Rudrāksha Jābāla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com
శ్లో।। ‘రుద్రాక్షోపనిషత్’ వేద్యం మహారుద్రతయా ఉజ్జ్వలమ్ ప్రతియోగి వినిర్ముక్తం ‘‘శివమాత్రపదం’’ భజేత్।। |
రుద్రోపనిషత్ - చెప్పుచున్న రహస్యతత్త్వమును ఎరిగినవారు క్రమంగా శివ తత్త్వమును ఎరిగినవారగుచున్నారు. ఉజ్వలమగు మహారుద్ర స్వరూపుడు, ఎదురుచెప్పుటకే (ప్రతియోగి) కుదరనట్టి వారు, పరకాష్ఠయగు ‘‘నిరూపిత పరమసత్యము’’ ను ప్రకటించువారు- అగు పరమశివుని ‘శివమాత్రపదసిద్ధి కొరకై (శివో2హమ్ సిద్ధికై) సేవించుచున్నాము. |
‘‘ఓం’’ 1. అథ హి ఏనం కాలాగ్ని రుద్రం భుసుండంః ప్రపచ్ఛ : ‘‘కథం రుద్రాక్షా ఉత్పత్తిః? తత్ ధారణాత్ కిం ఫలం?’’ - ఇతి।। |
‘‘ఓం ఇత్యేకాక్షరమ్ బ్రహ్మ’’ ఒకానొక సందర్భములో వాయస - భుసుండులవారు జగద్గురువులగు కాలాగ్నిరుద్ర భగవానుని దర్శనం చేసుకొని ఈ విధంగా పరిప్రశ్నించారు. స్వామీ! రుద్రాక్షలు ఎట్లా పుట్టినాయి? అట్టి రుద్రాక్షధారణ - ఏ ఫలమును ప్రసాదించ గలదు? (రుద్రాక్ష = అనేకమైనదంతా ఏకమగు ఆత్మయందు లయింపజేసి దర్శించు దృష్టి. ఈవిధంగా రుద్రుడు లయకారుడు). |
తం హో వాచ భగవాన్ కాలాగ్ని రుద్రః : త్రిపుర వధార్థమ్ అహమ్ నిమీలితాక్షో అభవమ్। |
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు: ఓ భుసుండా! వినండి. నేను ఒకప్పుడు దేవతల కష్టములు తొలగించటానికై, త్రిపురాసురుని సంహరించ సంకల్పించాను. కించిత్ కనులు మూసుకొన్నాను. |
తేభ్యో జలబిందవో భూమౌ పతితాః, తే ‘రుద్రాక్షా’ జాతాః, సర్వానుగ్రహార్థాయ। |
అప్పుడు నా కనులనుండి జలబిందువులు భూమిపై రాలటం జరిగింది. ఆ జలబిందువులే సర్వజనులకు అనుగ్రహము ప్రసాదించే నిమిత్తమై ‘రుద్రాక్షలు’గా అయినాయి. |
తేషాం నామోచ్చారణ మాత్రేణ దశ గో ప్రదాన ఫలం। దర్శన స్పర్శనాభ్యాం ద్విగుణ ఫలమ్। |
అట్టి ‘రుద్రాక్ష’ నామమును ఉచ్ఛరించిన మాత్రముచేతనే ఈ జీవునకు పది గోవులను దానము చేసిన ఫలితము లభించగలదయ్యా। అంతే కాదు. రుద్రాక్షలను దర్శించినంత, స్పృశించినంత మాత్రంచేతనే అంతకు ద్విగుణీకృతమైన ఫలము (Double the above) సిద్ధించగలదు. |
అత ఊర్థ్వం వక్తుం న శక్నోమి। తత్ర ఏతే శ్లోకా భవంతి। |
ఇక ఆపై - (పూజించటము, ధారణ చేయటము మొదలైనవాటి చేత) లభించుఫలము నేను కూడా నిర్వచించి చెప్పలేను. ఆయా విశేషములు శాస్త్రములచే శ్లోకరూపంగా గానము చేయబడుచూ ఉన్నది. |
2. భుసుండౌ వాచ : కస్మిగ్ం స్థితం తు? కిం న్నామ? కథం వా ధార్యతే నరైః? కతి భేదముఖాని? - అత్ర కైః మంత్రైః- ధార్యతే కథమ్? |
భుసుండయోగీశ్వరుడు: • రుద్రాక్షలు ఎక్కడ స్థితి కలిగి ఉంటాయి? • వాటికి ఏఏ పేర్లు ఉన్నాయి? • జనులు ఏఏ విధాలుగా ధరిస్తూ ఉంటారు? • ఏఏ ముఖభేదములున్నాయి? • ఏఏ మంత్రములతో మనన పూర్వకంగా ఉపాసిస్తూ, ధారణ చేయాలి? దయతో వివరించండి. |
కాలాగ్నిరుద్రౌవాచ : దివ్య వర్ష సహస్రాణి చక్షుః ఉన్మీలితం మయా। భూమాః అక్షి పుటాభ్యాం తు పతితా జలబిందవః। |
శ్రీ కాలాగ్ని రుద్రభగవానుడు : వేయి దివ్యసంవత్సరముల కాలము నేను చక్షురున్మీలితుడనై (కనులు మూసుకొని) ఒక్కసారిగా కనులు తెరచుటచే అక్షిపుటములనుండి (కనుకొలకుల నుండి) కన్నీటి బిందువులు జాలువారి భూమిపై పడటం జరిగింది. |
తత్ర అశ్రుబిందవో జాతా మహారుద్రాక్ష వృక్షకాః। స్థావరత్వమ్ అనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్। భక్తానాం ధారణాత్ పాపం దివారాత్రి కృతగ్ం హరేత్। |
ఆ అశ్రు బిందువులే భూమిపై మహారుద్ర వృక్షములుగా అయినాయి. భక్తులను అనుగ్రహించుటకొరకై జలరూపమగు ఆ అశ్రుబిందువులు స్థావరములుగా రుద్రాక్ష వృక్షములు - అట్టి రుద్రాక్షల ధారణ-పగలు, రాత్రి చేసిన పాపములు హరించవేయ గలవు. |
లక్షం తు దర్శనాత్ పుణ్యం, కోటిః తత్ స్పర్శనాత్ భవేత్। తస్య కోటి శతం పుణ్యం లభతే ధారణాత్ నరః। |
దర్శనమాత్రం చేత లక్ష జపము చేసిన పుణ్యము, స్పర్శమాత్రం చేత కోటి జపము చేసిన ఫలము లభించగలదు. అంతేకాదు. నరుడు (మానవుడు) రుద్రాక్షలను ధారణ చేయుటచే శతకోటి జపముల పుణ్యము పొందుచున్నాడు. |
లక్ష కోటి సహస్రాణి, లక్ష కోటి శతాని చ - తత్ జపాత్ లభ్యతే పుణ్యం నరో రుద్రాక్ష ధారణాత్। ధాత్రీఫల (ఉసిరికాయంత) ప్రమాణం యత్ -‘శ్రేష్ఠమ్’ ఏతత్ ఉదాహృతమ్। |
రుద్రాక్షలను ధారణ చేసి జపం చేస్తే లక్ష కోటి వేల, లక్ష కోటి వందలసార్లు జపము చేసిన పుణ్యము లభించగలదు. ఉసిరికాయంత ప్రమాణముగల రుద్రాక్షలు శ్రేష్ఠము, ఉత్తమము అని చెప్పబడుతోంది. |
బదరీఫల (గంగరేగుపండు) మాత్రం తు ‘మధ్యమం’ ప్రోచ్యతే బుధైః। అధమం చణమాత్రం (శనగ గింజంత) స్యాత్ ప్రక్రియైషా మయోచ్యతే। (ప్రక్రియ ఏషా మయ ఉచ్యతే।) |
గంగరేగుపండంత ప్రమాణముగల రుద్రాక్ష మధ్యమమని బుధులచే తెలియజేయబడుతోంది. శనగ గింజ ప్రమాణముగల రుద్రాక్ష అధమము. ఇది ప్రక్రియా విధానంగా నాచే చెప్పబడింది. |
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ ఇతి శివాజ్ఞయా, వృక్షాజాతాః పృధివ్యాంతు తత్ జాతీయాః శుభాక్షకాః। (శుభ అక్షకాః)। |
ఓ భుసుండ మహాశయా! ఇప్పుడు రుద్రాక్షల ప్రక్రియ గురించి చెప్పుచున్నాను. వినండి. జనులలో విభాగములుగా చెప్పుకోబడుచున్నట్లే, రుద్రాక్ష వృక్ష జాతులు కూడా - ‘‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’’ జాతుల రుద్రాక్ష వృక్షాలు ఉన్నాయి. వాటివాటి రుద్రాక్షలు కూడా చతుర్విధములు. |
శ్వేతాస్తు బ్రాహ్మణా జ్ఞేయాః। క్షత్రియా రక్తవర్ణకాః। పీతా (పసుపుపచ్చ) వైశ్యాస్తు విజ్ఞేయాః। కృష్ణాః (నలుపు) శూద్రా ఉదాహృతాః।। |
తెల్లని రుద్రాక్షలు బ్రాహ్మణ రుద్రాక్షలు అని, ఎర్రనివి క్షత్రియ రుద్రాక్షలు అని, పసుపు పచ్చవి వైశ్యజాతి రుద్రాక్షలు అని నలుపు రుద్రాక్షలు శూద్ర రుద్రాక్షలు అని చెప్పబడుతోంది. |
బ్రాహ్మణో బిభృయాత్ శ్వేతాన్। రక్తాన్ రాజా తు ధారయేత్। పీతాన్ వైశ్యస్తు బిభృయాత్। కృష్ణాం శూద్రస్తు ధారయేత్। సమాః స్నిగ్ధా దృఢాః స్థూలాః కంటకైః సంయుతాః శుభాః। |
అందుచేత…, బ్రాహ్మణులు → తెల్ల రంగు రుద్రాక్షలను, క్షత్రియులు → ఎర్రరంగు రుద్రాక్షలను, వైశ్యులు → పసుపుపచ్చరంగు రుద్రాక్షలను, శూద్రులు → కృష్ణ (నలుపు) రంగు రుద్రాక్షలను ధారణ చేయుట శ్రేష్ఠము. రుద్రాక్షలలో సమమైనవి, నునుపైనవి, గట్టిగా ఉన్నట్టివి, స్థూలంగా ఉండేవి, చిన్న కంటకములవలె (ముళ్లతో) ఉండేవి - ఇవి శుభప్రదము. |
క్రిమిదష్టం ఛిన్న భిన్నం కంటకైః హీనమేవ చ। వ్రణయుక్తమ్ అయుక్తం చ షట్ రుద్రాక్షాణి వర్జయేత్।। |
పురుగులు కొరికగా చిల్లులు కలిగినవి, ముక్కలుగా ఛిన్నాభిన్నమైనట్టివి, పెద్దముల్లులు (కంటకములు) కలిగియున్నట్టివి, హీనమైన ఆకారములు కలిగియున్నట్టివి, వ్రణములతో గొగ్గిలిగొగ్గిలిగా ఉన్నట్టివి, నలువైపులా అసమమైన ఆకారములు కలిగియున్నట్టివి అగు రుద్రాక్షలు వర్జించవలసినవి. ధరించరాదు. |
3. స్వయమేవ కృతద్వారం రుద్రాక్షం స్యాత్ ఇహ ‘ఉత్తమమ్’। యత్తు పౌరుషయత్నేన కృతం తత్ ‘మధ్యమం’ భవేత్। |
స్వయముగా (మానవ ప్రయత్నం లేకుండా) ప్రకృతి సిద్ధంగా రంధ్రము కలిగియున్న రుద్రాక్షలు ఉత్తమమైనవి. పురుష ప్రయత్నపూర్వకంగా రంధ్రము చేయబడినవి ‘మధ్యమము’ అగుచున్నాయి. |
సమాన్ స్నిగ్ధాన్ దృఢాన్ స్థూలాన్ క్షౌమసూత్రేణ ధారయేత్। సర్వ గాత్రేణ సౌమ్యేన సామాన్యాని విచక్షణః।। |
సమమైనవి, సుతి మెత్తని - నునుపైనవి, దృఢమైనవి, స్థూలమైనవి - ఇటువంటి రుద్రాక్షలను పట్టుత్రాడుతోగ్రుచ్చి ధరించాలి. సామాన్యంగా - విచక్షణశీలురగు పండితులు రుద్రాక్షమాలలను దేహమంతటా ధరిస్తూ ఉంటారు. |
నికషే హేమరేఖాభా యస్య రేఖా ప్రదృశ్యతే, తత్ అక్షమ్ ఉత్తమమ్ విద్యాత్। తత్ ధార్యం శివపూజకైః। |
ఏ రుద్రాక్ష అయితే గీటురాయిపై గీసినప్పుడు బంగారపురంగు గీత కనబడటము జరుగుతుందో, అట్టి రుద్రాక్ష ఉత్తమమైనదిగా గ్రహించ బడుతోంది. అట్టి అక్షతను శ్రేష్ఠముగా శివపూజ సందర్భము కొరకై ధరించ బడుచున్నది. |
శిఖాయాం ఏకరుద్రాక్షం। త్రిశతం (300) శిరసా వహేత్। షట్ త్రింశతం (36) గళే దధ్యాత్। బాహ్వోః షోడశ - షోడశ (16,–16)। మణిబంధే ద్వాదశైవ (12)। |
శిఖయందు - ఒక రుద్రాక్షను శిరస్సునందు - 300 రుద్రాక్షలు, గళము (మెడ) యందు ‘36’ రుద్రాక్షలు, ఉభయ భుజములకు 16+16 రుద్రాక్షలు, మణికట్టుకు ‘12’ రుద్రాక్షలు, |
స్కంధే పంచశతం (500) వహేత్। అష్టోత్తర శతైః (108) మాలామ్, ఉపవీతం ప్రకల్పయేత్। |
స్కందము (చంక, మూపుర) స్థానములలో ‘500’ రుద్రాక్షలను, 108 రుద్రాక్షల మాలను ఉపవీతము (జందియము) వలె వేసుకోవాలి. |
ద్విసరం త్రిసరం వాపి సరాణాం (పేటలు) పంచకం తథా। సరాణాం సప్తకం వాపి బిభృయాత్ కంఠదేశతః। మకుటే కుండలేచైవ, కర్ణికా హార కే-పి వా కేయూర కటకే సూత్రం కుక్షిబంధే విశేషతః। సుప్తే పీతా సదా కాలం, రుద్రాక్షం ధారయేత్ నరః। |
కంఠమునకు రెండు (2) వరుసల (లేదా) మూడు (3) వరుసల (లేక) (5) వరుసల (లేక) ఏడు (7) పేటల మాలను ధరించెదరుగాక! మకుటము (కిరీటము) నందు, కుండలము (చెవిప్రోగుల)యందు కర్ణిక (చెవికమ్మ)యందు, హారకము (గొలుసు) నందు, కేయూర (బాహు ఆభరణమునందు, కటక సూత్రమునందు), కుక్షి (పొట్ట) బంధమునందు రుద్రాక్షలు, వాటితో కూడిన సూత్రపు త్రాడుతో సర్వకాలములలో ధరించటము చేత - విశేషమైన ఫలితము లభించగలదు. |
త్రిశతం తు అధమం। పంచశతం మధ్యమమ్ ఉచ్యతే। సహస్రం ఉత్తమం ప్రోక్తమ్ ఏవం భేదేన ధారయేత్ |
మొత్తము అన్నీ కలిపి - 300 రుద్రాక్షల ధారణ - అధమము 500 రుద్రాక్షల ధారణ - మధ్యమము 1000 రుద్రాక్షల ధారణ - ఉత్తమము ఈ భేదమును ఎరిగి ధారణ చేయబడును గాక। |
శిరస ‘ఈశాన’ మంత్రేణ కంఠే ‘తత్పరుషేణ’ తు। ‘‘అఘోరేణ’’ గళే ధార్యం తేనైన హృదయే-పి చ।। |
శిరస్సుపై → ‘‘ఈశానః’’ మంత్రములో ధరించాలి. శ్లో।। ఈశానః సర్వ విద్యానామ్। ఈశ్వరః సర్వభూతానామ్। బ్రహ్మ అధిపతిః। బ్రాహ్మణో అధిపతిః బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్।। (శివ ‘ఓం’) ‘‘తత్పురుష’’ మంత్రము గానం చేస్తూ కంఠమున రుద్రాక్షమాలతో అలంకరించుకోవాలి. శ్లో।। తత్పురుషాయ విద్మహే। మహా దేవాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచోదయాత్।। గళమున (కుత్తుకయందు), హృదయమున రుద్రాక్షలు ధరించేడప్పుడు అఘోరమంత్రము గానము చేస్తూ ఉండాలి. శ్లో।। అఘోరేభ్యో, అథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యోః సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః।। |
4. ‘అఘోర’ బీజ మంత్రేణ కరయోః ధారయేత్ సుధీః। పంచాశత్ (50) అక్షగ్రథితాన్ వ్యోమవ్యాప్యపి చ - ఉదరే। పంచ బ్రహ్మభిః అంగైశ్చ త్రిమాలా పంచసప్త చ। గ్రథిత్వా మూలమంత్రేణ, సర్వాణి అక్షాణి ధారయేత్। |
‘‘అఘోర బీజమంత్రము’’ చదువుచూ చేతులకు రుద్రాక్షలు ధారణ చేయాలి. 50 అక్షములను (రుద్రాక్షలను) ప్రథితము (మాలగా కూర్చటము) చేయాలి. ఉదరము (పొట్ట) చుట్టూతా విస్తరించి ధరించాలి. పంచబ్రహ్మలను రుద్రాక్షపూర్వకంగాను, మూల మంత్రములతో గ్రథితం చేస్తూ - (కూర్చుచూ) ధరించాలి. |
అథ హి ఏనం భగవంతం కాలాగ్నిరుద్రం భుసుండః పప్రచ్ఛ : ‘‘రుద్రాక్షాణాం భేదేన యత్ అక్షం?యత్ స్వరూపం? యత్ ఫలమ్ ఇతి? తత్ స్వరూపం ముఖ యుక్తం, అనిష్ట నిరసనం, కామాభీష్ట ఫలం బ్రూహి’’ - ఇతి।। |
భుసుండవాయస మహా యోగి : హే భగవాన్। కాలాగ్ని రుద్రదేవా। - రుద్రాక్షలలో వివిధ భేదములు ఎట్టివి? ఏ రకములు ఉన్నాయి? - ఏ జాతి రుద్రాక్ష ఏ స్వరూపం కలిగి ఉంటుంది? ఏ ఫలమును ప్రసాదించగలదు? - వాటి ముఖ స్వరూపములు ఏమిటి? వాటి అనిష్ట - నిరసనము లైనవి ఏవి? అభీష్ట ఫలములను ఏవి ప్రసాదిస్తాయి? - ఈ వివరణలు దయచేసి చెప్పండి. |
సహోవాచ: తత్రైతే శ్లోకా భవంతి। మం.శ్లో।। ఏకవక్త్రం తు రుద్రాక్షం పరతత్త్వ స్వరూపకమ్। తత్ ధారణాత్ పరే తత్త్వే లీయతే విజితేంద్రియః। |
కాలాగ్ని రుద్ర భగవానుడు : నాయనా! భుసుండా! మీరు అడిగిన విశేషాల గురించి వివరించే శాస్త్ర శ్లోకములు (వివరణలు) ఉన్నాయి. (1). ఏకముఖరుద్రాక్ష : పరతత్త్వ స్వరూపకము. ఏకముఖ రుద్రాక్ష ధారణచే అట్టివాడు ఆత్మోపాసకుడై పరబ్రహ్మముతో మమేకత్వము సిద్ధించుకోగలడు. ఇంద్రియ దృశ్యమంతా జయించి వేయగలడు. ఆతనికి ఇంద్రియములు స్వాధీనమైనవై ఉంటాయి. |
ద్వి వక్త్రంతు, మునిశ్రేష్ఠ చ, అర్థనారీశ్వరాత్మకమ్। ధారణాత్ అర్ధ నారీశః ప్రీయతే తస్య నిత్యశః।। |
(2). ద్విముఖ రుద్రాక్ష : - అర్థనారీస్వరూపము : ఓ మునిశ్రేష్ఠా! ఈ ద్విముఖ రుద్రాక్షను ధరించినవాడు సమస్త జగత్ దృశ్యముపట్ల అతీతరూపమగు మౌన-ఈశ్వరత్వము, మునిశ్రేష్ఠత్వము సిద్ధించుకోగలడు. ఇహ-పర, ప్రకృతి-పురుష, జీవ-బ్రహ్మ ఏకత్వరూపమగు అర్థనారీశ్వ రాత్మకమైనది-అగు ద్విముఖ రుద్రాక్షయొక్క అనునిత్యధారణచే అర్ధ నారీశ్వరుడు ప్రీతిచెంది సమస్త ఇహ-పర సుఖములు ప్రసాదించగలరు. |
త్రిముఖంచ ఏవ రుద్రాక్షమ్ అగ్ని త్రయ స్వరూపకమ్। తత్ ధారణాచ్చ హుత భుక్తస్య తుష్యతి నిత్యదా।। |
(3). త్రిముఖ (3) రుద్రాక్ష : అగ్నిత్రయ స్వరూపమ్ త్రిముఖ రుద్రాక్ష - గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, అహవనీయాగ్ని స్వరూపము. అట్టి త్రిముఖరుద్రాక్ష ధారణచే హుతభుక్ అగు అగ్నిభగవానుడు ప్రీతిచెంది, సర్వశుభములు ప్రసాదించగలరు. |
చతుర్ముఖం తు రుద్రాక్షం చతుర్వక్త్ర స్వరూపకమ్। తత్ ధారణాత్ చతుర్వక్త్రః ప్రీయతే తస్య నిత్యదా।। |
(4). చతుర్ముఖ (4) రుద్రాక్ష - చతుర్ముఖబ్రహ్మ స్వరూపము 4 ముఖముల రుద్రాక్ష సృష్టికర్త అగు చతుర్ముఖ బ్రహ్మ స్వరూపము. చతుర్ముఖ రుద్రాక్ష నిత్యధారణచే బ్రహ్మభగవానుడు ప్రీతిచెంది సర్వ శుభ - సంపదలు ప్రసాదించగలరు. బ్రహ్మజ్ఞానము అనుగ్రహించగలరు. |
పంచవక్త్రం తు రుద్రాక్షం పంచ బ్రహ్మ స్వరూపకమ్। పంచ వక్త్రః స్వయం బ్రహ్మ పుంహత్యాం చ వ్యపోహతి।। |
(5). పంచముఖ (5) రుద్రాక్ష - పంచముఖ బ్రహ్మ / పంచముఖ శివ భగవానుని స్వరూపము పంచముఖ రుద్రాక్ష ధారణచే పంచముఖుడగు శివదేవుడు ప్రీతిపొందిన వారై బ్రహ్మహత్య ఇత్యాది మహాపాపముల దోషములు కూడా తొలగించి, సర్వ శుభములు ప్రసాదించగలరు. |
షఢ్వక్త్రమ్అపి రుద్రాక్షం కార్తికేయ అధి దైవతమ్। తత్ ధారణాత్ మహాశ్రీః స్యాత్ మహత్ - ఆరోగ్యం ఉత్తమమ్।। |
(6). షట్ ముఖ (6) రుద్రాక్ష-షణ్ముఖ/కార్తికేయ/కుమారస్వామి స్వరూపము ఆరు ముఖముల రుద్రాక్ష ధారణచే ఆ కార్తికేయ కరుణారస సాగరుని కరుణా కటాక్ష వీక్షణ లభించగలదు. మహత్ సిరిసంపదలు, మహత్తరమగు భౌతిక - మానసిక ఆధ్యాత్మి సంపదలు, ఉత్తమ ఆరోగ్యము లభించగలవు. |
మతి విజ్ఞాన సంపత్తి శుద్ధయే ధారయేత్ సుధీః। ‘వినాయక అధిదైవం చ ప్రవదంతి మనీషిణః।। |
షణ్ముఖ (6) రుద్రాక్షధారణచే అధికాధికంగా ఉత్తమమైన బుద్ధి - విజ్ఞాన సంపత్తి, నిర్మలమైన మనో బుద్ధులు లభించగలవు. అట్టివాడు సుధీః (ఉన్నతమైన, సునిశితమైన బుద్ధిసంపన్నుడు) కాగలడు. మహనీయులు ‘‘షణ్ముఖ రుద్రాక్షకు అధి దేవత వినాయకస్వామి’’ అని కూడా చెప్పుచూ ఉంటారు. అట్టి ధారణ ‘వినాయకోపాసన’ అగుచున్నది. |
5. సప్తవక్త్రం తు రుద్రాక్షం సప్తమాత్ర అధిదైవతమ్। తత్ ధారణాత్ మహాశ్రీ స్యాత్ మహత్ - ఆరోగ్యం ఉత్తమమ్।। మహతీ జ్ఞాన సంపత్తిః, శుచిః ధారణతః సదా।। |
(7). ఏడు (7) ముఖముల రుద్రాక్ష - సప్త మాతృకల అధిదేవతారూపము. (బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనబడు) సప్త మాతృకల దేవతా స్వరూపము. అట్టి ఏడు ముఖముల రుద్రాక్షను శుచిగా నిత్యము ధరించుటచేత - మహత్ సంపద, మహత్ ఆరోగ్యము, మహత్ జ్ఞాన సంపత్తి సిద్ధించగలదు. |
అష్టవక్త్రం తు రుద్రాక్షమ్ అష్టమాత్ర - అధి దైవతమ్। వసు-అష్టక ప్రియంచైవ గంగాప్రీతికరం తథా। తత్ ధారణాత్ ఇమే ప్రీతా భవేయుః సత్యవాదినః।। |
(8). ఎనిమిది (8) ముఖముల రుద్రాక్ష అష్టమాత్ర అధిదేవతా స్వరూపము. అష్ట వసువులకు (అవుడు, ధ్రువుడు, సోముడు, ఆధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసులకు) - ప్రియమైనది. అష్టగంగలకు (గంగ, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి)కి - ప్రీతికరము. ఎనిమిది ముఖముల రుద్రాక్ష ధరించటంచేత అట్టివారు అష్ట వసువులకు, అష్టగంగలకు ప్రీతికరము అవుతారు. సత్యవాదు లవగలరు. సత్యవాక్ - శుద్ధి పొందగలరు. |
నవ వక్త్రం తు రుద్రాక్షం నవశక్తి అధి దైవతమ్। తస్య ధారణ మాత్రేణ ప్రీయంతే నవశక్తయః।। |
(9). తొమ్మిది (9) ముఖముల రుద్రాక్ష నవశక్తి స్వరూప అధిదేవత. ధారణమాత్రంచేత నవశక్తి దేవతలకు (నవావరణల అధిదేవతలకు (అట్టివాడు) ప్రీతిపాత్రుడగు చున్నాడు. (దృశ్యాత్మ, జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మలనబడే నవాత్మాంశల జ్ఞానము సిద్ధించగలదు) |
దశవక్త్రం తు రుద్రాక్షం యమ దైవత్యమ్ ఈరితమ్। దర్శనాత్ శాంతి జనకం పాపానామ్। నాత్ర (న-అత్ర) సంశయః।। |
(10). పది (10) ముఖముల రుద్రాక్ష ‘‘యమ-దైవత్యము’’ - గా చెప్పబడు తోంది. చూచినంత మాత్రం చేతనే సర్వ శారీరక మానసిక రుగ్మతలు తొలగుతాయి. ఇంద్రియ నిగ్రహము సిద్ధించగలదు. పరమశాంతి లభించగలదు. సందేహమే లేదు. యమ దేవునికి ప్రీతి అగుటచేత మృత్యుభయము ఉండదు. అమృతత్వము స్వానుభవమవగలదు. |
ఏకాదశ ముఖం తు అక్షం, రుద్ర ఏకాదశ దైవకమ్। తత్ ఇదం దైవతం ప్రాహుః, సదా సౌభాగ్య వర్థనమ్।। |
(11). ఏకాదశ (11) ముఖములు గల రుద్రాక్ష ఏకాదశ రుద్రదేవతా స్వరూపము. అట్టి రుద్రాక్ష ధారణ - సదా సౌభాగ్యమును, దివ్యత్వము ప్రసాదించునదిగా చెప్పబడుచున్నది. |
రుద్రాక్షం ద్వాదశ ముఖం, మహావిష్ణు స్వరూపకమ్। ద్వాదశ ఆదిత్యరూపం చ బిభర్తి ఏవ హి తత్పరః।। |
(12). ద్వాదశ (12) ముఖములుగల రుద్రాక్ష మహావిష్ణు స్వరూపము. ద్వాదశ ఆదిత్యుల దివ్య తేజోరూపము. ఇది ధరించుటచే వారియొక్క ప్రీతి, కరుణ స్వాభావికమై ప్రాప్తించగలదు. |
త్రయోదశ ముఖం చ అక్షం కామదమ్ సిద్ధిదం శుభమ్। తస్య ధారణ మాత్రేణ కామదేవః ప్రసీదతి।। |
(13). త్రయోదశ (13) ముఖములుగల రుద్రాక్షత - సర్వ కోరికలు తీర్చునది. సిద్ధి ప్రసాదించునది. శుభములు కలుగజేయునది. ధారణమాత్రముచేత కామదేవత (కామేశ్వరుడు) సంతోషించి కోరుకొన్నవి ప్రసాదించగలరు. ఆత్మ - స్వతంత్రేచ్ఛచే పరిపూర్ణుడు కాగలడు. |
చతుర్దశ ముఖం చ అక్షం రుద్ర నేత్ర సముద్భవమ్। సర్వ వ్యాధి హరం చ ఏవ సర్వదా ఆరోగ్యమ్ ఆప్నుయాత్।। |
(14). పదునాలుగు (14) ముఖముల (పలకల) రుద్రాక్ష రుద్రభగవానుని నేత్రముల నుండి ఉద్భవించినట్టిది. సర్వ మానసిక రుగ్మతలను, శారీరక వ్యాధులను తొలగించుచూ, సర్వదా శారీరక-మానసిక ఆరోగ్యము ప్రసాదించునట్టిది. |
6. మద్యం మాంసం చ లశునం (ఉల్లి) పలాండుం (వెల్లుల్లి) శిగ్రుం (గోంగూర) ఏవ చ శ్లేష్మాత్మకం (కఫమ్ స్పర్శ), విఢ్వరాహమ్ (తాంబూల సేవనము) అభక్ష్యం। వర్జయేత్ నరః। |
ఓ భుసుండయోగీశ్వరా! ఇప్పుడు రుద్రాక్ష ధారణయొక్క ఉత్తమ ప్రయోజనము సిద్ధించుటకై పాటించవలసిన నియమములు, విధి-నిషేధములు వినండి. మద్యము, మాంసము, శిగ్రు (గోంగూర), కఫము అధికంచేసే ఆయా పదార్థములు, విఢ్వరాహము (కిళ్ళీ మొదలైనవి) - అభక్ష్యముగా చెప్పబడుచున్నాయి. వాటిని సాధకుడు వదలి ఉండటము ఉచితము. |
గ్రహణే విషువే చ ఏవమ్ అయనే, సంక్రమే-పి చ, దర్షేషు పూర్ణమాసే చ పూరేణాషు దివసేషు చ రుద్రాక్ష ధారణాత్ సద్యః సర్వ పాపైః ప్రముచ్యతే।। |
గ్రహణ సమయమునందు, విషువత్ కాలము (రేయి-పగలు సమమైన ఉదయ-సాయంకాల ప్రదోషకాలములయందు), ఆయా (ఉత్తరాయన, పూర్వాయన) అయన పుణ్యకాలములందు, సంక్రమణ కాలమునందు (సూర్యుడు మేష, వృషభ, కర్కాటక - మొదలైన) ఒక ‘రాశి’ నుండి మరొక ‘రాశి’లో ప్రవేశించుకాలమునందు, దర్శ (అమావాస్య) - పౌర్ణమి రోజులలో, పూర్ణ దినములలో, (ఏకాదశి, దశమి, పంచమి, సప్తమి ఇత్యాది పరవడి రోజులలోను) రుద్రాక్ష మాలధారణచే సర్వపాపములు తొలగగలవు. సద్యోముక్తి లభించగలదు. |
రుద్రాక్ష మూలం తత్ బ్రహ్మ। తత్ నాళం విష్ణురేవ చ। తత్ ముఖం రుద్ర - ఇత్యాహుః। తత్ బిందుః సర్వ దేవతా। ఇతి।। |
రుద్రాక్ష యొక్క : మూలము - బ్రహ్మనివాసము. నాళము - విష్ణు నివాసము. ముఖము - రుద్రనివాసము. అద్దాని బిందువు - సర్వ దేవతల నివాసము - అని విజ్ఞులు అభివర్ణిస్తున్నారు. |
అథ కాలాగ్ని రుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్చ : అధీహి, భగవన్। రుద్రాక్షధారణ విధిమ్ (బ్రూహి)। |
ఒక సందర్భములో బ్రహ్మమానస పుత్రుడగు సనత్కుమారులవారు శ్రీ కాలాగ్ని రుద్రభగవానుని ఈ విధంగా అడగటం జరిగింది. హే దేవాదిదేవా! రుద్ర భగవన్। నమస్తే। రుద్రాక్షధారణ యొక్క విధి విధానము గురించి వివరించి చెప్పండి. |
తస్మిన్ సమయే నిదాఘు, జడభరత, దత్తాత్రేయ, కాత్యాయన, భరద్వాజ, కపిల, వసిష్ఠ, పిప్పలాదయశ్చ। కాలాగ్నిరుద్రం పరిసమేత్య, ఊచుః - అథ కాలాగ్నిరుద్రః : కిమర్థం భవతామ్ ఆగమనమ్? ఇతి। |
అదే సమయంలో మహనీయులగు నిదాఘు మహర్షి, జడభరతుడు, అత్రి - అనసూయలకు విష్ణు అంశగా పుట్టిన దత్తాత్రేయస్వామి, కాత్యాయనుడు, భరద్వాజ మహర్షి, కపిల మహర్షి, వసిష్ఠమహర్షి, పిప్పలాదమహర్షి - మొదలైనవారు ఆచోటికి వచ్చారు. కాలాగ్ని రుద్రభగవానుడు : ఓ సప్తర్షి, పరమహంస మొదలైన మహనీయులారా! సుస్వాగతం. మీ రాకకు - ఏమిటి విశేషము? ఊరకరారు మహాత్ములు। |
హోవాచ : రుద్రాక్షధారణ విధిం వై సర్వే శ్రోతుమ్ ఇచ్ఛామహ। ఇతి।। |
నిదాఘ మొదలైన మహర్షులు, పరమహంసలు : స్వామీ! కాలాగ్నిరుద్రదేవా! మీరు చెప్పుచున్న రుద్రాక్షధారణా విధి గురించి మేము కూడా వినాలనే ఇచ్ఛచే వచ్చాము. |
అథ కాలాగ్నిరుద్రః ప్రోవాచ : రుద్రస్య నయనాత్ ఉత్పన్నా ‘రుద్రాక్షా’ ఇతి లోకే ఖ్యాయంతే। అథ సదాశివః సంహారకాలే, సంహారం కృత్వా, సంహారాక్షం ముకుళీ కరోతి, తత్ నయనాత్ జాతా ‘రుద్రాక్షా’ - ఇతి ।।హోవాచ।। తస్మాత్ రుద్రాక్షత్వమితి - ‘‘కాలాగ్ని రుద్రః’’ - ప్రోవాచ।। |
కాలాగ్ని రుద్ర భగవానుడు : బిడ్డలారా! వినండి. రుద్రుని కనులనుండి జాలువారుతూ జనించాయి కాబట్టి ‘‘రుద్రాక్షలు’’ అనే పేరుతో లోకప్రసిద్ధములు. సదాశివుడు సృష్టియొక్క ఉపసంహరణ (లేక) సంహారకాలమునందు మూడవ నేత్రమగు ‘సంహార అక్షము’ మూసుకొనుచున్న సమయములో అట్టి -అప్పటి కనులనుండి జనించి జాలువారినవే రుద్రాక్షలు. రుద్ర నయనం నుండి, బయలుదేరుటచే ‘రుద్రాక్షలు’. (రుద్రాక్షత్వము = అనేక భేదములతో కూడిన సమస్త దృశ్యమును ‘ఆత్మగా భావించుట’ యందు లయింపజేయటము-అనునది తాత్త్వికార్థము). |
7. తత్ రుద్రాక్షే ‘వాక్’ విషయే కృతే దశ గో ప్రదానేన యత్ ఫలమ్ అవాప్నోతి, తత్ ఫలమ్ అశ్నుతే। |
‘‘రుద్రాక్షలు - వాటి ఉత్పత్తి విశేషము - వాటి ధారణచే కలుగు సత్ప్రయోజనము’’ గురించి సత్సంగపూర్వకంగా సంభాషించుకొన్నంత మాత్రం చేతనే - 10 గోవులను ఆశ్రమములకో, విద్యాపీఠములకో దానము చేసిన సత్ఫలితము లభించగలదు. |
స ఏష ‘‘భస్మజ్యోతి రుద్రాక్ష’’ - ఇతి తత్ రుద్రాక్షం కరేణ స్పృష్ట్వా ధారణ మాత్రేణ ద్విసహస్ర గో-ప్రదానఫలం భవతి। |
- భస్మజ్యోతి రుద్రాక్షాయ నమో నమః - ఈశానః సర్వవిద్యానాం…. - భస్మజ్యోతి రుద్రాక్షాయ నమో నమః - తత్పురుషాయ విద్మహే, మహాదేవాయధీమహి…. - భస్మజ్యోతి రుద్రాయ నమో నమః - అఘోరేభ్యో అధ ఘోరేభ్యో… అని మంత్రోచ్ఛారణ చేస్తూ కరణములతో (రెండు అరచేతులు - చేతి పది వ్రేళ్ళతో) స్పృశించి, కళ్లకు అద్దుకొని, ధారణ చేసినంతమాత్రంచేత రెండు వేల గోవులు దానము చేసిన ఉత్తమఫలము ఆ ధారణ చేసిన వానికి కలుగగలదు. |
తత్ రుద్రాక్షే కర్ణయోః ధార్యమాణే ఏకాదశ సహస్ర గో-ప్రదానఫలం భవతి।। ఏకాదశ రుద్రత్వం చ తత్ రుద్రాక్షే శిరసి ధార్యమాణే కోటి గో-ప్రదానఫలం భవతి। |
పవిత్రమగు రుద్రాక్షలను చెవులకు ధారణ చేయటం చేత పదకొండ వేల గోవుల దానఫలము దక్కుతుంది. ఏకాదశ రుద్రత్వము ప్రాప్తించగలదు. ఎవ్వరైతే శిరస్సునందు రుద్రాక్షలు ధారణ చేస్తారో…అట్టివారికి కోటి గో- దానము చేసిన మహత్తర ఫలము లభించగలదు. |
ఏతేషాం స్థానానాం కర్ణయోః ఫలం వక్తుం న శక్యమ్। ఇతి।। హోవాచ।। |
దేహములోని ఆయా సమస్త స్థానములలో రుద్రాక్ష ధారణ చేయటము వలన లభించు ఫలమును మాటలతో నిర్వచించి చెప్పజాలనిది. |
య ఇమాం ‘‘రుద్రాక్షజాబాలోపనిషదం’’ నిత్యమ్ అధీతే, బాలో వా, యువా వా వేద, స ‘మహాన్’ భవతి। స గురుః సర్వేషాం మంత్రాణాం, ఉపదేష్టా భవతి। |
ఎవ్వరైతే ఈ ‘‘రుద్రబాలోపనిషత్’’ను అధ్యయనం చేసి, పరమార్థమను గ్రహిస్తారో అట్టివారు బాలురైనా, యువకులైనా మరెవ్వరైనా కూడా మహానుభావులు కాగలరు. అట్టివారు మంత్రోపాసనలకు గురువులు, ఉపదేష్టలు (బోధకులు) అవగలరు. |
ఏతైరేవ హోమం కుర్యాత్, ఏతైరేవ అర్చనం తథా రక్షోఘ్నం మృత్యు తారకం। |
రుద్రాక్షమాల ధరించియే హోమము, అర్చన, ధారణ చేసెదరుగాక! గురుప్రసాదంగా స్వీకరించబడిన రుద్రాక్ష దండ సర్వదోషములనుండి పాపములనుండి రక్షించునది, మృత్యువునుండి దాటించి వేయునది అగుచున్నది. బుద్ధికి ఏకాగ్రత ప్రసాదించగలదు. |
గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత సప్తద్వీపవతీ భూమిః దక్షిణార్థం నావకల్పతే। |
గురులబ్ధమైన రుద్రాక్షమాలను కంఠమునకు బాహువులకు (చంక మొదలు వ్రేళ్ళవరకు ఉండుభాగమునందు, భుజముపై) శిఖ ళిశిగజుట్టు (లేక) పిలకస్థానమురి నందు కట్టుకొనెదరుగాక. అట్టి గురువుకుగాని, ధారణ చేయించువానికి గాని స్పప్తద్వీపములతో కూడిన భూమిని దక్షిణగా ఇచ్చినా చాలదు. |
తత్ శ్రద్ధయా యాం కాంచిత్ గాం దద్యాత్, సా దక్షిణా భవతి। |
అయితే అట్టి గురువుకు, రుద్రాక్షమాలాధారణ అనుగ్రహించువానికి శ్రద్ధ - భక్తులతో ఒక గోవును ఇచ్చినా చాలు, అది గొప్ప దానఫలమై సిద్ధించగలదు. |
య ఇమాం ఉపనిషదం బ్రాహ్మణః సాయమ్ అధీయానో… దివస కృతం పాపం నాశయతి। మధ్యాహ్నే అధీయానః షట్ (6) జన్మకృతం పాపం నాశయతి। |
ఈ ఉపనిషత్తును అధ్యయనము చేయువాడు…, బ్రహ్మవిద్యా సమన్వితుడగు (బ్రాహ్మణములను ఎరుగుచున్న బ్రాహ్మణుడు) అవగలడు. → సాయంకాలము అధ్యయనోపాసన చేయుటచే పగలు చేసిన పాపదోషములు నశించగలవు. → మధ్యాహ్న సమయంలో అధ్యయనము చేస్తే ఆరు జన్మలలో చేసిన పాప కర్మల దోషములు తొలగిపోగలవు. |
సాయం ప్రాతః ప్రయుంజానో అనేక జన్మకృతం పాపం నాశయతి। షట్ సహస్ర లక్ష గాయత్రీ జప ఫలం అవాప్నోతి। |
సాయంకాలము, ప్రాతః (ఉదయ) కాలమునందు ఈ ఉపనిషత్తును ఉపాసిస్తే, అనేక జన్మలలో చేసిన పాపము నశిస్తుంది. ఆరువేల లక్షల గాయత్రీ జప ఫలము లభించగలదు. |
బ్రహ్మహత్యా సురాపాన స్వర్ణ స్తేయ గురుదార గమన తత్ సంయోగపాతకేభ్యః పూతో భవతి। సర్వ తీర్థఫలమ్ అశ్నుతే। పతిత సంభాషణాత్ పూతో భవతి। |
బ్రహ్మ హత్య, సురాపానము, స్వర్ణము (బంగారము) దొంగిలించటము, గురుభార్యాగమనము- అటువంటి వారితో స్నేహము వలన కలిగే పాపములనుండి కూడా. పునీతుడు కాగలడు. సర్వపుణ్య తీర్థములలోను స్నానము చేసిన ఫలము లభించగలదు. దుష్ట సంభాషణ చేసిన దోషము నుండి పవిత్రుడు అవగలడు. |
పంక్తి శత సహస్ర పావనో భవతి। శివసాయుజ్యం అవాప్నోతి।। న చ పునరావర్తతే। న చ పునరావర్తత-ఇతి।। ‘ఓగ్ం’ సత్యమ్।। |
ఈ రుద్రాక్షజాబాలోపనిషత్ అధ్యయనుడు, రుద్రాక్షలు ధరించువాడు ఉన్న చోటు, అట్టి వంద వేల (లక్ష) పంక్తులలోనివారు, ఇంకా, అట్టి రుద్రాక్షోపనిషత్ అధ్యయనులు, రుద్రాక్షధారులతో సహా - వీరంతా శివసాయుజ్యము పొందగలరు. వారికి పునరావృత్తి దోషము ఉండదు. ఉండదు. ఇది సత్యము. |
ఇతి ఉపనిషత్।।
రుద్రాక్ష జాబాలోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
రుద్రాక్షోపనిషత్ తత్త్వము ప్రసాదించు మహత్ ఉజ్వల ప్రకాశానంద స్వరూపుడు, ప్రతియోగి వినిర్ముక్తుడు, తిరస్కరించ వీలుగాని స్వస్వరూపాత్మ స్వరూపుడు అగు జగద్గురు రుద్రభగవానునికి మనసా వాచా కర్మణా నమస్కరిస్తున్నాము. |
చిరంజీవి, యోగతత్త్వవేత్త, వసిష్ఠమహర్షికి యోగవిద్యావిశేషాలు విశదీకరించినవారు, మేరు పర్వత నివాసి, బ్రహ్మజ్ఞానానందుడు, దేవతా సభలచే స్తుతించబడువాడు - అగు భుసుండ వాయస మహాయోగి ఒకానొక సందర్భములో లోకేశ్వరుడు, లోక గురువు అగు కాలాగ్ని రుద్ర భగవానుని దర్శించి, ‘‘శివశంభో! హర హర శంభో!’’ మొదలైన శివస్తుతులు సమర్పించారు. రుద్రదేవుడు సంతోషించినవారై ఇట్లు సంభాషించసాగారు.
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు : నాయనా! భుసుండమహాశయా! మీ శివతత్త్వ స్తోత్రములకు సంతోషించానయ్యా! మీరు స్వతఃగానే యోగజ్ఞులు, తత్త్వజ్ఞులు. మీ రాకకు ఆనందిస్తున్నాను. ఏమి మీ కోరిక? అడగవయ్యా! సిద్ధింపజేస్తాను.
శ్రీ భుసుండ మహాశయుడు : హే భగవన్! కాలాగ్నిరుద్ర దేవాది దేవా! పునః పునః నమో నమః। మీ దర్శనముతో నేను పునీతుడను. ఈ శుభవేళ ఒకానొక ముఖ్య విశేషమును లోక కల్యాణ మూర్తులగు మీవద్ద శ్రవణము చేయాలని సముత్సాహపడుచున్నాను.
స్వామీ! మీచేత లోక శుభంకరంగా, కరుణాకటాక్ష వీక్షణరూపంగా ప్రసాదించబడిన ‘రుద్రాక్షలు’ క్రియా-జ్ఞాన-భక్తి-శ్రద్ధా యోగాభ్యాసులకు, యోగసిద్ధులకు కూడా పవిత్రభావనల సిద్ధికొరకై ధారణాయోగ్యము కదా.
మీచే లోక కల్యాణము కొరకై ప్రసాదించబడుచున్న రుద్రాక్షలు సర్వ ముముక్షువులకు, ఆర్తో-జిజ్ఞాసు-అర్థార్థీ-జ్ఞానీ చతుర్విధ సుకృతులకు అత్యంత సహకారికము- అని లోక ప్రసిద్ధమైన విషయము. అట్టి పవిత్రమగు రుద్రాక్షల గురించి రుద్రాక్షోత్పత్తి స్థాన స్వరూపులగు మీరే వివరించెదరు గాక - అని మిమ్ములను అభ్యర్థిస్తున్నాను.
కథం రుద్రాక్షోత్పత్తిః? రుద్రాక్షలు ఎట్లా ఉత్పన్నమైనాయి?
తత్ ధారణాత్ కిం ఫలం? రుద్రాక్ష ధారణచే కలిగే ప్రయోజనములు ఏమిటి?
ఈ ఈ విశేషముల గురించి అనుగ్రహించండి.
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు : బిడ్డా! మహదాశయా! భుసుండ యోగీశ్వరా! వినండి. చెప్పుతాను.
ఒక సమయములో దేవతల అభ్యర్థనను అనుసరించి లోక కల్యాణార్థమై, భక్త-ఆర్తజన రక్షణార్థమై, దేవతల శ్రేయో కార్యక్రమముల దిగ్విజయార్థమై, జ్ఞానార్తిజన అధ్యయన సిద్ధ్యర్థమై - త్రిపురాసుర సంహారము చేయటానికి సంసిద్ధుడను అగుచున్నాను. ఆ సందర్భములో - అహం నిమీలితాక్షో భవంతః। కించిత్ ధ్యానము కొరకై కనులు మూసుకున్నాను. అప్పుడు నా కనుల నుండి జల బిందువులు జాలువారి భూమిపై పడటము జరిగింది. తేభ్యో జల బిందవో భూమౌ పతితాః - తే ‘రుద్రాక్షా’ జాతాః సర్వానుగ్రహార్థాయ। ఆ జాలువారిన జలబిందువులు సర్వజనులను అనుగ్రహించు నిమిత్తమై రుద్రాక్షలుగా అయినాయి.
అట్టి రుద్రాక్షలయొక్క…..,
ఇక ఆపై ధరించటము, పూజించటము ఇటువంటివాటి వలన కలుగు ఫలము మాటలతో చెప్పుకోలేము. ఈఈ విశేషముల గురించి
ఈఈ విశేషములన్నీ శాస్త్ర వాఙ్మయములచే, ఋషి-ముని పుంగవులచే గానము చేయబడుచూ, శ్లోక పూర్వకంగా లోకములలో ప్రవచించబడుచున్నాయి.
భుసుండ యోగీశ్వరుడు : స్వామీ! మీరు చెప్పుచున్న విశేషాలు శ్రోతగా నాకు ఎంతగానో ఆనందమును, జిజ్ఞాసను కలుగజేస్తున్నాయి. దయచేసి మరికొంత విశేషముగా రుద్రాక్షోత్పత్తి, తదితర ఆయా విషయములను నాకు బోధించ వేడుకొంటున్నాను.
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు : వినండి. వేయి దివ్య వర్షములు నేను కనులు మూసుకుని ఒక్కసారి కనులు తెరుస్తూ ఉండగా కనుల పుటములనుండి జల బిందువులు నేలపై పడినాయి. ఆ కన్నీటి బిందువులే భూమిపై స్థావరరూపము సంతరించుకొని రుద్రాక్ష మహా వృక్షములు అయినాయి. భక్తానుగ్రహ కారణాత్। భక్తులపై నాకు గల అవ్యాజమైన ప్రేమచేత, వారిని అనుగ్రహించుట కొరకే రుద్రాక్షతలను సంకల్పించాను.
శ్రీ భుసుండ మహాయోగి : స్వామీ! రుద్రాక్షల వేరు వేరు ప్రమాణముల ప్రాసస్త్యముల గురించి దయతో వివరించండి.
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు :
ధ్రాత్రీ (పెద్ద-ఉసిరిగ) ఫల ప్రమాణము గల రుద్రాక్ష - అత్యంత శ్రేష్ఠమైనది.
బదరీ (రేగు) ఫల ప్రమాణము గల రుద్రాక్ష - మధ్యమమైనది.
చణ (శనగ) ప్రమాణము గల రుద్రాక్ష - అధమము.
వాటి వాటి ప్రక్రియానుసారంగా నాచే ఆయా విశేషములుగా చెప్పబడినది - ప్రక్రియా ఏషా మయా ఉచ్యతే।
శ్వేత (తెలుపు) రంగు రుద్రాక్షలు - ‘బ్రాహ్మణ’ - బ్రాహ్మణులు ధారణ చేయునవి.
రక్త (ఎరుపు) రంగు రుద్రాక్షలు - ‘రాజసిక (క్షత్రియ)’ - రాజాతు ధారయేత్.
పీతాన్ (పసుపుపచ్చ) రంగు రుద్రాక్షలు - ‘వైశ్య’ - వైశ్యులు ధారణ చేయునవి.
కృష్ణాత్ (నలుపు) రంగు రుద్రాక్షలు - ‘శూద్ర’ - శూద్రులు ధారణ చేయునవిగా చెప్పబడుచున్నాయి.
విధి : (ఉపయోగించవలసినవి) : సమతలము కలిగినవి, స్నిగ్ధమైనవి (నునుపైనవి), దృఢమైనవి, స్థూలమైనవి, సమతులమైన కంటములు కలిగినవి శుభప్రదము.
నిషేధము : క్రిములచే కొరకబడి చిల్లులు కలిగినట్టివి, ఛిన్నాభిన్నమైనట్టివి, పెద్ద ముళ్ళు (కంటకములు) రూపంగా తేలినట్టివి, హీనమైన - అసమతలమైన - వంకరటింకర - చిల్లులు గల ఆకారము కలిగినట్టివి, వ్రణయుక్తమైనవి, ఉబ్బుగా ఉన్నట్టివి, అయుక్తమైన ఆకారము కలిగినవి, షడ్రుద్రాక్షాణి (అనేక చిల్లులతో కూడినవి) ఇటువంటివి ధరించ కూడనివి.
• రుద్రాక్షలన్నిటిలోనూ-స్వయముగా ప్రకృతి కృతమైన ద్వారము (రంధ్రము) కలిగియున్న రుద్రాక్షలు మొదటగా ఉత్తమమైనవి. స్వయమేవ కృతద్వారం రుద్రాక్షంస్య ఆది ఉత్తమమ్।
• మానవ ప్రయత్నముద్వారా రంధ్రము చేయబడిన రుద్రాక్షలు మధ్యమము అగుచున్నాయి. యత్తు పౌరుష యత్నేన కృతం తన్మధ్యమాం భవేత్।
రుద్రాక్ష-సూత్రము : సమమైనవి, స్నిగ్ధమైనవి (నునుపైనవి), దృఢమైనవి, స్థూలమైనవి - పట్టుత్రాడుతో గ్రుచ్చి ధరించాలి.
శాస్త్ర విచక్షణాశీలురగు పండితులు తమ శరీరముయొక్క సర్వ భాగములందు రుద్రాక్ష సూత్రములను ధరిస్తూ ఉంటారు.
ఉత్తమ జాతి రుద్రాక్షలు : గీటురాయితో గీసినప్పుడు బంగారపు రంగు రేఖ వస్తూ ఉంటే, అట్టి రుద్రాక్షలు ఉత్తమోత్తమమైనవి. శివపూజ చేస్తున్న సందర్భములలో అట్టి రుద్రాక్షమాల ధరించటము అత్యంత త్వరితముగా ఫలప్రదము. ఇంకా కొన్ని కొన్ని రుద్రాక్షలు ఏఏ రీతిగా ధరించటము శాస్త్రీయమో, శుభప్రదమో చెప్పుకొందాము.
శ్లో।। శిఖాయాం ఏకరుద్రాక్షం। త్రిశతం శిరసా వహేత్।
షట్ త్రింశంతం గళే దధ్యాత్। బాహ్వోః షోడశ-షోడశ।।
శిఖయందు - ఒక రుద్రాక్ష, శిరస్సునందు - 300 రుద్రాక్షలు, గళము (మెడ) యందు - ‘36’ రుద్రాక్షలు, బాహువులలో - 16–16 చొప్పున, మణి కట్టు ప్రదేశములో - ‘12’ రుద్రాక్షలు, భుజస్కంధము - మూపులయందు ‘500’ రుద్రాక్షలు, జందెముగా - 108 రుద్రాక్షలమాలలు … ఈవిధంగా రుద్రాక్షలు ధరించటము శ్రేష్ఠము.
కంఠమునకు - ‘2’ పేటలుగాని, 3 పేటలుగాని, 5 పేటలుగాని, 7 పేటలుగాని, రుద్రాక్షలమాలగా ధరించటము శుభప్రదము.
రుద్రాక్ష శాస్త్రీయము ఎరిగినవారు-మకుటము (కిరీటము)నందు, కుండలము (చెవిప్రోగు)నందు, కర్ణికా హారము (చెవుచుట్టుగాను), కేయూరమునందు (భుజకీర్తులుగా), కటకము (కణత ప్రదేశము) నందు, కడుపుచుట్టూ రుద్రాక్ష సూత్రములు ధరించుచూ ఉంటారు.
నిద్రా సమయములప్పుడు కూడా ధారణ: సుప్తే పీతా సదా కాలం రుద్రాక్షం ధారయేత్ నరః। నిద్రించునప్పుడుకూడా పసుపు పచ్చని రుద్రాక్షలు ధరించవచ్చును.
శరీరమంతా కలిపి సంఖ్యా పూర్వకంగా రుద్రాక్ష ధారణ - ప్రాసస్త్యత :-
300 రుద్రాక్షలు అధమమని,
500 రుద్రాక్షలు మధ్యమమని,
1000 రుద్రాక్షలు ఉత్తమమని, చెప్పబడుతోంది.
శిరసా ‘‘ఈశాన…’’ మంత్రేణ :-
శిరస్సునందు రుద్రాక్షలు ధరించేటప్పుడు చదువదగు మంత్ర / మంగళ శ్లోకము:-
శ్లో।। ఈశానస్సర్వ విద్యానాం, ఈశ్వర స్సర్వభూతానాం।
బ్రహ్మాధిపతిః। బ్రహ్మణో-ధిపతిః।
బ్రహ్మా శివో మే అస్తు సదాశివ ‘ఓం’।।
[ సమస్త విద్యలకు ఈశానుడు / అధిపతి. సృష్టిలోని సమస్త జీవులకు కూడా ఈశ్వరుడు/ప్రభువు. సృష్టికర్త - సృష్ట్యభిమాని యగు బ్రహ్మదేవునకు కూడా అధిపతి/యజమాని. సమస్త వేదములకు/బ్రాహ్మణములకు అధిపతి / సంస్తుతింపబడువాడు. బ్రహ్మదేవుడు (హిరణ్యగర్భుడు) తానే అయినట్టివాడే పరమశివుడు. అట్టి ఆ స్వామి నాయొక్క (సహజమగు) ప్రణవస్వరూప (ఓంకార స్వరూప) సదా శివత్వము (శివోహమ్ తత్త్వమును) అనుగ్రహించెదరు గాక ].
ఈవిధంగా మంగళ శ్లోకము ఉచ్చరిస్తూ, అద్దాని మహదార్ధము మనోబుద్ధులతో భావిస్తూ, సంకల్పిస్తూ, ఆరాధనాపూర్వకంగా శిరస్సు ప్రదేశంలో రుద్రాక్షధారణ చేయాలి.
కంఠే ‘తత్పురుషేణ’ తు।
కంఠప్రదేశమున రుద్రాక్షలు అలంకరించుకొనుచున్నప్పుడు చదువతగినన మంగళశ్లోక - మంత్రములు
సహస్రాక్ష మహాదేవ రుద్ర గాయత్రీ మంత్రము:
శ్లో।। తత్పురుషస్య విద్మహే సహస్రాక్ష మహాదేవస్య
ధీమహి। తన్నో రుద్రః ప్రచోదయాత్।।
(తత్ పురుషాకార - పరమ పురుషుని మహిమను బుద్ధితో ఎరుగుటకై సహస్రనయనుడగు మహాదేవ భగవానుని ధ్యానించుచున్నాము. అట్టి తత్ నో రుద్రః - జ్ఞాన ప్రదాత యగు రుద్ర దేవాది దేవుడు మా బుద్ధులను - స్వస్వరూపాత్మ జ్ఞానార్ధమై వికసింపజేసెదరు గాక!
మహాదేవ రుద్ర గాయత్రీ మహామంత్రము : తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్।।
(సాక్షాత్తు తత్పురుషుడై విరాజిల్లుచున్న పరమ పురుషుని మహిమ గురించి ఎరుగుటకై పరమేశ్వరుడగు మహాదేవుని (మనసా, బుద్ధ్యా) ధ్యానించుచున్నాము. (అట్టి మా యీ ధ్యానమును స్వీకరించి) ఆ రుద్రభగవానుడు ‘‘రుద్రో2హమ్ - శివో2హమ్ - తత్త్వము’’ కొరకై - మా బుద్ధులను ప్రేరేపించెదరు గాక’’)
అను పారాయణముతో దేహ మనో బుద్ధ్యా త్రికరణశుద్ధిగా చేస్తూ ఆత్మ భగవానుని ధ్యానించెదరు గాక!
కంఠ ప్రదేశములో
‘అఘోరేణ’ గళే ధార్యం, తేనైవ హృదయే-పి చ।
‘అఘోరబీజ’ మంత్రేణ కరయోః ధారయేత్ సుధీః।।
గళము (కంఠ ప్రదేశము)నందు, హృదయప్రదేశమునందు ధరిస్తున్నప్పుడు (మరియు) చేతులకు ధరిస్తున్నప్పుడు చదివే అఘోర బీజమంత్రము పఠించెదరు గాక.
అఘోర బీజ మంత్రము:
అఘోరేభ్యో-థ (అఘోరేభ్యః అథ) ఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యః।
సర్వేభ్యస్సర్వ (సర్వేభ్యః సర్వ) శర్వేభ్యో! నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః।।
(హే శర్వ భగవాన్! మీయొక్క ‘‘సూక్ష్మ-స్థూల-కారణ-కారణకారణ’’ … ‘సృష్టి-స్థితి-లయ-కేవల రుద్ర స్వరూపమునకు సర్వకాల సర్వావస్థలయందు నమస్కరిస్తున్నాను. ప్రణమిల్లుచున్నాను. ఉపవాసమును సమర్పించుకొనుచున్నాను) - అని శబ్దార్ధపూర్వకంగా మనసావాచా కర్మణా బుద్ధ్యా ఆరాధిస్తూ, ఉపాసిస్తూ, కంఠ ప్రదేశమునందు, హృదయ స్థానములోను, చేతులకు రుద్రాక్షమాలల ధారణ నిర్వర్తించెదరు గాక।
పొట్టచుట్టూ : పంచాశత్ అక్ష గ్రధితాన్ వ్యోమ వ్యాపి చ ఉదరే। 50 రుద్రాక్షలతో కూర్చబడిన మాలను పొట్ట-నడుము చుట్టూతా ధరించెదరు గాక।
అంగాంగములకు : అంగైశ్చ పంచబ్రహ్మాభిః - త్రిమాలా పంచసప్త చ - గ్రధిత్వా మూలమంత్రేణ సర్వాణి అక్షాణి ధారయేత్।।
అన్ని అంగములకు పంచబ్రహ్మ పూర్వకమైన (శబ్ద స్పర్శ రూప రస గంధ దేవతోపాసన పూర్వకంగా) మూడు వరుసలతో గాని ఐదు వరుసలతోగాని - ఏడు వరుసలతోగాని మూల మంత్ర సమన్వితంగా గ్రుచ్చుతూ, రుద్రాక్ష మాలలను తయారుచేసి, అంగాంగములకు ధారణ చేయుదురు గాక.
వాయసభుసుండ మహాయోగి : స్వామీ రుద్రాక్షల భేదమును అనుసరించి ఏదేది ఏఏ స్వరూపమైనది? ఏఏ ఫలములు సిద్ధింపజేస్తాయి? వాటి వాటి స్వరూపము గురించి, ముఖముల గురించి, అనిష్ట నిరసములు - కామాభీష్ట ఫలముల గురించి మాపై దయను అనుగ్రహిస్తూ వివరించమని అర్థిస్తున్నాను.
కాలాగ్ని రుద్ర భగవానుడు : బిడ్డా! ప్రియ భుసుండ యోగీశ్వరా! మీరు అడిగిన దాని గురించి శాస్త్రములచే శ్లోక పూర్వకంగా వివరించబడియే ఉన్నదయ్యా. వినండి. చెప్పుతాను.
ఏక(1) ముఖ రుద్రాక్ష :
శ్లో।। ఏక వక్త్రం తు రుద్రాక్షం, పరతత్త్వ స్వరూపకమ్।
తత్ ధారణాత్ పరే తత్త్వే లీయతే విజితేంద్రియః।।
ఏక ముఖ రుద్రాక్ష (ఇహమునకు ఆవల - ఇహమునకు ఆధారమైనట్టి) - పరతత్త్వ స్వరూపకమైనది. సాక్షాత్ పరమాత్మయొక్క ప్రత్యక్ష రూప సంజ్ఞగా ఉపాసనకొరకై అభివర్ణించబడుచున్నది. ఏకముఖ రుద్రాక్షను తత్త్వభావోపాసనగా, (‘నీవుగా కనిపిస్తున్నది పరమాత్మయే’ - అని) భావించి ధారణ చేయువాడు ఇంద్రియములను - ఇంద్రియ దృశ్య వ్యవహారములను మొదలంట్లా అధిగమించి సాక్షాత్ పరతత్త్వమునందు లీనము పొందగలడు. తరంగము జలముతో ఏకత్వము పొందు తీరుగా, అట్టి ఏకముఖ రుద్రాక్ష ధారుడు ‘‘సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు’’ అగు పరమాత్మతో ‘సో2హమ్, తత్త్వమ్’ను అతి త్వరగా సిద్ధించుకోగలడు.
ద్వి (2) ముఖ రుద్రాక్ష : ద్వివక్త్రం తు మునిశ్రేష్ఠ! చ అర్థ-నారీశ్వరాత్మకమ్। హే మునిశ్రేష్ఠా! భుసుండ మహాశయా! రెండు ముఖముల రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపము. (తత్) ధారణాత్ అర్థనారీశః ప్రీయతే తస్య నిత్యసః। నిత్యము ద్విముఖ రుద్రాక్షను ధరించుటచే ‘అ-ఉమ’, ‘శివ-శివా’, ‘భవ-భవానీ’, ‘ఊహించువాడు - ఊహ’, ‘పురుష ప్రకృతి’ - జీవ-ఈశ్వరుల ఏక తత్త్వమగు అర్ధనారీశ్వర స్వామికి ప్రీతి కలుగజేయువాడగుచున్నాడు. ‘అహమ్ - మమ’, ‘అహమ్-త్వమ్’ ల ఏకత్వమును పొందుచూ అర్ధనారీశ్వర తత్త్వ సిద్ధుడు కాగలడు. అర్థనారీశ్వరుడు సంప్రీతుడగుచు సమస్త సంపదను ప్రసాదించుచున్నారు. జీవాత్మ-పరమాత్మల అభేదత్వమే అర్ధనారీశ్వర తాత్త్వికార్థము.
త్రి (3) ముఖ రుద్రాక్ష : త్రిముఖం చ ఏవ రుద్రాక్షమ్ అగ్ని త్రయ స్వరూపకమ్। మూడు ముఖముల రుద్రాక్ష అగ్ని త్రయ స్వరూపకము (యజ్ఞములోని గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, అహవనీయాగ్ని; దృశ్య-ద్రష్ట-కేవల దృక్ ‘త్రి-ప్రేరణాగ్ని’ స్వరూపములు. జీవాత్మ-ఈశ్వరుడు-పరమాత్మల సంజ్ఞా స్వరూపము). అట్టి త్రిముఖ రుద్రాక్ష - అనునిత్య ధారణచే - యజ్ఞ సమర్పణములగు హుతములను స్వీకరించు దివ్యస్వరూపుడగు అగ్ని భగవానుడు-ప్రీతి పొందగలరు. అట్టివాడు యజ్ఞాగ్నికి సమస్తము సర్వదా హుతము చేసినవాడగుచున్నాడు. భస్మభూషితాంగుడై సమస్త దృశ్యముపట్ల స్వస్వరూప భావనను సిద్ధించుకోగలడు.
చతుర్ముఖ (4 ముఖముల) రుద్రాక్ష : చతుర్ముఖం తు రుద్రాక్షం చతుర్వక్త్ర స్వరూపకమ్। నాలుగు ముఖములు గల రుద్రాక్ష చతుర్ముఖ బ్రహ్మయొక్క ప్రతి రూపము. తత్ ధారణాత్ నిత్యదా తత్ చతుర్వక్త్రః ప్రీయతే। అట్టి ‘4’ ముఖముల రుద్రాక్షయొక్క నిత్య ధారణచే - సృష్టికర్త, సృష్ట్యాది స్వరూపుడు అగు జగత్ పితామహ చతుర్ముఖ బ్రహ్మ సంప్రీతుడగుచున్నాడు. (చతుర్ముఖ = స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ - ముఖములు)
పంచ (5)ముఖ రుద్రాక్ష : ఇది పంచబ్రహ్మ స్వరూపము. పంచముఖ రుద్రాక్ష ధారణచే (సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన) పంచముఖుడగు శివభగవానుడు ప్రీతి పొందినవారగుచున్నారు. పంచవ్రక్తః స్వయం బ్రహ్మ। పుం హత్యాం చ వ్యపోహతి। పంచముఖ రుద్రాక్ష ధారుడు స్వయం బ్రహము రూపానుభవుడు కాగలడు. పంచముఖుని కరుణచే బ్రహ్మహత్యా దోషముల వంటివి కూడా తొలగిపోగలవు.
షఢ్వక్త్ర రుద్రాక్ష (‘6’ ముఖముల రుద్రాక్ష) : ఆరు ముఖముల రుద్రాక్షకు షణ్ముఖుడగు కార్తికేయ స్వామి అధిదేవత. షణ్ముఖ రుద్రాక్ష ధారణచే మహాన్ సంపద, మహాన్ ఆరోగ్యము, ఉత్తమమైన ‘మతి’ లభించగలదు. జ్ఞాన ‘విజ్ఞాన సంపద’, ‘శుద్ధమగు బుద్ధి’, ‘ధారణ’, విస్తారము - సునిశితము అగు ‘ధీశక్తి’ లభించగలదు. [ కొందరు పురాణ ప్రావీణ్యులగు బుద్ధిమంతులు ఆరు ముఖముల రుద్రాక్ష వినాయకస్వామి స్వరూపము ఆరాధిస్తూ ఉంటారు. (గాణాపత్యులు) ].
సప్త (7) వక్త్ర (పలకల) రుద్రాక్ష : సప్త మాత్ర అధి-దైవతమ్। సప్త మాతృకల అధిదైవతా స్వరూపము. ‘7’ ముఖముల రుద్రాక్ష ధారణచే సమస్త సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యములు, మహత్తరమగు జ్ఞానసంపత్తి, శుచి అయిన భావములు ఉత్తమమైన భావన-ధారణలు, అత్యున్నతమైన అవగాహనలు మొదలైనవన్నీ లభించగలవు.
(1) (సప్త మాతృకలు = బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ)
(2) (సప్తమాతృకలు = (కాళి, కౌశిక, ఉద్ధత, హవిషే, శారిక, ఆర్య, వైధాత్రి. కుమారస్వామి వరప్రసాదంచేత ‘బాలగ్రహములు’గా మానవులకు 16 సం।। వయసు వరకు పాలించువారు. బలులచే తృప్తిపొందువారు - భారతము)
అష్టముఖ (8) రుద్రాక్ష : అష్టమాత్ర అధిధైవతము. ధారణచే అష్టవసు (మరియు) గంగాదేవీ ప్రీతికరము. అట్టి అష్టముఖ ధారణచే అష్టమాత్ర దేవతలకు, సత్యవాదులగు బ్రహ్మతత్త్వజ్ఞులకు ప్రీతిపాత్రుడు అగుచున్నాడు.
(అష్టవసువులు = అవుడు, ధృవుడు, సోముడు, ఆధ్వరుడు, అనిలుడు, ప్రత్యులుడు, అనలుడు, ప్రభాసుడు). (అష్టగంగలు = గంగ, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధువు, కావేరి)
నవ (9) ముఖ రుద్రాక్ష : నవశక్తి-అధిదేవతా స్వరూపము. నవగ్రహ ఉపాసనా అధిదైవతము. అట్టి ‘9’ ముఖముల (వక్త్రముల) రుద్రాక్ష ధారణచే నవగ్రహ దేవతలకు, వారి ప్రత్యధి దేవతలకు ప్రీతిపాత్రుడు అగుచున్నాడు.
(నవగ్రహములు = సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు).
(నవాత్మల (1) దృశ్యాత్మ, (2) జీవాత్మ, (3) అంతరాత్మ, (4) పరమాత్మ, (5) నిర్మలాత్మ (6) శుద్ధాత్మ, (7) జ్ఞానాత్మ, (8) మహాత్మ, (9) భూతాత్మల జ్ఞానము సిద్ధించగలదు.
దశ (10) వక్త్ర (ముఖముల) రుద్రాక్ష : సమవర్తియగు యమభగవానుని దివ్య స్వరూపమునకు సంజ్ఞగా అభివర్ణితము. పంచముఖ రుద్రాక్షను దర్శించినంత మాత్రంచేతనే మనస్సుకు పరమ శాంతి లభించగలదు. పాపభావములు శమించగలవు. దశవిధ పుణ్య భావములు ప్రవృద్ధమవుతాయి.
(దశవిధ పుణ్య కర్మలు = పరోపకారము, గురుజనసేవ, దానము, ఆతిధ్యము, పావిత్ర్యము, మహోత్సవము, వ్రతము, పశుపాలనము, జగద్వృద్ధి, న్యాయాచరణము)
ఏకాదశ (11) ముఖముల రుద్రాక్ష : ఏకాదశ రుద్ర - దివ్యస్వరూపము. ఏకాదశముఖ రుద్రాక్ష ధారణ - సౌభాగ్య వర్ధనము. అల్పత్వము నుండి బయల్వెడలునట్లు చేసి దివ్యత్వము ప్రసాదించగలదు.
ఏకాదశరుద్రులు (బ్రహ్మమానసపుత్రులు) (1) అజుడు, (2) ఏకపాదుడు, (3) అహిర్బుధ్న్యుడు, (4) హరుడు, (5) శంభుడు, (6) త్ర్యంబకుడు, (7) అపరాజితుడు, (8) ఈశానుడు, (9) త్రుభువనుడు, (10) త్వష్ట (విశ్వకర్మ), (11) రుద్రుడు = భారతము)
ద్వాదశ (12) ముఖ రుద్రాక్ష : మహా విష్ణు స్వరూపకము. ఆదిత్యుని (సూర్యుని) ద్వాదశ (12) రూపములు. దివ్యత్వము కొరకై, తేజో విభవము కొరకై ధారణ చేయతగినట్టిది.
అన్యపాఠము (Another Puranic Discription):
(ద్వాదశాదిత్యులు : అదితియందు కశ్యపునివలన కలిగిన 12 మంది సూర్యతేజోసంపన్నులు (1) ధాత, (2) మిత్రుడు, (3) అర్యముడు, (4) శుక్రుడు, (5) వరుణుడు, (6) అంశుమంతుడు, (7) భగుడు, (8) వివస్వంతుడు, (9) పూషుడు, (10) సవిత, (11) త్యష్ఠ, (12) విష్ణువు = [మహాభారతము]).
త్రయోదశ (13) ముఖ రుద్రాక్ష : కోరిన కోరికలు తీర్చునట్టిది. సర్వ శుభములు సిద్ధింపజేయగలదు. ధారణ మాత్రం చేతనే కామ దేవుని (కామేశ్వరీ సహిత శివభగవానుని) కరుణకు అర్హము చేయునట్టిది.
చతుర్దశ (14) ముఖ రుద్రాక్ష : ఇది రుద్ర భగవానుని నేత్రముల నుండి జాలువారిన జల బిందువుల సాక్షాత్ స్వరూపముగా వర్ణించబడుతోంది. శివతత్త్వ జ్ఞానముయొక్క సామీప్య దృష్టి (శివో2హమ్‌ను) ప్రసాదించగలదు.
రుద్రాక్షమాల ధారణ సర్వ వ్యాధులను హరించివేయగలదు. సర్వదా ఆరోగ్యమును ప్రసాదించగలదు.
రుద్రాక్షమాల ధారణ చేస్తునప్పుడు విధి నిషేధములు : మద్యమును (మత్తు పానీయములను) స్వీకరించరాదు.
ఆహార నియమములు పాటించాలి : మద్యము, మాంసము, ఉల్లిపాయ (లశునము), వెల్లుల్లి (పలాండుము), గోంగూర (శిగ్రు), తదితర శ్లేష్మమును వృద్ధిచేయు భక్ష్యముసు - అభక్ష్యములు (తినరాదు) అనునది నియమము.
నూతన రుద్రాక్షమాల ధరించుటకు తగిన సమయములు : గ్రహణ సమయము, విషువద్దినము, (సంధ్యా సమయము, (రాత్రి - పగలు సమమైన కాలము), గ్రహణ విడుపు దినము. ప్రత్యేక పవిత్రదినములగు శివరాత్రి, దేవీనవరాత్రి దినములు, కృత్తికా నక్షత్ర ప్రవేశ కార్తీక మాస పవిత్ర దినములు, వినాయక చవితి, శ్రీరామ నవమి, కృష్ణాష్టమి ఇత్యాది పర్వ దినములు, దక్షిణాయణ - ఉత్తరాయణ ప్రవేశ పుణ్యదినములు, నెల సంక్రమణ సమయములు, అమావాస్య-పౌర్ణమి దినములు, తిథి పూర్ణ దినములు - మొదలైనవి రుద్రాక్ష ధారణకు అధికంగా శుభప్రదము.
రుద్రాక్ష ధారణ సర్వ పాప ‘దృష్టి - భావన’లను తొలగించగలదు. ప్రారంభించిన మంత్రోపాసన త్వరగా సిద్ధించి, సద్యోముక్తిని (అఖండమగు, ఆత్మాహమ్ భావన, నిశ్చల స్వానుభవములను) ఇప్పటికిప్పుడే ప్రసాదించగలదు. సద్యోముక్తికి త్రోవ చూపగలదు.
రుద్రాక్ష యొక్క త్రిమూర్తి స్వరూపము
• రుద్రాక్ష మూలం తత్ బ్రహ్మ। - రుద్రాక్షయొక్క మూలమునందు సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు సంస్థితులు.
• తత్ నాళం విష్ణురేవ చ। - నాళము (మధ్య ప్రదేశము) విష్ణు స్థానము.
• తత్ ముఖమ్ రుద్ర। - ముఖము రుద్రస్థానము
•
తత్ బిందుః సర్వ దేవతా-ఇతి। - బిందు స్థానము సర్వదేవతా నిలయము. (సుషిరగ్ం సూక్ష్మం, తస్మిన్ సర్వమ్ ప్రతిష్ఠితమ్)।
మరొక ఒకానొక సందర్భములో-బ్రహ్మ మానస పుత్రుడు, యతీశ్వరుడు, యోగీశ్వరుడు అగు శ్రీ సనత్కుమారులవారు శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుని దర్శించి నమస్కరించారు. వారిరువురు రుద్రాక్ష తత్త్వము గురించి, మహత్మ్యము గురించి అనేక విశేషములు సంభాషించుకొనుచున్నారు. చివరికి సనత్కుమారులవారు ఈవిధంగా అడగటం జరిగింది.
సనత్కుమారుడు : స్వామీ! జగద్గురూ! కరుణామూర్తియగు సర్వేశ్వరా! కాలాగ్ని రుద్రభగవన్! మరికొంతగా కూడా రుద్రాక్ష ధారణ విధి, మహత్మ్యము వివరించండి. విద్యార్థినై శ్రవణము చేయటానికి అత్యుత్సాహపడుచున్నాను.
సనత్కుమారులవారు రుద్రమహాదేవుని ఆవిధంగా అడుగుచుండగా, ఆసమయంలో శివదర్శనానందము కొరకై కొందరు మహనీయులగు పరమహంసలు, ఋషిపుంగవులు, అవధూతలు ఆచోటికి వచ్చి శివ-పార్వతులకు త్రి ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ దండప్రణామములు భక్తిపూర్వకంగా సమర్పించారు. వారు సర్వశ్రీ…
నిదాఘుడు - తేజోబిందూపనిషత్, బృహదారణ్యకోపనిషత్ మొదలైన ఉపనిషత్తులలో ‘‘తత్-త్వమ్’’ ‘‘సో2హమ్’’ల తత్త్వికార్థమునకు శ్రోత, వక్త అయినట్టి మహనీయుడు.
జడ భరతుడు - పూర్ణ జ్ఞాని! ఆత్మానుభవుడు అయి ఉండి కూడా కించిత్ ప్రియత్వముచే జింక మొదలైన ఉపాధులను గ్రామ సంచారమువలె చుట్టివచ్చిన దృష్టాంత సారూప్యులు (భారతము).
దత్తాత్రేయులవారు - అత్రి-అనసూయలకు శ్రీమన్నారాయణాంశగా జన్మించిన అవధూత. భక్తులకు సద్యోముక్తి జ్ఞాన ప్రదాత.
కాత్యాయనుడు - కాత్యాయనీ - యాజ్ఞవల్క్యుల పుత్రుడు. బ్రహ్మ జ్ఞాని.
భారద్వాజుడు - సప్తర్షులలో ఒకరు. బ్రహ్మజ్ఞుడు.
కపిలుడు - మాతృదేవతకు సాంఖ్యయోగము బోధించి, ‘108’ శారీరక తత్త్వములను శాస్త్రీయంగా బోధించిన మహర్షి.
వసిష్ఠ మహర్షి - బ్రహ్మ మానస పుత్రుడు. సూర్యుని ‘రేతఃపతనము’ నుండి ఊర్వశీ మాతృత్వముతో కుండనుండి జన్మించినవారు. సప్తర్షులలో ఒకరు. శ్రీరామచంద్రునికి గురువు. యోగవాసిష్ఠ ప్రవక్త.
పిప్పలాదుడు - మహాతపో సంపన్నులు. మహర్షి. దధీచి మహర్షి కుమారుడు. పిప్పల వృక్షము క్రింద జన్మించారు. తండ్రి భౌతికదేహమును వజ్రాయుధము కొరకై దేవతలకు సమర్పించిన తరువాత, తల్లి లోపాముద్రకు జన్మించారు. తల్లి కూడా అగ్నిప్రవేశము చేయగా - పిప్పల వృక్ష దేవత (రావిచెట్టు) చంద్రుని నుండి అమృతము ఇచ్చి కాపాడింది.
ఈఈ మొదలైనవారంతా వచ్చి స్వామి శివభగవానునికి నమస్కరించి, స్వామి అనుజ్ఞతో వారి సమక్షంలో సుఖాశీనులైనారు.
కాలాగ్ని రుద్రభగవానుడు : - మహనీయులారా! బిడ్డలారా! కిమర్థం భవత ఆగమనః? మీరందరికి శుభము అగుగాక! ఏ కారణంగా మీరంతా ఇప్పుడు వచ్చారు?
శ్రీ నిదాఘ మొదలైనవారు : హే లోక శుభంకరా! నిత్యానంద స్వరూపా! మీరు మహనీయుడగు ఈ సనత్కుమారునికి రుద్రాక్ష ధారణ గురించి చెప్పుచున్నారు కదా! ఆయా విశేషాలకు మేము కూడా శ్రోతలమై, అట్టి రుద్రాక్షమాలా ధారణ మహత్మ్యము గురించి వినుటకై వచ్చాము.
శ్రీ కాలాగ్ని రుద్ర భగవానుడు : (ఆయా అనేక విశేషాలు చెప్పుతూ ఈవిధంగా సమీక్షించసాగారు).
బిడ్డలారా! ఇంకా కూడా వినండి. రుద్రుని కనుల నుండి జాలు వారిన నీటి బిందువుల నుండి ఉత్పన్నమైనాయి కాబట్టి ‘రుద్రాక్ష’లు అను పేరుతో లోక ప్రసిద్ధమైనాయి.
‘‘రుద్రాక్ష’’ - తాత్త్వికార్థము |
సర్వము కేవలాత్మయందు ఏకము - లయము చేయు కనులు (లేక) దృష్టి - అనునదే రుద్రాక్ష శబ్దార్ధము. సదాశివుడు సంహార కాలములో, సంహార లీలను నిర్వర్తించటానికై కనుల నుండి జనించటంచేత ‘రుద్రాక్షలు’ అనబడుచున్నాయి.
జాగ్రత్-స్వప్న-సుషుప్తుల వస్తుతః - రాహిత్యము (స్వతఃగా లేవు) అను తత్త్వార్థ దృష్టియే ‘రుద్రాక్షత’।
ఇంకా, స్వామి ఆయా అనేక విశేషాలన్నీ విశదీకరిస్తూ బోధించుట జరిగింది.
కాలాగ్ని రుద్రభగవానుడు : పవిత్రమగు రుద్రాక్షల గురించి సంభాషించుకున్నంత మాత్రంచేతనే పది గోవులు దానం చేసిన ఫలము సిద్ధించగలదు.
అట్టి ‘భస్మజ్యోతి రుద్రాక్ష’ అని గూడా పిలువబడు రుద్రాక్షను చేతితో స్పృశించటముచేతను, ధారణ మాత్రం చేతను - ద్విసహస్ర (2,000) గోవులను దానముచేసిన ఉత్తమఫలము ప్రాప్తించగలదు.
అట్టి రుద్రాక్షలను చెవులచుట్టూ ధారణ మాత్రంచేత ఏకాదశ సహస్ర (11,000) గో ప్రదాన ఫలము లభిస్తోంది. ఏకాదశ రుద్ర మహత్ స్థానము చేరుస్తోంది.
శిరస్సు చుట్టు రుద్రాక్ష ధారణచేత కోటి గోదాన ఫలము వచ్చి చేరగలదు. పై విధముగాను, కర్ణకుండలములుగాను రుద్రాక్ష ధారణచే లభించే ఫలము నేను మాటలతో అభివర్ణించి చెప్పలేను.
ఎవ్వనరైతే ఈ రుద్రాక్ష జాబాలోపనిషత్‌లో చెప్పుచున్న విశేషాలను నిత్యము అధ్యయనము చేస్తూ ఉంటారో, అట్టి రుద్రాక్ష తత్త్వమును ఎరిగినవారు - బాలురైనా, యువకులైనా కూడా (మరెవ్వరైనా కూడా)…. మహత్తరమైన వేద విద్యను ఉపాసించినవారితో సమానులగుచున్నారు.
అట్టి అధ్యయనము చేసినవారు జ్ఞానబోధకు గురుస్థానమును, మంత్రోపదేశమునకు ఉపదేష్ట స్థానమును అలంకరించ గలరు.
రుద్రాక్షలు ధారణచేసియే హోమము చేయుదురు గాక.
పరమాత్మను అర్చించునప్పుడు రుద్రాక్ష ధారణ ధరించెదరు గాక!
ఉత్తమమైన రక్షణ కలుగజేయునది, మృత్యువునుండి తరింపజేయునది అగు రుద్రాక్షమాలను గురుముఖతః ఉపదేశపూర్వకంగా స్వీకరించబడు గాక.
అట్టి గురూపలబ్ధమైన రుద్రాక్షలను కళ్ళకు అద్దుకొని కంఠమునందు, భుజములపైన, శిఖ మొదలైనచోట భక్తి-శ్రద్ధలతో ధారణ చేయుదురు గాక।
అట్టి రుద్రాక్షమాలతో చేర్చి మంత్రోపాసన నేర్పినట్టి గురువు యొక్క ఋణము సప్త ద్వీపములను సమర్పించుకొనుటచేత కూడా తీరునది కాదు.
అయితే, అట్టి గురువుకు ఏకొంచమైనా గాని, ఒక్క గోవునైనాగాని సమర్పించినంత మాత్రముచేతనే గురువులు సంతోషించుచున్నారు. తృప్తి చెందుచున్నారు. భక్తితో ఏది సమర్పిస్తే అదియే మహనీయులగు గురువుల దృష్టిలో గొప్పదగు గురుదక్షిణ.
ఎవ్వరు ఈ ఉపనిషత్తును పారాయణ పూర్వకంగా పఠిస్తారో…,
• సాయంత్రపు పారాయణముచే పగలు చేసియున్న పాపము తొలగిపోగలదు.
• మధ్యాహ్న సమయములలో పారాయణము చేయటంచేత ఆరు (6) జన్మలలో చేసియున్న పాపమంతా నశించగలదు.
• ఉదయకాలములోను, సాయం సమయములందు-అధ్యయనము చేస్తూ ఉండగా అనేక జన్మలలో చేసియున్న పాపము భస్మమైపోగలదు. అంతేకాకుండా షట్ సహస్ర లక్షల (6000 లక్షల) గాయత్రీ జప ఫలము ప్రాప్తించగలదు.
• ఘోర మహాపాతకములగు బ్రహ్మహత్య, సురాపానము, బంగారము దొంగిలించిన దోషము, గురు దారా-గమనము, అట్టి పాప గుణములు కలవారితో సంయోగము (స్నేహ/సామీప్య)ములనబడే పంచమహాపాతకముల నుండి కూడా పునీతుడు అవగలడు.
• సర్వ తీర్థములు సందర్శించి పవిత్రత పొందగలడు.
• నీచమైన సంభాషణ నిర్వర్తించిన దోషము నుండి పవిత్రుడు కాగలడు.
అట్టివాడు ఏ పంక్తిలో ఉంటే, ఆ పంక్తిలోని జనులు (రుద్రాక్ష ధారణా ప్రభావముచేత) పునీతులు, పవిత్రులు అగుచున్నారు. రుద్రాక్ష ధారణ చేయువారి ఉనికి మాత్రంచేత వారి పరిసరములలోని వందల - వేల పంక్తులలోని జనులు నిర్మలత్వము సంతరించుకోగలరు.
రుద్రాక్ష ధరించినవాడు, ఆతని సమీప్య జనులు (శిష్యులు, బంధువులు మొదలైనవారు) శివసాయుజ్యము పొందగలరు.
అట్టివారు పునరావృత్తి-జన్మ జన్మాంతర చక్రము నుండి విడివడగలరు.
జన్మ కర్మల విషయంలో సర్వస్వతంత్రులై, స్వస్వరూపానందమునందు ప్రతిష్ఠితము కాగలరు.
న చ పునరావర్తత ఇతి ‘ఓగ్ం’।।
సత్యమితి
ఇతి రుద్రాక్షజాబాలోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।