Mahȃvȃkya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అథర్వణ వేదాంతర్గత

18     మహావాక్యోపనిషత్

శ్లోకతాత్పర్య పుష్పమ్

శ్లో।। యత్ మహావాక్య సిద్ధాన్త
మహావిద్యా కళేబరమ్,
వికళేబర కైవల్యం
రామచంద్రపదం భజే।।
ఏదైతే వేదోపనిషత్ ప్రవచితమైన మహావాక్యముల సిద్ధాంతసారమగు ‘మహావిద్య’గా మూర్తీభవించినదై యున్నదో, వికళేబర కైవల్యమై (విదేహ కైవల్య స్వరూపమై) విరాజిల్లుచున్నదో, అట్టి శ్రీరామచంద్ర మూర్తి యొక్క పదమును భజించుచున్నాము.
ఓం
1. అథ హో వాచ భగవాన్ బ్రహ్మా :
‘‘అపరోక్షానుభవ పర-ఉపనిషదమ్’’
(పరోపనిషదమ్) వ్యాఖ్యాస్యామః।।
భగవానుడగు చతుర్ముఖ బ్రహ్మదేవుడు : మహర్షులు, మానసపుత్రులు, దేవతలు మానవులు-మొదలైన సమస్త ప్రియ ముముక్షు జనులారా! ఇప్పుడు మనము-‘‘అపరోక్షానుభవము’’యొక్క ఉప (సామీప్య) నిషదము (ఆసీనము) (Sitting Very Close) గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. (నిషాదము - కూర్చుండబెట్టడము).
గుహ్యాత్ గుహ్యతరమ్ ఏషా।
న ప్రాకృతాయ ఉపదేష్టవ్యా।
ఈ అపరోక్షానుభవ విశేషాలు - రహస్యాలన్నిటికంటే రహస్యమైనది.

ప్రాకృత, ప్రాపంచక, బాహ్యేంద్రియ దృష్టి, ఆశయము కలవారు ఈ ‘‘అపరోక్షానుభవము’’ను బోధింపబడటానికి అర్హులు కారు.
సాత్త్వికాయ, అంతర్ముఖాయ
పరి శుశ్రూషవే।। (ఉపదేష్టవ్యా)।
ఎవ్వరైతే సాత్త్విక గుణ సంపన్నులై, బాహ్యముగా కనిపించే నామ- రూప-గుణ-మార్పు చేర్పులను అధిగమించిన ‘‘అంతర్ముఖ దృష్టి’’ కలిగి ఉంటారో, గురువు వద్ద [ ప్రణిపాత (నమస్కరిస్తూ), పరిప్రశ్నలతో కూడి ] శుశ్రూష చేయువారై ఉంటారో,- వారు ఉపదేశమునకు తప్పకుండా అర్హులే!
2. అథ సగ్ంసృతి బంధ - మోక్షయోః।
విద్యా - అవిద్యే చక్షుషీ
ఉపసగ్ంహృత్య విజ్ఞాయ,
అవిద్యా లోక-అంధః తమో దృక్।
దృశ్యముతో పెట్టుకొంటున్న సంసృతి (అవినాభావభావ సంబంధము)ను అనుసరించే బంధములు ఏర్పడుచున్నాయి.

సంబంధము ఏర్పరచుకొని ఉంటే బంధము. అంతరమున సంబంధము లేనివాడై ఉంటే - మోక్షము.

(బంధ మోక్షములకు) విద్య అవిద్యలు రెండు వేరైన చూపుట (దృష్టులు) వంటివి. అందుచేత జగత్ భావములను ఉపశమింపజేయుచు, విజ్ఞాన దృష్టి ఆశ్రయించెదరు గాక.

లోకమును- అజ్ఞాన, లోకపరిమిత, తమో దృష్టితో దర్శించటమే అవిద్య.
తమో హి శారీర ప్రపంచమ్।
ఆబ్రహ్మ స్థావరాంతమ్।।
అనంతాఖిల అజ అండభూతమ్।
(అనంతాఖిలాజాండభూతమ్)।
ఈ శరీరమునుండి ప్రపంచము వరకు ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తూ, బ్రహ్మ నుండి-స్థావరము కనిపించేదంతా కూడా తమో (మాయా) ఆవరణయే।
ఆత్మ - ఈ అఖిలాండకోటి బ్రహ్మాండస్వరూపము. అజము. జననమే లేనట్టిది. మొదలు చివర లేనిది. అజ-అండ భూతము. (కలలోనో, కల్పనలోనో కనిపించే) కల్పనా వస్తువుకు జననమెక్కడిది? నాశనమెక్కడిది?
నిఖిల నిగమ-ఉదిత
సకామకర్మ వ్యవహారో లోకః।
నైషో అంధకార అయమాత్మా।
ఈ లోకములన్నీ కూడా (1) వేదములలో చెప్పబడిన (మరియు) (2) లౌకికమైన ఆయా అనేక సకామ కర్మ వ్యవహారములచే నిర్మితమై ఉన్నట్టివి.

అనగా, ఈ జీవుడు స్వపురుషమాత్రుడా?
ఈ జీవాత్మ (లేక) జీవుడు అంధకార స్వరూపుడు కానే కాదు. (నిర్విషయుడు, లేనివాడు, శూన్యము కాదు). (ఆత్మ తేజో రూపుడే)।
విద్యా హి కాండ, అంతరాదిత్యో,
జ్యోతిర్మండలం గ్రాహ్యం।
ఈ జీవుడు ఆత్మయొక్క ‘ఎరుక’ అనే వెలుగుచేత జడ జగత్తులో ప్రకాశించుచున్న విద్యా స్వరూపుడుగాను, హృదయాంతరంగంలో వెలుగొందుచున్న ఆదిత్య స్వరూపుడుగాను. జ్యోతిర్మండలాకారమగు ఆత్మ స్వరూపుడుగాను నిర్వచింపబడుచున్నాడు.
న అపరమ్।
ఈ జీవుడు పరమాత్మకు అన్యుడు కాడు. భిన్నము కాదు.
‘‘అసావాదిత్యో బ్రహ్మేతి’’
అజపయా ఉపహితగ్ం
‘‘హగ్ంసః - సో౽హమ్’’।
ప్రకాశించుచున్న ఆదిత్యుడే బ్రహ్మము. (బ్రహ్మము నిత్యప్రకాశుడగు ఆదిత్యునివంటిది). [ స్వయం ప్రకాశము. సర్వమును తానై వెలిగించునది ]
అజపానుసంధానంగా (శబ్దములనుదాటి భావనయొక్క అనుసంధాన పూర్వకంగా) - హంస - సో౽హమ్ (కేవల - సందర్భముల మధ్య)గా వెలుగొందువాడు.
ప్రాణ అపానాభ్యాం
ప్రతిలోమ - అనులోమాభ్యాగ్ం
సమ - ఉపలభ్యైవగ్ం,
సా చిరం లబ్ధ్వా త్రివృత్ - ఆత్మని, బ్రహ్మణి
అభిధ్యాయమానే
సచ్చిదానందః పరమాత్మా ఆవిర్భవతి।।
అట్టి బ్రహ్మమును ప్రాణ - అపానధారణ పూర్వకంగాను, ప్రతిలోమ (అవరోహణ క్రమము-దిగటము), అనులోమ (ఆరోహణ క్రమము- ఎక్కడము) గుర్తులతోను, కేవలముగాను ‘‘హంసః। సో౽హమ్’’ అని దీర్ఘకాలము జపించాలి. ఉపాసించాలి.

క్రమంగా (దీర్ఘకాల ఉపాసనచే) సమ్యక్ జ్ఞానము (సర్వత్రా సమదృష్టి - అనే జ్ఞానము)చే బ్రహ్మమును ధ్యానించటంచేత సత్ (ఉనికి), చిత్ (ఎరుక), ఆనంద (భావన) స్వరూపుడగు పరమాత్మ అంతరహృదయంగా ఆవిర్భవించ గలడు. (అనగా) పరతత్త్వము స్వానుభవము కాగలదు.
3. సహస్రభానుమత్ చు(సు)రితా, (స్ఫురితా),
పూరితత్వాత్ అలిప్యా,
పారావార పూర ఇవ।
అట్టి అఖండ పరతత్త్వానుభవం ఎటువంటిదంటే....,
- ఆత్మ వేలాది సూర్యుల యొక్క కాంతితో ప్రకాశించు సురి (చురకత్తి) వంటిది. (కత్తివలె ‘అన్యము’ అనేదంతా ఖండించివేయునది).
పూర్ణమగు సముద్రమువలె ఆత్మ నిర్మలము, పరిపూర్ణము అయి ఉన్నట్టిది. జగత్తులతో పూర్ణమై - వెల్లివిరియుచున్నట్టిది.
నైషా సమాధిః।
‘సమాధి’ అనేది సమస్త ఆలోచనలు విరమించు స్థితి.

కాని ఆత్మానందమో? ఆలోచనలన్నిటికీ ఆవల, ఆలోచనలతో సహా సమగ్రమై సమస్తమును తనయందు కలుపుకొని ఉన్నట్టిది. కనుక అది ‘సమాధి’ స్థితి అని కూడా అనలేము.
నైషా యోగసిద్ధిః।
అట్టి ఆత్మస్థితి ప్రతి జీవునిపట్ల సర్వదా సిద్ధించియే ఉన్నట్టిది. అందుచేత ‘‘అది యోగాభ్యాసము తరువాత సిద్ధించునది’’ - అనవీలు కాదు.
నైషా మనోలయః।
(కింతు) బ్రహ్మైక్యం తత్।
మనస్సు ఉండటానికి, లేకపోవటానికి ఆత్మస్వరూపమునకు సంబంధము లేదు. కనుక, అది మనో ‘‘లయస్థితి’’ అని కూడా చెప్ప వీలుకాదు.

మరి ఆత్మానుభవము (లేక) బ్రహ్మీస్థానము గురించి ఏమని చెప్పుకోవాలి?

అది ఈ జీవాత్మయొక్క తత్ స్వరూపమగు (ఆవలిరూపమగు) ‘‘బ్రహ్మము’’తో మమైక్య స్థితి. బ్రహ్మమునకు అనన్యస్థితి.
ఆదిత్యవర్ణం, తమసస్తు పారే
సర్వాణి రూపాణి విచిత్య ధీరః,
నామాని కృత్వా అభిదవన్ యదాస్తే
ధీరులగు వారు- [ ఉత్తమ, సునిశిత, విస్తార, నిర్మల, విచక్షణాసహిత ‘ధీ’ (బుద్ధి) కలవారు ] - సమస్తనామ రూపాత్మకమైనదంతా విచారించి, మాయామయములుగా నిర్ణయించి, అటుపై ఏ ‘బ్రహ్మము’ గురించి ఎలుగెత్తి చెప్పుచున్నారో, - అట్టి బ్రహ్మము - ఆదిత్యునివలె స్వయంప్రకాశకము. తమస్సుకు ఆవలది.
ధాతా పురస్త ఆద్యమ్ ఉదాజహార,
శక్రః ప్రవిద్వాన్ ప్ర-దిశశ్చతస్రః।
అట్టి ‘బ్రహ్మము’ గురించి ధాత (బ్రహ్మదేవుడు) ముందుగా వర్ణించారు. ప్రవచించారు. అది తెలుసుకొని ఇంద్రుడు ఆత్మానంద పరవశంతో నలుదిక్కుల గానం చేస్తున్నారు.
తమేవం విద్వాన్ ‘‘అమృత ఇహ’’ భవతి।
న - అన్యః పంథా అయనాయ విద్యతే।
నాలుగు దిక్కులందు, నాలుగు అవాంతర దిక్కులందు ఏ ఆత్మను దర్శించి త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు గానము చేస్తున్నారో, - అట్టి ‘అఖండాత్మ’ లేక ‘బ్రహ్మము’ను విద్వాంసుడైనవాడు ఇప్పుడే తెలుసుకొని, ఇక్కడే సర్వత్రా దర్శించుచున్నాడు. మృత్యువును దాటి అమృతుడగు చున్నాడు.

అట్టి ఆత్మయొక్క దర్శనము, మమేకముచే ‘అమృతత్వము’ను (మృత్యు పరిధులను అధిగమించటమును) ఇప్పుడే ఇక్కడే సిద్ధించుకోవాలి. వేరే ఎప్పుడో, ఎక్కడో కాదు. ఎప్పటికో తెలిసేది కాదు.
యజ్ఞేన యజ్ఞ మ యజంత దేవాః।
తాని ధర్మాని ప్రథమాన్యాసన్। (ప్రథమాని ఆసన్)।
పైవిధంగా దేవతలు ‘జ్ఞాన యజ్ఞము’ చేత యజ్ఞ స్వరూపుడగు పరమాత్మకు సర్వతత్త్వ స్వరూపుడుగా యజనము (యోగోపాసన) సమర్పిస్తున్నారు.

అట్టి ఆత్మ ధర్మములను (నిత్యత్వము, సత్యత్వము, అతీతతత్వము, కేవలసాక్షిత్వము మొదలైన ఆత్మయొక్క ముఖ్య ధర్మములను) న్యాసము (ఉపాసన), అనుష్ఠానము, ధారణ చేస్తున్నారు.
తే హ నాకం మహిమానః సచంతే,
యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః।
అట్టి ఆత్మయొక్క విశిష్ట ధర్మములను ఉపాసించువారు మహాత్ములగు జీవన్ముక్తుల స్థానము సిద్ధించుకొని, ఆత్మయే తామై, ఆయా నిత్యత్వాది విశేష ఆత్మగుణములతో ప్రకాశించుచున్నారు.
4. సో౽హమ్ అర్కః, పరంజ్యోతిః।
అర్కజ్యోతిః। అహగ్ం శివః।
సూర్యునిలోని పరంజ్యోతి స్వరూపముగా ఏ ఆత్మయొక్క మహిమ వెలుగొందుచున్నదో - అట్టి ఆత్మజ్యోతి, పరంజ్యోతి, అర్కజ్యోతి, శివానంద స్వరూపము - ‘‘నేనే’’ అయి ఉన్నాను.
ఆత్మజ్యోతిః అహగ్ం శుక్రః।
సర్వజ్యోతిః అసావహమ్।
నేనే నిర్మలమగు ఆత్మగా సమస్త జీవులయందు ప్రకాసిస్తున్న జ్యోతి స్వరూపుడను. రస స్వరూపుడను. అఖండాత్ముడను.
ఏతత్ అథర్వశిరో అధీతే, ...
అథర్వవేదమునకు శిరస్సు వంటి ఈ మహావాక్యోపనిషత్‌యొక్క ‘‘అధ్యయన ఫలశృతి’’ చెప్పుకుంటున్నాము.
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి।
సాయం అధీయానో దివసకృతం పాపం నాశయతి
ఉదయము పఠణము, అధ్యయనము చేసిన వానిపట్ల (తద్విధమైన ఆచరణ ఆశ్రయించినవానిపట్ల) రాత్రి చేసియున్న పాపదోషములు నశించగలవు.
సాయం సమయంలో ఈ ఉపనిషత్ విశేషాలను అధ్యయనం చేస్తే, పగలు చేసిన కర్మల దోషములు తొలగ గలవు.
తత్ సాయం ప్రాతః ప్రయుంజానః
పాపో అపాపో భవతి।
ఉదయము, సాయంత్రము కూడా అధ్యయనము చేస్తూ ఉండగా అట్టివాడు ‘పాపి’ అయినప్పటికీ ‘అపాపి’ (పవిత్రుడు) కాగలడు. పరమ పవిత్రుడౌతాడు. సర్వత్రా ఆత్మదృష్టిని పొందగలడు.
మాధ్యందినమ్ ఆదిత్యాభిముఖో అధీయానః
పంచమహా పాతక-ఉపపాతకాత్ ప్రముచ్యతే।।
మధ్యాహ్నమువేళ సూర్యునికి అభిముఖంగా నిలచి, ఈ మహావాక్యోపనిషత్ విశేషాలను పఠణము, మననము చేయువాడు తనయొక్క జన్మజన్మల మహాపాతక, ఉపపాతకములనుండి ముక్తుడు (విముచ్యుడు) కాగలడు.
సర్వ వేదపారాయణ పుణ్యం లభతే।
శ్రీ మహావిష్ణు సాయుజ్యమ్ అవాప్నోతి।।
అట్టి వానికి నాలుగు వేదముల పారాయణము చేసిన పుణ్యము లభించగలదు.
ఆతడు విష్ణుసాయుజ్యము పొందుచున్నాడు
మహావాక్యోపనిషత్ - సమాప్తా।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఇతి మహావాక్యోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః

అథర్వణ వేదాంతర్గత

18     మహావాక్యోపనిషత్

అధ్యయన పుష్పము

ఒక సందర్భములో కొందరు మునులు, దేవతలు, బ్రహ్మమానస పుత్రులగు సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సనకుడు, సనందనుడు - మొదలైనవారు ప్రజాపతి అగు బ్రహ్మదేవుని దర్శనం చేసుకొన్నారు.

దేవతలు మొ।। వారు : హే పితామహా! సృష్టికర్తా! బ్రహ్మదేవా! ‘జీవించాలి’ - అనే అభిమానముగల జీవులు - బ్రాహ్మీదృష్టి పొందే సులువైన సాధనామార్గమును, జ్ఞానమును బోధించవలసినదిగా కోరుతూ, మిమ్ములను శరణు వేడుచున్నాము.

భగవంతుడగు బ్రహ్మ : బిడ్డలారా! ఇప్పుడు మనము ‘‘అపరోక్షానుభవము’’నకు సంబంధించిన ఉపనిషత్ ప్రబోధము గురించి వ్యాఖ్యానించుకుందాము.

1. ఇంద్రియములకు ప్రత్యక్షముగా అనుభవమగుచూ ఉంటే - అది ‘‘ప్రత్యక్షానుభవము’’.
ఆత్మయో? ఇంద్రియములకు విషయము కాదు. ఇంద్రియములకే ఆధారమగుచు, వాటిని వెలిగించునది. కనుక ఆత్మ ‘‘ప్రత్యక్షానుభవము’’ కాదు, ఇంద్రియములకు విషయమై కనబడేది, వినబడేది కాదు.

2. ఆత్మ జీవునకు పరోక్షమైనది కాదు. ఇంద్రియములకు, దేహమునకు జీవునకు వేరుగా ఎక్కడో ఉండి, ఎప్పటికో ఎచ్చటనో లాభించేదైతే ‘‘పరోక్షానుభవము’’. ఆత్మయో?
ఇంద్రియములకే జనన-ప్రేరణస్థానమైయున్న ఆత్మ - ఈ జీవునికి వేరుగా ఎక్కడో లేదు. అన్యము కాదు. కాబట్టి పరోక్షానుభవము కాదు. ఇప్పటికే సిద్ధించి, వెన్నంటి ఉన్నట్టిది ‘పరోక్షము’ ఎట్లా అవుతుంది?

3. ప్రత్యక్షము కానిది, పరోక్షము కానిది - ‘‘అపరోక్షము’’।
ఆత్మ ప్రత్యక్షము, పరోక్షము కాదు. కాబట్టి ‘‘అపరోక్షానుభవము’’ అయి ఉన్నది. ఇంద్రియములకు అవిషయము. అనుభవికి అనన్యము. కాబట్టి - ‘‘అపరోక్షము’’.

ఆత్మ - వక్త, శ్రోతలు ఇరువురికి కూడా వర్తమానములోనే ఏమాత్రము అన్యమే కానట్టిది. కాబట్టి అపరోక్షము.

అట్టి ‘‘స్వస్వరూపాత్మ’’ గురించిన జ్ఞానము రహస్యములలోకెల్ల అత్యంత రహస్యమై ఉన్నట్టిది.

ఇది ‘‘శ్రోత- స్వాభావికమగు తన స్వస్వరూపము గురించి తానే ఎరగటము’’ - అయిఉన్నట్టిది.

అందుచేత ఎవరి దృష్టి ప్రాకృతమైన (ప్రకృతి సంబంధమైన / ఇంద్రియ సంబంధమైన / బాహ్య సంబంధమైన) - విషయ విశేషాలకు పరిమితమై, సంకుచితత్వము వహించి ఉంటుందో, అట్టి వారికి అపరోక్షమగు ఆత్మ గురించిన స్వాభావిక తత్త్వము బోధించటంచేత ప్రయోజనము ఉండదు.

అట్టి శ్రోతపట్ల ఆత్మానుభవము సులభమై సిద్ధించదు.

ఎవ్వడైతే →
• సత్త్వగుణ సంపన్నుడై, (రాజసిక - తామసిక భావాలను అధిగమించినవాడై),
• నామ-రూప-గుణాత్మకమైన సమస్తమునకు ఆవలగల కేవల-స్వస్వరూప సాక్షి యొక్క అనునిత్య దర్శనముచే అంతర్ముఖత్వము నందు అభిరుచి కలవాడై, -
• ఆత్మజ్ఞాన-ఆత్మ భావన యొక్క సముపార్జన కొరకై ఆచార్యులను సేవించు పరిశుశ్రూష స్వభావము గల వాడై - ఉంటాడో, అట్టివానికి ఈ మహావాక్యోపనిషత్‌యొక్క తాత్త్వికార్థము తప్పక ఉపదేశించబడు గాక! (బోధించబడు గాక)।

మొట్టమొదట ఈ జీవుడు ఈ దృశ్యముతో మానసికంగా ఏర్పరచుకొన్న సంబంధము స్వకీయ అజ్ఞానముచేత ‘‘బంధము’’గా అగుచున్నదని గమనించి, ఆపై అట్టి బంధము తొలగి ఆత్మానందమును సిద్ధించుకొను ఆశయము పొంది ‘ముముక్షువు’ అగుచున్నాడు.

అట్టి ముముక్షువు
(1) శమము (ఇంద్రియ నిగ్రహము),
(2) సంతోషము (కలిగినదానితోను, పొందినదానితోను తృప్తిని అభ్యాసముగా కలిగి ఉండటము),
(3) విచారణ (నిత్యానిత్య వివేకము గురించిన ప్రయత్నము. శాస్త్ర / గురువాక్య పరిశీలన),
(4) సత్సంగము
అనబడు సాధన చతుష్టయమును ఆశ్రయిస్తున్నాడు. అట్టి ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనముగా ‘ఆత్మవిద్య’కు అర్హుడగుచున్నాడు.

రెండు వేరువేరైన దృష్టులను విభాగించటమును తెలుసుకొని, ‘విజ్ఞానము’ (లేక) ఆత్మజ్ఞానము సహాయముతో వివేకి అయినవాడు అనాత్మ దృష్టిని (సాకార పాంచభౌతిక ఖండాత్మక దృష్టిని) క్రమంగా ఉపసంహారము చేసుకొంటున్నాడు. జయించివేస్తున్నాడు.

దేవతలు, బ్రహ్మ మానసపుత్రులు : తండ్రీ! బ్రహ్మదేవా! ‘అవిద్య’ అనగా ఏది? ఏ రూపముగా ఈ జీవునిపట్ల ప్రవర్తించటం జరుగుతోంది?

బ్రహ్మదేవుడు : బిడ్డలారా! వినండి.

స్వస్వరూపమగు ఆత్మకు అన్యముగా అనిపించేదంతా ‘అనాత్మ’గా చెప్పబడుతోంది. అనేకముగా కనిపిస్తున్న ఈ సమస్తము ‘ఏకము, అక్షరము’ అగు ‘‘ఆత్మ’’గా అనిపించటమే ‘విద్య’. బంధ-మోక్షములకు విద్య-అవిద్యలు రెండు కళ్లు (వేరైన దృష్టులు) వంటివి. ఎందుకంటే దృష్టిని అనుసరించియే బంధ మోక్షములు ఏర్పడినవై ఉంటున్నాయి.

ఓ ప్రియజనులారా! మీరంతా ఆత్మతత్త్వ ధ్యానము కొరకై అనాత్మను ప్రక్కకు నెట్టి వేయండి. పదార్థ దృష్టిని అధిగమించి పరమార్ధ దృష్టిని ఆశ్రయించండి. ఎవరు బ్రహ్మమును మాత్రమే సర్వత్రా దర్శిస్తారో, అట్టివారు ‘సంసృతి’ని (సంబంధముచే ఏర్పడే బంధమును) జయించి, నిత్య ముక్తత్వము సిద్ధించుకోగలరు.

‘అవిద్య’ అనగా? అవిద్యా లోకాంధ తమో దృక్।

అవలోకనమే (Way of seeing) మూలమైనట్టి ‘లోకదృష్టి పరిమితత్వము’ - అనే తమో ధ్యాసయే (లేక) కల్పితమైన అజ్ఞాన దృష్టియే - అంధకారముతో సమానమైన ‘‘అవిద్య’’.

ఈ శారీరకమైన స్థితిగతుల అనుభవము, (బ్రహ్మ నుండి స్థావరము వరకు అనుభవమయ్యే) ప్రపంచానుభవము, (ఏకమునందు అనేకానుభవం - ఇదంతా తమస్సు (అజ్ఞానము) చేతనే ఏర్పడుతోంది.

అట్లాగే, అనంతమగు సమస్త భౌతిక బ్రహ్మాండములు (అనంతాఖిల అజాండభూతమ్।), సకల వేదములనుండి సకామ కర్మరూపమగు లౌకిక (లోక) కర్మ వ్యవహారములు (నిఖిల నిగమోదిత సకామకర్మో లోకః।) - ఇవన్నీ కూడా తమో విశేషములే!

ఆత్మకు లేని బంధము కల్పించి ఆపాదించబడుచున్నవే.

ఈ జీవుడు (ఇంకాకూడా) ఎట్టివాడు?

ఈ జీవాత్మ ఆత్మతేజో ప్రకాశస్వరూపుడే గాని, అంధకార స్వరూపుడు కాదు. ఆత్మ విద్యాసాగర స్వరూపుడు. అంతరాదిత్య స్వరూపుడు. (అంతరంగాకాశంలో ప్రకాశించే స్వయంప్రకాశ ఆదిత్యుడు).

కేవలాత్మగా జ్యోతిర్మండల స్వరూపుడు. విద్యానంద స్వరూపుడు.

గ్రాహ్యం నాపరం। ఈ జీవాత్మ పరమాత్మనుండి వేరుపడి ఉండనే లేదు. పరమాత్మకు వేరైనవాడు ఏమాత్రము కాదు.

‘‘బ్రహ్మమే సర్వ జీవుల హృదయములలోను ప్రకాశించుచున్న ఆదిత్యుడు।’’
‘‘అట్టి హంస (ఆత్మ) నేనే అయి ఉన్నాను. హంసస్సో౽హం।’’
అని సర్వదా సర్వత్రా జపము (మననము) ఆశ్రయించాలి.

ప్రాణ-అపానాభ్యాం। ప్రాణ అపానములను ఒక ప్రదేశములో కుంభకం చేసి జీవాత్మ పరమాత్మల ఏకత్వము అనేకసార్లుగా ఉపాసించాలి.

ప్రతిలోమ (అవరోహణక్రమము / పైనుండి క్రిందికి) - అనులోమ (ఆరోహణక్రమము / క్రిందినుండి పైకి) (యోగపరంగా సహస్రారం నుండి మూలాధారం వరకు)

(ప్రతిలోమము = ప్రతికూలముగా. అనులోమము = ఒకానొక క్రమమును అనుసరించటము)

  1. ‘‘సో (సః)’’ నుండి ‘‘హం’’ వరకు (సహజము నుండి సందర్భము వరకు) → ప్రతిలోమ క్రమము/అవరోహన క్రమము.
    (పరమాత్మ నుండి జీవాత్మ వరకు). (యోగపరంగా - సహస్రారము నుండి మూలాధారము వరకు).

  2. ‘‘హం’’ నుండి ‘‘సో’’ (సః) వరకు. (సందర్భము నుండి సహజము వరకు) → అనులోమ క్రమము/ఆరోహన క్రమము.
    (యోగపరంగా మూలాధారం నుండి సహస్రారం వరకు)

ఈవిధమైన క్రమంగా ‘‘సో౽హం హంసః’’ ‘‘హంసః సో౽హం’’ అని బహుకాలంగా అజపంగా (సహజ-సందర్భములను ఈవిధంగా సమ్యక్ దృష్టిని (లేక) సర్వత్రా సమమై, అఖండమైయున్న ‘‘ఆత్మదృష్టి’’ని) సంపాదించుకోవాలి సుమా!

(ద్రష్ట దర్శన దృశ్య) తివృత్ ఏకస్వరూపమగు బ్రహ్మమును ధ్యానించాలి.

సచ్చిదానందః పరమాత్మ-ఆవిర్భవతి।। క్రమంగా ఈ జీవుడు స్వయముగా సత్-చిత్-ఆనంద స్వరూపము, సమస్తమునకు ‘పరము’ (ఆవలిది) అగు ఆత్మ స్వరూపముగా ఆవిర్భావము పొందినవాడు అవగలడు.

అట్టి అఖండ - అప్రమేయ - సమగ్ర - అనునిత్య సత్యమగు ‘‘తత్త్వవృత్తి’’ (లేక) తత్త్వ దృష్టి మహత్తరమైనది.

ఆత్మ - నేతి

నైషా సమాధిః । : ‘సమాధి’ అనగా (కొన్ని శ్రాస్త విభాగములు ఇస్తున్న నిర్వచనమును అనుసరించి) - సమస్త హావభావముల విరామస్థితి. కానీ ఆత్మ పురుషుడో? సమస్త హావభావములు తనవే అయి, తాను వాటన్నిటికీ ఆవల ఉన్నట్టివాడై, ‘‘జగత్తులు - జగద్భావములు - జగత్ భావ సమన్వితుడు’’ - అగు తివృత్ ఆత్మ స్వరూపుడై విరాజిల్లువాడు. కనుక - ఆత్మానుభవము ‘‘సమాధి’’ వంటిది - అని పరిమితముచేసి చెప్పలేము. అఖండాత్మానంద భావనకు ‘‘జగత్ విషయ విరామము’’ యొక్క అగత్యమేదీ లేదు.

నైషా యోగ సిద్ధిః । : అట్టి ఆత్మానుభూతి యోగాభ్యాసముల తదనంతరము సిద్ధించేదా? కాదు. సర్వదా సిద్ధించియే ఉన్న ‘ఆత్మ’ కొరకై - ‘‘యోగాభ్యాసముల తరువాత’’-అని ఎట్లా అంటాము? అందుచేత ‘‘ఆత్మానందము యోగసిద్ధి రూపము’’- అని కూడా అనలేము.

నైషా మనో లయః । : ఆత్మయొక్క ‘మననము’ అనే క్రియావిశేషమే మనస్సు. అట్టి మనస్సుకు మునుముందుగాను, మనస్సు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, మనస్సు లయించిన తరువాత కూడా ‘ఆత్మ’ - యథాతథము. తరంగము ప్రదర్శనము కాకముందు, తరంగము సందర్భముగాను, తరంగము లయించిన తరువాత కూడా జలము యథాతథము కదా! ఆత్మనుండే మనోతరంగములు బయల్వెడలి, తిరిగి ఆత్మయందే లయిస్తున్నాయి. అందుచేత ‘ఆత్మ మనోలయ రూపము’ అని అనలేము. ఎందుకంటే మనస్సు ఉన్నా, లేకున్నా కూడా ఆత్మ సర్వదా పరము (Beyond), మరియు, యథాతథము కూడా.

జీవ బ్రహ్మైక్యమే (ఏకమ్, అఖండమ్) - ఆత్మయొక్క స్వాభావిక రూపము.

అట్టి ఆత్మయొక్క మహిమా విశేషాలు ఇంకా కూడా ఎట్టివంటే...,

ఆదిత్య వర్ణమ్, తమసస్తు పారే। : అది చీకటికి ఆవల సూర్యతేజో విలాసముగా నిత్య ప్రకాశము. అజ్ఞానమునకు సంబంధించక, ఆవల అనునిత్య తేజోవిలాసమై వెలుగొందుచున్నట్టిది. ‘జీవాత్మ’గా కనిపించేదానికి ఆవలగా, సాక్షిగా ప్రకాశించుచున్నట్టిది.

సర్వాణి రూపాణి విచిత్య, ధీరః, నామానికృత్వా అభిదవన్ యదాస్తే। : ఉత్తమ బుద్ధి గల ధీరులు ‘‘ఈ నామ రూపాత్మకంగా ప్రదర్శనమగుచున్నదంతా ‘‘స్వయం ప్రకాశమగు ఆత్మ’’ యొక్క ప్రదర్శనమే (Manifestation of Absolute Self) ’’ - అని గమనిస్తూ, దర్శిస్తున్నారు.

ధాతా పురస్తాత్ ఆద్యమ్ ఉదాజహార। : ఈవిధంగా ధాత (బ్రహ్మ భగవానుడు) ఇతఃపూర్వమే (సృష్టికి పూర్వమే) - ‘‘నేను నిర్వర్తించబోవు ఈ సృష్టి అంతా కూడా ఆత్మ యొక్క ఆనంద ప్రదర్శనా చమత్కారమే’’ - అని ఎలుగెత్తి గానం చేసి, సృష్టి కల్పనకు ఉపక్రమించుచున్నారు.

శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః। : అప్పుడు త్రిలోకాధిపతి అగు ఇంద్ర భగవానుడు ‘‘ఈ సమస్తము కూడా ద్రష్టయొక్క కేవల స్వరూపమగు స్వస్వరూపాత్మయే। అనేకంగా (స్వకీయ కల్పనచే) అగుపించేదంతా ఏకమగు ఆత్మయే’’ అని నిస్సందేహముగా ఎరిగినవారై, అట్టి ఆత్మతత్త్వ జ్ఞానమును పది దిక్కుల మార్మ్రోగేటట్లుగా గానం చేస్తూ వినిపిస్తున్నారు.

తమేవమ్ విద్వాన్ అమృత ఇహ భవతి। : అట్టి స్వస్వరూపమగు ‘‘ఆత్మ’’ గురించి ఇప్పుడే తెలుసుకొన్నవాడు ఇక్కడే జన్మ-మృత్యువుల పరిధులను అధిగమించి, వాటికి సాక్షి అయిన తనయొక్క అమృతత్వమునందు అనుక్షణికంగా ‘‘స్వానుభవుడు’’ కాగలడు.

అట్టి అమృతమగు ఆత్మగురించి తెలుసుకోవటము తప్పించి, ఇక (మృత్యువును అధిగమించటానికి) వేరే త్రోవయే లేదు.

యజ్ఞేన యజ్ఞమ్ అయజంత దేవాః, తాని ప్రధమాన్యాసన్। : అట్టి ‘‘ఆత్మతత్త్వ జ్ఞాన యజ్ఞము’’ను నిర్వర్తించి దేవతలు అట్టి యజనముచే అమృతతుల్యులై, ముక్తులైనారు.

ఆత్మ జ్ఞాన లక్షణములే ప్రధానములైన గుణములు.

అట్టి ఆత్మ జ్ఞానముచే జీవులు జీవన్ముక్తులై, తత్త్వవేత్తల స్థానము పొంది ప్రకాశించగలరు.

‘‘నేను’’ ఎవరు?

• నేను ఆత్మగా స్వయం ప్రకాశకమగు ఆత్మ సూర్య-జ్యోతి స్వరూపుడను.
• అర్కజ్యోతి శివానంద రూపుడను.
• సమస్తమునందు నిర్మలమగు ఆత్మగా రసస్వరూపుడనై వేంచేసి ఉన్నవాడను.
• అఖండమగు ఆత్మజ్యోతిని నేనే!
• అగ్నియే సమస్త దీపములలో వెలుగుచు, కాంతిమయమై ఉన్నట్లుగానే, ఆత్మనగు నేనే సమస్త జీవులలో స్వయముగా జ్యోతికే, జ్యోతిగా, ఆత్మజ్యోతిగా ‘‘శివో౽హమ్’’ అయి వెలుగొందుచున్నవాడను.

ఫలశ్రుతి

బ్రహ్మదేవులవారు :
ఓ ప్రియజనులారా! సమస్త జీవులారా!

ఈ మహావాక్యోపనిషత్ విశేషముల సారము అథర్వణవేదమునకు శిరస్సు వంటిది. ఇందలి తాత్త్విక పాఠ్యాంశమును అధ్యయనము చేసి హృదయస్తము చేసుకొనెదరు గాక! (ఉపనిషత్తులు వేదములకు శిరస్సులుగా వర్ణించబడుచున్నాయి).

ఎవ్వరైతే మధ్యాహ్నకాలంలో సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యనమస్కారములు నిర్వర్తించి, ఆ తరువాత ఈ ఉపనిషత్ విశేషాలు ఆదిత్యుని (సూర్యుని) సమక్షంలో అధ్యయనం చేస్తారో, అట్టి వారు పంచ మహాపాతక ఉపపాతకముల నుండి ప్రముచ్యులు (Relieved) కాగలరు.

ఈ ఉపనిషత్ విశేషములు అధ్యయనము చేయువారికి సమస్త వేదముల పారాయణ పుణ్యము లభించగలదు.

అట్టివారు మహావిష్ణు సాయుజ్యము పొందగలరు.

ఇతి మహావాక్యోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।

Mahȃvȃkya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com