[[@YHRK]] [[@Spiritual]]
Pȃsupata Brahma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
పాశుపతబ్రహ్మవిద్యాసంవేద్యం పరమాక్షరం . పరమానందసంపూర్ణం రామచంద్రపదం భజే .. |
|
శ్లో।। పాశుపత బ్రహ్మవిద్యా సంవేద్యం పరమాక్షరమ్ పరమానంద సంపూర్ణం రామచంద్రపదం భజే।। |
‘‘పాశుపతము’’ అని పిలువబడు ‘‘బ్రహ్మవిద్య’’ యొక్క అధ్యయనముచే తెలియబడునది, సర్వజగత్‌ద్దృశ్యమునకు మునుముందే సర్వదా (పరమై)యున్నట్టిది, మార్పుచేర్పులచే స్పృశించబడకపోవుటచే అక్షరమైనట్టిది, పరమానందము, స్వసంపూర్ణము అయినట్టిది - అగు ‘‘శ్రీరామచంద్రపదమును’’ ఉపాసించుచున్నాము. |
హరిః ఓం .. అథ హ వై స్వయంభూర్బ్రహ్మా ప్రజాః సృజానీతి కామకామో జాయతే |
|
1. హరిః ఓమ్। అథ హ వై స్వయంభూః బ్రహ్మా ‘‘ప్రజాః సృజాని....!’’ ఇతి కామకామో జాయతే। |
ఓం। సర్వము హరిమయము। తనకు తానే జనించినట్టి (స్వయంభువు అగు) బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు ‘‘నేను జీవులను సృష్టించెదనుగాక!’’ - అను కోరికను పొందారు (కామకాముడు అయినారు). [ అవిధంగా ‘అన్యము’ రూపంగా సమస్త జగద్వ్యవహారము కల్పించబడసాగుతోంది ]. |
కామేశ్వరో వైశ్రవణః . వైశ్రవణో బ్రహ్మపుత్రో వాలఖిల్యః స్వయంభువం పరిపృచ్ఛతి జగతాం కా విద్యా కా దేవతా జాగ్రత్తురీయయోరస్య కో దేవో |
|
కామేశ్వరో వైశ్రవణో బ్రహ్మపుత్రో వాలఖిల్యః స్వయంభువమ్ పరిపృచ్ఛతి: ‘‘= జగతాం కా విద్యా? కా దేవతా? జాగ్రత్ తురీయయోః అస్య కో దేవః? |
ఒక సమయంలో కామేశ్వరుడు, వైశ్రవణుడు, బ్రహ్మపుత్రుడు, వాలఖిల్యుడు అను నలుగురు ఋషులు బ్రహ్మదేవుని సమీపించి ఈవిధంగా అడిగారు. ‘‘తండ్రీ!’’ 1) ఈ సమస్త జగత్తులలో అత్యుత్తమమైన విద్య ఏది? 2) ఈ జగత్తులకు దేవతలు (Divine to all worlds) ఎవరు? జాగ్రత్‌కు దేవత ఎవరు? తురీయమునకు దేవత ఎవరు? |
యాని తస్య వశాని కాలాః కియత్ప్రమాణాః కస్యాజ్ఞయా రవిచంద్రగ్రహాదయో భాసంతే కస్య మహిమా గగనస్వరూప |
|
యాని తస్య వశాని? కాలాః కియత్ ప్రమాణాః? కస్య ఆజ్ఞయా రవి చంద్ర గ్రహాదయో భాసంతే? కస్య మహిమా గగనస్వరూపః? |
(3) ఆ దేవత వశంగా ఏమేమి ఉన్నాయి? (4) కాలము ఎంత ప్రమాణము కలిగి ఉంటోంది? (5) ఎవ్వరి ఆజ్ఞచే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహములు మొదలైననవి (ఒకానొక విధి విధానంగా) భాసిస్తున్నాయి? (6) ఆకాశ స్వరూపముయొక్క ‘మహిమ’’ ఎవ్వరిది? |
ఏతదహం శ్రోతుమిచ్ఛామి నాన్యో జానాతి త్వం బ్రూహి బ్రహ్మన్ . |
|
ఏతత్ అహగ్ం శ్రోతుం ఇచ్ఛామి। న అన్యో జానాతి। త్వం బ్రూహి, బ్రహ్మన్!’’ |
స్వామీ! స్వయంభూ! బ్రహ్మదేవా! ఈఈ విశేషాల వివరణలు మేము శ్రవణం చేయతలచి మిమ్ములను శరణువేడుచున్నాము. ఈఈ విశేషాలు మీరు మాత్రమే ఎరిగియున్నారు. అందుచేత దయతో మీరే వివరించి బోధించ ప్రార్థన. |
స్వయంభూరువాచ కృత్స్నజగతాం మాతృకా విద్యా ద్విత్రివర్ణసహితా ద్వివర్ణమాతా |
|
2. స్వయంభూః ఉవాచ : కృత్స్న జగతాం మాతృకా విద్యా ద్వి - త్రి వర్ణ సహితా। ద్వివర్ణ మాత్రా। (ద్వివర్ణమాతా)। |
బ్రహ్మదేవుడు : ఈ జగత్తుయొక్క ఉత్పత్తిని వివరించే ‘మాతృకావిద్య’ రెండు - మూడు వర్ణములతో కూడి ఉన్నది. రెండు వర్ణములైన మాతృకలు, మూడు వర్ణములతో కూడినది, ‘నాలుగు’ తీరులైన చాతుర్మాత్రాత్మ ఏకము - అగు ‘ఓం’ కార రూపిణియే అయి ఉన్నది. నాకు కూడా ప్రాణాత్మకమైన దేవత- ఆ మాతృకా విద్యయే. |
త్రివర్ణసహితా . చతుర్మాత్రాత్మకోంకారో మమ ప్రాణాత్మికా దేవతా . అహమేవ జగత్త్రయస్యైకః పతిః . మమ వశాని సర్వాణి యుగాన్యపి . |
|
త్రివర్ణ ఉపేతా। చతుర్మాత్రాత్మక- ‘ఓం’ కార రూపిణీ। మమ ప్రాణాత్మికా దేవతా। అహమేవ జగత్ - త్రయైకః పతిః। మమ వశాని సర్వాణి యుగాన్యపి। |
1) ‘‘అ-మ’’ ద్వివర్ణాత్మకము 2) ‘‘అ-ఉ-మ’’ త్రివర్ణాత్మకము 3) ‘‘అ-ఉ-మ-హంస’’ చాతుర్మాత్రాత్మకము (భూ-స్వర్గ-పాతాళ) త్రిజగత్తులకు ఏకైక పతిని, ప్రభువును నేనే। యుగములన్నీ నాకు వశమై (Under my control) ఉంటున్నాయి. |
అహోరాత్రాదయో మత్సంవర్ధితాః కాలాః . మమ రూపా రవేస్తేజశ్చంద్రనక్షత్రగ్రహతేజాంసి చ . గగనో మమ త్రిశక్తిమాయాస్వరూపః |
|
అహోరాత్రాదయో మత్ సంవర్ధితాః। కాలాః మమరూపం। రవేః తేజః చంద్ర నక్షత్ర గ్రహ తేజాంసి చ, గగనో - మమ త్రిశక్తి మాయా స్వరూపః। |
రాత్రి-పగలు-అనేవి నాచే వృద్ధి చేయబడుచున్నట్టి, నాయొక్క కాలస్వరూపము. సూర్యతేజస్సు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, ఆకాశము - మొదలైనవన్నీ కూడా నాయొక్క మాయాస్వరూపమై ఆకాశమున వెలయుచున్నాయి. |
నాన్యో మదస్తి . తమోమాయాత్మకో రుద్రః సాత్వికమాయాత్మకో విష్ణూ రాజసమాయాత్మకో బ్రహ్మా . ఇంద్రాదయస్తామసరాజసాత్మికా న సాత్వికః కోఽపి అఘోరః సర్వసాధారణస్వరూపః . |
|
నాన్యో మత్ - అస్తి। (నాన్యో మదస్తి)। - తమో మాయాత్మకో రుద్రః। - సాత్త్విక మాయాత్మకో విష్ణుః। - రాజస మాయత్మకో బ్రహ్మా। - ఇంద్రాదయః తామస రాజసాత్మికాః। న సాత్త్వికః కో౽పి। - అఘోరః సర్వసాధారణ స్వరూపః। |
ఎక్కడా ఏదీ కూడా నాకు వేరుగా ఏమాత్రము లేదు. రుద్రుడు తమో మాయాత్మకుడు. విష్ణువు - సాత్త్విక మాయాత్మకుడు. బ్రహ్మయో - రాజస మాయాత్మకుడు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా తామస - రాజసాత్మకులు. కేవల సాత్త్విక రూపుడు ఎవరూ లేరు. (ప్రకృతిలో ఉండరు). అఘోరము (సూక్ష్మరూపము) - సర్వ సాధారణ స్వరూపమైయున్నది. (స్థూలమంతా సూక్ష్మరూప ప్రదర్శనమే). |
సమస్తయాగానాం రుద్రః పశుపతిః కర్తా . రుద్రో యాగదేవో విష్ణురధ్వర్యుర్హోతేంద్రో దేవతా యజ్ఞభుగ్ |
|
సమస్త యాగానాం → రుద్రః పశుపతిః → కర్తా। రుద్రో → యాగ దేవః। విష్ణుః → అధ్వర్యుః। హోతా → ఇంద్రః। దేవతా → యజ్ఞభుక్। |
సమస్త యాగములకు - పశుపతి యగు రుద్రుడు → కర్త। రుద్రుడు → యాగదేవుడు। విష్ణువు → ఆధ్వర్యుడు (యజ్ఞమునందు మంత్ర విధానము నడుపువాడు)। ఇంద్రుడు → హోత (ఋక్కులు తెలిసిన ఋత్విక్కు, హోమము చేయువాడు)। దేవతలు → యజ్ఞభోక్తలు। |
మానసం బ్రహ్మ మాహేశ్వరం బ్రహ్మ మానసం హంసః సోఽహం హంస ఇతి . |
|
మానసం → బ్రహ్మ। మాహేశ్వరం → బ్రహ్మ। మానసగ్ం → హగ్ంసః। సో౽హగ్ం → ‘హగ్ంస’ ఇతి। |
బ్రహ్మ → మానసము (మనోరూపము)। బ్రహ్మ → మహేశ్వరుడు। హంస → మానసము। హంస → సో౽హమ్। |
తన్మయయజ్ఞో నాదానుసంధానం . తన్మయవికారో జీవః . పరమాత్మస్వరూపో హంసః . |
|
తన్మయ → యజ్ఞో నాదానుసంధానమ్। తన్మయ వికారో → జీవః। పరమాత్మ స్వరూపో → హగ్ంసః। |
తన్మయ (తత్ - మయ) → యజ్ఞము యొక్క నాదానుసంధానము తన్మయ వికారమే → ఈ జీవుడు। ‘హంస’ యే సో౽హమ్। అదియే పరమాత్మ స్వరూపము. |
అంతర్బహిశ్చరతి హంసః . అంతర్గతోఽనకాశాంతర్గతసుపర్ణస్వరూపో హంసః . |
|
3. అంతర్బహిః చరతి హగ్ంసః। అంతర్గతో - అనవకాశాంతర్గత సువర్ణ స్వరూపో హగ్ంసః। |
హంసయే - బాహ్య అభ్యంతరములలో చరించునది. సమస్తమునకు అంతర్గతము. ఆకాశ - అనవకాశములకు కూడా అంతర్గతుడు ఎవరు? సువర్ణ స్వరూపుడగు ‘హంస’ యే! |
షణ్ణవతితత్త్వతంతువద్వ్యక్తం చిత్సూత్రత్రయచిన్మయలక్షణం నవతత్త్వత్రిరావృతం |
|
షణ్ణవతి (96) తత్త్వ తంతువత్ వ్యక్తమ్। చిత్ సూత్రత్రయ ‘‘చిన్మయలక్షణమ్’’। నవతత్త్వ ‘‘త్రిరావృతమ్’’। |
అట్టి కేవలమగు హంస - ‘96’ తత్త్వములతో - తంతువువలె (తామర తూడు దారమువలె) ‘వ్యక్తము’ (Manifested) అగుచున్నది. చిత్ సూత్రత్రయముతో 3 సూత్రములతో (ఎరుగువాడు - ఎరుక - ఎరుగబడునదిలతో) కూడి ‘హంస’ చిన్మయలక్షణుడు. నవ తత్త్వములతో (నవ-ఆత్మగుణములు జ్ఞాన , సుఖ, దుఃఖ, ఇచ్ఛా ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారములతో), మూడు పేటలతో (సత్వ-రజో-తమములతో) హం - త్రిరావృతమై- ఏర్పడి ఉంటోంది. |
బ్రహ్మవిష్ణుమహేశ్వరాత్మకమగ్నిత్రయకలోపేతం |
|
బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమ్। అగ్నిత్రయ కళోపేతమ్। |
‘హంస’ ఇంకా కూడా, - బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకము (సృష్టి - స్థితి - లయాత్మికము). (అహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అనబడు) త్రయాగ్నులు తనయొక్క కళలుగా (యజ్ఞమునందు) కలిగి ఉన్నట్టిది. |
చిద్గ్రంథిబంధనం . అద్వైతగ్రంథిః |
|
‘చిత్’ గ్రంథి బంధనమ్। అద్వైత గ్రంథిః। |
చిత్ (ఎరుక - ఎరుగువాడు - ఎరుగబడునది) అనబడు గ్రంథులచే (ముడులచే) బంధనము కలిగి ఉంటోంది. (జీవాత్మ పరమాత్మల పరస్పర అద్వితీయత్వము అనే) అద్వైత గ్రంథి కలిగి ఉన్నట్టిది కూడా. |
యజ్ఞసాధారణాంగం బహిరంతర్జ్వలనం |
|
యజ్ఞ సాధారణాంగమ్। బహిరంతః జ్వలనమ్। |
ఈ విశ్వమంతా తనయొక్క యజ్ఞరూపముగా సాధారణమైన అంగముగా కలిగి ఉన్నట్టిది - హంస। బాహ్య - అభ్యంతరములుగా వెలుగొందుచున్నట్టిది - హంస. |
యజ్ఞాంగలక్షణబ్రహ్మస్వరూపో హంసః . ఉపవీతలక్షణసూత్రబ్రహ్మగా యజ్ఞాః . |
|
యజ్ఞాంగ లక్షణ - బ్రహ్మస్వరూపో హగ్ంసః। ఉపవీత లక్షణ సూత్ర బ్రహ్మగా యజ్ఞాః। |
హంసయే [అత్మయే (లేక) బ్రహ్మమే] - ఈ సమస్తమును తన స్వరూపముగా కలిగి, యజ్ఞాంగములు తన లక్షణములుగా కలిగి ఉన్నట్టిది. ‘యజ్ఞము’ - సూత్రబ్రహ్మగతమై ఉపవీత లక్షణములు కలిగి ఉన్నట్టిది. |
బ్రహ్మాంగలక్షణయుక్తో యజ్ఞసూత్రం . తద్బ్రహ్మసూత్రం . యజ్ఞసూత్రసంబంధీ బ్రహ్మయజ్ఞః . |
|
బ్రహ్మాంగ లక్షణయుక్తో - యజ్ఞసూత్రమ్। తత్ బ్రహ్మసూత్రమ్, యజ్ఞసూత్ర సంబంధీ - బ్రహ్మయజ్ఞః। |
యజ్ఞసూత్రము: బ్రహ్మము యొక్క ద్రష్ట - దర్శన - దృశ్య - దృక్ బ్రహ్మాంగలక్షణముల- సంజ్ఞ. అదియే (తత్త్వరూపమే) బ్రహ్మ సూత్రము ‘యజ్ఞసూత్ర’ సంబంధముగా ‘బ్రహ్మయజ్ఞము’ అనబడుతోంది. |
తత్స్వరూపోఽఙ్గాని మాత్రాణి మనో యజ్ఞస్య హంసో యజ్ఞసూత్రం . |
|
తత్స్వరూపః। అంగాని మాత్రాణి। మనోయజ్ఞస్య హగ్ంసో - యజ్ఞసూత్రమ్। |
అద్దాని అంగములు - శబ్ద స్పర్శ రూప రస గంథములనబడే పంచ తన్మాత్రలు. మనస్సుతో చేసే మనో యజ్ఞమునకు హంస (సో౽హమ్) యే యజ్ఞ సూత్రము. |
ప్రణవం బ్రహ్మసూత్రం బ్రహ్మయజ్ఞమయం . ప్రణవాంతర్వర్తీ హంసో బ్రహ్మసూత్రం . |
|
ప్రణవం బ్రహ్మసూత్రం బ్రహ్మయజ్ఞమయమ్। ప్రణవ - అంతర్వర్తీ హగ్ంసో - ‘‘బ్రహ్మసూత్రమ్।’’ |
‘ఓం’ (అ+ఉ+మ+హంస) అను ప్రణవము - బ్రహ్మ యజ్ఞమునందు బ్రహ్మసూత్రము. ప్రణవ - అంతర్వర్తి (అంతరంగా వర్తించునది) అగు హంసయే (సో౽హమ్‌యే) - బ్రహ్మసూత్రము. |
తదేవ బ్రహ్మయజ్ఞమయం మోక్షక్రమం . బ్రహ్మసంధ్యాక్రియా మనోయాగః . సంధ్యాక్రియా మనోయాగస్య లక్షణం . |
|
తదేవ బ్రహ్మయజ్ఞమయమ్। మోక్షక్రమమ్। బ్రహ్మసంధ్యా క్రియా, మనో యాగః। ‘సంధ్యాక్రియా’ మనోయాగస్య లక్షణమ్। |
- ఇవన్నీ ‘‘బ్రహ్మసంధ్యా క్రియలు’’. ‘‘మనో యాగము’’. బ్రహ్మయజ్ఞమయ విశేషములు. మోక్షమునకు క్రమ విధానము. మనో యాగము యొక్క లక్షణ విశేషమే ‘‘సంధ్యాక్రియ’’. |
యజ్ఞసూత్రప్రణవబ్రహ్మయజ్ఞక్రియాయుక్తో బ్రాహ్మణః . బ్రహ్మచర్యేణ హరంతి దేవాః . |
|
యజ్ఞసూత్ర ప్రణవ బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తో బ్రాహ్మణః। బ్రహ్మచర్యేణ చరంతి దేవాః।। |
యజ్ఞసూత్రము, ప్రణవోపాసన, బ్రహ్మయజ్ఞము - అను క్రియలు - ‘బ్రాహ్మణము’ - అనబడుచున్నాయి. నిర్వర్తించువారు బ్రాహ్మణులు. దేవతలు బ్రహ్మమునందు ఆచరణ కలిగి ఉన్నారు. |
హంససూత్రచర్యా యజ్ఞాః . హంసప్రణవయోరభేదః . |
|
4. హగ్ంస సూత్రచర్యా యజ్ఞాః। హంస - ప్రణవయోః అభేదః। |
‘హంస’ (ఆత్మ, సో౽హమ్) యొక్క సూత్ర (Indicative) చర్యలు ‘‘యజ్ఞములు’’. హంస, ప్రణవము అభేదమైనవి. ఏకరూపము కలిగినట్టివి. |
హంసస్య ప్రార్థనాస్త్రికాలాః . త్రికాలస్త్రివర్ణాః . |
|
హంసస్య ప్రార్థనాః త్రికాలాః। త్రికాలాః త్రివర్ణాః। |
హంసయొక్క ప్రార్థనా రూపములే త్రికాలములు. త్రికాలములు (భూత-వర్తమాన- భవిష్యత్ కాలములు) ఆత్మకు త్రివర్ణములు (3 రంగులు) వంటివి. |
త్రేతాగ్న్యనుసంధానో యాగః . త్రేతాగ్న్యాత్మాకృతివర్ణోంకారహంసానుసంధానోఽన్తర్యాగః . |
|
త్రేతాగ్ని (గ్న్యన్) అనుసంధానో యాగః। త్రేతాగ్న్య ఆత్మాకృతి వర్ణ ‘ఓం’ కార హగ్ంస అనుసంధానో అంతర్యాగః। |
(గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అనబడు) త్రేతాగ్నుల (అగ్నిత్రయము యొక్క) అనుసంధానమే ‘యాగము’. (త్రైతాగ్నులైనట్టి జీవాత్మ, ఈశ్వరుడు, పరమాత్మల) - త్రైతాగ్నుల ఏకాత్మకృతి వర్ణనయే ‘ఓంకారము’. అట్టి త్రేతాగ్నుల ఆత్మకృతి వర్ణము - ఓంకారముతో అనుసంధానమే ‘అంతర్యాగము’. |
చిత్స్వరూపవత్తన్మయం తురీయస్వరూపం . |
|
చిత్ - స్వరూప సత్ తన్మయం తురీయ స్వరూపమ్। |
చిత్ స్వరూపముతో కూడిన సత్-తన్మయమే ‘‘తురీయస్వరూపము’’ (జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షి అయి, ఆ మూడిటిని సంచార స్థానములుగా కలిగి ఉన్నట్టిది - ‘తురీయము’). |
అంతరాదిత్యే జ్యోతిఃస్వరూపో హంసః . యజ్ఞాంగం బ్రహ్మసంపత్తిః . బ్రహ్మప్రవృత్తౌ తత్ప్రణవహంససూత్రేణైవ ధ్యానమాచరంతి . |
|
అంతరాదిత్యే జ్యోతిస్స్వరూపో హగ్ంసః। యజ్ఞాంగం బ్రహ్మ సంపత్తిః। బ్రహ్మ ప్రవృత్తౌ తత్ ప్రణవహంస సూత్రేణైవ ధ్యానమ్ ఆచరంతి। |
అంతర్గమైయున్న ఆదిత్యుని జ్యోతి స్వరూపమే ‘హంస’. బ్రహ్మసంపత్తియే (బ్రహ్మతత్త్వజ్ఞానమే) యజ్ఞములో ముఖ్యమైన సంపత్తి. (సంపదా విశేషము). ప్రణవము (ఓంకారము) ధ్యానించేడప్పుడు అది బ్రహ్మసంపత్తికి సూత్రముగా ధ్యానిస్తూ, బ్రహ్మభావనయే ఆచారణగా కలిగి ఉండటము- ‘‘బ్రహ్మ ప్రవృత్తి’’. |
ప్రోవాచ పునః స్వయంభువం ప్రతిజానీతే బ్రహ్మపుత్రో ఋషిర్వాలఖిల్యః . హంససూత్రాణి కతిసంఖ్యాని కియద్వా ప్రమాణం . |
|
ప్రోవాచ పునః స్వయంభువం: ప్రతిజానీతే బ్రహ్మపుత్రో, ఋషిః వాలఖిల్యః : హంససూత్రాణి కతిసంఖ్యాని? కియద్వా ప్రమాణమ్? |
ఇంకా బ్రహ్మ మానసపుత్రుడగు వాలఖిల్యమహర్షి - స్వయంభువు, ప్రజాపతి అగు బ్రహ్మదేవుల వారిని ఈవిధంగా అడిగారు. హంస సూత్రములు ఎన్ని? దానికి ప్రమాణము ఏమిటి? |
హృద్యాదిత్యమరీచీనాం పదం షణ్ణవతిః . చిత్సూత్రఘ్రాణయోః స్వర్నిర్గతా ప్రణవధారా షడంగులదశాశీతిః . |
|
(స్వయంభువౌవాచ): హృత్ ఆదిత్య మరీచీనాం పదం షణ్ణవతిః (96)। చిత్ సూత్ర ఘ్రాణయో, స్వర నిర్గతా, ప్రణవధారా షట్ (6) అంగుళదళా అశీతిః। |
శ్రీ స్వయంభువు ఈ విధంగా వివరించారు. ‘‘హృదయము’’ అనే సూర్యుని యొక్క కిరణములు (ప్రసరణ స్థానములు) - ‘96’. చిత్ సూత్రము - అనే ఘ్రాణము (వాయుసంచలము) యొక్క స్వర నిర్గతమైన ప్రణవాధారములు ‘6’ అంగుళముల విస్తీర్ణతతో ‘80’ దళములు. |
వామబాహుర్దక్షిణకఠ్యోరంతశ్చరతి హంసః పరమాత్మా బ్రహ్మగుహ్యప్రకారో నాన్యత్ర విదితః . |
|
వామబాహు దక్షిణకట్యోః అంతశ్చరతి హగ్ంసః పరమాత్మా। బ్రహ్మ గుహ్య ప్రకారో న అన్యత్ర విదితః। |
ఎడమ భుజమునకు - కుడికంటికి (కుడి మొల ప్రదేశమునకు) మధ్యగా హంసరూపుడగు పరమాత్మ సంచారము కలిగి ఉన్నారు. ‘‘బ్రహ్మగుహ్యప్రకారమును’’ (బ్రహ్మతత్త్వ రహస్యమును) అనుసరించి ‘అన్యత్ర’ తెలియబడడంలేదు. (ఆత్మ అనన్యము, ఆత్మకు వేరుగా ఏదీ లేదు). |
జానంతి తేఽమృతఫలకాః . సర్వకాలం హంసం ప్రకాశకం . |
|
యే జానంతి, తే అమృతఫలకాః। సర్వకాలగ్ం హంస ప్రకాశకమ్। |
‘‘ఆత్మకు వేరుగా ఏదీ లేదు’’ అను అనన్యత్వమును ఎరిగినవారు అమృత ఫలము పొందినవారగుచున్నారు. (త్రికాలములు అనబడే) సర్వ కాలములందు హంస (ఆత్మ) ఈ సమస్తముగా ప్రకాశమానమై ఉన్నది. |
ప్రణవహంసాంతర్ధ్యానప్రకృతిం వినా న ముక్తిః . నవసూత్రాన్పరిచర్చితాన్ . తేఽపి యద్బ్రహ్మ చరంతి . అంతరాదిత్యే న జ్ఞాతం మనుష్యాణాం . |
|
ప్రణవ హంసా అంతర్థ్యాన ప్రకృతిం వినా న ముక్తిః। నవ సూత్రాన్ పరిచర్చితాన్। తే౽పి యత్ బ్రహ్మ చరంతి, అంతరాదిత్యం న జ్ఞాతం మనుష్యాణామ్। |
ప్రణవ హంస (The Comprehensive Self of every self) - యొక్క అంతరధ్యానముగా సమస్త ప్రకృతిని దర్శించటమునకు వేరుగా ‘ముక్తి’కి నిర్వచనము లేదు. సమస్తము స్వస్వరూపాత్మగా అనునిత్యము సందర్శించటమే ‘ముక్తి’. మరొకటేదీ కాదు. ఎవరైతే నవ (9) సూత్రములను పరిచర్చించి ఇది ఎరుగుచున్నారో, అట్టి వారు స్వాభావికముగా బ్రహ్మమునందు చరించుచున్న వారగుచున్నారు. మానుష (ఇంద్రియ పరిమిత, దృశ్య పరిమిత) దృష్టిచే అంతరాదిత్యుని (అంతర సూర్యుడగు ఆత్మను) ఎరుగజాలకున్నారు. |
జగదాదిత్యో రోచత ఇతి జ్ఞాత్వా తే మర్త్యా విబుధాస్తపన ప్రార్థనాయుక్తా ఆచరంతి . |
|
‘‘జగదాదిత్యో రోచత’’ ఇతి। జ్ఞాత్వా తే మర్యా విబుధాః। తపన ప్రార్ధనాయుక్తా ఆచరంతి। |
‘‘ఈ జగత్తు అంతరాదిత్యుని (ఆత్మ పురుషుని) రుచికర ప్రదర్శనము’’ - అని ఎరిగినవారు విభుదులై (తెలివి కలవారై), ఆత్మయందే ప్రార్థనాయుక్తమైన తపన (తపస్సు)ను ఆచరిస్తూ ఉంటారు. |
వాజపేయః పశుహర్తా అధ్వర్యురింద్రో దేవతా అహింసా ధర్మయాగః పరమహంసోఽధ్వర్యుః |
|
5. వాజపేయః పశుకర్తా - ఆధ్వర్యుః। ఇంద్రో - దేవతా। అహిగ్ంసా - ధర్మయాగః పరమ హగ్ంసో అధ్వర్యుః। |
వాజపేయ ఆత్మయజ్ఞము నందు, ఇంద్రియ పశువులను పాలించు పశుకర్త (పశుపతి)యే - ఆధ్వర్యుడు. (యజుర్వేద మంత్రాలు చదువువాడు). ఇంద్రుడు - దేవత. అహింసయే - ధర్మయాగము. పరమహంసయే - ఆధరువ్యుడు. (సో౽హమ్ పరమమ్ ‘‘కేవలమగు నేనే నేను’’ అనునదే పరమహంస స్థితి). |
పరమాత్మా దేవతా పశుపతిః బ్రహ్మోపనిషదో బ్రహ్మ . స్వాధ్యాయయుక్తా బ్రాహ్మణాశ్చరంతి . |
|
పరమాత్మా దేవతా - పశుపతిః। బ్రహ్మోపనిషదో బ్రహ్మ। స్వాధ్యాయ యుక్తా - బ్రాహ్మణాః చరంతి। |
పరమాత్మయే - పశుపతి దేవత. (ఇంద్రియములకు నియామకుడు, అధినేత). బ్రహ్మోపనిషత్తులు - బ్రహ్మ. బ్రాహ్మణులు - బ్రహ్మము గురించిన స్వాధ్యాయయుక్తులుగా చరించు వారు. (బ్రహ్మము గురించి అధ్యయనముచేస్తూ, ఎలుగెత్తి గానము ప్రకటించువారు). { హోత = ఋగ్వేద మంత్రములు చదువు వారు. ఉద్గాత = సామవేదమంత్రాలను గానం చేయువాడు. ఆధ్వర్యుడు = యజుర్వేద వేదమంత్రాలను ఉచ్ఛరించువాడు. బ్రహ్మ = అథర్వణ వేదమంత్రాలను పలుకువారు. (ఆధ్వర్యుడు ముఖ్యుడు. యజ్ఞము మొత్తాన్ని ఏ పొరపాటు లేకుండా జరిపించువారు) ఋత్విక్కులు = యజ్ఞములోని తక్కిన అనేక కార్యక్రమములు నడిపించు వారు. [ ఉదా: అగ్నిధ్రుడు, ప్రతిప్రస్థాత, నేష్ట, ఉపద్రష్ట మొదలైనవారు ] } |
అశ్వమేధో మహాయజ్ఞకథా . తద్రాజ్ఞా బ్రహ్మచర్యమాచరంతి . |
|
అశ్వమేధో → మహాయజ్ఞ కథా। తద్రాజ్ఞా (తత్ రాజ్ఞా) బ్రహ్మచర్యమ్ ఆచరంతి। |
‘‘అశ్వమేధము’’ - అనునది మహాయజ్ఞ కథా సంవిధానముగా మనము చెప్పుకొంటున్నాము. అశ్వమేథము నిర్వర్తించు రాజు బ్రహ్మచర్యము ఆచరించటమును (అశ్వము ఆత్మజ్ఞానముగాను, విధానము మనోఅశ్వ సంచార విజయముగాను) ఎరుగుదురు గాక। |
సర్వేషాం పూర్వోక్తబ్రహ్మయజ్ఞక్రమం ముక్తిక్రమమితి |
|
సర్వేషాం పూర్వోక్త బ్రహ్మయజ్ఞక్రమం ముక్తిక్రమమ్ ఇతి। |
‘‘బ్రహ్మయజ్ఞము’’ అని (వేద వాఙ్మయంలో) వివరించబడుచున్నదంతా ‘క్రమముక్తి’ విధానము. |
బ్రహ్మపుత్రః ప్రోవాచ . ఉదితో హంస ఋషిః . స్వయంభూస్తిరోదధే . రుద్రో బ్రహ్మోపనిషదో హంసజ్యోతిః పశుపతిః |
|
బ్రహ్మపుత్రః - ప్రోవాచ। ఉదితో హగ్ంస ఋషిః। స్వయంభూః తిరోదధే రుద్రోపనిషదో హగ్ంస జ్యోతిః పశుపతిః। |
పూర్వోక్తమైన బ్రహ్మయజ్ఞక్రమము ముక్తిప్రదమని పలుకుచు, బ్రహ్మ మానస పుత్రులకు బ్రహ్మదేవుడు ఇంకా చెప్పసాగారు. హంసఋషి ఉదయించగానే స్వయంభువు తిరోధానము (అంతర్థానము) అగుచున్నాడు. అనగా, సృష్టి క్రమమంతా కల్పిత మాత్రమే అగుచున్నది, సృష్టి, సృష్ట్యనుభవము కూడా కల్పితమాత్ర అసహజ సత్యముగా తెలియవస్తున్నది. ‘రుద్రోపనిషత్‘లో వరిణాంచబడిన హంస జ్యోతియే పశుపతి। |
ప్రణవస్తారకః స ఏవం వేద . హంసాత్మమాలికావర్ణబ్రహ్మకాలప్రచోదితా . |
|
ప్రణవః తారకః। స ఏవం వేద హగ్ంసాత్మ మాలికావర్ణ బ్రహ్మకాల ప్రచోదితా। |
ప్రణవము (అ+ఉ+మ = ఓం) - తారకము (తరింపజేయునది). ఈవిధంగా ఎవడు తెలుసుకుంటాడో అట్టివాడు -‘హంసాత్మక మాలికావర్ణ బ్రహ్మకాల ప్రచోదితుడు’ అగుచున్నాడు. |
పరమాత్మా పుమానితి బ్రహ్మసంపత్తికారిణీ .. 1.. అధ్యాత్మబ్రహ్మకల్పస్యాకృతిః |
|
పరమాత్మా పుమాన్ ఇతి। బ్రహ్మసంపత్తి కారిణీ। అధ్యాత్మ బ్రహ్మకల్పస్య ఆకృతిః। |
పరమాత్మయే పురుషుడు। బ్రహ్మసంపత్తి (ప్రకృతియే) సమస్తమునకు కారణము. అధ్యాత్మము - బ్రహ్మకల్పన’కు ఆకారము (ఆకృ |
కీదృశీ కథా . బ్రహ్మజ్ఞానప్రభాసంధ్యాకాలో గచ్ఛతి ధీమతాం . హంసాఖ్యో దేవమాత్మాఖ్యమాత్మతత్త్వప్రజా కథం .. 2.. |
|
కీదృశీ, కథా బ్రహ్మజ్ఞాన ప్రభా సన్ధ్యాకాలో గచ్ఛతి ధీమతామ్? హంసాఖ్యో దేవమ్। ఆత్మాఖ్యమ్। ఆత్మతత్త్వ ప్రజాకథమ్। |
అట్టి ఆధ్యాత్మము ఏవిధంగా కనబడుచున్నది? ధీమంతులు సంధ్యాకాలము ప్రవేశించి బ్రహ్మజ్ఞాన ప్రభ ఏమని పొందారు? ‘హంసాఖ్యుడు’ అనే ఆయన [ (లేక) హంస-సోహం అధ్యయనుడు ] ప్రజాకథనమగు ఆత్మతత్త్వ దేవుని కథను (కథనమును) (తమ తపస్సు ద్వారా) ఎరిగి లోకమునకు చాటిచెప్పారు. ‘హంస’యే దేవత. హంసయే ‘ఆత్మ’ గురించిన వివరణ. హంసయే ఆత్మతత్త్వ ప్రజా కథనము. |
అంతఃప్రణవనాదాఖ్యో హంసః ప్రత్యయబోధకః . అంతర్గతప్రమాగూఢం జ్ఞాననాలం విరాజితం .. 3.. |
|
అంతః ప్రణవ నాదాఖ్యో హంసః ప్రత్యయ బోధకః। ‘అంతర్గత ప్రమా’ గూఢం జ్ఞాననాళం విరాజితమ్। |
అంతరములోని ప్రణవనాదాఖ్యుడే (Inner voice expressor) హంస - ప్రత్యయ బోధకుడు. అంతర్గత (కేవల) బుద్ధియందు రహస్యముగా (గూఢముగా) ప్రకాశించు చున్నట్టిది, జ్ఞాన నాళములో విరాజిల్లుచున్నట్టిది - హంస (జీవాత్మ). |
శివశక్త్యాత్మకం రూపం చిన్మయానందవేదితం . నాదబిందుకలా త్రీణి నేత్రం విశ్వవిచేష్టితం .. 4.. |
|
శివ శక్త్యాత్మకం రూపం చిన్మయానంద వేదితమ్। ‘నాద బిందు కళా’ త్రీణి నేత్రం విశ్వ విచేష్టితమ్।। |
శివ - శక్త్యాత్మకరూపమే - పురుష ప్రకృతి, చిన్మయానందముగా (I & My) తెలియబడుతోంది. అట్టి చిన్మయానందము ‘‘నాద-బిందు-కళలు’’ (Sound, Pin and Art) అనే త్రినేత్రములతో విశ్వముగా నిర్మితమై ప్రదర్శితమై యున్న |
త్రియంగాని శిఖా త్రీణి ద్విత్రాణాం సంఖ్యమాకృతిః . అంతర్గూఢప్రమా హంసః ప్రమాణాన్నిర్గతం బహిః .. 5.. |
|
6. త్రియంగాని, శిఖా త్రీణి, ద్విత్రాణాం సాంఖ్యమ్ ఆకృతిః। అంతర్గూఢ ‘ప్రమా’ హంసః ప్రమాణాత్ నిర్గతం బహిః। |
సాంఖ్యము (జ్ఞానవిచారణ) కు త్రి అంగములు (జగత్ స్వప్న సుషుప్తులు), (జగత్-జీవ ఈశ్వరులనబడే) త్రిశిఖలు. ‘‘2-3’’- ఆకృతులు ఉంటోంది. అంతర్గూఢంగా గల ‘ప్రమ’’ (యదార్థమగు ఆత్మ)యే ‘‘హంస’’. అట్టి అంతర్గూఢాత్మయే ప్రమాణము (As an appearance)గా జగత్తు అయి బహిర్గతమౌతోంది. |
బ్రహ్మసూత్రపదం జ్ఞేయం బ్రాహ్మం విధ్యుక్తలక్షణం . హంసార్కప్రణవధ్యానమిత్యుక్తో జ్ఞానసాగరే .. 6.. ఏతద్విజ్ఞానమత్రేణ జ్ఞానసాగరపారగః . |
|
బ్రహ్మసూత్రపదం జ్ఞేయం బ్రాహ్మ్యం విధ్యుక్త లక్షణమ్। హంసాఖ్య ప్రణవ ధ్యానమ్ ఇత్యుక్తో జ్ఞానసాగరే। ఏతత్ విజ్ఞానమాత్రేణ జ్ఞాన సాగర పారగః। |
‘‘ఈ సమస్తము బ్రహ్మము యొక్క విధ్యుక్త లక్షణ విశేషమే’’ - (All this is the duly exhibited quality of Brahman) - అను అవగాహనయే బ్రహ్మ సూత్ర పదము. హంసాఖ్యమైన ప్రణవ ధ్యానమే (ఆత్మ) జ్ఞానసాగరముగా చెప్పబడుతోంది. ఈ మాత్రము తెలుసుకున్నంత మాత్రం చేత ఈ జీవుడు జ్ఞానసాగర పారగుడు అగుచున్నాడు. |
స్వతః శివః పశుపతిః సాక్షీ సర్వస్య సర్వదా .. 7.. సర్వేషాం తు మనస్తేన ప్రేరితం నియమేన తు . విషయే గచ్ఛతి ప్రాణశ్చేష్టతే వాగ్వదత్యపి .. 8.. |
|
స్వతశ్శివః పశుపతిః సాక్షీ, సర్వస్య సర్వదా సర్వేషాం తు మనః తేన ప్రేరితం నియమేన తు। విషయే గచ్ఛతి ప్రాణః చేష్టతే వాక్ - వదత్యపి। |
ఈ జీవుడు స్వతఃగా శివుడే. శివతత్త్వమ్। శివో౽హమ్। అట్టి పశుపతియే కేవల సాక్షి. ఆ స్వతఃశివుడగు పశుపతి చైతన్యమే సర్వ దేహములలో, సమస్త జీవులయొక్క మనోరూపమై నియమానుసారంగా సమస్త జీవులను ప్రేరితము (Inspired) చేయుచున్నది. ప్రాణము ఇంద్రియ విషయములవైపుగా వెళ్లుచున్నది. వాక్కు మాట్లాడు చేష్ట కలిగి ఉంటోంది. |
చక్షుః పశ్యతి రూపాణి శ్రోత్రం సర్వం శృణోత్యపి . అన్యాని కాని సర్వాణి తేనైవ ప్రేరితాని తు .. 9.. |
|
చక్షుః పశ్యతి రూపాణి శ్రోత్రం సర్వం శృణోత్యపి, అన్యాని ఖాని సర్వాణి తేనైవ ప్రేరితాని తు। |
కళ్లు రూపములను చూస్తూ ఉన్నది. చెవులు సమస్త శబ్దాలను వింటూ ఉన్నది. అట్లాగే సమస్త ఇంద్రియములు ప్రాణశక్తిచేతనే ప్రేరణపొందు చున్నాయి. విషయముల కల్పనచే జగత్తుగా అనుభవము పొందుచున్నాయి. ప్రాణేశ్వరుని ప్రాణశక్తి ప్రేరణయే ఇదంతా! |
స్వం స్వం విషయముద్దిశ్య ప్రవర్తంతే నిరంతరం . ప్రవర్తకత్వం చాప్యస్య మాయయా న స్వభావతః .. 10.. |
|
స్వం స్వం విషయం ఉద్దిశ్య ప్రవర్తంతే నిరంతరమ్। ప్రవర్తకత్వంచాపి అస్య మాయయా, న స్వభావతః। |
ఆవిధంగా ఇంద్రియములన్నీ కూడా వాటి వాటి విషయముల గురించి నిరంతరము (ప్రాణశక్తివలన) ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. ఏ జీవుడైతే అట్టి ఇంద్రియములతో, విషయముల పట్ల ప్రవర్తకుడై ఉన్నాడో అదంతా ‘మాయ’ చేతనే. అంతేగాని, ఇంద్రియ విషయాను సంధానము - అనేది ఈ జీవుని సహజస్వభావము కాదు. (ఆత్మత్వమే సహజ స్వభావము). |
శ్రోత్రమాత్మని చాధ్యస్తం స్వయం పశుపతిః పుమాన్ . |
|
శ్రోత్రమ్ ఆత్మని చ అధ్యస్తం। స్వయం పశుపతిః పుమాన్। |
వినికిడి (Hearing) అనునది అధ్యస్తము (Inner Placed) అయి ఉన్నది - ఆత్మయందే. ఇక ఈ పురుషుడు (జీవుడు) స్వయముగా పశుపతి (శివ) స్వరూపుడే. |
అనుప్రవిశ్య శ్రోత్రస్య దదాతి శ్రోత్రతాం శివః .. 11.. మనః స్వాత్మని చాధ్యస్తం ప్రవిశ్య పరమేశ్వరః . |
|
అనుప్రవిశ్య శ్రోత్రస్య దదాతి శ్రోత్రతాం శివః। మనః స్వాత్మని చ అధ్యస్తం ప్రవిశ్య పరమేశ్వరః। |
తన చమత్కారమగుశక్తిచే శివుడు శ్రోత్రమును అనుసరించినవాడై చెవులకు వినికిడి (Hearing)ని ప్రసాదిస్తున్నారు. వినబడు విషయములు కూడా శివచైతన్యమే. పరమేశ్వరుడు ప్రవేశించి మనస్సును ఆత్మయందు అధ్యస్తముగా (As Inner Placed) కలిగి ఉంటున్నాడు. |
మనస్త్వం తస్య సత్త్వస్థో దదాతి నియమేన తు .. 12.. స ఏవ విదితాదన్యస్తథైవావిదితాదపి . |
|
మనస్త్వం తస్య సత్త్వస్థో దదాతి నియమేవ(న) తు। స ఏవ విదితాత్ అన్యః తథైవ అవిదితాత్-అపి। |
పరమేశ్వరుడే సత్త్వస్థుడై (ఉనికి ప్రదర్శనా సంకల్పుడై) మనస్సును ప్రసాదించువాడై ఉంటున్నారు. ఈ జీవుడు తెలియబడేదానికి, తెలియబడనిదానికి కూడా వేరుగా పరమాత్మస్వరూపుడై ఉన్నాడు. |
అన్యేషామింద్రియాణాం తు కల్పితానామపీశ్వరః .. 13.. |
|
అన్యేషాం ఇంద్రియాణాం తు కల్పితానామపి ఈశ్వరః। |
ఈశ్వరుడు కల్పితమే అయినట్టి తదితర ఇంద్రియములుగా కూడా విస్తరించువారై ఉన్నారు. |
తత్తద్రూపమను ప్రాప్య దదాతి నియమేన తు . |
|
తత్ తత్ రూపమ్ అనుప్రాప్య దదాతి నియమేన తు। |
ఈశ్వరుడే - ఆయా చెవులు, కళ్లు మొదలైన ఇంద్రియములను విశేషములుగా కల్పించుకొని, పొంది, ప్రవేశించి, - వాటియందు ఇంద్రియానుభవములను నియమించుచున్నారు. |
తతశ్చక్షుశ్చ వాక్చైవ మనశ్చాన్యాని ఖాని చ .. 14.. న గచ్ఛంతి స్వయంజ్యోతిఃస్వభావే పరమాత్మని . |
|
తతః చక్షుశ్చ వాక్చైవ మనశ్చ అన్యాని ఖాని చ। న గచ్ఛంతి స్వయంజ్యోతిః స్వభావే పరమాత్మని।। |
పరమాత్మచే స్వయం కృతంగా నియమించబడిన కళ్లు, చెవులు, తదితరములన్నీ స్వయం జ్యోతి స్వభావుడగు పరమాత్మను కప్పి ఉంచ గలవా? లేనే లేదు. (అవి ప్రకృతిలోని విశేషములు మాత్రమే అయి ఉంటాయేగాని), ఇంద్రియములు పరమాత్మను పొందలేవు, చేరలేవు, కప్పి ఉంచలేవు. |
అకర్తృవిషయప్రత్యక్ప్రకాశం స్వాత్మనైవ తు .. 15.. వినా తర్కప్రమాణాభ్యాం బ్రహ్మ యో వేద వేద సః . |
|
7. అకర్తృ విషయ ప్రత్యక్ ప్రకాశం స్వాత్మనైవతు। వినా తర్క ప్రమాణాభ్యాం బ్రహ్మయో వేద వేదసః। |
ఈ జగత్ దృశ్యరూపంగా సిద్ధిస్తున్న ఇంద్రియ విషయములు స్వయం కర్తృత్వములు కావు. అవి జడములు మాత్రమే. అవన్నీ కూడా స్వాత్మయొక్క చైతన్య ప్రకాశము చేతనే అనుభూతి రూపంగా రూపుదిద్దుకొని ఉంటున్నాయి. సమస్త తర్క ప్రమాణములు (Logics and standardized views) దాటిపోయి, ఎవ్వడైతే అట్టి ఆత్మను తెలుసుకుంటాడో, అట్టివాడు సమస్తము గురించి తెలుసుకొన్నవాడు అగుచున్నాడు. |
ప్రత్యగాత్మా పరంజ్యోతిర్మాయా సా తు మహత్తమః .. 16.. తథా సతి కథం మాయాసంభవః ప్రత్యగాత్మని . |
|
ప్రత్యగాత్మా పరంజ్యోతిః మాయా సా తు మహత్తమః। తథా సతి కథం మాయా సంభవః ప్రత్యగాత్మని? |
ప్రత్యగాత్మ (సమస్తమునకు వేరైనట్టి ఆత్మ) పరంజ్యోతి స్వరూపము. అట్టి ఆత్మ యొక్క మాయ మహత్ తమమైనది. (Superlatively మహిమ గలది) . అయితే అత్యంత నిర్మలము, మహత్తమము, కేవలము, అద్వితీయము అగు ప్రత్యగాత్మ యందు ‘‘మాయ’’ అనునది మాత్రం ఎట్లా సంభవం? (దర్పణంలో వస్తువులు కనిపిస్తూ ఉన్నప్పటికీ, దర్పణంలో అవి ఉండవు కదా!) |
తస్మాత్తర్కప్రమాణాభ్యాం స్వానుభూత్యా చ చిద్ఘనే .. 17.. స్వప్రకాశైకసంసిద్ధే నాస్తి మాయా పరాత్మని . |
|
తస్మాత్ తర్క ప్రమాణాభ్యాం స్వానుభూత్యా చ చిద్ఘనే। స్వప్రకాశైక సంసిద్ధే నాస్తి మాయా పరాత్మని। |
కాబట్టి, ఈ జీవుడు శాస్త్ర ప్రమాణ పూర్వక తర్కముచేతను, స్వానుభవము చేతను తనయందే ‘చిద్ఘనము’ను దర్శించును గాక। సిద్ధించుకొనును గాక। (అంతేగాని, మనోదర్పణమునందో, జగద్దృశ్యమునందో-కాదు). స్వయంప్రకాశము అయి పరాత్మ తనయందే స్వానుభవముగా ఆత్మభావనగా సంసిద్ధము అగుచుండగా, అద్దానియందు ‘మాయ’కు చోటెక్కడిది? (‘మాయ’ అనగా ‘యామా’ - స్వతఃగా లేనిదే అగుచున్నది). |
వ్యావహారికదృష్ట్యేయం విద్యావిద్యా న చాన్యథా .. 18.. |
|
వ్యావహారిక దృష్ట్యా అయం విద్యా-అవిద్యా। న చ అన్యథా...। |
వ్యావహారిక దృష్ట్యా మాత్రమే ‘‘విద్య, అవిద్య, మాయ’’ మొదలైనవి ఉన్నట్లుగా అనిపిస్తోంది. అన్యథా (వస్తుతః, వాస్తవానికి) - అవి లేవు. |
తత్త్వదృష్ట్యా తు నాస్త్యేవ తత్త్వమేవాస్తి కేవలం . |
|
తత్త్వ దృష్ట్యాతు నాస్త్యేవ తత్త్వమేవ అస్తి కేవలమ్। |
తత్త్వ దృష్ట్యా చూచినప్పుడు కేవలమగు ‘‘తత్ త్వమ్’’ మాత్రమే ఉన్నది. మాయ, విద్య, అవిద్య-ఇవన్నీ ‘‘వ్యావహారికదృష్టి’’ మాత్రమే. ‘‘ఆత్మప్రకాశము’’ యొక్క వెలుగు చమత్కారమేగాని, ఆత్మకు వేరుగా వ్యావహారికమైనదంతా మొదలే లేదు. (అందుకే అవన్నీ జ్ఞాన బోధకు ఉపయోగించుకొని, ఆ తరువాత విడచివేసియే ఉండాలి). |
వ్యావహారిక దృష్టిస్తు ప్రకాశావ్యభిచారితః .. 19.. ప్రకాశ ఏవ సతతం తస్మాదద్వైత ఏవ హి . |
|
వ్యావహారిక దృష్టిస్తు ప్రకాశ అవ్యభిచారతః। ప్రకాశ ఏవ సతతం తస్మాత్ మౌనం హి యుజ్యతే। |
వ్యావహారిక, తదితర - సమస్త సందర్భములలోను (సతతము) నిర్విషయ, మౌన ఆత్మప్రకాశమే సర్వత్రా ఏర్పడినదై ఉన్నది. ఎప్పటికీ ప్రకాశము ఉండియే తీరుతోంది కాబట్టి, అది విషయములకు ఆవలిది కనుక ‘మౌనము’ - అని వరిణాంచబడుతోంది. |
అద్వైతమితి చోక్తిశ్చ ప్రకాశావ్యభిచారతః .. 20.. ప్రకాశ ఏవ సతతం తస్మాన్మౌనం హి యుజ్యతే . అయమర్థో మహాన్యస్య స్వయమేవ ప్రకాశితః .. 21.. న స జీవో న చ బ్రహ్మా న చాన్యదపి కించన . న తస్య వర్ణా విద్యంతే నాశ్రమాశ్చ తథైవ చ .. 22.. న తస్య ధర్మోఽధర్మశ్చ న నిషేధో విధిర్న చ . |
|
అయమ్ అర్ధో, మహాన్ యస్య స్వయమేవ ప్రకాశితః న స జీవో। న చ బ్రహ్మ। న చ అన్యదపి కించన। న తస్య వర్ణా విద్యంతే న ఆశ్రమాశ్చ తథైవ చ । న తస్య ధర్మో అధర్మశ్చ న నిషేధో విధిః న చ ।। |
ఎవనిపట్ల అయితే - ‘‘ఆత్మయే ఉన్నది. వ్యావహారికమైన విద్య అవిద్య మాయ అనునవే - స్వతఃగా లేనే లేవు’’ - అను మహత్తరమగు అర్థము స్వాభావికంగాను, స్వయముగాను ప్రకాశితమై ఉంటుందో, - అట్టివాడు ఇక జీవుడు కాడు. (శబ్దరూపమగు) బ్రహ్మము కాదు. మరింకేమీకూడా కాదు. ఆతనిపట్ల వర్ణాశ్రమ ధర్మములు మొదలైనవన్నీ లేనివే అగుచున్నాయి. ఆతనికి సంబంధించి విధి (Do's) లేదు. నిషేధము (Do not's) ఉండ జాలవు. ధర్మము, అధర్మము అనునవి కూడా ఉండజాలవు. |
యదా బ్రహ్మాత్మకం సర్వం విభాతి తత ఏవ తు .. 23.. తదా దుఃఖాదిభేదోఽయమాభాసోఽపి న భాసతే . |
|
8. యదా బ్రహ్మాత్మకం సర్వం విభాతి స్వత ఏవ తు తదా దుఃఖాది భేదో అయమ్ ఆభాసో౽పి న భాసతే। |
ఎప్పుడైతే ఈ లోకములు, ఈ జగత్తులుగా కనిపిస్తున్నదంతా కూడా స్వతఃగానే బ్రహ్మత్మకముగా ప్రకాశమానమౌతుందో (అనుభవైక వేద్యమౌతుందో, తెలియవస్తుందో), అప్పుడిక దుఃఖముల అభాస కించిత్ కూడా భాసించదు. |
జగజ్జీవాదిరూపేణ పశ్యన్నపి పరాత్మవిత్ .. 24.. న తత్పశ్యతి చిద్రూపం బ్రహ్మవస్త్వేవ పశ్యతి . ధర్మధర్మిత్వవార్తా చ భేదే సతి హి భిద్యతే .. 25.. |
|
జగత్ - జీవాదిరూపేణ పశ్యన్ అపి పరాత్మవిత్, న తత్ పశ్యతి చిద్రూపం బ్రహ్మవస్తు-ఇతి పశ్యతి। ధర్మ ధర్మిత్వ వార్తా చ భేదే సతి హి భిద్యతే। |
‘‘పరాత్మవేత్త’’ - ఇక్కడ జగత్తు, జీవుడు మొదలైన రూపములుగా చూస్తూ ఉన్నప్పటికీ, వాటినన్నిటినీ జగత్ జీవాత్మ భేదముతో చూడడు. ఇదంతా చిద్రూప - పరబ్రహ్మ వస్తువుగానే (బ్రహ్మ పదార్థంగానే) సర్వదా దర్శిస్తూ ఉంటాడు. ఆతనిపట్ల అనేకమంతా ఏకదృష్టియే అగుచున్నది. ధర్మము - ధర్మిల మధ్యగల భేదవార్తలన్నీ ఆతనిపట్ల చెదిరిపోయినవి అవుతాయి. |
భేదాభేదస్తథా భేదాభేదః సాక్షాత్పరాత్మనః . నాస్తి స్వాత్మాతిరేకేణ స్వయమేవాస్తి సర్వదా .. 26.. బ్రహ్మైవ విద్యతే సాక్షాద్వస్తుతోఽవస్తుతోఽపి చ . |
|
భేద - అభేదః తథా భేదాభేదః సాక్షాత్ పరాత్మనః। నాస్తి స్వాత్మ అతిరేకేణ స్వయమేవ అస్తి సర్వదా। బ్రహ్మైవ విద్యతే సాక్షాత్ వస్తుతో, అవస్తుతో౽పి చ। |
బేధ అభేదములన్నీ, భేదాభేదములకు ఆవలివాడగు పరమాత్మయొక్క సమక్షంలో స్వతఃగానే వీగిపోతాయి. ఆత్మకు వేరై ఎక్కడా ఏదీ ఏకించిత్ కూడా మొదలే లేదు. ఆత్మయే స్వయముగా సర్వదా సర్వత్రా వేంచేసినదై యున్నది. వస్తువుగాను, అవస్తువుగాను ఉన్నదంతా కూడా సాక్షాత్ బ్రహ్మమే అయి ఉన్నది. |
తథైవ బ్రహ్మవిజ్జ్ఞానీ కిం గృహ్ణాతి జహాతి కిం .. 27.. అధిష్ఠానమనౌపమ్యమవాఙ్మనసగోచరం . |
|
తదైవ బ్రహ్మవిత్ జ్ఞానీ కిం గృహాణాతి? జహాతి కిం? అధిష్ఠానమ్। అనౌపమ్యమ్। అవాక్-మానస గోచరమ్। |
అట్టి బ్రహ్మము గురించి ఎరిగియున్న బ్రహ్మజ్ఞాని ఈ దృశ్య జగత్తులో దేనిని స్వీకరిస్తాడు? దేనిని వదులుతాడు? ఏదీ స్వీకరించడు, వదలడు. బంగారు ఆభరణములకు బంగారము వలెనే, - పరబ్రహ్మము సమస్తమునకు అధిష్ఠానమైనట్టిది. ఏ ఉపమానములతోను నిర్దేశించి చెప్పబడజాలదు. (వాక్కుకు మనస్సును అందక) అవాక్-మానస గోచరమైనట్టిది. |
యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రం రూపవర్జితం .. 28.. అచక్షుఃశ్రోత్రమత్యర్థం తదపాణిపదం తథా . |
|
యత్ తత్ అద్రేశ్యమ్, అగ్రాహ్యమ్, అగోత్రమ్, రూపవర్జితమ్, ఆచక్షుః శ్రోత్రమ్ అత్యర్థం తత్ అపాణిపాదం తథా, |
ఏదేదైతే దృశ్యములో కనబడే ఒకానొక వస్తు దృశ్య వంటిది కాదో, ఆలోచనలకు అగ్రాహ్యమో (గ్రహించరానిదో), గోత్రవిభాగసంబంధమైనది కాదో, రూపములేనట్టిదో, కళ్లకు కనబడనిదో, వినికిడిచే అర్థము కానిదో దేనికి కాళ్లు చేతులు లేవో (రాకపోకల కదలికలు లేవో...), (అదియే ఆత్మతత్త్వము). |
నిత్యం విభుం సర్వగతం సుసూఖ్మం చ తదవ్యయం .. 29.. బ్రహ్మైవేదమమృతం |
|
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మంచ తత్ అవ్యయమ్। బ్రహ్మైవ ఇదం అమృతం |
ఏది త్రికాలములలోను నిత్యము - అనునిత్యము అయి ఉన్నట్టిదో, (రాజ్యమునకు ‘రాజు’ వలే) ఏది సమస్తమునకు విభువో, (కధా రచయిత కథలో వలె) ఏది సర్వగతమో, (సాకారము కంటే కూడా) సూక్ష్మాతి సూక్ష్మమో, ఏది ‘వ్యయము’ (Spent off) అనే ధర్మము లేనిదై, అవ్యయమో - అట్టి అమృతరూపమగు బ్రహ్మమే ఇదంతా, ఈ సమస్తము కూడా! |
తత్పురస్తాద్- బ్రహ్మానందం పరమం చైవ పశ్చాత్ . బ్రహ్మానందం పరమం దక్షిణే చ బ్రహ్మానందం పరమం చోత్తరే చ .. 30.. |
|
తత్ పురస్తాత్ బ్రహ్మానందం। పరమంచైవ పశ్చాత్। బ్రహ్మానందం పరమం దక్షిణే చ। బ్రహ్మానందం పరమం చ ఉత్తరే చ। |
అట్టి పరబ్రహ్మమునకు - ముందుగా ఉన్న రూపము బ్రహ్మానందము - తరువాత ఉన్నది - ‘పరమానందము’ - దక్షిణముగా ఉన్నది - పరమగు బ్రహ్మానందము - ఉత్తరముగా ఉన్నది - పరమగు ఆ బ్రహ్మానందమే। అన్నివైపులా బ్రహ్మానందమే ఆక్రమించి ఉన్నది. బ్రహ్మానందమే అద్దాని స్వాభావిక విన్యాసము. |
స్వాత్మన్యేవ స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః . తదా ముక్తో న ముక్తశ్చ బద్ధస్యైవ విముక్తతా .. 31.. |
|
9. స్వాత్మన్యేన స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః। తదా ముక్తో, న ముక్తశ్చ బద్ధస్యైవ విముక్తతా। |
ఆత్మదర్శి తన ఆత్మయందే ఈ సమస్తమును స్వయముగా నిర్భయముగా, నిస్సంసయముగా దర్శిస్తున్నాడు. అట్టివాడు ముక్తుడే అయినప్పటికీ తన యందు దర్శించే ఈ జగత్తులను విడువనివాడే కనుక అముక్తుడే. సమస్తము నుండీ విముక్తుడే అయి కూడా ఏదీ వదలటము లేదు కాబట్టి బద్ధుడు కూడా। |
ఏవంరూపా పరా విద్యా సత్యేన తపసాపి చ . బ్రహ్మచర్యాదిభిర్ధర్మైర్లభ్యా వేదాంతవర్త్మనా .. 32.. |
|
ఏవం రూపే పరా విద్యా సత్యేన తపసాపి చ బ్రహ్మచర్యాదిభిః భక్తైః లభ్యా వేదాంతవర్త్మనా। |
తెలియబడేదానికి ఆవల ‘‘తెలుసుకొనువాడు’’ (The knower prior to all knowings) - వేంచేసి ఉన్నాడు. ఆతడు అసత్యమును అధిగమించి సత్యమును ఆశ్రయించటంచేతను, బ్రహ్మమునే ఉపాసిస్తూ బ్రహ్మచర్యము నిర్వర్తించుట చేతను, భక్తి చేతను - అట్టి పరావిద్యను పొందుచున్నాడు. |
స్వశరీరే స్వయంజ్యోతిఃస్వరూపం పారమార్థికం . క్షీణదోషః ప్రపశ్యంతి నేతరే మాయయావృతాః .. 33.. |
|
స్వశరీరే స్వయం జ్యోతిః స్వరూపం పారమార్థికమ్ క్షీణదోషాః ప్రపశ్యంతి। నేతరే మాయయావృతాః।। |
అట్టివాడు స్వయంజ్యోతి స్వరూపమగు పారమార్ధికస్వరూపమును స్వశరీరంలోనే సందర్శిస్తున్నాడు. దృష్టికి సంబంధించిన సమస్త దోషములు తొలగగా అట్టి వేదాంతజ్ఞాని తనయందే పరమాత్మను గమనిస్తున్నాడు. మాయాదృష్టితో ఆవృతమైన బుద్ధిగల తదితరులు పరమాత్మను ఎక్కడా కూడా బాహ్య-అభ్యంతరములలో దర్శించలేకపోతున్నారు. |
ఏవం స్వరూపవిజ్ఞానం యస్య కస్యాస్తి యోగినః . కుత్రచిద్గమనం నాస్తి తస్య సంపూర్ణరూపిణః .. 34.. |
|
ఏవం స్వరూప విజ్ఞానం యస్య కస్యాస్తి యోగినః కుత్ర చిత్ గమనం నాస్తి తస్య సంపూర్ణ రూపిణః।। |
ఏ యోగి (లేక) యోగ సిద్ధుడైతే (అంతర హృదయములో సర్వాత్మకుని ఆత్మయందు దర్శనము అనబడే)- స్వరూప విజ్ఞానము కలిగి ఉంటాడో.... - సంపూర్ణ రూపి (పూర్ణస్వరూపుడు) అగు ఆతనికి (ఒక లోకము నుండి మరొక లోకమునకు రాకపోకలు అనబడే) గమనాగమనములు ఉండవు. |
ఆకాశమేకం సంపూర్ణం కుత్రచిన్న హి గచ్ఛతి . తద్వద్బ్రహ్మాత్మవిచ్ఛ్రేష్ఠః కుత్రచిన్నైవ గచ్ఛతి .. 35.. అభక్ష్యస్య నివృత్త్యా తు విశుద్ధం హృదయం భవేత్ . |
|
ఆకాశమ్ ఏకం సంపూర్ణం కుత్రచిత్ నహి గచ్ఛతి, తద్వత్ బ్రహ్మాత్మవిత్ శ్రేష్ఠః కుత్రచిత్ నైవ గచ్ఛతి। అభక్షస్య నివృత్త్యా తు విశుద్ధం హృదయం భవేత్। |
సంపూర్ణము, సర్వగతము అగు ఆకాశము ఏవిధంగా ఎక్కడికో వెళ్లటము, ఎక్కడినుండో రావటము - అనునవే ఉండవో, అదేవిధంగా బ్రహ్మమును గురించి ఎరిగి, బ్రహ్మము తానై యున్న బ్రహ్మాత్మవిత్‌శ్రేష్ఠునికి-ఎక్కడి నుండి ఎక్కడికీ రాక - పోకలు ఉండవు. అట్టివారు అభక్ష్యము (పొందకూడనివి, అనుభవించకూడనివి) పొంద కుండానే ఉన్నవారై, సమస్త అభక్ష్యములనుండి విముక్తులై, విశుద్ధమగు హృదయమునందు అఖండమగు ఆత్మను దర్శిస్తూ, స్వహృదయమునందే ఆత్మస్వరూపులై ఉంటున్నారు. |
ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః .. 36.. చిత్తశుద్ధౌ క్రమాజ్జ్ఞానం త్రుట్యంతి గ్రంథయః స్ఫుటం . |
|
ఆహార శుద్ధౌ చిత్తస్య విశుద్ధిః భవతి స్వతః। చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం। త్రుట్యంతే గ్రంధయః స్ఫుటమ్। |
[ ఇంద్రియములతో - శాస్త్రానుగతంగా స్వీకరించవలసినవి స్వీకరిస్తూ, త్యజించవలసిన (కామ క్రోధాదులను) త్యజిస్తూ ], ఆహారము (ఇంద్రియ విషయములు) - సంబంధించిన శుద్ధి పొందుచున్నారు. తద్వారా (ఇష్టాయిష్ట రూపములతో కూడిన) చిత్తముయొక్క శుద్ధి స్వతఃగానే అతనియందు కలుగుతుంది. చిత్తశుద్ధిచే ‘జ్ఞానము’ క్రమంగా వికసించ గలదు. అట్టి జ్ఞానముచే హృదయగ్రంథులు విడిపోతాయి. |
అభక్ష్యం బ్రహ్మవిజ్ఞానవిహీనస్యైవ దేహినః .. 37.. న సమ్యగ్జ్ఞానినస్తద్వత్స్వరూపం సకలం ఖలు . |
|
అభక్ష్యం బ్రహ్మవిజ్ఞాన విహీనస్యైవ దేహినః స సమ్యక్ జ్ఞానినః తద్వత్ స్వరూపగ్ం సకలం ఖలు। |
ఇంకా కూడా, సమ్యక్జ్ఞానికి ఈ జగత్తంతా తన యొక్క స్వాభావిక చమత్కార స్వరూపమే అవుతుంది. అందుచేత బ్రహ్మజ్ఞానికి ఇక్కడ ‘అభక్ష్యము’ అంటూ ఏదీ ఉండదు. బ్రహ్మజ్ఞాన - విహీనునికో? ఆతనిచే స్వీకరించబడేదంతా అభక్ష్యమేగా పరిణమించగలదు. |
అహమన్నం సదాన్నాద ఇతి హి బ్రహ్మవేదనం .. 38.. బ్రహ్మవిద్గ్రసతి జ్ఞానాత్సర్వం బ్రహ్మాత్మనైవ తు . |
|
10. ‘‘అహమ్ అన్నగ్ం। సదా అన్నాద।’’ ఇతి హి బ్రహ్మవేదనమ్। బ్రహ్మవిత్ గ్రసతి జ్ఞానాత్ సర్వం బ్రహ్మత్మనైవ తు। |
బ్రహ్మాజ్ఞానము కలవాడు • నేనే అన్నమును (I am all that being experienced) • నేనే అన్నాదుడను కూడా (I am the maker / worker for all that being experienced) - అని ఎరిగి ఉంటున్నాడు. బ్రహ్మము ఎరిగిన బ్రహ్మవేత్త ‘సమస్తము బ్రహ్మమే’ అను బ్రహ్మాత్మ జ్ఞానమును ఏమాత్రము ఏ సందర్భములోను విడువడు. |
బ్రహ్మక్షత్రాదికం సర్వం యస్య స్యాదోదనం సదా .. 39.. యస్యోపసేచనం మృత్యుస్తం జ్ఞానీ తాదృశః ఖలు . బ్రహ్మస్వరూపవిజ్ఞానాజ్జగద్భోజ్యం భవేత్ఖలు .. 40.. |
|
బ్రహ్మ క్షత్రాదికం సర్వం యస్యస్య ఆదోదనం సదా (యస్యస్యాదోదనం సదా), యస్య ఉపసేచనం మృత్యుః తన్ జ్ఞానీ తాదృశః ఖలు। బ్రహ్మస్వరూప విజ్ఞానాత్ జగత్ భోజ్యం భవేత్ కిల। |
ఏ ఆత్మకు (పరబ్రహ్మమునకు) బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనబడేదంతా ఆదోదనము (ఆహారము) అగుచున్నదో, ఎవనికి మృత్యువు కూడా ఉపశేచనము (ఉపాహారము / Tiffin ) వంటిది అవుతోందో... అట్టి - పరమాత్మ పురుష స్వరూపమే తానని గ్రహించిన వాడు ‘‘ఆత్మజ్ఞాని’’. ‘బ్రహ్మము ’ గురించిన స్వరూపవిజ్ఞానము సిద్ధించుకున్నవానికి - ఈ జగత్తంతా కూడా తాను భోగించు వస్తువుగా అగుచున్నది. |
జగదాత్మతయా భాతి యదా భోజ్యం భవేత్తదా . బ్రహ్మస్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా .. 41.. యదాభాసేన రూపేణ జగద్భోజ్యం భవేత తత్ . మానతః స్వాత్మనా భాతం భక్షితం భవతి ధ్రువం .. 42.. |
|
జగత్ ఆత్మతయా భాతి యదా భోజ్యం భవేత్ తదా (కిల)? బ్రహ్మ స్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా। యత్ ఆభాసేన రూపేణ జగత్ భోజ్యం భవేత్తు తత్। మానతః స్వాత్మనా భాతం భక్షితం భవతి ధ్రవమ్। |
• జగత్తంతా ఆత్మయే అయి ఉన్నప్పుడు ఈ జగత్తు ఆత్మకు భోజ్యవస్తువు. • అయితే, ఏదీ కాని ఈ జగత్తు ఆత్మకు భోజ్య వస్తువు (something that is enjoyable) ఎట్లా అవుతుంది? ఎట్లా అంటే బ్రహ్మమే - స్వాత్మమయము అయి, ఈ సమస్తమును ఆస్వాదిస్తూ ఉన్నది కాబట్టి. ఎప్పుడైతే ‘ఆభాస’ (లేనిది ఉన్నట్లుగా తోచటం) రూపంగా ఈ జగత్తు సత్యమగు ఆత్మకు భోజ్యవస్తువు అవుతోందో, అప్పుడు ఇక ఇదంతా ‘‘స్వాత్మ’’కు భక్షిత (భుజింపబడే) వస్తువు అవటం ధృవమే (నిజమే) అవుతుంది. |
స్వస్వరూపం స్వయం భుంక్తే నాస్తి భోజ్యం పృథక్ స్వతః . అస్తి చేదస్తితారూపం బ్రహ్మైవాస్తిత్వలక్షణం .. 43.. |
|
స్వస్వరూపం స్వయం భుక్తే నాస్తి భోజ్యం పృథక్ స్వతః। అస్తిచేత్ అస్తితా రూపం బ్రహ్మైవ అస్తిత్వ లక్షణమ్। |
వాస్తవానికి ఆత్మ తనయొక్క స్వస్వరూపమునే జగత్తుగా అనుభవిస్తోంది. అంతేగాని జగత్తు తనకు బాహ్యమైన భోజ్య వస్తువుగా కాదు. ఒకవేళ ‘‘ఈ జగత్తు ఉన్నది’’ అని అనుకుంటే ‘‘బ్రహ్మమే ఈ జగత్తును తనయొక్క అస్తిత్వ లక్షణముగా కలిగి ఉంటోంది’’ అనవలసిందే। |
అస్తితాలక్షణా సత్తా సత్తా బ్రహ్మ న చాపరా . నాస్తి సత్తాతిరేకేణ నాస్తి మాయా చ వస్తుతః .. 44.. |
|
అస్తితా లక్షణా సత్తా। సత్తా బ్రహ్మ న చ అపరా। నాస్తి సత్తా అతిరేకేణ నాస్తి మాయా చ వస్తుతః। |
‘‘అస్తి (ఉన్నది)’’ - అనునదే సత్త। ‘‘సత్త’’ అనునది బ్రహ్మమే - అయి ఉన్నది. బ్రహ్మమునకు వేరైన సత్తా దేనికీ లేదు. ‘‘సత్త’’కు వేరే ఏదీ లేదు. వస్తుతః ‘‘మాయ’’ అనునదేదీ లేదు. (అందుకే యా మా = ఏది లేదో అని మాయ నిర్వచించబడుతోంది) |
యోగినామాత్మనిష్ఠానాం మాయా స్వాత్మని కల్పితా . |
|
యోగినామ్ ఆత్మనిష్ఠానాం మాయా స్వాత్మని కల్పితా। |
యోగికి ‘ఆత్మనిష్ఠ’ యొక్క దృష్టిచే ‘మాయ’ అనబడేది స్వకీయమగు ఆత్మయొక్క స్వయం కల్పితము మాత్రమే। |
సాక్షిరూపతయా భాతి బ్రహ్మజ్ఞానేన బాధితా .. 45.. |
|
సాక్షి రూపతయా భాతి బ్రహ్మజ్ఞానేన బాధితా। |
బ్రహ్మజ్ఞానముచే ‘మాయ’ అనబడేది బాధించబడినదై, కేవలమగు (నిర్విషయ) సాక్షిత్వమే సర్వత్రా స్వానుభవమవుతోంది. • మాయకు ఆత్మయే సాక్షి. • సాక్షి అగు ఆత్మయే ఉన్నది. ‘మాయ’ ఆత్మకు స్వయంకల్పితం మాత్రమే। • ‘మాయ’ అనబడేది ఆత్మకు వేరుగా లేదు. |
బ్రహ్మవిజ్ఞానసంపన్నః ప్రతీతమఖిలం జగత్ . పశ్యన్నపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్ .. 46.. ఇత్యుపనిషత్ .. |
|
బ్రహ్మవిజ్ఞాన సంపన్నః ప్రతీతమ్ అఖిలం జగత్। పశ్యన్ అపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్।। |
బ్రహ్మజ్ఞాన సంపన్నుడు → ఈ ప్రతీతము (ప్రదర్శనము) అగుచున్న సమస్త జగత్తును - జగత్తుగా చూస్తూనే, స్వస్వరూపాత్మగా ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. అనేకంగా కనిపిస్తున్న ఈ జగత్తు బ్రహ్మజ్ఞానికి ‘‘ఏకమగు ఆత్మ’’ గా అనుక్షణికము - స్వాభావికము అయి అనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా స్వయంభువు బ్రహ్మ - తన మానస పుత్రులకు కామేశ్వర, వైశ్రవణ, బ్రహ్మపుత్ర, వాలఖిల్యులకు ఆత్మజ్ఞానము బోధించారు. |
పాశుపతబ్రహ్మోపనిషత్ సమాప్తా ఓం శాంతిః। శాంతిః। శాంతిః ।। |
ఇతి అథర్వణ వేదాంతర్గత ‘‘పాశుపత బ్రహ్మోపనిషత్’’ ఓం శాంతిః। శాంతిః। శాంతిః ।। |
హరిః ఓం। హరిస్వరూపమై, ‘ఓం’ కార సంజ్ఞార్థమగు పరమాత్మకు నమస్కరిస్తూ।
స్వయంభువు (one who is himself the reason for his presence) అగు బ్రహ్మదేవుడు - సమస్తమునకు అనన్యము, ఏకము అయి ఉండి కూడా, ‘‘నేను అన్యమగు జగత్తును, ఆ జగత్తును ఆస్వాదించు ‘అనుభవి’ స్వాభావులగు జీవులను సృష్టించుకొని ఆస్వాదించెదను గాక।’’ - అని లీలగా, క్రీడగా, వినోదముగా సంకల్పించారు.
అట్టి సృష్టి పరిఢవిల్లటానికై మనస్సు నుండి సృష్టిని నడిపించు సామర్థ్యముగల బ్రహ్మమానసపుత్రులను, దేవతలను, లోక పాలకులను, 14 లోకములను, లోకాంతర్గత జీవులను సృష్టించి, వారియొక్క అంతరంగ - బహిరంగములను కల్పించసాగారు.
అట్టి సృష్టిలోని జీవులు ఎప్పుడో తమ స్వస్వరూపమును ఏమరచి, దృశ్యధ్యాసలకు బద్ధులు కాసాగారు. (అనగా) ‘ద్రష్ట’గా తమ కేవలత్వమును, ఆత్మౌన్నత్యమును ఏమరచసాగారు.
ఇదంతా ఈ విధంగా జరుగుచుండగా, ఒకసారి బ్రహ్మమానసపుత్రులు, ఋషులు, అగు- కామేశ్వరుడు, వైశ్రవణుడు, బ్రహ్మపుత్రుడు, వాలఖిల్యడు - అను నలుగురు ‘ఆత్మతత్త్వజ్ఞానసిద్ధి’ అను మహదాశయముతో తండ్రియగు బ్రహ్మదేవుని సమీపించారు.
బ్రహ్మమానస పుత్రులు (ఋషులు) : తండ్రీ! ప్రజాపతీ! సృష్టికర్తా! సమస్త రుగ్మతలకు ఔషధము తత్త్వజ్ఞానమే కదా! అట్టి బ్రహ్మజ్ఞానము కొరకై మిమ్ములను శరణువేడుచు, మాకు తారసబడుచున్న కొన్ని సందేహములకు సశాస్త్రీయమగు పరాకాష్ఠ వివరణ కొరకై మీపాదపద్మములు ఆశ్రయిస్తున్నాము.
బ్రహ్మదేవుడు : బిడ్డలారా! మీకు వస్తున్న సందేహములేమిటో చెప్పండి. తత్త్వజ్ఞానమును వివరించుకుందాము.
ఋషులు : పితృదేవా! వినండి.
(1) మీరు కల్పించిన ఈ జగత్తులలోని జీవులు అనేక విద్యలను, తద్వారా సంపదలను, పురాణ ఇతిహాసములను ఆశ్రయిస్తున్నారు. అంతే కాకుండా, అనేక ఉపవిద్యలచే మీరు నిక్షిప్తం చేస్తూ ఉన్న అనేక ఆకృతి విశేషములను ఉపయోగిస్తూ, ఆయా శాస్త్రములను అధ్యయనం చేస్తున్నారు. పరిశోధనలు కొనసాగిస్తున్నారు. మానవుల జీవితసరళి ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక, ఇప్పుడు మా ప్రశ్న. ఈ సమస్త జగత్తులలో అత్యుత్తమమైన విద్య ఏది?
(2) ఈ లోకములన్నీ నడిపిస్తూ ఉన్న దివ్య (అశరీర) ప్రజ్ఞలగు దేవతలు (Divine Being) ఎవరు? ఎట్టివారు? ఎక్కడివారు?
(3) జాగ్రత్‌కు, తురీయమునకు అధిష్ఠాన దేవత ఎవరు?
(4) ఆ దేవతల వశంగానే లోకస్తులగు జీవులు ఆయా సుఖదుఃఖములు, జన్మ కర్మలు పొందుచున్నారా? (లేక) జీవులు స్వయంకృత కర్మ ఫలములుగా జన్మ-కర్మలను పొందుచున్నారా? (కాక) ఈ జగత్ సంఘటనలను మరేదైన కారణం ఉన్నదా?
(5) ఈ ‘కాలము’ యొక్క కల్పన ఎవరిది? కాలమునకు ఆవల, ఈవల ఉన్న సత్యమేది?
(6) ఎవరియొక్క ‘ఆజ్ఞ’ను అనుసరించి ఆకాశములో సూర్య చంద్ర నక్షత్ర గ్రహ - ఇత్యాదులన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి?
(7) ఈ ఆకాశము యొక్క మహిమ ఎట్టిది? ఈ దృశ్యమానమగుచున్న సమస్తము కూడా ఎవరియొక్క మహిమ?
స్వామీ! ప్రజాపతీ! ఈ ఈ విశేషాలలోని అంతిమసత్యము (The Finest Truth) ను మీవద్ద శ్రవణము చేసి తెలుసుకోవాలని మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. ఈఈ విశేషములయొక్క ఆత్యంతికార్థము మీరు మాత్రమే ఎరిగి ఉన్నారు. అందుచేత ఆయా పరాకాష్ఠ విశేషాలు బోధించవలసినదిగా మిమ్ములను అర్ధిస్తున్నాము.
స్వయంభువు (బ్రహ్మదేవుడు) :
బిడ్డలారా! ఈ సమస్త జగత్తుయొక్క తత్త్వమేమిటో ఎరుగుట ‘మాతృకావిద్య’ అని అంటారు.
[ మాతృకల పురాణ నామములు = బ్రహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీశ్వరి ].
మాతృక = (The Origin of whatever / all This )
ఈ జగత్తు అంతా కూడా (మాతృకా రూపంగా) -
• ద్వివర్ణ సహితము। (జీవాత్మ-పరమాత్మ చమత్కారము).
• ద్వివర్ణ మాత్రా। - (అనుభవి - అనుభవముల కలయిక).
• త్రివర్ణోపేతా। - (సత్త్వ రజో తమో - త్రిగుణాత్మకము).
• చతుర్మాత్రక ఓంకారరూపిణీ। - అకార ఉకార మకార అర్ధమాత్రలతో కూడిన ఏకాక్షర స్వరూపము.
• ప్రాణాత్మికా దేవతా। ఇదంతా ప్రాణశక్తియొక్క (ప్రాణదేవత యొక్క) అనేకరూప ప్రదర్శనములు.
ఓ ప్రియ మానసపుత్రులారా! ఈ (భూ పాతాళ స్వర్గము లనబడే) త్రిలోకములు నా భావనా సృష్టియే కాబట్టి నేనే ‘జగత్రయ - అధిపతి’’ని.
• కాల స్వరూపమైనట్టి (కృత-త్రేతా-ద్వాపర-కలి) యుగములంతా నా రచనయే. కాబట్టి (కథకు ఆ కథా రచయితవలె) నాకు వశమయ్యే ఏర్పడి ఉంటున్నాయి.
• రాత్రింబవళ్లు, పక్షములు, నెలలు, మాసములు, సంవత్సరములు, యుగయుగాంత పునర్యుగములు - మొదలైనవన్నీ నేను వృద్ధి చేయుచున్న కాలరూప చమత్కారమే। మమ సంవర్థితములే।
• ఆకాశంలో కనబడే సూర్య-చంద్ర-నక్షత్రములన్నీ నాయొక్క తేజో-అంశ విశేషములే.
• గగనో మమ త్రిశక్తి స్వరూపః। ఆకాశము నాయొక్క (జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ, కర్తృ కారణ కార్య, ద్రష్ట్రు దర్శన దృశ్య, భూత వర్తమాన భవిష్యత్ - ఇత్యాది) త్రిశక్తి మాయా స్వరూపము.
• న అన్యో మత్ అస్తి। నాకు వేరుగా ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు. ఈ సమస్తమునకు కర్తను నేనే। భోక్తను కూడా నేనే! అకర్త - అభోక్తను కూడా నేనే అయి ఉన్నాను.
మాయకు ఆవల ఉండి ఉన్నాను. ‘మాయ’ నాయొక్క కల్పితమాత్రము అయి ఉన్నది.
• రుద్రుడు - తమో మాయాత్మకుడు.
• విష్ణువు - సాత్విక మాయాత్మకుడు.
• ఇంద్రుడు మొదలైన దేవతలు - తామస రాజసాత్వికులు.
• కేవలమగు ‘సాత్త్వికము’ సృష్టిలో ఉండదు.
[ కేవలమగు - ఆత్మమాత్రమే (మాయాతీత) సాత్త్వికము. ]
• అఘోరము - (సూక్ష్మస్వరూపము) నాయొక్క సర్వ సాధారణ రూపము.
ఈ విశ్వయాగమునకు :
• రుద్రుడు, పశుపతి కర్త।
• రుద్రుడే - యుగపురుషుడు.
• హోత - ఇంద్రుడు.
• ఆధ్వర్యుడు - విష్ణువు.
• యజ్ఞఫల స్వీకారులు (యజ్ఞభుక్) - దేవతలు.
• మనస్సే - బ్రహ్మ (మానసం బ్రహ్మ).
నా కల్పన అగు ఈ (14 లోకములతో కూడిన) ఈ సృష్టి యొక్క బాహ్య - అభ్యంతరములలో ‘హంస’ (ఆత్మ)యే అంతటా ఏర్పడినదై ఉన్నది. (నాటక రచయిత యొక్క కల్పనయే అన్ని పాత్రలయొక్క, పాత్రల సంబంధములయొక్క, కథా సంఘటనలయొక్క అంతర్లీనంగా ఉన్నట్లుగా, బంగారు ఆభరణమంతా బంగారముతో నిండి ఉన్నరీతిగా) - ఆకాశ అనాకాశములలో అంతర్గతంగా ఏర్పడి ఉన్నది - ‘హంస’యే.
నాటకం దృష్ట్యా నాటకంలో రచయిత కనబడడు. కాబట్టి ఆతడు అంతర్గతుడు, అవ్యక్తుడు కదా! అట్లాగే హంస కూడా సృష్టి యొక్క సమస్తమునకు అంతర్గతము, అవ్యక్తము కూడా.
అట్టి ఆత్మ లేక ‘హంస’ ఇంకా కూడా...,
• ‘96’ తత్త్వములతో సృష్టిగా వ్యక్తము అవుతోంది. (వివరణ మున్ముందు ఇవ్వబడింది).
• [ (1) ఎరుగుచున్నవాడు (The Knower) (2) ఎరుక (The Knowing) (3) ఎరుగబడునది (All that being known as - అను రూపమగు ] చిద్రూపత్రయ - చిన్మయ లక్షణుడు. (ఆత్మ - వాటిని అన్నిటినీ) తన బాహ్య లక్షణములుగా కలిగి ఉన్నట్టిది.
• (పంచ ప్రాణములు, మనో బుద్ధి చిత్త అహంకారములతో కూడిన) నవ తత్త్వ త్రిరావృతము.
• (త్రిగుణములు ఒకదానితో ఒకటి కూడి 3 x 3 = 9 రకముల గుణ సంపన్నము - ఆ ‘హంస’ యే).
• సృష్టించటము, సృష్టిని పరిపోషించటము, సృష్టిని లయము చేయటము - అను అభిమాన తేజో పురుషులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకము - అట్టి ‘హంస’ యొక్క విన్యాసమే.
• (గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని - అని పిలువబడే) - అగ్నిత్రయ కళలతో కూడుకొని ఉన్నట్టిది - ఆ ‘హంస’యే.
• (బ్రహ్మగ్రంథి - విష్ణుగ్రంథి - రుద్రగ్రంథి అనబడే) చిత్ (ఎరుకకు సంబంధించిన) గ్రంథిలచే (ముడిలచే) ఇంధనము పొందుచున్నట్లుగా కనబడుచున్నది - ‘హంస’. [ వాస్తవానికి హంస (ఆత్మ) బంధరహితము) ].
• (జీవాత్మ-ఈశ్వర-పరమాత్మల ఏకత్వము సూచించు) - అద్వైత గ్రంథి (ఏకముడి) సమన్వితము - ‘‘హంస’’.
• (విశ్వ) యజ్ఞము యొక్క సాధారణ - అంగములను - తన అంగములుగా కలిగి ఉన్నట్టిది - ‘‘హంస’’.
• (ఆత్మయే లేక ‘‘హంస’’యే) - ఈ సమస్త జగత్తు యొక్క జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల యొక్క బహిరంతరములు - తనవిగా కలిగి ఉన్నట్టిది. అంతటా వెలుగొందుచున్నది. (బహిరంతర్జ్వలనమ్)। - ఇతి హంసః।।
ఉపవీత లక్షణసూత్ర బ్రహ్మగా యజ్ఞాః। ‘‘ఆత్మగా నేను ఈ సమస్తము త్రిగుణాత్మకంగా ధరించుచున్నాను’’ అను ఎరుకయే ఉపవీత లక్షణ సూత్రము. ‘‘పూదండలో దారము వలె నేనే సర్వత్రా స్వకీయ భావనాపూర్వకంగా కల్పించుకొని అలంకరించుకొంటున్నాను’’ - అనునదే బ్రహ్మయజ్ఞము. అదియే సూత్రయజ్ఞము. అదియే ఉపవీత లక్షణ సూత్రము.
బ్రహ్మాంగ లక్షణ యుక్తో బ్రహ్మసూత్రః । బ్రహ్మము యొక్క అంగలక్షణ (అఖండ-అప్రమేయ-నిత్య-సత్య- అమృత లక్షణములు) సూచించునదే యజ్ఞసూత్రము. ‘తత్’ యే బ్రహ్మసూత్రము. సమస్తమునకు ఆవలిదగు పరబ్రహ్మోపాసనను ఉద్దేశించినదే ‘బ్రహ్మసూత్రము’.
బ్రహ్మయజ్ఞమే। యజ్ఞసూత్రము. విశ్వయజ్ఞ సంబంధమైన ఉపాసనయే బ్రహ్మయజ్ఞము. ‘‘ఈ విశ్వము ఆత్మయొక్క సహజమగు ‘తత్’ స్వరూపమే। బ్రాహ్మీ స్వరూపమే’’ - అను ఉపాసనయే బ్రహ్మయజ్ఞము.
బ్రహ్మము యొక్క అంగములు : అంగాని మాత్రాణి। శబ్దస్పర్శ రూప రస గంధములనబడే పంచతన్మాత్రలు - బ్రహ్మముయొక్క అంగములు (అవయవములు - దేహరూపము). బ్రహ్మమో? ‘దేహి’ స్వరూపము. విశ్వదేహి యొక్క (విశ్వేశ్వరుని యొక్క) స్వకీయానంద స్వరూపమే విశ్వము.
మనో యజ్ఞస్య హగ్ంసో యజ్ఞసూత్రమ్। ఆత్మగురించి మనస్సు చేసే ఉపాసనా యజ్ఞమే యజ్ఞసూత్రము.
బ్రహ్మసూత్రము। ప్రణవమే బ్రహ్మ సూత్రము. వస్త్రములో ధారము, దూదిలాగే బ్రహ్మయజ్ఞమయమే యజ్ఞసూత్రము.
ప్రణవాంతర్వర్తీ హగ్ంసో యజ్ఞసూత్రమ్। ఏ హంస ప్రణవము యొక్క ‘‘అంతర్వర్తి’’ (Inner sense) (అంతరార్థము) అయి ఉన్నదో - అదియే ‘‘బ్రహ్మసూత్రము’’. బ్రహ్మసూత్రమే యజ్ఞసూత్రము కూడా. యజ్ఞసూత్రము ‘యజ్ఞము’ అనబడే సృష్టి వినోదమునకు ‘సంజ్ఞ’.
తదేవ బ్రహ్మయజ్ఞమయమ్। ఆ తత్‌బ్రహ్మమే ‘సృష్టికల్పన’ అనబడే బ్రహ్మయజ్ఞమయముగా అగుచున్నది. అనగా, సృష్టి బ్రహ్మయజ్ఞ అంతర్విభాగమే।
బ్రహ్మసూత్రము (లేక) యజ్ఞసూత్రము: ‘‘బ్రహ్మము అయి ఉన్న నేను ఈ ‘అన్యము’ గా కనిపిస్తున్న అంతటినీ సూత్రప్రాయంగా ధారణ చేస్తున్నాను’’- అను బ్రాహ్మీభావనయే యజ్ఞసూత్రము (లేక) బ్రహ్మసూత్రము. అట్టి కేవలగు ఆత్మభావనయే కైవల్యము.
‘అన్యము’గా కనిపించేదంతా ‘యజ్ఞసూత్రము’గా ధరించటానికి ఉపాయములు :
(1) బ్రహ్మ సంధ్యాక్రియ : ‘ధ్యానము’, ‘కర్మయోగము’, ‘ప్రాణాయామోపాసన’, ‘పరాప్రేమ స్వరూపమగు భక్తి’ వంటి క్రియలతో బుద్ధిని - జీవాత్మ (ఇహ స్వరూపము) పరమాత్మ (ఆవలిదగు పరస్వరూపము)ల మధ్యగా గల ‘‘సంధ్యాస్థానము’’ నందు - నిలిపి ఉంచటమును - ‘‘బ్రహ్మ సంధ్యా క్రియ’’గా చెప్పుకుంటున్నాము. (ఇది క్రమముక్తిగా చెప్పబడుతోంది).
(2) మనోయాగము : మనస్సును ‘కేవలము, సర్వాత్మకము, సర్వతత్త్వస్వరూపము’ - అగు ఆత్మతో అనుసంధానము చేయు అనునిత్య క్రియా విశేషమే ‘మనోయాగము’. (ఇది సద్యోముక్తిగా వర్ణించబడుతోంది)
ఇక్కడి ఈ రెండిటినీ విడివిడిగా చెప్పుకుంటున్నప్పటికీ, మనోయాగము కూడా - బ్రహ్మ సంధ్యా క్రియా యోగము యొక్క ఒకానొక విశేష లక్షణమే అయిఉన్నది.
అట్టి అఖండాత్మ సంజ్ఞయగు ‘ప్రణవ బ్రహ్మయజ్ఞము’ను అనుష్ఠానము చేయు ధారణయే ‘యజ్ఞసూత్రము’. అట్టి ‘‘యజ్ఞసూత్ర- ప్రణవబ్రహ్మయజ్ఞ క్రియాయుక్తుడు’’ - అయినప్పుడు ‘బ్రాహ్మణుడు’గా చెప్పుకోబడుచున్నాడు.
అట్టి బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తులై దేవతలు - జగత్తును నిర్వర్తిస్తూ, పరిపోషిస్తున్నారు. ‘యజ్ఞసూత్ర ధారణ’గా భావించి, తమ తమ విద్యుక్తధర్మములైనట్టి సృష్టిరచన-సృష్టి క్రియా కల్పనలయందు యజ్ఞ భావనతో పాల్గొంటున్నారు. ఈ విధంగా దేవతలు ‘బ్రహ్మచర్యము’ను ఆచరిస్తున్నవారు అగుచున్నారు. [ యజ్ఞము కొరకు చేయు కర్మ బ్రహ్మచర్యమే। ]
‘యజ్ఞము’ అనగా? హంస (సో౽హమ్ ఓం) సూత్రమును ఉద్దేశించి ప్రాపంచక కర్మలు, ఉపాసనలు, అగ్ని కార్యములు, తదితర సమస్త క్రియలు నిర్వర్తిస్తూ ఉండటమే ‘యజ్ఞము’. ఇదియే యజ్ఞము అను వేద శబ్దముయొక్క ముఖ్యార్థము.
(1) హంస (ఆత్మ) (2) ‘ఓం’ - అను ప్రణవము అనబడేవి రెండు కూడా వేరు వేరు కాదు. హంసః ప్రణవో అభేదః।
(హంస = సో- హమ్. ప్రణవము = సమగ్రమగు స్వస్వరూపము).
• ‘హంస’ (ఆత్మ) యొక్క భావనారూప-ప్రార్థనా చమత్కారమే త్రికాలములు (భూత భవిష్యత్ వర్తమానకాలములు).
• త్రికాలములు, త్రివర్ణములు కూడా! (జీవ ఈశ్వర పరాత్మలు), (జాగ్రత్ స్వప్న సుషుప్తులు), (సత్త్వ-రజో-తమములు).
• యాగము : త్రేతాగ్నుల (3 అగ్నుల అనుసంధానమే ‘యాగము’. (ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని). (సృష్టి, స్థితి, లయలు) అనుసంధానమే ‘యాగము’ అను శబ్దముయొక్క ఒకానొక శబ్దార్థము).
(పంచాగ్నులు : గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ, సఖ్యా, అవసధ్యాగ్నులు).
[ యాగము = (నిరుక్తారము) దృశ్య-జీవ-ఈశ్వరుల - ఏకరూప అనుసంధానము ]
త్రైత అగ్న్య ఆత్మాకృతి వర్ణ ఓంకార హగ్ంస - అనుసంధానో ‘అంతర్యాగః’।
(1) గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ - త్రి అగ్నులు.
(2) ఆ మూడు తనవైన హంస (ఓంకారము, ఆత్మ) యొక్క మనో - అనుసంధానమే అంతర్యాగము.
‘‘ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావైన నేనే ‘నేను’. అట్టి నేను ఆత్మస్వరూప, స్వభావుడనై సమస్తమునకు ఆధారమును, కర్తను కూడా’’ - అను భావన - అవగాహనల అనుసంధానము - ‘అంతర్యాగము’.
(చతురీయము, 4వది)
• జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాయొక్క స్వకీయ కల్పితస్థానములై, సంచారము కొరకు నాకై కల్పించుకున్న ‘నేనైన నేనే’ - తురీయము’. అట్టి తురీయము యొక్క స్వరూపము ఎట్టిది? చిత్స్వరూప సత్ తత్‌మయం తురీయ స్వరూపమ్। (తురీయ పురుషుని రూపము - చిత్ (knowing) తో కూడిన ‘సత్’ (Absolute presence) రూపము (మరియు) తత్ (That form beyond all) స్వరూపము - కూడా।
• హంస = అంతరాదిత్యే జ్యోతిస్స్వరూపో హగ్ంసః। అంతర హృదయములో సూర్య (ఆదిత్య) జ్యోతి స్వరూపము- ‘హంస’ అనబడుతోంది.
• బ్రహ్మసంపత్తి = ‘యజ్ఞము’ యొక్క ముఖ్య అంగము - ‘‘బ్రహ్మతత్త్వజ్ఞాన సంపత్తి’’.
ఈ జీవుడు బ్రహ్మమునందు ప్రవృత్తుడైనవాడై అట్టి ‘ప్రణవ హంస’ అగు ఆత్మను ‘సూత్రము’గా ఆచరించి, తద్వారా అఖండాత్మ భావనను సిద్ధించుకోగలడు.
బ్రహ్మమానసపుత్రులైనట్టి వాలఖిల్య, కామేశ్వర, వైశ్రవణ మొదలైనవారు :
తండ్రీ! బ్రహ్మభగవాన్! ‘హంస సూత్రములు’ అనబడు హంస (ఆత్మ)కు సూత్రములు ఎన్ని?
అద్దాని ప్రమాణము (పరిమాణము) ఎట్టిది?
బ్రహ్మదేవుడు : హృదయాదిత్యుని నుండి (హృదయములోని సూర్యుని నుండి) సృష్టిగా విస్తరిస్తున్న కిరణములు ‘‘96’’.
[ పంచ కర్మేంద్రియములు (+) పంచ జ్ఞానేంద్రియములు (+) పంచ ప్రాణములు (+) పంచ ఉపప్రాణముల (+) అంతరంగ చతుష్టము అగు మనో బుద్ధి చమత్కారములు నాలుగు ] = 24.
జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములలో ఈ ‘24’. అనగా 24 x 4 = ‘‘96’’
ఇవన్నీ చిత్ సూత్రము యొక్క ఘ్రాణములు (వాసనలు / చిరుగంటలు).
అట్టి ‘చిత్’ సూత్ర ఘ్రాణముల యొక్క స్వర నిర్గతమైన (ప్రదర్శనమైన) (Sound, Expressively spoken) ప్రణవధారలు ‘ఆరు’ - అంగుళములు.
‘‘బ్రహ్మము అయి ఉన్న నేను ఈ దృశ్య జగత్తును సూత్రముగా (Like an ornament) అవధరించుచున్నాను’’ - అను ‘పరమార్థము’నకు సూచనయే బ్రహ్మసూత్రము (లేక) భౌతికమైన యజ్ఞసూత్రము.
అట్టి యజ్ఞ సూత్రము (ప్రత్తి తంతువుల సంజ్ఞగా) ఎడమభుజము నుండి కుడి కటి (మొల) వరకు ‘80’ అంగుళముల పొడవుగలది ధరించబడుతోంది.
అట్టి స్థానము ‘హంస-సంచారక స్థానము’గా భావించబడి, ఉపాసించ బడుతోంది. బ్రహ్మము ఈ యజ్ఞసూత్ర స్థానములో (జందెము ధరించిన శారీరక స్థానములో) (భౌతిక - ఉపాశ్రయముకొరకై) అనుభవము కాగలదు.
బ్రహ్మముయొక్క స్వకారమగు తాత్త్విక స్వరూపము తేలికగా అనుభవము కాగలదు. బ్రహ్మగృహ్య ప్రకారో న అన్యత్ర విదితః। బ్రహ్మ సూత్రము యొక్క ఆశ్రయము చేతనే బ్రహ్మము అనుభవమౌతుంది. వేరే త్రోవ లేదు. అట్టి పరమాత్మతత్త్వము ఎరిగినవారు అమృత ఫలప్రదులు కాగలరు.
హంస (ఆత్మ) సర్వకాలములందు నిత్యప్రకాశకము.
ప్రణవహంస యొక్క అంతర్ - ధ్యాన ప్రకృతి లేకుండా ఈ జీవునికి ముక్తి సిద్ధించదు.
ఆత్మజ్ఞానము కొరకై (బ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు, జీవాత్మ, దృశ్య-జగత్తు-మనోబుద్ధి చిత్త అహంకారములు అనబడే) ‘‘నవసూత్రము’’ ముందుగా విచారించబడు గాక।
ఆ నవ సూత్రములుగా చరించుచున్నది కూడా ఆత్మయే.
అంతరాదిత్యుడగు ఆత్మభగవానుని ఎరుగని మానవుడు - బాహ్య సూర్యుని గురించి మాత్రం ఏమి, ఎంతవరకు తెలుసుకోగలడు? ఆత్మతత్త్వ జ్ఞానము ఎరిగిన విబుధులు సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ, సమస్తమును ఆత్మగానే ఉపాసిస్తున్నారు. ఆత్మయందే ఆచరణము కలిగి ఉంటున్నారు. మరణమును అధిగమించి అమృత స్వరూపులగుచున్నారు.
యజ్ఞము నిర్వర్తించువారు :
(1) యజమాని = యజ్ఞమునకు కర్త.
(2) ఆధ్వర్యుడు = యజ్ఞములో యజుర్వేద మంత్రములను పలుకువారు. ఈయన యజ్ఞము చేయించువారిలో ముఖ్యులు. యజ్ఞమును ఎట్టి పొరపాట్లు లేకుండా చూచుకొను బాధ్యత కలవారు.
(3) హోత = యజ్ఞవిధిలో ఋగ్వేద మంత్రములను చదువువారు.
(4) ఉద్గాత = యజ్ఞ సంవిధానములో సామవేదమును గానము చేయువారు.
(5) బ్రహ్మ = ‘‘అధర్వణ వేద మంత్రములను చెప్పువారు.
(6) ఋత్విక్కులు = యజ్ఞవిధిలోని ఆయా అనేక విధులను నిర్వర్తింపజేయువారు. వీరు ‘అగ్నిధ్రులు, ప్రతిపస్థాత, నేష్ట, ఉపద్రష్ట’ మొదలైన పేర్లు కలిగి ఆయా యజ్ఞ క్రియలు నిర్వర్తిస్తూ ఉంటారు.
వాజపేయములో (మనో వాజపేయ బ్రాహ్మీ యాగములో)
పశుహర్త (పసుపతి) → ఆధ్వర్యుడు
ఇంద్రుడు → దేవత
ధర్మయాగము (ధర్మసూత్రము) → అహింస
పరమహంస → ఆధ్వర్యుడు
పశుపతి → పరమాత్మయగు దేవత
బ్రహ్మ → బ్రహ్మోపనిషదము
స్వాధ్యాయయుక్తులు → బ్రాహ్మణులు. (తత్త్వజ్ఞులగు మహనీయుల ప్రవచనములు, బోధలు, స్వానుభవములు)
అశ్వమేధము - మహాయజ్ఞ కథనమునకు:
• రాజు (యజ్ఞకర్త) - బ్రహ్మచర్యము (బ్రహ్మోపాసన)
• ఆశయము - ఆత్మజ్ఞానముగాను విధానము మనో సంచారము’’ విజయము సంపాదించటముగాను చెప్పబడుతోంది.
బ్రహ్మపుత్రుడు : సర్వేషాం పూర్వోక్త బ్రహ్మయజ్ఞ క్రమం - ముక్తిక్రమం। ఇట్టి మన తండ్రిగారు చెప్పిన బ్రహ్మయజ్ఞక్రమము - ‘ముక్తిక్రమము’ అయి ఉన్నది. (బ్రహ్మయజ్ఞము - అని వేద వాఙ్మయంతో చెప్పబడినది - క్రమముక్తి విధానము).
ఈ విధంగా బ్రహ్మదేవుడు ‘హంస ఋషి’ తత్త్వము బోధించారు. స్వయంభూః తిరోదధే। స్వయంభువు అగు ప్రజాపతి అదృశ్యమైనారు.
అట్టి ఈ ‘రుద్రోపనిషత్’ అని చెప్పబడే వివరములకు హంసజ్యోతి పురుషుడు - పశుపతి।
తారకము = ప్రణవము (తరింపజేయునది). ఉపనిషత్‌లోని విశేషములు ఎరిగినవాడు ‘హంసాత్మ మాలికా వర్ణ ప్రబోధితుడు’ - అనబడుచున్నాడు.
పరమాత్మయే - పురుషుడు।
ప్రకృతియే - బ్రహ్మసంపత్తికారిణీ।
అధ్యాత్మము - బ్రహ్మకల్పము అయినట్టి జగత్తు యొక్క ఆకృతి। (అధ్యాత్మ బ్రహ్మస్య ఆకృతిః)
ధీమంతుల (ఆత్మబుద్ధి కలవారు) ఈ కనబడుచున్న దృశ్యమును ‘బ్రహ్మజ్ఞాన ప్రభోధము’ యొక్క సంధ్యాకాలంగా (సంధ్యావందన క్రియచే) ఉపాసిస్తూ ఉంటున్నారు.
హంసాఖ్యముని ‘‘ఆత్మతత్త్వ ప్రజాకథనము’’ ద్వారా ఆత్మదేవుని గురించి స్వానుభవముగా తెలుసుకొని ఉన్నారు. ఆయన ఇంకా ఈ విధంగా ముముక్షువులకు ఎలుగెత్తి చెప్పుచున్నారు.
అంతర హృదయంలో ప్రణవనాదాఖ్యుడు ‘ఓం’ కార స్వరూపుడై వేంచేసి ఉన్నారు. ఆయనయే ప్రత్యయ బోధకుడు. బాహ్యమునుండి బుద్ధిని వెనుకకు మరల్చుదాము. అట్టి అంతరనాద స్వరూపుని గమనిద్దాము. శ్రవణం చేద్దాము. ఏకాగ్రబుద్ధితో - (1) బుద్ధికి ఈవల బుద్ధియందు (2) బుద్ధికి ఆవల గూఢముగాను - ప్రకాశించుచున్న ఆత్మ చైతన్యమును ధ్యానిద్దాము.
‘నాద-బిందు-కళలు’ :- ఈ మూడు కూడా బుద్ధియందు అంతర్గతమై జ్ఞాననాళములు. చిన్మయానంద వేదితములు. విశ్వచేష్ఠితమునకు (విశ్వనిర్మాణమునకు, అనుసంధానము. ఆత్మాకాశమునందు ఏర్పడుచున్న) మూలకారణములుగా అగుచున్నాయి.
శివశక్త్యాత్మకం రూపం చిన్మయానంద వేదితమ్ - చిన్మయానందము సిద్ధించగా రూపించునది, (కనిపించునది) శివ- శక్తుల (కేవల సందర్భముల, పురుష-ప్రకృతుల, ‘‘నేను-నాయొక్క’’) ("I" and "MY") ఏకరూపము. ఈ సమస్తము శివ శక్త్యాత్మకమే। పరస్పరం అభేదము కూడా।
నాద బిందు కళా త్రీణి ద్విత్రాణాం సాంఖ్యం అకృతిః। - ఈ విశ్వమంతా ‘నాద-బిందు-కళలు’’ అనే త్రినేత్రముల సంక్రియా ప్రదర్శనములతో కూడి ఉన్నది. సాంఖ్యపూర్వకంగా జీవాత్మ - పరమాత్మల ద్విత్వ చమత్కారము. సాకారంగా అనుభవమగుచూ ఉంటున్నాయి.
అంతర్గూఢ ‘ప్రమా’ హంసః । - సమస్త జీవుల హృదయాలలోను హంసయే (ఆత్మయే) ‘ప్రమ’గా (సహజసత్త్వమై, యదార్థముగా) వేంచేసి ఉన్నది. అట్టి ప్రమ అగు (సత్యమగు) ఆత్మయొక్క స్వయం కల్పిత ‘ప్రమాణము’ - ఈ దృశ్యజగత్తు.
బ్రహ్మసూత్ర పదం జ్ఞేయం బ్రాహ్మ్యం విద్యుక్త లక్షణం। బ్రహ్మజ్ఞుల విధ్యుక్త లక్షణము : బ్రహ్మ సూత్ర పదము [ బ్రహ్మమే (పూదండలలో దారములాగా) సమస్త జీవుల హృదయములందు సమరూపమై ఉండటము ] స్వానుభవమై ఉండటము. ‘‘బ్రహ్మ-సూత్రపదము’’ ఎరిగి ఉండటము - బ్రాహ్మ్యము యొక్క (బ్రాహ్మణుల) విధ్యుక్త లక్షణము.
‘‘తెలుసుకొనువాడు’’, ‘తెలివి’లతో సహా తెలియబడేదంతా బ్రహ్మమే’’ - అనునదే సదా జ్ఞేయము.
హంసాఖ్య ప్రణవ ధ్యానమే ఓంకార సంఖ్యార్థమగు కేవలాత్మ స్వరూప ధ్యానము.
ధ్యానము చేయు విధానమే జ్ఞాన (అధ్యాత్మ) శాస్త్ర పారగము. అట్టి ‘‘స్వస్వరూప, సర్వ స్వరూప ఆత్మ’’ను తెలుసుకున్నంత మాత్రం చేతనే ఈ జీవుడు తెలుసుకోవలసినది తెలుసుకున్నవాడై ‘‘జ్ఞానసాగర పారగుడు’’ (One who reached the other end of the ocean of knowledge) అగుచున్నాడు.
స్వస్వరూపాత్మయే శివుడు. ఆయనయే అందరిలో కేవల స్వరూపముగా వెలయుచున్నారు. సమస్త జీవులలో స్వతఃశివుడుగా వెలుగొందుచున్నారు. అట్టి పశుపతి అగు స్వతఃశివుడే - సర్వము సర్వదా తానే అయి, సమస్తమునకు ఆవల ‘‘సాక్షి’’ అయిఉన్నారు కూడా।
అట్టి చైతన్య స్వరూపుడగు శివభగవానుడే సమస్త జీవులలో మనోరూపుడై సమస్తమునకు ప్రేరణ కలిగిస్తూ, నియమించుచున్నారు. సర్వజీవులలోని మనోదర్పణము - ఆ శివతత్త్వవిలాసమే।
అట్టి స్వయం శివ ప్రేరణాన్వితుడగు ఈ జీవుని పట్ల (An Individualistic state):
• ప్రాణము ‘‘ప్రియము’’ రూపముగా ఇంద్రియ విషయములవైపుగా వెళ్లి వ్రాలుచూ ఉన్నది.
• ప్రాణము నుండి ప్రియమగు వాక్కు చేష్టత (Inclination) పొంది - మాట్లాడటము జరుగుతోంది.
• ప్రాణము నుండి ప్రియమగు చూపు రూపుదిద్దుకొని, రూపములను చూడటం జరుగుతోంది.
• ప్రాణము నుండి ప్రియమగు శ్రవణశక్తి బయల్వెడలి సమస్త శబ్ద జాలమును వినగలుగుతోంది.
• తదితర ఇంద్రియములు - ఆయా ఇంద్రియ విషయములన్నీ కూడా ప్రాణశక్తి నుండియే పొందుచున్నాయి.
ప్రాణశక్తియే ఇంద్రియ - ఇంద్రియ విషయములుగా కూడా ప్రదర్శనమౌతోంది.
[ (ఉదా: చర్మము= స్పర్శ, స్పర్శించబడే వస్తువు, నాలుక = రుచి, రుచి చూడబడే వస్తువు, ముక్కు = వాసన, వాసన చూడబడే వస్తువు)
ఇవన్నీ కూడా ఆత్మయొక్క ‘‘శక్తి’’ రూపమగు ‘ప్రాణము’ చేతననే ప్రేరణ పొంది ప్రవర్తిస్తున్నాయి. అనగా, ఆత్మకు చెందిన (పశుపతి దత్తమైన) ప్రాణశక్తియొక్క వివిధ ప్రదర్శనములే ఈ కర్మ జ్ఞానేంద్రియములు, వాటివాటి విషయములు కూడా। ]
ఈ ఇంద్రియములన్నీ ప్రాణశక్తి నుండి ప్రేరణ పొంది, విషయములలో ప్రవర్తిస్తూ ఉన్నాయి, అయితే, ప్రవర్తింపజేయువాడు ఎవరు? ఆత్మ యొక్క స్వయం విన్యాస కల్పితుడగు మాయా పురుషుడే। అంతేగాని ఈ ఇంద్రియ జగదనుభవము ఆత్మయొక్క సహజ స్వరూపము కాదు, స్వభావము కాదు. పరమాత్మయే పశుపతి. జీవాత్మానుభవములతో కూడిన లోక విన్యాసమంతా పశుతత్త్వమే।
శ్రోత్రము (వినికిడి)నకు ‘‘ఉనికి స్థానము’’ (Zone of placement) ఏది? అది స్వయం - పశుపతి పురుషుడగు ఆత్మయందే అధ్యస్తము అయి ఉన్నది. ఆ పరమపురుషుని కళయే శ్రోత్రము. కాబట్టి వినికిడి యొక్క ఉనికి స్థానము పశుపతియే (ఆత్మపురుషుడే।). తన జీవాంశచే శివుడు - శ్రోత్రమును అనుసరిస్తూ విషయముల కల్పన, వాటి అనుభవము కూడా నిర్వర్తిస్తున్నారు.
మనస్సు ఆత్మయందే అధ్యస్తము అయి ఉన్నది. (Thought has its placement in 'Absolute Self' only). ఆత్మపురుషుడే మనస్సునందు ప్రవేశించి, మనోరూపుడై మనస్సును ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆలోచించబడుచున్న దానిపై మనస్సును నియమించువాడు కూడా తానే అయి ఉంటున్నారు. అంతేకాదు. మనస్సుకు తెలియబడుచున్న సమస్తము కూడా ఆయనయే।
స ఏవ విదితాని అన్యః, తథైవ అవిదితానపి। ఇక్కడి తెలియబడేది (అట్లాగే), తెలియబడనిది - అంతా కూడా ఆ ఆత్మ పురుషుని చిద్విలాస విన్యాసమే.
ఆ ఈశ్వరుడే (1) సమస్తమైన (కల్పితమాత్రములగు) ఇంద్రియార్థములలోను, ఇంద్రియములలోను ప్రవేశించటము, (2) ఇంద్రియాను భవములుగా ప్రాప్తిస్తున్న సమస్త రూప నామ అనుభవములను - ఉభయము తానే స్వయముగా దాల్చుచుండటము కూడా - నిర్వర్తిస్తున్నారు.
ఇంద్రియములను, ఇంద్రియ విషయములను మనో విన్యాసముగా నియమిస్తున్నది కూడా ఆ ఆత్మదేవుడే. మనోవిన్యాసము, మనోబంధమోక్షములు - ఇవన్నీ కూడా జీవుడుగా ప్రదర్శనమగుచున్న పశుపతియొక్క స్వయంకృత లీలా కల్పనయే।
తతః చక్షుశ్చ, వాక్ చ ఏవ, మనస్య, అన్యాని ‘ఖాని’ చ, న గచ్ఛంతి స్వయంజ్యోతిః స్వభావే పరమాత్మని। స్వయంజ్యోతి స్వరూపుడగు పరమాత్మయొక్క తేజో విభవములే ఈ కళ్లు, వాక్కు, మనస్సు తదితర ఇంద్రియ రంధ్రములు కూడా! అంతేగాని, అవన్నీ ఆత్మకు వేరైన, అతీతమైన ఉనికి కలిగి లేవు.
ఇంద్రియములుగాను, ఇంద్రియ విషయ రూపమగు నామరూపాత్మక జగత్తుగాను కనిపించే ఉభయము పశుపతి యొక్క విశ్వ తాండవ నృత్యమే। ఆత్మ విన్యాసమే।
స్వాత్మయే అయి ఉన్న పరమాత్మ సమస్త ఇంద్రియ విషయములకు అకర్త. బాహ్య-అంతరంగ విభాగములకు వేరై, ప్రత్యక్ ప్రకాశ రూపుడు. సమస్తము తనయొక్క ప్రకాశము, తేజోవిభవముగా కలిగి ఉన్నట్టి వారు.
అట్టి బ్రహ్మమును విజ్ఞులు తర్క - ప్రమాణములను (Logic, examples) ఉపయోగించుకుంటూనే తర్క ప్రమాణములను అధిగమించి (1) ‘‘తెలియబడే సమస్తము’’ గాను, ‘‘తెలుసుకొంటున్నవాడు’’ గాను తెలుసుకొంటున్నారు. (వేద వేదసః। వేద విహితః। వేదవేద్యః।)
అట్టి స్వస్వరూపుడగు ప్రత్యగాత్మ పరంజ్యోతి స్వరూపుడు. ఆయన యొక్క మాయ ‘‘మహత్తరమగు స్వకీయ కల్పన’’ అయి ఉన్నది. అంతేగాని ఆత్మపురుషుని సమక్షంలో మరొకరెవరో వచ్చి ‘మాయ’ను కల్పించటము లేదు.
అయితే నిర్విషయుడు, సమస్తమునకు పరము (ఆవల) అయినట్టివాడు నిత్యనిర్మలుడు అగు ‘ప్రత్యగాత్మ’ యందు ‘మాయ’ అనే దోషకల్పన అసలు ఎట్లా ఏర్పడుతుంది? ఏర్పడటానికి వీలే లేదు.
అందుచేత,
- తర్క ప్రమాణములచేతను (Through Logic and study of examples / similies)
- స్వానుభవము చేతను,
- స్వప్రకాశైక సంసిద్ధి చేతను,
సిద్ధించుచున్న చిద్ఘనమునందు (ఘనీభూతమైన కేవల చిత్ పరాత్మయందు)-‘మాయ’ అనే అన్యమైనది ఘటించగల ప్రసక్తియే లేదు.
వ్యవహారిక దృష్టే అయం విద్యా, అవిద్యా। న చ అన్యథా।। వ్యావహారిక దృష్టి చేత మాత్రమే [ (లేక) లోకసంబంధమైన - నామరూపాత్మకమైన) దృష్టిచేత మాత్రమే ] విద్య, అవిద్య అనబడేవి ఉన్నాయి. అందుకు వేరైన దృష్టిలో చూచినప్పుడు ‘విద్య, అవిద్యలు’ లేనివే అగుచున్నాయి.
తత్త్వదృష్ట్యాతు నాస్త్యేవ, తత్త్వమేవ అస్తికేవలమ్। తత్త్వ దృష్టితో చూస్తే ‘కేవలమగు తత్త్వము’ మాత్రమే ఇక్కడ ఉండి ఉన్నది. ఒకడు వ్యావహారిక దృష్టిలో ఉన్నా, అది కూడా ఆత్మయొక్క సంప్రకాశ ప్రదర్శనమే. ఈవిధంగా మౌన స్వరూపమగు ఆత్మప్రకాశమే ‘సమస్తము’ అయి వెలయుచున్నది.
ఎవరి పట్ల అయితే,
‘‘విద్య-అవిద్యలకు ఆవల (జ్ఞాన-అజ్ఞానములకు అతీతంగా) అఖండాత్మ యొక్క ప్రకాశమే ఈ సమస్తము’’ అను మహార్థము స్వాభావికంగా ప్రకాశించుచు, స్వాభావికంగా స్వానుభవము అవుతూ ఉంటుందో -
• అట్టివాడు ‘జీవుడు’ కాదు.
• ‘బ్రహ్మము’ - అను శబ్దమాత్రుడు కూడా కాదు.
ఆతడు తనకు తానే సంపూర్ణుడు.
‘‘మరొకటేదో లభిస్తేనేగాని నేను పూరుణాడను కాను’’ అనే శంకయే ఆతనిపట్ల శేషించి ఉండదు. జీవుడు, బ్రహ్మము మొదలైనవన్నీ తనయొక్క ఆత్మప్రకాశమునందు ఏర్పడే కించిత్ సాకార స్వకీయ సందర్శనము వంటిది మాత్రమే। (దర్పణములో ప్రతిబింబము వంటిది మాత్రమే). (లేక) అవి అంతిమబోధకై మధ్యేమార్గరూప శాస్త్ర కల్పితాలు.
అట్టి సర్వత్రా స్వస్వరూప బ్రహ్మమును దర్శించువానిపట్ల వర్ణ రూప భేదములు గాని, బ్రహ్మచర్య - గృహస్త - వానప్రస్త - సన్న్యాస ఇత్యాది ఆశ్రమ భేదములుగాని ఉండజాలవు. ఆత్మని గురించి - ధర్మ - అధర్మములుగాని, విధి నిషేధములు గాని - ఏమని నిర్వచించి చెప్పగలము?
ఈ సమస్త దృశ్యమును - ‘‘స్వతఃగానే (In its natural course / act) బ్రహ్మమే’’ అని దర్శించువాడు -
• తాను లోకంలో అనేక దుఃఖముల మధ్యగా (లౌకికంగా) ఉన్నప్పటికీ కూడా, కించిత్ కూడా అంతరంగంలో అవేవీ లేనివాడై ఉంటాడు.
• ఆతనికి దృశ్యము దృశ్యముగా కనిపించక, కేవల ‘చిద్రూపము’ (In Absolute knowing form) గా అగుపిస్తూ ఉంటుంది.
• సాక్షాత్ పరమాత్మ యొక్క సమక్షంలో ధర్మ - ధర్మి (ధర్మము, అధర్మము, ధర్మిష్టుడు, అధర్మిష్టుడు) మొదలైన భేదములేవీ మొదలే ఉండజాలవు. సమస్తము ఆయనయే అయి ఉండగా, ఇక ఆయన పట్ల (లేక) ఆయన సమక్షంలో భేదాభేదములేమి ఉంటాయి? కథా రచనలోని ‘‘మంచివారు, చెడ్డవారు’’ మొదలైనవి కథా రచయిత తనపట్ల కలిగి ఉండడు కదా।
నాస్తి స్వాత్మాతిరేకేణ, స్వయమేవ అస్తి సర్వదా! ఆత్మకు ఆవలగా గాని, ఆత్మకు వేరైగానీ ఏదీ లేదు. ఆత్మయే సర్వత్రా సమస్వరూపమై ‘‘ఈ సమస్తము’’గా వెలయుచున్నది. వస్తుతః గాని, అవస్తుతః గాని ఇక్కడ ఉన్నది బ్రహ్మమే.
అట్టి బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మజ్ఞాని తానే ఈ సమస్తము అయి ప్రకాశించుచున్నాడు. తనయొక్క తేజోవిభవమే అయిఉన్న దృశ్యజగత్తులో బ్రహ్మజ్ఞాని ఏది స్వీకరిస్తాడు? ఏది త్యజిస్తాడు? కిం ఉపాదేయం? కిం హేయం? కిం గృహాణాతి, జహాతి కిం?
బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే ‘‘అధిష్ఠానము’’ అయినట్లుగానే, ఈ సమస్తమునకు (స్వస్వరూపమగు) ఆత్మయే అధిష్ఠానము. అట్టి అధిష్ఠానమగు ఆత్మ - అనౌపమ్యమ్। ఉపమానాలను ఉపయోగించి ఒకరికి మరొకరు ఆత్మతత్త్వానుభవం కలిగించలేరు. ఆత్మ ఉపమానములకు కూడా అందనిది.
అవాక్- మానస గోచరమ్। అది వాక్కుకు, ఆలోచనలకు విషయము కాదు. వాక్కు, ఆలోచనలు తనవై ఉన్నట్టిది - (అధిష్ఠానమగు) ఆత్మ.
అద్రేశ్యమ్। ఆత్మ దేశ కాలాదులకు చెందినది కాదు. దేశ కాలాదులన్నీ అద్దాని స్వయం కల్పనా వినోదములు మాత్రమే।
అగ్రాహ్యమ్। బుద్ధితోనో, ఇంకొకరు చెప్పితేనో, లేక ఎక్కడైనా ‘వింటేనో, చదివితేనో గ్రహించబడేది కాదు. ఎందుకంటే సమస్తము ఆయారీతులుగా గ్రహిస్తున్నది ఆత్మయే కనుక। ఒకడు తనను తాను తెలుసుకొనే అధ్యయనోత్సాహంతో మాత్రమే - ఆత్మను గ్రహించబడగలదు.
రూపవర్జితమ్। అది నామ రూపాత్మకమైనది కాదు. నామరూపములన్నీ ఆత్మయొక్క భావనా మాత్రములే। ‘ఆత్మ’ను నామరూపాత్మక చట్రము (పరిధి)కి తెచ్చి నియమించి చెప్పలేము.
అచక్షుశ్రోత్రమ్।। అత్యర్థం తదపాణి పాదం తథా। అట్టి ఆత్మ - కళ్లు, చెవులు తదితర జ్ఞానేంద్రియముల రూపములుగా అవదు. చేతులు, కాళ్లు, తదితర కర్మేంద్రియముల రూపములు పొందేది కాదు. వాటి వాటి విషయపరంపరల రూపము కూడా పొందేది కాదు. వాటికన్నిటికీ ఆత్మ సాక్షి, నియామకుడు, రచయిత కూడా.
నిత్యమ్। ఆత్మ త్రికాలములందు యథాతథము.
విభుమ్। సమస్త జగదనుభవములను (రాజువలె) పరిపాలించినది కాబట్టి - విభువు.
సర్వగతమ్। ఒక నాటక రచయిత - నాటకములోని కథా విభాగములోను, పాత్రల యొక్క పరస్పర (సానుకూల, ప్రతికూల) సంబంధ బాంధవ్యములలోను - సర్వగతుడై ఉంటాడుకదా! నాటకమంతా రచయితయొక్క ఊహాకల్పనయే కదా। అట్లాగే అనుభవముగా అగుచున్న సమస్తమునందు పరమాత్మయే (పాలలో నేయివలె) సర్వగతుడై, అంతర్లీనుడై ఉన్నారు.
ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు స్వయం కల్పిత కథావిశేషము వంటి ఊహా - అపోహ నిర్మిత జగత్తంతా అనుభవముగా కల్పించుకొని అనుభవిస్తున్నాడు,
సుసూక్ష్మమ్। ఆత్మ ఈ సర్వశరీరములలో సమముగా సూక్ష్మాతి సూక్ష్మస్వరూపమై వేంచేసి ఉన్నది. ఆకాశము కంటే కూడా ఎంతో సూక్ష్మమైనట్టిది.
తత్ అవ్యయమ్। ప్రతి ఒక్కని అంతర్యామియగు స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ మార్పు-చేర్పులు ఏమాత్రము పొందనిది. అవ్యయమైనది. వ్యయము కానట్టిది.
బ్రహ్మైవ ఇదమ్ అమృతం। ఈ జగత్తుగా కనబడేదంతా కూడా - అమృతస్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.
బ్రహ్మానందం పరమం దక్షిణేన చ। బ్రహ్మానందం పరమం చ ఉత్తరే చ।। ఈ సమస్త లోకముల ఉత్పత్తి - స్థితి - లయములకు (లోకములకు మునుముందుగాను, లోకములు నశించిన తరువాత కూడా) ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు ఉన్నదంతా బ్రహ్మానందమే। పరమానందమే। బ్రహ్మమే ఈ దృశ్యమునకు అటు ఉత్తరంగాను, ఇటు దక్షిణంగాను ఆవలగా కూడా ఉండి ఉన్నది.
ఆత్మను ఎరిగినవాడు స్వాభావికంగా ‘అభయుడు’ అగుచున్నాడు.
స్వాత్మన్యేవ స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః। నిర్భయుడగు ఆత్మజ్ఞాని ఈ జగత్తును స్వయంగా సదా తనయొక్క స్వస్వరూపాత్మరూపంగానే దర్శిస్తూ ఉంటాడు.
ఆతడు జగత్ వ్యవహారాల దృష్ట్యా బద్ధుడివలె ఉంటూ కూడా, మరొకప్రక్క సమస్తమునకు అతీతుడై, (శరీరముయొక్క రాకపోకలతో సహా) సమస్త లోకసంబంధమైన, దృశ్య సంబంధమైన వ్యవహారములనుండి ‘విముక్తుడై’ (Al-relieved) ఉంటాడు.
ప్రతి ఒక్కరి (జగద్దృశ్యమునకు ఆవలిదగు) ‘పర’ స్వరూపమును (One's own Form which is beyond and mere witness to all this being seen) : - ఎరుగునది ఎట్లా?
• సత్యమార్గము (త్రికాలములందు ప్రతి జీవునిపట్ల ఏర్పడి ఉండి కేవలమగు ఉనికి యొక్క ఉపాశ్రయము) చేతను,
• ‘‘సత్యము స్వానుభవము కావాలి. అసత్యము జయించబడాలి’’ అనే తపన రూపమగు తపస్సు చేతను,
• బ్రహ్మచర్యము. (బ్రహ్మము గురించిన అధ్యయనము, ఆచరణము) చేతను
• వేదాంత వర్త్మనా। వేదాంత సంబంధమైన వర్తనము చేతను,
(వేదము = తెలియబడునది. అంతము = ఆవల।
వేదాంతము = తెలియబడుచున్నదంతా తెలుసుకొనుచున్న స్వస్వరూపము (The knower of all that being known) గురించిన వివరణ).
అట్టి స్వస్వరూప (వేదాంతరూప) అధ్యయనము చేత పరమాత్మను తనయందే ఈ జీవుడు ఎరుగగలడు. దర్శించగలడు. మమేకమవ గలడు.
సత్య తపో బ్రహ్మచర్య వేదాంత వర్తనములచే బుద్ధిలోని అల్ప-దోష దృష్టులు క్షీణించగా, అప్పుడు సర్వతత్త్వస్వరూపుడగు పరమాత్మను అట్టివారు తమయందే దర్శిస్తున్నారు, స్తుతిస్తున్నారు.
బుద్ధియొక్క దోషములు తొలగని వారు ‘మాయ’ చేత ఆవృతులై ఉండటంచేత తమయందే ఉన్న పరమాత్మను దర్శించలేకపోవుచున్నారు.
ఏ యోగి అయితే సహజము - కేవలము - స్వాభావికము అగు స్వస్వరూపమునకు సంబంధించిన విజ్ఞానము సంపాదించుకుంటాడో, అట్టి పూర్ణస్వరూపునికి దృష్టియందు లోకములకు సంబంధించిన గమన - ఆగమనములు ఉండవు.
ఏకము సంపూర్ణము అగు ఆకాశము ఎక్కడికీ వెళ్ళటం, ఎక్కడి నుండీ రావటం ఉండనట్లే, - ఆత్మాకాశమునకు కూడా ‘ఇక్కడ నుండి అక్కడికి’ అనునది ఉండనే ఉండదు.
• అభక్ష్యస్య నివృత్త్యా తు విశుద్ధం హృదయం భవేత్।। ఎప్పుడైతే ఇంద్రియములు విషయముల నుండి నివృత్తి పొందుచూ ఉంటాయో, అప్పుడిక హృదయము విశుద్ధము పొందుచూ ఉంటుంది.
• ఆహారశుద్ధే చిత్తస్య విశుద్ధిః భవతిస్వతః । ఆహారశుద్ధిచే చిత్తము స్వయముగా విశుద్ధి పొందగలదు. (స్వాత్త్వికాహారము, న్యాయార్జితాహారము, దైవార్పితాహారము, మితాహారము - అనునవి ఆహార శుద్ధి విశేషములుగా చెప్పబడుచున్నాయి)
(‘ఆహారశుద్ధి’ - అనబడేదానికి విశేషార్థము: ఇంద్రియములతో - ఆత్మజ్ఞాన ప్రయోజనముగల విషయములను స్వీకరించటము, అన్యవిషయములను త్యజించివేయటము (లేక) అంతరంగంలో మౌనం వహించి ఉండటము).
• చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం, త్రుట్యంతే గ్రంథయః స్ఫుటా। చిత్తశుద్ధిచే (నిర్మల దర్పణమునందు దృశ్యమువలె) హృదయ దర్పమునందు ఆత్మజ్ఞానము స్వభావంగానే సుస్పష్టమై సందర్శనమవగలదు. ఆత్మజ్ఞానము ప్రవృద్ధము అగుచూ ఉండగా దృశ్యానుభవమునకు సంబంధించిన హృదయ గ్రంథులు తెగిపోగలవు.
[ బ్రహ్మగ్రంథి = ‘‘సృష్టి కల్పించబడినది’’ - అనే భావనకు సంబంధించిన చిక్కుముడి.
విష్ణుగ్రంథి = ‘‘ఈ సృష్టి కొనసాగటం ఆవశ్యకం. నేను ఆధారపడి ఉన్నవాడను’’ అను భావనా గ్రంధి.
రుద్రగ్రంథి = ఈ సృష్టి ఉపసంహారమునకు సంబంధించిన భావనాగ్రంధి. ‘‘ఇంకా ఇంకా, ఏవో ఏవో తొలగితేగాని ఆత్మ అనుభవం కాదు’’ - అనే భ్రమాత్మకమైన చిక్కుముడి ]
సమ్యక్ జ్ఞాని : ఎవడు ఆత్మదృష్టిని సంపాదించుకొని సర్వత్రా సమదృష్టిని (సమ్యక్ దృష్టిని) సంపాదించుకుంటాడో,...అట్టి వాని పట్ల అభక్ష్యము [ శాస్త్ర నియమములైనట్టి విధి-నిషేధముల నియమితము (Applicability) ] ఉండదు. సమ్యక్ జ్ఞానికి సమస్తము స్వాభావికంగాను, అనునిత్యంగాను ‘‘తన స్వరూపమే’’ అయి, ఆతనిచే బ్రహ్మానందముగా దర్శించబడుతోంది. ఆస్వాదించబడుతోంది.
అహమ్ అన్నగ్ం। పంచేంద్రియములకు విషయములుగా ప్రదర్శనమగుచున్న ఈ దృశ్యజగత్తులోని శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ విషయములన్నిటితో కూడిన జగద్దృశ్యమంతా నాయొక్క స్వయంకల్పితమే। కనుక ఇంద్రియ విషయములయినట్టి అన్నము (అనుభవముగా అనుభవమగుచున్నట్టి) - అంతా నేనే.
[ అన్నము = తినబడునది (అనుభవించబడుచున్నది). (కళ్లకు చూపు, నోటికి రుచి, చర్మమునకు స్పర్శ, చెవికి వినికిడి - మొదలైనవి ]
అహం సదా అన్నాదగ్ం। ఈ అనుభవమగుచున్న సమస్తము నాయొక్క ఇష్టము చేతనే (స్వకీయ-జఠరదీప్తి చేతనే) ఏర్పడుతోంది. కనుక, ఈ సమస్తమునకు అన్నాదుడను. అనగా, ఉత్పత్తి స్థానమును, అనుభవమును సార్థకపరచువాడను కూడా ‘‘నేనే’’।
[ (అన్నాదమ్ = సమస్తమునకు ప్రదాత. కారణ కారణము. (ఇదంతా నా ఆకలిగా, ఇష్టముగా కలవాడను - నేనే) ]
బ్రహ్మమును ఎరుగుట బ్రహ్మ వేదనము. తనను తాను ఈ సమస్తమునకు ‘అన్నము’గాను, ‘అన్నాదుడు’గాను గమనించటము, దర్శించటము, తానే ఉభయము అయి ఉండటమును గమనించటము → ‘బ్రహ్మవేదనము’గా చెప్పబడుతోంది.
బ్రహ్మవిత్ గ్రసతి జ్ఞానాత్ సర్వం బ్రహ్మాత్మనైవ తు। బ్రహ్మమును ఎరిగినవాడు సర్వము బ్రహ్మాత్మకంగాను, స్వస్వరూపాత్మకంగాను ఎరుగుచున్నాడు.
ఎవరికైతే...,
- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అనబడు చాతుర్వర్ణ్యములు తాను ఆస్వాదించు ఆహారము వంటిదో,
- ‘మృత్యువు’ అనునది ఉపసేచనము (ఉపాహారము/పానీయము) వంటిదో,
అట్టి ఆత్మపురుషుని స్వస్వరూపముగాను, సర్వాత్మకునిగాను ఎరిగినవాడే ‘జ్ఞాని’ అని చెప్పబడుచున్నాడు. ‘బ్రహ్మము’ యొక్క స్వరూపము తెలుసుకున్నవానికి ఈ దృశ్యమంతా కూడా - తాను భోగించు వస్తువు (Subject matter of one's own enjoyable experience) - అగుచున్నదే గాని, బంధముగా కాదు.
ఇంకొక మాట।
ఈ జగత్తు ‘ఆత్మ’గానే భాసిస్తూ ఉన్నప్పుడు, ఇక ‘ఆత్మకు జగత్తు భోజ్యవస్తువు’ - అనటం మాత్రం ఎట్లా కుదురుతుంది? కుదరదు. మరి? బ్రహ్మ స్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా। బ్రహ్మమే స్వాత్మస్వరూపమగు ఈ సమస్తమును తనకు భక్షితము (Consumption)గా కలిగి ఉండి, స్వయముగా ఆనందిస్తోంది. తనయొక్క తేజోవిభవమునే జగత్తు అనబడు స్వయం కల్పితమును భోజ్యముగా పొందటం జరుగుతోంది.
బ్రహ్మము తనయొక్క స్వాత్మత్వవికాసముచే నిత్యభక్షితముగాను, నిత్యభక్షితుడుగాను (నిత్యము భక్షించబడునదిగాను, నిత్యము భక్షించువానిగాను) అగుచున్నది. అట్టి ఆత్మ సర్వదా ధ్రువమై, మార్పు చేర్పులకు, సంగతి - సందర్భములకు ఆవలిదై, సాక్షియై, స్పర్శించబడనిజాలనిదై ఉన్నది.
ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు స్వస్వరూపమునే ‘భోజ్యము’...అగు ‘పాంచభౌతిక-పంచేంద్రియ విషయ’ జగత్తుగా తనకు వేరైన దానివలె (As if different from his own self) పొందుచున్నాడు.
‘‘ఈ జగత్తు ఉన్నది’’ అను భావనకు ఈ జీవుడు పొంది ఉండటానికి కారణం? ఈ జీవుని స్వకీయమైనట్టి ‘‘అస్తి’’ అను స్వభావము నుండి బయల్వెడలుచున్నట్టిదే - ఈ జగత్తు కాబట్టి.
(ఆత్మ = ‘‘అస్తి’’ + ‘‘భాతి’’ + ‘‘ప్రియము’’
‘‘ఉనికి’’ + ‘‘ఎరుక’’ + ‘‘అనుభూతి’’
‘‘సత్’’ + ‘‘చిత్’’ + ‘‘ఆనందము’’
I am + knowing + Enjoying)
తరంగములు అనేకం ఉండవచ్చు గాక। జలమే ఉనికి కలిగిఉన్నది. తరంగములకు ఆకారము, పేరు, పొడవు, వెడల్పు మొదలైనవి సత్యము, నిత్యము కాదు కదా। తరంగములు జలముయొక్క నిజస్వరూపంకాదు. జలమే జలముయొక్క నిజస్వరూపము. తరంగముల నిజరూపము జలమే!
అట్లాగే - ఆత్మకే ఉనికి ఉన్నది. భావనాతరంగరూపములగు జగదనుభవములకు అస్తిత్వమెక్కడ? అస్తిత్వము లేని దానికి కర్తృత్వ, భోక్తృత్వము లెక్కడ? జగదనుభవములు ఎవరివో, ఎవరి నిర్వచనములో, అట్టి ‘ఆత్మ’ మాత్రమే ‘ఉనికి’ కలిగి ఉన్నది.
అస్తితా లక్షణా సత్తా। సత్తా బ్రహ్మ న చ అపరా।
ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. ఇక ‘మాయ’ అనబడేది మాత్రం - ఆత్మకు వేరైఎక్కడున్నది? మరి ‘మాయ’ అనబడేది (స్వతఃగా లేకపోయినప్పటికి) ఎందుకు అనుభవమౌతోంది? ఈ విషయంలో యోగపురుషుల అభిప్రాయం ఈవిధంగా ఉన్నది :-
యోగినాం ఆత్మనిష్ఠానాం ‘మాయ’’ - స్వాత్మని ‘‘కల్పితా’’। ఆత్మనిష్ఠను స్వభావంగా సిద్ధించుకొన్న యోగపుంగవుల దృష్టిలో - ‘‘మాయ’’ - అనబడేది ‘‘స్వస్వరూపాత్మయొక్క స్వయం కల్పిత వినోదము మాత్రమే’’. ఇక ‘మాయ’ - అనబడేది ‘బ్రహ్మము’ గురించిన జ్ఞానముచే బాధించబడినదై, ఆపై - ‘‘సాక్షి చైతన్యము’’ మాత్రమే శేషించుచున్నది. (బంగారు ఆభరణమంతా బంగారమే అయిన తీరుగా) సమస్తము సాక్షి చైతన్యముగా స్వానుభవమగుచుండగా, ఇక మాయ గురించిన చర్చ ఎక్కడ? అద్దానికి చోటెక్కడ?
ఓ వాలఖిల్య, వైశ్రవణ, కామేశ్వర, బ్రహ్మపుత్రులారా!
ఏదేది ఆత్మకు వేరుగా అగుపిస్తూ ఉన్నదో, అదంతా కూడా ‘‘యా మా’’ ‘‘మా యా’’ (లేని‘ది’) గా శాస్త్రములచే చెప్పబడుతోంది.
కనుక అస్మత్ మానసపుత్రులారా! మీరంతా కూడా। →
Pȃsupata Brahma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com