[[@YHRK]] [[@Spiritual]]
Sarabha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
(శరభుడు = సమస్త జీవులు తన శరములుగా కలవారు)
సర్వం సంత్యజ్య మునయో యద్భజంత్యాత్మరూపతః . తచ్ఛారభం త్రిపాద్బ్రహ్మ స్వమాత్రమవశిష్యతే .. |
|
శ్లో।। సర్వం సంత్యజ్య మునయో, యత్ భజన్తి ఆత్మరూపతః। తత్ చ ఆరంభం త్రిపాద్ బ్రహ్మ, - స్వమాత్రమ్ అవశిష్యతే।। |
మునులంతా సమస్తమును త్యజించినవారై దేనిని ఆత్మరూపంగా భజిస్తూ ఉన్నారో, అట్టి ఆది త్రిపాద్ బ్రహ్మము - మనందరి స్వస్వరూపమే అయి ఉన్నది. ఘనశేషబ్రహ్మమే స్వస్వరూపము. |
అథ హైనం పైప్పలాదో బ్రహ్మాణమువాచ |
|
ఓం 1. ఓం। అథ హి ఏనం (అథహైనం) పైప్పలాదో బ్రహ్మాణమ్ ఉవాచ :- |
ఒకానొక సందర్భములో పిప్పలాద మహర్షి కుమారుడు పైప్పలాదుడు బ్రహ్మ దేవుని ప్రత్యక్షము చేసుకొన్నారు. ఆ సందర్భంలో ఇట్లా అడిగారు. |
భో భగవన్ బ్రహ్మవిష్ణురుద్రాణాం మధ్యే కో వా అధికతరో ధ్యేయః స్యాత్తత్త్వమేవ నో బ్రూహీతి . |
|
‘‘భో, భగవన్! బ్రహ్మ విష్ణు రుద్రాణాం మధ్యే కోవా అధికతరో ధ్యేయః స్యాత్? తత్త్వమేవ నో బ్రూహి। ఇతి।। |
పైప్పలాదుడు: ‘‘హే భగవన్! బ్రహ్మదేవా! (తాత్త్విక దృష్టిచే) బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికతమమై, ధ్యానింప తగినవారు?’’ - అట్టి తాత్త్విక విశేషము గురించి మాకు దయతో వివరించి బోధించండి. |
తస్మై స హోవాచ పితామహశ్చ హే పైప్పలాద శృణు వాక్యమేతత్ . |
|
తస్మై సహ ఉవాచ పితామహశ్చ : హే పైప్పలాద! శృణు వాక్యం ఏతత్। |
పితామహులగు బ్రహ్మ భగవానుడు:
ఓ పైప్పలాదా! మీకు ఒక విశేషము చెప్పుచున్నాను. విను. |
బహూని పుణ్యాని కృతాని యేన తేనైవ లభ్యః పరమేశ్వరోఽసౌ . |
|
బహూని పుణ్యాని కృతాని యేన, తేనైవ లభ్యః పరమేశ్వరో, అసౌ। |
ఎవ్వనిచేతనైతే అనేక పుణ్య క్రియలు నిర్వర్తించబడినవై ఉన్నాయో, అట్టి వానికి మాత్రమే పరమేశ్వరుడు లభ్యుడు (లభించినవాడు) అగుచున్నాడు. |
యస్యాంగజోఽహం హరిరింద్రముఖ్యా మోహాన్న జానంతి సురేంద్రముఖ్యాః .. 1.. ప్రభుం వరేణ్యం పితరం మహేశం |
|
యస్య అంగజో అహం హరిః ఇంద్ర ముఖ్యాః। మోహాత్ న జానంతి సురేంద్ర ముఖ్యాః, ప్రభుం, వరేణ్యం, పితరం మహేశం।। |
ఎవ్వరి అంగములనుండి నేను, హరి, ఇంద్రుడు మొదలైన ముఖ్య దేవతలందరము జనిస్తూ ఉన్నామో, - అయినా కూడా మోహముచే ఎవరిని నేను, సురేంద్రుడు మొదలైన ముఖ్య దేవతలు కూడా ఎరుగలేకున్నారో, - ఎవరు దేవతలకే దేవతయో, ప్రభువో, స్తుతించతగినవాడో, తండ్రియో- అట్టి పరమేశ్వరునికి నమస్కారముము. |
యో బ్రహ్మాణం విదధాతి తస్మై . వేదాంశ్చ సర్వాన్ప్రహిణోతి చాగ్ర్యం తం వై ప్రభుం పితరం దేవతానాం .. 2.. మమాపి విష్ణోర్జనకం దేవమీడ్యం |
|
2. యో బ్రాహ్మాణం విదధాతి తస్మై, వేదాంశ్చ సర్వాన్ ప్రహిణోతి చ అగ్ర్యమ్, తం వై ప్రభుం పితరం దేవతానామ్ మమ అపి విషోణాః జనకం దేవమ్ ఈడ్యమ్।। |
ఓ పైప్పలాదా! ఇంకా విను. ఎవ్వరైతే సృష్టికర్త అగు బ్రహ్మకే సృష్టికర్తయో, ఎవరు చతుర్వేదములను సృష్టికర్తకు ప్రసాదించి ఉన్నారో, అట్టి పరమేశ్వరుడే పితరులకు, దేవతలకు సృష్టికర్త అగు నాకు రక్షకుడు. పరిపోషకుడు. విష్ణువునకు కూడా ఆయనయే ప్రభువు, తండ్రి, దేవదేవుడు. మా అందరికి పూజార్హుడు. |
యోఽన్తకాలే సర్వలోకాన్సంజహార .. 3.. స ఏకః శ్రేష్ఠశ్చ సర్వశాస్తా స ఏవ వరిష్ఠశ్చ . |
|
యో అంతకాలే సర్వ లోకాన్ సంజహార, స ఏకః శ్రేష్ఠశ్చ, సర్వ శాస్తా స ఏవ। |
ఎవ్వడైతే అంత్య (ప్రళయ) కాలంలో సమస్తము తనయందు లయం చేసుకుంటున్నారో, ఆ పరమేశ్వరుడే సర్వశ్రేష్ఠుడు, సమస్తము శాసించువాడు కూడా। |
యో ఘోరం వేషమాస్థాయ శరభాఖ్యం మహేశ్వరః . నృసింహం లోకహంతారం సంజఘాన మహాబలః .. 4.. |
|
యో ఘోరం వేషం ఆస్థాయ శరభాఖ్యం మహేశ్వరః, నృసింహం లోకహంతారం, సం జఘాన మహాబలః। |
ఏ మహేశ్వరుడైతే శరభ (శరభము) అనే ఘోర వేషమును ధరిస్తున్నారో, లోక హంతకుడైన నృశింహుని జయించారో, ఆయనయే ముఖ్యమైన పూజనీయుడు. |
హరిం హరంతం పాదాభ్యామనుయాంతి సురేశ్వరాః . మావధీః పురుషం విష్ణుం విక్రమస్వ మహానసి .. 5.. |
|
హరిగ్ం హరం తం పాదాభ్యాం, అనుయాంతి సురేశ్వరాః। మావధీః పురుషం విష్ణుం, విక్రమస్వ మహానిశి।। |
దేవతలు హరునికి (రుద్రునికి) పాదాభివందనము చేస్తూ ‘‘ఓ మహేశ్వరా! విష్ణువును మాకొరకై రక్షించి మాకు ప్రసాదించండి. వధించకండి!’’ అని ప్రార్థించగా..., |
కృపయా భగవాన్విష్ణుం విదదార నఖైః ఖరైః . చర్మాంబరో మహావీరో వీరభద్రో బభూవ హ .. 6.. |
|
కృపయా భగవాన్ విష్ణుం విదదార నఖైః ఖరైః। చర్మాంబరో మహావీరో వీరభద్రో బభూవ హ।। |
ఆ పరమేశ్వరుడు దయతో విష్ణుమూర్తిని ప్రసాదించారు. వాడి అయిన గోళ్ళతో చీరారు. (దక్షయజ్ఞ సందర్భము). మహావీరుడు, కరి చర్మము ధరించినవారు - అగు పరమేశ్వరుడే వీరభద్రుడుగా అయినారు. |
స ఏకో రుద్రో ధ్యేయః సర్వేషాం సర్వసిద్ధయే . |
|
స ఏకో రుద్రో ధ్యేయః। సర్వేషాం సర్వసిద్ధయే, |
(అనేకములలో ఏక స్వరూపుడైయున్న అట్టి రుద్రభగవానుడే దేవతలకు, మాకు ధ్యానింపతగిన ధ్యేయవస్తువు. ఆయనయే సమస్తమును ప్రసాదించు వారు. సర్వులకు సంపదలను, సామర్థ్యములను సిద్ధింప జేయువారు. |
యో బ్రహ్మణః పంచవక్రహంతా తస్మై రుద్రాయ నమో అస్తు .. 7.. |
|
యో బ్రహ్మణః పంచమ వక్త్ర హంతా, తస్మై రుద్రాయ నమో అస్తు। |
ఏ పరమేశ్వరుడైతే బ్రహ్మ దేవుని యొక్క ఐదవ ముఖమును ఖండించారో, అట్టి రుద్ర భగవానునికి నమస్కారము. |
యో విస్ఫులింగేన లలాటజేన సర్వం జగద్భస్మసాత్సంకరోతి . |
|
యో౽పి స్ఫులింగేన లలాటజేన సర్వం జగత్ భస్మసాత్ వై కరోతి। (భస్మసాద్వై కరోతి।) |
ఏ స్వామి అయితే తనయొక్క లలాటములో గల మూడవ నేత్రమునుండి పుట్టిన ఒక చిన్న నిప్పు రవ్వతో సమస్త జగత్తులను భస్మము చేసి వేయగలరో, అట్టి రుద్ర దేవాది దేవునికి నమస్కారము. |
పునశ్చ సృష్ట్వా పునరప్యరక్షదేవం స్వతంత్రం ప్రకటీకరోతి . తస్మై రుద్రాయ నమో అస్తు .. 8.. |
|
3. పునశ్చ సృష్ట్వా పునరపి అరక్ష దేవగ్ం స్వతంత్రం ప్రకటీ కరోతి, తస్మై రుద్రాయ నమో అస్తు। |
ఏ పరమాత్మ అయితే భస్మము నుండి ఈ సమస్త సృష్టిని పునః సృష్టిస్తూ, రక్షిస్తూ దేవాది దేవుడై సర్వ స్వతంత్రము ప్రదర్శిస్తూ ఉన్నారో, అట్టి రుద్రభగవానునికి ఎల్లప్పుడు నమస్కరిస్తూ ఉన్నాము. |
యో వామపాదేన జఘాన కాలం ఘోరం పపేఽథో హాలహలం దహంతం . తస్మై రుద్రాయ నమో అస్తు .. 9.. |
|
యో వామపాదేన జఘాన కాలం ఘోరం, పపావథ హాలాహలం తమ్, తస్మై రుద్రాయ నమో అస్తు।। |
ఏ రుద్ర దేవుడైతే తన ఎడమపాదముతో (భక్తుడగు మార్కండేయుని రక్షించటానికి) ఘోరము అయినట్టి యముని గుండెను తన్నారో, భక్తులపై ప్రీతితో హాలాహలమును త్రాగి కంఠమున ధరించారో, అట్టి స్వామికి నమస్కారము. |
యో వామపాదార్చితవిష్ణునేత్రస్తస్మై దదౌ చక్రమతీవ హృష్టః . తస్మై రుద్రాయ నమో అస్తు .. 10.. |
|
యో వామ పాదార్చిత విష్ణు నేత్రః తస్మై దదౌ చక్రం అతీవ హృష్టః తస్మై రుద్రాయ నమో అస్తు। |
ఏ శివభగవానుని ఎడమ భాగము పొందుట కొరకై విష్ణువు వారి ఎడమ పాదమును ఆశ్రయించి, చూపును నిలిపారో (త్వత్ పాదౌ నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః - శివానంద లహరి), దానికి సంతోషించి భక్తవత్సలుడై విష్ణువుకు ‘చక్రము’ ప్రసాదించారో, అట్టి రుద్ర భగవంతునికి నమస్కరిస్తున్నాము. |
యో దక్షయజ్ఞే సురసంఘాన్విజిత్య విష్ణుం బబంధోరగపాశేన వీరః . తస్మై రుద్రాయ నమో అస్తు .. 11.. |
|
యః దక్షయజ్ఞే సురసంఘాన్ విజిత్య విష్ణుం బబంధ ఊరుపాశేన వీరః, తస్మై రుద్రాయ నమో అస్తు। |
ఏ స్వామి అయితే దక్ష ప్రజాపతి అశాస్త్రీయంగా చేస్తున్న నిరీశ్వర దక్ష యజ్ఞమును వీక్షిస్తూ ఉన్న కారణంగా అప్పటికప్పుడు తనయొక్క వీరభద్రాంశతో దేవతలను జయించి, విష్ణువును ఊరు (పెద్ద) పాశములతో బంధించారో - అట్టి రుద్ర పరమాత్మా! నమస్కారము. |
యో లీలయైవ త్రిపురం దదాహ విష్ణుం కవిం సోమసూర్యాగ్నినేత్రః . |
|
4. యో లీలయైవ త్రిపురం దదాహ, కామం కాలం సోమ సూర్యాగ్ని నేత్రః। |
ఏ స్వామి అయితే ‘లీలా వినోదము’గా త్రిపురములను కాలాగ్నిచే కాల్చి వేశారో, అట్లాగే కాముని, కాలుని కూడా తనయొక్క మూడవ నేత్రముతో దహించారో, |
సర్వే దేవాః పశుతామవాపుః స్వయం తస్మాత్పశుపతిర్బభూవ . తస్మై రుద్రాయ నమో అస్తు .. 12.. |
|
సర్వే దేవాః పశుతామ్ అవాపుః స్వయం తస్మాత్ పశుపతిః బభూవ, తస్మై రుద్రాయ నమో అస్తు।। |
- ఏ పరమేశ్వరుడు చంద్ర సూర్య అగ్నులను త్రినేత్రములుగా కలిగి ఉన్నారో, ‘దేవతలు’ అనే పుష్పములున్న పూపొద (అవాపము) తానై అయి ఉన్నారో, - ఏ ఈశ్వరుడు దేవతలను అందరిని పశువులుగా చేసి తాను ‘పశుపతి’ బిరుదాంకితులైనారో, అట్టి రుద్ర స్వామి వారికి నమస్కారము. |
యో మత్స్యకూర్మాదివరాహసింహా- న్విష్ణుం క్రమంతం వామనమాదివిష్ణుం . వివిక్లవం పీడ్యమానం సురేశం భస్మీచకార మన్మథం యమం చ . తస్మై రుద్రాయ నమో అస్తు .. 13.. |
|
యో మత్స్య కూర్మాది వరాహ సింహాన్ విష్ణుం క్రమంతం వామనం ఆదివిష్ణుమ్, వివిక్లబం పీడ్యమానం జఘాన, భస్మీచకార మన్మధం యమం చ, తస్మై రుద్రాయ నమో అస్తు। |
ఏ పరాత్పరుడైతే ..., - మత్స, కూర్మ, వరాహ, నారసింహ ఇత్యాది అవతారములు ధరించిన విష్ణుమూర్తిని, అదంతా కూడా మనస్సు యొక్క లీలగా బోధించి, మనోవేదనను తొలగించారో, - చూపు మాత్రం చేత మన్మధుని యమింపజేసి, భస్మము చేసివేశారో,- అట్టి రుద్ర భగవానునికి నమోస్తు। నమస్కారము। |
ఏవం ప్రకారేణ బహుధా ప్రతుష్ట్వా క్షమాపయామాసుర్నీలకంఠం మహేశ్వరం . |
|
ఏవం ప్రకారేణ బహుధా ప్రతుష్ట్వా క్షమాపయామాసుః నీలకంఠం, మహేశ్వరమ్। |
ఈవిధంగా నీలకంఠుడగు మహేశ్వరునికి దేవతలు అనేకవిధాలుగా స్తుతులను సమర్పించి, హృదయపూర్వకంగా క్షమాపణలు వేడుకొంటున్నారు. |
తాపత్రయసముద్భూతజన్మమృత్యుజరాదిభిః . నావిధాని దుఃఖాని జహార పరమేశ్వరః ..14.. |
|
5. తాపత్రయ సముద్భూత, జన్మ మృత్యు జరాదిభిః, నానావిధాని దుఃఖాని, జహార పరమేశ్వరః।। |
ఏ పరమేశ్వరుడైతే ఈ జీవులకు (ఆదిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక) తాపత్రయముల వలన కలుగుచున్న జన్మ-జరా-మృత్యు ఇత్యాది - సమస్త దుఃఖములను హరిస్తారో, అట్టి హరునకు నమస్కారము. |
ఏవం మంత్రైః ప్రార్థ్యమాన ఆత్మా వై సర్వదేహినాం . శంకరో భగవానాద్యో రరక్ష సకలాః ప్రజాః .. 15.. |
|
ఏవం మంత్రైః ప్రార్థ్యమాన ఆత్మా వై సర్వదేహినామ్, శంకరో భగవాన్ ఆద్యో, రరక్ష సకలాః ప్రజాః। |
ఏ స్వామి అయితే సమస్త దేహములలో వేంచేసియున్న ‘ఆత్మ’గా ప్రార్థించబడుచూ ఉన్నారో, ఆద్యుడు, భగవానుడు-అగు శంకరుడై సమస్త జీవులను ప్రేమతో రక్షిస్తున్నారో, అట్టి రుద్ర పరంధామునికి నమస్కారము. |
యత్పాదాంభోరుహద్వంద్వం మృగ్యతే విష్ణునా సహ . స్తుత్వా స్తుత్యం మహేశానమవాఙ్మనసగోచరం .. 16.. |
|
యత్ పాద-అంభోరుహ ద్వంద్వం మృగ్యతే విష్ణునాధునా, స్తుత్వా స్తుత్యం మహేశానం అవాక్ -మానస గోచరం, |
‘‘స్వామి పాదపద్మాలు ఎక్కడ’’? అని విష్ణుమూర్తి (ఆది వరాహమూర్తి అయి) ఇప్పటికీ వెతుకుచున్నారో, అవాక్ మానసగోచరుడగు ఏ మహేశ్వరుని స్తుతించి, విష్ణువు లోక పాలనా సామర్థ్యమును అనుగ్రహంగా పొందుచున్నారో, |
భక్త్యా నమ్రతనోర్విష్ణోః ప్రసాదమకరోద్విభుః . |
|
భక్త్యా నమ్రతనోః విషోణాః ప్రసాదం అకరోత్ విభుః। |
- ఏ రుద్రదేవునికి నమ్రతుడై విష్ణువు వంగి నమస్కరిస్తూ ఉండగా ఆ రుద్రుడు తన అనుగ్రహమంతా ప్రవహింపజేసారో, |
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ . |
|
యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ। |
- ఎవరియొక్క సాన్నిధ్యమును (స్థానమును) మనస్సు పొందలేక వాక్కుతో సహా వెనుతిరుగుతోందో, |
ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కదాచనేతి .. 17.. |
|
ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన। |
అట్టి ఆనంద బ్రహ్మమగు రుద్రభగవత్ తత్త్వము ఎరిగినవాడు ఇక దేనికి భయము ఉండదు. |
అణోరణీయాన్మహతో మహీయా- నాత్మాస్యజంతోర్నిహితో గుహాయాం . |
|
అణోరణీయాన్ మహతో మహీయాన్ ‘ఆత్మ’ అస్య జంతో నిహితో గుహాయామ్ |
ఆ స్వామి సమస్త జీవుల హృదయ గుహలో - - అణువుకంటే సూక్ష్మంగాను, - సమస్త మహద్వస్తువుల కంటే మహనీయము గాను, స్థూలముగాను వేంచేసి ఉన్నారు. |
తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతుఃప్రసాదాన్మహిమానమీశం .. 18.. |
|
తమ్ అక్రతుం పశ్యతి వీత శోకో ధాతుః ప్రసాదాత్ మహిమానం ఈశమ్। |
అట్టి ఈశ్వరుని మహిమను నిర్మలమగు హృదయమును పొందినవారు తమ అంతరంగమునందే ఆ రుద్ర ‘చైతన్యమూర్తి’గా దర్శిస్తున్నారు. |
వసిష్ఠవైయాసకివామదేవ- విరించిముఖ్యైర్హృది భావ్యమానః . సనత్సుజాతాదిసనాతనాద్యై- రీడ్యో మహేశో భగవానాదిదేవః .. 19.. |
|
వసిష్ఠ వైయాసికి వామదేవ విరించి ముఖ్యైః హృది భావ్యమానః, సనత్సుజాతాది సనాతనాద్యైః ఈడ్యో మహేశో భగవాన్ ఆదిదేవః। |
అట్టి రుద్రమూర్తి (ఇంకా కూడా) → - వసిష్ఠుడు, శ్రీశుకుడు, వామదేవుడు, బ్రహ్మ మొదలైన ముఖ్యులందరి హృదయమునందు స్వానుభవంగా వేంచేసి ఉన్నవారు. - సనత్సుజాతుడు, [ (సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు) (బ్రహ్మ మానసపుత్రులు) ] మొదలైన మహనీయులచే సర్వదా సనాతన ధర్మస్వరూపులుగా స్తుతించబడువారు. అట్టి మహేశ్వరులు, భగవంతుడు, ఆదిదేవుడు అగు రుద్రభగవానునికి నమస్కారము. |
సత్యో నిత్యః సర్వసాక్షీ మహేశో నిత్యానందో నిర్వికల్పో నిరాఖ్యః . అచింత్యశక్తిర్భగవాన్గిరీశః స్వావిద్యయా కల్పితమానభూమిః .. 20.. |
|
సత్యో, నిత్యః, సర్వసాక్షీ, మహేశో, నిత్యానందో, నిర్వికల్పో, నిరాఖ్యః అచింత్య శక్తిః భగవాన్ గిరీశః స్వావిద్యయా కల్పితమాన భూమిః। |
ఆ రుద్ర భగవానుడు → - సత్యము నిత్యము అయినట్టివారు. - సమస్తమునకు సాక్షి. - తానే సమస్తముగా విస్తరించటముచేత ‘మహేశుడు’. - నిత్యానంద స్వరూపుడు. - సర్వ కల్పనలు తనవై, తాను ఆవలివాడవటంచేత నిర్వికల్పుడు. - నామరూపములకు పరిమితము కానివాడు కాబట్టి నిరాఖ్యుడు. - ఆచింత్యమగు శక్తి సంపన్నుడు, అచింత్య శక్తుడు. - సర్వమును ప్రకాశింపజేయుటచే ‘భగవానుడు’। - నిశ్చల స్వరూపుడు కాబట్టి గిరీశుడు। - స్వకీయమైన అవిద్య చేతనే సమస్త భూమి - భూమికలు కల్పించుకొని ఆస్వాదించువారు. (Creates all Levels and enjoys). అట్టి ఆ రుద్రదేవునికి నమస్కారము. నమస్కారము. |
అతిమోహకరీ మాయా మమ విష్ణోశ్చ సువ్రత . తస్య పాదాంబుజధ్యానాద్దుస్తరా సుతరా భవేత్ .. 21.. |
|
అతి మోహకరీ మాయా మమ విషోణాశ్చ, సువ్రత! తస్య పాదాంబుజ ధ్యానాత్ దుస్తరా సుతరా భవేత్।। |
ఓ సువ్రతా! పైప్పలాదా! నాచేతను, విష్ణువుచేతను కల్పించబడుచున్న మాయ అత్యంత దుస్తరమైనది. దాటరానిది. అయితే పరమేశ్వరుడగు రుద్రభగవానుని పాదపద్మములను ఆశ్రయించి, ధ్యానిస్తూ ఉన్నావా, ... ఇక ‘దుస్తరము’ - అగు సంసారము నీపట్ల సు-తరము (తేలికగా తరించి వేయగలిగినది) కాగలదు. |
విష్ణుర్విశ్వజగద్యోనిః స్వాంశభూతైః స్వకైః సహ . మమాంశసంభవో భూత్వా పాలయత్యఖిలం జగత్ .. 22.. |
|
6. విష్ణుః విశ్వ జగత్ యోనిః స్వాంశభూతైః స్వకైః సహ, మమాంశ సంభవో భూత్వా పాలయతి అఖిలం జగత్। |
విష్ణువు తనయొక్క (స్వకీయ) ‘అంశ’ లచే మమ ‘యోని’ అగు నాచే సృష్టించబడిన జగత్తును ‘పాలన’ చేస్తున్నారు. నా ‘అంశ’గా జనించిన జగత్తుకు విష్ణువు ‘పరిపోషణ’ అనే లీలను నిర్వర్తిస్తున్నారు. |
వినాశం కాలతో యాతి తతోఽన్యత్సకలం మృషా . |
|
వినాశం కాలతో యాతి తతో అన్యత్ సకలం మృషా। |
అట్టి ఈ సాకార - సగుణ కల్పిత జగత్తు అంతా కూడా - కాలగతిగా వినాశనము పొందుతోంది. ఈ రుద్రుడు కాలః కాలుడు. కాలమునకే నియామకుడు. ఆయన అనన్యుడు. ‘అన్యము’ అనునదే లేనివాడు. ఆ రుద్రభగవానునికి అన్యముగా అనిపించేదంతా ‘మృష’ (భ్రమ) యే. |
ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ శూలినే . మహేశ్వరాయ మృడాయ తస్మై రుద్రాయ నమో అస్తు .. 23.. |
|
ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ శూలినే, మహేశ్వరాయ మృడాయ తస్మై రుద్రాయ నమో అస్తు।। |
- స్వామి ‘ఓం’ శబ్ద-సంజ్ఞార్థ స్వరూపులు. - తరంగములన్నీ జలములో లయమగుచున్న తీరుగా సమస్తమునకు మహాగ్రాసుడు.. లయకారుడు. - ఆయన దేవతలకే ఉపాస్యము కాబట్టి - మహాదేవుడు. - త్రిలోకములను, త్రిగుణములను సాయుధులై ధరించుటచే త్రిశూలురు. - సమస్త దేహములలో, భావములలో, మనస్సులలో వేంచేసియున్న మహేశ్వరులు. - మృడుడు (మృగచర్మధారుడు). అట్టి రుద్ర పరంధామునికి నమస్కారము. నమస్కారము. |
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాయనేకశః . త్రీంల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః .. 24.. |
|
7. ఏకో విష్ణుః మహద్భూతం పృథక్ భూతాని అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగ్ అవ్యయః। |
మహద్భూతుడు, ఏక స్వరూపుడు అగు విష్ణువే స్వకీయమాయచే - పాంచభౌతికంగాను, అనేక భూతజాలము (జీవ జాలము)గాను ప్రదర్శనమగుచున్నారు. సమస్త జీవులయొక్క ఆత్మస్వరూపుడు, అవ్యయుడు-అగు ఆ విష్ణువే విశ్వానుభవి (జీవుడు) అయి ‘స్వకీయ కల్పన’ అగు విశ్వమును ఆస్వాదిస్తున్నారు. ఆ విష్ణువే జీవుడుగా కూడా అయి వెలయుచున్నారు. |
చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచమిరేవ చ . హూయతే చ పునర్ద్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు .. 25.. |
|
చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిః ఏవ చ, హూయతే చ పునః ద్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు। |
- (దృశ్య-దేహ-జీవ-ఈశ్వరులనే) నాలుగు (బాహువులు) కలవారు. - (మనో బుద్ధి చిత్త అహంకారములనబడే) మరొక 4 (బాహువులు) కలవారు. - మరల (జీవాత్మ పరమాత్మలనబడే) రెండుగా కూడా అగుచున్నవారు ఆ పరమశివుడే! అట్టి పరమాత్మ మా పట్ల ‘ప్రసన్నుడు’ అగు గాక! |
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం . బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా .. 26.. |
|
బ్రహ్మార్పణం। బ్రహ్మహవిః। బ్రహ్మగ్నౌ। బ్రహ్మణా హుతమ్। బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా। |
సమస్తము బ్రహ్మమే! నిర్వర్తించబడుచున్న కార్యక్రమమంతా- బ్రహ్మమే। ‘‘హవిస్సు (నేయి మొదలైనవి) - బ్రహ్మమే। యజ్ఞాగ్నిగుండములోని అగ్ని - బ్రహ్మమే। హుతము (సమర్పించబడేవన్నీ) - బ్రహ్మమే। గంతవ్యము (పొందవలసినది) - బ్రహ్మమే। నిర్విషయ భావన అగు ‘సమాధి’. బ్రహ్మముయొక్క కర్మ విశేషముగా సర్వత్రా సమదర్శనమే - (సమాధి= సమ+అధి). ఈ సమస్తము బ్రహ్మ కర్మయే అగుచున్నది. |
శరా జీవాస్తదంగేషు భాతి నిత్యం హరిః స్వయం . బ్రహ్మైవ శరభః సాక్షాన్మోక్షదోఽయం మహామునే .. 27.. |
|
శరాః జీవాః। తత్ అంగేషు భాతి నిత్యం హరిః స్వయమ్। బ్రహ్మైవ శరభః సాక్షాత్ మోక్షదో అయం, మహామునే! |
ఈ జీవులంతా శరభములు (బాణములు) వంటివారు. ఈ జీవులందరి శరీరాంగములుగా హరియే స్వయముగా నిత్యము ప్రకాశించుచున్నారు. శరభుడే (రుద్రుడే) బ్రహ్మము. ఓ మహామునీ! ఆయనయే మోక్షప్రదాత కూడా! (ఆయనయొక్క ప్రదర్శనమే నీవు, నేను కూడా!). |
మాయావశాదేవ దేవా మోహితా మమతాదిభిః . తస్య మాహాత్మ్యలేశాంశం వక్తుం కేనాప్య శక్యతే .. 28.. |
|
8. మాయావశాత్ ఏవ దేవా మోహితా మమతా ఆదిభిః। తస్య మాహాత్మ్య లేశాంశం అపి వక్తుం న శక్యతే। |
ఓ పైప్పలాదా! ఎవ్వరి ‘మాయ’కు బద్ధులై దేవతలు కూడా మమత మొదలైన బంధములు పొందుచూ (దృశ్యము చూస్తూ ఉన్నప్పుడు) మోహితులై ఉంటున్నారో,- అట్టి రుద్రభగవానుని మహత్మ్యము యొక్క ఒక లేశము (కించిత్) కూడా మేము వర్ణించజాలము. |
పరాత్పరతరం బ్రహ్మ యత్పరాత్పరతో హరిః . పరాత్పరతరో హీశస్తస్మాత్తుల్యోఽధికో న హి .. 29.. |
|
పరాత్పర తరం బ్రహ్మ, యత్ పరాత్ పరతో హరిః, తత్ పరాత్ పరతో అధీశః। తస్మాత్ తుల్యో అధికో నహి।। |
- పరాత్ పరతరము - ‘బ్రహ్మ’। పరాత్పరమునకే పరము - ‘హరి’। అయితే, అట్టి హరిరూప పరాత్పరపరముకే పరమైనవారు - రుద్రుడు। అట్టి పరాత్పరమునకే పరమైయున్న పరమ శివునకు సమానమైనదిగాని, అధికమైనదిగాని వేరే ఏమి ఎక్కడా లేదు. |
ఏక ఏవ శివో నిత్యస్తతోఽన్యత్సకలం మృషా . |
|
ఏక ఏవ శివో నిత్యః। తతో అన్యత్ సకలం మృషా। |
ఈ సమస్తము కూడా - నిత్యము, అక్షరము, ఏకము అగు ‘‘శివ స్వరూపమే’’ అయి ఉన్నది. ఏకము, నిత్యము అగు శివతత్త్వముకంటే వేరుగా ఏదైనా, ఎక్కడైనా అనిపిస్తూ ఉంటే, - అది భ్రమ (మృషము) (Illusion) మాత్రమే. |
తస్మాత్సర్వాన్పరిత్యజ్య ధ్యేయాన్విష్ణ్వాదికాన్సురాన్ .. 30.. శివ ఏవ సదా ధ్యేయః సర్వసంసారమోచకః . తస్మై మహాగ్రాసాయ మహేశ్వరాయ నమః .. 31.. |
|
తస్మాత్ సర్వాన్ పరిత్యజ్య, ధ్యేయాన్ విష్ణ్వాదికాన్ సురాన్। శివ ఏవ సదాధ్యేయః సర్వ సంసారమోచకః। తస్మై మహాగ్రాసాయ మహేశ్వరాయ నమః। |
అందుచేత విష్ణువు మొదలైన అన్య దేవతలను వదలి ఏకము, అఖండము, నిత్యము అగు శివతత్త్వమునే ధ్యానించాలి. అది సర్వసంసార బంధములనుండి విమోచనము కలిగించగలదు. అట్టి సమస్తము గ్రహించివేయుచున్నట్టి, సమస్తమునకు లయకారుడయినట్టి మహేశ్వరునికి నమస్కారము. |
పైప్పలాదం మహాశాస్త్రం న దేయం యస్య కస్యచిత్ . నాస్తికాయ కృతఘ్నాయ దుర్వృత్తాయ దురాత్మనే .. 32.. దాంభికాయ నృశంసాయ శఠాయానృతభాషిణే . |
|
పైప్పలాద మహాశాస్త్రం న దేయం యస్య కస్యచిత్, నాస్తికాయ కృతఘ్నాయ దుర్వృత్తాయ దురాత్మనే, దామ్భికాయ నృశంసాయ, శఠాయ, అనృత భాషిణే।। |
ఈ ఉపనిషత్‌లో మనము చెప్పుకొనియున్న ‘‘పైప్పలాద మహాశాస్త్రము’’ అనబడే ‘‘ఏకాక్షర శివతత్త్వ జ్ఞాన విశేషములు’’ బోధించటానికి (కొందరికిగాను) ఈవిధంగా నిషేధించబడింది : - (సర్వాధారమగు పరమాత్మ తత్త్వమును అంగీకరించనట్టి) నాస్తికునికి, - చేసిన మేలు మరచిపోయి, తాను చేసిన సహాయములు మాత్రమే సంభాషించే కృతఘ్నునికి, - దుర్వృత్తులు (Negative Avocation that bother / trouble others) అభ్యసించు దుర్వృత్తునికి, - దురాత్మునికి (దోష బుద్ధి కలవానికి), - దాంభికునికి (లేని గొప్ప ప్రదర్శించు వానికి), - నృశంశునికి (క్రూరునికి, ఘాతుకునికి), - శఠునకు (అసూయ, మూర్ఖము, మోహము స్వభావముగా కల వానికి, - అవాస్తవములను వాస్తవమువలె సంభాషించు వానికి, - ఇట్టి స్వభావ లక్షణములు కలవానికి పైప్పలాద శాస్త్రము బోధించటము ‘నిషేధము’ అని చెప్పబడుతోంది. |
సువ్రతాయ సుభక్తాయ సువృత్తాయ సుశీలినే .. 33.. గురుభక్తాయ దాంతాయ శాంతాయ ఋజుచేతసే . శివభక్తాయ దాతవ్యం బ్రహ్మకర్మోక్తధీమతే .. 34.. |
|
సువృత్తాయ, సుభక్తాయ సువ్రతాయ సుశీలినే, గురుభక్తాయ దాంతాయ, శాంతాయ ఋజు చేతసే, శివ భక్తాయ దాతవ్యం, బ్రహ్మ కర్మోక్త, ధీమతే! |
సువృత్తునకు (సాత్విక - శుభప్రద వృత్తులు కలవానికి), దాంతునకు (ఓర్పు, ధైర్యము, బహిరింద్రియ నిగ్రహము, కష్ట సుఖ సందర్భములలో సహనము కలవానికి), శాంత స్వభావునకు, ఋజువర్తనునకు (త్రికరణ శుద్ధి కలవానికి), శివభక్తి కలవానికి, బ్రహ్మోపాసనా సంబంధమైన కర్మ నిర్వర్తించు ఉత్తమ బుద్ధి కలవానికి తప్పక బోధించబడు గాక! |
స్వభక్తాయైవ దాతవ్యమకృతఘ్నాయ సువ్రతం . న దాతవ్యం సదా గోప్యం యత్నేనైవ ద్విజోత్తమ .. 35.. |
|
స్వభక్తాయైవ దాతవ్యమ్ అకృతఘ్నాయ సువ్రత! న దాతవ్యం సదా గోప్యం, యతోనైవ, ద్విజోత్తమ! |
ఓ సువ్రతా! పైప్పలాదా! భక్తి కృతజ్ఞత కలవానికి ఈ శాస్త్రము సవివరణముగా బోధించబడు గాక! ఓ ద్విజోత్తమా! అనర్హునికి బోధించరాని ఈ శాస్త్రము సదా ‘రహస్యము’గా భావించబడు గాక। భక్తి లేనివానికి, కృతఘ్నునికి అడిగినా కూడా చెప్పకూడదు. |
ఏతత్పైప్పలాదం మహాశాస్త్రం యోఽధీతే శ్రావయేద్ద్విజః స జన్మమరణేభ్యో ముక్తో భవతి . యో జానీతే సోఽమృతత్వం చ గచ్ఛతి . గర్భవాసాద్విముక్తో భవతి . |
|
పైప్పలాదం మహాశాస్త్రం యో అధీతే శ్రావయేత్ ద్విజః, స జన్మ మరణేభ్యో ముక్తో భవతి। యో జానీతే, సో అమృతత్వం చ గచ్ఛతి। గర్భవాసాత్ విముక్తో భవతి। |
ఓ ద్విజోత్తమా! ఈ పైప్పలాద మహాశాస్త్రమును ఎవరు అధ్యయనము చేస్తారో, (మరియు) ద్విజుడై ఎవరు అభిరుచి గలవారికి వినిపిస్తారో, అట్టివాడు జన్మ-మరణములనుండి విముక్తుడు కాగలడు. ఇందలి సారము ఎరిగినవాడు అమృతస్వరూపుడగుచున్నాడు. గర్భ నరకము నుండి విముక్తుడు అవగలడు. మృత్యువుకు కూడా ఆత్మగా ‘సాక్షి’ అయి ఆనందముగా శేషించి ఉండగలడు. |
సురాపానాత్పూతో భవతి . స్వర్ణస్తేయాత్పూతో భవతి . బ్రహ్మహత్యాత్పూతో భవతి . గురుతల్పగమనాత్పూతో భవతి . |
|
9. సురాపానాత్ పూతో భవతి। స్వర్ణ స్తేయాత్ పూతో భవతి। బ్రహ్మహత్యాత్ పూతో భవతి। గురు తల్ప గమనాత్ పూతో భవతి।। |
ఈ శరభోపనిషత్ అధ్యయనము చేసిన పుణ్యఫలం చేత - సురాపానదోషము (మత్తు పదార్థముల సేవనము), బంగారము దొంగిలించిన దోషము, బ్రహ్మ హత్య, గురు తల్పగమనము - మొదలైన పంచ మహాపాతకములు చేసి ఉంటే, వాటి దోషములు తొలగి - ఆ అధ్యయనుడు పవిత్రుడు అగుచున్నాడు. |
స సర్వాన్వేదానధీతో భవతి . స సర్వాందేవాంధ్యాతో భవతి . |
|
స సర్వాన్ వేదాన్ అధీతో భవతి। స సర్వాన్ దేవాన్ ధ్యాతో భవతి। |
అట్టివాడు సర్వ వేదములను ఉపాసన - అధ్యయనము చేసినవాడు, సర్వ దేవతలను ధ్యానించినవాడు కాగలడు. |
స సమస్తమహాపాతకో- పపాతకాత్పూతో భవతి . తస్మాదవిముక్తమాశ్రితో భవతి . |
|
స సమస్త మహాపాతకాత్ పూతో భవతి। తస్మాత్ అవిముక్తం ఆశ్రితో భవతి। |
సమస్త మహాపాతకముల నుండి పునీతుడు కాగలడు. అట్టి అధ్యయనము చేసినవాడు అవిముక్తము (కాశీ క్షేత్రము)ను ఆశ్రయించిన, సేవించిన పుణ్యము పొందుచున్నాడు. |
స సతతం శివప్రియో భవతి . స శివసాయుజ్యమేతి . న స పునరావర్తతే న స పునరావర్తతే . బ్రహ్మైవ భవతి . ఇత్యాహ భగవాన్బ్రహ్మేత్యుపనిషత్ .. |
|
సతతం శివప్రియో భవతి। స శివ సాయుజ్యమేతి। న స పునరావర్తతే। న స పునరావర్తతే। బ్రహ్మైవ భవతి। ఇతి ఆహ భగవాన్ బ్రహ్మా।। |
అట్టివాడు శివభగవానునికి ‘ప్రియము’ అగుచున్నాడు. శివసాయుజ్యము పొందగలడు. పునరావృత్తి దోషము పొందడు. బ్రహ్మవేత్త అయి, బ్రహ్మమే తానై వెలయుచున్నాడు. ఈవిధంగా సృష్టికర్త, ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు తత్త్వజ్ఞానాభిలాషతో తనను ఆశ్రయించిన పైప్పలాద మునికి శివతత్త్వము బోధించారు. |
శరభోపనిషత్ సమాప్తా। ఓం శాంతిః। శాంతిః। శాంతిః।। |
ఇతి శరభోపనిషత్ । ఓం శాంతిః। శాంతిః। శాంతిః।। |
(శరభుడు = సమస్త జీవులు తన శరములుగా కలవారు)
ఈ సమస్త ఇంద్రియ జగత్ విశేషములను అధిగమించి, వాటివాటిపట్ల (అవి ఎట్లా ఉన్నా కూడా ఒక్కటే - అనే రూపంగా), మౌనము సిద్ధించుకొన్న మునులు ఏ ‘ఆత్మరూపము’ పట్ల ధ్యాన, ధారణా నిష్ఠులై ఉంటున్నారో, అట్టి తివిక్రమ (జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనయొక్క త్రిపాదములు (మూడు అడుగులు) అయి ఉన్నట్టి స్వస్వరూప - సర్వ స్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము.
పిప్పలాద మహర్షి కుమారుడగు పైప్పలాదుడు తనయొక్క శ్రద్ధతో కూడి తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించారు. సమస్తమునకు ‘‘ఆది’’, సనాతనుడు, సమస్త జీవులకు పరిపోషకుడు, ప్రజాపతి, సర్వులలో శ్రేష్ఠరూపుడు అగు బ్రహ్మ భగవానుడు ఒకానొక రోజు పైప్పలాదుని ముందు అనుగ్రహపూర్వకంగా ప్రత్యక్షమైనారు.
పైప్పలాదుడు : హే పితామహా! బ్రహ్మానందస్వరూపా! సమస్త జీవుల స్వరూప స్వభావములను సృష్టిస్తున్న మహా ప్రజ్ఞానంద స్వరూపా! నమో నమః। హే భగవన్! నేను మోక్షార్ధినై యున్నాను స్వామీ!
బ్రహ్మదేవుడు : బిడ్డా! పైప్పలాదా! నాకు చాలా సంతోషము. ఇతఃపూర్వంలాగానే ధ్యానము కొనసాగించి క్రమంగా బుద్ధిని సునిశితము, విస్తారము చేసుకొనెదవు గాక! అన్యమును ఉపశమింపజేసుకొనెదవు గాక! అనన్యుడగు పరమాత్మయందు మమేకత్వము, సునిశ్చలత్వము, అనునిత్యత్వము, స్వాభావికత్వము పొందెదవు గాక!
పైప్పలాదుడు : పరమకారుణ్య మూర్తివగు ఓ ప్రజాపతీ! తమ ఆజ్ఞానుసారం బుద్ధి నిర్మలత, నిశ్చలత కొరకై ధ్యానమునకు ఉపక్రమిస్తాను. అయితే, హే భగవన్! బ్రహ్మ విష్ణు రుద్రాణాం మధ్యే కోవా అధికతరో ధ్యేయః స్యాత్। ముక్తికొరకు సృష్టికర్త అగు బ్రహ్మ, పరిపోషణకర్త అగు విష్ణువు, లయకర్త అగు రుద్రులలో ఎవరు అధికతరంగా ధ్యేయముగా ( Most Fine Object for Chanting) ధ్యానింపతగిన వారు? అట్టి ఆ యొక్క అధికతర ధ్యేయము యొక్క తత్త్వము ఎట్టిది?
హే మహాత్మా! నాపట్ల సద్గురువులై, మోక్షమునకు మార్గదర్శకులై, నాకు ఆయా సంబంధిత తాత్త్విక విశేషములను బోధించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తూ, శరణు వేడుచున్నాను. దయతో నా ధ్యానమునకు మార్గదర్శకులవండి.
బ్రహ్మ భగవానుడు (పితామహుడు) :
బిడ్డా! పైప్పలాదా! చెప్పుచున్నాను విను.
‘పరమేశ్వరుడు’ అగు రుద్రభగవానుని అనుగ్రహ రూపమగు ‘‘అఖండ బ్రహ్మతత్త్వము’’ - అనన్య సామాన్యము. అనేక పుణ్యకార్యములు చేసియున్నట్టి పుణ్యకర్మఫలంగానే సిద్ధించగలదు. ఈ సమస్తము స్వస్వరూపాత్మ బ్రహ్మముగా - నిస్సందేహముగాను, అనుక్షణికముగాను, స్వాభావికముగాను - స్వానుభవమవటమే రుద్రతత్త్వ జ్ఞానము. అది సమస్తము కంటే శ్రేష్ఠము.
• నేను, హరి, ఇంద్రుడు మొదలైన వారమంతా ఎవరికి అవయవములు (అంగముల) వంటివారమో,
• మేమంతా ఎవరి అంగములనుండి జనిస్తున్నామో,
• అయినా కూడా మోహవశంచేత మాయొక్క జననస్థానము అయినట్టి శివస్థానమును మేమే ఎరుగలేకుండానే ఉండిపోతున్నామో,
• ఎవరు దేవతలందరికీ కూడా ఆది స్థానమో, నియామక ప్రజ్ఞాస్థానమో,
అట్టి సర్వతత్త్వ స్వరూపుడు, సర్వాత్మకుడు అగు రుద్రభగవానుడే మాకు వరేణ్యుడు (స్తుతింపతగినవాడు), తండ్రి, సర్వముగా విస్తరించి ఉన్నట్టి ‘మహేశ్వరుడు’ కూడా।
అట్టి ‘పరమేశ్వరుడు’ అగు రుద్రభగవానుడు :-
• బ్రహ్మను సృష్టించి చతుర్వేదములను ప్రసాదించి ఉన్నారు. కనుక సృష్టికి సృష్టికర్తకు ‘అగ్ర్యమ్’ - మునుముందే ఉన్నవారు, దేవతలకే పితరుడు (తండ్రి). సమస్తమునకు ప్రభువై నియమించువారు.
• ప్రళయ (కల్పాంత) కాలములో సమస్తము హరించి తనయందు లయము చేసుకొనువారు. ఏకస్వరూపులై ఆనంద సాగరంలో విహారము చేయువారు. (భ్రస్యన్ దేవగణన్, త్రసన్ మునిగణన్, నస్యత్ ప్రపంచం లయన్, పశ్యన్ నిర్భయ ఏకయేవ విహరతి ఆనందసాంద్రో భవాన్।। - (శివానంద లహరి).
• మరల క్రీడగా, లీలగా, వినోదముగా సృష్టికాలంలో సమస్తమును నియమించువారు. సర్వశాస్తా। జగత్తులన్నిటినీ శాసించువారు. వసిష్ఠుడు. (The superlative). అట్టి రుద్రస్వామి మాకు సర్వదా ఆరాధ్యము.
• ఏ పరమేశ్వరుడైతే ‘శరభ’ అను ఘోరమైన, భీభత్సమగు వేషము ధరించి లోకాలను సంహరించు ఆవేశము గల నృశింహ విష్ణుని జయించి వశం చేసుకొన్నారో, మహాబలుడో,
• దేవతలు ఏ హరునికి పాదాభివందనములు సమర్పించి ‘‘ ఓ మహేశ్వరా! నృశింహ విష్ణువును ఏమీ చేయకండి. రక్షించి తిరిగి మాకు ప్రసాదించండి. ఆయనయే మాయొక్క బలము, వైభవము కదా!’’ - అని అర్థించగా చిరునవ్వుతో విష్ణుమూర్తిని ప్రసాదించారో...,
• ఏ స్వామి వీరభద్రుడుగా అయి, తన వాడి అయిన నఖములతో (గోళ్ళతో) దక్షయజ్ఞమును ధ్వంసము చేసారో,
• ఏ స్వామి కరి చర్మాంబరధారియో, వీరాధివీరుడో,
అట్టి ఏక - అఖండ - సర్వాత్మకుడగు పరమేశ్వరుడే మాచే సర్వసిద్ధికై ఉపాసించబడువారు. మాయొక్క సృష్టి స్థితి సామర్థ్యముల కొరకై సమస్తము ప్రసాదించగల రుద్రభగవానుని స్తుతిస్తున్నాము. శరణు వేడుచున్నాము.
✏︎ యో బ్రహ్మణః పంచమ వక్త్ర హంతా। ఎవరైతే సృష్టికర్తయగు బ్రహ్మదేవుని యొక్క (తన సృష్టిలోని స్త్రీని కామించిన కారణంగా) ఐదవ ముఖమును ఎడమ చేయి చిటికిన వ్రేలుతో ఖండించారో,
✏︎ యో౽పి స్ఫులింగేన లలాటజేన సర్వం జగత్ భస్మసాత్ వై కరోతి। ఎవరు ప్రళయకాలంలో లలాటము నుండి (మూడవ నేత్రము నుండి) జనించే జ్ఞానాగ్ని యొక్క స్ఫులింగము (నిప్పురవ్వ)చే ఈ అనేక బ్రహ్మలతో కూడిన ఈ దృశ్య జగత్తునంతా భస్మము చేసి వేయుచున్నారో,
✏︎ పునశ్చ సృష్ట్వా, పునరప్యరక్ష దేవగ్ం స్వతంత్రం ప్రకటీ కరోతి। తిరిగి సృష్టికాలంలో తన అమృతమయమగు దృక్కులతో ఈ సృష్టినంతా పునః పునః సృష్టిస్తూ ఇదంతా అత్యంత మధురముగా చేసివేస్తున్నారో, దేవాది దేవుడై ఈ సృష్టినంతా సర్వస్వతంత్రముగా ప్రకటిస్తూ సర్వదా రక్షిస్తూ ఉన్నారో,
తస్మై రుద్రాయ నమో అస్తు। అట్టి రుద్ర దేవాది దేవునికి ‘నమో నమః’। (స్వామి అనుగ్రహముచే) మాకు ‘‘(న)’’ బ్రహ్మముతో (మః) జీవైక్యము (జీవ బ్రహ్మైక్యము) సిద్ధించును గాక!
బిడ్డా! పైప్పలాదా! రుద్రోపాసనాపూర్వకంగా ఇంకా కూడా కొన్ని విశేషాలు చెప్పుకుందాము. విను.
☀︎ ఏ పరమేశ్వరుడైతే - (శివలింగమును కౌగిలించుకొని భక్తి పారవశ్యంగా శరణువేడిన మార్కండేయుని రక్షించటానికి) - తన ఎడమ పాదముతో ఘోరమైన స్వభావముగల ‘‘మృత్యు అధినేత, దిక్పాలకుడు’’ అగు యముని గుండెను తన్ని, భక్తుని రక్షించారో (వక్షస్తాడన మంతకస్య కఠిన ఆపస్మార సంమర్దనమ్। - శివానంద లహరి),
☀︎ దేవ దానవులు [ మృత్యువు (మార్పు)కు ఆవలిదైన ] అమృతత్వము యొక్క (అమృతము యొక్క) సిద్ధి కొరకై పాల సముద్రమును మధిస్తూ ఉండగా జనించిన హాలాహలమును (కాలకూట విషమును) లోక రక్షణార్ధమై త్రాగి కంఠనమున నిలిపి, ‘నీల కంఠుడు’ అను బిరుదు పొందారో,
☀︎ సర్వదా లోక రక్షక, లోక కళ్యాణ కారకులై ఉంటున్నారో, కాలఃకాలుడై కాలమునకు ఆవలిదగు ఆత్మతత్త్వామృతమును లోకస్థులు పొందటానికి మార్గదర్శకులగుచున్నారో,
అట్టి రుద్ర పరమాత్మకు నమో అస్తు। నమో నమః। నమస్కారము.
ఇంకా కూడా,
★ యో వామ పాదార్చిత విష్ణునేత్రః తస్మై దదౌ చక్రమతీవ హృష్టః। ఏ పరమశివుని ఆత్మానందపూర్వకమగు శివతాండవము దర్శిస్తూ ఉండగా పరవశుడై విష్ణువు - రుద్రుని ఎడమ పాదమును దర్శిస్తూ తనను తాను సమర్పించుకొని బ్రహ్మానందము సిద్ధించుకొన్నారో,
అది గమనించిన ఆ శివదేవుడు ఎంతగానో ఆనందించినవారై విష్ణువుకు చక్రాయుధము (విష్ణుచక్రము) ప్రసాదించారో...,
తస్మై రుద్రాయ నమో అస్తు। అట్టి రుద్రభగవంతునికి నమస్కారము.
★ దక్ష ప్రజాపతి నీరీశ్వర (ఈశ్వర తిరస్కారముతో కూడిన) దక్ష యజ్ఞము నిర్వర్తిస్తూ ఉండగా, దక్షప్రజాపతి కుమార్తె, రుద్రుని అర్థాంగి సతీదేవి ‘పుట్టినిల్లు ఆడపడుచు’ భావనతో యజ్ఞ ప్రాంగణము ప్రవేశించింది. ఆమెను - శివదూషణలతో అవమానించగా ఆ దేవి యోగాగ్నికి, దేహమును సమర్పించారు. అప్పుడు రుద్రభగవానుని స్వకీయ ‘అంశ’ అగు వీరభద్రుడు రుద్రశిఖ నుండి జనించి దక్షుని శిక్షిస్తూ ఉన్న సమయంలో విష్ణు భగవానుని పెద్దపాశముతో కట్టిపడేశారు. అట్టి ఆది దేవుడగు రుద్రునికి నమస్కారము.
★ ఏ స్వామి లీలగా త్రిపురాసుర త్రిపురములయొక్క తనయొక్క మూడవ నేత్రమునుండి జనించిన ‘అగ్ని’ యొక్క ఒక శిఖచే ఒక్కసారిగా దహించివేశారో (అంతరార్ధంగా - జాగ్రత్, స్వప్న సుషుప్తులను తన యొక్క తురీయ తాత్త్విక స్వరూపంతో కేవలసాక్షిత్వమునందు లయింపజేసివేస్తున్నారో), ఆ స్వామిని శరణు వేడుచున్నాము.
★ ఏ భగవానుడు తనయొక్క మూడవ కన్నుతో కాముని (మన్మధుని) క్షణంలో భస్మము చేసివేశారో, అట్టి రుద్రభగవానునికి నమో నమః।
★ ఏ దేవాది దేవుడు సూర్య-చంద్ర-అగ్నులను తనయొక్క త్రినేత్రములుగా కలిగియుండి, జడమాత్రమగు ఈ జగత్తంతా తేజోమయము చేసివేస్తున్నారో, అట్టి జగత్ప్రభువుకు నమస్కారము.
★ ఏ పరమ పురుషుడు సృష్టిలోని సమస్త జీవుల జీవన ప్రయోజనము కొరకై దేవతలందరిని ‘పశువులు’గా తీర్చిదిద్ది, తాను ‘పశుపతి’ అయి ఉన్నారో, - తస్మై రుద్రాయ నమో అస్తు।
★ మహావిష్ణువు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఇత్యాది అవతారముల ధారణచే మనో వికార - వికల్పములు పొందగా, ఏ భగవంతుడగు రుద్రుడు అట్టి మనస్సును తన స్వాధీనము చేసుకొని విష్ణు భగవానునికి స్వాంతనము ప్రసాదించు చున్నారో,
★ ఎవరు మన్మథుని యమింపజేసి, చూపు మాత్రంచేత భస్మము చేసివేశారో, - అట్టి రుద్రునికి నమస్కరిస్తున్నాము.
ఓ పైప్పలాదా! కాలకూట విషమును కంఠమునందు బంధించి ‘నీల కంఠుడు’ అని స్తుతించబడే మహేశ్వరుని ఆత్మానంద-దివ్య ఔన్నత్యమును పరిపరివిధములుగా స్తుతిస్తూ దేవతలు క్షమాపణలు వేడుకొంటూ ఉంటున్నారు.
ఆ పరమేశ్వరుడు - (ఆధి భౌతిక, అధి దైవిక, ఆధ్యాత్మికములనబడే - Physical, mental and spiritual) తాపత్రయముల నుండి (Trio - worries) జీవులపట్ల సంభవిస్తున్న నానావిధములైన దుఃఖముల నుండి - రక్షించువారు అయిఉన్నారు.
(‘‘నా రుద్రో రుద్రమర్చతి’’ మొదలైన) అద్వైతపూర్వకమైన అనేక స్తుతులచే, మంత్రములచే ప్రార్థించబడుచున్న రుద్ర భగవానుడే సర్వ దేహములలో ‘‘ఆత్మ (The absolute self of all selves)" - అయి విరాజిల్లుచున్నారు.
భగవంతుడు (సమస్తము తనయొక్క వెలుగుగా కలిగి ఉండువాడు), ఆద్యుడు (One who is there prior to all Beginings) అగు శంకరుడే సమస్త జీవులను రక్షించువారు. ఈ జీవుడు జీవించి ఉన్నప్పుడు ‘జీవనము’ ప్రసాదిస్తూ, దేహ పతనానంతరము కూడా ఈ జీవునికి ‘తోడు’గా ఉండటానికే ‘శ్మశానవాసి’ అగుచున్న త్యాగమూర్తి.
(శ్మశానము = ఈ జీవుడు అప్పటి వరకు ఉపయోగించిన భౌతికదేహమును కోల్పోవుచున్న తరుణము, దేహానంతరము పొందుచున్న స్థితి, గతులకు ప్రతీక).
♦︎ ‘‘ఈ పరమశివుని పాదపద్మములు ఎక్కడ స్థానము కలిగి ఉన్నాయి?’’ - అనేది తెలుసుకోవటానికై విష్ణువు ఆది వరాహమూర్తి అయి, ఏ పాదములు దర్శించి శరణాగతి పొందటానికి ఇంకా కూడా (అవి దొరకనందువల్ల) వెతుకుచూనే ఉన్నారో...,
♦︎ అవాక్-మానస గోచరమగు అట్టి శివతత్త్వమును స్తుతిస్తూ ఉండగా, విష్ణుమూర్తి సృష్టి పరిపోషణా సామర్ధ్యమును పొందుచున్నారో,
♦︎ వంగి నమస్కరిస్తు విష్ణుదేవునికి సమస్త సాయుధ సంపదలను, సామర్ధ్యములను ఏ రుద్రుడు ప్రేమపూర్వకమైన చూపుతో ప్రసాదిస్తున్నారో,
♦︎ యతో వాచో నివర్తంతే అస్రాప్య మనసా సహ। ఎవరియొక్క కేవలీ ఆనంత తత్త్వమును ఎంతో ప్రయత్నించి కూడా పొందలేక మనస్సు తన ఉపకరణము అగు ‘వాక్కు’ తో సహా వెనుతిరగవలసి వస్తోందో...,
ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన। అట్టి ఆనందమయుడైనట్టి శివబ్రహ్మమును ఎరిగినవాడు, - ఇక దేనికి భయపడతాడు? దేనికీ భయపడడు.
ఆ రుద్ర భగవానుడు ఎక్కడో ఆకాశంలోనో, కైలాసంలోనో లేరు. మరి? జీవుల హృదయాంతరంగుడై...,
• అణువుకు కూడా అణువై, సూక్ష్మాతిసూక్ష్మ స్వరూపుడై, అణోరణీయాన్,
• మహాస్థూలమై, మహనీయమైయున్న సమస్త పదార్ధములకంటే మహనీయుడై, ఘనీభూతుడై,-మహతో మహీయాన్ -
సమస్త జీవుల ఆత్మస్వరూపుడై మౌన - ప్రశాంత - ఆనంద స్వరూపముగా వేంచేసి ఉన్నారు.
ఎవరి బుద్ధి అయితే ఉత్తమ కర్మలచే కర్మపరిధులను అధిగమించి, నిర్మలమై, దోషరహితమై, సునిశితమై, విస్తారమై ఉంటుందో, - అట్టివారు ఆ రుద్ర భగవానుని యొక్క ఉనికి - తేజో విభవములను తమ హృదయమునందే దర్శిస్తున్నారు.
ఆ సర్వేశ్వరుడగు రుద్రమూర్తి ఇంకా కూడా...,
⚙︎ వసిష్ఠుడు, వామదేవుడు, శ్రీశుకుడు, బ్రహ్మదేవుడు మొదలైన బ్రహ్మజ్ఞానులగు తత్త్వవేత్తలచే తమ హృదయమునందే భావించబడుచూ, అనుక్షణము ఉపాసించబడుచున్నారు.
⚙︎ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన సనాతనులగు బ్రహ్మమానస పుత్రులు మొదలైనవారిచే సర్వదా ‘హే రుద్రభగవాన్!’ - అని హృదయాంతరంగుడుగా దర్శించబడుచున్నారు.
⚙︎ మహేశో। మహేశ్వరులై ఈ సమస్తముగా లీలా వినోదంగా సంప్రదర్శనమగుచున్నట్టి వారు.
⚙︎ భగవాన్। సమస్త దేహములలో వేంచేసి ఉండి, తమయొక్క ‘భావనా సౌందర్యము’తో సమస్తము సర్వదా వెలిగించుచున్నట్టి వారు. సర్వులకు అంతర్యామి।
⚙︎ ఆది దేవః। సమస్తమునకు మునుముందే చేతన (చైతన్య) స్వరూపులై సమస్తమును ప్రసాదించువారవటముచేత ‘ఆది దేవులు’.
⚙︎ సత్యో। సర్వులలో ‘నేను ఉన్నాను’ అను రూపంగా ‘సత్’ ‘యో’ (ఉండియే ఉన్నవారు) కాబట్టి సత్య (సత్యో) స్వరూపులు.
⚙︎ నిత్యో। కాలమునకు నియామకులై (కాలః కాలురై) భూత-వర్తమాన-భవిష్యత్ కాలములలో సచ్చిదానంద స్వరూపులు. నిత్యులు. భూత వర్తమాన భవిష్యత్తులలో సర్వదా యథాతథ స్వరూపులు.
⚙︎ సర్వసాక్షీ। దృశ్యమునకు ద్రష్టవలె, పఠణము చేయు కథకు పఠించువానివలె సమస్తమునకు సాక్షీ స్వరూపులై ఉన్నవారు.
⚙︎ మహేశో। సమస్తమునకు ఆ రుద్రభగవానుడే నియామకుడై, తానే తద్విధంగా విస్తరించి ఉండటముచేత ‘మహేశ్వరుడు’ అని స్తుతించబడుచున్నవారు.
⚙︎ నిత్యానందో। తన ఆనందము యొక్క ప్రదర్శనంగానే (స్వకీయ వినోదముగా) సమస్త లోకములను, జాగ్రత్ స్వప్న సుషుప్తులను సృజియించి, పాలించి, ఉపసంహారము నిర్వర్తిస్తున్నవారు. కనుక, ఈ సమస్త దృశ్య వ్యవహారము ఆ రుద్రదేవుని నిత్యానందమే! ఆయన నిత్యానందులు.
⚙︎ నిర్వికల్పో। సర్వకల్పనలు తనవై, వాటన్నిటికీ ఆవల నిర్వికల్పులై ఉన్నవారు.
⚙︎ నిరాఖ్యః। (ఆఖ్యః = పేరు)। నామ రూపాదులచే ఏమాత్రము కూడా పరిమితము కానివారు.
⚙︎ అచింత్య శక్తిః। చింతనకు విషయమే కానట్టి సర్వశక్తిమంతులు. సర్వశక్తి స్వరూపులు.
⚙︎ భగవాన్। సమస్తమును వెలుగించువారు (One who enlightens all else).
⚙︎ గిరీశః। హిమగిరిపై సంచరిస్తూ ఉన్న ఈశ్వర స్వరూపులు.
⚙︎ స్వ-అవిద్యయా కల్పిత మానభూమిః। తాము నిష్ప్రపంచ స్వరూపులు అయి ఉండి కూడా, - స్వకీయ అవిద్యచే కల్పితమైన సప్త భూమికలు, సమస్త ప్రపంచము కలవారు. తన కల్పనయందు తానే ప్రకాశించి, సంచారములు చేస్తూ, వినోదించువారు.
ఓ పైప్పలాదా! అట్టి రుద్రస్వామిని మేము ఎల్లప్పుడు సేవిస్తున్నాము.
ఓ సువ్రతా! నాయొక్క, విష్ణువు యొక్క ‘మాయ’ అత్యంతమోహము కలిగించగలిగినట్టిది. అట్టి దుస్తరమగు ఆ మాయ, - రుద్రభగవానుని పాదపద్మములు ఆశ్రయించువారికి ‘సం-తరా’ (తరించటానికి అత్యంత సులభము) అవుతోంది సుమా! అందుచేత జీవులంతా ఆ శివభగవానుని పాదములను శరణువేడి, మాయనుండి తరించెదరు గాక!
శ్రీ విష్ణుదేవుడు తన అంశలగు దేవతలచే ‘తన యోని’ అయినట్టి ‘జగత్ యోని’ని పాలిస్తున్నారు. ఆయన కాలఃకాలుడగు రుద్రుని అంశ అయి అఖిల జగత్తును రక్షిస్తున్నారు. వినాశం కాలతో యాతి। సమస్తము కాలముచేత జనించి, కాలముచేతనే వినాశనము పొందుచున్నది. రుద్రభగవానుడో? కాలః కాలుడు। కాలమునకే కాలము అయినవాడు. కాలమును నియమిస్తున్నట్టివారు.
అట్టి రుద్రభగవానుడు ‘అనన్యుడు’. ఈ సమస్తము ఆయనకు అనన్యము (ఏమాత్రము వేరు కానిది) అయి ఉన్నది.
స్వప్నదృశ్యమంతా మెలకువరాగానే ఏమౌతోంది? స్వప్న ద్రష్టలో మౌనంగా లయమౌతుంది కదా! రుద్రభగవానునికి (లేక) ఆత్మకు అన్యముగా కనిపించేదంతా ‘స్వప్న దృశ్యము’ లాగానే మృషము. (అసత్యము, కల్పితమాత్రము, అబద్ధము, అశక్యము, (which is impossible to exist at all), అవిషయము) అయిఉన్నట్టిది. రుద్రభగవానుని కల్పనయగు ఇదంతా రుద్రునియందే లయిస్తోంది.
ఓం తస్మై మహాగ్రాసాయ, మహాదేవాయ శూలినే, మహేశ్వరాయ మృడాయ, తస్మై రుద్రాయ నమో అస్తు।। సమస్తమును గ్రహించి తనయందు లయింపజేయు లయకారుడు, దేవతలకే దేవత అగుటచే మహాదేవుడు, త్రి-గుణాత్మక, త్రి-లోక, త్రి-అవస్థల సంజ్ఞగా చేతియందు శూలము ధరించినట్టి త్రిశూలి, సమస్త జీవులుగా విస్తరించిన వారగుటచే మహేశ్వరులు, మృడుడు (మృగచర్మధారుడు). (ఆది భిక్షువు) - అగు రుద్రభగవానునికి నమస్కారము.
శ్రీవిష్ణువు సర్వదా ఏక స్వరూపుడై అందరిలో వేంచేసి ఉన్నవారు. పంచభూతముల ఏకస్వరూపుడవటంచేత ‘మహత్‌భూతుడు’. (పంచభూతములు తనయొక్క మహత్ స్వరూపముగా కలవారు).
అట్టి ఏక-అఖండ స్వరూపుడగు విష్ణువు (ఏకమే అయి ఉండి కూడా) - (ఒకే బంగారము, అనేక అభరణములవలె) - అనేక జీవులుగా రూపములను దాల్చుచున్నారు. ఆయన మూడు లోకములలో అనేక అసంఖ్యాక రూపములు ధరించి సమస్తమును ఆస్వాదిస్తున్నారు.
అట్టి విష్ణుభగవానునికి హోమ ద్రవ్యములు సమర్పిస్తూ యజ్ఞక్రియలు (హోమము) నిర్వర్తిస్తూ ఉన్నాము.
చతుర్భిశ్చ - మనో బుద్ధి చిత్త అహంకార పూర్వకంగాను,
చతుర్భిశ్చ - దృశ్య - జీవాత్మ - ఈశ్వర - కేవలాత్మకంగాను,
ద్వాభ్యాం - జీవాత్మ - పరమాత్మపూర్వకంగాను,
పంచభిరేవ చ - ‘‘ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన’’ - పంచ ప్రాణాత్మికంగాను, పంచభూతాత్మికంగాను,
పునః ద్వాభ్యాం - మరల ఇహ-పర పూర్వకంగాను (Worldly side of 'what I am' and the original side of 'what I am').
హోమము చేస్తూ ఉండగా మాకు విష్ణు భగవానుడు ప్రసన్నుడు అగు గాక! ‘‘వషట్కము’’ (అగ్నియందు వేల్వబడిన హవిస్సు) స్వీకరించి మమ్ములను ఆత్మజ్ఞాన తేజో సంపన్నులుగా తీర్చిదిద్దును గాక!
బ్రహ్మార్పణం = అర్పించటము, త్యాగము చేయటము, సమర్పించటము, హోమము చేస్తున్నవాడు బ్రహ్మమే।
బ్రహ్మ హవిః = అగ్నిహోత్రమునందు వేల్చుటకు ఉపయోగించే నేయి, ఇవురుబెట్టిన అన్నము మొదలైనవి బ్రహ్మమే।
బ్రహ్మాగ్నౌ = ఏ అగ్నికి ఆహూతులు సమర్పిస్తున్నామో అట్టి అగ్ని కూడా బ్రహ్మమే।
బ్రహ్మణాహుతమ్ = వేల్చబడినవి, సమర్పించబడినవి బ్రహ్మమే।
బ్రహ్మకర్మ సమాధినా = బ్రహ్మము, బ్రహ్మజ్ఞానము, ఉద్దేశించి చేసే సమస్తకర్మలు ‘సమాధి’ అభ్యాసమే।
‘సమస్తము బ్రహ్మమే’ అను దృష్టి, దర్శనములే ‘‘బ్రహ్మకర్మ సమాధి’’
బ్రహ్మైవ తేన గంతవ్యమ్ = బ్రహ్మకర్మ, బ్రహ్మోపాసన, బ్రహ్మయజ్ఞము మొదలైన వాటిచే పొందవలసినది ఏది? ‘‘నేనే బ్రహ్మమును’’ - అను స్థానమే.
ఓ మహామునీ! పైప్పలాదా!
ఈ జీవులందరూ ‘బాణము’ వంటి వారై ఉండగా, వారి శరీరములలో హరి నిత్యము స్వయముగా శరభోపాసకులై (శివోపాసకులై) వేంచేసి ఉన్నారు.
• శరభుడు అగు శివుడు సాక్షాత్ స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నారు.
• అట్టి శరభుడే (శివుడే) సాక్షాత్ మోక్ష ప్రదాత! సద్యోముక్తి ప్రదాత.
ఓ పైప్పలాదా! ఎవరియొక్క ‘మాయ’చేత దేవతలంతటివారు కూడా ఈ కల్పిత దృశ్యముపట్ల మోహితులు అగుచు, మమత - అహంకారములను పొందుచూ ఉంటున్నారో.., తస్య మాహాత్మ్య లేశాంశమ్ అపి వక్తుం న శక్యతే। - అట్టి పరమేశ్వరుని మహత్మ్యము యొక్క ఒక కించిత్ విభాగము (లేశాంశము కూడా) మాకు వర్ణించటానికి అలవి కానిది సుమా!
☀︎ ఇహాత్ - ఈ జీవునికి చెందిన ఇహ ప్రకృతిలోని వ్యష్టి రూపము.
☀︎ పరాత్ - ఈ జీవునికి సంబంధించి ఇహము (దృశ్యములో కనిపించే అనుభవి - అనుభవము)నకు ఆధారమై, ఆవల ఏర్పడి ఉంటున్న పరస్వరూపము. పరమ్ (ఆవలి స్వస్వరూపము).
☀︎ పరాత్ పరమ్ - - సమస్త అనుభవములకు, దేహ-దేహాంతరములకు ఆవలిది.
- సమస్తమునకు ‘సాక్షి’ స్వరూపము.
- సమస్తమునకు ప్రేరణ స్థానము.
- పరమునకే పరమగు ఆదిస్వరూపము.
☀︎ పరాత్ పరతరమ్ బ్రహ్మా। - ‘‘అందరిలోని నేనైన నేనే - నేను’’ అయి, సమస్తమునకు వేరైనది కూడా అయినట్టిది. నాటకంలో పాత్రలన్నీ రచయిత సంకల్పమే అయినట్లు, పరాత్‌పరతరము (Next to positive Degree. Comparative Degree) - బ్రహ్మదేవుని ప్రదర్శనమే! (All this is the own manifestation of the superlative i.e., "BRAHMANI" )
☀︎ యత్ పరాత్ పరతో హరిః। - పరమునకే పరమైన వారు (ఈ జీవునికి చెందిన అనేక ఉపాధులు నావైన ‘నేను’ ) - ‘హరి’ స్వరూపము.
☀︎ తత్ పరాత్ పరతో అధీశః - అట్టి (1) పరాత్ (2) పరాత్ పరము (3) పరాత్ పరతరములకు ఆవలివాడు - శివుడు ఒక్కడే! ఆయనకు ఆవల మరింకేమీ లేదు. అందుచేత ‘పరాత్ పర తమము’ (The finest of the finest of what everybody of us is) - అని శివభగవానుడు స్తుతించబడుచున్నారు.
ఓ పైప్పలాదా! అట్టి శివతత్త్వము గురించి ఇంకా కొన్ని విశేషాలు చెప్పుకుందాము. వినండి.
ఏక ఏవ శివో। అనేకముగా కనిపిస్తున్న ఈ జగద్దృశ్యము - ఏకమగు శివస్వరూపమే! (ఒకచోట అనేక బంగారపు ఆభరణములు ఉన్నప్పటికీ - బంగారము ఏకమే అయి ఉన్నది కదా!).
నిత్యః। కాలమునకు ఆవలివారు అవటంచేత ఆ శివుడు [ (లేక) మనందరిలోని ఆ శివతత్త్వము ] త్రికాలాబాధ్యము. భూత-వర్తమాన భవిష్యత్తులలో యథాతథము. (కాలః కాల ప్రసన్నానాం కాలః కిన్ను కరిష్యతి?)
అట్టి శివునికి అన్యమైనదంటూ (‘‘జీవుడు - మనో బుద్ధి చిత్త అహంకారములు, - లోకపాలకులు - లోకములు - జ్ఞానులు - అజ్ఞానులు’’ - మొదలైనదంతా) ఎక్కడా ఏదీ లేదు.
అనేకంగా కనిపిస్తూ కూడా శివతత్త్వము ఎరిగిన వానికి ఇదంతా కూడా - ఏకమగు ‘శివానంద లహరి’గా స్వానుభవమౌతోంది.
తతో అన్యత్ సకలం మృషా। (శివాత్ పరతరం న అన్యత్ కించిత్ అస్తి।)। శివునికి వేరై ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేనే లేదు.
శివునికి, శివతత్త్వమునకు, శివాత్మతత్త్వమునకు, శివసంకల్పమునకు అన్యముగా (వేరుగా) ఏదైనా కనిపిస్తూ ఉంటే, - అదంతా మృష (భ్రమ, స్వకీయ మనో కల్పన) మాత్రమే! శివుడే ఆత్మ। శివుడే అఖండము। శివుడే నేను। శివో-హమ్।
అందుచేత ఓ పైప్పలాదా! ఓ సమస్త ప్రియ ఆత్మతత్త్వాధ్యయనులారా!
సమస్త సంసార దోషములు తొలగటానికై అన్య దేవతోపాసనను (విష్ణువు వేరు-నేను వేరు, తదితర దేవతలు వేరు. నేను వేరు- మొదలైన అన్యధ్యానములను) పరిత్యజించివేసి, ఏకము, అఖండము, స్వస్వరూపమునకు అభిన్నము, సమస్త జీవుల స్వాభావిక, సహజ రూపములకు అనన్యము, నిత్యము - అగు శివతత్త్వమునే - ‘‘తత్ శివో త్వమేవ। శివో-హమ్। సర్వమిదం శివమ్।’’ - అనురూపమగు అనునిత్యోపాసనగా అనుష్ఠించెదరు గాక!
అట్టి సర్వమును తనయందు హరించు లయకారుడు, సమస్తము ఆకర్షించి గ్రహించివేయు మహాగ్రాసుడు, (బంగారు ఆభరణములన్నిటికీ బంగారమువలె) సర్వము తనకు అనన్యమైనవాడు - అగు శివభగవానుని, మహేశ్వరునికి నమస్కరిస్తున్నాము.
శాస్త్ర నిష్ఠ నియమములు : పైప్పలాద మహాశాస్త్రం న దేయం యస్య కస్యచిత్।। ఈ ‘‘పైప్పలాదము’’ అనబడే మహాశాస్త్రమును అర్హత లేని వారికి, (అనర్హునికి) బోధించకూడదు - అనునది ఆర్యుల / విజ్ఞుల నియమము.
♦︎ ఈ జగద్దృశ్యమునకు ఆధారమైయున్న దివ్యమగు దైవీ ప్రజ్ఞను అంగీకరించక, ‘నాస్తికుడు’గా ఉన్నవానికి, నాస్తికాచారములు ఆశ్రయించువానికి,
♦︎ ఇతరులు తనకు చేసిన ఉపకారములను మరచి, తాను ఇతరులకొరకై చేయు ఉపకారములు మాత్రమే సంభాషించు కృతఘ్నునికి,
♦︎ ఇతరులకు కష్టము కలుగజేయు దుష్టవృత్తులు విడువని వానికి,
♦︎ ఇతరులకు అకారణముగా హానిచేయు స్వభావము ప్రదర్శించు దురాత్ములకు,
♦︎ తమ గొప్పతనము అధికముగాచేసి సంభాషించు స్వభావము గల దాంభికునిని,
♦︎ క్రూరమైన ఘాతుకములు చేయు స్వభావము గల నృశంసులకు,
♦︎ అసూయ, మూర్ఖత్వము, మోహము, మౌఢ్యత్వములతో కూడిన అభ్యాసము ఆశ్రయించు శఠునికి,
♦︎ అసత్యము సంభాషించటానికి గాని, ఆశ్రయించటానికి గాని వెనుకాడని అనృతభాషిణులకు,
ఈ ఉపనిషత్ శాస్త్ర రహస్యములు బోధించటము సముచితము కాదు.
ఓ ద్విజోత్తమా! రహస్యములలోకెల్ల రహస్యమగు ఈ విద్యను
(ఈ పైప్పలాద విద్యను) అర్హతానుకూలంగా తప్పక బోధించబడు గాక!
ఎవ్వరైతే ఈ ‘‘పైప్పలాద దర్శన విద్య’’ అనబడే శరభోపనిషత్ విషయములను అధ్యయనము చేస్తారో,
ఎవరు ఇందలి విశేష విద్యను అర్హులగు వారికి విశదీకరిస్తారో, బోధిస్తారో, ప్రవచిస్తారో, -
అట్టి ద్విజుడు జన్మ - మరణ చక్రమునుండి ‘విముక్తుడు’ అగుచున్నాడు.
ఈ శివతత్త్వ విద్యను ఎరిగినవాడు ‘గర్భవాసము’ అనే దౌర్భాగ్య (బాధాకర) స్థితులనుండి విముక్తుడగుచున్నాడు.
యో జానీ తే అమృతత్వం భవతి। ఇందలి తాత్త్వికార్థమును బుద్ధితో అధ్యయనము చేసి ఎరిగినవాడు - జన్మ జన్మాంతర సందర్భములకు అప్రమేయ సాక్షిత్వము (Mere witness while being unconcerned with comings and goings of physical bodies) పొందుచున్నాడు. ‘‘అమృతత్వము’’ సిద్ధించుకోగలడు.
ఈ శరభోపనిషత్‌లోని రుద్రతత్త్వము (లేక) శివతత్త్వ జ్ఞానము ఆశ్రయించినవాడు -
ఇతః పూర్వము నిర్వర్తించియున్న పాపదోషముల నుండి పునీతుడు కాగలడు.
⚛︎ సురాపానము (మత్తు ద్రవ్యము) సేవించిన దోషమునుండి,
⚛︎ బంగారము దొంగిలించిన దోషమునుండి,
⚛︎ బ్రహ్మహత్యా దోషము నుండి,
⚛︎ గురుతల్పగమన దోషమునుండి,
⚛︎ పంచమహాపాతకముల నుండి పునీతుడు కాగలడు.
⚝ నాలుగు వేదములు సేవించిన పుణ్యఫలము పొందగలడు.
⚝ సర్వదేవతలను ధ్యానించిన ఫలము సిద్ధించుకోగలడు.
⚝ సమస్తపాతక, ఉపపాతక దోషములనుండి పునీతుడు కాగలడు.
⚝ అవిముక్తము (కాశీ క్షేత్రము) దర్శించి సేవించిన ప్రయోజనములు పొందుచున్నాడు.
అట్టివాడు సర్వదా శివభగవానునికి ప్రియము కాగలడు.
ఇక్కడే శివసాయుజ్యమును పొందగలడు.
అట్టివానికి జన్మ-కర్మల పునరావృత్తి దోషములు ఉండవు.
ఈ ఉపనిషత్ అధ్యయనము చేయువాడు శివతత్త్వ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము పొందినవాడై, బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.
ఈ విధంగా బ్రహ్మదేవులవారు పైప్పలాద మహర్షికి పునరావృత్తి దోషము లేనట్టి ‘‘సో౽హం బ్రహ్మ’’ (లేక) ‘‘శివో౽హమ్’’ సిద్ధిని బోధించారు.
Sarabha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com