Chāndōgya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

సామవేదాంతర్గత

16     ఛాందోగ్యోపనిషత్

విషయ సూచిక :


సామవేదాంతర్గత

Ⅰ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - మొదటి అధ్యాయము

1–1. ప్రథమ ప్రపాఠకః - ప్రథమః ఖండః - ఉద్గీథ విద్య

ఉద్గాత = యజ్ఞ విధియందు ‘సామగానము’ నిర్వర్తించువారు.
ఉద్గాతము = పాడటము - సామగానము చేయటము.
ఉద్గీథము = సామవేదాంగ - గానామృత విభాగ

1. ఓం ఇతి ఏతత్ అక్షరం ఉద్గీథం ఉపాసీత।
ఓం ఇతి హి ఉద్గాయతి।
వేద విభాగములైనట్టి - సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులచే ఏ ‘‘ఏకము, అక్షరము’’ అగు తత్త్వము ‘ఓం ఇతి’ అని ఉద్గాతము (ప్రకటనము) చేయబడుతోందో, ఎలుగెత్తి గానము చేయబడుచున్నదో - అట్టి పరమాత్మతత్త్వ సంజ్ఞాక్షరమును ఉద్గీథము (కర్మల ప్రయత్నముల ద్వారా) చేయుచున్నాము. ఉపాసించు చున్నాము. నమస్కరిస్తున్నాము.
అట్టి ఓంకారమే సమస్త హృదయములలో గానామృతమై వెలుగొందుచున్నది.

తస్య ఉపవ్యాఖ్యానమ్।
అట్టి ‘ఓం’కార అక్షరార్థమగు పరబ్రహ్మము అనిర్వచనీయము, అవాక్‌మానసగోచరము. అయినప్పటికీ - అద్దాని సామీప్యతను (స్వానుభవ అనుక్షణ-అనునిత్యము సిద్ధించటానికై) వ్యాఖ్యానించు కుంటున్నాము.
2. ఏషాం భూతానం పృథివీ రసః।
పృథివి రసస్వరూపమై యున్నది.
ఈ భౌతిక జీవులందరు పృథివి (భూమి) యొక్క రసస్వరూపులు. పృథివియొక్క రసమునుండే సమస్త దేహములు రూపుదిద్దుకుంటున్నాయి.
పృథివ్యా ఆపో రసః।
ఈ పృథివి జలముయొక్క రసస్వరూపము. జలముయొక్క సారమే పృథివీ రూపము.
అపాం ఓషధయో రసః।
ఓషధులే జలము రూపము సంతరించుకుంటున్నాయి. ఓషధుల రసరూపము, (లేక) సారరూపము - ‘జలము’.
ఓషధీనాం పురుషో రసః।
ఓషధులు పురుషుని రసరూపము. ఓషధుల రసస్వరూపము (సారరూపము) పురుషుడు.
పురుషస్య వాక్ రసో
వాచ ఋక్ రసః।
పురుషుని యొక్క రస రూపము ‘వాక్కు’. వాక్కు ఋక్ యొక్క రసము।
ఋచః సామ రసః।

అట్టి వచనములు - వాక్కుల సారరూపమే ఋగ్వేదములో గానము చేయబడుచున్న ‘ఋక్కులు’.

సామ్న - ఉద్గీథో రసః।
ఋక్కుల (మంత్రముల) సారము -స్తుతిరూపమగు సామగానములు. ఉద్గీథము (ప్రవచనముల వర్ణనముల) సారమే సామగానములు.
3. స ఏష రసానాగ్ం
రసతమః, పరమః
పరార్థ్యో అష్టమో
యత్ ఉద్గీథః।
అట్టి సామవేద-సామగానముల రస స్వరూపము (సారము-The Essence) - తమము (Superlative), పరమము (The Finest), పరతత్త్వము అగు ఏ ‘‘ఓం’’కారార్థ (కేవల స్వరూప) తత్త్వమే (ఏడు భూమికలకు ఆవల గల) తురీయాతీతము. అట్టి ఆత్మయే ‘ఓం’ అక్షరార్థముగా ప్రవచనము, వ్యాఖ్యానము, గానము చేయదగిన పరబ్రహ్మ తత్త్వము.
4. కతమా కతమత్ ఋక్?
కతమత్ కతమత్ సామ?
కతమః కతమ ఉద్గీథ?
ఇతి విమృష్టం భవతి।।
ఏది ఏది ఋక్కుల సారము?
ఏది ఏది సామగానముల సారము?
ఏది ఏది ఉద్గీథము?
అనునది ఇక్కడ విశ్లేషణపూర్వకంగా వివరించుకుంటున్నాము.
5. వాక్ ఏవ ఋక్। ప్రాణః సామ।
‘ఓం’ ఇతి ఏతత్ అక్షరం ఉద్గీథః।
తద్వా ఏతత్ మిథునం - యత్ వాక్ చ,
ప్రాణః చ, ఋక్ చ, సామ చ।।
‘‘వాక్కు’’ (Speaking) ఋక్ స్వరూపము. ప్రాణము-సామగానము (సామము).
అట్టి వాక్-ప్రాణములు అక్షరమగు ‘ఓం’గా వ్యాఖ్యానించబడుతోంది. అట్టి వాక్ - ప్రాణముల పరస్పర ఏకత్వము, ఋక్-సామముల ఏకరస స్వరూపమే ‘‘మిథునము’’ (The Couple Association).
6. తత్ ఏతత్ మిథునం ఓం ఇతి
ఏతత్ అస్మిన్ అక్షరే సంసృజ్యతే।।
అట్టి వాక్-ప్రాణముల మిథునము (కలయిక) అక్షరమగు తత్త్వముచే స్వకీయముగా కల్పన చేయబడుతోంది. అక్షరమగు ‘ఓం’కారము నందు వాక్-ప్రాణముల మిథునము (సంయోగము) అగుచున్నది.
యదా వై మిథునౌ సమాగచ్ఛత
ఆపయతో వై తావన్యోన్యస్య కామమ్।।
అది ప్రకృతి-పురుషుల (Me-I am) అన్యోన్యముల వలె పరస్పర ఇచ్ఛలచే పూర్ణము సంతరించుకోవటముగా జరుగుతోంది. అట్టి మిథున స్థానమగు ఏకము, అక్షర ఓంకార తత్త్వమును ఉపాసిస్తున్నాను.
7. ఆపయితా హ వై
కామానాం భవతి।
య ఏతత్ ఏవం విద్వాన్ -
అక్షరం ‘‘ఉద్గీథం’’ ఉపాస్తే।
ఎవ్వరైతే అట్టి ఇహ-పరముల, జీవాత్మ-పరమాత్మల, వాక్-ప్రాణముల మిథునమును (పరస్పర ఇచ్ఛాపూర్వక స్వామ్యత్వమును, ఏకత్వమును) అక్షరమును దర్శించుచూ, గమనిస్తూ, ఉపాసిస్తూ ఉంటారో వారే విద్వాంసులు.

అట్టి అక్షర ఉద్గీథము (ఆత్మోపాసన) చేయుచున్నవాడు - కోరుకొన్నది కోరుకొన్నట్లుగా పొందగలడు. సమస్తము తానే అయి ఉన్న ఆత్మయొక్క తత్త్వమును సంతరించుకోగలడు.
8. తత్ వా ఏతత్ ‘‘అనుజ్ఞాక్షరం’’।
యత్ హి కించ అనుజానాతి -
ఓం ఇతి ఏవ తదా హ
ఏషో ఏవ సమృద్ధిః యత్ అనుజ్ఞా।
సర్వ దైవ ఉపాసనలు అనుజ్ఞ స్వీకారరూపంగా ‘ఓం’ అని ప్రారంభమౌతున్నాయి. ‘‘స్వామీ! మిమ్ములను పూజిస్తున్నాను. అనుజ్ఞ ప్రసాదించండి!’’ - అని పలుకుచుండగా అనుజ్ఞ వృద్ధి చెందుచున్నది. అందుకని ‘ఓం’ను సమృద్ధి ప్రవచనంగా స్వీకరించబడుతోంది.
సమర్థయితా హ వై కామానాం భవతి,
య ఏతత్ ఏవం విద్వాన్
అక్షరం ఉద్గీథమ్ ఉపాస్తే।।
ఎవ్వరైతే సర్వ దైవ-పితృ కార్యములందు ‘ఓం’ అను అనుజ్ఞాక్షరము పలికి ఉపాసనకు, యజ్ఞవిధికి సంకల్పించి ఉంటాడో- అట్టివాడు తత్ పరమాత్మను గానం చేస్తూ సమర్థుడు అగుచున్నాడు. అక్షరమగు ‘ఓం’కారమును ఉపాసించిన అట్టివానికి సర్వకామములు నెరవేరగలవు.
9. తేన ఇయం త్రయీ విద్యా వర్తతే।
‘ఓం’ ఇతి ఆశ్రావయతి।
‘ఓం’ ఇతి శగ్ం సత్య -
‘ఓం’ ఇతి ఉద్గాయతి।
ఏతస్య ఏవ అక్షరస్య అపచిత్యై।
మహిమ్నా రసేన।।
‘ఓం’ కారముతో కార్యక్రమములు ప్రారంభించుచుండగా ‘త్రయీవిద్య’ (ధర్మార్థకామముల)యొక్క ప్రతీతి సిద్ధిస్తుంది.

యజ్ఞమును నిర్వర్తింపజేస్తున్న పర్యవేక్షకుడగు అధ్వర్యుడు ‘ఓం’ అని వినిపిస్తూ కార్యక్రమము యొక్క శ్రావ్యమునకు ‘నాంది’ పలుకుచున్నారు.

‘ఓం’ అని కార్యక్రమము యొక్క శుభ ప్రయోజనములకై ‘శం - సత్యం - ఓం’ అని ఎలుగెత్తి గానము చేయుచున్నారు.

అట్టి ఏకము - అక్షరము అగు ఓంకారోచ్చారణ మహిమ వలన సమస్త కర్మలు, కర్మవిభాగములు ప్రవర్తమానము అగుచున్నాయి.
10. తేన ఉభౌ కురుతో యత్ చ తత్ ఏవం వేద,
యత్ చ న వేద।
నానా తు విద్యా చ అవిద్యా చ।।
‘ఓం’ కారము యొక్క ఏకాక్షర తాత్త్వికార్థము తెలిసి కొందరు, అట్టి రహస్యార్థము తెలియకుండానే మరికొందరు కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ తత్త్వము తెలిసి - విద్యాపూర్వకంగా, మరికొందరు అవిద్యాపూర్వకంగా (ఓంకారము యొక్క ముఖ్యోద్దేశ్యము తెలియకుండానే) ఓంకార మంత్రమును ఉపాసిస్తున్నారు.
యత్ ఏవ విద్యయా కరోతి, శ్రద్ధయా ఉపనిషదా,
తత్ ఏవ వీర్యవత్తరం భవతి।
ఇతి ఖలు ఏతస్య ఏవ అక్షరస్య
ఉపవ్యాఖ్యానం భవతి।।
‘‘ఓంకారము’’ యొక్క అంతరార్థమగు వ్యక్తావ్యక్త పరమాత్మ యొక్క ముఖ్యార్థమును తెలుసుకొని, అట్టి పరమాత్మతో ‘సామీప్యత’ భావించుకుంటూ కర్మలు నిర్వర్తిస్తారో, అట్టి వారు వీర్యవంతులు అగుచున్నారు. ఉత్తమోత్తమ ప్రయోజనం సిద్ధించుకుంటున్నారు.
ఇతి - ఓంకారము యొక్క ఉపవ్యాఖ్యానము.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమ అధ్యాయే ప్రథమ ఖండః


1–2. ప్రథమ ప్రపాఠకః - ద్వితీయ ఖండః - అధ్యాత్మ ఉద్గీథము

(ఓం ప్రాణేశాయ నమః। అంగీరస ఋషయే నమః। బృహస్పతి ఋషయే నమః।
ఆయాస్యు ఋషయే నమః। బక ఋషయే నమః। ఉద్గాత నమః)

1. దేవ, అసురా హ వై యత్ర సంయేతిర
ఉభయే ప్రాజాపత్యాస్తద్ధ,
దేవా ఉద్గీథమ్ అజహ్రుః।
అనేన ఏనాత్ అభిభవిష్యామ ఇతి।।
ఒకానొకప్పుడు ప్రజాపతి పుత్రులు అయినట్టి దేవతలు, అసురులు తమలో తాము వైరము పెంచుకొని యుద్ధమునకు దిగారు. దేవతలు అసురులపై విజయము పొందటానికై ఉద్గీథోపాసనను ఓంకారోపాసనతో ప్రారంభించారు. ఆత్మశక్తిని ఉపాసించసాగారు.
2. తే హ ‘‘నాసిక్యం ప్రాణం’’ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తగ్ం హ అసురాః పాప్మనా వివిధుః।
వారు ఇక్కడ ఆత్మదేవతను ఉపాసించి ప్రాణవాయువు ముక్కు ద్వారా ప్రవేశించు నాసేంద్రియమును అవలంబిస్తూ ఉన్న ఆత్మశక్తిని ఉద్గీథము చేయసాగారు (ఉపాసించసాగారు).
కానీ అసురులు ఆ స్థానమునందు ప్రవేశము పొంది పాప భావములను ప్రవేశింపజేసి వేధించసాగారు.
తస్మాత్ తేన ఉభయం జిఘ్రతి - సురభి
చ దుర్గంధి చ - పాప్మనా హి ఏష విద్ధః
అందుచేతనే ఘ్రాణేంద్రియములలో సుగంధ - దుర్గంధ - మిశ్రమముల యొక్క ఉభయ కర్మల అనుభవము ఏర్పడసాగింది.

‘‘వాసన చూడగలిగినవి - వాసన చూడకూడనివి’’ ఏర్పడి పాపములు ఏర్పడసాగాయి. (ఆత్మను ఏమరచునట్లు చేసేవే పాపములు).
(అందుచేత - దేవతలు అసురులను నిరోధించలేకపోయారు)
3. అథ హ ‘వాచం’ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తాగ్ం హ అసురాః పాప్మనా వివిధుః
దేవతలు వాక్కును అవలంబించి ఉద్గీథోపాసన చేయసాగారు। అక్కడికి అసురులు కూడా ప్రవేశించి పాపకర్మలను ప్రవేశింపజేయ సాగారు.
తస్మాత్ తయా ఉభయం
వదతి, సత్యం చ, అనృతం చ
పాప్మనా హి ఏషా విద్ధా।।
అందుకు ఫలితంగా వాక్కులో సత్యము, అనృతము (అసత్యము) ప్రవేశించి పాప వాక్కు కూడా (దుష్ట దూషణ నిషిద్ధ వాక్కు కూడా) ప్రవేశము పొందింది.
(అందుచేత దేవతలు అసురులను ఓడించలేకపోయారు)
4. అథ హ ‘‘చక్షుః’’ ఉద్గీథం
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః తస్మాత్
తేన ఉభయం పశ్యతి
దర్శనీయం చ, అదర్శనీయం చ
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
దేవతలు చక్షువులను ఉద్గీథము (ఉపాసన / ప్రత్యుత్సాహము) చేసి చూపుశక్తిని ప్రవర్తింపజేయసాగారు. ఇంతలోనే అసురులు ‘‘చూపు’’లో పాపదృష్టిని ప్రవేశింపజేశారు.

అందుచేత కంటిలోంచి బహిర్గతమగుచున్న చూపు - చూడతగిన వాటిపై చూడకూడని వాటిపై కూడా ప్రసరించసాగాయి. ‘‘నిర్దోష-దోష’’ దర్శనములు సృష్టిలో ఏర్పడటం జరుగసాగింది.

ఈ విధంగా ‘‘పుణ్య-పాపములు, మంచి చెడులు’’ - అను ద్వంద్వము ఏర్పడుతోంది. మంచితోబాటే చెడును చూడాలనే ఇష్టము వెంటనుండసాగింది.

దేవతలు చూపుతో పరమాత్మను మాత్రం ఉపాసించుకోలేకపోయారు.
5. అథ హ ‘శ్రోత్రం’ ఉద్గీథమ్
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః।
తస్మాత్ తేన ఉభయగ్ం శృణోతి -
శ్రవణీయం చ, అశ్రవణీయం చ।
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
అప్పుడు దేవతలు ఆత్మోపాసనచే ‘వినికిడి’ని కల్పించి ఉత్తేజితం చేసి ప్రదర్శించసాగారు. అప్పుడు ఆ చోట అసురులు పాపము (దోషపూరితము) అగు గుణమును వినికిడిలో ప్రవేశింపజేశారు.

అప్పుడు ‘‘వినతగినవి - వినకూడనివి’’ ఉభయము ఏర్పడినవయ్యాయి.

ఈ విధంగా వినతగినవి - వినకూడనవి కూడా వినికిడి వెంటనంటి ఉండి, వినికిడిని తాడనము పొందించసాగాయి.

(దేవతలు అసురుల అడ్డంకులను తొలగించలేకపోయారు. పరమాత్మయందు వినికిడి నిలుపలేకపోయారు)
6. అథ హ ‘‘మన’’ ఉద్గీథం
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః।
తస్మాత్ తేన ఉభయం సంకల్పయతే,
‘‘సంకల్పనీయం’’ చ, ‘‘అసంకల్పనీయం’’ చ।
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
అప్పుడు దేవతలచే ‘మనస్సు’ అనబడేది ఉపాసించబడగా, సంకల్పముల - ఆలోచనల రూపమగు ‘మనస్సు’ - ప్రవర్తించసాగింది. ఇంతలో అసురులు ఆలోచనలలో పాపము (దోషమును) తెచ్చి ప్రకాశింపజేసారు.

అప్పుడు ‘సంకల్పన’ అనునది ‘సంకల్పించతగినవి - సంకల్పించకూడనివి’ ఉభయము ప్రవర్తించసాగింది.

ఈ విధంగా మంచి చెడుల ద్వంద్వము ప్రవర్తించసాగింది.

ఈ విధంగా ద్వంద్వములు దేవతల కార్యక్రమములను వశం చేసుకొని, దివ్యతత్త్వములను చాటు చేయసాగాయి.
7. అథ హ య ఏవ అయం ‘‘ముఖ్యః ప్రాణః’’
తమ్ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తగ్ం హ అసురా ఋత్వా విదధ్వంసుః।
యథా అశ్మానం ఆఖణమ్ ఋత్వా విధ్వగ్ంసేత।
అప్పుడు దేవతల ఆత్మోపాసన యజ్ఞోపాసనలనుండి ‘‘ముఖ్యప్రాణము’’ అను ప్రాణశక్తి సముత్పన్నము అవసాగింది.

అప్పుడు ఆ ముఖ్యప్రాణములోనికి అసురులు పాపము (దోషమును) ప్రవేశింపజేయాలని తలచారు. ప్రయత్నించారు. కానీ వారికి అది ఏమాత్రము సాధ్యము కాలేదు.

అప్పుడు అసురులు దేవతలను ఓడించలేక - ఒక మట్టి బెడ్డను బండరాయితో కొట్టినప్పుడు - ఆ మట్టిబెడ్డ వలె తామే చెల్లాచెదరు అయిపోయారు - విధ్వంసము పొందారు.
8. ఏవం యథా అశ్మానం ఆఖణం ఋత్వా విధ్వగ్ంసత,
ఏవగ్ం హ ఏవ స విధ్వగ్ంసతే।
య ఏవం విది, పాపం కామయతే,
యః చ ఏనం అభిదాసతి, స ఏషో అశ్మా ఆఖణః।
ఏవిధంగా అయితే పాఱతో కొట్టబడిన మట్టిగడ్డ ముక్కలు అయిపోతుందో, ఆ విధంగా ముఖ్యప్రాణముయొక్క ఉపాసనచే పాపములు, దూషణములు అనే అసుర స్వభావములు, దుష్ట సంకల్పములు ఆతనిని తాకలేవు. అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి నశించగలవు.

గొడ్డలికి బండరాయి పగలని విధంగా ధూషణము మొదలైన సాంసారిక సందర్భములలో ఆతడు పగలని రాయి వలె ఉండగలడు.
(అశ్మానం = రాయి; ఆఖణం = పాఱ, గొడ్డలి)
9. నైవైతేన (న ఏవ ఏతేన) సురభి,
న దుర్గంధి విజానాతి
అపహత పాప్మా హి ఏషః।
తేన యత్ అశ్నాతి యత్ పిబతి,
తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి।
ఏతము ఏవ అంతతో అవిత్త్వా ఉత్క్రామతి
వ్యాదదాతి ఏవ అంతత ఇతి।
ప్రాణోపాసన :

ఎవడు తినటము, త్రాగటము మొదలైన వాటితో ముఖ్యప్రాణమును సేవించు భావనతో నిర్వర్తిస్తాడో - అట్టివాడు సువాసన - దుర్వాసనలకు పరిమితుడు కాడు. తినకూడనివి, త్రాగకూడనివి అగు పాపములను (దోషములను) జయించివేస్తాడు. తినటము, త్రాగటము, వినటము మొదలైన వాటిచే బంధించబడడు.

‘ప్రాణ-అపాన’ సంయమ అభ్యాసముచే ముఖ్యప్రాణస్వరూపుడై - పాపరూపులగు అసురులను జయిస్తాడు. ముఖ్యప్రాణస్వరూపముచే దేహములలో ప్రాణముయొక్క ప్రవేశము-నిష్క్రమణములను తన స్వాధీనమునందు కలిగియుండి, క్రమంగా ఆవల గల ఆత్మతత్త్వమును అవధరించగలడు.

ముఖ్యప్రాణోపాసనను ఇంద్రియముల ద్వారా అర్చించుచున్న భావన కలవాడు, జన్మ-కర్మల పట్ల పారతంత్ర్యము జయించి స్వాతంత్ర్యుడు (Independent) కాగలడు.
10. తగ్ం హ అంగిరా ఉద్గీథమ్
ఉపాసాంచక్ర ఏతము
ఏవ అంగిరసం మన్యంతే,
అంగానాం యత్ రసః।
‘‘ఈ విధంగా ఇంద్రియములను ప్రాణదేవతా - ఉపాసనగా భావించి వర్తించి, ఆత్మతత్త్వమును సిద్ధించుకోవటము’’ అను ఆత్మతో సంయోగాభ్యాసమును అంగిరస మహముని లోకములకు బోధించియున్నారు.

అందుచేత ఈ ఉద్గీథము (ఉపాసన) - ‘అంగిరసము’ అని చెప్పబడుతోంది.

అంగములను రసస్వరూపముగా తీర్చిదిద్ది రసస్వరూపమగు ప్రాణదేవతను ఉపాసించటము కాబట్టి ‘అంగిరసము’. ప్రాణములు దేహ అంగములకు సర్వస్వము కాబట్టి ‘అంగిరసము’.
11. తేన తగ్ం హ బృహస్పతిః
ఉద్గీథం ఉపాసాంచక్ర ఏతము ఏవ
బృహస్పతిమ్ మన్యంతే
వాగ్ఘి బృహతీ తస్యా ఏష పతిః।।
‘‘ఈ విధంగా బృహస్పతి ప్రాణదేవతను సేవించుటయందు ఇంద్రియములను నియమించు భావన’’ - అను ఉద్గీథము (సేవ)ను ఉపాసించారు. (ఇంద్రియ) దేవతలకు గురుస్థానము అలంకరించారు.

ప్రాణమునకు ‘బృహస్పతి’ అని సార్థక నామము.

విస్తారము - పెద్దది (బృహత్) అగు వాక్కుకు ప్రాణదేవతయే పతి కాబట్టి ప్రాణము (ఇంద్రియ దేవతలకు పతి అయి) - ‘బృహస్పతి’గా అభివర్ణించబడుతోంది.
12. తేన తగ్ం హ ఆయాస్య
ఉద్గీథం ఉపాసాంచక్ర
ఏతము ఏవ ఆయాస్యం
మన్యంత-ఆస్యాద్యదయతే।
అట్టి ఇంద్రియములచే ప్రాణోపాసనను ఆయాస్యఋషి ఉద్గీథము చేస్తూ ఉపాసించారు.

ప్రాణము ఆయాస్యము (నోరు) నుండి రాకపోకలు చేస్తూ ఉండటంచేత ప్రాణము ‘ఆయాస్యము (రాక-పోకలు-గలది)’గా చెప్పబడి ఉపాసించబడుతోంది. అద్దాని ఋషి ఆయాస్యుడు.
13. తేన తగ్ం హ బకో
దాల్భ్యో విదాంచకార।
స హ నైమిశీయానామ్ ఉద్గాతా బభూవ।
స హ స్మైభ్యః కామాన్ ఆగాయతి।।
దాల్భ్యుని కుమారుడు బకఋషి కూడా స్వానుభవంగా ‘‘ఇంద్రియములతో ప్రాణోపాసన’’ - అను ఉద్గాథమును తెలుసుకొని ఉపాసించారు.

ఆయన నైమిశారణ్యంలో తపస్సు చేయు మునులకు, ఋషులకు ఉద్గాత (Trainer) అయినారు.

‘‘మీరు కోరుకొన్నది లభించగలదు’’ అను ఫలశృతిని ప్రాణ ఉద్గీథోపాసన గురించి ప్రవచించారు.
14. ఆగాతా హ వై కామానాం భవతి।
య ఏతత్ ఏవం
విద్వాన్ అక్షరం ఉద్గీథం
ఉపాస్త ఇతి అధ్యాత్మమ్।
ఎవ్వరైతే ప్రాణోపాసనను అక్షర (ఓంకార) ఆత్మోపాసనముగా ఉద్గీథోపాసన నిర్వర్తిస్తారో - వారు కోరుకున్నవి లభించగలవు.

ఇతి అధ్యాత్మమ్। ఇంద్రియములను ప్రాణదేవతా సమర్పణగా ఉపాసించటమే అధ్యాత్మజ్ఞానము అయి ఉన్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ద్వితీయః ఖండః


1–3. ప్రథమ ప్రపాఠకః - తృతీయః ఖండః - ఉద్గీథము యొక్క అధిదైవిక రూప ఉపాసన

(ఉద్గీథము = గానము)

1. అథ అధిదైవతం।
య ఏవ అసౌ తపతి
తమ్ ఉద్గీథం ఉపాసీత।
ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి।
ఇక ఇప్పుడు ఉద్గీథము (అక్షరగానము) యొక్క ‘‘అధిదైవికమైన రూపమును ఉపాసించటము’’ గురించి చెప్పుకుంటున్నాము.

ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుని సామగానరూపంగా ఉపాసించటము అధిదైవికోపాసన.

అట్టి సూర్యుడు ‘‘ఉదయించటము’’ అనే ఉద్యమముచే జనులందరిని ఉద్గానముగా చేస్తున్నారు.
ఉద్యగ్ంస్తమో భయం
అపహంతి, అపహన్తా హ వై భయస్య
తమసో భవతి, య ఏవం వేద।
సూర్యుడు సమస్త జీవులకు చీకటి భయమునుండి విముక్తి ప్రసాదిస్తున్నారు. ‘భయము’ అనే చీకటి తొలగటానికై అట్టి సూర్యభగవానుని ఉద్గీథోపాసన చేయుదురు గాక। సూర్యుని స్వయం ప్రకాశ తత్త్వమును ఎరిగినవారు, ఉపాసించువారు అజ్ఞాన చీకటినుండి బయటపడి ఆత్మసూర్యుని యందు ప్రవేశించగలరు.
(భాస్కరాయ విద్మహే, మహద్యుతికరాయ ధీమహి। తన్నో ఆదిత్య ప్రచోదయాత్।)
2. సమాన ఉ ఏవ అయం చ
అసౌ చ ఉష్ణో
అయం ఉష్ణో అసౌ।

‘స్వర’ ఇతి ఇమం ఆచక్షతే
స్వర ఇతి ‘‘ప్రత్యాస్వర’’
ఇతి। అముం తస్మాత్ వా
ఏతం ఇమం, అముం చ,
ఉద్గీథమ్ ఉపాసీత।
ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ, ఉష్ణమును ప్రసాదిస్తూ ఉన్నట్లే, దేహములో ప్రాణము సూర్యునివలె ప్రకాశిస్తూ ఉష్ణమును ప్రసాదిస్తోంది. (ఈవిధంగా) సాదృశంగా సమాన రూపములే। గుణము దృష్ట్యా ఒక్కటే. ఉభయము ఉష్ణమే!

ప్రాణమునకు ‘స్వర’ అని మరొక పేరు.

సూర్యునికి - ‘‘స్వర ప్రత్యాస్వర’’ అని పేరు.

అందుచేత దేహములో ప్రాణభగవానుని, ఆకాశంలో సూర్యభగవానుని ఇరువురియొక్క ‘సామ్య - తేజో’ రూపములను సామగానాలతో స్తుతిస్తూ ఉపాసించెదము గాక।
3. అథ ఖలు ‘వ్యానమ్’
ఏవ ఉద్గీథం ఉపాసీత।
యత్ వై ప్రాణ ఇతి, స ‘‘ప్రాణో’’।
యత్ అపాన ఇతి సః అపానః।
అథ యః ప్రాణ - అపానయోః
సంధిః, సః ‘‘వ్యానః’’
యో వ్యానః, సా ‘వాక్’।
తస్మాత్ అప్రాణన్ అనపానన్
వాచమ్ అభివ్యాహరతి।।
ఇప్పుడిక ‘‘వ్యానము’’ రూపమును ఉద్గీథోపాసన (గానోపాసన-praying by singing) చేసెదము గాక।

లోనికి వాయువును తెచ్చుచున్న ‘శక్తి’యే - ‘ప్రాణము’.

లోనుండి బయటకు వెళ్లుటకు వాయువును కదలించు శక్తి - ‘అపానము’.

ప్రాణ - అపానముల సంధిలో స్థానము పొందియుండు వాయుశక్తి ‘వ్యానము’.

ఏది వ్యానమో అదియే ‘వాక్కు’ రూపముగా అగుచున్నది. మనము మాట్లాడుచూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస - ప్రశ్వాస ప్రక్రియలను ఆపితేనే మాట్లాడగలుగుతాము. అందుచేత వ్యానమే (ప్రాణ అపానముల సంధియే) ‘వాచము’ రూపమగుచూ, మాటలు వెలువడుచున్నాయి - అని చెప్పబడుతోంది.
4. యా వాక్ స ఋక్।
తస్మాత్ అప్రాణన్, న అనపానన్
ఋచం అభివ్యాహరతి। య ఋక్ తత్ సామ।
- ఏది వాక్కుయో, అదియే ఋక్కు (స్తోత్ర మంత్రము)
- ఋక్కులు పలుకుచున్నవాడు ప్రాణ - అపానముల కదలని స్థితికి తెచ్చి మాత్రమే - పలుకగలుగుచున్నాడు.
ఏది ఋక్‌యో అదియే సామము (గానము, ఉద్గీథము).
తస్మాత్ - అప్రాణన్ న అపానన్
న సామ గాయతి। యత్ సామ,
స ఉద్గీథః తస్మాత్ అప్రాణన్,
న అనపానన్ ఉద్గాయతి।
అనగా ‘ప్రాణ - అపానము’లను చలన రహితము చేసినప్పుడే సామగానము సిద్ధిస్తోంది.

ఏది సామమో అదియే (ఓంకారాక్షరోపాసన రూపమగు) ఉద్గీథము.

అందుచేత ఉద్గీథము (సామగానము) ప్రాణ - అపానములు కదలిక త్యజించినప్పుడే జరుగుచున్నది. ఆ రెండిటి నిశ్చలమగు మధ్యస్థానమే ఉద్గానము (లేక) పైకి గానము చేయటము.
5. అతో యాని అన్యాని వీర్యవన్తి కర్మాణి
యథా అగ్నేః మంథనమ్ ఆజేః
సరణం దృఢస్య ధనుష ఆయమనం
‘‘అప్రాణన్ న అనపానగ్ంస్తాని కరోతి।
సామగానము చేస్తున్నప్పుడే కాకుండా, తదితరమైన ఆయా అనేక పనులు దేహముతో చేస్తూ ఉన్నప్పుడు ప్రాణ-అపానములు రహితం అయినప్పుడే (సమస్థితికి వచ్చినప్పుడే) నిర్వర్తించబడుచున్నాయి.

ఉదాహరణకు చెక్కలను రాపిడి చేసి మంధనము చేయటము, దూరంగా ఉన్న ఒక చోటికి వెళ్ళాలనే లక్ష్యంగా పరుగులు తీయటము, గట్టిగా ధనస్సును లాగి బాణము ఎక్కుబెట్టటము -ఈ ఈ మొదలైన కర్మలన్నిటిలో ప్రాణ-అపానములు నిర్వ్యాపారము (Non Functional) అయి ఉంటాయి.
ఏతస్య హి ఏతోః వ్యానం ఏవ
ఉద్గీథం ఉపాసీత।
అందుచేత ప్రాణ - అపానములు కదలిక చేయనట్టి ‘వ్యానప్రాణము’ను ఉద్గీథోపాసన చేయుచుండెదరు గాక।
6. అథ ఖలు ఉద్గీథ
‘‘అక్షరాణి’’ ఉపాసీత।
ఇక - మనము ‘‘ఉద్గీథ’’ యొక్క అక్షరములను (వర్ణములను, ‘‘ఉత్-గీ-థ’’లను) విశ్లేషించెదము గాక! - (నామ అక్షరాణి ఇత్యర్థః। - ఉద్గీథలోని అక్షరములు - విచారణ చేస్తున్నాము).
ఉద్గీథ ఇతి ప్రాణ ఏవ ఉత్ (కిం తు)
ప్రాణేన హి ఉత్తిష్ఠతి।
వాక్ ‘గీ’ః।
వాచో హ ‘గిర’ ఇతి - ఆచక్షతే।
అన్నం ‘థమ్’।
అన్నే హి ఇదగ్ం సర్వగ్ం స్థితమ్।
‘‘ఉద్గీథ’’ పదములో (‘‘ఉత్-గీ-థ’’లలో) ‘‘ఉత్’’ అనగా ‘‘ప్రాణము’’, ఎందుకంటే ప్రాణశక్తిచేతనే ఒకడు లేచి నిలబడగలుగుతాడు.
వాక్కును ‘‘గీ’’। వాక్కును ‘గిర’ అని కూడా పిలుస్తారు.

‘‘అన్నము’’ - ‘థమ్’’
థమ్ = అంతటా స్థితి కలిగియున్నది.

సర్వము అన్నమునుండే ప్రతిష్ఠితమై ఉండటముచేత అన్నమునకు ‘థమ్’ అని (ఉద్గీథను) అర్థము చెప్పుచున్నారు.

7. ద్యౌః ఏవ ‘ఉత్’।
అన్తరిక్షం ‘గీః। పృథివీ ‘థమ్’।
ఆదిత్య ఏవ ఉత్।
వాయుః ‘గీః।
అగ్నిః ‘థగ్ం’।
‘‘ఉత్-గీ-థమ్’’

ద్యౌః = (ద్యులోకము, స్వర్గలోకము) - ‘‘ఉత్’’। పైన ఉండటంవలన ఉత్ - ద్యౌః)

అంతరిక్షము = గీః। లోకములు తనయందు ఇముడ్చుకోవటంచేత అంతరిక్షమే గిరణము - ‘‘గీః’’।

పృథివి = థమ్। ప్రాణులకు స్థానము అగుచుండటంచేత పృథివియే అన్నము - థమ్

ఆదిత్యుడు = ‘ఉత్’। సూర్యుడు ఆకాశంలో పైన ఉండటంచేత ఆదిత్యుడే ఉత్

వాయువు = గీః। అగ్ని మొదలైన దేవతలను తనయందు ఇముడ్చుకోవటంచేత వాయువుయే ‘గీః’

అగ్ని = థమ్। యజ్ఞములో సమస్త కర్మలకు అధిష్ఠానం అవటంచే అగ్నియే ‘థమ్’।
సామవేద ఏవ ‘ఉత్’।
యజుర్వేదః ‘గీః’।
ఋగ్వేదః థమ్।
దుగ్ధే అస్మై వాక్ దోహం,
యో వాచో దోహో,
అన్నవాన్ అన్నాదో భవతి।
య ఏతాని ఏవం
విద్వాన్ ఉద్గీథ అక్షరాణి
ఉపాస్త ఉద్గీథ ఇతి।
సామవేదము - స్వర్గలోకముతో సమానంగా ‘ఉత్’। సామము చెప్పుబడుతోంది కాబట్టి ‘ఉత్’

యజుర్వేదము - ‘స్వాహా’ అను మంత్రముతో హవిస్సును దేవతలు స్వీకరిస్తున్నారు కాబట్టి ‘గీ’

ఋగ్వేదము - సామ ఋక్కునందు అధిష్ఠించి ఉండటంచేత ‘‘థమ్’’

ఎవ్వరైతే ‘‘ఉద్గీథము’’ను పైన మనం చెప్పుకున్న తీరులుగా ఉపాసిస్తాడో, అట్టివాని వాక్కు పాలవలె మాధుర్యము సంతరించుకోగలదు. అట్టివాడు అన్నవంతుడు, అన్నాదుడు (కలిగినవాడు, ఇచ్చువాడు) కాగలడు.

ఉద్గీథాక్షరములు ఈ విధంగా ఉపాసించువాడు ‘‘ఉత్తమ అనుభవి’’ అగుచున్నాడు.
(The Finest will have its admission into his zone of experience)
8. అథ ఖలు ఆశీః సమృద్ధిః।
ఉపసరణాని ఇతి ఉపాసీత।

యేన సామ్నా స్తోష్యన్ స్యాత్
తత్ సామ ఉపధావేత్।

ఉద్గీథము - కామసిద్ధి

ఇప్పుడు మనము - తాను అనుకున్నవి జరగటానికి, కోరికలు ఈడేరటానికి, సమృద్ధి పొందటానికి - ఎట్లా ఉద్గీథోపాసన చేయాలో చెప్పుకుందాము.

సామము (వాక్కు సంగీతము)తో ఏ దేవతను ఉపాసిస్తూ ఉన్నారో, ఆ దేవతా సామమును - ఉత్పత్తి, ఛందస్సు మొదలైన విశేషములతో భావన చేయాలి. మననము చేయాలి.
9. యస్యాం ఋచి తామ్ ఋచం।
యత్ ఆర్షేయం తం ఋషిం।
యాం దేవతాం అభిష్టోష్యన్ స్యాత్
తాం దేవతాం ఉపధావేత్।
ఆ సామము ఏ ఋక్కు (గానము వాక్కునందు) అధిష్ఠితమైయున్నదో ఆ ఋక్కును కూడా (ఆ శబ్దార్థము కూడా) - అద్దాని దేవత, ఛందస్సు మొదలైన వాటితో చేర్చి భావన చేయాలి.

ఏ ఆర్షమునందు ఉన్నదో - ఆ ఋషిని (ఉద్గాతను) స్తుతించుచూ, ఆ దేవతను కూడా భావన చేయుదురు గాక।
10. యేనత్ ఛందసా స్తోష్యన్ స్యాత్,
తత్ ‘ఛన్ద’ ఉపథావేత్।
ఏన స్తోమేన స్తోష్యమాణః స్యాత్
తగ్ం స్తోమం ఉపధావేత్।।
ఏ మంత్రమును ఏ ఛందస్సుతో స్తుతించబోవుచున్నారో - ఆ ఛందస్సును స్తుతిస్తూ (మననము చేస్తూ) ఉద్గీథ గానము చేయాలి.

ఏ స్తోమను (సామయందలి ఆ దేవతను స్తుతించే సంఖ్యా విశేషమును) స్తుతిస్తున్నారో - ఆ వేద - ఉపాంగ - సంఖ్యా విశేషములను కూడా భావన చేయాలి. ఆ దేవతను (స్తోమను) భావన చేస్తూ ఉద్గీథము నిర్వర్తించెదరు గాక।
11. యాం దిశం అభిష్టోష్యన్ స్యాత్
తాం దిశం ఉపధావేత్।
ఉద్గాత (యజ్ఞవిధిలో సామగానముతో పరమాత్మను స్తుతించుచున్న వాడు) ఏ దిక్కుగా స్తుతిస్తున్నాడో (ఉద్గీథము చేయుచున్నాడో) ఆ ‘దిక్కు’ను కూడా ధ్యానించెదరు గాక। ఆ దిక్కుగా ఆత్మను మననము చేసెదరు గాక।
12. ఆత్మానం అన్తత
ఉపసృత్య స్తువీత। కామం ధ్యాయన్।
న ప్రమత్తో అభ్యాశో హ యదస్మై
స కామః సమృధ్యేత
యత్ కామః స్తువీత ఇతి,
యత్కామః స్తువీత ఇతి।।
ఆ తరువాత స్వకీయమగు జీవాత్మత్వమునకు ఆవలగల పరమాత్మ (లేక) కేవలాత్మతత్త్వమును సమీపించి సర్వలోక సంబంధమైన కోరికలను త్యజించినవాడై ధ్యానము చేయును గాక।

అప్రమత్తుడై (Non-Lazy, Non-drowsy) అయి అట్టి ఉపాసన నిర్వర్తించు గాక।

అట్టివాడు సకాముడైతే, ఆతడు ఏ సమృద్ధి కోరుకొని ధ్యానిస్తాడో - అట్టి కోరుకొన్నవన్నీ లభించగలవు. కోరుకొన్నవి కోరుకొన్న రీతిగా త్వరితముగా పొందబడగలవు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే తృతీయః ఖండః


1–4. ప్రథమ ప్రపాఠకః - చతుర్థః ఖండః - ఓంకార ఉద్గీథము

1. ‘ఓం’ ఇతి ఏతత్
అక్షరం ఉద్గీథం ఉపాసీత।
‘ఓం’ ఇతి హి
ఉద్గాయతి, తస్య ఉపవ్యాఖ్యానమ్।
‘ఓం’ యొక్క పరాకాష్ఠార్థమైనట్టి అక్షరము (బ్రహ్మము) యొక్క గానమును ఉపాసించెదము గాక.

అట్టి ‘ఓం’ అని ఏది గానము చేయబడుచున్నదో - అద్దాని గురించి ఉపాఖ్యానము (వ్యాఖ్యానము) చేసుకొంటున్నాము.
2. దేవా వై మృత్యోః బిభ్యతః।

త్రయీం విద్యాం ప్రావిశగ్ంస్తే
ఛందోభిః అచ్ఛాదయన్ యత్
ఏభిః అచ్ఛాదయగ్ం
తత్ ఛందసాం ఛందస్త్వమ్।।
ఒక సందర్భములో దేవతలు మృత్యువు గురించిన భయమును పొందసాగారు.

త్రయీ విద్యలయినట్టి వేదములలో చెప్పబడిన ధర్మ - అర్థ - కామముల గురించిన మంత్రములను ఆశ్రయించారు. వేద ఛందస్సులచే (ఆయా త్రైవిద్యా కార్యక్రమములచే) ఆచ్ఛాదనము (En-covered, en-compassed) పొందారు. వేదమంత్రములలో సూచించబడిన కర్మల విభాగమును బాగుగా అనుష్ఠించసాగారు.

వేదములలో ధర్మార్థకామ విభాగములు ఆశ్రయించారేగాని, వేద హృదయమగు పరమాత్మతత్త్వము ఏమిటో వారు అప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు.
3. తాను తత్ర మృత్యుః
యథా మత్స్యమ్ ఉదకే
పరిపశ్యేత్ - ఏవం పరి అపశ్యత్।
ఋచి సామ్ని యజుషి, తే ను
విదిత్వ ఊర్ధ్వా ఋచః
సామ్నో యజుషః ‘స్వరం’ ఏవ ప్రావిశన్।
సకల సంహారరూపిణియగు మృత్యుదేవత దేవతల కొరకై వెతుకసాగింది. వారు వేదోపాసనలలోని ధర్మార్థకామముల చాటుగా కనిపించనే కనిపించారు.

నిర్మలమైన నీటిలో చేపలు కనబడుతూ ఉంటాయి చూచారా! నిర్మల జలంలోని చేపలను చూచు విధంగా తమను మృత్యుదేవత చూస్తూ ఉన్నదని, త్రైవిద్యోపాసనచే మృత్యువు తమచే జయింపబడలేదని ఆ దేవతలు గమనించారు.

త్రైవిద్యా మంత్రములు (ఋక్=శాస్త్రీయ స్తుతి మంత్రములు, యజుః = యజ్ఞ - యాగ ప్రాధాన్యములగు యజుర్వేద మంత్రములు, స్తుతి ప్రాధాన్యములగు సామవేద మంత్రములు) తమను మృత్యు పరిధులనుండి బయటకు తేలేవని గమనించారు.

అప్పుడు ఋక్-యజుః-సామవేదములలోని ‘స్వరము’ రూపము, ఏకాక్షరము అగు ‘ఓం’కారార్థమును అధ్యయనము చేయసాగారు. ఉపాసించసాగారు. ‘ఓం’ కారమును సమస్త విధానములలో మొదట - చివరగా ఏర్పరచుకొని త్రైవిద్యను ఉపాసించసాగారు.
4. యదా వా ఋచం
ఆప్నోతి ‘ఓం’ ఇతి ఏవ
అతి స్వరతి ఏవగ్ం।
సామ ఏవం యజుః
ఏష ఉ స్వరో
అందుచేతనే ఋగ్వేద ఋచములు పఠిస్తూ ఉన్నప్పుడు ‘ఓం’ అను అక్షరతత్త్వార్థ స్వరముతో ప్రారంభించటం జరుగుతోంది. సర్వాత్మకమగు పరాత్మను జ్ఞాపకం పెట్టుకొని ఋగ్వేద ఋక్కులు గానం చేయబడుచున్నాయి.

అట్లాగే యజుర్వేద మంత్రములను, సామవేద మంత్రములను కూడా ‘ఓం’ కార ఉచ్చస్వరముతో ప్రారంభించసాగారు. ‘ఆత్మోపాసన’ను జోడించి మంత్రోపాసన ప్రారంభిస్తున్నారు.
యత్ ఏతత్ అక్షరం।
ఏతత్ అమృతం। అభయం।
తత్ ప్రవిశ్య, దేవా అమృతా
అభయా - అభవన్।
ఆ విధంగా ఏ ‘ఓం’తో ఋక్ - యజు - సామములను, త్రైవిద్యను - దేవతలు అధ్యయనము ప్రారంభించారో, అట్టి ‘ఓం’ యొక్క పరమార్థము :-

ఏదైతే జన్మ-కర్మ మొదలైనవాటిచే తరుగుదల - పెరుగుదల పొందటంలేదో - ‘అక్షరము’। - క్షరము లేనిదో - అది అద్వితీయమగు ‘పరమాత్మ’ లేక ‘పరబ్రహ్మము’నకు సంజ్ఞ. కాబట్టి అభయము. రెండవది ఉంటే కదా భయము? (ద్వితీయం వై భయం భవతి)!

అట్టి అక్షరము - అద్వితీయము అగు కేవల సాక్షీరూపమగు ‘ఆత్మ’ యందు ప్రవేశించి దేవతలు అమృత స్వరూపులైనారు. అభయమును సిద్ధించుకొన్నారు.
5. స య ఏతత్ ఏవం విద్వాన్
అక్షరం ప్రణౌతి,
ఏతత్ ఏవ అక్షరగ్ం
‘స్వరం’ అమృతం, అభయం ప్రవిశతి।
తత్ ప్రవిశ్య యత్ అమృతా
దేవాః తత్ అమృతో భవతి।।
ఏ నిత్యానిత్య వివేకియగు విద్వాంసుడైతే - అట్టి ప్రణవమగు అక్షరమును, సమన్వయిస్తూ, దర్శిస్తూ, ఉపాసిస్తూ ఉంటాడో - అట్టివాడు అక్షరము (‘ఓం’కార) స్వరరూపము, అమృతము, అభయము అగు పరస్వరూపము నందు ప్రవేశిస్తాడు. దేవతలవలెనే అమృత స్వరూపుడౌతాడు. అమృత తుల్యుడౌతాడు. తానే అభయము - నిత్యము - సహజము అగు అఖండ ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లుతాడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే చతుర్థఖండః


1–5. ప్రథమ ప్రపాఠకః - పంచమః ఖండః - (‘ఓం’కార) ప్రణవమే ఉద్గీథము

(ఉద్గాతం = గానము చేయటము)

1. అథ ఖలు య ఉద్గీథః
స ప్రణవో। యః ప్రణవః
స ఉద్గీథ - ఇతి। అసౌ వా
ఆదిత్య ఉద్గీథ। ఏష ప్రణవః ।
‘ఓం’ ఇతి హి ఏష స్వరన్ ఏతి।।
ఏది సామగాన (స్తోత్ర) సంబంధమైన ఉద్గీథమో, అదియే ‘ప్రణవము’. ఏది ప్రణవమో, అదియే ఉద్గీథము కూడా।

ప్రణవమే సూర్యుడు.

అట్టి ఏకాక్షరమగు ఆత్మ ‘ఓం’ స్వరముయొక్క ఉపాసనచే అనుభవమగుచున్నది.

‘అన్నము’ కూడా అదియే. ‘అనుభవి - అనుభవము’ - ఈ రెండూ ప్రణవ స్వరూపముగా ఉద్గీథోపాసన (గానోపాసన)తో ఉపాసించబడుచున్నాయి. ఏకరూపముగా దర్శించబడుచున్నాయి.

సూర్యుడు ‘ఓం’ - ప్రణవము ఉద్గీథము (గానము) చేస్తూనే ఆకాశంలో స్వయంప్రకాశకుడై సంచరిస్తున్నారు.
2. ఏతము ఏవ అహమ్
అభ్యగాసిషం,
తస్మాత్ మమ త్వమ్ ఏకో అసి ఇతి
హ-కౌషీతకిః పుత్రం
ఉవాచ - రశ్మీగ్ం స్త్వం
పర్యావర్తయాత్ బహవో
వై తే భవిష్యన్తి ఇతి ‘‘అధి దైవతమ్’’।
సూర్యుడు తన కుమారుడైనట్టి కౌషీతకీ మహర్షికి ఈ విధంగా బోధించారు.
‘‘ప్రియపుత్రికా! కౌషీతకీ। నేను ప్రణవ గానము చేస్తూ ఆకాశంలో స్వయం ప్రకాశకుడినై సర్వత్రా వెలుగును నింపుచున్నాను. నీవు నన్ను ఆత్మతత్త్వ పురుషుడుగాను, నా కిరణములను ఉద్గీథముగాను భావించి ఉపాసించుము. నా తేజస్సు ఏకమే అయినప్పటికీ అనేక రూపములుగా పర్యావర్తనము అగుచున్న తీరుగా, ఏకము-అక్షరము అగు ఆత్మయే అనేకముగా పర్యావర్తనమై ప్రదర్శనమౌతోంది’’.

సూర్యుడు చెప్పినట్లు ఉపాసించిన (ప్రజాపతి) కౌషీతకీ మహర్షి తన కుమారునితో ‘‘నాయనా! కావున నీవు నాకు ఒక్కడివే పుత్రుడవు. దేవతలు సూర్యుని కిరణములను ఉద్గీథోపాసనకు విషయము (ఉపాస్యము)గా భావించి ధ్యానిస్తున్నారు. నీవు అట్లే నిర్వర్తించు. నీకు బహు సంతానము కలుగును’’ - అని బోధించారు.
3. అథ అధ్యాత్మం।
య ఏవ అయం ముఖ్యః ప్రాణః
తం ఉద్గీథం ఉపాసీత -
‘ఓం’ ఇతి హి ఏష స్వరన్ ఏతి।।
అధ్యాత్మము
ఇప్పుడిక ‘‘అధ్యాత్మము’’ గురించి చెప్పుకుందాము.

అధ్యాత్మము: ఇది తన శరీరమును, తదితర శరీరములను ఉపాసించటము. అయితే భౌతిక రూపంగా కాదు. దేహములన్నీ ముఖ్యప్రాణ ప్రదర్శనా రూపముగా భావన చేయటము - ఉద్గీథోపాసన చేయటము, (‘ఓం’) ప్రణవోపాసన (లేక) ‘స్వరోపాసన’ అగుచున్నది. నోటితో ఉచ్చరించే ప్రణవమే ప్రాణము.

4. ఏతము ఏవ అహమ్
అభ్యగాసిషం। తస్మాత్
మమ త్వమ్ ఏకో అసి ఇతి
హ కౌషీతకిః పుత్రం
ఉవాచ - ప్రాణాగ్ంస్త్వం
భూమానం అభిగాయతాత్
బహవో వై మే భవిష్యంతి ఇతి।।
కౌషీతకీ మహర్షి ఇంకా ఈ విధంగా చెప్పుచున్నారు.

నేను ప్రాణమును ప్రణవ స్వరూపంగాను, ‘‘ఈ ప్రాణమే నాకు పుత్రుడు’’- గాను భావిస్తూ ‘‘ఆత్మా వై పుత్ర నామాసి’’ అను స్తుతి నిర్వర్తిస్తూ ఉన్నాను.

‘‘ప్రాణమును పుత్రునిగాను భావించి, బహుసంతతి ప్రసాదించటానికై ప్రాణములను ఉద్గీథోపాసనగా చేస్తున్నాను.
ప్రాణమే ప్రణవ స్వరూపంగా, బహు (అధికము)గా భావించుటము నిర్వర్తించబడుచున్నప్పుడు సర్వజీవులు నాకు మమప్రాణస్వరూపంగా అనుభవమగుచున్నారు’’.
5. అథ ఖలు య ఉద్గీథః స ప్రణవః।
యః ప్రణవః స ఉద్గీథః।
ఇతి హోతృషదనాత్ హ ఏవ అపి
దురుద్గీతమ్ అనుసమాహరతి - ఇతి।
అనుసమాహరతి ఇతి।।
ఏది ఉద్గీథమో (స్తుతిగానమో) అదియే ప్రణవము.

ఏది ప్రణవమో, (ప్రాణశక్తియో) - అదియే ఉద్గీథము కూడా!

ఈ విధంగా ఆధ్యాత్మికంగా శరీరములనే ప్రాణస్వరూపంగా, ప్రాణములనే ప్రణవముగా ఏకరూపం చేసి ఉద్గీథము చేస్తున్నప్పుడు వేదమంత్రములను పలుకుటలో ఉచ్చారణ దోషములు ఉన్నప్పటికీ కూడా (ప్రాణమే - ప్రణవము, ప్రాణమే దేహము - అను గానముచే) - అట్టి పలుకు దోషములు సమాహరతము (దోషము తొలగుట) పొందబడగలవు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే పంచమ ఖండః


1–6. ప్రథమ ప్రపాఠకః - షష్ఠః ఖండః - పరమపురుషుడే ఉద్గీథము

1. ఇయం ఏవః అగ్నిః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచి అధి ఊఢగ్ం సామ।
తస్మాత్ ఋచి అధి ఊఢగ్ం సామగీయతే।
ఇయం ఏవ సా అగ్నిః।
అమః తత్ సామ।।
ఈ అగ్నియే ‘సామము’.
అట్టి సామము ‘ఋచమ్’ పై ఆధారము.
‘సా’ = భూమి (Basis)
‘అమ’ = అగ్ని.
ఈ విధంగా అగ్నియే సామవేదము.
అగ్ని ప్రాణరూపము.
గానము ప్రాణశక్తియొక్క క్రియా ప్రదర్శనము.
ప్రాణమునకు ఆధారము ఋచము (ఆత్మ).
ఇదంతా అగ్ని (ప్రాణ) స్వరూపమై ‘సామము’గా ప్రదర్శనమగుచున్నది.
(ఊఢము = పొందబడినది, మోయబడినది.
అధ్యూఢము = ఒకటిచే మరొకటి పొందబడినది - మోయబడినది)
2. అన్తరిక్షం ఏవ ఋక్।
వాయుః సామ।
తత్ ఏతత్ ఏతస్యాత్
ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం
సామ గీయతే, అన్తరిక్షం ఏవ సా వాయుః।
అమః తత్ సామ।।
అంతరిక్షమే → ‘ఋక్కు’
వాయువు → ‘సామము’
అట్టి సామము ఋక్‌పై ఆధారము.
ఋక్కుపై ఆధారితమై సామము గానము చేయబడుతోంది.
సా = ఆకాశము
అమ = వాయువు
ఆకాశము + వాయువు యొక్క కలయికయే(రమయే) - ‘‘సామ’’
3. ద్యౌః ఏవ ‘ఋక్’।
ఆదిత్యః ‘సామ’ ।
తదేతత్ ఏతస్యామ్
ఋచః అధ్యూఢగ్ం
సామ। తస్మాత్ ఋచః
అధ్యూఢగ్ం సామ గీయతే
ద్యౌః ఏవ - సా ఆదిత్యః ।
అమః తత్ ‘‘సామ’’।।
ద్యులోకము (స్వర్గలోకము) - ‘ఋక్’
ఆదిత్యుడు (సూర్యుడు) - సామము
- అట్టి సామము (ఆదిత్యుడు) ఋక్‌పై ఆధారము.
- ‘ఋక్’ ఆధారముగా సామము గానము చేయబడుతోంది.
‘‘సా’’ = స్వర్గము (ద్యులోకము)
‘‘అమ’’ = సూర్యుడు (ఆదిత్యుడు)
ద్యులోకము (దివ్యలోకము/స్వర్గలోకము) + ఆదిత్యుడు → ఈ రెండిటి కలయికయే ‘‘సామము’
4. నక్షత్రాణి ఏవ ఋక్।
చంద్రమాః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచః అధ్యూఢగ్ం ‘సామ’।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం
సామ గీయతే నక్షత్రాణి
ఏవ సా చంద్రమా
అమః - తత్ సామ।।
నక్షత్ర మండలము - ‘‘ఋక్’’
చంద్రుడు - ‘సామము’
అట్టి సామము → ఋక్‌పై ఆధారితము
అందుచేత ‘ఋక్’ ఆధారంగానే సామము గానము చేయబడుతోంది.
‘‘సా’’ = నక్షత్రమండలము
‘‘అమ’’ = చంద్రుడు
నక్షత్రమండలము + చంద్రుడు
సా (ఋక్) + (అమ) ఈ రెండూ కలిస్తేనే ‘సామ’.
5. అథ యత్ ఏతత్ ఆదిత్యస్య
శుక్లం భాః స ఏవ ఋక్।
అథ యత్ నీలం, పరః కృష్ణం తత్ సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।।
ఆదిత్యుని కాంతి - శుక్లము (తెలుపు) ‘సా’
ఆదిత్యుని నీలము, పరము అగు కృష్ణము (నలుపు) - ‘‘అమ’’
ఈ శుక్లము, కృష్ణముల చేరిక → ‘సామ’.
తెలుపు నలుపుపై ఆధారము.
‘ఋచము’పై ఆధారము కలదై ‘సామ’గానము (అద్వఢగ్ం = ఆధారమై ఉన్నది)
తెలుపుపై నలుపువలె ‘ఋక్’ పై ‘సామ’ గానము చేయబడుతోంది.
(ఋక్ = Lyric, సామ = Music)
6. అథ యత్ ఏవ ఏతత్ ఆదిత్యస్య శుక్లం,
భాః స ఏవ ‘సా’ అథ యత్ నీలం
పరః (పరా) కృష్ణం। తత్ అమః తత్ ‘సామ’।
అథ య ఏషో అంతర ఆదిత్యే
హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్య
శ్మశ్రుః హిరణ్య కేశ
ఆప్రణఖాత్, సర్వ ఏవ సువర్ణః।।
ఆదిత్యునియందు ఏ శుక్లము (తెలుపు) భాసిస్తోందో - అదియే నీలము, నలుపుగా రూపు కలిగి ఉంటోంది.
సూర్యునిలో ప్రకాశమానుడగుచున్నవాడే ‘‘పురుషుడు’’.
ఆ పురుషుడు (worker of the universe) ‘ఆదిత్యుడు’గాను, హిరణ్మయుడుగాను (కూడా) చెప్పబడుచున్నాడు.
అట్టి హిరణ్మయపురుషుడు బంగారు కేశములతో, బంగారు రంగుతో ప్రకాశమానుడుగా ఉపాశ్య - ఉపదేశ్య రూపముగా అభివర్ణించ బడుచున్నారు.
7. తస్య యథా కప్యాసం
పుండరీకం ఏవం అక్షిణీ।
తస్య ‘ఉత్’ ఇతి నామ।
స ఏష సర్వేభ్యః పాప్మభ్య
ఉదిత ఉత్ ఏతి హ వై
సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద।
సమస్త కల్పకు పురుషకారుడు, ఆధారుడు అగు ఆ హిరణ్యగర్భ పురుషుడు
- ఎరుపు రంగుతో ప్రకాశించు తామరపువ్వు వంటి కనులతో,
- ‘ఉత్’ శబ్దార్థుడై అజ్ఞానమాలిన్యము నుండి బయటకు తెచ్చువాడై సముద్ధరించువాడై,
- సమస్త పాప దోషముల నుండి బయటపడటానికి మార్గదర్శకుడై, పాపములు పోగొట్టువాడై యోగజ్ఞులచే దర్శించబడి, సాధక జనుల కొరకై సారూప్యముగా ప్రసాదించబడుచున్నారు.
ఇది ఎరుగుచున్నవారు సర్వ దోషముల నుండి విడివడుచున్నాడు.
8. తస్య ఋక్ చ సామ చ, గేష్ణౌ।
తస్మాత్ ఉద్గీథః। తస్మాత్ త్వ ఏవ ఉద్గాత।
ఏతస్య హి గాతా।
స ఏష యే చ ఆముష్మాత్పరాంచో లోకాః।
తేషాం చేష్టే దేవకామానాం చ
ఏతి అధిదైవతమ్।।
ఆ పరమపురుషుడే ఋగ్వేద యజుర్వేదములు గృహముగా కలవారు.
- ఆయనయే ఉద్గీథము (స్తోత్ర గాన స్వరూపము) కూడా!
- ఆయనయే గానము చేయు ఉద్గాత, ఉద్గాతను ఆహ్వానిస్తున్న యజ్ఞకర్త కూడా।
- ఆయనయే గానలహరి।
- ఆయనయే ఆముష్మిక (పరలోక) ప్రయోజనరూపుడు.
- ఆయనయే దేవతలు కోరుకొనే పరాకాష్ఠతత్త్వుడు. లోకములకు కూడా ఆవలివాడు.
ఇదియే ‘అధిదైవతము’.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే షష్ఠః ఖండః


1–7. ప్రథమ ప్రపాఠకః - సప్తమః ఖండః - పరమ పురుష సామ ఉపాసన

1. అథ అథ్యాత్మం।
వాక్ ఏవ ‘‘ఋక్’’। ప్రాణః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
ఈ శరీరమునకు సంబంధించిన సాధనా వ్యవస్థయే ‘అధ్యాత్మము’.
- వాక్కు (Speaking)యే - ‘ఋక్’.
- ప్రాణమే - ‘సామము’.
అట్టి సామము (శబ్ద సంగీత సౌందర్యము) ఋక్కుపై (సత్యవాక్కు - ఆత్మతత్త్వముపై) ఆధారపడి గానం చేయబడుతోంది.
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
వాక్ ఏవ ‘సా’ ప్రాణో ‘అమః’ - తత్ సామః।।
అందుచే అట్టి ఋక్కునకు (పరమసత్యమగు ఆత్మతత్త్వమునకు) ఆధారమై సామము గానము చేయబడుచున్నది.
వాక్కుయే ‘సా’
ప్రాణము - ‘అమ’
తత్ పరమాత్మ స్వరూపమే సామగానము. వాక్కు - ప్రాణముల కలయికయే ‘సామ’.
2. చక్షుః ఏవ ఋక్। ఆత్మా సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
చక్షుః ఏవ ‘సా’ ఆత్మా అమః తత్ సామ।।
చక్షువులు (కన్ను) - ‘ఋక్కు’
చూచువాడు / నేత్రేంద్రియము → ‘సామ’
కన్నుపై చూపు ఆధారపడు విధంగా - ఋక్కుపై సామ ఆధారితము. ఋక్కు ఆధారంగానే సామము గానము చేయబడుతోంది.
నేత్రములు, చూపు ఏకరూపమే.
నేత్రము (కన్ను) → ‘సా’
ఆత్మ (నేత్రేంద్రియము) → ‘అమ’
ఈ నేత్రము - జీవాత్మల కలయికయే సామ।
3. శ్రోత్రం ఏవ ‘‘ఋక్’’ మనః ‘సామ’।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
శ్రోత్రం ఏవ ‘సా’। మనో - అమః।
తత్ సామ।।
శ్రోత్రము (చెవి) (వినికిడి) - ‘ఋక్కు’.
మనస్సు - ‘సామ’
అట్టి సామము ఋక్కుపై ఆధారపడి యున్నది.
చెవి - ‘సా’
మనస్సు - ‘అమ’
చెవి మనస్సుల కలయికయే ‘సామ’
4. అథ యత్ ఏతత్ అక్ష ణాః (ఋక్-అక్షః)
శుక్లం। భాః స ఏవ ఋక్ అథ యత్ నీలం పరః
కృష్ణం తత్ సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచ అధ్యూఢగ్ం సామ।
నేత్రములోని శుక్ల (తెలుపు) విభాగముగా భాసించుచున్నది - ‘ఋక్కు’.
తెలుపుకు వేరుగా నీల - నలుపులతో కూడిన నల్లని విభాగము - ‘సామ’
సామము (గానము) ఋక్కు నుండి (మంత్రము - వాఙ్మయము నుండి) బయల్వెడలుచున్నది. అనగా సామము ఋక్కుపై ఆధారపడి ఉన్నది. కంటిలో తెల్లటి విభాగముపై (విస్తరణవలె) నల్లటి విభాగము చోటుపొందుచున్నది.
తస్మాత్ ‘ఋక్’చ అధ్యూఢగ్ం సామ గీయతే।
అథ యత్ ఏవ ఏతత్ అక్ష ణాః
శుక్లం భాః స ఏవ ‘సా’।
అథ యత్ నీలం పరః
తత్ ‘అమ’। తత్ సామ।
‘ఋక్కు’ను ఆధారము చేసుకొని సామము గానము చేయబడుతోంది.
ఈ విధంగా కంటిలో తెల్లగా ప్రకాశమానమై యున్నది - ‘సా’.
నీలమునకు పరమై నలుపు విభాగము - ‘అమ’.
ఆ రెండిటి కలయికయే ‘సామ’.
5. అథ య ఏషో అంతః అక్షిణి పురుషో
దృశ్యతే స ఏవ ఋక్ తత్ సామ
తత్ ఉక్థం- తత్ యజుః తత్ బ్రహ్మ।
తస్య ఏతస్య తత్ ఏవ రూపం
యత్ అముష్యరూపం
యా అవముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ।
యత్ నామ, తత్ నామ।
ఏ పురుషుడు నేత్రములో అంతరముగా చూచువానిగా దృశ్యమానమై యున్నారో (As a perceiver) -
ఆయనయే ఋక్కు
ఆయనయే ‘సామము’ కూడా।
ఆయనయే ‘ఉక్థ (ప్రాణము) (సామవేదము)
ఆయనయే - ‘‘యజుర్వేదము’’
ఆయనయే - ‘‘బ్రహ్మము’’

ఈ నేత్రములలో నివాసము కలిగియున్న రూపమే (చూచువాడే) అముష్యరూపము. సూర్యునిలో నివసించుచున్న రూపము కూడా ఆయనయే.

పురుషుడు - సూర్యునిలో నివసించుచున్నవాని పేరు, ఈ నేత్రములలో నివసిస్తున్నవారి పేరు ఒక్కటే. ఆతడే ‘పురుషుడు’।

ఆ పురుషుడే సర్వజీవులలో ‘‘ఉత్తమపురుషగా’’ (The First Persion, ‘I’ గా) వెలయుచు - పురుషోత్తముడుగా సుత్తించబడుచున్నాడు.

6. స ఏష యే చ ఏతస్మాత్ అర్వాంచో
లోకాః తేషాం చేష్టే మనుష్య కామానాం చ ఇతి।

ఆ పురుషుడే
- జగత్తులో సర్వజీవుల ఇష్టము, వాంఛ, ఆశయముల రూపంగా ప్రదర్శనమగుచున్నారు. (అహమ్ ఆత్మ సర్వభూతాయ స్థితః)
- ఆయనయే లోకముల రూపంగాను, లోకములలోని సర్వ దృశ్యములుగాను వెలయుచున్నారు.
- ఆయనయే మనుష్యులలో (జీవులలో) కామములను చేష్టితము చేయుచున్నవారు.
(He is the Inspirer of all desires/Expectations of all beings, just like a Drama writer for all Roles)

తద్య ఇమే వీణాయాం గాయన్తి।
ఏతం తే గాయన్తి తస్మాత్ తే ధనసనయః
ఎవ్వరైతే అట్టి సమస్తమునందు వసించుచున్న వాసుదేవ భగవానుని (లేక) వాసుదేవ పురుషుని వీణాగానముతో పాడుచున్నారో (స్తుతిస్తూ పాట పాడుచున్నారో) - వారు ఏది ‘మాకు కావాలి’ అనుకుంటే అవన్నీ పొందగలరు.
7. అథ య ఏతత్ ఏవం విద్వాన్
సామ గాయతి ఉభౌ స గాయతి।
ఎవ్వరైతే అట్టి దేవదేవుని ఎరుగుచు సామగానము చేయుచున్నారో, వారు (ఇహ-పర రూపములగు) ఉభయము - ఋక్ (వాక్) - సామ అర్థోపాసనలను ఉపాసించువారగుచున్నారు.
సో అమున ఏవ స ఏష యే చ అముష్మాత్
పరాంచో లోకాన్ తాగ్ం చ
ఆప్నోతి దేవ కామాగ్ంశ్చ।।
అట్టి పరమాత్మను ఎవ్వరైతే ఉద్గీథ గానము ద్వారా ఉపాసిస్తున్నారో వారు పరమునగల దివ్యలోకములు ప్రాప్తించుకోగలరు. దివ్యపురుషులగు దేవతలచే (హిరణ్యగర్భునిచే) దేవతా లోక భోగములు ప్రసాదించబడుచున్నారు.
8. అథ అనేన ఏవ యే చ ఏతస్మాత్
అర్వాంచో లోకాః తాగ్ంశ్చ
ఆప్నోతి మనుష్య కామాగ్ంశ్చ।
తస్మాత్ ఉ హ ఏవం విత్
ఉద్గాతా బ్రూయాత్।
యజ్ఞవిధులందు యజ్ఞకర్తను, తదితరులను ఉద్దేశించి ఉద్గాత (సామగానము చేయు యజ్ఞవిధిలోని నిర్వాహకుడు) ఏ ఏ ఉత్తమ ఆశీర్వాదములు పలుకుచున్నాడో - అట్టి తాము కోరుకొన్న ఉత్తమ లోకములను - ఆ పరమపురుషుని ఉపాసించు మానవులు, సర్వత్ర పరమాత్మ సంకల్పములను దర్శించువారు పొందగలరు.
(వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్। సర్వభూత నివాసో2సి, శ్రీ వాసుదేవ నమోస్తుతే)
9. కం తే కామం ఆగాయనీతి ఏష హి ఏవ
కామాగానస్య ఈష్టే య ఏవం విద్వాన్
సామ గాయతి। సామ గాయతి।।
ఉద్గాత సామగానము చేస్తూ యజ్ఞకర్తకు, శ్రోతలకు, సభికులకు ఏఏ ‘భవతు’ అని గానం చేస్తున్నారో, అట్టి సామగాన ప్రయోజనములు - ‘పరమపురుషోపాసన’ చేయుచున్నవారికి స్వాభావికంగానే సిద్ధించగలవు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే సప్తమః ఖండః


1–8. ప్రథమ ప్రపాఠకః - అష్టమః ఖండః - సామ యొక్క గతి ఏది?

1. త్రయో హ ఉద్గీథే
కుశలా బభూవుః।
శిలకః శాలావత్యః
చైకితాయనో దాల్భ్యః
ప్రవాహణో జైవలిః - ఇతి।।
అట్టి ఉద్గీథము (సామ) గానము చేయగల నిష్ణాతులైనవారు (కుశలురు) ముగ్గురు ముఖ్యమైనవారిని తలచుకొని నమస్కరిస్తున్నాము.
(1) శాలవత్యుని కుమారుడు - శిలక ముని
(2) దాల్భ్య వంశీయుడు - చైకితాయన ముని
(3) జీవలుని కుమారుడు - ప్రవాహణముని, జైవలి.
తే హ ఊచుః
ఉద్గీథే వై కుశలాః
స్మః హంత ఉద్గీథే
కథాం వదామ ఇతి।।
మహనీయులగు అట్టి ముగ్గురు మునీశ్వరులు - ఒక సందర్భంలో కలుసుకొని ఈ విధంగా సంభాషించసాగారు.
ముగ్గురు మునీశ్వరులు : ఓ మునివర్యులారా! ఉద్గీథగానము (తత్త్వవర్ణన, తత్త్వ ప్రశంస) యందు కుశలురమైనాము కనుక, మీరు ఇష్టపడితే మనము ఉద్గీథ గానము గురించి సంభాషించుకుందాము.
2. తథా ఇతి హ సముపవివిశుస్స హ
ప్రవాహణో జైవలిః ఉవాచ
భగవంతౌ అగ్రే వదతాం బ్రాహ్మణ
యోః వదతోః వాచగ్ం శ్రోష్యామి ఇతి।
మునుల సభ ప్రారంభమైనది.
ప్రవాహణో జైవలి మునీంద్రుడు : (లేచి నిలుచుని) ఓ శాలవత్య కుమారులగు శిలకమునీంద్రా! దాల్భ్య వంశీయులగు చైకితాయన ముని సత్తమా! మీరిద్దరు అగ్రతాంబూలార్హులు. నాచే నమస్కారార్హులు. మీరు ముందుగా బ్రాహ్మణములను గానం చేయండి. మేమంతా శ్రవణము చేస్తాము.
3. స హ శిలకశ్శాలావత్యః
చైకితాయనం దాల్భ్యం ఉవాచ
హంత త్వా పృచ్ఛానీతి పుచ్ఛేతి హ ఉవాచ।।
శిలక శాలావత్యుడు : (చైకితాన దాల్భ్యునితో) అయ్యా। చైకితాన దాల్భ్య మహాశయా! నాదొక చిన్న ప్రశ్న! అనుజ్ఞ అయితే అడుగుతాను. ఈ రీతిగా ఈ సత్సంగ సందర్భమును మనిద్దరము ప్రారంభిద్దాము.
చైకితాన దాల్భ్యుడు : శిలక శాలవత్య మునీంద్రా! అట్లాగే అడగండి. నాకు తెలియవచ్చినంతవరకు మీ ప్రశ్నలకు సమాధానము మనవి చేస్తాను.
4. కా సామ్నో గతిః ఇతి?
‘‘స్వర’’ ఇతి హ ఉవాచ।
స్వరస్య కా గతిః? ఇతి ।
‘‘ప్రాణ’’ ఇతి హ ఉవాచ ।
ప్రాణస్య కా గతిః? ఇతి
‘‘అన్నమ్’’ ఇతి హ ఉవాచ।
అన్నస్య కా గతిః? ఇతి।
‘‘ఆప ఇతి’’ హ ఉవాచ।
(గతి = పోక; త్రోవ; ఉపాయము; శరణము; విధము; దశ; ఆధారము; చలనము; నడక; ప్రవేశము; ప్రాప్తి; దిక్కు; ఫలితము)
శిలక శాలవత్యుడు : ‘సామ’ యొక్క గతి (ఆశ్రయము) ఏమైయున్నది?
చైకితాన దాల్భ్యుడు : ‘స్వరము’.
శిలక శాలవత్యుడు : స్వరముయొక్క గతి ఏది?
చైకితాన దాల్భ్యుడు : ‘‘ప్రాణము’’
శిలక శాలవత్యుడు : ప్రాణముయొక్క ‘గతి’ ఏది?
చైకితాన దాల్భ్యుడు : ‘‘అన్నమ్’’ (ఇంద్రియములకు ఆహారమగుచున్న శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములు)
శిలక శాలవత్యుడు : ‘అన్నము’ యొక్క గతి ఏది?
చైకితాన దాల్భ్యుడు : ఆపః (జలము)
5. అపాం కా గతిః? ఇతి
‘‘అసౌ లోక’’ - ఇతి హ ఉవాచ।
అముష్య లోకస్య కా గతిః? ఇతి।
శిలక శలావత్య ముని : అపాం (జలము)నకు గతి ఏది?
చైకితాయన దాల్భ్య ముని : ఆ లోకము (స్వర్గలోకము; అముష్యలోకము)
శిలక శలావత్య ముని : అముష్యలోకము ఎటు గతిస్తోంది?
న స్వర్గం లోకం అతినయేత్ - ఇతి।। హ ఉవాచ।
స్వర్గం వయం
లోకగ్ం సామ అభిసగ్ంస్థాపయామః
స్వర్గసగ్ంస్తావగ్ం హి సామ ఇతి।।
చైకితాయన దాల్భ్య ముని : స్వర్గమునకు ఆవల ఇంకేమీ లేదు. అందుచేత స్వర్గలోకమునకు ఆవల స్తుతించవలసిన మరొక ‘గతి’ లేదు. ‘సామము’నే స్వర్గముగా వర్ణించుచున్నారు కదా!
స్వర్గములోనే సామము సంస్థితము. అందుచేత స్వర్గమునందే ‘సామము’ కొరకై వెతకి పట్టుకోవాలి. సామము స్వర్గలోకము దాటి వెళ్లవలసినది ఏదీ లేదు.
6. తగ్ం హ శిలకః శాలవత్యః
చైకితాయనం దాల్భ్యం ఉవాచ -
అప్రతిష్ఠితం వై కిల తే దాల్భ్య
సామ యస్తు ఏతర్హి బ్రూయాన్
మూర్ధా తే విపతిష్యతి - ఇతి।
మూర్ధా తే విపతేత్ - ఇతి।।
శిలక శాలవత్య ముని : ఓ చైకితాయన దాల్భ్య మునివర్యా! మీరు వర్ణించిన సామగానము గురించిన ముగింపులో ఒక అప్రతిష్ఠము (లేక) దోషము ఉన్నదని నా మనవి.
మీరు చేసిన సామగానము గురించిన ముగింపు - మీ శిరస్సు నేలకూలదని చెప్పగలరా?
- ఓ దాల్భ్యా! మీ బుఱ్ఱ (తల) క్రింద పడగలదు సుమా! (అనగా విజ్ఞుల సభలో మీరు తల వంచవలసి వస్తుంది - అని భావన)
7. హంతా। అహం ఏతత్
భగవతో వేదాని ఇతి
విద్ధీతి, హ ఉవాచ।
అముష్య లోకస్య కా గతిః? ఇతి।
‘అయం లోక’ - ఇతి। హ ఉవాచ।
అస్య లోకస్య కా గతిః? ఇతి।
న ప్రతిష్ఠాం లోకమ్
అతినయేత్ ఇతి। హ ఉవాచ
ప్రతిష్ఠాం వయం లోకగ్ం
సామ అభిసగ్ంస్థాపయామః
ప్రతిష్ఠా సగ్ంస్తావగ్ం హి సామ - ఇతి।।
చైకితాయన దాల్భ్యా ముని : హే భగవాన్! శిలకమునీశ్వరా! నాకు ఇంతకు మించి తెలియదు. అందుచేత మీరు ‘సామగానము’ గురించి నేను చెప్పిన ‘స్వర్గలోకము’నకు మించి ఉత్తరోత్తర సత్యము ఏదైనా ఉంటే నాకు బోధించండి. నేను వింటాను.
శిలక శాలావత్య ముని : ఓ! తప్పకుండా! అడగండి. చెపుతాను.
చైకితాయాన దాల్భ్య ముని : అముష్య (స్వర్గ) లోకమునుండి ఆపై గతి ఏది?
శిలక శాలావత్యముని : ఈ భూలోకమే।
చైకితాయాన దాల్భ్య ముని : ఈ (భూ)లోకమునకు తరువాత గతి ఏది? సారాంశము ఏది?
శిలక శాలవత్యముని : సారాంశము సామగానమే. అట్టి సామగానమును ఎవ్వరు లోకమునుండి మరొకచోటికి తీసుకుపోలేరు.
సామగానమును ఈ లోకముననే సిద్ధించుకోవాలి.
సామగాన సారాంశమే ‘పృథివి’.
8. తగ్ం హ ప్రవాహణో జైవలిః ఉవాచ
అంతవత్ వై కిల తే శాలావత్య సామ
యస్తు ఏతర్హి బ్రూయాన్ మూర్ధా తే
విపతిష్యతి ఇతి। మూర్ధా తే విపతేత్ ఇతి।।
ప్రవాహణ జైవలి : ఓ శిలక శాలపత్యమునీ! ‘సామగానము’ మరొక రీతిగా విశదీకరించబడుతోంది. ఆ మీరు చెప్పినదానికి మరొక వేరైన వివరణను విన్నవారు ‘‘మీ శిరస్సు నేలవాలుతుంది’’ - అని చెప్పగలరు.
మీ శిరస్సు నేల కూలగలదు. (నీవు వారి అభిప్రాయము ముందు తలవంచవలసి వస్తుంది?)
హంత అహం ఏతత్
భగవతో వేదాని ఇతి
విద్ధి ఇతి హ ఉవాచ।।
శిలక శాలవత్యముని : మహనీయా! ప్రవాహణ జైవలి మునీంద్రా। భగవాన్। మీ దృష్టిలో ఉన్న అట్టి - ఆ పై విద్యాక్రమము ఏమిటో మీరే దయచేసి వివరించండి. నేను శ్రవణము చేసి నేర్చుకోవటానికి సంసిద్ధుడనై ఉన్నాను.
ప్రవాహణ జైవలి : అట్లే చెప్పుతాను. వినండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే అష్టమః ఖండః


1–9. ప్రథమ ప్రపాఠకః - నవమః ఖండః - సామ యొక్క గతి ఆత్మయే!

1. అస్య లోకస్య కా గతిః ఇతి?
ఆకాశ ఇతి హ ఉవాచ
సర్వాణి హ వా ఇమాని భూతాని
ఆకాశాత్ ఏవ సముత్పద్యంత।
ఆకాశం ప్రత్యస్తం యన్తి
ఆకాశో హి ఏవ ఏభ్యో జ్యాయాన్
ఆకాశః పరాయణమ్।।
శిలక శాలావత్యముని : ఈ లోకముయొక్క లోకానంతరపు గతి ఏది?

ప్రవాహణ జైవలి : లోకము యొక్క గతి ‘‘ఆకాశము’’. ఎందుకంటే, ఈ జీవులంతా ఆకాశమునుండే పుట్టుచున్నారు. తిరిగి ఆకాశమునందే లీనము అగుచున్నారు.
సమస్తము ఆకాశమునుండే బయల్వెడలుతోంది. కనుక పంచభూతములలో ఆకాశమే తదితర భూ-జల-అగ్ని-వాయువుల కంటే గొప్పది. పెద్దది. శ్రేష్ఠము. ఆకాశమే ఆధారము. అందుచేత ఆకాశతత్త్వమే పరాయణము (శ్రేష్ఠాతిశ్రేష్ఠము).
2. స ఏష పరోవరీయాన్ ఉద్గీథః।
స ఏషో అనంతః పరోవరీయో
హ అస్య భవతి।
పరోవరీయ, సో హ లోకాన్
జయతి య ఏతత్ ఏవం విద్వాన్
పరోవరీయాగ్ం సముద్గీథమ్ ఉపాస్తే।
అట్టి అత్యంత సూక్ష్మము, శ్రేష్ఠము అగు ఆకాశముకంటే కూడా ఆత్మతత్త్వగాన రూపమగు ‘ఉద్గీథము’ ఎంతో సూక్ష్మము, శ్రేష్ఠము కూడా.

అట్టి ఆత్మ గురించిన ఉద్గీథా వాక్యంగా - ఆత్మ అనంతము!

‘‘అట్టి పరోవరీయమే (పరమాత్మ స్వరూపమే) ఈ సమస్తము అయి ఉన్నది’’ - అని ఎరిగినవాడు దివ్య - (స్వర్గ) లోకముతో సహా సమస్త లోకములను జయించి వేయగలడు.

అట్టి పరోవరీయమ్ (పరమాత్మయే) విద్వాంసులు సముద్గీథము (గానము) చేస్తూ ఉపాసించవలసిన పరాకాష్ఠగా భావిస్తున్నారు.
3. తగ్ం హ ఏతం అతిధన్వా శౌనక ఉదర
శాండిల్యాయ ఉక్త్వా ఉవాచ
యావత్ త ఏనం ప్రజాయాం
ఉద్గీథం వేదిష్యన్తే పరోవరీయో హి ఏభ్యః,
తావత్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి।।
శునక మహాముని కుమారుడు శౌనకుడు - అతిధన్వా నామధేయుడు, ఉదర శాండిల్యునికి ఈ విధంగా బోధిస్తూ - ఇంకా ఇట్లు చెప్పసాగారు.

అట్టి పరోవరీయము ఉద్గీథా గానముగా ఉపాసించుచుండగా వారు పరంపరగా ఉత్తమ జీవనము పొందగలరు. ఈ లోకములో జీవితము యొక్క సార్థకత సిద్ధించుకోగలరు.
4. తథా అముష్మిన్ లోకే లోక ఇతి।
స య ఏతత్ ఏవం
విద్వాన్ ఉపాస్తే పరోవరీయ ఏవ హ
అస్య అస్మిన్ లోకే జీవనం భవతి,
తథా అముష్మిన్ లోకే లోక ఇతి,
లోకే లోక ఇతి।।
అంతేకాదు. అట్టి పరోవరీయోపాసనచే ఆముష్మిక (ఉత్తరోత్తర - స్వర్గ - దివ్య) లోకములలో కూడా కీర్తిమంతులు కాగలరు.

పరోవరీయ ఉద్గీథము (ఆత్మోపాసన) ఎరిగినవారు ఐహిక-ఆముష్మిక లోకములలో విజయము పొంది, లోక-లోకములలో ప్రకాశవంతులై, లోకాతీత స్థానము సిద్ధించుకోగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే నవమః ఖండః


1–10. ప్రథమ ప్రపాఠకః - దశమః ఖండః - యజ్ఞములకు ప్రస్తావ - ప్రతిహర్త దేవతలు ఎవరు?

1. మటచీ హతేషు కురుషు ఆటిక్యా
సహ జాయయా ఉషస్తిః హ
చాక్రాయణ ఇభ్యగ్రామే
ప్రద్రాణక ఉవాస।।

‘కురు’ అనే దేశంలో ఒకానొక సమయంలో తుఫాను - వడగళ్ళ వానల కారణంగా పంటలన్నీ పాడైపోయినాయి. ఆ దేశంలోగల ‘ఇభ్య’ అనే మావటివారి నివాస గ్రామంలో చక్రాయణుడు అను మరొక పేరుగల ఉషస్తి ముని, ఇంకా యవ్వనము కూడా రాని వారి ధర్మపత్నితో నివసిస్తూ ఉండేవారు.
అది పేదలు నివసిస్తున్న ఒక మారుమూల గల పల్లెటూరు.

2. స హ ఏభ్యం కుల్మాషాన్ ఖాదన్తం బిభిక్షే।
తగ్ం హ ఉవాచ ।
న ఏతో అన్యే విద్యన్తే యత్ చ,
యే మ ఇమ ఉపనిహితా ఇతి।।
ఆ ఉషస్తి ముని ఒకరోజు ఒక మావటివాని ఇంటి దగ్గర నిలబడి భిక్షాం దేహి అని భిక్షము అడిగారు.

మావటివాడు : ఓ ఉషస్తి మునీశ్వరా! మీకు తెలుసు కదా, ఇవి కరువుకాటకపు రోజులని! ఇంట్లో ఉలవ గుగ్గిళ్ళు (గుర్రాలకు ఆహారము) (లేక పుచ్చిన మినుగులు) మాత్రమే ఉన్నాయి. మరింకేమీ లేవు. ఈ గుగ్గిళ్ళు మాత్రం ఉడకపెట్టి మీకు ఇవ్వగలను. తీసుకొంటారుగా మరి?
(కుల్మాషము = గుగ్గిళ్ళు, కుడితినీరు)
(మినుగులు - అని కూడా అర్థం చెప్పబడింది)
3. ఏతేషాం మే దేహి ఇతి। హ ఉవాచ
తాన్ అస్మై ప్రదదౌ హంత
అనుపానమ్ ఇతి ఉచ్ఛిష్టం వై।
‘‘మే పీతగ్ం స్యాత్ ఇతి’’ హ ఉవాచ।।
ఉషస్తి ముని (చక్రాయణుడు) : నాయనా! మీరు కలిగియున్నవే తినటానికి నాకు ఇవ్వండి. నాకు చాలా ఆకలి వేస్తోంది. మీ దగ్గర లేనివాటి గురించి మీరు మాత్రం ఏమిచేస్తారు?

మావటివాడు : అయ్యా! ఇదిగో పుచ్చి ఉన్న ఈ గుగ్గిళ్ళు మీకు సంతోషంగా ఇస్తున్నాను. అయితే త్రాగటానికి మంచినీరు లేదు. మురికి నీరు మాత్రమే ఉన్నది. అవి ఎంగిలివి కూడా! (జంతువులు ఎంగిలి చేసాయి).

ఉషస్తి ముని : బిడ్డా! అట్లాగే! మీరు ఇంట్లో ఏ నీరు త్రాగుచున్నారో, ఆ నీరే ఇవ్వండి. నేను సంతోషంగా త్రాగుతాను. ఎంగిలి నీరైనా కూడా - దాహం తీరుస్తాయా? లేదా? అనేది ముఖ్యం. జగత్తులో ఎంగిలి కానిదేముంటుంది?
4. న స్విత్ ఏతే అపి ఉచ్ఛిష్టౌ ఇతి న వా?
ఆజీవిష్యం ఇమాన్ అఖాదన్ ఇతి
హ ఉవాచ।
కామో మ ఉదకపానం ఇతి।

(గుగ్గిళ్ళు తిన్న తరువాత)
‘‘నాయనా! ఆకలి తీర్చటానికి ఉపయోగపడుచూ ఉన్నప్పుడు - ఏ పదార్థమైనా నీచము’ అని, మరొకదానిని ఉచ్చము అని ఎట్లా అంటాము? అందుచేత చక్కగా తిన్నాను. నీవు ఇచ్చిన నీళ్లు కూడా నా దాహం తీర్చింది. నాకు సంతోషము’’ - అని ఆ మావటివానిని ఉషస్తముని ఆశీర్వదించారు.

5. స హ ఖాదిత్వా అతిశేషాన్ జాయాయా ఆజహార।
సా అగ్ర ఏవ సుభిక్షా బభూవ తాన్ ప్రతిగృహ్య నిదధౌ।
తాను తిన్న తరువాత మిగిలిన కొంచము గుగ్గిళ్ళను భార్య యొక్క ఆహారము కొరకై ఇంటికి తీసుకొనిపోయారు. ఆమె భిక్షము ఎత్తుకొని వచ్చి అప్పటికే ఆహారము భుజించియున్నందువల్ల భర్త తెచ్చిన గుగ్గిళ్ళను ఇంటిలో దాచిపెట్టింది.
6. స హ ప్రాతః సంజిహాన ఉవాచ
యత్ బత అన్నస్య లభేమహి లభేమహి ధనమాత్రామ్
రాజా అసౌ యక్ష్యతే స మా సర్వైః
ఋత్విజైః వృణీత ఇతి।।
ఆ మరునాడు నిదురలేచిన తరువాత ఆ చాక్రాయణ ఉషస్తిముని ఇట్లా పలికారు.

‘‘ఓ భార్యామణీ! ఆహా! మరికొన్ని గుగ్గిళ్ళు ఉంటే బాగుండేది. హాయిగా తినే వాళ్ళం. ఇదంతా ధనం లేక పోవటంవలనే కదా! ధనం సంపాదించదలిచాను. ఈ సమీపంలోగల ఒక ప్రదేశంలో రాజుగారు ఒక యజ్ఞం చేస్తున్నారని విన్నాను. వెళ్లి వారి యజ్ఞ కార్యక్రమములోని ఋత్విజులలో ఒకడినై యజ్ఞ కార్యక్రమమును సేవిస్తాను. వారు నన్ను స్వీకరించవచ్చు కదా! అప్పుడు ఋత్విజ సంభావన రాజుగారు ఇవ్వవచ్చు కదా!"
7. తం జాయా ఉవాచ
హంత। పత ఇమ ఏవ
కుల్మాషా ఇతి తాన్
ఖాదిత్వా అముం యజ్ఞం వితతం ఏయాయ।।
చక్రాయణ నామధేయ ఉషస్తిముని మాటలకు ఆయన భార్య సంతోషించారు. రాత్రి తాను దాచిపెట్టిన ఉలవచిక్కుళ్ళ గుగ్గిళ్ళు (కుల్మాషములు) తెచ్చి ఇచ్చి, యాగము జరిగేచోటికి వెళ్లి ఋత్విక్కుగా పాల్గొనమని ప్రోత్సాహం చేసారు.
ఆ కుల్మాషములు తిని ఆ ఉషస్తి ముని యజ్ఞము చేయుచున్న చోటికి వెళ్లారు. యజ్ఞకర్తయగు రాజును దర్శించారు.
8. తత్ర ఉద్గాతౄన్
ఆస్తావే స్తోష్యమాణ
అనుపోపవివేశ,
స హ ప్రస్తోతారం ఉవాచ।
యజ్ఞ వేదిక వద్ద:-
ఆ తరువాత స్తోత్రములు చేయుచున్న ఉద్గాతలు (ఋత్విక్కుల) మధ్యగా వెళ్లి కూర్చున్నారు.
ఇక యజ్ఞం ఆరంభం కాబోతోంది.
ఉషస్తిముని అక్కడ యజ్ఞ ప్రదేశములో గల ‘ప్రస్తోత’తో ఇట్లు పలికారు.
9. ప్రస్తోతః యా దేవతా
ప్రస్తావం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోష్యసి
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
ఉషస్తిముని : అయ్యా ప్రస్తోతగారూ! మీరు ప్రస్తావం (Introduction) చేస్తూ ఏ దేవతను ప్రస్తుతిస్తున్నారో, తెలుసు కదా? అట్టి ప్రస్తావ దేవతయొక్క తాత్త్విక ప్రయోజనమైన పరమార్థమును తెలుసుకొనియే చేస్తున్నారు కదా? ఒకవేళ ‘ప్రస్తావ దేవత’ పరమార్థమును తెలియకుండానే చేస్తున్నారా ఏమి?
తెలియకుండా, దేవతా స్తుతులు మాత్రం గానం చేస్తూ ఉంటే - మీరు ఎప్పుడో మీ తల దించుకోక తప్పదు.
ప్రస్తావ దేవత తెలియకుండా ఉన్నవారైతే మీ తల ఆ విధంగా తెగి నేలకూలుతుంది.
10. ఏవం ఏవ ఉద్గాతారం ఉవాచ
ఉద్గాతః యా దేవత ఉద్గీథం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి,
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
ఆ తరువాత ఉగ్దాతారునివైపు చూచి, ఆ ఉద్గాతారునితో ఇట్లా అన్నారు.

ఓ ఉద్గాతారా! ఏ దేవత గురించి మీరు‘‘ఉద్గీథ గానము’’ చేస్తూ ఉన్నారో, అట్టి దేవత ఎవరో తెలియకుండా (అవిద్వాన్) - గానము మాత్రము చేస్తూ ఉంటే (ఉద్గాస్యసి-కిం) - అప్పుడు మీరు శిరస్సు వంచుకోవలసి వస్తుంది. విదిత వేద్యుల సభలో మీ శిరస్సు తెగి క్రింద పడగలదు.
11. ఏవం ఏవ ప్రతిహర్తారమ్ ఉవాచ
ప్రతిహర్తః యా దేవతా ప్రతిహారమ్
అన్వాయత్తా, తాం చేత్
అవిద్వాన్ ప్రతిహరిష్యసి।
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
అటు తరువాత ఉషస్తిముని అక్కడి ప్రతిహర్తారుని స్థానంలో ఆసీనులైన ప్రతివర్తారుని చూచి ఇట్లా పలికారు.

ఓ ప్రతిహర్తార ఋత్విక్కు మహాశయా! మీరు కనుక ప్రతిహర్తార దేవత ఎవరో, పరమార్థమును తెలియకుండా ప్రతిహార (ద్వారపాలక) గానము చేస్తూ ఉంటే (స్వాగత ప్రవచనాలు పలుకుతూ ఉంటే)
- మీరు అవిద్వాంసులై ప్రతీహారము (Punishment) పొందగలరు సుమా! మీరు శిరస్సు దించుకోవలసిన సమయం వస్తుంది, అనగా మీ పాండిత్యపు శిరస్సు తెగిపోగలదు. అందుచేత ప్రతిహర్తార్య దేవతను తెలుసుకొని ఉన్నారని అనుకుంటున్నాను.
తే హ సమారతాః తూష్ణీం
ఆసాంచక్రిరే।।
అట్టి ఉషస్తిముని వాక్యములు విని యజ్ఞకర్త అక్కడ యజ్ఞము నిర్వర్తిస్తున్న వారు, పర్యవేక్షిస్తున్నవారు, ఆ కార్యక్రమంలో ఉపాసకులై పాల్గొనుచున్న వారు - వారంతా కూడా, వారివారి పనులను ఆపి - ఉషస్తిముని ఆసీనులై ఉన్నచోట దృష్టి సారించసాగారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే దశమః ఖండః


1–11. ప్రథమ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - ఆదిత్యుడు ప్రస్తావ దేవత, అన్నమే ప్రతిహర్త

1. అథ హ ఏనం యజమాన ఉవాచ-
భగవన్ తం వా అహం వివిదిషాణీ ఇతి।
ఉషస్తిః అస్మి చాక్రాయణ
ఇతి హ ఉవాచ।।
యజ్ఞముయొక్క యజమాని (యజ్ఞకర్త అయిన రాజుగారు):
అయ్యా। భగవాన్। మీరెవ్వరో, ఎందుకు వచ్చారో, ఏమి ఉద్దేశ్యమో ఈ యజ్ఞప్రాంగణ సభకు ముందుగా వివరిస్తూ తెలియజేయమని నా ప్రార్థన.

ఉషస్తిముని : అయ్యా, నేను చక్రాయణ మహర్షి కుమారుడను. చాక్రాయణుడను. ఉషస్తి మునిగా మునుల లోకంలో పిలువబడువాడను.
2. స హ ఉవాచ -
భగవన్తం వా అహం ఏభిః సర్వైః ఆర్త్విజ్యైః
పర్య ఏషిషం భగవతో వా
అహం అవిత్త్యా అన్యాన్ అవృషి।।
భగవాగ్ంస్త్వ (త్వ) ఏవ మే సర్వైః
ఋత్విజైః ఇతి ।
ఋత్విక్కు (మరియు) యజమాని :
హే భగవాన్। నమో నమః। మీరు ఉద్గీథ గాన దేవత యొక్క తాత్త్వికార్థము ఎరిగి ఉండుటము గురించి ప్రశ్నిస్తున్నారు కదా. సంతోషము. మిమ్ములను ఋత్విజునిగా ఈ యజ్ఞమునకు ఆహ్వానించాలని మేము అనుకొన్నాము. మీ గురించి అన్వేషించి ప్రయత్నించాము కూడా. మీరు మా వార్తాహరులకు దొరకలేదు. అందుచేత వేరే ఋత్విజులను నియమించాము. సరే"! ఇప్పుడు ఈ యజ్ఞమును ఋత్విజులై పర్యవేక్షించవలసినదిగా మా విన్నపము.
3. తథా ఇతి।

అథ తర్హి ఏత ఏవ సమతిసృష్టాః
స్తువతాం యావత్ తేభ్యో ధనం
దద్యాః తావన్ మమ దద్యా ఇతి
తథా ఇతి హ యజమాన ఉవాచ।
ఉషస్తిముని :
భగవాన్। యజమానీ! ఈ యజ్ఞమును నిర్వహించటానికి నేను సిద్ధమే. అందుకు రెండు నియమములు మీరు అంగీకరించెదరు గాక!
(1) నేను ఋత్విజునిగా యజ్ఞము నిర్వహిస్తుండగా ఋత్విజులంతా నేను చెప్పిన రీతిగా, నా ఆధ్వర్యంలో స్తుతిగానములు అర్థము తెలుసుకొంటూ చేయుచుండెదరు గాక।
(2) ఈ ఋత్విజులందరికీ ఎంత ధనము ఇస్తున్నారో, అంతమాత్రమే ధనమును నాకు కూడా ఋత్విజ తాంబూలముగా ఇప్పించండి, అంతకుమించి వద్దు.
యజమాని : మీ రెండు నియమములు నాకు అంగీకారమే.
4. అథ హ ఏనం ప్రస్తోత ఉపససాద।
ప్రస్తోతః యా దేవతా ప్రస్తావం
అన్వాయత్తా తాం చేత్ అవిద్వాన్
ప్రస్తోష్యసి, - మూర్ధా తే విపతిష్యతి ఇతి।
మా భగవాన్ అవోచత్
కతమా సా దేవతా? ఇతి।।
ప్రస్తోత (దేవతాహ్వానములను, తదితర మంత్రములను ప్రస్తావన చేస్తూ విస్తరించి సవివరించు ఋత్విక్కు ):-
హే ఉషస్తి భగవాన్! ప్రస్తుతించబడుచున్న దేవత ఎవరో తెలుసుకోకుండా, అవిద్వాంసుడై - ప్రస్తావన (Introductory) గానము చేస్తూ ఉంటే శిరస్సు దించవలసిన సందర్భం వస్తుందని (శిరస్సు ఖండింపబడగలదని) మీరు ఇప్పుడు అని ఉన్నారు కదా! హే భగవాన్! ఈ యజ్ఞములో ఉద్గీథ గానము చేయబడు దేవత ఎవరు? మీకు తెలిసి ఉంటుంది. దయచేసి వివరించండి.
5. ‘‘ప్రాణ’’ ఇతి హ ఉవాచ।
సర్వాణి హ వా ఇమాని భూతాని
ప్రాణం ఏవ అభిసంవిశంతి। ప్రాణం అభి ఉజ్జిహతే।
స ఏషా దేవతా ప్రస్తావం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ప్రాస్తోష్యో
మూర్ధా తే వ్యపతిష్యత్
తథా ఉక్తస్య మయా ఇతి।।
స్తిముని :

యజ్ఞమునకు ముఖ్యమైన, ముందుగా ప్రస్తావించవలసిన ప్రస్తోత దేవత - ‘‘ప్రాణదేవతయే’’!

ఈ సృష్టిలో కనిపిస్తున్న చరాచరములన్నీ కూడా చివరికి ‘‘ప్రాణశక్తి’’ యందే లయమగుచున్నాయి.
ప్రాణమునందే సృష్టి సమయంలో తిరిగి ఉద్భవిస్తూ ఉన్నాయి.
అందుచేత ప్రస్తావ గానమునకు దేవత ‘‘ప్రాణమే’’। - అని పూజ్యులగు వేదవిదుల నిర్ణయము.

అట్టి ప్రాణదేవత గురించి మీరు తెలుసుకోకుండా (లేదా - ఋత్విక్కుగా నేను సభకు తెలియజేయకుండా), కేవలము ఉద్గీథ గానము నోటితో మాత్రమే పలుకుతూ ఉంటే - అర్థం తెలియకుండా ప్రస్తావ గానమును చదువుతూ ఉంటే అట్టి ఋత్విజుడు ఎప్పటికైనా ఎక్కడో తలవంచుకొని సిగ్గుపడక తప్పదు. అందుచేత ‘‘శిరస్సు తెగిపోగలదు’’ అని నాచే జాగ్రత్త చెప్పబడింది.
6. అథ హ ఏనం ఉద్గాత ఉపససాద ఉద్గాతః
యా దేవతా ఉద్గీథం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి
మూర్ధా తే విపతిష్యతి ఇతి మా భగవాన్
అవోచత్ కతమా సా దేవతా ఇతి।
ఉద్గాత ఋత్విక్కు :
హే చక్రాయణ ఉషస్తిమునివర్యా! ఉద్గానముతో మనము ప్రశంసిస్తున్న (లేక) స్తోత్రము చేయుచున్న (లేక) ప్రస్తావము చేయుచున్న దేవతయొక్క ‘పరార్థము’ (తాత్త్వికార్థము) తెలియకుండానే అవిద్వాంసుడై ఉద్గీథస్తుతి పలుకుతూ ఉంటే - అట్టి అవిద్వాంసుడగు ఉద్గాతగా నా శిరస్సు నేలకూలగలదని మీరు ఇందాక హెచ్చరించారు కదా!

ఇప్పుడు మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను.

యాగములలో ఉద్గీథగానము చేస్తున్నాము కదా! అట్టి గానము చేయబడుచున్న దేవత ఎవరు? దయచేసి చెప్పండి! నేను మీనుండి ఎరుగుటకు సంసిద్ధుడను.
7. ‘‘ఆదిత్య’’ ఇతి హ ఉవాచ
సర్వాణి హ వా ఇమాని భూతాని
ఆదిత్యమ్ ఉచ్చైః సన్తం గాయన్తి!
స ఏషా దేవతా ఉద్గీథం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ఉదగాస్యో -
మూర్ధా తే వ్యపతిష్యత్
తథా ఉక్తస్య మయా ఇతి।
ఉషస్తిముని :
అట్టి ఉద్గీథము (లేక) ఉద్గీథ గానము ఉద్దేశ్యించు ప్రస్తావ దేవత ‘‘ఆదిత్యుడు (లేక) సూర్య భగవానుడే’’।
ఆదిత్యుడు ఉదయించగానే ఈ చరాచర ప్రకృతి అంతా, ఈ భూతజాలమంతా కూడా ఉత్తేజితమై నిదుర లేస్తోంది. ఆ సూర్యభగవానుని ఉద్గీథ (మహాత్మ్య) గానము చేస్తూ ‘జాగ్రత్’ను స్వీకరిస్తోంది.

ఈ విషయము ఎరిగి - వేదగానము చేస్తూ యజ్ఞ / యాగ విధానము ప్రారంభం చేయాలి. ‘‘ఈ సూర్యుడే పరమాత్మ’’ అని ఎరుగకుండా, ప్రస్తావ దేవతగా భావించకుండా ప్రస్తావన స్తుతులు గానం చేస్తూ ఉంటే, అట్టివాడు తలవంచవలసి ఉంటుంది. (శిరస్సు తెగి నేలపై పడుతుంది) - అని గుర్తు చేయటానికే ‘‘ప్రస్తోత ప్రస్తావ దైవమును ఎరిగి ఉండాలి’’ - అని నేను చెప్పాను.
8. అథ హ ఏనం ప్రతిహర్తా ఉపససాద ప్రతిహర్తః
యా దేవతా ప్రతిహారం అన్వాయత్తా,
తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి,
మూర్ధా తే విపతిష్యతి ఇతి।
మా భగవాన్ అవోచత్
కతమా సా దేవతా ఇతి।
ప్రతిహర్త (అడ్డగించు, విరుద్ధ, విరాస్త, తోసిపుచ్చు చమత్కారి) :
ఓ చక్రాయణ ఉషస్తి మునీశ్వరా! భగవాన్!

‘‘ప్రతిహర్తగా దేవత ఎవరో, దివ్యతత్త్వము ఏమిటో - తెలుసుకోకుండా ప్రతిహర్తగా గానం చేస్తూ ఉంటే, తత్త్వార్థము పట్ల అవిద్వాంసుడై (పరమార్థము తెలియకయే) ప్రతిహారము నిర్వర్తిస్తూ ఉంటే - అప్పుడు తలదించవలసి ఉంటుంది (తల తెగిపడినట్లు అవుతుంది) - అని మీరు అభిప్రాయము చెప్పారు కదా!

అట్టి ప్రతిహర్త (ప్రతిహర) దేవత ఎవరై ఉన్నారో - దయతో వివరించండి. నేను మీ వద్ద ఈ విషయం అధ్యయనుడను అవుతాను.
9. ‘‘అన్నం’’ ఇతి హ ఉవాచ।
సర్వాణి హ వా ఇమాని భూతాని
అన్నం ఏవ ప్రతిహరమాణాని జీవన్తి।
స ఏషా దేవతా ప్రతిహారం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యో,
మూర్ధా తే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇతి।
తథా ఉక్తస్య మయా ఇతి।
ఉషస్తిముని :

అట్టి దేవత ‘‘అన్నము’’. ఎందుకంటే, ఈ చరాచర జీవరాసులంతా అన్నముయొక్క ప్రతిక్రియచేతనే జీవిస్తూ ఉన్నారు కదా।
ప్రతిహార గాన యుక్తము ‘‘అన్నము’’ అని తెలియక గానము చేస్తే, అర్థము తెలియకుండా గానము చేయటం చేత (అవిద్వాంసుడు అవటంచేత) అట్టి ప్రతిహర్యము వలన ఎప్పుడో తలవంచవలసి వస్తుంది. అందుకే తల తెగగలదు, అని నాచేత చెప్పబడింది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ఏకాదశః ఖండః


1–12. ప్రథమ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - శ్వేత శునకములు సామగానం చేయుట

1. అథ అతః శౌవ ఉద్గీథః।

తద్ధ బకో దాల్భ్యో గ్లావో వా మైత్రేయః
స్వాధ్యాయం ఉద్వవ్రాజ।।
(అర్థము / దేవతయొక్క తత్త్వార్థము తెలియకుండా ఉద్గీథ గానము చేయటం విషయంలో) - కుక్కలు కూడా ఉద్గీథ గానము చేయగలవు కూడా!
ఒకప్పుడు దాల్భ్య బకముని మైత్రేయ గ్లావ ఋషి దగ్గిరకు వెళ్లి అక్కడ ఆశ్రమంలో స్వాధ్యాయము చేయనారంభించారు. అక్కడి గ్రామ సమీపంలోగల ఆశ్రమంలో వేదములు అభ్యసించసాగారు.
2. తస్మై శ్వా శ్వేతః ప్రాదుః బభూవ।

తం అన్యే శ్వాన ఉపసమ ఇతి ఊచుః

అన్నం నో భగవాన్।
అగాయతి అశనాయామ వా ఇతి।।
కుక్కల (శ్వా-శ్వేతః) రూపందాల్చి అక్కడికి తెల్లటి కుక్కల రూపంలో వేదగాన దేవతలు వచ్చారు.

అక్కడ ఒక తెల్లటి కుక్క వేదాధ్యయనులను సమీపించి ఇట్లా పలకసాగింది -

ఓ దివ్యవేదాధ్యయన దేవతలారా! మాకు ఆకలి వేస్తోంది. అన్నము ఇప్పించండి. మీకు వశముగా ఉండి మేము కూడా గానం చేస్తాము
3. తాన్ హ ఉవాచ
ఇహ ఏవ మా ప్రాతః
ఉపసమీయాత -ఇతి।
తత్ హ బకః దాల్భ్యో గ్లావో వా మైత్రేయః
ప్రతిపాలయాంచకార।
ఉద్గీథ దేవతా శ్వేత శునకములు ఇట్లు చెప్పెను -
‘‘రేపు ఉదయం మా దగ్గరకు రండి’’.

బకముని (దాల్భ్య బకముని), మైత్రేయ గ్లావ ఋషి ఆ సమీపమున వేచి ఉండసాగారు (నిరీక్షించసాగారు). ఉద్గీథమును గానము చేస్తున్న శ్వేత శునకరూప గానదేవతలను గమనిస్తూ ఉండసాగారు.
4. తే హ యథ ఏవ ఇహ బహిః పవమానేన
స్తోష్యమాణాః సగ్ంరబ్ధాః
సర్పన్తి ఇతి ఏవం ఆససృపుః
తే హ సముపవిశ్య హిం చక్రుః।
ఆ దేవతా శునకములు ఋత్విక్కులు గానం చేసే విధంగానే - అవయవములు త్రిప్పుతూ, మధురంగా ఉద్గీథగానము చేయసాగాయి. ఆ తరువాత ఆ శునకములు మంత్రములు చెప్పుచూ కూర్చుండిపోయాయి.
‘‘ఓ యజ్ఞపురుషుడా! ఓ యాగకర్తా। నమస్కారము।
ఓం। మమ్ములను ‘అన్నము’ తిననీయండి.
‘ఓం’। పానీయములు త్రాగనీయండి
అని సమీపమున కూర్చుని అర్థించసాగాయి.
5. ఓం ఆదామ ఓం పిబామ
ఓం దేవో వరుణః, ప్రజాపతిః,
సవితా, అన్నం ఇహ ఆహరత్
అన్నపతే! అన్నం
ఇహ ఆహర ఆహర ఓం ఇతి।
ఓం। మమ్ములను ఆహారము తిననీయండి. త్రాగనీయండి. పాడనీయండి।
దేవదేవుడగు వరుణ భగవానుడు, ప్రజాపతి, సవిత్రు (సూర్య) దేవుడు మాకు అన్నమును ప్రసాదించెదరు గాక।
ఓ అన్నదేవతా! అన్నపూర్ణాదేవీ! మీరు మాకు అన్నము చేకూర్చండి. ఇక్కడ మేమున్నచోటనే ప్రసాదించండి. మాకు అన్నమును సమకూర్చమని అభ్యర్థన। ఇక్కడకు తెమ్ము! తెమ్ము! ఓం - ఇతి।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ద్వాదశః ఖండః


1–13. ప్రథమ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - సామగాన స్వరములకు దేవతలు

1. అయం వావ లోకో ‘హా’ ‘ఉ’కారః - వాయుః।
‘హా’ ‘ఇ’కారః చన్ద్రమా అథకారః।
ఆత్మా ‘‘ఇహ’’కారో।
అగ్నిః ఈకారః।
ఈ లోకము ‘హా’ ‘ఉ’కారము.
వాయువు ‘హా’ ‘ఇ’కారము.
చంద్రుడు ‘అథ’ కారము
ఆత్మ (జీవాత్మ) (ఇహ) ‘ఇ’ కారము
అగ్ని ‘ఈ’ కారము.
2. ఆదిత్య ‘ఊ’ కారః।
నిహవ ‘ఏ’కారః।
విశ్వేదేవా ఔహోయికారః।
ప్రజాపతిః ‘హిం’కారః।
ప్రాణః స్వరో।
అన్నం యా।
వాక్ విరాట్।
ఆదిత్యుడు - ‘ఊ’ కారము
నిహవము (ప్రార్థన) - ‘ఏ’ కారము
విశ్వేదేవతలు - ‘ఔ’ ‘హో’ ‘ఇ’కారములు
ప్రజాపతి - ‘హిం’ కారము
ప్రాణము - స్వరము
అన్నము - ‘యా’ అనే స్తోభయందు భాసించవలెను (ప్రాణమును నిలుపునది)
విరాట్ - వాక్కు
3. అనిరుక్తః త్రయోదశః
స్తోభః సంచరో ‘హుం’కారః।
‘హుం’కారము అనిర్వాచ్యమగు (That which cannot be told by speaking) 13వ అక్షరము - స్తోభ.
స్తోభ = ‘హుం’ కార సంచారము, అనిర్వాచ్యము, వాక్కుకు అందనిది.
4. దుగ్ధే అస్మై ‘వాక్’ దోహం యో వాచో
దోహో అన్నవాన్, అన్నాదో భవతి
య ఏతాం ఏవగ్ం సామ్నాం ఉపనిషదం వేద।
ఉపనిషదం వేద।। ఇతి।।
అట్టి సామగానము చేయువారు పాలవలె మధురము అగు అమృతరూపము సంతరించుకోగలరు.
అట్టి వారికి అన్నము అధికముగా లభించగలదు.
ఆతడు అన్నమును (ఇంద్రియములతో ఇంద్రియ విషయములను) తృప్తిగా భుజించగలడు.
పవిత్రమగు సామగానము చేయువారు పూతాత్ములు (నిర్మలాత్ములు). ఈ ఉపనిషత్ ఎరిగినవారు ధన్యులు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమోధ్యాయే త్రయోదశః ఖండః

🌺 ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమో2ధ్యాయః సమాప్తః 🌺


సామవేదాంతర్గత

Ⅱ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - రెండవ అధ్యాయము

2–1. ద్వితీయ ప్రపాఠకః - ప్రథమః ఖండః - సమస్త సామోపాసన

1. ఓం। సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగ్ం సాధు।



యత్ ఖలు సాధు తత్ సామ ఇతి ఆచక్షతే।


యత్ అసాధు తత్ అసామ ఇతి।
సామ ఉపాసన గురించి ఎరిగియున్న సాధు పురుషులకు నమస్కారము.
పరమాత్మతత్త్వము ఎరుగుచూ, స్తుతిస్తూ గానము చేయటమే ‘‘సామగానము’’.
సమస్త ఉపాసనలలో ‘‘సామోపాసన’’ శుభప్రదము.

ఎదైతే సాధువో (దైవీగుణములో, అమానిత్యాది జ్ఞాన లక్షణములు, అద్వేష్టాది భక్తినిర్వచములు) - అదంతా సామమే। మనము చేస్తున్న సామగానమే!

ఏది శాస్త్రముల చేత, అనుభవజ్ఞులగు పెద్దల చేత, సహజములగు సాత్విక జనుల చేత ‘‘అసాధు’’ (Not Appropriate) అనబడుచున్నదో అదంతా ‘‘అసామమే!’’
2. తత్ ఉత అపి ఆహుః
సామ్న ఏనమ్ ఉపాగాత్ ఇతి।
‘సాధున ఏనం ఉపాగాత్’, ఇతి ఏవ।
ఎవ్వరైనా, ‘‘సామగానముతో అభ్యర్థిస్తున్నారు. విన్నవిస్తున్నారు’’ - అని చెప్పితే అట్టివారు ‘‘సద్బుద్ధితోనే అది అడుగుచున్నారు’’ - అని గమనించాలి. గ్రహించాలి. వారు త్యాగబుద్ధితోనే అడుగుచున్నారని అనుకోబడుతోంది.
తత్ ఆహుః అసామ్న ఏనం ఉపాగాత్ ఇతి।
అసాధు న ఏనం ఉపాగాత్ ఇతి ఏవ - తత్ ఆహుః।।
అట్లా కాకుండా, ఎవ్వరైనా ‘‘ఆయన అసామగానముతో అది అడుగుచున్నారు’’ - అని చెప్పితే, దాని అర్థం - ‘‘అట్టివారు సంకుచితమగు, స్వార్థపూరితమగు, కామపూరితమగు బుద్ధితో మాత్రమే అడుగుచున్నారు’’ - అని గ్రహించాలి.
3. అథ ఉత అపి ఆహుః
సామ నో బత ఇతి
యత్ - సాధు భవతి।।
సాధు బత ఇతి ఏవ తత్ ఆహుః
అసామ నో బత ఇతి
యత్ అసాధు భవతి,
అసాధు బత ఇతి ఏవ తత్ ఆహుః।।
‘‘ఇదిగో, ఇది సామగానము. ఇది సామనము (సకల జనుల శ్రేయస్సును తమ దృష్టిలో కలిగియున్న మనస్సు). ఈ గాన శ్రవణము (సంభాషణ, శ్రవణము), సద్బుద్ధితో గానము - శ్రవణము పుణ్యప్రదము. ఇది ‘సాధు’.

సామ ఇంద్రియానము (లేక) లోకసంబంధమైన ఆనందము ఆశయముగా కలిగినది ‘అసాధు’ అగుచున్నది.

కామ్యబుద్ధితో, పాపము కలిగించునది అయి ఉన్నదంతా ‘అసాధు’ - ‘అసామ’। ఏది ‘సాధు’యో, ఏది ‘అసాధు’యో గ్రహించి ఉండాలి.
4. స య ఏతత్ ఏవం
విద్వాన్ సాధు ‘సామ’
ఇతి ఉపాస్తే, అభ్యాశో,
హ యత్ ఏనగ్ం సాధవో
ధర్మా ఆ చ గచ్ఛేయుః
ఉప చ నమేయుః।।
ఎవరైతే ‘సాధు’, ‘అసాధు’ అగుచున్న గానములేవో గ్రహించి, వివేకి అయి, విద్వాంసుడై ‘సామ’ను ఉపాసిస్తాడో, అభ్యాసం చేస్తాడో అట్టి సాధు - ధర్మ-ఆచరణను ఆశ్రయిస్తూ సర్వశుభములను, సంపదలను పొందుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ప్రథమః ఖండః


2–2. ద్వితీయ ప్రపాఠకః - ద్వితీయః ఖండః - పంచవిధ పృథివి సామోపాసన

1. లోకేషు పంచవిధగ్ం
సామా ఉపాసీత।

లోకంలో ‘‘సామము’’ - యొక్క ఐదు (5) విధములైన ‘ఉపాసన’
(1) ‘హిం’ ఆహ్వానము (Welcome)
(2) ప్రస్తావము (Introduction)
(3) ఉద్గీథము - మహిమ స్తుతి (Literary description)
(4) ప్రతిహారము - వ్యతిరిక్త ఖండనము
(5) నిధనము (సమాప్తి - End up / Conclusion)
పృథివీ ‘హిం’కారః।
అగ్నిః ‘ప్రస్తావో’
అన్తరిక్షం ‘ఉద్గీథ’।
ఆదిత్యః ‘‘ప్రతిహారో’’
ద్యౌః ‘‘నిధనం’’।
ఇతి ఊర్ధ్వ ఏషు।
పృథివి పంచవిధ సామోపాసనా!
(1) పృథివి - ‘హిం’ కారము (ఆహ్వానము)
(2) అగ్ని - ప్రస్తావము (దేవత గురించి ప్రస్తావించటము)
(3) అంతరిక్షము (ఆకాశము) - ఉద్గీథము (ఔన్నత్య వర్ణనము)
(4) ఆదిత్యుడు - ప్రతిహారము (వ్యావిరిక్తభావముల ఖండనము)
(5) ద్యౌః (ద్యులోకము, దేవతాలోకము, స్వర్గలోకము) - నిధనము (సమాప్తి)
ఈ విధంగా తెలుసుకొని ఉపాసిస్తూ ఈ జీవుడు ఊర్ధ్వగతులను ఊర్ధ్వస్థానములను సిద్ధించుకోగలడు.
2. అథ ఆవృత్తేషు
ద్యౌః ‘హిం’ కార।
ఆదిత్యః ‘‘ప్రస్తావో’’
అన్తరిక్షం ‘‘ఉద్గీథో’’
అగ్నిః ‘‘ప్రతిహారః’’
పృథివీ ‘‘నిధనమ్’’
ఇప్పుడిక ఆవృత్తమునందు (తిరిగి నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు) (లేక) అనుక్రమమునందు
(1) ద్యులోకము స్వర్గలోకము యొక్క స్వరము - ‘హిం’కార ఉపాసన
(2) ఆదిత్యము యొక్క స్వరము - ‘‘ప్రస్తావ’’ ఉపాసన
(3) ఆకాశము (అంతరిక్షము) యొక్క స్వరము - ‘ఉద్గీథ’ ఉపాసన
(4) అగ్ని యొక్క స్వరము - ‘ప్రతిహార’ ఉపాసన
(5) భూమి యొక్క స్వరము - ‘‘నిధన’’ ఉపాసన
3. కల్పన్తే హ అస్మై లోకా
ఊర్ధ్వాశ్చ, ఆవృత్తాశ్చ
య ఏతత్ ఏవం విద్వాన్ లోకేషు
పంచవిధం సామా ఉపాస్తే।।
ఈవిధంగా ఊర్ధ్వలోకములను (కిందనుంచిపైకి), ఆవృత్తములను (పైనుండి క్రిందికి) - స్వరములను గురించి తెలుసుకొని సామగానమును ‘5’ (పంచ) విధములుగా ఉపాసిస్తున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వితీయః ఖండః


2–3. ద్వితీయ ప్రపాఠకః - తృతీయః ఖండః - పంచవిధ సామగాన ‘‘వృష్టి’’ ఉపాసన

1. పృష్టౌ పంచవిధగ్ం
సామా ఉపాసీత।
పురోవాతో ‘హిం’ కారో
మేఘో జాయతే స ప్రస్తావో
వర్షతి స ఉద్గీథో
విద్యోతతే స్తనయతి।
స ప్రతిహారః।
వృష్టులు (కురిపించటము) 5 విధములగు సామములుగా ఉపాసించ బడుగాక।
(1) తూర్పు వాయువు - ‘హిం’కారోపాసనగా
(2) మేఘమును - ‘ప్రస్థాన’ ఉపాసనగా
(3) వర్షమును - ‘ఉద్గీథము’ ఉపాసనగా
(4) మెఱుపులను, పిడుగులను - ‘ప్రతిహార’ ఉపాసనగా
ఉపాసించబడు గాక!
2. ఉత్ గృహాణాతి తత్ ‘నిధనమ్’।


వర్షతి హ అస్మై వర్షయతి హ
య ఏతత్ ఏవం
విద్వాన్ వృష్టౌ
పంచవిధగ్ం సామా ఉపాస్తే।
(5) ఉపసంహారము (లేక) విరమించటమును - నిధనముగాను,
గానము చేస్తూ ఉపాసించబడుతోంది.

ఈ విధంగా వృష్టిని (వర్షమును) ప్రకృతియొక్క మహత్తరమైన ప్రసాదముగాను, పరమాత్మయొక్క కరుణా రసముగాను విద్వాంసులచే ఉపాసించబడుచున్నది.
ఇది విద్వాంసుల యొక్క ‘వృష్టిరూప పంచవిధ సామోపాసన।’

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే తృతీయః ఖండః


2–4. ద్వితీయ ప్రపాఠకః - చతుర్థః ఖండః - పంచవిధ జల సామోపాసన

1. సర్వాన్ అప్సు పంచ
విధగ్ం సామా ఉపాసీత।
మేఘో యత్ సంప్లవతే స ‘‘హింకారః’’।
యత్ వర్షతి స ప్రస్తావో
యాః ప్రాచ్యః స్యన్దంతే స ఉద్గీథో
యాః ప్రతీచ్యః స ‘‘ప్రతిహారః’’।
స సముద్రో ‘నిధనమ్’।
సమస్త జలములను ‘5’ విధములుగా ‘సామగానోపాసన’ చేయుదురు గాక।
(1) మేఘముల సమూహము రూపుదిద్దుకోవటము - ‘హిం’కారోపాసన।
(2) వర్షించటము - ప్రస్తావోపాసన।
(3) జలము ప్రాచీ (తూర్పు) దిశగా ప్రవహించటము - ఉద్గీథము
(4) జలము ప్రతీచ్యదిశగా (పడమట - ప్రవహించటము) - ప్రతిహారము
(5) సముద్రమే - నిధనము (సమాప్తి)
2. స హ అప్సు ప్రైత్యప్సుమాన్ భవతి
య ఏతత్ ఏవం విద్వాన్ సర్వాః
అప్సు పంచ విధగ్ం సామా ఉపాస్తే।।
ఈ విధంగా ‘పంచసామోపాసన’ గురించి ఎరిగియున్నవాడు, జలోపాసన చేయుచున్నవాడై ‘జలపంచ సామము’ తత్త్వము ఎరిగియున్న విద్వాంసుడగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్థః ఖండః


2–5. ద్వితీయ ప్రపాఠకః - పంచమః ఖండః - పంచవిధ ఋతు సామోపాసన

1. ఋతుషు పంచవిధగ్ం - సామా ఉపాసీత।
వసన్తో ‘హిం’కారః।
గ్రీష్మః ‘‘ప్రస్తావో’’
వర్షా ‘‘ఉద్గీథః’’।
శరత్ ‘‘ప్రతిహారః’’।
హేమన్తః ‘‘నిధనమ్’’।
ఋతువులను పంచ (5) విధములైన సామోపాసన నిర్వర్తించెదరుగాక।
(1) వసంత ఋతువు → ‘హిం’కారోపాసన
(2) గ్రీష్మ ఋతువు → ప్రస్తావనోపాసన
(3) వర్ష ఋతువు → ఉద్గీథము
(4) శరత్ ఋతువు → ప్రతిహారము
(5) హేమన్తము → నిధనము (ఉపసంహారము/సమాప్తి)
(గమనిక - ఇక్కడ సంవత్సరమును ఆరు కాకుండా ఐదు ఋతువులుగా చెప్పబడెను.)
2. కల్పన్తే హ అస్మా ఋతవ
ఋతుమాన్ భవతి,
య ఏతత్ ఏవం విద్వాన్ ఋతుషు,
పంచవిధగ్ం సామా ఉపాస్తే।
ఎవ్వరైతే వసంత - గ్రీష్మ - వర్ష - శరత్ - హేమన్త ‘పంచ’ (5) ఋతువులను సామము యొక్క ‘హిం’కార, ప్రస్తావన, ఉద్గీథ ప్రతిహార - నిధనములుగా తెలుసుకొని విద్వాంసులై ‘పంచ ఋతు సామగానము’ను ఉపాసిస్తారో - వారు ఋతువులచే రక్షించబడి, ఋతువులలోని ఆయా సంపదలు పొందగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే పంచమః ఖండః


2–6. ద్వితీయ ప్రపాఠకః - షష్ఠః ఖండః - పంచవిధ పశు సామోపాసన

1. పశుషు పంచవిధగ్ం
సామా ఉపాసీత।
అజా ‘‘హిం’’కారో
అవయః ‘‘ప్రస్తావో’’
గావ ‘‘ఉద్గీథో’’
అశ్వాః ‘‘ప్రతిహారః’’
పురుషో ‘‘నిధనమ్’’।
పశువుల గురించిన పంచ (5) విధ సామోపాసన ఈ విధంగా ఉంటుంది.
(1) అజములు (మేకలు) - ‘హిం ’కారోపాసన।
(2) అవయములు (గొఱ్ఱెలు) - ప్రస్తావోపాసన।
(3) గోవులు (ఆవులు) - ఉద్గీథోపాస।
(4) అశ్వములు (గుఱ్ఱములు) - ప్రతిహారోపాసన।
(5) పురుషుడు (మానవుడు) - నిధనము (సమాప్తి)
2. భవన్తి హ అస్మా పశవః
పశుమాన్ భవతి -
య ఏతత్ ఏవం విద్వాన్
పశుషు పంచ విధగ్ం సామా ఉపాస్తే।।
ఇట్టి పంచవిధ పశు సామోపాసన ఎరిగి, నిర్వర్తించువాడు సమృద్ధియగు పశుసంపద పొందగలడు.
అట్టి ‘‘పంచవిధ పశు సామోపాస’’ ఎరిగినవాడు లోటు లేనివాడై ఉంటాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే షష్ఠః ఖండః


2–7. ద్వితీయ ప్రపాఠకః - సప్తమః ఖండః - ఇంద్రియ సామోపాసన

1. ప్రాణేషు పంచవిధగ్ం
పరోవరీయః సామా ఉపాసీత।
ప్రాణో ‘‘హిం’’ కారో
వాక్ ‘‘ప్రస్తావః’’।
చక్షుః ఉద్గీథః। శ్రోత్రం ‘‘ప్రతిహారః’’।
మనో ‘నిధనం’ పరోవరీయాగ్ంసి వా ఏతాని।।
పంచవిధ పరోవరీయ (శ్రేష్ఠి) సామోపాసన
పరోవరీయోపాసన (లేక) పంచవిధ (శ్రేష్ఠాతిశ్రేష్ఠ) సామోపాస ఈ విధమైనది.
(1) ప్రాణము → ‘హిం’కార ఉపాసన।
(2) వాక్ (మాట్లాడటం) → ప్రస్తావనోపాసన।
(3) చక్షువులు (కన్నులు) → ఉద్గీథోపాసన
(4) శ్రోత్రములు (చెవులు) → ప్రతిహారోపాసన
(5) మనస్సు → నిధనము (సమాప్తి ముగింపు)
ఇవి ‘‘పరోవరీయ పంచవిధ సామోపాసనలు’’.
2. పరోవరీయో హ అస్య భవతి।
పరోవరీయసో హ లోకాన్ జయతి।
య ఏతత్ ఏవం విద్వాన్ ప్రాణేషు
పంచవిధం పరోవరీయః
సామా ఉపాస్త
ఇతి తు పంచవిధస్య।।
అట్టి పంచవిధ పరోవరీయ సామోపాసన ఎరిగినవాడు, ధ్యానము చేయువాడు లోకాలు జయించివేయగలడు. (లోకములలో నేను ఉన్నాను. లోకాలు నాలో అదే సమయంలో ఉన్నాయి - అను) సిద్ధిని పొందగలడు.
అట్టి ‘‘ప్రాణేషు పంచవిధ పరః పరీయ సామోపాసన’’చే విద్వాంసుడై దివ్యలోకప్రవేశమునకు అర్హులౌతారు.
పంచవిధ ఉపాసన, సర్వదా ఉత్తమ ప్రయోజనము ప్రసాదించగలదు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే సప్తమః ఖండః


2–8. ద్వితీయ ప్రపాఠకః - అష్టమః ఖండః - ‘వాచి (వాక్)’ సప్తవిధ సామోపాసన

1. అథ సప్తవిధస్య వాచి
సప్తవిధగ్ం సామా ఉపాసీత।
యత్ కించ వాచో
హుం ఇతి స ‘‘హింకారః’’।
యత్ ప్ర ఇతి స ‘‘ప్రస్తావో’’
యత్ ఏతి స ‘‘ఆదిః’’।
‘‘7’’ విధముల వాచి (వాక్కు) - ‘‘సప్తవిధ సామోపాసన’’ గురించి ఉపాసన కొరకై చెప్పుకుంటున్నాము.
1. ఏది ‘హుం’ అని ఏ కొంచము కూడా అయి, అనబడుచున్నదో → అది ‘హిం’కారము. (వాక్కులో ‘హుమ్’ అను స్వరమే ‘హిం’కారము)
2. ‘‘ప్ర’’ అను స్వరము → అది ‘ప్రస్తావము’.
3. ఏది ‘అ’ ఆదియో → అదియే ‘ఆది’. (That is at the begining of all else).
‘‘అ’’ - అను స్వరమే - ఆది। అదియే ‘‘ఓం’’.
2. యత్ ఉత్ ఇతి - స ‘‘ఉద్గీథో’’
యత్ ‘ప్రతి’ ఇతి స ‘‘ప్రతిహారో’’
యత్ ఉప ఇతి స ఉపద్రవో
యత్ ‘ని’ ఇతి తత్ ‘‘నిధనమ్’’।
4. ఏ ఉత్ (ఆది నుండి - ఆదికి అనన్యంగా) బయల్వెడలుచున్నదో (జలము నుండి తరంగంలా) → అది ‘ఉద్గీథము’. ఉత్ అను స్వరమే ఉద్గీథము.
5. ఏది ప్రతి అయి ఉన్నదో - ఈ కనబడే దానికి వేరై విడిగా ఉన్నదో → అది ‘ఆది’. ‘‘ప్రతి’’ - అను స్వరమే ‘‘ప్రతిహారము’’.
6. ఏది ఉప అను స్వరమో → అదియే ‘ఉపద్రవము’.
7. ‘‘ని’’ - అనునదే ఆ యొక్క ‘నిధనము’ → ‘ని’ అను స్వరమే ‘నిధనము’ (ముగింపు/సమాప్తి).
3. దుగ్ధే అస్మై వాక్ దోహం యో
వాచో దోహః।
అన్నవాన్ అన్నాదో భవతి
య ఏవం విద్వాన్
వాచి సప్త విధగ్ం సామా ఉపాస్తే।।
అట్టి ‘‘సప్తవిధ వాచి (వాక్)-సప్తవిధ సామము’’గా తెలుసుకొని ఉపాసించు వాడు పితికిన పాలు పోసియున్న పాత్రను - పొందు రీతిగా (పాల పాత్రను పొందు విధంగా) - ‘‘వివేకి అయి వాక్-అమృతమును’’ పొందుచున్నాడు.
అన్నము (బ్రహ్మము)ను కోరుకొని అన్నమే (బ్రహ్మమే) అగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే అష్టమః ఖండః


2–9. ద్వితీయ ప్రపాఠకః - నవమః ఖండః - ఆదిత్య సప్తవిధ సామోపాసన

1. అథ ఖల్వముమ్ (ఖలు అముమ్)
ఆదిత్యగ్ం సప్తవిధగ్ం సామా ఉపాసీత।



సర్వదా ‘‘సమః’’ తేన సామ।
మాం ప్రతి మాం ప్రతి ఇతి
సర్వేణ సమః తేన సామ।
ఇక ఆపై, సూర్యుని (ఆదిత్యుని) సప్తవిధ సామగానములుగా (సప్తాశ్వ రథమ్ ఆరూఢునిగా, సప్త వర్ణముల కిరణ స్వరూపునిగా) ఉపాసించటము గురించి చెప్పుకుంటున్నాము.


‘‘సూర్యుడు సర్వదా సమత్వమునందు అధిరోహితులై, సర్వదా ప్రకాశిస్తూ, నా వైపు సమీప్యుడై ఉన్నారు. సర్వత్రా సమస్తులై సమముగా ప్రకాశించువారు. సర్వులపట్ల సమభావన, స్వయంప్రకాశకము, నిత్య జాగరూకత, సర్వత్రా సమవత్ స్థితి’’- మొదలైన ఆత్మతత్త్వ నిర్వచనములు పుణికి పుచ్చుకున్నవారు’’ - అను సామగానముతో స్తుతించెదరు గాక. ప్రతి ఒక్కరికి సమీపమున ఉన్నారు కాబట్టి ఆయనయే ‘సామగానము’ (స-ఆమ).
2. తస్మిన్ ఇమాని సర్వాణి
భూతాని అన్వాయత్తాని ఇతి విద్యాత్।
తస్య యత్ పురోదయాత్, స ‘హిం’కారః।
తత్ అస్య పశవః అన్వాయత్తాః।
తస్మాత్ తే ‘హిం’ కుర్వంతి,
హింకార భాజినో,
హి ఏతస్య సామ్నః।
సమస్త భూతజాలము ఆ సూర్యభగవానునిపై ఆధారపడి మాత్రమే జీవించగలుగుచున్నారని గ్రహించబడు గాక।

ఆ సూర్యుడు ఉదయించటానికి ముందుగా - ‘హిం’ కారము

ఆయన ‘హిం’ కార మహిమపైననే జీవుల మనుగడ అంతా ఆధారపడి ఉన్నది. అందుచేత జీవులంతా ‘జీవించటము’ను ఆధారముగా పొందుతూ, ‘హిం’ కార శబ్దమును చేస్తూ నిదురలేస్తున్నారు.

అట్టి ‘హిం’కార స్వరూపులే అయి జీవించటమే ‘‘ఆదిత్య సప్తవిధ సామోపాసన’’ అనబడే ‘‘సామగానము’’.
3. అథ యత్ ప్రథమా ఉదితే స ‘‘ప్రస్తావః’’।
తత్ అస్య మనుష్యా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే ప్రస్తుతి కామాః ప్రశగ్ంసా
కామాః ప్రస్తావ భాజినో
హి ఏతస్య సామ్నః।।
(1) సూర్యుని (ఆదిత్యుని) ఉదయించటానికి మునుముందటి రూపము -‘హిం’ కారము.
(2) మొట్టమొదటి ఉదయ కిరణములు - ప్రస్తావము.

జీవుల జీవనము అట్టి సూర్యోదయముపై ఆధారపడి ఉన్నది. వారి ప్రత్యక్ష - రక్షణ, పరోక్ష దేహ మనోబుద్ధులను నిర్మలము చేయటము, ఇవన్నీ ప్రశంసించటమే ‘‘సామగాన-ప్రస్తావన’’.
4. అథ యత్ సంగవ
వేలాయాగ్ం స ఆదిః।
తత్ అస్య వయాగ్ంసి అన్వాయత్తాని।
తస్మాత్ తాని అన్తరిక్షే అనారంబణాని
ఆదాయ ఆత్మానం పరిపతంతి
ఆది భాజీని హి ఏతస్య సామ్నః।
ఆయన కిరణములు లోకమంతా విస్తరించుచుండు సందర్భమే ‘ఆది’. ఆదిత్యుని లోని ‘ఆది’।

సూర్యాకారముగా పక్షులు ఆకాశంలో ఎగురుచున్నాయి. పక్షులు సూర్యునిపై ఆధారపడియే ఎగురుచున్నాయి.

అట్టి చిన్న ఆకారముగల (అల్పబలము, మేధస్సుగల) పక్షులు అంతరిక్షములో సూర్యోదయము ఆరంభము అగుచూ ఉండగా, చెట్లుపైనుండి కిలకిలారవములతో ఆకాశములోకి ఎగురుచూ ఉన్న శక్తి యొక్క దృశ్యమే ‘ఆదిత్య సామగానము’। ఆ కిలకిలా శబ్దాలే సూర్యస్తోత్రము.
5. అథ యత్ సంప్రతి
మధ్యన్ దినే స ‘‘ఉద్గీథః’’।
తత్ అస్య దేవా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే సత్తమాః
ప్రాజాపత్యానాం ఉద్గీథ భాజినో
హి ఏతస్య దేవాః (సామ్నా)।
మధ్యాహ్న సమయంలో సూర్యుడి ప్రకాశమాన ప్రత్యక్ష రూపము - ఉద్గీథముగా ఉపాసన.

అట్టి మధ్యాహ్న సూర్యుని నుండియే తేజస్సు పొందుతూ, దేవతలు ప్రకాశించుచున్నారు. మధ్యందిన ప్రకాశముపై ఆధారపడి ఉన్నారు. అట్టి మధ్యాహ్న సూర్యతేజస్సును పొందుచున్న దేవతలు, అట్టి తేజోవిభవము గురించి ప్రజాపతి పుత్రులగు దేవతలు ఉద్గీథ గానము చేస్తూ ఉన్నారు. అట్టి ఉద్గీథ గానమే ‘‘మధ్యందిన ఆదిత్య ఉద్గీథ-సామ గానము’’.

6. అథ యత్ ఊర్ధ్వం మధ్యన్ దినాత్
ప్రాక్ - అపరాహ్ణాత్ స ‘‘ప్రతిహారః’’।
తత్ అస్య గర్భా ‘‘అన్వాయత్తాః।’’
తస్మాత్ తే ప్రతిహృతా న అవపద్యంతే
‘ప్రతిహార’ భాజినో హి, ఏతస్య సామ్నః।।
మధ్యాహ్నకాలము గడుచుచూ ఉండగా, ఏర్పడియున్న సాయం సూర్యప్రకాశము - ‘‘ప్రతిహారము’’ (1 PM to 3 PM)

అట్టి మధ్యాహ్నానంతర సూర్యప్రకాశముపై తల్లి గర్భములోని పిండములు ఆధారపడి రక్షణ పొందుచున్నాయి.

అట్టి ప్రతిహార - ఆదిత్య సామగానమువలననే గర్భస్థ పిండములు క్రిందకు పడకుండా గర్భములో మధ్యగా వ్రేలాడుచూ, జీవశక్తిని పొందసాగుచున్నాయి. మధ్యాహ్నానంతర సూర్యప్రకాశ - గర్భస్థ శిశుస్థాన రక్షణయే ‘‘ఆదిత్య-ప్రతిహార సామగానము’’.

7. అథ యత్ ఊర్ధ్వం అపరాహ్ణాత్
ప్రాక్ - అస్తమయాత్
స ‘‘ఉపద్రవః’’
తత్ అస్య అరణ్యా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే పురుషం దృష్ట్వా
కక్షగ్ం శ్వభ్రమితి ఉపద్రవన్తి।
ఉపద్రవ భాజినో హి,
ఏతస్య సామ్నః।
(అపరాహ్ణము = పగటి చివరి భాగము. ఒక పగటిని మూడు సమాన భాగాలు చేసినప్పుడు - చివరి 3వ భాగము)

పగటిలో చివరి భాగము, సూర్య అస్తమయానికి ముందు ప్రకాశించు సూర్యుడు ‘‘ఉపద్రవము’’ ( 3 pm 5 pm )

అట్టి ఉపద్రవ - సూర్యునిపై అరణ్య మృగములు జీవము, రక్షణ పొందినవై ఉంటున్నాయి.

అట్టి అపరాహ్ణ - ప్రాక్ (Before) అస్తమయ సూర్యుని రూపము ‘‘ఉపద్రవ సూర్యరూపము’’గా ఉపాసించబడు గాక।
8. అథ యత్ ప్రథమా
అస్తమితే తత్ ‘‘నిధనం।’’
తత్ అస్య పితరో ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తాన్ నిదధతి,
నిధన భాజినో హి।
సూర్యుడు అస్తమించగానే ఆ మరుక్షణ సూర్యుని ‘‘నిధనము’’ (ఉపసంహార - ఆటవిడుపు).

అట్టి నిధన సూర్యునిపై పితరులు ఆధారపడినవారై ఉంటారు.

అట్టి నిధనరూప సూర్యతత్త్వము వలననే పితరులు ఆధారపడి పోషింపబడుచున్నారు.
ఏతస్య సామ్న ఏవం ఖల్వముమ్
ఆదిత్యగ్ం సప్తవిధగ్ం సామా ఉపాస్తే।।
ఈ విధంగా సప్త (7) విధ సామగానంగా ఆదిత్యుని సామగానం చేస్తూ ఆరాధించెదరు గాక।

(1) పురా ఉదయ ఆదిత్య హింకార సామగానము
(2) ప్రథమ ఉదిత ఆదిత్య సామగానము
(3) ఉషోదయానంతర - ఆదిత్య సామగానము
(4) మధ్యందిన ఉద్గీథ సామగానము
(5) అపరాహణా ఊర్ధ్వ - ప్రాక్ అస్తమయ ఆదిత్య సామగానము
(6) అస్తమయ ఆదిత్య సామగానము (ఉద్గీథోపాసన)
(7) అస్తమయానంతర ఆదిత్య సామగానము
- ఉపాసించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే నవమః ఖండః


2–10. ద్వితీయ ప్రపాఠకః - దశమః ఖండః - ‘‘అతిమృత్యు సామోపాసన’’

1. అథ ఖలు - ఆత్మ సంమితమ్
‘‘అతిమృత్యు’’, సప్తవిధగ్ం
సామా ఉపాసీత।
హింకార ఇతి।
త్రి అక్షరం (త్ర్యక్షరం) ప్రస్తావ ఇతి।
త్రి అక్షరం (త్ర్యక్షరం) తత్ సమమ్।
ఇక ఇప్పుడు - మృత్యువుకు ఆవలగల (మార్పు చేర్పులకు ఆవలగల) సర్వత్రా సమరూపమైయున్న ఆత్మయొక్క ‘అతిమృత్యురూప’ (Beyond Change Factors) సప్తవిధ ‘సామోపాసన’ గురించి చెప్పుకుంటున్నాము.
‘‘హిం-కార’’ - ఇతి । 3 అక్షరముల శబ్దము
‘‘ప్రస్తావ’’ - ఇతి। 3 అక్షరముల శబ్దము
ఈ రెండు సమస్వరూపమైనవి.
2. ‘‘ఆదిః’’ ఇతి ద్వి అక్షరం (ద్వ్యక్షరం)।
‘‘ప్రతిహార’’ ఇతి చతుః అక్షరం।
తత ఇహ ఏకం తత్ సమమ్।
‘‘ఆది’’ - ఇది ‘2’ అక్షరముల శబ్దము.
‘‘ప్రతిహార’’ - ఇది ‘4’ అక్షరముల శబ్దము
‘ప్రతిహారము’ నుండి ఒక అక్షరమును తీసుకొనివచ్చి ‘ఆది’కి చేర్చాలి.
అప్పుడు ఆ రెండు సమము అవగలవు.
(ఆది = మొట్టమొదటే ఉన్న ‘నేను’. ప్రతిహారము = కల్పన, ఊహ, భావన, మాయ).
3. ఉద్గీథ ఇతి త్రీక్షరం। (త్ర్యక్షరం)।
‘‘ఉపద్రవ’’ ఇతి చతుః అక్షరం।
త్రిభిః త్రిభిః సమం భవతి।
అక్షరం అతి శిష్యతే।
త్రీక్షరం తత్ సమమ్।।
‘ఉద్గీథ’ - ఇది ‘3’ అక్షరములు.
‘ఉపద్రవ’ - ఇది ‘4’ అక్షరములు.
పై అక్షరములు ‘3+3’ = 6 ఏకము చేస్తే అప్పటికిక ఏడిటిలో (Out of 7) ఒక అక్షరము శేషిస్తోంది.
ఆ విధంగా త్రి అక్షరం - త్రి అక్షరం సమము అయి ‘‘సర్వత్రా సమము’’ మాత్రమే ఏర్పడియున్నదగుచున్నది.
మిగిలిన ఒక అక్షరము కూడా మూడు అక్షరములతో సమముగానే చెప్పబడెను.
4. ‘‘నిధనం’’ ఇతి త్రి అక్షరం (త్ర్యక్షరం)।
తత్ సమం ఏవ భవతి।
తాని హ వా ఏతాని
ద్వావిగ్ంశతిః(22) అక్షరాణి।
‘నిధనం’ (సమాప్తి, ముగింపు) - అనునది ‘త్రి’ అక్షరం (3 అక్షరములతో ఉన్నది).
అంతా అక్షరమే కనుక మిగతా త్రి-అక్షరములతో సమమే (Equal) అయి ఉన్నది.
ఈ విధంగా సప్తవిధి సామగానోపాసనకు ‘‘22"అక్షరములు కలిగి ఉన్నది.

Ⅰ. ‘‘హిం’’ ‘‘కార’’ = 3;
Ⅱ. ‘‘ప్రస్తావ’’ = 3;
Ⅲ. ఆది = 2;
Ⅳ. ప్రతిహార = 4;
Ⅴ. ఉద్గీథ = 3;
Ⅵ. ఉపద్రవ = 4;
Ⅶ. నిధనం= 3

3+3+2+4+3+4+3 = 22 అక్షరములు

5. ఏకవిగ్ంశతి (21) ఆదిత్యం ఆప్నోతి।

ఏకవిగ్ంశః వా ఇతిః (21వ వాడు) అసావాదిత్యో

ద్వావిగ్ంశేన (22) పరమాదిత్యాత్ జయతి।
తత్ నాకం। తత్ విశోకమ్।
సమస్వరూపములైన 21 ఆదిత్య (మొట్టమొదటి స్వరూపమగు ఆత్మయొక్క) తత్త్వము తెలుసుకొంటారో, వారు ‘ఆదిత్యము’ (The Beginning of Everything) సిద్ధించుకుంటారు.

ఈ 21 అక్షరములుగా కనిపిస్తున్నది సర్వత్ర వేంచేసి, సమస్తము తానే అయి ఉన్న ఆదిత్యుడే!

22వది అక్షరమగు పరమాదిత్యము (ఆదిత్యునికి కూడా పరమైనది. ఆవలది). అట్టి పరమాదిత్యము, దివ్యలోకము శోకరహితమైనది. అట్టి పరమాదిత్యము (కేవలాత్మ, పరస్వరూపము, పరమాత్మ) తెలుసుకొంటే ద్రష్టయొక్క (జీవునియొక్క) ద్రష్టత్వముచే దృశ్యము నుండి పొందుచున్న దుఃఖములన్నీ శమిస్తాయి. (All worries of Indria-jagath vanish /subside).
6. ఆప్నోతి హ ఆదిత్యస్య జయం పరో హ।
అస్య ఆదిత్య జయాత్ జయో భవతి।
య ఏతత్ ఏవం విద్వాన్ ఆత్మ,
సంమితం అతిమృత్యు సప్త విధగ్ం
సామా ఉపాస్తే। సామా ఉపాస్తే।
ఈ లోకమున ప్రకాశమానుడైయున్న ఆదిత్యునికి (సూర్యునికి) 21 అక్షరములు. 22వ అక్షరం సూర్యునికి ఆవలి లోకము. అది ఆదిత్యమును కూడా దాటినట్టి (కేవలమగు ఆత్మ) స్థానము.

అట్టి ఆదిత్యలోకము దాటి అమృతమగు ఆత్మలోకము (ఆత్మస్థానము) ఎరిగిన విద్వాంసుడు సమస్తమునందు ఆత్మను, ఆత్మయందే సమస్తమును దర్శించుచూ, సప్తవిధ సామములను ఉపాసిస్తూ - క్రమంగా మృత్యుపరిధులను దాటివేస్తాడు. అట్టి ఏకవింశతి అక్షర సామోపాసనచే అమృతస్వరూపమును సిద్ధించుకొంటాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే దశమః ఖండః


2–11. ద్వితీయ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - గాయత్ర సామోపాసనా

1. మనో ‘‘హింకారో’’ వాక్ ‘‘ప్రస్తావః।
చక్షుః ‘‘ఉద్గీథః’’।
శ్రోత్రం ‘‘ప్రతిహారః’’।
ప్రాణో ‘‘నిధనం’’।
ఏతత్ గాయత్రం
ప్రాణేషు ప్రోతమ్।।
‘మనస్సు’ - ‘హిం’ కారము
వాక్ - ‘ప్రస్తావ’
చక్షువులు - ‘‘ఉద్గీథ’’
శోత్రములు (చెవులు) - ‘‘ప్రతిహార’’
ప్రాణము - ‘నిధనం’

అట్టి ప్రాణశక్తితో ఆయా (5) రూపములుగా ప్రోతమై (నిండినదై) ఉన్నదే - ఏతత్ గాయత్రం। (అదియే గాయత్రి)।
2. స య ఏవం ఏతత్
గాయత్రం ప్రాణేషు ప్రోతం
వేద ప్రాణీ భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా, మహామనాః స్యాత్,
తత్ వ్రతమ్।
ప్రాణము ‘గాయత్రి’చే ప్రోతమై ఉన్నట్లే గాయత్రి ప్రాణముచే ప్రోతమైయున్నది.

వేదము (తెలియబడేది / తపస్సు) ప్రాణిగా అగుచున్నది.

అట్టి ‘‘ప్రాణస్వరూప గాయత్రి సామగానము’’. తెలుసుకొని గాయత్రీ - ప్రాణోపాసన చేయువారు జ్యోతిస్వరూపులై జీవించగలరు. వారి జీవితమే జ్యోతి (స్వయంప్రకాశ) రూపమవగలదు। ఆత్మజ్యోతియగు (కేవల శివ స్వరూపము సంతరించుకోగలరు).

అట్టివారు గొప్ప జన, పశు, సంపద పొందగలరు.
గొప్ప కీర్తిమంతులు అగుచున్నారు. అట్టి ‘మహామనోసిద్ధి’యే ‘‘గాయత్రీ - ప్రాణోపాసనా వ్రతము’’.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకాదశః ఖండః


2–12. ద్వితీయ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - రథంతరమగ్ని సామోపాసనా

1. అభిమంథతి స ‘హిం’కారో।
ధూమో జాయతే స ప్రస్తావః।
జ్వలతి స ‘‘ఉద్గీథః’’
అంగారా భవంతి స ‘‘ప్రతిహార’’
ఉపశామ్యతి తత్ ‘‘నిధనగ్ం’’
సగ్ంశామ్యతి తత్ నిధనం
ఏతత్ ‘‘రథంతరం అగ్నౌ’’ ప్రోతమ్।
అరణి కొయ్యలతో మథనము (రెండు కొలతో ఒరిపిడి చేయటము) - ‘హిం’ కారము.
ధూమము పుట్టటము - ‘‘ప్రస్తావము’’.
అగ్నిజ్వాల జననము - ‘ఉద్గీథము’’.
అగ్నికణములు - విస్ఫులింగములు - ‘‘ప్రతిహారము’’.
ఆ విధంగా జ్వలిస్తున్న అగ్ని ఉపశాంతి పొందటము, (అనగా) ఉపశమించటము - ‘నిధనము’ .
అట్టి ‘సంశామ్య’ (Subsiding) రూపమగు అగ్ని - రథంతరాగ్నిగా జగత్తంతా ప్రోతమై(Filled up) ఉన్నది.
2. స య ఏవమ్ ఏతత్ రథంతరం
అగ్నౌ ప్రోతం వేద, బ్రహ్మవర్చసి అన్నాదో భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా
న ప్రత్యఙ్ అగ్నిం ఆచామేత్ న నిష్ఠీవేత్ తత్ వ్రతమ్।
అట్టి రథంతరంగా ప్రోతమైయున్న (జగత్తంతా ఓతప్రోతమైయున్న) అగ్నితత్త్వమును తెలుసుకొన్నవాడు బ్రహ్మవర్చస్సు పొందగలడు. సమస్తమును పొందిన ‘అన్నాదుడు’ - కాగలడు.
- వారి ఆయుష్షు పవిత్రము కాగలదు (ఉత్తమమైన ఆయుష్షు పొంద గలరు).
- జ్యోతిస్వరూపులై జీవించగలరు.
- ఉత్తమ సంతానము, పశుసంపద పొందగలరు.
- గొప్ప కీర్తిమంతులుగా కాగలరు.
అందుచేత సర్వత్రా మౌనంగా ఉన్న అగ్ని (లేక) ప్రాణశక్తిని ఉపాసించటమును ‘వ్రతము’ (Regular Practice)గా కలిగి ఉండెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వాదశః ఖండః


2–13. ద్వితీయ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - వామదేవం మిథున సామోపాసన

1. ఉపమన్త్రయతే స ‘‘హిం’’కారః।
జ్ఞపయతే స ప్రస్తావః।
స్త్రియా సహః ఏతే స ఉద్గీథః।
ప్రతి స్త్రీం సహః ఏతే స ‘‘ప్రతిహారః’’।
కాలం గచ్ఛతి తన్నిధం
పారం గచ్ఛతి తత్ ‘‘నిధనం’’।
ఏతత్ వామదేవ్యం మిథునే ప్రోతమ్।
[ఉపమంత్రణము = పిలుపు, బుజ్జగింపు మంత్రోచ్చారణ]

ఉపమంత్రయతము - మంత్రోచ్ఛారణ - ‘హిం’కారము
జ్ఞాపకము - ప్రస్తావము
స్త్రీ సంగమము (ప్రకృతితో కలిసి ఉండటము) - ఉద్గీథము
ప్రతి స్త్రీ సహము(మిథునము । కలయిక) - ప్రతిహారము।
కాలము గడచిపోవటము, చివరికి చేరటము - నిధనము (సమాప్తి)
అట్టి వామదేవ మిథునము (కేవలమగు ఆత్మతో కల్పన చేరి సమాగమము)తో ఇదంతా ఏర్పడినది అగుచున్నది.
2. స య ఏవం ఏతత్ వామదేవ్యం
మిథునే ప్రోతం వేద మిథునీ భవతి।
మిథునాన్ మిథునాత్ ప్రజాయతే।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా, పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా న కాంచన పరిహారేత్
తత్ వ్రతమ్।।
అట్టి ‘ఆ వామదేవ మిథునము’చే ప్రోతము (Made up of) - తెలుసుకొన్నవాడు ‘మిథునీ’ అగుచున్నాడు.

మిథునముచే మిథునము వృద్ధి చెందుచున్నది. మిథునము (కలయిక) ప్రవృద్ధమవగలదు. అట్టి ఏకత్వ దర్శన ధ్యానముచే ఆయుష్షు పవిత్రమవగలదు. జగజ్యోతి స్వరూపము ఆవిష్కరణము కాగలదు. ఉత్తమ సంతానము, పశుసంపద ప్రాప్తించగలదు. ఉత్తమ కీర్తి లభించగలదు. అట్టి వామదేవ మిథునము (అనుభవి - అనుభవముల ఏకత్వము) వ్రతముగా ఆచరించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే త్రయోదశః ఖండః


2–14. ద్వితీయ ప్రపాఠకః - చతుర్దశః ఖండః - ‘బృహదాదిత్య’ సామోపాసన

1. ఉద్యన్ ‘‘హింకార’’।
ఉదితః ‘‘ప్రస్తావః’’।
మధ్యందిన ‘‘ఉద్గీథః’’।
అపరాహ్ణాః ‘‘ప్రతిహారః’’।
అస్తం యత్ ‘‘నిధనం’’।
ఏతత్ ‘‘బృహత్ ఆదిత్యే’’ ప్రోతమ్।
సూర్యుడు
ఉదయించు సూర్యుడు - ‘హిం’కారము.
ఉదయిస్తున్నప్పుడు - ‘ప్రస్తావము’
మధ్యాహ్న సూర్యుడు - ఉద్గీథము
అపరాహ్ణా (మధ్యాహ్నానంతర-సాయంత్ర) సూర్యుడు - ప్రతిహారము
సూర్యాస్తమయం - ‘నిధనము’
ఇది ‘బృహత్ ఆదిత్యము’ అనబడుతోంది.
2. స య ఏవం ఏతత్ బృహత్
ఆదిత్యే ప్రోతం వేద,
తేజస్వి అన్నాదో భవతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా। తపన్తం న నిందేత్। తత్ వ్రతమ్।
అట్టి ఆ యొక్క ‘బృహత్ ఆదిత్యము’ ఏ విధంగా సర్వత్రా ప్రోతమైయున్నదో ఎరిగి ఉపాసిస్తున్నవాడు తేజోవంతుడు, సమస్తము అనుభవముగా పొందువాడు అగుచున్నాడు. ఆయుష్మంతుడు కాగలడు. జగత్‌జ్యోతి స్వరూపుడు కాగలడు. ఉత్తమ జనసంపద, పశుసంపద పొందగలడు।
గొప్ప కీర్తిమంతుడగుచున్నాడు.
అట్టి బృహత్ ఆదిత్యుని తీవ్రతను నిందించరాదు.
అట్టి ఆరాధన ‘వ్రతము’గా ఆచరించబడు గాక!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్దశః ఖండః


2–15. ద్వితీయ ప్రపాఠకః - పంచదశః ఖండః - వైరూప పర్జన్య సామోపాసన

1. అభ్రాణి సంప్లవన్తే స ‘‘హింకారో’’
మేఘో జాయతే స ‘‘ప్రస్తావో’’
వర్షతి స ‘‘ఉద్గీథో’’
విద్యోతతే స్తనయతి, స ‘‘ప్రతిహార’’
ఉత్ గృహాణాతి తత్ ‘‘నిధనమ్’’
ఏతత్ వైరూపం పర్జన్యే ప్రోతమ్।
మబ్బుల సంప్లవన్తము (సమూహము ఏర్పడటం) - ‘హిం’కారము
దట్టమైన మేఘములు - ప్రస్తావము
వర్షించటము - ఉద్గీథము
మేఘపు మెఱుపులు - ‘ప్రతిహారము’
వర్షానంతరము (మేఘములు । ఆకాశము) - ‘‘నిధనము’’
అట్టి మేఘముల తత్త్వము ‘‘పర్జన్యము’’తో ప్రోతమైయున్నది.
2. స య ఏవం ఏతత్ వైరూపం
పర్జన్యే ప్రోతం వేద విరూపాగ్ంశ్చ
సురూపాగ్ంశ్చ పశూన్ అవరుంధే,
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా, వర్షంతం।
న నిందేత్ తత్ వ్రతమ్।।
అట్టి పర్జన్యమును సామోపాసన చేయువారు - సామగానము చేయువారు, (అనగా) పర్జన్యముతో ఆత్మోపాసన చేయువారు
- పశు సంపద పొందగలరు.
- ఆయుష్మంతులు కాగలరు.
- జగజ్జ్యోతి స్వరూపులగుచున్నారు.
- ఉత్తమ ప్రజలను, పశుసంపద పొందగలరు.
- గొప్ప కీర్తిమంతులు కాగలరు.
‘వర్షము’ను నిందించరాదు. ఇది వ్రతము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే పంచదశః ఖండః


2–16. ద్వితీయ ప్రపాఠకః - షోడశః ఖండః - వైరాజ ఋతు సామోపాసన

1. వసన్తో ‘‘హింకారః’’।
గ్రీష్మః ‘‘ప్రస్తావః’’।
వర్షా ‘‘ఉద్గీథః’’।
శరత్ ‘‘ప్రతిహారః’’।
హేమంతః ‘‘నిధనం’’।
ఏతత్ వైరాజమ్ ఋతుషు ప్రోతమ్।
వసంత ఋతువు - ‘హిం’కారము
గ్రీష్మ ఋతువు - ‘ప్రస్తావము’
వర్ష ఋతువు - ‘ఉద్గీథము’
శరత్ ఋతువు - ‘ప్రతిహారము’
హేమంతము - ‘నిధనము’
ఇది ‘‘వైరాజ ఋతు సామగానోపాసన’’. కాలము ఆత్మయందు ఓతప్రోతమైయున్నతీరును ఉపాసించటము- ‘‘వైరాజ ఋతుపాసన’’.
2. స య ఏవం ఏతత్ వైరాజమ్
ఋతుషు ప్రోతం వేద
విరాజతి ప్రజయా పశుభిః।
బ్రహ్మవర్చసేన, సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి। మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్య। ఋతూన్ న నిందేత్। తత్ వ్రతమ్।।
అట్టి ఆ ‘‘వైరాజ ఋతు ప్రోతము’’ ఎరిగినవాడు ప్రజ - పశు సంపదతో విరాజిల్లగలడు.
బ్రహ్మవర్చస్సుతో ఉత్తమ ఆయుష్షు కలిగి యుండగలడు.
స్వయంజ్యోతి స్వరూపుడు కాగలడు.
ఉత్తమ ప్రజా సంపద, పశు సంపద కలిగి యుండగలడు.
ఋతువులను (చలి - ఎండ - వేడి కదా…అని తలచుచూ) నింద చేయరాదు. ఇది వ్రతము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే షోడశః ఖండః


2–17. ద్వితీయ ప్రపాఠకః - సప్తదశః ఖండః - శక్వరీ లోక సామోపాసన

1. పృథివీ ‘‘హింకారో’’
అంతరిక్షం ‘‘ప్రస్తావో’’
ద్యౌః ఉద్గీథో
దిశః ‘‘ప్రతిహారః’’
సముద్రో ‘‘నిధనం’’
ఏతాః శక్వర్యో లోకేషు ప్రోతాః।।
పృథివి (భూమి) - ‘హిం’కారము
అంతరిక్షము - ‘ప్రస్తావము’
ద్యులోకము (దివ్యలోకము) - ‘ఉద్గీథము’
దిక్కులు - ‘దిశలు’
సముద్రము - ‘నిధనము’
ఇది లోకమునందు ‘‘శక్వరీ సామగానము’’.
2. స య ఏవం ఏతాః శక్వర్యో లోకేషు
ప్రోతా వేద లోకీ భవతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోగ్జీవతి
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
లోకాన్ న నిందేత్
తత్ వ్రతమ్।
ఎవ్వరైతే ఇట్టి లోక సంబంధమైన శక్వరీ సామగానోపాసన చేయుచున్నారో, అట్టివాడు లోకతత్త్వమును ఎరిగినవాడై ‘వేద లోకీ’ - అగుచున్నాడు.
• అట్టివాని ఆయుష్షు పవిత్రమగుచున్నది.
• స్వయంజ్యోతి జీవన స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు.
• మహనీయులగు జనసంగమము, పశుసంపద పొందుచున్నాడు.
• గొప్ప కీర్తిమంతుడు కాగలడు.
అంతేగాని లోకనింద చేయరాదు. ఇది వ్రతము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే సప్తదశః ఖండః


2–18. ద్వితీయ ప్రపాఠకః - అష్టాదశః ఖండః - రేవతీ సామగానోపాసన

1. అజా ‘‘హింకారో’’
అవయః ‘‘ప్రస్తావో’’
గావ ‘‘ఉద్గీథో’’
అశ్వాః ‘‘ప్రతిహారః’’
పురుషో ‘‘నిధనం’’
ఏతా రేవత్యః పశుషు ప్రోతాః।
రేవతీ గానము:
అజములు (మేకలు) - ‘హిం’కారము
గొఱ్ఱెలు - ప్రస్తావము
గోవులు (ఆవులు) - ఉద్గీథము
గుఱ్ఱములు - ‘ప్రతిహారము’
పురుషుడు (మానవుడు) - ‘నిధనము’
ఈ విధమైన ఉపాసన ఆత్మోపాసనకు దారితీస్తూ ఉన్నది.

(గమనిక: 2–6 ఖండములో కూడా చెప్పబడిన పశు ఉపాసన)

2. స య ఏవం ఏతా
రేవత్యః పశుషు ప్రోతా
వేద - పశుమాన్ భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి। మహాన్ ప్రజయా
పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
పశూన్ న నిందేత్ తత్ వ్రతమ్।।
అట్టి రేవతీ సామగానముచే ‘పశువు’ (మేకలు - గొఱ్ఱెలు - గోవులు - గుఱ్ఱములు, పురుషుడు) లను ఉపాసించు అభ్యాసి,
- పశు సంపదా సమృద్ధి పొందగలడు.
- ఆయుష్షు పావనము కాగలదు.
- జ్యోతిస్వరూప జీవనము (స్వయంజ్యోతి, అఖండజ్యోతి రూపము) స్వానుభవముగా పొందగలడు.
- ప్రజ - పశు సంపదలు పొందగలడు.
- గొప్ప కీర్తి పొందగలడు.
పశువులను నిందించరాదు. ఇదంతా వ్రతమై ఉండును గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే అష్టాదశః ఖండః


2–19. ద్వితీయ ప్రపాఠకః - ఏకోనవింశః ఖండః - యజ్ఞ యజ్ఞీయ అంగ సామగానోపాసన

1. లోమ ‘‘హింకారః’’।
త్వక్ ప్రస్తావో।
మాగ్ంసమ్ ఉద్గీథః।
అస్థి ‘‘ప్రతిహారో’’।
మజ్జా ‘‘నిధనం’’।
ఏతత్ యజ్ఞా యజ్ఞీయమ్
అంగేషు ప్రోతమ్।
లోమము (రోమము) - ‘హిం’కారము
త్వక్ (చర్మము) - ప్రస్తావము
మాంసము - ఉద్గీథము
బొమికలు (అస్థి) - ప్రతిహారము
మజ్జ (ఎముకలలోని పొడి పదార్థము) - నిధనము

శరీరావయవ సంబంధితమైన ఈ ‘‘యజ్ఞా-యజ్ఞీయ సామోపాసన’’ ఎరిగియున్నవారు - ఉత్తమ అంగములు కలిగి ఉండగలరు.
2. స య ఏవం ఏతత్ యజ్ఞా యజ్ఞీయం
అంగేషు ప్రోతం వేదాంగీ భవతి।

న అంగేన విహూర్ఛతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
సంవత్సరం మఙజ్ఞో (మనోజ్ఞో)
న అశ్నీయాత్। తత్ వ్రతమ్।।
మఙజ్ఞో న అశ్నీయాత్ ఇతి వా।।
అట్టి యజ్ఞ యజ్ఞీయ అంగదృష్టి కలిగియున్నవాడు (అంగ యజ్ఞో పాసకుడు) వేదములు (తెలియబడే సమస్తము) తన అవయవములుగా భావన సిద్ధించుకొని ‘‘వేదాంగి’’ - కాగలడు.
- ఆతడు అంగములచే బాధించబడడు.
- ఉత్తమ ఆయుష్షు పొందగలడు.
- జ్యోతివలె స్వయం ప్రకాశకుడై వెలుగొందగలడు.
- ఉత్తమ కీర్తిమంతుడు కాగలడు.
సంవత్సరమంతా (ఎల్లకాలము) స్వీకరించకూడనివి ఎరిగి స్వీకరించక ఉండాలి. శాస్త్ర - గురు - ఆర్య వాక్యానుసారం శుభప్రదమైనవి, జ్ఞానప్రదమైనవి మాత్రమే స్వీకరించాలి.
ఇది ‘వ్రతము’గా అనువర్తించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకోనవింశః ఖండః


2–20. ద్వితీయ ప్రపాఠకః - వింశః ఖండః - దేవతా రాజన సామగానోపాసన

1. అగ్నిః ‘‘హింకారో’’
వాయుః ‘‘ప్రస్తావ’’।
ఆదిత్య ఉద్గీథో।
నక్షత్రాణి ‘‘ప్రతిహారః’’
చంద్రమా ‘‘నిధనం’’
ఏతత్ రాజనం దేవతాసు ప్రోతమ్।
అగ్ని - ‘హిం’ కారము।
వాయువు - ‘‘ప్రస్తావము’’।
ఆదిత్యుడు - ‘‘ఉద్గీథము’’।
నక్షత్రములు - ‘‘ప్రతిహారము’’।
చంద్రుడు - ‘‘నిధనము’’
ఇది ‘‘దేవతా రాజన సామ గానము’’గా చెప్పబడుతోంది.
2. స య ఏవం ఏతత్
రాజనం దేవతాసు ప్రోతం వేద,
ఏతా సామా ఏవ దైవతానాగ్ం
సలోకతాగ్ం సార్‌ష్టితాగ్ం
సాయుజ్యం గచ్ఛతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోగ్జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా బ్రాహ్మణాన్ న నిందేత్।
తత్ వ్రతమ్।।
అట్టి ‘‘రాజనం దేవతాసు సామగానోపాసనం’’ ఎరిగినవాడు దేవతా తత్త్వమును ఎరిగినవాడై లోకపరిధులను దాటి వేయగలడు. ‘సాయుజ్యము’ సిద్ధించుకోగలడు.
- ఆయుష్షు సద్వినియోగపడగలదు.
- స్వయంజ్యోతి స్వరూపుడు కాగలడు.
- మహాన్ ప్రజ - పశు సంపద పొందగలడు.
- మహాన్ కీర్తిమంతుడగుచున్నాడు.
బ్రహ్మతత్త్వజ్ఞులగు (బ్రాహ్మణముల అంతర్గానము ఎరిగిన) బ్రాహ్మణులను నిందించరాదు. ఇది వ్రతము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే వింశః ఖండః


2-21. ద్వితీయ ప్రపాఠకః - ఏకవింశః ఖండః - సర్వస్మిన్ సామగానోపాసన

1. త్రయీ విద్యా ‘‘హింకారః’’।
త్రయ ఇమే లోకాః ‘‘ప్రస్తావో’’
అగ్నిః వాయుః ఆదిత్యః స ‘‘ఉద్గీథో’’
నక్షత్రాణి వయాగ్ంసి మరీచయః, స ‘‘ప్రతిహారః’’।
సర్పా గంధర్వాః పితరః తత్ ‘‘నిధనం’’।
ఏతత్ సామ సర్వస్మిన్ ప్రోతమ్।।
త్రయీ విద్యా(ఋక్-యజుః-సామ వేదములు) - ‘హిం’ కారము
భూర్-భువర్-సువర్ త్రైలోకములు - ‘‘ప్రస్తావము’’
అగ్ని-వాయు-ఆదిత్య త్రయీ దేవతలు - ‘‘ఉద్గీథము’’
నక్షత్రములు, పక్షులు, సూర్యకిరణములు - ‘‘ప్రతిహారము’’
సర్పములు, గంధర్వులు, పితృదేవతలు - ‘‘నిధనము’’
ఇదంతా ‘‘సామ సర్వస్మిన్’’ లేక ‘‘సర్వస్మిన్ సామోపాసన’’ - అనబడుతోంది.

2. స య ఏవం ఏతత్ సామ సర్వస్మిన్
ప్రోతం వేద సర్వగ్ం హ భవతి।
అట్టి సర్వస్మిన్ సామగానోపాసన ఎరిగినవాడు వేదవిద్వాంసుడు, వేదహృదయము ఎరిగినవాడు.
సర్వులకు సంబంధించిన సామగానము హృదయమునందు దర్శించగలడు.

3. తత్ ఏష శ్లోకః, యాని
పంచధా త్రీణి త్రీణి తేభ్యో।
న జ్యాయః పరం అన్యత్ అస్తి।
దీనికి సంబంధించిన మనన రూపమంత్రము ‘‘5’’ విధములుగా ‘3’ విభాగములుగా (5x3=15) ఏర్పడి ఉపాసించబడుచున్నాయి.
అట్టి ‘15’ అక్షరముల సామగానము (సర్వస్మిన్ వేద సామగానము) మించిన ఉపాసన మరొకటి లేదు.

4. యః తత్ వేద స వేద సర్వగ్ం।
సర్వా దిశో బలిం అస్మై హరంతి।
‘‘సర్వం అస్మి’’ - ఇతి ఉపాసీత।
తత్ వ్రతం తత్ వ్రతమ్।।
ఈ స్వర్వస్మిన్ సామవేదగానము తెలిసినవారు సర్వము ఎరిగిన వారగుచున్నారు.
వారికి సర్వదిక్కులు తమ బలమును ప్రసాదిస్తూ ఉండగా, వారు ఆత్మబలము పునికిపుచ్చుకోగలరు.
‘‘ఈ సమస్తము నేనై ఉన్న నేను’’ను ఉపాసించెదరు గాక।
ఇది వ్రతమగు గాక। ఇదియే వ్రతమగు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకవింశః ఖండః


2–22. ద్వితీయ ప్రపాఠకః - ద్వావింశః ఖండః - వినర్ది సామోపాసన

1. వినర్ది సామ్నో వృణే పశవ్యమ్ ఇతి।
అగ్నేః ఉద్గీథో। అనిరుక్తః ప్రజాపతేః।
నిరుక్తః సోమస్య మృదు శ్లక్‌ష్ణం వాయోః।
శ్లక్‌ష్ణం బలవత్ ఇంద్రస్య।
క్రౌన్చం బృహస్పతేః అపధ్వాంతం వరుణస్య।
తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత
వారుణం తు ఏవ వర్జయేత్।।
పైన చెప్పుకుంటూ ఉన్నట్టి ‘‘సామగానము’’చే సర్వత్రా విస్తారమగు ఆత్మ అనుభవమవగలదు.
వినర్ది (ఎద్దుతో పోలిన) గానము పశువులకు హితకరము.

అగ్ని - ఉద్గీథముగా
ప్రజాపతి - అనిరుక్తముగా
చంద్రుడు - నిరుక్తముగా
వాయువు - మృదువుగా, ప్రియముగా, పిల్లవాయు తరంగాలుగా
ఇంద్రుడు - ప్రియము, బలములతో కూడి
బృహస్పతి - క్రౌంచముగా (కొండగా)
వరుణుడు - అపధ్వాంతముగా (తిరస్కరించవలసినవి తిరస్కరించుటకు శక్తిగా) సామగానములన్నిటినీ ఉపసేవించాలి. సాధన చేయాలి.

వారుణము అనబడు అపధ్వాంతము (దూషణలను) విసర్జించాలి.
2. అమృతత్వం దేవేభ్య
ఆగాయని ఇతి ఆగాయేత్।
స్వధాం పితృభ్య।
ఆశాం మనుష్యేభ్యః।
తృణ ఉదకం పశుభ్యః।

స్వర్గం లోకం యజమానాయ।
అన్నమ్ ఆత్మన ఆగాయానీ ఇతి।
ఏతాని మనసా ధ్యాయన్
అప్రమత్తః స్తువీత।।

ఈ ‘‘అగ్ని, ప్రజాపతి, చంద్ర, ఇంద్ర, బృహస్పతి, వరుణ’’ - సామగానోపాసనచే ఓ ఆయా దేవతలారా! మాకు అమృతత్వము ప్రసాదించండి!’’ - అని సామగానము చేయుదురు గాక!

ఓ దేవతలారా! నన్ను అమృతత్వమునకు జేర్చండి. మా పితృదేవతలకు తృప్తిగా స్వధామ - భోజనము అందించండి. మా పశువులకు గడ్డి, నీరు లభించును గాక।

యజమానికి స్వర్గలోకం లభించును గాక।

నాకు అన్నము (బ్రహ్మము। బ్రాహ్మీస్థితి) ప్రసాదించండి.

ఈ విధంగా మనస్సును నియామకం చేసి అప్రమత్తతతో సామస్తుతి సమర్పిస్తూ ధ్యానించెదరు గాక।


3. సర్వే స్వరా ఇంద్రస్య ఆత్మనః।

సర్వ ఊష్మాణః ప్రజాపతేః ఆత్మానః।

సర్వే స్పర్శా మృత్యోః ఆత్మానస్తం

యది స్వరేషు ఉపాలభేత్
ఇన్ద్రగ్ం శరణం ప్రపన్నో

అభూవం స త్వా ప్రతివక్ష్యతి


ఇతి ఏనం బ్రూయాత్।
సమస్త స్వరములు ఇంద్రభగవానుని రూపములే।

ఊష్మములు (ఉష్ణములు, ఉత్తేజములు) అన్నీ కూడా ప్రజాపతి రూపములే।

స్పర్శలన్నీ కూడా ‘మృత్యువు’ యొక్క రూపములే।

స్వరములో ఏవైనా దోషములు ఉంటే - ‘‘స్వామీ! ఇంద్రదేవా! మిమ్ములను శరణువేడి ఈ స్వరము పలుకుచున్నాను’’ - అని నమస్కరించుదురు గాక।

‘‘ఇంద్రదేవా! మీరు సమాధానము ప్రసాదించెదరు గాక। దోషములు తొలగించి నన్ను ఉద్ధరించండి’’ అని ప్రార్థన చేసి స్వరం పలికెదరు గాక।

దోషములు చూపువారితో ‘‘అయ్యా! క్షమించండి! ఇంద్రదేవుడు సరిచేయుటకై ప్రార్థిస్తున్నాను’’-అని వినమ్రులై పలికెదరు గాక। ఇంద్రుని ఆ రీతిగా వేడెదరు గాక।


4. అథ యది ఏనం ఊష్మసు ఉపాలభేత
ప్రజాపతిగ్ం శరణం,
ప్రపన్నో అభూవం,
స త్వా ప్రతిపేక్ష్యతి -
ఇతి ఏనం బ్రూయాత్।



అథ యది ఏనగ్ం
స్పర్శేషు ఉపాలభేత
మృత్యుగ్ం శరణం
ప్రపన్నో అభూవం
స త్వా ప్రతిధక్ష్యతి
ఇతి ఏనం బ్రూయాత్।।
(ఊష్మములు = గాలిని ఊదుచూ పలుకు వర్ణములు. ‘‘శ-ష-స-హ’’ అను వర్ణములు. జిహ్వమూలీయము ‘క’ కార ‘ఖ’ కారములకు ముందు వచ్చే విసర్గలు. అనుస్వారము)

గాలిని ఊదుతూ పలికే శ-ష-స-హ వర్ణములు, ‘క’కార-‘గ’కార విసర్గలు, అనుస్వారములు - మొదలైన ఊష్మములలో దోషము ఎవరైనా చూపుతూ ఉంటే, ‘‘నేను ప్రజాపతిని ఈ విషయంలో శరణు వేడుచున్నాను. క్షమించబడుదును గాక।’’ - అని నమస్కరిస్తూ ప్రజాపతిని వేడెదరు గాక।


‘‘స్పర్శ’’లో ఏవైనా దోషములున్నాయేమోనని అనుకుంటే ‘‘నేను మృత్యు దేవతను శరణువేడుచున్నాను. నమస్కరించి సరిచేయమని ప్రార్థన’’ అని నమస్కరిస్తూ ప్రతిధ్యక్షిస్తూ (అభ్యర్థన చేస్తూ)
దోష నివృత్తికై - ప్రార్థన పలకాలి.
‘‘మృత్యుదేవత దోషములను దహించును గాక’’ - అని భావపూర్వకంగా శరణాగతుడవాలి.
5. సర్వే స్వరా ఘోషవన్తో
బలవన్తో వక్తవ్యా।
ఇంద్రే బలం దదాని ఇతి।


సర్వ ఊష్మాణో అగ్రస్తా అనిరస్తా,
వివృతా వక్తవ్యాః।



‘‘ప్రజాపతేః ఆత్మానం పరిదదాని’’
ఇతి సర్వే స్పర్శా లేశేనాన్
అభినిహితా వక్తవ్యా।

మృత్యోః ఆత్మానం పరిహరాణి। ఇతి।।
సప్త స్వరములను (‘‘స-రి-గ-మ-ప-ద-ని’’) ఎలుగెత్తి బలమైన నాదముతో, సుశబ్దంగా భావన చేసి గట్టిగా, సుస్పష్టంగా పలకాలి.
‘‘ఇంద్ర భగవానుడు మాకు శబ్ద - నాద బలము ప్రసాదించు గాక’’ - అని భావించి ఉచ్చరించాలి.


సర్వ ఊష్మాణములను (గాలిని ఊదుతూ పలికే ‘శ స ష హ’ వర్ణములను, అనుస్వరములను) - అగ్రములుగా (ప్రాముఖ్య భావనా సహితంగా), అనిరస్తములుగా (అనిరుక్తముగా - సుస్పష్టంగా, నిర్దుష్టంగా) వివృత్తంగా (విడివిడిగా), భావనాపూర్వకంగా పలకాలి.



‘‘జగద్రచయిత అగు ప్రజాపతికి నా ఈ సర్వము సమర్పిస్తున్నాను. ఆత్మార్పణము చేయుచున్నాను’’ - అని భావన చేస్తూ సర్వ శబ్దస్పర్శలను (ఒక శబ్దభావనతో మరొక శబ్దభావన కలిసిపోకుండా) పలకాలి.

‘‘మృత్యువు నుండి నేను రక్షింపబడెదను గాక’’ - అని అమృతస్థాన, మహాశయముతో పలకాలి. అమృతస్థానమును ఉపాసించెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వావింశః ఖండః


2–23. ద్వితీయ ప్రపాఠకః - త్రయోవింశః ఖండః - త్రయీ విద్యా - భూః భువః సువః - ‘‘ఓం’’

1. త్రయో ధర్మ స్కంధాః।
యజ్ఞో, అధ్యయనం, దానం ఇతి ప్రథమః।


తప ఏవ। ద్వితీయః।

బ్రహ్మచారీ ఆచార్య కులవాసీ తృతీయో।
అత్యన్తం ఆచార్యకులే అవసాదయః।
సర్వ ఏతే పుణ్యలోకా భవన్తి।

బ్రహ్మసగ్ంస్థో, అమృతత్వం ఏతి।
మూడు ధర్మ స్కందములు (విభాగములు, సమూహములు)
(1) యజ్ఞము, (2) అధ్యయనము, (3) దానము - వీటికి ముందుగా సంసిద్ధులం కావాలి. ఇది మొదటిది.

‘‘తపస్సు’’ రెండవది.

బ్రహ్మచర్యము ఆర్యకుల వాసము (గురుకుల వాసము) మూడవది.
అన్నిటికీ శ్రేష్ఠము ఆచార్యకుల అవసాదయము (సేవనము). అట్టి గురుసేవచే పుణ్యలోకములు లభించగలవు.

అట్టి తపో బ్రహ్మచర్య గురుకుల వాసములచే బ్రహ్మమునందు బుద్ధి నిశ్చలమైనదై (సంస్థితమై) అమృతత్వము లభించగలదు.
2. ప్రజాపతిః లోకాన్ అభ్యతపత్
తేభ్యో అభితప్తేభ్యః త్రయీ విద్యా
సంప్రాస్రవత్ తాం అభ్యతపత్।


తస్యా అభితప్తాయా ఏతాని అక్షరాణి
సంప్రాస్రవన్త ‘‘భూర్భువః స్వః’’ ఇతి।
ప్రజాపతి లోకములను తపస్సు - సంకల్పము నుండి సృష్టిస్తూ త్రయీ విద్యలను (తపస్సు, బ్రహ్మచర్యము, గురుకల సేవలను) అభితప్యేభ్యముగా (ఆచరణ మార్గములుగా) కల్పించారు.


త్రయీ విద్యనుండి త్రయీ (ఋక్ - యజుర్ - సామ)వేదములను, (అ+ఉ+మ) త్రయీ అక్షరములను, భూర్ (Matter) - భువర్ (Thought and Feelings) - స్వర్ (దివ్య) వ్యాహృతులు అను త్రైలోకములను కల్పించారు.
3. తాని అభ్యతపత్
తేభ్యో అభితప్తేభ్య
‘ఓం’కారః సంప్రాస్రవత్।।

తత్ యథా శంకునా సర్వాణి
పర్ణాని సన్తృణ్ణాని।

ఏవం ‘ఓం’కారేణ సర్వా వాక్ సన్తృణ్ణ।

‘ఓం’కార ఏవ ఇదగ్ం సర్వమ్।
‘ఓం’కార ఏవ ఇదగ్ం సర్వమ్।।

వాటి ‘‘అభితపము’’ నుండి ‘ఓం’ కారము జనిస్తోంది.
అట్టి ‘ఓం’కారము నుండి సమస్త జగత్తు బయల్వెడల సాగుతోంది.

సర్వపర్ణములు (ఆకులవలె) మనో బుద్ధి చిత్త అహంకారములన్నీ జీవకణములుగా బయల్వెడలుచున్నాయి.

‘ఓం’కారము నుండే సమస్త ‘వాక్’ బయల్వెడలుచున్నది.

కనుక ఈ సమస్తము ‘ఓం’ కారమే।
ఓంకారమే ఈ సమస్తము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే త్రయోవింశతి ఖండః


2–24. ద్వితీయ ప్రపాఠకః - చతుర్వింశః ఖండః - సవనము (యజ్ఞము)

అగ్ని = అష్టదిక్పాలకులలో ఒకరు. పూర్వ దక్షిణ దిక్ దేవత (ఆగ్నేయము) - భార్య = స్వాహాదేవి,
పట్టణము = తేజోవతి, వాహనము = మేషము, ఆయుధము = శక్తి. అష్ట వస్తువులకు రాజు కూడా!

1. బ్రహ్మవాదినో వదన్తి
యత్ వసూనాం ప్రాతః సవనగ్ం।
రుద్రాణాం మాధ్యన్ దినగ్ం సవనం।
ఆదిత్యానాం చ విశ్వేషాం చ
దేవానాం తృతీయ సవనమ్।
బ్రహ్మతత్త్వజ్ఞుల ప్రవచనము:
ప్రాతః (ఉదయ) సవనము ఉపాసన → (అష్ట) వసువుల నిమిత్తము
మధ్యాహ్న సవనము - (ఏకాదశ) రుద్రుల నిమిత్తము
సాయం సవనము - (ద్వాదశ) ఆదిత్యుల నిమిత్తము, విశ్వేదేవుల నిమిత్తము నిర్వర్తించాలి.
2. క్వ తర్హి యజమానస్య లోక ఇతి
స యః తమ్ న విద్యాత్
కథం కుర్యాత్? అథ విద్వాన్ కుర్యాత్।
యజమాని (యజ్ఞకర్త) ఉన్న లోకము ఏది? ఆయనచే అన్ని లోకములు స్వాధీనపరచుకోబడుచున్నాయి.

ఈ విధంగా ప్రాతః మధ్యాహ్న సాయం వసు - ఆదిత్య - రుద్ర - యజమాన లోక యజ్ఞవిధులు తెలియకుండా కర్త యజ్ఞము ఎట్లా చేయగలరు? చేయలేరు. అందుచేత యజ్ఞతత్త్వము లక్ష్యము యజ్ఞకర్త, యజ్ఞాభిమానులు, యజ్ఞము చేయించే వారు, యజ్ఞములో పాల్గొనువారు కూడా త్రైసవనములను తెలుసుకొనెదరు గాక। వసు - ఆదిత్య - రుద్ర - విశ్వేదేవ తత్త్వములను ఎరిగి ఉండెదరు గాక।
3. పురాప్రాతః అనువాకస్య ఉపాకరణాత్
జఘనేన గార్హపత్యస్య ఉదఙ్ముఖ
ఉపవిశ్య స వాసవగ్ం సామ అభిగాయతి।
ఉదయ అనువాకము (సవనము / ఉపాకరణము) ప్రారంభిస్తున్నప్పుడు యజ్ఞకర్త - ‘గార్హపత్యాగ్ని’కి ఉత్తరదిక్కుగా ఆసీనుడై ‘‘సవాస-సం సామగానము’’ గానము చేస్తూ యజ్ఞ యాగ హోమ కార్యక్రమము ప్రారంభిస్తున్నాడు.
4. లో3క ద్వారమ్ అపావాℨరూణా ℨℨ పశ్యేమ
త్వా వయగ్ం రా ℨℨℨℨℨ
హు3మ్ ఆ ℨℨ జ్యాℨ యోℨ
ఆ ℨ 𝟚𝟚𝟚𝟚 - ఇతి
‘‘ఓ అగ్నిదేవా। నా విజ్ఞాపన వినండి. మా కొరకై ఊర్ధ్వలోకముల ద్వారములను తెరువండి। ఊర్ధ్వలోకములలో మాకు జ్ఞానదర్శనము ప్రసాదించండి।
ఆ తరువాత ఆహుతులను (1) (5) సార్లు అగ్నికి సమర్పిస్తూ ఉన్నాను’’
- అని యజమాని స్వరబద్ధంగా గానము చేయుచున్నాడు.

5. అథ జుహాతి నమో అగ్నయే। పృథివీ క్షితే।
లోక క్షితే లోకం మే యజమానాయ
వింద ఏష వై యజమానస్య లోక ఏతా2స్మి।
‘‘విశ్వమంతా వ్యాపించియున్న ఓ అగ్నిదేవా! నమోనమః । ఈ అగ్ని కార్యమునకు యజమానినగు నాకు దర్శనమివ్వండి.
భూమిని, లోకములను దాటివేసి నన్ను ఉద్ధరించడానికి ఈ నేనున్న స్థానము చేరి మమ్ములను ఉద్ధరించండి।’’ అని ప్రార్థించెదరు గాక।

6. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా।
అపజహి పరిఘం ఇతి।
ఉక్త్వా ఉత్తిష్ఠతి।
తస్మై వసవః ప్రాతః సవనగ్ం సంప్రయచ్ఛన్తి।
‘‘యాగకర్త యొక్క పరతత్త్వాయుష్షు కొరకై ఈ ఆహుతి (నేయి) సమర్పిస్తున్నాను। స్వాహా"!’’
‘‘ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత ఉత్తరగతుల కొరకు ‘‘స్వాహా’’ అని హోమము చేయుటకై సంసిద్ధుడను! పరిఘము (గడియ)ను తీసివేయుము’’ అని పలుకుచున్నారు.
అప్పుడు ‘‘అగ్నిదేవా! ఈ స్థానముకు రండి!’’ అని చెప్పుచూ యజమాని నిదుర లేస్తున్నారు.
ఆ ప్రాతః సవనము స్వీకరించి వసువులు యజమానికి వరప్రసాదులు అగుచున్నారు.
7. పురా మాధ్యన్ దినస్య సవనస్య ఉపకరణాత్,
జఘనేన అగ్నీధ్రస్య ఉదన్ముఖ ఉపవిశ్య
స రౌద్రగ్ం సామ అభిగాయతి।
మధ్యాహ్న సవనము (యజ్ఞము) ప్రారంభించటానికి ముందుగా యజమాని దక్షిణాగ్నికి వెనుకవైపు ఆసీనుడై, ఉత్తరదిక్కుగా చూస్తూ, ఏకాదశ రుద్రుల గురించి స్వాగత - ఆహ్వానాలు పలుకుచున్నారు. సామగాన పూర్వకంగా పలికెదరు గాక।
8. లోℨ క ద్వారం అపావా ℨ రూణా ℨℨ పశ్యేమ? త్వా వయం వైరా ℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ℨ ఆ ℨ 𝟚𝟚𝟚𝟚- ఇతి।।

‘ఓ అగ్నిదేవా! ఊర్ధ్వలోకముల ద్వారములు మా కొరకై తెరిపించండి। ‘3’ ‘3’ ‘3’ సార్లు మంత్రములు, హవిస్సు సమర్పిస్తున్నాము. స్వామీ! మేము విరాట్ పదము కొరకై సమర్పిస్తున్నాము. మిమ్ములను ఆకాశంలో సందర్శించెదము గాక।’’.

హుం। హుం। హుం।
జ్యా। జ్యా। జ్యా। యో। యో। యో।
ఆ ఆ ఆ ఆ

అంటూ మంత్రములు గానము చేస్తూ హవిస్సులను ఆహుతి (సమర్పణ) చేయాలి.
9. అథ జుహోతి నమో వాయవే
అంతరిక్షక్షితే లోకక్షితే।
లోకం మే యజమానాయ
వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి।
అంతరిక్షమున సంచరిస్తూ లోకరక్షణ చేస్తూ ఉన్న ఓ వాయుదేవా!

ఈ యజ్ఞమునకు యజమానినైయున్న నేను ఈ స్థానమునకు (ఇచ్చటకు) విచ్చేయుటకై ఆహ్వానము పలుకుచున్నాను సుస్వాగతం
10. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా

అపజహి పరిఘం
ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి।

తస్మై రుద్రా మాధ్యన్
దినగ్ం సవనగ్ం సంప్రయచ్ఛంతి।।
‘‘యజమాని పరతత్త్వ ఆయుష్షు అనుగ్రహించటానికై - హవిస్సును ఆహుతిగా సమర్పిస్తున్నాము. స్వాహా!’’

ఈ బెత్తపు దెబ్బతో యజమానిని (యజ్ఞకర్తను) ‘ఉత్తిష్ఠ’ అని విప్రులు లేపుచున్నారు.
(బెత్తపు దెబ్బ = ఉత్తేజితుని, సంసిద్ధుని చేయటము)

ఈ విధంగా మధ్యాహ్న సవనము స్వీకరించు రుద్రులు మధ్యాహ్న వరప్రసాదులై ఆశీర్వాదములు అందజేయుచున్నా
11. పురా తృతీయ సవనస్య
ఉపకరణాత్ జఘనేన ఆహవనీయస్య
ఉదన్ముఖ ఉపవిశ్య స ఆదిత్యగ్ం
స వైశ్వదేవగ్ం సామ అభిగాయతి
మూడవ సవనము (సాయంత్ర సవనము)నకు ముందుగా ఆహవనీయాగ్నికి ప్రక్కగా - ఉత్తరంగా ఉపవిశ్యము (Placed) అయినవాడై, ఆదిత్యుని గురించి (ఆదిస్వరూపము గురించి), విశ్వదేవతల గురించి - యజ్ఞకర్త సామగాన స్తోత్రము గానము చేయుచుండెదరు గాక.
12. లోℨ క ద్వారం అపావా3 రూణా ℨ-ℨ పశ్యేమ,
త్వా వయగ్ం స్వారా ℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ℨ ఆ ℨ𝟚𝟚𝟚𝟚 - ఇతి।
‘‘ఓ ఆదిత్యా! ఈ లోకములో మేము చిక్కుకొని ఉన్నాము. ఈ లోకముయొక్క ముఖద్వారము తెరవండి। మేము ‘స్వారాజ్యము’ కొరకై మిమ్ములను దర్శించగలము.
‘‘ఓ అగ్నిదేవా! స్వర్గతలముయొక్క ద్వారమును మాపై కరుణకలవారై, మా కొరకు దారిచూపండి. దివ్యలోకములు పొందుట కొరకై మేము మిమ్ములను శరణువేడుచున్నాము. మీ దర్శనభాగ్యము ప్రసాదించండి’’.
ఇది ఆదిత్యుల గురించిన సామగానము।
13. ఆదిత్యమ్ అథ వైశ్వ దేవం లో3క ద్వారం
అపావా ℨరూణా ℨℨ పశ్యేమ।


త్వా వయగ్ం సామ్రాℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ఆ ℨ𝟚𝟚𝟚𝟚 - ఇతి।
‘‘ఓ అగ్నిదేవా! స్వర్గభూములు మేము చేరటానికి ముఖద్వారము మీరు తెరిపించండి. మమ్ములను దేవతాలోకము చేరుటకై సహకరించ వలసినదిగా అభ్యర్థిస్తున్నాము’’ - అని యజమాని అగ్నిదేవునికి సాయంకాల సవనమును నుతులతో ప్రారంభం చేస్తున్నారు.

‘‘ఓ అగ్నిదేవా! మేము సమర్పిస్తున్న హోమద్రవ్యములను ఆహుతులుగా స్వీకరించి మమ్ము స్వర్గధామము జేర్చండి’’ - అని యజమాని అగ్నిదేవుని వేడుకొంటున్నారు.
ఓ విశ్వదేవతలారా! లోకము యొక్క ద్వారం తెరవండి. ఆత్మ సామ్రాజ్యము కొరకై మీ దర్శనం ఇవ్వండి।
14. అథ జుహోతి నమ ఆదిత్యేభ్యశ్చ।
విశ్వేభ్యశ్చ। దేవేభ్యో దివిక్షిద్భ్యో లోకక్షిద్భ్యో।
లోకం మే యజమానాయ విందత।
ఇప్పుడు ఆదిత్యునికి ఆహుతులు యజమానిచే సమర్పించ బడుచున్నాయి.

విశ్వదేవునికి (The worker of the universe) - దేవతా లోకములోని దేవతలకు, లోకపాలకులకు హవిస్సులు సమర్పిస్తున్నాను.

యజమానినగు నేను ఈ ఆహుతులు సమర్పిస్తున్నాను. స్వీకరించి యజమానినగు నాకు సంతోషము కలుగజేసెదరు గాక।
15. ఏష వై యజమానస్య లోక ఏతా అస్మి
అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా।


అపహత పరిఘం ఇతి ఉక్త్వా ‘‘ఉత్తిష్ఠ’’ ఇతి।
హే ఆదిత్య భగవాన్। యజమానినగు నేను ఈ ఆహుతులు హవ్య వాహనుని ద్వారా సమర్పిస్తున్నాను. నాకు పరతత్త్వజ్ఞానముతో నిర్మితమగు ఆయుష్షును ప్రసాదించెదరు గాక। స్వాహా।

బెత్తపు దెబ్బచే యజమాని ఉతిష్ఠితుడు (Awakened) అగుచున్నాడు.

16. తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ
దేవాః తృతీయ సవనగ్ం,
సంప్రయచ్ఛన్తి ఏష వై
యజ్ఞస్య మాత్రాం వేద,
య ఏవం వేద।
య ఏవం వేద।।
అప్పుడు యజమాని ఈ విధంగా ఉత్తిష్ఠితుడు (నిదురలేచినవాడు) అగుచూ ఇట్లు అంటున్నాడు.
- ఇదియే ఆదిత్య ముఖద్వారము.
- ఇదే విశ్వేశ్వరుని సమక్షము
- ఇదే దేవతలను జ్ఞాపకము చేసుకొను తృతీయ సవనము।

ఈ విధంగా అట్టి యజ్ఞపురుషుని స్థానము పొందగలము.
ఆయనను తెలుసుకొని పునీతులము అగుచున్నామ.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్వింశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - ద్వితీయో అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅲ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - మూడవ అధ్యాయము

(మధు విద్యా ఉపాసన : 3–1 నుండి 3–11 వరకు)
(మధు = తేనె; తిరశ్చీనవగ్ం = తేనెపట్టు ఉన్న బొంగు; మరీచి = కిరణములు; మధునాడ్యః = తేనె తాగినవాడు)

3–1. తృతీయ ప్రపాఠకః - ప్రథమః ఖండః - సూర్యుని తూర్పు కిరణముల ఉపాసన

1. ఓం।
అసౌ వా ఆదిత్యో దేవ మధు।

తస్య ద్యౌః ఏవ తిరశ్చీనవగ్ంశో
అన్తరిక్షం అపూపో మరీచయః పుత్రాః।
‘ఓం’!
ఆకాశంలో ప్రకాశించు ఆదిత్యుడే (ఆది = The beginning Point of everything) దేవతలకు మధు (తేనె)

ద్యులోకమే (అమృత లోకము) తేనె పట్టు ఉన్న బొంగు వంటిది.
అట్టి ద్యులోకమునకు స్థానము అరూపమగు అంతరిక్షము. అట్టి అంతరిక్షము - తేనెపట్టు.
ఆదిత్యుని (లేక) సూర్యుని కిరణములు ఆదిత్యుని పుత్రులు- ‘‘తేనెటీగలు’’.
2. తస్య యే ప్రాంచో రశ్మయస్తా ఏవ
అస్య ప్రాచ్యో మధునాడ్యః।
ఋచ ఏవ మధుకృత।
ఋగ్వేద ఏవ పుష్పమ్।।
తా అమృతా ఆపః।
తా వా ఏతా ఋచః।
అట్టి (తూర్పు నుండి) ఆదిత్యుని (సూర్యుని) నుండి ప్రసరిస్తున్న కిరణములే మధునాడ్యములు - తూర్పు మధు నాడ్యములు.

ఋగ్వేదములో ఋక్కులు - మధుకృతములు (తేనెటీగలు)
ఋగ్వేదము - ‘‘పుష్పము’’
అందలి జలమే (తేనెయే) - ‘‘అమృతము’’

అట్టి తత్త్వజ్ఞుల పరమాత్మ గురించిన ప్రవచన గానములే ఋగ్వేదము.

3. ఏతమ్ ఋగ్వేదం అభ్యతపన్,

తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।
పరమాత్మ స్వరూప స్వభావములను అభివర్ణించు తత్త్వము సదా ఉపాసించబడు గాక। భావించబడు గాక।

ఈ విధంగా - ‘‘సూర్యుడే దేవతలకు మధువుగాను, మధువు (అమృత తత్త్వముతో) స్వర్గము జేర్చునని, ఆకాశమే మధువుకు ఆధారమని, సూర్యకిరణములే మధుపుత్రులని, ఋక్కులు మధుపములని (పంచామృత విశేషములని), ఋగ్వేదమే యజ్ఞపుష్పమని, అందలి ఆత్మతత్త్వ స్తుతులే అమృతమని, ఆత్మతత్త్వము గానము చేయు ఋషులే తేనెటీగలనీ-ఎరిగి భజించువాడు - యశస్సు, తేజస్సుతో కూడిన ఇంద్రియములు, వీర్యము, అన్నాద (బ్రాహ్మీ) రసము పొందగలడు
4. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యమ్
అభితో అశ్రయత్।
తద్వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య రోహితగ్ం రూపమ్।।
అట్టివాడు స్వాభావికంగా ఇక్కడే, ఇప్పుడే ఆదిత్య లోకము ఆశ్రయించిన వాడై, సిద్ధించుకోగలడు. దాటివేయగలడు కూడా।
ఆదిత్యుని ఎఱ్ఱని రూపము ఉపాసిస్తూ ఆదిత్య భగవానుని ఆత్మస్వరూపునిగా గ్రహించినవాడై, క్రమంగా తానే ఆఖండాత్మానంద స్వరూపుడై విరాజిల్లగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ప్రథమః ఖండః


3–2. తృతీయ ప్రపాఠకః - ద్వితీయః ఖండః - సూర్యుని దక్షిణ కిరణముల ఉపాసన

1. అథ యే అస్య దక్షిణా రశ్మయస్తా
ఏవ అస్య దక్షిణా మధునాడ్యో।
యజూగ్ం షి ఇవ మధుకృతో।
యజుర్వేద ఏవ పుష్పం।
తా అమృతా ఆపః।
సూర్యునికి దక్షిణముగా ఏ కిరణములు ఉన్నాయో, అవియే దక్షిణమువైపుగల ‘‘మధునాడులు’’.
యజుర్వేదములోని మంత్రములు - తేనెటీగలు (మధుకృతములు, తుమ్మెదలు)
యజుర్వేదమే పుష్పము (తేనెటీగలు తేనె తెచ్చు స్థానములు)
తేనెయే అమృతము
(మార్పు చేర్పులు లేనట్టి - మధురమగు కేవల స్వస్వరూపము)
2. తాని వా ఏతాని యజూగ్ంషి
ఏతం యజుర్వేదం అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।।

యజుర్వేద మంత్రములు (యజస్సులు) యజుర్వేదమును - (తేనె పట్టును తేనె తీగలవలె) ఆలింగనము చేసుకొని ఉన్నాయి.
అట్టి యజస్సుల (మంత్రముల) యజుర్వేద ఆలింగనము వలన (ఆశ్రయము వలన) రసము రూపంగా (తేనె రూపంగా) యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలము, వీర్యము, భోజనము (అన్నము) - ఇవన్నీ లభిస్తున్నాయి.

3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం
అభితో అశ్రయత్ తద్వా ఏతత్
యత్ ఏతత్ ఆదిత్యస్య శుక్లగ్ం రూపమ్।।
అట్టి యజస్సుల (మంత్రముల) తేనెతీగలు ఆశ్రయించియున్న ‘తేనెపట్టు’ వంటి యజుర్వేదమునుండి (ఆత్మానంద మాధుర్యము అనే) తేనె పొంగిపొరలి (జ్ఞాన) సూర్యుని చుట్టూతా ఆశ్రయించాయి.
అట్టి తేనె (యజస్సుల అంతరార్థము) ఆక్రమణయే ఆదిత్యుని ‘‘తెల్లటి రూపము’’ అయి ఉన్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ద్వితీయః ఖండః


3–3. తృతీయ ప్రపాఠకః - తృతీయః ఖండః - సూర్యుని పడమర కిరణముల ఉపాసన

1. అథ యే అస్య ప్రత్యంచో
రశ్మయస్తా ఏవ అస్య ప్రతీచ్యో
మధునాడ్యః సామాని ఏవ మధుకృతః।
సామవేద ఏవ పుష్పం తా అమృతా ఆపః।।
సూర్యునియొక్క పడమరదిక్కు కిరణములే మధునాడ్యములు (తేనె తుట్టెలోని నాడ్యములు)
సామ గానములే (సామములే) - తేనెటీగలు (మధుకృతములు)
సామ వేదమే - (తేనెటీగలు తేనె తెస్తున్న) పుష్పములు
తేనెతుట్టెలోని తేనె రసము వలె సామవేదములోని రసమే / జలమే
- ‘‘అమృతము’’ (జన్మ-కర్మలకు ఆవలిదగు, మార్పుచేర్పులు లేని ఆత్మరూపము).
2. తాని వా ఏతాని సామాని
ఏతగ్ం సామవేదం అభ్యతపన్
తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో-జాయత।।
సామములు (సామవేద గానములు) తేనెపట్టును తుమ్మెదల వలె - సామవేదమును ఆశ్రయించి, చోటు చేసుకొని ఉన్నాయి.
అట్టి సామముల (సామగానముల, సామమంత్రముల) సామవేద- ఆలింగనము నుండి యశస్సు, తేజస్సు, ఇంద్రియముల జ్ఞానసాధనముల ఆశ్రయము అనే బలము, (ఆత్మజ్ఞానము అనే) వీర్యము అనబడు రసము (తేనె) లభిస్తోంది. (‘‘రసము’’ = తత్త్వజ్ఞానము, తత్త్వానుభవము)
3. తత్ వ్యక్షరత్, తత్ ఆదిత్యం అభితో అశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య కృష్ణగ్ం రూపమ్।
అట్టి రసము (ఆత్మజ్ఞానము అనే తేనె) ఆదిత్యుని ఆశ్రయించుటచేత ఏర్పడిన నలుపుయే ఆదిత్యుని కృష్ణవర్ణము.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే తృతీయః ఖండః


3–4. తృతీయ ప్రపాఠకః - చతుర్థః ఖండః - సూర్యుని ఉత్తర కిరణముల ఉపాసన

1. అథ యే అస్య ఉదంచో రశ్మయస్తా ఏవ
అస్య ఉదీచ్యో మధునాడ్యో
అథర్వ అంగిరస ఏవ మధుకృత।
ఇతిహాస పురాణం పుష్పం।
తా అమృతా ఆపః।

ఇక సూర్యుని ఉదీచ్యదిశ (ఉత్తరదిక్కు) కిరణములు.
- అట్టి ఉత్తరదిక్కు మధునాడ్యములు (నాడులు).
- అథర్వ వేద మంత్రములే ఆ ‘‘తేనెటీగలు’’.
- ఇతిహాస పురాణములు ఆత్మ మాధుర్యము కొరకు వెతకు తేనెటీగలు వ్రాలు ‘‘పుష్పములు’’.
- అందు లభించే జలమే (తేనెయే) అమృతము.

2. తే వా ఏతే అథర్వ అంగిరస
ఏతత్ ఇతిహాస పురాణం అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః తేజ
ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్ం
రసో అజాయత।।
అట్టి అథర్వ మంత్రములయొక్క అథర్వవేదమనే తేనెతుట్టెను ఆలింగనము చేసుకొనియుండటముచే ఇతిహాస పురాణములు లభిస్తున్నాయి.
- అట్టి ఇతిహాస పురాణములలోని (ఆత్మతత్త్వము అనే) మధురసము గ్రోలుటచే యశస్సు, తేజస్సు, వీర్యము, అన్నాదము (భుజించు మధుర పదార్థములు) లభిస్తున్నాయి.
(అంగీరసము = సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించుచున్నప్పుడు లభించే మాధుర్యము)
3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం
అభితో ఆశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య పరం కృష్ణగ్ం రూపమ్।
అట్టి మధుర రసము (ఇతిహాస, పురాణములలోని ఆత్మతత్త్వరసము) పొంగి పొరలి సూర్యునిచుట్టూ ఏర్పడటము జరుగుతోంది. అట్టి అథర్వమంత్రముల రసరూపమగు ఇతిహాస పురాణ సారమే ఆదిత్యునిలో కనిపిస్తున్న నలుపురంగు ఆచ్ఛాదనము

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే చతుర్థః ఖండః


3–5. తృతీయ ప్రపాఠకః - పంచమః ఖండః - సూర్యుని ఊర్ధ్వ కిరణముల ఉపాసన

1. అథ యే అస్య ఊర్ధ్వా రశ్మయస్తా ఏవ।
అస్య ఊర్ధ్వా మధునాడ్యో
గుహ్యా ఏవ ఆదేశా మధుకృతో।

బ్రహ్మైవ పుష్పం తా అమృతా ఆపః।
సూర్యునియొక్క ఊర్ధ్వ దిక్కువైపు కిరణములే మధునాఢ్యము (తేనెతుట్టె)

ఆత్మ గురించి గురుముఖతః లభిస్తున్న తత్త్వరహస్యమగు ఆదేశములు తుమ్మెదలు.

బ్రహ్మమే - ‘‘పుష్పము’’
జలము (రసము, తేనె) - ‘‘అమృతము’’.
2. తే వా ఏతే గుహ్యా ఆదేశా
ఏతత్ బ్రహ్మ అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః
తేజ ఇంద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।
బ్రహ్మతత్త్వజ్ఞులగు మహనీయుల శ్రేయోవాక్యపూర్వక తత్త్వరహస్య బోధలు బ్రహ్మమును ఆలింగనము చేయిస్తున్నాయి.

అట్టి రహస్య బోధలు ఏ ప్రణవ స్వరూపమగు ఆత్మను ఆలింగనము చేస్తున్నాయో, అట్టి బోధలు శ్రవణ మననములు చేసి, ధ్యాసను ఏకాగ్ర పరచువాడు యశస్సు, తేజస్సు, ఇంద్రియముపై అజమాయిషీ, వీర్యము, ఉత్తమానుభవముల రూపమగు అన్నాద రసములు పొందగలడు.
3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం అభితో ఆశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య మధ్యే క్షోభత ఇవ।
అట్టి మధువు (తత్త్వరహస్య బోధల సారము) ఆదిత్యుని ఆశ్రయించి చుట్టూ స్థానము పొందుచున్నాయి.
ఆ మధు తత్త్వము పొంగిపొరలి సూర్యుని మధ్యగా క్షోభవలె ఆక్రమించుచున్నది.
4. తే వా ఏత రసానాగ్ం రసాః।
వేదా హి రసాః తేషాం ఏతే రసాః।।
తాని వా ఏతాని అమృతానాం అమృతాని
వేదా హి - అమృతాః
తేషాం ఏతాని అమృతాని।।
అట్టి మధువుయొక్క రసామృతము చేతనే వేదములు నిండి ఉన్నాయి. వేదముల సారము అట్టి మధుర రసామృతమే। ఆత్మమాధుర్య మార్గదర్శకత్వమే। ఆత్మయొక్క కేవల స్వరూప ఆనందరసమే అటు సూర్యుని, ఇటు వేదములను తమ కాంతి - ఎరుక తేజోవిభవముతో నింపి ఉంచుచున్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే పంచమః ఖండః


3–6. తృతీయ ప్రపాఠకః - షష్ఠః ఖండః - అరుణాదిత్యోపాసన (లేక) సూర్యోదయాది కాంతుల ఉపాసన

1. తత్ యత్ ప్రథమం అమృతం

తత్ వసవ ఉపజీవన్తి అగ్నినా ముఖేన।

న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।

ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి।
సూర్యోదయ వసువుల ఉపాసన
అరుణ (ఎర్రటి) రూపములో ఉన్నట్టిది ప్రథమ అమృతము.

అగ్ని ముఖంగా, అగ్నిదేవుని రూపంగా ప్రాతఃసవనమునకు అధిపతులగు - (అష్ట) వసువులు ఆ అమృతమును అనుభవముగా పొందుచున్నారు.

అయితే, దేవతలు అట్టి అమృతమును భుజించటము లేదు, త్రాగటము లేదు.

అమృతము (మార్పుచేర్పులు లేని స్వస్వరూప మాధుర్యము)ను చూస్తూ ఆనందిస్తున్నారు. తృప్తి పొందుచున్నారు.
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశంతి।
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
అట్టి అమృత రూపములో లీనమగుచున్నారు.
వారు ఆత్మరూపము (లేక) అమృతరూపము పట్ల ఉద్యుక్తులు అగుచున్నారు. ఉద్యమిస్తున్నారు.
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
వసూనాం ఏవ ఏకో భూత్వా అగ్నిన ఏవ
ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
‘అట్టి మార్పు చేర్పులకు ఆవలిదైనట్టి అమృతరూపము ఎవరు తెలుసుకుంటారో, వారు వసువుల రూపము పొందుచూ, అగ్నిదేవుని ఉన్ముఖంగా అమృతత్వము సిద్ధించుకొనెదరు’’.

అట్టి అరుణకాంతుల సూర్యుని ఆత్మభావనకై ఉపాసించువారు మార్పుచేర్పులచే స్పర్శించబడని అమృతదృష్టిచే అసంతృప్తులను జయించగలరు. ‘ఆత్మతృప్తి’ని పొందగలరు. ‘ఆత్మమేవాహమ్’ భావనను ఆశ్రయించినవారై ఆత్మయందు నిత్యోదితులై ఉండగలరు.
4. స యావత్ ఆదిత్యః పురస్తాత్
ఉదేతా పశ్చాత్ అస్తమేతా
వసూనాం ఏవ తావత్
ఆధిపత్యగ్ం స్వారాజ్యం పర్యేతా।
అట్టి అరుణోదయ కాంతులను ( ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తిమ్…., సప్త అశ్వ రథం ఆరూఢం, ప్రచండం, కశ్యపాత్మజం, భాస్కరాయ విద్మహే, మహద్ధ్యతి కరాయ ధీమహి। తన్నో ఆదిత్య ప్రచోదయాత్ మొదలైన మంత్రములతో) - ఆత్మోపాసన చేయువారు -
సూర్యుడు తూర్పున ఉదయిస్తూ పడమర అస్తమిస్తున్నంతకాలము వసువుల ఆధిపత్యము పొందినవారై స్వయం ప్రకాశత్వమగు స్వారాజ్యము సిద్ధించుకోగలరు

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే షష్ఠః ఖండః


3–7. తృతీయ ప్రపాఠకః - సప్తమః ఖండః - మధ్యాహ్న సూర్య - రుద్రుల ఉపాసన

1. అథ యత్ ద్వితీయం అమృతం
తత్ ‘రుద్రా’ ఉపజీవన్తి, ఇన్ద్రేణ ముఖేన।

న వై దేవా అశ్నన్తి న పిబన్తి।

ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
ఇప్పుడు ఇక ద్వితీయమగు సూర్యుని శుక్ల (తెల్లని) రూప - అమృతమును (ఏకాదశ) రుద్రులు ఇంద్రుని ముఖంగా, ఇంద్రుని రూపంగా పొందుచున్నారు.

దేవతలు ఈ అమృతము కూడా తినటం లేదు, త్రాగటం లేదు.

అయితే దేవతలు - ఆ అమృతమును (The Self beyond any change) సర్వత్రా దర్శించుచు తృప్తిచెందుచున్నారు.
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశంతి।
ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి।
వారు ఆ సూర్యుని తెల్లటి రూపమునందు ప్రవేశించి, ఆ రూపమును ఉద్యమింపజేస్తున్నారు.
3. స య ఏతత్ ఏవం అమృతం
వేద రుద్రాణాం ఏవ-ఏకో భూత్వా,
ఇంద్రేణ ఏవ ముఖేన ఏతత్
ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి।
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।
ఎవ్వరైతే అట్టి ఆదిత్యునియొక్క తెల్లటి ‘‘అమృత’’ రూపము తెలుసుకొంటూ ఉంటున్నారో అట్టి ఉపాసనపరుడు ఏకాదశ రుద్రులలో ఒకడుగా అగుచు, ఇంద్రుని సహాయముతో అట్టి అమృతమును సర్వదా దర్శించుచు ‘ఆత్మతృప్తుడు’ అగుచున్నాడు.
- అట్టి అమృత రూపములో విలీనుడు అగుచున్నాడు.
- తత్ రూపమునందు ఉదితుడై (ఉదయించి) స్వయం అమృతరూపుడగుచున్నాడు. స్వయంప్రకాశమగు నిత్య ప్రకాశాత్మానందరూపుడై విరాజిల్లుచున్నాడు.
4. స యావత్ ఆదిత్యః
పురస్తాత్ ఉదేతా।
పశ్చాత్ అస్తమేతా।
ద్విస్తావత్ దక్షిణత ఉదేత।
ఉత్తరతో అస్తమేతా।
రుద్రాణాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।
ఎవ్వడైతే - అట్టి అనన్యమగు అమృతమును (లేక) అట్టి స్వస్వరూపామృత తత్త్వమును ఎరుగుచున్నాడో అట్టివాడు సూర్యోదయాస్తములు ఉత్తర - దక్షిణములలో జరుగుచున్నంత కాలము (ఆచంద్రార్కము) ‘కాలము’ ప్రవర్తించునంతకాలము, ‘‘రుద్రస్థానము’’ పొంది ఉండగలడు.

ఇంకా, దక్షిణ దిక్కుతో ఉదయించి ఉత్తరదిక్కుతో అస్తమించు కాలము (అనగా, రెట్టింపు కాలము) - రుద్రుల ఆధిపత్యమగు స్వారాజ్యము (ఈ సమస్తము స్వయంకృతమగు స్వయం - ఆత్మస్వరూపమే - అను స్వస్వరూపాస్వాదన) సిద్ధించుకొనుచూ రుద్రానందము పొందగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే సప్తమః ఖండః


3–8. తృతీయ ప్రపాఠకః - అష్టమః ఖండః - సాయంకాల - ఆదిత్యుల ఉపాసన

1. అథ యత్ తృతీయం అమృతం -
తత్ ఆదిత్యా ఉపజీవన్తి, వరుణేన ముఖేన।
న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యభగవానుని మూడవ రూప విభాగము మూడవ అమృతము. అట్టి మూడవ అమృతమును వరుణ ముఖముగా వరుణుని రూపముగా ఆదిత్యులు ఆస్వాదనచేస్తూ ఉన్నారు. (ఇది సాయంకాల సూర్యుని ఉపాసన)
దేవతలు అట్టి సాయం - అమృతతత్త్వమును దేవతలు భుజించటము లేదు. త్రాగటము లేదు. అయితే అట్టి సాయంకాల సూర్య అమృత తత్త్వమును చూస్తూ ఆనందిస్తున్నారు. తృప్తులగుచున్నారు.
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశన్తి
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
ఆదిత్యులు అట్టి అమృతరూపమునందు లీనమై తత్ రూపమును పొందినవారై ఉంటున్నారు.
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
ఆదిత్యానాం ఏవ ఏకోభూత్వా,
వరుణేన ఏవ ముఖేన ఏతత్ ఏవ
అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపమ్ అభి సంవిశతి,
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
అట్టి సూర్యుని సాయం సూర్య అమృత తత్త్వము ఎరిగినవాడు ద్వాదశాదిత్యులలో ఒకడై, వరుణముఖంగా ‘అమృతము’ (మార్పు- చేర్పులకు ఆవలగల కేవలమగు స్వస్వరూపమును) దర్శించుచూ తృప్తుడగుచున్నాడు.

అట్టి అమృత రూపముతో విలీనము పొంది, అమృతరూపుడై ఉదయిస్తున్నాడు.
4. స యావత్ ఆదిత్యో దక్షిణత ఉదేత।
ఉత్తరతో అస్తమేతా ‘ద్వి’స్తావత్।
పశ్చాత్ ఉదేతా।
పురస్తాత్ అస్తమేతా।
ఆదిత్యానాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
అట్టివాడు సూర్యోదయాస్తమయము జరుగుచున్నంతకాలమునకు రెండంతలు కాలము (అనగా)
ఎంతకాలము సూర్యుడు దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కునందు అస్తమిస్తాడో…(మరియు)
ఎంతకాలము సూర్యుడు పశ్చిమ దిక్కుగా ఉదయించి, తూర్పు దిక్కుగా అస్తమిస్తాడో…
అంత కాలము ద్వాదశాదిత్యుల స్వారాజ్యము, సంపదలు పొందగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే అష్టమః ఖండః


3–9. తృతీయ ప్రపాఠకః - నవమః ఖండః - సూర్యాస్తమయ - మరుత్తుల ఉపాసన

1. అథ యః చతుర్థం అమృతం
తత్ మరుత ఉపజీవన్తి - సోమేన ముఖేన।

న వై దేవా అశ్నన్తి। న పిబంతి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యదేవుని నల్లని రూపము నాలుగవ అమృతము.
‘‘చంద్రముఖం’’గా మరుత్తులు ఆ చతుర్థ నల్లని రూపమును అనుభవముగా పొందుచున్నారు.

దేవతలు అట్టి నల్లటి అమృత రూపమును భుజించటము లేదు. త్రాగటము లేదు. అయితే, అట్టి అమృత చతుర్థ రూపమును చూస్తూ తృప్తిని పొందుచూ ఉన్నారు.
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశన్తి,
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
ఎవ్వరైతే ఈ వివరములను తెలుసుకొంటున్నారో, ఉపాసిస్తున్నారో, అట్టివాడు మరుత్తులలో ఒకడుగా అగుచున్నాడు. సోమముఖంగా ఆ నాలుగవ అమృతరూపమును పొందుచున్నాడు. అట్టి రూపముతో ఉద్యన్తుడు అగుచున్నాడు.
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
మరుతాం ఏవ ఏకో భూత్వా
సోమేన ఏవ ముఖేన।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి,
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।
- ఆ విధంగా మరత్తులలో ఒకడై, అట్టి అమృతరూపమును పొంది,
- తత్ రూపమునందు ప్రభవించుచు,
- తత్ అమృతరూపమును దర్శించుచు తృప్తుడగుచున్నాడు.
అట్టి సూర్యాస్తమయం (సూర్యుని) నాలుగవ రూపమును ఉపాసించి ఆత్మోపాసన చేయువారు, అట్టి సూర్యాస్తమయ సూర్యతత్త్వమును సంతరించుకొని ఆదిత్యునియందు ఉదయించువారు అవగలరు.
4. స యావత్ ఆదిత్యః।
పశ్చాత్ ఉదేతా।
పురస్తాత్ అస్తం।
ఏతా ‘ద్వి’స్తావత్
ఉత్తరత ఉదేతా।
దక్షిణతో అస్తమేతా।
మరుతాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
సూర్యుడు ఎంతవరకు పశ్చిమదిక్కుగా ఉదయించి తూర్పుదిక్కుగా అస్తమిస్తున్నాడో, అంతకు రెండింతలు -
ఉత్తర దిక్కుగా ఉదయించి దక్షిణ దిక్కుగా అస్తమించు కాలము అంతకాలము - సూర్యుని నాలుగవ అమృత రూపము ఎరిగి ఉపాసించువాడు మరుత్తులలో ఒకడై ఆధిపత్యము, స్వారాజ్యము పొందియుండగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే నవమః ఖండః


3–10. తృతీయ ప్రపాఠకః - దశమః ఖండః - సాధ్యుల - ఆదిత్య అంతరాంతర - బ్రహ్మోపాసన

1. అథ యత్ పంచమం
అమృతం తత్ సాధ్యా ఉపజీవన్తి,
బ్రహ్మణా ముఖేన।।

న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యభగవానుని అంతర (లోపలి) రూపము ‘పంచమ’ అమృత రూపము.
అట్టి పంచమ అమృతరూపమును బ్రహ్మదేవుని (ప్రజాపతి) ముఖంగా సాధ్యులు ఆశ్రయించి జీవిస్తున్నారు.

దేవతలు అట్టి అంతర్గత పంచమ అమృత రూపమును తినటము లేదు. త్రాగటము లేదు. అయితే అట్టి సూర్య అంతరామృతమునే దర్శిస్తూ తృప్తులు అగుచున్నారు.
2. త ఏతత్ ఏవ రూపం
అభిసంవిశన్తి ఏతస్మాత్
రూపాత్ ఉద్యన్తి।
అట్టి ఐదవ అంతరామృత రూపమును చూస్తూ సర్వదా ఆ అమృత రూపమునందే సాధ్యులు - నిత్యోదితులై ఉంటున్నారు.
3. స య ఏతత్ ఏవం
అమృతం వేద సాధ్యానాం ఏవ
ఏకో భూత్వా బ్రహ్మణైవ ముఖేన
ఎతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి।
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
అట్టి అంతర - అమృతరూపమును ఎరిగినవారు సాధ్యులలో ఒకరై, బ్రహ్మదేవుని (ప్రజాపతి) ముఖంగా అమృతదర్శనం చేస్తూ ఆత్మతృప్తులవగలరు.
అట్టి రూపములో ప్రవేశము పొంది అమృతస్వరూపులుగా ఉదయించగలరు.
4. స యావత్ ఆదిత్య ఉత్తరత ఉదేతా।
దక్షిణతో అస్తమేతా ద్విస్తావత్
ఊర్ధ్వ ఉదేతా। అర్వాక్ అస్తమేతా।
సాధ్యానాం ఏవ తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
అట్టి అంతరాంతర అమృత తత్త్వము ఎరిగినవారు
- సూర్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమించుచున్నంత కాలమునకు రెండంతలు,
- ఊర్ధ్వమున ఉదయించి, అధోభాగమున అస్తమించుచున్నంత కాలము, సాధ్యులలో ఒకరై ఆధిపత్యము, స్వారాజ్యము సిద్ధించుకొన్నవారై ఉండగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే దశమః ఖండః


3–11. తృతీయ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - మధు విద్యా ఉపాసనకు పరాకాష్ఠ

1. అథ తత ఊర్ధ్వ ఉదేత్య, న ఏవ ఉదేతా।
న అస్తం ఇతి।
ఏకల ఏవ మధ్యే స్థాతా।।

తత్ ఏష శ్లోకః।।
ఆ తరువాత అట్టి ఉపాసకుడు - సూర్యుడు ఊర్ధ్వంగా తాను వెళ్లి - అక్కడ ఉదయాస్తములు లేనివాడై (ఉదయించనివాడై, అస్తమించనివాడై) అక్కడే మధ్యగా నివాసము కలిగి ఉంటున్నాడు.

అట్టి ఉదయాస్తమయాతీతమగు సూర్యస్థానము వర్ణిస్తూ శాస్త్రీయమగు ఈ శ్లోకము చెప్పబడుచున్నది.
2. న వై తత్ర న నిమ్లోచ
న ఉదియాయ కదాచన।
దేవాః తేన అహగ్ం
సత్యేన మా విరాధిషి బ్రహ్మణా ఇతి।।

ఆత్మసూర్యుడు ఏ కార్యములు చేయనివాడై, ఉదయ - అస్తమయములు ఏమాత్రము ధర్మములుగా లేనివాడై (Sans the Functions of Dawn and Dusk)
- ‘బ్రహ్మము’ అను స్థానమును వీడనివారై ఉంటున్నారు.

ఓ దేవతలారా! నేను అట్టి సత్యమగు బ్రహ్మస్వరూపమునందే నిత్యనివాసిని।

3. న హ వా అస్మా ఉదేతి।
న నిమ్లోచతి। సకృద్దివా హి
ఏవ అస్మై భవతి - య ఏతాం
ఏవం బ్రహ్మోపనిషదం వేద।।
ఓ శ్రోతలారా। దేవతలారా। నేను ఈ సర్వాత్మకమగు స్వస్థానము నుండి రాను - పోను - వృద్ధి పొందను. గ్లాని-హాని పొందను.
బ్రహ్మమును సమీపించి, బ్రహ్మమునకు సమీపముగా ఆసీనుడై
- బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాను. బ్రహ్మోపనిషదుడనై విరాజిల్లుచున్నాను.
4. తత్ హ ఏతత్
బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ।
ప్రజాపతిః మనవే। మనుః ప్రజాభ్యః।
తత్ హ ఏతత్ ఉద్దాలకాయ, అరుణయే,
జ్యేష్ఠాయ పుత్రాయ
పితా బ్రహ్మ ప్రోవాచ।।
ఈ ‘మధు విజ్ఞానము’ను ఒకప్పుడు సృష్టికి ఆదిస్వరూపుడగు బ్రహ్మభగవానుడు, ప్రజలకు పతి అగు ప్రజాపతికి చెప్పి ఉన్నారు.
- ప్రజాపతి మనువుకు బోధించి ఉన్నారు.
- మనువు ఇక్ష్వాకుడు మొదలైన అనేకమంది జనులకు బోధించారు.
ఈ బ్రహ్మ జ్ఞానమును అరుణి తన పెద్ద కుమారుడగు ఉద్దాలకునికి ఉపదేశించారు.
5. ఇదం వావ తత్
జ్యేష్ఠాయ పుత్రాయ పితా
బ్రహ్మ ప్రబ్రూయాత్।
ప్రణాయ్యాయ వా అన్తేవాసినే।।
అట్టి ఈ బ్రహ్మజ్ఞానమును బ్రహ్మజ్ఞుడైనవాడు తన జ్యేష్ఠ పుత్రునికి, మరియు అర్హులు, ప్రియులు అగు శిష్యులకు పరంపరగా ఉపదేశించెను.
6. న అన్య అస్మై కస్మై చ న
యది అపి అస్మా ఇమాం అద్భిః
పరిగృహీతాం, ధనస్య పూర్ణాం దద్యాత్।
ఏతత్ ఏవ తతో భూయ ఇతి।
ఏతత్ ఏవ తతో భూయ ఇతి।।
అర్హతగల సంతానమునకు, శిష్యులకు కాకుండా, తపోధ్యానాదుల అభ్యాసములేని అనర్హులకు ఉపదేశించరాదు.
ఈ బ్రహ్మవిద్య సముద్రమంత సంపదకన్నా కూడా ఉత్తమోత్తమ మైనది. అందుచే ధనము, అధికారము మొదలైనవి బ్రహ్మవిద్యకు అర్హత కాదు.
ఈ బ్రహ్మవిద్య సమస్త లోకసంబంధమైన, ధనార్జనా సంబంధమైన అన్ని విద్యలకంటే కూడా మహత్తరమైనది, మహనీయమైనది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ఏకాదశః ఖండః


3–12. తృతీయ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - గాయత్రీ ఉపాసన

1. గాయత్రీ వా ఇదగ్ం సర్వం
భూతం యత్ ఇదం కిం చ।
వాక్ వై గాయత్రీ।
వాక్ వా ఇదగ్ం సర్వం భూతం।
గాయతి చ త్రాయతే చ।।
సర్వలోకములలోని సమస్త భూతజాలము (కొంచము నుండి భూరివరకు), సమస్తము గాయత్రీ గాన స్వరూపమే।

వాక్కు గాయత్రీ స్వరూపము। ఈ సర్వము గాయత్రీ గానముగా ఉపాసించుటచే అట్టి గాయత్రీ మననము రక్షణ ప్రసాదించగలదు.

(గాతయత్ త్రాయతే యస్మాత్ ‘‘గాయత్రీ’’ ఇతి అభిధీయతే - గానముచే రక్షించునది కాబట్టి ‘గాయత్రీ’।)
2. యా వై సా గాయత్రీ
ఇయం వావ సా యేయం పృథివీ।
అస్యాగ్ం హి ఇదగ్ం సర్వం
భూతం ప్రతిష్ఠితం
ఏతాం ఏవ న అతిశీయతే।।
ఏది గాయత్రియో, అదియే ఈ సమస్త పృథివి, ఈ సమస్త జీవుల స్వరూపము కూడా।
‘‘గాయత్రి’’ తత్త్వమునందే ఈ జీవులంతా ప్రతిష్ఠితులై ఉన్నారు. గాయత్రియందే నివాసము కలిగియున్నారు.
ఏదీ కూడా గాయత్రీతత్త్వమును అధిగమించి లేనేలేదు.
సమస్త బ్రహ్మాండములు ‘‘గాయత్రి’’ యందు (దర్పణంలో దృశ్యమువలె) అంతర్గతమై ఉన్నాయి.
3. యా వై సా పృథివీ ఇయం వావ సా యత్ ।

ఇదం అస్మిన్ పురుషే శరీరం
అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితా
ఏతత్ ఏవ న అతిశీయన్తే।
ఏది పృథివియో అది గాయత్రియే।

ఈ పురుషుని భౌతిక శరీరము, ఇందలి పంచప్రాణములు, ఇంద్రియములు, ‘శబ్ద స్పర్శ రూప రస గంధ’ - ఇంద్రియార్థములు, ఆ ఇంద్రియార్థములకు విషయములతో కూడిన దృశ్యజగత్తు - ఇదంతా గాయత్రీయందే సంప్రతిష్ఠితమైయున్నది. గాయత్రిని దాటి ఏదీ లేదు.
4. యత్ వై తత్పురుషే
శరీరం ఇదం వావ, తత్
యత్ ఇదం అస్మిన్
న అంతః పురుషే హృదయం।
అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితా,
ఏతత్ ఏవ న అతిశీయన్తే।
గాయత్రియే తత్పురుష శరీరము. ఆద్యంతరహిత పురుషుడే గాయత్రి।

ఈ పురుషుడు, ఆలోచనలకు జననస్థానమగు ఆతని హృదయము, పురుషకారమునందు ప్రవర్తమానమైయున్న ఇందలి ప్రాణతత్త్వము - గాయత్రియందే సుప్రతిష్ఠితమై ఉన్నాయి.

గాయత్రిని అధిగమించినదై ఏదీ లేదు।
5. స ఏషా చతుష్పదా
షడ్విధా గాయత్రీ।
తత్ ఏతత్ ఋచా అభ్యనూక్తమ్।
గాయత్రీ షట్ విధా : ఆరేసి (6) అక్షరములుగల నాలుగు (4) పాదములతో కూడిన ఛందస్సు.

అట్టి గాయత్రి - వాక్కు, ప్రాణులు, పృథివి, దేహము, హృదయము, ప్రాణములు అనే ఆరు (6) రూపములుగా ఉన్నది.

అట్టి గాయత్రీదేవి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనే ‘చతుష్పాదము’ అయి (నాలుగు పాదములు) మరియు (మనో బుద్ధి చిత్త అహంకార-జీవ-ఈశ్వరులనే) ఆరు పాదములు ప్రదర్శనముగా కలిగియున్నది.

ఆ గాయత్రీ ఋక్కులచే స్తుతించబడుచున్నది.
6. తావాన్ అస్య మహిమా
తతో జ్యాయాగ్ంశ్చ పూరుషః।
పాదో అస్య సర్వా
భూతాని త్రిపాదస్య
అమృతం దివి ఇతి।।
వాక్కు, ప్రాణులు, పృథివి, దేహము, హృదయము, ప్రాణములు - అనే ఆరు రూపములు గాయత్రీ మహిమా విశేషములు. వాటన్నిటికంటే అధిక మహిమగలవాడు ‘‘పురుషుడు’’.

అట్టి పురుషునిలో
Ⅰ. నాలుగవ వంతు - సమస్త భౌతిక రూప - భూతజాలము. మార్పు - చేర్పుల విభాగమైయున్నది.
Ⅱ. మిగతా మూడు పాదములు - అమృతస్వరూపమై దివ్యలోకములను నిండి ఉన్నది.
7. యత్ వై తత్ బ్రహ్మ ఇతి ఇదం వావ।
తత్ యో అయం బహిర్ధా పురుషాత్ ఆకాశో।
యో వై స బహిర్ధా పురుషాత్ ఆకాశః।
గాయత్రీ దేవీ రూపమగు అట్టి పరబ్రహ్మమే ఇక్కడి ఈ శరీరము చుట్టూ ఆకాశరూపముగా (బహిరాకాశంగా) వ్యాపించి ఉన్నది.
8. అయం వావ స యో
అయం అంతఃపురుష ఆకాశో
యో వై సో అంతఃపురుష ఆకాశః।

ఆ పరబ్రహ్మమే అంతఃపురుష ఆకాశ పురుషుడై, దేహములోపల అంతఃపురుషాకాశము రూపముగా సర్వత్రా నిండియున్నది.

9. అయం వావ స యో అయం
అంతర్హృదయ ఆకాశః।
తత్ ఏతత్ పూర్ణం అప్రవర్తి
పూర్ణాం అప్రవర్తినీగ్ం।
శ్రియం లభతే, య ఏవం వేద।।
అట్టి పరబ్రహ్మమే ‘‘అంతర-హృదయాకాశము’’లో కూడా హృదయమంతటా నిండి ఉన్నది.
హృదయములో ఏ పరబ్రహ్మము బ్రహ్మాకాశమై విస్తరించి ఉన్నదో, అది స్వతఃగానే పూర్ణము. అది ప్రవర్తితము కాదు. అప్రవర్తితము. ఎటువంటి ప్రవర్తనలేనిదై నిశ్చలమై, సుస్థిరమై, యథాతథమై, నిర్వికారమైయున్నది.
అట్టి ఆత్మ గురించిన తత్త్వము ఎరిగినవాడు సర్వశ్రేయస్సులు పొందగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ద్వాదశః ఖండః


3–13. తృతీయ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - హృదయాంతర్గత సుషిర ఉపాసన

1. తస్య హ వా ఏతస్య
హృదయస్య పంచ దేవ సుషయః।
స యో, అస్య ప్రాక్ సుషిః
స ప్రాణస్తః చక్షుః।
స ఆదిత్యః తదేతత్ ‘‘తేజో’’।
‘‘అన్నాద్యం’’ ఇతి ఉపాసీత।
తేజస్వి అన్నాదో భవతి,
య ఏవం వేద।।
(సుషి = రంధ్రము, దారి)
అట్టి గాయత్రీస్వరూపమై ప్రకాశించుచున్న హృదయస్థానము సిద్ధింపజేయుటకు పంచ విధములైనట్టి దేవ సుషులు (దేవలోకమునకు ద్వారములు / మార్గములు / త్రోవలు / దారులు) ఉన్నాయి.

(1) తూర్పు సుషి (మార్గము) - ప్రాణదేవత : ద్వారపాలకుడు ‘ప్రాణము’. ప్రాణదేవుడే దేహములో నేత్రములు (చూపు)గానున్నారు. ఆకాశంలో ఆదిత్యుడై (సూర్యభగవానుడై) ఉన్నారు. ఆయనను పంచప్రాణములలోని ‘‘ప్రాణము’’ను హృదయము యొక్క తూర్పు సుషిగా పూజించాలి.
ఇంకా, అట్టి ప్రాణదేవతను తేజోరూపముగాను, అన్నాదుడుగాను (ఆహారప్రదాతగాను) ఉపాసించెదరు గాక।

అట్టి ప్రాణేశ్వరుని (మోక్ష) ద్వారపాలకునిగాను, తేజోరూపునిగాను, అన్నాదునిగాను ఎరుగువాడు - తేజోవంతుడు, అన్నాదుడు అగుచున్నాడు.
2. అథ యో అస్య దక్షిణః సుషిః స‘‘వ్యానః’’।
తత్ శ్రోత్రగ్ం। స చన్ద్రమాః।
తత్ ఏతత్ శ్రీః చ। యశః చేతి ఉపాసీత।
శ్రీమాన్ యశస్వీ భవతి, య ఏవం వేద।
(2) దక్షిణ సుషి - ‘‘వ్యానము’’ : ఈయనయే చెవి, వినికిడిగా, ఆకాశంలో చంద్రుడుగా, దర్శించాలి. ఈయనయే ఐశ్వర్యప్రదాతగా ఉపాసించాలి.

ఎవ్వరైతే (పంచ ప్రాణములలోని) వ్యానదేవతను శ్రవణశక్తి గాను, ఔషధి రూపంగాను, ఆహారము అనుగ్రహిస్తున్నవారు గాను, యశోప్రదాత గాను (రక్షకుడుగాను) తెలుసుకొని ఉంటారో, అట్టివారు శ్రీమాన్ (సంపదకలవారు)గాను, కీర్తిమంతులుగాను (యశస్విగాను) అగుచున్నారు.
3. అథ యో అస్య ప్రత్యక్ సుషిః
సో ‘‘అపానః’’ సా వాక్। సో ‘‘అగ్నిః’’।
తత్ ఏతత్ బ్రహ్మవర్చసం,
‘‘అన్నాద్యం’’ ఇతి ఉపాసీత।
బ్రహ్మవర్యస్య అన్నాదో భవతి, య ఏవం వేద।
(3) ప్రత్యక్ - (పశ్చిమ) సుషి (ద్వారము) -‘‘అపానము’’:
అట్టి అపాన దేవతయే - (అపానద్వారమే) ‘వాక్’ స్వరూపము. (మరియు) అగ్ని స్వరూపము. అట్టి అపానదేవతను ‘‘బ్రహ్మవర్చస్సు’’ గాను, అన్నాదుడు (అన్నప్రదాత)గాను ఉపాసించెదరు గాక।
అపానమును వాక్ రూపముగాను, (Talking Ability) అగ్నిరూపము గాను, బ్రహ్మవర్చో ప్రదాతగాను, అన్నాదుడుగాను ఎరిగి ఉపాసించు వాడు బ్రహ్మవర్చస్సు, ఆహార సమృద్ధి పొందగలడు.
4. అథ యో అస్య ఉదఙ్ సుషిః స ‘‘సమానః’’।
తత్ మనః। స పర్జన్యః।
తత్ ఏతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చ।
ఏతి ఉపాసీత।
కీర్తిమాన్, వ్యుష్టిమాన్ భవతి
య ఏవం వేద।
(4) హృదయమునకు ఉత్తరంగా గల రంధ్రము - ‘‘సమానము’’:
- అది ‘‘మనస్సు’’.
- అదియే పర్జన్యుడు
అట్టి సమానప్రాణబ్రహ్మమును మనస్సుగాను, పర్జన్యుడుగాను, పరబ్రహ్మముయొక్క ‘కీర్తి’గాను, వర్షించు అనుగ్రహముగాను ఉపాసించబడుగాక।

ఈ విధంగా హృదయ ఉత్తర సుషియమును సమానప్రాణ-మనో- పర్జన్య-పరబ్రహ్మరూపముగా ఉపాసించువాడు కీర్తిమంతుడు వ్యుష్టి (లావణ్య)వంతుడు కాగలడు.
5. అథ యో అస్య ఊర్ధ్వః
సుషిః స ‘‘ఉదానః’’।
స వాయుః। స ఆకాశః।
తత్ ఏతత్ ఓజః చ మహః చ
ఇతి ఉపాసీత। ఓజస్వీ,
మహస్వాన్ భవతి,
య ఏవం వేద।।
హృదయముయొక్క ఊర్ధ్వ సుషిరము (ఛిద్రము) - ఉదాన ప్రాణోపాసన।
- అట్టి ఊర్ధ్వరంధ్ర ఉదానప్రాణమే వాయువు. అదియే ఆకాశము. అదియే ఓజస్సుగాను , మహత్ స్వరూపముగాను ఉపాసించబడుగాక।
(ఓజస్సు = తేజము; బలము; సారము; పరాక్రమము;, వెలుగు;, శ్రేష్ఠత, Inclination / Inspiration)

ఈ విధంగా : హృదయ ఊర్ధ్వ సుషిరమును (ఛిద్రమును) - ఉదాన ప్రాణముగా, ఉదానప్రాణమును వాయు స్వరూపంగా, ఆకాశ స్వరూపంగా, ఓజస్సుగా, మహత్‌గా ఉపాసించబడు గాక।

అట్టి ఉపాసనను ఎరిగినవాడు ఓజస్విగాను, మహాన్‌గాను అగుచున్నాడు.
6. తే వా ఏతే ‘‘పంచ బ్రహ్మ పురుషాః’’
స్వర్గస్య లోకస్య ద్వారపాలాః।
స య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మపురుషాః
స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేదాస్య కులే
వీరో జాయతే, ప్రతిపద్యతే స్వర్గం లోకం,
య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్’’ -
స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద।।
హృదయము యొక్క సుషి (రంధ్రములు)
(1) ప్రాక్ సుషిః (రంధ్రము) - ‘‘ప్రాణము’’ (చూపు, ఆదిత్యుడు, అన్నాదము)
(2) దక్షిణ సుషిః - ‘‘వ్యానము’’ (శ్రోతము (వినికిడి); చంద్రమసము; సంపద; కీర్తి)
(3) ప్రత్యక్ (పడమర) సుషిః (రంధ్రము) - ‘‘అపానము’’ - వాక్కు, అగ్ని, వర్చస్సు, అన్నాదము.
(4) ఉదన్ (ఉత్తరము) వైపు సుషిః ‘‘సమానము’’ - మనస్సు; పర్జన్యుడు; కీర్తి; అనుగ్రహము.
(5) ఊర్ధ్వసుషిః (ద్వారము) ‘ఉదానము’ - వాయువు, ఆకాశము, బలము.
పై ఐదుగురు బ్రహ్మపురుషులు బ్రహ్మమునకు ద్వారపాలకులు.
ఈ ఐదుగురు బ్రహ్మపురుషులు స్వర్గలోక (ఆత్మతత్త్వ) ‘‘పంచద్వారపాలకులు’’.

ఎవ్వరైతే ఈ పంచ దివ్య ద్వారపాలకులను భక్తితో ప్రార్థనలు సమర్పిస్తూ ఉపాసన చేయుచున్నాడో…
పంచద్వారపాలకులను బుద్ధితో ఎరుగుచూ, ఆరాధిస్తూ ఉంటాడో, అట్టివాడు స్వాభావికంగా స్వర్గలోక ఆనంద నివాసమునకు అర్హుడై, స్వర్గలోక ప్రవేశము పొందుచున్నాడు.
7. అథ యత్ అతః పరో దివో జ్యోతిః దీప్యతే।
విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు
అనుత్తమేషు, ఉత్తమేషు లోకేషు
ఇదం వావ తద్యత్ ఇదం
అస్మిన్ అంతః పురుషే జ్యోతిః।।
ఏ పరబ్రహ్మజ్యోతి - ఆవలి లోకమగు దివ్యలోకమునందు (స్వర్గలోకమునందు) - అన్నింటికీ పైనగా, విశ్వమునకు ఆవలగా, అనుత్తమ లోకములలో కూడా అంతటా ప్రకాశించుచున్నదో,
అట్టి ఉత్తమ - అనుత్తమ లోకములలో సర్వత్రా ప్రకాశమానమైయున్న జ్యోతియే (Enlightenment)….ఇక్కడ సమస్త భౌతిక శరీరములలో కూడా (పురుషుని అంతరమున కూడా) జ్యోతి స్వరూపమై వెలుగొందుచున్నది.

ఈ ఎదురుగా కనిపిస్తున్న సమస్తము ‘‘ఆత్మజ్యోతి’’ యొక్క తేజోరూపమే।
8. తస్య ఏషా దృష్టిః
యత్ర, ఏతత్ అస్మిన్ శరీరే
సగ్ంస్పర్శేన ఊష్ణిమానం విజానాతి।
అట్టి పరంజ్యోతి స్వరూపమే కంటికి సాకారముగా కనబడుచున్న సమస్తముగా వెలుగొందుచున్నది.
అట్టి (ఆత్మానంద) జ్యోతి స్వరూపమే ఒకరి శరీరము స్పృశించినప్పుడు ‘వెచ్చతనము’గా స్పర్శానుభవము అగుచూ, తెలియబడుతోంది.
తస్య ఏషా శ్రుతిః యత్ర ఏతత్
కర్ణావపి గృహ్య నినదం ఇవ,
నదథుః ఇవ, అగ్నేః ఇవ,
జ్వలత ఉపశృణోతి।
తదేతత్ దృష్టం చ,
శ్రుతం చ, ఇతి ఉపాసీత।
చక్షుష్యః శ్రుతో భవతి,
య ఏవం వేద।
య ఏవం వేద।।
అట్టి పరంజ్యోతియే చెవులు (వ్రేళ్ళతో) మూసుకున్నప్పుడు ‘ఉం…..’ నినదముగా వినపడుతోంది. చెవులలో అగ్నిజ్వాల శబ్దమువలె ‘ఉం’కు ఆదిగా (శబ్దరూపంగా) వినబడుతోంది.

ఈ విధంగా యోగాభ్యాసి
- కంటికి కనబడు వెలుగును (వెలుగులో దృశ్యమును),
- చెవులకు వినబడే నినదము (Sound)ను,
- అగ్నిజ్వాల శబ్దమువలె వినబడు ఛటఛట శబ్దములును
ధ్యానపూర్వకంగా ఎరుగుచూ ఉపాసించువాడు ఆత్మతత్త్వము యొక్క దర్శనము, స్పర్శ సిద్ధించుకోగలడు. సర్వత్రా స్వస్వరూపాత్మను, స్వస్వరూపమునందే సమస్తమును గమనించగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే త్రయోదశః ఖండః


3–14. తృతీయ ప్రపాఠకః - చతుర్దశః ఖండః - శాండిల్య విద్యా

1. సర్వం ఖల్విదం బ్రహ్మ।

తత్ జలాన్ - ఇతి ‘‘శాంత’’ ఉపాసీత।।


అథ ఖలు క్రతుమయః పురుషో యథా
క్రతుః అస్మిన్ లోకే పురుషో భవతి।
తథేతః ప్రేత్య భవతి।


స క్రతుం కుర్వీత।
నామ-రూప-గుణాత్మకంగా ఎదురుగా కనిపిస్తున్న ఈ సమస్తముగా ఉన్నది బ్రహ్మమే।
అట్టి బ్రహ్మమునందే సమస్త దృశ్యము యొక్క ఏర్పడటము, కొనసాగటము, లయము అవటము జరుగుతోంది.

అట్టి పరమశాంతమగు బ్రహ్మమును ఉపాసించెదము గాక!

అట్టి పరమాత్మ క్రతు (యజ్ఞ)మయ పురుషుడు. అట్టి క్రతు (యజ్ఞ)మయ పరుషునిగా పరమాత్మను తెలుసుకొనెదము గాక। పురుషుడే ఈ జీవుడు.
- ఈ జీవుడు సంకల్పములను (నిశ్చయములను) కలిగి ఉంటున్నాడు.
- ఈ జీవుడు ఏఏ సంకల్పములను (నిర్ణయములను, నిశ్చయములను) కలిగి ఉంటాడో, తదనంతరం అదియే అగుచున్నాడు.

అందుచేత, జగత్ యజ్ఞ పురుషుని పురుషకారముగా ఈ జగత్తును భావించువాడు యజ్ఞపురుషుడే అగుచున్నాడు.
2. మనోమయః। ప్రాణ శరీరో, ‘భా’ రూపః।
సత్య సంకల్ప। ఆకాశాత్మా।
సర్వ కర్మా। సర్వకామః।
సర్వగంధః, సర్వ రసః।




సర్వం ఇదం అభ్యాత్తః।

అవాకీ అనాదరః।।
అట్టి బ్రహ్మము…,
★ మనోమయుడు. ఆయన మనస్సే ఇదంతా!
★ ప్రాణరూపుడు. తేజోరూపుడు.
★ సత్య సంకల్పుడు.
★ ఆకాశమంతా ఆత్మగా కలవాడు.
★ సర్వ కర్మలు ఆత్మయే.
★ సర్వ కామములు ఆత్మయే.
★ సర్వగంధములు, రసములు ఆత్మ విన్యాసమే.

ఈ సమస్తమును అన్నివైపులా వ్యాపించి ఉన్నది - ఆత్మయే.

ఆత్మ - - అవాక్‌మానసగోచరము.
- ఎట్టి అదరము (తొట్రుపాటు) లేనట్టిది.
3. ఏష మ ఆత్మా అంతర్ హృదయే
అణీయాన్ వ్రీహేర్వా,
యవాద్వా, సర్షపాద్వా,
శ్యామాకాద్వా, శ్యామాక తండులాద్వా।




ఏష మ ఆత్మా అంతర్ హృదయే జ్యాయాన్ పృథివ్యా
జ్యాయాన్ ‘అంతరిక్షా’। జ్యాయాన్ ‘దివో’।
జ్యాయాన్ ‘ఏభ్యో-లోకేభ్యః’’।
నా ఈ ఆత్మ నాయొక్క అంతరహృదయమునందు
వ్రీహేర్వా - వడ్ల గింజ చివ్వరి మొన కంటె,
యవ - కారు మినుములు, అలసందల కంటె,
సర్ష పాద్వా - ఆవ గింజల కంటె,
శ్యామాకాద్వా - మిరియపు గింజలకంటె,
శ్యామాక - తృణధాన్య విశేషములకంటె,
తండూలాక్వా - బియ్యపు గింజ కంటె,
వీటన్నిటి సూక్ష్మరూపము కంటే సూక్ష్మాతి సూక్ష్మము।
(The Smallest of the Smallest. The Subtlest!)

అంతేకాదు!- అంతర హృదయములో వెలుగుచున్న నా ఆత్మ
పృథివికంటే, అంతరిక్షముకంటే, దేవలోకముకంటే,
సమస్త లోకములకంటే కూడా (14 లోకములలో సమస్త వస్తు జాలము కంటే కూడా) అత్యంత శ్రేష్ఠము. మిక్కిలి వృద్ధము.(The Biggest of the Biggest)

4. సర్వకర్మా। సర్వకామః।
సర్వగంధః। సర్వరసః।
సర్వం ఇదం అభ్యాత్తో।



అవాకీ అనాదర,
సర్వకర్మలు, సర్వ కామములు ఆత్మవే।
సర్వగంధానుభవములు, సర్వ రసానుభవములు కలిగియున్నట్టిది - ఆత్మ।
సర్వ దిక్కులందు, సర్వ వైపులా, సర్వత్రా వ్యాపించి ఉన్నది.


నా యొక్క సర్వదా నేనైయున్న, ఆత్మయొక్క సహజరూపము-
☼ వాక్యములచే వర్ణించరానిది.
☼ అదరము (Disturbance) లేనిది. ఈ దృశ్య జగత్తుగా కనిపిస్తున్నా కూడా నిర్వికారమైనది.
ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితా2స్మి - ఇతి
యస్య స్యాదద్ధా న విచికిత్సా అస్తి ।।


హ స్మాహ శాండిల్యః శాండిల్యః।
అట్టి హృదయమునందలి ఆత్మయే బ్రహ్మము.



అట్టి ఆత్మ తత్త్వమునందు ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో, వారికి సంసారమునకు సంబంధించిన ఎట్టి సందేహములు మిగిలి ఉండవు.
ఇతి హ స్మాహ శాండిల్యః శాండిల్యః।
ఇది శాండిల్య జగద్గురువుచే ప్రవచించబడిన ఆత్మతత్త్వ విన్యాసము.
శ్రీ శాండిల్య మునీశ్వరులుచే ప్రబోధించబడిన ఆత్మజ్ఞాన విశేషము.

శాండిల్య జగద్గురవే నమః।

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే చతుర్దశః ఖండః


3–15. తృతీయ ప్రపాఠకః - పంచదశః ఖండః - విరాట్ కోశోపాసన

1. అంతరిక్ష ఉదరః, కోశో భూమి,
బుధ్నో న జీర్యతి।


దిశో హి అస్య స్రక్తయో।

ద్యౌః అస్య ఉత్తరం బిలగ్ం స ఏష కోశో

వసుధానః తస్మిన్ విశ్వం ఇదగ్ం శ్రితమ్।।
ఆత్మకు జీర్యము (నాశనము) అనునదే లేదు. ఈ విశ్వము అట్టి విశ్వేశ్వర రూపమే।
అంతరిక్షము ఉదరము (పొట్ట) గాను, భూమి కోశము (ఖజానా) గాను గల ఈ విశ్వము కూడా వినాశనము లేనట్టిదే।

అట్టి ఈ విశ్వమునకు అష్టదిక్కులు మూలముగా (లేక) కోణములుగా కలిగియున్నట్టిది.

ద్యులోకము (స్వర్గలోకము) పైన ఉండే ఛిద్రము, అనగా బిలము అద్దాని కోశము.

అట్టి విశ్వమునకు రత్నగర్భ అయి భూమి అమర్చబడినదై ఉన్నది.
2. తస్య ప్రాచీ దిక్ ‘జుహూః’ నామ।
‘‘సహమానా’’ నామ ‘‘దక్షిణా’।
‘రాజ్ఞీ’ నామ ప్రతీచీ।
‘‘సుభూతా’’ నామ ఉదీచీ।


తాసాం వాయుః వత్సః ।
స య ఏతం ఏవం వాయుం దిశాం
వత్సం వేద, న పుత్ర రోదగ్ం రోదితి।।

సో2హమ్ ఏతం ఏవం
వాయుం దిశాం వత్సం
వేద, మా పుత్ర రోదగ్ం రుదమ్।
అట్టి విశ్వమునకు
తూర్పు దిక్కు పేరు - ‘జుహూ’’।
దక్షిణ దిక్కు పేరు - ‘సహనామ’
పడమర దిక్కు పేరు - ‘‘రాజ్ఞీ’’
ఉత్తర దిక్కు పేరు - ‘‘సుభూతా’’

అట్టి నాలుగు దిక్కులకు ప్రియమైన బిడ్డ - ‘వాయువు’.
అట్టి ‘4’ దిక్కుల యొక్క ముద్దుబిడ్డ అగు దిశ సమన్వితమగు ‘వాయువు’ను ఎఱిగినవాడు - కుమారునివలన దుఃఖము ఏమాత్రము పొందడు. (పుత్రునివలన ఆనందమునే పొందగలడు).

నేను ఈ విధంగా వాయు వీచికలను దిక్కుల ప్రియ పుత్రునిగా ఎరుగుచున్నాను. అందుచేత పుత్రుని గురించిన దిగులు ఇక నాకు ఉండజాలదు. క్షేమముకొరకై బాధ పడనక్కర్లేదు.
నా పుత్రుని ఆయుష్షు కొరకై వత్స (Young boy) వంటి వాయు దేవుని ఉపాసించుచున్నాను.
3. ‘‘అరిష్టం కోశం’’ ప్రపద్యే అమునా,
అమునా, అమునా।।

‘ప్రాణం’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
‘భూః’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
‘భువః’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।।
‘‘స్వః’’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
అరిష్టము (మేలు, శుభము) కొరకై - అవినాశియగు ‘కోశము’ను ‘‘విశ్వకోశము నాశనము లేనిది - లేనిది - లేనిది’’ - అని ఉపాసించు చున్నాము.

ప్రాణదేవతను కోరికలు నెరవేరుటకై శరణువేడుచున్నాను.
అభీప్సితములు నెరవేరటానికై భూలోకమును ఆశ్రయిస్తున్నాను.
అవసర సిద్ధికై భువర్లోకమును శరణు కోరుకొనుచున్నాను.
వాంఛల సిద్ధికై (స్వర్) సువర్లోకమునకు శరణాగతుడను అగుచున్నాను.

4. స యత్ అవోచం ప్రాణం
ప్రపద్య, ఇతి ప్రాణో వా।
ఇదగ్ం సర్వం భూతం,
యత్ ఇదం కించ తమ్ ఏవ తత్ ప్రాపత్సి।
ప్రాణోపాసన అనగా
‘‘ఈ సృష్టిలో (లేక) దృశ్యములో కనిపించే ప్రాణులంతా, అస్మత్ (నాయొక్క) - ప్రాణశక్తి యొక్క ప్రదర్శనమే’’ అని గమనిస్తూ ఉన్నవాడనై ఉండటము.
సర్వ స్వరూపుడగు, స్వయం సమస్త ప్రదర్శనా స్వరూపుడగు - ‘‘ప్రాణేశ్వర భగవానుని’’ ప్రార్థనలను సమర్పిస్తూ ఉపాసించటము. ‘‘విశ్వప్రాణ స్వరూపమే నేనై ఉన్నాను’’ అను ప్రాణేశ్వర స్వరూప ధారణము.
5. అథ యత్ అవోచం భూః ప్రపద్య
ఇతి పృథివీం ప్రపద్యే।
భూ ఉపాసన అనగా -
‘‘భూః’’ కు ప్రపత్తి సమర్పిస్తున్నాను - అనగా భూమికి శరణాగతుడను అగుచున్నాను - అను భావన. భౌతికమైనదంతా ఆత్మగా దర్శించటము.
అంతరిక్షం ప్రపద్యే దివం ప్రపద్య,
ఇతి ఏవ తత్ అవోచమ్।
అంతరిక్షోపాసన అనగా -
అంతరిక్షమును శరణువేడుచున్నాను. ద్యులోకమును ప్రపద్యించుచున్నాను. అనగా ఆ తత్ పరమాత్మనే నేను ఉపాసించటము - ఉపాసకుడనై ఉపాస్యము అగుచుండటము.
6. అథ యత్ అవోచం భువః ప్రపద్య
ఇతి అగ్నిం ప్రపద్యే వాయుం ప్రపద్య।
ఆదిత్యం ప్రపద్య।
ఇతి ఏవ తత్ అవోచమ్।।
‘‘భువః ప్రపద్య’’ అనగా భువలోక ఉపాసనచే -
- అగ్నిని ఉపాసిస్తున్నాను
- వాయువును ఉపాసిస్తున్నాను
- ఆదిత్య భగవానుని ఉపాసిస్తున్నాను
అనియే నేను చెప్పుచున్నట్లు!
7. అథ యత్ అవోచగ్ం ‘‘స్వః’’ ప్రపద్య -
ఇతి ఋగ్వేదం ప్రపద్యే।
యజుర్వేదం ప్రపద్యే।
సామవేదం ప్రపద్య
ఇతి ఏవ తత్ అవోచం।
తత్ అవోచం।।
‘‘సువర్లోకమును ఉపాసిస్తున్నాను’’ - అని చెప్పుచున్నప్పుడు ‘‘ఋగ్వేదమును, యజుర్వేదమును, సామవేదమును ఆరాధిస్తున్నాను’’ అని చెప్పుచున్నాను. ‘‘త్రైవేద అంతర్లీనసారమే నేను’’ అను ఆరాధన.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే పంచదశః ఖండః


3–16. తృతీయ ప్రపాఠకః - షోడశః ఖండః - ఆత్మయజ్ఞోపాసన–1

1. పురుషో వావ యజ్ఞః।
తస్య యాని చతుర్విగ్ంశతి (24) వర్షాణి
తత్ ‘‘ప్రాతః సవనమ్’’।
చతుర్విగ్ంశతి (24) అక్షరా
గాయత్రీ గాయత్రం ప్రాతః సవనం।
తదస్య వసవో అన్వాయత్తాః।
ప్రాణా వావ వసవ,
ఏతే హి ఇదగ్ం సర్వం వాసయంతి।
పురుషుడే (వ్యక్తియే) నిశ్చయముగా యజ్ఞము. (నా యొక్క పురుషకారము జగత్ -యజ్ఞవిభాగమే)।
ప్రాతః సవనం
ప్రాతః స్తుతులు
- అట్టి పురుషుడు గడిపిన 24 సంవత్సరముల జీవితము ప్రాతఃకాల యజ్ఞ సవనము.
- అట్టి ప్రాతఃకాల సవనము ‘24’ అక్షరములు కలిగియున్నది.
- (ఈ విధంగా) గాయత్రీమంత్రము 24 అక్షరములు.
- ఉదయ యజ్ఞము ‘‘ప్రాతఃకాల గాయత్రీసవనము’’ - వసువులకు సంబంధించినది.

ప్రాణములు సర్వత్రా విస్తరించి అంతటా నిండి ఉండటంచేత, వసించినవి అవటంచేత - ప్రాణములే ‘‘వసువులు’’.
2. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్,
స బ్రూయాత్ ప్రాణా! వసవ।
ఇదం మే ప్రాతఃసవనం,
మాధ్యం దినగ్ం సవనం అనుసంతనుతేతి।
మా అహం ప్రాణానాం వసూనాం
మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇతి।
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।।
ఈ 24 సంవత్సరముల వరకు ఏదైనా వ్యాధివలన కించిత్ బాధ కలుగుతూ ఉంటే - ఇట్లా ప్రార్థన చేయాలి.

‘‘ఓ ప్రాణ రూపులగు వసువులారా! నేను మీకు భక్తితో సమర్పిస్తున్న ఈ ‘‘ప్రాతఃకాల యజ్ఞ సవనము’’ను ‘‘మాధ్యందిన సవనము’’తో ఏకము చేయండి. కలపండి!
ప్రాతఃకాల యజ్ఞసవన నిష్టుడనైయున్న నేను ప్రాణరూపులగు వసువుల మధ్యలో ఉండి, నాశనము లేనివాడనగుదును గాక। నశించకుండెదను గాక।’’

ఇట్టి ప్రాతః చతుర్వింశతి అక్షరగాయత్రీ - సవనము చేయువాడు సర్వ దైహిక - మానసిక రోగములనుండి విముక్తుడవగలడు.
3. అథ యాని చతుఃచత్వారిగ్ంశత్ (44)
వర్షాణి తత్ ‘‘మాధ్యన్దినగ్ం సవనం।’’
చతుఃచత్వారిగ్ంశత్ అక్షరా।
త్రిష్టుప్। త్రైష్టుభం మాధ్యన్‌దినగ్ం సవనం।
తదస్య రుద్రా అన్వాయత్తాః।
ప్రాణా వావ రుద్రా
ఏతే హి ఇదగ్ం సర్వగ్ం రోదయన్తి।।
మధ్యన్దినగ్ం సవనం
మధ్యాహ్న స్తుతులు
ప్రాతః దిన సవనం తరువాత 44 సంవత్సరముల వరకు ‘‘మధ్యందిన సవనము’’ - చెప్పబడుతోంది.
- అక్షరములు = ‘44’
- ఛందస్సు = ‘త్రిష్టుప్’
- ‘‘త్రిష్టుప్’’చే మధ్యాహ్న సవనము గానము చేయబడుతోంది.

అట్టి మధ్యందిన సవనము (ఏకాదశ) రుద్రులకు సంబంధించినది.
- రుద్రులు ఈ విశ్వమునకు రోదనము (ఆక్రందనము, అణచటము) కలిగించువారు. కనుక రుద్రులు.
- ప్రాణములు రోదనములు కలిగించేవి కాబట్టి ప్రాణములే రుద్రులు.
4. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్ స బ్రూయాత్।
‘‘ప్రాణా! రుద్రా! ఇదం మే మాధ్యన్ దినగ్ం
సవనం తృతీయ సవనం అనుసన్తనుతేతి।
మా అహం ప్రాణానాగ్ం రుద్రాణాం మధ్యే
యజ్ఞో విలోప్సీయేత్ ఇతి
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।।
ఈ మధ్యందిన సవనకాలమగు 44 సంవత్సరములు వ్యాధులు కలుగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరు గాక।

“ప్రాణదేవతలారా! రుద్రులారా! ఈ మా మధ్యాహ్న సమయ సవనము (లేక) యజ్ఞమును మూడవ (తృతీయ) యజ్ఞముగా (వరకు) మలచమని రుద్ర దేవతా స్వరూపులగు మిమ్ములను శరణు వేడుచున్నాను. యజ్ఞపురుషుడనైయున్న నేను ప్రాణదేవతలైనటువంటి రుద్రుల మధ్యగా మిగిలిపోయి రుద్రస్వరూపుడనగుదును గాక। ముందుముందుకు ఉద్ధరించబడెదము గాక।”

అట్టివాడు బాధలనుండి విడివడి ఆరోగ్యవంతుడు కాగలడు.
5. అథ యాని అష్టాచత్వారిగ్ంశత్ (48)
వర్షాణి తత్ తృతీయ సవనం।
అష్టాచత్వారిగ్ంశదక్షరా ‘‘జగతీ’’।
జాగతం తృతీయ సవనం
తత్ అస్య ఆదిత్యా అన్వాయత్తాః।
ప్రాణా వావ ఆదిత్యా ఏతే హి
ఇదగ్ం సర్వం ఆదదతే।
తృతీయ సవనము
ఆ తరువాత ‘‘48’’ సంవత్సరముల మూడవ సవనము (యజ్ఞము)
ఛందస్సు - ‘జగతీ’।
అక్షరములు - ‘48’
ఈ జగతీ మూడవ సవనము ఆదిత్యులకు సంబంధించినది.
సర్వము సర్వత్రా ప్రాణములు గ్రహిస్తూ ఉన్నాయి. అందుచేత ప్రాణదేవతలే ‘‘ఆదిత్యులు’’ అయి ఉన్నారు.
6. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్, స బ్రూయాత్।
‘‘ప్రాణా ఆదిత్యా। ఇదం మే తృతీయ సవనం’’।
ఆయుః అనుసన్తనుతేతి।
మా అహం ప్రాణానామ్ ఆదిత్యానాం
మధ్యే యజ్ఞో విలోప్సీయేత్ ఇతి।
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।
అట్టి (పైన చెప్పిన) 48 సంవత్సర జీవిత విభాగములో ఏవైనా కష్టములు, బాధలు సందర్భమగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరు గాక।

ఓ ప్రాణదేవా! ఆదిత్య స్వరూపా। ఇదే మా తృతీయ (సాయంకాల) సవనం। దయతో స్వీకరించండి. ఈ తృతీయ సవనం ఆయుష్షు ఉన్నంతవరకు నిర్వర్తించుటకై అనుగ్రహించండి. యజ్ఞభావనతో ‘‘జగతీ మూడవ సవనము’’ సమర్పిస్తున్న యజ్ఞకార్యము ప్రాణరూపులగు ఆదిత్యుల మధ్యలో ముగియకుండా కొనసాగింపజేయండి. ఆదిత్య స్వరూపము ప్రసాదించి నన్ను మాయనుండి సముద్ధరించండి.

ఇట్టి ఉపాసన చేయువాడు అన్ని బాధలనుండి విముక్తుడై ఆరోగ్యవంతుడుగా ఉండగలడు.
7. ఏతద్ధ స్మ వై తత్ విద్వాన్ ఆహ
మహిదాస ఐతరేయః
స కిం మ ఏతత్ ఉపతపసి।
యో అహం అనేన న ప్రేష్యామి ఇతి
స హ షోడశం వర్ష శతం (116)
అజీవత్‌ప్ర హ షోడశం
వర్ష శతం (116) జీవతి,
య ఏవం వేద। య ఏవం వేద।
శ్రీ ఐతరేయ మహిదాస మునీంద్రులవారు ఈ యజ్ఞవిధిని పూర్తిగా ఎరిగినవారై, విద్వాంసులై - ఈ విధంగా ప్రవచనము చేస్తున్నారు.

‘‘నేను 116 సంవత్సరములు ఎట్లా జీవించాను? ఈ
(1) ప్రాతఃకాల గాయత్రీ మంత్ర 24 సంవత్సరముల 24 అక్షరముల సవనమును,
(2) మధ్యాహ్న త్రిష్టుప్ రుద్ర మంత్ర 44 సంవత్సరముల 44 అక్షరముల సవనమును,
(3) సాయంకాల జగతీ ఛందో 48 సంవత్సరముల 48 అక్షరముల సవనమును
- ఈ మూడిటిని ఉపాసించుట చేతనే।"

ఎవ్వరు ఇది ఎరుగుచున్నారో వారు 116 సంవత్సరముల దీర్ఘాయుష్మంతులు (24+44+48=116) కాగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే షోడశః ఖండః


3–17. తృతీయ ప్రపాఠకః - సప్తదశః ఖండః - ఆత్మయజ్ఞోపాసన–2

1. స యత్ అశిశిషతి, యత్ పిపాసతి,
యత్ న రమతే, తా అస్య‘‘దీక్షాః’’।
యజ్ఞదీక్షలు : ఆకలి అనుభవించటము, దాహము కలిగి ఉండటము, రమించకపోవటము ఇవన్నీ యజ్ఞదీక్షలు.
2. అథ యత్ అశ్నాతి యత్ పిబతి, యత్ రమతే,
తత్ ఉపసదైః ఏతి।
భుజించటము, త్రాగటము, రమించటము - ఇవన్నీ కూడా ఉపసదములు (గురు ఆజ్ఞ ప్రకారం నియమముగా చేయవలసినవి)
3. అథ యద్ధసతి, యజ్జక్షతి యత్ మైథునం చరతి
స్తుత శస్మైః ఏవ తత్ ఏతి।।
నవ్వటము, తినటము, సంభోగము - ఇవన్నీ స్తోత్రములు, శస్త్రములు.
4. అథ యత్ తపో దానం ఆర్జవమ్
అహిగ్ంసా సత్యవచనం। ఇతి తా అస్య దక్షిణాః।।
తపస్సులు, దానములు, ఆర్జవములు అహింసా - ఇవన్నీ సత్యవచనములు. ‘‘ఇవన్నీ యజ్ఞ దక్షిణములు’’.
5. తస్మాత్ ఆహుః సోష్యతి అసోష్టేతి
పునః ఉత్పాదనం ఏవ అస్య।
తత్ మరణం ఏవ ‘‘అవభృథః’’
ఇక్కడ ఫలించునవి, ఫలించనివి అవన్నీ యజ్ఞముయొక్క సత్ఫలితములు, అవియే పునఃఉత్పాదనములు
తల్లి ప్రసవించటమే పునర్జన్మ।
మరణమే అవభృథ స్నానము.
6. తద్ధ ఏతత్ ఘోర ఆఙ్గీరసః
కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా ఉవాచ।
అపిపాస ఏవ స బభూవ।
సో అంతవేళాయాం ఏతత్
త్రయం ప్రతిపద్యేత।।
అక్షితమసి। అచ్యుతమసి।
ప్రాణసగ్ంశితం అసీతి।
తత్ర ఏతే ద్వే ఋచౌ భవతిః।।
ఘోర అంగీరస ముని ఒక సందర్భములో దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణునికి ఈవిధంగా వివరించి చెప్పుచూ పైవిధంగా పలికారు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఏ ఇతర విద్యల పట్ల తృష్ణ లేనివారయ్యారు.

ఉత్తమ సాధకుడు మరణ సమయంలో ఈ మూడు మంత్రములను జపించునుగాక।
- నీవు క్షీణించనివాడవు।
- చ్యుతి లేనివాడవు।
- సూక్ష్మ ప్రాణస్వరూపుడవు।

ఈ విషయమై రెండు ఋక్కులు ఉన్నాయి.
7. ఆదిత్ ప్రత్నస్య రేతసః।
(జ్యోతిః పశ్యంతి వాసరమ్।
పరోయత్ ఇధ్యతే దివి)।
ఉద్వయం తమసః పరి జ్యోతిః
పశ్యన్త ఉత్తరగ్ం స్వః। పశ్యంత ఉత్తరం దేవం
దేవత్రా సూర్యమగన్మ।
జ్యోతిః ఉత్తమం ఇతి।।
జ్యోతిః ఉత్తమం ఇతి।।
బ్రహ్మజ్ఞులగు మహనీయులు ఎల్లవేళలా ఈ దృశ్యజగత్తును (సనాతనము, జగత్కారణము అగు) పరబ్రహ్మముయొక్క రేతస్సుగా (తేజోరూపముగా) దర్శిస్తూ ఉంటారు. జ్యోతికే జ్యోతిని, సమస్తమునకు పరమై - దివ్యమైయున్న తత్త్వమును సర్వే సర్వత్రా గాంచుచున్నారు.

ఆత్మజ్ఞానమును అధ్యయనము చేస్తూ ఉన్న మేము కూడా
- నిత్యోదితము, చీకటికి ఆవల
- సమస్తమునకు పరము
అయిన పరంజ్యోతినే దర్శిస్తున్నాము.

‘‘మేము ఆత్మజ్యోతి స్వరూపులము’’ - అను భావన, అనుభూతులను ఆశ్రయిస్తూ ఉన్నాము.
సర్వదేతలకు ఆవలగా సమస్త దేవాతీతముగా, సూర్యునికి కూడా ఆవలగా ప్రకాశించు తత్త్వమును చూస్తూ ఉన్నాము. ఉత్తమ స్వయం జ్యోతి స్వరూపంగా స్వస్వరూప - సర్వస్వరూప ‘ఆత్మ’ను ఆరాధిస్తున్నాము.

అది ఉత్తమపురుష (First Person) జ్యోతి స్వరూపమే। అదియే నేను - నీవు కూడా।

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే సప్తదశః ఖండః


3–18. తృతీయ ప్రపాఠకః - అష్టాదశ ఖండః - చతుష్పాద బ్రహ్మోపాసనా

1. ‘‘మనోబ్రహ్మా’’ - ఇతి ఉపాసీత ఇతి అధ్యాత్మం।
అథ అధిదైవతం।
ఆకాశో బ్రహ్మేతి।
ఉభయం ఆదిష్ఠం భవతి,-
అధ్యాత్మం చ అధిదైవతం చ।।
ఈ మనస్సు బ్రహ్మమే। కనుక, ‘‘మనస్సు యొక్క సహజ-వాస్తవ స్వరూపము ఆత్మయే’’ అని ఉపాసించుచున్నాము.

అట్టి బ్రహ్మమును సర్వ జీవులలో వేంచేసినదై ఉండటంచేత ‘‘అధ్యాత్మము’’ అని, సర్వ దైవతా స్వరూపము కాబట్టి ‘‘అధి-దైవతము’’ అని ఆరాధిస్తున్నాము. ‘ఆకాశము’ బ్రహ్మమే। అధ్యాత్మము (దేహము), దేవతలు (అధిదైవతము) కూడా ఆది స్వరూపమగు బ్రహ్మమే।

కనుక సమస్త జీవులలో ‘అహమ్-నేను’ రూపమున మాకు ప్రదర్శనము అగుచున్నట్టిదే - ‘‘అధి దైవతము’’. అధిదైవమే పరబ్రహ్మము.
2. తత్ ఏతత్ చతుష్టాద్ బ్రహ్మ।
వాక్ పాదః, ప్రాణః పాదః,
చక్షుః పాదః శ్రోత్రం పాద - ఇతి అధ్యాత్మమ్।।
అథ అధిదైవతం। అగ్నిః పాదో।
వాయుః పాద ఆదిత్యః పాదో।
దిశః పాద - ఇతి ఉభయం ఏవ
ఆదిష్టం భవతి। అధ్యాత్మం చ ఏవ।
అధిదైవతం చ।।
అట్టి పరబ్రహ్మమునకు పాదములు–4.

అధ్యాత్మము (దేహమునకు సంబంధించి)

1. వాక్ ఇంద్రియ పాదము
2. ప్రాణ పాదము
3. నేత్రములు (కళ్ళు) - పాదము
4. చెవులు (వినికిడి) - పాదము.
ఇది ‘‘అధ్యాత్మము’’।

అధి దైవతము

దేవతలకు సంబంధించిన పాదములు.
1. అగ్ని 2. వాయువు 3. ఆదిత్యుడు 4. దిక్కులు
ఇదియే (శరీరము - దేవతల) అధిదైవతోపాసన.

ఇవి అధ్యాత్మ - అధిదైవతోపాసనములు.
3. వాక్ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః।
సో అగ్నినా, జ్యోతిషా భాతి చ,
తపతి చ। భాతి చ తపతి చ కీర్త్యా
యశసా బ్రహ్మవర్చసేన య ఏవం వేద
వాక్కు బ్రహ్మమే। బ్రహ్మముయొక్క నాలుగు పాదములలో ఒకటి ఈ వాక్కు.

బ్రహ్మమే అగ్నిగా, వెలుగుగా (జ్యోతిస్వరూపమై) వెలుగొందుచున్నది.

సమస్తమును తపింపజేయుచున్నది. ఈవిధంగా బ్రహ్మమే సర్వముగా భాసిస్తూ, సమస్తమును తపింపజేయుచున్నదని ఎవరు ఎరుగుచున్నారో, అట్టివారు కీర్తి, యశస్సు, బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించగలరు.
4. ప్రాణ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః।
స వాయునా జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ।
తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద।
ప్రాణమే బ్రహ్మము. ప్రాణము బ్రహ్మముయొక్క నాలుగు పాదములలో ఒకటి.

అట్టి ప్రాణము వాయు స్పర్శచే జ్యోతి స్వరూపమై ప్రకాశించుచూ ప్రదర్శనమగుచున్నది. సమస్తమును ప్రాణము తపింపజేయుచున్నది. అన్నిటినీ వెలిగించుచున్నది. ప్రాణమును ఆత్మయే తపించుచు, ప్రాణమునకు ‘ప్రాణి’ అయి ఉన్నది.

ఎవ్వరు ప్రాణమును పరబ్రహ్మ స్వరూపంగా ఎరిగి ఉపాసిస్తారో, అట్టి వారు గొప్ప తపోవంతులు, కీర్తివంతులు, యశోసంపన్నులు, బ్రహ్మవర్చస సంపన్నులు అగుచున్నారు.
5. ‘‘చక్షుః’’ ఏవ ‘‘బ్రహ్మణః’’ చతుర్థః పాదః।
స ఆదిత్యేన జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ తపతి చ
కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన య ఏవం వేద।।
ఈ చక్షువులు (చూపు) బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క నాలుగు పాదములలో ఒకటి - ‘చక్షువులు’.

నేత్రములోని తేజస్సే ఆకాశంలో సూర్య ప్రకాశముగా వెలుగొందుచున్నది. సూర్య ప్రకాశ చైతన్యమే కళ్ళలో తేజస్సుగా ప్రకాశముగా, చైతన్యమై వెలుగొందుచున్నది.

ఈ విధంగా ‘‘కళ్ళలోని వెలుగు’’, ‘‘సూర్యునిలోని వెలుగు’’ - ఏకము, అఖండము అగు బ్రహ్మప్రకాశమే - అని గ్రహించి తపస్సు నిర్వర్తించు వారు తపోఫలము, కీర్తి, యశస్సు, బ్రహ్మవర్చస్సు పొందుచున్నారు.
6. శ్రోత్రం ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః
స దిగ్భిః జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ తపతి చ
కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన
య ఏవం వేద। య ఏవం వేద।।
చెవి-వినికిడి బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇది బ్రహ్మమునకు నాలుగవ పాదము.

ఇది దిక్ దేవతా రూపమై నాలుగు దిక్కులలో జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తోంది. నాలుగు దిక్కులను తపింపజేస్తోంది. తాను వెలుగుతూ, దిక్కులన్నీ వెలిగిస్తోంది.

ఈవిధంగా బ్రహ్మమే ‘వినికిడి’ రూపంగా దిక్కులన్నీ వెలిగిస్తూ తపింపజేస్తూ ఉన్నదని ఎరిగి ఉపాసించువాడు - బ్రహ్మవర్చస్సు, కీర్తి పొందుచున్నాడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే అష్టాదశః ఖండః


3–19. తృతీయ ప్రపాఠకః - ఏకోనవింశః ఖండః - ఆదిత్యబ్రహ్మోపాసనా

1. ‘‘ఆదిత్యో బ్రహ్మా’’ ఇతి ఆదేశః।
తస్య ఉపవ్యాఖ్యానమ్।


‘అసత్’ ఏవ ఇదమ్ అగ్ర ఆసీత్।।
తత్ సదాసీత్, తత్ సమభవత్।



తత్ ఆండం నిరవర్తత।
తత్ సంవత్సరస్య మాత్రామ్ అశయత।


తత్ నిరభిద్యత। తే ఆండకపాలే రజతం చ,
సువర్ణం చ అభవతామ్।
ఆదిత్యుడు (సూర్యుడు) బ్రహ్మమే। ఇది ఆదేశము (This is the order)
తదితర విశేషములన్నీ ఉపవ్యాఖ్యానము (Talking about other relevant details) మాత్రమే।

మొట్టమొదట - ‘‘కేవలము, ‘అన్యము’ అనునది కించిత్ కూడా లేనట్టిది’’ - అగు ‘ఆత్మ’ మాత్రమే ఉన్నది. అట్టి మొట్టమొదటి స్థితియందు ఈ ‘జగత్తు’ అనునది లేదు. అనగా అసత్తు (Non present)! అది ఎప్పటికీ యథాతథము.
మొట్టమొదట ‘సత్’ (existence) అయి, అద్దాని నుండి (లేక) అట్టి ‘ఆసత్’యే ఈ ‘భూమి’ మొదలైనవన్నీగా ప్రదర్శనమగుచున్నది.

అవ్యక్తంలోంచి వ్యక్తము అగుచు, అండాకారము (గ్రుడ్డు ఆకారము) బయల్వెడలుతోంది.
ఆ విధముగా అండాకారము (బ్రహ్మాండము)గా పరిణమించి, అది ఒక సంవత్సర కాలము అట్లే ఉన్నది.

ఆ అండము పగిలి - రెండు ముక్కలుగా (విభాగములుగా) అయి - అవి ఒకటి వెండిరంగుతో మరొకటి సువర్ణము (బంగారము) రంగుతోను రూపుదిద్దుకున్నాయి.
2. తత్ యత్ రజతగ్ం సేయం పృథివీ
యత్ సువర్ణగ్ం, సా ద్యౌర్యత్
జరాయు తే, పర్వతా।
యత్ ఉల్బగ్ం, స మేఘో నీహారో
యా ధమన యస్తా నద్యో
యత్ వాస్తేయమ్ - ఉదకగ్ం స సముద్రః।।
Ⅰ. వెండి రంగుగా కనిపిస్తున్న ప్రథమార్థ భాగము (1st Half) - ఈ సమస్త భూతలము (All that is solid) - భూలోకము.
Ⅱ. బంగారపు రంగుతో కనిపిస్తున్న ద్వితీయార్థ భాగము (2nd Half) ద్యులోకము (లేక) స్వర్గలోకము.

బాహ్యమున ఉన్న విభాగం చర్మ భాగము - పర్వతములు.
ఆ అండములోని ఉల్బగము (పొంగుతూ కనిపించు విభాగము) - మేఘములు
ఆ అండములోని ‘నరములు’గా ఉన్న విభాగములు - నదులు
ఆ అండమునకు అడుగున ఉన్నవి - సముద్రములు
3. అథ యత్ తత్ అజాయత,
సో అసావాదిత్యః
తం జాయమానం
ఘోషా ఉలూలవో అనూద తిష్ఠన్
సర్వాణి చ భూతాని, సర్వే చ కామాః।।


తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం
ప్రతి ఘోషా ఉలూ లవో అను-ఉత్తిష్ఠన్తి
సర్వాణి చ భూతాని, సర్వే చ కామాః।।
ఆ తరువాత ఏది జనించిందో, అది ఆదిత్యుడు (మొట్టమొదట సృష్టిరూపంగా బయల్వెడలుచున్నట్టి తత్త్వము).
ఆ ఆదిత్యునినుండి ‘ఘోష’ (పెద్ద శబ్దము - Big Bang) బయల్వెడలి, అది అన్నివైపులా విస్తరిస్తూ ఈ సమస్త భూతజాలము, ఆ భూతజాలముల అవసరములు, ఆశయముల రూపంగా విస్తరించసాగింది.



ఈ విధంగా ఆ ఆదిత్యుని ఉదయము, అస్తమయము వాటిననుసరించి జీవులు, ఆ జీవులనుండి ప్రతిఘోష (Resound) సర్వభూతజాలము, వారివారి కోరికలు, ఆశయములు బయల్వెడలటం జరుగుతోంది.
(అహమాత్మా సర్వభూతాశయ స్థితః - భగవద్గీత)।

4. స య ఏతం ఏవం విద్వాన్
‘‘ఆదిత్యం బ్రహ్మేతి’’ ఉపాస్తే।।
అభ్యాసో హ యత్ ఏనగ్ం
సాధవో ఘోషా ఆ చ గచ్ఛేయుః
ఉప చ - నిమ్రేడేరన్।
ఈ విధంగా -
- కేవలమగు, నిర్విషయమగు సత్‌రూపాత్మ।
- అద్దాని నుండి అండము।
- అండము ‘రెండుగా’ అవటము।
- అవి భు-స్వర్గ లోకములవటము।
- ఆ ఆదిత్యుని నుండి ఘోష।
- ఆ ఘోష నుండి జీవులు (Individual Beings) వారి ఆశయములు, ఆర్తి, ఆవేదనలు।…….
బయల్వెడలటము ఎరిగినవారై, అట్టి ‘‘ఆదిత్యుడే బ్రహ్మము’’ అని ఉపాసిస్తారో, అభ్యాసపరులై ఉంటారో -
అట్టి ఉపాసకుని నుండి (ఓంకార) ఘోష అనుభూతమై, వేదనాదములు జనిస్తూ సర్వత్రా ఆనందము కలిగించగలవు. ఆతడు ఆనందవంతుడు, సుఖవంతుడు కాగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ఏకోనవింశతిః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - తృతీయో అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅳ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - నాలుగవ అధ్యాయము

4–1. చతుర్థ ప్రపాఠకః - ప్రథమ ఖండము - జ్ఞానశ్రుతి రైక్వ ఉపాఖ్యానము - సంవర్గ విద్యా

1. ఓమ్।
జానశ్రుతిః హ పౌత్రాయణః
శ్రద్ధాదేయో బహుదాయీ బహుపాక్య ఆస।
స హ సర్వత ఆవసథాన్
మాపయాంచక్రే సర్వత ఏవ
మే - అత్స్యంతి - ఇతి।।

జానశ్రుత వంశీయుడు - జనశ్రుతుని ప్రపౌత్రుడు (మునిమనుమడు) - శ్రీ జానశ్రుత పౌత్రుడు.
ఆ జానశ్రుత పౌత్రుడు ఎంతో శ్రద్ధగా దానములు చేస్తూ ఉండేవారు. గొప్ప ‘అన్నదాత’గా లోకప్రసిద్ధుడైనారు.
‘‘జనులు అన్నదానము స్వీకరించి సుఖముగా ఉండెదరు గాక।’’ - అని భావించి ఆయన అనేకచోట్ల అన్నదాన సత్రములను, ధర్మశాలలను కట్టించారు కూడా।

2. అథ హ హగ్ంసా నిశాయాం అతిపేతుః
తద్ ధ ఏవగ్ం హగ్ంసో హగ్ంసం అభ్యువాద
హో! హో! అయి।
భల్లాక్ష! భల్లాక్ష!
జానశ్రుతేః పౌత్రాయణస్య
సమం దివా జ్యోతిః ఆతతం।
తత్ మా ప్రసాఙ్‌క్షీః।
తత్ త్వా మా ప్రధాక్షీః ఇతి।।
ఒకానొకరోజు సాయం సమయంలో ఆ జానశ్రుతి పౌత్రాయణుడు మేడపై గల విశాల ప్రదేశంలో చల్లటి గాలులు సేవిస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆతనికి ఎదురుగా రెండు హంసలు ఆకాశంలో ఎగిరిపోతూ ఈ విధంగా సంభాషించుకోవటం వినసాగారు.

మొదటి హంస : అహో! అహో! ఆశ్చర్యం! ఓ మిత్రమా! భల్లాక్షా! భల్లాక్షా! అదిగో। ఆ జానశ్రుతి పౌత్రాయణుడిని చూస్తున్నావా? ఈయన చేస్తున్న అన్నదానమునకు లోకశుభముకొరకై కట్టించిన ధర్మశాలలకు, అన్నసత్రములకు - ఈయన ఎంతో తేజోవంతుడైనాడు. ఆయన కీర్తి, తేజస్సు ద్యులోకము (స్వర్గలోకము) వరకు వ్యాపించి ప్రకాశిస్తోంది. ఓ పరిమితమగు కాళ్లు గల మిత్రమా! చూస్తున్నావు కదా!
అదిగో! దేవలోకము వైపుగా ప్రసరిస్తూ ఉన్న ఆయన అన్నదాన తేజస్సును పొరపాటుగా స్పృశించవద్దు సుమా! ఎందుకంటే ఆతని అన్నదాన తేజస్సును నీవు స్పృశించావో, అది నిన్ను తగలబెట్టగలదు.
3. తము హ పరః ప్రతి ఉవాచ-
కం వర ఏనమ్ ఏతత్
సంతగ్ం సయుగ్వానమ్ ఇవ
రైక్వామ్ ఆత్థేతి?
యో ను కథగ్ం సయుగ్వా, రైక్వ? ఇతి।।
రెండవ హంస : ఏమిటి? అజ్ఞానిలా ఉన్నావే! ఈ జానశ్రుతి పౌత్రాయణుని గురించి నాకు ఇంత గొప్పగా చెప్పుచున్నావేమిటి? ఈ రాజు అల్పుడు మాత్రమే అయి ఉండగా, ఈతనిని బండి రైక్వునితో సమానంగా పొగుడుచున్నావా? సరికాదు. ఆ రైక్వుని (రైక్వుడు అను పేరు గలవాని) ముందు ఈ జానశ్రుతి పౌత్రుడు ఎంతటివాడు? గమనించలేదా?
మొదటి హంస : బండితో కూడిన రైక్వుడా? ఆయన ఎవరు? కాస్త విడమర్చి, వివరించి చెప్పండి.
4. యథా కృతాయ విజితాయ
అధరేయాః సంయతి ఏవం ఏనగ్ం
సర్వం తత్ అభిసమేతి।
యత్కించ ప్రజాః సాధు కుర్వంతి,
యః తత్ వేద, యత్ స వేద
స మయా ఏతత్ ఉక్త ఇతి।।
రెండవ హంస : ఒక జూదరి జూదములో 4 పందెములు గెలిచాడనుకోండి. అప్పుడు ఆతనికి 3, 2, 1 పందెములు గెలిచినవారు వశమై ఉంటారు కదా।
అట్లాగే ఆ రైక్వుడు తదితర అన్నదానాది సత్కర్మల ఫలములన్నీ ఏది తెలుసుకొంటే వశమై ఉంటాయో - అవన్నీ తెలుసుకొని ఉన్నట్టివాడు. జనులు చేస్తున్న సత్కర్మలన్నీ (4 పందెములు గెలిచిన జూదక్రీడాకారుని వలె), సమస్త కర్మలు చేసిన ఫలము జ్ఞాని అయి ఆ రైక్వుడు సంపాదించుకున్నారు. అందుచేత ‘‘అట్టి బండి రైక్వుని సత్కర్మ ఫలముల ముందు అన్నదానం చేస్తున్న ఈ జానశ్రుత పౌత్రాయణుని కర్మ ఫలమెంత?’’ - అని ప్రశ్నించాను.
5. తదు హ జానశ్రుతిః
పౌత్రాయణ ఉపశుశ్రావ।
ఆకాశంలో ఎగురుచూ వెళ్లుచున్న ఆ రెండు హంసల సంభాషణను జానశ్రుత పౌత్రాయణుడు శ్రద్ధగా విన్నారు.
స హ సంజిహాన ఏవ
క్షత్తారమ్ ఉవాచ
అంగారే హ సయుగ్వానం ఇవ
రైక్వమ్ ఆత్థేతి యో?
కథగ్ం సయుగ్వా రైక్వ? ఇతి।
జానశ్రుతపౌత్రాయణుడు - (ఆ మరునాడు నిద్రలేస్తూనే వైతాళిక మాటలు వింటూ తన సేవకునితో)
ఓ ప్రతీహారీ! వైతాళికా! నన్ను సయుగ్వ రైక్వునివలె పొగుడు చున్నావేమిటయ్యా? నేను సయుగ్వా రైక్వుని (బండితో కూడిన రైక్వుని) ముందు అల్పుడనని నీకు ఇంకా తెలియదా? ఆయనను పిలుచుకురండి.
ప్రతిహారి (సేవకుడు) : మహాన్! ఆ ‘సయుగ్వ రైక్వుడు’ అనగా ఎవరు? ఎక్కడుంటాడో మరి?
6. యథా కృతాయ విజితాయ ఆధరే యాః
సంయంతి ఏవం ఏనగ్ం
సర్వం తత్ అభిసమేతి
యత్కించ ప్రజాః సాధు కుర్వంతి
యః తత్ వేద - యత్స వేద,
స మయా ఏతత్ ఉక్త - ఇతి।।

జానశ్రుత పౌత్రాయణుడు : ఓ ప్రతీహారీ! వైతాళికా ఆ సాయుగ్యానమివ (నాలుగు చక్రాల బండిని అధిరోహించిన) రైక్వుడే పొగడ తగినవాడుగాని, నేను కాదు.
ఒక జూదగాడు కృతాయమ అనే క్రీడలో నాలుగు ఆటలను గెలిచినప్పుడు - ఆతనికి మిగతా 3–2–1 ఆటలు గెలిచినవారిపై ఆధిపత్యం ఉంటుంది కదా! అట్లాగే, ఆ రైక్వుడు ఏది తెలుసుకున్నాడో, మిగతా ఉత్తమ కర్మపరులంతా వశులై ఉంటారు. తెలుసుకోవలసినది తెలుసుకొని ఉండటంచేత కర్మిష్టులగు మేము ఆ రైక్వుని ముందు స్వల్పులము. మీరు వెళ్లి ఆయన ఎక్కడున్నా చూచి పిలుచుకురండి.

7. స హ క్షత్తా అన్విష్య
న అవిదం ఇతి ప్రత్యేయాయ
తగ్ం హ ఉవాచ-
యత్ర, అరే! బ్రాహ్మణస్య
అన్వేషణా తత్ ఏనమ్ అర్చ ఇతి।।
సేవకుడు రైక్వుని కోసం వెతికి, ఆయన కనబడక తిరిగివచ్చి జానశ్రుత పౌత్రాయణునితో ఇట్లు పలికారు.
సేవకుడు : అయ్యా! మునివర్యా! మీరు చెప్పిన ఆ రైక్వుని కోసం చాలా గ్రామాలలో వెతికాము. వారు కనబడలేదు. ఏమి చేయమంటారు?
జానశ్రుత పౌత్రాయణుడు : ఓ సేవకా! వైతాళికా! ఎవ్వరు ఎక్కడ నివాసం కలిగి ఉంటారో - అక్కడ వెతకాలి. ఎక్కడెక్కడో ఆయనకు నివాసము కానిచోట్ల వెతికి ఏమి ప్రయోజనం? ఎక్కడ బ్రహ్మతత్త్వజ్ఞులు నివసిస్తూ ఉంటారో అక్కడ వెతికి, ఆయనను గుర్తించి పట్టుకు రండి!

8. సో అధస్తాః శకటస్య పామానం
కషమాణం ఉప ఉపవివేశ।
తగ్ం హ అభ్యువాద త్వం ను
భగవః సయుగ్వా, రైక్వ?
ఇతి అహగ్ం హి అరా ఇతి।
హ ప్రతిజజ్ఞే స హ క్షత్తా
అవిదం ఇతి ప్రత్యేయాయ।।
అప్పుడు ఆ సేవకులు మరల వెళ్లి తత్త్వజ్ఞులు నివసించే పవిత్ర ప్రదేశములలో రైక్వుని కొరకు వెతకనారంభించారు.
అప్పుడు ఒక బండి క్రింద (అధస్తాః శకటస్య) - దురద పొక్కులు గోక్కుంటూ ఒకాయన కనిపించారు. ఆ సేవకులకు ‘‘ఈయన రైక్వుడేమో?’’ - అనే అనువనం వచ్చింది.
ఆయన కూర్చునియున్న బండి క్రింద స్థానమును సమీపించారు.
జానశ్రుత పౌత్రాయుని సేవకులు : హే పూజనీయా! మహానీయా! ‘‘బండితో కూడిన రైక్వుడు’’ అనగా తమరే కదా?
బండి క్రింద కూర్చున్న ఆయన : అవును. మీరు అడిగే ఆ రైక్వుడను నేనే! అనుమానమెందుకు వచ్చింది?

అప్పుడు ఆ సేవకులు ‘‘అమ్మయ్య। మన యజమాని వెతకమని చెప్పిన రైక్వుడు కనిపించారు।’’… అని సంతోషము పొందినవారై,జానశ్రుత పౌత్రేయుని సమీపించి, ‘‘రాజా! మునీశ్వరా! మేము దేవరవారు (మీరు) వర్ణించి చెప్పిన రైక్వుని కనుగొన్నాము. దగ్గరలోనే బండి క్రింద ఏకాంతంగా కూర్చుని ఉన్నారు’’ - అని తెలియజేసారు. అప్పుడు జానశ్రుత పౌత్రుడు గబగబలేచి సయుగ్వా (బండి క్రింద గల) రైక్వుని దర్శనము కొరకై జ్ఞానార్థి అయి బయల్వెడలారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ప్రథమః ఖండః


4–2. చతుర్థ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - జ్ఞానమునకు అర్హత నిరహంకారము, ప్రపత్తి

1. తదు హ జానశ్రుతిః పౌత్రాయణః
షట్ శతాని గవాం నిష్కం - అశ్వతరీ - రథమ్
తత్ ఆదాయ, ప్రతిచక్రమే తగ్ం హ అభ్యువాద।।
జానశ్రుతి పౌత్రాయణుడు సేవకులు చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్లారు. 600 గోవులను, గుఱ్ఱములను, రథములను తీసుకొని మహానుభావుడగు ఆ రైక్వుడు ఉన్నచోటును జ్ఞానార్థి అయి సమీపించారు. శ్రీ రైక్వునికి అభివాదములు సమర్పించారు.
2. రైక్వేమాని షట్‌శతాని,
గవాం అయం నిష్కో
అయమ్ అశ్వతరీ రథో ను
మ ఏతాం భగవో దేవతాగ్ం శాధి
యాం దేవతామ్ ఉపాస్స ఇతి।
జానశ్రుత పౌత్రేయుడు : బండి క్రింద విశ్రాంతి తీసుకుంటన్న మహామహనీయా! రైక్వమహాశయా! మీ కొరకై 600 ఆవులను, గుఱ్ఱములను, రథములను సమర్పించటానికై తీసుకొచ్చాను. దయతో స్వీకరించండి. అనుగ్రహించండి. మీరు ఏ దేవతా ఉపాసనచే దివ్యజ్ఞానము పొందారో, అట్టి దివ్యతత్త్వవిశేషమును శ్రవణం చేయాలని వచ్చాను. దయతో వివరించమని తమకు నా ప్రార్థన.
3. తము హ పరః ప్రతి ఉవాచ అహ
హారే త్వా శూద్ర; తవ ఏవ సహ గోభిః అస్తు। ఇతి।
తదు హ పునః ఏవ జానశ్రుతిః
పౌత్రాయణః సహస్రం గవాం,
నిష్కం అశ్వతరీ రథం
దుహితరం తదాదాయ ప్రతిచక్రమే।।
రైక్వుడు : ఓయీ! శూద్రా! నీవు తెచ్చిన గోవులు, గుఱ్ఱములు, రథములు నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నీవే దాచుకో!
జానశ్రుత పౌత్రేయుడు : స్వామీ! అట్లాగా! అయితే 1000 గోవులను, చక్కటి గుఱ్ఱములతో కూర్చిన రథమును సమర్పించుకుంటాము. నాకు జ్ఞానము బోధించండి.
రైక్వుడు : అవన్నీ నాకెందుకు చెప్పు?
4. తగ్ం హ అభ్యువాద, రైక్వా!
ఇదగ్ం సహస్రం గవాం అయం
నిష్కో అయం అశ్వతరీ రథ
ఇయం జాయా అయం
గ్రామో యస్మిన్ నాస్సే అను ఏవ
మా భగవన్। శాధి। ఇతి।।
జానశ్రుత పౌత్రేయుడు : (మరల మరల అభివాదములు పలుకుచూ) ఓ రైక్వేయ మహాత్మా! నమో నమః। మీకు 1000 గోవులు, శ్రేష్ఠమైన గుఱ్ఱములు, రథములు తెచ్చి సమర్పిస్తున్నాను. స్వీకరించండి.
నా భార్యపుత్రులతో సహా మీకు సేవకులమౌతాము.
ఇదిగో! కంచరగాడిదల రథము. నా కుమార్తెయగు ఈమెను మీకు జీవితభాగస్వామిగా సమర్పిస్తాను. మీరున్న ఈ గ్రామమును మీకు కానుకగా సమర్పిస్తున్నాను.
హే భగవాన్! ఇంకా ఏమి కావాలో కోరుకోండి - స్వామి! నాకు మీరు ఆత్మజ్ఞానము సిద్ధించుకొన్న తీరు దయతో వినిపించండి.
5. తస్యా హ ముఖమ్ ఉపోద్ గృహణాన్ ఉవాచ :
ఆజహార ఇమాః శూద్ర అనేనైవ
ముఖేన ఆలాపయిష్యథా ఇతి।
తే హి ఏతే రైక్వపర్ణా - నామ
మహావృషేషు యత్ర - అస్మా
ఉవాస, స తస్మై హ ఉవాచ।।
రైక్వుడు : జానశ్రుత పౌత్రేయుని కుమార్తె ముఖం వైపుగా చూచారు. ఏదో అవ్యాజమైన బ్రహ్మజ్ఞాన తేజస్సును గమనించారు. ‘‘విద్యా ముఖము’’ అని గ్రహించారు. బ్రహ్మవిద్యను సంభాషించటానికి అంగీకారము పలికారు. ‘‘ఓ శూద్రుడా! మీరు కోరినట్లు మీ కుమార్తె ముఖంలోని బ్రహ్మతేజస్సును గౌరవిస్తూ తత్త్వ సంబంధమై సంభాషించటానికి సంసిద్ధుడను’’ - అని పలికారు.

అప్పటి నుండి ఆ మహావృషల దేశములోని ఆ రైక్వుడు బండిక్రింద ఉండి ఉన్న గ్రామము ‘‘రైక్వపర్ణ’’ అనే పేరుతో ప్రసిద్ధమయింది.
ఆ చోటనే ఉండి ఇక రైక్వుడు జానశ్రుత పౌత్రేయుని విన్నపమును అనుసరించి ప్రసంగించటానికి సిద్ధమైనారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ద్వితీయః ఖండః


4–3. చతుర్థ ప్రపాఠకః - తృతీయ ఖండము - సంవర్గము (విలీనము, ఆశ్రయము)

1. వాయుః వావ సంవర్గః।

యదా వా అగ్నిః ఉద్వాయతి
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।।
యదా సూర్యో అస్తమేతి,
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।
యదా చంద్రో అస్తమేతి,
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।।

బండి క్రిందనే ఉండే మహనీయుడగు రైక్వుడు ఈ విధంగా ప్రసంగించసాగారు.
ఓ జానశ్రుత పౌత్రేయ మహాశయా! వినండి.

అధిదైవతమునకు ‘వాయువు’యే సంవర్గము, చివరికి ఆశ్రయము వాయువే!
అగ్ని చల్లబడినప్పుడు ఆశ్రయిస్తున్నది ఏది? వాయువునే!
సూర్యుడు అస్తమించినప్పుడు వాయువునందే ప్రవేశము పొందుచున్నారు.
అట్లాగే చంద్రుడు కూడా అస్తమించినప్పుడు వాయువునందే లీనము, మమేకము అగుచున్నారు.
2. యదా ఆప ఉచ్ఛుష్యంతి,
‘వాయుమ్’ ఏవ ఆపియంతి।
వాయుర్హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త
ఇతి ‘‘అధిదైవతమ్’’।।
జలము ఇంకిపోయినప్పుడు ప్రవేశము పొందుచున్నది ఎందులో? వాయురూపమే పొందుచున్నది.
వాయువే సమస్తమును చివరికి మ్రింగివేయుచున్నది. అందుచేత వాయువే ‘‘అధిదైవతము’’।
3. అథ అధ్యాత్మం।



ప్రాణో వావ సంవర్గః

స యదా స్వపితి ప్రాణమేవ వాక్ అపి ఏతి

ప్రాణం చక్షుః ప్రాణగ్ం శ్రోత్రం ప్రాణం
మనః ప్రాణో హి ఏవ।
ఏతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి।।
అధ్యాత్మము
ఇక అధ్యాత్మము. శరీరములోని అంతర్గతంగా ఉండిన శక్తులకు సంబంధించినది.

ప్రాణమే - సంవర్గము (తనలో) తదితరమును విలీనము చేసుకొనునది)

ఈ వ్యక్తి (జీవుడు) నిదురకు ఉపక్రమించగానే వాక్ ఇంద్రియము ప్రాణమునందే విలీనం అవుతోంది.
అట్లాగే చక్షువులు (చూపు), శ్రోత్రము (వినికిడి), మనస్సు కూడా ప్రాణమునందే విలీనమౌతున్నాయి.
‘‘ప్రాణమే వాటన్నిటినీ తనయందు కలుపుకొని (విలీనము చేసుకొని) ఉంటోంది.
4. తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయుః ఏవ
దేవేషు ప్రాణః ప్రాణేషు।।

దేవతలయందు వాయువు, ప్రాణులయందు ప్రాణము రెండు కూడా - సంవర్గము (విలీనము/చేరిక) పొందటం జరుగుతోంది.

5. అథ హ శౌనకం చ కాపేయం
అభిప్రతారిణం చ కాక్షసేనిం
పరివిష్యమాణౌ బ్రహ్మచారీ బిభిక్షే
తస్మా ఉ హ న దదతుః।।
పూర్వకాలంలో ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు.
(1) కౌపేయ (కపి) గోత్రీకుడైన శౌనకుడు (2) కక్షసేనుని కుమారుడు - అభిప్రతారిణి.
ఒకరోజు వారిద్దరు కలిసి భోజనము చేయటానికి కూర్చుని భుజించటం ప్రారంభించారు.
ఆ సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి ‘‘భిక్షాం దేహి!’’ అని అర్థించారు.
వారు అది విని కూడా ఆ భిక్షకునికి భిక్ష పెట్టలేదు.
6. స హ ఉవాచ మహాత్మనః చతురో దేవ ఏకః
కః స జగార భువనస్య గోపాః తం కాపేయ
న అభిపశ్యంతి మర్త్యా అభిప్రతారిన్ బహుధా
వసంతం యస్మై వా ఏతత్ అన్నం,
తస్మా ఏతత్ న దత్తమ్। ఇతి।
భిక్షకుడు అగు ఆ బ్రహ్మచారి :
ఓ కాపేయ శౌనకమునీ! ఓ కాక్షసేన అభిప్రతారిణీ! మీరు భలేవారే!

(వాక్కు, చక్షువులు, శ్రోతము, మనస్సు అనబడే) నలుగురు దేవతలను తనయందు కలుపుకొని ఉంటున్న (లేక) అపాన - వ్యాన - ఉదాన - సమాన - ప్రాణములను తనయందు ఏకము చేసుకొనియున్న) ముఖ్య ప్రాణస్వరూపుడగు మహాత్ముడగు ప్రజాపతిని, భువన రక్షకుని, మీ మానవులు గుర్తించటం లేదేమిటి? సమస్త ఆహారము ఎవ్వరి కొరకు భుజించబడుచున్నాయో అట్టి ప్రాణేశ్వరుడే ‘‘అన్నము పెట్టండి!’’ - అని అడుగుతుంటే, అట్టి ప్రజాపతి ప్రాణస్వరూపునకే అన్నముపెట్టరెందుకు?
7. తదు హ శౌనకః కాపేయః
ప్రతిమన్వానః ప్రత్యేయాయ।

ఆత్మా దేవానాం జనితా ప్రజానాగ్ం
హిరణ్యదగ్ంష్ట్రో బభసో అనసూరిః మహాన్తమ్।
అస్య మహిమానమ్
ఆహుః అనద్యమానో యదన్
అన్నం అత్తి ఇతి వై వయం।
బ్రహ్మచారిన్।
ఆ ఇదమ్ ఉపాస్మహే
దత్తాస్మై భిక్షామ్ ఇతి।।
ఆ మాటలు విన్న (కాపేయముని కుమారుడగు) శౌనకముని, అన్నం తింటున్నవాడల్లా ఆ మాటలు అంతరార్థము మననము చేస్తూ లేచి, ఆ బ్రహ్మచారి వద్దకు వచ్చారు.

శౌనకుడు : ఓ గృహయజమానీ! ప్రజాపతి సర్వదేవతలకు ఆత్మస్వరూపుడు. సర్వజీవులను సృష్టించువారు. ఆయన బంగారు దంతములు కలవాడు. ఈ ప్రాణేశ్వరుని మహిమ ‘‘మహాన్తము, మహత్తరము, బహుగొప్పది’’ - అని వేదములచే కీర్తించబడుతోంది.
ఈయనయే అన్నము, అన్నము కానిది కూడా భక్షించగలిగినట్టివారు.
ఓ బ్రహ్మచారి గారూ! మేము అన్నమునే ఉపాసించుచున్నాము. అందుచేత, వీరికొరకే భుజిస్తూ అన్నము వీరికి - ఎందుకు సమర్పించము. తప్పక సమర్పిస్తాము! అనగా అట్టి మీకు అన్నము సమర్పించ సంసిద్ధము.
8. తస్మా ఉ హ దదుస్తే వా।
ఏతే పంచాన్యే పంచాన్యే
దశ సంతస్తత్ కృతమ్।।
తస్మాత్ సర్వాసు దిక్ష్వన్
అన్నమ్ ఏవ దశ కృతగ్ం
స ఏషా విరాట్ అన్నాదీ
తయా ఇదగ్ం సర్వం దృష్టగ్ం।
సర్వమసి ఇదం దృష్టం భవతి।
అన్నాదో భవతి -
య ఏవం వేద।
య ఏవం వేద।।
అప్పుడు లేచి ఆ బ్రహ్మచారికి భిక్ష సమర్పించారు.

‘ఐదు, ఐదు కలిసి పది’కి వారు అన్నమును ఆ బ్రహ్మచారికి సమర్పించారు.

కాబట్టి (తూర్పు-పడమర-ఉత్తరము-దక్షిణము-ఈశాన్యము- ఆగ్నేయము-నైరుతి-వాయువ్యము-పైన-క్రింద అన్నీ కలిపి) కృతమగు దశదిక్కులు బ్రహ్మమునకు సమర్పించబడుచున్న అన్నమే।

సమస్తము భక్షించువాడు ఆ విరాట్ పురుషుడే। ఆయనయే సమస్తము దర్శిస్తున్న ద్రష్ట.

‘‘ఆ అన్నాదుడగు పరబ్రహ్మమే సమస్తమును చూస్తూ, అనుభవముగా కల్పించుకొని పొందుతోంది’’ - అని ఎరుగుచున్నవాడు - సర్వమును సరి అయిన దృష్టితో దర్శిస్తున్నవాడు, ఆస్వాదిస్తున్నవాడు అగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే తృతీయః ఖండః


4–4. చతుర్థ ప్రపాఠకః - చతుర్థ ఖండము - సత్యకామ జాబాలుని చరిత

1. సత్యకామో హ జాబాలో।
జబాలాం మాతరమ్।
ఆమంత్రయాంచక్రే
బ్రహ్మచర్యం భవతి।
వివత్స్యామి - కిం గోత్రో ను
అహమ్ అస్మి ఇతి।।
సత్యకాముడు ఒక పిల్లవాడు. ఆతని తల్లి జబాల. ఆ సత్యకాముడు గురుకులాశ్రమము చేరి విద్యాభ్యాసము చేయవలసిన సమయము, బ్రహ్మచర్య వ్రతము ప్రారంభించవలసిన వయసు వచ్చింది.
జబాల : బిడ్డా! సత్యకామా! నీవు విద్యార్థివై, బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించి గురుకులమునకు వెళ్లవలసిన సమయం వచ్చిందయ్యా!
సత్యకామ : అమ్మా! నేను సంతోషంగా గురుకులం జేరి గురువును విద్యకై ఆశ్రయిస్తాను. అయితే ‘‘ఇదమ్ గోత్రోద్భవస్య అహం భో అభివాదయే।’’ - అని గురువుకు నమస్కరించాలి కదా! నేను ఏ గోత్రజుడను?
2. సా హ ఏనమ్ ఉవాచ :
న అహమ్ ఏతత్ వేద -
తాత! యత్ గోత్రః త్వమ్ అసి।
బహు అహం చరంతీ పరిచారిణీ యౌవనే
త్వామలభే, సా అహమ్ ఏతత్
న వేద యత్ గోత్రః త్వమ్ అసి।
‘జబాలా’ తు నామ అహమ్ అస్మి।
సత్యకామో నామ త్వమ్ అసి।
స సత్యకామ ఏవ జాబాలో బ్రువీథా ఇతి।।
జాబాలి : బిడ్డా! నేను యౌవ్వనంలో ఉండగా పరిచారికనై, దాసిగా అనేక గృహములలో సేవిస్తూ ఉండగా, నీవు నాకు పుట్టావు. అందుచేత నీవు ఏ గోత్రమునకు చెందినవాడవో నాకు తెలియదు. అందుచేత ఇది అని చెప్పలేను.
నా పేరు ‘జబాలి’, నీ పేరేమో - ‘సత్యకాముడు’ నీవు నా కుమారుడుగా - సత్యకామ జాబాలి అని ఇంతవరకే నేను రూఢిగా చెప్పగలను.
నీ తండ్రి ఎవ్వరో నాకు తెలియదు. నేను చెప్పలేను. అందుచేత ఈ విశేషములతో నీవు గురుకులమును, గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించు.
3. స హ హారిద్రుమతం
గౌతమమ్ ఏతి ఉవాచ :
బ్రహ్మచర్యం భగవతి
వత్స్యామి ఉపేయం భగవంతమ్। ఇతి।।
అప్పుడు ఆ సత్యకాముడు బ్రహ్మచర్య - విద్యాభ్యాస దీక్ష కొరకై హరిద్రమతముని కుమారుడగు గౌతముని ఆశ్రమం ప్రవేశించాడు.
సత్యకాముడు : గురుదేవా! గౌతమ మునీంద్రా! భగవాన్! నేను విద్యార్థినై విద్యకొరకు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను. శిష్యత్వము అనుగ్రహించండి.
4. తగ్ం హ ఉవాచ :
‘‘కిం గోత్రో ను సోమ్య!
అసి’’ - ఇతి?
స హ ఉవాచ :
‘‘న అహమ్ ఏతత్ వేద భో!’’
యత్ గోత్రో అహమ్ అస్మి
- అపృచ్ఛం మాతరగ్ం, సా ప్రత్యబ్రవీత్
‘‘బహు అహం చరంతీ పరాచారిణీ యౌవనే।
త్వామలభే స అహమ్ ఏతత్ న వేద।
‘యత్ గోత్రః త్వమ్ అసి।
గౌతమ మునీంద్రుడు : మంచిది. స్వాగతం. ఓ సౌమ్యా! ప్రియదర్శనా! నీ గోత్రము - నామములతో కూడిన ‘‘ప్రవర’’ చెప్పి, గురుకులాశ్రమములో ప్రవేశించు.

సత్యకాముడు : హే మహనీయా! గురు భగవాన్। నా గోత్రము ఏమిటో నాకు తెలియదు. నేను నా గోత్రమేమిటని నా మాతృదేవతను జబాలను ఇక్కడికి వచ్చేముందు అడిగాను.
మా అమ్మ ఏమన్నదంటే…
‘‘బిడ్డా! నేను యౌవనవతినై ఉన్నప్పుడు అనేక చోట్ల పరిచారిణినై ఉండటం జరిగింది. అందుచేత నీ తండ్రి ఎవ్వరో గోత్రమేమిటో తెలియదు కాబట్టి ఇది అని చెప్పలేను’’.
జబాలా తు నామా అహమస్మి।
సత్యకామో నామ త్వమ్ అసి ఇతి।’’
సో అహగ్ం సత్యకామో
జాబాలో అస్మి భో। ఇతి।।
మా అమ్మ పేరు - జబాల
నా పేరు - సత్యకాముడు
అందుచేత నేను సత్యకామ జాబాలిని మీకు నమస్కరిస్తూ అభివాదము పలుకుచున్నాను.
(చతుస్సాగర పర్యంతం గో - బ్రాహ్మణేభ్యః శుభం భవతు। ‘‘పరమాత్మ’’ ఋషేయ గోత్రోద్భవస్య - గురునిర్ణయ వేదశాఖ అధ్యాయి సత్యకామ జాబాల - అహం భో అభివాదయే.)
5. తగ్ం హ ఉవాచ :
న ఏతత్ అబ్రాహ్మణో వివక్తుం అర్హతి।





సమిధగ్ం సోమ్యా। ఆహర ఉప త్వా
నేష్యే న సత్యాదగా ఇతి।



తమ్ ఉపనీయ
గౌతమ మహర్షి :
బిడ్డా। సత్యకామా! ఈ విధంగా సత్యమును బ్రహ్మవిద్యార్హత కలవాడు (బ్రాహ్మణుడు అయినవాడు) మాత్రమే పలుకగలడు. ఇతరులు చెప్పలేరు. సత్యమును చెప్పావు కాబట్టి నీవు బ్రాహ్మణుడివేవయ్యా! (కర్మణా జాయతే ద్విజాః)। గుణముచేత (సత్యము పలుకుటచేత) నిన్ను బ్రాహ్మణుడుగా గుర్తిస్తున్నాను.

ఓ సౌమ్య! నీవు దగ్గరలోని అడవిలోకి వెళ్లి యజ్ఞమునకు కావలసిన సమిధలు పట్టుకురా! సమిత్పాణివై రమ్ము! నీవు సత్యము నుండి చ్యుతుడవు కాలేదు. ‘సత్యకాముడు’ అనే పేరుకు అర్హుడవు.


ఆ పేరుతోనే ఉపనయనం జరిపిస్తాను”, అని చెప్పి అప్పుడు ఉపనయనము జరిపించారు.
కృశానాం-అబలానాం చతుశ్శతా (400) గాః
నిరాకృత్య ఉవాచేమాః సోమ్యా!
అనుసంవ్రజేతి।




తా అభిప్రస్థాపయన్ ఉవాచ :
న అసహస్రేణ ఆవర్తేయేతి।

స హ వర్షగణం ప్రోవాస
తా యదా సహస్రగ్ం సంపేదుః।
అప్పుడు గురుదేవుడగు గౌతమమహర్షి తన గోసంపదలోని బక్కచిక్కిన, బలములేని ‘400’ గోవులను వేరు చేసి సత్యకామునికి ఇచ్చి మేపుకురమ్మని చెప్పారు.

సత్యకాముడు ఆ బక్కచిక్కిన 400 గోవులను మేపటానికి తోలుకుపోతూ ఇట్లా గురువుగారితో తన విద్యకు సంబంధించిన పట్టుదలకు సంజ్ఞగా (గుర్తుగా) ఇట్లా వినమ్రుడై పలికారు.

సత్యకాముడు : ఈ 400 గోవులు 1000 గోవులు కాగానే మీ వద్దకు తిరిగివస్తాను. 1000 గోవులు కాకుండా మీ దర్శనం చూసుకోనని నా మనవి.

సత్యకాముడు ఆ విధంగా 400 గోవులను మేపసాగాడు. సంవత్సర కాలానికి ఆ ‘400’ గోవులు ‘1000’ గోవులు అయినాయి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే చతుర్థః ఖండః


4–5. చతుర్థ ప్రపాఠకః - పంచమ ఖండము - ప్రకాశవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క మొదటి పాదము

1. అథ హి ఏనం ఋషభో
అభ్యువాద సత్యకామ! ఇతి
భగవ! ఇతి!
హ ప్రతిశుశ్రావ ప్రాప్తాః, సోమ్య!
సహస్రగ్ం స్మః ప్రాపయ
న ఆచార్య కులమ్।
ఒకరోజు ఆ గోసంపదలోని వృషభము (ఎద్దు) సత్యకాముని వద్దకు వచ్చి ఎదురుగా నిలుచున్నది.
వృషభము : ఓ సత్యకామా!
సత్యకాముడు : భగవాన్। వృషభరాజమా? చెప్పండి. ఏమి కావాలి? ఏమి ఆజ్ఞ?
వృషభము : మేము వేయి సంఖ్యగా గో సంపద అయ్యాము. మీరు చేపట్టిన కార్యము పూర్తి అయింది కదా! ఓ సౌమ్యా! ఇక మమ్ములను ఆచార్యులవారు విద్య బోధిస్తున్న గురుకులమునకు చేర్చండి.

అప్పుడు సత్యకాముడు లేచి నిలబడి, ఆ వృషభమునకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పించి ‘‘వృషభదేవా! మీ ఆజ్ఞను నిర్వహిస్తాము!’’ అని పలికారు.

2. బ్రహ్మణః చ తే పాదం బ్రవాణి - ఇతి।।


బ్రవీతు మే భగవాన్। - ఇతి।।

తస్మై హ ఉవాచ
- పాచీ దిక్ - కలా,
- ప్రతీచీ దిక్ - కలా
- దక్షిణా దిక్ - కలా
- ఉదీచీ దిక్ - కలా
ఏష వై సౌమ్య - చతుష్కలః
పాదో బ్రహ్మణః ప్రకాశవాన్ నామ।
వృషభము : మా కోరిక నెరవేరుస్తున్నారు కదా. సరే! అందుకుగాను - మీకు బ్రహ్మముయొక్క చతుష్పాదముల గురించి చెప్పుతాను.

సత్యకాముడు : భగవాన్! వృషభదేవా! దయచేసి చెప్పండి. విద్యార్థినై వింటాను.

వృషభము : ఆ నాలుగు పాదములు 4 అంశలు (కళలు).
(1) తూర్పు (2) పడమర (3) దక్షిణము (4) ఉత్తరము
ఈ నాలుగు దిక్కులు బ్రహ్మమునకు ‘ప్రకాశరూపము’ అని పిలువబడును. నాలుగు దిక్కులను బ్రహ్మము ప్రకాశింపజేయు చున్నది. కాబట్టి పరమాత్మ (లేక) పరబ్రహ్మము ‘ప్రకాశవాన్’ అనబడుచున్నారు. ఈ నాలుగు దిక్కులుగా ప్రకాశిస్తున్నది పరబ్రహ్మమే। ఈ నాలుగు కళలుగా బ్రహ్మముయొక్క మొదటి పాదమును ఉపాసించు.
3. స య ఏతం ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణః।
‘ప్రకాశవాన్’ ఇతి ఉపాస్తే,
ప్రకాశవాన్ అస్మింల్లోకే భవతి।
ప్రకాశవతో హ లోకాన్ జయతి।
య ఏతమ్ ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణః
‘ప్రకాశవాన్’ ఇతి ఉపాస్తే।
ఎవ్వరైతే బ్రహ్మమును ‘4’ దిక్కులలో ప్రకాశమానుడైయున్న ‘ప్రకాశవాన్’ అని తెలుసుకొని, నాలుగు దిక్కులను పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసిస్తారో ఆతడు సమస్త లోకములలో ప్రకాశవంతుడై ఉండగలడు.

తనయొక్క ప్రకాశముచే ఆతడు లోకములను జయించగలడు. ‘‘లోకములన్నీ నాలోనే, నా యొక్క ఆత్మ ప్రకాశములోనే ఉన్నాయి’’ - అని గమనించగలడు.

ప్రకాశపూర్ణుడై సమస్త లోకములను దాటివేయగలడు కూడా!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే పంచమః ఖండః


4–6. చతుర్థ ప్రపాఠకః - షష్ఠః ఖండము - అనంతవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క రెండవ పాదము

1. అగ్నిష్టే పాదం వక్తేతి।
సత్యకాముడు : వృషభదేవా! దయచేసి బ్రహ్మముయొక్క రెండవ పాదము గురించి బోధించండి.
వృషభము : అదా! అది నేను కాదు. అగ్నిదేవుల వారు మాత్రమే బోధించగలరు. నేను కాదు.

ఇట్లా పలికి పూజనీయుడగు వృషభము చెప్పటమును విరమించింది.
స హ శ్వో భూతే గా
అభిప్రస్థాప్రయాంచకార।
తా యత్ర అభిసాయం బభూవుః
తత్ర అగ్నిం ఉపసమాధాయ గా
ఉపరుధ్య సమిధమ్ ఆధాయ
పశ్చాత్ అగ్నేః ప్రాఙుపోపవివేశ।।
ఆ మరునాడు సత్యకాముడు గోవులను మేపటానికి అడవికి తీసుకొనిపోయి ఇక మేపనారంభించాడు.

అక్కడ కొన్ని ఎండు కట్టెలు తెచ్చి అగ్నిని వెలిగించారు.

తూర్పు దిక్కుగా కూర్చుని అగ్నిదేవుని ప్రతిష్ఠించి ఆహ్వానము - సుస్వాగతము మొదలైనవి స్తుతులు పలుకుచూ ఆరాధించసాగారు. అప్పుడు అగ్నిదేవుడు పలుకసాగారు.
2. తమ్ అగ్నిః అభ్యువాద,
సత్యకామ! - ఇతి-
భగవ! ఇతి హ ప్రతిశుశ్రావ।।
అగ్ని భగవానుడు : ఓ సత్యకామా?
సత్యకాముడు : హే భగవాన్! అగ్నిదేవా! నమోనమః।
అగ్నిదేవుడు : నన్ను ఎందుకొరకై ఉపాసిస్తూ ఆహ్వానించావయ్యా?
3. ‘‘బ్రహ్మణః సోమ్య! తే పాదం బ్రవాణి’’ ఇతి।
‘‘బ్రవీతు మే భగవాన్’’ ఇతి।
తస్మై హ ఉవాచ :
పృథివీ కలా। అంతరిక్షం కలా।
ద్యౌః కలా। సముద్రః కలా।
ఏష వై సోమ్య। చతుష్కలః పాదో
బ్రహ్మణో అనంతవాన్ నామ।।
సత్యకాముడు : అగ్నిదేవా! బ్రహ్మముయొక్క రెండవ పాదము గురించి మీరు బోధిస్తారు కదా - అని మిమ్ములను భక్తితో ఆహ్వానించాను. భగవాన్! దయతో బోధించండి.
అగ్నిదేవుడు : సరే! విను. చెప్పుతాను.
బ్రహ్మముయొక్క రెండవ పాదమునకు చెందిన నాలుగు కళా ప్రదర్శనములు ఇట్లు ఏర్పడి ఉన్నాయి.
(1) పృథివీ కళ (2) అంతరిక్ష కళ (3) ద్యులోక (స్వర్గలోక) కళ (4) సముద్ర కళ
ఈ నాలుగు బ్రహ్మముయొక్క 4 కళలై అంశలై బ్రహ్మమువలెనే అనంతములై ఉన్నాయి. ఈ 4 కళలను బ్రహ్మముయొక్క రెండవ పాదపు - 4 అంశలుగా ఉపాసించు.
4. స య ఏతమ్ ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణో
‘అనంతవాన్’ ఇతి - ఉపాస్తే,
అనంతవాన్ అస్మిన్ లోకే భవతి।
అనంతవతో హ లోకాన్ జయతి,
య ఏతమ్ ఏవమ్ విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణో
అనంతవాన్ ఇతి ఉపాస్తే।।
ఎవ్వరైతే బ్రహ్మముయొక్క రెండవ పాదమునకు చెందిన కళలు (Art of the Artist)గా పృథివిని, ఆకాశము (అంతరిక్షము)ను, (అశరీర దివ్యపురుషుల) దేవతా లోకము, సముద్రములను అనంతరూపంగా ఎరిగి ఉపాసిస్తాడో, అట్టివాడు దృశ్యముచే పరిమితము కానివాడై - అనంతుడు, అపరిమితుడు అగుచున్నాడు.
- అనంతుడై లోకములను జయించుచున్నాడు.
- లోకములను తనయందు దర్శిస్తున్నాడు.
ఈ బ్రహ్మముయొక్క చతుష్పాదముల అనంతత్వము ఆరాధించువాడు అనంతుడై వెలుగొందగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే షష్ఠః ఖండః


4–7. చతుర్థ ప్రపాఠకః - సప్తమ ఖండము - జ్యోతిష్మాన్ - చతుష్కలా బ్రహ్మముయొక్క మూడవ పాదము

1. హగ్ంసః తే పాదం వక్త ఇతి।
స హ శ్వో భూతే గా అభిప్రస్థాపయాంచకార
తా యత్ర అభిసాయం బభూవుః
తత్ర అగ్నిమ్ ఉపసమాధాయ
‘గా’ ఉపరుధ్య సమిధమ్ ఆధాయ
పశ్చాత్ అగ్నేః ప్రాఙ్ ఉప ఉపవివేశ।।
సత్యకాముడు : స్వామీ! బ్రహ్మముయొక్క 3వ పాదము గురించి చెప్పరూ!
అగ్నిదేవుడు : బిడ్డా! నీవు అడిగిన ‘3’వ పాదము గురించి ‘హంస’ను అడుగు చెప్పగలదు. ఆ హంస నీకు 3వ పాదము యొక్క అంశలను విశదీకరించగలదు.

ఇట్లా ఆ మరునాడు ఉదయం మరల ఆవులను తోలుకొని అడవికెళ్ళారు.
ఆవులను మేతకు త్రోలారు. అక్కడ కొన్ని సమిధలు పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసారు.
తూర్పుముఖంగా అగ్నికి ఎదురుగా ఆశీనులైనారు. ‘హంస’ను ధ్యానం చేసారు. హంస ప్రత్యక్షమైనది.
2. తగ్ం హగ్ంస ఉపనిపత్యాభ్యువాద,
సత్యకామ! ఇతి।।
భగవ! ఇతి హ ప్రతిశుశ్రావ।
హంస : ఓ సత్యకామా!
సత్యకాముడు : భగవాన్! హంసదేవా! నమో నమః।
హంస : ఏమిటయ్యా? నన్నెందుకు అగ్న్యోపాసన పూర్వకంగా ఆహ్వానించావు?
3. బ్రహ్మణః సోమ్య తే పాదం
బ్రవాణి। ఇతి।।
బ్రవీతు మే భగవాన్! ఇతి।
తస్మై హ ఉవాచః
అగ్నిః కలా। సూర్యః కలా।
చంద్రః కలా। విద్యుత్ కలా।
ఏష వై, సోమ్య। చతుష్కలః।
పాదో బ్రహ్మణో జ్యోతిష్మాన్ నామ।।
సత్యకాముడు : ఓ సౌమ్యా! బ్రహ్మముయొక్క ‘3’వ పాదము గురించి చెప్ప ప్రార్థన. భగవాన్! దయతో వివరించండి.
హంస : చెప్పుచున్నాను. వినండి.
బ్రహ్మముయొక్క ‘4’ కళలు / అంశలు - 3వ పాదముయొక్క అంశలు.
(1) అగ్ని (2) సూర్యుడు (3) చంద్రుడు
(4) విద్యుత్తు (తేజస్సు)
ఓ సౌమ్యా! బ్రహ్మముయొక్క అంశలుగా వీటిని ఎరిగినవాడు జ్యోతిష్మాన్ లోకములను జయించగలడు.
4. స య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం।
‘‘పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్’’ ఇతి ఉపాస్తే
జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి।
జ్యోతిష్మతో హ లోకాన్
జయతి య ఏతమ్ ఏవం
విద్వాన్ చతుష్కలం పాదం
బ్రహ్మణో ‘‘జ్యోతిష్మాన్’’ ఇతి ఉపాస్తే।।
బ్రహ్మముయొక్క పాదములుగా, కళలుగా అగ్ని - సూర్య - చంద్ర - విద్యుత్తులను భావించి ఉపాసించువాడు జ్యోతిష్మంతుడు। జ్యోతిష్మంత లోకాలను జయించగలడు. అనగా జ్యోతిష్మంత లోకములను తనయందు దర్శించగలడు. జ్యోతిస్వరూపుడై ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే సప్తమః ఖండః


4–8. చతుర్థ ప్రపాఠకః - అష్టమ ఖండము - అయతనవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క నాలుగవ పాదము

1. మద్గుష్టే పాదం వక్త ఇతి
స హ శ్వోభూతే
గా అభిప్రస్థాపయాంచకార
తా యత్రాభిసాయం బభూవుః
తత్ర అగ్నిం ఉపసమాధాయ
గా ఉపరుధ్య, సమిధమ్ ఆధాయ।
పశ్చాత్ అగ్నేః ప్రాఙ్ ఉప ఉపవివేశ।।
సత్యకాముడు : తరువాతి, (4వ) పాదము గురించి కూడా చెప్పండి.
హంస : మిత్రమా! అది నీకు మద్గుష్టము (నీటి కాకి) చెప్పగలదులే।
అని హంస మౌనము వహించింది.

ఆ మరునాడు సత్యకాముడు దినచర్యగా ఆవులను తోలుకువెళ్ళారు. అవి మేత మేయనారంభించాయి. ఆతడు సమిధలు ప్రోగుచేసి, అగ్నిని వెలిగించి, తూర్పుగాను - అగ్నికి ఆవలగా కూర్చుని నీటి కాకి గురించి ప్రార్థనలు సమర్పించారు.
2. తం మద్గుః ఉపనిపత్య
అభ్యువాద ‘‘సత్యకామ!’’ ఇతి
‘‘భగవ!’’….ఇతి హ ప్రతిశుశ్రావ।।

మద్గుష్టము (నీటికాకి) : ఓ సత్యకామా!
సత్యకాముడు : ఓ జలజంతు దేవతా। జ్ఞానియగు నీటికాకి। భగవాన్! నమస్కారము। అని స్తుతించారు.

3. బ్రహ్మణః సోమ్య! తే పాదం బ్రవాణి ఇతి।
బ్రవీతు మే భగవన్। ఇతి।।
తస్మై హ ఉవాచ
ప్రాణః కలా। చక్షుః కలా।
శ్రోత్రం కలా। మనః కలా।
ఏష వై, సోమ్య। చతుష్కలః
పాదో బ్రహ్మణ ఆయతనవాన్ - నామ।।
సత్యకాముడు : హే బ్రహ్మన్। భగవాన్। బ్రహ్మము గురించిన (4వ) పాదము గురించి నాకు చెప్పమని విన్నపము.
మద్గుష్టము : చతుష్కళలు
(1) ప్రాణకళ (2) చక్షువులు (చూపు) కళ (3) శ్రోత (వినికిడి) కళ (4) మనస్సు కళ
హే సౌమ్య! ఈ చతుష్కళ సమన్విత బ్రహ్మముయొక్క పాదమును తెలుసుకొన్నవాడు ఆయతనవంతుడు (ఉత్తమస్థానము కలవాడు) అగుచున్నాడయ్యా।
4. స య ఏతం ఏవం విద్వాన్
చతుష్కలం పాదం బ్రహ్మణ
ఆయతనవాన్ - ఇతి ఉపాస్త।
ఆయతనవాన్ అస్మిన్ లోకే భవతి।
ఆయతనవతో హ లోకాన్ జయతి।
య ఏతం ఏవమ్ విద్వాన్
చతుష్కలం పాదం
బ్రహ్మణ ఆయతనవాన్ ఇతి ఉపాస్తే।
4 పాదములగు (1) ప్రాణము, (2) చక్షువులు (కళ్ళు - చూపు) (3) శ్రోతము (వినికిడి) (4) మనస్సు (ఆలోచన స్థానము)లను బ్రహ్మముయొక్క కళలుగా ఉపాసించువాడు ఆయతనుడు (ఉత్తమ గృహము కలవాడు) అవగలడు. సమస్త లోకములు ఆతనికి సొంత ఇంటితో సమానము అవుతాయి. లోకములను జయించగలడు. లోకములను తనయందు దర్శించగలడు.
ఉపాసనచే బ్రహ్మమును ఉపాసించువాడు, సర్వ సమృద్ధుడు కాగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే అష్టమః ఖండః


4–9. చతుర్థ ప్రపాఠకః - నవమ ఖండము - గురుముఖతా బ్రహ్మవిద్య అభ్యాసము

1. ప్రాప హ ఆచార్యకులం।
తమ్ ఆచార్యో అభ్యువాద
‘‘సత్యకామ!’’ ఇతి ‘‘భగవ!’’
ఇతి హ ప్రతిశుశ్రావ।।
అప్పుడు సత్యకాముడు గురుకులం చేరాడు.
ఆచార్యులవారు : ఓ సత్యకామా।
సత్యకాముడు : భగవాన్। గురుదేవా! సాష్టాంగ దండ ప్రణామములు స్వీకరించండి।
ఆచార్యులు : సౌమ్య! సత్యకామా! నీ ముఖము చూస్తూ ఉంటే బ్రహ్మమును ఎరిగినట్లుగా కనిపిస్తున్నావు. నీకు ఎవ్వరు బోధించారు?
2. ‘‘బ్రహ్మవిత్ ఇవ వై సోమ్య।
భాసి? కో ను త్వా అనుశశాసేతి?’’
‘‘అన్యే మనుష్యేభ్య ఇతి
హ ప్రతిజజ్ఞే భగవాన్
త్వయేవ మే కామే బ్రూయాత్।
సత్యకాముడు : మనుష్యులకు వేరైనవారే నాకు (సవిషయ-సాకార) బ్రహ్మముయొక్క కళల గురించి, పాదముల గురించి చెప్పారు. అయితే మాత్రం ఏమున్నది? స్వామీ! మీరు నాకు నేను కోరుకొను చున్న (నిర్విషయ-నిరాకార) బ్రహ్మము గురించి బోధించి భగవాగుడు (ధన్యుడు)గా తీర్చిదిద్దండి.
3. శ్రుతగ్ం హి ఏవ మే భగవద్దృశేభ్య
ఆచార్యాద్ధై వ విద్యావిదితా

సాధిష్ఠం ప్రాపతి - ఇతి।।
తస్మై హి ఏతత్ ఏవో వాచా
అత్ర హ న కించన వీయాయేతి।
వీయాయేతి।।
తమవంటి మహనీయులగు ఆచార్యులు బోధించునది అత్యుత్తమమైన బ్రహ్మవిద్య.
ఆచార్యులగు మీరు బోధించుట చేతనే మేము సాధుత్వము పొందగలమని మీవంటి మహనీయులు చెప్పటం వింటున్నాము. శ్రీ గురుభ్యోన్నమో నమో నమో నమః ।।

అప్పుడు ఆచార్యులగు గౌతమమహర్షి సత్యకామునికి ‘బ్రహ్మవిద్య’ను బోధించారు.

అప్పుడు ‘లోటు’ అనునదంతా తొలగిపోయి, ఆ సత్యకాముడు ఏలోటు లేనివాడైనాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే నవమః ఖండః


4–10. చతుర్థ ప్రపాఠకః - దశమ ఖండము - ఉపకోసల విద్య

1. ఉపకోసలో హ వై కమలాయనః
సత్యకామే జాబాలే బ్రహ్మచర్యం ఉవాస।
తస్య హ ద్వాదశ వర్షాణి అగ్నీన్ పరిచచార।
స హ స్మ అన్యాన్ అన్తేవాసినః
సమావర్తయగ్ం తగ్ం హ
స్మ ఏవ న సమావర్తయతి।।
కమలాయని మునీంద్రుని కుమారుడు ‘‘ఉపకోసల కమలాయనుడు’’ అనేవారు, ఆయన సత్యకామ జాబాలి ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్య వ్రతమును (బ్రహ్మము గురించిన ఉపాసనా వ్రతమును) నిర్వర్తించసాగారు. 12 సంవత్సరముల కాలము ఆయన తోటి విద్యార్థులతో కూడి శాస్త్ర ప్రవచనానుసారంగా అగ్నికార్యము దైనందిక హోమము) మొదలైన వాటిని నిర్వర్తించారు.
ఆ విధంగా 12 సంవత్సరముల కాలము గడచిన తరువాత సత్యకామ జాబాలి ఒకరోజు శిష్యులందరికీ ‘వీడ్కోలు ఆశీర్వాద సభ’ ఏర్పాటు చేసారు. కానీ ఉపకోసలునుని మాత్రం ఆ సభకు పిలువలేదు.
2. తం జాయ ఉవాచ :
తప్తో బ్రహ్మచారీ కుశలమ్
అగ్నీన్ పరిచచారీన్।
మా త్వా అగ్నయః పరిప్రవోచన్
ప్రబ్రూహి అస్మా ఇతి।
తస్మై హ అప్రోచ్యైవ ప్రవాసాంచక్రే।
అప్పుడు సత్యకాముని భార్య (గురుమాత) సత్యకామునితో ఇట్లా పలికారు.
‘‘పతిదేవా! తమరు శిష్యులందరికీ వీడ్కోలు ఆశీర్వాదము ప్రసాదించారు. కానీ మీ శిష్యులలో ఉపకోసలుని మాత్రం వీడ్కోలు సభకు పిలువలేదు. ఉపకోసలుడు అందరికంటే కూడా గురుకుల (ఆశ్రమ) సేవ అధికంగా చేసి ఉన్నవాడు. ఇది మీరు గమనించియే ఉంటారు.
బ్రహ్మచర్య వ్రతమును దీక్షగా నిర్వర్తించి ఉన్నాడు కూడా. నిత్యాగ్నిదేవత ఈ విషయంలో మిమ్ములను ఆక్షేపించవచ్చునేమో గదా?’’.

సత్యకాముడు అది విని కూడా ఉపకుశలనకు వీడ్కోలు ఉపదేశము ఇవ్వకుండానే, ఎటో ప్రహసమునకు (సంచారమునకు) వెళ్లారు.
3. స హ వ్యాధినా అనశితుం దధ్రే
తమ్ ఆచార్య జాయా ఉవాచ :
బ్రహ్మచారిన్ అశాన
‘కిం ను న - అశ్నాసి?’ ఇతి।
స హ ఉవాచ :
బహవ ఇమే అస్మిన్ పురుషే
కామాన్ అనాత్యయా
వ్యాధిభిః ప్రతిపూర్ణో2స్మి।
న అశిష్యామి ఇతి।।
అది తెలుసుకొన్న ఉపకుశలుడు మనోవేదన చెంది ఉపాసములతో కృశించిపోసాగాడు. అప్పుడు ఆచార్యపత్ని (సత్యకాముని జీవిత భాగస్వామి) - అది గమనించారు. ఉపకుశలునితో ఇట్లు పలికారు.
గురుమాత (ఆచార్యుల వారి ధర్మపత్ని) : ఓ బ్రహ్మచారీ। చిరంజీవి। ఉపకుశలా। ఏమిటి, నీవు ఆహారం తీసుకోవటం మానావా? ఎందుకు?
ఉపకుశలుడు : గురుమాతా! అనుకున్నది జరగకపోవటంచేత నేను మనోవ్యాధిచే ప్రతిపూర్ణుడను అయ్యాను. భోజనముపై మనస్సు పోవటం లేదు.
{ఆ నిరుత్సాహం చూచి గురుమాత ‘‘అయ్యో! బిడ్డ ఏమౌతాడో!’’ అని అనుకోసాగారు.}
4. అథ హ అగ్నయః సమూదిరే,
తప్తో బ్రహ్మచారీ కుశలం
నః పర్యచారీత్।
హ అంతా, అస్మై ప్రబ్రవామి - ఇతి।
తస్మై హ ఊచుః
ప్రాణో బ్రహ్మ। ‘‘కం’’ బ్రహ్మ।
‘‘ఖం’’ బ్రహ్మ। ఇతి।।
అప్పుడు ఉపకుశలుని నిరాహారము (ఆహారము తీసుకోకపోవటము) గమనించిన యజ్ఞాగ్నీ దేవతలు ఒకచోట కలుసుకొన్నవై ఇట్లా సంభాషించుకోసాగారు.
యజ్ఞాగ్ని దేవతలు : ఓ మిత్ర అగ్నిశిఖా దేవతలారా! ఈ పిల్లవాడు ఉపకుశలుడు ఆహారం తీసుకోక ఎంతో బాధపడుచున్నాడు. ఈతడు సుదీర్ఘకాలంగా సేవానిరతుడై అహూతులను అందించటంలో శ్రమలు తీసుకొని ఉన్నాడు. ఈతనిని ఊరడించి, శాంతపరచటం మనయొక్క ప్రత్యుపకార ధర్మము।
యాజ్ఞాగ్ని దేవతలు : చిరంజీవా! ఉపకోసలా! నీకు ఉపదేశము ప్రసాదించదలిచాము. విను! ప్రాణమే బ్రహ్మము. ‘కం’ బ్రహ్మము. ‘ఖం’ - బ్రహ్మము అని ఎరుగుదువా?
5. స హ ఉవాచ :
విజానామి అహం యత్ ప్రాణో బ్రహ్మ।
కం చ తు ఖం చ
న విజానామి ఇతి।।
తే హ ఊచు :
యత్ వావ ‘కం’ తత్ ఏవ ‘ఖం’।
యత్ ఏవ ‘ఖం’ తత ఏవ ‘కం’ ఇతి।
ప్రాణం చ హ అస్మై తత్
ఆకాశం చ ఊచుః।
ఉపకోసలుడు : ఓ యజ్ఞాగ్ని శిఖ దేవతలారా! నమోనమః। ‘‘ప్రాణము బ్రహ్మమే’’ - అనే విషయం నేను ఎరిగి ఉన్నాను.
కానీ మీరు ‘కం బ్రహ్మమే’ ‘ఖం బ్రహ్మమే’ అంటున్నారే! ఆ విషయం నేను ఎరిగి ఉండలేదు. దయచేసి విశదపరచండి.
అగ్నిదేవతలు :
ఏది ‘కం’యో, అదియే ‘ఖం’।
ఏది ‘ఖం’యో, అదియే ‘కం’ కూడా।
(కం = సుఖము; ఖం = ఆకాశము)

అప్పుడు యజ్ఞాగ్ని దేవతలు ఆ ఉపకోసలునికి సుఖమయరూపమగు ‘‘ప్రాణము’’ గురించి, ‘‘ఆకాశము’’ (చిదాకాశము) గురించి కూడా ఉపదేశించారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే దశమః ఖండః


4–11. చతుర్థ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - గార్హపత్యాగ్ని అనుశాసనము (1)

1. అథ హి ఏనం గార్హపత్యో అనుశశాస
‘‘పృథివిః - అగ్నిః - అన్నమ్ - ఆదిత్య’’ - ఇతి।।
య ఏష ఆదిత్యే పురుషో
దృశ్యతే, - సో2హమస్మి।
స ఏవ అహం అస్మి - ఇతి।।
గార్హపత్యాగ్ని పురుషుడు -
‘‘నేను సర్వదా ఆత్మ స్వరూపుడను।
- ఈ సమస్తము ఆత్మస్వరూపమే। కాబట్టి భూమి, అగ్ని, అన్నము ఆదిత్యుల రూపముగా ఉన్నది నేనే। ఇది అనుశాసనము.
ఆదిత్యునియందు ఏ పురుషుడు (Worker of the whole) కనిపిస్తూ ఉన్నారో,
- ఆ ఆదిత్య పురుషుడను నేనే।
- ఆ ఆదిత్యపురుషుడనే నేను।
అంతేగాని, జీవమాత్రుడను కాను. అగ్ని - కట్టెల రూపమాత్రుడను కాను."
2. స య ఏతం ఏవం విద్వాన్
ఉపాస్తే అపహతే
పాప కృత్యాం లోకీ భవతి।
సర్వమ్ ఆయురేతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంతే।।
ఎవ్వడైతే ఆత్మగురించి ఈ విధంగా - ‘‘ఈ సమస్తము ఆత్మయే। నేను ఆత్మ స్వరూపుడనే। ఈ సమస్తము నేనే’’ - అని ఆత్మజ్ఞానవిద్వాంసుడై నిశ్చలుడౌతాడో
- ఆతని పాపదృష్టులన్నీ తొలగిపోతాయి.
- ఉత్తమ లోకములు సిద్ధించుకోగలడు.
- ఆయుష్షు పవిత్రమౌతుంది.
- ఉజ్వలుడై జీవించగలడు.
- ఆతనిని ఆశ్రయించినవారు, సంబంధీకులు క్షీణత పొందరు.
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే।।
అట్టి ఆముష్మిక లోకతత్త్వము ఎరిగినవారు మా చే ఇహ - పరములందు కూడా మార్గదర్శకులుగా, తత్త్వజ్ఞులుగా గౌరవించబడుచున్నారు. (ఈవిధంగా పలికి గార్హపత్యాగ్ని పురుషుడు మౌనం వహించారు)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ఏకాదశః ఖండః


4–12. చతుర్థ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - గార్హపత్యాగ్ని అనుశాసనము (2)

1. అథ హి ఏనమ్
అన్వాహార్య పచనో అనుశశాసా
‘‘ఆపో దిశో నక్షత్రాణి చంద్రమా’’ - ఇతి
య ఏష చంద్రమసి పురుషో దృశ్యతే -
సో2హమస్మి। స ఏవ అహమస్మి ఇతి।।
గార్హపత్యాగ్ని అనుశాసనం -
అప్పుడు అన్వాహార్య పచనాగ్ని గురించి గార్హపత్యాగ్ని దేవత ఇంకా ఈ విధంగా బోధించసాగారు.
గార్హపత్యాగ్ని పురుషుడు (దేవత) : ఓ ఉపకోసలా। ఇది కూడా విను.
(1) జలము (2) దిక్కులు (3) నక్షత్రములు (4) చంద్రమా…అయి ఉన్నది చంద్రమ పురుషకారమే। అట్టి చంద్రమసముగా కనబడుచూ ఉన్నదంతా నేనే అయి ఉన్నాను.
అది నేను। నేనే అదంతా।
2. స య ఏతం ఏవం విద్వాన్
ఉపాస్తే - అపహతే
పాపకృత్యాం, లోకీ భవతి।
సర్వమాయురేతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంత।
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతం ఏవం
విద్వాన్ ఉపాస్తే।।
ఇది ఎరిగి ఉపాసిస్తున్న విద్వాంసుడు ‘అది నేనే’ అనే భావనను నిశ్చలపరచుకొన్నవాడు,
- సర్వపాప దృష్టులనుండి విడివడగలడు.
- సర్వ లోకములు తన స్వరూపమే అయి ఆనందించగలడు.
- ఉత్తమ ఆయుష్షు పొందగలడు.
- స్వయం ప్రకాశమగు జ్యోతి స్వరూపుడై విరాజిల్లగలడు.
- అట్టివాని వంశము క్షీణించదు.
- వారు ఆముష్మిక లోకవాసులుగా మాచే దర్శించబడుచున్నారు. గౌరవించబడుచున్నారు. లోకంలో అట్టివారు మాకు ఆరాధ్య పురుషులగుచున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ద్వాదశః ఖండః


4–13. చతుర్థ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ఆహవనీయాగ్ని అనుశాసనం (1)

1. అథ హి ఏనం ఆహవనీయో అనుశశాస
‘‘ప్రాణ। ఆకాశో। ద్యౌః। విద్యుత్’’ - ఇతి।
య ఏష విద్యుతి పురుషో దృశ్యతే…
సో2హమస్మి। స ఏవ అహమస్మి - ఇతి।।
ఆహవనీయాగ్ని పురుషుడు (దేవత) :
ఏ విద్యుత్ పురుషుడు ప్రాణ, ఆకాశ, ద్యులోక, విద్యుత్తు (తేజోమయము)గా అగుపిస్తున్నారో అట్టి విద్యుత్ (తేజో) పురుషుడను నేనే। నేనే అవన్నీగా ఏర్పడి ఉన్నాను.
2. స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే,
అపహతే పాపకృత్యాం లోకీ భవతి।
సర్వమ్ ఆయుః ఏతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంత।
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతమ్ ఏవం విద్వాన్ ఉపాస్తే।।
ఈ విధంగా ఎవ్వరైతే తన ఆత్మస్వరూపము గురించి తాను తెలుసుకొని విద్వాంసుడై ఉపాసిస్తాడో….
- అట్టివాడు పాపకృత్యములనుండి విడివడి, సర్వలోకహితుడు అవుతాడు.
- ఆయుష్మంతుడు కాగలడు.
- జ్యోతి స్వరూపుడై జీవితమును ప్రకాశింపజేసుకోగలడు.
- ఆతని వంశము పావనము అవుతుంది.
- ఆతని ఆముష్మక జ్ఞానమును మేము భజించుచున్నాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే త్రయోదశః ఖండః


4–14. చతుర్థ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - ఆహవనీయాగ్ని అనుశాసనం (2)

1. తే హ ఊచుః।
ఉపకోసల ఏషా, సోమ్య!
తే అస్మత్ విద్యా - ఆత్మ విద్యా చ।
ఆచార్యస్తు తే గతిం వక్తా ఇతి
అజగామ హ అస్య ఆచార్యః।
తమ్ ఆచార్యో అభ్యువాదా
ఉపకోసలా! ఇతి।।

ఆ అగ్ని పురుషులు ఇంకా ఇట్లా ప్రవచించసాగారు.

త్రయాగ్ని పురుషులు : ఓ ప్రియ ఉపకోసలా! సౌమ్యా! మేము మీకు ఆత్మ విద్య గురించి చెప్పాము. ఇంకా కూడా మీ గురుదేవులు సత్యకాములవారు మరింతగా బోధించగలరు.

అప్పుడు ఆచార్యులవారు (సత్యకాములవారు) సంచారమునుండి తిరిగివచ్చారు.

ఆచార్యులు : ఓ ఉపకోసలా!

2. ‘భగవ।’ - ఇతి హ।
ప్రతిశుశ్రావ బ్రహ్మవిద ఇవ,
సోమ్య, తే ముఖం భాతి కా ను?
త్వా అనుశశాసేతి కో, ను!
మా అనుశిష్యాత్ భో,
ఇతీ హ అప ఏవ నిహ్నుతే।
ఇమే నూనం ఈదృశా అన్యాదృశా
ఇతీ హ అగ్నీన్ అభ్యూదే।
కిం ను, సోమ్య!
కిల తే అవోచన్? ఇతి।।

ఉపకోసలుడు : భగవాన్! గురుదేవా! నమోనమః
ఆచార్యులు : సౌమ్యా! ప్రియదర్శనుడా! నీ ముఖము బ్రహ్మవేత్త ముఖంలాగా ప్రకాశిస్తోందే! నీకు ఎవ్వరైనా బ్రహ్మవిద్యను ఉపదేశించారా?
ఉపకోసలుడు : స్వామీ గురుదేవా! మీ శిష్యుడనగుటచే మీరే కదా, నాకు బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించాలి!

ఆయా విధములుగా (గార్హపత్యాగ్ని-ఆహవనీయాగ్ని స్వరూపుడగు) అగ్నిదేవుడు దృశ్యంలో సందర్భములగు కొన్ని విశేషములపట్ల సో2హమ్ భావమును బోధించారు.

3. ‘ఇదమ్’ ఇతి హ ప్రతిజజ్ఞే లోకాన్ వావ
కిల సోమ్య! తే అవోచన్
అహం తు తే తత్ వక్ష్యామి!
యథా పుష్కరపలాశా ఆపో
న శ్లిష్యంత ఏవం,
ఏవం విది పాపం కర్మ న శ్లిష్యత - ఇతి।
బ్రవీతు మే భగవాన్! ఇతి
తస్మై హ ఉవాచ।।
ఆచార్యులు : ఓహో! అగ్నిపురుషుడు లోక విశేషములను సో2హమ్ దృష్టితో దర్శించుచూ ఉపాసించు విశేషములన్నీ చెప్పారా? మంచిది.
ఇప్పుడు నీకు బ్రహ్మము గురించిన విశేషమునే బోధిస్తాను. నీ మనస్సులోని బ్రహ్మజిజ్ఞాసాభిలాషను తీరుస్తాను.
పద్మముపై ఉన్న జలబిందువులు పద్మమును తాకని విధంగా, బ్రహ్మతత్త్వజ్ఞానముచే నిన్ను పాపదోషములు స్పృశించజాలవు.
ఉపకోశలుడు : ఆచార్యదేవా! నాకు ఇంకను బ్రహ్మజ్ఞానము పూర్తిగా బోధించండి.
అప్పుడు గురుదేవులు ఇట్లా పలుకసాగారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే చతుర్దశః ఖండః


4–15. చతుర్థ ప్రపాఠకః - పంచదశ ఖండము - అక్షిణి పురుష ఉపాసన

తస్మై హ ఉవాచ :
1. య ఏషో ‘‘అక్షిణి పురుషో’’
దృశ్యత - ఏష ‘‘ఆత్మ’’ ఇతి।
హ ఉవాచ :
ఏతత్ అమృతమ్। అభయమ్।
ఏతత్ బ్రహ్మా ఇతి।।
తత్ యత్ అపి అస్మిన్ సర్పిర్వ
ఉదకం వా సించతి వర్త్మనీ ఏవ గచ్ఛతి।।
సత్యకామ జాబాలి :
ఓ ప్రియశిష్యా! ఉపకోశలా! విను.

ఈ కంటిలో చూపును ఉపయోగించుచూ ఏ ‘చూచువాడు’ (అక్షిణిపురుషుడు) వేంచేసి ఉన్నాడో - ఆతడు ఆత్మయే అయి ఉన్నాడు.

ఆ చూపు తనదైన అక్షిణి పురుషుడు ‘కన్ను’ అనే ఉపకరణము కంటే ముందే ఉన్నాడు. చూచేవాడే కంటితో పుట్టడు, కంటితో చావడు. ఆ చూచేవాడే అమృత పురుషుడు. అభయ స్థానమునకు చెందినవాడు. బ్రహ్మమే అయిఉన్నాడు.

అట్టి చూచువాడుగాని, చూపుగాని చూడబడే దానిచే ప్రవేశించబడటం లేదు. వెన్నగాని, నీటిబిందువుగాని కళ్లపై జల్లితే, అవి బయటకు వెళ్తాయేగాని, లోనికి ప్రవేశించవు గదా! చూపులో చూడబడేది ప్రవేశించక తిరిగి బయటకే వెళ్లుచున్నది.
2. ఏతగ్ం సంయద్వామ - ఇతి
ఆచక్షత, ఏతగ్ం హి
సర్వాణి వామాని అభిసంయంతి।
సర్వాణి ఏనం వామాని
అభిసంయంతి - య ఏవం వేద।।
అట్టి అక్షిణి పురుషుడే (One who is seeing) ఆత్మపురుషుడు.

ఆయనను ‘‘సంయద్వామ’’ (యత్ వామ సంయత్ - విడిగా ఉన్నవాడు) - అని కూడా అంటారు. ఎందుకంటే, అన్ని నామములు (అభినందనములు) ఆయనకే చేరుచున్నాయి. ఎవ్వడైతే ‘‘సర్వస్తుతులు, దృశ్యసేవనములు చెందుచున్నది ఆ ద్రష్ట పురుషునికే’’ - అని గ్రహిస్తాడో, ఆతడు సర్వ నామములు (అభినందనలు) పొందినవాడగుచున్నాడు.

అందుచేత నీవు చూచేవన్నీ చూచువానికే సమర్పించు!
3. ఏష ఉ ఏవ వామనీః।
ఏష హి సర్వాణి వామాని నయతి।
సర్వాణి వామాని నయతి య ఏవం వేద।।
అట్టి ఆత్మస్వరూపుడగు అక్షిణిపురుషుడే (కేవల ద్రష్టయే) -
వామనీ → సర్వము తనకు చెందినవాడు, దృశ్యమంతా తన సంపదగా కలవాడు.
ఈ విధంగా కంటిలో ప్రవర్తమానుడై ఉన్న ద్రష్ట (లేక) అక్షిణి పురుషుని ఆత్మగా ఎరిగినవాడు - తాను చూస్తున్నదంతా తన సంపదగా ఎరిగి, ఆత్మానందుడగుచున్నాడు.
4. ఏష ఉ ఏవ భామనీః
ఏష హి సర్వేషు లోకేషు భాతి।
సర్వేషు లోకేషు భాతి -
య ఏవం వేద।।
ఆ కంటిలో నివాసము కలిగి సమస్తమును చూస్తూ ఉన్న దృక్ - పురుషుడే -
భామనీ → సమస్తమును తన చూపు తేజస్సుతో వెలిగించుచున్నాడు.

భాతి = ఈ సమస్త లోకములుగా భాసించుచున్నది ఆ అక్షిణి పురుషుడే। ఇదంతా ఆయన పురుషకారమే।

ఇది తెలుసుకొన్నవాడు ‘‘నేనే ఈ కనబడే సమస్తమును దృశ్యముగా వెలిగిస్తూ వెలుగుచున్నదంతా నేనే అయి ఉన్నాను’’ అని ఎరుగగలడు.
5. అథ యత్ ఉ చ ఏవ
అస్మిన్ శవ్యం కుర్వంతి,
యది చ న అర్చిషం ఏవ
అభిసంభవంతి,
అర్చిషో అహరహ్న
ఆపూర్యమాణపక్షమ్
ఆపూర్యమాణపక్షాతి ఆన్షట్ ఉదఙ్
ఏతి → మాసాగ్ం।
తాన్ మాసేభ్యః సంవత్సరగ్ం।
సంవత్సరాత్ → ఆదిత్యమ్।
ఆదిత్యాత్ → చద్రమసమ్।
చంద్రమసో → విద్యుతమ్।
ఈ విధంగా - (1) నేత్రములో నివసించుచూ అక్షిణి పురుషుడై (2) చూడబడుచున్నదంతా తానే అయి, సమస్త దృశ్యముగా వెలుగొందుచున్నాడు అని ఆత్మను (స్వస్వరూప-దృక్‌ద్రష్ట స్వరూపముగా) - ఉపాసించువాడు -
→ ఆతడు సంతానము మొదలైన ఇతరులచే గుర్తింపకున్నా (లేక) స్తుతించబడకున్నా, దేవ పితృకార్యములు పొందినా, పొందకపోయినా కూడా → ఆతడు - అర్చిస్సులను (అర్చన కిరణములను) చేరుచున్నాడు.
→ పగటి తేజోపుంజములలోను, కాంతిలోను ప్రయాణములు పొందుచున్నాడు.
→ ఆపూర్యమాణ పక్షము (శుక్లపక్షము)లో ప్రవేశిస్తున్నాడు.
→ శుక్లపక్ష దేవత నుండి ఉత్తరాయణ దేవతను ఆశ్రయిస్తున్నాడు. ఉత్తరాయణములో ప్రవేశిస్తున్నాడు.
→ అందులోంచి సంవత్సర దేవతను పొందుచున్నాడు.
→ అక్కడనుండి ఆదిత్యలోకము (సూర్యుని) చేరుచున్నాడు.
→ అక్కడి నుండి చంద్రమసము.
→ చంద్రమసము నుండి తేజమయమగు ‘విద్యుత్’ రూపమును పొందుచున్నాడు.
తత్పురుషో అమానవః
స ఏనా(త్) బ్రహ్మ గమయతి।
అట్టి తేజోమయ విద్యుత్ స్థానమునుండి తత్పురుష సంబంధమైన, మానవాతీతమైన బ్రహ్మలోకము జేరి ‘‘బ్రహ్మము’’ను పొందుచున్నాడు.
ఏష ‘‘దేవ పథో’’ ‘‘బ్రహ్మపథ’’
ఏతేన ప్రతిపద్యమానా।
ఇమం మానవం ఆవర్తం
న ఆవర్తంతే। న ఆవర్తంతే।।

ఇదియే ‘‘దేవపథము’’. ఇదియే ‘‘బ్రహ్మపథము’’. అదియే ‘‘బ్రహ్మమే తానవటము’’. అట్టివాడు బ్రహ్మమే తానై, ఇక ‘‘నేను జీవుడను’’ అనబడు స్వయం కల్పిత పరిమితమగు మానవలోకమునకు తిరిగిరాడు. బ్రహ్మమే తానై సర్వత్రా విరాజిల్లగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే పంచదశః ఖండః


4–16. చతుర్థ ప్రపాఠకః - షోడశ ఖండము - యజ్ఞోపాసన

1. ఏష హ వై యజ్ఞో
యో అయం పవత
ఏష హ యన్నిదగ్ం సర్వం పునాతి।।
ఈ జగత్తులో వాయువు (పవనము) వీచుచు సమస్తము నిర్వర్తిస్తోంది. జీవులకు జీవనము ప్రసాదిస్తూ ఉన్నది. కదిలే వాయువు వెనుక ‘‘కదిల్చే చైతన్యము’’ ప్రవర్తమానమై ఉన్నది.
అట్టి (పవతము) వీచువాయువే, అగ్నిజ్వలనంగా ఇక్కడి యజ్ఞ కార్యక్రమమునకు నాంది. అట్టి వాయువుయొక్క వీచికలు సమస్తమును పవిత్రము చేస్తున్నాయి.
యత్ ఏష యన్నిదగ్ం సర్వం పునాతి -
వాయువు వీచుచుండగా అది యజ్ఞరూపంగా సమస్తమును పవిత్రము - ఉత్తేజము చేయుచున్నది.
యజ్ఞమునకు ప్రారంభమును ప్రసాదిస్తోంది.
తస్మాత్ ఏష ఏవ యజ్ఞః
తస్య మనః చ వాక్ చ వర్తనీ।।
కావున, వాయు సంచలనమే మహత్తరమగు సృష్టి యజ్ఞము. (నమస్తే వాయు! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।)
యజ్ఞమునకు (1) మనస్సు (2) వాక్కు మార్గములు. ఆ రెండు ప్రధానములు.
2. తయోః అన్యతరాం మనసా
సగ్ంస్కరోతి, బ్రహ్మా వాచా
హోతా, అధ్వర్యుః ఉద్గాతా అన్యతరామ్।।
స యత్ర ఉపాకృతే ప్రాతః అనువాకే।
పురా పరిధానీయాయా
బ్రహ్మ వ్యవవదతి।।
యజ్ఞములోని మనస్సు - వాక్కు మార్గములలో,
మనస్సును → ‘‘బ్రహ్మ’’ అగు ఋత్విక్కు మనస్సుతో సంస్కరిస్తున్నారు.
వాక్కును → హోత - ఆధ్వర్యుడు - ఉద్గాత, వీరు తమ వాక్కుతో ‘వాక్కు’ను సంస్కరిస్తున్నారు. ఈ రెండవ మార్గము - వారిచే సంస్కరించబడుతోంది.

ముందుగా ప్రాతరనువాకము. ఆ తరువాత యజ్ఞము మొదలౌతోంది. ‘‘పరిధానీయము’’ అనే ఋక్కు యజ్ఞగుండమును, కుండలను పవిత్రము చేయటమునకు ముందుగా ఋత్విక్కు ఋక్కులను గానం చేస్తారు. ఋక్కుల గానము ముగించి, ఋత్విక్కు మౌనము వీడగానే ‘‘మనో సంస్కరణము’’ అనే మొదటి మార్గము పూర్తి అయినట్లు.
3. అన్యతరామ్ ఏవ వర్తనీగ్ం,
సగ్ంస్కరోతి। హీయతే అన్యతరా।
స యథ ఏకపాద్ వ్రజన్
రథో, వైకేన చక్రేణ
వర్తమానో రిష్యతి।
ఏవమ్ అస్య యజ్ఞో రిష్యతి।
యజ్ఞగ్ం రిష్యంతం
యజమానో అనురిష్యతి।
స ఇష్ట్వా పాపీయాన్ భవతి।।

మనస్సు సంస్కరించబడిన తరువాతనే వాక్కు కూడా సంస్కరించబడాలి. అట్లా కాకుండా (మనో సంస్కార ఋక్‌గానం) లేకుండా వాక్ సంస్కారం మాత్రమే ఆశ్రయించటం ఎటువంటిదంటే
→ యజ్ఞ కర్మ పవిత్రత చెందదు.
→ ఒంటి కాలితో మనుష్యుడు నడవటము వంటిది.
→ ఒక చక్రముతోనే రథమును ముందుకు త్రోయటము వంటిది.
యజ్ఞము కూడా ఆ విధంగా ఉత్తమంగా ప్రయోజనకారి కాదు.
మనో సంస్కారము + వాక్ సంస్కారము → ఉభయము అనుసరించకపోతే యజ్ఞము కుంటుపడినట్లు అవుతుంది. యజమాని పాపి కూడా అగుచున్నాడు.

4. అథ యత్ర ఉపాకృతే ప్రాతః
అనువాకే న పురా పరిధానీయాయా
బ్రహ్మా వ్యవవదతి
ఉభే ఏవ వర్తనీ సగ్ంస్కుర్వంతి।
న హీయతే అన్యతరా।।
‘‘ప్రాతరనువాకము’’ (Pre Praying chants) తరువాత పరధీయ ఋక్కులకు ముందుగా ఋత్విక్కు మౌనము వీడకుండా ఉంటే - అప్పుడు అటు
(1) ప్రాతరనువాకము (2) పరాధీయు ఋక్కులు - ఉభయము సంస్కరించబడినవి అవుతాయి.
రెండూ కూడా ఇక లోపభూయిష్టము కావు.
5. స యథా ఉభయ పాద్,
వ్రజన్ రథో వోభాభ్యాం
చక్రాభ్యాం వర్తమానః ప్రతితిష్ఠతి।
ఏవం అస్య యజ్ఞః ప్రతితిష్ఠతి।
యజ్ఞం ప్రతితిష్ఠంతం
యజమానో అనుప్రతితిష్ఠతి।
స ఇష్ట్వా, శ్రేయాన్ భవతి।।
ఏ విధంగా అయితే…
- మానవుడు రెండుకాళ్ళతో అయితే చక్కగా నడుస్తున్నాడో,
- రెండు చక్రములతోనే రథము చక్కగా ముందుకు నడవగలదో,
అదే విధంగా ప్రాతరనువాకము, పరాధీయ ఋక్కులు ఇవన్నీ మనో సంస్కార మంత్రముల - ‘‘వాచా సంస్కార మంత్రములతో’’ కూడుకొని యజ్ఞము ప్రతితిష్ఠము అగుచున్నది.

యజ్ఞకర్త, ఋత్విక్కు, ఆధ్వర్యుడు, హోత, ఉద్గాత మొదలైన యజ్ఞదీక్షా భాగస్తులంతా అనుప్రతిష్ఠితులు కాగలరు.
యజ్ఞము తృప్తిగా జరుగుచూ ఉండగా, యజమానికి, యజ్ఞవీక్షకులకు క్షేమము కాగలదు.
యజ్ఞము (ఇష్టము)చే యజమాని శ్రేయము పొందగలడు. యజ్ఞభాగస్తులు, యజ్ఞవీక్షకులు - సర్వశ్రేయస్సులు పొందగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే షోడశః ఖండః


4–17. చతుర్థ ప్రపాఠకః - సప్తదశః ఖండః - వ్యాహృత్యుపాసన

1. ప్రజాపతిః లోకాన్ అభ్యతపత్।
తేషాం తప్య మానానాగ్ం
రసాత్ ప్రావృహత్।
అగ్నిం పృథివ్యా వాయుమ్
అంతరిక్షాత్ ఆదిత్యం దివః।।

‘‘ప్రజాపతి - ‘సృష్టి’ని లీల - క్రీడ - వినోదముగా కల్పన చేసెదను గాక’’ - అనే ఇచ్ఛ పొందారు. తపన రూపంగా తపస్సుచే ధ్యానరూపంగా సృష్టి రసమును పండించసాగారు.

తపనయే - తపస్సు। ధ్యాసయే - ధ్యానము।

కొన్ని మహత్తర వస్తువులను సృష్టి కల్పనా లీలకొరకై వెలికితీయసాగారు.
భూమి.
భూమి నుండి - అగ్నిని,
ఆకాశము నుండి - వాయువును
ద్యు(దేవతా) లోకమునుండి - ఆదిత్యుని (సూర్యుని)
రసరూపంగా - బహిర్గతపరచారు.

(గమనిక - సృష్టి క్రమము అనేక వేదోపనిషత్తులలో అనేక విధములుగా చెప్పబడినా, సృష్టికి మూలము మాత్రము ఆత్మ (బ్రహ్మము) అనియే నిర్ధారణ చేయబడినది.)

2. స ఏతాః తిస్రో దేవతా అభ్యతపః।
తాసాం తప్యమానానాగ్ం
రసాన్ ప్రావృహత్।
అగ్నేః ఋచో।
వాయోః యజూగ్ంషి।
సామాని ఆదిత్యాత్।।
ఈ విధంగా కొనసాగిస్తూ ముగ్గురు దేవతలను (త్రిమూర్తులను) గురించి ధ్యానతపస్సులచే ఆ దేవతల రసతత్త్వము స్వీకరించారు.
అగ్ని నుండి → ఋక్కులను (ఋగ్వేదమునందలి ఆత్మదేవుని గురించి స్తుతులను),
వాయువు నుండి → యజుర్వేద మంత్రములను (యజస్సులను)
ఆదిత్యుని నుండి → సామ వేదగానములను
రసముగా (సృష్టికొనసాగించటానికి) స్వీకరించారు.
ఈ విధంగా 3 వేదములు రూపుదిద్దుకున్నాయి.
3. స ఏతాం త్రయీం విద్యామ్
అభ్యతపః, తస్యాః తప్యమానాయా
రసాత్ ప్రావృహత్ ‘భూః’ ఇతి ఋగ్భ్యో।
‘భువః’ ఇతి యజుర్భ్యః।
‘‘స్వః’ ఇతి సామభ్యః।।
ఆ ‘‘ఋక్ - యజుర్ - సామ’’ త్రయీ (3) వేదములనుండి మరల తపస్సుచే ‘రసము’ను వేదసారమును స్వీకరించారు.
ఋగ్వేద ఋక్కుల నుండి - భూమి (Zone of Matter)
యజుర్వేద మంత్రముల నుండి - భువర్లోకమును (Zone of Thought)
సామవేద సామముల నుండి - ‘స్వః’ వ్యాహృతులను
(సృష్టికొరకై) తీసుకొన్నారు (స్వీకరించారు).
4. తత్ యద్య ఋక్తో రిష్యేత్
‘‘భూస్స్వాహా’ ఇతి గార్హపత్యే జుహుయాత్।
ఋచామ్ ఏవ తత్ రసేనర్చాం, వీర్యేణర్చాం,
యజ్ఞస్య విరిష్టగ్ం సందధాతి।।
యజ్ఞములో ఋగ్వేద ఋక్కులవలన ఏవైనా దోషములు అనిపిస్తూ ఉంటే ‘‘భూస్స్వాహా’’ అని చెప్పుచూ ‘గార్హపత్యాగ్ని’లో హవిస్సులను వ్రేల్చాలి. (హోమము చేయాలి).
ఈ విధంగా ఋక్కుల సారముచే ఋక్కుల వీర్యత్వము (శక్తి)చే హోమద్రవ్యములను హోమాగ్నిలో వ్రేల్చుచుండగా ఋక్కులకు చెందిన లోటులు తొలగిపోతాయి.
5. అథ యది యజుషో రిష్యేత్ ‘‘భువస్స్వాహా’’ ఇతి,
దక్షిణాగ్నౌ జుహుయాత్ యజుషామ్ ఏవ
తత్ రసేన యజుషాం వీర్యేణ
యజుషాం యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి।।
అటుపై యజుర్వేద యజస్సుల (లేక) మంత్రముల కారణంగా ఏవైనా ‘లోటు’ కలుగుచుండటము గురించి - ‘దక్షిణాగ్ని’ యందు ‘‘భువస్వాహా’’ అని పలుకుచు హవిస్సులను దక్షిణాగ్నికి సమర్పించాలి. (దక్షిణాగ్నియందు హోమద్రవ్యములను వ్రేల్చాలి).
అట్టి యజస్సుల వీర్యత్వము (బలము)చే యజస్సుల దోషములు ఏమైనా ఉంటే ఆ అరిష్టములు తొలగగలవు.
6. అథ యది సామతో రిష్యేత్ ‘స్వః స్వాహా’ ఇతి
ఆహవనీయే జుహుయాత్,
సామ్నామ్ ఏవ తత్ రసేన,
సామ్నామ్ వీర్యేణ సామ్నామ్ యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి।।
అప్పుడు ఇక -
సామవేద సామగాన - మంత్రములలో ఏదైనా ‘లోటు’ (యజ్ఞదోషములు) కలిగితే ‘‘స్వస్స్వాహా’’ అనే మంత్రముతో అహవనీయగ్నికి ఆహుతులు సమర్పించెదరు గాక।
అట్టి సామవేద సామముల రసము చేతను, సామ్నమంత్ర ఉచ్చారణ బలము చేతను యజ్ఞము యొక్క సర్వదోషములు తొలగుతాయి.
7. తత్ యథా లవణేన
సువర్ణగ్ం సందధ్యాత్,
సువర్ణేన రజతగ్ం, రజతేన త్రపు,
త్రపుణా సీసగ్ం సీసేన లోహం
లోహేన దారు దారు చర్మణా!
ఈ విషయం (దోషనివారణ) ఎటువంటిదంటే
- బంగారమును టంకము మొదలైన క్షారద్రవ్యములతో అతిగించగలము.
- వెండిని అతికించటానికి బంగారమును ఉపయోగించాలి.
- తగరమును వెండితో అతిగించగలం.
- సీసమును - తగరంచే అతిగించగలం.
- ఇతర లోహములను (ఇనుమును) - సీసముతో అతిగించగలం.
- కొయ్యను - ఇనుముతో అతిగించగలం.
8. ఏవం ఏషాం లోకానాం ఆసాం,
దేవతా నామస్య అస్త్రయ్యా,
విద్యయా వీర్యేణ యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి,
భేషజకృతో హ వా ఏష యజ్ఞో,
యత్ర ఏవం విత్ బ్రహ్మా భవతి।।
అదే విధంగా - లోకములయొక్క దుష్టత్వము దేవతా నామముల అస్త్రములు తొలగించుతీరుగా
- వేద రూపమగు రసరూపశక్తితో (శబ్దవీర్యత్వముతో) దోషములు తొలగించవచ్చును. యజ్ఞము యొక్క లోటులను పూరించవచ్చును.

ఈ విధంగా ఋక్ - యజుర్ - సామ మంత్రములచే యజ్ఞముల లోటును పూరించగల భిషజుల (Doctor) వంటి ‘బ్రహ్మ’ ఏ యజ్ఞకార్యమును పర్యవేక్షిస్తూ ఉంటారో - అట్టి యజ్ఞము దోషరహితము కాగలదు. వ్యాహృతి హోమరూప ప్రాయశ్చిత్తము ఎరిగిన ఋత్విక్కు గల యజ్ఞము దిగ్విజయమవగలదు.
9. ఏష హ వా ఉదక్ ప్రవణో యజ్ఞో
యత్ర ఏవం విత్ బ్రహ్మా భవతి।
ఏవం విదగ్ం హ వా ఏషా
బ్రహ్మాణమ్ అనుగాథా
యతో యత ఆవర్తతే,
తత్ తత్ గచ్ఛతి।
ఒక మంచి గుఱ్ఱము సరి అయిన సమయంలో రౌతును రక్షిస్తుంది కదా! అట్లాగే బ్రాహ్మణములు, అంతరార్థములు ఎరిగిన ఋత్విక్కు మాత్రమే యజ్ఞమును, యజమానిని, తదితరులందరినీ యజ్ఞం జరుగు పర్యంతము కాపాడుతూ ఉండగలడు.
ఆతడు యజ్ఞములో ఎక్కడెక్కడ ఎంతెంతవరకు సరిచేయుట అవసరమైయున్నదో - అక్కడక్కడకు వెళ్లి పొరపాటులను, లోటులను సరిచేయగలడు. అందరికీ శాస్త్రీయతను బోధించి, యజ్ఞమును నడిపించగలడు.
10. మానవో బ్రహ్మ ఏవ ఏక ఋత్విక్ కురూన్
అశ్వా అభిరక్షతి ఏవం విద్ధ వై
బ్రహ్మా యజ్ఞం యజమానగ్ం
సర్వాగ్ంశ్చః ఋత్విజో అభిరక్షతి।।
మానవీయుడగు బ్రహ్మ ఒక్కడే ఋత్విక్కు. అందరికీ యజ్ఞవిధులలో రక్షకుడు. అశ్వమును రక్షించుచున్నారు.
- బ్రహ్మయజ్ఞమును / (బ్రహ్మతత్త్వము) తెలియజేయుచున్నారు.
- యజమానిని అపరాధములను నివృత్తింపజేయుచున్నాడు.
- సర్వజనులను శ్రద్ధావంతులుగా చేయుచున్నాడు.
ద్విజుడై అన్నివైపులా రక్షించగలడు.
తస్మాత్ ఏవం విదం ఏవ బ్రహ్మాణం కుర్వీత
నానేవం విదం। నానేవం విదం।।
కాబట్టి యజ్ఞముయొక్క విధివిధానమంతా అంతర్హృదయముతో సహా చక్కగా తెలిసియున్నవానిని మాత్రమే యజమాని బ్రహ్మగా నియమించుకోవాలి. యజ్ఞవిధిని తెలియనివానిని బ్రహ్మగా నియమించుకోకూడదు. ఇది యజ్ఞవిధి సూచనము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే సప్తదశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - చతుర్థ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅴ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఐదవ అధ్యాయము

5–1. పంచమ ప్రపాఠకః - ప్రథమ ఖండము - ప్రాణదేవతా ఉపాసన

1. ఓం।
యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద,
జ్యేష్ఠశ్చ హ వై శ్రేష్ఠశ్చ భవతి।
ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ।।
ఎవ్వరైతే సర్వజ్యేష్ఠమైనది, సమస్తమునకు శ్రేష్ఠమైనది తెలుసుకుంటాడో - అట్టివాడు అంతటా జ్యేష్ఠుడై, శ్రేష్ఠుడై ఉండగలడు.
ప్రాణమే సర్వదా జ్యేష్ఠము, శ్రేష్ఠము కూడా
2. యో హ వై వసిష్ఠం వేద, వసిష్ఠో
హ స్వానాం భవతి।
వాగ్వావ వసిష్ఠః।

ఎవ్వరైతే వసిష్ఠుని (మిక్కిలి శ్రేష్ఠుని) తెలుసుకొనుచున్నాడో, ఆతడు వసిష్ఠుడే (అందరిలో శ్రేష్ఠుడు) అగుచున్నాడు.
వాక్కుయే వసిష్ఠము।

3. యో హ వై ప్రతిష్ఠాం వేద
ప్రతి హ తిష్ఠతి అస్మిగ్ంశ్చ,
లోకే అముష్మిగ్ంశ్చ।।

చక్షుర్వావ ప్రతిష్ఠా।
ఎవ్వరైతే ప్రతిష్ఠమైనది (స్థిరత్వమును ఇచ్చునది) తెలుసుకొంటాడో, అట్టివాడు చంచలములను జయించి సుప్రతిష్ఠితుడు అగుచున్నాడు. అట్టివాడు ఐహిక - ఆముష్మికములందు ప్రతిష్ఠితుడు (Wel-Placed) అగుచున్నాడు.
(యథాతథంగా ఉంటూనే అనేక వేరువేరు విషయములు చూడగలదు కాబట్టి -) ఈ నేత్రములే ప్రతిష్ఠితము.
4. యో హ వై సంపదం వేద
సగ్ం హ అస్మై కామాః
పద్యంతే దైవాశ్చ, మానుషాశ్చ।।
శ్రోత్రం వావ సంపత్।।
ఎవరైతే వాస్తవమైన ‘సంపద’ ఏదో - అది తెలుసుకుంటాడో - అట్టి వానిని దేవతలు కోరికలు తీర్చుకొన్న వారుగా చేయగలరు. అన్ని కోర్కెలు తీర్చగలరు.
వేదముల శ్రవణము, గురువులు చెప్పు సద్బోధ వినగలగటమే సంపద. అందుచేత జీవునకు చెవులే - నిజమైన సంపద।
5. యో హ వా ఆయతనం వేద
ఆయతనగ్ం హ స్వానాం భవతి।।

‘మనో’ హ వా ఆయతనమ్।।
ఎవ్వడైతే - అన్నీ కూడా దేనిని ఆశ్రయించినవై ఉంటున్నాయో - అట్టి ‘ఆయతనము’ను తెలుసుకుంటాడో, అట్టివాడు - తదితరులకు ఆయతనుడు (ఆశ్రయింపతగినవాడు) అయి ప్రకాశిస్తున్నాడు.
(ఇంద్రియములకు భోక్త మనస్సు. ఇంద్రియములు దృశ్యమునుండి తెచ్చే సమాచారమంతా మనస్సుకే చేర్చబడుతోంది. కనుక మనోవృత్తుల రూపమగు) మనస్సే ఆయతనము (సర్వాశ్రయము).
6. అథ హ ప్రాణా అహగ్ం
శ్రేయసి ‘వ్యూదిరే అహగ్ం’
శ్రేయానస్మి అహగ్ం।
శ్రేయాన్ అస్మి ఇతి।।
ఒకప్పుడు ప్రాణశక్తి సమన్వితములగు ఇంద్రియములన్నీ ఒకచోట సమావేశమైనాయి. ఒక్కొక్క ఇంద్రియము ‘‘నేనే జీవునికి ముఖ్య శ్రేయము’’ కలుగజేస్తున్నాను. ‘‘శ్రేయోదాయకుడిని నేనే’’ - అని ఎవరికివారే (కళ్ళు, చెవులు, నోరు మొదలైనవి) వివాదము పొందసాగాయి.
7. తే హ ప్రాణాః ప్రజాపతిం
పితరమ్ ఏతి ఊచుః
‘‘భగవాన్। కో నః శ్రేష్ఠ? ఇతి।
తాన్ హ ఉవాచ :
‘‘యస్మిన్ వ ఉత్క్రాన్తే
శరీరం ‘పాపిష్ఠతరమ్’ ఇవ
దృశ్యేత, స వః శ్రేష్ఠ।’’
ఇతి।।
అప్పుడు ప్రాణశక్తి రూపములగు ఇంద్రియ దేవతలందరు పితృదేవులగు సృష్టికర్త వద్దకు వెళ్లారు. ఈవిధంగా అడిగారు.

‘‘హే భగవాన్। పితృదేవా! శరీరములో గొప్ప ధర్మములు (Functions) నిర్వర్తిస్తూ ఉన్న మాలో గొప్పవారు ఎవ్వరో శ్రేష్ఠులెవరో జ్యేష్ఠులెవరో కొంచం వివరించి చెప్పండి."

ప్రజాపతి: ఓ! అదా! వినండి, చెపుతాను. మీలో ఎవ్వరు దేహమును వదలి లేచిపోతే శరీరము అత్యంత అశుచి అయి, పాపభూయిష్ఠము, (ఆవల పారవేయవలసినది) అవుతుందో - వారే శ్రేష్ఠులు. సరేనా?

ఇంద్రియములు తిరిగివచ్చి దేహములో ప్రవేశించాయి.
8. సా హ ‘వాక్’ ఉచ్చక్రామ,
సా సంవత్సరం
ప్రోష్య పర్యేత్య ఉవాచ
‘‘కథమ్ అశకతర్తే
మజ్జీవితుమ్?’’ - ఇతి।

యథా కలా అవదన్తః।
ప్రాణంతః ప్రాణేన
పశ్యంతః చక్షుషా
శృణ్వంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనసైవమ్।

ఇతి ప్రవివేశ హ వాక్।
[వాగింద్రియ దేవత]
అప్పుడు ‘‘వాక్కు(Talking)" శరీరమును విడచి పైకి వెళ్లింది. మరల సంవత్సరము తరువాత తిరిగి వచ్చింది.

వాక్ దేవత : ఓ తదితర ఇంద్రియములారా ‘‘నేను లేనప్పుడు కూడా మీరు ఈ శరీరములో ఎట్లా జీవిస్తున్నారు? ఈ శరీరము ఇంకా జీవిస్తూ ఉన్నదేమిటి? నాకు ఆశ్చర్యమేస్తోంది.

తక్కిన ఇంద్రియములు : ఓ వాక్ ఇంద్రియ దేవతా! ఒక మూగవాడు ప్రాణము కలిగి, ప్రాణముల శక్తిచే కళ్ళతో చూస్తూ, చెవులతో వినుచూ, మనసుతో ధ్యాసలు కలిగి ఉండనే ఉంటాడు కదా! అట్లాగే, ఈ జీవుడు వాక్కు తొలగినప్పటికీ శరీరముతో జీవించియే ఉన్నాడు.

అప్పుడు వాక్కు తిరిగి శరీరములో ప్రవేశించి - (నేను లేకున్నా ఈ జీవుడు జీవించియే ఉన్నాడు, కాబట్టి అత్యంత శ్రేష్ఠుడను కాదు - అని తలచింది)
9. చక్షుః హ ఉచ్చక్రామ
తత్ సంవత్సరం
ప్రోష్య పర్యేత్య ఉవాచ :

‘‘కథమ్ అశకతర్తే
మజ్జవితుమ్?’’ - ఇతి।
[చక్షురింద్రియము]
అప్పుడు చక్షు (చూపుదేవత) - (‘‘నేను లేకపోతే ఈ దేహము అశుచి, నిస్తేజము అవుతుంది కదా’’ అని తలచి) - ఆ జీవుని దేహమును వదలి పైకివెళ్లి పోయింది. ఒక సంవత్సరము తరువాత తిరిగి శరీరమును సమీపించింది. అప్పటికీ ఆ శరీరి జీవిస్తూనే ఉన్నాడు.

చక్షురింద్రియ దేవత : ఓ తదితర ఇంద్రియములారా! నేను సంవత్సరకాలం లేకపోయినా ఈ దేహము శిథిలం కాలేదే? మీరంతా ఎటూ పోలేదే? ఈ సంవత్సరకాలం ఈ జీవుడు ఏదీ చూడలేకపోయాడు కదా।
‘‘యథా అంధా అపశ్యంతః।’’
ప్రాణంతః ప్రాణేన వదంతో
వాచా, శృణ్యంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనస ఏవం ఇతి
తదితర ఇంద్రియములు : ఓ చక్షుదేవతా! ఏదైనా కారణం చేత ఒకనికి చూపుపోయిందనుకోండి. ఆతని ప్రాణము, ప్రాణిగా ఆతడు వాక్కు, చెవులతో శ్రవణము, మనసుతో ధ్యానము కొనసాగుతూనే ఉంటుంది కదా! అదేవిధంగా మీరు శరీరంను వీడి పైకి వెళ్లినప్పుడు ప్రాణము, ప్రాణశక్తులైన వినికిడి, వాక్కు, శ్రవణము - ఇవన్నీ కొనసాగుచూనే ఉన్నాయి.
ప్రవివేశ హ చక్షుః।।
అప్పుడు చక్షు శక్తి (చూపు) నేను లేనంతమాత్రంచేత తదితర శరీరం నిష్ప్రయోజనం కాదన్నమాట అనుకొన్నది. శరీరములో పునః ప్రవేశించింది.
10. శ్రోత్రగ్ం హ ఉచ్చక్రామ।
తత్ సంవత్సరం ప్రోష్య పర్యేత్య - ఉవాచ :-
‘‘కథం అశకతర్తే మజ్జీవితుమ్?’’ - ఇతి।
యథా బధిరా అశృణ్వంతః।
ప్రాణన్తః ప్రాణేన వదంతో వాచా
పశ్యంతః చక్షుషా
ధ్యాయంతో మనసైవమ్ ఇతి ప్రవివేశ హ శ్రోతమ్।
శ్రవణ (వినికిడి, చెవి) దేవత అప్పుడు శరీరమునుండి బయల్వెడలి సంవత్సరకాలం తరువాత మరల శరీరమును సమీపించింది.
నేను సంవత్సరకాలం ఈ శరీరం వదలివేసి ఉన్నా కూడా ఇది ఎట్లా మనగలుగుతోంది? ‘‘ప్రాణము, చూపు, స్పర్శ మొదలైనవన్నీ ఎట్లా ఉండి ఉన్నాయి?
తదితర ఇంద్రియముల సమాధానం: ‘‘ఒకడు చెవిటివాడు అయినప్పటికీ ప్రాణము, మనస్సు, ఆలోచన మొదలైనవి ఉంటాయి కదా! ఇదీ అంతే।’’ అప్పుడు వినికిడి తిరిగి శరీరంలో ప్రవేశించింది.
11. మనో హ ఉచ్చక్రామ।
తత్ సంవత్సరం ప్రోష్య
పర్యేత్య ఉవాచ :
‘‘కథమ్ అశకతర్తే మజ్జీవితుమ్’’ - ఇతి
అప్పుడు మనస్సు దేహమును విడచి ఎటో వెళ్లిపోయింది. ఒక సంవత్సరకాలం తరువాత తిరిగివచ్చింది.
మనస్సు : ఇదేమిటి? నేను సంవత్సర కాలము ఈ దేహమును త్యజించినప్పటికీ ఇది ఇంకా కూడా జీవించి ఎట్లా ఉండగలిగింది? మీరంతా ఎట్లా ఈ దేహంలో ఉండగలిగారు?
‘‘యథా బాలా అమనసః’’।
ప్రాణంతః ప్రాణేన
వదంతో - వాచా,
పశ్యంతః - చక్షుషా,
శృణ్వంతః - శ్రోత్రేణైవమ్ ఇతి
ప్రవివేశ హ మనః।।
సమాధానము : మనస్సు ఏమాత్రము వికసించని, అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణశక్తితో వినటము, ఏడవటము, నొప్పి అనుభవించటము, ఆకలి, చూడటము - చేయటం లేదా? అట్లాగే మనస్సు సంవత్సర కాలం లేనప్పటికీ ఈ దేహము ప్రాణశక్తితో (ప్రాణములు కలిగి ఉండి) మాట్లాడుతోంది, చూస్తోంది, వింటోంది, వినిపిస్తోంది.

అప్పుడు మనస్సు, మరల శరీరములో ప్రవేశించింది. తాను లేనంతమాత్రంచేత శరీరము నశించదు కాబట్టి తాను సర్వ శ్రేష్ఠము కాదని గమనించింది.
12. అథ హ ప్రాణ ఉత్ చక్రమిషన్ సః।
యథా సు-హయః
పడ్వీశ శంకూన్ సంఖిదేత్
ఏవమ్ ఇతరాన్
ప్రాణాన్ సమఖిదత్।
తగ్ం హ అభిసమేత్య ఊచు :-
‘‘భగవన్! నేధి! త్వం నః శ్రేష్ఠో-సి।
మా ఉత్క్రమీః ఇతి।
అప్పుడు ముఖ్యప్రాణము శరీరమునుండి నిష్క్రమించటానికి సంసిద్ధమవసాగింది.
ఒక ఉత్తమమైన గుర్రము తనను కాళ్ళు కట్టి ఉంచిన గింజను పెరికి ఛంగ్‌న బయలుదేరుచున్నది చూచారా!
అట్లా ప్రాణము బయటకు వెళ్లటానికి ఉద్యమిస్తూ ఉండగా శరీరములోని చూపు, వినికిడి, మాట, ఆలోచన - భావన - స్పర్శ - మొదలైనవి కూడా దేహము నుండి పెరికివేయబడసాగాయి.

అప్పుడా ఇంద్రియశక్తులన్నీ (పంచేంద్రియములు) మనస్సుతో సహా ప్రాణదేవతను సమీపించి ఇట్లా పలికాయి.
‘‘భగవాన్! ప్రాణదేవా! మీరు ఈ శరీరంలో శ్రేష్ఠులు, జ్యేష్ఠులు అయి ఉన్నారు. ఇది ఇప్పుడు మేము గమనిస్తున్నాము. దయచేసి శరీరమునుండి బయటకు వెళ్ళకండి. మీరు ఉంటేనే మేము దేహములో మనగలమని తెలుసుకున్నాము’’.
13. అథ హ ఏనం వాక్ ఉవాచ:-
‘‘యత్ అహం వసిష్ఠో అస్మి
త్వం తత్ వసిష్ఠో అసి’’ ఇతి।
అథ హ ఏనం చక్షుః ఉవాచ :-
‘‘యత్ అహం ప్రతిష్ఠా2స్మి।
త్వం తత్ ప్రతిష్ఠా అసి’’। ఇతి।।
ఇంద్రియములు ప్రాణదేవతను ఇట్లా స్తుతించాయి.

వాక్కు : నేను ఈ దేహములో వసిష్ఠుడను (అందరికంటే పెద్దవాడను) అయి ఉన్నమాట నిజమే. అయితే మీరు దేహంలో ప్రతిష్ఠితులై ఉండబట్టే నేను వసిష్ఠుడను.
చక్షువులు : నేను దేహంలో ప్రతిష్ఠుడనై ఉన్న మాట నిజమేకాని, అదంతా మీయొక్క ‘‘ప్రతిష్ఠ’’ యొక్క ప్రభావమే
14. అథ హ ఏనగ్ం శ్రోత్రమ్ ఉవాచ:
‘‘యత్ అహగ్ం ‘సంపద్’ అస్మి,
త్వం తత్ సంపద్ అసి ఇతి।
అథ హ ఏనం ‘మన’ ఉవాచ :-
యత్ అహమ్ ‘ఆయతనమ్’
అస్మి త్వం తత్ ఆయతనమ్ అసి ఇతి।।
శ్రోతము (వినికిడి - చెవులు) : నేను ఈ దేహముయొక్క ‘సంపద’ అయి ఉండటమనేది - అదంతా కూడా - ప్రాణదేవా! మీరు సంపద కలిగి ఉండటం చేతనే।
మనస్సు : ఓ ప్రాణదేవా! సమస్తమునకు మీరే ఆధారము అయి ఉండగా, ఆ ఆధారమే (ఆశ్రయమే) నాచే ప్రదర్శించబడుతోంది.
15. న వై వాచో, న చక్షూగ్ంషి
న శ్రోత్రాణి, న మనాగ్ంసి ఇతి అచక్షతే।।

‘‘ప్రాణా’’ ఇత్యేవ ఆచక్షతే।
ప్రాణో హి ఏవ ఏతాని
సర్వాణి భవతి।
ఈ విధంగా వాక్కుగాని, కళ్ళుగాని, చెవులుగాని, ఆలోచన (మనస్సు)గాని స్వయముగా చైతన్యవంతము కావు. స్వయంగా శక్తి కలిగియున్నవి కావు. అందుచేత జీవుడు అనగా ‘‘వాక్కు, కళ్ళు, చెవులు, ఆలోచన’’ - అని అనరు.
‘‘ప్రాణమే - జీవుడు’’ అనబడుచున్నాడు.
ప్రాణశక్తియే శరీరంలో వాక్కుగాను, చూపుగాను, వినికిడిగాను ఆలోచన (మనస్సు)గాను ప్రదర్శనం అగుచున్నది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ప్రథమః ఖండః


5–2. పంచమ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - ప్రాణ విద్య

1. స హ ఉవాచ :-
కిం మే అన్నం భవిష్యతి - ఇతి।।
యత్ కించిత్ ఇదమా
శ్వభ్య ఆ శకునిభ్య
ఇతి హ ఊచుః।
ప్రాణదేవత : ఓ ఇంద్రియములారా! నాకు ఏది అన్నము (ఆహారము) కాగలదు? మరి నన్ను శరీరంలో ఉండిపోమంటున్నారు కదా! నాకు ఆహారము ఏది?
ఇంద్రియములు : ప్రాణేశ్వరా! ఒక కుక్క నుండి పక్షివరకు ఏదేది అన్నము (ఆహారము) అగుచున్నదో అదంతా మీరు స్వీకరిస్తున్న ఆహారమే కదా!
తద్వా ఏతత్ అనస్య అన్నమ్।
అనో హ వై నామ ప్రత్యక్షం।
న హ వా ఏవంవిది

కించన అనన్నం భవతి - ఇతి।।
ఈ విధంగా ప్రాణదేవతకు సర్వేంద్రియ విషయములు ఆహారమే। - ఇంద్రియములకు ప్రత్యక్షమైనదంతా ఆహారమే। ఈ దృశ్య జగత్తులో ప్రాణములకు ఆహారము కానిదంటూ ఏదీ లేదు. అనన్నము ఏదీ లేదు.
‘‘ప్రాణములకు సమస్తము అన్నమే’’ అని తెలుసుకొన్నవానికి ఇంద్రియములకు విషయమగుచున్న ఈ జగద్దృశ్యమంతా ‘అన్నము’గా అగుచున్నది.
2. స హ ఉవాచ :-
కిం మే వాసో భవిష్యతి? ఇతి
‘ఆపః।’ - ఇతి హ ఊచుః
ప్రాణదేవత : సరే"! మరి నాకు ధరించటానికి వస్త్రము ఏది?
ఇంద్రియములు : ప్రాణదేవా! జలమే మీరు ధరించు వస్త్రము.
తస్మాత్ వా ఏతత్ అశిష్యంతః
పురస్తాత్ చ ఉపరిష్టాత్ చ
అద్భిః, పరిదధతి
లంభుకో హ వాసో
భవతి అనగ్నో హ భవతి।।
ఈ కారణం చేతనే భోజనానికి కూర్చున్నవారు
- భోజనానికి ముందుగా - భుజించిన తరువాత - కూడా అన్నమును జలముతో ఆచ్ఛాదిస్తున్నారు.
‘‘అట్టి ఆచమనమే ప్రాణమునకు వస్త్రము’’ అని ఎవ్వరు తెలుసుకొంటారో, వారికి వస్త్రములు అక్షయముగా లభించగలదు. వారు ఎప్పటికీ నగ్నముగా ఉండవలసిన పని ఉండదు.
3. తద్ధైతత్ (తత్ హి ఏతత్) సత్యకామో జాబాలో

గో శ్రుతయే వైయాఘ్రపద్యాయ
ఉక్త్వ ఉవాచ।।

యద్యపి ఏతత్ శుష్కాయ స్థాణవే బ్రూయాత్
జాయేరన్ ఏవ అస్మిన్ శాఖాః ప్రరోహేయుః
పలాశాని - ఇతి।।
మనము చెప్పుకొన్న ఈ ‘‘ప్రాణవిద్య’’ను జగద్గురువగు శ్రీ సత్యకామ జాబాలుడు - తనను ప్రాణతత్త్వము గురించి శ్రవణము చేయటానికి వచ్చి ఆశ్రయించిన వ్యాఘ్రపదుని కుమారుడగు గోశ్రుతి… అనే వారికొరకు కూడా ఉపదేశించారు.

సత్యకామ జాబాల : ఓ ప్రియ వ్యాఘ్రపద ప్రియకుమారుడవగు గోశ్రుతా! ఈ ‘ప్రాణవిద్య’ను మీరు ఎండిపోయిన మ్రానుకు చెప్పటం జరిగినా సరే - ఆ ఎండిపోయిన చెట్టు మరల చిగురించగలదు। ఇతి ఫలశ్రుతి।
4. అథ యది మహత్ జిగమిషేత్
అమావాస్యాయాం
దీక్షిత్వా పౌర్ణమాస్యాగ్ం
రాత్రౌ సర్వ - ఔషధస్య
మంథం దధి మధునోః
ఉపమథ్య
పైన చెప్పబడ్డ ప్రాణవిద్యామంత్రములన్నీ కూడా మహత్వసిద్ధులు ప్రసాదించగలిగినట్టివిగా మంత్రశాస్త్రవేత్తలచే ఉచ్చరించ బడుచున్నాయి. ‘‘మంథనము’’ అనే యజ్ఞములో విధి విధానములుగా చెప్పబడుచున్నాయి.

ప్రాణవిజ్ఞానము తెలిసినవారు - మహత్వసిద్ధి కొరకు ఈ యజ్ఞ
విధానము ఆచరించుచున్నారు. ఆ విధానము చెప్పుకుందాము.

మహత్ సిద్ధికొరకై - అమావాస్య రోజున ‘యజ్ఞదీక్ష’ను స్వీకరించాలి.
‘‘జ్యేష్ఠాయ - శ్రేష్ఠాయ
స్వాహా’’ - ఇతి అగ్నావాజ్యస్య
హుత్వా మంథే
సంపాతమ్ అవనయేత్।।
- 15 రోజులు దీక్షగా గడిపి పౌర్ణమినాటి రాత్రి యందు
☘︎ పెరుగు - తేనెలో నవధాన్యములు పిండిని - వీటన్నిటినీ పిష్ఠము (ముద్ద)గా చేయాలి (మంథపిష్ఠము).
☘︎ అట్టి పిష్ఠమును జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగు ప్రాణదేవతకు నివేదనగా సమర్పించాలి.

హవిస్సును యజ్ఞాగ్నికి ‘‘జ్యేష్ఠాయ - శ్రేష్ఠాయ స్వాహా’’ అని మంత్రములను పలుకుచూ అగ్నికి ఆజ్యము (నేయి) సమర్పించాలి. ఆ తరువాత మాలిన్యము తీసి వేరేచోట ఉంచాలి.
5. ‘‘వసిష్ఠాయ స్వాహా।’’ - ఇతి
అగ్నావాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్ అవనయేత్
‘‘ప్రతిష్ఠాయై స్వాహా’’ ఇతి
‘‘వసిష్ఠాయ స్వాహా’’ ( వసిష్ఠము - అంతటికి పెద్దదైనట్టి దానికొరకు హోమద్రవ్యము సమర్పిస్తున్నాను) అని మరల మంత్రములతో అగ్నితో నేతిని వ్రేల్చుచూ, మంథపిష్ఠముపై నేతిని సంప్రోక్షించాలి.

‘‘ప్రతిష్ఠా ప్రాణదేవతకు సమర్పిస్తున్నాము’’ అంటూ అగ్నికి సమర్పించి పిష్ఠముపై కూడా నేతిబొట్లు వేయాలి.
అగ్నా వాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్
అవనయేత్ సంపదే స్వాహా ఇతి।
అట్లాగే ‘‘సంపదాయ స్వాహా’’ మంత్రము ఉచ్చరిస్తూ, అగ్నికి నేయి హోమం చేస్తూ మంథపిష్ఠముపై నేయిబొట్లు వదలాలి.
సంపత్ గుణ సమన్వితమగు ప్రాణదేవతకు ఆహుతులు సమర్పిస్తూనే, సంపదే స్వాహా అంటూ మంథ పిష్ఠముపై కూడా నేయి బొట్లు విడువాలి.
‘‘ఆదాయతనాయ స్వాహా’’ ఇతి।
అగ్నా వాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్ అవనయేత్।।
‘‘ఆదాయము (సమస్తమునకు ఆశ్రయము, ఆధారము) అగు ప్రాణ దేవతకు సమర్పిస్తున్నాను’’ - అని పలుకుచూ (‘‘ఆదాయనాయ స్వాహా’’ అని మంత్రము చదువుచూ) స్రువముతో నేయిని తీసుకొని హోమాగ్నికి సమర్పించాలి. స్రువమునకు అతుక్కుకొని ఉన్న నేతి బొట్లను మంథపిష్ఠముపై వేయాలి. శ్రువమున శేషించిన నేతి చుక్కలు సంపాతము చేయాలి (చల్లాలి).
6. అథ ప్రతిసృప్య అంజలౌ
మంథమ్ ఆధాయ జపతి।
ఆ తరువాత అగ్నిగుండమునకు కొంచము దూరముగా జరిగి, మంథన మలిన భస్మమును దోసిలియందు ఉంచుకొని ఇట్లా ప్రార్థించాలి.
‘‘అమో’’ నామ అసి।
అమా హి తే సర్వం ఇదమ్।।
స హి జ్యేష్ఠః శ్రేష్ఠః ।।
రాజా అధిపతిః సః మా
జ్యైఇష్ఠ్యగ్ం శ్రైష్ఠ్యగ్ం।
ఓ ప్రాణదేవా! మీరు ‘అమో’ అనే పేరు గలవారు. (ప్రాణము ఆహారము వెంటనంటి దేహమునందు సంచరిస్తూ ఉండటంచేత) మంథద్రవ్యము అగ్నికి ఆహారము కాబట్టి ‘ఆమో’ అని అగ్ని పిలువబడుతోంది.
‘‘సర్వమిదదగ్ం స హి జ్యేష్ఠః శ్రేష్ఠో రాజ్యాధిపతిః’’ - అను మంత్రముతో ‘‘ఓ ప్రాణదేవా? మీరు జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, ఈ దేహరాజ్యమునకు అధిపతులు కూడా!" - అని భావిస్తూ పూజించాలి.
రాజ్యమ్ ఆధిపత్యం గమయతి।
అహమేవ ఇదగ్ం
సర్వమ్ అసాని। - ఇతి।।
ఓ ప్రాణదేవా! ప్రకాశమానులగు మీరు నాకు జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వము ఈ శరీరముపై ఆధిపత్యము ప్రసాదించండి। సర్వము అగు ఆత్మయే నేనై ఉండెదను గాక.
7. అథ ఖలు ఏతయః ఋచా
పచ్ఛ ఆచామతి
తత్ సవితుః వృణీమహ
ఇతి ఆచామతి।।

వయం దేవస్య భోజనం
ఇతి ఆచామతి।
ఆ తరువాత ఋక్కు మంత్రము పఠిస్తూ ఒక్కొక్క అడుగులోను ఆచమనం చేయాలి.
ఋక్కులు : ‘‘తత్సవితుః వృణీమహే’’। వయం దేవస్య భోజనం।।
‘‘శ్రేష్ఠం సర్వధా తమమ్।। తురం భగస్య ధీమహి।’’
ఈ విధంగా ప్రతి ఋక్కుకు ఆచమనం చేస్తూ ఉండాలి.
ఆ సవితృ దేవత యొక్క మహిమను స్తుతిస్తున్నాను’’ - ఆచామతి (ఆచమనం)
‘‘సవితృ దేవతారూపము పొందుటకై మేము ఈ దివ్యమగు దైవీ ప్రసాదము పొందెదము గాక’’ - అని ఆచమనం చేయాలి. (ఉద్ధరిణితో నీళ్ళు తీసుకోవాలి
శ్రేష్ఠగ్ం సర్వధాతమమ్
ఇతి ఆచామతి।
‘‘తురం భగస్య ధీమహి’’
ఇతి సర్వం పిబితి।
నిర్ణిజ్య కగ్ంసం చమసం వా
పశ్చాత్ అగ్నేః సంవిశతి
చర్మణి వా స్థండిలే వా
వాచంయమో అప్రసాహః
(దేవస్య - ప్రకాశరూపుడైన సవితుః)
యజ్ఞ ప్రసాదము అన్ని అన్నములకంటే మిక్కిలి శ్రేష్ఠము. సర్వ జగత్తులను ఉత్పన్నము చేయునది, నిలబెట్టునది - యజ్ఞప్రసాదమే.
వేగముగా, తేజోరూపముయొక్క (సవితృదేవతయొక్క) మహిమ ఎరిగిన బుద్ధి పొందెదము గాక! అన్నీ త్రాగుచున్నది! ఆ ప్రాణ దేవతయే సమస్త ప్రదర్శనము - అను బుద్ధి పొందెదము గాక। ప్రాణమే ఈ సమస్తము.
అని పలుకుచూ కాంస్య పాత్రను శుభ్రం చేసి, పాత్రకు అతుకుకుని ఉన్న మంథన యజ్ఞద్రవ్యములను నీటితో కడిగి - నీటిని త్రాగాలి. లేదా వేరే కంచుపాత్రతో నీరు త్రాగాలి
స యది స్త్రియం
పశ్యేత్ సమృద్ధం
కర్మ - ఇతి విద్యాత్।।
ఆ తరువాత అగ్ని కుండమునకు ప్రక్కగా - జింకచర్మము పరచుకొని (లేదా) నేలను శుభ్రం చేసుకొని మౌనం పాటిస్తూ, అలజడి లేని ప్రశాంత చిత్తముతో యజమాని పరుండును గాక!
నిదురించినప్పుడు స్వప్నములో ‘‘స్త్రీయొక్క దర్శనం’’ అయితే - అప్పుడు యజ్ఞకర్మ చక్కగా సమృద్ధముగా ఫలితం ఇచ్చినట్లుగా భావించాలి.
8. తత్ ఏష శ్లోకో।
యదా కర్మసు కామ్యేషు స్త్రియగ్ం
స్వప్నేషు పశ్యతి సమృద్ధం,
తత్ర జానీయాత్
తస్మిన్ స్వప్న నిదర్శనే।
తస్మిన్ స్వప్న నిదర్శనే।
ఈ విషయమై ఈ విధంగా శ్లోకము చెప్పబడుతోంది.
‘‘ఎప్పుడైతే కామ్య కర్మలయందు (ఏదైనా ఇహలోక (లేక) స్వర్గాదిలోక సంబంధమైన ఉద్దేశ్యముతో) యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తిస్తూ ఉండగా, అప్పుడు ‘స్త్రీ దేవత’ యొక్క దర్శనము స్వప్నములో అయితే - అది ‘‘యజ్ఞకర్మ సమృద్ధమైనది’’ అని అనుకోవటానికి నిదర్శనము’’ అని చెప్పబడుతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వితీయః ఖండః


5–3. పంచమ ప్రపాఠకః - తృతీయ ఖండము - పంచాగ్ని విద్య

1. శ్వేతకేతుః - ఆరుణేయః
పంచాలానాగ్ం సమితిమేయాయ।
అరుణి ఋషి కుమారుడు ఆరుణి. ఆరుణి ‘గౌతమ’ నామధేయుడు. అట్టి గౌతమారుణి కుమారుడు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు ఒకానొక సందర్భములో పాంచాలరాజ్య రాజభవనానికి విచ్చేశారు. ఆ కాలంలో జైవలుని కుమారుడు ప్రహవణుడు అనే రాజు రాజ్యము ఏలుతూ ఉండేవారు. రాజు ప్రవాహణుడు శ్వేతకేతు మునికి రాజప్రసాదానికి స్వాగతం పలికారు.
తగ్ం హ ప్రవాహణో జైవలిః ఉవాచ।
‘‘కుమారాను త్వా
అశిషత్ పితే ఇతి।
‘‘అను హి భగవ’’ ఇతి।।
ప్రవాహణుడు : కుమారా! శ్వేతకేతూ! రండి! సుస్వాగతం। ఆశీనులుకండి. ఇప్పుడు చెప్పండి. మీ నాన్నగారు పూజ్యులు ఆరుణిగౌతములు నీకు విద్యలన్నీ నేర్పించినారు కదా! మీ విద్య పూర్తి అయినదా?
శ్వేతకేతు : అవును. మా నాన్నగారు ఆరుణి మునివర్యులు నాకు అన్నీ నేర్పియున్నారు. నాయొక్క విద్య పూర్తి అయినదని ఆశీర్వదించారు.
2. వేత్థ యదితో అధి
ప్రజాః ప్రయంతి?’’ - ఇతి।
‘‘న భాగవ!’’ - ఇతి
ప్రవాహణుడు : సరే"! సంతోషము. అయితే ఒక విశేషము అడుగుతాను. ఈ జగత్తులో సృష్టించబడుచూ ఉన్న జీవులంతా (మరణానంతరము) పైకి పోవుచున్నారు కదా! ఎటు / ఎక్కడికి వెళ్లుచున్నారో - మీకు తెలుసు కదా!
శ్వేతకేతువు : ఈ విషయం నాకు తెలియదు.
3. ‘‘వేత్థ యథా పునః
ఆవర్తంత ఇతి?
‘‘న భగవ!’’ - ఇతి।
ప్రవాహణుడు : సరే“! రెండవ ప్రశ్న. ఈ జీవులు తిరిగి ఏవిధంగా పునరావర్తులు అవుతారు? ఎట్లా తిరిగివస్తారు? (How are they getting back to material Forms?)
శ్వేతకేతువు : ఈ విషయం కూడా నాకు తెలియదే”!
‘‘వేత్థ పథోః
దేవయానస్య పితృయాణస్య చ
వ్యావర్తనా ఇతి।
న భగవ। - ఇతి
ప్రవాహణుడు : ఈ సృష్టిలో ‘జీవులు’ అనే ప్రయాణీకులకు సంబంధించిన (1) దేవయానము (2) పితృయానము అనే రెండు మార్గములు సంకల్పితమై వర్తిస్తున్నాయి. ఆ రెండు మార్గముల గురించి మీకు తెలుసు కదా! అవి రెండూ విడిపోయే స్థానము మీకు తెలుసా?
శ్వేతకేతువు : తెలియదే"! దేవయాన - పితృయానములనే మార్గముల గురించి కూడా నాకు తెలియనే తెలియదు. అవి ఏ చోట రెండు మార్గములుగా విడిపోతున్నాయో కూడా అస్సలు తెలియదు.
3. ‘‘వేత్థ యథా అసౌ లోకో
న సంపూర్యత 3?’’ ఇతి।
- న భగవ।’’ ఇతి।।
‘‘వేత్థ యథా పంచమ్యాం
ఆహుతావా ఆపః పురుషవచసో భవంతి?’’ - ఇతి?
‘‘న ఏవ భగవ!’’ - ఇతి।
ప్రవాహణరాజు : ఈ జగత్తులో అసంఖ్యాక జీవులు దేహములు త్యజించి ఊర్ధ్వలోకములు చేరుచున్నారు కదా! మరి ఊర్ధ్వలోకములు (పితృలోకములు) మరణించినవారితో నిండిపోవటం లేదేమి?
శ్వేతకేతువు : ఇది కూడా నాకు తెలియనే లేదు.
ప్రవాహణుడు : ‘‘పంచమ హవిస్సునందు జలము’’ పురుషుడు అనే పేరును పొందుచున్నాడు’’ - అనే వాక్యము యొక్క సవివరణ మీరు ఎరిగియే ఉన్నారు కదా?
శ్వేతకేతువు : ఈ విషయం కూడా నాకు కొంచెము కూడా తెలియదే!
4. ‘‘అథాను కిమ్ అనుశిష్టో
అవోచథా యో హీమాని న విద్యాత్ కథగ్ం
సో ‘అనుశిష్టో’ బ్రువీతి ఇతి?
ప్రవాహణరాజు : అనగా మీరు విద్యను పూర్తిగా నేర్చుకోలేదా? మరి మీరు ‘‘నేను విద్యను నేర్చుకోవటం పూర్తి చేసినవాడనైనాను. అనుశిష్టుడను’’ అని అంటున్నారేమిటి?
స హాయస్తః పితుః
అర్ధం ఏయాయ?
తగ్ం హ ఉవాచ -
‘‘అననుశిష్య వావ
కిల మా, భగవాన్।
అబ్రవీత్ అను త్వా
అశిషమ్?’’ - ఇతి।
అప్పుడు శ్వేతకేతు : ‘‘ప్రవణ మహారాజా! మరల మీ దర్శనం చేసుకుంటాను’’ - అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు.
శ్వేతకేతువు : పితృదేవా? ఆరుణిమహర్షీ! రాజర్షియగు ప్రవాహణ మహారాజుగారు వేసిన ప్రశ్నలకు నాకు సమాధానం తెలియలేదు. ‘‘విద్య పూర్తి అయినదని ఎట్లా అన్నారు?’’ - అని ఆయన నన్ను ప్రశ్నించారు కూడా!
భగవాన్! నేను విద్యను పూర్తి చేసానని మీరు అన్నారు కదా!? ఆ మాట ఎట్లా అన్నారు?
5. పంచ మా రాజన్యబంధుః
ప్రశ్నాన్ అప్రాక్షీః తేషాం
నైకంచన అశకం వివిక్తుమ్ - ఇతి।
ఆ రాజన్య బంధువు (దుష్టుడు) అడిగిన 5 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయానే? ఏమిటి నాకు ఈ దుస్థితి? ఈ విధంగా అడుగుతూ రాజు అడిగిన ‘5’ ప్రశ్నలు తండ్రికి శ్వేతకేతువు - వినిపించాడు.
స హ ఉవాచ :-
యథా మా త్వం తత్ ఏతాన్ అవదో।
యథా అహమ్ ఏషాం నైకంచన వేద।
యది అహమ్ ఇమాన్ అవేదిష్యం,
కథం తే న అవక్ష్యం? ఇతి
ఆరుణీ మునీంద్రులు : బిడ్డా! శ్వేతకేతూ! నీవు అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానము ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు. అందుచేత నాకు తెలియని ప్రశ్నలు, ప్రశ్నల సమాధానం నేను బోధించలేను కదా!
నేను కనుక ఆ ప్రశ్నలు వాటి సమాధానము ఎరిగిఉండి ఉంటే, నేను నీకు ఎందుకు బోధించను? బోధించి ఉండేవాడినే!
6. స హ గౌతమో రాజ్ఞో అర్థమ్ ఏయాయ,
తస్మై హ ప్రాప్తాయ అర్హాంచకార।
స హ ప్రాతః సభాగ ఉదేయాయ।
గోతమ గోత్రీయుడగు ఆరుణి అప్పటికప్పుడే బయలుదేరి ఆ మరునాడు ఉదయమే జావలుని కుమారుడగు పాంచాల దేశరాజు ప్రవాహణుడు ఉన్నచోటుకు వెళ్లారు. పంచ ప్రశ్నలకు సమాధానం వివరించవలసినదిగా అర్థించారు
తగ్ం హ ఉవాచ :-
‘‘మానుషస్య, భగవాన్ గౌతమ!
విత్తస్య వరం వృణీథా।’’ ఇతి
ప్రవాహణ రాజర్షి : పూజనీయుడగు గౌతమా! ఆ సమాధానాలెందుకు? మనుష్య సంబంధమైన సంపదను అడగండి. మీకు సమర్పించుకోగలను.
స హ ఉవాచ :
తవ ఏవ, రాజన్। మానుషం విత్తం యామేవ।
కుమారస్య అంతే వాచమ్
అభాషథాః తామ్ ఏవ
మే బ్రూహి - ఇతి
స హ కృచ్ఛ్రీ, బభూవ।
ఆరుణీ మునీంద్రుడు : మీరు ఇస్తానన్న మనుష్య సంపదతో నాకు పనిలేదు. మీ వద్దనే ఉంచుకోండి. మా కుమారుడు (మరియు) శిష్యుడు అగు శ్వేతకేతువును మీరు అడిగియున్న ‘5’ ప్రశ్నలకు సవివరణ ప్రసాదించండి.

ప్రవాహణ రాజర్షి (తనలో)
అయ్యో! ఏమిటి ఇవి అడుగుచున్నారు? - అని ఇబ్బందిగా భావించారు.
7. ‘‘తగ్ం హ చిరం వసేతి।’’
అజ్ఞాపయాంచకార।
తగ్ం హ ఉవాచ :-
యథా మా త్వం, గౌతమా।
అవదో యథా ఇయం
న ప్రాక్త్వతః పురా
విద్యా బ్రాహ్మణాన్ గచ్ఛతి
తస్మాత్ ఉ సర్వేషు లోకేషు
క్షత్రస్యైవ ప్రశాసనమ్ అభూత్ - ఇతి।।
తస్మై హోవాచ।।
ప్రవాహణ రాజర్షి : గౌతమా! ఆరుణిమునీంద్రా! మీరు కొంతకాలం ఇక్కడ ఉండండి!…ఈ విధంగా (గురువువలె) ఆదేశించారు. కొంతకాలమైన తరువాత
ప్రవాహణ రాజర్షి : ఓ ఆరుణి మహాశయా! గౌతమా! మీరు నన్ను ఆ ‘5’ ప్రశ్నలకు సమాధానం అడుగుచున్నారు. అవి బ్రాహ్మణులకు మేము ఎప్పుడూ చెప్పలేదు.
ఇతః పూర్వము బ్రాహ్మణులకు చెప్పబడని అవశేషములు క్షత్రియజాతికి ఉపదేశ్యము (బోధించతగినవి) మాత్రమే। మీవంటి మహనీయులగు బ్రహ్మతత్త్వాశయము గలవారికి కాదు.
అయినా కూడా మీరు అడుగుచున్నారు.
సరే"! వివరిస్తాను. వినండి. మీరు మాకు పూజనీయులు కదా, మరి

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే తృతీయః ఖండః


5–4. పంచమ ప్రపాఠకః - చతుర్థ ఖండము - ప్రథమ విశ్వయజ్ఞ హోమము

1. అసౌ వావ లోకో,
గౌతమా! ‘‘అగ్నిః’’।
తస్య ఆదిత్య ఏవ సమిత్
రశ్మయో ధూమో।
అహః అర్చిః।
చంద్రమా అంగారా।
నక్షత్రాణి విస్ఫులింగాః।।
గౌతమా! వినండి.
ప్రథమ దేవతా హోమమునకు
(భూలోకంలో అగ్నిహోత్రమునకే ఆహవనీయాగ్ని ఆశ్రయమయే తీరుగా)

☼ ద్యులోకము (స్వర్గ లోకము) - అగ్ని
☼ ద్యులోకమనే అగ్నికి ఆదిత్యుడు - సమిధలు (కట్టెలు)
☼ ఆదిత్య (సూర్యకిరణములు) - ‘పొగ’
☼ చంద్రుడు పగలు - బొగ్గులు (జ్వాల చల్లారిన తరువాత మిగిలేవి)
☼ నక్షత్రములు - కిరణములు. విస్ఫులింగములు
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ
దేవాః ‘‘శ్రద్ధాం’’ జుహ్వతి।
తస్యా ఆహుతేః
‘సోమో రాజా’ - సంభవతి।
ఈ విధంగా ఇంద్రియాభిమాన దేవతలు ‘శ్రద్ధ’ అనే ఆహుతిని ప్రాణాగ్నికి సమర్పిస్తున్నారు.

అట్టి ఆహుతిని ఇంద్రియ - అభిమాన దేవతలు {నేత్ర (చూపు) దేవత, చెవులు (శ్రవణ) దేవత, స్పర్శ (చర్మ) దేవత, రుచి (నాలుక) దేవత, గంధ (ముక్కు) దేవత} -

‘‘శ్రద్ధ’’ అనే ఆహుతిని సమర్పిస్తూ - పవిత్రులగుచున్నారు. ఆ హవిస్సులవలన ‘‘సోమరాజు’’ (జీవుడు - Experiencer) జనించుచున్నాడు (సంభవించుచున్నాడు).

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్థః ఖండః


5–5. పంచమ ప్రపాఠకః - పంచమ ఖండః - ద్వితీయ విశ్వయజ్ఞ హోమము

1. పర్జన్యో వావ గౌతమ! అగ్నిః।
తస్య వాయుః ఏవ సమిత్।
అభ్రం ధూమో। విద్యుత్ అర్చిః।
అశనిః అంగారా।
హ్రాదనయో విస్ఫులింగాః।।
ద్వితీయ దేవతా హోమము
☼ పర్జన్యుడు (వర్ష దేవతయే) - ‘‘అగ్ని’’
☼ దానికి వాయువే - ‘‘సమిధ’’
☼ మేఘములే - ‘‘పొగ’’
☼ విద్యుత్ (మెరుపు) - ‘‘జ్వాల’
☼ పిడుగులే - బొగ్గు (జ్వాల తరువాత శేషించేది)
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః
సోమగ్ం రాజానం జుహ్వతి।
తస్యా ఆహుతేః వర్షగ్ం సంభవతి।।
అట్టి అగ్నియందు దేవతలు ఆహుతిని సమర్పిస్తున్నారు.
అట్టి ఆహుతిని చంద్రుని (సోమరాజుకు) సమర్పించటం చేత ‘‘వర్షము’’ సంభవిస్తోంది. (శ్రద్ధయే చంద్రుని రూపము పొందుచూ - అగ్నిచే వర్షాకారము పొందుతోంది)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే పంచమః ఖండః


5–6. పంచమ ప్రపాఠకః - షష్ఠ ఖండము - తృతీయ విశ్వయజ్ఞ హోమము

1. పృథివీ వావ, గౌతమా! అగ్నిః।
తస్యాః సంవత్సర ఏవ సమిత్।
ఆకాశో ధూమో।
రాత్రిః - అర్చిః।
దిశో - అంగారా।
అవాంతరదిశో - విస్ఫులింగాః।।
తృతీయ దేవతా హోమము
☼ ఈ పృథివి (భూమి)యే - ‘‘అగ్ని’’
☼ దీనికి సంవత్సరము (Time Factor) - సమిధ
☼ ఆకాశమే - ధూమము (పొగ)
☼ రాత్రి - జ్వాల
☼ (తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణ) దిక్కులు - ఉష్ణము
(మండే బొగ్గులు-జ్వాల తరువాత మిగిలేవి)
☼ అవాంతర దిశలు - విస్ఫులింగము
(ఈశాన్య-ఆగ్నేయ-నైరుతి - వాయవ్యములు)
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ
దేవా ‘వర్షం’ - జుహ్వతి।
తస్యా ఆహుతేః అన్నగ్ం సంభవతి
అట్టి ఆ యొక్క అగ్నియందు దేవతలు ‘‘వర్షము’’ను హోమము చేయుచున్నారు.
అట్టి అగ్నియందు దేవతలు వర్షమును వాహనము చేస్తూ ఉండగా, అట్టి ఆహుతుల వలన ‘‘అన్నము’’ (ఆహారము) పుడుతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే షష్ఠమః ఖండః


5–7. పంచమ ప్రపాఠకః - సప్తమ ఖండము - చతుర్థి విశ్వయజ్ఞ హోమము

1. పురుషో వావ గౌతమా। అగ్నిః।
తస్య ‘వాక్’ ఏవ సమిత్।
ప్రాణో - ధూమో।
జిహ్వా - అర్చిః।
చక్షుః - అంగారాః।
శ్రోత్రం - విస్ఫులింగాః।
4వ దేవతా హోమము
☼ అన్నము నుండి జనించిన పురుషుడే - ‘‘అగ్ని’’
☼ వాక్కు - ‘సమిధ’
☼ ప్రాణము - పొగ
☼ జిహ్వ - జ్వాల
☼ చక్షువులు (చూపు) - మండే బొగ్గు కణములు
☼ చెవులు (వినికిడి) - విస్ఫులింగములు
2. తస్మిన్ - ఏతస్మిన్ అగ్నౌ
దేవా ‘అన్నం’ జుహ్వతి।
తస్యా ఆహుతే ‘రేతః’ సంభవతి
అట్టి అగ్నియందు అన్నమును దేవతలు ఆహుతులుగా సమర్పిస్తున్నారు. అప్పుడు ఆ ఆహుతులనుండి ‘‘రేతస్సు’’ జనిస్తోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే సప్తమః ఖండః


5–8. పంచమ ప్రపాఠకః - అష్టమ ఖండము - పంచమ విశ్వయజ్ఞ హోమము

1. యోషా వావ, గౌతమా! అగ్నిః।
తస్యా ‘ఉపస్థ’ ఏవ సమిత్।
యత్ ఉపమంత్రయతే స ధూమో।
యోనిః అర్చిః
యత్ అంతః కరోతి - తే అంగారా।
అభినందా - విస్ఫులింగాః।
5వ దేవతా హోమము
☼ స్త్రీ - అగ్ని
☼ ఉపస్థ (జననేంద్రియము) - సమిధలు
☼ స్త్రీ పురుషుని ఆకర్షించు ఉప మంత్రమే - ధూమము
☼ జననేంద్రియమే - జ్వాల
☼ సంభోగమే - బొగ్గు కణములు
☼ రతిసుఖమే - అగ్ని కిరణములు
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా
‘‘రేతో’’ జుహ్వతి।
తస్యా ఆహుతేః ‘గర్భః’ సంభవతి।।
అట్టి ఆ యొక్క అగ్ని కార్యమునందు అగ్నికి దేవతలు ‘రేతస్సు’కు ఆహుతిగా సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతుల నుండి ‘‘గర్భము’’ సంభవిస్తోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే అష్టమః ఖండః


5–9. పంచమ ప్రపాఠకః - నవమ ఖండము - పంచమ హవిస్సునందు జల ‘పురుషుడు’

1. ఇతి తు పంచమ్యామ్ ఆహుతాః
ఆపః పురుష వచసో భవంతి - ఇతి

స ఉల్బావృతో గర్భో దశ
వా నవ వా మాసానంతః
శయిత్వా యావత్ వా అథ జాయతే।।
ఈ విధంగా 5వ ఆహుతి దేవతలచే సమర్పించబడుచుండగా జలము ‘పురుషుడు (జీవుడు)’ శబ్దమునకు వాచ్యముగా (Main Meaning) అగుచున్నాయి.
‘‘జరాయువు’’ అనే గర్భసంచిలో ‘10’ నెలలో, ‘9’ నెలలో గడుపుచూ అక్కడ నిదురిస్తూ, చివరికి ఆ తరువాత జీవుడు జన్మించటం జరుగుతోంది.
2. స జాతో యావత్ ఆయుషం జీవతి।

తం ప్రేతం దిష్టం ఇతో
అగ్నయ ఏవ హరంతి, యత ఏవేతో
యతః సంభూతో భవతి।।
ఆ విధంగా ‘జీవుడు’గా జనియించిన శిశువు (జీవుడు) ఆయుష్షు ఉన్నంతవరకు పాంచభౌతిక జగత్తులో జీవిస్తున్నాడు.
మరణించిన తరువాత ఆ జీవుడు ‘ప్రేతము’ అనబడుచున్నాడు. అట్టి ప్రేతము (ఆ మరణించిన వానిని) కర్మఫలానుసారంగా ఏ అగ్ని నుండి ఈ లోకమునకు వచ్చియున్నాడో - ఆ అగ్నియే హరించి మరొక లోకములోనికి తీసుకొనిపోవటము, అక్కడ తిరిగి ప్రతిష్ఠించటము జరుగుతోంది. అనగా ఈ జీవుడు దేహానంతరము మరొక దేహమునందు తనను తాను అనుభవముగా పొందుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే నవమ ఖండః


5–10. పంచమ ప్రపాఠకః - దశమ ఖండము - దేవయాన పితృయాన మార్గములు

1. తత్ య ఇత్థం విదుః
యే చ ఏమే అరణ్యే ‘శ్రద్ధా’ తప,
ఇతి ఉపాసతే, తే ‘అర్చిషమ్’
అభిసంభవంతి।
అర్చిషో అహరహ్న
ఆపూర్యమాణ పక్షమ్।
ఆపూర్యమాణపక్షాద్యాన్
షడుదన్ ఏతి మాసాగ్ంస్తాన్।।
దేవయాన పంథా
ఎవ్వరైతే ఈ విధంగా (1) శ్రద్ధ (2) వర్షము (3) అన్నము (4) రేతస్సు (5) గర్భము అనబడే ‘5’ దేవతా హోమములవలన ఈ శరీరయానము, జీవాత్మ (పురుషుడు) వ్యవహారము సంభవిస్తోందని గ్రహిస్తాడో, అరణ్యము (Beyond worldly events and happenings)లో ఉండి, శ్రద్ధతో ఈ ఐదిటికీ ఆవల గల పరమాత్మ స్వరూపము ఉపాసిస్తారో, అర్చిస్తారో - వారు కాంతివంతమగు లోకములు పొందుచున్నారు. వారు అర్చిష్మంతుడు అనబడే అగ్నిజ్వాల అభిమాని దేవతను పొందుచున్నారు. జ్వాలనుండి పగలును, పగలు నుండి శుక్లపక్షమును, ఉత్తరాయణ 6 నెలల (షణ్మాసామ్) చివర ఉత్తరగతిని పొందుచున్నారు.
2. మాసేభ్యః సంవత్సరగ్ం
సంవత్సరాత్ - ఆదిత్యమ్।
ఆదిత్యాత్ - చంద్రమసమ్।
చంద్రమాసో - విద్యుతమ్।
తత్పురుషో - అమానవః।
స ఏనాత్ ‘బ్రహ్మ’ గమయతి ఏష
దేవయానః పంథా ఇతి।।
ఉత్తరాయణ షణ్మాసము నుండి - సంవత్సరమును,
సంవత్సరము నుండి - ఆదిత్యుని
ఆదిత్యుని నుండి - చంద్రమసమును (చంద్రుని)
చంద్రమసము నుండి - విద్యుత్తును (తేజస్సును)
- అక్కడి నుండి మానవపరిధికి ఆవలగల ‘తత్పురుషము’ అనబడే బ్రహ్మము వైపుగా ప్రయాణిస్తూ ఉంటారు.
ఈ పంథా (మార్గము, విధి విధానము)ను ‘‘దేవయాన పంథా’’ అని పిలుస్తున్నారు.
3. అథ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే,
దత్తమ్ ఇతి ఉపాసతే,
తే ‘ధూమం’ అభిసంభవంతి
ధూమాత్- రాత్రిగ్ం
రాత్రేః - అపర పక్షమ్।।
అపరపక్షాద్యాన్ - ‘షట్’
దక్షిణ ఏతి మాసాగ్ం।
తాన్ న ఏతే ‘సంవత్సరం’
అభిప్రాప్నువంతి।
పితృయాన మార్గము
ఎవ్వరైతే తామున్నచోట
- ఇష్టా పూర్తములను (యజ్ఞ యాగములు, లోకసేవా కార్యక్రమములను) నిర్వర్తిస్తూ ఉంటారో, దాన-ధర్మములు మొదలైనవి నిర్విర్తిస్తూ, అట్టి ఆశయములు మాత్రమే కలిగి ఉంటారో, అట్టివారు ధూమ (పొగ) లోకములు చేరుచున్నారు.
ధూమము నుండి - ‘రాత్రి’కి
రాత్రి నుండి - కృష్ణపక్షమునకు,
కృష్ణపక్షము నుండి - దక్షిణాయణ షట్ మాసములను,
అక్కడి నుండి - సంవత్సరమును పొందుచున్నారు.
4. మాసేభ్యః - పితృలోకం
పితృలోకాత్ - ఆకాశమ్
ఆకాశాత్ - చంద్రమసమ్
ఏష సోమో రాజా తత్
దేవానాం - ‘అన్నం’
తం దేవా భక్షయంతి।।
మాసముల నుండి - పితృలోకములకు,
పితృలోకముల నుండి - ఆకాశమునకు,
ఆకాశము నుండి - చంద్రమసమునకు,
(ఆయా అభిమాన దేవతలకు) చేరుచున్నారు.
ఈతడే సోమరాజు. ఈతడు దేవతలకు ఆహారము అగుచున్నాడు. దేవతలు ఆతనిని అన్నముగా (ఆహారముగా) భుజించుచున్నారు.
5. తస్మిన్ యావత్ సంపాతమ్ ఉషిత్వా,
అథ ఏతమ్ ఏవ అధ్వానం పునః నివర్తంతే।
అక్కడ పురాకృత కర్మల ఫలములను పొందుచు తిరిగి పునరావృత్తిగా క్రింద జన్మలను పునః పొందుచున్నారు.
యథా ఏతమ్ - ‘‘ఆకాశమ్’’।
ఆకాశాత్ - ‘‘వాయుం’’।
వాయుః భూత్వా ‘‘ధూమో’’ భవతి।
ధూమో భూత్వా - ‘‘అభ్రం’’ భవతి।
పునరావృత్తి యానము
ఇది శరీరము విడిచినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేసి ఉన్నారో, ఇప్పుడు ఆ మార్గంగానే తిరిగి దేహముల ధారణ వైపుగా తిరిగివస్తున్నాడు.
(ఇదివరకు వెళ్లినది మాసములు - పితృలోకము - ఆకాశము - చంద్రమసము)
ఇప్పుడు తిరిగి రాక…
చంద్రమసము నుండి - ఆకాశము
ఆకాశము నుండి - వాయువులో ప్రవేశము
వాయువు నుండి - ‘ధూమము’ (పొగ)
ధూమము నుండి - మేఘము అగుచున్నాడు.
6. అభ్రం భూత్వా - మేఘో భవతి।
మేఘో భూత్వా - ప్రవర్షతి।।
త ఇహ వ్రీహియవా ఓషధి - వనస్పతయః
తిలమాషా ఇతి జాయంతే।
అతో వై ఖలు దుర్నిష్ప్రపతరమ్।
యో యో హి ‘అన్నం’ అత్తి।
యో ‘‘రేతః’’ సించతి।
తత్ భూయ ఏవ భవతి।।
దట్టమైన మేఘమై - వర్షించు మేఘము అగుచున్నాడు.
మేఘము నుండి - చినుకుల ద్వారా వర్షించువాడగుచున్నాడు.
అట్లా వర్షించి భూమిపై -
వ్రీహి (ధాన్యముగా, వడ్లుగా)
యవ - (ధాన్య విశేషములుగా, గోధుమలు మొ।।వి)
ఓషధులు - (అరటి వంటి మొక్కలు మొదలైనవిగా)
వనస్పతులు - (చెట్లుగా)
తిల - (నువ్వులుగా)
మాషా - (మినుములుగా)
ఆయా రూపములు పొందుచున్నాడు.

ఈ విధంగా ఈ జీవుడు తిరిగి దేహరూపముగా అవటమనేదంతా అనేక కష్టము - బాధ - దుర్ఘటనములతో కూడినదే! ఆయా రూపములలో బయటకు వచ్చుటకు అనేక కష్టములు పొందుచున్నారు.

ఆయా పదార్థముల రూపము పొంది, ఆ తరువాత
- జీవుల ఆహారము రూపముగా అయి,
- ఆహారము రేతస్సుగా అయి, విడుబడి ఆయా రూపములు కలదిగా అగుచున్నది.
7. తద్య ఇహ రమణీయ చరణా అభ్యాశో,
హ యత్తే రమణీయాం యోనిమ్ ఆపద్యేరన్। బ్రాహ్మణ యోనిం వా, క్షత్రియ యోనిం వా,
వైశ్య యోనిం వా అథ య ఇహ
కపూయ చరణా అభ్యాశో
హ యత్తే కపూయాం యోనిం ఆపద్యేరన్
‘శ్వ’ యోనిం వా, ‘సూకర’ యోనిం వా,
చణ్డాల యోనిం’ వా।
అట్టి జీవులలో ఇతఃపూర్వము రమణీయమైన, పుణ్యప్రదమగు ఆచరణ, అభ్యాసము కలవారు రమణీయమైన యోనులు (జన్మలు) పొందటం జరుగుతోంది.

బ్రహ్మతత్త్వముపై ధ్యాసగల - బ్రాహ్మణ కార్య సమర్థత గల - క్షత్రియ వ్యవహార వ్యాపార దక్షత గల - వైశ్య యోనులందు జన్మిస్తున్నారు.

అట్లా కాకుండా, దుష్టమైన ఆచరణ అభ్యాసములు కలవారు, చెడు నడవడి గలవారు కపూయ (అల్ప) యోనులలో, కుక్క - పంది - చణ్డాల యోనులలో జన్మ పొందుచున్నారు.
8. అథ ఏతయోః పథోః న కతరేణ చ న
తాని ఇమాని క్షుద్రాణి అసకృత
ఆవర్తీని భూతాని భవంతి।
జాయస్వ మ్రియస్వ ఏతి
ఏతత్ తృతీయం స్థానం।
తేన అసౌ లోకో స సంపూర్యతే।

తస్మాత్ జుగుప్సేత। తత్ ఏష శ్లోకః।।
కొందరు పై మార్గములు కాకుండా, అల్పమగు దోమవంటి క్రిమికీటక క్షుద్ర ప్రాణులై మరల మరల జన్మిస్తూ ఉంటారు.

జన్మిస్తూ మరణిస్తూ ఉండటంచేత వారు ఈ లోకములోనే సంచారములు, రాకపోకలు కలిగి ఉంటూ ఉన్నారు. అందుచేతనే (స్వర్గము, పితృలోకము మొదలైన) ఊర్ధ్వలోకములు నిండటము జరగటము లేదు.

పైన చెప్పుకొన్నరీతిగా - ఉత్తరోత్తర స్థితిగతులలో గల భీకర దుఃఖస్థితులు గమనించి ముందుగానే నిషిద్ధకర్మలు, క్రూరప్రవర్తనలు పట్ల అత్యంత జాగరూకులై ఉండాలి. ఈ విషయము వివరిస్తూ పాఠ్యాంశములున్నాయి.
9. స్తేనో హిరణ్యస్య, సురాం పిబగ్ంశ్చ,
గురోః తల్పమ్ ఆవసన్, బ్రహ్మహా చ
ఏతే పతంతి చత్వారః
పంచమశ్చ ఆచరగ్ం స్రైరితి।।
ఉత్తరోత్తర సుదీర్ఘదుఃఖస్థితులను దృష్టిలో పెట్టుకొని పంచ (5) నిషిద్ధ మహాపాతకములు ఈ విధంగా చెప్పబడుచున్నాయి.
(1) బంగారము అపహరించువాడు.
(2) సురాపానము చేయువాడు
(3) గురుపత్నీ సంగమము
(4) బ్రహ్మహత్య చేయువాడు
ఇవి పతనమునకు కారణము.
(5) పై దోష ప్రవర్తన కలవారితో కూడి సంచరించటము పంచమ మహాపాతకముగా చెప్పబడుతోంది.
10. అథ హ య ఏతాన్
ఏవం పంచాగ్నీన్ వేద,
న సహ ఏతైః అపి
ఆచరన్ పాప్మనా లిప్యతే।
శుద్ధః పూతః
పుణ్య లోకో భవతి
య ఏవం వేద।
య ఏవం వేద।।
అయితే, ఎవ్వరైతే - ఈ పంచమ పాఠకములో చెప్పుకొన్న పంచాగ్నులను ఎఱిగినవాడై, వాటియొక్క అంతర్లీన తత్త్వమును ఉపాసిస్తూ ఉంటారో పైన చెప్పిన పంచ మహాపాతకముల దోషములనుండి, తదితర పాపదోషములను పొందడు.

పరిశుద్ధుడు, నిర్మలుడు, పునీతుడు కాగలడు.
- పుణ్యలోకములలో ప్రవేశము పొందగలడు.

అందుచేత అట్టి పంచాగ్ని తత్త్వములను ఎఱిగి, ఆత్మోపాసనను ఆశ్రయించెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే దశమః ఖండః


5–11. పంచమ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - వైశ్వానరాత్మోపాసన

1. ప్రాచీనశాల ఔపమన్యవః
సత్యయజ్ఞః పౌలుషిః,
ఇంద్రద్యుమ్నో భాల్లవేయో జనః శార్కరాక్ష్యో,
బుడిల అశ్వతరాశ్విః
ఒకానొక సందర్భంలో కొందరు మహనీయులు సత్సంగపూర్వకంగా ఒకచోట సమావేశమవటం జరిగింది.
(1) ఉపమన్యుని కుమారుడు - ప్రాచీనశాలుడు.
(2) పులిషియొక్క కుమారుడు - సత్యయజ్ఞుడు.
(3) భల్లవి పుత్రుడు - ఇంద్రద్యుమ్నుడు.
(4) శర్కరాక్షుని పుత్రుడు - జనుడు.
(5) అశ్వతరాశ్వుని పుత్రుడు - ఋడిలుడు.
తే హైతే మహాశాలా,
మహా శ్రోత్రియాః సమేత్య
‘‘మీమాగ్ంసాం’’ - చక్రుః।
కో నః ఆత్మా? కిం బ్రహ్మే-తి।
వీరు గొప్ప శాస్త్రకోవిదులు. గొప్ప శిష్యగణము గల గృహస్థులు. శ్రుతుల గురించి అధ్యయనము చేసియున్న శ్రోత్రీయులు వీరంతా సమావేశమై ‘‘మన ఆత్మ అనగా ఎవరు? పరాబ్రహ్మము అనగా ఏది?’’ - అని సమాలోచన చేయసాగారు.
2. తే హ సంపాదయాం చక్రుః
ఉద్దాలకో వై భగవంతో
అయమ్ ఆరుణిః
సంప్రతి ఇమం ఆత్మానం
వైశ్యానరం అధ్య ఇతి।
తం హన్త అభ్యాగచ్ఛాం ఏతి।
తగ్ం హాభ్యాజగ్ముః।
కొంతసేపు సమాలోచన చేసిన తరువాత, ‘‘ఇట్లా కాదు, మనము వేదతత్త్వము తెలిసిన సద్గురువును ఆశ్రయిద్దాము’’ అని అనుకొన్నారు. ఆరుణి ఋషి కుమారుడైన ఉద్దాలకమహర్షి (ఆరుణి) దర్శనం చేసుకొని, వారి వద్ద ‘‘వైశ్వానరోపాసనా విద్య’’ గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు.
వెంటనే ఆరుణీ నామధేయ ఉద్దాలక మహర్షి ఆశ్రమానికి వచ్చి తత్త్వవేత్త అగు ఆ మహర్షిని సందర్శించారు.
హే మహాత్మా! మాకు వైశ్వానర విద్యను బోధించ ప్రార్థన!
3. స హ సంపాదయాంచకార
ప్రక్ష్యన్తి - మామ్ ఇమే
మహాశాలా మహాశ్రోత్రియాః
తేభ్యో న సర్వమివ ప్రతిపత్స్యే హంత।
అహమ్ అన్యమ్ అభ్యనుశాసాని। ఇతి।।
ఉద్దాలక మహర్షి : ఈ విధంగా తలచారు. ‘‘ఈ వచ్చినవారు పెద్ద శిష్యబృందము గల గృహస్థులు. వీరు అనేక వివరణల గురించి నన్ను ప్రశ్నించగలరు. వీరికి వైశ్వానర విద్య గురించి సంపూర్తిగా బోధించలేను. అందుచేత వీరికి మరొక మహనీయుడగు గురువును ఆశ్రయించటానికై దారి చూపిస్తాను’’ ఇట్లా అనుకొని ఈ విధంగా పలుక సాగారు.
4. తాన్ హ ఉవాచ :-
అశ్వపతిర్వై భగవన్తో
అయం కైకేయః సంప్రతి
ఇమమ్ ఆత్మానం ‘వైశానరమధ్య’ ఇతి।
తం హన్త అభ్యాగచ్ఛామ్
ఏతి తం హాభ్యాజగ్ముః ।।
ఉద్దాలక మహర్షి : ఓ మహాశాలా - మహాశ్రోత్రియులారా! పూజనీయులారా! నాకన్నా కూడా వైశ్వానరోపాసన గురించి ఎరిగియున్నవారు, మహనీయుడు అగు ఒకరున్నారు. వారు - ఆయన కేకయరాజ కుమారుడగు అశ్వపతి. మహారాజు వారు వైశ్వానరుని ఎరిగియున్నవారు. మనము ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి వైశ్వానరవిద్య గురించి శ్రవణము, అధ్యయనము చేద్దాము పదండి.
5. తేభ్యో హ ప్రాప్తేభ్యః పృథక్
అర్హాణి కారయాంచకార
స హ పాత్రః సంజిహాన ఉవాచ
ఆ మరునాడు వారంతా అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లి, వారిని సందర్శించారు. అప్పుడు అశ్వపతి మహారాజు ఆ వచ్చినవారందరికి సుస్వాగతము పలికారు. ఒక్కొక్కరికి సత్కారములు సపర్యలు అందజేసారు. ఆ మరునాడు ఉదయము వారందరినీ సమీపించి రాజు ఇట్లా పలికారు.
‘‘న మే స్తేనో జనపదే।
న కదర్యో న మద్యపో।
నానాహితాగ్నిః న అవిద్వాన్।
న స్వైరీ, స్వైరిణీ కుతః?
యక్ష్యమాణో వై భగవన్తో అహమస్మి।
అశ్వపతి మహారాజు : ఓ పూజనీయులారా! ఈ మా రాజ్యములో దొంగలుగాని, లోభులుగాని లేరు. మద్యపానం చేయువారు లేరు. అహితాగ్నినిష్ఠులు కానివారు లేరు. అవిద్వాంసులు లేరు.
వ్యభిచారులు గాని, కుంటలు గాని లేరు. మీరు నిశ్చింతగా మా రాజ్యంలో కొంతకాలము ఉండి ఆనందించండి.

భగవాన్! నేను ఇప్పుడు ఒక యజ్ఞమును ప్రారంభించబోతూ, దీక్ష తీసుకోబోతున్నాను.
యావత్ ఏకైకస్మా ఋత్విజే
ధనం దాస్యామి,
తావత్ భగవద్భ్యో దాస్యామి
వసంతు భగవంత। ఇతి।।
ఈ జరగబోయే యజ్ఞమునకు ఋత్విజులు వచ్చియున్నారు. ఒక్కొక్క ఋత్విజునికి ఎంతెంత సమర్పించుకోబోవుచున్నానో - అంతంత ధనము మీలో ప్రతి ఒక్కరికి కూడా సమర్పించుకుంటాను. మీ మహనీయత్వమును గౌరవించుకుంటాను.
నాచే మీరు పూజింపబడుచూ ఇక్కడ ఉండండి. ఇది నా అభ్యర్థన, ప్రార్థన.
6. తే హి ఊచు :-
‘‘యేన హ ఏవ అర్థేన
పురుషశ్చః ఏత్తగ్ం హైవ
వదేత్ ఆత్మానమ్
ఏవేమం వైశ్వానరగ్ం
సంప్రత్యధ్యేషి తమేవ
నో బ్రూహి - ఇతి।
ఉద్దాలక ఋషి, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు :
మహారాజా! అశ్వపతీ! మీ స్వాగత వచనములకు, అభ్యాగతి మర్యాదలకు, ధనసమర్పణ సంసిద్ధతకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మీకు సర్వదా శుభమగు గాక! మీ యజ్ఞ కార్యక్రమము దిగ్విజయమగు గాక! అయితే ఇక్కడ ఒక విషయం మీకు విన్నవించుకొంటున్నాము. మేము సంపదల కొరకై మీవద్దకు రాలేదు. ఎవరు ఏ ప్రయోజనము కొరకై వస్తారో, అదియే మీవంటి మహనీయులు సిద్ధింపజేయటము ఆచరిస్తూ ఉంటారు కదా!

మీరు ‘వైశ్వానరవిద్య’ను సవివరంగా, సశాస్త్రీయంగా ఎరిగి ఉన్నవారనునది లోకప్రసిద్ధము. అందుకొరకై విద్యార్థులమై వచ్చాము. దయతో వైశ్వానరవిద్యను మాకు బోధించవలసినదిగా అర్థిస్తున్నాము. అనుగ్రహించండి.
7. తాన్ హ ఉవాచ :-
ప్రాతర్వ: ప్రతివక్తా2స్మి,
ఇతి తే హ సమిత్
పాణయ: పూర్వాహేణా
ప్రతిచక్రమిరే తాన్ వా
అనుపనీయైవ…
ఏతత్ ఉవాచ।।
అశ్వపతి మహారాజు : మహనీయులారా! అట్లాగే! అయితే, అట్టి విద్య మనం అభ్యసించటానికై మీరు ప్రాతఃకాల ఉదయ సమయములలో సంసిద్ధులై ఉండండి. అప్పుడు మాత్రమే నాకు తీరిక.
ఆ మరునాడు ఉదయమే ఉద్దాలకఋషి మొదలైనవారు సమిత్ ప్రాణులై (సమిధల కట్టెలను గురుసమర్పణగా చేతబూనినవారై) సిద్ధమై ఉన్నారు.
వారికి ‘‘ఉపనయన దీక్ష’’ - నియమించకుండానే అశ్వపతిరాజు ఈ విధంగా బోధించటము ఆరంభించారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకాదశః ఖండః


5–12. పంచమ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - ద్యులోక వైశ్వానరోపాసన

1. ఔపమన్యవ కం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।
(ఔపమన్యుడు) దివమేవ భగవో, రాజన్!
అశ్వపతి మహారాజు : మహనీయుడగు ఉపమన్య మునీంద్రుల ప్రియ కుమారుడగు ఔపమన్యా! ప్రాచీనశాలా! మీరు ‘ఆత్మ’ను ఏవిధంగా ఉపాసిస్తూ ఉన్నారో ముందుగా అది వివరించి మాకందరికీ చెప్పండి.
ఔపమన్యుడు / ప్రాచీనశాలుడు : రాజా! ద్యులోకమును (దేవతా లోకమును) వైశ్వానరాత్మగా ఉపాసిస్తున్నాను.
ఇతి హ ఉవాచ :
‘‘ఏష వై సుతేజా - ‘‘ఆత్మా
వైశ్వానరో - యం।’’
త్వమ్ ఆత్మానం, ఉపాస్సే
తస్మాత్ తవ ‘సుతం’,
‘ప్రసుతం’, ‘ఆసుతం’ కులే దృశ్యతే।
అశ్వపతిరాజు : అయితే, మీరు ఉపాసిస్తూ ఉన్నది ఆత్మయొక్క ఒక ‘సంతేజము’ అయినట్టి వైశ్వానరాత్మను మాత్రమే! అది పూర్ణాత్మ యొక్క ఉపాసన కాదు.

మీరు ‘సుతేజా’ అనబడే ఆత్మయొక్క కళను మాత్రమే ఉపాసిస్తున్నారు. సుతేజ వైశ్వానరాత్మ కేవలమగు ఆత్మకు ఒక అవయవము వంటిది. మీరు ఉపాసిస్తూ వస్తున్నది -

(1) సుతము = {వైదిక కర్మ (అగ్నిష్టోమము) నందు సోమలతను దంచి వేరుచేయబడిన ‘‘సోమరసము’’}

(2) ప్రసుతము = {క్రతువులలో (వాజపేయము వాటియందు) సంపాదించబడే సోమరసము}

(3) అసుతము = {యాగములందు (సత్రయాగము మొదలైన వాటియందు) నిరంతరము ఉపయోగించు సోమరసముగా సుస్పష్టము అవుతోంది}
2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియం అత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే
య ఏతమ్ ఏవం
ఆత్మానం వైశ్వానరం
ఉపాస్తే మూర్ధాతి,
ఏష ఆత్మన - ఇతి।
మీరు ఆహారము చక్కగా పొంది భుజించగలరు. ప్రియమగు పదార్థములు పొందగలరు.

ఎవ్వరైతే పరబ్రహ్మమును (లేక) వైశ్వానరాత్మను దివ్యలోకముగా పూజిస్తారో - అట్టి వారి కులంలో సత్కర్మానుష్ఠానపరులే పుడతారు. అట్టివారి కులంలో బ్రహ్మవర్చస్సు అగుపడుతూ ఉంటుంది.

అయితే అట్టివారిది పూర్ణాత్మకు చెందిన శిరస్సుయొక్క ఉపాసన మాత్రమే। సంపూర్ణమైన ఉపాసన కాదు.
హ ఉవాచ :
మూర్ధా తే వ్యపతిష్యత్ యత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ఓ ఔపవన్యా! ఒకవేళ మీరు ఇప్పుడు నా దగ్గిరకు వచ్చి, నేను చెప్పబోవు వైశ్వానరాత్మ యొక్క వివరణ వినకపోతే - ఎప్పుడో మీ తల క్రింద పడిపోయి ఉండేదే। అనగా, మీరు అసంపూర్ణ ఉపాసనచే తలవంచవలసి వచ్చేది।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వాదశః ఖండః


5–13. పంచమ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ఆదిత్య వైశ్వారోపాసన

1. అథ హ ఉవాచ :
సత్యయజ్ఞం పౌలిషిం,
ప్రాచీనయోగ్య కం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।
ఆదిత్యమేవ భగవో, రాజన్। ఇతి।।
అశ్వపతి మహారాజు : ఓ ప్రాచీన యోగ్యుడా! మానవీయుడగు పులిష మునీశ్వరుని కుమారా? సత్యయజ్ఞా! మీరు చెప్పండి. మీరు దేనిని ఆత్మగా ఉపాసిస్తున్నారు?
సత్యయజ్ఞుడు: భగవాన్! రాజన్! గురుదేవా! నేను సూర్య భగవానుని వైశ్వానరాత్మ దేవునిగా (లేక) పరమాత్మగా ఉపాసిస్తున్నాను.
హ ఉవాచ :
ఏష వై విశ్వరూప ఆత్మా
వైశ్వానరో యం త్వమ్ ఆత్మానమ్ ఉపాస్సే,
తస్మాత్ తవ బహు
విశ్వరూపం కులే దృశ్యతే।।
అశ్వపతి మహారాజు : నీవు ఏ సూర్యుని ఉపాసిస్తున్నావో ఆయన వైశ్వానరాత్మ యొక్క ఒక (అంశ) రూపమే ఉపాసిస్తున్నారు. అట్టి ఆత్మ స్వరూపోపాసన చేస్తూ ఉన్నారు కాబట్టి ; ఆదిత్యుడే విశ్వరూపుడు కనుక - ఆయనను ఉపాసించటం వలన మీ కులములో (వంశములో) అనేక ఇహ-పర సుఖములు ఇచ్చే సాధనములు కనబడుచున్నాయి. సాధన సంపత్తి సమగ్రంగా లభించగలదు.
2. ప్రవృత్తో, అశ్వతరీరథో దాసీ నిష్కో
అత్స్యన్నం పశ్యసి।
అశ్వతర (గుర్రము/కంచరగాడిద) రథములు, దాసదాసీజనులు, శుభ్రమైన ఆహారము కలిగియుండగలరు. ప్రియమగు అన్నము సర్వదా లభించగలదు.
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం అత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి।
అస్య బ్రహ్మవర్చసం కులే య
ఏతమేవమ్ ఆత్మానం ‘వైశ్వానరమ్’ ఉపాస్తే
చక్షుష్ట్వ ఏతత్ ఆత్మన ఇతి।
హ ఉవాచ :
అంధో అభవిష్కో యత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ప్రియమైన విషయములు చూస్తూ ఉండగలరు. బ్రహ్మవర్చస్సు కలిగి యుంటారు. కనుక ఈ విధంగా ఆత్మను ఆదిత్యరూపంగా ఉపాసించటము శుభప్రదమే!

అయితే మీరు ఉపాసించునది వైశ్వానరాత్మ యొక్క ‘కన్ను’ మాత్రమే। అందుచేత అది సంపూర్ణమైన వాశ్వానరోపాసన కాదు.

ఏది ఏమైతేనేమి. మీరు మాత్రం నా దగ్గిరకు ఇప్పుడు వచ్చి వైశ్వానరాత్మ యోగము ఉపాసనల గురించి శ్రవణం చేయబోతున్నారు. కాబట్టి మంచిదే. అట్లా వచ్చి ఉండకుంటే మీరు పూర్ణాత్మ జ్ఞాన విషయంలో గ్రుడ్డివారు అయిపోయేవారే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే త్రయోదశః ఖండః


5–14. పంచమ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - వాయు వైశ్వానరోపాసన

1. అథ హ ఉవాచ ఇంద్రద్యుమ్నం
భాల్లవేయం వైయాఘ్రపద్యకం
త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।

అశ్వపతి మహారాజు : ఓ భల్లవి మునీశ్వరుని పుత్రులగు ఇంద్రద్యుమ్న మహాశయా! వైయాఘ్రపద్యా! మీరు కూడా చెప్పండి. మీరు ఆత్మ అనగా ఏదని ఉపాసిస్తున్నారు?

వాయుమేవ భగవో, రాజన్! - ఇతి।
హ ఉవాచ :
ఏష వై పృథక్ వర్త్మా ఆత్మా
వైశ్వానరో యం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్సే
తస్మాత్ త్వాం పృథక్ బలయ ఆయంతి।
పృథక్ రథ శ్రేణయో అనుయంతి।
ఇంద్రద్యుమ్నుడు : గురువర్యా! మహారాజా! నేను వాయుదేవుని పరమాత్మగా ఉపాసిస్తున్నాను. (నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।)
అశ్వపతి మహారాజు : అనగా, ఓ ఇంద్రద్యుమ్నమునీ! మీరు ‘‘పృథక్ వర్త్మ’’ అను వైశ్వానరాత్మ అంశను ఉపాసిస్తున్నారన్నమాట.
వాయువు నానాగతి కలది కదా! అందుచేత మీరు అనేక దిక్కులనుండి బలమును పొందగలరు.
అనేక రథములు మీ వెనుకగా (మీరు ఎక్కడికి వెళ్లితే అక్కడికి) నడచివస్తూ ఉండగలరు.
2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి।
అస్య బ్రహ్మవర్చసం కులే,
య ఏతమేవమ్ ఆత్మానం
వైశ్వానరం ఉపాస్తే,
ప్రాణస్త్వేష ఆత్మన ఇతి।।

మీరు పవిత్రము, ప్రియము అగు ఆహారము ఎల్లప్పుడు పొందుచూ ఉండగలరు. అన్నభోక్త అయి ఉంటారు.
అందరికీ ప్రీతిపాత్రులు అవుతారు. బ్రహ్మవర్చస్సు కలిగి ఉంటారు. ఆ విధంగా వాయువును వైశ్వానరాత్మగా ఉపాసించటం చేత మీ వంశము పవిత్రమై ఉండగలదు.
అయితే మీరు వైశ్వానరాత్మ యొక్క ‘‘ప్రాణాంశ’’ను మాత్రమే ఉపాసించినవారగుచున్నారు. అనగా మీయొక్క వైశ్వానరోపాసన సమగ్రము కానేకాదు.

హ ఉవాచ :
ప్రాణస్త ఉదక్రమిష్యయత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ఒకవేళ మీరు నా వద్దకు వైశ్వానరోపాసన యొక్క వాస్తవ తత్త్వము శ్రవణము చేయటానికి వచ్చి ఉండకపోతే - మీరు ప్రాణము పోగొట్టుకొని ఉండేవారు సుమా!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్దశః ఖండః


5–15. పంచమ ప్రపాఠకః - పంచదశ ఖండము - ఆకాశ వైశ్వానరోపాసన

1. అథ హ ఉవాచ జనగ్ం।
శార్కరాక్ష్య
‘‘కం’’ త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।।
అశ్వపతి మహారాజు : ఓ శర్కరాక్ష్య మునీశ్వరుని ప్రియకుమారా! జన మహాశయా! మీరు చెప్పండి. మీరు ఇంతవరకు వైశ్వానరాత్మగా ఎవరిని (లేక) దేనిని ఉపాసిస్తున్నారు? అది ఈ మన ‘సభ’కు వివరించి చెప్పండి।
ఆకాశమేవ భగవో,
రాజన్! ఇతి!
జనుడు : మహాత్మా! అశ్వపతి మహారాజా! గురువర్యా! నేను ఆకాశమును భగవానునిగాను, ‘‘వైశ్వానరాత్మ’’ గాను ఉపాసిస్తూ ఉన్నాను.
హ ఉవాచ :
ఏష వై బహుల ఆత్మా వైశ్వానరో
యం త్వమ్ ఆత్మానం ఉపాస్సే।
తస్మాత్ త్వం బహులో అసి
ప్రజాయా చ। ధనేన చ।
అశ్వపతి మహారాజు : ఓ జన మహాశయా! మీరు ఆత్మను ఆకాశరూపంగా ఉపాసించటము - ‘బహుళోపాసన’ అని చెప్పబడుతూ ఉంటోంది.
అందుచేత మీరు బహుళమగు అష్టసంపదలతోను, ఉత్తమ జన సంపదతోను, ధనముతోను సర్వదా సమృద్ధులై ఉంటారు.
2. అత్స్యన్నం పశ్యసి। ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి। అస్య బ్రహ్మవర్చసం కులే
య ఏతమేవమ్ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే,
సందేహస్త్వ ఏష ఆత్మన ఇతి।
హ ఉవాచ
సందేహః తే వ్యదీర్యతి యత్ మాం
న ఆగమిష్య। ఇతి।।
సమృద్ధిగాను, ప్రియముగాను ఎల్లప్పుడు మీరు ఆహారము పొందుతూ ఉంటారు. అందరికి ప్రియము అవుతారు. మీ వంశము బ్రహ్మవర్చస్సుతోను, జ్ఞానులతోను విరాజిల్లగలదు.
అయితే మీరు ఉపాసిస్తున్న వైశ్వానరోపాసన - ఆత్మయొక్క మధ్యభాగము మాత్రమే ఉపాసించువారగుచున్నారు సుమా.
మీరు ఇక్కడికి (నావద్దకు) వచ్చి ఉండకపోతే మీ శరీరమధ్యభాగము నశించిపోయి ఉండేదే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే పంచదశః ఖండః


5–16. పంచమ ప్రపాఠకః - షోడశ ఖండము - జల వైశ్వానరోపాసన

1. అథ హ ఉవాచ
బుడిలం అశ్వతరాశ్విం
వైయాఘ్రపద్య!
కం త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।।
‘అప’ ఏవ భగవో, రాజన్। ఇతి।
అశ్వపతి మహారాజు : ఓ అశ్వతరాశ్వ మునీశ్వర కుమారా! బుడిల మహాశయా! వైయాఘ్రపద్య। మీరు ఆత్మను ఏ ఆలంబనంతో ఉపాసిస్తున్నారు? ఏ రూపము ఆశ్రయించి ఆత్మయొక్క ‘‘సమగ్రము’’ను సమీపంచ యత్నిస్తున్నారు?
బుడిల ముని : నేను జలదేవతను భగవానుని స్వరూపంగా భావించి వైశ్వానరోపాసన చేస్తున్నాను.
హ ఉవాచ :
ఏష వై రయిః ఆత్మా వైశ్వానరో యం త్వమ్
ఆత్మానం ఉపాస్సే తస్మాత్ త్వగ్ం
రయిమాన్, పుష్టిమాన్ అసి।

అశ్వపతి మహారాజు : మీరు ఆపః (జలమును) ఆత్మోపాసన కొరకై ఉపాసించటము ‘‘రయి-వైశ్వానరాత్మోపాసన’’ అని అంటూ ఉంటారు.
(జలమునుండి పంటలు, వాటి నుండి ధనధాన్య సంపద లభిస్తాయి. కనుక) మీరు శరీర పుష్టిని పొందుచున్నారు.

2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి, అస్య బ్రహ్మవర్చసం కులే।
య ఏతమ్ ఏవ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే
బస్తిస్త్వ ఏష ఆత్మన ఇతి।
అన్నమును సమృద్ధిగా పొందగలరు. అంతా ప్రియంగా ఉండగలదు. బ్రహ్మవర్చస్సు పొందగలరు. మీ కులము (వంశము) లోని వారు ఆహారము, బ్రహ్మవర్చస్సు చక్కగా పొందగలరు.
అయితే అట్టి జలమును ఉపాసించటమనేది వైశ్వానరాత్మయొక్క మూత్రాశయ - అంశము ఉపాసించటము వంటిది.
హ ఉవాచ
బస్తిస్తే వ్యభేత్స్యత్ యత్ మాం న ఆగమిష్య। ఇతి।।
మీరు నా వద్దకు వచ్చి ఉండకపోతే మూత్రాశయము పగిలి ఉండేదే

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే షోడశః ఖండః


5–17. పంచమ ప్రపాఠకః - సప్తదశ ఖండము - భూమి వైశ్వానరోపాసన

1. అథ హ ఉవాచ ఉద్దాలకం ఆరుణిం :
గౌతమ। కం త్వమ్ ఆత్మానం
ఉపాస్స? - ఇతి
‘‘పృథివీమ్’’ ఏవ, భగవో రాజన్।’’ - ఇతి।

అశ్వపతి మహారాజు : అరుణిమహర్షి పౌత్రులు, పూజ్యులగు ఆరుణి మునీంద్రులవారి కుమారుడు అగు ఓ ఉద్దాలక మహర్షీ! గౌతమా? మీరు ఆత్మను ఏ ఉపాయంగా - రూపంగా ఉపాసిస్తున్నారు?
ఉద్దాలకుడు : ఈ భూమియే ఆత్మస్వరూపము - అని వైశ్వానరోపాసన చేస్తూ ఉన్నాను, భగవాన్! రాజన్!

హ ఉవాచ :
ఏష వై ప్రతిష్ఠా ఆత్మా వైశ్వానరో యమ్ త్వమ్
ఆత్మానం ఉపాస్సే, తస్మాత్ త్వం
ప్రతిష్ఠితో-సి ప్రజయా చ, పశుభిః చ।।
అశ్వపతి మహారాజు : మీరు వైశ్వానరోపాసనగా భూమిని ఆత్మస్వరూపంగా భావించి ఉపాసించటము మంచిదే. అది ‘ప్రతిష్ఠా’ అనబడుచున్న వైశ్వానరాత్మోపాసన.
ఈ ఉపాసనచేత మీరు ప్రజా - పశు సంపదచే ‘‘ప్రతిష్ఠ’’ కలిగి ఉంటారు.
2. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి। అస్య బ్రహ్మవర్చసం కులే య
ఏతమేవమ్ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే,
పాదౌ త్వేతావా ఆత్మన ఇతి।
హ ఉవాచ :
పాదౌ తే వ్యమ్లాస్యేతాం
యత్ మాం న ఆగమిష్య - ఇతి।।
ఉత్తమమైన ‘అన్నము’ (ఇంద్రియములకు ఆహారము) పొందుచూ ప్రీతిని పొందుచూ ఉంటారు. మా వంశంలో బ్రహ్మవర్చస్సు వేంచేసినదై ఉండగలదు.
ఇటువంటి ఉపాసన వైశ్వానరాత్మ యొక్క పాదములను (పాద అంశను మాత్రమే) మీరు ఉపాసిస్తూ ఉన్నట్లు!
నా వద్దకు వచ్చి ఉండకపోతే మీ పాదములు శుష్కించి ఉండేవే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే సప్తదశః ఖండః


5–18. పంచమ ప్రపాఠకః - అష్టాదశ ఖండము - పూర్ణ వైశ్వానరాత్మోపాసన

1. తాన్ హ ఉవాచ :
ఏతే వై ఖలు యూయం పృథక్ ఇవ
ఏవం ఆత్మానం వైశ్వానరం విద్వాగ్ం
సో అన్నమత్థ యస్తు।
ఏతమ్ ఏవం ప్రాదేశ మాత్రమ్
అభివిమానమ్ ఆత్మానం
వైశ్వానరం ఉపాస్తే,
వైశ్వానరాత్మోపాసన - ముఖ్య విధానము
అశ్వపతి మహారాజు : [అ ఉద్దాలకుడు మొదలైన వైశ్వానరోపాసన (లేక) ఆత్మోపాసన అధ్యయనం చేయవచ్చిన వారందరితో] :
ఓ ఉద్దాలకుడు మొదలైన మహనీయులారా! మీరంతా కూడా వైశ్వానరాత్మను వేరువేరుగా తెలుసుకొంటూ ఉపాసన చేస్తున్నారు. అన్నమును (ఆహారమును / ఇంద్రియ విషయములను) ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతటితో ‘పరమాత్మను ఉపాసిస్తున్నాను’ - అని తృప్తిపడుచున్నారు. పరమాత్మను ఒక్కచోట మాత్రమే (ప్రాదేశమాత్రుడై) ఉన్నాడనే అభినివేశము (Emotion)తో మాత్రమే ఆరాధన చేస్తున్నారు.

పరమాత్మ ఒక్క రూపంగానో, ఒకచోటనే, పంచ భూతములలో ఒకటి మాత్రమేగానో పరిమితుడు కాదు కదా! కాబట్టి మీది పరిమితమైన ఉపాసనయేగాని పూర్ణాహుతి కాదు.
స సర్వేషు లోకేషు,
సర్వేషు భూతేషు,
సర్వేషు ఆత్మ సు అన్నమత్తి।।
ఆ వైశ్వానరాత్మ భగవానుడు సర్వ లోకములలోను, సర్వ భూతములందు (పంచ భూతములందు) సర్వజీవులందు వేంచేసి, సర్వత్ర ప్రకాశమానులై ఉన్నారు. ఇట్టి ఉపాసన చేయువారు సమస్తము అన్నముగా, స్వానుభూతిగా, స్వస్వరూపముగా ఆస్వాదించగలరు.
2. తస్య హ వా ఏతస్య ఆత్మనో
వైశ్వానరస్య మూర్ధ ఏవ సుతేజాః చక్షుః
విశ్వరూపః ప్రాణః పృథక్ వర్త్మా ఆత్మా
సందేహో బహులో బస్తిః ఏవ రయిః
పృథివి ఏన పాదౌ। ఉర ఏవ
వేదిః। లోమాని బర్హిః।
హృదయం ‘గార్హపత్యో’।
మనో ‘అన్వాహారి’। అపచన
ఆస్యమ్ ‘ఆహవనీయః’।
అట్టి మన స్వస్వరూపుడే అగు వైశ్వానరాత్మ ఎట్టివాడంటే (పరమాత్మ ఎంతటి వాడంటే),
ఆయన మూర్ధమే (శిరస్సే) - తేజోమయమై కనిపిస్తున్న సమస్త సుతేజస్సు. ఆ తేజస్సే ద్యులోకము (స్వర్గలోకము)
ఆయన చక్షువులే! చూపుయే - ఈ సమస్త విశ్వము యొక్క రూపము - ఆదిత్యుడు (All that beeing seen)
ఆయన ప్రాణశక్తియే - ఈ వేరువేరుగా కనిపించే పృథక్ (multiple) వర్తనమంతా - వాయువు (The vapour and its Air waves)
ఆయన శరీరమధ్యభాగమే - ఈ విస్తారము, సువిశాలము అగు ‘‘ఆకాశము’’ (Total Space) ఆయన మూత్రాశయమే - ఈ సమస్త జలము (All Liquid)
ఆయన యొక్క పాదములే - ఈ సమస్తమైన పృథివి (All that is solid)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే అష్టాదశః ఖండః


5–19. పంచమ ప్రపాఠకః - ఏకోనవింశ ఖండము - ప్రాణాయ స్వాహా

1. తద్యత్ భక్తం ప్రథమమ్
ఆగచ్ఛేత్ తత్ హోమీయం
స యాం ప్రథమామ్
ఆహుతిం జుహుయాత్తాం
జుహుయాత్ ‘‘ప్రాణాయ స్వాహా’’ - ఇతి
ప్రాణః తృప్యతి।
ప్రాణ - ఆహుతులు
(1) ప్రథమ ఆహుతి - ‘‘ప్రాణాయస్వాహా’’
(మొదటి హోమము)
(భోజన కాలములో) ఏది మొదటగా లభిస్తుందో - అది ప్రథమ హోమ సమర్పణగా
‘‘ప్రాణాయ స్వాహా’’ అని హోమద్రవ్యముగా భావనచేసి వైశ్వానరాగ్నికి (లేక) వైశ్వానరాత్మకు సమర్పించాలి.
అప్పుడు ‘‘ప్రాణము’’ తృప్తి పొందగలదు.
2. ప్రాణే తృప్యతి - చక్షుః తృప్యతి।।
చక్షుషి తృప్యతి
ఆదిత్యః తృప్యతి।
ఆదిత్యే తృప్యతి।
ద్యౌః తృప్యతి।
దివి తృప్యంత్యాం।
ఎప్పుడైతే ‘‘పంచప్రాణములలో మొదటిదైనట్టి వైశ్వానర తేజో ప్రథమరూపమగు ప్రాణము తృప్తి చెందుతుందో
- నేత్రేంద్రియములు తృప్తి చెందుతాయి.
- నేత్రేంద్రియ తృప్తిచే ‘ఆదిత్యుడు’ తృప్తి చెందుతారు.
- ఆదిత్యతృప్తిచే దేవతా లోకము (ద్యులోకము) తృప్తి చెందగలదు.
- ద్యులోక తృప్తిచే దివి (ఊర్ధ్వమంతా) తృప్తి పొందగలదు.
యత్ కిం చ ద్యౌః చ
ఆదిత్యః చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
ఏది ద్యులోకము (దివ్య తత్త్వముల)చే, ఆదిత్యునిచే అధితిష్ఠితము (occupied) అయి ఉన్నదో - అట్టి సమస్తము తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అప్పుడు సర్వ అసంతృప్తులు తొలగిపోయినవై తృప్తిచేత తృప్తిపొందగలము. ఇట్టి ‘‘ప్రాణాయస్వాహా’’ అంటూ మొదట లభించిన అన్నమును ప్రాణాహుతిగా సమర్పించుటలో అంతరార్థము ఎరిగి, ఆచరించువాడు - ప్రజలు, పశుసంపద, అన్నము సమృద్ధిగా, శ్రేయోదాయకంగా పొందుచూ, బ్రహ్మవర్చస్సుతో ‘‘అహంబ్రహ్మాస్మి’’ అని ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకోనవింశః ఖండః


5–20. పంచమ ప్రపాఠకః - వింశ ఖండము - వ్యానాయ స్వాహా

1. అథ యాం ద్వితీయాం
జుహుయాత్తాం జుహుయాత్
‘వ్యానాయస్వాహా’ ఇతి
వ్యానః తృప్యతి।
(2) ద్వితీయ ఆహుతి - ‘‘వ్యానాయస్వాహా’’
(రెండవ హోమము)
ఇప్పుడు రెండవ ఆహుతిని ‘‘వ్యానాయ స్వాహా’’ అని చెప్పుచూ హోమము చేయాలి. ఈ ద్వితీయ హోమమును సర్వాత్మేశ్వరుడగు వైశ్వానరాత్మ దేవునికి సమర్పించాలి.
2. వ్యానే తృప్యతి - శ్రోత్రం తృప్యతి।
శ్రోత్రే తృప్యతి చంద్రమాః తృప్యతి।
చన్ద్రమసి తృప్యతి దిశః తృప్యంతి।
దిక్షు తృప్త్యంతీషు యత్ కిం చ దిశశ్చ,
చన్ద్రమాశ్చ అధితిష్ఠన్తి, తత్ తృప్యతి।
తస్సాను తృప్తిం తృప్యతి,
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అట్టి ‘‘వ్యానాయ స్వాహా’’ - అంటూ ఆహుతిని హోమము చేయుచుండగా వ్యాన వాయువు తృప్తి చెందగలదు.
వ్యాన వాయు తృప్తిచే - శ్రోత్రేంద్రియము (వినికిడి) తృప్తి చెందగలదు.
తృప్తి పొందిన శ్రోత్రేంద్రియము (చెవి)చే చంద్రుడు తృప్తి చెందగలడు.
చంద్రమసి తృప్తిచే - దిక్కులన్నీ తృప్తి చెందగలవు.
దిక్కుల తృప్తిచే ఈ దిక్కులుకు, చంద్రునికి ఆధారమైయున్న సమస్తము తృప్తి చెందగలదు.
అప్పుడు అసంతృప్తి తొలగి అనుతృప్తి (ఆత్మతృప్తి) తృప్తి పొందగలదు.
అట్టి ‘అపానాయస్వాహా’ రూపమగు రెండవ ఆహుతి హోమ విధానము (తత్త్వము) ఎరిగినవాడు - ప్రజా (మిత్రులు, కుటుంబసభ్యులు), సంపద, పశు సంపద, అన్నము, బ్రహ్మవర్చస్సులతో ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే వింశః ఖండః


5–21. పంచమ ప్రపాఠకః - ఏకవింశ ఖండము - అపానాయ స్వాహా

1. అథ యాం తృతీయాం
‘‘జుహుయాత్తాం జుహుయాత్
అపానాయస్వాహా’’ - ఇతి
అపానః తృప్యతి।
(3) తృతీయ ఆహుతి - ‘‘ఆపానాయస్వాహా’’
(తృతీయ హోమము)
ఆ తరువాత ‘‘అపానాయ స్వాహా’’ అంటూ అపాన ప్రాణమునకు మూడవ ఆహుతి హోమము చేయాలి. అప్పుడు అపాన వాయువు తృప్తిపొందగలదు.
2. అపానే తృప్యతి వాక్ తృప్యతి।
వాచి తృప్యన్త్యామ్ అగ్నిః తృప్యతి।
అగ్నౌ తృప్యతి, పృథివీ తృప్యతి।
అపానవాయు తృప్తిచే ‘వాక్కు’ తృప్తి చెందగలదు.
వాక్ తృప్తిచే - అగ్ని తృప్తి పొందుతుంది.
అగ్ని తృప్తిచే - పృథివి తృప్తి చెందుతుంది.
పృథివ్యాం తృప్యన్త్యాం యత్కిం చ
పృథివీ చ, అగ్నిశ్చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
పృథివీ తృప్తిచే - అట్టి పృథివికి, అగ్నికి అధిష్ఠానము అయినట్టిది (ఆత్మ) తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా, పశుభిః అన్నాత్
ఏన తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।
అట్టి అనుతృప్తి (ఆత్మ తృప్తి)చే తృప్తి సిద్ధించుకొన్నవాడు ప్రజ-పశు-అన్న-బ్రహ్మ తేజస్సులను పొందగలడు

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకవింశః ఖండః


5–22. పంచమ ప్రపాఠకః - ద్వావింశ ఖండము - సమానాయ స్వాహా

1. అథ యాం చతుర్థీం
జుహుయత్తాం జుహుయాత్
‘‘సమానాయ స్వాహా’’ ఇతి
సమానః తృప్యతి।
(4) చతుర్థ ఆహుతి ‘‘సమానాయ స్వాహా’’
(4వ హోమము)
ఇప్పుడిక 4వ ఆహారమును (ఆహుతిని) ‘‘సమానాయ స్వాహా’’ అని చెప్పుచూ సమాన వాయువు కొరకై హోమము చేయాలి.
అప్పుడు సమాన వాయువు తృప్తి చెందగలదు.
2. సమానే తృప్యతి - మనః తృప్యతి।
మనసి తృప్యతి - పర్జన్యః తృప్యతి ।
పర్జన్యే తృప్యతి - విద్యుత్ తృప్యతి।
సమాన ప్రాణము తృప్తి చెందటంచేత - మనస్సు తృప్తి చెందుతుంది.
మనోతృప్తి చేత పర్జన్యుడు (వర్షదేవత) తృప్తి చెందగలరు.
పర్జన్యతృప్తి చేత విద్యుత్ (తేజస్సు / కాంతి) తృప్తి చెందగలదు.
విద్యుతి తృప్యన్త్యాం - యత్కిం చ విద్యుచ్చ
పర్జన్యశ్చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
తస్య అనుతృప్తిం తృప్యతి।
విద్యుత్ తృప్తి చేత - అట్టి పర్జన్యునికి (వర్షమునకు), విద్యుత్తుకు (కాంతికి) అధిష్ఠానము (Root) అయి ఉన్న (అధిష్ఠానమగు) ఆత్మ - తృప్తి చెందగలదు. ‘‘అనుతృప్తి’’ - తృప్తి పొందగలదు.
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అనుతృప్తిచే (అధిష్ఠానము యొక్క తృప్తిచే) - అట్టి హోమము చేయువానికి సత్సంతానము, పశుసంపద, అన్నము, బ్రహ్మతేజస్సు స్వాభావికంగానే లభిస్తాయి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వావింశః ఖండః


5–23. పంచమ ప్రపాఠకః - త్రయోవింశ ఖండము - ఉదానాయ స్వాహా

1. అథ యాం పంచమీం
జుహుయాత్తాం జుహుయాత్
‘‘ఉదానాయ స్వాహా’’ ఇతి
ఉదానః తృప్యతి।
(5) పంచమ ఆహుతి ‘‘ఉదానాయ స్వాహా’’
(5వ హోమము)
ఇప్పుడిక ‘‘ఉదానాయ స్వాహా’’ అను మంత్రము పలుకుచు వైశ్వానరాత్మకు ‘‘ఐదవ ఆహుతి’’ సమర్పించాలి. అప్పుడు ఉదాన ప్రాణము తృప్తిచెందగలదు.
2. ఉదానే తృప్యతి త్వక్ తృప్యతి,
త్వచి తృప్యన్త్యాం వాయుః తృప్యతి।
వాయౌ తృప్యత్య ఆకాశః తృప్యతి।
ఉదానప్రాణ తృప్తిచే - చర్మము తృప్తి చెందగలదు.
చర్మము యొక్క తృప్తిచే - వాయువు తృప్తి పొందుతోంది.
వాయు తృప్తిచే ఆకాశము తృప్తి పొందగలదు.
ఆకాశే తృప్యతి యత్కిం చ వాయుశ్చ,
ఆకాశశ్చ, అధితిష్ఠతః తత్ తృప్యతి।
ఆకాశ తృప్తిచే ఆకాశమునకు, వాయువుకు కూడా అధిష్ఠానము అయినట్టిది (ఆత్మ) తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అప్పుడు అనుతృప్తిరూపంగా సమస్తము తృప్తి చెందగలదు.
అట్టి హోమము చేయువాడు ప్రజలను, పశువులను, అన్నమును సమృద్ధిగా పొందగలడు.
అట్టి పవిత్రమగు అన్నముచే - బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ సంతృప్తుడై ఉండగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే త్రయోవింశః ఖండః


5–24. పంచమ ప్రపాఠకః - చతుర్వింశ ఖండము - వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ ఫలము

1. స య ఇదమ్ అవిద్వాన్
అగ్నిహోత్రం జుహోతి
యథా అంగారాన్ అపోహ్య
భస్మని జుహుయాత్
తాదృక్ తత్ స్యాత్।
అశ్వపతి మహారాజు : ఓ ఉద్దాలకాది మహనీయులారా! మనం వైశ్వానరాత్మ ‘‘పంచప్రాణాహుతులు’’ గురించి చెప్పుకున్నాం కదా! ఇట్టి వైశ్వానరాత్మ విజ్ఞానమును అభ్యసించకుండా అగ్నిహోత్రము చేస్తే యజ్ఞము, యాగము, హోమము మొదలైనవి నిప్పులే లేని బూడిదలో హోమము చేయు విధంగా వ్యర్థమే అవుతుంది.
2. అథ య ఏతత్ ఏవం విద్వాన్
అగ్నిహోత్రం జుహోతి,
తస్య సర్వేషు లోకేషు,
సర్వేషు భూతేషు, సర్వేషు ఆత్మసు హుతం భవతి।
వైశ్వానరాత్మ పంచ ప్రాణాహుతులు ఎరిగి అగ్నిహోత్రము ప్రారంభించి హోమము చేయటంచేత సర్వాలోకములకు, సర్వజీవులకు, సర్వుల ఆత్మకు ఆహుతులు సమర్పించి హోమము చేసిన ప్రయోజనము, హుతము చేసిన ఫలము లభించగలదు.
3. తత్ యథా ఈషీకాతూలమ్ అగ్నౌ
ప్రోతం ప్రదూయేత్
ఏవగ్ం హాస్య సర్వే పాప్మానః ప్రదూయన్తే
య ఏతత్ ఏవం విద్వాన్
అగ్నిహోత్రం జుహోతి।
ఎవ్వరు ‘‘వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ హోమ విధానము’’ పై విధంగా అంతరార్థపూర్వకంగా ఎరిగి, మననం చేస్తూ పంచాహుతులను సమర్పించి, అటుపై యజ్ఞము, క్రతువు, హోమము ప్రారంభిస్తారో వారియొక్క పాపములన్నీ అగ్నిలో వ్రేల్చబడుచున్న ముంజగడ్డి చివరలవలె సలసల కాలి బూడిద అయిపోగలవు. తినే ఆహారమును హోమము చేయు భావనతో భావించువాడు సర్వలోకములందు హుతం చేసిన ప్రయోజనము పొందగలడు.
4. తస్మాదు హ ఏవం విత్ యద్యపి
చణ్డాలాయ ఉచ్ఛిష్టం
ప్రయచ్ఛేత్ ఆత్మని హ
ఏవ అస్య, తత్
వైశ్వానరే హుతం స్యాత్।
ఇతి। తత్ ఏష శ్లోకః।
పంచహోమములు ఎరిగి అగ్నికార్యము, తదితర కార్యక్రమములు నిర్వర్తించువారు ఇతరులను హింసించు స్వభావము గల చండాలునికి తెలిసి కూడా దానము చేసిన పాపము కూడా తొలగగలవు. ముందుగా ‘వైశ్వానరాహుతి’ తెలిసి (మనస్సుతో) నిర్వర్తిస్తూ భుజించువారు, యజ్ఞహోమములు చేయువారివలెనే అన్ని దోషములన్నీ తొలగించుకోగలరు. ఈ విధంగా శ్లోకించబడుతోంది.
5. యథా ఇహ క్షుధితా
బాలా మాతరం పర్యుపాసతే,
ఏవగ్ం సర్వాణి భూతాని
‘అగ్నిహోత్రమ్’ ఉపాసత ఇతి।
‘అగ్నిహోత్రమ్’ ఉపాసత। ఇతి।।
ఆకలిగొన్న పసిబిడ్డలు తల్లిని ‘రావాలి’ అని కోరుకొంటూ తల్లి చుట్టూ చేరి బ్రతిమలాడుతూ ఉపాసిస్తారు చూచారా? ఆ విధంగా యజ్ఞ, యాగ, క్రతు, హోమ సందర్భములలో యజ్ఞకర్త మొదలైన వారంతా అగ్నిహోత్రమును ఉపాసించాలి. ఉపాసించెదరు గాక!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్వింశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది పంచమ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅵ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఆరవ అధ్యాయము

6–1. షష్ఠః ప్రపాఠకః - ప్రథమ ఖండః - సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశం

1. ఓం
శ్వేతకేతుః హ ఆరుణేయ ఆస।
తం హ పితా ఉవాచ :-
శ్వేతకేతో వస బ్రహ్మచర్యమ్।
న వై, సోమ్యా! అస్మత్
కులీనో అననూచ్య
బ్రహ్మబంధుః ఇవ భవతి ఇతి।।
ఓం! అరుణి మహర్షి మనుమడు మరియు ఆరుణిమహర్షి (ఉద్దాలకుని) కుమారుడు - శ్వేతకేతువు.
ఒకరోజు ఉద్దాలకారుణి మహర్షి పంచవర్షములు గల పుత్రునితో ఈ విధంగా సంభాషించారు.
ఉద్దాలకారుణి మహర్షి : బిడ్డా! శ్వేతకేతూ! నీవు మన వంశానుచారములు ఆశ్రయించాలి.
శ్వేతకేతువు : పితృదేవా! ఆజ్ఞాపించండి। ఏమి చేయవలసియున్నది?
ఉద్దాలకుడు : బిడ్డా! సోమ్యా! శ్వేతకేతూ। నీవు సద్గురువును ఆశ్రయించాలి. బ్రహ్మచర్య దీక్షను గ్రహించి వేదవేదాంగములు అధ్యయనము చేయాలి. వేదములను, అందలి శిరోభాగమువంటి ఉపనిషత్తులను అధ్యయనము చేయాలి. మన వంశములో వేదములను, అందలి శిరోభాగమువంటి ఉపనిషత్తులను అధ్యయనము చేసినవారే అందరూ కూడా! అంతేకాని, నామమాత్ర బ్రాహ్మణులు మన వంశంలోఎవరూ లేరు.
2. స హ ద్వాదశ (12) వర్ష ఉపేత్య
చతుర్వింశతి (24) వర్షః
సర్వాన్ వేదాన్ అధీత్య
మహామనా అనూచానమానీ స్తబ్ధ ఏయాయ।
శ్వేతకేతువు 12 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల వయసువరకు (12 సంవత్సరముల కాలము) 4 వేదములు అధ్యయనం చేశారు.
విద్యార్థి దశ పూర్తయినది, ఇంటికి తిరిగి వచ్చారు. తాను విద్య నేర్చుకొని మహా బుద్ధి గలవాడనని తలచుచూ విద్యాగర్వముతో, అభిమానముతో ఉండసాగారు.
తం హ పితా ఉవాచ :-
శ్వేతకేతో! యన్ను సోమ్య! ఇదం మహమనా
అనూచానమానీ స్తబ్ధో? అస్యుత।
తమ్ ఆదేశమ్ అప్రాక్ష్యః।
ఉద్దాలకుడు : కుమారా! సౌమ్య! శ్వేతకేతూ! నీవు అన్నీ తెలుసుకున్నానని, విద్యావంతుడనని, గొప్పవాడివైనావని తలచుచూ, స్తబ్ధుడవై కనిపిస్తున్నావే? మంచిది. అయితే సరే"! మంచిదే! అయితే ఒక ముఖ్య విషయం.
3. యేన అశ్రుతం శ్రుతం భవతి, అమతం మతం
అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి
కథం ను భగవః
స ఆదేశో భవతి - ఇతి?
ఏది లోకంలో వినబడదో అట్టిది విని ఉన్నావా? ఏది అమతమో (లోకాభిప్రాయములచే సిద్ధించదో) అట్టిది (బ్రహ్మజ్ఞానము) సిద్ధించుకున్నావు కదా! ఏది లోక జీవనములో తెలియబడజాలదో అట్టి దాని గురించి తెలుసుకున్నావు కదా? శాస్త్రముల ఆదేశమేమిటో గ్రహించావా?
శ్వేతకేతువు : తండ్రీ! అట్టి ఆదేశము ఏమిటి? ఎటువంటిది? విశదీకరించండి. జ్ఞానము ఏమిటో ఉపదేశించండి.
4. యథా, సోమ్య!
ఏకేన మృత్పిండేన సర్వం
మృణ్మయం విజ్ఞాతం స్యాత్,
‘‘వాచారమ్భణం వికారో నామధేయం,
మృత్తిక ఇతి ఏవ సత్యమ్’’।
ఉద్దాలకారుణి : తత్త్వశాస్త్రము యొక్క, సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశము (The Final Message) ఏమిటో కొన్ని విశేషాలు చెబుతాను విను. ఓ సోమ్య! నీవు, నేను తెలుసుకోవలసిన సత్యము - స్వస్వరూపమునకు అనన్యము అయి ఉండినట్టి బ్రహ్మమే కదా! అంతకుమించి తెలుసుకోవలసినది మరేముంటుంది?
శ్వేతకేతువు : ఏది సత్యము? ఏది కల్పన? ఏది బ్రహ్మము? ఏది అనన్యము? దయతో నాకు చెప్పండి.
ఉద్దాలక మహర్షి : బ్రహ్మము గురించి శాస్త్రముల ఆదేశమేమిటో కొన్ని దృష్టాంతములతో కూర్చి చెప్పుతాను. విను.

ఈ దృశ్య జగత్తు అనేకమంది జీవరాసులతో, అనేక భేదములతో లోకన్యాయంగా అనభవమౌతోంది కదా! అయితే -
మృత్తికా - కుంభ న్యాయము :- అనేక ఆకారములు గల కుండలు ఒకానొకచోట ఉన్నాయి. ఆ కుండల వేరు వేరు ఆకారములు, కుండ మూత, మట్టి బాన….మొదలైనవన్నీ సత్యమా? కాదు. కుండలన్నీ మట్టితో తయారైనాయి కనుక ‘వేరు వరు కుండలు’ అనునది సత్యమా? కాదు. మట్టి మాత్రమే నిత్యము సత్యము. ‘‘కుండ-బాన-మూత’’ - మొదలైనవి మాటవరసవరకే.
మట్టియొక్క అనేక ఆకారములు కల్పించబడినవి మాత్రమే। అట్లాగే అనేక జీవులుగా కనిపిస్తున్నప్పటికీ సమస్తమునకు ‘‘అధిష్ఠానమగు బ్రహ్మము’’ మాత్రమే సత్యము.
5. యథా సోమ్య! ఏకేన లోహ మణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్,
వాచారమ్భణమ్ వికారో నామధేయమ్,
- లోహం ఇతి ఏవ సత్యమ్।

బంగారు ఆభరణ న్యాయము :- బంగారముతో చేయబడిన అనేక ఆభరణములు ఆయా పేర్లతో చెప్పబడుచున్నాయి. (ఉదాహరణకు గాజులు, అరవంకె, ఉంగరము, పాపిడిబిళ్ల మొదలైన ఆయా పేర్లు) బంగారము ఒక్కటేగాని ఆయా అనేకములు అవటం లేదు కదా! ఆ పేర్లన్నీ పేర్లుగా కల్పన మాటవసరకేగాని మొదలే (బంగారము దృష్ట్యా) వేరుకానివే. బంగారము - గాజు వేరు చేసి ఇద్దరికి ఇవ్వగలమా? లేదు. అందుచేత। ‘‘గాజు’’ అనే మాట వాచారంభము. (మాటకేగాని వస్తుతః గాజు బంగారమునకు వేరుగా లేదు. ఆకార వికారమునకు చెప్పే పేరు) అందుచే ‘వికారము’ నకు పెట్టిన పేరు.
ఇనుము లోహమే సత్యము. ఆభరణము, సూది, సుత్తి, పలుగు, గొలుసు - మొదలైనవి సత్యము కాదు. వాచారంభము. వికారో నామధేయము.
6. యథా, సోమ్య। ఏకేన
నఖ నికృంతనేన సర్వం
కార్‌ష్ణాయసం విజ్ఞాతం స్యాత్,
వాచారమ్భణం వికారో నామధేయం
- కృష్ణాయసమ్ ఇతి ఏవ సత్యం!

ఏవం సోమ్య! స ఆదేశో భవతి। ఇతి।।

కొయ్యతో గొప్పదేవతా విగ్రహం ఒక కళాకారుడు తయారు చేశారు. అందరు ఆ దేవతా విగ్రహమును పూజిస్తున్నారు. అట్టి ఆ విగ్రహమునకు నఖ-శిఖ పర్యంతము, పాదములగోళ్లు, పాదములు, పిక్క, మోకాలు, నడుము, భుజములు, పొట్ట, హృదయము, ముఖము, కళ్లు, చెవులు, నుదురు, శిరస్సు, కిరీటము - ఇవన్నీ కొయ్య యందు చెక్కబడ్డాయి. అయితే అక్కడ ఉన్నది ఏకమగు కొయ్య మాత్రమే! మిగతాదంతా వాక్కుచే ఆరంభమై మొత్తమంతా ఆయా వికారములకు పెట్టబడిన కల్పితమగు పేర్లు - మాత్రమే!

7. న వై నూనం భగవన్తః
స ఏతత్ అవేదిషుః
యద్ధ్యేతత్ (యత్ హి ఏతత్) అవేదిష్యన్
కథం మే నా వక్ష్యన్? ఇతి।
భగవాన్। త్వ ఏవ మే
తత్ బ్రవీతు - ఇతి।
తథా సోమ్య! ఇతి హ ఉవాచ।।
శ్వేతకేతు : ‘‘స్వామీ!‘‘బొమ్మలన్నీ మట్టివే। ఆభరణములన్నీ బంగారమే। కొయ్య విగ్రహములోని అవయవములన్నీ కొయ్య మాత్రమే. తదితరంగా భేదంగా పిలువబడేదంతా వాక్కుచే కల్పనగా ఆరంభించబడిన కల్పన. వికారములకు ఈయబడిన పేర్లు మాత్రమే। అక్కడ మట్టి, బంగారము, కొయ్య మాత్రమే సత్యము’’ - అను ఒకానొక పాఠ్యాంశము. శాస్త్రముల ఆదేశము (The order of Learning Text Book) అనేది ఒకానొక కొత్త కోణముగా వింటున్నాను.

నాకు ఈ విషయం భగవంతునితో సమానులు, పూజ్యులు అగు గురువులు బోధించి ఉండలేదు. వారి దృష్టిలో మీరు చెప్పే వివరణ తెలియదేమో! వారు చెప్పందే నాకు తెలియదు కదా! (లేక) ఇతః పూర్వము నేను అర్హుడనై ఉండలేదో! అందుచేత మీరు నాకు వివరించమని ప్రార్థన.

ఉద్దాలకుడు : సోమ్యా! ప్రియకుమారా! చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ప్రథమః ఖండః


6–2. షష్ఠః ప్రపాఠకః - ద్వితీయ ఖండః - జగత్ కూడా సత్ రూపమే!

1. ‘‘సత్’’ ఏవ సోమ్య।
ఇదమ్ అగ్ర ఆసీత్।
ఏకం ఏవ - అద్వితీయం!
తత్ హి ఏక ఆహుః అసత్ ఏవ
ఇదమ్ అగ్ర ఆసీత్।
ఏకమేవ - అద్వితీయం

తస్మాత్ అసతః సత్ జాయతా!

ఉద్దాలకుడు : ఈ దృశ్య మానమగుచున్న జగత్తుకు మునుముందుగా ‘‘నేను ఉన్నాను’’ అను రూపముగల ‘‘సత్’’ మాత్రమే ఉన్నది. నేను ఉన్నాను అనునది ఎవ్వరూ మనకు చెప్పకుండానే మనము స్వానుభవంగా కలిగి ఉంటున్నాము కదా! అప్పుడు అట్టి ‘సత్’ ఏకము అయి ఉన్నది. అనేకముగా కాదు. అద్దానికి (నేను ఉన్నాను - అనుదానికి) ద్వితీయ సైతం ఏదీ లేదు. ఇదియును అర్థం చేసుకో.

అట్టి ఏకము, అద్వితీయము అయి ఉన్న ‘సత్’ యే ‘అసత్’గా కూడా ప్రదర్శనమౌతోంది.

2. కుతస్తు ఖలు, సోమ్య।
ఏవం స్యాత్ ఇతి?
హోవాచ :
కథమ్ అసతః సత్ జాయతే - ఇతి?
సత్త్వ ఏవ, సౌమ్య!
ఇదమ్ అగ్ర ఆసీత్
ఏకమేవ - అద్వితీయమ్।
శ్వేతకేతు : అయితే ఉన్నదానినుండి (సత్ నుండి) లేనిది (అసత్) బయల్వెడలుతోందా? సత్ నుండి అసత్ ఎట్లా జనిస్తోంది?
ఉద్దాలకుడు : ఉన్నదాని నుండి ‘లేనిది’ వెడలటమేమిటి? లేనిది ఉన్నదాని నుండి జనించటమేమిటి?
సౌమ్యా। మొట్టమొదట ‘సత్’ యే ఉన్నది. ఇప్పటికీ ‘సత్’యే ఉన్నది. ఉన్నది ఎప్పటికీ ఉన్నది. లేనిది ఎప్పుడూ లేదు. సత్‌యే (ఉనికియే) సర్వదా ఏకమై, అద్వితీయమై ఉన్నది.
3. తత్ ఐక్షత బహు స్యాం ప్రజాయేయేతి।
తత్ తేజో అసృజత।
తత్ తేజ ఐక్షత
బహు స్యాం ప్రజాయేయేతి।
తత్ అపో అసృజత।
తస్మాత్ యత్ర క్వ చ
శోచతి, స్వేదతే వా పురుషః।
తేజస ఏవ తత్ అధి ఆపో జాయన్తే।
ఆ మొట్టమొదటే ఉన్న సత్ (తత్) - ‘‘నేను అనేకములుగా అగుదునుగాక। బహురూపములు ధరించెదనుగాక।’’ - అని భావించుచున్నది. ఆ సత్ (తత్) ముందుగా తేజస్సు (Enlightenment) ను సృజించుకుంటున్నది.
అట్టి తన నుండి బయల్వెడలిన తేజస్సును ‘‘అనేకముగా అగునుగాక।’’ - అని అనుకుని అట్టి భావననుండి ‘జలము’ను సృజిస్తోంది. అందుచేతనే ఈ పురుషుడు దేనిగురించైనా వేదన (ఆదుర్దా) చెందగానే ముందుగా స్వేదము (చెమట) పుట్టుకొస్తున్నది.
ఆ సమయములో తేజస్సు నుండి జలము ఉత్పన్నమౌతోంది. అందుకే ముఖము తేజోమయమై కనిపిస్తోంది.
4. తా ఆప ఐక్షంత బహ్వ్యః
స్యామ ప్రజాయేమహీతి।
తా అన్నమ్ అసృజన్త।
తస్మాత్ యత్ర క్వ చ
వర్షతి తత్ ఏవ
భూయిష్ఠమ్ ‘అన్నం’ భవతి।
ఆ జలము ‘‘మేము అనేకముగా అయ్యెదము’’ - అని ఈక్షణము (Perceiving, Feelings) చేస్తున్నది.
అనేక రూపములుగా అవసాగుతోంది.
ఆ జలము తన నుండి అన్నమును పుట్టింపజేసుకొంటోంది. (అన్నము = ఆహారము; పంచేంద్రియానుభవములు)
అందుచేతనే - ఎచ్చటైనా ఎప్పుడు ‘వర్షము’ కురిస్తే, అక్కడ జీవులకు అన్నము సమృద్ధిగా అగుచున్నది. ‘పరిపోషణ ధర్మము’ బయల్వెడతలుతోంది.
యద్భ్య ఏవ తదధి
‘అన్నాద్యం’ జాయతే।
జలము అన్నాద్యము (ఆహారము ఉత్పత్తి చేసి ప్రసాదించునదిగా) ఈ సృష్టిలో - అగుచున్నది సృష్టికి ఆహారప్రదాతగా ప్రదర్శనమౌతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ద్వితీయః ఖండః


6–3. షష్ఠః ప్రపాఠకః - తృతీయ ఖండః - సత్‌యే జీవరూపములు

1. తేషాం ఖలు ఏషాం భూతానం
త్రీణి ఏవ బీజాని భవన్తి
అణ్డజం। జీవజమ్। ఉద్భిజమ్ - ఇతి।
సమస్త జీవులు జనిస్తున్న బీజము (Types of source of generation) - మూడు విధములు.
(1) అండజములు : (గ్రుడ్డు నుండి ఉత్పన్నములు, జనితములు, ఉదా।। పక్షులు, పాములు మొదలైనవి).
(2) జీవజములు : దేహంలోంచి, పుట్టేవి. ఉదా।। జరాయుజములగు మానవులు, పశువులు మొదలైనవి.
(3) ఉద్భిజములు : నేలను (పైభాగంలోంచి) చీల్చుకొని పుట్టుచున్నవి. (ఉద్భిద్-స్థావరములు)
[ స్వేదజములు (చెమట నుండి పుట్టేవి), వేడి నుండి పుట్టే ఉష్మకజములు జీవజములని ఇక్కడ మహర్షి ఉద్దేశ్యము ]
2. సేయం దేవత ఐక్షత, హన్త।
అహమ్ ఇమాః త్రిస్రో
దేవతా ‘‘అనేన జీవేన
ఆత్మనా అనుప్రవిశ్య,
నామరూపే - వ్యాకరవాణి’’ - ఇతి।
‘‘కేవల సత్’’ స్వరూపుడగు ఆ ఆత్మ భగవానుడు - ‘‘ఇక నేను అగ్ని - జల - అన్నములనబడే ముగ్గురు దేవతలుగా ప్రవేశించి నామ రూపములను వ్యక్తపరిచెదను గాక।’’- అని తలచుచున్నారు.
3. తాసాం త్రివృతం।
త్రివృతం ఏకైకాం
కరవాణి - ఇతి।
స ఇయం దేవతా ఇమాః తిస్రో దేవతా
అనేన ఏవ జీవేన ఆత్మన
అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్।
ఈ మూడిటిలో ఒక్కొక్క దానిని తిరిగి మిగతా రెండు కలుస్తూ ఆయా సమ్మిళతములు (permutations and combinations) ఏర్పడుచూ ఆత్మదేవునిచే ధారణ పూర్వకంగా స్వయం స్వరూపమై కల్పించబడుతోంది. అట్టి ‘‘తివృత్ x తివృత్ కరణము’’చే అసంఖ్యాక నామరూపములు ఆత్మచే పరికల్పించబడి (ఒక రచయితే తన నవలయందు అనేక పాత్రల స్వభావములను, పరస్పరములను కల్పిస్తున్నట్లుగా) వ్యవహారితమై (Transactionally) విస్తరింపజేయబడుతోంది.
4. తాసాం త్రివృతం। త్రివృతం
ఏకైకామ్ అకరోతి।
యథా తు ఖలు, సోమ్య।
ఇమాః తిస్రో దేవతాః త్రివృత్।
త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి।
తత్ మే (తన్మే) విజానీ హి। ఇతి।।
ఈ విధంగా మొట్టమొదటగా ఉన్న ‘సత్’ దేవత ఏకమే అయి ఉండి 3x3x3గా అనేకముగా అనుకోబడుతోంది. ఓ సౌమ్య! అదంతా - యథాభావం తథా భవతి’’ - గా భావించబడుతోంది. అట్టి తివృత్ భావనచే కల్పనగా అనుభవమగుచున్న ఇంద్రియజగత్ దృశ్యమంతా - మరోకప్పుడు కలలోని దృశ్యము కల తనదైనవాడిలో లయం పొందుచున్నట్లు) - తిరిగి తనయందే తిరోధానము (withdrawal) పొంది అనేకమంతా ఏకమునందు (నాయందే) లయమై ‘తత్’ రూపముగా అగుచున్నది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే తృతీయః ఖండః


6–4. షష్ఠః ప్రపాఠకః - చతుర్థః ఖండః - త్రివృత్‌కరణం - వాచారంభణం వికారో నామధేయం

1. యత్ అగ్నే, ‘‘రోహితం’’
రూపం ‘‘తేజసః’’ తత్ రూపమ్।
యత్ ‘‘శుక్లం’’, తత్ ‘‘అపాం’’।
యత్ ‘‘కృష్ణమ్’’ తత్ ‘‘అన్నస్య’’।
అపాగాత్ అగ్నేః అగ్నిత్వం వాచారంభణం
వికారో నామధేయం।
త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం।
( △ మూడు రేఖలు కలిస్తే త్రిభుజం (Triangle). ఈ ‘3’ రేఖలు తీసి ప్రక్కన పెడితే త్రిభుజము ఎక్కడున్నది?)
అగ్నిరూపం
అగ్నిలో ఎరుపు, తెలుపు, నలుపు కలిసి ఉన్నాయి.
ఎరుపు - తేజోరూపము.
తెలుపు - జలరూపము
నలుపు - అన్నము రూపము (పృథివి)

ఈ రక్తవర్ణము (తేజస్సు), శ్వేతవర్ణము (జలము), నల్లటి రూపము (అన్నము) - ఈ మూడు తొలగించి చూస్తేనో, అగ్నిలో ఈ మూడు (తేజోతత్త్వము, జలతత్త్వము, పృథివీతత్త్వము) ప్రక్కన పెడితే - ‘‘అగ్ని, అగ్నిత్వం’’ అనునవి [‘బంగారపుగాజు’లో గాజు (Bangle) వలె] వాచారంభము - మాటవరుసగా చెప్పుకునేది.

వికారో నామధేయము - ఒక వికారమునకు (త్రిభుజములాగా) చెప్పునది. మూడు (తేజస్సు, జలం, అన్నం) రకములుగా ఉన్నవే సత్యము.
2. యత్ ఆదిత్యస్య రోహితం
రూపం ‘తేజసః’’ తత్ రూపం।
యత్ శుక్లం, తత్ ‘‘అపాం’’।
యత్ కృష్ణం తత్ ‘‘అన్నస్య’’
అపాగాత్ ఆదిత్యాది ఆదిత్యత్వం
వాచారమ్భణం వికారో నామధేయం।
త్రీణి రూపాణి। ఇత్యేవ సత్యం।।
సూర్యబింబము
ఆదిత్యునిలో (సూర్య బింబములో) :
రోహితరూపం (ఎరుపు) - తేజస్సు.
తెల్లటి రూపము - జలము.
నల్లగా ఉన్నది - అన్నము (పృథివి).
ఈ మూడు విడదీసి ఆవలపెట్టి ఇప్పుడు సూర్యబింబమును చూస్తేనో?
ఆదిత్యుడు (సూర్యబింబము అనునది - వాచారంభణం (మాటవరసకు చెప్పుకొనేది మాత్రమే)।
నామధేయం (ఆదిత్యుడు అనునది) వికారమునకు చెప్పుకొనేది (మట్టిబొమ్మలో మట్టికి బొమ్మవలె). త్రిరూపములే సత్యము.
అంతేగాని ‘ఆదిత్యుడు’ - అనునది ఆ మూడిటి (తేజస్సు, జలం, అన్నం) కలయికకు వేరుగా లేదు.
3. యత్ చంద్రమసో ‘‘రోహితం’’
రూపం, ‘తేజసః’ - తత్ రూపం।
యత్ ‘‘శుక్లం’’ తత్ ‘‘అపాం’’।
యత్ ‘‘కృష్ణం’’ తత్ ‘‘అన్నస్య’’।
అపాగాత్ చంద్రాః।
చంద్రత్వం - వాచారమ్భణం
వికారో నామధేయం।
త్రీణి రూపాణి। ఇత్యేవ సత్యం।।
చంద్రమసము (చంద్రబింబము)
‘‘చంద్రబింబము’’ అనే దానిలో
ఎర్రని రూపము - తేజస్సు
తెల్లటి విభాగము - జలము
నలుపు విభాగము - అన్నము (అనుభవమయ్యేదంతా)
వీటిని వదలి (ప్రక్కకు పెట్టి) చూచినప్పుడు? - ‘చంద్రత్వము’ అనబడేది -
వాచారంభణం - మాటకోసం అనుకునేది మాత్రమే।
పేరు - వికారము (ఆకారరహితం)।
పైమూడే సత్యముగాని ‘చంద్రుడు’ అనేది ‘మాటలగారడీ’యే।
4. యత్ విద్యుతో ‘రోహితగ్ం’
రూపం - తేజసః తత్ రూపమ్
యత్ శుక్లం, తత్ ‘‘అపాం’।
యత్ కృష్ణం, తత్ ‘అన్నస్య’।
అపాగాత్ విద్యుతో,
విద్యుత్త్వం - వాచారమ్భణం।
వికారో నామధేయం।
త్రీణి రూపాణి - ఇత్యేవ సత్యం।
విద్యుత్తు - తేజస్సు
విద్యుత్ (తేజస్సు) యొక్క రూపం
విద్యుత్ యొక్క రక్తవర్ణమే - తేజస్సు
తెల్లటి రూపమే - జలము
నల్లటి రూపమే - అన్నము
ఈ మూడు విడదీసి చూస్తేనో? విద్యుత్తులో ‘విద్యుత్తత్త్వము’’ అనేది వాచారంభము (వాక్కు యొక్క కల్పనయే).
అద్దాని నామధేయము (‘విద్యుత్’ అనే శబ్దము) ఒక వికారము వంటిది. ఆ తేజస్సు, జలము, అన్నము కలిస్తేనే విద్యుత్తు. కనుక మూడు రూపములు సత్యము. విద్యుత్తు సత్యము కాదు.
5. ఏతత్ హ స్మ వై తత్
విద్వాంస ఆహుః-
పూర్వే మహాశాలా
మహాశ్రోత్రియా న నో-ద్య
కశ్చన అశ్రుతం
అమతమ్, అవిజ్ఞాతమ్
ఉదాహరిష్యతి - ఇతి।
హ్యేభ్యో విదాంచక్రుః।।
ఓ శ్వేతకేతూ! పూర్వకాలంలో అనేకమంది పూర్వీకలగు మహాగృహస్థులు, మహాశ్రోత్రియులు మనము చెప్పుకొన్న ‘‘తివృత్కరణము’’ను తెలుసుకొనియున్నవారు ఉన్నారు. మన వంశంలో నా పితృదేవులు (అరుణి మునీంద్రులు మొదలైనవారు) శ్రోత్రియులు ఉన్నారు. మీ గురువులు కూడా ఎరిగియే ఉన్నారు. అందుచేత మనము చెప్పుకొన్నది అమితము, అశ్రుతము, అవిజ్ఞాతము కాదు. ఎందుకంటే, ఎందరో మహనీయులు ‘అగ్ని’ ఇత్యాది దృష్టాంతములు ద్వారా సమస్తము తెలుసుకొనియే ఉన్నారు. వారు వచించి ఉన్నారు కూడా।
6. యదు రోహితమ్ ఇవ ఆభూత్
ఇతి ‘తేజసః’ తత్ రూపమ్ - ఇతి।
తత్ విదాంచక్రుః।
యదు ‘శుక్లమ్’ ఇవ
ఆభూత్ ఇతి ‘అపాం’ రూపమితి।
తద్విదామ్ చక్రుః యదు
‘కృష్ణమ్’ ఇవ ఆభూత్
ఇతి అన్నస్య రూపమ్ ఇతి
తద్విదాం చక్రుః।
వారంతా కూడా ఈ ఈ విశేషము తెలుసుకొనియే శాస్త్రీయంగా ఎలుగెత్తి చాటుచున్నారు.
- రోహితము (ఎర్రగా) కనిపించేది తేజోరూపమని.
- ఏది తెల్లవలె కనిపిస్తోంది అది జలము యొక్క రూపమని.
- ఏది శుక్ల (నలుపు) వర్ణంగా కనిపిస్తోందో - అదంతా అన్నము (అనుభవముగా పొందబడు) రూపమని వారు గమనిస్తూ ప్రవచించి ఉన్నారు. వారు సర్వజ్ఞులై ప్రకాశిస్తున్నారు.
7. యత్ విజ్ఞాతమ్ ఇవ ఆభూత్
ఇతి ఏతా సామేవ దేవతానాం
‘సమాస’ ఇతి, తత్ విదాం చక్రుః।
యథా ను ఖలు, సోమ్యే।
మాః త్రిసో దేవతాః
పురుషం ప్రాప్య త్రివృత్।
త్రివృత్ ఏకైకా భవతి
తత్ మే విజానీహి। ఇతి।।
ఈ విధంగా విజ్ఞాతంగా (తెలియబడుచున్న రూపంగా) కనిపిస్తున్నదంతా భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ దేవతా సంయోగము చేతనేనని వారు దర్శించుచున్నారు.
ఓ సోమ్యా। ఏ తేజ - జల - అన్న త్రిదేవతలు పురుషునియందు త్రివృత్ రూపములు కలిగియుండి ఏకము అగుచున్నారో - అది చెప్పుతాను. శ్రద్ధగా శ్రవణం చేసెదవు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే చతుర్థః ఖండః


6–5. షష్ఠః ప్రపాఠకః - పంచమః ఖండః - త్రివృత్ కరణం

1. అన్నమ్ అశితం
త్రేధా విధీయతే।
అన్న - జల - అగ్నుల త్రివిధ పరిణామములు
ఈ జీవుడు అన్నము భుజించిన తరువాత (జఠరాగ్నిచే పచనము అయిన తరువాత) - మూడు విభాగాలుగా ఆ అన్నము విభాగము/ విభజనము పొందుతోంది.
తస్య యః స్థవిష్ఠో ధాతుః,
తత్ పురీషం భవతి।
యో మధ్యమః - తత్ మాగ్ంసం।
(1) అన్నమునకు చెందిన స్థూల భాగము / ధాతు విభాగము - అది మలము రూపంగా బయటకు వెళ్లుచున్నది.
(2) అన్నముయొక్క మధ్యాంశము - రసముగా మారి, ఆ తరువాత మాంస రూపముగా పొందుచున్నది.
యో అణిష్ఠః
తత్ మనః ।
(3) అణుతమమగు సూక్ష్మ అంశము - ఊర్ధ్వముగా (పైవైపుగా) వెళ్లి సూక్ష్మ (హిత) నాడులలో ప్రవేశించి (మనస్సులో ప్రవేశించి, ఆలోచనను వృద్ధిపరుస్తోంది. మనస్సునుండి పంచేంద్రియములు కార్యములను ప్రవర్తిస్తున్నాయి.
2. ఆపః పీతాః త్రేధా విధీయన్తే।
తాసాం -
యః స్థవిష్ఠో ధాతుః
- తత్ మూత్రం భవతి।
యో మధ్యమః - తత్ లోహితం।
యో అణిష్ఠః - స ప్రాణః।।
త్రాగిన నీరు ‘3’ విధములుగా రూపము దాల్చుచున్నది.
(1) జలము యొక్క స్థూలభాగము ధాతు విభాగం - మూత్రముగా అగుచున్నది.
(2) మధ్య భాగము - రక్తముగా అగుచున్నది.
(3) సూక్ష్మ విభాగము - ప్రాణములో ప్రవేశించుచు, శరీరములో ప్రాణముయొక్క ఉత్తేజతకు తోడు అవుతోంది.
3. తేజో అశితం త్రేథా విధీయతే।
తస్య - యః స్థవిష్ఠో
‘‘ధాతుః’’ - తత్ ‘అస్థి’ - భవతి।
యో మధ్యమః - స ‘మజ్జా’।
యో అణిష్ఠః - సా ‘వాక్’।।
తేజస్సు (నేయి మొదలైన) మూడు విధములుగా ప్రవర్తనమానమౌతోంది.
తేజస్సుయొక్క స్థూల - ధాతు విభాగము - ఎముకల రూపము పొందుచూ, శరీరంలో గట్టి తనమును పరిపోషిస్తోంది.
తేజస్సు (వేడిమి) యొక్క మధ్య విభాగము - మజ్జ (ఎముకలలోని నూనె వంటి విభాగముగా అవుతోంది)
తేజస్సుయొక్క సూక్ష్మవిభాగము - వాక్కుగా రూపుదిద్దుకుంటోంది.
4. అన్నమయం హి, సోమ్య!
మన। ఆపోమయః ప్రాణః ।
తేజోమయీ ‘వాక్’ ఇతి।
శ్వేతకేతు : భూయ ఏవ
మామ్, భగవాన్! విజ్ఞాపయతి। ఇతి।
ఆరుణి : తథా। సోమ్య।
ఇతి హ ఉవాచ।।
ఈ మనస్సు - అన్నమయము,
ప్రాణము - జలమయము
వాక్కు - తేజోమయము
(ఈ మూడు విడదీస్తే - ‘శరీరము’ అనే శబ్దము వాచారంభణమ్। వికారో నామధేయమ్।)

శ్వేతకేతువు : గురుదేవా! ఆరుణి మహర్షీ! దయతో మరికొంతగా వివరించి చెప్పండి.
ఆరుణిమహర్షి : నాయనా! శ్వేతకేతూ! సరే"! అట్లాగే వివరించి చెప్పుతాను, విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే పంచమః ఖండః


6–6. షష్ఠః ప్రపాఠకః - షష్ఠః ఖండః - అన్నమే మనస్సు, నీరే ప్రాణము, అగ్నియే వాక్

1. దధ్నః సోమ్య! మథ్యమానస్య
యో అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి, తత్ సర్పిః భవతి।
పెరుగును చిలికినప్పుడు ఆ పెరుగుయొక్క సూక్ష్మభాగము పైకి చేరి మీగడగాను, అదే వెన్న, ఆ తరువాత ‘నేయిగాను అగుచున్నది.
2. ఏవమ్ ఏవ ఖలు, సౌమ్య।
అన్నస్య ఆశ్యమానస్య
యో - అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి - తత్ ‘మనో’ భవతి।
ఓ సోమ్య! అదే విధంగా తిన్న అన్నముయొక్క అత్యంత సూక్ష్మవిభాగము పైకి తేలియాడుచు అదియే ‘మనస్సు’గా రూపుదిద్దుకొనుచున్నది. (అనగా ఇంద్రియములకు విషయములతో ఆలోచనలే ‘మనస్సు’ అగుచున్నది.)
3. అపాగ్ం సోమ్య। పీయమానానాం
యో అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి స ‘ప్రాణో’ భవతి।।
త్రాగబడిన నీరు యొక్క సూక్ష్మభాగము పైకివచ్చి అదియే ‘ప్రాణము’ రూపమును ప్రత్యుత్సాహపరచుచున్నది.
4. తేజసః, సోమ్య! అశ్యమానస్య
యో అణిమా స ఊర్ధ్వః
సముదీషతి సా ‘వాక్’ భవతి।।
స్వీకరించబడిన తేజస్సు యొక్క (అగ్నియొక్క) సూక్ష్మ విభాగము పైకి వచ్చి అదియే ‘వాక్’ అవుతోంది.
5. అన్నమయం హి, సోమ్య!
‘మన’ ఆపోమయః ‘ప్రాణః’।
తేజోమయీ ‘వాక్’ - ఇతి।
ఓ సోమ్యా! శ్వేతకేతూ!
మనస్సు అన్నమయము (అన్నమయం మనః)
☼ ఇంద్రియ విషయానుభవములే మనోరూపముగా అవుతోంది.
☼ ప్రాణములు జలమయము.
☼ వాక్కు తేజోమయము.
శ్వేతకేతువు : భూయ ఏవ, భగవాన్।
విజ్ఞాపయత్వ ఇతి।




శ్రీ ఆరుణి : తథా సోమ్య।
ఇతి హోవాచ।
శ్వేతకేతు : పితృదేవా! సద్గురుదేవా! మీరు చెప్పు పెరుగుయొక్క సూక్ష్మవిభాగం ‘నేయి’ అగుచున్న విధంగా -
తినే అన్నముయొక్క అత్యంత సూక్ష్మవిభాగం ‘‘మనస్సు’’గాను, త్రాగే జలముయొక్క అత్యంత సూక్ష్మవిభాగం - ప్రాణరూపంగాను, తేజస్సు (అగ్ని) యొక్క అత్యంత సూక్ష్మవిభాగం - ‘వాక్కు’గాను అగుచున్నాయనే విషయం నేను ఏమాత్రము ఎరిగి ఉండలేదు. ఇది నాకు విజ్ఞాపనం (To practically learn) ప్రసాదించండి.

ఉద్దాలకుడు : సోమ్యా! శ్వేతకేతూ! నీకు అనుభవమవటానికై ఈ ఈ విషయాలు (For practically experiencing) చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే షష్ఠః ఖండః


6–7. షష్ఠః ప్రపాఠకః - సప్తమః ఖండః - అన్న-జల-తేజస్సు యొక్క సూక్ష్మాంశములు

1. షోడశ కలః సోమ్య!
పురుషః పంచదశాహాని,
మాశీః కామమ్। అపః పిబ।
ఆపోమయః ప్రాణో న పిబతో
విచ్ఛేత్ స యత। ఇతి।।
బిడ్డా! ఈ పురుషుడు భుజించిన అన్నముయొక్క సూక్ష్మతమమైన (సూక్ష్మాతి - సూక్ష్మమైన) అంశము - మనస్సులో శక్తి సంచారము కలిగిస్తోంది.
అన్నము ద్వారా బలము సంతరించుకొన్న మనస్సు - 16 భాగములుగా విభాజ్యము (Divided) అగుచున్నది. అనగా 16 కళలు ప్రదర్శనమై పురుషుడు షోడశకళారూపుడై ప్రదర్శనం అగుచున్నాడు.
అట్టి షోడశ కళలు ఉన్నప్పుడే ఈ పురుషుడు - ద్రష్ట, శ్రోత, మన (మననము), బోద్ధ (బోధింపబడువాడు), కర్త, విజ్ఞాత అగుచూ ఆయా సమస్త కళలు నిర్వర్తించగలడు.

షోడశ కళాపూరుణాడవగు నీవు ఇప్పుడు 15 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు. కానీ జలము మాత్రము కావలసినంత త్రాగుచూ ఉండు. ప్రాణము జలమయము కాబట్టి, జలము త్రాగకపోతే ప్రాణము పోతుంది సుమా!
2. స హ పంచదశాహాని న అశా
అథ హ ఏనమ్ ఉపససాద।
కిం బ్రవీమి, భో ఇతి ఋచః సోమ్య।
యజూంషి సామాని ఇతి।
స హ ఉవాచ : న వై మా
ప్రతిభాన్తి, భో - ఇతి।।
ఆ చెప్పిన విధంగా నీరు మాత్రమే త్రాగుచు 15 రోజులు నిరాహారంగా ఉపవాసము ఉండి, శ్వేతకేతువు 15 రోజుల తరువాత తండ్రిని ఉద్దాలక మహర్షి దర్శనం చేసుకున్నారు.

శ్వేతకేతువు : తండ్రీ! మీరు చెప్పిన విధముగా నీరు మాత్రమే త్రాగుచూ 15 రోజులు ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు?
ఉద్దాలకుడు : సోమ్యా! నీవు 12 సంవత్సరాల కాలం గురుకులంలో వేద పఠనము నేర్చుకొని ఉన్నావు కదా! ఏదీ? ఋక్-యజుః సామవేదములలోని కొన్ని మంత్రములు సశాస్త్రీయంగా స్వరయుక్తంగా చెప్పు.
శ్వేతకేతువు : నాన్న గారూ! అవేమీ ఇప్పుడు నాకు జ్ఞాపకానికి రావటం లేదు. క్షమించాలి.
3. తం హోవాచ : యథా, సోమ్య।
మహతో అభ్యాహితస్య,
ఏకో అంగారః ఖద్యోత
మాత్రః పరిశిష్టః స్యాత్ తేన తతో-పి
న బహు దహేత్ ఏవం
సోమ్య! తే షోడశానాం
కలానామ్ ఏకా కల
అతిశిష్టా స్యాత్ తయై తర్హి వేద
అన్న అనుభవసి
అశాన అథ మే విజ్ఞాస్య, ఇతి।।
ఉద్దాలకుడు : ఎందుకు జ్ఞాపకం రావటంలేదు? ఎందుకో చెపుతాను విను.

ఒకచోట అగ్ని జ్వాజ్వల్యంగా మండుతూ ఉన్నది. ఆ జ్వాజ్వలంగా వెలుగుచున్న అగ్ని క్రమంగా ఆరిపోయి, చివరకు కొద్ది నిప్పురవ్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చిన్న నిప్పురవ్వలు ఒక కట్టెను కాల్చలేవు కదా!

అట్లాగే ఓ సోమ్యా! నీయొక్క (పైన పురుషుని గురించి చెప్పుకొన్న) షోడశ (16) జీవకళలలో ఒక్క జీవకళమాత్రమే మిగిలి ఉండటంచేత నీకు ఇప్పుడు గురుకులంలో నేర్చుకొన్న వేదపాఠములు గుర్తుకు రావటంలేదు.
అందుచేత ఇప్పుడు నీవు అన్నము భుజించు. అన్నీ గుర్తుకు వస్తాయి.
4. స హ అశ అథ హి ఏనమ్ ఉపససాద।
తగ్ం హ యత్ కించ పప్రచ్ఛ
సర్వగ్ం హ ప్రతిపేదే।
శ్వేతకేతువు తృప్తిగా ఆహారము స్వీకరించి మరల ఉద్దాలకమహర్షి వద్దకు వచ్చారు. అప్పుడు ఇక వేదములలో తండ్రిగారు ప్రశ్నిస్తున్నవన్నీ జ్ఞాపకమువచ్చి, ఆతడు తండ్రి కోరిన విధంగా చెప్పగలిగారు.
5. తగ్ం హోవాచ
యథా సోమ్య।
మహతో అభ్యాహితస్య ఏకమ్
అంగారం ఖద్యోత మాత్రమ్ పరిశిష్టం
తం తృణైః ఉపసమాధాయ
ప్రజ్వలయేత్ తేన తతో-పి బహు దహేత్।।

ఉద్దాలకమహర్షి : శ్వేతకేతూ సౌమ్య! ఇప్పుడేమి జరిగింది?
ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని చల్లారిన తరువాత శేషించిన చిన్న నిప్పుకణములపై ఎండుగడ్డిపరకలను వేసినప్పుడు మరల మంటలుగా మారగా, అప్పుడు ఆ అగ్ని అనేక తృణములను కాల్చగలుగుతుంది కదా!

6. ఏవం సోమ్య! తే షోడశానాం
కలానామ్ ఏకా కలా అతిశిష్టాభూత్।
సా అన్నేన ఉపసమాహితా
ప్రాజ్వాలితః య ఏతర్హి వేదాననుభవసి
అన్నమయం హి సోమ్య! మన।
ఆపోమయః - ప్రాణః । తేజోమయీ వాక్।
ఇతి తత్ హ అస్య
విజజ్ఞావితి। విజజ్ఞావితి।।
అట్లాగే, సోమ్య! నీవు ఉపవాసము చేసియున్నప్పుడు చివరికి మిగిలియున్న ఒక్క కళను నీవు అన్నము తినటంచేత ఉపసమాహితము అయి తక్కిన 15 కళలను కూడా వెలిగించగలిగింది. అప్పుడు నీవు మనస్సు ప్రత్యుత్సాహము పొందగా వేద మంగళ శ్లోకములు గుర్తుకు వచ్చి గానం చేయగలుగుచున్నావు.

అన్నము తినగానే మనస్సు ఉత్తేజము పొందసాగుతోంది.
కనుక,
★ మనస్సు - అన్నమయము (తస్మాత్ అన్నమయం మనః)
★ ప్రాణము - ఆపో (జల) మయము
★ తేజస్సు - వాక్‌మయము
అని అర్థము చేసుకొనెదవు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే సప్తమః ఖండః


6–8. షష్ఠః ప్రపాఠకః - అష్టమః ఖండః - సత్‌యే జీవులకు మూలము

1. ఉద్దాలకో హి ఆరుణిః
శ్వేతకేతుం పుత్రం ఉవాచ
‘‘స్వప్నాన్తం మే సోమ్య! విజానీహి ఇతి।


యత్ర ఏతత్ పురుషః
స్వపితి నామ సతా, సోమ్య!
తదా సంపన్నో భవతి।
స్వమపీతో భవతి।
తస్మాత్ ఏనగ్ం స్వపితి, ఇతి ఆచక్షతే
స్వగ్ం హి అపీతో భవతి।।
శ్వేతకేతువు : తండ్రీ! ‘స్వప్నము’ రూపము ఎట్టిది?
ఉద్ధాలకుడు : కుమారా! శ్వేతకేతా!
ఇప్పుడు ఇక నీకు స్వప్నము యొక్క స్వరూపము ఏమిటో వివరిస్తాను. స్వప్న పురుషకారము గురించి విను.

జాగ్రత్‌లో దృశ్యము పొందుచున్నట్టి ఈ పురుషుడు (జీవుడు), అట్టి దృశ్యము యొక్క భౌతికమైన ఇంద్రియములద్వారా - ఆస్వాదనము విరమించి, స్వప్నస్థితిని స్వీకరిస్తున్నాడు.
స్వప్నస్థితిలో (ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పుడు కనిపిస్తూ ఉన్న) భౌతిక జాగ్రత్ జగత్ దృశ్యమునుండి విడివడి ఉంటున్నాడు కాబట్టి - తనయందు తానే ఉనికి పొందుచున్నాడు. అందుచేత ‘‘స్వమపి’’ గా అగుచున్నాడు. అందుచేత ‘స్వపితి’ - స్వం అపీతః - తన స్వరూపము తానే త్రాగువాడు - అగుచున్నాడు. తనయందు తాను ఏకము అగుచున్నాడు.
2. స యథా శకునిః సూత్రేణ
ప్రబద్ధో దిశమ్ దిశమ్ పతిత్వా
అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా
బంధనమేవా ఉపశ్రయత।


ఏవమేవ ఖలు సోమ్య।
తన్మనో దిశం దిశం పతిత్వా,
అన్యత్ర ఆయతనమ్ అలబ్ధ్వా
ప్రాణమేవ ఉపశ్రయతే।

ప్రాణబంధనం హి సోమ్య।
‘మన’ - ఇతి।
ఒక పంజరమునకు ఒక పక్షి యొక్క కాలును బారైన దారము (Long Thread) తో కట్టిన తరువాత, పంజరముయొక్క తలుపులు తీసిబెట్టినప్పటికీ ఆ పక్షి అటు దిక్కు, ఇటు దిక్కు ఎగిరి ఎగిరి, ఎటు వెళ్లలేక తిరిగి పంజరములోనే ప్రవేశిస్తుంది కదా! పంజరమును వదలి ఎటూ దూరంగా వెళ్లలేదు కదా!


ఓ సోమ్యా! అదే విధంగా మనస్సు కూడా ‘ప్రాణము’ అనే దారముతో బంధించబడి ఉన్నది. అందుచేత ఈ మనస్సు అటు - ఇటు తిరిగినా కూడా, బయట ఎక్కడా స్థిరమైన, నిశ్చలమైన ఆశ్రయము దొరకక, తిరిగి ప్రాణమునే ఆశ్రయించునదై ఉంటోంది.

అందుచేత - మనస్సు ‘ప్రాణము’ అనే బంధము కలిగియే ఉంటుంది.
3. అశనా పిపాసే మే, సౌమ్య!
విజానీ హి। ఇతి।

యత్ర ఏతత్ పురుషో
అశిశిషతి నామ ‘ఆప’ ఏవ।
తత్ అశితం నయన్తే
తత్ యథా గోనాయో
అశ్వనాయః, పురుషనాయ
ఇత్యేవం తదప ఆచక్షతే అశనాయ ఇతి।

తత్ర ఏతత్ శుంగమ్
ఉత్పతితగ్ం, సోమ్య! విజానీ హి
న ఇదం అమూలమ్ భవిష్యతి - ఇతి।।
శ్వేతకేతువు : పితృదేవా! ఆకలి - దప్పికలు ఏతీరైనవి?
ఉద్దాలకుడు : ఆకలి దప్పికల గురించి చెప్పుచున్నాను. విను.

ఈ జీవుడు ఆకలి పొందినప్పుడు అట్టివాడు తినుచున్నాడు. జలము చేతనే ఆహారము శరీరములోని అన్ని భాగములలోకి తీసుకొనిపోబడుతోంది. అందుచేత జలమును ‘‘అశితి’’ అని అంటారు. గోవులను తోలుకొని పోవు వానిని ‘గోనాయ’ అని, అశ్వములను తీసుకొనిపోవు వానిని అశ్వనాయ, సేనాపతిని ‘పురుషనాయ’ అంటారు కదా!
అట్లాగే ఆహారరసమును తీసుకొని శరీరములోనికి తీసుకుపోతుంది, కనుక ‘అశనాయ’ అని అంటారు.

ఓ శ్వేతకేతూ! మొక్కకు మూలము (వేరు) లేకుండా అంకురము (మొలక) రాదు కదా!
అట్లాగే, ‘జలము’ చేతనే ఈ శరీరము యొక్క శుంగము (అంకురము) ఉత్పన్నమౌతోంది. అంకురము కార్యరూపముగా శరీరము రూపుదిద్దుకుంటోంది. కనుక మూలము (జలము) లేకుండా ఈ శరీరము ఉండజాలదు.
4. తస్య క్వ మూలం స్యాత్ అన్యత్రాత్
అన్నాత్ ఏవం ఏవ ఖలు సోమ్య!
అన్నేవ శుంగేన ‘‘ఆపో మూలమ్’’
అన్విచ్ఛాత్ అద్భిః సోమ్య!
శుంగేన ‘‘తేజో మూలమ్’’ అన్విచ్ఛ।
తేజసా సోమ్య। శుంగేన
‘సన్మూలమ్’ అన్విచ్ఛ।
సన్మూలాః, సోమ్య! ఇమాః
సర్వాః ప్రజాః ‘సత్’
ఆయతనాః సత్యప్రతిష్ఠాః ।।
జలము కంటే వేరైన మూలము, కారణరూపము ఈ శరీరమునకు మరొకటేమున్నది? లేదు.

అన్నరూపమగు శుంగము (అంకురము) ద్వారా జలరూపమగు మూలము అన్వేషణం చేయి.
జలరూపమగు శుంగము (అంకురము) ద్వారా తేజముయొక్క మూలము అన్వేషించు.
తేజముయొక్క అంకురము (ఉత్పత్తి) ద్వారా ‘సత్తు’ మూలమును గుర్తించు.

ఈ జీవులంతా ‘‘సత్’’యే మూలముగా కలిగియున్నారు.
సమస్త జనులకు ‘సత్తు’ ఆశ్రయము, ఆధారము కూడా।

5. అథ యత్ర ఏతత్ పురుషః
పిపాసతి నామ తేజ ఏవ
తత్ పీతం నయతే, తత్ యథా,
గోనాయో అశ్వనాయః, పురుషనాయ
ఇత్యేవం తత్ ‘తేజ’ ఆచష్ట ఉదన్యేతి।
తత్ర ఏతత్ ఏవ ‘శుంగమ్’
ఉత్పతితం, సోమ్య।
విజానీహి న ఇదం
అమూలమ్ భవిష్యతి।। ఇతి।।
ఇక ఇప్పుడు -
ఈ పురుషుడు దప్పిక (దాహము) పొంది నీరు త్రాగగానే ఆ జలమును తేజస్సు తీసుకొని పోవుచున్నది. అప్పుడు పిపాసతి - అనబడుచున్నాడు.

(గోవులు తోలుకెళ్లువాడు ‘గోనాయ’, అశ్వములను తోలుకెళ్లువాడు ‘అశ్వనాయ’, జనులను గొనిపోవువాడు ‘పురుషనాయ’ అనబడునట్లుగా) తేజస్సు జలమును తీసుకొనిపోవు ధర్మముచే ‘ఉదన్య’ - అనే పేరు కూడా పొందుచున్నది.

జలరూపమగు ‘మూలము’ చేతనే ఈ ‘శరీరము’ రూపమగు అంకురము ఏర్పడుతోంది. మూలము లేకుండా ఏదీ జనించదదు కదా! ఈ శరీరమునకు మూలము జలమే.
6. తస్య క్వ మూలం స్యాత్
అన్యత్ర అద్భ్యో అద్భిః, సోమ్య।
శుంగేన ‘తేజో మూలమ్’ అన్విచ్ఛ।
తేజసా సోమ్య। శుంగేన ‘సన్మూలమ్’ అన్విచ్ఛ।
సన్ములాః సోమ్య! ఇమాః సర్వాః
ప్రజాః ‘సత్’ ఆయతనాః, ‘సత్’ - ప్రతిష్ఠా।
యథా ను ఖలు,
సోమ్య। ఇమాః తిస్రోః దేవతాః
పురుషం ప్రాప్య, త్రివృత్।
త్రివృత్ ఏకైకా భవతి।
తదుక్తం పురుసాత్ ఏవ భవతి।
జలముయొక్క పరిణామమే అయి ఉన్న ఈ శరీరమునకు వేరే మూలమేమున్నది?
జలముయొక్క మూలము ‘తేజస్సు’ను గుర్తించు.
తేజో అంకురమునకు మూలము ‘సత్’ అని గుర్తించు.

ఈ జవులంతా ‘సత్’యే మూలముగా ఆధారముగా కలిగి ఉన్నారు. ‘సత్’యందే సమస్తము ప్రతిష్ఠము (Established) అయి ఉన్నది.

పుత్రా! ఏవిధంగా అయితే (తేజో-జల-అన్నములు)గా తివృత్ - తివృత్ ‘‘3x3’’ = 9 దేవతా పురుషరూపములు అగుచూ, ఏకమగు పరమాత్మగానే (ఆదిపురుషుడుగానే) ఉన్నారో అదివరకు చెప్పియున్నాను.
అస్య, సోమ్య। పురుషస్య ప్రయతో
వాక్-మనసీ సంపద్యతే।
మనః ప్రాణే
ప్రాణః తేజసి
తేజః పరస్యాం - తేవతాయామ్।
ఈ జీవుడు ప్రకృతి సిద్ధదేహము త్యజిస్తున్నప్పుడు -

వాక్కు మనస్సునందు లయిస్తోంది.
మనస్సు ప్రాణమునందు లయిస్తోంది.
ప్రాణము తేజస్సునందు ఏకము అవుతోంది.
తేజస్సు పరమగు ఆత్మయందు లయము పొందుతోంది.

అట్టి పరమాత్మ తత్త్వము సూక్ష్మాతిసూక్ష్మము.
7. స య ఏషో అణిమ ఏతత్
ఆత్మ్యమ్ ఇదం।
సర్వం। తత్ సత్యం।
స ఆత్మా తత్త్వమసి, శ్వేతకేతో। ఇతి।
ఈ విధంగా ఈ కనబడే సర్వము ఆత్మయే। అట్టి ఆత్మయే సత్యము.

ఓ శ్వేతకేతూ। ఆ ‘ఆత్మ’ అనబడేది ‘నీవే’ అయి ఉన్నావు.
శ్వేతకేతువు : భూయ ఏవ మా, భగవాన్।
విజ్ఞాపయతి - ఇతి।

ఉద్దాలకుడు : తథా, సోమ్య! ఇతి - హోవాచ।
శ్వేతకేతువు : హే భగవాన్! మీరు నాకు చెప్పుచున్న ‘తత్త్వమసి’ అనే విషయము (లేక) మహావాక్యము నాయొక్క సునిశ్చిత, అనునిత్య, అప్రతిహత, నిస్సందేహ స్వానుభవము కొరకై మరింతగా బోధించమని అర్థిస్తున్నాను.
ఉద్దాలక మహర్షి : బిడ్డా। సరే। చెపుతాను విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే అష్టమః ఖండః


6–9. షష్ఠః ప్రపాఠకః - నవమః ఖండః - తత్త్వమసి!

ఆరుణి :
1. యథా, సోమ్య।
మధు మధుకృతో నిస్తిష్ఠన్తి,
నానాత్యయానాం వృక్షాణాం
రసాన్ సమవహారమ్
ఏకతాం రసం గమయన్తి।
ఉద్ధాలకుడు : కుమారా! సమస్తము పరమాత్మయొక్క స్వయం ప్రదర్శనా చమత్కారమే - అని మనం సుస్పష్టం చేసుకోవటానికి దృష్టాంతాలు కొన్ని చెపుతాను విను.
కొన్ని తేనెటీగలు - అనేక వృక్షాల పూలమొక్కలను సమీపించి పూవులపై వ్రాలి, రసమును గ్రహించి, తేనెపట్టులో తేనెను తయారుచేసి ఉంచుతున్నాయి. ఏ తేనె బొట్టు ఏ వృక్షం నుండి లభించిందో తెలుసుకోగలమా? లేదు కదా! తేనె అంతా ఒకటే అయి ఉన్నది కదా!
2. తే తథా తత్ర స వివేకం
లభన్తే ‘అముష్య అహం’
వృక్షస్య రసో2స్మి అముష్యాహం
‘వృక్షస్య రసో అస్మి।’
ఇతి ఏవ ఖలు।
ఆ తేనె బొట్టుకు - ‘‘నేను ఈ వృక్షం నుండి వచ్చాను. ఆ వృక్షం నుండి వచ్చాను’’ - అనేది ఏమాత్రము తెలియటము లేదు కదా।
ఆరుణి:
సోమ్య। ఇమాః సర్వాః ప్రజాః
సతి సంపద్య న విదుః ‘సతి-
సంపద్యామ్ అహమ్’’ ఇతి।।
అదే విధంగా ఈ జీవులంతా కూడా ‘సత్తు’ నుండి బయలుదేరి ‘సత్’ నే పొందుచూ కూడా, ‘సత్’ గురించి ‘మేము సత్తును సర్వదా పొందియే ఉంటూ, సత్ స్వరూపమే అయి ఉన్నాను’’ - అనునది దృష్టిలో లేకయే ఉంటున్నారు.
3. త ఇహ వ్యాఘ్రో వా,
సింహో వా, వృకో వా, వరాహో వా,
కీటో వా, పతంగో వా,
దంశో వా, మశకో వా
యద్యత్ భవన్తి, తదా భవన్తి।।
‘సత్’యే సమస్తము అయి ఉండి కూడా, అట్టి కేవలమగు సత్స్వరూపదేవత ఎప్పుడు ఎట్లా అవాలని భావిస్తుందో - అట్లాగే పులిగానో, సింహముగానో, తోడేలుగానో, పందిగానో, కీటకముగానో శీతాకోక చిలుకగానో, అడవి ఈగగానో, దోమగానో అగుచున్నది. తన కల్పనయందు తానే ప్రవేశించి తాను కల్పించుకొన్న రూపములను తానే నిరాటంకముగా ధారణ చేస్తున్నది. అయితే తన సత్ స్వరూపము వీడకయే ఉన్నది.
4. స య ఏషో ‘అణిమ’
ఏతత్ ‘ఆత్మ్యమ్’ ఇదం సర్వం।
తత్ సత్యగ్ం। స ఆత్మా।
తత్త్వమసి, శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్।
విజ్ఞాపయతు। ఇతి।
ఆరుణి :
తథా సోమ్యా!
ఇతి హో వాచ।।
ఒక అణువు దగ్గరి నుండి ఏదేది ఉన్నదిగా కనిపిస్తూ అనిపిస్తూ ఉన్నదో - అట్టి సమస్తము ఆత్మయే ‘‘ఇన్ని రూపములుగా అగుచూ ఉన్నది. సర్వదా సమస్తము తానే అగుచున్న ఆత్మమాత్రమే సత్యము. తదితరమైనదంతా కల్పన.

ఓ శ్వేతకేతూ! ఇంకొక ముఖ్యమైన, అసలైన సత్యము విను.
పరమసత్యమగు, ఈ సమస్తము తానే అయి ఉంటున్న దానినే ‘ఆత్మ’ అంటున్నారు. ఆత్మయే సత్యము. అంతేకాదు అట్టి ‘ఆత్మ’ నీవే అయి ఉన్నావు. ఇదియే వేదవాక్కు। తత్త్వజ్ఞానము. ఉపనిషత్ వాణి।

శ్వేతకేతువు : అట్టి నేనే అయి ఉన్న పరమసత్యమగు పరమాత్మ గురించి ఇంకా వినాలని ఉన్నది. స్వామి! పితృదేవా! ఇంకా వివరించి చెప్పండి!
ఉద్దాలకుడు : సరే! మరికొంతగా సత్యము, ఆత్మ అయి ఉన్న దాని గురించి చెప్పుకుందాము. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే నవమః ఖండః


6–10. షష్ఠః ప్రపాఠకః - దశమః ఖండః - ఆత్మతత్త్వము - నది దృష్టాంతము

ఆరుణి :
1. ఇమాః సోమ్య! నద్యః పురస్తాత్
ప్రాచ్యః స్యందన్తే।
పశ్చాత్ ప్రతీచ్యస్తాః సముద్రాత్
సముద్రం ఏవ అపియన్తి
స సముద్ర ఏవ భవతి,
తా యథా తత్ర న విదుః,
‘‘ఇయమ్ అహమస్మి।
ఇయమ్ అహమస్మి’’ ఇతి।
ఉద్ధాలకుడు : సోమ్యా! శ్వేతకేతు! మరొక దృష్టాంతం సహాయంతో సత్యమగు ఆత్మగురించిన మరికొంత విశేషము చెప్పుకుందాము.

నదులు చూడు। కొన్ని తూర్పుగా ప్రవహించి, అలా అలా సముద్రంలో జేరుచున్నాయి. మరికొన్ని పడమరదిక్కుగా ప్రవహించి సముద్రంలో జేరుచున్నాయి.
సముద్రంలో నదుల జలము ప్రవేశించిన తరువాత ‘‘నేను ఈ నదీ జలమును। ఆ పేరుగల నదీజలము అనేది ఏమైనా తెలుస్తోందా? లేనే లేదు కదా! సముద్ర జలంలో ఏ జలం ఏ నది నుండి వచ్చిందనే గుర్తింపు ఏమున్నది?
2. ఏవం ఏవ ఖలు సోమ్య!
ఇమాః సర్వాః ప్రజాః,
సత-ఆగమ్య (ఆగత్య) న విదుః
సత ఆగచ్ఛామ్ అహమ్ ఇతి।
త ఇహ వ్యాఘ్రో వా
సింహో వా, వృకో వా, కీటో వా,
పతంగో వా, దగ్ంశో వా,
మరకో వా - యద్యత్ భవన్తి,
తదా భవన్తి।
అట్లాగే ఈ జీవులంతా ‘సత్’ నుండీ బయలుదేరి ప్రదర్శనమగుచూ కూడా - ‘నేను సర్వత్రా సమస్వరూపమై, సమస్తము అయి ఉన్న ‘సత్త’ నుండే వచ్చాను’’ - అనునది లోకదృష్టిగా తెలియనట్లే అయి ఉంటోంది.

సత్ నుండే బయలుదేరి సత్ స్వరూపుడే సర్వదా అయి ఉండి కూడా - ఈ జీవుడు ఇక్కడ దృశ్యములో పులిగానో, సింహముగానో, తోడేలుగానో, కీటకము (చీమ) గానో, పతంగము (ఎగిరే తేనెటీగ) గానో, అడవి ఈగగానో ఏది అవాలనుకొంటే అదిగా అగుచూ ‘సత్’ యందు భావనగా సంచారములు పొందుచున్నారు.
3. స య ఏషో అణిమా
ఏతత్ ‘‘ఆత్మ్యమ్
ఇదమ్ సర్వమ్’’।
తత్ సత్యమ్। స ఆత్మా।
తత్ త్వమ్ అసి, శ్వేతకేతో। ఇతి।।
శ్వేతకేతువు : ‘‘భూయ ఏవ మా
భగవాన్। విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా ‘సోమ్య!’
ఇతి హో వాచ।।
అట్టి అతి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మయే ఈ సర్వముగా అయి ఉంటోంది. అదియే సత్యము। ఏది సత్యామో అదియే సత్। ఏది సత్‌యో అదియే ఆత్మ। ఏది ఆత్మయో అదియే నీవు। నిత్యము అయి ఉన్నావు.

శ్వేతకేతువు : ఈ సమస్తము ఆత్మయే అయి, అట్టి ఆత్మయే నేనై ఉన్న సత్యము (సత్) గురించి ఇంకా వినాలని ఉంది. ఓ గురుదేవా! పితృదేవా! మరికొంత వివరిస్తూ, వర్ణించి చెప్పండి.
ఉద్దాలకుడు : ఇంకా కూడా చెప్పుకుందాము విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే దశమః ఖండః


6–11. షష్ఠః ప్రపాఠకః - ఏకాదశః ఖండః - ఆత్మతత్త్వము - వృక్ష దృష్టాంతము

ఆరుణి :
1. అస్య, సోమ్య! మహతో వృక్షస్య
యో ‘మూలే’’ అభ్యాహన్యాత్ జీవన్।
స్రవేద్యో ‘‘మధ్యే’’ అభ్యాహన్యాత్ జీవన్।
స్రవేద్యో ‘‘అగ్రే’’ అభ్యాహన్నాత్ జీవన్।
స్రవేత్స ఏష జీవేన ‘‘ఆత్మన’’ అను ప్రభూతః
పేపీయమానో, మోదమానః తిష్ఠతి।।
ఉద్దాలకుడు : ఒక మహావృక్షము యొక్క ఒక కొమ్మను ఖండిస్తే, అది రసము స్రవిస్తూ, మిగిలిన కొమ్మలు, వృక్షము జీవిస్తూనే ఉంటుంది. మధ్యభాగముగాని, అగ్రభాగముగాని ఖండించినా కూడా, మిగిలిన భాగము జీవిస్తూ, రసము స్రవిస్తూ ఉంటుంది. వృక్షము జీవిస్తూనే, జీవాత్మత్వము కొనసాగుతూ జలపానము చేస్తూ ప్రమోదము, ఆనందము కొనసాగిస్తూ, వృద్ధిని కలిగియే ఉంటోంది.
2. అస్య యత్ ఏకాగ్ం శాఖాం జోవో జహాతి।
అథ సా శుష్యతి।
ద్వితీయాం జహాత్।
అథ సా శుష్యతి।
తృతీయం జహాతి। అథ సా శుష్యతి।
సర్వం జహాతి। సర్వః శుష్యతి।
ఏవం ఏవ ఖలు సోమ్య।
విద్ధి। ఇతి హోవాచ।।
వృక్షజీవుడు వృక్షముయొక్క శాఖను వీడినప్పుడు - ఆ శాఖ శుష్కించి పోవుచున్నది. జీవత్వముచే వృక్షజీవుడు రెండవ శాఖను కొనసాగింప జేయుచున్నాడు. అది విడిస్తే, మూడవశాఖను కూడా విడిస్తే ఆ మూడవ శాఖ శుష్కిస్తూ ఉన్నాయి. మొత్తము వృక్షమును వృక్షజీవుడు త్యజించినప్పుడు వృక్షమంతా శుష్కిస్తోంది. అట్టి జీవరసమే ఆత్మతత్త్వము అను గమనించు.
3. జీవాపేతం వావ కిల
ఇదం మ్రియతే, న జీవో మ్రియత। ఇతి।
స య ఏషో అణిమై
తదాత్మ్యమ్ ఇదగ్ం సర్వం।
తత్ సత్యగ్ం। స ఆత్మా।
తత్ త్వమ్ అసి
శ్వేతకేతో! ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్।
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా। సోమ్య।
ఇతి హో వాచ।
అదేవిధంగా జీవుడు ఈ దేహమును త్యజించినప్పుడు దేహము నశిస్తోంది. కానీ ‘జీవుడు’, ఆతని ‘జీవనము’ ఈ రెండూ నశించటము లేదు. అట్టి జీవుని ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మము. అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ కనబడేదంతా।

అట్టి ఆత్మయే సత్యము। సత్యము నాశనము లేనిది, నిత్యమైనదే ఆత్మ। అట్టి ఆత్మయే నీవై ఉన్నావు.

శ్వేతకేతువు : మహనీయా! సంతోషము, ఇంకా కూడా వివరించి, నాకు తెలియజేయ ప్రార్థన.
ఉద్దాలకుడు : సరే! సోమ్య! ఇంకొంత వివరిస్తాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ఏకాదశః ఖండః


6–12. షష్ఠః ప్రపాఠకః - ద్వాదశః ఖండః - ఆత్మతత్త్వము - మఱ్ఱిగింజ దృష్టాంతము

ఆరుణి :
1. న్యగ్రోధ ఫలమ్ అత ఆహరేతి।
ఇదమ్ భగవ।
ఇతి భింధీతి।
భిన్నమ్ భగవ - ఇతి।
కిమ్ అత్ర పశ్యసి? ఇతి।
అణ్వ్య ఇవ ఇమే ధానా,
భగవ! ఇత్యాసాం అంగైకాం భింధీతి।
భిన్నా భగవ ఇతి।
కిమ్ అత్ర పశ్యసి? ఇతి।
‘‘న కించన భగవ!’’ …ఇతి।
ఉద్దాలక మహర్షి : నాయనా! శ్వేతకేతూ అదిగో। ఆ మఱ్ఱి చెట్టు ఉన్నది కదా! ఒక మఱ్ఱి పండును ఇట్లా తీసుకురా.
ఉద్దాలక మహర్షి : ఏదీ! ఈ మఱ్ఱిపండును చీల్చు.
శ్వేతకేతువు : భగవాన్। ఇదిగో। చీల్చాను.
ఉద్దాలక మహర్షి : ఇప్పుడు ఇందులో ఏమి కనిపిస్తోంది?
శ్వేతకేతువు : ఇందులో అణువువంటి చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి, భగవాన్।
ఉద్దాలక మహర్షి : ఆ గింజను కూడా పగలగొట్టు.
శ్వేతకేతువు : ఈ చిన్న గింజను కూడా పగలగొట్టాను.
ఉద్దాలకుడు : ఆ చిన్నగింజను పగలగొట్టి చూస్తే ఇంకా నీకేమి కనిపించింది?
శ్వేతకేతువు : భగవాన్! నాకు ఇంక ఏమీ కనిపించటము లేదు.
2. తం హోవాచ (ఆరుణి ఉవాచ) :
యం వై సోమ్య। ఏతమ్ అణిమానం
న నిభాలయస ఏతస్య వై, కిల సోమ్య।
ఏషో అణిమ్న ఏవం
మహాన్ న్యగ్రోధః తిష్ఠతి।।
శ్రద్ధత్స్వ సోమ్య! ఇతి।
ఉద్దాలక మహర్షి : చిన్న గింజను చీల్చితే నీకు ఏదీ కనిపించటము లేదు. అత్యంత సూక్ష్మ భాగమేదో నీకు కనిపించటము లేదు. అట్టి కంటికి ఏ మాత్రము కనిపించిన సూక్ష్మాతి సూక్ష్మభాగమునుండి అనేక శాఖలు, ఫలములు, ఆకులుగల సువిశాలమైన మఱ్ఱి మహావృక్షము పుట్టుకువస్తోంది. మహావృక్షముయొక్క ఆకారములు తదితర వస్తు ధర్మములు అట్టి మఱ్ఱి సూక్ష్మ గింజలోని ఖాళీ స్థానములోనుండి, కాలక్రమంగా అంతటా ప్రదర్శనమౌచున్నాయి.
3. స య ఏషో ‘అణిమ’ ఏతత్
ఆత్మ్యమ్ ఇదమ్ సర్వం
తత్ సత్యం। స ఆత్మా।
తత్ త్వమ్ అసి, శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు : భూయ ఏవ, మా భగవాన్।
విజ్ఞాపయతి ఇతి।
ఆరుణి : తథా సోమ్య ఇతి!
హో వాచ।।
అట్టి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మాకాశ సూక్ష్మ విభాగంలో ఈ సమస్త సువిశాల బ్రహ్మాండమంతా తిష్ఠితమైయుండి, కాలక్రమేణా ప్రదర్శనము అవుతోంది.
ఎట్టి సూక్ష్మాతిసూక్ష్మ విభాగ చమత్కారము నుండి ఈ బ్రహ్మాండాలన్నీ బయల్వెడలుచున్నాయో అదియే - సత్యము (యత్ - సత్)! అదియే ఆత్మ।
ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మయే నీ సత్యస్వరూపము। నీవే అయి ఉన్నావు। ఇది ఆత్మజ్ఞుల, వేదముల నిర్వచన సారము.
శ్వేతకేతువు : భగవాన్! ఇంకా కూడా మీ వద్ద మమానంద స్వాభావికమగు ఆత్మగురించి తెలుసుకోగోరుచున్నాను.
ఉద్దాలక మహర్షి : సరే"! మరికొంతగా చెప్పకుందాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ద్వాదశః ఖండః


6–13. షష్ఠః ప్రపాఠకః - త్రయోదశః ఖండః - ఆత్మతత్త్వము - లవణం దృష్టాంతం

ఆరుణి :
1. లవణమ్ ఏతత్ ఉదకే
అవధాయ అథ మా ప్రాతః
ఉపసీదథా ఇతి।।
స హ తథా చకార
తం హోవాచ : (ఆరుణీ ఉవాచ)
యద్దోషా లవణమ్ ఉదకే
అవాధా (అబాధా) అంగ తత్ ఆహః ఏతి।
తత్ ధావమృశ్య న వివేద
ఉద్ధాలక మహర్షి : ఓ ప్రియ శ్వేతకేతూ! కొంచము ఉప్పు తీసుకురా. ఆ ఉప్పురాళ్ళను నీటిలో వేయి. తెల్లవారిన తరువాత నా దగ్గరకు రా. మాట్లాడుకుందాము.
(అప్పుడు శ్వేతకేతువు ఉప్పును ముంచి నీళ్ళలో వేసారు. ఆ మరునాడు తెల్లవారిన తరువాత ఉదయం తిరిగి పితృదేవుల సమక్షానికి వచ్చారు.)
శ్రీ ఉద్దాలకుడు : శ్వేతకేతూ! రాత్రివేళ నీళ్లల్లో ఉప్పు వేశావు కదా! అదే ఉప్పు ఆ నీళ్లలోనుండి తీసుకునిరా!
నీళ్లలో వెతికినా కూడా ఉప్పు గడ్డలు కనిపించనేలేదు.
శ్వేతకేతు : ఆ ఉప్పుగడ్డలు నీళ్లలో విలీనమై పోయినాయి.
2. యథా విలీనం ఏవ అంగ
అస్య అన్తాత్ ఆచామ్ ఏతి।
కథమ్ ఇతి?
శ్వేతకేతువు : లవణమ్ ఇతి।
ఆరుణి : మధ్యాత్ ఆచామేతి!
కథమితి?
శ్వేతకేతువు : లవణం ఇతి।
ఆరుణి : అంతాత్ ఆచామేతి।
కథమితి?
శ్వేతకేతువు : లవణమ్ ఇతి।
ఆరుణి : అభిప్రాస్యై, తత్ అథమ్
ఉపసీదథా ఇతి।
తద్ధ తథా చకార। తత్ శశ్వత్ సంవర్తతే।
తం హోవాచ (ఆరుణీ ఉవాచ) : అత్ర వావ కిల
‘సత్’ సోమ్య! న నిభాలయసే
అత్రైవ కిల। ఇతి।।
ఉద్దాలక మహర్షి : సరే! ఉప్పు ఏమైనాగానీ, నీళ్లు పైపై రుచి ఎట్లా ఉన్నదో? అది గమనించు.
శ్వేతకేతు : నీరు ఉప్పగా ఉన్నది.
ఉద్దాలకుడు : అడుగున (క్రిందగా) రుచి చూచి చెప్పు.
శ్వేతకేతు : ఉప్పగానే ఉన్నది.
ఉద్దాలకుడు : ఆ నీరు ఆవల పారబోసి నా దగ్గరకురా!
శ్వేతకేతువు ఆ ఉప్పగా ఉన్న నీరు ఆవల పారబోసి తండ్రి దగ్గరకు వచ్చాడు.
ఉద్దాలకుడు : నీవు నీటిలో వేసిన ఉప్పు నీటిలో ఎక్కడ ఉండి ఉన్నది?
శ్వేతకేతు : నీటిలో కలిసిపోయి అంతటా ఉండి ఉన్నది.

ఉద్దాలకుడు : నీటిలో ఉప్పు కలిసిపోయి, ఉప్పు చేతికి దొరకక, రుచిగా మాత్రమే తెలియవచ్చింది చూచావా? అట్లాగే సత్‌రూపమగు బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నప్పటికీ కళ్లకు కనపించటం లేదు. స్థూలమైన ‘‘ప్రత్యక్షము’’ మొదలైన ప్రమాణములకు తెలియరావటం లేదు.
3. స య ఏషో అణిమ ఏతత్ ‘ఆత్మ్యమ్’
ఇదగ్ం సర్వం। తత్ సత్యం।
స ఆత్మా। తత్ త్వమ్ అసి, శ్వేతకేతో । ఇతి।
శ్వేతకేతువు : భూయ ఏవ మా భగవాన్
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా సోమ్య।
ఇతి హోవాచ।।
అట్టి సూక్ష్మమగు ‘సత్’ చేతనే (నీళ్లల్లో కరిగిన ఉప్పువలె) ఈ సమస్తము తదాత్మ్యము కాబడి ఉన్నది. అటి సత్ యే సత్యము.

ఆ సత్యమే ఆత్మ। ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మయే నీవై ఉన్నావు.

శ్వేతకేతు : భగవాన్! అట్టి నా ఆత్మస్వరూపం గురించి ఇంకా కొంత చెప్పండి.
శ్రీ ఉద్దాలక మహర్షి : సరే! ఇంకా చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే త్రయోదశః ఖండః


6–14. షష్ఠః ప్రపాఠకః - చతుర్దశః ఖండః - ఆత్మతత్త్వము - దొంగలచే బంధింపబడినవాని దృష్టాంతము

ఆరుణి :
1. యథా, సోమ్య! పురుషం గాంధారేభ్యో
అభినద్ధ అక్షమానీయ తం తతో
అతిజనే విసృజేత్ స యథా తత్ర ప్రాఙ్‌వోదఙ్ వాధరాఙ్ వా
ప్రత్యన్ వా ప్రధ్మాయీ త
అభినద్ధాక్ష ఆనీతో। అభినద్ధాక్షో విసృష్టః।।
శ్రీ ఉద్ధాలక మహర్షి : ఒకసారి కొందరు దొంగలు గాంధర దేశము నుండి ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి తీసుకొనివచ్చి ఎక్కడో ఒక మహారణ్యంలో విడచి పెట్టి వెళ్లిపోయారు.
అప్పుడు ఆ కీకారణ్యంలో కళ్లు కట్టివేయబడి ‘‘అయ్యా! ఎవ్వరైనా దగ్గరలో ఉన్నారా? నా కనులకు గంతలు కట్టి ఇక్కడ ఎక్కడో పడవేశారు. కనులు కనిపించటం లేదు’’ - అని ఏడవటం ప్రారంభించాడు.
2. తస్య యథా అభినహనం
ప్రముచ్య ప్రబ్రూయాత్ ఏతాం
దిశం గంధారా, ఏతాం దిశం వ్రజేతి।
స గ్రామాత్ గ్రామం పృచ్ఛన్ పండితో
మేధావీ గంధారానేవ ఉపసంపద్యేత్।
ఎవ్వరో బాటసారులు ఆతని కేకలు విన్నారు. కట్లు విప్పి కనులకు గంతలు తొలగించారు. ‘‘ఎటు వెళ్లాలి?’’ అని అడిగి ‘‘ఇదిగో! ఈ దిశగా ఈ బాటగా వెళ్ళండి. మీరు మీ గాంధార దేశం తిరిగి చేరగలరు’’ - అని త్రోవ చూపించారు.
ఆతడు పండితుడు, మేధావి, అవటంచేట త్రోవలో ఆయా బాటసారులను, ఆయా గ్రామ యజమానులను అడుగుచూ, త్రోవ తెలుసుకుంటూ చివరికి గాంధార దేశం చేరాడు. తిరిగి తన ఇంటికి సుఖంగా చేరాడు.
ఏవం ఇవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద
తస్య తావత్ ఏవ చిరం,
యావత్ న విమోక్ష్యే
అథ సంపత్స్య। ఇతి।
అదేవిధంగా సంసారారణ్యంలో కామ - క్రోధ - లోభ - మోహ ఇత్యాది దొంగలు సంసారాంధకారములో పడవేయగా, ఈ జీవుడు తన సంసార బాధలను గమనించి అరచి, శాస్త్రములచే గంతలు తొలగించబడుచున్నాడు. ఆచార్యులవారిని దర్శించి, ప్రయత్నశీలుడై సత్యమును ఎరిగి ముక్తిని సిద్ధించుకొంటున్నాడు.
3. స య ఏషో ‘ఆణిమా’ ఏతత్
‘ఆత్మ్యమ్’ ఇదం సర్వమ్।
తత్ సత్యమ్। స ఆత్మా।
తత్ త్వమసి - శ్వేతకేతో! ఇతి।।
శ్వేతకేతువు :-
భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి।
ఉద్దాలకారుణి:
తథా సోమ్య!
ఇతి - హోవాచ।।
అట్టి సాంసార జీవుడు చేరు స్వస్థానమ్ అతి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మ। అట్టి ఆత్మయే ఈ సమస్తము అయి ఉన్నది. అట్టి ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మయే నీవై ఉన్నావు. ఇదియే వేద హృదయం। ఉపనిషత్ వాణి।

శ్వేతకేతువు : తండ్రీ! భగవాన్! ఇంకా కూడా ఆత్మ గురించి మరికొంత నాకు తెలియజేయండి.
శ్రీఉద్దాలక మహర్షి : బిడ్డా! ఇంకా కూడా చెపుతాను. విను.
(అరుణి పుత్రుడు ఆరుణి ఉద్దాలకుడు అని పేరు. ఆయన కుమారుడు శ్వేతకేతువు).

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే చతుర్దదశః ఖండః


6–15. షష్ఠః ప్రపాఠకః - పంచదశః ఖండః - ఆత్మతత్త్వము - మరణశయ్యపై ఉన్నవాని దృష్టాంతము

ఆరుణి :
1. పురుషం సోమ్య! అత ఉపతాపినం
జ్ఞాతయః పర్యుపాసతే - ‘‘జానాసి
మాం? జానాసి మాం?’’ ఇతి।
తస్య యావత్ న వాక్ - మనసి
సంపద్యతే, మనః ప్రాణే, ప్రాణః తేజసి
తేజః పరస్యాం దేవతాయం
తావత్ జానాతి।।
ఉద్ధాలక మహర్షి : ఒకానొకడు వ్యాధిపీడితుడై మరణశయ్యపై ఉన్నప్పుడు - ఆతని బంధువులు ‘‘ఇదిగో। నన్ను గుర్తుపట్టావా? నేనెవరు? నేనెవరు? ఈతడెవరు?’’ అని అడుగుచూ ఉంటారు. ‘‘నా గుర్తు నీకు ఉన్నదా?’’ అని పలుకరిస్తూ ఉంటారు.
ఆతని వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆవలదగు పరదేవతా స్వరూపమునందు ఏకమవనంతవరకు గుర్తు పడతాడు.
(ఇక ఆతడు ఆ తరువాత ఎవ్వరినీ గుర్తుపట్టడు)
- బంధువు, అయినవాడు మొదలైన గుర్తులు ఆతనికి ఇక ఉండవు.
2. అథ యదా అస్య వాక్ - మనసి
సంపద్యతే, మనః - ప్రాణే,
ప్రాణః తేజసి, తేజః పరస్యాం
దేవతాయామ్ - అథ న జానాతి।।
ఆ తీరుగా వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆత్మయందు లయము పొందుచున్నదో అట్టి ఆత్మ జగద్దృష్టిచే కప్పబడినవి తొలగుచుండగా ఆతడిక బంధువులను గుర్తుపట్టడు.
3. స య ఏషో ‘‘అణిమా’’
ఏతత్ ఆత్మ్యమ్ - ఇదమ్ సర్వం।
తత్ సత్యం। స ఆత్మా।
తత్త్వమసి - శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి :
తథా సౌమ్య। ఇతి
హో వాచ।
అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ సమస్తము. అదియే సత్యము. సత్యమైనదే ఆత్మ. ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. తత్ త్వమ్ అసి।

శ్వేతకేతువు : భగవాన్। ఇంకా కూడా ‘ఆత్మ’ గురించి (అనగా సహజ స్వరూపము గురించి) ఇంకా ఇంకా కూడా బోధించ ప్రార్థన.
ఉద్దాలక మహర్షి : సరే! ఇంకా విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే పంచదశః ఖండః


6–16. షష్ఠః ప్రపాఠకః - షోడశః ఖండః - ఆత్మ విజ్ఞానిని దృశ్యము బంధించలేదు

ఆరుణి (ఉద్దాలకుడు):-
1. పురుషం సోమ్య! ఏత
హస్త గృహీత మానయన్తి
అపహార్షీత్ స్తేయమ్ అకార్షీత్
పరశుమ్ అస్మై తపతి ఏతి।
స యది తస్య కర్తా భవతి,
తత ఏవ అనృతమ్ ఆత్మానం
కురుతే, సో అనృత-అభిసంధో
అనృతేన ఆత్మానమ్ అంతర్ధాయ
పరశుం తప్తం ప్రతిగృహాణాతి,
స దహ్యతే, అథ హన్యతే।।
ఉద్ధాలకుడు : ఒకనిపై దొంగతనము ఆపాదించబడినది. కానీ ఆతడు ‘‘నేను దొంగతనము చేయలేదు’’ - అని చెప్ప ప్రారంభించాడు.

అప్పుడు ఇనుప కడ్డీ కాల్చి ‘‘తాకి-ప్రమాణము చేయి’’ అని ఊరి పెద్దలచే సత్య-అసత్య నిరూపణకై నిర్దేశించబడింది.

ప్రమాణముయొక్క ప్రయోజనంగా →
- దొంగతనము చేసి ఉంటే కాల్చిన ఇనుప కడ్డీ చేతిని కాల్చగలదు.
- దొంగతనము చేయకపోతే చేతిని ఇనుపకడ్డీ కాల్చదు. ఆతడు వెంటనే విడుదల చేయబడతాడు.
2. అథ యది తస్య అకర్తా భవతి,
తత ఏవ ‘సత్యమ్’ ఆత్మానం
కురుతే, స సత్యాభిసంధః
సత్యేన ఆత్మానమ్ అన్తర్ధాయ
పరశుం తప్తం ప్రతిగృహాణాతి
స న దహ్యతే - అథ ముచ్యతే।
అట్లాగే సత్యమగు ఆత్మను ఎరిగి ‘‘ఆత్మయే సత్యము ఆత్మయే నేను’’ - అను ‘సత్యము’ను ధారణ చేయువానిని (కాలిన పలుగు సత్యము చెప్పువాని చేయి కాల్చని తీరుగా) దృశ్యము బంధించలేదు.
3. స యథా తత్ర నాదాహి
ఏత ఏతత్ ఆత్మ్యమ్ ఇదగ్ం
సర్వం। తత్ సత్యగ్ం।
స ఆత్మా। తత్ త్వమసి, శ్వేతకేతో! ఇతి
శ్వేతకేతువు :
తత్ హ అస్య విజజ్ఞావితి, విజజ్ఞావితి।
ఈ సమస్తము ఆత్మయే। ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మను ధారణచేయువాడు అట్టి సత్యము దర్శిస్తాడు. అట్టి ఆత్మయే సత్యము. అదియే నీవు।

శ్వేతకేతువు : మీరు చెప్పిన దృష్టాంతములను మననము చేస్తూ ఉండగా ఆత్మను ఎరుగుచున్నాను. చక్కగా ఆత్మను తెలుసుకుంటున్నాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే షోడశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - షష్ఠ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅶ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఏడవ అధ్యాయము - నారదునకు సనత్కుమారుని ఉపదేశము

7–1. సప్తమ ప్రపాఠకః - ప్రథమ ఖండము - “నామ ఉపాసన”

1. ఓం
అధీహి భగవ। ఇతి
హ ఉపససాద సనత్కుమారం నారదః।
తం హ - ఉవాచ :
(సనత్కుమారౌవాచ:)
యత్ వేత్థ తేనమ్ ఉపసీద।
తతస్త ఊర్ధ్వం వక్ష్యామి ఇతి।

దేవర్షి త్రిలోక సంచారి అగు శ్రీనారదమహర్షి ఒక సందర్భములో సద్గురువు, బ్రహ్మ మానసపుత్రుడు - శ్రీ సనత్కుమారులవారిని సమీపించి తత్త్వము ఉపదేశించమని విన్నవించుకొన్నారు.

సనత్కుమారుడు : మంచిది అయితే ముందుగా మీరు తత్త్వము ఏవిధంగా తెలుసుకొన్నవారై ఉన్నారో అది వివరించండి. ఆ తరువాత నేను తప్పక చెపుతాను.
2. స హ ఉవాచ (నారదౌవాచ) :
ఋగ్వేదం, భగవో। అధ్యేమి।
యజుర్వేదం; సామవేదం ;
అథర్వణం చతర్థం;
ఇతిహాస పురాణం పంచమం;
వేదానాం వేదం, పిత్ర్యం,
రాశిం, దైవం, నిధిం;
వాకోవాక్యమ్ ఏకాయనం
దేవవిద్యాం, బ్రహ్మవిద్యాం;
భూతవిద్యాం, క్షత్రవిద్యాం;
నక్షత్ర విద్యాం, సర్ప దేవ జన
విద్యాం ఏతత్, భగవో। అధ్యేమి।

నారద మహర్షి : గురుదేవా। సనత్కుమారా! భగవాన్! ఋక్ - యజః - సామ - అథర్వణ చతుర్వేదములు, పంచమవేదముగా చెప్పబడే భారతాది పురాణ - ఇతిహాసములు, వేదములకు వేదము అగు వ్యాకరణము, పిత్ర్యము అనబడే శ్రాద్ధ కర్మ విధాన శాస్త్రము, (శ్రాద్ధకల్పము), రాశి (గణితవిద్య), దైవము (ధూమకేతు ఉత్పాతములను చెప్పే ఉత్పాత శాస్త్రము), నిధి (మహాకాలాది కాలశాస్త్రము), వాకోవాకము (తర్కశాస్త్రము - Logic), ఏకాయనము (నీతిశాస్త్రము), దేవవిద్య, నిరుక్తము (పదముల అవయవార్థ వివరణ విద్య), శిక్ష, కల్పము మొదలైన విద్యలు, ఛందస్సు, చితులు మొదలైనవి అంశములుగాగల బ్రహ్మవిద్య, పంచభూతములను వశం చేసుకొనే భూతవిద్య, (ధనుర్వేదము మొదలైన) క్షత్రవిద్య, నక్షత్ర శాస్త్రము, (జ్యోతిషశాస్త్రము), సర్పవిద్య (సర్పశాస్త్రము), దేవజనవిద్య (నృత్యగీతాది లలిత కళలు) - ఇవన్నీ నాకు వచ్చు.
3. సో2హం భగవో మన్త్రవిదే
వా2స్మి। న ఆత్మ విత్।
శ్రుతం హి ‘‘ఏవ మే భగవన్
దృశేభ్యః ‘‘తరతి శోకం ఆత్మవిత్’’ - ఇతి।
సో2హం భగవః శోచామి।

తం మా భగవాన్। శోకస్య
పారం తారయతు - ఇతి।

తం హోవాచ : యత్ వై
కిం చ ఏతత్ అధ్యగీష్ఠా నామ ఏవ ఏతత్।।

ఇవన్నీ తెలుసుకొని నేను మంత్ర వేదుడను అయ్యానేగాని ఆత్మవిత్ (ఆత్మతత్త్వవేత్త) కానేలేదు. ఆత్మవిత్ మాత్రమే సర్వ శోకముల నుండి విడివడగలడని నేను సత్యద్రష్టల వద్ద విని ఉన్నాను. నేను శోకము (worry) తొలగించుకోలేక, శోకము వదలక ఉన్నాను.

భగవాన్। నన్ను శోకము అనే సముద్రము దాటించండి. సంసార సాగరం నుండి కాపాడండి.


శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! ఇప్పటిదాకా మీరు చెప్పినదంతా నామము మాత్రమే.
4. నామ వా ఋగ్వేదో యజుర్వేదః
సామవేద అథర్వణః
చతుర్థ; ఇతిహాస పురాణః పంచమో
వేదనాం వేదః
పిత్ర్యోః, రాశిః
దైవో నిధిః వాకో వ్యాకమ్,
ఏకాయనం దేవవిద్యా
బ్రహ్మవిద్యా భూతవిద్యా
క్షత్రవిద్యా, నక్షత్రవిద్యా
సర్ప దేవ జన విద్యా
నామ ఏవ ఏతత్ నామా ఉపాస్స్వ ఇతి।।

నామోపాసన
అనగా - ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు, పంచమ వేదములనబడే భారతము మొదలైన ఇతిహాస పురాణములు, వేదవేదమనబడే వ్యాకరణము, శ్రాద్ధకల్పము అనబడే పితృదేవోపాసనా శాస్త్రము, గణితము, నిధిజ్ఞానము, తర్కశాస్త్రము, మీమాంస, నీతిశాస్త్రము, నిరుక్తము (శబ్దశాస్త్రము), వేదమంత్రోచ్చారణ అగు వేద విద్య, భూతవిద్య, [ధనుర్వేదము (Medical), జ్యోతిషము, గారడి మొదలైన] క్షేత్రవిద్య, జ్యోతిష్యము (నక్షత్ర విద్య), గారుడము, సంగీతము, నృత్యము మొదలైన కళలు, శిల్పవిద్య ఇవన్నీ నామములే!
నామమాత్ర విద్యలే! భౌతిక విద్యలే! ఈ నామవిద్యను బ్రహ్మముగా ఉపాసించాలి. బ్రహ్మముగా ఉపాసిస్తేనే ప్రయోజనం.
5. స యో నామ బ్రహ్మ ఇతి ఉపాస్తే
యావత్ నామ్నో గతం తత్ర
అస్య యథా కామచారో భవతి
యో ‘‘నామ బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।
నారదుడు :
అస్తి, భగవో! నామ్నో భూయ? - ఇతి।
సనత్కుమారుడు :
నామ్నో వావ భూయో అస్తి ఇతి।
నారదుడు :
తత్ మే, భగవాన్।
బ్రవీతు - ఇతి
అట్టి ‘నామము’ను బ్రహ్మముగా ఉపాసించువాడు, నామ విషయకమగు జ్ఞానమును పొంది - అట్టి ఆత్మ (బ్రహ్మ) జ్ఞానమునందు ఉదయిస్తున్నాడు. పొందుచున్నాడు.
నామము యొక్క వ్యాప్తి ఎంతవరకో గ్రహించి, అంతవరకు వ్యాప్తి కలవాడై సంపూర్ణమైన బ్రాహ్మీ ఫలము పొందుచున్నాడు.

నారద మహర్షి : ‘నామము’ కంటే గొప్పదైనది మరేదైనా ఉంటుందా?
సనత్కుమారుడు : అవును. నామ విద్య కంటే మహత్తరమైన విద్య ఉన్నది.
నారద మహర్షి : అయితే భగవాన్! అట్టి భూరి (ఇంకా గొప్పదైన) విద్య నాకు దయచేసి బోధించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ప్రథమః ఖండః


7–2. సప్తమ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - ‘‘వాక్ ఉపాసన’’

1. వాక్ వావ నామ్నో భూయసీ।
వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి।


యజుర్వేదం, సామవేదం,
అథర్వణం చతుర్థమ్,
ఇతిహాస పురాణం పంచమమ్,
వేదానాం వేదం, పిత్ర్యం,
రాశిం దైవం నిధిం వాకోవాక్యం
ఏకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం
భూతవిద్యాం, క్షత్రవిద్యాం,
నక్షత్ర విద్యాం, సర్ప - దేవ -
జన విద్యాం దివం చ,
వాక్కు నామముకంటే గొప్పది, వాక్కు చేతనే ఈ క్రింది విద్యలన్నీ నిర్మితమైనవి. అట్టి వాక్కును బ్రహ్మముగా ఉపాసించాలి.







వాక్ నిర్మితములు :- చతుర్వేదములు, ఇతిహాస పురాణ పంచమము, వ్యాకరణము, శ్రాద్ధ - కల్ప - గణిత శాస్త్రములు, దైవజ్ఞానము, నిధిశాస్త్రము, తర్కము, నీతిశాస్త్రము, నిరుక్తము, కల్పము, శిక్ష, భూతతంత్ర విద్య, ధనుర్వేదము, జ్యోతిషశాస్త్రము, గారుడివిద్య, ద్యులోకవిద్య, భూతవిద్యా, అస్త్రవిద్య, నక్షత్రవిద్య, సర్ప-దేవ-జన విద్య - ఇవన్నీ వాక్ విద్యలే.
పృథివీం చ, వాయుం చ, ఆకాశం చ ఆపశ్చ
తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ
పశూంశ్చ వయాంసి చ
తృణ - వనస్పతీన్ శ్వాపదా
అన్యా కీట - పతంగ - పిపీలికం,
ధర్మం చ, అధర్మం చ, సత్యం చ,
అనృతం చ, సాధు చ, అసాధు చ
హృదయజ్ఞం చ, అహృదయజ్ఞం చ
యద్వై వాక్జ్ఞా భవిష్యత్।
సమస్తము వాక్కు చేతనే తెలియబడుతోంది.
పంచభూతములైనటువంటి పృథివి, వాయు, ఆకాశ, ఆప (జల) తేజస్సులు; దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు;
తృణములు (గడ్డిపరకలు), వనస్పతులు (వృక్షములు), శ్వాపదములు (పులి మొదలైన హింసక క్రూర జంతువులు), తదితర జంతువులు, కీటకములు, పతంగములు (తుమ్మెదలు), పిపీలికములు (పురుగులు, చీమలు)
ధర్మ - అధర్మములు, సత్య - అసత్యములు, సాధు - అసాధులు మనోజ్ఞ - అమనోజ్ఞము (మనస్సుకు తెలిసేవి, తెలియనివి ఇవన్నీ) వాక్కు లేకపోతే తెలిసేవే కావు.
న ధర్మో న అధర్మో వ్యజ్ఞాపయిష్యత్।
న సత్యం, న అనృతం న సాధు న అసాధు
న హృదయజ్ఞో - న అహృదయజ్ఞో
వాక్ ఏవ ఏతత్ సర్వం విజ్ఞాపయతి
వాచమ్ ఉపాస్స్వ ఇతి।।
వాక్కు కనుక లేకపోతే ఏది ధర్మమో, ఏది కాదో, తెలియజేయు వీలు కాదు.
సత్యమేమో, అసత్యమేమో, ఏది సాధు, ఏది అసాధు - గుర్తు తెలిసేది కాదు. మనోజ్ఞ - అమనోజ్ఞములైనవన్నీ వాక్కు చేతనే గుర్తింపబడుచున్నాయి. అందుచేత వాక్కునే బ్రహ్మముగా ఉపాసించు.
2. స యో వాచం బ్రహ్మేతి ఉపాస్తే
యావత్ వాచో గతం తత్ర అస్య
యథా కామచారో భవతి
యో వాచం బ్రహ్మేతి ఉపాస్తే।
అస్తి భగవో వాచో, భూయ? ఇతి।
వాచో వావ భూయో ‘అస్తి’ ఇతి।
తత్ మే, భగవాన్! బ్రవీతు। ఇతి।
ఎవ్వరైతే ‘వాణి’ లేక వాక్కును బ్రహ్మముగా ఉపాసిస్తారో, వారు వాక్కు విస్తరించి ఉన్నంతవరకు స్వేచ్ఛాగతి (కామగతి - ఇష్టముగా విస్తరించటము)ను సిద్ధించుకోగలరు. వాక్కు వ్యాప్తి అగు స్థానము వరకు యథేచ్ఛగా విహరించగలరు.
నారదమహర్షి : గురుదేవా! భగవాన్! వాక్కు కంటే గొప్పదైనది మరేదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఓ! వాక్కు కంటే ఉన్నతమైనది ఉన్నది.
నారదమహర్షి : భగవాన్! వాక్కుకన్నా భూరి (గొప్పది, విస్తారమైనది) ఏదో దానిగురించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ద్వితీయః ఖండః


7–3. సప్తమ ప్రపాఠకః - తృతీయ ఖండము - ‘‘మనో ఉపాసన’’

సనత్కుమారుడు:
1. ‘మనో’ వావ వాచో భూయో।
యథా వై ద్వే వా ఆమలకే,
ద్వే వా కోలే, ద్వౌ వా అక్షౌ,
ముష్టిః అనుభవతి….
ఏవం వాచం చ నామ చ
‘మనో’ → అనుభవతి।
శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! వాక్కు కంటే కూడా అధికమైనది మనస్సు.

దృష్టాంతపూర్వకంగా చెపుతాను. విను. ఒకడు రెండు ఉసిరిక పండ్లను, (లేక) రెండు వాక్కాయలను, రేగుకాయలను (లేక) రెండు రుద్రాక్షలను గుప్పిటతో (పిడికిలియందు) పెట్టుకొన్నప్పుడు మనస్సునందు - ఆ నామములు, ఆ వాక్కు ఇముడుకొన్నట్లుగా - అనుభవము అవుతోంది.
స యదా మనసా మనస్యతి
మంత్రాన్ అధీయీయేతి,
యథాధీతే కర్మాణి కుర్వీయేతి।
అథ కురుతే పుత్రాగ్ంశ్చ
పశూంశ్చ ఇచ్ఛేయేతి।
యథా ఇచ్ఛత ఇమం చ లోకం
అముంచేత్ ఇచ్ఛేయేత్ యథేచ్ఛతే।

మనో హి ఆత్మా।
మనో హి లోకో।
‘‘మనో హి బ్రహ్మ।’’
మన ఉపాస్స్వ - ఇతి।।
మనస్సుతో ఎప్పుడైతే అనుకుంటాడో
- అప్పుడు ఆతడు మంత్రమును మననము చేస్తాడు. ఉచ్చరిస్తాడు.
- అప్పుడే ఆతడు ఆయా కర్మలు నిర్వర్తిస్తాడు.
- పశువులు, సంతానము మొదలైనవి మనస్సుతో కోరుకొన్నప్పుడే అవన్నీ పొందుతాడు.
- మనస్సుతో కోరనివేవీ పొందనేపొందడు.
- మనస్సుతో ఇహ పరలోకములలో ఎక్కడ యథేచ్ఛగా సంచరించాలని అనుకుంటాడో అక్కడే ఇష్టంగా సంచారములు చేస్తాడు.

అంతేకాదు. మనస్సు ఆత్మ స్వరూపమే!
మనసు యందే లోకము!
మనస్సు ‘బ్రహ్మమే’ కూడా!
అందుచేత మనస్సును బ్రహ్మముగా ఉపాసించెదరు గాక।
2. స యో మనో బ్రహ్మేతి
ఉపాస్తే, యావత్ మనసో
గతం తత్ర అస్య
యథా కామచారో భవతి।
యో ‘‘మనో బ్రహ్మ’’ - ఇతి ఉపాస్తే।।
ఎవ్వరు మనస్సును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారో, - అట్టివారు మనస్సు విస్తరించి ఉన్నంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ప్రియస్వరూపులై ఉండగలరు.
నారదుడు :
అస్తి, భగవో। మనసో
భూయ? ఇతి।
సనత్కుమారుడు :
మనసో వావ భూయో అస్తి ఇతి।
నారదుడు :
తత్ మే భగవాన్
బ్రవీతు - ఇతి।।
శ్రీ నారదులవారు : స్వామీ! మనస్సుకన్నా భూయ (అధికమైనది, ఉన్నతమైనది) ఏదైనా ఉన్నదా?
శ్రీ సనత్కుమారుడు : మనస్సు కన్నా అధికమైనది ఉన్నది.
శ్రీ నారద మహర్షి : భగవాన్! అట్టి మనస్సు కంటే కూడా విస్తారము, పెద్దది ఏదై ఉన్నదో అది వివరించ ప్రార్థన!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే తృతీయః ఖండః


7–4. సప్తమ ప్రపాఠకః - చతుర్థ ఖండము - ‘‘సంకల్ప ఉపాసన’’

సనత్కుమారుడు:
1. సంకల్పో వావ మనసో భూయాన్।
యదా వై సంకల్పయతే, అథ ‘మనసి’।
అతి అథ వాచమ్ ఈరయతి।
తాము నామ్నీరయతి।
నామ్ని మన్త్రా ఏకమ్
భవన్తి - మంత్రేషు కర్మాణి।।
శ్రీ సనత్కుమారుడు : మననరూపమగు మనస్సు కంటే ‘‘సంకల్పము’’ - విస్తారమైనట్టిది. ఎప్పుడైతే ఈ జీవుడు సంకల్పించటానికి ఉపక్రమిస్తాడో - అప్పుడు మనస్సుతో ఆ సంకల్పించిన దానిని కోరుకుంటాడు.
- ఆ మనస్సు వాక్కును ప్రేరేపిస్తోంది.
- వాక్కు నామరూపములను ప్రేరేపిస్తోంది.
అనగా, వాక్కులో నామము చేరియుంటోంది.
నామము మంత్రములో ఏకమగుచున్నది. మంత్రము (మననము) కర్మలలో చేరుచున్నది.
2. తాని హ వా ఏతాని సంకల్ప
ఏకాయనాని, సంకల్పాత్మకాని,
సంకల్పే ప్రతిష్ఠితాని
సమక్లృపతాం ద్యావా - పృథివీ
సంకల్ప ఏతాం।
వాయుశ్చ ఆకాశం చ, సమకల్పంత ఆపశ్చ। తేజశ్చ।


తేషాం సంక్లృప్త్యై వర్షం సంకల్పతే।
వర్షస్య సంక్లృప్త్యా, అన్నగ్ం సంకల్పతే।
అన్నస్య సంక్లృప్త్యై ప్రాణాః సంకల్పన్తే ।
ప్రాణానాం సంక్లృప్త్యై మంత్రాః సంకల్పన్తే ।
మంత్రాణాం సంక్లృప్త్యై కర్మాణి సంకల్పన్తే ।
కర్మాణాం సంక్లృప్త్యై లోకః సంకల్పతే
లోకస్య సంక్లృప్త్యై సర్వం సంకల్పతే।
స ఏష సంకల్పః।

సంకల్పం ఉపాస్య ఇతి।।

మనస్సు, వాక్కు, నామము మొదలైనవన్నీ సంకల్పమునందు, సంకల్పము సంకల్పించుకొని అందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి.
అన్నిటికీ మూలము సంకల్పమే! సమస్తము సంకల్పమునే ఆధారముగా కలిగి ఉన్నాయి. దివ్యలోకము, భూలోకము కూడా సంకల్పమాత్రములే. వాయువు, ఆకాశము కూడా సంకల్పించబడి, ఉనికి పొందినవే. తేజస్సు కూడా సంకల్పము చేతనే ఏర్పడుతోంది.


సూర్యతేజస్సుచే (నీరు ఆవిరి అయి, మేఘములుగా అయి) వర్షముగాను, వర్షమువలన అన్నము, అన్నమువలన కర్మలు, కర్మలవలన (14) లోకములు, ఇవన్నీ కూడా సంకల్పములచేతనే సిద్ధిస్తున్నాయి. లోకములవలన మరల సంకల్పములు కలుగుచున్నాయి.
లోకములు మొదలైనవి, పైన చెప్పుకొన్న సమస్తము సంకల్పముచేతనే కలుగుచున్నాయి.


అంతెందుకు? ఈ ‘సృష్టి’ అంతా సంకల్పము చేతనే సృష్టించబడుతోంది.


అందుచేత ఓ నారదా! నీవు ‘సంకల్పము’ను బ్రహ్మముగా ఉపాసించు.
3. స యః ‘‘సంకల్పం బ్రహ్మ’’
ఇతి ఉపాస్తే, సంక్లృప్తాన్ వై
స లోకాన్ ధృవాన్ ధృవః ప్రతిష్ఠితాన్।
ప్రతిష్ఠితో అవ్యథమానాన్।
అవ్యథమానో అభిసిద్ధ్యతి।
యావత్ సంకల్పస్య గతం
తత్ర అస్య యథా కామచారో
భవతి, యః ‘‘సంకల్పం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।
నారదుడు :
అస్తి భగవః సంకల్పాత్ భూయ? ఇతి।
సనత్కుమారుడు :
సంకల్పాత్ వావ భూయో అస్తి - ఇతి
నారదుడు :
తత్ మే భగవాన్। బ్రవీతు। ఇతి।।
ఎవ్వరైతే ‘‘సంకల్పము బ్రహ్మమే’’ - అని భావించి సంకల్పమును ఉపాసిస్తారో - ఆతను తాను సంకల్పించిన లోకముతో - ధృవముగా ధృవమైన నివాసము పొందగలడు. ప్రతిష్ఠితుడు కాగలడు.
‘సంకల్పము’ను బ్రహ్మముగా దర్శించువాడు - ఎట్టి వ్యథలు లేనివాడై, వ్యథలేని స్థితి స్థానములను ఉత్తమముగా సిద్ధించుకోగలడు. దుఃఖరహితుడు కాగలడు.
‘సంకల్పము’ ఎంతవరకు విస్తరించి ఉండగలదో - అంతవరకు తన ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛగా సంచరించువాడై ఉండగలడు.


నారదమహర్షి : గురుదేవా! సనత్కుమారా? సంకల్పము కంటే కూడా ఇంకా శ్రేష్ఠమైనది, అధికమైనది ఉన్నదా?
సనత్కుమారుడు : అవును. ‘సంకల్పము’ కంటే కూడా పెద్దదైనది, శ్రేష్ఠమైనది - ఉన్నది.
నారదమహర్షి : అట్టి సంకల్పమునకు మించినది, శ్రేష్ఠమైనది ఏమై ఉన్నదో - అది నాకు బోధించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే చతుర్థః ఖండః


7–5. సప్తమ ప్రపాఠకః - పంచమ ఖండము - ‘‘చిత్త ఉపాసన’’

సనత్కుమారుడు:
1. చిత్తం వావ సంకల్పాత్ భూయో।
యదా వై చేతయతే। అథ సంకల్పయతే।
అథ ‘మనస్యతి’ అథ వాచమ్ ఈరయతి।
తాము నామ్నీరయతి।
నామ్ని మంత్రా ఏకం భవన్తి।
మంత్రేషు కర్మాణి।।
సనత్కుమారుడు : చిత్తము సంకల్పము కంటే - శ్రేష్ఠము, అధికము.
ఈ జీవుడు తాను ‘చిత్తము’ను ఉపయోగిస్తూ (చేతనము చేస్తూ) ఉన్నప్పుడే సంకల్పించగలడు.
చిత్తము - ఇష్టము, వాంఛరూపము, చిత్తము ఉన్నప్పుడే - సంకల్పము, మనస్సు, వాక్కు - ప్రేరణము పొందుతాయి.
చిత్తము (ఆసక్తి) యొక్క ప్రవర్తన చేతనే…వాక్కు నామమునందు ప్రేరణ ప్రదర్శించగలదు. నామము - మంత్రము అప్పుడు ఏకము కాగలుగుతాయి. మంత్రము వలన కర్మలు ప్రవర్తమానమగు చున్నాయి.
2. తాని హ వా ఏతాని చిత్త ఏకాయనాని।
చిత్తాత్మని। చిత్తే ప్రతిష్ఠితాని।
నామము, వాక్కు, మనస్సు, సంకల్పము - ఇవన్నీ చిత్తమునందే ఏకత్వము పొందుచున్నాయి. చిత్తమే వాటన్నిటికీ ‘ఆత్మ’. అవన్నీ చిత్తమునందే ప్రతిష్ఠితమై ఉంటున్నాయి.
తస్మాత్ యద్యపి బహువిద చిత్తో భవతి,
‘‘న అయం అస్తి - ఇతి ఏవ ఏనం
ఆహుః యత్ అయం వేద’’,
యద్వా అయం విద్వాన్నేత్థమ
చిత్తః స్యాత్ ఇతి అథ
యది అల్పవిచ్చిత్తవాన్ భవతి।
తస్మా ఏవోత శుశ్రూషన్తే ।
అందుచేతనే - ఒకానొకడు ఎన్నో విషయములు తెలిసికొని ఉన్నవాడు అయినప్పటికీ - అతని చిత్తము ఒక విషయముపై ఏకాగ్రత (concentration) కలిగి ఉండకపోతే, ‘‘ఈతనికి ఈ విషయము ఏమాత్రము తెలియదు. ఈతడే గనుక ఈ విషయం తెలిసి ఉంటే, దీనిపట్ల అజ్ఞుడై ఉంటాడా?’’ - అని జనులు అనుకుంటూ ఉంటారు.
ఆ చిత్తము కొంతమాత్రమే ఏకాగ్రమైతే (If his interest is only partially involved) ఆతడు కొంతమాత్రమే తెలుసుకోగలడు. ఒక విషయముపై ఎవరికి చిత్తము ఏకాగ్రమై ఉంటుందో, వారితోనే జనులు ఆ విషయం సంభాషిస్తారు.
చిత్తం హి ఏవ ఏషామ్ ఏకాయనం।
చిత్తం ఆత్మా।
చిత్తం ప్రతిష్ఠా।
చిత్తం ఉపాస్స్వ ఇతి।
చిత్తమే చివరికి అన్నిటినీ ఏకీయము (united) చేయు ఆశ్రయము.
చిత్తము ఆత్మయే।।
చిత్తమే సమస్తమునకు ప్రతిష్ఠితమైయున్న స్థానము।
అందుచేత ‘‘చిత్తము పరబ్రహ్మమే।’’ అని ఉపాసించెదవు గాక.
3. ‘‘స యత్ చిత్తం బ్రహ్మేతి’’ ఉపాస్తే చిత్తాన్త్వై ।
స లోకాన్ ధృవాన్। ధ్రువః ప్రతిష్ఠితాన్
ప్రతిష్ఠితో - అవ్యథమానా।
అవ్యథమానో - అభిసిద్ధ్యతి।
ఎవ్వరైతే - ‘‘చిత్తము బ్రహ్మమే అయి ఉన్నది’’ - అని చిత్తమును ఉపాసిస్తారో, అట్టివారు దృఢచిత్తులు అగుచున్నారు.
ఆతడు లోకములలో ఎక్కడ ఉంటే అక్కడ ధృవముగా ప్రతిష్ఠితుడు కాగలడు. ఆతని చిత్తము చాంచల్యము త్యజించినదై ఉండగలదు. ఆతడు ఏ వ్యథలు లేనివాడై (Sans all worries) ఎక్కడైనా ప్రతిష్ఠ కలిగి, వ్యథరాహిత్యము సిద్ధించుకొని ఉండగలడు.
యావత్ చిత్తస్య గతం, తత్రాస్య
యథా కామచారో భవతి।
‘యత్ చిత్తం బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।
నారదుడు : అస్తి, భగవన్।
చిత్తాత్ భూయ ఇతి?
సనత్కుమారుడు : చిత్తాత్ వావ భూయో అస్తి - ఇతి।
నారదుడు : భగవాన్! బ్రవీతు - ఇతి।
చిత్తము ఎంతవరకు విస్తరించి ఉండగలదో - అంతవరకు ఆతడు తన ఇచ్ఛానుసారంగా ఉండగలడు. చిత్తము బ్రహ్మముగా ఉపాసించు వాడు బ్రహ్మమే కాగలడు.

శ్రీనారదమహర్షి : గురు రాజన్ ! చిత్తముకంటే శ్రేష్ఠము, ‘బహు’ అయినది మరొకటేదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : చిత్తముకంటే కూడా మహత్తరమైనది ఉన్నది.
శ్రీ నారదుడు : భగవాన్। చిత్తముకంటే కూడా బృహత్తరము ఏదో దాని గురించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే పంచమః ఖండః


7–6. సప్తమ ప్రపాఠకః - షష్ఠ ఖండము - ‘‘ధ్యాన (ధ్యాస) ఉపాసన’’

1. ధ్యానం వావ చిత్తాత్ భూయో।
ధ్యాయతి ఇవ పృథివీ। ధ్యాయతీవ
అంతరిక్షం। ధ్యాయతీవ ద్యౌః। ధ్యాయన్తీవ ఆపో
ధ్యాయన్తీవ పర్వతా।
ధ్యాయన్తీవ దేవమనుష్యాః।
సనత్కుమారుడు : చిత్తము కంటే కూడా ధ్యానము - బహుళము, శ్రేష్ఠము.
పృథివి (భూమి), అన్తరిక్షము (ఆకాశము), ద్యౌః (దేవతాలోకము), జలము, పర్వతములు, దేవతప్తమనుష్యులు - అందరూ ధ్యాస (లేక) ధ్యానమునందే నిమగ్నమై కనిపిస్తున్నారు. (ధ్యాసయే ధ్యానము)
తస్మాత్ య ఇహ
మనుష్యాణాం మహతాం ప్రాప్నువన్తి।
ధ్యానాపాదాంశా ఇవ ఏవ తే భవంత్యథ।
యే అల్పాః కలహినః, పిశునా ఉపవాదినస్తే।
అథ యే ప్రభవో ధ్యానాపాదాగ్ంశా
ఇవైవ తే భవంతి। ధ్యానం ఉపాస్స్వ ఇతి।
అందుచేత మానవులంతా ఎవ్వరైతే మహదత్వము పొందుచున్నారో అదంతా ధ్యాసరూపమగు ‘ధ్యానము’ చేతనే ప్రాప్తించుకొంటున్నారు.
ధ్యానముయొక్క అభ్యాసము లేనివారు క్రింద దశలోనే అల్పులుగా, కలహప్రియులుగా (పోట్లాడటం అలవాటు గల వారుగా), పిశునులుగా (కొండెములు చెప్పువారుగా) నీచ-దుష్ట-ద్రోహ స్వభావులుగా, నిందలు ఆరోపించువారుగా ఉండిపోవుచున్నారు.
2. స యో ‘‘ధ్యానం బ్రహ్మేతి’’ ఉపాస్తే
యావత్ ధ్యానస్య గతం, తత్రాస్య
యథా కామచారో భవతి,
యో ‘‘ధ్యానం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।
నారదుడు :
అస్తి భగవో! ధ్యానాత్ ‘‘భూయ’’ ఇతి?
సనత్కుమారుడు :
‘‘ధ్యానాత్ వావ భూయో అస్తి’’ - ఇతి।
నారదుడు :
తత్ మే భగవాన్। బ్రవీతు।’’…ఇతి।
సమర్థులైన వారంతా తమయొక్క ధ్యాసరూపమగు ధ్యానముచేతనే ధ్యానలాభంగా సమర్థత పొందుచున్నారు.
ఎవ్వరైతే ‘‘ధ్యానము బ్రహ్మమే’’ - అని ఉపాసిస్తారో, అట్టివారు వారి ధ్యానము (ధ్యాస) ఎక్కడివరకు విస్తరిస్తోందో, అంతవరకు తమ ఇచ్ఛానుకూలంగా (As they like it) ఉండగలరు. ‘‘ధ్యానము బ్రహ్మమే’’ అని ఉపాసించబడు గాక।

నారద మహర్షి : ధ్యానము కంటే మించినది ఇంకేమైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఆ! ధ్యానముకంటే ‘భూరి’ (శ్రేష్ఠము) అయినది ఉన్నది.
నారద మహర్షి : అది ఏది? గురు సత్తమా? దయచేసి చెప్పం&

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే షష్ఠః ఖండః


7–7. సప్తమ ప్రపాఠకః - సప్తమ ఖండము - ‘‘విజ్ఞాన ఉపాసన’’

సనత్కుమారుడు:
1. విజ్ఞానం వావ ధ్యానాత్ భూయో।

విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి।
యజుర్వేదం, సామవేదగ్ం, అథర్వణం చతుర్థమ్,
ఇతిహాస పురాణం పంచమమ్;
వేదానాం వేదం, పిత్ర్యం, రాశిం, దైవం,
నిధిం, వాకోవాక్యమ్, ఏకాయనం,
దేవ విద్యాం, బ్రహ్మవిద్యాం,
భూతవిద్యాం, క్షత్రవిద్యాం,
నక్షత్రవిద్యాగ్ం, సర్ప దేవ జన విద్యాం,
దివం చ పృథివీం చ - వాయుం చ
ఆకాశం చ - ఆపశ్చ - తేజశ్చ
దేవాంశ్చ, మనుష్యాగ్ంశ్చ,
పశూగ్ంశ్చ, వయాంసి చ
తృణ వనస్పతీన్ చ శ్వాపద
అన్యాకీట పతంగి పిపీలికం
సనత్కుమారుడు : ధ్యానము కంటే విజ్ఞానము - భూరి (గొప్పది / పెద్దది, శ్రేష్ఠము)

‘విజ్ఞానము’ చేతనే ఈ మానవుడు ఋగ్వేద - యజుర్వేద - సామవేద - అథర్వణ వేద (చతుర్వేదములు) పంచమ వేదమగు భారతము మొదలైన ఇతిహాస - పురాణములు, వేదనాం వేదము అయినట్టి వ్యాకరణము, పిత్ర్యము (శ్రాద్ధ, తంత్రము), కల్పము, గణితశాస్త్రము, దైవతత్త్వములు, నిధి శాస్త్రము, ఏకోవాక్యము (తర్కము), ఏకాయతనము (నీతిశాస్త్రము), దేవతల గురించిన విద్య, బ్రహ్మవిద్య, భూతప్రేత పిశాచ సంబంధమైన విద్య, క్షత్రియ (యుద్ధ) విద్య, నక్షత్రవిద్య (జ్యోతిష్యశాస్త్రము), సర్వదేవతాజనవిద్య, దేవతల దివ్యలోకముల గురించి, పృథివి గురించి, వాయువు గురించి, ఆకాశము గురించి, జలము గురించి, తేజస్సు గురించి, దేవ - మనుష్య - పశు - పక్షి - తృణ - వనస్పతి - ఓషధి - కీటకము గురించి పతంగముల (పిట్టల) గురించి, పురుగుల గురించి,
ధర్మం చ - అధర్మం చ,
సత్యం చ - అనృతం చ,
సాధు చ - అసాధు చ,
హృదయజ్ఞం చ - అహృదయజ్ఞం చ
అన్నం చ - రసం చ,
ఇమం చ లోకం - అముం చ
విజ్ఞానేన ఏవ విజానాతి। విజ్ఞానమ్ ఉపాస్స్వ ఇతి।।
ధర్మ - అధర్మ, సత్య - అసత్య, సాధు - అసాధు, హృదయానికి ఆనందము కలిగించే - కలిగించని వాటి గురించి.
అన్నము (ఆహారము) గురించి, అన్నరసము గురించి, ఇహ -పర (తరువాతి, ఊర్ధ్వ) లోకముల గురించి వీటన్నిటి గురించి తెలుసుకొంటున్నాడు.

‘‘తెలుసుకోవటము’’ అనేది ‘‘విజ్ఞానము’’ చేతనే సిద్ధిస్తోంది. కనుక ‘విజ్ఞానము బ్రహ్మమే’ - అని ఉపాసించెదవు గాక।
2. స యో ‘విజ్ఞానం బ్రహ్మేతి’
ఉపాస్తే విజ్ఞానవతో వై
స లోకాన్ జ్ఞానవతో అభిసిద్ధ్యతి।
యావత్ విజ్ఞానస్య గతం,
తత్ర అస్య యథా కామచారో భవతి యో
‘‘విజ్ఞానం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।

నారదుడు :
‘‘భగవో। విజ్ఞానాత్ భూయ? ఇతి।
సనత్కుమారుడు :
‘‘విజ్ఞానాత్ వావ భూయో అస్తి। ఇతి’’
నారదుడు :
‘‘తత్ మే, భగవాన్! బ్రవీతు - ఇతి’’।
‘‘విజ్ఞానము బ్రహ్మమే’’ - అను విధంగా ఎవరు ఉపాసిస్తారో - అట్టి వారు విజ్ఞానమయ లోకములలో జ్ఞానవంతులతో సంగము పొందగలరు.
విజ్ఞానము ఎంతవరకు విస్తరించి ఉన్నదో - అంతవరకు విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసించువారు - తమ ఇచ్ఛానుకూలంగా ఉండగలరు. తదితరములకు బద్ధులు కారు.

నారదమహర్షి : విజ్ఞానము కంటే కూడా ఉన్నతమైనది ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : విజ్ఞానము కంటే కూడా ఉత్కృష్టమైనది (మహత్తరమైనది) ఉన్నది.
నారదుడు : అది ఏది? భగవాన్! దయచేసి వివరించండి!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే సప్తమః ఖండః


7–8. సప్తమ ప్రపాఠకః - అష్టమ ఖండము - ‘‘బల ఉపాసన’’

సనత్కుమారుడు:
1. బలం వావ విజ్ఞానాత్ భూయో అపి
హ శతం విజ్ఞానవతాం ఏకో
బలవాన్ ఆకంపయతే
స యదా బలీ భవతి,
అథ ఉత్థాతా భవతి ఉత్తిష్ఠన్
పరిచరితా భవతి।
పరిచరన్ ఉపసత్తా భవతి।
ఉపసీదన్ ద్రష్టా భవతీ
శ్రోతా భవతి। మన్తా భవతి।
బోద్ధా భవతి। కర్తా భవతి।
విజ్ఞాతా భవతి।
సనత్కుమారుడు :
విజ్ఞానము కంటే కూడా (ధైర్య) బలము గొప్పది. (బుద్ధి - logic - ఉన్నతమైనది).

వందమంది విజ్ఞానవంతులను (పండితులను) కూడా ఒక్క ఆత్మబలం భావన చేయువాడు - వణికించగలడు. ఓపిక ఉంటేనే ఏదైనా చేయగలడు.
ఈ జీవుడు (మానవుడు) బలవంతుడైతే ధైర్యము కలవాడు కాగలడు. లేచి నిలుచోగలడు. ఉత్తిష్ఠుడై సద్గురువులను సమీపించగలడు. బలములేని బలహీనుడు ఎక్కడికి వెళ్లగలడు? కూర్చున్నవాడు లేవనే లేవలేడు కదా?
బలవంతుడైనప్పుడే ఈ మానవుడు ఉపసత్తు - శ్రోతము కాగలడు.
❋ బోద్ధా (బోధించుటకు) అర్హుడు కాగలడు.
❋ బలముంటేనే ఒక పనికి కర్త కాగలడు.
❋ బలమున్నప్పుడే ఏదైనా తెలుసుకొన్నవాడు కాగలడు.
బలేన వై పృథివీ తిష్ఠతి।
బలేన అంతరిక్షం।
బలేన ద్యౌః। బలేన పర్వతా।
బలేన దేవ మనుష్యా।
బలేన పశవశ్చ వయాంసి చ
తృణ వనస్పతయః
శ్వాపదా అన్యా కీట - పతంగ పిపీలికం।
బలేన లోకః తిష్ఠతి।
బలమ్ ఉపాస్స్వ - ఇతి।
❋ బలముచేతనే భూమి పడిపోకుండా నిలిచి ఉండగలుగుతోంది.
❋ బలము చేతనే అంతరిక్షము నిలిచి ఉన్నది.
❋ బలము చేతనే పర్వతము తనపై చెట్లు, మృగములు సంచరించ గలిగి ఉంటున్నాయి.
❋ బలము ఉండటంచేతనే దేవతలు, మనుష్యులు మనగలుగుతున్నారు.
పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, (పులి మొదలైన) క్రూరమృగములు, కీటకములు, పక్షులు, పురుగులు జీవించటం కొనసాగించగలుగుచున్నాయి.
బలముయొక్క ఆధారము చేతనే లోకములు కొనసాగుచూ, తిష్ఠితమై ఉన్నాయి.
అందుచే ‘బలము’ను పరబ్రహ్మముగా ఉపాసించు.
2. స యో ‘బలం బ్రహ్మేతి’
ఉపాస్తే యావత్ బలస్య గతం,
తత్రాస్య యథా కామచారో భవతి,
యో ‘బలం బ్రహ్మ’ - ఇతి ఉపాస్తే।

నారదుడు :
‘‘అస్తి, భగవో। బలాత్ భూయ? - ఇతి’’।
సనత్కుమారుడు:
‘‘బలాత్ వావ భూయో అస్తి - ఇతి’’।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్, బ్రవీతు’’ - ఇతి।।
ఎవ్వరైతే ‘‘బలము బ్రహ్మమే అయి ఉన్నది’’ అను భావనను ఆశ్రయించి ఉపాసిస్తూ ఉంటారో, అట్టివారు - ఎక్కడివరకు బలము విస్తరించి ఉన్నదో - అక్కడి వరకు వారు ఇచ్ఛాపూర్వకంగా (The way they like) ఇష్టమైన విధంగా ఉండగలుగుతారు। బలమును ఉపాసించువారు బలవంతులవగలరు.



నారదమహర్షి : హే భగవాన్! ‘‘బలము’’ కంటే కూడా గొప్పది (భూయ) ఇంకా ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఎందుకు లేదు? బలము కంటే అధికమైనది ఉన్నది.
నారదమహర్షి : బలముకంటే అధికమైనది ఏమున్నదో అద్దానిగురించి వివరించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే అష్టమః ఖండః


7–9. సప్తమ ప్రపాఠకః - నవమ ఖండము - ‘‘అన్న ఉపాసన’’

సనత్కుమారుడు:
1. అన్నం వావ బలాత్ భూయః।
తస్మాత్ యద్యపి దశరాత్రీః - న
అశ్నీయాత్ యద్యు హ జీవేత్।
అథవా అద్రష్టా, అశ్రోతా, అమన్తా,
అబోద్ధా, అకర్తా, అవిజ్ఞాతీ భవతి।
అథ అన్నస్యాయై ద్రష్టా
భవతి। శ్రోతా భవతి।
మన్తా భవతి। బోద్ధా భవతి। కర్తా భవతి।
విజ్ఞాతా భవతి।
అన్నమ్ ఉపాస్స్వ ఇతి।
సనత్కుమారుడు : ‘బలము’ కంటే గొప్పది (భూరిః) ‘‘అన్నము’’.
అందుచేతనే ఒకానొకడు 10 రోజులు అన్నము తినకపోతే - ఏమౌతోంది? తనకున్న బలము పోగొట్టుకొని, బలహీనుడై, జీవించటమే కష్టముగా అగుచున్నాడు.
10 రోజులు ఆహారము తీసుకోకపోవటం చేత మరణించనైనా మరణిస్తాడు. లేదా ఒకవేళ ఇంకా జీవిస్తూ ఉన్నా కూడా కళ్ళతో చూడలేడు. బుద్ధితో ఏమీ విశ్లేషించి తెలుసుకోలేడు. ఏ పనీ చేయలేడు. ఏమీ తెలుసుకోలేడు. ఆహారము తీసుకోనప్పుడు స్థితి ఇట్టిది.
ఆహారము తీసుకొన్న తరువాతనో?
ద్రష్ట కాగలడు. శ్రోత కాగలడు. మనస్సుతో మననము చేయగలడు. బుద్ధితో తెలుసుకోగలడు. తెలుసుకొన్నది ఆకలింపు చేసుకుంటూ ‘విజ్ఞాత’ కాగలడు.
అందుచేత ‘అన్నము’ను పరబ్రహ్మముగా ఉపాసించెదవు గాక।
2. స యో ‘‘అన్నం బ్రహ్మేతి’’
ఉపాస్తే। అన్నవతో వై।
స లోకాన్ పానవతో అభిసిద్ధ్యతి
యావత్ అన్నస్య గతం
తత్ర అస్య యథా కామచారో
భవతి। యో ‘అన్నం బ్రహ్మ’
ఇతి - ఉపాస్తే।


నారదుడు :
‘‘అస్తి, భగవో। అన్నాత్ భూయ?’’ - ఇతి
సనత్కుమారుడు :
‘‘అన్నాత్ వావ భూయో అస్తి’’ - ఇతి
నారదుడు :
‘‘తన్మే భగవాన్ బ్రవీతు।’’ - ఇతి।।
‘‘అన్నము బ్రహ్మమే’’ అను భావముతో ఉపాసించువాడు అన్నవంతుడు కాగలడు. తృప్తిగా ఆహారము పొందగలడు.
అన్నము పొందువాడు అన్ని విధాలా భాగ్యవంతుడే। ఎందుకంటే దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, చిత్తములు మొదలైన వాటన్నిటికీ అన్నమే ఆధారము.
‘‘అన్నము బ్రహ్మమే’’ అని ఉపాసించువానికి - ఇచ్ఛానుసారంగా దేహ - మనో - బుద్ధి - చిత్తములు రూపుదిద్దుకోగలవు.



నారద మహర్షి : మహాత్మా! ‘అన్నము’ కంటే అధికమైనది ఇంకా మరొకటి ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుల వారు : నారదమహర్షీ! అన్నము కంటే ఇంకా గొప్పదైనది ఉన్నది.
నారద మహర్షి : అది ఏదో సెలవియ్యండి, భగవాన్।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే నవమః ఖండః


7–10. సప్తమ ప్రపాఠకః - దశమ ఖండము - ‘‘ఆపో ఉపాసన’’

సనత్కుమారుడు:
1. ‘ఆపో’ వావ అన్నాత్ భూయస్యః

తస్మాత్ యదా సువృష్టిః న భవతి,
వ్యాధీయన్తే ప్రాణా
అన్నం కనీయో భవిష్యతి ఇతి।
అథ యదా సువృష్టిః భవతి - ఆనందినః,
ప్రాణా భవన్తి, అన్నం బహుభవిష్యతి। ఇతి।

‘ఆప’ - ఏవ ఇమా మూర్తా
యేయం పృథివీ। యత్ అంతరిక్షం।
యత్ ద్యౌః। యత్ పర్వతా।
యత్ దేవ - మనుష్యా।
యత్ పశవశ్చ వయాంసి చ।
తృణ వనస్పతయః శ్వాపదా।
అన్యాకీట - పతంగ - పిపీలకమ్
‘‘ఆపః’ ఏవ ఇమా మూర్తా।

ఆప ఉపాస్స్వ ఇతి।।

సనత్కుమారుడు : జలము అన్నము కంటే కూడా అధికమైనది.

అందుచేతనే సువృష్టి (బాగుగా, సమయానుకూలంగా వర్షము) వర్షించనప్పుడు అన్నము సరిగా లభించదు. శరీరములకు వ్యాధులు కలుగుచూ ఉంటాయి కూడా.
సకాల - సమృద్ధి వర్షము కురిసినప్పుడు (వర్షపాతము సరిగా ఉన్నప్పుడు) - ‘‘అన్నము బహుగా లభిస్తుంది’’ - అన్ని జీవులు ఆనందిస్తున్నారు.


మూర్తీభవించిన (రూపము గల) సర్వ పదార్థములలోను జలము ఉనికి కలిగియున్నది.
సమస్త పదార్థములకు ఆధారము జలమే।
పృథివి (భూమి), అంతరిక్షము (ఆకాశము), ద్యులోకము (దేవతాలోకము, స్వర్గలోకము), పర్వతములు, దేవ-మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిమి-కీటకములు, తృణములు (గడ్డిపరకలు), వనస్పతులు (వృక్షములు), మృగములు, కీటక-పతంగ -పిపీలికములు (చీమలు) - సమస్తము (అన్నీ కూడా) జలము చేతనే మూర్తీభవించినవై ఉన్నాయి.



అందుచేత జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించెదవు గాక।
2. స యో ‘‘అపో బ్రహ్మ’’ ఇతి ఉపాస్త
ఆప్నోతి సర్వాన్ కామాం,
తృప్తిమాన్ భవతి।
యావత్ అపాం గతం, తత్రాస్య
యథా కామచారో భవతి।
యో ‘అపో బ్రహ్మ ఇతి’ ఉపాస్తే

నారదుడు :
‘‘అస్తి భగవో। అద్భ్యో భూయ? ఇతి
సనత్కుమారుడు :
‘అద్భ్యో వావ భూయో అస్తి’ - ఇతి।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్। బ్రవీతు।’’ ఇతి।।
ఎవ్వరైతే ‘‘జలము పరబ్రహ్మస్వరూపము’’ - అని ఉపాసిస్తారో, వారు కోరుకొనేవన్నీ లభించి తృప్తివంతులు కాగలరు.
అట్టివారు - జలము విస్తరించి ఉన్నంతవరకు, వారి ఇచ్ఛానుసారం సంచారములు చేయగలరు.
అందుచేత ‘‘జలము బ్రహ్మమే’’ అని ఉపాసించుము.

నారద మహర్షి : జలము కంటే కూడా అధికమైనది ఉన్నదా?
సనత్కుమారుడు : జలము కంటే కూడా ఉపాసనకొరకై అధికమైనది ఉన్నది.
నారద మహర్షి : అట్టి అధికమైనది మా ఉపాసన కొరకై శలవియ్యండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే దశమః ఖండః


7–11. సప్తమ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - ‘‘తేజో ఉపాసన’’

సనత్కుమారుడు:
1. తేజో వావ అద్భ్యోః భూయః తద్వా,
ఏతత్ వాయుమ్ ఆగృహ్య,
ఆకాశమ్ అభితపతి।
తత్ - ఆహుః - నిశోచతి నితపతి।
వర్షిష్యతి వా ఇతి।
తేజ ఏవ, తత్ పూర్వం
దర్శయిత్వాధ ఆపః సృజతే।
సనత్కుమారుడు : తేజస్సు జలముకంటే కూడా గొప్పది. అట్టి తేజస్సు ఎప్పుడైనా వాయువును నిశ్చలం చేసి, ఆకాశమును అన్నివైపులా తపింపజేస్తూ (వేడి కలిగిస్తూ) ఉంటే, అప్పుడు ‘‘బాగా వేడిగా ఉండి ఆకాశము ఉక్కబోస్తోంది. అందుచేత వర్షము రావచ్చును’’ - అంటారు. ఈ విధంగా వర్షమునకు తేజస్సే ప్రథమ కారణము.

ఈ విధంగా తేజస్సే అన్నిటికంటే ముందుగా ప్రదర్శనమై జలమును సృష్టించుచున్నది. తేజస్సువల్లనే నీటి ఆవిరిరూపంగా మేఘములు ఉత్పన్నమై వర్షమునకు కారణము అగుచున్నది.
తత్ ఏతత్ ఊర్ధ్వా అభిశ్చ,
తిరశ్చీభిశ్చ విద్యుద్భిః
ఆహ్రాదాః చరన్తి।
తస్మాత్ ఆహుః విద్యోతతే
స్తనయతి, వర్షిష్యతి వా
ఇతి ‘తేజ’ ఏవ।
తత్పూర్వం దర్శయిత్వా।
అథ ఆపః సృజతే
తేజ ఉపాస్స్వ ఇతి।
తేజస్సు ఎప్పుడైతే పైకి - క్రిందకు విస్తారమగుచు పైకి, వెనుకకు ఊర్ధ్వగామి, తిర్యక్‌గామి అగుచు ఉన్నదో, ఆ సందర్భములో మేఘములలో విద్యుత్తుతో కూడిన గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే విద్యుత్ (మేఘములో మెఱుపు) మేఘగర్జనలతో ప్రదర్శనమౌతుందో అప్పుడు ‘‘ఆకాశంలో మెఱుపులు సంభవిస్తూ ఉన్నాయి. మేఘగర్జనలు వినిపిస్తున్నాయి. కనుక వర్షింపబడవచ్చు’’ -అని అనుకుంటూ ఉంటారు.
అందుచేత తేజస్సే మొదటిగా ఉండి వర్షమును వర్షింపజేస్తోంది.
కనుక జలమును సృష్టిస్తున్నది ‘తేజస్సే’।
అట్టి తేజస్సు ఆత్మగా ఉపాసించ బడుగాక।
2. స యః ‘తేజో బ్రహ్మేతి’’
ఉపాస్తే తేజస్వీ వై,
స తేజస్వతో లోకాన్ భాస్వతో
అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి।
యావత్ తేజసోగతం
తత్ర అస్య యథా కామచారో భవతి,
యః ‘తేజో బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।

నారదుడు :
‘‘అస్తి, భగవ! తేజసో భూయ?’’ ఇతి
సనత్కుమారుడు :
‘‘తేజసో వావ భూయో అస్తి - ’’ ఇతి।।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్, బ్రవీతు’’ - ఇతి।।
ఎవ్వరైతే ‘‘తేజస్సు బ్రహ్మమే’’ అని దర్శిస్తూ బ్రహ్మోపాసన చేస్తారో - తేజోవంతుడౌతాడు. తన తేజస్సుతో లోకములకు వెలుగు ప్రసాదిస్తూ ఉంటాడు. చీకటిలేని లోకములలో ప్రవేశించి, తేజోమయం చేస్తూ ఉంటాడు. తేజోమయ లోకములలో తన ఇచ్ఛానుసారం విహరించగలిగినవాడై ఉంటాడు. తేజస్సు బ్రహ్మముగా దర్శిస్తూ బ్రహ్మముగా ఉపాసించుదురు గాక।


నారద మహర్షి : స్వామీ! తేజస్సు కన్నా అధికమై ఉపాసించవలసినది ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : అవును. తేజస్సుకన్నా ‘భూరి’ అయిన ఉపాసనా వస్తువు ఉన్నది.
నారద మహర్షి : భగవాన్! అదేమిటో కూడా దయచేసి నాకు ఉపదేశించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ఏకాదశః ఖండః


7–12. సప్తమ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - ‘‘ఆకాశ ఉపాసన’’

సనత్కుమారుడు
1. ఆకాశో వావ తేజసో భూయాన్।
ఆకాశే వై సూర్యాచన్ద్రమసా ఉభౌ।
విద్యుత్ నక్షత్రాణి అగ్నిః।
ఆకాశేన ఆహ్వయతి।
ఆకాశేన శృణోతి।
ఆకాశేన ప్రతిశృణోతి।
ఆకాశే రమత - ఆకాశే న రమత।
ఆకాశే జాయత।
ఆకాశమ్ అభిజాయత
ఆకాశమ్ ఉపాస్స్వేతి।।
సనత్కుమారుడు : తేజస్సు కంటే ఆకాశము అధికతరమైనది. ప్రాధాన్యమైనది.
ఆకాశములో సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ (తేజస్సు), తారలు (నక్షత్రములు), అగ్ని - ఇవన్నీ స్థానము కలిగి ఆహ్వానితమై ఉన్నాయి.
ఆకాశమువలననే శబ్దమును వినగలుగుచున్నాము. మనము చేసిన శబ్దము కూడా (Resound) మనము ఆకాశము వలననే వినగలుగుచున్నాము.
మనమంతా రమిస్తున్నది, రమించనిది కూడా- ఆకాశమునందే।
ఆకాశము నుండే పుట్టుచున్నాము.
ఆకాశములోనికే తిరిగి వెళ్లుచున్నాము.
అందుచేత ‘‘ఆకాశము బ్రహ్మమే’’ అని ఉపాసించబడు గాక।
2. స య ‘ఆకాశమ్ బ్రహ్మ’’
ఇతి ఉపాస్తే, ఆకాశవతో వై
స లోకాన్ ప్రకాశవతో,
అసం బాధాన్ ఉరుగాయవతో అభిసిద్ధ్యతి।
యావత్ ఆకాశస్య గతం
తత్రాస్య యథా కామచారో
భవతి, య ‘‘ఆకాశం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।
నారదుడు : ‘‘అస్తి భగవ, ఆకాశాత్ భూయ?’’ - ఇతి
సనత్కుమారుడు : ‘‘ఆకాశాత్ వావ భూయో అస్తి’’ - ఇతి। నారదుడు :
తత్ మే, భగవాన్। బ్రవీతు।’’…ఇతి।।
ఎవరైతే ఆకాశమును ‘‘ఇది బ్రహ్మము’’ అని ఉపాసిస్తాడో, అట్టివాడు ప్రకాశవంతమైనట్టి, సంబంధ బంధములు ఉండనట్టి, బహువిస్తారములైనట్టి లోకములను బాగుగా సిద్ధించుకోగలడు.
‘‘ఆకాశము బ్రహ్మము’’ - అని ఉపాసించువాడు - ఆకాశము ఎంతవరకు విస్తరించి ఉంటే అంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ఉనికి, సంచారములు పొంది ఉండగలడు.

నారద మహర్షి : మహాత్మా! ఆకాశము కంటే కూడా అధికమైనది ఉపాసనకై ఇంకా కూడా ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఆకాశము కంటే కూడా భూరి (అధికము, విస్తారము) అయినది ఉన్నది.
నారద మహర్షి : భగవాన్। అది ఏమై ఉన్నదో దయతో వివరించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ద్వాదశః ఖండః


7–13. సప్తమ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ‘‘స్మర ఉపాసన’’

సనత్కుమారుడు:
1. ‘స్మరో’ వావ ఆకాశాత్ భూయః।
తస్మాత్ యత్ అపి బహవ
ఆసీః, అన్న స్మరన్తో,
నైవ తే కంచన శృణుయుః।
న మన్వీః। న విజానీరన్।
సనత్కుమారుడు : ఆకాశము కంటే కూడా స్మరణము (Remembrance) గొప్పది. ‘బహు’ అయినట్టిది.

ఒకచోట చాలామంది ఆశీనులై ఉన్నారనుకో. వారంతా ఒకరి గురించి మరొకరు ఏమాత్రము స్మరించనప్పుడు - ఒకరు చెప్పేది మరొకరు వినరు. ఒకరి గురించి మరొకరు ఆలోచించరు. ఒకరి గురించి మరొకరు తెలియబడరు కూడా.
యదా వావ తే స్మరేయుః,
అథ శృణుయుః,
అథ మన్వీరన్,
అథ విజానీరన్,
స్మరేణ వై పుత్రాన్ విజానాతి।
స్మరేణ పశూన్
స్మరమ్ ఉపాస్స్వ। ఇతి।
వారంతా పరస్పరము స్మరించటము ప్రారంభించినప్పుడు మాత్రమే - ఒకరు చెపుతున్నది మరొకరు వినగలరు.
- ఒకరి గురించి మరొకరు మనస్సు పెట్టగలరు.
- ఒకరి గురించి మరొకరు తెలుసుకోగలరు. స్మరణచేతనే ‘‘ఈతడు నా కుమారుడు, ఇది పశువు’’ - మొదలైన సమస్తము గుర్తించబడుచున్నాయి. అనుభూతపరచుకోబడుచున్నాయి.

కాబట్టి నీవు ‘‘స్మరణశక్తి’’ని బ్రహ్మముగా ఉపాసించెదవు గాక।
2. స యః ‘స్మరమ్ బ్రహ్మ’
ఇతి ఉపాస్తే, యావత్ స్మరస్య గతం,
తత్ర అస్య యథా కామచారో భవతి,
యః ‘‘స్మరమ్ బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।

నారదుడు : ‘‘అస్తి, భగవః స్మరాత్ భూయ?’’ ఇతి।।
సనత్కుమారుడు : ‘స్మరాత్ వావ భూయో అస్తి।’ - ఇతి।।
నారదుడు : ‘‘తన్మే భగవాన్। బ్రవీతు।’’ ఇతి।।
ఎవరైతే స్మరణశక్తిని బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉంటాడో, అట్టివాడు స్మరణము ఉన్నంతవరకు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకమై (బంధరహితుడై) స్థితి పొంది ఉండగలడు.


నారదమహర్షి : మహానుభావన్। భగవాన్। ‘స్మరణము’ కంటే మించినది, అధికమైనది (ఉపాసనకై) ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఉన్నది. ‘స్మరణము’ కంటే అధికమైనది కలదు.
నారదమహర్షి : ఏమిటది? దయచేసి వివరించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే త్రయోదశః ఖండః


7–14. సప్తమ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - ‘‘ఆశా ఉపాసన’’

సనత్కుమారుడు:
1. ‘ఆశా’ వావ స్మరాత్ భూయస్య।
ఆశేద్ధో వై స్మరో మంత్రాన్ అధీతే।
కర్మాణి కురుతే।
పుత్రాగ్ంశ్చ పశూగ్ంశ్చ ఇచ్ఛత।
ఇమం చ లోకం అముం చ ఇచ్ఛత
ఆశామ్ ఉపాస్స్వ। ఇతి।।
సనత్కుమారుడు : ‘ఆశ’ (కామము) అనునది స్మరణము (జ్ఞాపకము) కన్నా కూడా అధికమైనది.

జీవునిలోని స్మరణశక్తి ’ఆశ’చే ప్రేరేపించబడినప్పుడు మాత్రమే ఆతడు ‘మంత్రము’ను ఉపాసించగలడు.
- ‘ఆశ’ చేతనే జీవుడు కర్మలు చేస్తున్నాడు.
- ఆశ చేతనే సంతానము, పశుసంపద మొదలైనవాటికొరకు ప్రయత్నశీలురై ఈ జీవుడు ఉంటున్నాడు. ఇహ-పర లోకములు ప్రయోజనములను ‘ఆశ’ చేతనే ప్రయత్నించటము, పొందటము జరుగుతోంది.
అందుచేత ‘ఆశయే బ్రహ్మము’’ - అని ఉపాసించబడు గాక।
2. స య ‘‘ఆశాం బ్రహ్మ’’
ఇతి - ఉపాస్తే, ఆశయాస్య సర్వే
కామాః సమృద్ధ్యన్త।
అమోఘా హా అస్య ఆశిషో భవన్తి।
ఎవ్వరైతే ‘ఆశ పరబ్రహ్మ స్వరూపమే’ అని ఉపాసిస్తాడో, ఆతడు కోరుకొనే సమస్త కోరికలను (వాంఛితార్థములను) పూర్తిగా, సమృద్ధిగా పొందగలడు.
అమోఘముగా అవన్నీ సిద్ధించగలవు.
యావత్ ఆశాయా గతం,
తత్రాస్య యథా కామచారో భవతి।
య ‘ఆశాం బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।
‘ఆశ’ అనునది ఎంతవరకు విస్తరించి ఉంటుందో - అంతవరకు ఆతనికి ఇష్టముగా అనిపించినదంతా పొందగలడు.
‘ఆశయే బ్రహ్మము’ అని ఉపాసించబడు గాక।
నారదుడు : ‘‘అస్తి భగవ। ఆశాయా భూయా?’’ - ఇతి!
సనత్కుమారుడు : ‘‘ఆశాయా వావ భూయో అస్తి’’ - ఇతి।।
నారదుడు : ‘‘తన్మే భగవాన్। బ్రవీతు।’’ - ఇతి।।
శ్రీ నారద మహర్షి : గురువరేణ్యా। ‘ఆశ’ కంటే అధికమైనది ఉపాసనకొరకై ఇంకేమైనా ఉన్నదా?
శ్రీ సనత్కుమారుడు : ఎందుకులేదు! ‘ఆశ’ కంటే అధికమైన ఉపాసన వస్తువు ఉన్నది.
శ్రీ నారద మహర్షి : అది ఏది? భగవాన్। దయచేసి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే చతుర్దశః ఖండః


7–15. సప్తమ ప్రపాఠకః - పంచదశ ఖండము - ‘‘ప్రాణోపాసన’’

సనత్కుమారుడు:
1. ప్రాణో వావ ఆశయా భూయాన్।
యథా వా అరా నాభౌ సమర్పితా ఏవమ్,
‘అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం।’
ప్రాణః ప్రాణేన యాతి।
ప్రాణః ప్రాణం దదాతి।
ప్రాణాయ దదాతి।
శ్రీ సనత్కుమారులవారు : ‘ప్రాణము’ ఆశ కంటే భూయిష్టమైనది. అధికమైనది. ఉన్నతమైనది. గొప్పది.
ఒక రథచక్రము యొక్క నాభి (Central hub) వద్ద ఆకులు (spokes of wheel) బిగించి ఉంచిన తీరుగా - ప్రాణమునందు దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్తములు అన్నీ కూడా బిగించబడినవై (సమర్పితమై) ఉన్నాయి. ప్రాణము ప్రాణశక్తి చేతనే చేతనమౌతోంది. ప్రాణమే ప్రాణమునకు ప్రాణము ప్రసాదిస్తోంది.
ప్రాణో హ పితా। ప్రాణో మాతా।
ప్రాణో భ్రాతా। ప్రాణః స్వసా।
ప్రాణ ఆచార్యః। ప్రాణో బ్రాహ్మణః।
ప్రాణము - అనగా, ప్రియత్వము (ఆశ) యొక్క శక్తిరూపమే। ప్రాణము తండ్రి! ప్రాణమే ‘అమ్మ’। ప్రాణమే సోదరుడు। ప్రాణమే సోదరి (తోడబుట్టినది) । ఆచార్యులవారు ప్రాణస్వరూపులు। బ్రహ్మతత్త్వజ్ఞులగు బ్రాహ్మణులు - ప్రాణస్వరూపులే। ప్రాణమే ఆయా ప్రియరూపాలన్నీ కూడా!
2. స యది పితరం వా, మాతరం వా
భ్రాతరం వా, స్వసారం వా,
ఆచార్యం వా, బ్రాహ్మణం వా,
కించిత్ భృశమ్ ఇవ
ప్రత్యాహ ‘ధిక్’ త్వ అస్తి।
ఇతి ఏవ ఏనం ఆహుః-
అందుచేతనే నీకు ప్రాణస్వరూపులే అయి ఉన్న తండ్రినిగాని, తల్లినిగాని, సోదరునిగాని, సహోదరినిగాని, ఆచార్యులవారినిగాని, బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణునిగాని కించిత్ అనుచితంగా మాట్లాడితే అప్పుడు ఆ ప్రక్కవారు ‘‘భృశమివ - తగనివిధంగా మాట్లాడుచున్నావేమయ్యా! ధిక్। నీకు ధిక్కారము అగుగాక।’’ అంటూ ఉంటారు కదా.
‘‘పితృ హా వై త్వమ్ అసి।
మాతృ హా వై త్వమ్ అసి।
భ్రాతృ హా వై త్వమ్ అసి।
స్వసృ హా వై త్వమ్ అసి।
ఆచార్య హా వై త్వమ్ అసి।
బ్రాహ్మణ హా వై త్వమ్ అసి। - ఇతి।।
ఇంకా కూడా ఆ దగ్గిరవారు (స్వతంత్రముగా ఉండువారు - తదితర బంధువులు) ఇట్లా ఉంటారు।
✘ మీ నాన్నగారిని దూషణగా మాట్లాడకు. వారిని చంపినంత పాపం నీకు వస్తుంది.
✘ అమ్మను ఏమీ అనకు! అమ్మను చంపినంత పాపం.
✘ సోదరునితో దుర్భాషలాడవద్దు! చంపినంత పాపం.
✘ సహోదరుని దూషించకు! చంపినంత దోషం సుమా!
✘ ఆచార్యులవారిని దూషించకు. వారిని చంపినంత దుష్ఫలితం!
✘ బ్రహ్మజ్ఞానులను చెడుమాటలనకు. బ్రహ్మహత్య అంత పాపం!
అని అతనితో మాట్లాడటం మానివేస్తారు.
3. అథ యద్యపి ఏనాన్
ఉత్క్రాన్త ప్రాణాన్,
శూలేన సమాసం వ్యతిషంద హి
ఏన న ఏవ ఏనం బ్రూయుః
పితృహాసీతి। న మాతృహాసీతి।
అదే మరొక సందర్భంలో తండ్రి గాని, తల్లిగాని, తదితరులుగాని మరణించినప్పుడు వారిని శ్మశానంలో (పితృవనంలో)దహనము చేసినప్పుడో-
‘‘నీవు పితృ హంతకుడవు. మాతృహంతకుడవు. భ్రాతృ హంతకుడవు. సహోదరీ హంతకుడవు. ఆచార్య హంతకుడవు. బ్రాహ్మణ హంతకుడవు అని ఎవరైనా అంటారా? అనరు.
న భ్రాతృహాసీతి। న స్వసృహాసీతి।
న ఆచార్యహాసీతి।
న బ్రాహ్మణహాసీతి।
ఎందుచేత? ఆ దేహములో ఎప్పుడో ప్రాణము తొలగిపోయింది కనుక! శూలముతో ముక్కలు చేసినా, కాకులకు, గ్రద్ధలకు ఆహారంగా వేసినా కూడా ‘‘వీరిని చంపి బాధించావు. ప్రాణహాని చేసావు’’ అని ఆపాదించరు.
4. ‘ప్రాణో’ హి ఏవ ఏతాని
సర్వాణి భవతి।
స వా ఏష ఏవం పశ్యన్ ఏవం,
మన్వాన ఏవం, విజానన్,
న అతివాదీ’’ భవతి।
తం చేత్ బ్రూయుః
అతివాద్యసీది।
‘‘అతివాది అస్మి’’ ఇతి బ్రూయాత్ -
న అపహ్నువీత।।
మనం పైన చెప్పుకున్నవారంతా ప్రాణస్వరూపులే అయి ఉన్నారు.

‘‘ఈ జీవులంతా నా ప్రాణస్వరూపులే. అందుచేత అంతా నాకు ప్రియమైన వారే। వారిని నేను బాధించలేను’’ అని అన్నప్పుడు ఎవ్వరైనా
‘‘నీవు అతివాదివిగా అగుచున్నావు. అతివాదివి కావద్దయ్యా!’’ - అంటే అనవచ్చు గాక।

అప్పుడు మనము వారితో ఏమని అనాలంటే, ‘‘అవును. నేను ఈ ప్రాణము బ్రహ్మముగా, ప్రియముగా భావించటములో అతివాదినే!’’ అనియే అనాలి. అంతేగాని వారన్నారని ‘‘ప్రాణస్వరూపభావన’’ నుండి తప్పుకోకూడదు.

సమస్తము తన ప్రాణస్వరూపంగా దర్శించేవాడు. ఆత్మభావన చేయువాడు ఆ విధంగానే భావిస్తాడు మరి!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే పంచదశః ఖండః


7–16. సప్తమ ప్రపాఠకః - షోడశ ఖండము - సత్యము కొఱకు తీవ్ర విజిజ్ఞాస కలిగియుండాలి

ఏష తు వా అతివదతి యః సత్యేన।
అతివదతి సో2హం, భగవః। సత్యేన
అతివదాని ఇతి।
సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం। - ఇతి।
‘‘సత్యం’’ - భగవో
విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : ఓ నారద మహర్షీ! సత్యజ్ఞానసంబంధమైన కేవలాత్మ గురించి చెప్పువాడు (లోకసంబంధమైన సంభాషణల దృష్ట్యా చూచినప్పుడు) - అతివదతి (అతివాది)యే అయి ఉంటున్నాడు.
శ్రీ నారద మహర్షి : స్వామీ! గురుదేవా! పరమార్థ సత్యవిజ్ఞానమును ఆశ్రయిస్తూ నేను అతివాదనుడను, అతివాదిని అయి అతివాదనము చేయు సంసిద్ధుడనై ఉన్నాను.
శ్రీ సనత్కుమారుడు : మనము పరమ సత్యముల పట్ల తీవ్ర జిజ్ఞాసువులము అయితేనే సత్యము అనుభవమై సిద్ధించగలదు. సత్యము పట్ల మాత్రమే విజిజ్ఞాసితులమై ఉండాలి.
శ్రీ నారద మహర్షి : హే సద్గురూ! భగవాన్, మీరు సూచన చేస్తున్నట్లు నేను పరాకాష్ఠ సత్యము కొరకే తెలుసుకోవటానికి సంసిద్ధుడనై (విజిజ్ఞాసుడనై) ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే షోడశః ఖండః


7–17. సప్తమ ప్రపాఠకః - సప్తదశ ఖండము - సత్యము గురించిన విజ్ఞానమే తెలుసుకోవాలి

యదా వై విజానాతి,
అథ సత్యం వదతి।
న అవిజానన్ సత్యం వదతి।
విజానన్ ఏవ సత్యం వదతి।
విజ్ఞానం త్వ ఏవ విజిజ్ఞాసితవ్యమ్
ఇతి విజ్ఞానం, భగవో - విజిజ్ఞాస ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : ఈ జీవుడు సత్యము తెలియనంతవరకు అసత్యమునే ఆశ్రయిస్తూ అట్టి అసత్యము గురించియే తర్జన భర్జనలు, వాదోపవాదములు, వ్యవహారములు సంభాషిస్తూ ఉంటాడు. ‘సత్యము’ ఏమిటో తెలిసిందా - ఇక ‘సత్యము’ మాత్రమే సంభాషిస్తాడు. అందుచేత సత్యమును గురించిన విజ్ఞానము కొరకే విజ్ఞాని తవ్యుడవై ఉండాలి. వాంఛించాలి.
శ్రీ నారదమహర్షి : గురువర్యా! మీరు గుర్తు చేస్తున్న విధంగా సత్యము గురించే విజ్ఞానవిశేషుడను కాగలను. సత్యము కొరకే నిమగ్నుడను అయి ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే సప్తదశః ఖండః


7–18. సప్తమ ప్రపాఠకః - అష్టాదశ ఖండము - మతితో సత్యమును మననము చేస్తూ ఉండాలి

1. యదా వై మనుతే అథ
విజానాతి నామత్వా విజానాతి।
మత్వైవ విజానాతి।
మతిస్త్వేవ విజిజ్ఞాసి తవ్యేతి।
మతిం, భగవో। విజిజ్ఞాస। ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : అయితే సత్యము స్వానుభవమై నిర్దుష్టంగా తెలిసేది ఎట్లా? అందుకు ‘‘సత్యము యొక్క మననము’’ - మార్గము. మానవుడు సత్యమును మననము చేతనే తెలుసుకోగలడు. మననము లేకపోతే తెలుసుకోవటము అనుభవమునకు రాదు. మననముచే సత్యమును తప్పక తెలుసుకోగలడు. మననము ద్వారా మతి (బుద్ధి) తో ‘సత్యము’ను ధృవీకరించుకోవాలి.

శ్రీ నారద మహర్షి : భగవాన్! ఆత్మపట్ల, పరమసత్యముపట్ల మననము చేయుటకై విజిజ్ఞాసుడనై (సమోత్సాహినై, తెలివిని వినియోగిస్తూ) ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే అష్టాదశః ఖండః


7–19. సప్తమ ప్రపాఠకః - ఏకోనవింశ ఖండము - శ్రద్ధ చేతనే మననము సాధ్యము

1. యదా వై శ్రద్ధధాతి
అథ మనుతే।
న అశ్రద్ధధన్ మనుతే।
శ్రద్ధధత్ ఏవ మనుతే।
శ్రద్ధా త్వేవ విజిజ్ఞాసి తవ్యేతి।
శ్రద్ధాం భగవో విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : అయితే సత్యము గురించిన మననము ఎప్పుడు సాధ్యపడుతుంది? శ్రద్ధచేతనే మననము సాధ్యం. అశ్రద్ధ కలవాడికి ఆత్మ గురించిన మననము ఘనీభూతమవదు.
(శ్రద్ధావంతుడు) శ్రద్ధ కలిగి ఉంటేనే మననము వలననే విజిజ్ఞాసము (సత్యము తెలియరావటము) జరుగగలదయ్యా!
శ్రీ నారదమహర్షి : గురుదేవా! శ్రద్ధను కలిగి సత్యమును తెలియటానికై ప్రయత్నవంతుడను - మీరు చెప్పే విధంగా - అగుచున్నాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ఏకోనవింశః ఖండః


7–20. సప్తమ ప్రపాఠకః - వింశ ఖండము - నిష్ఠ చేతనే శ్రద్ధ బలపడుతుంది

1. యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి।
న అనిస్తిష్ఠన్ శ్రద్ధధాతి।
నిస్తిష్ఠన్ ఏవ శ్రద్ధ ధాతి।
నిష్ఠా త్వేవ విజిజ్ఞాసితవ్యేతి।

నిష్ఠాం, భగవో।