[[@YHRK]] [[@Spiritual]]

Bhȃvana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అథర్వణ వేదాంతర్గత

17   భావనోపనిషత్

శ్లోకతాత్పర్య పుష్పమ్

శ్లో।। స్వావిద్యా పద తత్కార్యం
శ్రీచక్రోపరి భాసురమ్
బిందురూప శివాకారం
రామచంద్రపదం భజే।।
శ్రీ చక్రమునకు ఉపరిగా (పైనగా) భాసించు చున్నట్టిది, బిందురూపము, శివతత్త్వాకారము, ఈ సమస్తము తనయొక్క కార్యరూపముగా కలిగి యున్నట్టిది, స్వాత్మ విద్యా స్వరూపము - అగు శ్రీరామచంద్ర పదము (తత్త్వము)ను భజించుచున్నాము. శ్రీరామచంద్ర-స్వాత్మారామ పదమును ఆశ్రయిస్తున్నాము.
ఓం
1. ఆత్మానం అఖండమంలాకారం
ఆవృత్య, సకల బ్రహ్మాండ మండలం
స్వప్రకాశం ధ్యాయేత్।
ఆత్మధ్యానము : స్వస్వరూపాత్మను → సమస్త బ్రహ్మాండ మండలమును ఆవరించి, ఆక్రమించి ఉన్నట్టి ‘‘అఖండ (Indivisible) మండలాకారము’’ గాను, స్వయం ప్రకాశముగాను భావిస్తూ ధ్యానమును ప్రారంభిస్తున్నాము. (Chanting theABSOLUTE SELFas indivisible form with universal Presentation).
శ్రీ గురుః - పరమకారణభూతా శక్తిః।
తేన నవరంధ్ర రూపో దేహః।
నవశక్తి రూపగ్ం శ్రీచక్రమ్।
సమస్తము ‘లఘువు’ అయి ఉండగా, కేలమగు ఆత్మయే సమస్తమునకు పరాకాష్ఠ - కాబట్టి ‘గురువు’. అట్టి ‘సత్’ గురువే సమస్త శక్తి సంపదలకు పరమ కారణభూతుడు.

అట్టి శ్రీ గురువగు పరమ కారణభూతము యొక్క శక్తి చేతనే (ఆత్మశక్తి చేతనే) నవ రంధ్రములతో కూడిన ఈ భౌతిక దేహము నిర్మితమై జీవిస్తోంది. స్పందన సహితమై ఉండ గలుగుతోంది.

ఈ ‘విశ్వరచన’ అంతా తనయొక్క సంపదగా కలిగియున్న శ్రీచక్రము- ‘9’ శక్తుల రూపంగా ప్రవర్తమానమై ఉన్నది.
వారాహీ,
పితృరూపా।
కురుకుళ్ళా।
భేరుండా।
దేవతా, మాతా।
పురుషార్థాః సాగరాః।
అట్టి ఆదిశక్తి స్వరూపిణియే శ్రీచక్ర దేవి. ఇంకా,
- వారాహీ। మాతృకా రూపిణి.
- ఈ సమస్తమునకు పితృ రూపిణి।
- కురుకుళ్లా। శ్రీ చక్రములో తేజో రూపిణియై విలసిల్లుచున్న దేవి.
- భేరుండ। (శ్రీచక్ర మేరువులో - 9వ ఆవరణలో 4వ దేవతా స్వరూపిణి).
- దేవతలకు కూడా జనని.
- ‘ధర్మ-అర్థ-కామ-మోక్షములు’’ అనే పురుషార్థములను తరంగములు తనయందు కలిగినట్టి అనంత సాగర-స్వరూపిణి.
2. దేహో నవరత్న ద్వీపః।
[ ఆధార-నవకం ముద్రా శక్తయః (ఇత్యాది) ]
ఈ దేహమే నవరత్నములు కలిగియున్న ద్వీపము.
(పంచ ప్రాణములు + అంతరంగ చతుష్టయ).
నవాత్మ గుణములు : జ్ఞాన, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారములు.
ఆధారము నుండి ‘9’ ముద్రలు, ‘9’ శక్తి స్వరూపములు (నవశక్తి) మొదలైనవి.
‘త్వక్’ ఆది సప్తధాతుభిః,
అనేకైః సంయుక్తాః।
ఈ శరీరములో సప్తధాతువులు, (చర్మము, క్రొవ్వు, బొమికలు, రక్తము, మాంసము, మజ్జ, శ్లేష్మము) తోను, ఇంకా అనేక పదార్థ విశేషాల మిశ్రమముగాను నిర్మితమైనది.
సంకల్పాః కల్పతరవః।
తేజః కల్పక ఉద్యానమ్।
- ఇందులోని సంకల్ప పరంపరలే కల్పవృక్షము.
- తేజస్సు (మనస్సే) - అనేక కల్పవృక్షముల సమూహముగల కల్పక - ఉద్యాన వనము వంటిది. (భావనల తేజోకిరణములు).
రసనయా భావ్యమానా।
మధుః ఆంల తిక్త కటు
కషాయ లవణ రసాః షడృతవః। (షట్ రుచవః)।
ఇంకా ఈ ‘దేహము’ మధ్యగా గల నోటితో (షట్ ఋతువుల నుండి) ‘మధురము (తీపి), ఆంలము (పులుపు), తిక్తము (చేదు), కటువు (కారము), కషాయము (వగరు), లవణము (ఉప్పతనము) - అని రసములు (షట్ రుచులు) సేవించబడుచున్నాయి.
క్రియాశక్తిః పీఠమ్।
కుండలినీ జ్ఞానశక్తిః గృహమ్।
ఇచ్ఛాశక్తిః మహాత్రిపుర సుందరీ।
ఈ శరీరము ‘క్రియాశక్తి’ (Working energy) వేంచేసి ఆశీనమైయున్న పీఠము. (Workmanship).
‘కుండలినీ’ అనే జ్ఞానశక్తికి ఇది నివాస గృహము.
అట్టి కుండలినీ - ‘ఇచ్ఛాశక్తి’యే మహాత్రిపుర సుందరీ స్వరూపము.
జ్ఞాతా - హోతా।
జ్ఞానమ్ - అగ్నిః।
జ్ఞేయగ్ం - హవిః।
శ్రీచక్ర యజ్ఞము / శ్రీ చక్ర పూజనములో :-

జ్ఞాత (The Knower) = ‘హోత’ (ఋత్విక్కు - ఋక్కులు, ఋగ్వేదము ఎరిగినవాడు). [(లేక) సమర్పించువాడు] - తెలుసుకొనువాడు.

జ్ఞానము (తెలియటము) (Knowing = ‘అగ్ని’. - తెలుసుకోవటము.

జ్ఞేయము (తెలియబడునది) (That being known) = హవిస్సు. (అగ్నిహోత్రమునకు సమర్పించే నేయి, అన్నము మొదలైన రూపమైనవి). - తెలియబడునది.
జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయా నామభేద
(అభేద) భావనగ్ం శ్రీచక్ర పూజనమ్।
జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయములు (The Knower, The knowing, that being known) గా, చెప్పుకోబడే వాటియొక్క ‘‘అభేద భావన’’యే (లేక) ‘‘ఏకత్వ భావన’’యే-‘‘శ్రీచక్ర పూజనము’’. (The Unity in the said Diversity).
నియతి సహిత శృంగారాదయో
నవరసాః అణిమాదయః।
నియామకమైయున్నట్టి, (నియమితమై యున్నట్టి) - శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, భీభత్సక, రౌద్ర, శాంత (9) - నవరసములే ఈ దేహములో కనిపించే - (అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ఈశిత్వ, వశిత్య, ప్రాకామ్య, ఇచ్ఛ అనబడే) - అష్టసిద్ధులుగా చూడబడు గాక!
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య
పుణ్య పాపమయా బ్రాహ్మ్యాత్ అష్ట శక్తయః।
ఈ శరీరము వెంటగా ‘‘కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, పుణ్య-పాపములనబడే ఈ ఎనిమిది - శరీరములోగల అష్ట శక్తి ప్రదర్శనములు.

అట్లాగే ఈ శరీరములో మాతృకలు ఆయా ధర్మములు నెరవేరుస్తున్నారు. (సప్తమాతృకలు = బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి). (లేక) కాఱి, కౌశిక, ఉద్ధత, హవిష, శారిక, ఆర్య, వైధాత్రి.
3. ఆధార నవకం ముద్రాశక్తయః।
పృథివి ఆపః తేజో వాయుః ఆకాశ, శ్రోత్ర త్వక్
చక్షుః జిహ్వా (ఆ)ఘ్రాణ, వాక్ పాణి పాద పాయు
ఉపస్థ - మనోవికారాః షోడశ (16) శక్తయః।
వచన ఆదాన గమన విసర్గ ఆనంద హాన ఉపాదాన
ఉపేక్షా - బుద్ధయో అనంగకుసుమాది శక్తయో అష్టౌ।
‘తొమ్మిది’ ఆధార చక్రములు ముద్రా శక్తులు. (సంజ్ఞాక్షర శక్తులు, చిహ్నములు) (చిన్ముద్ర మొదలైనవి).

శరీరములోని షోడశ (16) శక్తులు
(1) పంచ భూతములు - పృథివి ఆపః తేజో వాయు ఆకాశములు. (5)
(2) పంచ జ్ఞానేంద్రియములు - చెవులు, చర్మము, కళ్లు, నాలుక, ముక్కు(5).
(3) పంచ కర్మేంద్రియములు - వాక్కు, చేతులు, కాళ్లు (పాదములు), పాయువు. (మల విసర్జనావయవం), ఉపస్థ (5)
(4) మనస్సు - వికారములు (1)
వాక్కు, ఇచ్చుట, గమనము, వదలటము, ఆనందము, హానము (నష్టపడటము), ఉపాదానము (ప్రతి గ్రహణము) లేక (ఇంద్రియములను మరలించటము), ఉపేక్ష - ఇవి ఎనిమిది విధమైన బుద్ధులు - ఇవి. అనంగ కుసుమము మొదలైన ‘‘అష్ట శక్తులు’’. (హృదయాకాశ సంబంధమైన అష్ట శక్తులు).
అలంబుసా, కుహూః విశ్వోదరీ
వరుణా, హస్తిజిహ్వా, యశశ్వతీ,
అశ్వినీ, గాంధారీ, పూషా, శంఖినీ, సరస్వతీ
ఇడా, పింగళా, సుషమ్నా చ
ఇతి చతుర్దశ (14) నాడ్యః।
‘సర్వ సంక్షోభిణీ’ - ఆది చతుర్దశారగ్ దేవతాః।
శరీరములోని చతుర్దశ (14) నాడులు:
(1) అలంబుసా (2) కుహూ (3) విశ్వోదరీ (4) వరుణా (5) హస్తి జిహ్వా (6) యశశ్వతీ (7) అశ్వినీ (8) గాంధారీ (9) పూషా (10) శంఖినీ (11) సరస్వతీ (12) ఇడ (13) పింగళ (14) సుషుమ్న - ఇవి 14 నాడులు.

వీరే శరీరము నందు రక్షణ కలుగజేయు చతుర్దశ దేవతలు - అయి ఉంటున్నారు. ‘సర్వ సంక్షోభినీ చతుర్దశ’ అనబడుచున్నారు.
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన,
నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయా…
ఇతి దశ (10) వాయవః।
సర్వసిద్ధిప్రదాది దేవ్యో
బహిర్దశారగా దేవతాః।।
పంచప్రాణములు - (1) ప్రాణము (2) అపానము (3) వ్యానము (4) ఉదానము (5) సమానము
పంచ ఉపప్రాణములు - (1) నాగ (2) కూర్మ (3) కృకర (4) దేవదత్త (5) ధనంజయ. ఇవి దశ ప్రాణ ఉపప్రాణములు.

ఈ 10 వాయువులు సర్వసిద్ధులు ప్రసాదించగల దేవతలు. ‘‘బాహ్య దశార దేవతలు’’ - అని ఉపాసించబడుచున్నారు.
4. ఏతత్ వాయు దశక
సంసర్గక ఉపాధిభేదేన
రేచక పూరక శోషక దాహక ప్లావక-
అమృతమితి ప్రాణ ముఖ్యత్వేన
పంచవిధో జఠరాగ్నిః భవతి।
ప్రాణముఖ్యత్వేన - పంచవిధ జఠరాగ్నులు
అటువంటి పంచ ప్రాణ వాయు - పంచ ఉపప్రాణముల ‘దశకము’ యొక్క సంసర్గికమైన ఉపాధి భేదంచేత (Physical formations by virtue of mix up of 10 prana energies) (1) రేచకము (ఖాళీచేయటము) (2) పూరకము (నింపటము) (3) శోషకము (ఇంకించివేయు శక్తి) (4) దాహకము (అగ్ని - కాల్చటము) (5) ప్లావకము (బాహ్య-అభ్యంతరములలో ప్రవహించు తత్త్వము, తడుపటము)గా (శరీరంలో) అమృతమగు ముఖ్య ప్రాణము అగుచున్నది. ఇవి పంచవిధ జఠరాగ్ని రూపములు, దశవిధ ప్రాణశక్తులు- ఆయా సమ్మేళణములుగా అగుచు, దేహములో ఆయా కార్యములు నిర్వర్తిస్తున్నాయి.
క్షారక ఉద్గారకః క్షోభకో మోహకో జృంభక
- ఇతి ‘‘అపాన’’ ముఖ్యత్వేన పంచవిధో అస్తి।
అపాన ముఖ్యముచే పంచ విధములు
అపాన ముఖ్యత్వముచే (1) క్షారకము (ఆకలి) (2) ఉద్గారకము (త్రేణుపు, వెడల కక్కటము) (3) క్షోభకము (కలత కలిగించునది) (4) మోహకము (మోహింపజేయునది) (5) జృంభకము (ఆవులింత) - అనే పంచవిధ ధర్మములు శరీరంలో కలుగుచున్నాయి.
తేన మనుష్యాణాం మోహకో, దాహకో,
భక్ష్య భోజ్య లేహ్య చోష్య
పేయాత్మకం చతుర్విధం
అన్నం పాచయతి ఏతా।
మనుష్యులయొక్క అట్టి మోహక-దాహక చర్యల వలన నోరుద్వారా శరీరములో ప్రవేశించిన భక్ష్య (చప్పరించి తినునది), భోజ్య (నమిలి తినునది) లేహ్య (నాకి మ్రింగునది) చోష్య (పీల్చబడునది) అగు చతుర్విధ ఆహారములు పచనమై, శరీరమునకు చలనశక్తి ప్రసాదిస్తున్నాయి.
(ఏతా) దశ వహ్నికలాః సర్వజ్ఞత్వాది
అంతర్దశారగా దేవతాః।
ఈ విధంగా ‘10’ విధములైన అగ్నులకు సర్వశక్తి రూపిణులు అయినట్టి 10 మంది అంతర్దశార దేవతలు దేహంలో వేంచేసి ఉన్నారు.
శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇచ్ఛా,
సత్త్వ రజః తమోగుణా
వశిన్యాది శక్తయో అష్టౌ।
ఈ దేహములో శీత-ఉష్ణ, సుఖ-దుఃఖ, ఇచ్ఛా-ద్వేష, సత్త్వ రజో తమోగుణములతో సుసంపన్నము చేయటానికై వశిని మొదలైన అధిష్ఠాన దేవతలు ఎనిమిదిమంది క్రియాశీలురై ఉండి ఉంటున్నారు.
(వశిని - ఆది వాగ్దేవతలు).
5. శబ్ద స్పర్శ రూప రస గంథాః
- పంచ తన్మాత్రాః।
- పంచ పుష్ప బాణాః।
మన - ఇక్షుధనుః।
వశ్యో - బాణో।
రాగః - పాశో।
ద్వేషో - అంకుశః।
ఈ శరీరంలో ఇంకా →
పంచతన్మాత్రలు - (1) శబ్దము (2) స్పర్శ (3) రూపము (4) రసము (5) గంధము. ఈ ఐదు కూడా ఐదు పుష్ప బాణములు.
మనస్సు → ఇక్షు (చెఱకుగడ) ధనస్సు.
వశము చేసుకోవటం (వశిని) → బాణము.
రాగము (అనురాగము) → పాశము
ద్వేషము → అంకుశము.
అవ్యక్త మహత్తత్త్వ అహంకారాః।
కామేశ్వరీ వజ్రేశ్వరీ భగమాలిన్యో
అంతః త్రికోణాగ్రగా దేవతాః।
అంతరమున త్రికోణాగ్ర దేవతలు -
(1) అవ్యక్తము (2) మహత్ తత్త్వము (3) అహంకారము.
- వీరే (1) కామేశ్వరి (2) వజ్రేశ్వరి (3) భగమాలిని అనే అంతః త్రికోణాగ్ర- గాన - దేవతలు.
పంచదశ తిథిరూపేణ
కాలస్య పరిణామావలోకన స్థితిః
పంచదశ నిత్యాః
శ్రద్ధానురూపా ధీర్దేవతా।
15 తిథులు (శుక్ల-కృష్ణ పక్ష తిథులు) - రూపంగా కాల పరిణామము అవలోకనము పొందుతూ ఉన్నది.
వారే పంచదశ (15) నిత్యలు. (నిత్యదేవతలు).
‘శ్రద్ధ’ అనే రూపముగా ఉన్నది ధీ (బుద్ధి) దేవత.
తయోః కామేశ్వరీ సదానంద ఘనా
పరిపూర్ణ స్వాత్మైక్యరూపా దేవతా లలితా।
ఈ సమస్త జీవుల దేహములలో దేవతలు -
కామేశ్వరి, సదానంద ఘన పరిపూర్ణ, స్వాత్మ ఐక్యరూపిణి అగు పరదేవతయే - సమస్తము తానే అయి విరాజిల్లుతోంది. సమస్త దేవతలు ఆ కామేశ్వరీదేవీ అంశయే. ఇదంతా కూడా ‘పరిపూర్ణ’ అగు కామేశ్వరీదేవీ - సంప్రదర్శనమే. స్వ-ఆత్మ-ఐక్యదేవతయే శ్రీలలిత.
6. ‘సలిలమ్’ ఇతి సౌహిత్య కరణగ్ం ‘‘సత్త్వమ్’’।
‘‘కర్తవ్యమ్, అకర్తవ్యమ్’’ - ఇతి
భావనాయుక్త - ‘‘ఉపచారః’’।
‘అస్తి-నాస్తి’ ఇతి కర్తవ్యతా ‘‘అనూపచారః’’।
అట్టి లలితా పరాభట్టారిక గురించిన పూజ, సన్నుతి।
సౌహిత్య (స్నేహపూర్వకమైన, తృప్తితో కూడిన) సాత్త్విక కరణములు, ప్రవర్తన కలిగి ఉండటమే - సలిలము, (జలసమర్పణ), జలాభిషేకము.

‘‘ఇది కర్తవ్యము - ఇది అకర్తవ్యము (ఇది చేయవలసినది, ఇది చేయవలసినది కాదు)’’ - అను భావనలే ఉపచారము (సన్న్యాసము).
అస్తి-నాస్తి (ఉన్నది-లేదు) అను చర్చ - విమర్శలు ‘‘అనూపచారము’’ (అసన్మానము).
బాహ్య-అంతఃకరణానాం
రూపగ్రహణ యోగ్యతా స్థితి - ‘‘ఆవాహనమ్’’।
అంతఃకరణము బాహ్యమున రూపమును గ్రహించు యోగ్యతా స్థితియే- ఆత్మదేవునిపట్ల ‘‘ఆహ్వానము’’. సాకారమైనదంతా నిరాకార చేతనతత్త్వముగా భావించటము ‘ఆవాహనము’.
తస్య బాహ్య-అంతఃకరణానామ్
ఏకరూప గ్రహణమ్ ‘‘ఆసనమ్’’।
ఆత్మ తాను ఏకరూపమై కూడా, అనేకమగు వినటము, చూడటము, చెప్పటము, స్పర్శ మొదలైనవి బాహ్య-అంతఃకరణములను (ఇంద్రియములను) పొందుచుండుటయే ‘మనస్సు’ (మానసము).
రక్త శుక్ల పద ఏకీకరణం ‘‘పాద్యమ్’’।
రక్త-శుక్ల పద ఏకీకరణమే ఆ లలితా పరాభట్టారిక (లేక) ఆత్మదేవికి సమర్పించే ‘పాద్యము’ (పాదప్రక్షాళనము).
(రజో-తమో ఏకీకరణమే పాద ప్రక్షాళనము).
ఉజ్జ్వలత్ ఆమోదానంద ‘‘ఆసన’’ -
దానమ్ - ‘‘అర్ఘ్యమ్’’।
హృదయపీఠముపై ఉజ్వలమగు ‘ఆమోదము’తో కూడిన ఆసన దానము (స్థానము ఆశ్రయించటమే) ‘అర్ఘ్యము’.
(తనలో ఆత్మ ఎక్కడున్నదో ఎరిగి ఉండటమే అర్ఘ్యము).
స్వచ్ఛం స్వతఃసిద్ధమ్ ఇతి ‘‘ఆచమనీయమ్’’।
చిత్ చంద్రమయీ సర్వాంగ స్రవణగ్ం ‘‘స్నానమ్’’।
స్వతఃసిద్ధమైన స్వచ్ఛతయే ‘‘ఆచమనీయము’’.
సర్వాంగముల చలనము-ప్రవర్తనములను చిత్ (ఎరుక) - అను చంద్రకిరణమయంగాను, సర్వాంగాల విషయములను ప్రణవముగా (పూర్ణాత్మగాను) భావించటము - ‘‘స్నానము’’.
చిదగ్ని స్వరూప పరమానంద శక్తి
స్ఫురణం - ‘‘వస్త్రమ్।’’
‘‘చిదగ్ని’’ (The Enlightenment of Knowing) స్వరూపమగు ‘‘పరమానందము’’ అనే శక్తికి సంబంధించిన ‘స్ఫురణ’యే - దేవదేవికి (ఆత్మదేవికి) సమర్పించే ‘వస్త్రము’.
ప్రత్యేకగ్ం సప్త వింశతిధా (27)
భిన్నత్వేన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక
బ్రహ్మగ్రంథి మద్రస తంతు
బ్రహ్మనాడీ, ‘‘బ్రహ్మసూత్రమ్।’’
బ్రహ్మనాడియే బ్రహ్మ సూత్రము.
ఒకదానికంటే మరొకటి ప్రత్యేకమయినది - అయినట్టి 27 తత్త్వములతో కూడుకొని ఉన్నట్టిది, అనేక విభిన్నత్వములతో కూడిన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైనది-అయినట్టి ‘బ్రహ్మనాడి’యే బ్రహ్మసూత్రము.
స్వ వ్యతిరిక్త వస్తు సంగరహిత
స్మరణమ్ - విభూషణమ్।
స్వస్వరూపము కంటే వేరైన వస్తువులతో ‘‘సంగరహితము’’గా అభ్యాసమే ‘‘విభూషణము’’. సమస్తము స్వస్వరూపముగా దర్శించటమే ఆభరణము.
సత్సంగ పరిపూర్ణతా
అనుస్మరణమ్- ‘‘గంధః।’’ సచ్ఛంఖ
(సత్-శంఖ) (పరిపూరణానుస్మరణమ్-ఇతి పాఠాంతరమ్)
సమస్త విషయాణాం
మనసః స్థైర్యేణ అనుసంధానం కుసుమమ్।
ఆత్మ పూజలో…,
సత్సంగముతో కూర్చబడినట్టి ఆత్మ గురించిన అనుస్మరణమే ఆత్మదేవునికి సమర్పించే గంధము.
‘సత్’ అనే శంఖమును పూరించటము (లేక), సత్-శంఖ పరిపూర్ణ - అనుస్మరణము, సమస్త విషయములను మనస్సుతో ధైర్య-స్థైర్యములతో అనుసంధానము చేయటము - ఇవియే భగవానునికి పుష్ప సమర్పణ.
7. తేషామ్ ఏవ సర్వదా స్వీకరణం - ‘‘ధూపః।’’
పవన అవచ్ఛిన్న ఊర్ధ్వ జ్వలన సత్-చిత్
ఉల్కాకాశ దేహో ‘‘దీపః।’’
మనస్సు వరకే ఈ జగత్తును స్వీకరించటము - ధూపము.
ఉచ్ఛ్వాస-నిశ్వాసలతో ఊర్ధ్వంగాను, అవిచ్ఛిన్నంగాను జ్వలిస్తున్న (వెలుగుచున్న) ‘సత్-చిత్-ఆనంద దేహమే’ దీపము.
ఉల్కాకాశమున ఆనందమయ ఆత్మ- దేహధారణచేయుచున్నాను’ - అను భావనయే ఆత్మ భగవానుని సమక్షంలో ‘దీపము’. సాక్షాత్ దీపదర్శనము.
సమస్త యాత - అయాత
వర్జనం ‘‘నైవేద్యమ్।’’
దేహములు, లోకములకు సమస్త యాత-ఆయాతములకు (రాక-పోకలకు) సంబంధించిన వ్యవహారశీలమంతా అధిగమించి ఉండటమే ‘‘నైవేద్యము’’.
అవస్థాత్రయ - ఏకీకరణం ‘‘తాంబూలమ్।’’
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు తనవైన ఏకాత్మ స్వరూపములో (తురీయములో) ఏకత్వము వహించి ఉండటము - ‘‘తాంబూలము’’.
మూలాధారాత్ - ఆ బ్రహ్మరంధ్ర పర్యంతమ్,
బ్రహ్మరంధ్రాత్ - ఆమూలాధార పర్యంతమ్
గత-ఆగత రూపేణ ‘‘ప్రాదక్షిణ్యమ్।’’
‘‘మూలాధారము’’ నుండి ‘‘బ్రహ్మ రంధ్రము’’ వరకు, బ్రహ్మరంధ్రము నుండి (తిరిగి) మూలాధారము వరకు, నిర్వర్తించు (యోగాభ్యాసమునకు సంబంధించిన) - రాక పోకలే ‘‘ప్రదక్షిణము’’.
తురీయావస్థా - ‘‘నమస్కారః।’’
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆవలి 4వ అవస్థ (తురీయావస్థ) యొక్క ధారణయే నమస్కారము.
దేహశూన్య ప్రమాతృతా -
నిమజ్జనమ్ - ‘‘బలిహరణమ్।’’
ఈ భౌతిక దేహమును ‘నిర్విషయము’ గాను, ‘శూన్యము’గాను భావించి అట్టి శూన్యత్వములో ‘నిమజ్జనము’ అయి ఉండటమే ‘బలిహరణము’.
‘‘సత్త్వమ్ అస్తి’’ -
కర్తవ్యమకర్తవ్యమ్ ఔదాసీన్య
నిత్యాత్మవిలాపనగ్ం ‘‘హోమః।’’
సమస్త ‘ఉనికి’లను, ‘లేము’లను, కర్తవ్య - అకర్తవ్యములను ఉదాసీనము (Unmindful, quietly beyond) గా దర్శిస్తూ, నిత్యము ఆత్మగురించిన విలాపనము (గానము)ను నిర్వర్తించటము - ‘‘హోమము’’.
ఏవం ముహూర్తత్రయం
భావనయా యుక్తో భవతి,
తస్య దేవతాత్మైక్య సిద్ధిః।।
ఈవిధంగా పరమాత్మయందు మూడు ముహూర్తముల కాలము నిశ్చలమైన ‘‘భావన’’ కలిగి యున్నంత మాత్రంచేతనే - అట్టి వానికి ‘‘దేవతా-ఆత్మైక్య స్థితి’’ సిద్ధించగలదు.
చింతిత కార్యాణి అయత్నేన సిద్ధ్యంతి।
స ఏవ ‘శివయోగి’ ఇతి కథ్యతే।
అనుకున్న కార్యములన్నీ అప్రయత్నంగా (అయత్నేన) సిద్ధించగలవు.
అట్టి (ఏక-అఖండ ఆత్మ) భావన కలిగియున్నవాడు ‘‘శివయోగి’’- అగుచున్నాడు.
‘కా’ ది ‘హా’ ది మత ఉక్తేన
భావనా ప్రతిపాదితా జీవన్ముక్తో భవతి-
- య ఏవం వేద। - ఇత్యుపనిషత్।।
‘‘కా’’ ది మత (కర్మ యోగ మార్గం)గాను, ‘హా’ది మత (జ్ఞాన యోగ మార్గం) గాను ఎవడు ఈ భావనోపనిషత్ ప్రతిపాదిస్తున్న ఆత్మయొక్క రూపమును తెలుసుకుంటూ, భావన చేస్తూ, ఉపాసిస్తూ ఉంటాడో, అట్టివాడు ‘‘జీవన్ముక్తుడు’’- అగుచున్నాడు.
భావనోపనిషత్ సమాప్తా
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇతి భావనోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

అథర్వణ వేదాంతర్గత

17   భావనోపనిషత్

అధ్యయన పుష్పమ్

‘‘శ్రీచక్రము’’ యొక్క ఉపరిగా (ఆవలగా) విస్తరించి భాసిస్తూ ఉన్నట్టిది, బిందురూపము, శివతత్త్వ జ్ఞానరూపము, సమస్త సృష్టికి ఆదికారణము, - అగు ‘‘పరతత్త్వ శ్రీమాతకు’’ నమస్కారము. అట్టి ఆత్మారామము (లేక) శ్రీ రామబ్రహ్మము-అనబడు అద్దానిని సర్వదా ఉపాసించుచున్నాము.

‘ఆత్మ’ యే సర్వజీవులకు పరాకాష్ఠ అగు ఆరాధ్య వస్తువు. ఎందుచేత? అందరికీ కూడా ‘ఆత్మ’ యే సహజముగాను, అనునిత్యముగాను ‘స్వభావ రూపము’ కాబట్టి.

ఆత్మధ్యానము అనగా ‘‘అనన్యము, సహజము అగు స్వస్వరూప ధ్యానమే’’ - అవుతుంది. సమస్తమునకు ఆవలిది, ఆది అగు ‘ఆత్మ’యే ఈ సమస్తమునకు ఆధారము. అనేకముగా అనుభవమగుచూ కూడా ‘ఏకమే’ అయి ఉన్నట్టిది ‘ఆత్మ’.

అట్టి ఆత్మను ఉపాసించేది ఎట్లా? (1) తెలుసుకోవటము, (2) భావించటము - అందుకు ఉపాయం.
‘భావన’ ద్వారా ‘భావించువాడు’ అగు స్వస్వరూపాత్మను ఆశ్రయించి ఉండటమే భావనోపనిషత్.

→ ఆత్మయే సమస్త బ్రహ్మాండ మండలముగా సమస్తమును ఆవరించి ఉన్నది.
→ అట్టి ఆత్మ స్వయంప్రకాశకము. అందుచేత అద్దానిని చూడటానికి మరొక ప్రకాశింపజేయు వస్తువుతో పని ఉండదు.

గురువు :- ఆత్మైవ హి గురుః। ‘ఆత్మ’ యే ‘గురువు’. ఆత్మకు ‘అన్యము’గా కనిపించేదంతా కూడా కల్పనామాత్రము, ఊహా-సందర్భ పరిమితము. కాబట్టి ‘‘లఘువు’’. అట్టి ‘గురువు’ అగు ఆత్మ సమస్త జీవుల సహజమగు స్వస్వరూపమై, సమస్త శక్తి సంపదలకు కారణభూతమై ఉన్నది. శ్రీ గురుః పరమ కారణ భూతా శక్తిః।

అట్టి ‘శ్రీ గురువు’ అగు ఆత్మ భగవానుని యొక్క శక్తి ప్రదర్శనమే ‘‘నవ రంధ్రములతో కూడిన ఈ పంచభూత నిర్మిత భౌతికదేహము’’ కూడా. అట్టి శ్రీ గురువే-సమస్తము తనకు చెందినదే అయి ఉండటంచేత- ‘‘నవశక్తి రూప శ్రీచక్రము’’ అని కూడా అభివర్ణితము అవుతోంది.

(నవ శక్తి = నవాత్మలు = జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ, సర్వాత్మలు).

(నవ రంధ్రములు = 2 కళ్లు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, నోరు, గుహ్యము, గుదము, బ్రహ్మరంధ్రము).

అట్టి నవశక్తి రూపిణియగు ‘శ్రీచక్ర దేవత’ అనబడే ఆత్మదేవియే ఇక్కడ ‘ప్రకృతి-పురుష’’, ‘‘అనుభవ-అనుభవి’’, ‘‘దృశ్య-ద్రష్ట’’, ‘‘క్షేత్ర-క్షేత్రజ్ఞ’’ - ఇత్యాది రూపములుగా కనపడుతోంది. విశ్వమంతా తన ‘9’ శక్తుల ప్రదర్శనగా వెలయుచున్నది. సమస్త ‘భావన’లకు తానే కారణమగుచున్నది. సముద్ర జలంనుండి తరంగములవలె, ఈ జగత్ దృశ్యములు ఆత్మదేవత నుండియే భావనాతరంగములుగా బయల్వెడలటము, సంచరించటము, లయించటము జరుగుతోంది. అట్టి నవశక్తీ - శ్రీచక్రదేవి ఇంకా ఇట్లా వర్ణించబడుతోంది.

‘‘వారాహీ’’ → మాతృకా రూపిణి. సమస్త బ్రహ్మాండములకు, అందలి లోకములకు జననస్థానము. కేవలమగు - అహంకార తత్త్వరూపిణి. (The Sense ofIat itsAbsolute Form’).

పితృరూపా → ఆత్మస్వరూపిణియగు శ్రీచక్ర దేవతయే సమస్తమునకు రక్షణను ప్రసాదిస్తూ ఉండటంచేత - ‘పితృరూపిణి’.

కురుకుళ్ళా → భక్తజనులు ఉపాశించే శ్రీచక్రములో తేజోరూపిణి అయి విలసిల్లటంచేత ‘కురుకుళ్ల’. జ్ఞానప్రదాత కాబట్టి ‘కురుకుళ్ల’ - సార్థక నామధేయము.

భేరుండా → శ్రీచక్రములో (9వ ఆవరణలో 4వ) దేవతా స్వరూపిణి. పట్టుదలకు, మొండితనమునకు, ఏకాగ్రతకు చిహ్నము.

దేవతా మాతా → మాతృకా స్వరూపిణి. శ్రీచక్ర స్వరూపిణి అగు ఆత్మదేవదేవి. ‘దేవతలకు కూడా జననస్థానము. దేవతలకే తల్లి’’!

పురుషార్థాః సాగరాః → ఆత్మకు ‘సంజ్ఞ’యగు శ్రీచక్రమే - చతుర్విధ పురుషార్థములను (ధర్మ, అర్థ, కామ, మోక్షములను) తన సాగర స్వరూపమునందు పడిలేచే తరంగాలవలె కలిగి ఉన్నట్టిది. శ్రీమాతయే. చతుర్విధ పురుషార్థ సాగర స్వరూపిణి. (పురుషార్థములు - ‘ధర్మము’ను నిర్వర్తించి, ‘దైవీ సంపద, జ్ఞానగుణములు’ అనే అర్థమును సంపాదించి, ‘లక్ష్యశుద్ధి’ అనే కామముతో ‘‘నాకు సంబంధమే లేదు’’ - అనే విముక్తి రూపమగు మోక్షము సిద్ధింపజేసుకోవటము.


దేహము - నవరత్న దీపము

ఈ దేహమే ఒక నవరత్న దీపము.

I. బాహ్యమున పంచభూతములు (5 = భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము).
అంతరమున మనో బుద్ధి చిత్తాహంకారాలు (అంతరంగ చతుష్టయం = 4 = మననము, ధ్యాస, ఇష్టము, వ్యష్టిత్వము)
- అనే నవరత్నములు (9).

II. (1) దేహత్రయము - స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము (3)
(2) అవస్థా త్రయము - జాగ్రత్, స్వప్నము, సుషుప్తి (3)
(3) ఆత్మ త్రయము - జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ (3)

ఈవిధంగా కూడా ఈ దేహము నవరత్న దీపము (3+3+3 = 9)

III. మాతృకా త్రయము - ‘అ’ ‘ఉ’ ‘మ’ (3)
గుణత్రయము - సత్త్వ రజో తమో (3)
స్థాన త్రయము - విశ్వుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు (3)

ఈ విధంగా కూడా తొమ్మిది (9).

IV. నవ ముద్రలు- ‘ఆధారము’ మొదలైన తొమ్మిది ముద్రలు. ఇవి తొమ్మిది శక్తి స్వరూపములు. చిన్ముద్ర మొదలుగా నవముద్రలు. నవావరణలు.

ఈ శరీరము

సప్తధాతువులు = చర్మము, కొవ్వు, మాంసము, బొమికలు, రక్తము, మజ్జ, శ్లేష్మము కలిగి ఉన్నది.

ఇంకా కూడా పాంచభౌతిక, ఆమ్ల - క్షార మిశ్రమములు అనేకము కలిగి ఉన్నది.

ఈ శరీరము సంకల్పములకు (Ideations, Assumptions, Pressumptions) కు కల్పతరువు (ఏది కోరుకొంటే అది ప్రసాదించే స్వర్గలోక వృక్షము) వంటిది.

అటువంటి అనేక కల్పవృక్షములు గల ఉద్యానవనము - ‘మనస్సు’. అట్టి మనస్సు - ఆత్మయొక్క తేజోరూపమే।

ఈ శరీరంలోని నోరు రుచి ఆస్వాదిస్తూ ‘షట్ రుచులు’ అనబడే - మధురము (తీపి), ఆంలము (పులుపు), తిక్తము (చేదు), కటువు (కారము), లవణము (ఉప్పతనము), ఆస్వాదిస్తోంది.

ఈ శరీరంలో కూడా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శశిర ఋతువు, శరద్రుతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువులు - అనే ఆరు ఋతువులు ఉన్నాయి.

క్రియా శక్తి :

అట్టి ఈ భౌతిక శరీరము చూడటం, వినటం, వాసన ఆస్వాదించటం, స్పర్శ, రుచి, మాట్లాడటం, నడవటం మొదలైన అనేక క్రియా నిర్వర్తనలకు శక్తి పీఠము వంటిది. ఈవిధంగా శరీరంలో ‘‘క్రియాశక్తి’’ - పీఠం వేసుకొని ఉన్నది.

కుండలినీ శక్తి :

ఇంకా ఈ శరీరంలో ‘‘కుండలిని’’ - అని పిలువబడే ‘‘ఇచ్ఛా - క్రియా - జ్ఞాన’’ త్రిశక్తి రూపమగు ఏకశక్తి ఉన్నది. అట్టి ఈ కుండలినీ శక్తి ఇంద్రియ విషయములవైపుగా దీక్ష - ధ్యాస కలిగి ఉన్నపుడు ‘కుండలినీ నిద్రాస్థితి’ - అని, (మరియు) (ఇచ్ఛా జ్ఞాన క్రియా - ఇంద్రియముల నియామకుడగు ఆత్మపురుషుని వైపుగా దీక్ష-ధ్యాస కలిగి ఉంటే ‘‘కుండలినీ జాగృత్’’ అని చెప్పబడుతోంది.

ఈ కుండలినీ శక్తియే దేహములోని ఇచ్ఛాశక్తి రూపమగు ‘‘మహాత్రిపుర సుందరీ’’ స్వరూపము.

శ్రీచక్రము : కేవలము, పరమప్రశాంతము, బ్రహ్మానందమయము, ఏకము, సర్వాతీతము అగు ఆత్మ తనయొక్క కేవలమౌన స్వభావమును వీడకయే, - అన్యమును కల్పించుకొని, పరిపోషించుకొని తిరిగి లీలగా ఆ అన్యమునంతా తనయందు అనన్యముగా లయము చేయు చమత్కారము - శ్రీచక్రము.

‘‘శ్రీచక్రోపాసన’’ అనే ‘‘యజ్ఞము’’ లో →
• జ్ఞాతయే (తెలుసుకొనువాడు) → హోత (ఋత్విక్కు).
• జ్ఞానము (తెలుసుకోవటము) → అగ్ని.
• జ్ఞేయము (తెలియబడునది) → హవిస్సు.

శ్రీచక్ర పూజనము = (1) జ్ఞాత (2) జ్ఞానము (3) జ్ఞేయము (The knower, The knowing and All that being known) లను అభేదరూపము గాను, శ్రీచక్ర స్వరూపమగు పరమాత్మకు ‘‘అనన్యము’’గాను, ‘ఆత్మ-భావన’ను అనుక్షణికంగా ఆశ్రయిస్తూ, స్వాభావికంగా అయ్యే వరకు ధారణ చేస్తూ ఉండటమే ‘శ్రీ చక్రపూజనము’.

నవ రసములు : ఈ శరీరములో ‘‘శృంగారము, వీర్యము, కరుణ, అద్భుతము, హాస్యము, భయానకము, భీభత్సము, రౌద్రము, శాంతము’’ - అనబడే నవరసములు ప్రదర్శితమౌతూ ఉంటున్నాయి.

అణిమ - గరిమ - మహిమ - లఘిమ - ఈశిత్వ - వశిత్వ - ప్రాకామ్య - ఇచ్ఛ అష్టసిద్ధుల విశేషములు కూడా ఇందులో భావరూపమై ఉన్నాయి..

సప్త మాతృకలు : ఇందులో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి - అనే సప్త మాతృకలు ఉనికి. వారు శరీరములోని అనేక రసతత్త్వములకు పరిపోషకులు, అయి ఉంటున్నారు. ప్రేమాస్పదులై ప్రాకృత శరీరమును తమ ప్రభావముచే - పరిరక్షకులుగా అగుచున్నారు.

అష్ట శక్తి ప్రదర్శనములు : (1) కామము (2) క్రోథము (3) లోభము (4) మోహనము (5) మదము (6) మాత్సర్యము (7) పుణ్యము (8) పాపము - ఇవి శరీరంలోని బ్రహ్మీ - సంబంధమైన అష్టశక్తి ప్రదర్శనములు.

ఆధారనవకం : ‘9’ ఆధారములు, ముద్రశక్తులు ఈ దేహములో నిక్షిప్తమై ఉన్నాయి. (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్త్వ రజో తమో గుణములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు).

ఇంకా ఇందులో…,

పంచ భూతములు : పృథివి ఆపః తేజో వాయు ఆకాశములు = (5) (Solid, Liquid, Head, Vapour, Space)

పంచ జ్ఞానేంద్రియములు : శ్రోత్రము (చెవులు), త్వక్కు (చర్మము, స్పర్శ), చక్షువులు (కళ్లు, చూపు), జిహ్వ (రుచి, మాట), ఘ్రాణము (వాసన) = (5)

పంచ కర్మేంద్రియములు : వాక్కు, పాణి (చేతులు), పాదము (కాళ్లు), పాయువు, ఉపస్థ = (5)

మనస్సు : ఆలోచన, భావాలు = (1)
ఇవన్నీ కలిపి షోడశ (16) శక్తులు.

అనంగ కుసుమ ఆదిశక్తులు : అనంగము (హృదయము) అనే పుష్పముయొక్క పుష్పదళములు. (1) వాక్కు (2) ఆదానము (ఇవ్వటము) (3) గమనము (4) వదలటము (5) ఆనందము (6) హానము (నష్టపడటము/వదలటము) (7) ఉపాదానము (ప్రతి గ్రహణము) ఇంద్రియములను విషయములనుండి మరలించటము. (8) ఉపేక్ష (పట్టించుకోకపోవటము) - ఇవన్నీ బుద్ధి యొక్క ‘‘అష్ట-అనంగ కుసుమములు.

చతుర్దశ నాడులు : ఈ శరీరములోని 14 నాడులు. ఇవన్నీ ‘మూలాధార చక్రము’ నుండి బయల్వెడలుచున్నాయి.
(1) అలంబుసా : గుద (మల విసర్జన) స్థానము వరకు విస్తరించి ఉండే ‘నాడి’.
(2) కుహూ : మర్మాయవము వరకు వెళ్లుచుండే నాడి.
(3) విశ్వోదరి : పొట్టలోని ‘అన్నకోశము’ వరకు (వైపుగా) పోవుచుండే ‘నాడి’.
(4) వరుణా : కొమ్మ-ఉప కొమ్మలవలె శరీరమంతా వ్యాపించి ఉండే నాడి.
(5) హస్తి జిహ్వ
(6) యశశ్విని : కుడి-ఎడమ పాదముల బొటనవ్రేలు వరకు విస్తరించి ఉండే నాడులు.
(7) హస్విని
(8) శంఖిని : కుడి-ఎడమ చెవుల వరకు ఏర్పడి ఉంటున్న నాడులు.
(9) గాంధారి
(10) పూషా : కుడి-ఎడమ కనులు, కంటి పాపల వరకు విస్తరించి ఉండే నాడులు.
(11) సరస్వతీ : రసేంద్రియమును (నాలుకను) చేరుచున్న నాడి.
(12) ఇడ : ఎడమ ముక్కు వరకు విస్తరించు నాడి.
(13) పింగళ : కుడి ముక్కు వరకు వెళ్ళుచుండే ‘నాడి’.
(14) సుషుమ్న : మూలాధారమునుండి బ్రహ్మ రంధ్రము వరకు, అక్కడినుండి సహస్రారము వరకు పైపైకిపోవు ‘నాడి’.


ఈ దేహములో దశవిధ వాయువులు అనునిత్యము సంచారము నిర్వర్తిస్తూ, ఈ జడ దేహమును అనునిత్యము ఉజ్జీవింపజేస్తున్నాయి.

పంచ ప్రాణములు : (1) (ముఖ్య) - ప్రాణము, (2) అపాన ప్రాణము, (3) వ్యాన ప్రాణము, (4) ఉదానప్రాణము, (5) సమాన ప్రాణము. ఇవి హృదయము, గుదము, శరీరమంతటా, కంఠము, నాభి ప్రదేశములలో ముఖ్య స్థానము కలిగి ఉండి శరీరములో ప్రవర్తిస్తున్నాయి.
పంచ ఉప ప్రాణములు : (1) నాగ ఉప ప్రాణము (2) కూర్మ ఉప ప్రాణము (3) కృకర ఉపప్రాణము (4) ధనంజయ ఉప ప్రాణము (5) దేవదత్త ఉప ప్రాణము.

ఇవి వచనము, దాన పరిగ్రహణములు, గమన ఆగమనములు, విషయ-కేవల ఆనందములు, విసర్జనము - అనునవి విషయములుగా కలిగి ఉన్నాయి.

పంచ విధ అమృతములు (పంచామృతములు) : ఈ ప్రాణ (5) ఉపప్రాణ (5) = 10 ద్వివిధ వాయువులు అనేక స్థాన, ఆకార, కలయిక, విడిపోవటముల చర్య కారణంగా ఉపభేదం పొందుచున్నాయి.

ఉపాధి భేదం చేత : (1) రేచకము (2) పూరకము (3) శోషకము (4) దాహకము (5) ప్లావకము అనునవిగా అయి, ఈ శరీరమును ‘మృతము’ నుండి కాపాడుచున్నాయి. అమృత జీవనము ప్రసాదిస్తున్నాయి. అందుచేత ‘పంచామృతములు’గా చెప్పబడుచున్నాయి.

(రేచకము = వాయువును బయటికి పంపటము.
పూరకము = వాయువు నింపటము.
శోషకము = ఉష్ణమును జనింపచేసి ఎండించటము.
దాహకము = దహించటము. కాల్చటము. (వైశ్వానర ధర్మము).
ప్లావకము = జలముచే వ్యాప్తము చేసి ఉంచటము. తడిపి ఉంచటము).

పంచ విధ జఠరాగ్నులు :

దశవిధ వాయువుల వివిధ కలయికలచే శరీరంలో పంచవిధ జఠరాగ్నులు జనిస్తున్నాయి, శరీరంలో చరిస్తున్నాయి.
(1) క్షారక - ఆకలి.
(2) ఉద్గారక - త్రేణువు / కక్కు.
(3) క్షోభక - కలత కలిగించేవి (కడుపు నొప్పి మొదలైనవి).
(4) మోహక - మోహింపజేసేవి (పులి త్రేణుపులు మొదలైనవి).
(5) జృంభక - ఆవలింత.

ఈ ఈ పంచ విధ జఠరాగ్నులచే ఆయా పంచవిధ వ్యవహారములన్నీ సంభవిస్తున్నాయి.

అటువంటి క్షారక, ఉద్గారక, క్షోభక, మోహక, జృంభక చర్యలచే - శరీరములో ఆహారరూపంగా ప్రవేశించే భక్ష్య (చప్పరింత), భోజ్య (నమలటం), లేహ్య (నాకటం), చోష్య (పీల్చటం) - అగు చతుర్విధాన్నములు - (చతుర్విధ (4) రకముల ఆహారములు) - పచనము అయి, శక్తిగా మారుచున్నాయి.

ఈ విధంగా దశాగ్నులను నియమించు సర్వజ్ఞత్వ లక్షణులగు పదిమంది దివ్య ప్రజ్ఞా స్వరూపులగు దేవతలు ఈ శరీరములో వాయువు యొక్క రాకపోకల ధర్మములు తమ దైవీశక్తిచే నిర్వర్తించువారై ఉంటున్నారు.

ఇంకా ఈ శరీరంలో ‘వశిని’ మొదలుగా గల వాగ్దేవతలు వేంచేసి ఉన్నారు. అట్టి దేవతల అష్టశక్తులు శరీరంలో శీతలము (Cool), ఉష్ణము (Hot/Heat), సుఖము (Pleasantness), దుఃఖము (Un-Pleasantness), ఇచ్ఛ (Expectation, Desire), సత్త్వ రజో తమో త్రిగుణములుగా సంప్రదర్శనమౌతున్నాయి.

పంచతన్మాత్రలు : ఈ శరీరంలో మాతృకల ప్రదర్శనములు (Motherly original presentations) ఉన్నాయి. అవియే ‘‘శబ్దము (Sound), స్పర్శ (Touch), రూపము (Form), రసము (Taste), గంధము (Smell)’’ అను పంచన్మాత్రలు శరీరంలో ఉంటున్నాయి.


ఇవే పంచ పుష్ప బాణము - అని కూడా చెప్పబడుచున్నాయి.

మనస్సు (ఆలోచన) - చెఱకుగడ / ధనస్సు.
మనస్సు విషయములకు ‘వశము’ అవటము - బాణము.
రాగము (Relatedness, Deep Attachment) - పాశము.
ద్వేషము (Disliking) - అంకుశము.

అంతః త్రికోణాగ్ర దేవతలు (1) అవ్యక్తము (2) మహత్ తత్త్వము (3) అహంకారము

(1) అవ్యక్తము : బీజములో ఆయా వృక్ష ధర్మాలవలె, ఇంకనూ వ్యక్తీకరణము కానట్టి, (కానీ) వ్యక్తీకరించగలిగినట్టి - ఆవలి సవిషయ - విషయములకు మునుముందటి స్వస్థితి.

(2) మహత్-తత్త్వము : (కలలో కనిపించే అనేకమంది జనులకు చెందిన అహంకారము ఎవరిది? కల తనదైన వానికి చెందినదే కదా! అట్లాగే, ఆత్మయొక్క సమష్టితత్త్వమే. ఈ జగత్తులో కనిపించే భిన్న భిన్న అహంకారులంతా (అహంకారములన్నీ) - [ఈ జగత్తు స్వయంకల్పిత స్వప్నమువంటిదే కాబట్టి]- ‘జాగ్రత్ తనదే’ అయిఉన్న ఈ జీవుని సమష్టి అహంకార రూపమే. అదియే ‘‘మహత్ తత్త్వము’’ అని కూడా పిలువబడుతోంది.

(3) అహంకారము : వ్యక్తిగతమగు ‘అహం’ (నేను) భావన. దేహములోని త్రికోణాగ్ర దేవతల (ఇచ్ఛా-జ్ఞాన-క్రియల) కార్యక్రమ విశేషము.

లోపలగల దేవతలు ‘‘కామేశ్వరి - వజ్రేశ్వరి - భగమాలిని’’ అను మూడు పేర్లతో (పౌరాణికంగా) చెప్పుకోబడుచున్నారు.

సదానంద ఘనా। పరిపూర్ణ స్వాత్మైక్య రూపా దేవతా లలితా।।

ఆత్మ దేవత ఈ శరీరములో పరాకాష్ఠ అయి, పరాత్పరము అయి వేంచేసి ఉన్నది. అట్టి పరదేవతయే ‘లలితాదేవి’. (స్వాత్మానంద లవీభూతా। అహమిత్యేవ విభావయేత్ భవానీమ్।). అట్టి ఆత్మాధిష్ఠాన స్వస్వరూప దేవతయే - ఈ జీవునిలోని ఘనీభూతమైన సదానంద స్వయమాత్మ స్వరూపము. స్వాత్మయే స్వరూపముగా గల ఆ ఆత్మదేవియే, (జీవాత్మ - ఈశ్వర - పరమాత్మ త్రయము తన ప్రదర్శనా చమత్కారమై ఉండగా) → దేహముయొక్క బాహ్య-అంతరములలో వెలయుచున్నది.

ఆత్మదేవతయే
• సమస్త జీవులలో ‘ధీ’ శక్తిగా (బుద్ధి శక్తిగా) వెలయుచున్నది.
• కాల స్వరూపిణి అయి, పంచదశ తిథుల పరిణామ - అవలోకనమునకు (కాల పరిణామమునకు) సాక్షి అయి వెలుగొందుచున్నది.
(పంచదశ తిథులు = పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దసి, పౌర్ణమి / అమావాస్య).
• పంచదశలలోను నిత్య అయి, సమస్త దశలకు, మార్పు చేర్పులకు ఆవలిదై (పరమై) పరమేశ్వరి అగు లలితాదేవి (ఆత్మదేవి) ప్రకాశించుచున్నది.

మానసిక - ఆత్మదేవతా పూజ


అట్టి స్వాత్మ దేవత అగు లలితా పరా భట్టారిక (సుందర స్వరూప ఘన దేవత) గురించిన ఉపనిషత్ పూర్వకమైన ‘‘మానసిక పూజ’’ గురించి చెప్పుకుంటున్నాము.


  1. ‘‘సలిలమ్ ఇతి సౌహిత్య కరణగ్ం సత్త్వమ్।’’ స్నేహపూర్వకమైన, తృప్తితో కూడిన సాత్త్విక కరణములు, క్రియలు, భావములు - కలిగి ఉండటమే…., → దివ్య స్వరూపిణి అగు లలితా-ఆత్మ స్వరూపిణీ దేవికి జల సమర్పణ। జలాభిషేకము।

  2. ‘‘కర్తవ్యమ్, అకర్తవ్యమ్’’ ఇతి భావనాయుక్త ఉపచారః। - శాస్త్ర గురు ఆర్య వాక్యములను అనుసరించి ‘‘ఇది కర్తవ్యము - నిర్వర్తించవలసినది’’, ‘‘ఇది అకర్తవ్యము - నిర్వర్తించకూడనిది’’ అని ఎరిగి - వర్తించు భావనలు → ఆత్మదేవుని సన్మాన రూపమగు ‘‘ఉపచారము’’.

  3. అస్తి నాస్తీతి కర్తవ్యతా - ‘‘అనూపచారః’’। - ఏది సర్వదా త్రికాలములలో ఏర్పడినదై ఉన్నదో, అది ‘అస్తి’. ఏది దేశ-కాల-భావనానుగతం మాత్రమే ఉన్నట్లు అగుపిస్తూ (అనిపిస్తూ), వాస్తవానికి స్వతఃగా లేదని ఎరిగి ఉండు భావనలే → అనూపచారము (ఆచారము కాదని వ్యవహరించటము).

  4. బాహ్య-అంతఃకరణనాం రూపగ్రహణ యోగ్యతా అస్తి ‘‘ఆవాహనమ్’’। - అంతరంగ చతుష్టయము (అంతఃకరణములు) అయినట్టి మనో - బుద్ధి - చిత్త - అహంకారములతో బాహ్యమైన పంచ జ్ఞానేంద్రియములను, పంచకర్మేంద్రియములను ఉపయోగించి రూపగ్రహణ యోగ్యతా స్థితిని ధారణ చేయుచుండటమే. → ఆత్మ దేవదేవికి ఆహ్వానమంత్రము / ఆవాహన ప్రవచనము.

  5. తస్య బాహ్యాంతః కరణానాం ఏకరూప గ్రహణమ్ ‘‘మానసమ్’’। - అట్టి బాహ్య - అంతఃకరణములకు విషయముగా అగుచున్న భిన్న భిన్న విశేషములలో ఏకత్వము [భిన్నత్వములో ఏకత్వము, (The unity in the Diversity)] ను మనస్సు (మననము)తో దర్శిస్తూ ఉండటమే → ‘మానసమ్’। మానసికోపాసన। మానసిక పూజ।

  6. రక్త శుక్ల ‘పద’ ఏకీకరణమ్ ‘‘పాద్యమ్’’। - ఎరుపు, తెలుపు పదముల ఏకీకరణమే ఆత్మదేవికి ‘‘పాద ప్రక్షాళనము’’.
    → రక్తము = రజోగుణము. శుక్లము = సత్త్వ గుణము
    → రక్త - శుక్లముల ఏకత్వము = గుణాతీతమగు ఆత్మను ఉపాసించటము.

  7. ఉజ్జ్వలత్ ఆమోద ఆనంద ‘‘ఆసనమ్’’। - ‘‘ప్రహర్షితము’’ అయినట్టి ఆమోద-ఆనందములే (Agreeing with life situations and maintaining undisturbed pleasantness) → ‘‘ఆసనము’’.

  8. దానమ్ ‘‘అర్ఘ్యమ్’’। - సహజీవులకు దానముచేయు క్రియలే ఆత్మదేవునికి ‘‘అర్ఘ్యము’’. (చేతులు కడగటము).

  9. స్వచ్ఛం స్వతః సిద్ధమ్ - ఇతి ‘‘ఆచమనీయమ్’’।- సర్వదా స్వచ్ఛమైన, స్వతః సిద్ధమైన - (Its presence by virtue of its own self - అగు) ఆత్మ గురించిన, శ్రవణ మనన నిదిధ్యాసలే → ‘‘ఆచమనీయము’’.

  10. చిత్ చంద్రమయీ సర్వాంగ స్రవణగ్ం - ఇతి ‘‘స్నానమ్।’’ - పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ విషయములన్నీ చిత్ భావనతో ఏకము, తన్మయము చేయటమే ‘‘ఆత్మ దేవుని పూజ’’ లోని → ‘‘స్నాన సమర్పణ’’ .
    (చిత్ = ఎరుక. ‘‘ఎరుగుచున్నవాడు, ఎరగటము, ఎరుగబడునది - ఇవన్నీ కూడా ఈ జీవుని కేవలచిత్ నుండే స్రవించుచున్నాయి’’- అను అవగాహన, అచంచలమగు అనుభూతియే ‘చిత్ చంద్రమయము’).

  11. చిదగ్ని స్వరూప పరమానంద శక్తి స్ఫురణం - ‘వస్త్రమ్’। - ‘‘చిదానంద రూపమగు చిదగ్ని తేజోశక్తియే ఈ సమస్త జగత్తు’’ - అను స్ఫురణయే ఆత్మ దేవాది దేవి కి సమర్పించే → ‘‘వస్త్రము’’.

  12. ప్రత్యేకగ్ం సప్తవింశతిధా (27) భిన్నత్వేన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక బ్రహ్మగ్రంథిమత్, రసతంతు బ్రహ్మనాడీ - బ్రహ్మసూత్రమ్।’’ - ఏ బ్రహ్మనాడి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమై ‘27’ తంతువులతో (27 వేరువేరైన తత్త్వములకు ఆశ్రయమై) యున్నదో, అట్టి బ్రహ్మనాడియే - ‘‘బ్రహ్మసూత్రము’’. అట్టి ‘‘బ్రహ్మము’’ అను నాడిని బుద్ధితో ధారణ చేయుచుండటమే → ఆత్మదేవీ పూజలో బ్రహ్మసూత్ర (యజ్ఞసూత్ర) సమర్పణము.

  13. స్వ-వ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణమ్ - ‘‘విభూషణమ్।’’ - ఏకమగు ఆత్మకు వేరైనట్లు అగుపిస్తూ, ‘‘అనేకముగా కనిపించే’’ - అనాత్మకు సంబంధించిన - వస్తు, సంగతి, సందర్భ, సంబంధ, అనుబంధ - ఇత్యాది వ్యవహారములు స్మరించక, భిన్నముగా కనిపించే ఈ సమస్తములో ‘ఏకత్వము’ను ఆశ్రయించి ఉండటమే → ఆత్మదేవికి సమర్పించే ఆభరణములు (లేక) విభూషణము.

  14. సత్సంగ పరిపూర్ణత - అనుస్మరణం - గంధః। - ‘అసత్’ తో సంగము జయించి, ‘సత్’తో ‘సంగము’ వలన అనుభవమగు ‘‘ఆత్మగా నేను పరిపూరుణాడను’’ - అను ఆత్మకు సంబంధించిన పరిపూర్ణతతో → అనుస్మరణమే ఆత్మదేవతకు ‘గంధము’.

  15. ‘సత్’ శంఖ-పరిపూర్ణానుస్మరణమ్, సమస్త విషయాణాం మనసః స్థైర్యేణ అనుసంధానం- ‘‘కుసుమమ్’’। ఆత్మయొక్క స్వాభావిక లక్షణము ‘సత్’. ‘నేను ఉన్నాను’ అను ఉనికి స్వరూపముగా (సత్‌గా) ఆత్మ సమస్త దేహములలో వేంచేసినదై ఉన్నది. త్రికాలములకు గాని, దేహ దేహాంతరములచేతగాని, జాగ్రత్ స్వప్న సుషుప్తి ‘త్రి’ అవస్థల చేతగాని పరిమితము, నియమితముకాని అట్టి ‘సత్’ - ‘పరిపూర్ణము’ అయిఉన్నది. సమస్తము అట్టి సత్‌కు చెందినదే! అట్టి పరిపూర్ణమగు సత్ స్వరూపమే స్వస్వరూపాత్మగా (1) మనన రూపమగు మనస్సుతో, (మరియు) (2) బుద్ధిచే కలిగిన స్థైర్యముతో ‘అనుసంధానము’ ఎల్లప్పుడు కలిగి ఉండటమే - ఆత్మదేవత అగు లలితాదేవికి సమర్పించే కుసుమము (హృదయ పుష్పము).

  16. తేషామ్ ఏవ సర్వదా స్వీకరణం ధూపః। - శుద్ధమైన మనస్సు ఈ సమస్తమును నిర్మలమగు ఆత్మగా భావన చేయటము, (మరియు) స్వీకరిస్తూ ఉండటము - ఇవియే ఆత్మభగవతికి సమర్పించే → ధూపము.

  17. పవనావత్ అఛిన్న ఊర్ధ్వ జ్వలన ‘సత్-చిత్’ ఉల్క ఆకాశ దేహో ‘దీపః’ - వాయువుచే (ఉచ్ఛ్వాస - నిశ్వాసలచే) కుండలినీ శక్తి ఊర్ధ్వముగా వెలుగుచుండగా, ‘సత్-చిత్ ఆనంద స్వరూపమగు జ్యోతిర్మయాకాశమే నా దేహము’ - అని దేహి తనయొక్క ఆత్మదేహమును తేజోమయముగా దర్శిస్తూ ఉండటమే → ‘దీపము’ అను సమర్పణ.

  18. సమస్త యాత - ఆయాత వర్జనం ‘‘నైవేద్యమ్’’। - సమస్తమైన యాతము (గతము, పోగొట్టుకొంటున్నవి), ఆయాతము (ముందు ముందు వచ్చునవి) - రెండిటినీ అధిగమించి, అతీతుడై ఉండు అభ్యాసమే → ఆత్మదేవతకు ‘నైవేద్యము (నివేదనము)’.

  19. అవస్థాత్రయ ఏకీకరణమ్ - ‘‘తాంబూలమ్’’। - స్వప్నములో అనుభవమయ్యేవన్నీ కల్పితములే. స్వప్నమునకు మునుముందుగాను, స్వప్నమునకు తదనంతరముగాను → వేంచేసి ఉన్న కేవల స్వరూపమగు ‘నేనే’ సత్యము.
    అట్లాగే జాగ్రత్ అనుభవములు కూడా. ఎందుకంటే అవన్నీ మనో కల్పితములే. జాగ్రత్‌కు మునుముందుగాను, జాగ్రత్‌కు తదనంతరముగాను వేంచేసి ఉన్న కేవల స్వస్వరూపమగు ‘నేనే’ సత్యము.
    సుషుప్తి విషయంలో కూడా ‘సుషుప్తి తనదైనవాడే’’ - సత్యము.
    ఎ అట్టి త్రి-అవస్థల ఏకీకరణముచే, ఆ మూడు తనవైన ‘నేను’ను ఆశ్రయించు అభ్యాసమే ఆత్మానందదేవికి ‘‘తాంబూల సమర్పణము’’

Image for Chakras

గతాగత రూపేణ ప్రాదక్షిణ్యమ్।

మూలాధార - బ్రహ్మరంధ్రముల మధ్యగా గతము - ఆగతము (పోవటము-రావటము) రూపంగా ధ్యానముయొక్క (ధ్యాసయొక్క) చలనము (Conscious move) జరుగుచూ ఉన్నదో - అదియే, ఆత్మదేవీ శ్రీమాతకు చేసే ‘‘ప్రదక్షిణము’’.

21. తురీయావస్థా - నమస్కారః - (1) జాగ్రత్ అవస్థ, (2) స్వప్నావస్థ, (3) సుషుప్త్యవస్థ (గాఢనిద్రా స్థితి) నావైన నేనే - తురీయము. ఆ మూడిటి సాక్షి నేనే అయి ఉన్నాను. అతీతమై యున్నాను. ఆ మూడు అవస్థలకు ప్రేరణము, ఆధారము అయి ఉన్న నాలుగవ అవస్థయే ‘‘తురీయము’’ (చతురీయము. నాలుగవది). అట్టి తురీయ స్థానమును భావన, ధారణలచే ఆశ్రయిస్తూ ఉండటమే → ‘‘ఆత్మ శ్రీమహారాజ్ఞి’’కి చేయు ‘నమస్కారము’.

22. దేహ శూన్య ప్రమాతృతా నిమజ్జనం ‘బలిహరణమ్’। - ఈ భౌతిక దేహమును ఒక శూన్యమైనదిగా భావిస్తూ, అట్టి భావనను ‘ప్రమాత’ యందు (సమస్త దృష్టాంతములకు సూచిత విషయమైన పరమాత్మ తత్త్వమునందు) నిమజ్జనము చేయటమే → ‘‘బలిహరణము’’. (ప్రమ = సత్యము, పరమ సత్యము).

23. సత్త్వమస్తి కర్తవ్యమ్। అకర్తవ్యమ్ ఉదాసీన్య నిత్యాత్మ విలాపనగ్ం హోమః। - ‘‘ఇదే చేయాలి। అది చేయకూడదేమో? ఇంతవరకే చేయాలి। అంతవరకు కాదు’’…. మొదలైన ఆయా కర్తవ్య - అకర్తవ్యముల పట్ల ఉదాసీనము వహిస్తూ,
- కేవలమగు ‘సత్త్వము’ - నందు స్థానము ధారణచేస్తూ, భావిస్తూ ఉండటము - హోమము.
నిత్యమగు ఆత్మతత్త్వము గురించి గానము చేయటము (ఎరుగుచు, దర్శిస్తూ, అదే తాను అగుచుండటము) - ఇదియే హోమము. ప్రపంచము కనిపించే అనేకమంతా ఏకమగు ‘‘సత్-తత్త్వము’’ నందు దర్శించు సత్త్వదృష్టియే (లేక) (తత్త్వ దృష్టియే) ‘హోమము’.

24. స్వయం తత్ పాదుకా నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం। - ఈ జీవాత్మత్వమును సర్వ తత్త్వ స్వరూపిణి అగు ఆ ‘‘ఆత్మ మహాదేవి’’ యొక్క (లేక) శ్రీ చక్ర స్వరూపిణి అగు జగజ్జనని యొక్క పాద పద్మములందు (తరంగము జలములో నిమజ్జనమగు విధంగా) - నిమజ్జనము చేసివేయటమే ‘పరిపూర్ణ ధ్యానము’. సర్వతత్త్వ స్వరూపమగు ఆత్మదేవతయందు పాదుకము పొందటము (నెలకొని ఉండటము, స్థిరపడి ఉండటము, మేళవించుకోవటము) - పరిపూర్ణ ధ్యానము.


పైవిధంగా విషయ భావనలతో నిండి ఉన్న మనస్సును ‘‘ఆత్మ భావన’’తో నింపి ఉంచి, ఆత్మతో ‘‘అనన్య భావన’’ను సిద్ధించుకోవటమే ‘భావనోపనిషత్’ ।

- ‘కా ది’ మత (కర్మయోగ) సిద్ధాంత మార్గము అనుసరించి,
- ‘హా ది’ మత (జ్ఞాన/సాంఖ్య) సిద్ధాంత మార్గము అనుసరించి
- (లేక) ఆ ఉభయమార్గములను శ్రద్ధగా అనుసరిస్తూ ఎవ్వడైతే (‘కాది-హాది’ మత సిద్ధాంతానుసారంగా) ఆత్మదేవిని తెలుసుకొని ఉంటాడో, అట్టివాడు ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు.


ఇతి భావనోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।



Bhȃvana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com