Maitrēya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

సామవేదాంతర్గత

10     మైత్రేయోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। శ్రుత్వ ఆచార్య ఉపదేశేన
మునయో యత్ పదం యయుః
తత్ స్వానుభూతి సంసిద్ధం
స్వమాత్రం బ్రహ్మభావయే।
(జగద్దృశ్యములో చేయవలసినదేదో చేస్తూ, ఆపై ఇక మౌనము వహించి…, నిత్య సత్యమగు ఆత్మతత్త్వము నందు కనులు తెరచి జాగరూకులై ఉంటున్నట్టి)- మునులు చేతులెత్తి - శ్రుతుల, ఆచార్యుల ప్రవచనముల సాక్షిగా ఏ పదము చూపుచున్నారో, అట్టి ‘పరమపదము’ యొక్క సిద్ధిచే, ‘‘బ్రహ్మమే నేను’’ అను అనునిత్య భావనకు - మనము చేరెదము గాక! అందుకొరకై శివభగవానుని శరణువేడుచున్నాము.


ప్రథమోధ్యాయః - బృహద్రథ వైరాగ్యము

1. ఓమ్।
బృహద్రథో వై నామ రాజా, -
రాజ్యే జ్యేష్ఠం పుత్రం నిధాపయిత్వ, -
‘‘ఇదమ్ అశాశ్వతం మన్యమానః శరీరం,
వైరాగ్యమ్ ఉపేతో, అరణ్యం నిర్జగామ।।
ఓంకార రూప పరమాత్మకు నమస్కరిస్తున్నాము.
ఇక్ష్వాకు వంశజుడైన బృహద్రథుడు అనే రాజు ఉండేవారు. ఆయన ఒక సమయంతో తన పెద్దకుమారుని రాజుగా చేసి, రాజరికాన్ని త్యజించారు. ‘‘ఈ దేహము శాశ్వతం కానే కాదు కదా! ఇది కాస్త బాగున్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి’’….అని తలచారు. విరాగియై అరణ్యవాసము స్వీకరించారు. (వానప్రస్థాశ్రమము ఆశ్రయించారు).
స తత్ర పరమం తప ఆస్థాయ ఆదిత్యమ్
ఈక్షమాణ, ఊర్ధ్వ బాహుః తిష్ఠత్। అంతే సహస్రస్య।।
మునిః అంతికమ్ ఆజగామ
అగ్నిరివా ధూమకః తేజసా నిర్దహన్-ఇవ -
ఆత్మవిత్ భగవాన్ శాకాయన్యః।
తపస్సు ప్రారంభించారు. దృష్టిని - ధ్యాసను భక్తితో సూర్యభగవానునిపై నిలిపి చేతులు ఎత్తి ఉంచి బుద్ధిని ‘సహస్రారము’నందు నిలిపి ఏకాగ్రతతో తపస్సు చేయసాగారు. (సహస్రారము = శిరస్సుపై బ్రహ్మరంధ్రము నుండి 12 అంగుళాలు వరకు ఊర్థ్వంగా)
ఒకరోజు అగ్ని, పొగలేని వెలుగువలె తేజో విలాసుడై వెలుగొందుచు - ఆత్మవేత్త, భగవంతుడు అగు శాకాయన్యుడు బృహద్రథుని ఆయన ముందు ప్రత్యక్షమైనారు.
‘‘ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ! వరం వృణీస్వ - ఇతి।
రాజానమ్ అబ్రవీత్, తస్మై నమస్కృత్యో వాచ :-
‘‘భగవన్! న అహం ఆత్మవిత్। త్వమ్ తత్త్వవిత్।
శృణుమో వయం సత్వం నో బ్రూహి। ఇతి।
‘‘ఏతత్ వృత్తం పురస్తాత్ అశక్యం।
మా పృచ్ఛ ప్రశ్నమ్, ఐక్ష్వాకాన్!
అన్యాన్ కామాన్ వృణీష్వ!’’ - ఇతి।
‘‘నాయనా! లే! లెమ్ము! నీకు ఏమి వరము కావాలో కోరుకో!’’ అని అన్నారు. ఆ బృహద్రథుడు ‘‘హే భగవాన్! నేను బ్రహ్మవేత్తను కాను. మీరో, పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొని యున్న తత్త్వవేత్త. నాకు తత్త్వజ్ఞానమును ప్రసాదించండి’’…అని ప్రార్థించారు.
ఆ మహనీయుడగు శాకాయన్యుడు రాజుతో, ‘‘ఓ ఇక్ష్వాకు వంశ సంజాతా! నీవు అడిగిన ఆత్మతత్త్వజ్ఞాన సమాచారము సంక్లిష్టమైనది. బోధించటానికి అశక్యమైనది కూడా. అది మాత్రం అడగకు. ఇంకేదైనా వరం కోరుకో! ఇస్తాను’’ - అని పలికారు.
శాకాయన్యస్య చరణాః అభిమృశ్యమాణోః
రాజే మాం గాధాం జగాద। (ఏజే మాం గాధాం జగాద్)
(ఇంతవరకు ఇట్లే మైత్రాయణ్యుపనిషత్‌లోకూడా)
అప్పుడు ఆ రాజు మహనీయుడగు శాకాయన్యుని పాదాలు రెండు చేతులతో పట్టుకొని నమస్కరిస్తూ ఈ విధంగా అభ్యర్థన చేశారు.
2. (క్ష్వాకువంశ ప్రభవో బృహద్రథౌ వాచ!)
ఆథ కిమ్ ఏతైర్వా అన్యానాం?
శోషణం మహార్ణవానాం।
శిఖరిణాం ప్రపతనం।
ధ్రువస్య ప్రచలనం।
శ్రీ బృహద్రథుడు
మహాత్మా! బ్రహ్మవిద్యకు వేరైన విషయాలవలన ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఈ దృశ్యములో శాశ్వతమైనదేమున్నది? మహాసముద్రాలే ఒకప్పటికి ఇంకిపోతున్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు నేలకూలుతున్నాయి. కాలగతికి ధ్రువతార వంటివి కూడా చలనం పొందుతోంది. మరొక కాలంలో మటుమాయమైపోతోంది.
స్థానం వా తరూణాం।
నిమజ్జనం పృథివ్యాః।
స్థానాత్ అపసరణం సురాణాం।
సువిశాలమైన మహావృక్షాలు ఒక్క గాలివానకు నేలకూలి స్థానం కోల్పోవుచున్నాయి. ఈ భూమియే ఇంకొకప్పటికి సముద్రంలో మునిగిపోతోంది.
దేవతలంతటివారు స్థానాలు కోల్పోయి కాలప్రవాహంలో కొట్టుకు పోతున్నారు. ఇక మా మానవ దేహములు, మా ఈ భౌతిక సంపదల గురించి చెప్పేదేమున్నది? ఇక నేను మాత్రం వర్తమాన దృశ్యంలో శాశ్వతమా? కాలవిధికి, కాల ప్రవాహానికి కొట్టుకుపోక తప్పదు కదా!
సో2హమ్ ఇతి ఏతత్ విధే,
అస్మిన్ సంసారే కిం కామోపభోగైః?
ఏరైవ (ఏత్యైః ఏవ) ఆశ్రితస్య
అసకృత్ ఉపా వర్తనం దృశ్యత। -
ఇతి ఉద్ధర్తుమ్ అర్హసీతి।
(ఇతి) ‘‘అంధ-ఉదపానస్ధో భేక’’ ఇవ
అహమ్ అస్మిన్ సంసారే।
భగవన్! త్వమ్ నో గతిః। ఇతి।।
ఈ ఎదురుగా కనిపించే సంసారములో ఎవ్వరైతే కామ ఉప-భోగములను ఆశ్రయిస్తారో వారంతా అసత్ కృతములైనట్టి, కల్పితమాత్రములైనట్టి స్థితులను, పునరావృత్తులను పొందుచూ దృశ్య మండలంలో చిక్కుకుంటున్నారు. పునః పునః అనేక జన్మలు పొందుచున్నారు.
నేను సంసారములో నూతిలో కప్పవలె చిక్కుకున్నవాడను. దిక్కుతోచకున్నాను. అందుచేత మీరే నాకు గతి. ఈ సంసార సాగరము నుండి ఆత్మజ్ఞాన సమాచారముతో నన్ను సముద్ధరించండి! నాపై కరుణ వహించండి!
3. భగవన్! శరీరమ్ ఇదం
మైథునాత్ ఏవ ఉద్భూతం।
సంవిత్ వ్యపేతం నిరయ ఏవ।
మూత్ర ద్వారేణ నిష్క్రాన్తమ్।
హే భగవాన్! ఇంకా వినండి. దేనిని చూచుకొని కామభోగములు కోరుకుంటామో అట్టి ఈ భౌతిక దేహం స్త్రీ-పురుష మైథునముచే శుక్ల-శోణితముల కలయికచే ఉత్పన్నమౌతోంది. ఇది జడమైనదేగాని స్వయంగా చైతన్యవంతముకాదు. ఇది దుఃఖకారణమే గాని సుఖ వస్తువు కాదు. ఏ-ఈ దేహమునకు దాసులమై జీవితం అనే అవకాశమును వృథా చేసుకుంటున్నామో,…అట్టి ఇది మూత్ర ద్వారమునుండి వెలువడి భూమిపైకి వచ్చింది.
అస్థిభిః చితం। మాంసేన అనులిప్తం।
చర్మణావబద్ధం। విణ్మూత్ర, వాత పిత్త కఫ మజ్జా మేదో
వస అభిరత్, అన్యైశ్చ మలైః
బహుభిః పరిపూర్ణమ్।
ఏతా దృశే శరీరే వర్తమానస్య,
భగవన్! త్వం నో గతిః। ‘ఇతి’।।
లోపల ఎముకలు. అవి మాంసముతో కప్పబడి, చర్మముచే అలకబడి ఉన్నాయి. లోపల మూల మూలలుగ మూత్రము, మలము. ఇంతే కాకుండా వాతము పిత్తము కఫములతో నిండి ఉంటోంది. ఇంకా రక్తము, మాంసము వంటి అనేక పదార్థాలు. ఇదీ, ఈ దేహముయొక్క నిర్మాణము. అటువంటి ఈ అనేక మురికి పదార్థములతో నిండి ఉన్న దేహముపై మమకారము - అభిమానములతో బద్ధుడనైన నాకు మీరేగతి! మీరు ప్రవచించి బోధించే ఆత్మ విద్య మాత్రమే మందు. కనుక నాపై కనికరించండి
4. అథ భగవాన్ శాకాయన్యః సుప్రీతో, అబ్రవీత్ రాజానం -
మహారాజ! బృహద్రథ! ఇక్ష్వాకువంశధ్వజ!
శీర్ష ఆత్మజ్ఞః, కృతకృత్యః త్వమ్।
‘మరుత్’ - నామ్నో విశ్రుతో అసీత్।
అయం ఖలు(e) ఆత్మాతే, కతమో, భగవాన్! వర్ణ్య ఇతి!
తం హోవాచ :
ఆ వాక్యములు విని భగవంతుడగు శాకాయన్యుడు చాలా సంతోషించారు. సుప్రీతుడైనారు. ఇట్లా పలకసాగారు.
‘‘హే మహారాజన్! బృహద్రథా! ఇక్ష్వాకు కుల రథమునకు ధ్వజము వంటి వాడా! ఆత్మజ్ఞాన వివేకీ! నీవు కృతకృత్యుడవయ్యా! మరుత్తు అనే పేరుతో లోకప్రసిద్ధుడవుకదా! నీవు ఇప్పటికే ఆత్మతత్త్వము తెలిసినవాడివే కనుక ఈ రీతిగా అడిగావు. భగవంతుడగు పరమాత్మను వర్ణించి చెప్పగలమా? లేదు. అయినా కూడా కొన్ని విశేషాలు చెప్పుకుందాము!’’ - అంటూ ఇంకా ఇట్లా చెప్పసాగారు. (మరుత్ = వాయువును జయించినవాడు).
పరమపదము - ఏమరుపు
5. శబ్ద స్పర్శ మయా యే అర్థా
అనర్థా ఇవ తే (ఇవమే)స్థితాః।
యేషాం సక్తస్తు భూతాత్మా।
న స్మరేత్ చ పరం పదమ్।।
ఈ జగత్ దృశ్యముయొక్క మూల పదార్థములగు శబ్ద-స్పర్శ-రూప- రస - గంధముల ‘విషయములు’ - అను తన్మాత్రలు గొప్ప అర్థములుగా పైకి కనిపిస్తూ ఉండవచ్చు గాక! వాస్తవానికి అవన్నీ అనర్థములే అయి ఉన్నాయి. ఈ జీవుడు అట్టి పంచతన్మాత్రలయందు ఆసక్తి పెంపొందించుకున్న వాడై, వాటికి ఆవలగల ఆత్మస్థానమును స్మరించటం లేదు. గమనించటం లేదయ్యా!
తపస్సు - ఆత్మానుభూతి
6. తపసా ప్రాప్యతే సత్త్వమ్।
సత్త్వాత్ సంప్రాప్యతే మనః।
మనసా ప్రాప్యతే హి ఆత్మా।
హి ఆత్మ అపత్త్యా నివర్తతే।।
తపస్సుచే ఆత్మానుభూతి: అట్టి తన్మాత్రలపట్ల తపనను ‘ఆత్మజ్ఞానముపట్ల తపన’ అనే తపస్సుగా మలచుకున్నామా, అప్పుడు రజో తమో గుణములు అల్పమగుచు, సత్త్వగుణము పెంపొందగలదు. సాత్విక గుణాభ్యాసంచేత మనస్సు నిర్మలమౌతుంది. నిర్మలమైన మనస్సుకు ఆత్మ అనుభవం కాగలదు. ‘ఆత్మాహమ్’ అను మనోదర్శనముచే సర్వసంసార ఆపదలు వాటికవే తోకముడుస్తాయి. నివర్తమౌతాయి.
7. యథా నిరింధనో వహ్నిః
స్వయమేవ ఉపశామ్యతి,
తథా వృత్తి క్షయాత్ చిత్తం
స్వయమేవ ఉపశామ్యతి।।
ఏ విధంగా అయితే ఇంధనము లేనప్పుడు అగ్ని తనకుతానే ఉపశమిస్తుందో….,
ఆవిధంగా ఇంద్రియములకు విషయములైనట్టి ఈ జగద్దృశ్య వృత్తులు (Avocations) క్షయిస్తూ ఉండగా, చిత్తము తనకు తానే శమించగలదు.
8. స్వయమేవ ఉపశాన్తస్య
మనసః సత్యగామినః।
ఇంద్రియార్థ విమూఢస్యాత్
అనృతాః కర్మవశానుగాః।।
ఎప్పుడైతే విషయసంబంధమైన ఆలోచనల రూపమైన మనస్సు శమిస్తుందో అప్పుడు సత్యము, సత్యమార్గము బుద్ధికి అనుభూతమగుచూ ఉంటుంది.
కర్మలవశంగా అనుభవమై సత్యమువలె కనిపించే ఇంద్రియార్థముల (శబ్ద స్పర్శ రూప రస గంధముల) విమూఢత్వము త్యజించువానికి సత్యదృష్టిచే ‘‘కర్మవశంగా కనబడే సర్వ పదార్థములు మిథ్యయే కదా!’’… అని తెలియవస్తోంది
9. చిత్తమేవ హి సంసారః। తత్ ప్రయత్నేన శోధయేత్।
యత్ చిత్తః తత్‌మయో భవతి గుహ్యమ్ ఏతత్ సనాతనమ్।।
చిత్తమే సంసారము అయి ఉన్నది. అట్టి చిత్తమును ఉత్తమ ప్రయత్నముతో శోధించి నిర్విషయము చేయాలి. అప్పుడా నిర్మల చిత్తము రహస్యము - సనాతనము అగు చిత్ ఆత్మ స్వరూపమై ప్రకాశించగలదు.
10. చిత్తస్య హి ప్రసాదేన
హంతి కర్మ శుభాశుభమ్।
ప్రసన్నాత్మ ఆత్మని స్థిత్వా
సుఖమ్ అవ్యయమ్ అశ్నుతే।।
కర్మలయొక్క శుభ - అశుభ ద్వంద్వ భ్రమ (లేక) మోహమును నిర్మలమైన చిత్తము మాత్రమే త్యజించి వేయగలుగుతుంది. అప్పుడు ఆ చిత్తము ఆత్మయందు ప్రతిష్ఠితమై, ఇక ఆపై అవ్యయము, విక్షేపరహితము అగు ఆత్మ సుఖమును పొందగలదు.
11. సమాసక్తం యథా చిత్తం
జంతోః విషయ గోచరం
యత్ ఏవం బ్రహ్మణిస్యాత్,
తత్ కో న ముచ్యేత బంధనాత్?
ఈ చిత్తము అజ్ఞానకారణంగా ఏవిధంగా విషయములలో లగ్నం అవుతుందో, అదే చిత్తము ఆత్మజ్ఞానము సంపాదించుకొని పరబ్రహ్మము నందు సంలగ్నమగుచున్నప్పుడు, ఇక అట్టి వాడెవ్వడు సంసారబంధము నుండి విముక్తుడవడు? తప్పక బంధ విముక్తుడు కాగలడు.
12. హృత్ పుండరీక మధ్యేతు భావయేత్ పరమేశ్వరమ్।
సాక్షిణం బుద్ధివృత్తస్య పరమ ప్రేమ గోచరమ్।।
అట్టి పరబ్రహ్మము (లేక) పరమాత్మ ఉన్నట్టి స్థానము ఏది? ఎక్కడ? ఆతడు సర్వబుద్ధి వృత్తులకు కేవలము సాక్షియై, పరమ ప్రేమాస్పదుడై హృదయ పద్మమునందే సర్వదా వేంచేసిఉన్నారు. కనుక, అట్టి పరమేశ్వరుని హృదయమునందే భావనచేయాలి. అనునిత్యం సందర్శించాలి.
13. అగోచరం మనో వాచామ్ అవధూతాది సంప్లవమ్।
సత్తా మాత్ర ప్రకాశైక స్వభావం భావనా గతిమ్।।
అట్టి హృదయాంతర్యామి-మనస్సుకు, వాక్కుకు అగోచరుడు. ఈ మనస్సు - వాక్కు మొదలైనవన్నీ పరమాత్మయొక్క విన్యాసము. సమస్త దుఃఖములు అట్టి పరమేశ్వర దర్శనముచే ఎటో కొట్టుకుపోతాయి. ఆయన మనందరిలో భావాతీతుడై, స్వస్వభావుడై, ‘అందరిలో అందరుగా’ విరాజిల్లుచున్నారు.
14. అహేయమ్ - అనుపాదేయమ్
అసామాన్య విశేషణమ్!
ధ్రువం స్తిమిత గంభీరం
న తేజో, న తమః తతమ్।
నిర్వికల్పం నిరాభాసం
నిర్వాణమయ సంవిదమ్ (సత్-విత్-మ్)।।
పరమాత్మకు ఏదీ వదలవలసినదీ లేదు. స్వీకరించవలసినదీ లేదు.
ఆ పరమాత్మ మనలోని ప్రతి ఒక్కరిలో సమముగా వేంచేసి ఉన్నారు. మనచే త్యజించబడక, స్వీకరించబడక ఉన్నారు. అట్టి పరమాత్మను ఎవ్వరూ పట్టుకొననూ లేరు. వదలి పెట్టనూ లేరు. తమ స్వస్వరూపమును ఎవరు మాత్రం వదలి ఉండగలరు? స్వస్వరూపము దర్శిస్తున్నప్పుడు మోక్షార్థి అయి కనిపించే ‘జీవుడు’ ఎక్కడుంటాడు? అప్పుడిక పట్టుకోవలసినవాడు మాత్రం ఎక్కడ?
ఆత్మ - దృశ్యములోని ఒక సామాన్య విశేషము వంటిది కాదు.
అద్దానిని (అట్టి ఆత్మపురుషుని) : -
- ధ్రువమైనదిగా, - స్తిమితమైనదిగా , - గంభీరమైనదిగా, - తేజస్సుకు - చీకటికి సాక్షిగా, - కల్పనా రహితునిగా, నిర్వికల్పునిగా, - నిరాభాసునిగా, అభాసరహితునిగా, - (కదలనిగాలివలె) నిర్వాణస్వరూపునిగా, దృశ్యసాక్షిగా, - సంవిత్ స్వరూపునిగా తెలుసుకొని-ధ్యానించెదము గాక!
15. నిత్యశ్శుద్ధో బుద్ధ - ముక్త స్వభావః।
సత్యః సూక్ష్మః సవిభుశ్చ అద్వితీయః
ఆనందాబ్ధిర్యః పరః సో-హమస్మి
ప్రత్యక్ ధాతుః! న అత్ర సంశీతిరస్తి।।
చిత్తము శమించగా శేషించే చిత్‌రూప పరమేశ్వరస్థానము ఎటువంటిదంటే: నిత్యమైనది. శుద్ధము. బుద్ధము. స్వభావతః నిత్యముక్తము. కేవలసత్ స్వరూపము. సూక్ష్మము. సర్వమునకు నియామకము. అద్వితీయము. ఆనందసాగర సదృశము. సర్వమునకు వేరైనది. పరము. ప్రత్యక్ (కేవల) బోధ స్వరూపము. అట్టి పరస్వరూపమే నేను. అదియే నీ - నా వాస్తవ పరతత్త్వ సత్యస్వరూపమై ఉన్నదయ్యా! అట్టి ఆత్మయందు సుఖాసీనులయ్యెదము గాక। ఆత్మనుండి ఎవరూ అన్యత్వము పొందటములేదు.
16. ఆనందం అంతః నిజమ్ ఆశ్రయంతమ్
ఆశా పిశాచీమ్ అవమానయంతమ్।
ఆలోకయంతం జగత్ ఇంద్రజాలం
ఆపత్ కథం మాం ప్రవిశేత్ అసంగమ్?
అట్టి ఆనంద నిజాంతర్గత నిజస్వరూపముచే ఆశ్రయించబడి ఉన్నవాడను.
ఆశాపిశాచము రా యత్నిస్తే - అవమానించి త్రోలివేయువాడను.
ఈ లోకములను, జగత్తులను ఇంద్రజాలమువలె వినోదంగా దర్శించుసాక్షిని. అట్టి అసంగ - అప్రమేయ ఆత్మస్వరూపుడనగు నన్ను - కలలోని విషయములవంటి - దృశ్యసంబంధమైన ఆపదలు ఎట్లా సమీపిస్తాయి చెప్పు? లేనేలేదు.
17. వర్ణాశ్రమ ఆచారయుతా విమూఢాః
కర్మానుసారేణ ఫలం లభంతే।
వర్ణాది ధర్మం హి పరిత్యజంతః
స్వానందతృప్తాః పురుషా భవంతి।।
ఎవ్వరైతే వర్ణాశ్రమ ఆచారములే అత్యంత ప్రాధాన్యముగాను, అంతిమాశయముగాను భావిస్తారో, - వారు మూఢులే అగుచున్నారు. అట్టివారు కర్మానుసారంగా కొన్ని కాలబద్ధమైన ఫలములను మాత్రమే పొందుచున్నారు. ఎవ్వరైతే వర్ణాశ్రమ ఆచారములను అధిగమించి స్వస్వరూపాత్మానందమే మహదాశయముగా కలిగి ఉంటారో, - వారు పరమ పురుషులుగా రూపొందుచున్నారు. (రూపుదిద్దుకొనుచున్నారు).
18. వర్ణాశ్రమం సావయవం స్వరూపమ్
ఆద్యంతయుక్తం హి అతికృచ్ఛ్ర మాత్రం
పుత్రాది దేహేషు అభిమాన శూన్యం
భూత్వా, వసేత్ సౌఖ్యతమ ఏహి అనంతే ।।
(సౌఖ్యతమేవహి అనంతే ।।)
అందుచేత, విధి - నిషేధముల పరిమితైయుండే వర్ణాశ్రమ, ఆచారములు సావయవరూపమని, దేహసంబంధితమైనవని, అనేక శ్రమతో కూడి అల్పప్రయోజనకారకములని గమనించెదరు గాక! ‘‘నా బంధువులు - నాపుత్రులు - నా కుటుంబము - నా జాతి - నాకులము - నా ప్రదేశము’’…ఇటువంటి దేహాభిమానములను హృదయములో ఎవరైతే రహితం చేసుకుంటారో, అట్టివారు శాశ్వతమగు మహదానందమునందు స్థానము పొందగలుగుచున్నారు.

ద్వితీయోధ్యాయః - మైత్రేయ - పరమేశ్వర సంవాదము

1. అధ భగవాన్ మైత్రేయః
కైలాసం జగామ।
తం గత్వా - ఉవాచ:
భో, భగవన్!
‘‘పరమతత్త్వ రహస్యమ్ అనుబ్రూహి!’’ ఇతి।।।
ఒకప్పుడు భగవానుడగు మైత్రేయ మహర్షి కైలాసమునకు వెళ్ళారు. శివదర్శనం చేసుకున్నారు. జగద్గురువు, జగదీశ్వరుడు అగు శ్రీ శివభగవానునితో ఇట్లా అభ్యర్ధించారు.
‘‘హే పరమాత్మా! భగవన్! సర్వేశ్వరా! నాకు దయతో పరతత్త్వము బోధించవేడుకుంటున్నాను స్వామీ! జీవుడనగు నాకు ఆత్మతత్త్వభావన’’ బోధించండి.
కరుణామయులగు మహాదేవులు శ్రీమైత్రేయులవారికి ఈ విధంగా బ్రహ్మతత్త్వాన్ని ప్రబోధించసాగారు.
స హో వాచ మహాదేవః:
2. దేహో దేవాలయః ప్రోక్తః।
స జీవః కేవలః శివః।
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యమ్
‘సో2హమ్’ భావేన పూజయేత్।।
మహాదేవోవాచ: నాయనా! మైత్రేయా! నీ శ్రద్ధాసక్తులకు మెచ్చానయ్యా! విను.
పరమాత్మ ఎక్కడున్నాడు? బ్రహ్మలోకంలోనా? కైలాసంలోనా? లేక వేరే లోకంలోనా? కాదు. ఈ దేహమే దేవాలయము. ఈ దేహములోని జీవుడే స్వతఃగా, కేవలము శివుడేనయ్యా! పూజ చేసేముందు నిన్నటి నిర్మాల్యము తొలగిస్తాముకదా! అట్లాగే ‘అజ్ఞానము’ అనే నిర్మాల్యమును తొలగించి ‘సో2హమ్-శివో2హమ్’ భావనతో స్వదేహములోని ఆత్మదేవుని పూజించాలి.
3. అభేద దర్శనం జ్ఞానం
ధ్యానం నిర్విషయమ్ మనః।
స్నానం మనోమల త్యాగః।
శౌచం ఇంద్రియ నిగ్రహః।
జ్ఞానము = సర్వే - సర్వత్రా సమదర్శనం. అభేదదర్శనము.
ధ్యానము = మనస్సును దృశ్య - లోక విషయములను అంతరమున రహితం చేయటం.
స్నానము = మనస్సు నుండి (కామ-క్రోధ-లోభ-మద-మాత్సర్య దోషములనే) మలమును తొలగిస్తూ శుభ్రం చేయడం.
శౌచము = ఇంద్రియములను విషయ - విషయవాసలనుండి నిగ్రహించటం. శుచి అయిన భావములతో మాత్రమే ఈ ఇంద్రియములను నియమించటము.
4. బ్రహ్మామృతం పిబేత్,
భైక్ష్యం ఆచరేత్ దేహరక్షణే।
వసేత్ ఏకాంతికో భూత్వా చ,
ఏకాంతే ద్వైత వర్జితే।
పానీయము = ‘బ్రహ్మతత్త్వజ్ఞానము’ అనే రసమును త్రాగుచూ ఉండటము.
భైక్ష్యం = పరతత్త్వమును గురించిన సాధన కొరకై ఉపకరించే ఈ దేహమును రక్షించుకొనే యత్నములే భిక్షాటన.
వాసము = అనన్యభావనచే ఏకాంతం ఉండేదే నివసించవలసిన గృహము.
ఏకాంతము = ‘పరమాత్మయే ఈ సర్వదృశ్య రూపముగా కనబడుచున్నారు. ఇదంతా సహజముగా ఏకమే అయి ఉండి, అజ్ఞాన దృష్టిచే భిన్నంగా కనబడుతోంది’ - అనునదే ద్వైతత్యాగరూప ‘ఏకాంతము’.
5. ఇత్యేవమ్ ఆచరేత్ ధీమాన్
స ఏవమ్ ముక్తిమ్ ఆప్నుయాత్।
జాతం-మృతం ఇదం దేహమ్
- మాతా - పితృ మలాత్మకమ్।।
తల్లి - తండ్రుల దేహములనుండి బయల్వెడలే మలముతో పోల్చతగిన ఈ భౌతిక దేహములు రావవచ్చు - ఉండవచ్చు. పోవచ్చు గాక! ఈ దేహాంతర్గతుడగు జీవుని (లేక) దేహిని శివస్వరూపంగా (పైన చెప్పిన రీతిలో) దర్శిస్తూ ఉపాసించువారు ముక్తిని తప్పకుండా పొందగలరు.
6. సుఖ-దుఃఖాలయ అమేధ్యం
స్పృష్ట్వా స్నానం విధీయతే
ధాతుబద్ధం మహారోగం
పాపమందిరం అధ్రువం
ఈ పాంచభౌతిక దేహము :
- సుఖదుఃఖములకు ఆలయము. తావు.
- అనేక దోషములతో కూడి, అపవిత్రమై ఉన్నది.
- చర్మము - మాంసము - మజ్జ - చీము - క్రొవ్వు - బొమికలు… ఇటువంటి అపవిత్రమైన వస్తువుల సమూహము. సప్తధాతు నిర్మితము.
- గొప్ప రోగములకు ఆలవాలము.
- అనేక పాప విషయములకు మందిరము.
అందుచేత, ఈ భౌతిక దేహమును దేహాత్మభావనతో స్పృశిస్తే, వెంటనే మనో మల నిర్మూలన స్నానం చేస్తూ ఉండాలి. ‘‘సమస్త శరీరము శరీరములోని ‘శరీరి’ని అఖండాత్మగా మననము చేయటము’’ - అనే ఔషధం సేవించాలి.
7. వికారాకార విస్తీర్ణం
స్పృష్ట్వా స్నానం విధీయతే।
నవద్వారం మలస్రావం
సదా కాలే స్వభావజమ్।।
అనేక వికారములతో నిర్మితమైన ఈ పాంచభౌతిక దేహమును ‘‘ఇదియే ఆత్మ’’ అను భావనతో స్పృశిస్తే, అందుకు ప్రాయశ్చిత్తముగా మలత్యాగ స్నానం చేయాలి. ఎందుకంటే ఈ శరీరము నవద్వారాలనుండి దుర్గంధ వస్తువులను స్రవింపజేసే స్వభావంగలది. కాలంతో పుట్టి, కాలంతో నశించేది. దేహసాక్షిని (దేహిని) వదలి భౌతికదేహంతో సంబంధం కలిగి ఉండటం మధురపదార్థం వదలి మలమును స్పృశించటము వంటిది.
8. దుర్గంధం దుర్మలోపేతం
స్పృష్ట్వా స్నానం విధీయతే।
మాతృ సూతక సంబంధం
సూతకే సహ జాయతే।
ఈ భౌతిక దేహములను చూచి, ‘‘నా భార్య - నా భర్త - నా పుత్రుడు’’ మొ।। భావాలతో స్పృశించటం కూడదు. శివభావంతోనే చూడాలి. ఇది దుర్వాసనలతోను, దుర్మలములతోను కూడి ఉన్నది కదా! అందుకే స్పృశించగానే శివభావనా జలముతో స్నానం చేయాలి.
అందుకే దేహము పుట్టినప్పుడు ‘మాతృసూతకసంబంధము’ అనే పురిటి స్నానము నియమించడింది.
9. మృతసూతక జం దేహం
స్పృష్ట్వా స్నానం విధీయతే।
‘అహమ్-మమ’ ఇతి విణ్మూత్ర
లేప గంధాది మోచనమ్।।
పుట్టినప్పుడు - మరణించినప్పుడు కూడా అందుకే ‘స్నానం చేయాలి’ అని - విధించబడింది.
జనన-మరణ సందర్భాలలో స్నానం - ‘‘నేను ఈ దేహమును ఇదినాది’’…అనే అహమ్+మమ వ్యర్థ పదార్థాలతో ఏర్పడే మలముయొక్క పూత నుండి ‘శివము’ అనే పరిశుభ్రస్నానంతో పరిశుద్ధపరచుకోవాలి-అను సూచకార్థము.
10. ‘‘శుద్ధశౌచమ్’‘ ఇతి ప్రోక్తం
మృత్ - జల అభ్యాంతు ‘లౌకికం’।
చిత్తశుద్ధికరం - శౌచం, వాసనాత్రయ నాశనం।
జ్ఞాన - వైరాగ్య మృత్తో యైః
క్షాళనాత్ ‘శౌచమ్’ ఉచ్యతే।।
శారీరక మట్టి - జలముతో మలమును తొలగించుకోవటానికి జనులు స్నానం చేస్తున్నారు. మంచిదే. అయితే ఇది భౌతిక శుద్ధి-శుచి కొరకు మాత్రమే!
అట్లాగే చిత్తమును ముఖ్యంగా శుద్ధి చేసుకోవాలి. ఎందుకు? ‘‘లోకవాసన- దేహవాసన - శాస్త్రవాసన’’….అనబడే వాసనాత్రయ మలము తొలగటానికై - ‘‘జ్ఞానము - వైరాగ్యము’’ అనబడే మట్టి - జలములలో చిత్తమును క్షాళనముచేయటమే ‘శౌచము’ అయి ఉన్నది.
11. ‘అద్వైత భావనా’ భైక్ష్యం।
అభక్ష్యం ‘ద్వైతభావనం’।
గురు, శాస్త్రోక్త భావేన
భిక్షోః భైక్ష్యం విధీయతే।।
‘అద్వైతభావన’యే ఈ జీవునికి నిజమైన ఆహారము (భిక్ష).
‘ద్వైతభావనయే తినగూడని (నిషిద్ధమగు) పదార్థము.
సద్గురువులు - సత్ శాస్త్రములు అందించే ఆప్తవాక్యముల భావనయే ఈ జీవభిక్షకునకు నిజమైన భిక్ష-ఆహారము. ‘తత్‌త్వమ్-సో2హమ్’ భావనయే జీవుడు పొందవలసిన నిజమైన భిక్ష. (‘భి’ = అంధకార, ‘క్ష’ = క్షయము).
12. విద్వాన్ స్వదేశమ్ ఉత్సృజ్య
సన్న్యాసానంతరం సతః
కారాగార వినిర్ముక్తః
చోరవత్ దూరతో వసేత్।।
ఒక గజదొంగ కారాగారంలో శిక్ష అనుభవించిన తరువాత చక్కటి బుద్ధితో (శిక్షానంతరం) ఆ కారాగారము నుండి వెలువడి, ఇక దూరంగా చక్కటి ప్రదేశంలో నివసిస్తాడేగాని, కారాగారానికి దగ్గిరగాగాని, లోనగాని ఉండాలని అనుకుంటాడా? లేదు.
అట్లాగే…, విద్వాంసుడైనవాడు ఆత్మజ్ఞానం సంపాదించుకున్న తరువాత ‘నేను-నాది’ అనే కారాగారము త్యజించి ‘సన్న్యాసము’ అనే దూరప్రదేశంలో నివసిస్తాడు. (కారాగారము = Prison).
13. అహంకార సుతం,
విత్త భ్రాతరం,
మోహ మందిరం,
ఆశా పత్నీం,
- త్యజేత్ యావత్,
తావత్ ముక్తో న సంశయః।।
సన్న్యసించవలసినది దేనిని? భౌతికమగు భార్యాపుత్ర సోదర ఇత్యాదులనా? ఊహూ"! కాదు. అవన్నీ సాధనకొరకేగాని, అసలైన సన్న్యాసము కాదు. మరి?
- ‘అహంకారము’ అనే కొడుకును.
- ‘ధనము-సంపద’ గురించి మోహము అనే సోదరుని.
- ‘ఆశ’ అనే భార్యను.
వీటిని వాటి వాటి మూలములతో సహా త్యజించి ఉండాలి. వాటిని ఎంతెంతవరకు త్యజిస్తే, అంతంతవరకు ‘ముక్తి’ (Relief) చోటుచేసుకో గలదు. ఇందులో సందేహమే లేదు!
14. మృతా మోహమయీ మాతా।
జాతో బోధమయః సుతః।
సూతక ద్వయ సంప్రాప్తౌ
కథం సంధ్యామ్ ఉపాస్మహే?
సర్వము స్వస్వరూపాత్మగా దర్శించటం సమారంభమైతే, ఇక శాస్త్ర సాధనల ప్రయోజనము సిద్ధించినట్లే! ‘‘సాధనలయొక్క అంతిమఫలం ఏమిటి?’’… అనునది పరిశీలిస్తే, ‘‘సాధనముల ఆవశ్యకత ఇక లేకపోవటము. స్వాభావికంగానే సర్వత్రా స్వస్వరూపాత్మ దర్శనము’’- అయి ఉన్నది.
అట్టి ఆత్మసాక్షాత్కారము సముపార్జించుకొన్న దివ్యాత్మదర్శిని ఒక బాటసారి, ‘‘ఏమయ్యా! నీవు సంధ్యావందము మొ।।ని నిర్వర్తించుచున్నట్లు కనబడటం లేదేం?’’ అని ప్రశ్నిస్తే, ఆ ఆత్మతత్త్వవిజ్ఞాని ఈ విధంగా సమాధానం చెప్పుచున్నారు.
- ‘‘మోహము అనే మాత చనిపోయిందయ్యా! అందుచేత, ‘‘మైల’’.
- ‘భోదమయి-బోధరూపాత్మ-అనే పుత్రుడు పుట్టాడు అందుచేత పురుడు।
ఈ విధంగా సూతకద్వయం ప్రాప్తించాయి. మరి సంధ్యోపాసన చేయలేను గదా!’’
15. హృదాకాశే చిత్ - ఆదిత్యః
సదా భాసతి భాసతి!
న అస్తమేతి న చ ఉదేతి।
కథం సంధ్యాం ఉపాస్మహే?
ఆ బ్రహ్మానంద ఆస్వాది ఇంకా ఇట్లా అంటున్నారయ్యా!
సంధ్యావనందనము ‘‘సూర్యోదయ-సూర్యాస్తమయ’’ సంధ్యాసమయాలలో కదా చేయవలసినది! అయితే
- నా హృదయాకాశములో చిద్ ఆదిత్య సూర్యుడు నిత్యోదయుడై భాసిస్తున్నారు. ఉదయాస్తమయములు లేక, - ఎల్లప్పుడు ప్రకాశిస్తున్నాడు. ఆ చిదానంద సూర్యుడూస్తమించటమూలేదు. ఉదయించటము లేదాయె! సంధ్యోపాసన ఎట్లా చేయాలి మరి?
16. ‘‘ఏకమేవ అద్వితీయం’’ - (బ్రహ్మ)
యత్ గురోః వాక్యేన నిశ్చితం,
ఏతత్ దేశాన్తమ్ ఇత్యుక్తం!
న మఠం। న వనాంతరమ్।
ఈ జీవుడు ఏకాంతము చేరితేనే ముక్తి. అనగా….? గురువాక్యమైనట్టి ‘బ్రహ్మము సర్వదా ఏకము. అద్వితీయము. నీవు బ్రహ్మమే అయి ఉన్నావు’….అనే మహావాక్యార్థమును సునిశ్చితం చేసుకోవటమే ఏకాంతము (లేక) దేశాంతరము. అంతేగాని ఇల్లు వదలి మఠము చేరటము కాదు. ఊరు వదలటమూ కాదు, అడవిలో ప్రవేశించటమూ కాదు, మరి!
17. అసంశయవతాం ముక్తిః।
సంశయావిష్ట చేతసామ్-
న ముక్తిః జన్మ జన్మాంతే।
తస్మాత్ విశ్వాసమ్ ఆప్నుయాత్।।
(1) తత్‌త్వమ్ = నీవుగా కనిపించేదంతా ఆ బ్రహ్మమే!
(2) సో2హమ్ = నేను బ్రహ్మమే!
ఈ ఉభయ మహావాక్యార్థముల విషయములో సర్వసందేహాలు తొలగిపోవటమే ముక్తి. బుద్ధి సందేహరహితం అయ్యేవరకు ఎన్ని జన్మలెత్తినా ముక్తి లభించే ప్రసక్తే లేదు. అందుచేత అట్టి స్వస్వరూపబ్రహ్మమునందు విశ్వాసము సంపాదించుకోవాలి.
18. కర్మత్యాగాత్ న సంన్న్యాసో।
న ప్రేష - ఉచ్చారణేన తు।
సంధౌ జీవ - ఆత్మనోః ఐక్యం
‘సంన్న్యాసః’ పరికీర్తితః।।
కర్మలను త్యజించినంత మాత్రం చేత అది ‘‘సత్+న్యాసము = సన్న్యాసము’’ కాదు. సన్న్యాసము గురించి గొప్ప మాటలు చెప్పుకోవటము సన్న్యాసము కాదు. ‘సన్న్యాసం మయా’’ అని ఉచ్చరించినంతమాత్రంచేత సన్న్యాసము రాదు. ఈ జీవాత్మను పరమాత్మయందు ఐక్యము చేసి సందర్శించటమే సన్న్యాసము.
19. వమన-ఆహారవత్ యస్య
భాతి సర్వ ఈషణాదిషు,
తస్య అధికారః సంన్న్యాసే
త్యక్త దేహాభిమానినః।।
ఒకడు తాను కక్కిన కూడును తింటానికి ఇష్టపడతాడా? లేదుకదా! ఆ విధంగా బ్రహ్మవేత్త - సర్వప్రాపంచకమైన అభిలాష-కోరికలపట్ల ‘‘ఇవన్నీ నేను కక్కిన కూడువలె నానుండి బయల్వెడలుచున్నాయి. ఇవి నేనెందుకు స్వీకరించాలి’’ అను దృష్టితో చూస్తాడు. అట్టివాడు దేహాభిమానము త్యజించినవాడై ‘సన్న్యాసి’ అగుటకు సాధికారుడు అగుచున్నాడు.
20. యదా మనసి వైరాగ్యం
జాతం సర్వేషు వస్తుషు,
తదైవ సన్న్యసేత్ విద్వాన్।
అన్యధా పతితో భావేత్।।
ఎప్పుడైతే సర్వదృశ్య వస్తు-విషయ-వ్యవహారములపట్ల పూర్ణముగా వైరాగ్యము (Non Fondness) జనిస్తుందో, అప్పుడు ఆతడు (ఏ ఆశ్రమములో ఉన్నప్పటికీ) సన్న్యాసియే అగుచున్నాడు. అట్టి సమగ్ర - సంపూర్ణ వైరాగ్యము కలుగకపోయిందా…అప్పుడిక (బాహ్యమున సన్న్యాసము స్వీకరించి యున్నప్పటికీ) పతనము అనివార్యము.
21. ద్రవ్యార్థమ్, అన్న-వస్త్రార్థం
యః ప్రతిష్ఠార్థమ్ ఏవ వా
సన్న్యసేత్-ఉభయభ్రష్టః।
స ముక్తిం నాప్తుమ్ అర్హతి।।
ఎవ్వరైనా ద్రవ్యము లభిస్తుంది కదా అనియో, అన్న - వస్త్రముల కొరకో, శిష్యులు లభిస్తారనో, గొప్ప పేరు ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకొనియో- భౌతికంగా సన్న్యసించాలని అనుకుంటున్నాడో, (లేక) కర్మ సన్న్యాసము స్వీకరిస్తాడో,- అట్టివాడు- కర్మావకాశములను సద్వినియోగము చేసుకోలేక, జ్ఞానమార్గము పట్టుబడక - ‘‘ఉభయభ్రష్టుడు’’ అగుచున్నాడు. ఆతడు ముక్తికి అర్హుడు కాలేక పోవుచున్నాడు.
22. ఉత్తమా - తత్త్వ చింతా చ।
మధ్యమం శాస్త్ర చింతనమ్
అధమా మంత్రచింతా చ।
తీర్థభ్రాంతిః అధమాధమా।।
తత్త్వచింతన → అన్నిటికంటే ఉత్తమోత్తమం.
శాస్త్ర చింతన → మధ్యమము.
మంత్ర చింతన → అధమము.
తీర్థభ్రాంతి (తీర్థయాత్ర చేసి ఆత్మను ఎరగాలనుకోవటం) → అధమాధమం.
23. అనుభూతిం వినా మూఢో
వృథా బ్రహ్మణి మోదతే।
ప్రతిబింబిత శాఖాగ్ర
ఫలాస్వాదన మోదవత్।।
ఏకమగు పరమాత్మయే ఈ అనేక నామ-రూపాత్మకమగు జగత్ రూపంగా కనిపిస్తున్నారు. (ఆ తీరుగా) ‘‘పరమాత్మగా అనిపించటము’’ అనే రూపముగల అనుభూతిని ప్రవృద్ధం చేసుకోకుండా బ్రహ్మము గురించి విని, మాట్లాడి, చదివి, ఆ మాత్రానికి ‘‘బ్రహ్మము అర్థమైయ్యిందిలే’’….అని అనుకుంటే ఏమిలాభం? ఒక పళ్ళవృక్షము యొక్క నీళ్లలో కనిపించే ఛాయలో (Shadow in the water) నుండి పళ్ళు కోసుకోగలమా? నీడాకారము చూచి ‘‘నేను పళ్ళను ఆస్వాదిస్తున్నాను’’ అని అనుకుంటే అప్పుడు పళ్ళు తిన్నట్లు అవుతుందా? అవదు కదా!
24. న త్యజేత్ యతిః ముక్తో
యో మాధూకర - మాతరం,
వైరాగ్య - జనకం, శ్రద్ధా - కళత్రం,
జ్ఞాన - నందనమ్।।
ఏ యతి (లేక సన్న్యాసి అయితే) భిక్షాటణము అనే తల్లిని, వైరాగ్యము అనే తండ్రిని, శ్రద్ధ అనే భార్యను, జ్ఞానము అనే ఆనందమును విడువడో….అట్టివాడు ‘ముక్తుడు’ అగుచున్నాడు. సన్న్యాసాశ్రమము స్వీకరించినా కూడా, - అవి మరచిపోతే నిత్య సన్న్యాసి కాడు. ఆశ్రమ సన్న్యాసి మాత్రమే. (బిక్షాటనము = ‘‘అంతా కూడా పరమాత్మచే ప్రసాదించబడినదే’’ - అను భావన)
25. ధనవృద్ధా, వయో వృద్ధా
విద్యావృద్ధాః తథైవ చ
తే సర్వే జ్ఞాన వృద్ధస్య
కింకరాః శిష్య కింకరాః।।
ధనవృద్ధుడు (గొప్పసంపదగలవాడు), వయోవృద్ధుడు (పెద్దవయస్సు గలవాడు), విద్యావృద్ధుడు (గొప్పగొప్ప చదువులు Qualifications గలవాడు),….. ఇటువంటి వారంతా కూడా - ఆత్మజ్ఞానవృద్ధునికి, ఆతని సేవకులకు సేవకులవంటివారు అగుచున్నారు.
26. మన్మాయయా (మత్ మాయయా) మోహిత చేతసో
మామ్ ఆత్మానమ్ ఆపూర్ణమ్,
అలబ\xc3\x86వంతః।
పరం విదగ్ధ ఉదరపూరణాయ
భ్రమంతి కాకా ఇవ సూరయో-పి!
మైత్రేయ మహర్షి : హే పరమశివా! శాస్త్రజ్ఞానముచే ముక్తి లభించగలదు కదా!
పరమశివుడు : ఓ మైత్రేయ మహర్షీ! ఒక కాకి రోజంతాకూడా ఆహారము కొరకే ఆయా ప్రదేశాలు చుట్టివస్తూ ఉంటుంది. చూచారా? కొంతమంది శాస్త్రసమాచారము చే శూరులు అయి ఉండి కూడా, నాయొక్క మాయచే మోహితుడై, మోహ-బుద్ధికలవారగుచున్నారు. తమయందలి అస్మత్ శివాత్మస్వరూపము యొక్క అనుభవమును సుస్థిరీకరించుకోక, - ధన-జన-అధికార-సభాగౌరవ-ఉదరపోషణములకు మాత్రమే ‘జీవించటము’ వలన లభించిన సమయమంతా గడిపివేస్తున్నారు. సమస్త జీవులలో సర్వదా వేంచేసియున్న నన్ను దర్శించటము లేదు.
- అపూర్ణముగా ఉండిపోతున్నారు.
- ‘‘ఇంకా ఎప్పటికో లభించవలసినది’’ - అని తలచుచూ, శివత్వము పొందనివారై కాలమును వృధా చేసుకుంటున్నారు.
27. పాషాణ - లోహ - మణి - మృణ్మయ విగ్రహేషు
పూజా - పునర్జనన భోగకరీ ముముక్షోః।
తస్మాత్ యతిః ‘స్వహృదయార్చనమేవ’ కుర్యాత్।
బాహ్యార్చనమ్ పరిహరేత్
అపునః భవాయ।।
ఓ మైత్రేయో! కొందరు ముముక్షువులు రాయి - లోహము - మణి - మట్టిలలో తయారుచేసుకొన్న విగ్రహములను పూజించటానికై పరిమితులగుచున్నారు. అది పునర్జన్మల భోగములను పొడిగించుకుంటూనే పోవుచున్నదయ్యా!
అందుచేత…
యతి (లేక) యోగి (లేక) సన్న్యాసి (లేక) ముముక్షువు ఏమి చెయ్యాలంటావా? క్రమంగా ‘బాహ్యార్చన’ను ఉపయోగించుకుంటూ అద్దానిని అధిగమిస్తూ, స్వహృదయము లోను - సర్వ హృదయాలలోను సర్వదా - సదా వేంచేసి యున్న శివతత్త్వమును తెలుసుకొని, గమనించి, దర్శించి ఉపాసించి అట్టి శివత్వము సిద్ధించుకోవాలి. జీవ స్వరూపమును అధిగమించి- ‘శివస్వరూపులు’ కావాలి.
28. అంతఃపూర్ణో - బహిః పూర్ణో
పూర్ణకుంభ ఇవ ఆర్ణవే।।
అంతఃశూన్యో - బహిః శూన్యః
శూన్య కుంభ ఇవ అంబరే।।
ఒకడు సముద్ర జలంలో బిందెను నింపి ఉంచితే బిందెలోపల - బయట సముద్రజలమునిండుగా ఉన్నట్లుగా, ఆత్మ సదా పూర్ణము. ఒక ఖాళీ బిందెయొక్క లోపల వెలుపల ఆకాశమే (Space) ఉండి ఉన్నట్లుగా- ఆత్మ సదా శూన్యము కూడా।
ఆత్మదర్శి బయట లోపల కూడా ‘‘పూరుణాడై, శూన్యుడై’’ ప్రకాశమానుడగు చున్నాడు.
29. మా భవ గ్రాహ్యభావాత్మా।
గ్రాహకాత్మా చ మా భవ।
భావనామ్ అఖిలాం త్యక్త్వా
యత్ శిష్టం(చిత్తం) తన్మయోభవ।।
ఓ మైత్రేయ మహానుభావన్!
నీవు గ్రహించబడు వస్తువు కావద్దు. గ్రహించువాడవు కావద్దు! సర్వభావ - అభావములను దాటివేసి, ఆవల ఏది శేషించియున్నదో అట్టి ఆదిశేషశయనుడివి కమ్ము. తన్మయో భవ! ఆ శేషించి యున్నట్టిది నీవేగా అయి ఉండుము! ఇదియే శివతత్త్వానుభవం!
30. ద్రష్టృ దర్శన దృశ్యాని
త్యక్త్వా వాసనయా సహ।
దర్శన ప్రథమా భాసమ్
ఆత్మానం కేవలం భజ।।
‘‘చూచువాడు - చూడటము - చూడబడునది’’. (‘త్రిపుటి’) అనబడే ఈ మూడిటిని వాటివాటి సంబంధమైన సంస్కార - వాసనలతో సహా అధిగమించివేసి, కేవల దృక్ - ప్రకాశరూపమగు ఆత్మ రూపమును ఉపాసిస్తూ, తన్మయుడవై ప్రకాశించుము.
31. సంశాంత సర్వ సంకల్పా
యా శిలావత్ అవస్థితిః,
జాగ్రత్ - నిద్రా వినిర్ముక్తా
సా స్వరూపస్థితిః పరా- ।।
।।ఇతి।।
సర్వ సంకల్పములు సశాంతించినవి అగుచుండగా; ఏ జాగ్రత్-స్వప్న- సుషుప్తులకు ఆవల ఉన్నట్టి శిలా శాంత అవస్థితి కలదో, - అట్టి ‘పరే-ఆవల’ స్వరూపస్థితి యందు సుస్థిరుడవై ఉండెదరు గాక!

అని జగద్గురువగు మహాదేవుడు మైత్రేయ మహర్షికి ఆత్మ జ్ఞానమును విశదపరచారు.

తృతీయోధ్యాయః - స్వస్వరూప సందర్శన గానము

1. అహమస్మి పరశ్చాస్మి।
బ్రహ్మాస్మి ప్రభవోస్మి అహమ్।
సర్వలోక గురుశ్చ అస్మి।
సర్వలోకే2స్మి।
సో2స్మ్యహమ్।।
శాకాయన్యమహర్షి : ఓ బృహద్రథా!
శ్రోతయొక్క స్వసహజాత్మరూప ధ్యానము-గానము ఏమిటో విను
నేనే నాలోని నేనై నేనుగా ప్రకాశిస్తున్నాను. సర్వమునకు పరమై (వేరై) ఆవల, ఉండి ఉన్నది కూడా నేనే।
బ్రహ్మము అని చెప్పబడుచున్నది నేనే! ‘బ్రహ్మము’ అయి ఉన్న నేనే ఈ సమస్త జగత్తులుగా ప్రభవిస్తూ ఉన్నాను.
సర్వము ప్రకాశింపజేస్తున్న పరబ్రహ్మము నేను. ‘నేను’ అని అనుకోవటానికి మునుముందే ఉన్నది నేనే।
సర్వలోకములలోని మహత్తరమైన వస్తువైన, సర్వలోకముల రూపముగా సందర్శించబడుచున్న ఆ ఆత్మ నేనే! నేను ఆత్మస్వరూపుడను!
2. అహమేవాస్మి సిద్ధో2స్మి।
శుద్ధో2స్మి పరమో2స్మ్యహమ్।
అహమస్మి సదా సో2స్మి।
నిత్యో2స్మి విమలో2స్మ్యహమ్।।
- నేనై యున్న నేనును నేనే!
- ఈ దృశ్యమును, దృష్టిని, మనో చిత్తములను, అహంకారమును నా కొరకై నేనే సిద్ధించుకొనుచున్నాను. కనుక సిద్ధుడను.
- అయినా కూడా సర్వదా సర్వమునకు ఆవల పరిశుద్ధుడనై ఉన్నాను. మలరహితుడను.
- నేనే సదా అన్నీ అయి, ఆవల కూడా నిండి ఉన్నాను. సదా శివుడను.
- నిత్యుడను. కాలనియామకుడనేగాని, కాలబద్ధుడను గాను. సదా నిర్మలుడను. నిర్విషయుడను.
3. విజ్ఞానో2స్మి విశేషో2స్మి।
సోమో2స్మి సకలో2స్మ్యహమ్।
శుభో2స్మి। శోకహీనో2స్మి।
చైతన్యో2స్మి। సమో2స్మ్యహమ్।।
తెలుసుకునేవాడిని నేనే! తెలియబడే విశేషమంతా కూడా నేనే! ఉభయము నాయొక్క ‘‘సమగ్రరూపము’’ లోని రెండు విశేషములు. సోమరాజు (జీవుడు), ఆ జీవునికి అనుభవము అయ్యే సమస్తము కూడా నేనే.
సర్వశుభంకరుడను! ఎట్టి వేదనలు లేనివాడను! శోకహీనుడను।
సర్వులతో సమస్వరూపమగు ఆత్మచైతన్యమే నా స్వరూపము!
4. మానావమాన హీనో2స్మి।
నిర్గుణో2స్మి శివో2స్మ్యహమ్।
ద్వైత - అద్వైత విహీనో2స్మి
ద్వంద్వహీనో2స్మి। సో2స్మ్యహమ్।।
నాకు మాన - అవమానములు రెండూ లేవు. ఆత్మస్వరూపుడనగు నేను గౌరవ-అగౌరవములచే క్రొత్తగా పొందేది లేదు. ఉన్నది పోగొట్టుకొనేది లేదు.
నిర్గుణుడను। సదాశివుడను। సర్వశుభంకరుడను।
నాకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు। వేరుకానిదీ లేదు. ద్వంద్వహీనుడను. సర్వము నేనైన నేనే నేను। ఏదీ అవక, వేరై ఉన్న వాడను కూడా।
5. భావ-అభావ విహీనో2స్మి।
భాసాహీనో2స్మి భా2స్మ్యహమ్
శూన్య అశూన్య ప్రభావో2స్మి।
శోభన - అశోభనో2స్మ్యహమ్।।
భావించువాడినగు నేను భావ - అభావములకు మునుముందే ఉన్నాను. భావన నాది గాని నేను కాదు. అందుచేత భావాభావ విహీనుడను.
నేను భాసించువాడను కాను. కానీ ఈ దేహ - దృశ్య - భావాదులుగా భాసిస్తున్నది, భాసింపజేస్తున్నది నేనే! నా ప్రకాశవిశేషాలే మనోబుద్ధి చిత్తాహంకారాలు కూడా!
ఇక్కడి శూన్యము అశూన్యములు నా ప్రభావములే! శోభ-అశోభ కూడా నాదే। నేనే।
ఈ సమస్తముగా శోభిస్తూ ఉన్నది నేనే।
నాకు అన్యమైనదేదీగా నేను శోభించటము లేదుకూడా.
ఈ సమస్తమునకు నేను అనన్యుడను.
6. తుల్య -అతుల్య విహీనో2స్మి
నిత్య శుద్ధః సదా శివః।
సర్వ-అసర్వ విహీనో2స్మి।
సాత్త్వికో2స్మి సదా2స్మ్యహమ్।।
నేను అయినదీ లేదు. నేను కానిది లేదు. నాతో సమానమైనదీ లేదు. నాకు సమానము కానిదీ లేదు.
- నిత్యశుద్ధుడను. జీవాత్మగా ఉన్న పరమాత్మను. ‘పరమాత్మయే’ అయి ఉన్న జీవాత్మను. సదాశివుడను!
నాకు సర్వము లేదు! అసర్వము లేదు! శుద్ధసాత్త్వికుడను! సదా సత్స్వరూపుడను!
7. ఏకసంఖ్యా విహీనో2స్మి।
ద్విసంఖ్యావాన్ అహం న చ।
సత్ - అసత్ భేద హీనో2స్మి।
సంకల్ప రహితో2స్మ్యహమ్।।
నాకు ఏకము లేదు! రెండు అనునది లేదు. నాకు రెండవది లేదు. ‘2’ సంఖ్యను కాను! జీవాత్మ-పరమాత్మలనబడే రెండు ధర్మములు నాకు లేవు. ఉభయత్రా ఏకస్వరూపుడను.
నాకు ఉనికి - లేమి అనే సత్ - అసత్ భేదము లేదు. సర్వసంకల్పములకు మునుముందే ఉన్నవాడను! కనుక నేను సంకల్పరహితుడను. సంకల్పా తీతుడను. సంకల్పములకు ‘సాక్షి’ని. సంకల్పములకు జననస్థానమును.
8. నానాత్వభేద హీనో2స్మి।
హి అఖండానంద విగ్రహః।
న అహమస్మి। న చ అన్యో2స్మి।
దేహాది రహితో2స్మ్యహమ్।।
ఏకమగు పరబ్రహ్మమే స్వస్వరూపంగా కలిగి ఉండటంచేత నేను ఆత్మ-అనాత్మ భేదమనుదే లేనివాడను. అఖండరూపుడను.
(అహమ్ భావనకు ఉత్పత్తి స్థానము - సాక్షి అగుటచే) నేను అహమ్ స్వరూపమునుకాను. వేరైన అన్యస్వరూపుడనుకాను, కేవలస్వరూపుడనగు నేను దేహము మొ।।వి లేనివాడను. అవన్నీ నాకు ఉపకరణములు.
9. ఆశ్రయ ఆయాశ్రయ హీనో2స్మి।
ఆధార రహితో–2 అహమ్।
బంధ-మోక్షాది హీనో2స్మి।
శుద్ధబ్రహ్మాస్మి సో2స్మ్యహమ్।।
నన్ను ఆశ్రయించినదీ లేదు. ఆశ్రయించనిదీ లేదు. నాకు ఆధారమంటూ మరొకటేదీ లేనివాడను. నాకు బంధము లేదు. కాబట్టి మోక్షమనబడేది కూడా లేదు. సదా శుద్ధ బ్రహ్మమే నేను!
10. చిత్తాది సర్వహీనో2స్మి।
పరమో2స్మి। పరాత్-పరః।
సదా విచార రూపో2స్మి।
నిర్విచారో2స్మి సో2స్మ్యహమ్।।
నాకు మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు అనబడేవేవీ లేవు. వాటన్నిటినీ ఆవల ఉన్నవాడిని. ఆవలకు కూడా వేరై ఉన్నవాడను. ‘పరము’నకు కూడా పరమై ఉన్నవాడిని. (I am the beyond to even beyond)
చిదానంద రూపుడను. అందుచేత విచారణా స్వరూపుడను అయి కూడా, - సదా నిర్విచారస్వరూపుడన. విచారణకు ఆవల ఉన్నవాడను
11. ‘అ’ కార ‘ఉ’ కార రూపో2స్మి
‘మ’ కారో2స్మి సనాతనః
ధ్యాతృ-ధ్యాన విహీనో2స్మి
ధ్యేయహీనో2స్మి సో2స్మ్యహమ్।।
‘అ’కార ‘ఉ’కార రూపమగు పరమాత్మను నేనే! పరస్వరూపుడను.
‘మ’ కారమగు సనాతన ‘ఇహ’ స్వరూపుడను కూడా! అయితే ధ్యానము చేయువాడు, ధ్యానము (Thinker Thought)- రెండు లేనివాడను. ధ్యానము చేయబడు విషయ వ్యవహారములు నాకు లేవు! సో2హమ్। అదియే నేను.
12. సర్వపూర్ణ స్వరూపో2స్మి।
సత్-చిత్-ఆనంద లక్షణః।
సర్వతీర్థ స్వరూపో2స్మి।
పరమాత్మాస్మి అహం శివః।।
ఈ సర్వమును నిండియున్న పూర్ణస్వరూపుడను. సత్-చిత్-ఆనందములు నా స్వరూపముయొక్క లక్షణములు (qualities). సర్వతీర్థములు నా స్వరూపమే. నేనే సర్వ తీర్థములలో ఆరాధించబడుచున్నాను. పరమాత్మను। శివస్వరూపుడను। లక్ష్య-అలక్ష్యములు లేని వాడను! నాశనమంటూ లేనట్టి నిత్యానుభవ స్వరూపుడను.
13. లక్ష్య-అలక్ష్య విహీనో2స్మి।
లయహీన రసో2స్మ్యహమ్।
మాతృ-మాన విహీనో2స్మి।
మేయ హీనః (అమేయమ్) శివో2స్మ్యహమ్।।
ప్రమాతృ-ప్రమాణములు లేనివాడను. నిరూపించబడేది - నిరూపణలు లేనివాడను. అమేయుడను. నాకు వేరై మరొకటేదీ ఎక్కడా లేనట్టి శివానందస్వరూపుడను. అప్రమేయుడను.
14. న జగత్ సర్వ ద్రష్టాస్మి।
నేత్రాది రహితో2స్మ్యహమ్।
ప్రవృద్ధో2స్మి। ప్రబుద్ధో2స్మి।
ప్రసన్నో2స్మి। పరో2స్మ్యహమ్।।
నేను జగత్తును కాను. జగద్రష్టనుకాను. ఆ ద్రష్టను భావనచే కల్పించుకొను చున్నట్టి దృక్ స్వరూపుడు. నేత్రములు మొదలైన ఇంద్రియములకు పరిమితుడనుగాను. అవన్నీ లేనప్పుడుకూడా ఉన్నవాడను. సర్వత్రా ప్రవృద్ధి పొందుచున్నది నేనే! ప్రబోధస్వరూపుడను. నిత్యానంద స్వరూపుడు. సర్వమునకు పరమై, సర్వము ఆనందము కొరకై కల్పించుకొనుచున్న వాడను!
15. సర్వేంద్రియ విహీనో2స్మి-
సర్వ కర్మకృత్ అపి అహమ్।
సర్వవేదాంత తృప్తో2స్మి।
సర్వదా సులభో2స్మ్యహమ్।
సర్వకర్మలు నిర్వర్తిస్తూ ఉన్నది నేనే అయి ఉండి కూడా, ఇంద్రియ రహితుడను. తెలియబడేదంతా తెలుసుకొంటూ ఆనందించువాడను. సర్వసులభుడను! సమస్తజీవులను తెలిసియే ఉన్నవాడను. ‘నేను’ తెలియనివారు ఎవ్వరుంటారు? ఎవ్వరూ ఉండరు?
16. ముదిత - అముదితాభ్యో2స్మి।
సర్వ మౌన ఫలో2స్మ్యహమ్।
నిత్య చిన్మాత్ర రూపో2స్మి।
సదా సత్-చిత్ మయో2స్మ్యహమ్।।
ఆనందించువాడను, ఆనందాతీతుడను కూడా. సర్వ విషయములపట్ల మౌనము వహించినప్పుడు కూడా శేషించి ఉన్నవాడను. జాగ్రత్. స్వప్న - సుషుప్తులు నా ఎరుక యొక్క విన్యాసములే. కనుక నిత్య చిన్మాత్ర రూపుడను. సదా సత్ - చిత్ మయుడనై ఉంటున్నాను!
17. యత్ కించిదపి హీనో2స్మి।
స్వల్పమపి అవినాస్మ్యహమ్।
హృదయ గ్రంథి హీనో2స్మి।
హృదయాంభోజ మధ్యగః।।
‘నాది’ అనునది ఎక్కడా ఏదీ లేనివాడను. స్వల్పమై ఉన్నది, హీనమై ఉన్నది కూడా నేనే.
వినాశనము అనునదే లేనివాడను. నాకు హృదయగ్రంథులు (సంతోషము- దుఃఖము- ఆవేశము-ఆశయము ఇత్యాదులు) లేనివాడను. అయితే హృదయ కమలమధ్యగతుడనై ఉన్నది నేనే!
18. షడ్వికార (షట్ వికార) విహీనో2స్మి
షట్ కోశరహితో2స్మ్యహమ్।
అరి షట్ వర్గ ముక్తో2స్మి।
అంతరాత్ అంతరో2స్మ్యహమ్।।
- నాకు షట్ వికారములు లేవు. ఆశ్రయించటము, జన్మించటము, బాల్యము, యౌవనము, వార్థక్యము, మరణము - అను వికారములు నాకు లేవు.
- అన్నమయ-ప్రాణమయ-మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ
ఆనందాతీతమయ షట్ కోశములు కూడా నాకు లేవు.
- కామ - క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్యములచే స్పృశించబడని కేవలీ రూపుడను!
- హృదయ - అంతరారంతర చైతన్య స్వరూపుడను!
19. దేశ కాల విముక్తో2స్మి।
దిగంబర సుఖో2స్మ్యహమ్।
నాస్తి బంధ విముక్తో2స్మి।
‘న’కార రహితో2స్మ్యహమ్।।
- నేను దేశ - కాలములచే బద్ధము కానట్టి ఆత్మస్వరూపుడను!
- సర్వదిక్ ఆకాశస్వరూపుడను! సుఖ స్వరూపుడను.
- బంధముగాని ముక్తిగాని లేనివాడను.
- ‘లేను’ అనేది లేనట్టి స్వరూపుడను. నేను ఉండని క్షణముగాని, కాలము గాని - లేదు. ‘నరత్వము’ అనునదిగా అగువాడనుకాను.
20. అఖండాకాశ రూపో2స్మి-హి
అఖండాకారమస్మి అహమ్।
ప్రపంచముక్త చిత్తో2స్మి।
ప్రపంచ రహితో2స్మ్యహమ్।।
అఖండాకాశ స్వరూపుడను. అఖండాకార రూపుడను, ప్రపంచమే లేనట్టి చిత్తము కలవాడను. నాకు ప్రపంచమనునదే లేదు. చిదానంద స్వరూపుడను.
21. సర్వప్రకాశ రూపో2స్మి।
చిన్మాత్ర జ్యోతిరస్మ్యహమ్।
కాలత్రయ విముక్తో2స్మి।
కామాది రహితో2స్మ్యహమ్।।
సర్వమును ప్రకాశింపజేయు స్వరూపుడను. అన్నిటినీ ‘ఎరుక’ అనే దీపముతో వెలుతురు ప్రసరింపజేసే చిన్మాత్రజ్యోతి స్వరూపుడను. త్రికాలాబాధ్యుడు. భూత-వర్తమాన-భవిష్యత్‌లకు ఆవల ఉన్నవాడను. నాకు కామము- కావలసినది అంటూ ఏదీ లేదు. వదలవలసినదీ లేదు, పట్టించుకోవలసినదీ లేదు.
22. కాయికాది విముక్తో2స్మి
నిర్గుణః కేవలో2స్మ్యహమ్।
ముక్తి హీనో2స్మి, ముక్తో2స్మి।
మోక్షహీనో2స్మి అహం సదా।
ఈ భౌతిక శరీరముల విషయానికివస్తే, - ఇవి నాకు ఎప్పుడూ లేవు. కనుక నిత్యదేహ విముక్తుడను. విదేహుడను.
గుణములకు మునుముందే నేనున్నాను. అట్టి గుణాతీతుడగు నేను సదా నిర్గుణడను। కేవల స్వరూపుడను. నాకు బంధమే లేదు. నిత్యముక్తుడను.
కనుక ముక్తి యొక్క ఆవశ్యకత ఏముంటుంది? బంధము లేనివానికి మోక్షమేముంటుంది? కనుక ముక్తి - మోక్షములకు నేను విషయమే కాను.
23. సత్య - అసత్యాది హీనో2స్మి
సన్మాత్రాన్నాస్మ్యహం సదా
(సత్ మాత్రాత్ న అస్మి అహం సదా)
గంతవ్య దేశ హీనో2స్మి
గమనాది వివర్జితః।।
సత్య-అసత్యములకు అతీతుడైనవాడను. స్వప్నములో సత్యమేమున్నది? స్వప్నము తనదైనవాడు - స్వప్నమునకు అతీతుడే కదా!
కేవల సత్ స్వరూపుడను. సత్ (ఉనికి)కి కూడా ఆవలివాడను. (సత్ మాత్రాతీతుడను).
నేను ఒకచోట నుండి మరొకచోటికి వెళ్ళువాడను కాదు! రాక-పోకలు లేనివాడను. (I am always there where I am ever)
24. సర్వదా సమరూపో2స్మి।
శాంతో2స్మి పురుషోత్తమః।
ఏవం స్వానుభవో యస్య
‘సో2హమ్’ అస్మి న సంశయః।।
సర్వదా సమరూపుడను। ఏకరూపుడను। పరమశాంతుడను. పురుషోత్తముడను. ఉత్తమ పురుషను (‘I’ at its absolute). స్వానుభవం చేత నేను అదియే! ఆత్మయే! పరమాత్మయే! ఈ సమస్తము నేనే। నేను కానిది ఏదీ లేదు. క్రొత్తగా కావలసినదీ లేదు.

నా గురించిన సందేహమేదీ నాకు లేదు.
ఫలశృతి
యః శృణోతి సకృద్వాపి (సకృత్ వ అపి)
బ్రహ్మైవ భవతి స్వయం।
బ్రహ్మైవ భవతి స్వయం।।
ఫలశృతి
ఎవ్వరీ బ్రహ్మతత్త్వ గానము శ్రద్ధగా వింటారో వారు స్వయముగా బ్రహ్మమే అగుచున్నాను.
‘నేను బ్రహ్మమే’ అని గమనించి, ఆస్వాదిస్తున్నారు.

ఇతి మైత్రేయోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।


మైత్రేయోపనిషత్ - నేనెవరై ఉన్నాను? ‘‘స్వస్వరూపాత్మ పూజ’’

ఓం అహమస్మి - పరశ్చాస్మి। బ్రహ్మాస్మి।
ప్రభవో2స్మ్యహమ్।
సర్వలోక। గురుశ్చాస్మి।
సర్వలోకే2స్మి
సో2స్మ్యహమ్। Line#6
తుల్యాతుల్య విహీనో2స్మి
నిత్యశుద్ధః సదాశివః ।
సర్వాసర్వ విహీనో2స్మి ।
సాత్త్వికో2స్మి ।
సదా2స్మ్యహమ్। Line#38
అహమేవాస్మి।
సిద్ధో2స్మి।
శుద్ధో2స్మి।
పరమో2స్మ్యహమ్।
అహమస్మి।
సదా సో2స్మి।
నిత్యో2స్మి।
విమలో2స్మ్యహమ్। Line#14
ఏకసంఖ్యావిహీనో2స్మి ।
ద్విసంఖ్యావాన్ అహమ్ న చ ।
సదసద్భేద హీనో2స్మి ।
సంకల్పరహితో2స్మ్యహమ్ । Line#42
నానాత్వభేద హీనో2స్మి
(హి) అఖండానంద విగ్రహః
నా2హమస్మి - న చ అన్యో2స్మి।
దేహాది రహితో2స్మ్యహమ్।। Line#46
విజ్ఞానో2స్మి।
విశేషో2స్మి।
సోమో2స్మి।
సకలో2స్మ్యహమ్।
శుభో2స్మి।
శోకహీనో2స్మి।
చైతన్యో2స్మి।
సమో2స్మ్యహమ్। Line#22
ఆశ్రయ-అనాశ్రయ హీనో2స్మి।
ఆధారరహితో2స్మ్యహమ్।
బంధమోక్షాది హీనో2స్మి।
శుద్ధబ్రహ్మాస్మి-సో2స్మ్యహమ్ ।। Line#50
చిత్తాది సర్వహీనో2స్మి।
పరమో2స్మి పరాత్పరః।
సదా విచారరూపో2స్మి।
నిర్వచారో2స్మి సో2స్మ్యహమ్ ।। Line#54
మానావమాన హీనో2స్మి।
నిర్గుణో2స్మి ।
శివో2స్మ్యహమ్ ।
ద్వైతాద్వైత విహీనో2స్మి ।
ద్వంద్వ హీనో2స్మి ।
సో2స్మ్యహమ్। Line#28
‘అ’ కార ‘ఉ’ కార రూపో2స్మి।
‘మ’ కారో2స్మి సనాతనః।
ధ్యాతృ-ధ్యాన విహీనో2స్మి।
ధ్యేయహీనో2స్మి - సో2స్మ్యహమ్ ।। Line#58
భావాభావవిహీనో2స్మి ।
భాసాహీనో2స్మి ।
భా2స్మ్యహమ్ ।
శూన్యాశూన్య ప్రభావో2స్మి।
శోభనాశోభనో2స్మ్యహమ్। Line#34
సర్వపూర్ణ స్వరూపో2స్మి।
సచ్చిదానంద లక్షణః।
సర్వతీర్థ స్వరూపో2స్మి।
పరమాత్మాస్మ్యహం శివః।
లక్ష్యాలక్ష్య విహీనో2స్మి।
లయహీనరసో2స్మ్యహమ్।
మాతృ మాన విహీనో2స్మి।
మేయహీనః - శివో2స్మ్యహమ్ Line#66న జగత్సర్వద్రష్టా2స్మి।
నేత్రాది రహితో2స్మ్యహమ్।
ప్రవృద్ధో2స్మి ప్రబుద్ధో2స్మి।
ప్రసన్నో2స్మి పరో2స్మ్యహమ్।। Line#70
సర్వప్రకాశ రూపో2స్మి।
చిన్మాత్రజ్యోతిరస్మ్యహమ్।
కాలత్రయవిముక్తో2స్మి।
కామాది రహితో2స్మ్యహమ్।। Line#98
సర్వేంద్రియవిహీనో2స్మి।
సర్వకర్మ కృదప్యహమ్।
సర్వవేదాంతతృప్తో2స్మి।
సర్వదా సులభో2స్మ్యహమ్।। Line#74
కాయికాది విముక్తో-స్మి।
నిర్గుణః కేవలో2స్మ్యహమ్।
ముక్తిహీనో2స్మి ముక్తో2స్మి।
మోక్షహీనో2స్మ్యహమ్ సదా।। Line#102
ముదితాముదితాభ్యో2స్మి।
సర్వమౌనఫలో2స్మ్యహమ్।
నిత్యచిన్మాత్రరూపో2స్మి।
సదా సచ్చిన్మయో2స్మ్యహమ్।। Line#78
సత్యాసత్యాది హీనో-స్మి।
సన్మాత్రాన్నాస్మ్యహం సదా।
గంతవ్యదేశ హీనో2స్మి।
గమనాది వివర్జితః। Line#106
యత్కించిదపి హీనో2స్మి।
స్వల్పమప్యవినాస్మ్యహమ్।
హృదయ గ్రంథి హీనో2స్మి।
హృదయాంభోజ మధ్యగః।। Line#82
సర్వదా సమరూపో2స్మి
శాంతో2స్మి పురుషోత్తమః।। Line#108
షడ్వికారవిహీనో2స్మి।
షట్కోశరహితో2స్మహమ్।
అరిషఢ్వర్గముక్తో2స్మి।
అంతరాత్ అంతరోస్మ్యహమ్।। Line#86
దేశకాల విముక్తో2స్మి।
దిగంబరసుఖోస్మ్యహమ్।
నాస్తి బంధవిముక్తో2స్మి।
నకార రహితో2స్మ్యహమ్।। Line#90
ఫలశ్రుతి
ఏవం స్వానుభవో యస్య
సో2హమస్మి న సంశయః।।

యః శృణోతి సకృద్వాపి
బ్రహ్మైవ భవతి స్వయమ్।
బ్రహ్మైవ భవతి స్వయమ్।।
అఖండాకాశరూపో2స్మి।
(హి) అఖండాకారమస్మ\xc2\xabహమ్।
ప్రపంచముక్త చిత్తో-స్మి।
ప్రపంచరహితో-స్మ\xc2\xabహమ్।। Line#94

ఇత్యుపనిషత్
మైత్రేయోపనిషత్ సమాప్తా।

ఉపనిషత్ మాత్రే నమః।।


సామవేదాంతర్గత

10     మైత్రేయ ఉపనిషత్

అధ్యయన పుష్పము


బృహద్రథుడు - పౌరాణిక విశేషాలు

వర్తమాన ఉపనిషత్ : ఇక్ష్వాకు వంశపు రాజు.

భారతము : బృహద్రథుడు ఉపరిచరవసువు కుమారుడు.

భాగవతము : దోమపాదుని వంశమువాడు. ‘పృథులాక్షుడు’ అను రాజుకు కుమారుడు. ఈయన కుమారుడు కుశాగ్రుడు.

భాగవతము : ఒకరాజు. ఇతని కుమారుడు పురంజయుడు.

భాగవతము : అశోకుని వంశమువాడైన శతధన్వుని కుమారుడు.

భాగవతము : దూర్వుని పుత్రుడైన నిమి తనయుడు. ఇతని కుమారుడు సుదాసుడు.

భారతము : బృహద్రథుడు మగధరాజు. ఈతని పత్నులు కాశీరాజు కుమార్తెలు అయిన ‘‘గవల, వార’’లు. చాలా కాలం సంతానము లేకపోవటము వలన అనేక వ్రతములు నిర్వర్తించారు.

ఒక సందర్భములో చూత వృక్షము క్రింద తపస్సు చేసుకుంటున్న కౌశికమునిని పుత్రసంతానము కొరకై అభ్యర్థించారు. అప్పుడు ఆ ముని నేలపై వ్రాలిన ఒక మామిడి పండును మంత్రించి ‘‘ఈ ఫలము వలన నీకు ఒక కుమారుడు కలుగగలడు’’ - అని దీవించారు. అప్పుడు బృహద్రథుడు మామిడి పండును ఇద్దరు భార్యలకు ఇచ్చారు. వారు ఆ పండును సగముగా చీల్చి ఉభయులు తిన్నారు. 10 నెలల శిశువు జనించారు. ఆ వికృతరూపులను ‘దాది’ చేత గృహద్వారము వద్ద పారవేయించారు.

జర అనే రాక్షసి ‘‘ఇది నాకు బలిగా ఇస్తున్నారు’’ - అని భావించి రెండు శరీర భాగములను నొక్కిబట్టి అదుమగా, ఒక మగ శిశివు రూపు దిద్దుకొన్నది. ఆ శిశువు బరువు మోయలేక జర ఎటో వెళ్ళిపోయింది. ఆ శిశువు బిగ్గరగా ఏడువగా ఒక ముసలి దాది ఆ శిశువును తల్లులకు చేర్చి - ‘జర’ చేసిన ‘సంధము’ వివరించింది. ఆతడే జరాసంధుడు.

ఆ జరాసంధుడు ‘జర’ అనే రాక్షసి పేరుతో ప్రతి సంవత్సరము ఉత్సవము జరిపించేవాడు. జరాసంధుడు పెద్ద అయిన తరువాత బృహద్రథుడు వానప్రస్థమునకై తపోవనమునకు వెళ్లారు.

శాకల్య మహర్షి గురించి - పౌరాణిక విశేషాలు

బ్రహ్మాండ పురాణము : శాకల్యుడు ఒక ఋషి. ‘పరశువు’ అనే రాక్షసుడు ఒక బ్రాహ్మణుని రూపముగా వచ్చి, శాకల్యుని ఆశ్రమమునకు ఎదురుగా నిలచెను. ‘‘ఒక శాకల్య మహర్షీ! నాకు భిక్ష!’’ …. అని అరచాడు. మహర్షి ఎంతగా అన్నము పెట్టినను ‘‘ఇది చాలదు. నాకు ఇంకా ఆకలి’’ అని అరవసాగాడు.

శాకల్య ఋషి : ఎవరు నీవు?

పరశువు : నేను ఒక రాక్షసుడను. అతిథిగా వచ్చాను. నాకు ఆకలి ఇంకా తీరలేదు. నిన్ను కూడా తింటాను.

శాకల్య ఋషి : నేను ఆత్మతత్త్వోపాసకుడను. నన్ను తినటము నీకు సాధ్యమయే పని కాదు. నా దగ్గిర ఉన్న ఆహారమంతా నీకు ఇచ్చివేస్తాను. అతిథిగా స్వీకరించి వెళ్ళిపో. నన్ను బ్రహ్మాది దేవతలు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటున్నారు కాబట్టి ఇంతకు మించి నీకు కూడా త్రోవలేదు కూడా.

అయినా సరే ఆ పరశువు రాక్షసుడు శాకల్యఋషిని మ్రింగటానికి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఋషి వేయి తలలతో, రెండువేల చేతులతో కనిపించారు.

పరశు రాక్షసుడు : ఓ ఋషిపుంగవా! మీరు సామాన్యులు కారని నేను ఒప్పుకొంటున్నాను. నన్ను క్షమించండి. దయతో నాకు భిక్ష ప్రసాదించండి.

శాకల్య ఋషి : ఓ పరశూ! అందుకు ఉపాయము చెపుతాను. గౌతమీ నదీ తీరానికి వెళ్లి స్నానంచేసి అక్కడ సరస్వతీ దేవిని ప్రార్థించు. ఆ జగజ్జనని నీకు ‘‘జ్ఞానము’’ అనే అమృతాహారమును ప్రసాదించగలదు

భాగతము : శాకల్య ఋషి ‘సౌభరి’ అను బ్రహ్మజ్ఞాని యొక్క కుమారుడు. తాను ఋగ్వేదమును అమూలాగ్రము అధ్యయనము చేసి, ఐదువిధములుగా విభజించి తన శిష్యులైనట్టి - వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిఖరుడు - అను వారలకు ఉపదేశించాడు. వీరు ‘జాతకర్ణి’ అను వానికి ఉపదేశించారు. ఇందలి శాకాయన్య మహర్షి శాకల్యులవారే అయిఉండవచ్చు - అని కొందరు పురాణశాస్త్రవేత్తల అభిప్రాయము.

మైత్రేయ మహర్షి గురించి - పౌరాణిక విశేషాలు

భాగవతము : వనవాసము చేస్తున్న పాండవులను చూచిన మైత్రేయమహర్షికి మనస్సు ద్రవించింది. వెంటనే హస్తినాపురము వచ్చి ధృతరాష్ట్ర మహారాజును దర్శించారు. ధృతరాష్ట్రుడు ‘‘నా కుమారులను ఆశీర్వదించండి’’ - అని అడిగారు. అప్పుడు మైత్రేయుడు ‘‘ఓ మహారాజా! ధృతరాష్ట్రా! పాండవులు నిర్మల హృదయులు. మంచివారితో శత్రుత్వము సర్వదా అనర్థదాయకము. మీరు మీ కుమారుడు దుర్యోధనుని క్షేమము నిజముగా కోరితే, - పాండవులతో స్నేహమును ఆశ్రయించండి’’.

అది విని దుర్యోధనుడు పక పకా నవ్వాడు.

మహర్షి : ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు ధర్మ పక్షపాతి. ఆయన పాండవులకు తోడుగా ఉన్నంతవరకు మీరంతా వారిని ఏమీ చేయలేరు. మీరు, మీ ప్రజలు సుఖంగా ఉండతలచుకొంటే, మీ దుర్మార్గపు యోచనలనుండి విరమించండి.

ఆ మాటలు విని దుర్యోధనుడు - ఎగతాళిగా గేలిచేస్తూ చేతివ్రేళ్ళు చూపించి, తొడలు సడలించాడు.

మైత్రేయ మహర్షికి ఆ ఎకసెక్యము చూచి కోపం వచ్చింది. ‘‘ఓ దుర్యోధనా! భీముని గదతో నీ తొడలు విఱుగగలవు. ‘కిమీరుడు’ అనే రాక్షసుని భీముడు సంహరించటము చూచాను. కనుక జాగరూకులై ఉండండి.

అప్పుడు ధృతరాష్ట్రుడు, ‘‘మహర్షీ! దయతో మీ శాపము ఉపసంహరించండి!’’ అని బ్రతిమలాడాడు.

మహర్షి : నేను శపించటము లేదు. సూచిస్తున్నాను. అంతే. ఇప్పటికైనా బుద్ధి కలిగి ఉంటే, మీ దుర్యోధనునికి మంచిది.

ఆ తరువాత శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి విదురునికి ధర్మము గురించి, తత్త్వము గురించి బోధించారు.

ఇక మనము ఉపనిషత్ అధ్యయనములో ప్రవేసిస్తున్నాము.మైత్రేయోపనిషత్ ప్రారంభము

ప్రమోధ్యాయః - బృహద్రథ వైరాగ్యము

‘ఓం’ - ఓం సంజ్ఞార్థ స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ….!

ఇక్ష్వాకు వంశములో బృహద్రథుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన మహాప్రాజ్ఞుడు. ధర్మనిరతుడు. ప్రజారంజకంగా ప్రజలను పాలిస్తూ ఉండేవారు.

అనేక సంవత్సరాలు ఆయన పాలనలో ప్రజలు సుఖ శాంతులతో, ఐశ్వర్య ఆనందములతో ఉండేవారు. ఆయన ఉత్తమ రాజుగా లోకప్రసిద్ధుడైనారు. (స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతమ్।)

ఒకానొక సమయంలో….

ఆ మహారాజు ఇట్లా ఆలోచించసాగారు. - ‘‘ఈ దేహము శాశ్వతమా? కాదు కదా! ఈ రాజ్యాధికారములు, ఇంద్రియానందము, పదవులు, పేరు ప్రతిష్ఠలు…ఇవన్నీ భ్రమాత్మకము. అశాశ్వతము. కాలబద్ధము. ఎప్పటికోఅప్పటికి జీవుడనగు నేను దేహముతో బాటే అన్నీ వదలవలసినదే కదా! అందుచేత నేను ఇక ఇప్పుడే ఇవన్నీ త్యజించెదనుగాక! వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి శేష జీవితకాల అవకాశమును సద్వినియోగపరచుకోవటమే సముచితము. శాశ్వతమైన వస్తువును ఆశ్రయించటానికి ఇంకా కూడా అశ్రద్ధ పనికిరాదు. ఎందుకంటే వార్థక్యము - మరణము సంభవించేవరకు ఇంద్రియ విషయములలో ముగ్ధుడనై (Ignorant) గడపటము పరమునకు అపోహసదృశమే అవుతుంది. ఈ ఇంద్రియములు, ఇంద్రియ విషయములతో కూడిన దేహము నన్ను విడువకముందే, నేను దీనిని మనస్సుతో విడచినవాడవవటము అభ్యసించెదను గాక।’’

క్రమంగా ఆయన తీవ్రమైన వైరాగ్యమును ఆశ్రయించసాగారు. వైరాగ్యభావాలు రూపుదిద్దుకోగానే ఆ బృహద్రథ మహారాజు పెద్దకుమారుని (సుదాసుని) పిలచి, మహారాజుగా అభిషేకం జరిపించారు.

ఒకానొకరోజు సూర్యలోకమునుండి సూర్యభగవానుని సంకల్పమును అనుసరించి సూర్యలోక వాసుడు, లబ్ధప్రతిష్ఠుడు, భగవంతుడు అగు శాకాయన్యుడు బృహద్రథ మహారాజు సమక్షంలో ప్రత్యక్షమైనారు. ఆయన అగ్ని - పొగలేని గొప్ప తేజస్సుతో వెలుగొందుచున్నారు.

ఆత్మజ్ఞానముచే మహాప్రకాశవంతులై, ధగధగాయమానంగా దివ్యకాంతులతో, జ్ఞాన తేజస్కులై ప్రకాశిస్తున్నారు.

శాకాయన్యులు : నాయనా! బృహధ్రథా! ఉత్తిష్ఠ। ఉత్తిష్ఠ। నీ భక్తి శ్రద్ధలతో కూడిన ధ్యానమునకు మెచ్చాము. చాలా ఆనందము. నీకు ఏమి వరము కావాలో కోరుకో. నెరవేర్చటానికి సంతోషముగా సిద్ధమై ఉన్నాము.

బృహద్ర థ మహారాజు : హే భగవాన్! మీ దర్శన భాగ్యము లభించినందుకు నాకు చాలా ఆనందము, సంతోషము. నా ఈ ప్రదక్షిణ పూర్వక సాష్టాంగదండ ప్రమాణములు దయతో స్వీకరించండి! ఈ (భౌతిక) పుష్పములు మరియు నా హృదయ పుష్పము మీ పాదపద్మములను అలంకరించునుగాక! మహాత్మా! మీరు బ్రహ్మజ్ఞానులై తేజోమయంగా కనిపిస్తున్నారు. పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొన్న మహనీయులగు మిమ్ములను లోకసంబంధమైన కోరికలు తీర్చమని వరమడగటం అర్థరహితమైన విషయం కదా!

స్వామీ! నేను అల్పజ్ఞుడిని. ఆత్మజ్ఞాని కాదు. అజ్ఞానినై తేజో విహీనుడనై దేహ దేహాంతరాలు గడవుచున్నవాడను. తత్త్వవేత్తను కాదు. ఇక మీరో? పరబ్రహ్మతత్త్వమును సాక్షాత్కరించుకొన్న మహామహనీయులుగా లోక-పురాణ గాథా ప్రసిద్ధులు. అందుచేత మీ యొక్క దర్శనమే మహత్ భాగ్యము. నాకు తత్త్వజ్ఞానమును విశదీకరించమని, ప్రసాదించమని వినమ్రుడనై మీకు నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాను.

శాకాయన్యులు : ఓ ఇక్ష్వాకువంశ సంజాతా। బృహద్రథా! ‘‘తత్త్వజ్ఞానము’’ అనేది చాలా సంక్లిష్టము కదయ్యా! చెప్పే వానికిగాని, వినేవానికిగాని ఆ సమాచారము (బ్రహ్మవిద్య) ఏమైన సులభమైన విషయమా? కానేకాదయ్యా! అశక్యమైనదని అనవచ్చుకూడా! అందుచేత తత్త్వజ్ఞానమును ప్రసాదించటమనే విషయం ప్రక్కకుపెట్టి, మరింకేదైనా వరము అడుగు. తప్పకుండా ప్రసాదిస్తాను. ఇష్టదైవము ప్రత్యక్షమైనప్పుడు ఏవైనా సంపద, స్థితి వంటివి అడగటమే లోకాచారము. అంతేగాని, తత్త్వజ్ఞానము వరముగా ప్రసాదించటము లోకాచారము కాదు కదా!

- - -

మహాత్ముడగు శాకాయన్యుని వాక్యములు విన్న బృహద్రథుడు లేచి నిలుచుని వారిని సమీపించారు. స్వామి పాదాలు స్పృశించి భక్తితో రెండు కళ్ళకు హత్తుకున్నారు.

బృహద్రథుడు : హే బ్రహ్మజ్ఞా! సర్వజ్ఞా! మీరు సర్వము ఎరిగినవారు. ఆత్మతత్త్వజ్ఞానము సంపాదించుకోకుండా ఇక తదితరమైనవి - ఈ దృశ్యములో - ఏది పొందితే మాత్రం ఏమి ప్రయోజనం? అసలు, ఇక్కడ ఈ 14 లోకాలలో శాశ్వతమైనది, పొందికూడా ఆ తరువాత ఎటువంటి దుఃఖము కలిగించనిది - అంటూ ఏదైనా ఉన్నదా? లేదు. ఈ అశాశ్వత - దుఃఖమయ జగత్తులో ఏదో పొందితే మాత్రం శాశ్వతానందము ఎట్లా లభిస్తుంది చెప్పండి స్వామీ!

ఇక్కడ 14 లోకాలలో కూడా నశించనిదేదీ నాకు కనిపించటంలేదు. కాలముతో వచ్చి కాలముతో పోయేవే ఇక్కడివన్నీ కూడా!

హే మహనీయా!

ఇదంతా ఇట్లా ఉండగా, ఇక సంసార బద్ధ జీవులమగు మా గతిని చూడండి. ఇందులో పైపై మెరుపులతో, తళుకు బెళుకులతో కనిపించే అనేక సంసార కామ ఉప భోగముల ధ్యాసలను ఆశ్రయించి, వాటితో సంబంధము పెంపొందించుకొని ఉంటున్నాము. అనేక ‘అసకృత్’ అయినట్టి, అర్థంపర్థంలేని కార్యక్రమములలో మానసికంగా ఇరుక్కొని జన్మజన్మలు వృథాచేసుకొంటున్నాము. అతి దీనులమై, ఏమీ తెలియనివారమై కట్టుకొయ్యకు కట్టబడిన పశువువలె బద్ధులమై ఉంటున్నాము. హృదయంలో అజ్ఞానముచేత పేరుకొని ఉన్న అనేక దిగుళ్ళు, వేదనలు, భ్రమలు మమ్ములను బహు దుఃఖితులుగా చేస్తున్నాయి. ఇదీ మాగతి! ఇక విదతవేద్యులగు మీవంటి ఆత్మజ్ఞానప్రజ్ఞాదురంధురులు కాకపోతే మమ్మెవరు కాపాడుతారు!

ఒక కప్ప ఇరుకైన చీకటి నూతిలో ఇరుక్కొని బయటకు రాలేక ఆహారము మొదలగునవి పొందక ఆక్రోశిస్తుంది చూచారా! మా గతి కూడా అట్లా ఉన్నది. అంధోపానస్తో భేక ఇవ। చీకటి నూతిలోని కప్ప నీళ్లలో తిరుగుతూ ‘‘ఆ" అంతా ఇంతే।’’ అని అనుకుంటుంది. మేము ఈ ఇంద్రియార్థములు అనే మురికినీళ్లున్నట్టి ‘అజ్ఞానము’ అనే చీకటి నూతిలో బెకబెకలాడుచూ దేహ దేహాంతరాలు గడుపుతూ వస్తున్నాము. జన్మ జరా మృత్యు ‘చక్రము’లో ఇరుక్కొని అంతరాంతరాలలో ఆక్రోశిస్తున్నాము.

ఓ మహామహనీయా! భవరోగమునకు ప్రముఖవైద్యులు (Great Doctor) అగు తమరు నన్ను ఈ సంసార లంపటము నుండి సముద్ధరించటానికై వేడుకుంటున్నాను. మీరే నాకు గతి!

హే భగవాన్! ఇంద్రియార్థములను ప్రదర్శించే ఉపకరణయంత్రమువంటి ఈ పాంచభౌతిక శరీరము స్త్రీ - పురుషుల కలయికను ఉపాదాన (Like an instrument) కారణంగా కలిగియుండి రూపుదిద్దుకుంటోంది. శుక్ల శోణితముల కలయికచే ప్రకృతి చమత్కారంచేత ఏర్పడుతోంది. ఇది జడవస్తువేగాని చేతన వస్తువు కాదు. చేతనరూపుడగు జీవాత్మ దీనిలో ప్రవేశించి సచేతనం చేస్తున్నాడు.

ఈ విధంగా (శుక్ల-శోణితములకలయికచే) రూపుదిద్దుకుంటున్న జడ దేహము ఇంద్రియములు పెంపొందించుకుంటూ కొన్ని నెలలు తరువాత స్త్రీ యొక్క మూత్రద్వారమునుండి దృశ్య ప్రపంచంలోకి వెలువడుతోంది. ఈ దేహ నిర్మాణం గురించి మరికొంత పరిశీలిస్తూ వస్తే….,

ఇక ఇందులో పదార్థాలేమిటంటారా?
జలము. మూత్రము. వాత - పిత్త - కఫ - మజ్జ - మేద - మాంసము - క్రొవ్వు మొదలైన అనేక మల(మురికి) పదార్థములు.
- ఇటువంటి అనేక వేరువేరైన ఏవేవో పదార్థములు.

ఈ విధమైన అనేక పదార్థములతో ప్రకృతిచే నిర్మించబడిన ఈ భౌతిక దేహమును జీవాత్మనగు నేను దయ్యమువంటి మనస్సుతో కూడినవాడనై ఆశ్రయించి ఇందులో ఇప్పుడు చిక్కుకొని ఉన్నాను. బంధంలో చిక్కుబడ్డాను. ‘‘ఈ దేహము నాకు సంబంధించినది. ఈ దేహమునకు నేను సంబంధించినవాడను. ఇది లేనిదే, నేను లేను. దీని హాని - వృద్ధులు నావే! నాకు చెందినవే!’’ - అని తలుస్తూ సంసార బద్ధుడనయ్యాను. ఇట్లా జీవులమగు మేము ఎన్ని దేహాలలో సంచరించామో తెలియదు.

స్వామీ! మీరే నాకు గతి. దిక్కు. నాకు ఇప్పుడు ఆత్మస్వరూపమును విశదీకరించే తత్త్వజ్ఞానము ఉపదేశించండి. ఇంతకుమించి మీనుండి కించిత్ కూడా ఏదీ ఆశించటం లేదు.

- - -

మహాత్ముడగు శాకాయన్యుడు బృహద్రథుడు చెప్పుచున్న విశేషాలన్నీ ప్రశాంతంగా విన్నారు. సుప్రీతులైనారు. చాలా సంతోషము పొందారు. ఇక ఇట్లా సంభాషించసాగారు.

- - -

శాకాయన్యులు :
మహారాజన్! బృహద్రథా! ఇక్ష్వాకు వంశమునకు ధ్వజమువంటివాడా! ఆత్మజ్ఞాన సమన్వితమైన బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా!

నీవు ఉత్తమమైన అవగాహనతో చెప్పిన వైరాగ్య సంపన్నమైన వివేక వాక్యాలు సత్యము, సుందరము కూడా.

నీవు పొందవలసినది పొందావు! కృతకృత్యుడవు! అందుచేతనే మరుత్ (మహాబుద్ధిగలవాడు) అను పేరుతో లోకప్రసిద్ధుడవు! నీవు అడిగిన వేదాంత సారమైనట్టి ఆత్మతత్త్వము మహత్తరమైనదే. అయితే ‘పరమాత్మ యొక్క మహిమ ఇట్టిది’ అని మనం నిర్వచించలేము. వర్ణించలేము. అయినా కూడా మహనీయుల ప్రవచనములగు తత్త్వజ్ఞానవిశేషాలను సత్సంగ పూర్వకంగా చెప్పుకుందాము. సరే, ఇక విను. (మరుత్ = వాయువును జయించినవాడు).

అవునయ్యా! స్వతఃగా పరమాత్మస్వరూపుడే అగు జీవాత్మ ఈ భౌతిక దేహములో చైతన్యరూపుడై ప్రవేశిస్తున్నాడు. శబ్ద-స్పర్శ-రూప- రస-గంధములనే పంచ ఇంద్రియార్థములను ఉపయోగిస్తూ విషయములలో స్వయముగా ప్రవేశించుచున్నాడు. అంతటితో ఆగక, తన్మయుడై వాటియందు సక్తతచే (because of attachment), ‘‘నేను దేహపరిమితుడను’’ అనే భావసంబంధమైన చిక్కుముడిలో చిక్కుకుంటున్నాడు. దుఃఖితుడు, బద్ధుడు అగుచున్నాడు. వేదన-రోదనలను కొనసాగిస్తూ దేహాలను త్యజిస్తున్నాడు. ఆతనిపట్ల క్రొత్త దేహాలు వచ్చిపడుచున్నాయి. నీవు చెప్పినట్లే ఈతని అజ్ఞాన నిర్మితమైన స్వకల్పిత దుఃఖపరంపరలకు అంతు పొంతు ఉండటంలేదన్న మాట వాస్తవమే.

బృహద్రథుడు : స్వామీ! మరిప్పుడేమి చేయాలి? త్రోవ ఏది? ఔషధము ఏమిటి?

శాకాయన్యులు : బుద్ధియొక్క దోషములు తొలగాలి. అందుకు మార్గముగా శాస్త్రములు, మోక్షశాస్త్రజ్ఞులగు అనుభవజ్ఞులు తపస్సును ఔషధంగా సూచిస్తున్నారు. అట్టి తపస్సు చేతనే నీవు సంసారదోషమేమిటో సుస్పష్టంగా గమనించగలిగావు. అజ్ఞానంచే జనిస్తున్న సంసార దోషముయొక్క విన్యాసమేమిటో నీవు బహుచక్కగా గుర్తించావయ్యా! సర్వ ఆపదలు అజ్ఞానముచే రూపుదిద్దుకుంటున్నాయి.

సంసారము

వృత్తి - : అస్సలు ఈ సంసారము యొక్క మూల రూపమేమిటి? దృశ్యమునకు సంబంధించిన ఇంద్రియ విషయములు, సందర్భములు, సంఘటనలు - మొదలైనవాటితో ఏర్పడిన మనోసంబంధము. వీటి వీటియొక్క మననము కారణంగా ఏర్పడే అనురాగము వలన ఏర్పడే మనోబంధము. అది ‘కామము’ రూపమును దాల్చటమే సంసారము. ధ్యాస (Feeling) అభ్యావశంచేత వృత్తి (Avocation)గా మారటం జరుగుతోంది. ఈ జీవుడు తనకు తానే అనేక వృత్తులను ఆశ్రయించుటచేత ‘దేహము, నామరూపములు’ మొదలగునవి వాటితో అవినాభావ సంబంధము ఏర్పడుచున్నదై ఉంటోంది. (Thinking - Feeling - Avocation - Habit, Dependence, etc)

వృత్తుల సమూహము యొక్క పెత్తనమును ‘చిత్తము’ అని పిలుస్తున్నాము.

ఇంద్రియ విషయముల ‘మననము’ లేకపోతేనో? ‘చిత్తము’ అనునదే నిలువజాలదు. రూపము పోగొట్టుకొని ‘న-రూపి’, ‘లేనిది’ కాగలదు.

ఏవిధంగా అయితే….,
- ఇంధనము లేనప్పుడు {ఉదా: కుంపటి లేక పొయ్యి నుండి) బొగ్గులను (లేక) కట్టెలను తొలగిస్తున్నప్పుడుఊ అగ్ని తనకు తానే శమిస్తుందో,

ఆవిధంగానే…
వృత్తులు (Thoughts attached with Avocational feelings and Emotions) తగ్గుతూ క్షయిస్తూ ఉండగా క్రమంగా చిత్తము కూడా తనకు తానే ఉపశమించగలదు.

బృహద్రథుడు : మహాత్మా! జీవులమగు మేము కర్మ బద్ధులము కదా! కర్మ-కర్మఫల-పునః కర్మల చట్రంలో ఇరుక్కుని జన్మ-పునర్జన్మ పరంపరలను పొందుచున్న మేము కర్మబంధమునుండి విముక్తులమయ్యేది ఎట్లా?

శాకాయన్యుడు : ‘శరీర యంత్ర విభాగములు’ వంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు - అనబడే ఇంద్రియార్థములను ఉపయోగిస్తున్నప్పుడు ‘‘వీటికి నేను పరిమితుడనే కదా!’’…అనే విమూఢభావనను విడువనివానికి మాత్రమే కర్మ-బంధము కాగలదు. జడము, అసత్యము అగు కర్మ-కర్మఫలములలో మనస్సే వెళ్ళి చిక్కుకుంటోంది. అట్టి మనస్సు జయించబడాలి సుమా! ఎప్పుడైతే సత్యమగు ఆత్మగురించి విచారణ ప్రారంభించి ‘‘సర్వసాక్షి, కేవలము - అగు ఆత్మయే నా స్వరూపము, స్వభావము కూడా కదా!’’…. అను అవగాహన - అనుభవము పెంపొందించుకుంటూ ఉంటావో,….. అప్పుడిక ‘మనస్సు’ అనునది స్వయముగా ఉపశాంతించ ప్రారంభిస్తుంది.

ఎందుకంటే స్వప్నముతో సమానమైనట్టి దృశ్య వస్తు - విషయ - సందర్భ - సంఘటన - బాంధవ్యములు మొదలగువాటి గురించి (- ‘‘ఇవన్నీ నిజమే। భవమే। ఉన్నాయి’’ - అని) మననమే మనస్సు యొక్క స్వరూపమైయున్నది!

సత్యమగు ఆత్మను గురించిన ‘‘మననము, సందర్శనము, మమేకము’’చే మనస్సు శాంతించక ఏంచేస్తుంది?


చిత్తమును → చిత్ వైపుగా…,

ఓ బిడ్డా! బృహద్రథా! ‘అసత్తు, కల్పితమాత్రము’ - అగు విషయములపట్ల కొన్ని జన్మములుగా పెంపొందించుకొనియున్న ‘ఇష్టము’నే ‘చిత్తము’ అని పిలుస్తున్నారు. చిత్తమేవ హి సంసారః! చిత్తమే సంసారము. అట్టి చిత్తముయొక్క ఆశ్రయాలు ఏమిటో అద్దాని కదలికలు ఎటువైపో కొంచము నీకు నీవే శోధించాలి సుమా! దేనిదేనిపట్ల (ఏ ఏ సంబంధ - అనుబంధ-సంపద-పేరు ప్రతిష్టలు మొ।।న వాటి పట్ల) చిత్తము ఆకర్షితమగుచూ ఉన్నదో,….అదంతా కూడా వాస్తవానికి ఆ చిత్తము తనపై తానే ఆ రీతిగా ఆరోపించుకొనుచున్నది. (లేక) తన్మయమగుచున్నది. సనాతనమగు రహస్యము ఏమిటంటే చిత్తముయొక్క ఆత్మపట్ల ప్రత్యారోపణయే సంసారానుభవము.

ఇంతకు మించి ‘సంసారము’ అనుదానికి వేరైన రూపము లేదు. ఉనికీ లేదు.

చిత్తము కల్పించుకొంటున్న సంబంధము, విభ్రమము, చాంచల్యముల చేతనే సంసారము ఏర్పడుచున్నది.

చిత్తముయొక్క ఏకాగ్రత-చాంచల్య రాహిత్యముచేత సంసారము (దీపము వెలిగించినప్పటి చీకటిలాగా) తొలగిపోవటం జరుగగలదు.

చిత్తము నిర్విషయమై, నిర్మలమైనప్పుడు, ఇక ఆ నిర్మల చిత్తము శుభాశుభకర్మల ప్రహసనమును జయించివేయగలదు. వాటినన్నిటినీ ఈ జీవునిపట్ల రహితం చేసివేయగలదు. అట్టి నిర్మల ప్రసన్న చిత్తము స్థిరీకరించుకున్న వానియొక్క సుఖము నాశనము లేనిది. నిర్మల - నిశ్చల చిత్తము బ్రహ్మానంద స్వరూపమే! (తేషాం సుఖం శాశ్వతమ్। నేతరేషామ్)।

బృహధ్రథుడు : అట్టి ఈ చిత్తము రహితమయ్యేది ఎట్లా? ఏ రీతిగా?

చిత్తమును ఎక్కడ సంలగ్నం చేయాలి?

శాకాయన్యుడు : అజ్ఞానముచే ఈ జీవుని చిత్తము దృశ్య విషయములందు సంలగ్నమౌతోంది కదా! అది నీవూ గమనించావు. అయితే, అదే చిత్తము తనయొక్క ‘ప్రియత్వము-ఇష్టము’ అనే స్వభావముతో పరబ్రహ్మమునందు సంలగ్నమైనప్పుడో? -

       * అదియే మోక్షము! * అదియే ముక్తి।

యద్యేవం బ్రహ్మణిస్యాత్ (సమాసక్తం) తత్ కో న ముచ్యేత బంధనాత్?

పరతత్త్వ దర్శనమునందు ఎవరిచిత్తము సంలగ్నమౌతుందో,… ఇక అట్టివాడు బంధమునుండి విముక్తుడు ఎందుకు కాడు? తప్పక అవుతాడు.

కిం తత్ బ్రహ్మ?

ఇంతకీ, ప్రేమాస్పదుడగు పరమాత్మయొక్క స్థానమేది? ఆయనను ఎక్కడ పట్టుకోవాలి? విను, చెప్పుతాను. మొట్టమొదట ‘‘ఆ పరమాత్మ నాయొక్క సహజమగు స్వస్వరూపుడు, సహజీవులందరియొక్క సహజ స్వరూపుడు కదా!’’ - అనునది గమనించు. స్వ-సర్వ పురుషుడుగా భావించి ఉపాసించు. ‘‘పరమాత్మకు అన్యముగా ఎక్కడ ఏది కనిపించినా అదంతా కథలోని కధనమువలె సందర్భ కల్పితము’’ - అను నిశ్చయమును పెంపొందించుకో.

ఆ పరమేశ్వరుని మన హృదయ పుష్పములోనే సర్వదా భావన చేసి, హృదయమునందే ఉపాసించాలి!

పరమాత్మను దర్శించటము ఎక్కడ? బుద్ధి వృత్తులలో కాదు. బుద్ధికి సాక్షిగా, సర్వ దేహములలోని కేవలీ స్వరూపునిగా, సర్వుల ప్రేమాస్పద స్వరూపునిగా గుర్తించబడు గాక! స్వహృదయేశ్వరుడుగా, సర్వుల సహజ - వాస్తవ స్వరూపుడుగా, సర్వము తానైనవాడుగా, సర్వమునకు వేరైన సాక్షిగా - పరమేశ్వరుని భావించాలి. ప్రేమ, భావనలతో పూజించాలి. సందర్శించాలి. మనస్సు తన్మయం కావాలి! ‘‘ఆ పరమేశ్వరుడు నాయందే, ‘నేను’ అనుభావనకు ముందేగల ‘నేను’ అయి ఉన్నారు’’ - అనునది సిద్ధించుకోవాలి.

బృహదృథుడు : పరమాత్మయొక్క ఏ ఏ లక్షణములు మననం చేస్తూ అర్థం చేసుకోవాలి?

శాకాయన్య మహర్షి : వినండి.

(1) బుద్ధి వృత్తులకు సాక్షి : స్వస్వరూపుడగు ఆత్మభగవానుని సంకల్పానుసారమే ఈ బుద్ధివృత్తులు ప్రదర్శితమగుచున్నాయి. ఆయన బుద్ధికి మునుముందే ఉన్నారు. ఎల్లప్పుడు బుద్ధికి సాక్షిగా ఉన్నారు. ‘‘నటుడు నటించే పాత్రయొక్క పాత్ర సంబంధమైన (నాటకములోని) బుద్ధికి వేరుగా, సాక్షిగా - ఆ కళాకారుని నిజ సహజస్వరూపము (Original Personality) ఉన్నట్లే, మన పరమాత్మ స్వరూపము బుద్ధికి (జగన్నాటకంలో కలిగిఉంటున్న బుద్ధివృత్తులకు) సర్వదా వేరే!’’….అని గమనించెదవుగాక। పరమాత్మత్వము బుద్ధికి సాక్షియై, బుద్ధికి ఉత్పత్తి స్థానమై యున్నది.

(2) మనో అగోచరం : ఆత్మ యొక్క అప్రమేయ - నిత్యత్వములు స్వరూపము మనస్సుకు కూడా విషయం కాదు. మనస్సుకు ఇంద్రియార్థాలు మాత్రమే విషయములు అవగలవు. ఆ మన పరస్వరూపము మనస్సుకు కూడా (లేక ఆలోచనలకు కూడా) ఉత్పత్తి స్థానము.

ఆలోచనలు చేయువాడు ఆలోచనలకు వేరుగా, ఆలోచనలకు సాక్షిగా ఉంటాడు కదా!

అట్టి ఆత్మకొరకై ఆలోచనలలో వెతకి ఏం లాభం? అయితే,
→ ఆలోచనల సహాయంతో బుద్ధికి సాక్షిగా ఉన్న ఆత్మభావనను తప్పక ఆశ్రయించవచ్చు.
అంతేగాని ఆత్మ ఆలోచనలకు ఒకానొక విషయమై ఉండలేదు. అందుకే పరమాత్మ మనస్సుకు అగోచరము - అని చెప్పబడుచున్నారు.

(3) వాచా అగోచరము : వాక్కు (మాటల)తో ఒకళ్లు చెప్పగలిగేది కాదు. చెప్పితే మరొకరి ఆ మాటలచే ‘ఇది కదా!’ అని విని అనుభవంగా పొందేది కూడా కాదు. ‘‘వాక్కుకు పరమాత్మయే ఉత్పత్తి స్థానము. అద్దానికి యజమాని’…అని గమనించాలి. అయితే, గురుబోధనలను, శాస్త్రములు సూచించే సాధనలను ఒక ఉపకరణముగా ఉపయోగించి, మనో-బుద్ధి-చిత్తములను పరమాత్మత్వము వైపుగా నడిపించి-తద్వారా పరమాత్మ భావనను సముపార్జించుకొనెదరు గాక।
(అందుకొరకే వేద-వేదాంతవాఙ్మయము ముముక్షువులకు అందించబడుతోంది).

(4) అవధూతాది సంప్లవం : సర్వ దుఃఖములకు ఆత్మవిచారణ ఆత్మాహమ్ మననమే ఉపాయం, సాధనము కూడా! సర్వ సంసార దోష నివారణి - ఆత్మభావనయే! అవధూతము: మేఘములు తొలగగా సూర్యుని కాంతి సర్వత్రా కనబడురీతిగా - భ్రమ తొలగగానే, ఆత్మయొక్క నిత్య-సత్యానుభవము సిద్ధించుచున్నది. (అట్టి సిద్ధపురుషుడే అవధూత).

(5) సత్తామాత్రము : ‘నేను ఉన్నాను’ అను ఏ భావన ఉన్నదో అట్టి ‘‘కేవల సత్తామాత్రము పరమాత్మ సర్వరూపమే। - అని ఉపాసించబడుగాక! ఆత్మ ‘‘కేవల సత్’’ స్వరూపము.

(6) ప్రకాశైక స్వభావం : తదితరమైన సర్వమును ప్రకాశింపజేయుచున్నది ఆత్మయే! ఎక్కడైనా - ఏదైనా తెలియ వస్తోందంటే, ‘ఆత్మయే అట్లు ప్రకాశింపజేస్తోంది’, ‘ఆత్మయే ప్రకాశమానమగుచున్నది’ అని భావించు.

(7) భావనాతిగమ్ : అది భావాతీతము. భావనలకు సాక్షి. భావనకు మునుముందే ఉన్నది. అంతేకాదు. భావనకు ఉనికిని, చలనమును ప్రసాదిస్తున్నది - కేవలచిత్ స్వరూపమగు పరమాత్మయే. భావనలన్నీ ఆత్మయందే జనించి, లయిస్తున్నాయి. కాబట్టి - ‘భావనాగతి’ అనబడుతోంది.

(8) అహేయమ్ - అనుపాధేయమ్ : మన స్వస్వరూపమే పరమాత్మ కదా! ప్రతిఒక్క జీవుని సహజస్వరూపమగు ‘‘పరమ్ (ఆవల) ఆత్మ’’….ను ఎవరుమాత్రం వదలేది ఎట్లా! జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో, దేహ-దేహాంతరములలో,.. అన్ని సందర్భములలో వెంటనంటియే ఉండేది-ఆత్మ. ఎవ్వరూ ఎప్పుడూ దానిని వదలటమే లేదు. కనుక పరమాత్మను ‘‘అహేయమ్’’ (వదలలేనిది)గా గ్రహించు. ఎల్లప్పుడు వెంటనుండియే, తనకు అభిన్నమై ఉన్న దానిని క్రొత్తగా స్వీకరించటమనేది మాత్రము ఎక్కడున్నది? కనుక అది ‘‘అనుపాదేయమ్’’ కూడా! అది క్రొత్తగా స్వీకరించబడేదీ కాదు. ఆత్మ సమస్తమునకు అనన్యము కాబట్టి - దేనినీ స్వీకరించునది కాదు కూడా.

(9.) అసామాన్యమ్ విశేషణమ్ : ఆత్మతో సమానమైన ‘సామాన్యమైనది’ ఏదీ ఎక్కడా లేదు.

10. ధ్రువమ్ : స్థిమితమ్ : గంభీరమ్ :

11. న తేజో - న తమః తతమ్ : పరమాత్మ తేజోరూపము కాదు. చీకటి రూపము కాదు. తేజస్సుకు తేజస్సును ప్రసాదించేది. చీకటికి సాక్షి. తేజో-తమస్సులు ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా నీయొక్క-నాయొక్క పరమాత్మత్వము (The self beyond all) యథాతథమై విరాజిల్లుతోందయ్యా! కనుక అది తేజో రూపము కాదు. చీకటి రూపము కాదు!

12. నిర్వికల్పము: ‘‘దృశ్యమునుండి-దృష్టిని-దృక్ స్వరూపమునకు మరల్చేయత్నమే’’ యోగోపాసన, ఆత్మోపాసన కూడా! అట్టి ఆత్మ జగత్ కల్పన లేనట్టిది. కనుక నిర్వికల్పము. ఆత్మయే జగత్తును తనయందు ఆపాదించుకొనుచున్నప్పుడు సవికల్పము. స్వతఃగా ఆత్మ నిర్వికల్పము.

13. నిరాభాసమ్ : నీళ్లలో కనిపించే చంద్రబింబమును చూచి ‘‘చంద్రుడు నీళ్లలో ప్రతిబింబించటానికి కర్త’’….అని కర్తృత్వం ఆపాదిస్తామా? లేదు. అట్లాగే ‘‘పరమాత్మ జీవాత్మగా ప్రతిబింబిస్తున్నాడు’’ - అనబడే ‘‘ఆభాస (Reflactive) ధర్మాన్ని’’ ఆత్మకు ఆపాదించలేము. కనుక ఆత్మ నిరాభాసము.

14. నిర్వాణమయమ్ : సంవిదమ్ : అంతే కాదు. ఆత్మను నిర్మల - ప్రశాంత స్వరూపము. అందుచేత సత్ - విత్ (ఉనికి - ఎరుక) కేవలీరూపంగాను ధ్యానించాలి.

ఆత్మ నిత్యము - అనునిత్యము కూడా! సర్వము ఎరిగియే ఉన్నది కాబట్టి నిత్యబుద్ధము. ఆత్మ దేనిచేతనూ బంధము పొందేది కాదు. కల కనేవాడు కలలోని విషయాలకు బద్ధుడౌతాడా? లేదు. అట్లాగే, ఆత్మ నిత్యముక్తము. ఆత్మకు వేరైనదంతా కల్పితము, భావనామాత్రము. ఆత్మయో, నిత్యసత్యము. అత్యంత సూక్ష్మము. కాబట్టి ఇంద్రియ - మనస్సులకు అవిషయమై ఉంటోంది. ఆత్మచేతనే దేహి-దేహ, మనో- బుద్ధి, చిత్త-అహంకారాలు, దృశ్యభావాలు చైతన్యవంతమౌతున్నాయి. కనుక ఆత్మయే సర్వనియామకము. స యేవ విభుశ్చ!

స్వప్నము తనదైన స్వప్నద్రష్టకు వేరై స్వప్నంలో ఏదీ ఉండదు కదా! అందుచేత ఆత్మ అద్వితీయము. ఆత్మకు ద్వితీయమై వేరే ఏదీ లేదు! ఆత్మ ఆనంద సాగరమునకు ఆవల పరమైయున్నది. ఆనందము ఆత్మది. అంతేగాని ఆత్మ ఆనందరూపమగుటలేదు. ఆత్మ సర్వమునకు వేరై, ప్రత్యేకమై, మనోబుద్ధులకు సాక్షియై సర్వమును చైతన్యపరుస్తోంది కనుక….."ప్రత్యగాత్మ’’ ‘‘ప్రత్యక్ చైతన్యము’’ గా అభివర్ణించబడుతోంది.


సో-హమస్మి। తదేవత్వమ్।
ఆత్మ అనబడునది నేనే! నీ స్వరూపము ఆత్మయే!

మనమందరము ఆత్మవంతులము. ఆత్మస్వరూపులము. అద్వితీయాత్మానంద స్వరూపము. అఖండాత్ములము.

నాలోని నేనైన నేను : నాయందు నేనే ఆనందమును సర్వదా ఆశ్రయించి ఉంటున్నవాడను. నాకు లోకములలో పొందవలసినదంటూ ఏదీ లేదు. ‘‘స్వప్నములో నేను ఏదైనా పొందితే బాగుండును’’…..అని అనుకొని ఎవ్వరూ నిద్రించటంలేదు కదా! ఆత్మ గురించి తెలుసుకొని, ఇక ఆశించవలసినదంటూ నాకు ఎక్కడా ఏదీ లేదు. కనుక అజ్ఞానదశలో నన్ను సమీపించిన ‘ఆశ’ అనే పిశాచిని అవమానించి జ్ఞానదండము చూపించి వెళ్ళగొట్టివేస్తున్నాను.

స్వీయ కల్పన : నిరాశ్రయుడను. ఈ జగత్తులు అనే ఇంద్రజాలానికి ఇంద్రజాలికుడిని నేనే! ఈ సమస్తమునకు విడిగా ఉంటూ, - మౌనంగా అవలోకిస్తూ ఉన్నది కూడా నేనే. సర్వదా కేవల దృక్ స్వరూపుడను.

(1) ఇది నా కల్పన. (2) దీనికంతటికీ కేవల సాక్షిని. (3) సమస్త కల్పనలకు మునుముందే ఉన్నట్టి ‘‘కేవల స్వరూపుడను’’.

అసంగమహమ్ : నాకు దేనితోను సంగము (Attachment) మొదలే లేదు. ఏదీ నాకు సంబంధించినది కాదు. నేను దేనికీ సంబంధించిన వాడను కాను. దుస్తుల కంటే నేను వేరే అయి ఉన్నట్లుగా, దేహ-మనో-బుద్ధి…ఇత్యాదులకంటే నేను వేరైనవాడను.

ఆపత్‌కథం మాం ప్రవిశేత్? ఒకని కలలో కనబడిన ఒక వస్తువో, విషయమో,-ఆ కల తనదైన వానిని బంధించగలదా? కలలోని ఒక ఆపద కల తనదైనవానికి - ఆపద కలిగించగలదా? లేదుకదా! అట్లాగే జాగ్రత్ కూడా సర్వమునకు అసంగుడనైన నన్ను ఏ ఆపద ఏమీ చేయజాలదు. స్పృశించనైనా లేదు.

ఎందుకంటే ‘ఆత్మ’ అనే స్వగ్రామంలో (లేక) నాకు చెందిన ఉద్యానవనములో జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నాకు నేనై నిర్మించుకొని ఆడుకొనే క్రీడా మైదానాలు - అని అంతరమున ఎరిగియే ఉంటున్నాను.

వర్ణాశ్రమ ఆచారాలు ఎవరికి?

దేహాత్మ భావన (నేను దేహమును - అనే భావన) కలిగియుండి దృశ్యముపై నమ్మికగల బుద్ధితో కొనసాగించువారికొరకై వర్ణము - వర్ణాశ్రమ ఆచారాలు, నియమములు చెప్పబడుచున్నాయి. అవి సాధనలోని విభాగములుగా మాత్రమే ఉండగలవు. అంతేగాని సిద్ధి అను ఆత్మస్థానములో చోటు ఉండదు.

‘‘ఆత్మాహమ్’’ భావనచే బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస ఆశ్రమాచారాలతో సంబంధమేముంటుంది?

దేహాభిమానమును దాటివేసినప్పుడు, ఇక కర్మ - కర్మఫలములతో పనేముంటుంది? అట్టివానికి ఆశ్రమాచారాలు నిర్వర్తిస్తే క్రొత్తగా వచ్చేదేముంటుంది? (వర్ణాశ్రమాచారాలు లోక సానుకూల్యత కొరకు మాత్రమేగాని, ఆత్మకు చెందినవి, సంబంధించినవి కావు.)

ఎవ్వరైతే…
       లోక సంబంధమైన వర్ణాశ్రమ ధర్మాలను, ఆచారాలను లోకం దృష్ట్యా ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆత్మభావన దృష్ట్యా ‘లేనివి’గా గమనించి, పరిత్యజించినవాడై ఉంటున్నాడో….,
అట్టివాడు స్వానంద సంతృప్తుడై ఉంటున్నాడు. ‘‘సర్వదా సర్వత్రా సర్వస్వరూపంగా సిద్ధించియే ఉన్న ఆత్మచే నేను సంతృప్తుడనుకదా!’’ అని భావించుచూ, పరిపూర్ణపురుషుడై జగత్తులో పాల్గొనుచున్నాడు.

అందుచేత ఓ బృహద్రథా!

వర్ణాశ్రమ ధర్మ విశేషాలన్నీ ప్రాపంచకమైనవి. భౌతిక దేహముతో నిర్వర్తించేవి. ఆత్మయో, - దేహమును అధిగమించి, దేహమును ఉపకరణంగా ఉపయోగించేది కదా! అటువంటి సావయవస్వరూపము, సందర్భమాత్రసత్యము, ఆద్యంతయుక్తము అగు విషయాలన్నీ, అధిగమించినవాడవై ఉండుము. పుత్రులు, తదితర బంధువులు, రాజ్యము, భౌతికంగా ఎదురుగా కనిపించే స్వరూప స్వభావములు - ఇత్యాది సర్వ అభిమానములను త్యజించివేయి. దాటివేయి.

‘జ్ఞానము పొందాలి। అజ్ఞానిని’ అనురూపముగల అభిమానమును కూడా త్యజించు. అనంతమగు ఆత్మయందు నిష్ఠుడవై ఉండెదవు గాక!

పరమాత్మనిరతుడవై, మిగిలినవన్నీ - ‘‘ రాజుగారు పిలిపించగా, పట్టణానికి వెళ్ళుచున్న బాటసారికి త్రోవలో కనిపించే జంతు కళేబరములను ఆతడు చూచీ - చూడనట్లు ఉండటము’’ వలె స్వల్ప విషయాలుగా భావించు.

ఆత్మయందే భావనను సునిశ్చితము, సునిశ్చలము చేసుకో! ‘‘నాతో సహా ఈ సర్వము నిత్యము అగు కేవల - అఖండ ఆత్మస్వరూపమే!’….అని అర్థం చేసుకుంటూ, భావిస్తూ ఆ ఆత్మయే నీవై ఉండుము.

ఓ బృహద్రథా। ఈ సందర్భంలో శ్రీమైత్రేయ మహర్షికి, పరమాత్మయగు శివ భగవానునికి జరిగిన తత్త్వశాస్త్ర విశేషములతో కూడిన ఒకానొక గొప్ప సంవాదము నాకు గుర్తుకు వస్తోంది.

అద్దానిని ప్రస్తావిస్తున్నాను. విను.

- - -

ద్వితీయోధ్యాయః - మైత్రేయ పరమేశ్వర సంవాదము

ఒకానొకప్పుడు మహత్తర తపస్సంపన్నుడు, ఉత్తమ గుణైశ్వరుడు అగు శ్రీ మైత్రేయమహర్షి కైలాసమునకు వెళ్ళటం జరిగింది.

పరమానంద రూపుడు, లోకకళ్యాణమూర్తి, భక్తవత్సలుడు, భక్త సులభుడు అగు మహాదేవుని దర్శనం చేసుకున్నారు.

ప్రేమగా ఆహ్వానిస్తూ శ్రీమన్ మహాదేవుడు మైత్రేయ మహర్షిని కుశలం అడిగారు. ‘‘బిడ్డా! ఏమి కావాలో కోరుకో నాయనా! నీ పరాప్రేమకు మెచ్చానయ్యా’’। - అని చిరునవ్వు చిందిస్తూ పలికాడు.

శ్రీ మైత్రేయమహర్షి : ఆనంద స్వరూపా! భక్తవత్సలా! పరమేశ్వరా! శివానందలహరీ స్వరూపా! సర్వతత్త్వ స్వరూపుడవగు మీ దర్శనముచే నేను ధన్యుణిణా. నాకింకేమి కావాలి? అజ్ఞులమగు మాకు ఎల్లప్పుడూ మీ పాదారవింద భజనయే చాలు.
స్వామి! మేము పరతత్త్వానుభవము సిద్ధించని అజ్ఞులము. అందుచేత మీకొక విన్నపము.

పరమాత్మయొక్క తత్త్వ రహస్యమును నాపై కరుణతో బోధించవలసినదిగా మిమ్ములను వేడుకుంటున్నాను.

మహాదేవుడు : మైత్రేయమహర్షీ! ఆధ్యాత్మ విద్య పట్ల నీకు గల శ్రద్ధకు మెచ్చుకుంటున్నాను. లోక సంబంధమైనవేవీ కోరుకోకపోవటము నాకు సంతోషము. కొన్ని ముఖ్యమైన విశేషాలు మనము సంభాషించుకుందాము.

పరమాత్మ ఎక్కడ ఉన్నారు? ఆకాశంలోనా? భూమిపై మరెక్కడన్నానా? వేరే విష్ణు-శివ ఇత్యాది లోకములలోనా? ఎక్కడ వెతకాలి? బిడ్డా। ఈ దేహములోనే ఆయన కొరకు వెతకాలయ్యా।

    శ్లో।। దేహో దేవాలయమ్ ప్రోక్తః। 
      స జీవో కేవలః శివః।।

ఈ దేహమే దేవాలయము. ఈ దేహములో నివాసముంటున్న జీవుడు సదా శివుడే! అటువంటి సర్వాంతర హృదయస్తుడగు శివుడినే ఈ జీవుడు ఉపాసించటము నిజమైన పరమాత్మోపాసన. కనుక బాహ్య (లేక) అన్య - ఉపాసన - సంపూర్ణము, సమగ్రము అయిన ఉపాసన అవదు.

అందుచేత -

గుడిలో శివలింగాన్ని పూజించేముందు నిర్మాల్యము తొలగించి, అప్పుడు పరమభక్తితో పూజిస్తారు కదా! ఆ రీతిగా,
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ‘సో2హం’ భావేన పూజయేత్।।

జ్ఞానము : ‘‘వారు వేరు, వీరు వేరు, మేము వేరు, ఇప్పుడు వేరు, మరొక్కప్పుడు వేరు’’ - ఈ రీతి అయిన భేద దర్శనమంతా అజ్ఞానము. సర్వభూస్థమ్ ఆత్మానమ్। సర్వ భూతాని చ ఆత్మని। ‘‘అందరిలో నేనైన ‘నేను’। నాలోని అందరు అయి ఉన్న నేను।’’ అను అభేద దర్శనమే జ్ఞానము.

ధ్యానము : విషయముల నుండి మనస్సును, చిత్తమును వెనుకకు మరల్చి, నిర్విషయము చేస్తూ, బుద్ధితో ఆత్మభావనను సర్వత్రా అనుసంధానము చేయటమే ధ్యానము యొక్క విధానము, ఉద్దేశ్యము, ఆశయము, లక్ష్యము కూడా!

స్నానము : మనోబుద్ధి చిత్తములలో ఏర్పడియున్న మల - ఆవరణ-విక్షేప దోషములను తొలగించి నిర్మలమైన ఆత్మదృష్టిని సముపార్జించుకోవటం.

శౌచము : విచ్చలవిడిగా విషయముల వెంట - సంఘటన - సందర్భముల వెంటా పరుగులు తీస్తున్న ఇంద్రియములను నిగ్రహించి సమదర్శనమును అభ్యసింపజేయటం. శుచి అయిన భావములను, అభిప్రాయములను వృద్ధి చేసుకోవటము. అశుచి అయిన అరిషట్‌వర్గ భావములను తొలగించుకోవటము.

పానము (Drinking) : బ్రహ్మతత్త్వమును గ్రోలటము. బ్రహ్మామృతాత్ పిబేత్।

ఆహారము : దేహరక్షణ కొరకు మాత్రమే ఆహారము. భైక్షమ్ ఆచరేత్ దేహ రక్షణే।

వాసగృహం : పరమాత్మతో ఏకాంతమే వాసస్థలము. వసేత్ ఏకాన్తికో భూత్వా చ।

ఏకాంతము : ద్వైతమును విసర్జించి ఏకత్వమును దృష్టియందు నిలుపుచూ నిశ్చలం చేయటం. అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఏకముగా అనిపించటానికి ప్రయత్నించటమే ఏకాంతయోగము. ఏకాంతే ద్వైత వర్జితమ్।

ఈ భౌతిక దేహము - దేహాత్మభావన :

పై విధమైన మార్గములో ఈ జీవుడు ప్రయత్నిస్తూ ఉండటం ఆవశ్యకం. ఇకప్పుడు, ‘‘మాతృ-పిత్రు మలాత్మకమైన చావు - పుట్టుకలతో కూడిన ఈ దేహమే నేను’’….అనే భ్రమాత్మకమైన బంధము నుండి తప్పక విముక్తుడవగలడు. కనుక, ‘‘ఈ

దేహముయొక్క రాక-పోకలకు, ఈవల-ఆవల ఉన్నట్టివాడిని కదా’’ అని భావించు.

ఈ పాంచభౌతిక దేహముతో తన్మయమగుచు, ఇద్దాని సంబంధ - బాంధవ్యములే మహత్తరమని తలచుచు, దేహసుఖములే ముఖ్యాశయముగా జీవించువానిపట్ల - ఈ ‘జీవితము’ అనే అవకాశము వ్యర్థం అగుచున్నదయ్యా! మునుముందుగా ఈ దేహము ఎట్టిదో, తానెట్టివాడో ఈతడు గమనించకపోతే, విభాగించకపోతే - సంసార దుఃఖము ఎన్ని వేల జన్మలెత్తినా తొలగదు.

ఈ జీవుడు స్వతఃగా శివానంద స్వరూపుడని (స జీవో కేవల శ్శివః) అని చెప్పుకున్నాము కదా! ఇక ఈ పాంచభౌతిక దేహము విషయానికి వస్తే…
ఇది అల్ప సుఖములకు - అనేక దుఃఖములకు ఆలవాలము, ఆలయము (సుఖ-దుఃఖాలయమ్).

అమేధ్యమ్ : మేధ్యము (పవిత్రము) కానిది. రోగము - బాధ - వార్థక్యము, మరణము ఇత్యాది అనేక దోషములతో కూడుకొనియున్నట్టిది.

ధాతుబద్ధమ్ : చర్మము - మాంసము - మజ్జ - చీము - నెత్తురు - క్రొవ్వు - బొమికలు ఇటువంటి అనేక వేరు వేరు ధర్మములు గల పదార్థములతో (సప్తధాతువులతో) నిర్మితమైనది.

మహారోగమ్ : ఇందులో భయంకరమైన రోగములు ‘‘మేము ఎప్పుడు ప్రకోపిద్దామా?’’ అని వేచి ఉన్నాయి. దాగుకొని ఉన్నాయి. అవన్నీ ఈ దేహమును శిధిలపరచటానికి ఉవ్విళ్ళూరుచున్నాయి. దాగుడుమూతలాడుచున్నాయి.

పాపమందిరమ్ : ఇందులో ఇంద్రియములు అనేక ఆవేశ - కావేశములను, పాపదృష్టులను ప్రకోపింపజేసే ప్రయత్నంలో సర్వదా నిమగ్నమై ఉంటున్నాయి.

అధ్రువమ్ : ఇందులో దృఢమైనది, చెడనిది అంటూ ఏ ఒక్కటీ లేదు. అందుచేత ఈ భౌతిక దేహమును ‘‘ఇది నేను. నాది. ఇది నాకు చెందినది. నేను దీనికి చెందినవాడను’’…..అని ఎప్పుడైనా అనిపిస్తే ప్రాజ్ఞులు… - ‘‘ఇందులో ఏది శాశ్వతము?’’ అని ప్రశ్నించుకుంటూనే ఉంటారు.

విజ్ఞులు దేహాత్మ భావనను స్పృశించినందుకుగాను మనోమల స్నానం చేస్తూ ఉంటారు.

భౌతిక భావనతో ‘స్పృశిస్తే స్నానం చేయండి’ అని శాస్త్రములు - శాస్త్రజ్ఞులు సాధకులకు విధిస్తున్నారు (సకృత్ గీతాంబసి స్నానం…మొ।।వి) భగవత్ ధ్యాన - గాన - తపో - సత్సంగాలే స్నాన జలము.

ఇంకా విను.
- ఈ దేహము అనేక వికారములతో కూడి ఉంటోంది.
- దీనికి ‘9’ ద్వారాలు (నవద్వార పురము).
- ఆ ‘9’ ద్వారముల నుండి అనేక దుర్గంధ వస్తువులు స్రవిస్తూ ఉంటాయి.
- ఇదంతా కాలబద్ధము. కాలస్వభావజం. ఎప్పుడు ఏమౌతుందో ఏమీ చెప్పలేము. ఇట్టి ఈ దేహము కలకాలం మనగలదని అజ్ఞులే (తెలివి తక్కువవాళ్లే) నమ్ముకొని ఉంటారేమో గాని…. విజ్ఞులు కాదు. వారు దీనియొక్క స్థితిగతులను గురించి ఏమాత్రము నమ్మి ఉండరు. ముందుగానే దీనియొక్క అనివార్య వినాశనము గురించి గ్రహించియే ఉంటారు. అటువంటి భౌతిక దేహమును ‘అహమస్మి’ అను భావంతో స్పృశిస్తే, ‘స్నానం’ విధించబడింది.

తోలు బొమ్మలాట వంటిదే ఈ దృశ్యాంతర్గత భౌతిక దేహములు.

ఇంకా చెప్పుకోవాలంటే….

ఈ దేహము అనేక దుర్గంధములతో కూడినది. దుర్మలములు కలిగినదై ఉన్నది. పిల్లవాడు పుట్టగానే ‘మాతృసూతకము’ అనే పురుటి దోషమును (ఇంటిపేరందరి వారికీ) నియమించారు. అట్లాగే మరణమప్పుడు కూడా (ఆ ఇంటి పేరు వారికి) ‘మైల’ అనుదానిని శాస్త్రములు విధిస్తున్నాయి.

‘‘అహమ్-మమ’’ అనే విణ్మూత్రమును (మూత్ర-మలములను) శుభ్రం చేసుకోవాలి. ‘‘ఆత్మతత్త్వ విచారణ’’ అనే మోచనాగంధము (washing powder/soap)తో స్పృశదోష స్నానం తప్పక నిర్వర్తించాలి సుమా!
మైత్రేయ మహర్షి : (జనులలో కొందరు వంట - పూజ - సంధ్యావందన - ప్రాణాయమాది సందర్భములలో స్నానము - మడి - ఆచారము - (పొడిబట్టలతో ఉన్నప్పుడు) ఇతరులను తాకితే మరల స్నానము - మడిబట్టలు….ఇటువంటి) ఆచారముల ఉద్దేశ్యము. ‘స్పృష్ట్యా స్నానం విధీయతే’’….అనునదే అయి ఉన్నదా, ప్రభూ!

మహాదేవుడు: శుద్ధము-శౌచకము-మృత్ స్నానం (మట్టితో రుద్దుకొని, సబు\xc3\x92తో రుద్దుకుని చేయు స్నానము)…ఇవన్నీ కూడా లౌకిక -లోక సంబంధమైన విషయాలు మాత్రమే! అవి శాస్త్ర ముఖ్యోద్దేశమని అనిపించుకోవు. చిత్తశుద్ధియే నేను సూచిస్తున్న స్పృష్ట్వా స్నానము సుమా!

చిత్తశుద్ధికరం శౌచము : చిత్తములో రజోగుణముచే (సాధనాసమయంలో కూడా) రూపుదిద్దుకొనే - లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అనబడే వాసనాత్రయము నుండి (చిత్తమును) పరిశుద్ధిచేసుకోవటం!

ఏ మట్టి (మృత్ -) తో చిత్తస్నానం చేయాలి? చిత్తశౌచము : జ్ఞాన - వైరాగ్యములు అనబడే మృత్తికతో (శుభ్ర భస్మము)తో చిత్తమును శుచి చేసుకోవాలి! జ్ఞాన - వైరాగ్య మృత్తోయైః క్షాళనాత్ ‘శౌచమ్’ ఉచ్యతే।

అద్వైతభావనా భైక్ష్యమ్ - ఆహారము : అద్వైత భావనయే - ఆరోగ్యము కొరకు స్వీకరించతగ్గ ఆహారము. ‘‘ఏకైక పరమాత్మయే ఈ సమస్త రూపాలుగా కనబడుచున్నారు’’ అను అద్వైతభావనను మననం చేస్తూ ఈ ద్వైత ప్రపంచంలో జీవించాలి. అనేకంగా కనిపిస్తూ ఒకటిగా అనిపించటమే ‘అద్వైతభావన’. ( ‘‘భి’’ = అంధకారము, మాయ, అజ్ఞానము. ‘‘క్షం’’ = క్షయింపజేసుకోవటము)

అభక్ష్యమ్ ద్వైతభావనా : -

- నేను వేరు - నీవు వేరు.        భక్తుడు వేరు - ఇష్టదైవము వేరు. 
- ఇప్పుడు వేరు - మరొకప్పుడు వేరు.     దృశ్యము వేరు - ద్రష్ట వేరు. 
- దేహమున్నప్పుడు వేరు - లేనప్పుడు వేరు.  యోగాభ్యాసి వేరు - భక్తి మార్గము వేరు. 
- జీవాత్మ వేరు - పరమాత్మ వేరు.     యోగి వేరు - జ్ఞాని వేరు. 
- జ్ఞాని వేరు - అజ్ఞాని వేరు.        భక్తి వేరు - జ్ఞానము వేరు. 
- పండితుడు వేరు - పామరుడు వేరు.    భవుడు వేరు - భావము వేరు.

ఇటువంటి ద్వైతభావనలు అభైక్ష్యము. అపథ్యము. చిత్తమునకు అనారోగ్యము, అశుద్ధి కలిగించే ఆహారము.

ఈవిధంగా ముముక్షువు…

      - స్వీకరించవలసినవి,     - స్వీకరించకూడనివి. 
        ఉపాదేయము      హేయము

బుద్ధితో గమనించాలి సుమా!

అట్టి సందర్భాలలో స్వబుద్ధి సరిపోనప్పుడు…,
(1) గురువాక్య-పాఠ్యాంశములను అధ్యయనము చేయటము (2) శాస్త్రములచే ప్రకటించబడుచున్న (తత్త్వమ్-సో2హమ్-త్వమేవాహమ్-జీవోబ్రహ్మేతి నా పరః - అయమాత్మా బ్రహ్మ ఇత్యాది) మాహా వాక్యార్థములను హృదయంలోను, బుద్ధిలోను మననపూర్వకంగా గుర్తుపెట్టుకొనియే సాధనలు, చేయటము (3) శాస్త్రములు సూచిస్తున్న యోగాభ్యాసము మొ।।వి నిర్వర్తించబడును గాక.

…ఈ ఈ భావనలు, ప్రయత్నములు సదా, సర్వ సందర్భాలలోను ఆశ్రయించి ఉండాలి.


చిత్తశుద్ధికై సర్వము సన్న్యసించాలి

ఒక దొంగ పట్టుబడి అసాధారణముగా శిక్షను అనుభవిస్తూ చాలాకాలం గడిపాడనుకో! ఆతడు శిక్ష పూర్తి చేసుకొని కారాగారము నుండి (జైలునుండి) విడివడి, ఇక ఆకారాగారానికి అతిదూరంగా ఉంటాడు కదా!

అట్లాగే….,
కొందరు స్వదేశమును త్యజించివేసి సన్న్యాసాశ్రమము స్వీకరిస్తున్నారు. సర్వము సన్న్యసించి ఇతఃపూర్వపు ప్రదేశములకు సుదూరంగా ఉంటున్నారు. అయితే….ఆతడు సన్న్యసిస్తున్నది ఎవరిని? భౌతికమైన భార్య - సోదరులు - కొడుకులు…ఇవియేనా?
అయితే ఇవన్నీ ఉండవచ్చుగాక! (లేక) ఉండకపోవచ్చుగాక! అసలు వదలవలసినవి ఇవికాదు. మరి? ఓ జనులారా!

వీటిని బుద్ధితో చిత్తమునుండి సన్న్యసించాలి! ‘‘ఓ అహంకారము, ఆశ, మోహము, కామము- ఇత్యాది పరిచయిస్తులారా! ఇక మీరు ఆ ప్రక్కకు తొలగండి! నేను మడి కట్టుకుంటున్నాను’’……..అనే జాగరూకతతో కూడిన కేక వేయాలి.

శ్రీ మైత్రేయమహర్షి : స్వామీ! చిత్తశుద్ధి శాస్త్రములు నిర్దేశిస్తున్నట్టి సంధ్యావందనము - పూజ మొ।।వి ఎంతో ఆవశ్యకం కదా! లేకుంటే బుద్ధి నిర్మలం కాదేమో! అట్టి అనుదిన సంధ్యోపాసన చేయలేని వారికి ‘‘చిత్త నిర్మలత్వం, సో2హమ్ రూపమైనట్టి ఆత్మభావన’’ లభించదు - అని కొందరి అభిప్రాయం.

శ్రీ మహాదేవుడు : నాయనా! మైత్రేయా! నీవు అడిగిన ‘‘సంధ్యోపాసన అనివార్యంగా అత్యావశ్యకము’’ అనే అభిప్రాయాన్ని విశ్లేషిస్తూ వివరించే ఒక దృష్టాంత సంఘటనను విను.

ఒకానొకప్పుడు బ్రహ్మమే తానై ఆస్వాదిస్తున్న ఒకానొక బ్రహ్మతత్త్వజ్ఞుని ఎవరో ఇట్లా ప్రశ్నించారు.

‘‘అయ్యా! మేము తత్త్వదర్శులము, ఆత్మమేవాహంభావమును పునికిపుచ్చుకొన్న వారము అవ్వాలి కదా! అందుకు మేము ఉదయం - సాయంకాలము క్రమం తప్పకుండా సంధ్యావందనము, బ్రాహ్మీ-ప్రదోషకాలంలో నిర్వర్తిస్తున్నాము. మరి మీమాట ఏమిటో చెప్పండి?’’

అప్పుడు ఆ మహనీయుడగు బ్రహ్మానందానుభవుడు ఈ విధంగా తమాషాగా సమాధానం చెప్పుచున్నారు.
‘‘వేదమాత సాధనములను సో2హమ్ బ్రహ్మీస్థితి కొరకై చెప్పుచున్నమాట నిజమే. అయితే, -

అయ్యలారా….!
- ‘‘నాకు అజ్ఞానమునకు జన్మస్థానం అయినట్టి ‘మోహము’ అనే తల్లి మరణించింది.
- ‘భోధమయి’ అయినట్టి గొప్ప కుమారుడు నాకు వెనువెంటనే పుట్టటం జరిగింది.

ఈ విధంగా మోహనాశనముచే ‘మైల’, ఆత్మ బోధ జనించటం చేత ‘పురుడు’ - ఒకేసారి నాకు వచ్చి పడ్డాయి. సూతకద్వయం ప్రాప్తించింది. మరిక బ్రాహ్మీముహూర్తం లోను, సాయం ప్రదేశకాలములోను సంధ్య మొదలైన ఆయా ఉపాసనలు ఎట్లా నిర్వర్తించటం చెప్పండి?’’

- - -

సర్వము స్వస్వరూపాత్మగా సందర్శించటం సమారంభమయి, నిశ్చలమయిందా, ఇక త్రిగుణరూపమగు శాస్త్ర ప్రవచిత సాధనలు తమ యొక్క ఉద్దేశ్యము (Purpose) నెరవేర్చినట్లే అవుతోంది. (శాస్త్రానపి సంత్యజ్యతి). సర్వము స్వస్వరూపముగా దర్శిస్తూ, ‘‘ఈ సర్వభూతములు నేనై - సర్వసాక్షిగా వేరై’’ అనే స్థితిని సంపాదించుకున్న వానికి సంధ్యావందనము, తదితర ఆత్మధ్యాన సాధనలు నిర్వర్తించవలసినదిగా నియమం చెప్పేపని ఏముంటుంది? సర్వత్రా ఆత్మ దర్శనమై, అటుపై ఆత్మదర్శనమే - ఆత్మ ధ్యానము అగుచున్నది.

‘నా హృదయాకాశములో చిత్ సూర్యుడు కేవలానుభవరూపుడై అనునిత్యంగా సర్వకాలములందు ప్రకాశిస్తున్నారు. అట్టి సత్-చిదాకాశ సూర్యుడు ఏ మాత్రము ఉదయించటము లేదు. అస్తమించటము లేదు. మరి ఉషోదయ - సాయంకాల సంధ్యావందనములు ఎట్లా చేయటం?’’

అని బ్రాహ్మీస్థితిని సముపార్జించుకున్న ‘‘మలరహిత చిత్త సమన్వితుడు, నిర్మల హృదయుడు’’ అయినట్టి యోగి పలికితే - మరి ఆ పలుకులు యుక్తియుక్తమే అవుతాయి కదా!

దేశాన్తం : ఈ గృహము - సంపదలు - సంబంధములు వదలి దూరంగా ఉన్నవానికే మోక్షము. దూరంగా ఉండటమంటే ఇల్లు - పెళ్లాం - పిల్లలను వదలి ఆశ్రమంలోనో, మఠములోనో, అడవిలోనో నివసించటమా? కాదు కాదు.

‘‘ఇక్కడ అనేకంగా కనిపించేదంతా భ్రమ - ఇదంతా ఏకమగు ఆత్మయే!’’ 
అనేకంగా కనిపిస్తూ ఉన్నదంతా ఏకముగా అనిపిస్తూ ఉండటమే - యోగము।

అనే గురు మహావాక్యములపట్ల గురిపెంపొందించుకోవటం, నిశ్చితమవటం (Becoming wel determined) - ఇదియే ‘‘దేశాన్తరము’’!

గురువెందుకంటావా? స్వస్వరూపాత్మపై గల సందేహాలను పూర్తిగా తొలగించుకోవటానికై గురువాక్యములపై విశ్వాసముంచి, తద్వారా ఆత్మవిశ్వాసమును సముపార్జించుకోవాలి. ఎందుకంటే…,
ముక్తియొక్క రూపము స్వస్వరూపము గురించిన సందేహాలన్నీ తొలగటము. (జ్ఞాన స్సంచ్ఛిన్న సంశయః).

ఆత్మస్వరూపము (స్వస్వరూపము) పట్ల సందేహాలు కొనసాగుచున్నాయా, …ఇక అప్పుడు జన్మ - జన్మలకు కూడా ముక్తి లభించదు. అట్టి సందేహములు తొలగే వరకు సాధన వదలరాదు.

సన్న్యాసము

కర్మలు మానివేసినంతమాత్రంచేత అది సన్న్యాసము అవదు. లేక, గొప్ప భాషావాక్యాలు, మాటలు చెప్పగలగటం సన్న్యాము కాదు. మరి?

సంథౌ జీవాత్మనో ఐక్యం! ‘‘ఈ జీవుడు బ్రహ్మమే! శివుడే జీవుడుగా కనిపిస్తున్నాడు. జీవుడే శివుడు అయి ఉన్నాడు’’ ఇటువంటి ‘జీవ బ్రహ్మైక్యము’యొక్క అనుసంధానమే - సన్న్యాసము (సత్-న్యాసము-సత్‌ను స్వీకరించటము, అసత్‌ను త్యజించటం)అయి ఉన్నది.

- - -

శ్రీ మైత్రేయమహర్షి : స్వామీ! పరమేశ్వరా! మేము అనేక జన్మలుగా దృశ్యవిషయములందు అభిలాష, అభిమానము, ఆవేశపూరితమైన అభినివేశము కలిగియున్నాము. ఎంత చదివినా, విన్నా కూడా సంసార దృష్టులను తొలగించుకోలేకపోతున్నాము. ఉపాయం చెప్పండి. త్రోవ చూపండి. ‘సన్న్యాసము’ అను దాని గురించి మరికొంత వివరించండి.

శ్రీ మహాదేవుడు :

‘దృశ్య సంబంధమైన సర్వము మనస్సుతో త్యజించటము, సత్‌ను మాత్రమే మనస్సుతో దృష్టియందు ఆశ్రయించి ఉండటము’ అనునవే నిజమైన సన్న్యాసము.

కేవలము సన్న్యాసాశ్రమము స్వీకరించినంత మాత్రంచేత నిత్య సన్న్యాసి కాజాలడు సుమా!

ధనము ఆశించో, అన్న - వస్త్రముల కొరకో, పేరు - ప్రతిష్ఠలను ఉద్దేశ్యించో,… సన్న్యాసాశ్రమము స్వీకరించువారు, సన్న్యాసము కొనసాగించువారు - అటు గృహస్థాశ్రమములోను, ఇటు సన్న్యాసాశ్రమములోను పొందవలసిన ఉత్తమమైనదేదీ పొందక ఉభయభ్రష్టులు అవగలరు. ముక్తిని కరతలామలకం చేసుకోలేకపోతారు. మరొక్క ముఖ్యమైన విషయం గమనించెదవు గాక।


Ⅰ. తత్త్వచింతన ఉత్తమోత్తమం।
‘త్వమ్ తత్ అసి’ అను జీవాత్మను పరమాత్మయొక్క చిద్విలాసమైన అంశగా నిరూపించే తత్త్వ శాస్త్రము, తత్త్వ చింతన, తత్త్వ భావన, ‘త్వమ్’ను తత్ పరమాత్మగా ఉపాసనా భావము కలిగి ఉండటము - ఇవన్నీ కూడా అధ్యాత్మ విద్యకు మకుటము వంటిది! సమున్నతమైనది! రాజవిద్య! ‘‘జీవాత్మ నాయొక్క (మయాకల్పితమైన) జగన్నాటకములోని మయారచితమైన పాత్రగా సందర్భసత్యము. నాయొక్క తదితరులయొక్క సహజ సత్యము ‘‘ఆత్మస్వరూపమే’’। … అనే సద్గురు వాక్యబోధ, వేదాంత వాఙ్మయసారము. అందుకుకావలసిన వివేక విజ్ఞానములు అన్నిటికంటే ఉత్తమము. ఆత్మదర్శన భావమునకు దారితీసి, నిశ్చలము చేయు మార్గమునే ‘తత్త్వచింతన’ అంటున్నాము. తత్త్వభావనను అనుసరించే ఒకడు ‘సో2హమ్’ను సిద్ధించుకోగలడు.

Ⅱ. మధ్యమమ్ శాస్త్ర చింతనమ్।
శాస్త్ర - పౌరాణిక విశేషాలు, చారిత్రక విషయాలు అధ్యయనము. వాటియొక్క అంతిమ ఆశయము తత్త్వచింతనయే - అందుకొరకై నిష్ఠలు, నియమములు, యోగాభ్యాసములు మొదలైనవన్నీ - ‘మధ్యమములు’.

Ⅲ. అథమా మంత్ర చింతా చ।
విధి - విధానములతో కూడిన మంత్రముల మననములు, వ్రతవిధానములు మొదలైనవి మరికొంత క్రింది అడుగు.

Ⅳ. తీర్థభ్రాంతిః అధమాధమః
‘‘తీర్థములు సేవించటం, ఎక్కడో సుదూరంగా ఉన్న ప్రదేశాలను బహుకాలం అనేకసార్లు చుట్టివస్తేగాని పరమాత్మను సుస్థిరీకరించుకోలేమేమోనని తలచటము - ఇది ఆధ్యాత్మిక సంబంధమైన మరికొంత క్రింద స్థితి.


అన్నిటికన్నా అతి ముఖ్యమైనది అనుభూతి.

 • ఆత్మయే నేను!    • ఇదంతా ఆత్మయే!   • నేనే ఇదంతా!

అను ఆత్మానుభూతి సునిశ్చితము, సునిశ్చలము, సుస్థిరము, అనునిత్యము, అచంచలము అవటానికే తదితరమైన సర్వయత్నములు కూడా! కేవలము ఆత్మతత్త్వ వివరణ సంబంధమైన భాష - సాహిత్యమునకు పరిమితమై, ఆత్మానుభవమునకు బుద్ధిని సిద్ధంచేసుకోకపోతే ఏమిలాభమయ్యా? బ్రహ్మముగురించి ఉపమానములను - ఉపమేయములను, వర్ణనలను, సాహిత్యమును పరిశీలిస్తూ ‘‘సర్వులలోని సత్యమగు కేవల సాక్షిని నేనే! స్వస్వరూపము, స్వస్వభావము అగు పరమాత్మయే - నా వాస్తవతత్త్వము’’ - అను మార్గముగా అడుగులు వేయకపోతే ఎట్లా?

ఆత్మ గురించి తెలుసుకొంటూ, సంభాషిస్తూ కూడా ‘‘ఇదంతా మమాత్మానంద స్వరూపమే’’ - అను అభ్యాసమును ఆశ్రయించకపోతేనో?

‘‘ఒకానొకచోట జలంలో ఫలములతో కూడిన వృక్షము ప్రతిబింబిస్తున్నాయి. ఆ జలంలో ప్రతిబింబించే ఫలములను చూస్తూ, వాటి రుచిగురించి ఊహిస్తూ, పైనగల ఫలవృక్షపు ఫలమును కోసుకోకపోవటం వంటిది.

అనుభూతి చేత మాత్రమే, బ్రాహ్మీ స్థితి సిద్ధిస్తుంది. బ్రాహ్మీ స్థితి సిద్ధించినప్పుడే - బ్రహ్మజ్ఞానము యొక్క నిజమైన ప్రయోజనము జీవుడు పొందినట్లు అవుతుంది.

శ్రీ మైత్రేయ మహర్షి : మమాత్మస్వరూపుడనగు మహాదేవా! జగద్గురూ! సర్వశుభంకరా! ఆధ్యాత్మయానంలో ఈ భౌతికదేహమున్నంతవరకు యతి వదలకూడనివి దయతో వివరించి చెప్పండి.

మహాదేవుడు : నాయనా! మైత్రేయమహర్షీ! యతి, ముక్తుడైనవాడు దేహమున్నంతవరకు కూడా…

(1) భిక్షాటన (మదూకరము) అనే తల్లిని, → (భి) అజ్ఞానము (క్ష) తొలగించగల ఉపాయములు, అభ్యాసములు)

(2) వైరాగ్యము (మథుకరము) అనే తండ్రిని, → (దేనిపట్ల రాగము కలిగి ఉండకపోవటము).

(3) శ్రద్ధ అనే భార్యను, → (ఆత్మ జ్ఞాన మార్గములగు భక్తి-యోగాభ్యాసములపట్ల శ్రద్ధ కలిగి ఉండటము).

(4) జ్ఞానము అనే కుమారుని (జ్ఞాన సమాచారమును, అధ్యయనములను సర్వత్రా అమృతమగు ఆత్మను దర్శించు దృష్టి వీడకపోవటము).

వీటిని విడుచుటయే లేదు. విడువడు. విడువకూడదు. కనుక, మధూకర మాతరం, వైరాగ్య జనకం, శ్రద్ధా కళత్రం, జ్ఞాననందనమ్ - న త్యజేత్। న త్యజేత్। జ్ఞాసమాచారము ‘వినాలి’ - అని అనుకోవాలేగాని, ‘‘ఆ" ! ఇవన్నీ నాకు తెలుసులే’’ - అని ఊరుకోకూడదు.

జ్ఞానవానేన బలవాన్

జ్ఞానవంతుడే బలవాన్! జ్ఞానిదే జీవితము! జ్ఞానియే సుఖవంతుడు. సర్వలౌకిక సంపదలు ఆత్మజ్ఞానసంపదముందు తీసికట్టే!

మం।। శ్లో।।   ధనవృద్ధా వయోవృద్ధా విద్యావృద్ధా తథైవ చ 
      తే సర్వ జ్ఞానవృద్ధస్య కింకరాః శిష్య కింకరాః

(1) ధనవృద్ధుడు (2) వయస్సుచే వృద్ధుడు (3) విద్యావృద్ధుడు …..ఈ ముగ్గురూ కూడా జ్ఞానవృద్ధునికి - ఆతని శిష్యునికి కూడా కింకరులై (సేవకులై) ఉంటారయ్యా. అందుచేత ఈ జీవుడు శ్రద్ధతో సర్వదా ఆత్మజ్ఞానము సముపార్జించుకొనే మార్గములో నిత్యయత్నపరుడై ఉండటమే అత్యంతికంగా శుభప్రదము.

- - -

శ్రీ మైత్రేయ మహర్షి : స్వామీ! జీవులమగు మేము ధనసంపద, గొప్ప ఆయుష్షు, పేరు - ప్రతిష్టలు …..ఇటువంటివే ఆశయముగా కలిగి ఉంటున్నామేగాని, ఆత్మజ్ఞానము విషయంలో, ‘‘తర్వాత చూద్దాంలే!’’…..అని అశ్రద్ధ వహిస్తున్నామే! అవకాశముల కోసం ప్రయత్నించకపోగా, ఎక్కడైనా అవకాశాలు లభించినా మేము సద్వినియోగం చేసుకోవటం లేదు. ఎంత చిత్రం?

మహాదేవుడు : బిడ్డా! నీవు చెప్పినది నిజమేనయ్యా! జీవులలో అధికులు ఆత్మతత్త్వముపై శ్రద్ధలేకపోవటంచేత నా మాయచే మోహితులగుచున్నారు. భ్రమతో కప్పబడిన బుద్ధికలవారై జీవిస్తున్నారు. అపూరుణాలై, వారియొక్క ఆత్మస్వరూపుడనైయున్న నన్ను పొందక, సంసారారణ్యంలో దేశ ద్రిమ్మరులవలె దేహదేహాంతరములలో సంచారాలు చేస్తున్నారు.

అనేక భ్రమలను తమ చిత్తము నిండా కలిగినవారై ఉంటున్నారు. తెలివితేటల విషయంలో శూరులే అయి ఉండి కూడా…, ఒక కాకి ఆహారం కోసం…రోజంతా అనేకచోట్ల తిరుగాడుచూ ఉంటున్నట్లుగా ఈ నిస్సార సంసారాణ్యములో తిరుగాడుచున్నారు. (అందుచేతనే అవతారమూర్తులయొక్క రాక అవసరమౌతోంది)

ఈ జీవులలో కొందరు తమ యొక్క ఇహ స్వరూపమును మాత్రము చూచుకుంటున్నారేగాని, తమ పరస్వరూపమేమిటో గమనించక, పొందక ‘‘దేహములు (జన్మలు)’’ అనే అవకాశములను బూడిద చేసుకుంటున్నారు. భ్రమలో ఉండిపోతున్నారు.
అయితే, తెలివైన, శ్రద్ధగల విద్యార్ధికి చదువుకోవటానికి ఏవీ అడ్డంకులు కావు. అట్లాగే నీవు ఆత్మజ్ఞానము పొందటానికి ఏవీ అడ్డంకులు కావని గుర్తుచేస్తున్నాను.

శ్రీ మైత్రేయ మహర్షి : స్వామీ! సర్వాత్మకుడు - స్వస్వరూపుడు అగు పరమాత్మను పాషాణ - లోహ ఇత్యాది విగ్రహ రూపముగా కల్పించుకొని ఉపాశించటం శాస్త్రములచే (ఆగమశాస్త్రము మొదలైనవాటిచే) సూచించబడుచున్నది కదా? అవి అవసరమేనా?

శ్రీ మహాదేవుడు : అవును. బుద్ధియొక్క ఏకాగ్రత కొరకై పాషాణ - రాయి - మణి - మట్టి ఇటువంటి వాటితో నిర్మితమైన విగ్రహారాధన శాస్త్రములు సూచిస్తున్నాయి. సాధకులకు మార్గము చూపుచున్నాయి.

అయితే,
నిగ్రహము కోసమే విగ్రహము సుమా! ఇది దృష్టియందు కలిగి ఉండియే,- క్రమంగా పరిమిత దృష్టిని అధిగమించి ఆత్మతత్త్వము గురించిన వివేకదృష్టికై సంసిద్ధమయ్యెదరు గాక।

శ్లో।। పాషాణ - లోహ - మణి - మృణ్మయ విగ్రహేషు 
    పూజా పునర్జనన భోగకరీ ముముక్షోః।।

పాషాణము, లోహము, మణి, మట్టి - ఇటువంటి వాటితో తయారైన విగ్రహముల పూజ, పరిమితమైన దృష్టిని దాటకపోతే, అవన్నీ ముముక్షువుపట్ల పునర్జన్మలను కొనసాగించే కారణములను వృద్ధిచేయగలవు సుమా! ‘‘నేను ఈ రూపముగా పూజిస్తున్న ఈ నా ఇష్టదైవము సర్వాత్మకుడు, సర్వతత్త్వస్వరూపుడు కూడా’’ అను ఎరుకను వృద్ధిపరచుకోవాలి. ఏ మరువరాదు.

బుద్ధియొక్క నిర్మలత్వము, మహదాశయముయొక్క సునిశ్చయత్వములను సాధించటానికై శిల్ప - శిలా - సాకార పూజ తప్పక ప్రయోజనకారియే. సాధన లేకపోతే ‘జన్మరాహిత్యము’ అనే స్థితి లభించదు. అయితే అవి (ఆశయ శుద్ధి లేనపుడు, సర్వాత్మక భావన ఆశ్రయించనప్పుడు) పునర్జన్మ హేతువులే మరి.

స్వహృదయార్చన

‘‘తస్మాత్ యతిః స్వహృదయార్చనమేవ కుర్యాత్’’ - బాహ్యార్చనం పరిహరేత్ అపునర్భవాయ।

అందుచేత దృశ్యాతీతస్థానము సంపాదించుకొనగోరు యోగి (యతి) చివరికి తన హృదయమునందు సర్వదా వేంచేసియేయున్న సర్వజగత్‌స్వరూపుడగు ఆత్మదేవునే (స్వాత్మనే) పూజించుచున్నాడు. ఆయనను సర్వాత్మకులుగాను, సర్వతత్త్వ స్వరూపుడుగాను ఆరాధిస్తున్నాడు. బాహ్య అర్చనలను దాటిన దృష్టిచే పునఃజన్మ రహితమగు ఆత్మస్థానము చేరుచున్నాడు.

పూర్ణము - శూన్యము

అట్టి స్వస్వరూపము - సర్వ స్వరూపము అయి ఉన్న ఆత్మ ఎక్కడ వేంచేసి ఉన్నది? దేహములోనా? బాహ్యములోనా? ఆకాశంలోనా? మరెక్కడన్నానా? విను, చెప్పుచున్నాను.

పూర్ణకుంభము : అంతఃపూర్ణో బహిఃపూర్ణో పూర్ణకుంభ ఇవ ఆర్ణవే! : ఒక కుండను సముద్ర జలంలో ముంచి ఉంచామనుకో! ఇప్పుడు జలము ఎక్కడున్నది? ఆ కుండయొక్క లోన-బయట కూడా ఉన్నది కదా! అట్లాగే ఆత్మ మనయొక్క బాహ్య - అంతరములలో అంతా నిండి ఉన్నట్లుగా గమనించు. ఉపాసించు. ఆస్వాదించు. పరమాత్మ పూర్ణస్వరూపుడు.

శూన్యకుంభము: అంతః శూన్యో - బహిః శూన్యః శూన్య కుంభ ఇవ అంబరే! : ఒకచోట ఒక ఖాళీ కుండ ఉన్నది. లోపల ఏమీ లేదు. శూన్యాకాశమే ఉన్నది. మరి ఆ కుండయొక్క బయట? శూన్యాకాశమే! పరమాత్మ శూన్య స్వరూపుడు కూడా।

అట్లాగే ఆత్మ సదా బయట - లోన నిర్విషయ చిదానందముగా సదా వెలుగొందుచున్నది.

భావాతీతమ్ - త్రిగుణరహితమ్।

శ్రీ మైత్రేయ మహర్షి : అట్టి పూర్ణము- శూన్యము కూడా అయి ఉన్న ఆత్మను గ్రహించటం ఎట్లా? (How to pick up?) ఆత్మదేవుని అనుగ్రహం పొందటం ఎట్లా?

శ్రీ మహాదేవుడు : ఓ మహర్షీ! దృశ్యములో ఏదైనా గ్రహించాలంటే ఇంద్రియములు నియమితము అవాలి. అయితే, ఆత్మ ఇంద్రియములచే గ్రహించబడు వస్తువు వంటిది కాదు. కాబట్టి బాహ్యమున దేనిచేతనూ గ్రహించబడువాడవు కావద్దు!

అట్లాగే బాహ్యమునుండి ఏదీ గ్రహించువాడవు కూడా కావద్దు. సర్వ దృశ్య భావములను త్యజించివేయి. దాటివేయి. భావనలు నీవి.
అంతేగాని భావనలలోని అంతర్విభాగము అగుచుండటము లేదు.

ఆత్మను అనుసంధానము సిద్ధించుకున్న ‘శివో2హమ్’ భావియొక్క ఆత్మదర్శన గానం ఏవిధంగా ఉంటుందో…ఇప్పుడు విను!

- - -

తృతీయోధ్యాయః

ఆత్మానంద గానము

ఆహా! ఏమి అస్మత్ ఆత్మస్వరూపము యొక్క మహిమ అహమస్మి పరశ్చాస్మి! పరస్వరూపుడనగు నేను - ఇహ స్వరూపము ధరించువాడనై స్వయంకల్పిత జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో విలాసంగా సంచారాలు చేస్తున్నాను కదా! నేనే నాలోని నేనై, సర్వముగా ప్రకాశిస్తున్నాను. ఈ సర్వమునకు పరమై కూడా విరాజిల్లుచున్నాను. సత్యమును ప్రకాశింపజేస్తున్నాను కూడా!

బ్రహ్మా2స్మి! బ్రహ్మము అని పిలువబడుచు, సర్వముగా ప్రభవిస్తున్నది నేనే! ఈ 14లోకములలో అత్యంత ఉత్కృష్టము - మహనీయము అగు గురు (The Finest) స్వరూపుడను. గురుశ్చా2స్మి। సర్వలోకములు నా స్వరూపమే! సర్వలోకముల కల్పన, సందర్శన - ఇదంతా నా యొక్క విన్యాసమే! ఆ బ్రహ్మము ఆత్మ అనబడేది నేనే! సో2హమ్! సో2హమ్!

ఈ దేహములో అత్యంత శ్రేష్ఠము అయి ఉన్న ఆత్మగా ‘గురు’ (The most superior part) స్వరూపుడను.

అహమస్మి సదా సో2హమ్! సో2స్మి!।।

నేను కానిదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇక్కడా - అక్కడా - ఇప్పుడు - అప్పుడు నేనే సర్వమై ఉన్నాను. సర్వమునకు వేరై కూడా ఉన్నాను. అహమేవా2స్మి! ఒక కథలో పాత్రలు, సంఘటనలు, సందర్భములు మొదలైనవేవీ ఆ కథారచయితకు వేరై ఉండవు కదా! కానీ రచయిత కథలో కనిపించడు. ఈ జగదనుభవమంతా నా రచనయే।

సిద్ధో2స్మి :
ఏదీ కూడా నాకొరకు మరొకరెవరో సిద్ధింపజేయటం లేదు! ఈ దృశ్య భావములను, దృశ్యమును, ద్రష్టత్వమును, జాగ్రత్-స్వప్న - సుషుప్తులను నా వినోదముకొరకు నేనే నేనై సిద్ధింపజేసుకుంటున్నాను. సిద్ధో2స్మి! సమస్తమును సిద్ధించుకుంటున్నది నేనే కనుక- సిద్ధపురుషుడను!

శుద్ధో2స్మి :
నేను నాచే సిద్ధింపజేసుకుంటున్నట్టి దేనిచేతను స్పృశించబడటంలేదు. నిత్యనిర్మలుడను.
సర్వదా సర్వమునకు వేరై ఆవల ఉన్నవాడను. పరమో2స్మ్యహమ్!

సదాసో2స్మి :
భూత - వర్తమాన భవిష్యత్ త్రికాలములలో సర్వదా ఉండువాడను. సర్వమునకు ఆవల ఉన్నది మరొకరెవరో కాదు! నేనే! అహమస్మి సదా సో2స్మి । సదా ‘‘సత్ (ఉనికి)’’ - స్వరూపుడను.

నిత్యో2స్మి :
నేను ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేనివాడను కాను. ఎల్లప్పుడు ఉండియే ఉన్నాను. ఉండియే ఉంటాను.

విమలో2స్మి :
నాకు జన్మ - కర్మ - సత్త్వ - రజో - తమో గుణ ఇత్యాది దోషాలేవీ అంటవు. కథ రాసేవాని కథలోని పాత్రల గుణాలు అంటుతాయా? లేదు. అందుచేత విమలో2స్మ్యహమ్! నిత్యనిర్మలుడను.

విజ్ఞానో2స్మి :
తెలియబడేదంతా ‘‘అనుభవము’’ రూపంగా తెలుసుకుంటున్నది నేనే! నాకు మరొకరెవ్వరో తెలియపరచటం లేదు.

విశేషో2స్మి :
సర్వ విశేషములు నేనే। సామాన్యంగా కనిపిస్తున్న దానిలో విశేషమైనవాడను. విశేషములోనే సామాన్యమంతా కలిగియున్నవాడను।
సోమో2స్మి । (స + ఉమ = ప్ర-కృ-తి = ప్రకృత్యహమ్)
సత్‌చిత్ఆనందస్వరూపుడను. నేనే ప్రకృతిగా విరాజిల్లుచున్నాను.
ప్రదర్శనము - కృతము - తిరోగమనము - అను మూడిటితో కనబడేదంతా ‘నేనే’। ప్రకృతి నా విన్యాసమే।

సకలో2స్మి :
సకలముగా భాసిస్తున్నది నేనే! స్వప్నంలో కనిపించేదంతా స్వప్నము తన దైనవాని ఊహా చమత్కారమే కదా! అందుచేత సర్వముగా నాచే పొందబడుచున్న జాగ్రత్ - స్వప్న - సుషుప్తిల అంతర్గతాలన్నీ నేనే! సకలో2స్మ్యహమ్! ‘‘ద్రష్ట-దర్శనము-దృశ్యము’’ - గా కనిపించేదంతా ‘‘నాలోని నేనైన నేనే’’.

శుభో2స్మి :
అంతా నావారే! నేనే! సర్వశుభ స్వరూపుడను! ‘శుభమ్’ అంటూ అంతటిని ప్రారంభిస్తున్నది - ముగిస్తున్నది కూడా నేనే! అందుచేత సర్వ శుభంకరుడను. శంకరుడను.

శోకహీనో2స్మి ।
అంతా నా కల్పనయే! కల తనదైన తనకు కలలోని తాను పొందుచున్న సుఖ - దుఃఖములకు ఏమి సంబంధము? ఏమీ లేదు. జీవాత్మగా పొందుచున్న శోకములకు ఆ జీవాత్మను కల్పించుకుంటున్న నాకు ఏమి సంబంధము? ఏమీ లేదు. శోకహీనో2స్మి! నవలలో ఒక పాత్ర దుఃఖము పొందితే, అది ఆ నవలా రచయిత పొందినట్లు అవదు కదా! ఈ దృశ్యమంతా రచిస్తున్న ఆత్మనగు నాకు జగద్దుఃఖములు లేవు.

చైతన్యో2స్మి ।
ఈ దేహము కదులుతోంది కదా! నేను దేహత్వమునకు వేరై, ఈ దేహములను కదల్చువాడను. ఆలోచనలను కల్పించుకొని, వాటిని కదల్చువాడను. సర్వ జగత్ - జన్మ - జీవన - మరణ భావములను చలింపజేయువాడను. చైతన్య స్వరూపుడను. ఇక్కడ దేహ మనో బుద్ధి చిత్త అహంకారాదులు స్వయముగా అచేతనమే అయి ఉండగా వాటిని చేతనము చేయుచున్న చైతన్యపురుషుడను నేనే।

సమో2స్మి ।
నేను దేహములో మాత్రమే కాక, సమస్త జీవులలో సమస్వరూపుడనై ఉన్నవాడను. సర్వ సముడను! సర్వమునందు సమముగా వేంచేసియున్న ఆత్మస్వరూపుడను, సమమ్ సర్వేషు భూతేషు తిష్ఠంతమ్। మార్పు - చేర్పులు లేని వాడను. సర్వదా ఏకరీతిగా - సమముగా ఉండువాడను. నాయొక్క సమ-ఆత్మస్వరూపమునందే సమస్తము ప్రతిబింబిస్తోంది.

మానావమాన హీనో2స్మి।
నాచే కల్పించబడి, నాకు వినోదముగా అగుచున్న కథలో కనిపించువారి వలన నాకు గౌరవాగౌరవములు ఏమున్నది?
నేను కల్పించిన ఒక కథలోని కొన్ని పాత్రలు వచ్చి నన్ను గౌరవించటమేమున్నది? గౌరవించకపోవటమేమున్నది? అగౌరవించటమేమున్నది?
నాచే గౌరవించబడుచున్న జగత్ దృశ్యములన్నీ నాయొక్క స్వకీయ కల్పనా భావ చమత్కారములే!
నాయొక్క భావనా కల్పితంగా, నాచే రూపము ఇవ్వబడుచున్న ఈ జగత్ విశేషములు వచ్చి నన్ను సన్మానించటమేమిటి? అసన్మానించటమేమున్నది?
అందుచేత నాకు మానముగాని, అవమానముగాని మొదలే లేవు.

నిర్గుణో2స్మి ।
నేను గుణసంబంధితుడినా! లేదు. నాయొక్క ప్రకృతి - (1) (ప్ర) ప్రకాశము, (2) (కృతి) - కృతము, (తి) తిమిరము / మోహము-అను మూడు గుణములు కలిగి ఉన్నది. అయితే, నేనుంటే గుణములకు ఉనికి. (అంతేకాని), గుణములచేత నాకు ఉనికి కాదు. గుణములు నావి. నేను గుణములుగా అవను. గుణిస్వరూపుడు. గుణములకంటే మునుముందే ఉన్నట్టి కేవల సత్ స్వరూపుడను. అందుచేత నిర్గుణుడను.

శివో2స్మి :
(శివాత్ పరతరం నాస్తి।) సర్వము శివ స్వరూపమేనని సిద్ధాంతీకరించబడుతోంది. కాబట్టి నేను - నీవుతో సహా సర్వము సహజంగా సర్వాంతర్యామి, సర్వ తత్త్వస్వరూపుడు - అగు శివస్వరూపమే। చిదానందరూపమ్। శివో2హమ్! సర్వము శివమయమే అయి ఉండగా, నేను శివతత్త్వమునకు వేరుగా ఎట్లా ఉంటాను? కాబట్టి శివో2స్మ్యహమ్! ‘శివుడు’ అని శాస్త్రములచే సువిస్తారంగా వర్ణించబడుచున్నది, వేదములచే స్తుతించబడుచున్నది - నాయొక్క కేవల స్వరూపమునే। (జీవో శివః)।

ద్వైతాద్వైత విహీనో2స్మి :
ఏకమగు ఆత్మయే అనేకముగా కనిపిస్తోంది. విజ్ఞానదృష్టిగలవారికి, పరమపవిత్రమగు హృదయముగలవారికి - ‘‘అనేకముగా కనిపిస్తూ ఏకముగా అనిపిస్తోంది! అదియే అక్షరమగు సత్యము. ఏకమై సర్వత్రా సర్వదా ఆత్మయే వెల్లివిరియుచుండగా ద్వైతమేమిటి? అద్వైతమేమిటి? ఇక వాదోపవాదములతో ఏమి పని? ద్వైతము నేనే। అద్వైతము నేనే। జీవుడను నేనే! శివ-పరతత్త్వమును నేనే! ద్వైత - అద్వైత విహీనో2స్మి!

ద్వంద్వ హీనో2స్మి :
నటుడు నాటకంలో నటిస్తూ (1) పాత్ర (2) పాత్రధారుడుగా - ఒక్కటిగా ఉన్నట్లే, జీవాత్మ - పరమాత్మ స్వరూపుడనై నేనే ఉన్నాను. పాత్రధారుడే పాత్రగా కనిపిస్తున్నాడు. పరమాత్మకు వేరై జీవాత్మత్వము నాకు లేదు. ద్వంద్వహీనో2స్మి! కేవలాత్మయే నేనై ఉన్నాను. ఇక నాకు తదితర సమాచారములతో క్రొత్తగా పనియేమున్నది? సో2హమస్మ్యహమ్!

భావాభావ విహీనో2స్మి :
భావన చేయునది నేనే! కనుక భావనకంటే ముందే భావించువానిగా నేను ఉన్నాను. భావన చేయునప్పుడుకూడా భావములకు అతీతుడనై ఉన్నాను. నా నుండి భావన ఉత్పన్నమగుచున్నది. కనుక భావనలకు ఆవల ఉన్నవాడను.

భాసా హీనో2స్మి :
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను క్రీడినై, - క్రీడా స్థలములుగా కల్పించుకొనుచున్నవాడను. అంతేగాని ఆ మూడు నన్ను భాసింపజేయటం లేదు. నన్ను భాసింపజేయునది, ప్రకాశింపజేయునది మరొకటేదీ లేదు. సమస్తమును భాసింపజేయునది నాయొక్క భాసా తేజస్సే। అట్టి ఆత్మ తేజో రూపుడనగు నన్ను తన వెలుగులో చూపగల మరొకటి ఏదీ లేదు. సూర్యునికి తన వెలుగులో తనను చూపటానికి దీపము ఎందుకు?

భాస్మ్యహమ్ :
స్వయం ప్రకాశకుడను. నాచేతనే సర్వము సర్వదా సర్వత్రా ప్రకాశింపజేయబడుచున్నది. కేవలమగు తేజోరూపుడను. ఏ వెలుగులో (ఎరుకలో) సమస్తము కనిపిస్తోందో, - ఆ వెలుగు (ఎరుక) నా ఆత్మ తేజస్సే.

శూన్యాశూన్య ప్రభావో2స్మి :
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనే తెరలపై విషయముల చిత్రీకరణచేయుచున్నది, ఆ విషయచిత్రీకరణకు విరమిస్తున్నది, కూడా నేనే! ఈ రీతిగా విషయములను, విషయరాహిత్యమునకు సాక్షినై ఆ రెండిటిని ప్రకాశింపజేయువాడనై ఉన్నాను. శూన్యము - అశూన్యము నా కల్పనా చమత్కారములే! (నాటకములోని సంఘటనలు - ఉన్న మాట నిజమే। నాకటమంతా కల్పన కాబట్టి, లేనిమాట కూడా నిజమే. ఈ విధంగా శూన్య-పూర్ణ స్వరూపుడను).

శోభనా శోభనో2స్మి అహమ్।
ఇది బాగున్నది - బాగుకాదు; ఇది అందమైనది - ఇది కాదు; వీరు ఇట్టివారు - వారు అట్టివారు కాదు…ఇత్యాదులన్నీ నాయొక్క స్వకీయ నిర్వచన - అవగాహన - అభిప్రాయములను అనుసరించే రూపుదిద్దుకుంటున్నాయి. కనుక ‘శోభ - అశోభ’ అనునదంతా నాలీలా విన్యాసమే! నేనే శోభించుదానిగాను, శోభించనిదానిగాను కూడా ఏర్పడినవాడనై ఉన్నాను.

తుల్య-అతుల్య విహీనో2స్మి ।
నాకు వేరుగా అగుచున్నది ఏదీ లేదు. నేను దేనికీ వేరుకాదు.
నాకు సమానమైనది ఏదీ లేదు. సమానము కానిదీ ఏదీ లేదు.
కలలో కనిపించేవన్నీ నానుండియే। అయితే కలలో ఏ ఒక్కటీ నేను కాదు. జాగ్రత్ కూడా స్వప్నము వంటిదే! కనుక జాగ్రత్‌లో కూడా నేను కానిదేదీ నాకు అనుభవంగాదు. జాగ్రత్ సాక్షినే కాబట్టి జాగ్రత్‌లో ఏదీ నేనవటం లేదు.

నిత్యశుద్ధో2స్మి ।
కథా రచయిత కథలో ఏ సంఘటనచేతనూ స్పృశించబడడు. కలలోని మంచి - చెడులను కల కంటున్నవానిపై ఆరోపిస్తామా? లేదు. నాటక పాత్రయొక్క మంచి చెడులు ఆ నటుని వ్యక్తిత్వమునకు సంబంధించినవి కావు కదా! జగత్‌ద్రష్ట - జగత్ దృశ్యముల సదోష - నిర్దోషములచే స్పృశించబడని కేవల దృక్‌స్వరూపుడను. కనుక నిత్యశుద్ధ స్వరూపుడను.

సదాశివో2స్మి ।
నా శివస్వరూపమునకు ఏ సమయములోనూ కూడా ఏ లోటూ లేదు. నేను అజ్ఞానినై అనేక జన్మలలో రాక - పోకలు నిర్వర్తించవచ్చుగాక! లేదా, మరికొన్ని జన్మలలో సుజ్ఞానినై జన్మ - కర్మలకు ఆవల గల ముక్త స్వరూపమును ఆస్వాదిస్తూ ఉండవచ్చు గాక! నాకు జ్ఞాన విషయాలు తెలియవచ్చు గాక! లేదా, తెలియకపోవచ్చును గాక! నేను సర్వదా సహజ శివస్వరూపుడనే అయి ఉన్నాను. (జీవోబ్రహ్మేతి నాపరః) (సదాశివుడు = ఈ జీవుడు ఎల్లప్పుడు శివానంద స్వరూపుడే।)

సర్వాసర్వవిహీనో2స్మి ।
‘‘సర్వభూతములు తానై - సర్వసాక్షి అనగా వేరై’’ అనికదా,….. ఆత్మగురించిన ఆత్మజ్ఞుల గానము! నా కలలో కనిపించేదంతా నేనే! కానీ నా కలలో నేను ఏదీ కాదు. నాయొక్క నాటక రచనలో పాత్రలయొక్క భావ - ఆవేశాలన్నీ నావే! కానీ నాయందు ఆ పాత్రల ఆవేశ కావేశాలు లేనే లేవు. అట్లాగే - అనుభవమయ్యే ఈ సర్వము నేనే! అయినా కూడా ఈ సర్వములో లేను. సర్వమునకు సాక్షినై, వేరుగా సర్వత్రా ఏర్పడి ఉన్నాను.

సాత్త్వికో2స్మి ।
‘నేను లేను’ అనునది నాకు ఉండనే ఉండదు. సదా సత్ స్వరూపుడను. శుద్ధసత్త్వ స్వరూపుడను.ఎల్లప్పుడు ఉనికిని కలిగి ఉంటున్న వాడిని కాబట్టి ఎప్పటికీ నేను నేనే! నాలోని నేనైన నేను సర్వదా యథాతథము. సదా2స్మ్యహమ్!

ఏక సంఖ్యా విహీనో2స్మి ।
నేను సర్వదా ఏకమేగాని అనేకము కాదు. అయితే, నేనున్నచోట… నాకు అభిన్నమైనట్టి నాయొక్క ప్రకృతి (లేక స్వభావము) నన్ను ఆశ్రయించియే ఉంటుంది. బంగారమునకు ‘ఇది’ అనే ఆకారము ఏదీ లేకపోయినప్పటికీ, ఏదో ఒక ఆకారము కలిగియే ఉండటం స్వభావమే కదా! అఖండుడనగు నన్ను నాయొక్క ప్రకృతి స్వభావసిద్ధంగా నన్ను ఆశ్రయించినదై ఉంటోంది.

ఈ విధంగా…

ఇవన్నీ అస్మత్ సంకల్పశక్తిని, ఊహాశక్తిని ఆశ్రయించినవై ఉంటున్నాయి. నేను ఈ రీతిగా నాయొక్క ఇచ్ఛ, జ్ఞాన, క్రియలను - జాగ్రత్ - స్వప్న - సుషుప్తి రూపములుగా నాయందే కల్పించుకుంటున్నాను. మరొకప్పుడు ఉపశమింపజేస్తున్నాను. సర్వదా ఏకస్వరూపుడను అయి ఉండి కూడా….ఏక సంఖ్యామాత్రుడనై ఉండను.

అనంతుడనై, సమస్తము నాయందు ఇముడ్చుకున్నవాడినై ఉంటాను.

న చ అహమ్ ద్విసంఖ్యావాన్

ప్రకృతి (లేక, స్వభావము) నాయొక్క స్వయంకల్పితభావనా వైచిత్ర్యమే కదా! నా ఊహ - భావన నాకు వేరైనవా? కావు. ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తి స్థానములు నా భావనయే. కాబట్టి ఊహ నాకు వేరైనది కాదు. నేను ఈ విధంగా అద్వితీయుణిణా! (మత్తః పరతరమ్‌నాన్యత్ కించిదస్తి). నేను నేనుగా ఉండి ‘‘అనుభవములు పొందే నేను’’ను కల్పించుకొని తదితర కల్పనలన్నీ నాకు నేనుగా ఆస్వాదిస్తున్నాను. నాకు వేరైనది ఏదీ ఎక్కడా లేకపోవటంచేత ద్విసంఖ్యావాన్ అహం న చ। ఒకే సంఖ్య వాడిని. రెండవ సంఖ్యయే లేనివాడను.

సత్ - అసత్ భేద హీనో2స్మి

కేవల సత్ స్వరూపుడనగు నేను నా స్వస్వరూపమునందే ద్వితీయమైన స్వభావము, ప్రకృతి మొ।।వి కల్పించుకొని ఉబుసుపోకగా, అస్మత్ చిద్విలాసమంతా కల్పించుకొంటున్నాను.

వేదాంతశాస్త్రము అభివర్ణిస్తున్నది. వాస్తవానికి నాకు సత్తు లేదు. అసత్తు లేదు. కేవలీ స్వరూపుడనై, త్రిగుణములకు - త్రి అవస్థలకు సాక్షిస్వరూపుడనై, కారణ - కారణుడనై వెల్లివిరుస్తున్నవాడను. నేను వేరు, నా కల్పన వేరు-అనునదీ ఎప్పుడూ లేదు. అందుచేత, నా వాస్తవ స్వరూపముయొక్క సమక్షములో సత్-అసత్ భేదములు లేవు.

సంకల్ప రహితో2స్మ్యహమ్
సంకల్పములన్నీ (All Assumptions along with Presumptions) నావి. అనగా, సంకల్పములన్నిటికి మునుముందే - సంకల్పములకు అవల కేవల చైతన్యస్వరూపుడనై నేనున్నాను. నాయొక్క లీలా వినోదమే సంకల్పములు.

అంతేకాదు!
సంకల్పములు నానుండి ప్రదర్శితమగుచున్న సందర్భాలలో కూడా నేను నేనుగానే ఉన్నాను. సంకల్పముల రూపముగా గాని, సంకల్పముల మధ్యకుగాని దిగి వచ్చుటలేదు. నా సహజ స్వస్వరూపము సంకల్పరహితమైనదే.
నిత్యోదిత చైతన్య స్వరూపుడనై సంకల్పములను, భావనలను, దేహాదులను చైతన్యపరచువాడను. (I am the Instigator and Inspirer of the whole worldly Scenario)

నానాత్వభేదహీనో2స్మి :
నా కలలో అనేకులు కనిపిస్తున్నప్పటికీ నేను ఆ వేరు వేరైన రూపములన్నిగా అగుచున్నానా? లేదు. ఆ రీతిగానే నేను ఏకమగు బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాను. (ఏకమేవాద్వితీయం బ్రహ్మ। జీవో బ్రహ్మే2తి నా పరః అని) వేద వాఙ్మయము, ఆత్మజ్ఞుల ఆప్తవాక్యములు ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. నాకు ‘నానాత్వము’ అనే దోషమే స్పృశించదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సందర్భాలలోను, దేహముల రాక - పోకల సంఘటనలప్పుడు నేను ఒకే తీరుగా ఉన్నాను. మార్పు చేర్పులు ఏమాత్రము స్పృశించని పరబ్రహ్మమే నా యొక్క సహజరూపము. అట్టి బ్రహ్మమునకు నానాత్వము ఎన్నడూ లేదు.

(హి) అఖండానంద విగ్రహః।
ఇదంతా నా ఆనందైశ్వర్య స్వరూపమే. ‘నేను వేరు - జగత్తు వేరు - పరమాత్మ వేరు - తదితరములు వేరు’….ఇదంతా ‘‘స్వప్న సందర్భములోని జాగ్రత్ యొక్క ఏమరపు’’ వలె - నా అజ్ఞాన విభాగము నుండి క్రీడా వినోదంగా - ‘జాగ్రత్’లో స్వస్వరూపముయొక్క ‘ఏమరపు’ అయి - ప్రదర్శనమౌతోంది.

స్వప్న సందర్భపు మైమరుపువలన జాగ్రత్‌ను ఎవ్వడూ పోగొట్టుకోవటంలేదు కదా! అట్లాగే అజ్ఞానముచే (కొన్ని కొన్ని జన్మలుగా దృశ్యముతో తన్మయ రూపమైన మైమరపు - ఆత్మత్వము యొక్క ఏమరపు మాత్రం చేత) ఆత్మస్వరూప లక్షణములైనట్టి ‘‘అఖండత్వము. అప్రమేయత్వము’’లకు వచ్చే లోటేమీ లేదు. ఆత్మస్వరూపుడనగు నేను జ్ఞాన, అజ్ఞాన- ఇత్యాది సర్వసందర్భాలలోను అఖండుడనే (Indivisible as different Forms).

నా2హమస్మి :
‘నేను’ అను అహమ్ భావము నాది. అంతే గాని అహమ్ భావము - నేను కాదు. ‘‘జాగ్రత్‌లో నేను - స్వప్నంలో నేను - సుషుప్తిలో నేను’’ ఇవి ‘నేను’ అనేది నాయొక్క నా సంప్రదర్శనలు మాత్రమే! వాటికి వేరైన చైతన్యస్వరూపుడను. నేను జగదృశ్యములోని ‘నేను’కు అతీతుడనైనవాడను. నాటకంలోని ‘‘పాత్రయొక్క ‘నేను’ - స్వరూప, స్వభావాలకంటే ఆ నటుడు బాహ్యంగా ‘‘వేరైన ‘‘నేను’’ కలవాడై ఉన్నట్లుగానే - ఈ ‘‘జాగ్రత్’’ లో కనిపించే ‘నేను’ - కు ఆవలిస్వరూపుడను. ఈ జాగ్రత్‌లోని ‘నేను’చే నాయొక్క సహజమగు స్వస్వరూపమునకు చెందిన ‘నేను’ తొలగించబడటములేదు. దాచివేయబడటము లేదు.
‘అహమ్’ భావన ఎక్కడ ఉత్పత్తి అవుతోందో అట్టి కేవలీతత్త్వమును. అహంభావనమునకు సాక్షిని కూడా। కనుక నా2హమస్మి.

న చ అన్యో2స్మి ।
నేను వేరైన మరొకటేదీ కాదు. వేరైన అన్య స్వరూపుడను కాను. నాకు నేనై, నేనుగా ఇక్కడే ఇప్పుడే ఉన్నాను. సర్వదా ఇక్కడ - ఇప్పుడు….అనువాటితో కూడుకొనియే ఉన్నాను. మరెక్కడివాడినో కాను.

దేహాది రహితో2స్మ్యహమ్। ఈ భౌతిక దేహము నేను ఉపయోగిస్తున్న ఒకానొక ఉపకరణము వంటిది.
అట్లాగే ఇంద్రియాలు - ఇంద్రియార్థములు కూడా. మనో బుద్ధి చిత్త అహంకారాలు కూడా నాకు ఉపకరణముల వంటివే.
జన్మ-జన్మాంతరములు కూడా అటువంటివే। ఉపయోగించుకొనువాడు ఉపయోగించబడే వస్తువు కంటే సర్వదా వేరే కదా!
అందుచేతనే ‘‘పరమాత్మ - పరస్వరూపము’’ అని - ఆత్మశాస్త్రముచే చెప్పబడుచున్నాను. దేహాదులు నాకు లేవు. వాటికంటే విశేషమైనవాడిని. (పరమ్ → ఆవల - నేనైన నేను).

ఆశ్రయ - అనాశ్రయ హీనో2స్మి।
నేను ఈ దేహ - మనో - బుద్ధి మొ।।వి ఆశ్రయించుకొని ఉన్నవాడిని కాదు. నేను దేనినీ ఆశ్రయించినవాడినై లేను. వాటికన్నిటికీ వేరై (పరమై) ఉన్నాను.
అట్లాగే, నేను ఆశ్రయించనిదేనికీ ఉనికి లేదు. నాకు ఆశ్రయము లేదు. అనాశ్రయము లేదు.

ఆధారరహితోస్మ్యహమ్।
నేను దేనిపైనా ఆధారపడి లేను. స్వయంకృతుడను. స్వయం సంకల్పుడను. స్వయం స్వరూపుడను. నాకు మరొకటేదీ ఆశ్రయము కాదు.

బంధ-మోక్షాది హీనో2స్మి।
కల తనదైనవాడు కలలో చిక్కుకున్నట్లుగా అవుతుందా? లేదు. నటుడు నాటకంలోని పాత్రయొక్క స్వభావముచే బంధితుడా? లేదు. గృహస్థ - ఆశ్రమములో ఉన్నంతమాత్రంచేత, ఒకడు ఆ ఆశ్రమముచేత బంధితుడా? సంబంధితుడా? రెండూ లేదు. విషయ భావనలచే బంధము, (విషయ - అభావనచే) మోక్షము మనస్సుకేగాని, ఆత్మకు కాదు. నేను సర్వదా స్వతఃగా ఆత్మస్వరూపుడను. నాకు బంధము లేదు. మోక్షము లేదు. ఆశ్రమములు లేవు. జీవేశ్వర ద్వంద్వము లేదు.

శుద్ధబ్రహ్మాస్మి సో2స్మ్యహమ్।
కేవలమగు శుద్ధబ్రహ్మమే నేను. తత్త్వశాస్త్రము ‘‘తత్ త్వమ్. నీవు అదియే! నీవే అది’’ అని బ్రహ్మము గురించిన విశేషంగా నాకు చెప్పుచూనే ఉన్నది. సిద్ధాంతీకరిస్తున్నది కూడా. అహమ్ బ్రహ్మా-స్మి! బ్రహ్మము కాకుండా నాకు వేరైన రూపమేదీ లేదు. సో2స్మ్యహమ్।

చిత్తాది సర్వహీనో-స్మి
ఒకడు వస్త్రము (చొక్కా) ధరిస్తే అది ఆతని దేహభాగమౌతుందా? లేదు కదా! ఈ మనో - బుద్ధి - చిత్త - అహంకారములు నేను ధరించు వస్త్రములు వంటివి మాత్రమే! ఈ అంతరంగ చతుష్టయమునకు వేరై ఉన్నవాడను. అవి ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా నేను ఉన్నాను. వాటిపై నేను ఆధారపడి ఉన్నవాడను కాను. కేవల సత్ స్వరూపుడను. చిదానంద రూపుడను. నేను ఉన్నాను కాబట్టి - అవన్నీ ఉనికిని సంతరించుకుంటున్నాయి.


పరమో2స్మి।

నేను దేహ - జన్మ - మృత్యు - ఇంద్రియార్థ - అంతరంగ చతుష్టయములతో సహా సర్వ అనుభవ - అనుభూతులకు ఆవల ఉన్నాను. పరస్వరూపుడును! పరమై (Away) ఉన్నాను.

పరాత్ పరః।
జీవుడుగా నాకు ‘‘ఈవల-ఆవల, బాహ్యము - అంతరము, జీవత్వము - పరత్వము’’ - అనే ద్వంద్వములు ఉండి ఉండవచ్చు గాక. అదంతా సందర్భ మాత్రము. సర్వ సహజీవులలో వేంచేసియున్న సర్వాత్మయే నా స్వరూపమ. ఇహ పరముల కావల పరాత్పరత్వము నాయొక్క సహజస్వభావము.

సదా విచారరూపో2స్మి ।
చిత్ (ఎరుక - ఎరుగుట) - ఆత్మస్వరూపుడగు నాయొక్క నిత్యోదితమైన విలక్షణమైన నిత్యలక్షణము. ఎరుకచే ఆనందించువాడను. చిదానందస్వరూపుడను. విచారణ అస్మత్ బుద్ధి స్వరూపము. ఆలోచన-భావన సర్వదా నా ఆనందవినోదమే.

నిర్విచారో2స్మి ।
విచారణ (బుద్ధి) కన్నా ముందున్నవాడను. సర్వ ఆలోచనల ఆవల ఆలోచించువాని రూపము నాదై ఉన్న వాడను. ఆలోచనలు చేయునప్పుడు - ఆలోచనలు లేనప్పుడు కూడా నిత్యోదిత ఆత్మతోజోరూపుడనుగా నేను ఉండనే ఉన్నాను. ఈ విధంగా ఆలోచనలకు సంబంధించనివాడను. సో2స్మ్యహమ్।

‘అ’ కార ‘ఉ’ కార రూపో2స్మి ‘మ’కారో2స్మి సనాతనః।

నేనుంటే జన్మలు - కర్మలు. అంతేగాని, జన్మకర్మలుంటే నేను కాదు. జన్మ - కర్మల మధ్యలోనివాడను కాను. జన్మ - కర్మలచే ఉనికి గలవాడనుగాను. జన్మల ప్రారంభమునకు ముందే నేనున్నాను కనుక ‘సనాతనపురుషుడు’ అని చెప్పబడుచున్నాను. అట్టి నన్ను వేదములు ‘ఓం’ అను సంజ్ఞతో పిలుస్తున్నాయి. ‘‘అ ఉ మ ఓం’’। (దేహే జాతే న జాతో2సి। దేహే నష్టే న నశ్యసి।)

అ   = సత్; ఉనికి; జాగ్రత్; పరమాత్మ । 
ఉ = చిత్; ఎరుక; స్వప్నము; జగత్తు। 
మ = ఆనందము; అనుభవి; సుషుప్తి; జీవాత్మ। 
అ = కేవలాత్మ; ఉమ; ప్రకృతి। 
అ = పరస్వరూపం.  ఉమ = ఇహస్వరూపము

ధ్యాతృ - ధ్యాన - ధ్యేయ హీనో-స్మి।

ధ్యాని = ధ్యాస ప్రదర్శించువాడు <span style="color:green;">(Perceiver)</span>. 
ధ్యానము = ధ్యాస <span style="color:green;">(Perception)</span>. 
ధ్యేయము = ధ్యానించబడు విషయములు <span style="color:green;">(Objects of Perception)</span>.

ఈ త్రిపుటికి ముందే ఉన్నాను. ఈ త్రిపుటి లేనప్పుడు కూడా నేనున్నాను.
కనుక త్రిపుటికి అతీతుడను. త్రిపుటియొక్క సాక్షిగా, త్రిపుటీరహితుణిణా.

సర్వ పూర్ణ స్వరూపో-స్మి।
‘‘ఇంకా మరొకస్థితియో, ఆశ్రమమో, సాధనయో పొందితేగాని నేను పూరుణాడును కాను!’’ అనునది నాకు కించిత్ కూడా ఏదీ లేదు. ఆత్మస్వరూపముచే నేను సర్వదా పూరుణాడను. ‘‘నాటకంలోని నా పాత్రకు నాటకంలో ఏదో లభిస్తేగాని ఆ పాత్రగా నటిస్తున్న నాకు క్రొత్తగా ఏదో లభించదు’’ ….అని అనము కదా!

అకార - మకార - ఉకార స్వరూపుడనై ‘‘పరమాత్మ - జీవాత్మ - జగత్’’ స్వరూపములను ధారణచేస్తూనే, ఆ సర్వమునకు ఆవల కేవలాత్మస్వరూపుడనై, నిర్విషయుడనై ప్రకాశిస్తున్నాను. ‘ఓం’ కారరూపుడను.

ఒకప్పుడు ‘‘జగద్దృశ్యములు’’ అనబడే క్రీడగా విషయములు కల్పించుకుంటూ, మరొకప్పుడు కల్పనలను నాయొక్క సర్వదా ప్రశాంతాత్మ స్వరూపములోనికి ఉపశమింపజేస్తూ ఉన్నట్టివాడను.

స్వీయకల్పనా విహార స్థానములగు నాయొక్క జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో నేను ఏదో క్రొత్తగా పొందితే పూరుణాడను, పొందక పోతే అపూరుణాడను అవుతానా? లేదు.

నేను స్వతఃగానే పూరుణాడను. క్రొత్తగా పొందవలసినది ఏదీ లేదు. కోల్పోయేదీ లేదు. ఈ రీతిగా సర్వపూర్ణ స్వరూపో-స్మి

సచ్చిదానంద లక్షణః।
సర్వదా శివస్వరూపుడను, (లేక) ఆత్మయే సత్య - నిత్య స్వరూపముగా కలవాడను - అగు నాకు ‘3’ విలక్షణములైన లక్షణములు ఉన్నాయి. ఇది వేదాంతశాస్త్రము (లేక) తత్త్వశాస్త్రము యొక్క ఒకానొక ముఖ్యమైన పాఠ్యాంశము.

(1) సత్ లక్షణుడను :
‘ఉనికి’ (సత్) నాయొక్క ఒక ముఖ్య లక్షణము (లేక) సహజ స్వభావము. ‘నేను ఉన్నాను’ అనునదే సత్ స్వభావము యొక్క బాహ్యభావనా ప్రదర్శనము. ‘నేను లేను’ అని ఎవ్వరూ అనలేరు కదా! ఒకవేళ ‘నేను లేను’ అంటే, ఒకానొకచోట లేనివాడైనప్పటికీ, మరొకచోట ఉండి ఉండాలి కదా!

కేవల (లేక) శుద్ధ సత్ ఆత్మకు అభిన్నమే నేను।

ఈ విధమైన అకార - ఉకార - మకారార్థములుగా చెప్పబడే త్రిపుటీవర్ణనములో

నేనున్నాను। 
నేనున్నాను। 
నేనున్నాను।

అని అంటున్నాము కదా! ఆ ‘ఉన్నాను’ అనునదే నాయొక్క సత్ స్వరూపము. అట్టి సత్ లక్షణము ఆత్మస్వరూపుడనగు నన్ను ‘‘దేహము ఉన్నప్పుడు, దేహము పోతున్నప్పుడు, దేహము పోయిన తరువాత, క్రొత్త దేహము వచ్చిన తరువాత’’ కూడా - నన్ను విడుచుట లేదు.

నేను ‘సత్’ అనబడే ఆ ఉనికిని, (లేక) ‘ఉన్నాను’ అనే లక్షణమును విడవబోవుటలేదు. ఈ రీతిగా అహమ్ సదా సత్ లక్షణ సమన్వితమస్మి!

(2) చిత్‌లక్షణుడను :
నేను ఎక్కడుంటే అక్కడ నాయొక్క ‘ఎరుక-తెలుసుకొనుట’ అనే లక్షణము వెంటనంటియే ఉంటుంది. అంతేకాదు. నేను ఏది ఎట్లు తెలుసుకొంటూ ఉంటే, అది అట్లే నాకు అనుభూతమౌతుంది.

    ‘ఎరుక’ అనే లక్షణము = చిత్ (Absolute Knowing).

    నేను చిత్ లక్షణున్ని. ఇదియే నా ‘‘చిత్ శక్తి’’.

దేనిని నేను ‘ఇది ఇష్టము’ అని తెలుసుకుంటానో, అది నాకు ఇష్టమైనది అగుచున్నది. ఏది ‘ఇష్టము కాదు’ అని అనుకుంటానో, అది అట్లే అయిష్టమైనది, అప్రియమైనది అగుచున్నది. (యత్ భావం, తత్ భవతి).

    కేవలచిత్ = శుద్ధచిత్

    చిత్ విలాసము = ఎరుక + ఎరుగబడే విషయాలు. తదితరముగా ఉంటున్నదంతా కూడా!

ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, దేహముల రాక - పోకలు, మనో- బుద్ధి - చిత్త - అహంకారాలు, 14 లోకముల భావనా చమత్కారాలు, బంధ-మోక్షములు- ఇవన్నీ నాయొక్క చిద్విలాసమే. నా ఎరుకచే కల్పించబడుచున్నవే. నేను ఏది ఎరుగుచూ ఉన్నానో అది అస్మత్ ఆత్మ ప్రభావము చేత ఉనికిని పొందుచున్నది.

నాయొక్క ఒకానొక ఎరుకయే (One of my styles of knowing) ఈ ఈ కనబడుచున్న నాయొక్క జాగ్రత్. ఇక జాగ్రత్ నన్ను బంధించటమెక్కడిది? అట్లే ఈ దృశ్యమంతా అస్మత్ చిత్ విలాసమే! నాయొక్క చిత్ లక్షణము నాకు భూషణమేగాని బంధము కాదు. ఆత్మస్వరూపుడనగు నన్ను ఈ శుద్ధ చిత్ లక్షణము విడువదు. నేనూ అద్దానిని విడువను.

సత్ - చిత్ స్వరూపుడనై సర్వత్రా వేంచేసి ఉండటమే నా విన్యాసము! నాలో నేనే సత్ - చిత్ స్వరూపుడనై ఉంటూ ఉన్నాను.
అహమ్ సదా సర్వదా చిత్ లక్షణ సమన్వితమస్మి।

(3). ఆనంద లక్షణుడను :
నేనెక్కడుంటే అక్కడ ‘అనుభూతి’ (Experiencing) ఉంటుంది. ఈ జ్ఞాన - అజ్ఞానములు, జీవేశ్వర ద్విత్వము, సంబంధ - అనుబంధ - బాంధవ్యముల రాకపోకలు, దేహ - దేహాంతర, లోక - లోకాంతర ప్రయాణచమత్కారాలు, ….ఇవన్నీ నా ఆనంద విభాగములే! (Such is my pleasure) సుఖ-దుఃఖములు, బంధమోక్షములు కూడా ‘‘ఆనందము’’ అనే స్వకీయ లక్షణముచే కల్పించబడే క్రీడా - లీలా వినోదాలే!

జన్మ - కర్మ - బంధము - మోక్షము - జీవత్వము - ఈశ్వరత్వము - ఇదంతా నా ఆనందస్వరూపమే!
సత్ - చిత్‌లు కూడా కేవలుడనగు నన్ను ఆనందింపజేయటానికే ఉన్నాయి.

నా దృష్టికి కనిపించే దృశ్యమ-దర్శనము-ద్రష్ట…. ఇవన్నీ నా ఆనందము కొరకై నాకు నేనుగా కల్పించుకొనుచున్నవే! అందుకే వేదాంతశాస్త్రము ‘ఆనందోబ్రహ్మ’ అని గానం చేస్తూ ఆనందస్వరూపునిగా గమనించి అభివర్ణిస్తున్నాయి. అహమస్మి ఆనందలక్షణ సమన్వితమ్!

సర్వతీర్థ స్వరూపో2స్మి। ఎక్కడ ఎవ్వరు ఏ రూపముగా, ఏ లక్షణములను ప్రతిపాదిస్తూ పూజిస్తూ ఉన్నారో,…అదంతా ఆత్మోపాసనయే అయి ఉన్నది. ఈ విధంగా సర్వ పూజాస్థానములలో పరమాత్మతత్త్వమే ఆరాధించబడటంచేతను, నేను సహజముగా ఆత్మస్వరూపుడనే అయి ఉండటంచేతను - నేను సర్వ తీర్థ స్వరూపుడనగుచున్నాను. ఇంద్రలోకంలో ఇంద్రుని, కైలాసంలో శివుణిణా, విష్ణులోకంలో విష్ణువును, ఆశ్రమములలో గురువులను, దేవాలయాలల త్రిమూర్తులను - అవతారమూర్తులను ఆరాధించేవారంతా ఆత్మారాధకులే! ఆత్మారాధనయే అంతర్లీన గానము. నేనో, ఆత్మ స్వరూపుడను. అందుచేత నేను సర్వతీర్థస్వరూపుడను.

పరమాత్మాస్మ్యహమ్ శివః।
సర్వమునకు ఆవల సర్వశుభంకరమగు శివ స్వరూపుడనై ప్రకాశిస్తున్నాను. భావములకు ఆవల, జన్మల ప్రహసనములకు ఆవల, జ్ఞాన - అజ్ఞానములకు, బంధ - మోక్షములకు ఆవల ‘‘నిత్య ప్రకాశము - స్వయం ప్రకాశకము’’ అగు ఆత్మయే నా స్వరూపము. అందరు అస్మత్ ఆత్మస్వరూపమే కాబట్టి అందరూ నాకు ప్రేమాస్పదులే. ఇదంతా నాకు ప్రేమాస్పదమే! నేను జీవునికి సాక్షియగు శివస్వరూపుడను. నాకు వేరైనట్టిది లేదు కాబట్టి అంతా నా ఆనందస్వరూపమే. శివానందలహరీ చమత్కారమే ఇదంతా. అందుకే వేదములు, పురాణములు….కూడా….

అని ఎలుగెత్తి అస్మత్ ఆత్మస్వరూపమును గానం చేస్తూ ఉంటే, నేను ఆస్వాదించకపోతే ఎట్లా? ఈ రీతిగా పరమాత్మాస్మ్యహమ్ శివః। శివో2హమ్! చిదానందరూపం, శివో2హమ్!

లక్ష్య - అలక్ష్యవిహీనో2స్మి।
ఈ 14 లోకాలలో కూడా ఎక్కడా నాదైనదేదీ లేదు. నాది కానిదీ లేదు. నవల వ్రాసిన రచయితకు ‘‘ఈ పాత్రలు గొప్పవి. ఇవి కావు. ఇవంటే నాకు ఇష్టం. అవంటే నాకు ఇష్టం లేదు’’…అనునదేదీ ఉండదు కదా! ఈ జగత్తంతా ఆత్మస్వరూపము అయి ఉండగా ఇందులో కొన్నిటిపై నమ్మకము, మరికొన్నిటిపై అపనమ్మకము ఏమి ఉంటుంది? నేను పట్టించుకోవలసినదీ లేదు. పట్టించుకోకూడనిది లేదు. ఐనవాళ్లు లేరు. కానివాళ్లు లేరు. నాదేమీ లేదు. నాది కానిదేదీ లేదు.

ఈ జగత్తులన్నీ నాలోనూ లేవు. కానీ నాకు వేరుగానూ లేవు. నేను పొందవలసినదేదీ లేదు. పొందకూడనిదీ లేదు. స్వప్నంలో కనిపించే రూపాల యొక్క లక్షణాలు నావికావు. నావి కాకపోలేదు కూడా. ‘‘ఇది నేను పొందాలి. కనుక నా లక్ష్యము’’ అనునదీ లేదు. ‘‘ఇది తొలగాలి కనుక అలక్ష్యము’’ అనునది కూడా లేదు.

లయహీన రసో2స్మ్యహమ్।
నేను ఎందులోనో లయించి, ఆపై లేకుండా పోవటమనునదేదీ లేదు.

నేను సర్వదా బ్రహ్మమే అయి ఉండగా, ‘‘బ్రహ్మమునందు నేను లయించబోవుచున్నాను’’ అనునది ఎక్కడున్నది?

తరంగము సర్వదా జలమే అయి ఉండగా (యో ఆపః మాం యతనం వేద) - ‘‘జలములో తరంగము లయించింది’’ …అనే ప్రసక్తి ఎక్కడిది?

నాశనము అనునది ఆత్మకు లేదు. నేను ఆత్మస్వరూపుడను.

ఈ దేహము మొదలైనవి రావచ్చుగాక! పోవచ్చుగాక! నేను ఆత్మగా సాక్షినై ఉన్నాను. ఆత్మయగు నేను ఆత్మయందు లయించటమనే సంగతియే లేదు. నేను సదా ఆత్మరసస్వరూపుడను. సదా శివస్వసూపుడను. మరొక దానిలో లయించటము అనునది లేదు.

మట్టి బొమ్మ సర్వదా మట్టియే! మట్టి మట్టిలో కలవటమనేదెక్కడున్నది? ‘జీవాత్మ’ అనునది నాయందలి తరంగముల చమత్కారము.

మాతృ-మాన విహీనో2స్మి। (పమాతృ-ప్రమాణములు లేనివాడను).
ఆత్మస్వరూపుడుగా నాతో సమానమైనదిగాని, పోల్చతగినదిగాని ఏదీ లేదు. ఆత్మస్వరూపము గురించి చెప్పే శాస్త్రములు అనేక ప్రమాణములు (Examples, Comparisons) తీసుకొని ఆత్మశాస్త్ర వాఙ్మయమును అందిస్తున్నాయి. అవన్నీ ఆత్మగురించి చెప్పటానికి ఉపయోగపడే ఉపకరణములవంటివి మాత్రమే. నాకు ప్రమాతృ (నిర్వచించబడేది) - ప్రమాణము (నిర్వచించటానికి ఉపయోగించగల సోదాహరణలు) ఏవీ లేవు. సర్వస్వరూపమగు ఆత్మగా నాకు నేనే సాటి! కథలోని ఏ దృష్టాంతము రచయిత ఎట్టివాడో చెప్పలేదు కదా. కలలోని ఏ వస్తువు స్వప్నము తనదైన వాని గురించి, ‘ఇట్టివాడు’ అని చెప్పగలుగుతుంది? అందుచేత నాకు ప్రమాతృ (చెప్పబడేది) - ప్రమాణములు లేవు.

మేయహీనః శివో2స్మ్యహమ్।
ఆత్మస్వరూపుడనుగా నాతో సమానమైనది ఎక్కడా ఏదీ లేదు. నేను అమేయుడను. కలలో ఏ ఒక్కటీ కల తనదైన వానితో సమానమైన వస్తువు కాదు కదా! అనేక కలలు కంటున్నవానితోను - ఒక కలలోని ఒక వస్తువుతోను - ఎట్లా ముడిపెట్టగలం? ఈ దృశ్య జగత్‌లో ఆత్మస్వరూపుడనగు నాకు సమానము - అని చెప్పగలిగినదేదీ లేదు. సర్వము మంగళప్రదము చేయువాడను. చైతన్యవంతముగా చేయువాడను. శివస్వరూపుడను.

సర్వమునకు వేరై, సర్వము నేనే అయి, సర్వ తత్త్వాత్మకుడనై ఉన్న నాతో ఏది సరిసమానము? శివో2స్మ్యహమ్! అహమ్ అమేయమ్!

న జగత్ సర్వ ద్రష్టా2స్మి।
కేవలాత్మ స్వరూపుడనగు నేను - ఒక రాజు గారు సామంత రాజును నియమించువిధంగా - ద్రష్టను, ఆతని ద్రష్టత్వమును, దృశ్యమును నియోగించుకుంటున్నాను. సామంతరాజు మహారాజు తరఫున పాలన చేయవచ్చుగాక! కానీ సామంతరాజు మహారాజు అవుతాడా? అవడు. నేను నియమించుకొనే ద్రష్ట - ద్రష్టత్వములకు మునుముందే అప్రమేయుడనై, వేరై ఉన్నాను. అందుచేత నేను ద్రష్టమాత్రముగా అవటము లేదు. ఆ ద్రష్ట యొక్క అనుభవరూపమగు జగత్‌దృశ్యము నేను కాదు. కల్పన నాది కావచ్చునేమో! అంతేగాని నేను కల్పనగా అవుతానా? అవను. న జగత్ సర్వ ద్రష్టాస్మి! నేను దేనినీ చూచువానిగా అగుటలేదు. సర్వదా కేవల ‘దృక్’ స్వరూపుడనై ఉన్నాను!

నేత్రాది రహితో2స్మ్యహమ్।
ఈ కళ్ళు - చెవులు - ముక్కు - నోరు ఇత్యాది ఇంద్రియములన్నీ నేను ఉపయోగిస్తున్న వస్తువులు. ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలు కూడా ఉపయోగించబడే సామాగ్రి మాత్రమే. ఇంటి యజమాని ఇంటిలోని ఒక బల్లతోనో, కుర్చీతోనో సమానము కాదు. అటువంటివాడు కాదు కదా! ఇంటి యజమానికి - ఇంటిలోని గోడలు, సామాను, కిటికీ, వంట పాత్రలు మొదలైనవాటికీ సంబంధముగాని - సారూప్యము గాని ఏనాడూ లేదు. ఉండదు. ఈ కర్మేంద్రియములు - జ్ఞానేంద్రియములు, వాటివాటి విషయములు. ఇవన్నీ ‘‘ఆత్మ స్వరూపుడను - యజమానిని’’ అగు నావంటివెట్లా అవుతాయి? నేను వేరైనట్టి పరస్వరూపుడును! పరమాత్మను!

ప్రవృద్ధో2స్మి। ప్రబుద్ధో2స్మి।
సర్వే సర్వత్రా ప్రబోధ స్వరూపుడను. ప్రవృద్ధ స్వరూపుడను. నాయొక్క ప్రవృద్ధ చమత్కారమే ఈ దృశ్యరూపజగత్తులు. సర్వము నాయందే నా చేతనే, నా కల్పనచే, భావనచే - లీలా వినోదంగా ప్రవృద్ధి పొందటం జరుగుతోంది.

ప్రసన్నో2స్మి - పరో2స్మ్యహమ్।
నాచే కల్పించబడే ఇదంతా నా క్రీడా - లీలా వినోదము మాత్రమే. ఇదంతా నా విలాసము. చిద్విలాసము. 14 లోకాల కల్పన, వాటిలో సంచారము, సుఖ దుఃఖ-బంధ మోక్షములు….అంతా లీలా వినోదమే! సర్వదా సర్వమునకు ఆవల ఉన్నట్టి ఆనందమే నా స్వరూపము. సదానంద స్వరూపుడను. నిత్యానందుడను. జీవాత్మను-జీవమును-దేహములను కల్పించుకోవటం-ఉపసంహరించటం … ఇదంతా నా వినోదము. సరదా। ఆనందేహేల। ఊహానందము। భావనాక్రీడ। స్వకీయ చమత్కారవిశేషము!

సర్వేంద్రియ విహీనో2స్మి, సర్వకర్మ కృత్ అపి - అహమ్।
ఈ ఇంద్రియార్థములను, తద్వారా ఈ ఇంద్రియములను ఉపయోగిస్తూ అనేక దేహములలో సంచరిస్తూ అనేక కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఉండవచ్చు గాక! (లేక) మరొకప్పుడు ఏమి ఉపయోగించక ఉండకుండవచ్చు కూడా గాక! ఇంద్రియార్థములుగాని, ఇంద్రియములుగాని….వీటన్నిటికీ, ఈఈ జన్మ - కర్మలతో సహా సర్వము నాకు వేరుగా ఉన్నాయి. కల్పన నాది కావచ్చేమోగాని, నేను కల్పనను గాను. ఇంద్రియములు లేనప్పుడు కూడా నేనున్నాను. నా సహజాత్మానంద స్వరూపమునకు ఇంద్రియాలు లేవు. వాటి ఆవశ్యకత లేదు.

సర్వవేదాంత తృప్తో2స్మి।
వేదాంత వాఙ్మయము అస్మత్ ఆత్మయొక్క మహనీయత్వమును‘‘శృణ్వంతి విశ్వే, అమృతస్యపుత్రః’’…అంటూ ఎలుగెత్తిగానం చేస్తోంది.

వేదము = తెలియబడునది
వేదాంతము = తెలియబడేదంతటికీ ఆవల గల - తెలుసుకొనుచున్నవాడు।
వేదాంత శాస్త్రము = సర్వము ఎరుగుచున్న కేవల చిత్ స్వరూపుడునగు నా ఔన్నత్యము తెలియజేయు శాస్త్రము.

నేను - నాకు కనబడే తదితరులు - అందరము అఖండాత్మ స్వరూపులం.

సద్గురువులు తత్త్వశాస్త్ర పాఠ్యాంశముగా చెప్పుచున్న ఆత్మౌన్నత్యమును శ్రవణం చేస్తూ అత్యంత తృప్తుడను అగుచున్నాను. నేను నా తృప్తి కొరకై మరొక బాహ్య వస్తువును ఆశ్రయించవలసిన అగత్యమేమున్నది? సద్గురువులగు మహనీయులచే అందించబడుచున్న ‘ఆత్మ’ గురించిన సమాచారముచే తృప్తోస్మి! సంతృప్తోస్మి! సర్వదా సర్వ వేదాంత తృప్తో2స్మి!

సులభో2స్మ్యహమ్।
ఆత్మగా ప్రతి ఒక్కరికి సులభసాధ్యుడను. వారి అతి సామీప్యమగు స్వస్వరూపమే నేనై ఉన్నాను. ఆత్మానుభవము అత్యంత సులభమేగాని, కఠినము కానేకాదు. సర్వ సహజీవులలో నేను ఆత్మ స్వరూపుడనై వేంచేసియే ఉన్నాను. అందుచేత అందరికీ సులభుడనేగాని, దుర్లభుడను కాను. అర్థంకానివాడను కాను. ఆత్మ అందరియొక్క సహజరూపమే అయి ఉన్నది. అద్దానిని క్రొత్తగా పొందవలసిన అవసరమేలేదు. నేను అందరికి సులభుడను. అందరూ నాకు సులభులే! (All are understandable and simple to me and I am understandable and simple to all).

ముదిత - అముదితాభ్యో2స్మి।
సంతోషము నా చమత్కారమే! దుఃఖము కూడా నా చమత్కారమే! ఆనందము నా స్వరూపము. నా స్థానము ఆనందాతీతమైనది కూడా! ఆనందమునకు ఆవల కేవల సాక్షినై ఉన్నాను. అన్నమయ - ప్రాణామయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ కోశములకు ఆవల ఆత్మేశ్వరుడనై ఉన్నవాడను. పంచకోశములు నా విన్యాసమే. సర్వము కల్పించుకొని ఆనందించువాడను కాబట్టి ‘ముదితుడను’. ఆనందమునకు ముందే సాక్షిగా సత్-చిత్ స్వరూపుడను కాబట్టి అముదితుడను కూడా।

సర్వమౌనఫలో2స్మ్యహం।
సర్వమును తిరస్కరించి వాటిపట్ల నిర్విషయత్వము వహించినప్పటికీ కూడా. అప్పటికీ నేను శేషించియే ఉంటాను. సర్వ విషయములపట్ల నా మనస్సు అవిషయరూపమైన మౌనము వహించినప్పుడు, అట్టి మౌనభావముయొక్క ఫలమును నేనే అయిఉన్నాను. సర్వము తిరస్కరించబడగా కూడా, నేను శేషించి ఉంటాను. (నేతి నేతేతి వాక్యేన). (ఆది శేషో2స్మి అహమ్)

నిత్యచిన్మాత్రరూపో2స్మి।
సర్వవేళలా కేవల చిన్మాత్రరూపుడను.
- సుఖ దుఃఖాలనుగాని, (ఇంకా) దేహమునుగాని, దేహముయొక్క రాకపోకలుగాని తెలుసుకొంటున్నట్టి ‘తెలివి’ స్వరూపుడను.కేవల చిత్ స్వరూపుడను.

నాటకము వ్రాసేవాడు నాటకములోని సంఘటనలకు బద్ధుడు అవుతాడా? కాడు. అట్లాగే, ‘ఎరుక’ అనబడే శుద్ధచిత్స్వరూపుడనగు నాకు నాచే తెలియబడునది బంధము ఎట్లా కలుగజేయగలదు? లేదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కూడా తెలుసుకొనుచున్నవాడను. నాయొక్క చిన్మాత్రస్వరూపంతో స్వయంకల్పితమైనట్టి జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను నింపి ఉంచువాడను.

సత్-చిత్‌మయో2స్మ్యహమ్।
ఉనికి + ఎరుక
సత్ + చిత్ మయుడవై ఉన్నవాడను!

కేవల - సత్ :: కేవల - చిత్ స్వరూపుడను. జగత్ రచన - జగత్ వీక్షణ - జగత్ ఆస్వాదన చేయువాడను! నాయొక్క భావ - అభావనలను అనుసరించి జగత్ సృష్టి - జగత్ లయములు జరుగుచున్నాయి. ఈ దృశ్యమంతా నాయొక్క సత్-చిత్‌మయ ఆనంద స్వరూపమే! నేను సర్వదా సచ్చిన్మయుడను!

యత్కించిదపి హీనో2స్మి।
నాది - నేను అనునవి కించిత్ కూడా లేనట్టివాడను. స్వల్పముగాని, అధికముగాని కానివాడను.

స్వల్పమపి - అవినాస్మ్యహం।
అత్యంత సూక్ష్ముడను. నాశనమనునది కించిత్ కూడా ఏ విషయముచేతనూ లేనివాడను. నాకు తదితరమైనదంతా మార్పు - చేర్పులో వినాశనమో పొందవచ్చు గాక! నేను వినాశనము లేనివాడను. అనగా, సర్వదా యథాతథము (As it is)గా ఉండువాడను. దేహము నశిస్తున్నప్పుడు కూడా నేను నశించటము లేదు. ఎప్పటివలెనే యథాతథుడను అయ్యే ఉంటున్నాను. నేను ఉపయోగిస్తున్న వస్తువు అయినట్టి దేహము మాత్రమే నశించినదగుచున్నది.

హృదయగ్రంథిహీనో2స్మి - హృదయాంభోజ మధ్యగః।
హృదయములోని చైతన్యరూపుడను. హృదయ-అంతర్గతుడను. సమస్త జగత్తు హృదయస్థానముగా కలవాడను.
అంతర్ - హృదయ అభ్యాంతరంగ హృదయాంతరంగుడను.

అటువంటి నాకు అహంకారము, మమకారము, ఆవేశము, సంబంధ అనుబంధములు - ఇత్యాది హృదయ గ్రంథులు లేవు. సర్వమునకు అతీతుడను.

షడ్వికార విహీనో2స్మి।
నాకు ‘‘దేహభావాశ్రయము, దేహప్రవేశము, బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరణము’’ అని చెప్పబడే ‘6’ వికారములు లేవు. నేను ధరించే వస్త్రముయొక్క రంగు - రూపు నాకు చెందినవి కావు కదా! దేహ వికారములు దృశ్యములోనివి. నేను దృశ్యము - ద్రష్టలకు సాక్షినగు కేవల దృక్ స్వరూపుడను. అసత్తు (మొదలే లేనిది) అగు ఈ భౌతిక దేహము నాయొక్క ‘సత్-ఉనికి’ చేతనత్వములపై ఆధారపడి ఉనికిపొందుచూ ఉన్నది. అంతేగాని నేను దేహములో అంతర్విభాగమును కాను. దేహముపై ఆధారపడినవాడను కాను. పరమై ఉన్నవాడను. పరస్వరూపుడను. అప్రమేయుడను.

షట్ కోశ రహితోస్మ్యహమ్।

అన్నమయకోశము - ప్రాణమయకోశము 
మనోమయకోశము - విజ్ఞానమయకోశము 
ఆనందమయకోశము - జీవాత్మ

ఇవన్నీ కూడా నాలోని నేనైన నేను యొక్క వివిధ స్వయంకల్పిత విశేషాలు. ఒకానొకడు - గృహయజమాని, భర్త, తండ్రి, ఉద్యోగి, మిత్రుడు, శిష్యుడు, గురువు - ఇవన్నీ తానే అయిఉండి కూడా, వాటన్నిటికీ వేరై ఉన్నాడు కదా!

అట్లాగే…
షట్ కోశములు నాయొక్క విభిన్న స్థానములలోని నాయొక్క ‘ఉనికి’కి వ్యవహారనామములే. అట్టి షట్ కోశములకు వేరైన చిదానంద స్ఫూర్తిని - నేను. అన్నిటికీ చైతన్యమును ప్రసాదిస్తున్న శుద్ధచైతన్య స్వరూపుడను. చిదానందఘనుడను. కారణకారణుడను.
షట్‌కోశములు నాచేత స్ఫూర్తిని పొంది వ్యవహరిస్తున్నాయేగాని, - అవి నేను కాదు.

అరిషట్‌వర్గ ముక్తో2స్మి।
నాయొక్క పర-స్వరూపము నిత్యముక్తము. (Ever Relieved sans any Bondages) కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములు - ఇవన్నీ మనోలక్షణాలు. ఆత్మ లక్షణాలు కావు. ఆత్మకు చెందినవి కావు. ఆత్మపరమై లేవు.

నాచే కల్పితమైన మనస్సు - దృశ్యభావనల దాంపత్యమునుండి ఈ అరిషట్‌వర్గములు సందర్భోచితంగా బయల్వెడలుచుండవచ్చుగాక!. కానీ నేను సాక్షిని. సర్వదా కేవల సాక్షిని. మనస్సుయొక్క సంచలనములను చిద్విలాసంగా, లీలావినోదంగా చూస్తూ ఉన్నట్టివాడను. ఆ మనస్సుయొక్క దృశ్యమననమునకు కూడా ఆవల ఉన్నట్టివాడను. మనస్సు (మననము) దృశ్యభావన - దృశ్యముల సంయోగముచే రూపుదిద్దుకొనే అరిషట్‌వర్గములకు కూడా మౌన సాక్షిని. వాటి చేతగాని, వాటికిగాని బంధించబడినవాడిని కాను. మనో-జగత్-అరిషట్ వర్గములన్నీ కూడా నన్ను స్పృశించలేవు. నాయొక్క సత్‌చిదానందత్వమునకుగాని, అప్రమేయత్వమునకుగాని, నిశ్చలతత్వమునకుగాని, నిర్మలత్వమునకుగాని ఎట్టి దోషము కలిగించలేవు. నేను సర్వదా అరిషట్‌వర్గములకు అతీతుడను. నిత్యముక్త స్వరూపుడను.

అంతరాత్ - అంతరో2స్మ్యహమ్।
అంతరాంతర స్వరూపుడను.

అట్టి నిత్యోదిత చైతన్యాత్మస్వరూప పరమాత్మయగు నాయందే సర్వము సర్వమునందు నేను.

సర్వుల హృదయాంతరంగమునందు కట్టెలు లేని అగ్ని యొక్క కేవలీ తేజస్సువలె వెలుగొందుచున్నవాడను.
హృదస్థుడనై, కూటస్థుడనై ప్రకాశించువాడను.

దేశకాల విముక్తో2స్మి।
నిత్యాత్మ స్వరూపుడనగు నాకు దేశ కాలములు లేవు. (I am beyond Time and place), (కాలః కాల ప్రసన్నానామ్ కాలః కిన్ను కరిష్యతి?). ఆత్మాత్ ఆకాశమ్। నా ఆత్మస్వరూపమునుండియే - ఆకాశము, తదితరములు (పంచభూతములు) స్వకీయ మాయావిశేషముగా వెలువడుచున్నాయి.

ఈ రీతిగా దేశకాలాతీతుడను. దేశకాలముల కల్పనకు కారణకారణుడను. సర్వమునకు ఉపాదాన కారణుడను (The Main cause and reason). అంతేగాని, దేశకాలబద్ధుడను కాను!

దిగంబర సుఖో2స్మ్యహమ్।
ఆకాశమునందలి సర్వదిక్కులలోను నాయొక్క ‘‘ఆత్మస్వరూపము’’ అనే రసము నిండియున్నది. సర్వత్రా సుఖస్వరూపుడనైఉన్నాను. సర్వ సుఖస్వరూపమగు ఆత్మయే స్వరూపముగాగల నాకు అందరూ ప్రియమైనవారే. అందుచేత ఒకడు తన కుమారుని క్షేమము స్వభావసిద్ధింగానే కోరుకున్నట్లుగా, నేను స్వస్వరూపాత్మ స్వరూపులగు అందరి సుఖ - క్షేమములను కోరుకుంటూ ఉండటంలోనే నాకు ఆనందము. సర్వులు నాకు ఆత్మబంధువులే. (ఇంకా కూడా), మమాత్మానందస్వరూపులే.

నాస్తి - బంధ విముక్తో2స్మి।
నాకు బంధమే లేదు. కాబట్టి ‘ముక్తి’ కూడా లేదు. ఒకవేళ ఉన్నాకూడా, ఆ బంధముక్తులు - మనోపరిమితమైనవి మాత్రమే గాని ‘ఆత్మ’నగు నాకు చెందినవి కాదు. ఆత్మ ఎల్లప్పుడు శుద్ధచైతన్యస్వరూపము, సదా పరము, అసంగము కూడా.

జగన్నాటకములోని పాత్రధారణవంటి ఇహస్వరూపమునకు (లేక నాయొక్క ‘జీవుడు’ అనే పాత్రకు) జగన్నాటకమును అనుసరించి ఉంటుంది కాబట్టి - ముక్తి ఉండదు. ఆవలగల నా పరస్వరూపమునకు బంధము లేదు.

జీవాత్మగా నిత్యబద్ధుడనైనప్పటికీ, పరమాత్మగా నిత్యముక్తుడను.

నకార రహితో2స్మ్యహమ్।
‘న’కార రహితుడు. ‘అభావము’ అనునదే లేనివాడను. ‘నేను లేను’ అనునదే ఉండనివాడను. జీవాహంకార అతీతుడను. ‘నేను’ లేకపోవటమనునదే లేదు. నాయొక్క ఉనికి (సత్‌రూపము) ఆధారరహితమైనది. దానికి మరొక ఆధారమేదీ లేదు. నేనున్నాను కాబట్టే జాగ్రత్ - స్వప్న - సుషుప్త - జన్మ - పునర్జన్మ ఇత్యాదులు ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడుండి మరొకప్పుడు ఉండవు.

జీవాహంకారమునకు సాక్షిని.

ఒకప్పుడు ఉండి - మరొకప్పుడు లేకపోవటమంటూ ఆత్మగా నాకు మొదలే లేదు.

ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేవన్నీ కూడా - ‘‘మొదలే లేనట్టివి’’

అఖండాకాశ రూపో2స్మి।
ఆత్మ ఎల్లప్పుడు ఏకము. అఖండము. ఏ క్షణమందును అనేకము అవటం లేదు. ఖండము అవటం లేదు. ఆకాశము (space) - ఈ ఊరి ఆకాశము-ఆ ఊరి ఆకాశము…ఈ విధంగా అవటం లేదు కదా। అట్లాగే, ఆత్మయే వాస్తవస్వరూపముగల నేను సర్వదా అఖండమే!

అఖండాకార2స్మ్యహమ్।
స్వప్నములో స్వప్నద్రష్టయే అనేక రూపములుగా అయి స్వప్నమును ఆస్వాదిస్తున్నాడు కదా! అట్లాగే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో అఖండాకారుడనై కూడా అనేక రూపములుగా కనిపిస్తున్నాను. ఆత్మస్వరూపుడనగు నేనే అన్ని రూపములుగా ఉండి ఉన్నాను.

ప్రపంచముక్త చిత్తో2స్మి।
చిత్తమే ప్రపంచానుభవమును కల్పించుకొంటోంది. చిత్తమే ప్రపంచము. అయితే చిత్తమే ప్రపంచభావన చేయనప్పుడు శుద్ధచిత్తస్వరూపమైయున్నది. ‘చిత్’యే శుద్ధ చిత్తము యొక్క వాస్తవమైన స్వరూపము.

‘‘శుద్ధ చిత్తము’’ అనగా? ఈ చిత్తము దర్పణము (అద్దము) వంటిది. దర్పణమునకు, అందులో ప్రతిబింబించే దృశ్యమునకు సంబంధమేమున్నది? వాస్తవానికి దర్పణములో వస్తుజాలమే లేదు. అట్లాగే చిత్తమునకు - అందులో ప్రతిబింబించే జగత్తులకు సంబంధమే లేదు. విషయరహితమగు చిత్తము చిత్ రూపమే. అట్టి కేవల చిత్‌స్వరూపుడనగు నాకు ప్రపంచబంధము అనునది ఎన్నడూ లేదు.

అద్దము తనయందు ప్రతిబింబించే, ప్రతిబింబమాత్ర దృశ్యములచే బంధింపబడుచున్నదా? లేదు. అద్దంలో ఏమీ ఉండనట్టే నా చిత్తము స్వతఃగా చూచినప్పుడు (దర్పణములో వస్తువులు ఉండనట్లుగా) ప్రపంచరహితమే!

ప్రపంచ రహితో2స్మ్యహమ్।
కేవలాత్మ స్వరూపుడనగు నేను ప్రపంచమును కల్పించుకొనుచున్నాను. ఆదిపురుషుడనై - నేను ప్రపంచము లేనప్పుడు కూడా నేనున్నాను. ఈ లోకములు మొదలైన దృశ్య వ్యవహారమంతా లయించినప్పటికీ శేషించువాడను. ఆదిశేషుడను, సర్వశేష్యుడను, వాస్తవానికి నాకు ప్రపంచములు లేవు. ప్రపంచరాహిత్యము లేదు. ప్రపంచ పరిధులలోనికి వచ్చువాడను కాను.

సర్వ ప్రకాశ రూపో2స్మి।
నా ఒకానొక భావనయే జగదనుభవము. భావనయే లేకుంటే జగత్తనే అనుభవమే ఉండదు. నేనుంటే జాగ్రత్. నేనుంటే స్వప్నము. నేనుంటే సుషుప్తి. స్వప్నములో కనిపించేదంతా ప్రదర్శిస్తున్నది, ప్రకాశింపజేస్తున్నది ఎవ్వరు? స్వప్నద్రష్టయే.
జాగ్రత్ - స్వప్న - సుషుప్త పురుషులు నానుండే బయల్వెడలుచున్నారు. సర్వమును ప్రకాశింపజేయునది ఆత్మస్వరూపుడనగు నేనే!

చిన్మాత్రజ్యోతి రసో2స్మ్యహమ్।
నాయొక్క చిన్మాత్రము (Pure Absolute Awareness) అనే వెలుగుచేతనే సర్వమును ప్రకాశమానమగుచున్నది. తెలుసుకొనువాని (The knower) చిత్ శక్తిచేతనే తెలియబడేదంతా ఉనికి పొందుచున్నది. సుందరమగు భావన గురించి భావించడం చేతనే- ఆ విధంగా నిర్వచిస్తున్నప్పుడు-ఆ వస్తువుపట్ల ‘సౌందర్యము’ అనేది ఉనికిని పొందుచున్నది. అంతేగాని వస్తువులో సౌందర్యము లేదు. భావన చేయువాడు లేనప్పుడు అనుభూతికి ఉనికి ఎక్కడిది?

నేను కేవల చిన్మాత్రజ్యోతిస్వరూపుడనై (దీపపు వెలుగు ఉన్నప్పుడే వస్తువుల ఆకారాదులు కనిపిస్తున్నట్లుగా) అనుభవములను, అనుభూతులను వెలిగించుచున్నాను. అనుభవములకు విషయములుగా తీర్చిదిద్దుచున్నాను.

ఆ విధంగా సర్వము ఉద్దీపింపజేసే చిన్మాత్ర జ్యోతిస్వరూపుడను.

కాలత్రయ విముక్తో2స్మి।
భూత-వర్తమాన-భవిష్యత్‌లందు నేను ఆత్మగా ఏకరూపుడను. దేహాలు - భావాలు - అభిప్రాయాలు - సంబంధాలు - అనుబంధాలు - బాంధవ్యాలు - ఇష్టాలు - అయిష్టాలు…ఇవన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎవరియొక్క అనుభవాలో, అట్టి సొంతదారుడనగు - ‘‘నేను’’ - (ఆత్మగా) మార్పు చెందటమే లేదు. సర్వము కాలబద్ధమే.

కాని ఆత్మ - కాలఃకాలము. కాలమును నియమించునది. కాలముచే బంధించబడనిది. కాలముయొక్క పరిధిలోకి రానట్టిది.

(1) ఈ దేహభావమే రాకముందు, 
(2) దేహముయొక్క రాకచేతను, 
(3) ఈ దేహమునకు చెందిన దైనందిక సంఘటనలైనట్టి బాల్య - యౌవన - వార్థక్యములచేతను, 
(4) మరణ-పునర్జన్మ సందర్భములచేతను,

ఆత్మస్వరూపుడనగు నేను మార్పుచేర్పులు పొందటమేలేదు. (I always stay and remain as what I am).

కళ్ళకు కదిలే శరీరము కనిపిస్తోంది. కదిల్చే చైతన్యమో? అగుపించటంలేదు. ఒక వస్తువును కదల్చువాడు ఆ వస్తువుకంటే మునుముందే ఉన్నట్లుగా,….కాలమునకు కాలాంతర్గతమైన విశేషములకు ఆవల ‘కేవలద్రష్ట’నై నేను ఉన్నాను. ఈ రీతిగా నేను కాలబద్ధుడనుకాదు. కాల నియామకుడను! అనిర్వచనీయమగు మమాత్మ స్వరూపమునుండి అనిర్వచనీయంగా (ఉత్పత్తిభావనచే) కాలము జనించి, (లయభావనచే) కాలము లయిస్తోంది. (కాలో2స్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధో - భగవద్గీతాచార్యులవారు)

కామాది రహితో2స్మ్యహమ్।
తదితర సర్వము కాలబద్ధము. ఆత్మస్వరూపుడనగు నేను మాత్రమే కాలమునకు పరము. కామక్రోధాదులు కాలమునకు - కలవంటి జగత్ దృశ్యమునకు పరిమితమైనట్టివి. మనస్సు కామ క్రోధ లోభాదులు పొందవచ్చుగాక! నేను మనస్సుకు ఉత్పత్తి స్థానమై-పరమై ఉన్నాను. ఆత్మస్వరూపుడుగా నాకు కామాదులు లేవు. వస్త్రధర్మాలు వస్త్రధారునకు చెందనట్లే, మనోధర్మాలు నన్ను స్పృశించవు. అందుచేత ఆత్మస్వరూపుడనగు నాకు - కామాదులు లేవు.

స్వప్నము తనదైనవానికి స్వప్న వస్తువులలో కొన్ని కొన్నిటిని తన వెంట జాగ్రత్‌లోనికి తెచ్చుకురావాలనే ‘కామము’ మొదలైనవి ఎందుకుంటాయి? నిదురలేస్తే అన్నీ పోతాయి కదా!

కాయికాది విముక్తో2స్మి।
స్థూల-సూక్ష్మ దేహముల (The physical Body and The Feelings Body) కంటే విశిష్టమైన ఆత్మస్వరూపుడను. స్థూల -సూక్ష్మములచే బద్ధుడను కానట్టివాడను. అవి రెండు నాకు (నాటకపాత్రయొక్క బాహ్య-అలంకారములవలె) అంగవస్త్రముల వంటివి! నేను సర్వదా దేహ-మనో-బుద్ధి-స్థూల-సూక్ష్మాదులకంటే విశిష్టమైనవాడిని. వాటికి నేను బద్ధుడనుకాను. అతీతుడను. వాటి బంధము నాకు ఎప్పుడూ లేదు.

నా వలన కాయము (దేహము) ఉనికిని సంపాదించుకొని ఉంటోంది. అంతేగాని - దేహము వలన నేను ఉనికిని పొందువాడను గాను.

నిర్గుణః కేవలో2స్మ్యహమ్।
త్రిగుణములు ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతికి ఆవల ‘‘పరమ పురుష - నిత్య చైతన్యస్వరూపుడను’’ అగు నేనున్నాను. స్వభావము స్వభావిని ఆశ్రయించి ఉంటుంది కదా! ‘గుణి’స్వరూపుడనగు నేను త్రిగుణములకు (సత్త్వ-రజో-తమో గుణములకు) ముందే, గుణముల ప్రారంభం కానప్పుడే ఉండి ఉన్నాను. అందుచేత నిర్గుణుడను. గుణములు ఉన్నప్పుడు కూడా గుణములకు ఆవల ఉన్నాను. అనగా అప్పుడు కూడా నేను నిర్గుణుడనే కదా। సర్వదా నిర్గుణుడనే. గుణములు నాకు ఆభరణములవంటివి మాత్రమే!

ముక్తిహీనో2స్మి ముక్తో2స్మి, మోక్షహీనో2స్మ్యహం సదా।
ముక్తి అనగా ఎట్టి బంధము ఉండకపోవటమే, బాధలుతొలగితే బంధము లేదు కదా!

ఒకానొక కళాకారుడున్నాడు. ఒక నాటకంలో ఒక పాత్రలో నటిస్తూ ఉన్నాడు. ఆ పాత్రలో ఆతనికి - (అధిక సంతానము, పేదరికము, భార్య పడుచున్న ఆరోగ్య సంబంధమైన బాధలు అవి చూచి దిగులు, అల్లుడు స్వార్థపూరిత స్వభావము…ఇటువంటి) అనేక బాధలు. ఆ పాత్ర బాధలు అనుభవిస్తూ ఉన్నది. బాధల నుండి ఇప్పుడు, ఆ వ్యక్తికి ముక్తి కావాలి.

నాటకంలోని పాత్రకు ఆ బాధలన్నీ పోతే ఆతనికి ముక్తియా?

అసలు పాత్రగా ఆతడు అవటమే లేదే. పాత్రయొక్క కష్టాలు ఆతనివి ఎట్లా అవుతాయి? కావు. ఆతనికి వాటితో సంబంధమేలేదు.

అవన్నీ కల్పితమగు నాటకములోనివేగాని, పాత్రధారుని వ్యక్తిగతమైనవి కావు. నాటకగతమైనవి మాత్రమే.

ఇప్పుడు ఈ దృష్టాంతం సహాయంతో జీవాత్మ - పరమాత్మల బంధ - మోక్షాలగురించి పరిశీలిస్తున్నాము.

ఇహాత్మ (Position in this world)

పరాత్మ

పరాత్ పరాత్మ / పరాత్పరుడు। = ఈ జీవాత్మ సంబంధమైన దేహమే కాకుండా సర్వుల అంతర్యామిగా ఉన్నట్టి నాయొక్క ఉనికి (My presence in what all and whom ever I am seeing).

ఇప్పుడు ‘ముక్తి’ యొక్క ఆవశ్యకత ఎవరికి?

బంధము జీవాత్మకా? జగత్తులోని నా పాత్ర రూపానికా? నాయొక్క పరాత్పర స్వరూపమునకా?
(అందరిలో ఏర్పడియున్న నేనైన నేనుకా?)

‘బంధవిముక్తి’ (లేక) ‘మోక్షము’నకు ఉపాయము
చేయవలసి వస్తున్నవి - చేయాలనుకొని కూడా చేయలేకపోతున్నవి, పొందుచున్నవి - పొందనివి, ఇష్టమనిపించేవి - ఇష్టము కాదనిపించేవి…ఇవన్నీ జగత్ స్వరూప భగవానునికి సమర్పిస్తూ, -

బంధము అసలు ఎవరికి?

బంధము జగత్తు కావల పరమై పరమాత్మగా చెప్పబడే మన-రూపానికా?

మన పరస్వరూపము (నాటక దీపమువలె) సర్వదా సాక్షియే కదా! అట్టి కేవలీ స్వరూపమునకు జగద్విషయములతో బంధమేముంటుంది.

Ⅰ. నాయొక్క జీవాత్మత్వము అనే నాటకపాత్ర జగన్నాటకమును అనుసరించియే ఉంటుంది గాని, జీవునిగా నా ఇచ్ఛానుసారము ఉండదు. కనుక బంధము తొలగదు. జీవాత్మత్వమునకు ‘ముక్తి’ అనే ప్రసక్తి లేదు. ‘‘జీవాత్మగా నిత్యబద్ధుడను’’.
Ⅱ. నాయొక్క పరస్వరూపము (లేక) పరమాత్మత్వము సర్వదా జగదనుభవములకు ఆవల కేవల సాక్షియై ఉన్నది! కాబట్టి నా పరతత్త్వమునకు “బంధము” అనే ప్రసక్తి లేదు. “పరమాత్మగా నిత్యముక్తుడును”.
Ⅲ. ఈ సర్వము నేనే అయినట్టి నా పరాత్ పరస్వరూపము. - ‘‘సర్వభూతములు నావై - సర్వ సాక్షి అనగా ‘నేను వేరై’ ఉంటోంది. కాబట్టి బంధ - ముక్తులు నాకు లీలావినోదమే। క్రీడా సంగతులు మాత్రమే।

ముక్తి హీనో2స్మి = జీవుడుగా నాకు ముక్తి ఉండదు. 
ముక్తో2స్మి = పరస్వరూపుడుగా నిత్యముక్తుడను. 
మోక్షహీనో2స్మ్యహం సదా = బంధముక్తులు నాకు లేవు. ఇహ - పరముల ఆవల నిత్యోదిత చైతన్యరూపుడను నేను. ఇక నాకు మోక్షమెక్కడిది? ఎవరినుండి?  ఎవరినుండి-దేనికి మోక్షము కావాలో అదీ నేనే।

సత్య-అసత్యాది హీనో2స్మి।

నేను - నా కల్పన ఒక్కచోటే - కలసియే ఉంటాము.

సత్యమ్ = యమ్ సత్। 
అసత్యమ్ = యమ్ అసత్।

నేను ఏది సత్యమనుకుంటే అది నాకు సత్యమౌతుంది.

నేను ఏది అసత్యమనుకుంటే అది నాకు అసత్యమౌతుంది.

(యత్ భావమ్-తత్ భవతి), అనగా సత్యాసత్యములు నేను అనుకోవటాన్ని అనుసరించి ఉంటున్నాయి. అనుకునే నేనో?

ఆ ఉభయభావాలను భావించువాడుగా ఉన్నాను. ఆవల ఉన్న నా స్వరూపమునకు సత్య - అసత్యములు లేవు.
కలగంటున్న నేను….
- కలకు వేరై ఉన్నాను.
- కల నాదే కాబట్టి కలగా కనిపించేదంతా నేనే కూడా.
- అంతానేనే అయిఉండగా…ఇక ఏది నేను కాదు?

నాకు సత్యమగు పరము లేదు. అసత్యకల్పన వంటి జీవాత్మత్వము లేదు. అన్నీ నేనే అయి, ఏదీ నేను కానివాడనై ఉన్నాను. ఇందుచేత సత్యాసత్యాది హీనో2స్మి!

సన్మాత్రాన్నాస్మ్యహం సదా। (సత్ మాత్రాత్ న అస్మి అహమ్ సదా)।
‘నేను ఉన్నాను’ అను నా భావనయే సన్మాత్ర భావన! ‘ఉన్నాను’ అను గమనికకు ముందే నేను ఉండి తీరాలి. కాబట్టి సన్మాత్ర (సత్- ఉనికియొక్క) భావనకు మునుముందే ఉన్నట్టి నేను సన్మాత్రభావనకు కూడా అతీతుడను. ఆవల ఉన్నట్టివాడను. ఆదిస్వరూపుడను. సన్మాత్రము (సత్‌భావన) కూడా నేను కాదు. సత్-చిత్-ఆనందములు నా లక్షణములు అని మాత్రమే అనవచ్చు. నేను సర్వలక్షణ విలక్షణుడను! ఈ రీతిగా సన్మాత్రాత్ న అస్మి అహమ్। నేను ఉన్నచోట సత్ అనే విశేష లక్షణము స్వాభావికమై ఉండి ఉంటోంది. అంతే.

గంతవ్య దేశ హీనో2స్మి।
ఆత్మాత్ ఆకాశమ్! ఆకాశాత్ వాయుః ఇత్యాదిః । ఆత్మస్వరూపుడనగు నా నుండి ఆకాశము (Space) బయల్వెడలుతోంది. ఆకాశము యొక్క రూపమే ‘‘ఇక్కడ - అక్కడ’’. ఇక నానుండి బయలుదేరిన ‘కాలము’నకు చెందినవి - ‘‘ఇప్పుడు, అప్పుడు’’ మొ।।నవి.

దేశకాలములు ఆత్మస్వరూపుడనగు నా నుండియే బయల్వెడలుచున్నాయి.

నా నుండి బయల్వెడలే ఆకాశములో, నా యందే ఉన్నట్టి ఆకాశములో - నేను ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళటమేమున్నది?

‘‘నేను నా కలలో పల్లె నుండి పట్టణము (From a village to a Town) వెళ్ళాను’’ అని అంటాననుకోండి. వాస్తవానికి కలంతా నాదే అయి ఉండగా నేను కలలో ఒక చోటునుండి మరొకచోటికి పోవుటమేముంటుంది?

జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు ఆత్మస్వరూపుడనగు నా భావనా - ఊహా చమత్కారమే. నేను సర్వదా ఉన్నచోటే ఉంటాను. ఈ దేహము యొక్క ప్రయాణాల చేతగాని, దేహముయొక్క రాకపోకల చేత గాని (జీవన్మరణముల చేత గాని), మనో-బుద్ధి-చిత్త-అహంకారముల ఉత్పత్తి-లయముల చేతగాని నేను నాకు వేరైన మరొక చోటికి రాను. నేను ఎక్కడ ఉన్నానో సర్వదా అక్కడే ఉన్నాను. నాకు ‘రాక లేదు - పోక లేదు’. అహం గమనాది వర్జితః

సర్వదా సమరూపో2స్మి।
నేను సర్వదా కేవలాత్మ స్వరూపుడను. ‘‘ఒకచోట సూర్యుడు ఉదయిస్తున్నారు. కాబట్టి అక్కడ నుండి సూర్యుడు తేజస్సు పొందుచున్నారు’’- అని అంటావా? ‘‘సూర్యుడు ఇక్కడ అస్తమించటం చేత ఇక్కడ తేజస్సు కోల్పోవుచున్నారు’’ - అని కూడా అనము కదా!

ఒకప్పుడు ఆత్మజ్ఞానము ఏమరచి అనేక జన్మలలో ఆయా సంఘటనలు - సందర్భములు సత్యమేనని అనుకోవచ్చుగాక! మరొకప్పుడు జ్ఞాన దృష్టితో చూడవచ్చుగాక! నేను ఆత్మస్వరూపుడను కానిది ఎన్నడూ లేదు. సర్వదా ఆత్మ తేజోభానుడను. సూర్యుడను.

నాకు ఎక్కువ తక్కువలు లేవు.

నాకు వేరుగా ఎక్కువ వారు లేరు. తక్కువ వారు లేరు.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో కూడా నేను ఏకరూపుడను.

‘‘నేను దుఃఖితుడను। నేను పాపిని। నేను అల్పుడను।’’ అనుకుంటున్నప్పుడు కూడా నేను సమస్వరూపుడనే. సర్వదా సమరూపో2స్మి! నిన్న - ఈరోజు - రేపు - జన్మ - జన్మాంతరాలలోను - జ్ఞాన, అజ్ఞాన సందర్భాలలోను నేను నేనే। సర్వదా సమస్వరూపిని.
సూర్యుడికి, ఆయన తేజస్సుకు వాస్తవానికి ఉదయ, అస్తమయములు లేనట్లే - నాయొక్క ఆత్మ తేజో విలాసమునకు ఉదయస్తమయములు లేవు.

శాంతో2స్మి।
నిశ్చలజలంలో జలమునకు అభిన్నమే అయినట్టి చంచల తరంగాలు బయల్వెడలుచున్నాయి. అయినప్పటికీ తరంగము జలమే. తరంగముల ప్రదర్శనముచే జలము పొందేదేమున్నది? కోల్పోయేదేమున్నది? జలముయొక్క యథాతథత్వమునకు ‘హాని’ ఏమున్నది.

నిశ్చల ఆత్మ స్వరూపుడనగు నా నుండి చంచల జగత్ భావములు - జగత్తులు, దేహభావములు - దేహములు బయల్వెడలుచున్నాయి. అయినంతమాత్రం చేత పరమశాంతస్వరూపుడనగు నాకు పోయేదీ లేదు. వచ్చేది లేదు. నా పరమశాంతత్వము చెదరటం లేదు. ఈ దృశ్యమంతా లేని - పోని కథ వంటిది. (లేనిది, పోనిది) 
లేదు → వాస్తవానికి లేదు. 
పోదు → పోయేదీ కాదు. వాస్తవానికి ఉంటే కదా...పోవటానికి?

నేను సర్వదా పరమశాంతమగు ఆత్మస్వరూపుడనే. సదా - సర్వత్రా నా శాంతాత్మత్వమునకు భంగము లేదు. లోటు లేదు. శాంతో2స్మి।

పురుషోత్తమః। ఉత్తమ పురుషః।
నేను ఉత్తమ పురుష (First Person. I) ను. నేనేదీ కాకుండానే, అంతా నేనే అయి ఉన్నాను. స్వప్నమంతా స్వప్నద్రష్ట రూపమే కదా! ఈ జాగ్రత్ అంతా నాకు అభిన్నము। నేనే। నేను కానిదేదీ లేదు. ఉండదు. 14 లోకములుగా, లోకేశులుగా, లోకస్థులుగా ఉంటూ అవేమీ లేనివాడనైయున్నాను. జీవాత్మ-పరమాత్మలకు ఆవల పురుషోత్తముడనై, అన్నిటికి కారణకారణుడనై ఉన్నాను. ఉంటాను! పురుషోత్తమస్మి।

పరమ శివౌ వాచ
ఏవం స్వానుభవో యస్య….పైన చెప్పుకున్న వివరాలు విశేషాలు ఎవ్వరికి స్వానుభవమే అగుచున్నాయో
అదే నేను। సో2హమస్మి। అదియే నీవు! అదియే నీవు। తత్త్వమసి।

సర్వము స్వానుభవము ఎవ్వరికో - ఎవ్వరిదో అట్టి నేను ‘‘బ్రహ్మము’’ అని వేదవాఙ్మయముచే చెప్పబడుచున్నాను.

  బ్రహ్మమేవా2స్మి। పర-బ్రహ్మమేవా2స్మి। సదా శివో2స్మి। 
  తదేవ త్వమ్। త్వమేవా2హమ్। 
* * *

‘‘ఇతి - శివభావన’’ - అని పరమ శివభగవానుడు మైత్రేయ మహర్షికి బోధించారు.

* * *

ఈ విధంగా బృహద్రథునకు సూర్యలోకవాసి అగు శాకాయన్య మహర్షి బోధించారు.

ఇది అధ్యయనము - శ్రవణము చేయువాడు బ్రహ్మమే తానగుచున్నాడు.
పరమాత్మయే అయి ప్రకాశిస్తున్నాడు. ఆనందిస్తున్నాడు!

ఇతి మైత్రేయోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।