[[@YHRK]] [[@Spiritual]]

Seetha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అథర్వణ వేదాంతర్గత

20     సీతోపనిషత్

శ్లోకతాత్పర్య పుష్పమ్

శ్లో।। ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి
త్రయం యద్భావ సాధనమ్।
తద్బ్రహ్మ సత్తా సామాన్యం
- ‘‘సీతాతత్త్వమ్’’ ఉపాస్మహే।।
తత్త్వ జ్ఞానార్థులు తమ ఉపకరణములుగా ఇచ్ఛ జ్ఞాన క్రియా త్రయీ శక్తులను ఏకముచేసి ఏ ‘భావన’ సిద్ధించుకోవటానికై ఎక్కుబెట్టుచున్నారో, - అట్టి సర్వత్రా సమ స్వరూపమై యున్న బ్రహ్మతత్త్వమగు ‘సీతాతత్త్వము’ను ఆరాధన పూర్వకంగా ఉపాసిస్తున్నాము.
మం।। శ్లో।।
1. ఓం దేవా హ వై ప్రజాపతిం అబ్రువన్।
‘‘కా సీతా? కిం రూపం?’’ ఇతి।।
ఒక సందర్భములో దేవతలు బ్రహ్మలోకము ప్రవేశించినవారై, బ్రహ్మదేవునికి నమస్కరించి, ఈ విధంగా అడుగసాగారు.
‘‘పితామహా! ప్రజాపతీ!
- ‘సీత’ అనగా ఎవరు?
- ‘‘సీతాదేవి యొక్క దివ్యరూపము ఎట్టిది?’’
సహోవాచ ప్రజాపతిః।
- సా సీతా ఇతి।।
అప్పుడు ప్రజాపతి - ‘సీతా తత్త్వము’ గురించి ఈ విధంగా వివరిస్తూ, బోధించసాగారు.
2. మూల ప్రకృతి రూపత్వాత్
సా సీతా ‘‘ప్రకృతిః’’ స్మృతా।
ప్రణవ ప్రకృతి రూపత్వాత్
సా సీతా ‘‘ప్రకృతిః’’ ఉచ్యతే।
‘‘సీతా’’-ఇతి త్రివర్ణాత్మా
సాక్షాత్ ‘‘మాయామయీ’’ భవేత్।।
ప్రజాపతి (బ్రహ్మదేవుడు) : బిడ్డలారా! వినండి.
సీతాదేవి మూలప్రకృతి అయి, ఈ ఎదురుగా గల సమస్త దృశ్య రూపము దాల్చు చున్నది. అందుచేత ‘‘ప్రకృతియే సీతాదేవి’’ అని చెప్పబడుతోంది కూడా!

ప్రణవము యొక్క ‘ప్రకృతి’ రూపమే సీత. అందుచేత ‘సీతయే ప్రకృతి రూపము’ - అనబడుతోంది.
‘సీత’యే త్రివర్ణాత్మకమై (సత్త్వ రజో తమో త్రిగుణాత్మకమై) ‘సాక్షాత్ మాయా స్వరూపిణి’గా విరాజిల్లుచున్నది.
(‘స’ - ‘ఈ’ ‘తా’ - ఇతి త్రివర్ణాత్మికా।)
విష్ణుః ప్రపంచ బీజం చ।
మాయా ‘ఈ’ కార ఉచ్యతే।।
‘‘స’’ కారః సత్యం అమృతం ప్రాప్తః
సోమశ్చ కీర్త్యతే (పరికీర్త్యతే)।।
సీత = ‘స’ - ‘ఈ’ - ‘త’ లోని

‘ఈ’ కారము
విష్ణు తత్త్వము. ప్రపంచమునకు బీజము కాబట్టి ‘మాయ’ అని కూడా అనబడుతోంది.

‘స’ కారము
‘‘సత్యము, అమృతము’’ అగు ఆత్మ తత్త్వానుభవమునకు సంజ్ఞ. ‘సోమ’ అని కూడా కీర్తించబడుతోంది.
‘త’ కారః తారలక్ష్మ్యా చ
వైరాజః ప్రస్తరః స్మృతః।
‘త’ కారము
- తార (తరింపజేయునది).
- ‘లక్ష్మీ తత్త్వము’గా సమస్త బాహ్య దృశ్య సంపదగా విరాజమానము.
‘ఈ’ కార రూపిణీ ‘సోమా’, అమృతావయవ దేవీ
‘ఈ’ కారము
‘ఈ’ కార రూపిణి = సోమ (చంద్ర) రూపిణి.
అమృతమగు (మృత / మార్పు స్వభావము లేనట్టి) దేవీరూపము.
అలంకార ‘స్రన్’ మౌక్తికాది ఆభరణ అలంకృతా।
మౌక్తికము (ముత్యము) మొదలైన ఆభరణములచే అలంకరించబడినట్టి సాకార సాలంకృత రూపము.
మహామాయా, అవ్యక్త రూపిణీ - వ్యక్తా భవతి।
మహామాయ. స్వతఃగానే ఎల్లప్పటికీ ‘అవ్యక్త’గా ఉంటూనే, ఈ సమస్తమును ‘వ్యక్తీకరించునది’ గా అగుచున్నది. వ్యక్తీకరణమంతా తానే అయి ఉంటున్నది కూడా.
(1) ప్రథమా శబ్ద బ్రహ్మమయీ,
స్వాధ్యాయ కాలే ప్రసన్నా,
ఉద్భావనకరీ సాత్మికా।
(1) శబ్ద బ్రహ్మరూపము : మూల ప్రకృతి అగు సీతాదేవి యొక్క మహామాయ మొదటిరూపము - శబ్దబ్రహ్మమయీ రూపము. అట్టి శబ్ద బ్రహ్మరూపంతో స్వాధ్యాయనము (వేదాధ్యయనము) చేయుచోట ప్రసన్న రూపిణి అయి ఉంటుంది. ఉత్తమ, ఉన్నత భావాలు కలుగజేస్తూ ఉంటుంది.
(2) ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా।
(2) ఆ సీతాదేవి యొక్క రెండవ మాయా రూపము - నాగలి యొక్క చివరి స్పర్శచే (జనకుని భూమిలో) లభించిన భూమిజా రూపము.
(3) తృతీయా ‘ఈ’ కార రూపిణీ,
అవ్యక్త స్వరూపా భవతి-ఇతి ‘సీతా’।
(3) మూడవ రూపము - జగత్తంతా తన వ్యక్తీకరణమే అయి ఉన్నట్టి - తన యొక్క ‘అవ్యక్త రూపము’.
- ఇతి ఉదాహరంతి శౌనకీ యే,
శ్రీరామ సాన్నిధ్యవశాత్
జగదానంద కారిణీ।
ఈ విధమైన సీతామాత యొక్క త్రివిధ మాయారూపము - శౌనకీయము. (శోనకీ తంత్రములో చెప్పబడింది). అయితే అట్టి మహామాయా స్వరూపిణి- శ్రీరామచంద్రుని సాన్నిధ్యవశంచేత సారూప్యము పొంది, ‘జగదానందకారిణి’- అగుచున్నది.
ఉత్పత్తి స్థితి సంహారకారిణీ।
సర్వదేహినాం సీతా భగవతీ।
జ్ఞేయా। ‘మూలప్రకృతి’ సంజ్ఞితా।
ప్రణవత్వాత్ ‘ప్రకృతిః’ - ఇతి
వదంతి బ్రహ్మవాదిన ఇతి।
ఈ ‘సీత’ యే ‘‘మూలప్రకృతి’ అని సంజ్ఞాపూర్వకంగా చెప్పబడుచూ
1. సమస్తమునకు ఉత్పత్తి-స్థితి-లయ కారణి అయి ఉంటున్నది.
2. సమస్త దేహములలో -
(i) ‘దేహి’రూపిగా
(ii) సర్వమును ‘ఎరుక’చే వెలిగించునది (భగవతీ)
(iii) ఎరుగబడు సమస్తముగా కూడా వెలయుచున్నది.

‘సీత’ - ప్రణవ స్వరూపిణి. ‘మూల ప్రకృతి రూపిణియే సీత’ - అని బ్రహ్మవేత్తల ప్రవచనము.
అథాతో ‘‘బ్రహ్మ జిజ్ఞాసా’’ ఇతి చ।
సా సర్వ వేదమయీ। సర్వ దేవమయీ।
సర్వ లోకమయీ। సర్వ కీర్తిమయీ।
సర్వ మయీ। సర్వ ధర్మమయీ।
సర్వాధార కార్యకారణమయీ
ఆ దేవి జీవులలోని (బ్రహ్మసూత్రముల ప్రారంభసూత్రము అయినట్టి) బ్రహ్మజిజ్ఞాసా। (సమస్తము అయి ఉన్న స్వరూపము గురించిన జిజ్ఞాసా) స్వరూపిణి। అని కూడా అనబడుతోంది.

ఆ దేవాదిదేవి, త్రి జగన్మాత ఇంకా ఎట్టి మహిమ కలిగిఉన్నదంటే, ఆ సీతామాతయే→
• తెలియబడేదంతా తానే అయి ఉన్నట్టిది. చతుర్వేదములలో ఉపాస్య వస్తువు ఆ దేవియే. అందుచేత సర్వవేదమయీ।
• సమస్త దేవతలు తన విస్తరిత స్వరూపమే కాబట్టి సర్వదేవమయీ।
• సమస్త లోకములు ఆ జనని యొక్క అవలోకనా చమత్కారమే కనుక - సర్వలోకమయీ। (అవలోకనా విశేషమితి లోకమ్)।
• సీతాదేవీ మూల ప్రకృతి స్వరూపిణి। ఇంకాకూడా - సర్వ కీర్తిమయి। సర్వమయి। సర్వధర్మమయి।
మహాలక్ష్మీః దేవేశస్య భిన్న-అభిన్న రూపా।
చేతన-అచేతనాత్మికా।
ఈ సీతామాతయే….,
మహాలక్ష్మి మొదలైన దేవతా స్త్రీలందరికి భిన్న స్వరూపము, అభిన్న స్వరూపము కూడా! (సమస్తమునకు పరము। సమస్తము తానే।)

- ఆ తల్లి చేతన-అచేతనాత్మిక। [కదలునది (మరియు) సమస్తమైన కదలికలు తనవై, తాను మాత్రం కదలనిది].
బ్రహ్మ స్థావరాత్మా। తద్గుణ కర్మ
విభాగ భేదాత్ శరీర రూపా।
- బ్రహ్మదేవుని నుండి స్థావరము వరకు ఆత్మ స్వరూపిణియే - ఆదేవి.
- తనయొక్క గుణ-కర్మ విభాగభేదంచేత ఈ సమస్త శరీరములు ధరిస్తూ ఉన్నది.
దేవర్షి మనుష్య గంధర్వ రూపా।
అసుర రాక్షస భూత ప్రేత పిశాచ
భూతాది భూత శరీర రూపా।
- ఆ మాతయే దేవ, ఋషి, మనుష్య గంధర్వ స్వరూపిణి కూడా.
- అసురుల, రాక్షసుల, భూత ప్రేత పిశాచముల ప్రదర్శనమంతా ఆ సీతామాతకు చెందినదే!

‘‘ఆకాశ-వాయు-అగ్ని-జల-పృథివి’’ అనే మహా పంచభూతములకు ఆది స్థానము. జనన స్థానము. పాంచభౌతికమైన సమస్త భౌతిక నామ రూపములు ఆ సీతాదేవీ శక్తి విన్యాస ప్రదర్శనములే!
భూతేంద్రియ మనః ప్రాణరూపేతి చ విజ్ఞాయతే।।
ఆ దేవియే →
పంచభూత, పంచకర్మేంద్రియ, పంచజ్ఞానేంద్రియ, పంచప్రాణ రూపిణిగా వెలయుచు, తెలియబడుచున్నది.
శక్త్యాత్మనా త్రివిధం భవతి

3. సా దేవీ త్రివిధా భవతి శక్త్యాత్మనా।
‘‘ఇచ్ఛాశక్తి’’, ‘‘క్రియాశక్తి’’, ‘‘సాక్షాత్ శక్తిః’’ ఇతి।
ఆ సీతాదేవి త్రి-శక్త్యాత్మిక. తన శక్తితో త్రి (మూడు) విధములుగా సంప్రదర్శన మౌతోంది.
(1) ఇచ్ఛాశక్తి (2) క్రియాశక్తి (3) సాక్షాత్ శక్తి
ఇచ్ఛాశక్తిః త్రివిధా భవతి।
శ్రీ భూమి నీళాత్మికా, భద్ర రూపిణీ, ప్రభావ రూపిణీ
సోమ సూర్య అగ్ని-రూపా భవతి।
ఇచ్ఛాశక్తి మూడు విధములుగా -
• శ్రీ, భూమి, నీళాత్మికా।
• భద్రరూపిణీ।
• ప్రభావరూపిణీ।
సోమ సూర్య అగ్ని రూపాత్మిక ।
అయి ఉంటోంది.
సోమాత్మికా-ఓషధీనాం ప్రభవతి।
సీతాదేవి యొక్క ఇచ్ఛా శక్తియే సోమాత్మిక (చంద్రాత్మ) అయి, భూమిపై ఓషధులుగా ప్రభవిస్తోంది.
కల్పవృక్ష, పుష్ప, ఫల, లతా, గుల్మాత్మికా
ఔషధ భేషజాత్మికా, అమృతరూపా।
దేవానాం మహస్తోమ ఫలప్రదా।
కల్ప వృక్షముగాను, పుష్ప - ఫల - లతా - గుల్మాత్మికముల (పొద) రూపములుగాను, ఓషధ ప్రదర్శనాత్మికగాను అమృతరూపమై వెలయుచున్నది.
దేవతలకు మహస్తోమ ఫలము (యజ్ఞఫలము) అందింపజేయుచున్నది.
అమృతేన తృప్తిం జనయతి
దేవానాం, అన్నేన, (మనుష్యానాం),
పశూనాం తృణేన,
తత్ తత్ జీవానాం।
దేవతలకు అమృతమును, మానవులకు అన్నమును, పశువులకు గడ్డి, ఆయా జీవులకు ఆయా ఆహారములు అందించునది - జగజ్జననియగు సీతాదేవియే!
4. (సూర్యాత్మికా)-సూర్యాది సకల భువన ప్రకాశినీ।
సూర్యగోళము మొదలగు సమస్త భువనములను ప్రకాశింపజేయునది - ‘మూలప్రకృతి’ రూపిణియే।
దివా చ రాత్రిః కాలకలా నిమేషం ఆరభ్య,
ఘటిక అష్టయామ దివస వార రాత్రి భేదేన పక్ష
మాస ఋతు అయన సంవత్సర
భేదేన మనుష్యాణాం శతాయుః
కల్పనయా ప్రకాశమానా।
‘సీతాశక్తి’ కాలస్వరూపిణి అయి విరాజిల్లుచున్నది. రాత్రింబవళ్ళ రూపమున కాలమును ప్రదర్శిస్తున్నది.
కాలరూపముతో కలానిమేషము (Fraction of a minute) - మొదలుకొని, ఘటికా, అష్టయామము (8 జాముల దినము), దివసము (Day), వారము (Week) రాత్రింపగళ్ళ భేదంతో, పక్ష, మాస, ఋతు, ఉత్తరాయణ, దక్షిణాయన, సంవత్సర భేదములతో శతసంవత్సర కల్పన (Century)గా ప్రకాశించుచున్నది.
చిరక్షిప్ర వ్యపదేశేన నిమేషం ఆరభ్య
పరార్థ పర్యంతం కాలచక్రం జగచ్చక్రం
ఇత్యాది ప్రకారేణ చక్రవత్ పరివర్తమానా
సర్వస్య తస్యైవ కాలస్య విభాగ విశేషాః,
ప్రకాశరూపాః కాల రూపా భవంతి।।
ఆ దేవియే → కాలరూపాః। ప్రకాశరూపాః।
చిర (Long time) - క్షిప్ర (Immediate/Short time) రూపముగా నిమేషము నుండి (from the point of Eye Lap time) పదార్థము (matter) పర్యంతము కాలచక్రమును, జగత్ చక్రమును త్రిప్పుచు, తనయొక్క సమస్త పదార్థ విభాగ విశేషములుగా ‘ప్రకాశరూప’ అయి, కాలరూపంగా విద్యమానమై ఉన్నది.
5. అగ్నిరూపా, అన్నపానాది
ప్రాణినాం క్షుత్ తృషాణాత్మికా।
ఆ సీతాభగవతి తనయొక్క దివ్య చైతన్య తత్త్వస్వరూపముతో →
• విశ్వమంతా అగ్ని-తేజోరూపమై విరాజిల్లుచున్నది.
• దేహములో జఠరాగ్ని రూపముగా ఉండి
- జీవులకు ఆకలి, దాహము కలిగించటము,
- వైశ్వానర రూపముతో చతుర్విధ అన్నములను పచనము చేయటము,
• శక్తిగా మరల్చి శరీరమంతా శక్తివంతముచేయటము నిర్వర్తించుచున్నది.
దేవానాం ముఖరూపా।
వన-ఔషాధీనాం శీతోష్ణరూపా।
కాష్ఠేషు అంతః బహిశ్చ (అంతర్బహిశ్చ)
‘‘నిత్య అనిత్య రూపా’’ భవతి।।
సమస్త దేవతల ముఖరూప తేజస్సు తానే అయి ఉంటోంది.
వన ఔషధములలో శీత-ఉష్ణరూపిణిగా ఉన్నది. కాష్ఠము (దేహము) యొక్క లోపల-బయట రూపము తానే అయి ఉన్నది. సమస్త జీవులలోని నిత్య-అనిత్య రూపము - తానే।
ఈ విధంగా మూలప్రకృతి స్వరూపిణిగా తానే సమస్తము అయి ఉంటోంది.
శ్రీదేవీ త్రివిధం
6. శ్రీదేవీ త్రివిధం రూపం కృత్వా
భగవత్ సంకల్ప అనుగుణ్యేన
లోక రక్షణార్థం రూపం ధారయతి।
‘శ్రీః’ ఇతి। ‘లక్ష్మీః’ ఇతి। ‘లక్ష్యమాణా భవతి’
ఇతి।- విజ్ఞాయతే।
ఆ శ్రీదేవి - ప్రకృతి స్వరూపిణిగా భగవత్ సంకల్పానుసారంగా లోక సంరక్షణార్థము మూడు విధములైన రూపములను ధారణ చేస్తోంది.
(1) ‘శ్రీ’ - ఇతి।
(2) ‘లక్ష్మి’ - ఇతి।
(3) ‘లక్ష్యమాణా’ - ఇతి। (లక్షించబడునదిగా)
ఈ మూడు రూపములుగా తెలియబడుతోంది.
భూదేవీ సప్త సాగరాంభః సప్తద్వీపా వసుంధరా।
భూః ఆది చతుర్దశ భువనానాం ఆధార-
ఆధేయాం ప్రణవాత్మికా భవతి।
సీతాదేవియే భూదేవిగా (హిందూ, అరేబియా, ఫసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ మొదలైన) సప్త సముద్రములతోను, (జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శౌక, పుష్కర - అనబడే) సప్త ద్వీపములతోను ‘వసుంధర’ అయి వెలయుచున్నది.
నీళాచ ముఖ విద్యున్మాని(లి)నీ
సర్వ ఔషధీనాం సర్వప్రాణినాం
పోషణార్థం సర్వరూపా భవతి।
నీళాదేవిగా
‘ముఖ విద్యుత్‌మానిని’ (ఉష్ణశక్తి, తేజోరూపిణి అయి) - భూమిలో సర్వాఉషధ (ఓజో) రూపిణిగాను, భూమిపై - సర్వప్రాణుల (తేజో) రూపంగాను అగుచున్నది. సర్వప్రాణులకు ‘తల్లి’ అయి, అట్టి సర్వజీవుల పోషణార్థము- ‘‘సర్వరూప’’ అయి భూమి లోపల, బయట కూడా ప్రదర్శనమౌతోంది.
సమస్త భువనస్య అధోభాగే
జలాకారాత్మికా మండూకమయి ఇతి,
భువనాధార ఇతి-విజ్ఞాయతే।।
ఇంకా కూడా, ఆ శ్రీదేవి అగు సీతాదేవియే సమస్త భువనముల అధోభాగంలో ‘‘జలదేవత’’గా ప్రదర్శనమగుచున్నది. ‘‘జలాకారాత్మిక’’గా అయి సమస్త జీవుల ‘జీవనాధార’ అగుచున్నది.
మండూకమయ (కప్ప రూపంగా) సమస్త భువనమునకు ఆధారమై వెలయుచున్నది.
7. క్రియాశక్తి స్వరూపమ్।
హరేః ముఖాత్ నాదః।
తత్ నాదాత్ బిందుః।
బిందూ - ఓంకార। ఓంకారాత్ పరతో
- రామ వైఖానస పర్వతః।
తత్ పర్వతే కర్మ జ్ఞాన మయీభిః
బహుశాఖా భవంతి।
క్రియాశక్తి
ఆ దేవియొక్క క్రియాశక్తిరూపము గురించి ఇంకా →
- శ్రీహరి ముఖము నుండి ‘నాదము’ జనిస్తోంది.
- ఆ నాదము నుండి ‘‘బిందువు’’.
- ఆ బిందువు నుండి ‘ఓం’కారము (ప్రణవము).
- అట్టి ఓంకారము యొక్క చివరగా ‘మ్‌’ - (అర్ధమాత్ర). రామ-వైఖానస పర్వతము - (అర్చన).

అట్టి రామ (కేవలాత్మ స్వరూప) (వైఖానస/ఉపాసన) పర్వతము నుండి కర్మ-జ్ఞానమయములైన అనేక శాఖ-ఉపశాఖలు గల వృక్షజాలములు.
తత్ర త్రయీమయం, శాస్త్రమాద్యం,
సర్వార్థ దర్శనం। ఋక్, యజుః,
సామ రూపత్వాత్ -
‘త్రయీ’ ఇతి పరికీర్తితా।
హేతునా కార్యసిద్ధేన
చతుర్థా పరికీర్తితా।
అక్కడనుండి త్రయీమయములయినట్టి ఋక్-సామ- యజుర్వేదము లనబడే శాస్త్ర-శాస్త్రార్థములు, (తద్వారా) సర్వార్థదర్శనములు ఏర్పడు చున్నాయి. (శబ్దము నుండి వైఖరి-వాక్యము, వాక్యమునకు అర్థ దర్శనము బయలుదేరుచున్నాయి).

‘‘ఋక్ - యజుర్ - సామ’’ వేద రూపిణిగా త్రయీవిద్య అని, కార్యసిద్ధి - కొరకై నాలుగవది (అథర్వణ వేదము) గాను పరికీర్తించబడుతోంది.
ఋచో యజూంషి సామాని
అథర్వ అంగిరసః తథా।
చతుర్హోత్ర (చతుః హోత్ర) ప్రధానత్వాత్
లింగాది త్రితయం త్రయీ।
అథర్వ అంగిరసం రూపం
సామ ఋక్ యజురాత్మకమ్।
నాలుగు వేదములను ‘ఋక్-యజుర్-సామ-అథర్వ అంగిరసములు’ అని కూడా అంటారు.

నాలుగవది (అథర్వణ) హోతవిధి. కార్యక్రమమును నడిపే విధి-విధాన-నిషేధ విశేష ప్రాధాన్యము.

‘లింగాది త్రితయం త్రయీ’ - కేవలమగు తత్త్వము నుండి త్రివిధములగు త్రివేదములు, త్రిగుణములు, త్రికాలములు, త్రి-అవస్థలు జనిస్తున్నాయి.

అంగీరస రూపమగు అథర్వణవేదము కూడా- ఋక్ యజుర్ సామవేదాత్మకమే!
తథా వింశతి ఆభిచార సామాన్యేన
పృథక్ పృథక్, ఏకవింశతి (21)
శాఖాయాం ‘‘ఋగ్వేదః’’ పరికీర్తితః।।
ఋగ్వేదములో అభిచార ప్రాధాన్యంచేత (హోమ ద్రవ్య విశేష ప్రాధాన్యముల చేత) వేరువేరు విభాగములుగా ‘21 శాఖలు’ అభివర్ణితమై (ఏర్పడినవై) ఉన్నాయి. [ఋగ్వేదము బహుతరంగా మంత్ర (ఋక్కుల) విభాగము].
శతం చ నవ శాఖాస్స్యుః (109)
యజుషాం ఏవ జన్మనామ్।
అదే విధంగా యజుర్వేదంలో 109 శాఖలు ఏర్పడి ఉన్నాయి. (విధి విధానముల ప్రాధాన్యము).
సామ్నః సహస్ర శాఖాస్స్యుః। (1000)
సామవేదము- 1000 శాఖలు. అథర్వణ వేదములో 50 శాఖలు ఉన్నాయి. (అథర్వణము శాంతి, సాత్విక భావములు, దైవీ సంపద యొక్క ప్రాధాన్యత కలిగి ఉన్నది).
పంచాశత్ శాఖా అథర్వణః। (50)
వైఖానసమ్ అతః తస్మిన్ నాదౌ
ప్రత్యక్ష దర్శనమ్। స్మర్యతే మునిభిః నిత్యం
వైఖానసమ్ అతః పరమ్,
వైఖానసము (అర్చన విభాగము) అనునది ప్రత్యక్ష దర్శనము.
(సమస్తము సీతాదేవీ తత్త్వముగా దర్శించు ఉపాసన-వైఖరి, విధానము = వైఖానసము).
శబ్ద బ్రహ్మమునకు ఆవలగల సీతాదేవీ మూల ప్రకృతి తత్త్వమును మునీశ్వరులు ఎల్లప్పుడు ఉపాసిస్తూ గానం చేస్తూ ఉంటారు.
కల్పో, వ్యాకరణం, శిక్షా, నిరుక్తం,
జ్యోతిషం ఛందః, ఏతాని షడంగాని।
షట్ (6) అంగాని।।
వైఖానస వ్రతము (శబ్దోపాసన) యొక్క స్మరణ తరువాత షడంగములు.

1. కల్పము = వ్రతకల్పము, నిబంధనములు. యుగ-యుగాంతరకాల విశేషములు. న్యాయము = తగవు, తీర్పు, తత్త్వశాస్త్రము.
2. వ్యాకరణము = వాక్య విభజన, నియమములు. శబ్ద లక్షణములు.
3. శిక్ష = విద్యాభ్యాసము. బోధనా విధానము. వేదస్వరముల బోధ.
4. నిరుక్తము = పదముల అవయవార్థ వివరణ శాస్త్రము. వేదమంత్రోక్త శబ్దములకు అవయవార్థములు.
5. జ్యోతిష్యము/జ్యోతిశ్శాస్త్రము = సూర్యుడు, నవగ్రహములు, నక్షత్ర మండలముల సంచారములు తెలియజేయు శాస్త్రము. కాల నియమానుసారం వేదముచే విధించబడిన కర్మలకు ఉచిత కాలము, కర్మఫల ఉపాయములు చెప్పు శాస్త్రము.
6. ఛందస్సు = పద్య లక్షణము చెప్పే శాస్త్రము. శ్లోక లక్ష్యములు.

ఇవి షడంగములు.
ఉపాగం అయనం చ ఏవ
మీమాంసా, న్యాయ విస్తరః
ధర్మజ్ఞ సేవితార్థం చ
వేద వేదో అధికం తథా।।
నిబంధాః సర్వశాఖా చ
సమయాచార సంగతిః,
ధర్మశాస్త్రం మహర్షీణాం
అంతఃకరణ సంభృతమ్।
ఇతిహాస పురాణాఖ్యం
ఉపాంగశ్చ ప్రకీర్తిమ్।
వేద ఉపాంగములు

మీమాంస = కర్మకాండను, జ్ఞానకాండను సమన్వయపూర్వకంగా ప్రతిపాదించు శాస్త్రము.
న్యాయము = తగవు, తీర్పు, తత్త్వశాస్త్రము. తర్కశాస్త్రము.
ధర్మశాస్త్రము = పరస్పర సానుకూల్యంగా అంతఃకరణ శుద్ధికై చాతుర్వర్ణ్య జీవులు ఆచరించవలసినవిగా ఋషులచే చెప్పబడే సమయ- ఆచారములు. సాంఘిక సంబంధమైన పరస్పర సానుకూల్య కర్మలు.
మునులచే లోక శ్రేయస్సు కొరకు ప్రవచించబడే అంతఃకరణ వృత్తుల సంస్కరణములే - ధర్మశాస్త్రము.

ఇతిహాసములు, పురాణములు కూడా వేద-ఉపాంగములుగా చెప్పబడు చున్నాయి. కీర్తించబడుచున్నాయి.
వాస్తు వేదో, ధనుర్వేదో
గాంధర్వశ్చ తథా మునిః
ఆయుర్వేదశ్చ పంచైతే
ఉపవేదాః ప్రకీర్తితాః।।
పంచ ఉపవేదములు

1. వాస్తు వేదము = గృహనిర్మాణ శాస్త్రము.
2. ధనుర్వేదము = విలువిద్య. అస్త్రవిద్య.
3. గాంధర్వ వేదము = సంగీత శాస్త్రము.
4. ఆయుర్వేదము = దేహ-చికిత్సా శాస్త్రము.
5. మునివేదము = ప్రాపంచక విషయములపట్ల మౌనము వహించి, పరతత్త్వమును ఆశ్రయింపజేయు శాస్త్రము. ఇవి పంచ ఉపవేదములు.
దండో నీతిశ్చ వార్తా చ
విద్యా వాయుజయః పరః
ఏకవింశతి (21) భేదో అయం
‘స్వప్రకాశః’ - ప్రకీర్తితః।
స్వప్రకాశ శాస్త్రములు:

(1) దండము (Punishment)
(2) నీతి (Principled Life)
(3) వార్త (వర్తనము). (అర్థ అనర్థ వివేచన విద్య) (Historical events of great personalities)
(4) విద్య (ఆత్మ విద్య)
(5) వాయుజయము (ప్రాణాయామము)
- ఇవన్నీ బహురూపములతో (21 భేద రూపములతో) కూడి స్వస్వరూప ప్రకాశక శాస్త్రములుగా పరికీర్తించబడుచున్నాయి.
వైఖానస ఋషేః పూర్వం
విషోణాః వాణీ సముద్భవేత్,
త్రయీరూపేణ సంకల్ప్య
ఇత్థం దేహీ విజృంభతే।
మొట్టమొదట విష్ణు భగవానుని ‘వాణి’ యే ఋక్-యజుర్-సామ త్రయీ వేదములుగా వెలువడగా, - వైఖానసము (It is Applicability and Practical Implementation side of it) ఋషుల వాక్యముల నుండి బయల్వెడలుచున్నాయి.
సంఖ్యారూపేణ సంకల్ప్య
వైఖానస ఋషేః పురా,
ఉదితో యాదృశః పూర్వం
తాదృశం శృణుమే అఖిలమ్।
ఓ దేవతలారా!
విష్ణు భక్తుడగు వైఖానస మహర్షికి విష్ణుభగవానుడు ఏది ‘సాంఖ్య యోగ శాస్త్రము’గా బోధించారో, - అట్టి విశేషములను ఇప్పుడు వివరిస్తున్నాను. వినండి.
8. శశ్వత్ బ్రహ్మమయం రూపం
‘‘క్రియాశక్తిః’’ ఉదాహృతా।
సృష్టిలోని బ్రహ్మమయరూపమే ‘క్రియాశక్తి’. (అట్టి క్రియాశక్తియే ‘సీతామాత’ యొక్క ప్రకృతి సంబంధమైన ప్రాకృతరూపము). ‘‘ఈ దృశ్యమంతా కూడా సీతాదేవియొక్క క్రియా స్వరూపమే’’ - అని చెప్పబడుతోంది.
- దేవియొక్క బ్రాహ్మీశక్తి (సృష్టి స్థితి లయ శక్తి) స్వరూపము.
‘‘సాక్షాత్ శక్తిః’’ భగవతః స్మరణమాత్ర రూపా।
ఆవిర్భావ ప్రాదుర్భావాత్మికా।
నిగ్రహ-అనుగ్రహ రూపా।
శాంతి తేజో రూపా।
వ్యక్తా-అవ్యక్త కారణ చరణ
సమగ్రావయవ ముఖవర్ణ
భేద-అభేద రూపా। భగవత్ సహచారిణీ।
అనపాయనీ। అనవరత
సహాయ ఆశ్రయణీ।
సీత-సాక్షాత్ శక్తి

- భగవతీ శక్తి. బ్రహ్మముయొక్క సాక్షాత్ శక్తి.
- ఆ సీతామాత యొక్క స్మరణ మాత్రం చేతనే సమస్తము అనుగ్రహముగా లభించగలదు.
- సమస్తము ఆవిర్భవింపజేయునది. సమస్తముగా ప్రవర్తింపజేయునది - సీతయే.
- నిగ్రహ - అనుగ్రహ రూపి. (నిగ్రహించగల, అనుగ్రహించగల దేవాది దేవి).
- పరమ శాంతమగు తేజస్సును రూపముగా కలిగి ఉన్నట్టిది - సీత।
- వ్యక్త-అవ్యక్త, కారణములు చరణములు (నడవడిక) కలిగినది.
- ఈ సమస్త జగద్దృశ్యమంతా- తనయొక్క సమస్త అవయవములుగా, ముఖముగా కలిగి ఉన్నట్టిది - సీత।
- అనేకము తానే అయి, ఆ అనేకములోని ఏకము తానే అయి ఉండటంచేత భేద-అభేదరూపిణీ! భగవంతునికి ఎల్లప్పుడు సహధర్మచారిణీ!
- అనపాయనీ। (తలచినంత మాత్రంచేత సమస్త అపాయములు తొలగించునది)।
- ఎల్లప్పుడు సహాయ, ఆశ్రయములు ప్రసాదించునది.
ఉదిత-అనుదిత ఆకారా।
నిమేష-ఉన్మేష సృష్టి స్థితి సంహార
తిరోధాన - అనుగ్రహాది
సర్వశక్తి సామార్ధ్యాత్
‘‘సాక్షాత్ శక్తిః’’ ఇతి గీయతే।।
ఉదయిస్తున్న, ఉదయించని ఆకారము కలిగి ఉన్నట్టిది. కనులు మూసి- కనులు తెరచునంత కాలములోనే ‘సృష్టి - స్థితి - సంహారము (ఉపసంహారము), తిరోధానము (తీసివేయునది), అనుగ్రహము మొదలైన సర్వశక్తి సామర్ధ్యము కలిగియున్నట్టిది.
సాక్షాత్ శక్తి స్వరూపిణిగా సీతాదేవికి మేము నమస్కరిస్తూ ఉంటున్నాము.
9. ఇచ్ఛాశక్తిః త్రివిధా।
ప్రలయ అవస్థాయాం విశ్రమణార్థం
భగవతో, దక్షిణ వక్షస్థలే
శ్రీవత్సాకృతిః భూత్వా, విశ్రమయతి
ఇతి-సా ‘యోగశక్తిః’।
సీతాదేవియొక్క ఇచ్ఛాశక్తియే ఇదంతా।
అట్టి ఇచ్ఛాశక్తి మూడు విధములుగా సంప్రదర్శనమౌతోంది.
1. యోగ శక్తి 2. భోగ శక్తి 3. వీర శక్తి.

1. యోగ శక్తి: సమస్తము శమిస్తూ అఖండ కేవల పరమాత్మ యందు విశ్రమించు ‘ప్రళయ’ కాలములో ఆ భగవంతుని దక్షిణ (కుడి) వక్షస్థలము నందు ‘శ్రీ వత్సాకృతి’ అయి విశ్రమించుచున్న శక్తి ‘యోగశక్తి’.
‘భోగశక్తిః’ భోగరూపా
కల్పవృక్ష కామధేను చింతామణి
శంఖ పద్మ నిధ్యాది నవనిధి సమాశ్రితా।
2. భోగ శక్తి : ఆ సీతామాత యొక్క ఇచ్ఛాశక్తి భోగశక్తిగా రూపుదాల్చి ‘భోగ’ రూపంగా అగుచున్నది.
ఆ భోగ ఇచ్ఛా శక్తియే (మహాకాశ), కల్పవృక్ష, కామధేను, చింతామణి, శంఖ, పద్మ, (సర్వరత్న, పింగళము), నిధి అనబడు నవనిధులను సమాశ్రయించినదై ఉంటోంది.
భగవత్ ఉపాసకానాం
కామనయా, అకామనయా వా
భక్తియుక్త నరం, నిత్య నైమిత్తిక కర్మభిః।
కోరికలు కలిగియుండిగాని, కోరికలు లేనివారై ఉండిగాని భక్తితో కూడి జీవులు చేసే నిత్య, నైమిత్తిక కర్మలకు ఫలములను అనుగ్రహిస్తూ ఉంటోంది.
అగ్నిహోత్రాదిభిర్వా,

‘యమ నియమ ఆసన ప్రాణాయామ
ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిభిర్వా,

లమనణ్వపి గోపుర ప్రాకారాదిభిః
విమానాదిభిః సహ,

భగవత్ విగ్రహ-అర్చా,
పూజా కర్మకరణైః
అర్చనైః స్నానాదిభిర్వా
పితృ పూజాదిభిః అన్నపానాదిభిర్వా
భగవత్ ప్రీత్యర్థం ఉక్త్వా, -
సర్వం క్రియతే।।
సీతాదేవీ తత్త్వము ఎరిగి ఉపాసించు అనేకమంది భక్తులు - ఈ క్రింది విధానాలుగా ఆరాధిస్తున్నారు.

i. ‘అగ్నిహోత్రము’ మొదలైన యజ్ఞ విధానముల ఆచరణతో,

ii. ‘ఆష్టాంగ యోగములు’ అయినట్టి,
(1) యమము (బాహ్యేంద్రియ నిగ్రహము)
(2) నియమము (అంతరింద్రియములైనట్టి మనో బుద్ధి చిత్త అహంకారముల నిగ్రహము)
(3) ఆసనము (ధ్యానముచేయటానికై ధారణ చేయు స్వస్తిక, పద్మ - ఇత్యాది కూర్చుని యుండు విధానములు)
(4) ప్రాణాయామము (గాలి పీల్చి నిలిపి, వదలు పూరక-రేచక-కుంభక - కేవల కుంభక ఇత్యాది ప్రాణోపాసనలు)
(5) ప్రత్యాహారము (ఇంద్రియములను విషయములనుండి వెనుకకు మరల్చటము, ఏకము, అఖండము అగు ఆత్మాదేవి యొక్క దర్శనమునందు భావనాపూర్వకంగా నియమించటము
(6) ధ్యానము (ధ్యాసను సర్వాత్మకుడగు పరమాత్మ యందు నియమించటము).
(7) ధారణ (ధ్యానముయొక్క చ్యుతి లేని నిశ్చలత్వము అభ్యసించటము
(8) సమాధి (అఖండాత్మయే తానై భాసించటము - ఈ అష్టాంగ యోగాభ్యాసములతో - సీతాదేవిని ఆరాధిస్తున్నారు.

iii. లమనము (భగవత్ భక్తి, ప్రేమ ప్రదర్శనము)గా, గోపుర ప్రాకార విమానాదులను నిర్మించి సమర్పించటముచేత ఉపాసిస్తున్నారు.

iv. భగవంతుని విగ్రహ-అర్చనల పూజావిధులచేత, భగవదత్తమై కర్మలచేత, స్నానాది నియమ నిష్ఠల చేత, పితృదేవతా పూజల చేత, అన్నపాన దానములుగా - ఆరాధిస్తున్నారు.
10. అథాతో వీరశక్తిః :-
చతుర్భుజా, అభయ వరద పద్మధరా
కిరీట-ఆభరణాదియుతా,
సర్వదేవైః పరివృతా,
3. వీర శక్తి :

సీతాదేవి యొక్క సహజ వీరరూపమగు - ఇచ్ఛాశక్తియే →
- స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములుగా చతుర్భుజ.
- (జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములు తన భుజములు అయినట్టి) చతుర్భుజ.
- అభయ - వరద - పద్మధర (జ్ఞాన ప్రసాదిత) అయి నమస్కరించు వారిని అనుగ్రహించునది.
- కిరీటము మొదలైన ఆభరణములు ధరించునది.
- సర్వదేవతలచే పరివృతమై ఉన్నది.
కల్పతరు మూలే చతుర్భిః గజైః రత్నఘటైః
అమృతజలైః అభిషిచ్యమానా।
సర్వదైవతైః బ్రహ్మాదిభిః వంద్యమానా।
- కల్పతరువు యొక్క మూలమున, నాలుగు ఏనుగులు ఆ లోకమాతను రత్న నిర్మిత ఘటములచే (కుండలచే) అమృతజలముతో అభిషేకము సమర్పిస్తున్నట్టిది.
- బ్రహ్మదేవుడు మొదలైన సమస్త దేవతలు నమస్కరిస్తూ ఉన్నట్టి పరాశక్తి స్వరూపిణి.
అణిమాది అష్టైశ్వర్యయుతా,
సమ్ముఖే కామధేనునా స్తూయమానా।
వేదశాస్త్రాదిభిః స్తూయమానా।
జయాది అప్సర స్త్రీభిః పరిచర్యమాణా।
- ‘‘అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ఈశిత్వ వశిత్వ, ప్రాకమ్య, ఇచ్ఛ’’ అనబడే అష్టసిద్ధులు అష్టైశ్వర్యములుగా కలిగి ఉన్నట్టిది, ప్రసాదించునది.
- ఎదురుగా కామధేనువు నిలబడి స్తుతిస్తూ ఉన్న రూపము.
- వేదములచే, శాస్త్రములచే అభివర్ణించబడుచున్న తత్త్వము.
- జయ, విజయ మొదలైన అప్సరసా స్త్రీలచే పరివృతమైనది

ఇట్టిది ‘‘సీతాదేవి వీర రూపము’’.
ఆదిత్య సోమాభ్యాం దీపాభ్యాం ప్రకాశ్యమానా।
తుంబురు నారదాదిభిః గీయమానా।
రాకా సినీ వాలీభ్యాం ఛత్రేణ,
హ్లాదినీ మాయాభ్యాం చామరేణ,
స్వాహా స్వధాభ్యాం వ్యజనేన,
ఇంకా కూడా, సూర్య చంద్రులను తనయొక్క తేజస్సుచే దీపమువలె వెలిగించునది. తుంబురుడు, నారదుడు మొదలైన దేవ ఋషి గణముచే స్తుతించబడునది.

రాకాసినివాలి - అనే ఛత్రములతో అలంకృతమైనట్టిది, ‘హ్లాదినీ’ అనే తన యొక్క మాయ చామరము (వింజామరము) చే సేవించబడునది,

‘‘స్వాహా’’ ‘‘స్వధా’’, మొదలైన సమర్పణ శబ్దములచే , - ఈ తల్లి సీతాదేవియొక్క సహజమగు స్వాభావిక తాత్త్విక రూపమే- పూజించ బడుతోంది.
భృగు పుణ్యాదిభిః అభ్యర్చ్యమానా ।
దేవీ దివ్య సింహాసనే పద్మాసనారూఢా।
సకల కారణ కార్యకరీ, లక్ష్మీర్దేవస్య
పృథక్ భవన కల్పనా।
భృగువు మొదలైన పుణ్య పురుషులగు మహర్షులచే పూజింపబడు దేవి.
దివ్య సింహాసనముపై పద్మాసనము ధరించి అధిష్ఠించి యున్న లోకపాలిని.
సకల కార్య-కారణ-కర్తృత్వములు తనవే అయినట్టి మూల ప్రకృతి రూపిణి,
లక్ష్మీదేవి యొక్క అంతఃపురములో శ్రీదేవి అయి విరాజిల్లునది.
అలంచకార స్థిరా, ప్రసన్న లోచనా,
సర్వదైవతైః పూజ్యమానా
‘‘వీరలక్ష్మీః’’ ఇతి విజ్ఞాయత।।
సర్వాలంకారకృత, స్థిర స్వరూపిణి, ప్రసన్నము (ఆనందము)తో కూడిన కళ్లు కలిగినది, సర్వదేవతలకు పూజనీయము, అగు సీతాదేవి యొక్క ఇచ్ఛారూపమగు వీరలక్ష్మీదేవి స్వరూపమును సర్వదా ఎరుగుచు, దర్శిస్తూ, ఉపాసిస్తూ శరణు వేడుచున్నాము.
ఇతి సీతోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
ఇతి సీతోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

అథర్వణ వేదాంతర్గత

20     సీతోపనిషత్

అధ్యయన పుష్పము

శ్లో।। ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావ సాధనమ్।
‘‘తద్బ్రహ్మ సత్తా సామాన్యం’’ - సీతా తత్త్వమ్ ఉపాస్మహే।।

ఇచ్ఛా జ్ఞాన క్రియా త్రిశక్తి స్వరూపిణి, మూలప్రకృతి, వ్యక్తావ్యక్త స్వరూపిణి, కరుణామూర్తి, జగన్మాతృదేవత, అనుగ్రహదేవత-అగు సీతామాతకు, ఆ తల్లియొక్క ‘‘తత్‌బ్రహ్మసత్తా సామాన్యము’’ - ను భక్తితోను, అధ్యయన పూర్వకంగాను నమస్కరిస్తున్నాము.



ఒకసారి దేవతాగణము సత్యలోకము ప్రవేశించి సృష్టికి కర్త, సర్వాత్మకుడు అగు ప్రజాపతిని దర్శించుకొని నమస్కరించారు. వినమ్రతతో బ్రహ్మదేవుడు, పితామహుడు అగు స్వామిని అధ్యయన - విద్యార్థులై ఈవిధంగా అడుగసాగారు.

దేవతా గణము : హే సృష్టికర్తా! పితామహా! బ్రహ్మదేవా! మా యొక్క సాంసారిక జాడ్యము తొలగటానికై తత్త్వదర్శులగు మీవద్ద ‘‘సీతాదేవి’’ యొక్క దివ్యతత్త్వము తెలుసుకోదలచాము. శ్రవణ మననములను ఆశ్రయించదలచాము.

కా సీతా? జనకునికి నాగలి స్పర్శచే లభించి, శ్రీరాముని పరిణయమాడి, లోకకంటకుడగు రావణుని సంహారమునకు కారణమైన - ఈ సీత వాస్తవానికి ఎవరై ఉన్నారు?

కిం రూపం? సందర్భమాత్ర సత్యమగు ఈ దృశ్య ప్రపంచము (పాంచభౌతిక ప్రపంచము)నకు సంబంధించక, సమస్తమునకు ‘పరము’ (Beyond) అయి ఉన్న ఈ సీతామాత యొక్క దివ్యరూపము (The Divine Form) ఎట్టిది? ఎటువంటిది?

అట్టి తత్త్వార్థ జ్ఞాన విశేషము మాకు బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాము.

ప్రజాపతి (బ్రహ్మదేవుడు) : బిడ్డలారా! దేవతలారా! ‘‘సీతా దేవీతత్త్వము’’ అనిర్వచనీయము. అవాక్ మానసగోచరము. అయినప్పటికీ, మనయొక్క బుద్ధి నిర్మలత, కుశలత కొరకై, ఆ జగన్మాతయొక్క అనుగ్రహంచేత ఆయా సీతాదేవీ తాత్త్విక విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి.

కాంతి ప్రకాశిస్తూ ఉండగా, ఆ కాంతితో సాకారాత్మకమైన అనేక విశేషాలు కనబడుచూ ఉంటాయి కదా। (శ్రీరాముడు ‘‘కేవల నిర్విషయ సాక్షిమాత్రుడు’’ అయి ఉండగా) - సీతాదేవియే ‘‘మూల ప్రకృతి స్వరూపము’’ అయి, సమస్తముగా సంప్రదర్శనమౌతోంది. అట్టి మూలాధార స్వరూపముతోనే ఈ ఎదురుగా కనిపించే అనేకముతో కూడిన సమస్త ప్రకృతిని తన యొక్క ‘లీలా ప్రదర్శనము’గా కలిగి ఉంటోంది.

ప్రణవము (‘‘ఓం’’) యొక్క ఐహిక (లేక) ప్రాకృత రూపమే సీతాదేవి. అందుచేత సీతయే ప్రకృతియొక్క స్వాభావిక రూపము. (లేక) ఈ ప్రకృతి అంతా సీతా మాతయే- అని అభివర్ణించబడుతోంది.

సీతాదేవియే త్రివర్ణాత్మకమై (సత్త్వ రజో తమో త్రిగుణాత్మకమై) ‘‘సాక్షాత్ మాయా స్వరూపిణి’’గా విరాజిల్లుతోంది.

‘‘సీతా’’ = ‘‘స’’ + ‘‘ఈ’’ + ‘‘త’’ - ఇతి త్రివర్ణాత్మికా!


‘‘ఈ’’

‘‘ఈ’’ కారము :- దేవియొక్క విష్ణుతత్త్వము. అట్టి విష్ణు తత్త్వమే ‘‘ప్రపంచము’’ అను దానికి బీజము. ‘‘ఈ’’ అనగా సీతాదేవియొక్క ‘‘మాయ’’కు సంజ్ఞాక్షరము. సర్వత్రా సర్వదా వేంచేసి ఉన్న చైతన్య స్ఫూర్తియే విష్ణుశబ్దార్థము. ‘‘సమస్తము తానే’’ అయి ఉన్నట్టిదే - విష్ణుతత్త్వము.


‘‘స’’

‘‘స’’ కారము :- ఆత్మ స్వాభావికమగు ‘‘సత్యము’’.

‘‘అమృతము. (మార్పు చేర్పులకు ఆవలది)’’.

‘స’ అక్షరమునకు సంజ్ఞ. ‘‘స - ఉమ’’ - ‘‘సోమ’’ అని, ‘స’కారముగా కీర్తించబడుతోంది.

‘సత్’ ఏవ ‘స’కారమ్।
‘‘ఏక-అక్షర సత్’’ ఏవహి ‘స’ కారః।


‘‘త’’

‘‘త’’ కారము :- ‘త’ కారః తార లక్ష్మ్యాచ। సమస్త జీవులను మోహాంధకారము నుండి తరింపజేయునది. ‘‘లక్ష్మీ’’ అను ఆత్మజ్ఞాన స్వరూప సంపద. ఈ సమస్త బాహ్య దృశ్యము తన తత్త్వముగాను, సంపదగాను కలిగి ఉండటం చేత - లక్ష్మీరూపము. (తార। ‘‘తారయత’’ - ఇతి ‘తార’).


‘‘ఈ’’ కారము :- సోమ (చంద్ర)-అమృతావయవదేవి. మృతమునకు (మార్పునకు) ఆవలి రూపము. మృత భావనను దాటివేయించు తత్త్వము. మార్పు-చేర్పులు లేనట్టి ‘స్వస్వరూపము’తో అనుసంధానము.

అట్టి ‘‘లక్ష్మీదేవీ సాకార-(ఉపాసనా)’’ రూపము :- ముత్యములు మొదలైన అనేక ఆభరణములచే అలంకరించబడిన రూపము.

‘‘ఈ’’ - మాయకు సంజ్ఞ. ఆ దేవి స్వాభావికంగా ‘అవ్యక్త’. అయితే, ఈ సమస్తమును తనయొక్క మహామాయా చమత్కారముచే వ్యక్తీకరిస్తూ ఉన్నట్టిది.

సహజంగానే ‘‘అవ్యక్తము’’, ‘‘మూల ప్రకృతి స్వరూపము’’ - అగు సీతాదేవి యొక్క మహామాయా రూపము వ్యక్తీకరణము స్వీకరిస్తూ, ‘3’ ప్రదర్శనములు కలిగి ఉంటోంది.

(1) ప్రథమా-శబ్ద బ్రహ్మమయీ - ‘స’ కారము : శబ్ద స్వరూపిణియగు సీతాదేవి. వేదోపనిషత్ ఋక్-స్తుతి-మహావాక్య రూపములలో (సత్) అయి ప్రకాశించుచున్నది. వేదమంత్రముల రూపముగా దేవతా స్తుతులలో స్తుతించబడేది సీతాతత్త్వమే. (విష్ణు-శివ-లలితా - సరస్వతీ - లక్ష్మీ - ఇత్యాది సహస్రనామములన్నీ సీతాదేవీ తాత్త్విక వర్ణనములే)।

‘‘తత్త్వమ్। సో౽హమ్।’’ ఇత్యాది మహావాక్యముల పరమార్థ (తాత్త్వికార్థ) ప్రవచనములు, వాటి నిరూపణముల యందు దేవాదిదేవి యగు సీతయే తత్త్వార్థమైయున్నది. (తత్త్వార్థ జ్ఞాన మంజషా)।మార్గదర్శి అయి, మాతృదేవత అయి, సద్గురువు అయి ఆశ్రితులకు సమస్తము సుబోధకము చేస్తోంది.

స్వాధ్యయనములందు (వేదగానములు జరుగుచోట) ‘ప్రసన్న రూపిణి’ అయి సత్త్వ భావములను ఉద్భవింపజేస్తూ, ముముక్షువులకు ‘‘స్వస్వరూప పరమాత్మత్వ భావన’’ సిద్ధించుకోవటానికి అనుగ్రహము ప్రసాదిస్తూ ఉన్నది. ఆశ్రిత జనులను ఆత్మారామ-ఆనంద సాగరముతో మమేకమగునట్లు దారిచూపుతోంది. ‘‘అహమ్ ఏక తరంగమస్మి - రామానంద సాగరమ్’’ భావనను అనుగ్రహిస్తోంది.

అంతే కాకుండా సమస్తమును ఉద్భవింపజేయు ‘ఉద్భవ కరీ’ రూపము.

(2) ద్వితీయ భూతలే హలాగ్రే సముత్పన్నా। ‘త’కార రూపిణీ। : రెండవ రూపము - సీతాదేవియొక్క ప్రాకృత పాంచభౌతిక రూపము. జనకుడు నాగలి దున్నుచున్నప్పుడు అట్టి హలము (నాగలి) చివరి స్పర్శచే లభించిన రూపము. సమస్తశక్తి స్వరూపిణి అగు సీతామాత, సమస్త రూపములు ‘తనవే’ - అయి ఉండికూడా, - భక్తుల ఉపాసన కొరకై ధరించినట్టి ‘‘నామ-రూపాత్మక-ప్రకృతి అంతర్గత రూపము’’.

(3) తృతీయా అవ్యక్త రూపా- ‘ఈ’ కార రూపిణీ : ఈ విశ్వమంతా తన వ్యక్తీకరణముగా కలిగి ఉంటూనే, తాను ఈ సమస్తమునకు ఆవల ‘అవ్యక్త’ రూపము. (The unmanifesting self while all else is being exhibited as its own presentation / manifestation).

ఈ విధంగా సీతాదేవియే మహామాయగా (1) ‘శబ్ద-స్వాధ్యాయన-ప్రసన్న-ఉద్భవకరీ ‘స’కార రూపము (2) పాంచభౌతిక-హాలాగ్ర జనిత రూపము (3) సమస్తమును తన వ్యక్తీకరణముగా కలిగియున్న ‘ఈ’కార అవ్యక్తరూపము కలిగి ఉన్నది.

ఇది ‘‘శౌనకీ తంత్రము’’ మొదలైన యంత్ర-మంత్ర శాస్త్రములలో సీతాదేవియొక్క మహామాయా స్వరూపము యొక్క అభివర్ణిత ‘‘త్రిరూపములు’’.

అట్టి మహా మాయా స్వరూపిణి అగు సీతాదేవి - కేవల ఆత్మారామమగు శ్రీరామచంద్రుని సాన్నిధ్యవశంగా ‘‘జగదానంద కారిణి’’- అయి విరాజిల్లుచున్నది.

మూల ప్రకృతి సంజ్ఞితా। సీతామాత మూలప్రకృతి అయి ఉండగా, శ్రీరామచంద్రుడో? - ఆ మూల ప్రకృతి ఎవరికి చెందినదై, ఎవరిని ఆశ్రయించినదై ఉంటోందో - అట్టి ఆత్మారామ స్వరూపుడు. ఆత్మను (ఆత్మకు అనన్యమగు) మూల ప్రకృతి యొక్క ఆశ్రయముచేతనే ‘అనుభవము’ అనే వినోదరూపమగు ఆనందము సిద్ధించుచుండగా, శ్రీరామునిపట్ల - ‘‘శ్రీరామానందుడు, ఆత్మానందుడు’’ - అను స్వానుభవము పరిఢవిల్లుతోంది. [ శ్రీరాముడు = ‘నేను’ (I am)। సీత = నాది (My) ]

అట్టి మూల ప్రకృతి రూపిణియగు సీతాదేవి →

☀︎ ఈ జగత్తుయొక్క ఉత్పత్తి, స్థితి, లయకారిణిగా అగుచున్నది. (సృష్టి కర్త్రీ బ్రహ్మరూపీ। గోప్త్రీ గోవింద రూపిణీ। సంహారిణీ విశ్వరూపా। తిరోధానకరి - ఈశ్వరీ - శ్రీ లలితా సహస్రనామము).

☀︎ ‘‘చిత్ స్వరూపిణి’’ అయి సమస్త దేహములలో (సమస్త జీవులలో) ‘‘జ్ఞేయ’’ (ఎరుక)గా ప్రదర్శనమై ఉంటోంది.

☀︎ ప్రకృతి రూపిణిగా సమస్త జీవులచే ‘అనుభవము’గా పొందబడేదంతా సీతాదేవీ రూపమే అగుచున్నది. (తెలియబడేదంతా సీతాదేవీ - చిత్ ప్రదర్శనమే)।

ఆ దేవియే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి। ‘‘అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’’। - అని నిర్వచించబడుచు, బ్రహ్మమును తెలుసుకోవాలనే ఉత్సాహమంతా (The inspiration and the inclination) ‘‘సీతా తాత్త్విక చేతనా విశేషమే’’।

ఇంకా కూడా - ఈ సీతాదేవి వ్యక్తావ్యక్త స్వరూపిణి। ఈ జనని యొక్క వ్యక్తా వ్యక్త స్వరూపమే సర్వత్రా వేంచేసినదై ఉన్నది।

సా సర్వ వేదమయీ। సర్వ వేదములు ఏ బ్రహ్మానంద స్వరూపము గురించి ఎలుగెత్తి గానము చేస్తున్నాయో, - అదియే సీతాదేవీ దివ్య రూపము. సర్వ వేదములలోని రసస్వరూపము కాబట్టి ‘‘సర్వ వేదమయీ’’ అని సీతామాత స్తుతించబడుతోంది. సర్వ వేదములు సీతా స్వరూపమే। (వేదము = తెలియబడునది). ఈ తెలియబడేదంతా నిండి ఉన్నది సీతయే। (వేదమ్ = ‘‘తెలియబడుచున్న సమస్తము’’ - అని శబ్దార్థము)।

సర్వ దేవమయీ। దేవతలంతా కూడా స్థానముగా కలిగియున్నది - ఈ సీతాదేవి యొక్క ప్రకృతి స్వరూపము నందే! సర్వ దేవతలు సీతాదేవి యొక్క మూల ప్రకృతి ప్రదర్శనా రూపులే।

సర్వ లోకమయీ। (స్వప్నమంతా స్వప్న ద్రష్ట యొక్క చేతనా రూపమే అయినట్లు, నవలలోని విశేషములన్నీ నవలా రచయిత యొక్క రచనా కల్పనా విన్యాసమే అయి ఉన్న తీరుగా) - ఆ సీతాదేవియే సమస్త లోకములలో స్ఫురించే లోకేశ్వరి।

సర్వ కీర్తిమయీ। జగత్ కథనములన్నీ, జగత్‌యశస్సు అంతా మూలాధారరూపిణి అగు సీతామాతకు చెందినవే।

సర్వ ధర్మమయీ। ఈ దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జీవ-ఈశ్వర-త్రిలోక ధర్మములుగా (Functional Features) ఏమేమి కనిపిస్తున్నాయో - అవన్నీ ప్రకృతి స్వరూపిణి అగు ఆ సీతామాత యొక్క చిత్కళా విన్యాసమే।

సర్వాధార కార్యకారణమయీ। ఈ దృశ్య ప్రపంచములో కనిపించే కార్యకారణ కర్తృత్వములన్నిటికీ ఆధారము ఈ సీతా జననియే. (‘‘కార్య కారణ కర్తృత్వే హేతుః ప్రకృతి’’ - ఉచ్యతే)।

మహాలక్ష్మీః - దేవేశస్య భిన్న-అభిన్నరూపా। ఈ సీతా మూలస్థాన రూపిణియే (1) మహాలక్ష్మీ (2) విష్ణుమూర్తిల రూపమును ఏకముగాను, భిన్నముగాను కూడా దాల్చుచున్నది.

చేతన-అచేతనాత్మికా। (1) కదలుచున్న సమస్తము, (2) తాను కదలక, సమస్తము కదల్చుచున్న చైతన్యము - ఉభయము తానే అయి ఉన్నట్టిది - ఆ దేవీ రూపము.

బ్రహ్మ స్థావరాత్మా। సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి ఒక స్థావరము (రాయి) వరకు గల సమస్తమునకు ‘‘ఆత్మ స్వరూపిణి’’ అగు - సీతా దేవియే।

తత్ గుణ కర్మ విభాగ భేదాత్ శరీరరూపా। బ్రహ్మ నుండి స్థావరము వరకు గుణ-కర్మ-విభాగ భేదములచేత వేరువేరుగాను, అనేకముగాను కనిపించేదంతా ‘తన శరీరమే’ అయి ఉన్న ప్రకృతి రూపిణి ఈ సీతామాతయే।

దేవర్షి గంధర్వ రూపా। అసుర రాక్షస భూత ప్రేత పిశాచ భూతాదిభూత శరీర రూపా। ఈ సీతా మూల ప్రకృతి స్వరూపమే - దేవతలుగాను, దేవర్షులుగాను, గంధర్వులుగాను, అసుర-రాక్షస రూపములుగాను, భూత ప్రేత పిశాచములుగాను,

ఇంకా, …. పంచభూతములకు ‘ఆది’ గాను, సమస్త భౌతిక శరీర బాహ్య-అభ్యంతర రూపములుగాను ప్రదర్శనమగుచున్నది.

త్రిశక్తి స్వరూపిణీ సీతా।

ఈ సీతాదేవియే ‘శక్తి’ రూపిణి. అట్టి సీతా మూలశక్తి మూడు విధములైన సంప్రదర్శనములతో విరాజిల్లుతోంది.
(1) ఇచ్ఛా శక్తి (2) క్రియాశక్తి (3) సాక్షాత్ శక్తి.

ఇచ్ఛా శక్తి మూడు రూపములు కలిగి ఉంటోంది.
(i) శ్రీ (ii) భూమి (iii) నీళాత్మికా - గాను,
(i) భద్రరూపిణీ (ii) ప్రభావరూపిణీ (iii) సూర్య-చంద్ర-అగ్ని రూపాత్మిక - గాను
- త్రివిధములుగా అగుచున్నది.

సోమాత్మికగా: - సీతామూర్తి యొక్క సోమరూపమే భూమిలో ఓషధులను ప్రభవింపజేస్తూ ఉన్నది.

ఈ సృష్టియందు కల్పవృక్షము యొక్క పుష్ప-ఫల-లత-గుల్మా(తీగా)త్మికగాను, ఔషధ భేషజాత్మికగాను, అమృతరూపం గాను, మహత్-సోమ ఫలముగాను అగుచున్నది.

→ మూల ప్రకృతి స్వరూపిణియగు సీతా జగన్మాతయే… తనయొక్క అమృతరూపముతో దేవలోకము (ఊర్థ్వలోకము)లోని దేవతలకు మహస్తోమ (మహత్ సోమ) ఫలము ప్రసాదించుచున్నది.


♣︎ దేవతలకు అమృతరూపంగాను,
♣︎ మానవులకు ‘అన్నము’ రూపముగాను,
♣︎ పశువులకు తృణముల (గడ్డి) రూపముగాను,
♣︎ వివిధ జీవులకు వారివారి వివిధ ఆహారముల రూపముగాను,
సమస్త జీవులకు వారివారి జీవనమునకు తగినట్టి ఆహారము ప్రసాదించునది - సీతామాతయే।

ఓజో రూపిణి అయి అన్నమును జీవులకు అందించటము, వైశ్వానర రూపిణి అయి దేహములో ఆహారము జీర్ణింపజేయటము నిర్వర్తిస్తోంది కూడా।


కాలరూపదేవీ స్వరూపిణి:

సీతాదేవియే ‘కాల స్వరూపిణి’ అయి, సమస్త జగత్తులను జనింపజేయటము, పరిపోషించటము, క్షయింపజేయటము కూడా నిర్వర్తిస్తోంది.

☼ తేజోరూపిణి అయి - సూర్యగోళము మొదలైన సృష్టిలోని ఆయా పదార్థములను తనయొక్క కాంతిచే వెలిగించుచున్నది.

☼ రాత్రి - పగలు రూపంగా కాలచక్రమును నడిపిస్తోంది.

☼ నిమేష (రెప్పపాటు కాలము) - కాష్ఠ (18 రెప్పపాటుల కాలము - కల (30 కాష్ఠల కాలము) - గడియ లేక ఘటిక (24 ని।।ల కాలము) - 8 జాముల దినము (జాము = యామము = 3 గంటల కాలము), రాత్రి-పగలు, వారము, పక్షము, మాసము ఉత్తరాయన-దక్షిణాయనములు (6 + 6 నెలలు), సంవత్సరము నుండి యుగ-యుగాంతముల వరకు ఇవన్నీ - సీతాదేవి యొక్క కాల స్వరూప విశేషములే. మానవులకు 100 సంవత్సరాల ఆయుష్షు, (అదేవిధంగా) ఆయా సమస్త జీవులకు ఆయుః పరిమాణ నిర్ణయము - మొదలైనదంతా ఆ ప్రకృతిదేవీ చమత్కార రచనా విశేషమే.

☼ చిర (Long Term) - క్షిప్ర (Immediate) ములు, నిమేషము నుండి-పదార్థముల స్థితిగతులు, వృద్ధి క్షయములు ఆ దేవియే।

తస్యైవ కాలస్య విభాగ విశేషాః। ప్రకాశరూపాః। కాలరూపా భవంతి। ఆ దేవియే కాలస్వరూపి అయి, కాలచక్రమును త్రిప్పుచు తనయొక్క కాల విభాగ విశేషములతో ప్రకాశించుచున్నది.

సీతాదేవియే కాలస్వరూపిణిగా ప్రకాశించుచు, కాలమునకు తానే ‘‘నియామకురాలు’’ అయి ఉంటోంది.


తేజో రూపియగు సీతామాతయే…,

⭐︎ అగ్నిరూపా। అన్నగత ప్రాణులలో ఆకలి-దప్పికలుగా వైశ్వానరాగ్ని అయి దేహములలో ఆహారముయొక్క జీర్ణ ప్రక్రియను సంసిద్ధము చేయుచున్నది.

⭐︎ అన్న పానాది ప్రాణినాం క్షుత్ తృషాణాత్మికా। పదార్థములలో ఆహారశక్తి తత్త్వమై, - శరీర పరిపోషణలకు భక్ష్య భోజ్య లేహ్య చోష్యములుగా మ్రింగు, నమిలి మ్రింగు, నాకి మ్రింగు, పీల్చబడు వానిగా) దేహములో ప్రవేశించుటకై సంసిద్ధమగుచున్నది.

⭐︎ దేవానాం ముఖరూపా। దేవతలలో తేజోరూపమై ముఖమునందు వెలుగొందుచున్నది.

⭐︎ వన-ఔషధీనాం శీతోష్ణరూపా। ఓషధులలో (ఆహార పదార్థములలో) శీత-ఉష్ణ (Cool and Hot) రూపమై వెలయుచున్నది.

⭐︎ కాష్ఠేషు అంతర్బహిశ్చ నిత్యానిత్యరూపా భవతి। కొయ్యలో కొయ్యవలె, - ఈ సృష్టియొక్క బాహ్య-అభ్యంతరములలో నిత్య-అనిత్య రూపములు ‘తానే’ అయి ఉంటోంది.


ఈ సమస్తము సీతాదేవికి చెందిన సంపదే కాబట్టి ‘శ్రీదేవి’. శ్రీదేవీ త్రివిధం కృత్వా, భగవత్ సంకల్పానుగుణ్యేన లోక రక్షణార్థం రూపం ధారయతి। ఆ శ్రీదేవి పరమాత్మ యొక్క సంకల్పమును (వినోదమును) అనుసరించి లోక సంరక్షణార్థమై (ఈ నామరూపాత్మక జగత్తు నిర్మితమై, కొనసాగటానికై) - త్రివిధరూపములను దాల్చుచున్నది.

(1) శ్రీః - ఇతి। (2) లక్ష్మీః - ఇతి। (3) లక్ష్యమాణా భవతి ఇతి।

‘శ్రీ’ అని (శ్రీకారము అని), ‘లక్ష్మి’ అని (సమస్త సంపద తనదైనదని) ‘లక్షింపబడునది’ అని (సమస్త జీవుల ఆశయములు తనవే అయినది-అని) ‘3’ విధములు - అని తెలియబడుతోంది.

భూదేవిగా - సప్త సాగర జలరూప, సప్త ద్వీపములతో కూడిన వసుంధర - అగుచున్నది.

→ ‘భూ, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్య సప్త ఊర్థ్వ లోకములుగాను,

‘‘అతల వితల సుతల తలాతల, రసాతల, మహాతల, పాతాళ, సప్త అథోలోకములుగాను,

‘‘చతుర్దశ భువన’’ అయి వెలయుచున్నది.

శ్రీదేవి అగు సీతాదేవియే - సమస్తమునకు :-
• ఆధారము - సమస్తము తనయందు ఉంచబడినట్టి తాను.
• ఆధేయము - ఉంచబడిన సమస్తము కూడా। ఈ కనబడుచున్న సమస్తము సీతాదేవీ విన్యాసమే।

‘ప్రణవాత్మిక’। - దృశ్య-దర్శన-జగత్తులకు తానే ‘ఆత్మ’ అయి ఉండటంచేత ‘‘ప్రణవాత్మిక’’ - అనబడుతోంది.

నీళాదేవి అయి, తేజస్సే ముఖముగా కలిగి ఉంటోంది. ‘ముఖ విద్యున్మానిని’ (తేజోముఖము) అయి సమస్త దేవతల ముఖములలో జ్యోతి-ఆనంద స్వరూపమై వెలయుచున్నది. తేజోవిభవమై ప్రకాసిస్తోంది.

సర్వ ఔషధీం। భూమిలో సర్వ ఔషధముల రూపముదాల్చినదై, ఆకు-ఫల-పుష్పముల రూపము దాల్చి, సర్వ జీవుల పరిపోషణార్థమై ‘‘ఓషధీ రూపము’’ దాల్చుచున్నది. సర్వ ఆహార రూపములు, ఆ ఆహారములు స్వీకరించే సమస్త జీవుల రూపములు ‘తానే’ అయి విలసిల్లుచున్నది.

జలాకారాత్మికా। - సమస్త భువనస్య అదో భాగే ‘జలాకారాత్మికా’, మండూకమయీతి, భువన-ఆధారేతి విజ్ఞాయతే। సమస్త భువనమునకు అడుగు (పాతాళ) భాగంలో ‘జలాకారాత్మిక’గా (ఆపః తత్త్వమై / జలతత్త్వమై) సీతాదేవి చైతన్యమే వేంచేసి ఉంటోంది.

(జలాక = జలగ ఆకారంగా। జలాకారము = ‘నీటిపై వ్రాత’ వలె ఈ జగత్తులు కలిగి ఉంటోంది).

మండూకముగా (కప్ప-నాలుగు కాళ్లు, - (మాండూక్యోపనిషత్) - ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములు’’గా) అయి సమస్త భువనములకు తానే ‘ఆధారము’ అయి ఉంటోంది.

క్రియా శక్తి స్వరూపీ!

ఈ సమస్తము ‘సీతా ప్రకృతి మహత్-తత్త్వము’ యొక్క క్రియాశక్తి చమత్కార రూపమే!

☼ శ్రీహరి ముఖము నుండి → ‘నాదము’ (Sound).

☼ అట్టి నాదము నుండి → ‘బిందువు’ (Point).

☼ అట్టి బిందువు నుండి→ ‘ప్రణవము’ (‘ఓం’కారము). జీవ బ్రహ్మముల, దృశ్యముల సమగ్రమగు ‘‘అద్వితీయ-పరమార్థ అక్షర సంజ్ఞ’’

☼ ‘ఓం’కారాత్ పరతో ‘రామ వైఖానస’ పర్వతః। → ‘నాదము’ ….. ‘ఓం’కారమునకు పరమై (ఆవలిదై, ఓంకారమునకు పరార్థమై, శ్రేష్ఠార్థమై →) - రామ వైఖానస (కేవలమగు ఆత్మారామ ఉపాసనా) పర్వతము.

(వైఖానస = వేద వాఙ్మయ అధ్యయనము)

అట్టి రామోపాసనా (ఆత్మోపాసనా) పర్వతమమునుండి కర్మ జ్ఞానమయములైన (Functioning and knowing సంబంధమైన) - అనేక శాఖలు, ఉపశాఖలు.

అచ్చట (ఆత్మారాముని యందు) త్రయీమయములగు త్రివేదములలోని పరమార్థము యొక్క స్ఫురణ (ఆత్మారామము)।

శాస్త్రం ఆద్యం సర్వార్థ దర్శనమ్। త్రివేదములలోని శాస్త్రీయ విషయాల అధ్యయనముచే సర్వార్థ దర్శన సిద్ధి.

[ త్రయీ : ‘ఋక్’ వేదము ‘యజుర్వేదము’, ‘సామవేదము’ - ఈ మూడిటినీ కలిపి ‘త్రివేదములు’ అని చెప్పుతూ ఉంటారు. ]

నాలుగవేదము : ‘అథర్వణ’. ఇది కార్యసిద్ధి (Execution of Tasks spoken by three VEDAs) యొక్క ప్రాధాన్యత కలిగి ఉన్నట్టిది. (అనగా ప్రధాన్యంగా - కార్యసిద్ధి నిమిత్తంగా నాలుగవ వేదము రూపుదిద్దుకొన్నదైనది).

నాలుగు వేదములను (1) ఋక్ (2) యజుః (3) సామ (4) అథర్వణ - అంగిరసము అని కూడా అంటారు.
(ముఖ్య ప్రాణమును ‘అంగిరసము’ అని మునులు స్తుతించుచున్నారు - ఛాందోగ్యోపనిషత్).

చాతుర్హోత్ర ప్రధానత్వాత్ లింగాది త్రితయం త్రయీ।

లింగ    = [ (పంచవిశంతి (25) తత్త్వములకు ఆది అగు) ] - ప్రకృతి.  
లింగాది   = ఆది పురుషుడగు ‘పరమాత్మ’.

3 వేదములలో ఆది పురుష - ప్రకృతులకు 4 హోత్రములు (వ్రేల్చటములు) - ప్రాముఖ్యము కలిగి ఉన్నాయి.
అథర్వ-అంగిరస (ఉపాసనా ప్రాధాన్య) రూపము కూడా ఋక్-యజుర్-సామ ‘‘త్రివేదహృదయాత్మిక’’ అగు సీతాదేవీ తత్త్వమే.

  1. ఋగ్వేదము - 21 శాఖలు
  2. యుజుర్వేదము - 109 శాఖలు
  3. సామవేదము - 1000 శాఖలు
  4. అథర్వణవేదము - 50 శాఖలు

వైఖానసమ్ అతః తస్మిన్ ఆదౌ ప్రత్యక్ష దర్శనమ్। ప్రాణోపాసనతో కూడి ప్రాణాయామాదులచే ఆది స్వరూపిణి అగు సీతాదేవీ (ఆత్మదేవీ) దర్శనము సిద్ధించగలదు. (వైఖానసము = ఆత్మతత్త్వ అపరోక్షానుభవము). అందుచేత మునులు వైఖానస దర్శనము (ప్రాణతత్త్వోపాసన)ను ముందుగా దర్శిస్తున్నారు. ఆ తరువాత శబ్దోపాసన. వైఖానస-శబ్ద దర్శనముల తరువాత - వేదాంగ దర్శనము - షడంగ దర్శనములు / షట్ దర్శనములు.

వేద సంబంధిత - ‘‘వేద ఉపాంగములు’’

  1. కల్పము : యుగ యుగాంతర కాల కల్ప వివరణలు. వ్రత కల్పములు, నిబంధనలు - వివరించు వేదాంగము.
  2. వ్యాకరణము : శబ్ద లక్షణ - వాక్యవివరణ, యతి ప్రాస సంబంధమైన నియమములు నిర్ణయించు శాస్త్రము.
  3. నిరుక్తము : వేద శబ్దములకు అవయవార్థము. పదముల ముఖ్యార్థములు తెలియజేయు శాస్త్రము/దర్శనము.
  4. జ్యోతిష్యము : సూర్య-చంద్ర-గ్రహ-నక్షత్ర-నక్షత్ర మండల కదలిక, సంచారముల గురించి తెలుపు శాస్త్రము. కర్మ సంబంధమైన ఉచిత - అనుచిత కాలనియమములను, నిష్కృతి-ప్రాయశ్చిత్తములను చెప్పు శాస్త్రము.
  5. ఛందస్సు : పద్య లక్షణము, పదరచన, గణ-ప్రాస నియమములు మొదలైన భాషా నియమములు వివరించు వేదాంగము / దర్శనము.
  6. శిక్ష : వేద స్వరములను, [ అనుస్వార (ఉదాత్త-అనుదాత్త) స్వర విశేషములను ] తదితర వేద - వేదాంగ - ఉపాంగ ఉచ్ఛారణాక్రమమును - నేర్పు విధి. విద్యాభ్యాసము, బోధనా విధానములను విశ్లేషించు శాస్త్ర / వేద విభాగ దర్శనము.


వేద ‘అనుబంధములు’గాను ఉపాంగములుగాను చెప్పబడు (వేద సంబంధిత) శాస్త్రములు:

  1. మీమాంస శాస్త్రము : పూర్వభాగంగా వేదములకు సంబంధించిన కర్మకాండను, ఉత్తర భాగంగా ‘జ్ఞానము’ బోధించు శాస్త్రము/ వేద ఉపాంగము. కర్మ-జ్ఞానములను సమన్వయించి విశ్లేషించు శాస్త్రము.
  2. న్యాయ శాస్త్రము : తర్క శాస్త్రము (Logic).

ధర్మశాస్త్రము

ఈ జీవులంతా పరస్పరము (ఒకరిపట్ల మరొకరు) ఏ ఏ ధర్మము నిర్వర్తించాలో, అట్టి ‘ధర్మాచరణ’ పైననే సాంఘిక జీవనము ఆధారపడినదై ఉంటుంది. అందుచేత - ధర్మజ్ఞ సేవితార్థం చ, వేద వేదో - అధికం తథా। ఒకడు తాను చేయవలసినది (ధర్మము), చేయకూడనిది (అధర్మము) - ఇవి అత్యంత ప్రాముఖ్యం అగుచున్నాయి.

ధర్మశాస్త్రము ధర్మప్రవచనములు - వేద వేదాంగముల కంటే కూడా (దైనందికంగా మానవుల జీవన విధానం పరిరక్షించేది, బాధించేది కూడా కాబట్టి) - ప్రాముఖ్యత సంతరించుకోసాగాయి.

ధర్మశాస్త్రములోని నిబంధనములు (Conditions) సమయ-ఆచారములకు సంబంధించిన సంగతులు (Timely practices and related duties of a person) - దైనందిక జీవితంలో అందరికీ ముఖ్యముగా తెలుసుకోవలసినవి అగుచున్నాయి.

అంతేకాదు. కాలమునుబట్టి ప్రదేశము, వాతావరణాదులనుబట్టి ధర్మ-నియమ-నిష్ఠలు వేరువేరుగా రచించబడవలసి వస్తోంది.

అట్టి అతి సూక్ష్మము - గహనము అయి ఉండటం చేత (‘మనుస్మృతి’ ‘పరాశరస్మృతి’ మొదలైన) మహర్షి అంతఃకరణములు ధర్మశాస్త్రములై వెలయుచున్నాయి. ధర్మశాస్త్రం మహర్షీణాం అంతఃకరణ సంభృతమ్।।

లోక క్షేమ ఆశయముతో మహర్షులు చెప్పు ప్రవచనములు, విధి-నిషేధములు ‘ధర్మశాస్త్రము’గా ఆచరించబడుతోంది. అవి మానవులకు విధి-నిషేధ సంబంధమైన నిఘంటువులు (Dictionary References for Do’s and Dont’s) అగుచున్నాయి. [ ధర్మో రక్షిత రక్షితః। ధర్మమును రక్షించువాడు (శ్రద్ధగా నిర్వరించువాడు) ఆ ధర్మముచేతనే రక్షించబడుచున్నాడు ].

వేదము యొక్క ఉపాంగములు :

ఇతిహాసము : పరంపరగా చెప్పుకొనే పూర్వకథ. చరిత్రాంశము. పూర్వము జరిగిన చరిత్రను వివరించు గ్రంథము. ఉదాహరణకు భారతము, రామాయణము మొదలైనవి. (ఇతి-హ-అసమ్। ‘హ’ - ఒకప్పుడు, ‘ఇతి’। - ఈవిధంగా, ‘అసమ్’ = జరిగినది).

పురాణములు : బ్రాహ్మణముల గురించిన గ్రంథములు వ్యాసమహర్షిచే ‘18’ పురాణములు పలుకబడ్డాయి.
(మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ గరుడ, కూర్మ, స్కాంద పురాణములు)

(అష్టాదశ పురాణముల పేర్ల గురించి శ్లోకం -: ‘మ’ద్వయం। ‘భ’ద్వయంబైవ। ‘బ్ర’ త్రయం। ‘వ’ చతుష్టయం। అ నా పా లిం గ కూ స్కా - ని పురాణాని పృథక్ పృథక్)
పురాణములు = పూర్వమే మొదలై ఉండిన ఆత్మతత్త్వము గుర్తుచేయు సంఘటనల అభివర్ణనలు కలది. ఇతః పూర్వమే ఉండి, ఇప్పటికీ, ఎప్పటికీ సమన్వయము కాగలిగినట్టివి - పురాణములు).

పంచ ఉపవేదములు :

శ్లో।। వాస్తువేదో ధనుర్వేదో గంధర్వశ్చ తథా మునిః
ఆయుర్వేదశ్చ పంచైతే - ఉపవేదాః ప్రకీర్తితాః।।
  1. వాస్తు వేదము : గృహములు మొదలైన వాటికి సంబంధించిన ‘‘నిర్మాణ’’ శాస్త్రము (Civil Engineering).
  2. ధనుర్వేదము : విలువిద్య। అస్త్రవిద్య, శస్త్ర విద్య.
  3. గంధర్వ వేదము : గానము, సాహిత్యములతో కూడిన సంగీతవిద్య, (గంధర్వగానము = దేవతా మధురగానము), నాట్యవేదము.
  4. ముని వేదము : సమస్త ప్రాపంచిక విశేషములను ఆత్మయందు ఏకముచేసి, సమస్త అనేకములపట్ల అంతరమున ‘మౌనము’ వహించియుండు ఆత్మయోగసిద్ధి - శాస్త్రము.
  5. ఆయుర్వేదము : మానవుల ఆయురారోగ్యములను రక్షించు, రోగులకు ఉపశమనము కలిగించు ఔషధ సంబంధమైన శాస్త్రము. (Medicine). రోగ చికిత్సా శాస్త్రము.

ఉపశాస్త్రములు :

‘దండో నీతిశ్చ వార్తాచ విద్యా వాయుజయః పరః।
(చతుశ్శాస్త్రములు : వ్యాకరణ, తర్క, మీమాంస, ధర్మశాస్త్రములు).

దండము : నేరము - శిక్ష సంబంధమైనది. రాజశిక్ష.

నీతి : రాజనీతి. నీతి-నీజాయితీగా ఉండే సాంఘిక జీవన శాస్త్రము.

వార్త : ప్రవర్తనము. అర్థ, అనర్థములను వివేచనచేయు వర్తనము. జీవనోపాయములు, లోకోక్తులు.

విద్య : అధ్యాత్మ విద్య. జ్ఞాన సంపాదనము. శాస్త్ర విద్య.

వాయు జయము : ప్రాణాయామ ఉపశాస్త్రము. పూరక - రేచక - కుంభక అభ్యాసములు. స్వాభావ కుంభక సిద్ధి. ఇడ పింగళనాడులను ఉపయోగించి ఇచ్ఛాశక్తి రూపమగు కుండలినీ శక్తిని మూలాధారంలో నిదురలేపి (ఇడ-పింగళల మధ్యగా గల) సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి, బ్రహ్మరంధ్రమును భేదింపజేసి, సహస్రాకారములోను ప్రవేశింపజేయు అభ్యాసము. 21 ఉపనిషత్తులలో ప్రాణాయామము గురించి శాస్త్రీయం విశేషాలు చెప్పబడుచున్నాయి.

స్వయం ప్రకాశవిద్యలు 21 రూపములుగా శాస్త్రరూపములు దాల్చి ఉన్నాయి.

ఇవన్నీ కూడా ‘‘సీతాదేవీ మూలప్రకృతి మహత్మ్య’’ విశేషములే!

సాంఖ్య శాస్త్ర రూపమగు సీతాదేవీ మహత్మ్యము విష్ణువు యొక్క వాణిగా, విష్ణు వాక్కుగా వైఖానస ఋషి శ్రవణం చేసి ఉన్నారు. ఓ దేవతలారా! మనము ఆయా కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాము.

సీతాదేవి సృష్టిలో ‘‘క్రియారూపము’’ అయి, సమస్తమును ఉత్తేజపరుస్తూ సజీవంగా నడిపించుచున్నది. (Inspiring and making lively).

శశ్వత్ బ్రహ్మమయం రూపం ‘క్రియా శక్తిః’ ఉదాహృతా। ఇదంతా ఎల్లప్పుడు (శశ్వత్) (బ్రహ్మమయమే అయి ఉండటంచేత, దృశ్యవ్యవహారమంతా కూడా బ్రహ్మముయొక్క క్రియాశక్తి ప్రదర్శనా చమత్కారమే - అని చెప్పబడుతోంది.

ఇంకా కూడా - ఆ దేవదేవి →

వ్యక్తావ్యక్త స్వరూపిణీ

సీతాదేవి అని వేదవేదాంగములచే గానము చేయబడుతోంది. ప్రస్తుతించబడుతోంది. (Everything else tends to be Sita Devi’s extension of Herself).

ఇచ్ఛాశక్తి స్వరూపిణీ సీతా।

ఆ దేవదేవి యొక్క ఇచ్ఛాశక్తి సందార్భానుచితంగా మూడువిధములై ప్రదర్శనమౌతోంది.
1. యోగశక్తి 2. భోగ శక్తి 3. వీరశక్తి

I. యోగశక్తి (Getting back to SELF) :- ప్రలయకాలంలో లోకములు, లోకపాలకులు, మునిగణము - అంతాకూడా లయించగా, ప్రపంచమంతా కూడా నిష్ప్రపంచమగుచూ ఉండగా, - భగవతియగు మూలప్రకృతీ సీతామాత భగవంతుడగు పరమబ్రహ్మమునందు (తరంగము జలములో లయించు తీరుగా) లయిస్తోంది. ఆయన యొక్క దక్షిణ (ఎడమవైపు) వక్షస్థలంలో విశ్రమించటానికై ‘శ్రీవత్సాకృతి’ని ధరిస్తోంది. అట్టి విశ్రమించు సీతాదేవీ ఆత్మసంయమమే యోగశక్తి [ ఆత్మతో శక్తి యోగము (ఏకము) పొందటము ] అని చెప్పబడుతోంది.

II. భోగశక్తి (Enjoying the own external) :- ఆ దేవియొక్క భోగశక్తియే దృశ్య జగత్తులో భోగరూపములు అగుచున్నది. సమస్త జీవులలోని ‘భోగించాలి’ అనే ఉత్సాహము సీతాదేవీ చైతన్య ప్రదర్శనమే।

సీతాదేవియే కల్పవృక్ష, కామధేను, చింతామణి, శంఖ, చక్ర, గదా ఖడ్గ, పద్మ, నిధి - అనబడే నవనిధులను ఆశ్రయించినదై, వాటివాటి వైభవములను సృష్టి కల్పనయందు సంప్రదర్శితము చేస్తూ ఉంటోంది.

భగవంతుని ఉపాసకులగు భక్తులకు తనయొక్క నవనిధులతో ‘తోడు’ అయి ఉంటోంది. వారు కోరికలతోగాని, కోరికలు లేకుండానేగాని (కామనయా, అకామనయా) చేయు నిత్యకర్మలను (Daily Puja etc.,), నైమిత్తిక కర్మలను (Occasionally taken up Dedications) - గమనిస్తూ కర్మఫలములను ప్రసాదించుచున్నది.

భక్తజనులగు అనేకులు జగన్మాతయగు సీతాదేవీ మహత్మ్యము ఎరిగినవారై →

ఈ ఈ అష్టాంగ యోగముల ద్వారా సీతాదేవియొక్క తాత్త్విక రూపము ఉపాసించబడుతోంది.


ఇంకా కూడా →

సీతాదేవీ వీరశక్తి

III. వీరశక్తి :- అమ్మవారు తనయొక్క వీరశక్తితో సాకార రూపమును భక్తుల ఉపాసన, ఏకాగ్రతల కొరకై ప్రసాదిస్తున్నారు.

అట్టి దేవి దివ్య సింహాసనముపై పద్మాసన - ఆరూఢ అయి అధిష్ఠించి ఉన్నది.

☼ జగత్తులో సర్వ కార్య కారణ కర్తృత్వములు ఆ సీతాదేవి యొక్క ప్రభవ-తేజో పుంజములే!
☼ వైకుంఠములో విష్ణుభగవానుని మందిరంలో లక్ష్మీదేవి అయి విలసిల్లుచున్నది.
☼ 14 లోకములు తనయొక్క బ్రహ్మీరూపముతో నిశ్చలముగా, సుస్థిరముగా నింపి ఉంచుచున్నది.
☼ తనయొక్క ప్రసన్నతతో కూడిన చూపులతో ఆశ్రయించి నమస్కరించినంత మాత్రంచేత భక్తజనుల మనస్సులను ప్రసన్న- ప్రశాంతమయముగా తీర్చిదిద్దుచున్నది.
☼ సర్వదేవతలచే పూజింపబడుచున్నది.

అట్టి వీరలక్ష్మిగా పిలవబడుచున్న సీతాదేవికి నమస్కరించుచున్నాము.

ఆ తల్లి ‘వీరలక్ష్మి’ అను నామముచే ప్రసిద్ధమై మాలోని అరిషట్ వర్గమును కడిగివేయును గాక!

మాకు ఆత్మానందమును అనునిత్యంగా, అనుక్షణంగా ప్రసాదించును గాక!

→ అట్టి యోగశక్తి, భోగశక్తి, వీరశక్తి సమన్వితమగు సీతాదేవి యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములకు - మాయను జయించే నిమిత్తమై, మేము నమస్కరిస్తున్నాము. శరణు వేడుచున్నాము.

మూల ప్రకృతి స్వరూపిణీ, ఇచ్ఛా జ్ఞాన క్రియా స్వరూపిణీ,
అస్మత్ ఆత్మ స్వరూపిణీ - శ్రీ సీతామాతాభ్యాం నమః।।
ఇతి సీతోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।



Seetha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com