[[@YHRK]] [[@Spiritual]]

Hayagreeva Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అథర్వణ వేదాంతర్గత

22     హయగ్రీవోపనిషత్

శ్లోకతాత్పర్య పుష్పమ్

శ్లో।। జ్ఞానానందమయం దేవమ్
నిర్మల స్ఫటికాకృతిమ్,
అధారం సర్వవిద్యానాం
హయగ్రీవం ఉపాస్మహే।
జ్ఞానానందమయులు, దేవదేవులు, నిర్మల స్ఫటికము వలె ప్రకాసించువారు, సర్వ విద్యలకు ఆధారులు - అగు ‘హయగ్రీవ భగవానుని ఉపాసించుచున్నాము’.
స్తుతి
శ్లో।। స్వ (అ)జ్ఞో౽పి యత్ ప్రసాదేవ జ్ఞానం తత్ ఫలమ్ ఆప్నుయాత్

సో౽యం హయాస్యో భగవాన్ హృది మే భాతు సర్వదా।
ఏ స్వామి యొక్క ప్రసాదముచే - స్వయముగా ‘అజ్ఞాని, మూఢుడు’ అయి ఉన్నవాడు కూడా ‘పరబ్రహ్మతత్-త్వమ్, సో౽హమ్’ జ్ఞానమును పొందగలడో, అట్టి హయగ్రీవ ఆచార్యులవారు మా హృదయములో సర్వదా ప్రకాశమానులై ఉండెదరు గాక।
1. ఓమ్।
నారదో బ్రహ్మాణమ్
ఉపసమేత్య ఉవాచ :
అధీహి భగవన్।
బ్రహ్మ విద్యాం వరిష్ఠాం,
యయా అచిరాత్ సర్వపాపం
వ్యపోహ్య, బ్రహ్మవిద్యాం
లబ్ధ్వా, ఐశ్వర్యవాన్ భవతి?
ఒకానొక సందర్భములో బ్రహ్మమానసపుత్రులగు నారదమహర్షి సత్యలోకములో ప్రవేశించినవారై పితృదేవులగు బ్రహ్మదేవునికి నమస్కరించి ఈవిధంగా అడుగసాగారు.

నారదుడు : హే భగవాన్! అధీహి। అధిపతీ! అధ్యయనము కొరకై ఆశ్రయిస్తున్నాను.
దేనిచే అచిరాత్ (త్వరగా) సర్వపాపదోషములు తొలగి బ్రహ్మతత్త్వము గురించి జ్ఞానైశ్వర్యులము కాగలమో అట్టి పరాకాష్ఠ అయినట్టి బ్రహ్మవిద్య’ను దయతో అనుహ్రించండి.
2. బ్రహ్మోవాచ : హయగ్రీవ దైవత్యాన్ మంత్రాన్ యో వేద,
స శ్రుతి స్మృతి
ఇతిహాస పురాణాని వేద।
స సర్వైశ్వర్యవాన్ భవతి।
బ్రహ్మభగవానుడు : బిడ్డా! నారదా! విను. చెపుతాను. ఎవరైతే ‘హయగ్రీవ దైవత్యములు’ అయినట్టి మనన-ధారణ రూపమంత్రములను ఎరుగుచున్నారో అట్టివారు -
  • శ్రుతి (శ్రవణముచే గ్రంథస్తమైనవి),
  • స్మృతి (సంఘటనా పూర్వకం, దృష్టాంత చారిత్రకంగా వేదార్థములు అనుభవ సంబంధము),
  • ఇతిహాసంగా [(ఐతిహాసిక) (పరంపరగా) చెప్పుకొనే పూర్వ కథలు, పూర్వ చరిత్రలు వివరించునది ఉదా: భారత, రామాయణములు],
  • పురాణ (జగత్ సృష్టి, మన్వంతరక్రమ సంబంధమైన కథలను తెలిపే గ్రంథములు - [ ఇవి వేదములకు వ్యాఖ్యానములవంటివి (పద్మపురాణము మొదలైనవి) ]

ఇవన్నీ ఎరిగినవాడౌతాడు.

సర్వ ఐశ్వర్యములు పొందినవాడగుచున్నాడు.
త ఏతే మంత్రాః
విశ్వ ఉత్తీర్ణ (విశ్వోత్తీర్ణ) స్వరూపాయ
చిన్మయానంద రూపిణే।
తుభ్యం నమో హయగ్రీవ విద్యా రాజాయ
విష్ణవే। స్వాహా। స్వాహా నమః।
హయగ్రీవదైవత్య (దివ్యతత్త్వ) మంత్రములు : ఈ విశ్వమంతటికీ ఆవలి (పర) స్వరూపులు, కేవల - ఎరుక రూపమగు- చిన్మయానంద స్వరూపులు, (గుఱ్ఱపు ముఖమును మనుష్య దేహమును ధరించినట్టివారు, వేదములు మధుకైటభుల నుండి వెనుకకు తెచ్చి తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చినవారు, విష్ణు అవతారులు, విద్యారాజు - అగు హయగ్రీవ విష్ణు భగవానునికి నమస్కారము! మాకు చెందిన సమస్తము స్వామికి ఆహుతులుగా సమర్పిస్తున్నాము. స్వాహా। స్వాహా।
(నమః।) ఋక్ యజుః సామ రూపాయ
వేదాహరణ కర్మణే
ప్రణవ ఉద్గీథ వపుషే మహాశ్వ శిరసే నమః।
స్వాహా। స్వాహా నమః।
‘‘ఋక్ యజుర్ సామ’’ త్రయీస్వరూపా! వేదములను పరిరక్షించుట యందు ఉద్యుక్తులైన స్వామీ! ప్రణవ శరీరా! భగవత్ స్తుతిరూపమగు ఉద్గీథపరమార్థ స్వరూపుడా! మహాశ్వమును (గుఱ్ఱమును) శిరస్సుగా ధరించిన హయగ్రీవ స్వామీ! సర్వ సమర్పణ పూర్వకంగా స్వాహా। స్వాహా। ఇదం సమర్పయామి। నమో నమః।
ఉద్గీథ। ప్రణవోద్గీథ।
సర్వ వాగీశ్వరేశ్వర।
సర్వ వేదమయ। అచింత్య।
సర్వం బోధయ బోధయ।
స్వాహా స్వాహా నమః।।
సామవేదగాన మాధుర్యస్వరూపా! ఉద్గీథా! ప్రణవ (ఓం) శబ్ద మహదార్థమా! సమస్త మంత్ర వేద - ఉపనిషత్ వాక్ స్వరూపమునకు ఈశ్వరుడా! సర్వ వేదములందు అంతర్లీనుడవై, అంతఃకరణుడవై ఉండువాడా! మనస్సుకు, చింతనకు ఆవలివాడా! అచింత్యా! సమస్తము ‘స్వాహా’గా సమర్పిస్తూ నమస్కరిస్తూ ఉన్నాము. ఆత్మను గురించిన సమస్తము మాకు బోధగా అనుగ్రహించండి.
స్వాహా! స్వాహా! నమః
బ్రహ్మా అత్రి రవి సవితృ భార్గవా - ఋషయః।
గాయత్రీ త్రిష్టుప్ అనుష్టుప్ - ఛందాగ్ంసి।
శ్రీమాన్ హయగ్రీవః, - పరమాత్మా దేవతేతి।
హ్లౌం (హ్సేం) - ఇతి బీజగ్ం।
సో౽హమ్ - ఇతి శక్తిః।
హ్లూం (హ్సుం) - ఇతి కీలకమ్।
భోగ మోక్షయోః వినియోగః।
ఈ హయగ్రీవ దివ్య మంత్రములకు -
ఋషులు → బ్రహ్మ, అత్రిమహర్షి, రవి, సవితృదేవుడు, భార్గవుడు।
ఛందస్సు → గాయత్రీ ఛందస్సు -త్రిష్టుష్, అనుష్టుప్।
దేవత → పరమాత్మ అగు శ్రీమన్ హయగ్రీవస్వామి।
హ్లౌం (హ్సౌం) → ఇతి బీజము।
సో౽హమ్ → ఇతి శక్తి।
(ఆయనయే నేను)
హ్లూం (హ్సూం) → ఇతి కీలకమ్।
మంత్రస్మరణ ఆశయములు → భోగ (ఇహమందు సుఖము), పరమందు మోక్షము. (భోగ, మోక్షములు).
‘అ’ కార ‘ఉ’కార ‘మ’కారైః
అంగన్యాసః / (కరన్యాసః)।
ధ్యానమ్ :

శ్లో।। శంఖ చక్ర మహాముద్రా
పుస్తకాఢ్యం చతుర్భుజమ్
సంపూర్ణ చంద్ర సంకాశమ్
హయగ్రీవమ్ ఉపాస్మహే।
‘అ’ కార ‘ఉ’ కార ‘మ’కార ములతో అంగన్యాసము, కరన్యాసములు (‘‘హ్లౌం-సో౽హమ్-హ్లూం-అ-ఉ-మ’’లతో కరన్యాసము - (అంగుష్ఠాభ్యాం నమః-ఇత్యాది). అంగన్యాసము-(హృదయాయ నమః - ఇత్యాది).
‘‘శంఖము’’, ‘‘చక్రము’’, ‘‘మహాముద్ర’’ (చిన్ముద్ర, తత్త్వమసిముద్ర) ‘పుస్తకము’ ఈ నాలిగిటిని నాలుగు చేతులతో ధరించినవారు, పూర్ణచంద్రునివలె ప్రశాంత-ఆనంద స్వభావులు అగు హయగ్రీవస్వామిని ఉపాసించుచున్నాము.
‘‘ఓం శ్రీమ్’’ - ఇతి ద్వే అక్షరే। (2)

‘‘హ్లౌం (హ్సౌం) - ఇతి ఏకాక్షరమ్। (1)

‘‘ఓం నమో భగవత’’ - ఇతి సప్తాక్షరాణి। (7)

‘‘హయగ్రీవాయ’’ - ఇతి పంచాక్షరాణి। (5)

‘‘విష్ణవ’’ - ఇతి త్రీణి అక్షరాణి। (3)

‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం’’ -ఇతి ‘షట్’-అక్షరాణి। (6)

‘‘ప్రయచ్ఛ స్వాహా’’ - ఇతి పంచాక్షరాణి। (5)

హయగ్రీవస్య తురీయో భవతి।।

ఓం శ్రీం హ్లౌం ఓం నమో భగవత హయగ్రీవాయ విష్ణవ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా।।
‘‘ఓం। శ్రీమ్’’। - ‘2’ అక్షరములు (2)

‘‘హ్లౌం (హ్సౌం)’’ । - ఏకాక్షరమ్। (1)

‘‘ఓం నమో భగవత’’। - ఇతి సప్తాక్షరాణి। (7)

‘‘హయగ్రీవాయ’’ - ఇతి పంచాక్షరాణి। (5)

‘‘విష్ణవ’’ త్రీణి అక్షరాణి (3)

‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం’’ - షట్ అక్షరాణి (6)

ప్రయచ్ఛ స్వాహేతి। ప్రసాదించుటకై పంచాక్షరీ (5)

స్వాహా। ఆహుతులుగా సమస్తము సమర్పిస్తున్నాము.

- పై హయగ్రీవస్య మంత్రోపాసనచే తురీయసిద్ధి ప్రాప్తించగలదు.

- ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తుల నావైన నేను’’ స్వరూపుడుగా, (తురీయుడుగా) సర్వజీవులలో వేంచేసియున్న హయగ్రీవస్వామికి నమస్కరిస్తున్నాము. సమస్తము సమర్పిస్తున్నాము.
3. ‘‘ఓమ్-శ్రీమ్’’ - ఇతి ద్వే అక్షరే । (2)

హ్లౌం (హ్సౌం) - ఇతి ఏకాక్షరం। (1)

ఐం ఐం ఐం - ఇతి త్రీణి అక్షరాణి। (3)

క్లీం క్లీం - ఇతి ద్వే అక్షరే । (2)

సౌః సౌః - ఇతి ద్వే అక్షరే। (2)

‘హ్రీం’ - ఇతి ఏకాక్షరమ్। (1)

‘‘ఓం నమో భగవత’’ - ఇతి సప్తాక్షరాణి। (7)

‘‘హయగ్రీవాయ’’ - ఇతి పంచాక్షరాణి। (5)

‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం’’ - ఇతి షడక్షరాణి। (6)

‘‘ప్రయచ్ఛ స్వాహా’’ - ఇతి పంచాక్షరాణి। (5)

- పంచమో మనుర్భవతి।

- హయగ్రీవా - ఏకాక్షరేణ బ్రహ్మవిద్యాం ప్రవక్ష్యామి।
‘‘ఓం - శ్రీం’’ - (2) ద్వే అక్షరము।

‘‘హ్లౌం (హ్సౌం)’’ - ఇతి ఏకాక్షరము। (1)

‘‘ఐం ఐం ఐం’’ - ఇతి త్రీణి అక్షరాణి। (2)

‘‘క్లీం క్లీం’’ - ఇతి ద్వే అక్షరే। (2)

‘‘సౌః సౌః’’ - ఇతి ద్వే అక్షరే। (2)

‘‘హ్రీం’’ - ఇతి ఏకాక్షరము। (1)

‘‘ఓం నమో భగవత’’ - ఇతి సప్తాక్షరాణి। (7)

‘‘హయగ్రీవాయ’’ - ఇతి పంచాక్షరాణి। (5)

‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం’’ - షడక్షరాణి। (6)

‘‘ప్రయచ్ఛ స్వాహా’’ - పంచాక్షరాణి। (5)

ఓంకార పంచమస్థానమగు ‘తురీయాతీతము’ సిద్ధించగలదు.

హయగ్రీవ ఏకాక్షరము (ఏకము-అక్షరము) గురించిన బ్రహ్మ విద్య చెప్పుకుంటున్నాము.
ఓం శ్రీం హ్లౌం ఐం ఐం ఐం క్లీం క్లీం
సౌః సౌః హ్రీం ఓం నమో భగవత
హయగ్రీవాయ।
మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా।।
బ్రహ్మా మహేశ్వరాయ।
మహేశ్వరః సంకర్షణాయ।
సంకర్షణో నారదాయ।
నారదో వ్యాసాయ।
వ్యాసో లోకేభ్యః।
ప్రాయచ్ఛత్ ఇతి।
ఈ విద్యను
బ్రహ్మ భగవానుడు - మహేశ్వరునికి, (శివునికి)
మహేశ్వరుడు - సంకర్షణునికి,
సంకర్షణుడు - బ్రహ్మమానసపుత్రుడగు నారదునికి,
నారదుడు - వ్యాసునికి,
వ్యాసుడు - సమస్తలోకములకు
వివరించ చెప్పటము జరిగింది.
‘హ’ కార ఓం। ల(స) కార ‘ఓం’।
‘ఉ’ కార ఓం।
త్రయమ్ ఏకస్వరూపం భవతి।
(హ కార ఓం। ల(స) కార ఓం। ఉ కార ఓం।)
ఇతి మంత్రః।
బ్రహ్మతత్త్వవిచారణచే - సో౽హం ।
‘హ’ = కారము (జీవాత్మ)।
‘ల’ (స) = కారము (సాక్షీస్వరూపాత్మ / కేవలాత్మ)।
ఉ = జగత్తు (అనుభవముగా పొందబడుచున్న సమస్తము)।
ఈ మూడు కూడా ఏకస్వరూపముగా ‘ఓం’లో ఏకమగుచున్నాయి.
‘హ్లౌం’ (హ్సౌం) - బీజాక్షరం భవతి।
బీజాక్షరేణ హ్లౌం (హ్సౌం) రూపేణ,
తత్ జాపకానాం సంపత్ - సారస్వతౌ భవతః।
‘‘హ్లౌం (హ్సౌం)’’ అనేది బీజాక్షరము.
అట్టి ‘‘హ్లౌం (హ్సౌం)’’ - బీజాక్షరము జపించువానికి ధనసంపద, సారస్వత వాఙ్మయ సంపద తనకు తానై లభించగలవు.
తత్ స్వరూపజ్ఞానాం
వైదేహీ ముక్తిశ్చ భవతి।
పరమాత్మ యొక్క ‘తత్’ స్వరూపజ్ఞానముచే (లేక) ఆత్మ యొక్క స్వరూప జ్ఞానముచే (స్వాభావికతచే) ‘విదేహముక్తి’ సిద్ధించగలదు.
దిక్పాలానాం రాజ్ఞాం నాగానాం
కిన్నరాణామ్ ‘అధిపతిః’ - భవతి।
ఆత్మతత్త్వజ్ఞుడు - దిక్పాలకులకు, రాజులకు, నాగులకు, కిన్నెరులకు కూడా అధిపతి (అధికుడు) అగుచున్నారు.
హయగ్రీవా - ఏకాక్షర
జపశీలాజ్ఞయా సూర్యాదయః స్వతః
స్వ స్వ కర్మణి ప్రవర్తంతే।।
ద్రష్ట - దర్శన - దృశ్యత్రయీ ఏక స్వరూపార్థమగు ‘‘హయగ్రీవ ఏకాక్షర’’ జపశీలుని (అఖండాత్మపురుషుని) ‘‘ఆజ్ఞ’’ చేతనే సూర్యుడు మొదలైన వారంతా వారివారి (స్వ స్వ) కర్మ విధులతో ప్రవర్తించుచున్నారు.
4. సర్వేషాం బీజానాం
‘‘హయగ్రీవ ఏకాక్షరబీజం’’
అనుత్తమం, మంత్రరాజాత్మకం భవతి।
హ్లౌం (హ్సౌం) - హయగ్రీవ స్వరూపోభవతి।
అన్ని బీజాక్షరములలోను ‘‘హయగ్రీవ ఏకాక్షరబీజము’’ - ఉత్తమోత్తమము, మంత్రరాజాత్మకము - అని కూడా చెప్పబడుతోంది.
‘‘హ్లౌం (హ్సౌం)’’ - అను ఏకబీజాక్షరము ‘‘హయగ్రీవ స్వరూపము’’- అగుచున్నది.
‘‘అమృతం కురు కురు స్వాహా’’।
తజ్జా(జ్ఞా)పకానాం వాక్‌సిద్ధిః, శ్రీసిద్ధిః
అష్టాంగయోగ సిద్ధిశ్చ భవతి।।
‘‘అమృతం కురు స్వాహా’’ - అను జపముచే ‘వాక్‌సిద్ధి’ ప్రాప్తిస్తూ, శ్రీ సిద్ధి (సమస్త సంపదలు) ప్రసాదించబడుతోంది.
(యమము, నియమము, ఆసనము, ప్రాణనిరోధము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి - అనబడే) - అష్టాంగ యోగ సిద్ధి - ప్రసన్నమౌతోంది.
హ్లౌం (హ్సౌగ్) సకల సామ్రాజ్య సిద్ధిం
కురు కురు స్వాహా।
హ్లౌం (హ్సౌగ్) - ఏకాక్షరము సకల సామ్రాజ్య సిద్ధి ప్రసాదించగలదు - ఇతి స్వాహా। (ఈ బీజాక్షరము పలుకుచు ఆహూతులు సమర్పించబడు గాక)।
తాన్ ఏతాన్ మంత్రాన్ యో వేద
అపవిత్రః పవిత్రో భవతి।
అబ్రహ్మచారీ సుబ్రహ్మచారీ భవతి।
ఈ హయగ్రీవ ‘ఏకాక్షర మంత్రమును ఎరిగినవాడు - అపవిత్రతను తొలగించుకొని పవిత్రుడు కాగలడు.
బ్రహ్మమును అధ్యయనము చేయని అబ్రహ్మచారి కూడా - బ్రహ్మమును చక్కగా తెలుసుకొని ‘‘సుబ్రహ్మచారి’’ కాగలడు.
అగమ్యాగమనాత్ పూతో భవతి।
పతిత సంభాషణాత్ పూతో భవతి।
బ్రహ్మహత్యాది పాతకైః ముక్తో భవతి।
హయగ్రీవ మంత్రమును జపించువాడు వెళ్లకూడనిచోటుకు వెళ్లిన దోషములనుండి పవిత్రుడు కాగలడు.
పతిత సంభాషణాదోషములనుండి పూతుడు (పునీతుడు) కాగలడు.
‘బ్రహ్మహత్య’ మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా ముక్తుడు కాగలడు.
గృహం గృహపతిరివ - దేహీ దేహాంతే
పరమాత్మానం ప్రవిశతి।
హయగ్రీవ దివ్య మంత్రములు ఎరిగి జపించువాడు - పరమాత్మ తత్త్వము సంతరించుకోగలడు.
గృహయజమాని సాయంకాలము ఇల్లు చేరువిధంగా, ఆ దేహి - దేహభావమును అధిగమించి ‘పరమాత్మ’ యందు ప్రవేశించగలడు.
‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’, ‘‘తత్త్వమసి’’,
‘‘అయమాత్మా బ్రహ్మ’’
‘‘అహం బ్రహ్మాస్మి’’ - ఇతి మహావాక్యైః
ప్రతిపాదితమ్ అర్థం
త ఏతే మంత్రాః ప్రతిపాదయంతి।
స్వరవ్యంజన భేదేన ద్విధాయతే।
అథ అనుమంత్రాన్ జపతి।
ఈ హయగ్రీవ దైవత్వ మంత్రములు, ఏకాక్షరీ మంత్రము - ఇవన్నీ ‘వేద మహావాక్యములు’ ప్రతిపాదిస్తున్న అర్థమునే ప్రతిపాదిస్తున్నాయి. (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) తత్త్వమసి (3) అయమాత్మా బ్రహ్మ (4) అహం బ్రహ్మాస్మి - మహావాక్యార్థమును అందిస్తున్నాయి.
స్వరము - వ్యంజనము (శబ్ద వృత్తి / అర్థము) ఏకమగుచున్నాయి కదా! అట్లాగే, ఏకమగు బ్రహ్మము - జీవాత్మ-పరమాత్మలుగా భేదము కనిపిస్తూ ఉన్నప్పటికీ - సర్వదా ఏకమే. ఎందుకంటే సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి.
యత్ వాక్ వదంత్య విచేతనాని (వదంతి అవిచేతనాని)
రాష్ట్రీ దేవానాం నిషసాద మంద్రా,
చతస్ర ఊర్జం దుదుహే వయాంసి
క్వస్విత్ అస్యాః పరమం జగామ?
- ఎక్కడ వాక్కు మాట్లాడక మౌనం వహిస్తోందో, తన చేతనము విడచి ఉంటోందో,
- దేవతలచే మంద్రమైన నిషాదముగా (రాగమాలికగా) ఏది స్తుతించబడుతుందో,
- పైన చెప్పబడిన చాతుర్మహావాక్యముల పరమార్థమై యున్నదో,
అట్టి పరాత్పరమగు ఆత్మను ఎవరు దాటగలరు?
గౌరీమ్ ఇమాయ సలిలాని
తక్షతి ఏకపదీ,
ద్విపదీ, సా చతుష్పదీ
అష్టా పదీ,నవ పదీ
బభూపుషీ సహాస్రాక్షరా
పరమే వ్యోమన్।
- అట్టి ఆత్మయొక్క విభవమే - భూమిపై జలతత్త్వముగాను,
- ఏకపదము (అనేకముగా కనిపిస్తూ కూడా ఏకమే అయిఉండటము) గాను,
- ద్విపదీ (పర-ఇహ స్వరూపము) గాను,
- చతుష్పదీ (మనో బుద్ధి చిత్త అహంకారములు) గాను,
- అష్టపదీ (పంచభూతములు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ) గాను,
- నవపదీ (జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ, సర్వాత్మ) గాను,
సహస్ర అక్షరముగాను, పరమాకాశముగాను వెలుగొందుచున్నది.
ఓష్ఠాపిధానా నకులీ దంత్యైః
పరివృతా పవిః
సర్వస్యై వాచ ఈశానా
చారు మామ్ ఇహ వాదయేత్
ఇతి చ వాగ్రసః।
ఓష్ఠము (పెదవులు) దంతములతో పరివృతమైన సమస్త వాక్కులు ఈశ్వరతత్త్వమై, ఈశ్వర విభవములు అగుచున్నాయి.
సమస్త శబ్దములు, నాదములు, శబ్దార్థ భావనలు ఈశ్వరుని జగద్రచనా విశేషములే।
5. ‘‘సశర్వరీః అమృతం బాధ మానా
బృహన్ ఇమాయ జమదగ్ని దత్తా
అసూర్యస్య దుహితా తతాన
శ్రవో దేవేషు అమృతమ్ అజుర్యా।’’
సమస్త చీకట్లను తొలగించి అమృతమయము చేయునది, జమదగ్ని మహర్షిచే చెప్పబడి బృహత్తరమైనది, సూర్యలోకమునకు ఆవలిది అగు ‘హయగ్రీవ అమృత తత్త్వము’ను ఉపాసిస్తున్నాము.
య ఇమాం బ్రహ్మవిద్యాం ఏకాదశ్యాం
పఠేత్, హయగ్రీవ ప్రభావేణ
మహాపురుషో భవతి।
ఎవ్వడైతే ఈ హయగ్రీవోపనిషత్‌లో చెప్పబడిన బ్రహ్మవిద్యను 11 సార్లు పఠిస్తాడో, అట్టివాడు శ్రీ హయగ్రీవ భగవానుని ప్రభావము (అనుగ్రహం) చేత ‘మహాపురుషుడు’ కాగలడు.
స జీవన్ముక్తో భవతి।
ఓం నమో బ్రహ్మణే
ధారణం మే అస్తు
అనిరాకరణం
అతడు ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు.
‘ఓం’కార - అక్షర సంజ్ఞార్థము అయినట్టి ‘బ్రహ్మము’ నకు (పరబ్రహ్మ పురుషునకు) నమస్కారము. అట్టి ఏకము, అక్షరము అగు బ్రహ్మముయొక్క ధారణ - మా బుద్ధికి సిద్ధించును గాక.
(అనిరాకరణం మే అస్తు।)
మే అస్తు అనిరాకరణమ్।
అట్టి బ్రహ్మము పట్ల మా బుద్ధికి ‘నిరాకరణము’ (Refusal) తొలగును గాక। మా మనస్సుకు, బుద్ధికి బ్రహ్మజ్ఞానమునపట్ల ‘‘అహమ్ బ్రహ్మాస్మి భావన’ పట్ల అనిరాకరణము (Acceptance. Non refusal) సర్వదా సిద్ధించును గాక।
ధారయితా భూయాసం
కర్ణయోః శ్రుతం మా చ ఊఢ్వం,
‘‘మమ అముష్య’’ -
‘‘ఓం’’ - ఇతి ఉపనిషత్।।
ఈ చెవులతో ఏ బ్రహ్మము బ్రహ్మతత్త్వము గురించి వింటున్నామో, - అది మేము మరల మరల బుద్ధితో కూడా ధారణ చేయుచుండెదము గాక। మాయందు ఆత్మజ్ఞానము సునిశ్చితము అగు గాక।
మాయొక్క బ్రహ్మతత్త్వధారణచే ఐహిక ఆముష్మిక ఫలములు (ఇహ-పరములు) పొందుచుండెదము గాక।
ఇహమందు సానుకూల్యమును, పరమందు మోక్షమును సిద్ధించుకొనెదము గాక।
హయగ్రీవోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
ఇతి హయగ్రీవోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

అథర్వణ వేదాంతర్గత

22     హయగ్రీవోపనిషత్

అధ్యయన పుష్పమ్

శ్లో।। స్వ (అ)జ్ఞోపి యత్ ప్రసాదేన జ్ఞానం తత్ ఫలం ఆప్నుయాత్
సో౽యం హయాస్యో భగవాన్ హృది మే భాతు సర్వదా।।

స్వయముగా అజ్ఞులము, ఆత్మజ్ఞాన విహీనులము అయి ఉండి కూడా, ఎవరి అనుగ్రహంచేత (సమస్తమునకు పరము - ఆవలిది, నిత్యము, అమృత - ఆనందమయము, కేవలము, సర్వదా యధా తథము అగు) ‘తత్’ స్వరూప ‘ఆత్మజ్ఞానము’ పొందగలుగుతామో - అట్టి హయ (గుఱ్ఱపు) ముఖుడగు శ్రీ హయగ్రీవ భగవానుడు మా హృదయములో సర్వదా వెలుగొందుచుండునుగాక। భాసించుచుండును గాక।

శ్లో।। జ్ఞానానందమయం దేవం, నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వవిద్యానాం, హయగ్రీవం ఉపాస్మహే।।

‘‘ఆత్మజ్ఞానము’’ అనే ఆనందముతో సర్వదా ప్రదర్శనమగువారు, సర్వదేవతా స్వరూపులు, నిర్మలహృదయులు, స్ఫటికమువలె తేజోపుంజములు వెదజల్లువారు (స్ఫటికాకృతులు), సమస్త విద్యలకు ఆధారము అయినట్టి వారు - అగు శ్రీ హయగ్రీవ భగవంతుని ఉపాసిస్తూ, ఆయనకు నమస్కరిస్తున్నాము.


దేవీ భాగవతము
శ్రీ హయగ్రీవుడు విష్ణుమూర్తి స్వామి అవతారము.

ఒకప్పుడు దేవతల రక్షణ కొరకై విష్ణు భగవానుడు దానవులతో సుదీర్ఘకాలంగా యుద్ధము చేయవలసి వచ్చింది. యుద్ధము చేసి చేసియున్న విష్ణుమూర్తి కించిత్ అలసిపోయి, ఎక్కుపెట్టిన ధనస్సుపై తలబెట్టుకొని నిదురించసాగారు.

ఇంతలో దేవతలు యజ్ఞము చేసి, యజ్ఞభాగమును విష్ణుమూర్తికి సమర్పించటానికై వచ్చారు. ఆయన ఎక్కు బెట్టిన బాణపు త్రాడుపై తల ఆనించి నిదురిస్తూ ఉండటము గమనించారు. కానీ, ‘‘నిదురిస్తూ ఉన్నవానిని నిదుర లేపకూడదు’’ - అను సూత్రమును అనుసరించి దేవతలుగాని, బ్రహ్మదేవుడుగాని విష్ణుమూర్తిని నిదురలేపటానికి జంకారు (hesitated).

అప్పుడు శివదేవులవారు దేవతలతో ‘‘ఓ దేవతలారా! ఈ విష్ణు భగవానుని నిదుర లేపటానికి ఒక ఉపాయము ఉన్నది. ధనస్సు యొక్క నారి (వింటిత్రాడు) ని త్రెంపితే, ఆ త్రాడు యొక్క కదలిక వలన విష్ణు దేవుని శిరస్సు కూడా కదలిక పొంది, అప్పుడు వారు తప్పక నిదురలేస్తారు’’ - అని ఉపాయంగా చెప్పారు.

అప్పుడు బ్రహ్మ దేవుడు వమ్రిని (చెదపురుగు, చెట్టుపై ఉండె ఒక నల్లని కీటకమును) ‘‘బిడ్డా! నీవు వెళ్లి, ఆ వింటి త్రాడును త్రెంచు’’ - అని అడిగారు.

ఆ వమ్రి ‘‘నిద్రపోవువానిని లేపటము పాపము కదా, పితామహా!’’ అని అడిగింది. అందుకుగాను బ్రహ్మదేవుడు ‘‘నీకు కావలసిన ఆహారము ప్రతిరోజు నేనే అందజేస్తాను’’ - అను ఒడంబడిక (Agreement)కు అంగీకరించారు.

ఆ తరువాత ఆ కీటకము (వమ్రి) నారిని కొరికింది. ఎక్కుపెట్టబడి ఉన్న ధనస్సు యొక్క నారి కొరకగానే ధనస్సు త్రుళ్ళినదై విష్ణుమూర్తి మెడకు బాణము తగిలి, ఆ మెడ తెగి శిరస్సు ఊడిపడింది. (ఇది లక్ష్మీదేవి యొక్క శాపపర్యవసానము. ఒకప్పుడు విష్ణుమూర్తి తనను చూచి అకారణంగా నవ్వినందుకు ‘తల తెగుగాక!’’ - అని శపించటం జరిగింది. - దేవీ భాగవతము). అది చూచి దిగులుపడుచున్న ఇంద్రుడు మొదలైన దేవతలను ఓదార్చి -

‘‘ఓ దేవతలారా! వేదమంత్రములతో దేవిని స్తుతించండి’’ అని పలికారు. దేవతల ప్రార్థనలకు లలితాదేవి ప్రసన్న అయి ‘‘కారణముంటేనే కార్యము జరుగుతుంది. మీరు గుఱ్ఱము శిరస్సును అంటించండి’’ - అని పలికి అంతర్థానమైనారు.

అప్పుడు విశ్వకర్మ గుఱ్ఱము శిరస్సును విష్ణు దేవుని మొండెమునకు వేదమంత్రపూర్వకంగాను, సంప్రోక్షణ మొదలైన ఆయా మంత్ర-తంత్ర విశేషములతోను అతికించారు.

అప్పుడు విష్ణుదేవుడు హయగ్రీవుడై దానవులను సంహరించారు.

ఈ హయగ్రీవస్వామియే ఒకప్పుడు పాతాళ లోకం ప్రవేశించి, వేదములు దొంగిలించిన మధు కైటభులను జయించి సృష్టి కొనసాగించటానికై తిరిగి సృష్టికర్త అగు బ్రహ్మదేవునికి ఆ వేదములను అందించారు. హయగ్రీవులే కల్కి అవతారమని పౌరాణిక వర్ణనము.

(దేవీపురాణము)


ఇక మనము హయగ్రీవోపనిషత్ విశేషముల ‘అధ్యయనము’లో ప్రవేశిస్తున్నాము.

ఒకానొక సందర్భములో బ్రహ్మమానస పుత్రులు, దేవర్షి - అగు నారదమహర్షి సత్యలోకము ప్రవేశించారు. తమ పితృదేవులగు సృష్టికర్త బ్రహ్మదేవుని దర్శించి, సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు.

నారదమహర్షి : తండ్రీ! భగవాన్। అధీహి। శరణు। మీ అధిపత్యము (ఆర్యత్వము)నకు నమస్కరిస్తున్నాను. స్వామీ! అన్నిటికంటే వరిష్ఠమైనది (The Highest) ఏది?

బ్రహ్మదేవుడు : కుమారా! ‘బ్రహ్మవిద్య’యే అన్నిటికంటే వరిష్ఠమైనది.

నారదమహర్షి : అట్టి బ్రహ్మవిద్య స్వానుకూలమయ్యేది, స్వానుభవమయ్యేది ఎట్లా?

బ్రహ్మదేవుడు : బుద్ధి యొక్క దోషములు తొలగుతూ ఉండగా, అట్టి నిర్మలబుద్ధికి బ్రహ్మ విద్య తప్పక ప్రకాశించగలదు.

నారదమహర్షి : యయా అచిరాత్ సర్వపాపం వ్యపోహ్య, బ్రహ్మ విద్యాం లబ్ధ్వా ఐశ్వర్యవాన్ భవతి? తండ్రీ। ఏమార్గంలో అతి త్వరగా మా బుద్ధి దోషములు తొలగి, బ్రహ్మ విద్య లభించగా, ‘‘ఆత్మతత్త్వభావనా ఐశ్వర్యము’’ లభించగలదు? - అట్టి బోధను దయతో అనుగ్రహించండి.

బ్రహ్మభగవానుడు : బిడ్డా। నారదా! బుద్ధి దృశ్యము నుండి ఉపసంహారము పొంది, ఆత్మయందు సునిశ్చలము కావటానికై ‘‘అధ్యాత్మ వాఙ్మయము’లో విశేషముగా ‘‘హయగ్రీవ దైవత్య మంత్రములు’’ చెప్పబడుచున్నాయి.

ఎవడైతే అట్టి హయగ్రీవ దైవత్యములైన (దివ్యములైన) మంత్రముల అర్థ - అంతరార్థములను చక్కగా తెలుసుకుంటూ, పారాయణము చేస్తాడో, - అట్టివాడు వేద, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణముల అంతర - సారము ఎరిగినవాడు అగుచున్నాడు.

హయగ్రీవ దైవత్య మంత్రోపాసనలు ఎరిగినవాడు జ్ఞానైశ్వర్యుడు, సర్వైశ్వర్యుడు కాగలడు. పై విభాగములలోని సార విశేషములు ఎరుగగలడు.

త ఏతే మంత్రః। హయగ్రీవ దైవత్యాన్ మంత్రములు।

[1.] శ్లో।। విశ్వ ఉత్తీర్ణ స్వరూపాయ
చిన్మయా నంద రూపిణే।
తుభ్యం నమో హయగ్రీవ
విద్యా రాజాయ విష్ణవే-
స్వాహా। స్వాహా। నమః।।

• విశ్వమును దాటివేసినట్టి విశ్వేశ్వర - విశ్వాతీత స్వరూపుడు, విశ్వసాక్షీ ।

• చిత్ (కేవలమగు ఎరుక) మయ ఆనందరూపుడు, తెలుసుకోవటమును తన ఆనందరూపముగా కలవారు (One to whomknowingby itself is an enjoyment) అగు స్వామీ!

• అట్టి హయగ్రీవభగవన్! సమస్త విద్యలకు రాజు వంటి వాడా! సమస్తమునందు ‘సత్’ స్వరూపులై వేంచేసియున్న విభూ! విష్ణుప్రభూ! మీకు నమస్కారము। సమస్తము మీకు సమర్పిస్తున్నాము. స్వాహా! స్వాహా! నమః।।

[2.] శ్లో।। ఋక్ యజుః సామ రూపాయ।
వేదాహరణ కర్మణే।
ప్రణవ ఉద్గీథ వపుషే
మహా అశ్వశిరసే నమః।
స్వాహా। స్వాహా। నమః।।

ఋక్ యజుర్ సామ - త్రివేదస్వరూపా। వేదములను ఉద్ధరించి (రక్షించి) తిరిగి అజునకు (బ్రహ్మదేవునికి) అందజేయు కార్యశీలుడా! ప్రణవ - ఉద్గీథ (ఆత్మ తత్త్వగాన) స్వరూపుడా! మహా అశ్వ (గుఱ్ఱపు) శిరస్సు కలవాడా।

సమస్తము సమర్పించుచూ నమస్కరిస్తున్నాము. స్వాహా! స్వాహా। నమః।

[3.] శ్లో।। ఉద్గీథ ప్రణవోద్గీథ
సర్వ వాగీశ్వరేశ్వర।
సర్వవేదమయ। అచింత్య
సర్వం బోధయ। బోధయ।
స్వాహా। స్వాహా। నమః।।

ఓ ఉద్గీథ (జగత్ గాన) ఆనందకారకా! ప్రణవగాన స్వరూపా! సమస్త వాక్కులందు విస్తరించి ఉన్నవాడా! సర్వ శబ్దములకు ఈశ్వరా! సర్వ వేదములలో వేంచేసి ఉన్నవాడా! ఆలోచనకు అందనివాడా! స్వామీ! ఆత్మజ్ఞానము గురించినదంతా మాకు బోధించండి. తెలియజేయండి. ఈ మా సమస్తము స్వీకరించండి! స్వాహా। స్వాహా। నమో నమః।

ఈ మంత్రములకు :

ఋషులు - బ్రహ్మదేవుడు, అత్రిమహర్షి, రవి, సవితృ, భార్గవులు’’।

ఛందస్సు - ‘‘గాయత్రీ’’ - త్రిష్టుప్పు, అనుష్టుప్పు।

దేవత - శ్రీమాన్ హయగ్రీవ పరమాత్మ।

‘‘హ్లౌం (హ్సౌం)’’ ఇతి బీజగ్ం

‘‘సో౽హమ్’’ ఇతి శక్తిః

‘హ్లూం (హ్సూం)’’ ఇతి కీలకం

= భోగ మోక్షయో వినియోగః।
= ‘అ’ కార - ‘ఉ’ కార - ‘మ’ కారై - అంగన్యాసః। కరన్యాసః।

(1) ‘అకార
(2) ఉకార
(3) మకార
(4) హ్లీం
(5) సో౽హమ్
(6) హ్లూం

కరన్యాసము
అకార - అంగుష్ఠాభ్యాం నమః
ఉకార - తర్జనీభ్యాం నమః
మకార - మధ్యమాభ్యాం నమః
హ్లీం - అనామికాభ్యాం నమః
సోహం - కనిష్ఠికాభ్యాం నమః
హ్లూం - కర తల పృష్ఠాభ్యాం

అంగన్యాసము
అకార - హృదయాయ నమః
ఉకార - శిరసే స్వాహా
మకార - శిఖయాయ వౌషట్
హ్లీం - కవచాయ హుం
సోహం - నేత్రత్రయాయ వౌషట్
హ్లూం - అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః

ధ్యానము

శంఖచక్ర మహాముద్రా।
పుస్తకాఢ్యం చతుర్భుజమ్। సంపూర్ణ చంద్ర సంకాశం
హయగ్రీవమ్ ఉపాస్మహే।।

(1) శంఖము (2) చక్రము (3) ‘తత్త్వమసి’ అనే అర్థమును సూచించే చిన్ముద్ర అగు మహాముద్ర (4) పుస్తకాధారణ లతో సారూప్యులు, (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములనబడే) - నాలుగు భుజములు కలిగి ఉన్నవారు, పూర్ణచంద్రుని వలె ప్రశాంత ఆనందహృదయులు- అగు హయగ్రీవుల వారిని ఉపాసించుచున్నాము.

హయగ్రీవ దైవత్య మంత్రము - 1

[1.] ‘‘ఓం శ్రీం’’ - ఇతి ద్వే అక్షరే। (2)
‘‘హ్లౌం (హ్సౌం)’’ - ఇతి ఏకాక్షరం (1)

‘‘ఓం శ్రీం హ్లౌం (హ్సౌం)’’। (3)

[2.] ‘‘ఓం నమో భగవత’’ - ఇవి సప్తాక్షరాణి। (7) ‘‘హయగ్రీవాయ’’ - ఇతి పంచాక్షరాణి (5)
‘‘విష్ణవ’’ - ఇతి త్రీణి అక్షరాణి (3)

‘‘ఓం నమో భగవత హయగ్రీవాయ విష్ణవ’’ (15)

[3.] ‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం।’’ - ఇతి షడక్షరాణి (6) ‘‘ప్రయచ్ఛ స్వాహా ।’’ - ఇతి పంచాక్షరాణి (5)

‘‘మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా।’’ (11)

హయగ్రీవ దైవత్య మంత్రము - 1
ఓం శ్రీం     హ్లౌం (హ్సౌం)   ఓం నమో భగవత  
     (2)    (1)      (7)  
హయగ్రీవాయ విష్ణవ । మహ్యం మేధాం ప్రజ్ఞాం  
     (5)    (3)     (6)  
ప్రయఛ   స్వాహా ।। 
     (5)            (29 అక్షరములు)

ఈ మంత్రోపాసన హయగ్రీవ తురీయస్థానము (జాగ్రత్ స్వప్న సుషుప్తులు, తన యొక్క సంచార స్థలములై, ఆ మూడిటికి వేరై, సర్వమును ప్రేరేపిస్తున్న - నాలుగవదగు ‘‘స్వస్వరూప స్థానము’’) ను - ప్రసాదించగలదు. [రోజు 21 (లేక) 36 (లేక) 54 చొప్పున ‘3’ సార్లు (ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము) ఉపాసించటం (మంత్రోపాసకులచే) సూచించబడుతోంది].


హయగ్రీవ దైవత్య మంత్రము - 2

‘ఓం శ్రీం’ - ఇతి ద్వే అక్షరే। (2 అక్షరములు)
‘‘హ్లౌం।। (హ్సౌం)।। - ఇతి ఏకాక్షరం। (1)
‘‘ఐం ఐం ఐం’’v - ఇతి త్రీణి అక్షరాణి। (3)
‘‘క్లీం క్లీం’’ - ఇతి ద్వే అక్షరాణి। (2)
‘‘సౌః సౌః’’ - ఇతి ద్వే అక్షరాణి। (2)
‘‘హ్రీం’’ - ఇతి ఏకాక్షరమ్। (1)
‘‘ఓం నమో భగవత’’ - ఇతి సప్తాక్షరాణి। (7)
హయగ్రీవాయ - ఇతి పంచాక్షరీ (5)
మహ్యం మేధాం ప్రజ్ఞాం - ఇతి షడక్షరాణి। (6)
ప్రయచ్ఛ స్వాహా।। - ఇతి పంచాక్షరాణి। (5)

[= 34 అక్షరములు]

ఓం శ్రీం   హ్లౌం (హ్సౌం)   ఐం ఐం ఐం    క్లీం క్లీం  
   2        1       3         2  
సౌః సౌః     హ్రీం ఓం నమో భగవత  
  (2)       (1)        (7)  
హయగ్రీవాయ।   మహ్యం మేధాం ప్రజ్ఞాం  
  (5)       (6)  
ప్రయచ్ఛ స్వాహా।  
  (5)                   (34 అక్షరములు)

పంచమ ‘ఓం’ భవతి।

[ ఓం = (1) అ (2) ఉ (3) మ (4) ‘‘మ్‌….’’ అర్ధమాత్ర (తురీయము) (5) లయము = తురీయాతీతము ].

పై 34 అక్షరముల హయగ్రీవ దైవత్య మంత్రముయొక్క ఉపాసనచే కేవలసాక్షీరూపమగు ‘‘తురీయాతీతము’’ సిద్ధించగలదు.

హయగ్రీవ ఏకాక్షరముతో బ్రహ్మవిద్య

బ్రహ్మదేవుడు: ఓ నారదా! ఇంకా కూడా విను. జీవులు హయగ్రీవ ఏకాక్షరమును వినియోగించి ‘‘బ్రహ్మవిద్య’’ను సిద్ధించుకోగలిగిన విధానము గురించి చెప్పుకుంటున్నాము.

ఈ విద్యను ఆయా సందర్భములలో :
బ్రహ్మ - మహేశ్వరునికి,
మహేశ్వరుడు - సంకర్షణునికి,
సంకర్షణుడు - దేవర్షి అగు నారదునికి,
నారదుడు - వ్యాసునికి,

వ్యాసమహర్షి లోక కళ్యాణము కాంక్షించినవారై అనేకమంది శిష్యులకు, తనను ఆశ్రయించవచ్చిన అనేకమంది జనులకు బోధించటము జరుగుతూ వస్తోంది.

‘హ’ కార ఓం। ‘ల’ (స)’ కార ఓం। ‘ఉ’ కార ఓం।।

‘‘త్రయం ఏక స్వరూపం భవతి’’ - ద్రష్ట, దర్శనము, దృశ్యము - ఈ మూడిటికి ఏకత్వము సిద్ధిస్తోంది. (అనగా - ద్రష్టయే దర్శన శక్తిచే దృశ్యరూపమును దాల్చి - స్వయం కల్పిత దృశ్యమును స్వయముగా ఆస్వాదిస్తున్నాడు - అనునది స్పష్టమౌతోంది.

‘‘హ్లౌం’’ (హ్సౌం) = హయగ్రీవ -ఏకాక్షర జపము

హ్లౌ (హ్లౌం) బీజాక్షరము. అట్టి హ్లౌం (హ్సౌం) బీజాక్షరముతో కూర్చి మంత్రోపాసను నిర్వర్తించువానికి లౌకిక (లోకసంబంధమైన) సంపద, సారస్వత సంపద - రెండూ లభించగలవు. ‘తత్’ అనబడే ‘‘స్వస్వరూపాత్మయొక్క జ్ఞానము’’ సిద్ధించగలదు. స్వస్వరూపము గురించి ఎరుగుటచే ‘‘విదేహముక్తి’’ లభించగలదు.

అట్టి ‘‘హ్లౌం’’ (హ్సౌం) ఏకాక్షర / బీజాక్షరోపాసనచే ‘‘సమస్తము నేనైన నేను’’ అను స్వాభావికానుభవము అయినట్టి ‘‘విదేహముక్తి’’ సిద్ధించగలదు. అట్టివాడు దిక్పాలకులపై, రాజులపై, నాగులపై, కిన్నరులపై ఆధిపత్యము పొందగలడు.

అట్టి హయగ్రీవ ఏకాక్షర జపశీలుడు ‘‘హ్లౌం’’ (హ్సౌం) (ఏకాక్షర, బీజ జపము చేయువాడు) - ప్రకృతికి వశుడు కాడు. ప్రకృతిని తానే స్వాధీనపరచుకోగలడు. ఆత్మతత్త్వజ్ఞుడగు అట్టి ఏకాక్షరశీలుని ఆజ్ఞ చేతనే స్వయంప్రకాశ శీలుడగు సూర్యుడు మొదలైన వారంతా వారి వారి కర్మలు నిర్వర్తిస్తున్నారు. పంచభూతములు, దేవతలు మొదలైన వారంతా కూడా హయగ్రీవ ఏకాక్షర ఉపాసనా సిద్ధుని సంకల్పానుసారం తమ తమ ధర్మములలో ప్రవర్తిస్తున్నారు.

సమస్త బీజాక్షరములలోకెల్లా ‘హయగ్రీవ - ఏకాక్షరబీజము’ - ఉత్తమోత్తమమైనది. ‘‘హ్లౌం (హ్సౌం)’’ బీజాక్షర సహిత ధ్యానముచేత ఆ ఉపాసకుడు హయగ్రీవస్వరూపమగు ‘కేవలము, సమస్తము’ అగు పరమాత్మానంద స్వరూపము పొందుచున్నాడు.

‘‘హ్లౌం (హ్సౌం) అమృతం కురు స్వాహా।।’’

అను హయగ్రీవ ఏకాక్షరసమన్వితమైన మృత్యుంజయ-పరమార్థ మంత్రముచే - మృత్యుపరిధులను దాటిపోగలడు. అనగా మృత్యు సందర్భములలో కూడా సర్వసాక్షి అగు తనయొక్క పరాత్-పర స్వరూపమును ధారణ చేసి ఉండగలడు.

అట్టి హయగ్రీవ ఏక బీజాక్షరము (హ్లౌం) తో కూడిన మంత్ర జపముచే భగవానుడగు హయగ్రీవస్వామిని సేవించటము చేత -


(ఇంకా కూడా), ఈ ‘‘హ్లౌం’’ (హ్సౌగ్) బీజాక్షరముతో కూడిన మంత్రోపాసనచే -
సకల సామ్రాజ్య సిద్ధిని ‘‘స్వాహా’’ - స్పందన పూర్వకంగా ప్రసాదించగలదు. [ (హ్లౌం (హ్సౌగ్) సకల సామ్రాజ్యసిద్ధిం కురు కురు స్వాహా। - ఇతి బీజాక్షర సహిత మంత్రము) ].


అట్టి ఈ మంత్రము యొక్క తాత్త్వికార్థము ఎవరు తెలుసుకుంటారో, అట్టి (స్వస్వరూప నిరూపణా) పరమార్థమును ఎవరు ఆశ్రయిస్తాడో →

☼ అట్టివాడు అపవిత్రుడు కూడా - పవిత్రుడు అగుచున్నాడు.
☼ బ్రహ్మమును లక్ష్యశుద్ధితో ఉపాసించని అబ్రహ్మచారి కూడా - ‘‘సు-బ్రహ్మచారి’’ కాగలడు.
☼ అగమ్యాగమనాత్ పూతో భవతి। నడవకూడని నడతలు, ప్రవర్తించకూడని ప్రవర్తనలు కలిగియున్నవాడు కూడా, - ఇప్పుడు ఈ హయగ్రీవ ఏకబీజాక్షర ధ్యానఫలముచే పవిత్రుడు కాగలడు.
☼ (ఇతరుల తప్పుపట్టుకోవటము, దూషించటము, మాటలతో ఇతరులను బాధించటము, అనృతము, దుష్టవచనములు పలకటము మొదలైన) - పతిత సంభాషణములు నిర్వర్తించియున్న దోషములనుండి హయగ్రీవ బీజాక్షరమంత్రోపాసకుడు పునీతుడు కాగలడు. అట్టివాని వాక్కు క్రమంగా పవిత్రత సంతరించుకోగలదు.
☼ (బ్రహ్మహత్య, సురాపానము, బంగారము దొంగిలించటము, గురుతల్పగమనము, పాతకములు చేసిన వానితో సాంగత్యము దోషము - అనబడు) పంచమహాపాతకముల దోషము కూడా ఆతనిపట్ల తొలగిపోగలదు.

ఒక గృహస్థ యజమాని తిరిగి తన ఇంటిలో ప్రవేశించుతీరుగా ఈ ఉపనిషత్‌లో మనము చెప్పుకున్న హయగ్రీవ బీజాక్షర సహిత మంత్రముల ఉపాసనచే ఈ జీవుడు తిరిగి ‘పరమాత్మత్వము’ అను స్వగృహమునందు ప్రవేశించగలడు.

మహావాక్యైః ప్రతిపాదితమ్ అర్థ త ఏతే మంత్రాః ప్రతిపాదయంతి।

శ్రీ హయగ్రీవ దివ్యమంత్రములు వేదములలో ఎలుగెత్తి గానము చేయబడిన 4 మహావాక్యముల మహదార్థమును సిద్ధింపజేస్తున్నాయి.

(1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) తత్త్వమసి (3) అయమాత్మా బ్రహ్మ (4) అహం బ్రహ్మస్మి

(1) ప్రజ్ఞానం బ్రహ్మ।: తెలియబడేదంతా దేనిచే తెలుసుకోబడుతోందో - అట్టి తెలుసుకోవటానికి మనముందే ఉన్న ‘తెలివి’యే ప్రజ్ఞానము. (ప్రజ్ఞానము = The Feature of knowing in all beings. The knowing at its absolute Form). అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మము. బ్రహ్మమే ప్రజ్ఞానముగా ప్రదర్శనము అగుచున్నది.
ఈ అనుభవముగా అగుచున్నది కాస్త ప్రక్కకుపెట్టి చూస్తే ‘‘ఈ అనుభవము ఎవరికి చెందిన ఎరుకయో అట్టి కేవలమగు ఎరుకయే బ్రహ్మము.

(2) తత్త్వమసి: నాకు ఎవరెవరైతే ‘‘నీవు’’ రూపంగా కనిపిస్తున్నారో, వారంతా కూడా ‘‘తత్’’ రూపమగు ‘పరబ్రహ్మ’ (లేక) ‘పరమాత్మ’ స్వరూపులే। ఏకమగు పరమాత్మయే అనేకములగు ‘‘నీవు’’లుగా (అజ్ఞాన దృష్టికి) కనిపిస్తోంది.
బ్రహ్మదేవుని నుండి - ఒక పురుగు వరకు అనేకములగు ‘నేను’లుగా కనిపిస్తూ ఉన్నదంతా (‘త్వం’ అంతా) - తత్‌యే। (ఏకాక్షరమగు ఆత్మయే)।

(3) అయమాత్మా బ్రహ్మ। : నాటకంలో పాత్రగా కనిపించేవాడు ఆ పాత్ర వేస్తున్నవాడే కదా.
నాటకంలో నా పాత్ర = ‘‘జీవాత్మ’’
ఆ పాత్ర ధారణ చేస్తున్న నేను = పరమాత్మ
నాటకము = ఈ జగన్నాటకము

★ ‘‘జీవాత్మ’’ అని ఎవరిని అంటున్నామో, అట్టి ఈతడు పరమాత్మ కాని క్షణమే ‘‘లేదు’’.
★ పరమాత్మయే సందర్భములలో ‘‘జీవాత్మ’’గా అగుపిస్తున్నారు.

కనుక ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నాడు. (జీవో బ్రహ్మేతి నాపరః)।

(4) అహం బ్రహ్మాస్మి : ఇక్కడ ‘అహం’ (నేను) జాగృత్ యొక్క అనుభవిగా మనలో ప్రతిఒక్కరికి తారసబడుతోంది కదా! అయితే ఈ ‘జాగ్రత్’లోని ‘నేను’ అనేది నాయొక్క ఒక ‘అంశ’ మాత్రమే। ‘‘జాగ్రత్‌లోని ‘నేను’, స్వప్నములోని ‘నేను’ సుషుప్తిలోని ‘నేను’ - అనే మూడు నేనులు నావైన నేనే - ‘అహం’ అను శబ్దము యొక్క విస్తీర్ణార్థము. ఈ జగత్తు యొక్క అనుభవము, దేహము, ఈ దేహమునకు ఇతఃపూర్వము, ఇప్పుడు ,ఈ దేహ తదనంతరము - ఇట్టి సమస్తమైన సందర్భములకు ఆవలగల ‘అహం’ స్వరూపమే బ్రహ్మము. (1) సమస్త జీవుల సహజ, వాస్తవ స్వరూపమై, (2) సమస్తమైన అన్యమునకు ఆవలిదై, (3) అన్యమైనదంటికీ అనన్యమైనట్టి నేనే బ్రహ్మము. అట్టి అర్థమును స్ఫురింపజేసేది - వేదమహావాక్యమగు ‘అహంబ్రహ్మాస్మి’.

బ్రహ్మము స్వర (శబ్దవృత్తి) - వ్యంజన (అర్థము)ల రెండు విధములుగా (వేద - వేదాంత వాఙ్మయమునందు) అభివర్ణించబడుతూ వస్తోంది.

ఈ అనుమంత్రములచే హయగ్రీవ పారమార్థికము (తత్త్వము) వర్ణించబడుతోంది.

యత్ వాక్ వదంతి అవిచేతనాని
రాష్ట్రీ దేవానాం నిషషాద మంద్రా,
చతస్ర ఊర్జం దుదుహే వయాంసి
క్వస్విత్ అస్యాః పరమం జగామ।।
- ఎక్కడ వాక్కు మాట్లాడక మౌనం వహిస్తోందో, తన చేతనము విడచి ఉంటోందో,
- సమస్త దేవతలచే మంద్రమైన నిషాదముగా స్తుతించబడుతోందో,
- ఏది పైన చెప్పబడిన చాతుర్మహావాక్యముల పరమార్థమై యున్నదో,

అట్టి ‘పరము’ అగు ఆత్మను ఎవరు దాటగలరు?
గౌరీమ్ ఇమాయ సలిలాని
తక్షతి ఏకపదీ, ద్విపదీ
సా చతుష్పదీ, అష్టాపదీ నవపదీ-
బభూపుషీ సహాస్రాక్షరా పరమే వ్యోమన్।।
- అట్టి ఆత్మయొక్క విభవమే - భూమిపై జలతత్త్వముగాను,
- ఏకపదము (అనేకముగా కనిపిస్తూ కూడా ఏకమే అయి ఉండటము) గాను,  - ద్విపదీ (పర-ఇహ స్వరూపము) గాను,  - చతుష్పదీ (మనో బుద్ధి చిత్త అహంకారములు) గాను,
- అష్టపదీ (పంచభూతములు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ) గాను,
- నవపదీ (జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ, సర్వాత్మ) గాను,

సహస్ర అక్షరముగాను, పరమాకాశముగాను వెలుగొందుచున్నది.
మంత్రములు
‘‘ఓష్ఠాపి ధానా నకులీ
దంత్యైః పరివృతా పవిః
సర్వస్యై వాచ ఈశానా
చారు మామ్ ఇహ వాదయేత్
ఇతి చ వాగ్రసః।’’
ఓష్ఠము (పెదవులు), దంతములతో (పల్లతో) (With Lips and Teeth) పరివృతమైన సమస్త వాక్కులు (పలికేవన్నీ) ఈశ్వరతత్త్వమై, ఈశ్వర విభవములుగా ఉపాసించుచున్నాము.

సమస్త శబ్ద-వాక్య-అర్థములు శ్రీ హయగ్రీవ వినోదకల్పనా విభవములుగా శ్రవణం చేస్తున్నాము. వినబడేదంతా శ్రీ హయగ్రీవ స్వామి కళావిన్యాసమే!
‘‘సశర్వరీః అమృతం బాధమానా
బృహన్ ఇమాయ జమదగ్ని దత్తా
అసూర్యస్య దుహితా తతాన
శ్రవో దేవేషు అమృతమ్ అజుర్యా।।’’
సమస్త చీకట్లను తొలగించి అమృతమయము చేయునది, జమదగ్ని మహర్షిచే చెప్పబడి బృహత్తరమైనది, సూర్యలోకమునకు ఆవలిది, దేవతలచే ఉపాసించబడునది అగు ’హయగ్రీవ అమృత తత్త్వము’ను ఉపాసిస్తున్నాము.



ఎవ్వడైతే ఈ ‘‘హయగ్రీవోపనిషత్’’లో ప్రతిపాదించబడిన బ్రహ్మవిద్యావిశేషములను 11 సార్లు అధ్యయనపూర్వకంగా పఠిస్తాడో, అట్టివాడు శ్రీ హయగ్రీవస్వామి యొక్క ప్రభావం చేత, అనుగ్రహంచేత - ‘మహాపురుషుడు’ కాగలడు.

(మహాపురుషుడు = జాగ్రత్ స్వప్న సుషుప్తులను, జన్మ జన్మాంతరములను, సమస్త దృశ్య వ్యవహారమును ‘‘తన (స్వకీయ) పురుషకారముయొక్క ‘‘వినోద ప్రదర్శనా వికాసము’’గా దర్శించటము అనే ఎరుకను ఆశ్రయించి, అట్టి భావనను స్వాభావికము, అనునిత్యము చేసుకొన్నట్టివాడు).

స జీవన్ముక్తో భవతి : ఎవరి దృష్టిలో తమయొక్క జీవన్మరణములు ‘జగన్నాటక పాత్ర’కు సంబంధించినవి మాత్రమే అయి ఉంటాయో, తమ దృష్టిలో వారికి వాటి వలన ఏమాత్రము బంధము ఉండదో, అట్టివాడు ‘జీవన్ముక్తుడు’. హయగ్రీవ దివ్యమంత్రములను పారాయణము చేయువాడు ‘జీవన్ముక్తుడు’ కాగలడు.

ఓం నమో బ్రహ్మణే। ‘‘అఖండము, నిత్యము, సమస్తము’’ - అగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము.

⚬ అట్టి బ్రహ్మముయొక్క ధారణ మేము నిరాకరణము చేయకుండెదము గాక।
⚬ బ్రహ్మము మమ్ములను నిరాకరించకుండును గాక।

ధారయితా భూయాసం కర్ణయోః శ్రుతం మా చ ఊఢ్వం।

మేము చెవులతో విన్నతత్త్వము బుద్ధితో ధారణ చేయుచుండెదము గాక।

జాగరూకములమై వినెదముగాక। విన్నది వదలి ఉండకుండెదము గాక।

శ్రవణము చేసినది మా హృదయములో ఆముష్యము (సుప్రసిద్ధము) అయి ఉండును గాక!

మే అస్తు అనిరాకరణమ్। మే అస్తు అనిరాకరణమ్।
ఇతి హయగ్రీవోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।

జగద్గురు శ్రీ హయగ్రీవస్వామి పాదారవిందార్పణమస్తు

Hayagreeva Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com