nārada parivrājaka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణ వేదాంతర్గత

24     నారద పరివ్రాజకోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। పారివ్రాజ్య ధర్మపూగా,
అలంకారా యత్ ప్రబోధతః।
దశ ప్రణవ లక్ష్యార్థం యాంతి
తం రామమ్ ఆశ్రయే।।

ఈ సమస్త జగద్దృశ్యమును జగత్తుగా మొదలంట్లా సన్యసించి వేసి (సమర్పించివేసి), ఈ సమస్తమును బ్రహ్మముగాను, సత్‌విన్యాసముగాను స్వీకరించిన సన్న్యాసులగు పరివ్రాజకులు ఏ ఆత్మధర్మముచే అలంకరించబడుచూ దేనిగురించి ప్రబోధితులై ఉంటున్నారో…,
అట్టి దశ ప్రణవ (పంచ భూతములు + పంచ ఇంద్రియ మనస్సు) లక్ష్యార్థమగు ఆత్మారాముని ఆత్మబుద్ధి కొరకై ఆశ్రయిస్తున్నాము. ఆత్మారామ సిద్ధి కొరకై శ్రీరామచంద్రుని ఉపాసిస్తున్నాము.


ప్రథమోపదేశః (1వ ఉపదేశము) - శ్రీ నారదులవారి నైమిశారణ్య ఆగమనము

1. పరివ్రాట్ త్రిశిఖీ సీతా చూడా
నిర్వాణ మండలమ్।
దక్షిణా శరభం స్కందం
మహా నారాయణ అద్వయమ్।।
ఇప్పుడు మనము (పాల యొక్క సారము స్వీకరించు హంస విధంగా) పదకొండు (11) ఉపనిషత్తుల సారమును స్మరిస్తున్నాము.
1. పరమహంస పరివ్రాజకోపనిషత్ 2. త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్ 3. సీతోపనిషత్ 4. యోగచూడామణ్యుపనిషత్ 5. నిర్వాణోపనిషత్ 6. మండల బ్రాహ్మణోపనిషత్ 7. దక్షిణామూర్త్యుపనిషత్ 8. శరభోపనిషత్ 9. స్కందోపనిషత్ 10. మహోపనిషత్ (మహా నారాయణోపనిషత్) 11. అద్వయ తారకోపనిషత్
ఓం అథ కథాచిత్ పరివ్రాజక ఆభరణో
నారదః సర్వలోక సంచారం కుర్వన్,
న పూర్వ పుణ్య స్థలాని పుణ్య తీర్థాని
తీర్థీ కుర్వన్ అవలోక్య।
ఒకానొకప్పుడు పరివ్రాజక - ఆభరణుడు, దేవర్షి అగు నారదమహర్షి సమస్త లోకములలో సంచారము చేస్తూ ఉన్నారు. వెళ్లినచోట ఇతః పూర్వము సామాన్య స్థలములు కూడా ఆయన పాదస్పర్శచే పుణ్యతీర్థములు అవసాగాయి.
చిత్తశుద్ధిం ప్రాప్య।
అట్టి తీర్థయాత్రల ఫలితంగా త్రిలోకసంచారి అగు శ్రీ నారదమహర్షి చిత్తశుద్ధిని మహత్తరంగా సంతరించుకొన్నారు.
నిర్వైరః శాంతః దాంతః
సర్వతః నిర్వేదం ఆసాద్య।
ఇక దేని పట్ల ఏమాత్రము వైరము (Enemity) లేనివారైనారు - నిర్వైరః।
మనస్సుయొక్క చాంచల్యము శాంతించింది. ఇంద్రియములు నిగ్రహించబడినవై, క్లేశములను (All Difficulties) సహించునవై, ఓర్పు - ధైర్యము కలిగినవై, ‘దాంతుడు’ అయినారు. సమస్త విశేషముల పట్ల వేదన (Worry) జయించి, నిర్వేదుడు అయినారు. నిర్వేదము సిద్ధించుకున్నారు.
స్వరూప అనుసంధానం అనుసంధాయ,
నియమ ఆనంద విశేష గణ్యం మునిజనైః
ఉపసంకీర్ణం నైమిశారణ్యం పుణ్యస్థలం అవలోక్య
సహజము, స్వాభావికము అగు ‘స్వస్వరూపము’తో అనుసంధానము (Wel-connected) పొందసాగారు.

ఆవిధంగా తీర్థయాత్రలు చేస్తూ, ఒక సమయంలో -
‘‘నియమమైన ఆత్మానంద విశేషముతో కూడినది, మహనీయులగు మునిగణముతో సమావేశమైనట్టిది - అగు నైమిశారణ్య పుణ్యస్థలము’’నకు వేంచేసారు.
స రి గ మ ప ద ని స సంజ్ఞైః,
వైరాగ్య బోధకరైః స్వర విశేషైః
ప్రాపంచిక పరాఙ్ముఖైః హరి కథాలాపైః।
ఆ ప్రదేశమంతా కూడా - ‘‘స రి గ మ ప ద ని’’ - సప్తస్వర నాదములతోను, వైరాగ్యమును బోధించునది అగు సంగీత వాయిద్యములతోను, జ్ఞాన స్వర విన్యాసములతో నిండి ఉన్నది.
అక్కడి వారందరు ప్రాపంచక విశేషముల నుండి వెనుకకు మరలినవారై, నివృత్తి మార్గదర్శనములైనట్టి హరికథలను చెప్పుకుంటూ ఉన్నారు.
స్థావర జంగమ నామకైః
భగవత్ భక్తి విశేషైః
నర మృగ కింపురుష అమర
కిన్నర అప్సర ఉరగ గణాన్ సంమోహయన్।
అక్కడి మునులు మొదలైనవారంతా తాము చెప్పుకుంటున్న భగవత్‌భక్తి విశేషములతో, కథలతో అక్కడి స్థావర జంగములను (కదలని రాళ్లను, కదిలే జీవులను), నరులను, మృగములను, అక్కడి వనములలో నివసించే కింపురుషులను, దేవతలను, కిన్నెరులను, అప్సరసలను, పాములను తన్మయులను, సంమోహితులను చేస్తున్నారు.
2. ఆగతం బ్రహ్మాత్మజం భగవత్ భక్తం
నారదం అవలోక్య,
ద్వాదశ వర్ష సత్రయాగ ఉపస్థితాః,
బ్రహ్మ మానసపుత్రుడు, భగవత్ భక్తి సంపన్నుడు, దేవర్షి అగు శ్రీ నారద మహర్షియొక్క రాకను - అక్కడి ద్వాదశ (12) సంవత్సరముల సత్రయాగము నిర్వర్తిస్తూ పాల్గొనుచూ ఉన్న ముని గణము గమనించారు.
శృత అధ్యయన సంపన్నాః
సర్వజ్ఞాః తపోనిష్ఠా పరాః చ
జ్ఞాన వైరాగ్య సంపన్నాః శౌనక ఆది మహర్షయః
ప్రతి ఉత్థానం కృత్వా, నత్వా, యథా ఉచిత
ఆతిథ్య పూర్వకం ఉపవేశయిత్వా,
స్వయం సర్వే అపి ఉపవిష్టా।
భో భగవన్! బ్రహ్మపుత్ర! కథం ముక్తి ఉపాయో ప్లవ
అస్మాకం వక్తవ్యం? ఇతి ఊచుః ఇతి ఉక్తః।
తాన్ స హ ఉవాచ నారదః।
వేదాధ్యయన సంపన్నులు, సర్వజ్ఞులు, తపోనిష్ఠాగరిష్ఠులు, పరతత్త్వ జ్ఞాన, వైరాగ్య సంపన్నులు అగు శౌనకుడు మొదలైన ఋషులంతా నారదునికి సుస్వాగతము పలికారు. నమస్కరించి, ఆతిథ్యపూర్వకంగా ఆహ్వానించి ఉచితాసనంపై ఆశీనులను చేశారు.

శౌనకాది మునులు : హే భగవన్! శ్రీ నారదమహర్షీ! బ్రహ్మమానస పుత్రా! మీ రాకతో మేము పునీతులమైనాము. మాకు ముక్తి కలిగే ఉపాయము ఏదో, అది బోధించి మమ్ములను అనుగ్రహించండి.

శ్రీ నారద మహర్షి ఆ ప్రశ్న విని, సంతోషము పొందినవారై ఈవిధంగా పలుకసాగారు.
సత్ కుల భవః, ఉపవీతః, సమ్యక్ ఉపనయన
పూర్వకం చతుః చత్వారింశత్ సంస్కార సంపన్నః,
స్వ అభిమతైక గురుసమీపే
స్వశాఖ అధ్యయన పూర్వకం
సర్వ విద్యాభ్యాసం కృత్వా,
ద్వాదశ వర్ష శుశ్రూషాపూర్వకం
బ్రహ్మచర్యం పంచవింశతి వత్సరం
గార్హస్థ్యం, పంచవింశతి వత్సరం వానప్రస్థ ఆశ్రమం
తత్ విధివత్ క్రమాత్ నిర్వర్త్య,
చతుర్విధ బ్రహ్మచర్యం షట్ విధ గార్హస్థ్యం
‘మానవజన్మ’ అనే సత్కులమున జనించినవాడు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా ఉపవీతుడై, ఉపనయన సంస్కార పూర్వకంగా (జంధ్యము, విభూతి మొదలైన) 44 సంస్కారములను నిర్వర్తిస్తూ అనుష్ఠానపరుడై ఉండాలి.
తనకు అభిమతము (ఇష్టము) అయినట్టి గురువును సమీపించాలి. తనకు సంబంధించిన వేదవిభాగమును అధ్యయనపూర్వకంగా విద్యాభ్యాసం చేయును గాక.
ఆ విధంగా గురుశుశ్రూష నిర్వర్తించాలి.
12 సం।।ల - గురుశుశ్రూషా పూర్వక గురుకుల బ్రహ్మచర్యముచే,
25 సం।।ల - గృహస్థాశ్రమము నిర్వర్తించి,
25 సం।।ల - ‘వానప్రస్థాశ్రమము’ సేవించి
ఆయా శాస్త్రవిధులను నిర్వర్తించును గాక.
చతుర్విధ (4) - వానప్రస్థ ధర్మం
సమ్యక్ అభ్యస్య,
చతుర్ (4) విధములైన బ్రహ్మచర్యమును (వినటము, చదవటము, తెలుసుకోవటము, ఆచరణలోకి తెచ్చుకోవటము) ఆచరించును గాక.
షట్ (6) విధములైన గార్హపత్యమును (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ, సభ్య, అవసధ్య, ఔపాసనాగ్నులగు షట్ అగ్నులతో) అగ్ని కార్యముతో గార్హపత్యము (గృహస్థాశ్రమము) నిర్వర్తించటము.
(పూజ-ధ్యానము-గానము-యోగాభ్యాసము అనబడు) నాలుగువిధములైన చతుర్విధ వానప్రస్థ ధర్మములు నిర్వర్తిస్తూ, సర్వత్రా సమదృష్టిని అభ్యసించాలి.
తత్ ఉచితం కర్మ సర్వం నిర్వర్త్య,
చతుర్విధ ఆశ్రమములైనట్టి బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్థ సన్న్యాసములలో - ఎక్కడ ఉంటే అక్కడ అక్కడి ఉచితమైన ఆర్యప్రకటిత ధర్మములు నిర్వర్తిస్తూ ఉండెదరు గాక!
సాధన చతుష్టయ సంపన్నః.
సర్వ సంసార ఉపరి
ఇంద్రియ నిగ్రహముతో కూడిన శాంతము, ఆత్మతత్త్వము గురించిన విచారణ, లభించిన దానితో తృప్తి రూపమగు సంతోషము, సత్సంగము అనబడే సాధన చతుష్టయమును అనుష్ఠించును గాక।
‘‘మనో వాక్ కాయ’’ కర్మభిః
యథా ఆశా నివృత్తః,
తథా వాసన ఈషణా ఉపరి అపి,
మనస్సు, వాక్కు, శరీరముల సమస్త కర్మ విశేషములను, సర్వసంసార విశేషములను అధిగమించివేయాలి. సమస్త ఆశ-నిరాశలను నివృత్తింప (Withdrawal) జేయాలి. వాసన (Tendencies), ఈషణ (Expectations and Attachments) అధిగమించివేయును గాక.
నిర్వైరః, శాంతో, దాంతః
నిర్వైరః సర్వభూతేషు। ఎవ్వరిపట్ల ఎటువంటి వైరము కించిత్ కూడా కలిగి యుండకుండు గాక। జలంలో తరంగమువలె, ఈ జగత్ భావన (దృశ్యము) ఆత్మభావనయందు ‘‘సశాంతించినది’’ అగును గాక।
బాహ్య ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండును గాక।
సన్న్యాసీ పరమహంస ఆశ్రమేణ
అస్ఖలితః స్వస్వరూప ధ్యానేన
దేహ త్యాగం కరోతి -
‘‘సన్న్యాసీ పరమహంస’’ ఆశ్రమము స్వీకరించినవాడగు గాక। అస్ఖలిత (చలించని, చెడని, తొట్రుబాటు లేని) స్వస్వరూప ధ్యానము ఆశ్రయించును గాక। సర్వదా ఈ పాంచ భౌతిక దేహమును మానసికంగా త్యజించినవాడై ఉండును గాక।
స ముక్తో భవతి।
అట్టివాడు ‘ముక్తుడు’ అగుచున్నాడు.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘ప్రథమ ఉపదేశః’’


ద్వితీయోపదేశః (2వ ఉపదేశము) - సత్యలోక ప్రవేశము

1. అథ హ ఏనం భగవంతం నారదం సర్వే
శౌనకాదయః పప్రచ్ఛుః।
భో! భగవన్! సన్యాస విధిం నో బ్రూహి ఇతి।
తాన్ అవలోక్య నారదః -
‘‘తత్ స్వరూపం సర్వం పితామహ ముఖేన
ఏవ జ్ఞాతుం ఉచితం’’ ఇతి ఉక్త్వా।
అప్పుడు భగవంతుడగు నారదమహర్షికి శౌనకుడు మొదలైన మహర్షులు ఈవిధంగా విన్నపము చేసారు.

శౌనకుడు మొదలైన ఋషులు : హే భగవాన్! మాకు ‘‘సన్న్యాస విధి’’ గురించి దయచేసి బోధించండి.

నారద మహర్షి : మహనీయులగు మహర్షులారా! మునిసత్తములారా! అట్టి ‘‘సన్న్యాసము’’ యొక్క స్వరూపమంతా కూడా మనము నా పితృదేవులు, జగత్ పితామహులు అగు బ్రహ్మ భగవానుని ముఖతః వినటమే మనకు ఉచితము. ఆయనయే నాకంటే సుస్పష్టంగా చెప్పగలిగినవారు.
సత్ర యాగ పూర్తి అనంతరం, తైః
సహ సత్యలోకం గత్వా,
ఆ మాట విని శౌనకాది ఋషులంతా ‘‘సరే"! అట్లాగే అగు గాక।’’ అని పలికారు.
అక్కడ 12 సం।।ల సత్రయాగము పూర్తి అయినది.
ఆ తరువాత నారద మహర్షి తదితర శౌనకాది ఋషులు, మునులు అంతా ‘‘సత్యలోకము’’నకు వెళ్లారు. సృష్టికర్త, ప్రేమమూర్తి అగు శ్రీ బ్రహ్మదేవుని దర్శించారు.
విధివత్ బ్రహ్మ నిష్ఠాపరం పరమేష్ఠినం నత్వా,
స్తుత్వా, యథా ఉచితం,
తత్ ఆజ్ఞయా తైః స హ ఉపవిశ్య,
విధివిధానంగా - బ్రహ్మ నిష్ఠాపరుడు, పరమేష్ఠి అగు బ్రహ్మభగవానునికి నమస్కరించారు. వారి అనుజ్ఞతతో వారు ప్రసాదించిన ఉచితాసనములపై నారదమహర్షి మొదలైనవారంతా సుఖాసీనులైనారు. నారదులవారు పితామహునితో ఇట్లా పలికారు.
నారదః పితామహం ఉవాచ :
గురుః త్వం। జనకః త్వం। సర్వ విద్యా రహస్యజ్ఞః।
సర్వజ్ఞః। త్వం అతో మత్ ఇష్టం
రహస్యం ఏకం వక్తవ్యం।
త్వత్ వినా మత్ అభిమత రహస్యం వక్తుం।
కః సమర్థః। కిం ఇతి చేత్,
పారివ్రాజ్య స్వరూప క్రమం నో బ్రూహి ఇతి।
నారదేన ప్రార్థితః పరమేష్ఠీ సర్వతః
సర్వాన్ అవలోక్య,

శ్రీ నారదమహర్షి : మహాత్మా! తమరు జగత్ గురువులు. సృష్టిలోని సమస్త జీవులకు తండ్రి. సమస్త విద్యల రహస్యము ఎరిగి ఉన్నవారు. సర్వజ్ఞులు. ఈ సృష్టి అంతటికీ మీరే బుద్ధిశాలురు.
ఒకానొక రహస్యమైన విషయం గురించి మీరు మాకు చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మేము తెలుసుకోగోరుచున్నది మీరు తప్ప, మాకు బోధించగలవారు ఇంకెవరు ఉంటారు?
మేము వినదలచిన అట్టి రహస్య విశేషము ఏమిటంటే ‘‘పరివ్రాజము’’ యొక్క స్వరూప క్రమము ఏమిటో దయచేసి మాకు వివరించి చెప్పండి.

ఈవిధంగా శ్రీ నారదమహర్షిచే ప్రార్థించబడినవారైన పరమేష్ఠి అగు బ్రహ్మభగవానుడు - అన్నివైపులా అక్కడ ఆసీనులైన మహర్షులను, మునులను ఒక్కసారి పరికించి చూచారు.

ముహూర్తమాత్రం సమాధినిష్టో భూత్వా,

‘‘సంసార ఆర్తి నివృత్తి అన్వేషణ ఇతి’’ - నిశ్చిత్య,


నారదం అవలోక్య తమ్ ఆహ పితామహః।
ముహూర్త కాలము (12 సెకనుల సమయము) సమాధి నిష్ఠులు అయినారు.

‘‘అవును. ఈ త్రిలోక జీవుల ‘సంసారార్తి’ యొక్క నివృత్తి ఏది?’’ అని అన్వేషణ చేసి, ‘‘సరే"! సవివరణగా చెప్పుకుందాము’’ - అని నిర్ణయించుకున్నారు.

పితామహులవారు నారదుని చూచి ఈవిధంగా పలుకసాగారు.
2. పురా, మత్ పుత్ర! పురుషసూక్త
ఉపనిషత్ రహస్య ప్రకారం నిరతిశయ
ఆకార అవలంబినా, విరాట్ పురుషేణ
ఉపదిష్టం రహస్యం। తే వివిచ్య ఉచ్యతే,
ప్రియ కుమారా! నారదా! పూర్వము ఒకానొకపుడు విరాట్ పురుషునిచే పురుషసూక్తోపనిషత్ రహస్యము చెప్పబడింది.(వాసుదేవ నారాయణ ప్రోక్తమైన ముద్గలోపనిషత్ - ఋగ్వేదాంతర్గతము - ఇంద్రునిచే శ్రవణము చేయబడినది). ఆ రహస్యమునే నీకు వివరంగాను, విపులంగాను చెప్పుచున్నాను. అందరూ వినండి.
తత్ క్రమం అతి రహస్యం బాఢం
అవహితో భూత్వా శ్రూయతామ్।
అట్టి పురుషసూక్తోపనిషత్ (ముద్గలోపనిషత్) క్రమవిధానము అతి రహస్యమైనది సుమా!
అందుచేత సావధానచిత్తులై వినెదరు గాక!
భో నారద! విధివత్ ఆదౌ అనుపనీత
ఉపనయన అనంతరం తత్ సత్కుల
ప్రసూతః పితృ మాతృ విధేయః,
పితృ సమీపాత్ అన్యత్ర సత్ సంప్రదాయస్థం
శ్రద్ధావంతం సత్ కులభవం, శ్రోత్రియం,
శాస్త్ర వాత్సల్యం, గుణవంతం, అకుటిలం,
సద్గురుం ఆసాద్య, నత్వా, యథా ఉపయోగం
శుశ్రూషా పూర్వకం స్వ అభిమతం విజ్ఞాప్య,
ద్వాదశ వర్ష సేవాపురస్సరం సర్వ విద్యాభ్యాసం కృత్వా
ప్రియ నారదా! ‘అనుపనీతుడు’, సత్కులజాతుడు అయినవాడు ముందుగా తల్లి - తండ్రులకు విధేయుడై ఉపవీత సంస్కారము (ఉపనయనము) పొందాలి.
అటు తరువాత తండ్రికి వేరైనట్టి సద్గురువును సంప్రదాయంగా సమీపించాలి. సత్-సంప్రదాయ సంపన్నుడు, శ్రద్ధావంతుడు, ఉత్తమ కుల సంజాతుడు, కుటిలము లేనివాడు అగు సద్గురువును ఆశ్రయించి నమస్కరించాలి. యథోచితంగా, శుశ్రూషపూర్వకంగా తనయొక్క విద్యార్థిత్వమును విజ్ఞాపనపూర్వకంగా తెలియజేయాలి.
12 సంవత్సరముల కాలము గురు సేవ నిర్వర్తిస్తూ సద్గురువు వద్ద సమస్త విద్యలు నేర్చుకోవాలి.
తత్ అనుజ్ఞయా స్వకుల అనురూపాం అభిమత
కన్యాం వివాహ్య, పంచవింశతి (25) వత్సరం
గురుకులవాసం కృత్వా, అథ గురు అనుజ్ఞయా
గృహస్థ ఉచిత కర్మ కుర్వన్।
దౌః బ్రాహ్మణ్య నివృత్తిం ఏత్య
స్వ వంశవృద్ధి కామః పుత్రం ఏకం ఆసాద్య,
గార్హస్థ్య ఉచిత పంచవింశతి (25) వత్సరం తీర్త్వా,
తతః పంచవింశతి వత్సర పర్యంతం త్రిషవణం
ఉదక స్పర్శన పూర్వకం చతుర్థకాలం
ఆ తరువాత గురు అనుజ్ఞ పొంది ఇంటికి మరలి గృహస్థాశ్రమం స్వీకరించును గాక। స్వకుల-నియమ-నిష్ఠలను అనుసరించి కన్యను వివాహమాడాలి. 25 సం।।లు గురుకులంలోగాని, (లేక) గురు అనుజ్ఞచే గృహస్థుడై గాని ఉచిత కర్మలు నిర్వర్తించాలి. బ్రాహ్మణ నిషిద్ధములగు కర్మలను విడచి తన వంశ వృద్ధి నిమిత్తంగా ఒక్క కుమారుని పొంది మరొక 25 సం।।లు గృహస్థుడుగా గడపాలి.
ఆ తరువాత 50 సం।। నుండి (75 సం।।ల వయసు వరకు) 25 సంవత్సరముల కాలము జలస్పర్శ పూర్వకంగా నాలుగవ కాలము (50 - 75) గడపాలి.
ఏకవారం ఆహారం ఆహరన్ నయం
ఏక ఏవ వనస్థో భూత్వా,
పురగ్రామ ప్రాక్తన సంచారం విహాయ,
నికర విరహిత తత్
ఆశ్రిత కర్మ ఉచిత కృత్యం నిర్వర్త్య,
దృష్ట శ్రవణ విషయ వైతృష్ణ్యం ఏత్య,
చత్వారింశత్ (40) సంస్కార సంపన్నః
సర్వతో విరక్తః చిత్తశుద్ధిం ఏతి
ఆశా అసూయా ఈర్ష్యా అహంకారం దగ్ధ్వా
సాధన చతుష్టయ సంపన్నః సన్యస్తుం అర్హతి।
ఆ తరువాత (75 సం।। తరువాత) ఒక పూట భోజనం (ఆహారము) తీసుకుంటూ, ఏకాకి అయి వనములో (అరణ్యంలో, ఏకాంత ప్రదేశంలో) వానప్రస్థుడై గడపాలి.
పట్టణ, గ్రామ సంచారములు విడచి పెట్టాలి. జనసమూహము లేనిచోట పర్ణశాలను నిర్మించుకొని వానప్రస్థాశ్రమమునకు ఉచితమైనట్టి యోగ-ధ్యాన-అధ్యయన-భక్తి కర్మలను నిర్వర్తిస్తూ వింటున్న, చూస్తున్న విషయములనుండి వైతృష్ణము (Non - desiring, Non depending) వృద్ధి చేసుకొనును గాక।
ముక్తికి కావలసిన (దాన-ధర్మ-ధ్యాన-ప్రాణాయామ-దైవోపాసన మొదలైన) 40 దైవీ సంస్కారములను (భగవద్గీతలో చెప్పిన భక్తి-జ్ఞాన- దైవీ సంపత్తి - గుణాతీత లక్షణములను) ఆశ్రయించి సర్వత్రా విషయములపట్ల విరక్తుడగును గాక। చిత్తశుద్ధిని సంతరించుకొనును గాక।
ఆత్మజ్ఞానాగ్నిచే ఆశ, అసూయ, ఈర్ష్య, అహంకారము మొదలైన జనన-మరణ-పునర్జన్మలతో కూడిన సంసార చక్రములో త్రోయుచున్న మనో దోషములను దగ్ధము చేసివేయును గాక।
సాధన చతుష్టయము (శమము, విచారణ, సత్సంగము, సంతోషములను) సుసంపన్నము చేసుకోవాలి. అప్పుడు వానప్రస్థము నుండి (లేక) తదితర బ్రహ్మచర్య గృహస్థాశ్రమముల నుండి, సన్న్యసించటానికి అర్హుడు కాగలడు.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘ద్వితీయ ఉపదేశః’’


తృతీయోపదేశః (3వ ఉపదేశము) - క్రమ - ఆతుర సన్న్యాసము - అంతః సూత్రము

1. అథ హ ఏనం నారదః పితామహం పప్రచ్ఛః
భగవన్! కేన సన్న్యాస అధికారీ వేతి
ఏవమ్ ఆదౌ సన్న్యాస అధికారిణం నిరూప్య।
పశ్చాత్ సన్న్యాస విధిః ఉచ్యతే।
అప్పుడు నారదమహర్షి పితామహులవారిని ఈవిధంగా అడుగసాగారు.
శ్రీ నారదమహర్షి : భగవన్! బ్రహ్మ భగవన్। ఏఏ కారణాలుగా ఒకడు సన్న్యాసము స్వీకరించడానికి అర్హుడు. ఆ తరువాత సన్న్యాసము స్వీకరించి ఏఏ లక్షణములను, విధి-నిషేధములను కలిగి ఉంటారు?
పితామహ ఉవాచ:
అవహితః శృణు।
పితామహుడు (సృష్టికర్త బ్రహ్మదేవుడు) : ఓ నారదా! సమస్త శ్రోతలారా! మీరంతా అవహితులై (అవధానము పొందినవారై, ఇతర ధ్యాసలు లేనివారై) వినండి.
అథ షండః, పతితో, అంగవికలః, స్త్రైణో,
బధిరో, అర్భకో, మూకః, పాషండః, చక్రీ,
లింగీ, వైఖానస, హర ద్విజౌ, భృతక,
అధ్యాపకః, శిపివిష్టో, అనగ్నికో-
వైరాగ్యవంతో అపి ఏతే న సన్న్యాస అర్హాః।

ముందుగా సన్న్యాసము స్వీకరించడానికి ఎవరు అర్హులు కారో, వారి గురించి చెప్పుకుందాము. ఆ తరువాత సన్న్యాసవిధి విధానములు వివరించుకుందాము.
సన్న్యాసమునకు అనర్హులు :
షండుడు (నపుంసకుడు), పతితుడు (కుల-సంఘ శాస్త్రీయ, శ్రేయో మార్గములను విడచి అధర్మ మార్గములో పడినవాడు), అంగ వికారుడు (అంగ లోపములు కలవాడు), స్త్రైణుడు (అనుచితమైన స్త్రీ సంపర్కములు కొనసాగించువాడు), బధిరుడు (చెవిటివాడు), అర్భకుడు (బాలుడు, శాస్త్ర విషయములు ఎరుగనివాడు), మూగవాడు, పాషండుడు (వేదములపట్ల మొండితనముతో కూడిన దురభిప్రాయము కలవాడు, నాస్తికుడు), చక్రీ (ఇతరులపై కొండెములు చెప్పుచూ పరులను అల్పభావముతో చూచువాడు), లింగీ (ధన సంపాదనయే లక్ష్యముగా కలిగి, ఇతరుల గృహములు ఆశ్రయించువాడు), వైఖానసుడు (దేవాలయములో అర్చక వృత్తి చేయువాడు), హర ద్విజుడు (శివాలయంలో అర్చకుడు), భృతకుడు (భృతి-జీవనోపాధి కొరకై వేదాధ్యయనము చేయువాడు), అధ్యాపకుడు (వేద విద్య నేర్పువాడు), శిపి విష్టుడు (శారీరక దీర్ఘరోగములు కలవాడు), అగ్నికార్యములపట్ల విముఖత గల అనగ్నికుడు - వైరాగ్య భావములు కలిగియున్నా కూడా - వీరు అనర్హులు.

సన్న్యస్తా యది అపి మహావాక్య
ఉపదేశే న అధికారిణః।

పూర్వ సన్న్యాసీ పరమహంసో అధికారీ।

పరేణ ఏవ ఆత్మనః చ అపి,
పరస్త్య ఏవ ఆత్మనా తథా అభయం
సమవాప్నోతి (సమ్ అవాప్నోతి) స ‘‘పరివ్రాట్’’ ఇతి స్మృతః।।
ఒకవేళ వీరు సన్న్యసించినా కూడా మహావాక్యములు బోధించటానికి అర్హులు అవరు.

సత్-న్యాసమును ఆశ్రయించి, ఆత్మోపాసనకు సిద్ధపడ్డవాడే పరమహంసత్వమునకు అర్హత (అధికారము) పొందగలడు.

ఆత్మకు పరమైనదంతా (వేరైనదంతా) విడచి, సమస్తమునకు ఆవల సాక్షీభూతమైయున్న ఆత్మస్వరూపమును ఆశ్రయించి, అభయము పొందినవాడు - పరివ్రాట్.
2. షండో, అథ వికలో అపి, అంధో
బాలకః చ అపి పాతకీ,
పతితః చ పరద్వారీ వైఖానస హరద్విజౌ,
చక్రీ, లింగీ చ పాషండీ శిపివిష్టో అపి అనగ్నికః,
ద్వి త్రి వారేణ సన్న్యస్తో భృతక
అధ్యాపకః అపి చ ఏతే న అర్హంతి
సన్న్యాసం ఆతురేణ వినా క్రమమ్।।
పైన చెప్పుకొన్న షండుడు (నపుంసకుడు), వికలుడు (అంగలోపము కలవాడు), గ్రుడ్డివాడు, బాలుడు, పాతకములు చేసిన పాతకుడు, పతితుడు (ధర్మమార్గముల నుండి దిగజారినవాడు), వైఖానసుడు (వేదములకు వేరైన ఉపాసకుడు), హర ద్విజుడు (శివాలయములో అర్చకుడు), చక్రీ (శంఖ చక్రములను చర్మముపై రచించుకొన్నవాడు), లింగీ (లింగార్చకుడు), పాషండ మతము (దైవ-వేద తిరస్కారము) ఆశ్రయించినవాడు, దీర్ఘరోగి అగు శిపివిష్టుడు, అనగ్నికుడు (అగ్ని కార్యములను తిరస్కరించువాడు), ఒకసారి సన్న్యసించి మరల సంసారము ఆశ్రయించిన ద్వి త్రి వారేణ సన్న్యస్తుడు, జీవనభృతిపై ఆశలు చావని భృతకుడు - వీరంతా క్రమ సన్న్యాసమునకు అర్హులు కారు. కానీ, ఆతుర సన్న్యాసము తీసుకున్నా అర్హులు కారు.
మునులు: ఆతురస్య కథం కాలః?
కథం ఆర్యస్య సమ్మతః?

బ్రహ్మ భగవానుడు: ప్రాణస్య ఉత్క్రమణ
ఆసన్నకాలస్తు ఆతుర సంజ్ఞికః।

నేతరస్తు (న ఇతరస్తు) ఆతురః కాలో
ముక్తిమార్గ ప్రవర్తకః।
మునులు : ఆతుర సన్న్యాసమునకు సరి అయిన సమయము ఏది? ఏ విధమైన ఆతుర సన్న్యాసము ఆర్యులచే (వేదజ్ఞులచే) అంగీకారము అవుతోంది?

బ్రహ్మ భగవానుడు : ‘‘ఆతురము’’ అనగా మరణ కాలము సమీపించి, ప్రాణములు వదలటము సమీపిస్తున్న సందర్భము.
ఆ విధంగా మరణ కాలము సమీపిస్తూ ఉండగా సన్న్యాసము స్వీకరించటము - ఆతుర సన్న్యాసము. అట్టి ఆతుర సన్న్యాసము ఆతుర కాలము కానప్పుడు స్వీకరిస్తే అది ముక్తి మార్గముగా అవదు.
ఆతురే అపి చ సన్న్యాసే తత్ తత్ మంత్ర పురస్సరమ్
మంత్రా వృత్తిం చ కృత్వా ఏవ, సన్న్యసేత్ విధివత్ బుధః।

ఆతురే అపి క్రమేచా అపి ప్రైష భేధో న కుత్రచిత్।

న మంత్రం కర్మరహితం కర్మ మంత్రం అపేక్షతే।
ఆకర్మ మంత్ర రహితం।
న అతో మంత్రం పరిత్యజేత్।
మంత్రం వినా కర్మ కుర్యాత్ భస్మని ఆహుతివత్ భవేత్।
‘ఆతుర సన్న్యాసము’ అయినప్పటికీ, అది కూడా సన్న్యాస మంత్ర - విధి విధానంగా, మంత్రవృత్తిని పురస్కరించుకొనే శాస్త్ర పద్ధతిగా విబుధుడు సన్న్యసించాలి.

ఆతుర సన్న్యాసము, క్రమ సన్న్యాసము - రెండు సందర్భములలో కూడా ప్రైష భేదము (శాస్త్రీయ విధి విధానము)లో భేదము ఏదీ ఉండదు.

మంత్రరహితమైన కర్మ ఏదీ ఉండదు. అందుచేత మంత్రమును విడువనే కూడదు.
‘‘మంత్ర రహితంగా కర్మను నిర్వర్తించటము’’ అనేది బూడిదతో ఆహుతి చేయటముతో సమానమౌతుంది.

విధి ఉక్త కర్మ సంక్షేపాత్ సన్న్యాసస్తు
‘ఆతురః’ స్మృతః।
తస్మాత్ ఆతుర సన్న్యాసే
మంత్ర ఆవృత్తి విధిః, మునే।

ఆహిత అగ్నిః విరక్తః చేత్ దేశాంతరగతో యది,
ప్రాజాపత్యేష్టిం అప్సు ఏవ
నివృత్యైవ (నివృత్య ఏవ) అథ సన్న్యసేత్।
అందుచేత శాస్త్రములు సంక్షిప్తంగా నియమించిన కర్మకాండతో నిర్వర్తించునదే ‘ఆతుర సన్న్యాసము’ - అనబడుతోంది.
నారదా! అందుచేతనే ఆతురసన్న్యాసమునకు కూడా సంక్షిప్తంగా మంత్ర - ఆవృత్తి విధించబడుతోంది.

ఒకడు వేరే ప్రదేశమునకు తరలి వెళ్ళిపోవటంచేత అగ్నికార్యము (ఆహితాగ్ని) ఉపాసించుటపట్ల అనురక్తి కోల్పోయి, విరక్తుడు అయినప్పుడు కూడా సన్న్యసించదలచినప్పుడు, ఆ వేరే ప్రదేశములో జలముతో ‘‘ప్రజాపత్యేష్టి" నిర్వర్తించి, అప్పుడు ‘నివృత్తి - ధర్మము’ అయినట్టి సన్న్యాసము స్వీకరించాలి. సర్వ స్వదక్షిణ రూపంగా ఆచరించాలి.
మనసా వా, అథ విధ్యుక్త
మంత్ర ఆవృత్య అథ వా జలే
శ్రుతి - అనుష్ఠాన మార్గేణ,
కర్మానుష్ఠానం ఏవ వా,
సమాప్య సన్న్యసేత్ విద్వాన్
నో చేత్ పాతిత్యమ్ ఆప్నుయాత్।।
మనస్సుతోగాని, సశాస్త్రీయ మంత్రముగ్ధంగా గాని, జలము (నీటి) యందు ‘శ్రుతి-అనుష్ఠానము’ మార్గంగాగాను, కర్మానుష్ఠానపూర్వంగా ‘‘అనుష్ఠానము’’ను పూర్తి చేయాలి. ఆ తరువాతనే విరక్తుడైన ఆతడు సన్న్యసించును గాక।
విధి విధాన మంత్ర కర్మనిష్ఠాపూర్వకంగా ఆచరించకపోతే, అట్టి (అవిధి అవిధాన పూర్వకంగా) సన్న్యసిస్తే పతితము (Down Fall) పొందే అవకాశము ఉంటుంది.
3. యదా మనసి సంజాతం వైతృష్ణ్యం సర్వ వస్తుషు,
తదా సన్న్యాసం ఇచ్ఛంతి పతితః స్యాత్ విపర్యయే।విరక్తః ప్రవ్రజేత్ ధీమాన్,
సరక్తస్తు గృహే వసేత్।

సరాగో నరకం యాతి
ప్రవ్రజన్ హి ద్విజ అధమః।
ఎప్పుడైతే సమస్త దృశ్య విశేషములపట్ల, వస్తుజాలముపట్ల అనురక్తి తొలగుతుందో, తృష్ణారహితుడు (Sans all World-related Avocational urges) అవుతాడో, అట్టివాడే సన్న్యసించాలి.
అట్లా కాకుండా తృష్ణ, అనురక్తి కలిగియే ఉండి సన్న్యసిస్తే, మనో వైకల్యములు జయించకుండా సన్న్యసిస్తే, అట్టివాడు పతితము (Down Fall) పొందగలడు. విపర్యుడు అవవచ్చు కూడా.

సమస్త దృశ్య సంబంధమైన విషయములపట్ల ‘విరక్తి’ (Non-inquisitiveness, non-relatedness) కలిగినప్పుడు మాత్రమే సన్న్యసించాలి. అనురక్తి కలిగి ఉంటే గృహస్థాశ్రమమే ఉచితము.

విషయములపట్ల ‘అనురాగము’ వదలక సన్న్యసిస్తే అట్టివాడు ‘నరకము’ అను అధమస్థానము పొందగలడు.
యస్య ఏతాని సుగుప్తాని
జిహ్వ ఉపస్థ ఉదరం కరః
సన్న్యసేత్ అకృతో ద్వాహో
బ్రాహ్మణో బ్రహ్మచర్యవాన్
బ్రహ్మచర్యము నుండి సన్న్యాసాశ్రమం : ఎవ్వనిపట్ల అయితే (1) నోరు (2) ఉపస్థ (శృంగారావయవము) (3) పొట్ట (4) చేతులు - ఈ నాలుగు తన వశమున ఉన్నవై కాపాడబడుచున్నాయో, అట్టివాడు (వ్రతనిష్ఠుడు) మాత్రమే బ్రహ్మచర్యమునుండి వివాహము మాని, సన్న్యాసాశ్రమము స్వీకరించవచ్చును.
సంసారం ఏవ నిస్సారం
దృష్ట్వా సారది వృక్షయా

ప్రవ్రజంతి అకృతో ద్వాహః
పరం వైరాగ్యం ఆశ్రితాః
ప్రవృత్తి లక్షణం కర్మ।
జ్ఞానం సన్న్యాస లక్షణమ్।
‘‘ఈ సంసారము మొదలు - మధ్య - చివర కూడా నిస్సారమైనది. సారది వృక్షమువలె (బూరుగ చెట్టువలె) లేక (ముళ్ల చెట్టువలె) నిరుపయోగమైనది’’ - అని గమనించి,

కర్మల పరిధులను అధిగమించివేసి పరమం అగు వైరాగ్యము ఆశ్రయిస్తూ సన్న్యసించుదురు గాక।

‘‘కర్మ’’ అనునది - ప్రవృత్తి రూపము.
‘‘జ్ఞానము’’ అనునది - సన్న్యాస లక్షణము.
తస్మాత్ జ్ఞానం పురస్కృత్య
సన్న్యసేత్ ఇహ బుద్ధిమాన్।

యదా తు విదితం తత్త్వం (తత్ త్వం)
పరంబ్రహ్మ సనాతనమ్।
‘తత్’ ఏకదండం సంగృహ్య
స ఉపవీతం, శిఖాం త్యజేత్।।
అందుచేత బుద్ధిమంతుడైనవాడు - కర్మ, కర్మఫలముల పరిధులను క్రమంగా దాటివేసి, ‘ఆత్మజ్ఞానము’ను పురస్కరించుకొని (ఆశ్రయించి) సమస్తమును సన్న్యసించినవాడై ఉండును గాక।

ఓ నారదమహర్షీ! ఎప్పుడైతే ‘తత్త్వజ్ఞానము’ను సంపాదించుకొని సనాతనమగు ‘‘పరబ్రహ్మము’’ అనే ఏకదండమును గ్రహిస్తాడో, - అట్టివాడు (తత్త్వభావనను ఆశ్రయిస్తూ), ఇక క్రమంగా భౌతికమైన దారపు నిర్మిత ఉపవీతమును, శిఖను త్యజించుచుండును గాక।
4. పరమాత్మాని యో రక్తో,
విరక్తో అపరమాత్మని
సర్వ-ఈషణా వినిర్ముక్తః
స భైక్షం భోక్తుం అర్హతి।।

పూజితో వందితః చ ఏవ
సుప్రసన్నో యథా భవేత్
తథా చేత్ తాడ్యమానస్తు
తదా భవతి ‘భైక్షభుక్’।
ఎవ్వడైతే సర్వాత్మకుడు, సర్వతత్త్వ స్వరూపుడు అగు ‘‘పరమాత్మ’’ పట్ల ‘అనురక్తి’ని పెంచుకుంటూ, (మరొకవైపు నుండి) - (‘‘భార్యేషణ, పుత్రేషణ - ధనేషణ’’ అనబడే) త్రయ-ఈషణములనుండి ‘విముక్తుడు’ (getting relieved) అగుచూ ఉంటాడో, - అట్టివాడు భిక్షకుడు అవటానికి, భిక్షాన్నము భుజించటానికి అర్హుడు (Deserved) అగుచున్నాడు.

ఎవడైతే కొందరిచే పూజింపబడుచున్నప్పుడు, నమస్కరించ బడుచున్నప్పుడు ఏవిధంగా సుప్రసన్నుడై ఉంటాడో,…
ఇతరులచే బాధించబడుచున్నప్పుడు కూడా అట్లాగే శాంతుడై, సుప్రసన్నుడై ఉండగలవాడే ‘‘భైక్షకభుక్తుడు’’.
అహం ఏవ అక్షరం బ్రహ్మ
వాసుదేవాఖ్యమ్ అద్వయమ్
ఇతి భావో ధ్రువో యస్య
తదా భవతి ‘భైక్ష భుక్’।

యస్మిన్ శాంతిః శమః శౌచం
సత్యం సంతోష ఆర్జవమ్,
ఆకించన్యం అదంభః చ
స ‘కైవల్య ఆశ్రమే’ వసేత్।।

యదా న కురుతే భావం
సర్వభూతేషు పాపకం
కర్మణా మనసా వాచా,
తదా భవతి భైక్షుకమ్।।
‘వాసుదేవ’ అని చెప్పబడుచు, అద్వయము, అక్షరము అయి ఉన్న బ్రహ్మము - అనగా ఎవరు? ‘నేనే’ అయి ఉన్న నాయొక్క పరబ్రహ్మ స్వరూపమే - అను ధృవమైన భావము ఎవరిపట్ల చ్యుతి లేనిదై, స్వాభావికమై, నిశ్చయమై ఉంటుందో, - ఆతడే ‘భైక్ష భుక్’.

కైవల్య స్థానము : ఎవనిపట్ల అయితే శాంతము, అంతరింద్రియ రూపమగు శమము, శుచి అయిన భావములు (శౌచము), సత్యము, తృప్తి, సంతోషములు, ఆర్జవము (ఋజుస్వభావము, మనసా-వాచా-కర్మణ ఏకత్వము, కుటిలత్వము లేకపోవటము), అకించత్వము (దీనత్వము లేకపోవటము), దంభము లేకుండటము - ఈ లక్షణములు స్వాభావికమో, - అట్టివాడు ‘‘కైవల్య ఆశ్రమము’’లో నివాసము కలవాడు అగుచున్నాడు.

కర్మణా మనసా వాచా (త్రికరణ శుద్ధిగా) - ఏ జీవునిపట్ల పాప (దోష, హింసా) భావములు, అభిప్రాయములు కలిగి ఉండడో (సమస్త జీవులు శుద్ధమగు పరబ్రహ్మ స్వరూపులే - అను భావము కలిగి ఉంటాడో) - అట్టివాడే ‘‘భిక్షకుడు’’.
దశలక్షణకం ధర్మం
అనుతిష్ఠన్ సమాహితః,
వేదాంతాన్ విధివత్ శ్రుత్వా
సన్న్యసేత్ అనృణో ద్విజః।

ధృతిః క్షమా దమో అస్తేయం
శౌచం ఇంద్రియనిగ్రహః,
ధీః విద్యా సత్యమ్ అక్రోధో
దశకం ధర్మలక్షణం।।
సన్న్యాసమునకు అర్హత : (1) దశ [10] లక్షణ ధర్మమును అనుష్ఠించువాడు (2) వేదాంత విద్యను సద్గురువు వద్ద విధి, విధానంగా విని హృదయస్థం చేసుకున్నవాడు, (3) ఋణగ్రస్తుడు కానివాడు- అట్టివాడు సన్న్యాసాశ్రమునకు అర్హుడు.

ధర్మ లక్షణ దశకము : 1. ధృతి (ఆత్మతత్త్వోపాసన పట్ల స్థిరత్వము. ధైర్యముతో కూడిన పట్టుదల) 2. క్షమాగుణము (తప్పులు మన్నించ గలగడం, ఓర్పు, సహనము) (3) దమము (బాహ్య ఇంద్రియ నిగ్రహము) (4) అస్తేయము (తనది కానిది స్వీకరించకపోవటము, దొంగ బుద్ధి లేకుండటము) (5) శౌచము (శుచి అయిన భావములు) (6) అంతరింద్రియ నిగ్రహము (శమము) (7) ధీః (ఉత్తమమైన తెలివితేటలు. నిర్మలమైన, సునిశితమైన, విస్తారమైన బుద్ధి) (8) విద్య (ఆత్మవిద్యా అధ్యయనము) (9) సత్యము (కల్పనా జగత్తును అధిగమించి ఉండటము) (10) అక్రోధము (క్రోధరాహిత్యము, ఎవ్వరిపై క్రోధము లేకుండటము) - ఇవి ధర్మలక్షణ దశకము (10).
5. అతీతాన్ న స్మరేత్ భోగాన్
న తథా అనాగతాన్ అపి।
ప్రాప్తాంశ్చ న అభినందేత్ యః
స కైవల్య ఆశ్రమే వసేత్।

అంతస్థాని ఇంద్రియాణి అంతః,
బహిష్ఠాన్ విషయాన్ బహిః
శక్నోతి యః సదా కర్తుం
స కైవల్య ఆశ్రమే వసేత్।
ఎవ్వడైతే - జరిగిపోయిన కాలమునకు సంబంధించిన (మరియు) రాబోవు కాల సంబంధమైన ఇహ-పర భోగముల గురించి (ఇంద్రియ విషాయానందముల గురించి) ఏ మాత్రము చింతించడో (One who does not worry at all), వర్తమాన భోగ సంపదల గురించి అభినందించడో (Does not depend on the sense enjoyments) - అట్టివాడు ‘కైవల్యాశ్రమము’నందు వసించును.

అంతరింద్రియములు అయినట్టి మనో-బుద్ధి-చిత్త-అహంకారములను అంతరముననే (లోనయే) నిరోధించి, బాహ్య కర్మ-జ్ఞాన దశ (10) ఇంద్రియ విషయములను బయటనే ఉంచివేసి (అంతరంగా ప్రవేశించనీయకుండా) ఎల్లప్పుడు వశము చేసికొని ఉండగలడో, - అట్టివాడే ‘‘కైవల్యాశ్రమవాసుడు’’.
ప్రాణే గతే యథా దేహః
సుఖం దుఃఖం న విందతి,
తథా చేత్ ప్రాణయుక్తో అపి
స కైవల్య ఆశ్రమే వసేత్।

కౌపీన యుగళం కంథా
దండ ఏకః పరిగ్రహః,
యతేః పరమహంసస్య
న అధికం తు విధీయతే।
ఏవిధంగా అయితే ప్రాణము పోయిన తరువాత ఈ భౌతిక దేహము సుఖముగాని, దుఃఖముగాని పొందటము లేదో, ఆవిధంగా ప్రాణములు శరీరములో ఉన్న సందర్భములో కూడా సుఖ-దుఃఖ భావములు ఎవడు పొందడో, అట్టివాడే కైవల్యాశ్రమ నిష్ఠుడు.

(1) కౌపీన యుగళము (గోచీల జతను), (2) కంథా (కంబళి), (3) ఏకదండము - యతి అయినట్టి పరమహంస. ఈ మూడింటిని మాత్రమే కలిగినవారై ఉంటారు. అంతకుమించి ఇంకేమీ కలిగి ఉండరు.
యది వా కురుతే రాగాత్
అధికస్య పరిగ్రహమ్,
రౌరవం నరకం గత్వా
తిర్యక్ యోనిషు జాయతే,

విశీర్ణాని అమలాని ఏవ
చేలాని గ్రధితానితు,
కృత్వా కంథాం బహిః వాసో
ధారయేత్ ధాతురంజితమ్,
ఏకవాసా అవాసా వా
ఏకదృష్టిః అలోలుపః,
ఏక ఏవ చరేత్ నిత్యం
వర్షాసు ఏకత్ర సం వసేత్।।
ఒకవేళ పై మూడుకు మించి ఇంకేమైనా ‘రాగము’లో అధికంగా కలిగి ఉంటే, అట్టివాడు రౌరవాది నరకములో ప్రవేశించటమే కాకుండా, జంతు యోనులలో జన్మలు పొందగలరు.

చిరిగిన వస్త్ర ఖండములతో (with pieces of cloth) బొంతగా కుట్టుకొని, అట్టి వాటితోనే ఏక వస్త్రముగా కుట్టుకొని ధరించాలి.
(లేదా) బాహ్య వస్త్రములు త్యజించి, దిగంబరుడై చరిస్తూ, ఏకాగ్రత కలవాడై, అభేద దృష్టితో నిశ్చలుడై, భేద దృష్టులన్నీ జయించినవాడై, ఆశారహితుడై ఏకాకిగా సంచరిస్తూ ఉండును గాక! ఒకేచోట నివాసము కలిగి ఉండరాదు.
వర్షాకాలపు (వర్షఋతు) 4 నెలలు మాత్రమే ఒకచోట (ఒక్క ప్రదేశంలో) నివాసము చేయాలి.
6. కుటుంబం పుత్రదారాంశ్చ
వేదాంగాని చ సర్వశః,
యజ్ఞం యజ్ఞోపవీతం చ
త్యక్త్వా గూఢః చరేత్ యతిః।
‘‘యతి’’ - అయినవాడు కుటుంబము, సంతానము, భార్య, వేదాంగములు (సాంఘికంగా, శాస్త్రీయంగా చేయవలసినవి, చేయకూడనివి) మొదలైనవన్నీ దాటిపోయినవాడు. యజ్ఞము-యజ్ఞోపవీతము కూడా త్యజించి ఉన్నవాడై ఉంటాడు. రహస్యంగా ‘‘సమస్తము ఆత్మయే’’ - అనే ఆత్మభావనయందు స్థితిని వీడకుండా ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు. తనయందు తానే, సమస్తము తానై సంచారము కలిగి ఉంటారు.
కామః క్రోథః తథా దర్పః
లోభ మోహ ఆదయః చ యే,
తాంస్తు దోషాన్ పరిత్యజ్య
పరివ్రాట్ నిర్మమో భవేత్।
‘‘పరివ్రాట్’’ - ఏదో ఇంకా కావాలి, పొందాలి అనే కామమును, అంతరంగంలో ఉండే ‘కోపము’ రూపమగు క్రోధమును, ‘‘నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని’’ - అనే దర్పమును, అవి-ఇవి నేను కలిగి ఉండి, నాకే చెందినవిగానే కనిపిస్తున్నాయి అనే ‘లోభము’ను, ఊహ-అపోహలతో కూడిన మోహము మొదలైన దోషములన్నీ పరిత్యజించి, ‘‘నాది-నేను’’ అనే మమకారము లేనివాడై ఉంటున్నాడు.
రాగ ద్వేష వియుక్తాత్మా
సమ లోష్ట ఆశ్మ కాంచనః
ప్రాణి హింసా నివృత్తః చ
మునిః స్యాత్ సర్వ నిస్పృహః।
‘‘ముని’’ - రాగ ద్వేషములను వదలివేసినవాడై, మట్టి రాయి మరియు బంగారములను ఒకే దృష్టితో చూస్తూ, సహప్రాణులపట్ల బాధించటము, హింసలను విడనాడినవాడై, ఈ సమస్తము పట్ల నిస్పృహుడై (ధ్యాస, అభిరుచి, అభిప్రాయములను వీడినవాడై) ఉంటున్నాడు.
దంభ అహంకార నిర్ముక్తో
హింసా పైశున్య వర్జితః।
ఆత్మ జ్ఞాన గుణ ఉప ఏతో
యతిః మోక్షం అవాప్నుయాత్।।
ఎవ్వడైతే - యతి అయి, దంభము-అహంకారములనుండి పూర్తిగా విడివడినవాడై, హింస-లోభత్వ-దీనత్వములను త్యజించినవాడై, ‘‘ఆత్మ అనగా ఏది?’’ అని ప్రశ్నించి, తెలుసుకున్న ఆత్మజ్ఞాన గుణోపేతుడైన యతి - మోక్షమును పొందుచున్నాడు. ‘‘నేను దేనికీ బద్ధుడను కాను’’ అను స్వాభావికతను పునికిపుచ్చుకుంటున్నాడు.
ఇంద్రియాణాం ప్రసంగేన
దోష మృచ్ఛతి అసంశయమ్।

సత్ నియమ్యతు తాని ఏవ
తతః సిద్ధిం నిగచ్ఛతి।
ఓ నారదా! శౌనకుడు మొదలైన మునీశ్వరులారా!
- ఇంద్రియ విషయముల గురించి ప్రసంగము (Talking repeatedly) కొనసాగిస్తూ ఉంటే, అప్పుడు సమస్త దోషములు ఈ జీవునిపట్ల వచ్చిపడుచూనే ఉంటాయి. ఇందులో అనుమానమే లేదు.

అందుచేత, ఎవ్వడైతే ఈ ఇంద్రియములను సరి అయిన (జ్ఞాన సముపార్జనా) మార్గంగా నియమిస్తాడో, అట్టివాడు తప్పక సిద్ధిని పొందగలడు.

న జాతు కామః కామానాం 
ఉపభోగేన శామ్యతి, 
హవిషా కృష్ణవర్త్మ ఇవ 
భూయ ఏవ అభివర్ధతే।।
‘‘ఈఈ కోరికలు తీరితే ఇక నాకు కోరికలు ఉండవు’’ - అనునది నిజం కాదు. అగ్నిలో హోమ ద్రవ్యములు (నేయి మొదలైనవి) వేస్తున్న కొలదీ అగ్ని ఆరుతుందా? లేదు. కొంచెం తగ్గినట్లే తగ్గి ఇంకా ప్రజ్వరిల్లుతుంది. అట్లాగే విషయములు ఆశ్రయించిన కొలదీ ‘కామము’ అనే అగ్ని కొంచెము తగ్గినట్లే తగ్గి ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది.

శ్రుత్వా స్పృష్ట్వా చ భుక్త్వా చ
దృష్ట్వా ఘ్రాత్వా చ యో నరః।
న హృష్యతి గ్లాయతి వా
స విజ్ఞేయో జితేంద్రియః।
ఏ విజ్ఞాని అయితే - శుభ అశుభ విషయములను వింటున్నప్పుడు (while hearing), ఆయా వస్తు విశేషములను స్పృశిస్తున్నప్పుడు (while touching), ఆహారపదార్థాలను తింటూ ఉన్నప్పుడు (while eating), వాసన చూస్తున్నప్పుడు (while experiencing smell) - సంతోషముగాని, దుఃఖముగాని పొందడో, - అట్టివాడే జితేంద్రియుడు (ఇంద్రియములను జయించినవాడు).
యస్య వాక్ మనసీ శుద్ధే
సమ్యక్ గుప్తే చ సర్వదా,
స వై సర్వం అవాప్నోతి
వేదాంత ఉపగతం ఫలమ్।।
ఎవ్వడైతే, -
- తనయొక్క వాక్కును, మనస్సును శుద్ధము (pure) చేసుకొని,
- సర్వదా సమ్యక్ (సమ) దృష్టిని అంతరమున పదిలపరచుకొని ఉంటాడో,
అట్టివాడు వేదాంత శాస్త్రముచే ఎలుగెత్తి గానము చేయబడుచున్న ‘‘సో2హమ్ - తత్త్వమ్’’ భావన అనే ఉత్తమ ఫలమును ఇప్పుడే, ఇక్కడే పొందుచున్నాడు.
7. సన్మానాత్ బ్రాహ్మణో నిత్యం
ఉద్విజేత విషాత్ ఇవ

అమృతస్య ఏవ చ ఆకాంక్షేత్
అవమానస్య సర్వదా।
బ్రాహ్మీదృష్టిని సంతరించుకొన్న బ్రహ్మనిష్ఠుడు - సన్మానములను స్వీకరించక, అట్టి సందర్భములను ‘విషము’ వలె భావిస్తూ ఉంటాడు.
అవమానము సందర్భమగుచున్నప్పుడు, ‘‘ఆహా"! ఇది నా మానసిక దోషములను తొలగించగలదు’’ - అని భావిస్తూ సర్వదా అమృతప్రాయంగా భావిస్తూ ఉంటాడు.
సుఖం హి అవమతః శేతే
సుఖం చ ప్రతిబుద్ధ్యతే।
సుఖం చరతి లోకే అస్మిన్
అనవమంతా వినశ్యతి।
తన వలన ఇతరులకు అవమానము కలిగినప్పుడు తన అహంకారము వృద్ధి చెందుతుంది. పైకి సుఖముగా కనిపించి, చివరికి దుఃఖమునకు దారి తీయగలదు.
తనకు అవమానము ఎవరివలన అయినా కలిగినప్పుడో? అది ఇతః పూర్వపు కర్మదోషములను తొలగించి, సంచిత పాపములనుండి శుభ్రము చేయగలదు. కనుక అది సుఖమునకే దారి తీయగలదు.
అవమానము అమృతముగా భావించువాడు ఆనందముగా మేల్కొనుచున్నాడు. అవమానించినవాడు పాపచిత్తుడు అవటంచేత దుఃఖముతో నిదురించి, తిరిగి దుఃఖముతోనే మేల్కొనుచు చివరకు నాశనము పొందుచున్నాడు. ‘‘వినశ్యతి।’’
అతివాదాన్ తితిక్షేత
న అవమన్యేత కంచన।
న చ ఇమం దేహం ఆశ్రిత్య
వైరం కుర్వీత కేనచిత్।
క్రుధ్యంతం న ప్రతి క్రుధ్యేత్
ఆకృష్టః కుశలం వదేత్।
సప్త ద్వార అవకీర్ణం చ
న వాచం అనృతాం వదేత్।।
అంతే కాకుండా సామాన్య ప్రయత్నములచే లభించనట్టి ‘‘తితిక్ష’’ అనే (అష్టాంగ యోగములలోని) యోగసిద్ధి లభించగలదు.
అందుచేత ఏ ఒక్క ప్రాణితో కూడా వైరము కూడదు. ఈ దేహ-ఇంద్రియములతో ఏ జీవితోను శత్రుభావన కలిగి ఉండరాదు.
ఎవరైనా కోపము ప్రదర్శిస్తున్నప్పుడు ‘శాంతము’ వహించి ఉండాలి. అంతేగాని తిరిగి క్రోధము ప్రదర్శించరాదు. ‘కుశలము’నే (మీకు శుభము అగు గాక అని) పలకాలి.
శబ్దము (Expression) సప్తద్వారముల నుండి (పంచేంద్రియములు, మనస్సు, బుద్ధిలనుండి) జనిస్తోంది. అట్టి సప్తద్వారముల నుండి ఎక్కడా అనృతము (అసత్యము) కూడదు. సత్యమునే పలకాలి, ప్రకటించాలి.
అధ్యాత్మరతిః ఆసీనో,
నిరపేక్షః నిరాశిషః,
ఆత్మనా ఏవ సహాయేన సుఖార్థీ విచరేత్ ఇహ।।

ఇంద్రియాణాం నిరోధేన,
రాగద్వేష క్షయేణ చ,
అహింసయా చ భూతానాం
అమృతత్వాయ కల్పతే।
‘యతి’ అయినవాడు అధ్యాత్మజ్ఞాన మార్గమునందు ఆసీనుడై ఉండును గాక. దేనినీ అపేక్షించనివాడై, దేనినీ అనుభవముగా పొందనివాడై, సమస్తము ఆత్మరూపముగా దర్శిస్తూ, ఆత్మభావనా సంపన్నుడై, సుఖ స్వరూపుడై సంచరించును గాక! (అనుభవములు ఉండి కూడా, అనుభవములు పొందనివాడు).

ఎవ్వడైతే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ క్రియలను ప్రదర్శిస్తున్న పంచేంద్రియములను విషయములనుండి ఉపసంహరించి, నిరోధించి ఉంటాడో, రాగ-ద్వేషములను క్షయింపజేసుకుంటాడో, సహజీవులపట్ల అహింస (బాధించకుండటము) ఆచరణగా (As a practice) కలిగి ఉంటాడో, అట్టివాడు మృత్యుపరిధులను దాటివేసి, అమృతత్వమును సిద్ధించుకోగలడు.
అస్థి స్థూణం స్నాయు బద్ధం,
మాంస శోణితలేపితమ్,
చర్మ అవబద్ధం, దుర్గంధ పూర్ణం
మూత్ర పురీషయోః।
జిరా శోక సమావిష్టం
రోగ ఆయతనం ఆతురమ్।
ఈ దేహము ఎటువంటిది?

ఎముకలతోను, కండరములతోను, నరములతోను నిర్మితము, బంధితము అయిన పంజరము వంటిది. మాంస రక్తములతో నిండినది. చర్మముతో కప్పబడినట్టిది. మూత్రము, పురీషము (మలము)లతో దుర్వాసన కలిగి ఉన్నట్టిది. ముసలితనము, దుఃఖములతోను అనేక రోగములతోను కూడి ఉన్నది.
రజస్వలం అనిత్యం చ
భూతావాసం ఇమం త్యజేత్।

మాంసా సృక్ పూయ విత్ మూత్రా
స్నాయు మజ్జ అస్థి సంహతౌ,
దేహే చేత్ ప్రీతిమాన్ మూఢో,
భవితా నరకే-పి సః।।
దుమ్ము, ముట్టు రూపమగు రజస్వలము (దుష్ట రక్తము) కలిగి ఉన్నట్టిది. పంచ భూత నిర్మితమైన ఈ భౌతిక శరీరము ఏమాత్రము నిత్యము కాదు. అట్టి ఈ భౌతిక దేహమును త్యజించి ఉండెదరు గాక। (దేహము ఉన్నా, లేనివారై ఉండండి).
అటువంటి మాంస, రక్త, మూత్ర (ఉచ్చ), స్నాయు (సన్నటి నరములు), మజ్జ (ఎముకలలోని నూనె పదార్థము), బొమికలతో ఒక పంజరమువలె నిర్మితమైయున్న ఈ భౌతిక దేహముపట్ల ఎవడు ప్రీతి కలిగి ఉంటాడో, - అట్టి మూఢుడు భవిష్యత్తులో అనేక నరక మార్గములలో ప్రయాణించటానికి సిద్ధమగుచున్నవాడు.
సా కాలసూత్ర పదవీ
సా మహావీచివాగురా,
సా అసి పత్రవనశ్రేణీ
యా ‘‘దేహో అహమ్’’ ఇతి స్థితిః।।

సా త్యాజ్యా సర్వయత్నేన
సర్వనాశే అపి ఉపస్థితే,
స్పృష్టవ్యా సా న భవ్యేన
స శ్వమాంసేవ పుల్కసీ।।
ఎవ్వడైతే ‘‘ఈ దేహమే నేను. నేనుండాలంటే ఈ దేహము ఉండి తీరవలసిందే. దేహమునకు-నాకు అవినాభావ సంబంధము. దీని బాధలన్నీ నాకే చెందుతాయి. దీనితో ఏర్పడే సంబంధాలు నాకు చెందిన సంబంధాలే’’ - అని తలుస్తాడో, అట్టివాడు కాల సూత్ర, మహావీచి మొదలైన నరకములన్నిటికీ లోను అగుచున్నాడు.

‘‘ఈ శరీరము ఒక శవము వంటిది. సర్వదా నశించినదే’’ అను దృష్టితో సర్వయత్నపూర్వకంగా దీనిని త్యజించి ఉండాలి. ఒకడు కుక్క మాంసమును తింటున్న వానిని ఏవిధంగా తాకటానికి వెనుకాడుతాడో, ఇష్టపడడో, ఆవిధంగా ఈ శరీరమును స్పృశించకూడని (తాకకూడని) వస్తువుగా చూస్తూ ఉండాలి.
8. ప్రియేషు స్వ ఏషు సుకృతం
అప్రియేషు చ దుష్కృతమ్,
విసృజ్య, ధ్యాన యోగేన
‘బ్రహ్మ’ ఆప్యేతి సనాతనమ్।।

అనేన విధినా సర్వాన్
త్యక్త్వా సంగాన్ శనైః శనైః
సర్వ ద్వంద్వైః వినిర్ముక్తో
బ్రహ్మణ్యేవ అవతిష్ఠతి।।
(1) సుకృతమువలన (పుణ్యకర్మల వలన) కలిగే ప్రియమైన కర్మ ఫలములను, (2) దుష్కృతముల వలన కలిగే అప్రియమైన కర్మ ఫలములను - ఈ రెండిటిని విడచివేసి ధ్యానయోగము ఆశ్రయించిన వారై, సమస్తమునకు మునుముందే ప్రకాశమానమైయున్న - సనాతనమగు - బ్రహ్మమును పొంది ఉండెదరు గాక!

ఆయా కర్మ-భక్తి-జ్ఞాన-త్రిగుణాతీత - సర్వ సమర్పణ - ఇత్యాది ఆయా సర్వ ప్రయత్నములతో దృశ్యముతో (ఇంద్రియ విషయములతో) ఏర్పడే ‘సంగము’ (Attachment)ను నెమ్మది నెమ్మదిగా త్యజించి, సమస్త ద్వంద్వ భావములనుండి వినిర్ముక్తులై బ్రహ్మమునందే అవతిష్ఠుతులై ఉండెదరు గాక।
ఏక ఏవ చరేత్ నిత్యం
సిద్ధి అర్థం అసహాయకః।
సిద్ధిం ఏకస్య పశ్యన్ హి,
న జహాతి। న హీయతే।।
‘‘అనేకముగా కనిపిస్తూ ఇదంతా కూడా ఏకమగు బ్రహ్మమే అయి ఉన్నది’’ - అను భావనచే అసహాయమగు (sans all dependences) ఆత్మభావనా సిద్ధికై ప్రయత్నశీలురు కావాలి.
ఎవ్వడైతే ఏకత్వమును చ్యుతిలేని బుద్ధితో సిద్ధించుకొని ఉంటాడో, అట్టివాడు ఆత్మతత్త్వ మాధుర్యము విడువడు, తిరిగి హీనత పొందడు.
కపాలం వృక్షమూలాని
కుచేల అన్యసహాయతా,

సమతా చ ఏవ సర్వస్మిన్
ఏతన్ ముక్తస్య లక్షణమ్।
- ‘‘భిక్షాటనకు ఒక కపాలము (భిక్షపాత్ర), నివసించటానికి ఒక వృక్షము యొక్క మూలము, ఒళ్ళు కప్పుకోవటానికి ఒక వస్త్రం సరిపోతాయి’’ అని భావించువాడు ముక్తుడు.
- చెట్టు మొదలే… కపాలము (భిక్ష గృహము)… సమస్త జగత్తు అన్యసహాయకము. సమతయే సర్వస్వము - ఈవిధంగా భావించటము ముక్తి లక్షణము.
సర్వభూత హితః శాంతః।
త్రిదండీ, సకమండలుః,
ఏక ఆరామః పరివ్రజ్య
భిక్షార్థం గ్రామం ఆవిశేత్।।

‘ఏకో’ భిక్షుః అథ ఉక్తః స్యాత్
‘ద్వా’వేవ మిథునం స్మృతమ్,

త్రయో గ్రామః సమాఖ్యాత
ఊర్ధ్వం తు నగరాయతే,
నగరం న హి కర్తవ్యం
గ్రామే వా మిథునే తథా।।
‘‘శాంతము’’ అనగా సమస్త జీవుల హితము (శ్రేయస్సు) కోరుకొనువాడై, పరమశాంతుడై జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనే త్రిదండము ధరించినవాడై, కమండలువు ధరించినవాడై,

ఏకమగు బ్రహ్మమునందు రమించువాడై ఉండువాడే భిక్షువు. జీవాత్మ-పరమాత్మల మిథునము (పరస్పర సంయోగము) ఎరిగినవాడే భిక్షువు.

ముగ్గురు భిక్షువులు / సన్న్యాసులు కలిసి ఉంటే అది ‘‘గ్రామము’’ అని పిలువబడుతోంది. ముగ్గురు కంటే ఎక్కువగా కలిసి ఉంటే అది ‘‘నగరము’’ అనబడుతోంది. నగరముగా గాని, గ్రామముగాగాని ఉండటము ఆత్మానుభవమునకు ఉచితం కాదు.
ఏతత్ త్రయం ప్రకుర్వాణః
స్వధర్మాత్ చ్యవతే యతిః।
రాజ వార్తాది తేషాం స్యాత్
భిక్షావార్తా పరస్పరమ్।।
స్నేహ పైశున్య మాత్సర్యం
సత్ నికర్షాత్ (సన్నికర్షాత్)। అసంశయః।
మిథునము (ఇద్దరు కలిసి ఉండుట), గ్రామము (ముగ్గురితో కలసి ఉండటము), నగరము (ముగ్గురికంటే ఎక్కువ మందితో కలసి ఉండటము), రాజకీయమైన వార్తలు (Political News) భిక్షువులు సంభాషించుకోవటము శ్రేయము కాదు. స్నేహము, పైశున్యము (లోభము), మాత్సర్యము మొదలైనవన్నీ వచ్చిపడతాయి. సత్య తత్త్వోపాసనకు నిరోధకాలు అవుతాయి. అనుమానం లేదు.
ఏకాకీ నిస్పృహః తిష్ఠేత్,
న హి కేన సహాలపేత్।।
దద్యాత్ ‘నారాయణ’ ఏతి ఏవం
ప్రతివాక్యం సదా యతిః
ఎవ్వరియొక్క ఏ సహాయము కూడా ఆశించకుండా ఏకాకిగా, జగత్ విషయాలు పట్టించుకోనివాడై యతి ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ‘‘నారాయణా! నారాయణా! నారాయణ!’’ అని ఎల్లప్పుడు పలుకుతూ ఉండు గాక!
ఏకాకీ చింతయేత్ బ్రహ్మ
మనో వాక్ కాయ కర్మభిః।।

మృత్యుం చ న అభినందేత
జీవితం వా కథంచన।
కాలం ఏవ ప్రతీక్షేత
యావత్ ఆయుః సమాప్యతే।।

న అభినందేత మరణం న అభినందేత జీవితం।
కాలం ఏవ ప్రతీక్షీత నిర్దేశం (నిదేశం) భృతకో యథా।।

ఏకాంతంగా ఏకాకి అయి మనో-వాక్-కాయము (శరీరము)లను ‘బ్రహ్మము’ గురించిన జ్ఞానానుభవసిద్ధికై నియోగించాలి. (ఉపనిషత్ వాఙ్మయము పఠించును గాక).

యతి మృత్యువును గాని, జీవించి ఉండటమునుగాని ఏ పరిస్థితులలోను అభినందించరాదు. అభిశంసించరాదు. రెండూ సమదృష్టితో చూస్తూ ఉండాలి.
ఆయుష్షు ముగుస్తున్న క్షణము వరకు కూడా పరతత్త్వ స్మరణ స్మరిస్తూ, భగవంతుని ఉపాసిస్తూనే ఉండుగాక!

జీవితమును, మరణమును అభినందించక, సేవకుడు రాజుగారి ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు కాలమునకు అంగీకారబుద్ధి కలిగి ఉండాలి.

9. ‘‘అజిహ్వః’’, ‘‘షండకః’’ ‘‘పంగుః’’
‘‘అంధః’’ ‘‘బధిర’’ ఏవ చ।
‘‘ముగ్ధః చ’’ ముచ్యతే భిక్షుః
షద్భిః ఏతైః న సంశయః।।
భిక్షక పరివ్రాజక విశేష లక్షణములు
నాలుక ఉండికూడా లేనివాడివలెను, పుంసత్వము ఉండికూడా ఉండనట్లు, కాళ్లు ఉండి నడవలేనట్లు, కళ్లు ఉండికూడా చూడలేని వానివలె, చెవులు ఉండికూడా చెవిటివానివలెను - ఈవిధమైన జ్ఞానముతో కూడిన ఆరు లక్షణములచే ఆ భిక్షకుడు సర్వ సంసార బంధములనుండి విముక్తుడు కాగలడు. సందేహమే లేదు.
ఇదం ఇష్టం, ఇదం న ఇతి,
యో అశ్నన్ అపి న సజ్జతి,
హితం సత్వం మితం వక్తితం
అజిహ్వం ప్రచక్షతే।
1. భిక్షక అజిహ్నుడు (నోరు లేనివాడు): తినేటప్పుడు ‘‘ఇది ఇష్టమైనది… అది కాదు’’ అనే ఇష్టాయిష్టములను వదలి, ఏ షడ్రుచులు లభిస్తే వాటిని యతి స్వీకరిస్తాడు. ఆహారము హితముగాను, సత్వము (ఉప్పు, కారము అధికం కానిది), మితముగాను - స్వీకరించటమును ‘అజిహ్వము’ అంటారు.
అద్య జాతాం యథా నారీం, తథా షోడశ వార్షికీమ్
శతవర్షాం చ యో దృష్ట్వా నిర్వికారః, స షండకః।
2. భిక్షక-షండకన్ (నపుంసకుడు): ఒక 16 సం।।ల యౌవన స్త్రీని, 100 సంవత్సరముల వయసు గల స్త్రీని ఒకే ‘నిర్వికార’ దృష్టితో చూడటము - షండకము (పుంసత్వమును అధిగమించటము).
భిక్షార్థం అటనం యస్య,
విణ్మూత్ర కరణాయ చ।
యోజనాత్ న పరం యాతి,
సర్వదా ‘పంగుః’ ఏవ సః।।
3. భిక్షక-పంగుడు (కుంటివాడు): కర్మేంద్రియములలో ఒకటి అయిన పాదములను తన వశములో ఉంచుకున్నవాడు - సుదూరంగా యోజన దూరం నడవ కలిగి ఉండికూడా, భిక్షాటనము సందర్భంలో తప్పితే తదితర సమయాలలో ఎటూ వెళ్లక, కాళ్ళు ఉపయోగించువాడు - ‘పంగుడు’ అనబడుచున్నాడు.
తిష్ఠతో వ్రజతో వా అపి,
యస్య చక్షుః న దూరగమ్
చతుః యుగాం భువం ముక్త్వా
పరివ్రాట్ సో ‘అంధ’ ఉచ్యతే।।
4. భిక్షక-అంధుడు (గ్రుడ్డివాడు): ఎవ్వనిచూపు అయితే ఆతడు కూర్చున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు కూడా 4 యుగముల (నాలుగు బారల) దూరము దాటి ఉండదో (భూత-భవిష్యత్తులను) వదలి వర్తమానమునందు సందర్శనము కలదై ఉంటుందో, అట్టి పరివ్రాట్ - ‘అంధుడు’ అని అనబడుచున్నాడు.
హిత-అహితం మనోరామం
వచః శోకావహం తు యత్,
శ్రుత్వా అపి న శృణోతి ఇవ
బధిరః స ప్రకీర్తితః।।
5. భిక్షక-బధిరుడు (చెవిటివాడు): మనస్సును రంజింపజేసేవి, హితంగాను - మెప్పుదలగాను అనిపించేవి, అహితంగాను- అవమానించినట్లుగాను, శోక భూయిష్టంగాను అనిపించేవి అగు ఆయా శబ్దజాలములు వింటూ కూడా విననివానివలెనే ఉండగలగటమే బధిరము. ఆతడే భిక్షక బధిరుడు (చెవిటివాడు) అగు పరివ్రాట్.
సాన్నిధ్యే విషయాణాం యః సమర్థో వికల ఇంద్రియః,
సుప్తవత్ వర్తతే నిత్యం, స భిక్షుః ‘ముగ్ధ’ ఉచ్యతే।।
6. భిక్షక-ముగ్ధుడు (ప్రతిచర్యరహితుడు): ఎదురుగుండా (సాన్నిధ్యంగా) ఇంద్రియార్థాలు వచ్చి ఉన్నప్పటికీ, వాటిని స్వీకరించి అనుభవించే సమర్థత కలిగి ఉండి కూడా, ఎవ్వడైతే అత్యంత సుప్తము (మౌనము) వహించినవాడై ఉంటాడో ఆతడే - భిక్షక ముగ్ధుడు.
(ముగ్ధుడు = ఏమీ తెలియనట్లుగా ఉండువాడు).
10. నటాది ప్రేక్షణం ద్యూతం
ప్రమదాం సుహృదం తథా,
భక్ష్యం భోజ్యం ఉదక్యాం చ
షట్ న పశ్యేత్ కదాచన।।
ఈ క్రింది ఆరు కూడా మొదలంట్లా వదలి ఉండాలి.
పశ్యేత్ న - షట్
1. నటకుల నాట్య విన్యాసము చూచి ఆనందించటము.
2. ద్యూతక్రియ (పేకాట, పందెములు మొ।।).
3. ప్రమదము (కామ వాంఛలు) గల వారితో స్నేహము.
4. తిండిపోతుతనము.
5. రుచులపట్ల ఆకర్షణ.
6. ఉదక్యాం (రజస్వల స్త్రీతో సంభాషణ).
ఈ ఆరు భిక్షక పరివ్రాట్‌కు నిషేధము.
రాగం, ద్వేషం, మదం, మాయాం
ద్రోహం, మోహం - పరాత్మను,
షట్ (6) ఏతాని యతిః నిత్యం
మనసా అపి న చింతయేత్।।
షట్ - నియతి
1. వస్తు - విషయ - వ్యక్తుల పట్ల రాగము.
2. పైవాటి కొన్నిటిపట్ల ద్వేషము
3. మదము (గర్వము).
4. మాయ (లేనిది ఉన్నట్లుగా భావించి వెంటబడటము).
5. ద్రోహము (వంచన).
6. అన్యము పట్ల మోహము (Illusion).
ఈ ‘6’ యతి ఆశ్రయించకపోవటమే ‘నియతి’. వీటిని మనస్సులో కూడా అనుకోరాదు. తలచుకోకూడదు.
మంచకం శుక్ల వస్త్రం చ
స్త్రీ కథా లౌల్యం ఏవ చ,
దివా స్వాపం చ, యానం చ,
యతీనాం పాతకాని షట్ ।
షట్ - పాతకములు
యతి అగువాడు ఈ ‘6’ కూడా పాతకములుగా గమనించు గాక।
1. మంచకము (మంచముపై పరుపులు వేసుకొని నిద్రించటము).
2. తెల్లటి వస్త్రములు ధరించటము.
3. స్త్రీల శృంగార సంబంధమైన వార్తలను, వర్ణనలను, దుష్ట సంభాషణలను మాట్లాడటము, వినటము, మననము చేయటము.
4. చంచలంగా (అశాంతిగా, ఆవేశముగా) ప్రవర్తించటము.
5. పగటి నిద్ర
6. ఇష్టమైన ప్రదేశాలకు సుదీర్ఘప్రయాణాలు -
ఈ ఆరు సుఖములు ఆశ్రయించటం పతన హేతువులు కాగలవు.
దూర యాత్రాం ప్రయత్నేన
వర్జయేత్ ఆత్మ చింతకః।

సదా ఉపనిషదం విద్యాం
అభ్యసేత్ ముక్తి హైతుకీమ్।।
ఆత్మ గురించిన చింతనయందు (ఆత్మతత్త్వజ్ఞాన విద్య యందు) అభ్యాసము కలిగియున్నవారు ప్రయత్నపూర్వకంగా దూరయాత్రలను ఆశ్రయించటము ఉచితము కాదు. (అవసరమైనంతవరకే అవి నిర్వర్తించాలి).
ఉపనిషత్తులలో చెప్పబడే ఆత్మవిద్య యొక్క దైనందికమైన (రోజువారీ) అధ్యయనము - అది ‘ముక్తి’కి కారణము కాగలదు.
న తీర్థసేవీ నిత్యం స్యాత్।
న ఉపవాసపరో యతిః,

న చ అధ్యయన శీలః స్యాత్
న వ్యాఖ్యాన పరో భవేత్।।
ఈ నాలుగు కూడదు.
1. ఎల్లప్పుడూ తీర్థయాత్రలను నిర్వర్తించటము,
2. సుదీర్ఘంగా ఆహారము తీసుకోకుండా ‘ఉపవాసవ్రతములు’ నిర్వర్తించటము,
3. అధికాధికంగా అనేక గ్రంథములను అధ్యయనము చేయటము,
4. అతిగా వ్యాఖ్యానిస్తూ రోజులన్నీ గడిపివేయటము,
ఇవి ఏకాగ్రతను పాడుచేయగలవు.
అపాపం అశఠం వృత్తం
అజిహ్మం నిత్యం ఆచరేత్।
అపాపం: పాప కర్మలు చేయకుండా, కపటమును విడచిపెట్టాలి.
అశఠం వృత్తం : మూర్ఖత్వము, మోస సంస్కారములను దగ్గిరకు రానీయరాదు.
అజిహ్మం: జిహ్మము (వంకర భావములు, సోమరితనము, కపటము, కుటిలబుద్ధి) దరిజేరనీయరాదు.
ఆచరణ ‘‘పాప, శఠవృత్తి, జిహ్మ’’ రహితంగా ఉండాలి.
ఇంద్రియాణి సమాహృత్య కూర్మో
అంగాని ఇవ సర్వశః।
క్షీణ ఇంద్రియ మనోవృత్తిః
నిరాశీః నిష్పరిగ్రహః।।
తాబేలు ఆపద శంకించినప్పుడు తన అవయవములను లోనికి ఉపసంహరించుకొను విధంగా,
మోక్షము కోరుకొనే ముముక్షువు ఏ ఏ ఇంద్రియ విషయములపై మనో వృతులు వ్రాలుచున్నాయో, అక్కడినుండి వెనకకు మరలుచూ ఉండాలి. ఆశారహితుడై, దేనినీ పరిగ్రహించనివాడై ఉండు గాక!
నిర్ద్వంద్వో। నిర్ణమస్కారః।
నిస్స్వధాకార ఏవ చ,

నిర్మమో నిరహంకారో నిరపేక్షో, నిరాశిషః,

వివిక్త దేశ సంసక్తో

ముచ్యతే, న అత్ర సంశయ ఇతి।
ఎవ్వడైతే…,
⌘ సమస్త ద్వంద్వములను దాటివేసి, ‘‘ఆత్మ అద్వితీయము’’ అని గమనిస్తూ అద్వితీయుడై ఉంటాడో,
⌘ ఆత్మపురుషునకు మాత్రమే నమస్కరిస్తూ, అన్యముగా కనిపించే దేనికీ నమస్కరించనివాడై ఉంటాడో,
⌘ పితృదేవతలను కూడా ఆత్మ భావనతో దర్శిస్తూ, ఆత్మకు వేరుగా స్వధాకారమును దాటివేస్తాడో,
⌘ ‘‘నాది, నాకు చెందినది. నేను దీని దీనికి చెందినవాడిని’’ మొదలైన సమస్త మమకారములను జయించి ‘నిర్మమ’ను ఆశ్రయిస్తాడో (పరమాత్మా! సమస్తము నీదయ్యా! నాది కాదు- అని భావిస్తూ ఉంటాడో),
⌘ వ్యష్టి అహంకారమును దాటిపోయి కేవలాత్మను ఆశ్రయిస్తూ నిరహంకారుడై ఉంటాడో,
⌘ సర్వ అపేక్షలు (Fascinations) వదలి ఉంటాడో,
⌘ ఆమిషము (లాభము, భోగము, భేషజము(Show off), ఇతరులను జయించాలనే ఆవేశము) వదిలించుకుంటాడో,
⌘ పరమాత్మపట్ల ఏకాంతోపాసన (ఒంటరిగా ఉపాసన) నిర్వర్తిస్తూ ఉంటాడో,
అట్టివాడు ఇక్కడే తప్పక ముక్తిని సంపాదించుకోగలడు. ఏమాత్రము సందేహమే లేదు.
11. అప్రమత్తః కర్మ భక్తి జ్ఞాన సంపన్నః
స్వతంత్రో వైరాగ్యం ఏత్య,
బ్రహ్మచారీ గృహీ వానప్రస్థో వా।ముఖ్య వృత్తికా విత్ బ్రహ్మచర్యం
సమాప్య గృహీ భవేత్।

గృహాత్ వనీ భూత్వా, ప్రవ్రజేత్।
యది వేతరథా, బ్రహ్మచర్యాత్ ఏవ ప్రవ్రజేత్।
బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని, వానప్రస్థుడు గాని, ఎవ్వరైనా
- ముందుగా బద్ధకమును జయించి అప్రమత్తుడై,
- భక్తి జ్ఞాన సంపన్నుడై,
- సర్వ బాధ్యతలనుండి విడివడి, స్వతంత్రుడై,
సన్న్యసించవచ్చును.

బ్రహ్మచారి మార్గమును ప్రారంభించి, ‘విత్ (జ్ఞాన) వృత్తి’’ని అవలంబించి, ఆత్మజ్ఞాన సంపన్నుడు కావాలి. ఈవిధంగా బ్రహ్మచర్యమును సమాప్తం చేసి గృహస్థాశ్రమము స్వీకరించును గాక।

గృహస్థాశ్రమము సేవించి అటుపై ప్రవ్రజుడై వానప్రస్థము (ఏకాంత స్థానము) ఆశ్రయించు గాక। లేదా బ్రహ్మచర్యాశ్రమమునుండే వానప్రస్థుడుగా ఆశ్రమము స్వీకరించవచ్చు కూడా.
గృహాత్ వా వనాత్ వా అథ పునరవ్రతీ వా వ్రతీ వా,
స్నాతకో వా అస్నాతకో వా ఉత్పన్న అగ్నిః అనగ్నికో వా,
యత్ అహరేవ విరజేత్ తత్ అహరేవ ప్రవ్రజేత్।

తత్ హి ఏకే ప్రాజాపత్యామేవేష్టిం కుర్వంతి।

అథవా స కుర్యాత్ ఆగ్నేయ్యాం ఏవ కుర్యాత్అగ్నిః హి ప్రాణః। ప్రాణం ఏవ ఏతయా కరోతి।

తస్మాత్ త్రైధా తదీయాం
ఏవ కుర్యాత్ ఏతయా ఏవ త్రయో,
ధాతవో యదుత ‘సత్వం రజః తమ’ ఇతి।।
ఒకడు గృహస్థుడు అయినా, వనసంచారి అయినా, వ్రతములు చేయుచున్న వాడైనా, వ్రతములు ఆచరించనివాడైనా, స్నాతకవ్రతుడై స్నానము ఆచరించువాడైనా (లేక) స్నాతక వ్రతుడు కానివాడైనా, అగ్ని అవధానుడు అయి, దైనందికమైన అగ్నికార్యము నిర్వర్తించనివాడైనా సరే - ఏ రోజు అనురక్తిని త్యజించి విరక్తి పొందుతాడో ఆ రోజే ప్రవ్రజము (సన్న్యాసాశ్రమము) స్వీకరించును గాక!

విరక్తుడు అయిన వెంటనే ఇక సన్న్యాసాశ్రమ స్వీకార - సంసిద్ధత కొరకై ‘‘ప్రజాపతి యాగము’’ - నిర్వర్తించును గాక।

ఒకవేళ శాస్త్రీయంగాను, మంత్ర-తంత్ర ముగ్ధంగాను (పూర్వకంగాను) ప్రజాపతివేష్టి చేయలేని సందర్భంలో అగ్నికార్యమైనా (అగ్ని దేవతా యాగమైనా) చేసి సన్న్యసించెదరు గాక!

ఎందుకంటే, అగ్నియే ప్రాణము అయి ఉన్నది. ప్రాణము చేతనే జీవుడు ప్రాణ సమన్వితుడు అగుచున్నాడు.

అనగా త్రి-అగ్నులను (ఆహవనీయ, దక్షిణ, గార్హపత్యాగ్నులను) వెలిగిస్తూ త్రిధాతు సంబంధమైన యాగము చేయాలి. సత్త్వ రజో తమో గుణములే త్రి-ధాతువులు. ఈ మూడు గుణములను అగ్నిలో హోమము చేయుదురు గాక।

12.
‘‘అయం తే యోనిః ఋత్వియో యతో జాతో అరోచథాః।
తం జానన్ నగ్న అరోహ అథానో వర్ధయా రయిం।।’’

‘‘అయం తే యోనిః ఋత్విజో’’…, మంత్రమును అనుష్ఠించెదరు గాక.
ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్రేత్।

ఏషవా వై అగ్నేః యోనిర్యః ప్రాణః
ప్రాణం గచ్ఛ స్వాం యోనిం గచ్ఛ స్వాహా।


ఇతి ఏవం ఏవ ఏతత్ ఆహవనీయాత్
అగ్నిం ఆహృత్య, పూర్వవత్ అగ్నిం ఆజిఘ్రేత్।
ఈవిధమైన అగ్ని మంత్రములను పలుకుచూ, అగ్ని దేవుని ఆహ్వానిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేయాలి.
‘‘ఏషావా వై అగ్నేః యోనిర్యః ప్రాణః….’’ మంత్రమును చదువుతూ ఆహావనీయాగ్నినుండి అగ్నిని తీసుకొని పైన చెప్పిన, ‘‘అయం తే యోనిః…’’ మంత్రముతో ముందులాగానే అగ్నిని ఉజ్జ్వలింపజేయాలి.
యత్ అగ్నిం న విందేత్। అప్సు జుహుయాత్।

అపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో
జుహోమి స్వాహా।


ఇతి హుత్వ ఉత్ ధృత్య (ఉద్ధృత్య)
తత్ ఉదకం ప్రాశ్నీయాత్
‘‘సాజ్యం హవిః అనామయం మోదం - ఇతి’’
సన్న్యసించే సందర్భములో ఒకవేళ అగ్ని లభించకపోతే - జలముతో (నీటితో) హోమము చేయవచ్చును.
మంత్రము - ‘‘ఆపో వై సర్వదేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి స్వాహా।’’ - అను మంత్రముతో జలమును హోమం చేయాలి. ఆ తరువాత ‘‘సాజ్యం హవిః అనామయం మోదం ఇతి’’తో ప్రాశితము చేయాలి. జలమును త్రాగాలి.
శిఖాం యజ్ఞోపవీతం పితరం పుత్రం కళత్రం
కర్మ చ అధ్యయనం మంత్ర అంతరం విసృజ్య
ఏవ పరివ్రజతి। ఆత్మవిత్ మోక్ష, మంత్రైః
త్రైధా తదీయైః విధైః తత్ బ్రహ్మ
తత్ ఉపాసితవ్యం ఏవ ఏతత్ ఇతి।।
శిఖను (పిలకను), యజ్ఞోపవీతమును (జంద్యమును, బ్రహ్మ సూత్రమును), తండ్రిని, కుమారుని, భార్యను, దైనిందిక కర్మలను, ‘పురాణ’ మొదలైన అధ్యయనమును, ఇతర మంత్రోపాసనలను సర్వ అంతరములను (భేదములను) విడచిపెట్టి పరివ్రజము (సన్న్యాసము) స్వీకరించును గాక।
ధాతు త్రయమునకు సంబంధించిన ఆత్మజ్ఞాన సంబంధమైన (‘సో2హం’ అను) మోక్ష మంత్రముతో సన్న్యాసాశ్రమమును స్వీకరించును గాక। బ్రహ్మతత్త్వమును మాత్రమే ఉపాసించాలి.
పితామహం పునః పప్రచ్ఛ నారదః :
కథం అయజ్ఞోపవీతీ బ్రాహ్మణ ఇతి?
అప్పుడు నారదమహర్షి బ్రహ్మదేవ భగవానుని ఈవిధంగా అడుగసాగారు.
‘‘బ్రహ్మమును ఆచరించువాడు బ్రాహ్మణుడు’’ అని శాస్త్రార్థము కదా! బ్రహ్మోపాసనగా ‘యజ్ఞోపవీతము’ ధరించబడుతోంది. మరి, అయజ్ఞోపవీతుడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? బ్రహ్మయజ్ఞోపవీతము త్యజించినవాడు ‘‘సత్‌న్యాస’’ (లేక బ్రాహ్మీన్యాస) రూపమగు సన్న్యాసి. మరి, యజ్ఞోపవీతము వీడమని ఎట్లా చెప్పబడుతోంది?
13. తం ఆహ పితామహః :
హృదిస్థా దేవతాః సర్వాః।
హృది ప్రాణః ప్రతిష్ఠితాః।
హృది ప్రాణశ్చ, జ్యోతిశ్చ।
త్రివృత్ సూత్రం విదుః బుధాః।।
పితామహుడు (బ్రహ్మభగవానుడు): - బిడ్డా! నారదా! దేవతలు ఉన్నదెక్కడయ్యా? సర్వదేవతలు హృదయములోనే (హృదయాంతర్గతులై) ఉన్నారు. హృదయములోనే ప్రాణము స్థానము కలిగి ఉన్నది. ప్రాణతత్త్వమే సర్వ దేవతల రూపంగా వెలయుచున్నది. (Prana Energy is manifesting in the form of all Divinities and Divine forms).
తత్త్వజ్ఞులగు బుద్ధిమంతులు ‘ప్రాణశక్తి’ అనే జ్యోతిస్వరూపమే త్రివృత్ సూత్రము (మూడు ధారముల యజ్ఞోపవీత సూత్రము) గా ఉన్నదని గమనిస్తున్నారు.
స శిఖం వపనం కృత్వా,
బహిః సూత్రం త్యజేత్ బుధః।

యత్ అక్షరం పరం బ్రహ్మ
తత్ సూత్రం ఇతి ధారయేత్।

సూచనాత్ సూత్రం ఇతి ఆహుః।
‘సూత్రం’ నామ పరంపదమ్।
అందుచేత ఆత్మవిద్య తెలిసిన బుధుడు శిఖను వపనం చేసి (తొలగించి) బాహ్యసూత్రమును త్యజించి ఉంటున్నారు.

బాహ్యమగు ప్రత్తితో తయారయిన సూత్రమును త్యజించి - ఏది అక్షరము (changeless) అయి ఉన్నదో, - అట్టి పరబ్రహ్మతత్త్వమునే సూత్రముగా ధరించినవారై ఉంటున్నారు.

‘‘బ్రహ్మైవ ఇదగ్ం సర్వం’’ అనునదే వారికి యజ్ఞ సూత్రము.
భౌతికంగా ధరించే ‘ప్రత్తి దారము’ నిర్మితమైన సూత్రము ‘పరబ్రహ్మము’ యొక్క ధారణయే సూచిస్తోంది. పరమపదమే సూత్రము.
తత్ సూత్రం విదితం యేన
స విప్రో వేదపారగః।
యేన సర్వం ఇదం ప్రోతం
సూత్రే మణి గణా ఇవ,
తత్ సూత్రం ధారయేత్ యోగీ
యోగవిత్ ‘తత్వ దర్శనః’’।।
పూదండలో దారము (సూత్రము) వలె, ఏ సూత్రము (దారము)తో ఈ సమస్త లోకములు, లోకపాలకులు, సమస్త జీవులు గ్రుచ్చబడి ఉన్నారో, అట్టి బ్రహ్మసూత్రమును వేదపారగులైన విప్రులు దర్శిస్తూ ఉన్నారు.
యోగి యోగవేత్త అయి తత్త్వదర్శనము అనే బ్రహ్మసూత్రమునే ధారణ చేయుచున్నారు.
బహిః సూత్రం త్యజేత్ విద్వాన్
యోగం ఉత్తమమ్ ఆస్థితః।

బ్రహ్మభావం ఇదం సూత్రం
ధారయేత్ యత్ స చేతనః।।


ధారణాత్ తస్య సూత్రస్య న
ఉచ్ఛిష్టః, న అశుచిః భవేత్।
ఆత్మశాస్త్రము అధ్యయనము చేసిన యోగాభ్యాసి ‘‘బాహ్యసూత్రమును దాటివేసి, ఆత్మదర్శనమే ధారణ చేయవలసినదిగా ఎరిగి, అదియే యోగముగా స్వానుభవం చేసి అట్టి యోగమునందు సంస్థితుడు అగుచున్నాడు.

సచేతనమగు బ్రహ్మ భావనయే సూత్రముగా ధరించాలి. అంతేగాని అచేతనమగు దారపు సూత్రము ధరించి, అంతటితో తృప్తి చెందరాదు.

అట్టి బ్రహ్మజ్ఞానమును, సో2హం బ్రహ్మానుభవమును సూత్రముగా ధరించినవానికి వదలవలసినది ఏదీ ఉండదు. అశుచి అయినది ఎక్కడా తారసపడదు.
సూత్రం అంతర్గతం ఏషాం
జ్ఞాన యజ్ఞోపవీతినామ్
తేవై సూత్రవిదో లోకే।
తేచ యజ్ఞోపవీతినః।

జ్ఞాన శిఖినో, జ్ఞాన నిష్ఠా, జ్ఞాన యజ్ఞోపవీతినః।
జ్ఞానం ఏవ పరం తేషాం, ‘‘పవిత్రం జ్ఞానం’’ ఉచ్యతే।।

అగ్నేః ఇవ శిఖా, న అన్యా, యస్య జ్ఞానమయీశిఖా,
స ‘శిఖీ’ ఇతి ఉచ్యతే విద్వాన్,
న ఇతరే కేశధారిణః।।
అంతరహృదయంలో ధరించే ‘‘జ్ఞాన యజ్ఞోపవీత ధారణ’’ గురించి తెలిసినవాడే యజ్ఞసూత్రమును ఎరిగినవాడు. ఆతడే యజ్ఞోపవీతుడు. అంతేగాని ప్రత్తిదారముచే నిర్మితమైన యజ్ఞోపవీతం ధరించినంత మాత్రంచేత, ఒకడు లోకంలో యజ్ఞోపవీతుడు కాడు.

ఆత్మజ్ఞాన యజ్ఞోపవీతునికి ఆత్మజ్ఞానమే శిఖ. అదియే ఆతని నిష్ఠ. (తదితర ఆచార వ్యవహారములు అసలైన నిష్ఠ కాదు). జ్ఞానమే పరము. జ్ఞానమే పవిత్రము.

జ్ఞానమయమైన శిఖయే శిఖగా ఎరిగి వానికి జ్ఞానాజ్ఞియే శిఖ (పిలక). అంతేగాని వెంట్రుకలతో నిర్మితమైన శిఖ అసలైన శిఖ కాదు.
కర్మణి అధికృతాయేతు
వైదికే బ్రాహ్మణాదయః,
తేభిః ధార్యం ఇదం సూత్రం
క్రియాంగం తద్ధివై స్మృతమ్,
(తత్ హి వై స్మృతమ్)।।

శిఖా జ్ఞానమయీ యస్య
ఉపవీతం చ తత్ మయమ్,
‘‘బ్రాహ్మణ్యం’’ సకలం తస్య
ఇతి బ్రహ్మవిదో విదుః ఇతి।
‘‘ఎవ్వరైతే వైదిక కర్మలను మంత్రయుక్తంగా నిర్వర్తించవలసినవారో, అట్టి సాంఘిక సంబంధమైన వైదిక బ్రాహ్మణులు మొదలైన వారికి మాత్రమే ‘క్రియాంగము’ అయినట్టి ప్రత్తి దారముతో నిర్మించబడినది నియమించబడింది’’ - అని గ్రహించబడు గాక। అది వేద విహిత కార్యములలో ఒకానొక క్రియా విశేషము మాత్రమే!

‘‘ఎవనికి ఆత్మజ్ఞానమయత్వమే శిఖయో, తత్త్వజ్ఞానమే ఉపవీతమో అట్టి వారందరు బ్రాహ్మణులే’’ - అని తత్త్వ జ్ఞానులంతా ఎరిగియే ఉంటున్నారు.
బ్రహ్మజ్ఞానులనే వారు ‘బ్రాహ్మణ్యులు’గా దర్శిస్తున్నారు.
14. తత్ ఏతత్ విజ్ఞాయ బ్రాహ్మణః పరివ్రాజ్య।

పరివ్రాట్ ఏకశాటీ। ముండో అపరిగ్రహః।
శరీర క్లేశ అసహిష్ణుః చేత్,

ఆత్మతత్త్వ జ్ఞానము, ఆత్మతత్త్వ దర్శనము కలవాడే (పైన చెప్పిన బ్రాహ్మణుడే) పరివ్రాట్ అగుచున్నాడు.

పరివ్రాట్ బాహ్య అంతర లక్షణములు
సర్వజ్ఞుడు అగు విజ్ఞాని సన్న్యసించి ఈ క్రింది విశేషములు కలిగి ఉంటాడు. (పరివ్రాట్ అయి, కృతకృత్యుడు కాగలడు).
- సర్వజ్ఞుడగు విజ్ఞాని ఏక వస్త్రము కలిగి ఉంటాడు. శిరో ముండనము (జుట్టు తొలగించుకోవటము) ఆచరిస్తాడు.
- సర్వత్రా ఏదీ కోరుకోకపోవటము, స్వీకరించకుండటము అనే అపరిగ్రహవ్రతుడై ఉంటాడు.
- విరాగి అయి శరీర క్లేశములన్నిటినీ దాటివేసి ఉంటాడు.
అథవా, యథావిధిః చేత్ జాతరూపధరో భూత్వా,
స్వ పుత్ర మిత్ర కళత్ర ఆప్తబంధు ఆదీన్,
స్వ అధ్యాయం, సర్వకర్మాణి చ,
సన్న్యస్య అయం బ్రహ్మాండం చ
సర్వం, కౌపీనం దండం ఆచ్ఛాదనం చ త్యక్త్వా,
ద్వంద్వ సహిష్ణుః, న శీతం, న చ ఉష్ణం,
న సుఖం, న దుఃఖం, న నిద్రాం, న మాన-అవమానే చ,
షడూర్మి (షట్ (6) ఊర్మి) వర్జితో
(లేక) యథావిధిగా అప్పుడే పుట్టిన బిడ్డవలె జాతరూపధరత్వము ధరించి దేనికీ సంబంధించనివాడై ఉండును గాక।
- సమస్త బ్రహ్మాండ వ్యవహారమును ‘మిథ్య’ (Illusion)గా భావించినవాడై, ఇక్కడి పుత్ర - మిత్ర - భార్య - ఆప్తబంధు మొదలైన సంబంధములన్నీ వదలి ఉంటాడు.
- స్వాధ్యాయము (Reading Books etc) తో సహా సమస్త కర్మలతో కూడిన ఈ బ్రహ్మాండము దాటివేసి ఉంటాడు. సన్న్యాస బాహ్య లక్షణములైనట్టి గోచి, దారపు జందెము, పిలక కూడా వదలి ఉంటాడు.
- శీత - ఉష్ణములను, సుఖ-దుఃఖములను మాన-అవమానములను, (ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణములు అనబడే)- షడూర్ములను వదలినవాడై, సహించువాడై ననిద్రాపరుడై (నిద్రను జయించినవాడై) ఉండును గాక!
నింద అహంకార మత్సర గర్వ దంభ
ఈర్ష్యా అసూయా ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖ
కామ క్రోధ లోభ మోహ ఆదీన్ విసృజ్య,

స్వ వపుః శవ ఆకారం ఇవ స్మృత్వా,

స్వ వ్యతిరిక్తం సర్వం అంతః బహిః అమన్యమానః।

కస్య అపి వందనం అకృత్వా,

న నమస్కారః న స్వాహాకారః న స్వధాకారః

న నిందాస్తుతిః యాదృచ్ఛికః భవేత్।

యదృచ్ఛా లాభ సంతుష్టః।
సువర్ణ ఆదీన్ న పరిగ్రహేత్।
ఇతరులను నిందించటము, నిందకు క్రుంగిపోవటము, అహంకారము, మదము, గర్వము, ఈర్ష్య, అసూయ, ఇచ్ఛ, ద్వేషము, సుఖ-దుఃఖములు, కామము, క్రోధము, లోభము, మోహము మొదలైనవన్నీ మొదలంట్లా వదలి ఉండాలి.

తన భౌతిక శరీరమును ఒక శవమును చూచిన భావనతో చూచును గాక।

సస్వస్వరూపమగు ఆత్మకు వ్యతిరిక్తమై, వేరేవలె కనిపించే అంతర-బహిర్ అంగములను లెక్కగొననివాడై ఉండును గాక!

ఆత్మ రూపమునకే నమస్కరిస్తూ తదితరమైన దేనికీ నమస్కరించకుండును గాక।

స్వాహా (పితృదేవతా) నమస్కారమును స్వధా (స్వర్గ దేవతా) నమస్కారము చేయకుండును గాక।

నింద-స్తుతులను (censure and Praise) - యాదృచ్ఛికము (No logic behind)గా భావించును గాక।

యాదృచ్ఛికంగా (అప్రయత్నంగా) లభించే వాటితో సంతుష్టుడు (Satisfied) అగును గాక। బంగారము మొదలైన సంపదలను స్వీకరించనివాడై ఉండును గాక।
న ఆవాహనం। న విసర్జనం। న మంత్రం।
న అమంత్రం। న ధ్యానం। న ఉపాసనం।
న లక్ష్యం। న అలక్ష్యం।
న పృథక్। న అపృథక్।
ఇక ఆతనిపట్ల కర్మ - ప్రతికర్మలు ఉండవు.
  దేవతాహ్వానము - విసర్జనము,
  మంత్రము - అమంత్రము,
  ధ్యానము - ఉపాసన,
  లక్ష్యము - అలక్ష్యము,
  వేరైనది - వేరుకానిది
మొదలైనవన్నీ కలిగి ఉండకుండును గాక।
న తు అన్యత్ర సర్వత్ర అనికేతః స్థిరమతిః।
శూన్యాగార వృక్షమూల దేవగృహ తృణకూట
కులాలశాల అగ్నిహోత్రశాలాగ్ని।
దిగంతర నదీ తటాక పుళిన
భూ గృహ కందర
నిరర స్థండిలేషు వనేవా।
నా చోటు - వారిచోటు లేనివాడై ఎక్కడ ఉన్నప్పటికీ అనికేతుడై (స్థిర నివాసము లేనివాడై), ఎక్కడ ఉన్నా కూడా స్థిరమతుడై (చంచల బుద్ధి త్యజించినవాడై) ఉండు గాక। జీర్ణమైన గృహము, వృక్షమూలము, దేవాలయము, గడ్డిపొదలు, పర్ణశాల, కుమ్మరి వారి ఇళ్లు, యాగశాల, అన్ని దిక్కులు, నదీ తటాకములు, ఇసుక తిన్నెలు, కొండగుహలు, నదీ స్థలములు, సమస్త భూ ప్రదేశములు ఆతనికి విహార స్థలములు (visiting places) అగు గాక!
శ్వేతకేతు, ఋభు, నిదాఘ, జడభరతర్షభ,
దుర్వాసః, సంవర్తక, దత్తాత్రేయ, రైవకత।

పదవ్యక్త లింగో వ్యక్తాచారో, బాల ఉన్మత్త
పిశాచవత్ అనున్మత్తోపి ఉన్నత్తవత్ ఆచరన్।

త్రిదండం శిక్యం పాత్రం కమండలుం
కటిసూత్రం కౌపీనం దండం వస్త్రం-సర్వం అప్సు విసృజ్య
అథ జాతరూపధరః చరేత్।
శ్వేతకేతువు, ఋభు, నిదాఘుడు, జడభరతుడు, దుర్వాసుడు, సంవర్తకుడు, దత్తాత్రేయుడు, రైవతకుడు (గో రక్షా అవధూత) మొదలైన అవధూత పరివ్రాజకులవలె తమ ఆత్మ ప్రజ్ఞను దాచుకొని ఉండెదరు గాక।

వ్యక్తమైన లింగము (రూపము), అవ్యక్తమైన ఆచారుడై, ఉన్మత్తత లేనప్పటికీ బాలురు, పిచ్చివారు, పిశాచములవలె ప్రపంచంలో సంచారులై ఉండెదరు గాక!

త్రిదండము, శిక్యము (ఉట్టి, సంచి), పాత్రలు, కమండలువులు, మొలత్రాడు, కౌపీనము (గోచి), దండము (చేతికర్ర), వస్త్రము - ఇవన్నీ జలమునందు సమర్పించివేయుదురు గాక! అప్పుడే పుట్టిన బిడ్డవలె చరించెదరు గాక!
ఆత్మానం అన్విచ్ఛేత్ యథా జాతరూపధరో
నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః

తత్వ బ్రహ్మమార్గే సమ్యక్ సంపన్నః। శుద్ధ మానసః।
ప్రాణ సంధారణార్థం యథా ఉక్తకాలే కరపాత్రేణ,

అన్యేన వా యా చితాహారం ఆహరన్।
ఆత్మతత్త్వము కొరకు మాత్రమే అన్వేషణ కలిగి ఉండెదరు గాక। పసిబిడ్డ వలె, ద్వంద్వాతీతులై, ఆత్మజ్ఞానమునకు వేరైనదేదీ స్వీకరించనివారై ఉండెదరు గాక।

తత్త్వమార్గములో యోగాభ్యాస సంపన్నులగుదురు గాక। సమస్త మార్గములలో బుద్ధిని శుద్ధి చేసుకొనుటలో ప్రయత్నశీలులగుదురు గాక।

ప్రాణమును ధరించి ఉండటానికి మాత్రమే సరి అయిన (యుక్త) సమయంలో దోసిలియందుగాని లేక ఏదైనా ఒక పాత్రయందు గాని భిక్షము తెచ్చుకొని భుజించెదరు గాక।
లాభ - అలాభయోః సమో భూత్వా।
నిర్మమః శుక్ల ధ్యాన పరాయణో।
అధ్యాత్మనిష్ఠః।
శుభ-అశుభ కర్మ నిర్మూలన పరః।
లాభ, అలాభములను ఒకే తీరుగా చూచుచుండెదరు గాక!
మమకారములన్నీ వదలి నిర్మలమగు ఆత్మధ్యానపరాయణులై కాలము గడపుచుండెదరు గాక!
ఆధ్యాత్మజ్ఞాన సాధనయందే ధ్యాస, నిష్ఠ కలిగి ఉండెదరు గాక।
శుభ - అశుభ కర్మ - కర్మఫల ఆసక్తులన్నీ నిర్మూలనము చేసికొని ఉండెదరు గాక।
సన్న్యస్య, ‘‘పూర్ణానందైక బోధః
తత్ బ్రహ్మ అహం అస్మి’’ - ఇతి
‘బ్రహ్మ ప్రణవమ్’ అనుస్మరన్।

భ్రమర-కీట న్యాయేన


సమస్తము సన్న్యసించివేసినవారై ‘‘పూర్ణ-ఆనందైక బోధ రూపమగు ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను’’ అను రూపమైనట్టి ‘‘బ్రహ్మప్రణవము’’ను సర్వదా సర్వత్రా స్మరణ కలిగి ఉండెదరు గాక।

భ్రమరము (తుమ్మెద), ఒక కీటకమును (చిన్న పురుగును) తెచ్చి, దాని చుట్టూ ‘‘ఝయ్-ఝయ్’’మని శబ్దం చేస్తూ ఉంటే, ఆ చిన్న కీటకము ఆ శబ్దమునకు స్పందిస్తూ చివరికి తానే పెద్ద-తుమ్మెదగా రూపుదిద్దుకుంటుంది కదా!
శరీర త్రయమ్ ఉత్సృజ్య
సన్న్యాసేనైవ దేహత్యాగం కరోతి -
స కృతకృత్యో భవతి।।
ఇతి ఉపనిషత్।।
సన్న్యాసి అయి, సమస్తమునకు అతీతత్వము సముపార్జించుకొని, స్థూల-సూక్ష్మ-కారణ త్రిశరీరములను అధిగమించి సాక్షీ స్వరూపమునందు నిశ్చల - సుస్థిరత్వము సిద్ధించుకున్నవాడు ‘‘కృతకృత్యుడు।’’ (పొందవలసినది పొందినవాడు) అగుచున్నాడు.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘తృతీయ ఉపదేశః’’


చతుర్థోపదేశః (4వ ఉపదేశము) - యతి నియమములు - ధర్మములు

1. త్యక్త్వా లోకాంశ్చ వేదాంశ్చ
విషయాన్, ఇంద్రియాణి చ,
ఆత్మని ఏవ స్థితో యస్తు
స యాతి పరమాం గతిమ్।।
ఓ నారదా! ఈ సమస్త లోకములను, వేదములను (విధి, విధాన, కర్మ- ఉపాసనా, జ్ఞాన, వాఙ్మయ వ్యవహారములను), దృశ్య విషయములను, ఆ దృశ్యము వేటికి విషయములో అట్టి ఇంద్రియములను త్యజించివేసి, అతీతత్వము సిద్ధించుకొని - ఎవ్వడైతే ఆత్మతత్త్వానుభవమునందే సంస్థితుడు (wel-situated) అవుతాడో, అట్టివాడు మోక్షరూపమగు ‘‘పరమాం గతి’’ని చేరగలడు.
నామ గోత్ర ఆది వరణం
దేశకాలం శ్రుతం కులమ్।
వయోవృత్తం, వ్రతం, శీలం
ఖ్యాపయేత్ నైవ సద్యతిః।

అసంభాషేత్ స్త్రియా, కాంచిత్
పూర్వ దృష్టాం చ న స్మరేత్।
కథాం చ వర్జయేత్ తాసాం
న పశ్యేత్ లిఖితాం అపి।
తమయొక్క నామమును, గోత్రమును, దేశ-కాల సంబంధమైనవిగాని, విన్న విశేషాలుగాని, కులమునుగాని, వయస్సునుగాని, వృత్తులుగాని, నిర్వర్తించిన వ్రతములనుగాని, తన శీలము యొక్క ఔన్నత్యముగాని నిజమైన యతి ప్రదర్శించుకోడు. గొప్పలు చెప్పుకోడు.

యతి అయినవాడు కామ వృత్తి - ప్రవృత్తి గల మాటలను సంభాషించడు. ఇతఃపూర్వము చూచిన స్త్రీల గురించి స్మరించనైనా కూడదు. స్త్రీలతో చేసిన కామ సంభాషణలన్నీ త్యజించివేయాలి. శృంగార స్త్రీల పఠములను (లిఖితములను) కూడా చూడరాదు.
ఏతత్ చతుష్టయం
మోహాత్ స్త్రీణాం ఆచరయతో యతేః।

చిత్తం విక్రియతే అవశ్యం
తత్ వికారాత్ ప్రణశ్యతి।
1. మోహ బుద్ధితో స్త్రీలను చూడటము
2. స్త్రీలతో శృంగార సంబంధమైన సంభాషణ
3. స్త్రీల గురించిన కామ సంబంధమైన కథలను, కథనములను వినటము
4. స్త్రీలతో సంబంధములను స్మరించటము
ఈ నాలుగింటికి యతి అయినవాడు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా, పై నాలిగింటిని ఆశ్రయిస్తూ ఉంటే, - చిత్త చాంచల్యము పొందగలరు. ఫలితంగా అట్టి వికారములు వినాశనమునకు దారి తీయగలదు.
తృష్ణా, క్రోధో, అనృతం, మాయా,
లోభ మోహౌ, ప్రియ అప్రియే,
శిల్పం వ్యాఖ్యాన, యోగః చ
కామో, రాగ పరిగ్రహః,
అహంకారో మమత్వం చ,
చికిత్సా, ధర్మసాహసమ్,
ప్రాయశ్చిత్తం, ప్రవాసః చ
మంత్ర - ఔషధ గత ఆశిషః।
ప్రతిషిద్ధాని చ ఏతాని
సేవమానో వ్రజేత్ అథః।
యతి నిషిద్ధములు
యతులు (సన్న్యాసాశ్రమము వారు - కలిగి ఉండకూడనివి)
1. తృష్ణ: పేరాశ. ఇకా ఏదో లభించలేదా? లభించాల్సిందే - అనే అభినివేశము.
2. క్రోధము : ఒక సంఘటన, సందర్భము వలన వచ్చిన కోపము మరల మరల మననము చేయటము.
3. అనృతము : సత్యము కానిది. ఏది నిజమో తెలుసుకోకుండానే తెలిసినట్లు మరల మరల మాట్లాడటము, దూషించటము.
4. మాయా : ఏదైతే కల్పితమో, అది ‘నిజమే’ అని మననము చేయటము. తన్మయమవటము.
5. లోభము : పిశినారితనము, అత్యాశ, ఇతరులనుండి పొందుతూ కూడా ఇతరులకు ఇవ్వవవలసినది ఇవ్వకుండటము.
6. మోహము : ఏది వాస్తవమో తెలుసుకోకుండా కనబడిన దానితో తన్మయమవటము, చిత్తవైకల్యము, బాహ్యరూపమునకు మురిసిపోవడము.
7. ప్రియము : కొన్నిటిని, కొందరిని అతిగా ఇష్టపడటము.
8. అప్రియము : మరి కొన్నిటి, మరి కొందరి పట్ల అయిష్టము కలిగి ఉండటము.
9. శిల్పము - చిత్రలేఖనము : ఊహ-అపోహలు కల్పించే బొమ్మలు గీయటము.
10. వ్యాఖ్యానము : ‘‘వారు అట్టివారు - వీరు ఇట్టివారు’’ అంటూ గుణగణములను వ్యాఖ్యానించటము.
11. యోగము : కొన్నిటితో సంయోగము, మరికొన్నిటితో వియోగము పొందు స్వభావము.
12. కామము : ఏదో ఇంకా పొందాలి - అనే తపన. లేనిది కావాలనుకోవటము.
13. రాగము : ఉన్నదాని పట్ల వదలలేకపోవటము. దూషణ-భూషణ- తిరస్కార - పురస్కారములపట్ల మనో స్పందనము.
14. పరిగ్రహణము : ప్రపంచంలో సందర్భమౌతున్న సంగతి, సందర్భ, సంబంధ-అనుబంధములను హృదయములోనికి ఆహ్వానించి, అట్టేబెట్టుకోవటము.
15. అహంకారము : ‘‘నేను వారి కంటె అంతటివాడిని. ఇంతటి వాడిని. ఇది నాది. నేను వేరు వారు వేరు’’ అను రూపము గల భావావేశములు.
16. మమత్వం : ప్రపంచంలో తారసబడే వస్తు జాలమును, బంధు-మిత్రులను ‘‘వీరు నా వారు, నాకే ఉండాలి’’ -అను సొంతము చేసుకొని ఉండే భావన.
17. చికిత్స : ఇతరులను ఇంకా ఏదో సరిచేయాలని, తాను ఇంకా ఏదో సరికావాలని - ఆవేశ పడటము. వైద్యము మొ।।వి.
18. ధర్మ సాహసమ్ : ధర్మ-అధర్మముల ప్రసక్తి గురించి సంభాషించి ఆవేశపడటము. ఇతరుల ధర్మ-అధర్మముల గురించిన సుదీర్ఘమైన నిందాస్తుతులు.
19. ప్రాయశ్చిత్తము : ‘‘దానికి అది చేయండి. దీనికి ఇంత చెల్లించండి’’ అని దోషముల గురించిన ప్రాయశ్చిత్తమును పరిభాషణం చేయరాదు.
20. ప్రవాసము : దూరదేశములలో ప్రవేశించి, నివాసము కలిగి ఉండరాదు. (విదేశీ సంచారములు ఏకాగ్రతను చెదిరించగలవు).
21. మంత్రములు : ఆయా లౌకిక ప్రయోజనమైన మంత్రముల సముదాయమును (మాయమంత్రము మొ।।వాటిని) ఉపాసించరాదు.
22. ఔషధములు : ఔషధముల వ్యాపారములు నిర్వర్తించరాదు.
23. ఆశీర్వాదములు : ఆశీర్వాదములు చేసి ప్రతిఫలము స్వీకరించటము.

ఇవన్నీ యతులు నిర్వర్తించే మార్గమునకు నిషిద్ధములు (Dont’s). వీటిని సేవించుటచే అధమ మార్గము అవగలదు. ఆతడు పతితుడు అయ్యే ప్రమాదము ఉండు అవకాశముంటుంది.
ఆగచ్ఛ గచ్ఛ తిష్ఠేతి
స్వాగతం సుహృదో అపి వా,
సన్మానం చ న బ్రూయాత్
మునిః మోక్ష పరాయణః।।

ప్రతిగ్రహం న గృహీణాయాత్।
నైవ చ అన్యం ప్రదాపయేత్।।
స్నేహితులు మొదలైన వారిని ‘‘రండి!’’ - అని, ‘‘వెళ్లిరండి’’ అని, ‘‘ఉండండి’’ అని స్వాగతము చెప్పటము, సన్మానించటము మొదలైనవి ‘మౌనము’ సిద్ధించుకొంటున్న మోక్ష పరాయణులైన మునులు నిర్వర్తించకుండెదరు గాక।

ఇతరులనుండి బహుమతులు, కృతజ్ఞతగా ఇచ్చే ధనము మొదలైనవి స్వీకరించరాదు. తాను ఇతరులకు ఇవ్వకూడదు.
2. ప్రేరయేత్ వా తథా భిక్షుః
స్వప్నేపి న కదాచన।

జాయా అహ్రాతృ సుత ఆదీనాం
బంధూనాం చ శుభ-అశుభమ్।
శృత్వా దృష్ట్వా న కంపేత
శోక హర్షౌ త్యజేత్ యతిః।
ఇతరులనుండి వస్తురూపంగా గాని ధనరూపంగా గాని తనకొరకై బహుమతులు తీసుకోవటము, లోక ప్రయోజనముల కొరకై బహుమతులు ఇవ్వడము - ఈ రెండిటినీ భిక్షకుడు (యతి, పరివ్రాజకుడు) ఏమాత్రము కలలో కూడా ప్రేరేపించకూడదు.

యతి అగుచున్నవాడు - భార్య, సోదరులు, కొడుకులు మొదలైనవారితో ఏర్పడే శుభ-అశుభ సమాచారములను వినినప్పుడు, చూచినప్పుడు ఏమాత్రము కంపించడు. శోకముగాని, సంతోషముగాని దరికి రానీయడు. వాటిని త్యజించివేసి ఉంటాడు.
అహింసా సత్యం అస్తేయం
బ్రహ్మచర్య అపరిగ్రహః।
‘‘యతి యొక్క స్వధర్మములు’’
అహింస : మనో వాక్ కాయములచే ఎవ్వరికీ ‘బాధ’ కలిగించకుండటము.
సత్యము : ఎల్లప్పుడు పరమ సత్యమగు ‘అఖండాత్మ’ గురించియే దృష్టి, ధ్యాస కలిగి ఉండటము.
అస్తేయమ్ : తనది కానిది దొంగిలించాలని దోష భావన కలిగి ఉండకపోవటము.
బ్రహ్మచర్యము : ఎల్లప్పుడు ‘బ్రహ్మజ్ఞానము’ కొరకై ఆచరణ, ఆచారము కలిగి ఉండటము.
అపరిగ్రహః : ఈ కల్పిత జగత్తు నుండి దేనినీ కూడా ఏమాత్రము స్వీకరించనివాడై ఉండటము.
అనౌద్ధత్యం అదీనత్వం
ప్రసాద స్థైర్యం ఆర్జవమ్।
అనౌద్ధత్వం : వారికంటే, వీరికంటే నేను ‘గొప్పగలవాడిని’- అని భావించకపోవటము.
అదీనత్వం : దేనికీ దీనుడు కాకపోవటము. ‘‘అయ్యో! నేనెందుకు పనికివస్తాను?’’ - అని భావించకపోవటము.
ప్రసాదం : నిర్మలమైన భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తనలు కలిగి ఉండటము.
స్థైర్యం : ఆత్మభావనతో ఆత్మ పరిపోషించుకోవటము స్థైర్యము.
ఆర్జవం : త్రికరణశుద్ధి (మనో వాక్ కాయములచే) శుద్ధమగు ప్రవర్తనము. కుటిల, దూషణభావాలు దరిచేరనీయకపోవటము.
అస్నేహో గురుశుశ్రూషా
శ్రద్ధా క్షాంతిః దమః శమః।

ఉపేక్షా స్థైర్య మాధుర్యే
తితీక్షా కరుణా తథా।


ప్రాపంచక విషయములతో స్నేహము (సంబంధము) కలిగి ఉండక పోవటము. గురుసేవ, శ్రద్ధ, ఓర్పు, బాహ్య-అంతర నిగ్రహము.

ఉపేక్ష : ప్రాపంచక సంగతి, సందర్భములపట్ల ఉపేక్ష కలిగి ఉండటము. అపేక్ష లేకపోవటము.
స్థైర్య మాధుర్యే : మధురముతో (సత్త్వ గుణముతో) కూడిన ధైర్యము, ఉత్సాహము కలిగి ఉండటము.
తితిక్షా : కష్ట-సుఖ సందర్భములను ఓర్చుకోవటము. ఓర్పు అనే శక్తి పెంపొందించుకోవటము.
కరుణ : సహజీవులపట్ల దయ, దాక్షిణ్యము, ఆప్యాయత కలిగి ఉండటము.
హ్రీః తథా జ్ఞాన విజ్ఞానే
యోగో లఘు-అశనం ధృతిః।
హ్రీః: ‘‘అనేకమంది మహనీయులు ఉన్నారు. నేనెంతటివాడిని?’’ - అని సిగ్గు భావన కలిగి ఉండటము.
జ్ఞాన విజ్ఞానే : ఆత్మతత్త్వము శ్రవణము చేయటము, తెలుసుకోవటము. అట్టి ఆత్మజ్ఞాన భావనను దైనందిక జీవిత సందర్భములలో అభ్యాసముగా కలిగి ఉండటము.
యోగః : దృశ్యములోని సంయోగ, వియోగములను అధిగమించి, ‘ఆత్మతో మమేకత్వము’ అనే అభ్యాసయోగి అయి ఉండటము.
లఘు అశనం : అవసరము, ఆరోగ్యములను దృష్టిలో పెట్టుకొని అల్పముగా మాత్రమే భుజించటము. ఇంద్రియములను పరిమితముగా, అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించటము.
ధృతిః : ఆత్మభావనతో ‘‘నేను అఖండము - పరము - నిర్మలము అగు ఆత్మనే కదా!’’ అనే ధైర్యము విడువకపోవటము. ఆత్మభావనను దృఢంగా ఆశ్రయించి ఉండటము.
ఏష స్వధర్మో విఖ్యాతో
యతీనాం నియతాత్మనామ్।

నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః
సర్వత్ర సమదర్శనః।।


ఇవన్నీ యతులకు శాస్త్ర నియమము అయిన స్వధర్మములుగా చెప్పబడుచున్నాయి.

‘‘యతి-పరివ్రాజకుడను కావాలి’’ అనుకున్నవాడు -
- శీత-ఉష్ణ, సుఖ-దుఃఖ, పాప-పుణ్య, శుభ-అశుభ ఇత్యాది సమస్త ద్వంద్వములను దాటివేసినవాడు అగును గాక!
- నిత్యము (ఎల్లప్పుడు) సాత్వికమైన స్థితిని, భావములను పరిరక్షించుకుంటూ ఉండాలి.
- సర్వత్రా సమదర్శనమును ప్రయత్నపూర్వకంగా కలిగి ఉండాలి.
3. తురీయః పరమో హంసః
సాక్షాత్ నారాయణో యతిః।

ఏకరాత్రం వసేత్ గ్రామే
నగరే పంచరాత్రకమ్।
సర్వాభ్యో అన్యత్ర వర్షాసు
స మాసాంశ్చతురో వసేత్।
ద్వి రాత్రం న వసేత్ గ్రామే భిక్షుః యది వసేత్ తదా,
రాగ ఆదయః ప్రసజ్యేరన్ తేన అసౌ నారకీ భవేత్।
భిక్షక (సన్యాసి) - నివాస నియమములు :
యతి (జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల తేజో రూపుడై, ఆ మూడు అవస్థలు తనవై తురీయుడైన) పరమహంస సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడే.

యతి యొక్క నివసించు విధులు ఈ విధంగా ఉండు గాక।

గ్రామములో ఒక రాత్రి. నగరములో ఐదు రాత్రులు.
వర్షాకాలము మాత్రము పై నియమము ఉండదు. 4 నెలలు ఒకే చోట ఉండవచ్చును.
భిక్షక సన్యాసి ఒకవేళ గ్రామములో రెండు రాత్రుల కాలము ఉంటేనో? అతనికి రాగము, ద్వేషము ప్రవృద్ధమవటం జరగవచ్చు. అది జరిగితే - అతడు నరకంలో నివాసము పొందువాడు కాగలడు.గ్రామాంతే నిర్జనే దేశే
నియతాత్మా అనికేతనః।
పర్యటేత్ కీటవత్ భూమౌ।
వర్షాసు ఏకత్ర సంవసేత్।
అందుచేత గ్రామమునకు చివరగా (In the outskirts)
- జనులు ఉండని ప్రదేశములో
- ‘ఇది నా ఇల్లు’ అనునది లేనివాడై
- ఇంద్రియములను, మనస్సును ఆత్మజ్ఞాన - ఆత్మదర్శనమునందు నియమించినవాడై ఒక కీటకమువలె ఒకచోట నిలువక పర్యటనలు చేస్తూ ఉండాలి.
వర్షాకాలంలో మాత్రం 4 నెలల కాలము ఒకే చోట ఉండవచ్చు.
ఏక వాసా, అవాసా వా,
ఏకదృష్టిః అలోలుపః
అదూషయన్ సతాం మార్గం
ధ్యానయుక్తో మహీం చరేత్।।
పరివ్రాజకుడైనట్టి యతి ఒక వస్త్రము మాత్రమే ధరించవచ్చు గాక లేక దిగంబరుడుగా ఉండవచ్చు గాక. ఏది ఎట్లా ఉన్నా కూడా ‘‘సమస్తము బ్రహ్మమే’’ అనుభవమును పదిల పరచుకొంటూ సత్ మార్గమును దూషించక (ఎవరినీ కూడా ‘‘తక్కువ వారు’’ అని భావించక), ఆత్మభావనకు సంబంధించిన ధ్యాస - ధ్యానములతో ఈ భూమిపై చరించును గాక.
శూచౌ దేశే సదా భిక్షుః
స్వధర్మం అనుపాలయన్।
పర్యటేత్ సదా యోగీ
వీక్షయన్ వసుధాతలమ్।

న రాత్రౌ న చ మధ్యాహ్నే
సంధ్యయోః నైవ పర్యటన్।
న శూన్యే న చ దుర్గే వా
ప్రాణి బాధకరే న చ।
‘భిక్షువు’ (యోగి, పరివ్రాజకుడు) అయినవాడు ఎల్లప్పుడూ శుచి అయిన (సాంసారిక భావములు తాండవించనట్టి) అదేశమును ఎన్నుకొంటూ, భిక్షు ధర్మములు శ్రద్ధగా ఆచరిస్తూ భూమిపై సంచరించును గాక.

రాత్రి సమయమునందు గాని, మిట్టిమధ్యాహ్న సమయమునందు గాని, సాయం-ప్రాతః సమయములందు గాని పర్యటనలు (Wandering and moving from place to place) చేయకుండెదరు గాక.
అట్లాగే శూన్యప్రదేశాలలో గాని, (కొండలు - శిలలు - ముళ్ళపొదలు - యడారులు మొదలైన) దుర్గమ ప్రదేశములలోగాని, ప్రాణమునకు బాధగా అనిపించే ప్రదేశములందుగాని తిరగరాదు.
ఏకరాత్రం వసేత్ గ్రామే,
పట్టణేతు దినత్రయమ్।
పురే దిన ద్వయం భిక్షుః
నగరే పంచరాత్రకమ్।
వర్షాసు ఏకత్ర తిష్ఠేత
స్థానే పుణ్య జలావృతే।।
‘గ్రామము’లో అయితే ఒక్క రాత్రి మాత్రమే నివాసము కలిగి ఉండాలి. పట్టణములో అయితే రెండు (2) రాత్రులు, పురములలో అయితే రెండు రోజులు, నగరములలో ‘5’ రాత్రలు - మించి నివాసము కలిగి ఉండరాదు.
‘వర్షాకాలంలో చాతుర్మాస్యము’ అను వ్రతము నిర్వహిస్తూ, చుట్టూ జలముగల స్థానంలో ‘4’ నెలలు స్థిరముగా ఉండవచ్చు అనునది సన్యాసులకు, యతులకు సూచించబడుతోంది.
4. ఆత్మవత్ సర్వభూతాని
పశ్యన్ భిక్షుః చరేత్ మహీమ్।
అంధవత్ కుబ్జవత్ చ ఏవ
బధిర ఉన్మత్త మూకవత్।।
త్రిగుణాత్మకంగాను, అనేక భేదములతోను కనిపించే ఈ దృశ్యజగత్తును, ఇందులో వివిధ మనస్తత్వములుగల జీవులను చూస్తున్నప్పుడు - భేదములన్నిటికీ గ్రుడ్డివాడివలెనే ఉండాలి (చూడకూడదు). కుబ్జునివలెను (మఱుగుజ్జువాడు తనకు అవసరమైనంత మాత్రమే చూచువిధంగాను), చెవిటివానివలెను, పిచ్చివాడువలెను, మూగవానివలెను చూస్తూ ఉండాలి. భిక్షకుడు సమస్త జీవులను తన యొక్క ఆత్మ స్వరూపంగా చూస్తూ, ఈ ప్రపంచములో సంచారము కలిగి ఉండును గాక.
స్నానం త్రిషవణం ప్రోక్తం
బహూదక వనస్థయోః।
హంసే తు సకృత్ ఏవ స్యాత్।
పర హంసే న విద్యతే।
బహూదకులకు, కుటీచకులకు మూడు పూటల స్నానము చెప్పబడుతోంది. హంసలకు రోజుకు ఒకసారి స్నానము నియమించ బడుతోంది. పరమహంసలకు స్నానము గురించిన ఏ నియము చెప్పబడటం లేదు. (పరమహంస = ‘‘సో2హమ్ పరమమ్’’. సమస్తమునకు ఆవలగల కేవల ఉనికి ఎరుక రూపమగు పరబ్రహ్మమే నేను’’ అను స్వాభావిక స్వానుభవము సిద్ధించుకున్నవాడు).
మౌనం, యోగ-ఆసనం,
యోగః తితిక్ష ఏకాంతశీలతా,
నిస్పృహత్వం సమత్వం చ
సప్త (7) ఏతాని ఏక దండినామ్।
త్రిదండిల (సన్యాసుల) పరమ ధర్మములు ‘‘సప్త పరివ్రాజ ధర్మములు’’ - అని చెప్పబడుచున్నాయి.
1) జగద్విషయములపట్ల ఎట్లా ఉన్నా సరే ‘‘మౌనము’’ వహించి ఉండగలగటం
2) యోగాసనము (పద్మాసనము మొదలగునవి) ధరించటము
3) యోగాభ్యాసము
4) కష్ట-సుఖములు, సంపద-ఆపదలు, సంబంధ-అనుబంధముల రాకపోకలు మొదలైన సందర్భములలో ‘ఓర్పు’ వహించి ఉండు శక్తి - తితిక్ష
5) సమస్తము పరమాత్మకు అనన్యమని భావించి, అట్టి పరమాత్మతో ఏకాంతముతో కూడిన ప్రశాంతత కలిగి ఉండటము - ఏకాంతశీతలా.
6) నీళ్లు పడవలోనికి రానీయని విధంగా ప్రపంచంలో కనిపించే అనేకత్వమును అనేక భేదములను, ఆత్మ దృష్టిచే జయించాలి. అంతరంగంలో పట్టించుకోకపోవటము - నిస్పృహత్వము.
7) సర్వత్రా సమదృష్టి - సమత్వము ఇవియే సన్యాసి ధరించి ఉండవలసిన సప్త ఏక దండము.
పరహంస ఆశ్రమస్థో హి,
స్నానాదేః అవిధానతః।

అశేష చిత్త వృత్తీనాం
త్యాగం కేవలం ఆచరేత్।
పరమహంస (బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్యాస) ఏ ఆశ్రమములో ఉన్నప్పటికీ అతనికి స్నానము యొక్క నియమము ఏదీ చెప్పబడటం లేదు. ఎందుకంటే సర్వదా ఆత్మభావనచే నిత్యనిర్మలమైన వానికి శుభ్రపరచుకొనే స్నాననియమములతో పనేముంటుంది. భోజన నియమములతో పనేమున్నది.

అయితే అతడు అంతులేని చిత్తవృత్తులను మొదలంట్లా విడచి ఉండటమనే ‘‘పరమహంస ధర్మము’’ ధర్మముగా కలిగి ఉండు గాక.
త్వక్ మాంస రుధిర స్నాయు
మజ్జా మేదో అస్థి సంహతౌ
విణ్మూత్ర పూయే రమతాం
క్రిమీనాం కియత్ అంతరం?
ఈ భౌతిక శరీరము ఎటువంటిది ? ఇది చర్మము, మాంసము, రక్తము, నరములు, మజ్జ (గుజ్జు), క్రొవ్వు, ఎముకలు మొదలైన తుచ్ఛపదార్థములతో తయారై లోన మలము, మూత్రము మొదలైన అనేక దోష పదార్థములు కలిగి ఉన్నది. ఇట్టి పాంచభౌతిక శరీరము చూచి రమించు మానవునికి, బల్లి, దోమ, ఈగ మొదలైన క్రిమికీటక జీవితములకు భేదమేమున్నది?
క్వ శరీరం అశేషాణాం
శ్లేష్మాదీనాం మహాశయః?

క్వ చ అంగ సౌరభీ శోభా
కమనీయ ఆదయో గుణాః?
➤ రక్త శ్లేష్మ మాంస నిర్మిత భౌతిక శరీరము పట్ల ‘‘ఇదే మహత్తరము’’ అని మహదాశయముగా కలవాడు ఎక్కడ?
➤ అఖండాత్మ శరీరముతో కూడిన మహదాశయుడగు పరివ్రాజకుడు ఎక్కడ ? ఎక్కడి కమనీయమైన ఆత్మజ్ఞాన సంపత్తిగల గుణ సంపన్నుడు ? - అనగా,
ఈ ఇద్దరికి ఒకరితో మరొకరికి పోలికయే ఉండదు.
5. మాంసా సృక్ పాయ విణ్మూత్ర
స్నాయు మజ్జా అస్థి సంహతౌ।
దేహే చేత్ ప్రీతిమాన్ మూఢో
భవితా నరకే అపి సః।

స్త్రీణాం అవాచ్య దేశస్య క్లిన్ననాడీ
ప్రణస్య చ అభేదే అపి,
మనో భేదాత్ జనః
ప్రాయేణ వంచ్యతే।
మాంసము, చీము, నెత్తురులతో పూయబడినది, మలమూత్రములు, నరములు, మజ్జ, ఎముకలుతో ఒక గూడువలె ఏర్పడి పై పైన నున్నగా కనిపిస్తున్న ఈ భౌతిక శరీరముపై ప్రీతితో జీవితాశయములను మరచిపోతున్న మూఢుడు ముందుముందు అనేక నరక స్థానములలో ప్రవేశించటానికి సంసిద్ధుడు అగుచున్నాడు.

ఈ స్త్రీ, పురుషుల అవాచ్యప్రదేశములు (జననేంద్రియములు) అనేకమైన తడసిన (తడి) నాడులతో నిండి ఉండగా ఇది ఒక వృణమునకు (పుండు, కురుపుకు) ఆ అవాచ్యప్రదేశమునకు (జనేంద్రియములకు) భేదము లేకపోయినప్పటికీ - ఈ జనులు గొప్ప విశేషమేదో మనస్సుతో కల్పించుకొని రహస్యాంగములను మోహావేశంతో చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యం ?
చర్మఖండం ద్విధా భిన్నం
అపాన ఉద్గార దూషితమ్,
యే రమంతి నమస్తేభ్యః।
సాహసం కిం అతః వరమ్?

న తస్య విద్యతే కార్యం
న లింగం వా విపశ్చితః।

నిర్మమో నిర్భయః శాంతో
నిర్ద్వంద్వో అవర్ణ భోజనః।
రహస్యాంగములు (అవాచ్య అంగములు) ఎటువంటివి ? చర్మముతో నిర్మితమై రెండుగా చీలి ఉన్నట్టివి. అపాన వాయువు అనే దుర్గంధముచే దూషితమైయున్నవి. అట్టి రహస్యేంద్రియములలో లభించే సుఖమే జీవిత పరమావధిగా (As if main objective) రమించదలచే వారికి - ఓ నమస్కారం. ఇంతకన్నా సాహసం ఇంకేముంటుంది ?

ఆత్మజ్ఞానికి అటువంటి విశేషములతో స్వాభావికంగానే ఏ పనీ, ఏ ఉత్తమ ప్రయోజనము కనిపించదు.
బ్రహ్మజ్ఞానికి బాహ్య సన్యాస వేష ప్రదర్శనముతో పనిలేదు. అక్కరలేదు.

ఆత్మతత్త్వము సర్వత్రా ఆస్వాదించు పరివ్రాజకుడు - సమస్త మమకారములు వదలినవాడై, భయమును మొదలంట్లా జయించి వేసి - నిర్భయుడై, ద్వంద్వములన్నిటికీ అతీతుడై, వర్ణాశ్రమ ధర్మములను విడచినవాడై ఉంటాడు.
మునిః కౌపీన వాసాః స్యాత్
నగ్నో వా ధ్యాన తత్పరః।

ఏవం ధ్యానపరో యోగీ
బ్రహ్మభూయాయ కల్పతే।
ఆ పరివ్రాజకుడు ముని అయి, గోచి ధరించియో (లేక) ధరించకయో ఏ ఆశ్రమంలో ఉండాలని అనుకొంటే ఆ రీతిగా (బ్రహ్మచారి - గృహస్థుడు - వానప్రస్థుడు- సన్యాసి అయి) - ఎల్లప్పుడు ఆత్మ ధ్యానమునందు తత్పరుడై ఉంటాడు.
అట్టి ‘‘ఆత్మ ధ్యాస - ధ్యాన’’ పరుడగు యోగి స్వయముగా బ్రహ్మమై బ్రహ్మానందమునకు అర్హుడు అగుచున్నాడు.
లింగే సత్యపి ఖలు అస్మిన్
జ్ఞానం ఏవ హి కారణమ్।

నిర్మోక్షాయ ఇహ భూతానాం
లింగ గ్రామో నిరర్థకః।
ముని యొక్క బాహ్యవర్తనములు, వస్త్రములు మొ।।వి సన్యాసమునకు కారణం కాదు. జ్ఞానము చేతనే ఒకడు ‘‘సన్యాసి’’ అగుచున్నాడు.

ఆత్మ జ్ఞానము ఆశయముకానప్పుడు బాహ్యమైన కాషాయ వస్త్రములు మొదలైనవన్నీ కూడా సన్యాసాశ్రమం పట్ల నిరర్థకములే అవుతాయి. ఆత్మజ్ఞాన - ఆత్మతత్త్వానుభవముల చేతనే ఒకడు ‘సన్యాసి’గా అగుచున్నాడు.
6. యత్ న సంతం న చ అసంతం।
న అశ్రుతం న బహుశ్రుతమ్।
న సువృత్తం। న దుర్వృత్తం।
వేద కశ్చిత్ స బ్రాహ్మణః।।

తస్మాత్ అలింగో ధర్మజ్ఞో
బ్రహ్మ వృత్తం అనువ్రతమ్।
గూఢ ధర్మ ఆశ్రితో విద్వాన్
అజ్ఞాత చరితం చరేత్।।
బ్రాహ్మణుడు : బ్రహ్మ భావనను సిద్ధించుకొన్నవాడే బ్రాహ్మణుడు. ఎవడైతే - ‘‘ఇది సత్ - ఇది అసత్’’ అని గాని, ‘‘ఇది శాస్త్రము (శ్రుతము) - ఇది కాదు’’ అని కాని, ‘ ఇది సత్ వృత్తి - ఇది దుర్ - వృత్తి’’ అని గాని భేదము ఎంచటం నిలిపివేసి, ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ సర్వత్రా బ్రాహ్మమునే దర్శిస్తాడో - అతడే బ్రాహ్మణుడు.

అందుచేత ఓ నారదా ! బాహ్యమైన చిహ్నములను (outward symbols) వదలి, ఆత్మ ధర్మము ఎరిగినవాడై ‘‘బ్రాహ్మీవృత్తి’ యే నిత్య వ్రతముగా కలిగి ఉండి, - ఏ విద్వాంసుడైతే సమస్తము ఆత్మగా భావించటము అనే రహస్య ధర్మమును ఆశ్రయిస్తూ తన యొక్క ఆత్మానందమును ఎవ్వరికీ గొప్పకై ప్రదర్శించకుండానే ఈ లోకంలో సంచరిస్తూ ఉంటున్నాడు.
సందిగ్ధః సర్వభూతానాం వర్ణ ఆశ్రమ వివర్జితః,
అంధవత్ జడవత్ చ అపి మూకవత్ చ
మహీం చరేత్। తం దృష్ట్వా శాంత మన
సంస్పృహయన్తి దివౌకసః,
లింగ భావాత్ తు కైవల్యం ఇతి।
బ్రహ్మ అనుశాసనం ఇతి।।
పరివ్రాజక సన్యాసి - బాహ్యంగా కనిపించే నేను - రూపాత్మకమైనదంతా ‘‘నిజము కాదు’’ - అను విషయంలో సందిగ్ధము వదలి, వర్ణాశ్రమ ధర్మములను విడచినవాడై బ్రాహ్మీధర్మము ఆశ్రయించి ఉంటాడు. బాహ్యమున కనిపించే అనేక భేదముల విషయంలో గ్రుడ్డివానివలె, జడుడులాగా (ఏదీ తెలియనివానివలె), మూగవానివలె ఈ భూమిపై చరించెదరు గాక.
సమస్తము సశాంతించినట్టి అట్టి శాంతమనస్కుని చూచి దేవతలు కూడా అతని సామీప్యత కోరుకుంటూ ఉంటారు. సమస్త భేదములను అధిగమించి సర్వత్ర అఖండము, అమృతము అగు స్వస్వరూపాత్మగా దర్శించటమును స్వాభావికం చేసుకోవటమే కైవల్యము. ఇది బ్రహ్మము గురించిన అనుశాసనము.
7. అథ నారదః పితామహం,
‘‘సన్న్యాసవిధిం నో బ్రూహి ఇతి’’ పప్రచ్ఛ
పితామహః తథే అంగీకృత్య
ఆతురే వా, క్రమే వా అపి తురీయ ఆశ్రమ స్వీకారార్థం
కృచ్ఛ్ర ప్రాయఃచిత్తపూర్వకం
అష్ట శ్రాద్ధం కుర్యాత్।
దేవ ఋషి దివ్య మనుష్య భూత
పితృ మాత్ర ఆత్మేతి అష్ట (8) శ్రాద్ధాని కుర్యాత్।
శ్రీ నారద మహర్షి : హే బ్రహ్మ భగవాన్ సన్యాసమునకు సంబంధించిన విధి విధానముల గురించి మరికొన్ని విశేషాలు ప్రవచించ ప్రార్థన.

పితామహ (బ్రహ్మ) భగవానుడు : సరే ! అట్లాగే. ఆతుర సన్యాసము గాని, క్రమ సన్యాసము గాని తురీయ ఆశ్రమరూపంగా స్వీకరించేటప్పుడు చిత్తము యొక్క శుద్ధి కొరకై ప్రాయశ్చిత్తంగా ‘8’ విధములైన శ్రాద్ధములను నిర్వర్తించెదరుగాక. అవి దేవ, ఋషి, దివ్య, మనుష్య, భూత, పితృ, మాతృ, ఆత్మ, శ్రాద్ధములు అష్ట విధి శ్రాద్ధములు.
ప్రథమం సత్యవసు సంజ్ఞికాన్
విశ్వాన్ దేవాన్, దేవశ్రాద్ధే బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్।

ఋషి శ్రాద్ధే దేవర్షి క్షత్రర్షి మనుష్యర్షీన్
1) దేవశ్రాద్ధము : మొదటగా సత్యవసు సంజ్ఞార్థులగు విశ్వదేవునికి, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను ఉపాసించాలి.
2) ఋషి శ్రాద్ధము : దేవ ఋషులను, రాజర్షులను, మనుష్య ఋషులను పూజించాలి.
దివ్య శ్రాద్ధే వసు - రుద్ర - ఆదిత్య రూపాన్

మనుష్య శ్రాద్ధే సనక, సనందన
సనత్కుమార, సనత్సుజాతాన్।

భూత శ్రాద్ధే పృథివ్యాది పంచమహాభూతాని
చక్షురాది కరణాని చతుర్విధ భూతగ్రామాన్।
3) దివ్య శ్రాద్ధము : దివ్య శ్రాద్ధము నందు వసు-రుద్ర-ఆదిత్య రూపాలను ఉపాసించాలి.
4) మనుష్య శ్రాద్ధము : బ్రహ్మ మానస పుత్రులగు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను ఉపాసించబడెదరు గాక.
5) భూత శ్రాద్ధము : పృథివి (భూమి), జలము, అగ్ని, వాయువు, ఆకాశము అయినట్టి పంచ మహాభూతములు (Solid, Liquid, Heat, Vapour, Space), కళ్లు మొదలైన పంచ జ్ఞానేంద్రియములు, కాళ్లు, చేతులు మొదలైన పంచ కర్మేంద్రియ కరణములు, 4 విధములైన (మనో, బుద్ధి, చిత్త, అహంకార) అంతరంగ చతుష్టయ గ్రామము (Zone) వీటిని ఉపాసించటము భూతశ్రాద్ధము.
పితృ శ్రాద్ధే పితృ పితామహ ప్రపితామహాన్।

మాతృశ్రాద్ధే మాతృ పితామహీ ప్రపితామహీః।

ఆత్మశ్రాద్ధే ఆత్మ పితృ పితామహాన్।

జీవత్ పితృకః చేత్ పితరం త్యక్త్వా
ఆత్మ పితామహ ప్రపితామహాన్।
ఇతి సర్వత్ర యుగ్మ క్లప్త్యా బ్రాహ్మణాన్ అర్చయేత్।
6) పితృ శ్రాద్ధము : గతించిన తండ్రి - తాత - ముత్తాతలను వసు - రుద్ర - ఆదిత్య ధ్యానపూర్వకమైన ఉపాసనము (మూడు తరముల ఉపాసన)
7) మాతృ శ్రాద్ధము : తల్లి, తండ్రి యొక్క తల్లిని, తాత (తండ్రికి తండ్రి) యొక్క తల్లిని ఉపాసించటము.
8) ఆత్మ శ్రాద్ధము : తనను, తండ్రిని, తాతను క్రమ రీతిగా శ్రాద్ధ మంత్రములతో ఉపాసించటము.

ఒకవేళ తండ్రి జీవించియే ఉంటే, అప్పుడు సన్న్యాసము స్వీకరించువాడు తనను, తాతను, ముత్తాతను శ్రాద్ధ మంత్రముతో ఉపాసించాలి.
ప్రతి ఒక్క శ్రాద్ధమునకు ఇద్దరిద్దరు బ్రాహ్మణులను పిలిపించి అర్చించాలి.
8. ఏకాధ్వర పక్షే, అష్టాధ్వర పక్షే వా
స్వ శాఖ అనుగత మంత్రైః
అష్ట శ్రాద్ధాని అష్ట (8) దినేషు వా
ఏక దినే వా పితృయాగ ఉక్త విధానేన
బ్రాహ్మణాన్ అభ్యర్చ్య, ముక్త్యంతం యథావిధి నిర్వర్త్య,
ఏకధ్వర పక్షే : ఒకే రోజు పూర్తి చేయు యజ్ఞము.
అష్టాధ్వరపక్షే : 8 రోజులు యజ్ఞము నిర్వర్తించి పూర్తి చేయుటము. శాస్త్రీయముగా ఏకధ్వర, అష్టాధ్వర ఉభయ పక్షములలోను చతుస్సాగర పర్యంతం… అను స్వరములో తన యొక్క శాఖా వేద మంత్రములతో తగిన విధంగా శ్రాద్ధమంత్రములతో యథావిధి కర్మకాండతో చివరి వరకు నిర్వర్తించాలి.
పిండప్రదానాని నిర్వర్త్య, సదక్షిణా తాంబూలైః
తోషయిత్వా, బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా,
శేషకర్మ సిధ్యర్థం సప్తకేశాన్ విసృజ్య
శేషకర్మ సిధ్యర్థం కేశాన్
సప్త అష్ట వా ద్విజః సంక్షిప్య వాపయేత్।
పూర్వం కేశ శ్మశ్రు నఖాని చేతి సప్తకేశాన్ సంరక్ష్య।।
యథావిధిగా పిండ ప్రదానము నిర్వర్తించబడుగాక. బ్రాహ్మణులకు శ్రాద్ధ విధానానుసారం దక్షిణ తాంబూలములు సమర్పించాలి.
ఆ తరువాత శేషించిన కర్మలు నిర్వర్తించటానికై శిరస్సు నుండి 4 వెంట్రుకలు గాని, 8 వెంట్రుకలు గాని వదలి మిగిలిన శిరస్సుపై గల వెంట్రుకలను, గడ్డమును, మీసమును క్షౌరము చేయించుకోవాలి. గోళ్లు తీయించుకోవాలి. సప్త (7) కేశములను (వెంట్రుకలను) మాత్రం సంరక్షించుకోవాలి.
9. కక్ష ఉపస్థవర్జం క్షౌర పూర్వకం స్నాత్వా,
సాయం సంధ్యావందనం నిర్వర్త్య,
సహస్ర గాయత్రీం జప్త్వా, బ్రహ్మయజ్ఞం నిర్వర్త్య,
చంకలోని వెంట్రుకలు తప్పించి, గడ్డము, మీసము, శిరో వెంట్రుకలు పైన చెప్పిన విధంగా క్షౌరం చేయించుకొని స్నానం చేయాలి.
❇︎ సాయంకాల సంధ్యావందనం నిర్వర్తించాలి.
❇︎ సహస్ర గాయత్రీ జపం చేయాలి.
❇︎ బ్రహ్మ యజ్ఞము నిర్వర్తించబడు గాక. సమస్తము బ్రాహ్మణం అను సర్వసమర్పణ మంత్రోపాసన నిర్వర్తించబడు గాక.
స్వాధీన అగ్నిం ఉపస్థాప్య,
స్వశాఖ ఉపసంహరణం కృత్వా,
❇︎ తన ఆధీనములో గల అగ్నిని స్థాపింపచేసి తన యొక్క వేద సంబంధమైన శాఖలను ఉపసంహరణము (withdraw) చేయును గాక.
తదుక్త ప్రకారేణ ఆజ్య ఆహుతిం
ఆజ్యభాగాంతం హుత్వా, ఆహుతివిధిం సమాప్య,
ఆత్మాదిభిః త్రివారం సక్తుప్రాశనం కృత్వా,

ఆచమన పూర్వకం అగ్నిం సంరక్ష్య, స్వయం అగ్నేః
ఉత్తరతః కృష్ణాజిన ఉపరి స్థిత్వా,
పురాణ శ్రవణ పూర్వకం జాగరణం కృత్వా,
చతుర్థ యామ అంతే స్నాత్వా,
తత్ అగ్నౌ చరుం శ్రపయిత్వా,
పురుష సూక్తేన అన్నం షోడశ ఆహుతీః హుత్వా,
తమ వేదశాఖోక్తము ప్రకారము ఆజ్యము (నెయ్యి) మిగిలి ఉన్నంత వరకు ఆజ్యమును హోమం చేసి ఆహుతి విధిని పూర్తి చేయాలి. తాను తదితర సంబంధీకులు సక్తు (పేలపిండి) ప్రాశనము నిర్వర్తించాలి.

ఆచమన విధిగా అగ్నిని సంరక్షిస్తూ, ఆ అగ్నికి ఉత్తర దిశగా ‘జింక చర్మము’ పరచి ఆశీనుడై పురాణ శ్రవణం చేస్తూ తెల్లవార్లు ‘జాగరణ’ (మెలకువతో ఉండటం) నిర్వర్తించాలి.
తెల్లవారుఝామున స్నానం చేసి, అక్కడి అగ్నితో చరుము (అన్నము) వండాలి. ఆ అన్నమును ‘పురుషసూక్త మంత్రము’ చదువుచూ షోడశ ఆహుతులుగా (16 ఆహుతులుగా) హోమం చేయాలి.
విరజా హోమం కృత్వా
అథ ఆచమ్య సదక్షిణం వస్త్రం
సువర్ణపాత్రం ధేనుం దత్వా,
సమాప్య బ్రహ్మ ఉద్వాసనం కృత్వా।
ఆ విధముగా ‘విరజా హోమము’ చేసి, ఆ తరువాత ఆచమనం చేయాలి. దక్షిణ పూర్వకంగా వస్త్రమును, బంగారమును, ఆవును దానములుగా ఇవ్వబడుగాక. కార్యమంతా పూర్తి చేసి బ్రహ్మోద్వాసన (బ్రహ్మవ్రత ఉద్వాసన) నిర్వర్తించాలి.
10.
సం మా సించంతు మరుతః। సం ఇంద్రః। సం బృహస్పతిః।
సం మా అయమ్ అగ్నిః సించతు।
ఆయుషా చ, ధనేన చ, బలేన చ వా
ఆయుష్మంతం కరోతు మే। ఇతి।

యాతే అగ్నే యజ్ఞయా తనూః, తయే హి ఆరోహ,
ఆత్మా ఆత్మానం అచ్ఛావసూని కృణ్వన్।
అస్మైనర్యా పురూణి యజ్ఞో భూత్వా, యజ్ఞం ఆసీద
స్వాం యోనిం జాతవేదో భువ
ఆజాయమానః సక్షయ ఏధి ఇతి।

అనేన అగ్నిం ఆత్మని ఆరోప్య, ధ్యాత్వా, అగ్నిం
ప్రదక్షిణ నమస్కార పూర్వకం ఉద్వాస్య,
ప్రాతః సంధ్యాం ఉపాస్య,
సహస్ర గాయత్రీ పూర్వకం సూర్యోపస్థానం కృత్వా,నాభిదఘ్న ఉదకం ఉపవిశ్య,
అష్ట దిక్పాలక అర్ఘ్య పూర్వకం గాయత్రీ
ఉద్వాసనం కృత్వా, సావిత్రీం వ్యాహృతిషు ప్రవేశయిత్వా
వాయువు, ఇంద్ర భగవానుడు, బృహస్పతి, అగ్ని మొదలైన దివ్యులగు దేవతలు రక్షిస్తూ, మాకు ఆయుష్షు, సంపద, బలము అనుగ్రహించెదరు గాక।- అను అర్థము గల మంత్రము చదువుచూ అగ్నిని ఆత్మయందు ఆరోపించుకొని అగ్నిని ధ్యానించాలి.
పురాణమగు ఆత్మ యజ్ఞమును యజ్ఞముగా అవధరించి ‘ఆత్మ యజ్ఞము’చే ఆత్మాగ్నిని ఉపాసించాలి.
అగ్నిని యజ్ఞ మంత్రముగ్ధంగా ఆత్మయందు ఆరోపించి, ధ్యానము చేసి అగ్నికి దక్షిణం చేసి నమస్కార పూర్వకంగా ఉద్వాసన పలకాలి.
ఆ మరునాడు ఉదయము సంధ్యా వందనమునకు ఉపక్రమించి సహస్ర గాయత్రీ పూర్వకంగా సూర్యోపస్థానము నిర్వర్తించెదరుగాక.


జలములో నాభి వరకు (బొడ్డు వరకు) మునుగునట్లు కూర్చుని అష్టదిక్పాలకులకు అర్ఘ్య ప్రదానం చేయాలి (తూర్పున ఇంద్రునకు, ఆగ్నేయమున అగ్నికి, దక్షిణమున యమునికి, నైరుతమున నైరుతునికి, పడమర వరుణునికి, వాయువ్యమున వాయుదేవునికి, ఉత్తరమున కుబేరునికి, ఈశాన్యమున ఈశానునికి అర్ఘ్యము సమర్పించాలి). గాయత్రికి ఉద్వాసన చేసి, సావిత్రిని భూః భువః సువః వ్యాహృతులందు ప్రవేశింపజేయాలి.
11. అహం వృక్షస్య రేరివ।
కీర్తిః పృష్ఠం గిరేః ఇవ।
ఊర్ధ్వ పవిత్రో వాజిని ఇవ -
స్వమృతమ్ అస్మి।
ఈ సంసార వృక్షమునకు పరిపోషకుడను నేనే. సంసారంగా కనిపించేది నా యొక్క తేజో కిరణ ప్రసరణ విషయ విశేషమే. నా యొక్క ఆత్మస్వరూపము పర్వత శిఖరమువలె సమున్నతమై నిలచి ఉంటోంది. ఆకాశంలో సూర్యుని నిర్మల తేజస్సువలె, నేనే స్వయముగా అమృత స్వరూపుడనై సర్వత్రా వెలయుచున్నాను.
ద్రవిణగ్ం సువర్చసం, సుమేధా అమృతో క్షితః।
ఇతి త్రిశంకోః వేద అనువచనమ్।।

యః ఛందసాం వృషభో విశ్వరూపః,
ఛందోభ్యో అధ్యమృతాత్ సంబభూవ,
సమ ఇంద్రో, మేధయా స్పృణోతు।

అమృతస్య దేవ
ధారణో భూయాసమ్।
సమస్తము నా యొక్క సంపదయే అయి, గొప్ప వర్చసుతో నిర్మల బుద్ధి స్వరూపుడనై, అమృత స్వరూపుడనై వెలుగొందుచున్నాను. ఇది త్రివేదముల సారమగు వేదవచనము.

- ఏ ‘‘ఆత్మ’’ అనే ఎద్దు (శ్రేష్ఠత్వము) విశ్వరూపంగా అగుపిస్తోందని వేదములచే సూచించబడుతోందో,
- వేదాధ్యయనముచే ఏది మార్పు చేర్పులకు అతీతంగా అమృత స్వరూపమై సిద్ధిస్తోందో,
అట్టి సమస్వరూపమగు ఆత్మను మేము మేధస్సు (బుద్ధి)తో ఇంద్రియములను ఉపయోగించి దర్శించెదము గాక.

మేము బలవంతులమై మా పట్టుదలతో అట్టి అమృత స్వరూపమగు బ్రహ్మతత్త్వమునే (లేక) మా సహజ స్వాభావిక స్వస్వరూపమునే ధారణగా కలిగి ఉండెదము గాక.
శరీరం మే విచర్షణం। జిహ్వా మే మధుమత్తమా।
కర్ణాభ్యాం భూరి విశృవమ్।

బ్రహ్మణః కోశో అసి మేధయా పిహితః
శృతం మే గోపాయ।
మా యీ శరీరము (బుద్ధి) జడత్వము వీడి ఆత్మ భావనా సిద్ధికే గొప్పగా సచేతనమై ఉండు గాక. మా నాలుక పరమాత్మ గురించిన పలుకుచే మధురమగు గాక.
ఈ మా చెవులు విస్తారమగు పరమ సవ్యమును వినుటకై ఉత్తేజితమగు గాక. వేదముల హృదయము (కోశము) నుండి మహనీయుల మేధస్సు (ప్రజ్ఞ)చే స్వానుభవముగా జనించిన శృతులు రహస్యముగా ప్రకటించబడిన స్వస్వరూపాత్మ తత్త్వజ్ఞానము మా యందు వికసించి, మమ్ము ఆనందింపజేయును గాక.
‘దార’ ఈషణాయాః చ ‘ధన’ ఈషణాయాః చ
‘లోక’ ఈషణాయాః చ వ్యుత్థితో అహమ్।

‘‘ఓం భూః సన్న్యస్తం మయా।
ఓం భువః సన్న్యస్తం మయా।
ఓగ్ం సువః సన్న్యస్తం మయా।
ఓం భూర్భువః సువః సన్న్యస్తం మయా’’ - ఇతి।।
అట్టి వేదహృదయము, ఉపనిషత్ వాణి, వేదజ్ఞుల స్వానుభవము అగు స్వస్వరూప జ్ఞానము ‘‘భార్య - ధనము - లోకము’’ అనే మూడు ఈషణములచే (కోరికలచే) కప్పబడి ఉండగా, ఇప్పుడు నేను వ్యుత్థనము (స్వాతంత్ర్యము) (get awakened) పొందుచున్నాను.
‘భూ’’ ‘‘భువః’’ ‘‘సువః’’ (Matter, Thought, [limited] Self) భూ-భువర్-సువర్- లోకముల భూ-భువర్-సువర్-వ్యాహృతులను దాటి సత్ స్థానమును చేరుతూ అసత్‌ను వీడుచు సత్-న్యస్తుడను అగుచున్నాను.
మంద్ర మధ్యమ తార ధ్వనిభిః
మనసా వాచా ఉచ్చార్యా,

అభయం సర్వ భూతేభ్యో।
మత్తః సర్వం ప్రవర్తతే

ఇతి - అనేన। జలం ప్రాశ్య
‘‘ప్రాచ్యాం దిశి పూర్ణాంజలిం ప్రక్షిప్యోం స్వాహా’’
ఇతి శిఖాం ఉత్పాట్య।
పై ‘‘అహం వృక్షస్య రేరివ’’ మంత్రమును ‘‘సన్న్యస్తం మయా’’ మంత్రములను మంద్ర (నెమ్మది, గంభీర స్వరముతోను, మధ్యమ స్వరముతోను, తారాస్థాయి స్వరములతోను- (Low, Middle and High voices) మనస్సు - వాక్కులను ఏకం చేసి ఉచ్చారణ చేయాలి.

‘‘ఆత్మనగు నేనే ఈ సమస్తము అయి ఉన్నాను. అందుచేత దీనికి అంతటికీ అభయుడను. ఈ సమస్తము ఆత్మ స్వరూపుడగు నాచేతనే ప్రవర్తితము (Participative, getting activated) అగుచున్నది.

ఈ విధంగా మంత్రము, మంత్రార్థము వాక్కుతోను, మనస్సుతోను చదువుతూ, జలమును మూడు సార్లు స్వీకరించి తూర్పు దిక్కున ప్రక్షిప్తమైన (Placed) ఓంకార అగ్ని తత్త్వమునకు పూర్ణాంజలి ఘటిస్తూ స్వాహా - అని పలుకుచు శిఖను (పిలక, జుట్టు) త్రెంచివేయా
12. యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్,

ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః।
సృష్టికి ముందే గల ప్రజాపతి ‘సృష్టి’ అనే ఈ సమస్తము ధారణ చేయుటచే రూపు దిద్దుకొన్నది. అట్టి ఈ సృష్టి యజ్ఞము నా పట్ల పరమ పవిత్రమై ఉండును గాక.

నన్ను ఆయుష్మంతుని గాను, అగ్రగామిగాను, మలినము తొలగించి పరిశుభ్రునిగాను, బలవంతునిగాను, తేజో సమన్వితునిగాను తీర్చిదిద్దును గాక।
యజ్ఞోపవీతం బహిః న నివసేత్।
త్వం అంతః ప్రవిశ్య, మధ్యే హి
అజస్రం పరమం పవిత్రం
యశో బలం వైరాగ్యం మేధాం ప్రయచ్ఛ ఇతి।
ఓ యజ్ఞోపవీత దేవతా ! ఇక మీరు బయట ఉండకండి. నా అంతరమున ప్రవేశించండి. హృదయ అంతర్గత మధ్యగా వేంచేసి నా యందు పరమపావనము అగు బుద్ధిని ప్రవిత్రమగు ఆచారములను, యశస్సును, జ్ఞానబలమును, వైరాగ్యమును, మేధస్సును ప్రసాదించెదరు గాక.
యజ్ఞోపవీతం ఛిత్త్వా, ఉదక అంజలినా,
సహ ‘‘ఓం భూః సముద్రం గచ్ఛ స్వాహా’’
ఇతి అప్సు జుహుయాత్।।

ఓం ‘భూః’ సన్న్యస్తం మయా।
ఓం ‘భువః’ సన్న్యస్తం మయా।
ఓగ్ం ‘సువః’ సన్న్యస్తం మయా।

ఇతి త్రిః ఉక్త్వా, త్రివారం అభిమంత్ర్య
తత్ జలం ప్రాశ్య ఆచమ్య, ఓం భూః స్వాహా।
ఇతి అప్సు వస్త్రం కటి సూత్రం అపి విసృజ్య,
‘‘సర్వ కర్మ నివర్తకో2హమ్’’ ఇతి స్మృత్వా।।
‘‘ఓం భూః సముద్రం గచ్ఛ స్వాహా’’ అను మంత్రము పలుకుచు ‘‘యజ్ఞోపవీతము’’ను తెంచి అంజలి ఘటిస్తూ (రెండు చేతులతో నమస్కరిస్తూ) జలములో వదలి వేయాలి.

‘‘ఓం భూః భువః సువః సన్న్యస్తం మయా’’
(భూర్ భూవర్ సువర్ లోకములను సన్యసిస్తున్నాము’)

- అని 3 సార్లు పలుకుచు అభిమంత్రన పూర్వకంగా, జలముతో 3 సార్లు ఆచమనం చేసి మొలనూలును (కటి సూత్రమును) నీటిలో వదలుచు ‘‘నేను ఇప్పుడు సమస్త కర్మలనుండి నివర్తకుడను (withdraw) అగుచున్నాను’’ అని పలుకుచు భావించును గాక.
13. జాతరూపధరో భూత్వా,
స్వరూప అనుసంధాన పూర్వకం
ఊర్ధ్వ బాహుః ఉదీచీం గచ్ఛేత్।
ఆ తరువాత జాతరూపధారుడై (అప్పుడే పుట్టిన బిడ్డవలె అప్పటి వరకు వెంటవచ్చిన సమస్త సంబంధ బాంధవ్యములను మనస్సుతో త్యజించినవాడై).
తన సహజము, స్వాభావికము అగు ‘‘కేవలాత్మ స్వరూపము’’తో అనుసంధానము పొందినవాడై చేతులు పైకి ఎత్తి ఉంచినవాడై, ఉదీచీ దిశగా (ఉత్తర దిశగా towards north) నడచివెళ్లును గాక.
1. విద్వత్ సన్న్యాసి
పూర్వవత్ విద్వత్ సన్న్యాసీ చేత్ గురోః
ప్రణవ మహావాక్య ఉపదేశం ప్రాప్య,
యథా సుఖం విహరన్।
మత్తః కశ్చిత్ న అన్యో వ్యతిరిక్త ఇతి
ఫలపత్ర ఉదక ఆహారః।
పర్వత వన దేవత-ఆలయేషు సంచరేత్।
సన్న్యస్య అథ దిగంబరః
సకల సంచారకః, సర్వానంద
స్వానుభవైకపూర్ణ హృదయః।

కర్మాతి దూరలాభః।

ప్రాణధారణ పరాయణః।
ఫల రస త్వక్ పత్రమూల ఉదకైః
మోక్షార్థీ గిరికందరేషు
విసృజేత్ దేహం, స్మరన్ తారకమ్।
1. విద్వత్ సన్న్యాసి
ఒకవేళ గురుముఖతః బ్రహ్మజ్ఞానము శ్రవణము చేసియే ఉన్న ‘‘విద్వత్ సన్యాసి’’ (wel educated) అయి వుంటే తన గురువుగారిని సమీపించి, వారి వద్ద ప్రణవ మహావాక్యములను ‘‘ఓం’’, తత్త్వమ్, సో2హమ్ మొ।।న మహర్థములను ఉపదేశము పొంది, ఇక ఆపై యథా సుఖముగా విహరించటము ప్రారంభించును గాక.
‘‘మత్తః కశ్చిత్ న అన్యో అస్తి’’ ఆత్మస్వరూపుడనగు నాకు వేరుగా ఎక్కడా ఏది లేదు అను నిశ్చయబుద్ధి కలిగియే ఉండి, స్థలము, ఆకు జలము స్వీకరించును గాక. పర్వత, వన, దేవాలయములలో సంచారములు కలిగి ఉండును గాక.
అట్టి సన్యాసి ‘‘దేశ-కాల-శరీర-వస్తు’’ మొదలైనవన్నీ మనస్సుతో త్యజించి ఉన్నవాడై, ఇష్టానుసారం ఎక్కడెక్కడైనా సంచారములు కలవాడై సర్వానంద స్వానుభవ ఏకపూర్ణ సత్ హృదయుడు అగుచున్నాడు.

కర్మ - కర్మ ఫలములతో సంబంధమే లేని లాభము పొందిన వాడగుచున్నాడు.

తన యొక్క ప్రాణ శక్తి తాను దర్శించు వస్తువువలె, తన యొక్క శక్తి ప్రదర్శనమువలె అనుభవుడు, పరాయణుడు అగుచున్నాడు. ఆత్మ భావన అనే తరింపజేయు తారక మంత్రము భావనాత్మకంగా స్మరిస్తూ, ఎక్కడ ఏది దొరికితే ఆ ఫలములను, రసమును, తొక్కును, ఆకులను, చెట్లు వ్రేళ్లను, నీళ్లను కూడా భుజిస్తూ మోక్షము కోరువాడై ఈ శరీరమును ‘‘నాది కాదు, నేను కాదు’’ అను భావన అగాహనలతో వదలివేసుకున్నవాడు అగుచున్నాడు.
2. వివిదిషా సన్న్యాసి
14. వివిదిషా సన్న్యాసీ చేత్, శతపథం గత్వా
ఆచార్య ఆధిభిః విప్రైః
‘‘తిష్ఠ తిష్ఠ, మహాభాగ! దండం వస్త్రం
కమండలుం గృహాణ ప్రణవ మహావాక్య
గ్రహణార్థం గురు నికటం ఆగచ్ఛేత్ ఇతి।
ఆదిష్ట ఆచార్యైః దండం కటిసూత్రం
కౌపీనం శాటీం ఏకాం కమండలుం।
2. వివిదిషా సన్న్యాసి
ఇక వివిదిషా సన్న్యాసి గురించి చెప్పుకుంటున్నాము. బ్రహ్మ జ్ఞానము సిద్ధించి సన్న్యసించువాడు విద్వత్ సన్న్యాసి. బ్రహ్మజ్ఞానము కొరకై సన్న్యసించువాడు వివిదిషా సన్న్యాసి. బ్రహ్మ జ్ఞాన సాధన కొరకై సన్న్యసించు వివిదిషా సన్న్యాసి అనేక మార్గములుగా మోక్షాశయము వైపు ప్రయత్నశీలుడు అగుచున్నాడు. అట్టి సన్న్యాస సందర్భములో ఆచార్యులు విప్రులు మొ।।వారు ఇట్లా పలుకుతారు ‘‘ఓ బ్రహ్మ జ్ఞాన సిద్ధి కొరకై సన్యసిస్తున్న మహాభాగా! ఆగండి! నిలవండి! దండమును, కాషాయ వస్త్రమును స్వీకరించండి. మహావాక్యముల పరమార్థము గ్రహించటానికై గురు - ఆశ్రమం ఆశ్రయించండి’’ అని ఆశీర్వాదం పలుకుచున్నారు.
ఆచార్యులను సమీపిస్తూ దండము, కటిసూత్రము, కౌపీనము, ఏకవస్త్రమును, కమండలును ధరించండి.
పాద ఆది మస్తక ప్రమాణం అవ్రణం
సమం సౌమ్యం అకాక పృష్ఠం సలక్షణం
వైణవం దండం ఏకం ఆచమన పూర్వకం
వైణవ (వేణు) దండము : పాదముల నుండి నుదిటి వరకు పొడవుగల వంకరలు లేని దండమును ఆచమన పూర్వకంగా స్వీకరించాలి. ఆ దండము సమంగా సౌమ్యంగా (అందంగా) వంకర టింకరలు లేనిదై ఉండుగాక. ‘‘సఖాం ఆగోపాయ … నివారయ’’ మంత్రము పఠిస్తూ దండమును పరిగ్రహించాలి.
సఖాం ఆగోపాయ ఓజః।
సఖాయో అసి ఇంద్రస్య వజ్రః అసి వార్త్రఘ్నః
శర్మ మే। భవ యత్ పాపం,
తత్ నివారయ - ఇతి దండం పరిగ్రహేత్।
ఓ దండమా! నీవు నా మిత్రుడవు. నాకు ఓజస్సు (శక్తి) ప్రసాదించి కాపాడుము. నీవు ఇంద్రుని వజ్రాయుధమువంటిదానవు. నా పాపములు నాశనం చేయుము.
‘‘జగత్ జీవం జీవన ఆధారభూతం! మాతే।
మా మంత్రయస్వ సర్వదా సర్వసౌమ్య’’ - ఇతి
ప్రణవ పూర్వకం కమండలుం పరిగృహ్య।
కౌపీన ఆధారం కటిసూత్రం! ఓం! - ఇతి
గుహ్య ఆచ్ఛాదనం కౌపీనం! ఓం! - ఇతి

శీత వాత ఉష్ణ త్రాణకరం
దేహైక రక్షణం వస్త్రం ‘ఓం’ - ఇతి।
కటిసూత్రం కౌపీనం వస్త్రం - ఆచమన పూర్వకం,

‘‘యోగ పట్టాభిషిక్తో భూత్వా కృతార్థో అహమ్’’ ఇతి
- మత్వా స్వ ఆశ్రమ ఆచారో భవేత్।
ఈ మంత్రముతో పాటుగా ‘‘ఓం’’ ప్రణవమును ఉచ్చరిస్తూ కమండలువుని గ్రహించెదరు గాక.
కౌపీనము (గోచి)నకు కటి సూత్రము (మొలత్రాడు) ‘ఓం’ కారభావనా పూర్వకంగా ధరించబడుగాక.
‘‘శీతావాత…ఓం’’ ఈ మంత్రము చదువుచు క్రమంగా కటిసూత్రం (మొలత్రాడు), కౌపీనము (గోచి), వస్త్రములను ఆచమన పూర్వకంగా స్వీకరించాలి.


‘‘ఇప్పుడు ఈ సన్యాస యోగ స్వీకారముచే యోగ - పట్టాభిషిక్తుడును, కృతార్థుడను అగుచున్నాను’’ అని మంత్ర ఉచ్చారణలను పలుకుచు - తన ఆశ్రమమునందు నివసించును గాక.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘చతుర్థ ఉపదేశః’’


పంచమోపదేశః (5వ ఉపదేశము) - చతుర్విధ సన్న్యాస భేదములు

1. అథ హ ఏనం పితామహం నారదః పప్రచ్ఛ

భగవన్! ‘‘సర్వకర్మ నివర్తకః సన్న్యాస’’ - ఇతి
త్వయ ఏవ ఉక్తః। పునః స్వ ఆశ్రమాచార
పరః భవేత్ ఇతి ఉచ్యతే,
శ్రీ నారదమహర్షి : హే పితామహా ! భగవాన్! సమస్త కర్మల నుండి నివృత్తి (withdraw from all activites) యే ‘‘సన్న్యాసము’’ అని మీరు ఇంతవరకు చెప్పుచూ వస్తున్నారు. ఇంతలో ‘‘స్వ-ఆశ్రమ సంబంధమైన కర్మలను, తత్ - సంబంధమైన ఆచారములు సన్యాసి నిర్వర్తిస్తూ ఉండునుగాక’’ అంటున్నారు. అనగా, సన్యాసాశ్రమము అనగా గృహస్థ ధర్మములు, సాంఘికమైన సమస్త వ్యవహారిక ధర్మములు, కర్మలు వదలటము కాదా ?
తతః పితామహ ఉవాచ:-
శరీరస్య దేహినో, జాగ్రత్ స్వప్న సుషుప్తి
తురీయ అవస్థాః సంతి।
తత్ అధీనాః కర్మ జ్ఞాన వైరాగ్య ప్రవర్తకాః
పురుషా జంతవః - తత్ అనుకూల ఆచారాః సంతి।
పితామహుడు బ్రహ్మదేవ భగవానుడు : నారదా ! దేహి ఈ దేహము (శరీరము) స్వీకరించటం చేత 1) జాగ్రత్ 2) స్వప్నము 3) సుషుప్తి 4) తురీయము అను నాలుగు అవస్థలు స్వీకరించినవాడు అగుచున్నాడు.
అట్టి 4 అవస్థలకు అధీనుడై కర్మ - జ్ఞాన - వైరాగ్య వర్తనుడై ఈ పురుషుడు (జీవుడు) ఉండవలసి వస్తోంది. జాగ్రత్‌లో ‘‘నేను సన్న్యాసాశ్రమవాసిని’’ అని తలచినప్పటికీ, మిగిలిన స్వప్న - సుషుప్తి - తురీయ సంబంధమై కర్మ - జ్ఞాన - వైరాగ్యములు ఉండనే ఉంటాయి కదా.
శ్రీ నారదుడు: తథ ఏవ చేత్, భగవన్!
సన్న్యాసాః కతి భేదాః?
తత్ అనుష్ఠాన భేదాః కీదృశాః?
తత్త్వతో అస్మాకం వక్తుమ్ అర్హసి - ఇతి।
శ్రీ నారదుడు : అయితే పితృదేవా ! ఈ విషయం వివరించి చెప్పండి. సన్యాసులు ఒక్కటేనా ? లేక వారిలో వేరు వేరు తరగతులు ఉంటే వారి పట్ల అనుష్ఠాన భేదములుంటాయా ? వాటి తాత్త్విక విశేషాలతో సహా వివరించండి.
2. తథా ఇతి అంగీకృత్య తం పితామహేన
సన్న్యాస భేదైః ఆచార భేదః కథితః

కథం ఇతి చేత్, తత్త్వతస్తి ఏక ఏవ సన్న్యాస
అజ్ఞానేన, ఆసక్తివశాత్ కర్మ లోపశ్చ త్రైవిధ్యం ఏత్య।
వైరాగ్య సన్న్యాసో, జ్ఞాన సన్న్యాసో
జ్ఞాన వైరాగ్య సన్న్యాసః, కర్మ సన్న్యాసశ్చ।
ఇతి చాతుర్విధ్యమ్ ఉపాగతః తధ్యథేతి।
పితామహుడు : బిడ్డా ! నారదా ! సరే ! అట్లాగే నీవు అడిగిన వివరాలు వివరించుకుందాము.

‘‘సన్న్యాసము’’ అనునది పరాకాష్ఠ తత్త్వముగా చూస్తే ‘ఒక్కటే’ అయినప్పటికీ ఆచార (Activity) భేదం చేతను, జ్ఞాన - అజ్ఞానములను అనుసరించియు జీవుల వారి వారి అనుక్తులను (Inquisitive attitudes) దృష్టియందుంచుకొని కర్మల పట్ల అభిరుచి, అభినివేశములను బట్టి ఆయా భేదముల దృష్ట్యా 4 విధములుగా వర్ణించబడుతోంది.
అవి ఏమిటంటే 1) వైరాగ్య సన్న్యాసము 2) జ్ఞాన సన్న్యాసము 3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసము 4) కర్మ సన్న్యాసము. వాటి గురించి చెప్పుకుందాము.
దుష్ట మదన అభావాత్ చ ఇతి
విషయ వైతృష్ణ్యం ఏత్య
ప్రాక్ పుణ్యకర్మ వశాత్ సన్న్యస్తః, స
వైరాగ్య సన్న్యాసీ

1) వైరాగ్య సన్న్యాసము : అనేక భక్తి - సుకర్మ - అధ్యయనముల ఉత్తమ ప్రయోజనంగా ఒకానొకడు దుష్టమైన మదన (ఏదో కావాలి, పొందాలి అనే కామన) భావముల పట్ల తృష్ణారాహిత్యమును పొంది, అప్పుడిక సన్న్యసించుచున్నాడు. ఇట్టివాడు ‘‘వైరాగ్య సన్న్యాసి’’ అని చెప్పబడుచున్నాడు.

శాస్త్ర జ్ఞానాత్ పాప పుణ్యలోక
అనుభవ శ్రవణాత్ ప్రపంచః
పరతః క్రోధ ఈర్ష్యా అసూయ
అహంకార అభిమాన ఆత్మక
సర్వసంసారం నివర్త్య,

దారైషణ, ధనైషణ, లోకైషణాత్మక దేహ వాసనాం,
శాస్త్రవాసనాం, లోకవాసనాం త్యక్త్వా,

‘‘వమన-అన్నం ఇవ ప్రాకృతికం సర్వం
ఇదం హేయం మత్వా,
సాధన చతుష్టయ సంపన్నః యః సన్న్యస్యతి
స ఏవ ‘‘జ్ఞాన సన్న్యాసీ’’।।
2) జ్ఞాన సన్న్యాసము : శాస్త్రములు అధ్యయనము చేస్తూ మహనీయుల ప్రవచనములు శ్రవణం చేస్తూ దుష్ట కర్మఫలములైన పాపపు లోకములను, సత్కర్మ ఫలములైనట్టి పుణ్య ఫలములను (సుఖ-దుఃఖ పర్యవసానములను), వాటి పరిమితులను పెద్దల నుండి విని తెలుసుకున్నవాడై ‘‘కర్మలు మోక్షము ప్రసాదించలేవు’’ అని తెలుసుకుంటాడు. క్రమంగా వాటి పట్ల అభినివేశమును (Emotional Attachment) ఉపసంహరించుకొని క్రమంగా క్రోధము, ఈర్ష్య, అసూయ, అహంకారము, అభిమానములను (Tendency of Anger, Disliking, Hatred, Individualistic sense of relatedness, liking for certain worldly matters)లతో కూడిన ‘‘సంసారము’’ అనే జాడ్యము నుండి నివర్తము (Coming out) పొందినవాడగుచున్నాడు.

‘‘ఈ భార్య, ధన సంపద, లోక సంబంధములు నాకు చెందినవి. నేను వీటికి చెందినవాడను’’ అనే త్రి - ఈషణములను (Tri-fondness) దేహమునకు, శాస్త్ర పాండిత్యమునకు లోక సంబంధములకు చెందిన త్రి-వాసనలను (Tri-Tendencies) మానసికంగా వదలి వేస్తూ, ఆధారపడనివాడై ఉండాలి.

ప్రకృతి ప్రాపంచక సమస్త సంబంధ అనుబంధ - బాంధవ్యములను ‘‘ఇవన్నీ కక్కిన కూడు (Vomited Food) లాగా మొదలంట్ల వదలవలసినవి అని గమనించినవాడై సాధన చతుష్టయము (1) నిత్య-అనిత్య వస్తు వివకము 2) ఇప్పటి - మరొకప్పటి కర్మ ఫల భోగముల పట్ల విరాగము 3) శమము, దమము మొదలైన శమాది షట్కసంపత్తి 4) మోక్షము పొందాలి అనే మముక్షుత్వము అనే సంపదను అభ్యాసపూర్వకంగా సుసంపన్నము చేసుకొన్నవాడు ‘‘జ్ఞాన సన్న్యాసి’’.
క్రమేణ సర్వం అభ్యస్య, సర్వం అనుభూయ,
జ్ఞాన - వైరాగ్యాభ్యాం స్వరూప అనుసంధానేన
దేహమాత్ర అవశిష్టః,
సన్న్యస్య జాతరూపధరః భవతి।
‘‘జ్ఞానవైరాగ్య సన్న్యాసీ’’।।
3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసము : పైన చెప్పిన జ్ఞాన సన్యాస విశేషాలు అభ్యాసం చేస్తూ, క్రమంగా వాటిని అనుభూతిపరంగా స్వాభావికం చేసుకొంటూ ఉండాలి.
- జ్ఞాన వైరాగ్య - అభ్యాసబలం చేత సహజము, అమృతము, పరము అగు కేవల స్వస్వరూపములో అనుసంధానము (Connected) పొందుచూ ఉండాలి.
- ఈ భౌతిక శరీరమును లేనిదిగా గమనిస్తూ లీలా వినోదంగా ధరిస్తూ ఉండాలి. సర్వమును ధరిస్తూ పుట్టుకకు ముందే గల ఆత్మశరీరము ధరించి ఉన్నవాడు ‘‘జ్ఞానవైరాగ్య సన్న్యాసి’’ అని పిలువ బడుచున్నాడు.
బ్రహ్మచర్యం సమాప్య, గృహీభూత్వా
వానప్రస్థ ఆశ్రమం ఏత్య, వైరాగ్య ఆభావే
అపి ఆశ్రమ క్రమ అనుసారేణ యః
సన్న్యస్యతి ‘‘సకర్మ సన్న్యాసీ’’।।
4) కర్మ సన్న్యాసము : మొట్టమొదట బ్రహ్మచారి అశ్రమమును పొంది శాస్త్ర - ఆత్మ విద్యా అధ్యాయనుడై విద్యాభ్యాసము పూర్తి చేసుకుని, అటు తరువాత గురు - అనుజ్ఞ పొంది గృహస్థాశ్రమము స్వీకరించి, ఆ తరువాత వానప్రస్థమును ఆశ్రయించి, వైరాగ్యం పొంది, అటు తరువాత సన్యాస ఆశ్రమము పొందువాడు ‘‘కర్మసన్న్యాసి’’ అని పిలువబడుచున్నాడు.
3. బ్రహ్మచర్యేణ సన్న్యస్య సన్న్యాసాత్
జాతరూపధరో, ‘‘వైరాగ్య సన్న్యాసీ’’।।

1. విద్వత్ సన్న్యాసీ, 2. జ్ఞాన సన్న్యాసీ
3. వివిదిషా సన్న్యాసీ, 4. కర్మసన్న్యాసీ
చ-ఇతి చతుర్థా।
బ్రహ్మచర్యాశ్రమము నుండి నేరుగా సన్యసించువాడు ‘‘జాతరూపధరుడు అయినవాడు ‘‘వైరాగ్య సన్న్యాసి’’ అని అనబడుచున్నాడు.
నాలుగు విధములైన సన్న్యాసులు 1) విద్వత్ సన్న్యాసి 2) జ్ఞాన సన్న్యాసి 3) వివిదిషా సన్న్యాసి 4) కర్మ సన్న్యాసి అని మరల గుర్తు చేసుకుంటున్నాము.
కర్మసన్న్యాసో అపి ద్వివిధః [2]।
1. నిమిత్త సన్న్యాసః 2. అనిమిత్త సన్న్యాసః
చ ఇతి।।

నిమిత్తస్తు ఆతురః ।
అనిమిత్తః క్రమ సన్న్యాసః।

ఆతురః సర్వకర్మ లోపః।
ప్రాణస్య ఉత్క్రమణకాల సన్న్యాసః
‘‘నిమిత్త సన్న్యాసః’’।
కర్మ సన్న్యాసులు రెండు రకములు :
1) నిమిత్త సన్న్యాసి 2) అనిమిత్త సన్న్యాసి.

1) నిమత్త కారణంగా సన్న్యసించువాడు (Timely, because of incident like nearing death etc) ఆతుర సన్న్యాసి.
2) అనిమిత్త సన్న్యాసి సన్న్యాస క్రమములు, సన్న్యాస ధర్మములు శాస్త్రీయంగా ముందుగా నిర్వర్తించువాడు.

ఆతుర సన్న్యాసికి సన్న్యాస కర్మకాండ విధి విధానము పరిమితంగాను సందర్భానుకూలంగాను ఉంటుంది. ప్రాణములు విడువటము సమీపిస్తున్నప్పుడు అట్టివానికి ‘‘ఆతుర సన్న్యాసము’’ చెప్పబడుతోంది.
ధృఢ అంగో భూత్వా సర్వం కృతకం
నశ్వరం ఇతి - దేహాదికం సర్వం హేయం ప్రాప్య।

హగ్ంసః శుచిషత్। వసుః అంతరిక్ష సత్।
హోతా వేదిషత్ అతిథిః దురోణ సత్।
నృషద్ వర సత్ వ్యోమ సత్।
అబ్జా, గోజా, ఋతజా, అద్రిజా, ఋతం బృహత్।।

(గమనిక - ‘‘హగ్ంసః శుచిషత్’’ అను మంత్రము కఠ
ఉపనిషత్ (అధ్యాయము 2 - వల్లీ 2) యందు మరియు త్రిపుర తాపినీ ఉపనిషత్ (అధ్యాయము 4) యందు కూడా కలదు)
అనిమిత్త (క్రమ) సన్న్యాసము : దృఢమైన అంగములు కలవాడే క్రమ సన్యాసము స్వీకరించును గాక. ఈయన ‘‘కర్మలు, కర్మ ఫలములు కాలముచే నశించిపోయేవే’’ అని గ్రహించి దేహము మొదలైనవి ప్రజ్ఞతో కూడిన మనస్సుచే వదలవలసినవిగా గమనిస్తున్నాడు. సో2హమ్‌ను ఆశ్రయించి ఆత్మ స్వరూపమును సిద్ధించుకొనును గాక. అట్టి ఆత్మాహమ్ భావన ఎట్టిది? అనగా
- దివ్యలోకములో ‘హంస’ వలె విహరించువాడును
- ఆకాశంలో వాయువువలెను
- యజ్ఞ వేదికపై గల అగ్ని గుండము నందు గల అగ్నివలెను
- ద్రోణకలశములోని సోమరసము వలెను
- ఇంటిలో వేంచేసియున్న అతిథి వలెను
- సమస్త దేహములలో సంచరించే వాయువు (గాలి) వలెను
- ఆకాశములో, యజ్ఞములో ఉన్నది
- అబ్జమునందు (తామరపువ్వునందు), ధాన్యము (భూమి) యందు, ఋత్ వలెను (యజ్ఞాంగములందు), కొండపైన పరమ సత్యమై స్వస్వరూపమై వెలయుచున్నది అని అత్మతత్త్వజ్ఞుడు దర్శించుచున్నాడు.
బ్రహ్మ వ్యతిరిక్తం సర్వం నశ్వరం ఇతి।
నిశ్చిత్య క్రమేణ యః సన్న్యస్యతి,
స సన్న్యాసః - ‘‘అనిమిత్త సన్న్యాసః’’।
‘‘బ్రహ్మమునకు వేరై కనిపించేదంతా నశించబోవునదే’’ అని గమనించుచున్నాడు. ఇట్టి నిశ్చయముతో కూడినవాడై ఎవ్వడు సన్యాసిస్తాడో, అట్టివాడు ‘‘నిమిత్త సన్న్యాసి’’ అని చెప్పబడుచున్నాడు.
4. సన్న్యాసః షడ్విధో [6] భవతి।
(1) కుటీచకో (2) బహూదకో (3) హంసః।
(4) పరమహంసః (5) తురీయాతీతో
(6) అవధూతః చ ఇతి,
సన్న్యాసులు ఆరు [6] విధలములైనవారు 1) కుటీచకుడు 2) బహూదకుడు 3) హంస 4) పరమహంస 5) తురీయాతీతుడు 6) అవధూత
కుటీచకః : -
శిఖా యజ్ఞోపవీత దండ కమండలు ధరః,
కౌపీనకంథాధరః, పితృ మాతృ గురు
ఆరాధన పరః, పిఠరఖని త్రశిక్య ఆది
మంత్ర సాధన పర। ఏకత్ర అన్నాదన పరః
శ్వేత ఊర్ధ్వ పుండ్రధారీ। త్రిదండః।
1) కుటీచక సన్న్యాసి : శిఖ, యజ్ఞోపవీతము, చేతిలో దండము, కమండలు (నీటి చెంబు) ధరించి ఉంటారు. పిఠరఖము (కవ్వపు కోల) త్రశిక్యము (మూడు ముళ్లుగల కావడి ఉట్టి) కూడా ఉండును. అతనికి మనన రూపమై మంత్రసాధనలు అగుచున్నాయి. ఒకేచోట ఉండి భుజించువాడు, తెల్లటి ఊర్ధ్వపుండ్రములను (నుదుటి నామము) అలంకరించుకొనువాడు. త్రిదండము (మనోదండము, వాక్ దండము, కర్మ దండము) అనే త్రిదండములను ధరించువాడు.
బహూదకః : -
శిఖా కంథాదిధరః।
త్రిపుండ్రధారీ। కుటీచకవత్ సర్వ సమో।
మధుకర వృత్త్యా అష్ట కబళ అశీ।
2) బహూదక సన్న్యాసి : శిఖ, యజ్ఞోపవీతము మొదలైనవి ధరించువారు. త్రిపుండ్రము, మధూకర భిక్ష చేస్తూ ‘8’ కబళములు (ముద్దలు) ఆహారము స్వీకరించు నియమములు పాటించువారు బహూదక సమానులు.
హంసః : -
జటాధారీ। త్రిపుండ్ర ఊర్ధ్వ పుండ్రధారీ।
అసంక్లుప్త మధుకర అన్న అశీ।
కౌపీన ఖండతుండధారీ।
3) హంస : జటధారి (పెద్ద జడలు కలిగి ఉండువారు). ఊర్ధ్వ పుండ్రములను ధరించువారు. ఈ ఇల్లు - ఆ ఇల్లు అనే నియమము పాటించక జీవించువారు. మధుకరము (భిక్షాటన) చేసి, గోచీ ఖండము ధరించువారు.
పరమహంసః : -
శిఖా యజ్ఞోపవీత రహితః।
పంచ గృహేషు ఏకరాత్ర అన్నాదానపరః।
కర పాత్రీ ఏక కౌపీనధారీ।
శాటీం ఏకాం ఏకం వైణవం దండం।
ఏక శాటీధరో వా।
భస్మోద్ధూళన పరః సర్వత్యాగీ।
4) పరమహంస : శిఖ (పిలక), యజ్ఞోపవీతము (జంధ్యము) వదలివేసి ఉంటారు. రోజుకు ఐదు (5) ఇళ్లలో మాత్రమే, రోజుకు ఒకసారి భిక్ష స్వీకరించువారు. చేతినే భిక్ష పాత్రగా ఉపయోగించువారు. ఒక్క గోచీమాత్రమే కలిగి ఉండువారు. ఒక్క ‘‘వైణవం దండము (చెక్కదండము) ఉపయోగించువారు. ఏకశాటి (ఏక వస్త్రము, ఒక్క దుప్పటి) ధరిస్తూ శరీరమంతా విభూతిని పూసుకొని ఉండువారు. సమస్తమును త్యజించి పరబ్రహ్మముతో ఏకాంతము ఆస్వాదించువారు.
తురీయాతీతః : -
గోముఖః ఫల ఆహారీ।
అన్నాహారీ చేత్, గృహత్రయే దేహమాత్ర అవశిష్టో।
దిగంబరః కుణపం ఇవ శరీర వృత్తికః।
5) తురీయాతీతుడు : గోవువలె లభించిన ఆహారమును తృప్తిగా స్వీకరించువారు. మూడు గృహములలో మాత్రమే లభించిన ఆహారము స్వీకరించువారు. దేహము ఉండి కూడా లేనివారై దిగంబరులై (వస్త్రములను ధరించనివారై) ఈ శరీరమును నశించినదానివలె (శవమువలె) దర్శించువారు.
అవధూతః : -
అవధూతస్తు అనియమో అభిశస్త పతిత వర్జన పూర్వకం
సర్వవర్ణేషు అజగర వృత్త్య ఆహార పరః।
స్వరూప అనుసంధానపరః।
6) అవధూత : శిఖ, యజ్ఞోపవీతము, భిక్ష మొదలైన ఏ శాస్త్రీయ నియమములు లేనట్టివాడు. సర్వ శాస్త్ర నియమములు దాటి ఉన్నవారు. పతితుల, పాప భావములు కలవారి ఇళ్లను వదలి, తదితర సకలం వర్ణ-జాతి వారి ఇళ్లలో భిక్ష స్వీకరించువారు. కొండచిలువ వలె లభించిన ఆహారము తినువారు. అఖండాత్మ స్వరూపముతో అనునిత్యము, స్వాభావికము అయినట్టి అనుసంధానము సిద్ధించుకొన్నవారు.
5. ఆతురః జీవతి చేత్, క్రమసన్న్యాసః కర్తవ్యః।


కుటీచక బహూదక హంసానాం
బ్రహ్మచర్య ఆశ్రమాది తురీయ ఆశ్రమవత్,
కుటీచక ఆదీనాం సన్న్యాస విధిః।

పరమహంస ఆది త్రయాణాం న కటిసూత్రం।
న కౌపీనం। న వస్త్రం। న కమండులుః। న దండః।
సార్వ వర్ణిక భిక్షాటన పరత్వం,
జాతరూపధరత్వం విధిః।
ఒకడు మరణ సమయము వచ్చినదని అనుమానిస్తూ ఆతుర సన్యాసము (యజ్ఞ-అగ్ని నియమములు పాటించకుండా) స్వీకరించవచ్చును. అయితే అతడు దైవవశంగా తిరిగి ఆరోగ్యము పుంజుకుంటే, అట్టివాడు క్రమ సన్యాస విధుల ప్రకారము శాస్త్ర ప్రక్రియలు తిరిగి నిర్వర్తించాలి.

ఒకడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమములో దేనినుంచైనా కుటీచక, బహూదక, హంస సన్యాసములను సిద్ధింపజేసుకోవచ్చు.

పరమహంస, తురీయాతీతుడు, అవధూత - ఈ ముగ్గురు సన్యాసులు కూడా కటి సూత్రము, కౌపీనము, కమండలువు దండము వీటిని ధరించాలనే నియమము ఏది కలిగి ఉండరు. వీరికి ఏ వర్ణము వారి ఇళ్లలోనైనా భిక్షాటనము, జాతరూప ధరత్వం (అప్పుడే పుట్టిన బిడ్డ వలె జగదృశ్యముతో ఎటువంటి సంబంధము కలిగి ఉండకపోవటము) ఇది విధి విధానం చెప్పబడుతోంది.
సన్న్యాసకాలే అపి అలంబుద్ధి పర్యంతం అధీత్య,
తదనంతరం కటిసూత్రం కౌపీనం
దండం వస్త్రం కమండలుం సర్వం అప్సు విసృజ్య।
సన్న్యాస కాలములో కూడా ఆత్మ జ్ఞాన తృప్తి పొందని అల్పబుద్ధి తొలగనంతవరకు శాస్త్రములను అధ్యయనము చేయవలసిందే. అటు తరువాత మొలనూలు (మొలత్రాడు), కౌపీన వస్త్రము (గోచి) దండము, వస్త్రము, కమండలము మొదలైనవన్నీ జలమునకు సమర్పించి వదలి వేయవచ్చును.
అథ జాతరూపధరః చరేత్ న కంథాలేశో
నాధ్యేతవ్యో, న వక్తవ్యో, న శ్రోతవ్యం అన్యత్
కించిత్ ప్రణవాత్ అన్యం న తర్కం పఠేత్
న శబ్దం అపి బహూన్ శబ్దాన్ న అధ్యాయేత్।
న మహత్ వాచో విగ్లాపనం।
గిరా ప్రాణి ఆదీనాం సంభాషణం।
న అన్య భాషా విశేషణం।
న శూద్ర స్త్రీ పతిత ఉదక్యాది సంభాషణం।
న యతేః దేవపూజా।
న ఉత్సవదర్శనం, తీర్థయాత్రా వృత్తిః।।
• పై ‘జాతరూపధరుడు’ అగుచూ ‘‘స్వాభావికంగా తనదే’’ అయిన అఖండ - అప్రమేయ ఆత్మరూపము సందర్శించుకొనును గాక.
• అట్టివాడు ఇక అధ్యయన శీలుడు కాడు. (శాస్త్రములతో పని ఉండదు).
• శబ్ద - మంత్ర ఉపాసనలు దాటిపోతాడు.
• అతనికిక ఇతరులకు చెప్పవలసినదిగాని, తాను వినవలసినదిగానీ ఏదీ ఉండదు.
• ఆత్మకు వేరైన అధ్యయన, ఉపాసన, వక్తవ్య - శ్రోతవ్యములు ఏమీ ఆశ్రయించడు.
• ప్రణవోపాసనలతో తప్ప తర్క శాస్త్రము శబ్దములను కూడా ధ్యానించడు.
• దీర్ఘమైన శాస్త్ర శబ్దజాలము కూడా ‘‘ఆత్మానుభవమునకు (అడ్డు)యే’’ అని గమనిస్తాడు.
• ఇతర జీవులతో బోధ, వాదము మొదలైనవి కలిగి ఉండడు. ఇతరుల అభిప్రాయములను విశ్లేషణ చేయడు.
• శూద్ర, పతిత, స్త్రీ సంభాషనలు నిర్వర్తించడు.
• ఆత్మను సిద్ధించుకున్న సన్యాస శ్రేష్ఠుడగు అట్టి యతి ఉత్సవములు, తీర్థ యాత్రలు నిర్వర్తించువాడుగా ఉండడు.
6. పునః యతి విశేషః।

కుటీచకస్య ఏతి ఏకత్ర భిక్షా।
బహూదకస్య అసంక్లుప్తం మధూకరం।
హంసస్య అష్ట గృహేషు అష్ట కబళం।
పరమ హంసస్య పంచ గృహేషు
కరపాత్రం ఫలాహార గోముఖం।
తురీయాతీతస్య అవధూతస్య
అజగరవృత్తిః సార్వవర్ణికేషు।

యతిః న ఏకరాత్రీః వసేత్। న కస్యాపి నమేత్।

తురీయాతీత, అవధూతయోః
న జ్యేష్ఠో
బ్రహ్మ భగవానుడు : ఓ నారద మహర్షి! ఇంకా కూడా యతుల గురించిన మరికొన్ని విశేషములు చెప్పుకుంటున్నాము. అందరూ వినండి.
1) కుటీచకునకు : ఒకే చోట భిక్ష.
2) బహూదకునకు : మధుకర బిక్ష. ఇళ్ల (గృహ) నియమములు ఉండవు
3) హంస : ఎనిమిది ఇళ్లు. ఎనిమది కబళములు.
4) పరమహంస : 5 ఇళ్ళలో భిక్ష, చేతులే పాత్ర. గోవు (ఆవువలె) లభించినది స్వీకరించటం.
5) తురీయాతీతుడు, 6) అవధూతకు : అజగర వృత్తి. కొండచిలువ వలె ఉన్న చోటే ఉండి లభించినది భుజించటము. అన్ని వర్ణముల వారి వద్ద భిక్ష స్వీకరించువారై ఉంటారు.

యతీశ్వరుడు ఒక్క చోటనే ఒక్క రాత్రిమించి గడపకూడదు. ఎక్కడ నిద్రవస్తే అక్కడ నిద్రించుదురు గాక. యతీశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించడు.

తురీయాతీతులు, అవధూతలు ఇరువురిలో ఎవరు ఎవరికంటే కూడా జ్యేష్ఠులు కారు, కనిష్ఠులు కారు. (ఎవరు ఎవరికంటే కూడా ఎక్కువ వారు, తక్కువ వారు కాదు). ఎందుకంటే ఇద్దరు స్వస్వరూప జ్ఞాన సంపన్నులే.
యో న స్వరూపజ్ఞో।
జ్యోష్ఠో2పి కనిష్ఠో।

హస్తాభ్యాం నది ఉత్తరణం న కుర్యాత్।
న వృక్షం ఆరోహేత్। న యాన అధిరూఢో।
న క్రయ-విక్రయ పరో। న కించిత్ వినిమయ పరో।
న దాంభికో। న అనృతవాదీ।

న యతేః కించిత్ కర్తవ్యం అస్తి।
అస్తిచేత్ సాంకర్యం।
ఒకానొకడు నామ - రూప - గుణాత్మకంగా జ్యేష్ఠుడు అయినప్పటికీ స్వస్వరూప జ్ఞాని అయి ఉండకపోతే కనిష్ఠుడే.

యతి అయినవాడు నదులలో ఈతలు కొట్టకూడదు. చెట్లు ఎక్కకూడదు. వాహనములు అధిరోహించరాదు. క్రయ - విక్రయములు (అమ్మటం - కొనటం - వ్యాపారం) నిర్వహించ కూడదు. వ్యాపారములు కించిత్ కూడా చేయరాదు. దాంభికములు (తన గురించి గొప్పలు) పలుకరాదు. అబద్ధాలు ఆడరాదు.

యతికి ఎటువంటి కర్తవ్యములు (Worldly duties) ఉండవు. ఒకవేళ ప్రాపంచక కర్తవ్యములు కలిగి ఉంటే అవి సాంకర్యమునకు (ఇంద్రియ చాపల్యమునకు) అవకాశాలు ఉంటాయి.
తస్మాత్ మనన ఆదౌ సన్న్యాసినామ్ అధికారః।
సన్న్యాసి యొక్క ఏకైక కర్తవ్యము? సమస్తమునకు ఆది (the begining) అయినట్టి ఆత్మోపాసన యందే సమస్త అధికారము, (Function) ఏకైక కర్తవ్యము కూడా.
7. ఆతుర కుటీచకయోః భూలోక భువర్లోకౌ।
బహూదకస్య స్వర్గలోకో।
హంసస్య తపోలోకః।
పరమహంసస్య సత్యలోకః।
తురీయాతీత అవధూతయోః
స్వాత్మన్యేవ (స్వ ఆత్మని ఏవ) కైవల్యం స్వరూప
అనుసంధానేన భ్రమర కీటక న్యాయవత్।
సన్న్యాస లోకప్రాప్తులు
అతుర, కుటీచక సన్న్యాసులకు : భూలోకము, భువర్లోకము,
బహూదకునకు - స్వర్గలోకము,
హంస (సన్న్యాసి) కి - తపోలోకము,
పరమ హంసకు - సత్యలోకము,
తురీయాతీత, అవధూతలకు - స్వాత్మానంద రూపము, కైవల్య స్వరూపము, కేవలమగు స్వస్వరూపానుభవము
- ఇవన్నీ భ్రమర కీటక న్యాయము వలె సిద్ధించినవగుచున్నాయి.
యం యం వా అపి స్మరన్ భావం
త్యజతి అంతే కళేబరం,
తం తం ఏవ సమాప్నోతి। న అన్యథా।
శ్రుతిశాసనమ్।।
ఒకడు ఏ ఏ భావము స్మరిస్తూ దేహమును త్యజించటం జరుగుతోందో అతడి అట్టి భావమునకు తగియున్నట్టి మరొక జన్మమును పొందుచున్నాడు. అంతకుమించి వేరైనదేదీ లేదు. ఇతి శ్రుతిశాసనము. ఆతని స్వస్వరూపమో? జన్మ - కర్మలచే అంటజాలని అమృతరూపము.
తత్ ఏవం జ్ఞాత్వా, స్వరూప అనుసంధానం।
వినా అన్యథా ఆచార పరో న భవేత్।
తదా ఆచారవశాత్ తత్ తత్
లోక ప్రాప్తిః, జ్ఞాన వైరాగ్య సంపన్నస్య
స్వస్మిన్నేవ ముక్తిః - ఇతి।

న సర్వత్ర ఆచార ప్రసక్తిః సదాచారః।
అందుచేత సర్వకాల సర్వ అవస్థలందు సర్వాత్మకమగు పరమాత్మతత్త్వమును ఎరుగుచూ, సదా అనుసంధానము (Connected) అవాలి. ఇక అన్యమైన ఈ దృశ్య వ్యవహార సంబంధ అనుబంధముల పట్ల ప్రయత్నశీలుడు, అనుసరణశీలుడు కాకుందురు గాక.
ఆ విధంగా ‘‘ఇదంతా పరమాత్మ యొక్క (బ్రహ్మముయొక్క) ప్రదర్శనా చమత్కారమే. ఆత్మనగు నా యొక్క లీలా వినోద కల్పనయే’’ అను తత్ తత్ ఆచారములను అనుసరించి తత్‌తత్ ఊర్ధ్వ స్థితిగతులను సంపాదించుకుంటూ, జ్ఞాన-వైరాగ్య సంపన్నుడు అవటమే ముక్తికి మార్గము.
అంతకుమించి సదాచార సంపన్నత మరొకటేదీ ముక్తి మార్గము కాదు.
8. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు
ఏక శరీరస్య। జాగ్రత్ కాలే విశ్వః।
స్వప్నకాలే తైజసః।
సుషుప్తికాలే ప్రాజ్ఞ అవస్థా భేదాత్।
అవస్థా ఈశ్వర భేదః।
ఈ జీవుడు స్వంతంగా ఆత్మస్వరూపుడే. అట్టి ఈ జీవునికి జాగ్రత్ స్వప్నసుషుప్తులు ఏక శరీరము (త్రివిధ పురుషకారములు (లేక) త్రి-అవస్థలు ‘3’ అవస్థలు తనవైన వాడు ఒక్కడే). అట్టి ఈ ఆత్మ పురుషుడు జాగ్రత్‌లో విశ్వుడుగాను, స్వప్నములో తేజసుడు గాను, సుషుప్తిలో ప్రాజ్ఞుడుగాను, త్రి-అవస్థలు ఆస్వాదిస్తున్నాడు. ఈ మూడు కూడా ఈశ్వరుని వివిధ అవస్థలు.
తాసు చతుర్దశ (14) కరణానాం బాహ్య వృత్తయో
అంతః వృత్తయః తేషాం ఉపాదానకారణం।
వృత్తయః చత్వారః (4)
‘‘మనః’’ ‘‘బుద్ధిః’’ ‘‘అహంకారః’’
‘‘చిత్తం’’ చ ఇతి।
ఈశ్వరుడు : జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు తనవై, ఆ మూడింటి యందు తానే భావనా పూర్వకంగా ఉన్న ఈ జీవుని విస్తారిత స్వరూపమే ‘‘ఈశ్వరుడు’’. అట్టి ఈశ్వరుడు తన కల్పన అగు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో 4 విధములైన బాహ్య అభ్యంతర వృత్తులు కూడి 14 కరణాలు కలిగి ఉంటున్నాడు.
బాహ్యవృత్తులు (ఉపాదాన కారణములు) :
1) పంచ జ్ఞానేంద్రియములు
2) పంచ కర్మేంద్రియములు
నాలుగు అంతర వృత్తులు : మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
బాహ్య వృత్తులకు, ఆయా అనుభవ పరంపరలకు, వాటిలో ఇష్ట-అయిష్టములకు అసలు కారణం (నిమిత్త కారణం) అంతర వృత్తులే.
తత్ తత్ వృత్తి వ్యాపార భేదేన
పృథక్ ఆచార భేదః।


నేత్రస్థం జాగరితం విద్యాత్।
కంఠే స్వప్నం సమావిశత్।
సుషుప్తం హృదయస్థం తు।
తురీయం మూర్ధ్ని సంస్థితమ్।
ఈవిధంగా ఈశ్వరునిచే స్వయం కృతంగా కల్పించబడిన ఆయా 14 బాహ్య-అభ్యంతర కరణములు వృత్తి భేదమును అనుసరించే జీవుల చేష్టలలో అనుభవ - అనుభజ్ఞులలో భేదములు కనిపిస్తున్నాయి. ‘ఏకము’ అయి ఉన్న చోట అనేకముగా అనుభవమౌతోంది.
అట్టి 14 బాహ్య అభ్యంతర వృత్తులలో అభిమానముచే విషయములను పొందుచూ ఇష్ట-అయిష్టముల కారణంగా సుఖ దుఃఖ ద్వంద్వములను తనవిగా అనుభవించువాడు జీవుడు.

అట్టి ఈ జీవుడు
జాగ్రత్ అవస్థలో - కళ్ళయందు,
స్వప్నావస్థలో - కంఠమునందు
సుషుప్తి అవస్థలో - హృదయమునందు
తురీయావస్థలో - మూర్ధము (శిరము) యందు సహస్రారమున విశేషమైన ‘ఉనికి’ కలిగినవాడై ఉంటున్నాడు.
తురీయం అక్షరం ఇతి జ్ఞాత్వా,
జాగరితే సుషుప్తి అవస్థ ఆపన్న ఇవ
యద్యత్ శృతం, యద్యత్ దృష్టం,
తత్ తత్ సర్వం అవిజ్ఞాతం ఇవ యో వసేత్,
తురీయుడు : ‘‘జాగ్రత్-స్వప్న సుషుప్తులు నావి’’ అను ఎరుక స్వరూపముగా కలవాడు.
✤ జాగ్రత్ స్వప్న సుషుప్తులు మార్పు చెందు అవస్థలు
✤ తురీయుడు ఏ మార్పు చెందని అక్షరుడు
✤ సుషుప్త్యవస్థ నుండి జాగ్రత్‌లో ప్రవేశించిన ఈ జీవుడు జాగ్రత్‌లో ఏదేది వింటున్నాడో చూస్తున్నాడో అవన్నీ ఇది వరకు తెలియనివి, ఇప్పుడు తెలుస్తున్నవి అను రూపంగా పొందుచున్నాడు.
తస్య స్వప్న అవస్థాయాం అపి తాదృక్ అవస్థా భవతి।
స జీవన్ముక్త ఇతి వదంతి।
సర్వ శ్రుతి అర్థ ప్రతిపాదనం ఇతి,
తస్య ఏవ ముక్తిః ఇతి।।
స్వప్నావస్థ సప్న సమయంలో జాగ్రత్ వంటిదేనని, జాగ్రత్ అవస్థ స్వప్న జగత్ వంటిదేనని, తత్త్వజ్ఞులచే ప్రతిపాదించబడుతోంది.
ఈ విధంగా ప్రతిపాదితమగు జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సొంతదారు, సాక్షీ స్వరూపుడు అగు తురీయ - స్వస్వరూపమును ఎవడు గ్రహిస్తాడో అట్టివాడే ‘ముక్తుడు’ అగుచున్నాడు.
9. భిక్షుః న ఐహిక - ఆముష్మిక అపేక్ష।
యది అపేక్షా అస్తి, తత్ అనురూపో భవతి।
స్వరూప అనుసంధాన వ్యతిరిక్త అన్యశాస్త్ర అభ్యాసైః
ఉష్ట్ర కుంకుమ భారవత్ వ్యర్థో।
ఐహిక - ఆముష్మిక (ఇహ-పర ; Here and here after) అనుభవముల పట్ల ‘ఆపేక్ష’ (Desire) కలవాడు ముక్తుడు కాలేడు.
ఒకవేళ ఇహ-పరములలో కనిపించే (లేక) అనిపించే దేనిపట్లైన ఆపేక్ష కొనసాగుతూ ఉంటే, అట్టివాడు ఈ దేహము తరువాత అట్టి ఆపేక్ష సంబంధమైన అనుభవముల వెంట పరుగులు పెట్టువాడే అగుచున్నాడు. ‘‘సమస్తము అఖండము, అమృత రూపము’’ అగు స్వస్వరూపమును ఏమారిపింపజేస్తూ అనుసంధానమునకు వ్యతిరేకంగా (అన్య) శాస్త్ర పఠణము, శాస్త్ర విశేష జ్ఞానము వంటి కుంకుమ బస్తా మోస్తూ కుంకుమ వాసన ఆస్వాదించని విధంగా - వ్యర్థము (Mere waste).
న యోగశాస్త్ర ప్రవృత్తిః। న సాంఖ్యశాస్త్ర అభ్యాసో।
న మంత్ర తంత్ర వ్యాపార
ఇతర శాస్త్ర ప్రవృత్తిః యతేః అస్తి చేత్,
శవ అలంకారవత్ చర్మకారవత్,
అతి విదూర। కర్మ ఆచార విద్యా దూరో।

‘యతి’ అయినవాడు యోగ శాస్త్ర ప్రవృత్తి (Avocation) గాని, సాంఖ్య శాస్త్ర అభ్యాసము (Practice) గాని, మంత్ర - తంత్ర వ్యాపారము (Investment) గాని కలిగి ఉండడు. ఒకవేళ ఎవరైనా అట్టి అధ్యాసలు కలిగి ఉంటే అవి యతి దృష్టిలో శవమునకు చేసే అలంకారముల వలె వ్యర్థములు గానే అనిపిస్తాయి. చర్మకారుని వలె (చర్మము కుట్టువానికి జంతుమాంసముతో పని లేనట్లు) కర్మ - కర్మ ఫల వ్యవహారములకు అతి దూరంగా ఉంటాడు. కర్మ - ఆచార - లోక సంబంధములైన విద్యలకు దూరంగా (will be at a distance) ఉంటాడు.

న ప్రణవ కీర్తన పరో। ప్రణవమును (ఓంకారమును) కూడా కీర్తించువాడుగా (పొగడువాడుగా) ఉండడు.
యత్ యత్ కర్మ కరోతి,
తత్ తత్ ఫలం అనుభవతి।
ఏరండ తైల ఫేనవత్ అతః
సర్వం పరిత్యజ్య తత్ ప్రసక్తం।
మనోదండం కరపాత్రం దిగంబరం
దృష్ట్వా పరివ్రజేత్ భిక్షుః।।
ఎవ్వడెవ్వడు ఏ ఏ కర్మలను కర్తృత్వము వహించి నిర్వర్తిస్తాడో, ఆయా కర్మఫలములనే అనుభవముగా పొందుతాడు.
అందుచేత సమస్త దృశ్య ప్రసక్తములు, సమాచారములు ఆముదపు నూనె నురుగువలె వదలివేయాలి.
‘మనస్సును దండము వలె తయారు చేసుకొని, చేతులను భిక్షక పాత్రగా ధరించి ఆత్మదృష్టితో పరివ్రాజము (జగత్తులో సంచారము) యతి నిర్వర్తించును గాక।
బాల ఉన్మత్త పిశాచవత్ మరణం
జీవితం వా న కాంక్షేత।

కాలమేవ ప్రతీక్షేత నిర్దేశ
భృతకన్యాయేన పరివ్రాట్ ఇతి।

తితిక్షా జ్ఞాన వైరాగ్య
శమ ఆది గుణ వర్జితః,
భిక్షా మాత్రేణ జీవి స్యాత్
స యతిః యతివృత్తి హా।।
ఒక పసిబాలుడు, ఉన్మత్తుడు (పిచ్చివాడు) పిశాచము ఆవహించినవాడు వలె - జీవించటమును గాని, మరణించటము గాని కోరుకోడు. ‘‘నాకు ఈ రెండు ఒక్కటే’’ అని నిశ్చయించుకొని ఎరిగి ఉంటాడు.

ఒక రాజు గారు ఇచ్చే ఆజ్ఞలను యథాతథంగా పాటించే రాజభక్తి గల భృత్యునివలె (As a servant) ‘కాలము’ను అంగీకరిస్తూ పరివ్రాట్ కాలమునకే అన్ని వదలి ఉంటారు.

తితిక్ష (ఓర్చుకోవటము, ఓర్పు భరించగలగటము, కష్ట-సుఖములను భగవత్ ప్రసాదంగా భావించి అంగీకార బుద్ధి కలిగి ఉండటము), ఆత్మ జ్ఞానముతో కూడిన వైరాగ్యము, శమము (అంతరింద్రియ నిగ్రహము), దమము (బాహ్య ఇంద్రియ నియమము) మొదలైనవి యతి గుణములు. అవి వదలి, కేవలము జీవించటానికై భిక్షాటనము చేయుటచే అట్టి యతి యతివృత్తిని పోగొట్టుకొనువాడు అగుచున్నాడు.
10. న దండ ధారణేన, న ముండనేన
వేషేణ, న దంభాచారేణ ముక్తిః।
జ్ఞానదండో ధృతోయేన,
‘ఏకదండీ’ - స ఉచ్యతే।
కేవలము కర్రతో నిర్మితమైన దండము, ముండనము (జుట్టు తొలగించటము), కాషాయ వేషము మొదలైన దంభాచారములు ఆశ్రయించినంత మాత్రం చేత ఎవ్వరికి ముక్తి లభించదు.
ఎవడైతే జ్ఞాన దండము, ధృతి (పట్టుదలతో కూడిన ఆత్మ భావన) పర్యములను కలిగి ఉంటాడో అట్టి వానిని ‘ఏకదండీ’ అని పిలుస్తారు.
కాష్ఠ దండో ధృతో యేన
సర్వ ఆశీ జ్ఞాన వర్జితః,
స యాతి నరకాన్ ఘోరాన్,
మహారౌరవ సంజ్ఞితాన్।
ప్రతిష్ఠా సూకరీ విష్ఠా
సమాగీతా మహర్షిభిః।
ఏ సన్న్యాసాశ్రమవాసి అయితే కొయ్య దండమును మోచేతితో అరచేతితో ధరించి, (కానీ) ప్రాపంచికమైన ఆశ-ఆవేశములు వదలక, ఆత్మ జ్ఞానమును విడచి ఉంటాడో అట్టివాటు రౌరవము మొదలైన సంజ్ఞలతో చెప్పబడే ఘోరమైన నరకముల ప్రవేశమును ఆహ్వానించిన వాడు అగుచున్నాడు. ‘‘నాయనలారా! సన్యాస వేషము ధరించి సంసారము విడవకపోవటము, పంది పెంటతో సమానమైన ప్రతిష్ఠా’’ అని మహర్షులు గానం చేస్తున్నారు. ఎలుగెత్తి హెచ్చరిస్తున్నారు.
తస్మాత్ ఏనాం పరిత్రజ్య
కీటవత్ పర్యటేత్ యతిః।

అయాచితం యథాలాభం
భోజన ఆచ్ఛాదనం భవేత్,
కనుక ఈ ప్రపంచ సంబంధమైన సమస్త ఆశలను, ఆపేక్షలను, సన్యాస సంబంధమైన వస్త్రము దండము మొదలైనవాటినన్నిటినీ బాహ్యమునందే త్యజించి శీతాకోకచిలకవలె ఈ ప్రపంచమునందు యతి అయి సంచరించును గాక.
అయాచితంగా (అడుగకుండానే) ఏ ఏ భోజన, అచ్ఛానము (వస్త్రము)లు లభించితే వాటితోనే సంతోషముగా కాలము గడుపును గాక.
పర ఇచ్ఛయా చ దిక్ వాసాః
స్నానం కుర్యాత్ పర ఇచ్ఛయా।

స్వప్నే అపి యో హి యుక్తః
స్యాత్ జాగ్రతి ఇవ విశేషతః।
ఈదృక్ చేష్టః స్మృతః శ్రేష్ఠో
వరిష్ఠో బ్రహ్మవాదినామ్।
ఇతరుల సానుకూల్యత, ఇష్టములను అనుసరించి వస్త్రములను మార్చటము, స్నానము చేయుటము మొదలైనవి నిర్వర్తించును గాక.

ఏ బ్రహ్మనిష్ఠుడైతే జాగ్రత్‌లో బ్రహ్మము గురించిన పూర్తి ధ్యాస కలిగి ఉన్నట్లే స్వప్న సమయములో కూడా బ్రహ్మమునే మననముగా కలిగి ఉండటం జరుగుతూ ఉంటే, అట్టివాడు ‘‘బ్రహ్మవాదులలో శ్రేష్ఠుడు’’ అని చెప్పబడుచున్నాడు.
అలాభే న విషాదీ స్యాత్।
లాభే చ ఏవ న హర్షయేత్।

ప్రాణయాత్రిక మాత్రః స్యాత్,
మాత్రా సంగాత్ వినిర్గతః।

అభి పూజిత లాభాంశ్చ
జుగుప్స ఏత ఏవ సర్వశః।
అభిపూజిత లాభైస్తు,
యతిః ముక్తో అపి బధ్యతే।
యతి అయినవాడు లాభించనప్పుడు విషాదము పొందడు. లాభము పొందినప్పుడు సంతోషము పొందడు. ఉభయ సందర్భములలోను సమత్వము కోల్పోడు.

ప్రాణము ధరించి ఉండటానికి (శబ్ద / స్పర్శ / రూప / రస / గంధములు అనబడే) పంచ తన్మాత్రములతో సంబంధము కలిగి ఉన్నవాడై, అంతకు మించి సంబంధము లేనివాడై ఉంటాడు.

ఇతరులు తనను పూజిస్తూ, స్తుతిస్తూ (అభిమానము) ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు గొప్పవాడుగా చెప్పుచున్నప్పుడు ఎటువంటి అయిష్టము, ప్రీతి కలిగి ఉండకుండను గాక. పూజించబడుటము లాభముగా భావించు యతి ముక్తుడై కూడా తిరిగి బద్ధుడు కాగలడు.
11. ప్రాణయాత్రా నిమిత్తం చేత్
వ్యంగారే భుక్తవత్ జనే।
కాలే ప్రశస్త వర్ణానాం
భిక్షార్థాం పర్యటేత్ గృహాన్।
ఆహారము పట్ల రుచులు, ఇష్టాయిష్టములు పెత్తనం చెలాయించరాదు. ప్రాణము నిలుపుటకై మాత్రమే భిక్షాటనం చేయాలి. సరి అయిన సమయమును అనుసరించి శుభగుణములు, సాత్విక భావములు గల ఇళ్ళ వద్ద మాత్రమే భిక్ష కొరకై ఆశ్రయించెదరు గాక.
పాణి పాత్రః చరన్ యోగీ
న అసకృత్ భైక్షం ఆచరేత్।
తిష్ఠన్ భుంజ్యాత్, చరన్ భుంజ్యాత్,
మధ్యే న ఆచమనం తథా।
అబ్ధి ఇవ ధృత మర్యాదా భవంతి విశదాశయాః।
నియతిం న విముంచంతి
మహాంతః భాస్కరా ఇవ।
పాణి పాత్ర భిక్ష (లేక) కరతల భిక్ష (చేతికి పట్టినంత ఆహారము భిక్ష) స్వీకరించాలి. ఒకే ఇంటికి అనేకసార్లుగా వెళ్లరాదు.
నిలుచున్నప్పుడు గాని, నడుస్తున్నప్పుడు గాని భిక్ష లభిస్తే అప్పటికప్పుడే భుజించాలి. మధ్య మధ్యలో ఆచమనము చేయరాదు.
సముద్రము వలె విశాలమైన ఆశయముతో అందరి పట్ల మర్యాదతో కూడిన ప్రవర్తన కలిగి ఉండు గాక.
ఆకాశములో సూర్యునివలె నియతి (సాంఘిక నియములు, విధులు) దాటకుండా యతి ఉండవలెను.
ఆసి ఏనతు యదా ఆహారం
గోవన్ మృగయతే మునిః,
తదా సమః స్యాత్ సర్వేషు
సో అమృతత్వాయ కల్పతే।

అనింద్యం వై వ్రజన్ గేహం
నింద్యం గేహంతు వర్జయేత్।
గోవు ముఖముతో ఆహారము ఎక్కడ దొరికితే అక్కడే తిని తృప్తి పడుచూ ఉండునట్లు ఆనందముగా, సర్వత్రా సమభావనతో ఈ భూమిపై చరించును గాక. అట్టివాడు క్రమంగా మృత్యు పరిధులను దాటిపోయి, తన అమృత స్వరూపమును ఆస్వాదించగలడు.

యతి అనింద్యము అయిన (సాత్విక భావములు, భక్తి, శాస్త్ర మర్యాదగల) ఇళ్లను భిక్షకై అడగాలి. గృహ యజమానులు ఎవరైనా ప్రార్థన చేస్తే ప్రార్థనను తిరస్కరించక వెళ్లెదరు గాక. నింద్యమైన (దుష్టగుణములు, ఆశయములుగల) ఇళ్ల వద్ద భిక్షకై వెళ్లరాదు.
అనావృతే విశేత్ ద్వారి
గేహేన ఏవ ఆవృతే వ్రజేత్।

పాంసునా చ ప్రతిచ్ఛన్నః శూన్యాగార ప్రతిశ్రయః,
వృక్షమూల నికేతో వా త్యక్త సర్వ ప్రియ అప్రియః।
ద్వారము (తలుపులు) తెరిచి ఉన్న ఇళ్ల వద్దనే భిక్ష కోరాలి. తలుపులు మూసికొని యున్న ఇళ్ల వద్ద భిక్షకై అడగరాదు.
చెరువు ఒడ్డులందు, శిథిల గృహములను, వృక్షముల మొదలు స్థానములను ‘ఇల్లు’గా భావించి విశ్రమించాలి. ‘ఇది ఇష్టము - అది కాదు’ మొదలైన ఇష్టాయిష్ట, ప్రియాప్రియ భావ అభిప్రాయములు జయించి ఉండాలి.
యత్ర అస్తమిత శాయీ స్యాత్
నిరగ్నిః అనికేతనః।

యథా లబ్ధ ఉపజీవీ స్యాత్
మునిః దాంతో జితేంద్రియః।
యతి అయిన వారు తాను సూర్యుడు అస్తమించినప్పుడు ఏ ప్రదేశములో ఉంటే అక్కడే ఆ రాత్రి ఉంటూ ఉండును గాక. సన్యాసులకు అగ్నికార్యము, ఒకచోటనే స్థిరనివాసము ఉచితం కాదు.
దాంతుడై (ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, ధైర్యము, సహనము కలవాడై), ఇంద్రియములను (విషయములను) జయించినవాడై, ప్రాపంచక సంగతి సందర్భములపట్ల మౌనము వహించిన ముని అయి, లభించిన దానితోనే తృప్తి చెందుచూ జీవించును గాక.
12. నిష్క్రమ్య వనం ఆస్థాయ
జ్ఞానయజ్ఞో జితేంద్రియః
కాలకాంక్షీ చరన్ ఏవ
బ్రహ్మభూయాయ కల్పతే।।

అభయం సర్వ భూతేభ్యో
దత్వా చరతి యో మునిః,
న తస్య సర్వ భూతేభ్యో
భయం ఉత్పద్యతే క్వచిత్।
సన్యాసి (లేక) యతి వనము చేరి ఏకాంతంగా ఆత్మ జ్ఞానయజ్ఞము అనుక్షణికంగా నిర్వర్తిస్తూ, ఇంద్రియములను జయించుచూ కాలానుగతంగా నిర్వర్తించవలసినది నిర్వర్తిస్తూ ఉండగా క్రమంగా పరబ్రహ్మమును సిద్ధించుకోగలడు.

‘‘ఈ సమస్తము మమ ఆత్మ స్వరూపమే’’ అను స్వస్వరూపాత్మ తత్త్వము స్వాభావిక రూపంగా సిద్ధించుకొని సమస్త అనేకత్వములపట్ల మౌనము సంపాదించుకొన్న యతికి ఇక ఎవ్వరివలన ఎట్టి భయము జనించదు. (స్వప్న ద్రష్ట - స్వప్నము వలె) - సమస్తము ఆత్మగా తానే అయి ఉండగా ఇక భయము ఎందుకు శేషిస్తుంది ? అతడు అభయుడు అగుచున్నాడు.
నిర్-మానః చ అనహంకారో
నిర్ద్వంద్వః ఛిన్న సంశయః।
నైవ కృధ్యతి, న ద్వేష్టి,
న అనృతం భాషతే గిరా।
మాన - అవమానములను రహితం చేసుకొని ద్వంద్వ దృష్టిని జయించి, ఆత్మతత్త్వము గురించిన అధ్యయనముచే స్వస్వరూపమగు అఖండాత్మ గురించి సంశయములన్నీ తొలగించుకొన్నవాడు - ఇక ఆపై ఎవ్వరిపైనా కోపము కలిగి ఉండడు. ఏ ఒక్కరి పట్ల ద్వేషము కలిగి ఉండడు. మొదలే అసత్యము, కల్పితమాత్రము అయినట్టి దాని గురించి అసలు మాటలకే ఉపక్రమించడు (మాట్లాడనే మాట్లాడడు).
పుణ్య ఆయతనచారీ చ భూతానాం అవిహింసకః।
కాలే ప్రాప్తే భవేత్ భైక్షం కల్ప్యతే బ్రహ్మభూయసే।
జీవులందరి పట్ల స్వాభావికమైన ఆప్యాయత కలిగి ఉంటాడు. పుణ్యకార్యములందు అభిరుచిపరుడై ఉంటాడు. ఎవ్వరికీ ఎట్టి బాధ కలిగించకూడని ‘ఆశయము’ కలిగి ఉంటాడు. కాల చమత్కారమును యథాతథంగా అంగీకరిస్తూ ఉంటాడు. భిక్షవృత్తిచే లభించినది తృప్తిగా తింటూ సంతోషముగా కాలము గడుపువాడు బ్రహ్మము పొందగలడు.
వానప్రస్థ-గృహస్థాభ్యాం న సంసృజేత్ కర్షిచిత్

అజ్ఞాతచర్యాం లిప్సేత, న చ ఏనం హర్ష ఆవిశేత్।

అధ్వా సూర్యేణ నిర్దిష్టః కీటవత్ విచరేత్ మహీమ్।
వానప్రస్థ గృహస్థులతో కలిసి తిరగరాదు.
ఏవో రహస్యమైన పనులు చేస్తూ ఉండటం వాటి పట్ల లిప్స (ఇచ్ఛ) కలిగి ఉండటం మంచిది కాదు. ఇతరులకు భయమో, ఆశ్చర్యమో కలిగించే పెద్దగా నవ్వులు ఉచితంకాదు.
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడే (పగలు కాలంలో మాత్రమే) ఒక కీటకమువలె దేనితోను ఏ బంధము లేకుండా సంచరిస్తూ ఉండును గాక.
ఆశీః యుక్తాని కర్మాణి
హింస అయుక్తాని యాని చ।

లోక సంగ్రహయుక్తాని
నైవ (న ఏవ) కుర్యాత్, న కారయేత్।
యతి అయిన వాడు (సన్యాసి) ప్రాపంచక ఆశలు సిద్ధించే కర్మవ్యవహారములందు గాని, సహజీవులను (జంతువులను గాని, మనుష్యులను కాని) హింసించే కార్యముల యందు గాని,
లోకంలో ఏవేవో లౌకిక ప్రయోజనముల దృష్టితో -
- ఏ కర్మలు చేయరాదు.
- అట్టి ఏ కర్మలకు (సలహాల ద్వారా) కారణం కారాదు.
13. న అసత్ శాస్త్రేషు సజ్జేత
న ఉపజీవేత జీవికామ్।

అతివాదాన్ త్యజేత్ తర్కాన్
పక్షం కంచన న ఆశ్రయేత్।।

న శిష్యాన్ అనుబధ్నీత,
గ్రంథాన్ న ఏవ అభ్యసేత్ బహూన్।
న వ్యాఖ్యాం ఉపయుంజీత
న ఆరంభా న ఆరభేత్ క్వచిత్।
ధర్మమునకు విరుద్ధంగాను ప్రాపంచిక విషయాలను ప్రోత్సహించేవి అగు శాస్త్రములలో రక్తి కలిగి ఉండకూడదు. జీవనోపాధి కొరకై ఆదాయము కొరకై వ్యవహారములు సలుపరాదు.

వాదోపవాదముల గురించిన తర్క - వితర్కము, ఒక పక్షమున ఉండి, మరొక పక్షమును విధానమును తప్పుగా నిరూపించ యత్నించటము ఇటువంటివి కూడదు.

శిష్యగణమును పెద్ద పెద్దగా సమీకరించి జేర్చుకోకూడదు. అనేక గ్రంథాలు పెద్ద సంఖ్యలో అభ్యసించటము కూడా కూడదు. దాని వలన బుద్ధి వ్యాపకమును కొనసాగిస్తూనే ఉంటుంది. వ్యాఖ్యానమునందే మునిగి తేలుతూ ఉండరాదు. అధిక కార్యకలాపములు, అనేక విషయములలో వ్యవహారశీలమును యతి ధర్మమునకు శ్రేయము కాదు.
అవ్యక్త లింగో। అవ్యక్త అర్థో - మునిః।
మునీశ్వరుల లక్షణములు :
- తన యొక్క గణ విశేషములను ఇతరుల గుర్తింపుకై ప్రదర్శించక రహస్యముగా అవ్యక్తంగా ఉంటూ ఉంటారు.
- ఉత్తమార్థములగు శాస్త్ర విశేషములను రహస్యముగా అవ్యక్తముగా తనయందు కలిగి ఉంటూ, వ్యతిరేకార్థములు గలవారితో వాదించని వారై ఉండరు.
ఉన్మత్త బాలవత్ కవిః మూకవత్,

ఆత్మానం తత్ దృష్ట్వా దర్శయేత్
- కవి అయి (సమస్తము ఎరిగి కూడా) పిచ్చివానివలె, అమాయక బాలునివలె, మూగవానివలె ఈ దృశ్య జగత్తులో సంచరించువారు.
- ఆత్మగా సమస్తము దర్శిస్తూ, ఇతరులకు ఆత్మ దృష్టి గుర్తు చేస్తూ ఉంటారు.
నృణామ్ న కుర్యాత్, న వదేత్ కించిత్,
న ధ్యాయేత్ సాధు అసాధు వా,
ఆత్మారామో అనయావృత్త్యా
విచరేత్ జడవత్ మునిః।
ప్రాపంచక వ్యవహారములను నిర్వర్తించక వాటి గురించి మాట్లాడక, ధ్యాస కలిగి ఉండక, సాధు - అసాధు భేదము లేనివారై ఉంటారు. సర్వ విషయముల పట్ల వృత్తులను జయించి, వృత్తులన్నీ ఆత్మారామునిపై నిలిపి, జగత్తులో మాత్రం జడుని వలె సంచరించువారై ఉంటారు.
ఏకః చరేత్ మహీం ఏతాం,
నిస్సంగః సంయతేంద్రియః,
ఆత్మరతిః ఆత్మక్రీడః
ఆత్మవాన్ సమదర్శనః।।
తనయందు తానే వివశాత్మకుడై ప్రకాశిస్తూ, ఒంటరిగా, దేనితోను ఏ మాత్రమే సంగము లేనివారై, ఇంద్రియములను జయించి తను ఉపకరణములుగా చేసికొని ఆ మునివర్యులు భూమిపై విహరిస్తూ ఉంటారు. ఆత్మయందు ఆత్మ అయి క్రీడిస్తూ, ఆత్మవంతుడు, సర్వత్రా సమదర్శి అయి వినోదిస్తూ ఉంటారు
14. బుధో బాలకవత్ క్రీడః
కుశలో జడవత్ చరేత్।।
ఉత్తమోత్తమమగు ఆత్మ బుద్ధి సిద్ధించుకొని కూడా ఆటలు ఆడుకొనే బాలునివలెను, సమస్తము ఎరిగి కుశలుడు (Expert) అయి ఉండి కూడా జడునివలెను చరిస్తూ ఉంటారు
వదేత్ ఉన్మత్తవత్ విద్వాన్।
గోచర్యాం నైగమః చరేత్।
విద్వాంసుడు బ్రహ్మజ్ఞాని అయి ఉండి కూడా ఏమీ తెలియని ఉన్మత్తునివలె కనబడుతారు. వేదాంతవేత్త అయి ఉండికూడా గోవు వలె లభించిన భిక్షని లభించిన చోటనే స్వీకరించువారై ఉంటారు.
క్షిప్తో అవమానితో అసద్భిః
ప్రబుద్ధో అసూయితోపి వా,
తాడితః సన్నిరుద్ధోవా
వృత్త్యావా పరితాపితః।
త్రోయబడినప్పటికీ (క్షిప్తో), అవమానించబడినప్పటికీ, అసభ్య ప్రవర్తన ప్రాప్తించినప్పటికీ, ఈర్ష్య-అసూయలు పొందవలసి వచ్చినప్పటికీ, కొట్టబడినప్పటికీ, వారి వృత్తి అడ్డగించబడినప్పటికీ, పరితాపములు పొందినప్పటికీ - అవన్నీ యతి (సన్యాసి) క్షమాగుణము కలిగి ఉంటారు. సహనము (తితిక్ష) ఏ మాత్రము కోల్పోరు
విష్ఠితో మూత్రితో వా
అజ్ఞైః బహుధా ఏవం ప్రకంపితః,
శ్రేయః కామః కృచ్ఛ్రగత
ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్।
ఉమ్మి వేయబడినప్పటికీ, మూత్రము చల్లబడినప్పటికీ, ఆత్మతత్త్వమునకు ప్రయత్నశీలురుగాని ఆయా అజ్ఞానులు అనేకములైన ప్రకంపనములు (Shakings) కలిగించినప్పటికీ కూడా శ్రేయస్సును కోరు యోగి అవన్నీ సహిస్తూ తితిక్ష - అనే యోగానికి అభ్యాసముగా భావిస్తారు. ఈ జరిగేదంతా నా మేలు కొరకే, యోగాభ్యాసము కొరకే అని తలచి, తనను తాను ఉద్ధరించుకొను ప్రయత్నమునందు మాత్రమే బుద్ధిని నిలపుకొని ఉంటారు.
సమ్మాననం పరాంహానిం యోగర్థేః
కురుతే యతః, జనేన అవమతో యోగీ,
యోగసిద్ధిం చ విందతి।
‘‘ఇతరులచే సన్మానములు, దానములు, గౌరవములు, స్తుతులు - ఇవన్నీ నా యొక్క పదమునకు హానికరము అవగలవు’’ అని భావించి, అట్టి వాటిని ఇవ్వజూపు జనులకు దూరంగా ఉంచు ప్రయత్నముగల యోగి యోగసిద్ధిచే ఆత్మానందుడై వెలయగలడు.
తథా చరేత వై,
యోగీ సతాం వర్త్మన దూషయన్
జనా యథా అవమన్యేః
అంగచ్ఛేయుః నైవ సంగతిమ్।
జనులు దూషించవచ్చుగాక. వారు ఈ అంగములనే (అవయవములను) ఖండించవచ్చుగాక. అవమానించవచ్చుగాక, యోగి వాటిని అసంగతులుగాను (అవిషయముగాను) ఆత్మ ఒక్కటే సంగతిగాను కలిగి ఉండగలరు.
జరాయుజ, అండజ-ఆదీనాం
వాఙ్మనః కాయ కర్మభిః,
యుక్తం కుర్వీత న ద్రోహం।
సర్వ సంగాన్ చ వర్జయేత్।

మానవులు, జంతువులు తదితరములు మొ।।వాటికి వాక్కుచేతగాని, శరీరము చేత గాని, కర్మకృతంగా గాని ఎట్టి ద్రోహము తలబెట్టరు. సమస్త సంగములు (All attachments / relations) వదలివేసి ఉంటారు.

కామ క్రోధౌ తథా దర్ప లోభ మోహ ఆదయః చ యే,
తాంస్తు దోషాన్ పరిత్యజ్య పరివ్రాట్ భయవర్జితః।।
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషట్ (ఆరు శత్రు) వర్గమును (Group) దోషములుగా గమనించి వాటిని పరిత్యజించి పరివ్రాట్ అయి సమస్త భయములు జయించివేయాలి.
15. భైక్ష అశనం చ, మౌనత్వం,
తపో, ధ్యానం విశేషతః
సమ్యక్ జ్ఞానం చ వైరాగ్యం
ధర్మోయం భిక్షుకే మతః।
భిక్షక సన్యాసికి లోక సంబంధమైన మత, కుల జాతి భేదములేవీ ఉండవు.
1) భిక్షాన్నమును భుజించటము
2) మౌనము వహించి ఉండటము
3) ‘‘పరతత్త్వము కొరకై తపన’’ రూపమగు తపస్సు
4) ‘‘పరమాత్మ పట్ల ధ్యాస’’ అను రూపముగల ధ్యానము
5) ‘‘సర్వత్రా సమ దర్శనము’’ అనే సమ్యక్ జ్ఞానము
6) ప్రాపంచకమైన సమస్త విశేషముల పట్ల విరాగము.
ఈ ఈ అభ్యాసములే, భిక్షక ధర్మ మతము, భిక్షక స్వాభావికములు.
కాషాయవాసాః సతతం
ధ్యానయోగ పరాయణః
గ్రామ అంతే వృక్షమూలే వా
వసేత్ దేవాలయే అపి వా।
భైక్షేణ వర్తయేత్ నిత్యం
నైకాన్నాశీ (న ఏక అన్నాశీ) భవేత్ క్వచిత్
వైరాగ్యమునకు ‘సంజ్ఞ’గా ఎల్లప్పుడు కాషాయ వస్త్రధారణము, ధ్యాన యోగ పరాయణుడై ఉండటము (Constant Avocation on the all pervading one’s own self) గ్రామమునకు చివర వృక్షముల మొదట్లో నివాసము (లేక) దేవాలయ ప్రాంగణంలో నివాసము, భిక్షాటన జీవనము - ఇవియే యతి వర్తనములు. యతి ఎక్కడున్నా కూడా ఆ పరిసరములను మహద్భాగ్యంగా భావిస్తాడు.
ఏ పరిస్థితులలో కూడా ఒకే ఇంట్లో (ఆహారము, అన్నము) స్వీకరించువాడై ఉండకూడదు.
చిత్తశుద్ధిః భవేత్ యావత్
తావత్ నిత్యం చరేత్ సుధీః।
తతః ప్రవ్యజ్య శుద్ధ ఆత్మా,
సంచరేత్ యత్ర కుత్ర చిత్।
ఎప్పటివరకు జగత్‌దృష్టి, జగదాకర్షణ భావములు పూర్తిగా రూపుదిద్దుకుంటుందో, అప్పటి వరకు సంచారమును బుద్ధిమంతుడైన యోగి కొనసాగిస్తూనే ఉంటాడు. చిత్తశుద్ధి సిద్ధించుకొన్న తరువాత ఇక ఆ పరివ్రాజకుడు ఎక్కడైనా తనకు ఇష్టమైన రీతిగా ఉండనూ వచ్చు. సంచరించనూ వచ్చు.
బహిః - అంతః చ సర్వత్ర సంపశ్యన్
హి జనార్దనమ్, సర్వత్ర విచరేత్ మౌనీ
వాయువత్ వీత కల్మషః।।
ఏ విధంగా వాయువు తనయందు ఎట్టి వాసనలు లేకుండా నిర్మలంగా భూమిపై సంచారము కలిగి ఉంటుందో, ఆ విధంగా ఆ మునీశ్వరుడు జనార్దనుని (సమస్తము తన స్వరూపమే అయి ఉన్న పరమాత్మను) బాహ్య - అభ్యంతరములలో దోషరహితునిగా సందర్శించును గాక. నిర్మల బుద్ధితో ఆత్మ యొక్క సర్వేశ్వరత్వమును ఉపాసించును గాక.
సమ దుఃఖ - సుఖః క్షాంతః
హస్త ప్రాప్తం చ భక్షయన్,

నిర్వైరేణ సమం పశ్యన్
ద్విజ గో అశ్వ మృగ ఆదిషుః

భావయన్ మనసా విష్ణుం
పరమాత్మానం ఈశ్వరమ్।
చిత్ మయం పరమానందం
‘‘బ్రహ్మ ఏవ అహం’’ ఇతి స్మరన్।।

జ్ఞాత్వా ఏవం, మనోదండం ధృత్వా,
నిత్యముక్తుడు

❇︎ సుఖ - దుఃఖ సంగతి సందర్భములలో సమత్వము వీడడు.
❇︎ అరచేతికి పట్టినంత మాత్రమే భిక్ష స్వీకరించుచుండువాడు.

❇︎ ద్విజుల (వేదవిద్యా పరుల) పట్ల, ఆవు - గుఱ్ఱము మొదలైన సమస్త జీవరాసుల పట్ల సమస్త వైర భావములు వీడి సమస్వరూపమగు ఆత్మగానే దర్శించువాడు.

❇︎ మనస్సుతో ‘‘సర్వాంతర్యామి, పరమాత్మ, ఈశ్వరుడు అగు విష్ణు భగవానుడే ఇదంతా అయి ఉన్నారు’’ - అను భావనను ఆశ్రయించి ఉండువాడు.
❇︎ ఏ చిన్మయ - పరమానంద పరబ్రహ్మమే ఇదంతా అయి ఉన్నదో, అట్టి పరతత్త్వమే నేను. నేను బ్రహ్మమే అయి ఉన్నాను అను అనుస్మరణము ఆశ్రయించి ఉండువాడు.

❇︎ ఆత్మతత్త్వమును బుద్ధితో ఎరుగుచున్నవాడై,
❇︎ మనస్సును దండముగా (దుడ్డు కర్ర నిర్మితమై సన్యాసుల చేత ఉపకరణముగా) ధరించి,
ఆశా నివృత్తో భూత్వా, ఆశాంబర ధరో భూత్వా,

సర్వదా మనో వాక్ కాయ కర్మభిః,
సర్వసగ్ంసారం ఉత్ సృజ్య,

ప్రపంచ అవాఙ్ముఖః (అవాఙ్ ముఖః)

స్వరూప అనుసంధానేన భ్రమర కీటక
న్యాయేన ముక్తః భవతి।
❇︎ సమస్త ఆశలను హృదయము నుండి తొలగించి వేసుకొని, నివృత్తుడై దిక్కులనే (ఆశనే) వస్త్రముగా ధరించినవాడై

❇︎ మనో - వాక్ - కాయ కర్మల పూర్వకంగా సంసార సమస్తమును వదలివేసి ప్రపంచము నుండి ఉపసంహారము (withdrawal) పొందినవాడై.

❇︎ తన యొక్క ‘అఖండ - అమృత - ఆనంద’’ ఆత్మ స్వరూపముతో సర్వాత్మకంగా అనుసంధానము పొందినవాడై ఉంటున్నాడు.

❇︎ ‘భ్రమర - కీటక న్యాయం’గా తానే సర్వాత్మకుడై, యతి ముక్తిని పొందుచున్నాడు.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘పంచమ ఉపదేశః’’


షష్ఠోపదేశః (6వ ఉపదేశము)

1. అథ నారదః పితామహం ఉవాచ
భగవన్! తత్ అభ్యాసవశాత్ భ్రమర కీట
న్యాయవత్ తత్ అభ్యాసః కథం ఇతి?
అప్పుడు నారద మహర్షి బ్రహ్మ దేవుల వారితో ఇట్లు పలికారు.
నారదమహర్షి : హే భవగాన్, మీరు చెప్పిన మార్గంలో ‘‘భ్రమర - కీటక న్యాయము’’గా యతి యోగాభ్యాసి అయి ఆత్మ స్వరూపము స్వానుభవమై సంతరించుకోవటానికై అభ్యాసముల గురించి ఇంకా కూడా వివరించి చెప్పండి.
తం ఆహ, పితామహః -
సత్యవాక్ జ్ఞాన వైరాగ్యాభ్యాం
విశిష్ట దేహ అవశిష్టో వసేత్।
పితామహుడు (బ్రహ్మ భగవానుడు) : నాయనా ! నారదా ! ప్రియ శ్రోతలారా ! మరికొంతగా మరికొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి.
- సత్య వాక్కును పరిపాలించువాడై,
- జ్ఞాన - వైరాగ్యములతో కూడిన సూక్ష్మ దేహి అయి, ఆత్మగా శేషించువాడై ఉండును గాక.
జ్ఞానం శరీరం వైరాగ్యం జీవనం విద్ధి।
శాంతి దాంతీ నేత్రే।
మనః ముఖం। బుద్ధిః కళ।
పంచవింశతి తత్త్వాని అవయానాని।
అవస్థా పంచమహాభూతాని,
జ్ఞానమే శరీరము, సమస్త రాగములను జయించిన వైరాగ్యమే జీవన విధానము.
శాంతము, (ఇంద్రియ నిగ్రహ రూపమగు) దాంతమే రెండు కళ్లు అగును గాక. మనస్సే ముఖము, బుద్ధియే (ప్రజ్ఞయే) కళ.
25 తత్త్వములు (పంచ కర్మేంద్రియ, పంచ జ్ఞానేంద్రియ, పంచప్రాణ, పంచ ఉపప్రాణ, పంచ తన్మాత్రలు - శబ్ద స్పర్శ రూప రస గంధములు) - ఆతనికి అవయవములు. పంచమహాభూతములు యతికి అవస్థలు.
కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాని శాఖా।
జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ అవస్థాః
చతుః దశ (14) కరణాని।
కర్మ-భక్తి-జ్ఞాన-వైరాగ్యములు యతికి శిరస్సు (శిరో ఉపరిభాగము).
జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములు, 14 కరణములు - జ్ఞానేంద్రియములు (5), కర్మేంద్రియములు (5), అంతరంగ చతుష్టయములు (4) (మనో-బుద్ధి-చిత్త-అహంకారములు) - అతనిని ఆశ్రయించిన స్వకీయ తత్త్వములు.
పంక స్తంభా కారాణి ఇతి
ఏవమపి, నావమపి పంకం ‘కర్ణధార’ ఇవ,
‘యంత’ ఇవ గజం, స్వబుద్ధ్యా స్వవశీ కృత్యాత్।
బురదలో ఇరుక్కొన్న నావ వలె ఈ జీవుని బుద్ధి పైన చెప్పిన 14 కరణ వ్యవహారములలో చిక్కుకొని ఉంటుంది. బురదలో ఇరుక్కొన్న నావను కర్ణధారుడు (నావికుడు నావను నడిపేవాడు) ఎంతో తెలివి, ఉపాయము, సామర్థ్యము, ప్రయత్నములతో బురద నుండి ఈవలకు తెస్తాడు కదా!
మావటి వాడు (యంత) ఎంతో నైపుణ్యముతో ఏనుగును వశం చేసుకొని ఉంటాడు కదా!
మద్వ్యతిరిక్తం, సర్వం కృతకం నశ్వరం - ఇతి
మత్వా విరక్తః పురుషః సర్వదా
బ్రహ్మ అహం ఇతి వ్యాహరేత్।


న అన్యత్ కించిత్ వేదితవ్యం
స వ్యతిరేకేణ, జీవన్ముక్తో వసేత్।
కృతకృత్యో భవతి।

న ‘‘నాహం బ్రహ్మేతి’’ - వ్యవహరేత్।
కింతు ‘‘బ్రహ్మాహమస్మి’’ ఇతి
అజస్రం జాగ్రత్, స్వప్న, సుషుప్తిషు
తుర్యావస్థాం ప్రాప్య తుర్యాతీతత్వం వ్రజేత్।
ఆ విధంగా ముముక్షువు ఇంద్రియములను, మనో బుద్ధి చిత్త, అహంకారములను స్వవశం చేసుకోవాలి. వాటికి, అవి వ్రాలుచున్న విషయములకు తాను వశుడు కాగూడదు.
‘‘అస్మత్ స్వస్వరూపమునకు వేరై కనిపించేదంతా కూడా నశించిపోయేదే’’ - అని ఎరిగిన వాడై ఉండాలి. సమస్త దృశ్య వ్యవహారముల పట్ల, అనురక్తిని జయించి, విరక్తి కలవాడై ఉండాలి. ‘‘నేను సర్వదా బ్రహ్మమునే, బ్రహ్మ2హమ్, సో2హమ్’’ అను పరమ సత్యమును ఆశ్రయించినవాడై ఉండాలి.

తదితరమైనదేదీ కించిత్ కూడా ఎరుక యందు కలిగి ఉండక కేవలమగు ఎరుక (The absolute knowing) ను ఆశ్రయించి, జీవన్ముక్తుడై ఈ జగత్తునందు వసించును గాక. అట్టివాడు పొందవలసినది పొందినవాడు అగుచున్నాడు.

‘‘బ్రహ్మమును నేను ఇప్పటికి కాదు. ఎప్పటికో సిద్ధించుకోవలసి ఉన్నది’’ అను రూపముగా భావించరాదు. ఆ విధంగా వ్యవహరించరాదు.
జాగ్రత్ స్వప్న సుషుప్తులయందు తురీయ స్వరూప పురుషుడను నేనే, తురీయ పురుషునికి (జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా కల్పన అయిన నేనుకు) ఆవలివాడను. తురీయాతీతుడను అను అభ్యాసముచే తురీయాతీతుడు అగును గాక. అభ్యాసముచే ఇదంతా సుసాధ్యమే.
2. దివాం జాగ్రత్। నక్తం స్వప్నం।
సుషుప్తం అర్ధరాత్రం గతం - ఇతి।


ఏక అవస్థాయాం చతస్రో అవస్థాసు ఏకైక
కరణ ఆధీనానాం చతుర్దశ (14) కరణానాం వ్యాపారాః।
పగలంతా జాగ్రత్‌లో గడిచిపోతోంది. రాత్రి ఈ జీవుడు స్వప్నములో ప్రవేశిస్తున్నాడు. అర్ధరాత్రి సుషుప్తి (గాఢనిద్ర) అనే మూడవ అవస్థ పొందుచున్నాడు. నాల్గవది జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అయినట్టి తురీయడు.

4 అవస్థలలోని ప్రతి ఒక్క అవస్థలో మిగిలిన మూడు అవస్థలు ఉండియే ఉన్నాయి.
14 కరణములలో ఒక్కొక్క కరణమునకు ఒకొక్క ఇంద్రియ వ్యాపారము కలదు.
చక్షురాదీనాం చక్షుషో రూపగ్రహణం।
శ్రోత్రయోః శబ్ద గ్రహణం।
జిహ్వాయా రసాస్వాదనం।
ఘ్రాణస్య గంధ గ్రహణం।
వచసో వాక్ వ్యాపారః।
పాణేః ఆదానం।
పాదయోః సంచారః।
పాయోః ఉత్సర్గ।
ఉపస్థస్య ఆనంద గ్రహణం।
త్వచః స్పర్శ గ్రహణం।
1. కళ్లకు చూపు. ఆ చూపుతో రూపములు చూడబడుచున్నాయి.
2. చెవులు వినికిడిచే శబ్దములు వినటానికి ఉపకరణములు.
3. నాలుక రుచి చూడటము నిర్వర్తిస్తోంది.
4. ముక్కుచే వాసన గ్రహించబడుతోంది.
5. నోరు ‘మాట్లాడటము’ అనే వ్యాపారము నిర్వర్తిస్తోంది.
6. చేతులు వస్తువులను పట్టుకొను ప్రవర్తన కలిగి ఉంటున్నాయి.
7. పాదములు సంచారము (Walking, Wandering) నిర్వర్తిస్తున్నాయి.
8. పాయువు ‘విజర్జించటము’ అనే ధర్మము కలిగి ఉంటోంది.
9. ఉపస్థ శృంగారానంద ధర్మము ప్రదర్శిస్తోంది.
10. చర్మము స్పర్శను గ్రహించటము నిర్వర్తిస్తోంది.
తత్ అధీనా చ విషయ గ్రహణా బుద్ధిః
బుద్ధ్యా బుధ్యతి।
చిత్తేన చేతయతి।
అహంకారేణ అహం కరోతి।
విసృజ్య జీవ ఏతాం దేహ
అభిమానేన జీవో భవతి।।

⌘    పై 10 ఇంద్రియములు బుద్ధికి ఆధీనమై, బుద్ధి సమస్తము అనుభవముగా పొందటానికి అవి ‘ఉపకరణములు’గా అగుచున్నాయి.
⌘    చిత్తము చింతన చేయు స్వభావము కలిగి ఉంటోంది.
⌘    అహంకారము ‘‘నేను-నాది, నా ప్రతిభతో చేస్తున్నాను’’ అనే ప్రదర్శనము కలిగి ఉంటోంది.
దశేంద్రియములకు, మనస్సు - బుద్ధి - చిత్త - అహంకారములకు (14 కరణములకు) వేరుగా ఈ జీవుడు విలక్షణుడై ఉన్నాడు. ఈ దేహము పట్ల అభిమానము (Identification) కలిగి ఉండటం చేత ‘జీవుడు’ అని (ఆత్మ పురుషుడే) పిలువబడుచున్నాడు.

3. గృహ అభిమానేన గృహస్థ
ఇవ శరీరే జీవః సంచరతి।
ఒకడు తన ఇంట్లో ఉండి ‘‘ఇది నా ఇల్లు’’ అను అభిమానము కలిగి ఉంటున్నాడు కదా. అట్లాగే ఈ శరీరము పట్ల ‘‘ఇది నాకు చెందిన శరీరము, నేను దీనికి చెందినవాడను’’ అను అభిమానముతో జీవుడు జీవజగత్తులో సంచారములు నిర్వర్తిస్తున్నాడు. తనను తాను దేహమునకు పరిమితము చేసుకుంటున్నాడు.
ప్రాక్ దళే పుణ్యవృత్తిః।
ఆగ్నేయ్యాం నిద్ర ఆలస్యే।
దక్షిణాయాం క్రౌర్య బుద్ధిః।
నైరుత్యాం పాప బుద్ధిః।
పశ్చిమే క్రీడా రతిః।
వాయవ్యాం గమనే బుద్ధిః।
ఉత్తరే శాంతిః।
ఈశాన్యే జ్ఞానం।
కర్ణికాయాం వైరాగ్యం।
కేసరేషు ఆత్మ చింతా। ఇతి

అష్ట-దిక్కులు
అష్టదళ హృదయ కమలము

ఈ జీవుడు ‘8’ దళములు గల (పుష్పపు రెక్కలు గల) హృదయము కలిగి ఉంటున్నాడు.

తూర్పు దళములో - పుణ్యవృత్తులు (మంచి పనులు చేయాలనిపించటము)

ఆగ్నేయ దళములో - నిద్ర, ఆలస్యము (బద్ధకము)

దక్షిణ దళములో - క్రూరమైన ఆలోచనలు

నైఋతి దళములో - పాపబుద్ధి

పశ్చిమ దళములో - క్రీడా రతి, క్రీడాభిలాష

వాయువ్య దళములో - ఎక్కడెక్కడో సంచారములు చేయాలనే యోచనలు

ఉత్తర దళములో - శాంతి, స్వస్థత

ఈశాన్య దళములో - జ్ఞానము (Logic)

పై విధంగా ఈ జీవుడు హృదయ పద్మము యొక్క ఏ దళములో ఉంటే ఆయా భావాలు కలుగుచున్నాయి. వాటివాటికి తాను బద్ధుడు అగుచున్నాడు.

తామరపువ్వు వంటి హృదయ పుష్ప కర్ణికలందు ఉన్నప్పుడు (రెక్కల చివరిగా ఉన్నప్పుడు) వైరాగ్యము, తామరపువ్వులోని కేసరము (పుష్పరాగము) నందు ఉన్నప్పుడు ఆత్మచింతన కలుగుచున్నాయి.
ఏవం వక్త్రం జ్ఞాత్వా।
జీవదవస్థా ప్రథమం ‘జాగ్రత్’।
ద్వితీయం ‘స్వప్నం’।
తృతీయం ‘సుషుప్తం’। చతుర్థం ‘తురీయం’।
చతుర్భిః విరహితం ‘తురీయ-అతీతం’।
ఇదంతా జీవుని ముఖము - ఇవి కలిగిన జీవుని అవస్థల యొక్క మొదటిది జాగ్రత్, రెండవది స్వప్నము (కల). మూడవది సుషుప్తము (గాఢ నిద్రావస్థ), నాలుగవది తురీయము. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు తన యొక్క పురుషకారముగా కలవాడు తురీయుడు. అటుతరువాత ఈ జీవుని రూపము ‘‘తురీయాతీతము’’ అని అనబడుతోంది.
విశ్వ తైజస ప్రాజ్ఞ తటస్థ భేదైః
ఏక ఏన। ఏకో దేవః సాక్షీ నిర్గుణః చ।
అట్టి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయపురుషులు (పురుషకారములు) - ‘‘విశ్వుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు, తటస్థుడు’’ గా చెప్పబడుచున్నప్పటికీ ఆ నాలుగు తనవైన ఆత్మ ఏకమే (ఒక్కటే), ఈ జీవుని ఏకస్వరూపమే సర్వసాక్షీ - నిర్గుణ స్వరూపము.
‘‘తత్ బ్రహ్మ అహమ్’’ ఇతి వ్యాహరేత్
నో చేత్ జాగ్రత్ అవస్థాయాం
‘జాగ్రత్’ - ఆది చతస్రో అవస్థాః।
స్వప్నే స్వప్నాది చతస్త్రో అవస్థాః।
సుషుప్తేః సుషుప్త్యాది చతస్రో అవస్థాః।
తురీయే తురీయాది చతస్రో అవస్థాః।
‘‘ఆ బ్రహ్మమే నేను. నా యొక్క కేవల - సహజ స్వరూపము బ్రహ్మమే’’ - అను నిశ్చయముతో ఈ దృశ్య జగత్తులో వ్యవహరించెదరు గాక. లేదా ఈ విధంగా గమనించెదరు గాక.
జాగ్రత్‌లో స్వప్నములో సుషుప్తిలో తురీయము
జాగ్రత్, జాగ్రత్ స్వప్న జాగ్రత్ సుషుప్తి జాగ్రత్ తురీయ జాగ్రత్
జాగ్రత్ - స్వప్నము స్వప్న స్వప్నము సుషుప్తి స్వప్నము తురీయ స్వప్నము
జాగ్రత్ - సుషుప్తి స్వప్న సుషుప్తి సుషుప్తి - సుషుప్తి తురీయ - సుషుప్తి
జాగ్రత్ - తురీయము స్వప్న తురీయము సుషుప్తి - తురీయము తురీయ-తురీయము
ఈ విధంగా ప్రతి అవస్థలోను నాలుగు అంతర్గత అవస్థలు ఏర్పడినవై ఉన్నాయి.
న తు ఏవం తురీయ అతీతస్య నిర్గుణస్య,
స్థూల సూక్ష్మ కారణ రూపైః,
విశ్వ తైజస ప్రాజ్ఞేశ్వరైః,
సర్వ అవస్థాసు సాక్షిత్వ ఏన
ఏక ఏవ అవతిష్ఠతే।
అయితే పైన చెప్పబడిన 4x4=16 అవస్థలు కూడా ‘‘తురీయాతీతము’’నందు ఉండవు. ఎందుకంటే వాటన్నిటికీ కేవలమగు సాక్షిమాత్రము అగుట చేత!
అట్టి తురీయాతీతము :
❆   గుణములకు ఆవల ఉన్న నిర్గుణ స్వరూపము.
❆   (దేహమునకు ‘దేహి’వలె) స్థూల సూక్ష్మ కారణ దేహములకు, విశ్వ తైజస ప్రాజ్ఞ పురుషకారములకు ఆది కారణము. అవన్నీగా ప్రదర్శనమగుచున్న ఈశ్వర రూపము.
❆   జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములకు (నాటక దీపమువలె) కేవల సాక్షీ రూపము (Mere witness like light emitting on stage in relation to inter - personal events of the Drama on stage).
తురీయాతీతము సర్వదా ఏకము, అఖండము, అద్వితీయము కూడా।
4. ఉత తటస్థో, ద్రష్టా తటస్థో।
న ద్రష్టా ద్రష్టృత్వాత్।
న ద్రష్ట ఏవ కర్తృత్వ భోక్తృత్వ అహంకార ఆదిభిః।
స్పృష్టో జీవో జీవేతరో న స్పృష్టః
జీవో అపి న స్పృష్ట - ఇతి చేత్
న జీవ అభిమానేన, క్షేత్ర అభిమానః।
శరీర అభిమానేన జీవత్వం।
జీవత్వం ఘట ఆకాశ
మహా ఆకాశవత్ వ్యవధానం అస్తి।
అట్టి తురీయాతీతము ఇంకా కూడా :
- నిత్యోదితమగు తటస్థము (Blossoming in everything while being always beyond).
- ద్రష్టత్వమునకు కూడా సాక్షి - తటస్థము కాబట్టి ద్రష్ట స్వరూపము కాదు.
- ద్రష్టకు ఉండి ఉంటున్న కర్తృత్వ, భోక్తృత్వ, అహంకారములు మొదలైనవి తురీయాతీత స్వరూపమునకు లేవు.
- జీవ - జీవేతరములు రెండు ఆత్మను ఆశ్రయించియే ఉన్నాయి.
- అయితే కూడా ఆత్మ - జీవాత్మ ఇతరములచే స్పృశించబడేది కాదు కూడా. ఎందుకంటే జీవాభిమానము చేత గాని, క్షేత్ర అభిమానముచేత గాని, శరీరాభిమానంచేత గాని జీవత్వము పొందేది కాదు.
- జీవత్వము - పరమాత్మత్వము అనేవి కుండలోని ఆకాశము, సర్వత్రాగల మహాకాశము వలె ఒకదానితో మరొకటి మరుగు (Mutually hiding) కలిగి ఉన్నాయి.
వ్యవధాన వశాత్ ఏవ హంసః।

సో2హం (హంసో2హమ్) ఇతి
మంత్రేణ ‘‘ఉచ్ఛ్వాస - నిశ్వాస’’
వ్యపదేశేన అనుసంధానం కరోతి।
జీవాత్మ జగదనుభవములకు కర్తృత్వ - భోక్తృత్వములను వహిస్తూ ఉండగా అట్టి జీవాత్మకు వ్యవధానముగా (కప్పువలె, మఱుగు - Secret గా) ఉండి ఉంటున్నదే ‘‘హంస’’ (ఆత్మ) (సో2హమ్).
ఉచ్ఛ్వాస (గాలి పీల్చునప్పుడు) సహజమగు ఆత్మగా, గాలి వదలునప్పుడు సందర్భరూపము ‘‘సందర్భములోని ఆత్మ’’గా భావిస్తూ ఉచ్ఛ్వాస - నిశ్వాసలను ఎరుకలో గమనించటమును అనుసంధానము చేయువారే పరమహంసలు. అట్టి సాధనకు ఉపక్రమించెదరు గాక.
ఏవం విజ్ఞాయ శరీర అభిమానం
త్యజేత్, న శరీర అభిమానీ భవతి।స ఏవ ‘బ్రహ్మ’ ఇతి ఉచ్యతే।
ఈ విధంగా ‘‘సహజ-సందర్భము’’లకు సంజ్ఞగా ఉచ్ఛ్వాస - నిశ్వాసలను గమనించటము నిర్వర్తించాలి. స్వస్వరూపాత్మ యొక్క అమృతస్వరూపమగు ‘‘సహజరూపము’’ను సందర్భ మాత్రమగు ‘‘సందర్భ స్వరూపము’’ను తన యొక్క పరమాత్మ-జీవాత్మల చమత్కారములుగా గమనించాలి. శరీరాభిమానమును త్యజించాలి. ఇక అట్టివాడు శరీరాభిమానిగా ఉండడు. పాంచభౌతిక శరీరము యొక్క రాక-పోకలను తన ఆత్మ స్వరూపముపై ఆపాదించుకోడు.

‘‘అట్టివాడు బ్రహ్మమే అయి ఉన్నాడు’’ అని ఆత్మజ్ఞుల చేతను, శాస్త్రముల చేతను సుస్పష్టము చేయబడుతోంది.
త్యక్త సంగో, జితక్రోధో,
లఘు ఆహారో జితేంద్రియః,

పిధాయ బుద్ధ్యా ద్వారాణి
మనో ధ్యానే నివేశయేత్।।
అందుచేత ఓ నారదా ! ముని శ్రేష్ఠులారా ! నా బిడ్డలే అయి ఉన్న సమస్త జీవులారా ! మీ యొక్క ఆత్మత్వమును ఎరుగుటకై ఉపాయములు చెప్పుచున్నాను. వినండి.
త్యక్త సంగః : బాహ్య - అంతర ఇంద్రియములకు తారసబడుచున్న సమస్త విషయ విశేషములను బాహ్యముననే త్యజించినవారవండి.
జిత క్రోధః : ‘‘ఒక వ్యక్తి (లేక) సందర్భముపై కోపమును విడువక పోవటము’’ అనే ‘క్రోధము’ను శత్రువుగా గమనించి జయించి వేయండి.
లఘు ఆహారః : ఇంద్రియములను బాహ్యమున నియమించటము. ఎంతవరకు దేహ రక్షణ పోషణలకు అవసరమో, అంత వరకే పరిమితము చేయండి. అల్పముగా ఆహారము స్వీకరించువారుగా ఉండండి.
జితేంద్రియః : ఇంద్రియములు మీకు ఉపకరణములుగా ఉండుగాక. వాటి విషయములకు మీరు వశులు కాకండి. బుద్ధిని బంధించి ఇంద్రియ ద్వారముల నుండి వెనుకకు మరల్చి మనస్సుతో ఆత్మధ్యానపరులుగా ఉండండి.
5. శూన్యేషు అవావకాశేషు
గుహాసు చ వనేషు చ

నిత్యయుక్తః సదాయోగీ
ధ్యానం సమ్యక్ ఉపక్రమేత్।
ధ్యాన విధి
బిడ్డా ! నారదా ! ధ్యాసను ఇంద్రియ విషయపరంపరల నుండి విరమింపజేసే సాధనయే ధ్యానము. ప్రాపంచకమైన ఇంద్రియ విషయములు చేరని శూన్యమైన ఆకాశ స్థానము (ప్రదేశము) నందు గాని, (సాంఘిక జీవనమునకు సుదూర ప్రదేశంలోగాని) లేక ‘గుహ’ యందు గాని ‘వనము’ (అరణ్యము) నందు గాని ఏ కొంచెముగా యోగి సదా నిత్యయుక్కుడై (యోగాభ్యాసి అయి) ‘‘సమత్రా / సమదర్శనము’’ అనే ‘‘సమ్యక్‌ధ్యానము’’నకు ఉపక్రమించాలి.
ఆతిథ్య శ్రాద్ధ యజ్ఞేషు
దేవయాత్ర ఉత్సవేషు చ,

మహాజనేషు సిద్ధ్యర్థీ
న గచ్ఛేత్ యోగవిత్ క్వచిత్।

యథా ఏనం అవమన్యంతే
జనాః పరిభవంతి చ,

తథా యుక్తః చరేత్ యోగీ
సతాం వర్త్మ, న దూషయేత్।
అట్టి ధ్యాన యోగమునకు సంసిద్ధము అగుచున్న యోగి -
- అతిధి సత్కారములు అందజేయచోట్లకు, శ్రాద్ధ (పితృ) యజ్ఞము జరుగు స్థానములకు, దేవాలయములలో జరిగే ఉత్సవములకు, అనేక మంది ఒకచోట చేరే సమావేశములకు ఎప్పుడు కూడా వెళ్లి పాల్గొనకుండును గాక.
- జన సమూహముల గౌరవ - మర్యాదలు, సన్మానములు మొదలైనవి యతి అయినవాడు కోరుకోరాదు.
- పైగా, జనసమూహము తనను లెక్కలోకి తీసుకోకుండాను, తనను పరిభవించు (తక్కువగా మాట్లాడుకొను) విధంగాను, సాంసారికాశయము గల జీవులు గౌరవించే విధంగాను ఉంటాడు.
- తన ఆత్మతత్త్వ జ్ఞానాశయములను దాచుకొని ఉండు గాక.
- దూషించువారియందు కూడా సత్‌భావము (ఆత్మభావన) ఆశ్రయించి - దూషించకుండును గాక.
వాక్ దండః కర్మ దండః చ
మనోదండః చ తే త్రయః (3)।

యస్య ఏతే నియతా దండాః,
స త్రిదండీ మహాయతిః।

విధూమే చ ప్రశాంతే అగ్నౌ
యస్తు మధుకరీం చరేత్,
గృహే చ విప్రముఖ్యానాం
యతిః సర్వోత్తమః స్మృతః।
త్రి (3) దండములు :
1) వాక్ దండము 2) కర్మ దండము 3) మనో దండము.

ఈ మూడు దండములను తాత్త్వికార్థ పూర్వకంగాను, ఆత్మజ్ఞాన యుక్తంగాను, నియతి పూర్వకంగాను (శాస్త్ర నిర్వచన నియమానుసారంగాను) ధరించువాడు ‘‘త్రిదండీ మహా యతి’’ అని పిలువబడుచున్నాడు.

ఒకరి ఇంటికి వెళ్లి భిక్ష అడగటానికి సరీయిన సమయం గమనించబడుగాక. అగ్ని ఆగిపోయి పొగ చల్లారిన తరువాత (వంట సమాప్తి అయిన తరువాత) ఆయా సంపద, దాన గుణము గల వారి ఇళ్లలో మధుకరము (భిక్ష) స్వీకరించును గాక. అట్టి భిక్షక సన్న్యాసి సర్వోత్తముడు అని చెప్పబడుచున్నారు.
దండం భిక్షాం చ యః కుర్యాత్
స్వధర్మే వ్యసనం వినా
యః తిష్ఠతి న వైరాగ్యం యాతి
నీచ యతిః హి సః।
యస్మిన్ గృహే విశేషేణ లభేత్ భిక్షాం చ వాసనాత్,
తత్ర నో యాతి నో భూయః। స యతిః న ఇతరః స్మృతః।
ఎవ్వరైతే బాహ్యమున సన్న్యాసిరూపుడై దండము ధరించి భిక్షకుడై (భిక్షాటనము నిర్వర్తిస్తూ) యతి ధర్మములను (సన్న్యాస ధర్మములను) నిర్వర్తించడో, ప్రాపంచక (దృశ్య) విషయములపట్ల విరాగము (వైరాగ్యము) కలిగి ఉండడో అట్టివాడు నీచుడేగాని ‘యతి’ కాడు.
అధికంగా భిక్ష లభించే ఇంటికి మరల మరల పోవటము చేయరాదు. ఎప్పుడూ వేరు వేరు గృహములకు వెళ్లుచూ ఉండాలి. అట్టివాడే యతీశ్వరుడు అనబడుచున్నాడు.
యః శరీర ఇంద్రియ ఆదిభ్యో విహీనం సర్వసాక్షిణమ్,
పారమార్థిక విజ్ఞానం సుఖ ఆత్మానం స్వయం ప్రభమ్।
ఏ జ్ఞాని అయితే శరీరము, ఇంద్రియములు మొదలైనవన్నిటికీ అతీతత్వము సంపాదించుకొని, సమస్తమునకు సాక్షిత్వము సిద్ధించుకొని పరమార్థకమగు ఆత్మత్త్వ జ్ఞానముచే స్వయం ప్రకాశము సిద్ధించుకుంటాడో అట్టివాడే పరతత్త్వజ్ఞాని.
పరతత్త్వం విజానాతి సో అతివర్ణాశ్రమీ భవేత్।
సర్వ ఆశ్రమ ఆదయో
దేహే మాయయా పరికల్పితాః।
పరతత్త్వము చక్కగా ఎరిగి యున్నవానికి నాలుగు వర్ణ ఆశ్రమ పరిధులు ఉండవు. ఎందుకంటే వర్ణాశ్రమ కర్మ విశేషములన్నీ ‘మాయా’ ఆధారముగా కల్పితమగుచున్నవే. పరబ్రహ్మమునకు లేవు. (పరబ్రహ్మము సిద్ధించుకోవటానికి ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి’’ అనే ఉపాయమును దృష్టిలో పెట్టుకొని - ఉపాయరూపంగా శాస్త్రములు ‘మాయ’యే అయినట్టి 4 ఆశ్రమ ధర్మములు నియమించి సూచిస్తున్నాయి).
6. న ఆత్మనో బోధ రూపస్య
మమత్వే సంతి సర్వదా।

ఇతి యో వేద వేదాంతైః
సో ‘‘అతివర్ణాశ్రమీ’’ భవేత్।
వర్ణాశ్రమాతీతుడు
‘‘నేను సర్వదా బోధరూపమగు ఆత్మను. అట్టి కేవల బోధరూపుడునగు నాకు ఇది నా ఆశ్రమము, అది నా ఆశ్రమం కాదు అని ఉండదు’’ అని ఏ వేద - వేదాంతుడు తెలుసుకుంటాడో అతడే ఆవలగల ఆత్మరూపము ఎరిగినవాడు. అట్టివాడు ఆశ్రమ పరిధులను దాటి ‘అతివర్ణాశ్రమీ’ అగుచున్నాడు.
యస్య వర్ణ ఆశ్రమ ఆచారో
గళితః స్వ ఆత్మ దర్శనాత్
స వర్ణాశ్రమాం తు సర్వాన్
అతీత్య స్వ ఆత్మని స్థితః।
ఎవ్వడైతే వర్ణాశ్రమ ఆచారములను ఉపకరణములుగాను, సాధన కొరకు నియమింబడినవిగాను భావించి సర్వత్రా ఆత్మ దర్శనమే పరమాశయముగా కలిగి ఉండి, అందుకు ఆశ్రమ ధర్మములు శాస్త్రీయ సాధనా విధానముగా అనుసరించు అభ్యాసము కలవారు - సమస్త వర్ణాశ్రమ ధర్మములకు ఆవలను దాటి వాని స్వస్వరూపాత్మయందు స్థితిని పొందుచున్నారు.
యో అతీత్య స్వ ఆశ్రమాన్ సర్వాన్
ఆత్మని ఏవ స్థితః పుమాన్
సో ‘‘అతివర్ణాశ్రమీ’’ ప్రోక్తః
సర్వ వేదార్థ వేదిభిః।।
ఏ పురుషుడైతే తన యొక్క సమస్త ఆశ్రమ ధర్మములను క్రమంగా (సాధ్యము సిద్ధిస్తున్నప్పుడు సాధనలు దాటినట్లు) దాటివేసి ‘‘ఆత్మధ్యానము, ఆత్మభావన’’ యందు స్థితి పొందుతాడో, అట్టి వాడు సర్వ వేదార్థములను అర్థం చేసికొని, దాటి ‘‘అతివర్ణాశ్రమి’’ అగుచున్నాడు.
తస్మాత్ అన్యగతా వర్ణాశ్రమా
అపి, నారదా! ఆత్మని ఆరోపితాన్ సర్వే
అహ్రాంత్యా తేన ఆత్మవేదినా।
కాబట్టి నారదా ! స్వగతమే కాకుండా అన్యగతమైన ఆశ్రమ ధర్మాలు అన్నీ కూడా ఆత్మయందు ఆరోపించి చెప్పబడేవేగాని, ఆశ్రమ ధర్మములే అంతిమ లక్ష్యము కాదు’’ అని, అవి అహ్రాంతి తొలగటానికి అహ్రాంతి నిర్మితములేనని ఆత్మజ్ఞాని గ్రహిస్తున్నాడు.
న విధిః న నిషేధః చ
న వర్జ్య అవర్జ్య కల్పనా బ్రహ్మ విజ్ఞానినాం అస్తి।
తథా న అన్యత్ చ, నారద।
ఆత్మ యొక్క స్వానుభవము సిద్ధించుచున్న సందర్భము సమక్షంలో విధి (Do’s) ఉండవు. నిషేధములు (Dont’s) ఉండవు. బ్రహ్మ విజ్ఞానమే అంతిమ అనుభవంగా శేషిస్తుంది. మరింకేమి ఉండవు. దేనితోనూ పని లేదు.
7. విరజ్య సర్వ భూతేభ్య
ఆవిరించి పదాత్ అపి,
కనుక ఓ నారదా ! ఈ జీవుడు సంసార దోషములు (Relatedness to worldly events and occasions) గ్రహించనివాడగును గాక.
ఘృణాం విపాట్య సర్వస్మిన్
పుత్రమిత్రాదికేషు అపి,
బ్రహ్మ దేవుని పదము (Position) నుండి సర్వ పదములు (All positional possessions) పట్ల, కొడుకు - స్నేహితుడు- సంబంధీకుడు మొదలైన సర్వ సంబంధిత దృశ్య వ్యవహారముల పట్ల అనురక్తిని జయించి, ‘విరక్తుడు’ అగును గాక.
శ్రద్ధాళుః ముక్తి మార్గేషు
వేదాంత జ్ఞాన లిప్సయా।
‘‘నాకు బంధముల భావన తొలగును గాక’’ అను రూపమగు ముక్తి మార్గము పట్ల ఆశయము కలిగి ఉండును గాక. అందుకొరకై వేదాంత జ్ఞానము పొందుటకు సంసిద్ధుడగును గాక.
ఉపాయనకరో భూత్వా
గురుం బ్రహ్మవిదం వ్రజేత్।
సేవాభిః పరితోషి ఏనం
చిరకాలం సమాహితః।
అట్టి ముక్తికి త్రోవతీయగల వేదాంత జ్ఞానము లభించేది ఎట్లా? అందుకొరకు తనయందు శ్రద్ధను నిదుర లేపి అందుకు ఉపాయముగా బ్రహ్మవిదుడగు గురువును ఆశ్రయించి, వారిని తన సేవా భావములతో సేవించి, దీర్ఘకాలము శ్రద్ధ - ఆసక్తులతో సేవిస్తూ ప్రయత్నశీలుడగును గాక.
సదా వేదాంత వాక్యార్థం
శృణుయాత్ సు సమాహితః
నిర్మమో నిరహంకారః
సర్వ సంగ వివర్జితః।

సదా శాంతి-ఆది యుక్తః సన్
ఆత్మని ఆత్మానం ఈక్షతే।
యోగసిద్ధుడైన యతి - ఎల్లప్పుడు సు-సమాహితుడై ఆత్మతత్త్వ జ్ఞానము పట్ల అంగీకారము కలవాడగును గాక. సమాధిని ఆశ్రయించినవాడై (వేదాంత వాక్యములైనట్టి ‘సో2హమ్’, ‘తత్త్వమ్’ ‘త్వమేవాహమ్’, ‘‘జీవోబ్రహ్మేతి నాపరః’’ మొదలైన మహావాక్యము లను) వినును గాక. మహదార్థమును గ్రహిస్తూ ఉండును గాక. మమకార, అహంకార రహితుడగును గాక. సర్వసంగములను వదలి వేయును గాక.

శాంతి మొదలైన ఉత్తమగుణములను ఆశ్రయించిన తత్త్వజ్ఞుడు ఈ భూమిపై ప్రశాంతముగా సంచారము చేస్తున్నాడు.
సంసార దోష దృష్ట్య ఏవ విరక్తిః జాయతే సదా,
విరక్తస్య తు సంసారాత్ సన్న్యాసః స్యాత్ న సంశయః।

ముముక్షుః పరమ హంసాఖ్యః సాక్షాత్ మోక్ష ఏక సాధనమ్,
అభ్యసేత్ బ్రహ్మ విజ్ఞానం వేదాంత శ్రవణ ఆదినా।
సన్న్యాసము : సదా సంసార దృష్టులలో గల దోషములను గమనించి, సమస్త అనురక్తులను జయించి - విరక్తి సమన్వితుడై, ఆత్మయందు పూర్ణార్థమును ఆశ్రయించువాడు ఎల్లప్పుడు సన్యాసియే. జ్ఞేయస్య నిత్య సన్న్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. సంశయము లేదు.
మముక్షువు అయినవాడు సాక్షాత్ మోక్షమే ఏకైక సాధనముగా కలిగి ఉండాలి. వేదాంత శాస్త్రము శ్రవణము చేస్తూ బ్రహ్మ జ్ఞానము సంపాదించి పరమహంసత్వము సంతరించుకోవాలి.
8. బ్రహ్మ విజ్ఞాన లాభాయ
పరమహంస సమాహ్వయః,
శాంతి దాంతి ఆదిభిః సర్వైః
సాధనైః స హితో భవేత్।

వేదాంత అభ్యాస నిరతః
శాంతో దాంతో జితేంద్రియః

నిర్భయో నిర్మమో నిత్యో
నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః


జీర్ణ కౌపీన వాసాః స్యాత్
ముండీ, నగ్నః అథవా భవేత్
పరమహంస అయి బ్రహ్మ విజ్ఞాన సంపన్నుడై, (సో2హమ్ పరమమ్ - సమస్తమునకు పరమైయున్న ఆత్మయే నా సహజ రూపము అను) ఆత్మ భావనను స్వాభావికం చేసుకుంటూ ప్రశాంతమైన బుద్ధి, ఇంద్రియ నిగ్రహములను ఎల్లప్పుడు ఉపకరణములుగా కలిగి ఉంటున్నారు.

(వేద + అంతము = తెలుసుకోబడు సమస్తమును తెలుసుకొంటున్నవాడు - The Knower) యతి ఎల్లప్పుడు వేదాంత అభ్యాసము నందే నిరతుడగును గాక, శాంతుడై దాంతుడగును గాక. ఇంద్రియనిగ్రహము కలవాడగును గాక.

- భయములన్నిటినీ జయించినవాడై,
- మమకారము త్యజించివేయును గాక.
- ద్వంద్వ మోహమును వదలి వేయును గాక.
ఈ కల్పిత మాత్ర దృశ్యము నుండి ఏదీ పరిగ్రహించనివాడై ఉండునుగాక.

జీర్ణ కౌపీనము (గోచి) ధరించి, ముడి (జుట్టు) తొలగించుకొన్నవాడై (లేదా) నగ్నముగా (బట్టలు వదలి) పరివ్రాజకుడు ఈ ప్రపంచమునందు ఆత్మానందముగా ఉంటున్నాడు.
ప్రాజ్ఞో వేదాంత విత్ యోగీ
నిర్మమో నిరహంకృతిః,
మిత్ర ఆదిషు సమః, మైత్రః
సమస్తేషు ఏవ జంతుషు
ఇంకా కూడా ఈ జీవుడు ‘‘సంసారము’’ అనే దృశ్యముతో ఏర్పరచుకొన్న మనో అనుబంధ జాడ్యము తొలగించుకొనే విషయాలను (పైన చెప్పుకొన్నవే కాకుండా) మరికొన్ని చెప్పుకొంటున్నాము.
- శాస్త్రము, సద్గురువులు, ‘‘తత్ త్వమేవ’’ పూర్వకంగా చెప్పుచున్న సూక్ష్మ విషయములు గ్రహించగల ప్రజ్ఞను సునిశితం చేసుకొని ప్రాజ్ఞుడై ఉండాలి.
- వేదాంత శాస్త్రము చెప్పుచున్న స్వస్వరూపము గురించి విశేషములు తెలుసుకుంటూ వేదాంతవేత్త కావాలి.
- వ్యక్తిగత పరిమితులను అధిగమించి వ్యష్టిత్వమును సమిష్టిరూప సర్వాత్మకమునందు ఏకము చేయు యోగీశ్వరత్వము కొరకై మన్నించు ‘యోగి’ అయి ఉండుగాక.
- నాది-నేను అనే పరిమితమైన మమకార - అహంకారములను జయించి ‘‘నిర్మమ, నిరహంకారి’’ అగును గాక.
- శుత్రు మిత్రుల యందు, సమస్త సహజీవుల యందు సమ బుద్ధి కలిగి ఉండును గాక.
ఏకో జ్ఞానీ ప్రశాంత ఆత్మా
స సంతరతి న ఇతరః ।

గురూణాం చ హితే యుక్తః
తత్ర సంవత్సరం వసేత్।
శిష్యత్వము : సన్న్యాసి, యతి, పరివ్రాజకుడై మోక్షమును సిద్ధించుకోవటానికి మార్గము అయి ఉన్న కొన్ని విశేషాలు.
బిడ్డలారా !
‘‘ఏకోజ్ఞానీ ప్రశాంతాత్మ’’ అగు స్థితి సిద్ధించటానికై ముందుగా తత్త్వజ్ఞాని అగు గురువును ఆశ్రయించి ఆయన సేవలో శ్రవణం చేస్తూ - ఒక సంవత్సర కాలము గడపటము ఉచితము.
నియమేషు అప్రమత్తస్తు
యమేషు చ సదా భవేత్।

ప్రాప్య చ అంతే తతః చ ఏవ
జ్ఞానయోగం అనుత్తమమ్।

అవిరోధేన ధర్మస్య సంచరేత్
పృథివీం ఇమామ్।
ఎల్లప్పుడు ‘‘నియమము’’ నందు (ఇంద్రియములను జ్ఞానార్జన కొరకై నియమించుటయందు), ‘‘యమము’’ నందు (ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరల్చుట యందు) శ్రద్ధాశువు అయి ఉండాలి.

ఆ విధంగా అనుత్తమమైన (శ్రేష్ఠమైన) ‘‘ఆత్మజ్ఞానానుభవము’’ సంపాదించుకోవాలి.

అట్టి ఆత్మ జ్ఞానానుభవి అయి మరొక (సంవత్సర కాలము) యతి ధర్మములను వీడకుండా జ్ఞాన యోగము ధారణ చేస్తూ భూమిపై సంచారములు నిర్వర్తించును గాక.
తతః సంవత్సరస్య - అంతే జ్ఞానయోగమ్
అనుత్తమం ఆశ్రమ త్రయం ఉత్సృజ్య
ప్రాప్తశ్చ పరమ ఆశ్రమమ్।
అనుజ్ఞాప్య గురూంశ్చైవ (గురూన్ చ ఏవ)
చరేద్ధి పృథివీం ఇమామ్।
త్యక్త సంగో, జితక్రోధో,
లఘు ఆహారో జితేంద్రియః।।
ఆ విధంగా సంవత్సర కాలము జ్ఞాన యోగ సమన్వితుడై సంచారము పూర్తి చేసుకొని, అటు తరువాత త్రి-ఆశ్రమములను (బ్రహ్మచర్య - గృహస్థ - వానప్రస్థ - ‘3’ ఆశ్రమములను) వదలి వేసి వాటికి ఆవలిదగు పరమాశ్రమము (సన్యాసాశ్రమము) స్వీకరించును గాక.

ఆ విధంగా నాలుగువదగు సన్న్యాసాశ్రమమును గురు అనుజ్ఞతో స్వీకరించి
- సమస్త సంగములను (All kinds of Relationships / Relatedness) మనస్సుతో వదలి వేయాలి.
- క్రోధము (The tendency of anger) మొదలంట్లా జయించి వేయాలి.
- ఇంద్రియములను పరిమితముగా (జీవించుటకు అవసరమైనంత వరకే) ఉపయోగిస్తూ ‘లఘు ఆహారి’ అయి ఉండాలి.
- ఇంద్రియ విషయములను జయించి, ఇంద్రియములను తన వశం చేసుకొని లోకములో సంచరించును గాక. తాను ఇంద్రియములకు వశుడు కాకూడదు. అవే తనకు వశములో ఉండాలి. అవి తనచే పాలించబడాలి.
9. ద్వావిమౌ న విరాజేతే
విపరీతేన కర్మణా,
నిరారంభో గృహస్థః చ
కార్యవాన్ చ ఏవ భిక్షుకః।
మాద్యతి ప్రమదాం దృష్ట్వా
సురాం పీత్వా చ మాద్యతి,

తస్మాత్ దృష్టివిషాం నారీం
దూరతః పరివర్జయేత్।
గృహస్థునకు కర్మలు చేయుటము, భిక్షకునకు కర్మలు లేకపోవటము విధి విధానంగా చెప్పబడుతోంది.
కర్మలు నిర్వర్తించని గృహస్థుడు, కార్యక్రమములను, కర్మ పరంపరలను నిర్వర్తించే భిక్షకుడు - ఇద్దరు కూడా ‘విపరీత కర్మ పరులు’ అగుచున్నవారే.
ఈ జీవులు మద్యపానము చేసినప్పుడు, యౌవనవతి / యౌవనవంతుడు అయిన దేహము చూచినప్పుడు మాద్యము (మత్తు) పొందినవారగుచున్నారు.

అందుచేత స్త్రీని శృంగార దృష్టితో చూడకూడదు. అట్టి (శృంగార) దృష్టిని దగ్గిరకు ఏ మాత్రము రానీయకూడదు. మలము ఒంటికి రాసుకోవటముతో సమానంగా భావించాలి.
సంభాషణం సహ స్త్రీభిః
ఆలాపః ప్రేక్షణం తథా,
నృత్తం గానం సహాసం చ
పరివాదాంశ్చ వర్జయేత్,
కులుకు మొదలైన వాటితో శృంగారపు గుర్తులు ప్రదర్శించు స్త్రీలతో సరస-సల్లాప సంభాషణము, గీతములు, చూపులు నిలపటము, నృత్య - గానములు సలపటము, ప్రక్కనే కూర్చోవటము, ఎవరి గురించో నిందా వాక్యములు చెప్పుకోవటము (పరివాదము) - ఇవన్నీ యతి మార్గంలో వదలి ఉండవలసిన
న స్నానం న జపః పూజా,
న హోమః న ఏవ సాధనమ్,
న అగ్నికార్యాది కార్యం చ
న ఏతస్య అస్తి ఇహ, నారద!

న అర్చనం పితృకార్యం చ
తీర్థయాత్రా వ్రతాని చ,
ధర్మా అధర్మ ఆదికం నాస్తి
న విధిః లౌకికీ క్రియా।

సంత్యజేత్ సర్వకర్మాణి
లోకాచారం చ సర్వశః।
ఓ నారదా ! ఎవ్వరైతే బ్రహ్మ భావమునందు అవిచ్ఛిన్నంగా ఓలలాడుచూ ఉంటారో - అట్టి వారికి స్నానము, జపము, పూజ, కోపము తదితర సాధనా క్రమములు, అగ్ని కార్యములు - ఇటువంటి నియమములేవీ ఇక శాస్త్రములు విధించవు. అట్టి సాధనములన్నిటి యొక్క సిద్ధి యగు ఆత్మానందము పొందినవానికి ఇక సాధనముల నియమములు ఉండవు.

అట్టి ఆత్మతత్త్వభావన స్వాభావికముగా పండించుకున్న తత్వార్థ జ్ఞానికి ఇక దేవతార్చనలు గాని, పితృకార్యములు గాని, తీర్థయాత్రలు గాని, తప్పక నిర్వర్తించలసిన వ్రతములు గాని, ధర్మ - అధర్మ నియమములు గాని, లౌకిక క్రియా విధులు గాని ఇక నియమించబడవు.

అట్టి సమస్త కర్మలు, లోక సంబంధమైన ఆచారములను నియమించి చెప్పలేము.
క్రిమి కీట పతంగాంశ్చ
తథా యోగీ వనస్పతీన్
న నాశయేత్ బుధో జీవాన్
పరమార్థ మతిః యతిః।

నిత్యం అంతర్ముఖః స్వచ్ఛః
ప్రశాంతాత్మా స్వ పూర్ణధీః,
అంతః సంగ పరిత్యాగీ
లోకే విహర, నారద!

న అరాజకే జనపదే చరతి
ఏక చరో మునిః।
పరమార్థమును ఎఱిగిన యతి క్రిమి కీటకములను, మిడతలు వంటి వాటినీ, పక్షులను, వృక్షములను, తదితర జీవులను నశింపజేయక, ఉత్తమ బుద్ధి కలవాడై ఉండు గాక.
సహ జీవులలోను, తనయందు బాహ్యములైన విశేషములను ప్రక్కకు పెట్టి (లేక) దాటివేసి సమస్తమునకు ఆధారమైయున్న ‘‘ఆత్మనే దర్శించటము’’ అను అంతర్ముఖత్వము వహించును గాక. స్వచ్ఛమైన మనస్సుతో, ప్రశాంతమైన భావనతో తన యొక్క పూర్ణత్వమును బుద్ధికి స్పష్టపరచుకొని ఉండు గాక. ఓ నారదా! నీ యొక్క అంతరమున సమస్త సంగములు విడచినవాడవై, బాహ్యమున లోకములన్నీ విహరించెదవు గాక.


రాజు పరిపాలన లేని ప్రదేశములలో ముని తిరగకూడదు. కానీ, దేనితోనూ సంబంధము కలిగి ఉండక ఒంటరిగా చరించుచుండును గాక.
నిస్తుతిః నిర్నమస్కారో
నిస్వధాకార ఏవ చ,
చల అచల నికేతశ్చ
యతిః యాదృచ్ఛికో భవేత్।।
దేనినీ స్తుతించకుండా, నమస్కరించకుండా, స్వధాకారుడు (పితృతర్పణము చేయువాడు) కాకుండా, ఆశీర్వాదములు ప్రసాదించకుండా, యాదృచ్ఛికంగా (without pre-plan) తారసపడే స్థానములందు కొండగుహలలోను నిహసము కలిగి ఉండును గాక.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘షష్ఠ ఉపదేశః’’


సప్తమోపదేశః (7వ ఉపదేశము) - నిర్దుష్ట నియమ నిష్ఠలు

1. అథ ‘‘యతేః నియమః కథం ఇతి’’ -
పృష్టం నారదం, పితామహః పురస్కృత్య,

విరక్తః సన్న్యాసీ వర్షాసు ధ్రువశీలో,
అష్టౌ మాసాన్ ఏకాకీ చరేత్।
న ఏకరాత్రం నివసేత్ భిక్షుః
భయాత్ సారంగవత్ ఏకత్ర న తిష్ఠేత్।
స్వగమన నిరోధ గ్రహణం న కుర్యాత్।
నారద మహర్షి : హే జగత్ సృష్టికర్తా ! బ్రహ్మ భగవాన్ ! ‘యతి’ యొక్క నిర్దుష్టమైన నియమ - నిష్ఠలు దయతో విశదీకరించండి. ఇది విని పితామహులు ఇట్లు వివరించసాగారు.

పితామహుడు : సన్యాసి సమస్త దృశ్య విషయములపట్ల అనురక్తిని జయించి, విరక్తుడై ‘8’ మాసములు ఏకాంతముగా, ఒకచోట నిలువక చరించువాడై ఉంటారు. వర్షాకాలపు ‘4’ మాసములు మాత్రము ధ్రువముగా ఒక చోటనే ఉంటారు (చాతుర్మాస్యము). భిక్షువు ఒకరాత్రి మించి ఎక్కడా కూడా రెండవ రాత్రి ఉండరు. భయము పొందు జింక ఒక చోట నుండి మరొక చోటికి రోజురోజు సంచరిస్తూనే ఉంటుంది, అట్లాగే యతి తన యొక్క యాత్రా సంచారమును ఏ మాత్రము విరామము కల్పించుకోరు.
హస్తాభ్యాం నది ఉత్తరణం న కుర్యాత్।
(న కుర్యాత్) న వృక్ష ఆరోహణం అపి।
న దేవ ఉత్సవ దర్శనం కుర్యాత్।
న ఏక రాత్రాశీ।
న బాహ్య దేవత అర్చనం కుర్యాత్।

స్వ వ్యతిరిక్తం సర్వం త్యక్త్వా,
మధుకర వృత్త్యా, ఆహారం
ఆహరన్ కృశో భూత్వా।
చేతులతో ఈత కొడుతూ నదులను యతి దాటకూడదు.
భిక్షుక యతి - చెట్లు ఎక్కకూడదు. దేవతా ఉత్సవములలో పాల్గొనరాదు. ఒక్క రాత్రి మించి ఎక్కడా నిలువ కూడదు. బాహ్య దేవతార్చనము నిర్వర్తించరు. సర్వదా సర్వాంతర్యామియగు పరమాత్మనే సర్వత్రా దర్శిస్తూ ఉపాసిస్తూ ఉంటారు.

ఆత్మకు అన్యమైనదంతా మనస్సుతో విడచి, ‘‘అనన్యచింతన’’ను ఆశ్రయించి, మధుకర (భిక్షక వృత్తి) ఆశ్రయించి లభించినది స్వీకరిస్తూ తపోధ్యాన నిష్ఠలచే శరీర భావనను ఎప్పటికప్పుడు కృశింపజేసుకుంటూ ఉంటారు.
2. మేదో వృద్ధిం అకుర్వన్ న।
ఆజ్యం రుధిరం ఇవ త్యజేత్।
ఏకరాత్ర - అన్నం పలలం ఇవ।
గంధ లేపనం అశుద్ధ లేపనం ఇవ।
క్షారం అంత్యజం ఇవ।
వస్త్రం ఉచ్ఛిష్ఠ పాత్రం ఇవ।
మేదో వృద్ధి (కండ, క్రొవ్వుల బలము వృద్ధి చేసుకొనే) వృత్తులు అవలంభించరాదు.
క్రొవ్వు పెంచే ‘నెయ్యి’ మొదలైన వాటిని రక్తపానముతో సమానంగా భావించి వదలి ఉండాలి.
ఒకేచోట అన్నము మాంసాహారముగా భావించాలి, ఆశ్రయించరాదు!
సుగంధ లేపనమును అశుద్ధముగా భావించాలి.
క్షారమును (ఉప్పును) అంత్యజము వలె దుష్టాహారము వలె భావించాలి. ఖరీదైన వస్త్రధారణమును ఉమ్మి పాత్ర వలె అనుకోవాలి.
అభ్యంగం స్త్రీ సంగం ఇవ।
మిత్ర ఆహ్లాదకం మూత్రం ఇవ।

స్పృహాం గోమాంసం ఇవ।
జ్ఞాత చరదేశం చండాల వాటికాం ఇవ।

స్త్రియం అహిమ్ ఇవ।
సువర్ణం కాలకూటం ఇవ।
సభాస్థలం శ్మశానస్థలం ఇవ।
అభ్యంగన స్నానము (కుంకుళ్లు, సుగంధములు మొదలైన వాటితో తలంటుకోవటం) స్త్రీ సంగముతో సమానంగా వదలి ఉండాలి. స్నేహితులతో ప్రాపంచక విషయాలు మాట్లాడటం మూత్రముతో సమానంగా అనుకొని వదలి ఉండాలి.

స్పృహ (ఆసక్తిని) గోమాంసముతో సమానంగాను, జ్ఞాతులు (బంధువులు) నివసించే ప్రదేశాలకు, ఇళ్లకు వెళ్లటం చండాలవాటికలలోకి వెళ్లటంగా భావించాలి.

స్త్రీలతో సరసములు మొదలైనవి త్రాచుపాములతో చలగాటంగాను, బంగారమును కాలకూట విషంతో సమానంగాను, అనేకమంది జనులతో కూడిన సభాస్థలము శ్మాశానంతో సమానంగాను యతి (సన్యాసి) భావించును గాక.
రాజధానీం కుంభీపాకం ఇవ।
శవ పిండవత్ ఏకరాత్ర అన్నం।
న దేహాంతర దర్శనం।

ప్రపంచ వృత్తిం పరిత్యజ్య,
స్వదేశం ఉత్సృజ్య, జ్ఞాత చర దేశం విహాయ,
విస్మృత్య పదార్థం పునః ప్రాప్త, హర్ష ఇవ।
రాజధాని (నగరము)లో నివాసము కుంభీపాక నరకంతో సమానంగా అనుకొనును గాక. ఒకే గృహములో మరల మరల భిక్ష తీసుకోవటం కూడదు. ఒకే ఇంటి వద్ద రెండవ సారి భిక్ష శవపిండముతో సమానంగా భావించాలి. భౌతికదేహము లోనికి చూడటం కూడదు.

ప్రపంచము (దృశ్యము)నకు సంబంధించిన సమస్త ప్రవృత్తులను విడచివేయును గాక.
స్వదేశ పరిమితములను వదలి విశ్వప్రేమికుడు అగును గాక.
తన ప్రియ బంధువులు నివసించు ప్రదేశము వదలి ఉండును గాక.
ఏ పదార్థమైన ‘మరల మరల పొందాలి’ అని హర్షము, ఆకర్షణ, ఉబలాటము కలిగి ఉండరాదు.
స్వమ్ ఆనందం అనుస్మరన్, స్వ శరీర
అభిమాన దేశ విస్మరణం మత్వా,
స్వశరీరం శవం ఇవ హేయం, ఉపగమ్య,
- స్వస్వరూపానందమును ఎల్లప్పుడు స్మరిస్తూ జ్ఞాపకము ఉంచుకోవాలి.
- స్వకీయ శరీరాభిమానమును, స్వదేశాభిమానమును విడచి ఉండాలి.
తన యొక్క పాంచభౌతిక దేహమును ‘శవము’ వలె హేయమైన వస్తువుగా భావించి, దీనికి ఆవలి దగు ‘‘శరీరి’’ భావమునందు విశ్రమించాలి
కారాగృహ వినిర్ముక్తః చోరవత్
పుత్ర ఆప్తబంధు భవస్థలం
విహాయ దూరతో వసేత్।।
కారాగృహము (Jail) నుండి బయటపడిన దొంగ కారాగృహములోని తోటి దొంగల బంధనమును వదలి బయటకు హాయిగా వచ్చు విధంగా కొడుకుల - ఆప్త బంధువుల నివాస స్థలములను విడచిపెట్టి వాటికన్నింటికి మానసికంగా దూరంగా వసించును గాక.
3. అయత్నేన ప్రాప్తం ఆహరన్
బ్రహ్మ ప్రణవ ధ్యాన అనుసంధాన పరో భూత్వా,
సర్వకర్మ వినిర్ముక్తః,
కామ క్రోధ లోభ మోహ
మద మాత్సర్య ఆదికం దగ్ధ్వా,
త్రిగుణ అతీతః షట్ ఊర్మి రహితః
షట్ భావ వికార శూన్యః
సత్యవాక్ శుచిః అద్రోహీ।
యతి (సన్యాసి) ఇంకా కూడా ఎట్లా ఉండాలి ? వినండి.
✤ ప్రయత్నము లేకుండానే (ఏదో కావాలి అని కోరుకొని, అందుకై పరుగులు పెట్టకుండానే) యథావిధంగా ఏది లభిస్తే అది స్వీకరిస్తూ ‘తృప్తి’ని వీడకుండు గాక.
✤ ఎల్లప్పుడు కేవల సర్వాత్మక పరబ్రహ్మము గురించి ప్రణవ సంజ్ఞాపూర్వకంగా అనుసంధానపరుడై ఉండు గాక.
✤ ‘కావాలి - చేయాలి’ అనే కర్మ స్వభావమునుండి (రజో గుణము నుండి) వినిర్ముక్తుడగును గాక.
✤ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషట్ (6) వర్గమును ‘తృప్తి, అల్పసంతోషము’ అనే ఆయుధములచే జయించి వేయును గాక.
✤ త్రిగుణములకు అతీతమగు సాక్షిత్వము అభ్యాసము చేయును గాక.
✤ షట్ ఊర్ములను (క్షుత్, తృష్ణ, శోక, మోహ, జరా, మరణములను) రహితము చేసుకొనును గాక. షట్‌భావ వికారములను (ఉత్పత్తి, స్థితి, పరిణామము, వృద్ధి, క్షయము, నాశనము) వదలును గాక,
✤ సత్యవాక్కుతో శుచి అయిన భావములతో అద్రోహి అయి ఉండును గాక.
- గ్రామే ఏక రాత్రం।
- పత్తనే పంచ రాత్రం।
- క్షేత్రే పంచ రాత్రం।
- తీర్థే పంచ రాత్రం।

అనికేతః। స్థిరమతిః। న-అనృతవాదీ।
గిరి కందరేషు వసేత్।
యతి అయినవాడు గ్రామములో ఒక రాత్రి మాత్రమే, పట్టణములలోను తీర్థ ప్రదేశములలోను ఐదు రాత్రులు మాత్రమే నివాసము కలిగి ఉండాలి.

ఎక్కడా స్థిరనివాసము కలిగి ఉండని వాడగును గాక. బుద్ధి నిశ్చలత (ఏకాగ్రత) కలిగి ఉండాలి.
సత్యము కాని దాని గురించి వాదనకు దిగకూడదు. సత్యవ్రతుడై ఉండాలి. పర్వత గుహలను కూడా నివాసముగా కలిగి ఉండును గాక.
ఏక ఏవ, ద్వౌ వా చరేత్ గ్రామం।
త్రిభిః నగరం చతుః గ్రామం ఇతి।
ఏకః చరేత్ భిక్షుః। చతుర్దశ కరణానాం
న తత్ర అవకాశం దద్యాత్।

అచ్ఛిన్న జ్ఞానాత్ వైరాగ్య సంపత్తిం అనుభూయ,
గ్రామములో ఒకరితోగాని, ఇద్దరితో గాని ఉండవచ్చును. నగరములో ముగ్గురితో మాత్రమే ఉండవచ్చును.
ఎప్పుడూ భిక్షాటనము ఒంటరిగానే నిర్వర్తించాలి.
(పంచకర్మేంద్రియ, పంచ (5) జ్ఞానేంద్రియ, మనో-బుద్ధి- చిత్త-అహంకారములనబడే) 14 కరణములను తనపై పెత్తనము చెలాయించనీయకూడదు. అవి తనకు వశమై ఉండాలేగాని, వాటికి తాను వశుడు కాకూడదు.

నిరంతరము ‘ఆత్మ’ జ్ఞానమును పరిపోషించుకుంటూ, వైరాగ్య సంపత్తిని పరిపుష్టి చేసుకుంటూ ఉండాలి.
‘‘మత్తో న కశ్చిత్ అన్యో అతిరిక్త’’
- ఇతి ఆత్మని ఆలోచ్య,

సర్వతః స్వస్వరూపమేవ పశ్యన్,
జీవన్ముక్తిం అవాప్య

అఖండమగు బ్రహ్మమే ఈ సమస్తముగాను, ‘‘నాలోని నేనైన నేను’’గాను ప్రదర్శనము అవుతోంది. కాబట్టి ఆత్మస్వరూపుడునగు నేనే ఇదంతా అయి ఉన్నాను. నాకు వేరై ఎక్కడా, ఏదీ లేదు’’ అని తన ఆత్మ స్వరూపము గురించి ఆలోచన కలవాడై ఉండును గాక.

‘‘సమస్తము స్వస్వరూపమే’’ - అను నిశ్చల - అవిచ్ఛిన భావమును స్వాభావికంగా పొందుచున్నాడు.

ప్రారబ్ధ ప్రతిభాస నాశ పర్యంతం
చతుర్విధం స్వరూపం జ్ఞాత్వా,
దేహపతన పర్యంతం
స్వరూప అనుసంధానేన వసేత్।।
ఇక ఈ వర్తమైన దేహముతో సాంఘికము, సహజీవులతో పరస్పరము అయిన వ్యవహారమంతా ప్రతిభాసగా (సూర్య కిరణమునకు - ఆ కిరణము పడే వస్తువునకు గల సందర్భమాత్ర సంబంధముగా, దర్పణములోని ప్రతిబింబ మాత్రంగా, అంశవంటిదిగా) భావిస్తూ చతుర్విధ స్వరూపంగా (జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ స్వరూపముగా) భావిస్తూ, సర్వకాల సర్వ అవస్థలయందు ‘‘కేవలము, సమస్తమునకు పరము’’ అయినట్టి స్వస్వరూపముతో నిత్యానుసంధానము కలిగి ఉండు గాక.
4. త్రిషవణ స్నానం కుటీచకస్య।
బహూదకస్య ద్వివారం।

హంసస్య ఏకవారం।
పరమహంసస్య మానసిక స్నానం।

తురీయ అతీతస్య భస్మ స్నానం।
అవధూతస్య వాయువ్య స్నానం।
స్నాన నియమములు :
కుటీచక యతికి      : 3 వేళల స్నానం
బహుదక యతికి    : రెండు పూటల స్నానం
హంసకు       : రోజుకు ఒక్కసారే
పరమహంసకు   : మానసిక స్నానము
తురీయాతీతునికి   : భస్మస్నానము
అవధూతకు    : వాయువ్య స్నానము
చెప్పబడుతోంది.
ఊర్ధ్వపుండ్రం కుటీచకస్య।
త్రిపుండ్రం బహూదకస్య।
ఊర్ధ్వపుండ్రం త్రిపుండ్రం హంసస్య।
భస్మోద్ధూళనం పరమహంసస్య।
తురీయ అతీతస్య తిలకపుండ్రం।
అవధూతస్య న కించిత్।
పుండ్రము (నుదుటి నామము)
కటీచకునికి    : ఊర్ధ్వ పుండ్రము
బహూదకునికి   : త్రి-పుండ్రము
హంసకు     : ఊర్ధ్వపుండ్రము గాని, త్రిపుండ్రము గాని
పరమహంసకు     : భస్మలేపనము (ముఖముపై భస్మము పూసుకోవటము)
తరీయాతీతునికి   : తిలకముచే పుండ్రము చెప్పబడుతోంది
తురీయాతీత అవధూతయోః ఋతు క్షౌరం।
కుటీచకస్యర్తు ద్వయ క్షౌరం।
హంసస్య పరమహంసస్య న క్షౌరం।
అస్తిచేత్ అయన క్షౌరం।

తురీయాతీత అవధూతయోః - న క్షౌరం।
క్షౌరము గురించిన నియమము
తురీయాతీతునికి, అవధూతకు   : ప్రతి ఋతువులోను (రెండు నెలలకొకసారి)
కుటీచకునికి        : రెండు ఋతువులకు ఒకసారి (నాలుగు నెలలకు ఒకసారి)
హంస, పరమహంసలకు   : క్షౌరము లేదు. లేదా ఆయనకు ఉత్తర - దక్షిణ ఆయనములకు, ఆరు నెలలకు ఒకసారి) క్షౌర నియమముగా సూచించబడుతోంది.
తురీయాతీత అవధూతలకు క్షౌర నియమము లేదని కూడా చెప్పవచ్చు.
కుటీచకస్య ఏకాన్నం।
మధూకరం బహూదకస్య।
హంస పరమహంసయోః కరపాత్రం।
తురీయ అతీతస్య గోముఖం।
అవధూతస్య అజగరవృత్తిః।
భిక్షా నియమము
కుటీచకునికి      : ఒక ఇంటిలో అన్నము
బహూదకునికి     : మధూకరము (భిక్షచేసి అన్నము)
హంస, పరమహంసలకు : కరపాత్రము (చేతిలో పట్టినంత భిక్ష)
తురీయాతీతునికి    : గోముఖ భిక్ష (వెళ్లిన చోట లభించినది)
అవధూతకు       : అజగర వృత్తి (ఉన్నచోటే లభించునది)
శాటీద్వయం కుటీచకస్య।
బహూదకస్య ఏకశాటీ।
హంసస్య ఖండం దిగంబరం పరమహంసస్య।

ఏక కౌపీనం వా తురీయ అతీత
అవధూతయోః జాతరూపధరత్వం।
హంస పరమహంసయోః
అజినం నత్వని ఏషామ్।
శాటీ (దుప్పటి) వస్త్రము నియమము
కుటీచకునికి    : రెండు వస్త్రములు / శాటీలు
బహూదకునికి   : ఒక వస్త్రము
హంసకు     : వస్త్ర ఖండము (Piece of cloth)
పరమహంసకు    : దిగంబరము
తురీయాతీతునికి    : కౌపీనము (గోచి)
అవధూతకు : జాతరూప ధరత్వము (దిగంబరము)
చెప్పబడింది.
హంస, పరమహంసలు జింక చర్మము ధరించవచ్చును.
5. కుటీచక బహూదకయోః దేవ అర్చనం।
హంస పరమహంసయోః మానస అర్చనం।
తురీయ అతీత, అవధూతయోః - సో2హం భావనా।
అర్చన చేయు విధులు
కుటీచక, బహూదకులకు : దేవతార్చనము
హంస, పరమహంసలకు : మానసికార్చనము
తురీయాతీత, పరమ హంసలకు : సో2హం (అఖండాత్మయే నేను) అనునవి అర్చన విధానములని చెప్పబడుచున్నాయి.
కుటీచక బహూదకయోః మంత్ర జప అధికారో।

హంస పరమహంసయోః ధ్యాన అధికారః।
తురీయాతీత అవధూతయోః న తు అన్యాధికారః।
మంత్రజప, ధ్యాన అధికారములు
కుటీచక, బహూదకులు : మంత్రజపం నిర్వర్తించు అధికారముగలవారు.
హంస, పరమహంసలు : ధ్యానము చేయటానికి అధికారులు
తురీయాతీత, అవధూతలు : అనన్యమగు స్వస్వరూప ధారణకు అధికారులు.
వీరికి స్వస్వరూప అనుసంధానమునకు అధికారము.
కింతు తురీయాతీత అవధూతయోః
మహా వాక్య ఉపదేశ అధికారః, పరమహంసస్య అపి।

కుటీచక బహూదక హంసానాం
న అన్యస్య ఉపదేశ అధికారః।
ఇతరులకు ఉపదేశించు అధికారము
తురీయాతీతులకు, అవధూతలకు, పరమహంస యతీశ్వరులకు - ఇతరులకు ‘‘తత్త్వమ్’’ (అదియే నీవు) అను మహవాక్యార్థము బోధించటానికి అధికారము.
కుటీచక, బహూదక, హంసలకు - ఇతరులకు ‘‘సో2హమ్’’ ఉపదేశమునకు అధికారము లేదు.
కుటీచక బహూదకయోః మానుష ప్రణవో।
హంస పరమహంసయోః అంతర ప్రణవః।
తురీయ అతీత అవధూతయోః బ్రహ్మప్రణవః।
ప్రణవోపాసన విధులు
కుటీచక, బహూదకులకు : మానుష ప్రణవోపాసన.
హంస-పరమహంసలకు : అంతర ప్రణవోపాసన
తురీయాతీత-అవధూతలకు : బ్రహ్మ భావనయే ప్రణవము (బ్రహ్మప్రణవము)
కుటీచక బహూదకయోః శ్రవణం।
హంస పరమహంసయోః మననం।
తురీయాతీత అవధూతయోః నిదిధ్యాసః।
శ్రవణ - మనన - ధ్యానములు
కుటీచక, బహూదకులకు : శ్రవణము
హంస - పరమహంసలకు : మననము
తురీయాతీత - అవధూతలకు : నిదిధ్యాసనము (వినటము-అనుకోవటము-అనిపించటము)
సర్వేషాం ఆత్మా అనుసంధానవిధిః ఇతి
ఏవం ముముక్షుః।
సర్వదా సంసార తారకం అనుస్మరన్।
జీవన్‌ముక్తో వసేత్ అధికార
విశేషేణ కైవల్య ప్రాప్తి ఉపాయం
అన్విష్యేత్ యతిః।।
ఏకవాక్యం :
మముక్షువులందరికీ కూడా ‘‘మనోబుద్ధి చిత్త అహంకారములకు ఆవలదగు ఆత్మయే నేను’’ అనునదే శాస్త్రములు చెప్పుచున్న ఏకైక విధి. అట్టి ఆత్మతో అనుసంధానమే ఈ జీవుని తరింపజేయు అసలైన అంతిమ ఉపాయం. అట్టి ‘‘ఆత్మతో మమేకత్వము’’ అనే తారకము అనుస్మరించబడు గాక. అట్టివాడు క్రమంగా జీవన్ముక్తుడు కాగలడు. అధికార విశేషమును అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ‘‘కేవలమగు ఆత్మానుభవము’’ అనబడే కైవల్యమునకు యతి అయి అన్వేషించాలి. మోక్షమునకు ఉపాయములను ఆశ్రయించాలి.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘సప్తమ ఉపదేశః’’


అష్టమోపదేశః (8వ ఉపదేశము) - తురీయము

1. అథ హైనం (అథ హ ఏనం) భగవంతం
పరమేష్ఠినం నారదః పప్రచ్ఛ

సంసార తారకం ప్రసన్నో బ్రూహి ఇతి।
తథా ఇతి।
పరమేష్ఠీ వక్తుమ్ ఉపచక్రమే।
అప్పుడు నారద మహర్షి పరమేష్ఠి శ్రీ భగవానుని ఈ విధంగా అడిగారు.
నారద మహర్షి : హే పరమేష్ఠీ । ఈ జీవుని ‘సంసార’ము అనే జాడ్యము నుండి ఏది తరింపజేయగలదు ? అద్దాని గురించి మాపై ప్రసన్నులై విశదీకరించండి.
బ్రహ్మ భగవానుడు : ఓ నారద మహర్షీ, తదితర మునీంద్రులారా సరే! అట్లాగే వివరిస్తాను. శ్రద్ధగా వినండి (ఉపక్రమిస్తున్నాను. శ్రవణం చేయండి)
‘ఓం’ ఇతి। ‘బ్రహ్మ’ ఇతి। వ్యష్టి - సమిష్టి ప్రకారేణ।

కా వ్యష్టిః? కా సమష్టిః?

సంహార ప్రణవః సృష్టి ప్రణవః చ
అంతర్బహిశ్చ ఉభయాత్మకత్వాత్
త్రి (3) విధో
బ్రహ్మ భగవానుడు : ‘బ్రహ్మము’ అనే సర్వాత్మకము, సృష్టికి ఆది అగు ఒక తత్త్వము ఉన్నది. అది ‘ఓం’ అనే సంజ్ఞాక్షరముగా చెప్పబడుతోంది. అది వ్యష్టి - సమిష్టి చమత్కారము కలిగి ఉన్నది.

నారదుడు : ఈ వ్యష్టి ఎవరు ? సమష్టి అనగా ఏమి ? ఆ రెండింటి పరస్పర సంబంధము ఏమిటి ?

బ్రహ్మ భగవానుడు : ఆత్మయే ప్రణవము. అట్టి ప్రణవము మూడు విధములుగా ప్రదర్శనమౌతోంది.
1) సంహార ప్రణవము 2) సృష్టి ప్రణవము 3) అంతర బాహ్య ఉభయాత్మక ప్రణవము.
బ్రహ్మ ప్రణవః అంతః ప్రణవో। వ్యావహారిక ప్రణవో।
బాహ్యప్రణవ ఆర్ష ప్రణవ
ఉభయ ఆత్మకో, విరాట్ ప్రణవః।

సంహార ప్రణవో బ్రహ్మ ప్రణవో అర్ధమాత్ర ప్రణవః।

‘ఓం’ ఇతి బ్రహ్మా।
ఓం ఇతి ఏకాక్షర మంత్రః ప్రణవం విద్ధి।
ఇంకా కూడా అట్టి ప్రణవము 1) అంతఃప్రణవము, వ్యవహారిక ప్రవణవము, బాహ్య ప్రణవముగా ఉన్నది. ఉభయాత్మకమైనది. ఆర్షప్రణవము అదియే బాహ్యమున విరాట్ ప్రణవము.

అందులో సంహార ప్రణవము, బ్రహ్మ ప్రణవము ఈ రెండు అర్ధ మాత్ర ప్రణవ స్వరూపములు.

‘ఓం’ అనగా బ్రహ్మమే. ‘ఓం’ను ‘‘ఏకాక్షర మంత్ర ప్రణవము’’ అని గ్రహించబడు గాక.
స చ అష్టధా భిద్యతే।
‘అ’ కార, ‘ఉ’ కారో, ‘మ’కార అర్ధమాత్రా
నాద బిందు కలా శక్తిః - చ ఇతి।

తత్ర చత్వార ‘అ’కారశ్చ ఆయుతా అవయవాన్విత।
‘ఉ’కారః సహస్ర అవయవాన్వితో।
‘మ’కారః శత అవయవోపేతో।
అర్ధమాత్రా ప్రణవో అనంత అవయవ ఆకారః।

సగుణో విరాట్ ప్రణవః।
సంహారో నిర్గుణ ప్రణవ।
ఉభయ ఆత్మక ఉత్పత్తి ప్రణవో।
యథా ఫ్లుతో విరాట్ ఫ్లుతః।
ఫ్లుతః సంహారః విరాట్ ప్రణవః
షోడశ (16) మాత్రాత్మకః।
షట్ త్రింశత్ (36) తత్త్వాతీతః।
అట్టి ఏకము, అక్షరము అగు బ్రహ్మము ‘8’ రకములుగా విభాగ ప్రదర్శనము నిర్వర్తిస్తోంది. 1) ‘అ’కారము 2) ‘ఉ’కారము 3) ‘మ’కారము 4) అర్ధమాత్రము 5) నాదము 6) బిందువు 7) కల 8) శక్తి.

‘అ’కారము పదివేల అవయవములు కలిగి ఉన్నది.
ఉకారము వేయి అవయవములు కలిగి ఉన్నది.
‘మ’కారము నూరు (100) అవయవములు,
‘అర్ధమాత్ర’యో అనంతమైన అవయవ ఆకార సమన్వితము.

విరాట్ ప్రణవము - సగుణ బ్రహ్మము
సంహారము - నిర్గుణ బ్రహ్మము
ఉభయాత్మకము - ఉత్పత్తి
అంతమేర ఫ్లుతముగా ఉన్నది - ఫ్లుతో (Al occupying) బ్రహ్మము
సర్వత్రా విస్తరించియున్న విరాట్ బ్రహ్మము షోడశ మాత్రాత్మకము. 36 తత్త్వములకు ఆవల తత్త్వాతీతమై పరబ్రహ్మము వెలయుచున్నది.
2. నారద మహర్షి:
షోడశ మాత్రాత్మకత్వం కథం ఇతి ఉచ్యతే?

బ్రహ్మదేవ పరమేష్ఠి:
‘అ’కారః ప్రథమ।
‘ఉ’కారో ద్వితీయో। ‘మ’కారః తృతీయ।
‘‘అర్ధమాత్రః’’ చతుర్థో। ‘‘నాదః’’ పంచమీ।
బిందుః షష్ఠీ। కలా సప్తమీ। కలాతీత అష్టమీ।
శాంతిః నవమీ। శాంతి అతీతా దశమీ।
ఉన్మని ఏకాదశీ। మనోన్మనీ ద్వాదశీ।
వైఖరీ (పురీ) త్రయోదశీ। మధ్యమా చతుర్దశీ।
పశ్యంతీ పంచదశీ। పరా షోడశీ।
పునః చతుః షష్టి (64) మాత్రా,
ప్రకృతి పురుష ద్వైవిధ్యం ఆసాది అష్టావింశతి (128)।
ఉత్తర శతభేద మాత్రా స్వరూపమ్ ఆసాద్య
స గుణ నిర్గుణత్వం ఉప ఏతి,

ఏకో2పి ‘బ్రహ్మప్రణవః’।
నారద మహర్షి : ‘‘విరాట్ బ్రహ్మము షోడశ మాత్రాత్మకము (16 మాత్రలతో కూడినది)’’ అని అన్నారు కదా. అట్టి 16 మాత్రలు ఏవై ఉన్నాయో దయచేసి వివరించండి.

పితామహ భగవానుడు : వినండి 1) ‘అ’ కారము 2) ‘ఉ’కారము 3) ‘మ’కారము 4) అర్ధమాత్ర 5) నాదము 6) బిందువు 7) కలా 8) కలాతీతము 9) శాంతి 10) శాంతి అతీతము 11) ఉన్మని 12) మనోన్మనీ 13) వైఖరీ (పురీ) 14) మధ్యమా 15) పశ్యంతీ 16) పరా - ఇవి షోడశ (16) మాత్రలుగా వర్ణించి చెప్పబడుచున్నాయి. అది నీ ఆత్మయే. ఇవన్నీ స్థూల, సూక్ష్మ, బీజ, తురీయములలో 64 మాత్రలుగా (4x16) కలవు.
అది నీవే ! నీ యొక్క సహజ స్వస్వరూపమే.
ప్రకృతి - పురుషుడు వైవిధ్యముతో వేరుగా ఒక్కొక్క మాత్రకు రెండు విధములుగా (2x64) మాత్రలుగా
మొత్తము 128 భేదములతో నిండిన మాత్రా స్వరూపము పొంది సగుణ-నిర్గుణత్వము దాల్చుచున్నది.


బ్రహ్మ ప్రణవము ఏకమే అయి కూడా, పై తత్త్వములన్నీ దాల్చుచున్నది.
సర్వాధారః పరంజ్యోతిః ఏష సర్వ
ఈశ్వరో విదుః సర్వ దేవమయః
సర్వ ప్రపంచ ఆధార గర్భితః।।
అట్టి బ్రహ్మప్రణవము పరంజ్యోతి స్వరూపమై సమస్తమును వెలిగించుచున్నది. సమస్త ప్రపంచముగా విస్తరించి, సమస్తమునకు ఈశ్వర స్వరూపము అయి ఉంటోంది. సమస్తము తానే ఎరుక రూపంగా ఎరుగుచున్నది. సమస్త దేవతల తత్త్వములు తనవే అయి ఉన్నట్టిది. సమస్తమునకు ఆధారమై, సమస్తం తన గర్భమున కలిగి ఉన్నట్టిది.
3. సర్వాక్షరమయః కాలః।
సర్వ ఆగమ మయః శివః।
సర్వ శ్రుతి ఉక్తమో మృగ్యః
సకల ఉపనిషత్ మయః।

భూతం భవ్యం భవిష్యత్ యత్
త్రికాల ఉదితం అవ్యయమ్,
తత్ అపి ‘ఓం’కారం ఏవ అస్య
విద్ధి మోక్ష ప్రదాయకమ్।।
‘ఓం’కారాక్షర సంజ్ఞార్థమగు ‘‘బ్రహ్మము’’ (లేక) సమస్త జీవుల ‘‘పరస్వరూపము’’ ఎట్టిదో గ్రహించాలి. అట్టి స్వానుభవమే మహదాశయమగు గాక.
- ఏది సమస్త జీవుల అక్షర స్వరూపమో, కాలముచే క్షరము (Decay) పొందనిదో,
- సమస్తము యొక్క రాకపోకలు తనకు చెందినవే అయి ఉన్నదో,
- సర్వ శ్రుతులచే (వేదములచే) (మృగ్యమై) వెతకబడి - చెప్పబడినదో (ఉక్తము) అదియే పరబ్రహ్మము.


భూత వర్తమాన భవిష్యత్తులతో ఏది నిత్యోదితమై అవ్యయమై ఉన్నదో, అట్టి ‘ఓం’కారమే మోక్షప్రదాయకమని గమనించబడు గాక.
తదేవ ఆత్మానం ఇతి ఏతత్,
బ్రహ్మ శబ్దేన వర్ణితమ్।

తత్ ఏకం అమృతం అజరం
అనుభూయ తథ ‘ఓం’ ఇతి।।

స శరీరం సమ్ ఆరోప్య తన్మయత్వం తథ ‘ఓం’ ఇతి,
త్రి శరీరం స్వమ్ ఆత్మానం పరంబ్రహ్మ వినిశ్చిను।
అట్టి ‘ఓం’కార అక్షరమే ‘ఆత్మ’ శబ్దముతోను, ‘బ్రహ్మము’ అని కూడా వర్ణించబడుతోంది.

అట్టి (ఈ జీవుని సహజస్వరూపమగు) ఆత్మ - సర్వదా ఏకము, జరామరణరహితముగా ‘ఓం’ శబ్దార్థమై అనుభూతము అవగలదు. సహజమగు స్వస్వరూపమే అని తెలియబడగలదు.

‘‘ఆత్మకు స్థూల - సూక్ష్మ - కారణ శరీరములు ఆరోపితములు మాత్రమే’’ అని గ్రహించి మూడు శరీరములకు (దేహములకు), ఆత్మయే ‘దేహి’, అట్టి ‘దేహి’యే పరబ్రహ్మమని వినిశ్చయము కలిగి ఉండెదరు గాక.
పరంబ్రహ్మ అనుసందధ్యాత్
విశ్వాదీనాం క్రమః క్రమాత్
స్థూలత్వాత్ స్థూల భుక్త్వాత్ చ
సూక్ష్మత్వాత్ సూక్ష్మ భుక్ పరమ్।
జాగ్రత్ పురుషుడగు విశ్వునకు, స్వప్న పురుషుడగు తేజసునకు, సుషుప్తి పురుషుడగు ప్రాజ్ఞునకు ఆవల గల పరమ పురుషుడు (లేక) పరం బ్రహ్మమును గమనించి అనుసంధానము సిద్ధించుకొనెదరు గాక. అట్టి పరబ్రహ్మమే తన యొక్క స్థూల విశేషముచే స్థూలమును, సూక్ష్మ విశేషముచే సూక్ష్మమును స్వయం కల్పితంగా ఆస్వాదించుచు, సమస్తమునకు ‘పరము’ (Beyond) అయి ఉన్నది.
ఐక్యత్వ ఆనంద భోగాత్ చ
సో అయమ్ ఆత్మా చతుర్విధః।

చతుష్పాత్ జాగరితః స్థూలః
స్థూల ప్రజ్ఞో హి విశ్వభుక్।
ఈ రీతిగా ఆత్మయే జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములనే 4 విధముల దశలకు ఆధారమై ఏకస్వరూపముతో ఆనంద భోగము ఆస్వాదిస్తోంది.

ఆత్మ తన యొక్క నాలుగు పాదములలో ఒకటైన జాగ్రత్‌నందు స్థూలము గురించిన ఎరుక గలవాడై ‘‘విశ్వభుక్’’ విశ్వమును ఆస్వాదించువాడు అగుచున్నాడు.
4. ఏకోనవింశతి ముఖః
సాష్టాంగః సర్వగః ప్రభుః।

స్థూల భుక్ చతురాత్మా (4)
అథ విశ్వో వైశ్వానరః పుమాన్।

విశ్వజిత్ ప్రథమః పాదః
స్వప్న స్థానగతః ప్రభుః।
సూక్ష్మ ప్రజ్ఞః స్వతః అష్ట అంగ,
ఏకో న అన్యః పరంతప।
సూక్ష్మ భుక్ చతురాత్మ అథ తైజసో భూతః ఆడయమ్।
హిరణ్యగర్భః స్థూలో అంతః ద్వితీయః పాద ఉచ్యతే।
ఆత్మ పురుషుడగు వైశ్వానరాత్మకుడు 19 ముఖములు, 8 అంగములు కలిగి సర్వగతుడై ఉన్నారు.

అట్టి స్థూలభుక్ (స్థూలభోక్త) అగు వైశ్వానర పురుషుడు చతురాత్మ అయి వెలయచున్నారు.

1) జాగ్రత్ : ఆత్మ పురుషుని యొక్క మొదటి పాదము విశ్వజిత్ (విశ్వుడు), ఆత్మ యొక్క స్వప్న స్థానగతమై (ఆత్మకు కలవంటిదై) ఉన్నది. ఆత్మయే అష్టాంగములు ప్రదర్శిస్తూ ఏకమే అయి ఉన్నది. అన్నీ తానై, అనన్యమై వాటినన్నిటినీ తపింపజేయుచున్నది (స్థూలభుక్).
2) స్వప్నము : ఆత్మయే సూక్ష్మ భుక్ (సూక్ష్మానుభావి) భూత విరాట్ అయి, స్థూలము గర్భముగా ధరించినదై ఉన్నది. ఈ స్వప్న - తైజస పురుషాకారము ఆత్మ యొక్క రెండవ పాదము.
కామం కామయతే యావత్
అత్ర సుప్తో న కంచన,
స్వప్నం పశ్యతి న ఏవ అత్ర
తత్ ‘సుషుప్తం’ ఇతి స్ఫుటమ్।
ఏకీభూతః సుషుప్తస్థః
ప్రజ్ఞానఘనవాన్ సుఖీ।

నిత్య ఆనందమయో అపి ఆత్మా
సర్వ జీవ అంతర స్థితః।
తథా అపి ఆనంద భుక్
చేతో ముఖః సర్వగతో ‘అవ్యయః’।
చతురాత్మా, ఈశ్వరః ప్రాజ్ఞః
తృతీయః పాద సంజ్ఞితః।
3) సుషుప్తి : ఆత్మ పురుషుని మూడవ పాదము ఈ సుషుప్తి (విషయరహిత) పురుషాకారము. అట్టి సుషుప్తి పురుషాకార విన్యాసము సందర్భము ఎట్టిది ?
- కించిత్ కూడా దృశ్య సంబంధమైన కోరికలు కోరటము ఉండదు (జాగ్రత్ అనుభవము ఉండదు).
- ఊహ నిర్మితమైన స్వప్నము కూడా దర్శించబడదు. సుషుప్త పురుషాకారము ప్రదర్శిస్తూ ఉన్న ఆత్మ - సుషుప్తమునందు ఉన్నదై, అనేకమంతా త్యజించి, ‘ఏకీభూతము’అయి ఉంటుంది. కేవలమగు ప్రజ్ఞ (విషయరహితమగు తెలివి) మాత్రమే కలిగి ఉన్నది. ప్రజ్ఞానఘన (ఘనీభూతమైన ప్రజ్ఞ) సుఖము ఆస్వాదిస్తున్నది.

ఈ సుషుప్తి పురుషాకారుడు నిత్యానందమయుడై సమస్త జీవుల అంతరమున స్థితి కలిగి ఉన్నాడు.
‘4’ పాదములతో, 4 ముఖములతో సుషుప్తి పురుషుడు సర్వగతుడై (సమస్త స్వానుభవములయందు విస్తరించినవాడై) అవ్యయుడై (మార్పు-చేర్పులు లేనివాడై) నిర్విషయ ఏకాంతానందమును అనుభవించుచున్నాడు. చతురాత్మ స్వరూపుడై, జాగ్రత్ స్వప్నములలో తన ‘అనుభవము’ అనే విన్యాసమును విస్తరించు ఈశ్వర స్వరూపుడై, ఆత్మ పురుషుని మూడవ పాదముగా వెలుగొందుచున్నాడు.
ఏష సర్వేశ్వరః చ ఏష సర్వజ్ఞః సూక్ష్మ భావనః।
ఏషో అంతర్యాం। ఏష యోనిః।
సర్వస్య ప్రభవ అపి అయౌ।।
అట్టి ప్రాజ్ఞ పురుషుడే సమస్తమునకు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. జాగ్రత్-స్వప్నములకు యజమాని. సమస్తము (జాగ్రత్ స్వప్నముల స్వభావమంతా) ఎరిగి ఉన్నవాడు. సర్వజ్ఞుడు. సమస్త భావముల సూక్ష్మ స్వరూపుడు. తన సూక్ష్మత్వము నుండి సర్వభావనలు ప్రదర్శించువాడు. ఈ సుషుప్త పురుషుడే సమస్త జీవుల ‘అంతర్యామి’. ఆ రెండిటి జనన స్థానమగు యోని. అట్టి ఆత్మయే సర్వజీవుల ప్రభవ (జనన) స్థానము. మరియు, లయ స్థానము.
5. భూతానాం త్రయం అపి ఏతత్
సర్వోపరమ బాధకమ్।

తత్ సుషుప్తం హి యత్ స్వప్నం।
మాయా మాత్రం ప్రకీర్తితమ్।।

చతుర్థః చతురాత్మా అపి
సత్ చిత్ ఏకరసో అవ్యయమ్।

తురీయా వసితత్వాత్ చ ఏకైకత్వ అనుసారతః
జ్ఞాత అనుజ్ఞాత్ర సుజ్ఞత్వాత్ వికల్ప జ్ఞానసాధనమ్।
4) తురీయం : జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఒకదానికి మరిఒకటి బాధకములు (ఒకటి రెండవ దానిని తొలగించునవి) అయి ఉంటున్నాయి.

ఏ జాగ్రత్ నుండి స్వప్న సుషుప్తులు అనుభవమగుచున్నాయో, అవన్నీ కూడా మాయా మాత్రము (కల్పిత మాత్రము).

అవి దేనికి చెందినవై ప్రవర్తిస్తున్నాయో, అదియే 4వదగు తురీయము. అట్టి తురీయము సత్ (ఉనికి), చిత్ (ఎరుక)ల ఏకరస స్వరూపము. త్రి అవస్థల ఏక రససారము.

జాగ్రత్-స్వప్న-సుషుప్తి త్రీవస్థలలో కూడా 1) జ్ఞాత (తెలుసుకొనువాడు) 2) అనుజ్ఞాత్ర (తెలుసుకొనువానిని తెలుసుకొనువాడు) 3) సుజ్ఞాత (విచక్షణా జ్ఞాని) అనే మూడు వికల్పములు ఏర్పడినవై ఉంటున్నాయి. సుజ్ఞానము జ్ఞాన సాధనము అగుచున్నది.
వికల్ప త్రయం అత్ర అపి
సుషుప్తం స్వప్నమ్ అంతరమ్।
మాయామాత్రం విదిత్వ ఏవం
సత్ - చిత్ ఏకరసో హి అయమ్।

విభక్తో హి అయం ఆదేశో
న స్థూల ప్రజ్ఞం అన్వహమ్।
న సూక్ష్మ ప్రజ్ఞం అత్యంతం న।
ప్రజ్ఞం న క్వచిత్, మునే।

న ఏవ అప్రజ్ఞం। న ఉభయతః ప్రజ్ఞం।
న ప్రజ్ఞం అంతరమ్।
న అప్రజ్ఞం అపి ప్రజ్ఞానఘనం చ అదృష్టం ఏవ చ।
ఈ విధంగా జాగ్రత్, స్వప్నములు ఆత్మ యొక్క వికల్పములే. అవి సుషుప్తిలో ఏకత్వము పొందుచున్నాయి. అవన్నీ మాయా మాత్రమేనని గమనించబడు గాక. అట్టి జాగ్రత్-స్వప్న-సుషుప్తులు తనవైయున్న తురీయమో? సత్‌చిత్ ఏక స్వరూపమైయున్నది.

ఓ మునీశ్వరా! తురీయమై జాగ్రత్ - స్వప్న-సుషుప్తులుగా ప్రదర్శనమగుచూ ఉన్నప్పటికీ, తురీయము సర్వదా యథాతథము. అట్టి తురీయము - జాగ్రత్‌లోని ‘స్థూలప్రజ్ఞ’ కాదు. స్వప్నములోని ‘సూక్ష్మప్రజ్ఞ’ కాదు. సుషుప్తిలోని అత్యంత (కేవల) ప్రజ్ఞ కూడా కాదు.

తురీయము అప్రజ్ఞ కూడా కాదు. ప్రజ్ఞ-అప్రజ్ఞల రూపము కాదు. ప్రజ్ఞ అద్దానికి వేరైనదీ కాదు.
తురీయరూపమగు ఆత్మ - అప్రజ్ఞ అయినప్పటికీ, అదృష్టమగు ప్రజ్ఞాన ఘనీభూత రూపము ఆత్మ రూపమే.
తత్ అలక్షణం అగ్రాహ్యం అవ్యవహార్యం అచింత్యం।


అవ్యపదేశ్యం। ఏకాత్మ ప్రత్యయసారం।

ప్రపంచ ఉపశమం। శివం। శాంతం। అద్వైతం।
ఆత్మ లక్షణములన్నిటికీ విలక్షణము. లక్షణరహితము (Qualities cannot be attributed). ఎట్టి వ్యవహారములకు విషయము కాదు. చింతనకు విషయము కాదు.

ఉపదేశించగలిగినది కాదు. అనేక ఆత్మలుగా కనిపిస్తూ ఈ సమస్తములో ఏకాత్మకమై ఉన్నది. శబ్దములతో చెప్పబడజాలదు. కేవలాత్మసారము అవటం చేత ‘ప్రత్యయసారము’.

ప్రపంచమంతా జనించి, చరించి, లయించు స్వస్వరూప స్థానము. సుఖప్రదమగు శివస్వరూపము. పరమ శాంతరూపము. జీవాత్మ-జగత్తులకు ద్వితీయము కాదు, కాబట్టి అద్వితీయము.
చతుర్థం మన్యంతే।
స బ్రహ్మప్రణవః।
స విజ్ఞేయో - న అపరః తురీయః।
సర్వత్ర భానువత్।
ముముక్షాణాం ఆధారః।
జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిది కాబట్టి చతుర్థము (4వది) అనబడుతోంది.
అట్టి ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపమే బ్రహ్మ ప్రణవము.
అట్టి తురీయమగు ఆత్మ గురించి ‘‘తురీయమునకు వేరుగా, ఎక్కడా-ఏదీ లేదు’’ అని తెలుసుకోబడుగాక.
అదియే సర్వత్రా సూర్యకాంతివలె ప్రకాశమానమై ఉన్నది.
అట్టి తురీయాత్మయే ముముక్షువులందరికి ఆధారమై ఉన్నట్టిది.
స్వయం జ్యోతిః బ్రహ్మ ఆకాశః
సర్వదా విరాజతే ‘‘పరంబ్రహ్మత్వాత్’’।
అట్టి తురీయము పరబ్రహ్మమే స్వాభావిక-సహజ స్వరూపమై యున్నది. బ్రహ్మకాశమున ఆకాశంలో సూర్యునివలె విరాజమానమై ఉన్నది.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘అష్టమ ఉపదేశః’’


నవమోపదేశః (9వ ఉపదేశము) - ఆత్మ యొక్క మహిమ

1.అథ పరబ్రహ్మ స్వరూపం కథం ఇతి? నారదః పప్రచ్ఛ

తగ్ం హ ఉవాచ పితామహః :
కిం (పర) బ్రహ్మ స్వరూపం ఇతి
‘‘అన్యో అసావన్యో అహం అస్మి’’ ఇతి-యే విదుః,
తే పశవో। న స్వభావ పశవః

తం ఏవం జ్ఞాత్వా విద్వాన్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే।
న అన్యః పంథా విద్యతే అయనాయ।
నారద మహర్షి : మహాత్మా, పితామహదేవ, పరబ్రహ్మస్వరూపము ఎట్టిదై ఉన్నది ? అది ఉన్నదెక్కడ ?

పితామహుడు (బ్రహ్మ భగవానుడు) : ఓ నారద ! పరబ్రహ్మము గురించి ఎట్టిదో తెలుసుకోవాలి. అది ఎప్పుడో ఎక్కడో ఉన్నట్టిది అని ఎంత తలుస్తాడో, అట్టివాడు పశువుతో సమానుడే. నా యొక్క భావించువాని రూపమే పరబ్రహ్మము అని ఎరుగుటచే ఇక ఆతడు పశువు అయి ఉండడు.

సమస్తమునకు పరమై, జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కూడా ‘‘సాక్షి’’ ‘‘స్థానము’’ అయి ఉన్న ఆత్మ గురించి తెలుసుకున్నవాడు జన్మ - మరణ పరిధుల నుండి విముక్తి పొందుచున్నాడు.
‘ముక్తి’ లేక ‘మోక్షము’నకు ఆత్మజ్ఞానము తప్పితే వేరు త్రోవయే లేదు.
కాలః, స్వభావో నియతిః,
యదృచ్ఛా, భూతాని, యోనిః,
‘పురుష’ ఇతి చింత్యమ్।
సంయోగ ఏషాం న తు ఆత్మభావాత్।


ఆత్మా హి అనీశః సుఖ దుఃఖ హేతోః।
ఆత్మ యొక్క ‘భావన’యే ఈ జగత్తు అనబడు దానికి కారణము. అఖండము, నిత్యము, అప్రమేయము అగు ఆత్మయే తన కల్పనయందు ‘జగత్తు’ అనబడేది కల్పించుకొంటోంది. అంతేగాని, ఈ జగత్తుకు కారణము కాలముగాని, స్వభావముగాని, నియతి గాని, యాదృచ్ఛము (Accidental) గాని, పంచభూతములుగాని, స్త్రీ గర్భముగాని, పురుషుడు గాని, స్త్రీ-పురుషుల సంయోగముగాని కాదు. స్త్రీ-పురుషులు ఈ జగత్తును నియమించటము లేదు.

ఆత్మయే సుఖదుఃఖములకు హేతువు (One’s own self is the main cause by virtue of its attributions).
తే ధ్యాన యోగా అనుగతా అపశ్యన్
దేవ ఆత్మ శక్తిం స్వ గుణైః నిగూఢామ్।
‘‘దివ్యమగు ఆత్మశక్తి యొక్క విశేష రహస్య రూపమగు స్వకీయ గుణముల నుండి ఈ ‘జగత్తు’ ఏర్పడినదై ఉంటోంది’’. అను రూపముగల ఆత్మ యొక్క ఔన్నత్యమును ధ్యానయోగము చేతనే మహనీయులచే దర్శించబడుతోంది.
యః కారణాని నిఖిలాని,
తాని కాలాత్మ యుక్తాని అధి తిష్ఠతి।
ఏకః తం ఏకస్మిన్ త్రి వృతం, షోడశ అంతం,
శత అర్థారం వింశతి ప్రత్యరాభిః,
అష్టకైః షడ్భిః విశ్వరూప ఏకపాశం
త్రిమార్గ భేదం ద్వి నిమిత్త ఏక మోహమ్।
బ్రహ్మము యొక్క (ఆత్మ యొక్క) త్రిగుణాత్మక శక్తియే సమస్తమునకు కారణము. కాలము కూడా కాలాత్మశక్తి నుండియే ప్రదర్శనమౌతోంది. ఏకమగు ఆత్మ శక్తి నుండి ఏకత్వము వీడకనే బండి చక్రములోని ఆకులవలె త్రివృతములు ఏర్పడుచున్నాయి.
త్రిగుణములు, 16 వికారములు ‘50’భేదరూపములగు ఆకులు, వాటిని పోషించు ‘20’ కీలకములు, అష్ట (8) విశేషములతో కూడిన విశ్వరూపము, వాటినన్నిటినీ కలుపుచున్న ఏకపాశము, త్రిమార్గ భేదముల నిమిత్త కారణములు. రెండు నిమిత్త - ఉపాదానములు ఏకమోహము (సృష్టి అనే బండి చక్రము) కలిగి ఉన్నది. (కారణ బ్రహ్మ చక్రములో పంచ (5) భూతములు, దశ (10) ఇంద్రియములు, అంతఃకరణము, ఆరు (6) అష్టకములు ఉన్నాయి).
2. పంచస్రోతో అంబుం పంచయోని
ఉగ్ర వక్రాం, పంచ ప్రాణ ఊర్మిం,
పంచబుద్ధి ఆది మూలామ్, పంచ ఆవర్తాం
పంచ దుఃఖౌషు వేగాం పంచాశత్
భేదాం పంచ పర్వామధీమః।
ఈ సంసారము అనే సాగరము (లేక) నదీజలము
❇︎ ఉగ్రమైన మెలికలు గల పంచయోనులు (శబ్ద స్పర్శ రూప రస గంధములనే పంచతన్మాత్రలు).
❇︎ పంచప్రాణములనే అలలు.
❇︎ పంచబుద్ధి మూలములు - పంచ జ్ఞానేంద్రియములు (చెవులు, చర్మము, కళ్లు, నాలుక, ముక్కు)
❇︎ పంచ విషయములనే ఆవర్తములు (సుడి గుండములు).
❇︎ పంచ దుఃఖములు అనే ప్రవాహ వేగములు కలది.
❇︎ 50 భేదములు కలది.
❇︎ పంచ క్లేశములతో మధ్య భాగము కలది.
- అయి ఉంటోంది.
సర్వాజీవే సర్వ సంస్థే బృహంతే
తస్మిన్ హంసః అహ్రామ్యతే బ్రహ్మచక్రే
ఈ జీవుడు తనను అఖండాత్మ నుండి వేరు అయినట్లు భావిస్తూ సర్వుల జీవరూపము, సర్వమునకు జనన లయస్థానము, సువిశాలము అగు బ్రహ్మచక్రమునందు భ్రమలతో కూడి తిరుగాడుచున్నాడు. జనన-మరణ చక్రములో చిక్కి తిరుగాడుచున్నాడు.
పృథక్ ఆత్మానం ప్రేరితారం చ మత్వా
జుష్టః తతః, తేన అమృతత్వం ఏతి।

ఉద్గీథం ఏతత్ పరమం తు బ్రహ్మా
తస్మిన్ త్రయం స్వ ప్రతిష్ఠ అక్షరం చ,


అత్ర అంతరం వేదవిదో విదిత్వా
లీనా బ్రహ్మణి పరే తత్ పరాయణాః।।
ఎప్పుడైతే ఈ జీవుడు ‘‘ఈ సమస్తమునకు వేరై (పరమై) యున్న ప్రేరణ రూపమగు అఖండాత్మను’’ అని ఎరుగుచున్నాడో అప్పుడిక అమృతత్వము సిద్ధించుకుంటున్నాడు.

అట్టి ఉద్గీథము (ప్రణవ) అక్షర పరబ్రహ్మమును తెలుసుకోవాలి. త్రి-మహావాక్యములు 1) సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఈ జగత్తుగా కనిపిస్తున్నది బ్రహ్మమే 2) తత్త్వమ్ - అదే నీవు అను రూపంగా కనిపిస్తున్నది. తత్ బ్రహ్మమే 3) సో2హమ్ - నేను సర్వదా ఆ బ్రహ్మమే అయి ఉన్నాను. మహా వాక్యములను ఉపాసించాలి. ముముక్షువు ఆ అక్షరమునందు స్వయముగా ప్రతిష్ఠితుడగుచున్నాడు.

వేదవిదుని (తెలియబడేదానిని తెలుసుకొంటున్న అతనిని) తెలుసుకొని ఉపాసించి బ్రహ్మమమునందు లీనమగుచున్నాడు.
3. సంయుక్తం ఏతత్ క్షరం, అక్షరం చ
వ్యక్త, అవ్యక్తం భరతే విశ్వం ఈశః,
అనీశః చ ఆత్మా బధ్యతే భోక్తృభావాత్
జ్ఞాత్వాత్ ఏవం ముచ్యతే సర్వపాశైః।।
జీవ - ఈశ్వర సమాగమము (పొందిక)
1) జీవుడు 2) ఈశ్వరుడు. ఈ రెండింటి యొక్క కలయిక ఇక్కడే ఏర్పడి ఉంటోంది.

1) క్షరము (నశించు / మార్పు చెందు స్వభావము గల జీవుడు).
2) అక్షరము (సర్వదా యథాతథమై నశించని స్వభావము గల ఈశ్వరుడు.
మరియు
1) వ్యక్తీకరణము అయిన జీవుడు,
2) వ్యక్తీకరణమునకు ఆధారమైయుండి, తాను వ్యక్తీకరణముకాని అవ్యక్తుడగు ఈశ్వరుడు.

జీవుడు భోక్తృభావముతో బద్ధుడై ఉంటున్నాడు. ఈశ్వరుడో? దేనికీ బద్ధుడుకాక, నిత్యముక్తుడై ఉంటున్నాడు. అట్టి అనీశ్వర - ఈశ్వర కలయిక తానే అనే చమత్కారమును ఎరిగినవాడు, సమస్త సంసార దోషముల నుండి విముక్తుడు కాగలడు.
జ్ఞ - అజ్ఞౌ ద్వౌః అజౌ ఈశ అనీశౌ
అజా హి ఏకా భోక్తృ-భోగార్థ యుక్తా

అనంతశ్చ ఆత్మా విశ్వరూపో హి అకర్తా,
త్రయం యదా విందతే బ్రహ్మం ఏతత్।।
ఈశ్వరుడు : సర్వజ్ఞుడు (ఈ దేహములు వాటి రాకపోకలు, సంగతి సందర్భములు ఎరిగియున్నవాడు), సందర్భములకు ఆవలివాడు.
అనీశ్వరుడు (జీవుడు) : కించిజ్ఞుడు, వర్తమాన ఉపాధికి మాత్రమే తన ఎరుక (knowing) ను పరిమితము చేసుకొన్నవాడు. సందర్భములకు పరిమితుడు.

జంట అగు ఈ ఇరువురు జన్మరహితులే. జన్మరహితులై భోక్తృత్వ భోగార్థయుక్తులై ఉంటున్నారు. ఇక ఆత్మయో? అనంతమై, ఈ సమస్త విశ్వము తన రూపమై దేనికీ కర్త కాక, ‘అకర్త’ అయి వెలుగొందుచున్నది.

అట్టి 1) కర్త - ఈశ్వరుడు 2) భోక్త - జీవుడు 3) అకర్త - ఆత్మ. ఈ మూడింటి విభాగము తనయందు ఎరిగినవాడు బ్రహ్మమే తానగుచున్నాడు.
క్షరం, ప్రధానం అమృత అక్షరం హరః
క్షరాత్మనావ ఈశతేత్ ఏవ ఏకః।

తత్ అభి ధ్యానాత్ యో జనాత్ తత్త్వ భావాత్,
భూయః చ అంతే విశ్వమాయా నివృత్తిః।।
ఇక్కడ కనబడేదంతా క్షరము (దృశ్యము). మరి ఆవలివాడు? అమృతుడు, అక్షరుడు. హరుడు. క్షరమును హరించువాడు. అట్టి అక్షరుడగు శివుడే క్షరమగు సమస్తముగా విస్తరించి ఈశ్వరుడుగా ఉన్నారు.

ఏ జనుడైతే ‘‘నాకు కనబడేదంతా పరమాత్మ స్వరూపమే’’ అను తత్త్వభావమును ఉపాసిస్తాడో, అట్టివాడు ఈ సమస్తమునకు కారణమగు పరమాత్మకు చెందిన ‘విశ్వమాయ’ నుండి విముక్తుడు అగుచున్నాడు.
జ్ఞాత్వాత్ ఏవం ముచ్యతే సర్వ పాశైః।
క్షీణైః క్లేశైః జన్మ మృత్యు ప్రహాణిః।।
ఈ విధంగా
‘‘i) 1) క్షరము 2) అక్షరము 3) కేవలము
ii) 1) వ్యక్తము 2) అవ్యక్తము 3) సాక్షి
iii) 1) కర్త 2) భోక్త 3) అకర్త ఆత్మ ప్రకాశము
iv) 1) జగత్తు 2) అనుభవి 3) సర్వాత్మకుడు,
ఈ త్రయీ విశేషములన్నీ కూడా పరమాత్మను, అవ్యయుడను ఏకస్వరూపుడను అగు నేనే’’

అని తెలుసుకొని ఈ జీవుడు సమస్త పాశముల నుండి వృద్ధి - క్షీణ, జన్మ-మృత్యు ప్రహారముల నుండి విడివడగలడు. సర్వక్లేశములు (All worries) జయించివేయగలడు.
తస్య అభిధ్యానాత్ తృతీయం
దేహ భేదే విశ్వ ఐశ్వర్యం ఆత్మకామః।।
అట్టి ఆత్మకాముడు జీవ-ఈశ్వర ద్వంద్వములకు ఆవలది, మూడవది అగు స్వస్వరూపమును, దేహమునకు ఆవలది అగు ‘దేహి’ స్వరూపముగా ఎరిగి ఈ విశ్వమంతా తన ‘ఐశ్వర్యము’గా ఆస్వాదించుచున్నాడు.
4. ఏతత్ జ్ఞేయం నిత్యం ఏవ ఆత్మసంస్థం,
న అతః పరం వేదితవ్యం హి కించిత్।


భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా
సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మం ఏతత్।

ఆత్మ విద్యా తపోమూలం
తత్ బ్రహ్మ ఉపనిషత్ పరమ్।
అట్టి సమస్త జీవుల స్వస్వరూపాత్మయే అయి ఉన్న పరబ్రహ్మ తత్త్వము యొక్క నిత్యత్వమును ఎరిగి, మనోబుద్ధులను అట్టి నిత్యాత్మయందు నిలుపువానికి ఇక అంతకుమించి ఎరుగవలసినది ఏదీ కొంచము కూడా శేషించదు (మిగలదు).

1) భోక్త అగు జీవుడు 2) భోగించబడు వస్తువు (భోగ్యము) 3) ప్రేరకుడు అగు ఈశ్వరుడు ఈ మూడు రూపములుగాను, ఈ విశ్వము రూపముగాను ఉన్న బ్రహ్మమే మనమంతా తెలుసుకోవలసినది, మమేకమవలసినది కూడా సుమా.

తపస్సు చేతనే ‘‘తత్ పదము’’ అగు బ్రహ్మము యొక్క సామీప్యత పొందుట అనే ఆత్మవిద్య లభిస్తోంది.
య ఏవం విదిత్వా, ‘స్వరూపం’
ఏవం అనుచింతయన్।
తత్ర కో మోహః? కః శోకః?
ఏకత్వం అనుపశ్యతః।

తస్మాత్ విరాట్ భూతం భవ్యం భవిష్యత్ భవతి
అనశ్వర స్వరూపమ్।
ఎవ్వడైతే ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ యొక్క స్వరూపమును ఎల్లప్పుడు చింతన చేస్తూ ఉంటాడో, అట్టి వానిని ఏది మోహింపజేయగలదు ? ఏది దుఃఖము కలిగించగలదు ? అట్టి వాడు సర్వదా సర్వత్రా ఏకత్వము, మమేకత్వము దర్శించి ఆస్వాదించగలడు. ఏకత్వం అనుపశ్యతః.

ఆ ఆత్మ భగవానుడే - భూత, వర్తమాన, భవిష్యత్ (In the Past, Present and future) త్రికాలములలో (అనశ్వర స్వరూపంతో సహా) సమస్తము అయి ఉంటున్నారు.
అణోః అణీయాన్,
మహతో మహీయాన్,
ఆత్మస్య జంతోః నిహితో గుహాయామ్

తం అక్రతుః పశ్యతి వీతశోకో ధాతుః
ప్రసాదాత్ మహిమానం ఈశమ్।
ప్రతి ఒక్క జీవుని సహజ - స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ ఎట్టిదని చెప్పుకోగలం ?
- అణువుకంటే ఎంతో సూక్ష్మము.
- మహత్తరమై పెద్ద (స్థూల) వస్తువుల కంటే కూడా మహత్తరమైనది (పెద్దది).
అట్టి ఆత్మ సమస్త జీవుల హృదయగుహలలో వేంచేసినదై ఉన్నది.

అట్టి ఆత్మేశ్వరుని స్వరూపము బంధరహితమై ఉన్నది. ఎవ్వడు బుద్ధిని శోకరహితంగా (Desireless for anything external) దైవీ సంపత్తితో పవిత్రము చేసుకుంటాడో అట్టివాడు ఆత్మయొక్క మహిమను (ఔన్నత్యమును), సమస్తముగా ఈశ్వరత్వమును తనయందే దర్శించగలడు. దర్శించి శోకరహితుడు కాగలడు.
అపాణిపాదో జవనో గ్రహీతా।
పశ్యతి అచక్షుః।
సశృణోతి అకర్ణః।

స వేత్తి వేద్యం। న చ తస్య అస్తి।
వేత్తా తం ఆహుః
అగ్ర్యం పురుషం మహాంతమ్।।
అట్టి ఆత్మకు చేతులు, కాళ్లు లేవు. కానీ సర్వమును గ్రహిస్తున్నది. ఆత్మ కళ్లు లేకుండానే సమస్తమును దర్శించుచున్నది. చెవులు లేవు గాని, సమస్తము ఆత్మయే వినుచున్నది.

అట్టి ఆత్మను తెలుసుకొనువాడు మరొకడు ఎవ్వడు లేడు. ఎందుకంటే ఆ తెలుసుకొనుచున్న వాడు ఆత్మస్వరూపుడే కాబట్టి. అట్టి ఆత్మను తెలుసుకొన్న ఆత్మవేత్తలు (ఆత్మతత్త్వ జ్ఞానులు) అది సమస్తముకు అగ్రము (The highest) గా స్థితి కలిగి ఉన్నదని, సమస్తము అద్దాని పురుషకారమే కాబట్టి ‘‘మహంతమ్ పురుషమ్’’ అని ఎలుగెత్తి గానము చేయుచున్నారు.
5. అశరీరం, శరీరేషు అనవస్థేషు అవస్థితమ్।
మహాంతం విభుం ఆత్మానం
మత్వా ధీరః న శోచతి।


సర్వస్య ధాతారం, అచింత్య శక్తిం
సర్వ ఆగమ అంత అర్థ విశేష వేద్యమ్।
నిర్మలము, సునిశితము, విస్తారము అగు బుద్ధిని సంపాదించుకొన్న ధీరులు అట్టి స్వస్వరూపాత్మను
- అశరీరము (శరీరము లేనిది) అని,
- ‘ఇక్కడ ఉన్నది’ అనునది లేనప్పటికీ అనిత్యమగు సమస్త శరీరములలో శాశ్వతమై వెలయుచున్నదని,
- సమస్తముగా ప్రదర్శనమగుచు మహోన్నతమై వెలయుచున్నదని
- సమస్తమునకు విభుడు (The king) అని తెలుసుకొని ఇక దేనికీ శోకము పొందనివారై ఉంటున్నారు.

సర్వమునకు సృష్టికర్త అగు ‘ధాత’ ఆ పరమాత్మయే. ఆయన చింతనకు (బుద్ధికి) అందని శక్తిస్వరూపుడు, సర్వవేదముల సారము. అంతరార్థమును గ్రహించి ఆయన యొక్క విశేషత్వము తెలుసుకొనువాడు ధన్యుడు.
పరాత్ పరం పరమం వేదితవ్యం
సర్వ అవసానే సకృత్ వేదితవ్యమ్।


కవిం। పురాణం। పురుషోత్తమోత్తమం।
సర్వేశ్వరం। సర్వ దేవైః ఉపాస్యమ్।

ఆ ఆత్మ పురుషుడు ఈ జీవుని పరస్వరూపమునకే పరమైనవాడు. సమస్త పరస్వరూపములు తానైనవాడు. సమస్తమునకు ఆవలివాడు. ఆయననే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి.

ఆ ఆత్మ భగవానుడు సర్వశ్రేష్ఠుడు. ఈ లోకములన్నిటి యొక్క రచయిత. మొదలే ఏర్పడి ఉన్న పురాణ పురుషుడు. సమస్త జీవులలో ఉత్తమ పురుష (The first person) గా ఉన్న పురుషోత్తముడు. సమస్తముగా తానే విస్తరించి ఉన్నవాడు, కాబట్టి సర్వేశ్వరుడు సమస్త దేవతలచే ఉపాసించబడువాడు. సమస్త దేవతారూపములుగా ఉపాసించబడువాడు కూడా.
అనాది మధ్య అంతం। అనంతం।
అవ్యయం। శివ। అచ్యుత।
అంభోరుహ గర్భ భూరుహమ్।

స్వేన ఆవృతం సర్వం ఇదం ప్రపంచం
పంచ ఆత్మకం పంచసు వర్తమానమ్।
అట్టి ఆత్మ దేవాది దేవుడు ఆది-మధ్య-అంతము లేనివాడు, అనంతుడు.
వ్యయము (Spend out) అనే ధర్మము లేని అవ్యయుడు.
తన అనంతత్వము ఏక్షణములోను వీడనట్టి అచ్యుతుడు. చ్యుతియే లేనివాడు (He never displaces from what he is ever). బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సృష్టి స్థితి లయ స్వరూపుడు కూడా.

పంచాత్మకము (దృశ్యాత్మకం, దేహాత్మకం, ఇంద్రియాత్మకం, ద్రష్టాత్మకం, సర్వాత్మకం) అయినవాడు. పాంచభౌతికము అయిన ఈ ప్రపంచమంతటికి తన స్వరూపముచేత ఆక్రమించుకొని ఉన్నవాడు.
పంచీకృత అనంత భవ ప్రపంచం।
పంచీకృత స్వ అవయవైః అసంవృతమ్।

పరాత్పరం యత్ మహతః మహాంతం
స్వరూప తేజోమయ శాశ్వతం శివమ్।।
ఈ పంచీకృత అనంత ప్రపంచంగా కనిపిస్తున్నది ఆత్మయే. దేనినీ చుట్టుకొని ఉండనిది (అసంవృత్తము). అయినప్పటికీ పంచీకృతమైనదంతా తన యొక్క అవయవ విశేషముగా కలిగి ఉన్నట్టిది.

ఆత్మ పరాత్పరము, మహామహిమాన్వితము.
తేజోమయమైన స్వరూపము. శాశ్వతమైనది. సర్వదా శుభప్రదమైనది. సుఖప్రదమైనది.
6. న అవిరతో దుఃచరితాన్,
న అశాంతో, న అసమాహితః,
న అశాంత మానసః వా అపి
ప్రజ్ఞానేన ఏన ఆప్నుయాత్।
అట్టి స్వస్వరూపమగు ఆత్మ జీవులందరికీ అత్యంత సమీపమైనట్టిది అయి ఉండి కూడా, అనేకులకు స్వ-అనుభవముగా సిద్ధించటమే లేదు. ఎందుచేత ? ఎవరైతే దుష్ట ప్రవర్తనల నుండి విరమించరో, ‘శాంతము’గా ఉండటమును అభ్యాసము చేసుకోరో, సర్వత్రా సమదృష్టిని ఆశ్రయించరో, అశాంతితో కూడిన మననము రూపమగు మనస్సును నిరోధించరో, అట్టివారు శాస్త్ర ప్రజ్ఞావంతులు అయి ఉండి కూడా ‘‘అఖండాత్మ భావన’ను సిద్ధించుకోలేరు.
న అంతః ప్రజ్ఞం। న బహిః ప్రజ్ఞం।
న స్థూలం। న అస్థూలం। న జ్ఞానం।
న అజ్ఞానం। న ఉభయతః ప్రజ్ఞం।
అగ్రాహ్యం। అవ్యవహార్యం।
స్వ అంతః స్థితం స్వయం ఏవ ఇతి।
య ఏవం వేద, స ముక్తో భవతి।
స ముక్తః భవతి।

ఇతి ఆహ భగవాన్ పితామహః।
ఆత్మ గురించిన మరికొన్ని
‘‘న-ఇతి’’ రూప వర్ణనలు చెప్పుచున్నాను వినండి.
✤ ఆత్మ - అంతఃప్రజ్ఞ (మనోబుద్ధి చిత్త అహంకార రూపము) కాదు.
✤ బాహ్య ప్రజ్ఞ (బాహ్య ప్రాపంచక దృశ్య విశేషముల గురించిన తెలివితేటలు) కాదు.
✤ స్థూలము కాదు. అస్థూలము (సూక్ష్మము) కాదు.
✤ జ్ఞానము కాదు. అజ్ఞానము కాదు.
✤ జ్ఞాన - అజ్ఞాన ఉభయ ప్రజ్ఞ కాదు. అది గ్రహించబడేదేదీ కాదు (గ్రహిస్తూ ఉన్నదే అది కాబట్టి).
✤ ఏదో వ్యవహార సాధనా సంబంధమైనది కాదు. అట్టి ప్రతి ఒక్క జీవుని స్వ-అంతరంగమునందే స్థితి కలిగి ఉన్నట్టిది. ఈ జీవుని స్వస్వరూపమే అది.
ఎవడు ఆత్మ గురించి ఈ విధంగా తెలుసుకుంటాడో అట్టివాడు ముక్తుడు అగుచున్నాడు అని పితామహ భగవానుడు చెప్పెను.
స్వస్వరూపజ్ఞః పరివ్రాట్।
పరివ్రాట్ ఏకాకీ చరతి।
భయత్రస్త సారంగ ఇత తిష్ఠతి।


గమన విరోధం న కరోతి।
స్వ శరీర వ్యతిరిక్తం సర్వం త్యక్త్వా
షట్ పద వృత్త్యా స్థిత్వా,
స్వరూప అనుసంధానం కుర్వన్,

సర్వం అనన్య బుద్ధ్యా
స్వస్మిన్ ఏవ ముక్తో భవతి।
పరివ్రాట్ (పరివ్రాజకుడు) తన యొక్క, తదితర సమస్త జీవుల యొక్క ‘స్వస్వరూపము’ ఎరిగి అనువర్తిస్తున్నాడు. వాస్తవ స్వరూప - స్వభావములు ఎరిగినవాడై, భయము పొందిన జింకలాగా ఈ జగత్తులో ఒక చోట నిలువక ఏకాకి అయి సంచారములు చేస్తూ ఉంటాడు. (దేనికీ సంబంధించక, ఏదీ తనకు సంబంధించనివాడై, దిగులు లేనివాడై, ప్రశాంత ఆనందములతో చరిస్తూ ఉంటున్నాడు).

ఎక్కడా ఒకచోట నిలువక గమనము ఆపనివాడై ఉంటారు.
తన యొక్క ఆత్మ దేహము తప్ప ఇక తదితరము అయినదంతా (వేరైనదంతా) త్యజించినవాడై, షట్పదవృత్తి (తుమ్మెద యొక్క) సంచారము వలె (తుమ్మెద పూరసము స్వీకరించునట్లు) సమస్త అనుభవములలో ఆత్మతత్త్వము మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు.
స్వస్వరూపమును సర్వాత్మకంగా అనుసంధానము చేయుచున్నవాడై ఉంటాడు.

అనన్యభావముతో (నేనే ఇదంతా అయి ఉన్నాను - అను భావనతో) దర్శించువాడు సర్వదా ముక్తుడే అగుచున్నాడు
స పరివ్రాట్ సర్వ క్రియాకారక
నివర్తకో। గురుశిష్య శాస్త్రాది
వినిర్ముక్తః। సర్వ సంసారం విసృజ్య చ,
అమోహితః పరివ్రాట్।


కథం నిర్ధనికో సుఖీ?
ధనవాన్ హి సుఖీ।
ఆ పరివ్రాట్
✡︎ సమస్త కర్మఫలరూప - క్రియా కారకముల నుండి విముక్తుడు అయి ఉంటాడు.
✡︎ గురువు, శిష్యుడు, శాస్త్రముల నుండి వినుర్ముక్తుడు (get relieved) అయి ఉంటాడు. చేరవలసిన చోటికి చక్కగా చేరినవాడు ఇక బాటలోని విశేషాల గురించి వినోద - విషాదములు పొందడు కదా.
✡︎ సమస్త సంసార వ్యవహారములను విడచిపెట్టి మోహమును జయించినవాడై ‘సర్వాత్మకుడు’ అయి ఉంటున్నాడు.

ధనము లేనివాడు సుఖంగా ఉండలేడు కదా ? అట్లాగే తత్త్వజ్ఞాన సంపన్నుడే సుఖముగా ఉండగలడు.
జ్ఞాన - అజ్ఞాన ఉభయాతీతః।


సుఖ-దుఃఖ-అతీతః।
‘‘ఒకడు జ్ఞాని అయినా (లేక) అజ్ఞాని అయినా ఆత్మానంద స్వరూపుడే’’ అను అవగాహన కలవాడు ఆత్మ సుఖి అగుచున్నాడు.

ఘనీభూతమైన ‘‘ఆత్మానంద స్వరూపుడనగు నాకు ప్రాపంచక సంబంధమైన సుఖముల వలన క్రొత్తగా వచ్చేదేమున్నది ? దుఃఖముల వలన పోయేదేమున్నది’’ అను సుఖదుఃఖాతీతుడే ఆత్మ సుఖమునకు అర్హుడగుచున్నాడు.
స్వయంజ్యోతిః ప్రకాశః।


సర్వ వేద్యః। సర్వజ్ఞః।
సర్వ సిద్ధిదః। సర్వేశ్వరః।
- సో2హం ఇతి।।
‘‘సూర్యుని చూపటానికి మరొక దీపముతో పనేమున్నది ? నేను స్వయం జ్యోతి స్వరూపుడనై ప్రకాశించువాడను’’ అను సంతృప్తిచే ఆత్మ తృప్తి లభించగలదు.

- తెలియబడేదంతా నా తెలివి యొక్క విస్తారమే కాబట్టి సర్వ వేద్యుడను.
- దేహముల రాకపోకలకు ఆవలిదగు పరాత్మ స్వరూపుడను.
- నా పట్ల ప్రవర్తిస్తున్న జాగ్రత్ స్వప్న సుషుప్తులను సిద్ధింపజేసుకొంటున్నది నేనే. అందుచేత సర్వసిద్ధుడను అని పరివ్రాట్ ఎరిగి, స్వానుభవుడై ఉంటాడు.
తద్విష్ణోం పరమంపదం
యత్ర, గత్వా న నివర్తంతే యోగినః।


సూర్యో న తత్ర భాతి।
న శశాంకో2పి।
న స పునరావర్తతే। న స పునరావర్తతే।

తత్ కైవల్యమ్।
ఆత్మనగు నేనే ఈ సమస్తము అగుచు, ఈ సమస్తమునకు పరముగా మార్పు, చేర్పులు లేనివాడనై ‘బ్రహ్మము’ అను శబ్దార్థంగా పరాకాష్ట స్వరూపుడనై ఉన్నాను. ‘‘సో2హం’’ అనబడు విష్ణు పదము సిద్ధించుకొన్న యోగి ఇక తిరిగి ‘‘నేను జీవుడను, పరిమితుడను’’ అను నివర్తము (Getting down again) పొందడు.

అట్టి స్వస్వరూపాత్మ స్థానమునందు ఈ సూర్య-చంద్రుల ప్రకాశము, కాలక్రమ స్థితిగతులు మొదలైన వాటికి ఇక చోటు ఉండదు. ఆ యోగి పునరావర్త దోషము పొందడు.

అదియే ‘కైవల్యము’ అనబడుతోంది. తన యొక్క కేవలీ స్వరూపము. అన్యముగా కనిపించేదంతా ఆత్మకు (తనకు) అనన్యముగా (వేరుకానట్లు) స్వానుభవ స్థానమగుటచే ‘కైవల్యము’ అని చెప్పబడుతోంది.

ఇత్యుపనిషత్ - నారద పరివ్రాజకోపనిషత్ - ‘‘నవమోపదేశః’’

🙏 ఇతి నారద పరివ్రాజకోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।


అధర్వణ వేదాంతర్గత

24     నారద పరివ్రాజక ఉపనిషత్

అధ్యయన వచన పుష్పము

విషయ సూచిక :


అధర్వణ వేదాంతర్గత

24     నారద పరివ్రాజక ఉపనిషత్ - అధ్యయన వచన పుష్పము

ప్రథమోపదేశము

‘‘సన్న్యాసప్రాధాన్యము’’ అయినట్టి ఈ క్రింది ఉపనిషత్తుల సారమే ఈ ‘‘నారద పరివ్రాజకోపనిషత్’’. ఈ క్రింది ఉపనిషత్తులు లోకములకు ప్రసాదించిన సత్యద్రష్టలగు తత్త్వజ్ఞులకు నమో నమో నమో నమః

1) పరమహంస పరివ్రాజకోపనిషత్ అథర్వణవేదాంతర్గత (15)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5
2) త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్ శుక్లయజుర్వేదాంతర్గత (7)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1
3) సీతోపనిషత్
అథర్వణవేదాంతర్గత (20)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5
4) యోగచూడామన్యుపనిషత్
సామవేదాంతర్గత (11)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 4
5) నిర్వాణోపనిషత్
ఋగ్వేదాంతర్గత (7)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1
6) మండల బ్రాహ్మణోపనిషత్
శుక్లయజుర్వేదాంతర్గత (12)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1
7) దక్షిణామూర్త్యుపనిషత్
కృష్ణయజుర్వేదాంతర్గత (14)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 2
8) శరభోపనిషత్
అథర్వణవేదాంతర్గత (19)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5
9) స్కందోపనిషత్
కృష్ణయజుర్వేదాంతర్గత (30)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 3
10) త్రిపాద విభూతి మహానారాయణోపనిషత్
అథర్వణవేదాంతర్గత (28)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 6
11) అద్వయతారకోపనిషత్
శుక్లయజుర్వేదాంతర్గత (1)
ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1
- - - - -

బ్రహ్మమానస పుత్రులు, ‘పరివ్రాజము’ అనే సన్న్యాసయోగ పరాకాష్ఠ స్థితిని ఆభరణముగా ధరించినవారు, లోక కళ్యాణము కొఱకై త్రిలోక సంచారి, భక్తజనులను స్వయముగా సమీపించి మార్గదర్శనము ప్రసాదించువారు, భక్తి సూత్రములు లోకములకు ప్రసాదించినవారు, ధర్మమునకు గ్లాని వాటిల్లినప్పుడు త్రిమూర్తులను ఆశ్రయించి అవతారమూర్తుల ఆగమనమునకు కారణభూతులగువారు అగు శ్రీ నారద దేవర్షి గురువరేణ్యుల పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు.

మహనీయులగు శ్రీ నారద మహర్షి త్రిలోక సంచారములు నిర్వర్తిస్తూ ఉంటారు. అట్టి ఒకానొక సందర్భములోని విశేషములు మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

శ్రీ నారద మహర్షి ఇచ్ఛానుసారంగా అనేక పుణ్యస్థలములను దర్శించసాగారు. ఆ స్వామి ఎక్కడ అడుగుపెడితే అక్కడ అవి గొప్ప పుణ్యతీర్థములుగా మారి, సందర్శకులకు వారి వారి భక్తి జ్ఞాన యోగ మార్గములలో ప్రోత్సాహము, సముద్ధరణ ప్రసాదించు దివ్య ప్రదేశములు అవసాగాయి.

తీర్థీ కుర్వన్తి తీర్థాని, సుకర్మీ కుర్వన్తి కర్మాణి, సచ్ఛాస్త్రీ కుర్వన్తి శాస్త్రాణి - నారదభక్తి సూత్రములు.

ఆ విధంగా మనోపవిత్రత కొఱకై శ్రీ నారద మహర్షి తీర్థయాత్రలు చేస్తూ, దేవాలయ సందర్శనము నిర్వర్తిస్తూ ఉండగా, వారు ఆత్యంతికమైన చిత్తశుద్ధి ప్రాప్తించుకోసాగారు. మనస్సు నిర్వైరము (దేనిపట్లా ‘వైరము’ యొక్క ఛాయ కూడా తొలగి పోవుటము) సిద్ధించసాగింది. ప్రశాంతత సంతరించుకోసాగింది. ఇంద్రియముల చాంచల్యము తొలగి సర్వత్రా దాంతము (Self control) పొందసాగాయి. సకల ఇంద్రియ నిగ్రహము ప్రాప్తించుకోసాగారు. బుద్ధి నిర్వేదము (వైరాగ్య భావము) ఆశ్రయించసాగింది. అందుకు ఫలితంగా వారు సమస్త దృశ్య విషయములనుండి ఉపసంహారము (withdrawal) పొంది, కేవలము - సమస్తము అయినట్టి ‘స్వస్వరూపము’ తో అనుసంధానము పొందసాగారు.

ఆ విధంగా తీర్థయాత్రలు సేవిస్తూ శ్రీ నారద మహర్షి ఒకానొకరాజు
- నిగమ (వేద) నాద ఆనంద విశేష గణ్యము (విశేషములతో కూడినది),
- సత్రయాగము జరుగుచున్న పవిత్రస్థలము,
- అనేక మునిజనము సమావేశమై ఉన్నది,
అగు ‘నైమిశారణ్యము’ చేరారు.

అక్కడి వాతావరణమంతా వేదపారాయణము, ‘స-రి-గ-మ-ప-ద-ని’ స్వరములతో కూడిన వైరాగ్య బోధకములైన సంగీత గానమయము అయి ఉన్నది. భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకమైన సత్సంగ పురాణ ప్రవచనములు ఆ ప్రదేశంలో జరుగుచున్నాయి. సమస్త దృశ్యప్రపంచ సంబంధముల బంధము తొలగించగల అనేక దృష్టాంతములు, చరిత్రలు, పురాణములు, ఇతిహాసములు, కథానికలు శ్రవణం చేయబడుచున్నాయి. శుకుడు, శౌనకుడు మొదలైన వారిచే మహత్తరముగా సత్సంగపూర్వకంగా ముముక్షువులకు మోక్షసాధనములు బోధించబడుచున్నాయి. ‘‘నివృత్తి’’ (withdrawal from wordly tendencies)కి ఉపాయములు విశదీకరించు హరికథా ఆలాపనలతో అక్కడి స్థావరములు కూడా తేజోవికాసముతో ప్రకాశిస్తున్నాయి. అక్కడి జంగమ జీవులగు మృగములు, మానవులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు మొదలైన మానవ దేవతాగణము ఆ ప్రదేశములో శ్రవణం (Listening) చేస్తూ పవిత్రత సంతరించుకుంటున్నారు.

బ్రహ్మాత్మజులు, భగవద్భక్త పరాయణులు అగు శ్రీ నారద మహర్షి, ఆ నైమిశారణ్య పవిత్ర తీర్థ ప్రదేశమునకు వేంచేయగానే, అక్కడి ద్వాదశ (12) సంవత్సరముల సత్రయాగములో పాల్గొనుచున్న శౌనకుడు మొదలైన శ్రుత అధ్యయన - శ్రవణములు చేస్తున్న అనేక మంది వైరాగ్య సంపన్నులగువారు వారికి ఎదురుగా వచ్చి సుస్వాగత వచనములతో శుభాకాంక్షలు పలికారు. సుఖాసీనులను చేసి నమస్కరించారు. ఆ తరువాత అక్కడి వారంతా వారివారి స్థానములలో చుట్టూ ఆసీనులైనారు.

ప్రశ్న - ముక్తి పొందటానికి ఉపాయము ఏమి?

శౌనకుడు మొదలైన మహర్షులు : హే భగవాన్, బ్రహ్మమానస పుత్రా । నారద మహర్షీ ।

కథం ముక్తి ఉపాయో, అస్మాకం వక్తవ్యమ్ । ఏ విధానము మేము ముక్తి పొందటానికి ఉపాయము అయి ఉన్నదో, అది మాకు బోధించి అనుగ్రహించండి.

భక్తిరసపారాయణులు, మహత్-పౌరాణికులు అగు మీ వాక్యామృతము గ్రోలటానికి మేమంతా ఉత్సాహవంతులమై ఉన్నాము.

శ్రీ నారద మహర్షి : ఓ శౌనకాది మునివర్యులారా, ముందుగా ముక్తికి సంబంధించిన ఒకానొక ‘‘శాస్త్రీయ క్రమ విధానం’’ చెప్పుకుందాము. వినండి (ఇది కొన్ని కులజుల నియమము).

ఆయా మూడు ఆశ్రమములకు ఉచితమైన సమస్త కర్మలను నిర్వర్తించి ‘సాధన చతుష్టయ సంపన్నుడు’ అవ్వాలి.

సాధన చతుష్టయము

Ⅰ. 1) నిత్య అనిత్య వస్తు ‘వివేకము’
2) ఇహ అముత్ర (ఈ లోక సంబంధమైన - పరలోక సంబంధమైన) ‘ఫల భోగ విరాగము’
3) i) శమము : మనోనిగ్రహము   ii) దమము : బాహ్యేంద్రియ నిగ్రహము   iii) ఉపరమము : విషయముల నుండి వెనుకకు మరలటము   iv) తితిక్ష : ఓర్చుకోవటము   v) శ్రద్ధ   vi) సమాధానము అనబడే ‘శమాది షట్క సంపత్తి’
4) మముక్షుత్వము : మోక్షము పొందాలనే మహదాశయము, తపన
(Ref. వివేక చూడామణి - శ్రీ శంకరాచార్య విరచితము)

Ⅱ. 1) శమము : బాహ్య - అభ్యంతర ఇంద్రియ నిగ్రహము. చాంచల్యము వదలి ‘శాంతి’ని ఆశ్రయించటము.
2) విచారణ : నిత్య - అనిత్యములను ఎఱిగి ఉండటము. శాస్త్ర అధ్యయనము మొ।।నవి
3) సంతోషము : కలిగిన దానితో, ప్రాప్తించినదానితో తృప్తి. ఉత్సాహ-సాహస-ధైర్య - బుద్ధి - శక్తి - పరాక్రమములను ఆశ్రయిస్తూ ఉండటము. హుషారుగా ఉండటం.
4) సత్సంగము : మహనీయులతో సమాశ్రయము. శ్రవణము - గురుసేవ.

పై విశేషములతో ‘‘సాధన చతుష్టయ సంపత్తి’’ ని వృద్ధి చేసుకోవాలి. అట్టి సాధన చతుష్టయము యొక్క అభ్యాసము చేస్తూ సంసార భోగాభిలాషలను మనో-వాక్ - కాయ పూర్వకంగా మొదలంట్లా పెకలించివేయాలి.

సమస్త దృశ్య సంబంధమైన ఆశలను త్యజించాలి. వాసనలను (tendencies), (దారేషణ, ధనేషణ, పుత్రైషణలనబడే) ఈషణ త్రయములను (World related urges) నివృత్తి చేసుకోవాలి.

నిర్వైరః సర్వభూతేషు : వైరము (Enmity) అనేదంతా రహితము చేసుకొనునుగాక, సమత్వము సముపార్జించుకోవాలి.

శాంతుడు, దాంతుడు (ఇంద్రియ నిగ్రహము కలవాడు), ఇంద్రియ విషయములను చూచి మనోచాంచల్యము పొందనివాడు అగును గాక।

‘సన్యాసి’ అయి, క్రమంగా పరమహంసాశ్రమమును స్వీకరించును గాక! పరమహంస స్థానము సిద్ధించుకొనును గాక।

అస్ఖచితము (చ్యుతి distraction లేనట్టి) స్వస్వరూపధ్యానముతో ఈ భౌతిక శరీరమును మానసికంగా ‘త్యాగము’ చేసినవాడు ‘ముక్తుడు’ (బంధరహితుడు) అగుచున్నాడు.

శరీరము ఉన్నప్పుడు, తొలగినప్పుడు కూడా అట్టివాడు ఆత్మవంతుడై ఉండగలడు.

అదియే ముక్తి, మోక్షము, జన్మరాహిత్యము కూడా।

ఇత్యుపనిషత్ । ప్రథమోపదేశమ్।


రెండవ ఉపదేశము - శాస్త్రోక్తముగా చతుః ఆశ్రమ పాలన

అప్పుడు శౌనకుడు మొదలైన మునీశ్వరులు నారదమహర్షితో ‘‘హే భగవాన్ ! శాస్త్రీయంగాను, మహనీయుల స్వానుభవ బోధగాను చెప్పు ‘సన్యాసము’ గురించిన విధిని వివరించండి’’ - అని అడిగారు. అది విని మహర్షి పలుకసాగారు.

నారద మహర్షి : జ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, తపోధనులు అగు ఓ శౌనకుడు మొదలైన మునీశ్వరులారా ! ‘‘సన్యాస విధి’’ గురించిన సమగ్రమైన విశేషాలన్నీ పితామహులగు బ్రహ్మదేవుల వారి ముఖతః మనమంతా శ్రవణం చేయటం ఉచితమని నాకు అనిపిస్తోంది. ఈ సత్రయాగము పూర్తి అయిన తరువాత మనము సత్యలోకము వెళ్లి పరమాత్మయగు బ్రహ్మ దేవుని నుండి సవివరంగా విందాము. ఎందుకంటే వేద ఉపనిషత్ మౌనులు, తత్వము ఎరిగిన మీకు సవిశేషంగా చెప్పగలిగినది పితృదేవులగు బ్రహ్మ భగవానుడే, నేను కాదు.

అక్కడ మునులు మొదలైనవారంతా ‘‘అలాగే! మనము పితామహుల వద్ద విందాము’’ అని తలచారు.

- - -

సత్రయాగము పూర్తి అయిన తరువాత నారదమహర్షి, శౌనకుడు మొదలైన వారంతా సత్యలోకములో ప్రవేశించారు. సృష్టికర్త అగు బ్రహ్మదేవుని దర్శించారు. విధివిధానంగా ఆ బ్రహ్మ నిష్ఠాపరులంతా పరిమేష్ఠి అగు బ్రహ్మదేవుల వారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించారు. జగత్ కర్తయగు పితామహులవారి అనుజ్ఞతో అందరూ ఉపవిష్ఠులైనారు.

శ్రీనారద మహర్షి : హే జగద్గురూ ! పితృదేవా ! మీరు సర్వజ్ఞులు. సర్వవిద్యా రహస్యములు ఎరిగినవారు. సృష్టి సంకల్ప సిద్ధులు. త్వం అతో మదిష్టం రహస్యం ఏకం వక్తవ్యం । త్వత్ వినా మత్ అభిమత రహస్యం వక్తుం కః సమర్థః? హే పితామహా ! ఒకానొక తాత్త్విక రహస్యం గురించి మీ వద్ద వినాలని మేమంతా అభిలాషపడుచున్నాము. మేము వినాలనుకొనే ఆ రహస్యార్థం మీరు తప్పితే మాకు తెలియజేయగల సమర్థులు మీకన్నా ఎవరుంటారు ? ఉండరు.

ఆ తాత్విక రహస్యం గురించి మా ప్రశ్న ఏమంటే …

పరివ్రాజ్య (పరివ్రాజకుని) స్వరూప - స్వభావ - ప్రవేశక ధర్మ విధుల గురించి దయచేసి మాకు బోధించండి.

⌘ ⌘ ⌘

ఈ విధంగా ప్రార్థించబడి, ఆ విధాత ఒక్కసారి సభలోని వారినందరినీ చిరునవ్వు చిందుస్తూ ప్రేమాస్పదంగా పరికించి చూచారు. ముహూర్తకాలము (12 క్షణముల కాలము) సమాధి నిష్ఠను ధారణ చేసారు. ‘‘వీరంతా ఏ ఉద్దేశ్యముతో ఈ వివరణను నన్ను అడుగుచున్నారు ?’’ అని ప్రశ్నించుకున్నారు. ఒహో ! ఈ నారదుడు సంసార - ఆర్తి యొక్క నివృత్తి కొరకై (To get rid of bondage formed with changing factors of the world scenario) అన్వేషిస్తూ అడుగుచున్నారు కదా! మంచిది’’ - అని దివ్యదృష్టితో అక్కడివారి హృదయములలోని మహదాశయమును గమనించారు. అప్పుడు నారదుని వైపు చూచి పితామహుడు ఇట్లా పలుకసాగారు.

శ్రీ ప్రజాపతి / పితామహుడు / బ్రహ్మదేవ భగవానుడు :

కుమారా! నారదా! ఒకప్పుడు (ఈ బ్రహ్మండమంతా తన పురుషకారముగా కలిగి వుండి, ఇదంతా తన దేహమే అయి ఉన్న) విరాట్ పురుషుడు నిరతిశయమగు ఆత్మానందము ఆస్వాదిస్తూ ‘‘పురుష సూక్తోపనిషత్ రహస్యార్థము’’ ప్రకారముగా ఒక తత్త్వరహస్యము నాకు బోధించబడింది. అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నీవు అడిగిన వివరణకు సమాధానంగా నిన్ను నిమిత్తంగా చేసుకొని సమస్త జనులకు చెప్పబోవుచున్నాను.

మనము చెప్పుకోబోతున్న ఈ తత్త్వార్థ పూర్వకమైన క్రమము (The sequencial ideas we are talking about) - అతి రహస్యమైనది. దృఢమైనది (గట్టిది, అత్యధికమనది). కాబట్టి అవహితుడవై (అత్యంత శ్రద్ధావంతుడవై) వినెదవుగాక. నారదా ! విను.

1) ఉపనయనము - 12 సం।। విద్యాభ్యాసము :

అనుపనీతుడు (ఉపనయన సంస్కారము / వడుగు కాని వటువు అనగా బాలుడు) - శాస్త్ర విధిని అనుసరించి ఉపనయన దీక్ష స్వీకరించును గాక! తాను జన్మించిన కులాచారములను అనుసరించి తల్లిదండ్రులకు విధేయుడై, ఆ తరువాత తన తండ్రి వద్ద కాకుండా (పితృ సమీపాత్ అన్యత్ర) తత్వశాస్త్ర అధ్యయనము చేయును గాక!

సత్సంప్రదాయము ఎరిగియున్నవారు, శ్రద్ధావంతులు, సత్కులభూషణులు, వేదహృదయము ఎరిగిన శ్రోత్రియులు, శాస్త్ర విధులను ప్రేమించువారు, కుటిలత్వము లేని నిర్మల హృదయులు అగు సద్గురువును (సద్గురువరేణ్యులను) సమీపించాలి. వారికి నమస్కరించి బ్రహ్మ విద్య కొరకై అర్థించాలి. వారికి శుశ్రూష పూర్వకంగా (శిష్య భావన, సేవా భావనలతో) నమస్కరించాలి. ‘‘గురుదేవా ! నేను ఆత్మ విద్య (లేక) బ్రహ్మ విద్య కొరకై శరణు వేడుచున్నాను’’ అని విజ్ఞాపనను సమర్పించాలి.

12 సంవత్సరములు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసమంతా పూర్తి చేసుకోవాలి.


2) వివాహం - గురుకులవాసం (25 సం।।లు) :

శుశ్రూషా పూర్వకంగా గురుసేవ చేస్తూ స్వాభిమతమైన వేద అధ్యయనము, తదితర సర్వసామాన్య విద్యాభ్యాసములను 12 సం।।ల కాలంలో పూర్తి చేసుకుని ఆ తరువాత బ్రహ్మచర్యము అవలంబించాలి. గురు అనుజ్ఞను పొంది, తన కుల పెద్దల అభిమతానుసారంగా వివాహం చేసుకొని 25 సం।। కాలము గురుకులవాసము చేయాలి.


3) గృహస్థోచిత కర్మల ఆశ్రయము (25 సం।।లు) :

ఆ విధంగా 25 సం।।ల గురుకుల వాసం పూర్తి చేసుకొని గురు అనుజ్ఞను పొంది గృహస్థుడు సంఘ, లోక కళ్యాణార్థం నిర్వర్తించవలసిన కర్మల కొరకై గృహస్థాశ్రమము నిర్వర్తించును గాక! ‘‘దౌ బ్రాహ్మణ్య’’ - ద్విజ ళి (1) శాస్త్ర సేవ (2) సంఘ సేవ)రి - వృత్తిని స్వీకరించాలి. వంశ వృద్ధి కొరకై ‘కామము’ను ఆశ్రయించి, సంతానము పొందాలి. గార్హస్థ్యోచితమైన (గృహస్థాశ్రమమునకు ఉచితమైన) ధర్మములను 25 సంవత్సరములు నిర్వర్తించాలి. సంతానమును తీర్చిదిద్దాలి. సంఘ సేవ, వస్తు ఉత్పత్తి మొదలైన ధర్మములు ఆచరించాలి.


4) వానప్రస్థం :

గృహస్థాశ్రమ ధర్మములు 25 సం।।లు నిర్వర్తించిన తరువాత, 4వ కాలముగా వానప్రస్థము స్వీకరించును గాక. ఈ చతుర్థ కాలములో 1) ఏకవారమ్ ఆహాము (ఒంటిపూట భోజనము) 2) ఏకాకిగా అరణ్యము మొదలైన ఏకాంత ప్రదేశములలో సంచారములు చేయుటము నిర్వర్తించును గాక. పట్టణము, గ్రామముల జనసమ్మర్ధ ప్రదేశములను విడచి ఉండునుగాక। జనావళికి దూరంగా ఉండే పర్ణశాలను నిర్మించుకొని వనస్థ (వానప్రస్థ) ఆశ్రమము సేవించాలి.

ఇంద్రియములకు తారసపడే (కనిపించే - వినబడే) సమస్త విషయములపట్ల తృష్ణను జయించివేయాలి. క్రమంగా చత్వారి (శ్రవణ - మనన - నిదిధ్యాస- సమాధి) లను అభ్యసించి ఏతత్ - సంస్కార సంపన్నుడు అవ్వాలి. సమస్త జగత్ విషయముల పట్ల విరక్తితో కూడిన ‘చిత్త శుద్ధి’ని సంపాదించుకొనాలి. హృదయములో జన్మజన్మలుగా గూడుకట్టుకొని ఉంటున్న ‘‘ఆశ, అసూయ, ఈర్ష్య అహంకారము’’లను దగ్ధము (ఆత్మజ్ఞానాగ్నిచే భస్మము) చేసివేయును గాక।

సాధన చతుష్టయమును (శమము, విచారణ, సంతోషము, సాధుజన సంగము) లను ఆశ్రయించి సన్యస్తుడు అవటానికి అర్హత సంపాదించుకొనును గాక।

ఇత్యుపనిషత్ । ద్వితీయోపదేశమ్।


మూడవ ఉపదేశము - ‘‘సన్యాసము’’నకు అధికారి

శ్రీనారద మహర్షి : హే ! పితామహ భగవాన్ ! దేనిచేత ఒకనికి సన్యాస ఆశ్రమాధికారం లభిస్తోంది ?

పితామహుడు : మొదట ‘‘సన్యాసాధికారము’’ను నిరూపించి, ఆ తరువాత సన్యాసవిధుల గురించి (Do’s and Dont’s) చెప్పుకుందాము. ఓ నారదా ! ఏకాగ్రతగా విను.

ఎవరు సన్యాసము స్వీకరించటానికి అనర్హులు ?

నపుంసకుడు (షండుడు), వికలుడు (అంగలోపములు కలవాడు), అంధుడు (గ్రుడ్డివాడు), బాలకుడు (శాస్త్ర జ్ఞానము, విధి విధానములు ఏమాత్రము ఎరుగనివాడు, సన్యాసాశ్రమ ధర్మముల గురించి తెలుసుకొననివాడు), పాపదృష్టి, పరులకు ద్రోహము చేయు దోషపూరితమైన ఆశయములు (స్వభావము) కలవాడు, పతితుడు (తన యొక్క బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమముల నుండి పతనము చెందినవాడు), పరద్వారీ (తన ఆహారము, జీవనముల కొరకై ఇతరులను ఆశ్రయించి, ఆధారపడు స్వభావము కలవాడు), వైఖ్యాసుడు (వానప్రస్థులలో ఒక తెగవాడు. (విష్ణు) దేవాలయములలో అర్చక ధర్మము నిర్వర్తించువాడు), శివార్చకుడు (శివాలయములో అర్చన వృత్తి ధర్మము నిర్వహించువాడు), (హరిద్విజుడు), చక్రీ (శరీరముపై శ్రీచక్రము, శంఖము చిత్రించుకున్నవాడు), (చక్రాంకితుడు), పాషండుడు (వేదముల పట్ల, వేద పాఠ్యాంశముల పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉన్నవాడు), లింగీ (వట్టి వేషము వేసి జీవనాధారము కలిగి బ్రతుకువాడు), శిపివిష్టుడు (జుట్టు మొత్తము ఊడి బుఱ్ఱజుట్టు అనగా బట్టతల శేషించినవాడు), అగ్ని కార్యముల పట్ల గౌరవము లేనివాడు - అనగ్నికుడు, రెండుమూడు సార్లు సన్యసించి వదిలినవాడు (ద్వి - త్రివారేణ సన్యస్తః), భృతకుడు (జీవనోపాధి కొరకు, ధనము సంపాదించటానికి సన్న్యసించు అభిప్రాయము కలవాడు),

పైన చెప్పబడినవారు సన్న్యాసము స్వీకరించటానికి అర్హులు కారు. వీరంతా ఆతురసన్న్యాసము స్వీకరించినప్పటికీ క్రమ సన్న్యాసాశ్రమము తీసుకోతగరు.

ఆతుర సన్న్యాస స్వీకారము

శ్రీ నారద మహర్షి : ఆతుర (ఆత్రము, తొందరపడు) సన్న్యాసమునకు ఏది సరి అయిన కాలము ? ఏ విధానముచే ఆతుర సన్న్యాసము ఆర్యసమ్మతము?

శ్రీ పితామహులవారు : ఆతుర సన్న్యాసి కూడా సన్యాసాశ్రమ ఫలము పొందుటకు అర్హుడే. ప్రాణస్య ఉత్క్రమణ ఆసన్న కాలస్తు ‘ఆతుర’ - సంజ్ఞికః । ఒకరకు ప్రాణములు పోవు సమయము సమీపిస్తున్న సమయమునందు స్వీకరించు సన్న్యాసమును ‘ఆతుర సన్న్యాసము’ అని పిలుస్తారు. ప్రాణములు పోవు సమయము కానప్పుడు ఆతుర సన్న్యాసము ముక్తి మార్గము ప్రసాదించదు. ప్రాణ ఉత్క్రమణ సమయ - సందర్భములలో ‘ఆతుర సన్న్యాసము’ స్వీకరించువాడు కూడా మంత్రపురస్కరంగా (అట్టి సందర్భము గురించిన శాస్త్రీయ మంత్రములతో) నిర్వర్తించాలి.

మం।।శ్లో।। మంత్ర - ఆవృత్తించ కృత్యైవ సన్యసేత్ విధివత్ బుధః ।
ఆతురే2పి, క్రమేచా2పి ప్రైషభేదో న కుత్ర చిత్ ।

ఆతుర సన్యాసమైనా (లేక) క్రమ సన్యాసమైన కూడా కర్మరహితమైన మంత్రము ఉండదు. ‘కర్మ, మంత్రము’ రెండు సన్న్యాస విధికి ఆవస్యకం. కర్మ కూడా మంత్రమును ఆపేక్షిస్తుంది. కర్మ ఎంత గొప్పగా చేస్తున్నప్పటికీ మంత్రమును విడిచి ఉండరాదు. మంత్రమును వదలరాదు. ‘మంత్రం వినా కర్మ కుర్యాత్ భస్మని అహుతివత్ భవేత్’ మంత్రము లేకుండా కర్మ నిర్వర్తించటమనేది బూడిదలో వదలిన హోమద్రవ్యము వంటిది.

‘ఆతుర సన్యాసము’ కొరకై విధి యుక్త (విధ్యుక్త) కర్మ కొంత సంక్షిప్తంగా శాస్త్రములచే విధించబడుతోంది. అందుచేత మునీంద్రా ! నారదా ! ఆతుర సన్యాసము కూడా ‘మంత్రావృత్తి’ చేతనే విధింపబడుతోంది సుమా.

అహితాగ్ని నిష్ఠుడు (ప్రతి రోజు అగ్నికార్యము నిర్వర్తించువాడు (లేక) నిత్యాగ్నిహోత్రావధానుడు) గృహస్థాశ్రమము పట్ల విరక్తి పొంది వేరే ఏదో దేశమునకు (సుదూర ప్రాంతమునకు వెళ్లి ఉండటం) జరిగితే కూడా, నివృత్తి - సర్వ సమర్పణ పూర్వకంగా ‘‘ప్రాజాపత్యేష్టి’’ నిర్వర్తించి సన్యసించును గాక।

మనస్సుతోగాని (లేదా) విధియుక్తియుక్తంగా గాని (అనగా) మంత్ర విధానార్థయుక్తంగా గాని (లేదా) జలములో గాని (లేదా) శ్రుతులలో (వేదములలో) చెప్పిన విధమైన కర్మానుష్ఠాన మార్గంగా గాని విద్వాంసుడు అయినవాడు సన్యసించును గాక. లేనిచో అట్టివాడు పతితుడు (one who meets downfall) అగు అవకాశము అధికము.

సన్న్యసించటానికి సమయాసమయములు

శ్లో।। యదా మనసి సంజాతం వైతృష్ణ్యం సర్వ వస్తుషు
తదా సన్యాసం ఇచ్ఛంతి । పతితస్స్యాత్ విపర్యయే ।

ఎప్పుడు మనస్సు సమస్త దృశ్య వస్తువుల పట్ల ‘‘కావాలి, పొందాలి, ఉండాలి’’ - అను రూపమగు తృష్ణ (Hunger) మొదలంట్లా తొలగుతుందో, అప్పుడే సన్యసించటానికి ఇచ్ఛగించాలి, ఇష్టపడాలి, సిద్ధమవ్వాలి. అట్లా కాకుండా తృష్ణ ఇంకా ఉండి ఉండగా ఎవడు సన్న్యసిస్తాడో అట్టివాడు పతితుడు కాగలడు.

ధీమంతుడైన, ధైర్యవంతుడైన విరక్తుడు మాత్రమే సన్యసించును గాక. అనురక్తి గలవాడు గృహస్థాశ్రమములో ఉండి, తన సాధనలు కొనసాగించడమే ఉచితము. ఎవడు ఆయా వస్తువుల పట్ల, విషయముల పట్ల, సంబంధితుల పట్ల సరాగుడై ఉంటాడో (రాగము sense of attachment కలిగియే, కొనసాగిస్తూ ఉంటాడో), అట్టివాడు సన్యసిస్తే (ప్రవ్రజుడు అయితే), అతడు ద్విజాధముడై, ఘోరమైన నరకమునకు పాత్రుడు కాగలడు.

- ఎవ్వనికి జిహ్వ (నాలుక), ఉపస్థ (శృంగార ఇంద్రియము), ఉదరము, కరములు (రుచి, కామము, ఆకలి, వ్యవహరములు) తన వశములో ఉంటాయో, వాటికి తాను వశుడు (slave) కాడో,
- ఎవడు బ్రహ్మమును సిద్ధించుకోవటమనే మహదాశయము కలిగి ఉంటాడో,
- బ్రహ్మచర్య వ్రతమునకు సంసిద్ధమై ఉంటాడో
అట్టివాడే సన్యాసము స్వీకరించవచ్చును. తదితరులు స్వీకరించకపోవటమే ఉచితము.

‘‘ఈ సంసారము సారరహితమైనది (నిస్సారమైనది) అను దృష్టిని పొంది ‘‘మరి సారమైనది ఏది?’’ అనే దిదృక్షువు (చూడాలనే ఇచ్ఛ గలవాడు) అట్టివాడు సమస్త కర్మలను, లోక సంబంధమైన లాభాలాభ వ్యవహారములను పరిత్యజించాలి. వైరాగ్యము ఆశ్రయించి, మోక్షార్థి అవగానే ఇక సన్యసించును గాక।

కర్మ - జ్ఞాన లక్షణములు

ప్రవృత్తి లక్షణం కర్మ । జ్ఞానం సన్యాస లక్షణం ।
‘కర్మ’ అనేది ప్రవృత్తి (Avocation to do something in this world) అనే లక్షణము కలిగి ఉన్నది. ‘జ్ఞానము’ అనేది నివృత్తి (Non avocation towards the doings) లక్షణముగా కలిగి ఉన్నది. అందుచేత బుద్ధిమంతుడైన వాడు ప్రవృత్తి లక్షణములను క్రమముగా ఉపసంహరించుకొని ఆత్మ తత్త్వ జ్ఞానము కొరకై (జ్ఞానమును పురస్కరించుకొని) - సన్యసించును గాక।

యదా తు విదితం తత్త్వం పరంబ్రహ్మ సనాతనమ్, తదా ‘ఏకదండం’ సంగృహ్య, స ఉపవీతం, శిఖాం త్యజేత్ ।
ఎప్పుడైతే ముముక్షువు (మోక్షగామి) జన్మ - కర్మలకు మునుముందే ప్రకాశమానమైయున్న ‘‘సనాతన పరబ్రహ్మము’’ ను సుస్పష్టముగాను, నిర్దుష్టముగాను తెలుసుకుంటాడో, ఇక ఆపై అతడు బ్రహ్మమునకు, జగత్‌ధారణకు సంజ్ఞ అయినట్టి ఉపవీతము (నూలు పోగు యజ్ఞోపవీతమును), శిఖను (బ్రహ్మరంధ్ర-సహస్రార ద్వారములకు ‘గుర్తు’ అగు పిలకను) విడచివేసి సన్న్యసించును గాక।

భిక్షుకాశ్రమము - కైవల్యాశ్రమము

శ్రీ నారదుడు : కేవలమగు ఆత్మను ఆశ్రయించి ఉండటము అనే ‘కైవల్యాశ్రమ’ రూపమగు ‘భిక్షుకాశ్రమము’నకు ఎవడు అర్హుడు ?

పితామహులవారు : నారదా ! ఒకడు ఎప్పుడు ‘భిక్షుకుడు’ - అనబడతాడో చెప్పుచున్నాను, విను!

తదా భవతి ‘‘భైక్షుకమ్’’

మనసా వాచా తదా భవతి భైక్షుకమ్। ఎవడైతే పై వర్ణనముల విధంగా కర్మణా మనసా వాచా ప్రవర్తన, భావన, ఎరుక కలిగి ఉంటాడో అప్పుడు అట్టివాడు ‘‘భిక్షుకుడు’’ అగుచున్నాడు.

అతడు (ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా) నిత్య సన్యాసియే.

ఋణ చతుష్ఠయము అయినట్టి ‘‘దేవ’’, ‘‘ఋషి’’, ‘‘మానవ’’, ‘‘పితృ-మాతృ’’ ఋణములన్నీ తీర్చుకొని అనృణుడు సన్యాసమునకు అర్హుడు.

శ్రీ నారద మహర్షి : పితృదేవా ! అనుష్ఠించవలసిన ‘‘దశ లక్షణకం ధర్మము’’ గురించి వివరించి చెప్పండి.

బ్రహ్మ భగవానుడు : సమస్త జనులు బంధవిముక్తి కొరకై దశలక్షణక ధర్మము గురించి వినండి. ఇది అన్ని ఆశ్రమ వాసులకు అనుసరణీయము.

1) ధృతి : పట్టుదలతో కూడిన స్థిరత్వము కలిగియుండటం, చాంచల్యము లేకపోవటము, ఆత్మజ్ఞాన పాఠ్యాంశములను గట్టిగా పట్టుకోవటము.
2) క్షమా : ఓర్పు, సహనము, మన్నించటము, క్షమించు గుణము.
3) దమము : ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములను మహదాశయము కొరకై నియమించటము. ఇంద్రియములను ఉపకరణముల వలె తన అదుపులో ఉంచుకోగలగటము.
4) అస్తేయము : తనది కానిది ‘‘నాది’’ అను గుణము జయించి ఉండటము. దొంగిలించు స్వభావము లేకుండటము.
5) శౌచము : శుచి అయిన, నిర్మలమైన భావములు, అభిప్రాయములు ఆశ్రయించి ఉండటము. ఇతరులలో శుభ గుణములు, ఆత్మతత్త్వము దర్శించు అభ్యాసము.
6) ఇంద్రియ నిగ్రహము : ఇంద్రియ విషయములచే ఆకర్షించబడక, వాటిని నిగ్రహించి మనో-బుద్ధి బలములు కలిగి ఉండటము.
7) ధీః : ఉపాసనా పూర్వకము, నిర్మలము, సునిశితము, విస్తారము, ప్రశాంతము అయిన బుద్ధిని ప్రవృద్ధము చేసుకోవటము. (బుద్ధి = The feature of logic, intelligence and the ability of differentiation) .
8) విద్యా : ఆత్మతత్త్వము గురించిన శాస్త్రీయ విద్య. మనస్సు, బుద్ధి, చిత్తము మొదలైన వేదాంత శాస్త్ర శబ్దముల ఉత్తమార్థమును అధ్యయనము చేయటము. (విద్యా విహీనః పశుః).
9) సత్యమ్ : ఏది పరమ సత్యమో అద్దానిని ఆశ్రయించటము. సందర్భ సత్యములను అధిగమించి, సహజ సత్యమగు ఆత్మ స్వరూపమును యమ్ సత్ (Absolute being) ను ఆశ్రయించటము.
10) అక్రోధము : వ్యవహారరీత్యా అనవసరమగు కోపమును సశాంతింపజేసుకుంటూ, కోపావేశమును జయించటము. కోపమును వెనువెంటనే ప్రేమ - శాంతములందు లయింపజేయు అభ్యాసము.

ఇవి సన్యాస ధర్మ దశ లక్షణములు. ఇవి ముముక్షువు సర్వదా అభ్యసించును గాక।

కైవల్యాశ్రమము (కేవలీ స్వరూపాశ్రయము)

మోక్ష రూపమగు కైవల్యమును ఈ జీవుడు సిద్ధించుకొనును గాక. అట్టి కైవల్యాశ్రమమే సంసార దుఃఖములన్నిటికీ ఏకైక ఉపాయము.

అట్టి కైవల్య స్థితి (లేక) స్థానము ఈ జీవునికి సిద్ధించేది ఎట్లా ?

అట్టివాడు కైవల్య - ఆశ్రమమునందు శాశ్వత నివాసము పొందుచున్నాడు. మోక్ష మార్గములో పయనించువాడగుచున్నాడు.

(కైవల్యము = సమస్త బాహ్య జగత్తుకు స్థానమే అయి ఉన్నట్టి కేవలమగు స్వస్వరూపమునందు ఆత్మానందముతో కూడిన విశ్రాంతి)

యతి సన్యాస వస్త్రధారణ - ఏకాకిగా సంచారము

సన్యాసాశ్రమము స్వీకరించినవాడు యతి అయి,
   రెండు కౌపీనములను (2 గోచీ గుడ్డలను), ఒక కంబళిని, ఒక దండమును మాత్రమే కలిగి ఉండును గాక.
   యతి పరమహంస అయిన వాడు అంతకుమించి ఏదీ కలిగి ఉండరు, ఉండరాదు.

సన్న్యాసి పరివ్రాజకుడై అంతకుమించిన వస్తుజాలమును సొంతము చేసుకొని ఉండరాదు. వస్తు జాలము, సంపద మొదలైనవి సంపాదించి, ప్రోగు చేసుకొను ఆసక్తి కలిగి ఉండు సన్యాసి ‘రౌరవము’ మొదలైన నరక స్థానములను, జంతు జన్మలను పొందువాడు అవగలడు. చిరిగిపోయిన వస్త్రములను ఉపయోగించి, వాటిని ‘ముక్కలు’గా చేసి బొంతగా తయారు చేసుకొని ఉండునుగాక. అట్టి గుడ్డముక్కలకు కాషాయరంగు అద్ది ఏక వస్త్రముగా ధరించును గాక।

ఏక వస్త్రము ధరించిగాని, వస్త్రము ధరించక (దిగంబరుడుగా) గాని -
- ఏకాగ్రమైన దృష్టి కలవాడై,
- నిశ్చలమగు అభేదదృష్టి కలవాడై,
- ఆశలన్నీ జయించినవాడై,
సన్యాసి ఏకాకిగా అనేక చోట్ల సంచారములు చేస్తూ ఉండాలి. వర్షాకాలములో మాత్రమే చాతుర్మాస దీక్ష కలవాడై నాలుగు నెలల కాలము ఒకేచోట నివాసము కలిగి ఉండాలి.

యతి (లేక) పరివ్రాజక రహస్య - ఏకాంత సంచారము - మోక్ష సిద్ధి

పరివ్రాజకుడు (లేక) యతి సమస్త సంసార బంధములను అధిగమించి మోక్షమే మహదాశయముగా కలిగి ఉంటాడు. ‘‘త్యాగేన తు కైవల్యమ్’’ అను వాక్యార్థమును ఆశ్రయించువాడగుచున్నాడు.

కుటుంబము, సంతానము, భార్య, బంధువులు, స్నేహితులు మొదలైన లోక సంబంధములను, లోక ప్రయోజనములను ఉద్దేశించే విధి విధానములను-నిషేధములను, అనేక శాస్త్రీయ పరిజ్ఞానములను చెప్పుచున్న వేదాంగములను, యజ్ఞ-యాగ - ఇష్టి - వ్రత విధానములను, వాటివాటి ఇహ-పర ప్రయోజనములను, యజ్ఞోపవీతము, శిఖ మొదలైన బాహ్య నియమ - నిష్ఠా విశేషములను-ఇవన్నీ వదలి ఉంటాడు. ఏకాంతమును ఆశ్రయించి రహస్యముగా (Having seperated himself from the relatedness to the worldly events, contexts and inter-personal belongings) సంచారము కలిగినవారై ఉంటారు.

దృశ్యముతో అనేక జన్మలుగా మమకార అహంకార పూర్వకంగా ఏర్పరచుకొంటూ వస్తున్న ‘అవినాభావ’ సంబంధము (Inter personal, Inter material relationship) వలన ఏర్పడుచున్న దోషములను గుర్తించి, వాటిని జయించటానికై మముక్షు యతి పరివ్రాజక మార్గము ఆశ్రయిస్తున్నాడు.

కాబట్టి,
కామః క్రోధః తథా దర్పో లోభ మోహ ఆదయశ్చ, యేతాంస్తు దోషాన్ పరిత్యజ్య ‘పరివ్రాట్’ నిర్మమో భవేత్ ।
‘‘ఏదో ఇంకా కావాలి’’ అనే కామము, కోప సందర్భములను సంస్కారములుగా మనస్సునందు పేర్చుకొన్నప్పటి రూపమగు క్రోధము, ‘‘నేను ఈ ప్రపంచంలో కనిపించే కొందరు జీవులకంటే గొప్పతనము కలవాడిని, ప్రత్యేకమైనవాడిని’’ - అను రూపముగా ఏర్పడుచూ ఉండే దర్పము, వ్యక్తిగత కుటుంబగత స్వార్థరూపమగు లోభము, సత్యముపై కల్పితమును ఆపాదించే మనోపరిమిత - మనో సంఘర్షణ రూపమగు మోహము మొదలైన దోషములను జయించటానికై ‘యతి’ (లేక) ‘సన్యాస’ (లేక) పరివ్రాట్ మార్గమును ముముక్షువు ఆశ్రయిస్తున్నాడు.

రాగ ద్వేషములనే దోషములనుండి బుద్ధిని శుభ్రపరచుకొంటూ, మట్టి - రాయి - బంగారములను సమదృష్టితో చూడగలగు చిత్తమును సంపాదించుకుంటూ, సమస్త సహజీవులను ప్రేమ దృష్టితో చూచుచూ, హింసించు స్వభావమును విడచిపెట్టుచూ, జగత్తు విషయముల పట్ల మౌనము అభ్యసిస్తూ ‘ముని’ అగుచున్నాడు.

సమస్త జగత్ - విశేషములపట్ల నిస్పృహుడు (unconcerned) అగుచు, దంభము (Sense of praising one’s own self in relation to others), అహంకారము (నేను - నాది అనే ఆవేశముల) నుండి క్రమంగా విముక్తుడు (Relieved) అగుచున్నాడు. హింస, పైసునము (Voilence and sadism) లను మొదలంట్లా తొలగించి వేసుకొంటున్నాడు. క్రమంగా అట్టి ముముక్షువు (మోక్ష సాధకుడు) ముని అయి, యతి మార్గమును ఆశ్రయించి ‘‘నేను నిత్యము, సత్యము, మధురము అఖండము అగు ఆత్మస్వరూపుడను’’ అను ఆత్మజ్ఞాన గుణోపేతుడై ఆ యతి మోక్షమును సిద్ధించుకొంటున్నాడు.

ఇంద్రియ దోషములు

పంచేంద్రియముల సామర్థ్యము దృష్ట్యా సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ జీవుడు సమస్త దుఃఖములు తొలగించుకోవటానికై ఎంతో శ్రమలను అనుభవించి, చివరికి ఉపకరణములుగా జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను సముపార్జించుకుంటున్నాడు. (తదితర జంతువులకు మాట్లాడే (మొదలైన) సామర్థ్యము ఉండుటలేదు.

అయితే ఇంద్రియములను ఉపకరణములుగా ఉపయోగిస్తూ ఈ జగత్తులో జీవిస్తూ ఉండగా, వాటివలన ఆత్మానందము సిద్ధించుకోవటానికి బదులుగా కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము మొదలైన అనేక దుఃఖములకు కారణము కాగల మనోదోషములను తెచ్చిపెట్టుకుంటున్నాడు.

ఇంద్రియాణాం ప్రసంగేన దోషమృచ్ఛతి, అసంశయమ్।
ఇంద్రియ విషయములను అధికంగా మాట్లాడుకుంటూ, ప్రసంగించుకుంటూ ఉండగా, వాటివలన కొన్ని దోషములు వచ్చి పడతాయి. ఇందులో సందేహం లేదు.

అయితే,
సన్నియమ్య తు తాన్యేవ తతః సిద్ధిం నిగచ్ఛతి।
ఆయా దోషములను కలుగజేయగల అవే ఇంద్రియములు సరి అయిన మార్గములో నియమించబడ్డాయో… అవి ఈ జీవునికి సిద్ధిని ప్రసాదించగలవు కూడా.

మహాభారతంలో యయాతి చెప్పినట్లు,

శ్లో।। న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి ।
హవిషా కృష్ణవర్త్మైవ భూయ ఏవ అభివర్ధతే ।।

ఒకాయన యజ్ఞము పూర్తి అయిన తరువాత యజ్ఞాగ్ని గుండములో భగ భగ మండుచున్న అగ్నిని ఆర్పటానికి హవిష్షుగా నేయిని తెచ్చిపోసాడు. అప్పుడు అగ్ని ఆరుతుందా? ఆరకపోగా, అగ్ని మరింత భగ్గుమంటుంది. అట్లాగే విషయములు అనుభవించటం కొనసాగిస్తున్నకొలది ఆ విషయముల కొరకై రూపుదిద్దుకొన్న కామము (Desire) తగ్గకపోగా, మరింతగా ప్రవృద్ధము అవుతూ ఉంటుంది.

జితేంద్రియుడు : ఎవడైతే ఇంద్రియములకు తాను వశము (Controlled, entangled) కాకుండా, తానే వాటిని తన వశము చేసుకొని ఉంటాడో, అట్టివాడు ‘జితేంద్రియుడు’.

అటువంటి జితేంద్రియుడు
- అనేక భేద - చమత్కార విశేషములతో కూడిన దృశ్య విషయ పరంపరలు చూస్తున్నప్పుడు,
- ఆయా సంబంధ - అనుబంధ - బాంధవ్యముల విషయ విశేషములను వింటున్నప్పుడు,
- ఆయా వస్తుజాలమును స్పర్శిస్తూ ఉన్నప్పుడు,
- ఆయా పదార్థములను తింటూ ఉన్నప్పుడు,
- రుచికరమగు తిను బండారములను వాసన చూస్తున్నప్పుడు,
న హృష్యతి । న గ్లాయతి । సంతోషము పొందడు. అరుచి, అసహ్యము, బాధ పొందడు. విజ్ఞుడై, ఇంద్రియ విషయములను జయించినవాడై ఉంటాడు.

యతి ఎల్లప్పుడు తనయందు రహస్యముగా సమ్యక్ దృష్టిని (సర్వత్రా సమదృష్టిని) సిద్ధించుకుంటాడు. వాక్కు, మనస్సులను, సర్వదా పరిశుద్ధము చేసుకొని ఉంటాడు. అప్పుడు వేదాంత శాస్త్రములో ఉపగతమై (అంతర్లీన గానమైయున్న) సమస్త ఆత్మానంద ఫలములను పొందగలడు.

సన్మానము బంధము । అవమానము శ్రేయోదాయకము

ఎవరైనా సరే బ్రహ్మమును ఉపాసించు మార్గము ఎన్నుకొన్నవాడు బ్రాహ్మణుడు. అట్టి బ్రహ్మమార్గమును ఆశ్రయించుచున్నవాడు→

సన్మానాత్ బ్రాహ్మణో నిత్యం ఉద్విజేత విషాదతః ।
తాను ఇతరులచే సన్మానించబడుచున్నప్పుడు ‘‘ఇది నాకు విషాదము పొందు సందర్భము’’ అని భావించి ఉద్విజేతము (ఉద్విగ్నత, వెఱపు, చింత, భయము, దుఃఖము) పొందినవాని వలె ఉంటాడు.

అమృతస్య ఏవ ఆకాంక్షేత్ అవమానస్య సర్వదా ।
ఒకడు ‘అమృతము’ను కోరుకొను విధంగా, బ్రహ్మ తత్త్వాభ్యాసి ఇతరుల నుండి అవమానమును అమృతప్రాయంగా భావిస్తాడు. తనకు అవమానమును, ఇతరులకు తన వలన సుఖము కలుగుటకు ఇష్టబడుతూ ఉంటాడు.

సుఖమ్ చరతి లోకే2స్మిన్, అవమంతా వినశ్యతి ।
‘‘సుఖము (గౌరవము) లోకములో బంధమే అవుతుందని, అవమానము లోక బంధములను నశింపజేస్తుందని ఎరిగి, భావించి ఉంటాడు. పైగా కష్టములు, అవమానములు వచ్చి పడుచున్నప్పుడు ‘‘నాకు తితిక్ష (సహించటము)’’ అనే యోగము (అష్టాంగ యోగములలో ఒకటి) అలవరుచుచున్నదని సంతోషము పొందుతాడు. సుఖములు, సన్మానములు తితక్ష యొక్క అభ్యాసమునకు వ్యతిరేకం అవుతాయని భావిస్తాడు.

న చ ఇమం దేహం ఆశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్ ।
ఈ దృశ్య జగత్తులో సంచరిస్తున్నప్పుడు ‘దేహభావము’ ఆశ్రయించి తద్వారా తదితరులతో వైరము కలిగి ఉండకూడదు. ఆత్మ భావమును ఆశ్రయించి మధురమగు స్నేహభావమనే కలిగి ఉండాలి.

కృధ్యంతం న ప్రతికృధ్యేదా । కృష్ణః కుశలం వదేత్ ।
కోపగించువారి పట్ల కోపము ప్రదర్శించకూడదు. కోపగించువానిపట్ల కుశలమే (క్షేమమే) ప్రకటించాలి. క్షేమమే కోరుకోవాలి. కుశలమే అడగాలి.

సప్త (7) ద్వారముల నుండి (పంచేంద్రియముల నుండి, మనోబుద్ధుల నుండి జనించే వ్యావహారిక సందర్భములలో అబద్ధము పలుకరాదు. (శబ్దము 7 ద్వారముల నుండి జనిస్తుందని శాస్త్ర విశ్లేషణము).

ఆధ్యాత్మ జ్ఞాన నిష్ఠుడై ఆత్మ భావన యందు అసీనుడై ఉండాలి. దేనినీ ఆపేక్షించక, ఆశించక ఆత్మజ్ఞాన భావనతో ఆత్మ సుఖమునే ఆశ్రయిస్తూ, ఇక్కడి దృశ్యము నందు సంచరించుచుండును గాక।

ఎవడైతే పంచేంద్రియములను నియమించి, నిరోధించి, రాగ - ద్వేషములను (ఇష్టము - అయిష్టములను) క్షీణింపజేసుకుంటూ ఉంటాడో, అట్టివాడు జన్మ-మృత్యు పరిధులను దాటి అమృతత్వము సిద్ధించుకోగలడు.

ఈ భౌతిక శరీరము ఎటువంటిది ?

ఈ శరీరము బొమికలు, స్థూనము (వెన్నెముక స్థంభము), స్నాయువు (సన్నటి నరములు) లచే బద్ధమై పిచ్చుక గూడువలె అమరిక కలిగి ఉన్నట్టిది.

మాంసము, శోణితము (రక్తము) లచే లేపితమై (అలకబడినదై) ఉన్నది. చర్మముచే కప్పబడి ఉన్నది.

మూత్రము, పురీషము (ఉచ్చ, పెంట) మొదలైన దుర్వాసన పదార్థములతో కూడి ఉన్నట్టిది.

ముసలితనము, ఆకలి బాధలు, శోకము (దుఃఖము) ఇందులో సమావేశమై ఉన్నాయి. ఇందులో ఎన్నో రోగములు ప్రదర్శనమవటానికి సంసిద్ధమై ఉన్నాయి.

రజస్వలము (రక్త స్రావము) మొదలైన వాటితో కూడిన ఈ భూత శరీరము అనిత్యము. శాశ్వతమైన వస్తువే కాదు! ఇది వదలి ఉండవలసినదే గానీ, పట్టుకొని కులకవలసినది కానే కాదు!

ఇటువంటి రక్తము, మాంసము, విసర్జనములు, కండరములు, మజ్జ (ఎముకలలో నూనె), ఇవన్నీ కలిసియుండి ప్రదర్శనమగుచున్న ఈ శరీరమును చూచి ఎవ్వడైనా ప్రీతి పొందుతూ ఉంటే - అట్టివాడు పర్యవసానంగా అనేక నరకములు రుచి చూడవలసి వస్తుంది.

ఎవ్వడైతే ‘‘ఈ దేహమే నేను’’ అని నమ్మి ఉంటాడో, అట్టి భావనలచే ‘‘కాలసూత్రము, మహావీచిక, అసిపత్రము’’ అనబడే నరక స్థానములకు రహదారిని ఆశ్రయించినవాడే అగుచున్నాడు. అందుచేత, సర్వనాశనము వైపుగా ఉపస్థితము (placed) అయినట్టి ‘‘నేను భౌతిక దేహభావమును - (శుచిగా ఉన్న ఒక వ్యక్తి కుక్క మాంసము తింటున్నట్టివానికి దూరముగా ఉండు విధంగా) - సర్వ ప్రయత్నములతో విసర్జించి ఉండాలి.

ద్వంద్వమును వదలాలి। బ్రహ్మమును పట్టుకోవాలి।

ఓ నారదా !

‘‘బంధవిముక్తి పొందాలి’’ అను ఉత్తమ ఆశయము గల జీవుడు ‘‘సుకృతముల వలన కలిగే ప్రియము, దుష్కృతముల వలన కలిగే అప్రియము’’ (ప్రియా ప్రియముల) రెండిటినీ ప్రక్కకు పెట్టి (వదలివేసి) ధ్యానయోగమునకు ఉపక్రమించాలి.

అట్టి ధ్యాన యోగ అభ్యాసముచే సనాతనము (That which is there from the begining and is blossoming beyond all qualities) అయినట్టి స్వస్వరూపమగు పరబ్రహ్మమును ఆశ్రయించాలి.

(భక్తి - జ్ఞాన - యోగ - సేవా - సమర్పణ - పూజ - ధ్యాన - తపో ఇత్యాది) ఆయా ఏదో మార్గములుగా భౌతిక శరీరముతోను దృశ్యముతోను ఏర్పడే సంగము (Attachment)ను నెమ్మది నెమ్మదిగా మానసికంగా త్యజించి వేయాలి.

సమస్త ద్వంద్వముల నుండి విముక్తుడై ఈ జీవుడు ‘బ్రహ్మము’ నందు ఆసీనుడు, అవితష్ఠిడు అగును గాక।

భిక్షు సన్యాస విశేష లక్షణములు

భిక్షువు ఆత్మసిద్ధి కొరకై ఏకాంతముగా (ఒం{రిగా), ఎవ్వరి సహాయము లేకుండా చరించుచుండను గాక. ఆ విధంగా ఒంటరిగా సంచరిస్తూ ఆత్మ ధ్యానము విడువక, హీనత్వము ఆశ్రయించక ఉంటాడు.

చేతిలో కపాలము (భిక్షుక పాత్రతోను, వృక్షముల మూలలో (మొదట్లో) నివాసము, ఆకులే వస్త్రములు గాను కలిగి ఉంటాడు. ఎవ్వరి సహాయము కోరకపోవటము, సర్వత్రా సమదర్శనము, సర్వత్రా ప్రేమ మొదలైనవి ముక్తుని స్వాభావిక లక్షణములు.

భిక్షుక యతి ఇంకా కూడా,
🥀 సర్వదా సమస్త సహజీవులకు హితము, క్షేమము కలుగజేయు నడవడిక కలిగి ఉంటాడు.
🥀 ఎల్లప్పుడు పరమ శాంత స్వభావుడై ఉంటాడు.
🥀 త్రిదండి (మనో దండము, వాక్ దండము, కర్మ దండము అనే త్రి(3) దండములు) ధరించిన వాడై ఉంటాడు. మనో, వాక్ కర్మలను తన చేతిలోని ఉపకరణములుగా కలిగి ఉంటాడు. అంతేగాని వాటికి తాను దాసుడై ఉండడు.
🥀 కమండలువు (సన్యాసులు జలము కలిగి ఉండు పాత్ర) మాత్రమే కలిగి ఉంటాడు.
🥀 ఏకారాముడై (ఒంటరివాడై) సర్వదా ఏకమగు బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నవాడై భిక్ష కొరకై గ్రామములో ప్రవేశిస్తూ ఉండును గాక।
ఏకో భిక్షుః యథోః ఉక్తస్వాత్ । ద్వా ఏవ మిథునం స్మృతం త్రయో గ్రామః సమాఖ్యాత ఊర్ధ్వంతు నగరాయతే।।
ఒక్కడు మాత్రమే (ఏకాంతుడై) ఒంటరిగా సంచారము కలిగి ఉంటే ‘‘భిక్షాటనము’’ అని పిలుస్తారు.
🥀 ఎప్పుడూ ‘ఏకో భిక్షువు’ అయి ఉండాలి (భిక్షాటనము).
🥀 ఒకవేళ ఇద్దరు భిక్షువులు కలిసి ఉంటే ‘మిథునము’ (జంట) అవుతారు.
🥀 ముగ్గురు భిక్షువులు కలిసి ఉంటే ‘గ్రామ సమాఖ్యాతము’ అంటారు.
🥀 అంతకు మించి భిక్షువులు కలిగి ఉంటే ‘నగర సమాఖ్యాతము’ అవుతుంది.

నగరముగా (ముగ్గురు మించి) గాని, గ్రామము (ముగ్గురు కలిసి) గాని మిథునముగా (జంటగా) గాని ఉచితము కాదు.

భిక్షువుకు ఏకోభిక్షుత్వమే (ఒంటరిగా భిక్షువై ఉండటమే) ఉచితం. ఒక్కరి కంటే ఎక్కువ భిక్షువులు కలిగి ఉంటే పరస్పర సంబంధము కారణంగా రాజవార్తలు, పరస్పర పూర్వాశ్రమ వార్తలు, లోక సంభాషణలు మొదలైనవి అధికమై భిక్షకునికి సంబంధించిన స్వధర్మముల నుండి జారిపోవు అవకాశములు అధికంగా ఉంటాయి. ఇద్దరు, ముగ్గురు (లేక) ఎక్కువ మంది కలిసి ఒకచోట ఉండటం చేత పరస్పరము లోక సంబంధమైన విషయముల పట్ల సంభాషించుకొను వ్యసనము, స్నేహము, పైశున్యము (పరస్పరము కోపతాపాలు కలిగి ఉండటము, కొండెములు చెప్పుకోవటము), మాత్సర్యము (అసూయ, పగ, విద్వేషము) మొదలైనవి ఏర్పడగలవు. అందుచేత అధికాధికంగా ‘ఏకాంతము’గా ఉంటూ ఉండాలి.

ప్రపంచ విషయములను పరస్పరం ఆలాపనములు చేయరాదు. వాటి పట్ల నిస్పృహ (Unavocative and unconcern) కలిగి ఉండాలి.

యతి అయినవాడు ఎవరితోనైనా ఏదైనా సంభాషించు సందర్భములో ‘‘ఇదంతా నారాయణమయం! నా ఎదురుగా ఉండి , కనబడేదంతా శ్రీమన్నారాయణుని ప్రత్యక్షరూపాలే. ఇదంతా నారాయణమే - అని ఉద్దేశిస్తూ ‘‘నారాయణ’’ శబ్దమును ప్రతి సందర్భములోను పలుకుచుండును గాక. దద్యాత్ ‘నారాయణ’ ఇత్యేవం ప్రతివాక్యం సదా యతిః.
యతి మముక్షువు ఇంకా కూడా ఈ ఈ లక్షణములు (లేక) స్వభావాలు ఆశ్రయిస్తూ ఉండాలి.

ఏకాకీ చింతయేత్ ‘బ్రహ్మ’ మనోవాక్కాయ కర్మభిః ।
ఏకాకిగా (being alone) ఎక్కవ సేపు ఉంటూ ఉండాలి. మనస్సు చేతను, వాక్కు చేతను, కాయము చేతను కనబడే శరీరములన్నిటిలో ‘శరీరి’గా ఉన్నది నారాయణుడే’’ - అను మననము ధరించాలి.

బ్రహ్మము గురించియే అనునిత్యంగా చింతన (Chanting) చేయాలి. అనిపించే వరకు అనుకుంటూనే ఉండాలి.

మృత్యుం చ న అభినందేత, జీవితం వా కథం చ న ।
ఎప్పుడూ కూడా చావాలని గాని, ఎంతో కాలం బ్రతకాలని గాని భావావేశము కలిగి ఉండక, ‘వర్తమానము’ను సద్వినియోగ పరచుకోవాలి. సర్వాత్మకమగు పరబ్రహ్మము గురించే యోచన, ఉసాసన కలిగి ఉండాలి.

కాలమేవ ప్రతిక్షేత యావత్ ఆయుః సమాప్యతే ।
ఆయుష్షు ఉన్నంతవరకు సమస్తమును ‘కాలగతి’ కి వదలివేసి, తాను బ్రహ్మము గురించిన ధ్యాసయందు నియమితుడై ఉండాలి.

రాజు గారి ఆజ్ఞను అనుసరించి, మరింకేమీ (అవునా ? కాదా ? అని) ఆలోచించకుండా, రాజాజ్ఞను నిర్వర్తించే భృత్యువు (రాజసేవకుని వలె) కాలగతిని అంగీకరించు బుద్ధి కలిగి ఉండాలి. బ్రహ్మము గురించిన జ్ఞానము (తెలుసుకోవటము), బ్రహ్మమునే దర్శించటము, బ్రహ్మమునందు ప్రవేశము పొందటమునందే ధ్యాసనంతా నిలుపాలి. ఇక ఇక్కడి జీవన్ - మరణ విశేషములన్నీ కాలమునకు సంబంధించినవిగా భావించాలి. జీవన్మరణముల పట్ల కావాలని గాని, వద్దనిగాని అనుకోవలసిన పని ఏమీ యతికి స్వాభావికంగానే ఉండదు.

యతి లక్షణములు - యతి స్వాభావికములు

ఏ ఆశ్రమంలో (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో) ఉన్నాకూడా యతి లక్షణములు ఆశ్రయించువాడు యతియే అగుచున్నాడు. అట్టి యతి స్వాభావికముల గురించి వివరిస్తున్నాను. నారదాది ముని శ్రేష్ఠులారా! వినండి! ముఖ్యంగా యతి ఆరు(6) విశేష స్వాభావికాలు కలిగి ఉంటున్నాడు.

శ్లో।। అజిహ్వః షండకః పంగుః అంధో బధిర ఏవ చ
ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుః షడ్భిః ఏతైః న సంశయః।।

1) అజిహ్నుడు 2) షండకుడు 3) పంగు 4) అంధుడు 5) బధిరుడు 6) ముగ్ధుడు అయిన ఆరు లక్షణములు గల భిక్షువు (సన్యాసి) గానీ, ముముక్షువు గాని సమస్త సంసార (దృశ్య) బంధములనుండి తప్పక విడివడగలడు.

ఈ ఆరు భిక్షుక - అభ్యాసముల గురించి మరికొంత వివరణగా చెప్పుకుందాము.

1) అజిహ్నుడు (నాలుక లేనివాడు) : రెండు అభ్యాసములు గలవానిని ‘అజిహ్వయతి’ అని పిలుస్తారు.

i) ఇదం ఇష్టం,ఇదం నేతి అశ్నన్ అపి న సజ్జతి। ఆహారము తింటూ ‘‘ఇదంటే నాకు ఇష్టము, రుచికరము - ఇదంటే నాకు ఇష్టము ఉండదు’’ - అను భావన లేకుండా ‘‘ఆహారములోని సమస్త రుచులు భగవత్ ప్రసాదితమే’’ అని ఆస్వాదించటము అజిహ్నుని మొదట స్వాభావిక లక్షణము.

ii) హితం, సత్యం, మితం వక్తితం ‘అజిహ్యం’ ప్రచక్షతే । నాలుక ఆహారం తీసుకోవటం, మాట్లాడటం అను రెండు ధర్మములు నిర్వర్తిస్తోంది. మాట్లాడేటప్పుడు అందరికీ ఇష్టమని అనిపించేటట్లు సంభాషించటము, సత్యమే పలుకటము (అబద్ధములు ఆడకపోవటము), మితముగా మాట్లాడటము (అతిగా మాట్లాడకపోవటము) ఈ లక్షణములు అజిహ్నునిలోని రెండవ స్వాభావికము. కాబట్టి యతి లక్షణములు అజిహ్నుడై ఉండటము.

2) షండకుడు / షండుడు / నపుంసకుని వంటి యతి : అద్యజాతాం యథా నారీం, తథా షోడశ వార్షికమ్, శతవర్షాంచ యో దృష్ట్యా నిర్వికారః స షండకః । అప్పుడే పుట్టిన బిడ్డను 16 సం।।ల యౌవనవతిని, నూరు సంవత్సరముల వయసుగల అవ్వను ఒకే నిర్వికార (వికారరహిత బ్రాహ్మీ) దృష్టితో చూడగలవాడు ‘‘యతిషడంగ లక్షణుడు’’.

3) పంగువు (కుంటివాడు వంటి యతి) : భిక్షార్థ మటనం యస్య విణ్మాత్ర కరణాయ చ, యోజనాత్ న పరం యాతి సర్వధా ‘పంగు’ ఏవ సః । భిక్ష కొరకు గాని, సంచారము కొరకు గాని యోజనము (ఆమడ, 4 క్రోసులు) దూరము మించి నడవక, మిగిలిన సమయమంతా ఒకచోట కూర్చుని ఆత్మోపాసన గురించిన అనుష్ఠానము నిర్వర్తించువాడు ‘యతి పంగువు’ (కుంటితనము ఉపాసించు యతి) అగుచున్నాడు.

4) అంధుడు (అంధుడు వంటి యతి) : తిష్ఠతో వ్రజతో వాపి యస్య చక్షుః న దూరగమ్, చతుర్వుగాం భువం ముక్త్వా పరివ్రాటో ‘అంధ’ ఉచ్యతే । ఒకే చోట కూర్చుని ఉన్నప్పుడు గాని, మరొక చోట బాటలో నడుస్తూ ఉన్నప్పుడు గాని అతని చూపు నాలుగు బారలకు మించి వెళ్లుచూడదో అతని నేత్రేంద్రియము (దృష్టి) సందర్భావసరమునకు మించి ఎక్కడెక్కడికో వెళ్లక అదుపులో ఉండి ఉంటుందో, ఆత్మ దృష్టిని వదలకయే ఉంటుందో, అట్టివాడు ‘యత్యాంధుడు’ అనబడుచున్నాడు.

5) బధిరుడు (చెవిటివాడు వంటి యతి) : హిత - అహితం మనోరామం, వచః శోకావహం తు యత్, శృత్వాపి నశృణోతీవ, బధిరః స ప్రకీర్తితః। హితమైన, అహితమైన విశేషముల పట్ల శోకము పొందు మాటలు వింటున్నప్పుడు కూడా ఎవడు వింటూ కూడా విననివాని వలెనే ఉండగలడో, అట్టివాడు ‘యతి-బధిరుడు’.

6) ముగ్ధుడు : సాన్నిధ్యే విషయాణాం యః సమర్థో వికలేంద్రియః, సుప్తవత్ వర్తతే నిత్యం స భిక్షుః - ‘ముగ్ధ’ ఉచ్యతే । ఎదురుగా అనేక ఇంద్రియ విషయములు ఏర్పడి ఉన్నప్పటికీ ఇంద్రియములు జయించినవాడై, విషయముల పట్ల సుప్తము (గాఢనిద్ర వహించినవాడై ఉన్నవాడు) ‘‘యతి-ముగ్ధుడు’’ అనబడుచున్నాడు.

- రుచిని జయించి, మంచి వాక్కును కలిగియున్న నాలుక
- బాహ్య సౌందర్యమునకు వశముగాని ఇంద్రియ నిగ్రహము
- అనవసరమైన తిరుగులకు వ్యర్థము చేయని నడకలు
- చెడును చూడని, మంచిని మాత్రము చూచి గ్రహించే చూపులు
- చెడు విషయములు వినక, ఆత్మజ్ఞాన - ఆత్మోపాసన సమాచారము పట్ల మాత్రమే శ్రద్ధగల వినికిడి
- ఇంద్రియ విషయములచే ఆకర్షితము కానట్టి, మౌనము వహించు బుద్ధి
ఇవి కలిగియున్నవాడు యతి ధర్మములను ఉపాసించువాడై, ఏ ఆశ్రమము వాడైనా యతీశ్వరుడు కాగలడు.
అతడు సర్వజ్ఞుడై ఉండి కూడా సంసార జనులకు అందరి వలె సామాన్యుని వలెనే అగుపిస్తాడు.

యతి మార్గవర్తికి నిషేధములు (చేయకూడనివి)

చూడకూడనివి (షట్ న పశ్యత్)
1) ఇంద్రియములను ఆకర్షించే నాట్య విన్యాసములు.
2) ద్యూతము (డబ్బుతో పందెములు, పేకాట మొదలైనవి).
3) ప్రమోదము (ప్రమాదాం సుహృదం తథా): (కామదృష్టితో స్త్రీలతో సంభాషణము) ధన దృష్టి, కామ దృష్టి కలవారితో స్నేహము
4) భక్ష్యము : తినగూడనివి తినటము
5) భోజ్యము : మ్రింగకూడనివి, త్రాగకూడనివి (మత్తు పానీయాలు) సేవించటము
6) ముదక్యము : ముదము (ఆశ్చర్య సంతోషములు) కలిగించే వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఆకర్షితులవటము.

ఈ ఆరు - షట్ న పశ్యేత్ కదాచన - యతి అభ్యాసి చూడకూడనివి.

మనస్సుతో కూడా చింతన చేయకూడనివి

1) క్రియా విషయ - వస్తు - బంధజనముల పట్ల రాగము.
2) పై సందర్భముల పట్ల ద్వేషము.
3) మదము (గర్వము, మత్తు).
4) కల్పిత ఆపాదిత విషయముల పట్ల సత్యము అను భావము కలిగించు మాయ.
5) ఇతరులకు నష్టము, బాధ, అవమానము కలిగించాలనే ద్రోహ బుద్ధి.
6) మోహము (సాకారమగు వస్తువులు, విషయముల పట్ల ఊహ - అపోహలతో వశము కావటము - (Attraction and ownership towards inanimate objects).

ఈ ఆరు యతి మనస్సుతో కూడా సంకల్పించనైనాకూడదు.

యతి వర్జించవలసిన షట్ పాతకములు

1) మంచము 2) తెల్ల వస్త్రములు 3) స్త్రీల సౌందర్యము గురించిన కథల శ్రవణము, మాట్లాడటము 4) చిత్త చాంచల్యము- క్షణమొక అభిప్రాయం కలిగి ఉండటము 5) పగటి నిద్ర 6) విలాసము ఆశయముగా దూరప్రయాణము.
ఈ ఆరింటిని షట్ పాతకములుగా భావించాలి.

ఇంకా కూడా …
- ఆత్మచింతన చేయువాడు అనేకసార్లు దూర దూర యాత్రలు సంకల్పించక, ఒక ప్రశాంత ప్రదేశము ఎన్నుకొని ‘ఆత్మచింతన’ యందు నిమగ్నము అయి ఉండును గాక।
- ముక్తికి కారణము కాగల విచారణ కొరకై నిత్యము వేదములలో జ్ఞాన విభాగము అయి ఉన్న ఉపనిషత్ విద్యను అధ్యయనము, అభ్యాసము చేయుచుండును గాక।
- సుదీర్ఘముగా తీర్థయాత్రలను నిర్వర్తించకుండును గాక।
- ఎక్కువసార్లు స్నానములు, అధికంగా ఉపవాసము (ఆహారము రోజంతా తీసుకోక పోవటము) ఉచితం కాదు.
- ఎక్కువగా శాస్త్ర పఠన శీలుడై వుండరాదు. తెలుసుకొన్నది అభ్యాసముగా తీర్చిదిద్దుకోవాలి.
- అధికాధికంగా వ్యాఖ్యానపరుడై జీవితమంతా గడిపివేయరాదు. తాను ఆత్మ గురించి ఎరిగినది - ఎదురుగా దర్శించు అభ్యాసము, స్వానుభవముగా మరల్చుకోవాలి.

అపాపమ్ అశఠంవృత్తం అజిహ్నం నిత్యమ్ ఆచరేత్ । యతి అయినవాడు పాపరహితమైన నిర్మల జీవితము కలిగి వుండాలి. కపట స్వభావము కలిగి ఉండరాదు. అశఠం - మూర్ఖత్వము వహించువాడై ఉండకూడదు.

తాబేలు ప్రమాదమును శంకించిన మరుక్షణం తన అంగములను ఉపసంహరిస్తుంది కదా! అట్లాగే యతి తన ఇంద్రియ ధ్యాసల దోషములను గుర్తించి ఇంద్రియములను (చూపును, వినికిడిని మొదలైనవాటిని) పాపపు ధ్యాసలు ఏర్పడకుండా వెనుకకు మరల్చి ఆత్మ ధర్మము అగు ‘సమత్వము’నందు ప్రతిక్షేపించాలి.

యతి అయినవాడు -
- ఇంద్రియ మనో వృత్తులను (avocations) క్షీణింపజేసుకొనుచూ ఉండాలి.
- ‘దృశ్యము నుండి ఏదో ఆశించటము’ అను దురభ్యాసము నుండి విరమించాలి.
- మమకారము, అహంకారములను దగ్గరకు చేరనీయకూడదు.
- దేనినీ ‘సొంతము’ అనే భావముతో పరిగ్రహించకూడదు. (పడవలోనికి నీరు రానివ్వని తీరుగా) వస్తువులను, విషయములను ‘‘నా సొంతము’’ అనే భావన రూపంగా హృదయమునందు ప్రవేశించనీయకూడదు.
- ఏదో పొందాలనే వృత్తితో ఎవరికీ నమస్కరించకుండు గాక।
- ఏదీ తనదిగా భావించక, స్వధాకారుడై ఉండకుండు గాక।
- మమకార రహితుడై, దేనినీ ఆపేక్షించనివాడై, ఆశను జయించినవాడై ఉండు గాక।
- పై సాధనలను ఆశ్రయిస్తూ ఏకాంతవాసి (alone) అయి ఎవడు ఉంటాడో ఆత్మతత్త్వమును, ఆత్మ ధర్మమును అనుష్ఠిస్తూ ఉంటాడో, అట్టివాడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ముక్తిని తప్పక సిద్ధించుకోగలడు.
ఇందులో సందేహము లేదు.

సన్యసించు విధి విధానము

ఓ నారదా ! తదితర శౌనకుడు మొదలైన శ్రోతలారా ! ఈ జీవుడు దుఃఖ బంధములను తొలగించుకొను విధానము వినండి.

‘‘నేను దృశ్యముతో తన్మయుడనై అనేక దుఃఖములు కొనితెచ్చుకుంటున్నాను. అజ్ఞానమును తొలగించుకొని, బంధ విముక్తుడను కావాలి’’ అను ఆవశ్యకతను ఎరిగినవాడు ఇక తాత్సారం చేయరాదు (Should not be lazy and delay from putting forth a programme). అప్రమత్తుడు (wel alert) అయి ఉండాలి.

క్రమము

బ్రహ్మచారి అయి, ఆ తరువాత గృహస్థుడై, ఆపై వానప్రస్థుడై, శాస్త్ర విహితమైన ఆయా ఆశ్రమ ధర్మములు నిర్వర్తించుచూ, కర్మ - జ్ఞాన యోగి అయి, ఆత్మోపాసన సర్వదా, సర్వత్రా కొనసాగించును గాక.

బ్రహ్మచర్యము తరువాత గృహస్థాశ్రమము స్వీకరించవచ్చు లేదా పూర్ణ నైరాశ్యము కలిగినవాడై ఉంటే బ్రహ్మచర్యము నుండియే సన్యాసాశ్రమము స్వీకరించి ప్రవ్రజుడు కావచ్చు కూడా।

సన్యాసమునకు ప్రవ్రజుడు కావటానికి తగిన సమయము ఏది ? విరాగి అయి, సమస్త దృశ్య విషయముల పట్ల వైరాగ్యము పొందటమే!
- వ్రతములు చేయుచున్నవాడైనా (లేక) ‘అవ్రతుడు’ అయినా సరే,
- స్నాతకుడు (బ్రహ్మచర్య వ్రతము స్వీకరించినవాడు) అయినా (లేక) అస్నాతకుడు అయినా సరే వైరాగ్యము పొందిన మరుక్షణం సన్యాసాశ్రమము ఆశ్రయించు గాక।

ఏ రోజు అయితే ఒకనికి సమస్త ప్రాపంచక సంగతి, సంబంధ, సందర్భములపట్ల మనస్సునందు అనురక్తి తొలగిపోయి, విరక్తి జనిస్తుందో, ఆ రోజే ప్రవ్రజము (సన్యాసము) స్వీకరించును గాక।

అందుకు గాను ‘ప్రాజాపత్యము’ అనే అగ్నికార్యము (వేష్ఠి) నిర్వర్తించునుగాక (లేదా) కనీసము అగ్నిదేవతాహ్వాన (లఘు) ఉపాసనలన్నా చేయాలి.

ఎందుకంటే, అగ్నియే ప్రాణస్వరూపమై ఉన్నది. సృష్టిలో ‘అగ్నేయ యజ్ఞము’ వలననే ఈ జీవుడు ప్రాణము కలవాడు అవుతున్నాడు. అందుచేత త్రిధాతు సంబంధమైన త్రైతాగ్ని రూపమగు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్నుల ఆహ్వానము చేసి) యాగము తప్పక చేయాలి. (పంచాగ్నులలో 4వది సభ్యము - అవసద్యము, ఐదవది సూర్యుడు).

త్రైతాగ్నులలో త్రిధాతువులు 1) సత్త్వగుణము 2) రజోగుణము 3) తమోగుణము అని కూడా గూఢార్థము. అందుచేత త్రైతాగ్ని వేష్ఠి నిర్వర్తించేటప్పుడు సత్త్వ, రజో, తమో గుణములను అగ్నియందు మానసికంగా మంత్ర శబ్దములతో హోమము చేయాలి. ఎందుకంటే మహదాశయమగు ప్రవ్రజము (సన్యాసము) అనునది త్రిగుణాతీత / నిర్గుణ స్థానము అయి ఉండటం చేత.

అగ్నివేష్టి మంత్రము

అయం తే యోనిః ఋత్విజో యతో జాతో అరోచథాః
తం జానన్ నగ్న అరోహథానో వర్ధయా రయిం ।
ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్రేత్ ఏషవా వై
అగ్నేర్యోనిర్యః ప్రాణః ప్రాణం గచ్ఛ స్వాం యోనిం గచ్ఛ స్వాహా ।

ఆత్మజ్ఞాన సంపన్నులగు ఋత్విజులు, - ఈ దృశ్య వ్యవహారమంతా రుచించనివారై - తత్త్వజ్ఞులై ఏ ఆత్మయోని యందు ప్రవేశిస్తున్నారో అట్టి స్వస్వరూపాత్మ తేజస్సును వేగముగా జేరుటకై నగ్నధారణకు సిద్ధపడుచున్నాము. బ్రాహ్మీస్థితికి ఆరోహణము కొరకై (For the purpose of stepping up) త్రైతాగ్నులను ప్రజ్వలింపజేయుచున్నాము, వర్ధింప జేయుచున్నాము.

శాస్త్రోక్తములైన ఆయా మంత్రములను పలుకుచు, దేవతలకు స్తుతులను పలుకుచు ఈ అగ్నికి ఆహుతులను సమర్పిస్తూ హోమము చేయుచున్నాము. మా ఆహుతులను స్వీకరిస్తూ అగ్ని భగవానుడు మా వ్యష్టి ప్రాణమును విశ్వగత ప్రాణమునందు ఏకము చేసి ఆహుతిగా పవిత్రము చేయును గాక.

ఈ విధంగా మంత్రము చదువుచు, ఆహవనీయాగ్ని కూడా వెలిగించి అగ్నికి ఆహుతులు సమర్పించాలి.

సన్యసించు సందర్భములో ఒకవేళ అగ్నికార్యము నిర్వర్తించటానికి కావలసిన సమిధము, అగ్ని పరికములు (సరంజామా) లభించకపోతే,
యత్ అగ్నిం నవిందేత్, అప్సుజుహాయాత్ - ‘‘ఆపోవై సర్వదేవతాః । సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి స్వాహా’’ అగ్ని లభించక పోయినప్పుడు జలము సకల దేవతా స్వరూపమే కాబట్టి, సమస్త దేవతలను ఉద్దేశించి ఈ చెప్పుకున్న మంత్రముతో హోమము చేయాలి.

ఆ తరువాత సాజ్యం హవిః అనామయం మోదమ్ ఇతి । - ఈ సమర్పిస్తున్న జలహవిస్సుతో అనామయుడగు పరమాత్మ తృప్తి చెందునుగాక - అను మంత్ర - మంత్రార్థములను పలుకుచూ, స్మరిస్తూ ప్రాశ్నీయము నిర్వర్తించాలి (జలము స్వీకరించాలి).

1) శిఖను 2) యజ్ఞోపవీతమును 3) పితరుని (తండ్రిని) 4) కుమారుని 5) కళత్రమును (భార్యను) 6) కర్మలను 7) వేదములో మహావాక్యములకు వేరైన తదితర మంత్రోపాసనలను విడచివేయాలి.

పరివ్రాజాత్మ విన్మోక్ష మంత్రము అయినట్టి అఖండ బ్రహ్మోపాసనా త్రైధా మంత్రమును - 1) తత్త్వము 2) సో2హమ్ 3) త్వమేవాహమ్ - త్రివిధ రూప మహామంత్రమును శబ్దార్థ పూర్వకంగా స్వీకరించి, సన్యాసము స్వీకరించాలి. సన్యాసి సాక్షాత్ పరబ్రహ్మమునే (తత్త్వమ్ - సో2హమ్ - త్వమేవాహమ్ - పరమార్థమునే) నేరుగా ఉపాసించాలి. అందు కొరకై అప్పటి వరకు సాధనగా కలిగియున్న అన్యదేవతా భావనార్థ మంత్రములన్నీ సన్యాసి అగుచు తర్పణ పూర్వకంగా వదలి వేయాలి. బ్రహ్మమునే ఉపాసిస్తూ ‘బ్రాహ్మణుడు’గా మాత్రమే అయి ఉండాలి.

యజ్ఞోపవీత శూన్యుడు ‘బ్రాహ్మణుడు’ అవుతాడా ?

శ్రీ నారదమహర్షి : హే పరబ్రహ్మమూర్తీ ! పితృదేవా ! జగత్ పితామహా ! మీరు చెప్పుచున్న విధానము ప్రకారము సన్యసించేటప్పుడు యజ్ఞోపవీతమును కూడా సమర్పించి వేయాలా ?

శ్రీ పితామహుడు (హిరణ్యగర్భుడు) : అవును. సన్యసిస్తూ ఉన్నప్పుడు ‘యజ్ఞోపవీతము’ ను కూడా విడచివేయును గాక.

శ్రీ నారద మహర్షి : హే సృష్టి సంకల్ప ఆది స్వరూపా ! బ్రహ్మ భగవాన్ ! ఇప్పుడు నాలో ఒక సందేహము జనిస్తోంది. ‘ఉపనయనము’ సందర్భములో బ్రహ్మోపాసనా స్వీకారము చేస్తూ, అందుకు సంజ్ఞగా యజ్ఞోపవీతము ధరిస్తున్నారు కదా! ఇప్పుడు సన్యసిస్తూ ఆ యజ్ఞోపవీతము వదలి వేస్తూ ఉండగా, అట్టివాడు బ్రహ్మోపాసకుడగు బ్రాహ్మణుడు ఎట్లా శాస్త్రార్థానుసారంగా కాగలడు ?

‘‘బ్రహ్మసూత్ర ధారణ’’ అనగా
ఈ విశ్వమంతా సూత్రముగా ధరించటమే!

పితామహులవారు : ‘త్రివృత్ సూత్రము’ (మూడు వృత్త దారములు గల సూత్రము) అనగా ప్రత్తిదార నిర్మితము మాత్రమేనని అనుకుంటున్నారా ? కానే కాదు. అట్టి త్రివృత్ - యజ్ఞోపవీతము మనోబుద్ధులతో ధరించటానికై సంజ్ఞార్థము మాత్రమే. పైగా సంజ్ఞార్థముగా (సంజ్ఞా పూర్వకంగా) ధరించిన దారపు త్రిసూత్రమునకు పరిమితమై పరమార్థమును ఆశ్రయించకపోతే ప్రయోజనము ఏమంటుంది ? ఏమీ ఉండదు. అంతరార్థమేమిటో తెలుసుకొని, ఉపాసన పూర్వకంగా ధరించాలి సుమా. బ్రహ్మమును ఉపాసించుచూ, దృష్టిని పవిత్రము, మహోన్నతము చేసుకోవటానికి యజ్ఞోపవీత ధారణ చెప్పబడుతుంది.

పరమార్థము :-
1) హృదిస్థా దేవతాః సర్వాః । సమస్త దేవతలు హృదయమునందే నివాసము కలిగి ఉన్నారు.
2) హృది ప్రాణాః ప్రతిష్ఠితాః । ప్రాణశక్తి కూడా హృదయమునందే ప్రతిష్ఠితము అయి ఉన్నది.
3) హృదిః ప్రాణశ్చ జ్యోతిశ్చ । ప్రాణము హృదయమునందు జ్యోతి (వెలుగు, That which undergoes no change) రూపంగా ప్రకాశమానమై ఉన్నది.
ఈ మూడు సూత్రములే యజ్ఞోపవీతములోని త్రి-దారముల యొక్క అంతరార్థమని వేదార్థము గ్రహించిన బుధులు (Persons having knowledge of main purpose) ఆ రీతిగానే ఉపాసన నిర్వర్తిస్తూ ఇతరులకు గుర్తు చేస్తున్నారు.

ఈ విధంగా ఎరుగుచూ ఆత్మోపాసన ఆశయముగా గల మముక్షువు శిఖను క్షౌరముచే తీసివేసి, విజ్ఞాన బలిమితో బాహ్య - (ప్రత్తితో నిర్మితమైన) సూత్రము త్యజించెదరు గాక।

మరి ఆశ్రయించవలసినది దేనిని ?

యత్ ‘అక్షరం పరంబ్రహ్మ’ తత్ సూత్రం - ఇతి ధారయేత్। ‘‘అక్షరమగు (That which undergoes no change) పరం బ్రహ్మమే (That self of myself beyond all and prior to all) నేను ధారణ చేయవలసినది. అందుకు ఈ నూలు ప్రోగు ఉపవీతము ఒక ఉపకరణము మాత్రమే’’ అని ఎరిగి అక్షర పరబ్రహ్మ యజ్ఞ సూత్రమే ధారణ కలిగియుండెదరు గాక।

సూచనాత్ సూత్రం ఇతి ఆహుః, సూత్రం నామ పరంపదమ్ । సమస్త జీవులలోను, పదార్థములలోను అంతర్యామి అయి, అంతర సూత్రమైయున్నదే పరమపద సూత్రము. (కథలోని పాత్రల స్వరూప స్వభావములన్నిటికీ ఆ కథా రచయితయే అంతర్యామి, అంతరసూత్రము అయి ఉంటున్న తీరుగా).

యేన సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ, తత్ సూత్రం విదితం యేన స విప్రో వేదపారగః । ఒకే దారములో అనేక రకములైన పుష్పములు గ్రుచ్చబడిన పూదండవలె, ఏ సూత్రమునకు అనేక జీవులు, వస్తుజాలము, పరస్పర సంబంధములు, సమస్త లోకములతో కూడిన ఈ విశ్వ విశేషాలన్నీ గ్రుచ్చబడినాయో, అట్టి సూత్రము గురించి ఎరిగినవాడే వేదపారగుడగు (వేదముల పాండిత్యము గల) ‘‘విప్రుడు’’.

యోగవేత్త అయిన తత్త్వ దర్శనుడు ధరించవలసినది సమస్తమునకు అంతార్యమి అగు ఏకసూత్రమేగానీ, కేవలము ప్రత్తిదారముతో నిర్మితమైన భౌతిక యజ్ఞసూత్రము కాదు.

సూత్రార్థము (సంజ్ఞ) ఏమిటో తెలిసినవాడు బాహ్య సూత్రమును బయటనే వదలి, సర్వాంతర్యామి స్వరూపమగు, ఉత్తమ స్థితమగు, యోగసూత్రమును (యజ్ఞోపవీతమును) ధరించాలి.

బ్రహ్మభావం ఇదం సూత్రం ధారయేత్ యః స చేతనః । అచేతనము, జడము అగు దారపు సూత్రమును త్రెంచి వేసి, ఏ సూత్రము సమస్తమునందు సచేతనమై ప్రదర్శనగుచున్నదో, అట్టి బ్రహ్మభావము అనే సూత్రమును (అట్టి అక్షపరబ్రహ్మ సూత్రమును) ధరించి ఉండాలి.

ప్రత్తి నిర్మితమైన సూత్రము ధరించినప్పుడు ‘‘ఏదైనా (బంధువుల మరణము మొదలైన) అశుచి జరిగినప్పుడు ఆ యజ్ఞోపవీతమును త్యజిస్తూ నూతనమైన యజ్ఞోపవీతము ధరించాలి’’ అనే శాస్త్రీయ నియమము లోకంలో ప్రసిద్ధిమై ఉన్నది.

అయితే,-
సమస్త జీవుల అంతర్గతమైన ఆత్మతత్త్వమును నిర్వచించు జ్ఞాన యజ్ఞోపవీతము వదలవలసిన పనిలేదు. ఏ ఉచ్ఛిష్ఠము, ఏ అశుచి కూడా అట్టి ‘‘సమం సర్వేషు భూతేషు’’ రూపమగు జ్ఞాన యజ్ఞోపవీతము ఏ క్షణము, దేనిచేతను మైలపడదు. అది అనుక్షణము ధరించవలసినట్టిది. ధరించతగినట్టిది.

అట్టి యజ్ఞోపవీతము అఖండాత్మ స్వరూపంగా ఎరిగినవాడే ‘‘సూత్రవిదుడు’’. కేవలము జడమగు ఉపవీతము ధరించిన వాడు, ఆ మాత్రం చేతనే సూత్ర విదుడు కాలేడు.

శ్లో ।। జ్ఞాన శిఖినో । జ్ఞాన నిష్ఠా । జ్ఞాన యజ్ఞోపవీతినః ।
జ్ఞానమేవ పరం, తేషాం పవిత్రం జ్ఞానముచ్యతే ।।

ఓ నారద మునీంద్రా! పైన మనము చెప్పుకున్న యజ్ఞసూత్ర పరమార్థము తెలుసుకొన్నవానికి -

జ్ఞానమే శిఖ । జ్ఞానమే నిష్ఠ । జ్ఞానమే యజ్ఞోపవీతము । జ్ఞానమే అతని యొక్క పరమ పవిత్రమగు పరస్వరూపము.
జ్ఞానమే ధర్భలతో ధరించే పవిత్రము.

వాటి అన్నిటి యొక్క ఆశయము జ్ఞానమే! పరతత్త్వ జ్ఞానమే!

జ్ఞానమే శిఖ, అంతేగాని కేశధారణ (పిలక) ఉన్నంతమాత్రం చేత ఒకానొకడు జ్ఞాని కాడు. కేశధారణచే తను, వేదములలో చెప్పిన వైదిక కర్మలచేతను ‘వైదిక బ్రాహ్మణుడు’ అను పిలుస్తారు. వారికి మాత్రమే (వైదిక కర్మానుష్ఠానము) నిర్వర్తించే బ్రాహ్మణులకు మాత్రమే ‘బాహ్యసూత్రము’ ఒక బాహ్యసంజ్ఞగా చెప్పబడింది. అది వైదిక క్రియా కలాపము మాత్రమే.

జ్ఞాన సూత్రము అందరూ ధరించవలసిందే.

‘‘ఎవనికి ఆత్మజ్ఞానమే శిఖయో, ఆత్మతో తన్మయత్వమే నిశ్చలమో, (‘‘ఆత్మయే నేను’’ అను భావన నిశ్చలమౌతుందో) అట్టి వానిదే బ్రాహ్మణ్యము యొక్క సంపూర్తి’’ అని బ్రహ్మవిదులు ఎరిగినవారై ఉంటున్నారు. ఈ విషయంలో బ్రహ్మజ్ఞులకు సందేహమే లేదు.

బ్రహ్మము గురించి ఎరిగిన విజ్ఞాని - పరివ్రాజక విధులు ।

బ్రహ్మ భగవానుడు : బ్రహ్మమును ఎరిగిన తరువాత, అట్టి బ్రహ్మజ్ఞుడు బ్రహ్మము గురించిన నిశ్చల భావన కొరకై బ్రహ్మము స్వాభావికము చేసుకొనుటకై సన్యసించుటచే పరివ్రాజి అగుచున్నాడు.

అట్టి పరివ్రాజక లక్షణములు కొన్ని ఇక్కడ మరల చెప్పుకుంటున్నాము. అంతా వినండి!

పరివ్రాజకులు ఏక వస్త్రము (ఒక్క వస్త్రము మాత్రమే కలిగి ఉంటున్నారు). శిరోముండనము (జుట్టు తొలగించటము) చేసుకుంటున్నారు. దేనినీ పరిగ్రహించనివారై (one who does not own anything in this world) సంచరిస్తున్నారు.

శరీర క్లేశములను సాధనగా భావిస్తూ ‘సహించటము’ను వహిస్తున్నారు.

(లేక) తీవ్ర వైరాగ్య సంపన్నుడు అయి ఉంటే అప్పుడే పుట్టిన బిడ్డకు ప్రపంచముతోను, బంధువులతోను, ఏ సంబంధము ఏర్పడి ఉండని విధంగా ‘‘నా పుత్రులు, నా స్నేహితులు, నా భార్య, నా ఆస్తులు, నా బంధువులు’’ మొదలైనవన్నీ లేనివాడై ఉంటారు.

⌘ శాస్త్ర సంబంధమైన స్వాధ్యాయనము (అనేక పుస్తకముల పరిశీలనము), లోక వ్యవహార సంబంధమైన కర్మలన్నీ వదలివేసినవారై ఉంటారు.
⌘ సమస్త బ్రహ్మాండమును కలలోని వ్యవహారం వలె మిథ్యగా ఎరిగినవారై ఉంటారు.
⌘ కౌపీనము (గోచి) తదితర వస్త్ర అచ్ఛాదనములు, దండము మొదలైనవన్నీ వదలిన వారై ఉంటారు.
⌘ ద్వంద్వములన్నీ సహించువారై ఉంటారు. శీత-ఉష్ణములు (చలి - ఉక్కపోతలు), సుఖ-దుఃఖములు, నిద్రసుఖము- నిద్రలేకపోవటము, మాన - అవమానములు రహితము చేసుకొని ఉంటారు.
⌘ షడూర్ముము (6 ప్రవాహ తరంగములు - ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణములు-Hunger, Thirts, Worry, Illusion, Old Age and Death) నాకు లేవు- అను అతీత - ఆత్మ భావన ఆశ్రయించి ఉంటారు.

నింద, అహంకారము, మత్సరము (ఈర్ష్య, ద్వేషము, లోభము, క్రోధముల కలయిక), గర్వము, దంభము (కపటము, ఆడంబరము), ఈర్ష్య (ఓర్వలేనితనము), అసూయ (మంచి గుణములందు దోషము ఆరోపించటము), ఇచ్ఛ - ద్వేషములు, సుఖ-దుఃఖ, కామ-క్రోధ - లోభ - మోహములు మొదలైనవన్నీ దగ్గరకు రానీయక, మొదలంట్లా విడచివేసి ఉంటారు.

⌘ తన భౌతిక శరీరమును ఒక శవము యొక్క ఆకారము వలె స్మరణము (జ్ఞాపకము) కలిగి ఉంటారు.
⌘ ‘‘స్వస్వరూపము, సర్వస్వరూపము, సర్వాంతర్యామి’’ అగు ఆత్మకు వ్యతిరిక్తమైన సమస్త బాహ్య - అభ్యంతరములన్నీ లెక్కకొననివారై (అమన్యమానులై) ఉంటారు.
⌘ ఎవ్వరికి నమస్కరించనివారై ఉంటారు (అనగా ఎవరిపట్లా ఆధారపడి ఉన్నాము అని అనుకోరు).
⌘ స్వాహా (దేవతా సమర్పణ) కారులై ఉండరు. స్వధా (పితృదేవతా సమర్పణ) కారులై ఉండరు.
⌘ ఎవరిని నిందించక స్తుతించక, యాదృచ్ఛికంగా సందర్భములగుచున్న దేనినీ పట్టించుకోనివారై ఉంటారు.
⌘ యాదృచ్ఛికంగా (కావాలని కోరుకోకుండా) ఏది లభిస్తే దానికే తృప్తి, సంతోషము, సంతుష్టి కలిగి ఉంటారు.
⌘ ‘బంగారము’ మొదలైన లౌకిక విలువైన వస్తుజాలమును ఏ మాత్రము కూడా దగ్గరకు రానీయరు. పరిగ్రహించరు.
⌘ ఆహ్వానము, విసర్జనము (Either welcoming or getting rid off) రెండింటినీ నిర్వర్తించరు.
⌘ దేవతాహ్వాన - విసర్జనములుగాని, మంత్ర - అమంత్రములుగాని, ధ్యాన - ఉపాసనలుగాని, లక్ష్య-అలక్ష్యములుగాని, వేరు-వేరుకానిది గాని (పృథక్ - అపృథక్‌లుగాని) ఆశ్రయించి ఉండరు.
⌘ ‘‘ఇక్కడ ఇప్పుడు ఇది నేను ఉండి ఉన్న, నాకు చెందినదైన చోటు’’ అనునదేమీ ఉండనివారై ఉంటారు. అనికేతుడై ఉంటారు. స్వదేశము, విదేశము అనే తేడా ఏదీ లేనివారై ఉంటారు.
⌘ స్థిరమతిః - నిశ్చలమైన ఆత్మబుద్ధిని ఆశ్రయించి ఉంటారు.

స్థిర నివాసమంటూ లేనివారై …

శ్వేతకేతు, ఋబు, నిదాఘ, జడ భరత, దుర్వాస, సంవర్తక, వైదేహావట, సిద్ధ, శుక, వామదేవ, దత్తాత్రేయ, దైవతక - ఇత్యాది అవధూతలవలె పరివ్రాజకులై …,

శూన్య (శిథిల), గృహములలోను, వృక్షముల మూలలయందు, దేవాలయములందు, గడ్డి దుబ్బుల ప్రదేశములందు, కులాల ప్రదేశములందు (పక్షి గూడులు ఉన్న చోట్ల పర్ణశాలల యందు), కుమ్మరి గృహముల యందు, యాగశాలల యందు, దిగంతరములందు (ఆకాశము - భూమి కలియుచున్న దిక్కుల చివరులయందు), నదీ తీరములందు, తటాకములు ఒడ్డు ప్రదేశములందు, భూగృహములందు (నేల మాళిగలందు), కందరములందు (గుహ, కనుమ ప్రదేశములలో), నిర్ఘరము (సెలయేళ్ల) ప్రదేశములందు, తండుల ప్రదేశములందు (పొలములందు), వనములందు - సంచార నివాసములు కలిగి ఉంటారు.

అవ్యక్త లింగము (ప్రదర్శించని గుణములు కలవారై), అవ్యక్తమైన ఆచారములు (ఇతరులకు తెలియజేయని ప్రవర్తనములు) కలవారై, బాలునివలె - పిచ్చివానివలె (ఉన్మత్తునివలె), (కానీ) అనున్మత్తుడుగా (ఏ పిచ్చిలేనివారుగా), అన్నీ ఎరిగినవారుగా ఆచారము (Behaviour) కలిగి ఉంటారు.

త్రిదండము (కర్రతో నిర్మితమైన హస్త ఉపకరణ ధారణ), శిక్యము (ఉట్టి సంచి), పాత్రలు, కమండులువు (మంచినీటి చంబు వంటిది), కటి సూత్రము (మొలత్రాడు), కౌపీనము (గోచి), దండము (చేతికర్ర), వస్త్రము - ఇవన్నీ కూడా జలమునందు సమర్పించివేసి (విడచినవారై) ఉంటారు. జాతరూపధరశ్చ - అప్పుడే పుట్టిన బిడ్డవలె జగత్తుతో ఎట్టి మనో సాంఘిక సంబంధము లేనివారై ఉంటారు. (They maintain a stand that they have no kind of relatives).

‘‘బ్రహ్మమునకు ద్వితీయమే లేదు’’ అను రూపంగా ద్వంద్వరహితులై ఉంటారు. దేనినీ పరిగ్రహించరు. దేనిపట్ల తిరస్కారము వహించరు. తత్త్వమార్గమును ఎల్లప్పుడు ఆశ్రయించినవారై, సమ్యక్ సంపన్నులు (సర్వత్రా సమదృష్టిని కలిగియున్నవారు) అయి ఉంటున్నారు.

సదా నిర్మల మనస్కులై ఉంటున్నారు (శుద్ధమానసః).

ప్రాణములు నిలుపుకొనటానికై రోజులో సరైన సమయములో చేయియే పాత్రగాగాని (లేదా) ఏదైనా మరొక పాత్రయందుగాని భిక్షకై వెళ్లి స్వీకరించి, భుజిస్తూ ఉంటారు.

సమస్త సమయములందు, లాభ-అలాభ సందర్భములందు - (ఏది లభించినా, లభించకపోయినా కూడా) - సమదృష్టిని వీడక ఉంటున్నారు. నిర్మల - శుక్ల (తెల్లటి) హృదయముతో ఆత్మపరాయణులై ఉంటున్నారు. ఆధ్యాత్మ నిష్ఠతో శుభ-అశుభ కర్మల పరిధులను నిర్మూలించుకొన్నవారై, కర్మఫలాతీతులై ఉంటున్నారు.

పూర్ణ ఆనంద ఏకబోధః
తత్ ‘‘బ్రహ్మ’’ - అహమస్మి

బ్రహ్మము ఎట్టిది?

పూర్ణము : సర్వదా పూర్ణమై (Complete by itself at all times) అయి ఉన్నది. ఎప్పుడో అసంపూర్ణమై, ఇప్పుడు దేనిచేతనో ఇక ‘పూర్ణము’ కావలసి ఉన్నట్టిది కానే కాదు. సదా పూర్ణము.

ఆనంద : స్వయముగా ఆనంద స్వరూపము. ఏదో లభించి, ఆ తరువాత ఏదో దుఃఖము పోగొట్టుకొని, అటు తరువాత ఆనందము సిద్ధించుకోవలసినది కాదు. నిత్యానంద స్వరూపము.

ఏకము : ఈ అనేకముగా ప్రదర్శనము అగుచూ కూడా సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది. ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ।

బోధ : సమస్త దేహములలో ఎరుగటము (The knowing) రూప అనుక్షణముగా నిత్యోదయము అగుచున్నట్టిది.

తత్ : లోకములకు, భావ - అనుభూతులకు, దృశ్య - మనో - బుద్ధి - చిత్త - వ్యష్ఠి అహంకారములకు ఆవలిదై వెలుగొందుచూ, దృశ్య మనోబుద్ధి చిత్త వ్యష్ఠ్యహంకారములు ‘తానే’ - అయి ఉన్నట్టిది.

బ్రహ్మ : సమస్త జీవులకు, ఈ సమస్త జగత్తులకు ‘మహత్తరము’ (The highest and the finest) అయి ఉన్నట్టిది. (Superlative in all) (అందుచేతనే బ్రహ్మము అనబడుచన్నట్టిది).

అహం బ్రహ్మాస్మి

అహమ్ : అట్టి బ్రహ్మము నేనే. సర్వదా నేనే అయి ఉన్నాను. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆధారము, కారణము అయి, సమస్తము తనయందు ప్రతిబింబింపజేస్తున్న ‘‘నేనైన నేనే’’ అయి ఉన్నట్టివాడను.

అట్టి బ్రహ్మమును 1) అనుస్మరణము గాను, 2) అనుక్షణము జ్ఞాపకముగాను 3) సర్వత్రా సందర్శనము చేయబడుచున్నట్టిదిగాను నిర్వర్తించాలి.

ఓ నారదా ! ఈ విధంగా ‘‘సో2హమ్ బ్రహ్మమ్’’ ను ఉపాసిస్తూ, దర్శిస్తూ, ప్రవేశించు ప్రయత్నములో ఉండు ‘‘భ్రమర కీటక న్యాయము’’ (కీటకము తన చుట్టూ తిరుగుచున్న తుమ్మెద యొక్క ‘ఘుయ్’ శబ్దము విని, విని, భయము పొంది క్రమంగా ప్రియము పొంది, తానే తుమ్మెదగా అగుచున్నట్లుగా) తానై తానే ‘బ్రహ్మము’ యొక్క స్వాభావికత సిద్ధించుకొంటున్నారు.

ముముక్షువు క్రమంగా ఈ దృశ్య భావములకు చెందిన సమస్త వ్యవహారములు మనస్సుతో సన్యసించినవాడై ఉంటున్నాడు. స్థూల - సూక్ష్మ - కారణ శరీరములను వదలి, వాటికి అతీతత్వము సిద్ధించుకొని, ఈ దేహము నాది కాదు, నేను కాదు’’ అను రూపంగా దేహత్యాజ్యం చేయువాడు కృతకృత్యుడు అగుచున్నాడు.

ఇత్యుపనిషత్ - తృతీయోపదేశః


నాలుగవ ఉపదేశము - సన్న్యాస స్వీకారము

యోగ ప్రతిబంధకములు

శ్లో।। త్యక్త్వా లోకాంశ్చ వేదాంశ్చ, విషయాన్ ఇంద్రియాణి చ
ఆత్మని ఏవ స్థితో యస్తు స యాతి పరమాం గతిమ్ ।

సమస్త దుఃఖములకు ఏకైక ఉపాయముగా మోక్షము అయి ఉన్నది. ఇక్కడి జనుల పరస్పర సంబంధములతోను, లౌకికమైన ధన - జన వ్యవహారములతోను కూడిన లోకములన్నీ మోక్షము కొరకై మానసికంగా త్యజించివేయాలి. ఇంద్రియ విషయములన్నీ వదలివేసినవాడై ఉండాలి. ఆత్మ యందు మాత్రమే సంస్థితుడై ఉండాలి. అట్టివాడు సమస్తమునకు ఆవలిదగు ‘పరమాంగతి’’ని సిద్ధించుకోగలడు.

నామము, గోత్రము మొదలైన సాంఘిక సంబంధమైన ఆవరణలను (Social Coverages) దేశ - కాలములకు మాత్రమే సంబంధించినట్టి కులము (Sub -Division) లను, బాల్య - కౌమార - యౌవన - వార్ధక్యముల (శారీరక) రూపమగు వయోవృత్తములను, నియమ - నిష్టల నిర్మితములైన వ్రతశీలములను, - ఇవన్నీ సత్ స్వరూపము కాదు, పరమ సత్యము కాదు అని గ్రహించి, ‘అసత్’ (Not originally there) అని భావించి, యతి మార్గాణ్వేషి - సుస్పష్టపరచుకొని, తెలుసుకొని ఉండాలి.

పూర్వ లౌకిక సంబంధమైన సంపదల గురించి, సంబంధ - బాంధవ్యముల గురించి, ‘‘వారు అట్టివారు, వీరు ఇట్టివారు’’ మొదలైన దృష్టాంతముల గురించి, జనుల కథనములు - ప్రవర్తన శీలముల గురించి స్మరించనేకూడదు. ఇతరుల శీలము గురించి ప్రకటనలు, నిర్ణయములు చేయకూడదు. ఇతఃపూర్వం చూచిన స్త్రీల గురించి, వారి నామ- రూప - గుణ - శీల - చిత్రపటముల గురించి మననము, స్మరణము, ఆలోచనలు చేయరాదు.

యతి మార్గములో ఉన్నవారు
1) స్త్రీ-పురుషుల దేహ సంబంధముల గురించిన పూర్వ సంఘటన - దృష్టాంతములను సంభాషించటము.
2) సంఘటన - సందర్భములను జ్ఞాపకము చేసుకోవటము, స్మరించటము.
3) స్త్రీ - పురుష పరస్పర సంబంధమైన కథలు చెప్పుకోవటము.
4) స్త్రీ - పురుష సంబంధమైన చిత్ర పఠములను చూడటము.
ఈ నాలుగు కూడా యతి మార్గమునకు నిషిద్ధములు (Don’ts). ‘‘అవి మోహము వలన కలుగునవి’’ అని గ్రహించి జాగరూకుడై ఉండాలి.

యతి చిత్ర పటముల విక్రయము (selling) నిర్వర్తించకూడదు. అవన్నీ వికారములుగా రూపుదిద్దుకొని, యతి యొక్క పతనమునకు కారణము కాగలవు (ప్రణశ్యతి).

యతి నిషిద్ధములు :
తృష్ణ : ఏదో సొంతము చేసుకోవాలనే ఆవేశము, దాహము (Thirst) కలిగి ఉండటము.
క్రోధము : కోపమును కొనసాగిస్తూ ‘‘వారి సంగతి చూడాలి’’ అనే భావనను వదలకపోవటము. ఇతరులను బాధించాలనే ఆవేశము. క్రోధ సంఘటనలను అనేక మందితో చెప్పుకోవటము.
అనృతము : అబద్ధములను పలకటము, అసత్యమైన వాటిని నమ్మి ఉండటము.
మాయ : మొదలే లేనిది ఉన్నట్లుగా భావించి ఆవేశ - కావేశములకు ‘లోను’ అగుచూ ఉండటము.
లోభము : తాను పొందలసినది పొందుతూ కూడా త్యాగ బుద్ధి లేకపోవటము. పిసినికోరుతనము. అత్యాశ.
మోహము : భ్రమను, కల్పితమును, ఆపాదిత మాత్రమును, లేని దానిని నమ్మి స్పందించటము. చిత్త వైకల్యము, కాలగతమైన కాలముచే వచ్చి పోయే దృశ్య విషయముల పట్ల ‘‘శాశ్వతమే’’ అనే పిచ్చి నమ్మకము.
ప్రియ - అప్రియే : కొందరి పట్ల ప్రియము, మరి కొందరి పట్ల అప్రియము కలిగి ఉండటము.
శిల్పం : సాకారముల పట్ల, రాతి బొమ్మల పట్ల ఆకర్షణ వికర్షణలు పొందటము.
వ్యాఖ్యానం : ఎవరి గురించైనా మంచి చెడుల గురించి వ్యాఖ్యానించటము.
అయోగం : యోగ - అభ్యాసముల పట్ల వ్యతిరేక పూర్వకమైన తిరస్కారభావము.
కామో : ఏదో పొందాలని కోరికలు కలిగి ఉండటము. అవేశముతో కూడిన ఇచ్ఛ. అనుభవించాలనే అభినివేశము.
రాగము : ‘నా వారు, నాది’’ మొదలైన రాగ భావములు (deep sense of belonging) కొనసాగించటము
పరిగ్రహణము : దానము అడిగి తీసుకోవటము, ఇవ్వాలని కోరుకోవటము.
అహంకారం : ‘‘వారికంటే నేను అంతటి వాడిని, ఇంతటివాడిని’’ అను తన గురించి ప్రత్యేకతగా భావించటము. జాగ్రత్ పరిమితమైన ‘నేను’ అను భావన.
మమత్వము : ‘‘నాది, నాకు చెందినది’’ అనే భావావేశము.
చికిత్స : వైద్యము, మంత్రము, తంత్రము సూచించటము, ఆశ్రయించటము
ధర్మసాహనము : ఆవేశపూర్వకమైన ధర్మాచరణము.
ప్రాయశ్చిత్తము : దోషములకు, కష్టములకు కర్మ విధులు బోధించటము.
ప్రవాసము : దూరదేశములకు ప్రయాణములు చేయటం.
మంత్రములు : మంత్రముల ఉపాసన.
ఓషధములు : ఔషధములు సూచించటం. సేవించటము.
ప్రతిషిద్ధము : ‘‘అది - ఇది చేయకండి’’ మొదలైనవి జనులకు సూచనలు ఇవ్వటము. నిషిద్ధ వాక్యములు.

పైవి సేవించువాడు యతి మార్గము నుండి చ్యుతి పొంది, అధమ మార్గము ఆశ్రయించువాడగుచున్నాడు.

మోక్షము ఆశయముగా గల ఇతర ముని స్నేహితులను, బంధువులను మొదలైనవారిని ‘‘రావాలి, రండి, పోండి, స్వాగతము’’ మొదలైనవి చెప్పరాదు. సన్మానముల గురించి సంభాషించరాదు. తాను ఏదీ స్వీకరించటము (ప్రతిగ్రహణము), ప్రదానము (ఇతరులకు ఇవ్వటము) - నిర్వర్తించరాదు. అవి యతి మార్గమునకు ప్రతి బంధకములు కాగలవు.

భిక్షువు (సన్యాసి, యతి మార్గము ఆశ్రయించువాడు) ధన - సత్కార - పేరు ప్రతిష్టల గురించి కలలో కూడా తలచుకోరాదు.

యతి అయినవాడు - భార్య, పుత్రులు, బంధువులు మొదలైన వారికి కలిగే శుభ - అశుభముల గురించి చూడటం జరిగినా, వినినా కూడా కంపనము పొందరాదు. వాటి పట్ల శోక - హర్షములు (Sorrow or happiness) పొందకూడదు.

సన్యాసి / యతి - ఆచరణములు

అహింస : ఇతరులకు బాధ కలిగించకుండటము.
సత్యము : సత్యమును ఆశ్రయించి ఉండటము. పలకటము.
అస్తేయము : తనది కానిది దొంగిలించాలనే బుద్ధిని రానీయక పోవటము.
బ్రహ్మచర్యము : బ్రహ్మము గురించి జిజ్ఞాస, పఠనము, అధ్యయనము కలిగి ఉండటము.
అపరిగ్రహణము : ఇతరుల నుండి ఏదో పొందాలనే భావన కలిగి ఉండకపోవటము.
అనౌద్ధత్యము : ‘‘నేను ఉన్నతుడు. గొప్పవాడిని’’ అనే భావనను, అభిప్రాయమును దగ్గరకు రానీయకపోవటము.
అదీనత్వము : ‘‘నేను దీనున్ని, లేనివాడను’’ అనే దీనత్వము ఆశ్రయించకపోవటము (should not be dull, gloomy or morose) ప్రసాదము : పవిత్రమైన భావాలు, ఆచరణలు, అభిప్రాయములు కలిగి ఉండటము.
స్థైర్యము : ధైర్యము, ఉత్సాహము, సాహసము, బుద్ధి ఉత్తేజితము (Inspired) చేసుకొని ఉండటము.
ఆర్జవం : వంకర - టింకరగా వ్యవహరించకపోవటము, త్రికరణ శుద్ధి, చెప్పినదే చేయటము, చేయునదే చెప్పటము.
అస్నేహము : దేశ - ప్రాంత - వ్యక్తిగత వ్యవహారములగు దేనితోనూ అతి స్నేహము కలిగి ఉండకపోవటము.
గురు శుశ్రూష : గురు (శ్రేష్ఠమైన) విషయము పట్ల శ్రద్ధ - గురుసేవ, గురు వాక్య మననము, శ్రద్ధ, భక్తితో కూడిన సేవా భావము కలిగి ఉండటము. (శుశ్రూష - వినాలనే ఇచ్ఛ, సేవ, లోబడిన వాడై ఉండటము, అచంచల మనస్సుతో వినటము)
శ్రద్ధ : ఆత్మతత్త్వ ధ్యాన - ఆత్మతత్త్వ స్తుతి - ఆత్మతత్త్వ దర్శనముల పట్ల అనుష్ఠానము వీడకపోవటము.
క్షాంతి : ఓర్పు. కష్ట సుఖముల పట్ల, లాభ నష్టముల పట్ల, తప్పు - ఒప్పుల పట్ల ఓర్పు వహించి ఉండటము. భరిస్తూ సమత్వము వీడకపోవటము. ఓర్చుకోగలిగే శక్తి, సహన శక్తి.
దమము : బాహ్య ఇంద్రియములను సరి అయిన కార్యక్రమములలో నియమించటము, ప్రాపంచక విషయముల నుండి, లౌకిక వ్యవహారముల నుండి ఇంద్రియ వ్యాపారములను వెనుకకు మరల్చటము, శాస్త్రీయ సాధనలగు యోగ సాధన, పూజ, ధ్యానములందు నియమించటము.
శమము : అంతరింద్రియములైనట్టి మనోబుద్ధి చిత్తములను, పవిత్ర కార్యములందు నియమించటము. బాహ్య విషయముల నుండి నిరోధించి ఉండటము. ఆత్మతత్త్వ దర్శనమునందు నియోగించటము. ధ్యానము, యోగాభ్యాసములందు మనోబుద్ధి చిత్తములను వినియోగించటము.
ఉపేక్ష : జన - ధన సంబంధమైన విశేషముల పట్ల ఉపేక్ష (Non - concentration, No-attraction) కలిగి ఉండటము. దృశ్య విషయముల పట్ల అపేక్షను వదలటము.
స్థైర్యము : ధైర్యము, ఆత్మ నమ్మకము, ఆత్మ భావన పట్ల స్థిరత్వము.
మాధుర్యము : మధురము అయిన సంభాషణ సహజనులకు ప్రియము కలిగించుచుండటము.
తితిక్ష : కష్ట - సుఖములు భరించగలుగు నిగ్రహముతో కూడిన యోగ స్థితి. క్షాంతి, ఓర్పు, శీతోష్ణ ద్వంద్వ సహనము.
కరుణ : సహజీవుల పట్ల కరుణ (Kindness), ప్రేమ, వాత్సల్యము కలిగి ఉండటము.
హ్రీ (సిగ్గు) : ‘‘ఎందరో తత్త్వజ్ఞులు ఉన్నారు. వారి సమక్షంలో నేను ఎంతటి వాడిని ?’’ అను సిగ్గు, అణకువ కలిగి ఉండటము - ఇది శిష్య లక్షణము.
జ్ఞాన విజ్ఞాన యోగము : తత్త్వ విషయాల పఠణ - అధ్యయనములు, ఆ విధంగా తెలుసుకొన్నవి సమస్త సందర్భములలో సమన్వయించుకొని ఆత్మ బుద్ధి ప్రవృద్ధము చేసుకోవటము.
లఘ్యశనము (లఘు అశనము) : పరమితముగా ఆహారము స్వీకరించటము. ఇంద్రియములను జీవనముకు అవసరమైనంత వరకు మాత్రమే నియోగించటము, అనవసర వినియోగముల నుండి విరమించటము.

ఏష స్వధర్మో విఖ్యాతో యతీనాం నియతాత్మనామ్ । ఇవన్నీ నియతాత్ముడగు యతి ధర్మములు. ఇవి అన్ని ఆశ్రమములవారికి ముముక్షు మార్గంగా నియమించబడుచున్నాయి.

ముఖ్యముగా మూడు యతి స్వభావములు :
1) నిర్ద్వంద్వో : ‘‘పరమాత్మకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేనేలేదు’’ అను ద్వంద్వరాహిత్యము. అద్వితీయ ఆత్మభావన.

2) నిత్య సత్త్వస్థ : సాత్వికుడై ఆత్మ జ్ఞానమును సర్వదా వీడక ఉండటము.

సత్ - స్వస్థః । ఆత్మయొక్క ‘సత్’ స్వరూపమునందు స్వస్థుడై (Comfortably) ఉండి ఉండటము.
(గమనిక : శ్రీ రమణ మహర్షులవారి ఉపదేశ సారముయందు చెప్పబడిన అభ్యాస స్థితి - ‘‘భావశూన్య సత్‌భావ సుస్థితిః’’)

3) సర్వత్రా సమదర్శనః : తరంగములన్నిటిలో ఒకే జలమున్నట్లు, కథలోని సమస్త పాత్రలు కథా రచయిత యొక్క కల్పనా చమత్కారమే అయినట్లు - సమ జీవులలో సమమగు ఆత్మనే దర్శించు దార్శనిక స్వభావము.

తురీయడగు పరమ హంస వర్తనములు / అభ్యాసములు

తురీయడు : తన యొక్క స్వస్వరూపమును 1) జాగ్రత్ 2) స్వప్న 3) సుషుప్తులకు ఆవలదిగాను, ఆ మూడిం{ తానై ఉన్న నాలుగవదిగాను దర్శించువాడు. సాక్షిత్వ - స్వానుభవుడు అయినవాడు.

పరమహంస : సో2హమ్ పరమమ్ । సమస్తమునకు ఆవల కేవలమై ప్రకాశించి ఆత్మ స్వరూపుడనే (‘హంస’ స్వరూపడనే) నేను’’ - అను అనునిత్యానుభవము పుణికిపుచ్చుకున్నవాడు. గట్టిగా పట్టుకున్నవాడు (వ్రేళ్లచే పట్టుకొన్నవాడు) అట్టి తురీయడగు పరమహంస స్వయముగా శ్రీమన్నారాయణమూర్తియే. ఆ యతికి నారాయణ భగవానునికి భేదమే ఉండదు.

ఓ నారదా! పరివ్రాజకుడు అట్టి పరమహంసత్వము సిద్ధించుకోవటానికి ముఖ్యమైన మరికొన్ని అభ్యాసముల గురించి చెప్పుకుందాము.

(ఇవి సన్యాస నియమములుగా చెప్పబడుచున్నాయి).

నివాసము : గ్రామములో నివాసము - ఒక్క రాత్రి మాత్రమే, నగరములో - 5 రాత్రులు మించి ఉండరాదు. వర్షాకాలము - 4 మాసముల కాలము ఒక్క చోటనే నివాసము కలిగి ఉండవచ్చును (చాతుర్మాస్యము). గ్రామములో రెండు రాత్రుల కాలము ఉండరాదు. దాని వలన రాగము, ద్వేషము మొదలైనవి రూపుదిద్దుకోగలవు. వాటి వలన నరక మార్గము ఎదురుకాగలదు.

గ్రామము చివరిగా జనసమూహము ఉండని ప్రదేశంలో ‘నా ఇల్లు / నా నివాసము’ అనునది ఏదీ లేనివాడై ఉండును గాక.

‘చాతుర్మాస్య 4 నెలల వానాకాలము’ తప్ప, ఇక తక్కిన సమయములలో ఒక కీటకమువలె భూమిపై పర్యటించుచుండును గాక।

ఏక వస్త్రముగా ఉన్నప్పటికీ (లేక) దిగంబరుడై (వస్త్ర రహితుడై) ఉన్నప్పటికీ కూడా భేదరహితమైన ఏకదృష్టి (అఖండాత్మ దృష్టి)తో, దృశ్యంలో ఏదీ ఆపేక్షించనివాడై ఉండును గాక!

‘‘అనేకమగు ఇదంతా ఒకదాని కంటే మరొకటి వేరు’’ అనే అనేక దృష్టి పట్ల లోలుపుడు (తీవ్రమైన ఇచ్ఛగలవాడు) కాకుండును గాక!

మహనీయులగు సంత పురుషుల మార్గమును తప్పు పట్టుకోకుండా తాను తనకు సాధ్యమైనట్టి సాధన మార్గము ఆశ్రయిస్తూ భూమిపై చరించుచుండును గాక! సాధ్యమైనదే సాధన.

శుచి అయిన ప్రదేశములో ఉంటూ ఆ భిక్షకుడు సన్యాస ధర్మములు నిర్వర్తిస్తూ ఉండును గాక! ‘‘ఇదంతా పరమాత్మ యొక్క మహత్యమే’’ అని తలచుచు (మననము చేస్తూ) యోగి ఎల్లప్పుడు అట్టి భావనతో సంచరించుచుండును గాక!

పర్యటనకు నిషిద్ధమైన సమయములు : ర్ధరాత్రిపూట గాని, మిట్ట మధ్యాహ్న సమయమునందు గాని, ఉదయ - సాయంకాల సంధ్యా సమయములందుగాని యతి పర్యటనలు, దేశ సంచారములు ప్రారంభించరాదు. అత్యంత శూన్యము, దుర్గమము (జనులు అతికష్ట ప్రదేశములుగా భావించునవి) అగు ప్రదేశములలో ఒంటరి సంచారము కూడదు (క్షేమము కాదు).

ఎక్కడ ఉన్నా కూడా, ఇతర ప్రాణులకు హాని కలిగించే ఉద్దేశ్యము కలిగి ఉండరాదు. మరల చెప్పుచున్నాను. గ్రామములలో (In villages) ఒక్క రోజు, పురములలో (In towns) రెండు రోజులు, నగరములలో (In cities) 5 రోజులు మించి (అన్నన్ని రాత్రుల మించి) ఉండరాదు. వర్షాకాలంలో చతుర్మాస్య వ్రతంగా 4 నెలలు ఒక్కచోటే సత్సంగపూర్వకంగా ఉండవచ్చును.

⌘ ⌘ ⌘

ఆత్మవత్ సర్వభూతాని :
1) నేను దృశ్య - దేహ - మనో బుద్ధి - చిత్త - వ్యష్ఠ్యహంకార రూపుడను కాదు. ఆత్మ రూపుడను.
2) సమస్త జీవులు అట్టి ఆత్మ స్వరూపులే.
3) కనుక ఈ సమస్త జీవులు, లోకములు, బ్రహ్మాండములు నా యొక్క ఆత్మ స్వరూపమే, నేనే !
నాకు నా ఆత్మ ఎట్టిదో, ఎంత ప్రియమో, ఈ కనబడేవారంతా (నా యొక్క ఆత్మస్వరూపమే అయి ఉండటం చేత) అంతే ప్రియము.
వీరంతా నా ఆత్మ యొక్క ఆనంద స్వరూప తరంగాలే’’ అను రూపంగా, ఆత్మగా దర్శిస్తూ, ఆత్మానందము ఆస్వాదిస్తూ భిక్షువు భూమిపై సంచరిస్తూ ఉండు గాక।

⌘ ⌘ ⌘

ఇక భిక్షువు యొక్క సాంసారిక (భేద దృష్టి) సంబంధములు (దృశ్యముతో అనుబంధము) గురించిన విషయానికి వస్తే, అతడు -

స్నానం

కుటీచక, బహూదక, భిక్షువులకు మూడు పూటల స్నానం చెప్పబడుతోంది.

హంసకు రోజుకొకసారి స్నానము నియమించబడింది.

పరమహంసకు స్నాన విధి నియమములు ఉండవు.

ఏకదండ సన్న్యాస నియమములు

ఏకదండ సన్న్యాసులకు (సన్న్యాసాశ్రమం స్వీకరించినవారికి) ‘7’ నియమములు పాటిస్తూ ఉండవలసినదిగా చెప్పబడుతోంది.

1) మౌనము : భేద దృష్టిని పెంచు ఆయా లోక విశేషములు సంభాషించకపోవటము సిద్ధాంత వాద - ఉపపాదములు ప్రక్కకు పెట్టి సర్వాత్మకమగు ఆత్మ గురించిన సంభాషణము మాత్రమే ఆశ్రయించటము.

2) యోగాసనము : తన శరీరమునకు అనుకూలమైన సుఖాసనము ఎన్నుకొని, ధరించి ఉండటము.

3) యోగము : బుద్ధిని నిర్విషయ మార్గంగా ధ్యానము నందు నియమించటము.

4) తితిక్ష : సహించు శక్తి పెంపొందించుకోవటము. బుద్ధికి ‘‘ఓర్పు’’ అనే నేర్పును కలిగించుకోవటము.

5) ఏకాంత శీలత : తనకు పరమాత్మకు గల సంబంధము ఏకాంతముగా (ఒంటరిగా) ఉండి అధ్యయనము, ఉపాసన నిర్వర్తించటము. జగద్దృశ్యమును పరబ్రహ్మముగా భావించటమే ఏకాంత శీలత్వముగా చెప్పబడుతోంది.

6) నిస్పృహత్వము : ఏకమగు ఆత్మతత్త్వమునకు భేద కల్పము పట్ల పట్టించుకోక పోవటము, అనేకంగా కనిపిస్తున్న దానిలో ఏకత్వము దర్శించు అభ్యాసము. భిన్నత్వంలో ఏకత్వ దర్శనము.

7) సమత్వము : ఆత్మ యొక్క సమత్వమును ఉపాసించటము. (సమం సర్వేషు భూతేషు తిష్ఠతం పరమేశ్వరమ్।)

ఈ ఏడు కూడా ఏకదండి (సన్న్యాసి) యొక్క అనవరత - అభ్యాసములు అయి ఉండు గాక ।

పరమహంస భావన

సో2హమ్ పరమమ్ : సమస్తమునకు ఆవలిదై, సమస్తముగా ప్రదర్శనమగు పరమవస్తువు (బ్రహ్మము) నేనే అయి ఉన్నాను - అను భావన.

అట్టి ‘పరమ భావన’ను సిద్ధించుకొన్న వానికి ఇక స్నానము, భోజనము మొదలైన తదితర శాస్త్రీయ విధి - విధానములతో ఆవశ్యకత ఉండదు. పరమహంసాశ్రమస్థో హి స్నాన - ఆది అవిధానతః ।

అయినప్పటికీ ఆయనకు ఒకే ఆచరణ - అశేష చిత్తవృత్తీనాం త్యాగం కేవలమ్ ఆచరేత్ । అంతులేని చిత్తవృత్తులను త్యజించివేయు ప్రయత్నమే అతడు చేయు యత్నశీలత్వము. ఎందుకంటే చిత్తవృత్తులు ఆకారముల చుట్టూ వృత్తము చేస్తున్నాయి.

దేహ మోహము

ఓ నారదా ! ఎందుకో ఈ జీవుడు భౌతికమైన దేహములను చూసి మోహము చెందుచున్నాడు. దీని గురించి విచారణ చేయకపోతే ఎట్లా ? ఈ దేహము ఎటువంటిది ? చర్మము, మాంసము, రక్తము, స్నాయువు (సన్నటి నరములు), మజ్జ (బొమికలలో గుజ్జు), మేదము (కొవ్వు), బొమికలు, మూత్రము, పురీషములతో కూడిన ఒక భౌతికమైన గూడు వంటి ‘‘ఈ దేహమే నేను’’ ‘‘ఆ దేహమే నీవు’’ అని నమ్మి కూర్చున్న వానికి, ఒక కీటక జీవితమునకు తేడా ఏమున్నది? ఏమీ ఉండదు.

⌘   శ్లేష్మము మొదలైన అనేక దోష పదార్థములతో కూడిన ఈ పాంచ భౌతిక శరీర భావన ఎక్కడ ? వాటికి సంబంధించి ఆశయములు ఎక్కడ?
⌘   సౌరభము, సుందరము, శోభాయమానము, కమనీయము అగు ‘‘శరీరి’’ (లేక) - ఆత్మభావన ఎక్కడ?

ఆ రెండింటికి - హస్తి - మశకాంతరమంత తేడా (ఏనుగు - దోమల శరీరములంతటి భేదము).

‘‘మాంస, రక్త, మూర్త, మల, నరము, మజ్జ, బొమికలు మొదలైన దోష పదార్థముల కలయిక’’ అగు ఈ దేహముపై మమకారము కలిగి ఉండు దేహి భవిష్యత్తులో అనేక నరకములకు ఆహ్వానము పలుకుచున్నవాడగుచున్నాడు.

స్త్రీ, పురుషుల అవాచ్య (రహస్యాంగ) భాగములన్నీ అనేక నాడులతోను, వ్రణములతోను (పుళ్లతోను) నిండి ఉండగా అవన్నీ ఒకేరకములైన పదార్థములయినప్పటికీ భేదములు కల్పించుకొని తమను తామే ఒకరినొకరు మోసగించుకొనుచున్నారే. చర్మ ఖండముతో రెండుగా చీలి కనిపిస్తూ, అపానము (విసర్జనము) అనే దూషణముతో కూడుకొనియున్న అంగములను చూచి, వాటిలో రమించాలనుకోవాలనుకొనే జీవులకు - వారందరికీ ఒక నమస్కారము., ఆహా"। వారిది ఎంతటి సాహసం ? అంతకన్నా సాహసం ఏముంటుంది ? పర్యవసానముల (Eventualities) గురించి భయమే లేదే !

మునికి ఈ దేహ - దేహ భాగములతో సిద్ధించగల కార్యము ఏదీ అగుపించదు. అల్పదార్శకులకు మాత్రమే కనిపించే ప్రత్యేకత వారికేదీ అనిపించదు. వారు మమకార - భయరహితులై పరమ శాంతమును పూనినవారై ద్వంద్వరహితులై - అనేక వర్గ భేదములను చూడరు. ఆస్వాదించరు.

ముని గోచి ధరించిగాని, (లేక) ధరించనివారైగాని (బాహ్యాన ఎట్లా ఉండినాకూడా) - ఆత్మధ్యాన తత్పరులై ఉంటారు. అట్టి ధ్యానపరుడగు యోగి బ్రహ్మ భావనను సర్వత్రా మననము చేస్తూ బ్రహ్మమే తామగుచున్నారు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి).

లింగ - వర్ణాశ్రమ ధర్మములు, ఆశ్రమ భేదములు - ఇవన్నీ ‘‘సమదర్శన - జ్ఞానము’’ కొరకై, జ్ఞానమే అంతిమ ఆశయముగా కలిగి ఉన్నాయి. సమస్తము సన్యసించి ఆత్మజ్ఞానము సిద్ధించుకోవటమే సన్యాసాశ్రమము యొక్క అంతిమ - ఆశయము.

నిర్మోక్షాయ ఇహ భూతానాం లింగ గ్రామో నిరర్థకః।
మోక్షమే మహదాశయము. అట్టి ఆశయము వదలి ఉంటే, ఇక సన్యాస చిహ్నములు, నియమములు అన్ని కూడా నిరర్థకమే (They are purposeless if freedom of one’s own self is not the main objective).

బ్రహ్మజ్ఞానో హి బ్రాహ్మణః

‘‘ఉన్నది ఏది? ఉన్నట్లే ఉండి కూడా లేనిది ఏది? వినకూడనిది ఏది? శ్రద్ధగా, అధికంగా వినవలసినది ఏది? వినవలసికూడా, ఎక్కువగా వినబడకయే ఉన్నదేది? శుభప్రదమగు వృత్తి, ప్రవర్త ఏది? దుర్వృత్తము, వినటము వలన నష్టము కలిగించేదేది?’’ - ఇవి ఎవరు సవివరంగా సశాస్త్రీయంగా తెలుసుకొని ఉంటారో అట్టివాడే బ్రహ్మమును ఎరిగినట్టి ‘‘బ్రాహ్మణుడు’’.

ఈ జీవుడు బ్రహ్మాజ్ఞాని అయి ‘‘బ్రాహ్మణుడు’’ కావాలి.

❋ ఎవడు బాహ్య చిహ్నములన్నీ (లింగములన్నీ) విడచి అలింగుడై, లింగాతీతత్వమును అత్యంత శ్రద్ధగా పాటించువాడై ఉంటాడో
❋ ఆత్మధర్మము తెలిసినవాడై బ్రహ్మభావమును అనుక్షణిక వ్రతముగా ఆశ్రయించి ఉంటాడో
❋ ఆత్మతత్త్వ ధ్యానమునందు నిష్ణాతుడు - విద్వాంసుడు అయి, రహస్యముగా ఇతరులకు తెలియరాని జ్ఞానచరితుడై ఉంటాడో
❋ ‘‘అనేకమంది జీవులుగా ఉన్నది ఏకస్వరూపుడగు ఆత్మభగవానుడే’’ అను అఖండాత్మ జ్ఞానమును బుద్ధితో నిర్ణయించుకొని అనేకము పట్ల సందిగ్ధుడై (అనేకత్వము నమ్మనివాడై) ఉంటాడో, ఆత్మ యొక్క ఏకత్వము పట్ల అసందిగ్ధుడై ఉంటాడో అనుమానము త్యజించనవాడై ఉంటాడో,
❋ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస ధర్మములను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మములను ‘ఆత్మదృష్టి’ అనే బల సంపదచే దృష్టియందు వదలి ఉంటాడో,
❋ అంధవత్, జడవత్ చ అపి, మూకవత్ చ మహీం చరేత్ । జగత్తులో కనిపించే ఏకాత్మకు అన్యమైన భేదములన్నిటి పట్ల గ్రుడ్డివానివలె, జడునివలె, మూగవానివలె చరిస్తూ అతీతత్వము వీడనివాడై ఉంటాడో -

అట్టి పరమశాంతుడగు యతీశ్వరుని చూచినప్పుడు దేవతలు కూడా అట్టివాని సమక్షమును, అట్టివానితో స్నేహమును కోరుకుంటారు.

లింగాభావాత్ (లింగ అభావత్) కైవల్యమ్ ఇతి బ్రహ్మానుశాసనమ్ । ‘‘ఆకారము, గుణములు, నామరూపములు’’ - మొదలైన విశేషములతో కూడిన లింగమును (గుణ విశేషములను) దాటి ఆవల అనుభవించటమే కైవల్యము. ఇది శాస్త్రీయ సిద్ధాంతము. ఇది బ్రహ్మానుశాసనము।

సన్యాసము స్వీకరించే విధానము

శ్రీ నారద మహర్షి : లోక కళ్యాణమూర్తీ ! జగత్ పితామహా ! పితృదేవా ! ఇప్పుడు మాకు సన్న్యాసాశ్రమము స్వీకరించే విధానము ఎట్టిదో, ఏ విధమైనదో మరికొంత వివరించి చెప్పండి.

శ్రీ పితామహుడు (బ్రహ్మ భగవానుడు) : ఓ నారదా ! ఇప్పటి వరకు ఆయా కొన్ని విశేషాలు చెప్పుకున్నాము. ఈ విషయమై మరికొంత వివరించుకుందాము.

1) ఆతుర సన్న్యాసము 2) క్రమ సన్న్యాసము - ఇప్పటికే ఆ రెండు రీతుల గురించి చెప్పుకోవటం జరిగింది కదా!

ఆతుర సన్న్యాసము : అనారోగ్యకర పరిస్థితులలోను, మరణము దగ్గరపడుచున్నట్లు అనుమానము వస్తున్నప్పుడు ఆతుర సన్న్యాసము శాస్త్రములలో సూచించబడుచూ ఉన్నది.

క్రమసన్న్యాసము : శరీరారోగ్యము ఉండగానే శాస్త్రీయంగా స్వీకరించబడేది. ఆతుర మార్గంగాని (లేక) క్రమసన్న్యాస విధి గాని తురీయాశ్రమము స్వీకరిస్తున్నప్పుడు కుచ్చ్ర వ్రతము (సన్న్యాసపు సంజ్ఞలగు కాషాయ వస్త్రము, బొంత మొదలైనవి వ్రత విధిగా స్వీకరించటము) సంబంధమైన ‘ప్రాయశ్చిత్తములు’ అనబడే ‘8’ శ్రాద్ధములు (శ్రద్ధతో కూడిన ఉపాసన / అర్చన) నిర్వర్తించాలి.
అవి 1) దేవ 2) ఋషి 3) దివ్య 4) మనుష్య 5) భూత 6) పితృ 7) మాతృ 8) ఆత్మ శ్రాద్ధములు.
వాటి ఉద్దేశ్యము ఏ విధమైనదో ముందుగా చెప్పుకుందాము.

1) దేవశ్రాద్ధము (లేక) అర్చనము : సత్య వస్తు (వసు) సంజ్ఞీకాన్, విశ్వేదేవాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ (అర్చనమ్ కుర్యాత్) । సత్య వస్తువుగా చెప్పబడు విశ్వదేవుని (The worker of the universe) సృష్టి - స్థితి - లయ స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులను పూజించాలి.

2) ఋషి శ్రాద్ధము (అర్చన) : దేవర్షులను, క్షాత్ర ఋషులను (రాజర్షులను), మనుష్య ఋషులను ఉద్దేశ్యించి చేసే శ్రద్ధతో కూడిన కృతజ్ఞతాపూర్వకమైన అర్చనా విధానము నిర్వర్తించాలి.

3) దివ్య శ్రాద్ధము : అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను పూజించటము, శాంతిని అర్థించటము చేయాలి.

4) మనుష్య శ్రాద్ధము : మనస్సుకు అధి దేవతలు అగు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు - ఈ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. లోక కళ్యాణమూర్తులు అగు వీరిని ఉపాసించటము, వారిని బుద్ధిని (మనీషమును) తీర్చి దిద్దు దివ్య స్వరూపులుగా సుత్తించి, శరణు వేడటము నిర్వర్తించాలి.

5) భూత శ్రాద్ధము : భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములను (పంచ మహాభూతములను - The solid, The liquid, The heat, The gas, The space లను),
పంచ జ్ఞానేంద్రియ దేవతలను [ శోత్రము - వినికిడి, శబ్దము, త్వక్కు (చర్మము) - స్పర్శ, చక్షువులు - చూపు / రూపము, జిహ్వా (నాలుక) - రుచి / రసము, ఘ్రాణము (ముక్కు) - గంధము ] దాల్చి దేహములో ప్రదర్శనమగుచున్న జ్ఞానేంద్రియ దేవతలను,
పంచకర్మేంద్రియ దేవతలను 1) వాగింద్రియము/వాక్కు - పలకటము 2) హస్తేంద్రియము / చేతులు - పట్టుకోవటము / ఇవ్వటము, 3) పాదేంద్రియము / కాళ్లు - నడక 4) ఉపస్థ (లేక) గుహ్యము - (మూత్ర) విసర్జకావయవము 5) గుదము - మల విసర్జకావయవము)
చతుర్విధ (భూతగ్రామ శ్రాద్ధములు) : 1) పంచ ప్రాణములు 2) పంచ ఉపప్రాణముల ఉపాసన 3) పంచ ఇంద్రియముల ఉపాసన 4) పంచ - ఇంద్రియ విషయముల ఉపాసన 5) మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అయి ఉన్న చతుర్విధ అంతరింద్రియముల ఉపాసన.
(వీటిని అన్నిటినీ ఉపాసించటము - భూత శ్రాద్ధము అని కూడా అంటారు).

6) పితృశ్రాద్ధము : పితృ-పితామహ-ప్రపితామహ ఉపాసన తండ్రి నుండి మూడు తరముల వరకు (1) తండ్రి 2) తాత 3) ముత్తాత. ఒకవేళ తండ్రి జీవించి ఉంటే (సన్న్యాసము స్వీకరించువాడు జీవ పుత్రుడైతే) తండ్రిని వదలి - తనను, తాతను, ముత్తాతను స్మరిస్తూ ‘‘శ్రాద్ధము’’ అనే శ్రద్ధతో కూడిన పరమార్థవాక్య ఉపాసన సమర్పించాలి.

7) మాతృశ్రాద్ధము : మాత - పితామహి - ప్రపితామహి (తల్లి, నానమ్మ, ముత్తమ్మ - నానమ్మ వారి తల్లి) కి శ్రాద్ధోపాసన చేయాలి. తల్లి బ్రతికి ఉంటే, తనను మొదటిగా జేర్చి శ్రాద్ధ మంత్రములు ఉపాసించాలి.

8) ఆత్మ శ్రాద్ధము : తనకు తానే నామరూపాత్మకమైన తన యొక్క జీవాత్మక ప్రాపంచక రూపము (పాత్ర)కు శ్రాద్ధ సంస్కారము నిర్వర్తించాలి.

పై అన్ని (8) శ్రాద్ధములలోను ఇద్దరిద్దరు బ్రాహ్మణులను ఆహ్వనించి విశ్వేదేవ - పితృదేవ పూర్వకంగా పూజించాలి.

అట్టి శ్రాద్ధము 1) ఏకాధ్వర పక్షము (ఒక్క రోజులో పూర్తి చేసేది) 2) అష్టాధ్వరపక్షము - (8 రోజులలో అష్ట శ్రాద్ధములు నిర్వర్తించటము) అను రెండు విధములు చేయవచ్చునని చెప్పబడుతోంది.

ఈ రెండు పద్ధతులలో కూడా :

★ స్వశాఖానుగతమైన మంత్రము - (చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు……. ఋషి త్రయార్షేయ / ఋషిపంచార్షేయ / సప్తార్షేయ (వంశ గురువుల పేర్లు), ….. వేదాధ్యాయీ (ఋగ్వేద / శుక్లయజుర్వేద / కృష్ణ యజుర్వేద మొ।।న అధ్యాయీ - వంశ వేద విభాగము) …………. (పేరు) అష్టశ్రాద్ధములలో ప్రవర పూర్వకంగా పలకాలి.

★ ‘పితృయాగము’ చేయు విధానంగా బ్రాహ్మణులను అర్చించాలి. వారి భోజన విధి, పాదార్చన విధి మొదలైనవన్నీ పితృ యాగోక్త విధానంగా యథావిధిగా నిర్వర్తించాలి. పిండ ప్రదానము మొదలైనవన్నీ శాస్త్రీయంగా చేయాలి. బ్రాహ్మణులను సంతోషింపజేయాలి. బ్రాహ్మణ ప్రియంగా పూర్తి చేయాలి.

★ ఆ తరువాత సన్న్యాస సంస్కారము నిమిత్తమై శేషించిన (మిగిలియున్న) కర్మ నిర్వర్తించటానికై ‘‘కేశాంత సప్తాష్టవా’’ - ‘7’ లేక ‘8’ వెంట్రుకలను వదలి, తల వెంట్రుకలను, ముఖ వెంట్రుకలను తొలగించుచూ క్షౌరము చేయించుకోవాలి. మంత్రముగ్ధంగా ‘7’ లేక ‘8’ కేశములను (వెంట్రుకలను) సంరక్షించుకోవాలి.

★ కక్షోపస్థవర్జం - చంకలోని ఉపస్థయందలి వెంట్రుకలు వదలి శిరస్సు, ముఖము వెంట్రుకలు క్షౌరం చేయించుకోవాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఆ సాయంకాలం ‘‘సాయం సంధ్యా వందనము’’ సహస్ర గాయత్రీ పూర్వకంగా జపించి ‘బ్రహ్మయజ్ఞము’ నిర్వర్తించాలి. తనకు సమీపముగా ‘స్వాధీనాగ్ని’ని స్థాపించాలి (ఉపస్థాపనం). తన యొక్క ‘వేదశాఖ’ను (‘‘…… శాఖాధ్యాయీ’’ - అనునది) విడచిపెట్టాలి.

★ ఆ తరువాత వేదోక్త - వేదమంత్రోచ్ఛారణగా ‘‘ఆజ్యభాగము’’ వరకు చెప్పబడిన మంత్రములో ఆజ్యము (నేయి) ని హోమము చేయాలి. ఆహుతి విధిని పూర్తి చేయాలి. తదితరులతో కలసి తాను సక్తు ప్రాశనము (పేల పిండితో కలిపిన ఆహారము తినటము) 3 సార్లుగా నిర్వర్తించాలి.

★ అటు తరువాత ఆచమనం చేసి అగ్నిని రక్షించుకోవాలి. అగ్ని కొనసాగునట్లు పుల్లలు (wood pieces) మొదలైనవి వేయాలి.

★ అగ్నికి ఉత్తర దిశగా జింక చర్మము పరచుకొని ఆసీనుడు కావాలి. పురాణ కథలు శ్రవణం చేస్తూ (వింటూ) ఆ రాత్రి జాగరణ (రాత్రంతా మెలకువగా ఉండటము) నిర్వర్తించాలి.

★ చతుర్థయామము (నాలుగవ జాము) చివరిలో (ఉదయం 6 గంటల) తరువాత స్నానం చేయాలి (యామము = జాము = 3 గంటల కాలము)

★ ముందు రోజు నుండి వెలుగుచున్న అగ్నిని కట్టెపుల్లలతో ప్రజ్వలింపజేయాలి.

★ ఆ అగ్నిలో అన్నము వండాలి. (అన్నమును ‘చరువు’ అని కూడా అంటారు. చరువు = దేవతల హోమము నిమిత్తమై వండిన అన్నము).

★ ఆ అన్నము (చరువును) ‘పురుష సూక్తము’ చదువుచూ, 16 ఆహుతులుగా అగ్నికి హోమము చేస్తూ ‘విరజా హోమము’ చేయాలి.

★ ఆ తరువాత ఆచమనం చేసి, వస్త్ర దానము, సువర్ణ పాత్ర దానము, గో దానము - సదక్షిణంగా (కొంత ధనమును దక్షిణగా జేర్చి) నిర్వర్తించాలి.

పై విధంగా నిర్వర్తించి, ఆ తదుపరి బ్రహ్మోద్వాసనము (విరజా హోమము మొదలైన అప్పటి దాకా నిర్వర్తించిన అగ్నికార్యము యొక్క ఉద్వాసన) పలుకుతూ సమాప్తి చేయాలి.

అగ్నికి ఉద్వాసన :

సం మా సించంతు మరుతః, సమ్ ఇంద్ర, బృహస్పతిః 
స మాం అయాగ్నిః, సించంతు । ఆయుషా చ, 
ధనేన చ బలేన చ వా ఆయుష్మంతం కరోతు మేతి, యాతే అగ్నే యజ్ఞియా ।

నేను సన్న్యాసాశ్రమము స్వీకరిస్తూ అయాగ్నికుడిని (అగ్నికార్యము వదలుచున్నవాడిని) అగుచున్నాను. నన్ను వాయువు, ఇంద్రుడు, బృహస్పతి రక్షించుచు తత్త్వోపాసనాయుక్తమగు ఆయుష్షు, జ్ఞాన బలము ప్రసాదించి ఆయుష్మంతుని చేయు గాక।

పై మంత్రమును చదువుచు, మంత్రార్థమును బుద్ధితో భావన చేస్తూ, అగ్నికి ప్రదక్షిణ చేస్తూ, ఆత్మ ప్రదక్షిణగా ఆపాదించును గాక. పాంచ భౌతికమగు అగ్నిని దాటి పురాణమగు ‘ఆత్మయజ్ఞోపాసన’ ధారణ చేయును గాక।

ఆత్మయందు అగ్నిని ఆరోపించి ఆత్మాగ్నిని ధ్యానిస్తూ, యజ్ఞాగ్నికి ప్రదక్షిణము చేసి, నమస్కరించి యజ్ఞాగ్ని గుండములోని అగ్నికి ‘‘ఉద్వాసన’’ (send off) పలుకును గాక।

ఆ మరునాడు ప్రాతః సంధ్యను ఉపాసిస్తూ సహస్ర గాయత్రీ పూర్వకంగా (1000 సార్లు గాయత్రీ మంత్రమును నిర్వర్తించి), సూర్యోపస్థానము (సూర్యోపాసన) చేయాలి. (సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపత యశ్చ మన్యుకృతేభ్యోః పాపేభ్యో రక్షన్తాం । యద్రాత్రియాత్ పాపమకార్షం, మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేన శిశ్నా । రాత్రి స్తదవలుంపతు. యత్ కించిత్ దురితం మయి ఇదమహం మాం సూర్యేజ్యోతిషి జుహోమి స్వాహా - అని దోసిలితో జలము స్వీకరించాలి.

ఆ తరువాత-
నాభిదఘ్నా ఉదకమ్ ఉపవిశ్య, అష్టదిక్పాలక అర్ఘ్యపూర్వకం గాయత్రీ ఉద్వాసనం కృత్వా, సావిత్రీం వ్యాహృతిషు ప్రవేశయిత్వా…, జలములో (తటాకములో) బొడ్డు వరకు మునిగి, జలస్వరూపడగు వరుణ దేవునికి నమస్కరించును గాక. అప్పుడు అష్టదిక్పాలకులకు అర్ఘ్యము సమర్పించును గాక।

తూర్పున : శచీదేవి సమేత ఇంద్ర భగవానునికి,
తూర్పు - దక్షిణ మధ్యదగు - ఆగ్నేయమున : స్వాహాదేవీ సమేత అగ్ని భగవానునికి,
దక్షిణమున : శ్యామలాదేవీ సమేత యమ భగవానుకి,
దక్షిణ - పశ్చిమమగు నైరృతియందు: దీర్ఘాదేవీ సమేత నైరృతి భగవానునికి,
పడమరగా : కాళికా దేవీ సమేత వరుణునికి,
పశ్చిమోత్తరంగా (వాయువ్యముగా) : అంజనాదేవీ సమేత వాయుభగవానునికి,
ఉత్తర దిక్కుగా : చిత్రా దేవీ సమేత కుబేరునికి,
పూర్వోత్తర దిశగా (ఈశాన్యముగా) : పార్వతీదేవీ సమేత ఈశాననుకి అర్ఘ్యములు సమర్పించును గాక.

ఆవిధంగా జలముతో అష్టదిక్పాలకులకు అర్ఘ్య ప్రదానము నిర్వర్తించి, ‘‘గాయత్రీ ఉద్వాసనము’’ నిర్వర్తించాలి.

అప్పుడు (సత్-విత్-ఋత్ స్వరూపిణి అగు) సావిత్రీ దేవిని స్వకీయమగు ఉపాసనా విధానమునందు ప్రవేశింపజేసుకోవాలి.
‘‘నేనే-సత్ ఉనికి, విత్ - ఎరుక స్వరూపుడగు సమస్తమునకు పరమైయున్న ఆత్మ పురుషుడను’’ అను స్వస్వరూపాత్మోపాసనకు ఉపక్రమించు గాక.
అందుకు చెప్పబడిన శాంతి పాఠక స్తుతి శ్లోకములు చెప్పుకుంటున్నాము.

స్వస్వరూపాత్మస్థాన స్తుతి

అహం వృక్షస్వ రేః ఇవ । ఈ సంసార వృక్షమును పోషించు చేతన స్వరూపడను నేనే.

కీర్తిః పృష్ఠం గిరేః ఇవ । స్వస్వరూపమగు ఆత్మ యొక్క కీర్తియే పర్వత శిఖరంలాగా ఎదురుగా సమున్నతంగా ఏర్పడి ఉన్నది.

ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వ అమృతమస్మి : ఆకాశంలో సూర్యునియందు ప్రదర్శనమగుచున్నట్లే - ఆ ప్రకాశమానమగు పరబ్రహ్మతత్త్వము నా యందు కూడా అమృత స్వరూపమై - అస్మత్ స్వస్వరూపంగా వెలయుచున్నది.

ద్రవిణగ్ం సువర్చసమ్ : మమాత్మ స్వరూపమే ఈ సమస్తమును తన యొక్క సు-వర్చస స్వరూప సంపదగా కలిగియున్నది. ఇదంతా నా సు-వర్చస రూపమగు ద్రవిణం (ధనము)యే.

సుమేధా అమృతో క్షితః : నా ఆత్మయే సర్వదా అమృత స్వరూపమై, సర్వత్రా భూస్వరూపమై ఉత్తమ బుద్ధికి అనుభవమగుచు ఉన్నది.

ఇది త్రిశంకోః వేదానువచనమ్ : ఇది ఋక్ - యజుర్ - సామ్ త్రివేదములు ప్రకటించు శ్రేష్ఠ వచనము.

పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవ ధ్యానము

ఏ ఓంకార ప్రణవమైతే …

యః ఛంద సా మృషభో విశ్వరూపః । ఈ విశ్వమంతా ఎవరి యొక్క కల్పిత రూపముగా వేదములచే చెప్పబడుచూ, ఎలుగెత్తి గానము చేయబడుతుందో (మృషము - కల్పిత ప్రతిబింబమాతృము - మట్టికి బొమ్మ ఆకారమువలె)

ఛందోభ్యో అధ్యమృతాత్ సంబభూవ । ఏ అమృత స్వరూపము నుండి వేదములు శబ్దరూపంగా బయల్వెడలుచున్నాయో.

సమేంద్రో మేధయా స్పణోతు । అట్టి సమగ్రాత్మ స్వరూపమగు ప్రణవము నా యొక్క ఇంద్రియములను ఉత్తమ మేధస్సుతో (బుద్ధితో) తీర్చిదిద్దును గాక।

అమృతస్య దేవ ధారణో భూయాసమ్ । మేము అత్యధికమగు ఆత్మధ్యానామృతమునే ధారణ చేయచుండెదము గాక।

శరీరం మే విచర్షణం । నా యొక్క ఆత్మ శరీరమే సర్వత్రా విస్తారము, సంచారము కలిగినదై మాకు అనుభవమగుచుండును గాక. నా ఈ శరీరము జ్ఞానము పొందుటకు ఉపయోగమగు ఉపకరణమగు గాక.

జిహ్వా మే మధుమత్తమా । మధురమగు ఆత్మ గురించిన జ్ఞాన వాక్యములనే నా నాలుక ఆశ్రయించి ఉండును గాక. నా వాక్కు మధురముగా, శుభప్రదముగా, సర్వజన శ్రేయోదాయకముగా పలుకులు పలుకును గాక. నేను పలికే పలుకులు సహజీవులకు మధురముగా వినిపించును గాక.

కర్ణాభ్యాం భూరి విశ్రువమ్ । నా చెవులు ఆత్మ భగవానుని స్తుతి - సమాచారములు వినుటకై అధికాధికంగా సువిస్తారమై ఉండును గాక.

బ్రహ్మణః కోశో2సి మేధయా పిహితః । మా మేధ (బుద్ధి) బ్రహ్మము గురించిన శాస్త్ర - స్వానుభవజ్ఞాన ధనాగారమై నిండియుండును గాక.

శ్రుతం మే గోపాయ । రహస్యములగు వేదాంత వాక్యములు మా హృదయమునందు పరమార్థపూర్వకంగా పరిరక్షించబడు గాక.

సముద్ధరణ - సన్న్యస్త మంత్రము

దారైషణాయాశ్చ ధనైషణాయాశ్చ, లోకైషణాయాశ్చ వ్యుత్థితో2హమ్ । : ఇప్పుడు ఈ యతి - పరివ్రాజక సన్యాస వ్రతము స్వీకరిస్తూ 1) భార్య, స్త్రీ, నామరూపములపట్ల ఏర్పడియున్న ఈషణము (ఇష్టము, అభిరుచి, కోరిక, ఆవేశము) 2) ధనము పట్ల, సంపద పట్ల ఈషణము 3) లోక సంబంధమైన ఈషణము - వీటి నుండి ఉద్ధరణము పొందుచున్నాను. బంధముల నుండి విడివడుచున్నాను. (ఈషణము = ఇచ్ఛ, కోరిక, ఆకర్షణ)

1) ఓం ‘భూః’ సన్న్యస్తం మయా : ఓంకార రూపుడగు పరమాత్మను ఆశ్రయిస్తూ భౌతికంగా కనిపించేదంతా (భూః) నాచే వదలివేయబడుచున్నది. (I am leaving all that is matter related).

2) ఓం ‘భువః’ సన్న్యస్తం మయా : మనస్సు యొక్క విషయములను (భువః) ఆశ్రయించు స్వభావము నాచే విడవబడుచున్నది.

3) ఓగ్ం ‘సువః’ సన్న్యస్తం మయా : సాత్వికగుణ ఫలమగు సుఖమయ స్వర్గ (సువః) లోకములను, అనుభవిని కూడా విడచిన వాడనగుచున్నాను.

పైన చెప్పుకున్న 1) ‘‘అహం వృక్షస్య రేరివ….’’, 2) ‘‘యః ఛందసా మృషభో విశ్వరూపః…’’, 3) ‘‘దారైషణాయాశ్చ…’’, 4) ‘‘ఓం భూః సన్న్యస్తమయా, ఓం భువః…’’ ఈ నాలుగు మంత్రములను అంతరార్థమును ఆస్వాదిస్తూ మంద, మధ్యమ, తార ధ్వనులతో (With low, medium and high sounding voice) పలకాలి. వాక్కుతోను, మనస్సుతోను ఒకేసారి ఉచ్చరించాలి.

- - -

శిఖాముండనము

ఆ తరువాత, శిఖాముండనము

అభయం సర్వ భూతేభ్యో । మత్తః సర్వం ప్రవర్తతే । ఓం స్వాహా । ఈ సమస్త జీవులు నా యొక్క అభయమగు ఆత్మానంద స్వరూపమే । నా వలననే ఇదంతా కూడా ప్రవర్తమానము (Tend to behave) అగుచున్నది.

అని జలమును ప్రాశ్యము చేయాలి (తాగాలి).

అప్పుడు తూర్పు దిశగా కూర్చుని రెండు చేతులతో పూర్ణాంజలి (దోసిలి) ధరించి, ‘‘ఓం అభయం…స్వాహా’’ అను పైన మంత్రము చదువుచూ శిఖను తీసివేయాలి.

యజ్ఞోపవీత త్యాజ్య విధాన మంత్రము

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ।
పరమ పవిత్రమగు యజ్ఞోపవీతము (ధారణ చేయబడు సృష్టికి సంజ్ఞ)
ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ।
మొట్ట మొదట ఇది సృష్టికర్తయగు ప్రజాపతి యొక్క సహజమగు (అసంకల్పిత) సంకల్పము రూపమున ఉన్నది.
ఆయుష్యమ్ అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం ।
ఈ సూత్రము ఆత్మజ్ఞాన సంబంధమైన ఆయుష్షును అధికం చేయునదై పవిత్రతను ప్రసాదించునది.
యజ్ఞోపవీతం బలమస్తు తేజః।
ఇట్టి ఈ యజ్ఞోపవీతము తేజో రూపమగు బలము.
యజ్ఞోపవీత! బహిః న నివసేత్ త్వం ।
అట్టి ఓ యజ్ఞాపవీతమా । ఇక మీరు శరీరమునకు బాహ్యముగా ఉండి ఉండకండి.
అంతః ప్రవిశ్య మధ్యే హి అజస్రం ।
ఇప్పటి నుండి (అజస్రము) ఎల్లప్పుడు నా హృదయ మధ్యగా ప్రవేశించిన వారై ఉండండి.
పరమం పవిత్రం యశోబలం జ్ఞానం మేధాం ప్రయచ్ఛేతి ।
నా హృదయమును పొందినవారై నాకు యశస్సు (ఉత్తమముగా కీర్తి), వైరాగ్యం, జ్ఞాన బలము, జగత్ విషయముల పట్ల వైరాగ్యము, సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మను తెలుసుకోగల మేధస్సు (ధారణ శక్తి గల మఱపు లేని బుద్ధి) ప్రసాదించువారై ఉండండి.

పై యజ్ఞోపవీత ధారణ - హృదయాంతర్గతములోనికి యజ్ఞోపవీత దేవతాహ్వాన మంత్రమును పలుకుచు, నూలుచే నిర్మితమైన బాహ్య యజ్ఞోపవీతమును త్రెంచాలి. జలమునకు నమస్కరిస్తూ ‘‘ఓం భూః సముద్రం గచ్ఛ స్వాహేతి’’ అని పలుకుచూ నీటియందు బాహ్య జందెమును విడచివేయాలి.

అప్పుడు -

ఓం భూః సన్యస్తం మయా । ఓం భువః సన్యస్తం మయా । ఓగ్ సువః సన్న్యస్తం మయా

అని మూడు సార్లు అమంత్రము చేసి జలము మూడు (3) సార్లు లోనికి తీసుకోవాలి (త్రాగాలి).

పై మంత్రము చదువుచూ కటిసూత్రము (మొలత్రాడు) కూడా త్రెంచి నీటిలో వదలాలి.

అప్పుడు ‘‘సర్వకర్మ నివర్తకో2హమ్ ।’’ ‘‘నేను సమస్త కర్మల నుండి నివర్తకుడను అగుచున్నాను. ముగింపు పలుకుచున్నాను’’ అని మనోవాక్కులతో పలుకును గాక.

ఆ తరువాత -

జాతరూపధరుడై (అప్పుడే పుట్టిన బిడ్డవలె), మనస్సులో జనులతో పరస్పర అనుబంధ - బాంధవ్యములేవీ ఏ మాత్రము లేనివాడై కేవలమగు స్వస్వరూపము (The absolute “i” of one’s own self) తో అనుసంధానము కలవాడై,
- రెండు చేతులు ఊర్ధ్వముగా (Upwardly) ధరించి ఉత్తరము వైపుగా నడిచి వెళ్లును గాక!

- - - - -

ఇప్పుడిక మనము (1) విద్వత్ సన్న్యాసి 2) వివిదిషా సన్న్యాసిల గురించి చెప్పుకుందాము.

విద్వత్ సన్న్యాసి - సన్న్యాస స్వీకారము

విద్వత్ సన్న్యాసి : సమస్త దృశ్య విషయములపట్ల విరాగము పొంది మోక్షము సిద్ధించుకొను ఏకైక లక్ష్యశుద్ధి కలవాడు. విరాగము / విరక్తితో చక్కగా సన్న్యసిస్తూ ఉంటే అతడు అప్పటికే గురుముఖతః ‘మహావాక్యోపదేశము’ పొందినవాడై సుఖముగా భూమిపై తత్త్వజ్ఞానముతో సంచరించును గాక.

జీవో బ్రహ్మేతి నా పరః । పరబ్రహ్మమే జీవుడుగా కనబడుచున్నది. జ్ఞాన దృష్టిచే జీవుడు బ్రహ్మమునకు వేరు కాదు అని తెలియవచ్చుచున్నది.

తత్త్వమ్ అసి । ‘నీవు’ రూపముగా కనిపిస్తున్నవారంతా తత్ శబ్దార్థమగు పరమాత్మ స్వరూపులే అయి ఉన్నారు.

సో2హమ్ । అఖండము, దివ్యము అగు ఆత్మయే నేనై ఉన్నాను. పరమాత్మ ఏకమై నా, నీ, ఆ, ఈ సమస్త స్వరూపుడు.

త్వమేవాహమ్ । నీవుగా ఉన్నది, ఈ జగత్తు రూపముగా ఉన్నది నేనే. నా యొక్క స్వాభావిక ఆత్మ స్వరూపమే అజ్ఞాన దృష్టికి అనేకముతో కూడిన జగత్తుగాను, జ్ఞాన దృష్టికి ఏకము, సమస్తము గాను అయి ఉన్నది. ఇదంతా నా వలననే నేనే అయి ఉన్నాను.

ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ । ఏకము, అక్షరము అగు బ్రహ్మమే, సత్యమగు సత్-చిత్-ఆనంద రూపమే - నేను - నీవు జగత్తుల ‘ఓం’ కారార్థ రూపముగా వెలుగొందుచున్నది.

ఈ విధంగా విద్వత్ సన్న్యాసి ఆత్మను సమస్తముగా ఎరిగి, ఆత్మానంద సిద్ధ పురుషుడై, ఈ దృశ్యమునందు ఆత్మానంద భరితుడుగా విహరిస్తున్నాడు.

ఈ సమస్తము నేనే అయి ఉండగా, నాకు అన్యముగా వ్యతిరేకమైనది ఏమున్నది ?

మత్తః కశ్చిత్ న అన్యో వ్యతిరిక్త। అను అనుభవమును స్వాభావికము చేసుకున్నవాడై ఉంటున్నాడు. ఎక్కడ ఏ ఫలము (Fruit), పత్రము (leaf), ఉదకము (Water) దొరికితే అవియే స్వీకరిస్తూ, పర్వతములందు, వనములందు, దేవాలయ ప్రాంగణములందు సంచారము కలిగి ఉండును గాక.

అట్టి సన్న్యాసి వస్త్రములను కూడా ధరించాలి అనే ధర్మము లేనివాడై (దిగంబరుడై), సర్వత్రా సంచారములు నిర్వర్తిస్తూ,
- సర్వానంద స్వానుభవైక పూర్ణ హృదయుడై (ఆత్మానందమును సర్వత్రా దర్శిస్తూ స్వస్వరూపముగా ఆనందించు హృదయముకలవాడై)
- కర్మ - కర్మఫలముల పరిధులను దాటిపోయి, కర్మ సాక్షిత్వము సిద్ధించుకొన్నవాడై ఉండును గాక.
- ప్రాణమునకే ఆధారము, ప్రాణ శక్తికి జనన స్థానము అగు ఆత్మను తనయందు, అఖిల భూతములందు దర్శించుచూ, ప్రాణాధార పరాయణుడై ఉండును గాక.

దేహము నిలచి ఉన్నంతవరకు ఫలములు, ఫలరసములు, ఆకులు, జలము స్వీకరిస్తూ ఏది ఆహారముగా లభిస్తే దానిని దేహమునకు సమర్పించువాడై ఉండును గాక।

మోక్షమును మాత్రమే అభిలషించువాడై కాలము గడుపును గాక । దేహము త్యజించు సందర్భము వచ్చినప్పుడు పర్వత గుహలలోనో, మరెక్కడైనా సరే - తారక మంత్రము (సమస్త దృశ్యము నుండి స్వస్వరూపమును తరింపజేయు మననము కలవాడై) జపిస్తూ (భావిస్తూ) ఈ భౌతిక శరీరమును శిథిల వస్త్రము విడిచినట్లు త్యజించివేయును గాక.

వివిదిషా సన్న్యాసి - సన్న్యాస స్వీకారము

‘‘ఈ జగత్తుతో అనురక్తియే సంసారము’’ అని తెలుసుకొని అందుకు సాధనగా సన్యాసాశ్రమము స్వీకరించువాడు. సన్యాసమును విరక్తి కొరకై సాధనగా ఎన్నుకొనువాడు - ‘‘వివిదిషా సన్న్యాసి’’ అనబడుచున్నాడు.

ఈతడు సన్న్యాసము ‘సాధన’ కొరకై స్వీకరించువాడు. విద్వత్ సన్న్యాసి వలెనే సన్న్యాసవ్రత దీక్షా స్వీకార విధిని ముగిస్తారు. ఆ తరువాత ఉత్తర దిక్కుగా 100 అడుగులు నడచి వెళ్లుతారు.

అప్పుడు ఆచార్యులు మొదలైన అక్కడి విప్రులు, పండితులు అతనిని ఉద్దేశ్యించి : తిష్ఠ, తిష్ఠ - మహాభాగా ! దండం వస్త్రం కమండలుం, గృహాణ । ప్రణవ మహావాక్య గ్రహణార్థం గురునికటం ఆగచ్ఛేత్ । - ఓ సన్న్యాసాశ్రమము స్వీకరిస్తూ ఉన్న మహానుభావా ! ఆగండి ! ఆగండి ! ప్రణవ వాక్యార్థము బుద్ధికి సుస్పష్టము, నిర్దుష్టము చేసుకోవటానికై మీరు సద్గురు ఆశ్రమము ఆశ్రయించండి !’’ - అని పలుకుతారు. అప్పుడు ఆ వివిదా సన్న్యాసి అక్కడి వేదజ్ఞుల, విప్రుల సూచనానుసారంగా దండము (చేతికర్ర), కటిసూత్రము (మొలత్రాడు), కౌపీనము (గోచి), ఏకశాఠి (ఒక శాలువ), కమండలువు (నీటి పాత్ర)ను స్వీకరించాలి.

వైణవం దండం : పాదముల నుండి మస్తకము (శిరస్సు) వరకు పొడవుగల వెదురు దండమును స్వీకరించాలి. ఎక్కడా వ్రణములు (కణుపులు) లేనిది, సౌమ్యము (నున్నగా)ను, వంకర టింకరలు - ఎత్తు పల్లాలు లేనిది, అందముగా ఉన్నది అగు దండమును పొంది (‘‘ఓం కేశవాయ స్వాహా….’’ మొదలైన విధంగా) ఆచమనం చేసి (మూడుసార్లు జలము లోనికి తీసుకుని) - ఈ మంత్రము చదువుచూ చేతికి తీసుకోవాలి.

సఖా ! మా గోపాయ !
మిత్రమా ! సఖా ! దండ భగవాన్ ! నన్ను సర్వదా కాపాడుతూ ఉండండి.
ఓజః సఖా యో అసి ఇంద్రస్య వజ్రోసి।
నా యందు ఓజో శక్తిని వృద్ధి చేయుదురు గాక. మీరు ఇంద్రుని వజ్రము వంటి వారు అయి వుండండి.
వార్త్రఘ్నః శర్మ మే భవ ।
నాకు సుఖాలు అవండి.
యత్ పాపం, తత్ నివారయేతి ।
ఓ దండ రాజమా ! పాప దృష్టుల నుండి కాపాడి నాకు ఆనందము కలుగజేయండి. పాప కార్యముల నుండి నివారించి నన్ను రక్షించెదరు గాక.

కమండలువు (జలపాత్ర) : ‘‘జగజ్జీవనం, జీవనాధార భూతం! మాతే! మా మంత్రయిస్య, సర్వదా సర్వసౌమ్యేతి’’ ‘‘జగత్తులో జీవించటానికి జీవనాధారమై ఉండగల ఓ కమండలువు మాతా! ఎల్లప్పుడు సమస్తము పట్ల సౌమ్య (Peaceful, Tolerable) స్వభావము కలిగిఉండుటకై ఆమంత్రిస్తూ (Please condition me) నన్ను రక్షించుటకై నన్ను వెంటనంటి ఉండండి’’ అని మంత్రము చదువుచూ, ప్రణవము (ఓం) ఉచ్చరిస్తూ కమండలువును స్వీకరించెదరు గాక!

కటి సూత్రము : కౌపీనాధారం కటిసూత్రం ‘ఓం’ ఇతి । ఓంకార స్వరూపమగు కటి సూత్రమా (మొలత్రాడు దేవా)! మీరు వేంచేసి నా యొక్క కౌపీనమునకు (గోచి ధరించటానికి) ఆధారము అవండి అని ఆహ్వానిస్తున్నాను.

కౌపీనము (గోచి) : గుహ్యాచ్ఛాదనం కౌపీనం ఓం ఇతి । నా యొక్క గుహ్యావయవమునకు ఆచ్ఛాదనగా (కప్పుకొని) ఉండటానికి ఓంకార స్వరూపముగా ఈ కౌపీన దేవతకు ఆహ్వానము’’ - అని చెప్పుచూ కౌపీనము ధరించాలి.

వస్త్రము (శాటీ, దుప్పటి) : శీత - వాత - ఉష్ణ త్రాణకరం । దేహైక రక్షణం ఓం ఇతి । చలి, ఉక్కు - ఉష్ణముల నుండి దేహమును రక్షించుటకై ఈ వస్త్రమును స్వీకరించుచున్నాను.

ఈ విధంగా కటి సూత్రమును, కౌపీనమును, కప్పుకొనుటకు వస్త్రమును ఆచమనపూర్వకంగా స్వీకరించాలి.

పై విధంగా సన్న్యాసయోగ పట్టాభిషిక్తుడై కృతార్థో2హం - ‘‘నేను కృతార్థుడను. జీవితములో నిర్వర్తించవలసిన ముఖ్య కార్యము నిర్వర్తించినవాడను అగుచున్నాను’’ అని నోటితో పలుకుచూ, మనస్సుతో మననము చేస్తూ బుద్ధితో అవగాహనను నిశ్చలము, నిర్మలము చేసుకొనును గాక. సన్న్యాసాశ్రమ స్వీకారి అగును గాక।

ఇతి ఉపనిషత్ - చతుర్థోపదేశః


ఐదవ ఉపదేశము

సన్న్యాసి విధములు

శ్రీ నారదుడు : హే భగవాన్ ! ఇప్పుడు నాదొక సందేహము. దయచేసి నివారించ ప్రార్థన.

‘సర్వకర్మ నివర్తకః సన్న్యాస’’ - ఇతి త్వయా ఉక్తః । మీరు మాకు సన్న్యాసయోగము గురించి బోధిస్తూ ‘‘సర్వ కర్మల నుండి ఉపసంహారము (Completely withdrawing from all functional duties) అని చెప్పుతూ వస్తున్నారా? లేక నాకు అట్లా అనిపిస్తోందేమో?

అలా చెప్పుచూనే ‘‘స్వాశ్రమాచార పరో భవేత్ । తను కూడా సన్న్యాసాశ్రమ ఆచారపరుడై ఉండాలి’’ - అని కొన్ని ఆచారములను (Doings) గురించి నియమములుగా చెప్పుచున్నారు కదా. ‘‘తప్పక నిర్వర్తించాలి’’ అని సూచిస్తున్నారు.

1) కర్మలు, విధులు ఆశ్రమానుసారంగా నిర్వర్తించటము 2) కర్మలన్నీ సన్న్యసించటము
ఈ రెండు విషయముల గురించి మరికొంత వివరించి చెప్పండి.

శ్రీ పితామహులవారు : చైతన్యమూర్తి అగు ఆత్మ ‘శరీరి’ అయి దేహమును స్వీకరిస్తున్నదిగా అగుచున్నది. అట్టి శరీరి దేహముతో ‘4’ అవస్థలు అనివార్యంగా కలిగి ఉంటున్నాడు.

1) జాగ్రత్ అవస్థ  2) స్వప్నావస్థ  3) సుషుప్త్యవస్థ  4) తురీయావస్థ.

ఈ నాలిగింటి యందు ప్రవర్తమానుడగుచున్న జీవితాభిమాని అగు జీవుడు, వాటికి అధీనమైనట్టి కర్మ - జ్ఞాన - వైరాగ్యములతో ప్రవర్తమానుడై ఉంటున్నాడు.

అట్టి సందర్భానుచితంగా ప్రవర్తమానుడగు పురుషుడు (పురుషకారము ప్రదర్శించు జీవుడు) - తత్ తత్ అనుకూలమైన ఆచారములను (Situational as well as contextual acts / deeds) నిర్వర్తించటము అనివార్యము అగుచూ ఉంటుంది. కాబట్టి జీవుడు దేహమున్నంత వరకు ఆయా స్థితికి సంబంధించిన కర్మలు నిర్వర్తించక తప్పేది కాదు.

శ్రీ నారదుడు : ఓహో" ! అట్లాగా ! అయితే సన్న్యాసము అనేది అనేక రకములైనవి - అని మీరు చెప్పే వాక్యములను అనుసరించి నేను అర్థం చేసుకుంటూ భావిస్తున్నాను. తండ్రి ! ఈ విషయం మాకు బోధించండి.

ఆయా వివరాలన్నీ బోధించటమును మేము అర్థిస్తున్నాము.

పితామహ భగవానుడు : సరే ! ‘‘సన్న్యాస భేదములు, ఆచార భేదములు ఏవేవి ? ఏ రీతిగా ప్రసిద్ధమై ఉన్నాయి? అను నీ ప్రశ్నకు సమాధానము మనము చెప్పుకుందాము.

తత్త్వతః అస్తి ఏక ఏవ సన్న్యాసః । వాస్తవానికి ‘సన్న్యాస తత్త్వము’ అనేది ఒక్కటే అయినప్పటికీ 1) జ్ఞాన-అజ్ఞానముల దృష్ట్యా 2) కర్మ విశేషముల వశంగా కొంత భేదముల చేత శాస్త్రములచే నాలుగు రకములుగా చెప్పబడుతోంది (ఉపాగతః).

1) వైరాగ్య సన్న్యాసి 2) జ్ఞాన సన్న్యాసి 3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసి 4) కర్మ సన్న్యాసి.

1) వైరాగ్య సన్న్యాసి - విధానము :

‘‘దుష్టమదన అభావాత్’’ చ ఇతి - విషయ వైతృష్ణ్యమ్ ఏత్య, ప్రాక్ - పుణ్య కర్మ వశాత్ సన్న్యస్తః - స వైరాగ్య సన్న్యాసీ ।

ఒకడు దుష్టమైన, బంధము - దుఃఖముల పర్యవసానము కలిగిన అభ్యాసములలో చిక్కుకున్నానే ? ఈ జీవితావకాశమును వృధాపరచుకోకూడదు’’ - అను ఎరుక (Awareness) పొందుచున్నాడు. జగద్విషయముల పట్ల, ఇంద్రియ విషయముల పట్ల ఏర్పడుచున్న తనయొక్క తృష్ణ (urge) ని గమనించిన వాడగుచున్నాడు. పూర్వ పుణ్యకార్యముల ఫలముగా సన్న్యాస భావములతో సన్న్యసించుచున్నాడు.

ఈతడు ‘‘వైరాగ్యసన్న్యాసి’’ అని పిలువబడుచున్నాడు.

2) జ్ఞాన సన్న్యాసి:

శాస్త్ర జ్ఞానాత్-పాప పుణ్య లోకానుభవ శ్రవణాత్, ప్రపంచ ఉపరతః, క్రోధ ఈర్ష్య అసూయ అహంకార అభిమానాత్మక సర్వ సంసారాం నివర్త్య, దారైషణ ధనైషణ లోకైషణాత్మక దేహ వాసనానాం శాస్త్ర వాసనానాం లోక వాసనానాం త్యక్త్వా, ‘‘వమనాన్నమ్ ఇవ ప్రాకృతికం సర్వమిదం’’ మత్వా, సాధన చతుష్టయ సంపన్నో యః సన్న్యస్యతి, స ఏవ ‘‘జ్ఞాన సన్న్యాసీ’’

మరొకడు వేదాంత శాస్త్రము (లేక) తత్త్వశాస్త్ర శాఖలైనట్టి వేద, ఉపనిషత్, పురాణ, చారిత్రాత్మక విషయముల జ్ఞానము సంపాదించుకొనుచున్నాడు.

⌘   ఈ ఎదురుగా కనిపిస్తున్న పాంచ భౌతికమగు ప్రపంచమునకు ఆవల ప్రకాశిస్తూ సమస్తమునకు ఆధారమైయున్న ఆత్మతత్త్వము వైపుగా దృష్టిని సారించుచున్నాడు.
⌘   దృశ్యము పట్ల అజ్ఞానపూర్వకంగా ఏర్పరచుకొన్న సంబంధ బాంధవ్యముల కారణంగా రూపుదిద్దుకొని, హృదయములో ప్రవేశించియున్న క్రోధము, ఈర్ష్య, అసూయ, అహంకార, అభిమానాత్మకమైన సర్వ సంసార వ్యవహారములను నివర్తము (ప్రవృత్తి లేనిదిగా, తొలగిపోవునదిగా) తీర్చిదిద్దుకుంటున్నాడు.
⌘   దారైషణ, ధనైషణ, లోకైషణలను (భార్య - భర్త - బంధు సంబంధమైన కోరికను, ధనము సంపదల పట్ల, లోకములో పేరు ప్రతిష్టల పట్ల, వస్తు సమూహములపట్ల - సొంతము కావాలనే కోరికలను), ఈషణత్రయమును క్రమంగా వదలివేస్తూ ఉన్నాడు.
⌘   ‘‘దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన’’ అనే త్రి-వాసనలను క్రమక్రమంగా పరిత్యజిస్తూ వస్తున్నాడు.
⌘   ప్రకృతి పూర్వకంగా ఇంద్రియ విషయములపట్ల ఏర్పడే ప్రియత్వమును, ఆధారపడి ఉండటము మొ।। వాటిని ‘‘కక్కిన కూడు వంటిది’’ అని భావించ సాగుచున్నాడు.
⌘   సాధన చతుష్టయము (శమము (శాంతము), విచారణ, సంతోష - సంతృప్తి, సాధుసంగము)లను అనుష్టించి సుసంపన్నుడగుచున్నాడు.

అట్టి సన్న్యసించువాడు ‘‘జ్ఞాన సన్న్యాసి’’ అనబడుచున్నాడు.

3) జ్ఞాన వైరాగ్య సన్న్యాసి :

క్రమేణ సర్వమ్ అభ్యస్య, సర్వం అనుభూయ, జ్ఞాన వైరాగ్యాభ్యాం -
- స్వరూప అనుసంధానేన,
- దేహమాత్రావశిష్టః -
సన్న్యస్య ‘‘జాతరూపధరో’’ భవతి - స జ్ఞాన వైరాగ్య సన్న్యాసీ।

పైన చెప్పుకున్న విధంగా శాస్త్ర జ్ఞాన తత్పరుడై, ప్రపంచాతీత చైతన్యము గురించి శ్రవణము చేసి, క్రోధ ఈర్ష్య, అసూయలచే నిర్మితము అగుచున్న సంసారము మొత్తము నుండి నివర్తించినవాడై, ఈషణ-వాసనా త్రయములను త్యజించి, ప్రాకృత సంబంధము యొక్క నిరుపయోగము ఎరిగినవాడై జ్ఞాన సన్న్యాసి సాధన చతుష్టపరుడగుచున్నాడు.

అభ్యాస బలముచే పైన చెప్పినవన్నీ అనుభవముగా తెచ్చుకొని (అనుభవజ్ఞుడై) -
- కేవలమగు స్వస్వరూపముతో (with the Absolute “I” of one’s own self) అనుసంధానము సిద్ధించుకొన్నవాడై
- అప్పుడే పుట్టిన బిడ్డవలె ప్రపంచముతో మానసిక సంబంధమే లేని దేహమాత్ర - అవశిష్టుడై,

కేవలమగు ఆత్మయందు సమస్తమును ఏకము చేయుచున్నవాడు ‘‘జ్ఞాన వైరాగ్య సన్న్యాసి’’ అగుచున్నాడు.

4) కర్మ సన్న్యాసి / క్రమ సన్న్యాసి :

బ్రహ్మచర్యం సమాప్య, గృహీ భూత్వా, వానప్రస్థాశ్రమం ఏత్య, వైరాగ్య అభావే ఆప్య, ఆశ్రమక్రమానుసారేణ యః సన్న్యస్యతి, స కర్మసన్న్యాసీ।

మొదట బ్రహ్మము గురించిన అధ్యయనము కొరకై విద్యార్థి అయి ‘బ్రహ్మచర్యము’ స్వీకరించి, అటు తరువాత విద్యను పూర్తి చేసుకొని, గురువు యొక్క అనుజ్ఞతో గృహస్థ ఆశ్రమము స్వీకరించి, ఆ తరువాత సరి అయిన సమయంలో గురు అనుజ్ఞతో, కుటుంబ సభ్యుల అంగీకారముతో గృహస్థాశ్రమ బాధ్యతలన్నీ అప్పగించివేసి, వానప్రస్థాశ్రమము స్వీకరించి, భక్తి జ్ఞాన వైరాగ్యములను నిశ్చలము, సుస్థిరము చేసుకొని, సరి అయిన సమయంలో శాస్త్రయుక్తంగా సన్న్యాసము స్వీకరించువాడు ‘క్రమ సన్న్యాసి’ (లేక) ‘కర్మ సన్న్యాసి’ అని పిలువబడుచున్నాడు.

బ్రహ్మచర్యాశ్రమము నుండియే సన్న్యసించువాడు

ఒకానొకడు బ్రహ్మచర్యాశ్రమము నుండియే నేరుగా (గృహస్థ, వానప్రస్థ ఆశ్రమములు ఆశ్రయించకుండా) సన్యసించువాడు అగుచున్నాడు.

జాతరూపధరుడై అప్పుడే పుట్టిన బిడ్డవలె సమస్త సంబంధములు (వదలుటచే) లేనివాడై సన్న్యసించవచ్చు. అట్టివాడు వైరాగ్యముచే వైరాగ్య సన్న్యాసి కావచ్చు. శాస్త్ర జ్ఞానము సంపాదించుకొని విద్వత్ సన్న్యాసి అగుచున్నాడు. ఆత్మజ్ఞాని అయి ఉంటే ‘జ్ఞాన సన్న్యాసి’ అగుచున్నాడు. (లేదా) వైరాగ్యము, మోక్షము పొందు ఉద్దేశ్యము కలిగి ఉంటే వివిదిషాసన్న్యాసి గాని, లేక ‘‘కర్మ సన్న్యాసి’’ గాని అగుచున్నాడు.

నాలుగు విధములైన సన్న్యాసములలో కర్మ సన్న్యాసము రెండు విధములు 1) నిమిత్త సన్న్యాసి 2) అనిమిత్త సన్న్యాసి
1) నిమిత్త సన్న్యాసి : ‘మృత్యువు’ అనే సందర్భముచే సన్న్యసించువాడు. ఈయనే ‘ఆతురసన్న్యాసి’ అని కూడా పిలువబడుచున్నాడు.
2) అనిమిత్త సన్న్యాసి : ‘మరణము’ వంటి నిమిత్త కారణములేవీ లేకుండా, కేవలము వైరాగ్య భావములు కారణంగా సన్యసించువాడు. ఈయనయే ‘‘క్రమ సన్న్యాసి’’ కూడా.

ఆతుర సన్న్యాసమునకు నిమిత్త కారణము :
ప్రాణ ఉత్క్రమణ కాలమునకు (When about to leave the body as per one’s health position) కొంచెము ముందుగా తీసుకొను సన్న్యాసము. అట్టి వాడు తిరిగి జీవించువాడు అయితే, మరల క్రమ సన్న్యాస విధానము నిర్వర్తించాలి.

అనిమిత్త సన్న్యాసము (క్రమ సన్న్యాసము) :
అంగములు దృఢంగా ఉండగా,
- కర్మ - కర్మ ఫలములు నశ్వరమే (నశించి పోయేవే) అని గ్రహించి,
- సమస్తము హేయమే (వదలి వేయవలసినవే) అని నిశ్చయించుకొని, నిష్కళయుడై స్వీకరించు సన్న్యాసము.

- - - - -

పరబ్రహ్మ ఎట్టివాడు?

హగ్ం సః శుచిషత్ : హంస సో2హం రూపమున దివ్యమగు దైవీ స్వరూపుడు.

అంతరిక్షసత్ : అంతరిక్షమున సత్ (ఉనికి /Being) అయి ఉన్నవాడు. ఆకాశమంతా నిండి ఉన్నవాడు.

హోతా వేదిసత్ : యజ్ఞవేదికలో అగ్ని స్వరూపుడు, హోత (ఋత్విజుడు) అయినవాడు.

అతిథిః దురోణ సత్ : ద్రోణకలశములో సోమరస స్వరూపుడు, ఇంటిలో అతిథివలె వేంచేసి ఉన్నవాడు.

నృషత్ వర సత్ : మానవులలో దేవతలలో అంతర్యామిగా ఉన్నవాడు, సత్ - స్వరూపుడు.

అబ్జా గోజో ఋతజా అద్రిజా ఋతం బృహత్ : సరస్సులలో తామరవలెను, చంద్రునిలో వెన్నెల తేజస్సు గాను, గోవులందు పాలరస స్వరూపుడు గాను, ఋగ్వేదములో ఋక్కు (భగవత్ స్తుతి) స్వరూపుడు గాను - కొండపై ఆకాశమువలెను, పరమ - మహత్ సత్యమై వెలుగొందుచున్నాడు.

‘‘అట్టి పరబ్రహ్మముకంటే వేరైనదంతా కూడా నశ్వరము (అశాశ్వతము త్వరలో నశించునది) అని నిశ్చయించుకొని క్రమమార్గంగా (శాస్త్ర విహిత మార్గంగా) సన్న్యసించువాడు ‘‘అనిమిత్త సన్న్యాసి’’.

షట్ (6) విధ సన్న్యాస - ఆశ్రయములు

1) కుటీచకుడు 2) బహూదకుడు 3) హంస 4) పరమహంస 5) తురీయాతీతుడు 6) అవధూత : ఈ 6గురు సన్న్యాసులలో వివిధ తరగతివారు.

1.) కుటీచక సన్న్యాసి :
- శిఖ, యజ్ఞోపవీతము, దండము, కమండలువు, కౌపీనము (గోచి), కందము (బొంత) ధరించువాడు.
- తల్లి, తండ్రి, గురువులను ఆరాధిస్తూ ఒకచోటనే ఉండువాడు.
- పిఠరకము (జోలె), త్రశిక్యము (కావడి ఉట్టి) ధరించి మంత్రోపాసన నిర్వర్తించువాడు.
- ఒక చోట భిక్ష, ఒకేచోట ఉండి, అక్కడనే భోజనము భుజించువాడు.
- తెల్లటి ఊర్ధ్వ పుండ్రములను (నుదిటిపై పైవైపుగా నామము) ధరించువాడు.
- త్రిదండమును (గూఢార్థము : 1) మనో దండము 2) వాక్ దండము 3) కర్మ దండము - మనోవాక్ కర్మలను ఉపకరణములుగా) ధరించినవాడు.
- కుటీచకులకు - బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ - ఆ తరువాత 4వది అగు సన్న్యాసవిధిగా చెప్పబడుతోంది.
- వీరు సన్న్యాసకాలములో ఉత్తమ బుద్ధి సిద్ధించేవరకు శాస్త్రములు అధ్యయనం చేస్తూ, ఆ తరువాత కటిసూత్రం, కౌపీనము, దండము, వస్త్రము, కమండలువు జలములో విడచివేస్తారు.
- వేదాంత శాస్త్రము లేని అధ్యయనము చేయకూడదు. ఆత్మ శాస్త్రము కాని విషయాలు అధ్యయనము గాని, మాట్లాడటము గాని, వినటముగాని, తర్కించటం గాని, వితర్కించటంగాని చేయరాదు.
- కఠిన వాక్యములు పలుకరాదు. అధికంగా ప్రాపంచక విషయాలు మాట్లాడరాదు. అధికమైన అన్య సంభాషణలు, వాదములు గొప్ప విగ్లాపనమే (Distraction) అవుతాయి.
- ఇతరుల సంభాషణలను విశ్లేషించరాదు.
- స్త్రీలతో కామ ప్రసంగములు చేయరాదు.
- వీరికి దేవతా పూజ, ఉత్సవ దర్శనము, తీర్థయాత్రలు స్వధర్మము కావు.
- ప్రాప్తించగల లోకము : క్రమ, ఆతుర సన్న్యాసులకు మరణానంతరము మరల భూలోకమునకు అర్హుడగుచున్నాడు.

2.) బహూదక సన్న్యాసి :
- ఒక చోట ఉండక సంచారులై ఉంటారు. మధుకర వృత్తి. గృహనియమములు లేవు.
- శిఖ, యజ్ఞోపవీతము, కౌపీనము, కందము (బొంత) మొదలైనవి ధరించుతారు.
కుటీచకునివలెనే త్రిపుండ్రము ధరించువారై ఉంటారు.
- సర్వత్రా సమ దృష్టి అభ్యసిస్తూ ఉంటారు (సర్వసమో).
- మధుకర (భిక్షాటన) వృత్తిచే ‘8’ కబళములు (8 ముద్దలు) మాత్రమే ఆహారముగా స్వీకరించువారై ఉంటారు.
- బహూదక సన్న్యాసికి - బ్రహ్మచర్యాశ్రమము నుండి గృహస్థ వానప్రస్థ, సన్యాస ‘క్రమ సన్న్యాసము’ చెప్పబడింది.
- వీరు కూడా కుటీచక సన్న్యాసివలెనే వేదాంత శాస్త్ర అధ్యయనము చేస్తూ, ఉత్తమ ఆత్మబుద్ధి సిద్ధించగానే, కటిసూత్ర కౌపీన దండ వస్త్రములు జలమునందు సమర్పించివేస్తారు. వీరు కూడా కుటీచకునివలెనే అన్య శాస్త్ర అధ్యయనము, పఠనము, చర్చ మొ।। చేయరాదు.
- వీరికి కూడా కుటీచక సన్న్యాస నియమములు వర్తిస్తాయి.
- ఈతడు మరణాంతరము భువర్లోకమునకు అర్హుడు.

3.) హంస :
- జటాధారి (అల్లిముడి వేయబడిన వెంట్రుకలముడి) ధరించువారు అయి ఉంటారు.
- త్రిపుండ్ర ఊర్ధ్వ పుండ్రము ధరిస్తారు.
- ఈ ఇల్లు - ఆ ఇల్లు - అను నియమము పాటించకుండా మధూకర భిక్షతో భిక్షాన్నము (ఆహారము) భుజించువారై ఉంటారు. ‘8’ఇళ్లలో ‘8’ కబళములు మాత్రమే నియమము.
- కౌపీన ఖండము ధరిస్తారు. కపాలము (యాచక భిక్షపాత్ర) ధరించువారై ఉంటారు.
- వీరికి కూడా ‘కర్మ సన్యాసము’ లేక క్రమ సన్యాసమే విధిగా చెప్పబడుతోంది.
- ఆత్మతత్త్వము తప్పితే మరింకేమీ పలుకరు, చర్చించరు, అధ్యయనము చేయరు.
- హంస దేహము త్యజించిన తరువాత స్వర్గలోక ప్రవేశమునకు అర్హుడు.

4.) పరమహంస :
- శిఖ, యజ్ఞోపవీతము ధరించనివారై ఉంటారు.
- రోజుకు ఐదు (5) ఇళ్లలో మాత్రమే భిక్షాన్నము స్వీకరించువారై ఉంటారు.
- హస్తమే (అఱచేయి) భిక్ష పాత్రగా కలిగి పట్టిడన్నము మాత్రమే ఒకొక్క ఇంట స్వీకరిస్తారు.
- ఒక కౌపీనము ధరిస్తారు. ఒక శాటీ (దుప్పటి), ఒక వైణ (వెదురు) దండము, ధారణ చేస్తారు.
- దేహమంతా విభూతి భస్మము పూసుకొని ఉంటారు.
- సమస్తము త్యజించి, ‘సర్వత్యాగి’ అయి ఉంటారు.
- వీరికి మొలసూత్రము, గోచి, కమండలు, దండము మొదలైన నియమములు ఉండవు.
- అన్ని వర్ణముల వారి వద్ద భిక్ష స్వీకరించవచ్చును.
- వీరు జాతరూపధరుడుగా (అప్పుడే పుట్టిన బిడ్డలాగా) జగత్- వ్యవహార సంబంధమేమీ లేనివారై ఉంటారు.
- పరమహంస భౌతిక దేహము త్యజించినప్పుడు తపోలోకము ప్రవేశించుచున్నారు.

5.) తురీయాతీతుడు :
- వీరు సంపూర్ణ స్వస్వరూప జ్ఞానము కలవారు.
- గోవువలె నోటికి పట్టినంత ఆహారము దొరికిన చోట స్వీకరిస్తారు (గోముఖాహారము)
- ముండు ఇళ్లలో మాత్రమే భిక్షను స్వీకరించువారై ఉంటారు.
- ప్రపంచమునకు సంబంధించి ఒక దేహము కలిగి ఉండటము తప్పితే - మరింకే లోక సంబంధము మనస్సుందు కలిగి ఉండరు.
- దిగంబరుడై, కుణపము (పీనుగ, శవము) వలె ఇంద్రియ వృత్తులు (Avocations) ఏవీ కలిగి ఉండరు.
- వీరికి కూడా ‘‘మొలత్రాడు - గోచిధారణ - వస్త్ర - కమండలు’’ నియమాలు ఉండవు.
- ఏ వర్ణము వారి ఇళ్ల వద్దనైనా బిక్షాటన చేయవచ్చును.
- వీరు కూడా పరమహంస వలెనే జాతరూపధరులై ఉంటారు.
- తురీయాతీతుడు స్వస్వరూప జ్ఞాని అయి ఉంటాడు. కనుక ఈయన స్వస్వరూపాత్మ యందే ముక్తిని సిద్ధించుకుంటున్నారు. ‘భ్రమర కీటక’ న్యాయమువలె తామే అఖండాత్మ స్వరూపులగుచున్నారు.

6.) అవధూత :
- వీరు సంపూర్ణ స్వస్వరూప జ్ఞానము కలవారు.
- అవధూతకు శాస్త్రీయ నియమములు ఏవీ విధించబడటంలేదు.
- అజగరము (కొండచిలువ) వలె తన దగ్గిరకు సమీపించిన ఆహారమును స్వీకరించువారై ఉంటారు.
- ఏకము, అఖండము, సర్వాత్మకము అగు స్వస్వరూపముతో సర్వదా అనుసంధానము కలిగి ఉంటారు.
- వీరికి కౌపీన - కటిసూత్ర - వస్త్ర - కమండలు నియమములు ఉండవు.
- ఏ వర్ణమువారి ఇంటి వద్ద అయినా భిక్ష స్వీకరించవచ్చును. భిక్షాటన నియమములు ఉండవు.
- వీరు కూడా పరమహంస, తురీయుల వలెనే జాతరూపధరులై (ప్రపంచముతో సంబంధము రహితము చేసుకొన్న వారై) ఉంటారు
- అవధూత కూడా తురీయాతీతుని వలెనే ‘స్వస్వరూపము’ నందే ముక్తి పొందినవాడగుచున్నారు. ఆత్మయే తానై ఆత్మానందమును అనుశ్రుతము, అనుక్షణికము చేసుకుంటున్నారు.

షట్ విధ సన్న్యాసుల గురించి మరికొన్ని విశేషాలు

⌘   సన్న్యాసులు వేదాంత (లేక) ఆత్మ శాస్త్ర సంబంధితమైన అధ్యయనము చేస్తూ ఉండాలి. వేదాంతము లేని శాస్త్రములను (అనగా) తర్క - వ్యాకరణ శాస్త్రముల వంటి వాటిని అభ్యసించరాదు.
⌘   బ్రహ్మ భావనాశీలుడై మెల్లగా, శాంతముగా సంభాషించాలి. అంతేగాని కఠినముగాను, తదితరుల అభిప్రాయములను చర్చింటము, ఖండించటము చేయరాదు.
⌘   విశేష భావములను సంజ్ఞలతో సంభాషించటము ఉచితము. వాక్యములు, భాష, వర్ణములు మొదలైనవి పరిమితముగా మాత్రమే ఉపయోగించాలి.
⌘   కామ ప్రసంగము చేయు వారితో సంభాషించరాదు.
⌘   యతికి దేవతా పూజ, ఉత్సవ దర్శనము, తీర్థ యాత్రలు స్వధర్మములు కావు.
⌘   యతి ఒక్క రాత్రి మించి ఒక్క చోట గడపరాదు.
⌘   ఏ చోట నిద్రవస్తే ఆచోటే నిదురించును గాక.
⌘   తురీయాతీత అవధూతయోః న జ్యేష్టో । తురీయాతీత, అవధూతలలో ఒకరు ఎక్కువవారని, మరొకరు తక్కువవారని అనలేము. ఎందుకంటే ఎవరు ఎంతటి శ్రేష్ఠుడైనా కూడా, ‘‘స్వస్వరూప జ్ఞానము’’ లేనప్పుడు - అట్టివాడు కనిష్ఠుడే.
‘‘సమస్తము సర్వదా స్వస్వరూప చమత్కృతియే’’ అని ఎరిగినవాడు ఏ ఆశ్రమవాసి అయినా శ్రేష్ఠుడే.

యతి (సన్యాసి) చేయకూడనవి :
- నదులలో ఈతకొట్టటము చేయరాదు.
- చెట్లు ఎక్కటము ఉచితము కాదు.
- గుర్రము మొదలైనవాటి పై ఆరోహణము / స్వారీ చేయరాదు.
- కొనుగోలు - అమ్మకము వ్యాపారములు - నిషిద్ధము.
- డబ్బు బాగా ఖర్చు చేయటము, అప్పులు ఇవ్వటము చేయరాదు.
వీటిలో పాల్గొనరాదు :
- దాంభికమై (నేను వారి కంటే గొప్పవంటి) కబుర్లు చెప్పటము ఏ మాత్రము యతికి శ్రేయము కాదు.
- అబద్ధమును కప్పిపుచ్చుకొనే వాదము చేయనేకూడదు.

అస్తిచేత్ సాంకర్యం । తస్మాత్ మనన ఆదౌ సన్యాసినామ్ అధికారః ।
ఇటువంటివన్నీ సాంకర్యము (దోష విషయములతో సంబంధము)నకు దారితీయగలదు. పై విషయములు, ఇతరుల గురించి కూడా మననము మొదలైనవి చేయరాదు.

ఆత్మతో అనుసంధానము

యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం తం తమేవ సమాప్నోతి న-అన్యథా ఇతి శ్రుతిశాసనమ్ ।
యతి అయినా (లేక) అయతి అయినా సరే…. ఎవ్వడు ఏ ఏ భావము స్మరిస్తూ శరీరము విడుస్తాడో… ఆతడు అట్టి స్థితి - గతియే పొందటం జరుగుతోంది. వేరుగా కాదు. ఇది శ్రుతి చెప్పుచున్న సృష్టి యొక్క శాసనము.

అందుచేత :

తదేవం జ్ఞాత్వా స్వరూప - అనుసంధానం ।
వినా, అన్యథా ఆచార పరో న భవేత్ । తదా
ఆచారవశాత్ తత్ తత్ లోక ప్రాప్తిః ।

ఈ జీవుడు శ్రుతులు చెప్పు ఈ విషయము అర్థం చేసుకొని స్వస్వరూపమగు అఖండ పరమాత్మతో అనుసంధానము సిద్ధించుకోవాలి.

అట్లా ఈ జీవుడు ఆచరించక, ఆత్మ జ్ఞానము ఆశ్రయించని పక్షంలో, ఆత్మకు అన్యమగు విశేషముల పట్ల, విషయముల పట్ల ఆచారపరుడు కానేకూడదు సుమా!

ఒకవేళ, ఆత్మకు వేరైన దృశ్య వ్యసనమునకు చెందిన ఆచారపరుడు అయితే, వాటికి సంబంధించిన ఆయా లోకములలో ప్రవేశ నిష్క్రమణములు ఈ జీవుని పట్ల అనివార్యము అవగలవు.

ప్రాప్తిః జ్ఞాన వైరాగ్య సంపన్నస్య స్వస్మిన్ ఏవ ముక్తిః ఇతి ।।
ఆత్మ జ్ఞానము పొందిన వైరాగ్య సంపన్నుడు ఎవరైనా సరే, - అట్టివాడు తన యొక్క స్వస్వరూపాత్మ యందే ‘ముక్తి’ పొందినవాడు అగుచున్నాడు.

న సర్వత్ర ఆచారప్రసక్తిః సదాచారః ।
స్వస్వరూపాత్మ యందు ప్రవేశించి, బాహ్య జగత్తు, అంతరంగ చతుష్టయము, సమస్త జీవాత్మలు తన యొక్క ఆత్మ సాగర తరంగాలుగా దర్శించువానికి, ఇక తానే సర్వత్రా ఆచార ప్రసక్తుడగుచున్నాడు. ఇక శాస్త్రములు మొదలైనవి అతనికి సదాచారముల గురించి చెప్పేదేముంటుంది? ఏమీ ఉండదు.

ఏకాత్మ - చతుః (4) అవస్థలు

సర్వదా ఏకమే అయి ఉన్న ఆత్మ పురుషుడు (The person of one’s own self) జాగ్రత్ స్వప్న సుషుప్త పురుషకారములు స్వయం కల్పితంగా కలిగి ఉంటున్నాడు. అట్టి అవస్థా భేదములను అనుసరించి
1) జాగ్రత్ = విశ్వపురుషుడు
2) స్వప్నము = తైజస పురుషుడు
3) సుషుప్తి = ప్రాజ్ఞ పురుషుడుగా (శాస్త్రములచే) విభజించి చెప్పబడుచున్నాడు.
ఈ మూడు తన ప్రదర్శనమై ఉన్నవాడు ఈశ్వర పురుషుడు అనబడుచున్నాడు.

కారణ రూప ఈశ్వరుడు → కార్యరూప జాగృత్ స్వప్న సుషుప్తిలను (విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనబడు పురుషకారములను) తనను తానే విస్తరితుడై ప్రదర్శనశీలుడు అగుచున్నాడు.

బాహ్యవృత్తులు (జాగ్రత్) : వృత్తులు 14 కరణములచే ప్రదర్శించబడుచున్నాయి. వీటిలో బాహ్యేంద్రియములు (10).

(A) పంచ కర్మేంద్రియములు (5) : 1) వాక్ ఇంద్రియము, 2) హస్త - ఇంద్రియము 3) పాద-ఇంద్రియము 4) ఉపస్థ (జనన) ఇంద్రియము 5) పాయు - ఇంద్రియము.
(B) పంచ - జ్ఞానేంద్రియములు (5) : 1) శ్రోత్ర (చెవి) ఇంద్రియము 2) త్వక్ (చర్మము - స్పర్శ) ఇంద్రియము 3) చక్షుః (చూపు) ఇంద్రియము 4) జిహ్వ - (రుచి / మాట) ఇంద్రియము 5) ఘ్రాణ (వాసన) ఇంద్రియము.
(C) అంతరింద్రియ చతుష్టయము (4) : 1) మనస్సు (ఆలోచన) 2) బుద్ధి (తెలివి, విచక్షణ) 3) చిత్తము (ఇష్ట - అయిష్టములు) 4) అహంకారము (సమిష్టి నుండి వేరైన వ్యక్తిగతమైన ‘నేను’ భావన)

వృత్తులు : పది బాహ్యేంద్రియముల నుండి, నాలుగు అంతరింద్రియముల నుండి జాగ్రత్‌లో బహిర్గతము అయి వస్తు - విషయ - తదితర శరీరధార సంబంధము కల్పించుకొని వృత్తులుగా ప్రదర్శనమగుచున్నాయి. వృత్తి వ్యాపార భేదం చేత ప్రవర్తనా భేదంగా 10 బాహేంద్రియములు, 4 అంతరింద్రియములు విడివిడిగా రూపుదిద్దుకుంటున్నాయి.

ముఖ్యస్థానములు : జాగ్రత్‌కు ముఖ్యస్థానం కళ్లు. స్వప్నము ముఖ్యస్థానంగా కంఠములో ప్రదర్శనమౌతోంది. సుషుప్తికి ముఖ్య స్థానము హృదయము. తురీయమునకు మూర్ధము (శిరో ఉపరిభాగము) స్థానము. అనగా ఈ జీవుడు నిత్యోదిత చేతన రూపుడై జాగ్రత్‌లో కళ్లలోను, స్వప్నమప్పుడు కంఠములోను, సుషుప్తి సమయములో హృదయములోను తురీయ సందర్భములో సహస్రారమునందు స్థానము (నివాసముగా) కలిగి ఉంటున్నాడు.

జాగ్రత్ స్వప్నములలో దృశ్య పరిమితమైన జ్ఞానము మాత్రమే కలిగి ఉంటున్నాడు.

తురీయుడు : జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనకు చెందినట్టి సంచార విశేషములుగా కలిగియున్న జీవుని యొక్క పురుషకార స్వరూపుడు.

ఈ జీవుడు తురీయ స్వరూపుడుగా అక్షరుడు - అనగా జరామరణములు, మార్పు-చేర్పులు, రాక-పోకలు లేనట్టి నిత్య చేతన స్వరూపుడు.

ఎవ్వడైతే - జాగ్రత్ స్వప్న సుషుప్తులు (ఒకదాని తరువాత మరొకటిగా) మార్పు-చేర్పులు, రాక-పోకలు కలిగి ఉన్నదని, తురీయము ‘సమాధి’ రూపమని, ఏకరూపమని గమనిస్తాడో, గ్రహిస్తాడో -
- అట్టి వాడు - జాగ్రత్ స్వప్నములలో తత్-తత్ ప్రపంచాతీతత్వము సిద్ధించుకొని ఉండగలడు.
- మూడు అవస్థలలో స్వస్వరూప జ్ఞానము కలవాడు కాగలడు.

‘జీవన్ముక్తయో ఇతి వదంతి’ ‘‘అట్టి తురీయ స్వరూప జ్ఞానము కలవాడు జీవన్ముక్తుడే’’ అని చెప్పబడుచున్నాడు. ఇదియే సర్వ శ్రుతులచే (వేదములచే) స్మృతులచే ప్రతిపాదించబడుచున్న ‘‘ముక్తి’’ యొక్క సిద్ధి.

భిక్షువు - స్వస్వరూప అనుసంధానము

సహస్రారము నందు స్థానము కలిగి ఉన్న జీవాత్మ యొక్క నిశ్చల - అక్షర స్థానమగు ‘తురీయము’ ను ఉపాసించువాడే ‘‘భిక్షువు’’ - అనబడుచున్నాడు.

ఎవ్వడైతే ఐహికమైన (ఇహ లోకమునకు సంబంధించిన), ఆముష్మికమైన (తదనంతర స్వర్గము మొదలైన లోకములకు సంబంధించిన) స్థితి-గతులందు అపేక్ష కలిగి ఉంటాడో, అట్టివాడు ‘‘తురీయ - స్వస్వరూప అనుసంధానము’’ నకు ప్రయాణించు భిక్షకుడు కాలేడు.

బ్రహ్మానుసంధానమునకు వేరైన శాస్త్ర - అభ్యాసములు, వాద -ఉపవాదములు, శాస్త్ర ప్రజ్ఞ మొదలైనవన్నీ కూడా ఉష్ట్ర కుంకుమ భారము (ఒంటె కస్తూరిని నడుము పై కలిగి ఉండి, మోస్తూ కూడా, కస్తూరి వాసనను ఆస్వాదించలేనిది) తో సమానమే! వ్యర్థమే! అట్టి ‘‘స్వస్వరూపముతో అనుసంధానము’’ అభ్యాసముగా కలుగనట్టి ఆ జీవుని యొక్క యోగశాస్త్ర ప్రవృత్తి సాంఖ్య (అంతరంగచతుష్టయ విశ్లేషణా) శాస్త్రాభ్యాసము, మంత్ర-తంత్ర వ్యాపారములు, తదితర శాస్త్ర ప్రవృత్తులు మొదలైనవన్నీ కూడా ఆ జీవుని పట్ల ‘‘శవమునకు చేసే అలంకారములు’’ వంటివై, వృధాయే అవుతాయి.

శాస్త్రములు తెలిసి, తురీయాత్మతో అనుసంధానము గురించిన ప్రయత్నము చేయనివాడు - చర్మకారుడు (చెప్పులు కుట్టువాడు) తాను ఆ చెప్పులను ధరించని విధంగా - అతనికి ఉపయోగము లేనివే అవుతాయి.

ఎవ్వడైతే కర్మ - ఆచారముల యొక్క ఉత్తమమగు అంతరార్థమునకు దూరంగా ఉంటాడో, ప్రణవ స్వరూపమగు ‘స్వస్వరూప - సర్వస్వరూపాత్మ’’ గురించిన విచారణ కర్మల, ఆచారముల ఉద్దేశ్యముగా గ్రహించడో - అట్టివాడు నిర్వర్తించే కర్మ వ్యవహారములన్నీ శాశ్వత - ఆత్మానందము దృష్ట్యా - నిష్ప్రయోజనమే.

యద్యత్ కర్మ కరోతి, తత్తత్ ఫలమ్ అనుభవతి । ఎవరు ఏ ఫలితము కోరి కర్మలు చేస్తాడో, అతడు ఆ విధంగానే కర్మ ఫలములను పొందుతాడు.

అందుచేత కుమారా ! నారద దేవర్షీ ! కుంకుడి (లేక) ఆముదపు రసములో పొంగును వదలి రసాన్ని ఉపయోగిస్తాము కదా. ఆ విధంగా ముముక్షువు దృశ్య పరిమిత దృష్టులన్నీ వదలి, ఆత్మదృష్టిని అవలంబించు ‘‘భిక్షువు’’ కావాలి.
- సమస్త కర్మ ఫలములను పరిత్యజించివేయాలి. వాటి వాటి ప్రసక్తులు (సమాచారములు) వదలి వేయాలి.
- ఆత్మ గురించిన ప్రసక్తినే మనస్సుతో ఆశ్రయించాలి.
- మనస్సును దండముగా (చేతి కర్రగా) చేసుకోవాలి. అరచేతులనే భిక్షక పాత్రగా ధరించాలి.
- దిగంబరుడై (సమస్త బాహ్య పటాటోపములన్నీ దూరంగా పారవేయాలి).

అట్టి పరివ్రాజక భిక్షువు ఒక అమాయక బాలుని వలె, ఉన్మత్తుని వలె (జగద్విషయముల పట్ల ఎరుక లేనట్టి అలౌకికుడై), పిశాచము వలె భౌతిక శరీరము మొదలే లేనివాడై ఉండును గాక.

జీవించటమునుగాని, మరణించటమునుగాని ‘కావాలి’ అని కోరుకొననివాడై (కాంక్షించనివాడై) ఉండును గాక.

కాలగతి చేత ఏది కలిగితే అది అట్లు కలుగును గాక.

అతడు కాలమునకు సాక్షి, అతీతుడు అయి ఉంటాడు.

భృత్యువు యజమాని ఏది చెప్పితే అది ఇష్ట - అయిష్ట ప్రసక్తి లేకుండా నిర్వర్తించు తీరుగా (భృతక న్యాయముగా) నిష్కాముడై విధివశాత్ చేయవలసిన కర్మలు నిర్వర్తించును గాక.

‘‘తితిక్ష, జ్ఞానము, వైరాగ్యము, శమము, దమము’’ మొదలైన జ్ఞాన గుణములు కూడా వదలి ఎవ్వడైతే భిక్షచే లభించే అన్నమును మాత్రమే (ఆహారము) పొందు ఆశయము కలిగి ఉంటాడో అట్టి వాడు యతి లక్షణములు పాటించువాడు కాదు. పైగా యతి వృత్తిని పాడు చేసుకొని, సంసార లంపటమున మునుగువాడే అవుతాడు. యతి మార్గము నుండి ‘చ్యుతి’ పొందగలడు.

కాష్ఠ (కొయ్య దండము కాదు - జ్ఞానదండము ధరించుట) (ఏకదండీ)

యతి (లేక) పరివ్రాజకుడు అయి కేవలము - కాష్ఠ (కర్ర) దండమును ధరించటము, ముండనము (క్షౌరము) చేయించుకోవటము, బాహ్య కాషాయ వస్త్రధారణము ఆశ్రయించినంత మాత్రముచేత ఏమాత్రము సరిపోదు. అవి మాత్రమే ధరించి ఉంటే, - అది దంభాచారము మాత్రమే అవుతుంది. అంతమాత్రంచేత ముక్తి లభించదు. మరి?

జ్ఞాన దండో ధృతోయేన ‘ఏకదండీ’ స ఉచ్యతే। ఎవరైతే ఆత్మజ్ఞానమే చేతికర్ర (దండము)గా ధరించి, ఈ జగద్దృశ్యములో సంచరిస్తూ (పరివ్రాజకుడై) ఉంటాడో, అతడే ‘‘ఏకదండి’’ అనబడుచున్నారు.

ఎవ్వడైతే ఆత్మజ్ఞానము ఆశ్రయించకుండా ఒక కాష్ఠ (కొయ్య) దండమును ధృతము (గట్టిగా) పట్టుకొని, ఆశాపాశములు త్రెంచుకోడో, అట్టివాడు ‘మహారౌరవము’ సంజ్ఞతముగా చెప్పబడే ఘోర నరకములో ప్రవేశించగలడు. ‘‘లోకములో ప్రతిష్ఠ గురించి తాపత్రయపడటము అనేది పంది పెంటను (నీచమును) కోరుకోవటము వంటిది’’ - అని మహర్షులు గుర్తు చేస్తూ ఉన్నారు.

అందుచేత యతి ప్రజల నుండి ప్రతిష్ఠను కోరక, ఒక కీటకమువలె (ఎవ్వరి మెప్పుకోసము వేచి ఉండక) ప్రపంచములో పర్యటిస్తూ ఉండును గాక!

అయాచితం యథాలాభం భోజన ఆచ్ఛాదనం భవేత్। - అయాచితంగా (కోరుకోకుండానే) ఏది లభిస్తే, ఆ భోజన, వస్త్ర ఆచ్ఛాదనములే (కప్పుకొనుటకు వస్త్రములు) స్వీకరించును గాక!

పరేచ్ఛయా చ దిగ్వాసాః, స్నానం కుర్యాత్ పరేచ్ఛయా। - ఇతరుల ఇష్టము, వసతిని అనుసరించి వస్త్రములు ధరించును గాక! ఇతరుల సానుకూల్యతను అనుసరించియే స్నానము, దైనందిక చర్యలు మొదలైనవి నిర్వర్తించును గాక!

ఎవ్వడైతే జాగ్రత్‌లో (మెలకువగా ఉన్నప్పుడు) ఏ విధంగా బ్రహ్మతత్త్వమును ఉపాసన, భావన, మమైక్యము అభ్యసిస్తున్నాడో…,

శ్లో।। స్వప్నే-పి యో హి యుక్తః స్యాత్ జాగ్రతీవ విశేషతః ।
ఈదృక్ చేష్టః స్మృతః శ్రేష్ఠో వరిష్ఠో బ్రహ్మవాదినామ్ ।।

అట్టి ఏ బ్రహ్మానిష్ఠుడైతే స్వప్న సమయములో కూడా ‘‘అహం బ్రహ్మస్మి’’, ‘‘తత్త్వమసి’’ భావనను ఏమాత్రము చదరకుండా కలిగియే ఉంటాడో - అట్టివాడు బ్రహ్మతత్త్వజ్ఞులలో వరిష్ఠుడు (శ్రేష్ఠుడు) అగుచున్నాడు.

➤ ఎవ్వరైతే లభించవలసినది లభించకపోయినప్పటికీ ఏ మాత్రము విషాదము పొందడో,
➤ ఏదైనా లభించినప్పుడు హర్షము కూడా పొందడో,
➤ ప్రాణముతో జీవితయాత్ర నిర్వర్తించటానికి ఎంత వరకు కనీసావసరములో, అంతవరకు మాత్రమే సంబంధిత ప్రాపంచక కర్మలు నిర్వర్తించువారై ఉంటారో,
➤ ఇతరులు తనను పూజిస్తున్నప్పుడు, స్తుతించుచున్నప్పుడు ఏమాత్రము ప్రీతి కలిగి ఉండడో (ఇదంతా కాల మహిమ అనుకుంటాడో), సమస్త విషయ లాభములందు జుగుప్స (అయిష్టము) కలిగి ఉంటాడో, అట్టివాడు యతిధర్మము నిర్వర్తించుచున్నట్లే. ఎందుకంటే పూజ, సన్మానము, స్తుతి, గౌరవించబడటము మొదలైనవి ముక్తుడైన యతిని కూడా బంధితునిగా చేయగలవు. కనుక సమస్త ఆశ్రమ ఆశ్రయులు అటువంటి వాటి పట్ల జాగరూకులై ఉండాలేగాని, లోబడి ఉండకూడదు.

భిక్షక యతి భిక్ష తీసుకొను విధి

ప్రాణయాత్ర కొనసాగు అవసరము వరకే భిక్ష గ్రహించాలి. అంతకు మించిన భిక్షను ఆకలి గొన్నవారికి ఇచ్చివేయవచ్చు.

సరి అయిన సమయములో మాత్రమే భిక్షాటన చేయాలి. గృహస్థులు వంట చేసుకొని, భోజనము చేసిన తరువాత సమయము ఎన్నుకొని భిక్షకై వెళ్లాలి. అరచేతులకు పట్టినంతవరకే భిక్షాహారము స్వీకరించాలి.

అనేకసార్లు ఒకే ఇంటికి వెళ్లి భిక్షను కోరరాదు. కూర్చుని తింటున్నా, నడుస్తూ తింటున్నా కూడా భోజన మధ్య కాలంలో పునః ఆచమనము చేయరాదు.

కొందరు పుణ్యాత్ములగు గృహస్థులు సముద్రము వలె విశాల బుద్ధి, గొప్ప గౌరవ మర్యాదలు, త్యాగ నిరతి, భిక్ష సమర్పించటంలో విశాలమైన ఆశయశీలురు అయి ఉంటారు. అయినా కూడా ఎక్కువసార్లుగా వారి వద్ద భిక్షకై ఆశ్రయించరాదు.

ఆకాశంలో సూర్య భగవానుని వలెనే మహనీయులగు యతులు నియతిని అతిక్రమించరు.

ముని స్వభావుడగు యతి (సన్యాసి) గోవువలె లభించిన దానికి సంతోషించి ఆహారము స్వీకరించాలి. అంతేగాని, ‘‘అది కావాలి. ఇది ఇవ్వండి’’ అని భిక్ష ఇచ్చు ఇంటి యజమానులను ఇబ్బంది పెట్టరాదు. ఒకరు భిక్ష ఇచ్చినా, మరొకరు ఇవ్వకపోయినా కూడా అమృతమగు వాక్యములనే పలకాలి. అందరి క్షేమము కోరుకోవాలి. ‘‘శుభమగు గాక, శాంతమగు గాక, ఐశ్వర్యమగు గాక, ఆనందమగు గాక!’’ అని శుభములను మాత్రమే ప్రవచించాలి. కోపగించరాదు.

ఇతరులను బాధించు, మోసగించు, హింసించు స్వభావులగు వారి, నింద్యులగు వారి ఇళ్లవద్ద భిక్ష కోరరాదు. అనింద్యులగు శుభ+శ్రేయో అభ్యాసములు, సాత్విక భావములు గల ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష స్వీకరించాలి. అయితే ఎవరు తమంతట తాముగా భిక్ష స్వీకరించమని అభ్యర్థిస్తే వారి కోరిక మన్నించాలి.

తలుపులు తెరచియున్న ఇళ్ల వద్ద మాత్రమే భిక్షను అడగాలి. తలుపులు మూసుకున్నవారి ఇళ్ల వద్ద భిక్షకై ఎలుగెత్తి అడుగరాదు. పరుష వాక్యములు పలుకరాదు.

ధూళితో శిథిలమైయున్న శూన్యాగారముల వద్ద గాని, వృక్షముల మూలమున గాని - ప్రియాప్రియములను విడచినవాడై విశ్రమించును గాక.

సూర్యుడు అస్తమించు వేళలో తాను ఏ ప్రదేశంలో ఉంటే అచ్చటనే విశ్రమించాలి (పడుకొనును గాక).

సన్న్యాసికి అగ్నికార్యము గాని, ఒకచోట స్థిర నివాసముగాని చెప్పబడటం లేదు. ఎవ్వడైతే లభించిన దానితో తృప్తి చెంది ఇంద్రియములను నియమించుచు, వాటిని జయించినవాడై ఉంటాడో, - అతడే మునీశ్వరుడు.

వానప్రస్థ యతి

గృహస్థాశ్రమము నుండి బయల్వెడలి, వనము (అరణ్యము, ఏకాంత ప్రదేశము) చేరి, జ్ఞాన యజ్ఞము (ఆత్మతత్త్వోపాసన) చేస్తూ ఇంద్రియములను జయించే ప్రయత్నము చేయువాడు ‘‘వానప్రస్థుడు’’. ఏ ముని-సమస్త భూతజాలమునకు భయము కలిగించనివాడై, సమస్త సహజీవుల పట్ల ప్రేమాస్పదుడై చరిస్తూ ఉంటాడో, అట్టివానికి ఇక భయము కలుగదు.

నియమములు :
‘‘నన్ను ప్రత్యేకముగా జనులు భావించాలి’’ అనే మానమును, ‘‘నేను అంతటివాడిని’’ అనే అహంకారమును వదలి ఉండును గాక.
❆ ‘‘పరమాత్మయే ఈ అనేక రూప ప్రదర్శనము (కథా రచయిత పాత్రలు కల్పిస్తున్నట్లుగా) కల్పిస్తున్నారు’’- అను ఎరుకను నిర్దుష్టము చేసుకుంటూ నిర్ద్వంద్వుడై ఉండును గాక. స్వస్వరూప ఆత్మతత్త్వము గురించిన సంశయములన్నీ తొలగించుకోవాలి.
❆ ఎవ్వరి పట్లా కూడా కోపముగా గాని, ద్వేషముగా గాని, అసత్యమును గాని భాషించకూడదు.
❆ సహజీవులను హింసించనివాడై వాత్సల్యము, ప్రేమ చూపుచూ పుణ్యచరితము (Behaviour) కలిగి ఉండునుగాక.
❆ ఆకలి కలిగినంతవరకే భిక్షను ఆశ్రయించును గాక. అట్టివాడు బ్రహ్మమును ఎరిగి, బ్రహ్మమే తానగుచున్నాడు.

సన్న్యాసికి సంబంధించిన మరికొన్ని ధర్మములు

సన్న్యాసి వానప్రస్థులతోగాని, గృహస్థులతోగాని కలసి తిరగరాదు. ఏకాంతముగా, ఎవ్వరికీ తన గొప్పతనము ప్రదర్శించక, అజ్ఞాతుడై చరించునుగాక. దేనికీ ఆనందముతో తబ్బిబ్బు కారాదు.

పగలు సూర్యుడు ఉన్నంతవరకు ఒక చోట నిలువక, కీటకమువలె సంచరించును గాక.

ప్రబుద్ధుడగు యతి ఆచార నియమములు

ఉత్తమమగు ఆత్మ బుద్ధి సిద్దించుకొన్న యతి కూడా ఈ దృశ్య జగత్తులో సంచరిస్తూ ఉన్నప్పుడు జాగరూకుడై ఉండాలి. లేదా, ఈ దృశ్యముతో ఏర్పడే సంసార దోషము తిరిగి ఆకర్షించి వశము చేసుకొను అవకాశము పొంచియే ఉండగలదు. అందుచేత దృశ్యములో పాల్గొనుచున్నప్పుడు ఆత్మజ్ఞాన సిద్ధుడు కూడా ఆచరించు కొన్ని నియమ - నిష్ఠలు మరొక్కసారి కూడా మరికొన్ని వివరిస్తున్నాను.

✡︎ ప్రబుద్ధుడై, ఆత్మగురించి సర్వజ్ఞుడు అయి కూడా ఒక బాలుని వలె (క్రీడా వినోదివలె) సంచరించాలి.
✡︎ అంతా తెలిసి, కుశలుడు (Wel-knowledgable and efficient) అయి ఉండి కూడా ఏమీ తెలియని జడునివలె (Like foolish - non active fellow) చరించును గాక.
✡︎ విద్వాంసుడు (Wel-informed) అయి కూడా ఉన్మత్తునివలె (ఏమీ తెలియని పిచ్చివానివలె) ఉంటూ ఉంటారు.
✡︎ వేద-వేదాంత తత్త్వ రహస్యము తెలిసికొని కూడా గోవృత్తివలె (ఆవు ఇంటింటికి వెళ్లి ఇచ్చిన అరటిపళ్లను తిను విధంగా) భిక్షాటనము చేయుగాక.
✡︎ అల్లరి, దురుసు, మాత్సర్యముతో కూడియున్న కొందరు జనులు ప్రబుద్ధుడగు తన పట్ల :
→ క్షిప్తో। అలక్ష్యముగా త్రోయవచ్చు గాక.
→ అవమానితో। తక్కువ చేసి అవమానించవచ్చు గాక.
→ అసద్భిః ప్రబుద్ధో। అసభ్యముగా, అగౌరవముగా అవమానించవచ్చు గాక.
→ అసూయతోపి వా ।: ఓర్వలేనితనము, మంచి గుణములపై కూడా దోషము ఆపాదించటము చేయవచ్చునుగాక
→ తాడితః । నిష్కారణంగా కొట్టవచ్చు గాక.
→ సన్నిరుద్ధో వా । తన ధ్యాన సాధనములకు అకారణంగా నిరోధము కలిగించవచ్చు గాక.
→ వృత్త్యా వా పరితాపితః । పరితాపము కలిగించు వృత్తులు ప్రదర్శించినప్పుడు.
→ అనేక విధములుగా నిందించినప్పటికీ, ఆయా అటువంటి సందర్భములలో ఇతరుల శ్రేయమే (క్షేమమే) కోరుకొనును గాక. శ్రేయఃకాముడు (ఆత్మ శ్రేయస్సు, మోక్షము) కోరుకొనువాడు అట్టి కుచ్ఛ్రము (పాపము) సహిస్తూ తనను తాను ఆత్మ జ్ఞానముతో ఉద్ధరించుకొను ప్రయత్నము వీడకుండును గాక.

అంతేకాకుండా (on the other hand) :

సమ్మాననం పరాం హానిం యోగర్థేః కురుతేయతః । ఇతరులు తనను సమ్మానించటము (గౌరవించటము, గొప్పవాడని స్తుతించటము మొదలైనవి) తన యొక్క పరతత్త్వ ధ్యానమునకు హానికరములని తలచునుగాక. అట్టి యోగాభ్యాసి త్వరగా యోగసిద్ధిని పొందగలడు.

సత్వ స్వభావముగలవారిని, సాత్విక ప్రవర్తనము కలవారిని దూషించుచోట వర్తించరాదు. తాను ప్రాపంచక సంగతి - సందర్భముల గురించి, ఇతరుల చెడు గురించి చెప్పుకొనే చోట్లకు దూరంగా ఉండాలి.

జంతువులను, పక్షులను హింసించకూడదు.

సర్వదా కామము, క్రోధము, దర్పము, లోభము, మోహము మొదలైన దోష గుణములు లేనివాడై, సమస్త సంగములు విడచినవాడై, భయము లేనివాడై పరివ్రాట్ సంచరించుచుండును గాక.

భిక్షుక -సన్యాస సత్ప్రవర్తనములు

మరికొన్ని సత్ప్రవర్తనముల గురించి చెప్పుకుందాము.

పరివ్రాట్ (భిక్షకుడు, సన్న్యాసి) చిత్తశుద్ధి సిద్ధించుకొనేంతవరకు ఒకచోట అధిక కాలం నిలువరాదు. చిత్తశుద్ధి కలిగి, దోషరహితుడైతే ఎచ్చటనైనా సంచారము చేయవచ్చు.

బాహ్య జగత్తులోను, అంతరంగములోను ఎల్లప్పుడు జనార్ధనుని (ఆత్మ భగవానుని) దర్శించాలి. (అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః - మంత్రపుష్పం).

మౌని అయి, వాయువు వలె దృశ్య సంబంధములైన ఏ దోషము తనను అంటనివాడై, నిర్మల హృదయుడై సంచరించును గాక. సుఖ-దుఃఖములను సమముగా స్వీకరించాలి. ఓర్పు, సహనము కలిగి ఉండాలి. చేతికి దొరికినదే భుజించాలి. అంతేగాని ఏవేవో ఆహారములు అధికముగా కోరుకోరాదు.

ఎవ్వరిపట్ల ఏమాత్రము వైరము లేనివాడై, ఒక ద్విజునిలోని (వేదపండితునియందు), గోవునందు, అశ్వము మొదలైన మృగములనందు సమ స్వరూపమగు ఆత్మనే దర్శించును గాక, ‘‘ఈ సమస్తము పరమాత్మ అగు విష్ణు స్వరూపమే’’ అను భావము కలవాడై సర్వత్రా ఈశ్వరునే దర్శించాలి.

‘‘చిన్మయము (Absolute knowing) పరమానందము అగు బ్రహ్మము నేనే అయి ఉన్నాను’’, ‘‘బ్రహ్మైవాహమ్’’ అను స్మరణను ఎల్లప్పుడు కలిగి ఉండాలి. జ్ఞాపకము వీడరాదు (అనుస్మరణము)

బ్రహ్మైవాహమిదం జ్ఞాత్వా, ఏవం మనోదండం ధృత్వా, ఆశా నివృత్తో భూత్వా, ఆశాంబరధరో భూత్వా,
మనో వాక్కాయ కర్మభిః సర్వ సంసారం ఉత్సృజ్య,
ప్రపంచ అవాఙ్ముఖః స్వరూప అనుసంధానేన, భ్రమర -
కీటక న్యాయేన ముక్తో భవతి - ఇతి ఉపనిషత్ ।।

→ వేద వేదాంత శాస్త్రములలో స్తుతించబడుచున్న, వర్ణించబడుచున్న ‘బ్రహ్మము’ అనగా నేనే - అని శాస్త్ర అధ్యయన, గురువాక్య మననముల ద్వారా ముందుగా గ్రహిస్తూ ఉండాలి. అట్టి భావనను అచ్యుతము చేసుకుంటూ ఉండాలి.
→ ‘‘నేను బ్రహ్మమే అయి ఉన్నాను’’ అని (అహం బ్రహ్మాస్మి అని) తెలుసుకుంటున్నది మనకు నిర్ద్వంద్వముగా అనిపించాలి. ఎట్లా ? అందుకుగాను ‘‘మనస్సు’’ను దండముగా (ఒక ఉపకరణంగా / చేతి కర్రవంటిదిగా) ధరించాలి.
→ దృశ్య ఆశ (ఆశించటము)ను త్యజించునుగాక. ఆశాంబరము (విరాగమునకు సూచనమగు కాషాయ వస్త్రము) ధరించుగాక.
ఈ దృశ్యమునకు సంబంధించి ‘‘ఇది ఇట్లా ఉండాలి, అది నాకు లభించాలి, అది నానుండి తొలగాలి’’ అను ఆయా రూపములుగా ఏర్పడుచున్న సమస్త సంసార సంబంధ బంధములను మనస్సు అనే దండము సహాయముతో త్రెంచుకొంటూ ఉండాలి. సమస్త ఉబలాటములను వదలుతూ రావాలి.
→ ప్రపంచము నుండి మనస్సును వెనుకకు మరల్చి అవాఙ్మఖుడు (Withdrawn) అగుచూ ఉండాలి.

పై అభ్యాసములచే ‘‘భ్రమర కీటక న్యాయము’’ వలె (తుమ్మెద చేయు ‘ఝం’ శబ్దముపై ధ్యాసచే చిన్న పురుగు తుమ్మెదగా అగుచున్నట్లుగా) ఈ జీవుడు జీవాత్మ పరిమితములను దాటివేసి స్వస్వరూప అనుసంధానముచే బ్రహ్మమే అగుచున్నాడు.

వ్యష్ట్యాత్మక భావము (Individual sense) ను అధిగమించి ‘‘సర్వాత్మకుడు, సర్వసాక్షి’’ అయి వెలుగొందుచున్నాడు

ఇతి ఉపనిషత్ - పంచమ ఉపదేశము


షష్ఠమ (6వ) ఉపదేశము

బ్రహ్మమే తాను అగుట!

శ్రీ నారద మహర్షి : హే భగవాన్ ! తండ్రీ ! మీరు చెప్పుచూ వస్తున్న విధంగా అభ్యసిస్తూ ‘భ్రమర - కీటక న్యాయం’’ ప్రకారంగా, ‘ముక్తి’ సిద్ధించుకోవటము ఎట్టిదో, ఎట్లాగో - మరికొంత వివరించ ప్రార్థన. ‘‘స్వస్వరూపానుసంధానరూప ముక్తి’’ గురించిన ఉపాయం మాకు బోధించండి.

శ్రీ పితామహులవారు (బ్రహ్మ భగవాన్) : స్వస్వరూపానుసంధానముచే ముక్తి ఎట్లా లభిస్తుందో విను!

అట్టి జ్ఞాన దేహికి (ఆత్మ జ్ఞానికి) -
- శాంతము, దాంతములే (Peace and control over Seeing, Hearing, etc) రెండు కళ్లు.
- మనస్సే అతనికి ముఖము, బుద్ధియే (ప్రజ్ఞయే) కళ.
- 5 తత్త్వములు (5-కర్మేంద్రియములు, 5- జ్ఞానేంద్రియములు, 5-ప్రాణములు, 5-ఉపప్రాణములు, 5-పంచభూతములు) - ఆతనికి శరీరాంగములు
- పంచమహాభూతములు, కర్మ-భక్తి - జ్ఞాన - వైరాగ్యములు అతనికి తన యొక్క శాఖావిస్తరణములు (Branch extensions).
- జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు అతనికి నివాస స్థానములు. స్వయం కల్పిత లీలా - వినోద ఆట స్థల విశేషాలు.

14 ఇంద్రియములు (బాహ్య జ్ఞాన - కర్మేంద్రియములు, అంతరంగ చతుష్టయము) ఇంటిపై మట్టి స్థంభములవలె జడరూపమై మోక్షాశయము కలవానికి ఉపకరణములు అగుచున్నాయి. అవన్నీ ఉపకరణములు (As utility instruments) గా ఎరిగి, బురదలో ఇరుక్కొన పడవను కర్ణధారుడు (పడవ నడుపువాడు) బయటకులాగు విధంగా, మదపుటేనుగును మావటివాడు వశం చేసుకొను విధంగా 14 ఇంద్రియములను స్వవశం చేసుకోవాలి.
- ఇంద్రియ విషయములకు, ఇంద్రియములకు ‘వేరు’ అయినట్టి ‘ఆత్మవస్తువు’ను ఎరిగి, మమేకము కావాలి.

ఆత్మకు వేరైనదంతా నశ్వరము (నశించిపోవు స్వభావముగలది)గా ఎరిగి, ఇంద్రియ విషయముల పట్ల జీవుడు (పురుషుడు) అనురక్తిని త్యజిస్తూ విరక్తిని పెంపొందించుకోవాలి.
‘‘బ్రహ్మహమ్ (నేనే బ్రహ్మమును)’’ - అని నిర్ణయించుకొని, ఆస్వాదించుచుండును గాక!
- ఈ సమస్తము బ్రహ్మమే.
- నేను బ్రహ్మమే అయి ఉన్నాను. కాబట్టి,
- ఈ సమస్తము నా యొక్క బ్రహ్మస్వరూపమే.
అని ఎరుగుచూ వేరుగా ఏదీ లేకుండియుండును గాక!

న కించిత్ వేదితవ్యం - స్వవ్యతిరేకేణ - జీవన్ముక్తో వసేత్ - కృతకృత్యో భవతి ।
స్వస్వరూపమునకు వేరుగా ఏదీ లేదు - అను ఎరుకచే ఈ జీవుడు జీవన్ముక్తుడు అగుచున్నాడు.

న నాహం బ్రహ్మ వ్యవహరేత్ ‘‘నేను బ్రహ్మమును కాదు. అజ్ఞానిని, బలహీనుడను అగు జీవుడను మాత్రమే’’ - అని ఎన్నడూ ఎవ్వరూ అనుకోవలసిన పనిలేదు.

జాగ్రత్ స్వప్న సుషుప్తులు నేనే కల్పించుకొంటూ, వాటికి ఆవలగా తురీయుడవై ఉన్నాను. అట్టి కల్పించుకొను తురీయ పురుషకారమునకు కూడా ఆవల తురీయాతీతుడనై కేవలమగు ఆత్మ చైతన్య పురుషుడనై, తదితర సమస్తమునకు ఆది స్వరూపుడనై వెలుగొందుచున్నాను - అను నిశ్చయమును పదిలపర్చుకుంటూ, పరిపుష్టము చేసుకోవాలి. ఎందుకు ? అదియే సత్యము కాబట్టి!

తురీయపురుషుని గుర్తు

ఈ జీవుడు పగలు జాగ్రత్‌లోను, రాత్రి స్వప్నములోను, గాఢనిద్రలో సుషుప్తిలోను, తిరిగి పగలు జాగ్రత్‌లోను (in a cycle) జీవితమును గడపివేస్తూ ఉన్నాడు.

ఈ మూడు అవస్థలు తనవైయున్న 4వ అవస్థ ‘తురీయము’.

అట్టి జీవునికి చెందిన తురీయ పురుషకారమే జాగ్రత్, స్వప్న సుషుప్తులు. తురీయుడుగా జాగ్రత్ స్వప్న సుషుప్తుల సమస్వరూపుడై ఉన్నాడు. అట్టి తన యొక్క 4వదగు తురీయ స్వరూపమును గమనించటమే లేదు.

అట్టి ‘4’వ అవస్థలోని ప్రతి దానిలోను మిగిలిన ‘3’ అవస్థలు ఏర్పడియే ఉంటాయి.

ఈ భౌతిక శరీరములో ఒక్కొక్క అవయవము ఒక్కొక్క కార్యమునకు సాధనగా అవుతోంది.

కళ్లలో చూచుశక్తి, చెవులలో శబ్దగ్రహణ రూపమగు వినికిడి శక్తి. నాలుకలో రుచు ఆస్వాదనశక్తి, ముక్కులో వాసన చూడగల శక్తి, నోటిలో వచన (మాట్లాడు) వ్యాపార శక్తి. కాళ్లలో నడుచుశక్తి. పాయువు విసర్జన శక్తి, ఉపస్థ - ఆనందించుశక్తి, చర్మము స్పర్శ శక్తి.

ఇవన్నీ ఈ భౌతిక దేహములో సమావేశమై ఉన్నాయి.

పై వాటిని ఉపయోగించి -
   - ‘బుద్ధి’తో తెలుసుకుంటూ ఉన్నాడు.
   - చిత్తముతో చింతించుచూ ఉన్నాడు.
   - అహంకారముతో ‘నేను’ రూపంగా అహంకరిస్తూ ఉన్నాడు.

ఈ జీవుడు పైన చెప్పుకున్న ఇంద్రియములకు వేరుగా ఉన్నాడు. అనేక ఇంద్రియములకు, ఇంద్రియ శక్తులకు ఆలవాలమైన ఈ శరీరముపై అభిమానము కలిగి ఉండటం చేత (శరీరాభిమానం చేత) ‘‘నేను ఒక జీవుడను’’ అను జీవత్వ భావము పొందుచున్నాడు.

ఒక ఇంటికి యజమాని ఆ ఇంట్లో కూర్చుని ‘‘ఈ ఇల్లు నాది’’ అను అభిమానము కలిగి ఉంటున్నట్లే, శరీరధారి అగు జీవుడు ‘‘ఈ శరీరము నాది’’ అను అభిమానమును దేహమున్నంత వరకు కొనసాగిస్తున్నాడు.

హృదయ సంచారము

ఈ జీవునికి బాహ్యమున ముఖము కనబడుచున్నట్లే ఈ శరీరమున అంతర్గతంగా ముఖము కలిగి ఉంటున్నాడు. అది ‘‘హృదయము’’ అని పిలవబడుతోంది. (అట్టి ‘హృదయము’ ‘తామర పుష్పము’తో పోలుస్తూ ‘‘హృదయ కమలము’’ అంటూ ఉంటారు). ఈ జీవుడు తన హృదయములో యథేచ్ఛగా సంచారము చేయుచున్నాడు.

దిక్ దళములు - జీవుని వృత్తులు

దిక్ దళములు - జీవుని వృత్తులు

ఈ జీవుడు హృదయ కమల దళములలో సంచరిస్తూ …
  తూర్పు దిక్కు దళములో - పుణ్యవృత్తి
 ఆగ్నేయ దళములో - నిద్ర, ఆలస్య వృత్తులు
 దక్షిణ దళములో - క్రౌర్య బుద్ధి
 నైరుతి దళములో - పాపబుద్ది
 పశ్చిమ దళములో - క్రీడా రతి బుద్ధి (Playfulness)
 వాయువ్య దళములో - గమన (Move from place to place) బుద్ధి
 ఉత్తర దళములో - శాంతము
 ఈశాన్య దళములో - జ్ఞానము
 హృదయమధ్యగా కర్ణిక యందు - వైరాగ్యము
 కౌసరము (పుష్పరాగము) నందు - బ్రహ్మచింతన

ఆయా స్థానములలో జీవుడు సంచరిస్తూ పై విశేషములన్నీ కల్పించుకొని అనుభవిస్తూ ఉన్నాడు.

అట్టి జీవుడు పై హృదయ కమలదళ సంచారముల నుండి విరామము పొంది, బయటకు వచ్చి, ‘స్వస్వరూపము’తో మమేకమగు మార్గమును అన్వేషించాలి.

ఏకోదేవః సాక్షీ

జీవత్ అవస్థలు - ఐదు. 1) జాగ్రత్ 2) స్వప్నం 3) సుషుప్తి 4) తురీయము 5) చ(తురీయ) విరహితమగు తురీయాతీతము.

పై అవస్థల పురుషకారములు : 1) విశ్వుడు 2) తైజసుడు 3) ప్రాజ్ఞుడు 4) తురీయుడు 5) ఏక స్వరూపుడు/తటస్థుడు. అవస్థలు, పురుషకారములు ఐదుగా చెప్పుకుంటున్నప్పటికీ, అవన్నీ తనవైన జీవుడు ఏకస్వరూపుడే గాని, అనేక రూపములుగా అవడు. ఐదుగా అవటమే లేదు. అట్టి జీవుని సహజమగు తురీయాతీతుడు 4 అవస్థలలో మిగిలిన మూడు కలిగి మొత్తం (4x4=16) షోడశ కళాస్వరూపుడై ఉంటున్నాడు.

ఏకోదేవః సాక్షీ

అయితే పై 4x4=16 అవస్థలు కూడా తురీయాతీతుడగు ‘నిర్గుణ-స్వస్వరూప-పరబ్రహ్మము’నకు లేవు. పై 16టికి తురీయాతీతుడు నాటక దీపమువలె సాక్షిత్వము వహిస్తూ, సర్వదా ఏకస్వరూపుడై ఉన్నాడు. అట్టి తురీయాతీతము ఈ జీవుని సహజ - నిజ స్వరూపమే అయి ఉన్నది.

తురీయాతీతుని తటస్థ / మధ్యవర్తి రూపము

సమస్తమునకు ‘‘పరము’’ (Beyond) అయినట్టి, ఈ జీవుని యొక్క సమస్తమునకు అతీతమైన తటస్థ స్వరూపమే ‘‘మధ్యవర్తి’’ అనబడుతోంది.

తటస్థుడగు తురీయాతీతుడే సమస్తమునకు ద్రష్ట. అయితే ఆయనకు (ఆ స్వస్వరూపమునకు) ‘‘ద్రష్టత్వము’’ అనే ధర్మము లేదు కాబట్టి ‘‘అద్రష్ట’’ కూడా! కర్తృత్వము, భోక్తృత్వము, అహంకారములతో కూడిన జీవాత్మ వైనమంతా ఆయన యొక్క స్వయం కల్పిత చమత్కారమే.

అందుచేత తురీయాతీత పురుషుడే జీవాత్మగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ, జీవునికి ఆవలివాడు (సాక్షి) కాబట్టి జీవాత్మగా అవటం లేదు.

ఆయన జీవాత్మగా కనబడుచూ కూడా తనకు అన్యమైన దేనిచేతను స్పర్శించబడడు. ఆయన జీవాభిమానము, క్షేత్రాభిమానము, శరీరాభిమానము పొందువాడు కాడు. కనుక జీవాత్మ ధర్మములు లేనివాడు. అయితే ఆయన సాక్షిగా ఏర్పడి ఉండటం చేతనే సమస్త అభిమానములు ఉనికిని పొందుచున్నాయి.

జీవునికి - ఈశ్వరునికి ఘటాకాశము (కుండలోని ఆకాశము) - మహాకాశము (Al present space) అనే బేధములు ఉన్నాయి. తురీయాతీత పురుషుడే జీవ - ఈశ్వరులు దృష్టిచే (ఆపాదనచే) ఆశ్రయించి ఉన్నప్పటికీ, తురీయాతీతునికి జీవ ఈశ్వర భేదము లేదు. ఉభయము తానై ఉభయమునకు వేరై తురీయాతీతుడు ప్రకాశించుచున్నాడు.

ఈ జీవుడు అట్టి తురీయాతీత స్వస్వరూపము ఆస్వాదించేది ఎట్లా ?

జీవుడు వాస్తవానికి తురీయాతీత స్వరూపుడే కాబట్టి - ‘‘సహజము’’ నుండి (సః) సందర్భములోనికి, సందర్భములో నుండి సహజములోనికి - అనుక్షణం ‘‘సో2హం’’అను అజపాగాయత్రి’’ నిర్వర్తిస్తూనే ఉన్నాడు.

ఉచ్ఛ్వాస : ‘‘సః’’ = సహజరూపము
నిశ్వాస : ‘‘అహమ్’’ = సందర్భరూపము

= అజపా గాయత్రి

ఈ విధంగా ‘‘సో2హం’’ (సహజ - సందర్భ ఏకైక తత్త్వము)ను ఎరిగి, శరీరాభిమానం త్యజించాలి. ఎవరు శరీరాభిమానము త్యజిస్తూ వస్తారో ‘అట్టి వాడు బ్రహ్మమే’ అని చెప్పబడుతోంది.

శరీరాభిమాన త్యాగము ఏ విధంగా ?

సమస్త జగద్విశేషములు పట్ల సంగము వదలి, క్రోధమును జయించి, అల్పమైన ఆహారము (ఇంద్రియ సద్వినియోగము) అభ్యసిస్తూ ఇంద్రియములను జయించి తన వశము చేసుకొన్నవాడై బుద్ధితో నవద్వారములను (రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రములు, నోరు, గుదము, రహస్యావయవము) మూసి ఉంచి, (ధ్యాసలను బాహ్యనుభవముల నుండి, వెనుకకు మరల్చి) మనస్సును సర్వత్రా సమస్వరూపమైయున్న ఆత్మయందు నిలపాలి. సమస్తము ఆత్మ ప్రదర్శనముగా ఉపాసిస్తూ, సర్వమునందు స్వస్వరూపాత్మను, స్వస్వరూపాత్మయందే సమస్తమును దర్శిస్తూ, ఆత్మ గురించిన ధ్యాసను నిలపాలి. అట్టి ధ్యాసయే ధ్యానము.

యతీశ్వర సిద్ధి

ధ్యానము : జన సంచారములేని శూన్య ప్రదేశములలోను, ప్రశాంత స్థలములందు, గుహలలోను, అడవులందు యోగి ఎల్లప్పుడు సమదృష్టి అభ్యసించువాడై సమ్యక్ ధ్యానము (ఆత్మయందే సమస్తము దర్శిస్తూ, ఆత్మయే సమస్తమైయున్నట్లు బుద్ధి నిశ్చలత పొందే ప్రయత్నము)నకు ఉపక్రమించాలి. బ్రహ్మాత్మైక్య భావనను మనస్సుతో అనుక్షణికంగా మననయుక్తము చేయాలి.

ఆతిథ్యము ఇచ్చే చోటులకు, శ్రాద్ధము - యజ్ఞము - దేవయాత్రోత్సవాలు జరిగే ప్రదేశాలకు, అనేక మంది జనము గుమికూడిన చోట్లకూ - సిద్ధిని కోరుకొనే యోగి (యోగవేత్త అయినవాడు) పోయి, పాల్గొనరాదు. అటువంటి చోట్ల యోగాభ్యాసము చేయు ప్రయత్నము చేయరాదు.

యోగాభ్యాసి అయినవాడు ఎవ్వరినీ దూషించరాదు. యోగాభ్యాసములను ఎగతాళి చేసే, పరాభవించే స్వభావముగల జనుల మధ్యగా ఉండరాదు. ఇతరుల దోష-దురహంకారములు తన యొక్క తితిక్ష (ఓర్పు, సహనములకు) సహకారిక ఉపకరణ సందర్భములుగా భావించాలి.

త్రిదండీ మహాయతి

శాస్త్ర విహిత ‘‘తత్త్వసాధన’’ కొరకై త్రిదండము ధరించుగాక. అట్టి త్రి-దండము యొక్క ఉత్తమార్థమును గ్రహించి ఉండాలి. 1) వాక్ దండము 2) కర్మ దండము 3) మనో దండము (వాక్-కర్మ-మనస్సులు) ఈ మూడు నియతి పూర్వకంగా (systematically engaged) ఉపయోగిస్తారో, అట్టివాడు ‘‘త్రిదండీమహాయతి’’ అని పిలువబడుతాడు.

మధుకర (భిక్షాటన) సమయాసమయములు

✤   భిక్షకు ఒక ఇంటికి వెళ్లేటప్పుడు, అప్పటికే అగ్ని చల్లారి, పొగ తొలగిన తరువాత మాత్రమే (వంట పూర్తి అయిన సూచనను గమనించి) అట్టి సమయమున భిక్షకై వెళ్ళాలి.
✤   సంపద కలిగి, దానము చేయు స్వభావము, పుణ్యభావన కలవారి ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష అడుగుదురు గాక.
✤   ఎవడు భిక్ష ధర్మము, నియమితములు ఆచరించకుండా, ఇతరులను బాధించి, పెత్తనము చెలాయిస్తూ భిక్ష అడుగుతాడే, వ్యసనములు కలిగిఉంటాడో (లేదా) అనురాగము కలిగి ఉన్నవాడై వైరాగ్యము ఆశ్రయించడో, అట్టివాడు నీచుడే అవుతాడుగానీ, ‘యతి’ కాలేడు.

ఒకరి ఇంట్లో భిక్ష అధికంగానూ, విశేష పదార్థములతోను లభిస్తోంది కాబట్టి, ఆకారణంగా, అదే ఇంటి వద్ద మరల మరల భిక్ష కోరరాదు.

ఏ యతి (సన్యాసి) అయితే…,

శరీర - ఇంద్రియములకు ఆవలి, సర్వసాక్షి, పారమార్థిక విజ్ఞాన స్వరూపము, బ్రహ్మానందఘనము, స్వయం ప్రభ (తేజో) ప్రభాసితము, కేవల అసిధారా సుఖస్వరూపము అగు స్వస్వరూప - సర్వాంతర్యామియగు అఖండాత్మను గ్రహిస్తాడో, అట్టివాడు ‘‘అతివర్ణాశ్రమి’’ (చతుర్విధ ఆశ్రమముల పరిధులను, ఆశ్రమ నియమ వ్యవహారములను అధిగమించినవాడు) అగుచున్నాడు.

ఆశ్రమ ధర్మములన్నీ మాయా కల్పితములే

ఓ నారదా ! ఒక ముఖ్య విషయం శాస్త్రములు, ఆశ్రమ ధర్మములు చెప్పుచున్నాయి. (బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి) విధులు, విధానములు, నిర్వర్తించవలసినవి, నిర్వర్తించకూడనివి చెప్పుచున్నాయి. నేను కూడా యతి, పరివ్రాజక, తురీయాతీత, పరమహంస ధర్మాలన్నీ చెప్పుతూ వస్తున్నాను కదా ! అయితే …,

‘‘సర్వాశ్రమ ఆదయో దేహే మాయయా పరికల్పితాః’’ సమస్త ఆశ్రమ ధర్మములు మాయా కల్పితమే. అటువంటప్పుడు నియమనిష్ఠలు, విధి-నిషేధములు శాస్త్రములు ఎందుకు చెప్పుచున్నాయి? ఒకనికి ముల్లు గుచ్చుకొన్నప్పుడు కాలిలో విరిగిన ముల్లును మరొక ముల్లుతో తీసి, అటు తరువాత రెండు ముల్లులను ఆవల పారవేస్తాము కదా. అట్లాగే ‘బంధము’ అనేది స్వయంకృత మాయాకల్పితమే.

ఆపాదితమగు ‘‘స్వస్వరూపము బంధము పొందుచున్నది’’ అను భ్రమ (లేక) సంసార బంధము తొలగటానికై, శాస్త్రములు మాయా కల్పితములగు విధి-నిషేధములు చెప్పుచున్నాయి.

స్వస్వరూపము యొక్క జ్ఞానముచే 1) ఆత్మగా అనుకోవటము 2) అనిపించటము 3) అదే తానవటము కొరకై నియమములు 4) వర్ణాశ్రమముల వారికి చెప్పబడుచున్నాయి.
ఏ వర్ణాశ్రమవాసి అయినా సహజముగా స్వయముగా ఆత్మ స్వరూపుడే. పూర్ణమగు ఆత్మ భావనాసిద్ధికి అర్హుడు కానివాడెవడు ?

సర్వదా సిద్ధించియే ఉన్నదాని కొరకై సాధన ఎందుకు ? ‘‘సర్వదా సిద్ధించియే ఉన్నది’’ అను నిశ్చయానుభవము కొరకు మాత్రమే సాధన. సిద్ధి పొందిన తరువాత సాధనతో పనేముంటుంది ? చేరవలసిన చోటికి చేరిన తరువాత ఇంకా నడకతో పని ఉంటుందా ? ఉండదు కదా.

‘‘బోధ రూపుడగు అత్మనే నేను’’ అను స్వానుభవము సిద్ధించుకొన్న వానికి ఇక మమకారము, అహంకారము మచ్చుకకైనా ఉండవు. అతడు వేద వేదాంత వేద్యుడు.
   వేదము = తెలియబడునది.
   వేదాంతుడు/ వేదాంతవేద్యుడు = తెలియబడేదానికి ఆవల గల తెలుసుకొనుచున్న వానిని తెలుసుకొన్నవాడు.
అట్టి వేదాంతవేద్యుడు ‘‘అతివర్ణాశ్రమి’’ (వర్ణాశ్రమ పరిధులను దాటినవాడు) అగుచున్నాడు.

ఎవడు స్వాత్మదర్శనం చేత ‘‘వర్ణాశ్రమ భేదములు ఆత్మ దృష్ట్యా మొదలే లేవు’’ అని అసంశయముగా గ్రహిస్తాడో, అట్టివాడు అతీతాశ్రమి అయి సర్వే సర్వాత్రా ఆత్మనే దర్శిస్తాడు. ఆత్మయే తానై సర్వాత్మకుడై వెలుగొందుతాడు.ఆ విధంగా సర్వవేదార్థముల సారము స్వయముగా పునికిపుచ్చుకోగలడు.

కాబట్టి నారదా ! ఆత్మను తెలిసినట్టి ఆత్మవేది ‘‘నా ఆశ్రమము, తదితర ఆశ్రమములు - ఇవన్నీ కూడా ఆత్మపై ఆరోపితమైనవే. అనగా అహ్రాంతి మాత్రమే’’ - అని సుస్పష్టముగా ఎరిగి, ‘‘అతివర్ణాశ్రమి’’ అగుచున్నాడు.

ఓ పుత్రా ! నారదా ! బ్రహ్మవిజ్ఞాని అయినవానిపట్ల ఇక విధి-నిషేధములు గాని, వర్ణ-వర్ణాశ్రమ కల్పనలు గాని, మరింకే జీవాత్మ - పరమాత్మ భేద విశేషాలుగాని ఏ మాత్రము అగుపించవు. కనిపించవు.

ముక్తి మార్గము

★ బ్రహ్మదేవుని పదము నుండి మరే పదము పట్ల, సర్వజీవుల వ్యవహారముల పట్ల అనురక్తి లేనివాడై, విరక్తుడై ఉండాలి.
★ పుత్ర - మిత్ర - కళత్ర - కుల - మత ఇత్యాదివన్నీ అల్పములుగా భావించి, పెల్లగించివేసి, వేదాంత జ్ఞానము పొందుచూ ముక్తిమార్గమునందు శ్రద్ధ కలిగినవాడై ఉండాలి.
★ ముక్తి కొరకై ఉపాయములు ఆశ్రయిస్తూ బ్రహ్మతత్త్వము ఎరిగిన గురువును ఆశ్రయించాలి.
అట్టి గురువును సేవించి, వారికి సంతోషము కలుగజేస్తూ, సమాహితుడై (ఏకాగ్ర బుద్ధి కలవాడై) వేదాంత వాక్యార్థములను దీర్ఘకాలము శ్రవణము, మననము, హృదయస్థము చేసుకొను గాక.

శ్లో।। నిర్మమో నిరహంకారః సర్వసంగ వివర్జితః
సదా శాంత్యాది యుక్తస్సన్ ఆత్మని ఆత్మానమ్ ఈక్షతే ।

ఆ విధంగా మహావాక్యముల ‘అర్థార్థి’’ అయి, అర్థములను విచారణ చేస్తూ హృదయస్థము చేసుకొనును గాక।
క్రమంగా మమకార - అహంకార రహితుడై, సమస్త సంగములను (All Attachments) త్యజించినవాడై, ఎల్లవేళల శాంతి, సహనము, అమానిత్వము మొదలైన ఉత్తమ గుణములు సిద్ధించుకొన్నవాడై, సర్వత్రా ఆత్మ దర్శనము ఆశ్రయించును గాక.
దృశ్యముతో ఏర్పడే భేద సంబంధరూపమగు సంసార దోషములను దృష్టియందు ఉంచుకొని ఎల్లప్పుడు విరక్తుడై ఉండును గాక.

విరక్తస్యతు సంసారాత్ సన్యాసః స్యాత్ న సంశయః ।
ఎవడు సమస్త సంసారము పట్ల విరక్తుడై ఉంటాడో, అతడు సన్యాసియే. ఇందులో సందేహము లేదు. అందుచేత ముముక్షువు (బంధము తొలగించుకోదలచినవాడు) సమస్తమునకు పరమైయున్న ‘‘సాక్షాత్ మోక్ష సాధన’’ అను ఏకైక మార్గము ఆశ్రయించువాడు ‘పరమహంస’’ అగుచున్నాడు. అందుకు మార్గము? ‘‘వేదాంతార్థ శ్రవణము’’ అనే మార్గముగా బ్రహ్మ విజ్ఞానము సిద్ధించుకోవాలి.

పరమహంస

యతి బ్రహ్మ జ్ఞాన లాభము పొంది ‘‘పరమహంస’’ (సో2హమ్ పరమమ్) స్థానము సిద్ధించుకొనును గాక. అందుకు ఉపాయములు చెప్పుకుందాము.

యతి : జీర్ణమైన (వస్త్రము నుండి చించిన) కౌపీనము (గోచి) ధరించి, తలవెంట్రుకలు తొలగించుకొంటున్నాడు. (ముండీ) నగ్నముగా (Without clothes, Nude) ఉంటున్నాడు.

ప్రాజ్ఞుడై, నిత్యానిత్య వివేకి అయి, వేదాంతపరమార్థము ఎరిగిన యోగి అయి, నిర్మమ - నిరహంకారుడై, శత్రు-మిత్రుల యందు సమబుద్ధి కలిగి, సమస్త సహజీవుల పట్ల మిత్రభావము పవృద్ధపరచుకొనును గాక.

ఎవ్వడైతే అనేకముగా కనిపించే ఈ దృశ్య జగత్తుపట్ల ఏకమగు ఆత్మజ్ఞానము సంపాదిస్తూ ‘‘ఏకజ్ఞాని’’ అవుతాడో, తన హృదయమునందు సమస్త భేదభావములను సశాంతింపజేసుకొని ప్రశాంతాత్ముడౌతాడో, అట్టి వాడు సంసారము నుండి తరించగలడు.

అట్టి ఏకదృష్టిని సంపాదించుకోలేనివాడు ‘‘సో2హమ్ పరమ్’’ రూపమగు పరమహంసత్వము సిద్ధించుకోలేడు. దృశ్యబంధముల నుండి తరించజాలడు.

అందుకు కొన్ని ఉపాయములు.

1) గురు-ఆశ్రయము (ఒక సంవత్సరము) :
అట్టి ‘‘ఏకదర్శి’’ అయి ఆత్మత్వము సిద్ధించుకోవటానికై తత్త్వజ్ఞాని అగు సద్గురువును ఆశ్రయించాలి. గురువును సేవలచే సంతోషింపజేస్తూ, గుర్వాశ్రమంలో ఒక సంవత్సర కాలము గడుపును గాక. గురువు తెలియజేయు విధంగా ఇంద్రియములను అప్రమత్తముగా నియమిస్తూ ‘నియమము’’ను నిర్వర్తించాలి. క్రమంగా ‘యమము’ (ఇంద్రియములను విషయములపై వ్రాలటము అనే వ్యసనము నుండి ఎల్లప్పుడు వెనుకకు మరలిస్తూ ఉండాలి). నియమేషు అప్రమత్తస్తు ।యమేషు సదా భవేత్।।

2) భూమిపై సంచారము - ఒక సంవత్సర కాలము :
గురు - ఆశ్రయముచే ఉత్తమమగు ఆత్మజ్ఞాన యోగమును అభ్యసించిన తరువాత, ధర్మాచరణము నుండి ఏ మాత్రము చ్యుతి పొందకుండా భూమిపై ఆయా ప్రదేశములను, మహనీయుల ఆశ్రమములను, తీర్థ స్థలములను సందర్శిస్తూ - ఒక సంవత్సరము గడుపును గాక.

3) గృహస్థ - వాన ప్రస్థాశ్రమములు :
ఆత్మజ్ఞానము ప్రవృద్ధ పరచుకొనుచు భూమిపై సంచారము ఒక సంవత్సర కాలము చేసి ఆ తరువాత గృహస్థ ఆశ్రమము, అటు తరువాత వాన ప్రస్థాశ్రమము స్వీకరించి ఆయా ధర్మములు నిర్వర్తించును గాక.

4) పరమాశ్రమము :
ఆ విధంగా విద్యార్థిత్వము, అధ్యయన సంపూర్తి, గురు ఆజ్ఞతో సంవత్సర దేశ సంచారము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము పూర్తి చేసుకొని (క్రమవిధిగా), (ఆ బ్రహ్మచారి- గృహస్థ - వానప్రస్థ ఆశ్రమములను ముగించుకొని) గురువుల, కుటుంబసభ్యుల అనుజ్ఞతో ‘పరమాశ్రమము’ స్వీకరించి అప్పుడిక లోక సంచారము చేయాలి. సమస్త సంగములు వదలి, క్రోధమును జయించి, మితాహారము స్వీకరించువాడై, ఇంద్రియములను జయించును గాక.

విడచి ఉండవలసినవి

శ్రీ బ్రహ్మదేవ భగవానుడు : ప్రియ నారదా ! గృహస్థునికిగాని, భిక్షకునికి (పరివ్రాజకునికి) గాని విపరీత కర్మలు ఉచితము కాదు సుమా !

శ్రీ నారద మహర్షి : తండ్రీ ! ఏవేవి ‘‘విపరీత కర్మలు’’ అనబడుచున్నాయి ?

శ్రీ బ్రహ్మభగవానుడు : ద్వి (2) విధములైన కర్మలు ‘‘విపరీత కర్మలు’’ అనబడుచున్నాయి.
1) గృహస్థుడు ఏ ప్రయత్నము చేయకుండా, ఏ ఉపయుక్త కర్మ ఆరంభించకుండా నిరారంభుడై ఉండువాడు - విపరీత కర్మిష్ఠుడు.
2) భిక్షకుడు అనేక సాంఘిక సంబంధమైన కార్యాలాపములు నిర్వర్తిస్తూ ఉండటము చేత ‘‘విపరీత కర్మిష్ఠుడు’’ అనిపించుకుంటాడు.
అట్టి వారు వైరాగ్యము సిద్ధించుకోలేరు.

ఆహా ! ఈ జీవుడు (స్త్రీ-పురుషులు) పరస్పర భౌతిక దేహములను చూచి సురాపానము త్రాగినవానివలె అగుచు మదమును (Sexual Thoughts) పొందుచున్నారే! ఇక సర్వత్రా ఆత్మ దృష్టి అలవడే అవకాశము ఎక్కడిది?

అందుచేత, చర్మ మాంస శరీర దృష్టిని ఆత్మానందము కోరువాడు దూరంగా వదలాలి. ఆత్మ జ్ఞానము కోరుకొనువాడు స్త్రీ, పురుష సంబంధముల గురించి సంభాషించనే కూడదు. అట్లాగే, స్త్రీలతో (అట్లాగే స్త్రీలు పురుషులతో) నృత్యము చేయటము, శృంగార గానములు, ఆనందముగా పరిహాసాలు, సరసాలు ఆడటము, ఇతరుల గురించి చెడు విషయములు సంభాషించటము మొదలైనవన్నీ కూడా ఆత్మ జ్ఞానమునకు తీవ్రమగు నిరోధకములు అవగలవు. అందుచేత ముముక్షువు అట్టివాటి పట్ల జాగరూకుడై ఉండాలి.

ఆత్మతో అంతఃసంగము సిద్ధించుకొన్నవాని విధి - నిషేధములు

శ్రీ నారదమహర్షి : జగత్ సృష్టి చైతన్యరూపా ! జగత్ పితామహా ! బ్రహ్మదేవ భగవాన్ ! శాస్త్రములు ముముక్షువుల ఉద్ధారణ కొరకై బ్రహ్మచర్య -గృహస్థ - వానప్రస్థ - సన్యాస ధర్మములు చెప్పుకుంటూ వస్తున్నాయి కదా! మరి ఆత్మతో అనునిత్యము, మమేకత్వము సిద్ధించుకొన్న మహనీయుని విధి - నిషేధములు (Dos and Don’ts) ఏ తీరునవై ఉంటాయి ? ఎటువంటి స్నాన పూజా, అగ్నికార్య, తీర్థ యాత్రా, ధర్మాధర్మ నియమములు కలిగి ఉంటాడు ?

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఆత్మ గురించి ఎరిగి, స్వస్వరూపాత్మను దర్శించినవాడై, సర్వత్రా ఆత్మానందము ఆస్వాదించుకొన్న ఆత్మ సిద్ధునికి ఎటువంటి స్నాన, పూజ, జప, హోమ సాధనలు ఉండవు. అగ్ని కార్యములు, అకార్యములు, పితృకార్య నియమములు, తీర్థయాత్రలు, వ్రతములు, ధర్మ-అధర్మ సూచనలు శాస్త్రములు చెప్పటం లేదు. సర్వసాధనల పరాకాష్ఠ అగు ‘‘సర్వత్రా ప్రేమాస్పద ఆత్మదర్శనము’’ స్వస్వభావ రూపంగా సిద్ధించుకొన్నవానికి సమస్త సాధనముల ప్రయోజనము సిద్ధించినట్లే. ఒకడు ‘వెళ్లాలి’ అనుకొన్న చోటికి వెళ్లిన తరువాత ఇక ప్రయాణ సాధనలతోను, ప్రయాణ సమయంలో జాగరూకతలు గురించి అగత్యము (Inevitability) ఏమి ఉంటుంది ? అట్టి స్థితిలో త్రి-ఆశ్రమముల (లేక) సన్యాసాశ్రమ సంబంధమైన యతి, పరివ్రాజ ధర్మములు ఏవీ విధి కాదు. నిషేధము కాదు.

అట్టి వానికి పరమాత్మ యందు రమించటమే ఏకైక నియమము. ‘‘నేను సర్వదా అఖండమగు ఆత్మతో ఏకమై ఉన్నాను’’ అను నిశ్చల భావనయే సాధన. అయితే పరమార్థబుద్ధిగల యతి - లోకాచారములన్నీ విడచినవాడై ఉండినప్పటికీ లోకమునకు క్షేమము కలిగించు కర్మలును స్వాభావికంగానే వీడడు. తనను ఆశ్రయించిన మముక్షువులకు స్థైర్యము కలిగించు విధులను స్వాభావికంగానే విడువడు. ఎందుకంటే అట్టివాడు సమస్త జీవుల పట్ల స్వాభావికంగా అత్యంత ప్రేమ, క్షమ, ఆప్యాయత కలిగి ఉంటాడు కాబట్టి!

అందుచేత :
పరమార్థబుద్ధి గల యతి క్రిమి కీటక పతంగములకు గాని, వనస్పతులకు (వృక్షములకు) గాని, సహజీవులకు గాని హింస కలిగించడు.

అట్టివాడు నిత్యము అంతర్ముఖుడై ‘‘సమస్తమునందు నిర్మలమగు ఆత్మయే ఆధారమైయున్నది’’ అని సమన్వయించుకుంటూ అందరిలో ఆత్మనే దర్శిస్తూ, ఆరాధించు భావన విడువక ఉంటాడు. నిర్మలము, ప్రశాంతము, స్వస్వరూప పూర్ణములతో కూడిన బుద్ధిని కలిగి ఉంటాడు. ‘‘మమాత్మా సర్వభూతాత్మ’’ - భావనతో బ్రహ్మానందము ఆస్వాదిస్తూ ఉంటాడు.

ఓ నారదా ! తదితర మునులారా ! సమస్త జనులారా ! మీరంతా కూడా బాహ్యమున ‘సంగము’ కలిగి ఉండి కూడా ‘అంతస్సంగము’ (Relatedness in the inner recess of heart) మొదలంట్లా విడచివేసినవారై ఉండండి. ఇదియే ముఖ్యమైన యతి - సన్యాసి - పరివ్రాజ ధర్మము.

అంతఃసంగము విడచియే లోకములోను, సందర్భములలోను విహరించండి. ఆత్మ గురించిన మననమును అనుక్షణము ఆశ్రయించినవారై ఒంటరిగా ఈ జగత్తులలో (దేహముల మధ్యగాను, జన్మ - కర్మల తోడను) విహరించండి.

అయినా కూడా,
నా రాజకే జనపదే చరతి ఏకచరో మునిః ।
ముని అయినవాడు రాజ్య-ప్రభుత్వ పరిపాలనలు లేని చోట విహిరించకపోవటమే ఉచితము. దేనినీ స్తుతించక, నమస్కరించక, స్వధాకారుడు కాక, ఆశీర్వాదములు పరిత్యజించినవాడై, స్వేచ్ఛగా (యాదృచ్ఛికంగా) కొండగుహలలోగాని, వనములలోగాని, మరింకెక్కడైనా గాని ఆత్మదృష్టితో విహరించును గాక.

ఇతి ఉపనిషత్ - షష్ఠమ ఉపదేశము


సప్తమ (7వ) ఉపదేశము - యతి ధర్మముల పునశ్చరణ

శ్రీ నారదమహర్షి : హే పితామహా భగవాన్ । ‘‘మహత్ పాఠ్యాంశములకు పునశ్చరణ దోషము ఉండదు’’ - అని ఆర్యవాక్యము కదా! అందుచేత యతి ధర్మముల గురించి, సమస్త జనులు పాటించవలసిన విధి-విధానముల గురించి మరల మరొక్కసారి సమీక్షించండి.

బ్రహ్మ భగవానుడు : నీవు కోరుచున్నట్లుగా మరల వివరిస్తున్నాను. విను.

అశాశ్వతమగు ఇంద్రియ - దృశ్య విషయములపట్ల ‘‘ఇవి నిత్యము, సత్యము, దోష / దుఃఖ రహితము అగు ఆనందమును ఇవ్వలేవు’’ అని సుస్పష్టముగా గుర్తించి ‘‘విరక్త సన్యాసి’’ అగుచున్నాడు. సమస్తము మానసికంగా సన్యసించినవాడై ఇక భౌతికంగా ఒక చోట ఉండక, పరివ్రాజకుడై ఆత్మయోగమును ‘‘అభ్యాసము’’ చేయును గాక.

మధుకర వృత్తితో ఆహారము స్వీకరిస్తూ క్రమంగా సంసార ధ్యాసలన్నీ కృశింపజేయును గాక.

బలము, కండ, క్రొవ్వు, వృద్ధి చేసుకోవాలని ఆశయముతో నెయ్యి మొదలైనవి అభిలషించరాదు. నెయిని నెత్తురుకూటివలెను, ఒకే ఇంట్లో అనేక సార్లు భుజించుటమును మాంసాహారమువలెను, సుగంధ లేపనములను అశుద్ధమువలెను, క్షారములను (అధికంగా ఉప్పు, కారములను) నీచ వస్తు సేవనమువలెను, ఖరీదైన వస్త్రములను ఉమ్మిపాత్రవలెను, అభ్యంగన స్నానమును దుష్టస్త్రీ సంగమువలెను, సంసారదృష్టి గల స్నేహితులతో కాలము గడపటమును మూత్రముతో సమానముగాను, ప్రాపంచక విషయములను ఇతరుల దుర్గణములను మాట్లాడుకోవటమును గోమాంసముతో సమానముగాను, జ్ఞాతులతో (చుట్టములతో) కలసి ఉండటము మురికివాడలో నివాసమువలెను, స్త్రీలతో స్నేహము త్రాచుపామును సమీపించటమువలెను, బంగారమును కాలకూట విషముతో సమానముగాను, అనేక మనస్తత్వములతో కూడిన జనుల సమావేశమును శ్మశాన ప్రదేశమువలెను, రాజధానిలో జనుల వ్యవహారములు (లాభనష్ట వ్యవహారములు కుంభీపాక నరకముతో సమానముగాను, ఒక ఇంటిలో అనేక సార్లు భుజించటమును శవపిండమును స్వీకరించటమువలెను - విసర్జించి ఉండాలి.

దేహాంతర దర్శనము

‘‘ఆత్మగా నాకు ఈ జన్మయే లేదు. ఇక పునర్జన్మ లేదని వేరే చెప్పాలా ?’’ - అని భావిస్తూ పునర్జన్మ రాహిత్యమును బుద్ధియందు వికసితము చేసుకొనును గాక.

ప్రపంచ వృత్తులన్నీ పరిత్యజించి, ‘స్వదేశము’ అనే పరిమిత భావమును వదలివేసి, రక్తబంధువుల ప్రదేశములను వీడి, పదార్థములతో సంబంధమును విడచివేసి, స్వస్వరూపానందమును సర్వదా సిద్ధించియే ఉన్నదానిగా గమనిస్తూ, హాయిగా, ప్రశాంతముగా, ఉద్వేగరహితంగా, ఆనందముగా ఈ దృశ్యమునందు సంచరిస్తూ పాల్గొనును గాక.

‘‘ఇది నా శరీరము, నేను దీనికి చెందినవాడను’’ అను శరీరాభిమానమును నెమ్మదిగా జయిస్తూ, దీనిని ‘‘శవము వలె హేయమైనది’’ అని భావించును గాక.

పుత్రులు, ఆప్తులు, బంధువు జనులు మొదలైనవారితో ఏర్పడే సంబంధమంతా కారాగము (Prison) అని తలచి బంధుస్థలమును విడిచి, సుదూరముగా సంచారము చేస్తూ, సర్వాత్మకమగు స్వస్వరూపాత్మను ఉపాసిస్తూ అనుష్ఠించును గాక.

అప్రయత్నముగా లభించిన ఆహారమును సంతోషముగా, అందరినీ ఆశీర్వదిస్తూ స్వీకరించాలి. తృప్తిని ప్రకటించాలి. ఎల్లప్పుడు ‘‘బ్రహ్మప్రణవ ధ్యాన’’ అనుసంధానపరుడై ఉండాలి.

⌘   సమస్త లోక సంబంధమైన కర్మలను విడచివేయును గాక.
⌘   కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మొదలైనవి దగ్ధము చేసివేయాలి.
⌘   సత్త్వ, రజో తమో గుణములను దాటివేసి ‘‘త్రిగుణాతీత దృష్టి’’ని ఆశ్రయించి త్రిగుణాతీతుడగును గాక.
⌘   షడూర్ములను (షట్(6) ప్రవాహ వేగములను), (ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర మరణములను) అంతరమున రహితము చేసుకొనును గాక. అవి ఆత్మ ధర్మములు కానట్లుగా గమనించాలి.
⌘   షట్ భావ వికారములను ((1) పుట్టాను 2) అభిప్రాయముల రూపుడను 3) జ్ఞాపకములు కలవాడను 4) కాలముచే ఒకటి నుండి మరొకటిగా అగువాడను 5) తెలియబడేవాటికి నిబద్ధుడను 6) మరణము స్వభావముగా కలవాడను) మొదలంట్ల తొలగించుకొనును గాక, ఆత్మదృష్టి కలవానికి ఈ షట్ (6) వికార స్వభావములు క్రమంగా వాటికవే తొలగిపోతూ ఉంటాయి.
⌘   సత్యవాక్కు పలుకువాడై, ద్రోహచింతన ఏ మాత్రము లేనివాడై (అద్రోహీ) అయి ఉండును గాక.
⌘   సర్వదా సంచారములు నిర్వర్తిస్తూ గ్రామములో ఒక్క రాత్రి మాత్రమే, పట్టణములో 5 రాత్రులు మాత్రమే, పుణ్యక్షేత్ర స్థలములలో 5 రాత్రులు మాత్రమే, అంతకుమించి ఉండనివాడై (అనికేతుడై) ఉండాలి.

బుద్ధిచాంచల్యమును జయించటానికై తపో-ధ్యాన-యోగాభ్యాసములను నిర్వర్తిస్తూ ‘స్థిరబుద్ధి’ని సంపాదించుకొనును గాక.

న-అనృతవాదీ । నిజము కాని దానిని నిజమని నమ్మటము, నమ్మించటము నిర్వర్తించకుండును గాక.

పర్వతకందరములు (గుహలు) అతనికి నివాసయోగ్యమే అగు గాక.

గ్రామములో అయితే ఒకరిద్దరి (1 లేదా 2) వరకు, పట్టణములలో అయితే ముగ్గురి వరకు, నగరములో అయితే నలుగురితోను మాత్రమే కలసి ఉండటము శ్రేయస్కరము. అంతకుమించి ఎక్కువమందితో కలసి ఉండరాదు. (లేదా) గ్రామములో ఒంటరిగానే సంచారములు చేయటము మరింత శ్రేయస్కరము.

భిక్షువు అయినవాడు 14 కరణములకు (పంచ కర్మేంద్రియములకు, పంచ జ్ఞానేంద్రియములకు, అంతరంగ చతుష్టయమగు మనో బుద్ధి చిత్త అహంకారములకు) తనను వశము చేసుకోవటానికి చోటు ఇవ్వకూడదు. అవన్నీ తనకే వశమై ఉండునట్లుగా యోగాభ్యాస బలసమన్వితుడై ఉండుగాక. అందుకు గాను, వైరాగ్య సంపన్నుడు అగుచుండును గాక.

‘‘మత్తో న కశ్చిత్ అన్యో అతిరిక్త’’ - ఇతి ఆత్మని ఆలోచ్య, సర్వతః స్వరూపమేవ పశ్యన్, - జీవన్‌ముక్తిం అవాప్య। ‘‘నాకు అన్యముగా వేరై ఏదీ ఎక్కడా లేదు’’ - అని స్వస్వరూపాత్మయొక్క ఔన్నత్యమును గమనించి, విచారించి, సమాలోచనతో సర్వత్రా స్వస్వరూపమే అని దర్శించువాడు ‘‘జీవన్ముక్తుడు’’ అగుచున్నాడు.

జీవన్ముక్తత్వముచే సర్వత్రా సర్వదా స్వస్వరూపమే అని అనుభవ పూర్వకంగా దర్శిస్తూ ఉండాలి. ఇక ఆపై దేహము ఉన్నంతవరకు ప్రారబ్ద - ప్రతిభాస (A reflection of present eventuality by virtue of past) గా దేహమున్నంతవరకు జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ దేహములను తెలుసుకొని ఉండును గాక.

దేహపతన పర్యంతం స్వరూపానుసంధానేన వసేత్ । దేహము పతనము పొందు వరకు ‘‘నేను దివ్యము, నిర్మలము, అఖండము అగు ఆత్మస్వరూపుడను’’ అను రూపమగు ‘‘స్వరూపానుసంధానము’’ (తన సహజ స్వరూపమును సర్వాత్మకుడగు పరమాత్మతో ఏకం) చేస్తూ ఉండును గాక! ఈ విధంగా దేహమున్నంతవరకు కాలఃకాలుడై కాలమును గడుపును గాక.

(కాలః కాలుడు = కాలము నా యొక్క కల్పనా చమత్కారములోనిదే । ఆత్మగా నేను కాలమునకు ఆవలివాడను’’ అని గ్రహించి ఉన్నవాడు).

శ్రీ నారద మహర్షి : మీరు మహత్తరమగు ‘‘సో2హమ్ తత్త్వమార్గము’’ చెప్పుచున్నందుకు కృతజ్ఞులం. మీకు వినమ్రులమై సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాము.

హే భగవన్ ! పితామహా ! జగదాధారా ! జగత్ శరణ్యా ! సద్గురు వరేణ్యా ! సృష్టి ప్రజ్ఞాభాషితా !

ఇప్పుడు మాకు 1) కుటీచక 2) బహూదక, 3) హంస 4) పరమహంస 5) తురీయాతీత 6) అవధూతల ఆచారములు, భోజనాది విశేషములు, భిక్షవృత్తులు, వస్త్రధారణలు, అర్చనలు, అనుసంధానములు మొదలైన విశేషాలు సమీక్షించి దయతో మరొక్కసారి చెప్పమని అర్థిస్తున్నాము.

బ్రహ్మ భగవానుడు : నారదా ! సరే ! మరొక్కసారి నీవు అడిగిన విధంగా సమీక్షించి చెప్పుచున్నాను. విను.

సన్యాస ధర్మముల సమీక్ష

సన్యాస ధర్మముల సమీక్ష

ఒకడు బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్న్యాసి అయినా కూడా, లేక మరెవరైనా కూడా అందరికి పరమాత్మతత్త్వము సిద్ధించుకోవటానికై రెండు ముఖ్యమైన సూత్రములు అనుసరించాలి. అవి అధ్యయనశీలురందరికీ ఉపాయములు.

1) సర్వేషాం ఆత్మానుసంధానమ్ విధిః ఇత్యేవం ముముక్షుః । అందరికీ కూడా ఆత్మతో ‘‘అనుసంధానమే’’ ముఖ్యమైన విధి (తప్పక నిర్వర్తించవలసినట్టిది). (ఆత్మ అనగా ? జాగ్రత్ పరిమితమైన ‘‘నేను’’ కాదు. ‘‘జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నా కల్పన’’ అయినట్టి, జన్మ - కర్మలకు కారణ భూతమగు ప్రతిఒక్కరిలోని ‘‘సమస్తము నావైన నేనైన నేను’’.

2) సర్వదా సంసారతారకం। తారకం అనుస్మరన్- జీవన్ముక్తో వసేత్ । అధికార విశేషేణ ప్రాప్తుః ఉపాయమ్ అనిష్యేత్ - ఇతి। ‘దృశ్యమునకు పరిమితమై ఉండటము’ అనే వ్యసనము (లేక) సంసారము నుండి విముక్తికై, తరింపజేయు మననము (తారక మంత్రమును) ఆశ్రయించాలి.

ప్రతి ఒక్కరు కూడా, వారి వారి అభిరుచి - అభ్యాసములను సమర్థతా సాధ్యములను అనుసరించి ఏదో ఒక ఉపాయంతో (లేక) ఆయా కొన్ని ఉపాయముల సహాయముతో ‘మోక్షము’ అను ‘ఆత్మ’ గురించిన అవగాహనా రూపమగు జీవన్ముక్తిని సిద్ధించుకోవాలి. (తారయత - ఇతి తారకమ్, తరింపజేయునది తారకము)

జీవన్ముక్తుడు : జీవిస్తూనే ఆత్మతత్త్వము దృష్ట్యా ఈ జగద్వ్యవహారములన్నీ ఆత్మగా గ్రహిస్తూ, తనకు ఎందుకు స్వతఃగా బంధనలు కావో గ్రహిస్తూ, ఆలోచనా రూపమగు మనస్సు తనకు ఉపకరణము అగునట్లు అభ్యాసము చేసి సమస్తము తానే అను సిద్ధిని పొందుచున్నవాడు.

ఇతి ఉపనిషత్ - సప్తమ ఉపదేశము


అష్టమ (8వ) ఉపదేశము

శ్రీ నారదుడు : హే పరమేష్ఠీ ! బ్రహ్మ భగవాన్ ! మాపై ప్రసన్న హృదయులై అమృత వాక్కులు కురిపిస్తున్నారు. ‘‘సంసారతారకము’’ను ప్రస్తావిస్తూ ఉన్నారు.

స్వామీ ! ఇప్పుడు మాకు ‘‘సంసారతారకము’’ (సంసారము నుండి తరింపజేయనది) అగు విచారణ - ఉపాసనల గురించి చెప్పండి. మాపై అనుగ్రహముతో ‘‘మేము ఏ ఏ విషయాలు ఉపాయాలుగా స్వీకరించి సంసార శృంఖలముల నుండి విడివడగలమో - మార్గము చూపండి.

శ్రీ బ్రహ్మ భగవానుడు : కేవలుడు, సర్వాత్మకుడు అగు పరమాత్మ (లేక) పరబ్రహ్మ పురుషుడు ‘ఓం’ అను శబ్ద - మహార్థ ‘‘సంజ్ఞ’’ చే వేదవాఙ్మయము సూచిస్తోంది. అట్టి ‘ఓం’ ప్రణవము అ + ‘ఉమ’ అను విధంగా రెండు విశేషాలుగా కలిపి ఉన్నట్టిది.

ద్రష్ట - దృశ్యము 
అనుభవి - అనుభవములు 
కేవలుడు - సందర్భములు 
పురుషుడు - ప్రకృతి

ఈ ప్రకారంగా విభాగించి విశ్లేషించబడుతోంది. ఈ విధంగా వ్యష్ఠి సమష్టి ప్రకారముగా విభాగిస్తూ ‘బ్రహ్మము’ గురించిన అనుస్మరణము కొరకై శాస్త్రములచే బోధించబడుతోంది.

శ్రీ నారద మహర్షి : అట్టి శాస్త్ర బోధ హృదయమునకు సంబంధించిన ‘‘వ్యష్ఠి’’ అనగా ఏమి ? ‘‘సమష్టి’’ అనగా ఏమి?

శ్రీ బ్రహ్మ భగవానుడు : వివరిస్తున్నాను. శ్రద్ధగా అందరూ వినండి. ప్రణవము సర్వదా ఏకము అక్షరము అయి ఉన్నది. అయితే అది మొట్ట మొదటగా శిష్యుల (విద్యార్థుల అవగాహనను ఉద్దేశ్యించి) - ‘‘మూడు’’ విధములుగా కూడా విభజించి చెప్పబడుతోంది.

వ్యష్టి - సమిష్టి

వ్యవహారిక ప్రణవము : సాధారణముగా మానవులచే జపించబడేది. అందుచేత ‘మానుష ప్రణవము’ అంటారు.
బాహ్య ప్రణవము : భేరీ, స్వరము, నినాదము మొదలైనవాటితో కూడిన శబ్ద రూపము.
ఆర్ష ప్రణవము : మాత్రా గణయుక్తంగా / విధిగా స్వరయుక్తంగా మహర్షులు చెప్పు ప్రణవము - ‘ఆర్షప్రణవము’

- - - - -

అంతః ప్రణవము ‘8’ విధములు

1) ‘అ’కారము - పదివేల అవయవములతో కలసి ఉన్నది.
2) ‘ఉ’ కారము - వెయ్యి అవయవములతో కూడి ఉన్నది.
3) ‘మ’కారము - నూరు అవయవములతో ఏర్పడినదై ఉన్నది.
4) అర్ధమాత్ర - అనంతమగు అవయవములు.

విరాట్ ప్రణవము : సగుణమైనది, ప్లుతము (Mix up)
సంహార ప్రణవము : నిర్గుణమైనది, ప్లుతకాలీనము
సృష్టి ప్రణవము : సుగుణ నిర్గుణ స్వరూపము, ప్లుత (Mixed) రూపము
(ప్లుతమునకు - 3 మాత్రలు. విరాట్ ప్రణవమునకు 14 మాత్రలు)

షోడశ మాత్రాత్మకత్వము

శ్రీ నారదమహర్షి : భగవాన్ ! ప్రజాపతీ ! ‘షోడశ మాత్రాత్మకము’ అని వేటిని అంటున్నారు.

బ్రహ్మ భగవానుడు : ఈ జీవుడు ‘షోడశకళాత్మకుడు’ అని చెప్పబడుచున్నాడు.

1) ‘అ’కారము 2) ‘ఉ’కారము 3) ‘మ’కారము 4) అర్ధమాత్ర 5) నాదము 6) బిందు 7) కలా 8) కలాతీకము (సాక్షి) 9) శాంతి 10) శాంత్యతీతా 11) ఉన్మనీ 12) మనోన్మనీ 13) పురీ 14) మధ్యమా 15) పశ్యంతీ 16) పరా

ఈ 16 కూడా ‘స్థూల - సూక్ష్మ - బీజ - తురీయములు’ అనే నాలుగు భేదములతో 16x4=64 మాత్రలుగా అగుచున్నాయి.

ఇవి మరల
1) ప్రకృతి (Experiences) సంబంధమైన - 64
2) పురుష (Experiencer) సంబంధమైన–64,
మొత్తము 128 బేధములతో నిండిన మాత్రా స్వరూపములు.

ఈ 128 భేదములు మాత్రాస్వరూపము పొందినవై 1) సగుణ 2) నిర్గుణ రూపములు దాల్చుచున్నాయి.

బ్రహ్మ ప్రణవము

బ్రహ్మ ప్రణవము సర్వదా ఏక రూపమే. అట్టి బ్రహ్మమే సకల జగత్తుకు భూత - వర్తమాన - భవిష్యత్‌లో మార్పు చెందు ‘జ’ (జనించు), ‘గత్’ - గతించు దానికి ఆధారము అయి ఉన్నది.

అట్టి సర్వాధారము అయిన బ్రహ్మము →

పరబ్రహ్మము ఇంకా కూడా ….,

⌘   సర్వ అక్షర (మార్పు చెందని) కాల స్వరూపము. (కాలములో మార్పులేదు. భూత - వర్తమాన - భవిష్యత్తులు కాలమునకు ప్రదర్శనా చమత్కారములు (Exhibitive features).
⌘   సర్వ వేదములతో శివ (శుభ) స్వరూపమై వెలుగొందుచున్నది. తెలియబడేదంతా అదియే.
⌘   సకల శ్రుతుల (ఉపనిషత్తుల) చే ఎలుగెత్తి ఉత్తమ స్థానముగా గానము చేయబడుచున్నది. (వివరించబడుతోంది). వెతకబడి గుర్తించబడుతోంది (మృగ్యం).
⌘   త్రికాలములలో మార్పు చేర్పులు లేనిదై యున్నది. (‘నేను’ అనేది మారటము లేదు కదా!) అవ్యయము.
అట్టి సమస్త జీవుల, సమస్త జగత్తుల స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మయే (లేక) పరబ్రహ్మమే ‘ఓం’ కారముగా మోక్ష ప్రదాయకముగా విజ్ఞులు చెప్పుచూనే ఉన్నారు.
⌘   అదియే ‘ఆత్మ’ అని ఏతత్ ‘బ్రహ్మము’ అని జాగ్రత్ స్వప్న సుషుప్తుల సాక్షి అగు ‘నేను’ అని అభివర్ణించబడుతోంది.

ఓ నారదా ! అట్టి నీ యొక్క, నా యొక్క, సమస్త జీవుల యొక్క ఆత్మ ఎటువంటిదంటే …,

➤ అమృతము (మృత్ / మార్పు ధర్మము) లేనట్టిది.
➤ అజరమ్ (శిథిలము కానట్టిది)
➤ అది అనుభూతిగా పొందినవాడు తానే అదిగా స్వానుభవమగుచున్నాడు. తదేవాహమ్
➤ ‘ఓం’కారము అనగా ఆత్మయే!

ఈ శరీరము ఉన్నప్పుడే అట్టి ‘ఓం’ కార సంజ్ఞార్థమగు ఆత్మతో తన్మయత్వము పొందాలి సుమా! ఇప్పటికిప్పుడే త్రిశరీరములకు (జాగ్రత్ - స్వప్న - సుషుప్తి రూపములకు) ఆవల గల అత్మయే పరబ్రహ్మమని, ‘అట్టి ఆత్మయే నేను’ అని ఈ జీవుడు వినిశ్చయుడు (సునిశ్చయుడు) కావాలి. అట్టి పరబ్రహ్మస్వరూపముతో ఈ విశ్వము, ఇందలి సమస్త విషయ - విశేషములను ‘అనుసంధానము’ (Wel-connected) చేసి వేయాలి.

1) స్థూలత్వము చేత స్థూల పురుషుడుగాను,
2) సూక్ష్మత్వముచే సూక్ష్మ పురుషుడుగాను,
3) ఐక్యత్వముచే ఐక్యతానంద భోగపురుషుడుగాను,
4) ఈ మూడింటికి సాక్షిగా తురీయ పురుషుడుగాను ‘4’ విధములుగా అగుచున్న ఆత్మ పురుషుడను ‘నేనే’ అని సుస్పష్టముగా, నిర్దుష్టముగా గ్రహించబడు గాక.

‘ఆత్మ భగవానుని నాలుగు పాదములే జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములు’ విశ్వుడుగా, తేజసుడుగా, ప్రాజ్ఞుడుగా, తురీయుడుగా సమస్తమును ఆస్వాదించుచున్నది ఆత్మ పురుషుడే! ఆత్మ పురుషుని లీలా, క్రీడా, వినోద చమత్కారమే ఇదంతా.

శ్రీ నారద మహర్షి : హే పరంధామా ! పరబ్రహ్మము యొక్క నాలుగు పాదముల గురించి మరికొంత వివరించండి.

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఈ విశ్వమంతా తన ప్రత్యక్ష రూపమై, సమస్త జీవులలోను, సమస్త లోకములలోను ‘అంతర్యామి’ అయి విస్తరించియున్న ఆత్మ భగవానునికి ‘4’ పాదములు.

నాలుగు పాదములు

1) ప్రథమ పాదము : విశ్వజిత్ - స్థూలభుక్ - వైశ్వానరః

ఈ విశ్వమే వైశ్వానర పురుష రూపముగల ఆయనకు :

19 ముఖములు :
1) చర్మము (త్వక్) (స్పర్శ) 2) చక్షువులు (కళ్లు) (చూపు) 3) శ్రోత్ర (చెవులు) (వినికిడి) 4) జిహ్వ (నాలుక) (రుచి) 5) ఘ్రాణము (ముక్కు) (గాలి పీల్చుట) (వాసనానుభవము) 6) వాక్కు (పలుకుట) 7) పాణి (చేతులు) 8) పాదము (నడక) 9) పాయువు (విసర్జనము) 10) ఉపస్థ (స్త్రీ పురుషుల రహస్యావయములు)
(ఇవి 5 కర్మేంద్రియములు + 5 జ్ఞానేంద్రియములు = 10)
11) ప్రాణము 12) అపానము 13) వ్యానము 14) ఉదానము 15) సమానము - (ఇవి పంచ (5) ప్రాణములు) 16) మనస్సు 17) బుద్ధి 18) చిత్తము 19) అహంకారము (అంతరంగ చతుష్టయము)

అష్టాంగములు :
1) విశ్వుడు (జాగ్రత్ పురుషుడు) 2) తైజసుడు (జాగ్రత్ స్వప్న పురుషుడు) 3) ప్రాజ్ఞుడు (జాగ్రత్ ప్రాజ్ఞ పురుషుడు) 4) తురీయ పురుషుడు (జాగ్రత్ తురీయుడు)
4x2 (అనుభవి + అనుభవమగునది) = 8

పై 19 ముఖములకు, ‘8’ అంగములకు ప్రభువు, స్థూలానుభవి, చుతురాత్మా - విశ్వో వైశ్వానర పురుషుడు. ప్రథమ పాదము. ఈయన జాగ్రత్‌ను పాలిస్తున్న ప్రభువు.

2) ద్వితీయ పాదము : తైజసో వైశ్వానర పురుషుడు

ఈయన స్వప్న స్థానమును పరిపాలించు ప్రభువు. సూక్ష్మ ప్రజ్ఞాసమన్వితుడు. హిరణ్యగర్భుడు. స్థూలమునకు అంతుడు (ఆవలివాడు) ఈయన ద్వితీయ పరమ పురుషుని ద్వితీయపాదము.

3) తృతీయ పాదము - సుషుప్తి వైశ్వానర పురుషుడు :

ఎప్పుడైతే జీవుడు గాఢ నిద్రను ఆశ్రయించినవాడై,

అట్టి స్థితిలో ఈ జీవుడు దేనితోను ఏ భేదము దర్శించక సుషుప్త స్థితుడై, కేవలమగు ప్రజ్ఞ (ఘనీభూతమైన ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘనుడు) అయి ఉంటాడు. స్వాత్మతో కూడుకొని నిత్యానందమయుడై ఉంటాడు. అయితే ప్రజ్ఞచే సర్వ జీవ - అంతర స్థితుడై ఉంటాడు. చతురాత్మేశ్వరునికి ఇది మూడవ పాదము.

ఈ సుషుప్తి ప్రాజ్ఞ పురుషుడు:

- జాగ్రత్ - స్వప్నములు తన యొక్క విస్తరించిన రూపములు కాబట్టి ‘‘సర్వేశ్వరుడు’’.
- జాగ్రత్ స్వప్నముల తత్త్వము ఎరిగినట్టి ‘సర్వజ్ఞుడు’ .
- సమస్త అంతరంగ సూక్ష్మ భావనలకు ‘అంతర్యామి’.
- సమస్తము ప్రభవించటానికి ‘యోని స్థానము’. (The zone where from all else emanates)

త్రయీ భూతములకు (జంతు - మానవ - దేవతా జీవులకు) జాగ్రత్ స్వప్న సుషుప్తులు సంచారము చేయు స్థానములు. ప్రతి ఒక్కటి మిగిలిన రెండింటిని బాధించునదై (వాటిని తొలగించుచు తాను ఆక్రమించునదై) ఉంటోంది.

‘‘జాగ్రత్ గాని, స్వప్నము గాని, సుషుప్తి గాని మాయామాత్రమే। ఆత్మకు స్వయం కల్పిత కల్పనా చమత్కారములే। ఊహలో ఏర్పడి లయించునవే’’ అని ఆత్మతత్త్వ శాస్త్రజ్ఞులచే సిద్ధాంతీకరించబడుతోంది.

4) చతుర్థ పాదము - తురీయ పురుషుడు :

ఈ తురీయ పాదము ‘‘ప్రత్యగాత్మ’ - అనబడుతోంది.

- (జాగ్రత్, స్వప్న, సుషుప్తులకు వేరై, ఆ మూడు తనవైనట్టి సాక్షీ ప్రజ్ఞ కాబట్టి).
- ఇది సత్ (ఉనికి) - చిత్ (ఏక) ఏకరస రూపము - అవ్యయమైనది (మార్పు - చేర్పుల దశలకు సంబంధించనది)
- అట్టి తురీయము ఏకము, అక్షరము, అఖండము, సర్వజీవులలో సమస్వరూపము.

- - - - -

జాగ్రత్ స్వప్న సుషుప్తి (3) అవస్థలు పరిశీలించి అధ్యయనము చేస్తూ ఉన్నప్పుడు మూడు వికల్పములు జనిస్తూ ఉన్నట్లు గమనించబడుతోంది.

1) జ్ఞాత - One who is knowing
2) అనుజ్ఞాత - The knower of the knower
3) అననుజ్ఞాత - The Non-knower of the knower

ఇంతకుముందే మనము చెప్పుకొన్న తీరుగా విశ్వ - తైజస వ్యవహారములన్నీ కూడా సచ్చిదానందరూపుడగు తురీయ పురుషుని సమక్షంలో వికల్ప - అవిద్యా కల్పితములే.

‘‘జాగ్రత్ - స్వప్నములు మాయా కల్పితములు’’ అని గమనిస్తూ సచ్చిదానందరూపమగు ‘తురీయ పురుషుడే నా నిజరూపము - నా సహజ రూపము’ - అని గమనించబడు గాక. ఓ మునీశ్వరా ! నారదా ! అట్టి తురీయ రూపము గొప్పదగు స్థూల ప్రజ్ఞ కాదు (జాగ్రత్‌గా అవటంలేదు). సూక్ష్మ ప్రజ్ఞ కూడా కాదు (స్వప్న దృశ్యము ప్రవేశించునదీ కాదు). అత్యంతమగు సుషుప్త ప్రజ్ఞా రూపము కూడా కాదు.

  ఓ మునీశ్వరా ! నారదా ! అది ‘ప్రజ్ఞరూపము’ అని చెప్పవీలుకాదు. ‘అప్రజ్ఞారూపము’ కూడా కాదు.
  అట్టి తురీయము కళ్లకు కనిపించని (అదృష్టమగు) ప్రజ్ఞాన ఘనము అనబడుతోంది.
  అట్టి తురీయము ‘‘ఇట్టి లక్షణములు కలది’’ అని చెప్పలేము. అందుచేత అలక్షణము.

‘తురీయము’ అనునది ఇంకా కూడా …
- ఇంద్రియములకు విషయమై లభించేది కాదు. ‘అగ్రాహ్యమ్’।
- లౌకిక వ్యవహారము వంటిది కాదు. ‘అవ్యవహార్యమ్’।
- చింతన చేయటానికి చింతించే విషయం వంటిది కాదు. ‘అచింత్యమ్’।
- మాటలతో ఒకడు మరొకరకి ఒక ‘వార్త’ వలె చెప్పగలిగేది కాదు. ‘అవ్యపదేశ్యమ్’।
- అది అనేకముగా అవటమే లేదు. సర్వదా ఏకమే అయి ఉన్నది. ‘ఏకాత్మమ్’।
- ఏకమే అయి సర్వదా ప్రసిద్ధి అయిన సారము (The essence of all studies). ‘ప్రత్యయసారమ్’।
- ఈ కనబడే ప్రపంచమంతా ఉపశమము పొందు స్థానము. ‘ప్రపంచోపశమమ్’।
- పరమ శాంత స్వరూపమైనది. ‘శాంతమ్’।
- అద్దానికి ద్వితీయమైనదే ఏ మాత్రము ఎక్కడా లేనట్టిది. ‘అద్వైతమ్’।
- అది జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిది. నాలుగవది. చతుర్థం మన్యంతే।

అదియే బ్రహ్మప్రణవము. అట్టి బ్రహ్మమే ఎవ్వరికైనా సర్వదా తెలుసుకోవలసి ఉన్నట్టిది. అది మముక్షువులకు (ఆత్మ గురించి తెలుసుకొని, మోక్షము పొందాలనే ఆశయము కలవానికి) పరమం (అన్యము) అయినట్టిది కాదు. సూర్యకాంతివలె సర్వత్రా వెలుగొందుచున్నట్టిది. ముముక్షువులందరికి ఆధారమైనట్టిది. అట్టి బ్రహ్మకాశమే స్వయం జ్యోతి స్వరూపమై సర్వత్రా విరాజిల్లుచున్నది.

అది ‘పరబ్రహ్మము’ అను శబ్దముచే స్తుతించబడుతోంది.

తదేవ పరబ్రహ్మస్వరూపమ్
ఇతి ఉపనిషత్ - అష్టమ ఉపదేశము


నవమ (9వ) - ఉపదేశము

శ్రీ నారద మహర్షి : తండ్రీ ! అట్టి పరబ్రహ్మస్వరూపము ఎటువంటిదో, మరికొంత వివరించి చెప్పండి. పరబ్రహ్మమును మేము ఎట్లా ఏఏ ప్రయత్నములచే సిద్ధించుకోవాలి ? అద్దాని స్థానము ఏది ? అది సులభమేనా ?

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఓ నారదా ! సమస్త శ్రోతలారా ! బిడ్డలారా ! పరబ్రహ్మము గురించి ఒక ముఖ్యమైన విషయము ప్రస్తావిస్తున్నాను. ఉత్తమమైన, నిర్మలమైన, సునిశితమైన బుద్ధిశాలురై వినండి. విస్తారమైన బుద్ధితో అవగాహన చేసుకోండి.

‘కిం బ్రహ్మస్వరూపం’ - ఇతి అన్యో అసావన్యో అహమస్మి - ఇతి యే విదుః తే పశవో । ఎవరైతే ‘బ్రహ్మము ఎక్కడో ఉన్నది. నేనేమో మరెక్కడో ఉన్నాను. అది ఇంకా ఎప్పటికో నేను సిద్ధించుకోవలసి ఉన్నది’’ అని అనుకుంటూ ‘‘అద్దాని కొరకు ఎచ్చటికో వెళ్ళాలి. ఏదో చేయాలి’’ అని భావిస్తూ ఉంటారో, వారు అజ్ఞాని అగు పశువుతో సమానము, మృగప్రాయులు, సత్యమును ఆశ్రయించువారు కారు.

న స్వభావ పశవః - తమేవం జ్ఞాత్వా -విద్వాన్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే । న అన్యః అయనాయ విద్యతే।
ఎవ్వరైతే ‘‘నేను బ్రహ్మమే అయి ఉన్నాను. అయితే, అనేక జన్మల దురభ్యాసవశంగా నా బుద్ధి దోష భావములచే కప్పబడి ఉన్నది. ఇప్పుడు ధ్యాసను దృశ్య విషయముల నుండి వెనుకకు మరల్చి, బుద్ధిని నిర్మలము చేసుకొను ప్రయత్నములచే ‘‘నేనే బ్రహ్మమును’’ అను నిజస్వరూప సత్య భావనను ఉత్తమ బుద్ధితో తిరిగి సిద్ధించుకోవాలి … అని తలచి, ప్రయత్నశీలుడైనవాడు - పశువు అవడు. మృగప్రాయుడు కాడు. ‘‘ఆత్మ అనగా సహజమగు స్వస్వరూపమే’ అని ఎరుగుచూ, తత్ వ్యతిరిక్త భావములు జయిస్తూ ఉన్నవాడు - తప్పకుండా మృత్యుముఖము నుండి విముక్తుడు కాగలడు.

‘‘నాకు ఆత్మగా బంధమే లేదు’’ అను నిశ్చల, నిర్మోహ, అసంశయ స్థితి రూపమగు మోక్షము సిద్ధించుకోవటానికి ఇంకా వేరే త్రోవ ఏదీ లేదు. (మోక్షము అనగా ఏదో లోకమునకు వెళ్లటము వంటిది కాదు).

శ్రీ నారదమహర్షి : పితృదేవా ! ఈ జీవుడు నిజ స్వరూపంగా పరమానందమగు బ్రహ్మమే అయి ఉన్నాడు కదా ?

శ్రీ బ్రహ్మ భగవానుడు : అవును. అందులో సందేహమే లేదు. ఈ జీవుడు స్వతఃగానే బ్రహ్మానంద స్వరూపుడు.

శ్రీ నారద మహర్షి : అట్టి బ్రాహ్మీ స్వరూపుడగు ఈ జీవునికి దుఃఖము అనేక భ్రమలతో కూడిన జన్మ-కర్మలు ఎక్కడి నుండి వచ్చిపడుచున్నాయి ? కాలము వలననా ? స్వభావమా ? నియతియా ? యాదృచ్ఛికమా ? యోని ప్రవేశము పొంది పాంచభౌతిక స్వీకారము చేయటము వలననా ? జీవాత్మత్వకారణంగానా ? మరింకేదైనా కారణము ఉన్నదా ? ఈ జగత్తే కారణమా ? జగత్తుకు కాలము మొదలైనవేవైనా కారణమా ?

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఈ జగత్తుకు కాలము మొదైలనవి ఏవీ కారణము కానే కాదు.

కాలము : ‘‘భూతకాలము వర్తమానానికి, వర్తమానము భవిష్యత్తుకు కారణము అగుచున్నాయి’’ అనునదంతా అల్పకాలిక సందర్భ సత్యము కావచ్చునేమో గానీ, అసలైన పరమ సత్యము కాదు. (క్రితం జన్మల కాలవ్యవహారములు ఈ జన్మకు, ఈ జన్మలోని కాలవ్యవహారాలు కారణము… అనునదంతా కల్పనయే గానీ - అసలైన సత్యము కాదు). ఎందుకంటే ఈ జీవుడు కాలముచే మార్పు చెందని ‘ఆత్మ’ స్వరూపుడు కాబట్టి!

స్వభావము : ఈ జగత్తు, అనుభవి అగు జీవాత్మ - ఈ రెండూ స్వాభావికంగా (In its natural way) ఏర్పడుచున్నాయి. అనునది కూడా నిజము (సత్యము) కాదు. స్వభావము ఉండాలంటే ఆ స్వభావము తనదైనవాడు ఒకడు వుండాలి కదా ? స్వభావి లేకుండా స్వభావము ఎట్లా ఏర్పడుతుంది ? అందుచేత ‘‘ఇదంతా స్వాభావికము’’ అనునది కూడా సత్యము కాదు. ‘‘ఈ స్వభావము తనదైనవాడు ఎవడు ?’’ అనేది ‘స్వభావ సిద్ధాంతము’ ధృవీకరించటము లేదు.

నియతి : ‘‘ఇదందా ఒకానొక నియతి. (It is all destined to so happen). అంతే"! అంతకుమించి వేరే కారణము లేదు’’ అనునది కూడా సత్యము కాదు. ‘‘నియతి తానంతట అదే ఎందుకు ఎట్లా నియమితము అవుతోంది ? ఈ జగత్ సంబంధములు, శరీర ధర్మములు ఎవరి కొరకు, ఏ ఉద్దేశ్యముతో నియతి నియమిస్తోంది ?’’ అనునది నియతి సిద్ధాంతము చెప్పటం లేదు. కనుక ‘నియతి’ అనుననది కూడా సత్యము కాదు (లేక) సమగ్రము కాదు.

యాదృచ్ఛికము : ‘ఈ జగత్తుకు ఎవ్వరూ కర్త లేకుండానే యాదృచ్ఛికంగా (very accidentally without any cause or anybody’s intention behind the same) ఏర్పడుచున్నది - అనునది కూడా సత్యము కాదు. ఈ కళ్లలో చూపు, కాళ్లలో నడిచే శక్తి, చెవులలో వినికిడి శక్తి, దృశ్య వ్యవహారాలలో కార్య - కారణాలు - ఇవన్నీ అకస్మాత్తుగా ఎట్లా ఏర్పడతాయి. దీని వెనుక ఒక తెలివి, నిర్మాణ విధానము, తెలివికలవాడు ఉండాలి కదా ? కనుక జగత్తుకు యాదృచ్ఛిక సిద్ధాంతము సరిపోదు. విచారణ సంపూర్తి అవజాలదు.

భూత యోని : ఇదంతా కూడా భూమి - జలము - అగ్ని - వాయు - ఆకాశముల సంయోగ వియోగములు మాత్రమే. (This is all the integration and Dis-integration of five factors called solid, liquid, Heat, gas and space) - అనునది కూడా పరాకాష్ట కాదు. పంచ భూతముల రకరకాల పాళ్ల కలయికచే పదార్థ ధర్మాలు ఎట్లా ఏర్పడుచున్నాయి ? శరీరంలో శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ అనుభవాలు, వాటివలన ఇష్ట - అయిష్టాలు ఎట్లా ఏర్పడుచున్నాయి ? కనుక జగదనుభవ - అనుభవిలకు ‘‘భూతయోని’’ సిద్ధాంతము కూడా పూర్తిగా చెప్పలేకపోతుంది.

పురుషుడు (జీవుడు) : ‘‘జీవుడు, అతని జీవన విధానము కొరకే జగత్తు ఏర్పరచబడుతోంది’’ అనునది కూడా పూర్ణమగు సిద్ధాంతము కాదు. అప్పుడు ‘‘ఈ జీవుడు శరీరము జనించటానికి మునుముందే ఉన్నాడా ? అతని దేహ ప్రదర్శనము ఎందుకు ఏర్పడియే ఉంటోంది ? జీవుడు ఎవరి అభిరుచి, అభిప్రాయము, ఉద్దేశ్యముల ప్రకారము జనిస్తున్నాడు?’’ అనునది సమాధానము లభించటము లేదు.

సంయోగ - వియోగములు : జీవుడు - పదార్థముల (The experiences and matter) ల సంయోగము - వియోగము కారణంగా ఈ జగత్తు ఏర్పడుతోంది ’’ - అను సిద్ధాంతము కూడా సమగ్రము కాదు. ‘‘ఎవరి తెలివిచే ఈ సంయోగ - వియోగములు ఏర్పడి, వాటి వలన జీవునికి సుఖ-దుఃఖములు రూపుదిద్దుకుంటున్నాయి?’’ అను ప్రశ్న మిగిలియే ఉంటోంది.

ఈ జీవుడు స్వయముగా సుఖ దుఃఖములకు హేతువు కాదు. మరి జీవ - జగత్తుల అనుభవ ప్రదర్శనమునకు కారణము ఎవరు ?

అద్వితీయుడగు పరమాత్మ

ఈ జీవుని స్వస్వరూపమే అయినట్టి, (తనకు ద్వితీయమే లేనట్టి) ‘అద్వితీయుడు’ అగు ‘పరమాత్మ’ యొక్క లీలా, క్రీడా, వినోద కల్పనయే ఈ ‘జగత్తు’ అనబడు అనుభూతి స్వరూపము (Form of experience)కు కారణము, కార్యము కూడా. ఆయన యొక్క స్వకీయమైన నియతి (లేక) నియామకమే ఈ ‘జగత్’ భావనా అనుభవముగా అగుచున్నది. అట్టి పరమాత్మయే సమస్త సుఖ-దుఃఖములకు కూడా హేతువు.

తే ధ్యానయోగాత్ - అనుగతా అపశ్యన్, దేవాత్మశక్తిం స్వగుణైః నిగూఢామ్।
‘‘ఇదంతా కూడా ‘స్వస్వరూపాత్మ’ యొక్క నిగూఢమగు స్వగుణరూప శక్తి ప్రదర్శనమే’’ అని ధ్యానయోగము ఆశ్రయించిన తత్త్వజ్ఞులగు మహనీయులు సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు.

అట్టి బ్రహ్మకి (బ్రహ్మశక్తి) యాదృచ్ఛికంగా త్రిగుణసహితము ‘సత్త్వ - రజో - తమో’ అగుచున్నది. అకారణమగు బ్రహ్మ శక్తియే సమస్తమునకు కారణమగుచు, కాలాత్మయుక్త రూపమున కూడా వెలయుచున్నది. అట్టి శక్తి నిర్మిత కాలచక్రము రూపంగా ఈ ‘జగత్తు’ అనే కథాకల్పన యొక్క సృష్టి, స్థితి, లయములను నిర్వర్తించుచున్నది.

అట్టి కాలచక్రమునకు
❇︎ సత్త్వ రజో తమో త్రిగుణములు,
❇︎ పంచభూత - పంచప్రాణ - పంచశరీర ధర్మ మనోరూపములగు షోడశ (16) చక్రములోని తీగలు,
❇︎ ‘56’ భేదములతో కూడిన ఆకులు,
❇︎ ఆ ఆకులకు ‘20’ కీలకములు, ఆరు అష్టకములు.
ఇవన్నీ ఏర్పడినవై కాలచక్రముతో బాటే పైకీ- క్రిందకీ తిరుగుచూ ఉన్నాయి.
- ‘‘జీవాత్మ వేరు - పరమాత్మ వేరు’’ అనే ద్వంద్వముల సంబంధమైన అజ్ఞానము ఆ కాలచక్రమునకు రెండు రంగుల చారల వలె పూయబడి ఉన్నాయి.

ఈ విధంగా ‘‘అకారణమగు బ్రహ్మము (ఆత్మ) ఈ కారణ రూపమగు ‘బ్రహ్మచక్రము’నకు ప్రేరక కారణము అగుచున్నది’’ అని సత్యాన్వేషకులకు మహర్షులు (మహత్ - ఋత్ దర్శకులు) స్వ-అనుదర్శకులై ఎలుగెత్తి ఋక్కులుగా గానము చేయుచున్నారు.

షోడశ వికారములు : పంచ (5) భూతములు, దశ (10) ఇంద్రియములు. అంతఃకారణము (1) = 16.

ఆరు అష్టకములు : [6x8] = 1) ప్రకృతి - అష్టకము 2) ధాతు - అష్టకము 3) ఐశ్వర్య అష్టకము (అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ఈశత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా సిద్ధులు). 4) భావ - అష్టకము 5) దేవ - అష్టకము 6) ఆత్మ గుణ (ధర్మ) అష్టకము.

ఇదియే కార్యబ్రహ్మ నదీ చమత్కారము. ఇంకా విను!

కార్య బ్రహ్మము యొక్క చమత్కారము

‘కార్యబ్రహ్మము’ - అనే నది
- పంచజ్ఞానేంద్రియములు ప్రవాహముగా కలిగి ఉన్నది.
- పంచభూతములను ఉగ్రమగు వక్ర (వంకర-టింకర) తరంగ గమనములుగా ఏర్పడి ఉంటున్నాయి.
- పంచ ప్రాణములనే (మరియు) పంచకర్మేంద్రియములనే ఊర్మి (మెలిక తరగములు).
- పంచ జ్ఞానముల(బుద్ధుల) మూలస్థానములు.
- పంచేంద్రియ విషయములే ప్రవాహ వేగములు.

1) పంచజ్ఞానేంద్రియములు 2) పంచ కర్మేంద్రియములు, 3) పంచ భూతములు 4) పంచ ప్రజ్ఞలు (దృశ్య - దేహ - మనో - బుద్ధి - అహంకార ప్రజ్ఞలు) 5) పంచ ప్రాణములు 6) పంచ ఉపప్రాణములు 7) పంచ కోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు) 8) పంచేంద్రియ విషయములు (తన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) 9) పంచాంగములు (తిథి - తార - నక్షత్ర - యోగ - కరణములు) 10) పంచ యజ్ఞములు (బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము).

ఇవి మొత్తం ‘‘10x5=50’’

ఈ విధంగా పంచదశ భేదములు ఈ ‘జగత్తు’ అనే ‘నది’ కలిగి ఉన్నది.
- పంచక్లేశములు దీని మధ్య భాగము.

ఓ నారదా ! అట్టి సర్వ జీవులు, వారి స్వభావములు గల ఈ ‘జగత్తు’ అనే నదిని మేము ఎల్లప్పుడు ఉపాసిస్తున్నాము.

అట్టి ‘‘బృహంతే తస్మిన్ హంసో అహ్రామ్యతే బ్రహ్మ చక్రే’’ - భ్రమింపజేస్తూ జ (జనించు) గత (గతించు) జగత్తు జీవునికి భ్రమింపజేస్తూ ఆత్మ దృష్టిని ఏమరపింపజేస్తోంది. ‘‘నేను వేరు- ఈశ్వరుడు వేరు’’ అను ప్రేరణత్వము ఆశ్రయించిన ఈ జీవుడు - సర్వమునకు జీవరూపము, సర్వమునకు జనన - జీవన - లయస్థానము అగు బ్రహ్మమును గమనించటము లేదు.

విశాలమగు బ్రహ్మ చక్రమునందే ఈ జీవుడు తిరుగాడటం జరుగుచూ ఉన్నది. జనన - మరణ చక్రములో పరిభ్రమిస్తూ ఒక దేహము తరువాత మరొక దేహమునకు ప్రయాణాలు చేస్తూ ఉండటము జరుగుతోంది.

‘‘ముక్తి’’

అందుకు ఉపాయము : అట్టి ఈ జీవుడు సర్వాత్మకమగు ‘‘చిదానంద పరబ్రహ్మము’’ తో ‘మమైకము’ సిద్ధించుకుంటూ, ‘‘నేనే బ్రహ్మమును । అహం బ్రహ్మస్మి’’ అని తెలుసుకోగానే - శరీర - ఇంద్రియ రూపమగు సంసార పంజరమును భేదించి, బ్రహ్మమే తానై ‘‘ముక్తుడు’’ (Relieved) అగుచున్నాడు. దేహములు, కాలములు మొదలైనవన్నీ ‘ఉపకరణ మాత్రములు’ అగుచున్నాయి.

అట్టి స్వస్వరూపమగు పరమాత్మయందే ‘‘1) భోక్త (The Experiencer) 2) భోగ్యము (భోగించబడునది All that being experienced), 3) భోగము (ప్రేరణ) అనే మూడు ఆత్మకు అనన్యమై ప్రతిష్ఠించబడుచున్నాయి’’ అని దర్శించువాడు అగుచున్నాడు.

చంచలమగు ‘జగత్తు’ లేక ‘ప్రపంచము’ అని పిలువబడుచున్న - ఈ సమస్తమునకు (తరంగములు జలమునందువలె) బ్రహ్మమే సుస్థిరమగు స్థానము అయి ఉన్నది.
- ఈ జగత్తు భావనచే కల్పితము కాబట్టి (ఒక కల్పిత కథలోని సంఘటనలవలె) మిథ్య । క్షరము!
- బ్రహ్మమే సత్యము, అక్షరము!

బ్రహ్మజ్ఞానులు : (అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ) - పంచకోశ వికారములతో కూడిన ఈ శరీరములోనే, సర్వశేష్యమగు ‘ఆత్మ’ ను తెలుసుకొని - విదిత్వాలీనా బ్రహ్మణిపరే తత్పరాయణా - అట్టి పరబ్రహ్మము యొక్క సర్వత్రా దర్శనమునందు పరాయణులై, అట్టి బ్రహ్మము నందు లీనము అగుచున్నారు.

‘మూల ప్రకృతి’ నుండి (లేక) ‘బ్రహ్మ చక్రము’ నుండి సదా విముక్తులై ఆత్మధ్యాన - ఆత్మ భావనా పరాయణులై అఖండాత్మత్వమును స్వస్వరూపమగా పుణికిపుచ్చుకొనుచున్నారు.

జీవ - ఈశ్వర - తత్త్వము / జీవేశ్వర న్యాయము

శ్రీ నారద మహర్షి : పితృదేవా ! సద్గురువరేణ్యా! ఈ జీవుడు ఎవడు ? ఈశ్వరుడు ఎవడు ? ఈ జగత్తు ఎట్టిది ? జీవ - ఈశ్వర సంబంధ - బాంధవ్యములు ఎట్టివి ? అనుగ్రహించి వివరించండి.

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఇక్కడ (1) క్షరము (నశించు ధర్మమము గలది) 2) అక్షరము (నశించు ధర్మమే లేనట్టిది) - అగు రెండు విశేష తత్త్వములు ఒకదానితో మరొకటి సంయుక్తమై, కలసి పోయినుట్ల కనిపిస్తున్నాయి.

1) జగత్తు : వికార సహితము. నశించు ధర్మము గలది.
2) బ్రహ్మము : వికార రహితము. నశించు ధర్మమే లేనట్టిది.
  అట్టి క్షర - అక్షరములు కలిసియున్న ఈ జగత్తును
   = అస్వతంత్రుడగు ‘జీవుడు’ (Individual self)
   = స్వతంత్రుడడు ‘ఈశ్వరుడు’ (Universal self) ఈ విశ్వమంతా తన ఐశ్వర్యముగా కలిగి ఉన్నవాడు.
ఈ ఇద్దరు ఏకమై భరించుచున్నారు.

‘‘నేనే దీనికి కర్తను’’ అను కర్తృత్వము, నేనే దీనిని ‘అనుభవించువాడను’ అనే భోక్తృత్వముల కారణంగా ఈ జీవుడు బంధించబడుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు ‘‘నేను ఉపాధి రహితమగు (నిరుపాధికమగు) ఆత్మనే’’ అని తనను గురించి గ్రహిస్తాడో - ఇక అట్టి పరమాత్మత్వ భావన చేత సమస్త పాశముల నుండి విడివడి ఈశ్వరత్వముచే ‘‘స్వతంత్రుడు’’ (Free of everything else) అగుచున్నాడు.

శ్లో।। జ్ఞ - అజ్ఞౌ ద్వాః అవజౌ ఈశ అనీశ అవజాహి ఏకా భోక్తృ భోగార్థయుక్తా ।

ఈశ్వరుడు సర్వజ్ఞుడు : దేహిగా - దేహమునకు సంబంధించి (దేహము రాకముందటి - ఇప్పటి - దేహానంతర) భూత - వర్తమాన - భవిష్యత్ స్థితిగతులను ఎరిగినవాడు. భోక్తృత్వమును భోగించువాడు.

జీవుడో - కించిజ్ఞుడు : వర్తమాన దేహ సంబంధమైన విశేషాలచే పరిమితిడు. ఈశ్వరునికి భోగ్యవస్తువు అయినట్టివాడు. అయితే, జగద్విషయములకు భోక్త.

అయితే ఈ 1) ఈశ్వరుడు 2) జీవుడు 3) జగత్తు - ఈ మూడింటికి కూడా కర్త ఎవరు? విశ్వరూపుడు అనంతుడు అగు ‘పరమాత్మ’యే! అనగా, అట్టి బ్రహ్మము యొక్క వినోదము కొరకే ఈ జీవ - ఈశ్వర - జగత్తులు కల్పనా రూపముగా ఏర్పడినవి అగుచున్నాయి. అట్టి జీవ - ఈశ్వర - జగత్తుల కల్పనయే ‘మాయ’ అనబడుతోంది. జీవ-ఈశ్వరులను కల్పించుచున్న మాయ పరమాత్మ యొక్క సన్నిధానమునందే ఉనికి కలిగి ఉన్నది. అట్టి మాయ అనిర్వచనీయము. ఎందుకంటే ‘మాయ ఎందుకు రూపుదిద్దుకొంటోంది ?’’ అన్నదానికి కారణము లేదు కాబట్టి (యా, మా- మొదలే లేనిది). అనగా జీవ-ఈశ్వరులు ఇరువురు
   - ఆత్మకు ‘‘అనన్యము’’
   - మాయచే ‘‘ఆకారణులు’’

ఏకైక పరమాత్మయే క్షర - అక్షరములగు జీవ, ఈశ్వర రూపములు దాల్చుచున్నాడు. ఎవ్వరైతే - జీవ, ఈశ్వర, మాయ అనబడే మూడు కూడా బ్రహ్మస్వరూపమే - అని తెలుసుకుంటాడో, అట్టివాడు ‘విశ్వరూపుడు’ అగుచున్నాడు. ఈ విశ్వమంతా తనయొక్క రూపముగా దర్శిస్తున్నాడు. తాను సమస్తమునకు ద్రష్టగా కేవలత్వము ఆస్వాదిస్తూ ఉంటున్నాడు.
   - మాయ క్షరము. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు ఉండదు.
   - అవిద్య మొదలైనవి నశించగా, అనుభవమగు స్వస్వరూపమునకు అన్యము కానట్టి పరమేశ్వరుడు.

అక్షరుడు : దేహముల రాక - పోకలకు, జగత్తుకు సంబంధించిన మార్పు - చేర్పులకు సంబంధించనివాడు.

అద్వితీయుడు : తానే జీవ -ఈశ్వర -జగత్తులుగా ప్రదర్శనమగుచున్నవాడు. కాబట్టి, తనకు ద్వితీయమైనది ఏదీ లేనివాడు.

స్వయం ప్రకాశకుడు : జీవ - ఈశ్వర - జగత్తులు పరమాత్మ యొక్క ప్రకాశములే అయి ఉండి, తాను మాత్రము మరొక దేనిచేతను ప్రకాశింపజేయువాడు కాదు. (అగ్ని - సూర్యుల వలె) స్వయం ప్రకాశకుడు.

సర్వ నియామకుడు : జీవ - ఈశ్వర - మాయలను, కాల చమత్కారమును నియమించువాడు.

పరమాత్మ ధ్యానము

ఈ జీవుని పట్ల మాయ ఎట్లా ప్రవృత్తమును విరమించి, నివృత్తము అవగలదు ? వినండి.

‘అక్షరుడు, అద్వితీయుడు, స్వయం ప్రకాశకుడు, సర్వనియామకుడు’’ అగు పరమాత్మ యొక్క విశేషములను ఎరుగుచు, పరమాత్మను ధ్యానించువాడు ఈ విశ్వమాయ నుండి నివృత్తుడు కాగలడు.

‘‘అట్టి పరమాత్మయే నేను’’ అను ‘‘సో2హం పరమార్థము’’ను తెలుసుకొన్నప్పుడు సమస్త సంసారపాశములు తెగిపోగలవు.

అట్టివాడు‘‘దృశ్య - దేహ - ఇంద్రియ -జీవ - ఈశ్వర’’ పంచ అవిద్యలను తొలగించుకొని పంచక్లేశముల నుండి ఈవల పడగలడు. అట్టివాని పట్ల జనన-మరణములు ‘‘మొదలే లేనివి’’ అగుచున్నాయి.

పరమాత్మ ధ్యానముచే జీవాత్మ - మాయలను అధిగమించి, ఈశ్వర తత్త్వములను తెలుసుకొని, ‘‘కేవల స్వరూపుడు’’ అయి, విశ్వమంతా తన ఐశ్వర్యముగా కలవాడై, ఆత్మకాముడై, అమృతత్త్వమును స్వాభావికము చేసుకొనుచున్నాడు. అట్టి నిత్యము, అంతరమున సర్వదా ఆత్మగా వేంచేసియున్నట్టిది అగు పరమాత్మయే అసలైన తెలుసుకోవలసి ఉన్నట్టిది. ఇక అంతకుమించి తెలుసుకొనవలసినదేదీ ఇక్కడ కించిత్ కూడా లేదు.

ఇక్కడ భోక్త (The experiencer), భోక్తము (That being experienced), బోధితత్వము / ప్రేరేపణ (The Act of experiencing) ఈ మూడూ కూడా మూడు రకాలుగా కనబడుచూ ఉన్నప్పటికీ, అవన్నీ కూడా ఏకమగు బ్రహ్మమే అయి ఉన్నాయి - అని ఎరుగబడుగాక. ఆ బ్రహ్మము యొక్క ఉపనిషదమే (సామీప్యమే) ఆత్మ విద్యకు (ఆత్మ గురించిన అధ్యయనమునకు, జ్ఞానమునకు), అందుకు చేసే తపన రూపమగు తపస్సుకు కూడా మూలము, లక్ష్యము.

ఓ నారదా ! ఓ బిడ్డలారా ! ఈ విధంగా ఎవ్వరైతే ఆత్మగురించి తెలుసుకొన్నవారై, ‘‘జన్మ - కర్మలకు ఆవలిదగు స్వస్వరూపమే అయి ఉన్నాను’’ అని అనుచింతన (Memorising all times, always and under all circumstances) చేస్తూ ఉంటారో.
తస్య కో మోహః ? కో శోకః ? ఏకత్వమ్ అనుపశ్యతః । అట్టి వానికి, సత్యమును ఏమర్చనప్పుడు ఏర్పడే ‘‘మోహము’ ఇక ఏముంటుంది ? శోకము (Worry and Lament) ఏమి మిగులుతుంది ? అట్టివాడు సర్వదా సర్వత్రా ఏకత్వమును సాక్షాత్కరించుకొన్నవాడై ఉంటాడు. నేనే సర్వాత్మకుడను. ఈ సమస్తము నా యందే (దర్పణంలో ప్రతిబింబములాగా) ఏర్పడి ఉన్నది’’ - అని గ్రహిస్తాడు.

ఓ నారదా ! భూత - వర్తమాన - భవిష్యతులలో కనిపించేదంతా నశించబోయేదే సుమా । అయితే విరాట్ విశ్వముగా కనిపించేదంతా అవినాశి అగు ఆత్మ యొక్క తత్త్వమే! నీవు ఆత్మవే అయి ఉన్నావు. ఇక భయమెందుకు ? శోకమెందుకు ?

శ్రీ నారద మహర్షి : అట్టి మహత్తరుడైనట్టి పరమాత్మ యొక్క సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూప వైభవమును ఈ జీవుడు తన స్వస్వరూపమును గాంచలేకపోతున్నాడు. మరి అతడు తన ఆత్మ యొక్క మహిమను దర్శించేది ఎట్లా ?

శ్రీ బ్రహ్మ భగవానుడు : ఎవ్వడు ఆ పరమాత్మ గురించి వెతుకుచున్నాడో, అధ్యయనము చేస్తున్నాడో, తపోధ్యాన యోగాభ్యాసములు నిర్వర్తిస్తున్నాడో, - అట్టి ఆ సాధకుని స్వస్వరూపముగానే పరమాత్మ వేంచేసియే ఉన్నారు. సర్వదా సిద్ధించిన దాని కొరకై సాధన ఎందుకు ? వెతుకులాట ఎందుకు? దేనికి ?

ఇక ఆయన ఎందుకు స్వానుభవము కావటము లోదో చెప్పుతాను విను.

ఆత్మ ఎటువంటిదంటే ..

ఈ విధంగా అణువుకంటే అణువై, మహత్తరముకంటే మహత్తరమై ఆత్మ ప్రతి ఒక్క జీవుని హృదయములోనే (ఆతనికి అనన్యమై) అతని బుద్ధి గుహలోనే దాగి ఉన్నది. బాహ్యమున ఎక్కడో కాదు. ఏదో లోకములో కానే కాదు. ఆత్మా అస్య జంతోః నిహితో గుహాయామ్।

అయితే,-
తమ హృదయములోనే దాగి ఉన్న అట్టి ఆత్మభగవానుని మహిమ ఎట్టిదో ఎవ్వరు చూడగలరు ?

మం।। శ్లో।। తమ్ అక్రతుః పశ్యతి వీతశోకో,
ధాతుః ప్రసాదాన్ మహిమానమ్ ఈశమ్ ।।

ఎవ్వడైతే జగత్తుకు సంబంధించిన సమస్త కార్య వ్యవహారాలను అధిగమించి ధాతుడై (శోధన చేయువాడై) ఉంటాడో, జగత్తుకు సంబంధించి సమస్త దిగుళ్లను, శోకములను వదిలివేస్తాడో అట్టివాడు తన నిర్మలమగు హృదయంలోనే ఆ ‘‘సర్వాత్మకుడు, సర్వకర్త, సర్వాంతర్యామి’’ - అగు ఈశ్వరుని మహిమను దర్శించగలడు. (He can enjoy his own all pervading SELF of himself here and now with the purity of his own common sense).

అట్టి (ఈ జీవుని స్వస్వరూపుడే అయినట్టి) ఆత్మ భగవానుని ‘ఈశ్వర మహిమ’ గురించి విను.

అపాణిపాదో - జవనోగ్రహీతా : ఆ ఆత్మ భగవానుడు పాణి - పాద (చేతులు - కాళ్ళు) రహితులే అయి ఉండి కూడా, (స్వప్నద్రష్ట - బయటనే ఉండి - స్వప్నములో సంచారములు చేస్తున్నట్లుగా) - సర్వత్రా సంచారములు స్వీకరిస్తున్నారు.

పశ్యతి అచక్షుః : కళ్లు లేకపోయినప్పటికీ సర్వత్రా చూచుచునే ఉంటున్నారు.

స శృణోతి అకర్ణః : చెవులు లేకపోయినప్పటికీ సమస్తము వినుచూనే ఉంటున్నారు.

న వేత్తి వేద్యం : తెలుసుకొనే ధర్మము లేకపోయినప్పటికీ సమస్తము తెలుసుకొంటూనే ఉన్నారు.

న తస్య అస్తి వేత్తా : ఆ పరమపురుషుని ఎరుగుచున్న వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే, ఆ తెలుసుకొంటున్నవాడు పరమాత్మయే, ఆత్మయే కాబట్టి!

తమాహుః అగ్ర్యం పురుషం మహాంతమ్ ।
ఆయనయే మహాంతమగు అగ్ర పురుషుడుగా నీలోను, నాలోను వేంచేసి ఉన్నారు. ఆయనయే శ్రేష