు. లోపాముద్ర చితి ఎక్కుచుండగా గర్భస్థ శిశువు గర్భము నుండి జారి అక్కడ గల ఒక రావిచెట్టు (పిప్పలవృక్షము) క్రింద పడిపోవటం జరిగింది.

లోపాముద్ర పిప్పల (రావి) వృక్షము క్రింద ప్రసవించటము చేతను, ఆ పిప్పల వృక్ష దేవత చంద్రకిరణములనుండి అమృతమును వేరుపరచి, ఆ బాలునికి పాలుగా ఇచ్చి పెంచటము చేతను - ఆ బాలుడు ‘పిప్పలాద’’ నామధేయుడైనారు. ఆయన తరువాత గొప్ప తపోధనుడు, తత్త్వజ్ఞాని అయి దేవతలకు, మునిలోకమునకు పూజ్యుడు అయినారు. ఆయన అర్ధాంగి ‘పద్మ’.

ఈ పిప్పలాద మహర్షి బ్రహ్మమానసపుత్రులగు అంగిరసులలో ఒకరుగా బ్రహ్మవైవర్త పురాణ ప్రవచనము.

పై విశేషాలు భారతమునుండి, శివపురాణము నుండి, బ్రహ్మవైవర్త పురాణము నుండి చెప్పుకున్నాము.


ఇక మనము బ్రహ్మోపనిషత్ విశేషముల అధ్యయనములో ప్రవేశించుచున్నాము.


– పరబ్రహ్మోపనిషత్ –

పిప్పలాదమహర్షి తన ఆశ్రమమునకు వచ్చినట్టి శునక మునీశ్వరుని కుమారుడగు శౌనకుని సాదరముగా తన ఆశ్రమములోనికి ఆహ్వానించి కుశలప్రశ్నలు అడిగారు.

పిప్పలాదమహర్షి : చిరంజీవీ! శౌనకా! పూజనీయులు, భృగమహర్షికి శిష్యులు అగు వీతహవ్యుని వంశజుడా? కుశలమా? ఏమిటి విశేషాలు?

శౌనకుడు : గురువర్యా! తమ దయచే సమస్తము శుభప్రదమే. కొన్ని నాలోని ఆధ్యాత్మికమైన సందేహాలకు తమరు వివరణ ప్రసాదించవలసినదిగా వినమ్రుడనై మీపాద పద్మములను శరణువేడుచున్నాను.

పిప్పలాదుడు : సుఖీభవ। జ్ఞానసిద్ధిరస్తు। చిరంజీవా! శౌనకా! ఏమి నీ సందేహములు? ప్రశాంత చిత్తుడవై ప్రశ్నించు. శివసంకల్పానుసారము మనకు చేతనైనంతవరకు పరతత్త్వమును సంభాషించుకుందాము.

శౌనకుడు : హే భగవాన్! గురుదేవా! అంగీరస పిప్పలాద మహనీయా! మీరు సూచించినట్లే విద్యార్ధినైన నేను మీ వివరణకొరకై కొన్ని ప్రశ్నలు మీముందు ప్రదర్శించుకుంటున్నాను. నా సందేహాలు దయతో వినండి.

దివ్యే బ్రహ్మపురే కే సంప్రతిష్ఠితా భవంతి?
దివ్యమైన (The Devine) బ్రహ్మపురము (The Township of “brahmam” the creator) నందు సంప్రతిష్ఠితులై, శాశ్వతమై (Wel established) ఉన్నది ఎవరు?

కథం సృజ్యంతే నిత్యాత్మన?
నిత్యమగు ఆత్మనుండి సృష్టించబడేదంతా ఎట్లా బయల్వెడలుతోంది? ఎవరు సృష్టిస్తున్నారు? ఎందుకు సృష్టిస్తున్నారు?

ఏష మహిమా విభజ్య, ఏష మహిమా విభుః, క ఏషః?
(1) ఈ విభజ్యము (That which is divisible) (2) విభువు (ఈ విభవమంతా తనదే - అయినవాడు) ఎవరు? ఈ జగత్ విభవమంతా ఎవ్వరిది? ఈ సమస్తము ఎవరికి చెందినదై ఉన్నది?

అంగిరస పిప్పలాదుడు : ఓ వీత హవ్య ప్రపౌత్రా! శౌనకా! మీరు అడుగుచున్న ప్రశ్నకు సమాధానము విద్యలలో వరిష్ఠము (Greatest, Finest ) అగు పరబ్రహ్మమే (లేక) బ్రహ్మ విద్యయే. అట్టి ఆత్మవిద్య గురించియే చెప్పుకుందాము. అదియే నిత్యమగు సత్యము కూడా।

విరజము (రజో తమో గుణ దోషరహితము), నిష్కళము (కళంకము లేనట్టిది), శుభ్రము (Very pure), అక్షరము (మార్పు చేర్పులనునవే లేనట్టిది), క్షరము (నాశనము కానట్టిది), విశోకము (ఎట్టి దుఃఖములకు చోటులేనిది) - అయి, పరబ్రహ్మము సర్వత్రా ప్రకాశించుచున్నది. అట్టి పరబ్రహ్మ పురమునందు జగత్-రచనా దివ్యరూపులు (Divinities) అగు దేవతలు, సమస్త జీవుల ప్రాణశక్తి వసించుచున్నవై ఉన్నాయి. సమస్తము అట్టి పరబ్రహ్మమునకు చెందినవే। అట్టి పరమాత్మయే సమస్తము అయి ఉంటున్నారు కూడా. నీవు-నేను కూడా అట్టి పరమాత్మకు చెందినవారమై, అనన్యులమై ఉన్నామయ్యా!

ఒక తుమ్మెద తనకు తానే పుష్పములపై వ్రాలటము, తేనె ప్రోగుచేయటము, తేనె తుట్టె నిర్మించటము - ఇవన్నీ నిర్వర్తిస్తోంది కదా! ఒక కుక్క (‘తనది’ అనునది లేకున్నప్పటికి) తన యజమానిని తాను రక్షించాలని, బయటవారిని అరుపులతో భయపెట్టాలని తనను తానే నియమించుకొని విశ్వాసము, కాపలాగా ఉండటము మొదలైన కర్మలు నిర్వర్తిస్తుంది కదా!

అట్లాగే….

ఆత్మ అకర్మిష్టి (కర్మరహితుడు) అయి కూడా, ‘‘జీవాత్మ - జగత్తు - జన్మజన్మాంతరములు’’ మొదలైనవన్నీ తనకు తానే, (ఎవరి ప్రమేయము, ప్రోద్బలము లేకుండానే) కల్పించుకుని ఆస్వాదించుచున్నది. కర్మలు, కర్మఫలములు మొదలైనవన్నీ రచించుకొని ఒక వ్యవసాయదారునివలె (కర్షకునివలె) వ్యాపకములతో కూడినదిగా అగుచున్నది.

అట్టి పరబ్రహ్మము గురించి తెలుసుకొని ‘‘జ్ఞాని అయినవాడు’’ - జగద్దృశ్యములో వర్తిస్తున్నాడు.

కర్మలు - కర్మఫలములు - ఆత్మ సమక్షములో చిన్నపిల్లవాడు విని ఆనందించే కథా కల్పనలు వంటివి - అని తెలిసియే విద్యుక్త ధర్మములు నిర్వర్తిస్తున్నాడు.

చేపలుపట్టే వలకు చేపల గురించిన ఏ ఆకర్షణ - వికర్షణలు, సంతోష-దుఃఖములు ఉండవుకదా! అట్లాగే, వాస్తవానికి ఆత్మకు ‘జగత్’ సంబంధించిన ఎట్టి ఆకర్షణ - వికర్షణలు ఉండవు.

అయితే ఏం? సర్వదా ఏకమే అయి ఉన్న ఆత్మ-జీవాత్మగా అనేక భేదములను అంగీకరించి, వాటియొక్క ఆకర్షణ - వికర్షణలను తాను (కలలో తన కల్పనలకు తానే బద్ధుడు అగు తీరుగా) లోను అగుచున్నది.

తన కల్పనా జగత్తులను తానే వీడలేక ‘‘నేను బద్ధుడను. ముక్తిని పొందేది ఎట్లా?’’ అని కూడా తన్నుకులాడుచూ, తన కల్పనయందు తానే అటూ ఇటూ పచార్లు చేయుచున్నది.

ఇదంతా ఆత్మయొక్క క్రీడా-లీలా-కల్పనా వినోదానందము అనబడుతోంది. ఇంతకుమించి ఇక్కడ మరేమీ కారణమై లేదు.

ఈ దేహములో ప్రాణశక్తికి ప్రాణేశ్వరీ - సంబంధించిన దేవత దేహములో నలువైపులా నాడులలో చైతన్యరూపమై సచేతనంగా ప్రసరితమై ఉంటోంది.

ఒక డేగ ఆకాశంలో అనేక చోట్ల తిరిగి తిరిగి గూటిలో ప్రవేశించు తీరుగా ఈ జీవుని మనస్సు సుషుప్తి నుండి బయల్వెడలి, జాగ్రత్ స్వప్నములలో సంచారములు చేస్తోంది. తిరిగి ఆ మనస్సుతో కూడిన బాహ్యత్వముతో సహా - సుషుప్తియందు ‘లీనము’ అగుచున్నది.

అనగా చిత్తము సుషుప్తి యొక్క ఈవల నుండి ఆవలకు, ఆవల నుండి ఈవలకు (లేక) నిర్విషయ మౌనము నుండి - జాగ్రత్ స్వప్నములలోని అన్యరూపములగు విషయ సమూహములకు, విషయ సమూహములనుండి - తిరిగి స్వస్వరూపమునకు చెందిన మౌనము (సుషుప్తి).

ప్రయాణములు చేయుచున్నది. పచార్లు సలుపుచున్నది.

ఆత్మయే హిరణ్మయము (తేజో స్వరూపము) అయి, పంచకోశములకు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందకోశములకు) ఆవల ఏర్పడి ఉన్నది. అమృతమయమై వెలుగొందుచూనే (ఇడ - పింగళ - సుషుమ్న అనబడు) త్రినాడులలో (కుండలినీశక్తి సహిత అయి) సంచారములు చేయుచున్నది.

బ్రహ్మముయొక్క త్రిపాదములు ‘‘జాగ్రత్, స్వప్న, సుషుప్తులు’’. (ఆభరణములన్నీ, అంతటా బంగారమే అయి ఉన్న తీరుగా)-సర్వత్రా హిరణ్మయముగా (చైతన్య ప్రదర్శనముగా) ఉన్నదే ‘‘ఆత్మ’’ లేక బ్రహ్మము.

అట్టి సర్వత్ర తేజో - చైతన్యరూపమై వెలుగొందుచున్న పరమాత్మయే [ సర్వత్రా ఏర్పడియున్న వాయువు ఒక బంతిలో ⃝ ఏర్పడి ఉన్నట్లు) గా] , దేవదత్తుడుగా (జీవాత్మగా) అగుచున్నది.

కర్మఫలానుభవి

ఆత్మ సర్వత్రా సర్వదా అనన్యమే అయి ఉండి కూడా, దేవదత్తుడుగా (జీవుడుగా) - ‘కర్మబద్ధుడు’ వలె అగుచున్నది.

‘‘ఇష్టము’’నకు (యజ్ఞ యాగ క్రతు పూజ ఉపాసనకు) సంబంధించిన కర్మలచేతను, ‘‘పూర్తము’’ (బావులను త్రవ్వించటము, సత్రములను కట్టించటము, దానము, ధర్మము మొదలైన) కర్మలచేతను-శుభప్రదమైన సుఖరూపములైన కర్మఫలములను జీవుడు పొందుచున్నాడు.

అశుభమగు - సహజీవులను బాధించటము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, మొదలైన అశుభకర్మలచే - అశుభప్రదమైన, దుఃఖ రూపమైన కర్మ ఫలములను - (ఈ జీవుడు) పొందుచున్నాడు.

ఈ విధముగా-ఈ జీవుడు (దేవదత్తుడు) కర్మ బద్ధుడు అగుచున్నాడు. అట్టి కర్మఫలములను అనుసరించి జన్మలు (ఆయా ఉపాధులు) పొందుచున్నాడు. అయితే ఈ జీవుడు నిజంగానే కర్మ - జన్మలకు బద్ధుడా? ఈ విషయము మరికొంత విచారణ చేద్దాము.

ఈ జీవుడు కర్మలకు నిజముగా బద్ధుడా?

[‘‘జీవో బ్రహ్మేతి నా పరః!’’ అనునది వేదమహావాక్యము. కనుక] ఈ జీవుడు స్వతఃగాను, సహజంగాను, నిజస్వరూపముగాను బ్రహ్మమే (పరమాత్మయే) అయి ఉన్నాడు. బ్రహ్మము నిత్యముక్తము కదా? బ్రహ్మమునకు బంధము ఎక్కడిది? ఈ జగత్ దృశ్యము బ్రహ్మమునకు స్వయం లీలాకల్పిత క్రీడా వినోదమే కదా మరి? అనగా ఆత్మపట్ల (1) నటునుని స్వతఃసిద్ధరూపము (2) నాటకములోని పాత్ర వలె - పర ఇహములు ఏర్పడి ఉంటున్నాయి.

జీవుడుగా ‘నిత్యబద్ధము’ అయినప్పటికీ, పరమాత్మ (బ్రహ్మము)గా నిత్యముక్తుడు అయి ఉన్నాడు.

‘జీవుడు’ (దేవదత్తుడు) సహజముగా (పరమాత్మగా) నిత్యముక్తుడు. ‘జీవాత్మ’ అనునది సందర్భ కల్పితము. సందర్భబద్ధము కాబట్టి ‘నిత్యబద్ధము’. ఒక నాటకములో మనము ఒక పాత్రగా నటిస్తూ ఉంటే, ఆ ‘‘పాత్ర (Role)’’ కు ముక్తి అనునది ఏమి ఉంటుంది? ‘పాత్ర’ యొక్క సంగతి - సంబంధ - సందర్భములు నాటకము నిర్ణయిస్తుంది. అంతేగాని నటుడుగా మనము కాదు కదా!

ఒక కథలోని ఒక పాత్ర బయటకువచ్చి ఆ కథా రచయితకు బంధము కలిగించగలదా? లేదు. అట్లాగే పరమాత్మయొక్క స్వకీయ రచనా చమత్కార రూపుడగు ఈ ‘జీవుడు’ - అనబడువాడు జగత్తు నుండి బయల్వెడలి, బయటకు వచ్చి తన ఉత్పత్తి - స్థానమగు పరమాత్మత్వమునకు ఎట్లా బంధము కల్పించగలదు? లేదు. అయితే, ఈ జీవుడు ఆత్మజ్ఞానముచే ‘‘సర్వాత్మకమగు అఖండాత్మనే నేను’’ - అనునది సిద్ధించుకోనంతవరకు జన్మ - కర్మ పరంపరాబద్ధుడే మరి.

యథా కుమారకో నిష్కామానందమ్ అభియాతి।। ఒక పసిపిల్లవాడు ‘‘నాది ఈ దేశము - ఈ జాతి - ఆ కులము - ఈ మతము’’ మొదలైనవి ఆశ్రయించకుండానే, దేనినీ కోరుకోకుండానే, నిష్కామానందము (బాలనందము) పొందుచున్నాడు. పకపకా నవ్వుచున్నాడు. కేరింతలు కొడుచున్నాడు. గంతులు వేస్తున్నాడు. ఆతనిది అకారణానందము.

తథైష దేవః స్వప్న ఆనందమ్ అభియాతి। అట్లాగే దేవదత్తుడు (జీవుడు) స్వప్నదృశ్యమును తనకు తానే తన ఆనందము కొరకై సుఖ దుఃఖములు కల్పించుకొని ఆస్వాదిస్తున్నాడు. తెల్లవారి లేచిన తరువాత స్వప్నమునకు ముందువలెనే (స్వప్నము ముగిసిన తరువాత) యథాతథము (As it is) గా ఉంటాడు కదా! ‘‘స్వప్నములో సుఖ-దుఖ సంఘటనలకు పుణ్యమో, పాపమో కారణము’’ అని మనము అనము కదా! ఎందుచేత? స్వప్నములోని సంఘటనలచే, స్వప్నానంతరము - స్వప్నముతనదైనవాడు - స్పృశించబడడు కాబట్టి.

అట్లాగే,
జీవాత్మ (జాగ్రత్‌లో కూడా) బాధలు మొదలైనవి పొందినంతమాత్రం చేత, అవన్నీ ఆతనియొక్క ‘‘పరమాత్మ స్వరూపము’’ను స్పృశించవు. స్పృశించలేవు కూడా. దోషము కలిగించలేవు.

తాడ్యమానోనైవ ఇత్యేవమ్ ఇష్టా పూర్వకర్మ శుభాశుభైః న లిప్యతే! జీవాత్మ స్వప్నములలో ఒక వ్యక్తి కనబడు తీరుగా కల్పితమే కాబట్టి జీవాత్మయొక్క (శుభకర్మలగు) ఇష్టాపూర్తముల, (అశుభకర్మలగు) కామ క్రోధముల ‘‘మంచి చెడులు’’ పరమాత్మ స్వరూపమునకు దోషములు కలిగించజాలవు.
(ఇష్టము = వ్రతములు, యజ్ఞములు, పూజలు మొదలైనవి. పూర్తములు = సాంఘికసేవలు)

అయితే, ఇష్టా పూర్తములు - బుద్ధి నిర్మలత కొరకై ఉపసాధనములు.

అనేక దీపములు అనేకచోట్ల ఆయా వేరువేరైన వస్తు జాలమును దీపింపజేయవచ్చుగాక. కానీ, సమస్త దీపముల తేజో - అగ్నిస్వరూపము ఒక్కటే. వెలుగులో కనబడే వస్తువుల దోషములు - అగ్ని (వెలుగు)లో ప్రవేశించి, అగ్నియొక్క వెలుగునకు దోషము కలిగించ గలవా? లేదు కదా! అట్లాగే కేవలమగు ఆత్మకు ఏ దోషము అంటదు.

సర్వాత్మత్వము ఎరిగి, ఆస్వాదించువాని దృష్టిలో - జీవాత్మ సంబంధమైన సంబంధములు - వ్యవహారిక కల్పితమే కానీ పరమాత్మ స్వరూపమునకు సుఖదుఃఖములు కలిగించగలిగినవి కావు.

అట్టి సమస్త జ్యోతి (దీపము)లలోని (సమస్త జీవులలోని) పరంజ్యోతి (లేక) పరమాత్మ స్వరూపము తెలుసుకొన్న వాని చిత్తము ‘జ్యోతిషాంజ్యోతి రానందము’’ పొందగలదు. ఆతడు ఇక దృశ్య విషయానందమునకు బద్ధుడు, పరిమితుడు, ఆశయుడు అయిఉండడు.

వాస్తవానికి, స్వతఃగా చూస్తే, - శుభ్రవర్ణము, కేవలస్వరూపము - అగు ఆత్మనుండి బయల్వెడలిన, కల్పితములగు జాగ్రత్ స్వప్నములు- తిరిగి అదే మార్గములో వెనుకకు మరలి, ఆత్మయందే (తరంగములు జలమునందువలె) లయమును పొందుచున్నాయి.

స్వప్నములోని సంఘటన సందర్భ - సంబంధములచే మెలకువ తరువాత స్వప్నము తనదైన వానికి బంధము కలగనట్లే, జాగ్రత్‌లో ఆయా అట్టి విశేషములచే - (తనయొక్క ఆత్మస్వరూపతత్త్వము ఎరిగిన తరువాత) - బంధము శేషించి ఉండజాలదు.

ఆత్మతత్త్వమును గట్టిగా ఆశ్రయించాలి!

అందుచే ఓ శౌనకా! జలూకా భావవత్ యథా కామమ్ అజాయత ఈశ్వరాత్। ఒక జలగ ఏవిధంగా అత్యంత ప్రియముగాను, పట్టుదలగాను, గట్టిగాను జంతువుయొక్క శరీరభాగమును పట్టుకొని తన ఆహారము సంపాదిస్తుందో, ఈశ్వరతత్త్వమును, ఈశ్వరదృష్టిని (ఆత్మతత్త్వమును) ముముక్షువు అంతగట్టిగా ఆశ్రయించాలి సుమా!

పరము-అపరములను వదలి, ఆ రెండిటికి మధ్యగాగల సంధిని ఆశ్రయించి పరాపరముల ఏకరూపమగు స్వస్వరూపమును ఆశ్రయించువాడు ఆత్మానందమును సిద్ధించుకోగలడు. పరము-ఇహములు తనవే అయి, భావాభావముల మధ్యగా సుస్థిరమై, నిశ్చలమైయున్న ‘ఆత్మ’ను ఆశ్రయించువాడు, అట్టి సంధియందు ఆత్మను దర్శించుచున్నాడు. మోక్షసిద్ధుడౌతున్నాడు.

ఈ కపాలాష్టకమును (పూర్యష్టకమును పంచభూత మనో బుద్ధి జీవాత్మలను) (కపాలాష్టక శరీరమును) భావ - అభావముల మధ్యగాను, పర-అపరము మధ్యగాను నిశ్చలమైయున్న ఆత్మతో ‘సో2హమ్’ కొరకై - ‘అనుసంధానం’ చేయాలి సుమా! శిశువు తల్లి స్థనములను ఆశ్రయించుతీరుగా ఆత్మస్వరూపమును గురు-శాస్త్ర వచనముల సహాయంతో ఆశ్రయిస్తూ ఉండాలి. (The Physical Body and the circumstances we come across should be used as ‘instruments’ to know ourselves).

ఏదైతే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలకు జననస్థానమో, అట్టి ఆత్మయే ఈ విశ్వమునకు, జాగ్రత్-స్వప్న వస్తుతత్త్వములకు ‘జననస్థానము’. ఆత్మ సర్వదా శుభ-అశుభములకు ఆవలి తత్త్వము. స్వప్నములోని విషయాలకు స్వప్నము తనదైనవాడు ఆవలివాడే (Beyond) కదా! ‘‘అట్టి ఆత్మ (The Self that is the Absolute Form of Enlightenment) శుభాశుభకర్మలచే దోషము పొందునదికాదు’’ - అని ఆత్మ గురించి ఎరిగినవాడు, ఇక కర్మబంధములు, కర్మదోషములు పొందడు.

అట్టి పరమాత్మ గురించిన ఇంకొన్ని విశేషాలు

అన్యదేవస్య సంప్రసాదో - అనన్యమగు ఆత్మయందు అన్యముగా భావించబడే, స్తుతించబడే ఇష్టదేవతలు→ అలంకార రూపములు.

అంతర్యామి : నాటక రచయితయే నాటకములోని ‘పాత్రలు (Roles)’ అన్నిటికీ అంతర్యామి’’ (The Inner Thought, The Inner Recess) అయి ఉన్నట్లుగా, - పరమాత్మయే జగన్నాటకములోని జీవులందరికి అంతర్యామి! (అహమాత్మా-సర్వభూతాశయ స్థితః। భగవద్గీత, విభూతియోగము). నీకు అనుభవమగుచున్న జగద్దృశ్యమంతటికీ నీవే ‘అంతర్యామివి’.

అసంగః : ఒకాయన గొప్ప నాటము రచిస్తూ ఉన్నాడు. అట్టి సందర్భంలో - ‘‘నాటకములోని ఒక సందర్భమునకో, సంఘటనకో సంబంధమునకో ఆ నాటక రచయిత బద్ధుడు(Bounded) , సంగుడు (Related) అగుచున్నాడు’’ అని అనము కదా! అట్లాగే ఆత్మ ఈ దృశ్య జగత్తులో దేనికీ సంగము (Related and attached) కాదు. ఆత్మకు బంధము ఉండజాలదు. (ఈ జీవునికి-దృశ్య జగత్తుకు ఉన్న సంబంధము = ఒక రచయితకు - ఆతను రచిస్తూ, ఆస్వాదిస్తూ ఉన్న ‘‘కథ’’కు ఉన్న సంబంధమే).

చిద్రూపః : ఆత్మ - కేవలమగు ఎరుకను (The knowing of the knower is extending as what all being known. Eg : Dreams) తన రూపముగా కలిగి ఉన్నట్టిది. అట్టి ఎరుకయే ‘‘సమస్తమైన ఎరుగబడినది’’గా కూడా రూపము దాల్చుచున్నట్టిది.

పురుషః : జాగ్రత్ స్వప్న సుషుప్తులు మనోబుద్ధి చిత్త అహంకారములు తనయొక్క పురుషకారము గా కలిగినట్టిది - ఆత్మ.

ప్రణవహగ్ంసః : ఆత్మ →ప్రతిజీవుని స్వాభావికమగు స్వస్వరూపమే హగ్ంసం = హంస = ‘‘సో2హమ్’’. ప్రణవస్వరూపము (సంజ్ఞ-ఓం) అయినట్టిది. (ప్రణవము = ఓం = సమస్తము నేనైన ‘నేను’కు సంజ్ఞ).

పరంబ్రహ్మ : నటునిపట్ల - (1) నాటకములో పాత్ర, (2) నటనా చాతుర్యము, (3) తనకు తానైన ‘తాను’ - అను ‘3’ విశేషాలు ఉన్నట్లే, ‘జీవాత్మ’ - ‘ఈశ్వరుడు’ ‘స్వస్వరూపము’ - అను మూడు విశేషాలు తనయొక్క త్రివిధ దర్శనములుగా కలిగి ఉన్నట్టిది. ఆ మూడిటికి పరము (ఆవలది) ఆత్మ కాబట్టి ‘పరంబ్రహ్మము’ అనబడుతోంది.

న ప్రాణహగ్ంసః - ప్రాణము జీవుడు కాదు. ప్రాణము జీవునియొక్క శక్తిరూపము. జీవుడో? ప్రాణి, ప్రాణము (లేక) ప్రాణశక్తి తనదైనవాడు. (ప్రాణము జడము. జీవుడు చైతన్యస్వరూపము).

ప్రణవో జీవః - ప్రాణము తనదైన వాడుగా ప్రాణేశ్వరుడే ఈ జీవుడు. ఈ జీవుడు ప్రణవ (లేక) ఆత్మ స్వరూపుడు.
ప్రాణము, జీవుడు, దేవతలు కూడా - పరమాత్మకు చెందినవై, పరమాత్మవైభవమై, పరమాత్మకు సమర్పించబడినవై ఉన్నట్టివి. అట్టి పరమాత్మ గురించి తెలుసుకొన్నవాడు ఇక ‘‘అయ్యా! మోక్షము నాకు ఇప్పించండి’’ - అని నివేదనలు (Appeals) కలిగి ఉండడు. ఎందుకంటే, తనను తాను ‘‘బంధరహితము, ప్రణవస్వరూపము’’ అగు ఆత్మగా గమనిస్తూ ఉంటాడు కాబట్టి.

జీవస్య బ్రహ్మమ్ ఆపాదయతి! ఈ జీవుడుగా కనిపిస్తున్నది, ‘నేను’గా అనిపిస్తున్నది - సమస్తము పరబ్రహ్మతత్త్వమే’’ అని ఎరిగి ‘ఆత్మతృప్తి’ని పొందుచున్నాడు. ‘‘జీవో శివః। ఈ జీవుడు బ్రహ్మమే। పరబ్రహ్మ స్వరూపుడే’’ - అను దర్శనమును వీడకయే, లీలగా ఈ దృశ్య జగత్తులో పాల్గొనుచున్నాడు. అయితే, ‘‘బ్రహ్మము జీవుడుగా అగుచున్నది’’ అని (అజ్ఞానముచే) ఆపాదించబడుతోంది.

బ్రాహ్మణుడు

(1) ఆత్మను ఎరిగి, (2) సర్వత్రా ఆత్మను దర్శించుచు, (3) తనకు చెందిన సమస్తము పరమాత్మకు సమర్పించి, (4) తానే ‘పరమాత్మ’ అయి వెలుగొందువాడు- ‘‘బ్రాహ్మణుడు’’ అని చెప్పబడుచున్నాడు. ‘‘నాకు, నీకు, జగత్తుకు ఆత్మ అనన్యము. ఆత్మకు మనము అనన్యము’’ అను ఎరుకయే ‘‘బ్రాహ్మణత్వము’’.

సత్త్వమ్ = ‘‘సత్-త్వమ్’’। ‘నీవు’గా కనిపించేదంతా సత్‌స్వరూపమగు ఆత్మయే’’
→ ఇదియే బ్రాహ్మణునకు అంతఃశిఖ (పిలక).
→ ఇదియే అంతరమగు యజ్ఞోపవీతము (లేక) బ్రహ్మసూత్రము.

‘‘సమస్తము బ్రాహ్మమే’’ అనునదే ముముక్షువు సిద్ధించుకోవలసిన అంతఃశిఖ - ఉపవీతములు.

బాహ్య శిఖ - యజ్ఞోపవీతములు

కర్మిష్టుడగు బ్రహ్మచారి, గృహస్థుడు - బాహ్యంగా ధరించే శిఖ - ఉపవీతము (జందియము) యొక్క అంతరార్థము ‘‘సమస్తము పరబ్రహ్మస్వరూపమే’’ అను భావనయే సుమా!

అయితే - ‘బ్రహ్మభావన’ అను అంతర్ ఉపవీతము - (బాహ్యమైన ఉపవీతధారణవలె) - బయటకు కనిపించేది కాదు.

దారపు ప్రోగులతో నిర్మితమైన ‘‘బ్రహ్మసూత్రము’’ కళ్లకు కనిపిస్తుందిగాని, బ్రహ్మభావన కళ్లకు కనిపించదు. ఒకనిని చూస్తే, ఆతని అవగాహనలు స్వభావములు మొ।।వి బయటగా - కళ్లకు కనిపిస్తాయా? లేదు కదా।

బాహ్యమైన దారపు తంతువులచే తయారుచేసుకొని ధరించే ఉపవీతమును - ‘‘అంతరబ్రాహ్మీభావన’’తో మేళనము చేసి ధరించాలి. అట్టి భావనలేకుండా త్రిసూత్రపు భౌతిక (ప్రత్తిదారపు) పోగు ధరించి ఏమిప్రయోజనము? అట్టి బ్రహ్మసూత్రధారణచే ముఖ్యముగా - అంతః సత్త్వ ధారణయే ఉద్దేశ్యించాలి.

బ్రహ్మము ఎటువంటిది?

న సత్ : అట్టి బ్రహ్మము సత్తు (ఉన్నట్లు)గా కళ్లకు ఒక వస్తువు వలె కనిపించేదా? కాదు. ఇంద్రియములకు ‘ఉన్నది’గా కనిపించేదంతా బ్రహ్మముయొక్క స్వకీయ భావనా చమత్కారము మాత్రమే. (ఉన్నది కాదు).

న అసత్ : ఆత్మయొక్క ఉనికి చేతనే గుణములు, భావములు, అనుభూతులు, అనుభవములు సత్తా పొందుచూ ఉండగా, ఆత్మ ‘‘అసత్తు, లేనిది’’ - ఎట్లా అవుతుంది? (లేనిదీ కాదు).

న సద సత్: ఆత్మకు సంబంధించి - కొంతవరకు ‘ఉన్నది’, మరికొంతవరకు ‘లేనిది’ - (Partially existent and partially non-existant) కూడా కాదు.

న భిన్నం: ఆత్మ - ఈ సమస్తమునకు వేరే ఎక్కడో ఉన్నది కాదు. సమస్తము ఆత్మయే అయి ఉండగా ఆత్మ ఎక్కడో ఉండటమేమిటి?

న అభిన్నమ్ : ఆత్మ - ఒకానొక దృశ్యము వంటిది కాదు కాబట్టి ‘అభిన్నము’ అని కూడా అనము. నాకు రూపాత్మకం కాదు.

న చ ఉభయమ్ : ఏకమగు ఆత్మయే సర్వదా ఉనికి కలిగి ఉన్నది. ఆత్మకు అన్యమైనట్టిదానికి ఉండటము అనునదే లేదు. అందుచేత ‘‘ఆత్మ-భిన్నము- అభిన్నముకూడా’’ - అని కూడా చెప్పలేము.

న స భాగమ్ : ‘‘ఆత్మ, దృశ్యము, దేహము, జీవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు - మొదలైన విభాగములతో కూడుకొని ఉన్నది’’ అని అనుకోవటానికి వీలులేదు. ఆత్మ అనన్యము - అప్రమేయము (Not different and not related to anything) అనునది మహావాక్యసారము అయి ఉండగా, ‘‘ఆత్మ-విభాగములతో కూడుకొన్నది’’ అని ఎట్లా అంటాము?

న నిర్భాగమ్ : దృశ్య - దేహ - జీవ - ఈశ్వర - పరమేశ్వరులు ఆత్మయొక్క అంతర్భాగములే కాబట్టి - ఆత్మ ‘‘భాగరహితము’’ అని కూడా అనము.

న చ అపి ఉభయ రూపకమ్ : ‘‘ఏకము, అనన్యము’’ అగు ఆత్మ సభాగ - నిర్భాగయుతము (భాగసహితము, భాగరహితము, ఉభయరూపకము) - అని కూడా అనము. అనలేము కూడా!

మాయ - యా మా!

సమస్తము బ్రహ్మాత్మైకత్వము (బ్రహ్మ-ఆత్మ-ఏకత్వము) అని ఎరిగిన తరువాత - ఇక్కడ మిథ్యాత్వము (మాయ) అనునది మాత్రం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కార్య - కారణ - కర్తృత్వములన్నీ కల్పితములే కాబట్టి ‘మిధ్య’గా హేయమే (వదలి ఉండవలసినట్టివే). కలవంటి జాగ్రత్ - స్వప్నవ్యవహారములలో మిధ్య కానిదేది? అంతర్గతంగా, ఆయా సందర్భ పరిమితంగా చూచినప్పుడు - నిజము కానిది ఏది?

బ్రహ్మమునందు (‘దృశ్యము - దేహి - జీవుడు - ఈశ్వరుడు - కేవలుడు’ అను) పంచపాదములు (విభాగములు) కించిత్ కూడా లేనేలేవు. (ఏకోసత్, విప్రా బహుధావదంతి - అను వాక్యార్థముగా) బ్రహ్మమునందు ఏకత్వమే సిద్ధిస్తూ ఉండగా శాస్త్రములు బ్రహ్మము గురించి చెప్పటానికై పై ఐదు పాదములు కల్పిస్తున్నాయి. ఏకత్వమే అంతిమంగా (Finally) ఎలుగెత్తి బోధించుచున్నాయి.
(ద్రష్ట, జీవుడు, ఈశ్వరుడు, పరాత్మ, పరాత్పరుడు).

చతుష్పాదః బ్రహ్మము

చతుష్పాదః బ్రహ్మము తనయొక్క ‘4’ పాదములతో సమస్త జీవులలోను ‘‘అంతర్వర్తి’’ అయి విరాజిల్లుచున్నది. చత్వారి స్థానములను తనయందు కలిగినదై ఉన్నది.

ఆత్మకు ముఖ్య చేతన చతుర్ స్థానములు :

Ⅰ. (1) నాభి (బొడ్డు), (2) హృదయము (3) కంఠము (4) మూర్థము (శిరస్సు, నుదురు)లలో విశేషమైన ప్రదర్శనా సంస్థితి కలిగియున్నది. (ఇవి ఉపాసనకొరకై సూచించబడుచున్నాయి).
(1) నాభి = బొడ్డు. నడిమిప్రదేశము. శరీరములో ముఖ్య మధ్య (నాభి) భాగము. మణిపూరక చక్రస్థానము. సర్వదేహతత్త్వములను తనయందు పూరించుకొని కేంద్రీకృతమై ఉన్న స్థానము.
(2) హృదయము = భావనలు, అనుభూతులు, అభిప్రాయములు మొదలైవన్నీ జనించు స్థానము. పరమాత్మ స్థానము. పరమాత్మయే - హృది సర్వస్య తిష్ఠితమ్ - సమస్త హృదయములలో ప్రకాశమానుడై ఉన్నారు.
మననరూపమగు మనస్సుకు (ఆలోచనలకు) జనన స్థానము - హృదయమే.
(3) కంఠము = శబ్దము ఉదయించుస్థానము. వాయువును శరీరమంతా విస్తరింపజేయుచోటు. కంఠాకాశముతో వాయుతరంగముల పరస్పర తాడనత్వముచే శబ్దము జనిస్తోంది.
(4) మూర్ధము = పంచ జ్ఞానేంద్రియములకు (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శలకు) కేంద్రీకృతస్థానము.

ఈ నాలుగు దేహములో ఆత్మ చైతన్యమునకు విశేష ప్రకటన స్థానములు.
Ⅱ. ఆత్మ ఆస్వాదించుచున్న చతుర్ అవస్థలు:
(1) జాగ్రత్ - ఇంద్రియముల ‘బాహ్యవిషయానుభవ ప్రజ్ఞ’.
(2) స్వప్న - స్వకీయ అంతర్ భావనానిర్మిత - విషయ కల్పిత ప్రజ్ఞ.
(3) సుషుప్తి - ‘‘నిర్విషయ మౌన - అనుభవరహిత - నిర్విషయ ప్రజ్ఞ’’.
(4) తురీయ - జాగ్రత్ స్వప్న సుషుప్తులు ‘‘తనవైయున్న స్వానుభవ ప్రజ్ఞ.’’

Ⅲ. చతురగ్నులు (యజ్ఞ-యాగములలో చెప్పబడేవి)
(1) ఆహవనీయాగ్ని - వేదికకు పూర్వ (తూర్పు) దిక్కున హోమము చేయబడినది.
(2) దక్షిణాగ్ని - వేదికకు దక్షిణ దిక్కున ఉండే అగ్ని.
(3) గార్హపత్యాగ్ని - వేదికకు పశ్చిమ దిక్కున ఉండే అగ్ని.
(4) సభ్యాగ్ని - హోమరహితాగ్ని. వేదికకు ఈశాన్య దిక్కునందు ఉండునది (సభ్య, అవసద్యోగ్నులు-రెండు హోమ రహితాగ్నులే)

ఈ అగ్నులు అటు యజ్ఞవాటికలోను, ఇటు భౌతిక దేహము అను వాటికలోను సంప్రదర్శనమగుచున్నాయి.
Ⅳ. చతురవస్థల దేవతాంశలు

జాగ్రత్‌కు - బ్రహ్మ। 
స్వప్నమునకు - విష్ణువు। 
సుషుప్తికి - రుద్రుడు। 
తురీయమునకు - అక్షరము, చిన్మయము।

ఈ ఈ దేవతాంశలు జీవాత్మను కళాత్మకంగా తీర్చిదిద్దుచున్నాయి.
ఈ విధంగా 4 అవస్థలు (ఆత్మకు) నాలుగు వ్రేళ్ల వలె, చుట్టుబడి ప్రవర్తిస్తున్నాయి.

ఆయా 4 అవస్థలకు (పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనో బుద్ధి చిత్త అహంకారములు అని) ‘‘24’’ - తత్త్వములు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయము) ‘‘4’’.

          24 x 4 = 96

96 తత్త్వములు తంతువువలె చుట్టబడినది ‘అపర’ తత్త్వము. అవన్నీ సత్వ రజో తమో గుణములరూపమై వర్తిస్తున్నాయి.
జ్ఞానపూతమ్। త్రిగుణ స్వరూపమ్।

అట్టి తత్త్వములతో కూడి విశ్వమును ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు ధరించటమునకు సూచనయే - త్రిసూత్రధారణ.

త్రిసూత్రముల - 3 పేటల (తంతువుల) ఉపవీతము

ఓ మహనీయుడవగు వీతహవ్య ప్రపౌత్రా! వేదవిద్యా పారంగతుడగు గృత్స్నమద పౌత్రా! తపశ్శాలీగు సునకముని కుమారా! ప్రియ శౌనకా!

మనము ఇప్పటిదాకా చెప్పుకున్న 96 తత్త్వముల ‘ప్రతీక’యే ‘జ్ఞానపూరిత త్రిగుణాత్మక సంజ్ఞ’ యగు త్రిసూత్రధారణము (లేక) ‘యజ్ఞోపవీతము’ (లేక) బ్రహ్మసూత్రము. (లేక) జంద్యము / జందియము.

అట్టి యజ్ఞసూత్రములోని ‘3’ ప్రోగులను (దారములను), మధ్యలో ఉండే ‘బ్రహ్మముడి’ ని ఇంకా ఈ విధంగా ఎరిగి ధారణచేయాలి.

బ్రహ్మముడి : సమస్తము బ్రహ్మముతో ముడిపెట్టి చూడటమే బ్రహ్మముడియొక్క ఉద్దేశ్యము. ‘‘బ్రహ్మమే నేను - నీవు - ఈ జగద్దృశ్యముగా ప్రదర్శనమగుచున్నది’’ - అను ఎరుకయే ‘బ్రహ్మముడి’.

త్రిమూర్తిత్వం పృథక్ విజ్ఞాయ : బ్రహ్మము నందు క్రీడా - లీలా వినోదముగా - (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనే) - మూడు వేరువేరైన విశేషాలు (జలములో ఆకాశ విభాగములు ప్రతిబింబించుచున్న తీరుగా) ప్రతిబింబించుచున్నాయి. హృదయములో (దర్పణంలోలాగా) త్రివిధమైన దృశ్యములుగా మూర్తీభవించినవై ఉంటున్నాయి.

నవ బ్రహ్మాఖ్య నవగుణోపేతమ్
Ⅰ. (1) సత్త్వ సత్త్వము (2) సత్త్వరజము (3) సత్త్వతమము
Ⅱ. (1) రజోసత్త్వము (2) రజోరజము (3) రజోతమము
Ⅲ. (1) తమోసత్త్వము (2) తమోరజము (3) తమోతమము

ఈ విధం నవగుణోపేతములు నవబ్రహ్మాఖ్యములు చెప్పబడుచూ ఉన్నాయి.

వీటి త్రి-నవమానముగా ‘సృష్టి’ అను కల్పన యొక్క అంతర్ - రంగుల మేళమువలె అగుచున్నాయి.

[ నవబ్రహ్మాఖ్యములు: నవప్రజాపతులు నవబ్రహ్మలు పౌరాణికంగా - మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు (9) ]

నవబ్రహ్మలు = బ్రహ్మ మానస పుత్రులు సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, ఋభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి (9)
అవన్నీ తిరిగి త్రిగుణములుగా చేసి, సూర్య-చంద్ర-అగ్ని కళారూపత్వముతో ఏకీకృతం చేయబడుచున్నాయి. ఆది - అంతములను ఏకీకృతముచేసి త్రి = అవృత్యము (Blossom) చేసి

అను త్రి- అభిమానములను ప్రదర్శించు సంజ్ఞగా మూడు ధారములుగా ఉపవీతము తయారుచేయబడుచున్నది.

మూడు కలిపి ‘ఏక-ఉపవీతము’గా దగ్గరకు జరిపి ‘ఏకీకృతము’ చేయబడుతోంది.

ఉపవీతము యొక్క పరిమాణము (Size) విశేషములు
ఆ త్రి గ్రంథిలను (3 దారములను) బ్రహ్మముడి దగ్గరగా తెచ్చి ‘ఏకగ్రంథి’గా తయారుచేయబడుతోంది.

ఉపవీత యొక్క పొడవు

ఉపవీత యొక్క పొడవు

9 x 3 (27) తత్త్వముల సంబంధముతో
- త్రిగుణోపేతముగా (సత్త్వ రజో తమోగుణోపేతంగా)
- త్రిమూర్తి లక్షణ లక్షితంగా (బ్రహ్మ-విష్ణు మహేశ్వర లక్షణ లక్షితంగా, సృష్టి స్థితి లయ లక్షణ లక్షితంగా) ఆపాదితము చేసి, భావన చేయబడుగాక।

వామాగ్ంసా - దక్షిణకట్యంతమ్ విభావ్య। ఎడమ భుజము నుండి కుడి కటి ప్రదేశము వరకు ఆవరించునట్లుగా యజ్ఞోపవీతము ధరించాలి.

ఆద్యంతమ్ (ఆది ఆంతమ్ - చివరి కొస వరకు) - గ్రహ సమ్మేళనము ఏకమ్ జ్ఞాత్వా = బ్రహ్మముడి నుండి బ్రహ్మముడివరకు (సూర్య చంద్ర అంగారక బుధ గురు శుక్ర శని రాహు కేతువులు - అనబడే) నవగ్రహముల ఏకత్వముగా ఉపవీతమును భావించి కళ్లకు అద్దుకోవాలి. బ్రహ్మముడిని స్పృశిస్తూ ‘‘భిన్నత్వములో ఏకత్వము’’ అను ఆత్మభావన అనుసంధానం చేయాలి.

ఉపవీతమును (లేక) బ్రహ్మసూత్రము ‘బ్రహ్మము’ గా భావించబడు గాక।

బ్రహ్మమేవ సత్యమ్

మూలమ్ - ఏక్‌గ్ం సత్యం మృణ్మయం విజ్ఞాతగ్ంస్య,
యత్ వాచా-రమ్భణం। వికారో నామధేయమ్।
‘మృత్తిక’ - ఇత్యేవ సత్యం।

తరంగములలో జలమే సత్యముగాని, తరంగముల ఆకారము సత్యము కాదు.

అట్లాగే మట్టితో - కోతి, కుక్క, మనిషి, దేవత, గుండు, పలక….ఇటువంటివి కొన్ని చేసి ఒకానొకచోట ఉంచామనుకో.

అప్పుడు వాటన్నిటిలో సత్యము ఏది? కోతియా? కుక్కయా? దేవతయా? గుండా? పలకయా?

శౌనకుడు : గురువర్యా! మీరు చెప్పిన వేరువేరు వస్తువులన్నీ (లేక) రూపములన్నీ మట్టితో తయారుచేసినవి కదా! అందుచేత - మృత్తికేవ సత్యమ్। మట్టితో తయారుచేసిన ఆయా ఆకారములన్నీ సత్యము కావు. మట్టియే సత్యము.

అంగిరస పిప్పలాదమహర్షి : అవును. మట్టియే సత్యము. మట్టితో ఒక ‘మనిషి’ ఆకారము నిర్మిస్తే అందులో ముక్కు, నోరు, కళ్లు, నుదురు, తల, చేతులు, కాళ్లు మొదలైనవన్నీ మట్టియే కాబట్టి ‘మృత్తి కేవసత్యమ్’ అనేది ఉపనిషత్ వాక్యము.

మరి, మట్టి (బొమ్మ) యొక్క ముక్కు, నోరు, కళ్లు, నుదురు, తల, చేతులు, కాళ్లు మొదలైనవి (అట్లాగే) మట్టితో నిర్మితమైన కోతి, కుక్క, మనిషి, దేవత, గుండు, పలకల మాటేమిటి?

ఏమిటంటే…., ‘‘వాచారంభం। వికారో నామధేయమ్।’’

మట్టి దృష్ట్యా అవన్నీ మాటవరసకు చెప్పుకునేవి మాత్రమే. ఆయా వేరైన ఆకార - వికారములకు మనము కల్పితముగా చెప్పుకొనే నామధేయములు [పెట్టిన పేరులు (Names sake nomenclature)] మాత్రమే!

అట్లాగే -

‘‘సమస్త జీవులలో హంస (ఆత్మ) మాత్రమే సత్యము. కనుక ఆత్మయొక్క జీవ, జగత్తుచేత - రెండవ నామధేయమ్ - (మట్టికి మట్టి బొమ్మలు లాగా) - అంతః శిఖోపవీతము. ఏకమగు ఆత్మకు సంజ్ఞ. 

జీవుడు - దృశ్యము మొదలైనవన్నీ. ‘మనో-భాషాకల్పిత భేదములు’ మాత్రమే!’’. ఆత్మయే సత్యము.

ఇట్టి నిశ్చయము ప్రవృద్ధపరచుకుంటూ, ‘బ్రహ్మము’ గురించిన ధ్యానము నిర్వర్తించెదరు గాక।

‘బ్రాహ్మణుడు’ ‘యతి’ - బాహ్యమైన శిఖను, నూలుప్రోగు యజ్ఞోపవీతమును లెక్కలోకి తీసుకోకుండా, అంతఃశిఖ, అంతర - యజ్ఞోపవీతమునే ముఖ్యముగా దృష్టియందు నిశ్చయము చేసుకొని ఉంటాడు.

ఇక గృహస్థులు ధరించే బహిర్‌లక్షితమైన శిఖ, (Outwardly aimed and wearing of Marriage-thread) అగు నూలు జందియము (లేక) యజ్ఞోపవీతము ధరించినంతమాత్రం చేత అది బ్రాహ్మణత్వము (బ్రాహ్మణుడు) అవదు. అది కర్మలకు సంబంధించిన ‘‘గృహస్థశిఖ - యజ్ఞోపవీతములు’’ మాత్రమే. ఆత్మదృష్టి కొరకై ధరించే సూచనారూపములు మాత్రమే।

అందుచేత గృహస్థుడుగా ధరించేది - అభాస పూర్వక ‘‘కేశ యజ్ఞోపవీతములు’’ అని చెప్పబడుతోంది. (They are symbolic to the Absolute Self which is holding all else).

శిఖ - యజ్ఞోపవీతముల అంతరార్థమును దృష్టిలో కలిగిఉండి - ప్రత్యక్షముగా :
- నూలుప్రోగులతో చేసినది.
- 96 బెత్తెలు, ముప్పేట (3వరసల) దారమును, మరల ‘ముప్పేట’గా చేసి మరల మూడు వరుసలలో కలిపి ముడి (బ్రహ్మముడి) వేయాలి.
- నాలుగు పేటలు చేసినది అగు యజ్ఞోపవీతధారణ చేయాలి.
- 24 తత్త్వములను ఉద్దేసిస్తూ ఉండాలి.
- (ద్రవ్య / ద్రష్టాత్మ-భూతాత్మ-జీవాత్మ-అంతరాత్మ, పరమాత్మ-నిర్మలాత్మ-శుద్ధాత్మ (కేవలాత్మ) -జ్ఞానాత్మ-మహాత్మ-లనబడే) నవతత్త్వములను ఏకము చేసి,

ఈ విధంగా బ్రహ్మసూత్రము (జందియము/ఉపవీతము) యొక్క 3 పోగులలోని ప్రతి పోగుకు (బ్రహ్మ-విష్ణు-మహేశ్వర, సృష్టి స్థితి లయ, సత్త్వ రజో తమో, సత్ చిత్ ఆనంద, జీవ ఈశ్వర పరమాత్మ మొదలైన) ఆయా ఆకారార్థములు ఉద్దేశ్యించబడుచున్నాయి.

‘బ్రహ్మముడి’. సమస్తమునకు ‘‘ఆది, జనన, అంతః ప్రతిబింబ’’ రూపమగు ‘బ్రహ్మము’నకు సంజ్ఞ. బ్రహ్మము పట్ల ‘ప్రవృత్తి’ కొరకై ఉపవీతము - ఒకానొక ఉపకరణ వస్తువు. ‘బ్రహ్మముడి’ = సృష్టి స్థితి లయములను పరబ్రహ్మముతో ముడి పెట్టడము. ఏకము చేయటము.

శౌనకుడు : మహాత్మా! పిప్పలాద భగవాన్! ‘ముక్తి’ అనగా ఏమి? బ్రహ్మ మొదలైన లోకపాలకులపట్ల, దేవర్షులపట్ల, మనుష్యులపట్ల ముక్తి ఏఏ తీరులుగా ఏర్పడి ఉంటుంది? ‘ముక్తి’ అనేది - దేవతలకు ఒక తీరుగా, మానవులకు ఇంకో తీరుగా, యక్ష, రాక్షసులకు మరొక తీరుగా, జంతువులకు వేరే తీరుగా ఉంటుందా?

అంగీరస పిప్పలాదుడు :
సర్వేషాం బ్రహ్మాదీనం దేవర్షీణాం మనుష్యాణాం ముక్తిః ఏకా। బ్రహ్మైకమేవ। బ్రాహ్మణత్వమ్ ఏకమేవ।।
బ్రహ్మ మొదలైన సృష్టి కర్తా దేవతలకైనా, దేవర్షులకైనా, మానవులకైనా ముక్తి ఒక్క తీరైనదా! ఆత్మ ఒక్కటే గాని ఒక్కొక్కరిలో ఒక్కొక్కతీరైన ఆత్మ లేదు. ముక్తి, బ్రహ్మము, బ్రాహ్మణత్వము అందరికీ ఒక్కతీరైనదే।

‘‘ఈ దృశ్యము, దేహము, సందర్భములు మొదలైనవి - కేవలాత్మ స్వరూపుడనగు నాకు - ఎప్పుడూ కూడా బంధమే కాదు’’ అను స్వకీయ నిశ్చల నిశ్చయత్వమే’’ ముక్తి. అదియే బ్రహ్మము. ఏకమగు బ్రహ్మమే అందరిలో ఏర్పడి ఉన్నది. (సమం సర్వేషు భూతేషు తిష్ఠతం పరమేశ్వరమ్ ।।)

వేదాంత వాఙ్మయానుసారముగా - ఈ జీవుడు ‘‘బ్రాహ్మీదృష్టి’’చే బ్రాహ్మణుడు అగుచున్నాడు. అంతేగాని జన్మ - జాతి - కర్మల చేత కాదు (వేదవిహిత కర్మలుచేత ‘విప్రుడు’ మాత్రమే అగుచున్నాడు).

అందుచేత బ్రహ్మము, బ్రాహ్మణత్వములకు - సమస్త జీవులు (బ్రాహ్మీ భావన సిద్ధించుకోవటానికి) అర్హులే.
= [జన్మనా జాయతే శూద్రః। కర్మణా జాయతే ద్విజః।
= బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణత్వత్। ఇతి శాస్త్రేషు నిర్ణయః]

శౌనకుడు : మరి వర్ణాశ్రమాచారముల మాట ఏమిటి?

అంగీరస పిప్పలాదుడు : అవును. శాస్త్రములు-ఈ జీవులకు (బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర) వర్ణాశ్రమాచారములను, విధి-నిషేధ విశేషములను, లౌకిక ధర్మములను వేరువేరుగా (దేశ-కాల-విధానంగా) చెప్పుచూ ఉన్నాయి. విప్రులకు, కొన్ని వర్గముల వారికి, శిఖ, యజ్ఞోపవీతములు, విధించబడ్డాయి. తదితరుల కొందరికి కూడా ఆ రెండు విధించబడకపోవచ్చుగాక!

కానీ అపవర్గము (మోక్షము) అనునది అందరికీ ఒక్కటే. బ్రహ్మజ్ఞానము చేతనే ఒకడు ‘బ్రాహ్మణుడు’ అను శబ్దార్ధపూర్వకమైన అర్హత పొందుచున్నాడు. అట్టి బ్రహ్మీదృష్టి సిద్ధించుకొన్న బ్రాహ్మణునకు ఆత్మకు సంజ్ఞ అగు ప్రణవమే శిఖ, యజ్ఞోపవీతములు. ఇంకా చెప్పాలంటే…,

❇︎ హంస (సో2హమ్) యే - శిఖ।
❇︎ ప్రణవమే (ఓం) - యజ్ఞోపవీతము।
❇︎ నాదమే - జీవాత్మత్వముయొక్క పరమాత్మత్వముతో ‘‘అనుసంధానము’’।

అట్టి ‘‘సమస్తము ఆత్మయే! బ్రహ్మమే!’’ - అనునదే అసలైన ధర్మము. నేతరో ధర్మః। తదితర వర్ణాశ్రమ ధర్మములు. ‘సందర్భానుచిత, సాంఘిక విధులు. అవన్నీకూడా ‘‘పరస్పర సానుకూల్య’’ ధర్మములేగాని (వాస్తవమగు, శాశ్వతమగు) ‘‘బ్రాహ్మీ ధర్మము’’ కాదు.
సమస్తము బ్రహ్మముగా తలచుచు, ‘‘తాను బ్రహ్మమే’’ అను బుద్ధియొక్క సిద్ధియే అన్ని ఆశ్రమముల సర్వసారమైనట్టి ‘‘బ్రాహ్మణ ధర్మము’’.

ఇంకా కూడా శిఖ ఉపవీతములు పరమార్థ దృష్టిచే ఈ విధంగా సవివరణము చేయబడుచున్నాయి.
🌹 ప్రణవమే (ఓం) - హంస (సో2హమ్). (హంసో2హమ్)యే - శిఖ.
🌹 నాదమే, నాదానుసంధానమే - త్రివృత్ సూత్రము (మూడు దారముల సూత్రము / జందియము)
🌹 హృదయాకాశమున వెలుగొందు చైతన్యము-సమస్తమును చేతనపరచు ఇచ్ఛ. ఉత్సాహపరచుటయే ఉపవీతముయొక్క సంజ్ఞ.
🌹 త్రివిధం బ్రహ్మసూత్రము (త్రిసూత్రమ్) - జాగ్రత్ స్వప్నసుషుప్తులుగాను, త్రిగుణములుగాను, త్రికాలములుగాను ఆత్మప్రదర్శనమే ఉపవీతములోని త్రి-సూత్రములధారణ.

అట్టి బ్రహ్మము గురించి ‘జ్ఞాతుమ్’ (తెలుసుకోవటము) ‘‘ద్రష్టుమ్’’ (దర్శించటానికి) ‘ప్రవేష్టుమ్’ (అదే మనము అయి ఉండటానికి) ఉద్దేశ్యించినదే - నిజమైన (అసలైన) శిఖోపవీతధారణ - అని జ్ఞాపకము కలిగి ఉండెదరు గాక!

ప్రత్తి దారపు ఉపవీత ధారణ ఆశ్రమ కర్మ - సాంఘిక పరిమితమైన ఆచారమేగాని ముఖ్య ప్రయోజనము కాదు. వాటి సంజ్ఞార్థమో? జీవులందరికీ విహితమే.

ప్రణవ - హంస - హృదయాకాశ - త్రివిధబ్రహ్మార్థము ఎరిగి, ఈ బాహ్యజగత్తును తాను దర్శించు (ధారణచేయు) బ్రహ్మసూత్రముగా భావించువాడు నిజమైన శిఖోపవీతధారుడే అగుచున్నాడు. అది అందరూ ఆశ్రయించవలసినదే, గాని చాతుర్వర్ణ్యములలోను, చతుర్-ఆశ్రమములలోను ఎవరికో ఒకరికి చెందినది కాదు.

అందుచేత ఓ శౌనకా! మరొకసారి సమీక్షించి చెప్పుచున్నాను.

ప్రాపంచక శిఖోవీతం త్యజేత్।

ప్రాపంచకమైన ఉపవీతము బుద్ధిచే త్యజించబడి ఉండుగాక!

స శిఖం వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేత్ బుధః। జుట్టు శిఖను వపనము చేసివేయాలి, (ప్రక్కకుపెట్టివేయాలి, వదలివేయాలి). బాహ్య సూత్రమును బాహ్యముననే ఉంచబడు గాక।

      యత్ అక్షరం పరం బ్రహ్మ 
      తత్ సూత్రమ్ ఇతి।’’ - ధారయేత్।।

బాహ్యమైన శిఖ, బాహ్యమైన నూలుపోగు జందియము - దేనికి సంజ్ఞయో, అది సర్వదా గుర్తు పెట్టుకొని ఉండాలి.

ఏది - అక్షరము (మార్పు చేర్పులు లేనిది, క్షరము కానిది) అయి ఉన్నదో, త్రిగుణములకు, త్రికాలములకు త్రిలోకములకు ‘పరము’ (Beyond) అయి ఉన్నదో,-అద్దాని సూచకమే-నేను బుద్ధితో ధారణ చేస్తున్న బ్రహ్మసూత్రము. అట్టి ఆత్మజ్ఞాన సిద్ధిచే ‘నాకు బంధమే ఉండజాలదు’- అను ఈ బ్రహ్మ సూత్రమునే పునర్జన్మ నివృత్తి కొరకు ధారణ చేయాలి.

బ్రహ్మసూత్రార్థము

శ్లో।। ‘‘సూచనాత్ సూత్రమ్’’ - ఇతి ఉక్తగ్ం - సూత్రం నామ పరంపదమ్। 
    తత్ సూత్రం విదితం యేన, స ముముక్షుః। స భిక్షుకః। 
    స వేదవిత్। సదాచారః। స విప్రః పంక్తి పావనః।

బ్రహ్మసూత్రము (ఉపవీతము) - అనునది పరమపదము గురించిన సూచన చేసేది, గుర్తు చేసేది, ఆశయము ప్రసాదించేది కూడా।

ఎవ్వడైతే బ్రహ్మసూత్రమును ‘అఖండము, ఏకము, స్వస్వరూపము, సర్వస్వరూపము’ అను ఎరుకను ఆశయముగా స్పష్టీకరించుకొని ఉంటాడో -
✤ అట్టివాడే ముముక్షువు (మోక్షాశయమును సంసిద్ధపరచుకొనువాడు).
✤ ఆతడే భిక్షకుడు. (భి = అంధకారమును, క్ష = క్షయింపజేసుకొనుచున్నవాడు).
✤ స వేదవిత్। ఆతడే వేదార్థము సువిదితము చేసుకుంటూ ఉన్నవాడు.
✤ సదాచారః। ఆతడే శాస్త్రములు సంబోధిస్తున్న సదాచారము (సత్-ఆచారము) ఎరిగి అనుసరించువానితో సమానుడు.
అట్టివాడే విప్రుడు. (వేద పాఠములు తెలిసినవాడు). అట్టివాడు ఏ పంక్తిలో ఉంటే, ఆ పంక్తిలో ఉన్నవారు కూడా పవిత్రమగు ఆత్మభావనపట్ల శ్రద్ధపొందినవారై, పవిత్రులు కాగలరు.

పూలదండ - ధారణ - అలంకారము

అనేక పూలతో తయారుచేయబడిన పూదండ పూలతో అంతరముగా గ్రుచ్చబడిన ‘దారము’ వలననే - ‘ఒక పూదండ’ (Garland) రూపము కలిగి ఉంటున్నది.

అట్లాగే ఈ త్రిలోకములలోని జీవజాలమంతా ఏ ‘‘ఆత్మసూత్రము’’చే, పరస్పరమైన (పూదండలోని పూలవలె) ఏర్పడినవై ఉన్నాయో, అట్టి సూత్రమే - యోగ విదితుడగు యోగి, బ్రాహ్మణుడు, యతి - ధరించవలసిన దండ. (Garland).

అదియే యోగి, జ్ఞాని, యతులకు పూదండాలంకారము గాని, భౌతికమైన పూదండ అసలైన పూదండ కాదు.

జనన-మరణ-పునర్జన్మ-పునరావృత్తి దోషములతో కూడిన అపార సంసార సముద్రమునుండి ‘ముక్తి’ని కోరుకొనువాడు - (ఆత్మగా నాకు బంధమే లేదు - అను) ‘‘స్వావలబంభన స్థితి’’ని సిద్ధింపజేసుకొని ఆత్మానందమును అనునిత్యముగా చేసుకోవాలి. అందుకు చేయవలసినది ఏమి? ‘‘సమస్తము బ్రహ్మమే’’ అను ‘‘బ్రహ్మజ్ఞానమయ సూత్రము’’ నే ధరించాలి. అట్టి ఆత్మభావన లేక బ్రహ్మభావన చేయటమే ‘యజ్ఞ సూత్రము’ (మరియు) ‘జ్ఞాన సూత్రము’ కూడా.

యజ్ఞోపవీత (బ్రహ్మసూత్ర) ధారణా నియమములు

భౌతికమైన (ప్రత్తితంతువులతో తయారుచేయబడిన) యజ్ఞోపవీతము ధరించువారు, ‘మైల’ మొదలైనవి సంభవించినప్పుడు అప్పటిదాకా ధరించిన ఉపవీతమును మైలపడినదానిగా భావిస్తారు. అశుచి ఉచ్ఛిష్టము (వదలివేయటము) చేస్తారు. యజ్ఞోపవీతము మారుస్తారు. ఆవిధంగా మార్చునప్పుడు

    యజ్ఞోపవీతం పరమమ్ పవిత్రమ్। ప్రజాపతే యస్సహజం పురస్తాత్। 
    ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రమ్। యజ్ఞోపవీతమ్ బలమస్తు తేజః।।

అనే మంత్రము చదువుచూ నూతన యజ్ఞోపవీతమును ధారణము చేస్తూ ఉంటారు.

అయితే, ‘‘సమస్తము సర్వదా బ్రహ్మమే’’ అను భావమును అంతరంగమునందు (మనస్సు, బుద్ధి, చిత్తములందు) బ్రహ్మసూత్రముగా ధరించినవారికి పైన చెప్పబడిన ‘‘అశుచి ఉచ్ఛిష్టము’’ అనే నియమము వర్తించనే వర్తించదు. హృదయాంతర్గతంగా జ్ఞానయజ్ఞోపవీతము ధరించిన బ్రహ్మసూత్ర విధులకు అంతా సమయమే। సర్వత్రా పవిత్రమే। వారు నిత్య జ్ఞానయజ్ఞోపవీతధారులు.

వారిపట్ల మైల-మడి, పవిత్రత - అపవిత్రత, విధ - నిషేధముల నియమములు, ఆశ్రమ నియమములు - ఇవన్నీ ‘అనివార్యము’ కాదు. ఉద్దేశ్యించబడవు, నిర్దేశ్యించబడటము లేదు.

ఆత్మజ్ఞానమేవ శిఖాయజ్ఞోపవీత ధారణమ్।।

శ్లో।। జ్ఞాన శిఖినో, జ్ఞాన నిష్ఠా, జ్ఞానయజ్ఞోపవీతినః, 
    జ్ఞానమేవ పరం తేషాం పవిత్రం జ్ఞానమీరితమ్।।
భౌతిక - యజ్ఞోపవీతము జ్ఞాన యజ్ఞోపవీతము
భౌతికమైన శిఖ కర్మలకు చెందినదేగాని వేద హృదయము సూచించే అసలైన శిఖ కాదు.
ఆత్మజ్ఞానమే ధారణ చేయవలసిన ‘శిఖ’ ధారణ అలంకరించుకోవలసిన ‘శిఖ’ (జ్ఞానశిఖయే ‘శిఖ’)
ప్రాపంచకమైన మైల, మడి, తడి, పొడి బట్టలు కర్మ సంబంధమైన నిష్ఠలుగా చెప్పబడుచున్నాయి.
అన్ని సందర్భములలోను-‘‘ఇదంతా బ్రహ్మమే। ‘నీవు, అతడు, ఆమె వారు, వీరు, జంతువులు, దేవతలు, మొదలైనదంతా బ్రహ్మము కాని క్షణమే లేదు’’- అనునిష్ఠను, పవిత్ర దృష్టిని వీడకపోవటమే ‘జ్ఞాననిష్ఠ’.
భౌతికమైన శిఖ - ఉపవీతముల ధారణ కర్మ యజ్ఞోపవీతమేగాని జ్ఞాన యజ్ఞోపవీతము కాదు. లోకసంబంధమైన (లౌకిక) గుర్తులు నిజమైన జ్ఞానము కాదు.
ఆత్మతత్త్వ జ్ఞాన ధ్యానములచే ‘‘సమస్తమైన అన్యము నాయొక్క స్వయంకల్పిత ధారణావినోదమే’’ అను అనన్య భావనయే ‘‘జ్ఞాన యజ్ఞోపవీతము’’. ఆత్మ జ్ఞానమే వాస్తవమైన జ్ఞానము.

శిఖ = అగ్నికి శిఖవలె - ఎవడికి ఆత్మతత్త్వజ్ఞానమే ‘శిఖ’యో అట్టి జ్ఞానశిఖ కలవాడినే ‘కేశధారుడు’ అంటారు.

అంతేగాని వెంట్రుకల శిఖ ఉన్నంతమాత్రాన కాదు.

ఒకానొకడు ఆత్మజ్ఞాన దృష్టి లేకుండా లోకసంబంధమైన (లేక) యజ్ఞయాగాది వైదిక కర్మల సంబంధమైన మంత్రతంత్రములు నిర్వర్తిస్తూ ఉంటే, అది పొట్టకూటి కోసము మాత్రమే (కుక్షిపూరకాః) అవుతుంది. అట్టివాడు ‘ఆభాస బ్రాహ్మణుడు’ మాత్రమే.

బాహ్యమున ఎడమ భుజము నుండి కుండి మొలవరకు సవ్యముగా ధరించు ఉపవీతమును - బాహ్యాభ్యంతరములందు ప్రకాశమానమైయున్న తత్త్వ (త్వమ్ తత్ ఆత్మయేవ) - ‘‘భావ తంతు సమన్వితము’’ - అనియే భావించాలి.

అట్టి తత్త్వభావనను నాభి (బొడ్డు) నుండి బ్రహ్మరంధ్రము వరకు (మూలాధార-స్వాధిష్ఠాన-మణిపూరక-అనాహత-విశుద్ధ-ఆజ్ఞా-బ్రహ్మరంధ్రముల వరకు) ప్రాణాయామ యోగాభ్యాసముచే బుద్ధిమంతులగు యోగులు (సుధీః) అభ్యాసము చేస్తున్నారు.

అట్టి బ్రాహ్మీభావనయొక్క ఆలంబన కొరకై అందుకు క్రియాంగముగా మాత్రమే తంతు నిర్మితమైన యజ్ఞోపవీతము ఉపకరణముగా ధరించబడుతోంది.

బ్రాహ్మీ భావనేన బ్రాహ్మణః।

ఆత్మతో తన్మయుడు అయి జ్ఞాన-శిఖ, అఖండాత్మ యజ్ఞోపవీతములను ధరించువారంతా బ్రహ్మణ్యులే। ఆ విధమైన ‘‘జ్ఞానశిఖ’’, ‘‘ఆత్మతో తన్మయ ఉపవీతము’’ ధరించనివారు బ్రాహ్మణ్యులు - అనటము ఆభాసయే. శాస్త్రదృష్టిచే బ్రాహ్మణ్యులు కారు. (విప్రులు మాత్రమే). ఆత్మదృష్టిచేతనే ఒకడు ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు.

అట్టి ‘ఆత్మజ్ఞాన-ఆత్మోపాసన-ఆత్మదర్శన-ఆత్మతో తన్మయ’ యజ్ఞోవీత పారాయణమే ‘పరతత్త్వ ధ్యానయోగము’. అట్టి జ్ఞానయజ్ఞోపవీత ధారణ చేయటము తెలిసిన యజ్ఞోపవీతుడు (‘‘నాకు బంధము మొదలే లేదు’’ - అనురూపముగల) ముక్తిని తప్పక పొందలగడు.

బహిరంతశ్చ ఉపవీతీ విప్రః సన్న్యస్తుమ్ అర్హతి। వేదశాస్త్రములను అథ్యయనము చేసిన విప్రుడు కూడా తనయొక్క బహిః - అంతరములో (బాహ్య అంతరములలో, బయట - లోపల కూడా) క్రియామాత్ర ఉపవీతమును విడచి, ఆత్మజ్ఞానోపవీతమునే బుద్ధితో ఆశ్రయించి ఉండును గాక।

ఏకయజ్ఞోపవీతీ తు నైవ సన్న్యస్తుమ్ అర్హతి। అనేకముగా కనిపిస్తున్న ఈ కల్పిత జగత్ - దృశ్యముపట్ల ఏకమగు ఆత్మదృష్టిని సిద్ధించుకొన్నవాడు దేనినీ పట్టుకోడు. వదలడు. ఏదీ పట్టుకోనివానికి దేనినైనా వదలవలసిన పనిఏమున్నది? ఆతనికి (చతుర్విధ ఆశ్రమములలోని నాలుగవదగు) ‘సన్న్యాసాశ్రమము’తో ఇక క్రొత్తగా అవసరము ఉండదు.

అందుచేత ఓ శౌనకా!

శ్లో।। తస్మాత్ సర్వప్రయత్నేన మోక్షాపేక్షీ భవేత్ యతిః। 
  బహిః సూత్రం పరిత్యజ్య ‘‘స్వాంతః సూత్రం’’తు ధారయేత్।।

సర్వ ప్రయత్నములలో మోక్షాపేక్ష కలవాడే ‘యతి’.

ఓ శౌనకా!

⌘⌘⌘

ఈ విధంగా మహనీయుడగు పిప్పలాదమహర్షి శౌనకునికి బోధించారు.

🙏 ఇతి పరబ్రహ్మ ఉపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।