annapoorNa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణవేదాంతర్గత

3     అన్నపూర్ణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। ‘‘సర్వ అపహ్నవ సంసిద్ధ
బ్రహ్మమాత్ర త్రయోజ్జ్వలమ్
త్రైపదం శ్రీరామతత్త్వం
స్వమాత్రమ్’’-ఇతి భావయే।।
బ్రహ్మతత్త్వానుభవమును కప్పి ఉంచుచున్న ‘‘సత్త్వ- రజో-తమో త్రిగుణమాయ’’ను తొలగించు కోవటానికి, ‘‘జాగ్రత్-స్వప్న-సుషిప్తిల సాక్షీ త్రై పదము’’ సిద్ధించు కోటానికి - శ్రీ ఆత్మారామమును భావనా పూర్వకంగా ఆశ్రయిస్తున్నాము.

ప్రథమోధ్యాయః - అన్నపూర్ణానుగ్రహమ్ - అధ్యయనమ్

1. ఓం నిదాఘో నామ యోగీంద్రో
ఋభుం బ్రహ్మవిదాం వరమ్
ప్రణమ్య దండవత్ భూమా, వుత్థాయ
స పునః మునిః।।
‘ఓం’ సంజ్ఞార్థ పరమాత్మకు నమస్కరిస్తూ ।

నిదాఘుడు అనే యోగీంద్రుడు ఒకరోజు బ్రహ్మతత్త్వజ్ఞుడు, తద్విద్వరేణ్యుడు అగు ఋభుమహర్షిని దర్శనం చేసుకొన్నారు. సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. ‘ఆత్మోద్ధరణ’ కొరకై ఇట్లు అభ్యర్థన సమర్పించారు.
నిదాఘో వాచ :
‘‘ఆత్మతత్త్వం అనుబ్రూహి।’’ - ఇతి
ఏవం పప్రచ్ఛ సాదరమ్।
కయా ఉపాసనయా, బ్రహ్మన్! ఈదృశం ప్రాప్తవాన్ అసి-
తాం మే బ్రూహి మహావిద్యాం, మోక్ష సామ్రాజ్య దాయినీమ్।।
నిదాఘుడు :
మహాత్మా! దయతో నాకు ఆత్మతత్త్వమును ఉపదేసించండి.
హే బ్రహ్మాన్! ఏ ఉపాసనచే మీరు ఇట్టి ఆత్మానంద స్థానమును సిద్ధించుకొన్నారో, మోక్షసామ్రాజ్యదాయిని అగు స్థితిని సంపాదించున్నారో - అది నాకు దయచేసి సాదరంగా బోధించండి.
ఋభౌవాచ :
నిదాఘ! త్వం కృతార్థో అసి।
శృణు విద్యాం సనాతన(నీ)మ్.
యస్యా విజ్ఞానమాత్రేణ జీవన్‌ముక్తో భవిష్యసి।।
ఋభుమహర్షి :
ఓ నిదాఘా! బ్రహ్మతత్త్వము తెలుసుకోవటానికై అడగటం చేత నీవు కృతార్థడవయ్యావయ్యా.
అట్లాగే చెప్పుకుందాము. ఏ సనాతన విద్య (జన్మ-కర్మలకు మునుముందే ఉన్న స్వస్వరూప విద్య) తెలుసుకున్నంతమాత్రం చేతనే ఈ జీవుడు ‘జీవన్ముక్తుడు’ అవగలడో, అట్టి ‘ఆత్మవిద్య’ గురించి చెప్పుతాను. శ్రద్ధగా వినెదవు గాక!
2. మూల శృంగాట మధ్యస్థా, బిందునాద కళాశ్రితా,
నిత్యానందా, నిరాధార (వి)ఖ్యాతా (ప్ర) విలసత్ కచా।
- మూల శృంగాటకము [నాలుగు త్రోవలు కలసినట్టి మూలస్థానము. (Four Road) యొక్క మధ్యగా వేంచేసి ఉన్నట్టిది].
-‘బిందు’-నాద-కళ’’ ఈ మూడిటిచే ఆశ్రయించబడుచున్నట్టిది,
- నిత్యానంద స్వరూపిణి,
- తనకు అన్యమైన దేనినీ ఆధారముగా కలిగి ఉండనట్టిది, (independent by itself),
- మిలమిల మెరుయుచున్న కవచములచే, ప్రకాశించుచున్నట్టిది, కేశ సౌందర్య సమన్వితము అగు ఒకానొక మహత్తరమగు మంత్రము ఉన్నది.

‘‘విష్టపే శ్రీ మహాలక్ష్మీ కామస్తారో నతిః తథా।’’
‘‘భగవతి అన్నపూరేణాతి, మమ అభిలషితం తతః’’।
‘‘అన్నం దేహి’’, తతః, ‘‘స్వాహా’’ మంత్రసార-ఇతి
విశ్రుతా- సప్తవింశతి (27) వర్ణాత్మా యోగినీగణ సేవితా।
(1) విష్టపము (పీఠము) - మహాలక్ష్మీ బీజము - ‘‘ఐం హ్రీం సౌః’’
(2) కామబీజము - ‘‘శ్రీం క్లీం ఓం’’
(3) ‘నమ’ - పదము (‘నతి’)
(4) ‘భగవతి’
(5) అన్నపూర్ణ (ఇతి)
(6) ‘మమ’ (7) ‘అభిలషితం’ (తతః)
(8) ‘‘అన్నం దేహి’’ (9) (తతః) ‘‘స్వాహా’’
ఈ విధంగా 9 x 3 = ‘27’ అక్షరములచే యోగినీ గణముచే జగజ్జనని యగు శ్రీ అన్నపూర్ణాదేవి ఈ మంత్రముచే సేవించబడుచున్నది.

‘‘ఐం హ్రీం సౌః శ్రీం క్లీం (ఓం) నమో
భగవతి అన్నపూరేణా మమ అభిలషితం
అన్నం దేహి స్వాహా ।।
(27 అక్షరములు)
ఇతి పిత్రా ఉపదిష్టో2స్మి ।
ఐం హ్రీం సౌః 3
శ్రీం క్లీం (ఓం) 2
నమో భగవతి అన్నపూరేణా 10
మమ అభిలషితం 6
అన్నం దేహి 4
స్వాహా। 2
(27 అక్షరములు)
ఈ మంత్రమును నా పితృ దేవులు (బ్రహ్మభగవానుడు) నాకు నా బాల్యంలో ‘సాధన’ కొరకై ఉపదేశించారు.
తదాది నియమః స్థితః,
కృతవాన్ స్వ - ఆశ్రమ ఆచారో,
మంత్ర - అనుష్ఠానం అన్వహమ్।।
మా నాన్న గారు నాకు ఈ మంత్రమును అభ్యసింపజేసినప్పటినుండి నేను (బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్థ) ఆశ్రమాచారపూర్వకంగాను, అత్యంత శ్రద్ధాభక్తులతోను అనుష్ఠానము చేయటం ప్రారంభించాను.
ఏవం గతే బహుదినే
ప్రాదురాసీత్(న్) మమ అగ్రతః,
అన్నపూర్ణ విశాలాక్షీ స్మయమాన ముఖాంబుజా।
ఈ విధంగా అనేక రోజులు గడచిపోయినాయి.
ఒక శుభ సమయంలో చిరునవ్వులు చిందిస్తున్న సుందరముఖముతో విశాలాక్షియగు - జగజ్జనని అన్నపూర్ణాదేవి నా ఎదురుగా పద్మము వికసించు తీరుగా ప్రత్యక్షమైనది.
తాం దృష్ట్వా దండవత్ భూమౌ
నత్వా ప్రాంజలిః ఆస్థితః,
(అన్నపూర్ణౌవాచ :)
అహో వత్స! కృతార్ధో-సి।
వరం వరయమ్ అచిరమ్।।
ఆ అన్నపూర్ణ - అమ్మవారిని చూచి నేను నేలపై వ్రాలి సాష్టాంగపూర్వకంగా నమస్కరిస్తూ ప్రాంజలి ఘటించాను. ఆ తల్లి మాతృవాత్సల్యం కురిపిస్తూ వికసిత వదనంతో ఈ విధంగా పలికింది.
‘‘వత్సా! నీవు సప్త వింశతి 27 (అక్షరముల) వర్ణాత్మక యోగినీగణ మంత్రము మననము చేసి కృతార్థుడవయ్యావు. ఏదీ? నీకు ఏమి కావాలో త్వరగా వరము కోరుకోవయ్యా
3. ఏవం ఉక్తో విశాలాక్ష్యా
మయోక్తం, మునిపుంగవ!
‘‘ఆత్మ తత్త్వం’’ మనసి మే ప్రాదుర్భవతు పార్వతి।
ఋభుమహర్షి :
ఓ మునిపుంగవా! నిదాఘా! ఆ అన్నపూర్ణాదేవి ఆ విధంగా అడుగగానే, నేను ఈ విధంగా వరమడిగాను.
‘‘అమ్మా! పార్వతీ దేవీ! దేవదేవీ! నా మనస్సుకు ఆత్మతత్త్వము స్ఫురించును గాక। ఇదే నేను కోరుకొనే వరము.
‘‘తథైవ అస్తు!’’ ఇతి మాం ఉక్త్వా,
తత్ర ఏవ అంతరధీయత।
అప్పుడు ఆ అమ్మ:
మాతృవాత్సల్యం కురిపిస్తూ చిరునవ్వుతో ‘‘తథైవ అస్తు. అట్లే అగుగాక’’! అని సుమధురముగా పలికి అంతర్థానము అయింది.
తదా మే మతిః ఉత్పన్నా
జగత్ వైచిత్ర్య దర్శనాత్।
అప్పుడు నాకు సృజనాత్మక విచారణశీలమగు పవిత్ర బుద్ధి సిద్ధించి, ఈ జగత్తుయొక్క వైచిత్ర్యమంతా సుస్పష్టమై కనబడసాగింది.
భ్రమః పంచవిధో భాతి।
తత్ ఏవ ఇహ సముచ్యతే।
‘‘భ్రమ’’ అనునది ‘ఐదు (5)’ విధములుగా ప్రవర్తిస్తున్నట్లు తెలియ రాసాగింది. అదంతా ఇప్పుడు వివరించుకుందాము.
(1) ‘‘జీవ-ఈశ్వరౌ భిన్న రూపాః’’ ఇతి,
- ప్రాథమికో భ్రమః।
(1) ‘జీవుడు- ఈశ్వరుడు’ - వీరు ఇరువురు భిన్నరూపులు - అనునది మొదటి భ్రమ. (ఈశ్వరుడే జీవుడుగా కనిపిస్తున్నారు.)
(2) ‘‘ఆత్మ నిష్ఠం కర్తృగుణం వాస్తవం’’ వా
-ద్వితీయకః।
(2) ఆత్మ ఈ జగత్తు విషయంలో కర్తృత్వ నిష్ఠ నిజంగానే కలిగియున్నది - అనేది రెండవ భ్రమ. (ఆత్మకు కర్తృత్వమే లేదు - సర్వదా ‘అకర్త’)
(3) ‘‘శరీరత్రయ సంయుక్త జీవః సంగీ’’
- తృతీయకః।
(3) ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తి శరీరములతో (త్రి-పురుషకారములతో) ఈ జీవుడు సంగము (Attachment) నిజంగానే కలిగియున్నాడు. వాటికి బద్ధుడు కూడా!’’ - అనునది మూడవ భ్రమ. (ఈ జీవుని వాస్తవ - సహజ స్వరూపము జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు పరిమితమైనది కాదు)
(4) ‘‘జగత్ కారణరూపస్య వికారిత్వం’’
- చతుర్థకః।।
(4) ‘‘నాకు వికారములు కలగటానికి ఈ జగత్తు కారణము అగుచున్నది’’ - అనునది నాలుగవ భ్రమ. (భ్రమలు స్వకీయమనోకల్పితాలు. అంతేగాని జడమగు జగద్దృశ్యముచే కల్పించబడటంలేదు)
(5) ‘‘కారణాత్ భిన్న జగతః సత్యత్వం’’
- పంచమో భ్రమః।।
జడమగు జగద్దృశ్యముచే కల్పించబడటంలేదు)
(5) ‘ఆత్మ ‘అనన్యము’ అయి ఉండగా, అట్టి కారణముకంటే వేరుగా కార్యరూపమగు ఈ జగత్తు సత్యత్వము కలిగియున్నది। సత్యమే।’’ అనునది ఐదవ భ్రమ. (ఈ కనబడే జగత్తు - దీనికి కారణమగు ఆత్మకు భిన్నము కాదు)
పంచభ్రమ నివృత్తిశ్చ తదా స్ఫురతి చేతసి।।
ఈ ఐదు భ్రమల నివృత్తి నాయొక్క బుద్ధియందు ఈవిధంగా స్ఫురించసాగాయి. ‘5’ భ్రమలు తొలగటానికై ‘5’ దృష్టాంతాలు సహకరించసాగాయి.
(1) ‘‘బింబ ప్రతిబింబ’’ దర్శనేన
భేదభ్రమో నివృత్తః।
(1) నీళ్లలో ఒడ్డునగల వృక్షముయొక్క ప్రతిబింబము కనబడినంత మాత్రంచేత నీటిలో వృక్షము ఉన్నదా? లేదు. అద్దంలో ముఖము (ప్రతిబింబిస్తూ) కనబడినా కూడా అద్దంలో ముఖము లేదు కదా। ఈ విధమైన బింబ-ప్రతిబింబ దర్శనముచే జీవ-ఈశ్వరుల భేదభ్రమ నివృత్తి కాసాగింది. బింబమే ప్రతిబింబముగా కనబడుచున్నట్లుగా, ఈశ్వరుడే జీవుడుగా అగుపిస్తున్నాడు.
(2) ‘‘స్ఫటిక లోహిత’’ దర్శనేన
పారమార్థిక కర్తృత్వ భ్రమోః
- నివృత్తః।।
(2) ఎర్రటి రంగు గల దీపపు వెలుగువద్ద స్ఫటికమును ఉంచితే తెల్లటి స్ఫటికము ఎర్రగా కనిపించినంత మాత్రం చేత - ఆ ఎర్రగా కనిపించే కర్తృత్వము స్ఫటికమునకు ఆపాదించలేము కదా! ఈ విశేషమును చూచి ‘‘ఆత్మకు కర్తృత్వము ఉన్నది’’ అనే పారమార్థిక కర్తృత్వ భ్రమ నివృత్తమవసాగింది. ‘అకర్త’ అగు ఆత్మయొక్క సమక్షంలో కర్తృత్వ-భోక్తృత్వలు వచ్చిపోతున్నాయి.
(3) ‘‘ఘట-మఠ ఆకాశ’’ దర్శనేన
సంగీ- ఇతి భ్రమో నివృత్తః।
(3) ఇది కుండలోని ఆకాశము, ఇది మఠములోని ఆకాశము - అని అన్నప్పటికీ ఆకాశము సర్వదా సర్వత్రా ఏకమే కదా!
ఈవిధమైన విచారణచే ఆత్మకు దేహములచే సంగము పొందునది అను భ్రమ నివృత్తమైపోతోంది. భౌతికాకాశమునకు దేనితోనూ సంగము లేనట్లే, ఆత్మాకాశమునకు దేనితోనూ ‘సంగము’ లేదు.
(4) ‘‘రజ్జు సర్ప’’ దర్శనేన
‘‘కారణాత్ భిన్న జగతః
సత్యత్వ’’ భ్రమో నివృత్తః
(4) ఒకానొకడు - ఒక నూతి ప్రక్కనో (లేక) బాట ప్రక్కనో పడి ఉన్న త్రాడును చూచి పాము అనుకొని ఎగిరి గంతులు వేస్తుంటే, అందుకు కారణం త్రాడుయా? కాదు కదా? అట్లాగే ‘‘ఈ జీవుని భ్రమానుభవములకు జగద్దృశ్యము కారణము కదా!’’- అనే భ్రమ-(తత్ దర్శనముచే) తొలగసాగింది. త్రాడును చూచి ‘పాము’ అని అనుకుంటున్నట్లే, ‘స్వస్వరూపాత్మ’యే అనేక భేదములతో కూడిన ‘జగత్తు’గా అనుకోబడుతోంది.
(5) ‘‘కనక రుచిక’’ దర్శనే
వికారిత్వ భ్రమో నివృత్తః।
(రుచిక = ఆభరణము)
(5) ‘బంగారపు ఆభరణము’ అను దానిలో బంగారము ఆభరణముగా అగుచున్నదా? లేదు. బంగారమునకు ఆభరణత్వము ధర్మమే అయి ఉండలేదు కదా! ఆభరణము బంగారము కాని క్షణమే లేదు. అట్లాగే జగత్తుకు ఆత్మ కారణము కాదు. జగత్తుకు కారణము లేదు - అని గమనిస్తున్నాను. ఆత్మకు జగద్వికారధర్మము నాచే తిరస్కరించబడుతోంది. ఆత్మ-ఆత్మగానే ఉన్నది గాని, జగత్తు అనబడుదానిగా అవటమే లేదు.
తదా భ్రమతి మత్ చిత్తం బ్రహ్మాకారం
అభూత్ స్వయమ్। నిదాఘ! త్వం అపీత్ధం
హి తత్త్వజ్ఞానం అవాప్ను హి।
ఓ నిదాఘా! ఈ విధంగా ఆయా భ్రమలు పొందుచున్న నా చిత్తము స్వయముగా బ్రహ్మకారము అవధరించసాగింది.
నీవు కూడా ఆ విధంగానే తత్త్వజ్ఞానము పొందవచ్చునయ్యా।
4. నిదాఘః ప్రణతో భూత్వా
ఋభుం పప్రచ్చ సాదరమ్।
‘‘బ్రూహి మే శ్రద్ధధానాయ
బ్రహ్మ విద్యాం అనుత్తమామ్।’’
అప్పుడు నిదాఘుడు లేచి నిలుచుని, నమస్కరిస్తూ ఋభుమహర్షికి హృదయపూర్వక ప్రణామములు సమర్పించి, మరల ఈ విధంగా సాదరంగా ప్రార్థించాడు.
నిదాఘుడు : స్వామీ! ఋభూ! ఉత్తమమగు బ్రహ్మవిద్యను మరికొంత వివరంగా ప్రసాదించ వేడుకొనుచున్నాను. శ్రద్ధావంతుడనై వినటానికి సంసిద్ధుడుగా ఉన్నాను.
తథా ఇతి ఆహ (తథేత్యాహ) ఋభుః :-
‘‘ప్రీతః తత్వజ్ఞానం దదామి తే।’’
ఋభువు : ప్రీతిపూర్వకంగా తత్త్వజ్ఞానము చెప్పుకుందాము. ముచ్చటించుకుందాము. వినండి.
‘‘మహాకర్తా’’, ‘‘మహాభోక్తా’’, ‘‘మహాత్యాగీ’’ భవ, అనఘ।
స్వ స్వరూప అనుసంధానం ఏవం కృత్వా సుఖీ భవ।
ఓ పాపరహితుడా! నిర్మలుడా! అనఘా! నిదాఘా!
మహాకర్తవు, మహాభోక్తవు, మహాత్యాగివి - అగుము.
సహజము, కేవలము, నిర్మలము అయినట్టి స్వస్వరూపము యొక్క అనుసంధానముచే సుఖవంతుడవై ఉండుము.
‘‘నిత్యోదితం, విమలం, ఆద్యం, అనంత రూపం,
బ్రహ్మాస్మి। న ఇతర కల - అకలనం హి కించిత్।’’
నేను… ఎవరు? Who Am I?
‘‘- నిత్యోదితము (Ever Dawning).
- విమలము (దోషరహితము).
- సమస్తమునకు మునుముందుగానే ఉండిఉండటంచేత ‘ఆద్యము’.
- దృశ్య, మనో, బుద్ధి, చిత్త, అహంకారములచే పరిమితము కానట్టిది. -కాబట్టి ‘‘అనంతము’’ - అగు బ్రహ్మమే నేను అయి ఉన్నాను. మరింకే కలన - అకలనములు నిజానికి కించిత్ కూడా నాపట్ల ఉండజాలవు’’.
ఇత్యేవ (ఇతి ఏవ) భావయ, నిరంజనతాం ఉపేతో,
నిర్వాణమే హి సకల అమల శాంత వృత్తిః।।
→ అని భావన చేయుము.
నిరంజనుడవై (ఏ దోషము చేతను స్పృశించబడనివాడవై సకల అమల (మలరహిత) శాంతవృత్తిని ఆశ్రయించి ఉండుము.
‘‘యత్ ఇదం దృశ్యతే కించిత్, తత్ తత్
నాస్తి’’ - ఇతి భావయ।
‘‘ఏదేది ఇంద్రియములకు దృశ్యమానమై కళ్ళకు ఎదురుగా కనిపిస్తోందో, అట్టి ఇదంతా మొదలే లేదు’’ - అని భావన చేయుము.
యథా గంథర్వనగరం,
యథా వారి మరుస్థలే,
ఓ మునీ! ఏ విధంగా గంథర్వనగరము (A Township in illusion) మొదలే లేదో, ఏ విధంగా మరుభూమిలో (మృగతృష్ణలో) జలము ఉండదో,
యత్తు నో దృశ్యతే కించిత్, యన్ను కించిత్ ఇవస్థితమ్,
మనః షష్ఠేంద్రియ అతీతం, తన్మయో భవ వై, మునే!
అదే విధంగా..
‘‘శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ పంచేంద్రియములుగానీ, ఆరవ ఇంద్రియమగు మనస్సుగాని కించిత్తు కూడా స్వతఃగా లేనే లేవు’’ - అని గమనిస్తూ, వాటికి అతీతుడవై, వాటికి ఆవల గల కేవలాత్మతో తన్మయుడవై ఉండుము.
‘‘అవినాశి చిత్ - ఆకాశగ్ం,
సర్వాత్మకమ్, అఖండితమ్।
నీరంధ్రం భూరి వా శేషం,-
తత్ అస్మి’’ - ఇతి విభావయ।।
‘‘అవినాశనము, ‘చిదాకాశము’ అని చెప్పబడుచున్నట్టిది, సమస్త జీవులలో సమరూపమైయున్న సర్వాత్మకము, (జీవుడు - ఈశ్వరుడు నీవు - నేను అను భేదములు లేనిదగుటచే) అఖండితము, నీరంధ్రము (ఆకాశము వలె రంధ్రము లేనిది), భూరి (అత్యంత గొప్పది) - అగు ఆత్మకు ఆవల ఏదీ శేషించి ఉండలేదు. కాబట్టి నిశ్శేషము - అగు ఆ పరమాత్మయే నేను’’ - అని భావన చేయుము.
యథా సంక్షీయతే చిత్తం అభావ
అత్యంత భావనాత్,
చిత్ సామాన్య స్వరూపస్య,
‘‘సత్తా సామాన్యతా’’ తథా।
దృశ్య విషయములపట్ల నమ్మకముతో కూడిన ఇష్టము (లేక) ప్రియమే చిత్తము యొక్క రూపము. భావనచే రూపుదిద్దుకుంటున్న చిత్తము అభావనచే క్షీణించగలదు.
చిత్తము క్షీణించిన మరుక్షణము ‘‘చిత్ సామాన్య, స్వరూపసత్తా రూపము’’ అగు ఆత్మ అనుభవము కాగలదు.
నూనం చైత్యాంశ రహితా,
చిత్ యత్ ఆత్మని లీయతే।
అసత్ రూపవత్ యచ్ఛా
సత్తా సామాన్యతా తదా।।
దృష్టిః ఏషా హి పరమా,
సదేహా, అదేహయోః సమా।।
చిత్తము చైత్యరహితము (బాహ్య విషయానుభవరహితము) అయిన మరుక్షణం ఈ చిత్తము చిదాత్మయందు లీనము కాగలదు. అప్పుడు చిత్తము ‘‘చిత్ స్వరూపమే’’ అగుచున్నది.
ఏది అసత్ అనబడుచున్నదో, అదంతా కూడా - విచారణచే - సత్తాసామాన్యము యొక్క‘ఏకోసత్’ నందు అనన్యత్వముగా రూపుదిద్దుకొనుచున్నది. అనన్యత్వమును సంతరించుకోగలదు.
అట్టి పరమాత్మ దృష్టి (లేక) సో2హం పరమమ్ - పరమహంస దృష్టిచే దేహము మొదలే లేనిదై, అదేహము అగుచున్నది. ‘‘దేహికి దేహము ఐహికమైన మోహము మాత్రమే’’ - అను ఆత్మతత్త్వ దృష్టి వెల్లివిరియు చున్నది. అట్టివానిపట్ల, ‘‘దేహము ఉన్నదా? లేదా?’’ అనేది విషయమే కాదు. దేహము ఉన్నప్పుడు కూడా దేహరహితునివలె ఉంటాడు.
5. ముక్తయో సంభవతి ఏవ,
తుర్యాతీతపర- అభిధా
వ్యుత్థితస్య భవతి ఏషా
సమాధిః తస్య చ, అనఘ!
ఓ అనఘా! నిదాఘా!
ముక్తి అనగా ఏమి? విను.
ఎవరి దృష్టి - జన్మ మృత్యు దృశ్య - మొదలైన సమస్తముయొక్క రాకపోకలతో సహా ‘బంధము’ అని కించిత్‌గా కూడా అనిపించని స్థితి పొందినదో- ఆతడే ముక్తుడు. అట్టివాడు సమస్తమునకు కేవలము సాక్షి అయిన ‘‘తుర్యాతీతము’’, ‘‘పరము’’ అను స్థానము అవధరించి ఉంటాడు. ఆతడు వ్యవహారములేవీ లేనట్టి సమాధియందున్నా, (లేక) వ్యవహారములలో వ్యుత్థానుడు (participating in situations) అయి ఉన్నా కూడా ముక్తుడే। ‘ముక్తి’ అనేది బుద్ధికి సంబంధించినది. అంతేగాని - భౌతికమైనది, మనోసంబంధమైనది, ప్రాపంచక సంబంధమైనది కాదు.
జ్ఞస్య కేవలం అజ్ఞస్య
న భవతి ఏవ బోధజా।
అనానన్ద - సమానన్ద
ముగ్ధ ముగ్ధ ముఖ ద్యుతిః।
కేవల స్వరూపముయొక్క జ్ఞానము చేతనే ఆనంద - అనానందములకు వేరైన, సమాధి ఉత్థానములకు సంబంధించని ఆత్మయొక్క బోధ లభించగలదు. అజ్ఞానము కారణంగానే ఆత్మబోధ స్ఫురించటం లేదు. జ్ఞానముచే స్వానుభవముగా (సహజ రూపంగా) ఆత్మ స్ఫురించగలదు.
చిరకాల పరిక్షీణ మనన - ఆది పరిభ్రమః,
పదమ్ ఆసాద్యతే పుణ్యం,
ప్రజ్ఞయైవ ఏకయా తథా,
ఇమం గుణ సమాహారం అనాత్మత్వేన పశ్యతః
అంతః శీతలయా యా అసౌ ‘సమాధిః’ - ఇతి కథ్యతే।।
చిరకాల ప్రయత్నముచే దృశ్య సంబంధమైన మననమునకు సంబంధించిన పరిభ్రమణము క్షీణించుచుండగా, పుణ్యప్రదమగు, కేవలమగు - ‘‘ప్రజ్ఞాసంస్థితి’’ రూపుదిద్దుకోగలదు. అట్టి నిశ్చల ప్రజ్ఞ (లేక) నిశ్చల-అచంచల నిర్మల ‘‘బుద్ధి స్థితి’’యే ‘సమాధి స్థితి’ అనబడుతోంది. అది అంతః శీతల స్థితి. (Inwordly Undisturbable Peace)
అవాసనగ్ం స్థిరం ప్రోక్తం
మనో ధ్యానం తత్ ఏవ చ, (తదేవ చ),
తత్ ఏవ, కేవలీ భావగ్ం
శాంతతా ఏవ చ తత్ సతా।।
వాసనలచే రూపుదిద్దుకున్న మనస్సు ఆత్మభావనా - మననములచే స్వయంగా సన్నగిల్లుచుండగా, పరమశాంతమగు పదము లభించగలదు. ప్రశాంతమగు స్వస్వరూపాత్మ అనుభవమవగలదు.
కేవలాత్మగా ఉండి ఉండటమే భావశాంతత! [భావము శాంతించగా ఈ జీవుడు ‘భవుడు’ (లేక) శివుడుగా శేషించుచున్నాడు].
తను వాసనమ్ అత్యుచ్చైః
పదా యోద్యతమ్ - ఉచ్యతే।।
అవాసనం మనోవక్త్ర పదం
తస్మాత్ అవాప్యతే।
‘‘ఈ దేహమే నేను. ఈ దేహమునకు నాకు అవినాభావసంబంధము. దేహము చేతనే, దేహము ఉంటేనే నేను సుఖిని’’ - అనునదే ‘తను - వాసన’ (The Tendency in relation to physical Body). అట్టి ‘తనువాసన’ను అధిగమించటం చేత ‘పదా-యో-ఆద్యతము’ అను ఉత్తమ పదము (The State of Basic Begining) లభించగలదు. భౌతిక దేహవాసనను జయించటం చేత ‘‘అవాసన మనోవక్త్రము’’ (The Face of thought sans Tendencies) సిద్ధిస్తోంది.
ఘనవాసనం ఏతత్తు చేతః కర్తృత్వ భావనమ్-
- సర్వ దుఃఖ ప్రదం।
వాసన (Tendency) యొక్క ఘనీభూతము (Solidnes) చేతనే ‘‘నేను కర్తను! నేను భోక్తను’’ అను కర్తృత్వభావన జనిస్తోంది. ‘ఆద్యతన ఆత్మ పదము’చే (కవి-ఆతని రచనలోని పాత్రయొక్క ప్రవర్తన-సంబంధము వలె) ఆకర్తృత్వ భావన స్వాభావికమౌతుంది.
వాసనలవలననే జీవునికి సర్వ దుఃఖములు సంప్రాప్తిస్తున్నాయి.
తస్మాత్ వాసనాం తనుతాం నయేత్।
చేతసా సం పరిత్యజ్య, సర్వభావ
ఆత్మభావనామ్, సర్వం ఆకాశతాం ఏతి
నిత్యం అంతర్ముఖ స్థితేః।
అందుచేత సర్వ అన్య వాసనలను బుద్ధిపూర్వకంగా - ప్రియపూర్వకంగా సంపరిత్యజించుము. అనగా, ‘‘సర్వత్రా ఆత్మయే ఈఈ రీతిగా ప్రదర్శనమగుచున్నది’’ - అను మననమును ఆశ్రయించుము.
‘‘సమస్తము ఆత్మాకాశమే’’ అను సమన్వయముతో నిత్యము అంతర్ముఖస్థితుడవై ఉండుము.
యథా విపణగా లోకా విహరంతో
అపి అసత్ సమాః,
అసంబంధాత్ తథా జ్ఞస్య
గ్రామో-పి విపినా ఉపమః।।
ఏవిధంగా అయితే విపణము (Market) లో అనేక మంది జనులు తిరుగుచూ ఉంటున్నప్పటికీ అది మనకు విషయమే కాదో, ఏ విధంగా వారందరినీ పట్టించుకోమో…. (మనము కొనుక్కోవలసినవి మాత్రమే ఆలోచిస్తూ ఉంటామో) అదే విధంగా →
- నీవు స్వగ్రామములో కూడా బంధుజనులు మొదలైనవారిపట్ల ‘‘వ్యాపార స్థలములో నాకు సంబంధించని జనుల వంటివారు’’ అనుభావన అంతరమున కలిగి ఉండుము. బయటకు మాత్రము నాటకంలోలాగా వ్యవహరించుము.
6. అంతర్ముఖతయా నిత్యగ్ం
సుప్తో బుద్ధో వ్రజన్, పఠన్,
పురం జనపదం గ్రామం
‘‘అరణ్యమ్ ఇవ’’ పశ్యతి।
ఎవ్వడైతే నిదురిస్తున్నప్పుడు, జాగ్రత్‌లో ఉన్నప్పుడు, బాటలలోనడుస్తూ ఉన్నప్పుడు, పురములోగాని - జనపదము(Town)లోగాని, అరణ్యములో గాని ఉన్నప్పుడు - సర్వ సంబంధములలో, సర్వసహజీవులలో అంతరమై యున్న ఆత్మనే దర్శిస్తూ ఉంటాడో, ఆతడే ‘అంతర్ముఖుడు’.
అంతః శీతళతాయాం తు,
లబ్ధాయాం శీతళం జగత్,
అంతః తృష్ణ ఉపతప్తానాం
దావ దాహమయం జగత్।
భవతి, అఖిల జంతూనాం
యత్ అంతస్తః తత్ బహిః స్థితమ్।
ఎవ్వడైతే ‘అంతఃశీతలము’ సిద్ధించుకుంటాడో, అట్టివానికి ఈ జగత్తంతా ప్రశాంతముగా, శీతళముగానే (Very Peaceful and Cool) గానే అగుపిస్తుంది.
ఎవ్వరైతే అంతరమున తృష్ణ (Urge to get something) కలిగి ఉండి, పరితప్తుడై (Highly Worried) ఉంటాడో, అట్టివానికి ఈ జగత్తు సలసల అగ్నివలె, దాహముతో కూడిన నదివలె అనిపించగలదు.
ఈ విధంగా ఈ జీవులంతా కూడా - అంతరమున ఏవిధంగా ఉంటే, అదియే బాహ్యమున వారిపట్ల స్థితి పొందినదిగా అగుచున్నది.
యస్తు ఆత్మరతి రేవ అంతః
కుర్వన్ కర్మ - ఇంద్రియైః క్రియాః,
న వశో హర్ష శోకాభ్యాగ్ం
స ‘‘సమాహిత’’ ఉచ్యతే।।
సమాహితుడు : ఎవ్వరైతే ఇంద్రియములను, సమస్త కర్మలను నిర్వర్తిస్తూ కూడా అంతరమున సమస్తమును ఆత్మయొక్క ప్రదర్శనముగా దర్శిస్తూ, ఆత్మయందు రమిస్తూ ఉంటాడో, ఇక్కడి హర్ష - శోకములకు, సుఖ దుఃఖములకు కించిత్ కూడా వశమై ఉండడో, అట్టివానిని ‘‘సమాహితుడు’’ అని పిలుస్తున్నారు.
ఆత్మవత్ సర్వభూతాని, పరద్రవ్యాణి లోష్టవత్,
స్వభావాత్ ఏవ, న భయాద్యః పశ్యతి
(స) - స పశ్యతి।।
ఎవ్వరైతే - సర్వభూతజాలమును (సర్వజీవులను) ఆత్మవలె చూస్తూ,
- ఇతరుల ద్రవ్యములను మట్టితో సమానంగా భావిస్తూ
- స్వభావతః ఎట్టి భయమును కలిగి ఉండడో….
అదియే సరి అయిన సందర్శనము.
అద్యైవ మృతిః ఆయాతు,
కల్పాంత నిచయే న వా,
న అసౌ కళంకం ఆప్నోతి
హేమ పంకగతం యథా।
బంగారము బురదలో పడినంత మాత్రంచేత ఆ బురద బంగారములోనికి ప్రవేశించి, దోషము కలిగించదు కదా! బంగారము విలువ లేకుండా పోదుకదా! అట్లాగే, అంతర్ముఖుడు, అంతఃశీతళుడు, సమాహితుడు అగు జ్ఞాని : -
→ ఇప్పటికిప్పుడు మరణిస్తూ ఉన్నప్పుడుగాని,
→ లేక, కల్పాంతమువరకు జీవిస్తూ ఉన్నప్పుడు గాని
ఎటువంటి కళంకము పొందడు.
‘‘కో2హమ్? కథం ఇదం?
కిం వా? కథం మరణ జన్మనీ’’?-
విచారయ అంతరేవ
ఇత్ధం మహత్ తత్ ఫలం ఏష్యసి।
ప్రియ నిదాఘా!
• నేను ఎవ్వరు? (ఈ భౌతిక శరీరమునా? ఆలోచననా? తెలివినా? ఇష్టాయిష్ట రూపుడునా? ‘అహం’ రూపుడునా? ఈశ్వరుడునా? కేవలాత్మనా? అన్నీనా?)
• ఈ జగద్దృశ్యము నాకు ఎట్లా ప్రాప్తిస్తోంది? (ఎవరో బలవంతంగా కల్పించారా? స్వకీయకల్పనయేనా?)
• ఈ సమస్తము వాస్తవానికి ఏమై ఉన్నది?
• ఈ జననమేమిటి? మరణమేమిటి? ‘పుట్టుక’తో పుట్టి, మరణముచే లేకుండా పోతున్నానా?
ఈ ఈ విషయాలన్నీ మనకు మనమే ఇప్పటికిప్పుడు విచారణ చేసామా, - ఇక మహత్తరమైన ఆత్మజ్ఞాన ప్రయోజనమును మనము తప్పకుండా పొందగలము.
విచారేణ పరిజ్ఞాత స్వభావస్య సతః తవ।
విచారణ (అధ్యయనము, Analysing) చేస్తూ వుంటే, ఏది మన సహజస్వభావ స్వరూపమో, ఏది సందర్భ మాత్రమో గ్రహించగలము. మన సత్ స్వభావము మనకు అవగతమౌతుంది.
మనః స్వరూపం ఉత్సృజ్య
శమం ఏష్యతి విజ్వరమ్।
విజ్వరత్వం గతం చేతః తవ సంసారవృత్తిషు।
‘ఇదంతా ఆత్మయే’ అను ఆత్మ మననము చేబట్టి, క్రమంగా దృశ్యమనన-మనోస్వరూపమును, అది కలిగించే జ్వరములను (వేదనలను) పాముకుబుసమువలె విసర్జించి ‘‘ఆత్మమేవా2హమ్’’ నందు సునిశ్చలుడవు అయ్యెదవు గాక!
హే బ్రహ్మన్। ఆత్మతత్త్వ నిశ్చలచేతచే సంసారవృత్తులవలన కలిగే సమస్తవేదనలు తొలగినట్టి కేవల - తత్ స్వరూప నిర్మలబుద్ధి’ పొందగలవు.
న నిమజ్జతి తత్, బ్రహ్మన్!
గోష్పదేషు ఇవ వారణః।
కృపణం తు మనో, బ్రహ్మన్!
గోష్పదే అపి నిమజ్జతి।।
సమస్తమును స్వస్వరూపాత్మ దృష్టితో చూచు దర్శనమునచే గోపాదజలమునందు వారణము (ఏనుగు) మునగని తీరుగా, ఈ సంసారమునందు మునుగవు. కృపణుడవు (బేలవు) కావు.
హే బ్రాహ్మీ స్వరూపా! స్వయం బ్రహ్మానంద స్వరూపా! ఆత్మబుద్ధి లేని మందబుద్ధిగలవాడు దృశ్యతాదాత్మ్యముచే గోష్పాదజలములో కూడా పుటుక్కున మునుగగలడు.
అందుచేత కృపణుడవు. (లోవి, మందుడవు, అజ్ఞానివి, జాలి కోరువాడవు) - కావద్దు.
7. కార్యే గోష్పదతో యే-పి
విశీర్ణో మశకో యథా,
యావత్ యావత్, మునిశ్రేష్ఠ! స్వయం
సంత్యజ్యతే అఖిలమ్,
తావత్ తావత్ పరోలోకః
పరమాత్మ ఏవ శిష్యతే।
ఓ మునిశ్రేష్ఠా!
దోమ గోష్పాదజలముపై మూగి (వ్రాలి) తన ఆహారం పొంది, అటుపై తిరిగి ఎగిరిపోతుందేగాని, గోష్పాదజలములో మునగదు కదా!
అదే విధంగా, వివేకి అయిన జ్ఞాని జగద్విషయములపై ఇంద్రియ పూర్వకంగా వ్రాలుచూ కూడా ఈ దృశ్య సంసారములో ఏమాత్రము మునగక మనుగడ సాగించగలడు. ఎంతెంతవరకు ఈ జీవుడు విషయములతో మునుగనివాడై ఉంటాడో, అంతంతవరకు సమస్త లోకములకు ‘పరము’ అయినట్టి పరమాత్మగానే శేషించగలడు.
యావత్ సర్వం న సంత్యక్తం,
తావత్ ఆత్మా న లభ్యతే।।
సమస్తము మొదలంట్లా బుద్ధితోను, మనస్సుతోను ‘‘ఇది కల్పనా మాత్రమే! సందర్భమాత్ర సత్యమే’’ - అను భావన - అవగాహనలచే రిత్యజించనంత వరకు ఆత్మ అనుభవమునకు రాదు. ఎంతెంత వరకు దృశ్య జగత్తు జయించబడదో, అంతంత వరకు ‘ఆత్మానందము’ అందని ద్రాక్షవలె దూరవస్తువుగానే ఉంటుంది.
సర్వవస్తు పరిత్యాగే
శేష ‘‘ఆత్మ’’ ఇతి కథ్యతే।
‘ఆత్మ అవలోకనార్థం తు
తస్మాత్ సర్వం పరిత్యజేత్।
దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార - జాగ్రత్ - స్వప్న - సుషుప్తి ఇత్యాది సమస్త వస్తువులను పరిత్యజించగా, (దాటిపోగా) అప్పటికీ, శేషించియే ఉండేదే ‘ఆత్మ’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది.
‘‘ఆత్మయొక్క అవలోకము’’ అను ఉత్తమ ప్రయోజనము కొరకై, తదితరములైన సమస్తము త్యజించటమే ఉత్తమ ఉపాయము. అంతకు మించి వేరుత్రోవలేదు.

సర్వం సంత్యజ్య దూరేణ యత్ శిష్టం
తన్మయో భవ।।
సర్వం కించిత్ ఇదం దృశ్యం
దృశ్యతే చేత్ జగత్ గతమ్,
చిత్ నిష్పంద అంశ మాత్రం తత్।
న అన్యత్ కించన శాశ్వతమ్।।
ఓ నిదాఘా! సమస్తము త్యజించినవాడవై, అప్పటికీ శేషించిన స్వస్వరూపాత్మతో తన్మయుడవై ఉండుము.
ఏ కించిత్ దృశ్యము ఇక్కడ ‘జగత్తు’ రూపముగా కనిపిస్తూ ఉన్నదో, అట్టి ఈ దృశ్య జగద్దృశ్యమునకు రెండు ముఖ్య లక్షణములు.
(1) ఇదంతా నిష్పందమగు చిదాత్మయొక్క ఒకానొక స్పందాంశ మాత్రమే.
(2) ఈ దృశ్యములో ‘ఇది శాశ్వతము’ అని చెప్పతగిన ఏదీ కించిత్ కూడా లేనట్టిది. (వచ్చి పోయేది. లేని-పోనిది).
సమాహితా నిత్యతృప్తా
యథా భూతా అర్థ దర్శినీ,
బ్రహ్మన్! ‘సమాధి’ శబ్దేన -
‘‘పరా ప్రజ్ఞ’’ ఉచ్యతే బుధైః
హే బ్రహ్మన్! ‘‘సమాధి-పరాప్రజ్ఞ’’ అనగా ఏమి?
(1) సమాహితమైనది (సర్వాత్మ సమ స్వరూపమైన స్వస్వభావము)
(2) ‘‘ఇంకా ఇదేదో కావాలి’’ అనునది ఏమాత్రము లేనట్టిది. నిత్యతృప్తమైనది.
(3) సమస్త జీవుల సహజ రూపమగు అఖండాత్మ దర్శనదృష్టి కలిగి ఉన్నట్టిది. (ఉన్నది ఉన్నట్లుగా చూచు దృష్టి). అట్టి పరాప్రజ్ఞ (The Awareness of the Beyond) అయినట్టిదే ‘సమాధి’ అను శబ్దముచే చెప్పబడుచున్నది. పరాప్రజ్ఞయే సమాధి.
అక్షుబ్ధా నిరహంకారా
ద్వంద్వేషు అననుపాతినీ,
ప్రోక్తా ‘సమాధి’ శబ్దేన
మేరోః స్థిరతరా స్థితిః।।
క్షుబ్దము (Disturbance) ఏమాత్రము లేనట్టిది, నిరహంకారమైనది, ద్వంద్వదోషము యొక్క అనుపాతము (Eventuality) లేనట్టిది, మేరుపర్వతమువలె అత్యంత నిశ్చలమైనది - అగు స్థితి - ‘సమాధి’ అని చెప్పబడుచున్నది.
నిశ్చితా విగత అభీష్టా,
హేయ ఉపాదేయ వర్జితా,
బ్రహ్మన్! ‘‘సమాధి’’ శబ్దేన
పరిపూర్ణా మనోగతిః।।
జ్ఞాన-విజ్ఞానములచే ఆత్మపట్ల సునిశ్చితుడు, సమస్త అభీష్టములను (Desires/Expectations), హేయ (వదలవలసినవి) - ఉపాదేయములను (స్వీకరించవలసినవి), దాటి ఉన్నవాడు, పరిపూర్ణ మనోగతిని సిద్ధించుకున్నవాడు సమాధినిష్ఠుడు.
కేవలం చిత్ ప్రకాశాగ్ంశ
కల్పితా స్థిరతాం గతా।।
ఈ సమస్తము చిత్‌ప్రకాశముయొక్క స్వయం కల్పిత వస్తు సంబంధము వంటిదై స్థితిపొందుచున్నది. ఇక్కడి జాగ్రత్-స్వప్నముల స్థితగతులు మొదలైనదంతా చిత్ ప్రకాశ పరికల్పనా చమత్కారమే.
8. తుర్యా సా ప్రాప్యతే దృష్టిః
మహద్భిః వేదవిత్తమైః।
అదూర గత సాదృశ్యా
సుషుప్తిః సో అపి లక్ష్యతే।।
ఇక్కడి జాగ్రత్ స్వప్న జగత్తులు చిత్ ప్రకాశముచే కల్పించబడి స్థిరత్వము పొందినట్లు, గతిస్తున్నట్లు కనబడుచుండగా, వేదవేత్తలగు నహనీయులు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు పరమై, సాక్షి అయి ఉన్న ‘తుర్యక్ దృష్టి’ని ప్రాప్తించుకొన్నవారై ఉంటున్నారు.
ఈ జీవునికి దూరముగా ఉండనట్టి (సమీపమునందే ఉన్నట్టి) సుషుప్త స్థితి వంటి - తుర్యక్ స్థానము జాగ్రత్‌లో కూడా ఆత్మజ్ఞులచే అనుభవసిద్ధము చేసుకోబడుతోంది.
మనో అహంకార విలయే
సర్వ భావాంతర స్థితా,
సం-ఉదేతి ‘పర-ఆనందా’
యా తనుః పారమేశ్వరీ।।
మనస్సు, అహంకారము విలయము పొందుచున్నప్పటి ఏ భావాతీత స్థితి ఉన్నదో, అట్టి పరమేశ్వరీ స్వరూపమే పరానందరూపము.
అదియే ‘‘పరమేశ్వరీ స్వస్వరూప తనువు’’ (అహమిత్యేవ విభావయే భవానీ।)
మనసైవ మనః ఛిత్వా,
సా స్వయం లభ్యతే గతిః।
తత్ అను(తదను) విషయ వాసనా
వినాశః, తత్ అను (తదను) చిత్తః
పరమస్ఫుట ప్రకాశః।
- మనస్సుతో మనస్సు ఛేదించబడగా, అట్టి తుర్యక్ - పరమాత్మ స్థానము స్వయముగా సిద్ధిస్తోంది. అదియే నాయొక్క సహజ - కేవలీ -అనునిత్య స్వరూపము). అదియే నీయొక్క, ప్రతి జీవుని యొక్క సహజరూపము.
అట్టి సిద్ధిచే విషయవాసనలు (Tendencies) వినాశనము పొందుచున్నాయి. చిత్తము చిత్ ప్రకాశము పొంది, పరమస్ఫుట తేజో విలాసముగా అనుభవమవగలదు. ఈ జగత్తంతా ఆత్మతేజో విలాసమై వినోదింపబడ గలదు.
తదను చ సమతా వశాత్ స్వరూపే-
పరిణ మనం మహతాం అచింత్యరూపమ్,
అఖిలం ఇదం అనంతం ఆత్మతత్త్వం
దృఢ పరిణామిని చేతసి స్థితో అంతః।
‘‘ఈ జగత్తు యొక్క వాస్తవరూపము సర్వసమతా స్వరూపమగు ఆత్మయే’’ అను మననముచే క్రమంగా మనస్సు అచింత్యము, మహత్తరము అగు ఆత్మరూపము దాల్చుచున్నది.
అప్పుడు ఈ సమస్తము బుద్ధికి ఆవలగల అనంతము, అఖండము అగు ఆత్మతత్త్వము యొక్క ప్రదర్శనముగా స్థితబుద్ధిరూపము పొందగలదు. స్థితబుద్ధి గలవాడే స్థితప్రజ్ఞుడు.
బహిః ఉపశమితే చర - అచర ఆత్మా (చరాచరాత్మా)
త్వయం (స్వయం) అనుభూతయత ఏవ దేవదేవః।
అసక్తం నిశ్చలం చిత్తం
యుక్తగ్ం సంసార్యపి స్ఫుటమ్।
సక్తం తం దీర్ఘ తపసా
ముక్తమ్ అప్యతి బద్ధవత్।
బాహ్యధ్యాస ఉపశమించగా, అప్పుడు ఇక చరాచరాత్మకమగు ఆత్మ- దేవదేవుని సందర్శనము అంతరమున అనుభూతమవగలదు.
అసక్తునికి (Non-inquisitive, Non-expecting చే) చిత్తము నిశ్చలము కాగలదు. సంసారము ఉన్నప్పటికీ అసక్తము, నిశ్చలము అగు చిత్తముచే ఆత్మ ప్రస్ఫుటమౌతోంది. అందుచేత, దృశ్యముతో సక్తమైన చిత్తమును సుదీర్ఘమగు తపనరూపమగు తపస్సుతో స్వాధీనము చేసుకోవాలి. దృశ్య సంబంధమైన సక్తత (Attachment) ను సుదీర్ఘమగు తపస్సుతో జయించాలి. త్యజించివేయాలి.
అంతః సంసక్తి నిర్ముక్తో
జీవో మధుర వృత్తిమాన్,
బహిః కుర్వన్, న కుర్వన్వా
కర్తా భోక్తా నహి క్వచిత్ । ఇతి।।
ఈ జగద్దృశ్యముతో అంతరమున సంబంధము కలిగి ఉండని సంసార నిర్ముక్తుడగు జీవుడు - మధురమైన వృత్తి కలిగి ఉంటాడు. ఆపై బాహ్యమున సమస్త కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ అకర్తయే అయిఉండ గలడు. దేనికీ కించిత్ కూడా ‘భోక్త’ అవనివాడై ఉంటాడు.
ఇతి ప్రధమో అధ్యాయః
ఇతి ఒకటవ అధ్యాయము

ద్వితీయో2ధ్యాయః :: సంగ-బంధ-మోక్షములు

నిదాఘౌ వాచ :
1. ‘‘సంగః’’ కీదృశ ‘‘ఇతి’’ ఉక్తః?
కశ్చ బంధాయ దేహినామ్?
కశ్చ ‘‘మోక్షాయ’’ కథితః? కథం తు ఏష చికిత్స్యతే?
నిదాఘుడు : గురుదేవా! ఋభుమహర్షీ। ‘‘సంగము’’ (The Sense of Relatedness)అని చెప్పబడుచున్నదేది? దేహధారులకు ఇదంతా ఎట్లా ‘బంధము’(The Sense of Bondage)గా అగుచున్నది.
బంధము ఎందుకు ఏర్పడుతోంది?
మోక్షమునకు (The Sense of Independence and Relief) సహకరించగలవి ఏవేవి?
బంధము ఏ రీతిగా చికిత్స చేయబడగలదు?
దయతో వివరించండి.
ఋభౌవాచ :
‘దేహ-దేహి’ విభాగేన
పరిత్యాగేన భావనా,
దేహ మాత్రే(D) హి విశ్వాసః
సంగో బంధాయ కల్పతే।।
ఋభుమహర్షి : ఈ జీవుడు రెండు విభాగములుగా ప్రదర్శనమగుచున్నాడు. (1) ‘‘దేహి’’ (2) ‘‘దేహము’’ ఈతడు - ‘‘నేను దేహిని। దేహమును ఉపయోగించుచూ, దేహమునకు వేరై ఉన్నాను కదా!’’ - అనునది ప్రక్కకు పెట్టి ‘‘నేను ఈ దేహమాత్రుడను. అవినాభావుడను. దేహముతో పరిమితుడను’’ - అను విశ్వాసముతో కూడిన సంగము ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఇందుచేతనే ‘‘బంధము’’ కలుగుతోంది.
‘‘సర్వం ఆత్మ ఇదం। అత్ర అహం
కిం వాంఛామి? త్యజామి కిమ్?’’
ఇతి ‘‘అసంగస్థితిం’’ విద్ధి
‘జీవన్ముక్త తను’ స్థితామ్।।
‘‘సర్వం ఖలు ఇదమ్ బ్రహ్మ’’ - అను వేద వేదాంత మహావాక్యమును అనుసరించి ఈ సర్వము ఆత్మయే కదా! నేను ఆత్మస్వరూపుడనై యుండి ఆత్మయే అయి వున్న ఈ దృశ్యములో కోరుకోవలసినదేది? వదలవలసినది ఏముంటుంది?’’ - అనునదే ‘‘అసంగస్థితి’’. అసంగము చేతనే ఈ జీవుడు జీవన్ముక్త స్థితిని సంతరించుకుంటున్నాడు.
న అహం అస్మి। న చ అన్యో అస్మి।
న చ అయం। న చ నేతరః (న - ఇతరః।)
సో ‘‘అసంగ’’ - ఇతి సంప్రోక్తో - ‘‘బ్రహ్మాస్మి’’
ఇతి ఏవ సర్వదా। (ఇత్యేవ సర్వదా)।।
నేను ఆత్మకు అన్యమై లేను. అట్లాగే మరింకొకరెవ్వరూ ఆత్మకు అన్యము కాదు. నేను మరొకటేదో అయి ఉండలేదు. ‘ఇతరుడు’ అనునది నాకు లేదు. నాకు ‘నేను’ లేదు. ‘తదితరుడు’ - అనునది (ఆత్మగా) లేదు. నాకు నేనుగా, నీకు నీవుగా, వారికి వారుగా ఉన్నది ఏకమగు బ్రహ్మమే।
- ‘‘నేను బ్రహ్మమునే!’’ - అను ఈ విధమైన సంప్రోక్తముచే ఈ జీవుడు ‘అసంగుడు’ అగుచున్నాడు.
న అభినందతి నైష్కర్మ్యం,
న కర్మసు అనుషజ్జతే,
సు సమో యః పరిత్యాగీ,
సో ‘‘అసగ్ంసక్త’’ ఇతి స్మృతః।।
అట్టివాడు ‘‘నేను కర్మలను చేయనేకూడదు’’ అనే నైష్కర్మ్యమును ఆశ్రయించడు. ‘‘ఈ ఈ కర్మలు నిర్వర్తిస్తేనే నాకు గతి’’ - అనే ‘అనివార్య త్వకర్మభావన’ను కూడా కలిగి ఉండడు.
సమస్త భేదములను అధిగమించి, సర్వత్రా సమదృష్టిని సిద్ధించుకొన్న వానిని ‘అసంసక్తుడు’ - అంటారు.
సర్వకర్మ ఫల ఆదీనాం
మనసైవ న కర్మణా।,
నిపుణో యః పరిత్యాగీ, -
- సో ‘అసగ్ంసక్త’ ఇతి స్మృతః।
ఎవ్వడు కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ సమస్త కర్మఫలములను పరిత్యజించి, కర్మఫలములతో ‘‘సంగము లేని నైపుణ్యము’’ (A Stand beyond relatedness to the outcome of functions) కలిగి ఉంటాడో, ఆతడే ‘అసంసక్తుడు’. కర్మలవలన బంధము లేదు. మనస్సులో కర్మఫలములతో గల సంబంధమే ‘బంధము’గా అవుతోంది. మనస్సు కనుక కర్మలను త్యజించినదై ఉంటే, అప్పుడిక బంధమే ఉండదు.
అసంకల్పేన సకలాః చేష్టా
నానా విజృంభితాః।
చికిత్సితా భవంతి ఇహ,
శ్రేయః సంపాదయంతి హి।।
సంకల్పములచే విజృంభిస్తున్న మానసికమైన ‘‘నానావిధ చేష్టలను, కర్మ సంగ వ్యవహారములను ‘‘అసంకల్పము’’ అనే దివ్యౌషధముతో చికిత్స చేసుకొన్నవాడు శ్రేయమును సంపాదించుకున్నవాడగుచున్నాడు. అనగా, ‘‘అఖండము, ఏకము, సమస్తము అయి ఉన్న ఆత్మయే నేను’’-అను శ్రేయస్సు సిద్ధించగలదు.
న సక్తమ్ ఇహ చేష్టాసు, న చింతాసు।
న వస్తుషు। న గమ - ఆగమ చేష్టాసు।
న కాల కలనాసు చ।
‘‘కేవలం చితి’’ విశ్రమ్య,
కించిత్ చైత్య అవలంబ్యపి,
సర్వత్ర నీరసమ్ ఇహ
తిష్ఠతి ఆత్మరసం మనః।।
భార్య-భర్త-పుత్ర మొదలైన సాంఘిక విషయములపట్ల ‘సక్తత’ కలిగి ఉంటున్నప్పుడుగాని, చేష్టలు -చింతనలు నిర్వర్తిస్తూ - కలిగి ఉన్నప్పుడు గాని, ఆయా దృశ్య వస్తువుల, రాకపోక చేష్టలందుగాని, కాల-కలన (కల్పన) సందర్భములందుగాని, ఆత్మదర్శనమునకు వేరైన అసక్తిని దరిజేరనీయక, కేవలమగు చిత్‌ను ఆశ్రయించి, చిత్ నందే విశ్రాంతిని అవలంబించి ఉండుము. సమస్త విషయ రహితత్వమును కొంచము కొంచముగా అభ్యసిస్తూ క్రమంగా విషయరాహిత్యత యొక్క అనుక్షణికతను సిద్ధించుకొనెదవు గాక।
ఓ నిదాఘా! ఈ మనస్సు ఆత్మ రస స్వరూపమే. కానీ, ఇది ‘కేవలచిత్’ను కించిత్ ఏమరచి చైత్యము (దృశ్యము) అవలంబించినంత మాత్రముచేత నీరసమగు (దృశ్యములో) బంధము తెచ్చిపెట్టుకుంటోంది.
2. వ్యవహారం ఇదగ్ం సర్వం మా కరోతు,
కరోతు వా, అకుర్వన్ వా అపి, కుర్వన్ వా
జీవః స్వాత్మ రతి క్రియః।
ఓ నిదాఘా! నీవు ఇక్కడి ఆయా లోక సంబంధమైన వ్యవహారములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు (లేక) నిర్వర్తిస్తూ ఉండనప్పుడు కూడా, ఈ దేహముతో జీవించి ఉన్నప్పుడు (లేక) దేహము లేనప్పుడు కూడా - ఆత్మయందు ఎల్లప్పుడు రమించువాడై, సర్వత్రా ఆత్మనే దర్శించువాడవై ఉండాలి. జన్మ-జీవన్-మృత్యు-మృత్యు తదనంతరములతో సహా సర్వత్రా సర్వదా సమస్తమును స్వస్వరూపాత్మగా, ఆత్మకు అభిన్నంగా అనుక్షణము దర్శిస్తూ ఉండటమే ఆత్మయందు రమించటము. (రమయతేతి రామః)।
అధవా తమ్ అపి త్యక్త్వా, చైత్యాగ్ం
సగ్ంశాంత చిత్‌ఘనః,
జీవః తిష్ఠతి సగ్ంశాంతో
జ్వలన్ మణిః ఇవ ఆత్మని।
(లేదా) సర్వ వ్యవహారములు వదలి శాంత-చిత్ఘన చైతన్యమును ఆశ్రయించుము. పరమశాంతమైయుండి సర్వమును వెలిగించు వెలుగువలె ఆత్మను దర్శిస్తూ ఉండుము. గొప్ప మణియొక్క ప్రకాశమువలె జగత్తును ఆత్మయొక్క తేజస్సుగా భావనచేస్తూ, జీవాత్మను పరమాత్మత్వము నందు సశాంతింప జేయుము. అన్యముగా కనిపించే సమస్తము పట్ల మౌనము వహించి ఉండుము. అంతరమున సర్వదా ‘పరమశాంతము’ను ఆశ్రయించి ఉండుము.
చిత్తే చైత్య దశాహీనే
యా స్థితిః క్షీణ చేతసామ్,
సోచ్యతే (స ఉచ్యతే) ‘శాంత కలనా’
జాగ్రత్ ఏవ సుషుప్తతా।
‘‘శాంతము’’ వహించి ఉండటమంటే?
చిత్తము చైత్య (దృశ్య వ్యవహార దశ) రహితంగాను, జాగ్రత్ స్వప్నములను కల్పనా మాత్రంగాను దర్శించు స్థితియే ‘‘శాంతస్థితి’’. అది - జాగ్రత్‌పట్ల ‘సుషుప్తస్థితి’ వంటి మౌనరూపంగా ధారణ కలిగి ఉండటము.
ఏషా, నిదాఘ! సౌషుప్తి
స్థితిః అభ్యాస యోగతః,
ప్రౌఢా సతీ ‘తురీయ’ ఇతి
కథితా తత్త్వ కోవిదైః।
ఓ నిదాఘా! జాగ్రత్ స్వప్నముల సందర్భములలో గాఢనిద్రలోవలె నిర్విషయ, ‘‘సాక్షిమాత్ర-జాగ్రత్, సుషుప్తి స్థితి’’ అనే ఆత్మస్థితి - అభ్యాసము చేతనే సిద్ధించగలదు. (‘Mere Witness’ is a state that comes out of practice only)
పెద్దవారు చిన్న పిల్లల ప్రవర్తనమును ఆవేశ-భావోద్వేగరహితంగా చూచువిధంగా ‘‘ఈ జగత్తును క్రీడవలె, బాలాలీలావినోదముగా నిర్విశేషంగా’’ చూచు స్థితియే ‘తురీయము’ అని తత్త్వకోవిదులు వివరిస్తున్నారు.
అస్యాం తురీయ అవస్థాయాగ్ం
స్థితిం ప్రాప్యా అవినాశినీమ్,
ఆనందైకాంత శీలత్వాత్
అనానంద పదం గతః।।
అట్టి తురీయావస్థ వినాశనము (నశించటము) అను ధర్మమే లేనట్టి స్థితి. అది అన్యము అనునదే అనుభవమవనట్టి ‘‘ఏకాంత పదము’’ అని చెప్పబడుతోంది. ఆట్టి ఆనందపదము - అనునిత్య పరమ - ప్రశాంత అంతః - శీల స్థితి.
అనానంద, మహానంద,
కాల-అతీతః తతో అపి హి,
‘‘ముక్త’’ ఇతి ఉచ్యతే యోగీ,
తుర్యాతీత (తుర్య అతీత) పదం గతః।।
తుర్యగ - అతీతుడు
ఇట్టి యోగ యుక్తుని ముఖ్యమైన విశేష లక్షణములు నాలుగు.
(1) అనానందుడు : లౌకికానందముల పరిధులు, ఆనంద విషయ సంబంధములు లేనివాడు.
(2) మహానందుడు : ‘‘సమస్తము స్వస్వరూపముగా భావించు మహత్ - ఆనందుడు.
(3) కాలాతీతుడు : త్రికాలముల పరిధులను దాటి, సర్వదా యథాతథుడు.
(4) ముక్తుడు : బంధము ఏమాత్రము ఉండజాలని స్థితిని సిద్ధించుకున్నవాడు.
పరిగళిత సమస్త జన్మ పాశః
సకల విలీన తమో - మయ అభిమానః
పరమ రసమయః పరాత్మసక్తో (పర-ఆత్మ సక్తో,)
- జన్మలకన్నా మునుముందే ‘‘చైతన్య స్వరూపమే నేనైన నేను’’ను గమనిస్తూ, జన్మ -మృత్యు పాశములకు బద్ధుడు అవనివాడై ఉంటాడు.

- మాయ - అభిమాన - ఇత్యాది తమస్సులను (చీకట్లను) తనయొక్క ఆత్మ తేజస్సునందు విలీనము చేసుకొని ఉంటాడు.

- పరమాత్మయందు మాత్రమే పరమరసమయుడై అన్యములుగా కనిపించే సమస్తమును తన రస స్వరూపమునందు లయింపజేసివేసి పరాత్మసక్తుడై ఉంటాడు.
జలగత సైంధవ ఖండవత్, మహాత్మా।
జడ - అజడ దృశోః మధ్యే
యత్ తత్త్వం పారమార్ధికమ్,
అనుభూతి మయం, తస్మాత్ సారం -
‘బ్రహ్మ’ ఇతి కథ్యతే।।
- నీటిలోకి జార్చబడిన ఉప్పుగడ్డవలె తన స్వరూప - స్వభావములన్నీ కూడా సదా ‘‘ఆత్మమేవా2హమ్, సదాశివో2హమ్’’ భావనయందు లయించినవాడై (తురీయాతీతుడై) ఉంటారు. మహాత్ముడై ఉంటాడు.

జడ - అజడముల మధ్యగా (In between Passive Voice & Active Voice) పరమార్థక స్వరూపుడై విరాజిల్లుచూ ఉంటాడు.

‘‘ఈ సమస్తము నేనై, ఈ సమస్తము నాయందు ఉండి ఉంటున్న నేనైన నేను’’ - అను మహత్ సార భావనా రూపమే ‘బ్రహ్మము’ - అని పిలువ బడుతోంది.
3. దృశ్య సంవలితో బంధః।
తత్ ముక్తౌ ‘‘ముక్తిః’’ ఉచ్యతే।
దృశ్య (ద్రవ్య) దర్శన సంబంధే
యా అనుభూతిః అనామయా,
తామ్ అవష్టభ్య తిష్ఠత్వగ్ం
సౌషుప్తిం భజతే స్థితిః।।
దృశ్యముచే చుట్టుకొనబడి ఉండటమే (Blockings the entire attention in what is being outworldly seen) (సంవలితమే) బంధము.

అట్టి దృశ్యమునుండి విడివడి ఉండటమే ముక్తి! (దృశ్యమునకు ఆవల స్వస్వరూపముతో ఆక్రమించుకొని ఉంటున్నవాడే నిత్యముక్తుడు).

దృశ్యము - దర్శనముల సంబంధమునకు ఏ అనామయమైన (వేరైన) అనుభూతి కారణమగుచున్నదో, అట్టి ‘కేవలానుభూతి’ని అవధరించి, గాఢనిద్రలో ఉన్నవానివలె అతీతుడవై ఉండుము. సుషుప్త పురుషస్థితిని దృశ్య-దర్శన సందర్భములో అవధారణ చేసినవాడవై ఉండుము.
సైవ(సఏవ) తుర్యత్వం ఆప్నోతి,
తస్యాం దృష్టిగ్ం స్థిరాం కురు।
అట్టి నిర్విషయ సుషుప్త స్థితిని దృశ్య దర్శన సందర్భములో ధారణగా కలిగి ఉండటముచే దృష్టి నిశ్చలమౌతుంది. దృష్టి యొక్క సుస్థిరతచే ‘తుర్యగము’ అను ‘జాగ్రత్-స్వప్న-సుషుప్త సాక్షీ స్థితి’ని పొందగలవు. తత్ ఫలముగా స్వస్వరూపాత్మానుభవము అనుభవైక వేద్యము కాగలదు.
ఆత్మా - స్థూలో న చ। ఏవ అణుః న।
న ప్రత్యక్షో। న చ ఇతరః।
న చేతనో, న చ జడో।
న చ ఏవ అసత్। న సత్ మయః।
‘ఆత్మ’ అనునది ఎటువంటిదని వర్ణించగలము?
- అది ఈ భౌతికమైన కళ్ళకు ఎదురుగా కనిపించగల ఒక పాంచభౌతికమైన స్థూల వస్తువా? కాదు.
- అణువు వలె సూక్ష్మరూపమా? లేదు.
- ప్రత్యక్షమై ఎప్పుడో, ఎన్నడో, ఎక్కడో కళ్లకు ఎదురుగా కనిపించేదా? కాదు.
- అప్రత్యక్షమునకు వేరై మరెక్కడో ఉన్నట్టిదా? కానే కాదు.
- అది చేతనము (కదులునది) కాదు. జడము (కదలనిది) కాదు. అసత్తు (లేనట్టిది) కాదు. సత్తు (ఉన్నది) కాదు.
న అహం। న అన్యో। న చ ఏవ ఏకో।
న చ అనేకో। అద్వయో। అవ్యయః।।
యత్ ఇదం దృశ్యతాం ప్రాప్తం
మనః సర్వ ఇంద్రియాస్పదమ్,
- అది జాగ్రత్ - స్వప్నములలో కనిపించే ‘‘అహమ్-నేను’’ రూపమా? కాదు.
- అహమ్‌కు వేరైనట్టి మరొకటేదోనా? కాదు.
- ఏకము కాదు. అనేకము కాదు. ద్వితీయము కాదు. వ్యయము కాదు. అవ్యయము కాదు.
అద్వయము, అవ్యయము అగు ఆత్మకు ఏ ఈ దృశ్యము ప్రాప్తిస్తోందో,….. అట్టి వ్యవహారమంతా - మనస్సుచే ఇంద్రియాస్పదంగా స్వయంకృతంగా ప్రాప్తించేదే. అంతేగాని, మరొకరు కల్పిస్తున్నది కాదు.
దృశ్య దర్శన సంబంధే యత్ సుఖం పారమార్థికమ్,
తత్ అతీతం పదం యస్మాత్,
తత్ న కించిత్ ఇవైవ (ఇహైవ) తత్।।
పారమార్థిక ఆత్మసుఖము అనబడు ఆనందసాగరముయొక్క కించిత్ ప్రదర్శనము - ఇక్కడి ‘‘దృశ్య, దర్శన సంబంధముల మధ్య’’గా స్ఫరించటం జరుగుతోంది। పరమాత్మ - జీవాత్మల - సంబంధము కళాకారునికి - కళాఖండములోని విశేషాలకు గల సంబంధము వంటిది.
న మోక్షో నభసః, పృష్ఠే।
న పాతాళే న(చ) భూతలే।
సర్వ ఆశా సంక్షయే, చేతః క్షయోః
‘మోక్ష’ ఇతి ఈష్యతే।
‘మోక్షము’ అనునది ఆకాశమునకు ఆవల ఎక్కడోగాని, (లేక) మరెక్కడో క్రింద పాతాళములోగాని, (కాక) భూతలముపైగాని లేదు.
ఈ చిత్తము దృశ్యముపట్ల కలిగి ఉంటున్న సర్వ ఆశలు ఉపశమించగా (లేక) క్షయించగా, ఇక అప్పటికే శేషించి ఉన్న చిత్తము యొక్క కేవల నిర్మలానుభవమే ‘మోక్షము’. అది మోక్షము పట్ల కోరిక కూడా లేని స్థితి.
‘‘మోక్షో మే అస్తి’’ - ఇతి చింతా
అంతర్జాతా (అంతః జాతా) చేత్, ఉత్థితం ‘మనః’,
మనన ఉత్థే మనస్య, ఏష బంధః
సా-సాగ్ంసారికో దృఢః।।
మోక్ష సన్న్యాసము
‘‘నేను బద్ధుడను. ఇప్పుడు నాకు మోక్షము (బంధరాహిత్యము) సిద్ధించాలి’’

- అనే చింతన చిత్తమునందు బయల్వెడలిందా, ఇక ఆ క్షణమే మననరూపమగు మనస్సు తిరిగి బయల్వెడలుతోంది. నిత్యముక్తమగు ఆత్మకు క్రొత్తగా మోక్షము ప్రసాదించేదెవరు? ఎందుకు?
‘అన్యము’ యొక్క మననముచే మనస్సు బయల్వెడలుతోంది.

- అదియే సాంసారిక రూపమగు ‘దృఢబంధము’గా రూపము దిద్దుకొంటోంది. అట్టి మనస్సు తిరిగి తిరిగి వచ్చి ఆత్మయందే లయిస్తోంది.

మననము యొక్క అవల గల ‘చిత్తము’ యొక్క మనన రహితానుభవమే ‘మోక్షము’. దృశ్యము గురించిన ‘ఇది బంధము - అది మోక్షము’ అను మననమే భవబంధము (లేక) సంసారబంధము.

సమస్త కల్పనా జగదనుభవములకు ఆవల కేవలమైయున్న ‘నేనే’ ఆత్మ-అని గమనించి ఉండు. ఆత్మకు బంధమెక్కడిది? లేనే లేదు. నీవు ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు.
4. ఆత్మ వ్యతీతే సర్వస్మాత్
సర్వరూపే అథవా తతే।
కో బంధః? కశ్చ వా మోక్షో?
నిర్మూలం మననం కురు।।
ఈ కనబడే సమస్త దృశ్య ప్రపంచమునకు, అంతరంగ చతుష్టయమునకు కూడా ఆత్మ- ‘అతీతము’ అయి ఉన్నది.

అయితే, ఈ సమస్తము ఆత్మరూపమే. ఈ సమస్తముగా (దృశ్యముగా, అంతరంగ చతుష్టయముగా) ఆత్మయే వ్యాపించి ఉన్నది.

(నీవు, నేను, వారు, వీరు, లోకములు, జాగ్రత్, స్వప్నము, సుషుప్తి, ఈశ్వరుడు, కేవలడు మొదలైన) సమస్తము ఆత్మయే అయి ఉండగా ఇక బంధము ఎవరికి? మోక్షము ఎవరికి?

ఓ నిదాఘా! అన్యదృష్టి నిర్మూలన రూపమగునదే ఆత్మదృష్టి. అందుచేత, ‘‘ఇదంతా సర్వదా ఆత్మయే’’ అను మననమును (అనన్యదృష్టిని) ఆశ్రయించి ఉండుము.
అధ్యాత్మరతిః అశ్రాంతః
పూర్ణ పావన మానసః।
ప్రాప్తాన్ ఉత్తమ విశ్రాంతిః
న కించిత్ ఇహ వాంఛతి।।
‘‘ఈ సమస్తము నాయొక్క ఆత్మానంద సంప్రదర్శనమే’’ అను ఆధ్యాత్మభావనయందు ఎల్లప్పుడు విశ్రాంతి తీసుకొన్నట్టివాడు- సంపూర్ణము - పవిత్రము అగు మనన రూప మనస్సును పొందగలడు. మనస్సు విశ్రాంతి పొందగలదు. అట్టి విశ్రాంతి పొందిన మనస్సుగల ప్రశాంత మనస్కుడు ఇక్కడ ‘‘ఇంకా ఇది పొందాలి! అది కావాలి. ఏదో తొలగాలి’’ - మొదలైన ఏ రూపమైన వాంఛ కలిగి ఉండడు. దేనినీ వాంఛించడు, ద్వేషించడు.
సర్వ అధిష్ఠాన సత్‌మాత్రే
నిర్వికల్పే చిత్ ఆత్మని,
యో జీవగత స్నేహః,
స ‘‘జీవన్ముక్త’’ ఉచ్యతే।।
ఈ సమస్తమునకు అధిష్ఠానము(Main Raw-Material, That with which all this is made up of) అగు ‘కేవలసత్’ను ఆశ్రయించి, ‘‘ఆత్మకు అన్యము’’ - అనే సమస్త కల్పనలు త్యజించి, నిర్వికల్పమగు చిదాత్మను ఆశ్రయిస్తూ, సమస్తమునకు ఆధారమైన ఆత్మవస్తువును సర్వే సర్వత్రా దర్శిస్తూ ఉంటాడో - ఆతడే ‘‘జీవన్ముక్తుడు’’. ఆత్మతో మాత్రమే స్నేహము కలిగి ఉంటాడు.
న అపేక్షతే భవిష్యత్ చ।
వర్తమానే న తిష్ఠతి।
న సంస్మరతి అతీతం చ।
సర్వమేవ కరోతి చ।।
అట్టివాడు -
‘‘భవిష్యత్తులో ఏదో స్థితి పొందాలి, ఇంకా ఎప్పుడో ఏదో సిద్ధించాలి’’ - అని అపేక్షించడు.
- ఈ వర్తమానంలో కనిపించే దేనిలోను తిష్ఠించుకొని ఉండడు.
- జరిగిపోయిన విషయములను జ్ఞాపకం చేసుకొంటూ భూతకాలములో ఉండడు.
అన్నీ నిర్వర్తిస్తూనే త్రికాలములకు అతీతుడై, ఆత్మసంభావనుడై ఉంటాడు.
అనుబంధపరే జంతావ(త్) సగ్ంసర్గమనాః సదా,
భక్తే భక్త సమాచారః। శఠే శఠ ఇవ స్థితః।।
బాలో బాలేషు। వృద్ధేషు వృద్ధో।
ధీరేషు ధైర్యవాన్।
యువా యౌవన వృత్తేషు।
దుఃఖితేషు సు-దుఃఖధీః।
అట్టి జీవన్ముక్తుని మరికొన్ని స్వాభావిక లక్షణములు
సహప్రాణులతో (జీవులతో) సంబంధము (సర్గము) కలిగి ఉంటూనే, సమస్తము ఆత్మగా భావన చేస్తూ, ఆత్మకు వేరైన విశేషాలతో అనుబంధాతీతుడై ఉంటాడు.
• భక్తులతో భక్తి సమాచారము కలిగి భక్త సంబంధము ప్రదర్శిస్తాడు.
• శఠులతో (మూర్ఖులతో) శఠునివలె ఉంటాడు.
• బాలురతో బాలుని వలెను,
• వృద్ధులతో వృద్ధుని వలెను,
• ధీరులతో ధైర్యవంతుని వలెను,
• యువకులతో యౌవనోత్సాహుడు వలెను,
• దుఃఖితులలో దుఃఖము ఉన్న వానివలెను, సుఖవంతులతో సుఖివలెను.
బాహ్య ప్రవర్తనము ప్రదర్శిస్తూనే ఆత్మభావన వీడక ఉంటాడు.
ధీర ధీః ఉదిత ఆనందః।
పేశలః పుణ్యకీర్తనః।
ప్రాజ్ఞః ప్రసన్న మధురో।
దైన్యాత్ అపగత ఆశయః।
ధైర్యముతో కూడిన బుద్ధి కలిగి ఆనంద, ఉత్సాహ, ఉత్తేజములు కలిగి, పుణ్యకార్యములందు అభిరుచి కలవాడై ఉంటాడు. అన్నీ తెలిసియే, - ప్రసన్నమైన ప్రవర్తన, మధురమైన వృత్తి కలిగి ఉంటాడు. సర్వలౌకికమైన ఆశయములను అంతరమున విడనాడి ఉంటాడు. సర్వే సర్వత్రా సమదర్శనము చేస్తూ ‘‘నేను అధికుడను కాను’’- అను అణకువ (Humbleness) కలిగి ఉంటాడు.
అభ్యాసేన పరిస్పందే
ప్రాణానాం క్షయమ్ ఆగతే।
మనః ప్రశమం ఆయాతి।
నిర్వాణమ్ అవశిష్యతే।।
ప్రాణాయామ యోగాభ్యాసి అయి ప్రాణముల (లేక-చిత్త-ఇష్టముల) పరిస్పందనమును వశము చేసుకొని ఉంటాడు. ఆతనిపట్ల మనస్సు స్వస్వరూపత్మయందు ఉపశమించినదై ఉంటుంది. అట్టి స్వానుభవము ఆత్మకు అనన్యభావనారూపమగు మనః ప్రశమనము. నిశ్చల వాయువుతో నిశ్చలవాయువువలె అచ్యుతస్థానము.
యతో వాచో నివర్తంతే వికల్ప కలనాన్వితాః,
వికల్ప సంక్షయాత్ జంతోః
పదం తత్ అవశిష్యతే।।
మనస్సు సశాంతించగా, ఈ సమస్తము తనయందు అనన్యముగా స్వాభావికం చేసుకున్న ‘అఖండాత్మ రూప నిర్వాణము’ యొక్క అనుభవం ఎట్టిది? తత్-అనుభవం గురించి చెప్పటానికి మాటలు చాలవు. మాటల వలన అసలైన అఖండాత్మానుభవం గురించి చెప్పబోయి,ఏదో చెప్పి కలనము(Illusion) పొంది వెనుకకు మరలుతాయి. ఆత్మ గురించిన అధ్యయనము చేస్తూ ఉండగా సంకల్ప-వికల్పములు సంక్షయించి, ఈ జీవుడు తనకు తానే అఖండ - అమృత - అప్రమేయాత్మరూపముగా శేషించుచున్నాడు. అప్పుడిక మాటలతో అవసరమేముంటుంది?
అనాద్యంత అవభాసాత్మా-
‘పరమాత్మ’ ఇహ విద్యతే।
= ఇతి ఏతత్ నిశ్చయం స్ఫారం
‘సమ్యక్ జ్ఞానం’ విదుః బుధాః।।
స్వస్వరూపమగు ఆత్మయే ఆద్యంత రహితముగాను, ‘పరమాత్మ’గాను తెలియబడగలదు. అట్టి నిశ్చయసారమే ‘సమ్యక్ జ్ఞానము’ - అని ఆత్మజ్ఞులగు బుధులు ఎరిగినవారై, ఇక ‘ఇది’ అని చెప్పలేక, వాక్కుకు (వ్యాఖ్యానములకు) అవిషయంగా ఎరిగి ఉంటున్నారు. సర్వత్రా సమరూపమగు ‘పరమాత్మ’ యొక్క జ్ఞానమే ‘సమ్యక్ జ్ఞానము’.
5. యథా భూత - “ఆత్మ దర్శిత్వం”
ఏతావత్ భువనత్రయే,
యదా “ఆత్మ ఏవ (ఆత్మైవ) జగత్ సర్వం”
ఇతి నిశ్చిత్య పూర్ణతా,
సర్వం ఆత్మైవ।
కౌ దృష్టౌ భావ-అభావౌ?
క్వ వా స్థితౌ?
అట్టి నిర్వాణ (తరంగరహితవాయుస్థితివంటి) నిశ్చలానుభవము పొందినవాడు - ఈ అనుభవమయ్యే త్రిభువనములను (మర్త్య-పాతాళ- స్వర్గలోకములను) యథాతథమగు ఆత్మస్వరూపముగాను, ఆత్మకు అనన్యముగాను దర్శించుచున్నాడు.
ఎవ్వరైతే ‘‘ఈ సమస్త జగత్తు (నాతో సహా) అఖండమగు ఆత్మ స్వరూపమేకదా!’’ అను నిశ్చయపూర్ణుడై ఉంటాడో, ఈ జగత్తును చూస్తూ ఉన్నప్పుడు ఆత్మదృష్టిని ఏమాత్రము విడువడో, అట్టివాడు ఇక భావ-అభావముల మధ్య పరిమితుడౌతాడా? అవడు. అంతా ఆత్మయే అయినప్పుడు భావాభావదృష్టుల మధ్యగా చిక్కుకునే ప్రసంగమెక్కడిది?
క్వ బంధ మోక్ష కలనే?
బ్రహ్మ ఏవ ఇదం విజృంభతే।
సర్వం ఏకం పరం వ్యోమ కో మోక్షః?
కస్య బంధతా?
బ్రహ్మేదం (‘బ్రహ్మ’ ఇదం) బృంహిత ఆకారం
బృహత్ బృహత్ ఇవ స్థితమ్।
బ్రహ్మమే ఈ సమస్తముగా విజృంభిస్తూ ఉండగా, ‘‘ఇది బంధము - అది మోక్షము’’ అను వాక్ - కల్పన ఎక్కడిది?
సర్వము ఏకమే అయి ఉన్న పరమాకాశమే అయి ఉండగా మోక్షమెవరికి? బంధమెవరికి?
‘‘బహృత్ : మహత్తరమై సర్వదా వ్యాపించి ఉన్నది’’ అని వర్ణించబడుచున్న అగు ‘బ్రహ్మము’ అను బృహత్ సర్వదా బృహత్తరముగానే ఉన్నది.
దూరాత్ అస్తమిత ద్విత్వం,
భవ ఆత్మైవ త్వమ్ ఆత్మనా।
ద్విత్వము (Duality) అనునది సుదూరంగా అస్తమించగా, ఇక ఆత్మయే శేషించుచుండగా, అట్టి ఆత్మయే స్వయముగా నీవై ఉండుము.
సమ్యక్ ఆలోకితే రూపే
కాష్ఠ పాషాణ వాససామ్।
మనాగపి న భేదో అస్తి।
క్వ అసి సంకల్పన ఉన్ముఖః?
ఓ నిదాఘా! కొంచము వివేచనతో కూడిన ‘సమ్యక్’ దృష్టితో పరిశీలించి చూస్తే (అవలోకిస్తే) - మట్టి, రాయి, ఇల్లు, బట్ట మొదలైనవన్నీ ఏమీ భేదమైనవి కావని తెలియబడగలదు. మరిక భేద దృష్టితో సంకల్పములు కలిగి ఉండవలసిన పనేమున్నది? (Everything is manifestation of Energy which is always constant-Physics).
ఆదావంతే చ సగ్ంశాంత-
స్వరూపం అవినాశియత్,
వస్తూనాం ఆత్మనశ్చ ఏతత్
తన్మయో భవ సర్వదా।।
ప్రియమిత్రమా! ఇక్కడి వస్తు సముదాయమునకు, ఆత్మకు కూడా ఒకానొక సారూప్యత, సాయుజ్యత ఉండ{ం గమనించు. ఆత్మకు, ఇక్కడి వస్తు జాలమునకు మొదటి నుండి ‘‘శాంతము, అవినాశనము’’ అను ధర్మములు కలిగియే ఉంటున్నాయి. (Energy is always constant). అందుచేత, అటువంటి శాంతము - అవినాశనము అగు ఆత్మయే సర్వదా నీవై ఉండుము. (ఆత్మవలెనే దృశ్యము కూడా శాంతానంద స్వరూపమే).
ద్వైత - అద్వైత సముద్భేదైః
జరామరణ విభ్రమైః,
స్ఫురతి ఆత్మభిః ఆత్మైవ
సిద్ధేః అబ్ధి ఇవ వీచిభిః।
సముద్ర జలంతో తరంగములు బయల్వెడలి, జలంలోనే సంచరిస్తూ తిరిగి మరొకప్పుడు జలమునందే లయిస్తున్నాయి కదా! అదే విధంగా ద్వైత - అద్వైత భేద విశేషములు, జరా - మరణ విభ్రమములు (Illusions) ఆత్మయందే స్ఫురించి, (ప్రతిబింబించి), ఆత్మయందే సిద్ధిని (లయమును) పొందుచున్నాయి!
ఆపత్ కరంజ పరశుం పరాయా నిర్వృతేః పదమ్-
శుద్ధం ఆత్మానం ఆలింగ్య
నిత్యం అంతఃస్థయా ధియా,
యః స్థితస్తం క ‘ఆత్మ’ -
ఇహ భోగో భాధయితుం క్షమః?
‘‘ఆపదలు’’ అనే ముళ్ళపొదలకు గొడ్డలి వంటిది, నిర్వాత (నిశ్చలమైన వాయువు) వంటిది - అగు కేవలాత్మ స్వరూపమును ఎల్లప్పుడు ఆలింగనముచేసుకొని అంతస్థ బుద్ధినిర్మలుడై స్థితించి ఎవడు ఉంటాడో, అట్టి వానిని ఇక్కడి ఈ భోగరూపమగు జగత్ విశేషములు, మాటలు ఏమి చేయగలవు? ఏమీ చేయలేవు. బాధించజాలవు.
కృతస్ఫార విచారస్య మనోభోగాదయో అరయః
మనాగపి న భిందంతి,
శైలం మంద అనిలా ఇవ।।
పిల్లగాలులు కొండను కదల్చగలవా? లేదు కదా! అట్లాగే, చక్కగా ఆత్మ గురించి విచారణ చేయుచున్న వానియొక్క మనస్సును ఇక్కడ కనిపిస్తున్న ఇంద్రియ విషయములు, ప్రాపంచకభోగములు కించిత్ కూడా ఖేదమును కలిగించలేవు.
నావాత్వమ్ అస్తి కలనాసు
న వస్తుతో అంతః।
నానావిధాసు-సరసి ఇవ జల ఆది, న అన్యత్।।
సరస్సులో అసంఖ్యాక తరంగములు కనబడుచూ ఉండవచ్చుగాక! అట్టి తరంగములన్నీ కూడా జలమే అయి ఉండగా, ఆయా తరంగములకు పరస్పరం భేదమేముంటుంది? జలము దృష్ట్యా ఏకమే కదా!
అట్లాగే, ఇక్కడ కలనము (లేక) భావన చేత జీవులలో పరస్పరము భేదము కనిపిస్తూ ఉన్నప్పటికీ వస్తుతః (ఆత్మదృష్టిచే) భేదమే లేదు.
ఇతి ఏక నిశ్చయమయః పురుషో ‘‘విముక్త’’ -
ఇతి ఉచ్యతే। సం అవలోకిత ‘‘సమ్యక్ అర్ధ’’ ఇతి।।
ఇట్టి నిశ్చయముగల పురుషుడు (జీవుడు) ‘విముక్తుడు’ అనబడుచున్నాడు. ‘సమ్యక్ అవలోకనము’ చేటయమే ‘సమ్యక్-అర్థము’ అని కూడా అంటారు.
ఇతి ద్వితీయో-ధ్యాయః
ఇతి 2వ అధ్యాయము

తృతీయో2ధ్యాయః - విదేహముక్తేః కిం రూపమ్?

నిదాఘౌవాచ :
1. విదేహముక్తేః కిం రూపమ్?
(తత్ వాన్) కోవా? మహామునే!
కం యోగం సం ఉపాస్థాయ
ప్రాప్తవాన్ పరమం పదమ్
నిదాఘుడు : హై మహామునీ! ‘‘విదేహిముక్తి’’ యొక్క రూపమేమిటి? ఏ మహానుభావుడు అట్టి విదేహముక్తిని సిద్ధించుకున్నారు? వారు ఏ యోగాభ్యాసమును ఆశ్రయించి అటువంటి విదేహముక్తి-పరమ పదమును ప్రాప్తించుకున్నారు?
స్వామీ! ఋభూ! దయతో వివరించండి. మేము కూడా మార్గాన్వేషణ చేస్తాము.
శ్రీ ఋభౌవాచ :
సుమేరోః వసుధా పీఠే మాండవ్యో నామ వై మునిః।
కౌండిన్యాత్ తత్త్వం ఆస్థాయ, జీవన్ముక్తో భవతి అసౌ।
ఋభుమహర్షి : సరే। వినండి. ఇందుకుగాను ఒక మహనీయుని గాథ చెప్పుకుందాము.
సుమేరు పర్వత పీఠముపై ‘మాండవ్యుడు’ అనే మునీశ్వరుడు ఉండేవారు. ‘కౌండిన్యుడు’ అను తమ గురు దేవులనుండి తత్త్వ విచారణను పొంది, క్రమంగా ఆతడు జీవన్ముక్తుడు అయ్యారు.
జీవన్ముక్తి దశాం ప్రాప్య
కదాచిత్ బ్రహ్మ విత్తమః,
సర్వ ఇంద్రియాణి సంహర్తుం
మనః చక్రే మహామునిః।।
ఆ బ్రహ్మవేత్తకి జీవన్ముక్త దశ ప్రాప్తించుకొన్న తరువాత, ‘‘ఇప్పుడు ఈ సమస్త ఇంద్రియములను జగద్విషయముల నుండి ఉపసంహరించెదనుగాక!’’ అని సంకల్పించారు. అందుకు ఆ మహాముని ఉపక్రమించసాగారు.
బద్ధ పద్మాసనః తిష్ఠన్, అర్థ-ఉన్మీలత లోచనః,
బాహ్యాన - అభ్యంతరాం చ ఏవ
స్పర్శాన్ పరిహరం శనైః,
తతః స్వమనసః స్థైర్యం మనసా విగత ఏనసా।
- పద్మాసనము అవధరించారు. కనులు సగము మూసుకొని అర్ధ నిమీలితనేత్రులు అయ్యారు.
బాహ్య - అభ్యంతరముల స్పర్శను నెమ్మదిగా ఉపసంహరించారు.
ఇకప్పుడు స్థైర్యము, నిర్దోషము గల మనో విభాగములతో (నిశ్చల మనస్సుతో) -చంచలమగు మనస్సును గమనించసాగారు.
‘‘అహో! ను! చంచలం ఇదం।
ప్రతి-ఆహృతం (ప్రత్యాహృతం) అపి స్ఫుటమ్,
పటాత్ ఘటం ఉపాయాతి,
ఘటాత్ శకటమ్ ఉత్కటమ్!
మనోచాంచల్యము
మాండవ్య మునీశ్వరుడు : ఆహా"! ఈ చంచల మనో విభాగము ఏమి సంచలము కలిగి ఉంటోంది! దీనిని (నిశ్చల మనోవిభాగముతో) ప్రత్యాహరించటము (ఉపశమింపజేయము) కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది -
పటము (వస్త్రము) నుండి - ఘటము వరకు,
ఘటము (నుండి) - శకటము వరకు
ఎక్కడెక్కడికో పరుగులు పరుగులు తీస్తోందే! ఎట్లా దీనిని నిరోధించటం? చంచల మనస్సును నిశ్చలపరచటం కుదిరేది ఏవిధంగా?
2. చిత్తం అర్థేషు చరతి పాదపేషు ఇవ మర్కటః।
పంచద్వారాణి మనసా, చక్షుః ఆదీని అమూన్యలమ్।
బుద్ధి ఇంద్రియ అభిధానాని, తాని ఏవ (తాన్యేవ)
అవలోకయామి అహమ్।
హత ఇంద్రియ గణా!
యూయం త్యజత ఆకులతాం శనైః।।
(యూయం త్యజత వ్యాకులతాం శనైః।।)
అరె! కోతి చెట్టు కొమ్మలపై దూకుతూ పరుగులు తీస్తున్న విధంగా చిత్తము అసంఖ్యాక విషయములపై గంతులేస్తోందే! ఏ ఒక్క విషయముపై ఏ కొద్దిసేపు కూడా ఆగటమే లేదు!
మనస్సుతో కళ్ళు - చెవులు మొదలైన పంచేంద్రియముల ద్వారా విషయములపై వ్రాలుటము - ఇక చాలు.
మనస్సును దాటి, బుద్ధితో ఇంద్రియములను మాత్రమే చూస్తూ, వాటి వ్యవహారమంతా ఇప్పుడు గమనించెదను గాక!
ఓ పాడు ఇంద్రియగణములారా! ఇక నెమ్మదిగా మీ కలనము (కలవరము, వ్యాకులత)ను వదలిపెట్టండి.
చిదాత్మా (చిత్ ఆత్మా) భగవాం తు
సర్వ - సాక్షిత్వేన స్థితో2స్మి అహమ్।
తేన ఆత్మనా బహుజ్ఞేన నిర్జ్ఞాతాః
చక్షుః ఆదయః।
ఓ ఇంద్రియ విషయ ధ్యాస సమూహములారా! సద్దు చేయకండి. ఇప్పుడు నేను చిత్ - ఆత్మ భగవాన్ సాక్షిస్థితిని ఆశ్రయించు ప్రయత్నము చేయుచున్నాను.
ఈ చక్షువులను ఉపయోగించుచూ దృశ్యమును తెలుసుకొనుచున్నది ఎవరు? సర్వజ్ఞము, జ్ఞానాతీతము అగు ఆత్మయే। ఆత్మయే అయి ఉన్న నేనే కదా!
పరి నిర్వామి శాంతో అస్మి।
దిష్ట్యాస్మి విగత జ్వరః।
స్వ-ఆత్మని ఏవ అవతిష్ఠే అహం
తుర్య రూపపదే అనిశమ్।।
ఆత్మను - ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు వేరుచేసి చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే - విగతజ్వరుడను (మనోదోషములు తొలగినవాడను) అగుచున్నాను. తుర్యక్‌రూపపదము (జాగ్రత్-స్వప్నసుషుప్తులకు ఆవలగల 4వ పదము) నందు అన్నివేళల అవధరించుచు స్వ-ఆత్మయందే అవతిష్ఠుడను అయ్యెదనుగాక!
ఆ మాండవ్యమహర్షి ఈ విధంగా మనస్సును సుదీర్ఘకాలము సముదాయించసాగాడు.
అంతరేవ శశామాస్య (సశామ్యస్య)
క్రమేణ ప్రాణ సంతతిః।
జ్వాలా జాల పరిస్పందో, దగ్ధ ఇంధన ఇవ అనలః।
ఉదితో అస్తంగత ఇవ, హి అస్తంగత ఇవ ఉదితః।
సమః సమ రసాభాసః
తిష్ఠామి స్వచ్ఛతాం గతః।।
క్రమంగా అతనియొక్క ప్రాణ - అపాన - ఇత్యాది సంతతి (పంచ వాయువుల సముదాయము) లోపలనే శమించసాగింది.
జ్వాలలుగా మండుచున్న కట్టెలు, అవి అగ్నిచే కాలటం పూర్తి కాగానే, ఆ అగ్ని శమిస్తుంది కదా! అట్లాగే ప్రాణాగ్ని ఆత్మయందు శమించసాగింది. ఇంకా కూడా ఆ మహర్షి ఈవిధంగా ధ్యానించసాగారు.
ఉదయించినవాడు అస్తమించునట్లు, అస్తంగతుడై మరల ఉదయించినట్లుగా, (కానీ) సూర్యుడు ఉదయ - అస్తమయములు తాను పొందక యథాతథమై ఉండు తీరుగా,
మనస్సు స్వచ్ఛము అగు సమరస ప్రకాశమునందు జనించి శమించుచుండగా, నిత్యప్రకాశకుడనైన నేను ఆత్మయందు సుతిష్ఠితుడనై ఉండెదను గాక!
ప్రబుద్ధో అపి సుషుప్తిస్థః। సుషిప్తిస్థః ప్రబుద్ధవాన్।
తుర్యం ఆలంబ్య కాయాంతః
తిష్ఠామి స్తంభిత స్థితిః।
సబాహ్య-అభ్యంతరాన్ భావాన్
స్థూలాన్ సూక్ష్మతరాన్ అపి,
త్రైలోక్య సంభవాం (సం) త్యక్త్వా సంకల్ప ఏక వినిర్మితాన్।
మెలకువలో ఉన్నప్పుడు గాఢనిద్రలో ఉన్నవానివలెను, గాఢనిద్రలో (సుషుప్తిలో) ఉన్నప్పుడు మెళకువలెను ఉండెదనుగాక!
తుర్యక్ (4వ) అవస్థను అవలంబించినవాడనై శరీరము అధిగమించి స్తంభించిన స్థితిని ఆశ్రయిస్తాను. శరీర రాహిత్యమును స్వాభావికం చేసుకుంటాను.
బాహ్య - అభ్యంతరములు అయినట్టి స్థూల - సూక్ష్మ భావములన్నీ సంకల్పమాత్రంగా త్యజిస్తూ, ఈ మూడు లోకములలో సంకల్పములచే నిర్మితమగుచున్న, సంభవిస్తున్న సమస్తమును త్యజించినవాడవై ఉంటాను.
సహ ప్రణవ పర్యంత దీర్ఘ నిస్స్వన తంతునా,
జహావ ఇంద్రియ తన్మాత్ర జాలం,
ఖగ ఇవ అనిలః।
ఏ స్థూల (బాహ్య), సూక్ష్మ (అభ్యంతర) భావజాలముల చేత(లేక) సంకల్పములచేత ముల్లోకములు (పక్షియొక్క గాలిలో ఎగరటం - వ్రాలటం వలె) రాక - పోకలు ఆగకుండా జరుగుతూ పోతున్నాయో, వాటిని నిరోధించటానికై చిత్తముయొక్క సంచారములు నిరోధించాలి.
అందుకొరకై పక్షి గాలిని విడుచు రీతిగా ప్రణవపర్యంతము పంచతన్మాత్ర జలమును యోగాభ్యాసముతో త్యజిస్తాను. (శబ్ద స్పర్శ రూప రస గంధములను వదలటము - అనే దీర్ఘ నిస్వనము (గాలి వదలటం) ప్రాణాయామము చేస్తాను.
తతో అంగ సంవిదం స్వచ్ఛాం
ప్రతిభాసమ్ ఉపాగతామ్,
సద్యోజాత శిశుజ్ఞానం
ప్రాప్తవాన్ మునిపుంగవః।।
ఈ విధంగా తలచిన మహానుభావుడగు ఆ మాండవ్య మహాముని పంచ ఇంద్రియాల తన్మాత్రలను (పక్షి గాలిని విడచినట్లు) మనస్సుతో నిస్స్వనము (వదలటము) చేయసాగారు.
ఆ మునిపుంగవుడు అప్పుడే పుట్టిన పసిబిడ్డయొక్క కేవలేంద్రయ జ్ఞానమువలె నిర్మలమగు స్వచ్ఛమగు అంగజ్ఞానము పొందారు.
అనగా శబ్దస్పర్శరూప రసగంధముల కేవల జ్ఞానము ఉన్నదే గాని, (వాటికి సంబంధించిన) విషయములతో సంయోగము ఏమాత్రము లేదు.
3. జహౌ చిత్తం చైత్య దశాగ్ం,
స్పందశక్తిం ఇవ అనిలః।
చిత్ సామాన్యం అథా ఆసాద్య
సత్తా మాత్రాత్మకం తతః।
‘‘సుషుప్తి పదం’’ ఆలంబ్య
తస్థౌ గంధం ఇవ అనిలః
సుషుప్తి స్థైర్యం అసాద్య
తుర్యరూపం ఉపాయయౌ,
క్రమంగా వాయువు స్పందశక్తిని వదలి కదలక ‘నిశ్చలము’గా ఉండు విధంగా, చిత్తము స్పందమును త్యజించింది. చైత్య దశ (చిత్తము విషయములను కలిగి ఉండటము)ను పరిత్యజించింది. (“interestedness” remained as ‘still’, while discarding what ever is interesting)
చిత్తము విషయములను వదలినప్పుడు కేవల చిత్ (లేక) చిత్ సామాన్యము (Absolute Form of Awareness) (లేక) సత్తా-మాత్రాత్మకము (Absolute Presence) అనబడురూపము సంతరించుకొన్నది.
అది వాసనలు వదలిన గాలితో పోల్చతగినది. అట్టి ‘జాగ్రత్‌లో సుషుప్తి’ అను ‘‘తుర్యక్ పదము’’ను పొందసాగింది
నిరానందో2పి, సానందః,
సత్ చ అసత్ చ బభూవ సః।
తతః తత్ సంబభూవ అసౌ,
యత్ గిరామపి అగోచరః।
అది ఆనంద - నిరానంద, సత్, అసత్- అతీత పదము. నిరానందుడు కూడా ఆనందుడు, సత్ కూడా అసత్ అయి ఉన్నట్టిపదము తుర్యక్‌రూప ఉపాయముచేత సుషుప్తిలో ఉండే ధైర్యమును ఆతని చిత్తము పొందింది.
అట్టి ‘‘చైత్యరహిత చిత్త, కేవల చిత్ - సుషుప్తి’’ స్థైర్య రూపముచేత ఆ మాండవ్య మహాముని కేవలాత్ముడు అయినాడు.
- నిరానందుడై కూడా ఆనందభరితుడుగాను,
- సత్తు అయి ఉండియే అసత్ స్వరూపుడుగాను,
- కొండవలె కనబడుతూ ఉండి కూడా అగోచరుడుగాను- తనను తాను దర్శించసాగారు.
యత్ శూన్యవాదినాగ్ం - ‘శూన్యం’,
‘బ్రహ్మ’-బ్రహ్మ విదాం చ యత్
‘విజ్ఞానమాత్రం’ - విజ్ఞానవిదాం,
యత్ అమలాత్మకమ్।।
ఆ మాండవ్యునియొక్క విషయ రహిత చిత్త - చిత్ స్వరూపము ఇంకా కూడా ఎటువంటిదంటే -
- శూన్యవాదులచే ‘శూన్యము’ గా చెప్పబడువాడుగా రూపుదిద్దుకున్నారు.
విజ్ఞానవాదులు ఆతని నిర్మల కేవల స్వరూపమును ‘‘విజ్ఞాన మాత్రము’’ అంటున్నారు.
‘పురుషః’। - సాంఖ్య దృష్టీనాం।
‘ఈశ్వరో’ - యోగవాదినామ్।
‘శివః’ శైవ। ఆగమస్థానాం।
‘కాలః’ కాలైక వాదినామ్।
సాంఖ్య దృష్టి గల సాంఖ్యులు ‘పురుషుడు’ అను పేరుతో పిలుస్తున్నారు.
యోగవాదులు ‘ఈశ్వరుడు’ అంటున్నారు.
శైవులు ‘శివుడు’ అంటున్నారు.
వేదాధ్యయనులు ‘ఆగమస్థానము’ అంటున్నారు.
కాలవాదులచే ‘కాలపురుషుడు’ అనబడుచుండసాగారు.
యత్ ‘సర్వశాస్త్ర సిద్ధాంతం’,
యత్ సర్వ హృదయానుగమ్,
యత్ సర్వగ్ం సర్వగం వస్తు,
యత్ తత్త్వం తత్ అసౌ స్థితః।
- ఏది సర్వశాస్త్రముల అంతిమ సిద్ధాంతార్థమో, ఏది సర్వదా సమస్త జీవరాసుల హృదయానుగతమై ఉన్నదో, (అనుగమనించినదై హృదయరూపంగా ప్రకాశిస్తోందో), ఏది సర్వత్రా వ్యాపించి ఉన్నదో (సర్వగ్ం), సర్వ వస్తువులుగా ప్రదర్శనమగుచున్నదో,
అదే తానుగా అయినారు.
యత్ అనుత్తమ నిష్పందం - దీపకం తేజసాం అపి,
స్వానుభూత్య ఏకమానం చ
(స్వ-అనుభూత్యైకమానం చ )
యత్ తత్త్వం తత్ అసౌ స్థితః।।
- ఏది చలనము లేని దీపము యొక్క తేజేస్సు వలె (స్పందరహితదీపంగా) సమస్తమును తన వెలుగులో వికసింపజేస్తూ ఉన్నదో…,
- ఏ తత్త్వము తనయొక్క అంతరముననే అనుభూతిగా అగుచున్నదో,
- ఏది ఏకమే అయినప్పటికీ అనేకముగా అగుపిస్తూ ఉన్నదో….,
యత్ ఏకం చ అపి - అనేకం చ ।
సాంజనం చ నిరంజనమ్।
యత్ సర్వం చ అపి అసర్వం చ
యత్ తత్త్వం తత్ అసౌ స్థితః।
ఏది దోషములు కలిగియున్నట్లు కనిపిస్తూ కూడా, నిర్దోష - నిరంజన రూపమో,
- సమస్తము అయి ఉండి కూడా అన్యముగా ఏదీ కాకయే ఉన్నదో, అట్టి తత్ స్వరూపుడై, స్వానుభవమునకు స్వస్వరూపాత్మయే అయి ప్రకటనమవసాగారు
అజమ్ అమరమ్ అనాద్యమ్,
ఆద్యమ్ ఏకమ్ పదం అమలగ్ం
సకళం చ నిష్కళం చ,
స్థిత ఇతి స తథా నభః,
స్వరూపాత్ అపి విమల స్థితిః
ఈశ్వరః క్షణేన।। ఇతి।।
ఆ మాండవ్య మహర్షి ఇంకా కూడా తన స్వస్వరూపము గురించి ఈఈ విధంగా అభివర్ణితము పొందసాగాడు.
• జన్మరహితము. అమరము (మరణమనునదే లేనిది)
• అనాది (ఆది లేనిది). సనాతనము.
• ఆద్యం - మొట్టమొదటే ఉన్నట్టిది.
• ఏక పద స్వరూపమైనది.(అనేకము అనునది కించిత్ కూడా లేనట్టిది)
• ‘ఓం’ అను ఏకపద సంజ్ఞ. ఏకమై, సమగ్రమై ఉన్నట్టిది.
• మలము లేనిది. దోషరహితము.
• సమస్తము - ఉండీ ఏదీ లేనట్టిది.
(బంగారమునకు ఆకారము ఉన్నప్పటికి ‘ఇది’ అనగలిగిన ఆకారము ఏదీ లేదు కదా?!) ఈ విధంగా సకలము - నిష్కళము అగు ఆకాశము యొక్క స్వరూపము కంటే కూడా అత్యంత సూక్ష్ముడు, నిర్మలుడు, కేవలుడు - అగు ఆత్మగా అనుక్షణికుడు అయినారు.
ఓ నిదాఘా! ఈ మనము చెప్పుకున్నదే అనిర్వచనీయమగు ‘విదేహముక్తి’ (పరిమిత) వాక్యవర్ణనము. అట్టి నిర్వికల్పము (లేక) ‘విదేహముక్తి’ గురించి ఎంతగా చెప్పుకున్నా కూడా, అది అనుభవైకవేద్యము మాత్రమే।
-ఇతి తృతీయో-ధ్యాయః-
-ఇతి 3వ అధ్యాయము-

చతుర్థః అధ్యాయః - జీవన్ముక్తుడు - అష్టసిద్ధులు

నిదాఘౌవాచ :
1. జీవన్‌ముక్తస్య కిం లక్ష్య (క్ష్మ) హి ఆకాశ గమన ఆదికం?
తథా చేత్, ముని శార్దూల! తత్ర నైవ ప్రలక్ష్యతే?
నిదాఘుడు : హే భగవాన్! మునిశార్దూలా! ఋభుమహర్షీ! జీవన్ముక్తుని యొక్క ముఖ్యమైన లక్షణములు ఏమిటి? ఆకాశగమనము మొదలైన) (అష్టసిద్ధులవంటి) విశేష ప్రత్యేక లక్షణములా? అట్లా అయితే (తమవంటి) జీవన్ముక్తులుగా చెప్పబడేవారిలో కొందరిలో అవి కనబడటం లేదే? వారికి ఆ ఆశయం (ప్రలక్ష్యము) ఉంటుందా? అష్టసిద్ధులు లక్ష్యముగా కలిగి ఉండవచ్చునా? తద్వారా ఆత్మానుభవము (లేక) జీవన్ముక్తి సిద్ధిస్తుందా?
శ్రీ ఋభౌవాచ :
అనాత్మవిత్ అముక్తో అపి
నభో విహరణ ఆదికమ్,
ద్రవ్యమంత్ర క్రియా కాల శక్త్య
ఆప్నోతి ఏవ, స ద్విజః।
ఋభుమహర్షి : ఓ నిదాఘ మునీ! ఒకానొకడు ఆత్మగురించి ఎరుగక ముక్తుడు కాకపోయినప్పటికి కూడా, అట్టివాడు ద్రవ్య - మంత్ర - క్రియా - కాలశక్తులను అనుసరించిన ప్రయత్నముచే ‘ఆకాశగమనము’ మొదలైన సిద్ధులు పొందినవాడై ఉండటము జరుగవచ్చు. సిద్ధులు కలిగి ఉన్నంత మాత్రంచేత జీవాత్మ-పరమాత్మల అనన్యత్వము సిద్ధించుకొన్న ‘సద్విజుడు’ అయి ఉంటాడని అనలేము. జీవన్ముక్త లక్షణములైనట్టి ‘జీవాత్మత్వము నాకు బంధము కాదు’’ అను ద్విజత్వము సిద్ధించుకొన్నట్లు సిద్ధాంతీకరించ లేము. అనగా అవి సద్విజ సహజ లక్షణములు కాదు.
న ఆత్మజ్ఞస్య ఏష విషయ।
ఆత్మజ్ఞో హి ఆత్మమాత్రదృక్।
(ఆత్మజ్ఞానో ఆత్మమాత్ర దృక్।)
(ఇంకా కూడా చెప్పాలంటే) ఆత్మజ్ఞుని దృష్టిలో ఆకాశగమనము (అణిమ-గరిమ-లఘిమ- మహిమ-వశిత్వ-ఈశ్విత్వ-ప్రాకామ్య-ఇచ్ఛా) అష్ట సిద్ధులు ఆత్మజ్ఞానమునకై విషయమే కాదు. ఆతని దృష్టిలో దృక్ స్వరూపుడగు ఆత్మయొక్క కేవల - వాస్తవ స్వరూపము మాత్రమే (1) అధ్యయనం చేయటానికి, (2) దర్శించటానికి, (3) తానే అయి ఉండటానికి - విషయము.
ఆత్మన ఆత్మని సంతృప్తో
న అవిద్యాం అనుధావతి।
యేయే భావాః స్థితాలోకే,
తాన్ ‘అవిద్యామయాన్’ - విదుః।
జీవన్ముక్తుడు ఆత్మయందే ఆత్మను దర్శిస్తూ సంతృప్తుడై ఉంటాడు. అవిద్యా విషయముల గురించి పరుగులు తీయడు.
లోకములోని ‘‘బాహ్యమైనట్టిదేదైనా పొందాలి’’ అను రూపముగల భావములన్నీ అవిద్యయే. లోకజనులు ఏఏ అవిద్యాస్థితి- గతులు, భావములు ఆశ్రయిస్తూ ఉంటున్నారో, అవన్నీ జీవన్ముక్తుని దృష్టిలో అవిద్యామయములుగానే అనిపిస్తూ ఉంటాయి.
త్యక్త అవిద్యో మహాయోగీ
కథం తేషు నిమజ్జతి?
లోకములన్నీ ఎందులో కల్పనారూపంగా ఉన్నాయో- అట్టి ఆత్మయే విద్య.
‘‘ఈ దృశ్యము వాస్తవమే’ అను మూర్ఖత్వము, మూఢత్వమును ఆశ్రయించి అల్పబుద్దితో సిద్ధజాలమును కోరుకొను అవిద్యయందు మునుగు స్థితిని మహాయోగులగు ఆత్మతత్త్వజ్ఞులు కోరుకొంటారా? లేదు. అభిలషించరు. ఆత్మయోగులు అవిద్యయొక్క పరిధులను అధిగమించువారై ఉంటారు.
యస్తు మూఢో అల్పబుద్ధిర్వా
సిద్ధి జాలాని వాంఛతి,
స సిద్ధి సాధనైః యోగైః, తాని సాధయతి క్రమాత్।
ద్రవ్య మంత్ర క్రియాకాల యుక్తయః సాధు సిద్ధిదాః,
పరమాత్మ పద ప్రాప్తౌ
న ఉపకుర్వంతి (నోపకుర్వంతి) కాశ్చన।।
ఏ యోగి అయితే ఆయా సిద్ధులకొరకై మంత్రతంత్ర యోగ శాస్త్రములో చెప్పిన సాధనలకు ఉపక్రమిస్తాడో, ఆయా క్రమంగా, ఆసిద్ధులు ఆతడు పొందగలడు.
ద్రవ్య-మంత్ర-క్రియా కాల-కాలయుక్త సాధనలచే లభించే సిద్ధులు లభించినంతమాత్రంచేత అవన్నీకూడా, అంతమాత్రం చేత ఎవ్వరికీ కూడా కొంచము కూడా ‘పరమాత్మ పదప్రాప్తి’కి ఉపయోగపడేవి కావు. ఆత్మభావనకు కావలసిన అవగాహనయే వేరు.
యస్య ఇచ్ఛా విద్యతే కాచిత్ స సిద్ధిగ్ం
సాధయతి, అహో।
ఆయా సిద్ధులన్నీ కూడా ఇచ్ఛ చేతను, యోగాభ్యాసమునకు సంబంధించిన సిద్ధి కొరకై అట్టి ఆశయము కలిగియుండి చేయు పరిశ్రమ చేతను సిద్ధిస్తున్నాయి. ఆత్మభావన సిద్ధించటానికి భౌతిక సిద్ధులతో పనేముంటుంది?
నిరిచ్ఛోః పరిపూర్ణస్య న ఇచ్ఛా సంభవతి క్వచిత్।
సర్వ ఇచ్ఛాజాల సంశాంతాః
ఆత్మ లాభో భవేత్, మునే!
‘‘ఆత్మస్వరూపభావనాసిద్ధి’’ అనేది సర్వ ఇచ్ఛలకు ముగింపు. అట్టి వానికి ఆకాశగమనము, మాయమవటము, వస్తువులను సృష్టించటము మొదలైన వాటిపై ఇచ్ఛయే ఉండదు. ఇక అందు కొరకై ప్రయత్నములు ప్రసక్తి ఎక్కడిది? అట్టి అష్టసిద్ధలు కలిగి ఉండటానికి, కలిగి ఉండకపోవటానికి - సర్వాత్మ ఆత్మభావనకు సంబంధమే లేదు.

ఓ మునీ! సమస్త ఇచ్ఛాజాలములు సంశాంతించినప్పుడే ఆత్మలాభము లభించగలదు. (ముని = సర్వ ఇంద్రియ విషయములపట్ల అంతరంగమున మౌనము వహించినట్టివాడు. ‘‘ఇవి ఎట్లా ఉంటేఏమి? సమస్తమునకు పరమైయున్న ఆత్మస్థానమే నా మహదాశయము!’’ - అను జగత్ విషయ మౌనమును, ఆత్మవిషయ ధ్యానమును ఆశ్రయించువాడు).
2. స కథం సిద్ధి జాలాని,
కథం వాంఛతి అచిత్తకః?
ఆత్మతత్త్వ ధ్యానమును ఉపాసించువానికి చిత్తము - ‘అచిత్తము’ అయి, చిత్ స్వరూపము సంతరించుకొంటోంది. ఇక అట్టి అచిత్తసిద్ధునికి చిత్తముయొక్క ప్రదర్శనారూపములగు దృశ్యవస్తు-సంఘటనా సంబంధమైన సిద్ధులు కోరుకోవలసిన పనేముంటుంది?
అపి శీతరుచాః అర్కే,
సుతీక్షే ణాపి ఇందుమండలే,
అప్యధః ప్రసరం త్యక్త్వా,
జీవన్ముక్తో న విస్మయీ।
‘‘సూర్యమండలము చల్లబడిపోయింది’’ అన్నప్పుడుగాని, ‘‘చంద్రుడు సుతీక్ష్ణుడై ప్రకాశిస్తున్నారు’’ - అన్నప్పుడు గాని, అవన్నీ జీవన్ముక్తునికి ఆశ్చర్యముగాని, వినోదముగాని కలిగించవు. ఆతడు సర్వ మనో ప్రసరణలు త్యజించినవాడై ఉంటాడు
అధిష్ఠానే పరే తత్త్వే
కల్పితా రజ్జు-సర్పవత్।
కల్పిత-ఆశ్చర్య జాలేషు
న అభ్యుదేతి కుతూహలమ్।।
‘‘ఈ జగద్దృశ్యములో ఆశ్చర్యంగాను సామాన్యంగాను కనిపిస్తూ ఉన్న విశేషాలన్నీ కూడా - త్రాడులో పాము యొక్క లక్షణాలు కనిపిస్తున్న తీరుగా కల్పితమైన వ్యవహారజాలములే కదా!’’ - అని గ్రహించి జగద్దృశ్యముపట్ల కల్పనామాత్రంగా సునిశ్చితుడైనట్టివాడే ఆత్మతత్త్వజ్ఞుడు. అట్టి వానికి ఇక్కడి విషయాలేవీ కుతూహలము ఏమాత్రము కలిగించ జాలవు.
యది విజ్ఞాత విజ్ఞేయా,
వీతరాగా మహాధియః
విచ్ఛిన్న గ్రంథయః సర్వే
తే స్వతంత్రాః తనౌ స్థితాః
ఆత్మతత్త్వమును సిద్ధించుకున్న తత్త్వజ్ఞులు - తెలుసుకొనవలసినది తెలుసుకొనియుండి, రాగమును త్యజించినవారై ఉంటారు. మహత్తరమగు బుద్ధికలవారై, హృదయగ్రంథులన్నీ ఛిన్నము కాగా, …. సర్వత్రా స్వతంత్రము గల రూపము కలవారై ఉంటారు. దేనికీ బద్ధులుకారు. పరిమితులుకారు. స్వతంత్రమగు ఆత్మ భావనాదేహులై ఉంటారు
సుఖ-దుఃఖ దశా ధీరగ్ం
సామ్యాత్(న్) న ప్రోద్ధరంతి యమ్,
నిశ్వాసా ఇవ శైలేన్ద్రం
చిత్తం తస్య మృతం విదుః।।
ఆపత్ కార్పణ్యం ఉత్సాహో
తత్త్వజ్ఞులపట్ల సుఖ - దుఃఖ దశలు బుద్ధిచే సమత్వము పొందినవై ఉద్వేగము, ప్రేరణత్వము సంతరించుకోవు. (అవి వారి దృష్టిలో స్వల్ప విషయములవలె అగుచున్నాయి). గొప్పకొండ ఒకని నిశ్వాసము (గాలిని ముక్కు నుండి వదలటము) వలన ఉన్న చోటి నుండి కదలదు కదా! ఆ తీరైన విధంగా వారి పట్ల చిత్తము నిస్పందనము పొందినదై ‘‘మరణంచినవానిలోని చిత్తరాహిత్యము’’ వలె అగుచున్నది. ఆతడు అంతరమున ‘‘పరమప్రశాంత’’ను సంతరించుకొని ఉంటున్నాడు.
మదో (మందో) మాంద్యం మహోత్సవః
యత్ న యంతి న వైరూప్యం
తస్య నష్టం మనో విదుః।
ఆపద సందర్భములోను, కార్పణ్యము (మమకారముతో కూడిన ఆదుర్దా) ఏర్పడుచున్నప్పుడు, ఉత్సాహ సంఘటనలప్పుడు, మందము - మాంద్యములు కలుగుచున్నప్పుడు, (ఇంకా ఆయా సందర్భములలో) మహోత్సాహము కలుగుచున్నప్పుడు కూడా - ఎవ్వడైతే ఏదీ పొందనివాడై, ఏ మార్పు అంతరమున కలిగి ఉండడో, ఎట్టి వైరూప్యము పొందడో (వికారము పొందడో) - అట్టి వానిపట్ల మనస్సు నశించినదే అగుచున్నది.
ద్వివిధః చిత్త నాశో అస్తి,
సరూపో, అరూప ఏవ చ।
జీవన్ముక్తౌ సరూపః స్యాత్,
అరూపో దేహముక్తిగః। (విదేహముక్తిగః)
చిత్తనాశనము రెండు రకములుగా ఏర్పడటం జరుగుచున్నది.
(1) సరూపము (2) అరూపము
జీవన్ముక్తుని విషయములో ‘సరూపచిత్తనాశనము’, విదేహముక్తుని విషయంలో ‘అరూప చిత్తనాశనము’ సిద్ధిస్తూ ఉంటాయి.
‘చిత్త సత్త’ ఇహ దుఃఖాయ।
‘చిత్తనాశః’ సుఖాయ చ।।
చిత్త సత్తాం క్షయం నీత్వా
చిత్త నాశం ఉపానయేత్।
చిత్తము ఉన్నంతవరకు ఈ జీవుని పట్ల దుఃఖము(Worry and meloncholy) అనివార్యము. చిత్తము నశించటముచే సుఖప్రదమే కాగలదు. అందుచేత ఎంతగా ప్రయత్నించైనా సరే, - చిత్తమును క్షయింప జేసుకోవాలి. చిత్తనాశనమును ఏదో ఒక ఉపాయముతో సిద్ధించుకోవటము - అత్యంత ఆవశ్యకము. (దృశ్య విషయములపై ఇష్టముచే ఆధారపడి ఉండటమే చిత్తముయొక్క రూపము)
3. మనస్తాం మూఢతాం విద్ధి
యదా నశ్యతి స, అనఘ!
చిత్తనాశ అభిదానగ్ం హి
తత్ స్వరూపం ఇతి ఈరితమ్।
ఓ అనఘా! నిదాఘా!
మరి ‘‘చిత్తము నశించటము’’ అనగా ఏమిటి?
ఈ చిత్తము, మనస్సు - ‘‘ఈ ఎదురుగా సంగతి - సందర్భము - సంబంధము అనుబంధము - బాంధవ్యము మొ।। వాటితో కూడిన దృశ్య వ్యవహారము నిజము నిత్యము! సత్యము (Original Permanent and true) ’’- అనే కల్పన/భ్రమ (misconceived notion illusionally) కలిగి ఉన్నది. అట్టి మూర్ఖత్వమును ఈ మనస్సులో నశింపజేయటమే ‘చిత్తనాశనము’ - అనబడుతోంది. చిత్తము నశిస్తే, ఇక ఈ మనస్సు ‘తత్’ (కేవల) స్వరూపమే అగుచున్నది. అదియే ఆత్మసాక్షాత్కారము, తత్త్వసిద్ధి కూడా.
మైత్ర - ఆదిభిః గుణైః యుక్తం
భవతి ఉత్తమ వాసనమ్।
భూయో జన్మ వినిర్ముక్తం
జీవన్ముక్తస్య తత్ ‘మనః’। (తన్మనః)।
సరూపో అసౌ మనోనాశో
‘జీవన్ముక్తస్య విద్యతే।
అహంకారం, బలం, దర్పం, క్రోధం, పారుష్యం, మమకారము - మొదలైనవన్నీ ఈ జీవునికి శత్రువులు. ఎందుకంటే అట్టి శత్రు (లేక) అసురీ వాసనలు పునర్జన్మ పరంపరలకు కారణము అగుచున్నాయి. మైత్రి, అద్వేష్టా సర్వభూతానామ్, నిర్మమకారము, కరుణ, క్షమాగుణము - మొదలైనవి ఉత్తమ వాసనలు, ఎందుకని? అవి భూయోజన్మ వినిర్ముక్తములు. అనగా, పునర్జన్మ దుర్వ్యసనము నుండి ముక్తిని ప్రసాదిస్తాయి. ‘మనోనాశనము’నకు సహకరిస్తాయి. [ అట్టి భగవద్గీతలో గీతాచార్యుల వారిచే ప్రవచనము చేయబడిన దైవీగుణములు (12వ అధ్యాయము), జ్ఞానలక్షణములు (13వ అధ్యాయము), గుణాతీత ధారణమార్గములు (14వ అధ్యాయము), దైవీగుణములు (16వ అధ్యాయము) ] ఆశ్రయించటం చేత జనించే ఉత్తమ వాసనల సహాయం చేత ఎవ్వరి మనస్సు నశించినదై ఉంటుందో, ఆతడే జీవన్ముక్తుడు.
నిదాఘ! రూప నాశస్తు వర్తతే దేహ ముక్తికే।
విదేహ ముక్త ఏవ అసౌ విద్యతే నిష్కళాత్మకః।
ఓ నిదాఘా! జీవన్ముక్తుడైన తరువాత ఇక ఆపై జీవన్-మృత్యు సంఘటనలు కూడా వాస్తవానికి లేనివగుచున్నాయి. ‘‘ఈ దేహము, జీవాత్మ మొదలైన పరిమితములు నా రూపము కాదు. ఈ విశ్వమే నా రూపమై, నేను ఆవల రూపరహితుడనై ఉన్నాను’’ - అను అనుభవముచే ఈ జీవుడు ‘‘విదేహముక్తుడు’’ అగుచున్నాడు.
• జీవన్ముక్తుడు -కళాత్ముడు- ‘ఇదంతా నాకు లీలయేగాని, బంధము కాదు।’’
• విదేహముక్తుడో - నిష్కళాత్ముడు - ‘‘ఇదంతా నేనే!’’
సమగ్ర అగ్ర్య గుణ ఆధారం అపి సత్త్వం ప్రలీయతే।
విదేహ ముక్తౌ విమలే పదే పరమపావనే।
‘‘నేను ఈ జీవాత్మ - జగత్తులుగా భాసిస్తూ, ఈ ఉభయము కూడా నా తేజోరూపముగా కలిగి ఉన్నాను’’ అను సమగ్ర గుణాధారుడై జీవన్ముక్తుడు ఉంటాడు. అట్టివాడు క్రమంగా గుణములకు, జగద్దృశ్యమునకు సమగ్రమగు ఆధారుడై, సత్త్వ (కేవలమగు ఉనికి) ప్రదర్శనుడై విమలము, పరము (Pure & Beyond) అగు ‘‘విదేహముక్తి స్వారాజ్యుడు’’ అగున్నాడు.
విదేహముక్తి విషయే తస్మిన్ సత్త్వక్షయ ఆత్మకే,
చిత్త నాశే విరూపాఖ్యే, న కించిత్ ఇహ విద్యతే।
విదేహముక్తుని విషయంలో

(1) అట్టి వానిపట్ల సత్త్వగుణము కూడా క్షయించినదై (ఒక నాటక రచయిత పాత్రలు గుణములకు వేరై ఉండు తీరుగా) గుణాతీతత్వము,

(2) నామరూపములకు అతీతమగుచుండటము,

(3) చిత్తము అరూపము పొందటము …… ఇవన్నీ స్వాభావికములౌతాయి.

అట్టి వానికి ‘‘ఇక్కడ - ఇది, అక్కడ-అది’’ అనునదే ఉండదు. ఇహము రహితమై ఆతని బుద్ధి పరస్వరూపమునందు, నిశ్చలమగుచున్నది. ఈ సమస్తము తనకు అనన్యత్వము సంతరించుకొంటుంది.
న గుణా। న అగుణాః తత్ర। న శ్రీః। న అశ్రీః।
న చ ఏతా। (నచ అనేకతా)। (న చ ఉభయో)।।
న చ ఉదయో। న అస్తమయో।
విదేహముక్తుని రూపము వర్ణనాతీతము
• అది గుణముల స్వరూపము కాదు, గుణరహితము (అగుణము) కాదు.
• ఈ విశ్వము అను శ్రీ (సంపద) కాదు. విశ్వరాహిత్యము అనబడు ‘అశ్రీ’ కాదు.
• ఏకము కాదు. అనేకము కూడా కాదు.
• ఆతని స్వరూపము ఉదయించునది కాదు. అస్తమించునది కాదు.
న హర్ష - అమర్ష సంవిదః।
న తేజో। న తమః కించిత్ ।
న సంధ్య ఆది। న రాత్రయః।
• ఆతని పట్ల హర్షము (Happy) గాని, అమహర్షము (Non-Happy) గాని ఉండవు. ఆనందమును తెలుసుకొనువాడు (సంవిదుడు) కాదు.
• ఆతడు తేజస్సుగాని, చీకటి గాని, కించిత్ గాని, బృహత్‌గాని కాదు.
• తేజో - చీకటిల మధ్యగా సంధ్యా స్వరూపుడుగాని, రాత్రి స్వరూపుడుగాని కాదు.

ఆతని పట్ల తేజస్సు, తమస్సు, సంధ్య, రాత్రి మొదలైని సరూపములు కావు. అరూపములు కావు.
న సత్తా। న అపి చ అసత్తా।
న చ మధ్యగ్ం హి తత్ పదమ్।
యే హి పారంగతా బుద్ధేః
సగ్ంసార ఆడంబరస్య చ,
తేషాం తత్ ఆస్పదగ్ం స్ఫారం
సవనానాం ఇవ అంబరమ్।।
ఇంకా కూడా - విదేహముక్తుని కేవల స్వస్వరూపపదము గురించి :
- సత్త (Presence) కాదు. అసత్త (Non-Presence) కాదు. ఆ రెండిటి మధ్యలో సత్-అసత్ (ఉన్నది-లేనిది మధ్యగా) కాదు.
ఆతని బుద్ధి సంసార సాగర ఆడంబరమంతా దాటివేసిన స్థానములో సుస్థిరముగా ఆక్రమించుకొన్నదై ఉంటుంది.
ఆకాశంలో నిశ్చలమై, అస్పందమైయున్న వాయువుతో పోల్చతగిన విధంగా అన్యమైనదంతా ఆతని అనన్య - కేవలము నందు నిస్పందమై ఉంటుంది.
ఆకాశంలో నిశ్చలవాయువువలె, ఆతనియందు జగత్ విశేషమంతా నిశ్చలము, స్వస్వరూపాత్మ రూపము సంతరించుకొంటుంది.
4. సగ్ం శాంత దుఃఖం అజడాత్మకం
ఏక సుప్తం, ఆనంద మంధరం
అపేత రజః తమో యత్,
ఆకాశకోశ తనవో, అతనవో, మహాంతః
తస్మిన్ పదే గళిత చిత్తలవా భవంతి
ఆతని స్వాత్మానందానుభవము ఎట్టిది?
- సర్వ దుఃఖములు (All worries) సంశాంతించినట్టి స్థానము.
- అది జడస్థితి కాదు. అనగా గాఢనిద్రవంటిది కాదు. అజడాత్మకం. కానీ, గాఢ నిద్రలో పొందు ఆనందము కలిగి ఉన్నట్టిది.
- రజో తమోగుణములను ధరించినట్టిది కాదు. వదలి ఉన్నట్టిది కాదు.
వారు ఆకాశకోశదేహులు, దేహరహితులు, మహాంతదేహులు కూడా. వారియందు ‘చిత్తము’ లవలేశము కూడా శేషించి ఉండక, చిత్తము చిత్‌స్వరూపమై విరాజమానము అగుచున్నది. చిత్తరహిత చిత్‌స్వరూపులై ఉంటారు. వారిపట్ల ‘‘చిత్తు-నేను-జగత్తు-నీవు ఇవన్నీ వేరువేరు కాదు. ఏకత్వము, అఖండత్వము సంతరించుకొని ఉంటాయి.
నిర్వాసన మనో
హే నిదాఘ! మహాప్రాజ్ఞ!
నిర్వాసన మనా భవ।
బలాత్ చేతః సమాధాయ
నిర్వికల్ప మనా భవ।।
మనోజయము - వాసనా జయము
అందుచేత ఓ నిదాఘ మహాశయా! నీవు సమస్త దృశ్య వాసనలను త్యజించుటలో ప్రయత్నశీలుడవై, నిర్వాసన (Sans Tendencies) యందు మనోసమన్వితుడవు అగుము.
అందుకుగాను అనేక పరస్పర సానుకూల - ప్రతికూల్య దృశ్య విషయ పరంపరలపై వ్రాలుచూ ఉన్న ఈ చిత్తమును వివేకముతో బలవంతముగా సమాధానపరచి, నిర్వికల్పము (State of witness to Thought) నందు ప్రవేశింపజేయాలి సుమా!
యత్ జగత్ భాసకం భావం
నిత్యం భాతి స్వతః స్ఫురత్,
స ఏవ జగతః సాక్షీ,
సర్వాత్మా విమల - ఆకృతిః।
ప్రతిష్ఠా సర్వభూతానాం
ప్రజ్ఞాన ఘన లక్షణః।।
ఓ నిదాఘ మునీ! ముఖ్యంగా ఒకానొక విషయము గమనించు.
- ఏదైతే ఈ జగద్దృశ్యమంతా భాసింపజేస్తోందో (That which is enlightening the entire worldly scenary)
- ఏది ఈ జగత్తు రూపముగా భాసిస్తోందో (That which is formulated as wordly scenary)
అదియే జగత్తుకు సాక్షి కూడా (It is also a mere witness to all this) . అదియే నిర్దోషము, సర్వాత్మకము, సర్వస్వరూపము అగు నీ ఆత్మ! నీవు, నేను అట్టి ఆత్మ స్వరూపులు సహజముగానే అయి ఉన్నాము. అన్యమైనదంతా సందర్భ కల్పితము, భ్రమాత్మకము.
అట్టి ఆత్మయొక్క ప్రజ్ఞానము (ఎరుక) అను ఘనీభూతలక్షణము చేతనే సర్వభూతజాలము ప్రతిష్ఠ పొందుచున్నది.
తత్ విద్యా విషయం బ్రహ్మ
సత్య జ్ఞాన సుఖ అద్వయమ్
ఏకం ‘బ్రహ్మాహం అస్మి’ -
ఇతి కృతకృత్యో భవేత్ మునిః।
ఓ విదాఘ మునివర్యా!
‘‘అటువంటి సత్యము, జ్ఞానము, సుఖము, అద్వయము’’ అగు బ్రహ్మమునే నేను - అను మననము కలిగి ఉండుము.
- ‘‘అది ఏకము, అఖండము’’ అని ముందుగా ఎరుగుము. ‘‘అట్టి బ్రహ్మమే నేను. నేను బ్రహ్మమే అయి ఉన్నాను. నేనే బ్రహ్మమును’’ - అను అహం బ్రహ్మాస్మి భావనను సిద్ధించుకొని మునులు కృతకృత్యులగుచున్నారు. మనము ఆ రీతిగా కృతకృత్యులము అయ్యెదము గాక।
సర్వ అధిష్ఠానం అద్వంద్వం
పరం బ్రహ్మ సనాతనమ్,
సత్ చిత్ ఆనందరూపం తత్
అవాక్ - మానస గోచరమ్।।
అట్టి అఖండమగు మనయొక్క స్వస్వరూప-కేవలాత్మ ఎట్టిదంటే:
• సర్వ ఆభరణములకు బంగారము, సర్వ తరంగములకు జలము, మట్టి కుండలన్నిటికీ మట్టి అధిష్ఠానము అయి ఉన్న విధంగా,.. ఈ సమస్తమునకు, సర్వమునకు అధిష్ఠానము.
• జీవాత్మ-పరమాత్మ మొదలైన ద్వంద్వము మొదలే లేని అద్వంద్వము.
• సమస్తమునకు మొట్టమొదటే చైతన్యరూపమై ఏర్పడి ఉండటం చేత సనాతనము, సనాతన పరబ్రహ్మము.
• సత్ - (ఉనికి) చిత్ (ఎరుక) ఆనందము (అనుభూతి)ల రూపము. అది వాక్కుకు, ఆలోచనకు - విషయమే కాదు. చూపుకు ఆకాశమువలె ఆత్మకు - వాక్కు - ఆలోచన స్వయం ప్రకాశ ప్రదర్శనములు. అంతేగాని వాక్కు - మనస్సులచే ఆత్మ లభ్యమవదు.
చూచేవాడు చూపుకు కనిపించడు కానీ, తెలియవస్తున్నాడు కదా! ఆత్మకూడా అట్టిదే.
న తత్ర చంద్ర అర్క వపుః ప్రకాశతే।
న వాంతి వాతాః। సకలా దేవతాశ్చ-
స ఏష దేవః కృతభావ భూతః,
స్వయం విరుద్ధో విరజః ప్రకాశతే।।
అట్టి ఆత్మతత్త్వానుభవ స్వస్వరూప స్థానమునందు (విదేహముక్తునిపట్ల) :-
- ఈ జాగ్రత్ జగత్తులో కంటికి కనిపిస్తున్న సూర్యచంద్రులు ప్రకాశమానులై ఉండరు. వాయువు చలనము కలిగి ఉండదు. దేవతలు సవిషయములై ఉండరు. ఆత్మప్రకాశముచే తానే అవన్నీగా భాసిస్తున్నవౌతాయి.
స్వయం ప్రకాశకుడగు ఆ ఆత్మ దేవాది దేవుడే ‘‘నేను భూతజాలముగా ప్రకాశించెదనుగాక!’’….అను స్వకీయ (కృత) భావనచే, తనకు విరుద్ధమైనదంతా (అన్యమైనదంతా) తాను వేరై ప్రకాశింపజేస్తూ, ఆ ప్రకాశమానమైనదంతా ‘‘తానే’’ అయి ఉంటున్నారు.
5.

భిద్యతే హృదయ గ్రంథిః
ఛిద్యంతే సర్వ సంశయాః
క్షీయంతే చ అస్య కర్మాణి
తస్మిన్ దృష్టే పరావరే।।
అట్టి ఆత్మ భగవానుని బాహ్య - అభ్యంతర (నిర్మల - కేవల సదానంద) స్వస్వరూపమును దర్శించు దృష్టి ప్రవృద్ధమగుచుండగా,
• హృదయములోని సృష్టి - స్థితి - లయ సంబంధమైన (బ్రహ్మ-విష్ణు- రుద్ర) గ్రంథులన్నీ (చిక్కుముడులన్నీ) విడిపోతాయి.
• సర్వసంశయములు తొలిగిపోతాయి.
• సమస్త కర్మబంధములు తెగినవైపోతాయి.
ఆతని దృష్టి ఇహమంతా దాటివేసి, పరావరత్వము పొందుచున్నది.
ద్వౌ సుపర్ణౌ శరీరే అస్మిన్,
‘‘జీవ - ఈశ’’ ఆఖ్యౌ సహస్థితౌ।
తయోః జీవః ఫలం భుంక్తే కర్మణో।
న మహేశ్వరః।।
జీవ-ఈశ్వరులు:
ఈ దేహము అనే గొప్ప వృక్షముపై రెండు పక్షులు సహజీవనం చేస్తూ ఉన్నాయి. అవి
(1) జీవుడు (2) ఈశ్వరుడు (లేక) మహేశ్వరుడు. ఆ రెండిటిలో జీవుడు (ఇహస్వరూపుడు) కర్మల ఫలములను అనుభవముగా పొందుచున్నాడు. ‘మహేశ్వరుడు’ అనబడు రెండవ పక్షికి (పరస్వరూపుడు) కర్మలు లేవు. కర్మఫలములు ఆస్వాదించదు. (నాటక దీపమువలె) సాక్షీభూతుడు మాత్రమే.
కేవలం సాక్షి రూపేణ వినా భోగేన వర్తతే।
(భోగ మహేశ్వరః) ప్రకాశతే।
(స్వయం భేదః కల్పితో - భోగేన వర్తతే।।)
ఈశ్వరుడు - కేవలము ‘సాక్షి’ రూపంగా ఏదీ భోగించక (చూస్తూ) ఉన్నారు. జీవుడేమో కల్పితమగు దృశ్య విషయ భోగి, ఈశ్వరుడు స్వయంభోగి. ‘జీవుడు’ అను దానిని ఈశ్వరుడు తన (‘‘కల్పితమగు) ఆనందించురూపము’’గా కలిగి ఉన్నవాడు. ఈ ఇద్దరు ఎల్లప్పుడు కలిసియే ఉంటున్నారు.
ప్రాతిభాసిక జీవస్తు
కల్పితో మాయయా తయోః।
చిత్ చిదాకారతో భిన్నా,
న భిన్నా చిత్త్వ హానితః।
ఒకడు ఇంటిలో యజమాని, ఉద్యోగము చేసేచోట ఉద్యోగి, బంధువుతో బంధువు అయిన తీరుగా ఈశ్వరుడు జీవుడుగా కనబడటమనేది ఒక సందర్భమాత్రమగు మాయాకల్పిత ప్రాతిభాసికము. (Attributedly created reflective context /confined incident).
నిరాకారమగు చిత్తు సాకారమగు ఈశ్వర - జీవాత్మ - జగత్ కల్పనలను కలిగి ఉంటున్నప్పటికీ, (నవలలోని సంఘటనలు, పాత్రలు రచయితకు వేరుకానట్లు, మరియు రచయిత అవిగా అవనట్లు) - చిత్త ప్రపంచ రచనవలన చిత్‌తత్త్వమునకు ఎట్టి హాని గాని, చ్యుతిగాని లేదు.
తర్కతశ్చ ప్రమాణాత్ చ,
చిత్ ఏకత్వ వ్యవస్థితేః
చిత్ ఏకత్వ పరిజ్ఞానే
న శోచతి। న ముహ్యతి।।
తర్కముచేత, శాస్త్ర ప్రమాణలముచేత చిత్‌యొక్క ‘‘ఏకత్వము - సర్వత్రా వ్యవస్థితము’’ లు సిద్ధాంతీకరించబడి చెప్పబడుచున్నాయి. అంతా చిదేకరసమే.
(1) ఇక్కడి జగత్తుగా, (2) ఆ జగత్తును అనుభవముగా కలిగి ఉన్నట్టి జీవుడుగా (3) ఆ జీవుని తన కల్పనయందు కలిగిఉన్నట్టి ‘ఈశ్వరుడు’గా (4) ఆ ఈశ్వరునికి సాక్షిమాత్రమైనట్టి కేవలముగా - ఈ విధంగా (వేరువేరై) కనిపిస్తున్నది - చిత్ - ఏకరస రూపమే!
అట్టి చిదేకత్వమును చక్కగా, స్వానుభవంగా ఎరిగిన యోగి ఇక దేనికి శోకించడు. మోహము పొందడు.
‘‘అధిష్ఠానం సమస్తస్య జగతః సత్య
చిత్ ఘనమ్ - ‘‘అహం అస్మి’’ - ఇతి నిశ్చిత్య
వీత శోకో భవేత్ మునిః।। (మునే!)।।
‘‘ఈ సమస్త జగత్తునకు అధిష్ఠానము (Root/Basic Raw-material) అయినట్టి - సత్య చిత్ ఘనీభూత స్వరూపము నేనే! ఈ సమస్తము నాయందే (స్వప్నములో వలెనే) ఉన్నట్టిది’’ - అను నిశ్చయమును సంసిద్ధింపజేసుకొన్న తత్త్వాభ్యాసి ఇక దేనికీ శోకము చెందక, మౌనము వహిస్తూ ‘ముని’ అయి ఉంటాడు. (ఆత్మపట్ల మాత్రమే జాగరూకుడై ఉంటాడు)

స్వ శరీరే స్వయంజ్యోతిః
స్వరూపగ్ం సర్వ సాక్షిణమ్,
క్షీణ దోషాః ప్రపశ్యంతి।
న ఇతరే (నేతరే) మాయయ ఆవృతాః।
ఓ నిదాఘ మహాశయా! మనము అనేక శబ్దములలో సుదీర్ఘంగా చెప్పుకోవలసినది ఏమున్నది? ఆత్మతత్త్వమును ఆశ్రయించువానికి శబ్దములు క్రోడీకరించి సుదీర్ఘంగా చెప్పుకోవటము - అది కూడా వాచా విగ్లాపన దోషమే అవుతుంది సుమా! ఎవ్వరి దోష దృష్టులు-భక్తి, జ్ఞాన, క్రియా, దైవీ సంపదాయోగములచే-క్షీణించుచూ ఉంటాయో, అట్టివాడు ఆ (ఈ సమస్తము అగుచూ కూడా ఇద్దానికి ఆవలే ఉన్న) పరమాత్మను తన శరీరమునందే స్వయంజ్యోతి స్వరూపుడుగాను, సర్వసాక్షి గాను - ‘‘ప్రపశ్యంతి’’ - సుస్పష్టముగా చూడగలడు.
తమేవ (తమ్ ఏవ) ధీరో విజ్ఞాయ
ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః।।

నానుధ్యాయాత్ బహూం చ శబ్దాన్।
వాచో విగ్లాపనగ్ం హి తత్।।

మహదాశయుని, ప్రయత్నశాలుని బుద్ధికి శరీమునందే ‘‘ఆత్మ’’ అనుభవమవగలదు.
మాయచే ఆవరించబడుటచే అప్రయత్నశీలురగు వారలు అది (తమయందు) దర్శించటము లేదు. బాహ్యమున ఎక్కడెక్కడో వెతకుచున్నారు.

ఆత్మను అధ్యయనము చేయుచున్నవారు తమ బుద్ధితో, స్వకీయ ప్రజ్ఞతో తమ అంతరముననే ఆత్మదర్శనము చేస్తూ ‘బ్రాహ్మణులు’ అని పిలువ బడుచున్నారు. (బ్రహ్మ-అహమ్-ఇతి బ్రాహ్మణః)
6. బాల్యేన ఏవ హి తిష్ఠాసేత్,
నిర్విద్య బ్రహ్మ వేదనమ్,
బ్రహ్మ విద్యాం చ బాల్యం చ
నిర్విద్య మునిః ఆత్మవాన్!
ఓ నిదాఘా! మానవజన్మ ఈ జీవునిపట్ల మహత్తరమైన అవకాశము అయి ఉన్నది. అందుచేత బ్రహ్మము గురించి తెలుసుకొను అభ్యాసమును బాల్యమునుండియే ప్రారంభము చేయటము శుభప్రదమయ్యా. ‘‘అవిద్య-బ్రహ్మవిద్య’’ల అంతరమును, వాటి వాటి విషయ-విశేష-ప్రత్యేకత లను బాల్యమునుండే అధ్యయనము ప్రారంభిస్తే, అట్టివాడు ముని అయి, ఆత్మవంతుడుగా ప్రకాశించగలడు. స్వస్వరూపాత్మ పట్ల నిదురలేవగలడు.
అంతర్లీన సమారంభః
శుభాశుభ మహాంకురమ్,
సంసృతి వ్రతతేః బీజం
శరీరం విద్ధి భౌతికమ్।।
లేదా, సంసార బీజములు బాల్యము నందే రూపుదిద్దుకొని ప్రవృద్ధము కాగలదు. ఎందుకంటే ఈ జీవుడు శుభ-అశుభ మహాబీజములతో జన్మను స్వీకరించుచున్నాడు కనుక.
ఈ ‘‘జన్మ’’ అనునది శుభ - అశుభములకు అంకురము (విత్తనపుమొలక) వంటిది. సంసారము అను పూలతకు బీజమువంటిదిగా ఈ భౌతిక దేహమును ఎరుగుము. దేహమే దేహిక ఐహిక మోహము.
భావ-అభావ దశా కోశం
దుఃఖరత్న సముద్గతమ్।
బీజం అస్యశరీరస్య,
చిత్తమ్ ఆశా వశానుగమ్।।
‘‘భావించటము-అనుభవించటము’’ లకు ఈ శరీరము ఒక కోశము (గర్భము) వంటిది. దుఃఖములు అనే రత్నములు దాచి పెట్టబడి ఒక భోషాణము (పెట్టె) కూడా.
అనేక ఆశలు తనయందు నిండుగా కలిగియున్న చిత్తమే ఈ శరీరమునకు బీజము.
ద్వే బీజే చిత్తవృక్షస్య
వృత్తి వ్రతతి ధారిణః।
ఏకం ప్రాణ పరిస్పందో।
ద్వితీయో దృఢ భావనా।।
‘‘వృత్తులు (Avocations) ’’అనే చిత్త వృక్షము రెండు బీజములు కలిగియుండి, అనేక తీగలతో చుట్టుకొనబడి ఉంటోంది.
(1) ప్రాణపరిస్పందము (ప్రాణము ప్రియము యొక్క రూపము)
(2) దృఢమైన భావన (యత్ భావం తత్ భవతి).
యదా ప్రస్పన్దతే ప్రాణో
నాడీ సంస్పర్శనా ఉద్యతః,
తదా సంవేదనమయం
చిత్తం ఆశు ప్రజాయతే।

సా హి సర్వగతా సంవిత్
ప్రాణస్పందేన బోధ్యతే।
సంవిత్ సంరోధనం శ్రేయః
ప్రాణాది స్పందనం పరమ్।
Ⅰ. ఎక్కడైతే ప్రాణశక్తి నాడుల స్పర్శచే ఉద్యమిస్తుందో, [ప్రియత్వము బహిర్గతమవసాగుతుందోరి- అక్కడ సంవేదనమయమైన (1. The Experience regarding what is being known. 2. The incident of that being known)] రూపముగా ‘చిత్తము’ జనిస్తోంది.

Ⅱ. ఎక్కడ చిత్తము ఉంటుందో అక్కడ సర్వగతమైన సంవిత్ (సత్, విత్ = ఉనికి, ఎరుక) లేక ఆత్మ ఆయా సందర్భగతము, వస్తుగతము అగుచూ, పరిమితత్వము ఆపాదించబడి, జీవాత్మగా అగుచున్నది.
సర్వగతము = సంవిత్, పరమాత్మ
వస్తు విషయ గతము = జీవాత్మ

Ⅲ. సంరోధనము = అడ్డుపడటము, అణచటము, ఆటంకము.
ప్రాణము - చిత్తముల స్పందనను అనుసరిస్తున్న సంవిత్‌ను (జీవాత్మ)ను ఆ ప్రాణములు మొదలైన వాటి స్పందనానుసరణము నుండి నిరోధించి, విరమింపజేసి ఆవలగల కేవలమగు సంవిత్‌నందు (పరమాత్మయందు) ఏకము, లయము చేయటము పరమ శ్రేయస్కరము.
యోగినః చిత్త శాంత్యర్థం
కుర్వంతి ‘‘ప్రాణరోధనమ్’’।
Ⅳ. సర్వాత్మకమగు సంవిత్ స్వరూపము సంతరించుకోవటానికై యోగి ‘చిత్తమును శాంతింపజేయటము’ అను యోగాభ్యాసమునకు ఉద్యుక్తుడు అగుచున్నాడు. అట్టి చిత్తము (చిత్‌నందు) సశాంతించటానికై యోగులు ప్రాణరోధనము (స్వాభావిక సంచలనము ప్రదర్శిస్తున్న ప్రాణశక్తిని అస్పందనమువైపుగా నిరోధించటము)ను నిర్వర్తించుచున్నారు. ఇది చిత్తశాంతి కొరకై ముఖ్యమైన ఒక ఉపాయము.
ప్రాణాయామైః, తథా ధ్యానైః,
ప్రయోగైః యుక్తి కల్పితైః,
చిత్త ఉపశాంతి ఫలదం
పరమం విద్ధి కారణమ్।
సుఖదం సంవిదః స్వాస్థ్యం
ప్రాణ సంరోధనం విదుః।।
Ⅴ. చిత్తశాంతి లభించటానికై (1) ప్రాణాయామము (2) ధ్యాసను నియమించు రూపముగల ధ్యానము (3) యుక్తి (జ్ఞానవిచారణ) ఈ మూడు ‘పరమగు చిత్తవిశ్రాంతి’ అనే ఫలప్రదాతలు.

Ⅵ. ప్రాణ సంరోధనము (ప్రాణ నిరోధము) అను ప్రాణాయామాభ్యాసము సంవిదము (ఆత్మ) లేక జీవునికి సుఖము, స్వాస్థ్యము ఇవ్వగలదు.
7. దృఢ భావనయా, త్యక్త
పూర్వా - పర విచారణమ్,
యదా దానం పదార్థస్య,
‘వాసనా’ సా ప్రకీర్తితా।
వాసనలు
ఈ జీవుడు స్వతఃగా సర్వగతమగు సంవిదాత్మ స్వరూపుడే. దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార ఇత్యాది విశేషములకు బద్ధుడు, పరిమితుడు కానే కాదు.
కానీ ‘‘నేను జీవుడను. పరిమితుడను’’ అను స్వయంకల్పిత పరిధులకు స్వస్వరూపము పరిమితమైనట్లు ఈతనికి అనిపించ సాగుతోంది. అప్పుడు అఖండాత్మ → జీవాత్మగా అనిపించుకొంటోంది. ఎందుచేత? అందుకు కారణం? వాసనలు.
వాసనలు అనగా? ఈ దృశ్యములోని వస్తువులు, సందర్భములు, సహజీవులు, సంబంధములు మొదలైనవాటి పట్ల - ‘‘వీటి పూర్వరూపం ఏమిటి? ముందు ముందు ఏరూపము పొందబోవుచున్నాయి’’ - అని విచారణ చేయకుండా, ఎట్లా ఇంద్రియములకు కనిపిస్తూ ఉంటే, అట్లాగే (స్వకీయ దృశ్య సంబంధ భావనా దర్పణములో నుండి) స్వీకరించటము (లేక) పొందటమునే ‘వాసనలు’ అంటున్నారు.
యదా న భావ్యతే కించిత్
హేయ ఉపాదేయ రూపి యత్
స్థీయతే సకలం త్యక్త్వా,
తదా చిత్తం న జాయతే।
ఇక్కడ ‘‘స్వీకరించాలి - వదలాలి’’ - అనునది కించిత్ కూడా భావించకుండా సమస్తమును మనస్సుతో దాటివేసి, అప్పటికీ శేషించియున్న స్థితిని ఆశ్రయిస్తే, ఇక అప్పుడు ‘చిత్తము’ యొక్క ఆనవాలు కూడా లేకుండా పోగలదు. దృశ్యముపట్ల ఇష్టావేశము, ఆత్మయొక్క ఏమరపు - ఈ ద్వంద్వమే చిత్తరూపము.
అవాసనత్వాత్ సతతం
యదా న మనుతే మనః,
అమనస్తాత్ తత్ ఉదేతి
పరమ ఉపరమప్రదా।
(పరమోపరమప్రదా)।
అమనస్కము
ఇక్కడ వస్తువుల పూర్వాపరములను (Previously how are they? later what are they going to be?) విచారించి వాటి వర్తమానంగా కనిపించే రూపముపై నమ్మకము వదలి ఉండటమే చిత్తశాంతి. అట్టి వాసనలు తొలగటానికై వాటి గురించి మననము చేయకపోవటమే ఉపాయము. ‘ఆత్మమననము’ అను మార్గం ఆశ్రయించి, ఇందలి విషయములగు దృశ్య సందర్భమననమును జయిస్తూ ఉండగా -పరమోపరమ ప్రదము (Finest state of sense of Absolute Self) రూపమగు అమనస్కము సిద్ధించగలదు.
యదా న భావ్యతే భావః
క్వచిత్ జగతి వస్తుని,
తదా హృత్ అంబరే శూన్యే
కథం చిత్తం ప్రజాయతే?
ఓ నిదాఘా! జనిస్తూ - జరుగుతూ - గతిస్తూ ఉండే స్వభావముగల జగత్ (జ + గత్)వస్తువుల పట్ల - ‘‘అవి లేకపోతే ఎట్లా?’’ అనే ‘అవినాభావ’ సంబంధము ఎట్లా ఏర్పడుతోంది? ‘భావన’ చేయటం చేతనే. ఆ విధంగా భావనచే ఏర్పడుచున్న సంబంధమే బంధము (లేక) సంసారము. అదియే చిత్తము కూడా. మరి తొలగేది ఎట్లా? భావనలచే ఏర్పడే చిత్త జనిత సంసారము ‘అభావన’ చేతనే తొలగుతుంది. ఎప్పుడైతే హృదయంలో భావములను భావించమో, ఇక అప్పటి శూన్య హృదయాకాశములో చిత్తము ఎట్లా ప్రదర్శనమౌతుంది? అవదు.
యత్ అభావనం ఆస్థాయ,
యత్ అభావస్య భావనమ్,
యత్ యథా వస్తు దర్శిత్వం
తత్ ‘అచిత్తత్వం’ ఉచ్యతే।
అచిత్తత్వము
- ఎప్పుడైతే నీవు ‘జగత్‌వస్తు భావనను జయించాలి’ - అను ప్రయత్నమునకు ఉద్యమించి ‘వస్తుభావన’ ను ఉపశమింపజేస్తూ ‘ అభావన’ను భావిస్తూ ఉంటావో, (అంతా ఆత్మ లీలా ప్రదర్శనముగా అనుకుంటూ ఉంటావో)…,
- ఎప్పుడైతే ‘అభావన’ యందు సంస్థితుడవై భావనలను ఉపకరణములుగా మాత్రమే ఉపయోగించుచూ వస్తు దర్శనము చేస్తూ ఉంటావో,
- ఆత్మ దర్శనమును సహజముగా కలిగి ఉండి, వస్తు దర్శనము సందర్భమాత్రంగా గమనిస్తూ ఉంటావో….
అది ‘అచిత్తత్వము’ అనబడుతోంది.
సర్వమంతః పరిత్యజ్య
శీతళ ఆశయవర్తి యత్,
వృత్తిస్థం అపి తత్ చిత్తం
‘అసత్‌రూపం’ ఉదాహృతమ్।
చిత్త-అసత్ రూపం
ప్రశాంతమగు ఆశయము (సమస్తము స్వస్వరూపమునకు అనన్యముగా దర్శించు మహదాశయము) కలవాడవై, అన్యముగా కనిపించే / అనిపించే దృశ్యభేద జగత్తును అంతరంగమున పరిత్యజించి, ఆత్మగా దర్శించు వృత్తిని కూడా ఆత్మానుభవమునందు అనుక్షణికంగా ఏకము చేయు స్వభావివై ఎప్పుడు ఉంటావో, అప్పుడిక ‘చిత్తము యొక్క అసత్’ (చిత్తము లేనిదే) స్వాభావికంగా సిద్ధిస్తోంది.
భ్రష్ట బీజ ఉపమా యేషాం,
పునః జనన వర్జితా,
వాసనా రసనా హీనా
‘జీవన్ముక్తా’ హి తే స్మృతాః।
ఉడకబెట్టిన బీజము మరల చిగురించదు కదా! ఆ విధంగా ‘పునర్జన్మ’ కలిగించు స్వభావముగల దృశ్య విషయ వాసనలను పరిత్యజించి, వాటిని జయించువాడే ‘జీవన్ముక్తుడు’. ఆతడు ఉత్తరోత్తర ఉపాధుల పట్ల స్వాతంత్రుడై ఉంటాడేగాని, ఇక పారతంత్రుడు కాడు.
సత్త్వరూప పరిప్రాప్త
చిత్త - అస్తే జ్ఞాన పారగాః
‘అచిత్తా’ ఇతి కథ్యంతే
దేహాంతే వ్యోమ రూపిణః।।
చిత్తము సత్త్వరూపము (కేవాలత్మ రూపము) సంతరించుకొన్నదై, ఆత్మజ్ఞాన - ఆత్మభావనలను ఆశ్రయిస్తూ ఉంటే అది అచిత్తమే. వారు దేహమునకు ఆవల ఆత్మాకాశము నందు ఆత్మానంద స్వరూపులై విహరించు వారగుచున్నారు. ‘అచిత్త సిద్ధులు’ అగుచున్నారు.
8. సంవేద్య సంపరిత్యాగాత్
ప్రాణస్పందన వాసనే,
సమూలం నశ్యతః క్షిప్రం
మూలచ్ఛేదాత్ ఇవ ధ్రుమః।।
ఎత్తుగా పెరిగిన ఒక చెట్టును మొదలులో నరికితే అది ఎండి, వాడి నశించిపోతుంది కదా! అట్లాగే ఇంద్రియములకు తెలియబడుచున్న ఇంద్రియ విషయపరంపరా వ్యవహారరూపమగు ‘సంవేద్యము’ను పరిత్యజించుచూ ఉండగా, ప్రాణస్పందనలు, వాసనలు (Responsiveness to wordly events and Tendencies) - కూడా మొదలు నరికిన చెట్టువలె తమకు తామే నశించగలవు. అనగా ప్రాపంచక విషయములు ఆలోచించక - భావించక ఉంటే ప్రాణ స్పందన స్వవశమౌతుంది. వాసనలు తోక ముడుస్తాయి.
పూర్వ దృష్టం అదృష్టం వా
యదస్యాః ప్రతిభాసతే,
సంవిదః తత్ ప్రయత్నేన
మార్జనీయం విజానతా।
తత్ అమార్జన మాత్రం హి
మహా సంసారతాం గతమ్।
తత్ ప్రమార్జన మాత్రం తు
‘మోక్ష’ ఇతి అభిధీయతే।।
కలలో కనిపిస్తున్న విశేషాలను తెల్లవారిన తరువాత పట్టుకు వ్రేలాడుతామా? లేదు కదా? అదే విధంగా ఇంతకుముందుచూచిన - చూడనివన్నీ (కలలో కనిపించిన గొప్ప - దృశ్యము వలె) ప్రతిభాసక భావనతో (Just things that reflect in water or mirror) - వాటిని తెలివైనవాడు ‘‘కడిగివదిలించుకోవలసిన దుమ్ము-ధూళి- బురదవంటివి’ - అని ఎరిగి ఉంటాడు. వివేకముతో త్యజించివేస్తాడు. (He will be in himself right now sans all worldly events)

లోకసంబంధమైన విషయములను వదలక, మరల మరల జ్ఞాపకముగా కలిగి ఉండి హృదయమును ‘పరిశుభ్రము’ చేయనందు వల్లనే అది ‘మహాసంసారము’గా రూపుదిద్దుకొంటోంది. త్యజించివేసినందువల్లనో? అది ‘మోక్షమే’ అవుతుంది.
అజడో అగళిత ఆనందః
త్యక్త సంవేదనో భవ।
ఇంతవరకు వినిన-చూచిన-వినని-చూడని దృశ్య విషయములను హృదయమునుండి కడిగివేసి వాటికి అతీతుడవై, సాక్షివై ఉండటమే ‘మోక్షము’ అని చెప్పబడుతోంది.
అందుచేత ఓ నిదాఘ మహాశయా! సంవేదనము (The details of the worldly knowing) హృదయమునందు లేనివాడవై, అజడుడవై, అనిర్వచనీయ ఆత్మానంద స్వరూపుడవై ఉండుము.
(Wash out all that being impressively influencing you by Indrias. Leave the mildness. Please fill up your inner-recess with undefinable happyness of your own sense of Self).
సంవిత్ వస్తు వశ ఆలంబః
సా యస్య ఇహ న విద్యతే,
సో ‘‘సంవిత్ అజడః’’ ప్రోక్తః,
కుర్వన్ కార్య శతాని అపి,
సంవేద్యేన ‘హృత్’ ఆకాశే మనాగపి న లిప్యతే।
ఈ జగత్తులో అనివార్యముగా చేయవలసి వస్తున్న ఆయా కర్మ - క్రియావిశేషాలు ఆత్మానుభవానికి అడ్డంకులుగా ఉన్నాయా? లేదు. ఎవ్వడైతే ఇక్కడి వస్తు విషయ-వశ-ఆలంబనములు సంవిత్ (ఆత్మ) భావనతో గమనిస్తూ ఉంటాడో,… అట్టివాడు ‘అసంవిత్-అజడుడు’ అనబడుచున్నాడు. అట్టివాడు వందరకములైన పనులు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడి సంవేద్యముచే (తెలియబడే ఈ జగత్ విశేషములచే) కించిత్ కూడా మూలదోషము పొందడు.
యస్య అసావత్ అజడా సంవిత్
‘జీవన్ముక్తః’ స కథ్యతే।
ఎవ్వడైతే అజడా-సంవిత్ అయి, ‘‘సంవిత్‌ధారణ’’ కలిగి ఉంటాడో, ఆతడు జీవన్ముక్తుడే। (సంవిత్ = సత్ + విత్ ల కేవలీరూపము).
యదా న భావ్యతే కించిత్ నిర్వాసనతయా ఆత్మని
బాల మూక ఆది విజ్ఞానం ఇవ చ స్థీయతే స్థిరమ్
తదా జాడ్య వినిర్ముక్తం అసంవేదనం ఆతతమ్।
ఎప్పుడైతే ఈ జీవుడు ‘నిర్వాసన’ను అధిరోహించినవాడై కించిత్ కూడా బాహ్య జగత్ విషయమై భావన కలిగి ఉండడో,
బాలునివలె ఈ జగత్తు తనయందు లేని వాడై మూగవానివలె జగతబీచ్ విషయములు ఆసక్తితో సంభాషించనివాడై ఆత్మస్వరూప భావనా-రూప విజ్ఞానదృష్టియందు సుస్థిరుడై ఉంటాడో,
అప్పుడిక ఆతడు సంవేదనము (ఇంద్రియములచే తెలియబడే ఇంద్రజాలము) అనే జాడ్యము వదిలించుకొన్నవాడగుచున్నాడు.
ఆశ్రితం భవతి ప్రాజ్ఞో
యస్మాత్ భూయో న లిప్యతే।
సమస్తా వాసనాః త్యక్త్వా
నిర్వికల్ప సమాధితః,
తన్మయత్వాత్ అనాద్యంతే
తదపి అంతః విలీయతే।।
అట్టి ప్రాజ్ఞుడు మరల దోషము పొందనట్టి స్థానమును ఆశ్రయించినవాడై ఉంటున్నాడు.

సమస్త వాసన-అవాసనల ప్రహసనమంతా త్యజించి వేసి ఆత్మతత్త్వజ్ఞుడు నిర్వికల్ప సమాధియందు నిష్ఠ పొందుచున్నాడు. ఆద్యంతరహితుడై, ఈ సమస్తము ఆత్మయందు విలీనము చేసుకొని తనకు ఇదంతా తన్మయముగాను, అనన్యముగాను, తాను ఇద్దానికి అనన్యముగాను దర్శిస్తున్నాడు.
9. తిష్ఠన్ గచ్ఛన్ స్పృశన్ జిఘ్రన్ అపి
తత్ లేప వర్జితః
అజడో అగళిత ఆనందః
త్యక్త సంవేదనః సుఖీ।।
ఏతాం దృష్టిం అవష్టభ్య
కష్ట చేష్టాయుతో - అపి సన్,
తరేత్ దుఃఖ-అంబుధేః పారం
అపార గుణసాగరః।
అసంవేదనుడు - సంవేదనము (తెలియబడేది) లేనట్టివాడు
ఎవ్వడైతే కూర్చున్నప్పుడు, వెళ్ళుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు కూడా ఆయా దృశ్యముల లేపనము (Paste) తనయందు ఏమాత్రము లేనివాడై, అజడుడై, ఆత్మసంతృప్తుడై దృశ్యమును త్యజించినవాడై ఉంటాడో, అట్టివానికి మాత్రమే ఈ తెలియబడే సమస్తము - సుఖ స్వరూపమవగలదు. దృశ్యము హృదయమునందు రహితము చేసుకొన్నవాడే సుఖి! పడవ నీళ్లలో ఉన్నప్పటికీ, పడవలో నీళ్లు ఉండవు కదా।
ఎంత కష్టముతో కూడుకొని ఉన్నప్పటికీ ఎవ్వడైతే దృశ్యాతీత-ఆత్మతన్మయ దృష్టిని అవలంబించువాడై ఉంటాడో, అట్టివాడు మాత్రమే ఈ విస్తార దుఃఖ సంసార సాగరమును దాటివేయగలుగుతాడు.
విశేషం సం పరిత్యజ్య
సత్‌మాత్రం యత్ అలేపకమ్,
ఏకరూపం మహారూపం
సత్తాయాః తత్ పదం విదుః।।
ఇక్కడి సమస్త దృశ్యవిషయ-విశేషములను సంపరిత్యజించివేసి, అప్పటికీ శేషించియుండే స్వాభావికమైన-అలేపకమైన కేవల‘సత్తమాత్రము’ (దృశ్య-ద్రష్టాతీత దృక్‌రూపము) శేషించుచున్నదో, అట్టి వ్యవహారమగు స్వకీయ స్వరూపమే తత్ పదము అని గమనించెదగవు గాక!
కాలసత్తా కలాసత్తా వస్తు సత్తేయం ఇతి అపి,
విభాగ కలనాం త్యక్త్వా ‘సత్’ మాత్ర ఏకపరో భవ।
(1) కాలసత్తా (2) కలాసత్తా (3) వస్తు సత్తా ఈ మూడు కలన సత్తాలను (కల్పనలను) త్యజించగా, ఏ ‘కేవలసత్త’ శేషించుచున్నదో, - అదియే నీవై ఉండుము.
సత్తా సామాన్యం ఏవ ఏకం భావయన్ కేవలం విభుః
పరిపూర్ణః పర ఆనందీ తిష్ఠాపూరిత దిగ్భరః
సమస్తముగా విస్తరించి సంప్రదర్శనమగుచున్న కేవల సత్తా సామాన్యము (That which is at present and all pervading while being one’s own absolute self) ను మాత్రమే భావన చేస్తూ, తదితర భావనలను ఏక సత్తాభావనయందు ఏకము చేసివేసెదవుగాక!
సత్తా సామాన్య పర్యంతే
యత్ తత్ కలనయోత్ జితమ్। (యోజ్ఝితం) (పదం)।।
అట్టి పరిపూర్ణము, పరానందము అగు సత్తా సామాన్యము సిద్ధించేవరకు అపూరితమగు కలనములను (All attributions and individuals perceptions) జయించుటయందు ప్రయత్నశీలుడవ్వాలి.
పదం ఆద్యం అనాద్యంతం (అనాది-అంతం)
తస్య బీజం న విద్యతే।
తత్ర సంలీయతే సంవిత్, నిర్వికల్పం చ తిష్ఠతి।
స్వస్వరూప కేవలము. (ఈ దేహ-లోక-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు మునుముందే ఉండి ఉండటంచేత) ఆద్యము. ఆది - అంత రహితము. అద్దానికి బీజము లేదు. అట్టి కేవలానంద స్వరూపమగు సంవిత్ (సత్+విత్) (లేక) జీవాత్మ-సంలీయము పొంది స్థితించటమే ‘నిర్వికల్పస్థితి’.
భూయో న వర్తతే దుఃఖే,
తత్ర లబ్ధపదః పుమాన్।
అట్టి అఖండ -అప్రమేయ ఆత్మపదము లభించిన తరువాత ఇక దృశ్యము గురించిన దుఃఖము(Worry) శేషించదు.
తత్ హేతుః సర్వ భూతానాం।
తస్య హేతుః న విద్యతే।।
సర్వభూతజాలమునకు కారణము అట్టి నిత్య సత్యమగు ఆత్మయే. అయితే, అట్టి ఆత్మకు మరొక కారణము ఏదీ లేదు. అది అకారణము. తనకు తానే కారణము.
10. స సారః సర్వ సారాణాం
తస్మాత్ సారో న విద్యతే।।
ఈ జీవాత్మ-జగత్తు మొదలైన సమస్తమునకు సారము ఆత్మయే. అట్టి ఆత్మకంటే వేరైన సారము మరింకేదీ లేదు. అది మరొకదేని సారమూ కాదు.
తస్మిన్ చిత్ దర్పణే స్ఫారే
సమస్తా వస్తు దృష్టయః।
అట్టి ‘‘చిత్’’ అనే దర్పణములో ఇక్కడి సమస్త వస్తు సముదాయము (అద్దములో దృశ్యమువలె) ఏర్పడినదై ఉన్నది.
ఇమాస్తాః ప్రతిబింబతి
సరసీవ తట ద్రుమాః
తత్ అమలం అజరం। తత్ ఆత్మ తత్త్వమ్।
తత్ అవగతా ఉపశాంతిం ఏతి చేతః ।।
ఒడ్డునగల వృక్షము సరస్సుయొక్క జలములో ప్రతిబింబించు తీరుగా ఈ సమస్తము ఏ ఆత్మయందు ప్రతిబింబిస్తుందో, అట్టి ఆత్మ మలరహితము (నిర్మలము). జరామరణములు లేనట్టిది. అట్టి ఆత్మతత్త్వము ఎరిగిన తరువాత ఇక చిత్తము తనకు తానే (ఆత్మయందు, ఆత్మకు అనన్యమై) ఉపశమించగలదు.
అవగత విగతా-ఏక, తత్ స్వరూపో
భవ భయ ముక్త పదో అసి సమ్యక్ ఏవ।
అట్టి నీ స్వస్వరూపము నీకు అవగతమై ‘అన్యము’ అను భావననుండి విగతుడవై, సర్వభయములు - వేదనలు త్యజించి వేయము. సమ్యక్‌భావము మాత్రమే సుస్థిరీకరించుకున్నవాడవై ఉండుము.
ఏతేషాం దుఃఖబీజానాం
ప్రోక్తం యద్యత్ మయోత్తరమ్।
తస్య తస్య ప్రయోగేణ
శీఘ్రం తత్ ప్రాప్యతే పదమ్।।
“ఈ దృశ్యముతో స్వయముగా ఏర్పచుకొన్న చిత్తసంబంధము” అని నేను ఏది దుఃఖబీజముగా చెప్పుకుంటూ వస్తున్నానో, అదంతా కూడా ఆత్మతత్త్వ భావనలచే ప్రయత్నిస్తూ ఉండగా - తరిగిపోగలదు. క్రమంగా అతిత్వరలో ఆత్మపదము నీకు ప్రాప్తించగలదు.

దీపము వెలిగించిన తరువాత చీకటికి చోటెక్కడిది? చీకటి ఎటుపోతుందో ఏమని చెప్పగలం?"
“సత్తా సామాన్య కోటిస్థేద్రాగి”
ఇత్యేవ పదే యది,
పౌరుషేణ ప్రయత్నేన
బలాత్ సంత్యజ్య వాసనామ్।।
‘‘నాకు అట్టి సత్తాసామాన్య స్థితి త్వరత్వరగా సిద్ధించాలి’’ - అని భావించి, ఔత్సాహికుడవు అయి ఉంటే, అది సిద్ధించే మార్గము - ఒక్కటే ఒక్కటి!
‘‘బలముతో కూడిన పురుషకార ప్రయత్నములతో వాసనలు త్యజించటమే!’’
అందుచేత ‘‘దృశ్య విషయములపట్ల రాగమును జయించటం’’ అనునదే ముఖ్య ఆశయము. వేటివేటి పట్ల ఆశ, కోపము, రాగము, ఉండవో, అవి జయించబడినట్లే. (ఇవియే కామ-క్రోధ-లోభములు).
స్థితిం బధ్నాసి, తత్త్వజ్ఞ!
క్షణమపి (క్షణం అపి) అక్షయాత్మికామ్।
క్షణే అస్మిన్నేవ తత్
‘సాధుపదం’ ఆసాదయసి అలమ్।।
హే తత్త్వజ్ఞా। వాసనలు జయిస్తూనే, నీవు ఒక్క క్షణమైనా అక్షయాత్మికమగు ఆత్మపదమునందు స్థితిని సిద్ధించుకోగలిగావా, తత్‌క్షణమే మహత్తరమగు ఆత్మపదము (సాధుపదము) సిద్ధించుకోగలవు. వాసనలు జయించావా, క్షణంలో అట్టి సాధు పదమును ఇప్పుడే, ఇక్కడే పొందగలవు. క్రమంగా స్వాభావికం కాగలవు.
సత్తా సామాన్యరూపే వా
కరోషి స్థితిమ్ ఆదరాత్,
తత్ కించిత్ అధికేన ఇహ
యత్నేన ఆప్నోషి తత్ పదమ్।।
‘‘సత్తా సామాన్య పదము’’ను రోజుకు కొంచము సేపు ఇష్టముగా, ఆదరముగా, ఆప్యాయముగా, అభ్యాసము చేస్తూ ఉంటే…ఆ విధంగా కొంచము కొంచము అధికం చేసుకొని ఉండు ప్రయత్నముచే ‘తత్ పదమును’ అలంకరించగలవు.
[ సత్తా సామాన్యము = ‘‘ఈ జగత్తంతా నాయొక్క సామాన్య (స్వాభావిక) సత్తాస్వరూపమే’’ - అను స్వాభావిక భావనా నిశ్చలత్వము. ]
11. సంవిత్ తత్త్వే కృతధ్యానో,
నిదాఘ! యది తిష్ఠసి,
తత్ యత్నేన అధికేన ఉచ్యైః
ఆసాదయసి తత్‌పదమ్।
ఓ నిదాఘా! సంవిత్‌తత్త్వము అనగా ‘‘ఏకము, అఖండము, నిత్యము అగు ఆత్మయే నేను - నీవు - ఈ జగత్ దృశ్యము కూడా’’ - అని అనుకుంటూ ఉండటమే సంవిత్ (కేవలమగు ఉనికి-ఎరుక) తత్త్వముయొక్క ధ్యానము చేయుటయందు నీవు ఈమాత్రము నిమగ్నుడవై ఉండటములో కష్టమేమున్నది-చెప్పు?
అట్టి ‘‘అనుకుంటూ-భావిస్తూ’’ ఉంటున్న సాధన అధికమగుచుండగా అత్యుత్తమమగు సంవిత్ పదమును అధిరోహించగలవు. బ్రహ్మముగా ఈ సమస్తమును మననము చేస్తూ ఉండగా బ్రహ్మమే అవగలవు. ఎందుకంటే, నీవు సర్వదా ‘తత్ స్వరూపుడవే’ అయి ఉన్నావు కాబట్టి.
వాసనా సం-పరిత్యాగే
యది యత్నం కరోషి భో,
యావత్ విలీనం న మనో,
న తావత్ వాసనాక్షయః।।

నక్షీణా వాసనా యావత్,
చిత్తం తావత్ న శామ్యతి।
దృశ్య మననము - ఆత్మ మననము
‘జగత్ దృశ్య మననము’ అనే సాంసారికాభ్యాసము’’ చేతనే వాసన ప్రవృద్ధమగుచూ దేహ-దేహాంతర భ్రమలకు కారణమగుచున్నాయి. ‘దృశ్యమననము’ స్థానమును ‘ఆత్మమననము’ ఆక్రమించివేయును గాక! అనగా దృశ్య వాసనలు ఆత్మమననముచే జయించాలి.
బిడ్డా! నిదాఘా! వాసనలు ఎట్లా తొలగుతాయి? మననమును ఉపశమించటం చేతనే! వాసనలు పరిత్యజించబడక, మనస్సు మొదలంట్లా ఆత్మ భావనయందు విలీనము కానంత వరకు వాసనలు క్షయించవు. మనస్సు లయించదు.
వాసనలు క్షీణించనంతవరకు చిత్తము శమించదు. మనస్సు తన చాంచల్యము త్యజించదు.
యావత్ న తత్త్వ విజ్ఞానం,
తావత్ చిత్త శమః కుతః?
‘‘త్వమ్ తత్ శివేతి’’ - అను తత్త్వవిజ్ఞానము దృఢం కాకుండా, ‘‘నేను వేరు! నీవు వేరు! ఈశ్వరుడు వేరు! జీవుడు వేరు! జ్ఞాని వేరు! అజ్ఞాని వేరు’’ అను భేదదృష్టిని తత్త్వదృష్టి ఆక్రమించి వేయకుండా ఉంటే - చిత్తము ఎట్లా శమిస్తుంది? భేద దృష్టిని త్యజించనంతకాలము చిత్తము కొనసాగుచూనే ఉంటుంది.
యావత్ న చిత్త - ఉపశమో
న తావత్ తత్త్వ వేదనమ్।
యావత్ న వాసనా నాశః
తావత్ తత్త్వ ఆగమః కుతః?
ఎంతవరకు చిత్తము ఉపశమించదో, అంతవరకు ఆత్మజ్ఞానము, తత్త్వదృష్టి (లేక) ఆత్మదృష్టి సిద్ధించదు. ‘‘ఇదంతా మమాత్మయే’’ అని అనిపించదు.
వానసలు ఎంతవరకు నశించవో, (కొనసాగుచూనే ఉంటాయో) అంతవరకు ‘తత్త్వమసి’ అను నిశ్చలబుద్ధి రూపమగు తత్త్వసిద్ధి ఎట్లా ప్రాప్తిస్తుంది? ప్రాప్తించదు.
యావత్ న తత్త్వ సంప్రాప్తిః
న తావత్ వాసనా క్షయః।
తత్త్వ జ్ఞానం, మనో నాశో
‘‘వాసనా క్షయ ఏవ చ’’
‘త్వమ్‌గా (నీవుగా) కనిపిస్తున్నది - తదేవ. తత్ బ్రహ్మమేవ! త్వమ్ బ్రహ్మ-అసి!’’ - అను తత్త్వము సంప్రాప్తించనంతవరకు (సంసిద్ధించ నంతవరకు) వాసనలు క్షయించవు.
‘తత్త్వజ్ఞానము’ అనగా? (దృశ్య భేద మనన రూపమగు) మనస్సు నశించగా (భేదదృష్టి తొలగగా) ఏర్పడు వాసనాక్షయమే ‘తత్త్వజ్ఞానము’.
అంతేగాని, శాస్త్రజ్ఞానము తత్త్వజ్ఞానము కాదు. ‘‘తత్‌త్వమ్’ అనునది తెలిస్తే సరిపోదు. అనిపించాలి. అనిపించాలంటే, అనుకుంటూ ఉండాలి.
మిథః కారణతాం గత్వా
దుస్సాధాని స్థిత అన్యతః।।
ఈ విధంగా (1). దృశ్య మనన త్యాగము (2) వాసనా క్షయము (3) చిత్తనాశనము (4) తత్త్వచింతన (5) తత్త్వభావన (6) తత్వానుభూతి (7) సో2హమ్ స్వానుభవము - ఇవన్నీ కూడా పరస్పరము ఒకదానికి మరొకటి కారణముగా అగుచున్నాయి. (‘‘తత్త్వమ్’’ = ‘‘అదియే నీవు’’)
భోగ ఇచ్ఛాం దూరతః త్యక్త్వా,
త్రయం ఏతత్ సమాచార।
ఈ ఇంద్రియములు భోగములవైపుగా ఎల్లవేళలా ప్రయాణిస్తూ ఉన్నాయి. కాబట్టి నిదాఘా! భోగేచ్ఛను దూరంగా త్యజించి వేసి (1) వాసనాక్షయము (2) మనో నాశనము (3) తత్త్వజ్ఞానము అను ఈ మూడిటిని బాగుగా అభ్యాసము చేయి.
వాసనాక్షయ విజ్ఞాన మనోనాశా,
మహామతే। సమకాలం (చిరకాలం) చిర అభ్యస్తా
భవంతి ఫలదా మతాః।
ఓ మహామతే!
ఈ (1) వాసనాక్షయ (2) విజ్ఞాన (3) మనో (మనన) నాశనము ఒక్కసారిగా చిరకాలము అభ్యసించాలి. అనగా ఒకదాని తరువాత మరొకటి అభ్యసించటము కాదు. ఒక్కసారే ఈ మూడు అభ్యసిస్తే అది మహత్తరంగా ఫలప్రదము కాగలదు - అని నా అభిప్రాయము.
త్రిభిః ఏభిః సం అభ్యస్తైః
హృదయ గ్రంథయో దృఢాః।
నిశ్శేషం ఏవ త్రుట్యంతి
బిసత్ ఛేదాత్ గుణా ఇవ।।
ఈ వాసనాక్షయ-విజ్ఞాన-మనోనాశనములు ఒక్కసారే అభ్యసిస్తూ ఉండగా, - తామరకాడ త్రెంచినప్పుడు లోని దారములు కూడా తెగిపోవు విధంగా - (1) ఈ దృశ్యము సృష్టించబడింది (2) ఇది కొనసాగుతోంది (3) ఇది లయిస్తోంది’’ అనబడే హృదయగ్రంథులు (చిక్కుముళ్ళు) మొదలంట్లా నిశ్శేషంగా తొలగుతాయి. (బ్రహ్మ-విష్ణు-రుద్రగ్రంథులు విడివడతాయి).
వాసనా సంపరిత్యాగే
సమం ప్రాణనిరోధనమ్
విదుః తత్త్వవిదః।
తస్మాత్ తత్ అపి ఏవం
సమాహరేత్।। (సమాచరేత్)।।
(దృశ్యములో భేదర్శనరూపమగు) వాసనలను పరిత్యజించటానికై ప్రాణనిరోధము (లేక) ప్రాణాయామము ఉపాయము - అని తత్త్వ విదులు - (తత్త్వవేత్తలు - తత్‌త్వమేవ అని ఎరిగిన తత్త్వ విద్వాంసులు) - ఎలుగెత్తి చెప్పుచున్నారు. అందుచేత ‘‘ప్రాణనిరోధ-అభ్యాసము’’ - వాసనలను త్వరగా తేలికగా హరించివేయగలదు.
• ప్రాణాయామముచే వాసనలను త్యజించటము సులభమౌతుంది.
• వాసనాపరిత్యాగముచే ప్రాణచలనము సమత్వము పొందగలదు.
వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్ఛతి అచిత్తతామ్।
ప్రాణస్పంద నిరోధాచ్చ।
యథా ఇచ్ఛసి తథా కురు।।
వాసనాత్యాగముచే చిత్తము అచిత్తత్వము సంతరించుకోగలదు. అట్లాగే ప్రాణాయామాభ్యాసముచే ప్రాణ స్పందము నిరోధించబడినదై, అది అచిత్తత్వము ప్రసాదించగలదు.
(1) వాసనా పరిత్యాగము (2) ప్రాణాయామము (3) విచారణ …. ఈ మూడిటిలో ఏది ఇష్టమో, ఆ మార్గాన్ని అనుసరించు. (లేదా) ఈ మూడిటిని సందర్భ యుక్తంగా ఆచరించు. చివరికి ఈ మూడిటిని ఏకరూపము చేయి.
12. ప్రాణాయామ దృఢ అభ్యాసైః
యుక్త్యా చ గురుదత్తయా
ఆసనాశన (ఆసన-అశన) యోగేన
ప్రాణస్పందో నిరుధ్యతే।
(1) దృఢమైన ప్రాణాయామ యోగాభ్యాసము
(2) గురుముఖతః తత్త్వజ్ఞానము శ్రవణము చేసి తత్త్వ దృష్టి కొరకై యుక్తిని సంపాదించటము.
(3) ఆసన జయము (స్వాభావికము, సానుకూలము అగు ‘ఆసనము’ను సుసుఖము చేసుకోవటము).
(4) ఇంద్రియములతో ఏది ఎంతవరకు ఎందుకొరకై స్వీకరించాలి, (మరియు) త్యజించాలి? - అని ఎరిగి నిర్వర్తించు అసనయోగము, ఆహార నియమము -
వీటన్నిటి అభ్యాసముచేత ప్రాణస్పందన నిరోధము (వశమై ఉండటము) - సామర్థ్యము అవగలదు. సాధ్యపడగలదు.
నిస్సంగ వ్యవహారత్వాత్ భవ భావన వర్జనాత్।
ఈ ప్రపంచములో నిస్సంగము (Non-attachment. Sense of beyondness) తో వ్యవహరిస్తూ ఉండగా భవభావము (ఈ జగత్తు యొక్క భేదములతో కూడిన ప్రత్యక్షరూపము నిజమే - అని తలచు భావన) తొలగుతోంది.
శరీర నాశ దర్శిత్వాత్ వాసనా న ప్రవర్తతే।
‘‘ఈ భౌతిక శరీరము నశించబోయేదే, శరీరిని అగు నేను నశించను’’ - అను భావనచే వాసనలు ఇక ప్రవర్తించటం మానివేస్తాయి.
యః ప్రాణ పవన స్పందః
‘‘చిత్తస్పందః’’ - సయేవ హి।


ప్రాణస్పంద జయే యత్నః।
కర్తవ్యో ధీమతోఉచ్చకైః।। (ధీమతా ఉచ్చకైః)।।
ఏది ప్రాణస్పందమో అదియే చిత్తము యొక్క స్పందము కూడా. ఉత్తమ బుద్ధితో ప్రాణస్పంద జయమునకు ఉపక్రమించుచుండెదవు గాక. ధీమంతులు ప్రాణస్పందనజయముచే చిత్తమును పూర్తిగా వశం చేసుకొని ఉంటున్నారు.
న శక్యతే మనో జేతుం
వినా యుక్తిం అనిందితామ్।
ఓ నిదాఘా! అనిందితమైన (దోషభూయిష్టము కానటువంటి) యుక్తిని (ఉపాయమును) ఆశ్రయించకపోతే మనస్సును జయించటము తేలికేమీ కాదు. సాధ్యం అవదు. ఎందుకంటే, ఈ మనస్సు అనేక జన్మలుగా సుదీర్ఘమైన ప్రత్యాకర్షణ - అభ్యాసములచే రూపుదిద్దుకొన్నది కాబట్టి.
శుద్ధాం సంవిదం ఆశ్రిత్య
వీత రాగః స్థిరో భవ।
అందుచేత నీవు శుద్ధ సంవిత్తు (కేవలమగు స్వరూపాత్మ, ఉనికి-ఎరుక తనదైన నిత్యస్వరూపము)ను ఆశ్రయించు. ‘అన్యము’ ను త్యజించు. సర్వత్రా అనురాగముతో కూడిన విరాగము కలవాడవై ఆత్మయందు సుస్థిరుడవు అగుము. సర్వత్రా అనురాగము విరుగమే.
సంవేద్య వర్జితం, అనుత్తమం, ఆద్యం
ఏకం సంవిత్ పదం
వికలనం కలయన్, మహాత్మన్!
హృతి ఏవ తిష్ఠ కలనా రహితః క్రియాంతు,
కుర్వన్ న కర్తృపదం
ఏత్య శమోదిత శ్రీః।
హే మహాత్మన్! సంవిత్ పదమును (కేవలాత్మతత్త్వమును) ఆశ్రయించుము.
• సంవేద్య (తెలియబడే సమస్తమునకు) వర్జితము (అతీతము) అయి,
• ఉత్తమోత్తమమై,
• సమస్తమునకు మొదలే ఉన్నట్టిదై,
• కల్పనా రహితమై, (వికలన - కలయమై), హృదయమునందేగల ఆ సంవిత్తును దర్శిస్తూ కర్మలు నిర్వర్తించుము.
దేనికీ కర్త కానివాడవై, శమముచే ఉదయించిన శ్రీకరమగు ఆత్మనే అంతటా దర్శించుము.
మనాగపి విచారేణ
చేతసః స్వస్య నిగ్రహః
పురుషేణ కృతో యేన
తేన ఆప్తం జన్మనః ఫలమ్। ఇతి।।
ఎవ్వడైతే కొంచమైనా విచారణ చేసి ఈ చిత్తము యొక్క పోకడలను నిగ్రహించటమును నిర్వర్తిస్తాడో, అట్టి పురుషుడు కృతార్థుడే. మానవుడుగా జన్మించినందుకు కృతార్థుడై ఉత్తమఫలము (ఆత్మతత్త్వానుభవఫలము) పొందుచున్నట్లే.


చిత్తమును నిరోధించే ప్రయత్నము చేయనివానికి, అందుకొరకై కొంచమైనా ఉపాయములు ఆశ్రయించనివానికి -మానవజన్మ అను మహత్తరమగు అవకాశము వృధా అగుచున్నట్లే సుమా!

ఇతి చతుర్థో-ధ్యాయః
ఇతి 4వ అధ్యాయము

పంచమోధ్యాయః - అవిచారో హి మృత్యుః

1. ఓం। గచ్ఛతః తిష్ఠతోవ అపి,
జాగ్రతః స్వప్నతో2పి వా,
న విచారపదం చేతో,
యస్య అసౌ ‘మృత’ ఉచ్యతే।।
ఎవ్వడైతే తాను నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, (మరియు) జాగ్రత్ - స్వప్న సందర్భములలోను - ఆత్మవిచారపరమైన చిత్తము కలిగియుండడో, ఆతడు అంతవరకు మరణించిన వానితో సమానమే! ఆత్మవిచారణ లేకపోవటమే మృతి. (ఎవ్వడు ఆత్మ - విచారణ చేస్తూ ఉంటాడో, అట్టివాడే అమృతుడు)
సమ్యక్ (ఙ్) జ్ఞాన సమాలోకః
పుమాన్ జ్ఞేయ సమః స్వయమ్,
న బిభేతి, న చ ఆదత్తే వైవశ్యం న చ దీనతామ్।
అపవిత్రమ్ అపథ్యం చ
విష సంసర్గ దూషితమ్,
భుక్తం జరయతి జ్ఞానీ
క్లిన్నం నష్టం చ మృష్టవత్।।
ఏ పురుషుడైతే సమ్యక్ - (Equally and independently placed through out what is being seen) జ్ఞానముతో ఈ సమస్త లోక దృశ్యములను సమాలోకనము చేస్తూ, స్వయం సమస్వరూపముగా ఎరుగుచూ ఉంటాడో - అట్టివాడు దేనికీ భయము పొందడు. ఎట్టి వికారములు కలిగి ఉండడు. దేనికీ వివశత్వముగాని, దీనత్వమునకు గాని లోనుకాడు.
అట్టి జ్ఞాని - అపవిత్రమైనది, తినగూడినది, విషముతో కూడి దూషితమైనది మొదలైనవి పొందవలసి వస్తున్న సందర్భములలో కూడా - మధురమైన ఆహారమువలె (మృష్టాన్నము వలె) స్వీకరించుచూ ఉండగలడు.

సంగ త్యాగం విదుః ‘మోక్షం’।
సంగత్యాగాత్ ‘అజన్మతా’।
సంగం త్యజ త్వం భావానాం,
‘జీవన్ముక్తో’ భవ, అనఘ!
హే నిర్మల భావుడా! పుణ్య స్వభావుడా! అనఘా! నిదాఘ మునీ!
- సంగము (Attachment with all aspects of worldy scenareo) ను త్యజించి ఉండటమే మోక్షము.
- అట్టి ‘‘సంగ అసంగమే’’ (Detached Attachment) జన్మ-రాహిత్యము కూడా.
అందుచేత భావనాపూర్వకంగా సమస్తసంగము (Relatedness) లను త్యజించి జీవన్ముక్తుడవు అగుము.
భావ అభావే పదార్థానాం,
హర్ష-అమర్ష వికారదా,
మలినా వాసనా య ఏషా (యైషా)
సా ‘సంగ’ ఇతి కథ్యతే।।
(నిర్వాసనా ‘అసంగ’ ఉచ్యతే।)
సంగము అనగా?
ఈ దృశ్య పదార్థముల పట్ల భావ-అభావములతో కూడిన సంతోష- దుఃఖములు కలుగజేయగలిగే మలిన వాసనలు కొనసాగించుచూ ఉండటమే ‘సంగము’ అనబడుతోంది. అరిషట్‌వర్గముతో కూడిన మమకార-అహంకా రూప భావనలు హృదయంలో కలిగి ఉండటమే సంగము. వాసనా రాహిత్యమే ‘అసంగము’.
జీవన్ముక్త శరీరాణాం
అపునః జన్మకారిణీ,
ముక్త-అహంకృతిః అభ్యాసాత్
శాంతా భవతి వాసనా।।
మమకార-అహంకార, సుఖదుఃఖ నిర్వచనములు - మొదలైన భావములు హృదయమునందు కలిగియుండుటయే వాసనల యొక్క రూపము. అట్టి వాసనలు రెండు రకాలు. (1) శుద్ధ వాసనలు (2) మలిన వాసనలు.
శుద్ధవాసనలు - అగ్నిలో కాల్చబడిన విత్తనమువలె పునర్జన్మ హేతువులను రహితం చేస్తాయి. అందుచేత,
ఓ నిదాఘా! (నేను-నాది రూపమగు) ‘అహంకృతి’ని శమింపజేయు అభ్యాసముచేతనే వాసనలు శమిస్తాయి. జీవన్ముక్తుని విషయంలో పునర్జన్మను లేకుండా జేయు, అహంకార బంధము తొలగించివేయు సాత్విక వాసనల అభ్యాసముచే మలినవాసనలు శాంతించగలవు.
దుఃఖైః న గ్లానిం ఆయాసి।
హృది, హృష్య సి నో సుఖైః।
ఆశావై వశ్యం ఉత్సృజ్య, నిదాఘ!
అసంగతాం వ్రజ।।
ఓ నిదాఘా! పునర్జన్మ కారకములగు మలినవాసనలు తొలగాలంటే ఎట్లా? ఉపాయములు చెప్పుచున్నాను. విను.
(1) దుఃఖములకు క్రుంగకు. గ్లాని పొందవద్దు.
(2) సుఖములకు పొంగకు. నావే - అని ఆనందము పడవద్దు.
(3) దృశ్యంలో ఏదో ‘ఆశించటము’ అనే దానికి వశం కావద్దు.
(4) దేనితోను సంగము (Attachment) పెట్టుకోవద్దు. సంగరహితుడవై ఉండు. (‘‘ఇది నాకు చెందినది. నేను దీనికి చెందినవాడను. ఇది నాకు అనివార్యము. అది నాకు తొలగాలి’’ అనునదే సంగము యొక్క రూపము). సంగరహితుడవై ప్రశాంత చిత్తముతో భూమిపై చరించు.
దిక్ కాలాది అనవచ్ఛిన్నం
అదృష్ట-ఉభయకోటికమ్,
చిత్-మాత్రం, అక్షయం, శాంతం,
ఏకం బ్రహ్మాస్మి। నేతరత్।।
(ఏకం ‘బ్రహ్మ’ అస్మి। న ఇతరత్)।
‘‘దృశ్యములో ప్రతిది నశించబోతోంది. మరి నేనో? ఆత్మనగు నేను నశించు స్వభావము కలవాడను కాదు. దిక్కుకాలముల సరిహద్దులచే పరిమితముకాని వాడను. అవిచ్ఛిన్నుడను. అదృష్టమగు (దృశ్యముగా కనబడని) అభయ స్వరూపుడను. కేవల చిత్ స్వరూపుడను. అక్షయము, శాంతము, ఏకము, అఖండము అగు బ్రహ్మమే అయి ఉన్నాను. మరింకొకటేదీ అయి ఉండనేలేదు’’ - అని సుస్పష్టముగా, నిర్దుష్టముగా తలచుచున్నవాడవై ఉండుము.
2. ఇతిమత్వా ‘అహం ఇతి’, (య)
అంతర్ముక్తా ముక్తవపుః పుమాన్
ఏక రూపః ప్రశాన్తాత్మా
‘‘మౌనీ-స్వాత్మ సుఖో’’ భవ।।
ఈ విధంగా ‘‘సహజము శాశ్వతము, బంధరహితము అగు ఆత్మయే నేను। సో2హమ్।’’ అని గ్రహించి అంతరమున బంధరహితుడవై, నిత్యముక్తుడవై ఉండుము. ‘‘బాహ్యమున బంధము కనిపిస్తున్నప్పటికీ, (జీవాత్మగా నిత్యము బద్ధుడను - అయి ఉండి కూడా), పరమాత్మగా నిత్యముక్తుడను’’ అని గమనిస్తూ ప్రశాంతాత్ముడవగుము. బాహ్య సమస్త విషయములపట్ల మౌనము వహించినవాడవై - మౌనివై - సర్వదా ఆత్మ సుఖివై ఉండుము. (జగత్ మౌనమ్, ఆత్మజాగ్రత్ -ఇతి మునిః)
నాస్తి చిత్తం। న చ అవిద్యా।
న మనో। న చ జీవకః।
‘బ్రహ్మ’ ఏవ ఏకమ్ అనాది - అంతమ్
అబ్ధివత్ ప్రవిజృంభతే।।
నిత్యము సముద్రజలంలో అసంఖ్యాక తరంగాలు బయల్వెడలి, తిరిగి లయిస్తూ ఉండవచ్చు గాక! జలమునకు వేరుగా తరంగాలు లేవు. తరంగముల క్షోభ జలమునకు ఉన్నట్లు కాదు. సముద్రంలో సర్వదా జలము మాత్రమే ఉన్నట్లు అవుతోంది. అట్లాగా - ఇక్కడ ఏకము, ఆద్యంతరహితము అగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. అదియే జీవుని వాస్తవ - ప్రశాంత - సహజరూపము. ఇక చిత్తము లేదు. అవిద్యలేదు. మనస్సు లేదు. జీవనము లేదు. మరణము లేదు.
దేహే యావత్ అహం భావో,
దృశ్యే అస్మిన్ యావత్ ఆత్మతా,
యావత్ ‘మను’ ‘ఇదం’ ఆస్థా
తావత్ చిత్తాది విభ్రమః।।
ఏకము, అనంతము, ప్రశాంతము అగు ఆత్మకు వేరుగా ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే అది చిత్తము యొక్క విభ్రమము (Illusion) మాత్రమే.
- ఎంతవరకైతే ఈ దేహముపట్ల అహంభావము, దృశ్యము పట్ల ‘నాకు చెందినది’ అను మమత్వము ఉంటాయో, ఎంతవరకైతే అహంకారము, మమకారము ఈ జీవుడు కలిగి ఉంటాడో….
అంతవరకు చిత్తము విభ్రమము పొందుచూనే ఉంటుంది. అట్టి విభ్రమమునకు ‘అంతు’ లేదు. కొనసాగుతూనే ఉంటుంది.
అంతర్ముఖతయా సర్వం
చిత్‌వహ్నౌ త్రిజగత్ తృణమ్,
జుహ్వతో అంతర్ నివర్తంతే
మునే! చిత్తాది విభ్రమాః।।
ఓ మునీ! ఇంద్రియములతో విషయములు పొందుచున్న సందర్భములో కూడా, సర్వదా అంతర్ముఖుడవై ఉండు. ‘‘చిదాత్మ గురించిన జ్ఞానము’’ అనే అగ్నియందు ఈ త్రిలోకవిశేషములను తృణప్రాయంగా (గడ్డి పరకలతో సమానంగా) వ్రేల్చివేయుము. ఎవ్వడు తత్త్వజ్ఞానాగ్నిలో ఈ త్రిజగత్తులను ఆవిధంగా దహించివేస్తూ ఉంటాడో, అప్పుడిక అంతరంగములో చిత్తము మొదలైన విభ్రమములు -అగ్నిలో వ్రేల్చిన గడ్డిపరకలవలె దహనమైపోగలవు.
చిదాత్మాస్మి (చిత్ ఆత్మా అస్మి), నిరంశో అస్మి-
పర-అపర వివర్జితః,
రూపం స్మరన్ నిజం స్ఫారం
మా స్మృత్యా సమ్మితో భవ।।
ప్రియ నిదాఘా!
- ‘‘నేను సర్వదా కేవలము, అనంతము’’ అగు చిదాత్మ స్వరూపుడను.
- ఈ దృశ్య - దేహ - మనో - చిత్త - అహంకారములచే నిరోధించ బడువాడను కాను. నిరంశుడను. ‘జీవాత్మ’ అనే అంశగా అగుచున్నవాడను కాను.
- ‘‘ఇహ-పర (జీవాత్మ-పరాత్మ) భేదములు ఏమాత్రము లేనట్టివాడను’’
ఈ విధంగా సర్వే సర్వత్రా విస్తరించియున్న స్వస్వరూపమును స్మరించుచున్నవాడవై ఆత్మస్వరూపమును ఆస్వాదిస్తూ సమాధానశీలుడవు అగుము. (ఇవియే ప్రతి జీవుని సహజస్వరూపముయొక్క విశేషణములు)
అధ్యాత్మ శాస్త్ర మంత్రేణ
తృష్ణా విష విషూచికా,
క్షీయతే భావితేన అంతః
శరదా మిహికా యథా।
నీయొక్క స్వస్వరూపము గురించి అధ్యాత్మ శాస్త్రము ఏవిధంగా ఎలుగెత్తి గానం చేస్తూ ప్రవచిస్తోందో, అట్టి పరమార్థమును శ్రవణం చేయి. అధ్యాత్మ శాస్త్ర ప్రబోధములను మననము చేయి. అంతే, అప్పుడేమోతుంది? శరత్ కాలములో మంచు (మిహిక) కరిగిపోతుంది చూచావా? ఆ విధంగా ఆత్మభావనచే తృష్ణా విషయ భావనలు తమకు తామే క్షీణిస్తాయి.
పరిజ్ఞాయ పరిత్యాగో
వాసనానాం, య ఉత్తమః,
సత్తా సామాన్య రూపత్వాత్
తత్ ‘కైవల్యపదం’ విదుః।।
ఆత్మయొక్క ఔన్నత్యము, సర్వాతీతత్వము ఎరుగుచూ, అట్టి పరిజ్ఞాన తేజో వీచికలకచే దృశ్యవాసనలు పరిత్యజించివేయి. అప్పుడు ఉత్తమమగు ‘‘ఆత్మసత్తాభావనా వాసన’’ - అనబడు శుభవాసన మాత్రమే శేషించగలదు. అట్టి కేవలమగు ‘‘ఆత్మయేవాహమ్’’ లేక ‘‘సో2హమ్-తత్త్వమ్’’ భావన అచంచలమై శేషించియుండటమే ‘కైవల్యము’ లేక ‘ఆదిశేష్యము’ కూడా! అట్టి కైవల్యస్థితిలో శుభాశుభ ఉభయ వాసనలు సశాంతించినవవగలవు.
3. యత్ర అస్తి వాసనా లీనా
తత్ ‘సుషుప్తం’ న సిద్ధయే।
నిర్బీజ వాసనా యత్ర
తత్ తుర్యం సిద్ధిదమ్ స్మృతమ్।।
నిదాఘుడు : హేగురువర్యా! గాఢనిద్రా సమయంలో వాసనలన్నీ లయిస్తాయి కదా! అది మోక్షస్థితియేనా? మోక్షస్థితి అట్టిదేనా?

ఋభుమహర్షి : ప్రియ నిదాఘా! గాఢనిద్ర (సుషుప్తి) సమయములో జగదృశ్య సందర్భ-సంబంధములు లయించినట్లు కనబడినప్పటికీ, ‘బీజములో అంకురము’ దాగి ఉన్న రీతిగా పునఃప్రదర్శనమునకు సంసిద్ధత కలిగియే ఉంటాయి. కొంచము సేపు మాత్రమే దాగి ఉంటాయి. అందుచేత అది ‘సిద్ధి’ కానే కాదు. వాసనలన్నీ నిర్బీజము పొందటమే (తిరిగి చిగురించు ధర్మమును మొదలంట్లా లేనివై ఉండటము చేత మాత్రమే) - అది ‘తుర్యక్’ అనబడు సిద్ధి - అని గ్రహించాలి సుమా!.
వాసనాయాః తథా వహ్నేః
ఋణ వ్యాధి ద్విషామ్ అపి,
స్నేహ వైర విషాణాం చ
శేషః స్వల్పో అపి బాధతే।
ఏ విధంగా అయితే అగ్ని, ఋణము, వ్యాధి, స్నేహము, శత్రువు, విషము - ఇవన్నీ కూడా కొంచము శేషించియున్నా కూడా, క్రమంగా తిరిగి వృద్ధి చెందగలవో, ఆ జీవుని బాధించగలవో, ఆ తీరుగా దృశ్య సంబంధమైన వాసనలు కొంచెము శేషించి యున్నా కూడా అది సంసార సాగరమును త్వరత్వరగా కల్పించగలవు. (తరంగా2పి ఇమే సముద్రా జాయంతే)
నిర్దగ్ధ వాసనా బీజః
సత్తా సామాన్యరూపవాన్,
స-దేహో వా, వి-దేహో వా,
న భూయో దుఃఖభాగ్ భవేత్।।
ఎప్పుడైతే ‘‘ఆత్మతత్త్వ జ్ఞాన-ధ్యానములు’’ అనే అగ్నిచే సంసార రూప వాసనల బీజములు ఉడకబెట్టబడతాయో, అవి మరల చిగురించవు. అప్పుడు నీవు సత్తాసామాన్య రూపము (Al-present universal self) సంతరించుకోగలవు.
అట్టివాడు సహదేహముక్తుడైనప్పటికీ (లేక) విదేహముక్తుడైనప్పటికీ మరల సంసార దుఃఖములకు లోనుకాడు.
ఏతావదేవ అవిద్యాత్వం ‘‘న ఇదం బ్రహ్మేతి’’ నిశ్చయః।।
ఏష ఏవ క్షయః, తస్యా
‘‘బ్రహ్మ ఇదం’’ (బ్రహ్మేదం) ఇతి - నిశ్చయః।।

‘‘ఈ ఎదురుగా కనబడేదంతా బ్రహ్మము కాదు. బ్రహ్మము మరెక్కడో ఉన్నది. అద్దాని కొరకు వెతకాలి’’ - అనునదే అవిద్య. అట్టి అవిద్యను ‘‘ఈ సమస్తము బ్రహ్మమే’’ - అను భావనతో క్షయింపజేయాలి. సమస్తము బ్రహ్మమే - అను నిశ్చయముతో ద్వైతమును త్యజించగలుగుతావు.

బ్రహ్మ చిత్। బ్రహ్మ భువనం।
బ్రహ్మ భూతపరం పరా। బ్రహ్మాహం।
బ్రహ్మ చిత్ శత్రుః।
బ్రహ్మ చిత్ మిత్ర బాంధవాః।।
మనలోని చిత్ (‘ఎరుక’) (The knowing) బ్రహ్మమే! ఈ భౌతికంగా కనిపించేదంతా బ్రహ్మమే। నేను బ్రహ్మమునే। నాచే తెలియబడుచున్నదంతా బ్రహ్మమే। నాకు సంబంధించినవారై కనిపిస్తున్న శత్రువులు, స్నేహితులు, బంధువులు కూడా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నారు.
‘‘బ్రహ్మ ఏవ సర్వం ఇతి’’ ఏవ
బాధితే బ్రహ్మవై పుమాన్।
సర్వత్ర అవస్థితం శాంతం
చిత్ బ్రహ్మ - ఇతి అనుభూయతే ।।

ఇదంతా సర్వదా బ్రహ్మమే। బాధించునది బాధింపబడునది కూడా బ్రహ్మమే. నేను బ్రహ్మమే! నాకు బాధ కలిగించేవారు కూడా బ్రహ్మమే!
‘ఎరుగుట’ అను చిత్ రూపముతో బ్రహ్మమే సర్వత్రా శాంతముగా అవస్థితమై, బ్రహ్మమే - ‘అనుభమము’ రూపముగా అగుచున్నది. అనుభవమగుచున్నదంతా బ్రహ్మమే।

అసంస్కృత అధ్వగా లోకే
మనసి అన్యత్ర సంస్థితే।।
యా ప్రతీతిః అనాగస్కా
‘‘తత్ చిత్ బ్రహ్మాస్మి సర్వగమ్’’।।
ఈ మనస్సు ‘ఆత్మజ్ఞానము’ అనే ఔషధము (మందు)తో సంస్కరించబడనప్పటి స్థితిలో కూడా అట్టి ఏఏ విషయాల గురించి ప్రతీతి (Driven and placed) పొందుచున్నదో, అదంతా కూడా నాయొక్క బ్రాహ్మీ స్వరూపమునందే ఆ విధంగా అగుచున్నది. నేనే బ్రహ్మముగా సర్వే సర్వత్రా విస్తరింపజేస్తున్నా కూడా సర్వముగా సర్వదా విస్తరించి ఉన్నాను కూడా।’’
ప్రశాంత సర్వ సంకల్పం
విగత అఖిల కౌతుకమ్,
విగత-అశేష సంరంభం,
చిదాత్మానం (చిత్-ఆత్మానం) సమాశ్రయ।।
ఓ నిదాఘా!
ఈ విధమైన ‘‘సర్వగతమగు బ్రహ్మమే నేను’’ - అనే ఇష్టాపూర్వకమైన భావన - ప్రజ్ఞలతో సర్వ సంకల్పములను ప్రశాంతింపజేయి. సర్వకౌతుకములను (All types of Inquisitiveness) త్యజించివేయి. సర్వసమారంభములను దాటివేయి. చిదాత్మను ఆశ్రయించి ఉండు.

‘‘సమస్తము నేనైన నేను’’ అను ఉపనిషత్ ఉద్యానవనము నందు విహరించుము.

ఏవం పూర్ణధియో ధీరాః
సమా నీరాగ చేతసః,
న నందంతి, న నిందంతి-
జీవితం మరణం తథా।
అట్టి పూర్ణమగు, వివేచనపూర్వకమగు బుద్ధితో సర్వ సాంసారిక రోగములు త్యజించినట్టి చిత్తము కలవాడు…, ఇక -
- దేనికీ పొంగిపొరలడు. దేనిని చూచీ క్రుంగడు.
- దేనినీ నిందించడు. శ్లాఘించడు.
జననముతో ఏదీ పొందడు. మరణముతో ఏదీ పోగొట్టుకోడు. ఆ రెండిటికి సాక్షియగు ఆత్మయందు మౌనానందమును వీడడు.
ప్రాణో అయం అనిశం, బ్రహ్మన్!
స్పందశక్తిః సదాగతిః।
స బాహ్య అభ్యంతరే దేహే
ప్రాణో అసా ఊర్థ్వగః స్థితః।।
హే బ్రహ్మన్! పంచ ప్రాణములలోని ప్రాణశక్తి ఎల్లవేళల స్పందశక్తి కలిగి ఉండి, సదా ‘గతి (movement from one point to another) కలిగి ఉండటము - అద్దాని స్వభావము. అది ఈ భౌతిక దేహములోపల - వెలుపల కూడా ఊర్ధ్వగతమై (manifesting forward movement) ఉంటుంది.
4. అపానో అపి అనిశం, బ్రహ్మన్!
స్పందశక్తిః సదాగతిః।
స బాహ్య - అభ్యంతరే దేహే
అపానో అయం అవాక్ - స్థితః।
హే నిదాఘా! అపానశక్తి కూడా అదేవిధంగా స్పందనశక్తితో ఎల్లప్పుడు గతి (movement) కలిగి ఉండటము సహజము.
అపానప్రాణము బాహ్య అభ్యంతరములలోను, దేహములోపల, దేహములోని కొన్ని క్రిందవిభాగములలోను ఉండి, సంచలన శీలమై ప్రదర్శనమౌతోంది.
జాగ్రతః స్వపతశ్చ ఏవ
ప్రాణాయామో-యమ్ ఉత్తమః
ప్రవర్తతే హి అభిజ్ఞస్య తత్ తావత్ శ్రేయసే శృణు।।
జాగ్రత్‌లోను, నిదురిస్తూ ఉన్నప్పుడు కూడా ఏ ప్రాణాయామము ప్రవర్తనశీలమమై ఉంటుందో, అట్టి అద్దాని యోగసార విశేషాలు కొన్ని, యోగాభ్యాసుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చెప్పుతాను! వినండి!
ద్వాదశ అంగుళ పర్యంత బాహ్యం ఆక్రమతాం తతః,
ప్రాణానాం అంగ సంస్పర్శో
యః, స ‘పూరక’ ఉచ్యతే।।
పూరకము :
బయట 12 అంగుళముల పర్యంతము ప్రాణశక్తిని విస్తరించి ఆక్రమింపజేసి, అట్టి శక్తితో తిరిగి అంతర్-దేహాంగములను కూడా (ప్రాణశక్తితో) స్పృశిస్తూ ఉండటమును ‘పూరకము’ అని అంటారు.
అపానః చంద్రమా దేహం
ఆప్యాయయతి, సువ్రత!
ప్రాణః సూర్యో అగ్నిః అథవా
పచతి అంతరిదం వపుః।।
సువ్రతా! ‘అపానము’ అనే చంద్రమసము దేహమును ఆప్యాయముతో నింపుతోంది.
పంచప్రాణములలోని మొట్టమొదటిది అగు ‘ప్రాణము’ అనే సూర్యుడు (లేక) అగ్ని దేహమును పచనము చేస్తూ, వెచ్చగా ఉంచుచున్నది. శరీరములో పచనశక్తి (Heating Energy) ప్రదర్శించుచున్నది. (ఇతి వైశ్వానరో)
ప్రాణక్షయ సమీపస్థం
అపాన ఉదయ కోటిగమ్,
‘‘అపాన ప్రాణయోః ఐక్యం’’
చిత్ ఆత్మానం సమాశ్రయ।।
ఓ ప్రియ నిదాఘా!
• ఏ బిందుస్థానములో ప్రాణము(Air that is entering the Body) క్షయించినదై అట్టి ప్రాణక్షయ స్థానమునకు అత్యంత సామీప్యమో,
• అపాన ప్రాణమునకు (Air that is pushing out)కు ప్రారంభస్థానమో,
• అట్టి ప్రాణ - అపానముల ఐక్యస్థానములో (మధ్యగా) (ప్రాణ కదలికలు శమించినచోట) వేంచేసినదైయున్న చిదాత్మను సమాశ్రయించి ఉపాసించు చుండెదవుగాక.
అపానో అసంగతో యత్ర
ప్రాణో న అభ్యుదితః క్షణమ్,
కలా కళంక రహితం
తత్ ‘‘చిత్ తత్త్వం’’ (చిత్తత్త్వం) సమాశ్రయ।।
• ఏ స్థానంలో అపానము అసంగతమై, ముగిసినదిగా అగుచున్నదో,
• ప్రాణము ఇంకను అభ్యుదితము అయి ఉండక ఉన్నదో…
కళంకరహితమైనట్టి (A Place where illusionary ideations do not accompany) - అట్టి చిదాత్మతత్త్వమును సమాశ్రయించుము.
న అపానో అస్తంగతో యత్ర,
ప్రాణశ్చ అస్తం ఉపాగతః,
నాస-అగ్ర గమనా వర్తం, తత్
చిత్ తత్ త్వం (తత్ చిత్తత్త్వం) ఉపాశ్రయ।।
ఎక్కడ అపానము అస్తమించదో, ప్రాణము ఉదయించదో అట్టి స్థానమును ముక్కుకు పై స్థానమున గమనావర్తమైనట్టి భృకుటీఆకాశములోని (In between two Eye Brows) ‘‘చిత్ తత్త్వము’’ను ఉపాసించుము.
అభాసమాత్రమేవ ఇదం
న సత్, న అసత్ జగత్ త్రయమ్।।
ఇతి అస్య కలనా త్యాగం
‘‘సమ్యక్ జ్ఞానం’’ విదుః బుధాః।।
అట్టి స్థానము నుండి చేయు దర్శనము ఎట్లా ఉంటుందంటే - ఈ త్రిజగత్తులు ‘‘సత్తు’’ కాదు. ‘‘అసత్తు’’ కాదు. ఇదంతా అభాస (Misconception) మాత్రమే.
ఈ రీతిగా జగత్తును భేదదృష్టితో కాకుండా చిత్‌తత్త్వ దృష్టితో చూస్తూ కల్పనా వ్యవహారమగు దృశ్యమును త్యజించి ఉండటమే ‘సమ్యక్ జ్ఞానము’.
5. అభాసమాత్రకం, బ్రహ్మన్!
చిత్త ఆదర్శ కళంకితమ్,
తతః తత్ అపి సంత్యజ్య
నిరాభాసో భవ ఉత్తమ।
హే బ్రహ్మాన్! ధూళితో కప్పబడిన అద్దములో దృశ్యముయొక్క ప్రతిబింబము అస్పష్టముగా కనిపిస్తుంది చూచావా? ఈ జగద్దృశ్యము చిత్తము ళీనే కళంకితమైన (దోషసంస్కారములు, వాసనలతో కూడిన) అద్దంలోరి కనిపించే ఆభాస (Refraction) వంటిది. అందుచేత అటువంటి ఆభాసమాత్ర (made up of illusions and misconceptions) దృశ్యమును మొదలంట్లా సంత్యజించు. ఆభాసలేనివాడవగుము - (1) జగద్దృశ్యము, (2) అది ప్రతిబింబిస్తున్న చిత్తము- ఈ రెండిటిని త్యజించి నిరాభాసుడవై ఉండుము.
భయప్రదం అకల్యాణం
ధైర్యసర్వస్వ హారిణమ్,
మనః పిశాచం ఉత్సార్య
యో2సి సో2సి స్థిరో భవ।।
‘సుదీర్ఘకాలంగా దృశ్య వస్తువుల గురించి భేద దృష్టులతో కూడిన మననము చేయటము’’ - అనే మూల పదార్థముచే నిర్మితము అవుతున్న ఈ ‘మనస్సు’ అనే పిశాచము భయప్రదమైనది. అశుభ ప్రదాత అయి ఉంటోంది. ధైర్యమును సడలించి పిరికితనమును కలిగిస్తూ ఉంటోంది. ఇది గమనించు. అట్టి మనో పిశాచమును పారత్రోలివేయి. మనస్సు రహితం చేయగా (మననమును ఆపివేయగా) అప్పటికీ ఏది అయి ఉన్నావో - ‘అది’గా (కేవలాత్మగా) ఉండి ఉండెదవు గాక! అదియే నీ-నా వాస్తవమగు (సహజ) రూపము.
చిత్ వ్యోమా ఏవ కిల అస్తి ఇహ,
పర-అపర వివర్జితమ్।
సర్వత్ర అసంభవత్ చైత్యం
యత్ కల్పాంతే అవశిష్యతే।
ఓ నిదాఘా! ఇక్కడ (1) సమస్తము తెలుసుకొనుచూ ఉన్న చిత్తు (perceiver) (2) తెలియబడుచూ ఉన్న చైత్యము (That being parceived) అనబడే రెండు కనబడుచున్నాయి కదా! వాస్తవానికి అద్దంలో దృశ్య వస్తువే లేనివిధంగా ఇక్కడ చిదాకాశము మాత్రమే ఉన్నది. అద్దానికి పరము లేదు. అపరములేదు. (ఆవల ద్రష్ట లేదు. ఈవల దృశ్యము / క్షేత్రము లేదు). సర్వకల్పనలు ముగిస్తే అప్పటికీ ’కల్పించువాడు’ శేషించి ఉంటాడు కదా! అట్టి కల్పాంతము తరువాత కూడా శేషించే చిత్ స్వరూపుడు మాత్రమే ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. అద్దంలో వస్తువు లేనట్లే, - చైత్యము(That being perceived) మొదలే లేదు.


వాంఛా క్షణేతు యా తుష్టిః
తత్ర వాంఛ ఏవ కారణమ్।
తుష్టిస్తు అతుష్టి పర్యంతా
తస్మాత్ వాంఛాం పరిత్యజ।।
వాంఛ (దృశ్యములో ఇంకా ఏదో పొందాలి) అనునది తీరటములో ఏ ఆనందము కొరకై ఈ జీవుడు వాంఛిస్తున్నాడో, అట్టి కోరిక తీరినప్పుడు లభించే ఆనందమునకు (తుష్టికి) కారణము ఏమిటి? వాంఛించటమే. వాంఛ తీరిందనుకో - ఆ ఆనందము కూడా తొలగిపోతుంది. అనగా ‘తుష్టి’ అనేది అతుష్టి ఉన్నంతవరకే ఉంటుంది. అతుష్టి వలన దుఃఖము కొనసాగుతుంది. అందుచేత ఓ నిదాఘా! వాంఛలన్నీ పరిత్యజించినవాడవై ఉండు. అప్పుడిక అతుష్టికి చోటే ఉండదు.
ఆశా యాతు నిరాశా త్వం,
అభావం యాతు భావతామ్।
అమనస్త్వం మనో యాతు
తవ అసంగేన జీవతః।।
ఇక్కడ - (1) ‘‘ఏదో కావాలి’’ అని ఆశించటము, (2) ఆశించిన దానిని గురించి మననము చేయటము, (3) అట్టి మననమే మనస్సుగా రూపొందటము జరుగుతోంది.
అట్టి మననము చేతనే అసంఖ్యాక ఉపాధులు (జన్మపరంపరలు) వచ్చి పడుచున్నాయి. ఫలితంగా ఈ జీవుడు స్వస్వరూపముయొక్క ఔన్నత్యమును ఏమరిచి ‘జీవదశ’ను దాటివేయలేక, బద్ధుడగుచున్నాడు. అందుచేత నీవు అసంగుడవై (Non-Concerned, Non-Confined) జీవిస్తూ ఉండు. అప్పుడు ఆశ నిరాశత్వముగాను, భావము అభావముగాను, మనస్సు అమనస్సుగాను అవగలవు. (నిరాశత్వము = ఆశించని స్థైర్యము)
వాసనా రహితైః అంతరింద్రియైః
ఆహరన్ క్రియాః,
న వికారం అవాప్నోషి,
ఖ వత్ క్షోభ శతైః అపి।
ఇక్కడి సాకారములైనట్టి అసంఖ్యాక వస్తువుల ఉత్పత్తి, వినాశనములచే ఆకాశము (Space) ఏమైనా పొందిన (లేక) కోల్పోయిన క్షోభ (Pain, Meloncholy, Disturbance) పొందుతోందా? లేదు కదా! అట్లాగే, ఎవ్వడైతే (దృశ్య) వాసనా రహితుడై, వాసనలను దాటివేసినవాడై ఉంటాడో - అట్టివాడు ఇంద్రియములతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా దృశ్య సంబంధములైన (జనన-జీవన్-మరణాదులు, ఉత్పత్తి-ఉనికి-వినాశనములు ఇత్యాది) వికారములేవీ కించిత్ కూడా పొందడు.
చిత్త ఉన్మేష-నిమేషాభ్యాం
సంసార ప్రళయ-ఉదయౌ
వాసనా ప్రాణ సంరోధాత్
అనున్మేషం మనః కురు।
చిత్తము కళ్ళు తెరిస్తే సంసారము ప్రభవిస్తోంది. అదే చిత్తము - కళ్ళు మూస్తే ప్రళయము. అందుచేత (1) ‘ప్రాణాయామము’ (2) వాసనలను త్యజించటము - అను రెండు ప్రక్రియలను ఆశ్రయించి చిత్తమును, మనస్సును అనున్మేషముగా (కనులు తెరువనిదిగా) చేసివేయి.
ప్రాణ ఉన్మేష-నిమేషాభ్యాం
సంసృతేః ప్రళయ-ఉదయౌ।
తం అభ్యాస-ప్రయోగాభ్యాం
ఉన్మేష రహితం కురు।।
ప్రాణముల ఉన్మేషము (వికాసము, చలన ప్రదర్శనము), నిమేషము (అప్రదర్శనము)ల వలన - సంసృతి (దృశ్య-ఆశ్రయము సంసారము) యొక్క వికాసము, ఉపశమనము (ఉదయము/ప్రళయము) జరుగుతోంది. అందుచేత ప్రాణయోగాభ్యాసముచే సిద్ధించు అభ్యాస, ప్రయోగములచే ప్రాణములను ఉన్మేషరహితము (కళ్ళు తెరవనిది, నిశ్చలత్వము, ఆత్మతో అనన్యము) చేయి.
6. ‘మౌర్ఖ్య’ ఉన్మేష నిమేషాభ్యాం
కర్మణాం ప్రళయ - ఉదయౌ।
తత్ విలీనం కురు బలాత్
గురు శాస్త్రార్థ సంగమైః।
మూర్ఖత్వము యొక్క ఉన్మేష నిమేషము (The Opening and the closing of ignorance) లచే కర్మల ప్రళయ-కర్మల ఉదయములు ఏర్పడు చున్నాయి.
అందుచేత ‘గురుబోధ శ్రవణము - శాస్త్రార్థమననములతో సత్ సంగమును ఆశ్రయించి, తద్వారా, మూర్ఖత్వమును బలవంతముగా ఆత్మభావనయందు/ఆత్మతత్త్వ దర్శనమునందు) విలీనము చేసివేయి.
అసంవిత్ స్పంద మాత్రేణ
యాతి చిత్తం అచిత్తతామ్।
ప్రాణానాం వా నిరోధేన
తదేవ పరమం పదమ్।।
అసంవిత్తు (సత్-చిత్‌ల ఏమరపు) యొక్క కించిత్ స్పందము చేత ఏ చిత్తము రూపు దిద్దుకుంటోందో, అట్టి అద్దానిని సత్-చిత్‌స్మరణచే (స్పందనచే) ‘‘అచిత్తము’’ చేయి. ‘ప్రాణాయామము’ (లేక) ప్రాణ నిరోధముచే చిత్తమును అనుక్షణికంగా అచిత్తము చేసివేయవచ్చును.

అట్టి అచిత్తత్వమే పరమపదము.
దృశ్య దర్శన సంబంధే
యత్ సుఖం పారమార్థికమ్,
తత్ అంతా ఏకాంత సంవిత్త్యా
బ్రహ్మ దృష్ట్యావలోకయ।।
దృశ్య-దర్శన (That being perceived - and perception) ముల సంబంధములచే అనిపిస్తున్న సుఖమును పారమార్థిక దృష్టితో (ఆత్మదృష్టితో) అధిగమించివేయి. ఆ రెండిటికీ ఆవల సంవిత్ ఏకాంతము (mere presence & Knowing in relation to Alone Self) అగు బ్రహ్మీదృష్టితో అవలోకించుము. అప్పుడు లభించగల బ్రహ్మానందమును సిద్ధింపజేసుకో.
యత్ర న అభ్యుదితం చిత్తం,
తత్ వై సుఖం అకృత్రిమమ్।
క్షయ అతిశయ నిర్ముక్తం
న ఉదేతి। న చ శామ్యతి।
ఎక్కడ చిత్తము అభ్యుదితము (Blossom up) అవదో, అక్కడ మాత్రమే అకృత్రిమమగు సుఖము ఉంటుంది. అందుచేత చిత్త సహాయముచే అనుభవమయ్యే సుఖము కృత్రిమము (Artificial) . ఒకప్పుడు ఉండేది - మరొక క్షణంలో ఉండనిది అగుచున్నది. అచిత్తరూపమగు ఆత్మసుఖమో? అట్టి అకృత్రిమ ఆత్మ సుఖమునకు క్షయము ఉండదు. అతిశయము ఉండదు. అది ఉదయించదు, అస్తమించదు.
జ్ఞస్య చిత్తం న చిత్తాఖ్యం,
చిత్తం చిత్తత్త్వం ఏవ హి।
తత్ ఏవ ‘‘తుర్య’’ అవస్థాయాం
తుర్య అతీతం భవత్యతః।।
ఆత్మతత్త్వము ఎరిగినట్టి తత్త్వజ్ఞునియొక్క చిత్తము ‘అచిత్తమే’ అని చెప్పబడుతోంది. స్వస్వరూప - ఆత్మ యొక్క స్వరూప స్వభావములు దృష్టిలో లేనివారి భావన-అవగాహనలతో కూడిన చిత్తము మాత్రమే ‘చిత్తము’ అనిపించు కుంటుంది.
ఆత్మజ్ఞుని చిత్తము ఇహములో ప్రవర్తిస్తున్న జాగ్రత్-స్వప్న-సుషుప్తుల పరిధులను దాటివేసి, ఆ మూడిటిని ‘తనవి’గా కలిగియున్న తురీయము వైపు సంధించబడి ఉంటుంది. అట్టి తురీయ చిత్తముచే నిర్వర్తించు అతీత యోగాభ్యాసముచే ఆ యోగి ‘తురీయాతీతుడు’ అగుచున్నాడు.
సన్న్యస్త సర్వ సంకల్పః,
సమశ్శాంత మనా మునిః
సన్న్యాస (సత్‌న్యాస) యోగయుక్తాత్మా
జ్ఞానవాన్, మోక్షవాన్ భవ।।
ఓ నిదాఘా! సమస్త సంకల్పములను సన్న్యసించినవాడవై. సర్వత్రా సమమగు, సశాంతించినదగు మనస్సుతో ‘మునివి’ అయి ఉండుము.
ఈ విధంగా సమస్త సంకల్పములను త్యజించినవాడవై సర్వత్రా సమమగు, ప్రశాంతించినదగు మనస్సుతో అంతరమున మౌనము వహించి ఉండుము.
ఈ మార్గముగా సన్న్యాసయోగయుక్తాత్ముడవు, ఆత్మతత్త్వజ్ఞానివి, (‘‘నాకు బంధమే లేదు’’ అను ఎరుకచే) అయి - మోక్షవంతుడవు గా ప్రకాశించ గలవు. (దృశ్య దేహములు నాకు బంధము కాజాలవు - అను నిస్సందేహత్వమే మోక్షము)
సర్వ సంకల్ప సంశాంతౌ,
ప్రశాంత ఘన వాసనమ్,
న కించిత్ భావన ఆకారం యత్,
తత్ బ్రహ్మ పరం విదుః।
• సర్వ సంకల్పములు సశాంతించగా (సంకల్పరహితుడవై ఉండగా),
• సర్వ దృశ్య సంబంధమైన (బాహ్య అంతర) ఘనవాసనలు (The solidity of Tendencies) అంతరంగమునందు ప్రశాంతత్వము సంతరించుకోగా,
ఏ కించిత్ భావనాకారమూ కూడా లేనట్టి ‘‘స్వస్వరూపమే’’ (లేక) ‘‘తత్త్వరూపమే’’ - పరంబ్రహ్మము.
సమ్యక్ జ్ఞాన అవరోధేన
నిత్యం ఏక సమాధినా,
సాంఖ్య ఏవావ బుద్ధా యే,
తే సాంఖ్యా యోగినః పరే।।
సాంఖ్యయోగి
- సమ్యక్ జ్ఞానముచే భేదదృష్టి అంతా నిరోధించబడగా
- సర్వత్రా ఏకమగు ఆత్మను దర్శించటమే సమాధి. అభ్యాసము వలన ఎవరిలో బుద్ధి సాంఖ్యయోగము - జ్ఞాననిష్ఠ కలిగి ఉంటాయో, అట్టివారే ‘సాంఖ్యయోగులు’. పరానందము సిద్ధించుకున్నట్టివారు.
ప్రాణాది అనిల సంశాంతౌ
యుక్త్యా యే పదమ్ ఆగతాః,
‘అనామయం’ ‘అనాద్యంతం’
తే స్మృతా యోగ యోగినః।।
ప్రాణము, అపానము మొదలైన వాయువులను శాంతింపజేయు యుక్తిచే ప్రాణాభ్యాస క్రియా యోగులు ఏ పదమును చేరుచున్నారో, అదియే - ‘‘అనామయము, అనాద్యంతము’’ అగు యోగయోగి పదము.
ప్రాణయోగులు, చిత్తనిరోధకులు కూడా అది సిద్ధించుకుంటున్నది ఆయోగ-యోగి పదమే।
7. ఉపాదేయం తు సర్వేషాగ్ం
శాంతం పదం అకృత్రిమమ్,
ఏక అర్థ అభ్యసనం ప్రాణ రోధ,
చేతః పరిక్షయః।
అట్టి ఏకార్థమును ప్రసాదించునది (అనేకార్థమంతా రహితము చేయునది), ప్రాణాయామముచే పరిక్షయింపజేయబడు చిత్త రూపము కలిగియన్నట్టిది, పరమశాంతరూపమైనట్టి, అకృత్రిమము అగు పరమపదము కొద్దిమందికి మాత్రమే సాధ్యమా? లేనేలేదు. అందరికి అభ్యాసవశంచేత ఆచరణ సాధ్యమే! ఉపాదేయమే! చదువుకున్నవారందరికీ చదువు వస్తుందికదా!
ఏకస్మిన్ ఏవ సంసిద్ధే
సం సిధ్యంతి పరస్పరమ్,
అవినాభావినీ నిత్యం
జంతూనాం ప్రాణచేతసి।।
(1) ప్రాణాయామ యోగము
(2) చిత్తనియమమార్గ చిత్తనిరోధాభ్యాసము.

ఈ రెండిటిలో ఒక్కటి ఆశ్రయిస్తే రెండవది దానంతట అదే స్వాభావికంగా (Automatically) సిద్ధించగలదు. అవి పరస్పరము సహకరించునవి. ఎందుకంటే, జీవులపట్ల ప్రాణ-చిత్తములు అవినాభావముతో సంచారము కలిగి ఉంటున్నాయి కాబట్టి.
ఆధార-ఆధేయవత్ చ ఏతే
ఏకభావే వినశ్యతః।
కురుతః స్వ వినాశేన
కార్యం మోక్షాఖ్యం ఉత్తమమ్।
[ (మేఘము -మేఘముయొక్క ఆకారము ఈ రెండు కూడా వర్షించుచునప్పుడు ఒకటి నశిస్తే రెండవది కూడా నసిస్తుంది కదా) ]. అధార-ఆధేయములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశిస్తుంది.
చిత్త-ప్రాణచలనములలో ఒకటి తొలగితే రెండవది కూడా స్వవినాశనము పొందుతూ ‘మోక్షము’ అనే ఉత్తమ కార్యమును సిద్ధింపజేస్తాయి.
సర్వం ఏతత్ ధియా త్యక్త్వా
యది తిష్టసి నిశ్చలః,
తత్ అహంకార విలయే
‘త్వమ్’ ఏవ పరమం పదమ్।
పరమపదము: అన్యరూపములగు బాహ్య-అంతరంగములను బుద్ధితో త్యజించగా ఏ స్వస్వరూపము నిశ్చలమై (త్యజించవీలుకానిదై) శేషిస్తుందో, … అట్టి అహంకారము కూడా విలయము పొందినప్పటి నీయొక్క ఆదిశేష్య స్వరూపమే - ‘పరమపదము’.
‘మహాచిత్’ ఏక ఏవ ఇహ అస్తి,
‘మహాసత్’ ఏతి యోచ్యతే। (య ఉచ్యతే)।।
ఇక్కడ సర్వే సర్వత్రా సర్వదా సర్వ జీవులలో అఖండము - ఏకము అయి ఉన్న ‘మహావిత్’యే ప్రదర్శనశీలమై ఉంటోంది. అదియే ‘మహాసత్’ అనబడు ‘నేను ఉన్నాను కదా’ అను రూపముగా సర్వ దేహములలోను ప్రకాశమానము అగుచున్నది.
నిష్కళంకా సమా శుద్ధా నిరహంకార రూపిణీ।
సకృత్ విభాతా విమలా నిత్య ఉదయవతీ సమా।
(నిత్యోదయవతీ సమా)।
సా బ్రహ్మ ‘పరమాత్మ’ ఇతి నామభిః పరిగీయతే।।
అట్టి ‘మహాచిత్’ మరియు ‘మహాసత్’ యే పరమాత్మ (ఆవల ప్రకాశమానమైయున్న ఆత్మరూపము)గా సర్వదా సర్వత్రా వేంచేసినదై యున్నది. సమస్తమును వెలిగించునదై (Enlightening), విమలమై (pure), నిత్యోదయమై (Ever blossoming) ‘పరబ్రహ్మము’ అను శబ్దమునకు పరమార్థమై వెలుగొందుచున్నది.
సైవాహమ్ (‘‘స ఏవ అహం’’) ఇతి నిశ్చత్య
నిదాఘ! కృతకృత్యవాన్।
అట్టి ‘‘పరమాత్మ’’ - మహత్ పదార్థంగా పరిశీలిస్తూ గమనిస్తే, → ఎక్కడ ఉన్నది? ఓ నిదాఘా! అదియే నీలో ‘అహమ్’ (నేను)’ అను రూపముగా వెలుగొందుచున్నది - అని దర్శిస్తూ కృతార్థుడవు అయ్యెదవు గాక! నీవే పరమాత్మవు అయి ఉన్నావు. ‘‘తత్త్వమసి।’’
న భూతం, న భవిష్యత్ చ
చింతయామి కదాచన।
దృష్టిం ఆలంబ్య తిష్ఠామి
వర్తమానం మహాత్మనా।।
అట్టి పరమాత్మ నీయందుగాని, నాయందుగాని - ‘‘ఒకప్పుడు ఉన్నది’’ - (It was in the past) అనుకోవలసినది కాదు. ‘‘భవిష్యత్తులో ఆయా ప్రయత్నముల అనంతరము లభించబోతోంది’ (To be gained in the future) అనే మాట కూడా యుక్తియుక్తం కాదు.
మరి? ‘‘అట్టి మహాత్మత్వము ఇప్పుడే ఇక్కడే మనకు అనన్యమై ఉన్నది’’ అని చింతన చేయవలసినట్టిది సుమా!
8. ఇదం అద్యమయా లబ్ధం
ఇదం ప్రాప్స్యామి సుందరమ్-
న స్తౌమి। న చ నిందామి।
ఆత్మనో అన్యం నహి క్వచిత్।।
అట్టి ‘పరమాత్మ’ సర్వదా నాలో నేనై ఉండగా ఇంక అద్దానికి సమయా సమయములు ఎక్కడివి? ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ లభించియే ఉన్నది అందుచేత, ఇప్పుడే అట్టి ఆత్మసౌందర్యము సందర్శిస్తున్నాము.
‘‘లభించియున్నదేకదా!’’ - అని స్థుతించటము లేదు. ‘‘అందరికీ లభిస్తోంది కాని, నాకు ఇంకా లభించటము లేదే?’’ - అని నిందించటము లేదు. ‘‘నాకు వేరుగా పరమాత్మ ఎక్కడో లేడు’’ అని గమనిస్తూ ఆత్మానందము ఆస్వాదిస్తున్నాను. సమస్తము మమాత్మయే అయి ఉండగా, ఇంక నేను ఎవరిని స్థుతించాలి? ఎవరిని నిందించాలి?
న తుష్యామి శుభప్రాప్తౌ।
న భిద్యామి అశుభాగమే।
సమస్తము, సర్వదా నాయొక్క ఆత్మానంద స్వరూపమే - అయి ఉన్నది కదా! అందుచేత
• శుభముల ప్రాప్తికి తుష్యించటము (సంతోషముతో పొంగటము) లేదు.
• అశుభప్రాప్తులకు ఖేదము చెందటములేదు.
ప్రశాంత చాపలం వీతశోకం,
అన్త (స్త) సమీహితమ్।
ఓ మునీశ్వరా! ‘‘ఆత్మతత్త్వ-ఆత్మసో2హమ్’ జ్ఞానముచే నా మనస్సు చపలత్వమును త్యజించి, శోకమును వదలివేసి ప్రశాంతము పొందినదై ఉంటోంది. ‘‘ఏదో పొందాలి. ఇంకా ఏదో కావాలి’’ అను రూపముగల సర్వ కోరికలు అస్తమించినవై ఉంటున్నాయి. సమస్తమునకు అంతమున (ఆవల) నన్ను నేను దర్శిస్తూ ఆస్వాదిస్తున్నాను.
మనో మమ, మునే! శాంతం
తేన జీవామి అనామయః।।
శాంతము పొందిన నా మనస్సు ఎట్టి మానసిక రోగము, దుష్టభావములు లేనిదగుచున్నది. ఈ జీవితమును, ఆయా సర్వ-సందర్భములను హాయిగా చూస్తూ కాలము గడుపుచున్నాను. వేరుగా ఉండియే సమస్తమును యథాతథంగా ఆస్వాదిస్తున్నారు.
అయం బంధుః, పరః చ (పరశ్చ) అయం
మమ అయం। మయమ్ అన్యకః।
ఇతి బ్రహ్మన్। న జానామి
సగ్ంస్పర్శం న దదామి అహమ్।
వాసనామాత్ర సంత్యాగాత్
జరామరణ వర్జితమ్।।
హే బ్రహ్మన్!
- వీరు నా బంధువులు. వారు కాదు. - వీరు (నా జాతి, దేశము, భాష మొదలైన వివరములు కారణంగా) నావారు. వారు నావారు కాదు. నేను వారికి చెందినవాడను. వారికి చెందినవాడను కాను’’.
ఈఈ మొదలైన సంసార స్పర్శలు నన్ను ఏమాత్రము సమీపించలేకపోతున్నాయి.
‘వార్ధక్యము, మరణము’ మొదలైన సమస్త వాసనలు మొదలంట్లా సంత్యజించినవాడనై ఉంటున్నాను. దేహ-మనో అతీతుడినై ఉంటున్నాను.
దేహధర్మములు ‘దేహి’ని అగు నావి ఎట్లా అవుతాయి?
‘స వాసనం’ మనో ‘‘జ్ఞానం’’।
‘‘జ్ఞేయం’’ నిర్వాసనం మనః।।
ఇప్పుడు నా మనస్సును రెండు భాగములుగా నాచే విభాగించబడుచూ…
- సవాసనతో కూడిన మనస్సును ‘జ్ఞానము’గాను.
- నిర్వాసనమయమైన మనో విభాగమును జ్ఞేయము (తెలుసుకోవలసినది) గాను దర్శనము చేయు విభాగినై ఉంటున్నాను.

మనస్సు
1. నిర్వాసన మనస్సు
2. సువాసన మనస్సు
చిత్తే త్యక్తే లయం యాతి
ద్వైతం ఏతత్ చ సర్వతః।
అయితే ఏ ద్వైత-జ్ఞానవిభాగము మనస్సునకు అనుభవమౌతోందో, అట్టి ద్వైతమంతా కూడా చిత్తలయముతో స్వయముగా లయము అగుచున్నది
శిష్యతే పరమగ్ం శాంతం
ఏకమ్ స్వచ్ఛం అనామయమ్,
అనన్తం, అజం, అవ్యక్తం, అజరగ్ం
శాంతం, అచ్యుతమ్,
మనస్సు లయించగా శేషించియుండు మమాత్మ ఎట్టిది? పరమశాంతము. ఏకము. స్వచ్ఛము. అనామయము (దేనిచేతను కప్పబడజాలనిది). అనన్తము. అజము (జన్మ-అను ధర్మము లేనట్టిది), (సమస్తమును వ్యక్తీకరిస్తూ ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ, తాను) అవ్యక్తము అయినట్టిది. అజరామరమైనది. శాంతము. స్వయం-స్థానము నుండి ఏమాత్రము చ్యుతి (Distraction) లేనట్టిది.
అద్వితీయం అనాద్యంతం
యత్ ఆద్యం ఉపలంభనమ్
(తెలుసుకొనుచున్నట్టిది అనుభూతరూపము)
ఏకం, ఆద్యన్త రహితం, చిత్‌మాత్రం,
అమలం తతమ్।
(స్వస్వరూపమునకు-త్వమ్‌నకు- జగద్దృశ్యమునకు ద్వితీయము కాదు కాబట్టి) అద్వితీయమైనట్టిది, ఆద్యంతరహితము.
మొట్టమొదటే చైతన్యరూపమై ఉండి సర్వమునకు స్వయముగా ప్రత్యుత్సాహ రూపంగా ప్రదర్శనము అగుచున్నదే - మమాత్మ. అది సర్వదా ఏకము. ఆద్యన్తరహితము. నిర్మల ఎరుక రూపము (చిన్మాత్రం అమలమ్) కూడా.
ఖాదపి అతితరాం సూక్ష్మం
తత్ బ్రహ్మాస్మి। న సంశయః।।
సర్వత్రా విస్తరించియున్నది, సర్వముగా వేంచేసి ఉన్నది మమాత్మయే! ఆకాశముకంటే అత్యంత సూక్ష్మమగు ఆత్మయే నేనై ఉన్నాను. ఇందులో అనుమానమే లేదు.
దిక్ కాలాది అనవచ్ఛిన్నగ్ం
స్వచ్ఛం నిత్యోదితం తతమ్,
సర్వార్థమయం ఏకార్థం
‘‘చిన్మాత్రం అమలం’’ భవ।।
అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. అందుచేత ఓ నిదాఘా! దిక్కు-కాలములచే విభాగము పొందనిది, స్వచ్ఛము - నిత్యోదితము, సర్వత్రా విస్తరించి ఉన్నది, ఏకార్థమే అయి, సమస్త పదార్థములుగా ప్రదర్శనమగుచున్నది - అగు ‘‘నిర్మలాత్మ’’ నీవై అయి ఉండెదవు గాక! తత్ త్వమ్ అసి! అదియే నీవై ఉన్నావు సుమా! ఈ విషయంలో నిస్సందేహుడవు అగుము.
9. సర్వం ఏకం ఇదగ్ం శాంతం
ఆది-మధ్య-అంత వర్జితమ్,
భావ-అభావమ్, అజం, సర్వం
ఇతి మత్వా సుఖీభవ।।
‘‘మమాత్మయే ఈ సమస్తము అయినదై, సర్వదా ఏకమై, ఆదిమధ్యాంతరహితమై, భావ-అభావస్వరూపమై, అజమై, సర్వము అయి వెలుగొందుచున్నది’’ - అను ఆత్మభావనను స్వీకరించుము. ఇంకేమున్నది? సర్వ ఆదుర్దాలను జయించి సుఖవంతుడవు కాగలవు.
న బద్ధో అస్మిన। ముక్తో2స్మి ।
‘బ్రహ్మ’ ఏవ అస్మి నిరామయమ్,।
ద్వైతభావ విముక్తః అస్మి (విముక్తో2స్మి ),
సత్ చిత్ ఆనంద లక్షణః।।
ఏవం భావయ యత్నేన ‘‘జీవన్ముక్తో’’ భవిష్యసి।
ఎప్పుడైతే ఈ జీవుడు →
• ఆత్మగా నాకు బంధము లేదు. ముక్తి లేదు.
• సర్వదా నిరామయమగు (Clean and unclouded) బ్రహ్మమే అయి ఉన్నాను.
• సమస్త ద్వైతభావములనుండి సర్వదా విముక్తుడనే అయి ఉన్నాను.
• నాయొక్క స్వరూపము సత్ - చిత్ - ఆనంద లక్షణ సమన్వితము మాత్రమే!’’
- అని ప్రయత్నపూర్వకంగా భావన చేయువాడై ఉంటాడో, - ఆతడు ‘‘జీవన్ముక్తుడు’’ అనబడుచున్నాడు.
పదార్థ బృందే దేహాది,
థియా సంత్యజ్య దూరతః।
ఆశీత శాంతః కరణో
నిత్యమ్ ఆత్మపరో భవ।।
ఈ భౌతికదేహము మొదలుకొని సమస్త పదార్థముల పట్ల సమస్త అవినాభావ సంబంధములను బుద్ధితో దూరంగా త్యజించివేయి.
అతఃకరణమునందు ఆసీనుడవై ఉండుము. నిత్యము ఆత్మపరుడవై ఉండు. అంతేగాని దృశ్యపరుడవుగానో, దేహపరుడవుగానో అయి ఉండవద్దు. (Be your own ‘self’ by duly discarding all Scenery related Barriers).
ఇదగ్ం రమ్యం, ఇదం న ఇతి (నేతి)
బీజం తే దుఃఖ సంతతేః।
‘‘ఇదిగో, ఇది నాకు రమ్యమైనది. నా దృష్టిలో అందమైనది. అది నాకు రమ్యము కాదు’’ - అనునదే నీయొక్క అనేక దుఃఖసంతతికి (దుఃఖపరంపరలకు) బీజము. అట్టి బీజమును నిర్బీజము చేసివేయి. ఏది ఎట్లా ఉన్నా కూడా, ఒకే తీరై ఉండునదే స్వస్వరూపాత్మ.
తస్మిన్ ‘సామ్య’ అగ్నినా దగ్ధే,
దుఃఖస్య అవసరః కుతః?
అటువంటి రమ్య-అరమ్య భేదభావలన్నీ ‘సర్వత్రా సమదర్శనము’ అను సామ్యాగ్నిచే దగ్ధం చేస్తే, ఇక ఆపై నీవు దేనికైనా సరే - దుఃఖము పొందవలసిన అవసరము ఏముంటుంది?
శాస్త్ర సజ్జన సంపర్కైః
ప్రజ్ఞాం ఆదౌ వివర్థయేత్।
ఋతగ్ం సత్యం పరంబ్రహ్మ
సర్వ సంసార భేషజం।।
(1) శాస్త్రముల అధ్యయనము, (2) సజ్జనులతో సత్సంగము, (3) స్వకీయమైన వివేకములచే ఆత్మసంబంధమైన ప్రజ్ఞను ముందుగా వృద్ధి చేసుకో!

ఈ సంసార భేషజముయొక్క వాస్తవరూపము - ఋతము (మహనీయుల స్వానుభవము), సత్యము (సత్‌స్వరూపము) అగు పరబ్రహ్మమేగాని మరొకటేదీ కాదు.
అత్యర్థం అమలం నిత్యం
ఆదిమధ్యాంత వర్జితమ్,
తథా స్థూలం అనాకాశం
అసగ్ంస్పృశ్యం అచాక్షుషమ్।
న రసం, న చ గంధాఖ్యం,
ఓ సువ్రతా! ఆత్మ ఎట్టిదంటే - అత్యంత అమలము (నిర్మలము). నిత్యము. ఆది (Begining), మధ్య (Inbetween), అంతములు (The End up) - కించిత్ కూడా లేనట్టిది.
• అయినా కూడా, స్థూలమగు ఆకాశము వంటిది (శూన్యము) కాదు.
• స్పర్శకు చక్షువులకు విషయము కాదు. నాలుకకు రుచిగాని, ముక్కుకు గంధముగాని కాదు.
అప్రమేయం అనూపమమ్।
ఆత్మానగ్ం సచ్చిదానందం
అనంతం-బ్రహ్మ, సువ్రత!
ఓ సువ్రతా!
• సమస్తమునకు అప్రమేయమైనట్టిది [ దేనితోను ప్రమేయము (Relatedness) కించిత్ కూడా లేనట్టిది) ]
• అనూపము (దేనిచేతను ఆక్రమించబడనట్టిది Unoccupiable by anything)
• సత్ చిత్ ఆనందము (ఉనికి, ఎరుగుట - సమస్త కల్పనము తన ఆనందము కొరకే) అయినట్టిది.
• దేనిచేతను పరిమితము కానట్టిది. కాబట్టి అనంతము.
10. ‘అహమ్ అస్మి’ ఇతి అభిధ్యాయేత్,
ధ్యేయ-అతీతం విముక్తయే,
సమాధిః సంవిత్ ఉత్పత్తిః
పర-జీవ ఏకతాం ప్రతి।।
‘‘నేను దృశ్యములో ఒకానొక భౌతిక వస్తువు వంటివాడను కాదు. సర్వదా ఆత్మయే అయి ఉన్నాను’’ - అను ధ్యానముచే నీవు ధ్యేయము (ధ్యానము చేయబడుచున్న సమస్త దృశ్యము) నకు అతీతుడవై ఉండగలవు. ధ్యేయము నుండి (ఇంద్రియ విషయములనుండి) విముక్తుడవు అవగలవు.
జీవాత్మ మరియు పరమాత్మ (కేవలము, సాక్షి)ల ఏకమేవానుభవమే ‘సంవిత్‌స్వరూప’ సమాధి.
నిత్యః సర్వగతో హి ఆత్మా
కూటస్థో దోష వర్జితః
ఏకః సంభిద్యతే భ్రాంత్యా
మాయయా, న స్వరూపతః।।
ఆత్మ నిత్యము. సర్వగతము (సర్వత్రా విస్తరించినదై ఉన్నట్టిది). ఆభరణమునకు బంగారమువలె, తరంగమునకు జలమువలె, మట్టి బొమ్మకు మట్టివలె) మూలము. సర్వకాలములలో ఒకేరూపము కలిగి ఉండుటచే కూటస్థము. ఏకమే అయి ఉండి కూడా, భ్రాంతిచే - అట్టి ‘‘ఆత్మయే స్వస్వరూపము’’గా అగుపించక ఉన్నది. ‘‘దేహమే నా స్వస్వరూపము?’’ - అను భ్రమ కలిగి ఉంటోంది.
(అట్టి ఏమరుపు ఆత్మకు స్వయం కల్పిత లీలా-క్రీడా వినోదమువంటిది మాత్రమే స్వయంకల్పిత ‘సంబంధ’ నిర్మిత ‘బంధన’ చమత్కారము).
తస్మాత్ ‘అద్వైత’ ఏవ అస్తి
న ప్రపంచో। న సగ్ంసృతిః।
అందుచేత అద్వితయమగు ఆత్మయే ఉన్నది. ఇంతకుమించి మరొకటి (ద్వితీయము) లేదు. ప్రపంచము లేదు. సంసృతి లేదు.
యథా ఆకాశో ‘ఘటాకాశో’
‘మహాకాశ’ ఇతి ఈరితః,
తథా భ్రాంతైః ద్విధా ప్రోక్తో హి
ఆత్మా ‘జీవ-ఈశ్వర’ ఆత్మనా।
ఒకే ఆకాశము.
(1) ఘటాకాశము (కుండలోని ఆకాశము) - (ఇంటిలోగల కుండ)
(2) మఠాకాశము (ఇంటిలోని ఆకాశము) - (ఇల్లు)
(3) బాహ్యాకాశము
(4) మహాకాశము (ఇల్లు, తదితర సర్వ ప్రదేశములు, భూమి, సూర్యుడు, నక్షత్ర మండలములు చోటుపొందుచున్న ఆకాశము)
- అని పేర్లతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు కూడా - ఆకాశము సర్వదా ఏకము, అవిభాజ్యము (United and indivisble) అయి ఉన్నది కదా!
- అట్లాగే ఇక్కడ ఆత్మాకాశము దృష్ట్యా అద్వితీయమగు ఆత్మయే ఉన్నది. అందుకు ద్వితీయముగా కనిపించే ప్రపంచము లేదు. అద్దానితో బంధ రూపమగు సంసృతి (కల్పనాబంధము) లేదు. జీవుడు లేడు. బంధమే లేనప్పుడు, అది తొలగవలసిన అగత్యము ఎక్కడిది?
అయితే భ్రాంతి తొలగటానికై, అట్టి భ్రాంతిగలవారికి బోధించటము యొక్క ప్రారంభదశలో అపరిపక్వ బుద్ధులకు ‘జీవుడు-ఈశ్వరుడు’ అనే ద్వైతము కల్పించబడుతోందేగాని వాస్తవానికి ఆత్మకు జీవ-ఈశ్వర భేదము ఉన్నదని ముఖ్యోద్దేశ్యము కాదు.
యదా మనసి చైతన్యం
భాతి సర్వత్రగం సదా,
యోగినో అవ్యవధానేన
తథా సంపద్యతే స్వయమ్।।
చైతన్యము నుండే ఆలోచన జనిస్తోంది. ఏవిధంగా అయితే సర్వగతమగు చైతన్యమే మనస్సుగా కూడా సర్వత్రా భాసిస్తోందో, అదే విధంగా యోగులు అనుభవమును అనుసరించి ‘‘ఏకమగు ఆత్మయే జీవుడు - ఈశ్వరుడు, పరమాత్మలుగా స్వయముగా తన అఖండత్వము వీడకుండానే భాసిస్తోంది.’’ ఆ తీరుగా భాసిస్తూ కూడా ఆత్మ మూడుగా అవటంలేదు.
యదా సర్వాణి భూతాని
స్వ-ఆత్మన్యేవ హి పశ్యతి,
సర్వభూతేషు చ ఆత్మానం
బ్రహ్మ సంపద్యతే తదా।।
బ్రహ్మము స్వానుభవముగా అయ్యేది ఎట్లా?
ఎప్పుడైతే సర్వభూత జాలము కూడా ‘‘స్వ-ఆత్మయే। నా ఆత్మయే।’’ అని దర్శించబడుతోందో,
‘‘సర్వభూతజాలమునందు నా ఆత్మ వేంచేసియే / ఏర్పడియే ఉన్నది. సర్వ భూతజాలము నా ఆత్మయందే ఆత్మకు అభిన్నమై యున్నది’’….అనిపించసాగుతోందో,
అప్పుడు ఇక ఆత్మ ఇప్పుడే, ఇక్కడే అనుభవమై సిద్ధించగలదు. అదియే సమాధి స్థితి.
యదా సర్వాణి భూతాని
సమాధిస్థో న పశ్యతి,
ఏకీ భూతః పరేణ అసౌ
తదా భవతి కేవలః।
ఎప్పుడైతే తాను సమాధిస్థితుడై అన్యమునంతా తన స్వరూపమునందు అంతర్ చమత్కారముగా దర్శించబడుచున్నాడో, ఇక్కడ భూతజాలము చూడక, ఆత్మను మాత్రమే దర్శిస్తాడో…
అట్టివాడే ఏకీభూతుడు.
ఆతడే పరమాత్మస్వరూపుడు.
ఆతడే కేవలుడు. ఆతని స్థితియే కైవల్యము. (కేవలానుభవేతి కైవల్యమ్)।
11. సప్తభూమికలు

శాస్త్ర సజ్జన సంపర్క
వైరాగ్య రసరూపిణీ,
ప్రథమా భూమికా ఏషా
ఉక్తా ‘‘ముముక్షత్వ’’ ప్రదాయినీ।।
సప్తభూమికలు
అటువంటి అఖండాత్మాత్వము ఆత్మసాక్షారముగా బుద్ధికి సిద్ధించటానికై అధ్యాత్మ శాస్త్రముచే సప్తభూమికలు (Seven Steps) చెప్పబడుచున్నాయి.
(Ⅰ) ముముక్షుత్వ ప్రదాయినీ భూమిక
(1) శాస్త్రములు చెప్పేదే అధ్యయనము చేయటము, (2) సజ్జనులతో (ఆత్మతత్త్వజ్ఞులతో) సత్సంగపూర్వక సంభాషణా - సంపర్కము (3) దృశ్య విషయములపట్ల రాగము తొలగినప్పటి వైరాగ్యము-ఈ మూడు రసరూపముగా (ఇష్టము) కలిగినట్టిదే (అభ్యాసరూపమే) ప్రథమ భూమిక. అధ్యయన - సత్సంగ - వైరాగ్యములచే ప్రథమభూమికయగు ‘‘ముముక్షుత్వము’’ అను రుచి లభిస్తుంది.
‘విచారణా’ ద్వితీయా స్యాత్।
(Ⅱ) ద్వితీయభూమిక = ‘‘విచారణ’’ : బాహ్యరంగము, అంతర్ - రంగము, జీవుడు - ఈశ్వరుడు - పరమాత్మ, జన్మ, మృత్యువు, ముక్తి, మోక్షము, జన్మరాహిత్యము-ఇత్యాదుల గురించిన విశేషాలతో కూడిన ‘ఆత్మవిచారణ’.
తృతీయా ‘‘సాంగ భావనా’’।।
(Ⅲ) తృతీయ భూమిక - ‘‘సాంగభావనా’’ : దేహి - దేహము, స్థూల సూక్ష్మ కారణ కేవల శరీరముల గురించిన అవగాహన. ఈ దృశ్యమాన మగుచున్న సమస్తమును ఆత్మయొక్క (ఆత్మకు) అంగముగా భావన చేయటము. ‘‘ఆత్మయే అంగముల ప్రదర్శనముగా అగుచున్నది’’ - అను అవగాహనము ఆశ్రయించటము.
‘‘విలాపినీ’’ చతుర్థీ స్యాత్,
వాసనా విలయాత్మికా।
(Ⅳ) నాలుగవ భూమిక - విలయాత్మికా - దృశ్యమునకు సంబంధించిన వాసనలను (All type of Tendencies) ఆత్మభావనయందు లయింపజేయు యత్నము, కార్యక్రమము. దృశ్యమును ఆత్మకు అనన్యముగా చూడటము → దీనిని ‘విలాపినీ భూమిక’ - అని కూడా అంటారు. ఇదియే విలయాత్మికము.
‘‘శుద్ధసంవిత్’’మయ
ఆనంద రూపా
భవతి పంచమీ।
అర్థ సుప్త ప్రబుద్ధాభో
‘‘జీవన్ముక్తో’’ అత్ర తిష్ఠతి।।
(Ⅴ) పంచమ భూమి - ‘‘శుద్ధ సంవిత్‌మయ ఆనందా’’ : ‘‘ఎరుక (knowing) +ఎరుగబడునదీ - అను వాటిలో ఎరుగబడుదానిని ప్రక్కకు పెట్టితే, అప్పటికీ శేషించేదే శుద్ధ సంవిత్. అద్దాని అనుభవమే శుద్ధ సంవిదానంద రూపము. కేవల ఎరుక రూపదర్శనము. అట్టివాడు అర్ధసుప్త (Half sleeping) ప్రబుద్ధుడు. అట్టివాడు జీవాత్మబంధము లేనివాడై, జీవన్ముక్తుడై ఉంటాడు. ‘‘జీవుడుగా ఉండి కూడా, నాకు బంధము లేదు’’ అను భావన కలవాడు - జీవన్ముక్తుడు.
‘‘అసంవేదన’’ రూపా చ
షష్ఠీ భవతి భూమికా।
ఆనంద ఏక ఘనాకారా
సుషుప్త సదృశీ స్థితిః।
(Ⅵ) ఆరవ భూమిక - ‘‘అసంవేదన’’ : తెలియబడే సమస్తము అన్యముగా లేకుండా, ఆత్మకు అనన్యముగా స్వానుభవమగు (తెలియబడు) స్థితి. దృశ్యము ఆనందముగాను, ఏకముగాను, ఘనీభూత సుషుప్తితో సమానముగాను అనిపించునట్టి దశ. సుషుప్తిలో ఉన్నవానివలె అన్యమంతా లేనిదవటము.
‘తుర్య’ అవస్థ ఉపశాంతా సా
ముక్తిః ఏవ హి కేవలా!
‘‘సమతా స్వచ్ఛతా సౌమ్యా’’
సప్తమీ భూమికా భవేత్।
(Ⅶ) ఏడవ భూమిక - ‘‘తుర్యక్’’ అవస్థ - సమస్తము స్వస్వరూపమునందు ఉపశాంతించినప్పటి స్థితి. అదియే ముక్తస్థితి, కేవలస్థితి - అని కూడా పిలువబడుతోంది. జాగ్రత్ స్వప్న సుషుప్తులు - స్వకీయ కల్పిత సంచారస్థలములుగా అనిపించు స్థితి.
ఈ 7వ భూమికలో సర్వత్రా సమభావన, ఆత్మగా సౌమ్యభావన- స్వాభావికముగా, అనుక్షణికముగా అగుచున్నాయి.
‘‘తుర్య-అతీతా’’ తు యా అవస్థా
పరా, ‘‘నిర్వాణరూపిణీ’’।
సప్తమీ సా పరా ప్రౌఢా
విషయో నైవ జీవతాం।
తరంగమును త్యజించిన వాయువువలె నిశ్చలము. ‘‘నిర్వాణరూపము’’. అనబడుచున్నది. ‘‘ఈ సమస్తము సర్వదా నేనే అయి ఉన్న నేను’’ - అను కేవల పరతత్త్వస్థితి.
పరాకాష్ఠ-తుర్యాతీతము. అది పరాప్రౌఢ (Maturity of that self which is always beyond). ఎవ్వరికి ఈ దేహముపట్ల, జీవితముపట్ల అభిమానము, అభినివేశము ఉంటుందో వారికి తుర్యాతీతము విషయ అగుటలేదు. తుర్యాతీతునికి జగత్తు విషయమే కాదు. జగత్తు స్వస్వరూపమునకు ‘అభిన్నము’ అగుచున్నది.
పూర్వ అవస్థాత్రయం తత్ర
‘‘జాగ్రత్’’-ఇత్యేవ సంస్థితమ్।
చతుర్థీ స్వప్న ఇతి ఉక్తా
‘‘స్వప్నాభం’’ యత్ర వై జగత్।
మొదటి మూడు భూమికలు అయినట్టి ముముక్షుత్వము (శభేచ్చ), విచారణ సాంగభావనలు - ఇక్కడి జాగ్రత్ అవస్థావిషయముల వంటివి.
నాలుగవ భూమిక అగు వాసనా విలయరూప విలాసినీ-స్వప్నము వంటిదిగా పోల్చబడుతోంది.
ఆనందైక ఘనాకారా
‘సుషుప్త్య’-ఆఖ్యాతు పంచమీ।
అసంవేదన రూపా తు
షష్ఠీ ‘‘తుర్యపదాభిధా’’।
ఇక ఐదవదగు ‘‘శుద్ధసంవిత్ మయారూపము’’ - సుషుప్తితో సమానము అనబడుతోంది. ఇది ఘనీభూతమైన ఏకానందరూపము.
‘‘అసంవేదనము’’ - ఆరవదగు ఏడవదగు ‘తుర్యక్ పదము’ - అను తెలియబడేదంతా తెలుసుకుంటున్న చిత్ నందు ఏకత్వము పొందటము. అసంవేదనము లేక అనన్యత్వము సిద్ధిస్తోంది.
‘‘తుర్య-అతీత పద’’ అవస్థా
సప్తమీ భూమికోత్తమా।
మనో వచోభిః అగ్రాహ్యా।
స్వప్రకాశా, సదాత్మికా।।
అసంవేదనము లేక అనన్యత్వము సిద్ధిస్తోంది.
ఆపైగల తుర్యాతీతపదమగు పరాకాష్ఠ అత్యంత ఉత్తమోత్తమమైన అవస్థ. అది మనస్సు చేత కూడా గ్రహించబడేది కాదు. అది ఆత్మయొక్క సత్ ప్రకాశాత్మకమైనది. స్వాభావికమగు సమగ్రత్వము.
అంతః ప్రత్యాహృతి (ప్రతి ఆహృతి) వశాత్,
చైత్యం చేత్ న విభావితమ్।
ముక్త ఏవ న సందేహో -
మహా సమతయా తయా।।
అంతరంగమునకు సంబంధించిన ప్రత్యాహారము యొక్క అట్టి అభ్యాసముచే ఇక చైత్యము (తెలియబడునది) స్వాభావికంగానే (స్వస్వరూపమునకు వేరుగా) ప్రకాశించదు.
ఆతనిది ‘మహాసమత్వస్థితి’. కాబట్టి అది ‘ముక్త’ స్థానమే. ఇందులో సందేహమే లేదు.
న మ్రియే। న చ జీవామి।
న అహం సన్ ఆపి అసన్మయః, (సన్న్యాప్యసన్మాయః)
అహం న కించిత్ చిత్ -
ఇతి మత్వా ధీరో న శోచతి।।
‘‘నేను మరణించువాడను కాను. జీవించి ఉన్నవాడిని కాను. సత్-న్యాసుడను కాను. అసత్‌న్యాసుడను కాను. మరింకేమీ కాదు. ‘‘సర్వాత్మస్వరూపమగు కేవలాత్మయే నేను. ఇక్కడ తెలియబడుచున్నదేదీ నేనై ఉండలేదు’’ - అని గ్రహించి ఆ తురీయాతీత ధీరుడు ఇక దేనికీ శోకించడు. సర్వము తానై వినోదిస్తాడు కూడా. సమస్తముతోను ఏకరూపుడౌతాడు.
12. అలేపకో అహమ్। అజరో।
నీరాగః శాంతవాసనః।
నిరంశో2స్మి చిత్ ఆకాశం, -
ఇతి మత్వా న శోచతి।
‘‘అఖండాత్మానంద - సమస్త స్వరూపుడను’’ - అగు నేను.
- ఎట్టి లేపనము [ జీవాత్మ- ఈశ్వరాది లేపనములు (outer pastings) ] లేనివాడను.
- జరామరణ రహితుడను.
- సమస్తము నేనే అయి ఉండటంచేత రాగరహితుడను. శాంతమగు స్వభావము కలవాడను.
- అంశరహితమగు చిదాకాశ స్వరూపుడను.
అని తనను గురించి తాను ఎరిగినవాడు ఇక దేనికీ శోకించడు.
అహం మత్వా విరహితః
శుద్ధో బుద్ధో అజరో అమరః,
శాంతః శమనం ఆభాస -
ఇతి మత్వా న శోచతి।।
‘‘ నేను భావాతీతుడను. ‘అహం’భావనకు మునుముందే భావన చేయుచున్నవాడను. దేనిపట్ల విరహము (అవినాభావము / Dependence) లేనివాడను. శుద్ధుడను. కేవల బుద్ధి స్వరూపుడను. జన్మ - మరణములు లేనివాడను. పరమశాంతుడను. అన్యముగా కనిపించిందంతా ఆభాస (Refraction) మాత్రమే. అదంతా సర్వదా శమించినట్టివాడను’’ - అని ఎరిగినవాడు ఇక ఆదుర్దాలేవీ లేనివాడగుచున్నాడు.
తృణాగ్రేషు అంబరే భానౌ
నర, నాగ, అమరేషు చ।
యః తిష్ఠతి ‘‘తత్ ఏవ అహం’’ -
ఇతి మత్వా న శోచతి।
‘‘ఒక గడ్డి పరక యొక్క చిట్టచివరగా ఉన్నది నేనే. ఆకాశమంతా నిండి ఉన్నాను కూడా! సూర్యునియందు, నరులయందు, నాగముల (పాములయందు) దేవతలందు ఏ ఆత్మ సుతిష్ఠించినదై ఉన్నదో - ఆ తత్ ఆత్మయే నేను!’’ - అని గ్రహించిన తరువాత ఇక వేదన ఎందుకుంటుంది? ఉండదు.
భావనాం సర్వభావేభ్యః
సం ఉత్సృజ్య సముత్థితః
అవశిష్టం పరంబ్రహ్మ కేవలో2స్మి -
ఇతి భావయ।
అందుచేత ఓ నిదాఘా! నీయొక్క సమస్త భావములకు సంబంధించిన ‘భావన’ను త్యజించి - ‘‘భావములకావల, భావించటానికి మునుముందే ఉన్న కేవలమగు పరబ్రహ్మమే నేను! బ్రహ్మమే ‘నేను’గా ఉన్నది నేనే! నేను బ్రహ్మమే అయి ఉన్నాను’’ - అని భావించవయ్యా!
వాచాం అతీత విషయో
విషయ ఆశాదశ ఉత్ తః (ఉజ్ఝతః)
పరానంద రస అక్షుబ్ధో
రమతే స్వాత్మని (స్వ ఆత్మన) ఆత్మని।
ఎవ్వడైతే -
• ఇంద్రియ విషయములపట్ల ఆశించు స్వభావమును జయించివేసి వాక్కుకు అతీతమైయున్న అక్షుబ్ధ (చంచలరహిత) పరానంద సాగర స్వరూపుడై స్వ-ఆత్మయందు ఆత్మగా రమిస్తూ ఉంటాడో,
సర్వకర్మ పరిత్యాగీ, నిత్యతృప్తో నిరాశ్రయః-
న పుణ్యే, న చ పాపేన,
న ఇతరేణ (నేతరేణ) చ లిప్యతే।
• సర్వకర్మలు మొదలంట్ల పరిత్యాగముచేసి ఉంటాడో, ‘ఆత్మతో ఆత్మను దర్శిస్తూ’ ఉంటాడో - దేనికీ ఆశ్రయముకాక, దేనినీ ఆశ్రయించక ఉంటాడో, - అట్టివాడు పుణ్యముచేతగాని, పాపముచేతగాని, మరింకే విశేషము చేతగాని దోషము పొందడు.
స్ఫటికః ప్రతిబింబేన
యథా నాయాతి రంజనమ్,
తన్ జ్ఞః కర్మఫలేన అంతః
తథా నాయాతి రంజనమ్।।
ఒక తెల్లటి స్ఫటికములో ఎదురుగా ఉన్న వస్తువు ఏదోరంగుతో ప్రతిబింబించినంత మాత్రంచేత ఆ వస్తువు యొక్క రంగు, దోషము మొదలైనవి స్ఫటికమునకు అంటుతాయా? అంటవుకదా! అట్లాగే, ఆత్మతత్త్వము యొక్క వాస్తవికత ఎరిగిన మహనీయుని అంతరమును కర్మఫలములు ఏమాత్రము రంజనము (ధూళి, దోషము) కలిగించలేవు.
13. విహరన్ జనతా బృందే
దేహ కర్తన పూజనైః,
ఖేద ఆహ్లాదౌ న జానాతి ప్రతిబింబ గతైః ఇవ।
నిస్తోత్రో, నిర్వికారశ్చ పూజ్య-పూజా వివర్జితః।
నీళ్ళలో కనబడే ప్రతిబింబమునకు నీళ్ల యొక్క కదలికచే లాభముగాని, నష్టముగాని ఉండదు కదా!
అట్లాగే ఆత్మజ్ఞుడు జనసమూహంలో విహరిస్తున్నప్పుడుగాని, ఈ దేహము పూజింపబడుచున్నప్పుడుగాని, ఖేద - ఆహ్లాదములు పొందుచున్నప్పుడుగాని - దేనికీ సంబంధించనివాడై, ఏదీ పొందనివాడై, అవేవీ తెలియరానట్టివాడై ఉంటాడు. అన్నీ నిర్వర్తిస్తూనే ఏమీ చేయనివాడై ఉంటాడు.

పూజించబడుచున్నప్పుడు, పూజిస్తూ ఉన్నప్పుడు కూడా…ఆ రెండిటిని వదలినవాడై, స్త్రోత్రరహితుడై, నిర్వికారుడై ఉంటాడు.
సంయుక్తశ్చ, వియుక్తశ్చ,
సర్వాచార నయక్రమైః।
తనుం త్యజతు వా తీర్థే,
శ్వపచస్య గృహే అథ వా,
జ్ఞాన సంపత్తి సమయే
ముక్తో అసౌ విగత ఆశయః।।
ఆచార వ్యవహారములపట్ల స్వీకరిస్తూనే స్వీకరించనివాడై ఉంటాడు.
ఈ భౌతిక దేహము ఒక తీర్థ ప్రదేశములో వదలుచున్నప్పుడుగాని, కుక్కమాంసము తిను శ్వపచుల ఇంటిలో త్యజించు సందర్భము ఏర్పడినప్పుడుగాని - ఎవ్వడైతే ఆత్మ జ్ఞానసంపన్నుడై ‘‘అమృత-ఆత్మానంద స్వరూపో2హమ్ భావనతో సర్వ లోక సంబంధములు త్యజించి ఉంటాడో’’ ఆతడు ముక్తుడే!
సంకల్పత్వగ్ం హి బంధస్య కారణం।
తత్ (సంకల్పత్వం) పరిత్యజ।।
నిదాఘుడు : గురువర్యా! ఋభుదేవా! అట్టి ఆత్మయే సహజస్వరూపముగా కలిగియున్నట్టి మాకు బంధము ఎక్కడి నుండి వచ్చిపడుతోంది?
ఋభుమహర్షి : ఓ నిదాఘ మహాశయా! ‘సంకల్పించము’ అనే మనో వ్యవహారము చేతనే బంధము ఏర్పడుతోంది. అందుచేత ఆత్మకు అన్యమైనట్టి సంకల్పము పరిత్యజించుము. రుగ్మతలన్నిటికీ అదే ఉపాయము.
మోక్షో భవేత్ అసంకల్పాత్।
తత్ (అసంకల్పాత్) అభ్యాసం ధియాకురు।
సావధానో భవ త్వం చ,
గ్రాహ్య గ్రాహక సంగమే।।
అసంకల్పమాత్రం చేతనే ఈ జీవునికి మోక్షము లభించగలదు. అందుచేత ‘ఉత్తమ, నిర్మల, సునిశిత, విశాల’ బుద్ధితో ‘సంకల్పించకుండటము’ అనే అభ్యాసమునకు ఇప్పుడే ఉపక్రమించు.
గ్రాహ్య (గ్రహించటము) గ్రాహక (గ్రహించువాడు) ములకు ఏర్పడుచున్న అవిజ్ఞాత - అభ్యాస పూర్వక పరస్పర సంబంధముపట్ల జాగరూకుడవై, సావధానుడవై ఉండెదవుగాక! సమస్త సంబంధములనుండి వేరైనవాడవై ఉండుము.
అజస్రమేవ సంకల్ప దశాః
పరిహరన్ శనైః।
అజస్రముగా (ఎల్లప్పుడు, ఏమాత్రము ఎడతెరిపిలేకుండా) చోటుచేసు కుంటున్న సంకల్పములనుండి విడివడి, ‘‘సంకల్పించక పోవటము’’ను అభ్యాసము చేయి. నెమ్మదిగా ‘‘సంకల్పించుచూ ఉండటము’’ అనే దశను ఉపసంహరించు. ఉపశమింపజేయి.
మా భవ గ్రాహ్య భావాత్మా।
గ్రాహకాత్మా చ మా భవ।।
గ్రాహ్య భావుడవు కావద్దు. (దృశ్యభావుడవు కావద్దు). గ్రాహక భావుడవు (ద్రష్ట భావుడవు) కావద్దు. ఆ రెండిటికీ ఆవలగా ఉండి, మౌనంగా చూస్తూ ఉండు.
భావనాం అఖిలాం త్యక్త్వా
యచ్ఛిష్టం (యత్ శిష్టం) తన్మయో భవ।।
సమస్త భావములు త్యజించి, అటుపై ఏది నీ స్వరూపముగా శేషించియుంటున్నదో, అట్టి ‘భావరహిత పరాత్మ రూపము’తో తన్మయుడవై ఉండియే ఈ దృశ్యమునందు సంచరించుము.
కించిత్ చేత్ రోచతే తుభ్యం
తత్ బద్ధో2పి భవస్థితౌ।
న కించిత్ రోచతే చేత్ తే
తత్ ముక్తో2సి భవస్థితౌ।।
ఈ దృశ్యములో ఏ కించిత్ వస్తువునుగాని, విషయమునుగాని - ‘‘నాకు చాలా యిష్టము’’ అను అవినా-భావన కలిగి ఉంటే, అది ‘భవబంధము’గా రూపము దిద్దుకొని ఉండగలదు. భావబంధమే భవబంధము.
దృశ్యములో ఏదీ కోరుకోకపోతే (లేక రుచించకపోతే) అప్పుడు నీవు ముక్తుడవై ముక్తిత్వమునందు సుస్థితి పొందుచున్నట్లే.
అస్మాత్ పదార్థ నిచయాత్
యావత్ స్థావర జంగమాత్
తృణాదేః దేహ పర్యంతాత్
మా కించిత్ తత్ర రోచతామ్।।
అందుచేత ఒక తృణము (గడ్డిపరక) నుండి ఈ దేహము వరకు ఈ స్థావర జంగమ పదార్థము ఏదీ కూడా నీకు ‘రుచించునది’ అయి ఉండకుండుగాక! ఆత్మ మాత్రమే ‘రుచి’ అగును గాక! అద్దాని సమస్తత్వ అప్రమేయత్వములు అభిరుచికి నీకు విషయమగు గాక!
14. అహంభావ - అనహంభావౌ
త్యక్త్వా సత్-అసతీ తథా,
యత్ అసక్తం సమం స్వచ్ఛం
స్థితం తత్ ‘‘తుర్యం’’ ఉచ్యతే।।
తుర్యగము : అహంభావము - అనహంభావములను, (అట్లాగే) సత్-అసత్‌లను త్యజించినవాడవై, అప్పటికీ ఎటువంటి…
- ఆసక్తి రహిత,
- సర్వత్రా సమస్వరూప,
- దోషరహిత - స్వచ్ఛ స్థితి ఉన్నదో - అదియే ‘తుర్యము’.
యా స్వచ్ఛా సమతా శాంతా, జీవన్ముక్త వ్యవస్థితిః।
‘సాక్షి’ అవస్థా వ్యవహృతౌ
సా ‘తుర్యకలన’ ఉచ్యతే।।
ఏది స్వచ్ఛము, సమతము, శాంతము, జీవన్ముక్తముగా వ్యవస్థితమైనట్టిదో, ‘సాక్షి-అవస్థ’గా వ్యవహృతమైనదో - అదియే ‘తుర్యకలనము’ అని చెప్పబడుచున్నది.
అసంభవాత్

నైతత్ (న ఏతత్) జాగ్రత్। న చ స్వప్నః।
(కింతు) సంకల్పానాం అసంభవాత్।
అసంభవాత్

అట్టి ఆత్మతత్త్వానుభవము జాగ్రత్ వంటిది కాదు. స్వప్నము వంటిది కాదు. ఎందుకంటే జాగ్రత్ స్వప్నములు సంకల్పములచే సంభవిస్తాయి. ఆత్మయో? నిర్విషయము. అద్దానియందు ‘సంకల్పము’ అనే అన్యమైనది అసంభవము. సమస్త సంకతల్పములను మనముందే ఉన్న - ఆ సంకల్పించువాని స్వస్వరూపానందము. (జీవన్-మరణములు కూడా భావనామాత్ర అనుభవములే).
సుషుప్తి భావో, నోప్యేత
అభావాత్ జడతా స్థితేః
ఆత్మానుభవము సుషిప్త్యనుభవము వంటిదా? కాదు. ఎందుకంటే సుషుప్తి - అభావన రూపమగు జడస్థితి మాత్రమే. భావములు ఉండియే వర్తమానంలో నిశ్శబ్దత పొందినవై ఉంటాయి. ఆత్మయో సుషుప్తికి కూడా ఉనికి స్థానము.
శాంతః సమ్యక్ ప్రబుద్ధానాం
యథా స్థితం ఇదం జగత్, -
సమ్యక్ (సర్వత్రా సమస్వరూపమును సిద్ధించుకొన్న) ప్రబుద్ధులకు (అసత్ నుండి ప్రబుద్ధము సిద్ధించుకొన్న వారికి) యధాస్థితమగు ఈ దృశ్య జగత్తంతా కూడా పరమశాంతరూపమై గోచరిస్తూ ఉన్నది.
విలీనం ‘తుర్యం’ ఇతి ఆహుః-
అబుద్ధానాం స్థితం స్థిరం।।
అబుద్ధులకు ఈ దృశ్యమంతా స్థిరమై ఘనీభూతముగా కనిపిస్తూ ఉంటే, సమ్యక్ సిద్ధి పొందిన ఆత్మజ్ఞులకు ఇది తుర్యము (సాక్షి) యందు సర్వదా విలీనమై యుండియున్నట్లు అగుపిస్తోంది.
అహంకార కలా త్యాగే
సమతా యాః సముద్గమే
విశరారౌ కృతే చిత్తే
తుర్యావస్థా ప్రతిష్ఠితే।।
అహంకార కలనము (భ్రమ) త్యజించబడగా, సర్వత్రా సమదృష్టి బయల్వెడలుచుండగా, చిత్తమునందు ‘అన్యము’ అయినదంతా తొలగిపోవుచుండగా - అట్టి వాని చిత్తము అనన్యమగు ‘తుర్యక్’ అవస్థ యందు ప్రతిష్ఠితము అగుచున్నది.
సిద్ధాంతో అధ్యాత్మ శాస్త్రాణాం
సర్వ అపహ్నవ ఏవ హి।
ఓ నిదాఘా! ఆత్మతత్త్వానుభవము సిద్ధించిన తరువాత ఇక శాస్త్రములతో కూడా పని ఉండదు. (శాస్త్రాన్యపి సంత్యజతి।). ఎందుకంటే అధ్యాత్మశాస్త్ర సిద్ధాంతాలన్నీ కూడా ఒక రకంగా పరతత్త్వానుభవమును కప్పిపుచ్చి ఉంచేవే. (అపహ్నవ ఏవ). మఱుగున ఉంచేవే! అనుభవం నుండి శాస్త్రం వస్తుంది. శాస్త్రం నుండి అనుభవము కాదు. శాస్త్రములు అనుభవమునకు దారిచూపి, ఇక ఆపై తమ స్థానమునుండి తొలగిపోతాయి.
న అవిద్యాస్తి ఇహ। నో మాయా।
‘శాంతం బ్రహ్మ’ ఇదం అక్లమమ్।
శాంత ఏవ చిత్ ఆకాశే,
స్వచ్ఛే శమ - శమాత్మని।।
ఇక్కడ అవిద్యలేదు. మాయ లేదు. క్లమము లేని (శ్రమలేని, బడలిక లేని) శాంతమగు బ్రహ్మము మాత్రమే ఉనికి కలిగియున్నది.
అట్టి చిదాకాకాశము స్వచ్ఛము శమమునందు శమించినట్టిది. పరమశాంతము. ఈ జీవునియొక్క - ‘‘సమస్తము తనయందు (ఆత్మదర్శనముచే) శమింపజేసుకొన్న - సశాంతస్వరూపము’’.
సమగ్ర శక్తి ఖచితే
‘బ్రహ్మ’ ఇతి - కలితాభిధే।
సర్వం ఏవ పరిత్యజ్య
‘‘మహామౌనీ’’ భవ, అనఘ!
ఓ నిదాఘా! సమగ్రశక్తి రూపమగు ‘బ్రహ్మము’ అను తత్త్వమునందు సమస్తమును జారవిడచినవాడవై, సర్వము బ్రహ్మమునకు అనన్యముగా ఏకము చేసివేయి. నీవే బ్రహ్మమై ఉండుము.
సమస్త భేదములను (ఆత్మకు అన్యముగా మనోభ్రమచే అనిపించే సమస్తమును) త్యజించి వేయుము. ఓ అనఘా! పాపరహితుడా. ‘మహామౌని’వై ఉండుము.
నిర్వాణవాన్ నిర్మనసః
క్షీణ చిత్తః ప్రశాంత ‘‘ధీః’’।।
సంచలనములన్నీ అధిగమించి : -
• నిర్వాణవంతుడవగుము.
• మనోరహితుడవై, అతీతుడవై ఉండుము. మనస్సుకు (ఆలోచనలకు) సాక్షివై చూస్తూ ఉండుము.
• ‘ప్రియము’ రూపమగు చిత్తమును క్షీణింపజేయుము. ఆత్మానందమునందు ఏకము చేసివేయుము.
• సంశాంతించిన ప్రశాంత బుద్ధితో విరాజిల్లుము.
15. ఆత్మన్యేవ అస్య శాంతాత్మా,
(ఆత్మన ఏవ అస్య శాంత-ఆత్మా)
మూక అంథ బధిర ఉపమః।
జగద్విషయ పరిచయములందు (సమస్త ఇంద్రియార్థములందు) - చెవిటివానివలెను (వినీ విననివాడివలెను),
- చూస్తూ కూడా చూడని వానివలెను (అంధునివలెను),
- మాట్లాడుతూ కూడా మూగవానివలెను (మాట్లాడనివానివలెను) - అగుచూ,
ఆత్మయందు సశాంతించిన శాంతాత్ముడవు - అయి ఉండుము.
నిత్యం అంతర్ముఖః స్వచ్ఛః
స్వాత్మనాంతః ప్రపూర్ణ ధీః।
స్వాత్మయందు పరిపూర్ణమగు బుద్ధి వెంటనంటియుండగా, నిత్యము అంతర్ముఖుడవు, స్వచ్ఛుడవు అయిఉండుము. అందరిలోను, అందరిగాను ఆత్మను దర్శించుము. (అందరిలోను అంతరాత్మను మాత్రమే దర్శిస్తూ, ఉపాసించువాడు - ‘‘అంతర్ముఖుడు’’).
జాగ్రత్ ఏవ సుషుప్తస్థః
కురు కర్మాణి వై, ద్విజ!
అంతః సర్వ పరిత్యాగీ,
బహిః కురు యథా గతమ్
జాగ్రత్‌లో కూడా సుషుప్తునివలె, దేనిచేతనూ స్పృశించనివాడవై కర్మలు నిర్వర్తించుము. బాహ్యమున కర్మలు నిర్వర్తిస్తూనే అంతరమున సర్వము పరిత్యాగము చేసినవాడవై ఉండుము. నిద్రాళువులె - ఏదీ ఏమాత్రము పట్టనట్లుగా - అంతరమున ఉండుము.
చిత్త సత్తా పరం దుఃఖం।
చిత్త త్యాగః పరం సుఖమ్।
అతః చిత్తం చిత్ ఆకాశే
నయ క్షయం అవేదనాత్।
ఓ నిదాఘా!
• చిత్తముయొక్క ఉనికియే పరమ దుఃఖము.
• చిత్తముయొక్క త్యాగమే పరమ సుఖము.
(కాబట్టి) అట్టి చిత్తమును ఎటువంటి వేదన లేకుండా చిదాకాశమునందు లయము చేసివేయుము.
దృష్ట్వా రమ్యం అరమ్యం వా
స్థేయం పాషాణవత్ సదా।
ఏతావతా(త్) ఆత్మయజ్ఞేన
జితా భవతి సంసృతిః।।
ఇక ‘సంసృతి’ లేక ‘సంసారము’ మాటేమిటంటావా?
రమ్యమైన (మరియు) అరమ్యమైన వస్తువులుగాని, విషయములుగాని రూపములుగాని కనిపించినప్పుడు ఒక శిలవలె అంతరమున ఆత్మ భావనతో నిశ్చలుడవై ఉండు.
ఈ మాత్రము భావనయే ఆత్మయజ్ఞము. అట్టి ఆత్మయజ్ఞముతో ఈ సంసారము (లేక) సంసృతిని జయించినవాడవు కాగలవు.
నియమః
వేదాంతే పరమం గుహ్యం
పురా కల్ప ప్రచోదితమ్।
న అప్రశాంతాయ దాతవ్యం
(నా) పుత్రా (యా) శిష్యాయ వై పునః।
(న అపుత్రాయ, అశిష్యాయ వై పునః)
ఓ ప్రియ నిదాఘమహాశయా! సమస్త కల్పనలకు మునుముందే ఉండి, సమస్తమును ప్రభోదితము (Inspiring Directing) చేస్తున్న పరమరహస్యమగు వేదాంత (తెలుసుకొనుచున్నవానిగురించిన) శాస్త్రమును నీకు ఇప్పుడు బోధించాను. ఇతఃపూర్వము బోధించబడినదే ఇప్పుడు నీకు వర్ణించి చెప్పాను.
ఇది నీవు అర్హతగల వారికి బోధించు. అయితే
- ఎవ్వరు ప్రశాంతమనస్కులై ఉండరో
- ఎవ్వరు ‘‘తండ్రీ।’’ - అను పుత్రభావము వహించరో, శిష్యభావము కలిగి ఉండరో, అట్టి వారు బోధకు అర్హులు అవజాలరు.
ఫలశృతి

అన్నపూర్ణ ఉపనిషదం యో అధీతే
గురు అనుగ్రహాత్
స జీవన్ముక్తతాం ప్రాప్య
బ్రహ్మైవ (‘బ్రహ్మ’ ఏవ) భవతి స్వయమ్।।

ఇతి ఉపనిషత్।।
(అన్నపూర్ణోపనిషత్ సమాప్తా)
ఎవ్వరైతే గురుదేవుల అనుగ్రహం పొంది ఈ అన్నపూర్ణోపనిషత్ అధ్యయనము చేస్తారో…
- వారు స్వయముగా బ్రహ్మమే అగుచున్నారు.
(బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి)

ఇతి అన్నపూర్ణోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః
అధర్వణ వేదాంతర్గత

3     అన్నపూర్ణ ఉపనిషత్

అధ్యయన పుష్పము


కొన్ని పౌరాణిక విశేషములు


ఋభు మహర్షి = సర్వశ్రీ సనక, సనంద, సనత్కుమార, సనస్సుజాత, దేవర్షి నారద మొదలైనవారివలెనే బ్రహ్మమానస పుత్రులలో ఒకరు. నిదాఘునికి గురువు.

ఒకరోజు ఒకరాజు ఒక ఎనుగును ఎక్కి ఎటో పోవుచూ ఉన్నారు. అప్పుడు ఋభుమహర్షి నిదాఘుని పిలచి, అది చూపించి, ‘‘శిష్యా! నిదాఘా। వీరిలో ఎవరు రాజు? ఎవరు ఏనుగు?’’ - అని ప్రశ్నించారు.

అప్పుడు నిదాఘుడు (‘‘గురువుగారు సరదాగా అడుగుచున్నారులే।’’ అని తలచి), కించిత్ ఎగతాళిగా, ‘‘గురువర్యా। మీవలే అడుగుచున్నది ‘‘ఏనుగు’’ నావలే సమాధానము చెప్పుచున్నదేమో ‘‘రాజు’’ - అని పలికారు.

ఆ సమాధానము విన్న ఋభుమహర్షికి కించిత్ కూడా కోపము రాలేదు. పైగా చిరునవ్వు నవ్వారు.

‘‘ఓ నిదాఘా। ఇప్పుడు నీకు ‘‘రాజు-ఏనుగుల అభేదము’’ను బోధిస్తాను. పద’’ అని పలికారు.

‘‘అద్వైత సిద్ధాంతము’’ను ప్రబోధించారు. నిదాఘుడు అదంతా శ్రద్ధాసక్తులతోను భక్తిగాను, విని ధన్యుడైనారు. గురుపాదములపై వ్రాలి నమస్కరించారు.

- [విష్ణుపురాణము (మరియు) మార్కండేయపురాణము]

వేద రహస్యములయినట్టి ‘‘తత్ త్వమ్ - సో2హమ్ - త్వమేవా2హమ్’’ - త్రయీ (3) మహావాక్యములచే ఉజ్వలమగుచున్నట్టిది, సమస్తమునకు మరుగున (Hidingly) ఉన్నట్టిది - అగు త్రిపద (జాగ్రత్ స్వప్న సుషుప్త) సాక్షీ స్వరూప ‘‘రామతత్త్వము’ - మాయొక్క ‘‘స్వస్వరూపమే’’ అయి ఉన్నది. అట్టి శ్రీరామతత్త్వమును శరణువేడుచున్నాము.

నిదాఘుడు అనే మహనీయుడు. పులస్యుని కుమారుడు (- విష్ణుపురాణము). ఆయన యోగాభ్యాసముచే ‘యోగీంద్రుడు’గా ప్రసిద్ధి. ఆయన ఒక సందర్భములో బ్రహ్మవిదుడగు తన గురువు శ్రీ ఋభుమహర్షిని దర్శించుకొన్నారు. భూమిపై సాష్టాంగ పూర్వకంగా దండ ప్రణామములు సమర్పించారు. వినమ్రుడై, గురువుకు ఎదురుగా నిలుచున్నారు.

- - -

ఋభు మహర్షి : వత్సా! నిదాఘమునీ! సుస్వాగతము సుఖాసీనుడవు కమ్ము. ఏమి ఈ విధంగా మన ఆశ్రమానికి అనుకోకుండా వచ్చావు? ఏమిటయ్యా, విశేషాలు?

నిదాఘ ముని : గురువర్యా! ‘తత్త్వజ్ఞానము’నకు మించిన విశేషమేముంటుంది? దయతో ఆత్మతత్త్వమును నాకు బోధించవలసినదిగా వేడుకుంటున్నాను. హే బ్రహ్మన్! మీరు మోక్ష సామ్రాజ్యమును సొంతము చేసుకొని ఉన్నారని మిమ్ములను మునిలోకము ప్రస్తుతించుచుండటము వింటూ ఉన్నాము. అయితే స్వామీ! ఏ మోక్ష ప్రదమగు మహావిద్యను అధ్యయనము చేసి, అట్టి ‘మహావిద్య’చే ఆత్మవిద్యను ప్రాప్తింపజేసుకొనుచున్నారో - అద్దానిని బోధించండి. నాకు మోక్ష సామ్రాజ్య ప్రదాయిని అగు ‘విద్య’ను ప్రసాదించండి.

ఋభు మహర్షి : బిడ్డా! నిదాఘా! ఇట్టి ప్రశ్న అడగటంచేత నీవు కృతార్థుడవయ్యావయ్యా! ఏది విజ్ఞాన (తెలుసుకున్నంత) మాత్రంచేత జీవన్ముక్తుడవు కాగలవో, అట్టి సనాతన విద్యను విశదీకరిస్తాను. శ్రద్ధగా వినిదెవు గాక! మనము ఇప్పుడు చెప్పుకుంటున్నది - ఈ జీవునియొక్క, ‘‘జన్మలన్నింటికంటె మునుముందే ఏర్పడినదై ఉన్నట్టి స్వస్వరూపము’’ గురించి కాబట్టి - ‘సనాతన విద్య’గా లోకప్రసిద్ధము.

- - -

ముందుగా నాయొక్క బాల్యములోని కొన్ని విశేషాలు చెప్పుతాను విను.

నీవు ఇప్పుడు నన్ను అడుగుచున్న విధంగానే - నేను చిన్నప్పుడు విద్యార్థి దశలో ఉండగా నా పితృదేవులగు బ్రహ్మదేవులవారిని ఆత్మవిద్య బోధించవలసినదిగా అభ్యర్థించాను. వారు నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించారు.

‘‘బిడ్డా! నీవు ముందుగా బుద్ధిని సునిశితము, నిర్మలము, సువిశాలము చేసుకుంటేనే ఆత్మవిద్యను అర్థము చేసుకొని, హృదయస్థము చేసుకోగలుగుతావు. అందుకొరకై జగన్మాతయగు అన్నపూర్ణ దేవిని ఉపాసించు’’.

అప్పుడు నేను మా నాన్నగారు సూచించిన విధంగా నిత్యోపాసనకు సంసిద్ధుడనయ్యాను. ఉపాసనకు త్రోవచూపించవలసినదిగా అడిగాను. అప్పుడు నాకు ఈ విధంగా (ఉపాసన) ను బోధించారు.

‘‘నాయనా! ఋభూ। ఉపాసనకొరకై నీకు ‘27’ అక్షరముల రూప బీజశబ్ద సమన్వితమగు మంత్రమును ఉపదేశిస్తున్నాను!’’ ఈ విధంగా పలికి - శ్రీ అన్నపూర్ణా సప్తవింశతి (27) అక్షర మహామంత్రమును ఉపదేశించారు.

భగవతి అన్నపూర్ణ సప్తవింశతి బీజమంత్రము

(1.) ధ్యానశ్లోకము (అన్నం = బ్రహ్మము, పూర్ణ = బ్రాహ్మి తత్త్వముచే పూర్ణానందస్వరూపిణి)


మూలశృంగాట మధ్యస్థా।
బిందునాద కళాశ్రితా।
నిత్యానందా। నిరాధారా।
విఖ్యాతా (ప్ర)విలసత్కచా।।
= ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ’’ నాలుగు త్రోవల మధ్యగల మూల స్థానమునందు వేంచేసియున్నట్టిది,
= బిందు (point) నాద (sound) కళ (manifestation) లను ఆశ్రయించి ఉన్నట్టిది. (ఆకాశ - శబ్ద - అర్ధముల దేవత),
= సర్వదా ఆనందస్వరూపిణి.
= దేనిపై ఆధారపడక, - స్వతఃసిద్ధమైనట్టిది.
= ఉత్తమమైన మెఱుపుతో కూడిన మేఘమాలిక ధరించనదిగా వర్ణించబడునది అగు - అన్నపూర్ణాదేవిని స్మరిస్తున్నాను. ఆ తల్లి లోక విదిత। జగన్మాత। సమస్త జీవులు ఆ తల్లి యొక్క బిడ్డలే। ఆహారము ప్రసాదించు మాతృమూర్తి.
విష్టపే శ్రీ మహాలక్ష్మీః।
జగత్ సంపదగా విలసిల్లు శ్రీ మహాలక్ష్మీ రూపిణి, (మహాలక్ష్మీ బీజరూపిణి)।
కామః తారోనతిః తథా।
(కామస్తారో నతిస్తథా)।
కామబీజముగా, తారా బీజముగా ఎల్లప్పుడు యోగులచే నమస్కరించ బడునది. (అన్నపూర్ణాదేవి ఇచ్ఛారూపమే ఈ సమస్తము).
భగవతి అన్నపూరేణాతి
తేజోరూపిణి అన్నపూర్ణాదేవిని భగవతి = సమస్తము వెలిగించునదిగా-తలచి నమస్కరిస్తున్నాను.
మమ అభిలషితం తతః।
నా అభిలషితము (కోరుకొనునది) ప్రసాదించుటకై వేడుకొనుచున్నాను.
అన్నందేహి తతః
స్వాహా - మంత్ర సార ఇతి విశ్రుతా।।
ఆ దేవి ఆహుతులు స్వీకరించి బ్రాహ్మీ ప్రసాదము ఇచ్చుటకై ‘‘అన్నందేహి’’ మంత్రసారముగా విస్తరించియున్నది. (అన్నం బ్రహ్మ)।
సప్తనింశతి వర్ణాత్మా।
యోగినీ గణ సేవితా।
‘27’ అక్షరములు మాలికగా యోగినీ గణముచే సేవించబడుచున్నది.

అట్టి జగజ్జనని, లోకపావనికి నమో నమో నమః!

(2.) సప్త వింశతి (27) అక్షర బీజమంత్రము


ఐం హ్రీం సౌః శ్రీం క్లీం
(5)
(ఓం) నమో భగవతి అన్నపూరేణా।
(10)
మమాభిలషితమన్నం
(8)
దేహి స్వాహా।।
(4)
Total Syllables =
27

ఓ నిదాఘా!

ఈ మంత్రమును భక్తితో, శ్రద్ధతో గురుతుల్యులగు నాన్నగారి (బ్రహ్మదేవునివద్ద) వద్ద స్వీకరించాను. ఉపదేశం పొందాను.

ఇక అప్పటి నుండి ఆచార-నియమములను పాటిస్తూ సుదీర్ఘకాలము ‘మంత్ర-అనుష్ఠానము’ ఆచరించాను. ఈ విధంగా చాలా రోజులు గడచిపోయినాయి. ఒకానొకరోజు చిరునవ్వులు చిందించు సుందరముఖముతో విశాలాక్షియగు జగన్మాత అన్నపూర్ణాదేవి నా కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షమైనది. వెంటనే లేచి నిలుచుని సాష్టాంగ దండ ప్రణామములు చేశాను. ప్రదక్షణ పాదాభివందనములు సమర్పించాను.

అప్పుడు ఆ జగదాంబ -

‘‘బిడ్డా! నీ ఉపాసనకు సంతోషించానయ్యా! నీ అభిలషితము (ఇష్టమైనది) ఏమిటో - అడుగు. త్వరగా! వరముగా ప్రసాదిస్తాను।’’ - అని మధురాతి మధురమైన స్వరములో పలికింది.

అప్పుడు నేను -

‘‘అమ్మా! విశాలాక్షీ! అన్నపూర్ణాదేవీ! పార్వతీ! త్రిలోక పాలినీ! జగదీశ్వరీ! సదానంద రూపిణీ!- ఆత్మ తత్త్వం మనసి మే ప్రాదుర్భవతు। ‘‘ఆత్మతత్త్వము నా మనస్సునందు పరిఢవిల్లును గాక! ఈ వరమును ప్రసాదించు, తల్లీ!’’- అని (వరముగా) కోరాను.

అప్పుడు జగత్ స్వస్థి స్వరూపిణియగు శ్రీ అన్నపూర్ణాదేవి -

‘‘తథైవ అస్తు! అట్లే అగుగాక!’’ - అని కరుణతో దీవించి అంతర్థానమైనది.

ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంచేత నా అంతరమున బుద్ధి వికసించగా, విచారణచే ‘వాస్తవానికి నాకు బంధమే లేదు’ - అను ముక్తస్థితి రూపుదిద్దుకోసాగింది. ‘‘పరమాత్మగా నేను నిత్యముక్తుడను’’ అని ఎరుగనారంభించాను. ఈ జగత్తు యొక్క వాస్తవ విచిత్ర స్వరూపమేమిటో ఎరుగగల మతి ప్రవృద్ధమైనది. తదా మే మతిః ఉత్పన్నా జగత్ వైచిత్ర్య దర్శనాత్।

ఆ క్రమంగా ఈ విధంగా విచారణ చేయసాగాను.

పంచవిధ భ్రమలు

ఇంద్రియములకు విషయముల రూపంగా ఈ జీవునికి ప్రాప్తిస్తున్న ఈ జగత్తు యొక్క దర్శనమునకు సంబంధించి ‘5’ విధములైన భ్రమలు ప్రవర్తిల్లుచున్నాయి.

(1) జీవ-ఈశ్వరౌ భిన్న రూపాః ఇతి ప్రాథమికో భ్రమః : (1) శరీరాభిమాని - శరీరధారియగు ఈ జీవుడు. (2) అనేక దేహములతో అనేక దేహములు విషయముగా కలిగియున్న ఈశ్వరుడు - వీరిరువురు వేరువేరైనవారు. ఒక్క తీరువారు కాదు. ఏకస్వరూపులు కాదు - అనునది మొదటి భ్రమ.

(2) ఆత్మనిష్ఠం కర్తృగుణం - వాస్తవమ్ - వా ద్వితీయకః : ‘‘ఆత్మయే - ఒకానొక నిష్ఠగా కర్మలు, జన్మలు మొదలైనవాటికి కర్త అయి ఉన్నది. త్రిగుణములు ఆత్మ కలిగి ఉంటోంది’’ - అనునది రెండవ భ్రమ.

(3) (జీవః) శరీరత్రయ సంయుక్త - సంగీ తృతీయకః। : ‘‘ఈ జీవుడు స్థూల, సూక్ష్మ, కారణ దేహములకు చెందినవాడు. (1) పంచభూత నిర్మితమైన భౌతిక (స్థూల) దేహము - (2) వినికిడి, చూపు, స్పర్శ మొదలైనవి ప్రదర్శించునట్టి - సూక్ష్మదేహము, (3) సంస్కారములు, వాసనలతో కూడిన) కారణ దేహము- కలిగి ఉన్నాడు. వాటికి ఈతడు బద్ధుడు. అట్టి బద్ధుడైన ఈ జీవుడు ముక్తిని సంపాదించుకోవాలి. అట్టి మూడు దేహములతో ఆతనికి సంగము (Attachment) ఉన్నది. అట్టి సంగము (Attachment) - అనేక ప్రయత్నములతో తొలగవలసి ఉన్నది’’ - అనునది మూడవభ్రమ.

(4) జగత్ కారణరూపస్య వికారిత్వం - చతుర్థకః : ఈ జగద్దృశ్యము కారణంగానే ఈ జీవుడు అనేక వికారములు పొందుచున్నాడు. దృశ్యము లేకుంటే వికారములు పొందడు. జగత్తు స్వయముగా తనకు తానే కామ - క్రోధ - లోభ….ఇత్యాది దోషములు కలిగిస్తూ ఉండగా, ఈ జీవుడు నిస్సహాయుడై, బద్ధుడగుచున్నాడు. జగత్తే లేకపోతే బంధమే ఉండేది కాదు - ఈ తీరైనది నాలుగవ భ్రమ.

(5) కారణాత్ భిన్న జగత్ సత్యత్వం - పంచమో భ్రమః : ఈ జగత్తుకు కారణము ఆత్మయే అయి ఉండి, ఆ తదనంతరము ఈ జగత్తు కూడా ఆత్మవలెనే ‘సత్యమే’ అయి ఉన్నది - అనేది ఐదవ భ్రమ.

ఈ విధంగా ఈ చిత్తమును (1) భిన్నత్వము (2) కర్తృత్వము (3) సంగము (4) వికారిత్వము (5) సత్యత్వము అనబడే ‘5’ భ్రమలు ఆవరించి ఉన్నాయి.

(1) జీవుడు ఈశ్వరుడు వేరు వేరు. (2) ఆత్మకు కర్తృత్వ - భోక్తృత్వములు ఉన్నాయి. (3) జీవాత్మకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. అవి దాటాలి. (4) ఈ జగత్తు కారణరూప వికారములు కలుగజేస్తోంది. జగత్తు లేకుంటే బంధము ఉండేది కాదు. (5) కారణరూపమగు ఆత్మకు కార్యరూపమగు ఈ జగత్తు భిన్నము - ఇవి పంచభ్రమలు.

పంచ భ్రమలు నివృత్తి అయితే, ఆ మరుక్షణం చిత్తమునకు ‘చిత్’ ప్రకాశము స్ఫురించగలదు. ఈ పంచభ్రమలను కడిగివేసి, బుద్ధిని పరిశుభ్రం చేసుకొని - ఈ జీవుడు ‘సో2హమ్-తత్త్వమ్’ భావనను సిద్ధించుకోవటానికై తత్త్వజ్ఞులగు మహనీయులు స్వానుభవమంతా రంగరించి, అందుకు ఉపాయాలుగా మనకు సూచిస్తున్నదే - తత్త్వశాస్త్రము.

నివారణోపాయములు

(1.) జీవుడు వేరు - ఈశ్వరుడు వేరు అను జీవేశ్వర భేద భ్రమ నివారణోపాయము→ బింబ - ప్రతిబింబదర్శనము :

ఆకాశంలో సూర్యుడు ప్రకాశించుచున్నారు. ఆ సూర్యబింబము తటాకములోని జలంలో ప్రతిబింబిస్తూ కనబడుతోంది. జలములోని తరంగాల కదలికలచే ప్రతిబింబము కదలుచున్నట్లుగా అగుపిస్తోంది. కనుక ‘‘సూర్యబింబము తటాక జలములోని కదలికలు పొంది, తద్వారా తాను చంచలత్వము అనుభవిస్తోంది! నిశ్చలతను కోల్పోతోంది’’ - అని అంటామా? అనము కదా!

‘‘అట్లా కాదనుకోండి! ఆకాశములో సూర్యబింబము వేరు. జలములో ప్రతిబింబము వేరు. అవి వేరు వేరు ధర్మములు కలిగి ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు నిశ్చలుడు అయిన మాట నిజమే! జలములో ప్రతిబింబము కదలుచున్నమాట కూడా నిజమే!’’- అను వాక్యములు నిజమా?

తరంగములలో ప్రతిబింబించే సూర్యబింబమునకు మాత్రం చాంచల్యము ఉన్నది - అని అన్నప్పుడు, అది ఒప్పుకుంటామా? లేదు. సూర్యుడు → బింబ, ప్రతిబింబములనబడే రెండు స్థితులు స్వధర్మముగా కలిగిలేడు. నీటిలో ప్రతిబింబసూర్యునికి ‘ఉనికి’యే లేదు. ఉనికియే లేనివానికి చాంచాల్యము ఉండటమేమిటి? ఆ చాంచల్యము తొలగించే ప్రసక్తి ఎక్కడిది?

ఈశ్వరుడు (పరమాత్మ) - బింబము

వస్తుతః ఉనికి (సత్) కలిగి ఉన్నది.
జగద్దృశ్యము - తటాక జలము

‘కథ’వలె కల్పన వంటిది.
జీవాత్మ - ప్రతిబింబము

వస్తుతః స్వకీయమైన ఉనికి లేనట్టిది. ఈశ్వరునికి వేరు కానిది. ఈశ్వరునియొక్క ఒక ‘అంశా’ చమత్కారము.

పరమాత్మ స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుడు దృశ్యములో జీవాత్మగా ప్రతిబింబించినంతమాత్రముచేత తనయొక్క పరమాత్మత్త్వమునకు చంచలత్వము మొదలైనవేవీ స్పృశించవు। → అను దర్శనము పూజ్యులగు ఆత్మతత్త్వజ్ఞులు ప్రసాదిస్తున్నారు.

ఈ విధమైన ‘బింబ - ప్రతిబింబ దర్శనము’ అనే ఔషధము సేవిస్తూ ఉంటే ‘జీవ-ఈశ్వర భిన్నరూప భ్రమ’ - అనే మొదటి భ్రమ తొలగిపోసాగింది.

(2.) (ఆత్మకు కర్తృత్వ-భోక్తృత్వాలు ఉన్నాయి అను) పారమార్ధిక కర్తృత్వభ్రమ - నివారణోపాయము → స్ఫటిక లోహిత దర్శనము :

ఒక తెల్లటి స్ఫటికమునకు ఎదురుగా ఎర్రటి వస్తువును ఉంచితే, అప్పుడు ఆ తెల్ల స్ఫటికము - ఎర్రగా కనిపిస్తుంది. ఆ వస్తువును అక్కడి నుండి తీసివేస్తేనో? ఆ స్ఫటికము తిరిగి తెల్లగా కనిపిస్తుంది.

అనే కర్తృత్వమును స్ఫటికమునకు ఆపాదిస్తామా? వాస్తవానికి ఆ స్ఫటికము ఎల్లప్పుడు తెల్లటి కాంతులతో ప్రకాశించునదే కదా! ఆత్మకూడా నిత్యనిర్మలము.

మరొక రీతిగా చూద్దాం

ఇంద్రనీలమణి నీలపు కాంతులు వెదజల్లుచుండగా, ఆ సమీపంలో ఉన్న వస్తువులు నీలపురంగుగా కనిపిస్తాయి. ‘‘ఈ వస్తువులు నీలంగా చూపుచున్న కర్తృత్వము ఇంద్రనీలమణి నిర్వర్తిస్తోంది’’ - అవి మణికి కర్తృత్వము ఆపాదిస్తామా? లేదు కదా! పోనీ వస్తువులు స్వకీయంగా నీలంగా అగుపించాలని - అట్లా కనిపిస్తున్నాయా? ఎవరిదీ కర్తృత్వం లేదు. ఈ జగత్తుకు కర్తృత్వము లేదు.

మరొక దృష్టాంతము :
- సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటే - ఆ వేడికి లోకములోని నీరు ఆవిరి అయి, చేపలన్నీ చచ్చిపోయానుకోండి. అప్పుడు, ‘‘చేపలను చంపిన కర్తృత్వము సూర్యకిరణములదే’’ - అని సూర్యునికి, సూర్య కిరణములకు కర్తృత్వము ఆపాదిస్తామా? ఆపాదించము కదా!

‘‘నిప్పు ముట్టుకుంటే కాలింది కాబట్టి, నా చేతిని కాల్చింది నిప్పుయే! కనుక దోషము నిప్పుదే - అని నిప్పుకు వ్రేలు కాల్చిన కర్తృత్వము అంటగట్టము కదా!

అదేవిధంగా - ‘‘స్ఫటిక లోహిత దర్శనము’’ అనే ఉపాయంచేత జీవాత్మయొక్క సహజస్వరూపమగు పరమాత్మకు సందర్భ మాత్రమే అయినట్టి ఈ జీవాత్మయొక్క బంధము, దుఃఖము, అల్పత్వము, అజ్ఞత్వము మొదలైనవి ఆపాదించజాలము. ఈ విధంగా ‘‘ఆత్మనిష్ఠ- కర్తృత్వగుణం వాస్తవమే’’ అనే రెండవ భ్రమను ‘‘స్ఫటిక లోహిత దర్శనము’’ అనే సమన్వయమును తొలగించుకోసాగాను.

(3) (జీవాత్మకు స్థూల సూక్ష్మ కారణ దేహములు ఉన్నాయి-అనే) - శరీరత్రయ సంయుక్త జీవ-సంగీ (స్థూల-సూక్ష్మ-కారణ దేహములకు ‘జీవుడు’ బద్ధుడై ఉన్నాడు) - అను భ్రమ - నివారణోపాయము → ఘట మఠాకాశ దర్శనము.

ఆకాశం-దృష్టాంతం

(Ⅰ) కుండలోని ఆకాశము
(Ⅱ) మఠము (Shut, House) లోని ఆకాశము
(Ⅲ) బయట ఆకాశము (Outside the House) - అని ఆకాశమును మూడుగా వర్ణించుకోవచ్చు.

అయితే మూడుగా చెప్పుకున్నప్పటికీ కూడా, ఆకాశము సర్వదా ఏకము - అఖండము అయి ఉన్నది. అద్దానికి ‘ఇంటిలోని - ఇంటిబయట’ భేదములు ఉండవు.

ఆకాశము ఎప్పుడైనా - ‘కుండలో’ అని గాని, ‘ఇంటిలో’ అని గాని, ‘ఆరుబయట’ - అని గాని దేనితోనైనా సంగము పొందుతుందా? లేదు. గాలి బూరలో నిండి ఉండటంచేత బూరతో లోపలి గాలి బూరతో సంగము (Relatedness, Belongingness) పొందదు కదా!

అట్లాగే పరమాత్మ కూడా
• స్థూలదేహము (Material/Physical Body) తో గాని,
• సూక్ష్మదేహము (The aboslute senses of Touch, Sound, Seeing, Forming, Tasting) తో గాని,
• కారణదేహము (Body of Tendencies) తో గాని,
సంగము పొందటము లేదు. ఈ జీవుని వాస్తవ స్వరూపము సర్వదా ‘అప్రమేయము’ అయినట్టి పరతత్త్వ స్వరూపమే అయి ఉన్నది.

అట్టి కేవల స్వరూపము దృశ్యము - జీవుడుగాగాని, దృశ్యపరంపరలు - ఈశ్వరుడుగా గాని సంగము (Attachment) పొందదు. కేవలమగు ఆత్మ నాలోను, జీవులందరిలోను సర్వదా ‘కేవలము’గానే ఉన్నది.

ఈ విధమైన దృష్టాంతముల యొక్క అవగాహనచే ‘‘శరీరత్రయయుక్త జీవః సంగీ’’ - అనే భ్రమను ‘ఘట మఠాకాశదర్శనము’ అను దృష్టాంతముచే నేను తొలగించుకొన్నాను.


(4) ‘‘మనో వికారములకు జగత్ దృశ్యమే కారణము’’ అనుభ్రమను - రజ్జు సర్ప దర్శనేన - కారణాత్ భిన్న జగత్ సత్యత్వభ్రమో’’ నివృత్తః। త్రాడులో పాము చూడటానికి త్రాడు కారణం కాదు - అను ఎరుకయే దృష్టాంతపూర్వక-భ్రమ నివృత్తి.

వివరణ → ఒకానొకడు మసక చీకటిగా ఉన్నప్పుడు బాటలో నడిచి వస్తూ ఒక నూతికి ప్రక్కగా వున్నచోట ఒక పెద్ద త్రాడును చూచి ‘‘పామేమో?’’ అని భ్రమ పొందాడు. భయముతో ‘అమ్మ బాబోయ్’ అని కేకలు వేయనారంభించాడు. కాళ్ళు - చేతులు బిగదీసుకుపోయాయి. నోటమాటరావడం మానివేసింది.

ఇటువంటి వికారములన్నీ రావటానికి కారణము? త్రాడా? పామా? త్రాడును చూడటమువలన ‘పాము’ అను భ్రమ కలిగినప్పటికీ ‘‘నేను పాముగా కనిపించాలి’’ అనే ఉద్దేశ్యము త్రాడు కలిగి ఉన్నదా? లేదు.

మరి అసలైన కారణం?

ఆ బాటసారి త్రాడును చూచాడు. ‘‘అది త్రాడా? పామా?’’ అని పరిశీలించాలనుకునేలోపే, ‘‘పాము అయి ఉండవచ్చునేమోకదా?’’….అనే అనుమానం బయల్వెడలింది. పాము అయితే? అది కరిస్తే? చచ్చామే! రక్తమంతా విషంతో నిండిపోతుంది! నురగలు క్రక్కుకుంటూ పడిపోతాను. ఎవ్వరైనా చూచేవరకు, నెత్తీనోరూ కొట్టుకోవటమే! త్రాచుపాము కరిస్తే చనిపోయినవారి గురించి విన్నాము కదా! ఇక నా గతీ అంతే! అయ్య బాబోయ్!’’ అని భ్రమించసాగాడు. భయంతో నెమ్మదిగా ప్రారంభించి, ఆ తరువాత పెద్దగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఎవరో అటు వచ్చి ఈ గొడవంతా గమనించాడు. దీపం వెలిగించి చూచాడు. తీరాచూస్తే అది పాము కాదు. ఎవ్వరో చాంతాడు ముక్కను నూతి ప్రక్కన బాటలో వదలి వెళ్ళినట్లున్నారు. అప్పుడు ఆతడు బాటసారికి చెప్పాడు - ‘‘ఇది త్రాడు మాత్రమేనయ్యా! భయమెందుకు?’’ అని. కానీ ఆ బాటసారి భయమునుండి తేరుకోవటానికి కొంతసేపు పట్టింది.

ఇది ‘‘సర్పరజ్జు భ్రాంతి’’ అను దృష్టాంతము తత్త్వశాస్త్రజ్ఞులచే ఉపమాన రూపంగా (As a simile) చెప్పబడుతోంది.

ఈ ఇంద్రియములకు విషయమగుచున్న భౌతిక దృశ్యము త్రాడువంటిది. ఇక్కడ ప్రాప్తము అగుచున్న వ్యవహారిక పరస్పరత్వమంతా నాటకములోని పాత్రల పరస్పర బంధత్వములు, మిత్ర - శత్రుత్వ విశేషములు వంటివి. త్రాడును చూచి పాము అనుకొనుతీరుగా, ఇక్కడ ఆత్మత్వము ఏమరచబడి, ‘‘కల్పన అయినట్టిదంతా సత్యమువలే’’ (అజ్ఞానదృష్టిచే) అనిపిస్తోంది. ఈ విధంగా ‘సర్పరజ్జు భ్రాంతి దృష్టాంతం’’ అర్థం చేసుకొని, ఈ జగద్దర్శనములో అంతర్లీనమైయున్న భ్రమ దర్శనమును గుర్తించసాగాను. ‘‘త్రాడులో పాము మొదలే లేని విధంగా, ఆత్మయందు ఆత్మయే ఉన్నది. ‘జగత్తు’ అనేది భ్రమ మాత్రమే’’ అని గమనించసాగాను.


(5) కనక-రుచిక దర్శనేన వికారిత్వభ్రమో నివృత్తిః

నిర్మలము, కేవలము, సర్వాతీతము అగు ఆత్మ పట్ల జీవాత్మత్వము, త్రిగుణములు, జన్మ-కర్మలు మొదలైన వికారములు, విభ్రమములు ఎట్లా ఏర్పడుచున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ‘‘కనక రుచిక దర్శన దృష్టాంతం’’ నాకు అందిస్తోంది. బంగారపు ఉంగరము (ఆభరణము)

బంగారము - ఆభరణము వేరు వేరా? కాదు. బంగారము నుండి ఆభరణము విడదీసి చూడగలమా? లేదు. బంగారము ‘ఆభరణము’గా అగుచున్నదా? అవటము లేదు. ఆభరణముగా కనిపిస్తున్నది బంగారము కన్నా వేరైనదా? కాదు.

అట్లాగే

ఈ విధంగా పరమాత్మకు - (జన్మ - జరా - మరణ, సత్త్వ - రజో-తమో, భూత-వర్తమాన-భవిష్యత్, దేహ - జీవ - బంధ - ఇత్యాది) - వికారములు మొదలే లేవని గమనించసాగాను. అట్టి సర్వాతీతమగు ‘కేవలాత్మ’యే నా సహజ నిజ స్వరూపము’’ - అను ఉపాసన, మననములను ఆశ్రయిస్తూ ఉన్నాను.

ఓ నిదాఘా! ఈ విధంగా ‘5’ దృష్టాంతపూర్వక సమాధానములచే నా చిత్తము స్వయముగా ‘చిత్-ఆకారము’ లేక ‘బ్రహ్మాకారము’ సంతరించుకోసాగుతోంది. నీవు కూడా ఇట్టి విచారణచే తత్త్వజ్ఞానము సంపాదించుకొనెదవు గాక.

- - -

‘‘మహాకర్త - మహాభోక్త - మహాత్యాగి’’

నిదాఘుడు సద్గురవగు ఋభు మహర్షికి ప్రణతుడై (శరణాగతుడై) సాదరముగా మరల ఈ విధంగా అడుగసాగారు.

నిదాఘుడు : గురుదేవా! శ్రద్ధతో మిమ్ములను అర్థిస్తున్నాను. ఉత్తమోత్తమమని మీరు భావించుచున్న విధంగా నాకు దయతో ఇంకా కూడా ‘బ్రహ్మవిద్య’ను బోధించండి.

ఋభుమహర్షి : నిదాఘా! నీవు శ్రద్ధతో కూడినవాడవు. గురువు పట్ల అచంచలమైన గురి, భక్తి కలవాడవు. ఓ అనఘా! సంతోషము. ఇప్పుడు ‘తత్త్వజ్ఞానము’ గురించిన ఆయా కొన్ని విశేషాలు చెప్పుకొందాము. విను. (తత్ త్వమేవ - ఇతి తత్త్వజ్ఞానమ్)

ఓ అనఘా! ‘మహాకర్త’, ‘మహాభోక్త’, ‘మహాత్యాగి’ వి అగుము - అని తత్త్వజ్ఞులు సూచిస్తున్నారు.

మహాకర్త : సమస్తమునకు కర్త (Doer) ఆత్మయే। ఆత్మయే నేను. కనుక సమస్తమునకు కర్తను. మహాకర్తను నేనే!

మహాభోక్త : సమస్తమునకు భోక్త (The one who is experiencing) ఆత్మయే। సో2హమ్ వేదవాక్యానుసారం నేనే ఆత్మను. కనుక సమస్తమునకు నేనే భోక్తను.

మహా త్యాగి :
Ⅰ. ఈ సమస్తము ఆత్మ నుండియే బయల్వెడలుతోంది. ఆత్మయొక్క త్యాగనిరతియే ఇదంతా. నేను ఆత్మను. అందుచేత.
• ఇదంతా ఆత్మయొక్క సమర్పణయే కాబట్టి,
• నేను ఆత్మ స్వరూపుడనే - కాబట్టి, ఈ
• సమస్తమునకు మహాత్యాగిని నేనే!
Ⅱ. ఈ జగత్తు త్యజించబడగా, అప్పటికీ శేషించే ఆత్మ అస్మత్ సహజరూపము అయి ఉన్నదని ఋషివాక్కు. వేదవాక్కు. సమస్తము త్యజించగా శేషించునది నేనే అయి ఉన్నాను. కనుక మహాత్యాగిని.

ఓ ప్రియ నిదాఘా! ఈ విధంగా స్వస్వరూపానుసంధానమును నిర్వర్తిస్తూ, ఆత్మభావనచే స్వాభావికంగానే సుఖవంతుడవు అగుము.

నిత్యోదితమ్ : సూర్యబింబమునకు స్వతఃగా ఉదయ -అస్తమయములు ఉంటాయా? ఉండవు. అట్లాగే నేను (అనుక్షణము ఉదయించు సూర్యునివలె) నిత్యోదితమగు ఆత్మను. జాగ్రత్ స్వప్న సుషుప్తులు, జన్మ-జన్మాంతరములు నా ‘కళా ప్రదర్శనము’ అయి ఉండగా, వాటియందు నేను ఉదయించటమేమిటి? అస్తమించటమేమిటి?

విమలమ్ : నాటక దీపమునకు నాటకములో పాత్రలయొక్క ఉచిత - అనుచితములు, మంచి - చెడులు ఏమాత్రము అంటవు కదా! అట్లాగే నేను మనస్సు, బుద్ధి మొదలైన వాటి దోషములచే మలమును పొందువాడను కాను. సదా నిర్మలుడను.

ఆద్యమ్ : జన్మచే ప్రారంభమవను. మరణముచే ముగియను. జన్మ-కర్మలకంటే మునుముందే ‘ఆది’ యందే ఉన్నవాడను. సమస్తమునకు మొట్టమొదట నేనే ఉన్నాను. ఆద్య స్వరూపుడను. (I am the begining of every thing else all).

అనన్తరూపమ్ : ఈ శరీరము, మనస్సు, చిత్తము, తెలివి, అహంకారము, దృశ్య ప్రపంచము మొదలైనవాటిచే ముగియవాడను కాను. అంతమే లేనివాడను. ఈ దేహము అంతము కలిగి యుండవచ్చు గాక! ‘దేహి’గా నేను ఒక భౌతిక వస్తువు వంటివాడను కాను. అనన్తరూపుడను.

నేతర (న ఇతర) కలా కలనం హి కించిత్ : ఆత్మనగు నాకు ఎట్టి కల్పనగాని, కలన (మాయ / దోషము) గాని కించిత్ కూడా లేదు. అంటదు.

ఈ విధంగా ‘ఆత్మభావన’ను ఆశ్రయించి ఉండుము. ఆత్మగా సర్వదా నిర్మలుడవే సుమా! నిరంజనుడవై, సర్వత్రా పరమప్రశాంతమగు ‘వృత్తి’ కలవాడవై నిర్మాణ స్వరూపమును అవధరించుము. యత్ ఇదమ్ దృశ్యతే కించిత్, తత్ తత్ నాస్తి - ఇతి భావయ। ఇక ఇక్కడ ఏదేదైతే పంచేంద్రియములకు విషయములుగా దృశ్యమానమై కనిపిస్తోందో, అదంతా ‘మొదలే లేనిది’గా భావించి ఉండుము.

(ఉదా : కథలోనో, నవలలోనో, నాటకములోనో కనబడే విశేషములు సత్యము (నిజంగా ఉన్నవి) ఎట్లా అవుతాయి? ఈ దృశ్యమానమగుచున్న జగత్తు కూడా అట్టిదే).
• కలలో కనిపించిన వస్తుజాలములు నిజంగా ఉన్నాయా?
• గంధర్వనగరంలో (ఊహలో కల్పించుకొని చూస్తున్న నగరంలోని వీధులలో) నిజంగానే భవనాలు ఉన్నాయా?
• ఎడారిలో కనిపించే ఎండమావులలో నిజంగానే జలము (నీరు) ఉన్నదా? ఉండదు.

అదే విధంగా ‘‘ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యము ఆత్మయందు కించిత్ కూడా మొదలే లేదు’’ - అని భావన చేస్తూ ఉండు.

కనులు, చెవులు, నోరు, ఘ్రాణేంద్రియను, చర్మేంద్రియము (పంచేంద్రియములు), ‘ఆరవ ఇంద్రియము’ అనబడుచున్న ‘మనస్సు’లను దాటివేసి, వాటన్నిటికీ ఆవలగల ఆత్మచైతన్యముతో తన్మయుడవై, తత్-భావికుడవై ఉండుము. ‘‘అవినాశి చిదాకాశగ్ం సర్వాత్మకమ్, అఖండితమ్, నీరంధ్రం, భూరి వా శేషం (భూరివ అశేషం) తత్ అస్మి’’ - ఇతి విభావయ।

ఎద్దానికైతే - ‘నాశనము’ అనే ధర్మము కించిత్ కూడా లేదో,
భూతాకాశము - చిత్తాకాశములకు ఆవల అవినాశి అయి ‘చిదాకాశము’ గా సర్వదా ప్రకాశమానమై యున్నదో, - అదియే నేను।
- నాటకంలో పాత్రలన్నిటికీ రచయితయే ‘ఆత్మ’ అయి ఉన్నట్లుగా, కలలో కనబడే అనేకమంది జనులకు కల తనదైనవాడు- ఆత్మ అయినట్లుగా,….
ఈ త్రిలోకములకు, ఈ సమస్త విశ్వమునకు, ఇందలి సర్వ జీవులకు ఎవ్వడు సర్వాత్మకుడో, ఆతడే నేను.
- ఎవ్వడు ‘దేహము-జీవుడు-ఈశ్వరుడు’ మొదలైన ఖండితములుగా ఏ క్షణమందు అవక సర్వదా అఖండితమైయున్నాడో,
తనయందు తనకు అన్యమైనదేదీ లేకపోవుటచే నీరంధ్రుడో, (సందు రంధ్రము లేనివాడో) - అట్టి ఆత్మపురుషుడను నేనే।
- సముద్రంలోని తరంగములన్నిటిలో సముద్రజలంవలె సమస్తము ఆక్రమించి ఉండటంచేత ఎవరు ‘భూరి’ (Magnum) అయి ఉన్నారో,- అట్టి ఆత్మస్వరూపుడను.

‘‘తదస్మి। అదియే నేను।’’ అను భావనచే విభావుడవై (ప్రకాశించువాడవై) ఉండు.

- - -


ఓ నిదాఘా ఎప్పుడైతే నీ చిత్తము ‘బాహ్య విషయ అభావన’ చేతను, ‘అంతరాత్మ భావన’ చేతను (అందరియొక్క, తనయొక్క విషయరహితమగు అంతరాత్మను దర్శించుచుండు అభ్యాసముచేతను) సంసిద్ధమౌతుందో, అప్పడిక చిత్ సామాన్యము, సత్తా సామాన్యము (Equally Placed Enlightenment and All equally placed presence), యొక్క అనుభవము సిద్ధించగలదు. క్రమంగా ‘చైత్యాంశ’ ను (That being known experienced, seen, touched, smelt, tasted etc.,) ‘చిత్’ నుండి ప్రక్కకు పెట్టుబడగా, అప్పుడు శేషించు ‘చిదంశ’ (The absolute Experiencer factor) - ‘చిదాత్మ’ యందువిలీనము అగుచున్నది.

Experiences (+) Experiencing = జీవుడు. ‘చైత్యంశ’.
Experiences sans Experiencing = చిదంశ.
Absolute Experiencer - When Gets united with the Macro, Universal, as well as ALL-Pervading EXPERIENCER = చిదాత్మ.

ఏ సత్తా సామాన్యము (All present myself) వర్తమానంలో ‘‘అట్టిది లేదేమో’’ అని అనిపిస్తోందో - అట్టి ‘‘సమస్తము నాలోని నేను’’ అగు స్థితి - ఆత్మదృష్టిచే ఇప్పుడే, ఇక్కడే లభించగలదు. విషయ దృష్టితో కూడుకొని ఉన్న ‘చిత్‌సత్త’ (లేక) సత్తా సామాన్యము (All- pervading one’s own presence) దృశ్య విషయ దృష్టిని త్యజించిన మరుక్షణం - సర్వాత్మకముగా వికాసము పొందగలదు. అట్టి చిదాత్మానుభవము (లేక) సదాత్మానుభవమునకు - ఈ శరీరము ఉండటము, (లేక) ఉండకపోవటము విషయమే కాదు. దృష్టి ఏషాహి పరమా సదేహా అదేహయోః సమా! అట్టి ‘‘అఖండాత్మ అహమేవ’’ - అను దృష్టి శరీరము ఉన్నా లేకున్నా కొనసాగగలదు.

అటువంటి తుర్యాతీత, పరస్థానమునందు ముక్తులు స్వాభావికంగానే విహరిస్తూ ఉంటున్నారు.

‘వ్యుత్థానము’ (Extroversion) చే జగత్తునందు, ‘సమాధి’(Introversion)చే కేవలమునందు సర్వదా వారు ముక్తస్వరుపులై ప్రదర్శితులు అగుచున్నారు.

‘ఇహము’లో సందర్భములందు, ‘పరము’ నందు ‘‘కేవలము (The Absolute)’’ నందు ఒకసారి సంప్రవర్తితులు అగుచూనే, సర్వదా యథాతథులై ఉంటున్నారు.

ఈ జీవునికి తనయొక్క ‘‘కేవల స్వరూపము’’ - సర్వదా సిద్ధించినదే అయి ఉన్నప్పటికీ, అది అనుభవమవటము లేదు. ఆనందమునకు కూడా ఆవల అనాన్దమైనట్టిది, సర్వత్రా ముగ్ధ ముగ్ధ సమానందము అయినట్టిది అగు ‘‘సహజాత్మ స్వరూపము’’ - ఆత్మగురించిన జ్ఞానము కలవానికే అనుభవము అవుతోంది. అజ్ఞానిపట్ల అఖండాత్మ అనుభవమవటం లేదు. చిరకాల పరిక్షీణ మననాది పరిభ్రమః, పదమ్ ఆసాద్యచే పుణ్యం ప్రజ్ఞయైవ ఏకయా తథా!

ఓ నిధాఘా!

చిరకాల ప్రయత్నములచేతనే ఈ దృశ్యమనన పరిభ్రమణము పరిక్షీణము (Wel subside) అవగలదు. దృశ్య మనన త్యాజ్యముచేతను, పుణ్య కర్మల ఫలముగాను ప్రజ్ఞచే అఖండాత్మ అనుభూతమౌతోంది. అప్పుడు ఈ త్రిగుణ నిర్మితమగు మనస్సు ఆత్మత్వము పొందినదై ఆత్మతో మమేకమవగలడు.

సమాధి : బాహ్యముగా వ్యవహారములలో ఉంటున్నప్పటికీ కూడా, అంతరమున పరమశాంతము, శీతలము (Calmness and coolness) అగు ఆత్మభావన కలిగియుండటము సమాధినిష్ఠుని స్వాభావిక లక్షణము.

భావశాంతత : దృశ్య సంబంధమైన వాసనలు త్యజించబడగా, మనస్సు చంచలత్వము త్యజించి, స్థిరత్వము పొందుతుంది. అట్టి- సమస్తమును కేవలమగు ఆత్మగా భావన చేయు ధ్యానస్థితియే ‘శాంతము’ అనబడుతోంది. ఓ నిదాఘా! తను వాసనను (దేహవాసనను) త్యజించి, పర శ్రేష్ఠమగు ఆత్మ వాసనను మాత్రమే ఆశ్రయించుము. అది ‘పదయో ఆద్యతము’ (యో ఆద్యతమ్ పదమ్। సమస్తమునకు మునుముందటి పదము) అనబడుతోంది. తను వాసన అతి నీచమైనది. తను వాసనమ్ అత్యుచ్చైః।

‘‘ఈ దేహము లేకుంటే నేను లేను’’ - అనురూపంగా సిద్ధించుకొన్న భ్రమ శమించటమే భావశాంతరూపమగు ‘అవాసనము’.

అవాసనము (వాసనాత్యాగము, నిర్వాసనము) అగు మనస్సు మాత్రమే ఆత్మయొక్క వక్త్రము (ముఖము)ను పొందగలదు.

ఆత్మ సర్వదా అకర్త. అభోక్త. కానీ జీవునికి (1) ‘ఇది నేను చేస్తున్నాను’ అను కర్తృత్వము, (2) ‘‘ఇదంతా అనుభవముగా పొందుచున్నాను’’ అను భోక్తృత్వము - అనుక్షణం అనుభవమౌతోంది. ఎందుచేత? ఘనవాసనమ్ ఏతత్తు చేతః కర్తృత్వ భావనమ్।

చిత్తము ఇంద్రియ విషయ రూపమగు దృశ్య వ్యవహారముతో మననము పొందుతోంది. సంగమును - అభిలషించటము చేస్తోంది. లాభించు - లాభించని ఆయా సందర్భములలో ఉత్సాహ నిరుత్సాహములు కలిగి ఉంటోంది. ఇటువంటి అనేక ఉపాధులలో సంబంధము - అనుబంధముల కొనసాగింపు కారణంగా ‘‘వాసనలు Tendencies’’ బయల్వెడలుచున్నాయి.

ధ్యాస - ధ్యానము - సంగము - కామము - క్రోధావేశము - మోహము - సంస్కారములు - వాసనలు

అట్టి దృశ్యముతో ఏర్పడిన వాసనలవలననే ఈ జీవునికి కర్తృత్వ - భోక్తృత్వభావములు ఘనీభూతమగుచున్నాయి. అట్టి వాసనలే - ‘‘నేను బద్ధుడను. పరిమితుడను. సంకుచిత స్వభావుడను - అను వ్యష్టిత్వముగా ఏర్పడి, చివరికి అదంతా కూడా ఈ జీవునిపట్ల అనేక దుఃఖముల (Series of worries) కు కారణమౌచున్నది.

అందుచేత అట్టి వాసనలను నెమ్మదిగా (నయాన) త్యజించివేయటానికి ఉపక్రమించాలి. చిత్తముతో (లేక) బుద్ధితో దృశ్యము వలన ఏర్పడే అవినాభావ రూపమైన భావనాసంబంధములను క్రమంగా మొదలంట్లా పరిత్యజించివేయాలి. అందుకుగాను సమస్త భేదభావములను వదలి, అభ్యాసపూర్వకంగా ‘‘ఇదంతా ఆత్మయొక్క సంప్రదర్శనమే’’ అను సందర్శనమును బలపరచుకొనుచూ, ఆత్మభావనను స్వాభావికం చేసుకోవాలి.

ఆత్మభావన అనగా? ఇక్కడి జగద్దృశ్యము, లోకములు, భూమ్యాకాశములు, ‘‘నావారు-నీవారు- అయినవారు- కానివారు’’ మొదలుగా కనిపించే సకల జనులు, సమస్త జీవజాతులు, ఇక్కడ కదిలే చేతనములు, జడములు, అంతరంగ విభాగములగు మనో- బుద్ధి-చిత్త-అహంకారములు, ఇక్కడి జ్ఞానులు-అజ్ఞానులు-సుజ్ఞానులు-దుర్జ్ఞానులుగా చెప్పుకోబడేవారు - మొదలైనదంతా కూడా ఆత్మాకాశమే! బాహ్యమున ఏది ఎట్లా ఉన్నట్లు కనిపించినా అంతరంగా కేవల చిదాకాశమే।

ఈ విధమైన ‘‘అంతరాంతర దృష్టి’’ (లేక) ‘‘ఆత్మగా భావన’’ కలిగి ఉండటమే అంతర్ముఖదృష్టి. ఆత్మభావనయే ‘‘అంతర్ముఖ స్థితి’’.

నిదాఘుడు : హే గురువర్యా! ఇక్కడ అనేకమంది ఇష్ట-అయిష్టజనులు, గురువులు, శిష్యులు మొదలైనవన్నీ ప్రతిరోజు అనేక రూపాలుగా, అనేక విధములుగా తారసపడుతూ ఉంటే, మీరు చెప్పిన ‘అంతర్ముఖదృష్టి’ సిద్ధించటము సులభమా? మేము ఎట్లా సిద్ధించుకోవాలి? సర్వత్రా సమభావన నాకు లభించేది ఎట్లా?

ఋభు మహర్షి : నిజమే। ‘‘ధ్యాస-సంగము-కామము-క్రోధము-లోభము-మోహము - స్మృతిభ్రంశము’’ మొదలైన జన్మజన్మల అభ్యాసము కారణంగా ఏర్పడిన ‘వాసనలు’ కారణంగా - ‘‘అంతా అఖండము, అప్రమేయము, అమృతరూపము, అతీతము అగు ఆత్మగా అనిపించటము’’ - అనేది ఈ జీవునికి దుస్సాధ్యమే అవుతోంది. కారణం? మనస్సుచే ఏర్పాటు అగుచున్న ‘భేదదృష్టి’ చేతనే.

‘‘భేదదృష్టిని త్యజించటము తేలికయా?’’ - అను ప్రశ్నకు, ‘‘ఎందుకు కాదు? కొన్ని చోట్ల మనము భేదదృష్టి ఏమాత్రము లేకుండానే మననము కలిగి ఉంటూనే ఉన్నామే’’…..అనేది విజ్ఞులచే (దృష్టాంత పూర్వకంగా) గుర్తు చేయబడుతోంది.

ఉదాహరణగా…..

ఒకడు తన గ్రామం వదలి సుదూరంగా ఉండే ఏదో కొత్త ప్రదేశంలో ఒక వీధిలో ఉన్నప్పుడు, అక్కడ కనబడుచున్న అనేక జనులతో ఏమాత్రము సంబంధము లేకుండానే వారందరిమధ్యగా నడచివెళ్లుతూ ఉంటాడు కదా! అసంబంధాత్ తథా జ్ఞస్య గ్రామో-పి విపిన- ఉపమః!

అదేవిధంగా ఆత్మజ్ఞాని (సమస్తము ఆత్మయే అని ఎరిగియున్నవాడు) తాను నివసించే గ్రామములోని వీధులలో నడుస్తూ ఉన్నప్పుడు - ‘‘ఈ నా బంధువులు, మిత్రులు మొదలైన వారంతా సహజదృష్టిచే మమాత్మానంద స్వరూపులే! ఇక సందర్భానుచితంగా కనిపించే బంధుత్వము సంబంధత్వము సందర్భకల్పితము. వస్తుతః అవాస్తవము. నాటకములోని పాత్రల పరస్పర సంబంధము వంటిది’’ - అని సుస్పష్టముగా ఎఱిగియే ఉంటున్నాడు. ఓ నిదాఘా! ‘‘నేను ఈ దేహముచే పొందుచున్న సమస్త జగద్దృశ్యము నాకు - కొద్దిసేపు నేను ఉండిపోయే సుదూర పట్టణములోని ఒక వ్యాపార (వ్యవహారిక) స్థలము వంటిది’’….. అని ఎందుకు అనుకుంటూ ఉండరాదు? ఇక్కడ కాలానుగతంగా అన్నీ కూడా మార్పు - చేర్పులుగా జరుగుచున్నాయి- అనునది ఎల్లప్పుడు అందరికీ అనుభవమే కదా। తత్ఫలితంగా సర్వాత్మీయమగు ఆత్మదృష్టి రూపుచెందగలదు.

అంతర్ముఖుడు : అంతర్ముఖతయా నిత్యగ్ం సుప్తో బుద్ధో, వ్రజన్, పఠన్, పురం జనపదం గ్రామం - అరణ్యమ్ ఇవ పశ్యతి। బాహ్యదృశ్యములను బాహ్యముననే అట్టేబెట్టివేసి, ఎవ్వడైతే సహజీవులను, ‘‘కేవలమగు ఆత్మయే వీరంతా!’’ - అను దృష్టితో చూస్తూ ఉంటాడో - అట్టి వానిదే ‘‘ఆత్మదృష్టి’’. ఆత్మజ్ఞాని సర్వదా అంతర్ముఖుడై ఉంటాడు. ఆతడు మెలకువగా ఉన్నప్పుడు, నిదురిస్తూ ఉన్నప్పుడు, ప్రబుద్ధుడై (సాలోచనగా) ఉన్నప్పుడు, స్నేహితులతోను-బంధువులతోను కలిసి వీధులలో నడుస్తూ ఉన్నప్పుడు, ఏదో పఠిస్తూ ఉన్నప్పుడు’’ ఆత్మదృష్టిని వీడడు. అనేకమంది జనులతో కనిపిస్తున్న గ్రామమును, పట్టణ ప్రదేశమును కూడా - నిర్జనమగు (జనమే కనిపించని) అడవిలో తానున్నట్లే అదంతా దర్శిస్తూ ఉంటాడు. (‘జనారణ్యము’ - అను భావన వీడడు).

లోపలి ఏముంటే అదే బయటగా…కనిపించటము : ఒకరి హృదయంలో (అంతరంగములో) ఏదేది ఏ విధంగా ఉంటే, అదియే బాహ్యమున జగత్తుగా (అదేవిధంగా) అనుభవమై సిద్ధిస్తోంది. (యత్ భావమ్ - తత్ భవతి, ఇహ, ఇతి)।

ఈ జీవుడు కర్మలు నిర్వర్తించకతప్పనే తప్పదు. అనివార్యం అయితే…
అంతఃశీతళతాయాం తు అంతరంగము ప్రశాంతము, శీతలముగా ఉండినప్పుడు ఈ ప్రపంచముగా శాంతముగా, చల్లగా
లబ్దాయాం శీతళం జగత్। (Pleasantly cool) అనుభవమవగలదు.
అంతః తృష్ణ ఉపతప్తానాం ఒకవేళ అంతరంగము తృష్ణ (Desires and expectations) ఉంటే, ఈ జగత్తు కూడా
దావదాహమయం జగత్ ఆశా మోహములుచే దాహమయంగా అనిపించసాగుతుంది.
భవతి అఖిల జంతూనాం జీవులందరికీ కూడా అంతరంగంలో ఏదేది ఏవిధంగా ఉంటే, అదియే ‘జగత్తు’ రూపంగా
యత్ అంతః బహిః స్థితమ్। (ఆవిధంగానే) అనుభవమౌతోంది.

సమాహితుడు

అందుచేత ఓ నిదాఘా! మనము సమాహితులము అయి ఉండాలి సుమా!

నిదాఘుడు : గురుదేవా! సమాహితము అనగా? మనము సమాహితులము అయ్యేది ఎట్లా?

ఋభుమహర్షి : యస్తు ఆత్మారతిరేవాంతః, కుర్వన్ కర్మేంద్రియైః క్రియాః న వశో హర్ష శోకాభ్యాగ్ం, స ‘సమాహిత’ ఉచ్యతే। ఇంద్రియములతో ఆయా విహిత, అవిహిత-ఇత్యాది కర్మలు నిర్వర్తిస్తూ కూడా హర్ష-శోకములకు వశుడు కాకుండా ఉండువాడు సమాహితుడు.

‘‘సమస్తము సర్వదా సర్వసాక్షియగు ఆత్మయొక్క తత్త్వమే కదా! నేను ఆత్మకు అనన్యుడను కదా!’’ - అను భావనతో ఆత్మయందే రమిస్తూ ఎవడు ఉంటాడో, అట్టివానిని ‘సమాహితుడు’ అని శాస్త్రము నిర్వచిస్తోందయ్యా!

యః పశ్యతి - సపశ్యతి। ఆ తీరైన దర్శనమే ‘సత్యము’ అయిన, ‘సరి’ అయిన దర్శనము. అట్టి ‘సమస్తము ఆత్మయే’ అను భావన (తత్త్వభావన) సునిశ్చయం చేసుకొని, ఈ జగత్తులో కర్మలు చేస్తూ ఉండగా, ఇక ఆతనికి ఎట్టి సంసారదోషము అంటదు. ఆత్మానుభూతికి లోటు ఉండదు. ఇక ఈ భౌతిక శరీరము కలిగి ఉండటము గురించి, ఇది బంధముగా అవటము గురించి ఏమంటావా? ‘‘నాకు, నాకు చెందినది, నీది, నీకు చెందినది, 14 లోకాల ద్రష్టలు - వారివారికి చెందినది - సమస్తము అఖండమగు ఆత్మయే’’ అను దృష్టిని (లేక) ఆత్మసాక్షాత్కారమును సిద్ధించుకొన్న యోగీశ్వరునికి (లేక) యుక్తునికి

అద్యైవ మృతిః ఆయాతు। కల్పాంత నిచయే నవా, న అసౌ కళంకమ్ ఆప్నోతి।

ఈ భౌతిక శరీరము ఇప్పుడు ఈ క్షణంలో నశించినాసరే! లేదా, ఇది కల్పాంతము వరకు కొనసాగినా సరే….ఆతనికి ఎట్టి కల్పనాదృష్టి సంబంధమైన దోషము అంటదు. ఎక్కడ ఎప్పుడు ఏది ఎట్లా ఉన్నా (లేక) పరిణమించినా కూడా, ఆతడు ‘‘నిత్యసత్యమగు బ్రహ్మమే (లేక) ఆత్మయే ఇదంతా’’ అను బుద్ధి నుండి చ్యుతి పొందడు. వదలడు. న అసౌ కళంకమ్ ఆప్నోతి హేమ పంక గతం యథా। బంగారము బురదలో పడినంతమాత్రం చేత బంగారములోనికి బురద ప్రవేశిస్తుందా? అద్దాని విలువ తగ్గుతుందా? లేదు కదా! అట్లాగే ఆత్మభావునిలో ఇక్కడి జన్మ-కర్మ వ్యవహారములు ప్రవేశించలేవు. ఆతని ఆత్మత్వమునకు లోటు కలిగించలేదు. ఆత్మకు ఎప్పుడూ కూడా దోషము లేదు. లోటు లేదు. అట్టి నిశ్చలమగు ‘ఆత్మమేవాహమ్’ ‘ఆత్మయేవ ఇదగ్ం సర్వమ్’- అని భావన చేయి.

నిదాఘుడు : అట్టి ఆత్మభావన సుస్థిరీకరించుకోవటము ఎట్లా?

బుభుమహర్షి : ఓ నిదాఘా! కో2హమ్? కథమ్ ఇదమ్, కిం వా? కథం మరణ జన్మనీ? విచారయ। - నేనెవరు? ఇదంతా ఇట్లా ఎందుకు జరుగుతోంది? మరణిస్తే ఏమౌతోంది? జన్మకు ముందు నేనెవరిని? - ఈఈ విషయములు కొంచము విచారణ (Analysing) చేయవయ్యా। వేత్ధం, మహత్ తత్ ఫలము ఏష్యసి। ఈమాత్రము విచారణచే నీయొక్క తత్ (సహజము, సత్యము, నిత్యము) అగు స్వరూపము గురించిన ఎరుకచే మహత్తరమైన ప్రయోజనము పొందగలవు. విచారణ చేసినంతమాత్రంచేత, నీవెవరో, నీ అసలైన స్వభావమేమిటో, ఈ జన్మ-మరణముల మధ్యగా కనిపించేదంతా ఎందుకు సందర్భ పరిమిత సత్యము మాత్రమేనో-తెలుసుకోగలవు.

మనోరూపమిదగ్ం సర్వమ్। ఈ జగత్తుగా అనుభవమయ్యేదంతా నీ మనోరూపము మాత్రమే! మనస్సు అనగా నీ ఆలోచనా పరంపరల చమత్కారమే! ఎప్పుడైతే ‘‘నేను ఎవ్వరు? ఈ జన్మమృత్యువులు ఏమై ఉన్నాయి?’’ అనే పరిశీలనచే నీకు సంబంధించి విచారణకు ఉపక్రమిస్తావో, ఇక నీవు నీయొక్క మనోపరిమితత్వమును అథిగమించి వేయగలుగుతావు. పాము తన కుబుసమును త్యజించి, అక్కడి నుండి బయల్వెడలి హాయిగా అటూ ఇటూ తిరుగుతుంది చూచావా? ఆ విధంగా, మనోస్వరూపమును త్యజించి, నీయొక్క అంతరింద్రియ ఆధిపత్య రూపమగు ‘శమము’ (పరమశాంతము)ను ధారణ చేస్తూ ఆత్మభావనను స్వాభావికం చేసుకో. విజ్వరుడు (Getting rid of all kinds of worries) అగుము. సంసార వృత్తులను (Avocations that are forming while using Eye, Ears, etc.,) త్యజించి, నిర్మలము - అతీతము అగు బుద్ధిని పొందుచూ ఉండగా, అప్పుడిక నీ చిత్తము సంసార వృత్తులలో (Avocations pertaining to what is being seen, felt and heard in the scenario) నిమజ్జనము పొందదు. ఆత్మవృత్తినే ఆశ్రయించగలదు.

హే బ్రహ్మన్! నీ బుద్ధి బ్రహ్మము నందు మాత్రమే ఉన్నదగుగాక. అప్పుడు ఇక ఇక్కడ ‘సంసారసాగరము’ అని చెప్పబడేదంతా గోష్పాదము (కొంచెము నీరుగల - ఆవుడెక్క - ముద్ర - గుంట) దాటటము వంటిది అవగలదు. గోడెక్కముద్ర జలములో కీటకము చిక్కుకుంటుందేమోగాని, ఆత్మతత్త్వము ఎరుగుచున్న విజ్ఞాని కాదు.

ఆత్మ నిశ్చయుడు విషయ సంసారమున మునుగడు.

(గోష్పాదజలంలో మూగిన దోమలు మునగకుండానే పైపైనే వ్రాలి, కొంతసేపైన తరువాత ఎగిరిపోతూ ఉంటాయి. చిన్న గులకరాయి ముక్క అయితే మునిగిపోతుంది. అట్లాగే ఆత్మ సమాచారముపట్ల నిశ్చలుడు సంసారమునందు మునుగడు).

ఓ మునిశ్రేష్ఠా! నిదాఘా!

ఎవ్వడైతే ఈ సమస్త దృశ్యరూప సంసారమును స్వయము మొదలే విడచినవాడై ఉంటాడో, - యావత్ యావత్, మునిశ్రేష్ఠ! స్వయం సంత్యజ్యతే అఖిలమ్, తావత్ తావత్ పరో లోకః పరమాత్మైవ శిష్యతే। - అంతంత వరకు పరమాత్మత్వమును స్వయం - సంసిద్ధించుకున్నవాడు అగుచున్నాడు.

ఎంతెంతవరకైతే - యావత్ సర్వం న సంత్యక్తం తావత్ ఆత్మా న లభ్యతే। - ఈ జీవుడు దృశ్య విషయాలలో సంబంధ - అనుబంధ - బాంధవ్యములను మంకుపట్టుతో పట్టుకొని, వదలకయే ఉంటాడో,….అంతంత వరకు ఈతనికి ఆత్మభావన లభించదు.

త్యాగేనైవతు కైవల్యమ్

సర్వ వస్తు పరిత్యాగే శేష ఆత్మేతి కథ్యతే। ఈ బాహ్య సంబంధమైన సర్వ వస్తు జాలమును మనస్సుచే - ‘‘ఇది నాకు సంబంధించినది కాదు. నేను దీనికి సంబంధించినవాడిని కాదు’’ - అను భావనాపటిమతో సంపరిత్యజించుచుండగా, అట్టివాడు - అప్పటికీ శేషించియుండే ఆత్మయే తానగుచున్నాడు.

అందుచేత ఆత్మావలోకనము (ఆత్మసాక్షాత్కారము) కొరకై ఈ ఇంద్రియ దృశ్య సంబంధమైన సమస్తమును మనస్సుతోను, బుద్ధితోను పరిత్యజించి ఉండెదవుగాక! ఆత్మావలోకనార్థం తు తస్మాత్ సర్వం పరిత్యజేత్। సర్వం సంత్యజ్య దూరేణ యత్ శిష్టం, తన్మయో భవ। త్యాగేనైవతు కైవల్యమ్త్యాగేనైవతు కైవల్యమ్ సమస్తము త్యజించినవాడవైన - తరువాత, అప్పటికీ ఏది విశిష్టమై శేషించియే ఉంటుందో అట్టి ఆత్మయే నీవై ఉండుము.

యత్ దృశ్యమ్। తత్ అశాశ్వతమ్। తత్ నశ్యమ్।

ఓ నిదాఘా! నీటిలో ఆవర్తములు (సుడులు), తరంగములు కనబడి, ఇంతలోనే మాయమగుచూ ఉంటాయి. అటువంటి సుడులు, తరంగాలు శాశ్వతము - అని అంటామా? అనము. తరంగాల దృష్ట్యా జలము మాత్రమే ఎప్పటికీ ఉంటుంది. అట్లాగే, సర్వం కించిత్ ఇదం దృశ్యం దృశ్యతే చేత్ జగత్ గతమ్, చిత్-నిష్పందాంశమాత్రమ్. తత్। న అన్యత్ కించన శాశ్వతమ్। ఏదేదైతే జగత్ గతమై (జనిస్తూ, గతిస్తూ ఉన్నదై). దృశ్యరూపముగా అగుపిస్తూ ఉన్నదో….అదంతా చిత్‌యొక్క కించిత్ స్పందనమాత్రమే. ఈ సువిశాల విశ్వమంతా కూడా దృశ్యముగా శాశ్వతము కాదు. నశ్వరము. అట్టి ఈ దృశ్యము ఆత్మదృష్టితో చూస్తేనో? ఆత్మస్వరూపంగా శాశ్వతం - (తరంగాలు జలమునందు ఎప్పటికీ ఉండి ఉండుతీరుగా). ‘‘తరంగాలు జలమును బంధిస్తున్నాయి’’ - అని అంటామా? అనము. అట్లాగే జీవాత్మ ప్రదర్శనము పరమాత్మత్వమును బంధించజాలవు.

సమాధి స్థితి - పరాప్రజ్ఞ

హే బ్రహ్మన్। ఎవరి అవగాహనా రూపమగు ప్రజ్ఞ అయితే…

అదియే ‘పరాప్రజ్ఞ’. అదియే బుధులచే (విజ్ఞులచే) ‘సమాధి’ అని కూడా అనబడుతోంది. అట్టి సమాధిస్థితి ఏ కారణాలవలనను, ఎట్టి క్షోభ పొందనట్టి ‘‘అక్షుబ్ధస్థితి’’. ‘అహమ్-మమ’ శబ్దార్థములచే స్పృశించబడనట్టిది. కాబట్టి నిరహంకారమైనట్టిది. ఎటువంటి ద్వంద్వములలో ఏమాత్రము మునగనట్టిది. మేరు పర్వతమువలె సమస్తము ఆత్మగా దర్శించటములో నిశ్చలమైనట్టి స్థితి. ఆత్మగా భావనచేయుటలో సునిశ్చతమైనట్టిది. సర్వలోక సంబంధమైన అభీష్టములకు(Wishes, desires and expectations) అతీతమైనట్టిది. ‘‘ఇది హేయము (వదలవలసినది) - ఇది ఉపాదేయము (స్వీకరించవలసినది, నిర్వర్తించవలసినది)’’ - అను పరిధులను దాటివేసియున్నట్టి అంతర్-మనోస్థితి. మనస్సు యొక్క ఆత్మతో ఏకరూపమగు పరిపూర్ణత్వము సిద్ధించుకొన్నట్టి స్థానమే సమాధి. ‘‘సూర్యుని నుండి బయలుదేరిన కిరణము దేనిపై ప్రసరిస్తూ ఉన్నప్పటికీ అది సూర్యతేజస్సుకు అభిన్నమే కదా! అట్లాగే నేను, సహజీవులు కూడా చిత్ ప్రకాశముయొక్క కల్పితాంశములై, చిదాత్మకు అనన్యులము’’ అను స్థిరబుద్ధి సిద్ధించుకొన్నప్పటి స్థితియే సమాధి.

తుర్యక్ దృష్టి

జీవుల పట్ల - (1) ‘జాగ్రత్ దృష్టి, (2) స్వప్నదృష్టి, (3) సుషుప్తి దృష్టి’ - అను మూడూ కూడా ఒకదాని తరువాత మరొకటి ఏర్పడినవై - మనోగతమై ఉండటము స్వాభావికము. సర్వత్రా సామాన్యము. అయితే వేదవిత్తములు (వేదహృదయము తెలిసినవారు) అగు మహనీయులు తుర్యస్థానమును ప్రాప్తించుకున్నవారై ఉంటున్నారు.

తుర్యక్ స్థానము : ‘‘ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నేను కల్పించుకొని, ప్రవేశించి, తిరిగి మరలి వచ్చుచున్న భూమికలు. నేను వాటికి వేరై, వాటికి ఆధారమై సాక్షీభూతుడను’’ - అని దర్శిస్తూ ఉండటమే ‘తుర్యక్‌స్థాన ప్రాప్తి’ అని చెప్పబడుతోంది. అది జాగ్రత్ స్వప్న సుషుప్తులకు దూరగతం కాదు (వేరైనది కాదు), ‘ఆ మూడూ నావి’ అను దృష్టియే తుర్యక్. అది సుషుప్తివలె జాగ్రత్-స్వప్న విషయరహితము - అయినప్పటికీ సుషుప్తివలె జడస్థితికాదు. ఎందుకంటే ‘సుషుప్తి’ అనేది మనస్సు, అహంకారము మౌనము వహించినట్టి స్థితిమాత్రమే. సుషుప్తి నుండి జాగ్రత్‌కో, స్వప్నములోనికో బయల్వెడలటానికి సిద్ధము అవుతూ ఉండగానే, తత్‌క్షణమే మనస్సు - అహంకారములు - తమ తమ వర్తమాన ప్రాపంచక దృశ్య సంచారములతో సహా - జూలు విదల్చుకొని బయల్వెడలుచున్నాయి. తుర్యక్ స్థితియో? అటువంటిది కాదు. మరి? మనో అహంకార విలయే, సర్వభావ అంతర స్థితా। మనస్సు అహంకారము ఆత్మయందు విలయము (Melting) పొందగా, సర్వభావములయొక్క అంతరముగా (ఆభరణములలో బంగారమువలె) స్థితి కలిగి ఉన్నట్టిది. ‘తుర్యక్’ అను అనుభవము సమస్తమునకు ఆవల (పారమ్) ఆత్మానంద (లేక) పరానంద సాగరములో ప్రదర్శనమగు ఈశ్వరీ సంబంధమైనది.

అట్టి సర్వమునకు పరమైయున్న కేవలానంద - అకారణానంద స్థితికి మార్గము - ఎవరికివారే మనస్సుతో మనస్సును జయించి స్వయముగా లాభించుకోవలసినట్టిది. చిత్తము తనయొక్క సమస్త వాసనలు (All Tendencies towards outward ‘Indriya’ contexts) నశింపజేయగా పరమస్ఫుటముగా ఈ జీవునికి తనయందే తురీయము ప్రకాశమానము అవగలదు. సర్వత్రా సమదర్శనముచే (సర్వత్రా- ఏకము-అఖండము అగు ఆత్మగా దర్శనముచే), స్వస్వరూపానుభవముగా పరిణామము పొందగలదు.

అట్టి స్వస్వరూపాత్మ మహత్తరమైనది. అచింత్యమైనది. అఖిలమ్ ఇదమ్ అనంతమ్, ఆత్మతత్త్వమ్ దృఢ పరిణామిని చేతసి స్థితో అంతః । ‘‘ఈ కనబడే సమస్తము కూడా అనంతమగు ఆత్మతత్త్వము యొక్క పరిణామమే కదా!’’ - అని చిత్తమునకు సంబోధన చేస్తూ, చిత్తమునకు ఆవలగల ‘‘చిత్‌తత్త్వము’’ నందు స్థితిని కలిగి ఉండటమే తుర్యక్‌స్థితి. చరాచరాత్మకమైన ఈ ప్రపంచము, - భేద రూపములతో కనిపించేదంతా - భావాతీతము నందు ఉపశమించగా, చిత్తము ఆసక్తిరహితము, నిశ్చలము అవగలదు. ‘సంసారము’ అనే భేద దృష్టితొలగిపోయి, దేవదేవుడగు ఆత్మ భగవానుని స్వరూపముగా ఈ సమస్తము అనుభవ మగుచూ ఉండటమే తుర్యక్‌స్థితి విశేషము. దీర్ఘ తపస్సు (తపనతో కూడిన ప్రయత్నముచే, క్రమముగా ఇదంతా ‘ఆత్మగా అనుకోవటము’), సుదీర్ఘభావనా యత్నము, సర్వభేదములపట్ల ‘అనాసక్తి’ అధికమగుచుండగా - చిత్తముయొక్క దృశ్యముతో సంబంధము కారణంగా ఏర్పడిన బంధము తొలగిపోతోంది.

ఒకడు దృశ్యము పట్ల సక్తుడు (Attached) అయి ఉన్నంతకాలము దీర్ఘతపస్సుచేసినా, యోగాభ్యాసము నిర్వర్తించి ‘యుక్తుడు’ అయినా కూడా - బద్ధుడే అవుతాడు.

అంతరమున సంసక్తి నిర్మూలించుకొన్నవాడు స్వాభావికంగానే మధురమైన వృత్తి కలవాడు అవుతాడు. అట్టి అసంసక్తుడు అంతఃసంసక్తి (Inward attachment) ని జయించివేస్తూ ఆత్మ తత్త్వ మా
ధుర్యము సిద్ధించుకొన్నవాడు బాహ్యమున కర్మలు చేస్తూ కూడా, బహిః కుర్వన్, న కుర్వన్ వా, కర్తా భోక్తా నహి క్వచిత్-ఇతి। - అంతరమున దేనికి కర్తగా గాని, భోక్తగా గాని అవనివాడే అయి ఉంటాడు.
(తుర్యక్ = తురీయము = చతురీయము = జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవి అయి ఉన్న ఆవల గల ఈ జీవుని స్వస్వరూపము).


2వ అధ్యాయము
(సంగము; బంధము; మోక్షము; చికిత్స)

నిదాఘుడు : గురువర్యా!

సంగః కీదృశ ఇత్యుక్తః? ‘సంగము’ అనేది ఏ రూపమైనట్టిది?
కశ్చ బంధాయ దేహినామ్? - ఈ దేహికి ఏది బంధము? ఈ జీవునిపట్ల బంధము ఎవరి వలన, ఎందుకు, ఎట్లా వచ్చిపడుతోంది?
కశ్చ మోక్షాయ కధితః? - ఏది ‘మోక్షము’ అనబడుతోంది?
కథం తు ఏష చికిత్సతే? - ఈ బంధము తొలగటానికై ఈ జీవుడు ఆశ్రయించవలసిన చికిత్స ఏది?

సంగము - బంధము

ఋభుమహర్షి :

శ్లో।। దేహ-దేహి విభాగేన పరిత్యాగేన భావనా,
దేహ మాత్రే హి విశ్వాసః సంగో బంధాయకల్పతే।।

ఈ జీవుడు దేహముతో కూడి ఉంటున్నాడు కదా! దేహము - ఉపయోగించబడేది. దేహియో? దేహమును ఉపయోగిస్తూ ఉన్నట్టి వాడు. ఒకడు ఒక వస్తువును (వస్త్రమునో, కలమునో, వంటపాత్రనో, ఒక వాహనమునో) ఉపయోగిస్తూ ఉంటే ఆ ఉపయోగించేవాడు (one who is using) - తాను ఉపయోగిస్తున్న ఉపకరణము (That being used) నకు దాసుడుగా అవుతున్నాడా? అవనే అవడు. కానీ ఈ జీవుని పట్ల అట్లా జరగటంలేదు. ‘‘ఈ దేహమును నేను ఉపయోగించేవాడిని. దీనికి వేరుగా ‘దేహి’ని అయి ఉన్నాను’’ అనే విషయమే ఏమరుస్తున్నాడు. ‘‘ఈ దేహము లేకపోతే నేను లేను. ఇది నశిస్తే నేను ఏమౌతానో కూడా నాకు తెలియదు. ఇది ఉంటేనే నేను ఉంటాను’’ - అను ‘‘దేహముతో అవినాభావ మనో సంబంధమే’’ బంధముగా అగుచున్నది. ఈ దేహమునకు దేహి - దాసుడుగా అగుచున్నాడు. ఎంతటి చమత్కారం!

‘‘నేను ఈ దేహమే।’’ అనే విశ్వాసము దట్టముగా కలిగి ఉంటున్న దౌర్భగ్యముచేతనే ఆతనిపట్ల బంధము కల్పించబడినది అవుతోంది. ఒకవేళ ఈ భౌతిక దేహము గురించి ఈ జీవునికి ‘‘ఇది నశిస్తే నేను నశిస్తాను. లేదా ఏమౌతానో నాకు ఏమీ తెలియదు’’ - అనే మూర్ఖభావనను త్యజిస్తేనో? అప్పుడు ఈ జీవునికి బంధము ఉండే ప్రసక్తియే లేదు. ఎందుకంటే, ఈతనిపట్ల ఇకప్పుడు సహజమగు స్వాత్మభావనయే శేషించగలదు కాబట్టి! అట్టి స్వాత్మభావన జీవన్ముక్తికి దారితీయగలదు.

జీవన్ముక్త స్థితి : ‘‘సర్వమ్ ఆత్మ ఇదమ్, అత్ర అహం కిం వాంఛామి? త్యజామి కిం?’’ ‘‘నాతో సహా ఇక్కడి సమస్తము ‘ఆత్మ’యే అయి ఉండగా, ఇక కోరుకోవలసినది ఏముంటుంది? త్యజించవలసినది మాత్రం ఏముంటుంది?’’ - అను రూపముగల ‘అసంగస్థితి’యే ‘‘జీవన్ముక్తత’’ (శరీరముచే బంధము కలుగనట్టి) స్థితి.

అసంసక్తుడు

నాహమస్మి। ఆత్మకు వేరుగా ‘నేను’ లేను. న చ అన్యో-స్మి। న చ అయం। న చ నేతరః। ఆత్మకు వేరై మరొకరు లేరు. వీరు లేరు. వారు లేరు. నేను సర్వదా బ్రహ్మమునే। నీవు, ఇతరులు బ్రహ్మమే।’’ - అని భావించటమే ‘‘అసంగస్థితి’’.

అట్టి అసంగస్థితి సిద్ధించుకొన్నవాడు ‘‘నేను కర్మలు చేయను’’ - అను ‘నైష్కర్మ్యము’ గాని, ‘కర్మలు చేయాలికదా’ అనే కర్మలలో తదాత్మ్యముగాని పొందడు. కర్మలు చేయవలసి వస్తున్నా, (లేక) చేయలేకపోయినా కూడా ‘సమత్వము’ వీడక ఉండువాడే అసంసక్తుడు. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా సమస్త కర్మఫలములను మనస్సుతో పరిత్యజించు నిపుణత (Efficiency) ఉన్నవాడిని ‘అసంసక్తుడు’గా చెప్పుతారు.

ఈ జీవుని పట్ల ‘ఏదో చేయాలి! ఇంకా చేయాలి!’ అనే రూపంగా రజోగుణము ప్రవర్తిస్తూ ఉంటోంది. అట్టి ‘రజోగుణము’ వలన కామ-క్రోధములు విజృంభించి, అవి కాస్తా ఈ జీవునికి శ్రమలు, పాపదృష్టులు, అల్ప భావములు - మొదలైనవన్నీ మూటగట్టి తెచ్చిపెడుచున్నాయి. కర్మలకు అంతెక్కడిది? అటువంటి అనుక్షణము విజృంభిస్తున్న చేష్టలన్నిటినీ ‘సంకల్పించకపోవటము’ అను అసంకల్పనయే చికిత్స. జీవుడికి సంకల్పములవలన బంధము. అంతేగాని, కర్మల వలన కాదు సుమా! అందుచేత, అసంకల్పనయే శ్రేయోదాయకమైయున్నది. (సంకల్పోహి బంధాయ। నిస్సంకల్పోహి మోక్షయే।)

దేహి సంకల్పము దేహము

‘సంకల్పము’ ఎక్కడి నుండి వస్తోంది? సక్తత (Attachments) వలన. అందుచేత ఓ నిదాఘా! ఇక్కడి ఆయా చేష్టలందు (జగద్దృశ్యములో జరుగుచూ ఉన్న వ్యవహార పరంపరలయందు) గాని, ఇక్కడి సంబంధ-అనుబంధ-బాంధవ్యములు మొదలైనవాటితో ఏర్పడే చింతనలయందుగాని, ఇల్లు మొదలైన వస్తు సముదాయమునందుగాని, ‘‘అక్కడికి పోవాలి - ఇక్కడికి రావాలి’’ అనురూపమగు రాక-పోకలయందుగాని, ‘‘ఇది కల్పన-అది నిజము. ఇది గొప్ప - అది కాదు’’ మొదలైన కలన - అకలనములందుగాని - ‘‘సక్తత’’ లేకపోవటమే అసంసక్తత. అవి ఏ తీరుగా ఉన్నాకూడా ఒక్క తీరుగా చూడటమే అది. వాటియొక్క సంకల్పములను అంతరంగములో త్యజించి ఉండటమే ‘అసంసక్తత’కు సుమార్గము.

ఈ దృశ్యము యొక్క అనుభవమునకు ఆవల ‘ఎరుక’ రూపమగు ‘కేవలచిత్’ (Knowing at its Absolute Form) వేంచేసినదైయున్నది. అటువంటి చిత్ స్వరూపము యొక్క మాధుర్యము ఎరుగుచున్నప్పుడు, ఆపై మనస్సు వ్రాలుచున్న దృశ్య వస్తు సముదాయముల గురించి అరసము (Distaste) స్వాభావికమవగలదు. ఈ మనస్సు - ఇంద్రియములకు ప్రియంగా కనిపించేవన్నీ దాటివేసి, స్వాభావికమగు ఆత్మానందమునందు దృష్టి పెట్టగలదు కూడా. ఈ జీవునికి వాస్తవమైన ఆనందము ఇంద్రియ - ఇంద్రియ విషయములలో లేదు. ఇంద్రియానందము వ్యాజ (Avocations and ‘IFs’ and ‘BUTs’) రూపమైనది. ఆత్మయందే ఆత్మజ్ఞానానంద రూపముగా వేంచేసి ఉండగా, ఆనందము కొరకు ఇంద్రియ జగత్తులో ఎంత వెతికి ఏమి ప్రయోజనము? వెతకవలసిన అగత్యము ఏమిటి?

నిదాఘుడు : పితృదేవా! మేము ఈ ప్రాపంచకమైన అత్యవసరముల దృష్ట్యా అనివార్యంగా అనేక ‘కర్మలు నిర్వర్తించక తప్పటంలేదు. వాటిలో కొన్ని చేయవలసినవి’… అని తెలిసి కూడా చేయలేకపోతున్నాము. కొన్ని ‘చేయకూడదు’ అని తెలిసి కూడా చేస్తూనే ఉంటున్నాము. ఈ విధంగా కర్మలకు దాసులము (Slakes) అగుచున్నాము. కర్మలను జయించి ‘ఆత్మభావన’ యందు ప్రవేశించేది ఎట్లా? ఎన్నటికి?

ఋభుమహర్షి : బిడ్డా। నిదాఘా! వ్యవహారమ్ ఇదగ్ం సర్వం మా కరోతు, కరోతు వా, అకుర్వన్ వాపి కుర్వన్వా, …..జీవః స్వాత్మ రతి క్రియః । నీవు కర్మలు చేయి. లేదా చేయకపో. చేస్తూ ఉన్నా, చేయకుండా ఉన్నా కూడా….ఆత్మయందు (ఆత్మగా ఈ సమస్తమును భావించుటయందు) ఇష్టము కలిగియుండెదవు గాక! అన్యభావనలను ఆత్మపట్ల ఇష్టాపూర్వకంగా త్యజించి ఉండు. ఇందులో కష్టమేమీ లేదు. ‘‘అంతా పరమాత్మ చమత్కారమే’’ - అని అనుకోవటంలో కష్టమేమున్నది? నాటకంలో నటిస్తూ ఉన్నవాడు - ఎంతో నటిస్తూ ఉన్నప్పటికీ, - ‘‘ఇది నాటకమే’’ - అని మరవటం లేదు కదా మరి?

అన్ని వదిలివేసి ప్రశాంతముగా ప్రకాశము వెదజల్లు ‘మణి’ వలె - చైత్యము (అనుభవమయేదంతా) సశాంతించినట్టి చిత్తముతో ఘనీభూతమగు ‘స్వస్వరూప-సమస్తస్వరూప’ ఆత్మభావనను ధారణ చేస్తున్నవాడవై ఉండు.

జాగ్రత్‌లో సుషుప్తి : జాగ్రత్‌లో ఉంటూనే నీ చిత్తము చైత్యరహితము (పంచేంద్రియ విషయములపట్ల కామక్రోధ లోభ రహితము) అయి ఉంటున్నప్పుడు, ఇక ఆపై అంతరమునకు పరమశాంతమగు స్థితి ఆరూఢమవగలదు. అట్టి స్థితిని ‘‘జాగ్రత్ సుషుప్తి’’ అంటారు. అట్టి జాగ్రత్ సుషుప్తి యొక్క స్థిరమైన అభ్యాసముచే ఏర్పడే ప్రౌఢస్థితి (matured state) ‘‘తురీయ స్థితి’’ అనబడుతోంది. ‘‘అది అవినాశనము. మార్పు - చేర్పులు లేని అమృతస్వరూపము అగు తురీయము - అని తత్త్వ కోవిదులచే శబ్దార్ధపూర్వకంగా చెప్పబడుతోంది. అది ఏకాంత (ద్వితియమేకాని) ఆనందశీలత్వముతో కూడిన ఆశ్రయమము కాబట్టి ‘ఆనందపదము’. (పంచకోశములలోని) ఆనందమునకు కూడా ఆవల ఉన్న సాక్షీతత్త్వము కాబట్టి ‘అనానందము’ కూడా.

తురీయాతీతము : జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను తనయొక్క పురుషకారముచే నిర్మించుకొని విహరించు స్వస్వరూపస్థితి విభాగము తురీయము. అట్టి తురీయమునకు కూడా సాక్షి అయి ఉన్నట్టి స్వస్వరూపస్థానము - ‘తురీయాతీతము’.

ఆనంద ఏకాంత శీలత్వాత్ : అది - లోకములు, లోకానుభవములు, లోకానుభవి కూడా తనకు అన్యము కాని స్థితి కాబట్టి - ‘ఏకాంతానందము’ అనబడుతోంది.

అనానందపదం గతము : అది పంచకోశములలోని ఆనంద కోశమునకు కూడా ఆవలది కాబట్టి ‘అనానందపదంగతము’ - కూడా!

మహానంద స్వరూపము : అద్దాని ఆనంద వీచికలే 14 లోకములు, లోకపాలకులు, సృష్టి - లయములు, కల్ప - కల్పాంతరములు కూడా! కనుక ‘మహానందస్వరూపము’.

అవినాశినీమ్ : అది వినాశనము యొక్క ఊసు కూడా ఉండనట్టి అవినాశనమగు అమృతస్వరూపము. ఓ ప్రియ నిదాఘా! సమస్త శ్రోతలారా! మనమంతా సర్వదా అట్టి అవినాశ, అమృతరూపము అగు ‘ఆత్మయే’ అయి ఉన్నాము సుమా! కనుక అది బాహ్య సంచారములు విరమించి స్వగృహమునకు చేరటమువంటిది.

తుర్యాతీతపదము - ముక్తుడు

‘ముక్త’ ఇతి ఉచ్యతే యోగీ తుర్యాతీతపదం గతః। అట్టి తుర్యాతీతపదమును తనయొక్క స్వాభావిక - అనునిత్య స్వరూపముగా గమనిస్తూ, ఆస్వాదించుచున్న యోగి - ‘ముక్తుడు’. ఆతడే - ‘తుర్యాతీతపదంగతుడు’.

బ్రహ్మము

అట్టి ముక్తునికి కాలాతీతమై, స్వాభావికమై అనుభవమగుచున్న తుర్యాతీతానుభవమునే ‘బ్రహ్మము’ అని కూడా అంటున్నారు.

పరిగళిత సమస్త జన్మపాశః। సకల విలీన తమోమయాభిమానః । పరమరసమయః పరాత్మసక్తో। జలగత సైంధవ ఖండవత్ మహాత్మా। జడ-అజడ దృశోర్మధ్యే - యత్ తత్త్వమ్ పారమార్థికమ్, అనుభూతిమయం తస్మాత్ సారం ‘బ్రహ్మ’ ఇతి కథ్యతే।

అట్టి ‘బ్రాహ్మీస్థితి’ ఎటువంటిదంటే…

పరిగళిత జన్మపాశః జన్మలు నా నుండి స్వప్న - స్వప్నాంతరముల వలె (ఒక ‘కల’ తరువాత మరొక ‘కల’ వలె) బయల్వెడలుచూ, నాయొక్క ‘క్రీడా-లీల’’గా నన్ను ఆనందింపజేస్తున్నాయి. నేను కంటున్న ‘కల’ - నన్ను బంధించదు కదా। అట్లాగే నా లీలావినోద - స్వయంకల్పితమగు ‘జన్మరూప’ స్వప్నములు నన్ను బంధించటమేమిటి? ‘‘ఒక రచయిత వ్రాసిన నవలలోని కొన్ని పాత్రలు బయటకు వచ్చి ఆ రచయితను బంధిస్తున్నాయి’’ - అనే వాక్యం ఎంతగా హాస్యాస్పదమో, ‘‘జన్మలు నన్ను బంధిస్తున్నాయి’’ అనునది అంతటి నవ్వు వచ్చే వార్త!

ఈ విధంగా ఎరుగుచున్న ‘బ్రాహ్మీదృష్టి’గల యోగికి ఇక జన్మ - కర్మబంధములు ఎక్కడుంటాయి? ఉండవు.

విలీన తమోమయాభిమానుడు : ‘‘సమస్తము నేనే అయి ఉండగా ఇక దేని గురించి మాన - అభిమాన తమస్సు (చీకటి) శేషిస్తుంది? అవన్నీ నా బ్రాహ్మీ స్వరూపమునందు విలీనమగుచున్నాయి. నేను సర్వదా బ్రాహ్మీ స్వరూపుడనై విరాజిల్లుచున్నాను’’ - అని బ్రహ్మతత్త్వానుభవి, నిత్యానుభవి - అయి ఉంటున్నాడు.

(1) పరమ రసమయః పరాత్మసక్తో : తనయొక్క నటనాకళ (Art of Acting) ను వినోదముగా కలిగియుండి, అనేక నాటకములలో అనేక పాత్రలు నటించేవానికి (The character Actor) తాను ఒక సందర్భములో ఒక నాటకములో ఒక పాత్ర యొక్క స్వరూప స్వభావములకు బద్ధుడౌతాడా? లేదు కదా! నటునికి ఆవల (నటనా కళకు కూడా ఆవల) తాను సర్వదా ఉండి ఉంటున్నాడు కదా! బ్రహ్మీభావము సిద్ధించుకున్నవాడు - తనయొక్క కేవలము, అఖండము, అప్రమేయము (The absolute, The indivisible, The unconcerned with worldly scene) - అగు బ్రహ్మీస్వరూపమునందే రుచికలిగియుండి, బ్రాహ్మీరసమయుడై ఉంటాడు.

జలగత సైంధవ ఖండవత్ : ఒక ఉప్పు బొమ్మ సముద్రముయొక్క లోతు గురించి అధ్యయనము చేయటానికి సముద్ర జలంలో ప్రవేశించింది. అప్పుడు ఆ ఉప్పుబొమ్మ యొక్క నామరూపాలు ఏమౌతాయి? సముద్రజలంలో కరిగిపోయి, ఏకమైపోతాయి. అట్లాగే, బ్రహ్మముగురించి తెలుసుకునుచున్న యోగి బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు. నామరూపములను తనయందు ఏకము చేసుకొన్న సచ్చిదానందమే బ్రహ్మము.

మహాత్మ : అట్టి తురీయాతీతుడు-బ్రహ్మమే తానగుచు, దేహాత్మత్వమును సం-విస్తరింపజేస్తూ,… ఈ సమస్త విశ్వమును తన శరీరముగా భావిస్తూ, విశ్వరూప - సందర్శనుడై, విశ్వమునకే ఆత్మ అగుచూ ‘మహాత్మ’ అను స్థానము పుణికిపుచ్చుకొంటున్నాడు.
జడ-అజడ దృశోః మధ్యే యత్ తత్త్వమ్ - పారమార్థికమ్

జడము = కదల్చబడునది. (దేహము, ఆలోచనలు, తెలివి, ఇష్టము, అహంకారము, జీవాత్మ మొదలైనవన్నీ కూడా).
అజడము = కదల్చుచున్నట్టిది. (పైవన్నీ చేతనము చేస్తున్నట్టి ఆత్మచైతన్యము).

అట్టి జడ - అజడ సందృశ్యముల మధ్యగా పారమార్థికమగు కేవల చైతన్యముగా ఏర్పడి ఉన్న స్వస్వరూపమే బ్రహ్మము.

అనుభూతిమయం : అది చెప్పగలిగేది కాదు. కానీ, అనుభవమునకు ఇప్పుడే, ఇక్కడే సర్వదా సంసిద్ధమై ఉన్నట్టిది.
అట్టి సారమే బ్రహ్మము.

బంధము - మోక్షము

‘దృశ్యము’తో అవినాభావసంబంధము కలిగి ఉండటమే ‘బంధము’. అట్టి సంబంధము నుండి ముక్తుడుగా (Always wel - relieved) తనను తాను గమనించి ఉండటమే మోక్షము. ఇంతకుమించి ఇక్కడ ఎవ్వరికీ కూడా బంధము లేదు. మోక్షము లేదు.

ఓ నిదాఘా! ఈ జీవులందరు విషయరహితమగు ‘సుషుప్తి’ నుండే ‘జాగ్రత్’కు రావటం జరుగుతోంది కదా! ఇది గుర్తెరుగుతూ, నీవు ఈ ‘జాగ్రత్’లోను, ‘స్వప్నము’లోను కనిపిస్తున్న, అనుభూతమగుచూ ఉన్న


Perception-Perceiving

ద్రవ్య-దర్శన సంబంధములన్నింటినీ నీయొక్క ‘సుషుప్తస్థానము’ (లేక) సుషుప్త శక్తి యందు లయింపజేసి యథాతథుడవై ఉండెదవు గాక!

అట్టి ‘సుషుప్తశక్తి’ యందు ‘జాగ్రత్ దృశ్యధారణ’ చే నీకు, అదృశ్యస్వరూపమగు తుర్యత్వము సిద్ధించగలదు. అదియే - ‘ఆత్మయందు ‘దృష్టిని సుస్థిరీకరించటము’ అని కూడా అంటారు. అట్టి - నీవు నీ దృష్టిని ఏకాగ్రము చేసి సంస్థాపించవలసియున్న ఆత్మ - ఎట్టిది?

న స్థూలో : అది ఇంద్రియములకు స్థూలముగా అనుభవమయే వస్తువు వంటిది కాదు.
న చైవ అణుః : ఏదో సూక్ష్మమైన అణువు (Atom) వంటిది కూడా కాదు.
న ప్రత్యక్షో : ఆత్మ (లేక) బ్రహ్మము కళ్ళకు ఎదురుగా ఒక వస్తువువలె ప్రత్యక్షమై కనిపించేదేదీ కాదు.
న చ ఇతరః : ఈ ప్రత్యక్షమైయున్న సమస్తమునకు వేరై మరెక్కడో ఉన్నట్టిది కూడా కాదు.
న చేతనో : చేతనమై కదులుతూ ఉన్నది కాదు,
న జడో : జడమైనది కూడా కాదు.
న చ ఏవ అసత్ : మొదలే లేనిదై ‘అసత్’ కాదు.
న ‘సత్’ మయః : ‘సత్’ (ఉన్నది) ఏదీ కాదు.
న అహమ్ : ‘నేను’ అను స్వరూపమైనది కాదు. (‘నేను’ - అని ఇప్పుడు అనిపిస్తున్నది జాగ్రత్ పరిమితము కదా।).
న అన్యో : ‘నేను’కు వేరై ‘అన్యము’గా ఉన్నది కాదు. (జాగ్రత్ స్వప్న సుషుప్త దేహ దేహాంతరములు నావై ఉన్నట్టి ‘నేను’ - అది).
న చ వై ఏకో : ఏకము కాదు.
న అనేకో : అనేకము కాదు.
న అద్వయో। (న) అవ్యయః : ‘అద్వయము కాదు. అవ్యయము కాదు. (It is beyond the range of Relativity).

ఇక్కడ ఏది దృశ్యరూపముగా ప్రాప్తిస్తుందో, అట్టి ఇదంతా కూడా (రంగుల కళ్ళజోడులోంచి కనిపించే దృశ్యమువలె) - మనస్సు యొక్క ఇంద్రియాస్పదమైనది మాత్రమే। అంతేగాని ఆత్మకు సంబంధించిన వివరణ కాదు. అట్టి ఇంద్రియ - కల్పిత దృశ్యము వలన ఆత్మకు బంధమెక్కడిది? మోక్షమెక్కడిది? మరి, బంధమెవరికి? మనస్సుకా? నాకా?

శ్లో।। న మోక్షో నభసః పృష్ఠే। న పాతాళే। న (చ) భూతలే।

‘మోక్షము’ అనునది ఎక్కడో ఆకాశంలో లేదు. దిక్కులలో లేదు. పాతాళంలో లేదు. భూమిమీద లేదు. మరి?

సర్వ ఆశా సంక్షయే చేతః క్షయో - ‘మోక్ష’ ఇతి ఈష్యతే।।

ఈ చిత్తము సమస్త దృశ్య వ్యవహారములపట్ల, సందర్భములపట్ల ‘ఆశించటము’ అనునది సంక్షయించినప్పుడు అట్టి చిత్తముయొక్క స్వరూపమే ‘మోక్షము’.

చిత్తము స్వాభావికంగా ఆశ-నిరాశలను త్యజించినప్పుడు అదియే మోక్షము. అంతేగాని, ‘‘నాకు మోక్షము లభించాలి’’ అనునది కొనసాగేంతవరకు, (మనస్సులో చింత అంతరంగా ఉన్నంతవరకు). అది మనస్సుకు బంధమే అగుచున్నది. (‘మోక్షము కావాలి’ అని ఆశించటము కూడా-సంసారము కొనసాగిస్తున్నట్లే-అని చెప్పబడుతోంది). (భగవద్గీతలో 18వ అధ్యాయము-మోక్ష సన్న్యాస యోగము).

ఆత్మ సర్వదా సమస్తమునకు అతీతము (It is beyond all else). సమస్తము ఆత్మయే అయి ఉండగా, మనస్సు మొదలైనవాటిచే ఆత్మకు బంధము ఏర్పడే ప్రసక్తి ఎక్కడిది? ఆత్మకు ఏ క్షణమందు బంధమే లేనప్పుడు ఇక ‘మోక్షము పొందాలి!’ అనే ప్రసంగముతో పనిఏమి? అందుచేత ‘‘నాకు మోక్షము సిద్ధించవలసియున్నది’’- అను భావనను కూడా వదలివేసి ఉండు. ఇష్ట-అయిష్టముల గురించిన చాంచల్యము త్యజించినప్పుడు లభించే ఉత్తమ విశ్రాంతియే మోక్షము. అట్టి పరమ విశ్రాంతి పొందిన మనస్సు ఇక్కడ దేనినీ స్వాభావికంగానే వాంఛించదు.

‘‘నాకు ఆత్మగా ‘బంధము’ అనునది మొదలే ఉండజాలదు’’ - అను నిస్సందేహ నిర్ణయమే ‘‘మోక్షము’’.

జీవన్ముక్తుడు

సమస్తమునకు (సర్వజీవులకు, దృశ్యజగత్తుకు) ఆభరణమునకు బంగారమువలె - ఏది అధిష్ఠానము అయి ఉన్నదో, సర్వ సంకల్పములకు ఆవలన ఏది నిర్వికల్ప స్వరూపమో, అట్టి చిదాత్మయందు - స్నేహము, ప్రియము ఎవ్వడైతే కలిగి ఉంటాడో, - ఆతడే జీవన్ముక్తుడు. అట్టివాడు (జీవుడు - జీవితమును ప్రేమించుచున్నట్లు) ‘ఆత్మ’ పట్ల ప్రియుడై ఉంటాడు.

భక్తులతో భక్తి సమాచారములు సంభాషిస్తూ ఉంటాడు. శఠులలో (మూర్ఖులమధ్యగా) ఉన్నప్పుడు మూర్ఖులలో ఒకడివలెనే ఉంటాడు. బాలురలో బాలుడై అల్లరి చేస్తూ, కేరింతలు కొడుతూ ఉంటాడు. ముసలివారి మధ్య ముసలివాడువలె, ధీరుల మధ్య దైర్యవంతుడుగాను, యువకుల మధ్య యౌవన వృత్తులు కలిగియున్నవానివలెను, దుఃఖితుల మధ్య దుఃఖము పొందినవానివలెను ఉంటాడు.

స్వాభావికంగానే ధీరధీః - ధైర్యముతో కూడిన ధీశక్తి కలవాడుగాను, అనుక్షణము ఉదయిస్తున్న (నిత్యోదయ) ఆనందము కలవాడుగాను, మృదుస్వభావుడుగాను, పుణ్యకార్యములు చేయువాడుగాను, నిత్యానిత్యవివేకముగల ప్రాజ్ఞుడుగాను, ప్రసన్నమైన-మధురమైన సంభాషిగాను అయి ఉంటాడు. పైకి దైన్యముగా (తక్కువవాడు అయినట్లు) ఉంటాడు. సర్వ ఆశయములు శమించినవాడై ఉంటాడు. అభ్యాసపూర్వకంగా ఆతని ప్రాణములు శాంతిని ఆశ్రయించినవై ఉంటాయి, వేదనములు లేని ప్రాణములు ధారణచేయువాడై ఉంటాడు. మనస్సు ఆత్మయందు శమించినదై, నిర్వాణస్థితి (కదలని గాలి వంటి స్థితి) ధరించి ఉంటాడు. ఆతని వాక్కు సర్వ క్షుబ్ధ-క్రూర-పరుష వాక్యములు త్యజించి, వికల్పములు లేనిదై, స్వాభావికంగానే మధురంగా ఉంటుంది. సర్వవికల్పములు సంక్షయించినట్టి పదమును ఆశ్రయించి ఉంటాడు. ‘‘ఆద్యంతరహితుడుగు పరమాత్మయే నాకు ఎదురుగా అన్నిమూలలా, అంతటా, సమస్త నామరూపములుగా సర్వదా వేంచేసియున్నారు’’ అను ఎరుకతో సమస్తము సందర్శిస్తూ ఉంటాడు. ఇట్టి నిశ్చయజ్ఞానమే ‘సమ్యక్జ్ఞానము’ - అని విజ్ఞులు ప్రకటిస్తూ ఉన్నారు.

బంధ-మోక్షములు ఎక్కడివి?

ఈ సృష్టి కల్పనకంటే మునుముందే ‘‘ఆత్మ’’ ఉన్నది। ఈ త్రిలోకములు ఆత్మ యొక్క స్వరూపమే। ఈ జగత్తు సర్వదా పూర్ణమగు ఆత్మస్వరూపమే। (పూర్ణమదః। పూర్ణమిదమ్) సమస్తము అఖండమగు ఆత్మయే అయి ఉండగా…,
- ‘ఇది నాకు బంధము’ అని చూస్తున్నదెవరు?
- భావ అభావములు ఎక్కడివి?
- బంధమెవ్వరికి? మోక్షమెవరికి? కలనము (దోషము) ఎవరిది?

అవన్నీ ఆయా రీతులుగా బ్రహ్మమే విజృంభిస్తోంది. సర్వము ఏకమగు పరాకాశమే అయి ఉండగా ఎవరివలన ఎవరికి బంధము? ఎవరి వలన ఎవరికి మోక్షము ప్రసాదించబడగలదు?

బ్రహ్మము  =  సర్వత్రా వ్యాపించి ఉన్నది - బృహత్ ఇదం। 
     =  బృహత్ ఆకారమ్। అన్నిటి కన్నా పెద్దది.

బ్రహ్మేదం బృంహితాకారం బృహత్ - బృహత్ ఇవ స్థితమ్। బృహత్ బృంహితాకారమగు బ్రహ్మము బృహత్‌గానే సం-స్థితమైయున్నది.

సమస్తము బ్రహ్మమే అయి ఉండగా బ్రహ్మమునకు బంధము కలిగించగలిగేది ఎవ్వరు? బ్రహ్మము అనన్యముకదా!

అందుచేత ఓ నిదాఘా! ఆత్మచేతనే ఆత్మను దర్శించు. సమస్త ద్వైతములను విసర్జించు. కలలో కనిపించే వివిధ వస్తువులకు ఒకదానితో మరొకదానికి ఏమి భేదము నిర్వచించి, నిర్ణయించి చెప్పగలం? అట్లాగే ఇక్కడ కాష్ఠము (కొయ్య), పాషాణమునకు (రాయికి)- పరిశీలించి చూస్తే - ‘‘పరాకాష్ఠ’’ దృష్టితో చూస్తే - భేదమేమీలేదు.

సంకల్పించుట చేతనే భేదము కనిపిస్తోంది. అందుచేత భేదమును సంకల్పించటము మానివేయి.

‘‘స్వప్నద్రష్ట యొక్క ఊహయే స్వప్నములోని ఏకానేక రూపములుగా కనబడుచున్నట్లు, - ఇక్కడ పరమశాంతము, అవినాశియగు ఆత్మయే భావనచే అనేక (వేరువేరైన) వస్తు రూపములుగా కనిపిస్తోంది’’ - అని గమనించి, ఆత్మనే భావిస్తూ, ఆత్మతోనే తన్మయుడవై ఉండు. అంతేగాని, ఇక్కడ స్వసంకల్పితంగా ఇంద్రియ దృష్టికి కనిపిస్తున్న భేదములతో తన్మయుడవు అనవద్దు. సముద్రంలో ఒకే జలము అసంఖ్యాక తరంగాలుగా ప్రదర్శనమౌతోంది చూచావా? ‘అనేక తరంగాలు’ అనేది జలమునకు (సాకారంగా చూస్తే) - వేరు వేరు, (జలం దృష్ట్యా చూస్తే) ఏకము కూడా కదా! అట్లాగే ఏకమగు ఆత్మయందు జరామరణము మొదలైన అనేక భేదాభేదములు, ద్వైతాద్వైతములు-విభ్రమములుగా సంసార దృష్టికి అగుపిస్తున్నాయి. అదంతా కూడా-దర్పణములో ప్రతిబింబిస్తూ, కనిపిస్తూ ఉన్న ఏవేవో వస్తువులవంటిది.

సర్వభేద దృష్టుల పర్యవసానములగు దుఃఖములకు (For all worries) ‘ఆత్మదృష్టి’యే ఉపాయము.

అందుచేత ఓ నిదాఘా! ‘ఆపదలు’ అనే ముళ్ళ పొదలకు పరశువు (గొడ్డలి) వంటిది - ‘‘నిర్వృతరూపమగు పరతత్త్వమే!’’ శుద్ధమగు అట్టి ఆత్మనే అంతరమున ఉత్తమమగు వివేకముతో (ధియా) ఆలింగనము చేసుకున్నవాడవై ఉండు. అట్టి బుద్ధితో ఎవ్వడు ఆత్మనే ఆశ్రయించిఉంటాడో, అట్టి వానిని ఇక్కడి భోగములు మొదలైనవి బాధించ జాలవు. చిరుగాలులు పర్వతమును తాకుచున్నప్పటికీ, ఆ పర్వతమును కదలించగలవా? ఎవ్వడైతే ఆత్మవిచారణయందు నిమగ్నుడై ఉంటాడో, అట్టివానిని ఇక్కడి భోగములు కొంచము కూడా ఆకర్షించజాలవు. వికర్షించలేవు.

సరస్సులో తరంగాలన్నీ ఏకమగు జలమే అయి ఉన్న తీరుగా, ఇక్కడ - నానాత్వమస్తి కలనాసు। న వస్తుతో అంతరః నానా విధాసు। - కల్పన చేతనే నానాత్వము కనిపిస్తోంది. వస్తుతః నానాత్వమనేది లేనే లేదు.

ఈ విధంగా సమ్యక్ అర్థముతో సమవలోకనము (Par-seeing) చేయుపురుషుడు-(భేద దృష్టిని త్యజించిన ద్రష్ట)- సర్వదా విముక్తుడే!

నీవు సమస్త నానాత్వములనుండి విముక్తుడవై అఖండాత్మ స్వరూపుడుగా విరాజిల్లుము.


3వ అధ్యాయము - విదేహముక్తి

నిదాఘుడు : పితృదేవా! ఋభు భగవన్! ‘విదేహముక్తి’ యొక్క రూపమేమిటి? అట్టి విదేహముక్తి సిద్ధించుకొన్నట్టి ఎవ్వరైనా మహనీయుని గురించి దృష్టాంతంగా చెప్ప ప్రార్థన. అట్టి పరమపదమును ఆ మహనీయుడు ఏ యోగము అభ్యసించి సముపార్జించుకున్నారు?

శ్రీ నిదాఘమహర్షి : ఒక మహనీయుని గురించి ‘విదేహముక్తి’కి దృష్టాంతంగా చెప్పుకుందాము.

- - -

సుమేరు పర్వతముపైగల ఒకానొక భూపీఠముపై ‘మాండవ్యుడు’ అనే మహాముని నివసిస్తూ, యోగ - ధ్యాన - తపస్సులు నిర్వర్తిస్తూ ఉండేవారు. వారు తమ సద్గురువులగు కౌండిన్యమునీంద్రుల వారి వద్ద ‘తత్త్వము’ను శ్రవణం చేసి జీవితము నాకు బంధము కాదు’’ అను రూపముగా - జీవన్ముక్తులు అయ్యారు. ఆయన ఆ విధంగా జీవన్ముక్తి దశ ప్రాప్తించుకొన్న తరువాత, ఒక సమయంలో ‘‘బ్రహ్మవిత్ - తమము’’ అను శాస్త్ర ప్రవచితమైన విదేహముక్తి స్థితి సిద్ధించుకోదలచారు. ‘‘మనఃచక్రమును నిశ్చలము చేసి నిలిపి ఉంచటానికై సర్వేంద్రియములను ఉపసంహరించుకొనెదను గాక!’’ - అని నిర్ణయించుకొని, అందుకు ఉపక్రమించసాగారు (started the process).

పద్మాసనమును ధరించారు. కనులు సగము మూసుకొని, ఇక బాహ్య - అభ్యంతరములలో (Outside and Inside) ఇంద్రియ విషయములనుండి (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ అనుభవములనుండి) మెల్లగా ధ్యాసను వెనుకకు (మనస్సులోనికి) మరల్చ ప్రారంభించారు.

ఇక మనస్సును నిరోధించటానికి సిద్ధపడ్డారు. నిర్మలమైన మనస్సుతో చంచలమనస్సు యొక్క చాంచల్యమును నిరోధించటానికి యత్నశీలులైనారు. అప్పుడు - మనస్సుయొక్క చాంచల్యమును గమనించసాగారు.

- - -
  అహో ను! చంచలమ్ ఇదమ్। ప్రత్యాహృతమపి స్ఫుటమ్ । 
  పటాత్ - ఘటమ్ ఉపాయాతి, ఘటాత్ - శకటమ్ ఉత్కటమ్।।

ఆహా"! ఏమి ఈ మనస్సుయొక్క చాంచల్యము! ఇది ఆపినా ఆగకుండా పటము (వస్త్రము) నుండి ఘటము (కుండ) వరకు, కుండ నుండి బండి (శకటము) వరకు, - ఆపినా ఆగకుండా పరుగులు తీస్తునే ఉన్నదే! నేను దీని పరుగులు ఆపలేకపోతున్నానే! చిత్తమ్, అర్థేషు చరతి పాదపేషు ఇవ మర్కటః। కోతి ఒక కొమ్మనుండి ఇంకొక కొమ్మపైకి దుముకుతూనే ఉంటున్న తీరుగా, ఈ చిత్తము అసంఖ్యాక విషయములపై వ్రాలుచూనే ఉన్నదే।

ఓ ‘‘చెవులు-చర్మము-కనులు-నోరు-ముక్కు’’ అనబడు పంచేంద్రియ ద్వారములారా! ఓ మనస్సా! బుద్ధీంద్రియమా! మీమీ వ్యసనపూర్వక, సంచారములను ఇప్పుడు అంతా గమనిస్తున్నాను. ఇక చాలు। ఓ హత (పాడు) ఇంద్రియగణములారా! యూయం త్యజత ఆకులతాం శనైః। ఇక మీరు నెమ్మదిగా మీ ఆకులతలు (ఆదుర్దాతో కూడిన బహిర్-సంచారములు) ఆపండి.

సకలేంద్రియములారా! సద్దు చేయవద్దు. ఇప్పుడు నేను సర్వసాక్షి అగు చిదాత్మభగవానుని స్థితిని ఉపాసిస్తూ, సుస్థిరం చేసుకుంటున్నాను.

అట్టి చిదాత్మ భగవానుని స్వస్వరూపముగా ధారణ చేస్తున్న ప్రయత్నములో - నాకు ఒక క్రొత్త విషయం తెలియవస్తోంది. కళ్ళు మొదలైన ఇంద్రియములకు విషయముల (దృశ్యము) రూపముగా తారసబడుచున్నదంతా అనేకములుగా కనిపిస్తూ కూడా - వాస్తవానికి ఏకమే। ఏకమగు ఆత్మస్వరూపమే। సత్యము, నిజము అగు ఆత్మ సర్వత్రా వేంచేసి ఉండి కూడా, ‘ఇంద్రియదృష్టి’ అనే అజ్ఞానపూర్వక దర్శనముచే ‘అది వేరు - ఇది వేరు’ అను రూపంగా మనస్సుచే అనుభవము పొందబడుతోంది. ఇప్పుడు ఇక మనోదృష్టి దోషములను తొలగించుకొని, ఆత్మదృష్టిని ఏకాగ్రం చేసుకోవటానికి సిద్ధపడుచున్నాను. గురు-శాస్త్ర ప్రవచనములన్నీ నా కళ్ళకు కప్పిన పొరలను తొలగిస్తున్నాయి. నిశ్చలవాయువువలె పరినిర్వాణుడను (చంచల రహితుడను) అగుచున్నాను. మనో దోషములు తొలగి విగతజ్వరుడను. జాగ్రత్ - స్వప్న- సుషుప్తులను ‘తనవి’గా కల్పించుకొని ఆ మూడు ప్రదేశములలో విహరిస్తున్న 4వదగు - ‘తుర్యక్ పదము’ను అవధరిస్తున్నాను. ‘‘సర్వాంతర్యామి, సర్వతత్త్వస్వరూపి’ - అగు స్వాత్మ (My own Al-Pervading and Al-Present SELF) యందు అవతిష్ఠుడను అగుచున్నాను. ‘అన్యము’ అనబడు కల్పితమైన (visualized and created) సమస్తమును స్వకీయ కల్పనా వినోదంగా చూస్తూ ఆనందిస్తున్నాను.

- - -

కౌండిన్య మహాముని ప్రియశిష్యుడగు మాండవ్య మహర్షి ఆ విధంగా మనస్సును సముదాయించారు. ఆత్మయందు ఆత్మగా ‘అహమ్-త్వమ్’తో సహా సమస్తమును చిద్విలాసంగా దర్శించటము అభ్యాసము చేయసాగారు. క్రమేణా ప్రాణచాంచల్యము, అద్దాని ప్రదర్శనారూపములగు ప్రియాప్రియభావముల రూపంతో కలిగే చాంచల్య స్వభావమును త్యజించసాగారు. ఆతని అంతరమున పంచప్రాణములు శాంత స్వభావముగా సంతరించుకోసాగాయి. అంతరేవ శశామాస్య (సశామ్యస్య) క్రమేణ ప్రాణసంతతిః। ఇంధనము (కట్టెలు) తగలబడటం పూర్తి అయిపోతూ ఉండగా అగ్నిజ్వాలలు క్రమంగా శమిస్తున్నట్లుగా, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా వేసవి వేసటలు చల్లబడుచున్నతీరుగా, సూర్యుడు ఉదయిస్తూ ఉండగా చీకట్లు తొలగిపోవు విధంగా-ఆతని సాంసారిక భేదభావావేశములు శమించసాగాయి.

‘‘ఈ సమస్తము నందు నేను - ఈ సమస్తము నాయందే’’ అను దర్శనముతో కూడిన ఆత్మానుభవము స్వాభావికం కాసాగింది.

‘‘ఆహా"! సమః సమరసాభాసః తిష్ఠామి స్వచ్ఛతాం గతః। - రసాభాస అంతా గతించిపోతూ ఉండగా సర్వత్ర సమత్వభావనయందు తిష్ఠితుడను అగుచు, శాంతమగు ఆత్మస్వరూపము దర్శించుచున్నాను. అట్టి శాంతామగు ‘ఆత్మ’ అనగా నేనే।’’-అని గానం చేయసాగారు.

ఇంకా ఇట్లా అనుకోసాగారు.

మండవ్య - ఆత్మ సంగీత గానము

ప్రబుద్ధో-పి సుషుప్తిస్థ। - (జాగ్రత్‌లో) మెలకువగా ఉండియే గాఢనిద్రయందు సంస్థితుడనై కాష్ఠమౌనంగా జాగ్రత్‌ను దర్శిస్తున్నాను.

సుషుప్తిస్థః ప్రబుద్ధవాన్।-నిద్రలో ఉన్నప్పుడు కూడా ప్రబుద్ధుడనైయున్న నన్ను నేను గమనిస్తున్నాను. ఈ విషయముల మధ్యగా ఉండి కూడా, విషయములేవీ కించిత్ కూడా లేనివాడవై ఉంటున్నాను. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నన్ను నేను విడవటము లేదు.

‘తుర్యగ’ (4వది) అగు (జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల ఉన్న) అవస్థను అవలంబించి, సర్వ మనోచాంచల్యములను వదలి’ స్తంభితస్థితిని అవధరించుచున్నాను. నాయొక్క ‘స్వకీయ’ సంకల్పములచేతనే (By Virtue of my own Assumptions and presumptions) నిర్మితమైనట్టి (made up of) - స్థూలసూక్ష్మభావ రూప (స్వర్గ మర్త్య పాతాళ) త్రిలోకములు మొదలైనవన్నీ - కల్పించబడుచున్నాయి - అను సందర్శనము కలిగి ఉంటున్నాను.

ఈ విధంగా సమస్తమును తనయందు తానే తనచేత తన వినోదంగా తానే కల్పించుకుంటున్నట్లు దర్శించసాగారు.

ఒక పక్షి ‘‘ఉఫ్’’ అని గాలి వదలుచున్నది చూచారా! ఆ విధంగా ఆ మహనీయుడగు మాండవ్యముని ప్రణవముతో కూడిన దీర్ఘనిస్స్వనముతో (చాలాసేపు గాలిని వదలుచు) - శబ్ద స్పర్శరూప రసగంధములనే తన్మాత్రలను బయటకు వదలసాగారు. గాలితోబాటు శబ్ద స్పర్శ మొదలైనవి కూడా వదలి, దాటివేస్తున్న భావనను అభ్యాసము చేయసాగారు. క్రమంగా ఆయన అంగభావములన్నీ స్వచ్ఛత పొందగా, ఇక ‘‘ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ’’ వలె కేవలమగు జ్ఞానస్థితిని (తెలుసుకుంటున్నవన్నీ త్యజిస్తున్న తెలివిని) స్వాభావికానుభవంగా పొందసాగారు. అనగా

చూపు (శక్తి) ఉన్నది - కానీ, ఇతఃపూర్వము చూచిన వస్తువుల ఆకార సంస్కారములు సమసిపోసాగాయి.
వినికిడి (శక్తి) ఉన్నది - కానీ, ఇంతకుముందు విన్న ప్రాపంచక శబ్దములన్నీ ‘లేనివి’ అవసాగాయి.
రుచి ఉన్నది - కానీ, ఆయా పదార్థముల రుచి - జ్ఞాపకములు తొలగిపోసాగాయి.
స్పర్శ ఉన్నది - కానీ, స్పర్శకు సంబంధించిన ఇతఃపూర్వపు అనుభూతులు రహితమైపోసాగాయి.
వాసన ఉన్నది - వాసన సంస్కారములు లేనివే అవసాగాయి. ఇవన్నీ తన సహజ కళలుగా దర్శిస్తూ, సందర్భవిశేషాలన్నీ పరిగణలో లేని స్థితిని నిశ్చలం చేసుకోసాగారు.

గాలి వీచటం మాని నిశ్చలమై ఉన్న తీరుగా ఆతని చిత్తము చైత్యము (అన్యమగు లోక-ఇంద్రియ విషములను) త్యజించి కేవల స్పందన శక్తిని మాత్రమే అవధరించినదయ్యింది. సుగంధ పుష్ప సువాసనలతో నిండుగా ఉండే వాయువువలె ఈ దృశ్య-ఇంద్రియ వ్యవహారములు తనయందు కలిగి ఉండి కూడా, వాటికి వేరుగా ఉండసాగారు. జగత్‌దృశ్యము పట్ల గాఢనిద్రలో ఉన్నవానివలె సత్తా సామాన్యము (Al-present throughout all that being seen-including all beings) అవధరించి ‘చిత్‌సత్త’ యందు ప్రశాంతులైనారు.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సాక్షిస్థానమును ధారణచేస్తూ, - సుషుప్తి మౌన రూపమైన ఆత్మ స్థైర్యము ఆత్మ ఏకాంతమును, ఆత్మానందమును అవధరించారు.

ఇప్పుడు ఆయన….
• ఆనందమునకు కూడా ఆవలివాడై ఉండి కూడా సానందుడై, ఆనందాతీతుడై కూడా ప్రకాశించుచున్నారు. తానే ఆత్మానందరూపుడు. తనకు ఆనందమెందుకు?
• ఆయన సత్, అసత్ రూపుడు కూడా. ఉనికియే ఆయన స్వరూపమై యుండగా, జాగ్రత్తులోని ఒక వస్తువు యొక్క ఉనికి లేములకు పరిమితుడెట్లా అవుతాడు? తానే సమస్తముయొక్క ‘సత్త’గా రూపుదాల్చువాడయ్యారు.
• ఆయన యొక్క సంభవము తత్త్వశాస్త్ర ప్రాజ్ఞులకు కూడా వర్ణనాతీతము. తత్ సంబభూవ అసౌ యత్ గిరామపి అగోచరః।

శూన్యవాదుల దృష్టిలో → అది ‘‘శూన్యము’’। భక్తులకు ఇష్టదైవము ఆయనయే।
బ్రహ్మవాదుల వాఙ్మయములో → అది ‘బ్రహ్మము’। జ్ఞానులు ఆత్మగా నిర్వచించేది ఆయననే।
విజ్ఞానవాదుల ప్రవచనములలో → అది ‘విజ్ఞానస్వరూపము’। యోగుల అఖండాత్మతో ఏకత్వము-ఆయనతో ఏకత్వమే।
సాంఖ్యవాదుల సిద్ధాంతానుసారము → అది ‘పురుషుడు’। వేదాంతవాదుల ‘‘తెలియబడేదానికి ఆవల- తెలుసుకుంటూ ఉన్నవాడు’’-ఆ తురీయాతీత స్వరూపమే।
యోగవాదుల భాష్యముననుసరించి → అదియే ‘ఈశ్వరుడు’
శైవాగమముల బోధ ప్రకారం → అది ‘శివస్థానము’ అది జీవునియొక్క స్వాభావిక కేవల స్వరూప సంబంధమైనది కాబట్టి - “కైవల్యస్థానము”
కాలైకవాదుల ప్రకారము → అదియే ‘కాలము’

యత్ ఏకంచాపి అనేకం చ। (ఒకే బంగారము - అనేక బంగారు ఆభరణములులాగా, ఒకే జలము - అనేక తరంగములవలె) - ఏదైతే ‘ఏకమే’ అయి కూడా, అనేకముగా కూడా అయి ఉన్నదో…, (ఏకోసత్ విప్రాబహుధా),

సాంజనం చ విరంజనం। అనేక జీవాత్మలుగా ఉన్నప్పటికీ ఏకస్వరూపుడే అయి ఉన్నారో, అన్యమంతా తానే అయి కూడా అనన్యుడు కూడానో, దోషములన్నీ తనకే ఆపాదితము న్యాయమే అయి ఉండి కూడా సర్వదా దోషరహితుడో….,

యత్ సర్వంచాపి అసర్వంచ । (రచయిత-ఆయన వ్రాసిన నవలవలె) సర్వము తానే అయినప్పటికీ…అదేదీ ఆయన కాదో….,

యత్ తత్త్వం తత్ అసౌ స్థితః। అట్టి ఏ తత్త్వమో, (ఆత్మతత్తమో, బ్రహ్మతత్త్వమో) - అది ఆ మాండవ్యుడు ‘తానే’ అయినారు. ‘ఈశ్వరుడు’ అనబడునది తానే అయినారు.

అనునదంతా తానే అయి ఉన్నట్లు, గుర్తించసాగారు!

ఆకాశం కంటే కూడా అత్యం నిర్మలుడైనాడు. పాత్రయొక్క గుణములు పాత్రధారునికి అంటని తీరుగా ‘‘ఈశ్వరుడు’’ అని వేదవాఙ్మయముచే చెప్పబడు స్వరూపుడైనాడు।

ఆ మాండవ్యుని విదేహముక్త్యనుభవము అనిర్వచనీయము. మాటలకు అందని అనుభవైక వేద్యము.


4వ అధ్యాయము…జీవన్ముక్తుడు - కిం లక్షణమ్?

నిదాఘుడు : మునిశార్దూలా! ఋభుమహర్షీ! జీవన్ముక్తస్య కిం లక్ష్యహి ‘ఆకాశగమనాదికమ్’? జీవన్ముక్తునికి లక్షణములు ఏ ప్రత్యేకత కలిగి ఉంటాయి? ‘ఆకాశగమనము’ మొదలై ఆయా సిద్ధులు ఆయన కలిగి ఉంటారా? ఒకవేళ ఆవిధంగా జీవన్ముక్తులు సిద్ధులు కలిగి ఉంటారనుకొంటే, అప్పుడు ‘‘జీవన్ముక్తులు కావాలంటే ముందుగా సిద్ధులు సాధించుకోవాలి।’’ - అనే సూత్రము శాస్త్రములు ఎక్కడా చెప్పటం లేదనుకుంటున్నాను. జీవన్ముక్తులలో అష్టసిద్ధులు తప్పక ఉంటాయని అనుకోవచ్చా? జీవన్ముక్తి కొరకై అష్టసిద్ధుల ఆవస్యకత ఏమైనా ఉన్నదా? (అష్టసిద్ధులు: అరిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా) -

ఋభుమహర్షి : ఓ ద్విజుడా! నిదాఘా! నీవు చెప్పే అష్ట సిద్ధులు సిద్ధించుకోవ{మునకు, - జీవన్ముక్తత్వమునకు సంబంధమే లేదు. ఒకానొకడు జీవన్ముక్తుడు కాకపోయినప్పటికీ కూడా, ‘‘ఆకాశవిహరణము’’ మొదలైన సిద్ధులు కొన్ని ద్రవ్యముల సముపార్జన (Permitations and combinations of certain materials from nature) చేతను, సిద్ధులు లభించాలనే ఆశయముతో ఆశ్రయించే మంత్రోపాసనల చేతను, ప్రాణ కుంభకము మొదలైన ఆయా క్రియలచేతను, కొన్ని సందర్భములలో కాలమహిమ చేతను, భౌతికమైన శారీరక సాధనలు - శక్తి వృద్ధి చేసుకోవటం చేతను కూడా లభిస్తూ ఉంటాయి.

న ఆత్మజ్ఞస్య ఏష విషయ। ఆత్మజ్ఞా హి ఆత్మమాత్ర దృక్। ఆత్మజ్ఞుల దృష్టిలో అష్టసిద్ధులు కూడా ఆత్మజ్ఞానసంబంధమైన విషయములే కాదు. ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞుల దృష్టిలో ‘విషయము’. ఆత్మయందు ఆత్మదర్శనమచేత మాత్రమే అజ్ఞానము తొలగుతుంది. ఆత్మచే ఆత్మ సంతృప్తి పొందినవాడు మాత్రమే అవిద్యను త్యజించగలడు.

ఆత్మన్ ఆత్మని సంతృప్తో న - అవిద్యామ్ అనుధావతి! ఎవ్వడైతే ఆత్మయందు ఆత్మను ఎరిగి ఆత్మానందము అభ్యసిస్తూ ఉంటాడో (లేక, ఆశ్రయిస్తూ ఉంటాడో) - అట్టివాడు అవిద్యావిషయముల కొరకై పరుగులు తీయడు.

ఓ నిదాఘా! ఏఏ భావపరంపరలు లోకమునకు (దృశ్య ప్రపంచమునకు) పరిమితమై ఉంటాయో అవియే ‘‘సంసారము’’. ‘‘దృశ్యములో ఇప్పటివరకు ఏమి పొందాను? ఇంకా ఏమేమి పొందవలసియున్నది’’ - ఇటువంటి గ్రాహ్య-త్యాజ్య వ్యవహారములచే ధ్యాసలు పరిమితమై ఉంటాయో - అట్టిదంతా అవిద్యయేగాని, మరింకేమీ కాదు. జీవన్ముక్తుడు మహాయోగి అయి ఈ దృశ్య వ్యవహారమంతా మొదలంట్లా త్యజించి ఉంటాడు. అట్టివాడు ‘‘దృశ్య సంబంధమైనవి మాత్రమే’’ అయినట్టి అష్టసిద్ధుల వ్యవహారాలలో ఎట్లా నిమజ్జనం (sinking) పొందుతాడు? పొందడు.

‘‘నాకు సిద్ధులు ఎట్లాగైనా కావాలి!’’- అని ఎవరు కోరుకుంటారో, అట్టివారు ఇక యోగశాస్త్రానుసారంగా యోగాభ్యాసానికి ఉపక్రమిస్తే, క్రమమైన ప్రయత్నముచే సరి అయిన సమయంలో అష్టాంగయోగములలోని కొన్ని గాని, అన్నీగాని తప్పక పొందగలరు. అయితే అట్టి ఆశయమే జీవితపరమావధిగాను, మహాదాశయముగాను భావించి ‘జీవితము’ అనే అవకాశమును (కాలము, శక్తి - యుక్తులను) ఉపయోగించువాడు - ‘అల్పాశయుడు, మూఢుడు, అల్పబుద్ధికలవాడు’ అని చెప్పబడుచున్నాడు.

ద్రవ్య-మంత్ర-కాలయుక్తంగా అవి లభించినాసరే, అవన్నీ కూడా ‘పరమాత్మపదప్రాప్తి’కి ఏమాత్రము పనికివచ్చేవి కావు. ద్రవ్య మంత్ర క్రియా కాల యుక్తయః సాధు సిద్ధిదాః, పరమాత్మ పద ప్రాప్తౌ నోపకుర్వంతి కాశ్చన। ఎందుకంటే, ఎవడికి అష్టసిద్ధుల పట్ల ఇచ్ఛ ఉంటుందో, అట్టివాడు మాత్రమే వాటికై ప్రయత్నిస్తాడు.

శ్లో।। నిరిచ్ఛోః పరిపూర్ణస్య నేచ్ఛా సంభవతి క్వచిత్।
సర్వేచ్ఛా జాల సంశాంతావ ఆత్మలాభో భవేత్ మునే!

సర్వైచ్ఛాజాలములు (The fisher - Nets of Desires and expectations) సశాంతించినప్పుడే ‘ఆత్మతత్త్వానుభవము’ లభించగలదు. నిరిచ్ఛ(Desirelessness)చే పరిపూర్ణుడైతేనే జీవన్ముక్తుడు. అట్టి జీవన్ముక్తునికి ‘‘నాకు మానవాతీత శక్తులు కావాలి’’ అనే కోరిక శేషించి ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉంటే, ఆతడు జీవన్ముక్తుడు కాలేడు.

ఓ నిదాఘా! దృశ్యజగత్తులో ‘‘సంపదలు, గౌరవాలు, గుర్తింపులు పొందాలి। కొన్ని సిద్ధులుపొంది అధికారములు చెలాయించాలి’’ - మొదలైన ఇచ్ఛలు, ఆశయములు కలిగి ఉండటానికి కారణము చిత్తమే। జీవన్ముక్తుని విషయంలో - ఆయన చిత్తమును జయించివేసి ఉంటారు. అనగా చిత్తమాలిన్యములు తొలగించుకొని, ‘చిత్తమును అచిత్తముగా చేయటము’ అనబడు ఆత్మస్థితిని సంతరించుకొని ఉంటారు.

స కథం చిత్తజాలాని కథం వాంఛతి అచిత్తకః? చిత్తమే చిత్‌స్వరూపమై ప్రకాశించు జీవన్ముక్తునికి - చిత్తజాలములైనట్టి అధికారము, ఇతరులపై పెత్తనము, ఇతరులకంటే అధికమైన స్థితులవంటి భౌతిక సిద్ధులు మొదలైనవాటిపై వాంఛ ఎట్లా ఉంటుంది? ఉండదు.

జీవన్ముక్తుని స్థితి ఎట్టిదంటే,… స్వప్న దృశ్యమువలె, ఊహాసౌధమువలె, ఈ జగత్తు ఏవిధంగా మొదలే కల్పితమో - సుస్పష్టంగా, నిర్దుష్టంగా కరతలామలకం అయి ఉంటున్నట్టిది. అందుచేత -
‘‘ఏమండోయ్! సూర్యుడు ఈరోజు ఆకాశంలో మంచుగడ్డలాగా చల్లబడిపోతారు చూడండి!’’ అని చెప్పినా,
‘‘అయ్యా! రేపు పున్నమిచంద్రుడు ఈ అర్ధరాత్రి వేడిమిసెగలు గ్రక్కబోవుచున్నారు, తెలుసా?’’ అని చెప్పినా కూడా - ఆతడు ఆశ్చర్యపడడు. దృష్టిని సారించడు కూడా!

(దృష్టాంతంగా : ‘‘మిత్రమా! నాకు కలలో కోటి రూపాయలు ఒక్కసారి ఇంటికివచ్చి బడ్డాయి!’’ అని ఎవ్వరైనా చెప్పితే, ‘‘అయ్యా! అందులో రెండు వేలు నాకు అప్పుగా ఇప్పించరూ?’’ - అని అడుగుతామా?)

అయినా ఈ దృశ్యము ఎటువంటిది? అధిష్ఠానే పరే తత్త్వే కల్పితా రజ్జు సర్పవత్, కల్పిత ఆశ్చర్య జాలేషు న అభ్యుదేతి కుతూహలమ్। ఒకడు త్రాడును చూచి ‘పాము’ అని భ్రమించి భయము-ఉద్వేగము-ఆవేశముతో చిందులువేయటము ఎటువంటిదో, - అధిష్ఠానమగు ఆత్మపై ‘జగద్దృశ్యము’ అనే ఆపాదన (Attribution) (లేక) కల్పన చేసి - ‘‘ఇందులో అది పొందాను। ఇంకా ఇది పొందాలి।’’ - అని అనుకోవటము అటువంటిది.

సమదృష్టి

బిడ్డా! నిదాఘా।

విజ్ఞాతవిజ్ఞేయుడై : తెలుసుకోవలసిన ఆత్మగురించి తెలుసుకొన్నవాడై….,

వీతరాగా : దృశ్యకల్పనలో తారసబడుచున్న సమస్త రాగములు - ద్వేషములు (కథలోని సంఘటనలవలె) మొదలంట్లా త్యజించినవాడై,

మహాథియః : మహత్ ఆశయము, సూక్ష్మదృష్టిగల బుద్ధితో, థీశక్తి కలవాడై,

విచ్ఛిన్న గ్రంథ యః సర్వే : ఈ దృశ్యమునకు సంబంధించిన ‘‘జనించింది। ఉన్నది తొలగాలి।’’ అను రక్తి రూపమగు (బ్రహ్మ-విష్ణు-రుద్ర) గ్రంథులన్నిటినీ త్రెంచి వేసుకొని, సర్వస్వతంత్రుడై…. జీవన్ముక్తుడు అంతరమున పూర్ణ-సంప్రకాశమానుడై ఉంటున్నాడు. అట్టి ధీరునకు సుఖ-దుఃఖ, సామాన్య-అసమాన్య దశలను ‘‘సమదృష్టి’’తో చూడగలడు. ఉచ్ఛ్వాస-నిశ్వాసలు లేని కొండలాగా ఆతనిపట్ల చిత్తము మరణించినదై, చంచలము లేనిదై ఉంటుంది.

ఎవరిపట్ల అయితే - ఆపత్తు, కార్పణ్యము (జాలితో ఏర్పడే దీనత్వము), ‘ఏదోచేయాలి-పొందాలి’ అనే ఉత్సాహము, గర్వము రూపమగు ‘మదము’, మాంద్యము (బద్ధకము), ఆయా సందర్భ-అసందర్భములపట్ల నిరుత్సాహముగానీ, మహోత్సాహముగానీ - ఉండవో, యత్ నయంతి న వై రూప్యం తస్య నష్టం మనో విదుః। ఆతనిపట్ల ‘మనస్సు’ అనే త్రాచుపాము చచ్చిపడినట్లే.

ఎవరికి వైరూప్యము, రూపముల మార్పు ఉండవో అట్టివాడు జీవన్ముక్తుడు. గుణములు, స్వభావములు, సంగతులు మొదలైనవాటిని చూస్తూ, అమృతమగు ఆత్మనే అందరిలో గమనిస్తూఉండటంచేత రూప-అరూపముల మార్పు-చేర్పులు జీవన్ముక్తుని భ్రమింపజేయలేవు.

చిత్తనాశనము

చిత్తనాశనము రెండు తీరులైనవి

(1) సరూప చిత్తనాశనము - ఇది జీవన్ముల లక్షణమై ఉంటుంది. వీరు ఈ జగత్తుగా కనిపిస్తున్నదంతా ఆత్మతో అనుసంధానము చేసుకొంటూ ఉంటారు.

(2) అరూపచిత్తనాశనము : ఇది విదేహముక్తుల స్వభావము. వీరి దృష్టిలో దృశ్యము-మొదలే లేదు. అఖండమగు ఆత్మమాత్రమే సర్వే - సర్వత్ర సర్వదా ఉన్నది. ‘జగత్తు’ అనబడేదే లేదు. ‘‘ ‘జగత్తు’ అనబడేదంతా ఆత్మ అనే దర్పణంలో ప్రతిబింబించే భావనావైచిత్ర్యము మాత్రమే! దర్పణముతో వస్తుజాలము ఏమాత్రమూ లేనట్లు, ఆత్మయందు జగత్తు ఎప్పుడూ కూడా లేనిదే. జగత్తు ఆత్మయందూ లేదు. మరింకెక్కడా లేదు. ‘దర్పణంలో ముఖము ఉన్నది’ అనే మాట నిజమెట్లా అవుతుంది?’’ - అను నిశ్చలావగాహన కలిగి ఉంటారు.

ఓ నిదాఘా!

చిత్త సత్త ఇహ దుఃఖాయ - చిత్తము ఉన్నదా, ఇక్కడ దుఃఖములు అనివార్యము.

చిత్త నాశః సుఖాయ చ - చిత్తనాశనము - మహత్ సుఖప్రదము.

అందుచేత చిత్తము యొక్క సత్త (ఉనికి) క్షయింపజేసి, నశింపజేసే అన్ని ఉపాయములకు, ప్రయత్నములకు ఈ జీవుడు ఉపక్రమించాలి సుమా! సమస్త సాధనలు చిత్తముయొక్క - ‘చిత్’ యందు - లయము కొరకే। స్వతఃగా లేనివై, కాలముచే మార్పు-చేర్పులు చెందే (వచ్చి-పోయే) వస్తు-విషయ-సంబంధ-బాంధవ్యములపట్ల ఏర్పడే ఇష్టాద్వేషములే ‘చిత్తము’యొక్క రూపము.

చిత్తము నశించేది ఎట్లా?

ఓ అనఘా! నిదాఘా!

ఈ మనస్సు ఆయా ప్రాపంచక సందర్భములపై, సంఘటనలపై వ్రాలుచూ ఉన్నప్పుడు, ‘‘ఇదంతా సత్యమే। నిజమే। నిత్యమే।’’ అను రూపంగా మూఢత్వము వహించి ఉంటోంది. అట్టి మూఢత్వము కారణంగా అరిషట్‌వర్గము (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య వర్గములు) జయింపరానివై ఉంటున్నాయి. ఎప్పుడైతే మనస్సు అటువంటి మూఢత్వము వీడుతూ వస్తుందో, అప్పుడిక చిత్తము ‘‘చిత్‌స్వరూపము’’ను సంతరించుకోసాగుతుంది.

సదేహముక్తుడు

ఆతనియందు మైత్రి, ఆప్యాయత, మధురభావములు, నిగర్వము, లోక శ్రేయోభిలాష మొదలైన ఉత్తమ వాసనలు స్వాభావికమవసాగుతాయి. ఆతడు పునర్జన్మకారణములన్నీ నశింపజేసుకుంటూ ‘జీవన్ముక్తుడు’ అవుతాడు. అట్టివాడు ‘తత్‌స్వరూపుడు’ అని కూడా పిలువబడుతూ ఉంటాడు. సాత్త్విక వృత్తులచే దుర్వృత్తులు తొలగిపోగా ఏర్పడుచున్న చిత్త - నాశనము సిద్ధించుకున్నవాడు ‘‘సరూప - జీవన్ముక్తుడు’’ అగుచున్నాడు.

విదేహముక్తుడు

విదేహముక్తుని యందు సత్త్వగుణంతోసహా త్రిగుణములన్నీ లయించగా, ఆతడు గుణాతీత స్థితి కలిగి ఉంటున్నాడు. చిత్తము నశించగా, ఆతనికి ఇక్కడ ఆత్మ తప్పితే మరింకేమీ ఎక్కడా ఉండదు. గుణములు ఉండవు. అగుణములు ఉండవు. సంపద ఉండదు. ఆపద ఉండదు. న శ్రీః। న అశ్రీః। న చ ఏకతా। ఆతని దృష్టిలో జగత్తే లేనప్పుడు సంపద ఏమున్నది? ఆపద ఏదై ఉన్నది?

విదేహ ముక్తుని దృష్టిలో - ‘ఉనికి’ ఉండదు, ‘లేమి’ ఉండదు. ఏకత్వము లేదు. ద్విత్వము లేదు. జగత్తుయొక్క ఉదయము లేదు. అస్తమయము లేదు. తేజస్సు లేదు. చీకటి లేదు. సంధ్య లేదు. దినము (Day Time) లేదు. రాత్రి (Night Time) ఉండదు. న సత్తా। న చ అపి అసత్తా। న చ మధ్యగ్ం హి తత్పదమ్। విదేహముక్తుని తత్ పదము - సత్తా (Presence, ఉనికి) కాదు. అసత్త (Non-Presence, లేమి) కాదు. ఉనికి-లేముల మధ్యగా ఉండీ - లేని మధ్యస్థితి కూడా కాదు. అది సంసారాడంబరమంతా కూడా జయించి వేసినట్టి స్థితి. ఆకాశము, వాయువుల లక్షణమువలె సువిశాలమై, సర్వత్రా వ్యాపించి, అంతటా ఉనికిని కలిగియుండి, సమస్తమునకు సాక్షిగా కూడా అయి ఉన్నట్టిది.

• దుఃఖములన్నీ (All the worries) సశాంతించిన స్థితి.
• అది జడస్థితి కాదు. అజడాత్మకమైనట్టిది. (చైతన్య కేవలీ రూపము).
• సమస్త శబ్దజాలము తనదే అయి ఉండియే, సుప్తము (Thick silence) అయినట్టిది.
• అవ్యాజమగు స్వయమానంద స్వరూపమైనట్టిది. (Independent of worldly affairs).
• రజో తమో గుణములు నిశ్శబ్దము వహించిన స్థితి.
• ఆకాశకోశము (The Recess of space) తన శరీరముగా (తనువుగా) కలిగి ఉన్నట్టిది.
• ఆద్యంతములు లేనిదై - మహాంతము అయినట్టిది.

తస్మిన్ పదే గళిత చిత్తలవా భవంతి। అట్టి విదేహముక్తుని పదములో ‘చిత్తము’ అని చెప్పుకోబడుదానికి లవలేశముకూడా స్థానము దొరకదు. లవలేశమంత చిత్తము కూడా గళితము (నశించిపోయినది) అగుచున్నది.

- - -

అందుచేత, హే నిదాఘా! మహాప్రాజ్ఞా! నిర్వాసన మనా భవ। మనస్సును నిర్వాసనము చేసివేయి. విషయములు ధ్యానిస్తూ - జగద్దృశ్యమును, జగద్విశేషములను, సహజీవులను - చూస్తున్న ఈ మనస్సులో ‘‘ఆత్మనే ధ్యానిస్తూ, ఆత్మగానే అవన్నీ చూడటమునందు అలవాటు చేయటమే’’ - మనస్సును నిర్వాసనము (Sans Tendencies) చేయటము సుమా! బలాత్ చేతః సమాధాయ నిర్వికల్పమనా భవ। ఈ చిత్తమును నయాన భయాన కూడా-బలవంతంగా సమాధానపరచి ‘‘ఆలోచనలకు కూడా సాక్షిత్వము వహించు స్థితి’’ - అనబడు ‘‘నిర్వికల్పమనస్కుడవు’’ - అగుము. మనస్సుతో ఆత్మనే మననము చేయి. ఆత్మకు అన్యముగా ఎక్కడెక్కడ ఏది. కనిపిస్తూ ఉన్నా, అదంతా ‘‘ఆత్మకు అన్యము కాదు’’ - అని అనిపించేవరకు మనస్సుతో అనుకుంటూ ఉండు.

ఏకం బ్రహ్మాహమస్మి। ఏకమగు బ్రహ్మమే నేను।

• యత్ జగత్ భాసకమ్। ఏదైతే ఈ సమస్త జగద్దృశ్యము ప్రకాశింపజేస్తోందో (That which is enlightening all this being known)..,
• యత్ జగత్ భావమ్। ఈ జగత్తంతా ఎద్దానికి భావముమాత్రమే (Idea) అయి ఉన్నదో …,
• నిత్యం భాతి స్వయం స్ఫురత్। ఏదైతే తనకు తానై ఈ సమస్త జగత్తు రూపమై స్వయముగా స్ఫురిస్తోందో…,
- అదియే ఈ జగత్తుకు ‘సాక్షి’ (Mere witness).
- అది సమస్త జగత్తులకు, సర్వజీవులకు ఆత్మ. అది సర్వాత్మకము.

అట్టి సత్య జ్ఞానానంద (సుఖ) అద్వయమగు బ్రహ్మము-తాను అవిషయమై యుండియే-ఈ సమస్తము తానే అయి ఉంటోంది. ‘‘అట్టి బ్రహ్మమే నేను’’ అని ఎరిగినవారై ముని కృతకృత్యుడు అగుచున్నాడు. కనుక ఓ నిదాఘ మహాశయా। నీవు అట్టి మునివి అయి ఉండు.

మనందరి అఖండాత్మ (లేక) బ్రహ్మము ఇంకా ఎటువంటిదంటే….,
• ఆభరణములకు బంగారమువలె, తరంగములకు జలమువలె, సర్వజీవులకు, సర్వమునకు - సర్వాధిష్ఠానము।
• అది ఈ సమస్తమునకు ద్వితీయమైనది (వేరైనది) కాదు - అద్వంద్వమ్।
• అది మొట్టమొదటే ఉండి ఉన్నదై, సర్వమునకు పరమై పరాకాష్ఠ అయి ఉన్నట్టిది - పరంబ్రహ్మ సనాతనమ్।
ఇప్పటికే ఉన్నది. ఎప్పటికీ ఉంటోంది.
• అది వాక్కుకు, మనస్సుకు గోచరమగు విషయముల వంటిది కాదు - అవాక్-మానస గోచరమ్।

ఈ భౌతికాకాశంలో వెలుగుచూ ఉన్న సూర్యచంద్రులు ఆత్మాకాశములో భాసించువారు కాదు. ఇక్కడి వాయువు ఆత్మయందు వీచదు. లోకపాలకులగు దేవతలు అక్కడ పాలించరు. ఆ ఆత్మదేవుడే సూర్యచంద్రులుగా (వారి ప్రకాశముగా), వాయువుగా (వాయువీచికలుగా), దేవతలుగా - స్వయంకృతులై ప్రకాశిస్తున్నారు. ఆయనయొక్క భూతభావనయే సమస్త భూతములు (జీవజాలము) కూడా। స్వయముగా జ్ఞానాతీతుడై, - ఎట్టి అజ్ఞాన దోషములు అంటకుండానే - ప్రకాశించుచున్నారు. సర్వమును ప్రకాశింపజేస్తూ, తాను స్వయం ప్రకాశకుడై వెలుగొందుచున్నారు.

అట్టి ఆత్మయే తెలుసుకోవలసిన మహత్తర వస్తువు।।

మం।। శ్లో।। భిద్యతే హృదయగ్రంథిః। ఛిద్యంతే సర్వ సంశయాః।
క్షీయంతే చ అస్యకర్మాణి। తస్మిన్ దృష్టే పరావరే।

అట్టి పరావరమగు ఆత్మదృష్టి సిద్ధించుకోనంతవరకు - సృష్టి స్థితి లయమునకు సంబంధించిన ‘నిజమే’ అను రూపమగు హృదయ గ్రంథులు (బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథులు) తెగవు. ‘ఇదంతా నిజమే’ - అను భవబంధము కొనసాగుచూనే ఉంటుంది.

- ‘‘నేనెవరు? ఈ జగత్తు ఏమై ఉన్నది? నీవు ఎవరు? ఇదంతా ఎందుచేత, ఎవరివలన, ఎంతవరకు?’’ మొదలైన ప్రశ్నలకు సంబంధించిన సంశయములు వదలవు.
- ‘‘కర్మలు - కర్మఫలములు - కర్మ బంధములు - కర్మోపాయములు’’ - అనురూపముగా ఏర్పడియున్న కర్మ వ్యవహార పరంపరలు క్షీణించవు.

ఆత్మభగవానుని సందర్శనముచే పైవన్నీ చక్కబడతాయి. హృదయ గ్రంథులు తెగిపోతాయి. సంశయాలన్నీ తొలగిపోతాయి. కర్మబంధాలన్నీ ‘లేనివి’గా వీగిపోతాయి.

జీవుడు - ఈశ్వరుడు

పంచ జ్ఞానేంద్రియములు, వాటివాటి పంచ ప్రజ్ఞలు, పంచ కర్మేంద్రియములు, వాటివాటి పంచ వ్యవహారములు, పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు, మనో-బుద్ధి-చిత్త-అహంకారములనబడే అంతరంగ చతుష్టయము - మొదలైనవన్నీ కుటుంబ సభ్యుల సమావేశ ప్రదేశమువలె ఈ ‘శరీరము’ అనే గూడు (గృహము, ఇల్లు)-కనబడుతోంది. (The Physical Body is like a Conference Hall)
అట్టి ఈ దేహములో ఏర్పడిఉన్న ఇద్దరు ముఖ్యులయొక్క ఒక గొప్ప సమావేశము గురించి వృక్షము - దృష్టాంతపూర్వకంగా ఈ విధంగా వర్ణించి చెప్పబడుతోంది.

- - -

ఈ శరీర వృక్షముపై రెండు పక్షులు అనంతకాలంగా నివసిస్తూ ఉన్నాయి. (1) జీవుడు (2) ఈశ్వరుడు.

(1) జీవుడు : ఆ వృక్షముపై నివసిస్తూ ఫలములను - Fruits (కర్మఫలములము) ఎల్లప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు (He is the Experiencer - one who is experiencing). ఈతడు దర్పణంలోను, జలములోను ప్రతిబింబించు వస్తువు వలె (అసలైన వస్తువు కాని తీరుగా) ‘ప్రాతిభాసిక స్వరూపుడు (Reflective Form), ‘మాయాకల్పితుడు’ అనబడుచున్నాడు.

ఈశ్వరుడు : కేవలసాక్షి. న కర్మణో భుక్త భోగ। కర్మలయొక్క ‘భోగించటము’ (Experiencing/Enjoying) అనే స్వభావమునకు ఆవలివాడు. మునుముందువాడు. కర్మల అనుభవము తాను ఏమాత్రము పొందనివాడు.

(జీవేశ్వరులు- (1) నటుని నాటకములోని పాత్ర (2) అనేక నాటకములలో నటిస్తూ ఉండే కళాకారుని బాహ్య-సహజరూపము వంటివి.
ఈ జీవుడు దృశ్య జగత్తులో చిదాకాశమునకు వేరుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, చిత్తము లయిస్తున్న సందర్భములో ఈశ్వరుడే। శాస్త్రములచేత తర్కముచేత, మహనీయుల స్వానుభవముచేత ‘చిత్’ అనునది ఏకరసమేనని నిరూపించబడుతోంది. (‘ఓం’ ఇతి ఏక - అక్షరం ‘బ్రహ్మ’). కనుక జీవాత్మ ఈశ్వరునికంటే భిన్నము కాదు.

చిదేకత్వ పరిజ్ఞాతే నశోచతి, న ముహ్యతి। ఎప్పుడైతే జీవాత్మ తనయొక్క చిదేకరూపమగు ఈశ్వరత్వము గురించి తెలుసుకుంటుందో - ఇక అప్పటి నుండి ఏ దుఃఖము (worry) గాని, మోహము(Illusion) గాని ఇక పొందదు. ఈ సమస్త జగత్తు యొక్క సత్య - చిత్ ఘనీ భూత అధిష్ఠానము ‘నేనే’ - అను నిశ్చయముచే అట్టి ముని శోకరహితుడగుచున్నాడు. (చూస్తున్న-వింటున్న-ఆఘ్రాణిస్తున్న- రుచిచూస్తున్న-ఆలోచన చేస్తున్న ‘‘ఎరుక’’ - ఒక్కటే అయి ఉండటమే ‘చిదేకరసము’ అను మాటకు దృష్టాంతము).

పరమాత్మ ఉన్నదెక్కడ? దర్శించటమెట్లా!

ఋబు మహర్షి :
మం।। శ్లో।। స్వశరీరే స్వయంజ్యోతిః స్వరూపగ్ం సర్వసాక్షిణమ్
క్షీణదోషాః ప్రపశ్యంతి। నేతరే (న ఇతరే) మాయయ ఆవృతాః।।

ఆ పరమాత్మ స్వ-శరీరమునందే స్వస్వరూపుడై, స్వయంజ్యోతి స్వరూపుడై (తనను వెలుగించుటకు, ప్రదర్శించుటకు మరొక బాహ్య వస్తువుయొక్క అవసరము ఏమాత్రము లేనివాడై), సర్వ జగదనుభవములకు కేవలము సాక్షి అయి వెలుగొందుచున్నారు. అట్టి ఆత్మస్వరూపుడగు పరమాత్మ మరి, అనుభవమవటం లేదేమి? ఎందుకంటే, స్వస్వరూపముయొక్క కేవల సాక్షీ - స్వయంజ్యోతీ స్వరూప ఔన్నత్యము - మనస్సులోని దోషములు తొలగిపోగా, బుద్ధిలోని దృశ్యధ్యాసలు శమించగా - ఈ జీవునికి తనయందే సందర్శనమవగలదు. ఇక ఎవ్వరైతే మనోదోషములు కొనసాగిస్తూ ఉంటారో, అట్టివారు మాయ (కల్పన, అన్యభావన, భావావేశములు)చే కప్పబడి ఉంటున్నారు. ఫలితంగా తమయందు తామే అయి ఉన్న ‘ఆత్మ’ - అనుభవమునకు రావటం లేదు.

అందుచేత ఓ నిదాఘా! నీవు ధీరుడవై (సునిశిత బుద్ధి కలవాడవై) ఆత్మను తెలుసుకొని ‘బ్రాహ్మణుడవు’ అవాలి. అట్టి శబ్దార్థము పుణికిపుచ్చుకోవాలి. ఆత్మ అనుభవైక వేద్యము. అట్టి ఆత్మను అనేక శబ్దములతో చెప్పుకుంటే సరిపోదు. అదంతా వాచోవిగ్లాపనము (Confusion by virtue of too much of Terminology) అవుతుంది కూడా.

జగత్ భావనములను ప్రక్కకు నెట్టి, ఆత్మభావనతో ఆత్మయందు ఆత్మను దర్శించటమే ఆత్మసాక్షాత్కారము.

- - -

ఋభుమహర్షి : ఓనిదాఘా! బాల్యమునుండే అవిద్యను జయించి, బ్రహ్మవిద్యను అభ్యసిస్తూ బ్రహ్మతత్త్వమునందు సుతిష్ఠితుడు అవాలి. బాల్యమునుండే బ్రహ్మవిద్యను ఆశ్రయించుచూ ఉండగా అవిద్యను జయించి అచిరకాలంలో ‘ముని-ఆత్మవాన్’ అగుము.

నిదాఘుడు : మహాత్మా! ఋభు మహర్షీ! అనేక చిత్ర-విచిత్రములతో కూడిన ఈ భౌతిక శరీరము ఎట్లా నిర్మితమౌతోంది?

ఋభుమహర్షి : చిత్తమే ఈ భౌతిక శరీరమునకు బీజము.

• అంతర్లీనంగా అనేక కల్పనల సంరంభము కలిగియున్నట్టిది….,
• అనేక సుదీర్ఘమైన శుభ-అశుభ కార్యక్రమముల పరంపరలకు బీజమైనట్టిది,…,
• అనేక సంబంధ-అనుబంధముల పరంపరలకు ప్రవర్తనము ప్రదర్శించునది….,
అగు చిత్తమే ఈ భౌతిక శరీరమునకు కారణ-కారణము.

అట్టి చిత్తము ‘ఆశ’ (ఆశించటము) అనే స్ఫురణ నుండి బయల్వెడలుతోంది. దేహమునకు నిజస్వరూపమైనట్టి ఈ చిత్తము ‘ఆశ’ అను దాని నుండి అంకురిస్తోంది.

భావ-అభావముల దశలకు కోశము, దుఃఖములు అనే రత్నములను తనయందు కలిగి ఉన్నట్టిది - అగు ఈ శరీరములో - చిత్తము ‘ఆశ’ అను దానికి వశమై ప్రవర్తిస్తోంది.
ఈ ‘చిత్తము’ అనే వృక్షమునకు రెండు బీజములు ఉండి, చిత్తవృత్తుల రూపంగా ప్రదర్శితమౌతోంది.
(1) ప్రాణ పరిస్పందనము (2) దృఢభావన

ఎప్పుడైతే జడమగు శరీరము నందు ప్రాణశక్తి ఉద్యమించి నాడులను స్పృశిస్తుందో, అప్పుడు సంవేదనమయము (Inspiration of knowing and Feeling) రూపమగు చిత్తము బయల్వెడలుతోంది. అప్పుడిక సర్వగతమైన సంవిత్ [(సత్ + విత్ → Present సత్ (Being) Al-present (Knowing)] ప్రాణస్పందనచే ‘భావన-అనుభూతి’ల దిశగా మేల్కొంటోంది.

ప్రాణస్పందన → చిత్తము - సంవేదనము - సంవిత్ (ఆత్మ)
Enegery → Liking - Knowing - Absolute Self

ఈ విధమైన ‘4’ టిలో సంవిత్ ఆత్మ (ఉనికి + ఎరుకల కేవల స్వరూపము) - పరాకాష్ఠ అయినట్టిది.

అందుచేతనే యోగులు సంవిత్ ఆత్మయొక్క సంవేదనము (స్వానుభవము) కొరకై - చిత్తమును సంశాంతింపజేయటంలో ప్రయత్నశీలురు అగుచున్నారు. అనేక దృక్కోణములతో జన్మజన్మలుగా రూపము సంతరించుకొని, అనేక దుర్భావ-సద్భావముల మిశ్రమముగా నిర్మితమైన ఈ ‘చిత్తము’ అనే మహారాక్షసుని వశం చేసుకోవటం తేలికైన పనికాదు. అది కొద్దిసేపు శాంతించినట్లే, కనబడుచూనే, మరొకవైపుగా అప్రతిహతంగా, దుర్జయముగా విజృంభిస్తూ ఉంటుంది. అటువంటి చిత్తమును మెడలు వంచి జయించేది ఎట్లా?

అందుకు యోగులు ఒక గొప్ప ఉపాయమును స్వానుభవమునుండి రంగరించి, సాధన రూపముగా తీర్చిదిద్ది మనకు అందిస్తున్నారు. ఆ ఉపాయమే → ప్రాణ స్పందన నిరోధయోగము లేక ప్రాణాయామాభ్యాసము.

(1) ప్రాణాయామాభ్యాసము చేతను, (2) యుక్తి (ఉపాయము) చేతను - చిత్తము ఉపశమించినదై ‘‘పరమాత్మతత్త్వ భావన’’గా రూపుదిద్దుకొంటూ ఉండగా, ‘త్వమ్’ పట్ల తత్‌భావన బలవత్తరము కాగలదు.

త్వమ్ ఆత్మయేవ (నీవు ఆత్మస్వరూపుడవే!)। నేను అట్టి ఆత్మస్వరూపుడనే। (సో2హమ్ తత్)। ఈ దృశ్య జగత్- స్వరూపమంతా ఆత్మస్వరూపమే (ఆత్మయేవ ఇదగ్ం సర్వమ్)। - అను అసంశయ సునిశ్చయమే ప్రాణాయామాభ్యాసములో కూడా అంతర్లీనమైయున్న ముఖ్యాశయము. ప్రాణనిరోధము వలన ఈ జీవునకు స్వస్థత సిద్ధించగలదు.

ఈ చిత్తము యొక్క చాంచల్యము, ఇంద్రియ విషయములపట్ల నమ్మకముతో కూడిన ధ్యాస, మనో దురభ్యాస వ్యసనములైనట్టి క్రోధావేశము, పరుషభాషణము మొదలైనవి శమించటానికై ఆశ్రయించవలసిన ఉపాయములు -

(1) ‘గురువు’ను ఆశ్రయించటము. వారిని పరమాత్మ - భావనతో దర్శించటము. వారు బోధించు తత్త్వమసి పాఠములను శ్రవణము చేయటము,
(2) ఆ తరువాత మననము, ముఖ్య పాఠ్యాంశములను గుర్తు (జ్ఞాపకము) కలిగి ఉండటము.
(3) ‘ఇష్టదైవము’ను మనస్సుతోను వాక్కుతోను ఆలోచన - మాటల ద్వారా ‘ఆరాధన’ చేయుచుండటము. మంత్రమును శబ్ద-అర్థ పూర్వకముగా మననము చేయటము. సమస్తమును ఇష్టదేవతా ప్రదర్శనముగా భావించటము. మననము చేయటము.
(4) ఇష్టమైన వారిపట్ల, అయిష్టమైన వారిపట్ల తదితరులపట్ల కూడా ‘‘ఆ పరమాత్మయే ఇన్ని రూపములలో, ఇన్ని రూపములుగా ఉన్నారు’’ అను జ్ఞాపకమును మననము చేస్తూ ఉండటము.
(5) ‘‘ఇతరుల తప్పులు ఎన్నటముకన్న, నా తప్పులు గమనించటము ముఖ్యము కదా!’’ - అను ఆత్మవిమర్శ.
(6) ‘‘జీవుడన్న తరువాత తప్పులు, లోపములు బహుశః ఉండక తప్పవు. నాలోను ఉంటాయి’’ అను ఓర్పు. తితిక్ష.
(7) ‘‘ఇతరుల పట్ల బాధ్యతతో మెలగటము నావంతు, నా గురించిన బాధ్యత పరమాత్మది’’ - అను అంతరంగ సునిశ్చితభావన.

ఈ విధంగా వేద-పురాణ-ఇతిహాస-(మహనీయుల) చరిత్రలు అనేక ఉపాయములు గుర్తు చేస్తున్నాయి. వాటిని గ్రహించి, అనువర్తిస్తూ ఉండటమే ‘యుక్తి’.

ప్రాణయోగాభ్యాసము

(1) రేచక - పూరక - కుంభకముల అభ్యాసము. (2) స్వాభావిక (సహజ) కుంభకము (3) దేహములోని (కాలు బొటనవ్రేలు నుండి - శిరో ఉపరిభాగము వరకు) ఆయా స్థానములందు, షట్ చక్రములందు, నవరంధ్రములందు సహజ (స్వాభావిక) కుంభకము. ఇట్టి ప్రాణాయామ - యోగాభ్యాసము ఈ జీవునికి అనిర్వచనీయమగు ‘స్వస్థత’ చేకూర్చగలదు.

వాసనలు
(Tendencies that take form because of Repeated physical and mental Acts)

వాసనల నిర్వచనము

మం।। శ్లో।। దృఢ భావనయా త్యక్త పూర్వా పర విచారణమ్,
యదా దానం పదార్థస్య ‘‘వాసనా’’ సా ప్రకీర్తితా।।

ఒక వ్యక్తి యొక్క, వస్తువు యొక్క సందర్భము యొక్క రూపనామములు మొదలైనవాటిపట్ల ‘‘ఇతఃపూర్వము ఇది ఏమైయున్నది? ఇంక ముందుముందు ఇది ఏమికానున్నది?’’ - అనే పూర్వాపర విచారణ చేయకుండానే, → ఆ పదార్థము - వ్యక్తి - సంఘటన మొదలైన వాటిని ఆశ్రయించి పరిమితమగు, సంకుచితమగు ‘దృష్టి’ని వీడక ఉద్వేగము పొందుచుండటమే ‘వాసన’ అనబడుచున్నది.

అట్టి వాసనలే చిత్తము యొక్క మూలపదార్థము (Raw-material). ‘వాసన’ అనునది భావన చేతనే ఏర్పడుతోంది. ‘భావన’ అనేది రెండు రూపములు కలిగి ఉంటోంది.

(1) హేయము = ఇది వదలాలి. వదిలితేగాని సుఖము లేదు. మోక్షము లేదు. బంధము తొలగదు.
(2) ఉపాదేయము = ఇది ఆశ్రయించాలి. ఆశ్రయిస్తేగాని సుఖ-మోక్షములు లభించవు. బంధము అనివార్యము. ఇది కావాలి. పొందకపోతే బ్రతుకు వృధా। పొందటమే నా గొప్ప।

ఓ నిదాఘా!

ఎప్పుడైతే నీవు - పై రెండు రూపములైనట్టి హేయము (That is yet to be left off) - ఉపాదేయము (That which is to be yet followed / adopted) లకు సంబంధించిన ప్రాపంచక - పాదార్థిక - వ్యష్టిగత పరిమితమగు ఉభయ భావనలు త్యజిస్తావో,

హేయ-ఉపాదేయ (leaving/taking) భావనలు లేకుండానే వస్తువులను, వ్యక్తులను చూడగలుగుతావో, అప్పుడిక చిత్తము మొదలంట్లా రహితమైనట్లే।

ఆ ఉభయము ఎల్లప్పుడూ వదలుచూ ఉండగా వాసనలు తొలగుచుండగా, ఇక మనస్సు మనుగడ కలిగి ఉండదు. మనస్సు లయించుచుండగా పరతత్త్వస్వరూపము పరమప్రదమై ఈ జీవునిపట్ల ప్రకాశించగలదు. స్వానుభవమవగలదు.

ఓ నిదాఘా! యదా న భావ్యతే భావః క్వచిత్ జగతి వస్తుని, తదా హృదంబరే శూన్యే కథం చిత్తం ప్రజాయతే? ఎప్పుడైతే నీవు జగత్తులోని ఏ వస్తువునుగాని, విషయమునుగాని, పాంచభౌతిక నామరూపములుగాని నీ హృదయాకాశంలో భావనయే చేయక, హృదయమునందు జగత్తును ‘రహితము’ చేస్తావో, అప్పుడిక ఆ శూన్యహృదయములో చిత్తమునకు ‘స్థానము’ ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు.

అచిత్తత్వము అనగా ఏమి?

ఎప్పుడైతే భావనను భావనయే చేయనివాడవై అభావనయందు సంస్థితుడవై ఉంటావో (అభావనను ధారణచేస్తావో), అభావనా స్థానమును సిద్ధించుకుంటావో, ఆ స్థితి నుండి ఈ జగత్తులోని సమస్త వస్తువులను అభావనాధారుడవై దర్శిస్తూ ఉంటావో, - అట్టి స్వయం అభావనాస్థాన సంస్థిత - భాహ్య జగత్ దర్శనమే ‘‘అచిత్తత్వము’’ అని చెప్పబడుతోంది.

చిత్తము యొక్క అసద్రూపత్వము

శ్లో।। సర్వమ్ అంతః పరిత్యజ్య శీతళ - ఆశయ వర్తి యత్, వృత్తిస్థమపి - తత్ చిత్తం ‘‘అసద్రూపం’’ - ఉదాహృతమ్।

ఓ నిదాఘా! భేదముతో కూడిన జగత్ - విశేషములన్నీ బాహ్యమందే ఉంచివేసి, అంతరమున ప్రశాంత - పూర్ణత్వములతో కూడిన నిర్విషయత్వమును అనువర్తిస్తూ, విషయములకు సంబంధించిన వృత్తులన్నీ (All avocations) సశాంతింపజేసి, శరత్‌కాలంలో తటాకంలాగా ప్రశాంతముగా తీర్చిదిద్దిన చిత్తము - ‘‘అసద్రూప చిత్తము’’(As it not there) - అనిపిలువబడుతోంది. భ్రష్టము అయిన బీజము (ఎండిపోయిన, వేయించిన బీజము) ఇక మరల చిగురించదు కదా! అట్లాగే, అసద్రూపచిత్తము ఇక పునర్జన్మ-అనివార్యత్వమును పొందదు. ఆతడు ‘పునర్జన్మరహితుడు’ అవుతాడు. అనగా పునఃజన్మ తన వశమై ఉంటుందేగాని, కర్మలవశము, త్రిగుణములవశము అయి ఉండదు. తనను తాను జన్మలకు వేరైన స్వరూపముగా దర్శించగలడు.

అట్టి వాసనారస రాహిత్యము సిద్ధించుకొన్నవాడు జీవన్ముక్తుడే।
సత్త్వ (సాత్విక) రూపము బాగుగా ప్రాప్తించుకొన్న ఆత్మజ్ఞాన పారగుల యొక్క చిత్తము - ‘‘అచిత్తము’’ అనబడుతోంది.

బాహ్యమున సాపేక్ష చిత్తము → చిత్త సహితుడు - ప్రాపంచక సందర్భానుసరణీయ, ధర్మానుసరణీయ దర్శనము గల ‘‘సాపేక్ష-చిత్తము’’.

అంతరమున కేవల చిత్తము → చిత్త రహితుడు. ‘సమస్తము సర్వదా బ్రహ్మమే’ - అను బ్రాహ్మీదృష్టిగల కేవలీ చిత్తము (లేక)‘‘చిత్‌చిత్తము’’ (లేక) ‘‘అసద్రూపచిత్తము’’

ఇవియే చిత్త రహిత (లేక) చిత్త జయ లక్షణములు.

అచిత్తుడు (లేక) కేవలీచిత్తుడు (లేక) అసద్రూప చిత్తుడు దేహ - మనో - చిత్త - జీవాత్మలను ఆత్మ దృష్టిచే దాటిపోయి, వాటికి సాక్షి అయి, పరిమితమగు జీవాత్మత్వమును అధిగమించి, ‘‘సమస్త జీవులలో వేంచేసియుండి, జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కూడా సాక్షి, కారణుడు, ప్రేరకుడు, ప్రేక్షకుడు అయి ఉన్న సర్వాత్మకమగు ఆత్మయే నేను।’’ - అను భావనతో ఆత్మాకాశ స్వరూపుడై విరాజిల్లుచున్నాడు.

చిత్తశుద్ధికి ఉపాయములు

నిదాఘుడు : గురుదేవా! ఋభుమహర్షీ! ‘‘చిత్తమును-బాహ్యముననే అట్టేబెట్టివేసి, అంతరమున చిత్ దృష్టితో చిదాకాశస్వరూపములమై అనునిత్య స్వయమాత్మ-ప్రకాశము సంతరించుకోవటము’’ - అనే మీరు ప్రసాదిస్తున్న వర్తమాన బోధనా పాఠ్యాంశము అమోఘం. అనుసరణీయమే కూడా. అయితే, ‘‘ఈ చిత్తము యొక్క ప్రాపంచకత్వమును తొలగించి అంతరమున చిత్‌స్వరూపంలా తీర్చిదిద్దటము ఎట్లా?’’ - అను ప్రశ్న మాకు కొనసాగుచూనే ఉన్నది. అందుచేత చిత్తమును అంతరమున అసద్రూపంగా (లేక) అచిత్తంగా చేసివేసుకోవటానికి కావలసిన ఉపాయములు, విధివిధానములు దయచేసి వివరించండి.

ఋభు మహర్షి : ఓ నిదాఘా! ఈ దేహములో ‘పంచేంద్రియములు’ ఏర్పడినవై ఉన్నాయి కదా! దేహి (user of the body) అయి ఉన్న నీవు - ఒకానొకప్పుడు ‘శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు’ అనబడే పంచేంద్రియ విషయములు ఆస్వాదించు ప్రయోజనము కొరకై, - పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు - ఇవన్నీ సార్థకమౌతున్న ఈ భౌతిక శరీరమును ‘‘ఉపకరణము (Instrument)’’గా స్వీకరించుచున్నావు. ‘శరీరి’గా అట్టి భౌతికదేహము స్వీకరిస్తున్నప్పుడు ‘జననము’ అనబడుతోంది. ఇది త్యజించబడుచున్నప్పుడు ‘మరణము’ అని చెప్పుకోబడుతోంది.

(కనబడుచున్న, వినబడుచున్న, స్పర్శించబడుచున్న, రుచిచూడబడుచున్న, వాసన చూడబడుచున్న) విషయ సమూహములు- ‘‘సంవేద్యము-(తెలియబడునవి)’’ - అని అనబడుచున్నాయి.

తెలియబడేవి, అనుభతమయేవి, అనుభవములుగా పొందబడేవి — ‘‘సంవేద్యత్వము’ (That being experienced)

తెలుసుకొంటున్నవాడు, అనుభూతపరచుకొంటున్నవాడు, అనుభవముగా పొందుచున్నవాడు — సంవిదత్వము (The State of experiencer)

ఈ జీవుడు ఇంద్రియములను ఉపయోగించి విషయములను పొందుచున్న సందర్భములలో ‘‘ఇష్ట-అయిష్టములు’’ ఆశ్రయించుచున్నాడు. అవియే‘‘ప్రియ-అప్రియములు, సుఖ-దుఃఖములు’’గా రూపుదిద్దుకుంటున్నాయి. అభ్యాసములుగా ప్రారంభమయి, క్రమంగా సంస్కారములుగా అయి, (ఆపై) వాసనలుగా రూపము పొంది - ఈ అసంఖ్యాక జన్మపరంపరలకు కారణమగుచూ, జీవుని వెంటనంటి కొనసాగుచున్నాయి.

అట్టి ‘సంఘటన-సందర్భములు’ పట్ల ఏర్పడుచున్న చిత్తమును ఇప్పుడు కొంచము కొంచము విరమిస్తూ - సంవేద్యత్వము (అనుభవముగా పొందబడుచున్నవి) నుండి సంవిత్‌తత్త్వము (అనుభవములకు వేరైన నీరూపము) వైపు ధ్యానము చేయనారంభించాలి.

సంవేద్యము నుండి → అనుభవి → నుండి కేవలమగు ‘సంవిత్‌స్వరూపము’
(Whatever being experienced)(The Experiencer) → (The Absolute All - present SELF )

సంవేద్యము నుండి → సంవిత్ వైపుగా। (లేక) 
దృశ్యము నుండి → కేవల ద్రష్టవైపుగా।

ఓ నిదాఘా! ఎప్పుడైతే ధ్యానముచే నీ ధ్యాస ‘సంవేద్యము’ (That being experienced) నుండి మరలి, క్రమంగా ‘‘దేహి- ఆలోచించువాడు-భావించువాడు’’ రూపుడగు (user of the body / thinker / feeler) ‘‘సంవిత్తు’’ నందు సుతిష్ఠతము అవుతుందో, ఇక ఆపై, శ్రవణము - జ్ఞానవిచారణల యొక్క కొంచెము ప్రయత్నము చేతకూడా ‘తత్’ పదము (లేక ‘ఆత్మపదము’) సులభముగా సిద్ధించుకోగలవు.

నిదాఘుడు : జన్మజన్మలుగా పేర్చుకొంటూ తెచ్చిపెట్టుకుంటున్న వాసనలను వదలించుకొని, ‘సంవేద్యము’ నుండి మేము ‘సంవిత్’ వైపు అడుగులు వేస్తూ, నిశ్చలత పొందటము - తేలికేనంటారా? (Is it easy to get back to the state of the ‘knower’ by withdrawing from the influence of all ’That being known?)

ఋభు మహర్షి : అవును। కష్టమే। అయితే సాధనచే సాధ్యమే. అందుకు సంవిత్ వైపుగా ధ్యాసను మరల్చుధ్యానము ఒక్కటే మార్గము. అట్టి మార్గములను నీవు అన్వేషించవలసిందే, ఆచరించవలసిందే! ఎవ్వరికీ కూడా వేరే మార్గం లేదు.

మం।। శ్లో।। వాసనా సంపరిత్యాగే యది యత్నం కరోషి భో,
యావత్ విలీనం న మనో, న తావత్ వాస నాక్షయః।

ఆత్మభావనా దృష్టి కొరకై వాసనా పరిత్యాగము ఒక్కటే ఉపాయం. ‘‘అనుకోవటము’’ అను బీజమునుండి మొలచినవే వాసనలు.

ఎంతవరకు ఉపాయములు ఆశ్రయించాలి? అంతరంగ వాసనలు పూర్తి రహితమయేవరకు ఉపాయాలు, సాధనలు కొనసాగించాలిసిందే. జబ్బు తగ్గే వరకు మందు వాడవలసిందే కదా! వేరే త్రోవలేదు. ఎందుకంటే మనస్సు వస్తు దృష్టిని వదలి ఆత్మదృష్టియందు పూర్తిగా లయించేవరకు వాసనలు తేలికగా క్షయించవు. తిరిగి మొలకలెత్తుతూనే ఉంటాయి. వాసనలు మొదలంట్లా క్షీణించనంతవరకు చిత్తము శమించే ప్రసక్తియే లేదు. నీవు తత్త్వజ్ఞానము ఆశ్రయించి, బుద్ధిని ఆత్మదృష్టిచే నిశ్చలం చేసుకోనంతవరకు - చిత్తము వెనుకకు మరలదు.

యావత్ న తత్త్వ సంప్రాప్తిః న తావత్ వాసనా క్షయః।

‘త్వమ్’గా కనిపించే ఈ సమస్తము సర్వదా ఆత్మయే - అనునదే తత్త్వస్థితి. అది లభించేంతవరకు వాసనలు క్షయించవు.

తత్త్వజ్ఞానం మనోనాశో -
వాసనా క్షయ ఏవ చ

(1) తత్త్వజ్ఞానము చేతనే మనోనాశనము.
(2) మనోనాశనము చేతనే - తత్త్వభావన.
(3) వాసనాక్షయము చేతనే మనోనాశనము.

ఈ మూడు పరస్పరము (ఒకదానికి మరొకటి) కారణములగుచూ, అభ్యాసముచేతనే సిద్ధించగలవు.

అందుచేత ఓ మహామతీ!

(1) తత్త్వజ్ఞాన (2) మనోనాశన (3) వాసనాక్షయములు - ఈ మూడిటికీ ఒకేసారి నీవు ప్రయత్నశీలుడవు కావాలి.

‘‘ఇంద్రియ విషయములను భోగించటము’ - అనే భోగేచ్ఛను దూరంగా వదలివేసి, ఈ మూడిటిని శ్రద్ధతో ఆచరించెదవుగాక! ఈ మూడు ఒక్కసారిగా అభ్యసిస్తేనే ఉత్తమ ప్రయోజనం, (ఒకటి తరువాత మరొకటి కాదు).

మం।।శ్లో।। వాసనా క్షయ, విజ్ఞాన, మనోనాశా, మహామతే!
సమకాలం చిరాభ్యస్తా భవంతి ఫలదా మతాః।।

సుదీర్ఘకాలం ఆ మూడు (ఒక్కసారిగా) అభ్యాసం చేస్తే మహత్తరమగు ప్రయోజనం సిద్ధించగలదు. తామరకాడను ముక్కలుగా త్రెంపితే, అందులోని తంతువులు (దారములు) కూడా తెగిపోతాయికదా! అట్లాగే, తత్త్వజ్ఞాన-మనోనాశన-వాసనాక్షయములచే - సృష్టి స్థితి లయ - దృశ్యానుభవమునకు సంబంధించిన త్రిగంథులు (బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంథులు) తమకు తామే తెగిపోగలవు.

(1) వాసనా త్యాగము (2) ప్రాణాయామపూర్వకంగా ప్రాణనిరోధము (3) తత్త్వజ్ఞానము

ఈ మూడూ ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉండాలి - అని తత్త్వవేత్తలు బోధిస్తున్నారు. అందుచేత ఓ మహాశయా! ఆ మూడూ దైనందికంగా అభ్యాసం చేయి.

 1. వాసనలను పూర్తిగా పరిత్యజించటమువలన చిత్తము అచిత్తమైపోగలదు.
 2. ప్రాణాయామయోగాభ్యాసముచే వాసనలు తేలికగా పరిత్యజించబడగలవు.
 3. ఆత్మతత్త్వ జ్ఞాన - అధ్యయనములచే వాసనలపట్ల అనురక్తి తొలగగలదు.

ఈ మూడిటిలో ఏది ముఖ్యమని భావిస్తూ, ప్రాముఖ్యత ఇస్తూ ఆచరిస్తావో - అది నీకు ఇష్టమైనట్లు ఆచరించు. కానీ, అన్నిటినీ కొంత కొంతగానైనా అభ్యసించు. క్రమ క్రమంగా నీయొక్క ‘‘స్వస్వరూప స్వాభావికానందము’’ సులభతరము కాగలదు.

వాసనలు ప్రవర్తించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

(1) దృఢమైన ప్రాణాయామ యోగాభ్యాసము.
(2) మనస్సును నిరోధించటానికి సద్గురువులచేతను, శాస్త్రములచేతను సూచించబడుచూ ఉన్న యుక్తులు (లేక) ఉపాయములు.
(3) సుఖాసనము సహాయముతో ధారణ.
(4) ఆహార నియమములు.
(5) పరమాత్మతో మనస్సుయొక్క సంయోగము.

వీటిచే ప్రాణస్పందన నిరోధించబడగలదు. అప్పుడు చిత్తము తనకుతానే వశమై ఉండగలదు.

నిస్సంగవ్యవహారత్వాత్ భవ భావన వర్జనాత్।

‘‘సంబంధము, అనుబంధము, మమకారము, బెంగ, ఆధారపడియున్న భావన’’ - మొదలైన ప్రాపంచక వ్యవహారములతో నిస్సంగము (Non-Relatedness) చేత ‘‘ఈ దృశ్యము నిజమే! నిత్యమే!’’ - అను ‘‘భవభావనా బంధము’’ - తొలగిపోగలదు.

ఇంకా వాసనలు నశించటానికి మరొక ఉపాయం విను.

(జన్మమృత్యు జరావ్యాధి దుఖ దోషాను దర్శినమ్)
శరీర నాశ దర్శిత్వాత్ వాసనా న ప్రవర్తతే।

ఈ శరీరము కాలముచే జనించి, కాలముచే రూపురేఖలు దిద్దుకొంటూ, కొంచము సేపు సుందరంగా కనబడుచూ, క్రమంగా కాలముచే శిధిలమగుచూ, ఎప్పుడో కాలముచే మ్రింగివేయబడుతోంది. ఇట్టి శరీరమును మహనీయులు మొదలే ‘నశించిన వస్తువు’గా చూస్తూ, గమనిస్తూ ఉంటారు. ఈశరీరమును నశించే (లేక) నశించిన వస్తువుగా దర్శిస్తూ ఉండటంచేత ఇక వాసనలు ప్రవర్తించటము క్రమంగా సన్నగిల్లగలవు.

ప్రాణస్పందమే చిత్తస్పందము కూడా!

యః ప్రాణ పవన స్పందః → చిత్త స్పందః స ఏవ హి।

ఏది ప్రాణస్పందనయో, అదియే చిత్తస్పందన కూడా.

చిత్తము విషయములకు స్పందనము పొందుతూ ఉంటే - ప్రాణము కూడా స్పందన పొందటం జరుగుచూ ఉంటుంది.
ఉదాహరణకు, - ఒకడు కోపమో, భయమో పొందటము చిత్తముచే జరుగుతోంది. అది ప్రాణస్పందమునకు కారణమై శరీరంలో ప్రాణవాయు కదలికలకు ‘అసమత్వము’ కలిగిస్తూ ఉండటం అందరికీ అనుభవమేకదా!

ప్రాణ-చిత్త స్పందనలు అన్యోన్యత్వము కలిగి ఉంటున్నాయి.

అందుచేత ఓ నిదాఘా! మోక్షమార్గమును ఆశ్రయిస్తున్న ముముక్షువులకు ప్రాణస్పందన జయము, కర్తవ్యము (తప్పక ఆశ్రయించవలసినది)గా సూచించబడుతోంది.

- - -

ఓ నిదాఘా!

న శక్యతే మనోజేతుం వినా యుక్తిం అనిందితామ్।

అనిందితము (ఇతరులకు ఇబ్బంది కలుగనట్టి - సశాస్త్రీయమైన), యుక్తి (ఉపాయమును) ఆశ్రయించకపోతే మనస్సును జయించటం అంత తేలికైన పనికాదు.

శాస్త్ర-గురు సూచకమైన ఉపాయములను ఆశ్రయిస్తూ, తద్వారా సంవిత్ స్వరూపమగు ఆత్మను మనస్సుతో ఆశ్రయించు. క్రమంగా సమస్త విషయముల పట్ల రాగమును త్యజించివేయి.

ఓ మహాత్మా! సంవేద్యమును (The object of Experience) ప్రక్కకు నెట్టి, కలనములను జయించి, ఆద్యము ఏకము అగు ఆత్మతో కర్మరహితుడవై ఉండుము. (కర్మలు చేస్తూ చేయనివాడవై ఉండు). నీ హృదయమునందు నీవే ఆత్మస్వరూపుడవై వెలుగొందుము. శమము మొదలైన అష్టాంగ యోగములు అభ్యాసముతో బాహ్యమంతా నీ ఆత్మస్వరూపముతో నింపివేయుము.

మానవజన్మ మహత్తరమైన అవకాశముగా చెప్పబడుతోంది. మరి వృధా చేసుకోకూడదు.

చిత్తము యొక్క నిగ్రహమును సిద్ధింపజేసుకుంటూ, ఆపై ఆత్మయొక్క స్వరూప స్వభావముల గురించి, ఔన్నత్య లక్షణముల గురించి కొంచము విచారణ చేసినా కూడా, జన్మసార్థకము అయినట్లే. అఖండాత్మ యొక్క అనుభవము త్వరగా స్వాభావికమై సిద్ధించగలదు.


5వ అధ్యాయము - అవిచారోహి మృత్యుః।

ఋభుమహర్షి : ప్రియపుత్రా! ‘మృత్యువు’ అనగా ఒక దేహము నశించి, మరొక దేహము వచ్చు సంఘటన మాత్రమే. అది ఒక వస్త్రము విడచి మరొక వస్త్రము ధరించటము వంటిది. (లేక) జాగ్రత్ నుండి నిద్రలోకి వెళ్ళి మరల జాగ్రత్‌లోకి రావటముతో సమానమైనది.

అవ్యాజప్రేమాస్పద స్వరూపులగు తత్త్వజ్ఞుల దృష్టిలో - స్వస్వరూపమగు ఆత్మయొక్క సమగ్రత్వము, నిత్యత్వము, అఖండత్వము, అప్రమేయత్వము (Non-confined) వంటి మహత్తర విలక్షణ - లక్షణములను ఏమరచి ఉండటమే మృత్యువు.

అందుచేత, మహదాశయా! నిదాఘా! నీవు నడుస్తూ ఉన్నప్పుడు, ఒకచోట కూర్చుని ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు- కూడా ఆత్మయొక్క నిత్యత్వము, సత్యత్వము, అన్యముగా కనిపించే దానియొక్క అనిత్యత్త్వము, అసత్యత్త్వము, దృశ్యముయొక్క సందర్భమాత్ర పరిమితత్త్వము - ఇవన్నీ జ్ఞప్తితో కలిగియే ఉండుము. ‘అహమ్ - త్వమ్ - ఇదమ్’’-లకు ఆత్మకు అనన్యముగా భావనను ఆశ్రయించినవాడవై ఉండుము.

ఆత్మను జ్ఞాపకము పెట్టుకొని ఉండటమే - ‘‘అమృతత్వము’’
ఆత్మయొక్క ‘తత్త్వమ్-సో2హమ్’ రూప ఔన్నత్యము, కేవలత్వము ఏమరచటమే - ‘‘మృతము’’

ఆత్మజ్ఞానమే అమృతము - అజ్ఞానమే మృతము।

ఆత్మతత్త్వము మననము చేయువాడు ఈ భౌతిక దేహముతో పుట్టడు. దీనితో చావడు. జన్మ-మృత్యువుల పరిధులను దాటి, ఆత్మస్వరూపము ధారణచేసి, అన్యమైన సమస్త వ్యవహారములను వీడక, సాక్షి అయి చూస్తూ, ఆస్వాదిస్తూ ఉంటాడు. బ్రహ్మానందమును స్వాభావికం చేసుకొని ఉంటాడు. ఈ సమస్త జాగ్రత్‌ను ‘గడచిపోతూ ఉండే స్వప్నము’తో సమానముగా, లీలా వినోదముగా దర్శిస్తూ ఉంటాడు.

సమ్యక్ జ్ఞానము : సమస్తము పరమాత్మ స్వరూపంగాను, తనప్రియమైన పరమాత్మ సర్వ జీవులలో సమముగా వేంచేసియున్నట్లుగాను దర్శించటమే సమ్యక్ జ్ఞానము. ఎవ్వడైతే ‘నా ఇష్ట దైవమే నాకు ఇన్ని రూపాలుగా అగుపిస్తూ, అనేకంగా కనిపిస్తూ, సర్వదా ఏకమే అయి ఉన్నారు’’ అను సమ్యక్ దృష్టిని అభ్యాసం చేస్తూ, ప్రవృద్ధం చేసుకుంటూ ఉంటాడో, అట్టివాడు - జ్ఞేయమగు ఆత్మను ఎరిగి స్వయముగా జ్ఞేయస్వరూపుడు (బ్రహ్మమే) అగుచున్నాడు. అట్టి జ్ఞేయసముడు (విజ్ఞేయుడు) (తెలుసుకోవలసిన ఆత్మగురించి తెలుసుకొని అఖండాత్మత్వము పుణికుపుచ్చుకున్నవాడు) - ఇక దేనికీ భయము పొందడు. దేనిపట్ల ఆదత్తుడు అయి ఉండడు (దేనినీ తనదిగా కలిగి ఉండడు). దేనికొరకూ వివశుడు కాడు. దేనిని చూచి దీనత్వము పొందడు. ‘‘ఇది అపవిత్రము. ఇది తినరానిది. ఇది విషము వలె దూషితము’’ - అనునదేదీ లేనివాడై సమస్తము స్వీకరించగలడు. భుజించగలడు. సమస్త ఇంద్రియ విషయములను ఇష్టాన్నము భుజించు రీతిగా చూస్తూనే, అసంబంధితుడు అయి ఉంటాడు.

సంగ త్యాగము : ఆత్మజ్ఞేయుడు దేనితోను సంగము (Relatedness, confinement, Attachment) కలిగి ఉండడు.

ఓ నిదాఘా! అనఘా!

మం।। శ్లో।। సంగ త్యాగం విదుర్మోక్షమ్। సంగత్యాగాత్ అజన్మతా।
సంగం త్యజ ‘త్వం’ భావానామ్, ‘జీవన్ముక్తో’ భవ। అనఘ!

అన్యముగా కనిపించే సమస్తముతో సంగము (Attachment with sense of dependence) కలిగి ఉండక, స్వస్వరూపమగు ఆత్మయొక్క స్వాతంత్ర్యము (Independence) గురించిన అవగాహన, ఎరుక కలిగి ఉండటమే ‘మోక్షము’. అదియే ‘జన్మరాహిత్యము’ కూడా! బిడ్డా! నీవు భావనారూపంగా సంగము త్యజించి, ‘జీవన్ముక్తుడవు’ అగుము.

సంగము అనగా? : పదార్థములతో ఏర్పడుచున్న భావ అభావములతో (పొందటము - పొందకపోవటముతో) హర్షము గాని, అమర్షము (విషాదము) గాని పొందటము, మలినవాసనల కారణంగా వికారములు పొందటమునే ‘సంగము’ అంటున్నారు. భావాభావ పదార్థానాం హర్షామర్ష వికారదా, మలినా వాసనా యైషా సా ‘సంగ’ ఇతి కథ్యతే।।

నిదాఘుడు : గురుదేవా! జీవన్ముక్తులలో వాసనలు, సంగము ఏమాత్రము శేషించి ఉండవు కదా?

ఋభుమహర్షి : వాసనలు రెండు రకములు (1) పునర్జన్మ కారణ-ప్రవృద్ధములు (2) పునర్జన్మ కారణ - నాశకములు. వాసనల కారణంగానే ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు ఉపాధులను ఒక పరంపరగా (Like a serial) పొందటం జరుగుతోంది. జీవన్ముక్తులు ‘భక్తి జ్ఞాన యోగ’ ఇత్యాది సాధనమార్గములచే ‘‘ఈ జీవితము అనే సందర్భమునకు బద్ధుడు కాను. సర్వదా ఆత్మస్వరూపుడను’’ - అను స్థితిని సిద్ధించుకొని ఉంటున్నాడు. అందుచేత ఆతనియందు భక్తి-జ్ఞాన-వైరాగ్య-యోగాభ్యాస-కర్మ ఫల సమర్పణ సంస్కారములు, అష్టాంగయోగ సంబంధమైన ‘సాత్విక’ వాసనలు మాత్రమే ఉంటాయి. అవి కూడా ‘‘కర్తవ్యానీతి మే। ‘‘ఇవి నాకు కర్తవ్యములు మాత్రమే। అంతేగాని, ఆత్మగా నేను చేస్తున్నవి కావు’’ - అని ఎరిగియే ఉంటాడు.

మలినవాసనలు - పునః పునః జన్మ జన్మాంతర కారకములు.

జీవన్ముక్తుని వాసనలు (Tendencies) - అపునర్జన్మ కారకములు (పునర్జన్మకు కారణములు తొలగించునవి) అయిఉంటాయి. ‘నాది -నేను’ రూపముల ‘అహంకారము’ను జయించి, ముక్తాహంకృతులు (Relieved of limited Individual sense of Ego) అయి ఉంటారు. అహంకారము త్యజించు అభ్యాసముచే వారు పరమశాంతిని సిద్ధించుకొని ఉంటారు.

అందుచేత ఓ నిదాఘా! దృశ్యములో దుఃఖసంఘటనలు చూచినప్పుడు గ్లాని (Melancholy, క్రోధ-ఆవేశములు) పొందవద్దు. క్రుంగవద్దు. సుఖ సంఘటనలు చూస్తూ పొంగవద్దు. ఆశ-నిరాశలకు లొంగి ఉండి ఉండవద్దు. ప్రాపంచక సంగతుల పట్ల అసంగివి (Non attached) అయి ఉండెదవుగాక! అనంతమగు ఆత్మస్వరూప లక్షణములను అవలంబించి, దిక్కు-కాలముల హద్దులకు పరిమితము కానివాడవై ఉండుము. ఆ రెండిటి మధ్య, మననస్వరూపుడవై, ఆత్మస్వరూపుడవై, కేవలమగు ఎరుకయే స్వరూపముగా కలవాడవై (చిన్మాత్రుడవై) ఉండుము. ‘‘అక్షయము’’ (That which does not have even a blink of decay), ‘‘శాంతము’’ [(undisturbed by all events including change of Bodies or Lokams (లోకములు)] సంతరించుకొని ఉండుము. (సమస్త తరంగములలోని జలమువలె) ఏకము అగు బ్రహ్మమే నేను. మరొకటేదీ కాదు’’ - అను సునిశ్చితత్వమును సుసంపన్నము చేసుకొని ఉండెదవు గాక!

అంతర్ముఖత్వము : ‘‘ఈ సమస్తము నాయొక్క ఆత్మప్రదర్శనమే’’ అను అంతర్ముఖత్వము వహించి ముక్తపురుషుడవు అగుము.

ఆత్మానందసాగరము - మనో బుద్ధి చిత్త - అహంకార తరంగములు

సముద్రములో తరంగాలు, సుడులు, బుడగలు, ఆవృత్తములు బయలుదేరి, తిరిగి సముద్రజలంలోనే లయమౌతూ ఉంటాయి కదా! తరంగములు మొదలైనవాటికి - (జలమునకువేరైన) ఉనికి ఎక్కడున్నది? అట్లాగే, ఆత్మానంద సాగరంలో చిత్తము లేదు. అవిద్య లేదు. జీవుడు లేడు. బ్రహ్మైవ ఏకమ్ అనాద్యంతమ్ అబ్ధివత్ ప్రవిజృంభతే। మహాసముద్రములో సముద్రజలంవలె బ్రహ్మమే ‘ఏకము-ఆద్యంతరహితము’ అయి సర్వే సర్వత్రా సమస్తముగా విజృంభించుచున్నది.

చిత్తభ్రమ : ఎంతెంతవరకైతే ‘‘ఈ దేహము మాత్రమే నేను. ఈ దృశ్యములో కనబడే ఒక వస్తువు వంటివాడను. ఈ దృశ్య జగత్తులో కొన్ని కొన్ని నాకు చెందినవి. నేను వాటివాటికి చెందినవాడను’’ అను భావనలు వదలవో, అంతవరకు చిత్తము మొదలైన వాటియొక్క విభ్రమము వదలదు, ఆగదు. కొనసాగుతూనే ఉంటుంది. అందుచేత ఓ నిదాఘా! నీవు సమస్తమునకు ఆధారమైయున్న అంతరాత్మనే - జగద్దృశ్యమునందు, తదితర జీవులందు, నీయందు దర్శించువాడవై ఉండుము. ఇక్కడి త్రిజగత్ (స్వర్గ-మర్త్య-పాతాళ) సంభ్రమములను తృణప్రాయంగా (గడ్డిపరకతో సమానంగా) చూస్తూ, జ్ఞానాగ్నిచే బాహ్యదృష్టులన్నీ దగ్ధం చేసివేయి. అప్పుడు చిత్తము మొదలైన విభ్రమములన్నీ అంతరమున వాటికవే ‘రహితము’ అయిపోతాయి.

నేను - జీవాత్మ, మొదలైన అంశలకు చెందనివాడను (అంశరహితుడను). నాకు వేరుగా పరముగాని, అపరము అనబడేది గాని ఏదీ లేదు. సర్వదా నిర్మలము, కేవలము అగు చిదాత్మనందస్వరూపుడను’’ - అని నీ నిజస్వరూపము గురించి స్మరించుచూ అన్యము పట్ల గుర్తించటము లేనివాడవై ఉండుము. ‘‘అనేక ఆభరణములకు బంగారంవలె, అనేక తరంగాలకు జలమువలె - ఈ సమస్తమునకు నేనే ఆధ్యాత్మను’’ - అనే ‘‘ఆధ్యాత్మశాస్త్రమంత్రము’’ను మనోబుద్ధులతో జపిస్తూ, సదా తత్-మననము కలిగి ఉండుము.

అప్పుడు శరత్కాలంలో మంచు కరిగిపోవుతీరుగా నీయందు ‘‘ఏదో పొందాలి! కావాలి। సిద్ధించాలి। చేయాలి। ఎప్పటికో, ఎన్నటికో గాని మోక్షము సిద్ధించదు!’’- మొదలైన అనేక రూపములుగా చిత్తములో ప్రవేశించియున్న దుర్వాసనలు, విషవాయువులు తమకు తామే క్షీణించిపోతాయి.

కైవల్యపదము : నీవు నీయొక్క కేవలీ ఆత్మస్వరూపము పట్ల ‘ధారణ’ను ఎట్టి స్థితి-గతులలోను విడువవలసిన పనియే లేదు. అదియే ‘‘కైవల్యపదము’’.

పరిజ్ఞాయ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః, సత్తా సామాన్య రూపత్వాత్, తత్ ‘‘కైవల్య’’ పదం విదుః।।

స్వస్వరూము, నిజరూపము అగు ఆత్మయొక్క తత్త్వమును ఎరిగినవాడవై, దృశ్య సంబంధమైన సమస్త వాసనలు - సాత్వికవాసనలతో సహా త్యజించివేయి. సత్తా సామాన్యరూపము (That Form of self which is equally present in all beings and in all that is being seen and experienced) అవధరించి ఉండటమే - ‘కైవల్యపదము’. అంతేగాని కైవల్యమనగా ఎక్కడిగో ప్రయాణించి వెళ్ళుట కాదని గమనించెదవు గాక! వాసనలపట్ల పూర్ణ సుషుప్తుడవై ఉండు ధారణయే కైవల్యస్థితి. అది ధ్యాన-త్యాగములచే ఇక్కడే, ఇప్పుడే సిద్ధించుకోవాలి.

సుషుప్తి - కైవల్యపదము

నిదాఘుడు : గురుదేవా! ఈ జీవుడు ప్రతిరోజు నిర్విషయరూపమగు ‘సుషుప్తస్థితి’ని పొందుచూ ఉన్నాడు కదా! అట్టి స్థితిలో జాగ్రత్ యొక్క స్మరణయే ఉండదు కాబట్టి, అది కైవల్యపదమునకు సంబంధించినదని అనవచ్చునా?

ఋభుమహర్షి : ప్రతిరోజు జీవుడు పొందే సుషుప్తస్థితి జడవిశ్రాంతి స్థితి మాత్రమే। అంతేగాని వాసనారహిత నిజరూపానుభవము కాదు. సుషుప్తస్థితిలో వాసనలు జయింపబడలేదు. దాచిపెట్టబడినవై మాత్రమే ఉన్నాయి. వాసనలయందు (In the Tendencies of Assumptions and pressumptions as well as craving for getting or leaving) ఉండనే ఉన్నప్పుడు - వాసనాత్యాజ్య సుషుప్తస్థితి సిద్ధించగలదా? సిద్ధించజాలదు. గాఢనిద్రలో ఉన్న వానిలో వాసనాబీజములు ఉండనే ఉన్నాయి. మెలకువ రాగానే అవి శరవేగంతో అంకురించటానికి సిద్ధమయే ఉంటాయి.

ఎప్పుడైతే వాసనలు నిర్జీవమై, వేయించిన విత్తనములవలె మరల అంకురించటానికి అశక్తమై ఉంటాయో - అట్టి స్థితియే ‘తురీయ సిద్ధి’ అని అనిపించుకుంటుంది.

ఓ నిదాఘా! ఒక ముఖ్య విషయం గుర్తుంచుకో.

మం।। శ్లో।। వాసనా యాః తథా వహ్నేః ఋణ వ్యాధిః ద్విషామపి
స్నేహ వైర విషాణాం చ శేషః స్వల్పో2పి బాధతే।।

అగ్ని, ఋణము, వ్యాధి, ఆయా విషయములపట్ల - వ్యవహారముల పట్ల స్నేహ-వైరములు (మిత్రత్వ-శత్రుత్వములు), విషము - ఇవన్నీ కూడా కొంచము మిగిలి ఉన్నా, ఈ జీవుని బాధిస్తూనే ఉంటాయి కదా! అట్లాగే వాసనలు (Attachments or detatchments with worldly events, persons, contexts etc.,) అంతరముగా కొంచము మిగిలి ఉన్నప్పటికీ -అవి అపార సంసారసాగరముగా రూపుదిద్దుకోగలిగియే ఉంటాయి. ఎప్పుడైతే వాసనలు వేయించిన బీజమువలె ఆత్మజ్ఞానాగ్నిచే దగ్ధమైనవై ఉంటాయో, అప్పుడు ఈ జీవుడు ‘సత్తాసామాన్య స్వరూపము’ సంతరించుకోగలడు. ఎప్పుడైతే వాసనా బీజములు ‘‘సర్వేసర్వత్రా ఆత్మదర్శనము’’ - అనే దర్శనాభ్యాసముచే నిర్బీజమైపోతాయో, (పునః అంకురించజాలవో) - అట్టివాడు దేహము ఉన్నా, లేకున్నా కూడా - దుఃఖవంతుడు కాడు. (All worries vanish when all Tendencies become ineffective to be reproductive.)

అవిద్య

నిదాఘుడు : స్వామీ! ‘అవిద్య’ అనగా ఏమి? అద్దాని రూపు రేఖలు ఎటువంటివి?

ఋభుమహర్షి : ‘‘నీవు, నేను, ఈ జగద్దృశ్యము, ఈ సమస్తము బ్రహ్మమే - సర్వంఖల్విదం బ్రహ్మ’’ - అని వేద-వేదాంగముల ప్రవచనసారము. సమస్తము బ్రహ్మమే అయి ఉండగా, ‘‘బ్రహ్మము సిద్ధించాలి। అది ఎన్నటికో మరి?’’ - అను వేదనకు అర్థమేమున్నది? ఏతావత్ ఏవ అవిద్యాత్వం నేదం బ్రహ్మేతి నిశ్చయః। ‘‘ఇది బ్రహ్మము కాదు. బ్రహ్మము ఎప్పటికో, ఏదో ప్రయత్నముచేత మాత్రమే సిద్ధించుకోవలసియున్నది’’ - అను నిశ్చయము కలిగియుండటమే ‘‘అవిద్య’’. ఏష ఏవ క్షయః, తస్యా ‘బ్రహ్మేదమ్’ - ఇతి నిశ్చయః। ‘‘ఇది బ్రహ్మము కాదు’’ అనే భావనను ‘సమస్తము బ్రహ్మమే కదా!’’ అనే నిశ్చయము యొక్క వీచికలచే కడిగివేయాలి.

బ్రహ్మ చిత్ - తెలియబడేది - తెలుసుకొనేది - తెలివి- అంతాబ్రహ్మమే।

బ్రహ్మ భువనమ్ - భూమి - ఆకాశము మొదలైన వాటితో కూడిన ఈ భువనమంతా (Total Physical Field) బ్రహ్మమే।

బ్రహ్మ భూత పరంపర - ఇక్కడి భూతజాలమంతా, జీవరాసులంతా, పంచభూతములతో సహా బ్రహ్మమే।

బ్రహ్మాహమ్ - నేను బ్రహ్మమునే। బ్రహ్మము కాని క్షణమే లేదు.

బ్రహ్మ శత్రుః। బ్రహ్మ చిత్ మిత్ర బాంధవాః। - నాయొక్క శత్రువులు, స్నేహితులు, బంధువులు - అందరూ కూడా చిన్మాత్ర బ్రహ్మస్వరూపులే। పరబ్రహ్మ స్వరూపులే।

‘సమస్తము బ్రహ్మమే’ - అనుభావనచే అన్యమనిపించేదంతా బాధించబడగలదు. (తొలగగలదు).

భేద దృష్టి అనునది ‘అనుకోవటము’ వలననే రూపుదిద్దుకుంటోంది. ‘సమస్తము అస్మత్ బ్రాహ్మీ స్వరూపమే’ - అని అనుకుంటూ ఉంటే క్రమంగా బ్రహ్మముగా అనిపించటము స్వాభావికం కాగలదు. అనుకోవటమే - సాధన. అందుకొరకు అనేక ఉపాయాలు అనిపించటమే సిద్ధి. బ్రహ్మమును తెలుసుకొని, సమస్తము బ్రహ్మముగా దర్శించు అంతరహృదయాభ్యాసికి క్రమంగా-సర్వత్ర అవస్థితం శాంతం చిద్బ్రహ్మేతి అనుభూయతే। - సర్వత్రా ఏర్పడినదై యున్న పరమశాంతమగు చిదానంద బ్రహ్మమే అనుభూతమవగలదు.

సమస్తము బ్రహ్మమే కదా।

నిదాఘుడు : మహాత్మా! మీరు నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించి చెప్పుచున్న ‘సమస్తము బ్రహ్మమే’ - అనేది నిర్వివాదాంశమే. అది వేద హృదయము, ఆత్మజ్ఞుల గానలహరి కూడా-అని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, మా ఈ మనస్సు పరిపరివిధములైన దృష్టులను కలిగి ఉంటోందే గాని, సర్వే సర్వత్రా సమమై వేంచేసియున్న బ్రహ్మమునకు సంబంధించిన ‘బ్రాహ్మీదృష్టి’ని కలిగి ఉండటమేలేదే?

ఋభుమహర్షి : అవును. మనస్సు యొక్క నైజము అట్లా ఉంటున్నమాట నిజమే! అయితే మాత్రం ఏం? ఏ మనస్సైతే సంస్కరించబడనిదై, బ్రహ్మజ్ఞాన సంస్కారములు ఆశ్రయించని కారణంగా, జగత్ దర్శన రూపంగా (భేదదర్శనరూపంగా) ప్రతీతమైయున్నదో, ఆ విధముగా ఉన్నది మాత్రం బ్రహ్మము కాదా? ఎందుకు కాదు? ‘‘సమస్తము బ్రహ్మమే।’’ - అనునది మూల సిద్ధాంతము కదా। ‘‘సర్వగతమైన చిద్బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తోంది కాబట్టి, నేనే ‘బ్రహ్మము’ అయి ఉన్నాను. కనుక ఈ సమస్తము నేనే’’ - అను భావనను ఆశ్రయించియే నీవు ఉండుము. ‘‘అయ్యో! మనస్సు ఇట్లా ఉన్నదే?’’ అనే కౌతుకమును వదలివేయి. ‘‘చాపక్రింద నీరువలె, సమస్త కెరటములలో జలమువలె, సమస్త భావనలలో స్వకీయ భావ చైతన్యము వలె - మమాత్మ సర్వగతము. సర్వత్రా ఈ సమస్తముగా విస్తరించి ఉన్నది’’ - అను మననమును ఆశ్రయిస్తూ ఉండు. అన్యరూపములగు సర్వ కుతూహములను, కర్మలకు సంబంధించిన సమస్త అంతర్గత సంరంభములను బ్రాహ్మీదృష్టియందు ఏకం చేసి వేయి. సర్వదా చిదాత్మ (The self which is knowing)ను సమాశ్రయించినవాడవై ఉండు. ఈ విధంగా పూర్ణమగు (అన్నపూర్ణస్వభావమగు), రాగరహితమగు బుద్ధిని సిద్ధించుకొన్న ధీరుడు జీవితమును నిందించడు. స్తుతించడు. మరణమును నిందించడు. స్తుతించడు. ‘‘ఏది ఏ తీరుగా ఎప్పుడు ఉన్నా - సమస్తము బ్రహ్మమే। మరి నేను బ్రహ్మమును కాకుండా ఉంటానా? ఉండను’’ అని ఎరిగి ఉంటాడు.

ఈ విధంగా ‘‘ఈ సమస్తము నేనే’’ - అను బుద్ధిని బుద్ధిమంతులు సుస్థిరీకరించుకొని - జీవన్ - మరణములను బ్రహ్మములతో ఏకము చేసి సర్వదా నిశ్చింతులై ఈ భూమిపై చరిస్తున్నారు.

ప్రాణ నిరోధ - అభ్యాస ఉపాయము

ఋభుమహర్షి : దృశ్యభావనలను సంస్కరించి, బాహ్మీభావనను నిశ్చలము, స్వాభావికము చేసుకోవటానికి ‘ప్రాణనిరోధము’ - మహత్తరమైన ఉపాయంగా త్తత్వజ్ఞులచే ప్రబోధించబడుతోంది. అట్టి ‘ప్రాణ నిరోధము’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా విను.

ప్రాణము - స్పందనశక్తి

హే బ్రహ్మన్। ఈ జడదేహములో ‘ప్రాణదేవత’ ప్రవేశించినదై దేహముయొక్క అణువణువు చేతనముగా చేస్తోంది. అట్టి ప్రాణశక్తి స్పందనము (Activation) కలిగియుంటోంది. ఎల్లప్పుడు ప్రాణ గతి (Move) దేహమంతటా ఏర్పడినదై ఉంటోంది. అట్లాగే అపానము కూడా ఎల్లప్పుడు స్పందన - గతి కలిగి ఉంటోంది. (ప్రాణశక్తి = Energising inward pull of Air అపానశక్తి = Energising outward push of Air)

ఈ విధంగా అపానము బయటనుండి దేహములోనికి, దేహము నుండి బయటకు నిత్యము కదలిక కలిగినదై అంతటా ఏర్పడి ఉంటోంది. ఏ ప్రాణశక్తి అపానముతో కూడి (మెలకువగా ఉన్నప్పుడు, నిదురిస్తూ ఉన్నప్పుడు కూడా) స్పందనశక్తి - గతిని ప్రదర్శిస్తోందో
- అట్టి ప్రాణ చలనముయొక్క ఉపాసనయే - చిత్తమును, మనస్సును నిరోధించి, నియమించటానికి ఉత్తమోత్తమమైన ఉపాయము. అట్టి ప్రాణనిరోధమును (ప్రాణోపాసనను) అభిజ్ఞులు (యోగవేత్తలు) ఏ విధంగా ప్రవర్తింపజేస్తూ సాధనగా మలచుచున్నారో, అట్టి ప్రాణాయోగాభ్యాసము గురించి కొన్ని విశేషాలు విను.

పూరకము : ద్వాదశాంగుళ పర్యంతం బాహ్యం ఆక్రమతాం తతః, ప్రాణానాం అంగ సంస్పర్శో యః, స ‘పూరక’ ఉచ్యతే।। బాహ్యమున 12 అం।। వరకు విస్తరించియున్న ప్రాణశక్తిని గమనించి, ఆకర్షించి, (ముక్కులోపలికి స్వీకరించి) లోని అంగములను సంస్పర్శింపజేయటము పూరకము. (గాలిని బయట నుండి లోనికి పీల్చి గుండెలో నిలపటము పూరకము).

‘‘అపానము’’ - అను చంద్రమసశక్తి దేహములో తృప్తి, చల్లదనము, సుఖము కలుగజేస్తూ ఉంటుంది. ‘‘ప్రాణము’’ - అనుశక్తి (సూర్యుడు-అగ్నిరూపుడై) దేహమును ఉష్ణముగా ఉంచుతూ ఆహార-పచనక్రియ నిర్వర్తిస్తూ ఉంటుంది. ప్రాణము (లోపలికి వచ్చు ప్రాణశక్తి) క్షయము పొందుచుండగా అపానము ఉదయిస్తూ చల్లదనము కలుగజేస్తూ ఆయా కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఉన్నది.

ప్రాణము - అపానము

Ⅰ. ఓ నిదాఘా। ప్రాణ - అపానములను సమస్థితికి తెచ్చి మధ్యగా వేంచేసినదైయున్న ‘చిదాత్మ’ను ఉపాసన చేయి. సమాశ్రయించు. అనగా, ‘ప్రాణము’ యొక్క ప్రసరణము ఉపశమించగా, ‘అపానము’ ఇంకా ప్రారంభము అవని - ‘‘ప్రశాంత సంధిస్థానము’’ ఏర్పడి ఉండే ‘‘నిశ్చల సత్-చిత్ తత్త్వము’’ను ఆశ్రయించి ఉండు. ఉపాసించు.

Ⅱ. అట్లాగే - ఎక్కడ అపానము అసంగతము చెందుతుందో (శమిస్తుందో), ప్రాణము ఇంకనూ ఉదయించదో - అట్టి అపాన - ప్రాణముల మధ్యస్థానమునగల నిర్మలమగు చిత్-తత్త్వమును సమాశ్రయించు.

అనగా,

Ⅲ. ఎక్కడ అపానము ఇంకనూ అస్తమించక ప్రాణమును పొందుతూ ఉంటుందో అట్టి ప్రాణపానముల కలయికల స్థానంలో (లేక) ఆ రెండిటి లయ స్థానములో (లేక) ప్రాణ-అపానముల సంధిస్థానంలో సర్వదా ఏర్పడి ఉన్న నిశ్చల సత్-చిత్ తత్త్వమును ఆశ్రయించి ఉండు. నాసాగ్రంగా ప్రాణ-అపానముల రాకపోకల మధ్యగల కేవలచిత్ నందు ధ్యాసను నిలిపి ఉంచు. ఉపాసించుము.

అట్టి ప్రాణ-అపానముల మధ్య గల నిశ్చల సత్-చిత్ తత్త్వమే ప్రాణోపాసకుల ప్రాణేశ్వరాత్మ భగవానుడు.

ఇక ఈ దృశ్యము గురించి ఏమిటంటావా? ఇదంతా అభాసమాత్రంగా (Like a Reflection in water or mirror. Not as original Truth) గా దర్శించు. అట్టి కలనగా (కల్పనగా) దర్శనమే జ్ఞానము. చిత్తముయొక్క విషయములను దర్శించకపోవు వ్యవహారము కూడా ‘అభాస’ (Illusion) యే। అట్టి చిత్తము - చిత్తము చేస్తున్న దర్శన / అదర్శనములు - ఉభయము బాహ్యముననే వదలివేసి, అంతరమున ‘‘నిరాభాసుడవు’’ - అయి ఉండుము.

మనస్సుకు ఆవల - ఆత్మ స్వరూపము

ఓ నిదాఘా! అనేక భయములు ప్రసాదించునది, అనేక అశుభములకు (అకల్యాణములకు) ఆలవాలము, ధైర్యమంతా హరించివేసేది అగు ‘మనస్సు’ అనే పిశాచమును దూరంగా పారత్రోలి, అటుపై ఇక ఏది శేషిస్తోందో, అట్టి మనో - అతీత ఆత్మస్వరూపుడవై ఉండుము.

సర్వశేష్యము : ‘‘పర - అపర భేదము (Beyond and Before Difference) లేనట్టిది’’ అగు చిదాకాశమే సర్వత్రా విస్తరించినదైయున్నది. ఇక ఏ ‘‘చైత్యము’’ (ఇంద్రియములకు అనుభూతమగుచున్నట్టిది, తెలియబడేది అగు సమస్తము- That being known) కల్పాంతమువరకు ఉంటుందో-అదంతా లయించినాకూడా చిదాకాశము శేషించియే ఉంటుంది. (‘I’ does not end up even after “my” absolves).

బంధమునకు కారణం? వాంఛ। (సంతుష్టి - అసంతుష్టి।)

నిదాఘుడు : హే మహానుభావన్। ఈ జీవుడు సర్వదా ఆత్మస్వరూపుడే కదా! ఆత్మ వాస్తవానికి నిత్యముక్తము కదా! మరి ఈ జీవునికి ‘బంధము’ అనబడేదంతా ఎట్లా, ఎందుచేత ప్రాప్తిస్తోంది?

ఋభుమహర్షి : ఆత్మస్వరూపుడే అయి ఉన్నట్టి జీవునికి ఈ కల్పితమగు దృశ్యము పట్ల ‘వాంఛ’ చేతనే బంధము భావనారూపంగా ఏర్పడినదై ఉంటోంది. వాంఛా-క్షణేతు యా తుష్టిః, తత్ర వాంఛైవ కారణమ్।

ఒకడు ఒక వస్తువును కోరుకుంటున్నాడనుకో. అది ఒక సమయంలో లభించగానే, ఆ క్షణంలో ఆతని తుష్టి (Satisfaction) లభిస్తోంది. ఇప్పుడు చెప్పు! ఆ తుష్టి వస్తువు వలన వచ్చిందా? కోరుకోవటము వలన వచ్చిందా?

నిదాఘుడు : కోరుకోవటం వలన, అది సిద్ధించటం వలన ఆతనికి తుష్టి లభించిందని నాకు అనిపిస్తోంది.

ఋభుమహర్షి : బాగా చెప్పావు! అనగా? అది వస్తువు నుండి లభించలేదు. అనగా కోరుకోవటము వలన అతుష్టి, లభించితే ‘తుష్టి’ వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నది. మరి….

తుష్టిస్తు అతుష్టి పర్యంతా। అతుష్టి (Dis-satisfaction) (లేక అసంతుష్టి) ఉన్నంతవరకు మాత్రమే తుష్టి (లేక సంతుష్టి) ఉంటుంది. అనగా ప్రపంచంలో అనుభవమయే తుష్టికి మూలము - అతుష్టియే। అట్టి అతుష్టి తొలగనంతవరకు ఈ జీవుడు తన స్వాభావికానందమయ ఆత్మస్వరూపమును ఆస్వాదించజాలడు.

అనగా ‘‘నాకు సంతుష్టి (Happiness) ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది?’’ - అనే వెతుకులాట అసంతుష్టి ఉండటంచేతనే బయల్వెడలుతోంది. అట్టి మూలరూపమగు ‘అసంతుష్టి’కి ఉపాయం వెతకకుండా, తుష్టి కొరకై జన్మలవెంట, కర్మలవెంట పరుగులు తీసి ఏమి ప్రయోజనం? అది- ‘‘మూలవ్యాధి’’కి మందువాడకుండా, బాహ్యాడంబరములకొరకై యాచించటము వంటిది. ‘గాయము’ తగ్గటం ముఖ్యంగాని, గాయము కనబడకుండా దాచుకోవటం ముఖ్యం కాదు కదా।

సంగము

ఎప్పుడైతే ఈ జీవుడు సంగము(Relatedness) ను మనన (లేక) సంకల్పపూర్వకంగా ప్రారంభిస్తాడో…ఇక క్రమంగా

నిరాశ (Non expectation) నుండి → ‘ఆశ’కు
అమనస్కము నుండి → మనోవ్యసనమునకు
అభావ స్థితి నుండి → భావించు స్థితికి
(ఆత్మస్థితి నుండి → సందర్భ స్థితికి) దిగజారటము జరుగుతోంది.

ఆకాశములో అనేక సంఘటనలు జరుగుచున్నప్పటికి, వందలాది క్షోభలు ఏర్పడుచున్నప్పటికీ ఆకాశము ఏమాత్రము ఏ వికారము పొందదు కదా! అట్లాగే, నీవు అంతరంగమునందు వాసనారహితుడవై, బాహ్యమున మాత్రం ఇంద్రియములను నియమిస్తూ, ఆయా క్రియలు నిర్వర్తిస్తూ ఉండు. నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా - (ఆకాశమువలె) నీవు ఎట్టి క్షోభను పొందవద్దు. నిర్వర్తించుచున్నట్టి - నిర్వర్తించనట్టి - సమస్త కర్మలను క్రీడా వినోదంగా మాత్రమే దర్శిస్తూ ఉండు.

చిత్తము

చిత్త ఉన్మేష - నిమేషాభ్యాం సంసృతేః, ప్రళయోదయౌ। చిత్తము యొక్క కనులు తెరవటమే సంసారము (లేక) సంసృతి. చిత్తము యొక్క కనులు మూయటమే ప్రళయము. (అంతేగాని, సృష్టి ప్రళయములనగా ఈ ఎదురుగా కనిపించే ప్రకృతి దృశ్యము యొక్క ప్రారంభ -వినాశనములు కావు).

అందుచేత ఓ నిదాఘా! ఈ మనస్సును ఆత్మపట్ల ఉన్మేషము (కనులు తెరవటము) చేయటమే సంసార (లేక) సంసృతి దోషనివారణమునకు మార్గము. అందుకు రెండు విధి - విధానములు (Two simulteneous Approaches)

(1) వాసనలను (Tendencies) త్యజించుచూ ఉండటము (2) ప్రాణ నిరోధము.

(చిత్తము వలెనే) ప్రాణ ఉన్మేష - నిమేషాభ్యాం సంసృతేః పళయ ఆదయోః। ప్రాణముయొక్క ఉన్మేష (కనులు తెరవటము - వికాసము) - నిమేషములు (సంకోచము, లయము) - ఇవియే సంసృతి - ప్రళయములు కూడా! కనుక ‘ప్రాణనిరోధాభ్యాసము’ను నిర్వర్తించు. ప్రాణమును ఉన్మేషరహితము చేయి (నిత్యప్రాణశక్తి స్వరూపుడవై విరాజిల్లు)

(ఉన్మేషము = కనులు విచ్చుట, వికాసము, ప్రకటనము, అభివృద్ధి; నిమేషము = కనులు మూయుట, సంకోచము)

మౌర్ఖ్యము (మూర్ఖత్వము)

మం।। శ్లో।। మౌర్ఖ్య ఉన్మేష నిమేషాభ్యాం కర్మణాం ప్రళయ - ఉదయౌ।
తత్ విలీనం కురు బలాత్, - గురు శాస్త్రార్థ సంగమైః।।

మూర్ఖత్వము యొక్క నిమేషమే వృద్ధియే - కర్మల ప్రళయము. (కర్మ రాహిత్యము). (నిమేషము = కనులు మూయుట).

మూర్ఖత్వము యొక్క ఉన్మేషమే సంకోచమే - కర్మల ఉదయము. (కర్మబంధము). (ఉన్మేషము = కనులు తెరవటము).

నీవు గురు, శాస్త్ర నిర్ణయ, శాస్త్రార్థముల, స్వావగాహన, స్వానుభవముల సహాయంతోను, యోగాభ్యాస బలంతోను (భక్తి జ్ఞాన యోగాభ్యాసములతోను) కర్మల ప్రళయము (కర్మరాహిత్యము) సిద్ధించుకో. సమస్త కర్మలను కర్మరహితమగు ఆత్మయందు దర్శించు.

అసంవిత్ స్పందమాత్రేణ యాతి చిత్తమ్ - ‘అచిత్తతామ్’। చిత్తము అనగా ఏమి? సర్వదా సర్వత్రా నిశ్చలమైయున్న నీ సంవిత్ (సత్-విత్) స్వరూపము ఇంద్రియ దృశ్య - సంగతి, సందర్భ, సంబంధ, సంఘటనలకు స్పందించటముచే ‘చిత్తము’ అని అంటున్నారు.

‘‘అసంవిత్ స్పందనము’’ (Non responsiveness by being beyond to worldly events) పొందినమాత్రంచేత చిత్తము అచిత్తత్వము సంతరించుకోగలదు. ప్రాణనిరోధము స్వాభావికమవగలదు. పరమపదము సిద్ధించ గలదు. ‘‘ఏది ఎట్లా ఉన్నా కూడా నేను సర్వదా యథాతథమగు పరాత్మానంద స్వరూపుడనే’’ - అను చెదరని నిశ్చల నిశ్చయానుభవమే అస్పందము (లేక) అచిత్తము.

ఓ నిదాఘా!

(1) దృశ్యము - దర్శనముల పరస్పర సంబంధముచేత ఏ సుఖము లభిస్తున్నదో, అద్దాని సుఖము
(2) దృశ్యమునకు ఆవలగల సంవిత్‌తత్త్వము (లేక), సత్-విత్ ఆత్మతో మమేకమగుటచే లభించు సుఖము
- ఈ రెండిటిని సరిపోల్చి చూచుకో. అటు తరువాత - దృశ్య - దర్శన సంబంధమును బ్రాహ్మీదృష్టితోనే చూచెదవుగాక। సాంసారిక (భౌతిక) దృష్టితో చూడకుండెదవు గాక!

యత్ర న అభ్యుదయం చిత్తం, తద్వై సుఖం అకృత్రిమమ్। దృశ్య విషయములచే చిత్తము పొందే సుఖము కృత్రిమమైనది మాత్రమే. ఎక్కడైతే చిత్తము అభ్యుదయము (వృద్ధి) పొందదో, అక్కడ మాత్రమే అకృత్రిమము అగు సుఖము (Natural - Non Artificial Happiness) లభించగలదు. ఎప్పుడైతే చిత్తము క్షయము గాని, అతిశయము గాని (Neither decay nor opening up) పొందదో, అక్కడ మాత్రమే నిజమైన ప్రశాంతత. ఆత్మజ్ఞానియొక్క చిత్తము - చిత్తము కాదు. ‘అచిత్తమే’ అనబడుతోంది. అదియే తురీయ, తురీయాతీత అవస్థలతో సంలీనమగుచూ ‘సత్త్వము’ (సత్+త్వమ్) అనబడుతోంది.

అందుచేత ఓ నిదాఘా! నీయందు నీవు పూర్ణానుభావుడవై ఉంటూనే ఈ జగన్నాటకంలో నటించువాడనై ఉండు. నీయొక్క నిశ్చల పరస్వరూపానుభవమును ఏమరువవద్దు.

‘‘జ్ఞానవాన్-మోక్షవాన్’’

మునీ! ప్రియ నిదాఘా! సర్వ సంకల్పములు(All Visualizations, Presumptions and assumptions with regard to wordly events, happenings etc) సన్న్యసించి, అంతరమున సమము - శాంతము అగు మనస్సును కలిగి ఉండుము. సన్న్యాస - యోగాత్మువడవు కమ్ము. సర్వత్ర శాంత స్వభావముచే విరాజిల్లు అంతరంగము కలిగి ఉండుము.

సాంఖ్య యోగులు - యోగ యోగులు

సాంఖ్యయోగులు = సమ్యజ్ జ్ఞాన అవరోధేన నిత్యమ్ ఏక సమాధినా, సాంఖ్య ఏవ అవబుద్ధా యే, తే ‘సాంఖ్యా యోగినః పరే’’।।
తరంగములు అనేకమైనప్పటికీ - జలము ఏకమే కదా!
ఆభరణములు అనేకంగా కనబడుచున్నప్పటికీ - బంగారము ఒక్కటే కదా!
సూర్యకిరణములు వేరువేరు చోట్ల ప్రసరిస్తున్నప్పటికీ - సూర్యుడు ఒక్కడే కదా!
వాయు వీచికలు వేరువేరైనప్పటికీ - వాయువు అంతటా ఒక్కటే కదా।

‘‘అనేకముగా కనిపిస్తున్నప్పటికీ, ఈ సమస్త జీవులు సర్వదా ఏకమగు ఆత్మస్వరూపులే’’ అని ఏ విచారణ - విచక్షణలచే నిర్ణయమౌతుందో, - అదియే సాంఖ్యయోగము. అట్టి ‘‘అనేకముగా చూస్తూ కూడా ఏకముగా అనిపించటము’’ను సిద్ధించుకొన్నవారే ‘సాంఖ్యయోగులు’. సమస్తమునకు పరమగు ఆత్మగా ‘‘అహమ్-త్వమ్-తత్’’ లను ఏకమగు ఆత్మ - దృష్టికి జేర్చి దర్శించువారే - సాంఖ్యయోగపరులు. ఇది విచారణ మార్గము.

యోగయోగులు = ప్రాణాది అనిల సంశాంతౌ యుక్త్యా యే పదమ్ ఆగతాః, అనామయమ్, అనాద్యంతమ్-తే స్మృతా ‘యోగయోగినః’’।
• పూరక-కుంభక-రేచకముల అభ్యాసముచే క్రమంగా ఆయా ఉపాయములతో సహజకుంభకము సిద్ధించుకోవటము. దేహములోని నవరంధ్రములలోను, షట్ చక్రములలోను, నాడులందు ‘‘ప్రాణనిశ్చలాభ్యాసము’’ నిర్వర్తిస్తూ ఉండటము.
• ప్రాణవాయు చలనమును ప్రాణశక్తి యందు, ప్రాణశక్తిని ప్రాణేశ్వరుడగు ఆత్మయందు యుక్తితో సశాంతింపజేయటము.
• యోగాభ్యాసపూర్వకంగా అనామయము, ఆద్యంత రహితము అగు ఆత్మ పదమును సిద్ధింపజేసుకోవటము. అట్టివారు యోగయోగులు. ఇది యోగ మార్గము.

నిదాఘుడు : మహాత్మా! అట్టి (1) సాంఖ్యయోగులు (2) యోగయోగులలో - ఎవరు యోగవిత్-తములు (లేక) అధిక శ్రేష్ఠులు? ఏ మార్గము త్వరితముగా ఫలప్రదము?

ఋభుమహర్షి : సాంఖ్యాయోగులు, యోగయోగులు (జ్ఞానమార్గపరులు, యోగమార్గపరులు) - ఇరువురు చేరేది ఒక్కచోటికే. ఇరువురు అకృత్రిమమగు శాంతపదము సిద్ధించుకొనుచున్నారు. రెండు మార్గములు ఒక్కచోటికే దారితీస్తూ ఉండగా…ఇందు ‘‘ఒకటి తక్కువ, మరొకటి ఎక్కువ’’ - అనే ప్రసక్తి ఎక్కడిది? ఎవరికి ఏది రుచియో, వారు ఆ మార్గములో ‘‘అఖండాత్మమేవాహమ్’’ - స్థానమును తప్పక సిద్ధించుకోవచ్చును.

అంతేకాదు. ఆ రెండు కూడా ‘‘పరస్పర సిద్ధి న్యాయము’’ కలిగి ఉన్నాయి. అనగా, వాటిలో యోగి ఒకటి సిద్ధింపజేసుకొంటూ ఉండగా, రెండవది స్వాభావికంగానే ఆతనిపట్ల సంసిద్ధమగుచూనే ఉంటుంది.

(1) ఏకార్థ-అభ్యసనము : ఏకము, అక్షరము, పరమార్థము అగు ఆత్మగురించిన శ్రవణ-మనన-నిది ధ్యాస - సమాధి రూపమగు - అభ్యాసము. క్రమంగా సర్వత్రా స్వస్వరూప-అఖండాత్మ దర్శనము.

(2) ప్రాణ నిరోధము : (1) పూరక - రేచకముల మధ్యగా వాయు కుంభకము, (2) దేహముయొక్క బాహ్య - అంతరములలో పూరక-రేచక (లేక) స్వాభావిక/సహజకుంభకాభ్యాసము, (3) ప్రాణముల కదలికలను దర్శిస్తూ మూలరూపమగు నిశ్చల ప్రాణశక్తిని ఉపాసించటము, (4) ప్రాణశక్తి సహాయంతో ప్రాణేశ్వరోపాసన. (5) క్రమంగా అఖండాత్మ సందర్శనము.

(3) చిత్త పరిక్షయము : ఈ చిత్తము ఏఏ సందర్భములందు, సంఘటనలయందు, నామ-రూపాదులయందు అరిషట్ వర్గరూపంగా ఇష్టాయిష్టములు పొందుచూ తగులుకొని ఉంటోందో - అది గమనించటము. అట్టి చిత్తమునకు బ్రహ్మభావనను అలవరచుచూ, సర్వే సర్వత్రా అఖండాత్మ దర్శనముచే చిత్తమును సత్త్వస్థితికి తీసుకురావటము.

ఈ మూడు కూడా - (1) ఏకార్ధాభ్యసనం, (2) ప్రాణరోధః (3) చేతః పరిక్షయః- ఏ కస్మిన్ ఏవ సంసిద్ధే, సంసిద్ధ్యంతి పరస్పరమ్।… (మూడిటిలో) ఒకటి నీవు సిద్ధింపజేసుకొంటూ ఉండగా, తక్కిన రెండు స్వాభావికంగానే నీ పట్ల సంసిద్ధమౌతూ ఉంటాయి.

అందుచేత ‘‘ఇది ఎక్కువ, ఇది తక్కువ’’ మొదలైనవి ఉత్తమయోగులు - చర్చకు విషయముగా ఏమాత్రము పరిగణించరు.
విజ్ఞులు ఈ మూడు ఒక్కసారిగా ఆశ్రయించువారై ఉంటారు. అంతేగాని వేరువేరు దృష్టితో చూడరు.

ప్రాణ-చిత్తముల అవినాభావసంబంధము

అవినా భావినీ నిత్యం జంతూనాం ప్రాణ-చేతసీ।
(1) ఎక్కడ కుంభకముచే ప్రాణశక్తిని నిరోధించి ఉంచుతామో, అక్కడ చిత్తము కేంద్రీకృతం కాసాగుతుంది. ఎక్కడ చిత్తమును తెచ్చి ఏకాగ్రం చేస్తామో, అక్కడిక ప్రాణశక్తి కేంద్రీకృతం అవుతూ వస్తుంది.
(2) ఈ చిత్త-ప్రాణముల అంతర్లీన గానము ‘ఇష్టము’ లేక ఇచ్ఛాశక్తియే।
(3) ఈ రెండు ‘భావన’చే నిర్మితమైనవే।
అందుచేత చిత్త-ప్రాణములు అవినాభావ సంబంధములు కలిగి ఉంటాయి. అనగా ఒకటి ఉన్నచోట రెండవది భావనాత్మకమై, అనుభూతిరూపమై వచ్చి చేరుతుంది. ఒకటి ఉండనిచోట, రెండవది కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతుంది.

అంతేకాదు.

ఆధార-ఆధేయవత్ చ ఏతే, ఏకభావే వినశ్యతః।।
ఈ చిత్త - ప్రాణములు రెండిటికీ ఆధార-ఆధేయ సంబంధము (Mutually dependent. The Relationship of one being dependent upon the independence of the second one)- ఉన్నది. ఒకటి తనను తాను త్యజించి రెండవదానితో ఏకత్వము సంతరించుకోగలదు.

ఒకచోట కొంత మట్టితో చేసిన గుఱ్ఱము సాకారముగా ఏర్పడి ఉన్నది.
* అక్కడినుండి ఆ మట్టిని ఎక్కడికో తొలగిస్తున్నాము. మట్టితోబాటు గుఱ్ఱము కూడా తొలగుతుంది కదా!
* ఆ మట్టి గుఱ్ఱమును ఎవరికో బహుమతిగా ఇచ్చి వేస్తున్నాము. అనగా మట్టి కూడా గుఱ్ఱముతో బాటే బహుమతిగా ఇచ్చివేయబడుచున్నట్లే కదా।
అంతేగాని ‘‘మట్టిని అట్టే బెట్టండి. గుఱ్ఱమును మాత్రమే ఇచ్చివేయండి’’ - అనునదిగాని, (లేక) ‘‘గుఱ్ఱమును అట్టే బెట్టండి. మట్టిని మాత్రమే ఇచ్చివేయండి’’ - అనునది గాని ఏమాత్రము కుదరదు కదా।

అట్లాగే చిత్తము - ప్రాణములు విడదీయరాని బంధము కలిగి ఉన్నాయి.

ఇంతేకాకుండా…
ఈ చిత్త - ప్రాణములు ఒకేసారి నశించినవై (సాధనలు సిద్ధించిన తరువాత శాంతము వహించినవై) (లేక) యోగభావనయందు సంయోగము పొందినవై - ఆ యోగికి మోక్షము ప్రసాదించుచున్నాయి.

పరమం పదమ్

నిదాఘుడు : మహనీయా! ‘పరమపదము’ అని తత్త్వశాస్త్రము మహదాశయముగా చెప్పు స్థితి మాకు సిద్ధించేది ఎట్లా?

ఋభుమహర్షి :

శ్లో।। సర్వమేతత్ ధియా త్యక్త్వా యది తిష్ఠసి నిశ్చలః,
తదా అహంకార విలయే - త్వమేవ పరమం పదమ్।।

బిడ్డా! మహాశయా! నిదాఘా! ఎప్పుడైతే నీకు ‘అన్యము’ అని అనిపించేదంతా నీయొక్క ‘బుద్ధి’తో త్యజించి, మనస్సును నిశ్చలం చేసి ఉంటావో…అట్టి స్థితిలో అహంకారము స్వయముగా (‘ఉష్ణజలంలో ఉంచిన మంచుగడ్డ’వలె) ఆత్మజ్ఞానాగ్ని యందు కరిగిపోయి, ఆత్మతో అనన్యత్వము సంతరించుకోగలదు. అప్పుడు నీవు ‘పరమం పదము’ను సిద్ధించుకొన్నట్లే। నీవే అది (తత్ త్వమ్) అగుచున్నావు.

ఆత్మఏవ మహాచిత్ - మహాసత్త

ఇక్కడ మహాచిత్ (The Factor of ‘knowing’ that is at present in all beings) మాత్రమే ఉనికిని కలిగి ఉన్నది. అదియే ‘‘మహాసత్త’’ (Al- pervading - BEING) - అని కూడా వర్ణించబడుతోంది. (Al-pervading Knowing & Al-pervading BEING)

అట్టి ఆత్మకు ‘‘మనో బుద్ధ చిత్త అహంకార-దృశ్య-జన్మ-మృత్యు" మొదలైన సంబంధమైన ఏ దోషము కించిత్ కూడా అంటజాలదు. కాబట్టి అది నిష్కళంకము. సర్వత్రా సమస్వరూపమై ఉన్నది కాబట్టి ‘సర్వసమము’. సర్వదా పరిశుద్ధము. అహంకారమునకు కూడా ఆవలది కాబట్టి నిరహంకార స్వరూపము. అద్దాని విభవమే ఈ సందృశ్యమగుచున్నదంతా। కాబట్టి సకృత్ విభాతము. అట్టి ఆత్మను నిర్మలదృష్టి చేతనే గమనించగలము కాబట్టి విమలము. సూర్యగోళమువలె స్వయం ప్రకాశక - నిత్యోదితము। (ever Blossoming).

అట్టి ఈ జీవుని సహజము, కేవలము (Original and absolute) అగు స్వస్వరూప తత్త్వమే ‘బ్రహ్మము’ అని, ‘పరమాత్మ’ అని, ‘పరబ్రహ్మము’ అని, ‘శివము’ అని, ‘విష్ణుతత్త్వము’ అని - ఇంకా ఇంకా అనేక పేర్లతో శాస్త్రములచే శ్లాఘించబడుతోంది.(శివతత్త్వ = త్వమ్ తత్ శివేతి).

ఓ నిదాఘా! ‘‘అట్టి పరమాత్మ (లేక) పరబ్రహ్మమే నేను’’ (సో2హమ్ తత్త్వమ్) - అని నిర్ణయించుకొని, కృతకృత్యుడవు అయ్యెదవుగాక!

సో2హమ్

• ఏది బ్రహ్మము, పరబ్రహ్మము, శివము, అనంతము, స్వయము, ఆది, కేవలము, నిజస్వరూపము మొ।।న మహత్ శబ్దములతో వాఙ్మయముగా తత్త్వజ్ఞులచే గానము చేయబడుతోందో- అది ‘‘నేనే’’ అయి ఉన్నాను. అది నేను కాని క్షణమే లేదు. ఉండబోదు.

• (ఆత్మ స్వరూపుడనగు) నేను భూత - భవిష్యత్ రూపమగు కాలమునకే అతీతుడను. వర్తమానమునందే పై ‘పరార్థము’గా సంస్థితుడను. కాలాతీతుడను. కాలనియామకుడను. కాలభావికుడను. కాలఃకాలుడను.

• ఆత్మకు ‘అన్యము’ అనునది ఎక్కడా ఏదీ లేదు. నేను నిజస్వరూపంగా ‘పరమాత్మ’నే అయి ఉన్నాను. అందుచేత ‘‘ఇదమద్య మయా లబ్దం। ఇమం ప్రాప్స్యామి సుందరం।’’ - న స్తౌమి। న చ నిందామి। - (కింతు) ఆత్మనో అన్యం నహి క్వచిత్।। సమస్తము ఆత్మయే అయి ఉండగా ‘‘ఇదిగో! ఇంతవరకు నాచేత పొందబడింది. ఇంకా ఈ సుందరమైనవి నాచే పొందబడవలసి ఉన్నది. మోక్షము కొరకై ఇంకా ఇంత నేను నిర్వర్తించవలసియున్నది?’’ - మొదలైనవేవీ నాపట్ల ఏమాత్రమూ లేనేలేవు.

• న తుష్యామి శుభ ప్రాప్తౌ। న భిద్యామి అశుభాగమే। నాకు శుభము ప్రాప్తించింది కదా అని సంతోషించవలసినవి లేవు. అశుభములు వస్తాయేమోనని భయపడవలసినవి లేవు. ఆత్మనగు నేను శుభాశుభములకు విషయమునే కాను.

• మమాత్మ సౌందర్యమును, ఆత్మయొక్క ఔన్నత్యమును గుర్తించుచూ, - ఎటువంటి చాపల్యములు లేనివాడనై, శోకరహితుడనై ప్రశాంతమైన ముఖమును అవధరిస్తున్నాను.

• మనస్సు ‘నాది’ కాని, ‘నేను’ కాదు. అట్టి నాచే నియమితమైన మనస్సుచే అనామయుడనై (అద్దములో వస్తువులు కనబడుతున్నప్పటికీ, అద్దములో ఏ వస్తువు లేని విధంగా), పరమశాంతముగా ‘జీవితము’ అనే ఒక స్వయంకల్పిత సందర్భమును ఆస్వాదిస్తున్నాను.

• ‘సమస్తము’ అయి ఉన్న ఆత్మను నేనే అయి ఉండగా, ఇక నాకు నా బంధువులెవరు? నాకు పరులు (వేరేవారు) ఎవరు? నాది అయినదేమున్నది? నాది కానిదేమున్నది? హే బ్రహ్మన్! సమస్తమునకు సంస్పర్శ (Touch) ను ప్రసాదిస్తున్నది నాకు నేనుగా నేనే। మమ అఖండాత్మ స్వరూపమే। సర్వదా నేను బ్రహ్మానంద స్వరూపుడనే।

ద్వైతము జయించేది ఎట్లా?

ఓ నిదాఘా! ద్వైతబుద్ధివలననే వాసనలు జనిస్తున్నాయి. వాసనలు త్యజించివేస్తే ఇక జరామరణ రహితమగు ఆత్మయే సర్వదా శేషించినది అగుచున్నది. మనస్సుయొక్క వాసనలు కలిగియుండు సందర్భంలో (సువాసనం మనః)…(అది ‘‘జ్ఞానరూపమగు - మనస్సు వాసనారహితమై యున్నప్పుడు) ఆ మనస్సు ‘‘జ్ఞేయమగు ఆత్మస్వరూపమే’’ - అగుచున్నది.

నిదాఘుడు : మహర్షీ! ‘ఆత్మ అఖండము’ అని మేము అధ్యయనము చేస్తూ ఉన్నప్పటికీ మాపట్ల ‘‘నేను వేరు - నీవు వేరు - ఇష్ట దైవము వేరు’’ మొదలైన అనేక భేదరూపములుగా వర్తమానానుభవము అనివార్యము, అప్రతిహతము, దాటుటకు కష్టతరము అవుతోందే। ఎందుచేత? అట్టి ద్వైత భావనను మేము అధిగమించేది ఎట్లా?

ఋభుమహర్షి : జన్మ-జన్మల కర్మ సంబంధమైన అభిమానములు ఈ జీవునిపట్ల వాసనలు (Tendencies) గా రూపు దిద్దుకుంటున్నాయి. అట్టి వాసనలే (వస్త్రమునకు దారమువలె) చిత్తముయొక్క మూల రూపము అయి ఉంటున్నాయి.

చిత్తే త్యక్తే లయం యాతి ద్వైతమ్ ఏతచ్చ సర్వతః।
అట్టి వాసనా నిర్మితమగు చిత్తము త్యజించబడిందా, అప్పుడిక ద్వైతము పూర్తిగా లయము పొందగలదు.

వాసనలు → సంస్కారములనుండి, సంస్కారము → అభ్యాసములనుండి, అభ్యాసములు → ఇంద్రియ-మనో సంబంధమైన కర్మ సందర్భములనుండి రూపుదిద్దుకుంటున్నాయి.

ఎప్పుడైతే చిత్తము లయిస్తుందో (లేక) శమిస్తుందో, అప్పుడిక శేషించే పరబ్రహ్మతత్త్వమే స్వస్వరూపముగా సహజరూపముగా ఉపహితము (స్వానుభవము) అవుతుంది. అట్టి నీయొక్క సహజము, కేవలము అగు స్వరూపము ఎట్టిదంటే…

పరమగ్ం : ఈ సమస్త దృశ్య వ్యావహారమునకు ఆవల - పరమై ఉన్నట్టిది.
శాంతమ్ : పరమ శాంత స్వరూపమైనట్టిది.
స్వచ్ఛమ్ : ఎట్టి దోషములు ఆపాదించబడజాలనిది.
అనామయమ్ : జగత్ విశేష వ్యవహార రహితమైనది.
అనన్తమ్ : పంచభూతములచేత గాని, మనో - బుద్ధి - చిత్త అహంకారములచేత గాని, దేహ - దేహాంతరములచేత గాని పరిమితము కానట్టిది.
అజరగ్ం : తరగటం, వార్థక్యము మొదలైనవి ఏమాత్రము లేనట్టిది.
శాంతమ్ : సర్వదా ప్రశాంత స్వరూపము.
అచ్యుతమ్ : దేహముల రాక - పోకల చేతగాని, జ్ఞాన - అజ్ఞానముల చేతగాని ‘స్వ-స్థితి’ నుండి ఏమాత్రము చ్యుతి (Distraction, Displacement) పొందనట్టిది.
అద్వితీయమ్ : జగత్తు, జీవాత్మ, ఈశ్వరుడు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు మొదలైన సమస్తము తనకు ద్వితీయము కానట్టిది.
అనాద్యంతము : మొదలుగాని, చివరగాని కానట్టిది, లేనట్టిది.
యత్ ఆద్యమ్ : సమస్త జీవులకు ఆది స్వరూపము. ఈ జీవునికి సంబంధించి - మొట్టమొదటయే ఉన్న చైతన్యస్వరూపము.
ఉపలంభనమ్ : సమస్తము తనయొక్క ‘‘అనుభవము’’ అను కల్పనయందు కలిగి ఉన్నట్టిది.
ఏకమ్ : ఏమాత్రము కూడా అనేకముగా అవనట్టిది.
ఆద్యన్తరహితమ్ : ‘‘ఇదిమొదలు - ఇది చివర’’ అని చెప్పటానికి ఏమాత్రము వీలుకానట్టిది.
చిన్మాత్రమ్ : కేవలమగు ఎరుక (Absolute knowing) రూపము. కేవలమగు తేజోరూపము (The Absolute Form of Englightenment)
అమలమ్ : ఏ దోషము ఆపాదింపబడజాలనట్టిది.
తతమ్ : సర్వత్రా విస్తరించి ఉన్నట్టిది.
ఖాదపి అతి తరాం సూక్ష్మం : ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము.

అట్టి బ్రహ్మమే నేను। తత్ ‘బ్రహ్మ’ అహమస్మి।
ఇందులో సందేహమే లేదు। న సంశయః।।

ఓ నిదాఘా! - ‘‘ఏది దిక్, కాలము మొదలైనవాటిచే విచ్ఛిన్నము (Breakup) కానట్టిదో, అత్యంత స్వచ్ఛమో, నిత్యోదితమో (Ever-Blossoming Ever Dawn), సర్వత్రా ఈ సమస్తముగా విస్తరించినదై యున్నదో, సర్వత్రా సర్వార్థమయమై (Multi-purpose, multi Faceted) అయి కూడా ఏకార్థమే (unity in the Diversity) అయి ఉన్నదో, కేవల ఎరుక - తేజోరూపమైన ‘చిన్మాత్రమో’ - అమలమో అట్టి బ్రహ్మమే నేను’’ అను మననముచే బ్రహ్మమే నీవు కాగలవు.

స్వరూప-స్వభావతః నేను
- సర్వము అయి ఉన్నాను.
- సర్వదా ఏకమే అయి ఉన్నాను.
- పరమశాంత స్వరూపుడను.
- ఆదిమధ్యాంత రహితుడను.
- భావాభావములకు మునుముందే ఉండి, ఆ ఉభయము నేనే అయి ఉన్నవాడను.
- ఈ సమస్తము సర్వదా నేనే -
అను అవగాహనను ఆశ్రయించి సుఖస్వరూపుడవై ఉండుము.

నాకు బంధము లేదు। ముక్తిలేదు। సర్వదా ఆకాశమువలె నిరామయమగు బ్రహ్మమే అయి ఉన్నాను। సర్వదా - ‘‘నాకు ఏదో వేరుగాఉన్నది’’ - అను ద్వైత భావము నుండి సదా విముక్తుడను. సత్ - (ఉనికి), చిత్ (ఎరుక), ఆనందము (అనుభూతి) స్వాభావికమైయున్న సచ్చిదానంద లక్షణుడను.

ఇట్టి భావనను ప్రయత్నపూర్వకంగా ఆశ్రయిస్తూ ఉన్నావా - ఇక నీవు జీవన్ముక్తుడవు అయినట్లే. ఇంతకుమించి జీవన్ముక్తత్వమునకు మరొక అర్థముగల నిర్వచనమేమీ లేదు.

పదార్థే సంత్యజ।

శ్లో।। పదార్థబృందే దేహాది ధియా సంత్యజ్య దూరతః,
అశీత శాంతఃకరణో నిత్యమ్ ఆత్మపరో భవ।।

బుద్ధితో - ఈ భౌతిక దేహమును, (అట్లాగే) సమస్త పదార్థములను దూరంగా త్యజించివేసి, నిత్యము శాంత-అంతఃకరణము కలవాడవై ఆత్మస్వరూపుడుగా ఉండుము. ఆత్మసింహాసనముపై అధిష్ఠించినవాడవై ఉండుము.

దుఃఖమునకు మూలకారణము
(The Root cause of worry)

ఋబుమహర్షి : ఓ నిదాఘా! ఆత్మానందస్వరూపుడే అయి ఉన్న ఈ జీవుడు అసంఖ్యాక దుఃఖపరంపరలకు లోను కావటానికి కారణమేమిటి? విను.

మం।। శ్లో।। ఇదగ్ం రమ్యమ్ ఇదం నేతి బీజం తే దుఃఖ సంతతేః।
తస్మిన్ సామ్యాగ్నినా దగ్ధే - దుఃఖస్య అవసరః కుతః?

దుఃఖపరంపరలన్నిటికీ మూలకారణము ఏదై ఉన్నది? ‘‘ఇది నాకు రమ్యము. ఇష్టము. నచ్చుతుంది. అది నాకు రమ్యము కాదు. ఇష్టం లేదు. నచ్చదు’’ - అను హృదయాందర్గతంలో గల బీజమే ఈ జీవునిపట్ల రూపుదిద్దుకుంటున్న దుఃఖములన్నిటికీ మూలకారణం (Root cause). అట్టి కారణ బీజమును ‘‘సామ్యము (సమదృష్టి, సమమగు ఆత్మభావన)’’ అనే అగ్నిచే దగ్ధం చేసి వేయి. ఇక దుఃఖము (Worry)నకు కారణమేముంటుంది? ఏదీ ఉండదు.

బిడ్డా! సజ్జనులతో సంభాషణ - సత్సంగములచేతను, శాస్త్రములచే బోధించబడుచున్న మహదాశయముయొక్క నిరతి చేతను ‘‘ప్రజ్ఞ (The Intelectual Ability / Sharpness of Brain in properly interpreting and assimilating)ఃః ను అలవరచుకో. తెలివిని వివర్థము (shaping up the sharpness) చేయి.

నీతో, నాతో సహా - ఈ సమస్తము అయి ఉన్న పరబ్రహ్మము ఇంకా ఈఈ విశేషములతో వర్ణించబడుతోంది.

ఋతము - తత్త్వజ్ఞుల స్వానుభవము.
సత్యము - కల్పనలు లేనట్టి నిజరూపము (సత్‌స్వరూపము). ‘ఉనికి’ అను విశేషము సంప్రదర్శించునది (యమ్-సత్).

ఈ సంసార భేషజమంతా బ్రహ్మముయొక్క సంప్రదర్శనా చమత్కారమే।

• (ఇంకా కూడా) పరమార్థమైనట్టిది. అమలము. నిత్యము. ఆది మధ్యాంతరహితము అయినట్టిది - బ్రహ్మము.
• స్థూలము కానట్టిది, శూన్యము కానట్టిది. ఆకాశము కానట్టిది. స్పర్శకు వినటమునకు, రుచికి, వాసన (మొదలైన వాటికి) విషయమే కానిది. దేనితోను ప్రమేయము లేనట్టిది. ఉపమానములతో చెప్పజాలనిది - అఖండాత్మస్వరూపము.

ఓ సువ్రతా! ఆత్మ సర్వదా సచ్చిదానందము, అనంతము కూడా. అట్టి బ్రహ్మమే నీవు. అట్టి బ్రహ్మము గురించియే సర్వదా మననం చేస్తూ క్రమంగా - ‘‘బ్రహ్మమే నేనై ఉన్నాను’’ - అని ధ్యానం చేస్తూ, ధ్యేయమునకు (ధ్యానము చేస్తూ ఉన్న నామ-రూప-శబ్ద తత్త్వమంతటికీ) అతీతుడవు అగుము. సర్వ సంసార బంధములనుండి అప్పుడు విముక్తుడవు అవగలవు. ‘‘సమస్తము సంవిదాత్మ అగు పరతత్త్వమునుండే జీవాత్మ-ఈశ్వరతత్త్వములు (జలంలో తరంగాలవలె) ప్రదర్శనమగుచున్నాయి’’ అనునది ‘సంవిత్ సమాధి’ అనబడుతోంది.

నిత్యః సర్వగతో హి ఆత్మా కూటస్థో దోషవర్జితః

రచయిత కథ వ్రాసి ముగించినంత మాత్రాన అంతటితో ముగింపు పొందుతాడా? పొందడు. అట్లాగే, ఆత్మ నిత్యమైనదే గాని దేశ- కాల-వస్తువులచే ముగియునది కాదు.
జన్మ-కర్మ మొదలైన వాటి ముగింపుచే తాను ముగియదు.
రచయిత యొక్క రచనా కళా విన్యాసమే - ఆతడు రచించిన కథ (లేక నవల) మొదటి నుండి చివరి వరకు నిండియున్నది కదా! అట్లాగే ఆత్మ తాను పొందుచున్న దృశ్య వ్యవహారమంతా తానే మొత్తమంతా నిండియుండి, ‘‘సర్వగతము’’ అయి ఉన్నది. ఆత్మయే రచయిత, రచన, పాఠకుడు కూడా!
ఒక నవల (లేక) కథకు మూలము రచయిత యొక్క కల్పనయే। కల్పనకు కూటస్థము (Its Root of Presence) - రచయితయే జగత్తుగా దర్శించబడేదంతా ఆత్మస్వరూపుడగు ద్రష్ట యొక్క స్వకీయ కల్పనా విశేషమే।
అట్టి కల్పనకు కూటస్థము (The origin where it is originally existent) ఆత్మయే।
ఒక నవలలోని ఆయా పాత్రల ‘సుగుణములుగాని, దుర్గణములుగాని, స్వరూప-స్వభావములుగాని రచయితకు ఆపాదించలేము. కానీ అవన్నీ రచయిత నుండియే కథా కల్పితంగా వచ్చాయి. మరెక్కడి నుండో కాదు. అయినాకూడా రచయిత దోషవర్జితుడు. పాత్రల మంచి-చెడులు ఆతనివి కావు. ఒక ద్రష్టగా జగన్నాటకమునకు రచయిత అయి ఉన్నప్పటికీ, ఈ జీవుని ఆత్మ స్వరూపమునకు ఇక్కడి - జీవాత్మ జగత్ విశేషముల స్వరూప స్వభావములు ఆపాదించలేము. కానీ అవన్నీ కూడా దృక్ స్వరూపుడగు (లేక) చైతన్య-స్వరూపుడగు ఆత్మపురుషుని స్వయంకల్పితం. అనగా జగత్తు ఆత్మచే స్వయంరచన, స్వయం ఆస్వాదన కూడా। జగత్తు ఆత్మయొక్క ప్రదర్శనా స్వరూపమే।
కథా రచనలో ఎన్ని రకాల పాత్రలు ఉన్నప్పటికీ, కథా రచయిత మాత్రం సర్వదా ఒక్కడే. ఆత్మ సదా దోషవర్జితము. స్వానుభవ జగత్తు నందు జీవాత్మగా ఎన్ని అన్యస్వభావములు చూస్తూ ఉన్నప్పటికీ, పరమాత్మగా సర్వదా ఏకమే. అనేకముగా అవడు.

అయితే, ఈజీవుని పట్ల భ్రాంతి కొనసాగుచున్నంతవరకు ఆత్మయొక్క పర-కేవలీ స్వరూపము ఆతనికి అనుభవముగా సిద్ధించటమే లేదు.

అందుచేత ఓ నిదాఘా। నీవు ముఖ్యంగా గమనించవలసినది.

మం।। శ్లో।। తస్మాత్ అద్వైత ఏవ అస్తి। న ప్రపంచో। న సగ్ంసృతిః।
యథా ఆకాశో ఘటాకాశో మహాకాశ ఇతీరితః।।

నాటక రచయిత - నాటకములో పాత్ర రెండు వేరు వేరా? నాటకమే కల్పన. అందులో ఒక పాత్రకు స్వతః సిద్ధమైన ఉనికి ఎక్కడిది? ఇక్కడ వాస్తవానికి రచయితకు మాత్రమే ఉన్నాడు. ఆతనికి వేరుగా నాటకమునకుగాని, పాత్రలకుగాని స్వకీయమైన ఉనికి లేదు.

అట్లాగే ఇక్కడ ‘నేను’ రూపముగా విరాజిల్లుచున్న ‘ఆత్మ’ మాత్రమే ఉన్నది. ఆత్మకు వేరుగా జగన్నాటకము స్వకీయమై లేదు. జీవాత్మ లేడు. ఆతనికి అనుభవమగుచున్న తదితర (అన్య) జీవులు (జీవాత్మలు) లేదు. సర్వదా ‘‘అద్వైతము’’ (అద్వితీయమగూఅత్మ) మాత్రమే ఇక్కడ ఉన్నది. ఇక ‘ప్రపంచము’ అనబడునది లేదు. సంసార బంధరూపముగా చెప్పబడే సంసృతి లేదు. ఊహలో నిజమేముంటుంది?

ఘటాకాశము = Space in the pot
బాహ్యాకాశము = Space outside the pot

‘‘కుండలోని ఆకాశము, బయటగల ఆకాశము’’ అని రెండు ఉన్నాయా? లేదు. కుండకు (ఘటమునకు) లోపల - బయట ఉన్నది ఒక్కటే ఆకాశము. అట్టి మహాకాశమునకు బాహ్య - అభ్యంతరములనబడే విభాగములే లేవు.

అట్లాగే ‘ఆత్మకు - (1) జీవాత్మ (2) పరమాత్మ - అనబడే రెండు వేరువేరైన ప్రత్యయములు సహజము కాదు. ఆత్మబోధ కొరకై ఆపాదితము మాత్రమే! సర్వదా అఖండమగు ఆత్మయే సర్వేసర్వత్రా ఉనికి కలిగియున్నది.

అందుచేత - భ్రాంత్యైః ద్విథా ప్రోక్తా, జీవ-ఈశ్వర ఆత్మనా। భ్రాంతి చేతనే - ‘‘ఇది జీవాత్మ। ఇది ఈశ్వరుడు।’’ - అని రెండు విభాగములుగా చెప్పబడుచున్నప్పటికీ, వస్తుతః వాస్తవానికి ఆత్మ సర్వదా ఏకమే గాని, - విభాగయుతము (partitionable) కాదు.

ఈ భేదములతో కూడిన దృశ్యము యొక్క వ్యవహారమంతా మనోకల్పనయే. అంతేగాని భేదము దృశ్యములో వాస్తవమై ఉండి ఉన్నట్టిది కాదు. ఎప్పుడైతే విచారణచే, యోగాభ్యాసాది ఉపాయములచే, మనస్సు నిర్మలమై, అట్టి నిర్మల మనస్సుకు సర్వత్ర సమస్తముగా విస్తరించినదైయున్న ఆత్మ - మననము అవుతుందో, అట్టి యోగికి ఆత్మ సాక్షాత్కారము స్వయముగా సిద్ధించగలదు.

ఆత్మ అనగా ఏమి?

మరి?

మం।।శ్లో।। యదా సర్వాణి భూతాని స్వాత్మన్యేవ హి పశ్యతి,
సర్వ భూతేషు చ ఆత్మానం, బ్రహ్మ సంపద్యతే తదా।

ఓ నిదాఘా!
నీ-నా ఆత్మ ఒక దేహ - దేహి పరిమితమనుకుంటున్నావా? లేదు.
ఆత్మ సర్వదా సర్వగతమై, అఖండమై సర్వత్రా ప్రదర్శనమానమై, ప్రకాశమానమైయున్నది.
ఎప్పుడైతే నీవు ‘‘సమస్త జీవులు మమాత్మానందస్వరూపమే। మమాత్మయే।’’ - అని ‘‘నావలెనే ఆత్మస్వరూపులే’’ - అని బుద్ధితో దర్శిస్తావో, అప్పుడు నీవు బ్రహ్మమునే పొందుతావు. బ్రహ్మమే అవుతావు.
అట్టి సర్వత్రా ఆత్మను, ఆత్మయందే సమస్తమును దర్శించటమే ‘సమాధిస్థితి’ అనబడుతోంది.

శ్లో।। యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి,
ఏకీభూతః పరేణ అసౌ తదా భవతి కేవలః।।

అట్టి సమాధిస్థుడవై ‘‘జీవులు వేరు - ఈశ్వరుడు వేరు’’ మొదలైన వేరువేరులుగా కనిపించేదంతా ఏకీభూతం చేసివేస్తావో, అప్పుడు నీవు కేవలము - పరము అగు పరబ్రహ్మస్వరూపుడవు అవుతావు. ఏకమగు బ్రహ్మముగా సమస్తమును దర్శించువాడై - సమాధిస్థుడు.

సప్తభూమికలు

అట్టి బ్రాహ్మీదృష్టి ‘సో2హమ్ బ్రహ్మ స్వాభావతః’ను సిద్ధించటానికి ఆత్మజ్ఞులచే త్రోవచూపబడుచున్న సప్తభూమికల గురించి ఇప్పుడు చెప్పుకుందాము.
(1) వైరాగ్యముముక్షుత్వా (2) విచారణా (3) సాంగభావనా (4) విలాపినీ - వాసనావిలయాత్మికా (5) శుద్ధసంవిన్మయానందరూపా (6) అసంవేదనారూపా (7) తురీయావస్థ - ఉపశాంతా।

I. పూర్వావస్థ / జాగ్రత్ సంబంధమైనవి: (పూర్వావస్థాత్రయ। జాగ్రత్ సంస్థిమ్।)
(1) ముముక్షుత్వము (2) విచారణ (3) సాంగభావన
Ⅱ. స్వప్న సంబంధమైనది: (స్వప్నాభం యత్ర వై జగత్।)
(4) విలాపినీ - వాసనావిలయాత్మకమైనది.
Ⅲ. సుషుప్తి సంబంధమైనవి: (5) శుద్ధ సంవిన్మయానంద రూపము / అర్థ సుప్త ప్రబుద్ధము - జీవన్ముక్తము
ఆనందైక ఘనాకార - సుషుప్తా।
Ⅳ. తురీయ సంబంధనమైనది (తుర్యపదము)
(6) అసంవేదన రూపము.
Ⅴ. తురీయాతీత సంబంధమైనది - తురీయ అవస్థ - ఉపశాంతి।
(7) ఆనందైక ఘనాకారము - (మనో వాచోభి అగ్రాహ్యమ్। మహా సమత। ముక్తి। పరా నిర్వాణ రూపిణి।)

(1) ప్రథమ భూమిక - వైరాగ్య రస రూపిణీ।

మహనీయుల మహదాశయ ప్రసంగము వింటూ వింటూ,

‘‘తినుతూ, త్రాగుతూ, అనవసరమైన ప్రసంగములు చేస్తూ నేను ఎందుకు ‘జీవితము’ అనే మహత్తరమైన అవకాశమును వృధా చేసుకొంటున్నాను? శాశ్వతమైన ప్రయోజనములను ఉద్దేశ్యించకుండా, అల్పమైన విషయములపట్ల అల్పమైన ఆశయములు కొనసాగిస్తూ కాలగతికి ‘ఎఱ’ అగుచున్నానే! లేదు. ఇది ఉపాయం కాదు’’ - అని వైరాగ్యము పొందుచున్నాడు. ఇక - ‘‘శాశ్వతమగు ఆనందము ఎక్కడ?’’ అనే ప్రశ్నకు వచ్చి, సమాధానము కొరకై వెతకటం ప్రారంభిస్తున్నాడు. ఇది శాస్త్ర అధ్యయనము, సజ్జనులతో సంపర్కము, వైరాగ్యము అను రసములతో కూడినదై, జీవునకు ముముక్షుత్వములో ప్రవేశమును ప్రసాదిస్తూ ఉన్నది. (‘పూర్వవస్థ’ / జగత్ సంబంధమైన మూడు భూమికలలో మొదటిది).

(2) ద్వితీయ భూమిక - విచారణా।

ప్రథమ భూమిక నుండి శాస్త్రార్థములు విచారణ చేయటము, తత్త్వజ్ఞులతో సంభాషించటము, అనుమానములు నివృత్తిజేసుకొనే ప్రయత్నము…ఇవన్నీ విచారణాభూమికలో ప్రవేశము, ప్రవృద్ధము - అగుచున్నాయి. ఇది పూర్వావస్థలలో రెండవది. ఇది కూడా జాగ్రత్ నందు సంస్థితమై యున్నది. ఈ స్థితిలో తత్త్వవేత్తలగు గురువులను ఆశ్రయిస్తున్నాడు.

(3) తృతీయ భూమిక - సాంగభావనా।

ఆపై క్రమంగా భక్తి గుణములగు ‘‘అద్వేష్టా సర్వభూతానాం, మైత్రః, కరుణఏవచ, నిర్మమో నిరహంకారో’’ - మొదలైనవి, ‘‘అమానిత్వమ్, అదంభిత్వమ్, అహింసా, క్షాంతి (ఓర్పు), ఆర్జనమ్ (త్రికరణ శుద్ధి) మొదలైన జ్ఞానలక్షణములు, ‘‘న ద్వేష్టి సంప్రవృత్తాని, నివృత్తని కాంక్షతి, ఉదానవత్ ఆసీనో, అసక్తః తేషుకర్మేషు’’ మొదలైన త్రిగుణాతీతాభ్యాసములను, కర్మసమర్పణ - ఇటువంటి మోక్షాంగములు ఆశ్రయిస్తూ ఉంటాడు. ఇది పూర్వావస్థలోని మూడవ భూమిక. ఇది కూడా జాగ్రత్‌లో సంస్థితమైయున్న భూమికయే.

(4) చతుర్ధ భూమిక - విలాపినీ (స్వప్న సంబంధమైన భూమిక)

సమస్త భూమికల ముందటి స్థితి - ‘‘వాసనా నిర్మాణము’’ (వాసనలు రూపము పొందుచున్న రీతి):

దృశ్య విషయములను ఇష్టాఇష్ట దృష్టులుతోను, ‘‘కావాలి-కావద్దు’’….అను భావనారూపంగాను ఆశ్రయిస్తూ ఉండగా వస్తు - విషయరూప-నామములపట్ల (ధ్యానము కాస్తా) ధ్యాసగా వృద్ధి చెందుతోంది.

ఆ ధ్యాస వలన క్రమంగా అభిప్రాయాలు దృఢపడుచూ, ఆయా వస్తువులతో సంగము (Relatedness) ఏర్పడుతోంది.

‘‘ఇవిలేకుంటే నేనెట్లా? నేను లేకుంటే ఇవి ఎట్లా?’’…అను మననమే సంగము.

అట్టి సంగము అవినాభావరూపము దిద్దుకొని ‘‘కావాలి। తప్పక పొందాలి।’’ - అనే కామము దృఢపడుతోంది.

అది క్రోధమునకు దారితీస్తోంది.

క్రోధము కాస్తా ‘ఆవేశము(Emotion)’గా సంతరించుకొని వివేకమును కప్పివేసి, విచక్షణను బలహీనపరచి ‘నాకు అనిపిస్తుందే నిజం। ఇక ఎవ్వడు ఏది చెప్పినా, సూచించినా అది నిజం కాదు. నేను లెక్క చేయనక్కర్లేదు’’ - అనే భ్రమస్థితి (మోహము) ఏర్పడుతోంది.

అది సమ్మోహనరూపంగా మారి ఇక తెలివి ఏమాత్రం వికసించనిదై, (పర్యవసానము ఏమిటి? ఇందువల్ల పొందుచున్నదేమిటి? ఎంతకాలం ఉంటాయి? పోగొట్టుకొనుచున్నదేమిటి? అవిపోవటం చేత ఏమేమి కోల్పోతాము? - మొదలైన విశ్లేషణా రూపమైన) - ‘స్మృతి’ కోల్పోబడుతోంది.

అప్పుడు ఆ జీవుడు తన ఆత్మయొక్క సహజమగు విస్తారమగు, స్వభావము, ఆనందరూపము ఏమర్చి జన్మకర్మ పరంపరల చట్రములో చిక్కుకొని పడరాని పాట్లు పడుచున్నాడు. తనను గురించి తానే తెలుసుకోలేని అజ్ఞానభూమికలలో తిరుగాడుచున్నాడు.

ఈ విధంగా భావన, ధ్యాస, ధ్యానము, కామము, క్రోధము, మోహలోభములు, వివేకానాశనము - వాటికి సంబంధించిన అభ్యాసములు అలవాట్లుగాను, అలవాటు సంస్కారముగాను, సంస్కారము వాసనలుగాను హృదయంలో గూడుకట్టుచున్నాయి.

వాసనా విలయ స్థితి

ఇప్పుడు ఇక వైరాగ్యపూర్వముముక్షుత్వము, విచారణ, సాంగభావనల సుదీర్ఘమైన అభ్యాసముచే వాసనలు క్రమంగా విలయము పొందుచూ ‘‘విలాపినీ (లేక) విలయాత్మికము’’ అనబడే 4వ భూమికలో ముముక్షువు ప్రవేశము పొందుచున్నాడు. ఇది మానసికమైన ప్రాధాన్యము కలిగి యున్నట్టిది. కాబట్టి ‘‘స్వప్నసంబంధ’’ (లేక) ‘‘స్వప్నానుభవ సంబంధిత’’ భూమికగా చెప్పబడుతోంది.

(5) పంచమ భూమిక - శుద్ధసంవిన్మయ ఆనందరూపా। ఆనందైక ఘనాకారా। సుషుప్త్యా।

ఈ ‘5’వ భూమికలో - శుద్ధ సంవిన్మయా రూపా భవతి పంచమీ, అర్థ సుప్త ప్రబుద్ధాభో - జీవన్ముక్తో అత్ర తిష్ఠతి। ఇది ‘సగము ‘నిద్ర-సగము మెలకువ’ - స్థితిరూపము. ఈ భూమిక జీవన్ముక్తమునందు సుతిష్ఠింపజేయుచున్నది. ఇందులో జాగ్రత్ ‘‘మొదలే లేనిది. నాటకము చూస్తున్నప్పుడు అందులో నిజము, శాశ్వతము ఏదీ ఉండదుకదా! అట్లాగే జాగ్రత్ మొత్తము కల్పనాతుల్యమే’’ - అను పరాదృష్టిచే చూడబడుతోంది. కాబట్టి ‘సుషుప్తి సమాన భూమిక’ అని కూడా పిలువబడుతోంది.

(6) ఆరవ భూమిక - ‘‘అసంవేదన రూపా’’ - తుర్యపద।

ఇది ఆనంద - ఏక - ఘనాకార (ఘనీభూతమైన ఏకానంద) భూమిక (State). ఇది సంవేదనము-(తెలియబడేదంతా)- తెలుసుకుంటున్న వాని రూపము మాత్రమే అయి ఉంటున్న భూమిక. కాబట్టి అసంవేదనా భూమికగా పేరుపెట్టబడింది. ఇది సుషుప్తి సమానమైన భూమిక। ఇది జగ్రత్ - స్వప్నములకు ఆవలరూపమైయున్నది. (సంవేదనము = All That being Experienced).

అసంవేదనము = Looking at all that being experienced as merely the extension of the Experiencer himself.
ఇది తెలియబడేదంతా ఉపశాంతించినప్పటి కేవలీ స్థితి. ముక్త స్థితి. ఇందులో… జగత్తు - స్వస్వరూపమునకు ‘అనన్యము’గా అభ్యాసము చేయబడుచున్నది.

(7) ఏడవ భూమిక - తుర్యావస్థ

తుర్యావస్థ ఉపశాంతా సాముక్తిదేవహి కేవలా।

కేవలమగు ఆత్మ అనుభవమగుచున్న స్థితి. ఇది స్వయముగా ముక్తి రూపమే.

సమతా - సర్వత్రా స్వస్వరూపాత్మయే గమనించు స్థితి. (‘‘సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్’’). సర్వత్రా సమత్వము సందర్శించు స్థానము.

స్వచ్ఛతా - నిర్మల ఆత్మ తత్త్వ భావన। ‘‘నిర్దోషం హి సమం బ్రహ్మ’’ అనబడు సర్వత్రా నిర్మలమగు ఆత్మను మాత్రమే సునిశ్చిత భావనతో చూచుచుండు భూమిక.

సౌమ్యతా - ఎల్లప్పుడు ప్రశాంతమును వీడనట్టి ఆత్మీయ స్థితి.

సమత, స్వచ్ఛత, సౌమ్యత స్వాభావికమై ఉంటాయి. ఇది అసంవేదనరూపము (తెలియబడే సమస్తము అధిగమించిన స్థితి - సంవేదనాతీత, సంవేదనాత్ పర, సంవేదనాంత స్థితి). తెలియబడేదానికి ఆవలగల ‘‘తెలుసుకొనువానిని మాత్రమే’’ దర్శించు భూమిక.

తెలియబడేదంతా తెలుసుకొనేవానికి అనన్యముగా అనుభవమగు భూమిక.

తుర్యాతీతపదాకారము

ఇది పరానిర్వాణము (సమస్తమునకు ఆవల నిశ్చలవాయువుతో పోల్చతగిన) రూపము. తుర్యాతీత పదావస్థా సప్తమీ భూమికోత్తమా। నిర్వాణ రూపేణా। తుర్యాతీతము పరాకాష్ఠ అయినట్టివి. తురీయమునకు ఆవలిది.

మం।।శ్లో।। మనో వచోభిః అగ్రాహ్యా। స్వప్రకాశా। సదాత్మికా।
అంతః ప్రత్యాహృతివశాత్ చైత్యం చేత్ న విభావితమ్।।

ఇది మనస్సు చేతను, వాక్కు చేతను గ్రహింప (తెలుసుకో) వీలులేనిది.

‘‘నేను స్వయంప్రకాశకుడను. అంతేగాని బాహ్యమగు మరొక వస్తువుతో వెలిగించబడుచున్నవాడను కాను’’. - అను ఆత్మజ్యోతీ - స్వయం జ్యోతీ స్వానుభవము. సూర్యునికి దర్శించటానికి ఒక దీపం ఎందుకు? అట్లాగే స్వప్రకాశ-స్వయంప్రతిపత్తి సమన్వితములగు ఆత్మయొక్క స్వరూప - స్వభావములు స్వాభావికమైన వాడను’’ - అని తుర్యాతీత సంస్థితుడు గమనించుచున్నాడు. సర్వదా సదానంద స్వరూపుడై ఉంటున్నాడు.

‘‘నా చేతనే తెలియబడుచున్నదంతా భావించబడుచూ, నాయందే నాకు వేరు కానట్టి చైత్యము (అనుభవమగుచున్నదంతా) నా చైతన్మాత్మ స్వరూపమే’’ - అను నిశ్చల భావన పుణికిపుచ్చుకుని ఉంటున్నాడు.

‘‘నీవు గాను, జగద్దృశ్యముగాను నేనే స్వాభావికంగా ఉండి ఉన్నాను - స్వప్న ద్రష్ఠకు వేరైనదేదీ స్వప్నములో ఉండజాలని తీరుగా’’ - అని ఎరిగి ఉంటున్నాడు.

ఈతడు ‘‘మహాసమతత్వము’’ను అనునిత్య ధారణగా కలవాడై - నిత్యముక్తుడు అయి ఉంటున్నాడు. ‘‘ఆత్మగా నేను నిత్యముక్తుడను’’ - అను ఎరుక వీడటము లేదు.

‘‘నేను చచ్చుట లేదు. పుట్టటం లేదు’’.
‘‘నేను సత్‌ను కాదు. అసత్‌ను కాదు’’.
‘‘నేను నేనే గాని, నేను ఏమియు (జీవుడు, దృశ్యము మొదలైనవిగా) అవటమేలేదు’’
అని గ్రహించి ఉన్నవాడు - తురీయాతీతుడు.

ఇతి మత్వా ధీరో న శోచతి। ఇది స్వస్వరూపము గురించి ఈ విధంగా ఎరిగిన అట్టి తురీయాతీతుడు - ధీరుడై (బుద్ధిసామ్యతకలవాడై), ఇక దేనికీ శోకించడు. (He does not worry about any thing)

తురీయాతీతుని ‘‘కో2హమ్? - సో2హమ్’’ నిర్వచనములు

ఇంకా కూడా…తురీయాతీతుని స్వకీయ స్వరూపనిర్వచనములు, స్వానుభవములు ఈ విధంగా ఉంటాయి. (ఇవి స్వానుభవం చేసుకొన్నవాడు ఇప్పుడే ఇక్కడే తురీయాతీతుడు)।

(ఇతిమత్వా న శోచతి)

అలేపకో2హమ్ - పంచకోశములవంటి ఎట్టి లేపనములు (పూతలు) లేని అలేపకుడను. నాయొక్క ఆత్మస్వరూప స్వయం ప్రకాశక ఔన్నత్యమును జగత్తులు, గుణములు మొదలైనవి కప్పి ఉంచజాలవు. అనంతాకాశమును మేఘములు ఎట్లా కప్పిఉంచగలవు? ఇదీ అట్టిదే.

అజరో : దేహసంబంధమైన జరామరణములు ఆత్మనగు నాకు సంబంధించినవి కావు. (నిత్యోదిత్య-నిత్య యౌవనస్థః)।
ఒకడు ఒకప్పుడు వస్త్రము ధరించి, మరొకప్పుడు విడచినంతమాత్రంచేత, ఆతడు ఆ వస్త్రధర్మములకు చెందినవాడు అవుతాడా? కాడు కదా!

నీరాగ : దేనిపట్లా ఎటువంటి రాగము లేనివాడను. ‘‘సమస్తము నేనే అయి ఉండగా - నన్ను ఆకర్షించగలిగినది ఏముంటుంది?’’.

శాంతవాసనః : సమస్త వాసనలు శాంతించగా శేషించు కేవలాత్మ స్వరూపుడను. ‘‘నేను వాసనలు మొదలైన వాటికి మునుముందే ఉన్న పరమశాంత స్వభావుడను! ‘మనస్సు’ మొదలైనవాటికి చెందిన వాసనల పరిధులకు సర్వదా ఆవలివాడను.

నిరంశో-స్మి : ‘‘జీవాత్మ, జగత్తు’’ మొదలైన అంశలు ఏవీ లేనివాడను. నిరంశుడను. ‘‘కొడుకు। కూతురు। తల్లి। తండ్రి। మిత్రుడు। భార్య। భర్త। మిత్రుడు। శత్రువు’’ - అని నా గురించి అనుకుంటూ ఉండేవన్నీ నన్ను వేరు వేరు అంశలుగా చేయగలవా? లేదు కదా! ఈ విధంగా అంశరహితుడను. ( I am beyond all ‘Roles’)

చిదాకాశో-స్మి : చైతన్య స్వరూపమగు చిదాకాశ స్వరూపుడను.
ఇది గమనిస్తూ సర్వదా శోక (Worry, meloncholy) రహితుడై ఉంటాడు. ఇట్టి స్వభావము స్వాభావికం చేసుకొన్న వాడు ఎవ్వడైనా - విదేహముక్తుడే।

ఇంకా కూడా ఈఈ విధంగా సునిశ్చితుడు అగువాడు - విదేహముక్తుడు.

అహం మత్వా విరహితః : ‘నేను నాది’ అనే పరిమితము - లేవీ ఏమాత్రము లేని వాడను (రహితుడను). ఆకాశంలో మేఘాలవలె - నేనుంటేనే ఏవైనా కూడా ఒకప్పుడు ఉండటం, మరొకప్పుడు ఉండకపోవటం జరుగుతోంది.

శుద్ధో బుద్ధో అజరో అమరః : శుద్ధబుద్ధి స్వరూపుడను. జరామరణములకు సంబంధించినవాడనే కాను. ఆకాశానికి భూ-అగ్ని-జల-వాయు ధర్మాలు అంటవు కదా! నేను ఆత్మాకాశ స్వరూపుడను. నన్ను ఏదీ అంట జాలదు.

శాంతః, శమన అభాసః : సర్వ ఆభాసలు (Reflections ప్రతిబింబములపట్ల, అభినివేశధ్యాసలు) శాంతించినట్టివాడను. సర్వదా ప్రశాంత - ఆత్మానంద-అద్వయస్వరూపుడను।

ఇతి మత్వా, న శోచతి

గడ్డిపరకయొక్క చిట్టచివ్వరయందు, ఆకాశమునందు, సూర్యునియందు, నరులయందు నాగుల (పాముల) యందు, సమస్త దేవతలయందు ఏ పరబ్రహ్మతత్త్వము అంతటా ఆక్రమించి యున్నదో అట్టి దివ్య ఆత్మతత్త్వమే - నేను।

విదేహముక్తుడు - ఇట్టి భావనలు, అవగాహనలు పుణికిపుచ్చుకొని ఉంటున్నారు.

ఓ నిదాఘా!

సర్వభావములయొక్క భావనను వదలగా, భావనలకు మునుముందే ఉన్న భావకునియొక్క ఏ ‘పరబ్రహ్మ కేవలీస్వరూపము’ వెలుగొందుచున్నదో - అట్టి పరమానంద, ఆత్మను నేనే - అని భావన చేయుచుండెదవుగాక। అప్పుడు నీవు విదేహముక్తుడవే।

అట్టి తురీయాతీతుని అఖండమగు పరబ్రహ్మతత్త్వము

• వాక్కుకు అతీతమైన విషయము.
• విషయములను, ఆశలను అధిగమించినట్టిది.
• తురీయాతీతుడు పరానంద రసమునందు నిండుగా మునిగియున్నవాడై, సమస్త జగత్తును స్వాత్మరసభావనతో చూస్తూ - స్వాత్మయందు ఆత్మానందస్వరూపుడై రమిస్తూ ఉంటాడు.

ఆతనికి ‘‘జగత్ సంచారము, దేహముల రాకపోకలు, సమస్త సంఘటనలు’’ - మొదలైనవన్నీ ‘ఆత్మ’ అనే ఉద్యానవనములో, తానే ఆత్మస్వరూపుడై (ఒక చక్రవర్తి తన ఉద్యానవనంలో సంచరించురీతిగా) - చేయు వినోద, విహారములు.

• సర్వకర్మ వ్యవహారముల ప్రభావములను దాటివేసినవాడై, సర్వత్రా ఆత్మభగవానుని జగత్ - ప్రదర్శనమును స్వకీయ లీలా వినోదముగా చూస్తూ, ‘సర్వకర్మ పరిత్యాగి’ - అయి ఉంటాడు.
• ఆత్మభావనచే, సర్వత్రా స్వస్వరూపాత్మ సందర్శనము చేస్తూ నిత్యతృప్తుడై ఉంటాడు.
• సమస్తము ఆత్మగా చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ‘అన్యము’ అను భావనతో దేనిని ఆశ్రయించనివాడై ఉంటాడు. ‘‘తరంగాలన్నీ జలమే అయినట్లు, మట్టి బొమ్మలన్నీ మట్టియే అయినట్లు - ఈ సమస్తము బ్రహ్మము కాని క్షణమే లేదు’’- అను అనన్యత్వమును, తన ఆత్మస్వరూపముతో అబేధత్వమును స్వాభావికం చేసుకొని ఉంటాడు.
• ఆతనిది ఆత్మదృష్టి మాత్రమే! జగత్తులో పైపైన కనిపిస్తున్న పుణ్య-పాపద్వంద్వములు, తదితర గొప్పవారు-కానివారు, జ్ఞానులు-అజ్ఞానులు, అయినవారు-కానివారు, చెందినవారు-చెందనివారు, పండితులు-పామరులు, గొప్ప తక్కువ కులమతములవారు, స్వదేశ-విదేశీయులు, దేవతలు-రాక్షసులు, మంచివారు-చెడ్డవారు మొదలైన - ఇవేవీ ఆతని ఆత్మదృష్టికి ఏమాత్రము భేదమును కల్పించజాలవు. ఆతడు ఆయా విషయములచే దోషము పొందడు. భేదదృష్టితో చూడడు. ఆత్మదృష్టితో చూస్తాడు. (‘‘అహం సర్వస్య ప్రభవో) - అన్నిటినీ ప్రభవింపజేస్తున్నది నేనే’’ - అను స్వస్వరూప భావన కలిగి ఉంటాడు.
• తెల్లటి ప్రకాశముగల స్ఫటికమునకు ఎదురుగా ఏ రంగు ఉంటే అదే అద్దానియందు ప్రతిబింబిస్తున్నప్పటికీ, అట్టి ప్రతిబింబదోషము స్ఫటికముయొక్క తెల్లటి రంగును మార్చగలదా? లేదు కదా! అట్లాగే - ప్రాపంచక విషయములు విషయములుగా ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆతని ‘‘బుద్ధి - స్ఫటికము’’ యొక్క ‘‘ఆత్మసమన్వయ-అవగాహనలకు’’ రంజనము కలిగించలేవు. ఆతడు సర్వదా నిరంజనుడు. నాటక రచయితవలె సర్వము తానై, ఏదీ కానివాడై ఉంటాడు.

ఒక దర్పణములో (అద్దములో) ఎదురుగా ఉన్న దృశ్య సంబంధమైన సంఘటనలు ప్రతిబింబిస్తూ ఉన్నంత మాత్రంచేత - ఆ సంఘటనలకు సంబంధించిన మంచి - చెడులు ఆ అద్దమునకు అంటుతాయా? అంటవు కదా!

తజ్ఞః (తజ్జ్ఞః) కర్మఫలేన అంతః తథా నా యాతి రంజనమ్।
ఆత్మతత్త్వము ఎరిగి, అఖండాత్మయే తానై వెలుగొందుచున్న తురీయాతీతుడు - కర్మలు, కర్మఫలములు మొదలైనవాటిచే రంజనము (దోషము) పొందడు. జన్మలు, కర్మలు మొదలైనవన్నీ ఉన్నప్పుడు, ఉండనప్పుడు కూడా, సదా ‘స్వస్థుడు’ అయి ఉంటాడు.

ఓ నిదాఘా। పై వర్ణనములను అభ్యాసపూర్వకంగా ఆశ్రయిస్తూ ఉండగా, నీవే ‘‘విదేహముక్తుడవు’’ అవుతావని గ్రహించు. గమనించు. అంతేగాని, విదేహముక్తుని (పైన చెప్పిన) లక్షణములను స్తుతిస్తూ ఊరుకోవద్దు.

నియమావళి

నిదాఘుడు : మహాత్మా! ఋభుగురుదేవా! అట్టి తురీయాతీతుడు జనులమధ్య నుండి బయల్వెడలి ఏకాంత ప్రదేశమును నివాసస్థలముగా ఎన్నుకొని, జనుల పరస్పర సంసార వ్యవహారములకు దూరముగా వెళ్ళి ఉంటారా? ఆతని నివాస, వస్త్రధారణ, ప్రవర్తన మొదలైనవాటికి సంబంధించి ‘నియమావళి’ ఏమైనా ఉంటుందా? ఆతని నివాసమేది? ఎక్కడికివెళ్ళితే తురీయాతీతుని దర్శనభాగ్యము మాకు లభించగలదు?

ఋభుమహర్షి :
శ్లో।। విహరన్ జనతా బృందే దేహకర్తన పూజనైః।
ఖేద ఆహ్లాదౌ న జానాతి ప్రతిబింబగతైః ఇవ।
‘‘ఆతడు జనుల మధ్యలో ఉంటారు. (లేక) ఉండరు’’- మొదలైన విధి - నిషేధములేవీ తురీయాతీతుని పట్ల లక్షణములుగా ఉండవు. జనబృందముల మధ్య (In between groups of people) విహరిస్తూ ఉన్నప్పటికీ ‘ప్రతిబింబన్యాయము’ సంతరించుకొని ఉంటాడు. ప్రతిబింబమునకు జలములో ఉన్నప్పుడుగాని, (లేక) భూమిపై (సూర్యకాంతిచే) ఏర్పడినదై రహదారిలో పడుచున్నప్పుడుగానీ - ఆయా జల, రహదారుల ధర్మములు తాను పొందుతుందా? పొందదు. వస్తువు ప్రతిబింబముగా అవదు. ప్రతిబింబము వస్తువే కాదు.

• ఈ దేహము పూజించబడుచున్నప్పుడుగాని, ఖండించబడుచున్నప్పుడుగాని తాను ఏదీ పొందని పరాత్మ (లేక) కేవలాత్మ స్వభావుడై ఉంటాడు.
• స్తోత్రములకు సంబంధించనివాడై, వికారములేవీ పొందనివాడై, పూజించటము - పూజించబడటము రెండిటికీ వివర్జితుడై ఉంటాడు. నిస్తోత్రో, నిర్వికారశ్చ పూజ్య పూజా వివర్జితః।

ఇక శాస్త్రములను అనుసరించిగాని, సంఘ నియమములను ఉద్దేశ్యించిగాని ఏర్పడియున్న ఆయా ఆచారములను ‘‘శ్రద్ధగా నిర్వర్తించువాడు - వదలివేసియున్నవాడు’’ - కూడా (ఒకే సమయంలో) అయి ఉంటాడు. విధి-నిషేధములకు ఆవలివాడై ఉంటాడు.

• ఆతనికి ఈ శరీరమును పవిత్ర తీర్థములో విడచుచుండటముగాని, (లేక) ఒక మురికివాడలో విడవకుండటముగాని - ఒక్కటే। ‘ఇది పవిత్రము - అది కాదు’ అనే చట్రములో ఇరుక్కొని ఉండడు.
• జ్ఞాన విశేషములు అధ్యయనం చేస్తూనే ‘‘నాకు ఎప్పుడూ కూడా బంధము లేదు’’ అని ఎరిగియుండి, సదా ముక్తుడై ఉంటాడు.
• ‘‘ఇది పొందాలి! అది తొలగాలి। వీరు ఇట్లా ఉండాలి. వారు అట్లా ఉండకూడదు’’ - మొదలైన ఆశించు స్వభావములను అధిగమించి - ‘‘విగతాశయుడు’’ అయి ఉంటాడు.

పైనంతా మనము చెప్పుకుంటూ వస్తున్న - ఆయా విశేష లక్షణములచే ఎవ్వడైనా సరే, విదేహముక్తుడు కాగలడు. ‘విదేహముక్తి’ అనునది బుద్ధియొక్క వికాస పరాకాష్ఠకు చెందినదేగాని, శరీరముల స్థితి-గతులకు, గృహస్థుడు మొదలైన ఆశ్రమములకు, నివాసప్రదేశములకు, వస్త్రధారణలకు చెందినదే కాదు.

సంకల్పము - బంధము

ఋభుమహర్షి : ఓ నిదాఘా!

అసలు ఈ జీవునికి బంధము ఎట్లా ఏర్పడుతోంది? దృశ్య విషయములతో అవినాభావ సంబంధము కలిగి ఉండటము చేత.
ఎందుచేత కలిగి ఉంటున్నాడు? ‘సంకల్పించటము’ అనే క్రియావిశేషము చేత. సంకల్పత్యగ్ం హి బంధస్య కారణం।
తత్పరిత్యజ। నీవు ‘సంకల్పించటము’ను త్యజించివేస్తూ ఉండు.
మోక్షో భవేత్ అసంకల్పాత్। తత్ అభ్యాసం ధియా కురు। నీవు సంకల్పించక పోయినంతమాత్రంచేతనే సర్వస్థితి-గతులకు ఆవలగల ఆత్మానుభవరూపమగు మోక్షము లభించగలదు. అందుచేత ‘సంకల్పించకుండటము’ అనే అభ్యాసమును బుద్ధితో ఆశ్రయించి ఉండు.

సంకల్పించకుండా ఉండటము ఎట్లా సాధ్యమంటావా? ఇక్కడ ‘గ్రహించబడుచున్నది - గ్రహించువాడు’ - ఈ రెండిటి మధ్య ఒకానొక ‘సంబంధము’ ఏర్పడుచూ ఉన్నది. నీవు గ్రహిస్తూ (Receiving matters) ఉన్నప్పుడు కూడా సావధాన చిత్తుడవై అసంకల్పమును వీడక (కొనసాగిస్తూనే), అసంకల్పన సింహాసనమును అధిరోహించియే గ్రాహ్య - గ్రాహక సంబంధములను స్వీకరించు. లేక, స్వీకరించనివాడవై ఉండు. సంకల్పదశలను నెమ్మదినెమ్మదిగా పరిహరిస్తూ (విడచి ఉంటూ), క్రమంగా సర్వత్రా ఆత్మను మాత్రమే గ్రహించి ఉండటమును అభ్యాసము చేస్తూ ఉండు. నీవు దేనికీ గ్రహించబడువాడవు అయి ఉండవద్దు. మా భావ గ్రాహ్యభావాత్మా। ‘గ్రహించువాడువు’ కూడా అయి ఉండవద్దు. గ్రాహకాత్మా చ మా భవ।

భావనాం అఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయో భవ।

సమస్త భావనలను వదలి, అప్పటికీ ఏ నీ స్వరూపము శేషించినదై ఉంటుందో - అట్టి నిర్మలాత్మ స్వరూపుడవై ఉండుము.

‘భావన’ను కలిగియుండు సందర్భములలో కూడా, - ‘‘ఇది ఇష్టము - అది ఇష్టము కాదు’’ అను ఇష్టా-అయిష్టములను తొలగించుకొని ‘భావశుద్ధి’ని కలిగి ఉండుము.

బద్ధము = కించిత్ చేత్ రోచతే తుభ్యం, తత్ బద్ధోపి భవస్థితౌ। ఈ దృశ్యములోని దేనిపట్లైనా కొంచము నీకు ‘ఇష్టము’ అని అనిపిస్తూ ఉంటే, నీవు బంధమునందే ఉండిపోతావు. ‘అయిష్టము’ అయినాకూడా - అది బంధరూపమే.

ముక్తము = న కించిత్ రోచతే చేత్ తత్‌ముక్తో-సి భవస్థితౌ।। ఈ దృశ్య ప్రపంచములో నీకు ఏదీ ‘ఇది ఇష్టము’ అనునది ఉండదో, అప్పుడు నీవు ‘మోక్షాకాశము’ నందు ప్రవేశము పొందగలవు.

ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉన్న స్థావర - జంగములగు ఒక గడ్డి పరక నుండి - ఈ భౌతికదేహము వరకు దేనినీ కూడా కించిత్ కూడా ‘ఇది నాకు చాలా ఇష్టము’ అనే ధ్యాసయే పెంపొందించుకోవద్దు. అయిష్టము కలిగి ఉండవద్దు. ఇష్టాయిష్టములు కలిగియుండటమే ‘అహం’ భావము. అట్టి అహంభావమును ‘‘నాహమ్’’ (నాది కాదు. నేను కాదు)’’ - అను భావనతో జయించివేసి, ‘సత్-అసత్’లకు సర్వదా అతీతుడవై ఉండుము.

తుర్యము

యత్ అసక్తం సమం స్వచ్ఛం స్థితం, తత్ ‘తుర్యమ్’ ఉచ్యతే।।

ఏ నీ స్వరూపము సర్వదా స్వాభావికంగానే అసక్తము(Non attached) ఆశ్రయించినదై, సర్వత్రా సమస్వరూపమై, సర్వదా స్వచ్ఛమై, సర్వదా సంస్థితమై యున్నదో - అట్టి నీ కేవలానంద రూపమే ‘‘తుర్యము’’.

జీవన్ముక్తము: యా స్వచ్ఛా సమతా శాంతా (స) జీవన్ముక్త వ్యవస్థితిః। ‘‘స్వచ్ఛము, సమతము, శాంతము’’ అగు ఆత్మ స్వరూపముతో ‘‘అహమ్-త్వమ్’’ల ఏకత్వమును ధరించి ఉండు. అట్టి స్వాభావిక బుద్ధినిశ్చలత, హృదయస్వాదనయే జీవన్ముక్తత్వము. ‘జీవితము’ అను సందర్భము సహజమగు మమాత్మానందస్వరూపమునకు బంధము కాజాలదు - అను నిశ్చలావగాహనయే జీవన్ముక్తత్వము.

తుర్య కలనము: సాక్ష్యవస్థా వ్యవహృతౌ సా ‘తుర్యకలన’ ఉచ్యతే। సమస్త జగత్ వ్యవహారమునకు సాక్షిత్వమును వీడకయే, జగద్వ్యవహారమునందు (పాల్గొనడమో/పాల్గొనకపోవటమో) - నిర్వర్తించటము - ‘తుర్యకలనము’ అనబడుతోంది.

సంకల్పాతీత తురీయము : తుర్యగము (తురీయము) అనునది సంకల్పములకు మునుముందే ఉన్నట్టి సంకల్పించువాని సంకల్పాతీత తేజో-చైతన్య స్వరూపము. అట్టి తురీయము-జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల రూపము కాదు. అది ప్రతి జీవునిపట్ల వాస్తవికమగు స్వాభావికమే అయి ఉన్నది.

తుర్యక్ స్థానము :-

ఈ జగత్తు యథాస్థితమై యుండి కూడా, ఇది శాంత-సమ్యక్-ప్రబుద్ధరూపమగు ఆత్మస్వరూపమై స్వాభావికంగా స్వానుభవమవటమే (లేక) ఆత్మయందు విలీనమై ఆత్మగా అనిపించటమే తురీయస్థితి. అనగా బుద్ధికి సమస్తము ఆత్మగా అనిపించు ‘సుస్థిరమగు’ ‘అబుద్ధస్థితి’.

సమతా : అహంకార కలా త్యాగే యాః సముద్గమే। విశరారౌ కృతే చిత్తే తుర్యావస్థా ప్రతిష్ఠితే। సందర్భమాత్రంగా బయల్వెడలే వ్యష్టిగత

ఈ సమస్తము అస్మత్ ఆత్మ స్వరూపమే। అందరిలోని నేనైన నేనే నా సహజాహంకార స్వరూపము।
ఈ సమస్తము నాయందు ఉన్న నేనే ఉన్నాను।

ఓ నిదాఘా। అట్టి తురీయాతీతమే నీపట్ల స్వాభావికమై సిద్ధించునుగాక।

అధ్యాత్మశాస్త్ర సిద్ధాంతములు : అధ్యాత్మ శాస్త్ర చర్చలు, సిద్ధాంతాలు - ఇవన్నీ శ్రవణం అవసరమే. అయితే అవన్నీ కూడా అనునిత్యమగు ఆత్మానుభవమును కొంత కప్పియే ఉంచుతాయి కూడా. సిద్ధాంతో అధ్యాత్మ శాస్త్రాణాం సర్వ అపహ్నవ ఏవహి।

అందుచేత, ఓ నిదాఘా! అధ్యాత్మశాస్త్ర సిద్ధాంతములను శ్రవణం చేసి, క్రమంగా ఆత్మభావనను (సమస్తము స్వస్వరూపాత్మగా) అనుకుంటూ - అనిపించేవరకు (ఆ అనుకోవటమును) కొనసాగించు. క్రమంగా ‘అత్మ’గా చెప్పబడేది నీవే అయి ఉండాలి.

‘ఆత్మానుభవము సమక్షములో శాస్త్రచర్చలన్నీ కూడా ముగిసినవి’ అవుతాయి.

మహామౌనస్వరూపము

వాస్తవానికి : ‘అవిద్య’ లేదు. ‘మాయ’ అనేదీ లేదు. ఈ కనబడేదంతా నీయొక్క దోషరహితమగు శాంతాత్మస్వరూపమే। చిదాకాశము సర్వదా శాంతము, స్వచ్ఛము, (సమస్తము తనయందు) శమించినట్టిది - అయి ఉన్నది. నీవు సర్వదా చిదాకాశస్వరూపుడవే అయి ఉన్నావు. ఇందులో సందేహమే లేదు. కనుక సమస్త శక్తి స్వరూపమగు బ్రహ్మముగానే సమస్తము దర్శించుము.

ఓ అనఘా! అన్యమైన సమస్తము బుద్ధితో మొదలంట్లా పరిత్యజించివేసి, ‘మహామౌనస్వరూపము’ వహించి ఉండుము.
ఇక ఇక్కడి ‘‘అన్యము, బంధము, జన్మకర్మభావములు’’ - ఇవన్నీ కూడా నీ ఆత్మౌన్నత్యము యొక్క కించిత్ ఏమరపు చమత్కారములు మాత్రమే!

ఇది గమనిస్తూ, క్రమంగా ‘‘నిర్మనసత్వము’’ను అవధరించి ఉండుము. చిత్తము చిత్‌నందు క్షీణించగా, నిశ్చలమగు వాయువువలె నిర్వాణస్వరూపుడవగుము. సంశాంతించిన బుద్ధికలవాడవగుము.

భక్తి - జ్ఞాన - యోగ - ధ్యాన - సమర్పణ - ఇత్యాది శాస్త్రసూచిత, ఆర్యసూచిత మార్గములన్నీ కూడా నీ నిర్మల - కేవల స్వరూపముయొక్క సమగ్రత్వ ఆనందత్వముల గుర్తింపు, ఆస్వాదన కొరకే సుమా!

నేను - అన్యజగత్తు

హే నిదాఘా! ఆత్మయందు శాంతాత్మస్వరూపము సిద్ధించుకొన్నవాడు ప్రాపంచక భేద విషయములపట్ల :-

ఓ ద్విజా! జాగ్రత్‌లోను, గాఢనిద్రలోను ఉన్నవానివలె (సుషుప్తునివలె, దేనికీ చెందనివాడవై, ఏదీ నీకు చెందనిదై) విద్యుక్తము, శాస్త్రీయము, దైనందికము, నైమిత్తకము, వ్యావహారికము, సాంఘికము అగు రీతిగా ఉంటూనే, - ఆత్మానందస్వరూపుడవై సమస్తమునకు ఆవల ఏదీ అంటనివాడవై, అంటరానివాడవై ఉండుము. ఇందులో కష్టము ఏమున్నది?

‘‘అంతః సర్వపరిత్యాగీ। బహిః కురు యథాగతమ్’’

బాహ్యమున ఆయా కర్మలు నిర్వర్తిస్తూనే, అంతరమున సమస్తము పరిత్యజించి ఉండుము. ఒకనటుడు నాటకరంగముపై సంబంధ-బాంధవ్య-సంపద-ఆపదలు ‘‘తనకు చెందినవే’’ - అన్నట్లు వేషభాషలు కలిగి ఉన్నప్పటికీ, - అంతరమున అవేవీ కించిత్ కూడా లేనివాడే అయి ఉంటాడు కదా! ఆ తీరుగానే ఈ జగన్నాటకరంగములో ‘జీవించటము’ అనే నటనా కౌశలముతో ప్రవర్తిస్తూ ఉండెదవు గాక! ‘‘అది కష్టము కదా?’’ అనే భావనను దగ్గిరకు రానీయకు, నాటక పాత్రకు వేరై ఉండియే నటుడు నటించగలిగినప్పుడు, మనందరికీ, ‘‘జగదనుభవమునకు వేరైన ఆత్మతత్త్వము ఆశ్రయించి ఉండటము’’ ఎందుకు సాధ్యం కాదు?

చిత్తము - ‘‘సుఖ దుఃఖములు’’

‘‘నేను ఆత్మను ఇదంతా సందర్భకల్పిత చమత్కారము’’ - అనుదాని ఏమరుపే - చిత్తముయొక్క రూపము.

చిత్తసత్తా పరం దుఃఖమ్। చిత్తము యొక్క ఉనికి కలిగి ఉండటమే పరమ దుఃఖము.

చిత్తత్యాగః పరం సుఖమ్। చిత్తము (ఇష్టాఇష్టములను) త్యజించి ఉండటమే ‘‘పరమ సుఖము’’.

ఇంతకుమించి ఈ జీవునకు సుఖము లేదు. దుఃఖము లేదు.

అట్టి ఈ చిత్తమును ఆవేదన (స్వాభావిక) పూర్వకంగా చిదాకాశము (సమస్తము అయి ఉన్న ఆత్మాకాశము) నందు లయింపజేయి. (మంచుగడ్డ యొక్క కరిగిపోయినప్పటి ఆకారమువలె) - క్షయింపజేయి.

దృష్ట్వా రమ్య, అరమ్యంవా స్థేయం పాషాణవత్ సదా। ఇక ఆపై, రమ్యమైన, అరమ్యమైన (Things you like or you do not like) ఆయా వస్తు - విషయ - సాకారాదులను చూస్తూ ఉన్నప్పుడు ఆత్మధ్యానివై, ఆత్మభావివై, ఆత్మాకారివై ఒక బండరాయిలాగే నిశ్చలుడవై ఉండుము. ఈ మాత్రము కొంచము కొంచము ప్రయత్నము చేతనే నీవు గొప్ప శత్రువు వంటి సంసృతి ( The sense of deep relatedness to the every minute - changing groups of scenario - factors) - ని జయించి వేయగలవు. ఈ మాత్రము ప్రయత్నశీలుడవు అవకుండా ‘‘అది కష్టము. ఇది నష్టము’’ అని అనుకుంటూ కాలము వృథా చేసుకొని ఏమి ప్రయోజనము?

ఋభుమహర్షి : ప్రియపుత్రా! నిదాఘా! నీవు నన్ను బ్రహ్మతత్త్వము గురించి వివరణ కోరియున్న ఈ సందర్భములో మనము చెప్పుకున్న ఈఈ విశేషాలన్నీ చెప్పుకున్నాము.

మనము ఇప్పుడు చెప్పుకున్న ఆత్మజ్ఞాన ఆత్మౌన్నత్య విశేషాలు ఎటువంటివంటే…
ఋతమ్ : ‘‘నేను ఎవరు?’’ అను ప్రశ్నకు సమాధానమునకై తపో - ధ్యాన - యోగ - అధ్యయనములు చేసి, మహనీయులు స్వానుభవముగా పొంది ప్రకటించినది.
కాబట్టి ఋతము,

బోధకు అర్హత

బిడ్డా।

అతిరహస్యమగు ఈ ‘‘అన్నపూర్ణోపనిషత్’’ ఆత్మజ్ఞానమును మహదాశయముగా కలవారికి సవివరంగా, మధురంగా బోధించు.

అయితే, ఆవేశ - కావేశములతో అప్రశాంతంగా ప్రవర్తించువారికి, మాతా పితృ భక్తి లేని వారికి, గురు శుశ్రూష, గురుభక్తి లేనివారికి ఇది బోధించటానికి నిషిద్ధమని ఆర్యవాక్యము. వారు కూడా యత్నశీలురై, సంసిద్ధపడుచూ శ్రవణమునకు అర్హత పొందుదురుగాక।

ఎవ్వరు శ్రద్ధ, ఆసక్తి, ఉత్తమాశయము, లోకశ్రేయోభిలాష కలవారో - అట్టివారంతా లింగ, మత, దేశ భేదములను లెక్కచేయక చక్కగా విశదీకరించెదవుగాక! శ్రవణము చేయువారు మునుముందుగా బుద్ధిని ధ్యాన - యోగాభ్యాస - నిస్వార్థ లోక సేవలచే సుసంపన్నము చేసుకొని, మహత్తరమగు ఇందలి విషయములు వినటానికి సంసిద్ధులై, తమయొక్క ‘ఆస్థి’యే అయి ఉన్న ‘అస్థి’ రూపమగు ఆత్మయొక్క స్వాభావికసత్యమును గ్రహించెదరు గాక.

ఫలశ్రుతి - ఫలితార్థము

మం।।శ్లో।। అన్నపూర్ణోపనిషదం యో అధీతే గుర్వనుగ్రహాత్
స జీవన్ముక్తతాం ప్రాప్య బ్రహ్మైవ భవతి స్వయమ్।

ఈ ‘‘అన్నపూర్ణోపనిషత్’ ఎవ్వరైతే గురు - అనుగ్రహ పూర్వకంగా అధ్యయనము చేస్తారో - అట్టివారు
‘జీవన్ముక్తి’ని ప్రాప్తించుకొన్నవారై స్వయం పరబ్రహ్మ స్వరూపులై విరాజిల్లగలరు.
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।

ఇతి అన్నపూర్ణ ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।