[[@YHRK]] [[@Spiritual]]
PraSna Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
శ్లో।। ఓం। గురుదేవ పిప్పలాదాయ నమః। సుకేశాయ భారద్వాజః, శైభ్యశ్చ సత్యకామాయ, సౌర్యాయణీ గార్గ్యః, కౌసల్యాశ్చ అశ్వలాయనాయ, భార్గవో వైదర్భిః, కబంధీ కాత్యాయనాయ ఋషిభ్యో గురుభ్యో మునిభ్యో నమః।। |
ఓం నమో బ్రహ్మాదిభ్యో। బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో। వంశ ఋషిభ్యో। మహద్భ్యో । గురుభ్యో నమః। |
ఓం సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యశ్చాశ్వలాయనో భార్గవో వైదర్భిః కబంధీ కాత్యాయనస్తే హైతే బ్రహ్మపరా బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం వక్ష్యతీతి తే హ సమిత్పాణయో భగవంతం పిప్పలాదముపసన్నాః .. 1.1.. |
|
ఓం నమో పరమాత్మనే నమః। హరిః ఓం! |
ఓంకార స్వరూపుడు, సర్వాంతర్యామి అగు పరమాత్మకు నమస్కరిస్తు న్నాము. సర్వమును తానై - పర్వము తనవైపుగా ఆకర్షించుచున్న హరి స్వరూప ‘ఓం’కారమునకు నమస్సుమాంజలులు. |
- ప్రథమ ప్రశ్నః - 1-1.) సుకేశా చ - భరద్వాజః; శైబ్యశ్చ - సత్యకామః; సౌర్యాయణీ చ- గార్గ్యః; కౌసల్యశ్చ - అశ్వలాయనో; భార్గవో - వైదర్భిః; కబంధీ - కాత్యాయనః - తే హ ఏతే - బ్రహ్మపరాః। బ్రహ్మనిష్ఠాః। పరంబ్రహ్మ అన్వేషమాణా ఏష హ వై ‘‘తత్సర్వమ్ వక్ష్యతి’’ ఇతి। తే హ సమిత్పాణయో → భాగవంతం పిప్పలాదమ్ ఉపస(ప)న్నాః।। |
1.) భరద్వాజుని కుమారుడైన (భారద్వాజ) సుకేశుడు, 2.) శిబి కుమారుడైన సత్యకాముడు, 3. గార్గ్య గోత్రజుడైనట్టి సౌర్యాయణి, 4. అశ్వలుని కుమారుడైనట్టి కౌసల్యుడు, 5. భృగు (భార్గవి) గోత్రజుడైన వైదర్భి, 6. కత్యుని కుమారుడైన కబంధి (లేక) కాత్యాయనుడు..., ఈ ఆరుగురు బ్రహ్మమే తమ యొక్క నిష్ఠగా కలిగి యున్నట్టి మునీశ్వరులు. బ్రహ్మమే జీవిత పరమార్థముగా గలవారు. వారంతా కూడా ఒకానొకప్పుడు ‘‘బ్రహ్మతత్త్వమును అన్వేషించి, తెలుసుకోవాలి!’’ అని ఉద్దేశ్యించి సద్గురువు - సత్‌తత్త్వమును ఎరిగినట్టి మహనీయ సందర్శనము కొరకై చేతులలో దర్భలు ధరించి బయల్వెడలారు. భగవంతుడు, మహనీయుడు ఆత్మజ్ఞుడు-అగు పిప్పలాదమహర్షిని సమీపించారు. ‘‘హే మహర్షీ! మాకు బ్రహ్మతత్త్వమంతా కూడా సర్వము ఆమూలాగ్రము బోధించండి!’’.. అని అభ్యర్థించారు. |
తాన్హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత యది విజ్ఞాస్యామః సర్వం హ వో వక్ష్యామ ఇతి .. 1.2.. |
|
1-2.) తాన్ హ స ఋషిః ఉవాచ: - ‘‘భూయ ఏవ తపసా - బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ। యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత। యది విజ్ఞాస్యామ్యః - సర్వం హ వో వక్ష్యామ’’ ఇతి।। |
అప్పుడు ఆ పిప్పలాద మహర్షి వారితో - ఇట్లా అన్నారు: ‘‘నాయనలారా! అట్లాగే। అయితే, ఇప్పటి నుండి ఒక సంవత్సర కాలము శ్రద్ధతో తపస్సు, బ్రహ్మచర్యము నిర్వర్తించండి. శ్రద్ధాసక్తులతో బ్రహ్మతత్త్వమును విచారణ చేయండి. అప్పుడు రండి. అప్పటికీ ఇంకా బ్రహ్మము గురించిన మీకు సందేహాలు ఏమైనా మిగిలి ఉంటే చెప్పండి. ఇంకా ఏమి తెలుసుకోవాలో- అప్పుడు యోచించి, ప్రశ్నల రూపంగా అడగండి. మీ ప్రశ్నలకు సమాధానము, నాకు తెలిసినంతవరకు, మీకు పూర్తిగా తప్పక చెప్పుతాను’’. |
అథ కబంధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ . భగవన్ కుతే హ వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి .. 1.3.. |
|
1-3.) అథ కబంధీ కాత్యాయన
ఉపేత్య, పప్రచ్ఛ :- ‘‘భగవన్! కుతో హ వా ఇమాః ప్రజాః ప్రజాయంత?’’ ఇతి! |
వారంతా గురు ఆజ్ఞ ప్రకారం శ్రద్ధగా తపస్సు చేస్తూ బ్రహ్మము గురించి విచారణ - ధ్యానము చేసారు. మరల గురువును సమీపించారు. అప్పుడు మొట్టమొదటగా కత్యుని కుమారుడైన కబంధి (కాత్యాయన) మహాముని- లేచి నిలుచున్నారు. గురుదేవులగు శ్రీ పిప్పలాది మహర్షి నమస్కరించి - ఈ విధంగా తన ప్రశ్నను నివేదించారు! ‘‘హే భగవన్! పిప్పలాద గురుదేవా నమో నమః। నాకు కళ్లకు ఎదురుగా ఈ జీవులంతా కనిపిస్తున్నారు కదా! ఈ ప్రాణికోట్లంతా ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు?’’ |
తస్మై స హోవాచ ప్రజాకామో వై ప్రజాపతిః స తపోఽతప్యత స తపస్తప్త్వా స మిథునముత్పాదయతే . రయిం చ ప్రాణం చేత్యేతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతి .. 1.4.. |
|
1-4.) తస్మై స హో వాచ; - ప్రజాకామో వై ప్రజాపతిః। స తపో అతప్యత। స తపః తప్త్వా- స మిథునమ్ ఉత్పాదయతే। ‘‘రయిం చ - ప్రాణం చ’’ ఇతి! ‘‘ఏతౌ యే బహుధా ప్రజాః కరిష్యత।’’.. ఇతి |
అప్పుడు శ్రీ పిప్పలాద మహర్షి ఇట్లా సమాధానం చెప్పసాగారు. సృష్టికి మునుముందే ఉన్నట్టి ఏకము, కేవలము, చైతన్యస్వరూపము అయి ఉన్న సృష్టికర్త - ‘‘నేను అనేక రూపులగు - నానాత్వ సమన్వితమైన జీవకోటిని కల్పించుకొని, వినోదినై ఉండెదనుగాక!’’.. అను రూపమైన అభిరుచిని, కోరికను పొందారు. అందుకు కావలసిన యోచన రూపమైన తపస్సు చేసి మొట్టమొదటగా ఒక ‘జంట’ (Dual) ని సృష్టించారు. (1) పదార్థము (Matter) / రయి (2) ప్రాణము (Energy) ‘‘ఈ రెండు కలిసి నాకు అనేక రూపములగు సంతానమును కల్పించు గాక!’’.. అని భావించారు. కనుక రయి (Matter) + ప్రాణము (Energy) నుండే ఈ జీవజాలమంతా బయల్వెడలటం జరుగుతోంది. |
ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చంద్రమా రయిర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మాన్మూర్తిరేవ రయిః .. 1.5.. |
|
1-5.) ఆదిత్యో హ వై ‘ప్రాణో’। రయిరేవ ‘చంద్రమా’। రయిర్వా ఏతత్ సర్వం - యత్ మూర్తం చ, అమూర్తం చ। తస్మాత్ మూర్తిరేవ రయిః।। (మూర్తిః ఏవ రయిః)। |
ప్రాణశక్తి యొక్క రూపము: - నిరాకారము (అమూర్తము). ‘‘ సూర్యుడు’’ - బృహత్తరమైన ప్రాణశక్తి కేంద్రము. రయిత్వము = ఆ ప్రాణము యొక్క సాకారము - ‘‘చంద్రుడు’’. అంతా కూడా నిరాకారమగు శక్తి+ సాకారమగు పదార్థముల కలయికయే! కనుక, సాకారమే → రయి ---- Self is the origin for Energy Energy = Formless ---- Energy is taking the form of matter Matter = Has Form ---- Matter is a form of Engergy అమూర్తమగు శక్తి యొక్క సాకారమే (మూర్తత్వమే) పదార్థము. పదార్థము = శక్తి రూపమే. అనగా, శక్తి - మూర్తము వేరువేరు కాదు. |
అథాదిత్య ఉదయన్యత్ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే . యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం యదంతరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే .. 1.6.. |
|
1-6.) అథ ఆదిత్య - ఉదయన్ - → ప్రాచీం దిశం ప్రవిశతి, తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సంవిధత్తే। → యత్ దక్షిణామ్, → యత్ ప్రతీచీం, → యత్ ఉదీచీం, → యత్ అధో, యత్ ఊర్థ్వమ్, → యత్ అంతరా దిశో → యత్ సర్వం ప్రకాశయతి - = తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే।। |
ప్రాణశక్తి రూపమగు ఆదిత్యుడు మొట్టమొదట ఉదయించి → తూర్పు (towards east) వైపు తన యొక్క శక్తితో విస్తరించి తూర్పు వైపు ప్రాణులను ధారణ చేయసాగుచున్నారు. అట్లాగే ప్రాణశక్తి స్వరూపుడగు ఆయనయే - - దక్షిణ దిక్కుగాను, - పడమర దిక్కుగాను, - ఉత్తర దిక్కుగాను, - క్రిందకు, - పైకి, - మధ్యగా- విస్తరించినవారై - అన్ని వైపులా ప్రాణ-శక్తి కిరణములను విస్తరింపజేస్తూ, ఆయా అన్ని ప్రాణ రూపములుగా ఉంటూ, ఈ సమస్తము తానే ధరించటం నిర్వర్తించసాగుచున్నారు. - ఈ విశ్వమంతా ఒకే ప్రాణశక్తి యొక్క వివిధ రూపములే! (Prana Energy is always same and constant. All the beings and non-beings are its manifestations). |
స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోఽగ్నిరుదయతే . తదేతదృచాఽభ్యుక్తం .. 1.7.. |
|
1-7.) స ఏష వైశ్వానరో విశ్వరూపః। ప్రాణో అగ్నిః ఉదయతే। తత్ ఏతత్ ఋచా (అ)భ్యుక్తమ్।। |
ప్రాణము యొక్క రూపము ‘అగ్ని’! ఇక మూర్తమగు (సాకారమగు) ఎదురుగా కనిపించే ఈ విశ్వమంతా ‘వైశ్వానరుడు’! వైశ్వానరో విశ్వరూపః। ప్రాణశక్తిని → అగ్ని రూపంగాను, ఈ సాకార విశ్వమును వైశ్వానరుడుగా → వర్ణనలు, ఉపాసనలు ప్రవచిస్తూ ఋక్కులను (స్తుతులను) ఋగ్వేదము గానం చేస్తోంది. |
విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం . సహస్రరశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముదయత్యేష సూర్యః .. 1.8.. |
|
1-8.) విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణమ్। జ్యోతిః ఏకం తపంతమ్! సహస్ర రశ్మిః శతథా వర్తమానః ప్రాణః ప్రజానామ్ ఉదయతి, ఏష సూర్యః।। |
ఇక ప్రాణశక్తి యొక్క విశేష తత్త్వమును వర్ణిస్తున్నాను. విను. - ఈ విశ్వమంతా ప్రాణశక్తి యొక్క బాహ్య - పాదార్థిక రూపమే! - ప్రాణ సూర్యుడు అటు అనంత తేజో స్వరూపుడై, ఇటు జీవజాల- కిరణ రూపుడై ఉన్నారు. - జాతవేదసుడై ఈ జీవాత్మల బాహ్య - అభ్యంతర రూపములను ఎరిగిన వాడు అగుచున్నారు. (రచయిత పాత్రల స్వభావాలు ఎరుకయే కదా!) - జ్యోతి-కాంతి స్వరూపుడై సర్వమును తపింపజేయుచు, వేడిని ప్రసాదిస్తున్నారు. - ఆయనయొక్క ప్రకాశమే సహస్ర (వేలాది) కిరణముల స్వరూపము అయి ఉంటోంది. అట్టి ప్రాణశక్తి ఈ జీవులను సృష్టించి, అట్టి స్థావర - జంగమములన్నిటికీ తానే ప్రాణస్వరూపమై ఉన్నది. |
సంవత్సరో వై ప్రజాపతిస్తస్యాయనే దక్షిణం చోత్తరం చ . తద్యే హ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోకమభిజయంతే . త ఏవ పునరావర్తంతే తస్మాదేత ఋషయః ప్రజాకామా దక్షిణం ప్రతిపద్యంతే . ఏష హ వై రయిర్యః పితృయాణః .. 1.9.. |
|
1-9.) సంవత్సరో వై ప్రజాపతిః। తస్య అయనే దక్షిణం చ - ఉత్తరం చ। తద్యేహవై (తత్ ఏవ, హవై,) తత్ ‘‘ఇష్టా-పూర్తే కృతమ్’’ ఇతి ఉపాసతే’’। (తే) చాంద్రమసమ్ ఏవ లోకమ్ అభిజయంతే। త ఏవ పునః ఆవర్తంతే (పునరావర్తన్తే)। తస్మాత్ ఏతే ఋషయః ప్రజా కామా, దక్షిణం ప్రతిపద్యంతే! ఏష హ వై రయి ర్యః పితృయాణః।। |
ఆ ప్రాణ-రయిల సృష్టికర్తయే కాల స్వరూపుడు! సంవత్సర స్వరూపుడు! అట్టి ప్రజాపతికి సంవత్సర (కాల) రూపంగా రెండు ప్రవృద్ధి వర్తమానములు. (1) దక్షిణాయనము (2) ఉత్తరాయనము (1) అందులో దక్షిణాయనము గురించి : - ఈదారి వేద ధర్మములు, లోకసంబంధమై ధర్మములు, వాటివాటికి సంబంధించిన కర్మలకు సంబంధించినది. (ఇష్టా-పూర్తములు మొదలైనవి). - ఈ దక్షిణాయన మార్గబాటసారి చంద్రలోకము (రయి- పదార్ధానుభావలు)ను గెలుచుకొనుచున్నాడు (పొందుచున్నాడు) అయితే పునరావృత్తి కలిగి ఉండి, -ఈతడు తిరిగి భౌతిక స్థానములకు మరలుచున్నాడు. అందుచేత వీరు ప్రజాకాములై దక్షిణ దిశ పొందుచున్నారు. ఇదియే పదార్థము! ఇదియే పితరుల దారి! (కేవలము నుండి - సందర్భములోకి) |
అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాఽఽత్మానమన్విష్యాదిత్యమభిజయంతే . ఏతద్వై ప్రాణానామాయతనమేతదమృతమభయమేతత్ పరాయణమేతస్మాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధస్తదేష శ్లోకః .. 1.10.. |
|
1-10.) అథ, ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ - శ్రద్ధయా - విద్యయా ఆత్మానమ్ అన్విష్యా → ఆదిత్యమ్ అభిజయంతే! ఏతత్ వై → ప్రాణానామ్ ఆయతనమ్ ఏతత్ → అమృతమ్, అభయమ్। ఏతత్→ పరాయణమ్। ఏతస్మాత్ (ఏతత్→ అస్మాత్) - న పునరావర్తంత- ఇతి ఏష నిరోధః! తత్ ఏష శ్లోకః।। |
(2) ఇక ఉత్తరమార్గ బాటసారులు. వీరు తపస్సు - బ్రహ్మచర్యములను శ్రద్ధతో - జ్ఞానముతో ఉపాసిస్తూ (పదార్థత్వమును అధిగమించి), ఆత్మత్వము కొరకై అన్వేషణ ప్రారంభించి, కొనసాగిస్తూ ఉత్తరాయణము ద్వారా సూర్యస్థానమును గెలుచుకొంటున్నారు.(దాటుచున్నారు). అది ప్రాణశక్తికి నిలయము. అభయస్థానము. అమృతానందానుభవప్రదము. అదియే పరాకాష్ఠ! పరాయణము! (పరస్వరూపమువైపుగా ప్రయాణము) పరంధామము. చంద్ర (భౌతిక సంబంధమైన యానము వలె) కాకుండా,- ఈ ఉత్తరాయన మార్గంలో పునరావృత్తి దోషము ఉండదు. ఇది ఆత్యంతికము. ఈ ప్రాణ మార్గము - ఉత్తరాయణము, మోక్షమార్గము, ఆత్మానుభవ మార్గముగా అభివర్ణించబడుతోంది. (సందర్భమునుండి కేవలమునకు) |
పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణం . అథేమే అన్య ఉ పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పితమితి .. 1.11.. |
|
1-11.) పంచ (5) పాదం। పితరం ద్వాదశ (12) ఆకృతిమ్। దివ ఆహుః పరే అర్ధే పురీషిణమ్। అథ ఇమే అన్య ఉ పరే విచక్షణం - సప్త (7) చక్రే - షడర (షట్ - 6) ఆహుః అర్పితమ్ ఇతి।। |
కొందరు ఆత్మశాస్త్రవేత్తలగు ఋషులు.. అట్టి జ్ఞాన పరాకాష్ఠయగు సూర్యస్థానమును - 5 పాదాలుగా → (హేమంత - శిశిర ఏకత్వంగా) 5 ఋతువులుగా - 12 ఆకృతులు → 12 నెలలుగాను, - ఆకాశమును ఆక్రమించుకొన్నదిగాను, - వర్షమును ప్రసాదించే పురీషిణముగాను వర్ణిస్తున్నారు. మరికొందరు ఋషులు.., - సర్వమునకు ద్రష్టగా (చూచువాడుగా) (లేక) విచక్షుణుడుగా, - ఏడు చక్రములలో కదలువాడుగా, (సప్తాశ్వాలు - సప్తరంగులు ధరించువాడుగా) (సప్తాశ్వరథమ్ ఆరూఢుడుగా) - 6 ఆకులు (ఋతువులు) ప్రకటించువాడుగా... స్తుతిస్తున్నారు. ఆదిత్యరూపంగా ప్రాణదేవుడు ప్రకటితుడు. |
మాసో వై ప్రజాపతిస్తస్య కృష్ణపక్ష ఏవ రయిః శుక్లః ప్రణస్తస్మాదేత ఋషయః శుక్ల ఇష్టం కుర్వంతీతర ఇతరస్మిన్ .. 1.12.. |
|
1-12.) మాసో వై ప్రజాపతిః। తస్య ‘కృష్ణపక్ష’ ఏవ రయిః। శుక్లః ప్రాణః। |
ఆ ప్రాణప్రదాతయగు ఆ ప్రజాపతి ప్రదర్శనమే - (లేక) ఆయన అవయవములే 12 మాసములు. అట్టి మాస స్వరూపుడగు ప్రజాపతి యొక్క → కృష్ణపక్షము - రయి (పదార్థము) → శుక్లపక్షము - ప్రాణము (శక్తి) |
తస్మాత్ ఏతే ఋషయః శుక్ల ఇష్టం కుర్వంతి। ఇతర - ఇతరస్మిన్।। |
కనుక మంత్ర ద్రష్టలు, ద్రష్టాభిమానులు అగు మహర్షులు శుక్లపక్షము నందు (ఆత్మ) యజ్ఞనిష్టులై ఉంటున్నారు. సృష్ట్యభిమానులగు ఇతర ఋషులు చంద్రయానమార్గులై కృష్ణపక్షయజ్ఞులు (To gain something in creation)గా నిర్వర్తిస్తున్నాను |
అహోరాత్రో వై ప్రజాపతిస్తస్యాహరేవ ప్రాణో రాత్రిరేవ రయిః ప్రాణం వా ఏతే ప్రస్కందంతి యే దివా రత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రౌ రత్యా సంయుజ్యంతే .. 1.13.. |
|
1-13.) అహో-రాత్రో వై ప్రజాపతిః। తస్య అహః ఏవ ‘ప్రాణో’। రాత్రిః ఏవ ‘రయిః’। ప్రాణం వా ఏతే ప్రస్కందంతి। యే దివా రత్యా సంయుజ్యంతే, బ్రహ్మచర్యమేవ, తత్-యత్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే।। |
పగలు - రాత్రి ప్రజాపతియొక్క ప్రదర్శనా చమత్కారమే। పగలు → ప్రాణశక్తిరూపము రాత్రి → భౌతిక రూపము. చంద్రుడు. అన్నము. ఎవ్వరైతే పగలు రతి(మైథునక్రియ) యందు సంపర్కులౌతారో వారు తమ యొక్క ప్రాణశక్తిని వ్యర్థపరచుకొనుచున్నవారౌతున్నారు. రాత్రిపూట రతి బ్రహ్మచర్యముతో సమానము. |
అన్నం వై ప్రజాపతిస్తతో హ వై తద్రేతస్తస్మాదిమాః ప్రజాః ప్రజాయంత ఇతి .. 1.14.. |
|
1-14.) అన్నం వై ప్రజాపతిః। తతో హ వై తత్ రేతః। తస్మాత్ ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి। |
‘‘అన్నము యొక్క తత్త్వమే ప్రజాపతి తత్త్వము. ఎందుకంటే.., అన్నము చేతనే శుక్ల-శోణితములు, తద్వారా ఈ జీవరాసులు కలుగు చున్నాయి కదా?.... అని కొందరు మహనీయులు అభివర్ణిస్తున్నారు! |
తద్యే హ వై తత్ ప్రజాపతివ్రతం చరంతి తే మిథునముత్పాదయంతే . తేషామేవైష బ్రహ్మలోకో యేషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం .. 1.15.. |
|
1-15.) తత్ యే (తద్యే) హవై తత్ ప్రజాపతి వ్రతం.. చరంతి। తే మిథునమ్ ఉత్పాదయంతే। |
ఎవరు ప్రాణ-రయి మిధునమును (ద్వంద్వమును) గ్రహిస్తున్నారో.. అట్టివారు ప్రజాపతి వ్రతధారులై జీవోత్పత్తి కొనసాగటానికై వ్రతంగా ఆచరిస్తున్నారు. |
తేషామ్ ఏవ, ఏష బ్రహ్మలోకో యేషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితమ్।। |
ఎవరి యొక్క తపస్సు, అవగాహన - ఇంద్రియ నిగ్రహములతో కూడుకొని ఉన్నదో, ఎవరి యందు సత్యమును ధారణ చేయు బుద్ధి ప్రతిష్ఠితము పొందుతోందో.., వారు బ్రహ్మమును దర్శించ గలుగుచున్నారు. బ్రహ్మమునందు ప్రతిష్ఠితులు అగుచున్నారు. |
తేషామసౌ విరజో బ్రహ్మలోకో న యేషు జిహ్మమనృతం న మాయా చేతి .. 1.16.. |
|
1-16.) తేషామ్ అసౌ విరజో.. బ్రహ్మలోకో న యేషు జిహ్మమ్ (జిహ్వమ్) అనృతం న మాయా చ। ఇతి।। |
ఎవ్వరియందైతే వంచన, మోసము, అనృతము, మాయాదృష్టి తరుగుతూ, ఇంద్రియ విషయములపై అభినివేశము, జిహ్వచాపల్యము, అభినివేశము, అభిరుచి తగ్గుతూ ఉంటాయో- అట్టి దోషరహితులకే బ్రహ్మలోకము తమకు చెందినదై ఉండగలదు. అట్టి దోషములు కలవారు జనన-మరణ చక్రములో తిరుగాడుచూనే ఉంటారు. పరమాత్మనుండే ఈ జీవజాలమంతా బయల్వెడలుతోంది. |
అథ హైనం భార్గవో వైదర్భిః పప్రచ్ఛ . భగవన్ కత్యేవ దేవాః ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠ ఇతి .. 2.1.. |
|
2-1.) అథ హి ఏనం (అథహైనం) భార్గవో వైదర్భిః పప్రచ్ఛ :- భగవన్! కతి (ఎందరు) ఏవ దేవాః ప్రజాం విధారయంతే? కతర (ఎన్ని) ఏతత్ ప్రకాశయంతే? కః (ఎవ్వరు) పునః ఏషాం వరిష్ఠ? ఇతి।। |
అట్టి ప్రాణ-రయి తత్త్వాన్నంతా వింటూ అప్పుడు భృగువంశజుడు - విదర్భ నివాసుడు అగు భార్గవుడు (పిప్పలాద మహర్షికి) - లేచి నిలుచుని, తన ప్రశ్నను ఇట్లా విన్నవించుకున్నారు.
‘హే భగవాన్! మహాత్మన్! సద్గురూ! పిప్పలాద మహర్షీ! ఈ భౌతిక దేహమును అశరీరులు దివ్య ప్రాజ్ఞులు అగు దేవతలు నిర్మించి, పర్యవేక్షిస్తున్నారు కదా! - అట్టి ఎంతమంది దేవతలు ఈ జీవుల దేహములను నిలబెట్టుచూ, పోషిస్తూ భరిస్తున్నారు? - ఎటువంటి తమ తమ యొక్క మహత్మ్యములచే ఈ (రయి-భౌతిక) దేహములను ప్రవర్తింపజేస్తున్నారు? అట్టి దివ్యరూపులగు దేవతలలో శ్రేష్ఠులెవరు? వారి ప్రకాశము ఎట్టిది? |
తస్మై స హోవాచాకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాపః పృథివీ వాఙ్మనశ్చక్షుః శ్రోత్రం చ . తే ప్రకాశ్యాభివదంతి వయమేతద్బాణమవష్టభ్య విధారయామః .. 2.2.. |
|
2-2.) తస్మై సహ ఉవాచ (సహోవాచ) : ఆకాశో హ వా ఏష దేవో। వాయుః అగ్నిః ఆపః పృథివీ వాక్ మనః చక్షుః శోత్రం చ।। తే ప్రకాశ్య అభివదంతి - వయం ఏతత్ బాణమ్ అవష్టభ్య విధారయామః।। |
అందుకు మహర్షి సమాధానం : పంచభూతములనబడే ఆకాశము - వాయువు - అగ్ని -జలము - పృథివి.. ఈ ఐదు కనబడే భౌతిక సృష్టికి కారణ పదార్థములు. సూక్ష్మ ప్రాణశక్తి ప్రదర్శనములే ఇంద్రియములను ప్రవర్తింపజేస్తున్నాయి. (1) వాక్కు- పాణి (చేతులు) - పాదములు - పాయువు (మలద్వారం) - ఉపస్థ.. ఈ 5 కూడా కర్మేంద్రియములు. (2) త్వక్ (చర్మము) - కళ్ళు- చెవులు - చర్మము - జిహ్వ - ఘ్రాణేంద్రియము - ఈ ‘5’ → జ్ఞానేంద్రియములు. ‘మనస్సు’ ఆరవ ఇంద్రియము. ఈ 5+5+5+1లో ఒక్కొక్క దానికి వీటి వీటి సొంతదారు అయినట్టి అధిష్ఠాన దేవతలు ఉన్నారు. వారంతా కూడా తమ తమ తత్సంబంధమైన కార్యాకార్యములచే తమ మహత్మ్యమును లోకాలలో ప్రదర్శిస్తున్నారు. ఒకానొక సందర్భములో అవన్నీ ఒకసారి ‘‘మేము ఈ శరీరమును నిలబెట్టుచున్నాము’’... అని గొప్పలు చెప్పుకోసాగాయి. |
తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ . మా మోహమాపద్యథ అహమేవైతత్ పంచధాఽఽత్మానం ప్రవిభజ్యైతద్బాణమవష్టభ్య విధారయామీతి తేఽశ్రద్దధానా బభూవుః .. 2.3.. |
|
2-3.) తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ। - ‘‘మా మోహమ్ ఆపద్యథ। అహమేవైతత్ (అహమ్ ఏవ ఏతత్)- పంచధా ఆత్మానం ప్ర విభజ్య - ఏతత్ బాణం అవష్టభ్య - విధారయామి!’’ - ఇతి। తే అశ్రద్ధధానా - బభూవుః।। |
(పంచకర్మ-జ్ఞానేంద్రియములు, పంచభూతములు మనస్సు.. ‘‘మేమే ఈ దేహములను నిలబెట్టి ఉంచుచున్నాము కదా!’’.. అని చెప్పుకొంటూ ఉండగా).., ముఖ్యప్రాణము వారందరిని పిలిచి, ఇట్లా పలికింది - ‘‘మిత్రులారా! మీరు మోహము పొందకండి! నన్ను నేనే ఈ ఈ 5+5+5+1గా నన్నునే ప్రవిభజించుచు ఈ 16తో సహా ఈ దేహము పడిపోకుండా నిలబెట్టుచున్నాను’’ అని ఎలుగెత్తి పలికింది. అప్పుడు ఆ 16 కూడా ‘‘ఆ"! ప్రాణశక్తి ఏమంటే మాకేం! మేమే ఈ దేహమును నిలబెట్టుచున్నాం’’ అని తలచాయి. ప్రాణశక్తి మాట విశ్వసించలేదు. ప్రాణదేవత (అగ్నిశక్తి) వాక్యాలపట్ల అశ్రద్ధ వహించాయి. పెడచెవిన బెట్టాయి. |
సోఽభిమానాదూర్ధ్వముత్క్రామత ఇవ తస్మిన్నుత్క్రామత్యథేతరే సర్వ ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవ ప్రతిష్ఠంతే . తద్యథా మక్షికా మధుకరరాజానముత్క్రామంతం సర్వ ఏవోత్క్రమంతే తస్మింష్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవ ప్రాతిష్టంత ఏవం వాఙ్మనష్చక్షుః శ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి .. 2.4.. |
|
2-4.)
సో అభిమానాత్ ఊర్ధ్వమ్ ఉత్క్రామత-ఇవ తస్మిన్ ఉత్క్రామత। అథ ఇతరే సర్వ ఏవ ఉత్క్రామన్తే। తస్మిం చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రతిష్ఠంతే।। తత్ యథా.., మక్షికా మధుకర రాజానమ్ ఉత్క్రామంతం→ సర్వా ఏవ ఉత్క్రామంతే। |
అప్పుడు ముఖ్యప్రాణము అభిమానము పొంది, (దేహము నుండి) పైకి లేచిపో ప్రారంభించింది. అప్పుడా 16 (పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు + మనస్సు) కూడా నిస్సహాయంగా దేహము నుండి బయల్వెడలసాగాయి. ఇంతలోనే ప్రాణము దేహంలో తిరిగి ప్రతిష్ఠ పొందగానే, అవన్నీ కూడా ప్రతిష్ఠ పొందాయి. దృష్టాంతానికి.., తేనేటిగ - రాణి బయలుదేరబోగానే, తక్కిన తేనేటీగలన్నీ తేనె తుట్టి నుండి బయల్వెడలబోతున్న విధంగా జరిగింది. |
తస్మిం చ ప్రతిష్ఠమానే, సర్వా ఏవ ప్రతిష్ఠంత।। ఏవం వాక్- మనః-చక్షుః శ్రోత్రం చ। తే ప్రీతాః ప్రాణం స్తున్వన్తి।। |
ప్రాణ ప్రతిష్ఠచే అవన్నీ కూడా తిరిగి ప్రతితిష్ఠత పొందాయి. అప్పుడు ముఖ్య ప్రాణము యొక్క ఔన్నత్యమును గుర్తించి వాక్కు - మనస్సు - చక్షువులు - చెవులు మొదలైనవన్నీ - ‘‘ప్రీతి పూర్వకంగా ప్రాణశక్తిని స్తుతించ సాగాయి’’. |
ఏషోఽగ్నిస్తపత్యేష సూర్య ఏష పర్జన్యో మఘవానేష వాయుః ఏష పృథివీ రయిర్దేవః సదసచ్చామృతం చ యత్ .. 2.5.. |
|
2-5.) ఏషో → అగ్నిః తపతి। ఏష→ సూర్య। ఏష→ పర్జన్యో- మఘవాన్। ఏష→ వాయుః। ఏష →పృథివీ రయిర్దేవః - సత్ - అసత్ చ, అమృతం చ యత్।। |
కాబట్టి మిత్రులారా! - అట్టి ప్రాణశక్తియే → అగ్నిగా ప్రకాశిస్తోంది. → అదియే వర్షముగా కురుస్తోంది. → ప్రాణమే దేవతలకు అధిపతియగు ఇంద్రరూపము కూడా! - అదియే ఈ భూమి యొక్క రూపము. నామరూపాత్మకమైనదంతా కూడా ప్రాణతత్త్వమే. - సత్తు - అసత్తుగా, మృత-అమృత రూపంగా, దేవతా-ఉపాసక రూపంగా కనిపించేదంతా సర్వదా సర్వత్రా ఏకమే అయి ఉన్న ప్రాణశక్తితత్త్వమే! |
అరా ఇవ రథనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం . ఋచో యజూగ్ంషి సామాని యజ్ఞః క్షత్రం బ్రహ్మ చ .. 2.6.. |
|
2-6.) అరా ఇవ రథనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితమ్। ఋచో-యజూగ్ంషి - సామాని - - యజ్ఞః - క్షత్రం బ్రహ్మ చ।। |
రథచక్రము యొక్క ఇరుసులో ‘ఆకులు’ ఇమిడి ఉన్నట్లుగా ప్రాణశక్తి యందే ఈ సమస్తము ప్రతిష్ఠితమైయున్నది. → ఋక్కులు, యజస్సులు, సామములు, యజ్ఞము, క్షత్రియులు (కార్యకుశలురు), బ్రాహ్మణులు (బ్రహ్మతత్త్వాధ్యయనులు) మొదలైనవన్నీ కూడా ప్రాణశక్తిలోనే ఏర్పడినవై ఉంటున్నాయి. ప్రాణశక్తి తనదైనవాడే ప్రాణేశ్వరుడు (లేక) ముఖ్య ప్రాణము. ఓ ప్రాణేశ్వరా! ముఖ్యప్రాణమా! |
ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే . తుభ్యం ప్రాణ ప్రజాస్త్విమా బలిం హరంతి యః ప్రాణైః ప్రతితిష్ఠసి .. 2.7.. |
|
2-7.) ప్రజాపతిః చరసి గర్భే త్వమేవ (‘త్వమ్’ ఏవ) ప్రతిజాయసే। తుభ్యం, (హి) ప్రాణ - ప్రజాస్తి ఇమాః ‘బలిం’ హరంతి యః ప్రాణైః ప్రతితిష్ఠసి।। |
నీవే ప్రజాపతివై సమస్త గర్భములయందు సంచారములు చేస్తూ మరల - మరల జనిస్తున్నావు. ఓ ప్రాణదేవా! ఈ సర్వదేహాలలో ఇంద్రియాలతో నివసిస్తూ ఉన్న నీకు ఈ జీవులంతా (శబ్ద-స్పర్శ-రూప-రస- గంధానుభవాలు అనబడే) కానుకలను (అనుక్షణం) బలి సమర్పణ (Presenting, Gifting) చేస్తున్నారు. |
దేవానామసి వహ్నితమః పితౄణాం ప్రథమా స్వధా . ఋషీణాం చరితం సత్యమథర్వాంగిరసామసి .. 2.8.. |
|
2-8.) దేవానామ్ అసి వహ్ని తమః। పితృణాం ప్రథమా స్వధా। ఋషీణాం చరితం సత్యం అథర్వ అంగీరసామ్ అసి।। |
ఓ ప్రాణదేవా! మీరు దేవతలకు కూడా హవిస్సును చేరవేసే వహ్నిదేవులు. శ్రేష్ఠ దేవాదిదేవులు. - అట్లాగే పిత్రు దేవతలకు ‘స్వథా’ రూపమగు పిండాహారము జేరవేయు అగ్నిదేవత మీరే। -ఋషుల యొక్క ముఖ్య సాధన - సాధ్య వస్తువు కూడా మీరే. (అంగీరసుడు మొదలైన మహర్షుల సత్యమార్గము, పరాకాష్ఠ ఆశయము - కూడా మీరే।) |
ఇంద్రస్త్వం ప్రాణ తేజసా రుద్రోఽసి పరిరక్షితా . త్వమంతరిక్షే చరసి సూర్యస్త్వం జ్యోతిషాం పతిః .. 2.9.. |
|
2-9.) ఇంద్రః త్వమ్, ప్రాణ తేజసా। రుద్రో అసి, పరిరక్షితా। త్వమ్ అంతరిక్షే చరసి సూర్యః। త్వమ్, జ్యోతిషాం పతిః।। |
ఓ ప్రాణ భగవాన్! ప్రాణశక్తిమంతుడగు ప్రాణ దేవతా! త్రిలోకనాధుడగు ఇంద్రునికి కూడా తేజోరూప - రుద్రుడవైనట్టి పరిరక్షకుడవు. ఇంద్రుడవు, రుద్రుడవు కూడా నీవే. ఆకాశంలో సంచరించే సూర్యుడవు నీవు. జ్యోతులకే జ్యోతి స్వరూపుడవు. |
యదా త్వమభివర్షస్యథేమాః ప్రాణ తే ప్రజాః . ఆనందరూపాస్తిష్ఠంతి కామాయాన్నం భవిష్యతీతి .. 2.10.. |
|
2-10.) యదా త్వమ్ అభివర్షసి అథ ఇమాః ప్రాణ తే ప్రజాః। ఆనందరూపా తిష్ఠంతి కామాయాన్నం (కామాయ అన్నం) భవిష్యతి - ఇతి।। |
ఓ ప్రాణశక్తి స్వరూపా! మీరు అభివర్షించటం చేతనే సర్వజీవులు కోరుకొనే ఆహారం పొందిన వారగుచు, ఆనంద భరితులగుచున్నారయ్యా! మీరు జీవింపజేయటంచేతనే జీవులంతా జీవత్వము పొందువారై ఉంటున్నారు. |
వ్రాత్యస్త్వం ప్రాణైకర్షరత్తా విశ్వస్య సత్పతిః . వయమాద్యస్య దాతారః పితా త్వం మాతరిశ్వ నః .. 2.11.. |
|
2-11.) వ్రాత్యః త్వమ్, ప్రాణ। ‘ఏకఋషిః’ అత్తా। విశ్వస్య సత్పతిః। వయమ్ ఆద్యస్య దాతారః పితా త్వమ్ మాతరిశ్వనః।। |
ఓ ప్రాణచైతన్యమా! నీవు వ్రాత్యుడవు. (సమిష్టిరూపుడవు). శుద్ధుడవు! అధర్వణుల ప్రతిపాదితమైన ‘ఏకఋషి’ అనే పేరు గల అగ్ని స్వరూపుడవై సర్వమునకు భోక్తవు. - ఈ విశ్వానికి గొప్ప ప్రభువువు! - మేము మీకు నేయి (హవిస్సులను) సమర్పించుచూ, - మీకు చెందిన యజ్ఞోపాసకులము - అయి ఉంటున్నాము. ఓ మాతారిశ్వా! వాయు దేవ స్వరూపా! మీరు మాకు తండ్రి! (God Father) |
యా తే తనూర్వాచి ప్రతిష్ఠితా యా శ్రోత్రే యా చ చక్షుషి . యా చ మనసి సంతతా శివాం తాం కురు మోత్క్రమీః .. 2.12.. |
|
2-12.) యా తే తనుః, వాచి ప్రతిష్ఠితా, యా శ్రోత్రే, యా చ చక్షుషి। యా చ మనసి, సంతతా శివాం తాం కురు మా ఉత్క్రమీః (మోత్క్రామీః)।। |
ప్రాణ భగవన్! - ఏ మీ యొక్క తనువు (శరీరము) మా మాటలలోను, మా చెవులలోను, చక్షువులలోను, మనస్సులోను, ప్రతిష్ఠితమైయున్నదో, ఆ- మీ సామీప్యము మా మాటలను - చెవులను - మనస్సును పరమ పవిత్రముగా తీర్చిదిద్దునుగాక! అంతేగాని, మీరు మమ్ములను విడచి ఎటూ వెళ్ళనే- వెళ్లకండి. మా వెంటనంటియే ఉండండి. |
ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం . మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విధేహి న ఇతి .. 2.13.. |
|
2-13.) ప్రాణస్య ఇదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితమ్। మాతా ఇవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విథేహి న। ఇతి।। ఇతి ద్వితీయ ప్రశ్నః |
హే ప్రాణతత్త్వమా! ఈ మూడులోకములలో ఎక్కడెక్కడ ఏదేదైతే ప్రతిష్ఠితమై ఉన్నదో.. అదంతా కూడా ప్రాణదేవుడువగు మీవశములోనే ఉన్నది! తల్లి బిడ్డను రక్షించునట్లు మమ్ములను రక్షించండి! మాకు సంపద, మేధ ప్రసాదించండి! - ఈ విధంగా ఆకాశ-వాయు- అగ్ని- అపః-పృథివీ, పంచజ్ఞాన- కర్మేంద్రియాలు అంతరంగ విభాగాలు లేచి నిలచుని ప్రాణదేవునికి స్తోత్రములు సమర్పించసాగాయి. అందుచేత ఓ భార్గవో వైదర్భీ! పంచభూత - దశేంద్రియ - మనో విశేషాలన్నీ శరీరములో దేవతలు. ప్రాణము ముఖ్య దేవత। ఇతి ద్వితీయ ప్రశ్నః |
అథ హైనం కౌశల్యశ్చాశ్వలాయనః పప్రచ్ఛ . భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిఞ్శరీర ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రతిష్ఠతే కేనోత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథమధ్యాత్మమితి .. 3.1.. |
|
3-1.) అథ హి ఏనం (అథహైనం) కౌసల్యశ్చ అశ్వలాయనః పప్రచ్ఛ :- భగవన్! కుత (ఎక్కడి నుండి) ఏష ప్రాణో జాయతే? కథమ్ (ఎట్లా) ఆయాత్ అస్మిన్ శరీరే? ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే? కేన ఉత్క్రమతే? కథం బాహ్యమ్ అభిధత్తే? కథం అధ్యాత్మమ్? ఇతి।। |
ఆ తరువాత అశ్వల పుత్రుడు అయినట్టి కౌసల్యుడు లేచి నిలుచుని, - నమస్కరించి-ఈ విధంగా పిప్పలద మహర్షిని సంప్రశ్నించారు :- హే భగవన్! పిప్పలాద మహర్షీ! ఈ ప్రాణశక్తితత్త్వము ఎక్కడి నుండి పుట్టుచున్నది? ఈ సర్వ శరీరాలలోకి ఎట్లా ప్రవేశిస్తోంది (వస్తోంది)? తనను తానే సర్వరూపాలుగా (ఇంద్రియ - మనో రూపాలుగా) ఎట్లా విభజించుకొన్నదై ఉంటోంది? ఎవని ప్రమేయంగా శరీరాలలో ప్రవేశిస్తోంది? తిరిగి ఎవని చేత దేహాల నుండి బయల్వెడలుతోంది? ఎట్లా వెలుపలినంతా భరిస్తోంది? అథి - దైవికమైన బాహ్య జ్ఞానాన్ని, ఆధ్యాత్మికమైన అంతర్ - జ్ఞానాన్ని ఎట్లా ధరిస్తోంది? దేహములను విడచినప్పుడు ఎక్కడికి వెళుతోంది? |
తస్మై స హోవాచాతిప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్ఠోఽసీతి తస్మాత్తేఽహం బ్రవీమి .. 3.2.. |
|
3-2.) తస్మై స హో వాచ :- ‘‘అతిప్రశ్నాన్ పృచ్ఛసి। బ్రహ్మిష్ఠో అసీతి। తస్మాత్ తే అహం బ్రవీమి। (ఇతి।।) |
అందుకు మహర్షి చెప్పసాగారు. చాలా గొప్ప ప్రశ్న వేస్తున్నావయ్యా! నీవు బ్రహ్మనిష్ఠుడవు కాబట్టే (ప్రాణతత్త్వము గురించి నేను చెప్పిన వివరాలను విచారణతో అధిగమించి) ఇట్లా ప్రశ్నించావు. నాకు సంతోషము. అందుచేత నీకు సమాధానం చెప్పుచున్నాను. విను. |
ఆత్మన ఏష ప్రాణో జాయతే . యథైషా పురుషే ఛాయైతస్మిన్నేతదాతతం మనోకృతేనాయాత్యస్మిఞ్శరీరే .. 3.3.. |
|
3-3.) ఆత్మన ఏష ప్రాణో జాయతే। యథైషా (యథా ఏషా) పురుషే ఛాయా। ఏతస్మిన్ ఏతత్ ఆతతం మనో కృతేన ఆయాత అస్మిన్ శరీరే।। |
ప్రాణము ‘ఆత్మ’ నుండే (From the Absolute "SELF") జనిస్తోందయ్యా! సాయంకాలపు యండలో నడుస్తున్న బాటసారిని (పురుషుని) నీడ విస్తరించినదై ఉంటోంది చూచావా? ఆ విధంగా ఆత్మపై ప్రాణము విస్తరించినదై ఉంటోంది. అట్టి ప్రాణశక్తి ఈ దేహములోనికి మనస్సు యొక్క చర్యలు కారణంగా ప్రవేశించినదగుచున్నది. |
యథా సమ్రాదేవాధికృతాన్ వినియుంక్తే . ఏతన్ గ్రామానోతాన్ గ్రామానధితిష్ఠస్వేత్యేవమేవైష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే .. 3.4.. |
|
3-4.) యథా సమ్రాట్ ఏవ అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్। ఏతాన్ గ్రామాన్ అధితిష్ఠ స్వేత్యేవమ్ ఏవ ఏష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథక్ ఏవ సన్నిధత్తే।। |
ఏ విధంగా అయితే ఒక సామ్రాట్టు (చక్రవర్తి) కొందరు అధికారులను నియమించి, ‘‘మీరు మీరు ఈ-ఆ గ్రామాలలో నివసించి, పరిపాలిస్తూ ఉండండి’’ అని ఆజ్ఞాపిస్తాడో.., ఆ రీతిగా.., (ఆత్మ నుండి బయల్వెడలిన) ముఖ్య ప్రాణము తదితర అపాన - వ్యాన - ఉదాన - సమాన - సప్రాణములను వాటి వాటి పనులలో వినియోగిస్తోంది! ఆత్మ ఎల్లపుడు ఏకమే। అట్లాగే ప్రాణము (శక్తి) సర్వదా ఏకమే అయి ఉండి అనేకమంతా సంప్రదర్శిస్తోంది. అందుచేతనే ఆత్మజ్ఞులకు- అనేకముగా ఇదంతా కనిపిస్తూ కూడా, ‘ఏకమే’-అని అనిపిస్తూ ఉంటుంది. |
పాయూపస్థేఽపానం చక్షుఃశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః . ఏష హ్యేతద్ధుతమన్నం సమం నయతి తస్మాదేతాః సప్తార్చిషో భవంతి .. 3.5.. |
|
3-5.) పాయు- ఉపస్థే→ ‘అపానం’। చక్షుః - శ్రోత్రే - ముఖ - నాశికాభ్యాం → ‘ప్రాణః’। స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు → ‘సమానః’। ఏష హి ఏతత్ హుతమ్ అన్నం సమం నయతి। - తస్మాత్ (దాని నుండి) ఏతాః సప్తార్చిషో భవంతి।। |
(ఒక బాటసారిని నీడ ఆక్రమించుకొన్న రీతిగా ఆత్మను ఆవరించిన ముఖ్యప్రాణము యొక్క ఆదేశానుసారంగా).. - అపానము → ‘‘పాయువు - ఉపస్థ’’ అనబడే విసర్జనేంద్రియాలలో ఉంటుంది. - కళ్లు - చెవులు - ముఖము - ముక్కులలో స్వయముగా ముఖ్యప్రాణము ఉంటోంది. శరీర మధ్య భాగములో సమాన ప్రాణము ఉన్నదై జీవుడు స్వీకరించిన ఆహారమును ఆయా దేహభాగాలన్నిటికీ సరి సమానంగా పంచిపెడుతోంది. దాని నుండి ఏడు జ్వాలలు (ఏడు జ్ఞానేంద్రియాలు - కళ్ళు - చెవులు - ముక్కు రంధ్రాలు - నోరు) తేజము పొందుచున్నాయి. |
హృది హ్యేష ఆత్మా . అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతం శతమేకైకస్యా ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖానాడీసహస్రాణి భవంత్యాసు వ్యానశ్చరతి .. 3.6.. |
|
3-6.) హృది హి ఏష ఆత్మా। అత్ర ఏతత్ ఏకశతం నాడీనామ్। తాసాం శతమ్, శతమ్-ఏకైకస్యాం (101) ధ్వాసప్తతిః - ద్వాసప్తతిః (72-72 చొప్పున) ప్రతి శాఖానాడీ సహస్రాణి (72000) భవంతి। ఆసు ‘వ్యానః’ చరతి।। |
ఆత్మ హృదయప్రదేశమున ముఖ్యస్థానము కలిగినదై ఉంటోంది. అట్టి హృదయంలో 101 నాడులు - ప్రవేశము కలిగి ఉన్నాయి. (అందులో 100 నాడులు దేహమంతా విస్తరించి ఉన్నాయి. ఒక్కటి మాత్రం బ్రహ్మరంధ్రము ద్వారా ఊర్ధ్వంగా విస్తరించి ఉన్నది). - అట్టి ప్రతి ఒక్కనాడికి నూరు-నూరు 72 → ప్రతిశాఖానాడీ సహస్రములై, (72000) చొప్పున అన్ని కలిసి 72000 నాడీ - ఉపనాడులు ఉంటాయి. వీటన్నిటిలో వ్యానప్రాణము సంచరించటం జరుగుతోంది. |
అథైకయోర్ధ్వ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం .. 3.7.. |
|
3-7.) అథ ఏకయో ఊర్ధ్వ ‘ఉదానః’ పుణ్యేన పుణ్యం లోకం నయతి। పాపేన పాపమ్। ఉభాభ్యామ్ ఏవ మనుష్య లోకమ్।। |
ఇక ఉదాన ప్రాణము ఉన్నది కదా! అది ఒక నాడి ద్వారా ఉర్ధ్వంగా పుణ్యకర్మలచేత ఈ జీవుని పుణ్యలోకాలు చేరుస్తోంది. పాపకర్మల చేత ఈ జీవుని (ఆ ఉదానప్రాణము) పాపపు లోకాలు చేరుస్తోంది. రెండూ (పాప-పుణ్యాలూ) ఉంటే - మనుష్యు లోకం జేరుస్తోంది. |
ఆదిత్యో హ వై బాహ్యః ప్రాణ ఉదయత్యేష హ్యేనం చాక్షుషం ప్రాణమనుగృహ్ణానః . పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్య అపానమవష్టభ్యాంతరా యదాకాశః స సమానో వాయుర్వ్యానః .. 3.8.. |
|
3-8.) ఆదిత్యో హ వై బాహ్యః ప్రాణ ఉదయతి - ఏష హి ఏనం చాక్షుషం ప్రాణమ్ అనుగృహాణానః। పృథివ్యాం యా దేవతా సైసా (స ఏషా) పురుషస్య ‘అపానం’ అవష్టభ్యాం అంతరా యత్ ఆకాశః, స ‘సమానో’ వాయుః ‘వ్యానః’।। |
ఆదిత్యుడే బహిః (బాహ్య) ప్రాణము. ఎందుకంటే ఆదిత్యుడే కళ్లలోని ముఖ్య ప్రాణాన్ని అనుగ్రహిస్తున్నారు. సూర్యకిరణములనుండి భూదేవత ఈ పురుషుని యొక్క అపానమును వశపరరచుకొని జీవులకు ఆహారము అనుగ్రహిస్తోంది. భూమి - ఆకాశముల అంతరాళంలో సంచరించేది సమాన వాయువు. సర్వత్రా సామాన్య రూపంగా ఉన్న వాయువు పేరు ‘వ్యానవాయువు’. (ఈ విధంగా ఈ ‘విశ్వము’ అనే దేహమంతా పంచప్రాణములు సంచారములు కలిగియుండి, జీవశక్తిని, జీవనశక్తిని ప్రదీపింపజేస్తున్నాయి. ఇదే తతంగము దేహములో కూడా జరుగుతోంది). |
తేజో హ వా ఉదానస్తస్మాదుపశాంతతేజాః . పునర్భవమింద్రియైర్మనసి సంపద్యమానైః .. 3.9.. |
|
3-9.) తేజో హ వా (నిజానికి) ‘ఉదానమ్’ తస్మాత్ ఉపశాంత తేజాః। పునః భవమ్ ఇంద్రియైః, మనసి సంపద్యమానైః।। |
ఈ జీవులలో జీవిస్తూ ఉండగా కనిపిస్తున్న జీవ తేజస్సు ఉదాన ప్రాణరూపమే! అందుచేతనే ‘‘ఉదాన ప్రాణ ప్రదర్శన’’ అయినట్టి తేజస్సు ఉపశమించి నప్పుడు ఆ జీవుడు (దేహి) ఇంద్రియార్థములతో సహా(శబ్ద స్పర్శ రూప రస గంధ భావనలతో సహా) ఆ దేహము వదలి, మరొక దేహరూపంగా పునర్జన్మ పొందు చున్నాడు. |
యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి . ప్రాణస్తేజసా యుక్తః సహాత్మనా తథాసంకల్పితం లోకం నయతి .. 3.10.. |
|
3-10.) యత్ చిత్తః తేన ఏష ‘ప్రాణమ్’ ఆయాతి। ప్రాణః తేజసా యుక్తః। సహ ఆత్మనా యథా సంకల్పితం లోకం నయతి।। |
ఈ పురుషుడు (జీవుడు) ఎట్టి ఇష్ట-ప్రియ-ఇచ్ఛా రూపమైనటువంటి చిత్తము కలిగి ఉంటాడో,.. ఆ చిత్తమును వెంట ప్రాణము కూడా వెంటనంటి, ఆయా కోరికలకు అనుకూలమగు దేహములో ప్రవేశము పొందుతోంది. ప్రాణము ఉదాన ప్రాణరూపంగా తేజస్సుతో కూడుకొని, చిత్తానుసారము నూతన దేహమును ప్రవేశిస్తోంది. అనగా ప్రాణశక్తి ఆత్మను అనుసరిస్తూ సంకల్పానుసారంగా ఆయా లోకములు ప్రవేశిస్తోందయ్యా! పునర్జన్మ చిత్తానుసారమే ఉంటోంది! (అయితే, ఆత్మపట్ల లోకములు మొదలైనవి స్వకీయ కల్పనలు మాత్రమే!). |
య ఏవం విద్వాన్ ప్రాణం వేద న హాస్య ప్రజా హీయతేఽమృతో భవతి తదేషః శ్లోకః .. 3.11.. |
|
3-11.) య ఏవం విద్వాన్ ప్రాణం వేద, నహి అస్య ప్రజాః హీయతే। (స) అమృతో భవతి। తత్ ఏష శ్లోకో భవతి।। |
ఏ విద్వాంసుడైతే ఈ రీతిగా ప్రాణము యొక్క సర్వత్వమును, చిత్తానుసార దేహప్రవేశమును, పంచభూతములను, మనో బుద్ధి చిత్త అహంకారాలను ఉద్దీపింపజేయునదిగాను,- తెలుసుకొని, ప్రాణోపాసనగా ఉపాసిస్తూ ఉంటాడో, ఆతని సంతతి (తదనంతర జన్మలు).. అల్పత్వము - క్షీణత్వము పొందవు. ఇది మహనీయులు ప్రవచిస్తున్న ‘‘ప్రాణతత్త్వ గానము’’. |
ఉత్పత్తిమాయతిం స్థానం విభుత్వం చైవ పంచధా . అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇతి .. 3.12.. |
|
3-12.) ఉత్పత్తిం ఆయతిం స్థానం విభుత్వం చ ఏవ పంచధా। అధ్యాత్మం చ ఏవ ప్రాణస్య విజ్ఞాయా అమృతమ్ అశ్నుతే।। విజ్ఞాయా అమృతమ్ అశ్నుత - ఇతి।। ఇతి తృతీయ ప్రశ్నః |
ఈ విధంగా ప్రాణతత్త్వము యొక్క → - ఆత్మ నుండి ఆవిర్భావము, - రాక (దేహప్రవేశము) - (ఆయతిమ్) - స్థానము (Placemets) , - విభుత్వము (అంతటా వ్యాపించి బాహ్య-అభ్యంతరముల ప్రదర్శనమై ఉండటము (లేక, సప్రాణత్వము), - 5 విభాగములుగా (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములుగా) అగుచుండటము, తెలుసుకొని ఉంటాడో, - అట్టి అద్దాని అంతః ప్రకృతిని తెలుసుకొంటున్నవాడు ప్రజ్ఞావంతుడు. మృత్యువును జయించి అమరుడౌతాడు. అవును! అమరుడే అగుచున్నాడు! కనుక, నిశ్చలమగు ఆత్మయొక్క శక్తి ప్రదర్శనమే - ప్రాణము. |
అథ హైనం సౌర్యాయణి గార్గ్యః పప్రచ్ఛ . భగవన్నేతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మింజాగ్రతి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవంతీతి .. 4.1.. |
|
4-1.) ఓం। అథ హి ఏనం సౌర్యాయణీ గార్గ్యః పప్రచ్ఛ: భగవన్! ఏ తస్మిన్ పురుషే కాని (ఏవి) స్వపంతి? కాని అస్మిన్ జాగ్రతి? కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి? (కస్య) (me]కి) ఏతత్ సుఖం భవతి? కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవంతి? ఇతి।। |
ఇకప్పుడు సూర్యుని మునిమునుమడు (సూర్యవంశజుడు), గర్గగోత్రుడు అయినట్టి సౌర్యాయణి - పిప్పలాదమహర్షికి తన పరిప్రశ్నను విన్నవించారు. భగవన్! పిప్పలాద గురువర్యా! - ఈ శిరస్సు - కాళ్ళు - చేతులు మొదలైనవి గల ఈ జీవుడు నిద్రిస్తుంటే ఏ ఏ ఇంద్రియములు నిద్రిస్తున్నాయి? - ఏఏ ఇంద్రియములు మేల్కొనియే ఉంటున్నాయి? - ఈ జీవుడు నిదురిస్తూ ఉండగా, అప్పుడు కూడా ఉండి, ఏ దేవత స్వపానుభవమును, స్వప్నానుభూతిని ఆస్వాదిస్తోంది? (స్వప్నం చూచే దేవత ఎవరు?) - స్వప్నానుభవము ఎవరి కల్పన? ఆ స్వప్నానుభూతి యొక్క సుఖమును పొందుచున్నదెవ్వరు? ఎవరికి? - దేనిపై స్వప్న - స్వప్నాంతర్గత విశేషాలన్నీ ఆధారపడినవై ఉంటున్నాయి? |
తస్మై స హోవాచ యథా గార్గ్య మరీచయోఽర్కస్యాస్తం గచ్ఛతః సర్వా ఏతస్మింస్తేజోమండల ఏకీభవంతి తాః పునః పునరుదయతః ప్రచరంత్యేవం హ వై తత్ సర్వం పరే దేవే మనస్యేకీభవతి తేన తర్హ్యేష పురుషో న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశతే నాభివదతే నాదత్తే నానందయతే న విసృజతే నేయాయతే స్వపితీత్యాచక్షతే .. 4.2.. |
|
4-2.) తస్మై స హోవాచ: యథా, గార్గ్య! మరీచయో (కిరణాలు) అర్కస్య - అస్తం గచ్ఛతః (అస్తమించే) సర్వా, ఏ తస్మిన్ తేజో మండల ఏకీ భవంతి.., తాః పునః పునరుదయతః ప్రచరంతి..। → ఏవం హవై (అదేరీతిగా) తత్ సర్వం పరే దేవే మనస్య → ఏకీ భవతి।। |
అప్పుడు సద్గురువు యొక్క సమాధానం : ఓ గార్గ్యా! వినండి! సూర్యుడు రోజు అస్తమించటం చూస్తూ ఉంటాము కదా! అట్లా అస్తమిస్తున్నప్పుడు అంతదాకా ప్రసరిస్తున్న సూర్యకిరణాలు ఏమౌతున్నాయి? వస్తువును అంటిబెట్టుకొని ఉంటున్నాయా? లేదు. సూర్యతేజోమండలముతో ఏకీభూతమగుచున్నాయి. మరల సూర్యోదయం అయినప్పుడు? తిరిగి సూర్యకిరణాలు ప్రసరిత మౌతున్నాయి! అదేవిధంగా దివ్య-దేవతా స్వరూపములగు ఇంద్రియానుభవములన్నీ కూడా నిద్రపోయినవాని మనస్సుతో ఏకీభూతమౌతున్నాయి. |
తేన తర్హి (అప్పుడు) ఏష పురుషో.. - న శృణోతి। న పశ్యతి। న జిఘ్రతి। - న రసయతే। న స్పృశతే। న అభివదతే। నా-దత్తే। న ఆనందయతే। న విసృజతే। నేయ ఆయతే। (నేయాయతే)। (తదా) స్వపితి (నిద్రిస్తున్నాడు) - ఇతి ఆచక్షతే ।। |
ఆ విధంగా అప్పుడు (తర్హి) గాఢనిద్రలో ప్రవేశించిన ఈ పురుషుడు → ఇక ఇంద్రియములతో ఏదీ వినడు. చూడడు. వాసన ఆస్వాదించడు. రుచి చూడడు. స్పర్శ అనుభవించడు. మాటలాడడు. ఏదీ స్వీకరించడు. ఆనందించడు. విసర్జించడు. కదలడు. అవన్నీ ఆత్మస్వరూపుడగు జీవుని మనస్సుతో అస్తమించిన సూర్యుని సూర్యకిరణాల వలె ఏకీభూతమౌతాయి. (ఇతి) అని విజ్ఞులు సుస్పష్టపరుస్తూ.. ఆచక్షతే। చెప్పుచున్నారు.) |
ప్రాణాగ్నయ ఏవైతస్మిన్ పురే జాగ్రతి . గార్హపత్యో హ వా ఏషోఽపానో వ్యానోఽన్వాహార్యపచనో యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాదాహవనీయః ప్రాణః .. 4.3.. |
|
4-3.) ప్రాణాగ్నయ ఏవై తస్మిన్ పురే జాగ్రతి! |
(గాఢ నిద్రా పరవశుని ఇంద్రియానుభవములన్నీ మనస్సుతోను, మనస్సు ఆత్మయొక్క నిర్విషయత్వముతోను ఏకీభూతమగుచుండగా) ప్రాణాగ్నులు మాత్రము ఆ శరీరపురంలో మేలుకొనియే ఉంటున్నాయి. |
గార్హపత్యో హ వా ఏషో ‘అపానో’’। ‘వ్యానో’ అన్వాహార్య పచనో। యత్ గార్హపత్యాత్ ప్రణీయతే, ప్రణయానాద (తీసుకోబడినటువంటి) ఆహవనీయః ‘‘ప్రాణః’’।। |
(1) గార్హ పత్యాగ్ని - అపాన ప్రాణము (Out going Air Push) (2) అన్వాహార్యాగ్ని - వ్యానము (3) అన్వాహార్య పచనాగ్ని → ప్రాణము గార్హపత్యాగ్ని నుండి ప్రాణశక్తి తీసుకొని రాబడుచూ ఉండటం చేత.. ఆ సందర్భంలోని ప్రాణసంచాలనము - ‘ఆవహనీయాగ్ని’ అని పిలువబడుతోంది! |
యదుచ్ఛ్వాసనిఃశ్వాసావేతావాహుతీ సమం నయతీతి స సమానః . మనో హ వావ యజమానః . ఇష్టఫలమేవోదానః . స ఏనం యజమానమహరహర్బ్రహ్మ గమయతి .. 4.4.. |
|
4-4.) యత్ ఉచ్ఛ్వాస - నిఃశ్వాసౌ ఏతాః ఆహుతీ (ఏతావాహుతీ) సమం నయతి ఇతి స ‘‘సమానః’’। మనో హవావ, ‘‘యజమాన’’। ఇష్టఫలమ్ ఏవ ‘ఉదానః’। స ఏనం యజమానమ్- అహరహమ్ బ్రహ్మ గమయతి।। |
నిద్రపోవువానిలో ఉచ్ఛ్వాసనిః శ్వాసలు అనే రెండు ఆహుతులను శరీరమంతా ప్రాణశక్తి తీసుకుపోతూ ఉండటం చేత ‘‘సమాన ప్రాణము’’.. అని అంటారు. (ఆ సమానమే ‘హోత’ - అనే ఋత్త్విక్కు). అయితే, ఈ సమస్త దృశ్యానుభవ వ్యవహారానికంతటికీ యజమాని ఎవ్వరూ అంటే,.. ‘‘మనస్సే’’. నిద్రలో మనస్సును ప్రాణశక్తి బ్రహ్మమునకు చేరుస్తూ ఉంటుంది. (మనస్సు మౌనము వహించుటచేతనే - ఈ పురుషుడు ‘‘హాయిగా నిద్రపోయాను’’ అని అంటాడు). అలా బ్రహ్మమును జేర్చే ప్రాణశక్తియే ‘ఉదానము’ అని పిలువబడుతోంది. అందుచేత గాఢ నిద్రప్పుడు బ్రహ్మముతో మమేకానుభవానికి (1) ఉదాన ప్రాణము- వార్తాహరుడు. (2) జీవుడు యజమాని! |
అత్రైష దేవః స్వప్నే మహిమానమనుభవతి . యద్దృష్టం దృష్టమనుపశ్యతి శ్రుతం శ్రుతమేవార్థమనుశృణోతి దేశదిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి దృష్టం చాదృష్టం చ శ్రుతం చాశ్రుతం చానుభూతం చాననుభూతం చ సచ్చాసచ్చ సర్వం పశ్యతి సర్వః పశ్యతి .. 4.5.. |
|
4-5.) అత్ర ఏష దేవః స్వప్నే మహిమానమ్ అనుభవతి! - యత్ దృష్టం దృష్టమ్ అనుపశ్యతి; శృతమ్ శృతమేవ అర్థమ్ అనుశృణోతి; దేశ దిక్ - అంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి। |
(జాగ్రత్‌లో బాహ్య దృశ్యము యొక్క ‘మహిమ’ ద్రష్టకు అనుభవమౌతోంది) అయితే, నిద్రించిన ఈ జీవుడు స్వప్న దృశ్య రూపంగా తన యొక్క ‘‘మహిమ’’నే తాను అనుభూతముగా పొందుచున్నాడు. జాగ్రత్ అవస్థలో నేత్రేంద్రియముతో ఏదిచూచాడో.. అట్టి రీతిగానే స్వప్నములో కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఆ దర్శనము భౌతికమైన కళ్లతో కాదు. - జాగ్రత్‌లో విన్నవే మరల వినుటకై కల్పించుకొని వింటున్నాడు. (కానీ బాహ్యమైన చెవులతో కాదు). - దేశము - దిక్కులు మొదలైనవి ఇతః పూర్వము అనుభవించినవే మరల - మరల అనుభవిస్తున్నాడు. |
దృష్టం చ- అదృష్టం చ, శ్రుతం చ - అశ్రుతం చ- అనుభూతం చ- అననుభూతం చ, సత్ చ - అసత్ చ సర్వం పశ్యతి। సర్వః పశ్యతి।। |
- ఈ జన్మలో చూచినవి-చూడనివి, విన్నవి-విననివి, అనుభూతము అయి ఉన్నవి-అనుభూతము అయి ఉండనివి, సత్యమైనవి- యండమావులవలె అసత్యమైనవి.. అన్నిటినీ చూస్తున్నాడు. అన్నీ అనుభవముగా పొందు చున్నాడు. ‘నిజమే’ అని అప్పటికి భావన చేస్తున్నాడు. |
స యదా తేజసాఽభిభూతో భవతి . అత్రైష దేవః స్వప్నాన్న పశ్యత్యథ యదైతస్మిఞ్శరీర ఏతత్సుఖం భవతి .. 4.6.. |
|
4-6.) స యదా ‘తేజసా’ అభిభూతో భవతి అత్ర ఏష దేవః.., స్వప్నాన్ న పశ్యతి। అథ తదై తస్మిన్ శరీర ఏతత్ సుఖం భవతి।। |
ఎప్పుడు ఈ పురుషుడు (జీవుడు) ఆత్మ-తేజస్సు చేత ఆచ్ఛాదితుడు అవుతాడో.. అప్పుడిక స్వప్న దర్శనమంతా విరమించి వేస్తున్నాడు. అప్పుడు ఈ శరీరము నందు తాను (విషయరాహిత్య కారణంగా పరమాత్మతో జీవాత్మకు ఏర్పడిన సంబంధం చేత)-ఆత్మతో ఏకమగు సుఖము పొందుచున్నాడు. ఇదియే సుషుప్తి అనుభవము. సుషుప్తి సుఖము. |
స యథా సోభ్య వయాంసి వసోవృక్షం సంప్రతిష్ఠంతే . ఏవం హ వై తత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే .. 4.7.. |
|
4-7.) స యథా, సోమ్య! వయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే, ఏవం హవై తత్ సర్వం ‘పర ఆత్మని’ - సంప్రతిష్ఠతే।। |
బిడ్డా! నాయనా! సోమ్యా! ప్రియదర్శనా! స్ఫురద్రూపీ! పక్షులు అక్కడ - ఇక్కడ తిరిగి తిరిగి, సాయం సంధ్యాసమయంలో తాము గూడుకట్టుకొన్న వృక్షముపైకి వచ్చి ప్రశాంతపడతాయి చూచావా?.. ఆ రీతిగా, తన మనస్సు - కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియములతో (దృశ్య) విషయములను జాగ్రత్ -స్వప్నాలలో ఆస్వాదించిన పురుషుడు- గాఢనిద్రా సమయానికి పరమాత్మను సమీపించి, పరత్వమును (Beyondness) పొందినవాడగు చున్నాడు. → ఆత్మ నుండి పురుషుడు, పురుషకారము → పురుషుని నుండి శబ్ద స్పర్శ రూప రసగంధములనబడే పంచతన్మాత్రలు. మాత్రలు బయల్వెడలుచూ జాగ్రత్ - స్వప్న అనుభవ రూపముగా అనుభూతమౌచున్నాయి. సుషుప్తిలోనో.. - ఈ దృశ్య విశ్వసంబంధమైన పంచతన్మాత్రానుభవమంతా తిరిగి పురుషునిలోనే లయమౌతోంది. - పక్షులు గూడు విడచి బయలుదేరి తిరిగి గూటికి చేరుచున్నట్లుగా.. అనుభవాలన్నీ సుషుప్తిలో లీనమై మౌనం వహిస్తున్నాయి. |
పృథివీ చ పృథివీమాత్రా చాపశ్చాపోమాత్రా చ తేజశ్చ తేజోమాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చాకాశశ్చాకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వక్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చాదాతవ్యం చోపస్థశ్చానందయితవ్యం చ పాయుశ్చ విసర్జయితవ్యం చ యాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చాహంకారశ్చాహంకర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ .. 4.8.. |
|
4-8.) పృథివీ చ - పృథివీ మాత్రా చ। ఆపశ్చ - ఆపో మాత్రా చ। తేజశ్చ - తేజో మాత్రా చ। వాయుశ్చ - వాయు మాత్రా చ। ఆకాశశ్చ - ఆకాశ మాత్రా చ। చక్షుశ్చ - ద్రష్టవ్యం చ। శ్రోత్రం చ - శ్రోత్రవ్యం చ। ఘ్రాణం చ - ఘ్రాతవ్యం చ। రసశ్చ - రసయితవ్యం చ। త్వక్ చ - స్పర్శయితవ్యం చ। ‘వాక్’ చ- వక్తవ్యం చ। హస్తౌ చ - ఆదాతవ్యం చ। ఉపస్థశ్చ - ఆనందయితవ్యం చ। పాయుశ్చ - విసర్జియితవ్యం చ। పాదౌ చ - గన్తవ్యం చ । మనశ్చ - మంతవ్యం చ। బుద్ధిశ్చ - బోద్ధవ్యం చ। అహంకారశ్చ - అహం కర్తవ్యం చ। చిత్తం చ - చేతయితవ్యం చ। తేజశ్చ - విద్యోతయితవ్యం చ। ప్రాణశ్చ - విధారయితవ్యం చ।। |
జాగ్రత్ అనుభవము లైనట్టి పృథివి - పృథివీ తన్మాత్ర, (ఇంద్రియానుభవము), జలము - జలతన్మాత్ర, వాయువు - ఆకాశ తన్మాత్ర, కళ్లు - చూచు కార్యక్రమం (తన్మాత్ర), నోరు - రుచిచూచే క్రియాక్రమం (తన్మాత్ర), చర్మము - స్పర్శ, వాక్ - చెప్పడం, చేతులు - తీసుకోబడటం, జననేంద్రియం - ఆనందించటం , పాయువు - విసర్జించటం, మనస్సు - ఆలోచించటం, బుద్ధి- తెలుసుకోవటం, అహంకారము - ‘నేనే కర్తను’ అనుకోవటం, చిత్తము - జ్ఞాపకం పెట్టుకోవటం, ఇష్టం, తేజస్సు - విషయములను ప్రకాశింపజేయటము, ప్రాణములు - దేహ భావధారణ, ఇవన్నీ పురుషునిలో ప్రవేశించి మౌనం వహిస్తున్నాయి. ఆ పురుషుడు తన సహజ / నిజ రూపమగు పరమ పురుషునిలో లీనమై ఉంటున్నాడు. |
ఏష హి ద్రష్టా స్ప్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మంతా బోద్ధా కర్తా విజ్ఞానాత్మా పురుషః . స పరేఽక్షర ఆత్మని సంప్రతిష్ఠతే .. 4.9.. |
|
4-9.) ఏష హి→ ద్రష్టా; స్ప్రష్టా; శ్రోతా; ఘ్రాతా; రసయితా; మంతా; బోద్ధా; కర్తా; విజ్ఞానాత్మా పురుషః। స పరే - అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే।। |
ఏ పురుషునిలో పంచభూత తన్మాత్రలు, కర్మేంద్రియ - జ్ఞానేంద్రియాలు ఇవన్నీ తన తమ చర్యలు - సంచారాలు త్యజించి (చెట్టుకు చేరిన పక్షుల వలె) దాగి ఉంటున్నాయో.. ఆ పురుషుడే.., • ద్రష్ట। శ్రోత। ఘ్రాత (వాసనచూచు) (స్పర్శానుభవము పొందు) స్రష్ట। • రుచిచూచువాడు. ఆలోచనచేయువాడు. • తెలుసుకొనువాడు. ‘నేను కర్తను’ (అహంకర్తా) అని భావించువాడు. ఆతడే విజ్ఞాన స్వరూపపుడగు పురుషుడు (జీవాత్మ). ఆతడే పరమ పురుషుడు. పరమాత్మ కూడా ఆతడే. అంతటికీ ఆవల అక్షరుడై ఉంటున్న వాడు. ఇంద్రియ విషయాలు పురుషునిలోను, పురుషుడు పరమ పురుషునిలోను ప్రతిష్ఠితమై ఉంటున్నాయి. (జ్ఞాని జాగ్రత్‌లో కూడా అట్లే ప్రదర్శిస్తున్నాడు). సముద్రజలంలో తరంగాలవలె క్షరరూపమైనదంతా అక్షరరూపునియందు బయల్వెడలి, ప్రవర్తించి తిరిగి ఆతని అక్షరమునందే లయమగుచున్నది. |
పరమేవాక్షరం ప్రతిపద్యతే స యో హ వై తదచ్ఛాయమశరీరమలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సోమ్య . స సర్వజ్ఞః సర్వో భవతి . తదేష శ్లోకః .. 4.10.. |
|
4-10.) ‘పరమ్’ ఏవ అక్షరమ్ ప్రతిపద్యతే, స యో హ వై తత్ అచ్ఛాయ మ శరీరం, అలోహితం, శుభ్రమ్, అక్షరమ్ - వేదయతే.., యస్తు, సోమ్య! స సర్వజ్ఞః। సర్వో భవతి।। - తత్ ఏష శ్లోకః।। |
భౌతిక దేహానికికైతే ఛాయ ఉండవచ్చు గాక! ఆత్మదేహము ఛాయారహితము, - ఎవ్వరైతే ఆ ఛాయా రహితము, రంగు, రూపు లేనట్టిది, స్వచ్ఛము, అక్షరము అగు (పురుషుడు - జీవుడు స్థానముగా గల) తన యొక్క ‘‘పరమ పురుష స్థానమును’’ - వేదయితే → తెలుసుకుంటాడో, ఆతని ‘‘పరము - అక్షరము’’ అగు తన యొక్క ‘‘సహజ స్వరూపము’’ను జాగ్రత్ స్వప్న సుషుప్తి సందర్భములలోను, దేహ దేహానంతర సందర్భములలోను సర్వదా ‘స్వానుభవుడు’ అగుచున్నాడో- ఆతడే అంతా తెలుసుకొనియున్నవాడు. ఓ సోమ్యా! ప్రియమైన గుణములు కలవాడా! అట్టి పరతత్త్వమును ఎరిగిన వాడు సర్వజ్ఞుడై - సర్వమును తానే అవుతాడు. (I am all this - అను రూపమగు) ఏకధ్యాసను విడువక ఆస్వాదిస్తూ ఉంటాడు. |
విజ్ఞానాత్మా సహ దేవైశ్చ సర్వైః ప్రాణా భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సోమ్య స సర్వజ్ఞః సర్వమేవావివేశేతి .. 4.11.. |
|
4-11.) విజ్ఞానాత్మా సహ దేవైశ్చ సర్వైః ప్రాణా - భూతాని సంప్రతిష్ఠంతి యత్ర, తత్ ‘అక్షరమ్’ వేదయతే యస్తు, సోమ్య! స సర్వజ్ఞః। సర్వమేవా అవివేశ।। ।।ఇతి।। |
ఈ ఈ విజ్ఞానాత్మ (బుద్ధి), సర్వ(జ్ఞానేంద్రియ - కర్మేంద్రియ) దేవతలు, పంచప్రాణాలు - పంచభూతాలు - దేనిలో స్థానము కలిగియున్నాయో, (దేనిలోంచి బయల్వెడలి తిరిగి గాఢ నిద్రా సమయంలో ఉప శమిస్తున్నాయో, జాగ్రత్ సందర్భంలో దేనిలో ప్రవర్తిస్తున్నాయో), -అట్టి స్వస్వభావమగు అక్షరతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు సర్వము తెలుసుకొన్నవాడగుచున్నాడు. సర్వజ్ఞుడై ఉంటున్నాడు. సర్వమునందు తానే ప్రవేశించి ఉన్నవాడుగా, తనయందే ఈ సర్వముగా దర్శించు చున్నాడు. (ఆత్మజ్ఞుడు - ఆత్మానందుడు అగుచున్నాడు!) ఆత్మయే నిత్య జాగృతము. తదితరమైనదంతా ఆత్మయొక్క కల్పిత విన్యాసము. |
అథ హైనం శైబ్యః సత్యకామః పప్రచ్ఛ . స యో హ వై తద్భగవన్మనుష్యేషు ప్రాయణాంతమోంకారమభిధ్యాయీత . కతమం వావ స తేన లోకం జయతీతి . తస్మై స హోవాచ .. 5.1.. |
|
5-1.) ఓం।। అథ హి ఏనం శైబ్యః సత్యకామః
పప్రచ్ఛ: - ‘‘స యో హ వై, తత్, భగవన్! మనుష్యేషు ప్రాయణాంతమ్ ‘ఓం’ కారమ్ అభిధ్యాయత.., కతమం (ఏ యొక్క) వావ స తేన లోకం జయతి?’’ |
స్వామీ! భగవన్! ఏ మానవుడైతే ప్రయాణాంతము (మరణము) వరకు ‘ఓం’కారమును ధ్యానిస్తూ - ఉపాసిస్తూ ఉంటాడో.., అట్టి అభిధ్యానము చేత ఆతనిచే ఏ-ఏ లోకములు జయించబడతాయి? (స్థితి-గతిగా) ఏ ఏ లోకములు సిద్ధించగలవు? |
ఏతద్వై సత్యకామ పరం చాపరం చ బ్రహ్మ యదోంకారః . తస్మాద్విద్వానేతేనైవాయతనేనైకతరమన్వేతి .. 5.2.. |
|
5-2.) తస్మై స హో వాచ: ఏతత్ వై, సత్యకామ! పరం చ; అపరం చ→బ్రహ్మ, యత్ ‘ఓం’ కారః। తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరమ్ అన్వేతి।। |
అందుకు శ్రీ పిప్పలాద మహర్షి ఇట్లా సమాధానం ప్రసాదిస్తున్నారు : ఓ సత్యకామా! వినండి! ‘ఓం’కారమునకు ఇరు పార్శ్వములందు పర - అపరములు ఉన్నాయి. పరము - ఓం → అపరము అందుచేత ‘ఓం’కార తత్త్వోపాసకుడు ఈ పర- అపర బ్రహ్మములలో మొదటి దానిని అందుకుంటూ ఉంటున్నాడు.రెండవదానిని అధిగమించివేసి, ‘పరము’నందు అపరమును ‘ఏకము’ చేసివేయుచున్నాడు. (పర-అపర భేదములను ఓంకారమునందు ఏకము చేసివేయుచునాడు). |
స యద్యేకమాత్రమభిధ్యాయీత స తేనైవ సంవేదితస్తూర్ణమేవ జగత్యామభిసంపద్యతే . తమృచో మనుష్యలోకముపనయంతే స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానమనుభవతి .. 5.3.. |
|
5-3.) స యత్ ఏకమాత్రమ్ అభిధ్యాయీత। స తేనైవ (తేన ఏవ) సంవేదితః తూర్ణం (త్వరగా/వడిగా) ఏవ -జగత్యామ్ అభిసంపద్యతే। తమ్ ‘ఋచో’ మనుష్యులోకమ్ ఉపనయంతే। స తత్ర తపసా - బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానమ్ అనుభవతి।। |
(1) అ-ఉ-మ లలో ఒక్క → (అ) మాత్ర-ఉపాసకుడు: ఆతడు ఒకవేళ్ళ ‘అ’కారరూపమగు ఒక మాత్రను మాత్రమే (God as Third person) ఓంకారముగా ధ్యానిస్తూ ఉంటే.. దాని చేతనే ఆతడు సిద్ధిని పొందినవాడై.. ఆ సిద్ధి స్థానము నుండి తిరిగి త్వరగా, (తూర్ణం ఏవ) - రావటం జరుగుతోంది. ఋక్కులు ఆతనిని మనుష్య లోకానికి తీసుకుపోతున్నాయి. ఆతడు అక్కడ తపస్సు- బ్రహ్మచర్యము శ్రద్ధగా నిర్వర్తించినవాడై బ్రహ్మతత్త్వానుభవుడగు చున్నాడు. |
అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోఽన్తరిక్షం యజుర్భిరున్నీయతే సోమలోకం . స సోమలోకే విభుతిమనుభూయ పునరావర్తతే .. 5.4.. |
|
5-4.) అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే.., సో అంతరిక్షమ్ ‘యజుర్భిః’ ఉన్నీయతే→ ‘‘సోమలోకమ్’’। స సోమలోకే విభూతిమ్ అనుభూయ → పునరావర్తతే।। |
(2) అ-ఉమలలో ద్వి-‘మాత్ర’ ఉపాసకుడు: ఒకవేళ్ళ ఆ ఓంకార ధ్యాత ‘‘అ’’ ‘‘ఉ’’ (పరమాత్మ+ప్రకృతి) అనబడే ద్విమాత్రలను మాత్రమే ఓంకార రూపంగా లేక (ఆత్మ+మనస్సు= పరమాత్మ)గా ధ్యానం చేస్తూ ఉంటే, అది ద్విమాత్ర ధ్యానం (Two out of three) అవుతుంది. అట్టివాడు మరణానంతరము మనస్సుతో ఏకత్వము పొంది యజుస్సుల ద్వారా (ఉపాసనాస్వభావంచే) ఆకాశంలో చంద్రలోకానికి పోయి, ఆ వైభవాన్నంతా అనుభవంగా పొంది తిరిగి మరెప్పుడో మానవ లోకానికి (పునరావృత్తిగా) వస్తున్నాడు. |
యః పునరేతం త్రిమాత్రేణోమిత్యేతేనైవాక్షరేణ పరం పురుషమభి- ధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః . యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యత ఏవం హ వై స పాప్మనా వినిర్ముక్తః స సామభిరున్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాజ్జీవఘనాత్ పరాత్పరం పురిశయం పురుషమీక్షతే . తదేతౌ శ్లోకౌ భవతః .. 5.5.. |
|
5-5.) యః పునః ఏతం త్రిమాత్రేణ ళి‘ఓం’ = (అ+ఉ+మ)రి ఇతి ఏతేనైవ అక్షరేణ ‘‘పరం పురుషమ్’’ అభిద్యాయీత। స తేజసి సూర్యే సంపన్నః। |
(3) అ-ఉ-మల త్రి ‘మాత్ర’ - ఉపాసకుడు: ఏ ఓంకారోపాసకుడైతే ఓం యొక్క త్రిమాత్ర రూపంగా (పరమాత్మ+ ప్రకృతి + జీవాత్మ = ఓం - అని భావనతో- సర్వమ్ ఓంకారమే - అనే అవగాహనతో) ఓం తత్త్వాన్ని ఉపాసిస్తాడో,... తద్వారా ‘‘అక్షర - సర్వస్వరూప’’ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాడో, అట్టివాడు సూర్య తేజస్సుతో ఏకత్వం పొందుచున్నాడు. |
యథా పాదోదరః (పాము) త్వచా (చర్మము) వినిర్ముచ్యతే, ఏవం హ వై → → స పాప్మనా వినిర్ముక్తః। స ‘సామభిః’ ఉన్నీయతే, బ్రహ్మలోకమ్। స ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరమ్ పురిశయం పురుషమ్ ఈక్షతే।। తత్ ఏతౌ శ్లోకౌ భవతః-।। |
పాము ఏ రీతిగా కుబుసము విడచి హాయిగా ఉంటుందో ఆ విధంగా ఆతడు పాప - అల్ప దృష్టులన్నిటి నుండీ విముక్తుడగు చున్నాడు. అట్టివాడు సామగానాలచేత (బ్రహ్మలోకమునకు తీసుకొని వెళ్ళబడుచున్నాడు. అట్టి హిరణ్యగర్భ స్థానము నుండి ఆతడు - పురిశయం - హృదయస్థుడైనట్టి పరమపురుషుని (పురుషోత్తముని) దర్శిస్తున్నాడు. ఆతని ద్విశ్లోక గానములుగా ఇహ-పరరూపములు అగుచున్నాయి! (జీవాత్మ-పరమాత్మల ఉభయము ఏకరూపమగుచున్నాయి). |
తిస్రో మాత్రా మృత్యుమత్యః ప్రయుక్తా అన్యోన్యసక్తాః అనవిప్రయుక్తాః . క్రియాసు బాహ్యాభ్యంతరమధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః .. 5.6.. |
|
5-6.) తిస్రో మాత్రా మృత్యుమత్యః ప్రయుక్తా అన్యోన్య సక్తా, అన విప్రయుక్తాః। క్రియాసు బాహ్య-అభ్యంతర - మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః (జ్ఞాని కంపించడు)।। |
‘అ-ఉ-మ’ మాత్రలను దేనికదే వేరువేరుగా ఉపాసించబడితే (అవి వేరువేరుగా భావించబడితే) అప్పుడు ఆసాధకుడు మృత్యువును అధిగమించడు. అట్టివాడు మృత్యుపరిధిలోనే ఉండిపోతాడు. (ద్రష్ట- దర్శన-దృశ్యముల ఏకత్వోపాసకుడు ‘అమృతుడు’ కాగలడు). ఆ మూడిటిని బాహ్య - అభ్యంత-మధ్యస్థానములను ఏకంగా చేస్తూ, శాస్త్రాలు సూచించే కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే, ఆతడు జ్ఞాని కాగలడు. ఇక ఈ దృశ్యమునకు, జన్మ-కర్మలకు సంబంధించిన కంపన (Shaking) ఆతనికుండదు. |
ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిర్యత్ తత్ కవయో వేదయంతే . తమోంకారేణైవాయతనేనాన్వేతి విద్వాన్ యత్తచ్ఛాంతమజరమమృతమభయం పరం చేతి .. 5.7.. |
|
5-7.) ఋక్ భిః→ ఏతం। యజుర్భిః→ అంతరిక్షమ్। స సామభిః →యత్ కవయో వేదయంతే। తమ్ ‘ఓం’ కారేణ ఏవ ఆయతనేన అన్వేతి విద్వాన్। యత్ తత్ చ అన్తమ్ అజరమ్-అమృతమ్- అభయం పరం చ।। ఇతి।। |
మొదటి మాత్రయగు ‘అ’ ఋక్‌చే - మరల భౌతికత్వం పొందుచున్నాడు ద్విమాత్ర యగు ‘అ’ + ‘ఉ’ ‘యజుర్’ చేత-అంతరిక్షాన్ని పొంది సూక్ష్మదేహధారియై, చంద్రలోకం ఆస్వాదిస్తున్నాడు. త్రిమాత్రారూపమగు అ+ఉ+మ = ‘ఓంకార - సామతత్త్వాన్ని ఎరిగినవాడు ‘‘ఇహ - పరములకు ఆవల ఉన్నట్టి జరామరణ రహితము, అమృత స్వరూపము, అభయము’’- అగు స్థానము సముపార్జించుకుంటున్నాడు. |
అథ హైనం సుకేశా భారద్వాజః పప్రచ్ఛ . భగవన్ హిరణ్యనాభః కౌసల్యో రాజపుత్రో మాముపేత్యైతం ప్రశ్నమపృచ్ఛత . షోడశకలం భారద్వాజ పురుషం వేత్థ . తమహం కుమారమబ్రువం నాహమిమం వేద . యద్యహమిమమవేదిషం కథం తే నావక్ష్యమితి . సమూలో వా ఏష పరిశుష్యతి యోఽనృతమభివదతి తస్మాన్నార్హమ్యనృతం వక్తుం . స తూష్ణీం రథమారుహ్య ప్రవవ్రాజ . తం త్వా పృచ్ఛామి క్వాసౌ పురుష ఇతి .. 6.1.. |
|
6-1.) అథ హి ఏనం సుకేశా భరద్వాజః
పప్రచ్ఛ:- ‘‘భగవన్! హిరణ్యనాభః కౌసల్యో రాజపుత్రో మామ్ ఉపేత్య, ఏతం ప్రశ్నమ్ అపృచ్ఛత।- ‘షోడశకలం, భరద్వాజ! పురుషం వేత్థ (ఎరుగుదువా)’’? తమ్ అహమ్ కుమారమ్ అబ్రువం -‘న అహమ్ ఇమం వేద। యది అహమ్ ఇమమ్ అవేదిషం-కథం తే నావక్ష(మ్) (న అవక్ష్యమ్)? - ఇతి। సమూలో వా ఏష పరిశుష్యతి, యో అనృతమ్ అభివదతి! తస్మాత్ న అర్హామి అనృతం వక్తుమ్! స తూష్ణీం రథమ్ ఆరుహ్య, ప్రవవ్రాజ (వెళ్లిపోయాడు)। తమ్ త్వా పృచ్ఛామి - క్వాసౌ పురుష? ఇతి।। |
అప్పుడు భరద్వాజస గోత్రుడైన సుకేశుడు లేచి నిలుచుని పిప్పలాద మహర్షికి నమస్కరించి, - తన ప్రశ్నను ఈ విధంగా విన్నవించుకున్నారు. ‘‘హే భగవాన్! దేవా! పిప్పలాద మహాశయా! ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. కోసల దేశానికి చెందిన హిరణ్యభ రాజపుత్రుడు ఒక సందర్భంలో మా ఆశ్రమానికి స్నేహ పూర్వకంగా వచ్చినప్పుడు ఒక సందేహము వెలిబుచ్చారు. ‘షోడశ కళల (16 Arts) పురుషుడిని నీవు ఎరుగుదువా; భరధ్వాజా?’ అని. అప్పుడు నేను అన్నానుగదా, - ‘‘నాకు అది తెలియదు. ఒకవేళ నేను తెలుసుకుని ఉన్నట్లయితే నీకు చెప్పనూ? తప్పక చెప్పుతానులే! ఎవడు అసత్యము (తెలియనిది తెలుసునని) చెప్పుతాడో - అట్టివాడు సమూలంగా ఎండిపోతాడు కదా! అందుచే అబద్ధం చెప్పటం నావల్ల కాదు!’’. అప్పుడు ఆ రాజకుమారుడు (ఈ మాత్రం తెలియదా?-అన్నట్లుగా) తూష్ణీభావంతో నన్ను చూస్తూ రథం ఎక్కి వెళ్లిపోయాడు. అదే మిమ్ములను అడుగుచున్నాను. ఎవరా షోడశ కళా పురుషుడెవ్వడు? ఏమా షోడశకళలు? |
తస్మై స హోవాచేహైవాంతఃశరీరే సోమ్య స పురుషో యస్మిన్నతాః షోడశకలాః ప్రభవంతీతి .. 6.2.. |
|
6-2.) తస్మై సహో వాచ: ఇహైవ (ఇహ ఏవ)-అంతః శరీరే, సోమ్య! స పురుషో యస్మిన్ను ఏతాః షోడశకలాః ప్రభవంతి। ఇతి।। |
అప్పుడు పిప్పలాదమహర్షి చెప్పసాగారు. ఓ సద్గుణుడా! సోమ్యుడా! ఆ షోడశ కళాన్వితుడు నీ శరీరము లోపలే ప్రభవించినవాడై ఉన్నాడయ్యా! అంతేనా! కాదు. నీ సహజరూపమునకు అనన్యుడు కూడా. |
స ఈక్షాచక్రే . కస్మిన్నహముత్క్రాంత ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామీతి .. 6.3.. |
|
6-3.) స ఈక్షాన్‌చక్రే। (ఆతడు ఆలోచించాడు)। ‘‘కస్మిన్ న అహమ్ ఉత్క్రాంత, ఉత్క్రాంతో భవిష్యామి? కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామి?’’ - ఇతి।। |
ఆత్మ ఆలోచనలలో లేదు. ఆత్మనుండి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచించువానిని ఆలోచనలలో వెతకి ఏం లాభం? మరి? ఆలోచనలు తనవైనట్టి ఆలోచించువాడిని మన ఆలోచనలుకు ఆవలనే పట్టుకోవాలి. ఆలోచనలన్నీ ఆతనివే! ఆత్మపురుషునివే! → ‘‘ఎవరు ఈ శరీరము నుండి వెలుపలికి వెళ్లబోవుచుండగా- కూడా ‘రాకపోకలన్నీ నావైన నేను’గా తనను ఎరుగుచున్నాడో-అదియే ఆత్మ! తనను తాను-సమస్తము యొక్క రాకపోకలకు ఆవలగా ఉన్నట్లు గమనించువాడే ఆత్మను ఎరుగుచున్నవాడు. |
స ప్రాణమసృజత ప్రాణాచ్ఛ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీంద్రియం మనః . అన్నమన్నాద్వీర్యం తపో మంత్రాః కర్మ లోకా లోకేషు చ నామ చ .. 6.4.. |
|
6-4.) స ప్రాణమ్ అసృజత। ప్రాణాత్ → శ్రద్ధామ్ → ఖం, వాయుః, జ్యోతిః, ఆపః, పృథివీ, ఇంద్రియం, మనః, అన్నమ్। అన్నాత్→ వీర్యమ్ తపో, మన్త్రాః కర్మ - లోకాః, లోకేషు చ నామ చ।। |
అట్టి ఆత్మయే ప్రాణశక్తి కూడా. సృష్టికర్త కూడా. (సృష్టికర్త ఆతని కల్పనయే). అట్టి ప్రాణశక్తి నుండి ఆకాశమును, వాయువును, జ్యోతి (అగ్ని)ని, ఆపః (జలమును), పృథివిని, మనస్సును -ఒక గానంలాగా సృష్టిస్తున్నది కూడా ఆత్మయే! అంతేకాదు. అన్నము (ఆహారము), అన్నము నుండి వీర్యము, తపస్సు, మంత్ర రూపములగు వేదములు, → కర్మలు(యజ్ఞాలు), లోకములు, లోకేసులు - మొదలైన ఇదంతా ఆత్మయందు ఆత్మకు అద్వితీయమైన ఆత్మకల్పనయే। |
స యథేమా నద్యః స్యందమానాః సముద్రాయణాః సముద్రం ప్రాప్యాస్తం గచ్ఛంతి భిద్యేతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే . ఏవమేవాస్య పరిద్రష్టురిమాః షోడశకలాః పురుషాయణాః పురుషం ప్రాప్యాస్తం గచ్ఛంతి భిద్యేతే చాసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే స ఏషోఽకలోఽమృతో భవతి తదేష శ్లోకః .. 6.5.. |
|
6-5.) స - యథా ఇమా నద్యః స్యందమానాః సముద్రాయణాః, సముద్రం ప్రాప్యాః అస్తం గచ్ఛన్తి, భిద్యతే తాసాం నామ-రూపే ‘‘సముద్ర’’ ఇత్యేవం ప్రోచ్యతే, = |
నదులు ప్రవహించి ప్రవహించి చివరకు సముద్రంలో ప్రవేశించినవై (తమ నామరూపాలు పోగొట్టుకొని) అదృశ్యము అవుతాయి. ఇకప్పుడు ‘సముద్రము’ అనబడే ఉంటుందిగాని. నదుల సంజ్ఞలు లేకయే పోతున్నాయి కదా. |
= ఏవమ్ ఏవ (ఆ రీతిగానే) అస్య పరిద్రష్టుః ఇమాః షోడశ కలాః పురుషాయణాః పురుషం ప్రాప్య అస్తం గచ్ఛంతి, - భిద్యతే తాసాం నామ-రూపే ‘‘పురుష’’.. ఇత్యేవం ప్రోచ్యతే। స ఏషో అకలో - అమృతో భవతి।। తత్ ఏష శ్లోకః।। |
అట్లాగే పరతత్త్వ ద్రష్ట (సర్వద్రష్ట) స్వరూపుడగు ఈ పరమ పురుషుని పొందినప్పుడు షోడశ కళలు అదృశ్యము అగుచున్నాయి. వాటి నామ-రూపాలు నశిస్తున్నాయి. పురుషుడు మాత్రమే శేషిస్తున్నాయి. ఆతడు (ఆ పరమ పురుషుడనబడే ఆత్మ).. కళారహితుడు (అకలః), కళాసహితుడు కూడా. ఆతడే అమృతుడు! అట్టి పరమ పురుషుని గురించే ఆత్మజ్ఞులు గానం చేస్తున్నారు। స్వప్నద్రష్ట యందు - స్వప్న దృశ్యము’’ వలె, షోడశ కళలు కళాస్వరూపుడగు ‘ఆత్మపురుషుని’ యందే లయము అగుచున్నాయి. |
అరా ఇవ రథనాభౌ కలా యస్మిన్ప్రతిష్ఠితాః . తం వేద్యం పురుషం వేద యథ మా వో మృత్యుః పరివ్యథా ఇతి .. 6.6.. |
|
6-6.) అరా ఇవ రథనాభౌ - కలా, యస్మిన్ (ఎవరియందు) ప్రతిష్ఠితాః। తం వేద్యం ‘‘పురుషం’’ వేద.., యథా (దేనివలనైతే) మా వో మృత్యుః పరివ్యథా.।। ఇతి।। |
రథచక్రము యొక్క ఇరుసులో ఆకుల వలె, ఎవరి యందు షోడశకళలు ప్రతిష్ఠితమైయున్నాయో,.. ఆ పురుషుడే నీవు తెలుసుకోవలసినట్టి ‘ఆత్మ’. అదియే నీవు. ఆ పురుషుని గురించి (తమ యొక్క జీవాత్మకు సాక్షిగా తామే అయి ఉన్న ఆత్మ) గురించి ఎవరు తెలుసుకుంటారో.. ఇకవారు అమృతు లౌతున్నారు. వారికి మృత్యువే లేదు! ఇది ఆత్మజ్ఞుల గానము. |
తాన్ హోవాచైతావదేవాహమేతత్ పరం బ్రహ్మ వేద . నాతః పరమస్తీతి .. 6.7.. |
|
6-7.) తాన్ (స పిప్పలాదమహర్షిః) హ ఉవాచః : ఏతా పదేవ అహం ఏతత్ ‘పరంబ్రహ్మ’ వేద- - నాతః (న అతః) పరమ్ అస్తి।। - ఇతి।। |
నాయనలారా! ‘ఆత్మ ఇట్టిది’ అని నేను ఇంత వరకు తెలుసుకున్నాను! ‘‘ఇంతకు మించినదై (ఆత్మకు అర్థమై) ఎక్కడా ఏదీలేదు!’’.. అని అర్థం చేసుకుంటున్నాను! మీకందరికీ శుభమగు గాక! |
తే తమర్చయంతస్త్వం హి నః పితా యోఽస్మాకమవిద్యాయాః పరం పారం తారయసీతి . నమః పరమఋషిభ్యో నమః పరమఋషిభ్యః .. 6.8.. |
|
6-8.) తే (ఆ ఆరుగురు ప్రశ్నించినవారు) తం అర్చయంతః; ‘‘త్వం హి నః పితా, యో అస్మాకం అవిద్యయాః పరం పారం తారయసి’’ ఇతి।। నమః పరమ ఋషిభ్యో।। నమః ఋషిభ్యః ।। |
అప్పుడా ఆరుగురు (ప్రశ్నించినవారు) లేచి నిలుచుని సద్గురువగు పిప్పలాదమహర్షి యొక్క పాదపద్మములను భక్తిపూర్వకంగా అర్చించారు. ‘‘స్వామీ! అవిద్యకు పరమునకు (ఆవలి వడ్డుకు) జేర్చి మమ్ములను తరింపజేశారు. అవిద్యను దాటించారు. అందుచేత మీరు మాకు పితృదేవతా సమానులు’’ - అని అభివర్ణిస్తూ నమస్కరించారు. పరమ ఋషులకు నమో నమః। నమస్కార కుసుమాంజలులు। ఋషులకు నమో వాక్కములు। ఋషిపుంగవులకు నమస్కరిస్తున్నాము। నమస్కరిస్తూ ఉన్నాము। |
శ్రీ పిప్పలాద మహర్షిని శిష్య ఋషులు అడిగిన 6 ప్రశ్నలు
వరుస సంఖ్య |
అడిగిన ఋషి |
|
|||
---|---|---|---|---|---|
1 |
కబంధీ కాత్యాయనః (కత్యస్య కుమారః) |
కుతో హ వా ఇమాః ప్రజాః ప్రజాయన్త? |
ఈ కనబడే జీవులంతా ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు? |
||
2 |
భార్గవో వైదర్భిః |
కతి ఏవ దేవాః ప్రజాం విధారయన్తే? కతర ఏతత్ ప్రకాశయన్తే? కః పునః ఏషాం వరిష్ఠ? |
- ఈ కనబడే జీవుల దేహములను నిర్మిస్తున్న, నిలబెట్టుచున్న ప్రజ్ఞాదేవతలు ఎవరు? ఎందరు? - ఏ దేవతలు ఈ దేహములను ప్రకాశింపజేస్తున్నారు? - వారిలో ముఖ్యుడు ఎవరు? |
||
3 |
కౌశల్యశ్చ అశ్వలాయనః |
కుత ఏష ప్రాణో జాయతే? కథమ్ ఆయాతి అస్మిన్ శరీరే? ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే? కేన ఉత్క్రమతే? కథం బాహ్యం అభిదత్తే? కథం అధ్యాత్మమ్? |
- ఈ ప్రాణము ఎక్కడినుండి పుడుతోంది? - భౌతిక దేహములో ఏవిధంగా ప్రవేశము పొందుతోంది? - ప్రవేశించిన తనను తాను ఎట్లా (పంచజ్ఞానేంద్రియ, పంచకరేంద్రియ, పంచప్రాణ ఇత్యాదులుగా) విభాగమై ప్రతిష్ఠత పొందుతోంది? - మరణ సమయంలో ఎట్లా ఈ దేహమును వీడుతోంది? - బాహ్యమున (ఆధిభౌతిక-ఆధిదైవికంగాను), అంతరమున (ఆధ్యాత్మికంగాను) ఎట్లా ధారణ చేస్తోంది? |
||
4 |
సౌర్యాయణీ గార్గ్యః |
ఏతస్మిన్ పురుషే కాని స్వపన్తి? కాని అస్మిన్ జాగ్రతి? కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి? కస్త్య ఏతత్ సుఖం భవతి? కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవన్తి? |
- ఈ జీవుడు నిదురిస్తూ ఉంటే, ఆతని పట్ల మేలుకొనియే ఉంటున్నది ఏది? - స్వప్నానుభవం ఎవరిది? మనస్సుదా ? జీవునిదా ? ఆత్మదా? - నిదురిస్తున్నప్పుడు జాగ్రత్ అనుభవాలు ఏమౌతున్నాయి? మెలకువ వచ్చినప్పుడు స్వప్నానుభవాలు ఏమౌతున్నాయి? - గాఢ నిద్రాసుఖం పొందుచున్నదెవరు? |
||
5 |
శైభ్యః సత్యకామః |
స యో హ వా ఏతత్ మనుష్యేషు ప్రాయణాన్తమ్ ‘ఓం’కారమ్ అభిధ్యాయీత - కతమం వావ స తేన లోకం జయతి? |
- పర-ఇహ-దృశ్యము సమగ్రమునకు ‘సంజ్ఞ’ అయి ఉన్నట్టి, ఓంకారోపాసకుడు దేహానంతరము ఎటువైపుగా ప్రయాణాలు కొనసాగిస్తున్నాడు? |
||
6 |
సుకేశా భారద్వాజః |
షోడశకలం పురుషం వేత్థ (కిం)? (కిం తత్?) |
‘షోడశ (16) కళాపురుషుడు’ అనగా ఎవ్వరు? ఎక్కడుంటారు? ఏమి చేస్తూ ఉంటారు? |
భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః।
ఆరాధ్యులు, పూజనీయులు, దివ్యదేహులు అగు ఓ దేవతలారా!
మీ యొక్క కరుణారస వీక్షణచే..,
మీచే ప్రసాదించబడిన.... ఈ మా రెండు చెవులతో అన్ని వేళలా శుభప్రదమైన, కైవల్యప్రదమైన, ఆత్మబుద్ధిప్రదమైన మాటలను - విషయములను - కథనములను మాత్రమే మేము వినుచుండెదము గాక!
అశుభమైనవి, ఇతరులకు బాధ కలుగుజేయునవి, కల్పిత సంసార సంబంధమైనవి, అమంగళములైనవి, పరదూషణముతో కూడినవి - అగు మాటల పట్ల-వినటానికిగాని, శ్రద్ధ వహించటానికిగాని, - మీచే ప్రసాదించబడిన ఈ రెండు చెవులు మేము ఉపయోగించకుండెదము గాక!
యజత్రాః
‘‘యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోఽయమ్ కర్మ బంధనః’’.. అవటం చేత.. మేము యజ్ఞకర్మ నిష్ఠులము అయి ఉండెదము గాక! ‘‘సృష్టి’’ - అనే మహత్తరమైన మహా యజ్ఞములో అంతర్విభాగముగా భావించి మేము ‘యజ్ఞత్రులము’ అగుచున్నాము.
- శాస్త్రానుసరణము, లోకప్రీతిప్రదము, కృతజ్ఞతాపూర్వకము, సహజీవులకు సానుకూల్యము, ఉత్తమ సమిష్టి ఆశయసిద్ధి పూర్వకము, బుద్ధి బలప్రదము, దైవ సమర్పితము, ఉపాసనా భావ సమన్వితము, నియతము → అగు బుద్ధి, శ్రద్ధలతో, యజ్ఞ భావముతో కర్మలు చేయుటకు మేము సర్వదా సంసిద్ధులమయ్యెదము గాక!
- సంకుచితము, వ్యక్తిగతస్వార్థము, ఆశా-దురాశా పూరితము, ఇతరులకు బాధ కలిగించునవి-మొదలైన అయజ్ఞ కర్మలు ఆశ్రయించకుండెదము గాక! అయజత్రులము కాకుండెదము గాక।
భద్రం పశ్యేమ అక్షభిః।
మీరు ప్రసాదించిన ఈ ఈ కన్నులతో యజ్ఞకర్మ నిష్ఠులమై మేము → శుభప్రదము, లోకకల్యాణ ప్రదము మహదాశయము, పవిత్రము - అగు దృష్టులను మాత్రమే కలిగియుండెదము గాక!
అల్పమైన, దోషపూరితమైన, సంకుచితమైన దృష్టులను దరిచేరనీయకుండెదము గాక!
స్థిరైః అంగైః తుష్టువాగ్ం సః తనూభిః।
స్థిరమైన - పరిపుష్టితో కూడిన - ఆరోగ్యవంతమైన అంగములతో కూడిన వారమై, (మీ ప్రసాదితమైన) ఈ శరీరముతో మీకు ఎల్లప్పుడు స్తోత్రవాక్కులు, గానములు పలుకుచుండెదము గాక!
వ్యశేమ దేవహితమ్ యత్ ఆయుః ।
(మీ మహిమలను గానం చేస్తూ) ఏ ఆయుష్షు దైవహితమై- దైవప్రాసాదితమై ఉన్నదో, అది సద్వినియోగము చేసుకొనెదము గాక!
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః। (దధాతు)
(సుః-అస్తి) = ‘‘స్వస్తి’’ = అస్తి స్వస్వరూపేణ = కేవలాత్మయగు స్వస్వరూపమునందు- (అస్తి) = నిశ్చలమగు ఉనికి.
ప్రాచీన గురువర్యులచే శాస్త్రములందు పురాణ-ఇతిహాసములలో అభివర్ణింపబడినవారు, పెద్ద చెవులతో ఉత్తమమైన శ్రుతము కలిగియున్న వారు, వేదవిహితమైన శ్రవణము ప్రసాదించువారు - అగు ఇంద్ర భగవానుడు మాకు స్వస్థితిని, (మా స్వాధ్యాయము నందు మేము విన్నది అభ్యసించటమునందు), అభ్యుదయమును ప్రసాదించెదరు గాక!
స్వస్తి నః పూషా విశ్వవేదాః (దధాతు) :
సర్వజ్ఞుడు (విశ్వవేదుడు), లోకపరిపోషకుడు (పూషా) అగు పరమాత్మ మాకు స్వస్తి ప్రసాదించుదురు గాక!
‘స్వస్తి నః తార్క్ష్యో అరిష్టనేమిః (దధాతు)।
దివ్య విహంగము (<span style="color:red>తార్క్ష్యుడు), ఆపదల నుండి రక్షించువాడు (అరిష్టనేమి) అగు గరుడ భగవానుడు మాకు స్వస్తి - అభివృద్ధి దయచేయుదురు గాక!
స్వస్తి నో బృహస్పతిః దధాతుః।
(దేవతలకు గురువు, బుద్ధికి అధిదేవత, బ్రహ్మవర్చస స్వరూపుడు) అగు బృహస్పతి మాకు అభ్యుదయ భావములను, సునిశితము - విస్తారము అగు బుద్ధిని ప్రసాదించి రక్షించును గాక!
ఓం నమః పరమాత్మనే!
హరిః ఓం!
ఒకానొక సందర్భంలో బ్రహ్మ విద్యను కోరుకున్నట్టి బ్రహ్మ నిష్ఠాపరులు, బ్రహ్మతత్పరులు - అగు కొందరు మహనీయులు పరబ్రహ్మము గురించి అన్వేషణ చేయువారై, అధ్యయనులై ఒకచోట సమావేశమైనారు. కొంత ‘సత్సంగము’ తరువాత వారంతా సద్గురు సాన్నిధ్యమును ఆలోచనచేయసాగారు. వారి పేర్లు :
→ భరద్వాజుని కుమారుడైన సుకేశుడు.
→ శిబి పుత్రుడైనట్టి సత్యకాముడు.
→ గార్గ్య గోత్రోద్భవుడైనట్టి సౌర్యాయణి.
→ అశ్వలాయన పుత్రుడు కౌసల్యుడు.
→ విదర్భ దేశీయుడైనట్టి భార్గవుడు.
→ కత్యుని కుమారుడైన కంబంధి.
ఆ మునీశ్వరులు బ్రహ్మవేత్త కొరకై వెతుకుచూ ‘‘శ్రీ పిప్పలాద మహర్షి మన ఆధ్యాత్మికమైన సందేహములను, తప్పక తొలగించగలరు కదా!’’... అని అనుకున్నారు. ‘సంశయాత్మా వినస్యతి’ అని కదా, పెద్దలు అనుచున్నది! అది దృష్టిలో పెట్టుకొని ఒకానొక రోజు పిప్పలాద మహర్షి ఆశ్రమమునకు వచ్చి, మహాపురుషుడగు మహర్షిని సందర్శించారు.
యజ్ఞ సంబంధమైన ‘సమిధలు’ చేతులతో ధరించి గురు ఆశ్రమమును సమీపించారు.
(ప్రాచీనకాలంలో గురు ఆశ్రమానికి వెళ్లేటప్పుడు యజ్ఞాలకు ఉపయోగబడే సమిధలు తీసుకొని వెళ్లటం ఒక సదాచారము. గురువు వద్దకు, చిన్న పిల్లల వద్దకు, ఆర్యుల వద్దకు ఉత్తి చేతులతో వెళ్లము కదా)।
‘‘స్వామీ! మాకు గల ఆధ్యాత్మికమైన సందేహాలు తొలగటానికై బ్రహ్మతత్త్వము విషయమై మీ ప్రవచనమును శ్రవణం చేయాలని మిమ్ములను శరణువేడుచున్నాము.
పిప్పలాదమహర్షి : మునీశ్వరులారా! మీరంతా కలసి తపో-బ్రహ్మచర్య నిష్ఠలను మరొక సంవత్సరకాలము శ్రద్ధ వహించినవారై నిర్వర్తించండి. ఆ తర్వాత మీరంతా కలసి రండి. అప్పటికీ సందేహాలుంటే, - మీమీ ప్రశ్నలు నన్ను అడగండి. నేను మీకు తప్పకుండా నాకు తెలిసినంతవరకు చెప్పుతాను.
(‘‘గురూపదేశం హృదయంలో నాటుకోవటానికి వీలుగా మునుముందుగా, తపస్సు- బ్రహ్మచర్యములు శ్రద్ధగా నిర్వర్తించటం చేత బుద్ధి సునిశితము, విస్థారము, సుతీక్షణాము, నిర్మలము అవుతుంది’’ - అనునది గురువు యొక్క ఉద్దేశ్యము).
ఆ మునీశ్వరులంతా గురు ఆజ్ఞను అదేవిధంగా పాటించినవారై, సంవత్సర కాలము తరువాత మరల శ్రీ పిప్పలాదమహర్షిని ఆశ్రయించారు.
ఆ మునీశ్వరులు గురువును సమీపించి ఇక తమ ప్రశ్నలను ఒక్కటొక్కటిగా అడగటం ప్రారంభించారు.
కత్యుని కుమారుడైన కబంధిముని : భగవాన్! నా కళ్లకు ఎదురుగా ఈ జీవులంతా కనిపిస్తున్నారుకదా! నా సందేహము ఏమిటంటే
ఈ జీవులంతా వాస్తవానికి ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు?
మహర్షి సమాధానము
శ్రీ పిప్పలాద మహర్షి : కేవలాత్మానందస్వరూపుడు, సమస్త కల్పనా సమర్థుడు, ఏకాంతుడు అయినట్టి ప్రజాపతి (సృష్టికర్త) ఒకానొకప్పుడు ‘‘అనేక మంది ప్రాణులను కల్పించుకొని ఉండెదనుగాక!’’.. అని వినోదార్థము ‘భావన-సంకల్పము’ చేయటం జరుగుతోంది.
అందుకొరకై ‘ధ్యాస’ను ఆశ్రయించి ధ్యానము చేస్తూ, తపన (Avocation) రూపంగా తపస్సు చేశారు.
‘‘ఒక జంటను (Duality from the unity) సృష్టించుకుంటాను. - ఆ జంట అనేక విధాలుగా వర్ధిల్లుచు, అనేక దేహములుగా ప్రదర్శనమగు చుండునుగాక!’’ అని.. భావించారు!
నిద్రించినవాడు తాను ఏకమే అయి ఉండి కూడా స్వప్నంలో తనకు వేరైన - అనేక రూపాలు కల్పించుకొని, నేను-నీవు-అది-ఇది మొదలైనవన్నీ ఆస్వాదిస్తున్నట్లుగా - సృష్టి కల్పనను తననుండి తనకు వేరు - అను రీతిగా ఆరంభించారు.
ఆయన మొట్టమొదటగా సృజియించుకున్న జంట మిథునము:
(1) శక్తి (ప్రాణము). (అగ్ని). (The Energy).
(2) పదార్థము (రయిం). (భూ). (అన్నము). (The Matter). (సాకారము).
ఈ మిథునమును (జంటను) ఎదురుగా తన యొక్క ‘‘తపోశక్తిచే - సంకల్పశక్తిచే - భావనాశక్తిచే’’ కల్పించుకొన్నారు. ‘‘అవి ఇంకా బహు జీవజాలములను, సంతతిని ఏర్పరచునుగాక!’’.. అని సంకల్పించారు!
ప్రజాపతి = • హిరణ్యగర్భుడు • సమష్టి మనస్సును ప్రదర్శించువాడు / ప్రకటించువాడు. • తన నుండి తానే లీలా వినోదంగా ‘‘శక్తి+పదార్థము’’లను సృష్టించువాడు. రయిం = అన్నము; చంద్రుడు : భోగించబడునది. సోముడు (Passive). ప్రాణము = అగ్ని :: భోక్త (Active voice). అన్నము → (1) చంద్రుని సూక్ష్మ ప్రభావము వలన కలుగుచున్నది. (2) ఐదు ఇంద్రియములకు బాహ్యానుభవ జగత్ దృశ్యము. చంద్రుడు → భూమిపై రసత్వానికి, ఓషధులకు, ఆహారమునకు ద్రవత్వానికి కారణమగుచున్నట్టిది. సూర్యుడు → సమస్తమునకు భోక్త. అగ్ని శరీరుడు. భూమికి అగ్నితత్త్వాన్ని తేజస్సును ఇచ్చు ప్రాణశక్తి జీవుడు = జీవత్వము ప్రదర్శించువాడు. జీవితాభిమాని. జీవము = ఊపిరి (శక్తి). అన్నము (రయి) ద్వారా వర్ధిల్లునది. |
ఓ బిడ్డా! కబంధీ! ఇంకా విను.
ప్రాణము = సూర్యుడు = భుజించువాడు = ఆస్వాదించువాడు (experienear) = వెలిగించునది - అమూర్తము (Formless) - ఇంద్రియములకు గోచరము కానిది - ఇంద్రియములచే పనిచేయించునది - ఇంద్రియములను ఉపయోగించునది - ఇంద్రియ ప్రదర్శనములకు ఆధారమైనది |
రయి = చంద్రుడు = భుజించబడునది = ఆస్వాదించబడునది (That being experienced) = వెలిగించబడునది = మూర్తివంతమైనది (That with form) - ఇంద్రియములు - ఇంద్రియానుభవములు - ఇంద్రియముల క్రియా విశేషములు - ఇంద్రియములకు విషయమైన జగత్‌దృశ్యము |
‘శక్తి’ - ‘రయి’ (Matter) ల గురించి మరొక్క విషయం : శక్తి నిరాకారము. అట్టి నిరాకారమైనదే సాకారము సంతరించుకొంటోంది. సాకారమైనదంతా స్వతఃగా నిరాకారమే అయి ఉన్నది. ఎందుకంటే, ఈ సమస్తము శక్తియొక్క ప్రదర్శనమే కాబట్టి.
ఏతత్ సర్వమ్ యత్ ‘‘మూర్తం’’ చ, ‘‘అమూర్తం’’ చ। తస్మాత్ మూర్తిరేవ రయిః।
ఏదైతే సాకారముగా కనిపిస్తోందో, ... అదంతా ‘రయి’ (పదార్థము)యే!
ఏదైతే నిరాకారమైయున్నదో,.. అది కూడా రయియే (పదార్థమే)!
అందుచేత - ఆకారమే ‘రయి’! ఆకారము పదార్థమునకు భిన్నము కాదు. పదార్థము స్వతఃగా చూస్తే నిరాకారమగు శక్తియే। (బంగారమునకు ‘ఇది’ అనే ఆకారమేమున్నది?).
ప్రాణము :
సూర్యశక్తిగా ప్రదర్శనమగుచున్నది ప్రాణమే!
సాకారామైన వస్తువులు - నిరాకారమైన వస్తువులు,
అంతా పదార్థమే!
పదార్థమో.... శక్తి యొక్క ప్రదర్శనమే! శక్తికి అభిన్నం.
శక్తి - పదార్థము = వాటి మధ్య ఏదైనా భేదం అనుభూతమగుచూ ఉంటే.. అదంతా
→ భావనా మాత్రమే। సాపేక్షమైన కల్పనా దృష్టియే।
→ అభి వ్యక్త భేదమాత్రమే! (Multiplicity of Manifestation).
వాస్తవానికి ‘శక్తి-పదార్థము’ ఈ రెండూ అభేదమైనవే.
శక్తియే - స్థూల దృష్టికి → పదార్థము గాను,
పదార్థము - సూక్ష్మ దృష్టికి → శక్తి గాను - అగుపించటము జరుగుతోంది.
అంతేకాదు! సాధారణ దృష్టికి..,
పదార్థము → స్థూలము. జడము. ‘స్థలము’ను ఆక్రమించేది. (That which occupies space).
ప్రాణశక్తి → స్థూలమునకు కారణమై, తనయందే ‘స్థలము - ఆక్రమించుట’ను కలిగియున్నట్టిది. (That in which space had its place).
సర్వము శక్తిమయమే! శక్తి ప్రదర్శనమే! ఈ సాకారంగా కనిపించేదంతా సహజంగా నిరాకారమగు ప్రాణశక్తియే అయి, సందర్భ సత్యము (In between Truth)గా స్థూలము నందు స్థూలంగా ఆక్రమించినదై కనిపిస్తోంది! సహజముగా ఇదంతా సూక్ష్మరూపమే!
ప్రాణశక్తి యొక్క ప్రదర్శనమే సూర్యబింబము. ‘‘అద్దాని చైతన్య స్వరూపుడు సూర్యుడు (లేక) ఆదిత్యుడు’’. [యత్-ఆది-హ(ఇతి) ఆదిత్యః। ఏది సమస్తమునకు ‘మొదలు’ అయి ఉన్నదో, ఇదంతా ఎవ్వని పురుషకారమో, ఆతడే ‘ఆదిత్యుడు’ - అని ఉపాసించబడుచున్నాడు]
ప్రాణశక్తి స్వరూపుడగు ఆదిత్యుడు...,
- తూర్పు దిశగా (ప్రాచీందిశే) (ప్రాణశక్తి రూపుడై విస్తరించటం జరుగుచున్నప్పుడు తన కిరణముల రూపంగా తూర్పు దిశ ప్రాణులను (దేహి-దేహములను) ధరించుచున్నవాడగుచున్నారు.
ఎప్పుడైతే తన ప్రాణశక్తిని ఆదిత్యుడు దక్షిణ (దక్షిణ దిశే), పడమర (ప్రతీచీం దిశే), ఉత్తర (ఉదీచీం దిశే), అధః(క్రింది వైపుగా), ఊర్థ్వమ్ (పై దిశగా), మధ్యగా (అంతరాదిశే) సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండటం జరుగుతోందో..,
అప్పుడు...., అట్టి ఆ ప్రాణశక్తి స్వరూపుడగు ఆదిత్యుని (సూర్యుని) ప్రాణశక్తులు-కిరణాల రూపంగా శక్తి - పదార్థద్వయమగు అనేక శరీరములను ప్రదర్శించుచున్నవాడగుచున్నాడు. (All beings are formed out of the Universal Being, named as Aditya Purusha).
ఈ విధంగా సర్వ దిక్కులా సర్వ జీవులుగా ప్రదర్శితమగుచున్నదంతా నిరాకారుడగు ప్రాణభగవానుని యొక్క (ప్రాణేశ్వరుని యొక్క) (లేక) ఆదిత్య ప్రాణశక్తుని యొక్క సాకార సంప్రదర్శనా వినోద - వికాసమే।
‘‘నిరాకార‘శక్తి’ + సాకార నామరూపాత్మకము’’ అనే జంటల కల్పనా ప్రదర్శనమే! ప్రాణశక్తి యొక్క ప్రేరణా ప్రదర్శనమే! |
అట్టి ప్రాణశక్తి - ఇంకా కూడా ఎటువంటిదంటే →
(1) ఈ విశ్వమంతా తనదై యున్నట్టిది.
(2) ఈ విశ్వమునకంతటికీ ఆత్మ.
(3) కిరణరూపమై ఈ విశ్వము యొక్క నామరూపాత్మకంగా సంప్రదర్శితము.
అంతా ప్రాణశక్తియే. ఈ విశ్వమంతటికీ ప్రాణమే త్రాణ (‘‘సర్వమ్ శక్తిమయమ్’’।) ప్రాణమే అగ్నిరూపమై వెలుగొందుతోంది.
ప్రాణశక్తియే ఈ విశ్వము తన రూపముగా కలిగియున్నది. విశ్వముయొక్క సహజరూపము ప్రాణమే.
ఆ ప్రాణశక్తి పురుషుడే అగ్నిగా ఉదయించుచున్నవారై, ఋక్- వేదమంత్రములచే అభ్యుక్తుడు - అభివర్ణితుడు అగుచున్నాడు. (అగ్నిమీళే పురోహితే।)
మేధావులైన ఋషులు ‘‘ఈ కనబడే విశ్వము యొక్క వాస్తవ రూపము ఏమిటి?’’.. అని అన్వేషించగా...,
- ఈ విశ్వమే తన రూపముగా కలిగినవాడు..,
- జీవులంతా తన కిరణ రూపములుగా ప్రదర్శించువాడు..,
- సకల ప్రాణులకు పరాయణుడు - ఆధారమైనవాడు..,
- జ్యోతిర్మయుడు (కాంతి (జ్యోతి) స్వరూపుడు),
- సృష్టిలో అణువణువుకు వేడిమిని ప్రసాదించుచున్నవాడు,
- సమస్త జీవులలో సహజాత్మ స్వరూపుడై వేంచేసి ఉన్నవాడు -
అగు ప్రాణశక్తుడగు ఆదిత్యుని అనన్యరూపముగా స్తుతులు సమర్పించి మనకందిస్తూ ఉన్నారు. (ఋక్కులు). ఆదియందే ఉండియుండి, సమస్తముగా విస్తరించువాడు (ఆది - ఇతి - యః)।
(హరీ! హిరణ్మయవపుః)। సహస్ర (వేలాది) జీవుల రూప కిరణ కాంతులతో ఆ ప్రాణతత్త్వుడే సర్వత్రా సమస్త విశేషాలుగా ప్రకాశిస్తున్నట్లు వారు ప్రకటిస్తున్నారు.
లెక్కలేనన్ని కిరణాలతో అనేక విధాలుగా ఉంటూ (అనేక జీవజాతుల రూపంగా ఉంటూ), ప్రాణశక్తి స్వరూప సూర్యుడే, అన్ని వైపుల ఉదయిస్తూ ఉన్నారు. అస్తమిస్తూ కూడా ఉన్నారు. అయినాకూడా, ఆయనకు ఉదయ- అస్తమయములు లేని స్వయంప్రకాశక నిత్యోదితుడు.
కనుక,
ఈ జీవులంతా ప్రాణేశ్వరుడగు ప్రజాపతియొక్క ఏకత్వంలోంచి ద్విత్వంగా ఏర్పడిన ప్రాణ(శక్తి)- పదార్థముల (రయి)ల మిథున (కలయిక) రూపాలే! ఈ దేహి - దేహాలన్నీ ఒకే ప్రాణశక్తి యొక్క వివిధ ప్రదర్శనములు.
ప్రాణమే వైశ్వానరుడు - విశ్వరూపము కూడా.
ప్రాణమే (జీవుడు/వ్యష్టి) - (సమిష్టి).
‘సంవత్సరము అనునది ప్రజాపతి కల్పనా రూపమే. కాలము సృష్టికి ప్రారంభమగు మూలము.
ద్విమార్గములు : అటువంటి ‘సంవత్సర’ రూపమును - ప్రజాపతి రెండు మార్గములను జీవులకొరకై కల్పించుచున్నారు.
(1) దక్షిణాయన మార్గము(దారి). (సకామం). చంద్రమార్గము (Towards Matter). (‘కేవలము’ నుండి ‘సందర్భము’వైపుగా)
(2) ఉత్తరాయన మార్గము. (నిష్కామం). సూర్యమార్గము (Towards prana cosmic). (‘సందర్భము’ నుండి ‘కేవలము’వైపుగా)
→ ఇది జీవుని యొక్క నామ రూపాత్మక (రయి)మైన ఆశయముతో కూడినది.
‘‘దృశ్యములో మరొకటేదో పొందాలి. ఇక్కడనో, (లేక) మరొక లోకంలోనో నామ-రూపాత్మకమైన, ఇంద్రియానుభవ సంబంధమైనదేదో లభించాలి కదా!’’ అనే ఉద్దేశ్యముతో నిర్వర్తించే శాస్త్ర-సూకములగు సాధనములు కలిగియున్నట్టిది.
ఎవ్వరైతే..,
ఇష్టా = వేదప్రతిపాదితమైన యజ్ఞములు, యాగములు, వ్రతములు, పూజలు ఇత్యాదులను..,
(అగ్నిహోత్రం, తపః సత్యమ్, భూతానంద అనుపాలనం, ఆతిధ్యం విశ్వసేవశ్చ ‘ఇష్టమ్’ ఇత్యభిధీయతే।।)
పూర్తములు : లౌకిక సంబంధమైన తటాకములు - బావులు త్రవ్వించటం, దానములు, తీర్థయాత్రలు, సత్రములు నిర్మించటం
- ఇత్యాదులను...,
(వాపీ - కూప- తటాకాది దేవతాయతనాని చ, అన్నప్రదానం ఆరామః-‘పూర్తమ్’ ఇత్యభిధీయతే।।)
(‘‘లోకంలో మంచిపనులే శాశ్వతమైన విలువ గలవి. అంతిమాశయం అదే. గొప్ప కర్మలు - పనులు చేస్తేచాలులే! మేము ఆత్మజ్ఞానం గురించి యోచించనవరం లేదులే!... అని అనుకునేవారు).
అటువంటి వారు- వారియొక్క ఉపాసనలకు - కర్మలకు ప్రయోజనంగా ‘‘చాంద్రమస లోకము’’ను సంపాదించుకుంటున్నారు.
అనగా ‘‘రయి (Material factors)"లో సమృద్ధి - సుందరము - సుఖమయములను సముపార్జించుకుంటున్నారు.
ఉదాహరణకు.., ‘‘చంద్రమస మార్గము’’ అనగా?
‘‘ఇష్టమ్’’ ఇత్యభిదీయత్ |
- ‘నేనీ అగ్నిహోత్రము చేస్తున్నాను కదా। - తపస్సు చేస్తున్నాను కదా। - సత్యమును అనుసరిస్తున్నాను కదా। - పక్షులకు- జంతువులకు ఆహారం ఇస్తున్నాను కదా। - పేదవారికి అన్నదాం.. వస్త్రదానం చేస్తున్నాను కదా। |
నాకు సుఖమయమైన స్వర్గలోకాలు, (లేక) సంపదలు, లౌకికమైన సానుకూల్యతలు లభించు గాక! భౌతిక సుఖరూపమైన వస్తు-వాహన-గృహాదులు లభించు గాక! చంద్రలోకంలో సుఖస్థానం లభించాలి! సుఖమయమగు ఊర్ధ్వలోక ప్రవేశము సిద్ధించాలి! |
‘‘పూర్తమ్’’ ఇత్యభిదీయతే |
- నేను నలుగురుకి ఉపయోగించాలని చెరువులు, బావులు త్రవ్విస్తున్నాను కదా.., - దేవాలయాలకు సంపదను ప్రదానం చేస్తున్నాను కదా। - అన్నదానం, సత్రాలు కట్టించటం చేస్తున్నాను కదా। - ఉద్యానవనాలు నలుగురి కోసం నిర్మింపజేస్తున్నాను కదా। |
- ఇదియే ముఖ్య ఆశయము : "నాకు సుఖమయ లోకాలు లభించాలి!" |
ఇటువంటి దృశ్య సంబంధమైన ఆశయాలు కలిగి ఉండటము-బాహ్యమగు సందర్భ సత్యములకు చెందినది - దక్షిణాయన మార్గము.
ఈ చంద్రమస మార్గం పదార్థముల వైపుగా (రయి) (లేక) నామ రూపాత్మకమైన ప్రాప్త్యముల వైపుగా చేయు ఉపాసన.
ఇట్టి వారు సుఖమయలోకములలో ప్రవేసించి పదార్థమయ సంపదాస్థానములను పొందుచున్నారు.
కాలానంతరం పుణ్యము ఖర్చుకాగా, ఆ తరువాత వారు తిరిగి పునరావృత్తిని పొందుచున్నారు. (పునశ్చత్వాం ద్రష్టుమ్ విభువి వహన్)
ఇది దృష్టిలో పెట్టుకొన్న వారికై (మనువు మొదలైన) ఋషులు సంతానార్థులై దక్షిణ యానమును అనుసరించి పదార్థ సంపదను పొందువిధి-విధానములు సూచిస్తున్నారు. ఇది ‘‘పితృయాన మార్గము’’ అని కూడా పిలువబడుతోంది.
పితృయానము జీవితము పట్ల భౌతిక సృష్టికి, ఆత్మ యొక్క జాగ్రత్ - స్వప్న కల్పనలకు చెందిన సుఖమయ మార్గము.
అందుచేత దక్షిణయానమే పదార్థము (Matter) అని కూడా పిలువబడుతోంది. ఇది ‘అన్యము’ను పొందటము గురించిన శాస్త్రీయమార్గము. పునరావృత్తి దోషము ఉండనే ఉంటుంది. ‘‘అనన్యము’’ నుండి ‘అన్యము’ వైపుగా ఎక్కుబెట్టబడి, కొనసాగు మార్గము.
ఇది అనన్యమగు ఆత్మ గురించిన స్థానము చేర్చు మార్గము. సహజ సత్యమగు ఆత్మానుభవమునకు చెప్పబడు శాస్త్రీయ సూచనలు.
ఉత్తరాయణము ద్వారము (మార్గము)లో- బ్రహ్మము పట్ల నిష్ఠ, బ్రహ్మచర్యము; విద్యయా- జ్ఞానమార్గంలో ఆత్మ కొరకై అన్వేషించటము - మొదలైనవన్నీ సూచితమై ఉంటున్నాయి.
ఇట్టి ఉత్తరాయణ మార్గంలో యోగులు ఆదిత్య స్థానము (సూర్యస్థానము)ను సముపార్జించుకుంటున్నారు.
సూర్యుడు ప్రాణశక్తి యొక్క తేజోప్రదర్శనం. ప్రాణశక్తికి నిలయం.
అట్టి ఆదిత్య స్థానము ఆత్మతత్త్వ స్వభావజము. అమృతము. మార్పుచేర్పులకు ఆవలిస్థానము. నాశరహితమగు స్థానము. అభయప్రదము. అట్టి సూర్యస్థానము జేరువారికి పునరావృత్తి (Slipping back from the state after once reached) ఉండదు. ఇది ఆత్యంతికము (The final finest) అవటం చేత - ‘ఆత్యంతము’ ‘పరము’ అను శబ్దములతో చెప్పబడుతోంది.
ఇది ఇంద్రియ విషయాలను దాటిపోవటము. ఇది ‘‘రయమునకు (నామ-రూపాత్మక పదార్థమునకు)’’ అతీతము, వ్యతిరిక్తము’’ అవటంచేత ‘నిరోధమార్గము’ అని కూడా అంటున్నారు.
..... ఈ విధంగా విజ్ఞులచే సూర్యమార్గము (ఆదిత్యమార్గము).. గానము చేయబడుతోంది.
ఈ మార్గము జన్మరాహిత్యమునకు (జన్మ-కర్మలకు ఆవలిదైనట్టి స్వస్వరూపాత్మ జ్ఞాన-ధ్యానములకు) త్రోవ.
(బ్రహ్మసూత్రములచే → ఇది దేవయానముగా వర్ణించబడుతోంది).
ఉపనిషత్తులచే → ఈ మార్గం గుండా (ఆత్మ జ్ఞాన మార్గములో) ప్రయాణించువారు బ్రహ్మలోకానికి ప్రయాణం చేస్తున్నారు. అక్కడ నివసిస్తూ కలాంతములో సృష్టికర్తయగు బ్రహ్మదేవునితో సహా (సముద్రజలంలో నదీజలం లీనమగుచున్నట్లుగా) బ్రహ్మమునందు లీనమగుచున్నారు-అని అభివర్ణనము).
మరికొందరు ఋషులు ఈ సూర్య (ఆదిత్య) మార్గాన్ని ఎట్లా అభివర్ణిస్తున్నారో.. అది కూడా వినండి.
• ఈ సూర్య మార్గంలో చిట్టచివరగా,
• స్వర్గలోకమునకు ఆవల,
• 5 పాదాలుగా (పంచపాదం) → (హేమంత ఋతువు - శిశిర ఋతువు ఒక్కటిగా చెప్పబడినప్పుడే - 5 ఋతువులు సంజ్ఞ) గల కాలస్వరూప స్థానము,
• పితరము → సర్వమునకు ఉత్పత్తి స్థానము,
• 12 రూపాలుగా (ద్వాదశాకృతం) → 12 నెలలుగా, -
• దివ అర్ధే - ఆకాశానికి ఆవల అర్ధ భాగంగా ఏర్పడినదై ఉన్నట్టిది.
• పురీషణము → సర్వము వర్షింపజేయు - ఆదిత్య స్థానము.
‘‘ఉత్తరాయన - ఆత్మోపాసనము’’గా చెప్పబడుచున్నట్టిది.
ఇక మరికొందరు మహనీయులు ఈవిధంగా కూడా వర్ణిస్తున్నారు :-
ఆ ఆదిత్య స్థానమును చేరువాడు :
- ‘విచక్షణౌ’ → కేవలద్రష్టత్వము. ఆత్మతత్త్వము గురించి విచారణచేసి ఆత్మభావన సిద్ధించుకొనటము. మౌన స్వరూపము. సర్వమును సాక్షిగా, అతీతంగా, చిద్విలాసంగా - ఆత్మదృష్టితో చూడటం.
- సప్తచక్రే → ఏడు చక్రాలు.. ఏడు రంగులు (ఈ దృశ్యమంతా ఏడు రంగుల చిత్రంగా గమనించటము.
- షడరాహు → ఆరు ఆకులు ఉంచబడినదిగా దర్శించగల స్థానం అని అభివర్ణిస్తున్నారు.
సూర్యుడు కాల విభాగానికి తండ్రి. అట్టి కాలము యొక్క ద్విమార్గములు
→ పదార్థము → శక్తి
మాసమే ప్రజాపతి (కాలస్వరూపుడు)
అందులో..
కృష్ణపక్షము → పదార్థము - ‘‘రయి’’ - కృష్ణపక్ష ఏవ రవిః’’।
శుక్లపక్షము → ‘‘శక్తి - ప్రాణశక్తి’’ - శుక్లః - ప్రాణః।
ఇది దృష్టిలో పెట్టుకొని కొందరు ఋషులు శుక్లపక్షంలోనే ఇష్టము (యజ్ఞ-యాగ-వ్రతాలు) నిర్వర్తిస్తూ ఉంటారు.
పదార్థత్వాన్ని అధిగమించే ఆశయం కలిగియే - శుక్లపక్షంలో(గా) యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తూ ఉంటారు.
Ⅰ. కొందరు శుక్లపక్షమును (పదార్ధానుభవ పరిమితులను దాటివేయు దృష్టిని) ఆశయముగా కలిగి ఉంటున్నారు.
Ⅱ. మరికొందరు కృష్ణపక్షాన్ని ఇష్టముల కొరకై ఎన్నుకొని, పదార్థత్వాన్ని ఆశయంగా కలిగి ఉంటున్నారు.
ఇట్టి రెండు దృష్టుల సమ్మేళనమే- ఏకత్వములో భిన్నత్వ రూపమైన సృష్టి. (భిన్నత్వములో ఏకత్వ దర్శనమే శుక్లమార్గము).
రాత్రి + పగలు = 1 రోజు
1 రోజు యొక్క స్వరూపము ప్రజాపతియే!
పగలు → ప్రాణము
రాత్రి → పదార్థము
అందుచేత -
పగలు సమయంలో → రతిక్రియకు, మైధునానికి (విషయములతో) సంయోగము / సంయజ్యము నిషేధము. అట్లు పొందువారు తమ ప్రాణశక్తిని న ప్రస్కందంతి → వ్యర్థము చేసుకొనుచున్నారు
రాత్రి సమయంలో → రతికి (మైధునానికి) ఏ దంపతులు సంయుజ్యము పొందుతారో, అది బ్రహ్మచర్యముతో సమానమే! అది ఇంద్రియ నిగ్రహమే అవుతుంది - అని చెప్పబడు
తాత్త్వికార్థ వివరణము
సహజముగా ... సర్వము ఆత్మగా చూస్తూ,
సందర్భమాత్రంగా ... విషయములతో ప్రాపంచికంగా దర్శిస్తూ ఉండటం.
ఇదియే బ్రహ్మచర్యము.
‘అన్నము’లోంచి జీవులు వస్తున్నారు. (అన్నము = అతః + నమ్) ‘‘అహమ్ + నమ్’’
→ భౌతిక రూపములు (నమ్ - నామ రూపాత్మకం)
→ ‘అహం’ రూపము (అత్, అతః)
→ ఈ రెండు అన్నము (ఆహారములో) మిథునమై (కలసియున్నవై) ఉన్నాయి.
ఈ ప్రాణికోట్లన్నీ ‘అన్నము’ నుండి జనిస్తున్నాయి.
అన్నము → ప్రాణ + పదార్థ సంపుటము.
జీవులంతా సముద్రంలో తరంగాల వలె నిత్య ప్రయాణీకులు.
మరణానంతరం ఈ జీవులు పదార్థ - ప్రాణ.. రెండు మార్గములలో ప్రయాణిస్తూ సంచరిస్తున్నారు.
కాల విభాగ సంజ్ఞలు |
- దక్షిణాయణం - ఉత్తరాయణం - కృష్ణపక్షం- శుక్లపక్షం - రాత్రి - పగలు - పదార్థమార్గము - ప్రాణమార్గము |
Towards sense of one's own SELF and then, Universal Self = ఉత్తరాయణం Towards sensory contexts = దక్షిణాయణం |
కాలము ఒక్కటే అయినట్లు, అదియే సంవత్సర ఉత్తరాయణ, దక్షిణాయణ.. ఇత్యాదులు అగుచున్నట్లు
.... ఇటువంటి వాటిలో ఈ జీవ సృష్టి అంతాకూడా - సాహిత్యమువలె, కథవలె, లీలగా ప్రజాపతితే కల్పించబటము, వికల్పించబడటము ఇక్కడ (జీవుల సృష్టి రూపంగా) జరుగుతోంది.
అయినా కూడా, ఆత్మ సర్వదా ఆత్మగానే ఉన్నదిగాని, ఆత్మయందు ఏదీ సృష్టింపబడటము లేదు, స్థితింపబడటం లేదు, లయింపబడటం లేదు కూడా।
ప్రజాపతి వ్రతం
ఈ విధంగా ఎవ్వరైతే..,
• ప్రజాపతి యొక్క సంకల్పమే సృష్టిగాను;
• ప్రధమంగా ప్రాణశక్తి ప్రజాపతి యొక్క ప్రదర్శనంగాను,
• ఈ దృశ్యము ‘ప్రాణము + రయి’ (Energy + Matter) అను మిథునము (జంట)గాను,
• నిరాకారము-అరూపమగు ప్రాణశక్తి యొక్క ప్రదర్శనమే సాకారము-సరూపము అగు సమస్త పదార్థముల ప్రదర్శనముగాను,
• జీవుల సృష్టి, ప్రాణశక్తి - రయిల మిథునముగాను,
• జీవ బాటసారులకు - (1) ప్రాణశక్తి వైపుగా (ఉత్తరాయణ) (2) పదార్థము(దక్షిణాయణ) మార్గములుగా రెండు ప్రయాణ మార్గాలు కల్పించబడినట్లు..,
• ప్రజాపతియే కాలస్వరూపుడై ద్వివిధ మిథునకర్తగా ప్రదర్శితమగుచున్నట్లు,
• అంతా ప్రాణేశ్వరుడగు ప్రజాపతి ప్రదర్శనమే-అనియు, సర్వులకీ సద్గతియేనని -
సందర్శిస్తారో, వారు ప్రజాపతివ్రతులు.
వారు కాల నిర్ణయాత్మకంగా (మోక్షసాధనలు అగు) సంతానము పొందువ్రతము చేస్తున్నవారు!
ఎవరి యొక్క తపస్సు - అవగాహన ఇంద్రియ నిగ్రహముతో కూడుకొనియుండి ‘కల్పన’ను అధిగమించినదై, సందర్భ సత్యములను దాటివేసినదై, సహజ సత్యమును (వారి తార్కిక బుద్ధి) ఆశ్రయించినదై ఉంటోందో,.. వారే సత్యవ్రతులు.
అట్టి సత్యనిష్ఠులు బ్రహ్మమును దర్శించగలరు.
ఎవరిలో వంచన, మోసము, అనృతము, మాయాదృష్టి తొలగుతూ వస్తోందో.., అట్టివారు భక్తి జ్ఞానములతో కూడిన వివేక దృష్టిచే దోషరహితమగు బ్రహ్మలోకమునకు చెందినవారు అగుచున్నారు. వంచన, మోసము, అనృతము, మాయదృష్టి, కామ క్రోధ లోభ మోహములు మొదలైనవి కొనసాగించువారు జన్మ-కర్మ-జన్మాంతరముల చక్రములో తిరుగాడువారై ఉంటున్నారు.
అయితే, పరమాత్మనుండియే ఈ జీవజాలమంతా బయల్వెడలుతోంది, పరమాత్మయందే లయిస్తోంది - అని విజ్ఞులు గమనిక కలిగి ఉంటున్నారు.
అక్కడికి వచ్చిన మునిపుంగవులంతా శ్రీపిప్పలాద మహర్షి విశ్లేషిస్తూ చెప్పిన ‘‘ఈ కనబడే జీవులంతా ప్రజాపతి సంకల్పిత చమత్కారమగు ప్రాణతత్త్వము యొక్క అభౌతిక + భౌతిక (సూక్ష్మ+స్థూల) ప్రదర్శనమే!’’,.. ‘‘సృష్టి కల్పన అంతా దక్షిణాయన, ఉత్తరాయన బాటసారుల చమత్కారమే’’ - అనునదంతా వింటూ ఉన్నారు.
అప్పుడు విదర్భ దేశీయుడు-భృగువంశజుడు అగు భార్గవుడు లేచి నిలుచున్నారు. గురు దేవులకు నమస్కరించారు. సాలోచనగా పిప్పలాద మహర్షి ముందు తన ప్రశ్నను ఇట్లా నివేదించారు.
స్వామీ! భగవన్! సద్గురూ! శ్రీపిప్పలాద మహర్షీ! ఈ పాంచభౌతిక దేహములన్నీ పాంచభౌతిక దేహ స్వరూపులగు జీవులు తమకు తామే నిర్మించుకొనటమూ లేదు. పరిపోషించుకోవటమూ లేదు. ఈ దేహములకు ఆయా విశేష ధర్మములు కల్పిస్తూ (ఉదా : చర్మానికి స్పర్శ, గుండెకు రక్తశుద్ధి, నరములలో రక్త ప్రదర్శనము, పొట్టలో జఠరాగ్ని ఇత్యాదులు) కొన్ని దేవతా ప్రజ్ఞలు పనిచేస్తూ ఈ ఇంద్రియములు క్రియాశీలకమవటానికి కారణమై ఉంటూ ఉండాలి కదా! (అనగా) జన్మలు పొందుచున్న జీవుల అతీతమైన దివ్య ప్రజ్ఞలు ఈ తతంగమంతా నడిపిస్తూ ఉన్నాయి - అని అనిపిస్తూ ఉన్నది.
ఇప్పుడు నా ప్రశ్న!
- ఈ దేహములు భరిస్తూ ఉన్న దేవతలు (లేక) దేవతా ప్రజ్ఞలు ఎందరు? ఎవరెవరు?
- ఈ దేహము - దేహములో తత్త్వాలను ప్రకాశమానం చేస్తూ తమ శక్తులను ప్రకటిస్తున్న దేవతా ప్రజ్ఞలు ఎన్ని? ఏవేవి?
- అట్టి దేవతా ప్రజ్ఞలన్నిటిలో వరిష్ఠ (Say, Leader) దేవత ఎవరు? శ్రేష్ఠమైనదేది? (Who is the most predominent?)
అందుకు మహర్షి సమాధానం :-
భార్గవీ! మీరు చెప్పుచున్నట్లే - శరీరులగు జీవుల శరీర నిర్మాణ కార్యక్రమంలో ప్రకృతిని సేవిస్తున్నట్టి అశరీరులగు ప్రజ్ఞలు ఉన్నాయి. అట్టి ప్రజ్ఞవంతులను ‘‘అధిష్ఠాన దేవతలు’’ అని అంటారు. ‘‘ఈ శరీరమునకు సంబంధించి వేరువేరు అధిష్ఠాన దేవతలు ఆయా దేహ విశేషాలకు నిర్మాతలు, సొంతదారులు కూడా’’ - అని పౌరాణికంగా చెప్పబడుచున్నది. వారంతా కూడా తమ తమ మహత్యములచే ఆయా క్రియలను దేహములలో నిర్వర్తించటం జరుగుతోంది.
కారణ పదార్థములు - పంచభూతములు (5)
ఆకాశము; వాయువు; అగ్ని; ఆపః (జలము); భూమి (Space - Vapour - Heat - Liquid - Solid)
ఈ ఐదు కూడా ఆయా అధిష్ఠాన దేవతల కార్యక్రమ నిర్వహణా చమత్కారాలే! ఇవి ‘పంచ సూక్ష్మ భూత శక్తి దేవతలు’ అని కూడా అంటారు కదా! పంచ భూతతత్త్వములే ఈ కనబడే సర్వ చేతన జడ భౌతిక రూపములకు (భౌతిక సృష్టికి) కారణ పదార్థములు. పిచ్చుకల గూడుల వంటి ఈ భౌతిక శరీరములన్నీ కార్యరూపములు. (దేవతలు = Cause, దేహములు = Effects).
కర్మేంద్రియములు : వాక్కు - పాణి (చేతులు) - పాదములు (కాళ్ళు) - పాయువు (మలద్వారము) - ఉపస్థ (జననేంద్రియము)
జ్ఞానేంద్రియములు : చర్మము (స్పర్శ) - కళ్లు (చూపు) చెవులు (వినికిడి) - జిహ్వ (రుచి) - ఘానేంద్రియము (ముక్కు -వాసన)
మనస్సు : ఇక ఆరవది ఇంద్రియము - ‘‘మనస్సు’’. మనః షష్ఠాని ।
వీటన్నిటికీ ఒక్కొక్క కార్యక్రమమునకు ఆయా అధిష్ఠాన దేవతయి (దివ్య ప్రజ్ఞలు) కారణముగా అగుచున్నారు. వారంతా సృష్టిలో తమ వంతుగా ఆయా సంబంధిత కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఈ శరీరములను పరిపోషిస్తూ ఉన్నారు. నిలబెట్టుచూ ఉన్నారు.
ఒకసారి ఒకానొక చమత్కారమైన సంఘటన యొక్క విశేషాలు ఇప్పుడు చెప్పుచున్నాను. మీరంతా శ్రద్ధగా వినండి. ఈ విశేషాలన్నీ మన ఈ భృగువంశీయుrడు - విదర్భ దేశీయుడు అగు భార్గవుని ప్రశ్నలకు సమాధానము అయి ఉన్నది.
ఒక సందర్భంలో ఒకానొక దేహి గాఢ నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు పంచకర్మేంద్రియములు (ప్రజ్ఞా దేవతాంశలు) ఒకచోట సమావేశమైనాయి. ఈ శరీరములలో తమ పాత్ర యొక్క ప్రాముఖ్యత- ప్రత్యేకతల గురించి గొప్పలు చెప్పుకోసాగాయి.
వాక్కు → నా వలననే కదా ఈ మానవుడు మాట్లాడటం! మాటలు లేకపోతే ఈ జీవుడి గతి? - మూగయేకదా! నిరర్థకమే. కనుక నా పాత్ర బహు గొప్పది. పైగా, ఈ జీవుడు నా ద్వారానే కదా; ఆహారము తీసుకొనేది! నేను లేకుంటే ఈ దేహము ఒక్కరోజు కూడా నిలువలేదు. కనుక ఈ దేహములో నేనే ముఖ్యం. నేనే ఈ దేహాన్ని కాపాడుచున్నాను. ఇదంతా నా సామర్థ్యమే. నా వాక్-సామర్ధ్యము వలననే ఈ జీవుడు వేద-వేదాంగముల ఆశ్రయము, మోక్షము సాధ్యమగుచున్నాయి.
పాదములు → ఏం గొప్పలండీ వాక్కు గారూ! గొప్పతనమంతా మాది! నోటితో తిన్న తిండి అరగాలి కదా! మేము నడుస్తున్నాము కనుకనే ఈ దేహమంతా కదులుతోంది. ఈ దేహము కదలకపోతే తిన్నది ఎట్లా అరుగుతుంది? ఈ జీవుడు నడుస్తుంటేనే జీవితం. లేకుంటే జీవితము నిరర్థకమే కదా! కనుక, పాదములగు మేమే దేహంలో ముఖ్య విభాగమై ఉన్నాము. మా వలననే ఈ దేహము ఆయురారోగ్యములతో మనగలుగుతోంది. మేమే ఈ పొడవైన భౌతిక శరీరము మోస్తున్నాము కనుక మేమే శరీరములో శ్రేష్ఠులము.
పాణి → ఆహారం ఎదురుకుండా ఉంటే సరిపోతుందా? చేతులము మేము ఉన్నాము కాబట్టి ఈ జీవుడు తిండి తినగలుగుచున్నాడు. పనిచేయగలుగుచున్నాడు. చేతులు లేని దేహము నిరుపయోగమే కదా! కనుక మేమే ముఖ్యము! (అయం హస్తో భగవానః।). మేమే ఈ శరీరాన్ని కాపాడుచున్నది! మేము లేకుంటే ఈ దేహము నిరర్థకము.
పాయువు (మలద్వారము) → : జీవుడు తిన్న ఆహారము జీర్ణమయిన తరువాత దేహము మలరహితం అవకపోతే? ఎన్నాళ్ళు జీవిస్తుంది ఈ దేహము? కనుక మేము - మేము నిర్వర్తించేదే దేహములో అతిముఖ్యమైన కార్యక్రమము. కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడా మేమే ఎంతో ముఖ్యం. మమ్ములను కాదని ఈ దేహం జీవించనే లేదు. అందుచేత శరీరములో మేమే ముఖ్యము.
ఉపస్థ → : జననేంద్రియమగు మేమే సంతానానికి కారణం. కనుక జీవజాతినంతా నిలబెట్టుచున్నది మేమే! లేకుంటేనో? మేము ఈ దేహ పునరుత్పత్తులకు సేవలందించకుంటే? జీవజాతులు కొద్ది సంవత్సరాలలో ఈ భూమిపై నిలవకుండాపోతాయి. అంతేనా? ఏం కాదు! ఈ జీవులకు శృంగారానందం మా వలననే కదా కలుగుతోంది. మేమే అతిముఖ్యం. మేము లేకుంటే ఈ జీవజాతులన్నీ ఒక తరము మించి భూమిపై నిలువజాలవు. అందుచేత శరీరములో మాదే ప్రాధాన్యము.
స్పర్శేంద్రియం (చర్మం) : అయ్యా! ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుచున్నారేగాని మా గొప్పతనం గురించి ఎవ్వరూ ఊసెత్తడం లేదేం? అన్ని అవయవాలను కప్పి ఉంచి, పుట్టీ - పుట్టకముందు నుంచి - పాడె వరకు ఈ దేహాన్ని రక్షిస్తున్నది మేము. అంతేనా? ఈ జీవుడికి స్పర్శ సుఖం - స్పర్శరక్షణ మేమే కదా ఇస్తున్నది? మమ్ములను కాదంటే ఈ దేహము, ఈ అంతర్వ్యవహారాలు, ఈ రక్త - మాంస విభాగాలు నిలుస్తాయా? మా గొప్పతనం ఎవ్వరికీ రాదు. అసలు ఏ జీవునికైనా - సుందర రూపముగాని, కురూపముగాని ఇస్తున్నది ఎవ్వరు? మేము. అటువంటి చర్మరూపస్పర్శేంద్రియమగు నన్నే మరచి ఏమిటేమిటో గొప్పలు చెప్పుకుంటున్నారే? ఈ దేహంలో మేమే గొప్ప! మా గొప్పతనం ఎవ్వరికో వస్తుందా? రాదు. ఎవ్వరూ మాట్లాడకండి. చర్మమే లేకుంటే ఏ జీవుడైనా జీవనము ఆరంభించగలడా, - చెప్పండి?
కళ్ళు - చూపు : ఏమిటేమిటి? ఇంతమంది ఇన్ని మాటలు చెప్పుచున్నారుగాని, మీకందరికీ శాస్త్ర నానుడి ఏమిటో తెలుసా? ‘‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’’.. అని విన్నారా? లేదా? లోచనం (కళ్ళు) లేకపోతే ఆ జీవుడికి లోకాలే లేవు. దేహంలో మేము ఉన్నదే ముఖ్యస్థానము. మా వలననే జీవుడికి జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కూడా! మా వలన పొందిన సమాచారమే దేహానికి నిజమైన ఆహారము. మా వలననే ఈ దేహము నడుస్తోంది. కూర్చుంటోంది. చూస్తోంది, నిద్రిస్తోంది, జీవిస్తోంది. కనుక చూపు రూపంలో కళ్ళలో ఉన్న మేము మీ అందరికన్నా ముఖ్యము. జీవుడికి నిజమైన చైతన్యము మా వలననే వస్తోంది! లేకుంటే దేహము - లోకము - జీవితము జడమే. కళ్లులేని బ్రతుకు ఏమి బ్రతుకు చెప్పండి?
చెవులు - వినికిడి : అయ్యా! అయ్యా! అసలు వినికిడియే లేకుంటేనో? శాస్త్ర గానాలు, గురు - శిష్య సంభాషణలు, సంగీత ఆస్వాదనలు, పరస్పర సంభాషణలు జరుగవుకదా! పెదవులు కదలితే కూడా దేహములో వినికిడి శక్తి లేకపోతే, ఆ మాటలు ఎందుకు పనికి వస్తాయి? కళ్ళు చూస్తే చూడవచ్చు. వినికిడి లేకపోతే ఏం ప్రయోజనం? ప్రకృతిని ఆస్వాదించే జీవునికి వినికిడి శక్తియే ముఖ్యం. మేమున్నాము కాబట్టే 64 కళలు ఉన్నాయి. అందుచేత అందరు మాటలు కట్టిపెట్టండి. మా గొప్పతనమేమిటో, ఈ దేహములో మా ఔన్నత్యము ఎట్టిదో, అది గమనించండి. అందరికంటేమేమే గొప్ప. అంతే। చెవులే లేకుంటే చేతన మాధుర్యమే అనుభవమవదు.
జిహ్వ - రుచి : అయ్యా! ఆహారం స్వీకరించేది నేను. ‘రుచి అనే హాయిని ఈ జీవుడికి అందించేది నేను. పలుకులు పలికేది నేను. నేను కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను కాబట్టే ఆహారం ఈ దేహంలో ప్రవేశించగలుగుతోంది. ఈ దేహానికి ముఖ్యద్వారము నేనే। జిహ్వయే లేకుంటే ఈ ఈ దేహము జడమైన తోలు తిత్తియే. నాపైన - నా కార్యక్రమంపైన ఈ సర్వదేహ విభాగాలు ఆధారపడి ఉన్నాయి. ఆహారము దేహములోనికి నేను పంపకుంటే? ఆపై ఇక ఈ కాళ్ళు - చేతులు - చర్మము - కళ్ళు - చెవులు పనిచేయగలవా? ఈ దేహయంత్రానికి ఇంధనం నావలననే ప్రాప్తిస్తోంది. కనుక సందేహమే లేదు - ఈ దేహంలో నేనే గొప్ప! నా గొప్పతనం ఎవ్వరు, ఎట్లా కాదంటారో.. చెప్పండి? నేనే నోరుకు శబ్ద శక్తి ప్రదాతను సుమా!
ఘ్రానేంద్రియము : అస్సలు గాలి పీల్చేది నేను. నా కార్యక్రమమే లేకుంటే? ఏ దేహమైన పది నిమిషాలు జీవిస్తుందా? లేనే లేదు. శరీరంలోని అణువణువుకు వాయుశక్తిని అందిస్తున్న నన్ను మీరంతా మరచిపోయి మాట్లాడుతారా?
జీవుడిని నేను లేకపోతే - సువాసన సుఖం తెలిసేదా? లేదు.
నేను పని చేస్తున్నాను కనుక మీరంతా ఉన్నారు. కనుక ఎవ్వరూ నోరు మెదపకండి! ఈ దేహానికి ముఖ్యవిభాగం నేనే! అంతే! ముక్కు మూస్తే మూడు నిముషాలు పట్టదు, అంతా గోల్-మాల్ అవటానికి!
మనస్సు : ఓ కర్మేంద్రియములారా? జ్ఞానేంద్రియము లారా? మీరంతా మీ గొప్పలు చెప్పుకొని వాదులాడుకుంటున్నారా? సరే! అసలు మనస్సు ఉంటే కదా జగత్తు! జీవుడి మనన శక్తినైన నేనే ముఖ్యం. మనస్సు ఉంటేనే అన్నీ ఉంటాయి. మనస్సు లేకుంటే జీవుడే లేడు. ఇక దేహం గురించి, మీ గురించి చెప్పేదేమున్నది? మనస్సు లేకుంటే ఏ జీవుడికీ మనుగడయే లేదు. కనుక నన్ను ‘షష్టేంద్రియం’ అని యోగులు, పౌరాణికులు, వేద ప్రవచనాలు ఎలుగెత్తి మమ్ములను పొగుడుతూ ఉంటే, మీరంతా ఏదేదో గొప్ప - గొప్పలు చెప్పుకుంటారే!
మనస్సే మనిషి। మనస్సే జగత్తు। మనస్సే బంధము. మనస్సే మోక్షము. కాబట్టి నేను గొప్ప। నేనే గొప్ప।
ఈ విధంగా ఆయా ఇంద్రియములు, మనస్సు ఒకటితో మరొకటి ‘‘మేం గొప్ప - మేం గొప్ప’’.. అంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. కీచులాడుకుంటున్నాయి. పరస్పరము తక్కువగా చేసి మాట్లాడుకుంటున్నాయి.
ఇంతలో...,
అప్పుడు ఆచోటిలో ప్రాణదేవత ప్రత్యక్షమయింది.
ముఖ్యప్రాణము : ఓ మిత్రులారా! ఇటు రండి! మోహంలో పడకండి! మీరంతా కూడా ముఖ్యమే. నేను కాదనను. అయితే, మీ అందరి రూపంలో ఉన్నదెవ్వరు? నేనే! నన్ను నేనే పంచభూతములుగా, పంచకర్మేంద్రియములుగా, పంచజ్ఞానేంద్రియములుగా.. అన్ని రూప-నామాలుగా, జీవులుగా, జీవరాశులుగా, భావనా తరంగములుగా విభజించుకొని విరాజిల్లుచున్నాను సుమా!
ఆ మాటలు ఇంద్రియాదులు విన్నాయి. మనస్సుతో సహా జ్ఞానేంద్రియ -కర్మేంద్రియములు ఆ మాటలు ఒప్పుకోలేదు. తమలో తాము ‘‘ఏమిటి ఈ ప్రాణము గొప్ప? మనందరి రూపంగా తానే ప్రదర్శనమగుచున్నానన్నంత ధైర్యంతో మాట్లాడుతోందే? ఏది ఏమైతేనేం? మనందరమే ఈ దేహాన్ని నిలబెట్టుచున్నాం. మధ్యలో ఈ ప్రాణ శక్తి గొప్పతనం ఏముంటుందట?’’ - అని చెప్పుకుంటూ గుసగుసలాడుకోసాగాయి.
ముఖ్యప్రాణము ఆ గుసగుసలు, ఆ దెప్పిపొడుపు మాటలు విన్నది. చాలా అభిమానము పొందింది. ‘‘వీళ్ళకు నా సంగతి ఏమిటో విజ్ఞానయుక్తంగా, అనుభవపూర్వకంగా తెలియజేయవలిసిందే!’’.. అని తలచింది.
అప్పుడు..., ఇక దేహము నుంచి చిన్నచిన్నగా బయల్వెడలసాగింది!
ఇంకేమున్నది? ముఖ్యప్రాణము దేహము నుండి బయల్వెడలుతూ ఉంటే,.. క్రమంగా పంచ ప్రాణములు-ఉప ప్రాణములు, కర్మేంద్రియములు.. జ్ఞానేంద్రియములు తాము కూడా దేహము నుండి కదలిపో - ప్రారంభించక తప్పలేదు. బలవంతంగా ఒకటి తరువాత మరొకటి దేహము నుండి బయల్వెడలటానికి సిద్ధం కాసాగాయి.
‘‘అయ్యయ్యో! కొంపలు మునుగుచున్నాయే? మనం కూడా ఈ దేహాశ్రయం నుండి బలవంతంగా నెట్టివేయబడచున్నామే!’’ అని ఇంద్రియములు, మనస్సు బెంబేలుపడసాగాయి. ఒక తేనెతుట్టెలోని రాణి తేనెటీగ బయటకు వెళ్ళుచుండగా మిగతా తేనె టీగలన్నీ ఆ రాణీ తేనెటీగను అనుసరిస్తూ ఉంటాయి - చూచారా? ఆవిధంగా ముఖ్య ప్రాణము యొక్క (దేహము నుండి) కదలికచే సర్వేంద్రియాలు - మనస్సు దేహమును బలవంతంగా వీడసాగాయి. దేహము కట్టెవలె మొద్దుబారిపోవటం ప్రారంభించింది.
అప్పుడు ముఖ్య ప్రాణము...,
‘‘ఆహా"! ఇప్పుడు నా ప్రాముఖ్యత ఏమిటో ఈ మనో- ఇంద్రియాలకు తెలియవస్తోంది కదా! నేనే నా యొక్క వివిధ శక్తుల రూపాలుగా ఇంద్రియ మనో నామకరణములగా ప్రదర్శితమగుచున్నానని తెలియవచ్చి ఉంటుంది. ఇక ఈ దేహమును అకాలముగా ఎందుకు త్యజించటం? కనుక తిరిగి నేను ఈ దేహములో ప్రాణశక్తి రూపంగా సుప్రతిష్ఠితమయ్యెదను గాక!’’ |
అప్పుడవన్నీ ఈ భౌతిక దేహములోని ముఖ్యప్రాణము యొక్క ‘‘ఆవశ్యకత, ఔన్నత్యము, ప్రాముఖ్యత’’ ఏమిటో గుర్తించాయి. వాక్కు, మనస్సు, చక్షువులు, చెవులు - ఇవన్నీ కూడా ప్రీతిపూర్వకంగా ప్రాణదేవతను స్తుతించటం ప్రారంభించాయి.
కాబట్టి బిడ్డలారా! ముఖ్యప్రాణమే (ప్రాణశక్తియే) ఈ కనబడే స్థూల-సూక్ష్మ శక్తులన్నిటికీ మూలశక్తి, మూల ప్రకృతి కూడా।
అట్టి ముఖ్య ప్రాణమే..,
- ప్రకృతిలో అగ్ని (Heat) రూపముగా అయి సర్వమును ఉత్తేజింపజేస్తోంది. ప్రకాశింపజేస్తోంది.
- ప్రాణశక్తియే వరుణదేవరూపుడై వర్షముగా కురుస్తోంది.
- దేవతలకు అధిపతి అగు ఇంద్రుడు ముఖ్య ప్రాణ సందర్శనా వైశిష్ట్యమే!
- భూమిపై కనిపించే నామ-రూపాత్మకమైనదంతా ముఖ్య ప్రాణ ప్రదర్శనమే ((Manifestation of prana energy as physical form))
అంతేకాదు! సత్తు (That which can be seen by physical Eyes) - అసత్తు (Which is non-Physical-eg.Emotions, opinions, interest etc.) రూపంగాను, మార్పు-చేర్పులకు ఆవల అమృతరూపంగాను, సర్వ దేవతల రూపంగాను కనిపించేదంతా ప్రాణశక్తితత్త్వమే.
రథచక్రము యొక్క ఇరుసులో ఆకులు ఇమిడి ఉన్నట్లుగా..
.... ఈ సర్వము ప్రాణభగవానుని యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి.
- ఋక్కులు, యజస్సులు, సామములో కనిపించే స్తోత్రములు మంత్రములు, ఉపాసనలు, గానములు.
ఇవన్నీ ప్రాణాగ్నిలోనుండి విస్ఫులింగములవలె బయల్వెడలుచున్నాయి.
- బ్రహ్మతత్త్వవేత్తలగు బ్రాహ్మణుల జ్ఞానశక్తి, క్షత్రియులలో క్షేత్రశక్తి, సమస్త జీవుల పంచేంద్రియశక్తులు ప్రాణశక్తి ప్రదర్శనములే.
ఇకప్పుడు..,
ఇంద్రియ దేవతలు (కర్మేంద్రియాలు - జ్ఞానేంద్రియాలు - మనస్సు) ప్రాణశక్తిని ఈ విధంగా స్తోత్రం చేయసాగాయి.
ఓ ప్రాణేశ్వరా! ముఖ్య ప్రాణమా!
• మీరే ప్రజాపతి అయి, సర్వజీవరాసుల గర్భములందు లీలగా సంచారాలు చేస్తున్నారు।
• మరల మరల దేహాలు స్వీకరిస్తున్నది, వాటిని త్యజిస్తున్నదీ కూడా మీరే।
• ఈ కనబడే సర్వదేహాలతోను, సర్వ అనుభవాలలోను నివసిస్తూ ఉన్న మీకు ఈ జీవులంతా - శబ్దానుభవము, స్పర్శానుభవము, రూపానుభవము, రసానుభావము, గంధానుభవము, (ఇంతేకాకుండా) సర్వభావ- ఆవేశములు - ఇత్యాది అనుభవములన్నీ - కానుకలుగా అనుక్షణం సమర్పించుచున్నారు. మా మా కార్యక్రమములకు కర్త- భోక్త మీరే.
• మీరు అగ్ని స్వరూపులై సృష్టి అంతా నిండి ఉన్నవారై విరాజిల్లుచున్నారు. ఇంద్రియములను ఉపయోగించి ఈ జీవులు నిర్వర్తించే యజ్ఞ - యాగములలో సమర్పిస్తున్న హవిస్సులను దేవతలకు చేరవేసే వహ్నిదేవుడు మీరే! ఈ విధంగా హవ్యవాహకులై, తద్వారా (దేవతల ద్వారా) జీవులకు శుభములను ప్రసాదిస్తున్నారు. ఇంద్రియములగు మాకు పుష్ఠిని కలుగజేస్తున్నారు.
• అదేవిధంగా వంశీయులు-పిత్రుదేవతలకు సమర్పించే ‘స్వథా’ రూపమగు పిండాహార సమర్పణను పిత్రుదేవతలకు చేరవేసి, తద్వారా జాతి-వంశవృద్ధికి సహకరిస్తున్నారు. స్వాథా వాహక దేవత మీరే కదా! సంతానవృద్ధి చేతనే కదా, ఇంద్రియములమగు మేము అనేక దేహాలలో ప్రకాశిస్తున్నాము.
• ఓ ప్రాణదేవా! ప్రాణేశ్వరా! ప్రాణానందస్వరూపా! - ఋషులయొక్క సాధన వస్తువులన్నీ మీ రూపమే। అంతేకాదు ‘సాధ్యము’ అగు పరమసత్య వస్తువు కూడా మీరే! అంగీరసుడు ఇత్యాది మహర్షులు చూపుచున్న సత్యమార్గము మీరే। పరాకాష్ట ఆశయ సిద్ధి కూడా మీరే! అంగీరసములలోని (అగ్నికార్యములలోని) అగ్ని మీరే!
• హే ప్రాణ భగవాన్! త్రిలోకములకు నాధుడు అయినట్టి ఇంద్రుని తేజస్సు మీ రూపమే! రుద్ర తేజస్సు కూడా ప్రాణశక్తి స్వరూపులగు మీరే అయి ఉన్నారు. సృష్టికర్తవు (బ్రహ్మ), సృష్టి రక్షకుడవు (విష్ణువు), సృష్టి సంహారకుడవు (రుద్రుడవు) నీవేనయ్యా!
• ఆకాశంలో సంచారాలు చేస్తున్న సూర్యభగవానుడు కూడా మీరే! జ్యోతులకే జ్యోతివై ఈ లోకములన్నిటినీ తేజోమయం చేస్తున్నది మీరే! జ్యోతిర్జ్యోతిస్స్వయంజ్యోతిః! నమో నమః!
• ఓ ప్రాణశక్తి స్వరూపా! మీరు అభివర్షంచటం చేతనే (Because of your devine raining) సర్వజీవులు తాము ఉన్నట్టి స్థానాలలోను, ప్రదేశాలలోను తాము కోరుకొంటున్న (తమకు తగియున్న) ఆహారము పొందుచున్నారు. జీవులందరినీ ఆ విధంగా ఎల్లప్పుడు ఆనందభరితుల్ని చేస్తున్నది మీరే కదా!
• సృష్టికి మూలపదార్థమగు నిర్వికారమగు వ్రాత్యుడవు. ప్రప్రధమ స్వరూపుడవు. సమిష్ఠి స్వరూపుడవు. సర్వమునకు భోక్త అయినట్టి ‘ఏకర్షి’ అనే పేరు గల అగ్ని మీరే! (You are the experiencer as well as Enjoyer of what ever all else that is present in the creation. You are the Al-present and Al-pervoding Fire / Heat).
• విశ్వమునకు ఆధారమైయున్న ‘సత్’ వస్తువు మీరే।
• వయం ఆద్యస్య దాతారః! (ఇంద్రియములగు) మేము మీరు భక్షించే పదార్థములన్నీ మీకు అందించేవారము మాత్రమే! వాటిని సంకల్పించేది, ఆస్వాదించేది మీరే!
• సమస్త జీవులను జీవింపజేయుచున్న వాయువుకు కూడా తండ్రి అయి ఉన్నవారు.
ఓ ప్రాణప్రదా! వాక్కులోను, చెవిలోను, నోటిలోను, (తదితర సర్వ ఇంద్రియములలోను) ఇంద్రియశక్తి రూపంగా విస్తరించి ఉన్నది మీరే! మీరు సర్వే సర్వత్రా విస్తరించి, సర్వమును ఉజ్జీవితముగాను, శోభాయమానముగాను, మంగళప్రదముగాను చేస్తున్నారు.
ఆ విధంగా మాయందు విస్తరించియున్నవారై మమ్ములను శుభప్రదంగాను, శక్తియుతముగాను తీర్చిదిద్దుతూనే ఉండటమును దయచేసి కొనసాగించండి.
అంతేగాని..,
మా ఉత్క్రమీ! మమ్ములను విడచి వెళ్ళకండి! ఎందుకంటే మాకు త్రాణ-ఉనికి ప్రదాత మీరేనని గమనించాము! ఒప్పుకుంటున్నాము!
ఈ మూడు లోకాలలో ఎక్కడెక్కడైతే ఏదేది ప్రదర్శితమగుచూ, ప్రతిష్ఠితమగుచూ కనిపిస్తోందో,... అదంతా కూడా ప్రాణదేవుడవగు మీ వశములో ఉన్నాయనిమేమిప్పుడు శతథా, సహస్రథా గమనిస్తున్నాము. అందుచేత ఓ ప్రాణమహాత్మా! మీకు వేనవేల నమస్కారాలు. మాకు సంపద-మేధస్సు ప్రసాదించండి.
శ్రీ పిప్పలాదమహర్షి: విన్నారా బిడ్డలారా! ఈ విధంగా పంచభూతములైనట్టి పృథివి - ఆపః - తేజో - వాయుః - ఆకాశములు, పంచకర్మేంద్రియములు; పంచ జ్ఞానేంద్రియములు; మనస్సు → తమ తమ స్తోత్రములను, విన్నపములను ప్రాణదేవునికి సమర్పించినవై, తమను తాము ప్రాణస్వరూపములుగా అవగాహన-అన్వయము కలిగియున్నవై.., తిరిగి యథాతధముగా దేహమునందు తమ తమ క్రియలను నిర్వర్తించటానికి ఉపక్రమించసాగాయి.
కనుక ముఖ్యదేవత ప్రాణశక్తియే! ప్రాణేశ్వరుడే! ఆయనయే సమస్త దేహములలో ప్రాణశక్తిగా వేంచేసి ఉండి, -
అన్నిటికన్నా శ్రేష్ఠమైనది - ప్రాణమే। పంచభూత, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనో విశేషాలన్నీ శరీరములోని దేవతలు. ప్రాణమే ముఖ్య దేవత।
ఆ తరువాత...,
అశ్వలపుత్రుడు అయినటువంటి కౌసల్యుడు లేచి నిలుచున్నారు. పూజ్యపాదులు, బ్రహ్మర్షి అయిన శ్రీ పిప్పలాద మహర్షి ముందు ఈ విధంగా తన ప్రశ్నను నివేదన చేయసాగారు.
‘‘హే భగవాన్! పూజ్యుడా! ప్రాణదేవుని యొక్క అధినాయకత్వము గురించి చాలా చక్కగా మాకు అర్థమయ్యేటట్లు కథా దృష్టాంతపూర్వకముగా బోధించారు. చాలా సంతోషము.
ఇప్పుడు నా సందేహమేమిటో కూడా, తమ ముందు వినమ్రుడనై, విన్నవించుకుంటున్నాను.
|
ఈ ప్రశ్నలకు మాన్యుడు - ఆత్మజ్ఞుడు అగు శ్రీ పిప్పలాద మహర్షి సమాధానం చెప్పసాగారు.
శ్రీ పిప్పలాద మహర్షి: ఓ కౌసల్యా! చాలా చక్కటి, అతి ముఖ్యమైన ప్రశ్న వేశారు.
మీరు బ్రహ్మనిష్ఠుడు కాబట్టే ముఖ్యప్రాణము గురించి నేను చెప్పిన విశేషాలన్నీ విని, అట్టి ప్రాణతత్త్వము యొక్క ఉత్పత్తి గురించి ప్రశ్నించారు. మంచిది! నాకు చాలా సంతోషం.
ఓ కౌసల్యాశ్వలాయనా!
బ్రహ్మతత్త్వ జిజ్ఞాసువు కాబట్టి నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్పుతాను. తదితర శ్రోతలారా! మీరందరూ కూడా శ్రద్ధతో వినెదరు గాక!
ఆత్మన ఏష ప్రాణో జాయతే। ప్రాణము ఆత్మ నుండే (From the Absolute Self) ప్రాదుర్భవిస్తోంది.
ఒక జీవుడు దీపమునకు అల్లంత దూరంగా నిలబడి ఉంటే, నీడ ఆతనిని ఆవరించి (ఆక్రమించుకొని ఉన్నట్లుగా) ఉంటుంది చూచారా! ఆ విధంగా ఈ ప్రాణము కూడా (నీడవలె) ఆత్మను ఆవరించి ఉన్నదానివలె ఉంటోంది.
ఇక, ‘‘ప్రాణము శరీరములో ఎట్లా ప్రవేశిస్తోంది?’’ అని కదా ప్రశ్న?
మనస్సు యొక్క చర్యల కారణంగా ప్రాణము శరీరములయందు ప్రవేశించినదై ఉంటోంది.
ఈ కనబడే సృష్టి అంతా కూడా శక్తి (ప్రాణతత్త్వము) యొక్క సంప్రదర్శనమే. బాహ్యములోని నామరూపములు, అంతరములోని మనో-బుద్ధి-చిత్తాదులు, వాటికి చెందిన అనుభవములు, అనుభూతులూ.. ఇవన్నీ కూడా ముఖ్యప్రాణ ప్రత్యక్ష రూపములే. అయితే ‘శక్తి’ ఉన్నప్పుడు ‘శక్తి తనదైనవాడు’ ఉండాలి కదా! మరి ప్రాణశక్తి ఎవరిది?
శక్తిమంతుడు → ఆత్మయే! అట్టి ఆత్మయొక్క చిత్తమే (ఇష్టమే) మనో-ప్రాణశక్తులుగా ఆవిర్భవిస్తున్నాయి.
శక్తిమంతుడు లేకుండా శక్తి ఉంటుందా? ఆత్మ లేకుండా ప్రాణము ఉండదు! ఆత్మయే ప్రాణరూపము దాల్చుచున్నది. ఆత్మ-ప్రాణము పరస్పరము అనన్యము, అవిభాజ్యము కూడా.
ఒకడు ఒకవైపు వెళ్ళుతూ ఉంటే ఆతనిని ఆతని నీడ అనుసరిస్తూనే ఉంటుంది కదా! నీడకు ఆ వ్యక్తి కంటే వేరైన ఉనికి ఉంటుందా? లేదుకదా! అట్లాగే వాస్తవానికి ప్రాణ శక్తికి ఆత్మకంటే వేరైన - ప్రత్యేకమైన అస్థిత్వము లేదు. ఆత్మకు వేరైనట్లుగా చూస్తే శక్తి వేరుగా ఉండజాలదు. ‘‘ఒక బలవంతుడగు వానిలో బలము వేరు. ఆతడు వేరు’’.. అని మనం అంటామా? ఆతనికి వేరుగా బలమునకు అస్థిత్వము ఉండదుకదా! ఆత్మకు వేరుగా ప్రాణశక్తికి అస్థిత్వము ఉండజాలదు.
ఆత్మ యొక్క సంకల్ప చమత్కారము చేతనే ప్రాణశక్తికి అస్థిత్వము స్వభావసిద్ధముగా ఆత్మకు అభిన్నమై కలుగుచున్నదని అభివర్ణించబడుతోంది!
ఆత్మనుండి ఆత్మ యొక్క సంకల్పం చేతనే ఆత్మకు అభిన్నమై, ఆత్మ యొక్క నీడవలె ప్రాణశక్తి బయల్వెడలుతోంది. అట్టి ముఖ్యప్రాణము ఇక ఇతర ప్రాణశక్తులైనట్టి ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములను, కర్మ-జ్ఞానేంద్రియాదులను నియమించుతోంది. పర్యవేక్షిస్తోంది కూడా. (Appointing as well as supervising). ఒక సామ్రాట్టు తనయొక్క పాలనాధికారంచేత-సేవకులను, గ్రామాధికారులుగా నియమించి, వారంతా ఆయా గ్రామాలను పరిపాలిస్తూ ఉంటే తాను మాత్రం వేరుగా ఉండి అంతా పర్యవేక్షిస్తూ ఉంటాడు కదా! పర్యవేక్షకుల ద్వారా, తానే నిర్వహిస్తూ ఉంటాడు. అట్లాగే ముఖ్యప్రాణము సర్వ తదితర ప్రాణశక్తులను పర్యవేక్షించటం జరుగుతోంది. ఇతర తత్త్వాలన్నిటినీ వినియోగిస్తూ ప్రకృతి రచనా లీలను విలాసంగా కొనసాగిస్తోంది. ముఖ్యప్రాణము ఆత్మ యొక్క విన్యాసమే కనుక అంతా కూడా ఆత్మ విన్యాసమే.
‘‘ఆత్మ సర్వదా అనన్యము. ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు’’ - అనునది వేద మహావాక్యము.
కాబట్టి...,
ఈ దృశ్యరచనా విలాసమంతా ముఖ్య ప్రాణశక్తిదే!
కానీ..,
అట్టి ముఖ్యప్రాణశక్తి ఆత్మకు తన యొక్క నీడవంటిది!
అటువంటి ‘‘ముఖ్యప్రాణశక్తి’’..,
పాయూపస్థే అపానం। పాయువు-ఉపస్థ (లేక) విసర్జన - జననేంద్రియాలలో అపానము |
→ అపానమును ముఖ్య ప్రాణమే నియమిస్తోంది. అట్టి అపాన ప్రాణము (Energy of pushing out), పాయువు, ఉపస్థలందు క్రియాశీలకమై ఉంటోంది. |
చక్షుః శ్రోత్రే ముఖ నాసికాభ్యాం ప్రాణః। కళ్లలోను - చెవులలోను - నోరులోను - ముక్కులోను చూపు - వినికిడి - రుచి - వాసన.. శక్తుల రూపంగా పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణము. |
→ ఇంద్రియార్థములందు స్వయముగా పర్యవేక్షించేది ప్రాణము. |
స్వయం ప్రాతిష్ఠతే మధ్యేతు - సమానః। దేహము యొక్క మధ్య భాగములో సమాన ప్రాణము ప్రతిష్ఠితమై యున్నది. ఏష హి ఏతత్ హతమ్ అన్నం సమం నయతి। తస్మాత్ ఏతః సప్తార్షిషో భవతి। ప్రాణము జఠరాగ్నిగా పొట్టలో ప్రవేశించి అన్నమును సమ(రస)రూపంగా చేస్తూ ఉన్నది. అట్టి అగ్ని నుండి సప్త (7) జ్వాలలు భయల్వెడలుచున్నాయి. |
→ సమాన వాయువుగా సంచారాలు చేస్తోంది. పొట్ట భాగములో సమాన ప్రాణము జఠరాగ్ని రూపము దాల్చినదై ఆహుతి ఇచ్చిన అన్నమును (జీవుడు తిన్న ఆహారమును) రసరూపంగా మార్చి శరీరములోని అన్ని భాగములకు సర్వ సమానంగా పంచిపెడుతోంది. జీర్ణం చేయటం ద్వారా అన్నము వంటబట్టేడట్లుగా చేస్తోంది. అట్టి ఆహార రసాగ్ని నుండి (కన్నులు - చెవులు - ముక్కు రంధ్రాలు - నోరు - అనబడే) సప్తార్చిషో భవంతి-ఏడు జ్వాలలు ఏర్పడినవై (వెలుగుచున్నవై) ఉంటున్నాయి. |
నాడులలో వ్యానప్రాణము హృదివి ఏష ఆత్మా। (అత్ర ఏతత్) ఏకశతం (101) నాడీనాం। తాసాం శతం, శతం ఏకస్యాం ద్వాసప్తతిః ద్వాసప్తతిః ప్రతిశాఖానాడీ సహస్రాణి భవస్త్యాసం వ్యాన చరతి।। |
- ఆత్మచైతన్యజ్యోతి యొక్క కళ (మరియు) ‘అంశ’ అగు జీవాత్మ-ప్రతి ఒక్కరి హృదయస్థానములో కట్టెలు లేని అగ్నివలె - తేజోమయమై వెలుగొందుతోంది. - అటువంటి దివ్యస్థానము నుండి 101 నాడులు ఆత్మోత్తేజితమై దేహమంతా విస్తరించినవై ఉంటున్నాయి. - ఆ 101 నాడులలో ఒక్కొక్క దానిని (100 x 100గా) 72 ఉపనాడులు (మొత్తం 72,000 నాడి-ఉపనాడులు) దేహము యొక్క ప్రతి అణుప్రాంతము వరకు విస్తరించి ఉన్నాయి. - ఆ 72000 నాడి - ఉపనాడి - శాఖానాడులలో రాక-పోకలు నిర్వర్తిస్తున్న ప్రాణశక్తిని ‘‘వ్యానవాయువు’’ అని పిలుస్తున్నారు. |
ఊర్ధ్వంగా (ఉదాన ప్రాణము) అథ ఏకయో ఊర్థ్వ ఉదానః। |
→ ఆ 101 నాడులలో ఒకానొక నాడి ఊర్ధ్వముగా (సహస్రార పర్యంతము) ప్రసరిస్తున్నదై (విస్తరించినదై) ఉంటోంది. జీవుడు-దేహములోని ఊర్ధ్వనాడిలో ఉదాన ప్రాణవాహకుడై బుద్ధితో సంచారాలుపైకి - క్రిందికి నిర్వర్తిస్తున్నాడు. ఈతడు కర్మలననుసరించి ఈ దేహానంతరము కూడా ఉదాన వాయు సమేతుడై 101వ నాడి నుండి ముందు ముందు ప్రయాణము కొనసాగిస్తున్నాడు. |
ఉదానవాయు వాహకుడై పుణ్యేన పుణ్యం లోకం నయతి। పాపేన పాపమ్। ఉభాభ్యాం ఏవ మనుష్యలోకమ్।। (ఆ ఏక ఊర్ధ్వనాడిని ‘సుషుమ్న’ అని యోగశాస్త్ర వ్యవహార నామము) |
→ పుణ్యకర్మలచే - సుఖమయమగు పుణ్యలోకములకు (స్వర్గం ఇత్యాదులు), → పాపకర్మలచే - దుఃఖము, ఆదుర్దాల, అజ్ఞాననము వేదనలతో కూడిన పాపపు లోకాలకు, (అధోలోకాలకు), దుఃఖ అవేదన గతులకు, → ఉభయ రీతులైన కర్మలు సమానంగా ఏర్పడి ఉన్న సందర్భాలలో → మనుష్యలోకమునకు ప్రయాణిస్తున్నాడు. |
ఇదంతా అంతర ప్రాణతత్త్వవిశేషం. ఇక..,
బాహ్య ప్రాణః ఆదిత్యో హ వై విశ్వగత ప్రాణః ఉదయతి। ఏషహి ఏనం చాక్షుషం ప్రాణమ్ అనుగృహాణానః।।
- ఆదిత్యుడే (సూర్యుడే) బాహ్య ప్రాణస్వరూపుడు సప్రాణ స్వరూపుడు.
ఎందుకంటే, ఆదిత్యుడే అటు కనబడే సమస్తముపై వెలుగును ప్రసరింపజేయుచు, ఇటు చక్షువులకు దృష్టిని ప్రసాదిస్తున్నారు. చూపును, దృశ్యమును ఒకచోటికి తెచ్చి, ఫలదీకరింపజేస్తున్నారు. అందుచేత సూర్యుడు సృష్టిలో (దృశ్యములో) ముఖ్య ప్రాణ స్వరూపుడుగాను, విశ్వదేవతగాను-యోగులు, ప్రాజ్ఞులు సందర్శిస్తూ, ఉపాసిస్తున్నారు. ఆదిత్యుడే కనులలో చూపుగా వెలుగొందుచున్నారు. ఆదిత్యుడే సూర్యగోళంలో తేజో రూపుడై విశ్వమంతా వెలుగుతో నింపివేస్తున్నాడు.
విశ్వ అపాన ప్రాణము :
భూమియందు ఏ దేవతా ప్రజ్ఞలు అనువర్తిస్తున్నాయో, అవన్నీ పరమ పురుషుని (బాహ్య) అపాన ప్రాణము యొక్క తేజోఅంశలే. అదే అపానము దేహములో (పూర్వం చెప్పుకున్నట్లుగా), అపాన ప్రాణమై కూడా ఉన్నది. బాహ్య అపానమే దేహములోని అపానమును తన వశంలో (తనయొక్క ఒక కిరణముగా) కలిగి యున్నది. అనగా విశ్వ అపాన వాయువు దేహములో ‘అపాన వాయువు’ అనే అంశను/ కిరణమును అనుగ్రహిస్తోంది. సృష్టిలోని దేవతా ప్రజ్ఞలను సృష్టియొక్క సహకారి కారణాలుగా ముఖ్యప్రాణమే ప్రదర్శిస్తోంది!
స ఏష పురుషస్య అపానమ్ అవష్టభ్య - భూమ్యాకాశముల మధ్యను అంతరాళంగాను (విశ్వ)సమాన వాయు సంచారం జరుగుతోంది. విశ్వప్రాణ పురుషుడే సమానప్రాణము. ఆ సమాన ప్రాణమే సర్వ దేహములలో సమాన వాయుత్వముగా ఉండి సర్వమును పర్యవేక్షించటం, నిర్వహించటం జరుగుతోంది! ముఖ్య ప్రాణ భగవానుడే సమానమును ధరించి - వ్యానవాయువుగా ఉన్నారు.
యత్ ఆకాశః స సమానో। వాయుః వ్యానః। ఆకాశమే సమాన ప్రాణము. వాయువు ప్రాణపురుషుని వ్యాన ప్రదర్శనము.
విశ్వ ఉదానము : తేజో హ వా ఉదానః।
తేజస్సు (అగ్ని)యే విశ్వౌదాన వాయువు.
తస్మాత్ ఉపశాంత తేజాః పునర్భవమ్ ఇంద్రియైః - మనసి సంపద్యమానైః।।
దేహము నందు విశ్వ ఉదానవాయు-అంశ రూపమగు అగ్ని సమసిపోతూ ఉన్నప్పుడు, ఇక ఆ జీవుడు దేహములోని మనస్సుచే కేంద్రీకరించబడిన ఇంద్రియములను (ఇంద్రియార్థములను) విరమించుచున్నాడు. మరొక దేహమును ఆశ్రయిస్తూ, పునర్జన్మను పొందినవాడగుచున్నాడు. ఉపాన ప్రాణ ప్రదర్శితరూప అగ్ని - దేహము నుండి విరమించటమే ‘మరణము’. పునః - దేహ ప్రవేశమే ‘జననము’.
పునర్జన్మ
ఆ విధంగా ఉదాన ప్రాణ రూపమగు అగ్ని (Temparature) దేహములో రహితమగుచూ ఉండగా ఆ దేహము నిస్తేజమై ఆ దేహికి దేహము దృష్ట్యా మరణము సంక్రమిస్తోంది.
ఇక, ఆ తదుపరి..,
ఆ దేహి - నిస్తేజమయిన అప్పటి వరకు సజీవమైయున్న ఆ భౌతిక దేహముతో ఆ మరణ సమయము వరకు ఎట్టి చిత్తము (ఇష్టము+భావావేశము) కలిగి ఉంటున్నాడో-,
ఆ తీరైన మనస్సుతో (ఆలోచన - ఆవేశాదులతో) - సూక్ష్మమగు ముఖ్యప్రాణమును సమీపిస్తున్నాడు.
స్థూల దేహము → అన్నమయకోశము.
సూక్ష్మదేహము → మనోమయ-ప్రాణమయ విజ్ఞానమ-ఆనందమయకోశములు.
జీవాత్మ → ఆత్మయొక్క - సందర్భములతో - తాదాత్మ్య - ‘అంశ’ రూపము.
ప్రాణము తన యొక్క ఉదానతత్త్వమగు అగ్ని (Temparature) తో సహా జీవాత్మతో కూడినదై, ఆ జీవాత్మ యొక్క సంకల్పానుసారము మరొక లోకములోనికి (దేహములోనికి) ప్రవేశించటం జరుగుతోంది. అది జీవాత్మ యొక్క పునర్జన్మ రూపముగా చెప్పుకోబడుతోంది. కనుక ముఖ్యప్రాణము జీవాత్మ యొక్క ఆనందకోశమును (ఇచ్ఛను) సిద్ధింపజేయటం జరుగుతోంది.
అనగా..,
* ఆత్మకు పునర్జన్మ లేదు. మొదటి జన్మయే లేదు. ఇక పునర్జన్మ ఎక్కడిది?
* దేహము జడము కాబట్టి ‘మరణము’ ఆపాదించలేము.
* దేహములకు ప్రాణ వాహనముతో మనస్సును అనుసరించి రాక-పోకలు కలుగుతూ ఉంటాయి.
* కల్పిత మాత్రము, ఊహా నిర్మితము - అగు మనస్సే = దేహముల రాక-పోకల (లేక) కలయిక-విడిపోవుటలను (లేక) జనన-మరణములను మననముచే పొందుతోంది. అందుచేత మనస్సే బంధము. మనస్సే మోక్షము కూడా.
ఏ విద్వాంసుడు మనం చెప్పుకున్న ప్రాణము యొక్క ‘‘సర్వవ్యక్తత్వము’’ను, ‘‘దేహ-దేహాంతర వాహకత్వము’’ను తన యొక్క ప్రజ్ఞతో గ్రహిస్తాడో.., అట్టివాని యొక్క మనో-కర్మేంద్రియ - జ్ఞానేంద్రియాది సంపద - ‘మృతత్వము’ను అధిగమించినవై అమృతత్వమును సంతరించుకుంటున్నాయి.
ఎవ్వరైతే..,
* ఆత్మయందు లీలగా సంఘటితమగుచున్న ముఖ్య ప్రాణోత్పత్తి గురించి, (అంతేకాక)..,
* ఆత్మయే అయి ఉన్న ప్రాణశక్తి యొక్క పంచ ప్రాణవిభూతుల గురించి,
* ఆత్మయొక్క ముఖ్య ప్రాణ విభూతిత్వమును (సర్వత్రా సర్వదా వ్యాపించి ఉండటమును) గురించి,
* ఆత్మ యొక్క అంతః ప్రకృతిని, బహిర్ -ప్రకృతిని గురించి -
అనుభవ-అనుభూతి పూర్వకంగా ఎరుగుచున్నాడో, నిత్యానుభవుడు అగుచున్నాడో, - అట్టివాడు అమరుడు (మృత్యురహితుడు) అగుచున్నాడు!
ఇది ప్రాణశక్తి యొక్క కథనము. నిశ్చలమగు ఆత్మయొక్క శక్తి ప్రదర్శనమే - ప్రాణము.
అప్పుడు గార్గ్య వంశీయుడైనట్టి సౌరాయణుడు లేచి నిలుచున్నారు. గురుదేవులకు నమస్కరించారు. ఈ విధంగా ప్రశ్నించారు.
హే భగవాన్! పిప్పలాదమహర్షీ!
ఈ జీవుడు జాగ్రత్- స్వప్న- సుషుప్తులు అనుభవరూపంగా పొందుచున్నాడు కదా!
|
శ్రీ పిప్పలాద మహర్షి సమాధానము :
ఓ గార్గ్యా! మహనీయులు జాగ్రత్-సుషుప్తులను గమనించినవారై సశాస్త్రీయంగా ఏమని చెప్పుచున్నారో - విను.
‘‘సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా, ఆయనయొక్క అసంఖ్యాక కిరణజాలములు భూమిపై అసంఖ్యాక స్థానములపై ప్రసరిస్తున్నాయి కదా! ఆ సాయంకాలము ఏం జరుగుతోంది?
సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యకిరణాలు ప్రసరించటము - ఇళ్ళు, తటాకములు, వీధులు, మొదలైన సమస్త భౌతిక రూపములను ప్రకాశింపజేయుటం - ఇదంతా ఏమౌతోంది? సూర్యకిరణాలు సూర్యునిలో ప్రవేశించుచున్నాయి. ఇక బాహ్యమైనయున్న తదితరమంతా ప్రకాశరాహిత్యము పొందుచున్నాయి కాదా!
మరల ఉదయము సూర్యుడు ఉదయించినప్పుడో? సూర్యకిరణాలు మరల అంతటా ప్రసరిస్తున్నాయి. అన్నీ కూడా ఇతఃపూర్వము వలెనే ప్రకాశమానమగుచున్నాయి! రాత్రి దృశ్యమంతా చీకటిచే కప్పబడినదై కళ్లకు కనబడనిదై ఉంటోంది. సూర్యోదయం కాగానే అంతా వెలుగులో కనబడసాగుచున్నాయి.
అదే విధంగా..,
ఈ ఇంద్రియ - దేహ-జాగ్రత్-స్వప్న భావ స్వరూప కిరణాలు గాఢనిద్రాసమయంలో దివ్యము అగు ఆత్మకు చెందిన - చంచలరహిత మనో విభాగమునందు ఏకీభూతమగుచున్నాయి.
అందుచేత నిద్రాసమయంలో ఈ దేహి (జీవాత్మ) బాహ్యేంద్రియములతో - ఏదీ వినటం లేదు. చూడటం లేదు. వాసన చూడటం లేదు. రుచి చూడటం లేదు. స్పర్శించటం లేదు. (స్పర్శానుభవము పొందటం లేదు). మాటలాడటం లేదు. ఏదీ తీసుకోవటం లేదు. ఇవ్వటం లేదు. విసర్జించటమూ లేదు.
అయితే, (1) ప్రాణము (2) జ్ఞాపకము చేసుకోకలిగినట్టి సంస్కార స్వభావము - ఈ రెండూ ప్రవర్తనశీలమైయే ఉన్నాయి.
జీవుడు గాఢనిద్రా పరవశుడై ఉండగా..,
ఈ దేహ పట్టణంలో ‘పంచప్రాణములు’ అనే పంచాగ్నులు మాత్రము జాగరూకులై ఉంటున్నాయి. జ్ఞాపకములు దాచబడినవై ఉన్నాయి. గార్హపత్యోవా ఏషో అపానో:: ‘‘అపాన ప్రాణము’’ అనే గార్హపత్యాగ్ని నాడీవ్యవస్థలోని క్రింది భాగంలో ప్రసరిస్తూ ఉంటుంది. అపానము సర్వవేళలా ఉరకలిడుతూ పనిచేస్తూ ఉంటుంది!
వ్యానో అన్వాహార్యాపచనో :: వ్యానము అన్వాహార్యపచనాగ్ని!
అహవనీయాగ్ని → యత్ గార్హపత్యాత్ ప్రణీయతే ప్రాణయానాత్ ఆహవనీయాత్ ప్రాణః। - గార్హపత్యాగ్ని నుండి ప్రాణశక్తి తీసుకొని రాబడుతూ ఉంటుంది. ప్రాణమునకు అపానము నుండి చంచలనము కలుగుతున్నది. కనుక ఇక్కడ సుషుప్తి సమయంలో ‘ముఖ్యప్రాణము’ అహవనీయాగ్నిగా చెప్పబడింది. సుషుప్తిలో ప్రాణములు నిదురించవు. సంచలనశీలమయ్యే ఉంటాయి.
సమానాగ్ని → ‘‘యత్ ఉచ్ఛ్వాస-నిఃశ్వాసౌ ఏతాః ఆహుతీ సమం నయతి - ఇతి సమానః :: ఇది ‘ఉచ్ఛ్వాస-నిశ్వాస’ అనే రెండు క్రియలను నిత్యము ఆహూతి (సమర్పణ) రూపముగా నిర్వర్తిస్తూ దేహమంతా ప్రాణశక్తిని సరిసమానంగా ప్రసరింజేస్తున్నట్టిది-సమానాగ్ని. నిద్రపోయినప్పుడు కూడా సమానాగ్ని తన విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది.
మనస్సు → యజమాని మనస్సును ఆత్మవద్ద (గాఢ నిద్రా సమయంలో) ఉంచి, ఆత్మతో ఏకము చేయుచున్నాడు. మెలకువ రాగానే మనసు-మననములు ఆత్మనుండి ఆత్మచేతనే ‘అన్యము’ అను స్థానమునకు తెచ్చుకు రాబడుచున్నాయి.
జీవుడు → యజమాన ఇష్టఫలమేవ ఇతి ఉదానః ఇష్టరూపమైనట్టి ఉదానము → జీవుని ఆత్మవద్దకు కొనిపోతోంది. ప్రతిరోజు నిద్రలో యజమానిని బ్రహ్మమునకు దగ్గరగా జేర్చునది ఈ ఉదానమే. ఉదాన ప్రాణముచే ఈ జీవుడు అన్యమంతా దాటివేసి, ఆవలగల అనన్యమగు ఆత్మతో ‘మమేకము’ అయి ఆనందము పొందుచున్నాడు.
ఈవిధంగా (1) ఆత్మతో ఏకము (2) ఆత్మకు అన్యము అనబడే నిద్రా-జాగ్రత్‌లను ఈ జీవుడు ప్రతిరోజు ‘‘సో అహమ్’’ అనుభవముగా పొందుచున్నాడు.
స్వప్నము - మనస్సు యొక్క స్వీయ మహిమ
మనస్సు స్వప్నదశలో తన యొక్క మహిమనే స్వప్నదృశ్యరూపంగా కల్పించుకొని అనుభవిస్తోంది. స్వప్నములో ‘వస్తురూప భావన’యే ‘వస్తురూపానుభవము’గా అయి, ఆత్మయొక్క స్వయం కల్పితుడగు ‘అనుభవి’ (The Experiencer) చే ఆస్వాదించబడుతోంది.
యత్ దృష్టం దృష్టమ్ అనుపశ్యతి - ఈ మనస్సు ఏదేదైతే జాగ్రత్ అవస్థలో చూస్తూ ఉండటం జరుగుతుందో, అట్టివే యగు దృశ్యములను దృష్టిచే స్వప్నానుభవములుగా పొందుతోంది. (అనగా) జాగ్రత్‌లో చూచినదానినే ఈ జీవుడు స్వప్నముగా ఊహించుకొని (లేక) కల్పన చేసుకొని స్వప్న దృశ్యముగా చూస్తున్నాడు.
యత్ శ్రుతం శ్రుతమేవ అర్థమ్ అనుశృణోతి - పూర్వము వినినట్టి అర్థమునే మళ్లీ వింటోంది.
దేశ-దిక్ - అంతరైశ్చ ప్రత్యనుభూతం పునఃపునః ప్రత్యనుభవతి। - జాగ్రత్ సందర్భముగా వివిధ ప్రదేశాలలో, దిక్కులలో, భూమ్యాకాశ మధ్య స్థానాలలో (అంతరేచ), హృదయ అంతరంగంలో - ఏదేది అనుభవించబడినదో, - అటువంటి వన్నీ మరల మరల అనుభవముగా ఆహ్వానించి అనుభూతిగా కల్పించుకొని ఈ జీవుని మనస్సు స్వప్నానుభవమంతా పొందుతోంది.
వర్తమాన - పూర్వ - తత్‌పూర్వజన్మలలో జ్ఞాపకాలన్నీ స్వప్నంలో పునరావృతమౌతూ ఉంటాయి.
దృష్టం చ - అదృష్టం చ → ఒక దృశ్య విషయాన్ని (స్వప్నంలో చూస్తున్నది) - కళ్ళకు విషయం కాకుండానే భావన (feeling)కు ఆహారముగా (అనుభూతముగా) స్వప్న దృశ్యం అగుచున్నది. చూచినది - చూడనిది → ఈ రెండు కూడా స్వప్నములో మనోకల్పనగా సందృశ్యమానమగుచున్నాయి. ఎందుచేత? కళ్ళకు కనిపించే దృశ్యమునకు - మనస్సు ‘భావన’ను జోడించటం చేతనే!
శృతం చ - అశృతం చ : విన్నది - విననిది కూడా స్వప్నంలో మనస్సుచే పూర్వానుభవములలోంచి కొని తేబడుచున్నాయి.
అనుభూతం చ- అననుభూతం చ: ఇతః పూర్వము అనుభూతమైనవి - అనుభూతం కానివి కూడా స్వప్నములో మనస్సు కల్పన చేసుకొని పొందుతోంది. స్వప్నములో కొన్ని అప్పటికప్పుడే కల్పన చేయబడుచూ ఉంటున్నాయి. ఒకప్పటి అనుభవమునకు మరొకప్పటి సందర్భమును జోడించి స్వప్న దృశ్యముగా పొందబడుతోంది. వేరు వేరు స్వప్నములలో, వేరువేరు కల్పనలు ఈ జీవునియొక్క స్వప్న పురుషకారముచే కల్పించబడి, పొందబడుచున్నాయి.
సత్ చ- అసత్ చ : నిజము అయినవి - నిజము కానివి కూడా స్వప్న ద్రష్ట మనోకల్పన చేసుకొని స్వప్న సందర్భంలో దర్శిస్తూ అనుభవించుచున్నాడు. (అనగా ఎప్పుడో జరిగినవి, ఎప్పుడూ జరగనివి కూడా పొందబడుచున్నాయి).
సర్వం పశ్యతి → మనస్సు అన్నిటినీ స్వప్న సమయంలో.. చూస్తోంది!
సర్వః పశ్యతి → ఈ మనస్సు తనను తానే అనేక రూపములుగా (స్వప్నంలో) చూచుకుంటోంది.
అయితే...,
జాగ్రత్-స్వప్నములు రెండూ కూడా ఆత్మ యొక్క స్వకీయ కల్పనా చాతుర్యములే. ఇంద్రియాలు గాఢ నిద్రాసమయంలో నిర్విషయత్వమగు మౌనము వహించి, తమ ఉత్పత్తి స్థానమగు మనస్సు యొక్క జాగ్రత్-స్వప్న సంబంధమైన పెట్టెలో దాచబడిన వస్తువుల వలె - దాగినవై ఉంటున్నాయి.
అయితే ఆత్మ స్వరూపుడగు జీవుడు తనను తానే సర్వత్రా సర్వముగా, జాగ్రత్-స్వప్న-సుషుప్తి స్థానములు తనయొక్క ‘కల్పన’గా చేసుకొని చూస్తున్నాడు.
జీవుడు కొన్ని కొన్ని అనుభూతులకు, అనుభవములకు ప్రాముఖ్యత ఇవ్వటముచే - జాగ్రత్‌లో ఏర్పడిన సంస్కారాలు మనస్సు యొక్క స్వప్నాంశలో ఈ జీవుడు తనకు తానే ప్రవేశింపజేసుకుంటున్నాడు. అనేక విశేషాలు ఒకచోటికి జేర్చి దృశ్యమును స్వప్నసీమలో మనస్సే కల్పించుకొంటోంది. జాగ్రత్-స్వప్నములకు చెందిన కల్పనాంశ ఈ జీవుడికి చెందినదేగాని, ఇందులో బాహ్యమగు వేరొకరి పాత్ర లేదు.
జాగ్రత్ సమయంలో → జాగ్రత్ యొక్క అంతర్గత సంబంధాలు, సందర్భాలు, సంఘటనలు, దృశ్యములు మొదలైనవి ‘‘సత్యమే కదా’’ అనిపిస్తున్నట్లే..., స్వప్న సమయంలో → స్వప్నదృశ్యము ‘‘సత్యమేగదా!’’ అనియే మనస్సు అనుభవము పొందుతోంది! జాగ్రత్ సమయంలో ‘‘స్వప్నము కల్పనయేకదా!’’ అని భావించబడుచున్నట్లే...., స్వప్న సమయంలో ‘‘జాగ్రత్ కల్పనయే కదా!’’ అని భావించబడుతోంది! అనేక జ్ఞాపములు గల ‘జ్ఞప్తి’ అనే భోషాణము నుంచి.., కొన్ని జాగ్రత్ సమయంలో పాల్గొంటున్నాయి. తిరిగి జ్ఞప్తిలో ప్రవేశిస్తున్నాయి. వేరే కొన్ని స్వప్న సమయంలో పాల్గొంటున్నాయి. తిరిగి జ్ఞప్తిలో ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్-స్వప్నములలో సందర్భపడుచున్న, (ఏర్పడుచున్న, రూపుదిద్దుకుంటున్న, జరుగుచూ ఉన్న) ‘తీరు’ అంతా ఒక్కటే। జాగ్రత్ స్వప్నమువంటిదే. స్వప్నము జాగ్రత్ వంటిదే. |
ఎప్పుడైతే ఈ దేహియొక్క (లేక) ఈ జీవుని యొక్క - (జగద్విషయములపై ఆలోచనల రూపంగా వ్రాలుచున్న) ఈ మనస్సు (స్వస్వరూపమైనట్టి ఆత్మ అను) తేజస్సుచే ఆక్రమించబడుతోందో,.. అప్పుడిక ఈ జీవుడు జాగ్రత్ దృశ్యమును గాని, స్వప్న దృశ్యమునుగాని దర్శించటం-అనుభవించటం-అనుభూతపరచుకోవటముల నుండి పూర్తిగా విరమించుచున్నవాడై ఉంటున్నాడు.
స్వప్నదర్శనము విరమించిన మరుక్షణము ఈ దేహములోనే దివ్యస్వరూపుడగు ఈ జీవుడు నిర్విషయ గాఢ నిద్రా సుఖమును అనుభవించటం ప్రారంభించుచున్నాడు.
అనగా ‘విషయములు’ అను బరువును దించుకొని తనయందు తానై ప్రశాంతపడుచున్నాడు. మనస్సు స్వయంజ్యోతి స్వరూపము నందు లయమగుచుండగా జీవాత్మ దేవుడు → ‘‘కేవలతేజో స్వరూపము, కేవల దృక్ స్వరూపము. కేవల ఎరుక స్వరూపము’’- ఆస్వాదిస్తూ, ఆత్మతో ఏకత్వానుభూతిని పొందుచున్నాడు.
అట్టి గాఢనిద్రా (సుషుప్తి) సమయంలో మనస్సే (జీవునిచే) రహితం చేయబడుతోంది కాబట్టి ‘మనోచంచలత్వము’ అనే శ్రమ ఉండదు. అట్టి సంషుప్త్యనుభవము ప్రశాంతతను, మౌనానందమును సంతరించుకున్నదగుచున్నది. ఇది సమాధి స్థితి యొక్క ఒకానొక కళావిశేషము వంటిది.
‘‘ఓ సద్గుణుడా! సౌమ్యుడా! సౌర్యాయణీ! కేవల తేజోరూపమగు సుషుప్తిలో జాగ్రత్ - స్వప్నానుభవాలన్నీ ఏమగుచున్నాయి? ఏరూపంలో ఉంటున్నాయి’’.. అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ ఉపమానం విను.
ఒకానొకచోట కొన్ని పక్షులున్నాయి. అవన్నీ ఒక వృక్షంపై నివసిస్తూ ఉంటున్నాయి. అవి తెల్లవారగానే నిశ్శబ్దమును వీడి, శబ్దము పలుకుచూ, ఆహారం కోసం ఎటో - ఎటో తిరగటం నిర్వర్తిస్తున్నాయి. సాయంకాలము అయ్యేసరికి, చీకటి పడుచుండగా.., మరల చెట్టు మీదికి చేరి నిశ్శబ్దం వహిస్తున్నాయి.
జాగ్రత్ స్వప్నములలో ఈ మనస్సు, కర్మేంద్రియములు, శబ్ద స్పర్శాది జ్ఞానేంద్రియములు - ఇవన్నీ ప్రపంచములో తిరిగి - తిరిగి, సుషుప్తి సమయంలో ఆత్మను చేరుకొని ఆత్మయందు విశ్రమిస్తున్నాయి. వివిధ తన్మాత్రలు తిరిగి ఆత్మయందే ప్రతిష్ఠ కలిగినవై ఉంటున్నాయి.
అన్నీ ఆత్మయందే ప్రతిష్ఠితమై ఉన్నాయి.
పృథివీ (భూమి) |
- తన్మాత్ర। స్థూలానుభవము. |
ఆపః (జలము) |
- ఆపః తన్మాత్ర। రుచి అనుభవము. |
అగ్ని |
- అగ్ని తన్మాత్ర। ఆకలి-దప్పికలు. |
వాయువు |
- వాయు తన్మాత్ర। (స్పర్శ). |
ఆకాశము |
- ఆకాశ తన్మాత్ర। చోటు-చోటులో ఉన్నదంతా। |
చక్షువులు (కళ్ళు-చూపు) |
- చూపు - చూడబడేదంతా। |
శ్రోత్రం (చెవులు- వినిడికి) |
- వినికిడి - వినబడేదంతా। |
ముక్కు |
- వాసన చూడటం - వాసన చూడబడేదంతా, (ఆఘ్రాణానుభవం) |
రుచి |
- రుచి - రుచిచూడబడేదంతా। |
త్వక్ (చర్మము) |
- స్పర్శ - స్పర్శానుభవమంతా, స్పర్శించబడేదంతా (స్పర్శయితవ్యం చ)। |
వాక్కు |
- మాట్లాడటం, మాట్లాడే విషయాలు, వక్తవ్యం చ। చెప్పబడే విషయములన్నీ। |
హస్తములు |
- తీసుకోవటం - తీసుకోబడేదంతా। |
ఉపస్థ (జననేంద్రియము) |
- ఆనందము - ఆనందం కలుగజేసే విషయాలన్నీ। |
విసర్జనేంద్రియము (పాయుః) |
- విసర్జన - విసర్జించబడేదంతా। |
రెండు పాదములు |
- నడకగా పోవుచుండే స్థానాలన్నీ। |
మనస్సు |
- ఆలోచనలు - ఆలోచించుచున్న విషయాలన్నీ। |
బుద్ధి |
- తెలివి - తెలియబడుచున్న విషయాలు, విశేషాలు, విచక్షించబడేదంతా। (Analysis and all those issues of such Analysis) |
అహంకారము |
- అహంభావన - ‘‘నేను కదా కర్తను’’.. అనే అభిమానమంతా। |
చిత్తము |
- జ్ఞాపకశక్తి - జ్ఞాపకము పెట్టుకొనేదంతా। |
తేజః (కాంతి) |
- కాంతి (ప్రకాశము), ప్రకాశింపజేయటం, ప్రకాశింపబడేదంతా। |
ప్రాణము |
- ముఖ్య ప్రాణము అద్దాని ధారణా - (ఐదు) రూపాలైనట్టి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము (మరియు) విశ్వ ప్రాణము (లేక) సప్రాణము, ప్రాణధారణము, ప్రాణ స్వరూపమే అయిన ఈ దృశ్యమంతా। |
ఇవన్నీ ఆత్మయందే సర్వదా ప్రతిష్ఠితమై ఉన్నాయి.
ఆత్మ నుండి బయల్వెడలి ఆత్మయందే ప్రదర్శితమైయున్నాయి. అగ్ని కణాలు అగ్ని కంటే వేరా? సూర్యకిరణాలు సూర్యబింబము (సూర్యుని ఉష్ణత్వము) కంటే వేరా? మట్టి బొమ్మలు మట్టికంటే వేరా? కాదు. అట్లాగే, ఇవన్నీ ఆత్మకు అభిన్నమే. ఆత్మ నుండి బయల్వెడలి, ఆత్మయందే ప్రవర్తిస్తూ, ఆత్మయందే లయిస్తున్నాయి.
స్వప్నంలో కనిపించే -
ఇవన్నీ కూడా స్వప్నము ముగిసిన తరువాత - అవ్యక్తరూపము(Unmanifested) రూపం సంతరించుకుని ఆత్మయందు ప్రవేశించినవై, ఆత్మయందు ఏకత్వము పొందుచున్నవగుచున్నాయి.
అట్లాగే జాగ్రత్‌యొక్క ప్రవేశ నిష్క్రమణములు కూడా ఆత్మయందే ఏర్పడుచు, ఆత్మకు అనన్యమై ఉంటున్నాయి.
సుషుప్తి : సమస్తము సుషుప్తిలో మౌనము వహించనవై ఉంటున్నాయి.
(దృష్టాంతము : ఒక నవలా రచయిత నవలా కథనమంతా వ్రాస్తూ - వ్రాస్తూ ‘‘రేపు కొనసాగిద్దాంలే!’’ అని, కథ వ్రాయటం ఆపి నిద్రకు ఉపక్రమించగానే ఆ కథలోని పాత్రల లక్షణాలు, ఆతని కథా సంబంధమైన ఊహ ఆతనిలో అవ్యక్తత్వము సంతరించుకొని, ఆతని యందు మౌనం వహించి ఉన్నవై, ఆతనితో అభేదత్వము పొందినవగుచున్నట్లుగా..!)
ఆ మరునాడు ఉదయం రచన ప్రారంభించగానే, తిరిగి రచనావ్యాసంగ-ప్రవాహము ప్రారంభమగుచున్నట్లుగా।
సుషుప్తి సందర్భములో ఈ జీవుని అవిద్య - అంతా కూడా అప్రదర్శితమవటం చేత జాగ్రత్ స్వప్నములకంటే అధికంగా ఆతడు ఆత్మయొక్క సామీప్యాన్ని - ఆస్వాదిస్తున్నాడు. గాఢనిద్ర సందర్భములో - ఆత్మ యొక్క మాధుర్యానికి అతిసామీప్యుడై ఉంటున్నాడు. అందుకే నిదురలేచిన తరువాత, ‘‘హాయిగా నిద్ర పోయాను కదా!’’.. అని అనుకుంటూ ఉంటున్నాడు. ఇంతలోనే - (మరుక్షణం) గాఢ నిద్రాసుఖాన్ని ఏమరచి తిరిగి కర్మేంద్రియ- జ్ఞానేంద్రియ - మనో బుద్ధ్యాది విషయాలలో ప్రాణశక్తి వాహకుడై ప్రవేశించుచున్నాడు. అనగా గాఢనిద్రలోని అనుభవమైన ‘హాయి’ని పోగొట్టుకొంటున్నాడు.
ఇక, ఆత్మజ్ఞాని గాఢనిద్రలోని ‘హాయి’ని జాగ్రత్-స్వప్న సందర్భములో కూడా కొనసాగిస్తూనే, జగద్విశేషాలలో నాటక పాత్ర వలె లీలగా వహించటం మాత్రమే వర్తిస్తున్నాడు. ఆత్మసమాధిత్వమును ధరించియే లీలావినోదంగా జాగ్రత్ - స్వప్నములను సందర్శిస్తూ ఉన్నాడు - (ఒక మగవాడు స్త్రీ పాత్ర ధరిస్తూ, తాను మగవాడినని మరువని తీరుగా).
అయితే..,
ఈ జీవుడు సందర్భంగా జాగ్రత్ జగత్తులో జీవుడుగా ఉండవచ్చుగాక! స్వతఃగా ఆత్మయే! ఈ జీవుడే ‘పురుషుడు’ అని కూడా పిలువబడుచున్నాడు. ఈ జాగ్రత్ - స్వప్నాలలో
• ‘ద్రష్ట’ (దర్శించువాడు - As Perceiver)గా,
• ‘స్పృష్ట’ (స్పృశించువాడు - Touch-Experiencer)గా,
• ‘శ్రోత’ (వినువాడు - Listener)గా,
• ’ఘ్రాత’ (వాసన చూచువాడు - As one who smells)గా,
• ’రసయిత’ (రుచి చూచువాడు - As one who tastes)గా,
• ‘మంత’ (ఆలోచించువాడు - As Thinker)గా,
• ‘బోద్ధ’ ( తెలుసుకొనవాడు - As Knower)గా,
• ‘కర్త’ (కర్మలకు కర్తృత్వము వహించు వాడు - As Doer) గా విజ్ఞానాత్మగా పురుషకారము వహిస్తున్నాడు.
అట్టి ఈ పురుషుడు (జీవుడు) - (ఉపాధిని, పైన చెప్పిన విశేషములన్నిటినీ ఉపకరణములుగా కలిగియున్నవాడు) - ఆత్మయందు ప్రవేశించుచున్నవాడై, ఆత్మకు అద్వితీయుడై, ఆత్మయందు సంప్రతిష్ఠితుడు అగుచున్నాడు. వ్యష్టిత్వమును అధిగమించినవాడై ఆత్మయొక్క సమిష్టితత్త్వముతోను, కేవలత్వముతోను ఏకత్వము అనుభవించువాడు అగుచున్నాడు. |
అట్టి పురుషుని యొక్క పరమాత్మతో ఏకత్వము
ఓ సోమ్యా! ఓ తదితర శ్రోతలగు స్నేహితులారా!
మనం చెప్పుకుంటున్న ఆత్మ అభేదము గురించి తెలుసుకొని, బుద్ధితో ఆస్వాదించటానికి ఫలశ్రుతిని చెప్పుచున్నాను. వినండి!
ఎవ్వరైతే.., స్వస్వరూపమగు ‘ఆత్మ’ గురించి -
అని తెలుసుకుంటాడో, ఆత్మదర్శమును - ఆత్మత్వము సంతరించుకుంటాడో.., అట్టివాడు →
సర్వజ్ఞః → సర్వము ఎరిగినవాడగుచున్నాడు.
సర్వః → అంతా తానే అయి ఆస్వాదిస్తున్నాడు.
‘ఇది ఇట్లు’ అని ఆత్మజ్ఞుల, మహర్షుల, ఆధ్యాత్మశాస్త్రము యొక్క ప్రవచనము.
ఓ సోమ్యుడా!
ప్రియాత్మస్వరూపుడా! ఆత్మస్వరూపులగు సమస్త శ్రోతలారా!
విజ్ఞానాత్మస్వరూపుడగు ఈ జీవుడు- ఇంద్రియ, ఇంద్రియాధి దేవతలతో సహా, పంచభూతానుభవాలు, ముఖ్యప్రాణశక్తితో కూడుకొని కూడా ఏ ఆత్మత్వము నందు ఉపశమించినవై ఉంటున్నాయో అట్టి అక్షర పరతత్త్వాన్ని ఎరిగినప్పుడు,
తానే అన్నీ అయి, సర్వము తనయందే అయి వెలుగొందుచున్నాడు! ఇతి ఆధ్యాత్మశాస్త్ర ప్రవచనః।
అక్కడి శిష్యులంతా శ్రీపిప్పలాదమహర్షి నాలుగు ప్రశ్నలకు సమాధానము విని లేచి నిలబడి మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు!
కొద్దిసేపైయ్యేడప్పటికీ గురు-శిష్యులంతా ఆయా స్థానాలలో తిరిగి సుఖాశీనులైయ్యారు. అప్పుడు శిబిపుత్రుడైనట్టి సత్యకాముడు లేచి నిల్చుని, శ్రీ పిప్పలాదమహర్షికి నమస్కరించి తన ప్రశ్నను ఈ విధంగా నివేదించసాగారు.
హే భగవంతుడా! మహర్షీ!
ఈ జీవులలో (మనుష్యులలో) ఎవ్వరైతే దేహము నుండి దేహాంతరమునకు (ఒక దేహము నుండి మరొక దేహమునకు.. మరణానంతరము) ప్రయాణిస్తూ ‘‘ఓం’’కారము యొక్క శబ్దమును - అర్థమును సముచ్ఛరణ చేస్తూ మనస్సును నిలిపి ఉంచుతాడో..,
అట్టివారు.., కతమం వావ లోకం జయతీతి?
- ఏఏ లోకములను జయిస్తున్నారు? ఏఏ లోకములు త్యజించివేస్తున్నారు?
- ఏ ఏ లోకములను పొందుచున్నారు? (లేక) కలిగిఉంటున్నారు?
శ్రీ పిప్పలాదమహర్షి : నాయనా! సత్యకామా! ఓంకారము అనగా బ్రహ్మమే! (ఒక నాణెమునకు రెండు వైపులు ఉన్నట్లుగా) ‘ఓం’కార సంజ్ఞారూపమగు బ్రహ్మమునకు రెండు రకములైన ప్రయోజనములు ఉన్నాయి.
‘ఓం’ కార రూపార్థము సర్వ సమగ్రమైనది. అందుచేత ఓంకారోపాసకుడు సాధన సమయంలో ఆ పర - అపరములలో ఏదో ఒకదానిని (అన్వేతి) పొందుచున్నాడు.
ఆ సాధనం పరిపక్వత సంతరించుకొన్నప్పుడు.. ఇహ-పరభేదం నశిస్తోంది! అది ఎట్లాగో చెప్పుతాను. విను.
ఓంకారము యొక్క త్రిమాత్రలు (మాత్ర = Phase, Dimension)
ఓం = అ + ఉ + మ = స్థూల రూపోపాసన + సూక్ష్మరూపోపాసన + సూక్ష్మాతి సూక్ష్మోపాసన
ఏ ఉపాసకుడైతే మూడిటిలో ఒక ‘మాత్ర’ను మాత్రమే (‘అ’కారము, పరమాత్మను సాకారుడుగా) ధ్యానిస్తూ ఉంటాడో, స్థూలరూపోపాసకుడై ఉంటాడో.., ఆతడు పరమాత్మను ‘‘ప్రథమ పురుష’’ (As Third Person= He, She, It)గా ధ్యానించినవాడగుచున్నాడు.
‘‘ఓం" = |
ఈ జగత్తుకు ఆధారమై, ఆవల ఉండి ఇదంతటికీ కారణమైన వాడుగా దైవోపాసన |
‘అ’ కారము ప్రథమమాత్ర - ప్రథమ పురుష (Third person - He, She, It, They, Them) |
‘అ’ కార రూప ఏకమాత్రోపాసన నిర్వర్తిస్తున్న ఉపాసకుడు సంవేదితుడై సిద్ధిని పొందినవాడై, కొన్ని సుఖలోకములలో - ప్రవేశించి ఎప్పుడో తిరిగి భూమిపై జన్మలకు వస్తున్నాడు. (‘పునరావృత్తి’ - అనే ధర్మము ఉంటుంది).
మరల భౌతిక భావనను (అభిసంపద్యతే) పొందుచున్నాడు. మొదటి మాత్ర అయినట్టి ‘అ’కార (రూపమైన) ఋక్కులు ఆతనిని ‘‘మనుష్యలోకమ్ ఉపనయంతే।’’.. మనుష్యలోకమునకు తీసుకొని వస్తున్నాయి.
అట్టి మనుష్య లోకములో ఆతడు తపస్సు - బ్రహ్మచర్యము లందు మరింత శ్రద్ధ కలిగినవాడై ఘనత వహిస్తున్నాడు.
అనగా, ఈతడు మరల ప్రయత్నశీలుడు అగుచున్నాడు.
(ఏకమాత్రోపాసన = పరమాత్మ స్థూలరూపుడుగా పురాణాలలో వర్ణించిన శివ-విష్ణు ఇత్యాది భౌతిక రూపముగా ఉపాసించుటకు పరిమితమవటము).
తరువాత దశలో ఆ ఓంకారోపాసకుడు స్థూల+సూక్ష్మ = ద్విమాత్రలను ధ్యానము చేస్తున్నవాడై, అదేరీతిగా ప్రయోజనము పొందుచున్నాడు. మనస్సుతో ఏకత్వము పొందుచున్నాడు! ‘నేను మనోరూపుడను - సూక్ష్మదేహిని’ అను భావనను సంతరించుకుంటున్నాడు!
అనగా.., - పరమాత్మ వీరిచే ‘‘స్థూల-సగుణ / సూక్ష్మగుణద్వయి’’గా భావించబడుచున్నారు.
ఈతడు రెండు మాత్రలను సమన్వయించుకుంటూ ‘ఓం’కార సంజ్ఞగా ఉపాసిస్తున్నాడు.
(1) ఈ జగత్తుకు ఆవల సర్వాధారమైన దైవము (పరమాత్మ) (Third Person - ప్రథమపురుష)
(2) ఈ కనబడేదంతా దైవరూపమే! (Second Person - మధ్యమ పురుష) కూడా
స్థూలము + భావన → ఈ రెండూ ఈతడు ఉపాసనాపరంగా సమన్వయించుకుంటున్నాడు.
అట్టి ద్విమాత్రోపాసకుని మనస్సు ఓంకారముతో ఏకత్వము పొంది యజుస్సులచేత (యజుర్వేద యజ్ఞ శబ్ద తరంగములచేత) దేహానంతరము అంతరిక్షయానముచే చంద్రలోకమునకు తీసుకొనిపోబడుచున్నాడు. అక్కడ చంద్రలోక వైభవాన్ని ఆస్వాదిస్తున్నాడు. కాలానంతరము తిరిగి మర్త్యలోకానికి వస్తున్నాడు. ఇంకా కూడా (ఈతడు) - మనస్సుతో ఏకత్వము ఆస్వాదిస్తూ సూక్ష్మదేహధారి అయి ఉంటాడు.
(ద్విమాత్రోపాసన = ఈ ఎదురుగా కనిపించేదంతా పరమాత్మరూపంగా ఉపాసించు స్థితి)
‘ఓం’ కార ఏకమాత్రోపాసకుడు (ఉదా = విగ్రహోపాసన; విగ్రహము నిగ్రహము కొరకే) (పరమాత్మ స్థూలరూపము) - పరమాత్మను స్థూలరూపముగా ఉపాసించువాడు. (శంఖు-చక్ర-గద ధారిగా, చతుర్భుజుడుగా, పన్నగశయనుడుగా, పసుపతి - గంగధారి - త్రినేత్రుడుగా, గజముఖుడుగా.. ఇత్యాదులు ఉపాసనలు సమర్పించువాడు.
‘ఓం’కార ద్విమాత్రోపాసకుడు (పరమాత్మసగుణుడు) = స్థూల + సూక్ష్మ (మనో) తత్త్వముగా పరమాత్మను నామరూపాత్మకుడుగా + సగుణుడుగా సేవించువాడు. (పరమాత్మను సర్వగుణ సంపన్నుడుగా భావించటము).
త్రిమాత్రోపాసన త్రిమాత్రేణ ‘ఓం’ - ‘ఓం’ సంజ్ఞా పరధ్యానం పరమాత్మ ధ్యానము
త్రిమాత్రోపాసకుడు ‘ఓం’ కారమును ఉచ్ఛరిస్తున్న సందర్భంలో
స్థూలము - సూక్ష్మము - కేవలముల సమన్వయోపాసన చేస్తున్నవాడగుచున్నాడు.
= అ + ఉ + మ
= స్థూలము + సూక్ష్మము + సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మ
= భౌతికము + మానసికము + ఆధ్యాత్మికము
= దేహము + దేహి + సర్వాంతర్యామి
ఈ ఈ మూడింటిని ఉద్దేశ్యిస్తూ ఓంకారోపాసన చేస్తున్నట్టివాడు. ఇది సమగ్రమైన ‘ఉపాసన’।
ఎవ్వడైతే త్రిమాత్రాత్మకమైనట్టి తత్త్వమును ‘ఓం’ అను అక్షరోచ్ఛారణతో అక్షర పరబ్రహ్మమును ఉద్దేశ్యిస్తూ ఉపాసిస్తున్నాడో.., అట్టివాడు → అటువంటి ఉపాసన చేత ఆతడు తేజోరూపమగు, సూర్యశక్తి సంపన్నమగు - ప్రాణతత్త్వమనే విశేష శక్తి సంపన్నుడు అగుచున్నాడు.
సూర్యశక్తితో ఏకత్వము పొందినవాడగుచున్నాడు.
ఒక పాము కుబుసమును విడచివేస్తుంది చూచారా! - యథా పాదోదరః త్వచా వినిర్ముచ్యతే, (తథా) - ఆ విధంగా ఆ త్రిమాత్రా సమన్విత ఓంకారోపాసకుడు సర్వ పాపదృష్టులను, దోషదృష్టులను (పాము కుబుసంలాగా) విడిచి వేస్తున్నాడు. ఆతని దృష్టిలో పరబ్రహ్మము మాత్రమే ఉన్నదిగాని, పాపి-పుణ్యుడు మొదలైన భేదములు వాస్తవమై లేవు. సామగానములతో (సామవేదశాస్త్ర సద్గ్రు ణ్యములతో (లేక) ప్రాణశక్తితో ‘సత్యలోకము’ అనే ప్రసిద్ధమైన పేరుతో పిలువబడే ‘బ్రహ్మలోకము’ (లేక ‘హిరణ్యగర్భలోకము’) ఈతడు చేరుచున్నాడు. అచ్చట జీవఘనత్వము పొందినవాడై ‘‘పురిశయంపురుషః - సర్వశరీరములలోని అంతర్గతుడు’’.. అగు పరంధాముడిని (పరమాత్మను, పరతత్త్వమును) - దర్శిస్తున్నాడు.
* తానుగా ఉన్నది పరమాత్మయే। * పరమాత్మగా ఉన్నది తానే।
తానే-పరతత్త్వమై, సర్వాంతర్యామియై, సర్వమునకు బాహ్య-అభ్యంతరములు స్వస్వరూపమయి సర్వము ఆస్వాదిస్తూ వెలుగొందుచున్నాడు.
ఈ త్రిమాత్రోపాసకుని విషయమై మరికొన్ని విశేషాలు కూడా చెప్పుకొంటున్నాము. వినండి।
ఈ త్రిస్రోమాత్రుడు (అ+ఉ+మ ఏక శ్లోక భావముగా ఉపయోగించువాడు - ప్రయుక్తుడు) పర- అపరములు పరస్పరము విడువనివాడై, దేనినీ విడువవలసిన - పట్టుకొనవలసిన అగత్యమే లేనివాడై, స్వయమాత్మయై ప్రకాశిస్తున్నాడు.
‘ఓం’కారము యొక్క మూడు మాత్రల ఉపాసనచే త్రిమూర్తి అయి (అ+ఉ+మ; దృక్+దృశ్య+దర్శనములు; జగత్తు+ జీవాత్మ+పరమాత్మలను ఎరిగి) సమస్తముయొక్క బాహ్య - అభ్యంతములను ఎరిగినవాడై ఉంటున్నాడు. ఇక మధ్య విషయములపట్ల ఆతని అవగాహనము స్వప్న సదృశంగాను, కల్పిత - కథాశ్రవణంగాను అయి ఉంటున్నాయి. ఆతడిక ‘‘సుఖ-దుఃఖములు’’.. మొదలైన ఏ ద్వంద్వములకు ఏ మాత్రము చలించనివాడగుచున్నాడు. కథ చదివేవాడు కథలోని సుఖ దుఃఖములను తాను పొందువాడవడు కదా! ఒకవేళ పొందినాకూడా, అది ఆతనికి ఆనంద వినోదమే కదా!
(త్రిమాత్రోపాసకుడు = నాతోసహా - నాకు చెందినట్లుగా అనిపించేదానితో సహా సర్వము సర్వదా బ్రహ్మమే!.. అను ఉపాసనచే ఏర్పడు సంభావన స్థితి).
ఈ విధంగా ‘ఓం’కారోపాసకులు →
(1) ఋక్కులచేత - ఓంకారము యొక్క ఆకార ఏకమాత్ర ఉపాసనచేత → స్థూల లోకములలోకి ఉత్కృష్టతను,
(2) యజస్సులచేత - ‘ఓం’కారము యొక్క ‘అ+ఉ’ కార స్థూల - సూక్ష్మ తత్త్వోపాసనా ఉద్దేశ్యము చేతను,
(3) అంతరిక్ష- (చంద్ర)లోక-స్థూల -సూక్ష్మ ఉత్కృష్ట స్థానమును,
సామములచేత మొదటి రెండు + 3వ మాత్రోపాసనోద్దేశ్యమైన అఖండ - అప్రమేయ ఉపాసనచేతను ‘బ్రహ్మలోక నివాసము’ అనే ఉత్కృష్టతను-పొందటం జరుగుతోంది.
తనకు తానే స్వాభావికంగానే సమస్తము అయి వెలుగొందుచున్నాడు.
ప్రాజ్ఞుడు త్రిమాత్రోపాసకుడై ఓంకారోరపాసనచే బ్రహ్మమును తెలుసుకొని (బ్రహ్మవిత్), బ్రహ్మమే తానై (బ్రహ్మైవ భవతి) - ‘‘అభయము, పరము, అజరము, శాంతము, అమృతము దేహామనోబుద్ధ్యాదులకు ఆవల సాక్షి అయినట్టికి, సర్వాధారము, సర్వాంతర్యామి’’ అగు ఆత్మానందస్థానమును సముపార్జించుకొనుచున్నాడు. ఆర్జించుకొని ఊరుకోకుండా, అనుక్షణికంగా, స్వాభావికము చేసుకుంటున్నాడు.
‘‘సృష్టి ప్రారంభ, వర్తమాన, లయాలు!’’ ఓంకారము యొక్క నిర్విషయ, సవిషయాలే।
ఈ విధంగా ఓంకారోపాసకుడు - సర్వము పొందినవాడగుచున్నాడు.
ఇకప్పుడు భరద్వాజ గోత్రుడైనట్టి సుకేశుడు సద్గురవగు శ్రీపిప్పలాదమహర్షి సమక్షములో తన ప్రశ్నను ఈ విధంగా మనవి చేసుకున్నారు.
సుకేశుడు :
హే పూజ్యుడా! భగవాన్! మహర్షీ!
ఒకానొక సందర్భములో ఒకరు నన్ను అడిగిన ప్రశ్నను మీకు విన్నవించుకొని మీ సమాధానమును అభ్యర్ధిస్తున్నాను. ఆ విషయమేమిటో నివేదిస్తున్నాను,
స్వామీ! ఒకసారి కోసలదేశానికి చెందిన రాజకుమారుడు హిరణ్యనాభుడు మా ఆశ్రమానికి వచ్చారు. ఆయన నన్ను ఇట్లా అడిగారు.
‘‘ఓ భరద్వాజా! మీరు 16 కళల (షోడశకళల) పురుషుని గురించి ఎరిగియే ఉన్నారా? లేదా? ‘‘షోడశకలం పురుషం వేత్థ (కిం)?’’
అప్పుడు నేను =
‘‘నా-హమ్ ఇమమ్ వేద! అయ్యా! మీరు చెప్పే ఆ ‘16’ కళల పురుషుడెవ్వరో నాకు తెలియదు, నేను ఆతనిని ఎక్కడా కూడా చూచినట్లు గుర్తు లేదు’’- అని పలికాను. అప్పుడాయన ‘‘వేదములు ఎరిగిన మీకు ఎందుకు తెలియదు? తెలిసే ఉంటుంది’’ ఎందుకో చెప్పటం లేదు’’ - అని అన్నారు.
అప్పుడు ‘‘యది అహం ఇమం అవేదిషం, తే కథం న వక్ష్యమ్? తెలిస్తే ఎందుకు చెప్పను? ఒకవేళ ఎప్పుడైనా ఈ మీ ప్రశ్నకు సమాధానమేమిటో మహనీయుల వద్ద తెలుసుకోవటం జరిగితే, మీకు తప్పకుండా చెప్పుతానులే!’’
ఎవ్వడు అబద్ధము చెప్పుతాడో.., (ఆధ్యాత్మిక ప్రశ్న)కు సమాధానము తెలియకపోయినప్పటికీ ఏదో ఒక్కటి తెలిసినట్లు చెప్పుదాములే.. అని ఏవేవో అబద్ధపు మాటలు చెప్పితే).. అట్టివాడు సమూలంగా ఎండి కృశిస్తాడని పెద్దల నానుడి కదా! అందుకే ‘నాకు సమాధానం తెలియదు అని మనవి చేస్తున్నాను.’’
అని ఆ రాజకుమారుడితో నేను చెప్పటం జరిగింది. అప్పుడు ఆ రాజకుమారుడు హిరణ్యనాభుడు (ఈమాత్రం తెలియదా? అన్నట్లుగా) నావైపు తూక్ష్ణీభావంతో చూస్తూ మా ఆశ్రమము నుండి అప్పటికప్పుడు - వెంటనే రథము ఎక్కి వెళ్లిపోయాడు.
స్వామీ! మహర్షీ! ఇప్పుడు తమకు అదే ప్రశ్నను నివేదిస్తూ మీ సమాధాన వాక్ అమృతాన్ని ప్రసాదించవలసిందిగా నేను వేడుకుంటున్నాను.
ఆ 16 కళల పురుషుడు ఎవ్వడు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు? ఏమా కళలు?
శ్రీ పిప్పలాద మహర్షి :
ఓహో! బాగున్నదయ్యా, సుకేశా! నీ మిత్రుడు, కోసల రాజపుత్రుడు అగు హిరణ్యనాభుడు అడిగిన ప్రశ్న!
సరే"! సమాధానం విను. ఓ స్నేహితులారా! మీరంతా కూడా వినండి.
ఓ సుకేశా!
ఇప్పుడు ఆ 16 కళల పురుషుడు ఇక్కడే ఉన్నాడు. మనందరివద్ద వేంచేసియే ఉన్నారు. మనలోనే ఉన్నారు. మనమే అయి ఉన్నాము కూడా! ఆత్మగా ఆ 16 కళలు మనయొక్క ప్రదర్శనా విన్యాసమే.
- నీయందే ఉన్నాడు.
- నీకు అభిన్నుడై ఉన్నాడు.
- నీవే ఆ ‘16’ కళల పురుషుడవు.
- నీయొక్క ఆత్మయే నీ ప్రశ్నకు సమాధానం!
సుకేశుడు :
ఆ 16 కళల పురుషడు నాయందే ఉన్నాడా? నేను ఆ పురుషునకు అభిన్నుడనా?.. మీరు అంటున్నది ఏ విధంగా యుక్తియుక్తం? నేనే అది ఎట్లా అవుతాను?
శ్రీ పిప్పలాద మహర్షి:
అవును! ఆ షోడశ కళల పురుషుడు మనందరిలోను సర్వదా వేంచేసి ఉన్నారు. ఆ పురుషుని ఎవరికివారు తమ యందు తామే దర్శించుకోవాలి సుమా! నేను - నీవు - ఈ నీ మిత్రులు, మనమందరము షోడశ కళాపురుషులమే! ఆ పురుషుడే మనలో ఆలోచనలను నిర్వర్తిస్తూ ఆలోచనలకు ఉత్పత్తి స్థానము - సాక్షి కూడా అయి, ‘ఆలోచనలు నిర్మించువారు’ అయి, మనందరిలో ఏకాత్మ స్వరూపుడై వెలయుచున్నారు.
‘‘సప్రాణమ్ అసృజత -.. అట్టి సర్వాంతర్యామియగు ఆత్మదేవుడు తనకుతానుగా, తనకొరకై విశ్వప్రాణము అను హిరణ్యగర్భతత్త్వమును సృష్టించుకుంటున్నారు.
అట్లు మన ఆత్మయొక్క సంకల్పముచే లీలా వినోదముగా ఆత్మ నుండి (కారణమగు ఆత్మకు అభిన్నమే అయి) ముఖ్య ప్రాణముగా జనించుచున్నారు. ముఖ్యప్రాణశక్తిని సృష్టి రచనకొరకై హిరణగర్భతత్త్వముగా క్రియాచమత్కారమును ఆత్మపురుషుడే తన వినోదము కొరకై ప్రారంభించుచున్నారు. ఇక ఆపై తదితరములైన (అన్యముగా కనిపిస్తున్న) సమస్తమును సృజిస్తున్నారు.
- మొట్టమొదటగా ఆత్మ నుండి→ ప్రాణశక్తి క్రియాత్మకమగు ప్రాణశక్తియే సృష్టికర్తృత్వమగు ‘‘హిరణ్యగర్భత్వము’’గా సంతరించు కుంటోంది.
అట్టి ప్రాణశక్తి నుండి → ‘‘శ్రద్ధ’’ (Attention / concerntration)
ఆ శ్రద్ధ (Concentration) నుండి →
→ ఖం - వాయుః - జ్యోతిః - ఆపః - పృధివి అనబడే మూల పంచభూతతత్త్వములు;
→ ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు,
అంతరంగము:
→ (మనో-బుద్ది-చిత్త-అహంకారాలు),
→ అన్నము (ఆహారము - దేహపరిపోషకతత్త్వములు) - అన్నము నుండి → వీర్యము
→ తపస్సు, ధ్యానము, ప్రాణాయామము మొదలైన సాధనములు.
→ లోకములు, (వివిధ స్వభావాలు, మనస్తత్వాలు).
ఈ విధంగా నామ రూపాత్మకమై ఈ కనబడే సర్వవిశేషాలు...,
ఇవన్నీ (ప్రాణశక్తియే) అనేక రూపములుగా, విశేషములుగా ప్రదర్శిస్తూ - ప్రదర్శితమగుచున్నది.
వింటున్నారా బిడ్డలారా! మరల వినండి! ఈ విధంగా నిర్వికారమగు ఆత్మపురుషుడు :
|
ఇవన్నీ ఆత్మ యొక్క లీలా వినోదమై, ఆత్మచేతనే ప్రదర్శింపబడుచున్నాయి.
... ఆత్మ అవ్యక్తరూపంగా ప్రవేశిస్తూ, వ్యక్తమగుచూ ఈ చమత్కార దృశ్యజగత్ క్రీడావినోదము పుంఖానుపుంఖంగా నిర్వర్తిస్తోంది.
కనుక..,
- ఇదంతా పరమ పురుషుడే।
- నీవు ఆత్మ స్వరూపుడవే।
- షోడశ కళలు ఆత్మస్వరూపుడవగు నీ నుండియే వెడలుచుండటం చేత ఆ షోడశకళలు నీయందే ఉన్నాయి.
అదంతా ఎట్లా జరుగుతోందో చెప్పటానికి.. ఒక దృష్టాంతమును తీసుకుంటున్నాను వినండి.
‘‘యథా సముద్రాయణాః స్యందమానాః ఇమా నద్యః (నదులు) → సముద్రం ప్రాప్య → అస్తం గచ్ఛంతి..,
ఏ విధంగా అయితే..,
* సముద్రమే తమ గమ్యము (Find Place to reach)గా గల వివిధ నదీ జలాలన్నీ కూడా..,
* సముద్రములో ప్రవేశించినవవై
* తమ యొక్క ‘‘ఈ జలము ఈ నదికి చెందినది’’ - అనే గుర్తింపు ఈ షణ్మాత్రంగా కూడా కలిగియుండవు కదా!
అప్పుడు ‘‘ఇది సముద్ర జలము’’ అంటామే గాని ఈ తరంగం ఆ పేరు గల నదిది’’ - అనబడేది ఎక్కడా ఉండదు గదా!
అట్లాగే..
‘కేవల ద్రష్ట’ అయినట్టి పురుషుని యొక్క షోడశ (16) కళలు కూడా →
ఏ తత్త్వములో అవన్నీ లయిస్తున్నాయో
- ఆ పురుషుడు మాత్రమే శేషిస్తున్నాడు. సర్వము తానే అగుచున్నాడు.
ఆతడే షోడశ పురుషుడు.
అనగా..
అజ్ఞాన దృష్టికి కనిపించే → పంచభూత+ పంచకర్మేంద్రియ + పంచజ్ఞానేంద్రియ + మనోరూప షోడశకలలన్నీ
(5 + 5+ 5+ 1=16) కూడా →
→ ఆత్మజ్ఞాన దృష్టిచే..,
ఆత్మకు అభిన్నమై తెలియవస్తున్నాయి. ‘‘అంతా ఆత్మయే’’.. అని సర్వదా పరమశాంతమై అనుభూతం అవుతోంది.
నిర్మలము - స్వయం జ్యోతి స్వరూపము అగు ఆత్మయే అంతా యథాతథముగానే సర్వదా విరాజిల్లుతోందయ్యా!
ఓ బిడ్డలారా! స్వస్వరూపముతో సహా సర్వము ఆ షోడశ కళాత్మక పరమ పురుషుడుగా ఉపాసిస్తూ క్రమంగా మనమంతా సహజంగా ఆ పరమ పరుష స్వరూపులముగా సుస్పష్ట పరచుకోవటమే వేదాంత విద్య!
రథము యొక్క ఇరుసులో ఆకులు అమర్చబడి యున్నట్లు, మనం చెప్పుకున్న షోడశ (16) కళలు ఎవ్వనియందైతే ప్రతిష్ఠితాలై ఉన్నాయో..
‘‘తతోహి వేద్యం పురుషః’’। తదేవాహమ్। తత్ త్వమేవ। తదేవ ఇదగ్ం సర్వమ్।
ఆతడే తెలుసుకోవలసిన పురుషుడు. పరమ పురుషుడు. ఆతడే నేను। ఆతడే నీవు। ఆతడే ఇదంతా।
ఆ పరమ పురుషుని స్వస్వరూపునిగా తెలుసుకొన్న తరువాత, ఇక అట్టివానిని మృత్యువు బాధించదు.
అట్టి పరమ పురుషత్వము సతరించుకోవటమే మన అంతరంగము యొక్క వేదగానము!
ఓ ప్రియమిత్రులారా!
అహం చ ఏతావత్ ఏతత్ పరంబ్రహ్మ వేద!
నేను ఆ పరబ్రహ్మమును ఇంతవరకు ఈ రీతిగా తెలుసుకొనిన వాడనై ఉన్నానయ్యా!
అతః పరమ్ న అస్తి
ఇంతకుమించి వేరే ఎక్కడా మరేదీ లేదు - అని తలచుచున్నాను.
ఆ విధంగా సుకేశ- సత్యకామ - సౌర్యాయాణి - కౌసల్య - భార్గవ - కబంధులు ఆరుగురు అడిగిన ఆరు ప్రశ్నలకు శ్రీ పిప్పలాద మహర్షి ప్రసాదించిన తత్త్వజ్ఞాన పూర్వక సమాధానాలను వారంతా శ్రద్ధ-భక్తులతో విన్నారు. ప్రాణతత్త్వము యొక్క వివిధ ప్రదర్శనా చమత్కారాలను, ఆత్మనుండి ఆత్మేచ్ఛచే బయల్వెడలే ఆత్మకు అభేద ప్రాణతత్త్వం గురించి, పరమ పురుషుని యందలి ఆయన యొక్క షోడశ కళల ఆవిర్భావ -తిరోభావ లీలా వినోద విశేషాలను గురించి బుద్ధితో గ్రహించిన వారయ్యారు!
లేచి నుంచుని, మహర్షిని సమీపించి వారిని పూజించారు.
‘‘స్వామీ!
త్వం హి నః పితా, యో అస్మాకం అవిద్యాయాః పరం పారం తారసీతి!
మీరే మాకు తండ్రి! ఎందుకంటే మీరిప్పుడు ప్రసాదించిన మీ యొక్క ప్రవచనా రూప బ్రహ్మజ్ఞానపూర్వక సమాధానాలచే మేము అజ్ఞానము యొక్క ఆవలిగట్టు చేరుచున్నాము.
నమః పరమ ఋషిభ్యో! నమః పరమ ఋషిభ్యః।
ఆత్మ జ్ఞానదీపము వెలిగించి అజ్ఞానాంధకారము మొదలంట్లా తొలగిస్తున్న ఓ పరమ ఋషులారా! ఋషి పుంగవులారా!
మీకు నమస్కారము! నమో నమః।। నమో నమో నమో నమః।"
ఇతి ప్రశ్నోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।