atharvaSira Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణవేదాంతర్గత

2     అథర్వశిరోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। అథర్వ శిరసాం,
అర్థం-అనర్థం వ్రాత సూచకమ్।
సర్వాధారం, అనాధారమ్
స్వమాత్రం, త్రైపదాక్షరమ్।।
ఈ అథర్వ శిరోపనిషత్ - జగత్ దృశ్యముయొక్క అర్థ- అనర్థములను వ్రాతసూచికంగా విశదీకరించుచున్నది. ఈ కనబడే సమస్తమునకు ఆత్మ తానే ఆధారమై, తాను మాత్రము దేనిపైనా ఆధారపడనిదై ఉన్నట్టిది. త్రైపదమునకు ఆవల రూపమగు అక్షర పరబ్రహ్మమును- ‘‘నిత్యోదిత స్వస్వరూపము’’-గా నిరూపించి చూపుచున్నది.

శాంతి పాఠము

ఓం
భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః।
భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః।
స్థిరైః అంగైః తుష్టువాగ్ంసః తనూభిః।
వ్యశేమ దేవహితమ్ యత్ ఆయుః।।
స్వస్తి నః ఇన్ద్రో వృద్ధశ్రవాః।
స్వస్తి నః పూషా విశ్వ వేదాః।।
ఓ పరమాత్మా!

మీచే ప్రసాదించబడి, మీ సొత్తు అయినట్టి ఈ మా చెవులు ఎల్లప్పుడు ఆత్మజ్ఞాన శ్రేయోదాయకమైన, భద్రమైన విషయములనే వినుచుండును గాక!

యజ్ఞ కార్యక్రమమునకు సంసిద్ధులమై యున్నట్టి మాయొక్క కళ్ళు భద్రమగు ఆత్మసందర్శనమునకై ఎల్లప్పుడూ సంసిద్ధపడుచుండును గాక!

బలము స్థిరము (Strong) అగు ఈ అవయవములతో ఆరోగ్యవంతులమై ఉంటూ మిమ్ములను కీర్తిస్తూ, సేవిస్తూ - మాకు విధించియున్న ఆయుష్కాలమును గడుపుచుండెదము గాక!

పురాతనుడు, త్రిలోకపాలకుడు, గొప్ప వినికిడితో శాస్త్ర విచారణ - విమర్శనలు కలిగియున్న వారు - అగు ఇంద్రభగవానుడు మాకు స్వస్తి - శాంతి - శుభములు కలుగజేయును గాక!

సర్వజ్ఞులు, విశ్వమును ఎరిగినవారు అగు సూర్య భగవానుడు మాకు శుభ - శాంతి - స్వస్థతలను సర్వదా ప్రసాదించుదురు గాక!
స్వస్తి నః తార్యోః అరిష్టనేమిః।
స్వస్తి నో బృహస్పతిః దధాతు।

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
మిక్కిలి వేగవంతుడగు గరుడ దేవుడు మాయొక్క అల్ప - పాపదృష్టులు - అనే సర్పపాశములను తొలగించి మమ్ములను కాపాడుదురు గాక! (వేగ సమన్వితులగు వాయుదేవుడు మాకు స్వస్తిని అనుగ్రహించెదరు గాక)

భగవంతుడు, లోకగురువు - అగు బృహస్పతి మాయొక్క ఆధ్యాత్మిక కార్యక్రమములను, గుణసంపదను పరిరక్షించుచుండెదరు గాక! మమ్ములను ప్రసాదము (పవిత్రము) చేయుదురుగాక।

ఓం శాంతిః శాంతిః శాంతిః।।

ప్రథమ ఖండః

1.) ఓం
దేవా హ వై స్వర్గలోకం అగమం।
తే రుద్రమ్ అపృచ్ఛన్:
‘‘కో భవాన్?’’ ఇతి!
సో అబ్రవీత్ ‘‘అహమ్ ఏకః ప్రధమమ్
ఆసం। వర్తామి చ। భవిష్యామి చ।
న అన్యః కశ్చిత్ మత్తో వ్యతిరిక్త।’’
- ఇతి।।
ఓంకార రూపుడగు పరమాత్మకు నమో వాక్కులు!

ఒకానొక సందర్భములో దేవతలంతా కలసి స్వర్గలోకమునుండి రుద్రలోకం వచ్చి రుద్రభగవానుని దర్శించారు. భక్తితో నమస్కరించారు. (ఆత్మజ్ఞాన జిజ్ఞాసులై, పరతత్త్వమును వినే ఉత్సాహముతో) జగద్గురువగు రుద్రభగవానుని ఇట్లా ప్రశ్నించారు.

‘‘స్వామీ! మీరెవరు? ఎట్టివారు? మీ తత్త్వమేమిటి?’’
(మీ తత్త్వమేమిటో తెలుసుకుంటేనే కదా, మాకు మాయొక్క ‘శివో2హమ్’ తత్త్వము ఏమిటో తెలియబడేది।).

రుద్రభగవానుడు : బిడ్డలారా! వినండి!
(I am the beyond and the Begining of all this) ఈ సృష్టి అంతటికి మొట్టమొదటగా, మునుముందుగా, ప్రప్రథమంగా నేను మాత్రమే ఏకరూపుడనై ఉండి ఉన్నాను. అనగా, ఈ సృష్టి లేనప్పుడు కూడా నేను ఉన్నాను. వర్తమానంలో కూడా (యథాతథంగా) ఉన్నాను.

భవిష్యత్‌లో కూడా నేను ఎప్పటికీ ఉండియే ఉంటాను. నాకు భిన్నమైనది - అన్యమైనది (వేరైనది), వ్యతిరిక్తమైనది అంటూ ఎప్పుడూ. ఎక్కడా ఏ కాలమందునూ ఏదీ లేనే లేదు! (అంతటా, అన్నిటా సర్వదా నేనే అయి ‘ఉన్నాను’!) అదీ నేను! (అహం నిత్య సత్ స్వరూపో2స్మి। శివాత్ పరతరం నాస్తి।). (రచయితకు వేరుగా ఆతని రచనలో ఏదీ ఉండదు కదా)।
2.) సో అంతరాత్ అంతరం ప్రావిశత్,
దిశశ్చ అంతరం ప్రావిశత్ -
సో2హమ్! నిత్య - అనిత్యో2హమ్!
బ్రహ్మాహమ్।
ప్రాంచః। ప్రత్యంచో2హమ్।
దక్షిణాం చ। ఉదం చ అహమ్।
అధశ్చ - ఊర్ధ్వంచ - దిశశ్చ - విదిశ్చ అహమ్।।
ఏదైతే ప్రతి ఒక్క జీవుని యొక్క అంతరాంతరములలోను, సర్వదిక్కులందు సర్వదా వేంచేసియున్నదో, - అది నేనే। సో2హమ్। (కల అంతటా - ‘కల తదైనవాడు’ నిండి ఉన్న తీరుగా!)

ఈ సర్వజీవుల సహజరూపము ఏదై ఉన్నదో…అట్టి పరబ్రహ్మమే నేను!

ఈ కనబడే సమస్తములోని నిత్యమైనది - అనిత్యమైనది కూడా నేనే!

సృష్టికి కర్తయగు బ్రహ్మగా ఉన్నది నేనే! సృష్టికి ముందు - సృష్టి తరువాత - సృష్టిగాను నేనే ఉన్నాను.

ఇంద్రియాధారుడను - ఇంద్రియములకు అనుభవమగుచున్న దృశ్యమును కూడా నేనే! ఈ ఇంద్రియములకు ముందున్నవాడిని, వీటిని ఉదయింపజేస్తున్నవాడిని నేనే! నేనే వాక్ - చక్షు - శ్రోత్ర - స్పర్శ - రస - మనో ఇంద్రియ రూపములుగా అగుచున్నాను.

క్రింద - పైన (10) దిక్కులలోను, దిశలు లేని (శూన్య) స్థానముగాను కూడా ఉన్నది ‘నేనే’। సమస్త జీవుల నిజరూపమై ఉన్నవాడను.
పుమాన్ అపుమాం స్త్రియశ్చ అహమ్।
గాయత్ర్యహమ్! సావిత్ర్యహమ్! సరస్వత్యహమ్।
త్రిష్టుప్ - జగతి - అనుష్టుప్ చ అహమ్।
ఛందో2హమ్। గార్హపత్యో2హమ్।
దక్షిణాగ్నిః, అహవనీయో2హమ్।
సత్యో2హమ్। ‘గౌః’ అహమ్। గౌర్యహమ్।
జ్యేష్ఠో2హమ్। శ్రేష్ఠో2హమ్। వరిష్ఠో2హమ్।
ఆపో2హమ్। తేజో2హమ్।
ఋక్-యజుః-సామ-అథర్వ అంగిరసో2హమ్।
నేనే పురుష - స్త్రీ - నపుంసక ఉపాధులుగా ఉండగా, ఇదంతా నాచే ఆస్వాదించ బడుతోంది. గాయత్రి - సావిత్రి - సరస్వతీ రూపాలుగా ఉపాసించబడుచున్నది నేనే!

త్రిష్టుప్-జగతి- అనుష్టుప్ ఛందస్సులు నేనే! యజ్ఞక్రియలోని గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని - ఇవన్నీ నాయొక్క వివిధ తేజో రూపములు.

నేనే సత్-స్వరూపమగు సత్యమును। గోరూపముగా (శ్రేష్ఠుడుగా) ఉన్న వాడను! గౌరీదేవి నా రూపమే! ఈ సర్వమునకు జ్యేష్ఠుడను। శ్రేష్ఠుడను। వరిష్ఠుడను। జలము - తేజస్సు కూడా నేనే! చతుర్వేదములచే ఉద్దేశ్యించ బడే సారవస్తువు నేనే!

ఋగ్వేదములోని ఋక్కులు, యజుర్వేదంలోని యజస్సులు, సామ వేదములోని సామ గానములు, అథర్వణ వేదములోని అధ్యయనములు అంగిరసములు (ముఖ్యప్రాణోపాసనలు) - ఈ విభాగములన్నీ నాగురించియే పలుకుచున్నాయి.
అక్షరమహమ్। క్షరమహమ్।
గోప్యో2హమ్। గుహ్యో2హమ్।
అరణ్యో2హమ్। పుష్కరమహమ్।
పవిత్రమహమ్।
ఇక్కడ మార్పు చెందనిది (I) - మార్పు చెందేది (My) …ఈ రెండూ కూడా నేనే! (I am the Constant/Fixed Factor as well as Varying / Changing Factor).

రహస్యము : అనేకుల ఇంద్రియ దృష్టిలో లేనట్టి వాడనై, వారందరిలో కూడా రహస్యముగా వేంచేసి ఉన్నవాడను. (I am the ‘Being’ of all while not being seen by all).

నిర్జనారణ్యము - బహుజన ప్రదేశము కూడా నేనే! ఎట్టి దోషములు స్పృశించజాలనట్టి పరమపవిత్ర స్వరూపుడను. నిర్మలుడను.
అగ్రంచ, మధ్యంచ, బహిశ్చ, పురస్తాత్,
దశసు దిక్ చ అవస్థితమ్ (దిక్ష్వవస్థితమ్)।
అనవస్థితమ్ చ, జ్యోతిః ఇతి అహమ్।
ఏకః సర్వే చ మామేవ।
ఈ సమస్త జగత్తు యొక్క పైభాగము, మధ్యభాగము, బాహ్యము, వెనుక, ముందు, 10 దిక్కులు నాచేతనే ఆక్రమించబడినవై ఉన్నాయి..

దశ దిక్కులందు నిండి ఉన్నది నేనే అయినప్పటికీ, నేను దిక్కుల మధ్య చిక్కిఉన్నవాడను కాదు! అంతా నాయందే। అంతా నేనే।

జ్యోతి (Enlightenment నిర్మలకాంతి) స్వరూపుడను. సర్వదా ఏకస్వరూపుడనై ఉన్నాను. అనేకముగా అగుచుండటం లేదు కానీ అనేకంగా అగుపిస్తున్నది ‘నేనే’।
మాం యో వేద, సర్వాం దేవాన్ వేద।
గాం గోభిః బ్రహ్మణాన్ బ్రాహ్మణేన।
హవీగ్ంషి, హవిషాయుః, ఆయుషా
- సత్యగ్ం సత్యేన,
- ధర్మం ధర్మేణ-
తర్పయామి - స్వేన తేజసా।
ఓ దేవతలారా! నన్ను తెలుసుకుంటే సర్వదేవతలను, సమస్తమును ఎరిగినట్లే! (మట్టిగురించి తెలిస్తే, మట్టి బొమ్మలగురించి ఇంకా తెలియవలసినదేమున్నది?)

(గో = భూమి). నేనే - ఈ భూమినంతటినీ సూర్యకిరణముల చేతను, బ్రాహ్మణుల వేదాధ్యయన - వేద శబ్ద నినాదముల చేతను, హవిస్సు - ఆజ్యము చేతను, జీవుల జీవిత కాల ప్రదర్శనముల చేతను పరిపోషిస్తున్నాను. సత్యమును సత్యముతోను, ధర్మమును ధర్మముతోను తర్పణము చేస్తూ ఈ భూమిని నా తేజస్సుచే రక్షిస్తున్నాను.
తతో దేవా రుద్రం న అపశ్యం।
తే దేవా రుద్రం ధ్యాయంతి।
తతో దేవా ఊర్ధ్వబాహవః స్తున్వంతి।।
ఇట్లా పలుకుతూ అంతర్ధానమైనారు. ఆ రుద్రభగవానుని అక్కడెక్కడా దేవతలు ఎదురుగా చూడలేకపోయారు. అప్పుడు వారు చేతులు పైకి ఎత్తి ఉంచి రుద్రభగవానునికి ఇట్లా స్తోత్రములు సమర్పించారు.

ద్వితీయ ఖండః - రుద్రాత్మకమిదం సర్వమ్।

ఓం
1. యో హ వై రుద్రః
స భగవాన్।
యశ్చ బ్రహ్మా భూర్భువస్సువః (భూ-భువః-సువః)
తస్మై వై నమో నమః।
శీర్షం జనపద ‘ఓం’
విశ్వరూపో2సి। - యశ్చ విష్ణుః।।
దేవతలు : రుద్రుడుగా మనకు ప్రత్యక్షమైనవారే భగవంతుడు!
వేద - వేదాంత శాస్త్రములచే ‘రుద్రుడు - భగవంతుడు’గా ఎవ్వరు కీర్తించబడుచున్నారో, ఎవ్వరైతే భూ - భువర్ - సువర్ - మహర్ - తపో లోకములను, సృష్టికర్తయగు బ్రహ్మను తనయొక్క తేజోరూపంగా కలిగి ఉన్నారో, అట్టి రుద్రపరమాత్మకు భక్తితో నమస్కరిస్తున్నాము. అత్యున్నతమగు ఓంకార రూపుడవు, విశ్వరూపుడవు నీవే అయి ఉన్నావయ్యా! సమస్తము పరిపోషిస్తూ, సర్వము తానే అయి ఉన్న ‘విష్ణువు’వు కూడా నీవే।
2. (యథా ప్రథమ మంత్ర ఉక్తావా
ఆది-అంతౌ తథా
సర్వ మంత్రేషు ద్రష్టవ్యౌ)।
(ఇది మొదటిగా చెప్పి, ఈ వర్ణనను ఇక చెప్పుకోబోవుచున్న నామములతో జతచేర్చి మంత్రోపాసన చేయబడును గాక। సమన్వయమగును గాక).
= 2 నుండి 32 =
యశ్చ విష్ణుణాః,
యశ్చ మహేశ్వరః,
యా చ ఉమా।
యశ్చ వినాయకః
యశ్చ స్కందః
యశ్చ ఇంద్రః
(అంతటా నిండి ఉండుటచే) నీవే విష్ణువువు। మహేశ్వరుడవు, ఉమా (శక్తి) స్వరూపుడవు। వినాయకుడు। స్కందుడు, ఇంద్రుడుగా మేము ఉపాసిస్తున్నది నిన్నే.
యశ్చ అగ్నిః
యా చ భూః
యశ్చ భువః
యశ్చ సువః
యశ్చ మహః
యశ్చ జనః
యత్ చ తపః
యచ్చ సత్యమ్
నీవే అగ్నిరూపుడవు! భూ - భువః - సువః - మహః - జనః - తపః - సత్య….అనే సప్త ఊర్ధ్వ లోకములు నీయొక్క సంప్రదర్శనా చమత్కారమే!
యా చ పృథివీ
యశ్చ ఆపః
యచ్చ తేజః
యశ్చ వాయుః
యచ్చ ఆకాశమ్ ।।
ఈ జీవులకు ఆహార ప్రసాదిస్తున్న భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము….ఇవన్నీ నీయొక్క వివిధ రూపాలే!
(దీపము యొక్క తేజస్సు అనేక రూపములను వెలిగించురీతిగా, - ఇవన్నీ నీయొక్క తేజో ప్రదర్శనా చమత్కారములే। మేమంతా మీ సంప్రదర్శనములమే।).
యశ్చ సూర్యః
యశ్చ సోమః
యాని చ నక్షత్రాణి
యే చ అష్టౌ గ్రహాః
యశ్చ ప్రాణః
యశ్చ కాలః
యశ్చ యమః
యశ్చ మృత్యుః
యచ్చ అమృతమ్।
ఓ రుద్ర భగవాన్! పరమాత్మా!
సూర్యుడుగా ప్రకాశిస్తున్నది, చంద్రుడుగా ఓషధులు అందిస్తున్నది, నక్షత్రములు, అష్టదిక్పాలకులు, ప్రాణశక్తి, కాలము, సంహారకశక్తియగు యముడు, మృత్యువు, అమృతము…ఇవన్నీ మీ చమత్కార విశేషములే।
యచ్చ భూతం - భవ్యం - భవిష్యత్
యచ్చ విశ్వం
యచ్చ కృత్స్నం
యచ్చ సర్వం।
యచ్చ సత్యం।।
త్రికాలములలో అంతటా ఉన్నది మీరే।
ఈ విశ్వరూపము, ఇక్కడ సమగ్రము, ఈ సర్వము, సత్యము, ఈ కాలంతర్గత కల్పన, కాలసాక్షి…, హే రుద్రభగవాన్! నీవేనయ్యా ఇదంతా! నీకు నమస్కరిస్తున్నాము?

తృతీయ ఖండః

ఓం
1. ఆదౌ, మధ్యే భూర్భువస్సువః (భూ-భువః-సువః) అంతే
శీర్షం జనత్ ‘ఓం’ విశ్వరూపో2సి, బ్రహ్మైకత్వం।
2. ద్విధా - త్రివిధ - ఊర్ధ్వమ్ - అధశ్చ।
త్వం శాంతిశ్చ। త్వం పుష్టిశ్చ। త్వం తుష్టిశ్చ।
తండ్రీ! రుద్రభగవాన్! నీవు నీయొక్క సమగ్రత్వ, సర్వత్వ, సకలత్వ, సత్‌స్వరూప చమత్కారముచే ప్రణవస్వరూపుడవు.

‘‘ఓం భూర్భువ స్సువస్వాహా జనదోమ్’’ (ఓం భూః భువః స్వాహా జనత్ ‘ఓం’) - అను గాయత్రీ మంత్రార్థమువు!

ఆదిలో ‘ఓం’ మధ్యలో ‘భూ-భువః -సువః’ అంతములో ‘స్వాహాజనదోమ్।’ సమస్తమును జనింపజేయువాడవు అయినట్టి ఓ ప్రణవ స్వరూపా!

నీవు విశ్వరూపుడవు! విశ్వేశ్వరుడవు! విశ్వాతీతుడవు!

- అద్వితీయమగు బ్రహ్మము నీవు।
- ‘2’గా (జీవాత్మ - పరమాత్మగా), ‘3’గా (ద్రష్ట - దర్శనము - దృశ్యముగా)….ఉన్నది నీవేనయ్యా!
- మంత్రముయొక్క ఊర్ధ్వభాగములోను, మధ్యలోను, అధోభాగములోను ఉండి ప్రతి ఒక్కరికి చెందినవాడవై ఉన్నావు। నాకు కూడా చెందినవాడవు। నేనై ఉన్నవాడవు. ‘నీవు’గా అనుభవమగుచూ ఉన్నవాడవు కూడా।
- శాంతివి నీవు! ప్రవృద్ధరూప పుష్టివి। సంతోషరూప తుష్టివి।
త్వం హుతమ్ - అహుతమ్।
విశ్వం - అవిశ్వం।
దత్తం - అదత్తం।
కృతమ్ - అకృతమ్।
పరం - అపరం।
ప(పా)రాయణం చ ఇతి।
- సమర్పించువాడు - సమర్పించబడుచున్నది కూడా నీవే!
- నీవే విశ్వరూపుడవు! విశ్వ సహితుడవు! విశ్వరహితుడవు!
- మాచే ఇవ్వబడుచున్నది, ఇవ్వబడకున్నది కూడా నీవే!
- నిర్వర్తించబడుచున్నది - నిర్వర్తించబడనిది నీవే!
- ఆవల గల పర స్వరూపము - ఈవల గల ఇహ (అపర) స్వరూపము నీవే! పరమాత్మవు - జీవాత్మవు కూడా నీవే।
- పారాయణము చేయబడుచున్నదంతా కూడా నీ గురించే!
3. అపామ సోమమ్ (అపామ్ అసోమమ్)
అమృతా అభూమ్ ఆగస్మ
జ్యోతి రవిదామ దేవాన్,
జలములో చంద్రబింబమువలె మేము నీయందు ఉనికి కలిగి ఉన్నాము. విశ్వేశ్వరుడవగు నిన్ను దర్శించి ధన్యులమగుచున్నాము. బ్రహ్మ విద్యా స్వరూపిణియగు ఉమాదేవి నీకు అభిన్నము కనుక, ఉభయము పొందినవారమై అమృతానందము పొందుచున్నాము! ఆనంద జ్యోతిస్వరూపులమగుచున్నాము.
కిం నూనమ్ అస్మాన్ కృణవత్ అరాతిః
కిము ధూర్తిః అమృత మర్త్యస్య?
ఇంద్రియముల స్వరూపము గ్రహించాము. మీయొక్క సామీప్యతచే ఇక ధూర్తములు, అనర్థకారకములు అగు ఇంద్రియ - ఇంద్రియ విషయ పరంపరలు…. మా అమృత స్వరూపమునకు కలగజేయగల ఆపద ఏమున్నది? మీరు మాలో ఉండగా, మేము అమర్త్యులము. (చేతః కుహరే పంచముఖో2స్తి। మే కుతో భీః)
సర్వం జగద్ధితం వా
ఏతత్ అక్షరం
ప్రాజాపత్యం। సూక్ష్మం
మీయొక్క అక్షర - ప్రణవ స్వరూపము సర్వలోకహితము. నశించనిది. ప్రజాపతిచే (సృష్టికర్తయగు బ్రహ్మచే) ఎల్లప్పుడూ దర్శించబడుచూ - సేవించబడుచూ ఉన్నట్టిది.
ఇంద్రియ - మనో - ప్రాపంచక బుద్ధులకు విషయము కాదు. కాబట్టి, మీ స్వరూపము - అత్యంత సూక్ష్మము.
సౌమ్యం పురుషం। అగ్రాహ్యం।
అగ్రాహ్యేణ వాయుం।
వాయువ్యేన సోమం।
సౌమ్యేన గ్రసతి!
స్వేన తేజసా తస్మాత్ ఉపసంహర్త్రే
మహాగ్రాసాయవై నమో నమః।।
హే పరమాత్మా! రుద్రభగవాన్। మీయొక్క స్వరూపము పరమ శాంతము. సౌమ్యము. పరిపూర్ణమైనది. మనో-వాక్కులచే గ్రహించుటకు వీలు లేనిది। గ్రహించశక్యము కానిది। స్వీయ తేజస్సుతో వాయుత్వము ద్వారా వాయువును, సౌమ్యత్వముచే చంద్రుని చైతన్యపరచుచున్నట్టిది, సర్వమును ప్రదర్శిస్తూ, ఉపసంహరిస్తున్నట్టిది. సర్వమును దిగమ్రింగునట్టి ఓ మహాగ్రాసా! పరాత్మకా! మహా రుద్రదేవా! ప్రణవ స్వరూపా! నమో నమో నమః। నమో నమః। నమో నమః।।

చతుర్థ ఖండః

1. హృదిస్థా దేవతాః సర్వాః।
హృది ప్రాణాః ప్రతిష్ఠితాః।
హృది త్వమసి యో నిత్యం
తిస్రో మాత్రాః పరస్తు సః।
హే రుద్ర దేవాదిదేవా!
ఈ సర్వదేవతలు, సర్వప్రాణులు, మానవులు, సమస్త ప్రాణులు కూడా మీ హృదయము నందు ప్రతిష్ఠిలమై ఉన్నారు.
మాలో ప్రతి ఒక్కరియొక్క హృదయములో సూత్రాత్మ స్వరూపులై, (భౌతిక, మానసిక, జీవాత్మక) మూడు మాత్రలకు పరమై, కేవలాత్మ స్వరూపముగా మీరు వేంచేసినవారై ఉన్నారు. మేమంతా మీకు అభిన్నులము.
2. తస్య ఉత్తరతః శిరో। దక్షిణతః పాదౌ।
య ఉత్తరతః, స ‘ఓం’ కారో।
య ఓంకారః, స ప్రణవో।
యః ప్రణవః స సర్వవ్యాపీ।
యః సర్వవ్యాపీ సో అనంతో।
ఓ మహా రుద్ర పరమాత్మా!
ఉత్తరము - నివృత్తి మార్గమే మీ శిరస్సు!
దక్షిణ - (ప్రవృత్తి) మార్గము (సంసారము) మీ పాదములు!
- ఏది ఉత్తర (నివృత్తి) స్థానమో, అదియే ఓంకారము!
- ఏది ‘ఓం’ కారమో, అదియే ప్రణవము!
- ఏది ప్రణవమో, అదియే సర్వవ్యాపకము.
- ఏది సర్వవ్యాపకమో, అది అనంతము!
యో అనంతః తత్ తారం।
యత్ తారం, తత్ సూక్ష్మం।
యత్ సూక్ష్మం తత్ శుక్లం।
యత్ శుక్లం తత్ వైద్యుతం।
యత్ వైద్యుతం తత్ పరంబ్రహ్మేతి।
స ఏకః స ఏకో రుద్రః।
స ఈశానః।
స భగవాన్! స మహేశ్వరః।
స మహాదేవః।।
ఏది అనంతమో అది తరింపజేయగల తారము.
ఏది తారమో…అది సూక్ష్మము.
ఏది సూక్ష్మమో, అది శుక్లము. నిర్మలము, పవిత్రము.
ఏది శుక్లమో, అదియే తేజోరూపమగు వైద్యుతము. వేదముల సారము.
అట్టి వైద్యుతమే పరబ్రహ్మము!
అట్టి పరబ్రహ్మము సర్వదా ఏకము!
ఏకమగు రుద్రతత్త్వము!
సర్వముగా విస్తరించియున్నదే ఈశానుడు. ఈశానుడే భగవంతుడు, మహేశ్వరుడు, మహాదేవుడు. మీరే అట్టి మహాదేవుడు, స్వామీ!
[ తత్త్వమ్! అగ్ని నుండి విస్ఫులింగములవలె మేమంతా మీనుండి (మీకు అనన్యమై) ప్రదర్శనమగుచున్నాము ].

పంచమ ఖండః

(1) అథ కస్మాత్ ఉచ్యత్ ‘ఓం’కారో?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
సర్వగ్ం శరీరం ఊర్ధ్వమ్
ఉన్నమయతి, (ఉత్ నమయతి) తస్మాత్
ఉచ్యత ‘ఓం’కారః।।
హే రుద్ర-సర్వాత్మకా!
మీరు ఓంకార స్వరూపులుగా ఎందుచేత చెప్పబడుచున్నారు?
‘ఓం’కారమును ఉచ్ఛరించుచుండగానే ఈ జీవుడు సంసారము నుండి పైకి మీచే లేవదీయబడుచున్నాడు. మిమ్ములను తలచుటచే ఉద్ధరించ బడుచున్నాడు. (వ్యష్టిగతమగు జీవత్వము నుండి ఈ జీవుడు శివత్వము సంతరించుకుంటున్నాడు). అందుకే మీరు ఓంకారస్వరూపులు!
(2) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘ప్రణవో?’’
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
ఋచో, యజూగ్ంషి, సామాని,
అథర్వ, అంగిరసశ్చ యజ్ఞే బ్రహ్మ చ బ్రాహ్మణేభ్యః
ప్రణామయతి, - తస్మాత్ ఉచ్యతే ‘‘ప్రణవః’’।।
ఎందుచేత మీరు ‘‘ప్రణవ స్వరూపులు’’ అని అనబడుచున్నారు?
ఏ ఓంకార రుద్రతత్త్వమును ఉచ్ఛరించటం చేత ఋక్ - సామ - యజు అథర్వ - అంగిరస (ప్రాణోపాసన) యజ్ఞ = షడంగముల యోగసిద్ధి ప్రయోజనమైనట్టి బ్రహ్మ యజ్ఞముచే - బ్రహ్మము పొందింపజేస్తూ ఉన్నారు. ఈ కారణం చేత మీరు ప్రణవస్వరూపులు - ప్రణవతీతి ప్రణవః। (ఆత్మత్వమును) పొందింపజేస్తున్నారు కాబట్టి ప్రణవస్వరూపులు!
(3) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘సర్వవ్యాపీ’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
సర్వాన్ లోకాన్ వ్యాప్యోతి స్నేహో
యథా పలల పిండం శాంతమూలం
ఓతం ప్రోతం అనుప్రాప్య సర్వం వ్యతిశిష్టః,
తస్యైవ అనువిద్ధం వ్యతిశిష్టః, -
తస్మాత్ ఉచ్యతే ‘సర్వవ్యాపీ’।।
మీరు ‘‘సర్వవ్యాపి’’ అని ఎందుకు చెప్పబడుచున్నారు?
నువ్వుపిండి ముద్దలోను, మాంసపు ముద్దలోను అంతరంగా నూనె ఉంటుంది కదా! ఆ రీతిగా రుద్రనామోచ్ఛారణచే అంతటా వ్యాపించి ఉన్నట్టి శాంతరూపమగు మీయొక్క ఓత - ప్రోత స్వరూపానుసంధానముచే ఈ జగత్తులో జరామరణములు లేనివారమై (అమర్త్యులమై) వెలయగలము. మీ సర్వవ్యాపకత్వము మేమూ ఆస్వాదించగలం. అందుకే మిమ్ములను ‘సర్వవ్యాపీ’ అని అంటున్నాము. మా అందరి బాహ్య-అభ్యంతరములలో సమస్తముగా వ్యాపించి ఉన్నది మీరే।
(4) అథ కస్మాత్ ఉచ్యతే ‘అనంతో’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
ఆద్యంతం నోపలభ్యతే (న-ఉపలభ్యతే)
తిర్యక్, ఊర్ధ్వమ్, అథస్థాత్-
తస్మాత్ ఉచ్యతే అనంతః।।
మిమ్ములను ‘అనంతుడు’ అని ఎందుచేత చెప్పుకుంటున్నాము?
ఏ తత్త్వమును ఉచ్ఛరించటం చేత (‘ఓం నమః శివాయ’ అనటం చేత) మీయొక్క ‘‘ఆద్యంత రాహిత్యము’’ తెలియవస్తోందో, క్రింద - పైన - ప్రక్కలా అంతటా అనుభవమగుచున్నావో…అట్టి మీ ‘అనంతత్వము కారణంగా మిమ్ములను అనంతుడు’ అని అంటున్నాం! ఆత్మగా మీరు ఆద్యంతరహితులు.
(5) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘తారం’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
గర్భ జన్మ వ్యాధి జరా మరణ
సంసార మహత్ భయాత్
సంతారయతి, తస్మాత్ ఉచ్యతే ‘తారమ్’।।
మిమ్ములను ‘తారమ్’ అని ఎందుకు అంటారు?
ఏ రుద్ర భగవానుని నామోచ్ఛారణ మాత్రం చేత జీవులంతా కూడా ‘గర్భస్థ - జన్మ - వ్యాధి - జరా - మరణ - సంసార మహత్ భయము నుండి తరిస్తున్నారో,….ఆ కారణం చేత ‘తారయతేతి రుద్రః తారమ్’’…..అని చెప్పుకుంటున్నారయ్యా! మీ శివానందతత్త్వము యొక్క మననముచే మేము సంసారబంధములనుండి తరించగలము.
(6) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘సూక్ష్మం’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
సూక్ష్మో భూత్వా పరశరీరాణ్యేవ
అధితిష్ఠతి, తస్మాత్ ఉచ్యతే ‘సూక్ష్మమ్’।।
మిమ్ములను ‘సూక్ష్మము’ అని అనటం ఎందుకు?
మీ నామము స్మరించటం చేత బుద్ధి సూక్ష్మమై ఈ జీవుడు తన పరతత్త్వమును అధిరోహిస్తున్నాడు. అందుచేత మీరు ‘సూక్ష్మము’ అన తగినవారు! అట్టి సూక్ష్మతత్త్వము మా బుద్ధికి ప్రసాదించగలవారు మీరు.
(7) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘శుక్లం’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
క్లందతే - క్లామయతే,
తస్మాత్ ఉచ్యతే ‘శుక్లమ్’।।
ఓంకార స్వరూపులగు మిమ్ములను ‘శుక్లమ్’ అని అనటమెందుకు?
మిమ్ములను ఉచ్ఛరిస్తే అంతరంగములోని సంసార సంబంధమైన గుసగుసలు తొలుగుతాయి. హృదయం నిర్మలమౌతుంది. అందుకని మిమ్ములను ‘శుక్లమ్’ అంటున్నాం! మా హృదయాలు ఆత్మభావనచే తెల్లనౌతాయి.
(8) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘వైద్యుతం’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
మహతి తమసి సర్వం శరీరం
విద్యోతయతి, తస్మాత్
ఉచ్యతే వైద్యుతమ్।।
మిమ్ములను ‘వైద్యుతమ్’ అని అనటమెందుకు?
తమయొక్క ప్రణవనామోచ్ఛారణచే గాడాంధకారము తొలగిపోయి, దేహమంతా ఆత్మజ్ఞానమనే వెలుగుచే ప్రకాశవంతమౌతుంది కాబట్టి- మిమ్ములను ‘వైద్యుతము’ అని సంభాషించుకుంటున్నాము. జ్యోతి స్వరూపా! తమసోమా జ్యోతిర్గమయ।
(9) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘పరంబ్రహ్మ’’?
యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ
బృహతి - బృంహయతి-
తస్మాత్ ఉచ్యతే - ‘‘పరంబ్రహ్మ’’।।
మిమ్ములను ‘పరంబ్రహ్మ’ అని చెప్పుకోవటమెందుకు?
మేము మిమ్ములను ఆశ్రయించి అజ్ఞానదశ నుండి జ్ఞానైశ్వర్యము వైపుగా వృద్ధి పొందుచున్నాము. తదితరులను కూడా వృద్ధి పొందింప జేయ గలుగుచున్నాము. ‘ఇహము’ నుండి ‘పరము’ చేరటానికి మీరే మార్గము. అందుచేత మీరు ‘పరబ్రహ్మ’. ఆవలగల మా కేవలస్వరూపాను భావమునకు మీరు మాకు మార్గము కాబట్టి పరబ్రహ్మ.
(10) అథ కస్మాత్ ఉచ్యత ‘‘ఏకో’’?
యః సర్వాన్ లోకాన్
ఉద్గృహ్ణాతి, అజస్రం
సృజతి, విసృజతి, వాసయతి-
తస్మాత్ ఉచ్యత - ‘ఏకః’।।
మిమ్ములను ‘ఏకో’ అని అనటమెందుకు?
ఒకప్పుడు ఈ లోకాలన్నీ మీయందు లీనమౌతున్నాయి. మీరే సర్వమునకు సృష్టి - స్థితి - సంహారకర్త. ఏకమై….అనేకమును సృజియిస్తున్నారు కాబట్టి ‘ఏకః’ అని అంటున్నాం. ఏకోసత్। తత్ సత్ త్వమేవ।
(11) అథ కస్మాత్ ఉచ్యత ‘‘ఏకో రుద్రః’’?
ఏక ఏవ రుద్రో। న ద్వితీయాయతస్థే,
య ఇమాం లోకాన్ ఈశత, ఈశనీయుః,
జననీయుః। ప్రత్యంజనాః తిష్ఠత।
సంచుకో చ అంతకాలే సంసృజ్య,
విశ్వా భువనాని గోప్తా,
తస్మాత్ ఉచ్యత ‘ఏకోరుద్రః’।।
మిమ్ములను మేము ‘ఏకోరుద్ర’ అని అనటమెందుకు?
ఈ అనేక భేదములతో కూడి ఈ సమస్త సృష్టి మీయందే, మీ చేతనే కల్పించబడి, పొందబడుతోంది. వాస్తవానికి ఏకరుద్రస్వరూపులగు మీరు మాత్రమే ఉన్నారు. మీకు ద్వితీయమనునదే లేదు. అట్టి తురీయస్వరూపులు. మీరే సమస్తమును నియమించు నియమశక్తి ప్రదర్శకులు. అంతటా వేంచేసి ఉన్నవారు. యజమాని అయి, ఈ లోకాలన్నీ జనింప జేస్తున్నవారు! పరిపాలిస్తూ, పరిపోషిస్తూ లయింపజేసు కొంటున్నారు. ఉపసంహారము (Withdraw) చేస్తున్నారు. అందుచేత ‘ఏకో రుద్రులు’. ఏక ఏకాదశో రుద్రా!
(12) అథ కస్మాత్ ఉచ్యత ‘‘ఈశానో’’?
యః సర్వాన్ లోకాన్ ఈశత
ఈశానీభిః జనభిః పరమశక్తిభిః
అభిత్వా శూరనోనుమో। (శూరనోఅనుమో)।।
మిమ్ములను ఈశానుడు అని అనటమెందుకు?
ఈ సర్వ స్థావర - జంగమ జగత్తుకు అచింత్యములై, భావనోపేతము, అవిద్యాభూతము అగు నియమశక్తులచే నియమించువారు మీరే. పరాశక్తి స్వరూపులు! స్వయంప్రకాశానంద స్వరూపులు. మిమ్ములను స్తుతిస్తున్నాము! ఫలితాలు కోరికాదు.
అదుగ్ధా ఇవ ధేనవః।
ఈశానమ్ అస్య జగతః
సువః దృశమ్, ఈశానమ్ ఇంద్రతస్థుషః
తస్మాత్ ఉచ్యత ఈశానః।।
పాలు పితకకుండా పూజించబడే గోవులవంటివి ఈ మా స్తోత్రములు!
మా ఇంద్రియములు మీచే నియమించబడినవి. ఇవన్నీ మీ సంపద! అందుచేత మీరు ఈశానుడు. మీ ఈ స్తుతులన్నీ మీరు మీగురించి వర్ణించుకొను స్వకీయ స్వస్వరూప గానములు. అంతటా, అన్నిటా వెలయుచున్నారు కాబట్టి - ‘ఈశానులు’. మాయందు మేముగా ఉండి, మాకు ‘జీవితము’ను ప్రసాదించుటచే ఈశానులు.
(13) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘భగవాన్’’?
యః సర్వాన్ భావాన్ నీరీక్షత్యా(త్వా)త్।
ఆత్మజ్ఞానం నిరీక్షయతి,
యోగం గమయతి, స ఏవ,
తస్మాత్ ఉచ్యతే ‘భగవాన్’।।
మిమ్ములను ‘భగవాన్’ అని ఎందుకంటున్నాము?
- సర్వమును ‘ఎరుక’ అను అగ్నితేజస్సుచే వెలిగించువారు కాబట్టి,
- సర్వ దర్శకుడవటంచేతను, సర్వత్రా భావనా స్వరూపులై వెలయుచుండటం చేతను,
- ఆత్మజ్ఞానము ప్రసాదించువారు అవటం చేతను,-యోగీశ్వరులుకాబట్టి,
- యోగ పరాకాష్ఠకు త్రోవచూపువారు అవటంచేతను, మీరు ‘భగవాన్’ అయి ఉన్నారు.
(14) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘మహేశ్వరో’’?
యః సర్వాన్ లోకాన్ సంభక్షః, సంభక్షయతి
అజస్రం సృజతి - విసృజతి, వాసయతి,
తస్మాత్ ఉచ్యతే ‘మహేశ్వరః’।।
మరి మహేశ్వరుడు ఎందుకయి ఉన్నారు?
ఈ లోకాలన్నీ మీకు ఆహారము. సర్వము స్వీకరిస్తున్నది మీరే! మీరు ఎల్లప్పుడూ లీలా వినోదంగా సృజిస్తున్నారు. ఇదంతాగా నివసిస్తున్నారు. మరొకప్పుడు ప్రశాంతంగా లయింపజేసుకొంటున్నారు. అందుచేత మీరు మహేశ్వరులు!
(15) అథ కస్మాత్ ఉచ్యతే ‘‘మహాదేవో’’?
యః సర్వాన్ భావాన్ పరిత్యజ్య
ఆత్మజ్ఞాన యోగైశ్వర్యే మహతి మహీయతే
తస్మాత్ ఉచ్యతే - మహాదేవః।।
మిమ్ములను ‘మహాదేవుడు’ అని ఎందుకంటున్నామంటే…,
సర్వభావములను పరిత్యజించి, ఆత్మజ్ఞానయోగైశ్వర్యులై మీ మహత్మ్యముతో ఈ సమస్తముగా ప్రకాశిస్తున్నారు. అందుచేత మీరు మహాదేవులు! ఈ జీవునికి చెందిన మహత్‌స్వరూపులు కాబట్టి కూడా ‘మహాదేవులు’. మేమంతా మీ మహాన్ స్వరూపమై ఉండటంచేత - మహాదేవులు.
(16) తదేతత్ రుద్రచరితం।
ఏష హి దేవః ప్రదిశో ను
సర్వాః పుర్వో హి జాతః
స ఉ గర్భే అంతః।
స ఏవ జాతః। సః జనిష్యమాణః।
పై విశేషమంతా రుద్రస్తోత్రంగాను, రుద్రచరితంగాను చెప్పబడుతోంది!

ఓ సమస్త జనులారా!
రుద్రభగవానుడే సమస్త దిక్కులలోను సమస్తమునకు మునుముందే ఉన్నట్టి ఆత్మ తత్త్వము! ఈ బ్రహ్మాండగర్భమున ఉన్నట్టి దివ్యతేజోమూర్తి!
ఈతడే పుట్టినవాడు - పుట్టబోవువాడు - పుట్టనివాడు కూడా।
ప్రత్యన్ (క్) జనాః తిష్టతి విశ్వతో ముఖః।
విశ్వతః చక్షుః ఉత విశ్వతో ముఖో।
విశ్వతో బాహుః, ఉత విశ్వతః పాత్
సం బాహుభ్యాం ధమతి సంపత
త్రైః ద్యావా భూమీ జనయన్దేవ ఏకః।।
ఈయన ప్రత్యక్ స్వరూపుడు. విశ్వతోముఖుడు.

విశ్వమంతా నేత్రములు, ముఖములు కలవాడు.

ఈ విశ్వమంతా తన బాహువులుగా, కాళ్ళుగా కలవాడు. (పాదో అస్య విశ్వా భూతాని।).

తమయొక్క బాహువులచే అనేక శబ్దములను పుట్టించుచున్నవారు. పంచభూతములు ఈయనయొక్క సంపద. త్రిలోకములు ఈయన సంచార ప్రదేశములు.

స్వామీ! మేమంతా మీ సంపదయే।

ఈ స్వామియే→ ఆకాశము, భూమి యొక్క పుట్టుకకు కారకుడై, అద్వితీయుడై, ఏకరూపుడై సర్వత్రా మా అందరుగా ప్రకాశించుచున్నట్టివారు.
(17) తత్ ఏతత్ ఉపాసితవ్యం,
యత్ వాచో వదంతి,
తదేవ గ్రాహ్యం।
అయం పంథా వితత
ఉత్తరేణ యేన దేవా,
యేన ఋషయో,
యేన పితరః
ప్రాప్నువంతి
పరమపరం(దం) పరాయణం చ ।।ఇతి।।
అట్టి ఈ మనందరి ఆత్మస్వరూపుడగు రుద్రభగవానుడే సర్వదా ఉపాసించతగినవారు.

ఏది వేద వాక్కులచే చెప్పబడుతోందో, అట్టి తత్ (తత్త్వ) శివరూపమే బుద్ధితో గ్రహించబడవలసినది. ఈయనయొక్క సచ్చిదానంద స్వరూపమే అందరికీ అత్యంత సామీప్యము.

ఏ ఉపాసనా, ఆరాధనా మార్గమును అనుసరించినవారై (పారాయణులై) ఋషులు, పితృదేవతలు చివరికి ఏ స్థానము ప్రాప్తింపజేసుకుంటున్నారో, ఆ పరమపదము, ఆ పారాయణమే ఈ రుద్రపరమాత్మ స్థానము!
(18) వాలాగ్రమాత్రం,
హృదయస్య మధ్యే,
విశ్వం దేవం, జాతవేదం వరేణ్యమ్।,
తమ్ ఆత్మస్థం
యే అనుపశ్యంతి ధీరాః
తేషాం శాంతిః శాశ్వతీ, నేతరేషామ్।
(న ఇతరేషామ్।)
ఆ శివభగవానుడు :-
కేశము (వెంట్రుక) యొక్క అగ్రభాగమువలె అత్యంత సూక్ష్ముడు! సర్వహృదయ మధ్య స్థానమున ఉన్నట్టివారు!
విశ్వరూపుడు! విశ్వేదేవుడు! స్వయంప్రకాశకుడు!
వేదములకు జన్మస్థానమైనవాడు! సర్వశ్రేష్ఠుడు! అంతఃకరణ నివాసి!

అట్టి ఈ రుద్రతత్త్వమును ఎక్కడ ఉన్నదని, ఎక్కడకు వెళ్ళి చూడాలి? ఏ తెలివిగలవారు (ధీమంతులు) తమయందు, ‘స్వస్వరూపము’గాను, బాహ్యమునందు సమస్త జీవులరూపము (తత్త్వమ్) గాను ఆ రుద్రభగవానుని చూచుచున్నారో, అట్టివారు మాత్రమే శాశ్వతమగు పరమశాంతిని పొందుచున్నారు!
సర్వమును రుద్ర పరమాత్మగా దర్శించని తదితరులు శాశ్వత సుఖ-శాంతులను పొందుచుండటం లేదు!
(19) యో యోనిం యోనిం అథితిష్ఠతి ఏకో,
యేన ఇదం పూర్ణం
పంచవిధం చ సర్వమ్,
తమ్ ఈశానం పురుషమ్
దేవ మీడ్యం (నిధాధ్యాయాత్) నిచాయ్యేమాం
(తారం) శాంతిం అత్యంతమ్ ఏతి।।
ఏ పరమాత్మ ఏకరూపుడై సర్వదేహములందూ సమముగాను, అఖండుడుగాను వెలయుచున్నారో…,
ఎవరు అంతటా పూర్ణుడై సచేతనుడై నిండియుండటంచేతనే పంచవిధములుగా (పంచభూతమయ) ప్రపంచము ఇక్కడ వర్తితమౌతోందో….

అట్టి ఈశానుడు, పరమపురుషుడు, దేవదేవుడు, సర్వాధారుడు - అగు రుద్ర దేవుని ‘నిధి ధ్యాస’చే ఏకాగ్ర దర్శనం చేయుచున్నాము. ఆత్యంతికమగు ‘శాంతి’ని సిద్ధించుకుంటున్నాము.
(20) ప్రాణ్యేషు అంతర్మనసో
‘లింగమ్’ ఆహుః,
యస్మిన్ క్రోధో యా చ
తృష్ణా, క్షమా చ।
తృష్ణాం ఛిత్వా హేతుజాలస్య మూలమ్
బుద్ధ్యా సంచింత్య స్థాపయిత్వాతు రుద్రే।
ఆత్యంతికమగు ‘శాంతి’ని సిద్ధించుకుంటున్నాము.
ఇంద్రియములు ప్రాణశక్తిచే కదలుచున్నాయి. ప్రాణముల అంతరమున మనస్సు ఉన్నది.

అట్టి మనస్సుయొక్క అంతరమున లింగశరీరమున్నది.

అట్టి లింగ శరీరంలో క్రోధము, తృష్ణ, క్షమారాహిత్యము (ఓర్పు లేకపోవటం) ఇవన్నీ ఉన్నాయి. సర్వ దోషములకు తృష్ణయే మూలము. అట్టి తృష్ణను జయించి బుద్ధితో లింగ దేహమునందు పరమపురుషుడగు రుద్ర భగవానుని స్థాపించుచున్నాము.
(21) రుద్ర ఏకత్వమ్ ఆహుః।
రుద్రం శాశ్వతం వై పురాణమ్ ఇష,
మూర్జం తపసా నియచ్ఛత।
వ్రతమ్ ఏతత్ పాశుపతమ్।।
ఏక స్వరూపుడు, శాశ్వతుడు, పురాణపురుషుడు అగు రుద్ర భఘవానుని లింగదేహము నందు (బుద్ధి యందు) తపస్సుతో ప్రతిక్షేపించటమే పాశుపత వ్రతము.

సర్వము రుద్రరూపముగా నిర్మలమైన బుద్ధితో ఆశ్రయించటమే పాశుపతవ్రత ముఖ్య ఆశయము, సంసిద్ధి కూడా.
(22) అగ్నిరితి భస్మ। వాయురితి భస్మ।
జలమితి భస్మ। స్థలమితి భస్మ।
వ్యోమేతి భస్మ। సర్వగ్ం హవా ఇదం భస్మ।
మన ఇతి ఏతాని చక్షూంషి భస్మాని।
అగ్నిః ఇత్యాదినా - భస్మ గృహీత్వా,
నిమృజ్య అంగాని సంస్పృశేత్।
తస్మాత్ వ్రతమ్ ఏతత్ ‘పాశుపతమ్’।
- పశుపాశ విమోక్షాయ।।
ఈ పాశుపత వ్రతోపాసకుల భస్మధారణయొక్క ఉద్దేశ్యము?

అగ్నియే భస్మము. వాయువు, జలము, స్థలము, వ్యోమము….అన్నీ కూడా భస్మరూపమే! (భ + స + మమ్ = భగవానుని సర్వత్రా వేంచేసియున్న ‘సమ’ స్వస్వరూప తేజస్సు).

మనస్సు, దృష్టి, కళ్ళు, సర్వము భస్మ స్వరూపమే! అగ్నిరితిభస్మ - వాయురితి భస్మ-జలమితి భస్మ-స్థలమితి భస్మ-వ్యోమ ఇతి భస్మ- అహమితి భస్మ। ఈ ఏడు మంత్రములతో భస్మమును గ్రహించి దేహముపై పూసుకుంటూ సర్వాంగాలను సుస్పృశించాలి!

ఇది పాశుపత వ్రతము. ఇది పశు పాశ విమోచకం కనుక ‘పాశుపతము’ అని, ‘పాశుపతవిద్య’ - అని లోకప్రసిద్ధము. ఇది జ్ఞానార్థులగు జీవులను అజ్ఞానకార్యముల నుండి విరమింపజేయగల ‘పాశుపతవ్రతము’.
(23) యో అథర్వశిరసం బ్రాహ్మణో
నిత్యమ్ అధీతే, సో అగ్నిపూతో భవతి।
స వాయుపూతో భవతి।
స ఆదిత్యపూతో భవతి।
స సోమపూతో భవతి।
స సత్యపూతో భవతి।
స సర్వపూతో భవతి।
స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి।
స సర్వేషు వేదేషు అధీతో భవతి।
స సర్వ వేద చర్య అనుచరితో భవతి।
ఏ తత్త్వోపాసకుడు నిత్యము ఈ అథర్వ శిరోపనిషత్‌ను అధ్యయనము చేస్తాడో, అట్టివాడు బ్రహ్మయజ్ఞవిథుడు అయి, అగ్నివలె పవిత్రుడగుచున్నాడు.

వాయువు వలె, ఆదిత్యునివలె, చంద్రునివలె, స్వయంగా, స్వాభావికంగా నిర్మలుడగుచున్నాడు. సత్యముచే సర్వదా సర్వత్రా పునీతడగుచున్నాడు. (ఆతనియొక్క దేహి-గుణ-దృశ్య-దేహ-జన్మ జన్మాంతర) సందర్భములన్నీ పవిత్రత సంతరించుకోగలవు.

సర్వతీర్థములలోను స్నానము చేసిన ప్రయోజనము పొందుచున్నాడు. ‘‘చతుర్వేద పారాయణ, సమస్త ధర్మాశ్రయ’’ ప్రయోజనం పొందుచున్నాడు. వేద - వేదాంగ అధ్యయన శ్రవణ ఫలములను సంపాదించు కుంటున్నాడు!
సర్వైః దైవేః (ఏవైః) జ్ఞాతోభవతి।
స సర్వయజ్ఞ - క్రతుభిః ఇష్టవాన్ భవతి।
తేన ఇతిహాస - పురాణానాం
రుద్రాణాం శత సహస్రాణి జప్తాని భవంతి।
గాయత్ర్యాః శత సహస్రం జప్తమ్ భవతి।
ప్రణవానామ్ అయుతం (ప్రణవ నామయుతం) జప్తం భవతి।
రూపే - రూపే దశ పూర్వాన్ పునాతి।
దశ - ఉత్తరాన్ ఆచక్షుసః
పక్తిమ్ పునాతి।
ఇతి ఆహ భగవాన్
అథర్వ శిరో, అథర్వ శిరః।।
ఈ అథర్వశివమును అధ్యయనము చేయువాడు
- సర్వదేవతలయొక్క తత్త్వమును తెలుసుకొన్నవాడగుచున్నాడు.
- సమస్త యజ్ఞ - క్రతు - ఇష్టా పూర్తములను నిర్వర్తించినవాడగుచున్నాడు.

‘‘ఈ సర్వము తమరు ధరించే భస్మస్వరూపమే’’ అనుభవముతో, ‘‘హృదయములో పేరుకుంటున్న ప్రాపంచిక సర్వవిషయాలు తొలగించి, రుద్రభగవానుని ప్రతిక్షేపించటం’’ అనబడే ‘పాసుపతవ్రతము’ యొక్క అనుక్షణిక నిర్వహణమ్ ఇతిహాస పురాణ పఠన ప్రయోజనము.

(ఇంకా కూడా)
కోటి రుద్రజప ప్రయోజనము లభించగలదు.
శతసహస్ర గాయత్రీ జప ఫలము ప్రాప్తించగలదు.
ప్రణవోపాసన ఫలము వచ్చి చేరగలదు.

మనము వివరించి చెప్పుకొన్న పాశుత వ్రత కథనము ఇటు పది తరములు - అటు పది తరములు పవిత్రులగుచున్నారు.
అట్టివాని కంటికి ఎదురుగాగల పది దిక్కులలోని వారంతా పవిత్రత పొందగలరు.

అథర్వశిర-పారాయణము ప్రణవోపాసనయే.

ఈ విధముగా భగవానుడగు అధర్వముని అథర్వశిరోవాక్యములు పలికారు.
(24) స కృత్ జప్త్వా శుచిః పూతః
కర్మణ్యో భవతి।
ద్వితీయం జప్త్వా
గణాపత్యమ్ అవాప్నో-తి।
తృతీయం జప్త్వా దేవమేవ అనుప్రవిశతి
ఇత్యోగ్ం సత్యమ్।। (ఇతి ‘ఓగ్ం’ సత్యమ్।)।।
ఈ అథర్వ శిరోపనిషత్ ఒకసారి జపిస్తే ఆ పఠించువాడు శుచుడు, పరమ నిర్మలుడు, ఉత్తమ కర్మలు నిర్వర్తించిన వారితో సమానుడు కాగలడు.
రెండవసారి జపిస్తే ఉత్తమగుణములు, మంచివారితో సహవాసము, గణాపత్యము పొందగలడు!
మూడవసారి జపించినప్పుడు దేవతల ఆనంద స్థానమున ప్రవేశించ గలడు. ఇది సత్యము! ‘ఓం’ యేవ సత్యమ్।
(25) యో రుద్రో అగ్నౌ, యో అప్సు
అంతర్య ఓషధీః వీరుధ ఆవివేశ,
య ఇమా విశ్వా భువనాని చ అక్లపే
తస్మై రుద్రాయ నమో అస్తు।।
నమో-స్తు। నమో-స్తు।।
ఏ రుద్రభగవానుడైతే

- అగ్ని స్వరూపుడై సర్వము తేజోమయం చేస్తున్నారో…..,

- రసస్వరూపుడై ఉదకమున ప్రవేశించి జీవులందరినీ పరిపోషిస్తున్నారో…,

- అంతర్యామియై సర్వజీవులలోను వేంచేసి ఉన్నారో…..,

- భూమియందు ఓషధీస్వరూపుడై జీవులకు ఆహారము అందిస్తున్నారో, వీరుధములలో (వృక్షములలో) వ్యాపించి ఫలములు ప్రసాదిస్తున్నారో,

- విశ్వస్వరూపుడై విశ్వ ప్రదర్శనము చేయుచున్నారో,

- చతుర్దశ భువనములను చాకచక్యముగా విస్తరించియున్నారో….,

- సమస్త జీవులు తమయొక్క ప్రదర్శనమే అయి ఉన్నారో…,

అట్టి రుద్ర భగవానునికి మరల మరల నమస్కరిస్తున్నాము.
నమో నమో నమో నమోస్తుతే।।
(26) అద్య మూర్థానమస్య సగ్ంశీర్యో
అథర్వా హృదయం చ
మస్తిష్కాత్ ఊర్ధ్వం ప్రేరయన్
పవమానో అథర్వ శీర్‌షః (శీర్‌ష్ణః)
తత్ వా అథర్వ శిరో
దేవకోశః సముజ్ఝితః
తత్ ప్రాణో అభిరక్షతు।
ఈ అధర్వోపనిషత్‌ను ముముక్షువులకు ప్రసాదించిన మహనీయులగు అథర్వమునికి ఆ పేరు ఎట్లా వచ్చిందో చెప్పుకుందాము.

ఒకప్పుడు అథర్వమునిని ఒక సందర్భంలో ఒక మహర్షికి లోకసంబంధమైన సంభాషణలచే కోపం కలిగించారు. ఆ మహర్షి ‘‘ఓ అథర్వా! నీ శిరస్సు తెగి హృదయమునకు వేరై క్రిందబడుగాక! నీ హృదయము కూడా నేలకూలును గాక!’’….అని శపించారు.

ఆ శాపం వింటూనే అథర్వముని మరుక్షణం తన యోగశక్తితో భౌతిక శరీరము నుండి బయటకు వచ్చి వేశారు. ఇంతలో శిరస్సు తెగిపడింది. ప్రాణోపాసనతో క్రిందగా పడియున్న శిరస్సును, హృదయమును అనుసంధానము చేసి ఆయన తిరిగి శరీరమును పునరుజ్జీవింపజేశారు!

అందుచేత ఆ మునీశ్వరుడు ‘‘అథర్వశిరుడు, పవమానుడు’’ అని పిలువబడసాగారు.
శ్రియమ్ అన్నమ్ అథో మనః।
శ్రియమ్ అన్నమ్ అథో మనః।
విద్యామ్ అన్నమ్ అథో మనో
విద్యామ్ అన్నమ్ అథో మనః।।
మోక్షమ్ అన్నమ్ అథో మనో।
మోక్షమ్ అన్నమ్ అథో మనః।।
ఇతి ‘ఓగ్ం’ సత్యమ్। - ఇత్యుపనిషత్।।
అన్నమ్ = ఇంద్రియానుభవమగు సమస్త జగద్దృశ్యము.

శ్రియమ్ అన్నమ్ = శ్రేయస్సు కలుగజేయగల ఇంద్రియానుభవములు.

విద్యామ్ అన్నము = ‘బ్రహ్మవిద్య’ అనే ఆహారము.

అథోమనో = శ్రియమైన విద్య అను ఆహారము (ఆలోచన)తో కూడిన మనస్సు.

మోక్షమ్ అన్నమ్ అథో మనః। ‘నాకు బంధము లేదు’ అను మోక్ష స్థితియొక్క అనుభవముతో కూడిన మనస్సు.

అట్టి అథర్వశిర మహామునిచే దివ్యచక్షువులచే దర్శించబడిన మంత్రరాశియే ‘అథర్వశిరము’ అని పిలువబడుతోంది.

ప్రాణప్రదుడగు అట్టి అథర్వశిర మునీశ్వరునికి నమస్కారము. మునీశ్వరుడు మమ్ములను రక్షించుగాక!
శ్రేయోదాయకమగు ఆత్మజ్ఞాన ఆహారమును, మా మనస్సుకు ప్రసాదించును గాక!
‘‘బ్రహ్మవిద్య’’ అనే వారి ప్రేరణ - రక్షణ మనకందరికీ లభించును గాక!
మోక్షము అనే అన్నమును ప్రసాదిస్తూ మా మనస్సులకు సంసార సాగరమునుండి ఈవలకు తెచ్చెదరు గాక।

రుద్రయోగమే సత్యము!
సత్యమేవ జయతే!

ఇతి అథర్వశిరోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
అథర్వణ వేదాంతర్గత

2     అథర్వశిర ఉపనిషత్

అధ్యయన పుష్పము


(సర్వాత్మకుడు, ఏక-అక్షరుడు అగు రుద్రమూర్తి యొక్క ఏకాదశమూర్తులైనట్టి అజ, ఏకపాద, అహిర్భుధ్యు త్వష్ణ, రుద్ర, శంభు, హర, త్ర్యంబక, ఈశాన, త్రుభువన రూపములకు - అధ్యయన సిద్ధికై నమస్కరిస్తున్నాము.)

‘‘ఓంకార స్వరూపుడు, సర్వాత్మకుడు, సర్వతత్త్వ స్వరూపుడు అగు రుద్రభగవానునికి నమస్కరించుచున్నాము’’.

అథర్వశీర్‌ష్ణ మహర్షిభ్యోన్నమః।

(అథర్వశిరము = అథర్వవేదమునకు శిరస్సు వంటి ఉపనిషత్ సారవిశేషము)


1.) ప్రథమ ఖండము - రుద్ర తత్త్వము

ఒకానొక సందర్భములో దేవతలు రుద్రభగవానుని దర్శనముకొరకై సువర్ణ-ధామమగు రుద్రలోకమును సందర్శించారు. భక్తి ప్రపత్తులతో జగదీశ్వరుడు, జగద్గురువు, జగత్ ప్రేరణశక్తి స్వరూపుడు అగు రుద్రదేవునికి ప్రదక్షిణ నమస్కారము సమర్పించారు. పారిజాత పుష్పములను స్వామి పాదపద్మములకు ప్రేమతో సమర్పించారు. స్వామికి ఎదురుగా సుఖాశీనులైనారు.

రుద్రభగవానుడు దేవతలను ప్రేమార్ద్ర దృక్కులతో ప్రశాంతంగా చూచారు. ‘‘బిడ్డలారా! ఏమి కావాలో కోరుకోండి’’ అన్న అర్థం వచ్చే ముఖకవళికలతో చిరునవ్వు చిందించారు.

అప్పుడు దేవతలు,
‘‘స్వామీ! భవుడా! శర్వుడా! ఈశానుడా! పశుపతీ! భీముడా! ఉగ్రుడా! మహాదేవా! మీ కరుణాకటాక్ష వీక్షణచే మేము పునీతులము అయ్యాము.
మాకు చెందినదంతా సర్వదా మీయొక్క విభవ చమత్కారమే కనుక, ఇక క్రొత్తగా కోరుకోవలసినదేమున్నది? మేమంతా మామా లోకాలలో మీ దయచే సుఖ - శాంత - ఐశ్వర్య - ఆనందములతో వర్థిల్లుచున్నాము!
హే భగవాన్! వాస్తవానికి శివతత్త్వజ్ఞానమే వాస్తవమైన సంపద. మిగతాదంతా స్వప్నసదృశమే కదా!
అందుచేత మీ తత్త్వము ఏమిటి? మీరెవరు? ఎట్టివారు? అనునది తెలుసుకొనుటకై మిమ్ములను శరణువేడుచున్నాము.
మీ వాస్తవ స్వరూపము ఏమైయున్నది? మేము ఆత్మానంద స్వరూపులగు మీయొక్క రుద్రతత్త్వమును మీ నుండి విని, మీ గురించిన ఉపాసనాక్రమమును మరింత ప్రవృద్ధపరచుకోగోరుచున్నాము.
తద్వారా ‘శివో2హమ్’, ‘నారుద్రో రుద్ర మర్చతి’, ‘జీవో శివః - శివో జీవః’ రుద్రసూక్త మహావాక్యములను సిద్ధించుకోగలుగుతాము అనునది మా ఆశయము.
అందుచేత, రుద్రతత్త్వ విశేషాలు వివరించమని మిమ్ములను మరొక్కసారి వేడుకుంటున్నాము."

అంతా విని రుద్రభగవానుడు జీవులందరినీ ఆనందింపజేయునట్లు అలవోకగా చిరునవ్వు చిందించారు. మధురమైన శబ్దములతో రుద్రరూప స్వస్వరూప-ఆత్మతత్త్వమును (లేక) రుద్రతత్త్వమును ఈ విధంగా ప్రవచించసాగారు.

- - -

బిడ్డలారా! వినండి!

అహమ్ ఏకః ప్రథమమ్ ఆసం వర్తామి చ! భవిష్యామి చ!

ఈ సృష్టికి ప్రప్రథమంగా మునుముందుగా, మొట్టమొదటగా ఉన్నది నేనే! ఈ సృష్టి లేనప్పుడు - ఉన్నప్పుడు కూడా యథాతథ పూర్ణానంద నిర్గుణ స్వరూపుడను! అందుచేత సనాతనుడను.
→ సృష్టికి ముందే నేనున్నాను.
→ సృష్టి సమయంలోనూ ఉన్నాను. నా త్రిగుణవిశేషమే ఈ సృష్టి! గుణములకంటే మునుముందుగా ‘గుణి’ ఉండి ఉండాలి కదా! అట్లాగే ఈ ‘సగుణ సృష్టి’కి ముందుగా నిర్గుణుడనై, ఆ తరువాత ‘గుణి’నై ఉంటున్నవాడను నేనే।
→ భవిష్యత్‌లో (సృష్టి లయించినా కూడా) నేను ఉండియే ఉంటాను. అహమ్ సత్ ఆనంద స్వరూపః।

అందుచేతనే ‘సదాశివ’ శబ్దముయొక్క శబ్దార్థమై సర్వదా, సర్వత్రా శివస్వరూపముగా ప్రకాశించుచున్నాను.

మరొక విషయం!

న అన్యః కశ్చిత్ మత్తో వ్యతిరిక్త। - ఇతి।

కల గనేవానికి వేరైనది - వ్యతిరిక్తమైనది (ఆతడు వద్దనుకొన్నది) కలలో ఏదైనా ఉంటుందా? ఉండదు, అట్లాగే, నాకు భిన్నమైనది, అన్యమైనది (వేరైనది), వ్యతిరిక్తమైనది అంటూ ఈ సృష్టిలో ఎక్కడా ఏదీ లేదు. ఉండదు. (మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి। మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ। - భగవద్గీతాచార్యులవారు)

→ ఈ సృష్టికి భావనను, భావించువాడిని, కర్తను, రచయితను, ఆస్వాదించువాడను కూడా నేనే! బ్రహ్మగా ఉన్నది నేనే! సృష్టికిముందు, సృష్టిగాను, సృష్టి తరువాత… సర్వదా, సర్వత్రా సర్వముగా కనబడుచున్నది నేనే. ఈ సృష్టికి సంబంధించిన కనబడని అవ్యక్తమును కూడా నేనే!

ప్రాంచః, ప్రత్యంతో2హమ్! సమస్తముగా ప్రకాశించువాడను.
సమస్త ప్రకాశములకు ఆవలివాడను కూడా! అహమ్ ప్రత్యంచో।

ప్రాచః = ముందుగా,   ప్రత్యంతః = ఆ తరువాత కూడా నేనే.

సృష్టి యొక్క అనుభూతి - అనుభవములకు ఆధారభూతుడను. ఇంద్రియ విషయరూపమగు దృశ్యము కూడా నేనే। ఇంద్రియములకు మునుముందే ఉన్నవాడిని. ఇంద్రియములను ఉదయింప జేస్తున్నవాడిని! వాక్ - చక్షు - శ్రోత్ర - స్పర్శ - రస - మనో - ఇంద్రియ రూపములుగా కనబడుచున్నవాడను. అవన్నీ నాయొక్క కళలు. (I am the Artist while they are all my Arts).

క్రింద - పైన తదితర 8 దిక్కులలోనూ….దశదిశలా (దశ దిక్కులకు) స్థానభూతుడను! అవన్నీ నాయందే ఉన్నాయి. వాటియందు అంతటా ఉన్నవాడను కూడా నేనే।

ఈ దృశ్యములో పురుష - స్త్రీ - నపుంసక ఉపాధులుగా ఏమేమి కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా నాయొక్క చిదానంద కళా ప్రదర్శనమే! నేనే! నాటకంలో కనిపించే పాత్రలన్నీ నాటకరచయిత యొక్క కల్పనా చమత్కారములేకదా! నేనే రచయితనై ఇదంతా ఆస్వాదిస్తున్నాను.

గాయత్ర్యహమ్ : (గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీ తేన కథ్యతే)….గానము చేయువానిని (లేక) మననము చేయువానిని రక్షించు అర్థముగల గాయత్రీ స్వరూపుడను! (త్రి-గాయ = జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నావైన తురీయ రూపుడను నేను. గాయత్ + ఋత్ = పరమసత్యమగు ఆత్మతత్త్వ గానమును కూడా నేనే।).

‘ఓం’। ….ప్రణవ వేదమంత్రమును. భూర్భువస్స్వః - మహావ్యాహృతుల స్వరూపుడను.


తత్ సవితుః వరణ్యేం – 8
భర్గో దేవస్య ధీమహి – 8
ధియో యోనః ప్రచోదయాత్ – 8 …….. 24 అక్షరముల స్తోత్రమును

గాయత్రీ మంత్రము ద్వారా ఉపాసించబడుచున్నట్టివాడను. ముముక్షువులు శరణు వేడుచూ ‘‘మా యొక్క బుద్ధిని వికసింపజేయుండి’’…. అని ఉద్దేశ్యిస్తున్నది నన్నే!

సావిత్ర్యహమ్ : సవిత్రుడను. సత్ విత్ రతః। సత్-విత్‌లను వెంట నిడుకొని రతించువాడను. కాబట్టి సావిత్రీ తత్త్వము-నేనే।
సరస్వత్యహమ్ : నాదస్వరూపమగు (వాక్‌స్వరూపమగు) తత్త్వముగా ఉపాశించబడుచున్నది నేనే. [స+రసత్+వతీ సమస్తముయొక్క రస (Artistic) స్వరూపుడను]. ఈ ‘విశ్వము’నకు రస స్వరూపుడను. రసాస్వాదన చేయువాడను కూడా. స-రసత్‌వతుడను.
ఛందోరూపమును: వేద - మంత్ర - శాస్త్రములలో విశేషంగా వినబడు త్రిష్టుప్ - జగతి - అనుష్టు ఛందస్సులు నాయొక్క సారస్వత ప్రదర్శనమే! నా గురించిన వాక్ గమకములే!
యజ్ఞస్వరూపుడను : యజ్ఞ విధిలో కనిపించే → గార్హపత్యాగ్నిని।
→ దక్షిణాగ్నిని।
→ ఆహవనీయాగ్నిని।
నేనే! నా యొక్క తేజోవిభవమే!

యజ్ఞభావనతో (With a sense of understanding that my function is part of whole) - తమ విద్యుక్త ధర్మములు ఆశ్రయించువారికి నేను సులభ - సాధ్యుడను. వేదాంత విజ్ఞానములోని సత్యము (యమ్ సత్)ను నేనే। గోరూపముగా ఉన్నవాడను. సర్వరక్షకుడను। ఈ దృశ్యమంతా నా పరిరక్షణలోనే పర్యవేక్షించబడుతోంది.

ఇక్కడి జలము - రసము, అగ్ని - తేజస్సు, వాటి వాటి ధర్మములు…నేనే!

ఋక్ వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అంగిరసము (ప్రాణతత్త్వము) - నాకు చెందినవే। నన్నే ఉద్దేశ్యిస్తున్నాయి. తెలియబడేదంతా ‘నేనే’ కాబట్టి నా స్వరూపమే! వేద స్వరూపుడను! నాలుగు వేదముల పాండిత్యమును సముపార్జించువాడను కూడా నేనే! వేదార్థములను తెలుసుకొంటున్నది నేనే! వేదాంత స్వరూపుడను కూడా! తెలియబడే సమస్తమునకు ఆవల ‘‘తెలుసుకుంటూ ఉన్నవాడిని’’ - నేనే।

తెలుసుకొంటూ ఉన్నవాడిని తెలుసుకొంటూ ఉన్నట్టి ‘‘వేదాంత పురుషుడను’’. (I am the knower of the knower).

మార్పు - చేర్పులు లేనట్టివాడను. అక్షర స్వరూపుడను. అయితే మార్పు - చేర్పులన్నీ నాకు చెందిన వినోద చమత్కారములే. (కథారచయిత తాను వేరుగాను, యథాతథముగాను ఉంటూనే కథలో అనేక మలుపులు కల్పిస్తున్నట్లుగా) - ఈ జగత్తంతా నాయొక్క రచనా చమత్కార వినోదమే!

బంగారము వివిధ ఆభరణములుగా మారిందా? లేదు. అయితే వివిధ ఆభరణములుగా కనిపించేది ఏది? బంగారమే కదా! ఆ రీతిగా అక్షరుడను। క్షరుడను కూడా। క్షరమగు దేహ-గుణ స్వభావాదులు నేనే! మార్పు చెందని ఆత్మను నేనే! క్షరాక్షరో2హమ్।

ప్రతి జీవునిలోనూ పరమ సత్యమైనట్టి (నామ-రూప-గుణ-క్షరాక్షరములకు, స్వభావములకు ఆవల వేంచేసి యున్న) సత్-చిత్-ఆనంద (ఉనికి-ఎరుక-వినోద) స్వరూపుడను.

ఈ జీవులు ఒక సహజీవుడిని చూస్తూ ‘‘ఈతడి నామ - రూప - గుణ - స్వభావములు ఇట్టివి’’… అని అనుకుంటున్నాడేగాని, ‘‘ఈతడు సర్వ విశేషములకు పరమైనట్టి నిర్గుణ - నిరాకార శివస్వరూపుడేకదా!’’….అను తత్త్వదృష్టిని ఆశ్రయించలేకపోతున్నారు.

వాస్తవానికి చూచేవానిలోను, చూడబడేవానిలోను ఏకమైయున్న నిత్యసత్యము నేనే।

అజ్ఞానదృష్టి (గుణదృష్టి) ఉన్నంతవరకు తత్త్వదృష్టి అలవడదు. తత్త్వదృష్టి ఉన్నచోట గుణములు స్వయం-ఊహాకల్పితములు మాత్రమే!

ఈ విధంగా అత్యంత - పరమ రహస్యమై అందరియందు నేనే వేంచేసి ఉన్నాను. గోప్యో2హమ్!

అంతా నేనే అయి కూడా, ‘‘ఇదంతా నాకు వేరు కదా!’’ - అను (లేక) ‘‘ఇదంతటిలో నేను ఒక మూలగా ఉన్న వాడిని కదా!’’….అని భావనలో నిమగ్నమై ఉన్నప్పుడు, నా సర్వాంతర్యామిత్వము, సర్వతత్త్వస్వరూపము నాకు తెలియనిదై, నాకు తెలియబడవలసినదై ఏదో తెలియని రహస్యమువలె ఉండిపోతోంది! (దృష్టాంతము = స్వప్నము తనదైనవాడు స్వప్నములో కనబడని తీరుగా) రహస్యస్వరూపుడనై ఉండటంచేత - గుహ్యో2హమ్।

జనుల మధ్య ఉంటూనే జనరహిత (నిర్జన) స్థానమును ఆస్వాదిస్తూ ఉన్నవాడను! ఏకాంతుడను.
→ జనారణ్యమునందు ఏకాకినై ఉన్నట్టివాడను.
→ నిర్జనారణ్యములో కూడా నిండుగా అనేకముతో కూడి ఉన్నట్టివాడను।

పరస్వరూపుడగు నేను దేహములలోను, గుణములతోను ఉండవచ్చు గాక! అయినాకూడా, - సర్వదా నిర్వికారుడను! ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములకు సంబంధించిన ఏ దోషముచేత కూడా స్పృశించబడనివాడను. పరమపవిత్రుడను. పవిత్రమహమ్!

అగ్రం చ : ఈ దేహములకు మునుముందే ఉన్నవాడను. జగత్తుకు మొదలే ఉండి, ప్రకాశించుచున్న ప్రప్రథముడను। అంతటికీ మహోన్నతుడను। పంచ భూతదేహమునకు, మనో-బుద్ధి-చిత్త-అహంకార- అవ్యక్తాదులకు ఆవల అగ్రస్థానముగా ప్రకాశించువాడను. అందుచేత అగ్రము అయి ఉన్నవాడిని. సనాతనుడను. (I am the top most of all also).

మధ్యం చ : ఆవలయే కాదు. ఈవలగా ఉన్నది కూడా నేనే! (అహమ్ ఆదిర్హి మధ్యంచ భూతానామ్ అంతయేవచ). ప్రతి ఒక్క జీవుని మొదలు - మధ్య - చివర కూడా నేనే! కనుక మధ్యగా ఉన్నది, ఉంటున్నట్లు భావించబడుచున్నది, భావించుచున్నట్టి వాడు కూడా నేనే! ‘‘మధ్య’’ అంతా నేనే! ఆది మధ్య అంతములు నాలోని నేనైన స్వయం ప్రదర్శనములే. (I myself am occupying the in-between-as well).

బహిశ్చ : ఈ జీవునియొక్క (ద్రష్టయొక్క) బాహ్యముగా కనిపించే పంచభూత జగత్తు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తానుభవములు, సంబంధ అనుబంధ బాంధవ్య విశేషములుగా కనిపిస్తున్నది - ఇదంతా నాయొక్క స్వరూపమే. స్వకీయ క్రీడా వినోద విన్యాసములే. (I am the beyond. Iam the outward).

పురస్తాత్ : వెనుకగాను, అంతరముగాను ఉన్నది నేనే! ఈవల ఉన్నది నేనే! (I am behind all this).
- ముందు-వెనుక, ఆవల-ఈవల, బయట - లోపల, ముందుగా-తరువాత-అటు తరువాత - ఆవల… అంతా నా స్వరూపమే.

దశ దిక్ చ అవస్థితమ్ - అనవస్థితమ్ : దశ దిక్కులలోను, దశదిక్కులుగాను ఉన్నది - కనిపించేది నా స్వరూపమే। దిక్కులన్నీ నాలో ఉన్నప్పటికీ, నేను దిక్కులలో చిక్కుకొని లేను. అందుచేత ‘అనవస్థితుడను’. ఎట్లా అంటే,….
స్వప్నమంతా నిండి ఉన్నది నేనే అయినప్పటికీ,
→ స్వప్నములో నేను లేను (అట్లా అయితే, స్వప్నముతో నేను ముగిసిపోవాలికదా!).
→ స్వప్నమంతా ఉన్నది నాలోనే! స్వప్నములోని 10 దిక్కులు నేనే, నాలోనే, నావే కూడా!

అట్లాగే, ఈ జాగ్రత్‌లోని దశ దిక్కులు, వాటిలో కనిపించేదంతా నాలోనే ఉన్నది. దానియందు నేను లేను. (మయా తతమ్ ఇదమ్ సర్వమ్ జగత్ అవ్యక్తమూర్తినా। మత్‌స్థాని సర్వభూతాని! న చ అహం తేషు అవస్థితః। - భగవద్గీత)

ఇదంతగా కనిపిస్తూ కూడా…ఇదంతగా నేను అవను. ఇదంతా నా యందు లేదు. నేను ఇద్దానియందు లేను. న చ అవస్థితమ్!

జ్యోతిరిత్యహమ్ : నేనున్నాను కాబట్టే సర్వము ఈ రీతిగా నాయొక్క వెలుగులో ద్యోతకమౌతోంది. జ్యోతి వెలుగు గదిలోని అన్ని వస్తువులను వెలిగింపజేయుచున్నది కదా! మనో బుద్ధి చిత్త అహంకారాలతో సహా ఈ సర్వము వెలిగింపజేయుచు, ఉనికిని ప్రసాదించు జ్యోతిస్వరూపుడను। పరంజ్యోతినై అంతా వెలుగొందుచున్న వాడను. తేజో రూపుడుగా సర్వత్రా వేంచేసినవాడనై ఉన్నవాడను.

ఏకస్సర్వేచ మామేవ : ఇక్కడి ఏకము, అనేకము మొదలైనదంతా కూడా నేనే! అనేకముగా కనిపిస్తూ ఏకముగా అనిపించటమే శివతత్త్వ జ్ఞానము!
- బంగారు లోహము - అనేక ఆభరణములు…ఉభయము బంగారమే కదా! నాయొక్క ప్రదర్శనమే ఏకము - అనేకము కూడా!

మాం యో వేద….సర్వాన్ దేవాన్ వేద। : ఓ దేవతలారా! దేవతాశ్రేష్ఠులారా! దిక్-జ్యోతిర్మండల దేవతారూపులారా! ఇది వినండి. నేను ఎవ్వరో, ఏమిటో, ఏ రీతిగా సర్వస్వరూపుడనో, స్వస్వరూపుడను కూడానో,… తెలుసుకున్నవాడు - (నన్ను ఎరిగితే) సర్వదేవతలను ఎరిగినవాడగుచున్నాడు సుమా! ఎందుకంటే నేనే సర్వదేవతా స్వరూపుడను. ఎవ్వరు ఏ దేవతను ఆరాధించినా, ఉపాసించినా కూడా నన్ను ఆరాధిస్తున్నట్లే! నన్ను చేరే ప్రయత్నమే అదంతా కూడా. (సో2పి మామేవ యజంతి।)

మట్టిని తెలుసుకొంటే మట్టి బొమ్మల గురించి వేరుగా తెలుసుకోవలసినదేముంటుంది? ఒకే మట్టి అన్ని మట్టి బొమ్మలుగా అయి ఉన్నది కదా! నేనే సర్వదేవతా స్వరూపుడను! (మృత్తికైవ సత్యమ్)।

ఈ జీవుడు ‘‘నన్ను తెలుసుకోవటము’’ అనగా - తనను తాను తెలుసుకోవటమే అగుచున్నది సుమా!

గాం - గోభిః బ్రాహ్మణాన్ - బ్రాహ్మణేన, హవీగ్ంషి - హవిషా, ఆయుషా : నేనే ఈ భూమినంతటినీ సూర్యకిరణములచేతను, వేదాధ్యయన - వేదననినాదములచేతను, వేదములను గానం చేస్తున్నట్టి బ్రహ్మజ్ఞులగు భూదేవతలగు బ్రాహ్మణుల చేతను, అగ్నికి సమర్పించబడే హవిస్సు - ఆజ్యము (నేయి) చేతను, సర్వజీవుల జీవితాంశల ప్రదర్శనములచేతను నింపి ఉంచుచున్నాను!

నేనే బ్రహ్మజ్ఞులయందు బ్రహ్మజ్ఞానముగాను, హవిష్షు సమర్పించువారియందు సమర్పితభావముగాను, ఆయుష్మంతుల ఆయుష్షుగా ప్రదర్శనమగుచున్నాను.

సత్యయజ్ఞ ధర్మములతో ఈ భూమిని రసమయము, రసవత్తరము చేస్తున్నది నేనే!

ఓ దేవతలారా! నేనే మీ అందరి రూపము కూడా! శుభమగు గాక!

- - -

ఈ విధంగా పలుకుచూ ఆ రుద్ర భగవానుడు క్రమంగా తేజోరూపుడై, తేజోమయుడై…. దేవతలు చూస్తూ - చూస్తూ ఉండగా…. చిరునవ్వులు చిందిస్తూనే అంతర్థానమయ్యారు.

దేవతలు అప్పుడు ‘‘స్వామి ఎక్కడ?’’ అని పరికించి చూచినప్పటికీ, వారికి భౌతికమైన కళ్ళకు కనిపించనే లేదు!

అప్పుడు ఆ దేవతలు ఆ రుద్రతత్త్వాన్ని ధ్యానం చేయసాగారు. ఒక్కచోట నిలబడి ఊర్ధ్వబాహువులు కలవారై (రెండు చేతులు పైకి ధారణ చేసినవారై) పరమేశ్వరుడు - సర్వాంతర్యామి అగు ఆ రుద్రభగవానునికి ఈ విధంగా స్తుతించటం ప్రారంభించారు!


2.) ద్వితీయ ఖండము - దేవతల రుద్రస్తుతి

దేవతలు : వేద - వేదాంగ - వేదాంత శాస్త్రములచే ఎవ్వరైతే ‘‘రుద్రుడు, భగవంతుడు’’ అని (తత్ శం యో ఆవృణీ మహే, గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే - అని) కీర్తించబడుచున్నారో,
ఎవ్వరైతే సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, సృష్టి విశేషములైనట్టి భూ-భువర్-సువర్-మహర్-ఇత్యాది పేర్లుగల 7 + 7 = 14 లోకములను (ఊర్ధ్వ = భూ, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్య లోకములు,
అధో = అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల పాతాళ లోకములు) తన తేజోరూపంగా విలసిల్లి ఉన్నారో….,
అట్టి రుద్ర పరమాత్మకు భక్తిపూర్వకముగా నమస్కరించుచున్నాము.

ఓ రుద్రభగవాన్! పరమశివా!!

- - -

వేదములకు శిరోరూపమగు ఓంకార రూపుడవు, తెలియబడే ఈ ఎదురుగా ఉన్న విశ్వరూపుడవు కూడా నీవే। తెలియబడుచున్నదంతా నీవే। మాలో వేంచేసియుండి ‘‘తెలుసుకొనుచున్నవాడు’’ కూడా నీవే!

ప్రప్రధమ మంత్రమగు ‘ఓం’ కారము యొక్క ఉపాసనచే ఏది ఆత్యంతికమై తెలియవస్తోందో, సర్వ దేవతల మంత్రములచే కూడా ఆ ఆత్యంతిక విశేషమే అగుచున్నది. యథా ప్రథమంత్రమ్ ఉక్తావా, ఆద్యం, తే తథా సర్వమంత్రేషు ద్రష్టవే! అందుచేతనే సమస్త దేవతా ఉపాసనలు ‘ఓం’ - ప్రణవముతోనే ప్రారంభించబడుచున్నాయి.

(పై వర్ణనములన్నీ ఈ క్రింది వాక్యములకు కూడా స్తుతి వచనములు అగుచున్నాయి).
• అంతటా నిండి ఉండుటచేత మీరే విష్ణువు.
• ఇహ పరతత్త్వములు మీకు చెందినవే కనుక, మీ లీలా ప్రదర్శనమే కనుక మీరే పరమేశ్వరుడు.
• ఈ ‘అహమ్-మమ’ రూపములతో కూడిన ప్రకృతి మీకు చెందివే కనుక మీరే ఉమ.
• మీరు కానిది ఎక్కడా ఏదీ లేదు. కనుక, దీనినంతటినీ, నడిపిస్తున్న నాయకత్వము మీకు చెందినదే. కనుక, మీరే వినాయకుడవు.
• దైవీ సంపత్తికి రక్షకుడు మీరే కనుక, దేవసైన్య నాయకుడగు స్కందుడవు.
• ఇంద్రియములకు అధిపతివై సర్వ దేహములలో సర్వదా వేంచేసి ఉండటము చేత ఇంద్రుడవు.
• మీ తేజస్సుచే సర్వమును వెలిగిస్తూ (హవ్య వాహనుడవై) సమర్పించబడుచున్నదంతా దేవతలకు అందించుచున్నారు. కాబట్టి మీరే అగ్నివి. హవ్యవాహనుడవు.
• భూ- భువర్-సువర్-మహర్-జనో-తపో-సత్య (ఊర్ధ్వ) లోకములన్నీ నిండి ఉన్నది మీరే। అథోలోకములలో కూడా నిండి ఉన్నది మీరే।
• పంచభూతమయుడవు కూడా నీవే। పృథివి, అప్పు (జలము), తేజో, వాయు, ఆకాశములు నీయొక్క రూపాలే!

హే రుద్రభగవాన్! దేవాదిదేవా।

సూర్యుడుగా సర్వము తేజోమయం చేస్తూ దివారాత్రములను (Day and Night) కల్పించుచున్నది, చంద్రుడుగా రసస్వరూపులై భూమిపై ఓషధులను ప్రవేశింపజేస్తున్నది కూడా మీరే.

ఆకాశంలో కనిపించే పాలపుంతలు, నక్షత్ర మండలములు, నవ గ్రహములు మీరే. ప్రాణశక్తి మీ రూపమే.

మీరే కాలస్వరూపుడు. కాలముచే నియమితమగుచున్నది కూడా మీరే. కాలముతో నశించే మృత్యుతత్త్వము, ఆ మృత్యువుకు నాయకుడగు యముడు కూడా మీరే.

ఈ విశ్వము, ఈ సర్వము, ఈ సర్వ విశేషాలు, వీటన్నిటికీ ఆధారమై వెలుగొందు శివానందస్వరూపులు మీరు. మీరు ఎక్కడ ఉన్నారు? మరెక్కడో లేరు! మాయందే మాకు సర్వస్వమై, అభిన్నమై, అద్వైతరూపులై సర్వదా, సర్వేసర్వత్రా వేంచేసియే ఉన్నారు!
(సాంబ యేవ స్సహాయః - అను ఆర్యవాక్యానుసారంగా) - మిమ్ములను సర్వదా శరణు వేడుచున్నాము.


3.) తృతీయ ఖండము - అంతా నీవేనయ్యా।

తండ్రీ! రుద్ర భగవాన్! నీవు సర్వస్వరూపుడవు! సకలతత్త్వమయుడవు! కేవలుడవు! ప్రణవ స్వరూపుడవు!

(ఆదౌ) ఓం (మధ్యే) భూ - భువర్ - సువర్ (అంతే శీర్ష్) ‘‘ఓం’’ జనతి

ఓం భూర్భువస్సువః జనతి ‘ఓం’…..అను గాయత్రీ మంత్రము యొక్క మంత్రదేవత - మనన స్వరూపము - ఆశయము, తత్-పధకుడు (గురువు) ….అంతా నీవేనయ్యా!
(1) ఆదిలో…‘ఓం’, (నిర్విషయానంద) - కేవలము.
(2) మధ్యలో….‘‘భూర్భువస్సువః’’ (సలోక-విషయానందము) - సృష్టి - స్థితులు.
(3) అంతములో….స్వాహాజనత్ ‘ఓం’ (ప్రపంచలయానందము) - లయము.
అయినట్టి ఓ ప్రణవస్వరూపా!

నీవు ‘‘విశ్వరూపుడవు! విశ్వేశ్వరుడవు! విశ్వాధారుడవు! విశ్వాస్వాదుడవు! విశ్వత్యాగుడవు! అవిశ్వుడవు! ఇవన్నీ ఒక్కసారే అయి ఉన్నావు. అద్వితీయమగు బ్రహ్మము నీవే।

- - -

ద్వివిధంగా
→ జీవాత్మ + పరమాత్మగా,
త్రివిధంగా
→ ద్రష్ట, దర్శనము, దృశ్యముగా,
ర్ధ్వమ్‌గా
→ ఆకాశమునకు ఆవల, సహస్రారమునకు ఆవలగల నిర్విషయచైతన్యాత్మగా….,
అధశ్ఛ
→ ఈవల గల పంచభూత + పంచతన్మాత్ర + పంచకర్మేంద్రియ-పంచజ్ఞానేంద్రియ-శబ్దస్పర్శాది దృశ్య విషయములుగా….,
శాంతిశ్చ
→ పరమశాంతము - వృత్తిరహితము - సర్వసాక్షి అగు ఆత్మదేవునిగా….,
పుష్టిశ్చ
→ సర్వజీవులకు పరిపోషణకర్తగా (పోషితమ్ ఇతి పుష్టిః), సంరక్షకుడుగా, సమృద్ధి ప్రసాదించువాడవుగా,
తుష్టిః
→ ఆహ్లాదకరుడుగా, ఆప్యాయత-ఆనందము-ఆకర్షణ-ఆమోదము-ఉత్సాహము - ఉత్తేజము - ఉల్లాసము కలిగించువాడుగా ఉన్నది నీవే! సర్వాత్మకుడుగా ప్రకాశిస్తూ ఆయారీతులుగా అనుభూతమగుచున్నదంతా శివస్వరూపమగు నీ మహిమయే!

మిమ్ములను మాయందు సర్వదా దర్శిస్తూ పవిత్రులమవటానికి ఈ వర్ణనమంతా మేము (మీగురించి) పారాయణము చేస్తూ ఉంటామయ్యా!

మా పారాయణ వస్తువు మీరే!

ఈ పారాయణము జదరుగుచున్నది మీ గురించి, మీ కొరకై, మీ వలన, మీ చేతనే।

- - -

అపాం - ఆనందసాగరుడవు। అట్టి విశ్వేశ్వరుడువగు మీ దర్శనముచే, మీ తత్త్వమును ఈ రీతిగా యోచన చేయుచుండుటచే ధన్యులమగుచున్నాము.

మీరే ఉమా (ఉ = అనుభూతి, మ = అనుభూతి పొందువాడు, ఉమ = ప్రకృతి, శక్తిస్వరూపిణి, అమ్మవారు)….స్వరూపులు! ప్రకృతి స్వరూపులు! అందుచేత మీ స్మరణ - దర్శన - కీర్తనలచే ఇహము - పరము (This side = అమ్మవారు, That side = అయ్యవారు) లేక ‘అమ్మయ్య’ను పొందుచున్నవారమగుచున్నాము. భౌమ-అభౌమానందమును పొందుచూ - అమృతస్వరూపులము అగుచున్నాము. ఆనందజ్యోతి స్వరూపులమగుచున్నాము. ఆత్మయొక్క సామీప్యముచే ధూర్తము - అనర్థకారకము అగు ఇంద్రియ విషయములను సాక్షిత్వభావనచే జయించి వేస్తున్నాము. అమృత స్వరూపులగు మిమ్ములను పొందిన తరువాత ఇక ఈ ఇంద్రియ విషయ జగత్తు - జన్మ - మృత్యువులు మమ్ములను సమీపించలేవు! తాకలేవు! ఓ మృత్యుంజయా! నమో నమః।

క్షరము లేని మీ యొక్క అక్షర - ప్రణవ స్వరూపము సర్వలోక హితకరము. శివము. శాంతము. శివానంద ప్రదము. అట్టి మీయొక్క అక్షరపరబ్రహ్మ స్వరూపమే ఎల్లప్పుడూ ప్రజాప్రతి (సృష్టికర్తయగు బ్రహ్మ)చే దర్శించబడుతోంది.

మీయొక్క తత్త్వము ఇంద్రియ-మనో-ప్రాపంచకమైన బుద్ధి విభాగములకు విషయము కాదు కాబట్టి అత్యంత సూక్ష్మము అయి ఉన్నది.
మీ స్వరూపము పరమశాంతము. సౌమ్యము. పరిపూర్ణము. మాయొక్క అంతరంగ చతుష్టయమును ఉపయోగించి మీ స్వరూపము తెలుసుకొనేది కాదు!

తెలుసుకొనుచున్నట్టి మేమే మీ స్వరూపము. ఇక అది తెలియబడుదానిలో నిర్వచించి ఏం వెతుకుతాం? (What is the use of searching for ‘I’ in all that being known?) అందుకే మిమ్ములను ‘అగ్రాహ్యము’ అంటూ ఉన్నాము.

మీరే స్వీయ తేజస్సుచే ‘మేము’గా ఉన్నారు.

స్వీయ తేజస్సుచే మీయొక్క…

చైతన్యపరచుచున్నారు। ఉత్తేజపరుస్తున్నారు।

సర్వమునకు ఆవల ఉండి….,
సర్వమును ప్రదర్శించుచూ…..,
సర్వమును ఉపసంహరిస్తున్నది….మీరే!

ఒకానొకప్పుడు సర్వమును దిగమ్రింగుచున్నట్టి ఓ మహాగ్రాసా! సర్వాత్మకా! ప్రణవస్వరూపా! మమస్వరూపా! మమాత్మస్వరూపా! హే
రుద్రభగవాన్!

నమో నమః।
నమో నమో నమః।
నమో నమో నమో నమః।।


4.) చతుర్థ ఖండము - ఈశానాయ నమో నమః।

దేవతలు - ఇంకా ఇట్లా గానం చేయసాగారు.

హే రుద్ర భగవాన్!

మీరు మాయొక్క హృదయ స్వరూపులు.

అట్టి మీ హృదయమునందే (అంతర హృదయ ఆభ్రాంతమధ్య హృదయాంతరంగమునందే) సర్వదేవతలు ప్రతిష్ఠితులై ఉన్నారు! సర్వప్రాణులు మీ హృదయమునందే ప్రవర్తమానులై ఉంటున్నారు.

అంతేకాదు ప్రాణులమగు మా అందరియొక్క హృదయపద్మములో సూత్రాత్మస్వరూపులై, త్రిమాత్రలగు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు వేరై, పరమై…, తురీయాత్మ స్వరూపులై (సర్వసాక్షి అయి) పరమాత్మస్వరూపులుగా వేంచేసి ఉన్నారు!

ఈ విధంగా మీరు అద్వితీయులు। మేమంతా మీకు అభిన్నులము।

హే రుద్రపరంధామా!

ఉత్తర దిక్ సంజ్ఞయగు నివృత్తి (పర) స్థానమే మీ శిరస్సు.

దక్షిణ దిక్ సంజ్ఞయగు ప్రకృతి (ఇహ) స్థానమే మీరు సంచారము చేయుచున్న ప్రదేశము.

ఉత్తరము శిరస్సు → కేవలము

దక్షిణము పాదములు → సందర్భము (జగత్తు)

• ఏది మీయొక్క నివృత్తి స్థానమగు ఉత్తరమో, అదియే ‘ఓం’కారము.
• ఏది ఓంకారమో, అదియే ప్రణవము (లేక) శబ్దబ్రహ్మము. ఉద్గీథము. గానరూపబ్రహ్మము.
• ఏది ప్రణవమో,….అదియే (కలలోనిదంతా ఆ కల కనేవాని స్వప్నచైతన్య విస్తారమే అయిన విధంగా) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో సర్వవ్యాపకము.
• ఏది సర్వవ్యాపకమో, అది (స్వప్నద్రష్ట యొక్క స్వప్న చైతన్యము ఒక స్వప్నముచే పరిమితము కాని విధంగా)….అనంతము!అపరిమితము! స్వప్న దృశ్యము దృష్ట్యా - స్వప్నము తనదైనవాడు అనంతుడే కదా।
• ఏది అనంతమో అది ‘‘నేను జీవాత్మను. అందుచేత పరిమితుడనుగదా!’’…అనే పరిమిత భావననుండి తరింపజేయునది కాబట్టి తారము (తారయితేతి తారమ్)
• ఏది తారమో అది సూక్ష్మము. ఇంద్రియములకు కనిపించేదంతా స్థూలము. ఇంద్రియములను వెలిగించేది? అది ఇంద్రియ విషయము కాదు. సూక్ష్మ బుద్ధి (To sharp common sense) చేత మాత్రమే గమనించబడేది! అతిసూక్ష్మము.
• ఏది సూక్ష్మమో అది విషయదోషములకు అతీతము. కాబట్టి శుక్లము. నిర్మలము. పవిత్రము.
• ఏది శుక్లమో అది నిర్మలబుద్ధిచే మాత్రమే ఆస్వాదించబడగలిగేది. కనుక వైద్యుతము.

ఈ విధంగా దృక్ - ద్రష్ట - దర్శనము - దృశ్యము, సర్వజీవుల సహజరూపము పరబ్రహ్మమే!

ఆ పరబ్రహ్మము ఏకముగానే ఉన్నదిగాని, అనేకముగా అవటము లేదు.

ఆ ఏక స్వరూపుడే ఈ రుద్రభగవానుడు!

సర్వములోను, సర్వముగాను విస్తరించి ఉండటంచేత ఓ రుద్రదేవా! మీరే ఈశానుడు!

ఈ సర్వము ఈశ్వరస్వరూపమే! ఈశానమే! ఈశ్వరుడే! మీరే మహాదేవుడు! మహేశ్వరుడు!

స్వామీ! మీరే ఆ దేవదేవుడు। శరణు। శరణు। నమో నమో నమో నమః।।

- - -

ఈ ఈశానునిచేరి ఈశానత్వము సముపార్జించుకోవటానికే అధ్యాత్మశాస్త్రము, శబ్దబ్రహ్మశాస్త్రము ప్రవచనమౌతోంది. అట్టి ఆత్మశాస్త్ర రుద్రగానము గురించి మనము ఇప్పుడు శబ్దనిర్వచన పూర్వకంగా కొన్ని విషయాలు చెప్పుకొంటున్నాము.

- - -

(1) ఆత్మానంద స్వరూపుడగు రుద్రభగవానుని ఎందుచేత ‘ఓం’కార స్వరూపుడుగా, చెప్పుకుంటున్నాము? అధ కస్మాత్ ఉచ్యతే ‘ఓం‘కారో?
‘ఓం’ అని ఉచ్ఛారణ చేస్తున్నంత మాత్రముచేత, రుద్రస్వరూపులగు మిమ్ములను తలచినవాడై ఈ జీవుడు ‘నేను శరీరమును’ అనబడే శరీర భావము నుండి మీచే లేవతీయబడుచున్నాడు. మిమ్ములను ‘ఓం’ అని తలచినంత మాత్రము చేతనే మేము సముద్ధరించబడుచున్నాము. అందుచేత ఓంకార స్వరూపులుగా చెప్పుకుంటున్నాము! ’ఓ’ అను పిలుపుచే పలుకుతారు. వేదములు స్తుతించే ‘ఓం’కారము శివతత్త్వ స్వరూపులగు మీగురించే.

(2) ఎందుచేత మీరు ప్రణవస్వరూపులుగా, ప్రణవముగా చెప్పబడుచున్నారు? అథ కస్మాత్ ఉచ్యతే ప్రణవో?
మీ నామమును (ఓం రుద్రాయ నమః । ఓం నమః శివాయ।)….ఉచ్ఛరించిన మాత్రముచేత ఋక్-సామ-యజో-అథర్వణ వేద, అంగిరస (ప్రాణతత్త్వములు), [శిక్ష (పాణిని), వ్యాకరణ (పాణిని), ఛందస్సు (పింగలముని) నిరుక్త (యస్కముని), జ్యోతిష, కల్పములనబడే వేద] - షడంగములు శ్రద్ధతో నిర్వర్తించిన ప్రయోజనమును పొందుచున్నాము! బ్రహ్మయజ్ఞము (లేక) ఆత్మయజ్ఞము నిర్వర్తించిన వారమగుచున్నాము. మీ నామోచ్ఛారణచే మీరు బ్రహ్మమును పొందింపజేస్తున్నారు. మీరు సహజంగానే ప్రణవస్వరూపులు। ప్రణవతీతి ప్రణవః। పొందింపజేస్తున్నది కాబట్టి ప్రణవము. మీరు మమ్ము బ్రహ్మస్వరూపులుగా తీర్చిదిద్దుచున్నారు కాబట్టి ప్రణవస్వరూపులు! ప్రణయత్వత్ ప్రణవమ్ - జ్వలింపజేయునది కాబట్టి ప్రణవము. మాలోని సముత్సాహము మీరే కాబట్టి, మీరు మాకు ప్రణవస్వరూపులు.

(3) మిమ్ములను ‘సర్వవ్యాపి’ అని ఎందుకు అభివర్ణిస్తున్నాము? అథ కస్మాత్ ఉచ్యతే ‘సర్వవ్యాపీ’?
నువ్వుగింజలన్నిటిలోను, మాంసపు ముద్దలోను అంతటా నూనె ఉంటుంది కదా! ఆ విధంగా రుద్రతత్త్వము, సర్వజీవులయందు, సర్వమునందు ఓత-ప్రోతమై ఏర్పడి ఉన్నది. రుద్రనామోచ్చారణ చేత మేము ఆత్మయొక్క సర్వ వ్యాపకత్వమును, సర్వాంతర్యామిత్వమును ఎరుగుచున్నాము. అందుచేత మిమ్ములను ‘సర్వవ్యాపి’గా చెప్పుకొంటూ ఉపాసిస్తున్నాము.

(4) కస్మాత్ ఉచ్యతే ఆనంతో? ‘అనంతుడు’ అని మిమ్ములను ఎందుకంటున్నాం?
మీ నామోచ్చారణ చేత మీయొక్క అద్యంతరాహిత్యము మాకు తెలియవస్తోంది. ‘‘స్వస్వరూపాత్మకు బాహ్య అంతరంగములకు సంబంధించిన ఆద్యంతములు ఏవీ లేవుగదా!’’ అనునది మేము గమనించుచున్నాము. అందుచేత ‘‘ఓం అనంతాయ నమోనమః’’ అని ఉచ్ఛరిస్తూ మిమ్ములను భజిస్తున్నాము!

(5) అథ కస్మాత్ ఉచ్యతే తారమ్? తారమ్ (తారుడు) అని పిలుస్తున్నాము ఎందుకని?
మీ నామోచ్చారణ చేత మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొందే శోకము నుండి (మరియు) జన్మ - వ్యాధి - ముసలితనము - మరణ - పునః జన్మ సంసార మహత్ భయములనుండి విడివడుచున్నాము! ‘‘మేము ఆత్మస్వరూపులమేగాని, భౌతికరూపమాత్రులము కాదు’’ అని గ్రహిస్తూ, శివతత్త్వాత్మత్వమును ఆశ్రయిస్తున్నాము. ‘‘చిదానంద రూపమ్ - శివో2హమ్! శివో2హమ్’’ అను అనుభూతిలో ప్రవేశించగలుగుచున్నాము. (సర్వం వ్యర్థం మరణసమయే, సాంబ ఏకః సహాయః). మిమ్ములను నామస్మరణ సహాయంతో శరణువేడుచున్నాము.

మమ్ములను మీ నామస్మరణ సంసార దుఃఖములనుండి తరింపజేస్తోంది కనుక ‘తారము’ అని చెప్పుకొంటున్నాము.

(6) అథ కస్మాత్ ఉచ్యతే సూక్ష్మమ్? మిమ్ములను సూక్ష్ముడు అని ఎందుకంటున్నాం?
మీ నామము ఉచ్ఛరిస్తూ ఉండగానే మా యొక్క బుద్ధి స్థూలత్వమును అధిగమించి సూక్ష్మత్వమును పొందుచున్నది. సూక్ష్మత్వముచే సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మత్వమును, శివత్వమును సమీపించగలుగుచున్నాము. అందుచేత మిమ్ములను ‘సూక్ష్మము-సూక్ష్ముడు’ అని శ్లాఘిస్తున్నాము.

(7) అధ కస్మాత్ ఉచ్యతే శుక్లం? ‘శుక్లము’ అని పిలుస్తున్నాం. ఎందుకు?
క్లందతే క్లామయతే - మీ నామమును మేము ఉచ్ఛరిస్తూ ఉంటే మాయందలి సంసార సంబంధమైన రుసరుసలు, గుసగుసలు, బుసబుసలు తొలగుతూ వస్తున్నాయి. హృదయము నిర్మలమగు తెల్లరూపుగా (స్వాత్వికంగాను, ఆనంద ఉత్సాహపూర్వకంగాను) ప్రకాశమానమగుచున్నది. అందుచేత ‘శుక్లము’ అని చెప్పుకుంటూ వస్తున్నాం!

(8) అథ కస్మాత్ ఉచ్యతే ‘వైద్యుతమ్’? మిమ్ములను వైద్యుతము అని ఎందుకు ఆరాధిస్తున్నాం?
ఏ రుద్రనామము (లేక) శివనామము (లేక) ప్రణవము మేము ఉచ్ఛరిస్తూ ఉంటే, వెలుగు విరజిమ్ముతూ అజ్ఞాన గాడాంధకారము తొలగిపోతోందో, తత్ఫలితంగా దేహమంతా ఆత్మానందప్రకాశవీచికలచే నిండిపోతోందో-ఆకారణం చేత మిమ్ములను ‘వైద్యుతమ్’ అని స్తోత్రం చేయటం జరుగుతోంది.

(9). అథ కస్మాత్ ఉచ్యతే పరబ్రహ్మమ్? మిమ్ములను ‘పరబ్రహ్మము’ అని ఎందుకు పిలుస్తున్నాము?
మీ నామోచ్చారణకు సంతోషించినవారై, మమ్ము మీరు అజ్ఞానమగు ‘ఇహము’ అనే పరిమితము జ్ఞానానందమగు ‘పరము’ వైపుగా తోలుకొనిపోయి, మీయందు లయింపజేసుకొంటున్నారు. అందుచే మిమ్ములను ‘పరంబ్రహ్మము’ అని, ‘‘మాయొక్క పర(ఆవల) స్వరూపము’’ అని ఎలుగెత్తి చాటుకుంటున్నాము.

(10) అథ కస్మాత్ ఉచ్యతే ఏకో? మిమ్ములను ‘ఏకము’ అని కదా, స్తుతిస్తున్నాం! ఎందుకు?
ఏక స్వరూపులగు మీనుండి అనేక రూపములగు ఈ 14 లోకములు, లోకాంతర్గతములు కూడా క్రీడావినోదంగా బయల్వెడలుచున్నాయి. మీ సంకల్పముచే కల్పనా రూపాలుగా వెలువడే ఈ లోకాలు మరల మీయందు లయిస్తున్నాయి. అనగా మీ లీలావినోద సంకల్పమే ఈ సర్వలోకముల - జనుల సృష్టి, స్థితి, సంహారము కూడా। అనేకములను సృష్టిస్తూ, ఏకరూపులై ఉంటున్నారు కాబట్టి ఏకో ఏకః - ఏకో అనేకఃఅని మిమ్ములను గురించి చెప్పుకొంటూ శాంతిని పొందగలుగుచున్నాము. ఏకమగు మీరు అనేకముగా ప్రదర్శనమవటము మాయొక్క ఆనందచమత్కారము.

(11). అథ కస్మాత్ ఉచ్యతే ఏకో రుద్రః? ‘‘ఒక్క రుద్రుడు మాత్రమే’’… అని మిమ్ములను గురించి ఎందుకనుకుంటున్నాం?
వాస్తవానికి రుద్రభగవానులగు మీరే అన్నిటా అంతటా అన్ని రూపాలుగా అయి, ఏకమాత్ర స్వరూపులై ఉంటున్నారు. వేరువేరుగా కనిపిస్తున్న ఇదంతా ఏకరూపులగు మీరే అయి ఉన్నారు. మట్టి బొమ్మలన్నిటిలో మట్టి మాత్రమే వాస్తవానికి ఉన్నది. మిగతా ‘ఈ జంతువుల మట్టి బొమ్మ - ఆ ఈ ఆకారముల మట్టిబొమ్మ’…ఇటువంటి వన్నీ కల్పనా మాత్రమే కదా! మీకు ద్వితీయమనబడేది ఎక్కడా లేదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆవల గల తురీయస్వరూపులు మీరు! అద్వితీయులు. మా రూపముగా ఉన్నది మీరే। (సో2హమ్ భవతీతి।) మేమంతా మీ స్వరూపులమే.

• లోకాలన్నీ విస్తరించి ఉండటంచేత ఈశతో - ఈశానః….ఈశత్వముచే ఈశానులు.
• ఈ సర్వ దేహ సంపదలకు యజమానులు. జననీయః।
• ఈ లోకాలన్నీ వ్యావృత్తిగా జనింపజేస్తున్నట్టివారు. ప్రత్యంజనాః!
• ఈ లోకాల రూపంగా ఉన్నది మీరే। తిష్ఠతి!
• ఇవన్నీ పరిపాలిస్తూ, ఎప్పుడో ఇదంతా ఉపసంహరిస్తున్నది కూడా మీరే! ఉపసంహరతి!
• వీటన్నిటికీ మరొకప్పుడు మీచే ఉపసంహరించబడటంచేత మీయందే లయిస్తోంది. అందుచేత లయకారులు కూడా।
• సర్వజీవులలో హృదయాంతర్గత స్వరూపులై అతి రహస్యంగా దాగి ఉన్నది మీరే!
• ఈ భువనమంతా మీరు ‘‘ఏకోరుద్రః’’ అని సర్వదా నిర్హేతుక జాయమాన కరుణా స్వరూపులుగా ఉద్దేశ్యించబడుచున్నారు!

(12). అథ కస్మాత్ ఉచ్యతే ఈశానో? ఎందుకని మిమ్ములను ‘ఈశానుడు’గా చూస్తున్నాం? అంటున్నాం?
అచింత్యము - మహావైభవోపేతము అగు మీయొక్క నియమశక్తి చేతనే అవిద్యారూపమగు ఈ స్థావర - జంగమ జగత్తు రూపనామములతో సహా నియమితమగుచున్నది. జగత్తుకంతటికి స్వస్వరూప సంకల్ప విస్తరణచే ఈశానులు. ఈ ఇన్ని రూపాలు మీరే కాబట్టి ఈ దృశ్య జగత్తుకు ఈశానులు. మీరే పరాశక్తి - అపరాశక్తి స్వరూపులు.

మీరు స్వయం ప్రకాశానంద స్వరూపులు! మిమ్ములను అనేక విధాలుగా స్తుతిస్తున్నాము! ఏవైనా లౌకిక - ప్రాపంచక - దృశ్య సంబంధమైన సంపదలు కోరుకొనియా? కాదు!

పాలు పితికే ఉద్దేశ్యము లేకుండానే గోవుకు సమర్పించే పూజలవంటి మా స్తోత్రములును మీ పాదపద్మములకు భక్తితో - ప్రేమగా సమర్పించటమే మహత్‌భాగ్యముగా భావిస్తున్నాము!

మా ఇంద్రియములు విషయములను పొందుచున్నాయి. అయితే మా ఇంద్రియములు మావి కావు. వీటి ఈశ్వరుడుగా - నియామకుడుగా….ఇవన్నీ వీటి - వీటి విషయ - విషయపరంపరలతో సహా - మీవే! మీకు చెందినవే!

ఇక మోమో? మేమంతా మీకు చెందినవారము. మీరు అద్వితీయులు కాబట్టి, మేము మీకు అభిన్నులము.

మా మనో - బుద్ధి - చిత్త - అహంకారాలన్నీ మీకు చెందిన తోట లోనివి. మీ సొత్తు అయినట్టి వనపుష్పాలు. అందుకే మిమ్ములను ‘ఈశానుడు’, మాయొక్క ‘ఈశ్వరుడు’ అని భావిస్తున్నాం!

(13). అథ కస్మాత్ ఉచ్యతే ‘భగవాన్’? మిమ్ములను మేము ‘భగవానుడు’ అని చెప్పుకోవటం ఎందుకు?
• మీరు ఈ సమస్తము వెలిగించు ‘భగ’ స్వరూపులు కాబట్టి, సందర్శకులై ఉండటంచేతను,
ఆత్మ జ్ఞానము ప్రబోధించే జగద్గురువు కాబట్టి,
• యోగమార్గంలో యోగులంతా చిట్టచివ్వరికి, చేరుచున్నది మిమ్ములనే అగుటచేతను,
• సమస్త జీవులు జ్యోతిస్వరూపులై ఉండగా, - మీరు ‘‘జ్యోతికేజ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యహమ్’’ స్వరూపులై ఉండటముచేత,
• సర్వమును ‘తెలివి - ఎరుక’ అనే జ్ఞానాగ్ని - జ్యోతి శిఖలచే వెలిగించుచున్నారు కాబట్టి….
మిమ్ములను భగవంతుడు - అని సంభాషించుకుంటున్నాము. సేవించుకుంటున్నాము. పూజించుకుంటున్నాము.

(14). అథ కస్మాత్ ఉచ్యతే మహేశ్వరో? ‘‘మీరు మహేశ్వరుడు’’ అని ఎందుకని అంటున్నాం?
కళాకారుడికి కళా ప్రదర్శనమే ఆహారము. సంగీత విద్వాంసునికి సంగీతమే ఉపాహారము. అట్లాగే ఈ లోకాలన్నీ మీయొక్క ఉపాహారము. మీనుంచి బయల్వెడలి మీకే ఇవి భక్ష్య పదార్థములు (Food - Stuff for consumption) అగుచున్నాయి. (All this is coming out of your artistic way of enjoyment).
జన్మరహితులై కూడా లీలగా సృజిస్తున్నారు. క్రీడగా విస్తరిస్తున్నారు. వినోదంగా ఆనందిస్తున్నారు. విశ్రాంతి కొరకై వీటిలో విశ్రమిస్తున్నారు. విసుగు వస్తే చిన్నపిల్లవాడి చేష్టవలే మీలో లయింపజేసుకుంటున్నారు. అజస్త్రం సృజతి - విసృజతి - వాసయతి। అందుచేత ‘మహేశ్వరుడు’ అని ఆరాధిస్తున్నాం। (అజస్త్రం = ఎల్లప్పుడు).

(15). కస్మాత్ ఉచ్యతే మహా దేవో? మిమ్ములను ‘మహాదేవుడు’ అని ఎందుకని అంటున్నామంటారా?
సర్వభావాలకు ఆవల ‘భావన చేయువారు’ అయి మా అందరియందు సర్వదా వెలయుచున్నారు. ఆత్మజ్ఞానయోగీశ్వరులై మాపై ఆత్మజ్ఞానామృతమును కురిపిస్తున్నారు. మహత్తరమైన మహత్మ్యముతో అన్నివేళలా, అన్నివైపులా, ప్రజ్ఞానంద జ్యోతిస్వరూపులై ప్రకాశిస్తున్నారు. విజయం చేస్తున్నారు.
దేవతలకు దేవతలై ఉన్నారు. అసలు, మీ భావసారూప్యములే ‘మేము’ అయి ఉన్నాము.
అందుచేత ‘మహాదేవుడు’ అని ‘దేవాది దేవుడు’ అని మీరు మాచే స్తోత్రము చేయబడుచున్నారు.

ఇది రుద్ర చరితము!

రుద్రభగవానుడే అన్ని దిక్కులలో నిండియున్నారు. సర్వమునకు మునుముందుగా ఉండి ఉన్నట్టి చైతన్యమూర్తి। చైతన్యస్ఫూర్తి।

ఆయనయే ఈ బ్రహ్మాండగర్భమున ప్రజ్వలించు దివ్య తేజోతత్త్వము। ఆయనయే - నేను, నీవు మొదలైన సర్వనామములన్నీ కూడా.

రుద్రభఘవానుడే…
- అన్నిచోట్లా పుట్టియున్నవాడు. పుట్టుబోవువాడు. పుట్టుకయే లేనివాడు కూడా।
- జన్మ సహితుడు - జన్మ రహితుడు ఈతడే. జన్మలకు ముందువాడు, జన్మలప్పటివాడు, జన్మలకు ప్రత్యక్ స్వరూపుడు. తదనంతరము వాడు కూడా. సర్వదా సర్వమునకు వేరైన వాడు కూడా ఆయనయే!
- విశ్వమంతా ఆయన ముఖప్రదేశమే. విశ్వతోముఖుడు.
- విశ్వతః చక్షుః, ఉత విశ్వతోముఖో। విశ్వమంతా చక్షువులు, ముఖములు కలవాడు।
- విశ్వమంతా చేతులు - కాళ్ళు కలవాడు।
- అసంఖ్యాక బాహువులతో అసంఖ్యాక చిత్ర - విచిత్ర శబ్దములను పలుకుచున్నది, పలికిస్తున్నది ఈ రుద్రభగవానుడే। ఈ సర్వాత్మస్వరూపుడే!

పంచభూతములు, వాటి వాటి ధర్మములు….ఈయన యొక్క భౌతిక సంపదయే. మనో - బుద్ధి - చిత్త - అహంకారాలు, రుద్రునికి చెందిన అభౌతిక సంపద। మనమంతా ఈయనకు చెందిన సంపదయే।

త్రిలోకములు ఈయన యొక్క సంచార ప్రదేశములు.

ఈ రుద్రభగవానుడే ఆకాశము - భూమియొక్క ఉత్పత్తి స్థానమై, వాటియందంతటా ప్రేరకమూర్తిగా చెన్నొందుచున్నారు.

ఆ రుద్రమూర్తియే త్రిమూర్తి స్వరూపుడు ఆయనయొక్క మూర్తులమే మనమంతా కూడా! అనేకంగా కనిపించే ఏకరూపుడు.

అనేకంగా కనిపిస్తూ కూడా మనమంతా సర్వదా ఏకరూపులమే। రుద్రో2హమ్। రుద్రస్త్వమ్। రుద్రమిదమ్। సర్వమిదం రుద్రమయమ్! రుద్రుని అర్చించే మనమంతా రుద్ర స్వరూపులమే!

రుద్ర భగవాన్! సర్వాత్మకా!

మనందరి కేవలాత్మస్వరూపుడగు రుద్రభగవానుడే సర్వదా ఉపాసితవ్యుడు. ఉపాసించవలసినవాడు. నమో నమః ।। ఉపాసించ తగినవాడు. ఉపాసించబడుచున్నవాడు. ఉపాసించుచున్నవాడు.

ఏది వేదవాక్కులతో, వేదవాఙ్మయముచే ‘శివతత్త్వము’గా చెప్పబడుతోందో, అదియే మనము బుద్ధితో గ్రహించవలసియున్న మహత్తర విశేషము.

ఏ మార్గమును అనుసరించినవారై ఋషిపుంగవులు, పితృదేవతలు, అంతిమంగా ఏది సిద్ధింపజేసుకుంటున్నారో….
- ఆ పరమ పదమే పారాయణ స్థానము।
- అదియే రుద్ర పరమాత్మత్వము। రుద్రో2హమ్ ధామము।

ఈ రుద్ర భగవానుడు ఆత్మస్వరూపముగా ఒక వెంట్రుక యొక్క చిట్టచివరి భాగముకంటే కూడా అతిసూక్ష్మాతి సూక్ష్ముడు!
సర్వుల హృదయములే ఆయనను మనం సులభంగా గమనించగల నివాసస్థానము.

విశ్వరూపుడు। విశ్వేశ్వరుడు। విశ్వదేవుడు। స్వయం ప్రకాశకుడు। వేదములకు జన్మస్థానమైనవాడు। వరేణ్యుడు। సర్వశ్రేష్ఠుడు।
అంతఃకరణ నివాసి।

- - -

ఏ ధీమంతులైతే (సూక్ష్మ బుద్ధితో) తమయొక్క బాహ్య - అభ్యంతరములలో అట్టి రుద్రభగవానుని అనన్యభావులై చూస్తున్నారో….
- అట్టి వారు మాత్రమే శాశ్వత శాంతిని సముపార్జించుకొనుచున్నారు. తేషాం శాంతిః శాశ్వతమ్ నేతరాషామ్! ఆ పరమాత్మను అన్యముగా - ‘‘ఇక్కడ లేరు. మరెక్కడో ఉన్నారు. ఎప్పటికోగాని సిద్ధించరు’’ - అను అవగాహనతో దర్శించువారి శాంతి శాశ్వతత్వము సంతరించుకోవటము లేదు. అశాంతి తొలగుటలేదు. దర్శించువారి శాంతి శాశ్వతత్వమును సంతరించుకోవటము లేదు. అశాంతి తొలగుటలేదు.

ఏ పరమాత్మ :

• సర్వ దేహములందు ఏకము - సమము - అఖండము అయి వెలయుచున్నారో….,
• పూర్ణులై ఉండగా ఆతని మహిమచే పంచవిధములైన పంచభూతముల సమ్మేళనమై ఈ ప్రపంచము వర్తించటం జరుగుతోందో,
- అట్టి సర్వాధారుడగు పరమపరుషుని, దేవదేవుని ఆశ్రయిస్తున్నాము. అత్యంతిక శాంతికొరకై….నిదిధ్యాస చే ఏకాగ్రదర్శనం (Nothing else than that) చేస్తున్నాము! అనుకుంటూ అనుకుంటూ ఉండగా ‘‘అనిపించటము’’ అను ‘‘నిదిధ్యాస’’ను మాకు ఆ జగన్నాయకస్వామి ప్రసాదించెదరు గాక।

• ఈ ఇంద్రియాలు తమంతట తామే కదలుచున్నాయా? లేదు. స్వతఃగా చూస్తే ఇవి జడములు. ఇవి ప్రాణశక్తిచే కదల్చబడుచున్నాయి.
• ప్రాణముల అంతరమున మనస్సు ఉన్నది. మనస్సుచే ప్రాణములు చైతన్యవంతములగుచున్నాయి. ప్రాణములను మనస్సు కదలిస్తోంది!
• అట్టి మనస్సుయొక్క అంతరమున లింగశరీరము (లేక) సంస్కార దేహమున్నది. ఆ లింగదేహములో….క్రోధము, తృష్ణ, క్షమ లేకపోవటం, ఇతరులపై విసుగు, ఆశా భయములు, నిరాశా నిస్పృహలు మొ।।న….ఇవన్నీ ఉన్నాయి. లింగదేహము మనస్సును కదలుస్తోంది. అట్టి లింగ (లేక) సంస్కార దేహములో అజ్ఞానముచేత రూపము పొందుచున్నది. సర్వ ద్వేషములకు, భయములకు తృష్ణయే మూలము. అట్టి తృష్ణను బయటకు వెడలగొట్టి లింగదేహమునందు సర్వతత్త్వస్వరూపుడు - చిదానందస్వరూపుడు అగు రుద్ర భగవానుని స్థాపించుచుండెదము గాక। అప్పుడే నిజమైన శాంతి. ఆయనను అనునిత్యంగా హృదయమునందు స్థాపిస్తూ ఉండటమే మనము నిర్వర్తించే అనునిత్యోపాసన! అదియే ‘‘సో2హమ్ శివః - శివతత్త్వ’’ జ్ఞానము కైవల్యము, మోక్షము కూడా।

పాశుపత వ్రతము

ఏక స్వరూపుడు, శాశ్వతుడు, పురాణపురుషుడు అగు రుద్రభగవానుని హృదయమునందు (లేక) లింగ దేహమునందు తపస్సుచే అలంకరించబడిన బుద్ధికుశలతచే ప్రతిక్షేపించటమే ‘పాశుపత వ్రతము’.

స్వస్వరూపముతో సహా ఈ సమస్తము రుద్రరూపంగా నిర్మలము - సునిశితము అయినట్టి బుద్ధితో అనునిత్య సందర్శనమే - ‘పాశుపతవ్రతము’ యొక్క అంతిమ లక్ష్యము, ఆశయము, విధి-విధానము, స్థానము కూడా!
రుద్రుడు ధరించే భస్మమే అంతా కూడా! భస్మధారణయొక్క ఉద్దేశ్యము అదే!

- - -

భస్మోపాసన : ( భ + సమమ్ = ఇదంతా మమాత్మయొక్క సమ స్వరూప తేజో విలాసము
సత్ + మమ + భః = నాయొక్క సత్ స్వరూప తేజస్సు)
భస్మమే……అగ్ని.
భస్మమే…. వాయువు.
భస్మమే….. జలము.
భస్మమే….. భూమి.
భస్మమే….ఆకాశము / స్థానము / స్థలము.
పంచ భూతములన్నీ…..రుద్రభస్మ రూపమే.
- మనస్సు - ఆలోచన - భావనోద్వేగము… భస్మమే.
- ఈ కళ్ళు - చూపు - దృష్టి……రుద్రభస్మ రూపమే.

ఈ విధంగా….

‘‘అగ్నిరితి భస్మ। వాయురితి భస్మ। జలమితి భస్మ। స్థలమితి భస్మ। వ్యోమేతి భస్మ! సర్వగ్ం హవా ఇదగ్ం భస్మ!
మన ఇతి ఏతాని చక్షూంసి భస్మాని!’’ అగ్నిరితి ఆదినా!

ఈ మంత్రము (7 స్తోత్రములతో) భస్మమును గ్రహించి రుద్రభస్మముగా ఉపాసన చేస్తూ దేహమునకు పూస్తూ ఆయా సర్వాంగాలను స్పృశించాలి! ఇది పాశుపత దైనందికవ్రతములోని అంతర్విభాగ క్రియ!

- - -

ఏ బ్రహ్మతత్త్వోపాసకుడైతే నిత్యము ఈ అథర్వశిరోపనిషత్‌ను అధ్యయనము చేస్తూ ఉంటాడో….అట్టి వాడు రుద్రోపాసకుడే. ఆతడు అగ్నివలె క్రమంగా పరమపవిత్రుడగుచున్నాడు. వాయువువలె, ఆదిత్యునివలె, చంద్రునివలె నిర్మలుడగుచున్నాడు. సత్యమువలె పునీతుడగుచున్నాడు.

• సర్వతీర్థములందు స్నానము చేసినట్టి ఉత్తమోత్తమ ప్రయోజనము పొందుచున్నాడు.
• చతుర్వేద పారాయణ ప్రయోజనమును అందిపుచ్చుకొనుచున్నాడు.
• వేదమంత్రములను శ్రద్ధాభక్తులతో వింటున్నట్టి ఫలమును సముపార్జించుకుంటున్నాడు.
• వేదములలో చెప్పబడిన యజ్ఞ - యాగాదులు నిర్వర్తించినవాడగుచున్నాడు.
• సర్వ దేవతా తత్త్వ రహస్యములను ఎరిగినవాడగుచున్నాడు.
• సమస్త యజ్ఞ - క్రతు - ఇష్టా - పూర్తములను నిర్వర్తించినవాడగుచున్నాడు.
• సమస్త ఇతిహాస - పురాణ పఠన పుణ్యములను ప్రాప్తించుకొంటున్నాడు.

ఓ రుద్రభగవాన్! ఈ సర్వము మీరు ధరించే భస్మ స్వరూపమే.

హృదయములోని దుష్టభావాలను తొలగించి రుద్రభగవానుని ప్రతిక్షేపించు పాశుపత వ్రతముచే
→ కోటి రుద్ర జప ప్రయోజనము సిద్ధించగలదు.
→ శత సహస్ర గాయత్రీ జపఫలము ప్రాప్తించగలదు.
→ ప్రణవోపాసన ఫలము త్వరగా సిద్ధించగలదు.

అట్టి పాశుపత వ్రత నిర్వర్తి యొక్క - ఇటు 10 తరములవారు, అటు 10 తరములవారు - పుణ్యలోకములు పొందుచున్నారు! అట్టివాడు ఎటువైపు చూస్తూ ఉంటే, అటువైపు పరమ పవిత్రత పొందగలదు.

ఇతి ఆహ భగవన్।

అథర్వ శిరో, అథర్వ శిరః।।

- - -

అథర్వ శిరోపనిషత్ ఒకసారి జపిస్తే (పఠిస్తే), ఆ పఠించినవాడు శుచిమంతుడు, నిర్మలుడు, ఉత్తమకర్మలు నిర్వర్తించినవాడు కాగలడు!

రెండుసార్లు పఠిస్తే (పారాయణం చేస్తే, జపిస్తే) ఉత్తమ గుణములు (దైవీ సంపత్తి, జ్ఞాన గుణములు) ఆతనిని వచ్చి చేరుతాయి. మంచివారితో, విజ్ఞులతో, బ్రహ్మజ్ఞానులతో సహవాసము లభించగలదు. అట్టివాడు గణాపత్యము (Leadership qualities) పొందుచున్నాడు.

మూడుసార్లు ఉపనిషత్తులు పారాయణం చేస్తూ అర్థమును మననము చేస్తే, ఆతడు దేవతలు ఉండే ఆనంద స్థానమునందు ప్రవేశించగలడు.

ఇంకా అధికంగా పఠిస్తూ ఉంటే రుద్ర భగవానునితో సామీప్యమును, సాలోక్యమును, సాయుజ్యమును సముపార్జించుకొంటున్నాడు.

ఇతి ఓగ్ం సత్యమ్

ఇది సత్యమును జేర్చు యోగమార్గము. జ్ఞానమార్గము. భక్తిమార్గము.

- - -

ఏ సర్వాత్మకుడగు పరమాత్మ అయితే….,
• అగ్ని స్వరూపుడై బాహ్య జగత్తులను, సర్వదేహములను తేజోమయం చేస్తున్నారో, తేజోరూపులై ప్రదర్శనమగుచున్నారో
• ఆపః స్వరూపులై తమయొక్క రసతత్త్వముచే జీవుల దేహములలో ప్రవేశించి పరిపోషిస్తున్నారో, వృక్ష జంతు జాతులను వృద్ధింపజేస్తూ - పరిరక్షించుచున్నారో…
• భూస్వరూపులై ఓషధరూపంగా ఆహార శక్తిని అందిస్తున్నారో,…. భూమియందు ఓజోశక్తిచే ఓషధరూపులై ఆహారమును తయారుచేస్తున్నారో…..,ఓజోరూపులై భూతత్త్వముగా వేంచేస్తున్నారో,
• అంతర్యామియై జీవాత్మ చైతన్యముగా సర్వ జీవులలోను వేంచేసి ఉంటున్నారో, వైశ్వానరులై జీవుడు - జీవత్వములను ప్రకటనపరచుచున్నారో,
• విశ్వస్వరూపులై ద్రష్ట - ద్రష్టల మధ్యగా దృశ్యానుభవరూపంగా ప్రదర్శితమగుచున్నారో….
• చతుర్దశ (14) భువనములను చాకచక్యముగా విస్తరించి ఉన్నారో…
• సమస్త జీవుల జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల, దేహ - దేహాంతరముల సందృశ్యమంతా పర్యవేక్షిస్తున్నారో,

అట్టి రుద్ర భగవానునికి మరల మరల నమస్కరిస్తున్నాము.

- - -

అథర్వశిర ఆఖ్యాయిక

ఈ ఉపనిషత్ ఉపదేష్ఠ అగు అథర్వ శీర్‌ష్ణ మహర్షి గురించి ఒకానొక విశేషము.

ఒక సందర్భములో అథర్వమునిపై ఒక మహర్షికి ఏదో సందర్భము - సంఘటన కారణంగా కోపం వచ్చింది. ఆ మహర్షి అథర్వమునిని ‘‘ఓ అథర్వా! నీతల తెగి హృదయమునకు వేరై నేలపడునుగాక!’’ అని శపించారు.

ఆ శాపము వింటూన్న క్షణమే అథర్వముని ప్రాణోపాసనకు ఉపక్రమించి శరీరము విడచిబయల్వెడలారు. మరుక్షణం శిరస్సు వెంటనంటి, తెగుచున్న తన శిరస్సును ‘‘ప్రాణశక్తి’’ అనే ఉపకరణముతో హృదయమునకు అనుసంధానం చేస్తూ ఆ మహర్షియొక్క పాదాలపై భక్తితో వ్రాలారు. ఆ విధంగా శరీరమును పునరుజ్జీవనం చేసుకొని మహర్షియొక్క క్షమచే ఆశీర్వాదం పొందారు! అప్పటి నుండి అథర్వముని ‘‘అథర్వశీర్షు ణాడు, పవమానుడు’’ అని పిలువబడుచున్నారు.

అట్టి అథర్వశీర్‌ష్ణ మహాముని తనయొక్క దివ్యచక్షువులచే దర్శించబడిన మంత్రరాశియే ‘‘అథర్వశీర్‌ష్ణము’’ అని పిలువబడుతోంది!
ప్రాణసమానుడు - ప్రియాతిప్రియుడు - ప్రాణప్రదుడు - మంత్రశ్లోక ద్రష్ట యగు అథర్వశీర్‌ష్ణ మహాముని యొక్క వాత్సల్య దృక్కులు మనపై ప్రసరించును గాక! మనకు శ్రేయోదాయకమగు ఆహారము, మనస్సు ప్రసాదించుదురు గాక! బ్రహ్మవిద్యచే మనము పునీతులమయ్యెదము గాక!

‘‘మోక్షము’’ అనే ‘‘అన్నము’’ మాకు ప్రసాదించబడునుగాక! పరబ్రహ్మస్వరూపమగు అన్నముచే మా మనస్సులు నిండియుండునుగాక! (తస్మాత్ అన్నమయమ్ మనః। అన్నం బ్రహ్మ)।

శ్రీ రుద్రయోగము సత్యయోగము! సత్యమే జయించగలదు. {సత్యమేవ జయతే। న అనృతః}


ఇతి అథర్వశిర ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।