[[@YHRK]] [[@Spiritual]]
Soorya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
సూదితస్వాతిరిక్తారిసూరినందాత్మభావితం . సూర్యనారాయణాకారం నౌమి చిత్సూర్యవైభవం .. |
|
శ్లో।। సూదితః స్వాతిరిక్తారి సూరి నందాత్మ భావితమ్। సూర్యనారాయణాకారం నౌమి ‘చిత్’ సూర్య వైభవమ్।। |
స్వస్వరూపమునకు వేరుగా అనిపించేదంతా భస్మము చేయునది (లయింపజేయునది), ఆత్మభావనాకారము ప్రసాదించునది - అగు సూర్యనారాయణాకారమును చిత్ సూర్య వైభవముగా స్తుతించుచున్నాము. |
హరిః ఓం అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః . బ్రహ్మా ఋషిః . గాయత్రీ ఛందః . ఆదిత్యో దేవతా . |
|
ఓం। 1. అథ ‘‘సూర్య-అథర్వ అంగిరసం’’ వ్యాఖ్యాస్యామః। బ్రహ్మా - ఋషిః। గాయత్రీ - ఛందః। ఆదిత్యో - దేవతా। |
ఇప్పుడు మనము ‘‘సూర్య’’ - అథర్వణవేద ‘అంగిరసము’ (మంత్రము)ను వ్యాఖ్యానించుకొంటున్నాము. అట్టి ఈ సూర్యాథర్వ అంగిరస మంత్రమునకు - ఋషి - ‘‘బ్రహ్మదేవుడు’’ ఛందస్సు - ‘‘గాయత్రి’’ దేవత - ‘‘ఆదిత్యుడు’’ (సూర్యుడు) |
హంసః సోఽహమగ్నినారాయణయుక్తం బీజం . హృల్లేఖా శక్తిః . వియదాదిసర్గసంయుక్తం కీలకం . చతుర్విధపురుషార్థసిద్ధ్యర్థే వినియోగః . |
|
హగ్ంసః సోఽహమ్ అగ్ని । - నారాయణ యుక్తం - బీజం। - హృల్లేఖా శక్తిః। - వియత్-ఆది సర్గ సంయుక్తం కీలకమ్। చతుర్విథ పురుషార్థ సిద్ధ్యర్థే వినియోగః। |
అగ్ని - ‘‘హగ్ంసః। సోఽహమ్’’। బీజము - ‘‘ఓం నమో నారాయణాయ’’ శక్తి - హృల్లేఖా (హృదయస్థానము)। కీలకము - ఆకాశము ఆదిగా (ఆకాశము-వాయువు-అగ్ని-ఆపః- పృథ్వి) - పంచభూతములతో సంయుక్తము (కూడుకొన్నది). (‘‘ధర్మ అర్థ కామ మోక్షములు’’ అనబడే) చతుర్విధ (నాలుగు రకముల)- పురుషార్థములు సిద్ధించటానికై - వినియోగము (సంకల్పిస్తున్నాము). |
షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజసంస్థితం . సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం |
|
2. షట్ స్వరారూఢేన బీజేన షడంగమ్ - రక్తాంబుజ సంస్థితమ్। సప్తాశ్వ రథినమ్। హిరణ్య వర్ణం। చతుర్భుజమ్। |
తనవైనట్టి ఆరు స్వరములతో ఆరూఢము (కలిగినది) అయిన బీజముతో షడంగము. [ స్వరములు = ఉదాత్త (వేదములోని ఊర్థ్వ స్వరము, అనుదాత్త (క్రింద స్వరము), మధ్యమ మొదలైనవి ]. - ఎర్ర తామర పద్మమునందు ప్రకాశమానుడై ఉండువారు, - ఏడు గుర్రములు పూన్చిన రథము అధిరోహించువారు, (సప్తాశ్వరధమారూధమ్) - బంగారు వన్నెలతో ప్రకాశించువారు, నాలుగు భుజములు కలవారు, |
పద్మద్వయాభయవరదహస్తం కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః . |
|
పద్మద్వయ-అభయ వరద హస్తమ్। కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద, స వై బ్రాహ్మణః- |
- అభయము (భయము పోగొట్టునది), వరదము (సమస్తము ప్రసాదించునది) - అగు రెండిటి సంజ్ఞగా రెండు చేతులతో రెండు పద్మములు ధరించువారు, - కాల చక్రమును నడిపిస్తూ ఉన్నవారు - అగు సూర్యభగవానుని తత్త్వతః ఎవరు తెలుసుకొంటారో, వారే బ్రహ్మమును ఎరిగినట్టి ‘బ్రాహ్మణులు’। |
ఓం భూర్భువఃసువః . ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి . ధియో యో నః ప్రచోదయాత్ . |
|
ఓం భూర్భువస్సువః, తత్ సవితుః వరేణ్యమ్ భర్గో దేవస్య ధీమహి- ధియో యో నః ప్రచోదయాత్। (ఇతి గాయత్రీ మంత్రః)। |
భూ భువః సువర్ (Matter - Thought - Self Zones) - అను వ్యాహృతులు. (Expressions) గా గలవారు, స్తుతిపాత్రులు (వరేణ్యుడు), సత్-విత్ (కేవలమగు ఉనికి, ఎరుక) స్వరూపులు అగు సూర్య భగవానుని మహిమను బుద్ధితో స్తుతించు చున్నాము. అట్టి భర్గోదేవుడు (సమస్తమును వెలిగించుచున్న సూర్యదేవుడు) మా బుద్ధులను (ఆత్మతత్త్వము వైపుగా, పరమ - సత్యము వైపుగా) ప్రేరేపించుదురు గాక! |
సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ . సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే . సూర్యాద్యజ్ఞః పర్జన్యోఽన్నమాత్మా |
|
సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ। సూర్యాద్వై ఖలు ఇమాని భూతాని జాయంతే। సూర్యాత్ యజ్ఞః। పర్జన్యో, అన్నమాత్మా। |
(దేహమునకు దేహియే ఆత్మ - అన్న తీరుగా) - ఈ సమస్త జగత్తుకు సూర్యుడే ‘ఆత్మ’ (The Self of entire Creation). ఆయన నుండి ఈ జగత్తు (లీలగా) బయల్వెడలుతోంది. సూర్యుని నుండియే ఈ సమస్త జీవులు జనించుచున్నారు. సూర్యుని నుండే ‘సృష్టి’ అనే మహా యజ్ఞము. ఆ యజ్ఞములో అంతర్భాగంగా ‘మేఘములు’ (వర్షాధి దేవత). మేఘముల వలననే ‘అన్నము’. అన్నము వలననే జీవులపట్ల ‘జీవితము’ అనే సందర్భము సిద్ధిస్తోంది. |
నమస్త ఆదిత్య . త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి . |
|
నమస్తే ఆదిత్య। త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి। |
[ ఆదిత్యుడు = అదితి కుమారుడు. (యః తు ‘‘ఆది = సమస్తమునకు మునుముందే ఉన్న సత్-విత్-ఋత్ ఆత్ముడు. సవితృడు). ] హే ఆదిత్య భగవాన్! మీకు నమస్కారము. స్వామీ! సృష్టిలోని సమస్త కర్మ వ్యవహారములకు ‘‘కర్త’’ అయి ఉన్నారు. ప్రత్యక్షకర్త మీరే! |
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి . త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి . త్వమేవ ప్రత్యక్షం రుద్రోఽసి . త్వమేవ ప్రత్యక్షమృగసి . త్వమేవ ప్రత్యక్షం యజురసి . త్వమేవ ప్రత్యక్షం సామాసి . త్వమేవ ప్రత్యక్షమథర్వాసి . |
|
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి। త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి। త్వమేవ ప్రత్యక్షగ్ం రుద్రో౽సి। త్వమేవ ప్రత్యక్షం ‘‘ఋక్’’ - అసి। త్వమేవ ప్రత్యక్షం ‘యజుః’ - అసి। త్వమేవ ప్రత్యక్షగ్ం ‘సామ’ - అసి। త్వమేవ ప్రత్యక్షమ్ ‘అథర్వ’ - అసి। |
మీరే ప్రత్యక్ష దైవము। ప్రత్యక్ష నారాయణుడగు మీరే - - ప్రత్యక్ష ‘సృష్టి’కర్త అగు బ్రహ్మదేవుడు! - ప్రత్యక్ష ‘స్థితి’ కర్త, పరిపోషకుడు అగు విష్ణు భగవానుడు! - ప్రత్యక్ష ‘లయ’ కర్త అగు రుద్రపరమాత్మ! - ఋషుల స్వానుభవముగా గానము చేయబడుచున్న ‘ఋక్కులు’ ప్రాధాన్యము కలిగిన ‘ఋగ్వేద మంత్ర స్వరూపులు’. - యజ్ఞయాగ యజస్సుల ప్రాధాన్యము కలిగియున్న ‘యజుర్వేద యజ్ఞ స్వరూపులు’. - వేదగానములతో కూడిన సామవేద గాన స్వరూపులు. - మీరే ప్రత్యక్షమగుచున్న విశేషములను క్రోడీకరించి వివరించు అథర్వణవేద స్వరూపులు. (యజ్ఞవిధి, విధాన, నిషేధ వివరణములు- విశేషములు ప్రాధాన్యముగా గలది). |
త్వమేవ సర్వం ఛందోఽసి . ఆదిత్యాద్వాయుర్జాయతే . ఆదిత్యాద్భూమిర్జాయతే . ఆదిత్యాదాపో జాయంతే . ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే . ఆదిత్యాద్వ్యోమ దిశో జాయంతే . ఆదిత్యాద్దేవా జాయంతే . ఆదిత్యాద్వేదా జాయంతే . |
|
త్వమేవ సర్వం ఛందో౽సి। ఆదిత్యాత్ వాయుః జాయతే। ఆదిత్యాత్ భూమిః జాయతే। ఆదిత్యాత్ ఆపో జాయంతే। ఆదిత్యాత్ జ్యోతిః జాయతే। ఆదిత్యాత్ వ్యోమ జాయతే। ఆదిత్యాత్ దేవా జాయంతే। ఆదిత్యాత్ వేదా జాయంతే। |
మీరే భాషాశాస్త్ర విశేషమగు ‘ఛందస్సు’ - స్వరూపులు. ఆదిత్యుడే - వాయువు, భూమి, జలము, జ్యోతి, వ్యోమము (ఆకాశము), దేవతలు, వేదములుగా అగుచున్నారు. ఆదిత్యుని నుండే భూ-జల- జ్యోతి (అగ్ని) -వాయు-ఆకాశములు, దేవతలు, వేదములు బయల్వెడలు చున్నాయి. ఈ సమస్తమునకు ఆది ఏదో, ‘‘తదేవ ఆదిత్యః’’. |
ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి . అసావాదిత్యో బ్రహ్మ . ఆదిత్యోఽన్తఃకరణమనోబుద్ధిచిత్తాహంకారాః . |
|
3. ఆదిత్యోవా ఏష ఏతత్ మండలం తపతి। అసావాదిత్యో బ్రహ్మ। ఆదిత్యో అంతఃకరణ- మనో బుద్ధి చిత్త అహంకారాః। |
ఆదిత్యుడే తనయొక్క తేజస్సుచే సూర్యమండలమును తపింప జేయుచున్నారు. వెలిగించుచున్నారు. ఆదిత్యుడే సర్వత్రా ఏర్పడియున్న బ్రహ్మము. ఆయనయే సృష్టికర్త అగు బ్రహ్మ. ఆయనయే జీవులలో అంతఃకరణ చతుష్టయమగు మనో బుద్ధి చిత్త అహంకారస్వరూపులు. |
ఆదిత్యో వై వ్యానః సమానోదానోఽపానః ప్రాణః . |
|
ఆదిత్యో వై వ్యానః సమాన ఉదానో అపానః ప్రాణః। |
ఆ ఆదిత్యభగవానుడే దేహములలో ప్రాణ-వ్యాన-సమాన-ఉదాన-అపానములుగా (పంచప్రాణములుగా) అయి, శరీరములోని అంతర్గత వ్యవహారములన్నీ సజీవరూపంగా నడిపిస్తూ ఉన్నారు. |
ఆదిత్యో వై శ్రోత్రత్వక్చక్షూరసనఘ్రాణాః . ఆదిత్యో వై వాక్పాణిపాదపాయూపస్థాః . ఆదిత్యో వై శబ్దస్పర్శరూపరసగంధాః . ఆదిత్యో వై వచనాదానాగమనవిసర్గానందాః . |
|
ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షూ రసన ఘ్రాణాః। ఆదిత్యో వై వాక్ పాణి పాద పాయు ఉపస్థాః। ఆదిత్యో వై శబ్ద స్పర్శ రూప రస గంధాః। ఆదిత్యో వై వచన ఆదాన ఆగమన విసర్గ ఆనందాః। |
ఆదిత్యుడే → పంచ జ్ఞానేంద్రియములగు - చెవులు (వినికిడి), చర్మము (స్పర్శ), కళ్లు (చూపు), రసనము (నాలుక), ముక్కు (వాసన) గాను పంచకర్మేంద్రియములు అగు - వాక్, పాణి (చేతులు) పాద (కాళ్లు), పాయు (విసర్జన), ఉపస్త (గుహ్య) లు గాను, పంచజ్ఞానేంద్రియ విషయములయినట్టి శబ్ద స్పర్శ రూప రస గంధములు గాను, పంచ కర్మేంద్రియ విషయములయినట్టి - వచనము, ఆదానము, ఆగమనము, విసర్జనము ఆనందములు గాను అగుచున్నారు. |
ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానానమయ ఆదిత్యః . నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి . భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః . |
|
ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞాన ఘన ఆదిత్యః। నమో మిత్రాయ భానవే। మృత్యోర్మా (మృత్యోర్మే) పాహి। భ్రాజిష్ణవే, విశ్వహేతవే నమః। |
ఆనందమయుడు, విజ్ఞానమయుడు (One enjoying and knowing many things), విజ్ఞాన ఘనము (The property of knowing at its absolute) - కూడా ఆ ఆదిత్యుడే! అట్టి ఆనంద విజ్ఞాన ఘనుడగు మిత్రునికి (సూర్యునికి) నమస్కారము. సర్వము ప్రకాశింపజేయు స్వామికి నమో నమః। మృత్యువు నుండి నన్ను రక్షించండి. అట్టి భ్రాజిష్ణువుకు (అనేక భూషణములు ధరించు వారికి), ప్రకాశించుటయే స్వభావముగా కలవారికి,, ఈ సమస్త విశ్వమునకు కారణమైనవారికి - నమస్కారము. |
సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు . |
|
సూర్యాత్ భవంతి భూతాని। సూర్యేణ పాలితాని తు। |
ఈ సమస్త భూతజాలము (జీవజాలము) సూర్యుని నుండే పుట్టు చున్నారు. సూర్యునిచేతనే పాలింపబడుచున్నారు. |
సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోఽహమేవ చ . |
|
సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః, సో౽హమేవ చ। |
(తరంగాలన్నీ చివరికి జలములోనే లయించు తీరుగా) - ఈ జీవులందరు చివరికి ఆదిత్యుడగు సూర్యునియందే లయిస్తూ ఉన్నారు. ఏ ఆదిత్యుడు సూర్యుడై ఆకాశములో స్వయముగా ప్రకాశించుచున్నారో, ఆయనయే సమస్త దేహములలో ‘నేను’గా కూడా ఉన్నారు. నేనై ఉన్నాను. సోఽహమస్మి। |
చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః . చక్షుర్ధాతా దధాతు నః . |
|
చక్షుః నో దేవః సవితా। చక్షుః న ఉత పర్వతః। చక్షుః ధాతా దధాతు నః। |
ఆ సవిత్రు దేవాదిదేవుడే నాయందు (పర్వతమువలె) ‘చూపు’ రూపంగా వేంచేసి ఉన్నారు. పర్వతము వంటి ఆయనయే - నాకు చక్షువులు. ధాత అగు ఆయన మాకు అట్టి ‘సో౽హమ్’ దృష్టిని ప్రసాదించును గాక। |
ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి . తన్నః సూర్యః ప్రచోదయాత్ . |
|
‘‘ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి। తన్న సూర్యః ప్రతచోదయాత్’’ |
అట్టి సమస్తమునకు ‘ఆది యత్ తత్’ అగు ఆదిత్య తత్త్వమును తెలుసుకొనుచున్నాము. ఆయన యొక్క సహస్ర కిరణ సంప్రదర్శనా - మహిమను బుద్ధితో నుతిస్తున్నాము. అట్టి ఆ సూర్య భగవానుడు మా బుద్ధిని (సత్యము, నిత్యము అగు అఖండాత్మ యొక్క స్వానుభవము వైపుగా) ప్రేరేపించును గాక। సముత్సాహ పరచును గాక। |
సవితా పశ్చాత్తాత్సవితా పురస్తాత్సవితోత్తరాత్తాత్సవితాధరాత్తాత్ . సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః . |
|
సవితా పురస్తాత్। సవితా పశ్చాత్। తత్ సవితా ఉత్తరాత్। (సవితా దక్షిణాత్।) తత్ సవితా అధరాత్తాత్। సవితా నః సువతు। సర్వతాతిగ్ం, సవితా నో రాసతాం దీర్ఘమాయుః।। |
సత్-విత్ (ఉనికి - ఎరుకల కేవల) స్వరూపుడగు సవితృడే ముందుగాను, వెనుకగాను, ఉత్తరముగాను, దక్షిణముగాను పైన క్రింద వేంచేసి ఉన్నారు. అట్టి సవితా దేవత మమ్ములను సదా రక్షించెదరు గాక! సమస్తమునకు అతీతము (ఆవలది) అగు సవితాదేవత మాకు ఆనందమయమగు దీర్ఘాయువు ప్రసాదించెదరు గాక। |
ఓంఇత్యేకాక్షరం బ్రహ్మ . ఘృణిరితి ద్వే అక్షరే . సూర్య ఇత్యక్షరద్వయం . ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి . ఏతస్యైవ సూర్యస్యాష్టాక్షరో మనుః . |
|
4. ‘ఓం’ ఇతి ఏక అక్షరమ్ బ్రహ్మ। (ఓమిత్యేకాక్షరం బ్రహ్మ)। ‘ఘృణి’ - ఇతి ద్వే అక్షరే। ‘సూర్య’ - ఇతి అక్షర ద్వయమ్। ‘ఆదిత్య’ - ఇతి త్రీణి అక్షరాణి। ‘‘(ఘృణి సూర్య ఆదిత్య ఓం)।’’ ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మనుః। |
‘ఈ అనేకము’గా కనిపించేదంతా ‘‘ఏకము, అక్షరము’’ - అగు బ్రహ్మమే। అట్టి ఏకాక్షరమగు బ్రహ్మమే ‘ఓం’ అని వేదోపనిషత్ వాఙ్మయముచే పిలువబడుతోంది. ‘ఘృణి’ - ఏకము రెండుగా (ద్వే) అక్షరములుగా అదియే ప్రదర్శన మౌతోంది (వెలుగు-జ్వాల). ‘సూర్య’ - ఇది ద్వయాక్షరమ్। - (అగ్ని - తేజ) ‘ఆదిత్య’ - ‘3’ అక్షరములు - (ఆది-తత్-యత్) మంత్రము - ఘృణి సూర్య ఆదిత్య ఓం (అష్టాక్షరి). (వెలుగు జ్వాలల అగ్ని తేజో స్వరూపుడు, సమస్తమునకు మునుముందు వాడు’’ అగు (ఏకాక్షర) ‘ఓం’కార రూప సూర్య దేవునికి నమస్కారము. ఇది ఏక సర్వస్వరూపుడగు సూర్యునియొక్క అష్టాక్షరముల (ఘృణి సూర్య ఆదిత్య ఓం) - ‘మూల మంత్రము’. |
యః సదాహరహర్జపతి స వై బ్రాహ్మణో భవతి . స వై బ్రాహ్మణో భవతి . |
|
యః సదా అహరహః జపతి, స వై బ్రాహ్మణో భవతి। స వై బ్రాహ్మణో భవతి। |
ఎవరైతే ఈ ‘సూర్యాష్టాక్షరీ’ మూల - మంత్రమును రాత్రింబవళ్ళు జపిస్తూ ఉంటారో (రోజూ జపిస్తారో), అట్టివాడు ‘బ్రాహ్మణుడు’ - అగుచున్నాడు. - (స్వాభావికంగా) బ్రాహ్మణుడు అని అనిపించుకోగలడు. |
సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధిభయాత్ప్రముచ్యతే . |
|
సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే। |
ఎవ్వరైతే ఈ ‘ఘృణి సూర్య ఆదిత్య ఓం’ - సూర్యాష్టాక్షరీ మంత్రమును సూర్యునికి అభిముఖులై జపిస్తూ ఉంటారో, - అట్టివారు మహా వ్యాధుల నుండి, మహాభయముల నుండి విముక్తులు కాగలరు. |
అలక్ష్మీర్నశ్యతి . |
|
అలక్ష్మీర్నశ్యతి। |
వారిపట్ల ‘అలక్ష్మీ’ (దారిద్ర్యము, భయము, ఉద్వేగము, ఆందోళన మొదలైనవి) తొలగిపోగలవు. |
అభక్ష్యభక్షణాత్పూతో భవతి . అగమ్యాగమనాత్పూతో భవతి . పతితసంభాషణాత్పూతో భవతి . అసత్సంభాషణాత్పూతో భవతి . |
|
అభక్ష్య భక్షణాత్ - పూతో భవతి। అగమ్యాగమనాత్ - పూతో భవతి। పతిత సంగ భాషణాత్ పూతో భవతి। అసత్ సంభాషణాత్ పూతో భవతి। |
అట్టి వారు - • తినకూడనివి తిన్న దోషముల నుండి, • దోష భూయిష్టములైన (వెళ్లకూడని) ప్రదేశములకు వెళ్లియున్న దోషముల నుండి, • ఇతరుల గురించి పతిత సంబంధమైన (దుష్ట) సంభాషణ పలికిన దోషముల నుండి, • అసత్ విషయదోషములనుండి (భ్రమాత్మకమైనవి సత్యముగా మాట్లాడిన దోషములనుండి) విముక్తులు కాగలరు. |
మధ్యాహ్నే సూరాభిముఖః పఠేత్ . సద్యోత్పన్నపంచమహాపాతకాత్ప్రముచ్యతే . సైషాం సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ . |
|
మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్ - - సద్య ఉత్పన్న (సద్యోత్పన్న) పంచమహాపాతకాత్ ప్రముచ్యతే। - స ఏషా (సైషా) సావిత్రీ విద్యా న కించిదపి న కస్మైచిత్ ప్రశగ్ంసయేత్। |
ఎవరు మధ్యాహ్నము సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్య-అష్టాక్షరీ మంత్రము జపిస్తారో → అనుకోకుండా ఉత్పన్నమగుచున్న ఇతఃపూర్వపు మహాపాతక-ఉప పాతకముల ఫలములు నుండి కూడా ప్రముచ్యులు కాగలరు. ‘‘సావిత్రీ విద్య’’గా ప్రసిద్ధి పొందియున్న ఈ సూర్యోపనిషత్ - అర్థ, అంతరార్థములను అర్హత లేనివారితో ప్రశంసిస్తూ ప్రసంగించరాదు. |
య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాంజాయతే . పశూన్విందతి . వేదార్థం లభతే . |
|
య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి, స భాగ్యవాన్ జాయతే। పశూన్ విందతి। వేదార్థం లభతే। |
ఏ మహాభాగుడు ఈ ‘‘సూర్యోపనిషత్’ను ఉదయ సమయంలో పఠిస్తాడో, అట్టివాడు ‘భాగ్యవంతుడు’ కాగలడు. పశు సంపదను పొంది ఆనందించగలడు. వేదముల పరమార్థము అట్టి వానికి లభించగలదు. |
త్రికాలమేతజ్జప్త్వా క్రతుశతఫలమవాప్నోతి . |
|
త్రికాలమ్ ఏతత్ జప్త్వా క్రతు శతఫలమ్ అవాప్నోతి। |
ఎవ్వడైతే ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యా సమయ (త్రికాలములలో) ఈ సూర్యోపనిషత్ అధ్యయనము, సూర్య-అష్టాక్షరీ మంత్రము యొక్క ఉపాసన (జపించటము) నిర్వర్తిస్తాడో, అట్టివాడు అనేక క్రతువులు నిర్వర్తించిన పుణ్యఫలము పొందగలడు. |
యో హస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి య ఏవం వేద .. ఇత్యుపనిషత్ .. |
|
హస్త ఆదిత్యే జపతి, స మహామృత్యుం తరతి। స మహామృత్యుం తరతి - య ఏవం వేద। - ఇత్యుపనిషత్।। |
రెండు చేతులు జోడించి (సూర్య నమస్కార సంయుక్త-అసంయుక్త) హస్తములతో సూర్యునికి నమస్కరిస్తూ సూర్యోపనిషత్ పఠణము, సూర్య- అష్టాక్షరీ జపము జపించువాడు ‘మహామృత్యువు’ నుండి తరించ గలడు. ఇందలి విషయము తెలుసుకొన్నవాడు మహా మృత్యువు నుండి తప్పక తరించగలడు. |
ఇతి సూర్యోపనిషత్సమాప్తా .. |
|
సూర్యోపనిషత్ సమాప్తా। ఓం శాంతిః శాంతిః శాంతిః।। శ్రీ సూర్య అష్టాక్షరీ ‘‘ఘృణిస్సూర్య ఆదిత్య ఓం’’ |
‘సూర్యోపనిషత్’ సమాప్తా। ఓం శాంతిః। శాంతిః। శాంతిః।। శ్రీ ఆదిత్య గాయత్రీ। ‘‘ఓం ఆదిత్యాయ విద్మహే, సహస్ర కిరణాయ ధీమహీ। తన్న సూర్య ప్రచోదయాత్’’।। |
ఆత్మ యొక్క భావనచే → స్వ - అతిరిక్తము (స్వస్వరూపమునకు అన్యమైనదంతా) సూదితము చేయునది (ఆత్మకు అన్యమైన భావననంతటినీ నశింపజేయునది), సూర్యనారాయణ ఆకారము ధరించినది - అగు ‘‘చిత్ - సూర్య వైభవము’’ను స్మరించుచున్నాము. స్తుతిస్తున్నాము.
ఇక ఇప్పుడు మనము అథర్వణ వేదాంతర్గతమగు సూర్య-అంగిరసమును (సూర్యనారాయణ తత్త్వమును) వ్యాఖ్యానించుకుంటున్నాము.
ఇవి ‘‘సూర్య అథర్వ అంగీరస మంత్ర రాజములు’’ గా ప్రసిద్ధము. త్రికాలములలో సూర్యోపాసనకు మననము చేయుటకై సూచించబడినవి.
పై మంత్రములకు :-
బ్రహ్మా - ఋషి। గాయత్రీ - ఛందః। ఆదిత్యో - దేవతా। ‘‘హగ్ంస, సో౽హమ్’’ అగ్ని నారాయణ యుక్తం - బీజమ్। హృత్ లేఖా - శక్తిః।
వియత్ ఆది సర్గ సంయుక్తము (ఆకాశము మొదలైన పాంచభౌతిక విశేషములతో సర్గముతో కూడినది) - కీలకము।
అట్టి మంత్రము - ‘‘(1) ధర్మ (2) అర్థ (3) కామ (4) మోక్షములు’’ అనే చతుర్విధ పురుషార్థములు సిద్ధికై వినియోగము।
షట్ (6) స్వరములతో ఆరూఢులమై షడంగన్యానము నిర్వర్తిస్తున్నాము.
1. కరన్యాసము | అంగన్యాసము |
---|---|
ఘృణ అగుష్ఠాభ్యాం నమః। | ఘృణ - హృదయాయ నమః। |
సూర్య తర్జనీభ్యాం నమః। | సూర్య - శిరసే స్స్వాహా। |
ఆదిత్య ఓం మధ్యమాభ్యాం నమః। | ఆదిత్య ఓం - శిఖయాయవౌషట్। |
ఘృణ - అనామికాభ్యాం నమః। | ఘృణ - కవచాయ ‘హుమ్’। |
సూర్య - కనిష్టికాభ్యాం నమః। | సూర్య - నేత్రాత్రయాయ ‘వషట్’। |
ఆదిత్య ఓం - కరతల కరపృష్టాభ్యాం నమః। | ఆదిత్య ఓం - అస్త్రాయ ఫట్। |
2. | |
---|---|
‘తత్సవితుః’ బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః। | ‘తత్సవితుః’ బ్రహ్మాత్మనే హృదయాయ ‘‘నమః’’। |
‘వరేణ్యం’ విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః। | ‘వరేణ్యం’ విష్ణవాత్మనే శిరసే ‘‘స్వాహా’’। |
‘భర్గోదేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః। | ‘భర్గోదేవస్య’ రుద్రాత్మనే శిఖయాయ ‘‘వౌషట్’’। |
‘ధీమహి’ సత్యాత్మనే అనామికాభ్యాం నమః। | ధీమహి సత్యాత్మనే కవచాయ ‘‘హుం’’। |
‘థియోయోనః’ జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః। | ధియోయనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ‘‘వషట్’’। |
‘ప్రచోదయాత్’ సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః। | ప్రచోదయాత్ సర్వాత్మనే ‘‘అస్త్రాయఫట్’’। |
షట్ స్వరా రూఢేన బీజేన। ఆరు స్వరములతో కూడిన బీజము (బీజమంత్రము).
[ స్వరము = ఉదాత్త (పై స్వరంగా), అనుదాత్త (క్రింది స్వరంగా), మధ్యమ-ఇత్యాది నాదవిన్యాసముతో కూడిన వేదగానము ]
(షడ్జము = ఒక స్వరము.
(1) ముక్కు (2) కంఠము (3) వక్షస్ధలము (4) తాలువు (దవడ) (5) జిహ్వ (6) దంతము - అనే ‘‘6’’ స్ధలములలో పుట్టుచుండే ‘‘స్వరవిశేషము’’.)
(అట్టి షడ్జమ స్వరయుక్తంగా వేద-మూల మంత్రములు గానము చేయబడుచున్నాయి).
స్తుతి -
• బంగారు వన్నెలు చిందించువారు, (దృశ్యము, జీవుడు, ఈశ్వరుడు, సాక్షి అనబడే) నాలుగు భుజములు ధరించి ఉన్నవారు,
• రెండు చేతులలో - (1) అభయము (సమస్త భయములు తొలగించునది) (2) వరదమ్ (సమస్తము ప్రసాదించునది) - అగు రెండు పద్మములను ధరించినవారు,
• (ఈ క్షణములు, నిముషములు, గంటలు, రోజులు, సంవత్సరములు, యుగములు, మహాయుగములతో కూడిన) కాలచక్రమును నడిపిస్తూ ఉన్నవారు
అగు సూర్యనారాయణ తాత్త్విక స్వరూపమును ఎవరు తెలుసుకొంటారో, అట్టివారే బ్రహ్మమును ఎరిగినట్టి (బ్రహ్మజ్ఞులైనట్టి) బ్రాహ్మణులు.
అట్టి స్వామిని మా బుద్ధిని వికసింపజేయటానికై ఈవిధమైన గాయత్రీ మంత్రోక్తంగాను, సూర్య అష్టాక్షరీ మంత్ర యుక్తంగాను జపిస్తున్నాము. స్తుతిస్తున్నాము. ఉపాసిస్తున్నాము.
ఓం | - (ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ)। ‘‘ఈ దృశ్య-ద్రష్ట-జీవ-ఈశ్వర-సాక్షిలతో కూడిన సమగ్రతత్త్వము’’ - ఇతి ‘‘ఓం’’ |
భూః భువః సువః (భూర్భువస్సువః) ‘‘తత్’’ | - వ్యాహృతమైనది. భూ భువ సువః గా (Matter, thought, thinker గా) ప్రకటనమగుచున్నది - అగు తత్ స్వరూపమును స్మరించుచున్నాను. సమస్తము తానై, సమస్తమునకు వేరైనట్టి తత్త్వమునకు నమస్కారము. |
సవితుః వరేణ్యం | - ఆయన సమస్త దేహములలో సత్-విత్ (ఉనికి-ఎరుక) రూపుడుగా వరేణ్యుడై (ముఖ్యాతి ముఖ్యుడై) ఉన్నవారు. |
భర్గోదేవస్య ధీమహి। | - సమస్తమును వెలిగించు దివ్య స్వరూపులు. ఈ సమస్తము ఆయనయొక్క మహిమగాను, ఆయన ‘‘ధీ (బుద్ధి) ఔన్నత్యము’’గాను దర్శిస్తున్నాము. (తత్త్వ స్వరూపుడు, సవితుడు, వరేణ్యుడు ధీమహి అయినట్టి ఆ భర్గో దేవుని యొక్క మహిమను స్తుతిస్తున్నాము. |
ధియో యో నః ప్రచోదయాత్।। | - (దేనిచే ఈ దృశ్య విషయములకు పరిమితమై ఉండిపోతున్నామో, అట్టి) మా యొక్క పరిమితమైన బుద్ధిని ప్రచోదింపజేయుదురు గాక! (ఉత్సాహవంతముగాను, సాహసవంతముగాను, ధైర్యవంతముగాను, వీర్యవంతముగాను, నిర్మలముగాను, సునిశితముగాను, విస్తారముగాను, పరమాత్మికముగాను) మా బుద్ధిని వికశింపజేసెదరు గాక! |
‘‘ఆది - త - యత్’’ - సృష్టికంటే మునుముందే ఉండి, సృష్టిగా తానే ప్రదర్శనమవటంచేత ‘ఆదిత్యుడు’ అని ఆత్మపురుషుడగు సూర్య భగవానుడు శ్లాఘించబడుచున్నాము.
ఓ సమస్తమునకు ఆది (The begining) అయినట్టి ఆది పురుషుడా! ఆదిత్యా!
మా ఈ స్తుతులు స్వీకరించండి.
ఓ ఆదిత్య భగవన్! ఆదినారాయణా! సత్-విత్ స్వరూప సవితా! సూర్యదేవా! సూర్యనారాయణ స్వామీ! నమస్తే ఆదిత్య।
మా కళ్లకు ప్రత్యక్షమై కనిపిస్తూ ఉన్న ప్రత్యక్ష నారాయణుడవు. ప్రత్యక్ష దైవమువు.
త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి। సృష్టిలో జరుగుచున్న సమస్త కర్మలకు, కార్యక్రమములకు మీరే ‘కర్త’ (You are Doer as well as prompter) అయి ఉన్నారు.
బ్రహ్మదేవుడుగా సృష్టిస్తున్నారు। ఈ సృష్టిని భావనచే, సంకల్పముచే - క్రీడగా, లీలగా కల్పించుచున్నారు. అట్టి సృష్టికర్త అగు బ్రహ్మదేవుడుగా అగుచున్నది ఎవరు? మీరే!
విష్ణువుగా పరిరక్షిస్తున్నారు। ఈ సృష్టిని పరిపోషించటము, కొనసాగించటము నిర్వర్తిస్తున్న ‘విష్ణువు’గా ఉన్నది కూడా తామే!
రుద్రుడుగా లయింపజేస్తున్నారు। అట్టి సృష్టిని మరొక సమయంలో లయింపజేయు లయకారుడగు ‘రుద్రుడు’ కూడా మీరే - అయి ఉన్నారు.
మీరే ఋగ్వేదములో ఆత్మగురించిన ‘సత్యవాణి’ అయి ఉన్న ఋక్ గానము చేయు ఋక్‌గాన స్వరూపులు। ఆ ఋక్కులను ఆత్మయొక్క స్వానుభవముగా ఎలుగెత్తి గానం చేస్తున్న ‘ఋషులు’ కూడా మీరే!
మీరే యజ్ఞములు, యజస్సులు ప్రాధాన్యముగా వచించబడుచున్న యజుర్వేద స్వరూపులు.
స్వర-సంగీత స్తుతుల ప్రాధాన్యమైయున్న సామవేద స్వరూపులు మీరే।
ప్రత్యక్షముగా కనిపిస్తున్న విశేషములను క్రోడీకరించి, ఉపాసనా రూపముగా తీర్చిదిద్దే వాఙ్మయముగల అథర్వణవేద స్వరూపులు కూడా తామే।
భాషను విధివిధానంగా తీర్చిదిద్దే ఛందస్సుగా ప్రదర్శనమగుచున్నది కూడా మీరే! ఛందోబద్ధమైనదంతా మీ విశేష స్వరూపమే!
సమస్తమునకు ఆవల ‘‘ఆది’’ యందు గల ఆ కేవలాత్మానంద స్వరూపులగు ‘‘ఆదిత్య పరమాత్మ’’ నుండే పంచభూతములు బయలుదేరుచున్నాయి.
• స్పందనరూపముతో కూడిన ‘‘వాయువు’’,
• స్థూల, జీవపరిపోషక రూపమగు ‘‘భూమి’’,
• ద్రవ-జల రూపమగు ‘‘ఆపః’’, (జలము),
• తేజో, అగ్ని రూపమగు ‘‘జ్యోతి’’, ‘ఉష్ణము’,
• నిశ్శబ్దమై శబ్దమునకు జననస్థానమగు ‘‘వ్యోమ (ఆకాశము)’’,
ఇవన్నీ కూడా ఆదిత్యుడగు సూర్యభగవానుని నుండే జనిస్తున్నాయి.
సృష్టి నిర్మాణ - సంరక్షణలను నిర్వర్తిస్తూ ఉన్నట్టి - అశరీర దివ్యప్రజ్ఞలగు దేవతలు ఆదిత్యుని నుండే బయల్వెడలుచున్నారు.
‘వేదా’। - తెలియబడుచున్న సమస్తము ఆదిత్యునినుండే ప్రకటనమౌతోంది. తెలియబడేదంతా ఆది-ఆత్మ స్వరూపుడగు ఆదిత్యునికి ‘అనన్యము’. అట్టి ఆదిత్యుని తాత్త్విక స్వరూప వర్ణనములతో ఋక్కుల ప్రాధాన్యము గల ఋగ్వేదము, యజ్ఞ యాగ అగ్ని కార్య ప్రాధాన్య యజుర్వేదము, స్తుతి గాన ప్రాధాన్య సామవేదము, దృశ్య ప్రపంచ విశేష ప్రాధాన్యమైన అథర్వణవేదములతో కూడినవే చతుర్వేదములు.
ఆత్మజ్యోతి స్వరూపుడగు ఆదిత్యుడే తనయొక్క తేజో స్వరూపముచే సూర్యమండలమును తపింపజేయుచున్నారు.
‘‘ఆసావ ఆదిత్యో బ్రహ్మ।’’ బ్రహ్మమే అయి ఉన్న ఆదిత్యుడే సమస్తముగా వసించువారై, విస్తరించువారై ఉన్నారు.
ఈ సమస్తమునకు ‘అనుభవి’ (పొందుచున్నవాడు) - బ్రహ్మమే।
☀︎ పొందబడునదంతా బ్రహ్మమే।
☀︎ పొందుచున్నవాడు బ్రహ్మమే।
☀︎ ఆదిత్యుడే బ్రహ్మమై సమస్తమును పొందువాడై ఉంటున్నారు. ఇతి ఆసావాదిత్యో బ్రహ్మ।
ఆదిత్యుడే అంతఃకరణ చతుష్టయము. (నాలుగింటి సముదాయము).
ఆదిత్యుడే సమస్త జీవులలోని అంతరంగ చతుష్టయమగు మనో బుద్ధి చిత్త అహంకారముల ప్రదర్శకుడు. ప్రదర్శనమగుచున్న స్వరూపమంతా ఆయనకు చెందినదే। ఆయనకు అనన్యమైనదే।
అట్టి ఆదిత్యుడే సమస్త దేహములలో పంచప్రాణ స్వరూపులై విరాజిల్లుచున్నారు.
☼ ఆదిత్య భగవానుడే సమస్త ప్రాణులలో ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన క్రియా విశేషములతో కూడిన పంచప్రాణ స్వరూపుడై వెలయుచున్నారు. శరీరములోని సమస్త అంతర్గత వ్యవహారములు నిర్వర్తిస్తున్నారు.
☼ ఆదిత్యుడే చెవులు - చర్మము - కళ్ళు - రసము (నాలుక) ఘ్రాణము (వాసన) - అను పంచ జ్ఞానేంద్రియములై వెలయుచున్నారు.
☼ దేహములో పంచ కర్మేంద్రియములగు ‘‘వాక్, పాణి, పాద, పాయు, ఉపస్ధ (స్త్రీ పురుషుల రహస్యావయవములు)గా - విలసిల్లుచున్నది ఆదిత్య - ఆత్మానందుడే!
☼ ఆదిత్యుడే పంచేంద్రియ విషయములగు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల స్వరూపుడు కూడా।
☼ కర్మేంద్రియ విషయములైనట్టి వచన (Talking), ఆదాన (Giving), ఆగమన (coming/walking), విసర్జన (Leaving), ఆనందములు (Enjoying) గా ఉన్నది కూడా ఆదిత్యుడే.
☼ ఆదిత్యుడే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములుగాను, కేవల - ఘనీభూత విజ్ఞానమయ స్వరూపముగాను అగుచున్నారు.
నమో మిత్రాయ భానవే, మృత్యోః మాం పాహి। సమస్త జీవులకు స్నేహితుడు అవటంచేత ఆనంద విజ్ఞానఘనుడు, మిత్రుడు, సమస్తమును వెలిగించువాడు కాబట్టి భానుడు - అగు సూర్యభగవాన్! నమస్కారము. మమ్ములను మృత్యుముఖము నుండి రక్షించండి. (అనగా) మార్పు చేర్పులకు విషయమే కానట్టి మా యొక్క సహజ-అమృత-అఖండ ఆత్మ స్వరూపమును మా బుద్ధి పొందునట్లు (గురువై) అనుగ్రహించండి.
జగత్తునంతటినీ తన ఆభరణముగా ధరించుచున్నవారగు భ్రాజిష్ణునకు, ఈ జగత్తుకు హేతువు అవటంచేత విశ్వహేతువు అగు ఆదిత్యునికి - నమస్కారము.
ఆ సూర్య భగవానుని వలననే, ఆయన నుండియే జీవులమగు మేమంతా బయల్వెడలుచున్నాము. సూర్యునియందే ఉనికి కలిగి ఉంటున్నాము. సూర్యునిచేతనే ఈ జగత్తంతా పాలించబడుతోంది.
(తరంగములన్నీ జలములోంచి ఉత్పన్నమై, జలమునందే సంచారములు కలిగి ఉండి జలమునందే లయించుచున్నవిధంగా) ఈ జీవులంతా సూర్యుని నుండి బయలుదేరి, సూర్యునియందే సంచారము కలిగి ఉండి, సూర్యునియందే ‘లయము’ పొందుచున్నారు.
యః సూర్యః సోహమ్ ఏవ చ। సమస్తము సూర్యుని ఆత్మ తేజమే. కాబట్టి, ఎవరు సూర్యుడై ప్రకాశించుచున్నారో, ఆ భగవానుడే సమస్తమునందువలెనే, నాలో నేనై ప్రకాశించుచున్నారు కూడా. కనుక సూర్యునిగా ఉన్నది నేనే। నేనుగా ఉన్నది సూర్యుడే।
ఆ సవితా దేవతయే - నాకు కళ్ళు. నాయొక్క చూపు, చూడబడునది కూడా ఆయనయే।
నాయందు ‘చూపు’ గా నిశ్చల పర్వత స్వరూపుడై వేంచేసి ఉన్నారు. దృక్ స్వరూపుడు, సృష్టికర్త అగు-ఆ ధాత, ఆ సవిత, ఆ సూర్యుడు- నాకు ‘‘సో౽హమ్ దృష్టి’’ ని ప్రసాదించుదురు గాక।
ఆదిత్యాయ విద్మహే, సహస్ర కిరణాయ ధీమహి। తన్నో సూర్యః ప్రచోదయాత్।।
- అట్టి ఆదిత్యుని మహిమను (పైన చెప్పుకొన్నవిధంగా) ఎరుగుచున్నాము.
- వేలాది కిరణస్వరూపుడగు ఆయన యొక్క మహిమయే - ఇదంతా కూడా। ఆయనను బుద్ధితో స్తుతిస్తున్నాము.
అట్టి ఆ సూర్యభగవానుడు మా యొక్క బుద్ధిని (స్వస్వరూపాత్మ తత్త్వము ఎరుగుటకై) ప్రచోదింపజేసెదరు గాక! వికాసపరచెదరు గాక। వికసింపజేసెదరు గాక। సముత్సాహపరచెదరు గాక।
అట్టి సత్ విత్ (ఉనికి - ఎరుక) స్వరూపుడగు సవితా - పురుషోత్తముడు మాయొక్క సహజమగు స్వస్వరూపుడై →
• ముందుగా → జగత్-ద్రష్ట రూపంగాను,
• వెనుకగా → ఆత్మగురించిన ఏమరపు రూపంగాను,
• ఉత్తరముగా → ఈ జగద్దృశ్యమునకు ఆవలగాను,
• దక్షిణముగా → ఈ జగద్దృశ్యమువైపుగా కనిపిస్తున్న సమస్తముగాను,
• క్రిందగాను, పైన అంతటా, అన్నిచోట్ల, సమస్తముగాను విస్తరించి ఉన్నారు.
అట్టి సవితృభగవానుడు, సూర్యుదేవుడు అగు ఆదిత్యుడు - నః సువతు। మాకు శుభప్రదుడై అనుగ్రహించెరు గాక! మాకు దీర్ఘాయువు ప్రసాదించెదరు గాక!
అట్టి ఈ జీవుని ‘‘ఏకాక్షర స్వరూపమే’’ బ్రహ్మము.
(I) త్రిపుటి [ (1) దృశ్యము, (2) ద్రష్ట (3) దర్శనము ] (II) జీవాత్మ (III) ‘‘అనేక దేహములు నావైన నేను’’ - రూపుడగు ఈశ్వరుడు, (IV) కేవలమగు పరమాత్మ - ఈ నాలుగు ఏ తత్త్వముదృష్ట్యా ‘ఏకము’ అయి ఉంటున్నాయో, అట్టి అఖండాత్మకు సంజ్ఞయే ‘‘ఓం’’ (ప్రణవము).
కనుక,
(ద్రష్ట-దర్శన-దృశ్య, భూత-వర్తమాన-భవిష్యత్, జీవ-ఈశ్వర-కేవల - ఇత్యాది త్రిపుటిగా ప్రదర్శనమగుచు కూడా) ‘ఏకము, అక్షరము’ అయి ఉన్నదో, అట్టి బ్రహ్మము - ‘ఓం’ అను ప్రణవముగా (ప్రణవార్థ పూర్వకంగా) వేద వాఙ్మయమునందు, వేదాంత శాస్త్రముచే చెప్పబడుతోంది.
శ్రీ సూర్యమంత్రము / శ్రీ సూర్య-అష్టాక్షరీ మంత్రము
(ఓం = ఏకము, అక్షరము)
‘‘ఘృణి’’ - ఇది ‘ద్వే’ అక్షరే। రెండు అక్షరములు (2). (ఘృణము) - కనికరము కలవాడు. వేడి, యండ పగలు, వెలుతురు స్వరూపుడు.
‘‘సూర్య’’ - ఇతి అక్షర ద్వయమ్। రెండు అక్షరములు (2). వెలుగు ప్రదాత. లోకములను ప్రకాశింపజేయువాడు. తేజోమయుడు.
‘‘ఆదిత్య’’ - ఇతి త్రీణి అక్షరాణి। ‘అదిత్య’ - 3 అక్షరములు. యత్ ‘ఆది’, తత్ ఆదిత్య ఇతి। సమస్తమునకు ‘ఆది’ స్వరూపుడు కాబట్టి ఆదిత్యుడు. సమస్త జీవులలోని జగదానుభవములకు ఆవల ‘‘జగదనుభవాతీత సాక్షీభూత కేవాలత్మ స్వరూపమే’’ - ఆదిత్యుడు.
‘‘ఘృణి స్సూర్య ఆదిత్య ఓం’’ అను ‘అష్టాక్షర మంత్రము’ - సూర్యోపాసనకై ‘బీజమంత్రము’.
ఎవ్వరైతే ఈ సుర్యాంగీరస మహా మంత్రమును పగలు రాత్రి కూడా జపిస్తూ ఉంటారో, అట్టివాడు బ్రహ్మజ్ఞాని కాగలడు. బ్రహ్మతత్త్వ దర్శనము ఆతనికి స్వాభావికమై, - ‘‘బ్రాహ్మణుడు’’ అని పిలువబడుచున్నాడు.
ఎవ్వరైతే సూర్యభగవానునికి అభిముఖంగా నిలబడి (లేక పద్మాసనాశీనుడై) ఈ ‘‘సూర్యాష్టాక్షరీ మంత్రము’’ జపిస్తూ ఉంటారో, ఆతడు మహావ్యాధులనుండి, సమస్త భయముల నుండి విముక్తుడు కాగలడు. ఆతనిపట్ల అలక్ష్మీవిధి వ్రాత (దారిద్ర్యము, కరువు, సాంసారిక దుఃఖ సందర్భము, దుష్ట పర్యవసానములు) నశించగలవు.
అభక్ష్యమ్ - (తినకూడనిది) తినిన దోషములనుండి, అగమ్య గమనాత్ (వెళ్ళకూడని చోట్లకు వెళ్లిన) దోషములనుండి, పతితులు పాపులు అగు వారితో లోకసంబంధమైన దూషణ తిరస్కార ఇత్యాది సంభాషణా దోషములనుండి, అసత్ విషయముల గురించి దీర్ఘంగా మాట్లాడిన పాప సంస్కారముల నుండి - (జపముచే) - పూతో భవతి। - దోషములు తొలగి, పవిత్రుడు, పునీతుడు కాగలడు.
ఎవడైతే మధ్యాహ్న సమయంలో సూర్యభగవానుని అభిముఖంగా భక్తితో నిలుచుని, ఈ ఉపనిషత్‌ను పఠిస్తాడో, (లేక) సూర్యాష్టాక్షరీ మంత్రమును జపిస్తాడో, అట్టివాడు సద్యోత్పన్న సుజ్ఞానుడౌతాడు. సాధనతో నిమిత్తం లేకుండానే అప్పటికప్పుడు, ఆత్మతో సంయమనము పొంది ‘సద్యోముక్తుడు’ కాగలడు. అట్టివాడు పంచ మహాపాతకముల నుండి కూడా బ్రహ్మహత్య (2) సురాపానము (3) బంగారము దొంగిలించటము (4) గురుతల్ప గమనము (5) ఈ నాలుగు పాపములు చేస్తున్న వారితో సాంగత్యము కలిగి ఉండటము - నుండి కూడా ] - విముక్తుడు కాగలడు.
ఇది ‘సావిత్రీ విద్య’గా ఆధ్యాత్మవాఙ్మయంలో లోక ప్రసిద్ధమైయున్నది.
అట్టి ఈ ‘‘సూర్యోపనిషత్’’లో మనము చెప్పుకొన్న ‘సావిత్రీ విద్య’ను ఎవరికైనా బోధించాలంటే, అట్టివాడు అర్హుడై ఉండాలి. అర్హత లేనివానికి బోధించరాదు. గురుశుశ్రూష, సేవాభావము, తపోధ్యానముల అభ్యాసము, ఆత్మజ్ఞానము గురించిన ఉత్తమాశయము మొదలైన ‘‘అధ్యయన సద్గుణములు’’ ఉంటేనే సూర్యోపనిషత్ విద్యకు అర్హుడు.
• ఏ మహాభాగుడై ఈ ఉపనిషత్‌ను పఠిస్తూ ఉంటాడో, అట్టివాడు భాగ్యవంతుడు (జ్ఞానైశ్వర్యవంతుడు) కాగలడు. పశు సంపద పొందగలడు.
• అట్టివాడు వేదముల సూక్ష్మార్థమును, అంతరార్థమును సులభముగా గ్రహించగలిగినట్టి నిర్మలము, సునిశితము, విస్తారము, ప్రశాంతము అగు బుద్ధిని సంపాదించుకొనగలడు - వేదార్థం లభతే।
• ఎవడు ఈ సూర్యోపనిషత్‌లో చెప్పబడిన మహామంత్రములను ప్రతిరోజు త్రిసంధ్యా సమయములలో జపిస్తూ ఉంటాడో,
• అట్టివాడు అనేక క్రతువులు చేయడంచేత లభించే ఉత్తమ పుణ్యఫలము పొందగలడు.
• ఉభయ హస్తములలో సూర్యభగవానుని భావనచేసి, ‘‘హస్తాదిత్య ఉపాసన’’తో కూడుకొని, ఇందలి సూర్యాష్టాక్షరీ మొదలైన మంత్రములను జపిస్తాడో, అట్టివాడు సమస్త కర్మ-కర్మఫలములకు అతీతత్వము సంతరించుకొని, ‘‘మహామృత్యువు’’ నుండి తరించగలడు.
స మహామృత్యుం తరతి। స మహా మృత్యుం తరతి - య ఏవం వేద।
ఈ ఉపనిషత్ పరమార్థమును గురుముఖతః ఎరిగినవాడు జన్మ కర్మ పునర్జన్మ రూపమైనట్టి చక్రము నుండి బయల్వెడలి, ‘మహామృత్యువు’ నుండి తరించగలడు.
Soorya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com