[[@YHRK]] [[@Spiritual]]
Sanyāsa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
సంన్యాసోపనిషద్వేద్యం సంన్యాసిపటలాశ్రయం . సత్తాసామాన్యవిభవం స్వమాత్రమితి భావయే .. |
శ్లో।। సన్న్యాసోపనిషత్ వేద్యం సన్న్యాసి పటలాశ్రయమ్, సత్తా సామాన్య విభవం ‘స్వమాత్రమ్’ -ఇతి భావయేత్।। |
యతి - సన్న్యాస పటలము (Group)లచే సర్వదా ఆశ్రయించబడునది అగు సత్తా సామాన్య విభవము (The Festivity of all -pervading equal presence) - ఎక్కడున్నది? - అది ‘‘స్వస్వరూపమే’’ - అను భావనా నిశ్చయము. ఈ సన్న్యాసోపనిషత్ అధ్యయనమునచే తెలియబడుచున్నది. |
హరిః ఓం అథాతః సంన్యాసోపనిషదం వ్యాఖ్యాస్యామో యోఽనుక్రమేణ సంన్యస్యతి స సంన్యస్తో భవతి . |
|
1. ఓమ్। అథ అతః సన్న్యాసోపనిషదమ్ వ్యాఖ్యాస్యామో। - యో అనుక్రమేణ సన్న్యస్యతి, స సన్న్యస్తో భవతి। |
ఓంకార ప్రణవ స్వరూప పరమాత్మకు నమస్కరిస్తూ..., ఇప్పుడిక మనము సన్న్యాసస్థితి యొక్క ‘‘ఉపనిషత్ విద్య’’ గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. ఎవ్వడైతే {బ్రహ్మచర్య - గృహస్థ - వానప్రస్థ ఆశ్రమ అనుక్రమంగా (In its sequence)ఊ సన్న్యాసాశ్రమం స్వీకరిస్తాడో, అట్టివాడు ‘సన్న్యస్తుడు’ అగుచున్నాడు. |
కోఽయం సంన్యాస ఉచ్యతే కథం సంన్యస్తో భవతి . య ఆత్మానం క్రియాభిర్గుప్తం కరోతి |
|
కోఽయం ‘సన్న్యాస’ - ఉచ్యతే? కథం సన్న్యస్తో భవతి? య ఆత్మానం క్రియాభిః గుప్తం కరోతి। |
ఎవరు ‘సన్న్యాసి’ అని అనబడుచున్నారు? ఒకడు సన్న్యస్తుడు ఎట్లా అవుతాడు? ఎవ్వడైతే ఆత్మయొక్క తత్త్వమును, ఆత్మయొక్క సమస్త మహాకర్తృత్వమును రహస్యంగా హృదయమున పదిలపరచుకొని, జగత్ - దర్శనము చేస్తూ ఉంటాడో, అట్టివాడు, ‘సన్న్యస్తుడు’ - అగుచున్నాడు. ఈ ‘‘జగద్దృశ్యము’ అను క్రియావిశేషమంతా- ఆత్మయందే, ఆత్మగానే, అనునిత్యంగా, ఎవడు సునిశ్చితుడై సందర్శిస్తూ ఉంటాడో - ఆతడే సత్‌న్యస్తుడు (లేక) సన్న్యస్తుడు.. |
మాతరం పితరం భార్యాం పుత్రాన్బంధూననుమోదయిత్వా యే చాస్యర్త్విజస్తాన్సర్వాంశ్చ పూర్వవత్ప్రాణిత్వా వైశ్వానరేష్టిం నిర్వపేత్సర్వస్వం దద్యాద్యజమానస్య గా ఋత్విజః సర్వైః పాత్రైః సమారోప్య యదాహవనీయే గార్హపత్యే వాన్వహార్యపచనే సభ్యావసథ్యోశ్చ ప్రాణాపానవ్యానోదానసమానాన్సర్వాన్సర్వేషు సమారోపయేత్ . |
|
2. మాతరం, పితరం, భార్యాం పుత్రాన్, బంధూన్, అనుమోదయిత్వా, యే చ అస్య ఋత్విజః తాం(తు) సర్వాంశ్చ పూర్వవత్ వృణీత్వా ‘‘వైశ్వానర ఇష్టిం’’ నిర్వపేత్। |
సన్న్యాస ఆశ్రమ స్వీకారం తల్లి తండ్రి భార్య పుత్ర బంధువుల యొక్క సంతోషపూర్వకమైన అనుమోదము (ఒప్పుకోలు - Acceptance) పొంది, తనకు ఋత్విక్కులు (దేవజ్ఞులు, కుటుంబపెద్దలు, గురుతుల్యులు) ఎవరైనా ఉంటే, వారందరినీ పూర్వము వలెనే సమీపించి, సన్న్యాస-ఉద్దేశ్యము తెలియజేసి అనుజ్ఞపొంది, వైశ్వానర - ఇష్టి (యజ్ఞమును) ఋత్విక్కుల సహాయంతో నిర్వర్తించాలి. |
సర్వస్వం దద్యాత్। యజమానస్య గా। ఋత్విజః- సర్వైః ప్రాత్రైః సమారోప్య, యత్ ఆహవనీయే, గార్హపత్యేవ అన్వాహార్య వచనే సభ్యావసథ్యోశ్చ, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాం తు సర్వేషు సమారోపయేత్। |
సర్వస్వదానంగా తనకున్న సర్వస్వము (కుటుంబ సభ్యులకు, ఋత్విజులకు మొదలైనవారికి) సమర్పించివేయాలి. యజమాని యొక్క గోవులను, ఋత్విజులకు ఇచ్చివేయాలి. సర్వపాత్రలను సమర్పణగా సమారోపణము చేయాలి. (విశ్వేశ్వరునికి చెందినవిగా భావించి విశ్వక్షేమమును ఉద్దేశ్యించి సమర్పించివేయాలి) ఆహవనీయాగ్నియందు, గార్హపత్యాగ్నియందు ‘‘అన్వాహార్య’’ వేదప్రోక్త వచనములందు, సభ్య - అవసథ్యల యందు సమస్తము సమర్పించివేయాలి. ప్రాణ - అపాన- వ్యాన - ఉదాన - సమానములను (పంచ ప్రాణములను) - అన్నిటినీ ప్రాణేశ్వర భగవానునియందు సమారోప్యము చేయాలి. వాటివాటి తత్త్వములను ఆయా అధిదేవతలకు చెందినవిగా భావిస్తూ సమర్పించివేయాలి. |
సశిఖాన్కేశాన్విసృజ్య యజ్ఞోపవీతం ఛిత్త్వా పుత్రం దృష్ట్వా త్వం యజ్ఞస్త్వం సర్వమిత్యనుమంత్రయేత్ . యద్యపుత్రో భవత్యాత్మానమేవేమం ధ్యాత్వాఽనవేక్షమాణః ప్రాచీముదీచిం వా దిశం ప్రవ్రజేచ్చ . త్రిషు వర్ణేషు భిక్షాచర్యం చరేత్ . పాణిపాత్రేణానాశనం కుర్యాత్ . ఔషధవదహనమాచరేత్ . ఔషధవదశనం ప్రాశ్నీయాత్ . |
|
స శిఖాన్ కేశాన్ విశృజ్య, యజ్ఞోపవీతం ఛిత్వా, పుత్రం దృష్ట్వా, ‘‘త్వం బ్రహ్మ। త్వం యజ్ఞః। త్వం సర్వం।’’ ఇతి అనుమంత్ర యేత్। యది అపుత్రో భవతి, ఆత్మానమ్ ఏవ ఇమం ధ్యాత్వా |
శిఖతో సహా కేశములను విసర్జించి వేయాలి. యజ్ఞోపవీతమును త్రెంచివేయాలి. పుత్రుని వైపు చూచి ‘‘కుమారా! నీవే బ్రహ్మమువు. నీవే యజ్ఞమువు. నీవే ఆత్మరూపమగు సర్వము కూడా’’.. అని వివరణాత్మకమగు మంత్రములను మనసా, వాచా, బుద్ధ్యా అనుమంత్రణము (అనుష్ఠానము) చేయాలి. ఒకవేళ ఆ యజమాని పుత్రులు లేనివాడైతే, తనను తానే చూచుకుంటూ ‘‘త్వమ్‌బ్రహ్మ’’ మొదలైన మంత్రములతో తనయొక్క జీవాత్మకు అనుమంత్రనము చేయాలి. |
న వేక్షమాణః - ప్రాచీం, ఉదీచీం వా దిశం ప్రవ్రజేత్। త్రిషు వర్ణేషు ‘‘బిక్ష’’ ఆచర్యం చరేత్। పాణి పాత్రేణ అశనం కుర్యాత్, ఔషధవత్ అశనం ఆచరేత్। ఔషధవత్ అశనం ప్రాశ్నీయాత్। |
ఇక ఏ మాత్రము వెనుతిరగకుండా ప్రాచీంవా (తూర్పు దిక్కుగా గాని) ఉదీచీ-వా(ఉత్తరదిక్కుగాగానీ) వెళ్లటము ప్రారంభించాలి (ప్రవ్రజేత్). త్రి- వర్ణములలో భిక్షాటణం చేస్తూ ‘చేయి’ని పాత్రగా చేసి ఆహారము భుజించాలి. అన్నమును రుచి, ఎక్కువ తక్కువల దృష్టి లేకుండా ‘ఔషధము’ అను భావనతో భుజించాలి. (మందులాగా స్వీకరించాలి). |
యథాలాభమశ్నీయాత్ప్రాణసంధారణార్థం యథా మేదోవృద్ధిర్న జాయతే . కృశో భూత్వా గ్రామ ఏకరాత్రం నగరే పంచరాత్రం చతురోమాసాన్వార్షికాన్గ్రామే వా నగరే వాపి వసేత్ . |
|
3. యథా లాభమ్ అశ్నీయాత్ - ప్రాణసంధారణార్థం। యథా మేదోవృద్ధిః న జాయతే। కృశో భూత్వా - గ్రామ ఏకరాత్రం, నగరే పంచరాత్రం। చతురో మాసాన్ వార్షికాన్ గ్రామే వా నగరే వా అపి వసేత్। |
యాధృచ్ఛికంగా లభించిన ఆహారమును ప్రాణసంధారణ కొరకు మాత్రమే స్వీకరించాలి. మేథోవృద్ధి (కండబలము) కొరకై ఉద్దేశ్యించరాదు. ఎప్పటికప్పుడు వేరు ప్రదేశములలో సంచారుడై ఉండాలేగాని ఒక్కచోటనే ఉండి పోరాదు. - గ్రామమైతే - ఒక్కరాత్రి మాత్రమే. - నగరమైతే - ఐదురాత్రులు మాత్రమే. -చాతుర్మాస్యముగా - సంవత్సరానికి (వర్షాకాలంలో) 4 మాసములు గ్రామములోగాని, నగరములోగాని ఉండవచ్చు. |
విశీర్ణవస్త్రం వల్కలం వా ప్రతిగృహ్ణీయానాన్యత్ప్రతిగృహ్ణీయాద్యద్యశక్తో భవతి క్లేశతస్తప్యతే తప ఇతి . యో వా ఏవం క్రమేణ సంన్యస్యతి యో వా ఏవం పశ్యతి |
|
పక్షావై మాసా ఇతి ద్వౌ మాసౌవా వసేత్। విశీర్ణ వస్త్రం వల్కలం వా ప్రతిగృహీణాయాత్। న అన్యత్ ప్రతి గృహీణాయాత్। |
- 4 నెలలు ఒక్కచోటే ఉండలేని సందర్భములలో 4 పక్షములు (4 x 1/2 = 2 నెలల కాలము) చాతుర్మాస్యవ్రతము నిర్వర్తిస్తూ ఒక్కచోటే ఉండవచ్చు. ముతక (విశీర్ణ) వస్త్రము గాని, నారబట్టలుగాని ప్రతిగ్రహించవచ్చు. (సిల్కు, పట్టువస్త్రములు స్వీకరించరాదు) |
యది అశక్తో భవతి, క్లేశతః, తప్యతే తప ఇతి। యోవా ఏవం క్రమేణ సత్ న్యస్యతి (సన్న్యస్యతి) యోవా ఏవం పశ్యతి ।। |
అనారోగ్యము ఇత్యాదుల కారణంగా అశక్తుడై ఉన్నప్పుడు ఉన్నచోటనే సన్న్యాసధర్మములు, తపస్సు, సన్న్యాసదృష్టిని వీడనివాడై ఉండాలి. సన్న్యాసభావనము ముఖ్యము. ఈ విధంగా సన్న్యసించువాడు ఏ క్రమంగా సన్న్యసిస్తూ, ఏదేది ఎట్లా దర్శిస్తూ ఉంటాడో.. ఆ విశేషాలు చెప్పుకుంటున్నాము. |
కిమస్య యజ్ఞోపవీతం కాస్య శిఖా కథం వాస్యోపస్పర్శనమితి . తం హోవాచేదమేవాస్య తద్యజ్ఞోపవీతం యదాత్మధ్యానం విద్యా శిఖా |
|
కిం అస్య యజ్ఞోపవీతం? కాస్య శిఖా? కథం వా అస్య ఉపస్పర్శనం? ఇతి। తగ్ం హోవాచ : ఇదం ఏవ అస్య తత్ యజ్ఞోపవీతం, యత్ ‘‘ఆత్మధ్యానం’’। విద్యా శిఖా। |
శ్రోత / శిష్యుడు : ‘సన్న్యాసభావన’ అనగా ఏమి? యజ్ఞోపవీతం, శిఖ త్యజించినట్టి ఆయనకు ఇక- ఏది యజ్ఞోపవీతము? ఏది శిఖ? ఆతనికి ఉపస్పర్శనం (ఉపనిషదము) ఏది? సద్గురువు ఋషి : సన్న్యసించినవానికి → ఆత్మభావన, ఆత్మధ్యానమే → యజ్ఞోపవీతము. ఆత్మవిద్యయే → శిఖ అనగా ఏమి? విను. |
నీరైః సర్వత్రావస్థితైః కార్యం నిర్వర్తయన్నుదరపాత్రేణ జలతీరే నికేతనం . |
|
నిర్వైరః సర్వత్ర అవస్థితేః కార్యం నిర్వర్తయన్। ఉదర పాత్రేణ। జల తీరే నికేతనమ్। |
ఆత్మభావన : దేనిపట్లా ఎటువంటి వ్యతిరిక్తము, ఎవ్వరిపట్లా కూడా విరోధిత్వము కలిగియుండకపోవటమే ఆతనికి కార్యము. ‘‘అందజరము ఏకమగు ఆత్మయే అయి ఉండగా, (నా చేతిపై నాకు కోపము ఉండనట్లే), ఎవ్వరిమీదా నాకు కోపం లేదు’’ - అను ఆత్మధ్యానమునందు నిమ్మగ్నుడగుచూ, పొట్టను భిక్షపాత్రగా భావించువాడై, జలప్రదేశములగు తటాక నదీ తీరములే నివాస స్థానములుగా కలిగి ఉంటున్నారు. |
బ్రహ్మవాదినో వదంత్యస్తమిత ఆదిత్యే కథం వాస్యోపస్పర్శనమితి . తాన్హోవాచ యథాహని తథా రాత్రౌ నాస్య నక్తం న దివా తదప్యేతదృషిణోక్తం . సంకృద్దివా హైవాస్మై భవతి య ఏవంవిద్వానేతేనాత్మానం సంధత్తే .. ఇతి ప్రథమోఽధ్యాయః .. 1.. |
|
బ్రహ్మ వాదినో వదన్తి : అస్తమిత ఆదిత్యే, కథం వా అస్య ఉపస్పర్శనం, ఇతి? తాన్ హోవాచ: యథా అహని తథా రాత్రౌ। న అస్య నక్తం, న దివా, తత్ అపి ఏతత్ ఋషిణా ఉక్తం। సకృత్ దివా హి ఏవ అస్మై భవతి। య ఏవం విద్యాన్ ఏతేన ఆత్మానం సంధత్తే।। |
బ్రహ్మవాదులు : సూర్యుడు అస్తమించిన తరువాత సన్న్యస్తునికి ఉప- స్పర్శనము (సంధ్యావందన సంబంధమైన - ఆచమనము/బ్రహ్మోపాసన) ఉంటాయా? ఉంటే, - ఏతీరుగా చేస్తారు? ఋషి : పగలు ఏ తీరుగా చేస్తారో, ఆ విధంగానే సన్న్యాసి ఆచమనము (బ్రహ్మోపాసన) రాత్రిపూట కూడా నిర్వర్తిస్తారు. ఆయనకు పగలు - రాత్రి భేదము ఉండదు. ఎల్లప్పుడూ ‘పగలు’ (Day time)తో సమానమే. స్వయముగా సూర్యునికిగాని, స్వయముగా ఆత్మసూర్యునికిగాని ఉదయాస్తమయములేమి ఉంటాయి? ఆతడు అనునిత్య-బ్రహ్మతత్త్వ ధ్యాని అయి ఉంటాడు. ఆత్మతత్త్వము ఎరిగి ఆతడు సత్ - న్యాసి అయి ఎల్లప్పుడు ఆత్మతో అనుసంధానం కలిగియే చరిస్తూ ఉంటారు. |
ఓం చత్వారింషత్సంస్కారసంపన్నః సర్వతో విరక్తశ్చిత్తశుద్ధిమేత్యాశాసూయేర్ష్యాహంకారం దగ్ధ్వా సాధనచతుష్టయసంపన్న ఏవ సంన్యస్తుమర్హతి . |
|
1. ఓం। చత్వారింశత్ (40) సంస్కార సంపన్నః, సర్వతో విరక్తః, చిత్త శుద్ధిమ్ ఏతి। ఆశా, అసూయా, ఈర్ష్యా అహంకారం - దగ్ధ్వా, సాధన చతుష్టయ సంపన్న ఏవ సన్న్యస్తుం అర్హతి।। |
‘ఓం’ సన్న్యసించటానికి అర్హుడెవ్వడు? (భగవద్గీతలోని-భక్తి, క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ యోగములలో ఉదహరించిన భక్తి-జ్ఞాన లక్షణములగు) ఆత్మ తత్త్వార్థ జ్ఞాన- స్వానుభవ సిద్ధి పూర్వకమైన ‘40’ గా సంస్కార సంపదల సంపన్నుడు, ఇంద్రియ - దృశ్య సంబంధమైన సమస్త బాహ్య విషయముల పట్ల విరక్తుడై చిత్తశుద్ధి సముపార్జించుకున్నట్టివాడు, ఆశ - అసూయ - ఈర్ష్య - అహంకారములను మొదలంట్లా దగ్ధము చేసుకొని ఉన్నవాడు, (శమము, విచారణ, సత్సంగము (లేక) సాధు సంగము, సంతోషము అనబడు) సాధన చతుష్టయ సంపత్తి కలవాడు సన్న్యసించటానికి అర్హుడు. కోప-ఆవేశ- అసూయ అహంకారములు మొదలైనవి జయించువాడే నిజమైన సన్న్యాసి. ఆవేశముతో, నిరుత్సాహములతో సన్న్యసించటము సముచితము కాదు. |
సంన్యాసం నిశ్చయం కృత్వా పునర్న చ కరోతి యః . స కుర్యాత్కృచ్ఛ్రమాత్రం తు పునః సంన్యస్తుమర్హతి ., 1.. |
|
సన్న్యాసే నిశ్చయం కృత్వా, పునః న చ కరోతి యః, స కుర్యాత్ కృచ్ఛ్రమాత్రం తు, పునః సన్యస్తుం అర్హతి। |
ఒకానొకడు సన్న్యసించటానికి కృతనిశ్చయుడై, అంతా సిద్ధం చేసుకుని విధానాలన్నీ పాటించి, చివరి దాకా వచ్చి, ఏదో కారణంచేత విరమించుకోవటం జరిగితేనో? - అట్టివాడు మరొక సందర్భంలో నేరుగా పునఃసన్న్యాసమును కృచ్ఛ్రమాత్రంగా (ఇంతకు ముందే నిర్వర్తించిన) విధానాలన్నీ పాటించకుండా వాటికి కొనసాగింపుగా చేయవలసినవి నిర్వర్తించి స్వీకరించటానికి అర్హుడే. |
సంన్యాసం పాతయేద్యస్తు పతితం న్యాసయేత్తు యః . సంన్యాసవిఘ్నకర్తా చ త్రీనేతాన్పతితాన్విదుః .. 2.. ఇతి.. |
|
సన్న్యాసం పాతయేత్ యస్తు పతితం న్యాసయేత్తు యః, సన్న్యాస విఘ్నకర్తా చ త్రీని ఏతాన్ పతితాన్ విదుః । ఇతి। |
కానీ, సన్న్యాసాశ్రమము స్వీకరించిన తరువాత కొంత కాలానికి అట్టి ‘న్యాసము’ నుండి పతితుడైతే మాత్రం అట్టివాడు బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ -త్రి ఆశ్రమముల నుండి పతితుడు అయినట్లుగా చెప్పబడుతాడు. (అట్టివాడు - ‘‘పంచమస్థితికి దిగజారినవాడు, పంచముడు’’ అనబడుతాడు. |
అథ షండః పతితోఽఙ్గవికలః స్త్రైణో బధిరోఽర్భకో మూకః పాషండశ్చక్రీ లింగీ కుష్ఠీ వైఖానసహరద్విజౌ భృతకాధ్యాపకః శిపివిష్టోఽనగ్నికో నాస్తికో వైరాగ్యవంతోఽప్యేతే న సంన్యాసార్హాః . సంన్యస్తా యద్యపి మహావాక్యోపదేశే నాధికారిణః .. |
|
2. అథ షండః పతితో అంగవికలః స్రైణో బధిరో అర్భకో మూకః పాషండః చక్రీ లింగీ కుష్ఠీ, వైఖానస, హరద్విజౌ, భృతక అధ్యాపకః శిపివిష్టో, అనగ్నికో, నాస్తికో, వైరాగ్య రహితో - అపి ఏతే సన్న్యాపాత్ అనర్హాః। సన్యస్తా యద్యపి, మహా వాక్యా ఉపదేశే న అధికారిణః।। |
సన్న్యాసాశ్రమ స్వీకరించటానికి అర్హులు కానివారెవ్వరు? షండుడు (నపుంసకుడు) (Eunuch), పతితుడు (ఇతఃపూర్వము సన్న్యాసాశ్రమము స్వీకరించి పతితుడు అయినవాడు); అంగవికలుడు; (Physically Handicapped), స్రైణుడు (స్త్రీ సంబంధమై లక్షణములు కలవాడు); బధిరుడు (చెవిటివాడు), అర్భకుడు (బాల్య- శారీరక లక్షణములు వీడనట్టివాడు); మూకడు (మూగవాడు); (Dumb), పాషండుడు (వేదప్రమాణములు అంగీకరించనివాడు, నియమములను విధానములను నమ్మనివాడు), చక్రీ (విమర్శలకు, కొండెములు చెప్పుటకు పరిమితుడై యున్నవాడు) లింగీ (లింగధారణ చేసినవాడు, ఒక మతమునకే పరిమితుడు) కుష్ఠువ్యాధివాడు, వైఖానసుడు, (వానప్రస్థులలో ఒక తెగవాడు; ఒకానొక అర్చకవృత్తి వాడు), హరద్విజుడు (బ్రాహ్మణుడై ఉండి ధర్మములు విడచినవాడు), భృతకుడు (జీవనోపాధి కొరకై మాత్రమే ఉద్దేశ్యించువాడు); అధ్యాపకుడు; శిపివిష్టుడు (ధీర్ఘరోగి), అగ్నికార్యములను గౌరవించని అనగ్నికుడు; నాస్తికుడు, వైరాగ్యము లేనివాడు - వీరు సన్న్యాసము స్వీకరించటానికి అనర్హులు. ఒకవేళ సన్న్యసించినప్పటికీ కూడా, వేద-మహావాక్యోపదేశము (తత్త్వమ్- సోఽహమ్) ఉపదేశించబడటానికి అధికారులు (Deserved) కాదు. (‘సేవ’కు, ‘మంత్రోపాసన’కు మాత్రమే అర్హులు). |
ఆరూఢపతితాపత్యం కునఖీ శ్యావదంతకః . క్షీబస్తథాంగవికలో నైవ సంన్యస్తుమర్హతి .. 3.. |
|
ఆరూఢపతితాపత్యం కునఖీశ్య అవదన్తకః క్షయీ తథా అంగవికలో, నైవ (న ఏవ) సన్న్యస్తుం అర్హతి।। |
ఆరూఢ పతితుడు (సన్న్యసించి, ఆశ్రము త్యజించిన తిరిగి ఇంద్రియ విషయములలో పతితమైన వాడు), కుంటివాడు, పుచ్చిన గోళ్ళు - పుప్పిపళ్ళ రోగము కలవాడు, క్షయవ్యాధి బాధితుడు, అంగవైకల్యము కలవాడు సన్న్యసించటానికి అర్హులు కాదు |
సంప్రత్యవసితానాం చ మహాపాతకినాం తథా . వ్రాత్యానామభిశస్తానాం సంన్యాసం న కారయేత్ .. 4.. |
|
సంప్రతి అవసితానాన్చ మహా పాతకినాః తథా, వ్రాత్యానాం అభీశస్తానాం సన్న్యాసం నైవ కారయేత్।। |
సంప్రత్యవసితుడు (సంస్కారము లేనివాడు), (పంచ) మహాపాతకులు { 1. బంగారము దొంగిలించటము, 2. భ్రూణహత్య (బాలహంతక), 3. బ్రహ్మత్య, 4. సురాపానము, 5. గురుపత్నీగమనము , మరియు ఇవి చేయువారితో స్నేహము చేయువారు }, వ్రాత్యుడు (ఉపనయనాది సంస్కారములు అనుసరించని ద్విజుడు), అభిశస్తుడు (ఇతరులకు హాని చేయు స్వభావము కలవాడు) - వీరు సన్న్యాసము ఇవ్వబడుటకు, సన్న్యసించటమునకు అర్హులు కారు. (సన్న్యాసదీక్ష ఇవ్వకూడదు). |
వ్రతయజ్ఞతపోదానహోమస్వాధ్యాయవర్జితం . సత్యశౌచపరిభ్రష్టం సంన్యాసం న కారయేత్ .. 5.. ఏతే నార్హంతి సంన్యాసమాతురేణ వినా క్రమం . ఓం భూః స్వాహేతి శిఖాముత్పాట్య యజ్ఞోపవీతం బహిర్న నివసేత్ . యశో బలం జ్ఞానం వైరాగ్యం మేధాం ప్రయచ్ఛేతి యజ్ఞోపవీతం ఛిత్త్వా |
|
3. వ్రత యజ్ఞ తపో దాన హోమ స్వాధ్యాయ వర్జితమ్, సత్య శౌచ పరిభ్రష్టం సన్న్యాసం నైవ కారయేత్। ఏతే న అర్హన్తి సన్న్యాసం ఆతురేణ వినా క్రమమ్। ‘‘ఓం భూః స్వాహా’’ ఇతి శిఖాం ఉత్పాట్య, యజ్ఞోపవీతం బహిః న నివసేత్ - యశో బలం జ్ఞానం వైరాగ్యం మేధాం ప్రయచ్ఛేతి - యజ్ఞోపవీతం ఛిత్వా, |
వ్రతములు, యజ్ఞములు, తపస్సు, దానము, హోమము, స్వాధ్యాయము ఇవన్నీ వదలివేసి ఉన్నవాడు, సత్యము, శుచి అయిన ఆచారముల నుండి భ్రష్టుడైనవాడు, - ఇట్టివారు ‘‘ఆతుర సన్న్యాసము’’నకు (మరణమునకు దగ్గరపడువారికి ఇచ్చు దీక్షకు) మాత్రమే అర్హులు. క్రమపూర్వకమైన సన్న్యాసదీక్షకు అర్హులు కాదు. ‘‘ఓం భూః స్వాహా।’’ - అని పలుకుచూ శిఖను తీసి, ‘‘హే పరమాత్మా! యశస్సు, బలము, జ్ఞానము, వైరాగ్యము ప్రసాదించమని వేడుకొనుచున్నాను’’ - అని యజ్ఞోపవీతమును త్రెంచి, ‘‘ఓం భూః స్వాహా భువస్స్వాహా। సువ స్స్వాహా’’ అని పలుకుచూ వస్త్రములు, |
ఓం భూః స్వాహేత్యప్సు వస్త్రం కటిసూయం చ విసృజ్య సంన్యస్తం మయేతి త్రివారమభిమంత్రయేత్ . |
|
‘‘ఓం భూః స్వాహా’’ ఇతి అప్సు వస్త్రం కటిసూత్రం చ విసృజ్య, ‘‘సన్న్యస్తం మయా’’ ఇతి త్రివారం అభిమంత్రయేత్।। |
మొలత్రాడు తీసి నీటిలో విడువాలి (విసర్జించాలి). ‘‘సన్న్యస్తం మయా’’ - అని ‘3’సార్లు అభిమంత్రణము (మంత్రముగ్ధంగా త్రికరణ శుద్ధిగా) చేయాలి. (ఇది-సన్న్యాస విధి విధానము జరుగుచున్నంతసేపు మననము చేస్తూ ఉంటారు). |
సంన్యాసినం ద్విజం దృష్ట్వా స్థానాచ్చలతి భాస్కరః . ఏష మే మండలం భిత్త్వా పరం బ్రహ్మాధిగచ్ఛతి .. 6.. |
|
సన్న్యాసినం ద్విజం దృష్ట్వా స్థానాత్ చలతి భాస్కరః। ఏష మే మణ్డలం భిత్వా పరంబ్రహ్మ అధిగచ్ఛతి। |
ఫలశ్రుతి : సన్న్యాసము స్వీకరించిన ద్విజుని చూస్తూ సర్వసాక్షి అగు సూర్వభగవానుడు ‘‘ఆహా"। సన్న్యాస ఆశ్రమము స్వీకరించిన ఈతడు నాకు పూజ్యుడు. ఈయన నా యొక్క సూర్యమండలమును ఛేదించి పరబ్రహ్మము నందు (లేక) బ్రహ్మలోకములో ప్రవేశించగలడు’’ అని శుభాకాంక్ష వచనములు పలుకుచూ ఉంటారు. |
షష్టిం కులాన్యతీతాని షష్టిమాగామికాని చ . కులాన్యుద్ధరతే ప్రాజ్ఞః సంన్యస్తమితి యో వదేత్ .. 7.. |
|
షష్టిం కులాని అతీతాని షష్టిం ఆగామికాని చ కులాని ఉద్ధరతే ప్రాజ్ఞః, ‘‘సన్న్యస్తం’’ ఇతి యో వదేత్। |
ఎప్పుడైతే ఆతడు ‘‘సన్న్యాసం మయా’’ అని పలుకుతూ సన్న్యాసాశ్రమం స్వీకరిస్తారో, అట్టివాని ఇతఃపూర్వపు షష్ఠి (60) కులములు (తరములు), రాబోవు షష్టి (60) కులములు (తరములు) ఉద్ధరించబడతాయి. పవిత్రమౌతాయి. |
యే చ సంతానజా దోషా యే దోషా దేహసంభవాః . ప్రైషాగ్నిర్నిర్దహేత్సర్వాంస్తుషారిన్నివ కాంచనం .. 8.. |
|
యే చ సన్తానజా దోషా, యే దోషా దేహ సంభవాః, ప్రైషాగ్నిః నిర్-దహేత్ సర్వాం తుషాగ్నిః ఇవ కాంచనమ్। |
ఏ విధంగా అయితే తుషాగ్నిచే పుటము వేయబడినదై బంగారు ఖనిజము మలదోషములన్నీ త్యజించి ధగధగ బంగారు కాంతి-తేజస్సులతో ప్రకాశిస్తోందో, ఆ విధంగా దేహ పరిమిత భావము వలన, సంతానం వలన (సంతానము పట్ల మమకారము; సంకుచితమైన అనురాగములకు సంబంధించిన దోషకర్మల ప్రభావము మొదలైనవి) - ఇవన్నీ కూడా విధి విధానంగా ‘‘సన్న్యాసం మయా’’ అను సన్న్యాసస్వీకారముచే జనించే ప్రేషాగ్నిచే - తొలగిపోగలవు. (సన్తానజ = సత్తును ఏమరచి అసత్ దృష్టితో ఏర్పడిన సంసార దోషము) - ఈ దోషము ప్రేషాగ్నిచే తొలగిపోగలదు). ప్రేషాగ్ని: విషయములపట్ల ప్రియత్వము తొలగించి, ఆత్మత్త్వము పట్ల ప్రియత్వము కలిగించు అగ్ని. |
సఖా మా గోపాయేతి దండం పరిగ్రహేత్ . |
|
‘‘సఖా! మా గోపాయ!’’ ఇతి దణ్డం పరిగ్రహేత్. |
పై విధంగా ‘ఓంభూః’ అని పలుకుచూ వస్త్రము, మొలత్రాడు జలమునకు సమర్పించి, ‘సన్న్యాసం మయ’ అని పలుకుచూ, సూర్యభగవానునిచే బ్రహ్మలోకమునకు దారిచూపు శుభాకాంక్షలు పొందుచు) - ‘‘సఖామా గోపాయ’’ అని పలుకుచూ దణ్డమును పరిగ్రహించాలి. |
దండం తు వాణవం సౌమ్యం సత్వచం సమపర్వకం . పుణ్యస్థలసముత్పన్నం నానాకల్మషశోధితం .. 9.. అదగ్ధమహతం కీటైః పర్వగ్రంథివిరాజితం . నాసాదఘ్నం శిరస్తుల్యం భ్రువోర్వా బిభృయాద్యతిః .. 10.. |
|
4. దణ్డం తు వైణవం సౌమ్యం, సత్వచం సమపర్వకమ్, పుణ్యస్థల సముత్పన్నం నానా కల్మష శోధితమ్, అదగ్ధం, అహతం కీటైః, పర్వగ్రన్థి విరాజితమ్, నాసాత్ అఘ్నం శిరః తుల్యం భృవోర్వా అభిభృయాత్ యతిః। |
దణ్డము :- వెదురుతో తయ్యారయినదై ఉండాలి. (లోహముతో తయ్యారైనది కాకూడదు) చిల్లులు, ఎత్తు - పల్లములు లేకుండా సమముగా ఉన్నదై ఉండాలి. - సమమైన కణుపులు కలిగినది, మంచి ప్రదేశంలో పుట్టినది, పురుగులు కొట్టనిది, అయి ఉండాలి. చీలికలు కలిగినది అవరాదు. దణ్డము యొక్క ఎత్తు : నేల నుండి- ముక్కు వరకు గాని, శిరస్సు వరకు గాని, భ్రూమధ్యము వరకుగాని పొడవు ఉన్నది - యతి ధరించును గాక। |
దండాత్మనోస్తు సంయోగః సర్వథా తు విధీయతే . న దండేన వినా గచ్ఛేదిషుక్షేపత్రయం బుధః .. 11.. |
|
దణ్డ ఆత్మనో అస్తు సంయోగః సర్వధా తు విధీయతే, న దణ్డేన వినా గచ్ఛేత్ ఇషు క్షేప త్రయం బుధః।। |
దణ్డమును ఎప్పుడూ తన దేహముతోబాటే, ఆత్మసమానంగా సంయోగము కలిగి యుండాలి. ఎల్లప్పుడు దేహముతో బాటే వెంటనంటి ఉండాలి. దణ్డము వెంటనంటి ఉండకుండా - ఇషుక్షేపత్రయ దూరము (బాణక్షేపత్రయము, 3 సార్లు బాణము విసరిన దూరము) ను బుధులు దాటి వెళ్లరు. |
జగజ్జీవనం జీవనాధారభూతం మాతే మామంత్రయస్వ సర్వసౌమ్యేతి కమండలుం పరిగృహ్య యోగపట్టాభిషిక్తో భూత్వా యథాసుఖం విహరేత్ .. |
|
జగత్ జీవనం, జీవనాధారభూతం, ‘‘మాతే మా మన్త్రయస్వ సర్వ సౌమ్య’’ ఇతి కమణ్డలుం పరిగృహ్య, యోగ పట్టాభిషిక్తో భూత్వా, యథాసుఖం విహరేత్।। |
(దండము ఆత్మభావనకు సంజ్ఞ). (కమండలము = సన్న్యాసులు జలము కొరకై దగ్గిర ఉంచుకొను పాత్ర). ‘‘మాతే! మా మన్త్రయస్వ సర్వ సౌమ్య’’ - అను మంత్రము చదువుచూ జగత్ జీవనమునకు ప్రతీక (సంజ్ఞ)గా, జీవన సందర్భమునకు ఆధార భూతముగా కమండలమును గ్రహించాలి.
‘‘సౌమ్య స్వరూపుడవగు ఓ కమండలమా! నీవు నన్ను ఆమన్తృడుగా (ఆత్మను మననము చేయువాడుగా) తీర్చి దిద్దుము’’ . ఈ విధంగా కమండలమును సర్వదా చేబూని యోగాభ్యాసంతో - ఆత్మయోగ పట్టాభిషిక్తుడై ఈ దృశ్యములో యధాసుఖంగా, ప్రశాంతంగా, ఆత్మ జ్ఞానానందముగా విహరించును గాక। |
త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ . ఉభే సత్యానృతే త్యక్త్వా యేన త్యజసి తత్త్యజ .. 12.. |
|
త్యజ ధర్మం అధర్మం చ ఉభే। సత్య - అనృతే త్యజ। ఉభే సత్యానృతే త్యక్త్వ, యేన త్యజసి - ‘తత్(హి)’ - త్యజ।। |
ధర్మ-అధర్మ, సత్య-అనృత (అసత్య) ద్వంద్వములను వదలును గాక. దేనితో సమస్తము త్యజిస్తూ ఉన్నాడో అట్టి త్యాజ్య భావనను కూడా త్యజించును గాక। (‘‘వదలాలి-వదలుచున్నాను’’ అనునది కూడా వదలివేయును గాక)। ఈ విధంగా ధర్మాధర్మ సత్యానృత ద్వంద్వములను త్యజించి, ఆ తరువాత ‘త్యజిస్తున్నాను’ అనే త్యాజ్యభావము కూడా త్యజించి మౌనము వహించి ఉండాలి. |
వైరాగ్యసంన్యాసీ జ్ఞానసంన్యాసీ జ్ఞానవైరాగ్యసంన్యాసీ కర్మసంన్యాసీతి చాతుర్విధ్యముపాగతః . తద్యథేతి |
|
వైరాగ్య సన్న్యాసీ, జ్ఞానసన్న్యాసీ జ్ఞానవైరాగ్య సన్న్యాసీ, కర్మసన్న్యాసీ చ ఇతి చాతుర్విధ్యం ఉపాగతః తత్ యథా ఇతి।। |
చాతుర్విధ సన్న్యాసి - సన్న్యసించి యున్నవారిని 4 విధములుగా విభజించి చెప్పుచున్నారు. (1) వైరాగ్య సన్న్యాసి (2) జ్ఞాన సన్న్యాసి (3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసి (4) కర్మసన్న్యాసి. అవి ఈ విధంగా వివరించబడుచున్నాయి. |
దృష్టానుశ్రవిక- విషయవైతృష్ణ్యమేత్య ప్రాక్పుణ్యకర్మవిశేషాత్సంన్యస్తః స వైరాగ్యసంన్యాసీ . |
|
5. ‘‘చతుర్విధ సన్న్యాసీమ్’’ (1) వైరాగ్య సన్న్యాసి: దృష్టా అనుశ్రవిక విషయ వైతృష్ణ్యమ్ ఏత్య, ప్రాక్ పుణ్య కర్మ విశేషాత్ సన్న్యస్తః - వైరాగ్య సన్న్యాసీ।। |
4 విధములగు సన్న్యాసులలో (1) వైరాగ్య సన్న్యాసి : దృశ్య ప్రపంచంలో కనిపించుచున్నవి. వినిపించుచున్నవి - ఇటువంటి సర్వ విషయములపై ‘‘ఇవన్నీ నిస్సారము నిష్ప్రయోజనము వచ్చిపోయేవేగాని ఉద్ధరించేవి కావు’’ - అని గమనించినవాడై, అట్టి సమస్త బాహ్య విషయములపై తృష్ణ (ఆశ) తొలగిపోగా, అనేక పూర్వజన్మల విశేషం చేత సన్న్యాసము స్వీకరించిన వానిని ‘వైరాగ్య సన్న్యాసి’’ అని అంటారు. |
శాస్త్రజ్ఞానాత్పాపపుణ్యలోకానుభవశ్రవణా- త్ప్రపంచోపరతో దేహవాసనాం శాస్త్రవాసనాం లోకవాసనాం త్యక్త్వా వమనాన్నమివ ప్రవృత్తిం సర్వం హేయం మత్వా సాధనచతుష్టయసంపన్నో యః సంన్యస్యతి స ఏవ జ్ఞానసంన్యాసీ . |
|
(2) జ్ఞాన సన్న్యాసి: శాస్త్ర జ్ఞానాత్ పాప-పుణ్యలోక అనుభవ శ్రవణాత్, ప్రపంచ ఉపరతో దేహవాసనాం, శాస్త్రవాసనాం, లోక వాసనాం త్యక్త్వా, అవమానం మానం ఇవ ప్రవృత్తిం సర్వం హేయం మత్వా; సాధన చతుష్టయ సంపన్నో యః సన్న్యస్యతి - స ఏవ ‘‘జ్ఞాన సన్న్యాసీ’’।। |
(2) జ్ఞాన సన్న్యాసి : పెద్దలు విజ్ఞులు వినిపిస్తున్న విశేషములచే శాస్త్రములను పరిశీలిస్తూ తద్వారా దేహానంతర పాప-పుణ్యలోకముల అనుభవము ఎటువంటిదో, కర్మ బంధముల పర్యవసానము ఏతీరైనదో గ్రహించిన వాడై, - ప్రాపంచ విషయములన్నిటి నుండీ ఉపరతుడై (one who is with - drawing from all world related world - confined contextual Aspects), and (World related wishes and Fancies), - తాను జన్మజన్మలుగా ప్రోగు చేసిపెట్టుకున్న దేహవాసనలు (Tendencis belonging to physical Bodies), శాస్త్రవాసనలు (Tendencies towards story, historical events, name and fame events of SASTRAS), లోకవాసనలు - ఇవన్నీ త్యజించినవాడై, - మాన - అవమానములతో సహా సర్వ ప్రవృత్తులను ( Avocative habits) - ‘‘అవన్నీ నిరుపయోగమైనవి. వదలవలసినట్టివి’’ అని భావించినవాడై- {(1) ఇంద్రియ నిగ్రహరూప శమము, (2) శాస్త్రీయ - స్వకీయ విచారణ, (3) మహనీయులతో సంభాషణ రూప సత్సంగము, (4) అసంతృప్తులను జయించిన సంతోషాభ్యాసము - అనే} సాధన చతుష్టయ సంపత్తి సుసంపన్నుడై - సన్న్యసించినవాడు జ్ఞానసన్న్యాసి. |
క్రమేణ సర్వమభ్యస్య సర్వమనుభూయ జ్ఞానవైరాగ్యాభ్యాం స్వరూపానుసంధానేన దేహమాత్రావశిష్టః సంన్యస్య జాతరూపధరో భవతి స జ్ఞానవైరాగ్యసంన్యాసీ . |
|
(3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసి: క్రమేణ సర్వం అభ్యస్య సర్వం అనుభూయ జ్ఞాన వైరాగ్యభ్యాం స్వరూప అనుసంధానేవ దేహ మాత్రావశిష్టః సన్న్యస్య జాతరూపధరో భవతి, స ‘‘జ్ఞాన వైరాగ్య సన్న్యాసీ’’।। |
(3) జ్ఞానవైరాగ్య సన్న్యాసి : పెద్దలు ప్రవచనములు వినుచూ, శాస్త్ర పరిశీలకుడై, ఉత్తరోత్తర గతులను - కర్మబంధములను స్వబుద్ధితో ఎరిగినవాడై, ప్రాపంచక విషయముల ఆకర్షణను జయించి, దేహ-శాస్త్ర - లోకవాసనలను విచారణ - ఉపాసనల ప్రభావంతో జయించి, సమస్త ద్వంద్వములను అధిగమించి, సాధన చతుష్టయమును ఆశ్రయించుచూ- క్రమేణా సర్వమును అధిగమించువాడు. గురువులు - విజ్ఞులు - శాస్త్రములు చెప్పిన మార్గంలో ఆత్మానుభూతిని పొందుచూ జ్ఞానవైరాగ్యముల అభ్యాసముచే స్వస్వరూపానుసంధానముచే దేహమత్రావశిష్టము’’ సిద్ధించుకొని, ఎప్పుడో సన్న్యాసము స్వీకరించి ‘జాతరూపధరుడు’ అగువాడు - జ్ఞాన వైరాగ్య సన్న్యాసి. |
బ్రహ్మచర్యం సమాప్య గృహీ భూత్వా వానప్రస్థాశ్రమమేత్య వైరాగ్యాభావేఽప్యాశ్రమక్రమానుసారేణ యః సంన్యస్యతి స కర్మసంన్యాసీ . |
|
(4) కర్మ సన్న్యాసి: బ్రహ్మచర్యం సమాప్య, గృహీ భూత్వా, వానప్రస్థాశ్రమమ్ ఏత్య, వైరాగ్య-అభావేపి ఆశ్రమ క్రమానుసారేణ యః సన్న్యస్యతి, స ‘‘కర్మసన్న్యాసీ’’ ఇతి।। |
(4) కర్మ సన్న్యాసి : ఒకానొకడు బ్రహ్మచర్యాశ్రమములో ప్రవేశించి, ఆచార్యులను సేవించి, లోక- పార లౌకిక విద్యలను అభ్యసించి, గుర్వాజ్ఞను అనుసరించి - గృహస్థాశ్రమములో ప్రవేశించి, ఆయా సంతాన - వృత్తిధర్మ - లోకసేవ రూపములగు గృహస్థాశ్రమ ధర్మములను ఒకప్పటికి ముగించుకొన్నవాడై, వాన ప్రస్థాశ్రమము స్వీకరించినవాడై వైరాగ్య భావములు పొందకపోయినప్పటికీ - ఆశ్రమ క్రమానుసారంగా ఎవ్వరు సన్న్యసిస్తారో - అట్టివారు ‘‘కర్మసన్న్యాసి’’. |
స సంన్యాసః షడ్విధో భవతి కుటీచకబహూదకహంసపరమహంసతురీయాతీతావధూతాశ్చేతి . |
|
6. స సన్న్యాసః షట్(6) విధో భవతి। (1) కుటీచక (2) బహూదక (3) హంస (4) పరమహంస (5) తురీయాతీత (6) అవధూతా-ఇతి।। |
అట్టి సన్న్యాసులు (మరొక విభజనను అనుసరించి) ఆరు (6) విధములైనవారుగా ఉండటము జరుగుతోంది. (1) కుటీచక (2) బహూదక (3) హంస (4) పరమహంస (5) తురీయాతీత (6) అవధూత. |
కుటీచకః శిఖాయజ్ఞోపవీతి దండకమండలుధరః కౌపీనశాటీకంథాధరః పితృమాతృగుర్వారాధనపరః పిఠరఖనిత్రశిక్యాదిమాత్రసాధనపర ఏకత్రాన్నాదనపరః శ్వేతోర్ధ్వపుండ్రధారీ త్రిదండః . |
|
[1] కుటీచక : కుటీచకః శిఖా యజ్ఞోపవీతీ। దణ్డ కమణ్డలు ధరః। కౌపీన శాటీ కంధాధరః। పితృ మాతృ గురు ఆరాధన పరః। పిఠర ఖని త్రశిక్య ఆది మాత్ర సాధనపర। ఏకత్ర అన్నాదన పరః। శ్వేత ఊర్థ్వ పుణ్డ్రధారీ। త్రిదణ్డః। |
(1) కుటీచక సన్న్యాసి : కుటీరమే (గృహమే) ఆశ్రమముగా భావించువాడై ఉంటారు. అనగా :- • శిఖ - యజ్ఞోపవీతుడై (కలిగియే) ఉంటారు. • దండ, కమండలు - కేన (గోచీ), శాటీ (దుప్పటి), కంధ (బొంత)లను ధరిస్తూ ఉంటారు. • తల్లి-తండ్రి-గురువులను ఆరాధించువారై ఉంటారు. (గృహములోనో, ఆశ్రమములోనో ఉండి ఉంటారు) • పీఠరము (కవ్వపుకోల, వంటి కుండ), ఖనిత్రము (త్రవ్వెడు సాధనము-గడ్డపార వంటిది), శిక్యము (ఉట్టి) - ఇవి మాత్రమే సాధన వస్తువులుగా కలిగి ఉంటారు. • ఒక్క ప్రదేశములోనే భోజనము భుజించు నియము కలిగి ఉంటారు. • తెల్లటి ఊర్ధ్వపుండ్రము (నిలువు బొట్టు) ధరించి ఉంటారు. • త్రిదండధారి అయి ఉంటారు. వీరు అందరిమధ్యగా ఉంటూనే, తనను తాను ‘సన్న్యాసి’గా నిర్వచనం కలిగి ఉంటారు. వారికి ఈ జగత్తంతా ఆశ్రమమే. సేవా ధర్మములే - ఆశ్రమ ధర్మములు. |
బహూదకః శిఖాదికంథాధర- స్త్రిపుండ్రధారీ కుటీచకవత్సర్వసమో మధుకరవృత్త్యాష్టకవలాశీ . |
|
[2] బహూదక : శిఖాది కంధాధరః। త్రిపుణ్డ్రధారీ। కుటీచకవత్ సర్వసమో, మధుకర వృత్తీ। అష్టకబళాశీ।। |
(2) బహూదక సన్న్యాసి : శిఖ (పిలక) ధారుడు. బొంతను (కంథమును) ధరిస్తూ ఉంటారు. త్రిపుండ్రములను (నొసలు/నుదురు/ఫాల భాగముపై మూడు విభూతిరేఖలు) ధరించినవాడై ఉంటారు. లోకసంచారి అయి ఉంటారు. కుటీచక సన్న్యాసివలెనే సర్వత్రా సమభావము కలిగి ఉంటారు. - మధూకరము (బిక్షాటనము) చేస్తూ 8 ముద్దల ఆహారము మాత్రమే తీసుకుంటూ వుంటారు. ఒక గృహమునకో, ఆశ్రమమునకో పరిమితులై ఉండరు. |
హంసో జటాధారీ త్రిపుండ్రోర్ధ్వపుండ్రధారీ అసంక్లృప్తమాధూకరాన్నాశీ కౌపీనఖండతుండధారీ . |
|
[3] హంస : జటాధారీ। త్రిపుణ్డ్రః, ఊర్ధ్వ పుణ్డ్రధారీ। అసంక్లప్త మాధుకర అన్నాశీ కౌపీన ఖణ్డధారీ। |
(3) హంస : జటాజూటమును (పొడవైన జుట్టును) ధరించి ఉంటారు. త్రిపుండ్ర- ఊర్ధ్వ పుండ్రములను (త్రి ఊర్థ్వ విభూతి రేఖలను) ధరించుచూ ఉంటారు. అసంక్లప్త (విశాలమైన) వీధులలో మధూకరము (భిక్షాటనము) చేస్తూ ఉంటారు. కౌపీన (గోచీ) ఖండమును ధరించువాడై ఉంటారు. ఈ జగత్తును క్రీడవలె దర్శిస్తూ లోక సంచారులై ఉంటారు. |
పరమహంసః శిఖాయజ్ఞోపవీతరహితః పంచగృహేషు కరపాత్రీ ఏకకౌపీనధారీ శాటీమేకామేకం వైణవం దండమేకశాటీధరో వా భస్మోద్ధృలనపరః సర్వత్యాగీ |
|
[4] పరమహంస : శిఖా యజ్ఞోపవీత రహితః। పంచగృహేషు కరపాత్ర। ఏక కౌపీన ధారీ। శాటీం ఏకాం ఏకం వైణవం దణ్డం। ఏకశాటీధరో వా, భస్మోద్ధూళన-పరః। సర్వత్యాగీ। |
(4) పరమహంస : శిఖ (పిలక) - యజ్ఞోపవీతములు లేనివారై ఉంటారు. చేతులను భిక్షక పాత్రగా ధరించి ఐదు ఇళ్ళలో మాత్రమే బిక్షాటణము చేస్తూ ఉంటారు. ఏక కౌపీన ధారి (ఒక్క గోచీ), ఒక్క శాటీ (దుప్పటి) ధారి అయి ఉంటాడు. ఒక వెదురు దండము ధరించుచూ ఉంటాడు. ఒక్క శాటీ (దుప్పటి)ని ధరిస్తూనే, దేహమంతా భస్మము ధరించి ఉంటారు మానసికంగా సర్వాత్యాగి అయి ఉంటారు. |
తురీయాతీతో గోముఖవృత్త్యా ఫలాహారీ అన్నాహారీ చేద్గృహత్రయే దేహమాత్రావశిష్టో దిగంబరః కుణపవచ్ఛరీన్వృత్తికః . |
|
[5] తురీయాతీత : గోముఖ వృత్త్యా ఫలాహారీ। అన్నాహారీ చేత్ గృహత్రయే దేహమాత్ర అవశిష్టో। దిగంబరః। కుణపవత్ శరీర వృత్తికః।। |
(5) తురీయాతీతుడు : గోముఖ వృత్తిచే ఫలాహారి. ఆకలి వేసినప్పుడు 3 ఇళ్లలో మాత్రమే గోముఖముచే (డప్పు వాయిస్తూ) మధూకరం (బిక్షాటన) చే బిక్ష చేసి భుజిస్తూ, ఈ భౌతిక దేహమును తనకు సంబంధించని వస్తువుగా కలవాడై (దేహమాత్రాన శిష్ఠుడై) ఉంటాడు. దిగంబరుడై ఉంటాడు. కుణపము (మరణించినదానితో సమానము)గా ఈ స్వశరీరమును దర్శిస్తూ ఉంటాడు. జగత్తంతా ఆతనికి స్వశరీరమై భాసిస్తూ ఉంటుంది. |
అవధూతస్త్వనియమః పతితాభిశస్తవర్జనపూర్వకం సర్వవర్ణేష్వజగరవృత్త్యాహారపరః స్వరూపానుసంధానపరః . |
|
[6] అవధూత : అవధూతస్తు అనియమః, పతిత అభిశస్త విసర్జన పూర్వకం, సర్వవర్ణేషు అజగర వృత్త్యా ఆహారపరః । స్వరూప అనుసన్థాన పరః ।। |
(6) అవధూత : ఒక కొండచిలువు (అజగరము) తాను ఆహారంకోసం ఎటూ సంచారం చేయకుండా, తాపత్రయపడకుండా అప్రయత్నంగా తన నోటి వద్దకు వచ్చిన దానిని తింటుంది కదా! అట్లాగే అవధూత కూడా పతితలను, అభిశస్తలను (ఇతరులపై నిందలు మోపు, హింసించు స్వభావులను) వదలి ఇక సర్వవర్ణముల వారు సమర్పించు ఆహారము తీసుకుంటూ ఉంటారు. సర్వదా ఆత్మస్వరూప అనుసంధానపరుడై ఉంటాడు. ఆతనికి అన్యమనునదే ఏదీ ఉండదు. |
జగత్తావదిదం నాహం సవృక్షతృణపర్వతం . యద్బాహ్యం జడమత్యంతం తత్స్యాం కథమహం విభుః .. 13.. |
|
7. సన్న్యాసుల స్వానుభవం :
జగత్ తావత్ ఇదం నాహమ్ (న అహం) స వృక్ష తృణ పర్వతమ్, యత్ బాహ్యం జడం - అత్యన్తం, తత్‌స్యాం కథం అహం విభుః? |
సన్న్యాసి - శబ్దార్ధభావము : కోఽహమ్? ‘‘నేను బాహ్యమున జగత్తులో కళ్లకు కనిపించే చెట్టు, గడ్డి, పర్వతము వంటివాడినా? కానేకాదు. అవన్నీ జడము. నేనో? సర్వమును నియమించు విభుడను. చేతన స్వరూపుడను. సమస్తమును సచేతనముగా చేయుచున్న నేను - తమకు తాముగా ప్రవర్తించలేని చెట్టు, గడ్డి, రాయి, పర్వతము వంటి ఈ జడ జగత్తు ఎట్లా అవుతాను?’’ నేను దృశ్య స్వరూపుడను కాను। |
కాలేనాల్పేన విలయీ దేహో నాహమచేతనః . జడయా కర్ణశష్కుల్యా కల్పమానక్షణస్థయా .. 14.. శూన్యాకృతిః శూన్యభవః శబ్దో నాహమచేతనః . |
|
కాలేన అల్పేన విలయీ దేహో, న-అహమ్ (నాహమ్) అచేతనః। జడయా కర్ణ శష్కుల్యా కల్పమానక్షణస్థయా, శూన్యాకృతిః, శూన్య భవః, శబ్దో నాఽహం అచేతనః। |
అచేతనమై (తనకు తానుగా ప్రవర్తించజాలనిదై), స్వల్పకాలములో నశించబోతూ, కొద్దిక్షణములు మాత్రమే నిలచిఉండే, కర్ణశష్కులితో (చెవిరంధ్రములలో) కల్పించబడిన ఈ భౌతికంగా కనిపిస్తున్న చర్మపు చెవులు నేను కాదు. శూన్యమైన ఆకృతి కలిగియుండి, శూన్యము నుండి పుట్టుచూ అచేతనమైనట్టి ‘శబ్దము’ కూడా - ‘నాఽహమ్’। నేను కాదు. |
త్వచా క్షణవినాశిన్యా ప్రాప్యోఽప్రాప్యోఽయమన్యథా .. 15.. |
|
త్వచా క్షణ వినాశిన్యా ప్రాప్యో అప్రాప్యో అయం అన్యథా। |
క్షణములో జనించి - నశించే ధర్మము గల చర్మము ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా-దీనికి నేను సర్వదా వేరై ఉన్నాను. చర్మము వలె నేను నశించిపోయేవాడినా? కానే కాదు. జడ పదార్థమును కాను. స్పర్శ నా స్వరూపము కాదు. |
చిత్ప్రసాదోపలబ్ధాత్మా స్పర్శో నాహమచేతనః . లబ్ధాత్మా జిహ్వయా తుచ్ఛో లోలయా లోలసత్తయా .. 16.. స్వల్పస్యందో ద్రవ్యనిష్ఠో రసో నాహమచేతనః . |
|
చిత్ ప్రసాద ఉపలబ్ధ ఆత్మా - స్పర్శో. నాహం (నాహమ్) అచేతనః। లబ్ధ ఆత్మా జిహ్వయా మందో లోలయా లోల సత్తయా। స్వల్ప స్యన్దో, ద్రవ్య నిష్ఠో రసో-న అహమ్ (నాహమ్) అచేతనః। |
‘చిత్’ నుండి (కేవలమగు ఎరుక రూపమునుండి) ఉపలబ్దము అగుచున్న (రూపము దిద్దుకొనుచున్న) స్పర్శ నేను కాను. జడమగు స్పర్శవలె అచేతనుడనా? కాను. స్వయం చిత్-చైతన్యమును. మరి నేను రసము (లేక) రుచినా? నాలుకచే మందముగా పొందబడునది, నాలుకపై స్రవించు ద్రవముచే ఏర్పడునది, స్రవించు - స్రవించని స్వల్ప స్పందనచే-పాదార్థ స్పర్శ తోడవుచూ అనుభవముగా అగుచున్నది- అగు ‘రసము’ (రుచి) నేను కాను. అది అచేతనము. నేను సచేతన స్వరూపుడును. రసానుభవియే లేకపోతే రసానుభవమునకు ఉనికి ఎక్కడిది? |
దృశ్యదర్శనయోర్లీనం క్షయిక్షణవినాశినోః .. 17.. కేవలే ద్రష్టరి క్షీణం రూపం నాహమచేతనం . |
|
దృశ్య దర్శనయోః లీనం క్షయి, క్షణ వినాశినోః, కేవలే - ద్రష్టరి క్షీణం రూపం, న అహ(నాహమ్) అచేతనమ్। |
ఇక నేను ‘‘ఈ రూపము’’ నా? కానే కాను. ఎందుకంటే ఈ రూపము’ అనేది ‘‘దృశ్యము- దర్శించటము’’ అనే రెండు కలియు క్షణంలో ఒక మెరుపు వలె మెరిసి మరుక్షణం (ఆ రెండు విడిపోగానే)ఎటో మటుమాయ మగుచూ ఉంటోంది. పైగా ‘రూపము’ అనునది ద్రష్ట యొక్క ‘వీక్షణము’పై ఆధారపడి అనభవమయ్యేది. ద్రష్ట ఒక స్త్రీని - శృంగార రూపము గానో, సోదరీ భావంగానో, మాతృభావంగానో, జగన్మాత భావంగానో భావిస్తూ ఉంటే - అట్లే ఆ రూపము అనుభవమయ్యేది. అనగా రూపము స్వతఃగా జడము. అచేతనమగు రూపము నేనెట్లా అవుతాను? అవను. |
నాసయా గంధజడయా క్షయిణ్యా పరికల్పితః .. 18.. పేలవో నియతాకారో గంధో నాహమచేతనః . |
|
8. నాసయా గంధ జడయా క్షయిణ్యా పరికల్పితః, పేలవో నియత - ఆకారో, గంధో, నాహమ్ అచేతనః। |
ఈ ముక్కు యందు గంధము అనునది వాసన చూడబడు వస్తువుతో క్షణకాలం కలియుటచే ఏర్పడే పరికల్పితమైన అనుభవము. స్వీయ పరికల్పనచే మాత్రమే ఏర్పడునది. నేను ఎప్పుడైనా పరధ్యానంగా ఉంటే ఒకపుష్పమునుండో, మరొక వస్తువునుండో వచ్చి ముక్కుకు చేరిన వాసన-నాకు గంధముగా అనుభవమే కాదు. అనగా ‘గంధము’ అనేది పేలవమైన నియతాకారము కలిగినది. స్వతఃగా నాకు ఏర్పడగలిగేది కాదు. అట్టి అచేతనమగు గంధము ‘నేను’ కాదు. |
నిర్మమోఽమననః శాంతో గతపంచేంద్రియభ్రమః .. 19.. శుద్ధచేతన ఏవాహం కలాకలనవర్జితః . చైత్యవర్జితచిన్మాత్రమహమేషోఽవభాసకః .. 20.. |
|
మరి నేను ఎవ్వరు? నిర్మమో। అమనస్కః। శాన్తో। గత పంచ ఇంద్రియ భ్రమః। ‘‘శుద్ధ చేతన ఏవ’’ అహం, కల-అకలన వర్జితః। చైత్య వర్జిత చిత్ మాత్రమ్ అహం ఏషో అవభాసకః।। |
ఇక నేను ఎవరు? ఎట్టివాడను? ‘‘నాది’’ అనుకొనుటకు మునుముందే ఉన్నవాడమ కాబట్టి నిర్మమోఽహమ్ (మమకార రహితుడను). ఆలోచనలు జడమైయుండగా, ఆలోచన చేయువాడుగా ముందుగానే ఉన్నాను కాబట్టి అమనస్కుడను. ఇంద్రియములను ఉపయోగించువాడను. అంతేగాని ఇంద్రియములకు విషయమైనవాడను కాను. ఇంద్రియ భ్రమలకు అతీతుడను. కల్పన - అకల్పనా రహితుడను. సర్వ చేతనములకు (ఆలోచనల - భౌతికమైన కదలికలకు) మునుముందు వాడను. శుద్ధ చేతన-చిత్ ఆనంద స్వరూపుడను. ఆలోచనలకు అవభాసకుడను. (వెలిగించువాడను). |
సబాహ్యాభ్యంతరవ్యాపీ నిష్కలోఽహం నిరంజనః . నిర్వికల్పచిదాభాస ఏక ఆత్మాస్మి సర్వగః .. 21.. |
|
స-బాహ్య అభ్యన్తర వ్యాపీ। నిష్కళోఽహం నిరంజనః నిర్వికల్ప చిత్ఆభాస ‘ఏక ఆత్మ’ అస్మి సర్వగః।। (ఏకాత్మాస్మి సర్వగః)। |
ఇక్కడి దేహ-మనో-బుద్ధి-చిత్త అహంకార -దృశ్య - మొదలైన సమస్తమునకు బాహ్య అభ్యంతరములలో వ్యాపించి ఉన్నట్టి చైత్యవర్జిత శుద్ధ ‘చిత్’ స్వరూపుడను. కళంక రహితుడను. నిర్మలుడను. నిరంజనుడను. ‘అనేకత్వము’ అనునదే లేనివాడను. ఏకాత్మగా నిర్వికల్పచిత్ స్వరూపుడనై, అంతటా ఈ సమస్తముగా- ప్రతిబింబించుచున్నట్టివాడను. |
మయైవ చేతనేనేమే సర్వే ఘటపటాదయః . సూర్యాంతా అవభాస్యంతే దీపేనేవాత్మతేజసా .. 22.. |
|
మయా ఏవ (మయైవ) చేతనేన ఇమే సర్వే ఘట-పట ఆదయః, సూర్యాన్తా అవభాస్యన్తే దీపేన ఏవ ఆత్మ తేజసా।। |
ఒక దీపము వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో వస్తువులు వాటివాటి ఆకారాలతో సహా కనిపిస్తూ ఉంటాయికదా! అట్లాగే, నా యొక్క చైతన్య ఆత్మతేజస్సు యొక్క ప్రసరణ చేతనే కుండ, వస్త్రము దగ్గిరనుండి సూర్యగోళము వరకు సర్వజగత్ వస్తు సముదాయము వెలుగును పొందినవై, ప్రకాశమానమగుచున్నాయి. (Being enlightened) |
మయైవైతాః స్ఫురంతీహ విచిత్రేంద్రియవృత్తయః . తేజసాంతఃప్రకాశేన యథాగ్నికణపంక్తయః .. 23.. అనంతానందసంభోగా పరోపశమశాలినీ . శుద్ధేయం చిన్మయీ దృష్టిర్జయత్యఖిలదృష్టిషు .. 24.. |
|
మయైవ (మయా ఏవ) ఏతాః స్ఫురన్తి ఇహ విచిత్ర ఇంద్రియ వృత్తయః। తేజసాన్తః ప్రకాశేన యథా, అగ్ని కణ పంఙ్క్తయః అనన్త ఆనందసంభోగా పర ఉపశమశాలినీ, శుద్ధేయం చిన్మయీ దృష్టిః జయతి అఖిల దృష్టిషు। |
అగ్నిలోంచి అగ్నికణములు (విస్ఫులింగములు) బయల్వెడలుచూ ఉంటాయి కదా! అదేవిధంగా మమాత్మయొక్క అంతః ప్రకాశము నుండి ఈ చిత్ర-విచిత్ర శబ్ద స్పర్శ రూప రస గంధ ఇంద్రియ వృత్తులన్నీ (All Kinds of Avocations) బయల్వెడలుచున్నాయి. అనంత- ఆనంద - సంభోగ స్వభావి అగు నా యొక్క ఈ చిన్మయీ దృష్టి సర్వ భోగములను తనయందు ఉపశమింపజేయగలుగునట్టిది. సమస్తమైన తదితర దృష్టులను కూడా నా యొక్క ఈ ఆత్మసందర్శన దృష్టి ఆక్రమించి, తనయందు లీనము చేసుకొనుచున్నది. |
సర్వభావాంతరస్థాయ చైత్యముక్తచిదాత్మనే . ప్రత్యక్చైతన్యరూపాయ మహ్యమేవ నమో నమః .. 25.. |
|
సర్వభావ-అన్తరస్థాయ చైత్యముక్త చిత్ ఆత్మనే, ప్రత్యక్ చైతన్య రూపాయ, మహ్యం ఏవ నమోనమః।। |
నా స్వరూపము సమస్త భావములకు అంతరమున తేజో విభవమై ఏర్పడి ఉన్నట్టిది. సర్వ కదలికలకు (చేతనములకు) ఆవల ముక్తాత్మగా ఉన్నట్టిది. సర్వము తానే అయి, సర్వమునకు వేరై ఉన్నట్టిది. కేవలాత్మ స్వరూపము అయినట్టి నాకు నేనే నమస్కరిస్తున్నాను. మహ్యం ఏవ నమో నమః।। |
విచిత్రాః శక్తయః స్వచ్ఛాః సమా యా నిర్వికారయా . చితా క్రియంతే సమయా కలాకలనముక్తయా .. 26.. కాలత్రయముపేక్షిత్ర్యా హీనాయాశ్చైత్యబంధనైః . |
|
9. విచిత్రాః శక్తయః స్వచ్ఛాః సమా యా నిర్వికారయా, చితా క్రియన్తే సమయా కల-అకలన ముక్తయా, కాలత్రయమ్ ఉపేక్షిత్ర్యా హీనాయాః చైత్య బంధనైః।। |
నాయొక్క చిదాత్మ విచిత్రమైన శక్తితో కూడుకొని, స్వచ్ఛమై, నిర్వికారమై యుండియే, తన యొక్క మాయాశక్తిచే సారూప్యముతో కూడిన సందర్భములను కల్పించుకొని ఆస్వాదించుచున్నది. అట్టి చిత్తు కలన-అకలనములకు (మాయాకల్పన- అకల్పనములకు) అతీతమై, త్రికాలములను ఉపేక్షించినదై ఉంటోంది. చైత్య బంధము (తెలియబడుచున్నదానిచే తెచ్చిపెట్టుకొంటున్నబంధము)నకు వేరై, అతీతమైయ్యే ఉంటోంది. నేను అపేక్షకు ఆవలగల ఉపేక్ష స్వరూపుడను. |
చితశ్చైత్యముపేక్షిత్ర్యాః సమతైవావశిష్యతే .. 27.. సా హి వాచామగమ్యత్వాదసత్తామివ శాశ్వతీం . |
|
చితః చైత్యం ఉపేక్షిత్ర్యాః సమతైవ అవశిష్యతే। సా హి వాచామ్ అగమ్యత్వాత్ అసత్తామ్ ఇవ శాశ్వతీమ్। |
తెలియబడుచున్నదంతా ఉపేక్షిస్తూ ఉన్నదై చిత్తు సర్వదా సమ స్వరూపముగా శేషించియే ఉన్నది. అయితే అట్టి నిర్వికారము, స్వచ్ఛము అగు ఆత్మ-వాక్కుతో చెప్పజాలనిది. ఊహించుటకు అలవికాని విధంగా - తన వెంట ‘అసత్తు’ను అనాదిగా కలిగియున్నది. శాశ్వతమగు ఆత్మ అశాశ్వతమగు అసత్తును సర్వదా వెంటనిడుకొనియే, (1) కేవలము (2) కల్పనలు - అను విడరాని జంటగా ఏర్పడి ఉంటోంది. |
నైరాత్మసిద్ధాత్మదశాముపయాతైవ శిష్యతే .. 28.. ఈహానీహామయైరంతర్యా చిదావలితా మలైః . సా చిన్నోత్పాదితుం శక్తా పాశబద్ధేవ పక్షిణీ .. 29.. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన జంతవః . |
|
నైరాత్మ్య సిద్ధాన్త దశాం ఉపయాత ఏవ శిష్యతే। ఈహ-అనీహా మయైః, అన్తః యాచితా వలితా మలైః। సాచిత్ న ఉత్పాదితుం శక్తా, పాశ బద్ధేన పక్షిణీ। ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన జన్తవః। |
కేవలమగు ఆత్మ తనకు తానే విచిత్రంగా ‘‘ఆత్మ ఎక్కడున్నది? లేదు. ఈ దృశ్య జగత్తే ఉన్నది’’ - అను రూపముగా నైరాత్మ సిద్ధాంత దశను తెచ్చిపెట్టుకొంటోంది. క్రమంగా ‘‘ఇవికావాలి - అవివద్దు’’ అనురూపములతో కూడిన ‘ఈహ- అనీహ - మయములైన అన్తఃమలినములను పొందుచున్నది. వాటిచే కప్పబడు చున్నది. మహత్తరమగు చిత్తు - త్రాడుచే బంధింపబడి, ఆకాశములో ఎగరలేని పక్షివలె, ఇచ్ఛాద్వేష ద్వంద్వ మోహములను కల్పించుకొని అనేక జన్మ-జీవన్ - మరణ దశలను పొందుచూ అనేక జీవుల రూపమును పొందుచున్నది. |
ధరావివరమగ్నానాం కీటానాం సమతాం గతాః .. 30.. ఆత్మనేఽస్తు నమో మహ్యమవిచ్ఛిన్నచిదాత్మనే . |
|
ధరా వివర మగ్నానాం కీటానాం సమతాం గతాః ఆత్మనే అస్తు నమో మహ్యం అవిచ్ఛిన్న చిదాత్మనే।। |
భూమిపై ఆహారము కోసము పరుగులిడే కీటకముతో సమానము అగుచున్నది. అయితే ఆత్మ సర్వదా యథాతథము. సోఽహమ్ నమః। ఏ అవిచ్ఛిన్న చిదాత్మ అయితే సర్వదా ‘‘నేను’’ - అయి ఉన్నానో అట్టి నాయొక్క కేవలాత్మ స్వరూపమునకు నమో నమః। నా సర్వాతీతాత్మకు నా నమస్కారములు। |
పరామృష్టోఽస్మి లబ్ధోఽస్మి ప్రోదితోఽస్మ్యచిరాదహం . ఉద్ధృతోఽస్మి వికల్పేభ్యో యోఽస్మి సోఽస్మి నమోఽస్తు తే .. 31.. తుభ్యం మహ్యమనంతాయ మహ్యం తుభ్యం చిదాత్మనే . |
|
పరామృష్టోఽస్మి। లబ్ధోఽస్మి। ప్రోదితోఽస్మి అచిరాత్ అహమ్। ‘ఉద్ధృతోఽస్మి’। వికల్పేభ్యో యోఽస్మి సోఽస్మి నమోస్తుతే। తుభ్యం మహ్యం అనన్తాయ। మహ్యం తుభ్యం చిదాత్మనే (చిత్ ఆత్మనే)।। |
సోఽహమ్ తత్త్వమ్ నమః। విచారణ - వివేచన చేయువారికి నేను పరస్వరూపుడనై తెలియవచ్చువాడను. ఈ సమస్తము నాకు ఉపలబ్ధమైయే ఉండటం చేత పూర్ణ-లబ్ధుడను. (సమస్త దృశ్యము నాకు లాభించినదై యున్నది). అచిరకాలంలో ప్రయత్నశీలత్వముచే పూర్ణుడగు నేను పూర్ణత్వానుభవుడనై గమనిస్తున్నాను. సర్వత్రా ఉద్ధృతడను నేనే। నాచేతనే ఉధృతంగా (like a speedy flow) సర్వే సర్వత్రా ఇదంతా ‘పొందబడుచున్నది-నేను పొందుచూ ఉన్నది కూడా నన్నే। సంకల్ప వికల్పములన్నీ నానుండే ఉద్ధృతమై వ్యక్తీకరణమగు చున్నాయి. నేను మొట్టమొదట ఎవ్వడను (కేవలాత్ముడను) అయి ఉన్నానో, ఇప్పటికీ, ఎప్పటికీ అదియే అయిఉన్నాను. సర్వదా ఏకము-అనంతము అగు ఆత్మపురుషుడను. ఈ సమస్తముగా ఉన్నది నేనే. ఇది ఈవిధంగా దర్శిస్తూ ఉన్నది నేనే। దర్శించబడుచున్నది నేనే. దర్శనము నా విన్యాసమే. తత్ త్వమ్! అదియే నీవు। సోఽహమ్। నేనూ అదియే! నీవు నేను కూడా అనన్తస్వరూపులము. నేను నీవు కూడా చిదాత్మ స్వరూపులము. అట్టి నేనైన నీకు, నీవైన నాకు నమస్కారము. నీవైన - నేనైన ‘ఆత్మ’కు నమో నవ |
నమస్తుభ్యం పరేశాయ నమో మహ్యం శివాయ చ .. 32.. తిష్ఠన్నపి హి నాసీనో గచ్ఛన్నపి న గచ్ఛతి . |
|
నమస్తుభ్యం పర ఈశాయ। నమో మహ్యం శివాయ చ। తిష్ఠన్ అపి హి న అసీనో। గచ్ఛన్ అపి న గచ్ఛతి।। |
ఏ పరము ఈ సమస్తముగా విస్తరించినదై ఉన్నదో - అట్టి పరేశ్వరుడవగు సర్వదా-అయి ఉన్న నీకు నా నమస్కారము। ఈ సమస్త ‘‘జీవుల సహజానంద స్వరూప శివుడను’’ అగు నాకు నా నమస్కారము. అంతటా ఏర్పడి ఉండికూడా ఎక్కడా కూర్చుని ఉండని, సర్వత్రా సంచారములు చేస్తూ కూడా ఎక్కడికీ వెళ్ళుచుండని నీ-నా ఏకాత్మకు నమస్కారము. నీవు-నేను అఖండాత్మ స్వరూపులమే। |
శాంతోఽపి వ్యవహారస్థః కుర్వన్నపి న లిప్యతే .. 33.. సులభశ్చాయమత్యంతం సుజ్ఞేయశ్చాప్తబంధువత్ . శరీరపద్మకుహరే సర్వేషామేవ షట్పదః .. 34.. |
|
10. ‘‘శాన్తోఽపి’’ వ్యవహారస్థః। ‘‘కుర్వన్’’ అపి న లిప్యతే। సులభశ్చ అయం అత్యన్తం, సుజ్ఞేయశ్చ ఆప్తబంధువత్। శరీర పద్మకుహరే సర్వేషాం ఏవ షట్పదః।। |
ఆత్మ = పరమశాంతమైనప్పటికీ సమస్త వ్యవహారములందు వ్యవహరించునది. సమస్త కర్మలు నిర్వర్తిస్తూ కూడా, వాటి యొక్క శుభా శుభ ఫలములు అంటజాలనిది. అట్టి, ఆత్మపురుష భగవానుడనగు నేను అన్యమైన విషయాల కంటే అత్యంత సులభ సాధ్యుడను. ఆత్మబంధువువలె తేలికగా తెలియబడువాడను. సమస్త జీవుల హృదయపద్మకుహరములో తుమ్మెద వలె సదా సంచరించువాడు. అట్టి నేను ‘ఆత్మ’నే గాని, ‘దేహము’ను కాను. |
న మే భోగస్థితౌ వాంఛా న మే భోగవిసర్జనే . యదాయాతి తదాయాతు యత్ప్రయాతి ప్రయాతు తత్ .. 35.. |
|
న మే భోగ స్థితౌ వాంఛా। న మే భోగ విసర్జనే। యదా యాతి, తదా యాతు। యత్ ప్రయాతి, ప్రయాతు తత్ |
అట్టి కేవలాత్మ స్వరూపుడనగు నాకు - ఎటువంటి భోగస్థితులపై కూడా ‘‘కావాలి। లేకుంటే ఎట్లా?’’ అనే వాంఛ లేదు. - అట్లాగే ‘‘భోగములు విసర్జించాలి. అప్పటికి కానీ మోక్షములేదు’’- అనబడు విసర్జించాలనే అగత్యము కూడా లేదు. నాయొక్క మోక్షానుభవము కొరకై నేను ఏదీ వదలఖర్లేదు. పట్టుకోవలసిన పని లేదు. ఈ (దేహ దృశ్య ఇత్యాదులతో సహా) ఏది వస్తే అట్లాగే రానీ! ఏది పోతే అది అట్లే పోనీ! నా యొక్క ఆత్మత్వమునకు లోటు ఏమున్నది? |
మనసా మనసి చ్ఛిన్నే నిరహంకారం గతే . భావేన గలితే భావే స్వస్థస్తిష్ఠామి కేవలః .. 36.. నిర్భావం నిరహంకారం నిర్మనస్కమనీహితం . కేవలాస్పందశుద్ధాత్మన్యేవ తిష్ఠతి మే రిపుః .. 37.. |
|
మనసా మనసిః ఛిన్నే, నిరహంకారతాం గతే। భావేన గళితే భావే, స్వస్థః తిష్ఠామి కేవలః। నిర్భావం నిరహంకార నిర్మనస్కం అనీహితమ్ కేవల ఆనన్ద శుద్ధాత్మన్యేవ తిష్ఠతి మే రిపుః।। |
మనస్సు చేత మనస్సు ఛిన్నమగుచుండగా, అది నాపట్ల నిరహంకారత్వము స్వాభావికంగానే సంతరించుకుంటోంది. భావముచే భావము భావరాహిత్యము పొందుచున్నది. నేను సర్వదా సుస్వస్థత యందు తిష్ఠితుడను, కేవలుడను అయి ఉంటున్నాను. నన్ను శత్రుభావముతో చూచువాడు ఎవరైనా ఉంటే,.. ఆతడు కూడా ‘‘నిర్భావ-నిరహంకార - నిర్మనస్క- (కోరికలకు ఆవల) అనీహిత - కేవల ఆనన్ద శుద్ధాత్మత్వము’’ నందే సు-తిష్ఠితుడు అయి ఉన్నాడు. ఆత్మగానే ఆతనిని సందర్శించుచున్నాను. ఆతనితో సహా నాకు కనబడుచున్న సమస్త జీవులుకూడా ‘‘నాయందు నేనే’’ అయి ఉన్న నా రూపములే. |
తృష్ణారజ్జుగణం ఛిత్వా మచ్ఛరీరకపంజరాత్ . న జానే క్వ గతోడ్డీయ నిరహంకారపక్షిణీ .. 38.. |
|
తృష్ణా రజ్జు గణం ఛిత్వా, మత్ శరీరక పంజరాత్, న జానే క్వ గత ఉడ్డీయ నిరహంకార పక్షిణీ। |
పంజరము తెరువగానే అందులో బంధించబడిన పక్షి ఆ పంజరము నుండి బయల్వెడలి ఎటో ఎగిరిపోతుంది కదా! అట్లాగే నాఈ శరీరము నుండి ‘అహంకారము’ అనే పక్షి - ‘తృష్ణ’ అనే త్రాళ్ళను త్రెంచివేసుకొని, ఇక ఆపై నిరహంకారము సంతరించుకొని ఎటు ఎగిరిపోతోందో నాకే తెలియదు. నేను చెప్పలేకపోతున్నాను. |
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే . యః సమః సర్వభూతేషు జీవితం తస్య శోభతే .. 39.. |
|
‘‘జీవితం తస్య శోభతే’’ యస్య నాహంకృతో భావో, బుద్ధిః యస్య న లిప్యతే, యః సమః సర్వభూతేషు, జీవితం తస్య శోభతే। |
‘‘జీవితం తస్య శోభతే’’ ‘‘నేను దేనికీ కర్తను కాదు’’ అనునదే ‘‘నిరహం’’భావన. ఎవ్వని యొక్క భావన నిరహంకారమై ఉంటుందో, ఎవ్వని బుద్ధి తన దోషములతో కూడిన సమన్వయములను త్యజించి నిర్మలత్వము సంతరించుకుంటుందో, ఎవ్వరి అనుభూతి సర్వజీవులందు సమదృష్టిని సముపార్జించుకుంటుందో- ఆతని జీవితమే శోభాయమానమై ఉంటుంది. |
యోఽన్తఃశీతలయా బుద్ధ్యా రాగద్వేషవిముక్తయా . సాక్షివత్పశ్యతీదం హి జీవితం తస్య శోభతే .. 40.. |
|
11. యో అన్తః శీతలయా బుద్ధ్యా రాగ ద్వేష విముక్తయా, సాక్షివత్ పశ్యతి ఇదం హి, జీవితం తస్య శోభతే। |
ఎవరి బుద్ధి అంతర్గతంగా పరమశీతలత్వము (peace and cool at its core) సంతరించుకొని, రాగ-ద్వేష భావములను త్యజించినదై, ఈ సమస్తమును సాక్షిగా చూడగలుగుచూ ఉంటుందో, ఆతని జీవితమే శోభించుచున్నదై ఉంటోంది. |
యేన సమ్యక్పరిజ్ఞాయ హేయోపాదేయముజ్ఝతా . చిత్తస్యాంతేఽర్పితం చిత్తం జీవితం తస్య శోభతే .. 41.. |
|
యేన సమ్యక్ పరిజ్ఞాయ హేయ - ఉపాదేయమ్ ఉజ్ఘతా, చిత్తస్య అన్తే అర్పితం చిత్తం జీవితం తస్య శోభతే। |
ఎవ్వని చిత్తమైతే హేయ-ఉపాదేయములను (వదలవలసినవి- పట్టుకోవలసినవి) వదలినదై సమ్యక్ పరిజ్ఞానముతో (Looking at Equality every where) - చిత్తమునకు ఆవల ప్రకాశమగుచున్న చిత్‌కు సమర్పితమై ఉంటోందో, అట్టివాని జీవితమే శోభాయమానము. |
గ్రాహ్యగ్రాహకసంబంధే క్షీణే శాంతిరుదేత్యలం . స్థితిమభ్యాగతా శాంతిర్మోక్షనామాభిధీయతే .. 42.. భ్రష్టబీజోపమా భూయో జన్మాంకుఅరవివర్జితా . హృది జీవద్విముక్తానాం శుద్ధా భవతి వాసనా .. 43.. పావనీ పరమోదారా శుద్ధసత్త్వానుపాతినీ . |
|
గ్రాహ్య గ్రాహక సంబంధే క్షీణే, శాన్తిః ఉదేతి అలమ్, స్థితిం అభ్యాగతా శాన్తిః, ‘మోక్ష’- నామ్న అభిధీయతే। భ్రష్ట బీజ ఉపమా భూయో జన్మ అంకుర వివర్జితా। హృది జీవత్ విముక్తానాం శుద్ధా భవతి వాసనా। పావనీ పరమోదారా శుద్ధ సత్త్వానుపాతినీ। (‘‘శుద్ధ సత్త్వ’’ అనుపాతినీ।) |
‘‘గ్రహించువాడు - గ్రహించబడునది’’ ఈ రెండింటి పరస్పర సంబంధము ఎవని పట్ల క్షీణించుచూ ఉంటుందో, అట్టివానికి స్వాభావికంగానే శాన్తి లభిస్తూ ఉంటుంది. అట్టి శాంతి సిద్ధించిన స్థితియే ‘మోక్షము’- అను పేరుతో చెప్పబడుతోంది. ‘‘ఈ సమస్తము మమాత్మయే’’ అను ధ్యాసచే - ఇదంతా ఆత్మగా అనన్య ధ్యానము చేయు యోగి యొక్క హృదయములో - వేయించబడిన బీజములలోని అంకురము వలె - పునః జన్మ బీజములు ఉండవు. పునర్జన్మ వాసనా రహిత హృదయము శుద్ధము, పావనము, పరమ ఉదారము, శుద్ధసత్వముగా రూపుదిద్దుకొంటోంది. |
ఆత్మధ్యానమయీ నిత్యా సుషుప్తిస్థేవ తిష్ఠతి .. 44.. చేతనం చిత్తరిక్తం హి ప్రత్యక్చేతనముచ్యతే . |
|
ఆత్మధ్యానమయీ నిత్యా సుషుప్తిస్థ ఏవ తిష్ఠతి। చేతనం చిత్తరిక్తం హి ‘‘ప్రత్యక్ చేతనమ్’’ ఉచ్యతే। |
ఆత్మధ్యానమయి - అయినట్టి ఆత్మయోగి యొక్క చిత్తము-సమస్త ప్రాపంచక విషయముల పట్ల నిత్యము సుషుప్తి (గాఢనిద్ర) కలిగిన వాని వలె ఉంటుంది. సమస్త ప్రాపంచక విషయములపట్ల ‘మౌనము’, ఆత్మ స్వరూపము పట్ల మాత్రమే ‘ధ్యానము’ కలిగి ఉంటుంది. చిత్తరహితమైన (అతిరిక్తమైన) చేతనము (Functioning) ను ‘‘ప్రత్యక్ చేతనము’’ - అని అంటారు. |
నిర్మనస్కస్వభావత్వాన్న తత్ర కలనామలం .. 45.. సా సత్యతా సా శివతా సావస్థా పారమాత్మికీ . సర్వజ్ఞతా సా సంతృప్తిర్నతు యత్ర మనః క్షతం .. 46.. |
|
నిర్మనస్క స్వభావత్వాత్, న తత్ర కలన - అమలమ్, సా సత్యతా, సా శివతా, సావస్థా పారమార్థికీ, సర్వజ్ఞతా సా సంతృప్తిః నను యత్ర మనః క్షతమ్। |
అట్టి ప్రత్యేక చేతనము - స్వభావతః ఎట్టి కలనము (దోషము) లేకుండుటచే ‘నిర్మనస్కము’ అగుచున్నది. ఎక్కడైతే ఆత్మకు అన్యమైన మననము క్షయిస్తుందో, → అదియే సత్యత్వము. సత్యము. → అదియే శివత్వము. అదియే పరమార్థ సంబంధమైన అవస్థ. → అదియే స్వాభావికమగు సంతృప్తి రూపము. |
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి . నిరస్తమననానందః సంవిన్మాత్రపరోఽస్మ్యహం .. 47.. |
|
ప్రలపన్, విసృజన్ గృహణాన్, ఉన్మిషన్ నిమిషన్ అపి, నిరస్త మనన - ఆనన్దః సంవిత్-మాత్ర పరోఽస్మి అహమ్।। |
ప్రలాపములు ఆడుచున్నప్పుడు, (మాట్లాడుచున్నప్పుడు), దేనినైనా విసర్జించు చున్నప్పుడు, ఏదైనా గ్రహించుచున్నప్పుడు, కనులు మూయునపుడు, తెరచునప్పుడు కూడా - తరంగరహిత జలమువలె (అన్యత్వ మననము లయించినప్పుడు శేషించు) - సర్వదా నేను సంవిత్ (సత్-విత్) మాత్ర కేవలీ స్వరూపుడను. |
మలం సంవేద్యముత్సృజ్య మనో నిర్మూలయన్పరం . ఆశాపాశానలం ఛిత్త్వా సంవిన్మాత్రపరోఽస్మ్యహం .. 48.. |
|
12. మలం సంవేద్యం ఉత్సృజ్య, మనో నిర్మూలయన్ పరమ్, ఆశా పాశ మలం, ఛిత్వా ‘‘సంవిత్ మాత్ర పరోఽస్మి అహమ్।’’ |
సత్-విత్‌మాత్ర నిరామయుడను మనస్సు యొక్క - (‘‘తెలియబడుచున్న అనేక భేదములతో కూడిన’’ దృశ్య జగత్తు అనబడే) ‘‘సంవేద్య మలము’’ను పూర్తిగా వదలి, ‘మనస్సు’ అనబడుదానినే నిర్మూలించుకొని, ఆశాపాశ దోషములను ఖండించి వేసుకొని-సంవిత్ మాత్రపరుడనై ఉంటున్నాను. నా సహజరూపమైన ‘‘కేవలమైన నేను’’ను తిరిగి యథాతథంగా ధారణ చేయుచున్నాను. |
అశుభాశుభసంకల్పః సంశాంతోఽస్మి నిరామయః . |
|
అశుభాశుభ (శుభాశుభ) సంకల్పః సంశాన్తోఽస్మి నిరామయః |
శుభాశుభ సంకల్పములన్నీ తొలగగా, నా యొక్క ‘నిరామయత్వము’ యొక్క స్వానుభవము నందు సశాంతించినవాడనై ఉంటున్నాను. |
నష్టేష్టానిష్టకలనః సంమాత్రపరోస్మ్యహం .. 49.. ఆత్మతాపరతే త్యక్త్వా నిర్విభాగో జగత్స్థితౌ . వజ్రస్తంభవదాత్మానమవలంబ్య స్థిరోఽస్మ్యహం .. 50.. నిర్మలాయాం నిరాశాయాం స్వసంవిత్తౌ స్థితోఽస్మ్యహం . |
|
నష్ట ఇష్ట-అనిష్ట కలనః సంవిత్ మాత్రపరోఽస్మి అహమ్। ఆత్మతా పరతే త్యక్త్వా నిర్విభాగో జగత్ స్థితౌ, వజ్ర స్తంభవత్ ఆత్మానం అవలంబ్య స్థిరోస్మి అహమ్। నిర్మలాయాం నిరాశాయాం స్వ సంవిత్తౌ స్థితోఽస్మ్యహమ్।। |
‘‘దీనివలన నష్టము. దానివలన లాభము’’, ‘‘ఇది ఇష్టము-అది కాదు’’ - అను మురికిని శుభ్రము చేసుకొని సంవిత్ మాత్రపరుడనై ప్రకాశిస్తున్నాను. ‘‘ఆత్మత్వము - ఆత్మకు వేరైనది’’ అనే భేదమంతా వదలి, జగత్ యొక్క ప్రదర్శనము నందు విభాగరహితుడనై, జగత్ ఆత్మనై ఉన్నాను. నిర్మలుడనై, ఆశలన్నీ జయించి ఉన్నవాడనై - ‘ఆత్మ’ను అవలంబించి వజ్రము స్థంభము వలె స్థిరుడనై ఉంటున్నాను. |
ఈహితానీహితైర్ముక్తో హేయోపాదేయవర్జితః .. 51.. కదాంతస్తోషమేష్యామి స్వప్రకాశపదే స్థితః . |
|
ఈహితాని - అనీహితైః ముక్తో, హేయ-ఉపాదేయ వర్జితః, కదా అన్తస్తోషమ్ ఈష్యామి- స్వ-ప్రకాశపదే స్థితః? |
పైవిధంగా నేను ఎల్లప్పుడు అభ్యాసము చేస్తున్నాను. ఈ విధంగా అభ్యాసము చేయుచుండగా ఎప్పుడు నిశ్చల-నిశ్చయ పూర్ణానందు డనగుదునో కదా? కోరుకునే-కోరుకోని వాటి నుండి విముక్తుడనై, - హేయ (విడవ వలసినవి) - ఉపాదేయములు (స్వీకరించవలసినవి) - అనే, వ్యవహారమంతా వర్జించిన వాడనై, స్వయంప్రకాశమునందు సంస్థితుడనై, ఎప్పుడు అంతః సంతోషిని అవుతానో కదా? |
కదోపశాంతమననో ధరణీధరకందరే .. 52.. సమేష్యామి శిలాసామ్యం నిర్వికల్పసమాధినా . నిరంశధ్యానవిశ్రాంతిమూకస్య మమ మస్తకే .. 53.. |
|
కథా ఉపశాన్త మనవో, ధరణీ ధర కోటరే, సమేష్యామి శిలో సామ్యం, నిర్వికల్ప సమాధినా, నిరంశ ధ్యాన విక్రాంతిః మూకస్య మమ మస్తకే? |
ఎప్పుడు కొండగుహలోని ఒక శిలవలె నా మనస్సు ఉపశాన్తిస్తుందో? రాజు కిరీటము చివర (సహస్రారము నందు) ప్రవేసించి నిర్వికల్ప సమాధి నిష్టుడనై అంశ రహితమగు ధ్యానము (కేవలధ్యానము)ను ఎప్పుడు సిద్ధించుకుంటానో? నేను పరమ ధ్యాన విశ్రాంతిని ఆశ్రయిస్తూ ఉండగా- |
కదా తార్ణం కరిష్యంతి కులాయం వనపుత్రికాః . సంకల్పపాదపం తృష్ణాలతం ఛిత్త్వా మనోవనం .. 54.. వితతాం భువమాసాద్య విహరాభి యథాసుఖం . |
|
కదా తార్ణన్ కరిష్యన్తి కులాయం వనపుత్రికాః, సంకల్ప పాదపం తృష్ణా లతం ఛిత్త్వా వనోపమమ్, వితతాం భువమ్ ఆసాద్య విహరామి యథా సుఖమ్? |
- జగత్తును ఏమరచుటచే నా తలపై ఎప్పుడు కొండ ఈగలు - (ఇది కదలిక లేని స్థలం కదా అని తలచి) - హాయిగా గూడుకట్టుకుంటాయో కదా! ‘సంకల్పము’ అను నా హృదయములోని వృక్షము, -ఎన్నడు ‘తృష్ణ’ అనే లతల సమూహముతో సహా ఖండించబడగా - హృదయ వనములో ఖాళీ అయిన ప్రదేశములో కేవలాత్మనుభవము నిర్దోషంగా, నిర్వికారంగా ఎప్పుడు విస్తారమవుతుందో మరి? నా హృదయము ‘ప్రశాంతము’ తో విస్తారము పొందినదై నాకు నాకే విహార భూమిగా అవుతుందో కదా? ఆత్మభూమియే నా స్వాభావికమగు పుట్టినిల్లు. |
పదం తదను యాతోఽస్మి కేవలోఽస్మి జయామ్యహం .. 55.. నిర్వాణోఽస్మి నిరీహోఽస్మి నిరంశోఽస్మి నిరీప్సితః . |
|
కేవలోఽస్మి జయామి అహమ్। నిర్వాణోఽస్మి। నిరీహోఽస్మి। నిరంశోఽస్మి నిరీప్సితః। |
(సర్వకోరికలు జయించిన) నిరీహుడను। (జీవాత్మ, జగత్తులు మొదలైన అంశలు లేనట్టి) నిరంశుడను. (నెరవేరవలసినదేదీ క్రొత్తగా లేనట్టి) నిరీప్సితుడను। |
స్వచ్ఛతోర్జితతా సత్తా హృద్యతా సత్యతా జ్ఞతా .. 56.. ఆనందితోపశమతా సదా ప్రముదితోదితా . పూర్ణతోదారతా సత్యా కాంతిసత్తా సదైకతా .. 57.. ఇత్యేవం చింతయన్భిక్షుః స్వరూపస్థితిమంజసా . నిర్వికల్పస్వరూపజ్ఞో నిర్వికల్పో బభూవ హ .. 58.. |
|
ఆనందితా, ఉపశమతా, సదా ప్రముదితోదితా, పూర్ణతా, ఉదారతా, సత్యా, శాన్తి సత్తా సదా ఏకతా।। - ఇత్యేవం (ఇతి ఏవం) చింతయన్ భిక్షుః స్వరూప స్థితిమంజసా, నిర్వికల్ప స్వరూపజ్ఞో, నిర్వికల్పో బభూవహ।। |
|
ఆతురో జీవతి చేత్క్రమసంన్యాసః కర్తవ్యః . |
|
|
|
న శూద్రస్త్రీపతితోదక్యా సంభాషణం . న యతేర్దేవపూజనోత్సవదర్శనం . తస్మాన్న సంన్యాసిన ఏష లోకః . |
|
న యతేః దేవ పూజన ఉత్సవ దర్శనమ్। తస్మాన్ న సన్న్యాసం ఏషలోకః। |
దేవతా పూజలను, ఉత్సవ దర్శనములను చేయరు. ‘‘లోకములో సన్న్యాసి ఉండడు. సన్న్యాసిలో లోకముండదు’’ - అని చెప్పబడుతోంది. |
ఆతురకుటీచకయోర్భూలోకభువర్లోకౌ . బహూదకస్య స్వర్గలోకః . హంసస్య తపోలోకః . పరమహంసస్య సత్యలోకః . తురీయాతీతావధూతయోః స్వాత్మన్యేవ కైవల్యం స్వరూపానుసంధానేన భ్రమరకీటన్యాయవత్ . |
|
ఆతుర కుటీచకయోః భూలోక, భువర్లోకౌ। బహూదకస్య స్వర్గలోకః। హంసస్య తపోలోకః పరమ హంసస్య సత్య లోకః। తురీయ అతీత అవధూతయోః, స్వాత్మన్యేవ (స్వ-ఆత్మని-ఏవ) కైవల్యమ్, ‘‘స్వరూప అనుసంధానేన’’ భ్రమర కీటక న్యాయవత్।। |
- ఆతుర, కుటీచక సన్న్యాసులకు ఉత్తరోత్తరములు భూ-భువర్లోకములు. -బహూదకులకు- స్వర్గలోకము. - హంస యోగులకు తపోలోకము. - పరమ హంసలకు సత్యలోకము. - తురీయాతీత, అవధూతలకు స్వాత్మస్థానము. → ఈ విధంగా ‘భ్రమర కీటకన్యాయము’ వలె స్వరూప అనుసంధానము వలన వీరందరికీ కైవల్యము రూపుదిద్దుకొనుచున్నది. |
స్వరూపానుసంధానవ్యతిరిక్తాన్యశాస్త్రాభ్యాస ఉష్ట్రకుంకుమభారవద్వ్యర్థః . |
|
14. స్వరూప అనుసంధాన వ్యతిరిక్త అన్య శాస్త్ర అభ్యాసైః ఉష్ట్ర కుంకుమ భారవత్ వ్యర్ధతా। |
స్వరూప అనుసంధానమునకు వేరైన, వ్యతిరిక్తమైన అన్యశాస్త్ర అభ్యాసములు యతి - ఆశ్రయించడు. అన్యోపాసనయందు పరిమితుడై ఉంటే (శాస్త్రజ్ఞానము ఆత్మానుభవమునకు దారితీయకుంటే) - అది ‘‘ఒక గాడిద కుంకుమపువ్వును మోస్తూ కూడా, దాని సువాసన ఇత్యాది ప్రయోజనము ఆ గాడిద పొందలేకపోవటము’’ - వంటిది. |
న యోగశాస్త్రప్రవృత్తిః . న సాంఖ్యశాస్త్రాభ్యాసః . న మంత్రతంత్రవ్యాపారః . నేతరశాస్త్రప్రవృత్తిర్యతేరస్తి . అస్తి చేచ్ఛవాలంకారవ- త్కర్మాచర విద్యాదూరః . న పరివ్రాణ్నామసంకీర్తనపరో |
|
న యోగ శాస్త్ర ప్రవృత్తిః, న సాంఖ్య శాస్త్ర అభ్యాసో న మంత్ర తంత్ర వ్యాపారో, న ఇతర శాస్త్ర ప్రవృత్తిః యతేః అస్తి। అస్తి చేత్, శవాలంకారవత్। |
యతియొక్క దృష్టిలో - యోగశాస్త్ర ప్రవృత్తి గాని, సాంఖ్యశాస్త్ర అభ్యాసము గాని, మంత్ర తంత్ర వ్యవహారములుగాని, (పరమాత్మను అన్యముగా వర్ణించు) అన్యశాస్త్ర పాండిత్య ప్రవృత్తులు గాని-పరమాశయము కాదు. ఒకవేళ ‘అన్యముగా’ చెప్పు (లేక) అనన్యమును ఏమరువజేయు విశేషములు తారసబడుట జరుగుతూ ఉంటే - అవన్నీ శరీరమునకు చేసే అలంకారముల వంటివే అను భావన కలిగి వారై ఉంటారు. ఆత్మానుభవము సమక్షములో అవి పరిగణకు రానివిగా చూస్తారు. |
కర్మ ఆచార విద్యాదూరః। న పరివ్రాట్ నామ సంకీర్తన పరః। |
పరివ్రాజకుడగు సన్న్యాసి యొక్క అభ్యాసము: కర్మ-ఆచార-శాస్త్ర విద్యా పాండితీ ప్రకర్షణలకు దూరంగా ఉంటారు. పేరు ప్రతిష్ఠల పట్ల ధ్యాస కలిగి ఉండరు. అట్టి విశేషములను పొగడరు. సంకీర్తన చేయరు. సర్వత్రా సమస్వరూపమగు ఆత్మనే సంకీర్తిస్తూ ఉంటారు. |
యద్యత్కర్మ కరోతి తత్తత్ఫలమనుభవతి . ఏరండతైలఫేనవత్సర్వం పరిత్యజేత్ . |
|
యత్ యత్ కర్మ కరోతి, తత్ తత్ ఫలం అనుభవతి। ఏరణ్డ తైల ఫేనవత్ సర్వం పరిత్యజేత్। |
ఒకవేళ్ళ ఏమైనా కర్మకు కర్తృత్వము వహిస్తూ, నిర్వర్తిస్తూ ఉంటే, ఆ కర్మల ఫలముల అనుభవము అనివార్యము. అందుచేత ఆముదపు నురుగు వలె (కుంకుడికాయ నురుగును శరీరముపై రుద్దుకొని, ఆ తరువాత నీటితో శుభ్రముచేసి పరిత్యజించి వేస్తాము కదా! అట్లాగే) ఇక్కడి సమస్తమును యతి పరిత్యజించి ఉంటారు. |
న దేవతాప్రసాదగ్రహణం . న బాహ్యదేవాభ్యర్చనం కుర్యాత్ . స్వవ్యతిరిక్తం సర్వం త్యక్త్వా మధుకరవృత్త్యాహారమాహరన్కృశీభూత్వా మేదోవృద్ధిమకుర్వన్విహరేత్ . |
|
న దేవతా ప్రసాద గ్రహణమ్। న బాహ్యదేవ అభ్యర్చనం కుర్యాత్। స్వ వ్యతిరిక్తం సర్వం త్యక్త్యా, మధుకరవృత్య ఆహారం ఆహరన్, కృశో-భూత్వా, మేదో వృద్ధిమ్ అకుర్వన్ విహరేత్।। |
యతికి - (సన్న్యాసికి) :- - దేవతా ప్రసాద గ్రహణము, - బాహ్య దేవతార్చన - మొదలైన బాహ్య ఉపాసనలు తమ కొరకు నియమమై ఉండవు. అవన్నీ లోక కళ్యాన దృష్టితో నిర్వర్తిస్తారేగాని, తమ కొరకు కాదు. సర్వత్రా ఆత్మను, సర్వము ఆత్మయందు దర్శించటమే ‘‘అంతరోపాసన’’. స్వస్వరూపమునకు వ్యతిరిక్తమైనదంతా త్యజించిన వాడై ఉంటాడు. మధుకర (భిక్షక) వృత్తిచే తనకు సరిపడునంతగా ఆహారము తెచ్చుకుంటారు. క్రొవ్వులు పెంచుకొనే అల్పాశయములు లేనివాడై విహరిస్తూ ఉంటారు. |
మాధూకరేణ కరపాత్రేణాస్యపాత్రేణ వా కాలం నయేత్ . ఆత్మసంమితమాహారమాహరేదాత్మవాన్యతిః . |
|
మాధుకరే కరపాత్రేణ అన్యపాత్రేణ వా కాలం నయేత్। ఆత్మ సమ్మితం ఆహారం ఆహరేత్ ఆత్మవాన్ యతిః। |
భిక్షాటనము చేయుచున్నప్పుడు చేతినే పాత్రగా గాని, వేరైన ఒక పాత్రగాని కలిగియుండి కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఆత్మవంతుడై యతి తనకు తిన-సరిపోవు ఆహారమే తెచ్చుకుంటాడు. దాచి దాచి ఉంచుకోవాలనే ఉద్దేశ్యము కలిగి ఉండడు. |
ఆహారస్య చ భాగౌ ద్వౌ తృతీయముదకస్య చ . వాయోః సంచరణార్థాయ చతుర్థమవశేషయేత్ ..59.. |
|
ఆహారస్య చ భాగౌ ద్వౌ, తృతీయమ్ ఉదకస్య చ, వాయోః సంచలనార్థాయ, చతుర్థం అవశేషయేత్।। |
పొట్టలో రెండు భాగములను ఆహారముతోను, మూడవ భాగమును నీటితోను నింపాలి. మిగిలిన నాలుగవ భాగమును వాయు సంచారము యొక్క వసతి కొరకు ‘ఖాళీ’గా ఉంచాలి. |
భైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాశీ భవేత్క్వచిత్ . |
|
భైక్షేణ వర్తయేత్ నిత్యం న ఏక అన్నాసీ భవేత్ క్వచిత్। |
సన్న్యాసి ఎల్లప్పుడూ భిక్షాటణంలోనే ఉంటూ ఒకే ఇంటిని ఆహారము (అన్నము) కొరకై ఆశ్రయించి ఉండకూడదు. |
నిరీక్షంతే త్వనుద్విగ్నాస్తద్గృహం యత్నతో వ్రజేత్ .. 60.. |
|
15. నిరీక్షంతే తు అనుద్విగ్నాః తత్ గృహం యత్నతో, వ్రజేత్। |
బిక్షాటనకు వెళ్లుచున్నప్పుడు - ఏగృహము వద్ద అయితే గృహిణి లేక గృహయజమాని అన్నము (ఆహారము) ప్రదానము చేయుటకై అనుద్వేగకరంగా నిరీక్షణ చేస్తూ ఉంటారో, ఆ ఇంటి వద్ద తప్పక, సయత్నపూర్వకంగా స్వీకరిస్తూ సాగిపోవాలి. |
పంచసప్తగృహాణాం తు భిక్షామిచ్ఛేత్క్రియావతాం . గోదోహమాత్రమాకాంక్షేన్నిష్క్రాంతో న పునర్వ్రజేత్ .. 61.. |
|
పంచ-సప్త గృహాణాన్తు బిక్షాం ఇచ్ఛేత్ క్రియావతామ్। గోదోహమాత్రం ఆకాంక్షేత్ నిష్క్రాన్తో న పునః, వ్రజేత్। |
బిక్షాటన కొరకు రోజుకు 5 లేక 7 ఇళ్లను మాత్రమే ఎన్నుకోవాలి. ఆవు పాలు పితుగుటకు పట్టుకాలము మాత్రమే అక్కడ వేచి ఉండాలి. ఒక్కొక్క ఇంటి నుండి మరల ఇంకొక ఇంటికి వెళ్లుచూ, మరల వెనుతిరగరాదు. |
నక్తాద్వరశ్చోపవాస ఉపవాసాదయాచితః . అయాచితాద్వరం భైక్ష్యం తస్మాత్భైక్షేణ వర్ధయేత్ .. 62.. |
|
నక్తాత్ వరశ్చ ఉపవాస। ఉపవాసాత్ అయాచితః। అయాచితాత్ వరం భైక్షం। తస్మాత్ భైక్షేణ వర్తయేత్। |
నక్తము(రాత్రియందు మాత్రమే భోజనము చేయటం) కంటే ఉపవాసము (పగలు మాత్రమే ఉపవాసము) మంచిది. ఉపవాసము కంటే అయాచితము, అయాచితము కంటే భైక్షము అధికమైనవి. అందుచేత భైక్షణము సన్న్యాసులకు వర్తనీయము. |
నైవ సవ్యాపసవ్యేన భిక్షాకాలే విశేద్గృహాన్ . |
|
నైవ (న ఏవ) సవ్య - అపసవ్యేన బిక్షాకాలే విశేత్ గృహాన్।। |
బిక్షాటనము చేయునప్పుడు సవ్యముగాను, మరల అపసవ్యముగాను గృహములలో ప్రవేశించరాదు. (ఒక్కసారి ముందుకు వెళ్లాలిగాని, ఒక త్రోవలోవెళ్లి తిరిగి అదే త్రోవలో వెనుకకు వచ్చి మరలి భిక్షాటనము చేయరాదు). |
నాతిక్రామేద్గృహం మోహాద్యత్ర దోషో న విద్యతే .. 63.. శ్రోత్రియాన్నం న భిక్షేత శ్రద్ధాభక్తిబహిష్కృతం . |
|
న అతిక్రామేత్ గృహం మోహాత్ యత్ర దోషో న విద్యతే। శ్రోత్రియ (అపి) - అన్నం నభిక్షేత శ్రద్ధా భక్తి బహిష్కృతమ్। |
ఏగృహములు దోషరహితమై ఉంటాయో, అట్టి గృహము దాటి (అతిక్రమించి) భిక్ష తీసుకోకుండా వెళ్లరాదు. ఇక, శ్రద్ధాభక్తులు లేనప్పుడు - యజమాని శ్రోత్రియుడైనా కూడా, - ఆ ఇల్లు భిక్ష విషయంలో బహిష్కృతమే। |
వ్రాత్యస్యాపి గృహే భిక్షేచ్ఛ్రద్ధాభక్తిపురస్కృతే .. 64.. మాధూకరమసంక్లృప్తం ప్రాక్ప్రణీతమయాచితం . తాత్కాలికం చోపపన్నం భైక్షం పంచవిధం స్మృతం .. 65.. |
|
వ్రాత్యస్య అపి గృహే భక్షేత్ శ్రద్ధాభక్తి పురస్కృతే। మాధూకరం అసంక్లప్తం ప్రాక్ప్రణీతం, అయాచితమ్, తాత్కాలికం చ ఉపపన్నం భైక్షం పంచవిధం స్మృతమ్। |
ఇంటివారు లోకరీతిగా గొప్పగొప్ప కులమువారా? - అనునది ముఖ్యము కాదు. భిక్ష ఇచ్చుటలో శ్రద్ధా భక్తులుంటే ఆ ఇల్లు బిక్ష స్వీకరించుటకు అర్హమే. భైక్షము 5 విధములు. (1) మధూకరము (2) ప్రాక్ ప్రణీతము (3) అయాచితము (4) తాత్కాలికము (5) ఉపపన్నము |
మనఃసంకల్పరహితాంస్త్రీన్గృహాన్పంచ సప్త వా . మధుమక్షికవత్కృత్వా మాధూకరమితి స్మృతం .. 66.. |
|
16. మనః సంకల్పరహితాన్, త్రీన్ గృహాన్ పంచ సప్తవా, మధుమక్షికవత్ కృత్వా ‘‘మాధూకరమ్’’ ఇతి స్మృతమ్।। |
(1) మాధూకరము : మనస్సుతో ముందుగా సంకల్పించకుండానే ‘3’ లేక ‘5’ లేక ‘7’ ఇళ్లకు తేనెటీగవలె వెళ్ళి భిక్షాటనము చేసి భిక్ష స్వీకరించటము - ‘‘మాధూకరము’’ - అని అనబడుతోంది. |
ప్రాతఃకాలే చ పూర్వేద్యుర్యద్భక్తైః ప్రాథితం ముహుః . తద్భైక్షం ప్రాక్ప్రణీతం స్యాత్స్థితిం కుర్యాత్తథాపి వా .. 67.. |
|
ప్రాతఃకాలేచ పూర్వేద్యుః యత్ భక్తైః ప్రార్థితం ముహుః తత్ భైక్షం ‘‘ప్రాక్ ప్రణీతం’’ స్యాత్ చితిం కుర్వాత్ అథాపివా।। |
(2) ప్రాక్ ప్రణీతము: ప్రాతఃకాలము (ఉదయమున) గాని, ముందురోజుగాని ఎవ్వరైనా భక్తితో వచ్చి మాటిమాటికీ భిక్ష తీసుకోవలసినదిగా ప్రార్ధిస్తూ ఉంటే ,ఆ విధంగా స్వీకరించే భిక్ష ‘ప్రాక్‌ప్రణీతము’. |
భిక్షాటనసముద్యోగాద్యేన కేన నిమంత్రితం . అయాచితం తు తద్భైక్షం భోక్తవ్యం చ ముముక్షుభిః .. 68.. |
|
భిక్షాటన సముద్యోగాత్ ఏన కేన నిమంత్రితమ్। ‘‘అయాచితం’’తు తత్ భైక్షం, భోక్తవ్యంచ ముముక్షుభిః।। |
(3) అయాచితము : భిక్షాటనమునకు బయలుదేరిన తరువాత, ఎవ్వరైనా ‘‘అయ్యా! ఈ రోజు మా ఇంటనే భిక్ష స్వీకరించాలి-’’- అని నియంత్రిస్తూ ఉన్నప్పుడు స్వీకరిస్తే అది అయాచితము. ఇట్టిది ముముక్షువుల వద్దే స్వీకరించాలి. లౌకికమైన కోరికలు కలవారి వద్ద కాదు. |
ఉపస్థానేన యత్ప్రోక్తం భిక్షార్థం బ్రాహ్మణేన తత్ . తాత్కాలికమితి ఖ్యాతం భోక్తవ్యం యతిభిస్తదా .. 69.. |
|
ఉపస్థానేన యత్ ప్రోక్తం భిక్షార్ధం బ్రాహ్మణేన తత్, ‘‘తాత్కాలికం’’ ఇతి ఖ్యాతం భోక్తవ్యం యతిభిః తదా।। |
(4) తాత్కాలికము : సన్న్యాసిని ఎవ్వరైనా బ్రహ్మతత్త్వోపాసన గల వాడు (బ్రాహ్మణుడు) భిక్షకు రమ్మని ఆహ్వానించి సమర్పిస్తే, అది ఆ విధంగా యతికి భోక్తవ్యమే. ఇది ‘‘తాత్కాలికము’’ |
సిద్ధమన్నం యదానీతం బ్రాహ్మణేన మఠం ప్రతి . ఉపపన్నమితి ప్రాహుర్మునయో మోక్షకాంక్షిణః .. 70.. |
|
సిద్ధం అన్నం యత్ ఆనీతం బ్రాహ్మణేన మఠం ప్రతిః, ‘‘ఉపపన్నం’’ ఇతి ప్రాహుః మునయో మోక్ష కాంక్షిణః।। |
(5) ఉపన్నము : బ్రహ్మజ్ఞానాశయముతో, ఉపాసనభావనతో ఎవ్వరైనా అన్నము సిద్ధము చేసి, మనస్సుతో ‘మోక్షకాంక్షి’ అయి, ఈ సన్న్యాసి కూర్చుని ఉన్న మఠము లేక స్థానమునకు తెచ్చి సమర్పిస్తే, అది ‘ఉపపన్నము’. |
చరేన్మాధూకరం భైక్షం యతిర్మ్లేచ్ఛకులాదపి . ఏకాన్నం నతు భుంజీత బృహస్పతిసమాదపి . |
|
చరేత్ మాధూకరం భైక్షం యతిః మ్లేచ్ఛ కులాత్ అపి। ఏకాన్నం న తు భుంజీత బృహస్పతి సమాత్ అపి।। (సమాదపి)। |
భిక్షాటనకై ‘మాధుకరము’ చేయుచు యతి మ్లేచ్ఛకులములవారి గృహముల వద్ద కూడా భిక్షను గ్రహించవచ్చును. అయితే ‘ఏకాన్నము’ను (ఒకేచోట రెండవరోజు కూడా ఆహారమును) బృహస్పతితో సమానమైనవారి ఇంటిలో కూడా భిక్షగా గ్రహించరాదు. |
యాచితాయాచితాభ్యాం చ భిక్షాభ్యాం కల్పయేత్స్థితం .. 71.. |
|
యాచిత, అయాచితాభ్యాం చ, భిక్షాభ్యాం కల్పయేత్ స్థితిమ్।। |
ఈ విధంగా యాచితమైనా, అయాచితమైనా కూడా - భిక్షకమార్గములోనే భిక్షను గ్రహించి సన్న్యాసి (యతి) దేహమును రక్షించుకోవాలి. |
న వాయుః స్పర్శదోషేణ నాగ్నిర్దహనకర్మణా . నాపో మూత్రపురీషాభ్యాం నాన్నదోషేణ మస్కరీ .. 72.. విధూమే సన్నముసలే వ్యంగారే భుక్తవజ్జనే . కాలేఽపరాహ్ణే భూయిష్ఠే భిక్షాచరణమాచరేత్ .. 73.. అభిశతం చ పతితం పాపండం దేవపూజకం . వర్జయిత్వా చరేద్భైక్షం సర్వవర్ణేషు చాపది .. 74.. |
|
17. న వాయుః స్పర్శదోషేణ। న అగ్నిః దహన కర్మణా। న ఆపో మూత్ర పురీషాభ్యాం। న అన్నదోషేణ మస్కరీ। విధూమే సన్ న ముసలే, వ్యంగారే, భుక్తవత్ జనే, కాలే అపరాహణా భూయిష్ఠే భిక్షాచరణం ఆచరేత్। అభిశస్తన్ చ పతితం పాషణ్డం దేవపూజకమ్ వర్జయిత్వా చరేత్ భైక్షం, సర్వవర్ణేషు చ ఆపది।। |
వాయువుకు స్పర్శదోషము ఉండదు. అగ్నికి దహనదోషము లేదు. జలమునకు మూత్ర-పురీషదోషము ఉండదు. అట్లాగే యతికి (సన్న్యాసికి) అన్నదోషము అంటదు. ఇంటిలో ఇక పొగరానప్పుడు (వంట అయిన తరువాత), రోకటిపోటు లేనప్పుడు, నిప్పులు లేనప్పుడు, జనులు భుజించిన తరువాత, అపరాహణా (మధ్యాహ్న - say 12 noon) సమయములోను భిక్షాచరణము నిర్వర్తించ వచ్చును. అభిశస్తుని (పరనింద అను దురభ్యాసము కలవాని), పతితుని, పాషండుని, (దేవపూజ పట్ల తిరస్కారము కలవానిని) వదలి, తదితర గృహముల వద్ద భిక్షాచరణము చేయుదురుగాక। ఆపద సమయములో సర్వ వర్ణముల గృహములలో భైక్ష్యము చేయవచ్చును. |
ఘృతం స్వమూత్రసదృశం మధు స్యాత్సురయా సమం . తైలం సూకరమూత్రం స్యాత్సూపం లశునసంమితం .. 75.. |
|
ఘృతం చ మూత్ర సదృశం। మధుస్యాత్ సురయా సమమ్। తైలం సూకర మూత్రం స్యాత్। సూపం లశున సమ్మితమ్। |
యతికి → నెయ్యి - మూత్రముతో సమానము. తేనె - సురాపానముతో సమానము. తైలము - పంది మూత్రముతో సమానము. సూపము - ( వండిన పప్పు) లశునముతో (వెల్లుల్లితో) సమానము. (త్యజించ తగినది). |
మాషాపూషాది గోమాంసం క్షీరం మూత్రసమం భవేత్ . తస్మాత్సర్వప్రయత్నేన ఘృతాదీన్వర్జయేద్యతిః . ఘృతసూపాదిసంయుక్తమన్నం నాద్యాత్కదాచన .. 76.. |
|
మాషాపూపాది గోమాంసం। క్షీరం మూత్ర సమం భవేత్। తస్మాత్ సర్వప్రయత్నేన ఘృతాదీన్ వర్జయేత్ యతిః। ఘృత సూపాది సంయుక్తం అన్నం నాద్యాత్ కదాచన। |
గారెలు, అప్పములు మొదలైన పిండివంటలు, గో-జంతు మాంసముతో సమానము. పాలు మొదలైనవి మూత్రముతో సమానము. సర్వ ప్రయత్నముతో యతి నెయ్యిని తానుగా కోరుకోరాదు. నెయ్యి-పప్పు కలిపిన అన్నము ఎప్పుడూ కావాలని అనుకోరాదు. |
పాత్రమస్య భవేత్పాణిస్తేన నిత్యం స్థితిం నయేత్ . పాణిపాత్రశ్చరన్యోగీ నాసకృద్భైక్షమాచరేత్ .. 77.. |
|
పాత్రం అస్య భవేత్ పాణిః। తేన నిత్యం స్థితిం నయేత్। పాణి పాత్రః చరన్ యోగీ న అసకృత్ భైక్షమ్ ఆచరేత్। |
యతికి చేతిలోని భిక్షక పాత్రయే అలంకారము. చేతిని భిక్షకపాత్రగా ధరించాలి. యోగి అసత్ (చేయరాని) పనులు చేస్తూ ఉన్నవారి వద్ద భైక్షకము ఆచరించరాదు. నిషేధములగు మాంసాదుల భైక్ష్యము చేయరాదు. |
ఆస్యేన తు యదాహారం గోవన్మృగయతే మునిః . తదా సమః స్యాత్సర్వేషు సోఽమృతత్వాయ కల్పతే .. 78.. |
|
ఆస్యేన తు యత్ ఆహారం గోవత్ మృగయతే మునిః, తదా సమఃస్యాత్ సర్వేషు, సో అమృతత్వాయ కల్పత ఇతి। |
గోవువలె (రుచి పట్టించుకోకుండా) ఆహారమును నోటితో తీసుకొను చుండటంచేత, అట్టి వాడు సర్వుల యందు సమస్వరూపుడై అమృతత్వమునకు అర్హుడగుచున్నాడు. |
ఆజ్యం రుధిరమివ త్యజేదేకత్రాన్నం పలలమివ గంధలేపనమశుద్ధలేపనమివ క్షారమంత్యజమివ |
|
18. ఆజ్యం రుధిరమివ త్యజేత్। ఏకత్ర- అన్నం పలలం ఇవ। గంధలేపనం అశుద్ధలేపనమ్ ఇవ। క్షారం అంత్యజం ఇవ। |
→ నెయ్యిని రక్తము వలె వదలాలి. → ఒకే ఇంటిలో అనేకసార్లు భోజనము మాంసభక్షణం వలె భావించాలి. → సుగంధ లేపనము - అశుద్ధ లేపనము వలె అనుకోవాలి. → క్షారము (కారము)ను - నీచము వలెను తలచాలి. |
వస్త్రముచ్ఛిష్టపాత్రమివాభ్యంగం స్త్రీసంగమివ మిత్రాహ్లాదకం మూత్రమివ స్పృహాం గోమాంసమివ |
|
వస్త్రం ఉచ్ఛిష్ట పాత్రం ఇవ। అభ్యంగం స్త్రీ సంగం ఇవ। మిత్ర ఆహ్లాదకం మూత్రం ఇవ। స్పృహాం గోమాంసం ఇవ। |
→ నూతన వస్త్రములను - ఎంగిలి కంచమువలెను, → తలంటును - స్త్రీ సంగమమువలెను, → పూర్వాశ్రమస్నేహితులతో ఆహ్లాదములు (పాతఃకాలపు కబుర్లు) - మూత్రము వలెను, → లోకసంబంధమైన స్పృహలు, జ్ఞాపకములు, కోరికలు గోమాంసము వలెను అనుకోవాలి. |
జ్ఞాతచరదేశం చండాలవాటికాదివ స్త్రియమహిమివ సువర్ణం కాలకూటమివ సభాస్థలం శ్మశానస్థలమివ రాజధానీం కుంభీపాకమివ |
|
జ్ఞాత చరదేశం చండాలవాటికామ్ ఇవ। స్త్రియమ్ అహిం ఇవ। సువర్ణం కాలకూటమివ। సభాస్థలం శ్మశానస్థలం ఇవ। రాజధానీం కుంభీపాకం ఇవ। |
→ ఇతః పూర్వాశ్రములో పరిచయిస్తులైయున్న వారి జ్ఞాతులైనవారి గ్రామ-పట్టణములను (పాత పరిచయములు ముందుకు వస్తూ ఉంటే) - చండాలవాటిక వలెను, → స్త్రీని అసభ్య దృష్టితో చూడటం పామును చూచినట్లు, → బంగారమును కాలకూటవిషము వలెను, → రాజకీయ విశేషములతోను, లోక విశేషములతో కూడిన సభాస్థలమును శ్మశానవాటిక వలెను దృష్టి కలిగి ఉండాలి. → రాజధానీ నగరమును కుంభీపాక నరకము వలెను, |
శవపిండవదేకత్రాన్నం న దేవతార్చనం . ప్రపంచవృత్తిం పరిత్యయ జీవన్ముక్తో భవేత్ .. |
|
శవ పిండవత్ ఏకత్ర అన్నం। న దేవత అర్చనం। ప్రపంచ వృత్తిం పరిత్యజ్య జీవన్‌ముక్తో భవేత్ (యతి)।। |
→ ఏకత్రాన్నము (ఒకేచోట రోజులు రోజులుగా ఆహార స్వీకారము) శవపిండము వలెను చూడాలి. దేవతల అర్చనము చేయరాదు. (అది అన్యమగు ప్రవృత్తి మార్గము కాబట్టి). ఈ విధంగా ప్రపంచ వృత్తులను పరిత్యజిస్తూ ఉండగా అట్టి యోగి జీవన్ముక్తుడు అగుచున్నాడు. |
ఆసనం పాత్రలోపశ్చ సంచయః శిష్యసంచయః . దివాస్వాపో వృథాలాపో యతేర్బంధకరాణి షట్ .. 79.. వర్షాభ్యోఽన్యత్ర యత్స్థానమాసనం తదుదాహృతం . |
|
ఆసనం పాత్రలోపశ్చ సంచయః, శిష్య సంచయః। దివాస్వాపో, వృధాలాపో - యతేః బంధకరాణి ‘షట్’ । వర్షాభ్యో అన్యత్ర యత్ స్థానం ‘ఆసనం’ తత్ ఉదాహృతమ్।। |
(1) ఆసనము (2) పాత్రలోపము (3) సంచయము (4) శిష్యసంచయము (5) దివాస్వాపము (6) వృధాలాపము - ఈ ‘ఆరు’ కూడా యతికి ప్రతిబంధకములు. (1) ఆసన స్థానబంధకము : వర్షాకాలము తప్పించి వేరే కాలములో ఒకేచోట ‘‘స్థానము - ఆసనము’’ కలిగి ఉండటము మొదటి ప్రతిబంధకముగా (ఆసన స్థాన బంధకముగా) పిలుస్తారు. (Attraction of the place) |
ఉత్కాలాబ్వాదిపాత్రాణామేకస్యాపీహ సంగ్రహః .. 80.. యతేః సంవ్యవహరాయ పాత్రలోపః స ఉచ్యతే . |
|
19. ఉక్తా లాబ్వాది పాత్రాణాం ఏకస్యాపి ఇహ సంగ్రహః యతేః సవ్యవహారార్థం పాత్ర అలాభే, అన్యపరిగ్రహః యతేః స వ్యవహారార్థం ‘‘పాత్రలోపః’’ స ఉచ్యతే।। |
(2) పాత్రలోపము : శాస్త్రములలో చెప్పబడియున్న సన్న్యాసియొక్క (యతి యొక్క) బిక్షక పాత్ర శాస్త్రములలో చెప్పిన ఆనపకాయ బుర్ర మొదలైన (భిక్షక) పాత్రలు లభించనప్పుడు ఆ యతి వ్యావహారికమైన (ఇళ్ళలో ఉపయోగించే) పాత్రవాడవలసినప్పుడు - అది ‘పాత్ర లోపము’. ఇది ‘‘షట్ యతి ప్రతిబంధకములలో’’ రెండవది. (Attraction of usables, Instruments) |
గృహీతస్య తు దండాదేర్ద్వితీయస్య పరిగ్రహః .. 81.. కాలాంతరోపభోగార్థం సంచయః పరికీర్తితః . |
|
గృహీతస్యతు దండాదేః ద్వితీయస్య పరిగ్రహః కాలాన్తర ఉపభోగార్థం ‘‘సంచయః’’ పరికీర్తితః।। |
(3) శిష్య సంచయము : యతి (లేక) సన్న్యాసి శాస్త్ర సూచనానుసారంగా ఒక్క దండమునే కలిగి ఉంటారు. అయితే ఏదైనా ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని, ‘‘మరొక సమయంలో ఉపయోగిస్తుందేమోలే-’’ అని తలచి రెండవ దండమును చేతిలో కలిగి ఉండటము మూడవ యతి- ప్రతిబంధకము. దండము కనబడకపోవటము, శిధిలమవటము మొదలైనవి సం# |
శుశ్రూషాలాభపూజార్థం యశోర్థం వా పరిగ్రహః .. 82.. శిష్యాణాం నతు కారుణ్యాచ్ఛిష్యసంగ్రహ ఈరితః . |
|
శుశ్రూషా లాభ పూజార్ధం, యశో-ర్ధం వా, పరిగ్రహః శిష్యాణాం, న తు కారుణ్యాత్ ‘‘శిష్య సంగ్రహ’’ ఈరితః।। |
(4) శిష్య సంచయము / శిష్య సంగ్రహము: కారుణ్యముతో, విద్యాబోధకొరకై, ఆత్మజ్ఞాన పాఠ్యాంశముల సుదీర్ఘ ప్రచారము కొరకై శిష్యులు ఆశ్రయించటము గాని, శిష్యులను సమీకరించటముగాని - తప్పుకాదు. అట్లా కాకుండా,.. ‘నన్ను సేవించాలి’’ అని, ‘‘నన్ను పూజించాలి’’ అని, ‘‘నా గురించి ప్రచారము చేయాలి’’-అనే ఉద్దేశ్యముతో శిష్యులను సమీకరిం చటము - అనేది నాలుగవ యతి ప్రతిబంధకము. |
విద్యా దివా ప్రకాశత్వాదవిద్యా రాత్రిరుచ్యతే .. 83.. విద్యాభ్యాసే ప్రమాదో యః స దివాస్వాప ఉచ్యతే . |
|
విద్యా ‘‘దివా’’ ప్రకాశత్వాత్, అవిద్యా ‘‘రాత్రిః’’ ఉచ్యతే। విద్యాభ్యాసే ప్రమాదో యః స ‘‘దివాస్వాప’’ ఉచ్యతే।। |
(5) దివాస్వాపము : ఆత్మవిద్యను - ‘‘పగటి వెలుగు’’ దివాప్రకాశము అంటారు. అవిద్యను - ‘‘రాత్రి /చీకటి’’ అంటారు. విద్యాభ్యాసము పట్ల ప్రమాదమే (ఏమరపు, అశ్రద్ధయే) - దివాస్వాపము. ఆధ్యాత్మిక సంబంధమైనవి, భిక్షక సంబంధమైన వాటి పట్ల బద్ధకము, ‘‘తరువాత, తరువాత’’- అని అనుకోవటము లోక సమాచారములు సంభాషించుకోవటము - ఇదంతా ‘దివాస్వాపము’. |
ఆధ్యాత్మికీం కథాం ముక్త్వా భిక్షావార్తాం వినా తథా .. 84.. అనుగ్రహం పరిప్రశ్నం వృథాజల్పోఽన్య ఉచ్యతే . |
|
ఆధ్యాత్మికీం కథాం ముక్త్వా భిక్షా వార్తాం వినా తథా, అనుగ్రహం, పరిప్రశ్నం, ‘‘వృధాజల్పః’’, అస్య ఉచ్యతే।। |
(6) వృధాలాపము /వృధాజల్పము : ఆధ్యాత్మిక ప్రసంగము, తత్త్వ జ్ఞాన సమాచారము కాకుండా కుశల ప్రశ్నలు, వారి గురించి - వీరి గురించి పరిప్రశ్నలు, క్షేమ సమాచారములు - ఇవన్నీ ‘‘వృధాజల్పము’’. ఇది ఆరవ యతి ప్రతిబంధకము. |
ఏకాన్నం మదమాత్సర్యం గంధపుష్పవిభూషణం .. 85.. తాంబూలాభ్యంజనే క్రీడా భోగాకాంక్షా రసాయనం . కత్థనం కుత్సనం స్వస్తి జ్యోతిశ్చ క్రయవిక్రయం .. 86.. క్రియాకర్మవివాదశ్చ గురువాక్యవిలంఘనం . సంధిశ్చ విగ్రహో యానం మంచకం శుక్లవస్త్రకం .. 87.. |
|
ఏకాన్నం (ఏక అన్నం), మత (మద) మాత్స్యరం, గన్థ పుష్ప విభూషణమ్, తాంబూల, అభ్యంజనే, క్రీడా భోగాకాంక్షా రసాయనమ్, కత్థనం కుత్సనం స్వస్తి జ్యోతిశ్చక్రయ - విక్రయమ్, క్రియా కర్మ వివాదశ్చ, గురు వాక్య విలఙ్ఘనమ్, సంధిశ్చ విగ్రహో యానం మంచకం శుక్లవస్త్రకమ్. |
యతి త్యజించవలసినవి : (ఒకేచోట నుండి భోజనము చేయుచూ రోజులు గడవటం రూపమగు) ఏకాన్నము. మత సంబంధమైన మాత్సర్యము, మద మాత్సర్యములు. గంధ-పుష్పముల అలంకారము. తాంబూల సేవనాభ్యాసములు. అభ్యంజనములు (అభ్యంగన లేక తలంటు స్నానములు). కాటుక మొదలైన అలంకరా ధారణములు. క్రీడలు. భోగకాంక్షలు. రసాయన (బలవర్ధక, మత్తు కలిగించే) ఔషధ సేవనములు. ఇతరులను అసహ్యించుకోవటము. కుత్సితభావములు. ఆత్మస్తుతి - పరనిందలు. పరదూషణలు. దర్శనమునకు వచ్చువారికి లౌకికమైన ఆశీర్వాదములు. ధన లాభము పొందుట, ధనదృష్టితో స్వస్తి వాక్యములు. జ్యోతిశ్చక్రముల క్రయ విక్రయములు (దేవుడి బొమ్మల విక్రయములు). క్రియ- కర్మల గురించి వివాదములు (అట్లాగే చేయాలి - ఇట్లా చేయకూడదు అను (వాదోపవాదములు). గురువు చెప్పు ఆజ్ఞలను ఉల్లంఘించటము. పొట్లాటలు. సంధి. ఒకరినొకరు కలహించుకోవటము. వాహనములు. మంచకము. తెల్లటి వస్త్రధారణము. |
శుక్లోత్సర్గో దివాస్వాపో భిక్షాధారస్తు తైజసం . విషం చైవాయుధం బీజం హింసాం తైక్ష్ణ్యం చ మైథునం .. 88.. |
|
20. శుక్లోత్సర్గో, దివాస్వాపో భిక్షా ధారస్తు తైజసమ్, విషంచైవ, ఆయుధం బీజం హింసాం తైక్షణ్యాంచ, మైధునం, - |
శుక్ల ఉత్‌సర్గము, దివాస్వాపము, కొందరి భిక్షపై ఆధారపడి ఉండటము, తైజస - (స్వప్న కల్పిత విశేషములతో కూడిన) సంప్రదర్శనము. విషపు మాటలు. ఆయుధ ధారణము. హింస. దుఃఖ బీజములు అవగల వాక్కులు. మైధున భావములు. ఇవన్నీ సన్న్యాసి వదలి ఉండాలి. |
త్యక్తం సంన్యాసయోగేన గృహధర్మాదికం వ్రతం . గోత్రాదిచరణం సర్వం పితృమాతృకులం ధనం . ప్రతిషిద్ధాని చైతాని సేవమానో వ్రజేదధః .. 89.. |
|
-త్యక్తం సన్న్యాసయోగేన గృహధర్మాదికం వ్రతమ్, గోత్రాది చరణం సర్వం పితృ- మాతృకులం, ధనమ్, ప్రతిషిద్ధాని చ-ఏతాని, సేవమానో వ్రజేత్ అధః। |
ఇంకా సన్న్యాసయోగము చేత గృహస్త ధర్మములైనట్టి ధనసముపార్జన, ధనమును దాచటం మొదలైనవి విడువాలి. వ్రతములు, గోత్రముల మమకారము, తల్లిదండ్రుల సంబంధితమైన కులాహంకారము, ధనమును ఆశించటము, కులగోత్ర గర్వములు - ఇటువంటి గృహస్త ప్రసిద్ధమైన విశేషాలు సేవించటంచేత అట్టివాడు సన్న్యాసాశ్రమము నుండి అధఃపతితుడు అగుచున్నాడు. |
సుజీర్ణోఽపి సుజీర్ణాసు విద్వాంస్త్రీషు న విశ్వసేత్ . సుజీర్ణాస్వపి కంథాసు సజ్జతే జీర్ణమంబరం .. 90.. |
|
సుజీర్ణో అపి సుజీర్ణాసు విద్వాన్ స్త్రీషు న విశ్వసేత్। సుజీర్ణాసు అపి కంధాసు సజ్జతే జీర్ణం అంబరమ్। |
‘‘నేను సుజీర్ణుడను. వృద్ధుడను. స్త్రీలతో భౌతికమైన సమీప్యత ఏమి తప్పు?’’ - అని తలచి, దేహసంబంధమైన సామీప్యతలను దరిచేరనీయ రాదు. జీర్ణమైన, చిరిగిపోయిన దుప్పటి కూడా బొంతలో వస్త్రము కాగలదు కదా. ‘‘నేను స్త్రీ-పురుష భౌతిక - లౌకిక సంబంధాలకు దూరంగా ఉండటమే ఉచితం।’’ - అని తలవాలి. |
స్థావరం జంగమం బీజం తైజసం విషమాయుధం . షడేతాని న గృహ్ణీయాద్యతిర్మూత్రపురీషవత్ .. 91.. నైవాదదీత పాథేయం యతిః కించిదనాపది . పక్వమాపత్సు గృణ్హీయాద్యావదన్నం న లభ్యతే .. 92.. |
|
స్థావరం, జంగమం, బీజం, తైజసం, విషం, ఆయుధమ్- షట్(6) ఏతాని న గృహీణాయాత్ యతిః మూత్ర పురీష వత్। నైవాత్ అధీత (ఉ)పాథేయం యతిః కించిత్ అనాపది। పక్వం ఆపత్సు గృహీణాయాత్ యావత్ అన్నం, న లభ్యతే।। |
(1) స్థావరమైనది (2) జంగమమైనది (3) బీజము (4) తేజసము, (5) విషము (6) ఆయుధము - ఈ ఆరింటిని - యతి అయిన వాడు మూత్రమువలె గ్రహించి ఉండాలి. మూత్ర పురీషములను చూచు దృష్టితో చూడాలి. (‘‘నావికావు. నేను వాటికి సంబంధించి లేను’’ - అని ఎరిగి ఉండాలి) ‘‘త్రోవలో ఆపత్తు లేమైనా ఉంటాయేమో’’ అనుకుంటేనే మాత్రమే (త్రోవలో తినే ఆహారము) తీసుకొని వెళ్ళవచ్చు. అనగా ప్రయాణించేటప్పుడు ఆపత్తులేమీ ఉండవనుకుంటే మార్గంతో తినే ఉద్దేశ్యంతో ఆహారము తీసుకువెళ్ళరాదు. (త్రోవలో ఏమీ తినటానికి దొరకదనుకుంటే మాత్రం పక్వాహారం తీసుకువెళ్ళవచ్చు). |
నీరుజశ్చ యువా చైవ భిక్షుర్నావసథే వసేత్ . పరార్థం న ప్రతిగ్రాహ్యం న దద్యాచ్చ కథంచన .. 93.. |
|
నీరుజశ్చ యువా చ ఏవ భిక్షుః న అపనథే వసేత్। పరార్ధం -న ప్రతి గ్రాహ్యం। న దద్యాత్ చ కథం చ న।। |
భిక్షకుడు తన వెంట నిరుజుని (ఎవరో తెలియనివాడు), రుజుమార్గము లేనివానిని, - ఈ ఇరువురిని కలిగి ఉండరాదు. ఇతరులకోసం ఏదీ ప్రతిగ్రహించరాదు. దానము చేయరాదు. (He should neither receive nor give on behalf of others). |
దైన్యభావాత్తు భూతానాం సౌభగాయ యతిశ్చరేత్ . పక్వం వా యది వాఽపక్వం యాచమానో వ్రజేదధః .. 94.. అన్నపానపరో భిక్షుర్వస్త్రాదీనాం ప్రతిగ్రహీ . |
|
దైన్య భావాత్తు భూతానాం సౌభగాయ యతిః చరేత్। పక్వం వా, యది వా అపక్వం |
యతి - ఇతరులతో ఉన్నప్పుడు ‘నేను చిన్నవాడినే’ అని నిగర్వ భావంతో ఉండాలేగాని, గర్వము, అధికారము ఇత్యాది భావాలతో కాదు. తదితర జనులకు శోభకలిగించేవాడుగా ఉండాలి. |
యాచమానో। యతిశ్చ వ్రజేత్ అధః- అన్నపానపరో భిక్షుః, వస్త్రాదీనాం ప్రతిగ్రహీ।। |
‘‘ఆహారము పక్వము అయినా (అన్నము, పిండివంట) లేక అపరిపక్వము (పళ్ళు, కాయలు) మొదలైన యాచించి అయినా స్వీకరించవచ్చు. ‘‘వస్త్రములు ఖరీదైన అన్నపానములు యాచించి తెచ్చుకుందాము’’ అనే ఉద్దేశ్యముతో యతి యాచనకై తిరుగాడరాదు. |
ఆవికం వానావికం వా తథా పట్టపటానపి .. 95.. ప్రతిగృహ్య యతిశ్చైతాన్పతత్యేవ న సంశయః . |
|
ఆవికం వా, అనావికం వా, తథా పట్టపటాన్ అపి, ప్రతిగృహ్య యతిశ్చ ఏతాన్ పతత్యేవ। న సంశయః।। |
అట్టి అన్నపానముల కొరకు యాచన దృష్టి, నూతన వస్త్రాదులు ఇతరుల నుండి పొందాలనే ఆశ-నిరాశలు కలిగి ఉండరాదు. అన్నపానములను, క్రొత్తవైన కంబళములను, పట్టువస్త్రములను పొందాలనే భావావేశము గల యతి (లేక) భిక్షువు యోగమార్గము నుండి పతితుడు అవుతాడు. సంశయము లేదు. |
అద్వైతం నావమాశ్రిత్య జీవన్ముక్తత్వమాప్నుయాత్ .. 96.. వాగ్దండే మౌనమాతిష్టేత్కాయదండే త్వభోజనం . మానసే తు కృతే దండే ప్రాణాయామో విధీయతే .. 97.. కర్మణా బధ్యతే జంతుర్విద్యయా చ విముచ్యతే . |
|
21. అద్వైతం నావం ఆశ్రిత్య జీవన్ ముక్తత్వం ఆప్నుయాత్। వాక్ దణ్డే-మౌనం ఆతిష్ఠేత్। |
→ ‘అద్వైతనావ’ను ఆశ్రయించినవాడై యతి క్రమంగా ‘ముక్తత్వము’ను పొందుచున్నారు. ‘వాక్కు’ను దండముగా తీర్చిదిద్దుకోవటానికై ‘మౌనము’ నందు సుతిష్ఠితుడు అగుచున్నారు. |
కాయ దణ్డేతు-అభోజనమ్।। మానసే తు కృతే దణ్డే-ప్రాణాయామో విధీయతే। కర్మణా బధ్యతే జన్తుః। విద్యయా చ విముచ్యతే।। |
ఈ భౌతిక దేహమును ‘అద్వైత’ మార్గమునకు ‘దండము’గా (మహత్తర ఉపకరణముగా) ఉపకరించుటకై అభోజనము (ఉపవాసము)ను (ఇంద్రియములు శబ్ద స్పర్శ రూపాదుల నుండి విరామము పొంది ఉండటమును) అనుష్ఠించుచున్నారు. మనస్సు (ఆలోచన)ను దండముగా చేసి ప్రాణాయమ యోగాభ్యాసము చేయుచున్నారు. కర్మల చేత జీవుడు కర్మబద్ధుడు అగుచున్నాడు. ఆత్మవిద్య చేత విముక్తుడు అగుచున్నాడు. |
తస్మాత్కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః .. 98.. |
|
తస్మాత్ కర్మ న కుర్వన్తి యతయః పారదర్శినః। |
అందుచేత పారదర్శక స్వభావులగు యతులు సకామమైన (ఇంద్రియ సుఖ సంబంధమమైన) ఎట్టి కర్మలు నిర్వర్తించు స్వభావులు అయి ఉండరు. అకర్మనిష్ఠులుగానే ఉంటున్నారు. |
రథ్యాయాం బహువస్త్రాణి భిక్షా సర్వత్ర లభ్యతే . భూమిః శయ్యాస్తి విస్తీర్ణా యతయః కేన దుఃఖితః .. 99.. |
|
రథ్యాయాం బహువస్త్రాణి బిక్షా సర్వత్ర లభ్యతే। భూమిః శయ్యా అస్తి విస్తీర్ణా। యతయః కేన దుఃఖతాః? |
‘‘రథములు సంచరించు వీధులలో, దేహ రక్షణకై ఏవో వస్త్రాలు దొరుకుతాయి. ఈ ప్రకృతి ప్రసాదితమైన భూమి అంతా కూడా నాకు విశ్రమించటానికి ఉపయోగించగల శయ్యయే। ఇక నాకు -వస్త్రములు లేవే, విశ్రాంతికి ఇల్లు లేదేమి’’ - అనే దుఃఖమెందుకుంటుంది? ఉండనే ఉండదు - అను నిశ్చయము కలిగి ఉంటున్నారు. అశ - భయవర్జితులై ఉంటారు. |
ప్రపంచమఖిలం యస్తు జ్ఞానాగ్నౌ జుహుయాద్యతిః . |
|
ప్రపంచం అఖిలం యస్తు జ్ఞానాగ్నౌ జుహుయాత్ యతి |
యతి (సన్న్యాసి) దృష్టిలో ఈ ఎదురుగా ఇంద్రియములకు అగుపిస్తున్న పాంచభౌతిక ప్రపంచమంతా ఆత్మయే. జ్ఞానాగ్నియందు మొదలంట్లా దహించివేసి ఈ సమస్తమును స్వస్వరూపాత్మ భగవానుని తేజో విలాసముగా ఆయన దర్శించుచున్నారు. |
ఆత్మన్యగ్నీన్సమారోప్య సోఽగ్నిహోత్రీ మహాయతిః .. 100.. |
|
ఆత్మని అగ్నీం తు సమారోప్య సో-గ్నిహోత్రీ మహాయతిః।। |
ఆత్మ (The Absolute Self) నందు అగ్ని యొక్క తేజోధర్మమును ఆరోపించి ఆ యతి ‘‘అగ్ని హోత్రీ - మహా యతి’’ స్వరూపుడు అగుచున్నాడు. జీవాత్మను బ్రహ్మాగ్నియందు సమర్పించి వేసినవారై ఉంటారు. |
ప్రవృత్తిర్ద్వివిధా ప్రోక్తా మార్జారీ చైవ వానరీ . |
|
ప్రవృత్తిః ద్వివిధా ప్రోక్తా మార్జాలీ చ ఏవ, వానరీ।। |
ద్వివిధా ప్రవృత్తిః ప్రవృత్తి రెండు విధములు. (1) మార్జాలీ (Approach of Cat) ప్రవృత్తి. (2) వానరీ (Approach of a Monkey) ప్రవృత్తి. |
జ్ఞానాభ్యాసవతామోతుర్వానరీభాక్త్వమేవ చ .. 101.. నాపృష్టః కస్యచిద్బ్రూయాన్న చాన్యాయేన పృచ్ఛతః . |
|
జ్ఞాన - అభ్యాసవతా మోతుః వానరీ భాక్త్వం ఏవచ।। న అపృష్టః కస్య చిత్ బ్రూయాత్। న చ అన్యాయేన చ పృచ్ఛతః।। |
జ్ఞాన అభ్యాసప్రవృత్తి మోతుః (మార్జాలీ)। తదితరమైనదంతా వానరీ। అడగనిదే ఎవ్వరికీ చెప్పకూడదు. అన్యాయమైన నడవడిక గలవానికి, ఆతడు అడిగినవి కూడా చెప్పరాదు. |
జానన్నపి హి మేధావీ జడవల్లోకమాచరేత్ .. 102.. |
|
జానన్ అపి హి మేధావీ జడవత్ లోకం ఆచరేత్। |
మేధావి అయి, (ఆత్మగురించి) అంతా తెలిసియున్నప్పటికీ జడుడినివలె లోకంలో వ్యవహరించాలి। అర్హత ఉన్నచోట మాత్రమే నోరు విప్పాలి. |
సర్వేషామేవ పాపానాం సంఘాతే సముపస్థితే . తారం ద్వాదశసాహస్రమభ్యసేచ్ఛేదనం హి తత్ .. 103.. |
|
సర్వేషాం ఏవ పాపానాం సంఘాతే సముపస్థితే, తారం ద్వాదశ సాహస్రం అభ్యసేత్ చ్ఛేదనం హి తత్।। |
‘సోఽహమ్’ మంత్రార్థయోగ- జ్ఞానముల అభ్యాసము 12000 మార్లు అభ్యాస-మననముల వలన ఆ యోగి (యతి) యొక్క పాపములు గుట్టలు ఉన్నా, కూడా వాటి నుండి తరించగలడు. |
యస్తు ద్వాదశసాహస్రం ప్రణవం జపతేఽన్వహం . తస్య ద్వాదశభిర్మాసైః పరం బ్రహ్మ ప్రకాశతే.. 104.. ఇత్యుపనిషత్ హరిః ఓం తత్సత్ .. ఇతి ద్వితీయోఽధ్యాయః .. 2.. |
|
యస్తు ద్వాదశ సాహస్రం ప్రణవం జపతే అన్వహమ్, తస్య ద్వాదశ భిః మాసైః పరంబ్రహ్మ ప్రకాశతే।। |
ఎవ్వరైతే ప్రణవమును పూర్ణార్ధపూర్వకంగా 12000 సార్లు జపిస్తారో, అట్టివారి పట్ల 12 మాసములలో పరబ్రహ్మము ప్రకాశమానమవగలదు. |
ఇతి ఉపనిషత్।।
సన్న్యాసోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
ఏ సత్తా సామాన్య విభవమును (All-equally placed All-Pervading "PRESENCE") సన్న్యాసపటలము (The Team of Sath - Nyasins) ఉపాసించుచున్నదో - అది సమస్త జీవుల స్వస్వరూపాత్మయే - అని భావిస్తూ ఆత్మోపాసనకు ఉపక్రమిస్తున్నాము.
సర్వతత్త్వస్వరూపుడు, సర్వాంతర్యామి, కేవలీ తత్త్వ స్వరూపుడు అగు సర్వాత్మ - భగవానుని వేదాక్షర సంజ్ఞయగు ‘ఓం’గా ఉపాసిస్తూ, ఈ సన్న్యాసోపనిషత్‌ను అధ్యయనము నిర్వర్తించుకుంటున్నాము.
ఇప్పుడిక మనము సన్న్యాసయోగము గురించి వ్యాఖ్యానించుకొనుచున్నాము.
తత్త్వమ్ (తత్ త్వమ్ అసి)ను ఉపాసించు మహదాశయుడు → బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థానము క్రమంగా ‘‘సన్న్యాస’’ ఆశ్రమమును ఆశ్రయిస్తున్నాడు.
యో అనుక్రమేణ సన్న్యస్యతి సన్న్యాసో భవతి। సమస్తము సన్న్యసించి, ‘‘కేవలము, సర్వతత్త్వ స్వరూపము’’ అగు ‘ఆత్మ’ను ఆశ్రయిస్తున్నవాడే - ‘‘సన్న్యాసి’’.
య ఆత్మానం క్రియాభిః గుప్తో భవతి। ఎవ్వడైతే తన యొక్క, సకల జీవుల యొక్క సమస్త క్రియలను ఆత్మయందు ‘‘గుప్తము (Secretly maintained)’’ చేయుచున్నారో - అట్టివాడు సన్న్యాసి। రహస్యమగు ఆత్మయందు అరహస్యమగు ఈ జగద్దృశ్యమును సందర్శించుచుండటమే సన్న్యాసము.
బుద్ధియొక్క సత్-న్యాసము (సత్-భావన, ఆత్మభావన) కొరకై ‘సన్న్యాసవిధి’ ఒక ఉపాయమగు ఉపాసనగా చెప్పబడుతోంది.
సన్న్యాసాశ్రమము స్వీకరించ తలచినవాడు మొట్టమొదట తల్లి, తండ్రి, భార్య, పుత్రులు, బంధువులను ఒప్పించాలి. అనుమోదము (Acceptance and Permission) పొందాలి.
‘‘పుత్రా!
త్వం బ్రహ్మ। త్వం యజ్ఞః। త్వం సర్వమ్। ‘‘నీవే బ్రహ్మము। నీవే యజ్ఞమువు। నీవే ఈ సర్వము!’’ అని అనుమంత్రణము చేయాలి.
‘‘తత్త్వమ్’’ (you are that) భావనోపాసనకు ఇది ప్రారంభము.
‘‘నీవు’’గా కనిపించేదంతా కూడా తత్ స్వరూపకేవల-ఆత్మానంద ప్రదర్శనమే’’ = అను ఉపాసనయే సన్న్యాసాశ్రమ ముఖ్యోద్దేశ్యము.
ఒకవేళ, అట్టి ‘సన్న్యాసాశ్రభిమాని’కి కుమారులు లేకపోతే? యది అపుత్రోభవతి?, ‘ఆత్మనమేవ’ ఇమం ధ్యాత్వా - తన యొక్క ఆత్మనే ఉద్దేశ్యించి, ‘త్వమ్ బ్రహ్మేతి’ మంత్రమును ఉచ్ఛరించాలి.
ఈ విధంగా ఉచ్ఛారణ చేసిన తరువాత, ఇక వెనుకకు తిరిగి చూడకుండా, తూర్పువైపుగాగాని, ఉత్తరం వైపుగాగాని అక్కడి నుండి నడచుచూ బయల్వెడలాలి. ‘‘అసత్ నుండి →‘సర్వాత్మకమగు సత్ భావన’ వైపుగా బుద్ధిని నడిపించుచున్నాను’’ - అను ఉపాసనాభావనతో బయల్వెడాలి.
→ త్రిషు వర్ణేసు భిక్షాచర్యం చరేత్। మూడు వర్ణముల వారి ఇళ్లలోను భిక్షాటనము చేస్తూ ఉండవచ్చు.
→ రెండు చేతులను తెరచి అట్టి ‘పాణిపాత్ర’ యందు ఆహారము భిక్షగా పొంది స్వీకరించాలి.
→ ఆహారమును ‘ఆకలి’ అనే వ్యాధికి ఔషధముగా భావించి ఔషధములాగా మాత్రమే స్వీకరించాలి.
→ ఆహారము ఎంత లభిస్తే అంతటితోనే ఆనందిస్తూ స్వీకరించాలి.
→ ఆహారమును ప్రాణములను నిలుపుకొనటానికి మాత్రమే ఉద్దేశ్యించాలి. అంతేగాని, ‘రుచి’ యొక్క భావనతో కాదు.
→ ఆహారమును క్రొవ్వుకొరకు, కండలు బాగా ఉండాలని ఉద్దేశ్యించకూడదు.
సంచారము :
అట్టి సన్న్యాసి ఎక్కడా దీర్ఘకాలము నిలువరాదు.
గ్రామములో అయితే - 1 రాత్రి మాత్రమే
నగరములో - 5 రాత్రులు మాత్రమే।
చాతుర్మాస్యము :
→ సంవత్సరమునకు 4 మాసములు కాలము (వర్షాకాలంలో) గ్రామంలోగాని, నగరంలోగాని చాతుర్మాస్య వ్రతపూర్వకంగా నివాసము కలిగి ఉండటము యతి యొక్క అభ్యాస నియమము.
→ (లేదా) పక్షము (Half of the month i.e., 15 days) మాసముగా తీసుకొని ‘4 పక్షమాసము’ (4 x 15 days = 2 నెలలు) చాతుర్మాస్యము (చాతుర్పక్షమాసము) ను ‘నివాసవ్రతము’గా ఆచరించవచ్చును.
ఈ ‘4’ లేక ‘2’ మాసముల చాతుర్మాస్యమును సత్సంగము కొరకు, వేదాంత - శాస్త్ర అధ్యయనము కొరకు మాత్రమే వినియోగించాలి.
వస్త్రధారణం : ద్విశీర్ణ వస్త్రం, వల్కలం వా ప్రగృహీణాయాత్। న అన్యత్। ముతక బట్టలు (మందపు ఖాదీ వంటివి) గాని, నార బట్టలుగాని ధరించాలి. ఇతరములైనవి ధరించరాదు. ఒకవేళ ముతకబట్టలు, నారబట్టలు కట్టుకోవటానికి అశక్తుడైతే (అనగా) అట్టి బట్టలు తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా అనిపించకపోతే - యది అశక్తోభవతి క్లేశతః తప్యతే తప ఇతి - అప్పుడు ముందుగా అటువంటి బట్ట ధరించటం అలవాటు చేసుకొంటూ, సానుకూల్యము - అని అనిపించిన తరువాత, క్రమంగా తగిన సమయంలో సన్న్యసించాలి. యోవా ఏవం క్రమేణ సన్న్యస్యతి యో ఏవం పశ్యతి।
శిష్యుడు : కిమ్ అస్య యజ్ఞోపవీతమ్? కాస్య శిఖా? కథం వా అస్య ఉపస్పర్శనమ్ ఇతి? గురుదేవా! ఉపనయన సందర్భంలో యజ్ఞోపవీత ధారణ, శిఖ (పిలక), ఉపస్పర్శము (ఆచమనము) - ఇవన్నీ ఉంటాయి. మరి సన్న్యాసికి కూడా ‘‘బ్రహ్మము యొక్క సమీప్య దర్శనము’’ లేక ఉపనయనమే లక్ష్యము కదా. అటువం{ప్పుడు యజ్ఞోపవీతము, శిఖ, ఆచమనములు సన్న్యాస విధానములో ఏమి ఉంటాయి?
(సన్న్యాసి విషయంలో యజ్ఞోపవీతము ఏది? శిఖ ఏది? ఉపస్పర్శనము (ఆచమనము) ఏమిటి?)
గురుదేవులవారు : ఆత్మస్వరూపా ! శిష్యా! విను చెప్పుతాను. ఇదమేవ అస్యతత్ యజ్ఞోపవీతం యత్ ఆత్మధ్యానమ్। సన్న్యాసి (లేక) యతికి అన్యధ్యానములను అధిగమించివేసి ‘‘సర్వత్రా ఆత్మదర్శనారూపము, అనన్యచింతనా రూపము’’ - అగు ఆత్మధ్యానమే యజ్ఞోపవీతము.
విద్యా శిఖా। ఆత్మ గురించిన విద్యయే ఆతనికి శిఖ.
ఉపస్పర్శనము: నిర్వైరః సర్వత్రా అవస్థితేః,- కార్యం నిర్వర్తయన్ ఉదరపాత్రేణ జలతీరే నికేతనమ్। ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా ఎవ్వరి పట్లా కించిత్‌గా కూడా వైరభావము లేకుండటము, (మరియు) బ్రహ్మతత్త్వము యొక్క అధ్యయనము- అనే కర్తవ్యము నిర్వర్తించుచూ, ఉదర పాత్ర (పొట్ట అనే పాత్ర) వెంటనిడుకొని నదీ తీరములలో నివాసము చేయటము - ఇదియే ఉపస్పర్శనము (ఆచమనము).
బ్రహ్మవాదులు : గురుదేవా! అస్తమితి ఆదిత్యే కథువా అస్య ఉపస్పర్శనమ్ - ఇతి? అయ్యా! సూర్యుడు అస్తమించిన తరువాత ఆయన ఆచమనం (నదీతీరంలో) చేస్తారా? ఆయనకు సంధ్యావందనాదులు ఉంటాయా?
గురుదేవులవారు : నాయనలారా! సన్న్యాస యోగికి - యదా అహని, తథా రాత్రే। న అస్య నక్తం, న దివా। - పగలు రాత్రి భేదముండదు. వారికి పగలు ఎటువంటిదో రాత్రి అటువంటిదే. సర్వకాల - సర్వావస్థలయందు ‘ఆత్మధ్యానము’ నందు నిమగ్నుడై ఉంటాడు. అన్ని కాలములు ఆయనకు సంధ్యాకాలములే.
తదపి ఏతత్ ఋషిణోక్తం। ఇది సన్న్యాసస్తుల గురించి ఋషిప్రోక్తము. వారికి సర్వకాలములు పగలుతో సమానమే. సత్-న్యాసులగు సన్న్యాసుల గురించిన ఈ విశేషమును ఎరిగినవారు ఆత్మజ్ఞానము వైపుగా సులభముగా అనుసంధానము పొందగలరు.
ఓం
శిష్యుడు : గురు భగవన్! సన్న్యసించుటకు ఎవ్వరికి అర్హత ఉంటుంది?
గురుదేవులవారు: (అద్వేష్టా సర్వభూతానాం, మైత్రః కరుణ ఏవచ। అమానిత్వమ్ అదంభిత్వమ్, అహింసా క్షాంతి, ఆర్జవమ్। అభయం, సత్వసంశుద్ధిః, జ్ఞానయోగ వ్యవస్థితః - ఇత్యాది) (భగవద్గీత - 12, 13, 14, 16, 18 అధ్యాయములలో చెప్పబడిన) నలుబది ఉత్తమ సంస్కారములతో కూడుకొని ఉన్నవాడు సమస్త దృశ్య వ్యవహారముల పట్ల అనురక్తిని (attachment) జయించి విరక్తి పొంది ఉన్నవాడు, చిత్తశుద్ధిని పెంపొందించుకున్నవాడు - సన్న్యసించటానికి అర్హుడు. లోకసంబంధమైన కోరికలు, ఆశ, అసూయ, ఈర్ష్య అహంకారము.. ఇవన్నీ తపో-ధ్యాన-యోగాభ్యాస-జ్ఞానాగ్నులచే దగ్ధం చేసివేయాలి.
(1) ఇంద్రియ నిగ్రహరూపమగు శమము (Sense of mental withdrawal from worldly happenings)
(2) మహనీయులతో సత్సంగము (‘సత్’ - ఎప్పటికీ ఉండే దానితో సంగము. ‘అసత్’తో అసంగము) అభ్యసిస్తూ,
(3) విచారణ (Application of common sense. The Approach of Analyzing) కు ఉపక్రమించి, ప్రాపంచక సమస్త విశేషములపట్ల నిత్యానిత్య వివేకము ఆశ్రయించటము.
(4) తృప్తిరూపమగు సంతోషము
(శమము, సత్సంగము, విచారణ, సంతోషము అనబడు) సాధన చతుష్టయ (నాలుగింటి సముదాయ) సంపన్నుడే సన్న్యాసాశ్రమ స్వీకారమునకు ఉత్తమార్హుడు.
నిశ్చయించుకొని కూడా, సన్న్యసించకపోతే...,
ఒకానొకడు సన్న్యసించటానికి నిర్ణయించుకొని, కుటుంబసభ్యుల అనుజ్ఞపొంది, కులగురువుల ఆశీర్వాదము పొంది, వైశ్వానరేష్ఠిని చేయుచూ... ఇటువంటి ఆయా సందర్భములలో ఒక సమయంలో ఏవో అవాంతరముల వలన సన్న్యసించు ఆలోచనను విరమించవలసి వస్తే? సన్న్యాసే నిశ్చయా కృత్వా, పునః న కరోతి యః, అట్టివాడు మరల సన్న్యసించాలని నిర్ణయించకుంటేనో? స కుర్యాత్ కృచ్ఛ్ర మాత్రంతు పునః సన్న్యస్తుమ్ అర్హతి। ఆతడు కృచ్ఛ్రమాత్రంగా (Eg. A function as a formality by inviting related people including Guru) - నిర్వర్తించి మరల సన్న్యాసము తీసుకొనవచ్చును. అనగా, ఇతఃపూర్వము నిర్వర్తించినంతవరకు - సన్న్యాస స్వీకారాగ్ని కార్యములు (వైశ్వానరేష్ఠి) మొదలైనవి మరల నిర్వర్తించవలసిన పనిలేదు.
త్రి-పతితులు
ఈ క్రింది ముగ్గురిని త్రి-పతితులు (slip-trio that fall down from the path of SANYASIN) - అని చెప్పబడుచున్నారు.
(1) సన్న్యాసం పాతయేత్ యస్తు। సన్న్యసించి, ఆ తరువాత సన్న్యాస నిష్ఠ-నియమములు పాటించనివాడు. తిరిగి సాంసారిక వ్యవహారములందు తలదూర్చి నిమగ్నుడగుచున్నవాడు. (Distraction and slipping into worldly Avocations). ఈతడు సన్న్యాసాశ్రమ విధుల నుండి భ్రష్టుడు అయినవాడు - అగుచున్నాడు.
(2) పతితం న్యాసయేత్తుయః। సన్న్యాసము స్వీకరించి కూడా ఆత్మన్యాసము (ఆత్మనిష్ఠ) ఆశ్రయించనివారు.
(3) సన్న్యాస విఘ్నకర్తాచ। ఎవరైనా సన్న్యాసాశ్రమాభిలాషులై ఉంటే, అట్టి సన్న్యాసాశ్రమ నిర్ణయము గల అర్హులు సన్న్యాసము తీసుకోనీయకుండా నిష్కారణంగా (కావాలని) విఘ్నములు కల్పించువారు.
సన్న్యాసమునకు ఎవరు అనర్హులు?
షండుడు (నపుంసకుడు). పతితుడు ( బ్రహ్మచర్య - గృహస్థాశ్రమ ధర్మములు విడచి పతితుడైనవాడు), అంగవికలుడు (Physically Handicapped); స్త్రైణుడు (స్త్రీ స్వభావములు, లక్షణములు గల పురుషుడు);
బధిరుడు (చెవిటివాడు); అర్భకుడు (బలహీనుడు); మూగవాడు; పాషండుడు (చెప్పితే విని కూడా ఏ మాత్రము తెలుసుకొనజాలని మూర్ఖుడు).
చక్రీ - భుజముపై చక్రాంకణములు ముద్రించుకొన్నవాడు ( ఒక్క వైష్ణరమతమో, శైవమతమో మరేరదైనా ఒక మతము తప్పించి మరే మాటలు వినటానికి విచారించటానికి సంసిద్ధుకాని స్వభావము అధికముగా కలవాడు); లింగధారణము చేసుకొన్నవాడు;
[చక్రీ = చాడీలు చెప్పు, పరదోషణ చేయు అలవాటు విడువనివాడు]
కుష్టువ్యాధి పీడితుడు;
వైఖానసుడు (విష్ణు దేవాలయములో అర్చక వృత్తి నిర్వర్తించువారు);
హరిద్విజే (శ్రీహరిని ద్వేషించు స్వభావము కలవాడు);
భృతకుడు (రోజూ కూలిచేస్తూ కుటుంబభారము నిర్వర్తించువాడు);
అధ్యాపకుడు (వేదములు చదివింపజేస్తూ నేర్పుతూ ఉండే ఉపాధ్యాయుడు), శిపినిష్ఠుడు (వీరాభిమాని);
అనగ్నికుడు (అగ్నికార్యముల పట్ల దూషణబుద్ధి కలవాడు);
నాస్తికుడు (కనబడే ప్రపంచమునకు ఆధారమైయున్న భగవత్ సంబంధమైన చైతన్యతత్త్వము ఉన్నది - అనే అభిప్రాయమును తిరస్కరించువాడు);
ఆయా సంపద, పరస్పర సంబంధముల, లౌకికమైన వ్యవహారముల పట్ల అనురక్తి వదలలేనివాడు (విరక్తిని సముపార్జించుకోనివాడు)...,
వీరంతా సన్న్యాసము స్వీకరించటానికి తగిన అర్హత పొందనివారవుతారు.
→ ఒకవేళ్ళ వీరు జీవన విధానము దృష్ట్యా సన్న్యాసము పుచ్చుకొన్నప్పటికి ముందుకు వచ్చినప్పటికీ కూడా - (సోఽహమ్, తత్ త్వమ్, జీవోబ్రహ్మేతి నాపరః అయామాత్మాబ్రహ్మ। సర్వం ఖిలు ఇదం బ్రహ్మ’’ మొదలైన - పరతత్త్వమును సిద్ధాంతీకరిస్తూ వేద - ఉపనిషత్తులలో చెప్పబడిన) మహావాక్యములను ఉపదేశించటానికి అర్హులు కాజాలరు.
అట్లాగే,
ఆరూఢ పతితుడు (ఒకసారి సన్న్యసించి పతితుడైనవాడు), ఆతని సంతానము (కునఖీ); వ్యాధి చేత గోళ్ళు పిప్పిగోళ్లుగా అయినవాడు;
దీర్ఘవ్యాధుల వలన పుప్పి పళ్లు గలవాడు; క్షయ మొదలైన ప్రాణాంతక రోగములచే బాధింపబడుచున్నవాడు; అంగవికలుడు (Physically handicapped)-వీరంతా కూడా సన్న్యాసాశ్రమమునకు అర్హులు కాదు. (అయితే ‘ఆతురసన్న్యాసము’నకు ఇవన్నీ అనర్హత కాదు).
దుష్ట స్త్రీ సంపర్కములో మునిగి తేలువారికి, పంచమహాపాతకములు చేసిన వారికి, వ్రాత్యులకు (ఉపనయము మొదలైన సంస్కారములు నిర్వర్తించనివారికి), వారి పిల్లలకు, దుష్టప్రవర్తన కలిగియున్న సంస్కార హీనులకు, అభిశస్తులకు ( పరదూషణ చేస్తూ సంఘ బహిష్కారము పొందినవారికి).. సన్న్యాసముయొక్క అనుజ్ఞ (పూజ్యులగు గురువులు) ఇవ్వరు.
వ్రతము, యజ్ఞము, తపస్సు, దానము, హోమము, స్వాధ్యాయము. ఈఈ అభ్యాసములు లేకుండా వాటి పట్ల అగౌరము కలవారు, ‘‘సత్యము, శుచి’’ ఇటువంటి ఆశయముల నుండి భ్రష్టులైనవారు - ‘‘సన్న్యాసము ఇవ్వకూడనివారు’’ అని చెప్పబడుచున్నారు.
ఆతుర సన్న్యాసము
కొన్ని సందర్భములలో మృత్యువును సమీపిస్తున్న ముముక్షువు ‘‘సన్న్యాస స్వీకారేచ్ఛ’’ - ప్రకటించునప్పుడు ఆతని బంధువులు నిర్వర్తింపజేయు ‘సన్న్యాసము’ - ఆతుర సన్న్యాసము అనబడుతోంది. పైన సన్న్యాసదీక్షకు అనర్హులుగా చెప్పబడిన వారందరు ఆతుర సన్న్యాసమునకు అర్హులే.
ఏతేన అర్హన్తి సన్న్యాసం ఆతురేణ వినా క్రమమ్। ఆతుర సన్న్యాసమునకు సన్న్యాసాశ్రమ స్వీకారమునుకు చెప్పబడిన ‘‘బంధువుల - గురువుల అనుజ్ఞ, వైశ్వానరేష్టి, తూర్పు- ఉత్తర దిక్‌యానము’’ మొదలైన వాటితో అవసరము లేదు.
సన్న్యసించుచూ ఆచరించవలసిన విధానములు
శిఖాం ఉత్పాద్య। ‘‘ఓం భూః స్వాహా’’ - అని పలుకుచూ ముందుగా శిఖ (పిలక)ను తొలగించివేయాలి.
యజ్ఞోపవీతం ఛిత్వా : బాహ్య ధారణా రూపమగు యజ్ఞోపవీతమును - యశోబలం, జ్ఞానం, వైరాగ్యం మేధాం ప్రయచ్ఛ మే - ఓ పరమాత్మా! ఇంతవరకు ఉపనయనార్ధము ధరించిన ఈ యజ్ఞోపవీతమును సన్న్యాసాశ్రమ ప్రారంభ సంజ్ఞగా త్రెంచుచున్నాను. నా యొక్క నూతన ఆశ్రమంలో అడుగులిడుచుండగా, - యశోబలము, జ్ఞానము, వైరాగ్యము, మేథ ప్రసాదించవేడుకొనుచున్నాను. అనగా, భౌతికమైన యజ్ఞోపవీతమును విడుస్తున్నానేగాని, అంతరార్థమగు యశో-బల-జ్ఞాన-వైరాగ్య -మేధస్సులను కాదు’’ అని భావన చేస్తూ యజ్ఞోపవీతమును త్రెంచాలి.
వస్త్ర విసృజ్యమ్ : ‘‘ఓం భూః స్వాహా’’.. అని పలుకుచూ ఇదిగో - ఇతఃపూర్వపు నాగరిక కటిసూత్రమును (మొలత్రాడును), వస్త్రములను వరుణ భగవానునికి సమర్పిస్తున్నాను - అని చెప్పుచూ వస్త్రములను మొలత్రాడును జారవిడచుచూ ‘‘సన్న్యస్తం మయా’’ అని 3 సార్లు అభిమంత్రించాలి.
భాస్కర భగవానుని - మంగళాశాసనము
సన్న్యాసము స్వీకరించిన ద్విజుని (ద్వితీయమగు ఆత్మతో ఏకత్వభావాన - సంసిద్ధుని)చూచి సూర్యమండలాధీసుడగు భాస్కర భగవానుడు తన యొక్క బ్రహ్మానందమును ప్రకటిస్తూ ఉంటారు. తన స్థానములో పులకితులగుచు :-
‘ఏషమే మండలం భిత్వా పరబ్రహ్మ - అధిగచ్చతి’. నాకు చేతులెత్తి నమస్కరిస్తున్న ఈ సన్న్యాస యోగాభ్యాసి దిగ్విజయుడై, నన్ను సమీపిస్తూ ఉండగా, నేను స్థానచలనము నిర్వర్తించి (సూర్యమండలము భేదించి ‘పరబ్రహ్మము’ను చేరుటకు) మార్గమును చూపుతాను. ‘‘బిడ్డా! సన్న్యాస యోగీ! సుస్వాగతం! నీ యొక్క పరాకాష్ఠ లక్ష్యము సిద్ధించుటకై నేను మార్గప్రసాదిని, మార్గదర్శిని అవుతాను’’ - అని భాస్కరుడు మంగళాశాసనము పలుకుచున్నారు.
‘‘సన్న్యాసం మయా’’ అని మూడుసార్లు పలుకుచూ.. సన్న్యాసించిన యోగి యొక్క ‘60’ ఇతఃపూర్వపు తరములవారు, ‘60’ మునుముందు తరములవారు సంసార కల్మష దోషముల నుండి విముక్తులై పవిత్రులు కాగలరు.
దండము యొక్క పరిగ్రహణము
ఏ విధంగా అనేక దోషములతో కూడుకొనియున్న బంగారు ఖనిజము ‘తుషాగ్ని’ యందు కాల్చబడుచూ అట్టి దోషపూరితములగు అన్యలోహాణువులను త్యజించి ధగధగాయమానంగా ప్రకాశించి బంగారపు ముద్ద అగుచున్నదో.., ఆవిధంగా సన్న్యాసాశ్రమము జీవుని పవిత్రునిగా తీర్చిదిద్దగలదు.
సన్న్యాసి ‘‘సఖా మా గోపాయ। ఆత్మ సఖుడా! రండి! రండి। నాకు రక్షకులు అవండి’’ - అని త్రిదండమును చేత ధరించుచున్నాడు అట్టి ఆ సన్న్యాసయోగి యోగాగ్ని యొక్క ఆశ్రయముచే వెలుగొందగలడు.
అట్టి దండము - వెదురుతో తయారైనదై ఉండాలి. లోహముతో తయారు చేయునది నిషిద్ధము. ఆ దండము ‘చిల్లులు, ఎత్తు పల్లములు’ - కలిగినదై ఉండకూడదు. సమమైన కణుపులు కలిగి ఉండాలి.
పుణ్యస్థలములలో సముత్పన్నమైనదై (లేక) ఆశ్రమములవంటి పవిత్ర స్థలము నుండి తెచ్చినదై ఉండాలి. అంతేగాని శ్మశానవాటికలనుండి, అపరిశుభ్రప్రదేశముల నుండి తెచ్చినట్టిది అవకుండును గాక! అద్దానిని ఆచ్ఛాదించి యున్న దుమ్ము, ధూళి, పేడ వంటి కల్మష దోషములన్నీ తొలగించాలి. సహము కాలినది, చీలికగా విరిగియున్నది అయి ఉండరాదు.
దండము యొక్క ఎత్తు:
ఆ యతి / సన్న్యాసి నడుచునప్పుడు సానుకూల్యంగా పై భాగంలో లావుగా, క్రిందవైపు కొంత సన్నముగాను, చివ్వర చతురస్రాకారము కలిగి ఉండుగాక.
పొడుగు (Length) :
→ నేల నుండి నడుము ఎత్తు వరకుగాని,
→ నేల నుండి - ముక్కు స్థానము వరకుగాని,
→ నేల నుండి - భ్రూమధ్య స్థానము ఎత్తుగాని,
సన్న్యాసియొక్క సానుకూల్యతను, సౌకర్యమును అనుసరించి దండము పొడవు కలిగినదై ఉండును గాక।
దణ్డ ఆత్మనో అస్తు సంయోగః సర్వధాతు విధీయతే।। ఏ విధంగా ఆత్మ ఈ జీవుని సర్వదా వెంటనంటి ఉంటుందో.. ఆ తీరుగా సన్న్యాసి దండమును సర్వదా చేత ధరించి తన వెంటనే ఉండును గాక! దండము - సర్వతత్త్వ స్వరూపమగు ఆత్మయొక్క భావనకు ‘సంజ్ఞ’.
‘‘ఈ దండము (ఇక్కడి సమస్తము ‘తానే’ అయి, ఈ సమస్తమునకు ‘వేరే కూడా’ అయి ఉన్న) మమాత్మ స్వరూపముగాను, ఆత్మధ్యాన పరికరముగాను కూడా ధారణ చేస్తున్నాను’’ - అని ఆ యతి భావన కలిగి ఉండును గాక! న దణ్డేన వినా గచ్ఛేత్ ఇషుక్షేప త్రయం బుధః। ఆ సన్న్యాసి దండము లేకుండా - బాణము విడచినప్పటి దూరమునకు - మూడంతలు (x 3) మించి నడచి వెళ్లరాదు- అను నియమము కలిగి ఉండును గాక.
కమండలువు / కమండలము:
(సన్న్యాసులు, బ్రహ్మచారులు జలముకొరకై ఉపయోగించు పాత్ర / కొమ్ము చెంబు వంటిది).
‘‘జగత్ జీవనం, జీవన ఆధారభూతం,
మాతే! మా మంత్రయస్వ సర్వసౌమ్య!’’
అను మంత్రమును పలుకుచూ కమండలమును జగత్ జీవనము (జగత్తులో అంతటా ప్రసరించియున్న జీవన (లేక) ప్రాణశక్తి గాను), సమస్త జీవుల జీవనాధారభూతంగాను ఉపాసించుచూ చేత ధరించాలి.
సన్న్యాసి ఈ విధంగా యోగ కమండలువును చేతితో పరిగ్రహించి, యోగ పట్టాభిషిక్తుడై ఆత్మసుఖమును సునిశ్చలము, సునిశ్చితము చేసుకొనుచూ ఈ విశ్వ ఉద్యాన వనమునందు హాయిగా, సుఖముగా విహరించును గాక। ఈ దృశ్య ప్రపంచమును ‘ఆత్మ’ గురించిన అధ్యయన విద్యకొరకై ప్రసాదించబడిన విశ్వవిద్యాలయము (The universe is an university for studying about "SELF") గా భావించును గాక.
ఇక సాంఘికమైన సామాజికమైన విశేషములైనటువంటి:-
‘‘ఇది ధర్మము. అది ధర్మము కాదు - అధర్మము ।
- ఇది సత్యము - అది అనృతము - అసత్యము।’’
- వీరు మంచివారు. వారు కాదు. వీరు జ్ఞానులు. వారు అజ్ఞానులు’’
- మొదలైన సాపేక్ష సంబంధమైన సంభాషణలను, వాదోపవాదములను, ‘‘మంచివారు - కానివారు; ధర్మపరులు - కానివారు; సత్యవంతులు - అసత్యవంతులు’’ ... ఇత్యాది భేద దృష్టులను సర్వాతీత దృష్టితో త్యజించి వేయునుగాక!
అంతేకాదు. యేన త్యజసి, తత్ త్యజ! దేనితో ‘ఇవన్నీ త్యజిస్తున్నాను’ అనే త్యాగమును నిర్వర్తిస్తున్నారో, అట్టి త్యాగాహంకారమును కూడా త్యజించి.. ఈ భూమిపై ‘‘త్యాగత్యాగి’’యై బ్రహ్మానంద - దండమును, ప్రజ్ఞా కమండలువును ధరించి ప్రశాంత చిత్తుడై సంచరించును గాక!
‘‘ఇదంతా నా ఆత్మయే’’- అను భావనను పుణికిపుచ్చుకొని ఈ జగత్-ఉద్యానవనములో చిన్నపిల్లవానివలె క్రీడించును గాక।
చతుర్విధ సన్న్యాసయోగులు
(1) వైరాగ్య సన్న్యాసి (2) జ్ఞాన సన్న్యాసి (3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసి (4) కర్మ సన్న్యాసి
(1) వైరాగ్య సన్న్యాసి :
దృష్ట్వా అనుశ్రవిక విషయ వైతృష్ణ్యం ఏత్య, ప్రాక్ - పుణ్యకర్మవిశేషాత్ సన్న్యస్తః।।
ఒకానొకడు ఈ ప్రాపంచక విషయాలు చూచి చూచి, విని విని, ... ఇక వీటిపై రోత పుట్టి,... సమస్త సందపల పట్ల, సంబంధ అనుబంధ బాంధవ్యముల పట్ల - విరక్తి పొందుచున్నాడు. సమస్త దృశ్య విషయముల పట్ల తృష్ణారాహిత్యము పొందుచున్నాడు.
‘‘అబ్బ! ఎంతో చూచాను. తిన్నాను. త్రాగాను. జనులతో సంబంధములు అనుభవించాను. (అహం మన్యైః అలమ్।). ఇక చాలు! వీటి వలన నాకు ఉత్తమ ప్రయోజనమేదీ లేదు. చూచినదే చూస్తున్నాను. విన్నదే వింటున్నాను. చెప్పినదే చెప్పుచున్నాడు. ఈ దేహము క్రమంగా శిధిలము కాబోవుచున్న వస్తువేకదా! వీటిలో అభిరుచి పొంది ఉండవలసినది క్రొత్తగా ఏమున్నది?’’
- అని ప్రశ్నించుకుంటున్నాడు.
- తర్కించుకుంటున్నాడు.
వాటన్నిటిపట్ల అనురక్తిని మొదలంట్లా త్రెంచి వేసుకుంటున్నాడు.
(న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతే - అని (భారతములో) యయాతి చక్రవర్తి ఎలుగెత్తి పలికినట్లు), ప్రాపంచక విషయములు పొందుచున్నకొలదీ ఇంకా పొందాలనే అనిపిస్తుంది. కాని, ‘‘చాలు, ఇంకా ఎందుకు?’’ అని అనిపించటము దైనందికమైన లౌకిక జీవితంలో అనిపించదు. మరి ఎప్పుడనిపిస్తుంది? ప్రాక్ పుణ్యకర్మ విశేషాత్ సన్న్యస్తః। జన్మ జన్మాంతరాలుగా నిర్వర్తించిన పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే అది లభ్యమౌతుంది. అట్టివాడే హృదయమందు రాగరాహిత్యము (sans attachment) సిద్ధించుకొని ‘‘వైరాగ్యసన్న్యాసి’’గా అగుచున్నాడు. సర్వత్రా విరాగి అయినవాడు స్వభావసిద్ధంగానే ఆత్మతో అనుసంధానము పొందుచున్నాడు.
(2) జ్ఞాన సన్న్యాసి :
శాస్త్ర జ్ఞానాత్ పాపుపుణ్యలోక అనుభవ శ్రవణాత్, ప్రపంచ ఉపరతో, దేహవాసనాం - శాస్త్రవాసనాం - లోకవాసనాం త్యక్త్వా, అవమానం మానమివ ప్రవృత్తిం సర్వం హేయం మత్వా, సాధన చతుష్టయ సంపన్నోఽయః సన్న్యస్యతి। ఒకానొకడు ‘‘శాస్త్రములు విశదీకరిస్తున్న మహత్తరము, ఆత్యంతికము ఏమై ఉన్నది?’’..... అని శాస్త్రములు పరిశీలించటము ప్రారంభిస్తున్నాడు.
ఇతిహాసములు, పురాణములు పుణ్యపాపకర్మల తదనంతర సుఖ-దుఃఖ పర్యవసానముల గురించి ఏమి చెప్పుచున్నాయో....వినుచున్నాడు.
సమస్త ద్వంద్వములను అధిగమించగా శేషించు ఆత్మగురించి చదువుచున్నాడు.
‘‘ఈ దృశ్యముగా అనేక భేదములతో కనిపించేదంతా కాలముచేత జనిస్తోంది. కాలము చేత నశిస్తోంది. అందుచేత దీనికి పరిమితమై ఉండటమనేది మహదాశయమే కాదు. ఇదంతా సందర్భంగా సత్యమువలె కనిపిస్తోంది. సహజమగు సత్యము ఏమాత్రము కాదు’’ - అని గ్రహించుచున్నాడు.
ఇక ప్రపంచము నుండి తనయొక్క ఇష్టముపట్ల, ఇష్టము - రూపమగు చిత్తముయొక్క ఉపశాంతికై (for withdrawal) సంసిద్ధుడగుచున్నాడు. క్రమంగా గురువాక్యములు మననము చేస్తూ, దేహముతో ఏర్పడుచున్న వాసనలు, శాస్త్ర పాండిత్యమునకు సంబంధించిన వాసనలు (Tendencies), లోకములోని జనులతోను - ప్రదేశములతోను - వస్తుసముదాయముతోను సంబంధితమైయున్న వాసనలను, ఉత్తమ - అధమలోకములకు సంబంధించిన అభినివేశములను - మొదలంట్లా త్యజించుచున్నాడు.
‘‘మానము - అవమానము’’...ఇటువంటి ద్వంద్వభావములన్నీ ‘‘మనోకల్పితమగు భ్రమయే కదా!’’ - అని గమనించి వాటిని తిరస్కరించి వేయుచున్నాడు. క్రమంగా జయిస్తున్నాడు. అట్టి ప్రవృత్తులన్నీ హేయముగా చూడనారంభిస్తున్నాడు.
సాధనచతుష్టయసంపత్తి (1) ఇంద్రియ నిగ్రహరూపమగు శమము (2) అధ్యయనరూపమగు విచారణ (3) పొందుచూ ఉన్నదానిపట్ల తృప్తి (సంతోషము) (4) మహనీయులతో సంగము రూపమగు సంత్సంగము లను ఆశ్రయిస్తున్నాడు. సాధన చతుష్టయ సుసంపన్నుడై (After fully practising Four facets) వెలయుచున్నాడు.
అట్టియోగి శాస్త్రజ్ఞాన - విజ్ఞానసంపన్నుడై సన్న్యాసాశ్రమము స్వీకరించినప్పుడు ఆయన ‘జ్ఞానసన్న్యాసి’ అని పిలువబడుచున్నారు.
(3) జ్ఞానవైరాగ్య సన్న్యాసి :
క్రమేణ సర్వమ్ అభ్యస్య సర్వం అనుభూయ జ్ఞానవైరాగ్యాభ్యాం స్వరూప-అనుసంధానేవ - ‘దేహమాత్ర’ అవశిష్టః సన్న్యస్య జాతరూపధరో భవతి - స ‘‘జ్ఞానవైరాగ్య సన్న్యాసీ’’।।
ఒకానొకడు -
- శాస్త్రములు చెప్పుచున్న ‘తత్త్వజ్ఞానము’ గురించి అభ్యాసము చేసినవాడై,
- క్రమంగా సర్వము అనుభూతిగా పొందినవాడై,
- జ్ఞాన - వైరాగ్యపూర్వకంగా ఆత్మస్వరూపానుసంధానము చేయుచూ,
- దేహత్వమును అధిగమించి ‘దేహి’ మాత్రుడుగా శేషించినవాడై, సర్వమును మనస్సుతో సన్న్యసించివేయుచున్నాడు.
అప్పుడే పుట్టిన బిడ్డవలె జగద్రహితుడై, కేరింతలు కొట్టుపిల్లవానివలె జాతరూపధరుడు అగుచున్న యోగి జ్ఞానవైరాగ్య సన్న్యాసిగా అనబడుచున్నాడు.
(4) కర్మ సన్న్యాసి :
బ్రహ్మచర్యం సమాప్య, గృహీభూత్వా - వానప్రస్థాశ్రమమ్ ఏతి। అవైరాగ్యాభావేఽపి, ఆశ్రమ క్రమానుసారేణ....సన్న్యాస్యతి యః - ఒకానొకడు ఆశ్రమ క్రమానుసారంగా మొదట బ్రహ్మచర్యమును, తరువాత గృహస్థాశ్రమమును, ఆ తరువాత వానప్రస్థాశ్రమమును నిర్వర్తించి...అటుపై వరుసక్రమంగా (వైరాగ్యవంతుడు అవకయే) ఆత్మతత్త్వానుభూతికొరకై సన్న్యసిస్తే .... అది కర్మ సన్న్యాసము అగుచున్నది.
షట్ (6) విధ సన్న్యాసులు - వారి బాహ్య లక్షణములు
(1) కుటీచక (2) బహూదక (3) హంస (4) పరమహంస (5) తురీయాతీత (6) అవధూత
(1) కుటీచక సన్న్యాసి :
శిఖాయజ్ఞోపవీతీ। దండ కమండలు ధరః। కౌపీన శాటీ కంధా ధరః। పితృ మాతృ గుర్వారాధనపరః।
కుటీరమును (ఇల్లును) విడువకయే సన్న్యసించువాడు. కుటీరమే ఈయనకు ఆశ్రమము. ఆశ్రమమే ఆతనికి కుటీరము కూడా.
యజ్ఞోపవీతము, శిఖ (పిలక) ధరించియే ఉంటారు. అయితే దండము, కమండలము ధరించి ఉంటారు. గోచి, దుప్పటి, బొంత కలిగినవాడై ఉంటారు.
తనయొక్క సేవలను అందిస్తూ తల్లి, తండ్రి, గురువులను సంతోషింపజేస్తూ పరిసేవకుడై ఉంటారు.
ఆత్మను ఆరాధిస్తూ ఉంటారు. సర్వదా శ్రామికుడై ఉంటారు.
కవ్వపుకోల, వంటకుండ, గడ్డపార, త్రవ్వకము, పారా, ఉట్టి - ఇటువంటి సేవక వస్తువులన్నీ ఈయనకు యోగ సాధనవస్తువులే.
దేశ సంచారము కాకుండా ఒక్కచోటనే ఉండి అక్కడ మాత్రమే భోజనము సేవించు అభ్యాసము కలిగి ఉంటారు.
ఈయన ముఖ్య బాహ్య లక్షణములు - మరల చెప్పుకుందాము.
(i) శిఖా - యజ్ఞోపవీతి। దండ కమండలు ధరః।
(ii) కౌపీన శాటీ కంధారః।
(iii) పితృ-మాతృ-గురు ఆరాధనపరః।
(iv) శ్రమను చేస్తూ సమర్పించువాడు।
(v) ఏకత్రా అన్నాదనపరుడు. (అన్నము సమకూర్చువాడు, తయారు చేయువాడు).
(vi) శ్వేత (తెలుపు) ఊర్థ్వ పుండ్రములను ధారణచేస్తూ ఉంటాడు. త్రిదండమును చేత ధరిస్తూ ఉంటారు.
(vii) సర్వసమో। సర్వత్రా సమభావుడై ఒకచోటనే ఉండి ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు. ఈతడు తాను ఎక్కడ ఉంటే అక్కడ, తన ‘ఆశ్రమము’గా భావిస్తూ ఉంటాడు.
(2) బహూదక సన్న్యాసి :
శిఖాది కంధాధరః : ఈయన కూడా శిఖ (పిలక), కంఠము (బొంత) మొదలైనవి ధరిస్తూ ఉంటారు.
త్రిపుండ్ర ధారీ : ఫాలభాగము చేతులు మొదలైన చోట్ల త్రిపుండ్రములను ధరిస్తూ ఉంటాడు.
కుటీచకవత్ సర్వసమో। కుటీచక సన్న్యాసివలెనే సర్వత్రా సమభావనచే సమస్తము ఆత్మగా దర్శించు అభ్యాసి, స్వభావి అయి ఉంటారు.
మాధుకరీ : భౌతిక దేహమును మాధుకర (భిక్షక) వృత్తిచే ఒక బాహ్య ఉపకరణముగా (రైతు ఆవును పోషించుతీరుగా) సన్న్యాసయోగ సాధనా లక్ష్యముతో పోషిస్తూ ఉంటారు. లోకమునకు ఉపయోగించు ఒక వస్తువుకు కాపలాదారునివలె శరీరముపట్ల భావన కలిగి ఉంటారు.
మాధుకరవృత్యా అష్ట కబళాశీ : భిక్షకుడై ఉంటాడు. ఎనిమిది కబళములు మాత్రమే - ఎనిమిది ఇళ్లలో మాధుకరముతో - ‘పొట్ట’ అనే యజ్ఞకుండమునకు (భిక్షాటనచే) సమర్పించు భావము కలిగి ఉంటారు.
(3) హంస :
జటాధరీ : జడలు ధరించి ఉంటారు.
త్రిపుండ్ర ఊర్థ్వధారీ : త్రిపుండ్రములను ధారణ చేస్తూ ఉంటారు. ఫాలభాగముపై ఊర్థ్వ పుండ్రధారుడై ఉంటారు.
అసంక్లప్త మాధుకరీ (అన్నాశీ) : విశాలమైన వీధులలో మధుకరము (భిక్షాటనము) చేస్తూ లభించిన ఆహారమును స్వీకరించువారై ఉంటారు.
కౌపీన-ఖండధారీ : గోచీ, గొంగళి ధరించు వారై ఉంటారు.
(4) పరమహంస :
• శిఖాయజ్ఞోపవీత రహితః। శిఖ, యజ్ఞోపవీతములను విడచివేసినవారై ఉంటారు.
• పంచగృహేషు కరపాత్ర : ‘5’ ఇళ్లలో మాత్రమే రెండు చేతులతో ఆహారము భిక్షగా స్వీకరించువారై ఉంటారు.
• ఏక కౌపీనధారీ : ఏకకౌపీనమును, ఒకటే (బొంత/దుప్పటి), ఒక వైణవము (వెదురుదండమును) ధరిస్తూ ఉంటారు.
• అంగములందు చితాభస్మమును ధరించుచూ ఉంటారు. భస్మోద్ధూళనపరః।
• సర్వత్యాగీ। ఈ దేహ దృశ్య-లోక-సాంఘిక సంబంధ-అనుబంధ-వ్యవహారములన్నీ మొదలంట్లా త్యజించినారై ఉంటారు.
(5) తురీయాతీతుడు
గోముఖవృత్తిగా ఏది ఎక్కడ ఎంతవరకు లభిస్తే....అంతవరకే భుజించుచూ సంచరించువారు.
గోముఖవృత్త్యా ఫలహారీ - అన్నాహారీ।
- మూడు గృహములందు భిక్షాటన చేసి ఏది ఎంత వరకు లభిస్తే అంతవరకే స్వీకరించి ఈ మాంసమయదేహమును లోకవినోద-లోకకళ్యాణభావనలతో పోషించువారు.
- ఈ దేహమును భౌతికమైన ఒక బాహ్య వస్తువుగా చూచువారు.
- దిగంబరులై, దేహమాత్రావసిష్టులై ఉండువారు. (దిక్ + అంబరులు = ఈ 10 దిక్కులతో కూడిన దృశ్య ప్రపంచము తాను ఆత్మస్వరూపుడై ధరిస్తున్న వస్త్రముగా దర్శించువారు)
- ఈ శరీరమును శవమువలె ఒక మరణించిన (గతించిన) వస్తువుగా - కృణపవత్ - చూచువారు. శరీరవృత్తులను త్యజించి ఉండువారు.
ఒకడు ఏ రంగు వస్త్రము ధరించినా కూడా, కాళ్లు - చేతులు - చర్మము మొదలైన వాటితో కూడిన ఆతని శరీరము యొక్క సహజ ధర్మములు మారవు. అట్లాగే, నేను శరీరము ధరించినా కూడా సత్ - చిత్ - ఆనందస్వరూపమగు ‘శరీరి’ ధర్మములు మారవు - అను ఎరుక కలిగి ఉంటాడు.
(6) అవధూత
స్వరూప అనుసంధానపరః
.. ఈ మొదలైన ఉపనిషత్ బోధలను పునికిపుచ్చుకున్నవాడై అవధూత సర్వదా స్వస్వరూప - సహజస్వరూప ఆత్మానుసంధానుడై ఉంటాడు. ఈ భౌతిక ‘దేహము’ను అలంకారోపకరణముగా కలిగియుండి, క్రీడావినోదంగా దృశ్యంలో సంచరిస్తూ ఉంటారు.
వీరందరూ కూడా (కుటీచకుని నుండి-అవధూత వరకు) ఈ భౌతికదేహమును జగద్దృశ్యమునకు చెందిన ఒక ఉపకరణముగాను, తాముఈ జగత్తంతా తన శరీరముగా కలవాడుగాను దర్శించువారై ఉంటున్నారు.
సన్న్యాసయోగుల (అవధూతల, పరమహంసల, తురీయాతీతుల) ఆత్మానంద గానము
WHAT I AM NOT? - నేను ఏది అయి ఉండలేదు?
జగత్ తావత్ ఇదం నాహం, స వృక్ష తృణ పర్వతమ్। యత్ బాహ్యం జడమ్ అత్యంతమ్- తత్స్యాం కథమ్ అహమ్ విభుమ్?, నేను ఈ బాహ్య జగత్తులోని వస్తువు వంటివాడిని కాను.
ఈ దృశ్యము కనిపిస్తూ ఉన్నదిగాని, ఇందులో కనిపించే వృక్షములు, గడ్డిపరకలు, పర్వతములు వంటి ఒక వస్తువును నేను కాదు. ఈ దృశ్యములోని భౌతిక వ్యవహారమంతా అచేతనమగు జడము. ఇక నేనో? సచేతనమగు చైతన్యస్వరూపుడను. నిత్యచైతన్యుడగు నేను రాయి - రప్ప - వంటి అచేతనపదార్థమెట్లా అవుతాను? వాటికి నేను భావనారూప - సంకల్ప సమన్వితుడగు విభువును.
ఈ భౌతిక దేహము నేను కానే కాదు। కాలేన అల్పేన విలయీ దేహో నాహం అచేతనః। ఈ భౌతికదేహము స్వయముగా కదలలేదు. చూడలేదు. వినలేదు. అందుచేత అచేతనము. పైగా ఇది కొంతకాలం క్రింత కల్పించబడి, మరికొద్దికాలంలో నశించబోయేది. చెవులు, కనులు, ముక్కు, గుదము, శిశ్నము, నోరు మొదలైన రంధ్రములతో కూడినదై, ఒకప్పుడు ఏర్పడి, మరొకప్పుడు గుప్పెడు బూడిదగా పరిణమించబోయే ఈ అచేతన దేహము నేనెట్లా అవుతాను? దీనిని ఉపయోగించి - వినటము, చూడటము, మాట్లాడటము, రుచి, స్పర్శ...ఇవన్నీ ఆస్వాదించే చేతనస్వరూపుడను. ఈ దేహము కల్పనలోనిది. నేనో, కల్పించుకొనువాడను. అందుచేత ఈ భౌతికంగా కనిపించే దేహము నేను కాదు.
నేను శబ్దమునా? కాదు. శూన్యాకృతిః శూన్యభవః శబ్దో నాహమ్ అచేతనః। శూన్యమైన ఆకృతి కలిగి, శూన్యమునుండి జనించే ‘‘ఆహా! ఓహో! ఊహూ’’ ఇత్యాది సమస్తశబ్దములు నేనుకాదు. అవి శూన్యస్వరూపము. పూర్ణస్వరూపుడనగు నానుండి బయల్వెడలే పలుకులు మాత్రమే!
నేను స్పర్శ, చర్మము కాను। త్వచా క్షణ వినాశిన్యా ప్రాప్యో-అప్రాప్యో అయం అన్యథా। స్పర్శ ప్రాప్తించుచున్నప్పుడు, ప్రాప్తించనప్పుడు కూడా నేను ఉన్నాను. వాటి ప్రాప్తాప్రాప్తములు నాపై ఆధారపడిఉన్నాయి. వాటికి సర్వదా నేను వేరై ఉన్నాను. స్పర్శ అనేది నాయొక్క చిత్ - చైతన్యముచేత ప్రసాదించబడుచున్న స్వానుభవం. అంతేగాని, అది నేను కాదు.
రుచి నేను కాదు. లబ్ధాత్మా జిహ్వయా మందో లోలయా, లోల సత్తయా, స్వల్ప స్యన్దో ద్రవ్యనిష్ఠో రసో నాఽహమ్। చంచలమైన ఈ నాలుకచే గ్రహించబడుచూ, నాలుకపై మందముగా, స్వల్పంగా స్రవించుచూ, పదార్థస్పర్శచే రూపము పొందుచున్న ‘రుచి’ నేను కాదు. అది స్వయంగా ప్రవర్తించేది కాదు. జడము. అచేతనము. నేను చేతన స్వరూపుడను. ‘రుచి’ అనే నిర్వచనము నాకు స్వాధీనమైనది. నేను దానికి స్వాధీనుడను కాను.
మరి నేను ఈ దృశ్యమును ఆస్వాదిస్తూ ఉన్న ద్రష్టత్వ పరిమితుడనా? కానే కాదు.
దృశ్య దర్శనయోః లీనం క్షయి, క్షణ వినాశినోః కేవలో ద్రష్టరి క్షీణం రూపం నాహమ్ - అచేతనమ్।।
క్షణంలో ఏర్పడి, మరుక్షణంలో నశించే దృశ్య - దర్శనములను పొందుచున్న ద్రష్టనా? కాదు.
ద్రష్టగా రూపుదిద్దుకోనప్పుడు (లేక) దృశ్యముతో సంబంధము పెట్టుకోనప్పుడు కూడా ‘నేను’ ఉన్నాను.
అందుచేత ద్రష్టరూప పరిమితుడను కాను.
‘ద్రష్ట’కు నియామకుడను. ద్రష్టను నా వినోదము కొరకు నేనే కల్పించుకొనువాడను. ‘దృక్’ స్వరూపుడను.
జగదభిమానియగు ‘జీవాత్మ’ - నాచే కల్పించబడుచూ, నాయొక్క ఒకానొక ‘అంశ’ - మాత్రమే అయి ఉన్నది.
కనుక నేను ‘ద్రష్ట’ను కూడా కాదు. మునుముందటివాడిని.
నాసయా గన్థ జడయా, క్షయిణా పరికల్పితః।
క్షణంలో పరికల్పించబడి, పేలవమైన నియతాకారము కలిగినది, అచేతనము అయిన గంధము (సువాసన -దుర్వాసనలు) నేను కాదు.
మరి నేను ఎవరు? WHO AND WHAT AM I? - ఏది అయి ఉన్నాను?
• కల్పన - అకల్పనలకు వేరై ఉన్నవాడిని.
• నిర్మమో। మమకార - అహంకారములకు ఆవలివాడిని.
• అమనస్కః। అమనస్కుడను. ఆలోచనలలోని వాడిని కాదు. ఆలోచనలకు వేరైనవాడిని.
• ఆలోచించువాడిని. ఆలోచనలకంటే మునుముందువాడిని. ఆలోచనలన్నీ నా శాంతరూపమునుండి బయల్వెడలుచున్నాయి.
• పరమ శాంత స్వరూపుడను.
• శబ్ద స్పర్శ రూప రస గంధ - పంచేంద్రియ - అనుభవైక విషయములగు భ్రమలకు అతీతుడను.
• శుద్ధ చైతన్య స్వరూపుడను.
• దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార మొదలుగా గల సమస్త చైత్యములకు (తెలుసుకోబడేవాటన్నిటికీ) ఆవలివాడిని. చైత్యవర్జితుడను. చైత్యవర్జిత కేవల చిన్మాత్రమే నేను. సమస్తము నా చైతన్యస్ఫూర్తి యందు వెలుగొందుచుండగా, నన్ను వెలిగించునది మరింకొక్కటేదీ లేదు. (చైత్యము = రుకచే ‘ఎరుగుచున్నవి’గా రూపము పొందినదంతా)
• బాహ్య (దృశ్య జగత్‌లో)- అంతరములలో (మనోబుద్ధి చిత్త అహంకారములలో) ఆయా సమస్త విశేషములుగా వ్యాపించియున్నది నేనే! మమాత్మయే। అస్మత్ చిత్ - ఆనందస్వరూపమే।
• మనో బుద్ధి దేహ దృశ్యముల దోషములచే స్పృశించబడువాడను కాను. నిష్కళుడను. నిరంజనుడను. నిష్కళోఽహం నిరంజనః।
• సమస్త కల్పనలు నాపట్ల ‘లేనివే’ అవటంచేత నిర్వికల్పుడను. దర్పణములో ప్రతిబింబమువలె ఈ జగత్తు నా మనోదర్పణములోని ప్రతిబింబమే కాబట్టి ‘‘చిదాభాసుడను’’
• ఏ ఏక అఖండాత్మ → సర్వగతమై సర్వత్రా వెలయుచున్నదో,....అట్టి ఆత్మయే నా అనునిత్య స్వాభావిక స్వరూపము. నా ఆత్మయే సర్వదా సర్వత్రా సమస్త నామరూపాత్మకంగా వెలయుచున్నది (సర్వగః).
• ఇక్కడి కుండ, వస్త్రము మొదలైన జడముగా కనిపించేవన్నీ నాయొక్క చైతన్యస్వరూపము యొక్క సామీప్యతచేతనే చైతన్యవంతమై అగుపిస్తున్నాయి.
• నాయొక్క ఆత్మతేజస్సు చేతనే సూర్యబింబమునకు ఆవలగల సూర్యతేజస్సు - బింబ, ప్రతిబింబములుగా వెలుగొందుచున్నాయి!
• ఆత్మస్వరూపుడనగు నాచేతనే ఇక్కడి చిత్ర - విచిత్రములైన ఇంద్రియ వృత్తులన్నీ ప్రవర్తమానశీలమగుచున్నాయి. మయైవ ఏతాః స్ఫుర్తని ఇహ విచిత్ర ఇన్ద్రియ వృత్తయః।
• అగ్నికణము అగ్నినుండి బయల్వెడలి ఆకాశములో వెలుగుతీరుగా అస్మత్ తేజో ప్రకాశముచేతనే ఈ జగత్తులు తేజో కణములై నానుండి బయల్వెడలి, నాయందే లయమౌచున్నాయి.
• అనన్తానంద సంభోగా పర-ఉపశమశాలినీ। నాయొక్క అనంతానంద సంభోగము నానుండే బయలుదేరి, నాయందే-నాచేతనే ఉపశమనము పొందుతోంది. నాయొక్క పరమశుద్ధమైయున్న ‘‘చిన్మయదృష్టి’’చే తదితర జగద్దృష్టులన్నీ మొదలంట్లా జయించి వేయబడుచున్నాయి.
ఏదైతే తనయొక్క ‘‘స్వకీయ సర్వభావముల అంతరము’’న - ‘తెలియబడేదంతా’ (All that being known) తనయందు తన రూపముగా కలిగియున్నదో అదియే చిదాత్మ। అట్టి నాయొక్క ప్రత్యక్‌చైతన్య రూపమగు నాకు నేనే నమస్కరించుచున్నాను.
ప్రత్యక్ చైతన్యరూపాయ - మహ్యమేవ నమో నమః।
అత్యంత విచిత్ర శక్తియుతము, స్వచ్ఛము, నిర్వికార-చిత్ స్వరూపము, సమయము యొక్క కలా (కల్పనా) - అకలనములు లేనట్టిది (Beyond the Time Factor) - అగు ‘మాయ’ సర్వత్రా ప్రవర్తించుచున్నది. అట్టి త్రికాలరూపమగు చిత్-చైత్యముల (తెలుసుకొనునది - తెలియబడునది ల) పరస్పర సంబంధమే ‘‘ఆత్మమాయ’’. అట్టి త్రికాల రూప ‘మాయ’ను అధిగమిస్తే సర్వత్రా సమరూపమగు ఆత్మయే స్వానుభవమై శేషించుచున్నది.
మాయ ఎట్టిది? ‘జీవాత్మ’యొక్క చమత్కారమేమి?
‘ఇట్టిది’ అని చెప్పుటకు అగమ్యగోచరము. వాచా అగమ్యగోచరా!
అట్టి అసత్తు ‘‘సత్తు’’ను ఆశ్రయించి సత్తువలెనే శాశ్వతత్వము సంతరించుకుంటోంది. శాశ్వతమగు ఆత్మ కల్పితమగు మాయను ఆశ్రయించి నైరాత్మత్వము (ఆత్మలేనిదానివలెను, కల్పితమగు జగత్తు - దేహము మాత్రమే ఉన్నదానివలెను) - అనుభూతి రూపము పొందుచున్నది.
ఆ విధమైనట్టి ఆత్మకల్పితమగు ‘‘మాయా రూపము (యా మా - స్వతఃగా లేనిది)’’ - ఆత్మయొక్క తేజస్సు చేతనే ఉనికిని పొందుచున్నది.
ఇక, దృశ్యాంతర్గతమగు ‘జీవాత్మ’ చేస్తున్నది ఏమిటి?
- తన కాలత్రయాతీత స్వరూపమును ఉపేక్షించి, ఇక్కడ లీలాచమత్కారముగా బంధనమును తెచ్చిపెట్టుకుంటోంది.
- ‘‘ఇది కావాలి - అది కాకూడదు (ఈహ-అనీహ)’’లకు సంబంధించిన అంతరంగముతో తన నిర్మలమగు కేవల చిత్ స్వరూపమును కప్పి ఉంచుకుంటోంది.
- పాశములచేత బంధింపబడి పక్షివలె అగుచున్నది. తన చిత్‌స్వరూపము నుండి బయల్వెడలుచున్న జగత్ వ్యవహారమునందు తానే (జీవాత్మగా) చిక్కుకొనుచున్నది.
- భూమిపైన కలుగులో చిక్కుకున్న కీటకముతో సమానంగా ఈ దృశ్యమునందు ‘‘కామమోహిత’’ అయి ప్రవర్తిస్తోంది.
- అట్టి ‘జీవాత్మత్వము’ అనేది - అనేక నాటకములలో నటించే గొప్ప నటునియొక్క ఒకానొక నాటకములో, ఒకానొక సందర్భములో నటిస్తూ ఉన్న ఒక పాత్రయొక్క ఆయా లక్షణముల వంటిది!
ఈ జీవాత్మ నాయొక్క అంశమాత్రమే. జీవాత్మయొక్క బంధ - సంబంధ - అనుబంధ - బాంధవ్య - మోక్షములు మొదలైనవి కూడా జీవాత్మవలెనే నా పట్ల కల్పితము మాత్రమే. జీవాత్మకు బంధమున్నప్పుడు, లేనప్పుడు కూడా ఆ ఉభయములకు సంబంధము లేని ‘‘కేవలాత్మ’’ను నేను.
అట్టి నాయొక్క కేవలాత్మస్వరూపము గురించియే ఉపనిషత్ వాఙ్మయము చేత సవివరముగా పరామర్శించబడుచున్నది. సద్గురువుల, సచ్ఛాస్త్రముల పరిశీలనచే, శ్రవణముచే - సర్వదా సిద్ధించియే ఉన్న స్వ-స్వరూపము పునః స్వానుభవముగా సిద్ధించుకోబడుచున్నది.
ఆత్మయే నాకు కేవల స్వరూపముగాను, తదితరమైనదంతా స్వీయకల్పనకు సంబంధించిన లీలా క్రీడా వినోద కల్పనగానూ - ప్రోదితమగుచున్నది. (స్వాభావికంగా నిరూపనము అగుచున్నది)
ఉద్ధృతోఽస్మి। వికల్పోఽస్మి।
యోఽస్మి సోఽస్మి నమోస్తుతే।।
అనునిత్యముగా ఉదితము (Ever-blossoming), నిత్యచేతనము (Always thrilingly active), వికల్పరహితము (Non-slipping to thoughts - level) అగు ఏ నా కేవలాత్మానంద స్వరూపము ఉన్నదో, అట్ టినాయొక్క ఆత్మకు తే నమోస్తు! నమోస్తు తే!. అట్టి నిత్యోదిత వికల్పరహిత ఆత్మస్వరూపమే నాచే సర్వదా (దైవస్తుతి, ఇతరులపట్ల నమస్కార మర్యాదల ద్వారా) భక్తి - జ్ఞానములతో కూడి ఆయా ప్రయత్నములచే ఉపాసించబడుచున్నది.
[ న = పరస్వరూపము / కేవల స్వరూపము
మః = ఇహ స్వరూపము / సందర్భములోని స్వరూపము
తే = ఆ ఆపరస్వరూమగు నేనే - ఈ నా ఇహస్వరూపంగా కూడా ప్రదర్శనమగుచున్నాను.
ఈ ‘నా’ ఇహస్వరూపము పరస్వరూప ప్రదర్శనమే. - ఇతి ‘నమస్తే’। ]
ఇదియే - సోఽహమ్
ఇక్కడి ‘‘నేను - నా’’ స్థానంలో ‘‘నీవు-నీ’’-లచే ‘తత్‌త్వమ్’ సిద్ధించుచున్నది.
ఇంకా కూడా ‘సన్న్యాసి’ యొక్క గానము ఈ విధంగా ఉంటోంది.
అట్టి ఆత్మయే ‘కేవల స్వరూపము’గా గల నాకు నేనే నా నమస్కారము.
ఓ ‘నీవు’గా నాకు తారసబడుచున్న జీవాత్మ స్వరూపా! మిత్రమా! నీవు ఆత్మస్వరూపుడవేనయ్యా! మమాత్మ స్వరూపుడవుకూడా।
నేనెవడనో....నీవు అదియే! (అహమ్, త్వమ్ తదేవ।) ।
నీవు ఎవడవో...నేను అదియే। (కస్త్వమ్, తదేవాఽహమ్।) ।
తుభ్యం మహ్యం అనన్తాయ → నీవు - నేను కూడా సర్వదా ఆద్యంతములనునవే లేని అనంత - అఖండాత్మ స్వరూపులము.
మహ్యం - తుభ్యం చిదాత్మనే → అయ్యా! నేను నీవు కూడా కేవల - ఎరుక (Absolute knowing) .....అగు చిదాత్మ స్వరూపులమే!
నీకు నాకు ‘‘తెలియబడేది వేరు వేరు’’ కావచ్చుగాక। అంతమాత్రంచేత ‘‘నీవు వేరు। నేను వేరు।’’గా అవుతామా? అవము. ఎందుకంటే ‘‘నీకు ఏది తెలియబడుతోంది? నాకు ఏది తెలియబడుతోంది?’’... అను భేదమంతా సందర్భ సత్యము. కేవలచిత్ (కేవలమగు ఎరుక) దృష్ట్యా నాలోను, నీలోను కూడా ఉన్నది ఏకమగు ‘ఎరుక’ రూపమగు చిదాత్మయే!
‘‘ఏది తెలుసుకుంటున్నాము?’’ - అనేది వేరువేరైనప్పటికీ తెలివి సర్వదా ఏకము - అఖండము కూడా!
దృష్టాంతానికి : ‘‘ఆ గదిలోని దీపపు తేజస్సులో (వెలుగు) ఏమేమి కనబడుచున్నాయి? ఈ గదిలోని దీపపు వెలుగులో ఏమేమి కన్పిస్తున్నాయి’’....అను ప్రశ్నలకు సమాధానము వేరువేరు కావచ్చు కానీ...వెలుగు దృష్ట్యానో? రెండు గదులలో వెలుగుచున్నది - ఒకే అగ్నియొక్క తేజస్సే కదా!
అట్లాగే,
• నాలోని ఎరుక - నీలోని ఎరుక వేరువేరు కాదు. ఒక్కటే!
• నాలోని ‘తెలుసుకొనువాడు’ - నీలోని ‘తెలుసుకొనువాడు’ వేరువేరు కాదు. ఒక్కటే।
• అట్టి ఏకముగా ఉన్న చిదాత్మకు నమస్కారము! నమో నమః।
అఖండమగు మమాత్మకే సర్వనమస్కారములు। (సర్వదేవ నమస్కారః కేశవమ్ ప్రతి గచ్ఛతి।)
నమస్తుభ్యం పరేశాయ। ‘నీవు’గా - ఆ పర - ఈశ్వరుడే కనిపిస్తున్నారు. పరేశ్వరుడవైయున్న ‘నీకు’ నా నమస్కారము.
నమో మహ్యం శివాయ చ। ‘శివోఽహమ్’ మహావాక్యముచే చెప్పబడు పరమసత్య వాక్యానుసారము ‘శివుడను’ అయి ఉన్న నాకు నా నమస్కారము.
మన ఇరువురము కూడా...., తిష్ఠన్నపి న ఆసీనో - గచ్ఛన్నపి న గచ్ఛతి।। - ఈ జగత్ దృశ్యములో ఒకచోట (‘జీవాత్మ’ అని పిలువబడే అంశగా) కూర్చుని ఉన్నప్పటికీ,... మనము ఎక్కడి నుండో ఇక్కడి వచ్చినవారము కాదు.
ఇక్కడ ఉండి మరెక్కడికో వెళ్ళువారము కాదు. ఆత్మగా ఇప్పుడు ఎక్కడ ఉన్నామో...ఇతఃపూర్వం అక్కడే ఉన్నాము. ఆత్మస్థానమగు అక్కడి నుండి ఎక్కడికీ రాము. ఇక్కడి నుండీ అక్కడికి ఎక్కడికీ వెళ్ళము.
శాన్తోఽపి వ్యవహారస్థః। పరమ శాంత స్వరూపుమైయుండి కూడా ఆత్మ (మనందరి కేవల - కాలాతీత - కేవల సాక్షీ స్వరూపము)....సమస్త వ్యవహారములను (జాగ్రత్-స్వప్న-సుషుప్తులలోని సర్వ అనుభవములను, భూత-వర్తమాన-భవిష్యత్ సమస్త సందర్భములను, సత్య-రజో-తమో త్రిగుణ ప్రదర్శనములను, సకల సంబంధ - అనుబంధ - సంబంధ బాంధవ్యములను) - నిర్వర్తించుచున్నదే అయిఉంటోంది.
ఆత్మ సర్వదా శాంతస్వరూపమైయుండియే సర్వ వ్యవహారశీలి కూడా.
కుర్వన్నపి న లిప్యతే : సమస్తకర్మలు నిర్వర్తిస్తున్న కర్త అయి ఉండికూడా....వాటి వాటి కర్మదోషములు (సుకర్మ-దుష్కర్మ-నిష్కర్మ-అకర్మ దోషములు) ఆత్మను ఏమాత్రము అంటజాలవు. (గాలి సువాసనా - దుర్వాసనా పదార్థములపై ప్రసరిస్తూ ఉన్నప్పటికీ వాయువును ఆయా వాసనలు అంటవు కదా।)
ఆత్మభగవానుడు సమస్తమైన అన్య విషయములకంటే అత్యంత సులభుడు. ఆప్తబంధువువలె సర్వము ఎరిగినట్టివాడు. పద్మములో తుమ్మెద దాగి ఉండు విధంగా సమస్త దేహములలో వేంచేసియుండి, సమస్తమును ఆక్రమించుకొని ఉన్నట్టివారు.
నేను ఆత్మను. ఈ సమస్తమును ఆక్రమించుకొనియున్నది నేనే. నీవు ఆత్మవే। నీవే ఈ సమస్తము అయియే ఉన్నావు.
న మే భోగస్థితౌ వాంఛా న మే భోగ విసర్జనే।। ఆత్మస్వరూపుడనగు నాకు ‘‘ఇది ఇంకా భోగించువాడనై ఉండాలి’’ - అనునది లేదు. సమస్తము ఆత్మయే అయి ఉండగా, అట్టి ఆత్మయే నేనై ఉండగా, - క్రొత్తగా పొందవలసినది ఏమున్నది? ఏవో భోగములను వదలవలసినది మాత్రము ఏముంటుంది? అట్లాగే, నేను ఏవో భోగములు విసర్జించటమనునదీ లేదు. నాకు వేరు కానిది నేనెట్లా విడుస్తాను?
యదా యాతి తదా యాతు, యత్ ప్రయాతి ప్రయాతు తత్। ఏది వస్తుందో అది వచ్చును గాక! ఏది పోవుచున్నదో అది పోవును గాక। వచ్చేదీ - పోయేదీ నాలోనే। నాలోగాని, నాకుగాని వచ్చేది లేదు। పోయేది లేదు। మనస్సుచే మనస్సు ఛిన్నము చేయబడుచుండగా నేను నిరహంకారుడను అగుచున్నాను. ‘భావించటము’ అనే అభ్యాసము దృశ్యానుభవమై పరిణమించుచున్నది. అభావమును భావించటముచేత ‘‘కేవల స్వరూపము’’ అను స్వస్థతయందు తిష్ఠితుడను అగుచున్నాను.
భావములను కలిగి ఉంటూనే నిర్భావుడనై, (లేక) భావాతీతుడనై,
‘అహం’ను ధారణ చేస్తూనే నిరహంకారుడనై, (లేక) అహంకారాది రహితుడనై,
ఆలోచనలు చేస్తూనే నిర్మనస్కుడనై, (లేక) అమనస్కుడనై,
ఇష్ట అయిష్టములు ప్రదర్శిస్తూనే నిరీహితుడనై, చిత్తరహితుడనై,
ఉన్నాను. అట్టి నా సర్వాతీతత్వము సందర్భములను కలిగి ఉండి కూడా, సందర్భములకు వశమై ఉండదు.
నన్ను శత్రువుగా భావించువాడు, నేను శత్రువుగా భావించువాడు కూడా - నావలెనే సర్వదా కేవలాత్మానంద స్వరూపులమేగాని, కించిత్ కూడా అన్యము కాదు.
నీవు అనన్యుడవు. నేను అనన్యుడను. ఆతడు అనన్యుడు. అనన్యమునకు మనమంతా అనన్యులము.
నిరహంకారమనే పక్షి ‘తృష్ణ’ అనే త్రాళ్ళను త్రెంచుకొని ఈ నా శరీరమునుండి బయల్వెడలి ఎటు ఎగిరిపోయిందో కూడా నేను చెప్పలేను.
జ్యోతి (దీపము) వెలిగిన తరువాత, ‘‘చీకటి ఎటుపోయింది?’’ - అని ఎవరైనా అడిగితే, ఏమని చెప్పగలం?
ఆహా"! ఆత్మగా నేను సర్వదా అకర్తను. అభోక్తను. ఈ జగద్దృశ్యములో జరుగుచున్నట్లుగా కనబడేదంతా నాటక కల్పనలోని వ్యవహారములవంటివి.
శ్లో।। యస్య నాహంకృతో భావో, బుద్ధిః యస్య న లిప్యతే
యః సమః సర్వభూతేషు జీవితం తస్య శోభతే।।
ఎవ్వరి దృష్టిలో అయితే - తాను చేస్తున్న సమస్త కర్మలకు కర్త (ప్రకృతి లేక కల్పనయేగాని) తాను కాదని, (అట్లాగే) జగన్నాటక పాత్రలు అయినట్టి సర్వ తదితర జీవులకర్మలు ప్రకృతి చేతనే కథాచమత్కారమువలె కల్పితమగుచున్నాయని....
దృఢమైన, నిస్సందేహ పూర్వకమైన నిశ్చలమైన అవగాహన ఏర్పడినదై ఉంటుందో, - వారే ‘‘నాహంకృత భావులు’’.
ఎవ్వరైతే -
అట్టివారి జీవితమే శోభాయమానమై ప్రకాశించుచున్నది.
ఎవ్వరైతే అంతఃశీతలమగు బుద్ధితో రాగ-ద్వేషరహితులై, నిత్యముక్త స్వభావులై (నాకు మొదలే బంధము లేదు - అను భావనను స్వాభావికంగాను, అనుక్షణికంగాను సమభ్యసించువారై), ఇక్కడ ఇంద్రియములకు తారసబడుచున్న సమస్తమును సాక్షివలె దర్శిస్తూ ఉంటారో,... వారి జీవితమే మహత్ - శోభప్రదము.
ఈ దృశ్య ప్రపంచములో హ్రస్వదృష్టి గలవారు - ‘‘ఇవన్నీ వదలవలసిన (లేక) పోగొట్టుకోవలసిన చిట్టా. అవన్నీ ఆశ్రయించవలసిన చిట్టా (Big Bist) ’’ - అను దృష్టితో దృశ్యమునందు దేహసంబంధములు తీవ్ర భావావేశములు కలిగి ఉంటూ ఉన్నారు.
వాస్తవానికి ఇక్కడ ఇంద్రియ ప్రపంచంగా కనిపించేదంతా కూడా ‘‘స్వప్నము తనదైనవాడు-స్వప్నదృశ్యము’’....ల సంబంధము వంటిది.
ఒకానొకడు కలకంటూ ఉండగా,.. ఆ కలలో పొందవలసినది ఏమున్నది? కలలో పోగొట్టుకొనవలసినది ఏముంటుంది? మెలకువరాగానే కల మొత్తం అదృశ్యమౌతుంది కదా!
యేన సమ్యక్ పరిజ్ఞాయ హేయ ఉపాదేయమ్ ఉజ్ఘతా, చిత్తస్య అన్తే అర్పితం చిత్తం,.. జీవితం తస్య శోభితే।
ఎవ్వరైతే సర్వత్రా సమముగా వేంచేసియున్న సత్‌స్వరూపాత్మ యొక్క తత్త్వమును ఎరిగినవారై, ఇక్కడి ‘‘పట్టు కోవలసినవి - వదలవలసినవి’’ అను ద్వంద్వ మోహములను మొదలంట్లా వదలినవారై, ‘‘చిత్తము’’ను చిత్తమునకు ఆవలగల చిత్‌స్థానమునందు (గంగార్పణమువలె) అర్పించివేసి ఉంటారో, వారి జీవితమే శోభాయమానము.
వారు ‘‘గ్రహించువాడు - గ్రహించబడునది’’...అను రెండిటియొక్క పరస్పర సంబంధములకు ‘‘చాలు’’ (అలమ్) - అను ముగింపు పలికి పరమశాంతిని పొంది ఆస్వాదించగలరు. సర్వసంబంధములు ఆత్మయందు (మంచుగడ్డ నీటియందువలె) సశాంతించినప్పటి దృఢ దృష్టి-స్వాభావికానుభవమవటమే ‘‘మోక్షము’’ అను శబ్దముతో చెప్పబడుచున్నది.
అసలీ జీవునిపట్ల జన్మపరంపరల సంసారచక్రము ఎందుకు ఏర్పడి ఉంటోంది?
‘‘ఇంద్రియ విషయాశ్రయము’’ అనే ప్రారంభము నుండి క్రమంగా ఇష్టాఇష్టములు కారణంగా దేహ-మనోబుద్ధి-అహంకారముల ద్వారా
‘‘విషయధ్యానము’’ - ‘‘సంగము’’ - ‘‘కామము’’ - ‘‘క్రోధము’’ - ‘‘మోహము’’ స్మృతి విభ్రవము’’, ‘‘బుద్ధినాశనము’’ - జన్మల ప్రహసన ప్రవేశము - ఈవిధమైన అథఃపతనము సిద్ధిస్తోంది.
శుద్ధసత్త్వము : ఎవరి హృదయులో ‘‘విషయముల ధ్యానములు’’ అనే అంకురములు ‘‘ఆత్మధ్యానము’’ అనే ఉష్ణముచే ఉడికించివేయబడతాయో, అప్పుడు ఆ భ్రష్ట బీజములో ‘పునర్జన్మలు’’ అనే అంకురములు తొలగిపోతాయి. దృశ్యబద్ధ జాడ్యము తొలగిన తరువాత కూడా శేషించియుండు వాసనలు (Tendencies) ‘శుద్ధవాసనలు’ అనబడుతాయి. అట్టి పావనము, పరమోదారము - అగు శుద్ధ వాసనలు శుద్ధసత్త్వస్థితికి జేర్చుచున్నాయి.
అనునిత్యమగు ఆత్మధ్యానమయమైన వాసనలు గలవాని స్థితి ఎట్టిది? ఆతనిది ‘నిత్యసుషుప్త స్థితి’ అని పిలువబడుచున్నది.
గాఢనిద్రలో ఉన్నవానికి ఏవిధంగా ఈ ప్రపంచముతో కించిత్ కూడా సంబంధము ఉండదో,... సన్న్యాసయోగి ఆ విధంగా జాగ్రత్‌లో కూడా ఈ దృశ్య ప్రపంచముతో ‘కించిత్’ కూడా సంబంధము కలిగి ఉండడు. చిరునవ్వు వీడకుండానే, ‘‘అపరిచయస్తుల ఇంటిలో జరిగే పండగసందడి’’ - వలె చూస్తాడు.
అప్పుడు ఆతడు చేతనుడై ఉంటాడా? అచేతనుడు అయిఉంటాడా?
చేతనం చిత్తరిక్తం హి ‘ప్రత్యక్ చేతనమ్’ ఉచ్యతే। ఎప్పుడైతే హావభావములను, సంకల్పములను కదల్చుచున్న చేతనశక్తి ఇష్టాఇష్టరూపమగు చిత్తపరిధులను దాటివేసి ఉంటుందో,....అదియే ‘ప్రత్యక్ చేతనము’. అదియే మనస్సుయొక్క పరిధులను అధిగమించినట్టి నిర్మనస్కస్వభావము. అట్టి ప్రత్యక్ చేతన సిద్ధునిపట్ల సంసార కలనము (దోషము) ప్రవర్తించజాలదు. ఎక్కడ దృశ్యమననరూపమగు మనస్సు ‘కేవలమనస్సు’ రూపము సంతరించుకొని ఉంటుందో....,
→ అదియే ‘సత్’ రూపమగు ‘సత్యస్థానము’.
→ అదియే పరమార్థమగు ‘శివస్థానము’.
→ అదియే పారమార్థికమగు ‘‘సర్వజ్ఞత్వము’’.
→ అదియే కైవల్య (కేవల) రూపమగు ‘‘నిజ స్థానము’’ కూడా।
అట్టి కేవలీ మనస్సుయే సంతృప్తి, ప్రలపనము (సంభాషించటము), విసర్జనము, స్వీకరించటము, కనులు మూయటము - తెరవటము మొదలైనవన్నీ నిర్వర్తిస్తోంది. అది జాగ్రత్ రూపంగా ప్రభవిస్తోంది.
అటువంటి నిశ్చలరూపమగు - నిరస్త (కదలికలు అనునవే లేని) ‘‘పరమానంద సంవిత్ మాత్ర పరస్వరూపుడను’’ నేనై ఉన్నాను.
తెలియబడుదానికి సంబంధించిన సంవేద్యము (knowing the things) అనే మలము తొలగిపోగా, మనస్సు నిర్మూలించబడుచున్నది. (తొలగినది అగుచున్నది). ‘ఆశించటము’ అనే రూపముగల ఆశాపాశములన్నీ విచ్చేదనమవగా, సంవిత్ (సత్-విత్) మాత్రపరుడను అయి ఉంటున్నాను. శుభాశుభ సంకల్పములన్నీ తొలగిపోగా, నిరామయమగు సశాంతించినట్టి ఆత్మస్వరూపుడను అగుచున్నాను.
ఇష్ట-అయిష్ట కలనమంతా వినష్టమైపోగా సంవిన్మాత్రపరుడనై శేషిస్తున్నాను.
‘‘ఆత్మత్వ-పరత్వ’’భావనా ప్రయత్నములను కూడా త్యజించివేసి, జగత్ స్థితికి సంబంధించి నిర్విభాగుడనై (Having become no more as part of this material scenary) ఆనందిస్తున్నాను. సర్వాత్మకుడనై వజ్రస్థంభమువలె సర్వత్రా ఆక్రమించుకొని సంస్థితుడనై ఉంటున్నాను. అప్పుడిక ఈ జగత్తు నాయొక్క ‘‘అనన్య-అంతర్విభాగము’’ - అగుచున్నది. నిర్మలుడనై, సర్వ ఆశలు త్యజించినవాడనై (Sans all expectations from the world) ‘స్వసంవిత్తు’ నందు సంప్రకాశమానుడను అగుచున్నాను.
ఎప్పుడోకదా?.....?
‘‘సంకల్పము’’ అనే వనమును, ‘తృష్ణ’ అనే లతను ఛేదించి, విస్తారమైన ‘ఆత్మానందము’ అనే విస్తార ప్రదేశములో నేను హాయిగా, ప్రశాంతంగ విహరిస్తానో కదా?
ఇహైవ :- ఈ ద్రష్ట - దర్శన - దృశ్యములకు ఆవలగల శాంతమగు పరమపదమును ఇక్కడే, ఇప్పుడే పొందెదను గాక!
తత్ అహమస్మి। శాంతమగు ఆత్మయే నేను.
పదన్తదను యాతో-స్మి జయామ్యహమ్। సమస్తమును జయించి పరమపదమును చేరినవాడనై, కేవలుడనై ప్రకాశించుచున్నాను.
నిశ్చలవాయురూప - నిర్వాణుడను, సర్వకోరికలు జయించిన నిరీహుడను। జీవాత్మ-ద్రష్ట-అనుభవి మొదలైన అంశలన్నీ దాటివేసిన నిరంశుడను। కోరికలన్నీ జయించిన నిరీప్సితుడను।
స్వచ్ఛత, ఊర్జితత। (బల, ఉత్సాహత్వముల) సత్తా। హృద్యత। సత్యవాక్యతా। ఆనందితా।
ఉపశమతా। సదా ప్రముదిత। పూర్ణతా। ఉదారతా। సత్య శాంతిసత్త।, ఏకతా।।
ఈఈ భావములు స్వీకరించి అభ్యసిస్తూ నిర్వికల్ప స్వరూపజ్ఞుడను, నిర్వికల్ప స్వరూపానుభవుడను అగుదును గాక! క్రమంగా నిర్వకల్పస్వరూపుడనగుచున్నాను!
ఈ విధంగా సన్న్యాసిస్వాభావికుడు సన్న్యాస యోగ జ్ఞాని అయి, ఆత్మస్వరూపుడై - ప్రకాశించుచున్నాడు.
సన్న్యాసాశ్రమము స్వీకరించువారు శాస్త్రములు చెప్పువిధానంగా (1) కుటుంబసభ్యుల అనుజ్ఞ (2) కులగురువుల అంగీకార ఆశీర్వాదములు (3) యేష్ఠి నియమములు - నిర్వర్తించి, అటుపై సన్న్యాసాశ్రమము స్వీకరించుచున్నారు.
ఆతురసన్న్యాసము
‘మరణము సమీపముగా అనివార్యమేమో’ అను స్థితిలో విధివిధానములతో సంబంధము లేకుండా స్వీకరించు సన్న్యాసము
‘ఆతురసన్న్యాసము’. ఆతురో జీవిచేత్, క్రమసన్న్యాసః కర్తవ్యః। ఆతుర సన్న్యాసము స్వీకరించినవాడు మరల ఆరోగ్యవంతుడు దైవకృపచే జరిగినప్పుడు అట్టివాడు మరల విధివిధానపూర్వకంగా క్రమసన్న్యాసము స్వీకరించాలి.
సన్న్యాసాశ్రమవాస సంబంధమైన కొన్ని నియమములు, కొన్ని నిషిద్ధములు
న శూద్రస్త్రీ - పతిత ఉదక్యా-సంభాషణమ్। శూద్రస్త్రీలతోను, పతితులతోను, రజస్వలాస్త్రీలతోను సంభాషించటము నిషిద్ధము.
న యతిః దేవపూజన ఉత్సవ దర్శనమ్। యతులు దేవపూజలు, ఉత్సవములు మొదలైనవాటిపై ఉత్సుకతగా ఉండరు. సర్వే సర్వత్రా పరమాత్మ సందర్శనపరులై ఉండటంచేత, వారికి పరమాత్మకు సంబంధించిన సంజ్ఞావిధానములతో ఆవశ్యకత ఉండదు. ఈ నియమముల దృష్ట్యా - తస్మాత్ సన్న్యాసమ్ ఏష లోకః। - ఈ లోకములో సన్న్యాసము ఉండదు. (లోకసంబంధమైనది కాదు), లోకమును అధిగమించివేసినట్టిది.
పైన చెప్పబడిన నియమ-నిష్ఠ-ఉపాసనా కలిగియున్నవాడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా నిత్య సన్న్యాసియే।
(జ్ఞేయస్య ‘‘నిత్య సన్న్యాసీ’’-యో న ద్వేష్టి, న కాంక్షతి। - భగవద్గీత).
కైవల్యస్థానములు
వివిధ సన్న్యాసులకు ఈ విధంగా కైవల్యస్థానములు చెప్పబడుచున్నది.
ఆతుర, కుటీచక సన్న్యాసులకు - భూలోకము, భువర్లోకము,
బహూదక సన్న్యాసికి - స్వర్గలోకము,
హంసకు - తపోలోకము,
పరమహంసకు - సత్యలోకము,
తురీయాతీత, అవధూతలకు - స్వాత్మస్థానము
స్వరూపానుసంధానము దృష్ట్యా - భ్రమర-కీటకన్యాయానుసారము కైవల్యస్థానము సిద్ధించుచున్నది.
ఆత్మానాం - అన్య శాస్త్రానామ్
స్వరూపానుసంధాన వ్యతిరిక్త అన్యశాస్త్రాభ్యాసైః ఉష్ట్రకుంకుమ భారవత్ వ్యర్థతా।
‘‘స్వస్వరూపానుసంధానము’’నకు వ్యతిరిక్తమైన అన్యశాస్త్రములు యతికి ‘‘కుంకుమపువ్వుమోస్తున్న ఒంటెకు కుంకుమపువ్వు వాసన తెలియకపోవటము’’ వంటిది. అనగా, ‘తత్త్వమ్ - సోఽహమ్’లను ప్రక్కకుపెట్టి అన్యదేవతారూపానుసంధానము ‘‘నిస్సారము, అనుభవమునకు పనికిరానిది’’ అగుచున్నది. అయితే, ‘‘వాటియొక్క అంతిమ లక్ష్యము సోఽహమ్ - తత్త్వమ్ భావనయే’’ అను ఎరుక వీడక నిర్వర్తించబడు గాక।
న యోగశాస్త్ర ప్రవృత్తిః న సాంఖ్యశాస్త్ర అభ్యాసో, న మంత్ర-తంత్రవ్యాపారో యతేః అస్తి।।
యతికి యోగశాస్త్రప్రవృత్తి, సాంఖ్యశాస్త్రాభ్యాసము, మంత్ర తంత్ర ప్రవృత్తులు ఉండవు. అస్తిచేత్ శవాలంకారవత్। ఒకవేళ్ళ యతి వాటిని కలిగిఉండవలసి వస్తే, అవన్నీ ‘‘శవమునకు అలంకారము’’ వంటివి మాత్రమే అను భావనయే కలిగి ఉంటారు.
సన్న్యాసి కర్మలు నిర్వర్తిస్తూనే - కర్మాచరణపరుడై ఉండరు. అంతరమున ప్రాపంచక విద్యలకు దూరముగా ఉంటారు. బాహ్యమున ‘‘నాటకములోని పాత్ర లక్షణములు’’ వలె - ప్రాపంచక విద్యలను బాహ్యముననే వదలి ఉంటారు.
న పరివ్రాట్ నామ సంకీర్తన పరః।
పరివ్రాట్టు ‘‘నామ సంకీర్తనలు’’ అను కర్మ విశేషములందు కర్తృత్వాది, అనివార్యాది భావనలు చేయువారై ఉండరు.
యత్‌యత్ కర్మ కరోతి, తత్ తత్ ఫలమ్ అనుభవతి।
ఎవ్వరైనా ఏ కర్మకు తాను కర్తృత్వమువహిస్తారో.....ఆ కర్మఫలము ఆతనికి తప్పక అనుభవమై తీరుతుంది. ఆముదపు నురుగుతో (లేక) కుంకుడికాయ నురుగుతో పాత్రలుతోమి కడిగివేస్తారు. నురుగును వదలి వేస్తారు కదా! ఆ తీరుగా సమస్తమును వదలి ఉంటారు. దేవతల (లౌకిక ప్రయోజనరూపములగు) ప్రసాదముల (Worldly Sanction) పట్ల వారు దృష్టి కలిగి ఉండరు.
న బాహ్యదేవాభ్యర్చనమ్ కుర్యాత్।
బాహ్యదేవతార్చనలు ఉద్దేశ్యించరు.
స్వ వ్యతిరిక్తం సర్వం త్యక్త్వా, మధుకరవృత్త్యా ఆహారమ్
ఆహరన్ కృశో భూత్వా మేదో వృద్ధిః అకుర్వన్ విహరేత్।।
‘‘స్వస్వరూపానుసంధానము’’నకు వ్యతిరిక్తమైన సమస్తము త్యజించి వేసి ఉంటారు. దేహమును జీవింపజేయునిమిత్తము మాత్రమే మాధూకరవృత్తి (భిక్షాటనము)చే ఆహారమును తెచ్చుకొని తింటూ జీవిస్తూ ఉంటారు. శరీరముయొక్క క్రొవ్వు వృద్ధికై పరిలక్షించక.... (ఆశయముగా కలిగి ఉండక), స్వప్నములో స్వప్నద్రష్టవలె ఈ జాగ్రత్ దృశ్యములో విహరిస్తూ ఉంటారు. అరచేతులనే మాధుకర (భిక్ష) పాత్రగా ధరించి (లేక) చేతికి పట్టినంత పాత్రను మాత్రమే కలిగి ఉండి భిక్షచే లభించిన ఆహారముతో కడుపునింపుకొంటూ కాలము గడుపుతూ ఉంటారు. ఆతని దృష్టి అంతా ‘‘ఈ సమస్తము నా ఆత్మయొక్క సంప్రదర్శనా వైభవమే’’ - అను భావన, అనుభూతులను స్వాభావికము, అనుక్షణికము చేసుకోవటమునందు మాత్రమే ప్రయత్నశీలమై, నిమగ్నమై ఉంటుంది.
ఆహారము - ఉదరపోషణ
శ్లో।। ఆహారస్య చ భాగౌ ద్వౌ। తృతీయం ఉదకస్య చ।
వాయోః సంచలనార్థాయ చతుర్థమ్ అవశేషయేత్।।
పొట్టలో 2 వంతులవరకు మాత్రమే ఘనాహారమతో నింపాలి. 1/4వ వంతు జలముచేత నింపాలి. మిగిలిన 1/4వ భాగము వాయువు నిరోధకములు (obstructions) లేకుండా ప్రసరించటానికై ఖాళీగా వదలాలి.
- భిక్షాటనము వలన లభించిన ఆహారమునే స్వీకరించాలి.
- న ఏక-అన్నాసీ భవేత్ క్వచిత్। ఒకే ఇంట్లో ఉండి ప్రతిరోజు ఆహారము స్వీకరిస్తూ ఉండకూడదు.
- అనుద్విగ్నంగా (కోప-తాపాలు లేకుండా) ఎవరు భిక్ష ఇవ్వాలని నిరీక్షిస్తూ ఉంటారో, అట్టివారి ఇళ్ళకు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి.
- భిక్షకై ‘5’ లేక ‘7’ ఇళ్ళకు మాత్రమే రోజూ ఎన్నుకొని భిక్షపొందాలి.
- వెళ్ళిన ఇంటివద్ద ఆవు పాలు పితుకు కాలము మాత్రమే నిరీక్షించాలి.
- ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తరువాత మరల వెనుకకు తిరగరాదు. (ముందుకే పోతూ బిక్షాటనం చేయాలి. వెనుక ఇళ్ళకు మరల వెనుతిరిగి వెళ్ళరాదు)
• నక్తము (రాత్రిపూట భోజనము) కంటే ఉపవాసము (పగటి భోజనము - రాత్రి నిరాహారము) మంచిది.
• రోజంతా ఉపవాసము కంటే అయాచితంగా ఇవ్వబడినది స్వీకరించటము మంచిది.
• అయాచితము (అడగకుండా ఇవ్వబడేది) కంటే భిక్ష చేసి ఆహారము స్వీకరించటము మంచిది.
భిక్ష చేస్తూ ఉన్నప్పుడు సవ్యాపసవ్యమార్గంగా (ఒకసారి వీధిలో ఈ చివరి నుండి ఆ చివరికి, వెనువెంటనే ఆ చివరి నుండి ఈ చివరికి) భిక్షకై గృహములకు వెళ్ళరాదు.
న అతిక్రమేత్ గృహం మోహత్ యత్ర దోషో న విద్యతే। ఏ ఇంటి వద్ద భిక్షాటనము దోషము కాదో, ( ఆ ఇంటివారు శ్రద్ధ-భక్తులు కలవారో), భిక్ష సమర్పించాలని అనుకుంటారో, అటువంటి ఇంటిని భిక్షను అడుగకుండా దాటివేయకూడదు. ‘భిక్ష ఇవ్వాలి’ అను ఉపాసన కలవారిని భిక్షస్వీకారం ద్వారా గౌరవించాలి.
శ్రోత్రియాన్నం న భిక్షేత శ్రద్ధాభక్తి బహిష్కృతమ్। వేదములు ఉపాసించు శ్రోత్రియుల ఇల్లు అయినప్పటికీ, ఆ ఇంటి సభ్యులకు శ్రద్ధ - భక్తిలేకపోతే, అట్టి ఇంటి వద్ద భిక్ష చేయరాదు. శాస్త్రములను, భిక్షకులను దూషించే స్వభావముగల ఇంటివద్ద భిక్ష అడుగరాదు.
వ్రాత్యులు (వేదములు ఎరుగనివాడు) అయినప్పటికీ, ఆ ఇంటివారు భిక్ష ఇచ్చుటలో శ్రద్ధ - భక్తి కలిగి ఉన్నవారైతే, అట్టివారి ఇంటి వద్ద ‘భిక్ష’ తప్పక అడిగి స్వీకరించాలి. పెద్దలను, విజ్ఞులను గౌరవించే వారి ఇంటిలో భిక్ష స్వీకరించి, అటువంటి సదభ్యాసములను ప్రోత్సాహపరచాలి.
పంచవిధ భైక్షములు (భిక్షాటనలు) - (1) మాధూకరము (2) ప్రాక్‌ప్రణీతము (3) అయాచితము(4) తాత్కాలికము (5) ఉపపన్నము.
(1) మాధూకరభిక్ష : అసంకల్పితంగాను యాదృచ్ఛికంగాను మూడు (లేక) ఐదు (లేక) ఏడు ఇళ్ళ వద్ద తేనెటీగవలె (with no pre-planning like a honey Bee) భిక్ష చేయుటమును ‘మాధూకర భిక్ష’ అని అంటారు.
(2) ప్రాక్ ప్రణీత భిక్ష : ముందురోజుగాని, ఆరోజు తెల్లవారగానేగాని ఎవ్వరైనా భక్తితో వచ్చి ‘‘అయ్యా! మా ఇంటికి భిక్షకు దయ చేయండి!’’...అని మాటిమాటికీ ఆహ్వానిస్తే....అది ‘ప్రాక్‌ప్రణీత భిక్ష’ అని పిలుస్తారు.
(3) అయాచిత భిక్ష : భిక్షాటణము చేస్తూ ఉండగా ఎవ్వరైన ‘‘స్వామీ! దయచేయండి! ఈరోజుకు మా ఇంట్లో తప్పక భిక్ష స్వీకరించండి’’.... అని నియంత్రించబడినప్పుడు అది అయాచిత భిక్ష. ఇటువంటి నిమంత్రితమైన భిక్ష ముముక్షువులై (మోక్షకాంక్షతో) ఆహ్వానిస్తేనే అంగీకరించాలి. అంతేగాని, లోకసంబంధమైన ఆశల, ఆశయముల కష్ట-సుఖముల ఉద్దేశ్యము కలవారి వద్ద ‘అయాచిత భిక్ష’ స్వీకరించరాదు.
(4) తత్కాలిక భిక్ష : ఆ యతి ఉన్న చోటికి వచ్చి బ్రహ్మజ్ఞానాశయముగల బ్రాహ్మణుడు (కులసంబంధము కాదు) ‘‘భిక్షార్థము రండి’’ - అని ప్రార్థన చేస్తే అది తాత్కాలిక భిక్ష అవుతుంది. యతి అందుకు అంగీకరించవచ్చు.
(5) ఉపపన్న భిక్ష : సిద్ధమైన అన్నము ఎవ్వరైనా మోక్షకాంక్ష అగు బ్రాహ్మణుడు (బ్రహ్మమును ఉపాసనగా కలవాడు) మఠము నుండి తెచ్చి సమర్పిస్తే అది ‘‘ఉపపన్నము’’.
యతి మాధూకర భిక్షమును మ్లేచ్ఛ కులము వారి వద్దనైనా భక్తి - శ్రద్ధలతో- సమర్పిస్తే తీసుకోవచ్చు. అయితే బృహస్పతి అంతటివాడు ఆహ్వానించినా కూడా, ఒకే ఇంటిలో (ఏకాన్నము - అనేక రోజులు) నివసించి ఆహారము (భిక్ష) స్వీకరించరాదు.
యతి యాచితముగా గాని, అయాచితముగా గాని భిక్షను దేహరక్షణ కొరకు మాత్రమే ఉద్దేశ్యించి స్వీకరించాలి.
వాయువు ఒక వస్తువును స్పృశించినప్పుడు కూడా ఆ వస్తువుయొక్క దుర్వాసన - సువాసనాది దోషములు వాయువును అంటవు.
అగ్ని ఒక వస్తువును దహిస్తున్నప్పుడు ఆ వస్తు దోషము అగ్నిని అంటజాలదు. జలము విషయములో - మూత్రము, పురీషము మొదలైన వాటి దోషములు జలమునకు అంటవు. అట్లాగే, అన్నదోషము యతి (లేక) సన్న్యాసిని అంటదు.
భిక్షాటనము ఏ సమయంలో చేయాలి?
ఒక ఇంటిలో (విధూమే) పొగరానప్పుడు (వంట పూర్తి అయి ఉంటుందనుకున్న తరువాత), రోకటి పోటు లేనప్పుడు, నిప్పులు లేనప్పుడు, వారి బంధువులు భుజించిన తరువాత, అపరాహ్నము తరువాత (మధ్యాహ్నము 12 గం।। తరువాత) భిక్షాచరణము ఆచరించాలి.
అభిశస్తుని (హింస స్వభావము కారణంగా గ్రామ బహిష్కరణ పొందినవాని) యొక్క, పతితునియొక్క, దేవతాపూజను వ్యతిరేకించు పాషండులయొక్క - ఇళ్ళు వదలి, మరిక ఏ ఇంటి వద్దనైనా భిక్షాచరణము చేయవచ్చు. ఆపత్కాలంలో అన్ని వర్ణములవారి వద్ద భిక్ష స్వీకరించవచ్చు.
నిషేధ పదార్థ సూచనలు (కావాలని కోరుకోకూడనివి)
అందుచేత సర్వప్రయత్నములతో నెయ్యి మొదలైనవి యతి వదలినవాడై ఉండాలి (తానుగా కోరుకోకూడదు). పప్పు, నెయ్యిలతో కూడిన అన్నము ‘‘నాకు ఇష్టము’’ అని యతి వ్యసనపడరాదు. అయాచితంగా వచ్చియున్న వాటికి ఈ నియమములు ఉండవు.
యతికి అరచేయియే భిక్షకు పాత్ర. చేతితోనే భిక్ష పొందాలి. పాణి పాత్రతో తిరుగుచూ కూడా ఎక్కువసార్లు భిక్షమును ఆచరించకూడదు.
ముని ఆవువలె నియమితముగా ఆహారము స్వీకరించాలి.
పై ఆచరణములచే ఆ యతి అమృతస్వరూపుడు అగుచున్నాడు...
నియమముల / నిషేధముల మరికొంత వివరణలు (తానుగా కోరుకో కూడనివి)।
• నెయ్యిని రక్తమువలె త్యజించాలి. ఆజ్యం రుధిరమివ త్యజేత్।
• ఒకేచోట అనేకసార్లు అన్నము స్వీకరించటం మాంసమువలె అనుకోవాలి. ఏకత్రా అన్నం పలలమివ।
• గంధలేపనమును అశుద్ధలేపనముతో ఆతనికి సమానము.
• క్షారము (కారము)ను చండాలభావంతో చూడాలి.
• నాజూకైన వస్త్రములను ఉచ్ఛిష్టపాత్ర (ఎంగిలి కంచము)వలె అనుకోవాలి.
• అభ్యంగన స్నానములను కులట స్త్రీ సంగమముతో సమానమనుకోవాలి.
• స్నేహితులతో ప్రాపంచిక విషయముల ఆహ్లాదకర సంభాషణలు మూత్రముతో సమానంగా భావించాలి.
• వస్తుజాలముతో సంబంధము గోమాంసములతో సమానముగా చూడాలి.
• ఇతః పూర్వం లోక వ్యవహారరీత్యా తెలిసినవారి ప్రదేశములకు వెళ్ళి, వారితో పూర్వ విషయ సంభాషణ - చండాలవాటికలవలె అనుకోవాలి.
• స్త్రీలతో సరస-విరస సంభాషణలు - పాముతో సమానమనుకోవాలి.
• బంగారముతో సంబంధము కాలకూటవిషంగా దర్శించాలి.
• పదిరకాల కాలక్షేపములు, లోకేషణాజనులు ఉండే సభాస్థలమును శ్మశానంతో సమానంగా అనుకోవాలి.
• రాజధానిలో ఇంద్రియానందముల పరిచయాలు కుంభీపాక నరకంతో సమానమనుకోవాలి.
• ఏకత్రాన్నము (ఒకే ఇంట్లో రోజుల తరబడి భోజనము) శవ పిండముగా చూడాలి.
యతులు అన్యదేవతా సంబంధమైన దేవతార్చనపరులై ఉండరు. (అనన్యోపాసకులై ఉంటారు).
ఈ విధంగా ప్రపంచ వృత్తులను జయించినవారు ‘‘జీవన్ముక్తులు’’ అగుచున్నారు.
యతికి తారసబడే (6) ప్రతిబంధకములు (బంధకరాణి షట్)
యతి (లేక) సన్న్యాస ఆశ్రమయోగికి ముఖ్యంగా ‘6’ ప్రతిబంధకములు తారబడుతూ ఉంటాయి.
(1) ఆసన దోషము (2) పాత్రలోపము (3) సంచయము (4) శిష్యసంచయము (5) దివాస్వాపము (6) వృధాలాపము
(1) ఆసన ప్రతిబంధకము: వర్షాభ్యో-అన్యత్ర యత్ స్థానమ్ ‘ఆసనమ్’ తత్ ఉదాహృతమ్।। జీవుడికి తానుండే పరిసరాలపట్ల మనోసంబంధమైన ప్రియత్వము ఏర్పడుచూ ఉంటుంది. యతి వర్షఋతువులో ‘‘చాతుర్మాస్యవ్రతం’’గా 4 నెలల కాలము తప్ప తదితర సమయాలలో ఒకేచోట ఉండరాదు. ఒకవేళ ఒక ఇంటిలో గాని, గ్రామంలోగాని మరెక్కడైనాగాని దీర్ఘకాలము ఉండాలని అనిపిస్తూ ఉంటే, అది ఆసన దోషము.
(2) పాత్రలోప ప్రతిబంధకము: శాస్త్రములలో సన్న్యాసాశ్రమమునకు సూచించిన సొరకాయపాత్ర మొదలైనవి లభించకపోవటము, అన్యమైన (విలువైన పాత్ర) పరిగ్రహించవలసిన రావటము, శిధిలమైనవాటి స్థానములో సరీయినవి దొరకకపోవటము→ఇటువంటివి ‘పాత్రలోపము’ అనబడు ప్రతిబంధకము. ఉక్త్వా లబ్ధ్వాది పాత్రణా అలాభే అన్యపరిగ్రహః, యతేః స వ్యవహారార్థం ‘‘పాత్రలోపః’’ స ఉచ్యతే।।
(3) సంచయ ప్రతిబంధకము: గ్రహించబడిన ‘దండము’ కాకుండా మరొక దండమును మరొక కాలములో ఉపయోగించుకోవాలని దాచిపెట్టుకోవటము - సంచయము. గృహీతస్యతు దండాదేః ద్వితీయస్య పరిగ్రహః కాలాన్తర - ఉపభోగార్థం - ‘‘సంచయః’’ పరికీర్తితః।। ‘దాచిపెట్టుకోవటం’ అనే లోభగుణమును యతి దరిజేరనీయడు.
‘‘పదార్థములను దాచుకొని తరువాత తిందాములే’’ - అనునది ‘సంచయప్రతిబంధకము’గా చెప్పబడుతోంది.
(4) శిష్య సంచయ ప్రతిబంధకము: శుశ్రూషాలాభ పూజార్థం యశో-ర్థం వా పరిగ్రహః శిష్యాణాం, న తు కారుణ్యాత్ ‘‘శిష్యసంగ్రహ’’ ఈరితః।। తనకు శూశ్రూష చేయుటకొరకుగాని, తనను పూజించటంకోసంగాని, తన యశస్సు గురించి ప్రచారము చేయటానికిగాని శిష్యులను చేర్చుకోవటము యతికి యోగమార్గములో ప్రతిబంధకముగా పరిణమించగలదు. అట్లా కాకుండా జ్ఞానబోధకొరకో, యోగాభ్యాసము కొరకో శిష్యులు ఆశ్రయించటము వలన అది ప్రతిబంధకము కాబోదు. శుభప్రదమే అయి, ఆ యతికి అది మోక్షసౌలభ్యము కాగలదు.
(5) దివాస్వాప ప్రతిబంధకము: విద్యా ‘దివా’ ప్రకాశత్వాత్। - పగలు ప్రకాశము ‘విద్య’ అని, అవిద్యా ‘రాత్రిః’ ఉచ్యతే । - రాత్రి -చీకటి ‘అవిద్య’ అని సంజ్ఞాపూర్వకంగా చెప్పబడుతోంది. విద్యాభ్యాసే ప్రమాదో యః స ‘‘దివాస్వాప’’-ఉచ్యతే।। విద్యయందు బద్ధకము చోటుచేసుకొనుచూ, అవిద్య యొక్క ప్రబలమును ‘దివాస్వాపము’ అనబడుచున్నది. ఆత్మ విద్యాభ్యాసమును ఏమరచి ‘‘నేను అంతటివాడిని. నా ప్రత్యేకలు ఇటువంటివి’’...అనే ఆత్మస్తుతి-పరనింద, ఆత్మవిద్యా ఏమరపును దివాస్వాప ప్రతిబంధకములుగా చెప్పుతారు.
(6) వృథాలాప ప్రతిబంధకము: (1) ఆత్మతత్త్వమునకు సంబంధించిన సమాచారము (2) భిక్షకు సంబంధించిన శాస్త్ర నియమములు - అతి ముఖ్యమగు ఈ రెండు యతిధర్మములను ప్రక్కకు పెట్టి..., అనుగ్రహమునకు సంబంధించిన సమాచారములు ‘‘వారేమైనారు? వీరు ఎటువంటివారు?’’ అను పరిప్రశ్నల గురించి తర్క వితర్కములు చేయటము....
ఇది ‘వృథాజల్పము’ (లేక) వృథాలాపము అను ప్రతిబంధకముగా చెప్పబడుచున్నది.
సన్న్యాసయోగాభ్యాసికి కూడనివి (లేక) విడువవలసినవి :
☼ ఏకాన్నము। ఒకేచోట భోజనము దీర్ఘకాలం స్వీకరించటం.
☼ మతమాత్సర్యం : ‘‘మా మతము గొప్పది. వారి మతము తక్కువది’’ - ఇటువంటి పరమతద్వేష - మాత్సర్యభావములు. తదితరుల అభిప్రాయములను దూషించే ప్రయత్నము సన్న్యాసులకు కూడదు.
☼ గంధ - పుష్ప సంబంధమైన లోకాకర్షణాహంకారములు, విభూషణములు.
☼ తాంబూల సేవనములు. అభ్యంగనములు. క్రీడాభోగకాంక్షలు. రసాయనములు.
☼ కత్థోనం (పరదూషణ), కుత్సితభావములు.
☼ స్వస్తి వచనము - ఆశీర్వాదముల వలన లభించే ధనవేడుకలు. జ్యోతిశ్చక్ర క్రయ విక్రయములు.
☼ క్రియాకర్మల సంబంధమైన వివాదములు. వాటికి సంబంధించిన వాదోపవాదములు.
☼ గురువులు చెప్పిన నియమ నిష్ఠలు పాటించకపోవటము.
☼ వ్యక్తుల మధ్యగల నివాదముల సంధి ప్రయత్నశీలత్వము.
☼ విగ్రహముల అమ్మకములు, ఊరేగింపులు.
☼ మంచము, అలంకార సంబంధమైన తెల్లటి వస్త్రములు.
☼ శుక్లోత్సర్గము. (శుక్లమును విడచు అభ్యాసములు).
☼ జ్ఞానమునకు సంబంధించని గుణదోషసంభాషణములు - దివాస్వాపము.
☼ భిక్ష గురించిన బాగోగుల దుష్టబీజములు (Seeds, that are harmful) కలిగి ఉండటము.
☼ కలలో కనిపించటము వంటి తైజస సమాచారములు.
☼ విషము, ఆయుధములు, బీజములు.
☼ హింసా ప్రవర్తనమములు. తీక్షణాముగా సామాన్య జనులను భయపెట్టే దేహాలంకారములు.
→ ఇవన్నీ సన్న్యాసయోగి వదలి, వాటికి దూరంగా ఉండాలి.
ఇంకా కూడా...
- గృహస్త ధర్మము సందర్భములో తాను చేసియున్న గొప్పకార్యముల అభివర్ణనము.
- గోత్రం గురించి, తల్లిదండ్రుల గురించి, ధన గృహ సంపదల గురించి చెప్పుకోవటము.
- లోక ప్రసిద్ధములైన వస్తువులను తెచ్చుకొని అలంకరించుకోవటము.
ఇటువంటివి సేవించటంచేత కూడా యతి అథః పతితుడు కాగలడు.
స్త్రీలతో యతి - (వారు యువతులైనా, ముసలివారైనా కూడా) - స్పర్శసంబంధము కలిగి ఉండరాదు. చిరిగిపోయినప్పటికీ ఖరీదైన వస్త్రములు, బొంతలుగా ఉండుతీరుగా, - స్పర్శలు ఇంద్రియాకర్షణలకు దారితీయగలవు.
(1) స్థావరములు (కదలనివి) (2) జంగములు (కదలు జీవదేహములు), (3) బీజములు (4) తైజసము (మత్తు ఇచ్చేవి) (5) దోష-దుష్ట సంభాషణలు (6) ఆయుధము - ఈ ఆరిటితో యతికి అవినాభావ సంబంధము పెట్టుకోరాదు. వాటిని మూత్ర-పురీషములతో సమానంగా చూడాలి.
ఆపత్తులు శంకించని సందర్భములలో యతి తనవెంట అన్నము మొదలైన తినుపదార్థములను వెంట తీసుకుపోరాదు. ఆపత్తుల సమయములలోను, త్రోవలో ఆహారము దొరకదనుకొన్నప్పుడు మాత్రము తీసుకొనిపోవచ్చును.
భిక్ష చేస్తున్నప్పుడు తనవెంట యువకులను, యువతులను, రోగము లేని వారిని వెంటనిడుకొని వెళ్ళరాదు.
‘‘ఇతరులకోసము’’ అని తలచుచు వస్తువులు, పదార్థములు ప్రతిగ్రహించకూడదు. ఇవ్వనూకూడదు. ఇతరులకు భయము, కష్టము కలిగించరాదు. దైన్యభావముకలవారికి ధైర్యము కలిగించు ప్రవర్తనము కలిగియుండాలి. ఏరోజుకారోజు అవసరము లేనట్టి పక్వ - అపక్వ పదార్థములను యాచించటము, దాచటము...ఇవి యతిని అథఃపతనమువైపుగా దారితీయగలవు. యతి అన్నపానాదులకొరకే భిక్షాటన చేస్తూ, - కంబళములు, పట్టువస్త్రములు మొదలైన విలువైన వస్తువులు ఆశించటము, స్వీకరించటము యోగభ్రష్టత్వమునకు కారణముకాగలవు.
యతి - యత్నశీలత్వము
☘︎ అద్వైత నావను ఆశ్రయించి జీవన్ముక్తుడు అగుచున్నారు. (సమస్త జీవులను పరమాత్మ స్వరూపులుగా భావించు అభ్యాసమే- అద్వైతనావ)
☘︎ వాక్కును జయించటానికై ‘మౌనము’ను అభ్యసించుచున్నారు.
☘︎ శరీరమును నిగ్రహించటానికై అభోజనమును (ఉపవాసమును) ఆశ్రయిస్తున్నారు.
☘︎ మనస్సు అదుపు చేయటానికై ‘ప్రాణాయామము’ నియమించుకొనుచున్నారు. (అభ్యసిస్తున్నారు)
కర్మణా బధ్యతే జంతుః। విద్యయా చ విముచ్యతే।। జీవులు కర్మలచేత బద్ధులగుచున్నారు. (ఆత్మ) విద్యచేత కర్మబంధములనుండి విడివడుచున్నారు.
తస్మాత్ కర్మ న కుర్తన్వి యతయః పారదర్శనః।। అందుచేత యతులు ఏ కర్మకు కూడా ‘‘నేను కర్తను’’ అను రూపంగా కర్తృత్వము వహించినవారై ఉండరు. కర్మసంబంధమేలేనివారై, పారదర్శకులై ఉంటారు. రహస్యంగా కర్మలు చేస్తున్నట్లు జనులను మభ్యపెట్టరాదు.
- వీధులలో చాలా వస్త్రములు దొరుకుతాయి.
- ‘భిక్ష’ అన్నిచోట్లా లభిస్తుంది.
- భూమిపై శయనించటానికి చోటు తక్కువ ఏమీ లేదు. విస్తీర్ణమైయున్నది.
మరి ఏదో లేదని ఎందుకు దుఃఖించటం?’’.......
అని యతులు భావన కలిగి ఉంటున్నారు. సమస్త ప్రపంచానుభవమును, ప్రపంచదర్శనమును యతి ‘‘ఆత్మజ్ఞానము’’అనే అగ్నియందు హోమము చేయుచున్నారు. ఆత్మయందు యోగాగ్నిని, సమారోప్యము చేసి యతి ‘‘అగ్నిహోత్రి’’ గాను, ‘మహాయతి’గాను అగుచున్నారు.
ప్రవృత్తి
ప్రవృతి రెండు రకములని చెప్పబడుతోంది.
(1) మార్జాలీప్రవృత్తి (2) వానరీప్రవృత్తి
మార్జాలీప్రవృత్తి - జ్ఞానాభ్యాసముతో కూడినది (యోగ-ఇత్యాది అభ్యాసములు- ‘‘అంతిమ లక్ష్యము-జ్ఞానమే’’-అని ఎరిగి నిర్వర్తించటము).
వానరీ ప్రవృత్తి - జ్ఞానాభ్యాసము లేకుండా చేయు అభ్యాసము [ అంతిమ లక్ష్యమగు - (సర్వభూతస్తం ఆత్మానం, సర్వభూతాని చ ఆత్మనివంటి) పరమాశయము గుర్తు పెట్టుకోకుండా యోగాభ్యాసములో మధ్యమధ్యగా (జ్యోతిదర్శనము మొదలైన) అనుభవములు, అనుభూతుల గురించి సంభాషించు స్థితి ].
ప్రవృత్తి యొక్క ఆశయము ‘ఆత్మభావన’ వైపుగా ఎక్కుపెట్టబడి ఉండాలి.
ఈ సన్న్యాసోపనిషత్‌లో చెప్పబడిన విషయములను ‘‘అయ్యా! దయచేసి వివరించి చెప్పండి!’’...అని అడిగినవారికి మాత్రమే బోధించాలి. అన్యాయమార్గముగా (తప్పులు ఎన్నటానికి, చులకన చేయటానికి, అహంకారముతోను) అడిగితే, ఆ విధంగా అడిగినవారికి చెప్పనేకూడదు.
జానన్ అపి మేధావీ జడవత్ లోకమ్ ఆచరేత్। ఆత్మతత్త్వము తెలిసిన మేధావి అయి ఉండి కూడా, వినటానికై అడగనిచోట, శ్రోత శ్రవణమునకు తగినంతగా సంసిద్ధుడు కానిచోట యతి ఆత్మగురించిన విశేషములను ఏమీ సంభాషించక, జడునివలె ఉండునుగాక।
ఎన్ని కష్టాలు వచ్చినా తారక (ఇష్టదైవముల) మంత్రమును విడువరాదు. 12000 సార్లు తారకమంత్రము జపించాలి.
ప్రణవమంత్రమును 12000 జపించువాడు పరబ్రహ్మమై ప్రకాశించగలడు.
ఇతి సన్న్యాసోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।