tripura tāpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణ వేదాంతర్గత

23     తిపురాతాపిన్యుపనిషత్

(త్రిపుర తాపినీ మహోపనిషత్)

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। త్రిపురా తాపినీ విద్యా
వేద్య చిచ్ఛక్తి విగ్రహమ్।
వస్తుతః చిన్మాత్ర రూపం
పరం తత్త్వం భజామ్యహమ్ ।।

‘‘చిత్‌శక్తి’’ స్వరూపము తెలియజేయు త్రిపురా తాపినీ విద్యను ఆశ్రయిస్తున్నాను. వస్తుతః ‘‘చిన్మాత్రమే’’ అయినట్టి పరతత్త్వమును భజించుచున్నాను.


ప్రథమోపనిషత్

1. ఓం । అథ ఏతస్మిన్ అంతరే భగవాన్ ప్రజాపత్యం
వైష్ణవం విలయకారణం రూపం ఆశ్రిత్య,
‘‘ఓంకారార్థమగు పరమాత్మకు నమస్కరిస్తూ’’ :-
సమస్తము తన చిత్ - (ఎరుక) తేజస్సునందు వెలిగించువాడగు భగవానుడు సమస్తమునకు అంతర్యామిగా ఆశ్రయించి ఉంటున్నారు.
(1) ‘‘ప్రజాపత్యము’’ను (సృష్టికర్తృత్వము), (2) వైష్ణవము (సృష్టి కొనసాగటానికి పరిపోషణ), పరిరక్షణ ప్రదర్శనమును మరల (3) ‘‘ఉపసంహారము’’లగు విలయ కారణమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
‘‘త్రిపుర అభిధా భగవతి’’ ।।
ఇతి ఏవం ఆదిశక్త్యా ‘‘భూర్భువః స్వః’’
భగవానుని ఆదిశక్తి రూపమే (వెలిగించు రూపమే) - భగవతి. అట్టి భగవానుని సంకల్ప - భావనా రూపి అగు భగవతి భూ, భువ సువర్లోకములను తన శక్తి ప్రదర్శనములు కలిగి ఉంటుంది.
త్రీణి స్వర్గ, భూ, పాతాళాని త్రిపురాణి హర ।
మాయాత్మకేన, హ్రీంకారేణ హృల్లేఖాఖ్యా (హృత్ లేఖ ఆఖ్యా)
భగవతీ త్రికూట అవసానే నిలయే
విలయే ధామ్ని మహసా ఘోరేణ వ్యాప్నోతి
మాయాత్మకమైన ‘హ్రీం’ కారముచే ‘‘హృల్లేఖ (హృత్ లేఖ)’’ బిరుదాంకిత అగు ఆ భగవతి త్రికూట శిఖరముపై నుండి ఆవలనుండి ‘‘స్వర్గ భూ పాతాళములు’’ అనే త్రిపురములను ఆక్రమించి’’ విలయము చేస్తూ ధామమునందు గొప్ప ఘోరమైన (ఘనీభూతమైన) తేజస్సుచే వ్యాపించి యున్నది.
2. స ఏవ ఇయం భగవతీ త్రిపుర ఇతి వ్యాపఠ్యతే

‘‘తత్సవితుర్వరేణ్యం’’ (1)

‘‘భర్గోదేవస్య ధీమహి’’ (2)

‘‘ధియో యో నః ప్రచోదయాత్ । (3)
ఆ భగవతియే ‘త్రిపుర’గా పఠించ బడుచున్నది. (చెప్పబడుచున్నది)
త్రిపదా గాయత్రి
(1) తత్ సవితుః వరేణ్యం । వేదోపనిషత్తులచే స్తుతించబడు (ఉనికి ఎరుక రూపమగు) సవితృదేవతకు నమస్కారము.

(2) సమస్తమును (ఎరుకచే) వెలిగించు భర్గోదేవుని ‘‘ధీ (బుద్ధి)’’ మహిమను ఉపాసించుచున్నాము.

(3) అట్టి వరేణ్యుడగు తత్-సవిత్ స్వరూప భర్గో దేవుడు మా యొక్క బుద్ధిని (ఆత్మజ్ఞాన - స్వానుభవ మార్గముగా) ప్రచోదితము చేయును గాక ।
ఇతి త్రిపదా గాయత్రి ।
పరోరజసే సావత్ ‘‘ఓం’’ ।

జాత వేదసే సునవామ సోమం అరాతీ,
యతో నిదహాతి వేదః ।

స నః పరుషత్ అతి దుర్గాణి

విశ్వా నావ ఇవ సింధుం దురితాత్యగ్నిః (దురిత అతి అగ్నిః)।
పై త్రిపాదములకు ఆవల 4వ పాదము, అట్టి నాలుగవ పాదము ‘పరోరజసే సావత్’ ‘ఓం’కార రూపమై విలసిల్లుచున్నది.

ఓ జాతవేదా ! అగ్నిదేవా ! మేము సోమలతనుండి సోమరసమును తీసి, ఇదిగో, మీకు సమర్పిస్తున్నాము.

ఓ అగ్ని భగవాన్ ! మేము పరమాత్మను ఎరుగుటలో దుర్గమములను (తారసపడే అడ్డంకులను) కరుణామూర్తులై తొలగించండి.

సముద్రంలో మునుగువానికి నావ లభిస్తే, దానిని ఎక్కి ఒడ్డుకు చేరునట్లుగా, మమ్ములను మీరే ‘నావ’ అయి సంసార దోషములనుండి కాపాడండి. సర్వదురితములను మీ తేజస్సుచే భస్మము చేయండి.
ఓం। త్ర్యంబకం యజామహే,
సుగంధిం పుష్టివర్ధనమ్ ।


ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోః
ముక్షీయ మా2మృతాత్। (మా అమృతాత్) ।
ఉత్తమ గంధములకు (Positive tendencies) పుష్టిని వర్ధనము (Develop) చేయుటకు త్రిపురముల (జాగ్రత్-స్వప్న - సుషుప్తుల) లయకారుడగు త్ర్యంబకుడగు పరమశివుని ఉపాసిస్తున్నాము. పూజిస్తున్నాము.

దోసపండు దోసతీగ తొడిమనుండి విడివడదీయు విధంగా మమ్ము మృత్యువునుండి విడదీసి వేయండి. అమృతము నుండి విడివడనీయకుండా అనుగ్రహించండి.
శతాక్షరీ పరమా విద్యా త్రయీమయీ
స-అష్టార్ణా త్రిపురా పరమేశ్వరీ।
ఆ భగవతీదేవి యొక్క విశేషణములు :
శతాక్షరీ :- పూర్ణము, అక్షరము
పరమా విద్యా :- ‘పరమ్’అగు (ఈ సమస్తమునకు ఆవలిదగు పరతత్త్వము (లేక) ఆత్మ గురించిన విద్యా స్వరూపిణి.)
త్రయీమయీ : ముజ్జగములు తానే అయి ఉన్నది.
స అష్టార్ణా : పంచభూత - మనోబుద్ధి చిత్తములనే, అష్టవిధి ప్రకృతితో కూడి ఉన్నది.
త్రిపురా :- జాగ్రత్ స్వప్న సుషుప్తులు, త్రిలోకములు, త్రికాలములు - తాను సంచరిస్తూ వినోదిస్తున్న - దేవి
పరమేశ్వరీ :- ఆవల స్వరూపిణి అయి సమస్తముగా విస్తరించి యున్న స్వరూపిణి ।
ఆద్యాని చత్వారి పదాని
పరబ్రహ్మ వికాసినీ,


ద్వితీయాని శక్త్యా ఆఖ్యాని,
తృతీయాని శైవాని,

తత్రలోకా వేదాః శాస్త్రాణి
పురాణాని ధర్మాణి వై చికిత్సితాని,

జ్యోతీగ్ం షి శివశక్తి యోగాత్
ఇతి ఏవం ఘటనా వ్యాపఠ్యతే,
పరబ్రహ్మముయొక్క వికాస (వికసించిన) స్వరూపమగు ఆ దేవి :
మొదటగా జాగ్రత్-స్వప్న-సుషుప్తి - తురీయములనే (లేక) మనో- బుద్ధి - చిత్త - అహంకారములనే 4 పదములు తనవైనట్టి దేవి ।

రెండవ విశేషముగా - ‘శక్తి’ స్వరూపిణి అయి ఉన్నట్టిది.
మూడవదిగా - శివ (కేవల) స్వరూపిణి, ప్రతిజీవుని నిజస్వరూపము.

ఆ దేవీ తత్త్వము గురించి చెప్పటానికే చతుర్వేదములు, సహితులు మొదలైనవాటి రూపంగా వేదాంత శాస్త్రములు, ధర్మశాస్త్రములు - ఇవన్నీ ఎలుగెత్తి గానం చేయటానికే ఏర్పడి ఉన్నాయి. అవి అనాత్మభావనకు చికిత్సా విధానము వంటివి.

జ్యోతి స్వరూపము, శివశక్తి యోగము మొదలైన పాఠ్యాంశములుగా (ఘటనా విశేషముల ద్వారా) ఉపాసించబడేది - ఆ దేవీతత్త్వమే।
అథ ఏతస్య పరం గహ్వరం వ్యాఖ్యాస్యామో ।

మహామను సముద్భవం తత్ ఇతి

బ్రహ్మ శాశ్వతం

పరో, భగవాన్


నిర్లక్షణో, నిరంజనో నిరుపాధిః
ఆధి రహితో - దేవః ।
అట్టి పరమేశ్వర పరమేశ్వరీ తాత్త్విక రహస్యము గురించి ఇప్పుడు కొన్ని విశేషములు చెప్పుకుంటున్నాము. వివరించుకుంటున్నాము. వ్యాఖ్యానించుకుంటున్నాము.

ఈ జగత్ వ్యవహారమంతా ఆ పరమాత్మ యొక్క మహామనస్సు నుండే సంభవిస్తోంది.

శాశ్వతమగు పరబ్రహ్మమే ఆ దేవదేవి రూపము

ఆ దేవీ రూపము సమస్తమునకు ఆవలిది కనుక పరము.
సమస్తమును చిత్ (ఎరుక) చే వెలిగించువాడు కనుక - భగవాన్ । భగవత్ స్వరూపము.

సమస్త లక్షణములు ఆ పరమాత్మవే అయికూడా ఆ దేవి సర్వ లక్షణ విలక్షణ । లక్షణ రహిత । ఎట్టి దోషములచే స్పృశించబడనిది. ఉపాధులన్నీ తన చేతనే కదల్చబడుచూ కూడా ఆ త్రిపురాదేవి ఉపాధికి ఆవలిది. ఉపాధి రహితమైనది. అధి (మానసిక రుగ్మత) లేనట్టిది. సమస్త దేవతా స్వరూపిణి ।
3. ఉన్మీలతే పశ్యతి । వికాసతే చైతన్య భావం
కామయత ఇతి ।
స ఏకో దేవః శివరూపీ దృశ్యత్వేన
వికాసతే యతిషు

యజ్ఞేషు యోగిషు, కామయతే కామం జాయతే

స ఏవ నిరంజనో అకామత్వేనోత్ జృంభతే
ఆ కేవలానంద ఆత్మ స్వరూపిణి అగు దేవదేవి
- కనులు తెరిచి, చూడటం ఆరంభించి చైతన్య భావము వికసింపజేసుకొని - ‘‘దృశ్యము ఆస్వాదిస్తాను’’ - అనే కామమును (wish)ను ఆశ్రయిస్తోంది.
సర్వదా ఏక శివ (ఆనంద) రూపిణి అయి ఉండి కూడా ప్రయత్న పూర్వకంగా అనేక రూపములుగా వికాసము పొందుచున్నది.
యోగులు దేవతల యజ్ఞ కార్యములయందు ఇష్టములను కోరుకుంటారు. అక్కడ నుండి దృశ్య సంబంధమైన కోరికలు కోరబడుచున్నాయి.
అయితే ఆ దేవి సర్వాంతర్యామి. జగత్ కల్పన నిర్వర్తిస్తూ కూడా, సర్వదా నిరంజన (నిర్మల, దోషరహిత) అకామ అయియే తన కామత్వ అంశం నుండి జగత్తులుగా విజృంభిస్తోంది.
అ క చ ట త ప యశాన్ సృజతే
తస్మాత్ ఈశ్వరః కామో అభిధీయతే ।


తత్ పరిభాషయా కామః కకారం వ్యాప్నోతి ।
‘కామ’ ఏవ ఇదం తత్ తత్ ఇతి
‘క’కారో గృహ్యతే ।

తస్మాత్ తత్ పదార్థ ఇతి
య ఏవం వేద ।।
‘‘అ క చ ట త ప’’ యశస్సుతో ఇదంతా సృష్టిస్తోంది. (అ) తనంతట తానుగా (క) స్వ - అర్థము, (చ) ఇంకా కూడా భావాత్మకంగా (త) తత్ స్వరూపి అయి (ప) వశించుచున్న దేవీ తన తేజస్సుతో ఇదంతా సృజించుచున్నది.

అందుచే ఈ దృశ్యజగత్తు ఈశ్వరుని (కామేశ్వరుని) కామ ప్రదర్శనగా చెప్పబడుతోంది.
ఈ సర్వము కాముడే (Presentation of one’s own desire) అనటానికే ‘క’ కారముగా అదియే విస్తారమౌతోంది. ఇదంతా ఈ దృశ్య జగత్తు ఇదం తత్ తత్ కామయేవయే ‘క’ కారముగా చెప్పబడేది.

అందుచేత ఇదంతా ఆత్మయొక్క కామమే కాబట్టి ‘‘ఆత్మయే’’ - అయి ఉన్నది - అని తెలియబడు గాక.
‘‘సవితుః వరేణ్యం।’’ ఇతి షూఙ్ ప్రాణి ప్రసవే
సవితా ప్రాణినః సూతే ప్రసూతే శక్తిమ్ ।
సూతే త్రిపురా శక్తిః ।
‘సవితుః వరేణ్యం’
- ‘‘సత్ - విత్’’ (ఉనికి, ఎరుక) గా ఆత్మపురుషుడు వరేణ్యుడు
షూన్ = ప్రసవము.
సవిత = ప్రాణులను కనుచున్నాడు.
ప్రసూతే = శక్తి శక్తితో నిర్వర్తించునది.
త్రిపురా శక్తియే ఈ సమస్తమునకు సూతము (ప్రసవము)- Place of Birth (కన్నతల్లి).
ఆద్య ఇయం త్రిపురా పరమేశ్వరీ
మహా కుండలినీ దేవీ జాతవేదస మండలం
యో - అధీతే సర్వం వ్యాప్యతే, త్రికోణ
శక్తిః ఏకారేణ మహాభాగేన ప్రసూతే ।
తస్మాత్ ఏకార ఏవ గృహ్యతే ।

‘‘వరేణ్యగ్ం’’ శ్రేష్ఠం భజనీయం
అక్షరం నమస్కార్యం ।।
తస్మాత్ వరేణ్యం ఏక అక్షరం గృహ్యత ఇతి,
య ఏవం వేద ।
ఎవ్వడైతే ఇప్పుడే ఇక్కడే త్రిపురాశక్తి, త్రిపురా - పరమేశ్వరీ, మహా కుండలినీ దేవి జాతవేద ‘మండలా’ (అగ్ని లోకేశ్వరీ) దేవిని (జాగ్రత్ స్వప్న సుషుప్తులు కల్పనలుగా సంచార స్థానములుగా) ఎవ్వడు ఉపాసిస్తాడో, అట్టివాడు తానే ఆత్మ భావనాసిద్ధుడు కాగలడు. త్రి-స్థానములలో సర్వవ్యాపకుడు, త్రికోణ (జాగ్రత్-స్వప్న-సుషుప్తిల (మరియు) ద్రష్ట - దర్శన - దృశ్యముల) ఏకారేణమును (ఏకత్వమును) పొందగలడు.

‘‘వరేణ్యము’’ - అనగా శ్రేష్ఠమైనదిగా భజనీయమైనది, అక్షరమైనది, నమస్కరించతగినది (ఉపాసించతగినది).
ఏకము, అక్షరము (Unity and changeless) అగునదే (పరబ్రహ్మమే) వరేణ్యము. ఇది తెలుసుకున్నవాడు ఏకము అక్షరముగా స్వస్వరూపము గాంచగలడు.
4. ‘‘భర్గో దేవస్య ధీమహి’’ ఇతి ఏవం వ్యాఖ్యాస్యామః।
ధకారో ధారణా । ధియైవ ధార్యతే।
ఇప్పుడిక ‘‘భర్గో దేవస్య ధీమహి’’ - అను దాని గురించి వ్యాక్యానించుకొంటున్నాము.
‘ధ’ = ధారణ
‘ధీ’ = బుద్ధి
‘ధియైవ ధార్యతే’ = బుద్ధి చేతనే ‘ధారణ’ చేయబడుతోంది.
భగవాన్, పరమేశ్వరో భర్గోదేవః


మధ్యవర్తి తురీయం అక్షరగ్ం


సాక్షాత్ తురీయగ్ం ।
భర్గోదేవః
⌘ సర్వమును వెలిగించువాడు కాబట్టి - భగవంతుడు (One who enlightens all).
⌘ ఈ జగదనుభవమునకు ఆవలివాడు (పరమ్) అయి అనుభవమంతా తానేగా విస్తరించి ఉన్నవాడు (ఈశ్వరుడు) కనుక పరమేశ్వరుడు(All beyond while extending as all).
⌘ కేవలజ్ఞాన దివ్యస్వరూపుడు కాబట్టి-భర్గో దేవుడు (Absolute knower and is divine by himself).
- సమస్త జీవుల హృదయాంతరంగుడు కనుక మధ్యవర్తి. జీవాత్మ - పరమాత్మ స్వరూపములుగా వర్తించువాడు కనుక మధ్యవర్తి.
- జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవై, ఆ మూడు తన యొక్క విహార స్థలములుగా కలవాడు కనుక - తురీయుడు.
- మార్పు చేర్పులచే స్పృశించబడడు కనుక - అక్షరుడు.
- తురీయమునకు కూడా సాక్షి కాబట్టి - సాక్షాత్ తురీయుడు.
- ఈ సమస్తము తానే అయినవాడు కనుక - సర్వగుడు.
సర్వాంతర భూతమ్।
తురీయ అక్షరం ‘ఈ’ కారం ।
సర్వాంతర్యామి, త్రి అవస్థలకు సాక్షి (తురీయుడు, అక్షరుడు - ‘‘ఈ’’ కారుడు (ధ + ఈ = ధీ)
పదానాం మధ్యవర్తి ఇతి ఏవం
వ్యాఖ్యాతం భర్గోరూపం
రూపం వ్యాచక్షతే ।।
జీవ - ఈశ్వర - పర (కేవల) పదములకు మధ్యవర్తి (మధ్యగా వర్తించువాడు). అందుచేత ‘‘భర్గోరూపుడు, భర్గోదేవుడు’’ - అని వ్యాఖ్యానించబడుచున్నాడు.
తస్మాత్ ‘‘భర్గోదేవస్య ధీమహి’’ ఇతి ఏవం
‘‘ఈ’’కారాక్షరం గృహ్యతే ।
ఇంకా కూడా ఆత్మ స్వరూపిణి అగు త్రిపురేశ్వరి గురించి….
అందుచేత ‘‘భర్గోదేవస్యం ధీమహి’’ - అను వాక్యము యొక్క సంజ్ఞార్థము ‘‘ఈ-కారాక్షరము’’ గా గ్రహించబడుతోంది.
‘‘మహి’’ ఇతి అస్య
వ్యాఖ్యానం । మహత్వం జడత్వం కాఠిన్యం విద్యతే
యస్మిన్ అక్షరే - తత్ - ‘‘మహి’’ ।
ఇప్పుడు ‘‘మహి’’ అను శబ్దము యొక్క ఉద్దేశ్యమును (అంతరార్థమును) వ్యాఖ్యానించుకుంటున్నాము.
ఏ అక్షరము →
• స్వస్వరూపము యొక్క సర్వాత్మత్వము సూచిస్తోంది - అది ‘‘మహత్’’ (లేక) మహత్వము.
• ‘స్పందన’కు సాక్షి అయి (తరంగమునకు అంతరమైన జలమువలె) సర్వదా నిశ్చలమవటముచేత ‘‘జడత్వము’’.
• మహాశిలవలె సుస్థిరము కాబట్టి కాఠిణ్యము.
• క్షరము లేనిది కనుక అక్షరము.
ఈ విధంగా ‘‘మహి’’ అనునది వ్యాఖ్యానముగా వివరించబడుతోంది.
లకారః పరంధామ కాఠిన్య ఆఢ్యగ్ం
ససాగరగ్ం సపర్వతగ్ం ససప్తద్వీపగ్ం
సకాననం ఉజ్జ్వలద్రూపం మండలం
ఏవ ఉక్తం ‘ల’ కారేణ పృథ్వీదేవీ
మహీత్యనేన వ్యాచక్షతే।
ఇంకా కూడా ‘‘ధీమహి’’ లోని ‘‘మహి’’ గురించి సూక్ష్మార్థంగా→
(‘‘లక్ష్మి, ‘‘లలిత’’, ‘‘శుక్ల’’ అను శబ్దములలోని) ‘ల’కారము ‘‘పరంధామము’’ (The Finest State) యొక్క సూచన.
కాఠిణ్యార్థంగా - స సాగరము (సముద్రము వలె యథాతథము), స పర్వతము (పర్వతమువలె నిశ్చలము). స-సప్తద్వీపము (పంచభూత- బాహ్య అభ్యంతర సమన్వితము). స-ఏకాననము (ఏకముఖ రూపము, అనేకంగా కనిపిస్తూ ఏకమే అయి ఉన్నట్టిది). నవ నవానుభవము కాబట్టి ఉజ్జ్వల (ఉత్ జ్వల) (Ever blossoming) రూప మండలము పృథివీ దేవిగా విభవము ఇదంతా ‘‘మహి’’ అనబడుతోంది.
5. ‘‘ధియో యో నః ప్రచోదయాత్ ।’’పరమాత్మా సదాశివ ఆదిభూతః ।


పరః స్థాణు భూతేన
‘ల’కారేణ జ్యోతిర్లింగం ।

ఆత్మానం ‘‘ధియో’’ బుద్ధయః
పరే। వస్తుని ధ్యాన ఇచ్ఛారహితే, నిర్వికల్పకే।
‘‘ధియో యోనః ప్రచోదయాత్’’ గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము.
ఆ త్రిపురేశ్వరియే (లేక) త్రిపురాసుర సంహారుడు అగు స్వామియే…,

- సమస్తమునకు పరమై (ఆవలగా) గల ఆత్మేశ్వరుడు కాబట్టి ‘‘పరమాత్మ’’.
- జీవాత్మగా (జగత్ దృష్టికి) కనిపిస్తూ కూడా సర్వదా ‘‘సదాశివుడే’’।
- సమస్త జీవాత్మలకు, పంచభూతములకు మునుముందువాడు. కాబట్టి ఆదిభూతుడు.

- ఆయన ‘ల’కారణుడై (లయమై)నట్టి పరస్వరూపుడైన స్థాణువు.
- జ్యోతిర్లింగ (తేజో-సూక్ష్మ) స్వరూపుడు.

- ఆత్మయందు బుద్ధి ప్రకాశవంతుడు కనుక - ఆత్మానం ధియో బుద్ధాయః । పరస్వరూపుడు. వస్తు పరిమితములందు ధ్యాన - ఇచ్ఛలు లేనట్టివాడు - నిర్వికల్పుడు
ప్రచోదయాత్ ప్రేరయేత్ ఇతి ఉచ్ఛ స్వర రహితం
చేతస ఏవ చింతయిత్వా భావయేత్ - ఇతి ।।
ప్రచోదయాత్ = ప్రేరేపించును గాక ।
ఈ శబ్దము పెద్ద గొంతుకతో కాకుండా (ఉచ్చ స్వర రహితమ్), బుద్ధి (చేతస్సు)లో చింతన చేస్తూ మనస్సుతో భావన చేయాలి.
పరో రజసే సావత్ ‘ఓం’ ఇతి ।

తత్ అవసానే । పరంజ్యోతిః ।
అమలగ్ం । హృది దైవతం । చైతన్యం
చిల్లింగగ్ం హృదయాగార వాసినీ।

హృల్లేఖే ఇతి । ఆదినా స్పష్టం ।
వాగ్భవకూటం । పంచాక్షరం ।


పంచభూత జనకం పంచకలామయం
వ్యాపఠ్యత ఇతి, య ఏవం వేద ।।
రజస్సుకు పరమై ఏర్పడి ఉన్న రూపము. ఓంకారార్థము.

సమస్తమునకు ఆవల ‘తత్’ స్వరూపమైనది. పరంజ్యోతి స్వరూపము, నిర్మలము. సమస్త జీవుల హృదయములలో దివ్య స్వరూపుడై వెలుగొందువాడు. చైతన్యమూర్తి । చిత్ స్వరూపముగా హృదయములలో నివాసము కలవాడు. అంతర హృదయుడు.

హృల్లేఖగా హృదయములో సుస్పష్టమగువాడు - ఆయా రూప - అవగాహన - భావనలచే ఉపాసనా ఫలముగా లభించువాడు. స్పష్టమగువాడు. వాక్కు జనించు స్థానమగు కూటస్థుడు. పంచాక్షరుడు (దృశ్య-ద్రష్ట-జీవాత్మ-ఈశ్వర-పర అను ఐదు - అక్షర స్వరూపము తనదైనవాడు).

(ఈ భూ - జల - అగ్ని - వాయు - ఆకాశ) పంచ భూతములకు జనన స్థానమైనవాడు. పంచకల స్వరూపుడు / పంచకలామయుడు. ఆ విధంగా త్రిపురాసుర సంహారిణి లయకారాన్ని ఉపాసిస్తున్నాము.
అథ తు పరం కామకళా భూతం కామకూటం ఆహుః ।

‘‘తత్సవితుః వరేణ్యం’’ -
ఇత్యాది ద్వాత్రిగ్ంశత్ (32)
అక్షరీం పఠిత్వా

‘తత్’, ఇతి - పరమాత్మా ।
సదాశివో అక్షరం విమలం నిరుపాధి
తదాత్మ్య ప్రతిపాదనేన
‘హ’ కార అక్షరం, శివరూపం
నిరక్షరం అక్షరం వ్యాలిఖ్యత ఇతి
‘‘ఈ విశ్వము (జగద్దృశ్యము) అంతాకూడా పరతత్త్వము యొక్క కామకళాభూతము (లేక) కామకూటమే’’ - అనబడుచున్నది.

‘‘తత్సవితుః వరేణ్యం’’ ఇత్యాది ‘32’ అక్షరముల మంత్రమును పఠిస్తూ ‘‘తత్ అనగా ఇది’’ అని ధ్యానము ధ్యాసలతో నిర్వర్తించాలి.


తత్-పరమాత్మ, సదాశివము అక్షరము, విమలము, నిరూపాధికముతో తాదాత్మ్యము ప్రతిపాదన కలిగి ఉండాలి. శివరూపము - ‘హ’కారాక్షరము.
శివుడు-సమష్ఠి రూపమైన ‘‘నేను’’. అట్టి తత్ శివ తత్త్వమును నిరక్షరము గాను (అఖండాత్మమేవాహమ్ - ‘భావన’ గాను), అక్షరపూర్వకంగాను (ఓం) - హృదయ ఫలకముపై లిఖించి ఉపాసించాలి.
తత్ పరాగ వ్యావృత్తిం ఆదాయ,
శక్తిం దర్శయతి తత్సవితుః (తత్ సవితుః) - ఇతి ।


పూర్వేణాధ్వనా సూర్య, అధః చంద్రికాం వ్యాలిఖ్య


మూలాది బ్రహ్మరంధ్రగం ‘స’ అక్షరం,
అ‘ద్వితీ’యం ఆచక్షత - ఇతి ఆహ ।
‘తత్’ నుండి బయలుదేరు ‘‘పరాగ వ్యావృత్తి (Extended form)ను స్వీకరించి, కేవలము నుండి బయల్వెడలుచున్న బాహ్య విశేషమును గమనిస్తూ - తత్సవితుః మంత్రమును పలకాలి.


పూర్వ (సూర్యోదయ వైపు అగు తూర్పు) మార్గంగా - సూర్యుని, అద్దాని క్రిందగా చంద్రికను లిఖించాలి.

‘‘ఇదంతా పరమాత్మకు అన్యము కాదు’’ అను ‘‘అద్వితీయము’’ను ‘స’ అక్షర మహదర్థంగా -
మూలాధారమునుండి - బ్రహ్మరంధ్రము వరకు మూలాధారము - స్వాధిష్ఠానము - మణి పూరకము, అనాహతము - విశుద్ధము - ఆజ్ఞ - బ్రహ్మరంధ్రము వరకు - కేవలమగు ‘‘అహంబ్రహ్మ’’ తత్త్వమును భావించాలి. ఉద్దేశ్యించాలి
6. భగవంతం దేవగ్ం
శివశక్త్యాత్మికం ఏవ ఉదితమ్ ।
శివో2యం పరమం దేవగ్ం ।

‘‘శక్తిః’’ ఏషా తు జీవజా ।
సూర్యాచంద్రమసోః యోగాత్ హగ్ంసః
తత్పదం - ఉచ్యతే ।
తస్మాత్, ఉజ్జృంభతే (విజృంభతే) కామః ।

కామాత్ కామః పరః శివః ।
కేవలుడు, ఆదిస్వరూపుడు, నిర్విషయుడు అవటంచేత దివ్య స్వరూపుడగు భగవంతుని నుండి శివ + శక్త్యాత్మకంగా ఈ సృష్ఠి అంతా బయల్వెడలింది. లీలగా ఉదయించింది.
సమస్త జీవులలోని నిజరూపమే శివుడు. అట్టి శివుడే పరమాత్మ, దేవాది దేవుడు. సమస్తమునకు పరమైనవాడు.

ఆయన యొక్క శక్తియే జీవజాలముగా జనించుచున్న ‘‘జీవజ’’.
సూర్య పరమాత్మయొక్క - చంద్రమస యోగముచే ‘శక్తి’నుండి సూర్యచంద్రులు బయల్వెడలుచున్నారు. అట్టిస్థానమే ‘‘తత్పదము’’. అదియే ‘‘హంస’’ - అనబడుతోంది.
అట్టి ‘పదము’ లేక ‘స్థానము’ నుండి ఇష్టము రూపం నుండి కాముడు విజృంభిస్తున్నారు.

కామము (అన్యము పట్ల ఇష్టము) నుండి ‘కాముడు’గా పరమశివుడే ఉదయిస్తున్నారు.
కార్ణో2యం కామదేవో2యం
వరేణ్యం ‘‘భర్గ’’ ఉచ్యతే ।

‘‘తత్సవితుః వరేణ్యం భర్గోదేవః’’
క్షీరగ్ం సేచనీయం అక్షరగ్ం
సమధుఘ్నం అక్షరం

పరమాత్మ జీవాత్మనోః యోగాః తత్ ఇతి

స్పష్టం అక్షరం తృతీయగ్ం ‘‘హ’’ ఇతి ।
తదేవ సదాశివ ఏవ నిష్కల్మష
ఆద్యో దేవో అంత్యం అక్షరం వ్యాక్రియతే ।
‘‘క’’ వర్ణుడగు కామదేవుడే ‘‘వరేణ్యుడగు భర్గ’’ అని పిలువ బడుచున్నారు.

‘‘తత్ సవితుః వరేణ్యం భర్గోదేవః’’ ఈ మంత్రము - క్షీరమును సేవించునట్లు (పాలు త్రాగినట్లు) సేవించ తగినది. అక్షరము.


పరమాత్మ - జీవాత్మ (పరము - ఇహము ) యోగము తత్ అని ఏర్పడుచున్నది.

సృష్టమైన అక్షరంగా (శివ, శక్తులకు) - మూడవదిగా ‘‘హ’’ అయి ఉన్నది. సో2హంలో ‘‘హం’’-అక్షరుడగు జీవాత్మయే । మధుఘ్నముతో కూడినది. ‘‘హ’’ అనే సదాశివుడు నిష్కల్మషుడు. ఆదిదేవుని అంశయే జీవుడు. ఆది - అంతముగా ‘‘అ’’ - ‘‘క్ష’’→ అక్షరము (శివుని జీవాత్మాక్షరము) అనబడుతోంది.
పరమం పదం ‘ధీ’ ఇతి ధారణం విద్యతే ।
జడత్వ ధారణం మహి ఇతి
‘ల’కారః శివ అధస్తాత్ తు లకార అర్థః


స్పష్టం అంత్యం అక్షరం పరమం చైతన్యం ।

‘‘ధియో యో నః ప్రచోదయాత్’’
పరో రజసే సావత్ ‘‘ఓం’’ ఇతి ఏవం
శివుడే ‘అహం’లో ‘హ’ స్వరూపుడగుచున్నవారు. సదాశివుడే ఆద్యుడు. ఆయన - నిష్కల్మషుడు. అక్షరుడు. అట్టి శివతత్త్వమే ఇక్కడ జీవాత్మ - పరమాత్మలుగా వ్యవహరిస్తోంది.
‘ధీ’ అను ధారణయే ‘‘పరమపదము’’గా చెప్పబడుతోంది.
నిత్యచైతన్య స్వరూపమగు పరతత్త్వము జడరూపమగు జీవుడే - అర్థముగా ‘‘మహి’’ । ఇది లకార శబ్దము.
‘ల’కారార్థము - లయకారుడుగా శివదత్తమైనది.

ఆది శివతత్త్వ స్పష్టము. ఆద్యంతికము అక్షర స్వరూపము, పరమ చైతన్య స్వరూపము.

‘‘ధియో యో నః ప్రచోదయాత్’’ పరో రజసే సావత్ ఓం।
మా యొక్క ధీ (బుద్ధిని) ప్రచోదింప జేయుదురు గాక ।
సమస్తమునకు పరోరజసము (పరతత్త్వ ప్రకాశము) అయి ఉన్న ‘ఓం’గా ఉపాసిస్తూ ఉన్నాము.
కూటం కామ కలాలయగ్ం

షడధ్వ పరివర్తకో వైష్ణవం పరంధామ - ఇతి

భగవాన్ చ ఏతస్మాత్ య ఏవం వేద ।
కూటస్థము, సమస్తము తన ‘కామ కళ’గా కలిగియున్నట్టిది,
(దృశ్య - దేహ - దేహి - జీవాత్మ - ఈశ్వర - పరమాత్మ అనబడే) షడత్వం (ఆరు తత్త్వములుగా) పరివర్తనము ప్రదర్శించునది,
(ఉనికి - ఎరుకల రూపమైనట్టి) వైష్ణవము అగు పరంధామమును ఉపాసిస్తూ ఉండగా ఈ జీవుడు భగవత్ స్వరూపమగు ‘ఓం’ స్థానమును సంతరించుకోగలడు
7. అథ ఏతస్మాత్ అపరం తృతీయగ్ం
శక్తి కూటం ప్రతిపద్యతే
ద్వాత్రింశత్ (32) అక్షర్యా
గాయత్ర్యా ‘‘తత్సవితుర్వరేణ్యం’’ ।
అట్టి సర్వత్రా ఏకము అయి ఉన్న ‘‘పరతత్త్వము’’ నుండి ‘‘మూడవది’’ అయినట్టి శక్తి కూటము బయల్వెడలుచున్నది.
‘‘32’’ అక్షరములతో కూడిన ‘‘తత్సవితుర్వరేణ్యం’’ మంత్రము - గాయత్రీ (ఛందో) సంబంధితము.

ఉదా:

భూర్భువస్స్వః 4
ఓం 1
తత్సవితుః 4
వరేణ్యం 3 పంచభూత (భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ) 5
భర్గోదేవస్య 5 పంచ పురుష (దృశ్య-ద్రష్ట-జీవ-ఈశ్వర-పర) 5
ధీమహి 3
ధియోయోనః 4 పంచప్రాణ 5
ప్రచోదయాత్ 5 పంచ ఉప ప్రాణ 5
అపోజ్యోతి 4 అంతరంగ చతుష్టయ 4
రసోమృతం 4 త్రిగుణములు 3
బ్రహ్మ 2

తస్మాత్ ఆత్మన ఆకాశ । ఆకాశాత్ వాయుః స్ఫురతి తత్
అధీనం వరేణ్యగ్ం సముదీయమానగ్ం సవితుర్వా యోగ్యో
జీవాత్మ పరమాత్మ సముద్భవస్తం ప్రకాశ శక్తి రూపం
జీవ అక్షరగ్ం స్పష్టం ఆపద్యతే।।
‘‘భర్గోదేవస్య’’ ధీ ఇతి అనేన ఆధారరూప, శివాత్మ ।
అక్షరం । గణ్యతే మహీత్య ఆది ।

నా అశేషం కామ్యగ్ం ।
రమణీయం దృశ్యం
శక్తికూటగ్ం స్పష్టీకృతం ఇత్యేవం ।
పంచ దశాక్షరం త్రైపురం యో అధీతే,
స సర్వాన్ కామాన్ అవాప్నోతి ।
స సర్వాన్ భోగాన్ అవాప్నోతి ।
స సర్వాన్ లోకాన్ జయతి ।
స సర్వాన్ వాచో విజృంభయతి ।
స గురుత్వం ప్రాప్నోతి । స వైష్ణవం ధామ భిత్త్వా
‘‘పరంబ్రహ్మ’’ ప్రాప్నోతి - య ఏవం వేద ।
ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు ప్రకటితమగుచున్నవి. స్తుతికి అర్హమగు తత్ పరమాత్మ ఆధీనములోనిది పంచభూత ప్రపంచము. అదియే సముదీయమానము. అది సవిత్ శబ్దయోగ్యము. అది జీవాత్మ - పరమాత్మలు సముద్భవిస్తున్న స్థానము. సర్వమును ప్రకాశించునది. అది జీవాత్మ (అంశ)ను అక్షరముగా స్పష్టీకరించటం జరుగుతోంది.
సమస్తమునకు ఆధారరూపముగా ‘‘భర్గోదేవస్య’’ అను ఆత్మ ధర్మము ఉపాసించబడు గాక । అది శివాత్మకము. అక్షరము (క్షరము కానిది) మహత్తుకు ఆదిగా గణించబడుచున్నట్టిది.

అది కామము ఏ మాత్రము శేషించనట్టిది. అయితే ఏది అద్దాని కామ్యము (ఇచ్ఛ) చేతనే రమణీయ జగద్దృశ్యము, రమణీయమైన ఇచ్ఛాస్వరూపం - శక్తి కూటముగా స్పష్టీకృతమగుచున్నాయో,
అట్టి పరబ్రహ్మము
- 15 అక్షరములతో కూడినది
- త్రిపురములతో కూడినది
అట్టి పరబ్రహ్మ తత్త్వమును ఎవరు ఉపాసిస్తారో / ఎరుగుచున్నారో అట్టివాడు కోరుకున్న సమస్తము సిద్ధించుకోగలడు. సకల భోగములు పొందగలడు. లోకములన్నీ జయించగలడు. సమస్త మహావాక్యములతో కూడి (‘సో-హమ్’, ‘తత్త్వమ్’, త్వమేవా-హమ్ లతో కూడి) విజృంభించగలడు. సమస్త లఘువులను అధిగమించి ‘గురుత్వము’ సిద్ధించుకోగలడు. వైష్ణవ ధామమును చేరినవాడై‘‘పరబ్రహ్మస్వరూపము - ప్రాప్తించుకోగలడు.
ఇతి ఆద్యాం విద్యాం అభిధాయ
ఏతస్యాః శక్తికూటగ్ం శక్తి శివాద్యం
లోపాముద్రేయం ద్వితీయే ధామని
ఈ విధముగా ‘‘ఆది’’ (మొదటిదిగా, That prior to everything) గురించిన విద్యను ఆశ్రయించాలి.
‘‘శక్తి - శివ ఆద్యము’’, ‘‘శక్తి-కూటము’’ అయినట్టిది. రహస్యముద్ర (స్థానము). అద్దాని ద్వంద్వ (శివా - శివ, శక్తి - శక్తిమంతుడు, జీవ-ఈశ్వర, ప్రకృతి - పురుష) ధామమును ద్వితీయముగా (రెండవదిగా) ఆశ్రయించాలి ।
పూర్వేణ ఏవ మనునా, బిందుహీనా,
శక్తి భూత హృల్లేఖా
క్రోధమునినా అధిష్టితా ।

తృతీయే ధామని పూర్వస్యా ఏవ విద్యాయా
యత్ వాగ్భవ కూటం
తేన ఏవ మానవీం
చాంద్రీం కౌబేరీం విద్యాం అచక్షతే।
అట్టి జీవేశ్వరోపాసనచే సమస్తమునకు పూర్వమే వేంచేసి ఉన్నట్టిది, నామ-బిందు-కళాతీతమైనది అగు శక్తి భూతమును హృదయాకాశంలో దర్శించాలి. పూర్వపు హృల్లేక - క్రోధమును అధిష్ఠించియున్న దేవిని ‘‘తృతీయము’’ (మూడవది) గా ఎరిగి ఉపాసించాలి.

ఆ తృతీయ (మూడవ) ధామమును సమస్తమునకు పూర్వము (పూర్వతత్ పూర్వము)గా గమనించాలి. తెలుసుకోవాలి. అదియే వాగ్భవకూటము. (వాక్కుకు జనన స్థానమైన కూటస్థము).
అదియే మానవీయము. అది ‘‘చాంద్రి’’ కౌబేరి విద్య - అని పిలుస్తున్నారు.
8. మదనాథః శివం వాగ్భవం।

తత్ ఊర్ధ్వ కామ కళామయగ్ం।

శక్తి - ఊర్ధ్వం శాక్తం - ఇతి

మానవీ విద్యా చతుర్థే ధామని
ఆ వాక్ జనన స్థానములో వేంచేసి ఉన్న తత్త్వస్వరూపమే ‘శివము’. ఆ పరమపురుషుడే మదనాథుడు, వాగ్భవుడు అని అభివర్ణితుడు.

‘తత్’ అగు పరబ్రహ్మమే పైపైకి ‘కామకళ’ను ప్రదర్శించటమే ఈ సమస్త సృష్టి విన్యాసము.

శక్తికి ఆవలగా ఉన్నవాడే శక్తి తనదైనట్టి ‘శాక్తుడు’.

అట్టి శాక్త (శక్తి తనదైనవాడి) స్థానమే కేవలబుద్ధి రూపమగు ‘‘మానవీ’’ అని, చతుర్థ ధామము (తురీయ స్థానమని) ప్రశంసించబడుతోంది. ప్రస్తావించబడుతోంది. స్తుతించబడుతోంది.
శివ శక్తి ఆఖ్యం వాగ్భవం తత్ ఏవ।

అధః శివ శక్తి ఆఖ్యం అన్యత్ తృతీయం చ

ఇయం చాంద్రీ విద్యా పంచమే ధామని ।
ధ్యేయ ఇయం చాంద్రీ కామాధః శివాద్యకామా
స ఏవ కౌబేరీ షష్ఠే ధామని
వ్యాచక్షత ఇతి - య ఏవం వేద ।
శివ శక్త్యాఖ్యం వాగ్భవం తదేవ। అట్టి వాగ్భవమే ‘‘శివశక్త్యాత్మకము’’ అని కూడా పిలువబడుతోంది.

ఆ శివశక్త్యాత్మకమైనదే దిగువగా (అనన్యము నుండి) అన్యముగా ప్రదర్శనమౌతోంది. ఇది తృతీయము అనబడుతోంది.

ఇదియే ‘‘చాంద్రీ విద్య’’ - పంచమ (తురీయాతీత) ధామము. అదియే చాంద్రీ కామాధము, శివ-ఆద్య-కామము అని ధ్యానించవలసినది. దానిని ‘‘కౌబేరీ విద్య’’గా 6వ ధామము - అని వర్ణించబడుతోంది.
ఇది ఎరిగిన వాడు సమస్తము ఎరిగిన వ్యాచక్షులు (వ్యాచక్షత సిద్ధించుకున్నవారు).
హిత్వా ‘ఈ’ కారం (హిత్వేకారం)
తురీయస్వరగ్ం,
మొదటిదైన ‘‘విష్ణు’’ స్థానమును ఆభేదించి, రెండవదగు ‘‘శక్తికూటము’’ ‘‘శక్తి శివాద్యము’’తో సాముద్ర అనే రెండవస్థానమును అధిగమించి, మూలమంత్రము చేత బిందు హీనమైన శక్తిరూపమగు ‘‘హృల్లేక క్రోధము’’ ‘‘చాంద్రి-కౌబేరి విద్యా’’ అను మూడవస్థానమును ఎరిగి, ఉపాసనచే అధిగమించి (పైదంతా ‘ఈ’కారము) అట్టి ‘ఈ’ కారమును వదలి, ‘‘తురీయ స్వర్గము’’ను అధిగమించి,
సర్వ ఆదౌ సూర్యచంద్రమస్కేన
కామేశ్వర్య ఏవ అగస్త్య సంజ్ఞా

సప్తమే ధామని తృతీయం
ఏతస్యా ఏవ పూర్వోక్తాయాః కామాద్యం ।

ధ్విధా అధః కం మదనకళాద్యగ్ం శక్తిబీజం ।

వాగ్భవ ఆద్యంతయోః అర్థావశిరస్కం కృత్వా
ఆదియందుగల సూర్య - చంద్రా తేజో (దేవతా) రూపమగు ‘‘కామేశ్వరీదేవి’’కి సంజ్ఞ సమస్తము చేర్చినప్పుడు (సమర్పించినప్పుడు) కలుగు సంజ్ఞను ‘‘అగస్త్య సంజ్ఞ’’ - అంటారు.


సప్తమ ధామమందు పూర్వోక్తము (పైన చెప్పుకొన్న) మూడవ ధామము ‘‘కామాద్యం’’.


మొదట - రెండు (ద్విధా) క్రిందగా - ‘‘మదన కళాద్యము’’ అనే శక్తి బీజము (ఆలోచన భావన) జనించు స్థానము.

వాగ్భవకూటమునకు ఆది - అంతముగా (అటు - ఇటు చివరలుగా) ‘‘అర్థావ శిరస్కము’’ (సహనముగా తలవంచి) నమస్కరించాలి.
నంది విద్యేయం అష్టమే ధామని వాగ్భవం ఆగస్త్యం

వాగర్థ కళామయం కామకళాభిధం
సకలమాయా శక్తిః ప్రభాకరీ విద్యేయం

నవమే ధామని పునరాగస్త్యం వాగ్భవగ్ం
శక్తి మన్మథ శివశక్తి మన్మథ ఉర్వీమాయా కామకళాలయమ్
‘‘నంది విద్య’’ అనబడు అష్ఠావధానము (మరియు) ‘‘వాగ్భవము’’అయి ఉన్న (నవమ) ధామమునందు ఏకాగ్రం చేయటము ‘‘ఆగస్త్యము’’

అది వాగర్థ (వాక్ + అర్థ) కళామయము, కామ కళాభిధము, సకల శక్తి సమన్వితము - ‘‘ప్రభాకరీ విద్యా’’ ఇది - 9వ ధామము.

అట్టి 9వ ధామములో మరల వచ్చి ఉపాసన చేయాలి. అది ‘‘వాగ్భవ మన్మథము’’, శివశక్తి మన్మథము, ‘‘ఉర్వీమాయా’’ కామకళాలయము అనబడుతోంది.
9. చంద్ర సూర్య అనంగ ధూర్జటి
మహిమాలయం తృతీయగ్ం । షణ్ముఖీయం
విద్యా దశమే ధామని విద్యా ప్రకాశితయా
భూయ ఏవ అగస్త్య విద్యాం పఠిత్వా
భూయ ఏవ ఇమాం అంత్య మాయాం
పరమశివ విద్యేయం ఏకాదశే ధామని
భూయ ఏవ అగస్త్యం పఠిత్వా
ఏతస్యా ఏవ వాగ్భవం యద్ధనజం
కామకళాలయం చ, తత్ సహజం
కృత్వా, లోపాముద్రాయాః శక్తికూట
రాజం పఠిత్వా, వైష్ణవీ విద్యా ద్వాదశే (12)
ధామని వ్యాచక్షత ఇతి య ఏవం వేద ।
ఈ ‘9’వ స్థానములో - చంద్ర సూర్య, అనంగ, ధూర్జటి- షణ్ముఖీ మహిమాలయ తృతీయము, ఆరు ముఖములు గల షణ్ముఖీయము.

10వ ధామము : విద్యా ధామము : ఈ 10వ ధామము, విద్యా ప్రకాశ పూర్వకమైన ‘‘అగస్త్య విద్య’’ను పఠించాలి.

11వ ధామము : ‘‘అంత్యమాయ’’. ఈ 11వ ధామము నందు పరమశివ స్థానముగా ఉపాసించాలి. మరల అగస్త్య విద్య (మంత్రమును) ఈ 11వ ధామములో పఠించాలి.

12వ ధామము : దీనినే ‘‘వాగ్భవము’’ (వాక్కు జనించు) స్థానముగాను (కుబేరుని) ‘‘కామకళాలయ’’ మంత్రములతో ‘‘సహజ స్వరూపము’’తో, ఏకం చేయాలి. ‘‘లోపాముద్రా మంత్రము’’ను ‘‘శక్తి కూట రాజము’’ను పఠించాలి.

ఇది ద్వాదశ ధామము.ఇది వైష్ణవీ విద్యా ధామముగా చెప్పుకుంటున్నారు.
తాన్ హ ఉవాచ భగవాన్ :
సర్వే యూయగ్ం శ్రుత్వా పూర్వాం
కామాఖ్యాం తురీయ రూపాం తురీయాతీతాగ్ం
సర్వోత్కటాగ్ం సర్వమంత్రాసనగతాం
పీఠ ఉపపీఠ దేవతా పరివృతాగ్ం
సకల కలా వ్యాపినీం దేవతాగ్ం
సామోదాగ్ం సపరాగాగ్ం సహృదయాగ్ం,
స అమృతాగ్ం సకలాగ్ం స ఇంద్రియాగ్ం
సదోదితాం పరాం విద్యాగ్ం ।।
ఈ ‘12’వ ధామము యొక్క ఉపాసనాశీలురకు పరమాత్మ యొక్క బోధ.
భగవంతుడు (సద్గురువు) : దేవతలారా మీరందరూ శ్రవణ - అభ్యాసులై, ఇతఃపూర్వమే
1) కామాఖ్యము 2) తురీయ రూపము 3) తురీయాతీతము 4) సర్వోత్కటము 5) సర్వమంత్రాసన గతము లకు సంబంధించి పీఠదేవతలను, ఉపపీఠ దేవతలను ఉపాసిస్తూ వస్తున్నారు కదా !

అట్టి సమస్తముచే చుట్టూ కానబడి ఉన్న సకల కళావ్యాపిని అయిన ఆ ఆత్మ దేవాదిదేవిని ఎరుగచుండెదరు గాక ।
ఆ దేవత ఆమోదము పరాగములతో కూడి, హృదయముతో కూడి. అమృత సహితము, అట్టి నిత్యోదితము అయిన పరావిద్యను (ఆత్మవిద్యను) సుస్పష్ట పరచుకొనెదరు గాక.
10. స్పష్టీకృత్వా హృదయే నిధాయ
విజ్ఞాయా నిలయం గమయిత్వా

త్రికూటాం త్రిపురాం పరమాం
మాయాగ్ం శ్రేష్ఠాం పరమాం
వైష్ణవీగ్ం సన్నిధాయ
స్వస్వరూపిణి, సర్వ స్వరూపిణి అగు త్రిపురసుందరీదేవీ తత్త్వమును స్పష్టముగా హృదయమునందు భావించి, నిలుపుకొని, అట్టి తత్త్వమును (విజ్ఞాయా) తెలుసుకొని, (గమయిత్వా) అద్దాని యందు ప్రవేశించెదరు గాక! (జ్ఞాతుం । ద్రష్టుం । ప్రవేష్టుం ।)
దేవీతత్త్వము
త్రికూటము : ద్రష్ట-దర్శన-దృశ్యముల జనన స్థానము.
త్రిపురాం : జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు తన సంచార పురములుగా కలిగినట్టి దేవి ।
పరమాం : సమస్తమునకు ‘‘పరము’’ అయినట్టి
మాయాగ్ం : మాయా తన స్వకీయ కల్పితము అయినట్టి - దేవదేవి।
శ్రేష్ఠాం : సమస్తమునకు శేష్ఠాతిశ్రేష్ఠమైనది.
మాయాం : మాయ కూడా తన స్వరూపమే అయినట్టిది.
వైష్ణవీం : సర్వత్రా సర్వదా ఏర్పడి ఆక్రమించుకొని ఉన్నట్టిది.
అట్టి ఆత్మానందరూపిణి యగు త్రిపురేశ్వరిని హృదయములో సన్నిధానము, సమీపము, ఆశ్రయము చేసుకోవాలి.
హృదయ కమల కర్ణికాయాం పరాం భగవతీం
లక్ష్మీం మాయాగ్ం సదోదితాం,
మహా వశ్యకరీం,
మదన ఉన్మాదన కారిణీం
ధనుర్బాణ ధారిణీం,
వాక్ విజృంభిణీం,
చంద్రమండల మధ్యవర్తినీం,
చంద్రకళాగ్ం సప్తదశీం,
మహా నిత్య ఉపస్థితాం ।పాశ అంకుశ మనోజ్ఞ, పాణి పల్లవాగ్ం
సముద్యత్ అర్కనిభాం, త్రినేత్రాం విచింత్య
ఆ దేవిని ఈ విధంగా ధ్యానము చేయాలి.
❇︎ హృదయ కమలము అనే కర్ణికపై (కృష్ణాజనముపై) వేంచేసి సమస్తమునకు పరమై యుండియే ఆశీనురాలై ఉన్న ఆత్మాదేవీ।
❇︎ సమస్తమును వెలిగిస్తూ ఉన్న భగవతీ ।
❇︎ సమస్తము తన సంపదయే అగుటచే శ్రీలక్ష్మీ । శ్రీ మహాలక్ష్మీదేవీ।
❇︎ రచయితవలె సమస్తము తన మాయా కల్పనా విశేషముగా కలిగి ఉన్నట్టిదానా ।
❇︎ సత్ (ఉనికి) నుండి ఉదితము (ఉదయించినది) అగుటచే ‘‘సదోదితా’’ ।
❇︎ సమస్తము తన వశములో కలిగి ఉండటంచేత మహావశ్యకరీ!
❇︎ సమస్త జీవులలోని ఇచ్ఛాశక్తి, ఆశయ చమత్కారములు తానే అయి ఉండటం చేత మదన ఉన్మాదన కారిణీ !
❇︎ ఉత్తేజ రూపిణీగా సర్వదా ధనుర్బాణ ధారిణీ !
❇︎ వాక్ రూపములో జీవులందరి నోటిలో వేంచేసిన వాక్ విజృంభిణీ!
❇︎ (‘‘మనస్సు’’ అనే) చంద్రమండల మధ్యవర్తిణీ । - చంద్ర(జీవ) కళాస్వరూపిణీ ।
❇︎ షోడశ కళలకు ఆవల సప్తదశ (17) రూపీ !
ఈ విధంగా మహానిత్యముగా - ఉపస్థితమైనదిగా ఆ దేవి ఉపాసించబడు గాక ।

ఇంకాకూడా - ఆ త్రిపురేశ్వరి - పాశము అంకుశము ధరించిన లేత హస్తములు కలది । ఉదయిస్తున్న సూర్యుని వలె తేజోవిభవము గలది. ఆ త్రినేత్రిని విచింత్యం (విచారణ పూర్వకంగా) భావించెదరు గాక।
దేవీం మహాలక్ష్మీగ్ం సర్వలక్ష్మీమయీగ్ం
సర్వలక్షణ సంపన్నాగ్ం, హృదయే చైతన్య
రూపిణీం, నిరంజనాం త్రికూటాఖ్యాగ్ం
స్మితముఖీం సుందరీం మహామాయాగ్ం

సర్వసుభగాం, మహాకుండలినీం
త్రిపీఠ మధ్యవర్తినీం అకథాది శ్రీపీఠే
పరాం, భైరవీం, చిత్కళాం మహా
త్రిపురాం దేవీం ధ్యాయేత్ ।
మహా ధ్యాన యోగేన। ఇయం
ఏవం వేదేతి మహా ఉపనిషత్
ఇతి ప్రథమోపనిషత్ ।।
ఇట్లా ఇంకా ధ్యానించాలి :- మహాలక్ష్మీదేవి । తన జ్ఞాన సంపదచే సర్వత్రా నిండి ఉన్న సర్వలక్ష్మీమయి । సర్వలక్షణ సంపన్న । హృదయమున వేంచేసియున్న చైతన్యరూపిణీ । నిరంజన (నిర్మలా)। జాగృత్ స్వప్న సుషుప్తులకు జనన స్థానము (త్రికూట) । చిరునవ్వు చిందించే ముఖముగలది, మహామాయా స్వరూపిణీం।

- సమస్త శుభములు ప్రసాదించునది, జ్ఞాన ప్రకాశినీ।
- మహాకుండలినీ (విశ్వ కుండలినీ స్వరూపిణి) ।
- త్రిపీఠముల (త్రికాలముల, త్రి-అవస్థల) మధ్యగా వర్తించునది ।
‘‘అకథ’’ ఆది పీఠము నందు ఉపాసీనమై యున్న (కూర్చునియున్న) భైరవీ చిత్కళ ।
మహా త్రిపురదేవీ ।

ఈ విధంగా సర్వాత్మకి అగు త్రిపురాదేవిని మహాధ్యానయోగంగా తెలుసుకోవటమే మహోపనిషత్.

ఇతి త్రిపురా తాపిన్యుపనిషత్ అంతర్గత ‘‘ప్రథమోపనిషత్’’


ద్వితీయోపనిషత్

1. శ్లో।। ‘‘ఓం’’ అథ అతో ‘‘జాతవేదసే సునవామ సోమం’’
ఇత్యాది పఠిత్వా త్రైపురీ వ్యక్తిః లక్ష్యతే।

జాతవేదస ఇతి ఏకర్చ సూక్తస్య,
ఆద్య మధ్యమ్ అవసానేషు తత్ర
స్థానేషు, విలీనం బీజనాగర రూపం
వ్యాచక్ష్వ ఇతి ఋషయ ఊచుః ।

తాన్ హ ఉవాచ, భగవాన్ !
జాతవేదసే సునవామ సోమం
తత్ అంత్యమవాణీం విలోమేన
పఠిత్వా ప్రధమస్యాద్యగ్ం
తదేవ దీర్ఘం ద్వితీయస్య ఆద్యగ్ం
‘‘సునవామ సోమం’’ ఇతి ।
ఋషయః ఊచుః । ఋషులు భగవానుని అడుగుచున్నారు ।
ఓం। భగవన్ ! ఇప్పుడిక ‘‘జాతవేదసే సునవామ సోమం అరాతీయతో నిదహాతి వేదః।’’ - మొదలైన మంత్రములు పఠనము చేస్తూ ఉండగా త్రిపురములను వ్యక్తీకరిస్తున్న త్రైపురీవ్యక్తి (పరమశివుడు) ఎట్లా అనుభవమవగలడు ?
ఏది ఏక ఋక్కు రూపము అగు ‘జాతవేదసే’ అనే సూక్తము (ఋక్కు, మంత్రము) ఆది బీజములో ఆది - మధ్య - అంతము (మొదలు, మధ్య, చివర)గా స్థానము కలిగి ఉన్నదో, లీనమైయున్నదో అట్టి సూక్తము గురించి వివరించి చెప్ప ప్రార్థన.

భగవానుడు: ఋషులారా ! వినండి
జాతవేదసే । సునవామ సోమం। దీనిలోని అంత్యమ వాణి (2వ వాక్కు)ను విలోమముగా (అవరోహణ క్రమంగా, పైనుండి క్రిందకు) పఠించాలి - ఇది మొదటిసారి.
ఇక రెండవసారి ఈ ‘‘సునవామ సోమం’’ అనే ద్వితీయ భాగమును దీర్ఘముగా ‘‘సు-న-వా-మ-సోమం’’ (దీర్ఘముగా గానం చేయాలి, పఠించాలి).
అనేన కౌళం వామగ్ం శ్రేష్ఠగ్ం సోమం
మహా సౌభాగ్యం ఆచక్షతే ।

స సర్వ సంపత్తి భూతం
ప్రథమం నివృత్తి కారణం।

ద్వితీయగ్ం స్థితి కారణం ।

తృతీయగ్ం సర్గ కారణం ।

ఇతి అనేన కరశుద్ధిం కృత్వా,
త్రిపురా విద్యాగ్ం స్పష్టీకృత్వా జాతవేదసే
సునవామ సోమం ఇత్యాది పఠిత్వా
మహా విద్యేశ్వరీ విద్యాం ఆచక్షతే ।।
అట్టి పఠనము - కౌళము (ఉత్తమ సాధనము) వామము, శ్రేష్ఠము, ‘‘సోమము, మహత్ భాగ్యము అవగలదు’’ అని మంత్రసిద్ధి పొందిన గురువుల సూచన.

మొదటిదైన ‘‘జాతవేదసే’’ అనే ఋక్కులోని ప్రథమ భాగము సర్వసంపత్తిని ప్రసాదించునది. నివృత్తి (Withdrawal from the world of differences) కారణము.

ఇక రెండవది (‘‘సునవామ సోమం’’) (ఆత్మ భావనయందు) - స్థితి కారణము.

ఇక మూడవది ‘‘సర్గ’’ (అరాతీయతో నిదహాతి వేదః అనునది ఆత్మతో మమైక) - కారణము.

ఈ మంత్రములో కరశుద్ధి (కర్మలు పవిత్రము) నిర్వర్తించుకొని, త్రిపురవిద్య (జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవే అయినట్లు) త్రిపురా విద్యను హృదయములో సుస్పష్ఠీకరించుకొని, ‘‘జాతవేదసే సునవామ సోమం’’ మొదలుగా గల మంత్రమును పఠనం చేస్తూ ఉండటమును ‘‘మహా విద్యేశ్వరీ విద్య’’ అని అంటారు.
2. త్రిపురేశ్వరీం - ‘‘జాతవేదస’’ ఇతి ।
‘‘జాతే’’ ఆద్య అక్షరే మాతృకాయాః శిరసి
బైందవం అమృతరూపిణీం కుండలినీం
త్రికోణ రూపిణీం చ ఇతి వాక్యార్థ।
ఏవం ప్రథమస్య ఆద్యం వాగ్భవం
ద్వితీయం కామకళాలయం ।
‘‘సర్వరక్షాకరీ విద్య’’
త్రిపురేశ్వరిని ‘‘జాతవేదసే’’ - అని ఉపాసించాలి. ‘‘జాత’’ అను మొదటి రెండు అక్షరములు మాతృకల యొక్క శిరస్సునందు ‘‘బైందవము, అమృతరూపినీ, కుండలినీ, త్రికోణ రూపిణీ’’ అని వాక్యార్థము.
ఈ విధంగా ప్రథమము (ప్రారంభము) యొక్క ఆద్యము ‘‘వాగ్భవము’’.
రెండవది - ‘‘కామకళాలయము’’.
‘‘జాత’’ ఇతి అనేన పరమాత్మన
ఉత్ జృంభణం
‘‘జాత’’ ఇతి ఆదినా ‘పరమాత్మా శివ’ ఉచ్యతే ।
జాత మాత్రేణ కామీ కామయతే
కామం ఇతి ఆదినా పూర్ణం వ్యాచక్షతే ।

తత్ ఏవ సునవామ గోత్ర ఆరూఢం
మధ్యవర్తినా అమృత మధ్యేన అర్ణేన
మంత్రార్ణాన్ స్పష్టీకృత్వా।
గోత్ర ఇతి నామ గోత్రాయాం ఇత్యాదినా స్పష్టం
‘‘జాత’’ - అను శబ్దము ‘‘పరమాత్మ’’ యొక్క ‘‘విజృంభణము’’ సూచించునది.
‘‘జాత’’ యొక్క ఆది (The basic begining)ను ‘‘పరమాత్మ శివ’’ అని చెప్పబడుతోంది.
‘‘జాత’’ మాత్రము చేతనే శివతత్త్వము పట్ల ‘‘కామ’’ (one who desires) అయి శివతత్వమును ‘‘కామీ కామయతే కామం’’ - అనబడుతోంది. ‘ఇత్యాదిచే పూర్ణము’ అని అంటారు.

అదే ‘‘సునవామ’’ గోత్ర అరూఢము - మధ్యవర్తి అయిన అమృత మధ్యమైన ‘‘అర్ణము’’ మంత్రార్ణమును స్పష్టీకరించుకోవాలి.
‘‘గోత్ర’’ అనే నామముచే ‘‘గోత్రము’’ (Raise up)ను స్పష్టం చేసుకోవాలి (స్పష్టీకరించుకోవాలి).
కామకళాలయగ్ం శేషం
వామం ఇత్యాదినా పూర్వేణాధ్వనా
విద్యేయగ్ం సర్వరక్షాకరి ఇతి ఆచక్షతే ।
ఏవం ఏత ఏన విద్యాం త్రిపుర ఈశీగ్ం
స్పష్టీకృత్వా ‘‘జాత వేదస’’ ఇతి
ఆదినా జాతో దేవ ఏక ఈశ్వరః ।

పరమో జ్యోతిః మంత్రతో వేతి తురీయం
వరం దత్వా బిందుపూర్ణ జ్యోతిః స్థానం కృత్వా
ప్రధమస్య ఆద్యం, ద్వితీయం చ
తృతీయం చ సర్వ రక్షాకరీ సంబద్ధం కృత్వా ।
కామకళాలయమును తెలుసుకొని, ‘‘వాం’’ మొదలైన పూర్వమార్గముచే (‘‘సునవాం’’లో ‘సున’ మార్గముచే) ప్రవచితమైన ‘‘శ్రీవిద్య - సర్వరక్షాకరి’’ అని చెప్పబడుతోంది.
అట్టి త్రిపురీ విద్యను స్పష్టీకరించుకొని, ‘‘జాతవేదస’’ అను ఆదిచే ‘‘జాతోదేవ ఏకీశ్వరః’’ - ‘‘ఈశ్వరుడు ఏకరూపుడు మొదటగా, సర్వదా కూడా ।’’ అని గ్రహించబడు గాక ।


అట్టి ఈశ్వరుడు సమస్తమునకు పరమజ్యోతి స్వరూపుడు. ‘‘పరమోజ్యోతి’’ - మనన రూప మంత్రం వలన తురీయవర స్థానమును చేరి, దానిని ‘‘బిందుపూర్ణ జ్యోతిస్థానము’’గా దర్శించాలి.
‘‘జాతవేదసే సునవామ సోమః’’ మంత్రము యొక్క ప్రథమంచే ఆద్యమును (మొదటి దాని యొక్క మొదలును), రెండవదానిని మూడవదానిని ‘‘సర్వరక్షాకరీ సంబద్ధము’’గా చేయాలి.
3. విద్యాం ఆత్మా ఆసన రూపిణీగ్ం స్పష్టీకృత్వా,
‘జాతవేదసే సునవామ సోమం’
ఇత్యాది పఠిత్వా, రక్షాకరీ విద్యాగ్ం స్మృత్యా,

ఆద్యంతయోః ధామ్నోః
శక్తి శివరూపిణీం వినియోజ్య

స ఇతి ‘శక్తి’ ఆత్మకం, వర్ణం సోమం ఇతి ।
శైవాత్మకం ధామ జానీయాత్ యో జానీతే
‘‘స’’ సుభగో భవతి

ఏవం ఏతాం చక్ర-ఆసనగతాం
త్రిపుర వాసినీం విద్యాగ్ం స్పష్టీకృత్వా,
‘‘జాతవేదసే సునవామ సోమం’’ ఇతి పఠిత్వా,

త్రిపురేశ్వరీ విద్యాగ్ం సదోదితాగ్ం
శివశక్త్యాత్మికాం ఆవేదితాం, జాతవేదాః ‘శివ’ ఇతి ।

‘స’ ఇతి (సేతి) శక్త్యాత్మా అక్షరం ఇతి !
‘‘జాతవేదసే సునవామ సోమం’’ ఇత్యాదిగా గల (దుర్గాసూక్త) మంత్రమును (ఋక్కును) పఠిస్తూ, శ్రీ విద్యచే ‘‘ఆత్మాసనరూపిణి’’ - అగు త్రిపుర సుందరిని స్పష్ఠీకరించుకొంటూ, ‘‘రక్షాకరీవిద్య’’ను ధారణచే స్మరించుకుంటూ ఉండాలి.

ఆద్యంతము (From the begining till the end) శక్తి - శివ ఏకరూప ధామము (స్థానము)ను వినియోగించుకుంటూ ఉండాలి.

‘‘సోమ’’లో ‘‘స’’ - శక్త్యాత్మక వర్ణము. ‘‘సోమ’’ - ఇతి (అని) శైవాత్మక వర్ణమును తెలుసుకుంటూ, ‘‘ద్యో’’ను ఎరుగుచున్నవాడు సర్వసుభాగములను (సుందరము, యోగము ఐనవన్నీ) పొందగలడు. మంగళ ప్రదమైనవన్నీ సిద్ధించుకుంటున్నాడు.

ఈ విధంగా ‘‘చక్రాసనగతము’’ అయినట్టి ‘‘త్రిపురవాసినీ విద్య’’ని హృదయంలో సుస్పష్టపరచుకోవాలి. అందుకుగాను ‘‘జాతవేదసే సునవామ సోమం…’’ ఋక్కును పఠిస్తూ ఉండాలి.

అట్టి త్రిపురేశ్వరీ విద్యచే సదోదితము (‘‘సత్’’ నుండి ఉదితము), శివశక్త్యాత్మకము నుండి బయల్వెడలినది అగు జాతవేదసుడే ‘‘శివుడు’’.


‘‘స’’ - అనగా అక్షరమగు శక్త్యాత్మకము.
శివాదిశక్తి అంతరాళ భూతాం త్రికూటాది చారిణీగ్ం
సూర్యా చంద్రమస్కాం మంత్రాసన గతాం
త్రిపురాం మహాలక్ష్మీగ్ం సదోదితాగ్ం స్పష్టీకృత్వా

‘జాతవేదసే సునవామ సోమం’
ఇత్యాది పఠిత్వా, పూర్వాగ్ం
సదాత్మాసన రూపాం విద్యాగ్ం స్మృత్వా

వేద ఇత్యాదినా విశ్వా హాసంత ఉదయ బైందవం
ఉపరి విన్యస్య సిద్ధాసనస్థాం త్రిపురాం
మాలినీ విద్యాగ్ం స్పష్టీకృత్వా ।।
‘‘శివ’’ అనబడు శివాదిశక్తికి అంతరభూతమును (‘‘శక్తియే శివ’’గా) గమనించాలి. ‘‘త్రికూట-ఆది సంచారణి’’, ‘‘సూర్య చంద్రాత్మికము’’, ‘‘మం’’త్రాసన గతము (మర్ధనము యొక్క అంతర ధ్యానదేవి), అగు త్రిపురేశ్వరీ మహాలక్ష్మీని బుద్ధికి స్పష్టీకరించుకోవాలి.

‘‘జాతవేదసే సునవామ సోమం’’ ఋక్కు (మంత్రము)ను పఠిస్తూ సమస్తమునకు ‘‘పూర్వమే’’ ప్రకాశమానమై ఉన్న ‘‘ఆత్మాసనరూప’’ విద్యను స్మరిస్తూ ఉండాలి.

వేదోపనిషత్ - మొదలైన వాటిచే విశ్వాహాసంత-ఉదయ బైందవము (ఈ విశ్వరచనా చమత్కృతి)కి ఆవల విన్యాస రూపిణి అయి సిద్ధాసనము నందు వేంచేసిన ‘‘త్రిపురా మాలిని’’ గురించిన విద్యను స్పష్టీకరించుకోవాలి.
4. ‘‘జాతవేదసే సునవామ సోమం’’
ఇత్యాది పఠిత్వా త్రిపురాగ్ం సుందరీగ్ం శ్రిత్వా,

కలే అక్షరే విచింత్య

మూర్తి-భూతాం మూర్తి రూపిణీగ్ం, సర్వ -
విద్యేశ్వరీం త్రిపురాం విద్యాగ్ం స్పష్టీ కృత్వా
‘‘జాతవేదస’’ ఇత్యాది పఠిత్వా
త్రిపురాం లక్ష్మీగ్ం శ్రిత్వా అగ్నిం నిదహాతి ।।
ఈ విధంగా ‘‘జాతవేదసే సునవామ సోమం…’ ఇత్యాదిగా గల సూక్తమును పఠిస్తూ, బాల త్రిపుర సుందరీదేవిని ఆశ్రయించాలి.

కలే (రేతస్సు రూపంగా ఉండి ఉన్నట్టి) అక్షర రూపమును విచారణ చేస్తూ ఉండాలి.

ఈ త్రిజగత్తులుగా మూర్తీభవించినది, మూర్తి రూపిణీ సర్వ విద్యలకు ఈశ్వరి అయినట్టి త్రిపురీ సంబంధమైన త్రిపురా విద్యను స్పష్టీకరించుకోవాలి.
‘‘జాతవేదస…’’ ఇతి ఆదిగా గల సూక్తమును పఠిస్తూ త్రిపురా లక్ష్మీదేవిని ఆశ్రయిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేయాలి.
స ఏవ ఇయం అగ్ని ఆసనే జ్వలతి ఇతి విచింత్య


త్రిజ్యోతిషం ఈశ్వరీం త్రిపురాంఅంబాం విద్యాగ్ం స్పష్టీకుర్యాత్,
ఆ త్రిపురేశ్వరీదేవి అగ్నియందు ప్రజ్వలిస్తూ ఉన్నదని (విచింత్యము) భావించాలి.

అట్టి త్రి-జ్యోతి స్వరూపిణి (జగత్ జ్యోతి, జీవజ్యోతి, అఖండజ్యోతి స్వరూపిణి) సమస్తముగా విస్తరించియున్న ఈశ్వరీ, జాగ్రత్- స్వప్న-సుషుప్తి పురములు తానే అయివున్న
త్రిపురాం - త్రిపురముల స్వరూపిణి,

‘‘అంబాం’’-‘‘అంబ’’ అను పేరుగలది.
‘‘త్రిజ్యోతిషం ఈశ్వరీం త్రిపురాం అంబాం విద్య’’ -ను స్పష్టీకరించుకోవాలి
ఏవం ఏత ఏన స నః
పర్షదతి దుర్గాణి విశ్వా ఇతి ఆది,
పరమ ప్రకాశినీ ప్రత్యక్ భూతా
కార్యా విద్యేయం ఆహ్వాన కర్మణి
సర్వతోధీరా ఇతి వ్యాచక్షతే ।
‘‘స నః పర్షదతి దుర్గాణి విశ్వా’’ - ఈ సంక్లిష్టమగు విశ్వమును చిత్రీకరించి ప్రసాదించు దేవి । పరమప్రకాశిని (ఆ సమస్తమునకు, పరమ-ఆవలగా ప్రకాశమానమై యున్నది) పంచభూతములకు ప్రత్యేకమై (వేరై) సమస్త భౌతికమునకు నిర్మాత । సృష్టి కార్యమును నిర్వర్తించునది। అట్టి ఆ దేవ దేవియే సర్వత్రా ‘ధీ’ (బుద్ధి) రూపిణి - అయి సమస్త కర్మలు నిర్వర్తించుచున్నది.
ఏవం ఏతత్ విద్యాష్టకం మహా మాయా
దేవీ - అంగభూతం వ్యాచక్షతే ।
ఇదంతా కూడా ఆ దేవి యొక్క మహామాయా - విద్యాష్టకమే । (అష్టవిధ ప్రకృతి = పంచభూతములు + మనో బుద్ధి చిత్తములు / అపరేయం ఇతి) ఇదంతా శ్రీదేవి యొక్క అంగములకు శరీరము వంటిదని - దేవీ అంగభూతము గురించి చెప్పబడుతోంది.
దేవ ఆహ వై భగవంతం అబ్రువన్
‘‘మహాచక్ర నాయకం నో బ్రూహి ఇతి’’ ।

సార్వ కామికగ్ం సర్వా ఆరాధ్యగ్ం సర్వరూపం
విశ్వతోముఖం మోక్షద్వారం యత్ యోగిన
ఉపవిశ్య పరంబ్రహ్మ భిత్త్వా నిర్వాణం ఉపవిశంతి ఇతి ।

తాన్ హ ఉవాచ :
భగవాన్ । శ్రీచక్రం వ్యాఖ్యాస్యామ - ఇతి ।
దేవతలు భగవానుని ఈ విధంగా అర్థించారు :
దేవతలు : ఓ మహాదేవా ! ‘‘మహాచక్ర నాయకము’’ గురించి మాకు దయతో వివరించి చెప్పండి.

‘‘సర్వకామికము, అందరికీ ఆరాధ్యము, సర్వస్వరూపము, ఈ విశ్వమంతా తన ముఖముగా కలిగియున్నది’’ - అగు ఏ పరబ్రహ్మము అనే మోక్షద్వారము తెరచి ‘‘నిర్వాణము’’ అను స్థానములో యోగులు ప్రవేశించి ప్రశాంతానందులై ఉంటున్నారు ?

భగవానుడు : మీరు అడిగిన దానికి సమాధానముగా మనము ‘‘శ్రీచక్రము’’ గురించి వివరించుకుందాము. వ్యాఖ్యానించుకుందాము.
5. త్రికోణం త్ర్యశ్రం కృత్వా

తత్ అంతర్మధ్యవర్తి వృత్తమాన యష్టీరేఖాం ఆకృష్య
విశాలం నీత్వా అగ్రతో యోనిం కృత్వా అపూర్వా
మూడు భుజములుగల త్రికోణము చేసి ఆ త్రికోణములోపల ‘‘మధ్యవర్తి’’ అయి మానయష్ఠీ రేఖను లాగి
త్రికోణము ఆ మధ్యవర్తిని విశాలము చేసి, పైనగా ‘యోని’ (రంధ్రము) చేసి, పూర్తి చేయాలి.
యోని అగ్రరూపిణీం మానయష్టిం
కృత్వా తాగ్ం సర్వ ‘‘ఊర్ధ్వాం’’ నీత్వా యోనిం
కృత్వాద్యం త్రికోణం చక్రం భవతి ’
ద్వితీయం అంతరాళం భవతి ।
తృతీయం అష్టయోని అంకితం భవతి ।।
యోని అగ్రరూపిణి అయినట్టి మానయష్ఠి (దండ)వలె చేసి, అంతకు ఊర్ధ్వముగా పొడిగించి, ‘యోని’గా చేస్తే మొదటిది ‘‘ఆద్య త్రికోణం చక్రము’’ అగుచున్నది.
- ద్వితీయము (రెండవది) - ‘‘అంతరాళము’’ అగుచున్నది.
- మూడవది ‘‘అష్ఠయోనీ అంకితము’’గా అవుతోంది.
అథ అష్టార చక్ర ఆద్యంత విదిక్ కోణాగ్రతో
రేఖాం నీత్వా, సాధ్యాది ఆకర్షణ బద్ధరేఖాం
నిత్వేతి, ఏవ మధోర్ధ్వ సంపుట యోని అంకితం
కృత్వా, కక్షాభ్య ఊర్ధ్వగ రేఖాచతుష్టయం
కృత్వా యథా క్రమేణ మానయష్టిద్వయేన
దశయోని అంకితం చక్రం భవతి ।।
ఇక అష్టభుజ (8) చక్రమును ఆద్యంతము, అన్ని దిక్కుల కోణాగ్రములతో కూడిన రేఖలను పొడిగించి, సాధ్యాది ఆకర్షణ బద్ధ రేఖను పొడిగించాలి. పైన క్రింద సంపుట యోనీ - అంకితము చేయాలి. కక్ష్యల నుండి, ప్రక్కలకు రేఖలను పైకి పోవు విధంగా గీసి యథాక్రమంగా ‘‘మానయష్టిద్వయము’’ చేసినప్పుడు - ఆది ‘‘దశయోని అంకితము’’ అవుతోంది.
అనేన ఏవ ప్రకారేణ పునః దశ అర చక్రం భవతి ।

మధ్య త్రికోణ అగ్ర చతుష్టయాత్ రేఖా అచర అగ్ర కోణేషు
సంయోజ్య తత్ దశారాంశతో నీతాం మానయష్టి
రేఖాం యోజయిత్వా చతుర్దశారం చక్రం భవతి ।

తతో అష్ట పత్ర సంవృతం చక్రం భవతి
షోడశ పత్ర సంవృతం చక్రం చతుర్ద్వారం భవతి ।
తతః పార్థివ చక్రం చతుర్ద్వారం భవతి ।
ఈ ప్రకారంగా మరల (పునఃనిర్వర్తించటం చేత ‘‘దశార చక్రము’’ అవుతుంది.

మధ్య త్రికోణము - అగ్ర చతుష్టయము - రేఖాచార - అగ్ర చతుష్టయము యొక్క కోణములందు కలిపి, దశార చక్రాంశలను పొడిగించి, మానరేఖను కలిపితే అది ‘‘చతుర్దశార చక్రము’’ అవుతుంది.

పై విధంగా ‘‘అష్టపత్ర సంవృత చక్రము’’ అగుచున్నది.
షోడశ (16) పత్ర సంవృతము అగు చక్రము చతుర్ద్వారము కలిగినది అవుతుంది. అద్దాని పార్థివ చక్రము ‘‘చతుర్ద్వారము’’.
ఏవగ్ం సృష్టి యోగేన చక్రం వ్యాఖ్యాతమ్

నవాత్మకం చక్రం ప్రాతి లోమ్యేన వా వచ్మి ।

ప్రథమం చక్రం త్రైలోక్య మోహనం భవతి ।।
ఈవిధంగా ‘‘సృష్టియోగ చక్రము’’ వ్యాఖ్యానించబడుతోంది.

‘‘నవాత్మక చక్రము’’ను ప్రతిలోమ్యముగా (అవరోహన క్రమంగా) చెప్పుకొందాము.

ప్రథమ (మొదటి) చక్రము ‘‘త్రైలోక్య మోహనము’’.
6. స అణిమాది అష్టకం భవతి।

స మాత్ర అష్టకం భవతి ।

స సర్వ సంక్షోభిణీ ఆది దశకం భవతి ।।


స ప్రకటం భవతి । త్రిపురయాధిష్ఠితం భవతి ।
స సర్వ సంక్షోభిణీ ముద్రయా జుష్టం భవతి ।
అట్టి ఈ చక్రోపాసనము ‘‘అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ వశియా, ప్రాకాన్యు, ఇచ్ఛా’’ అనబడే - అష్ట సిద్ధులు ప్రసాదించునది.

అట్టి వానికి మాత్రాష్టకము (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, చాముండి, వారాహి, ఇంద్రాణి) అనుగ్రహము సిద్ధించగలదు.

‘‘సర్వ సంక్షోభిణి’’ మొదలుగా గల దశకము యొక్క అనుగ్రహము పొందగలరు.

త్రిపురేశ్వరీ ఆత్మవిద్య ప్రకటనమవగలదు.
‘‘సర్వసంక్షోభిణీ ముద్ర’’ ధారణ చేసిన ఫలము లభించగలదు.

ద్వితీయగ్ం సర్వ ఆశా పరిపూరకం చక్రం భవతి ।
స కామాది ఆకర్షిణీ షోడశకం భవతి ।
స గుప్తం భవతి । త్రిపురేశ్వరి అధిష్ఠితం భవతి।
‘‘సర్వవిద్రావిణీ’’ - ముద్రయా జుష్టం భవతి ।।

తృతీయగ్ం సర్వ సంక్షోభణం చక్రం భవతి ।
స అనంగ కుసుమాది అష్టకం భవతి ।
స గుప్తతరం భవతి । త్రిపుర సుందర్యా అధిష్టితం భవతి ।
సర్వాకర్షిణీ ముద్రయా జుష్టం భవతి ।
ద్వితీయ (రెండవ) చక్ర సిద్ధి : ఇది సర్వ ఆశలు, ఆశయాలు సిద్ధింపచేయు చక్రము. ‘కామ’ ఆదిగా గల ‘‘ఆకర్షిణీ షోడశకం’’ (16) అనే ఫలము పొందగలరు. గుప్తమగు ఆత్మభావన అనునిత్యమవగలదు. ‘‘త్రిపురీ, అధిష్ఠితము లభించగలదు - ‘‘సర్వ విద్రావిణీ ముద్ర’’ ఫలము పొందగలరు.

తృతీయ (మూడవ) చక్రోపాసనచే సర్వ సంక్షోభణ చక్రము ‘‘అనంగ కుసమ’’తో మొదలయ్యే అష్ట 5 (అష్టమాతృక) అనుగ్రహము, గుప్త తరము లభించగలవు. త్రిపుర సుందరీ అధిష్ఠానము పొందగలరు. సర్వాకర్షిణీ ముద్ర సిద్ధించగలదు.
తురీయగ్ం సర్వ సౌభాగ్యదాయక చక్రం భవతి ।
స సర్వ సంక్షోభిణీ ఆది ద్విసప్తకం భవతి ।
స సంప్రదాయం భవతి । త్రిపురవాసిని అధిష్ఠితం భవతి ।
స సర్వవశంకరీ ముద్రయా జుష్టం భవతి ।

తురీయాంతగ్ం ‘‘సర్వార్థ సాధకం చక్రం’’ భవతి ।
స సర్వసిద్ధి ప్రదాది దశకం భవతి। సకల కౌళం భవతి।

త్రిపురా మహాలక్ష్మీ అధిష్ఠితం భవతి ।
మహా ఉన్మోదినీ ముద్రయా జుష్ఠం భవతి ।
4వదగు ‘‘తురీయగము’’ అనబడే చక్రము ‘‘సర్వ సౌభాగ్యదాయక చక్రము’’. అది ‘సర్వసంక్షోభిణీ’ ఆదిగా ‘‘ద్విసప్తకము’’ (14) అనబడుతోంది. అది సంప్రదాయకము. త్రిపురవాసిని యొక్క అధిష్ఠము. అది ‘‘సర్వ వశంకరీ ముద్ర’’ తో కూడినది.

అట్టి తురీయాంతం (5వది) సర్వార్థ సాధకము. ‘‘సర్వసిద్ధి ప్రదము’’ మొదలగు దశకము (10) లభించగలదు. ‘‘సకల కౌళము’’ అవగలదు.

మహాలక్ష్మీ అధిష్ఠితము, మహా ఉన్మోదినీ ముద్రతో కూడినది.
షష్ఠగ్ం సర్వరక్షాకరం చక్రం భవతి । స సర్వజ్ఞత్యాది
దశకం భవతి । స నిర్గర్భం భవతి । త్రిపురమాలిని
అధిష్ఠితం భవతి । మహా అంకుశ ముద్రయా జుష్టం భవతి।

సప్తమగ్ం సర్వరోగ హరం చక్రం భవతి ।
స ‘వశిని’ ఆది - అష్టకం భవతి ।

స రహస్యం భవతి ।

త్రిపుర సిద్ధయా అధిష్ఠితం భవతి ।
ఖేచరీ ముద్రయా జుష్టం భవతి ।
‘‘6’’వ చక్రము సర్వరక్షాకర చక్రము, ‘సర్వజ్ఞత్వము’ మొదలుగా దశకము, నిర్భరము (అతిశయము) త్రిపురామాలినీ అధిష్ఠితము. మహా అంకుశ ముద్రతో కూడినది.

సప్తమ చక్రము సర్వరోగ హర చక్రము. వశిని ఆది (వశిన్యాది) అష్టకముతో (అష్ట సిద్ధితో) కూడినది.

పై విశేషముతో కూడిన శ్రీచక్రోపాసనచే (త్రిపురా రహస్యం) । (దష్ట-దృశ్యముల ఏకత్వ రూపమగు సో2హమ్ తత్త్వమ్)ను పొందుతాడు.

త్రిపుర తత్త్వసిద్ధిచే అధిష్ఠితుడు (Achieved) అవుతాడు. ఖేచరీముద్రను సేవించినవానికి అది తేలికగా లభించగలదు.
7. అష్టమం సర్వసిద్ధిప్రదం చక్రం భవతి ।
స ఆయుధ చతుష్టయం భవతి ।
స పర - అపర రహస్యం భవతి ।
త్రిపుర అంబయా అధిష్ఠితం భవతి ।
బీజ ముద్రయాం జుష్టం భవతి ।
అష్టమ (8వ) చక్రోపాసన సర్వసిద్ధి ప్రదమైనది. ఆయుధ చతుష్టయము (విష్ణుదేవుని బాణము, ఖడ్గము, శంఖము, చక్రముల ప్రభావము) పొందగలడు. త్రిపురాంబికచే అధిష్టితము. బీజము ధరించిన వానికి సులభ్యము.
(బీజోపాసన = సమస్త భావపరంపరలకు ‘ఆది’ అగు ఉత్పత్తి స్థానమును బుద్ధితో గమనించి ఉపాసించటము).
నవమం చక్రనాయకగ్ం సర్వ ఆనందమయం చక్రం భవతి ।
స కామేశ్వరి ఆది త్రికం భవతి ।
స అతి రహస్యం భవతి ।
మహా త్రిపుర సుందర్యా అధిష్ఠితం భవతి ।
యోని ముద్రయా జుష్ఠం భవతి ।
సంక్రామంతి వై సర్వాణి ఛందాగ్ంసి చక్రారాణి
తత్ ఏవ చక్రగ్ం శ్రీ చక్రమ్ ।
నవమ (9వ) చక్రము : ఇది చక్రనాయకము, సర్వానందమయ చక్రము. కామేశ్వరి ఆదిగా - ‘‘త్రి (3) క యుక్తము’’ అతి రహస్యము. మహాత్రిపుర సుందరిచే అధిష్ఠితము. ‘యోనిముద్ర’తో కూడినది. (త్రికోణయుక్తము = కామేశ్వరీ । భగమాలినీ । వారాహీ । ఇచ్ఛ-బుద్ధి-ఆలోచనా స్రవంతుల అధిదేవతలు)
సమస్త ఛందస్సులు (వేదములు) చక్రపుటాలుగా సంక్రమిస్తున్నాయి.
ఈ చక్రమే ‘‘శ్రీచక్రము’’.
తస్యనాభ్యాం అగ్నిమండలే సూర్యా చంద్రమాసౌ ।
తత్ర ఓంకార పీఠం పూజయిత్యా


తత్ర అక్షరం బిందురూపం ।

తత్ అంతర్గత వ్యోమరూపిణీం । విద్యాం పరమాగ్ం
స్మృత్వా మహాత్రిపుర సుందరీం ఆవాహ్య।
మహాదేవులు దేవతలతో శ్రీచక్రము గురించి ఇట్లు చెప్పసాగారు.
మహాదేవుడు : అట్టి శ్రీచక్రము యొక్క నాభియందు (మధ్యగా) అగ్నిమండలము. ఆ మండలమునందు సూర్య-చంద్రులను భావించాలి. అందు ‘ఓం’కార పీఠమును పూజించాలి.

అందు (.) బిందురూపాక్షరమును, బిందువు క్షరము లేని ఆత్మకు సంజ్ఞగా ఉపాసించాలి. ‘ఓం’కారమును పఠించాలి.

ఆకాశ రూపిణి పరమ విద్యాస్వరూపిణి అగు దేవిని స్మరించాలి. మహా త్రిపురసుందరిని ఆహ్వానించి మానసిక పూజ, ఆయా పూజా ద్రవ్యములుతో పూజ నిర్వర్తించాలి.
క్షీరేణ స్నాపితే దేవీ చందనేన విలేపితే ।
బిల్వపత్ర అర్చితే మాతః
దుర్గే అహం శరణం గతః ।

ఇతి ఏకయర్చా ప్రార్థ్య
మాయా లక్ష్మీ మంత్రేణ పూజయేత్ ।

ఇతి భగవాన్ అబ్రవీత్ ।
ఏతైః మంత్రైః భగవతీమ్
యజేత్, తతో దేవీ ప్రీతా భవతి ।
స్వ ఆత్మానం దర్శయతి।
ఓ త్రిపుర సుందరీదేవీ ! నీకు ఇదిగో క్షీరముతో స్నానము చేయించి, చందనము (గంధము)తో పూత పూస్తూ పూజిస్తున్నాను. బిల్వ (మారేడు) పత్రములతో సేవిస్తున్నాను. ఓ దుర్గాదేవీ ! నీకు శరణాగతుడను అగుచున్నాను.

ఈ విధంగా ఋక్కులతోనూ ‘‘నమస్తేస్తు మహామాయే ! శ్రీపీఠే । సురపూజితే….!’’ అను లక్ష్మీ అష్టకముతో (మాయా లక్ష్మీ మంత్రముతో) పూజించాలి.

భగవానుడు : ఓ దేవతలారా ! అట్టి మంత్రముతో, పూజా ద్రవ్యములతో, శ్రీచక్ర అంతర్గతమైన శ్రీదేవిని పూజిస్తూ ఉండగా ఆ త్రిపురాదేవి ప్రీతి చెందును.
ఆ విధంగా తుష్టి చెందిన ఆ దేవి ఆత్మయొక్క స్వరూపమును దర్శింపజేయగలదు.
తస్మాత్ య ఏతైః మంత్రైః యజతి
స బ్రహ్మ పశ్యతి । స సర్వం పశ్యతి ।
సో అమృతత్వం చ గచ్ఛతి య ఏవం వేద।
ఇతి మహోపనిషత్।।
ఈ విధంగా శ్రీచక్ర నాభిస్థాన అంతర్గత అగు ఆ శ్రీచక్ర త్రిపుర సుందరిని (‘‘జాతవేదసే’’, ‘‘నమస్తేస్తు మహామాయే’’ మొదలైన) మంత్రములతో ఉపాసించువాడు బ్రహ్మమును దర్శించగలడు. జనన మరణ చక్రమునుండి విడివడి అమృతత్వము సిద్ధించుకోగలడు. ఆత్మను ఎరుగగలడు.

ఇతి త్రిపురా తాపిన్యుపనిషత్ అంతర్గత ‘‘ద్వితీయోపనిషత్’’


తృతీయోపనిషత్

1. ‘‘ఓం’’ దేవా హ వై ముద్రాః సృజేమేతి ।
భగవంతం అబ్రువగ్ం ।
తాన్ హ ఉవాచ భగవాన్ -
అవనికృతజాను మండలం విస్తీర్య,

పద్మాసనం కృత్వా, ముద్రాః సృజత ఇతి ।

స సర్వాన్ ఆకర్షయతి యో యోనిముద్రాం అధీతే,
స సర్వం వేత్తి ।
స సర్వఫలం అశ్నుతే ।
స సర్వాన్ భంజయతి ।
స విద్వేషిణగ్ం స్తంభయతి ।
దేవతలు : భగవాన్ ! ఇప్పుడు ఇక మేము దేవీధ్యానము కొరకై ముద్రలను సృజించదలచుచున్నాము.

భగవానుడు : ఓ దేవతలారా ! అట్లాగే సృజించండి. నేలపై ఆశీనులై మోకాళ్ళను ‘‘విస్తరించి, పద్మాసనము’’ ధరించి ముద్రలను సృజించెదరు గాక !

ఎవ్వరైతే యోనిముద్రను అధ్యయనము చేస్తాడో, అట్టివాడు అందరినీ ఆకర్షించగలడు. సర్వఫలములను పొందగలడు. అందరినీ జయించగలడు. శతృవులందరినీ స్తంభింపచేయగలడు.

(యోనిముద్ర = అరచేతిని గుంటగా చేసి చేతివేళ్ళను పైకి ధారణ చేయటము).
మొదటి ముద్ర :
మధ్యమే అనామికా ఉపరి విన్యస్య కనిష్ఠికా
అంగుష్ఠతో అధీతే, ముక్తయోః తర్జన్యోః
దండవత్ అధస్తాత్ ఏవం విధా ప్రథమా సంపద్యతే ।।
రెండవ ముద్ర :
స ఏవ మిళిత మధ్యమా ద్వితీయా ।
మూడవ ముద్ర :
తృతీయా అంకుశ ఆకృతిః ఇతి ।
నాలుగవ ముద్ర :
ప్రాతిలోమ్యేన పాణీ సంఘర్షయిత్వా
అంగుష్ఠౌ సాగ్రిమౌ సమాధాయ తురీయా !
ముద్రలు
మొదటిముద్ర :
చేతి మధ్యవేలును అనామిక (చేతి ఉంగరం వ్రేలు)పై విస్తరించి ఉంచి, - కనిష్ఠ (చిటికన) వ్రేలు బొటన వ్రేలుతో తాకించి ఉంచి, తర్జనిని (చూపుడు వ్రేలును) దండమువలె ధరించి ఉంచటము.
రెండవ ముద్ర :
మధ్యమ వేలుపై చూపుడు వేలును ధరిస్తే అది రెండవ ముద్ర.
మూడవ ముద్ర :
మధ్యవేలు విస్తరించి అంకుశము వలె వ్రేళ్ళను ధరించునది - మూడవ ముద్ర.
నాలుగవ ముద్ర :
చేతులను ఎదురెదురుగా (ప్రాతిలోమముగా) చొనిపి, బొటన వ్రేలు చివరలను కలిపి కదలకుండా ధారణచేయు ‘ముద్ర’ - నాలుగవ ముద్ర.
ఐదవ ముద్ర :
పరస్పరం కనీయసేదం మధ్యమా ఆబద్ధే
అనామికే, దండిన్యౌ తర్జన్యా వా ఆలింగ్యోవష్టభ్య
మధ్యమా నఖ - మిళిత అంగుష్ఠౌ పంచమీ ।
ఆరవ ముద్ర :
స ఏవ అగ్రే అంకుశ ఆకృతిః షష్ఠీ ।

ఏడవ ముద్ర :
దక్షిణశయే వామబాహుం కృత్వా
అన్యోన్య అనామికే - కనీయసీ మధ్యగతే
మధ్యమే తర్జన్య ఆక్రాన్తే
సరళాసు అంగుష్ఠౌ ఖేచరీ సప్తమీ ।
ఐదవ ముద్ర :
చిటికిన వ్రేలును మధ్య వ్రేలుతో కట్టి (తాకించి) అనామిక (చూపుడు వ్రేలు)ను కర్రలా చేయటము (లేదా) చూపుడు వ్రేలుతో చిటికెన మధ్యవ్రేలులను చుట్టబెట్టి బొటనవ్రేలు - మధ్యమ వ్రేలు గోళ్ళను తాకించి ఉంచటము - ఐదవ ముద్ర.
ఆరవ ముద్ర :
5వ ముద్రలోవలెనే ‘‘చిటికిన వ్రేలు, మధ్యమ వ్రేలు’’లను అన్యోన్యగా తాకించి చూపుడు వ్రేలును చుట్టి సూటిగా ‘అంకుశము’ వలె ధరించటము - ఆరవ ముద్ర.
ఏడవ ముద్ర - ‘‘ఖేచరీ’’ :
కుడి చేతిని ఎడమ భుజము (బాహువు)పై ఉంచి,
చిటికిన వ్రేలును ఉంగరపు వ్రేలును అన్యోన్యం చేసి (చిటికిన వ్రేలుపై ఉంగరపు వ్రేలును తాకించి), మధ్యగతం చేసి, ఉంగరపు వ్రేలును చిటికిన వ్రేలుపైనుండి మధ్యగా విస్తరింప చేసి,
మధ్యమ వ్రేలును చూపుడు వ్రేలుతో ఆక్రమింపచేసి,
సరళముగా (విడిగా) బొటనవ్రేలును ధారణ చేయటము. ఇది ‘‘ఖేచరీ’’ - ‘‘సప్తమీ’’ - ఏడవ ముద్ర
ఎనిమిదవ ముద్ర :
2. సర్వ ఊర్ధ్వే సర్వసగ్ంహృతి,
స్వ మధ్యమా అనామికా అంతరే కనీయసీ
పార్శ్వయోః తర్జన్యా అంకుశాఢ్యే యుక్తా
స అంగుష్ఠ యోగతో అన్యోన్యగ్ం సమం
అంజలిం కృత్వా అష్టమీ

తొమ్మిదవ ముద్ర :
పరస్పర మధ్యమా పృష్ఠ వర్తిన్యాః
అనామికే తర్జన్యా ఆక్రాంతే, సమే
మధ్యమే, ఆదాయ అంగుష్ఠౌ మధ్యవర్తినౌ
నవమీ ప్రతిపద్యత ఇతి ।।
ఎనిమిదవ ముద్ర :
అన్ని వ్రేళ్ళను పైకి చాచి, అన్నింటిని మడచి,
మధ్యవ్రేలు, ఉంగరపు వ్రేలు క్రిందగా చిటికిన వ్రేలును ఉంచి,
చూపుడు వ్రేలును సూటిగా అంకుశము వలె ఉంచి, బొటనవ్రేలును చూపుడు వ్రేలుతో తాకించి, ఈ రెండింటిని సమముగా ఉంచి, అంజలి (దోసెలి)గా ఉంచటము - 8వ ముద్ర.

తొమ్మిదవ ముద్ర :
మధ్యమ - ఉంగరపు వ్రేళ్ళను పరస్పరం చేసి (తాకించి / మధ్యమ వ్రేలును ఉంగరపు వ్రేలుపై ఉంచి) చూపుడు వ్రేలుతో మధ్యమ వ్రేలును ఆక్రమించి సూటిగా ఉండేటట్లు తెచ్చి బొటన వ్రేలును సమవర్తనము (Straight) తాకి ఉంచటము - 9వ ముద్ర.
స ఏవ ఇయం కనీయసే సమే అంతరితే అంగుష్ఠౌ
సమాః అంతరితౌ కృత్వా త్రిఖండా సంపద్యత ।

ఇతి పంచబాణా, పంచాద్యా ముద్రాః స్పష్టాః
‘క్రోం’ అంకుశా హ సఖ ప్రేం ఖేచరీ హస్రౌం బీజ అష్టమీ
వాక్ భవాద్యా నవమీ
దశమీ చ సమృద్యత ఇతి
య ఏవం వేద
త్రిఖండముద్ర :
పై 9వ ముద్రవలెనే చిటికిన వ్రేలును మధ్యగా - సమముగా ఉండునట్లుగాను, బొటన వేలును కనిష్ఠకమునకు చిటికిన వ్రేలుకు సమాంతరముగా చేస్తే - అది ‘‘త్రిఖండ’’ అనబడుతోంది.

ఈ విధంగా ‘‘పంచబాణే పంచాధ్యా’’ ముద్రలను స్పష్టం చేసుకోవాలి. ‘‘క్రోం’’ అంకుశా ‘‘సప్రేం’’ ఖేచరీ ‘‘హస్రౌం’’ - బీజాష్ఠమీ ఈవిధమైన ముద్రలన్నీ ఎరిగినవాడు నవమీ, దశమీ స్థానము ఎరిగినవాడు అగుచున్నాడు.
(జీవాత్మ - పరమాత్మల గురించి తెలుసుకొనుచున్నాడు)
అథ అతః (అథాతః) కామకళా భూతం చక్రం
వ్యాఖ్యాస్యామో।
‘‘హ్రీం క్లీం ఐం బ్లూం సౌః’’
ఏతే పంచకామాః సర్వచక్రం వ్యాప్య వర్తం
తే మధ్యమం కామగ్ం సర్వావసానే సంపుటీ కృత్య,
‘బ్లూం’ కారే సంపుటం వ్యాప్తం కృత్వా,
ద్విరైం ద్వయేన మధ్యవర్తినా సాధ్యం బధ్వా
భూర్జపత్రే యజతి ।।
కామకళాభూత చక్రము
ఓ దేవతలారా ! ఇప్పుడు మనము ‘‘కామకళాభూత చక్రము’’ గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము.
‘‘హ్రీం’’ ‘‘క్లీం’’ ‘‘ఐం’’ ‘‘బ్లూం’’ ‘‘సౌః’’ ఈ ‘‘పంచకామము’’ - సమస్త చక్రములో వ్యాపించి, వర్తిస్తూ ఉంటుంది.
ఇందలి మధ్యమ కామమును (‘‘ఐం’’ను) - సర్వావసానంగా సంపుటి చేసి,
‘‘బ్లూం’’ కారములోకి ఆ సంపు{మును వ్యాప్తము చేసి,
రెండుసార్లు ‘‘ఐం’’ ద్వయముచే మధ్యవర్తిచే సాధ్యమును బంధించి ‘‘భూర్జపత్రము’’ను సేవించాలి. (ఇది ఒకానొక ముద్రగా చెప్పుతూ ఉంటారు.)
3. తత్ చక్రం యో వేత్తి, స సర్వం వేత్తి।
స సర్వలోకాన్ ఆకర్షయతి । సర్వగ్ం స్తంభయతి ।

నీలీయుక్తం చక్రగ్ం
శత్రూన్ మారయతి । గతీగ్ం స్తంభయతి
లక్షాయుక్తం కృత్వా సకలలోకం వశీ కరోతి ।
నవలక్షజపం కృత్వా రుద్రత్వం ప్రాప్నోతి ।
మాతృకయా వేష్టితం కృత్వా విజయీ భవతి ।
భగాంక కుండలం కృత్వా, అగ్నిం ఆధాయ
హవిషా యోషితో వశీ కరోతి ।
అట్టి కామకళా చక్రమును ఎవరు తెలుసుకుంటారో వారు సర్వము తెలుసుకొన్నవారౌతారు. సర్వలోకములలో ఆకర్షించబడువారు అవుతారు. సర్వమును స్తంభింపచేయగల సామర్థ్యము పొందుతారు.

నీలియుక్తమైన చక్రము శతృవులను చంపివేయగలదు. ‘‘గతి’’ని స్తంభింపజేయగలదు.
‘‘లక్ష’’ యుక్తముగా ఉపాసిస్తే సకల లోకాలు వశమౌతాయి. తొమ్మిది లక్షల జపముచే రుద్రత్వము ప్రాప్తించగలదు.
‘‘మాతృకావేష్టితము’’ ఉపాసిస్తే దిగ్విజయుడు అవుతాడు.
‘‘భగాంక కుండలము’’ను నిర్వర్తిస్తూ, అగ్నిని ఉపాసిస్తూ హవిస్సులను సమర్పించిన వానికి సమస్తము వశమై ఉంటుంది.
భగాంకకుండలము = వృత్తములో జ్యోతిని ఉపాసించటము.
(పురుషే హుత్వా) వర్తులే హుత్వా
శ్రియం అతులాం ప్రాప్నోతి ।
చతరుశ్రే హుత్వా వృష్టిః భవతి ।
త్రికోణే హుత్వా శత్రూన్ మారయతి । గతిగ్ం స్తంభయతి।
పుష్పాణి హుత్వా విజయీ భవతి ।
మహారసైః హుత్వా పరమ
ఆనంద నిర్భరో భవతి ।
మహారసా వై షడ్రసాః ।
వర్తుల మండలము నందు హోమము చేస్తే అంతులేని, నిరుపమానమైన శ్రేయస్సు ప్రాప్తించగలదు.
చతురస్ర కుండలమున హోమం చేస్తే వర్షము కురియ గలదు.
త్రిభుజ మండలములో హోమం చేస్తే శతృవులుతో శతృత్వం తొలగుతుంది. శతృవుల గతులు స్తంభించబడతాయి.
పుష్పములతో హోమము చేస్తే ‘విజయము’ పొందగలరు.
మహా రసము (పండ్ల రసములతో) హోమము చేస్తే, అట్టివాడు పరమానంద పూర్ణుడు కాగలడు.
‘‘మహా రసములు’’ అనగా షడ్రసములు (ఉప్పు, పులుపు, కారము, చేదు, ఒగరు, తీపి).
4. గణానాం త్వా గణపతిగ్ం హవామహే ।
కవిం, కవీనాం ఉపమశ్రవస్తమమ్ ।
‘‘జ్యేష్ఠరాజం బ్రహ్మణాం । బ్రాహ్మణస్పత ఆనః
శృణ్వన్ ఊతిభిః సీదసాదనం ।’’ ఇతి ఏవం ఆద్యం
అక్షరం । తత్ అంత్య బిందు । ‘‘పూర్ణమ్’’ - ఇతి
అనేన అంగగ్ం స్పృశతి ।
‘‘గం గణేశాయ నమః’’ ఇతి గణేశం నమః కుర్వీత ।
ముందుగా → ‘‘ఓం । గణానాం త్వా గణపతిగ్ం హవామహే । కవిం కవీనాం ఉపమశ్రవస్తవమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతిభిః సీదసాదనమ్’’ - ఈ మంత్రము ఆద్యక్షరముగా (ప్రారంభాక్షరంగా) గానం చేయాలి.
అటు తరువాత ‘‘బిందు - పూర్ణమ్ ఇతి’’ - అని పలుకుచూ అంగాంగములు స్పృశించాలి.
‘‘ఓం గం గణేశాయ నమః’’ అని పలుకుచూ గణేశ్వరునకు మనసా-వాచా - కర్మణా నమస్కరించుచున్నాము.
ఓం నమో భగవతే భస్మాంగరాగాయ ।
ఉగ్ర తేజసే హన హన । దహ దహ ।
పచ పచ । మథ మథ । విధ్వగ్ంసయ
విద్వగ్ంసయ । హల భంజన
శూలమూలే వ్యంజన సిద్ధిం కురు కురు ।
క్షేత్రాధ్యక్షుని ఈ విధంగా పూజిస్తున్నాము. ఓం । ఓ అంగ రాగములను భస్మము చేయు భగవతీ । మీ యొక్క ఉగ్రతేజముతో మాలోని విషాదమును, బద్ధకమును, అరిషట్ వర్గమును-‘‘హన’’ సంహరించండి (చంపండి) । దహించి వేయండి । పచనము చేసివేయండి. మధించి వేయండి । విధ్వంసము చేసి వేయండి. అవిద్యను తొలగించి ‘‘విద్య’’ను ప్రసాదించండి. హలము (నాగలి బరువు) తొలగించు స్వామీ ! శూలమూలమున బయలు పరచువాడా । మాకు సిద్ధిని ప్రసాదించండి.
సముద్రం పూర్వ ప్రతిష్ఠితగ్ం శోషయ శోషయ ।
స్తంభయ స్తంభయ । పరమంత్ర
పరయంత్ర పరతంత్ర పరదూత
పరకటక పరచ్ఛేదన కర విదారాయ ।
విదారాయచ్ఛింధి ఛింధి । హ్రీం ఫట్ స్వాహా
అనేన క్షేతాధ్యక్షం పూజయేత్ - ఇతి

కుళ కుమారి విద్మహే మంత్రకోటి సుధీమహి ।
తన్నః కౌళిః ప్రచోదయాత్ ।
ఇతి కుమారి అర్చనం కృత్వా యో
వై సాధకో అభిలిఖితి ।
సో, అమృతత్వం చ గచ్ఛతి । స యశ ఆప్నోతి ।
స పరమ ఆయుష్యం । అథవా పరంబ్రహ్మ భిత్వా,
తిష్ఠతి - య ఏవం వేద ।
సంసార (సముద్రము)నకు ముందే ప్రతిష్ఠితమైయున్న ఆత్మతత్త్వము కొరకై ఈ సంసార సముద్ర జలమును శోషింపజేయండి - స్తంభింప చేయండి.
పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరదూత, పరకటక, పరిచ్ఛేదనమును కొరకై నిర్వర్తించండి.
‘‘ఛింది ఛింది హ్రీం ఫట్ స్వాహా’’ ఈ విధమైన మంత్రముతో క్షేత్రాధ్యక్షుని పూజించెదరు గాక ।

కుళ కుమారీ గాయత్రి
‘‘కుళ కుమారీ’’ తత్త్వము ఎరుగుటకై మంత్రకోటీశ్వరీ మహిమను కీర్తిస్తున్నాము. అట్టి కౌళీదేవి మా యందలి కౌళీదేవి తత్త్వమును ప్రచోదింపజేయును గాక ।
ఈ విధంగా ‘‘కుమారీ అర్చనము’’ను ఎవరు నిర్వర్తిస్తాడో, లిఖిస్తాడో, అట్టివాడు అమృతత్వమును పొందగలడు - అమృతత్వముతో బాటు ‘యశము’ను పొందుతాడు. ఉత్తమ ఆయుష్మంతుడు కాగలడు, లేదా
‘‘స్వస్వరూప - పరబ్రహ్మము’’ అనే సంబంధమైన పరిమితమంతా అధిగమించగలడు. బ్రహ్మము నందు స్థానము పొందగలడు.

ఇతి త్రిపురా తాపిన్యుపనిషత్ అంతర్గత ‘‘తృతీయోధ్యాయః’’


చతుర్థోపనిషత్

1. శ్లో।। ‘‘ఓం’’ దేవా హ వై భగవంతం
అబ్రువన్ దేవ గాయత్రగ్ం
హృదయం నో వ్యాఖ్యాతం
త్రిపురగ్ం సర్వ ఉత్తమమ్ ।
జాతవేదస సూక్తేన ఆఖ్యాతం ।
నః త్రైపురాష్టకమ్ ।

యదిష్ట్వాముచ్యతే యోగీ జన్మసగ్ం సార బంధనాత్,
అథ మృత్యుంజయం నో బ్రూహీతి।

ఏవం బ్రువతాగ్ం సర్వేషాం
దేవనాగ్ం శ్రుత్వా ఇదం వాక్యమ్
అథ అతః ‘త్ర్యమ్బకే’న, అనుష్టుభేన
మృత్యుంజయం దర్శయతి ।
దేవతలు భగవంతునితో :
ఓ దేవాదిదేవా ! మీరు దేవ ‘‘గాయత్రీ హృదయము’’ వ్యాఖ్యానము అయినట్టి ఉత్తమమగు ‘‘త్రిపురము’’ గురించి చెప్పారు. చాలా సంతోషము.
ఇప్పుడిక ‘‘త్రైపురాష్టకము’’ అని చెప్పబడే ‘‘జాతవేద సూక్తము’’ గురించి వ్యాఖ్యానిస్తూ బోధించ ప్రార్థన.అట్లాగే - యోగులు దేనిచే బంధములనుండి విడివడుచున్నారో - అట్టి ‘‘మృత్యుంజయము’’ గురించి కూడా దయచేసి వివరించండి.

భగవంతుడగు మహాదేవుడు దేవతలందరి విన్నపమును విన్నవారై ఈ ఈ వాక్యములు ప్రసాదించసాగారు.
మహాదేవుడు : ‘‘అనుష్టుప్’’ ఛందస్సుచే నిర్మించబడిన
‘‘త్ర్యంబకం యజామహే । సుగంధిం పుష్ఠివర్ధనం । ‘ఉర్వారుకమ్’ ఇవ బంధనాత్ మృత్యోః ముక్షీయ । మా2మృతాత్’’
- అను మృత్యుంజయ మంత్రమును ఈ విధంగా ‘‘వివరణ’’ను వినండి.
కస్మాత్ ‘‘త్ర్యంబకం’’ ఇతి ? త్రయాణాం
పురాణాం అంబకగ్ం స్వామినం
తస్మాత్ ఉచ్యతే ‘‘త్ర్యంబకం’’ ఇతి ।


అథ కస్మాత్ ఉచ్యతే ‘‘యజామహ’’ ఇతి ?
యజా మహే సేవా మహే వస్తు

‘‘మహే’’ ఇతి అక్షరద్వయేన కూటత్వేన
అక్షరైకేన ‘‘మృత్యుంజయమ్’’ ఇతి ఉచ్యతే।
తస్మాత్ ఉచ్యతే ‘యజామహ’ - ఇతి ।
ఏ కారణంగా ‘‘త్రయంబకమ్’’ అని అంటున్నారు?
ఆయన మూడు అత్యంత పురాణమైన (ప్రాచీనమైన) పురములకు స్వామి (ప్రభువు) కనుక ‘‘త్ర్యంబకం’’ (త్రయంబకుడు) అని అంటున్నారు. (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులే ఆ త్రిపురములు - అని వ్యాఖ్యానించబడుతోంది. అట్లాగే ‘‘త్రికాలములు’’ అని కూడా).

ఎందుచేత ‘‘యజామహ’’ అని అంటున్నారు ? ‘‘స్వామీ! మిమ్ములను అనుష్ఠిస్తున్నాము. సేవిస్తూ ఉన్నాము. స్తుతిస్తున్నాము. మీ మహిమను ఉపాసిస్తున్నాము.

‘‘మహే’’ అనే అక్షర ద్వయముతో, ఏకాక్షరము అయినదే మృత్యుం జయము (మృత్యువుకు ‘సాక్షి’ అయి ఉన్న ఆత్మస్వరూప సిద్ధి) అట్టి మృత్యుంజయము అగు కూటస్థ స్థానము కొరకై మహిమను అనుష్ఠిస్తున్నాము. (యజామహ - ఇతి)
2. అథ కస్మాత్ ఉచ్యతే ‘సుగంధిం’ ఇతి?
సర్వతః యశ ఆప్నోతి,
తస్మాత్ ఉచ్యతే సుగంధిం ఇతి ।

అథ కస్మాత్ ఉచ్యతే పుష్ఠివర్ధనం ఇతి ?
యః సర్వాన్ లోకాన్ సృజతి
యః సర్వాన్ లోకాగ్ంస్తారయతి
యః సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి,
తస్మాత్ ఉచ్యతే ‘పుష్టివర్ధనం’ ఇతి ।
ఎందుచేత ‘‘సుగంధిం’’ అనబడుతోంది ? శివ తత్త్వము సర్వత్రా యశోమయము కాబట్టి ‘‘సుగంధిం’’ అంటున్నాము. (సర్వత్రా విస్తరించియున్న సువాసన వంటిది - అని త్ర్యంబకుని స్వరూపము గురించిన విశేషణము)

ఎందుచేత ‘‘పుష్ఠివర్ధనమ్’’ అని అంటున్నాము ?
ఏ శివతత్త్వమైతే సమస్త లోకములకు రక్షణయో (రక్షించుచూ ఉన్నట్టిదో)
- ఏది సమస్త లోకములుగా వ్యాపించి ఉన్నదో
- ఏది సమస్త జీవులకు పోషణ, పుష్టి ప్రసాదిస్తోందో, ఆ కారణం చేత - ఆ పరమ పురుషుడగు శివుని ‘‘పుష్టివర్ధనమ్’’ అను శబ్దముతో (ఈ మృత్యుంజయ మంత్రములో) వర్ణిస్తూ ఉన్నాము.
అథ కస్మాత్ ఉచ్యతే ‘‘ఉర్వారుకం ఇవ
బంధనాత్ మృత్యోః ముక్షీయ’’ ఇతి ?
సంలగ్నత్వాత్ ఉర్వారుకం ఇవ మృత్యోః
సగ్ంసార బంధనాత్, సంలగ్నత్వాత్
బద్ధత్వాత్ మోక్షీ భవతి । ముక్తో భవతి ।
ఎందుచేత ‘‘ఉర్వారుకమ్ ఇవ బంధనాత్ మృత్యోః ముక్షీయ’’ అని మంత్రము నందు అభ్యర్థనపూర్వకంగా అనబడుతోంది ? దోసకాయ దోసతీగకు అతికి ఉన్నట్లుగా, ఈ జీవుడు మృత్యు సంసారమునకు సంబంధుడై దేహ-దేహాంతరములు గడుపుచున్నాడు.
‘‘స్వామీ ! దోసపండు దోసతీగనుండి వేరుచేయు విధంగా సంసార బంధము నందు సంలగ్నమై ఉన్నాము. బంధము నుండి తొలగించండి’’ - అని కోరుతున్నాము.
అథ కస్మాత్ ఉచ్యతే ‘మా2మృతాత్’ ఇతి
అమృతత్వం ప్రాప్నోతి ।
అక్షరం ప్రాప్నోతి ।
నిత్యత్వం ప్రాప్నోతి ।
స్వయం రుద్రో భవతి ।।
ఎందుచేత ‘‘మా2మృతాత్’’ అని మంత్రము చెప్పుతోంది ?
- నన్ను మృత్యువు నుండి అమృతత్వమునకు చేర్చండి.
- క్షరము నుండి మా ధ్యాసను అక్షరమునకు నడపండి.
- అనిత్యమైన దానిని దాటించి నిత్యోత్వమును ప్రాప్తింపచేయండి.
అట్టి ఉపాసకుడు స్వయంగా రుద్రుడే అగుచున్నాడు. (నా రుద్రో రుద్రమర్చతి) ।
దేవా హ వై భగవంతం ఊచుః
‘‘సర్వం నో వ్యాఖ్యాతమ్’’ ।
అథ కైః మంత్రైః స్తుతా భగవతీ
స్వ ఆత్మానం దర్శయతి ?
తాం తు సర్వాం చ శైవాన్ వైష్ణవాన్ సౌరాన్
గణేశాన్ నో బ్రూహి - ఇతి ।।
దేవతలు : హే భగవాన్ । మాపై అనుగ్రహముతో సర్వమును వ్యాఖ్యానిస్తూ మాకు బోధిస్తున్నారు. కృతజ్ఞులము.
ఈ విషయం కూడా మిమ్ములను బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాము.
ఏ మంత్రముచే స్తుతించబడినదై ఆ భగవతి అగు త్రిపురేశ్వరీ దేవి మాకు స్వయం ఆత్మస్వరూపంగా దర్శనము ప్రసాదించగలదు? అట్టి అన్ని ‘‘ శైవము, వైష్ణవము, సౌరము, గణేశము’’ అని చెప్పబడేవి మాకు విశదీకరించి చెప్పండి.
స హ ఉవాచ భగవాన్
త్రయంబకేన అనుష్టుభేన
మృత్యుంజయం ఉపాసయేత్।


పూర్వేణ అధ్వనా వ్యాప్తం
‘ఏకాక్షరం’ ఇతి స్మృతమ్ ।

‘‘ఓం నమః శివాయ’’ - ఇతి యాజుష
మంత్ర ఉపాసకో రుద్రత్వం ప్రాప్నోతి ।
కల్యాణం ప్రాప్నోతి య ఏవం వేద ।
భగవానుడు : ‘‘అనుష్ఠుప్’’ ఛందో బద్ధమైన (మనం పైన చెప్పుకొన్న) మృత్యుంజయ మంత్రమును ఉపాసించెదరు గాక ‘‘త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ । మామృతాత్’’ అని మృత్యుంజయ మంత్రము మృత్యువును దాటించి ఈ దేవీ దర్శనము తప్పక ప్రసాదించగలదు.

సమస్తమునకు మునుముందే మార్గదర్శకమైనది ఏకాక్షరము ‘‘ఓం’’ ఇతి । ఏకము, అక్షరము అగు బ్రహ్మమే మృత్యుంజయ మంత్రము యొక్క మహదార్థము.

కనుక ఒక్క ‘ఓం’ అను అక్షరోపాసనచే ‘‘ఓం నమః శివాయ’’ అను ఈ (విశ్వయజ్ఞ రూపార్థమగు) యాజుషీ మంత్రమును ఉపాసించువాడు ‘‘రుద్రత్వము’’ పొందగలడు. రుద్రమంత్రార్థమును ఎరిగి ఉపాసించు వాడు సమస్త శుభములు పొందగలడు. దేవీ స్వరూపమగు స్వస్వరూపాత్మానుభవము పొందగలడు.
3. తత్ విష్ణోః పరమం పదం
సదా పశ్యన్తి సూరయః।

‘దివి’ ఇవ చక్షుః ఆతతం ।
విష్ణోః యత్ పరమం పదమ్
(ఆత్మోపాసనచే సంసారబంధములను త్రెంచివేసికొనియున్న)
సూరులు (విద్వాంసులు) ‘‘తత్ విష్ణోః’’ అను పరమ పదమును సర్వత్రా సర్వదా దర్శించుచున్నారు. ఇదంతా విష్ణుతత్త్వముగా ఎరుగుచున్నారు.
ఆకాశము వలె ఇదంతా కూడా విష్ణుమహిమ చేతనే విస్తరించ బడినది. విష్ణుతత్త్వమే ఇదంతాగా విస్తరించుచున్నది.
అట్టి విష్ణుధ్యానయోగముచే ఆత్మదేవీ దర్శనము కాగలదు.
విష్ణోః సర్వతోముఖస్య స్నేహః యథా
పలలపిండమ్ ఓతప్రోతం అనువ్యాప్తం ।


వ్యతిరిక్తం, వ్యాప్నుత ఇతి ।
వ్యాప్నువతో విష్ణోః తత్ పరమం పదం
పరం వ్యోమేతి పరమపదం పశ్యన్తి ।
వీక్షంతే సూరయో బ్రహ్మాదయో దేవా స ఇతి
సదా హృదయ ఆదధతే తస్మాత్ విష్ణోః స్వరూపమ్ ।
సర్వత్ర ముఖము కలవాడు, ఈ సమస్తము తన ముఖమే అయి ఉన్నవాడు - ‘‘సర్వతోముఖుడు’’ - అగు విష్ణువు (విష్ణుతత్త్వము) ‘‘నువ్వులలో, మాంసములో నూనె’’ వలె ఈ సమస్తమునందు ఓత - ప్రోతమై (వస్త్రములో నిలువు - అడ్డముగా దారము విస్తరించి ఉండు విధంగా) సమస్తమునందు, సమస్తముగా వేంచేసి ఉన్నారు.

ఈ సమస్తమునకు వేరై విస్తరించి ఉన్నారు కూడా ।
ఆ విధంగా (నవలలో ఆ నవలా రచయితవలె) వేంచేసియున్నట్టి పరమ పదమగు పరంజ్యోతి స్వరూపుడగు విష్ణు తత్త్వమును - దృశ్య వ్యవహారము జయించిన సూరులు సదా దర్శిస్తూనే ఉంటారు. ఆ యొక్క విష్ణు స్వరూపమును బ్రహ్మ మొదలైన బ్రహ్మజ్ఞులు తమ యందే దర్శించుచున్నారు.
వసతి తిష్ఠతి భూతేషు ఇతి వాసుదేవ ఇతి ।


‘‘ఓం నమ’’ - ఇతి త్రీణి అక్షరాణి ।
‘‘భగవత’’ - ఇతి చత్వారి ।
‘‘వాసుదేవాయ’’ - ఇతి పంచాక్షరాణి।


ఏతత్ వై వాసుదేవస్య ద్వాదశార్ణం అభ్యేతి
సమస్త జీవుల హృదయ గృహములలో ఏ పరమాత్మ సర్వదా ప్రకాశమానుడై వేంచేసి ఉన్నారో - ఆయన ‘‘వాసుదేవుడు’’ అను శబ్దముతో చెప్పబడుచున్నారు. ఇదియే ‘‘వాసుదేవ’’ నిర్వచనము. వాసుదేవ భావనచే ఆత్మ దేవీ దర్శనము కాగలదు.
‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’
ద్వాదశాక్షరీ మంత్రము
‘‘ఓం నమో’’ - త్రీణి (3) అక్షరములు.
‘‘భగవత’’ - చత్వారి (4) అక్షరములు.
‘‘వాసుదేవాయ’’ - ఇతి పంచ (5) అక్షరములు.
ఇదియే వాసుదేవపరమైనట్టి (3+4+5=12) ద్వాదశాక్షరీ ఉపాసించబడు గాక ।
స ఉపప్లవం తరతి, స సర్వం ఆయుః ఏవ ఏతి ।
విన్దతే ప్రాజాపత్యగ్ం, రాయః సోషం
గౌపత్యం చ సమశ్నుతే ।

ప్రత్యక్ ఆనందం, బ్రహ్మపురుషం
ప్రణవ స్వరూపమ్ ।
అట్టి ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ - ద్వాదశాక్షరీ మంత్రమును ఉపాసించువాడు సమస్తమైన ఉపప్లవముల నుండి (ఉపద్రవముల నుండి) తరించగలడు. పవిత్రమైన, సద్వినియోగమగు ఆయుష్షును పొందగలడు. సమస్త ప్రాజాపత్యములకు (అధికారములను), రాయసోషములను (Royal), గౌపత్యములను (గౌరవములను) సంపాదించుకోగలడు.
ద్వాదశాక్షరీ మహా మంత్ర జపముచే ప్రత్యక్ష ఆనందమును, బ్రహ్మానందమును, బ్రహ్మపురుషమును, ప్రణవ స్వరూపమును సంతరించుకోగలడు.
‘అ’కార, ‘ఉ’కారో, ‘మ’కార ఇతి,
తాన్ ఏకథా సంభవతి
తత్ ‘ఓం’ ఇతి ।।
హగ్ంసః శుచిషద్ వసుః అంతరిక్ష।
సత్ హోతా వేదిషత్
అతిథిః, దురోణసత్

నృషత్ వర సత్। ఋత సత్ । వ్యోమ సత్ ।
అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ।।

‘అ’కార (కేవలమగు పరమాత్మ), ‘ఉ’ కార (ప్రకృతి, దృశ్యము, అనుభవములో), ‘మ’కార (జీవాత్మ, అనుభవి) ఈ మూడింటిని ఏకము చేసినప్పటి ‘‘అక్షర సంజ్ఞ’’యే ‘‘ఓం’’కారము.
(పరమ పురుషుడు) ఆత్మ అంతటా కూడా సమస్త జీవులలో
- ఆకాశములో సూర్యునివలె హంస (సొ-హమ్) అయి,
- ఆకాశములో వాయువు వలె,
- గృహములో అతిథివలె ప్రవేశించి సంచారము కలిగి ఉంటున్నారు. అంతటా అగ్నివలె, జీవులలో పురుషకారమువలె, ఆకాశము వలె ఆత్మదేవుడు వేంచేసి ఉన్నారు.
జలములో ‘రుచి’ వలె ఉంటున్నారు. భూమిలో ‘సారము’గా ప్రదర్శనమగుచున్నారు. వేదములలో వాక్‌స్వరూపుడుగాను, కొండలలో ‘ఘనము’ (Solid)గాను, ఋతము, బృహత్ అయి వుండి సర్వత్రా వేంచేసి ఉంటున్నారు.

4. ‘‘హగ్ంస ఇతి ఏతత్ మనోః అక్షర ద్వితీయేన,
ప్రభాపుంజేన, సౌరేణ ధృతం

అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతగ్ం
సత్యాప్రభా పుంజని ఉషాసంధ్యా ప్రజ్ఞాభిః
శక్తిభిః పూర్వగ్ం సౌరం అధీయానః
సర్వ ఫలం అశ్నుతే । స వ్యోమ్ని పరమే
ధామని సౌరే నివసతే ।
‘హగ్ం’-‘‘స’’ (హంస) అనే ‘‘సో-హమ్’’ అర్థమును ప్రతిపాదించే రెండు అక్షరములు సూర్యుడు కిరణములను ధరించు విధంగా ఆత్మార్థంగా ధరించబడుతోంది.
అట్టి ఆత్మపురుషుడు ‘‘అబ్జా గోజా ఋతజా అద్రిజా’’ ఉన్నా అత్మయే జలములోను రుచిగా, భూమియందు భూసారముగా, వేదములందు ‘‘ఓం’’కారముగా (సత్యమగు తత్త్వోపాసనగా), ఉదయించు సూర్యుని కిరణముల వలె సత్యమై నిత్యమై వెలుగొందుతోంది. ఆత్మ పురుషుడే సమస్త జీవులలో ప్రజ్ఞా (wisdom) రూపమై, సర్వత్రా శక్తి రూపమై, సమస్తమునకు మునుముందే ఏర్పడిన వారై ఉన్నారు.
ఆకాశములో సూర్యునివలె సర్వజీవులలో ప్రకాశించుచున్నారు. అట్టి ఆత్మదేవుని ఉపాసనచే సర్వము లభించగలదు. ఆయన సూర్యమండలమునకు ఆవల ఆకాశమంతా విస్తరించి ఉన్నారు.
గణేశ మంత్రము
‘‘గణానాం త్వా’’ ఇతి త్రైష్టుభేన
పూర్వేణ అధ్వనాం అనునైకార్ణేన
గణాధిపం అభ్యర్చ్య గణేశత్వం ప్రాప్నోతి ।
“గణేశ మంత్రము”
‘‘గణానాం త్వా…’’ అను త్రైష్టుభమును ఉపాసించుటచే సమస్తమునకు పూర్వముగా ఉన్న పరంధామము అని పూజించెదరు గాక. అవి ఏకార్ణము శబ్దము యొక్క ఆశ్రయముచే గణాధిపుని (సమస్త గణములకు అధిపతిని) అభ్యర్థించటం చేత, అట్టి ఉపాసకుడు గణాధిపత్యము - సిద్ధించుకోగలడు.
అథ గాయత్రీ సావిత్రీ సరస్వత్య జపా మాతృకా
ప్రోక్తా తయా సర్వం ఇదం వ్యాప్తమ్ ।
గాయత్రి-సావిత్రి-సరస్వతీ మంత్రోపాసన
అట్టి త్రిపురేశ్వరీదేవియే గాయత్రీ, సావిత్రీ సరస్వతి ‘‘జపామాతృక’’చే సమస్తము వ్యాప్తమై ఉన్నది.
‘‘ఐం’’ వాగీశ్వరీ విద్మహే,
‘క్లీం’’ కామేశ్వరీ ధీమహి ।
‘సౌః’ తన్నః శక్తిః ప్రచోదయాత్’’ - ఇతి
శక్తి గాయత్రీ మంత్రము
‘‘ఐం’’ వాక్ స్వరూపిణీదేవి యొక్క మహిమ ఎరుగుచున్నాము. ‘క్లీం’ ఈ సమస్త తన ఇచ్ఛగా కలిగియున్న ఆ దేవి యొక్క మహిమను ధీ (బుద్ధితో) యోచిస్తున్నాము. ఉపాసిస్తున్నాము. అట్టి శక్తి దేవి మా బుద్ధులను ప్రచోదింపజేయును గాక ।
గాయత్రీ ప్రాతః, సావిత్రీ మధ్యందినే,
సరస్వతీ సాయం - ఇతి ।

నిరంతరం అజపాహగ్ంస ఇతి ।

ఏవం మాతృకా, పంచాశత్ వర్ణ విగ్రహేణ
‘అ’కార ఆది ‘క్ష’కార అంతేన వ్యాప్తాని
భువనాని శాస్త్రాణి ఛందాగ్ంసి
ఇతి ఏవం భగవతీ సర్వం వ్యాప్నోతి ।
ఇతి ఏవ తస్య ఏవై నమో నమః ।

ఇతి తాన్ భగవాన్ అబ్రవీత్ :
ఏతైః మంత్రైః నిత్యం దేవీగ్ం స్తౌతి స సర్వం పశ్యతి ।
సః అమృతత్వం చ గచ్ఛతి య ఏవం వేద ।
ఆ త్రిపురేశ్వరీ-త్రిపుర శక్తి దేవిని ఉదయమున - గాయత్రీ దేవి గాను, మధ్యాహ్నమున - సావిత్రీ దేవిగాను, సాయంకాలమున - సరస్వతీ దేవిగాను ఉపాసించెదరు గాక ।
జపమునకు, శబ్దమునకు ఆవల ఈశ్వరీదేవిగా (కేవల రూపంగా, నామరూపాతీతంగా) అజపారూపంగా నిరంతరము ఆరాధిస్తూ ఉన్నాము.
ఈ విధంగా ఆ దేవీ స్వరూపము పంచాశత (50) వర్ణ మాతృకా విగ్రహము అయినట్టిది. ‘అ’ కారమునుండి ‘క్ష’ కారము వరకు ఆవలగా వ్యాపించి ఉన్నది. భువనమంతా విస్తరించి ఉన్నది. వేద శాస్త్రములచే అభివర్ణితము.
ఈ విధంగా మాతృకావర్ణ రూపిణిగా సమస్తముగా వ్యాపించి ఉన్నది అగు త్రిపురసుందరీ మాతకు నమస్కారము. (మాతృకం = వర్ణమాల మంత్రం = అక్షరావయవము).

ఈ విధంగా భగవంతుడు దేవతలతో పలికారు.
ఈ మంత్రములతో ఎవరు దేవిని స్తుతిస్తారో, అట్టివారు సర్వమును దర్శించగలరు.
ఆ దేవీతత్త్వము తెలుసుకోవటం చేత అమృత స్థానమును చేరగలరు.

ఇతి - త్రిపురా తాపిణ్యుపనిషత్ - ‘‘చతుర్థ అధ్యాయః’’


పంచమోపనిషత్

1. ‘‘ఓం’’ దేవా హ వై భగవంతం అబ్రువన్ :
స్వామిన్ । నః కథితగ్ం స్ఫుటం క్రియాకాండగ్ం
స విషయం త్రైపురం । ఇతి ।
అథ పరమం నిర్విశేషం కథయస్వ - ఇతి ।

తాన్ హ ఉవాచ భగవాన్ :
తురీయయా మాయయా అంత్యయా నిర్దిష్టం
పరంబ్రహ్మ ఇతి ।
పరమపురుషం చిద్రూపం పరమాత్మ - ఇతి ।
దేవతలు (భగవానునితో): స్వామీ ! భగవన్ ! ‘‘త్రైపురము’’ గురించిన క్రియాకాండను సవిషయంగా ప్రస్ఫుటం (clarified) చేసారు. ఇప్పుడు ‘‘పరమము’’ (finest) అయినట్టి ‘‘నిర్విశేషము’’ గురించి విశ్లేషముగా బోధించమని ప్రార్థన.

శ్రీ భగవానుడు : ‘‘పరంబ్రహ్మము’’ అనునది ఎటువంటిదంటే…,
తురీయము : జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలగా, సాక్షిగా ‘‘నాలుగవది’’. అంతేగాని మూడు అవస్థల అంతర్గతం కాదు. ‘మాయ’కు ఆవల, నిర్ధుష్ఠమై ఉన్నట్టిది. అది ‘‘పరమపురుషము’’, చిద్రూపము (Absolute form of knowing) ‘‘పరమాత్మ’’గా చెప్పబడేది.
శ్రోతా, మన్తా, ద్రష్టా అద్వేష్టా ప్రష్టా
స్ప్రష్టా ఘోష్టా విజ్ఞాతా ప్రజ్ఞాతా
సర్వేషాం పురుషాణాం అంతఃపురుషః
స ఆత్మా । స విజ్ఞేయ ఇతి ।
అట్టి ఆత్మపురుషుడు - సమస్తమునకు శ్రోత (వినువాడు), మన్తా (మనోరూపుడు, మననము చేయువాడు), ద్రష్ట (perceiver), అద్వేష్టా (దేనిపట్ల ద్వేషము లేనివాడు), ప్రష్ఠ (ముందర నడిచెడివాడు / leader), స్ప్రష్టా (Clear), ఘోష్టా (చాటించువాడు / publisizer), విజ్ఞతా (సమస్తము ఎరుగుచుండువాడు), ప్రజ్ఞాతా (తెలివి స్వరూపుడు, ఎరుగువాడు), సమస్త జీవుల అంతర్యామి - (ఆత్మ) అయి ఉన్నారు.
న తత్ర లోకా అలోకా ।
న తత్ర దేవా అదేవాః ।
పశవో, అపశవః, తాపసో న తాపసః।
పౌల్కసో, న పౌల్కసః ।
విప్రా న విప్రాః ।

స ఇతి ఏకం ఏవ పరంబ్రహ్మ
వీహ్రాజతే నిర్వాణమ్ ।
న తత్ర దేవా ఋషయః
పితర ఈశతే ప్రతిబుద్ధః సర్వ విద్యేతి ।।

తత్ర ఏతే శ్లోకా భవన్తి
(సమస్త జీవుల స్వాభావిక స్వస్వరూపమే అయిఉన్న - అట్టి) ఆత్మాకాశము (లేక) చిదాకాశములో
- లోకములు లేవు, అలోకములు ఉండవు.
- దేవతలు ఉండరు. అదేవతలు ఉండరు. తాపసులు ఉండరు. అతాపసులు ఉండరు
- పశువులు లేవు, అపశువులు లేవు.
- పౌల్కసుడు (illegal child) లేడు. అపౌల్కసుడు లేడు.
- విప్రుడు లేడు, అవిప్రుడు లేడు.

ఏకము అగు పరబ్రహ్మము మాత్రమే నిర్వాణ (నిశ్చల) రూపమై వీహ్రాజమానమై యున్నది.
అట్టి నిర్వాణ స్థానములో దేవతలు, ఋషులు, తెలివిగలవారు (ప్రబుద్ధులు) మొదలైనవారంతా సర్వ భేదములు తొలగి ఏకస్వరూపులే అగుచున్నారు.

అద్దాని గురించి శాస్త్రములచే శ్లోకపూర్వకంగా గానము చేయబడియే ఉన్నది.
అతో నిర్విషయం నిత్యం
మనో కార్యం ముముక్షుణా ।
యతో నిర్విషయో నామ
మనసో ముక్తిః ఇష్యతే ।
మనః హి ద్వివిధం ప్రోక్తం ।
(1) శుద్ధం చ (2) అశుద్ధం ఏవ చ
అందుచేత ముముక్షువైనవాడు మనస్సును నిర్విషయముగా ధారణ చేయు కార్యమునందు నిత్యము ప్రయత్నశీలుడై ఉండును గాక!
ఎప్పుడైతే మనస్సు దర్పణమువలె నిర్విషయంగా అనుభూతమగుచూ తెలియవస్తుందో అట్టి ‘స్థితి’యే ‘‘మోక్షము’’ అనబడుతోంది.
అట్టి ఈ మనస్సు రెండు విధములుగా (విభాగములుగా విశ్లేషించబడుతోంది.
(1) శుద్ధ మనస్సు (కేవలమగు మనస్సు) (2) అశుద్ధమగు మనస్సు (విషయ సహితముగా మనస్సు).
అశుద్ధం కామ సంకల్పం ।
శుద్ధం కామ వివర్జితమ్ ।।
‘‘ఏదో కావాలి, పొందాలి, చేరాలి’’ అను కామముతో కూడినప్పుడు అది అశుద్ధమగు మనస్సు. సమస్త కామములు (desires, expectations, wishes, dependencies, etc.,) రహితం అయినప్పుడు - అదియే శుద్ధమగు మనస్సు.
2. మన ఏవ మనుష్యాణాం
కారణం బంధ - మోక్షయోః।


బంధనం విషయ ఆసక్తిః।
ముక్త్యై నిర్విషయం మనః।


నిరస్త విషయా సంగం,
సన్నిరుధ్య మనో హృది।


యదా యాతి అమనీభావః
తదా తత్ పరమం పదమ్।
మనస్సుకే బంధము
ఆత్మస్వరూపముగా ఈ జీవుడు నిత్యముక్తుడు. మరి బంధము ఎట్లా వచ్చిపడుతోంది. (‘మననము’ అను అడ్డ దిడ్డ దారములతో నిర్మితము అయినట్టి) మనస్సే బంధమునకు, మోక్షమునకు కూడా కారణము.

ఇంద్రియ విషయములపట్ల కలిగి ఉంటున్న ‘‘ఆసక్తి’’ (అపేక్ష, ఆశించటము, అభిలషించటము, తనకు తానై ఆధారపడి ఉండటము)- ఇదియే బంధము. మనస్సు విషయరాహిత్యము సంతరించుకొని ఉన్నదా.. అదియే ‘ముక్తి’.

అందుచేత విషయములతో ఏర్పడుచున్న ‘సంగము’ (Relatedness) నిరస్తము చేయాలి. పోగొట్టుకోవాలి. తిరస్కరించివేయాలి. త్రోసి వేయాలి (Leave, thow off). అందుకుగాను మనస్సును నియమ పూర్వకంగా నిరోధించాలి.

ఎప్పుడైతే మనన రహితరూపమగు అమనీభావము (భావ రాహిత్యము) పొందుతామో, అదియే ‘పరమపదము’ అయి ఉన్నది.
తావత్ ఏవ నిరోద్ధవ్యం
యావత్ ధృది గతం క్షయమ్।।

ఏతత్ జ్ఞానం చ ధ్యానం చ।
శేషో అన్యో గ్రంథవిస్తరః।।

న ఏవ చింత్యం। న చ అచింత్యం।
న చింత్యం। చింత్యం ఏవ చ।

పక్షపాత వినిర్ముక్తం
బ్రహ్మా సంపద్యతే ధ్రువమ్।।
ధృతిగతమైనదంతా (దృశ్య సంబంధమై పట్టుకున్నదంతా, ఆత్మకు అన్యమైనదంతా) ఏదైతే ధరించబడుతోందో - అదంతా కూడా పూర్తిగా క్షయించే వరకు ఈ మనస్సును నిరోధించే ప్రయత్నము చేయవలసిందే.
విషయములవైపు పరుగులు తీస్తున్న మనస్సును వెనుకకు మరల్చి ఈ మనస్సును నిర్విషయము చేసే అనునిత్యమైన ప్రయత్నమే ‘జ్ఞానము’, ‘యోగము’ కూడా. ఇక శాస్త్రములలోను, సాధనములలోను (ప్రాణాయామ, పూజ, తపస్సు మొదలైన వాటి గురించి) చెప్పేదంతా- ఇదే విషయము (ప్రయత్నము) యొక్క గ్రంథ విస్తారమే.
మనస్సు నిరోధించబడిందా, ఇక - చింతన చేయవలసినదేదీ ఉండదు. చింతన చేయకూడనిది ఉండదు. దేనికి చింతించు ధర్మమే లేదో అట్టి ఆత్మ మాత్రమే చింతింపతగినది.
‘‘ఇది ఇటువంటిది, వారు ఇటువంటి వారు. ఇప్పుడు ఇది, అప్పుడు అది’’ - అను రూపము గల పక్షపాతములన్నీ (Different interpretations) నుండి విముక్తుడు అయినవాడు ‘బ్రహ్మము’ను సిద్ధించుకోగలడు.
స్వరేణ సల్లయేత్ యోగీ
సర్వం సంభావయేత్ పరమ్।
(‘అ’కారము మొదలైన అక్షరములు పలుకుచూ, ఉదాత్త అనుదాత్త షడ్జములతో కూడిన) ‘స్వరము’తో సత్ స్వరూపమగు పరమాత్మయందు జగదనుభవములన్నీ యోగి లయించివేయాలి. అప్పుడు ‘పరతత్త్వము’ యొక్క స్వరము (పరమాత్మ తత్త్వము) సంభావన (Shaping the sense, placing the sense) సిద్ధించుకోవాలి
అస్వరేణ తు భావేన
న భావో భావ ఇష్యతే
తత్ ఏవ నిష్కళం బ్రహ్మ
నిర్వికల్పం నిరంజనమ్।
అట్టి స్వరము (శబ్ద పరిమితమైనది, All that within range of sound)ను దాటిన ‘‘అస్వర భావన’’ను చేయాలి. అది ‘‘అభావ భావము’’ అనబడుతోంది. అప్పటి యోగి యొక్క ఆత్మ తదాత్మ్య స్థితియే నిష్కళంకము (కళంకములు లేనిది), నిరంజనము (ధూళి రహితము), నిర్వికల్పము (సమస్త వికల్పనలు లయించినది) అగు ‘‘బ్రహ్మము’’.
‘‘తత్ బ్రహ్మ అహం’’ ఇతి జ్ఞాత్వా
బ్రహ్మ సంపద్యతే క్రమాత్।

నిర్వికల్పం అనంతం చ
హేతు దృష్టాంత వర్జితమ్।
అప్రమేయం అనాద్యంతం
యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః।
‘‘అట్టి నిష్కళంక, నిర్వికల్ప, నిరంజనము అగు ఆ బ్రహ్మమే నేను’’ అనునది తెలుసుకున్నవాడు ఇక క్రమముగా బ్రహ్మమే తానై, బ్రాహ్మీ స్థితి సంపాదించుకుంటున్నాడు.

అట్టి నిర్వికల్పము, అనంతము అగు బ్రహ్మము - హేతువులు (Reasons), దృష్టాంతములు లేనట్టిది. అది దేనికీ సంబంధించినది కాదు. అప్రమేయము. ఆద్యంత రహితము. అట్టి ఆత్మను తమ సహజ స్వరూపముగా, నిజస్వరూపముగా తెలుసుకొని బుధులు (తెలివి కలవారు) సమస్త సంసార బంధముల నుండి విడివడుచున్నారు.
న నిరోధః। న చ ఉత్పత్తిః।
న బద్ధో। న చ సాధకః।।
న ముముక్షుః న వై ముక్త
ఇతి ఏషా పరమార్థతా।

ఏక ఏవ ఆత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు।
స్థాన త్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే।


ఏక ఏవ హి భూతాత్మా
భూతే భూతే వ్యవస్థితః।
ఏకధా బహుధా చ ఏవ
దృశ్యతే జల చంద్రవత్।
వాస్తవానికి పారమార్థికంగా చూస్తే - ఇక్కడ ముముక్షువు లేడు. నిరోధములు లేవు. ఉత్పత్తి లేదు. బద్ధుడు లేడు. సాధకుడు లేడు. ముముక్షువు లేడు. ముక్తుడు లేడు.


అందుచేత అఖండము, అప్రమేయము, నిత్య నిర్మలము అగు ఆత్మ మాత్రమే జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మననము చేయతగినట్టి వస్తువు.
ఎవ్వడైతే (జాగ్రత్-స్వప్న-సుషుప్తి) - స్థాన త్రయమునకు ఆవలిదగు తన యొక్క తురీయ స్వరూపమును చేరి, సర్వమును దాటి వేస్తాడో, ఆతడు పునర్జన్మ రహితుడు అవుతాడు.

ఆకాశంలో ఒకే చంద్రుడు ప్రకాశిస్తూ అనేక నుయ్యి-తటాక- నదీ-సముద్ర జలములలో అనేక చంద్ర బింబముల వలె ప్రతిబింబిస్తున్న విధంగా,
ఒకే (ఏకము అయిన) భూతాత్మ అనేక అసంఖ్యాక జీవులలో వ్యవస్థితమై (Having been placed) ఉన్నది. ఒకే రీతిగాను, అనేక రీతులుగా కూడా (ఏకమగు ఆత్మ) ఇక్కడ (భేద దృష్టికి) కనబడుచూ ఉన్నది.
3. ఘట సంవృతం ఆకాశం
నీయమానే ఘటే యథా,
ఘటో నీయేత న ఆకాశం
తథా జీవః। నభ ఉపమః।

ఘటవత్ వివిధ ఆకారం భిద్యమానం పునః పునః,
తత్ భేదే చ న జానాతి
స జానాతి చ నిత్యశః।।
ఒకచోట ఒక కుండ (ఘటము) ఉన్నది. ఆ కుండ ఆక్రమించుకొని ఉన్న చోటును ‘ఘటాకాశము’ అంటాము. ఆ కుండ ఏ కారణం చేతనో పగిలిపోయింది. ఇంక అక్కడ ‘ఘటాకాశము’ అనేదేదీ ఉండదు. ‘ఆకాశము’ అనుదానిలో ఘటాకాశము గుర్తు లేకుండా పోయింది కదా! జీవాత్మ యొక్క లయము ఇట్టిదే.

ఆకాశము అనేక కుండలలో అనేక ఘటాకాశములగుచున్న ఉపమానంలాగానే - ఈ జీవులు కూడా (మట్టియే అనేక కుండలుగా అగుచున్నట్లే) అనేక దేహములలో దేహి అనేక రూప నామములు దాల్చుచున్నాడు. ఒకే మట్టి అనేక కుండలవడం జరుగుతోంది. అవన్నీ పగిలితే, మట్టిగా శేషించి, తిరిగి అనేక వేరైన కుండలు అగుచున్నట్లే - ఈ జీవులు ఏకాత్మరూపులై ఉన్నారు. అజ్ఞానముచేతనే అనిత్యమగు జీవాత్మలు కనిపిస్తున్నారు. జ్ఞానముచే నిత్యమగు ఏకాత్మ స్వానుభవము కాగలదు.
శబ్ద మాయ ఆవృతో యావత్,
తావత్ తిష్ఠతి పుష్కలే।

భిన్నే తమసి చ ఏకత్వం
ఏక ఏవ అనుపశ్యతి।

శబ్దార్ణం అపరబ్రహ్మ
తస్మిన్ క్షీణే యత్ అక్షరమ్,
అనేక నామరూపాత్మకమైన ‘‘శబ్దమాయ’’ (శబ్దమయము)చే దృష్టి ఆవరించబడినంతసేపూ కూడా, అనేకమే కనిపిస్తుంది. అఖాండాత్మ దృష్టిచే ఏకత్వమే అనిపించగలదు.

చీకటి తొలగితే అంతా స్పష్టము అగు తీరుగా అజ్ఞానాంధకారము తొలగిందా, ఏకత్వమే స్వానుభవము అవగలదు.

శబ్దము రూపంగా విస్తరించి చెప్పబడేది-‘‘స్వయం బ్రహ్మానుభవము’’ నకు దారి మాత్రమే. అందుచేత ‘‘అపరం బ్రహ్మ’’ అనబడుతోంది. ‘స్వానుభవము’చే శబ్ద రూపమంతా క్షయించగా, ‘అక్షరరూపము’ అగు ఆత్మానుభవము రూపుదిద్దుకోగలదు.
తత్ విద్వాన్ అక్షరం ధ్యాయేత్
యత్ ఇచ్ఛేత్ శాన్తిం ఆత్మనః।

ద్వే బ్రహ్మణీ హి మంతవ్యే
శబ్ద బ్రహ్మపరం చ యత్।
‘‘శాంతి సంపాదించుకోవాలి’’ - అని అనుకున్నవాడు ఆత్మజ్ఞానము సముపార్జించుకొని, విద్వాంసుడై అక్షరమగు ఆత్మతత్త్వమునే ఉపాసించాలి.
(1) శబ్ద బ్రహ్మమును (2) స్వానుభవము మాత్రమే అయి ఉన్న ‘‘పరబ్రహ్మము’’ను - రెండిటినీ మననపూర్వకంగా ఉపాసించెదరు గాక!
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః
పరంబ్రహ్మ అధి గచ్ఛతి।

గ్రంథం అభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః,
పలాలం ఇవ ధాన్యార్థీ త్యజేత్ గ్రంథం అశేషతః,
ఎవడైతే శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడై ఉంటాడో, అట్టివాడు క్రమంగా ‘పరబ్రహ్మము’ను పొందగలడు (సిద్ధించుకోగలడు). శబ్ద బ్రహ్మము సాధన. పరబ్రహ్మము సిద్ధి.
గ్రంథమును అభ్యసిస్తూ మేధావి అయి, జ్ఞాన (Theoretical) - విజ్ఞాన (Practical) తత్పరుడై, ధాన్యముయొక్క పొట్టు వదలి బియ్యమును తీసుకొను విధముగా, గ్రంథము క్రమంగా వదలి, జ్ఞాన-విజ్ఞాన సంబంధమైన సారమును మాత్రమే స్వీకరించు గాక! అట్టివాడే మేధావి.
గవాం అనేక వర్ణానాం, క్షీరస్య అపి ఏక వర్ణతా,
క్షీరవత్ పశ్యతి జ్ఞానం
లింగినస్తు గవాం యథా
జ్ఞాననేత్రం సమాధాయ
స మహత్ పరమం పదమే।।
అనేక రంగులు గల ఆవులు ఉండవచ్చు గాక! అవి ఇచ్చే పాలు మొత్తం తెలుపు రంగులో ఉంటాయి. అనేక శాస్త్రములు, గురువులు ప్రసాదిస్తున్న జ్ఞానసారము ఏకమగు ఆత్మజ్ఞానమే। జ్ఞాన నేత్రంతో అవన్నీ దర్శించి స్వీకరించుచు ఆ మహత్ ఆత్మపదమును సిద్ధించుకోవాలి.
నిష్కళం నిశ్చలం శాంతం
బ్రహ్మ అహం ఇతి సంస్మరేత్ ఇతి।
ఇతి ఏకం పరంబ్రహ్మ రూపం
సర్వ భూత అధివాసం
తురీయం జానీతే
సో అక్షరే పరమే వ్యోమన్ అధివసతి
‘‘నిష్కళంకము, నిశ్చలము, పరమశాంతము - అగు బ్రహ్మమే నేను’’ - అనియే సంస్మరిస్తూ ఉండాలి. స్ఫురణ కలిగి ఉండాలి.
అట్టి పరంబ్రహ్మము సర్వజీవుల అంతరమున నివాసము కలిగి ఉన్నది. అట్టి తురీయమును ఎవడు తెలుసుకుంటాడో, అట్టివాడు సర్వ క్షరములను జయించి అక్షర పరమాకాశమును స్వరూపముగా పొందగలరు.
య ఏతాం విద్యాం తురీయాం
బ్రహ్మయోని స్వరూపాం
తామ్ ఇహ ఆయుషే
శరణం అహం ప్రపద్యే।।
‘‘ఎవరైతే బ్రహ్మయోని స్వరూపమగు ‘తురీయము’ను స్పష్టముగా తెలుసుకొని ఉంటారో, అట్టి మహనీయులను తురీయవిద్య కొరకై నేను శరణు వేడుచున్నాను’’.
4. ఆకాశాత్ అనుక్రమేణ సర్వేషాం వా
ఏతత్ భూతానాం ఆకాశః
పరాయణగ్ం సర్వాణి హవా
‘‘ఆకాశాత్ వాయుః। వాయోః అగ్నిః। అగ్నేః ఆపః। ఆపః పృథివీ’’ అను అనుక్రమణమును (ఉపనిషత్ వాణిచే చెప్పబడిన పాంచభౌతిక నామరూపాత్మక దృశ్యముయొక్క ఉత్పత్తి వివరణ వాక్యమును) అనుసరించి, - ఈ సమస్త భూతజాలము (జీవజాలమంతా కూడా) ‘‘ఆకాశము’’ నుండే పరాయణము (జనించటము, బయల్వెడలటము) జరుగుతోంది
ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ జాయంతే।
ఆకాశ ఏవ లీయంతే
తస్మాత్ ఏవ జాతాని జీవన్తి।

తస్మాత్ ఆకాశజం బీజం వింద్యాత్।

తత్ ఏవ ఆకాశపీఠం స్పార్శనం పీఠగ్ం తేజః
పీఠం అమృతపీఠం రత్న పీఠం జానీయాత్
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి।
ఈ భూతజాలమంతా ‘ఆకాశం’లోనే జనిస్తూ, తిరిగి ‘ఆకాశము’నందే లీనము పొందుచున్నది. ఆకాశమునందే (జనన-విలీనముల మధ్య) జీవిస్తున్నాయి.

‘‘ఆకాశమే ఈ సమస్తమునకు బీజము’’ - అని తెలుసుకొనబడు గాక! ఎరుగబడు గాక!

అట్టి ఆకాశ పీఠము - స్పార్శనం పీఠము, తేజో పీఠము, అమృత పీఠము, రత్న పీఠము అని ఎరుగబడు గాక। ఆ విధంగా ఎరగటంచేత అట్టివారు ‘‘అమృత స్థానము’’నకు చేరుకొనుచున్నారు.
తస్మాత్ ఏతాం తురీయాగ్ం

శ్రీకామ రాజీయాం ఏకాదశధా భిన్నాం,

ఏకాక్షరం బ్రహ్మ ఇతి యో జానీతే

స తురీయం పదం ప్రాప్నోతి
- య ఏవం వేద
జాగ్రత్ స్వప్న సుషుప్తులతో సహా ఈ సమస్తము తురీయపురుషుని ఇష్టా చమత్కార ప్రదర్శనమే।

అట్టి ‘‘తురీయగ కామరాజీయము’’ ‘11’ రకములుగా (పంచ ప్రాణ- పంచేంద్రియ - జీవాత్మ సమేతంగా) భిన్న భిన్న రూపములు దాల్చుచున్నది.

ఇదంతా కూడా సర్వదా ‘ఏకము, అక్షరము’ అగు బ్రహ్మమే అయి ఉన్నది.

ఈ పరమ సత్యము ఎరిగినవాడు ‘తురీయ పదము’ను స్వాభావికంగానే పొందుచున్నాడు

ఇతి - త్రిపురా తాపిణ్యుపనిషత్ - “పంచమోపనిషత్”


🙏 ఇతి త్రిపుర తాపిన్యుపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।


అధర్వణ వేదాంతర్గత

23     తిపురాతాపిన్యుపనిషత్

(త్రిపుర తాపినీ మహోపనిషత్)

అధ్యయన వచన పుష్పము

‘‘త్రిపురా తాపినీ విద్య’’చే ఏ చిచ్ఛక్తి (చిత్ శక్తి) విగ్రహము (తత్త్వము) - ‘‘వస్తుతః చిన్మాత్రరూపం’’గా (The Form of mere Absolute Awareness) విశదీకరించబడుతుందో, అట్టి ‘‘పరతత్త్వము’’ను ఉపాసించుచున్నాము.

త్రిపుర తాపిన్యుపనిషత్ - ప్రథమోపనిషత్

భగవానుడగు పరమశివుడు కేవలుడు, నిష్క్రియుడు, సమస్త విషయాతీతుడై బ్రహ్మానందమయుడై ఉన్నారు. ఆయన నిర్విషయానందుడై ఉండియే - లీలగా, క్రీడగా, వినోదముగా మూడు రూపములు ధారణ చేస్తూ ఉంటున్నారు.

 1. ప్రజాపత్యము : (కల కనేవాడు కలలో అనేకమందిని కల్పించుకొని, వారందరితో వ్యవహరిస్తున్న తీరుగా) - సృష్టిలో అనేకమంది జీవాత్మల కల్పన (తనకు అనన్యముగా) కల్పించుకొంటున్నారు.
 2. వైష్ణవం : (జలము తనయందు తరంగములను కొనసాగిస్తూ ఉన్న తీరుగా) ఆ జీవుల పరిపోషణను కొనసాగిస్తూ ఉన్నారు. సమస్త జీవులలో అంతర్లీనులై ఉంటున్నారు.
 3. విలయం : (ఆలోచన బయలుదేరి, కొనసాగి - తిరిగి ఆలోచించువానితో లయము పొందు తీరుగా) సమస్తము సర్వాత్మకుడు, స్వస్వరూపుడు అగు శివభగవానునియందే విలయము పొందుతోంది.

ఈవిధంగా త్రి (3) కారణరూపములను ధరించుచున్నారు (ఆశ్రయిస్తూ ఉన్నారు).

‘‘త్రిపుర అభిధా భగవతి’’ అనబడే తనయొక్క ఆదిశక్తి ‘‘భూ । భువః । సువః (Matter, Thought, Self) ’’ అనబడే త్రిరూపములను, స్వర్గ-భూ-పాతాళములు - అనబడే త్రిపురములను ధరిస్తోంది.

హర మాయాత్మిక (శివుని స్వయంభావిత మాయాత్మిక) అయి తన స్వరూపమును సర్వత్రా నింపినదై ఉన్నది.

ఆ హృల్లేఖ్య (శివుని హృదయేశ్వరి) అయినట్టి ఆ దేవి తనయొక్క ‘‘హ్రీం’’ కారముతో భగవతి అయి ఉన్నది.

⃤ త్రికూట శిఖరమే తనయొక్క నిలయమై (స్థానము కలిగి ఉన్నదై), తనయొక్క మహత్తరమైన, ఘోరమైన తేజస్సుతో (జాగ్రత్-స్వప్న-సుషుప్తులు తనవే అయి ఉన్న “నేను”గా) వ్యాపించినదై ఉన్నది.

ఈవిధంగా ఆ భగవతి ‘‘త్రిపుర’’ అని వ్యాపఠ్యతే - అధ్యయనపూర్వకంగా స్తుతించబడుతోంది.

త్రిపదా గాయత్రి

1. తత్సవితుర్వరేణ్యం। (తత్ సవితుః వరేణ్యం)
2. భర్గో దేవస్య ధీమహి। (8)
3. ధియో యోనః ప్రచోదయాత్ (8)

ఇవి గాయత్రి యొక్క మూడు పాదములు.

ఇక 4వ పాదము: పరో రజసే సావదోం (సమస్తమునకు ప్రేరేపన స్వరూపిణి). 4 పాదములతో సమగ్రమైన స్వరూపమునకు సంజ్ఞ - ‘‘ఓం’’.

అమ్మవారి ఉపాసనా మహా మంత్రములు

జాతవేదసే సునవామ సోమం అరాతీయతో నిదహాతి వేదః।
దేవి యొక్క ‘జ్ఞానాగ్ని’ని మాయందు వెలిగించటానికై మేము ‘సోమము’ను సమర్పిస్తూ ఉన్నాము.
‘‘వేదము’’ (తెలియబడుచున్న సమస్తము కూడా) ఆ దేవి యొక్క తేజోరూపముచే దహించబడుచున్నది.
మాతా! అజ్ఞానము యొక్క వీచికలైనట్టి మాయొక్క ‘కర్మలు’ అనే కట్టెలు దహించబడి, ‘జ్ఞానాగ్ని’ మాయందు వెలుగొందును గాక!
స నః పరుషదతి దుర్గాణి విశ్వా నావ ఇవ సింధుం దురితా అతి అగ్నిః।
సముద్రములో మునిగిపోకుండా ‘నావ’ ఉపకరణము అయి సముద్రమును దాటివేయించు తీరుగా, అగ్ని దేవుడు (జాతవేదుడు) మమ్మల్ని సమస్త క్లేశములనుండి, దురితములనుండి తప్పిదముల నుండి కాపాడుదురు గాక!

ఓం। త్ర్యం బకం యజామహే, సుగంధిం, పుష్టి వర్ధనమ్।
ఉత్తమ గంధమును-పరిమళములను వెదజల్లువాడు, పుష్టిని వృద్ధి (వర్ధనము) చేయువాడు అగు (భూత-చిత్త-చిత్ ఆకాశములను ఆక్రమించుకొని ఉన్నట్టి) త్ర్యంబకుని (త్రినేత్రుడిని) - ‘‘యజామహే’’ - ఆరాధిస్తూ ఉన్నాము. ఉపాసిస్తున్నాము. పూజిస్తూ ఉన్నాము.
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోః ముక్షీయ।
దోసపండును తొడిమనుండి వేరు చేయునట్లు, ఆ శివభగవానుడు మమ్ములను ‘మృత్యువు’ నుండి వేరు చేసెదరు గాక।
మా అమృతాత్।
‘అమృతము’ నుండి వేరు కాకుండా పరిరక్షించెదరు గాక!

త్రిపురా తాపినీ విద్య।

త్రిపురా విద్య ఈ విధంగా అభివర్ణించబడుతోంది.

ప్రప్రథమ స్వరూపిణీ - ‘శతాక్షరీ’

శతాక్షరీ।
పూర్ణమైన అక్షర స్వరూపిణీ! పరమా విద్యా! ఈ జీవుని కేవల-పర (సమస్తమునకు ఆవలిదగు) పరమా విద్యా స్వరూపిణీ!
త్రయీమయీ!
(సత్వ రజో తమో) - త్రిగుణాత్మకా! (భూత-వర్తమాన-భవిష్యత్) త్రికాల, (స్వర్గ భూ పాతాళ), (జాగ్రత్-స్వప్న-సుషుప్తి) త్రి అవస్థా, (జీవ-ఈశ్వర-పర) త్రిమూర్తీ స్వరూపిణీ!
స అష్టార్ణా!
(అర్ణము, తరంగము) (పంచభూతములు, మనో బుద్ధి చిత్తములు అనే) ఎనిమిది తరంగములుగా విశ్వమునందు ప్రవహించు దేవీ!
త్రిపురా!
(జాగ్రత్ స్వప్న సుషుప్తులనే) త్రిపురములను పాలించు త్రిపురేశ్వరీ! దృశ్యము-ద్రష్ట-దృక్ త్రిరూపములుగా విస్తరించియున్న - త్రిపురేశ్వరీ! పరమేశ్వరీ! సమస్తము ‘తానే’ అయి, అట్టి సమస్తమునకు ‘పరము’ (Beyond) అయినట్టి ఈశ్వరీ!
ఆద్యాని చత్వారి పదాని పరబ్రహ్మ వికాసినీ।
మొట్టమొదటే ఏర్పడి ఉండి (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములని పిలువబడే) 4 పదములను పరబ్రహ్మ స్వరూపిణిగా వికసింపజేయుచున్న ఆది స్వరూపిణీ! పరబ్రహ్మ స్వరూపిణీ! ఇదంతా నీయొక్క ప్రప్రథమ స్వరూపము.

ద్వితీయాని - ‘‘శక్త్యాఖ్యాని’’।

ఏకము, అఖండము అగు పరబ్రహ్మ స్వరూపము నుండి ఆ దేవాదిదేవి - ద్వితీయమైన (As 2nd) ‘‘శక్తి’’గా ప్రదర్శనమగుచున్నది.

పరబ్రహ్మము + శక్తి।
పురుషుడు + ప్రకృతి।
నేను + నాది / నాయొక్క।
కేవల స్వరూపిణి + సందర్భ స్వరూపిణి।

తృతీయాని - ‘‘శైవాని’’।

అట్టి దేవియొక్క శివ + శక్తి ద్వయము సుఖ, శుభ, శాంతి, ఐశ్వర్య, ఆనందరూపమగుచున్నది. ‘శైవము’గా - ఆ దేవియే అఖండాత్మ నుండి మూడవ తత్త్వమై బయల్వెడలుతోంది.

అట్టి శివశక్తి శైవము నుండియే →

❋ [(సప్త (7) అధో లోకములైనట్టి - అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకములు, సప్త (7) ఊర్ధ్వలోకములైనట్టి - భూ, భువః, సువః, మహః, జనో, తపో, సత్య లోకములు] - అనబడే - 14 లోకములు,
❋ (ఋక్-యజుః-సామ-అథర్వణములనబడే) చతుర్ (4) వేదములు,
❋ సమస్త శాస్త్రములు, పురాణములు, (మను ధర్మము, ఆర్ష ధర్మము, పారాశర్య సంహిత మొదలైన లోక-క్షేమ సంబంధమైన) ధర్మశాస్త్రములు,

ఇవన్నీ కూడా చికిత్సతముగా (ప్రతిక్రియగా) - నిర్మితమై దేవీ తేజస్సుచే సృష్టియందు ప్రక్షిప్తం అయినవగుచున్నాయి.
ఇవన్నీ సంసార రోగ చికిత్సగా అమ్మవారిచే లోకములకు ప్రసాదించబడుచున్నాయి.

ఆ జనని ‘‘జ్యోతి’’ స్వరూపిణి అయి తనయొక్క శివశక్తి యోగంచేత ఇక్కడ ఘటనా అఘటనములన్నీ నవలా రచయితవలె రచిస్తూ జగన్నాటకమునకు కారణమై ఉంటోంది. ఘటనాఘటన విభూతులను సంప్రదర్శనము చేస్తోంది.

[ ఘటన = Incidental (ప్రతిబింబము)        అఘటన = Non-Incidental (దర్పణము) ]

అట్టి పరము (Beyond and Prior to all), గహ్వరము (ఇహము, అపరము)ల గురించి ఆయా కొన్ని విశేషాలు ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాము.

అమ్మవారి తత్ స్వరూపము (లేక) పరస్వరూపము

అది ‘మహాన్’ మను స్వరూపము. (విశ్వమంతా తానై, సమస్తమునకు ‘వేరు’ అయినట్టి) ‘‘తత్’’ను తన స్వరూపముగా కలిగి ఉన్నట్టిది.

‘బ్రహ్మము’ అని శాస్త్రములచే ఎలుగెత్తి గానము చేయబడుచున్నట్టిది. త్రికాలములకు ఆవలిదై శాశ్వతమైనట్టిది.

పాత్రధారుని నాటకమునకు, ఆ పాత్రధారుని నాటకమునకు సంబంధించని సహజరూపముల భేదము వలె - ఈ జగన్నాటకమునకు రచయితగా ‘పరము’ స్వరూపముగా కలిగియున్నట్టిది. (నాటకములోని పాత్రా విశేషాలు = ఘటన. పాత్రకు వేరైన నటుడు = అఘటన).

సమస్తమునకు వెలుగు (Enlightenment)గా ‘‘భగవాన్’’ స్వరూపిణి. సమస్త లక్షణములకు ఆవల నిర్లక్షణము (విలక్షణము) అయినట్టిది. (ఎట్టి దోషములు స్పర్శించని) నిరంజన స్వరూపిణి. ఉపాధికి వేరైనట్టి (దేహిగా) నిరుపాధిక స్వరూపిణి। ఆధిరహితము (మనో దోష రహితము) అయినట్టి దేవాదిదేవి। శివస్వరూపిణి।

ఈవిధంగా ‘మహాన్’, ‘బ్రహ్మము’, ‘రచయిత’, ‘చేతనరూపిణి’ అయినట్టి శ్రీ త్రిపుర సుందరీ దేవి ఇంకా కూడా ఎటువంటిదంటే -

నిరుపాధి : ఈ బ్రహ్మాండమంతా ఆ దేవియొక్క ‘‘ఉపాధి’’యే అయి ఉంటూనే, ఆ తల్లి నిరుపాధి. ‘ఉపాధి’కి వేరై, ఉపాధిలపై ఆధారపడనట్టి ఉనికి కలిగినది. నిరుపాధికము. (ఉపాధి = Something under usage).

‘ఆధి’ రహిత : జగత్తులను కల్పిస్తూ వినోదిస్తూ ఉన్నప్పటికీ, జగత్తుపట్ల మానసికమైన ‘‘వ్యసనము, ఆధారపడటము’’ అను ఆధి (మనోవ్యాధి) లేనట్టిది. మనస్సు ఆ త్రిపురేశ్వరికి స్వయంగా నియమించుకొన్న ఉపకరణమేగాని, మనస్సుచే బంధింపబడునది కాదు. అందుచేత ఆధి (వ్యధ, ప్రత్యాశ) లేనట్టిది.

ఉన్మీల్యతే పశ్యతి : ఈ విశాల విశ్వమంతా ఆ జగన్మాతయొక్క ‘‘కనులు తెరచి చూడటము’’ అనే చమత్కార రూపమే! ఈ జగద్దృశ్యమంతా ఆ తల్లియొక్క దర్శన (Perceiving) ప్రదర్శనమే।

వికాసతే చైతన్య భావమ్। : ఆ దేవియొక్క చైతన్య భావనయే ఈ సమస్తములుగా వికసిస్తూ ఉన్నది. ఈ లోకములు, లోకపాలకులు, లోకులు - ఇదంతా ఆ మాతయొక్క చైతన్య భావనా వికాసమే (Manifestation of her own enlightenment of feeling).

కామయత ఇతి : ఆ దేవియొక్క ‘‘ఇష్టము’’ చేతనే, ఈ సమస్తము వెల్లివిరుస్తోంది. అందుకే కామాక్షీదేవిగా మనము ఉపాసిస్తున్నాము. ఆ మాతయొక్క కోరికను అనుసరించియే ఈ జగన్నాటకమంతా ప్రదర్శనమగుచున్నది. సమస్త జీవులందు, సమస్తమునందు ‘‘నా యిష్టము’’ అను రూపముగా ప్రదర్శనమగుచున్నది ఆ త్రిపురసుందరియే.

స ఏకో దేవః శివరూపీ। : అనేకముగా కనిపిస్తూ ఉన్న ఈ జగత్తులో ‘‘ఏక-శివ’’ రూపిణియై విరాజిల్లుచున్నది. ‘ఏకోదేవః’ అగు శివస్వరూపిణి అగుచున్నది.

దృశ్యత్వేన వికాసతే। : ‘‘దృశ్యము’’గా కనబడేదంతా ఆ దేవి యొక్క దృశ్యత్వ వికాసమే। ద్రష్ట-దృశ్య సంబంధ చమత్కారమే।

యతిషు యజ్ఞేషు యోగిషు కామయతే కామం జాయతే। : ఈ సమస్తము స్వస్వరూపముగా దర్శిస్తూ వినోదించు యతులందు, యజ్ఞుములందు, యోగాభ్యాసపరులగు యోగులందు - వారి ఇష్టరూపముగా, లక్ష్యముగా ఏర్పడి ఉన్నది ఆ ఆనందవల్లీ దేవియే। కోరికలు గలవారియందు ‘కోరుకొనుట’ అనే ‘‘కామయతే కామ’’ రూపమై ప్రదర్శనమగుచున్నది.

నిరంజనో, అకామత్వేన విజ్జృంభతే। : సమస్త జీవులలో కామయతే కామరూపిణి అయి ఉండియే, సర్వదా సర్వత్రా నిత్య నిర్మలమై, అకామ స్వరూపముగా (నిర్మల నిర్గుణ చైతన్యముగా) విజ్జృంభించుచున్నది.

‘‘అ క చ ట త ప’’ యశాన్ సృజతే। ‘‘క్+అ’’, ‘‘చ్+అ’’, ‘‘ట్+అ’’, ‘‘త్+అ’’, ‘‘ప్+అ’’ అనే హల్లుల - అచ్చుల కలయకతో ఏర్పడేవన్నీ ఆ మాతయొక్క కంఠ (శబ్ద) సౌందర్యములే.

అక్షర ఉచ్చారణ విశేషములు

సరళములు = ‘క’ ‘చ’ ‘ట’ ‘త’ ‘ప’
అల్పప్రాణములు = ‘య’ ‘ర’ ‘ల’ ‘వ’
ఆదేశ సరళములు = ‘గ’ ‘జ’ ‘డ’ ‘ద’ ‘బ’
ఇక్కులు = ‘ఇ’ ‘ఉ’ ‘ఋ’ ‘ఒ’ అను నాలుగు అక్షరములు
అచ్చులు, ఆదులు = ‘అ’ నుండి ‘ఔ’ వరకు వర్ణనములు (16 అక్షరములు)
‘ఏ’త్వము, ‘ఐ’త్వము, ‘ఓ’త్వము
హల్లులు = ‘క’ నుండి ‘హ’ వరకు (వ్యంజనములు అని కూడా పేరు)
ఓష్ఠ్యములు (పెదవులతో ఉచ్చరించేవి) = ఉ ఊ ప ఫ బ భ మ
స్థిరాలు = ‘య, ర, ల, వ, శ, ష, స, హ, ళ’
కంఠోష్ట్యములు (కంఠముతో పలికేవి)= క ఖ గ ఘ జ ‘హ’ కారము
అంతసాలు, ఘోషలు = ‘య ర ల వ’
అనునాశికములు (ముక్కుతో ఉచ్చరించేవి) = ఙ ఞ ణ న మ (అనువర్ణములు)
కంఠోష్ట్యములు (కంఠము+పెదవి) = ఓ ఔ

గఠాదులు = ఠ డ ఢ ద ఢ క్ష గ జ బ మ - 10 వర్ణములు
తాలవ్యములు (దవడ)తో పలికేవి = ఇ ఈ చ ఛ జ ఝ ఞ య శ
తురీయ వర్ణములు/వర్ణ చతుర్థ వర్ణాలు = ఘ ఝు ధ భ
తృతీయలు వర్ణములు = ‘గ జ డ ద బ’ అను సరళ వర్ణములు
త్రికము = {ఆ (దూర నిర్దేశ సర్వనామము), ఈ (సమీప నిర్దేశ సర్వనామము), ఏ (ప్రశ్నార్థక సర్వనామము)}
దంత్యములు (దంతములు స్ధానముగా ఉచ్చరించే వర్ణములు) = ‘కా’ కారము, ‘ల’ కారము, ‘స’ కారము
త థ ధ న
దంత్యేష్ఠ్యములు (దంతములు, పెదిమలతో పలికేవి) = ‘వ’కారము
మూర్ధన్యములు (శిరస్సును నాలుకతో తాకుతూ ఉచ్చరించబడే అక్షరాలు) = ఋ బు ట ఠ డ ఢ ణ ర ష
యణ్ణులు = ‘య ర ల వ’
వక్ర తమములు = ‘ఐ’ ‘ఔ’
వక్రములు = ‘ఎ ఏ ఒ ఓ’
వర్గ యుక్కులు,
మహాప్రాణములు = ఖ - ఘ, చ - ఝ, ఠ - ఢ, థ - ధ, ఫ - భ
వర్ణకము = ‘డు ము వు లు’

(పైవన్నీ అక్షర-ఉచ్చారణంగా జనించిన శబ్ద విశేషములు).

తస్మాత్ ఈశ్వర -
కావున ఈశ్వరియే సమస్తమైన నామరూపాత్మకంగా విస్తరించి ఉన్నది. ఈ సమస్తము ఆ జననియొక్క చిత్త (ఇచ్ఛా) విశేషమే ఇదంతా. ‘కామః’లో ‘క’కారముగా ‘కామేశ్వరి’ అను నామముచే పిలువబడుచున్నది.

కామో ఏవ ఇదం తత్ తత్ ఇతి।
దేవియొక్క ఇచ్ఛా-కల్పనలను అనుసరించి, ఆ దేవియొక్క వినోద-ఆనంద నిర్మితమే ఇక్కడి భౌతిక వస్తుజాలము. అట్టి భౌతికమైనదంతా అమ్మవారి ఇచ్ఛా (కావాలనుకొన్న) రూపమే।

పదార్థములన్నీ దేవీ ఇచ్ఛగా ఎరిగి దర్శించువాడు ఇక్కడి సంగతులు, సందర్భములు, అనుబంధములు, బాంధవ్యములు రూపంగా ఈ శరీరముతోను, తదితర శరీరములతోను ఏర్పడుచూ ఉన్నదంతా ఆ కామాక్షీదేవి (చిత్ శక్తి) యొక్క నాటకీయ - వినోదమే అని, ఈవిధంగా తత్త్వదర్శి దేవీ - ఉపాసనా భావము స్వీకరించుచున్నాడు.

ఆతడు ఆ జగన్మాతయొక్క దర్శనము చేయుచున్నవాడే అగుచున్నాడు.

సవితుర్వరేణ్యమ్

ఆ జగన్మాతయే ‘‘సవితుర్వరేణ్యం’’ - అని వర్ణించబడుతోంది. ఇదంతా ‘‘సవితుర్వరేణ్యం’’।

‘‘సత్ (ఉనికి, Being) + విత్ (ఎరుక, Knowing)’’
ఇతి ‘షూన్’ : జగన్మాతయే ‘సత్-విత్’ స్వరూపిణి అయి, సమస్తమునకు జనని-జనించు స్థానము అయి ఉన్నది.

 • షూన్ = ప్రసవము, ఉనికి-ఎరుకల మధ్య సంబంధము
 • సవిత = ప్రాణులను కనుచున్నవాడు.
 • శక్తి = కనుచుండటము

⎼⎼⎼➤        త్రిపురాశక్తి

ఆ దేవియే త్రి ప్రదర్శనములు కారణంగా ‘‘త్రిపురా పరమేశ్వరి’’, ‘‘మహాకుండలినీ దేవి’’ అని పిలువబడుతోంది.

అట్టి దేవియొక్క తేజోరూపమైనట్టి ‘‘జాతవేదస మండలము’’ను ఎవ్వరు ఉపాసిస్తారో, అట్టివారు తమయొక్క సర్వత్రా వ్యాప్యత్వమును అనుభవముగా పొందగలరు. (ద్రష్ట-దర్శన-దృశ్యములతో కూడిన) త్రికోణశక్తిని అధిగమించి, సాక్షీరూపమగు ‘ఏ’ (ఆవల గల కేవల సాక్షిత్వ) కారణత్వము సిద్ధించుకోగలరు. అట్టి ‘ఏ’కారత్వమే గ్రహించవలసినది, వరేణ్యము (ఉపాసించవలసినది), శ్రేష్ఠము, భజించవలసినది కూడా.

అందుచేత అట్టి ఏకారత్వమునే సర్వత్రా, సహజీవులందరిలో చూస్తూ, స్తుతిస్తూ, గ్రహించవలసినది. దేవీతత్త్వమును ఎరిగినవాడు ‘ఏ’కార (సాక్షీ) తత్త్వమును స్వస్వరూపముగా స్వీకరించగలడు.

భర్గో దేవస్య ధీమహి - వ్యాఖ్యాస్యామః

ఇప్పుడు ‘‘భర్గో దేవస్య ధీమహి’’ అను దాని గురించి వ్యాఖ్యానించుకుందాము.
‘‘ధ’’ - అనగా ‘‘ధారణ’’।
‘‘ధీ’’ - బుద్ధి చేతనే ‘ధారణ’ చేయబడుతోంది.
‘‘భర్గో దేవో’’- భగవానుడగు పరమేశ్వరుడే సమస్తమును వెలిగించుచు ‘భర్గోదేవుడు’ అయి ఉన్నారు (One who enlightens everything else).

ఆ పరమేశ్వరియే ఇహము - పరములకు (Here what I am - Originally what I am లకు) ‘మధ్యవర్తి’. జాగ్రత్-స్వప్న సుషుప్తులకు ఆవలి, అవన్నీ తనవైనట్టి అక్షరమగు ‘తురీయుడు’. సాక్షాత్ తురీయము. సర్వత్రా విస్తరించి ‘సర్వము’ అయి ఉన్నట్టిది.

‘‘తుః’’ : ‘‘ఈ’’ : ‘‘యమ్’’

‘ఈ’ కారము ‘మధ్యవర్తి’ వలె పరమేశ్వరి కూడా సమస్తమునకు మధ్యవర్తియే. అట్టి మధ్యవర్తిత్వమే ‘‘భర్గో రూపము’’ - అని వ్యాఖ్యానించబడుతోంది.

అందుచేత ‘‘భర్గో దేవస్య ధీమహి’’ అను మంత్ర వాక్యము పలుకుతూ ‘‘ఏకము-అక్షరము అగు ఆత్మయొక్క మహిమను స్తుతిస్తున్నాము’’ - అను ఉద్దేశ్యమును ఆశ్రయించి ఉండాలి.

‘మహీ’ ఇతి అస్య వ్యాఖ్యానం।

‘‘మహ్వత్వం, జడత్వం, కాఠిణ్యం’’ ఈ మూడు కూడా ఏ అక్షరమునందు ఏర్పడి ఉన్నదో, - అదియే ‘‘మహి’’.

‘ల’కారము = పరంధాముని కాఠిన్య-అర్థమును సూచించునది. ఆయనయొక్క కాఠిన్యమే (The Solidness): -
- సాగరములతో (సముద్రములతో కూడిన)
- పర్వతములతో కూడిన, సప్త ద్వీములతో కూడిన, అరణ్యములతో కూడిన ప్రకాశరూపము (Manifesting form).

‘ల’కార మండలరూపమే ఈ పృథ్వి (భూమి).

‘‘ఈ భూమి అంతా ఆ దేవీ మహత్మ్యమే’’ అని దేవీతత్త్వవేత్తల ప్రవచనము.

ధియో యోనః ప్రచోదయాత్

ఈ మంత్రము పరమాత్మ అగు పరమశివుని ఆధిభూతత్వమును స్తుతిస్తోంది.
సమస్తమునకు ఆయన పరము (Beyond, ఆవల) అయి ఉండియే, దీనికంతటికీ ప్రకాశమానుడు. మార్పు చేర్పులు లేని స్థానువు (Constant) అయి ఉన్నవారు.

‘‘ల’’కారముచే జ్యోతిర్లింగ స్వరూపుడగు (జ్యోతి చిహ్నముగా సూచించబడు) ఆ పరమశివ భగవానుడు
మా యొక్క - ధియః - బుద్ధులను -
✤ భగవత్ ధ్యానమునందు, ధ్యానేచ్ఛయందు
✤ నిర్వికల్పమునందు
→ ప్రచోదయాత్। - ప్రేరేపించెదరు గాక।

ఇతి ఉచ్చస్వర రహితం, చేతసైవ చింతయిత్వా, భావయేత్। ఈ విధమైన ‘‘స్వామీ! మా బుద్ధిని ఆత్మ భావనవైపు ప్రేరేపించండి’’ - అనే మంత్ర-మంత్రార్థములను పెద్ద గొంతుకతో కాకుండా, (నిశ్శబ్దంగా) - బుద్ధితో చింతనచేస్తూ, మనస్సుతో భావన చేయాలి.

- - -

ఆ దేవ దేవి!

⌘ పరోరజము (మన పరస్వరూపము) అను తత్-అవసానమున ప్రకాశించుచున్న పరంజ్యోతి. అత్యంత అమలము (స్వచ్ఛమైనది). సమస్తమును ‘చేతనము’ (Inspired) గా చేస్తున్న చిత్-చైతన్య స్వరూపిణి. ‘చిత్’ లింగ స్వరూపిణి.
⌘ హృదయము అనే ఆగారములో (గృహములో) సదా నివసించునది.
⌘ ‘హ్రీం’ మొదలైన బీజాక్షర సంపుటిలచే ‘వాక్ భవ కూటము’ వాక్కు యొక్క జనించు స్థానము.
⌘ ‘ఓం ఐం హ్రీం క్లీం శ్రీం’ అను పంచాక్షర స్వరూపిణి.
⌘ ఇక్కడి ఆకాశము-వాయువు-అగ్ని-జలము-భూమి అనబడే పంచభూతములకు - పంచభూత జనకము - జనక స్థానము, జనింప జేయునది.
⌘ (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు) (దృశ్యము-ఇంద్రియములు-దేహము-జీవుడు-పరమాత్మ) (భూతకాల- వర్తమానకాల- భవిష్యత్‌కాల-కర్మ ఫలములు అనే) పంచవిధములైన రీతులుగా - పంచకలాత్మకము, పంచకలామయము.
⌘ సర్వదా సర్వత్రా వ్యాపించి యున్నది.

అట్టి బాలత్రిపుర సుందరీ స్వరూపమును ఎరిగినవాడే జగన్మాత తత్త్వమును ఎరిగినవాడు.

ఆ దేవి - సమస్తము తన ‘ఇచ్ఛ’గా కలిగి ఉండటంచే ‘‘కామ కళాభూతమైన కామకూటము’’ (The Root of the Desire to have all these dramatic events of this world) - అని చెప్పబడుతోంది.

(ఓం) తత్ సవితుః వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 16
ధియో యోనః ప్రచోదయాత్ 8
(ఓం) ఆపోజ్యోతి రసోమృతం। 8
‘‘ఓం’’ = 32

ఈ 32 అక్షరములను ‘ఓం’తో జోడించుచూ, పఠించాలి.

‘‘తత్’’ = పరమాత్మ। సదాశివుడు। ‘ఓం’। అక్షరము। విమలము। ఉపాధికి ఆతీతమై ‘నిరుపాధికము’।

అట్టి ‘తత్’తో ‘సో2హం’ లోని ‘సో’గా భావించాలి.

‘‘హ’’కారాక్షరం = శివరూపం. నిరక్షరము. అక్షరము కూడా!

తత్సవితుః తత్ సరాగ వ్యావృత్తిం ఆదాయ, శక్తిం దర్శయతి తత్సవితుః ఇతి। తత్ ‘స’విత్‌లోని సరాగమును వృత్తిగా స్వీకరించి, ‘శక్తి’గా భావించాలి.

పూర్వ (తూర్పు) మార్గంగా సూర్యుని, ఆ క్రిందగా చంద్రికను ‘శ్రీచక్రము’లో లిఖించాలి.

‘‘మూలాధార చక్రము’’ నుండి ‘‘బ్రహ్మరంధ్రము’’ వరకు సాక్షరము, అద్వితీయము గురించి శ్రీ చక్రము సూచించుచున్నది.

శివ శక్త్యాత్మకమ్

భగవంతం దేవగ్ం శివ-శక్త్యాత్మకమ్ ఉదితమ్। దేవ దేవుడగు పరమాత్మ ‘‘శివ’’ - ‘‘శక్త్యాత్మకము’’గా ఉదయించుచున్నారు.

అయం ‘‘శివో’’ - శివుడు → పరమదైవము.

ఆయన శక్తియే - ఈ జీవజాలమంతాగా ప్రదర్శనమగుచున్నది.

సూర్య - చంద్రమస యోగముచే ఏర్పడుచున్న ‘తత్’ పదమే ‘‘హంస’’ అనబడుతోంది.

ఆ పరమ శివస్వరూపునినుండి ‘‘సృష్టి సంకల్పము’’ అనే కామము బయల్వెడలుటచే ‘కాముడు’ అని స్తుతించబడుచున్నారు. అట్టి ‘క’ వర్ణము బయల్వెడలుచున్న మూలా స్వామి అగు కామదేవుడు ఉపాసనకు విషయమై ‘‘భర్గ’’ - అనబడుచున్నారు.

‘తత్ సవితుః వరేణ్యం భర్గో దేవః’ ఈ మంత్రము క్షీరము (పాలు) వలె సేవించాలి. దీనిచే అక్షరము (క్షరమనునదే లేని సహజ స్వరూపమగు పరబ్రహ్మము) ఆరాధించబడుతోంది. మధుఘ్నముతో కూడినది.

(1) పరమాత్మలో (2) జీవాత్మ యోగము అనునదే - ‘‘తత్’’ అను శబ్దార్థము.
మూడవ (3) అక్షరము = ‘‘హ’’ అనబడుచున్నది.
‘‘హ’’ అక్షరార్థము = పరమశివుడు

ఆయనయే ఎట్టి దోషములు స్పృశించని నిష్కల్మషుడు.

ఆ దేవదేవుడు ఆది - అంతములకు ఆవల దివ్యరూపుడుగా వ్యాకరించబడుచున్నది (నిర్ణయించబడుచున్నది).

అట్టి పరమపదము (శివపదము) యొక్క ధారణమే ‘ధి’ - అను అక్షరముగా చెప్పబడుతోంది. జడత్వ ధారణము - ‘మహి’ శబ్దముగా అనబడుతోంది.

‘మహి’ ఇతి ‘ల’ కారః। ‘ల’ అనే అక్షరము ‘మహిమ’కు సంజ్ఞ.

‘ల’కారార్థము = అంత్యమ్ సృష్టమ్। ఈ సమస్తమునకు ఆవలగల అక్షరము - ‘‘పరమ చైతన్యము’’.

ధియో యోనః ప్రచోదయాత్। పరో రజసమును (లేక) పరతత్త్వమును స్పష్టపరచ వేడుకొనుచున్నాము. ఆవలి స్వస్వరూపమే ‘ఓం’ అను అక్షరముతో ఉపాసించబడుతోంది.

కూటము = పద్మము (కామకలాలయము శ్రీచక్రములోని కూటము).

ఈ మంత్రోపాసన, కూటము, కామకలాలయము. షడధ్వపరివర్తకుడు (‘6’ చక్రములను దాటించి) బ్రహ్మరంధ్రము ద్వారా ‘‘ఈ సమస్తము నాలోని నేనైన నేను’’ - అను సహస్రారమునకు జేర్చుచున్నది. అట్టి స్థానమును సుస్థీకరించుకొను స్థానము - ‘‘వైష్ణవ స్థానము’’ అని, ‘‘పరంధామము’’ అని కూడా పిలువబడుతోంది.

32 అక్షరముల గాయత్రి : ‘‘ఓం భూర్భువస్స్వః (4), తత్సవితుర్వరేణ్యం (7), భర్గో దేవస్య (5), ధీమహి (3), ధియో యోనః (4) ప్రచోదయాత్ (4) ఓం ఆపోజ్యోతిః।’’ (5).

ఈ మంత్రార్థమగు ఆత్మనుండి ‘‘శక్తి కూటము’’ (The original source from where energy stems out).

దేని నుండి ‘ఆకాశము’, ఆకాశము నుండి వాయువు స్ఫురిస్తున్నాయో అదియే వరేణ్యము (స్తుతించవలసినది, ఉపాసించవలసినది). అధీనం। ఆశ్రయించవలసినది.

‘సవితుః’ - ఎద్దాని నుండి జీవాత్మ-పరమాత్మలు ఉభయము సముద్భవిస్తున్నాయో (జనిస్తున్నాయో), వారే సవిత్రు భగవానుడు. సత్-విత్-ఋత్ స్వరూపుడు. ఈవిధంగా ‘‘సవితృ’’ శబ్దము గురించి ఎరిగినవాడు ‘జీవాత్మ’గా కనిపిస్తున్నదానియొక్క అక్షర-స్పష్టమును పొందగలడు.

భర్గోదేవస్య ‘ధీ’ - ఇతి। సమస్తమునకు ఆధారరూపమైనట్టి ‘‘శివాత్మాక్షరము’’గా గణింపబడుతోంది (నిర్ణయించబడుతోంది).

‘మహి’ - మొదలైనదంతా అశేషమైన, కామ్యరూపమయినట్టి రమణీయమైనట్టి ‘‘శక్తి కూటము’’గా స్పష్టీకరించబడుతోంది.

ఈవిధంగా   తత్సవితుర్వరేణ్యం (7)
        భర్గో దేవస్య (5)
         ధీ మహి (3)
             15

త్రైపురస్వరూపమగు పై పంచదశాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసిస్తారో, అట్టివారు -
- తాము కోరుకొన్నవన్నీ పొందగలరు. స సర్వాన్ కామాన్ ఆప్నోతి।
- వారు సర్వభోగములు పొందగలరు. స సర్వాన్ భోగాన్ అవాప్నోతి।
- వారు సర్వ లోకములు జయించగలరు. స సర్వాన్ లోకాన్ జయతి।
- వారు సమస్త వాక్కులను బలపూర్వకంగా విజృభించి పలుకగలరు. స సర్వాన్ వాచో విజృంభతి।
- అట్టివారు (లఘువు అగు సమస్తమును అధిగమించి) గురుత్వమును పొందగలరు. స గురుత్వం ప్రాప్నోతి।
- వారు వైష్ణవ ధామమును (విష్ణు గ్రంధిని) కూడా ఛేదించి పరబ్రహ్మమును పొందగలరు.

శ్రీ చక్రంలో ధామములు

ప్రథమ ధామము : ఈవిధంగా ‘ఆద్యా విద్య’ను పూర్వ మనువు చెప్పియున్నారు. ఇది ప్రథమ ధామము.
ద్వితీయ ధామము : శక్తి కూటము. శక్తి + శివ ఆద్యము (The Basic Begining) లోపాముద్రేయము.
తృతీయ ధామము : బిందు రహితముగా, భూతహృత్ లేఖనము, క్రోధమునినా అధిష్ఠితా। క్రోధ మౌన అధిష్ఠానరూపము. ఇతః పూర్వమే ఉన్న వాక్‌భవకూట విద్య. ‘‘చాంద్రీం విద్య’’, ‘‘కౌబేరీ విద్య’’ అని కూడా పిలుస్తారు.
చతుర్థ (నాలుగవ) ధామము :
- మదనాథుడగు శివతత్త్వము (శివుడు). (వాగ్భవకూటము).
- అద్దానిపైన కామ కళామయమగు ‘శక్తి’. దానికి పై ‘శాక్త్యము’.
ఇది ‘మానవీ విద్య’ అని పిలుస్తున్నారు.
పంచమ (5వ) ధామము : శివ-శక్తిల ఏక రూపమగు వాగ్భవము. ఇది శివశక్త్యాఖ్యము. ఇది తృతీయము పైనది. ఈ పంచమీ ధామమే చాంద్రీవిద్యగా ధ్యేయము (ధ్యానింపతగినది).
షష్ఠౌ ధామము : చాంద్రీ। క్రింద కామరూపిణి. పైన శివాద్య కామరూపము. దీనిని ‘‘కౌబేరీ షష్ఠే ధామము’’ అని పిలుస్తున్నారు.
సప్తమ ధామము : ఇది హిత ‘ఏ’కార రూపము. తురీయ స్వరరూపము. అన్నిటికీ ఆది స్వరూపము. సూర్య-చంద్రమసములతో కూడిన కామేశ్వర వాగస్త్య (వాక్-అస్త్య) సంజ్ఞా రూపము. ‘‘వాగస్త్య’’ అని పిలువబడునది.
అష్టమ ధామము : పైన 3వ ధామముగా చెప్పబడినదానికి కామాద్యము (కామము-ఇచ్ఛ) ప్రారంభరూపముగా కలిగియున్నట్టిది. రెండు అరలు క్రిందగా ‘కం’ మదన కళారూపము. శక్తి బీజము. వాగ్భవమునకు చివరిగా అర్థావ శిరస్కం చేయటము. ఇది ‘‘నంది విద్య’’ అని కూడా పిలువబడితోంది.
నవమ ధామము : ‘‘వాగ్భవమును, ఆగస్త్యమును, శక్తిని కలిగి ఉన్నట్టిది. ‘‘మన్మథ ఉర్వీమాయా’’। ‘‘కామ కళాలయం’’ అను బీజాక్షర నిర్మితము.
దశమ ధామము : చంద్ర, సూర్య, అనంగ, ధూర్జటిల ‘మహిమ’తో కూడిన ధామము. షణ్ముఖీ విద్య యొక్క మూడవదిగా ప్రకాశించునది. షణ్ముఖీ త్రయీ విద్య।
ఏకాదశ ధామము : మరల ఆగస్త్య విద్యను పఠించి, మరల ‘ఏ’-వమును మాయగా ఆమంత్ర్యము చేయు ధామము. ఇది ‘పరమశివ విద్య’.
ద్వాదశ ధామము : మరల ఆగస్త్యమును పఠించి వాగ్భవమును ధ్యానిస్తూ కామ కాళాలయమును సహజముగా చేసుకొంటూ, లోపాముద్రతో శక్తి కూటరాజమును పఠించటము. ఇది ‘వైష్ణవీ విద్య’ - అనబడుతోంది.

- - -

భగవానుడగు శివుడు పై ‘12’ ధామములు చెప్పి, ఇంకా (మునులతో, దేవతలతో) ఈవిధంగా పలికారు.

పరమేశ్వరుడు : ఇవన్నీ శ్రద్ధగా విన్నారు కదా! ఇంత వరకు ‘‘కామాఖ్య తురీయము’’ అని, పూర్వరూపమని గ్రహించెదరు గాక।

తురీయాతీతము :
ఇది సమస్తమును దాటివేసినట్టిది. కాబట్టి ‘‘సర్వ ఉత్కటము’’. సర్వ మంత్రములకు ఆసనగతము (Final Sitting) అయినట్టిది. పీఠ-ఉపపీఠములచే పరివృతమైనది.

ఆ తురీయాతీత దేవి:
- సకల కళా వ్యాపిని. సామోదకమైనది. (అన్ని సిద్ధాంతములకు మోదకమైనది).
- పరాగముతో కూడినది.
- సర్వహృదయగతమైనది. అమృత స్వరూపము. సకల స్వరూపము. ఇంద్రియ సమస్తము తన అలంకారముగా కలిగినది. సదోదితమైనది. (సత్ నుండి ఉదయించినది).

అదియే ‘‘పరా విద్య’’ అయినట్టిది.

- - -

మహా త్రిపురసుందరీ ధ్యానము

పాశ-అంకుశములను అలంకరించిన మనోహరమైన పాణి పల్లవములు (లేత, సుకుమారమైన చేతులు) కలిగినది। సముద్యత్ అర్క నిభాం। ఉదయించుచున్న సూర్యునివలె సర్వత్రా తన ప్రకాశమును వెదజల్లునది।

దేవీ లక్ష్మీ। సమస్తము తన సంపదగా గల సర్వలక్ష్మీమయి। ఈ జగత్తులన్నీ తన లక్షణములుగా కలిగియున్న సర్వలక్షణ సంపన్న। హృదయములోనే వేంచేసియున్న చైతన్య స్వరూపిణి। నిర్మల స్వరూపిణి కాబట్టి నిరంజన। ద్రష్ట-దర్శన-దృశ్యములను తన అంతరమున కలిగి ఉండటంచేత త్రికూటాఖ్య। ఆనందముతో కూడిన చిరునవ్వు చిందించు స్మితముఖి। సుందరీ। మహామాయా స్వరూపిణి।

సర్వ శుభములను ప్రసాదించునది। ‘మూలాధారము’ నుండి ‘సహస్రారము’ వరకు విస్తరించియున్న మహాకుండలినీ దేవి। ‘‘జీవ-ఈశ్వర-పర’’ అనబడే 3 పీఠముల మధ్యగా వర్తించు త్రిపీఠ మధ్యవర్తిని। అకథా అనే ఆది పీఠమునందు వేంచేసి ఉన్న మాత। పరాం భైరవీ। చిత్ (ఎరుక) అనబడు కళచే చిత్కళా స్వరూపిణి। మహా త్రిపురాదేవి।

అట్టి త్రిపురేశ్వరిని కేవలమగు స్వస్వరూపముగా మహాధ్యాన యోగముచే ధ్యానించి తెలుసుకొనెదము గాక।

ఇతి త్రిపురా తాపినీ మహోపనిషత్ - ప్రథమోపనిషత్


త్రిపురా తాపిన్యుపనిషత్ - ద్వితీయోపనిషత్

‘‘త్రైపురీవ్యక్తి’’ అగు త్రిపురీదేవిని గుర్తించటమెట్లా?

అందుకుగాను వేదము చెప్పుచున్న (కృష్ణ యజుర్వేదాంతర్గత తైత్తిరీయారణ్యకే ఖిలాకాండే ఇత్యాది చోట్ల సూత్రముగా చెప్పబడిన) సూత్రమంత్రమును ఉపాసన పూర్వకంగా పఠించటము గురించి చెప్పబడుతోంది.

ఓం। అథాతో ‘‘జాతవేదసే సునవామ సోమమ్’’ ఇత్యాది పఠిత్వా…।

(దుర్గా) సూక్తము

నారాయణ యాజ్ఞాన్ ఖిలోపనిషత్ - 2వ అనువాకము

మం।।శ్లో।।

జాతవేదసే! సునవామ। సోమం అరాతీయతో నిదహాతి వేదః।
స నః పర్షదతి దుర్గాణి, విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః (దురితా అతి అగ్నిః) ।।

తామ్ అగ్ని వర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్।
‘దుర్గాం దేవీగ్ం శరణం’ అహం ప్రపద్యే। సుతరసి తరసే నమః।।

అగ్నే! త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభిః అతి దుర్గాణి విశ్వా।
పూః చ పృథ్వీ బహులా న ఉర్వీ, భవా తోకాయ తనయాయ శంయోః।।

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధుం నః నావా దురితా అతి పర్షిః।
అగ్నే అత్రివన్ మనసా గృణానో అస్మాకం బోధి అవితా తనూనామ్।।

పృతనా జితగ్ం సహమానమ్ ఉగ్రమ్ అగ్నిగ్ం। హువేమ పరమాత్ సధస్థాత్।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామత్ దేవో అతి దురితా అతి అగ్నిః।।

ప్రత్నోషి కం ఈడ్యో అధ్వరేషు సనాత్ చ హోతా నవ్యః చ సత్సి।
స్వాంచ అగ్నే తనువం విప్రయ స్వాస్మభ్యన్చ సౌభాగమాయ జస్వ।।

గోభిః జుష్టమ్ అయుజో నిషిక్తం తవ ఇంద్ర విష్ణోః అనుసన్చరేమ।
నాకస్య పృష్ఠమ్ అభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయన్తామ్।।

ఓం కాత్యాయనాయ విద్మహే। కన్యకుమారి ధీమహి। తన్నో (తత్ నో) దుర్గిః ప్రచోదయాత్।

‘‘జాత వేదసే సునవామ సోమమ్’’ మొదలైన ‘స్తుతి’ అనే ఉపాసనచే ఆ త్రైపురీ దేవిని స్వ-దేహమునందే గుర్తించ గలుగుతాము. ఋషులు దేవదేవుడగు శివభగవానుని ఈవిధంగా ఇంకా అర్థించారు.

- - -

ఋషులు: ‘‘జాతవేదస’’ - ఇది ఏకర్చసూక్తము (ఋక్కు)కు ఆద్యము (Begining) - మధ్య (In Between) - అవసానము (At the end) - ఆయా స్థానములలో బీజనాగర రూపము ఉన్నట్లుగా చెప్పబడుతోంది కదా! ఓ మహాదేవా! దేవాది దేవా! శివభగవాన్! దయచేసి అట్టి ‘‘బీజ నాగర రూపము’’ గురించి బోధించండి.

దేవ దేవుడు (శివభగవానుడు): మునులారా! ఋషులారా! వినండి.

‘జాతవేదసే సునవామ సోమం’ అను మంత్రమును అంత్యమవాణిని (చివరి వరకు) విలోమంగా (అవరోహ క్రమంగా, పై నుండి క్రిందికి దిగుచున్న స్వరంగా) పఠనము (చదవటము) చేయాలి.

జాతవేదసే : ‘‘జా’’ (మొదటి పదములోని మొదటి అక్షరము)ను దీర్ఘంగాను,

‘‘సునవామ సోమమ్’’ -
సోమమ్ - కౌళము, శ్రేష్ఠము, మహా సౌభాగ్యము అను అర్థంగా చెప్పుచున్నారు.
స-ఉ-మమ్ - మొదటిది (స) - నివృత్తికారణము.
రెండవది (ఉ) - స్థితి కారణము.
మూడవది (మమ్) - సృష్టికారణము.

అప్పుడిక ‘‘జాతవేదసే సునవామ సోమమ్’’ ఇత్యాదిగా గల సూక్తమును పఠించాలి.

దీనిని ‘‘మహా విద్యేశ్వరీ విద్య’’గా చెప్పబడుతోంది.

త్రిపురేశ్వరీం జాతవేదస ఇతి।

‘‘జాత వేదస’’ అనగా? ఆ త్రిపురేశ్వరియే।

‘‘జాత’’ - అనే మొదటి రెండు అక్షరములను మాతృకయొక్క శిరస్సునందు - బైందవము. (బిందు సంబంధమైనది). అమృతరూపిణి చ ఇతి వాక్యార్థమ్।

జా = మొదటిదానియొక్క మొదటిది. వాగ్భవము (జనించటము). ‘‘పరమాత్మయగు శివ’’ - అనబడుతోంది.
త = కామ కళాలయము (జనించుటయందు ఇచ్ఛ).

‘జాత’ ఈవిధంగా పరమాత్మ యొక్క విజృంభణము. ‘జాత’ మాత్రము చేత ‘కామి’ అయి కామమును కోరుకొనుచున్నారు.
‘కామేశ్వరుడు’ అనబడుచున్నారు.
ఈవిధంగా ‘‘ఆదిచే శివుడు పూర్ణుడే’’ - అని చెప్పబడుతోంది.
ఆ పూర్ణుడగు శివుడే ‘సునవామము’ గోత్రరూపము (గోత్రప్రవరుడుగా, మూల పురుషకారముగా, సృష్టి వంశమునకు కూటస్థుడుగా) రూపిగా దేవియే ఆరూఢమైనది.
సమస్తమునందు మధ్యవర్తి. అమృతరూపిణిగా సమస్త జీవులలో వేంచేసి ఉన్నట్లు మంత్రార్థమును స్పష్టీకరించుకోవాలి.

గోత్ర = ‘వామ గోత్రము’ అమ్మవారికి చెందినదే। ఈ సమస్తము దేవియొక్క కామకళాలయంగాను, శేషము (మిగిలినదంతా) అమ్మవారి వామము (సంపద) గాను భావించాలి.

పూర్వేణ అధ్వనా విద్యేయగ్ం। సమస్తమునకు ఇతః పూర్వమే ఉన్న స్వరూపిగా ‘దేవి’ని ఎరిగెదరు గాక! సర్వము తానై, సమస్తమునకు ‘రక్షాకర్తీ’ - రక్షించునది అని దర్శించబడును గాక!

- - -

ఈవిధంగా త్రిపురేశ్వరీ విద్యను స్పష్టీకరించుకోవాలి. ‘‘జాతవేదస’’ - అను మొదలైన మంత్రముల సారమేమిటో, అదియే శ్రీవిద్య.

జాతో దేవ ఏక ఈశ్వరః - ‘‘ఈ సమస్త జగత్తులు, జగత్పాలకులు, జీవులు… ఇదంతా, వీరంతా జనిస్తున్న స్థానము దేవదేవుడు, ఏక-అఖండ స్వరూపుడు అగు ఈశ్వరుడే। ఇదియే త్రిపురేశ్వరీ విద్య యొక్క అంతిమసారము, ఇది సిద్ధించుకోవలసిన అనుభవము కూడా!

పరమోజ్యోతి మంత్రముతో (జ్యోతిర్జ్యోతిః పరం జ్యోతిః। ఆత్మ జ్యోతిశ్శివోస్మ్యహమ్ - మంత్రముతో) అనుష్ఠానముగా అనుసంధానం చేస్తూ, తురీయపరమును (తురీయాతీతము)ను ధ్యానిస్తూ - శ్రీ చక్రములోని మొదటిదాని యొక్క మొదటిదానిని, రెండవదానిని, మూడవదానిని - సర్వ రక్షాకరీ సంబద్ధము చేయాలి.

- - -

ఈవిధంగా ‘చక్రాసనగత’ అయిన ‘‘త్రిపురవాసినీ విద్య’’ను (శ్రీచక్రమును) స్పష్టము చేసుకుంటూ,
‘‘జాతవేదసే సునవామ సోమమ్’’ - ను పఠిస్తూ,
‘‘సదోదిత (సత్-ఉదిత), శివశక్త్యాత్మికము’’ అయిన శివుడే ‘‘స’’ అను శక్తిచే ‘‘ఆత్మాక్షరము’’ అని ఉపాసించబడును గాక।

శ్లో।। ‘శివ’ ఆది - ‘శక్తి’ - అంతరాళ భూతాం త్రికూటాదిచారిణీగ్ం
సూర్యా-చంద్రమస్కాం మంత్రాసనగతాం త్రిపురాం
మహాలక్ష్మీగ్ం సదోదితాం స్పష్టీకృత్వా, -

‘శివ’యందు ఆరంభమై, శక్తిని అంతరమున ఆదిభూత స్వరూపియే ‘‘శివ శక్తీదేవి’’। అంతరమున ఉన్న శివ-శక్తి ఐక్యము, ఆ దేవి త్రికూటముతో సహా సమస్తమునందు సంచారము కలిగినది. సూర్య-చంద్ర రూపములు తానే అయినది.

‘మంత్రము’ను ఆసనముగా కలిగినది, ‘‘మహాలక్ష్మి’’ అని పిలువబడునది. సదానంద స్వరూపిణి అగు అట్టి స్వస్వరూపాత్మను స్పష్టీకరించుకొంటూ, అట్టి స్వస్వరూపమును ధ్యానం చేయాలి.

ఇంకా కూడా,

‘‘జాతవేదసే సునవామ సోమమ్’’ పఠిస్తూ పూర్వాతిపూర్వమైన సదాత్మాసన రూపము గురించిన విద్యను స్మరణము చేస్తూ ‘‘వేద’’ - మొదలైన ‘విశ్వాహా సంతోదయ బైందవం’ (విశ్వాహంకార జననమును) పై స్థానంలో ప్రతిక్షేపించి చూస్తూ, ‘‘త్రిపురాం మాలినీ’’ విద్యను స్పష్టీకరించుకుంటూ ఉండాలి.

శ్రీ త్రిపురసుందరిని శ్రీచక్రములో ఆరాధించాలి. ఆవిధంగా ఆరాధిస్తూ ‘‘కల’’ అక్షరమును విచింతన చేయాలి. అనగా ఈ సమస్తమును తన మూర్తీభవముగా కలిగియున్న

ఆ జననియే - సైవేయమ్ అగ్న్యాసనే జ్వలతీతి। విచింత్య। - అగ్నిగా సర్వత్రా ప్రజ్వలిస్తున్నట్లు భావన చేయాలి.

ఆ దేవియొక్క ‘‘త్రిజ్యోతిషము ఈశ్వరీ, త్రిపురా, అంబా’’ విద్యను స్పష్టం చేసుకోవాలి.

స నః పర్షదతి దుర్గాణి విశ్వా। ఆ దేవియొక్క జ్యోతి - ప్రకాశమే ఈ విశ్వముగా మననము చేయాలి.

పరప్రకాశిని, ప్రత్యక్‌భూత (సమస్తమునకు ఆవలి ప్రదర్శనము)గా భావించాలి.

ఆ శ్రీదేవీ విద్యయే ఆహ్వాన కర్మయందు ‘‘సనః పర్షదతి దుర్గాణి’’ మంత్రముచే ఆహ్వానించబడుతోంది.

ఈవిధంగా ‘అష్టవిద్యా స్వరూపిణి’, అని దేవీ అంగభూతంగా చెప్పుకుంటున్నాము.

మహాచక్రనాయకము

దేవతలు : దేవా! శివభగవాన్! సర్వకామములను సిద్ధింపజేయునది, సమస్త జనులకు ఆరాధ్యము, సర్వస్వరూపము, విశ్వతోముఖము, మోక్షద్వారము అయి ఉన్నట్టిది, యోగులు ‘పరబ్రహ్మము’ను భేదించి ఏ ‘నిర్వాణస్థానము’ చేరుచున్నారో, అట్టి ‘మహాచక్రనాయకము’ గురించి విశదీకరించి చెప్పండి.

శ్రీచక్రము

శ్రీచక్రము : అద్వైత సత్ చిత్ ఆనంద (“Non-dual”, “Being”, “Knowing”, “Enjoying” సంబంధమైన) బ్రహ్మవిద్యా స్వరూపము.

అఖండాత్మస్వరూపిణి అగు జగన్మాతయే - శ్రీచక్ర రూపిణి, జగత్-పోషిణి, ఈ చరాచర జగత్ వ్యాపిణి కూడా.

శ్రీచక్రములో రచించబడే దేవీ నామములు
1. దుర్గ 2. భద్రకాళి 3. విజయ 4. వైష్ణవి 5. కుముదా 6. చండికా 7. బగళా 8. మాధవి 9. కన్యా 10. లక్ష్మీ 11. సరస్వతి

శ్రీచక్రములో శ్రీదేవి - ప్రతివారిలోని కేవలాత్మ స్వరూపమే।

బిందురూపిణి : బిందువు నుండి రేఖలు, చతురస్రములు, పంచ-సప్త-అష్ట-దశ-ఇత్యాది కోణ భుజములు - ఇవన్నీ ఏర్పడుచున్నట్లే, శ్రీదేవియొక్క తత్త్వము నుండే ఆలోచనలు, భావములు, అనుభూతులు, జగదనుభవములు, దేహ-దేహాంతర స్వయం కల్పిత సంబంధ - అనుబంధ - బాంధవ్యములు,…. ఇవన్నీ కూడా ఏర్పడుచున్నాయి. అందుచేత శ్రీచక్రములో మధ్యగా ‘బిందురూపిణి’గా ఉపాసించబడుతోంది.

నిర్గుణి : గుణములకు, స్వభావములకు, కల్పిత జగత్తులకు మునుముందే ఉన్నది కాబట్టి - నిర్గుణి.

త్రిగుణ ప్రదర్శిని : ఇక్కడి లోకవ్యవహారములన్నీ త్రిగుణాత్మకమైనవి. అయితే, అట్టి త్రిగుణములు ప్రతి జీవునిలోని ఆత్మస్వరూపిణి అగు శ్రీదేవీ చిత్కళలే!

శక్తిస్వరూపిణి : సమస్తము తన శక్తి ప్రదర్శనముగా కలిగి ఉన్నట్టిది. ఆత్మయొక్క శక్తి ప్రదర్శనముగా సర్వత్రా వేంచేసి యున్నట్టిది.

సర్వత్రా ప్రవేశించినదై, సమస్త సృష్టికి ఆధారభూతమైనట్టి ‘‘శక్తి’’ స్వరూపమే ‘‘శ్రీదేవి’’గాను, ‘‘శ్రీచక్రము’’ గాను ఉపాసించబడుతోంది.

అట్టి శ్రీచక్రము : ‘‘చిత్స్యరూప బ్రహ్మజ్ఞానైక్యము’’ కొరకై సాధనము.

వేద - వేదాంత ఆత్మతత్త్వార్థములకు, వేద పురాణ ఇతిహాసార్థములకు మూలము.

శక్తి రూపమగు శ్రీచక్రము

శక్తి రూపమగు శ్రీ చక్రము

అట్టి శ్రీచక్రము ఉపాసనకొరకై నిర్మించే సాంప్రదాయములు అనేకము. ముఖ్యముగా రెండు రీతులైనవి.

సృష్టి సంహార క్రమములు

శ్రీ చక్రమును మైథున క్రియాత్మకంగా పూజించువారికి ‘‘కజ్రోళికేళులు’’ అనబడుచున్నారు.

శ్రీ చక్రోపాసన ముఖ్యముగా రెండు పద్ధతులు

శ్రీచక్ర ఉపాసన

బహిర్యజనమును

పైన ‘‘అంతర్యజనము’’గా చెప్పబడినదంతా కర్మవిధానముల పట్ల ‘‘ఆసక్తి’’ కలవారికొరకై రేఖా త్రిభుజ - త్రికోణము, బహుభుజ వృత్త - ఇత్యాదులతో రచించి, చక్రముగా ఉపాసించేది - బహిర్యజన శ్రీ చక్రోపాసన.

శ్రీచక్ర రచన

ఇత్యాది రేఖ - భుజ - కోణ బిందు సమన్వితంగా శ్రీ చక్రము రచించబడుతోంది.

ఈ ఈ మొదలైన వాటితో శ్రీచక్రమును నిర్మించి, మధ్యగల బిందువును ఆత్మగా భావిస్తూ, తక్కినవన్నీ ‘‘ఆత్మశక్తి’’ ప్రదర్శనములుగా ఉద్దేసిస్తూ గంధ పుష్ప అక్షతలతో, వర్ణనములతో శ్రీ దేవి యొక్క 11, 32, 108, 1000 నామములను నామరూపాత్మకంగా ఉచ్చరిస్తూ చేయు పూజా విధానమును అనుసరించటము ‘‘శ్రీచక్ర బహిర్వజనము’’.

శ్రీ చక్రము - షట్చక్రములు

శ్రీ చక్రము మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు షట్ చక్ర సమన్వితముగాను, ‘‘బ్రహ్మరంధ్రము’’ ఆవరణ యొక్క లోవిభాగముగాను, శిరస్సు నుండి ఆవల గల ‘‘సహస్రారము’’ - బాహ్య ఆవరణగాను భావించి ఉపాసించబడటము అంతర్యోజన శ్రీ చక్రోపాసన.

పూర్వమార్గము : మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు గల షట్ చక్రస్థానములను, ఆజ్ఞాచక్రము నుండి - బ్రహ్మరంధ్రము వరకు గల మార్గమును ఉపాసిస్తూ యోగాభ్యాస మార్గంగా సహస్రారమును చేరి, ఆక్రమించి సమస్తమును తన యందు దర్శించటము - సహస్రార శ్రీ చక్ర మార్గము.

శ్రీ చక్రము - మహా చక్రనాయకము

వ్యాఖ్యానము

మహాచక్రాయనము - త్రికోణమును (త్రిభుజములతో) వ్రాసి
- దానిలోపల ‘‘మానయష్టి (సన్నని) రేఖ’’ను అకృష్యము చేసి (పొడిగించి), విశాలము చేసి
- ముందటగా ‘యోని’ (రంధ్రము) చేసి, పూర్తిచేసి
- అగ్రయోనిని ‘‘మానయష్టి’’గా చేసి
- దానికి అంతకు పైగా (ఊర్ధ్వముగా) పొడిగించి ‘యోని’గా చేసి, పూర్తి చేయాలి.
పూర్తి చేస్తే… ఇది మొదటి ‘‘త్రికోణ చక్రము’’ అవుతుంది.

- రెండవది ‘‘అంతరాళము’’
- మూడవది ‘‘అష్ట (8) యోని అంకితము’’
ఈ విధంగా పైన క్రింద సంపుటయోని - అంకితము చేయాలి.

‘8’ భుజ చక్రముల - ఆది అంత అగ్రమున రేఖలకు పొడిగించాలి. ‘సాధ్యము’ మొదలైన ఆకర్షణ బద్ధ రేఖను పొడిగించాలి.

ఈ విధంగా పైకి - క్రిందకు ‘సంపుటయోని’ అంకితము చేయాలి.

కక్ష్యల నుండి ప్రక్కల నుండి పైకి పోయేటట్లుగా నాలుగు రేఖలు గీయాలి. యథాక్రమంగా మాన యష్టిద్వయంలో ‘‘దశయోని అంకితము’’ అనే ‘‘అంకిత చక్రము’’ అవుతుంది.

మధ్య ‘‘త్రికోణాగ్ర చతుష్టయము’’ - రేఖచర అగ్రకోణములందు కలిపి దశ (10) అగ్రముల నుండి పొడిగిస్తే ‘‘చతుర్దశ (14) అర చక్రము’’ అవుతుంది. దీనితో ‘‘అష్ట పత్ర సంయుతము’’ కూడా కాగలదు. తరువాత షోడశ (16) పత్ర చక్రము - పార్ధివ చక్రము - చతుర్థ్యారము (4 Gates)తో కూడినది అవగలదు.

ఈ విధంగా ‘‘సృష్టియోగము’’ రేఖా పూర్వకంగా వ్యాఖ్యానించబడుతోంది.

‘‘నవాత్మ చక్రము’’, ‘‘ప్రతిలోమ చక్రము’’ ప్రథమ ‘‘త్రైలోక్య మోహనచక్రం’’ అవుతుంది.

శ్రీచక్రము - నవావరణ చక్రములు / ముద్రలు

(1) ప్రథమంగా: సర్వ సంక్షోభినీ ముద్రా చక్రము - ‘‘సాణిత్ అష్టకము’’, ‘‘సమాత్ర-అష్టకము’’ ‘‘సర్వ సంక్షోభిణి’’ మొదలైన దశకము, సప్రటము, త్రిపురాయాధిష్ఠితము, ‘‘ససర్వసంక్షోభిణీ ముద్ర’’ అగుచున్నాయి.

(2) ద్వితీయంగా : సర్వ విద్రావిణీ ముద్రా చక్రము - ‘‘సర్వాశాపరిపూరక చక్రము’’, సకామ-ఆది ఆకర్షిణీ షోడశకము (16), సగుప్తము అవుతుంది. త్రిపురేశ్వరీ అధిష్ఠితముగాను ‘‘సర్వ విద్రావిణీ ముద్రా స్వీకారము’’ గాను అవగలదు.

(3) తృతీయంగా : సర్వవశంకరీ ముద్రా చక్రము - సర్వ సంక్షోభణ చక్రము, స-అనంగ కుసుమ - ఆది అష్ఠకము (8), త్రిపురసుందరీ - అధిష్ఠితము అగుచున్నది. ఇది సర్వాకర్షణీ ముద్రగా చెప్పబడుతోంది.

(4) తురీయంగా : సర్వ వశంకరీ ముద్రా చక్రము - ఇది 4వది. సర్వ సౌభాగ్యదాయక చక్రము అగుచున్నది. సర్వసంక్షోభిణి మొదలుగా ద్విసప్తకము (7 x 2 = 14) గీతలు / కోణములు అయిఉన్నది. ఇది ‘‘సంప్రదాయ చక్రము’’ అనబడుతోంది. త్రిపురావాసిని (త్రిపురేశ్వరి)చే అధిష్ఠితము (సింహాసనము). దీనిని ‘‘సర్వవశంకరీ ముద్ర’’ అంటారు.

(5) తురీయాంతగ్ం : మహోన్నాదనీ ముద్రా చక్రము - ఇది సర్వ అర్థములను సిద్ధింపజేయగల ‘‘సర్వార్థసాధక చక్రము’’. సర్వసిద్ధి ప్రదాదికంగా దశకము సకల కౌళము (సహస్రారమునుండి మూలాధారము వరకు విస్తరించి ఉన్నట్టిది). త్రిపురామహాలక్ష్మిచే అధిష్ఠానమైయున్న స్థానము. మహోన్నాదనీ (గొప్ప శబ్దవతిగా) ముద్ర.

(6) షష్ఠగ్ం (6వది) - మహాంకుశ ముద్రా చక్రము - ఇది సర్వ రక్షాకరం చక్రము. సర్వజ్ఞత్వము మొదలైన దశ (10) కళాత్మకము నిర్గర్భము (జన్మరాహిత్యము) ప్రసాదించునది. త్రిపురమాలిన్య చక్రముగా పిలువబడునది. ‘‘మహాంకుశ ముద్ర’’గా చెప్పబడునది.

(7) సప్తమగ్ం (7వది) । ఖేచరీ ముద్రా చక్రము - ఇది సర్వరోగహర చక్రము. వశిని మొదలైన అష్ట (8) దేవతలతో కూడుకొన్నది. ‘రహస్యము’ అని పిలుస్తారు. త్రిపుర సిద్ధ దేవత వేంచేసి ఉన్నట్టిది. ‘‘ఖేచరీముద్ర’’గా స్వీకరించబడునది.

(8) అష్టమమ్ (8) । బీజముద్రా చక్రము - సర్వసిద్ధి ప్రదచక్రము : నాలుగు ఆయుధములతో కూడి ‘‘సాయుధ చతుష్ఠయము’’ - అయి ఉన్నట్టిది. పరాపర రహస్యమును తెలియజేయునది. త్రిపురాంబా దేవిచే అధిష్ఠితము. బీజముద్రగా పిలువడునది.

(9) నవమం చక్రం - యోని ముద్రా చక్రము - ఇది చక్ర నాయకము. సర్వానందమయ చక్రము. కామేశ్వరుడు మొదలుగా త్రిచక్రముగా ఉన్నట్టిది. అతి రహస్యమైనదగుచున్నది. మహా త్రిపుర సుందరిచే అధిష్ఠితము. ‘యోనిముద్ర’ అని పిలువబడుతోంది.

- - -

ఈ విధంగా నవావరణ చక్రముల గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నాము. సర్వ ఛందస్సులు (4 వేదములు) ఈ నవ చక్రపు ఆకులలో ప్రక్షిప్తము. ఇవియే శ్రీ చక్రములు. అట్టి శ్రీచక్రము యొక్క నాభియందు అగ్ని మండలము. ఇది సూర్య - చంద్రమసముల నిలయము.

అందులో ‘ఓం’కార పీఠము -

అట్టి శ్రీదేవీ ‘‘ఓంకార బిందు అంతర్గత వ్యోమ రూపిణి’’ని స్మరించాలి. మహా త్రిపురసుందరికి ఆహ్వానము పలకాలి.

శ్లో।। క్షీరేణ స్నాపితే దేవీ । చందనేన విలేపితే ।
బిల్వపత్రార్చితే మాతః । దుర్గే । అహం శరణం గతః ।।

ఓ మహాత్రిపురదేవీ। నీకు క్షీరముతో (పాలతో) స్నానము చేయించి, చందనముతో విలేపనము చేస్తున్నాము. ఇదిగో ! బిల్వ పత్రములచే (మారేడు ఆకులతో) పూజిస్తున్నాము. మాతా ! శ్రీ దుర్గా దేవీ ! నీకు శరణాగతులము అగుచున్నామమ్మా !

ఈ విధంగా ఆ త్రిపురాదేవిని ‘‘ఏక ఋక్కు’’తో ప్రార్థించి, ‘‘మాయా లక్ష్మి మంత్రము’’తో పూజించాలి.

మాయా మంత్రము:

(1) నమస్తేస్తు మహామాయే । శ్రీపీఠే । సురపూజితే ।
శంఖ చక్ర గదా హస్తే । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(2) నమస్తే గరుడారూఢే । డోలాసుర భయంకరీ ।
సర్వపాపహరే దేవీ । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(3) సర్వజ్ఞే । సర్వవరదే । సర్వదుష్ఠ భయంకరీ ।
సర్వదుఃఖ హరే దేవీ । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(4) సిద్ధి బుద్ధి ప్రదే దేవీ! భుక్తి ముక్తి ప్రదాయనీ।
మంత్రమూర్తే సదా దేవీ! మహాలక్ష్మీ! నమోస్తు తే।

(5) స్థూల సూక్ష్మే । మహారౌద్రే । మహాశక్తీ । మహోదరే ।
మహాపాపహరే దేవీ । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(6) ఆది-అంత రహితే దేవీ । ఆదిశక్తీ । మహేశ్వరీ ।
యోగజ్ఞే । యోగసంభూతే । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(7) పద్మాసన స్థితే దేవీ । పర బ్రహ్మ స్వరూపినీ ।
పరమేశి జగన్మాతః । మహాలక్ష్మీ । నమోస్తు తే ।

(8) శ్వేతాంబర ధరే దేవీ । నానాలంకార భూషితే ।
జగద్ధితే (జగత్ హితే) జగన్మాతః । మహాలక్ష్మీ । నమోస్తు తే ।
మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
సర్వసిద్ధిమ్ అవాప్నోతి । రాజ్యం ప్రాప్నోతి సర్వదాః ।।

ఫలశృతి:
ఏకకాలే పఠేత్ నిత్యం మహాపాతక నాశనం।
ద్వికాలం యః పఠేత్ నిత్యం ధనధాన్య సమన్వితః ।
ద్వికాలం యః పఠేత్ నిత్యం మహా శత్రు విశానశనం ।
మహాలక్ష్మిః భావేత్ నిత్యం ప్రసన్నాః। వరదాః । శుభాః।

- - -

ఇంకా కూడా భగవానుడగు పరమశివుడు దేవతలతో ఈ విధంగా పలుకసాగారు.

శివభగవానుడు : దేవతాలారా ! పై మాయా మహాలక్ష్మి మంత్రముచే పూజించటం చేత, యజించటము చేత (ఉపాసించటం చేత) భగవతియగు శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి ప్రీతి పొందగలరు. సంతోషముతో స్వాత్మానముగా (స్వస్వరూపాత్మగా) విశదమవగలదు. అట్టి దేవీ అనుగ్రహముచే అట్టివాడు సృష్టికర్త అగు బ్రహ్మదేవుని దర్శించగలడు. దేవీతత్త్వమును తెలుసుకున్నవాడు సర్వమును దేవీ స్వరూపముగా దర్శించగలడు. అమృతత్త్వము సిద్ధించుకోగలడు.

ఇతి మహోపనిషత్ - త్రిపురాతాపిన్యుపనిషత్
ద్వితీయ అధ్యాయః సమాప్తః


త్రిపురాతాపిన్యుపనిషత్ - తృతీయోపనిషత్

దేవతలు : భగవాన్ ! మాకు ఇప్పుడు ‘‘ముద్రలు’’ గురించి బోధను అనుగ్రహించండి. మేము ముద్రతో శ్రీదేవిని ఏకాగ్రులమై సేవిస్తాము.

శ్రీ శివభగవానుడు : నవని కృత జానుమండలం విస్తీర్య పద్మాసనం కృత్యా ముద్రాః సృజతేతి। ఓ దేవతలారా! మోకాళ్లను నేలపై మోపి, విస్తరించి, పద్మాసనము ధరించండి. అప్పుడిక ముద్రలను సృజించెదరు గాక ! అట్టివాడు అందరినీ తనవైపుగా ఆకర్షించగలడు. ‘యోనిముద్ర’ను అనుష్ఠించినవాడు సమస్తమును ఎరుగగలడు. సర్వ ఫలములు పొందగలడు. సర్వము సంభవింపచేసుకొనగలడు. హృదయ దోషములను అన్నింటినీ స్తంభింప చేసి వేయగలడు.

వివిధ ముద్రలు

1) ప్రథమ - ‘‘ముద్ర’’

మధ్యమే - అనామికా ఉపరి విన్యస్య, కనిష్ఠిక అంగుష్ఠతో అధీతే, ముక్తయోః తర్జన్యో దండవత్ తధస్తాత్।

చేతుల మధ్యవ్రేళ్ళను అనామికపై (ఉంగరపువ్రేళ్ళపై తాకించి, విస్తరించి) తరువాత విడదీసి చిటికిన వ్రేలు-బొటన వ్రేలు కలిపిచూపుడు వ్రేళ్ళను క్రిందకు కర్రవలె ధారణ చేయుటము.

2) ద్వితీయ - ‘‘ముద్ర’’

సైవ మిళిత మధ్యమా - ద్వితీయా ।

మధ్యమ వ్రేలుతో కూడి పైవిధంగా ఉంటే రెండవ ముద్ర

3) తృతీయ - ‘‘ముద్ర’’

తృతీయా అంకుశాకృతిః ఇతి ।

అంకుశములాగా పై మొదటి ముద్ర ధరిస్తే - అది మూడవ ముద్ర

4) చతుర్థ - ‘‘ముద్ర’’

ప్రాతిలోమ్యేన పాణీ సంఘర్షయిత్వా
అంగుష్ఠౌ సాగ్రిమౌ సమాధాయ - తురీయా ।

ప్రతిలోమంగా (ఎదురుబొదురుగా చేతిని చేతితో బొనిపి బొటన వ్రేళ్లను, చివర్లలో కలిపి కదలకుండా ధరిస్తే - అది నాలుగవ ముద్ర

5) పంచమ ‘‘ముద్ర’’

పరస్పరం కనీయస ఇదం, మధ్యమా ఆబద్ధే అనామకే దండిన్యౌ
తర్జన్యావా ఆలింగ్యో అవష్టభ్య మధ్యమ నఖ । మిళిత అంగుష్ఠౌ ।

కనిష్ఠిక (చిటికిన)ను మధ్యమ వ్రేలుచే కట్టబడి అనామిక (ఉంగరపు వ్రేలు)ను కర్రలా చేయటము (లేక) మధ్యమ వ్రేలును బొటనవ్రేలు గోరుపై తాకించటము

6) షష్ఠీ ‘‘ముద్ర’’

స ఏవ అగ్రే అంకుశ ఆకృతిః - షష్ఠీ ।

పై 5వ ముద్రలో మధ్యమ ఉంగరపు వ్రేలు - బొటన వ్రేలులను అంకుశము వలె ఆకృతిని ధరించటము

7) సప్తమీ ‘‘ముద్ర’’

దక్షిణశయే వామబాహుం కృత్వా అన్యోన్య అనామికే - కనీయసీ మధ్యగతే,
మధ్యమే తర్జని ఆక్రాన్తే
సరళ స్వ అంగుష్ఠౌ - ఖేచరీ సప్తమీ ।

కుడి చేతిని ఎడమ భుజము పై వేసి, ఉంగరపు వ్రేళ్ళను, చిటికెన వ్రేళ్లపై మధ్యగతంగా (ఒకదానికొకటి మధ్యగా ధరించి) మధ్యమ వ్రేళ్ళను ఉంగరపు వ్రేళ్ళతో చుట్టబడినట్లుగా చేసి బొటన వేలులను సరళం చేయు ముద్ర - ఖేచరీ।

8) అష్టమీ ‘‘ముద్ర’’

సర్వ ఊర్ధ్వే, సర్వసగ్ంహృతి స్వమధ్యమ్ అనామికా అంతరే కనీయసీ పార్శ్వయోః ।
తర్జన్యావ అంకుశాఢ్యే యుక్తా, స - అంగుష్ఠయోగతో
అన్యోన్యం సమం అంజలిం కృత్వా - అష్టమీ ।

రెండు చేతుల యొక్క అన్ని వ్రేళ్ళను పైకిగా పెట్టి అన్ని వ్రేళ్ళను మడచి, మధ్యవ్రేలు - ఉంగరపు వ్రేలు ప్రక్కగా చూపుడు వేలును అంకుశము వలె సూటిగా కలిపి ఉంచి, రెండు చేతుల బొటన వ్రేళ్ళను కలిపి ఉంచి పరస్పరము సమంగా దోసిలి పట్టి ఉంచటము.

9) నవమీ ‘‘ముద్ర’’

పరస్పర మధ్యమ ఆపృష్ఠ ప్యర్తిన్యావ అనామికే తర్జన్యా క్రాంతే
సమే మధ్యమే ఆదాయ అంగుష్ఠౌ మధ్య వర్తినౌ - నవమీ ప్రతిపధ్యత - ఇతి।

- మధ్య వ్రేలిని ఉంగరపు వ్రేలుపై ఆనించి - సమమైన మధ్యవ్రేలును తీసుకొని
- రెండు బొటన వ్రేలులను మధ్యవర్తులముగా చేయుటము - 9వ ముద్ర అగుచున్నది

10) త్రిఖండ ముద్ర

సైవేయం కనీయసే సమే అంతరితే అంగుష్ఠౌ సమావంతరితే కృత్వా -
త్రిఖండీ - సంపద్యత ఇతి।

అదే చిటికిన వ్రేళ్ళును సమములుగా, మధ్యనుండేట్లుగాను, బొటన వ్రేళ్ళను సమాంతరముగా చేస్తే అది ‘‘త్రిఖండి ముద్ర’’।

కామకళాభూతము గురించి వ్యాఖ్యానము

పరమేశ్వరుడు : ఓ దేవతలారా! కాబట్టి ఇక ఇప్పుడు కామకళాభూతము గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము.

హ్రీం క్లీం ఐం బ్లూం సౌః

ఈ ఐదు బీజాక్షరములు - ‘‘పంచకామ’’ అనబడుతోంది. ఇది శ్రీ చక్రమంతా వ్యాపించి వర్తించుచూ ఉన్నట్టిది.

⌘   ఈ ‘‘పంచకామ’’ను (‘‘ఐం’’ను) - చిట్టచివరగా సంపుటం చేయాలి.
⌘   ‘‘బ్లూం’’ కారమునందు సంపుటమును వ్యాప్తించేయాలి.
⌘   రెండుసార్లు ‘‘ఐం’’ ద్వయమును మధ్యవర్తిచే సాధ్యమును బంధించాలి.
⌘   భూర్జప్రతము (బుజపత్తిరి ఆకు) పై (శ్రీచక్రమును) పూజించాలి.

ఈ కామ కళాభూతమైన శ్రీచక్రమును ఎరిగినవాడు సర్వమును ఎరిగినవాడు అవగలడు. లోకములన్నీ ఆకర్షించువాడగుచున్నాడు. సర్వమును స్తంభింపజేయగలడు. ‘‘లక్షాయుక్తము’’ అయినట్టి ఈ చక్రము సకల లోకమును వశముగా చేయగలదు.

నవలక్ష (9లక్షలు) జపం చేసినవాడు రుద్రత్వము పొందగలడు.

‘‘మాతృకా - ఆవేష్టితము’’ చేస్తే దిగ్విజయుడు కాగలడు.

❋ ‘‘భంగాంక కుండలము’’ చేసి, అగ్నిని ఆహ్వానించి హనిస్సుతో హోమము చేస్తే సర్వము వశము కాగలదు.
❋ వర్తులము (Circular)గా అగ్నికి హోమము సమర్పిస్తే గొప్ప శ్రియము (శ్రేయస్సు) లభించగలదు.
❋ చతురస్రముగా అగ్నిగుండము నిర్మించి హోమము చేయుటచే వర్షము కురియగలదు.
❋ త్రికోణ అగ్నిగుండము చేసి హోమము చేస్తే శతృవులు మిత్రులు కాగలరు. అట్టివారు ‘గతి’ని స్థంభింపచేయగలరు. సంసారమును జయించగలరు.
❋ పువ్వులతో హోమం చేస్తే, విజయము లభించగలదు.
❋ మహారసములతో హోమం చేస్తే అట్టివాడు పరమానందపూర్ణుడు (Fully Satisfied, Happy) కాగలడు.
(మహారసములు : ఉప్పు, పులుపు, కారము, చేదు, ఒగరు, తీపి షట్ రసములు)

శ్రీచక్ర ఉపాసనా విధి - విధానము

ముందుగా సిద్ధి - బుద్ధి సహిత మహాగణపతిని భక్తిపూర్వకంగా మనస్సులో తలచుకుంటూ, వాక్కుతో గణేశమంత్రం జపం చేస్తూ ప్రారంభాక్షరమును (‘‘గ్’’ను) చివరి అక్షరమును (‘‘మ్’’ను), బిందుపూర్ణమును, శమ్‌ను విడివిడిగా అంగస్పర్శ చేయాలి (చేతులతో హృదయమును, భుజములను, చెవులను తాకుతూ కళ్ళకు హద్దు కావాలి (గం గం గం ఇతి).

మహాగణేశ స్తుతి మంత్రము

గణానాం త్వా గణపతిగ్ం । హవామహే ।
కవిం । కవీనామ్ ఉపమశ్రవస్తవమ్ । జ్యేష్ఠరాజం ।
బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః । శృణ్వన్ ఊతిభిః సీద సాదనమ్ ।
గం గణేశాయ నమః ।

తాత్పర్యము : ఓ విఘ్నేశ్వరా ! మీరు సృష్టిలోని ఇంద్రియ - ఇంద్రియార్థములకు నాయకుడు, గణపతి! అట్టి మీకు స్తుతి సమర్పించుచున్నాము. నవలకు నవలా రచయితవలె ఈ బ్రహ్మాండములన్నిటికీ మీరే రచయిత. సృష్టి కవిత్వమును పాలించువారు. సమస్తమునకు ముందే ఉండి, సమస్తమును నడిపించు జ్యేష్ఠరాజు మీరే, బ్రహ్మము గురించిన విశేషములన్నీ వినుటకై అవి సిద్ధించుటకై అనుగ్రహించండి.

ఈ విధంగా పలుకుచూ ముందుగా ‘‘గ’’ నమః । ఆది - అక్షరం । అంత్య బిందు పూర్ణమిత్ - అనేన అంగేన పూరయేత్। మొదలు - చివర కూడా మరియు బిందు పూర్ణమను అంగస్పర్శ పూర్వకంగా ‘‘ఓం । గం। గణేశాయనమః’’ - అని పలుకుతూ గణేశునికి రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

శ్రీ చక్రము యొక్క క్షేత్రాధ్యక్ష ఉపాసనా మంత్రము

ఓం నమో భగవతే । భస్మాంగ రాగాయ ।
ఉగ్రతేజసే । హన హన । దహ దహ ।
పచ పచ । మథ మథ ।
విధ్వగ్ంసయ । విధ్వగ్ంసయ । హలభంజన ।
శూలమూలే వ్యంజన । సిద్ధిం కురు కురు ।
సముద్రం పూర్వ ప్రతిష్ఠితగ్ం శోషయ । శోషయ ।
స్తంభయ । స్తంభయ ।
పర మంత్ర పర యంత్ర పర తంత్ర పరదూత
పరకటక పరచ్ఛేదన కర విదారయ । విదారయ ।
ఛింది । ఛింది । హ్రీం ఫట్ స్వాహా।।

సమస్తమును వెలిగిస్తున్న ఓ భగవతీదేవీ !

ఇంద్రియ విషయములపట్ల మాకు కలుగుచున్న రాగద్వేషములను భస్మము చేయగల దేవీ! గొప్ప తేజో రూపమా !

మా సాంసారిక భావావేశములను హననము చేసివేయండి. చెండాడండి । దహించి వేయండి । పచనము చేసి వేయండి । మథించి వేయండి । చిలికి వేయండి । మా అజ్ఞానమును పూర్తిగా విధ్వంసము చేసివేయండి । మమ్ములను బాధించు నాగలిలను విరగగొట్టి వేయండి । శూలబాధలను వ్యంజనము (Push out) చేసి వేయండి ।

మాకు మా ఆధ్యాత్మిక మార్గములలో సిద్ధి (fulfilment) ప్రసాదించు మార్గము చూపండి. సంసార సముద్రము యొక్క పూర్వ ప్రతిష్ఠలన్నీ శోషించి వేయండి ।

మా యొక్క దుష్ట సాంసారిక భావనలను, తాపత్రయములను స్తంభింపజేసివేయండి ।

(మేము ‘‘అనన్య భావనను’’ సిద్ధింప చేసుకునే మార్గంలో దృశ్యము నుండి మమ్ము తాకుచున్న) బాహ్య సంబంధమైన పర మంత్రములను (అన్య మననములను), పర యంత్రములను (అడ్డుగావున్న సామాగ్రిని), పర దూతలను (అన్యభావములను పేట్రేపే వార్తలను), మమ్ములను ఛేదన (Break up)చే బాధించే, వ్యవహారములను తొలగించి వేయండి. ఛింది। కోసి వేయండి । ‘‘హ్రీం ఫట్ స్వాహా’’ అని బీజాక్షరములతో నిన్ను ఉపాసిస్తున్నాము.

ఈ పైన చెప్పిన బీజాక్షర మంత్ర - అర్థములతో శ్రీచక్రములోని క్షేత్రపాలకుని పూజించాలి.

శ్రీచక్ర కౌళ కుమారీదేవీ గాయత్రీ మంత్రోపాసన

కుళకుమారి విద్మహే । మంత్ర కోటి సుధీమహి ।
తన్నః కౌళిః ప్రచోదయాత్ ।।

శ్రీచక్ర మహాయంత్రములో కుళకుమారి యొక్క తత్త్వమును, మహిమను తెలుసుకుంటూ, ఆ మంత్రకోటీదేవి యొక్క మహిమను స్తుతిస్తున్నాము. అట్టి సర్వమంత్ర స్వరూపిణియగు కౌళకుమారీదేవి మా బుద్ధులను ఉత్తేజింపజేయును గాక ।

ఈ విధంగా కుమారీదేవిని మంత్రముగ్ధంగా, శ్రీచక్ర పూర్వకంగా అర్చించాలి.

ఏ సాధకుడైతే పై కౌళీ కుమారీ గాయత్రీ మంత్రమును లిఖించి (అభిలిఖించి, వ్రాసి), పూజిస్తాడో, అట్టివాడు మృత్యుపరిధులను దాటిపోయి, అమృతత్వమును సిద్ధించుకోగలడు. యశస్సును పొందుతాడు. ఉత్తమమైన, తాత్త్విక ప్రయోజనముతో కూడిన ‘‘ఆయుష్మంతుడు’’ కాగలడు.

👉. బ్రహ్మరంధ్రమును ఛేదించి, తానే పరబ్రహ్మయై ఉండగలడు.
👉. బ్రహ్మమును తెలుసుకొని, బ్రహ్మయే తానవగలడు ।।

ఇతి త్రిపురాతాపినీ మహోపనిషత్ - తృతీయ అధ్యాయః।।


త్రిపురాతాపిన్యుపనిషత్ - చతుర్థోపనిషత్

దేవ గాయత్రీ హృదయము - మృత్యుంజయ విద్య

దేవతలు : భగవన్ ! మహాదేవా !! ‘‘దేవగాయత్రీ హృదయము’’ అని చెప్పబడే ఆధ్యాత్మిక విశేషము గురించి మాకు వ్యాఖ్యానించి చెప్పండి. అనుగ్రహించండి.

అట్టి మృత్యువును జయించు మృత్యుంజయ విద్యను బోధించండి.

పరమేశ్వరుడు : ఓ సమస్త దేవతలారా ! ‘‘మృత్యుంజయ విద్య’’, ‘‘దేవగాయత్రీ హృదయము’’ అను పేరుగలది అగు ఆత్మ విద్యను వివరించి చెప్పుచున్నాను, వినండి.

మృత్యుంజయ మంత్రము

ఓం త్ర్యంబకం యజామహే । సుగంధిం । పుష్టివర్ధనమ్ । 
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ । మా అమృతాత్ ।।

త్ర్యంబకేన అనుష్టుభేన మృత్యుంజయం దర్శయతి । త్ర్యంబక మంత్రము ‘అనుష్టుప్’ ఛందస్సు (ఛందోబద్ద) మంత్రముచే మృత్యువును జయించు సిద్ధిని తప్పక పొందవచ్చును.

దేవతలు : కస్మాత్ ‘త్ర్యంబకమ్’ ఇతి ? త్ర్యంబకము అని ఎందుకంటున్నారు ?

పరమేశ్వరుడు : మూడు పురములు = (జీవ, ఈశ్వర, పరమాత్మలు); (స్థూల - సూక్ష్మ - కారణ దేహములు) ; (ఇహ - పర - పరాత్పరములు) ; (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు) ; భూత - వర్తమాన - భవిష్యత్తులు - ఇత్యాది త్రిపురములు.

పై త్రయీ విశేషములన్నీ కూడా స్వస్వరూపముగా కలవాడు, ప్రదర్శనము చేయువాడు కాబట్టి - ‘‘త్ర్యంబకమ్’’ అనబడుచున్నారు.

దేవతలు : అథ కస్మాత్ ఉచ్యత ‘‘యజామహే’’ ఇతి ? ఎందుచేత ఆ మృత్యుంజయ స్వామి యగు పరమశివుని (మిమ్ములను) ‘‘యజామహే’’ అని స్తుతిస్తున్నారు ?

పరమేశ్వరుడు : పరమాత్మ కూటస్థుడు (The Root of all from which everything stems up), అక్షరుడు, అనేకముగా కనిపిస్తున్న ఈ దృశ్యమంతా ఏకస్థుడై ఉన్నవాడు - అనే అర్థము చెప్పటానికి ‘య’ ‘జా’ అని అంటున్నాము.

‘‘మహే’’ అనే ద్వౌ అక్షరములతో ‘‘స్వామీ ! మీ యొక్క మహిమను స్తుతిస్తూ సేవిస్తున్నాము’’ అని ఉద్దేశ్యించబడుతోంది. మృత్యుంజయుడు కనుక ‘‘యజామహే’’ అను వర్ణనము సముచితమై చెప్పబడుతోంది.

దేవతలు : అథ కస్మాత్ ఉచ్యతే ‘‘సుగంధిమ్’’ ? సుగంధిమ్ అని ఎందుకు పలుకబడుతోంది ?

పరమేశ్వరుడు : సర్వతో యశమ్ ఆప్నోతి, తస్మాత్ ఉచ్యతే ‘సుగన్ధిమ్’ ఇతి । ఆ పరమాత్మ యొక్క యశస్సుయే సర్వత్రా వ్యాపించినదై ఉండటం చేత ‘‘సుగంధిం’’ అనబడుతోంది.

దేవతలు : అథ కస్మాత్ ఉచ్యతే ‘‘పుష్టివర్ధనమ్’’ ఇతి ? ‘పుష్టివర్ధనమ్’ అను మృత్యుంజయ మంత్రములోని శబ్దము యొక్క ఉత్తమార్థము వివరించండి.

పరమేశ్వరుడు : యః సర్వాన్ లోకాన్ సృజతి, యః సర్వాన్ లోకాగ్ం తారయతి, యః సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి - తస్మాత్ ఉచ్యతే ‘‘పుష్టివర్ధనమ్’’ ఇతి । ఈ సమస్త లోకములను సృష్టించునది, సమస్త జీవులు తనను ఆశ్రయించునప్పుడు సమస్త బంధములనుండి తరింపచేయునది, (అంతేకాకుండా) సమస్త లోకములుగా విస్తరిస్తూ పరిపుష్టి చేస్తున్నది - ఆ పరమాత్మయే కాబట్టి ‘‘పుష్టివర్ధనమ్’’ - అను శబ్దము (మృత్యుంజయ మంత్రములో) ఉపయుక్తము చేయబడినది.

దేవతలు : అథ కస్మాత్ ఉచ్యతే ‘‘ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోః ముక్షీయేతి’’ ? ‘‘ఉర్వారుకము వలె (దోసకాయ వలె) మృత్యుబంధనము నుండి ముక్తము’’ - అను ప్రయోగము యొక్క ఉద్దేశ్యము దేనిచేత చెప్పబడినది?

పరమేశ్వరుడు : సంలగ్నాత్ ఉర్వారుకమివ మృత్యోః సంసార బంధనాత్ । సంలగ్నత్వాత్ బద్ధత్వాత్ మోక్షీ భవతి। ముక్తో భవతి । ఉర్వారుకము (దోసకాయ) పెద్దదై పండిపోతూ కూడా దోసతీగ నుండి తనకు తానుగా విడివడదు. ఎవరైనా కత్తిరిస్తేగానీ తీగకు వేరవదు.

‘ఓ పరమాత్మా ! మేము కూడా అనేక జన్మ - మృత్యువుల రూపమగు ‘‘సంసారము’’ అనే దోసతీగనుండి దోసకాయవలె విడివడలేకపోతున్నాము. మా సాధనలు పరిపక్వమవటము లేదు. పరమశివా ! మాపై జాలిపడి, ఈ మృత్యు రూప సంసారము నుండి (దోసతీగనుండి దోసకాయను విరచి విడదీసినట్లుగా) మమ్ములను విడదీయండి’’ - అను ప్రార్థన సూచిస్తోంది. ఈ దృశ్య వ్యవహారముతో మనస్సు వలన కలుగుచున్న సంబంధరూప బంధము తొలగిందా, … ఇక అది మోక్షమే ।

దేవతలు : అథ కస్మాత్ ఉచ్యతే ‘‘మా2మృతాత్’’ ఇతి ? ‘‘మా అమృతాత్’’ - అని ఎందుకు మృత్యుంజయ మంత్రములో ‘శబ్దము’గా చెప్పబడుతోంది ?

పరమేశ్వరుడు : అమృతత్వం ప్రాప్నోతి । అక్షరం ప్రాప్నోతి । నిత్యత్వం ప్రాప్నోతి । స్వయం రుద్రో భవతి । ఓ దేవతలారా ! ఈ జీవుడు స్వతఃగానే ఆత్మగా అమృత స్వరూపుడు - అక్షరుడు, నిత్యుడు. ఇవన్నీ రుద్ర రూప లక్షణములు కాబట్టి స్వయముగా రుద్రుడే. అయితే, ఈ మార్పుచేర్పులతో కూడిన, సంగతి - సందర్భములతో కూడిన దృశ్యవ్యవహారమంతా కూడా - ఈ జీవునియొక్క (మృత్యువుకు కూడా సాక్షి అయిన) అమృత స్వరూపమును ఏమరపింపజేస్తోంది. అందుచేత, ‘‘అమృతత్వమును మేము విడివడకుండెదము గాక।’’ అని ప్రార్థన చేయబడుతోంది. అమృతత్వము జీవుని స్వాభావికము. మార్పు - చేర్పులతో కూడి దృశ్య విషయములతో ధ్యాస వాస్తవానికి అస్వాభావికము.

దేవతలు : హే భగవాన్ ! మాకు అంతరార్థమంతా విశదీకరించి చెప్పుచున్నారు. చాలా సంతోషము. అయితే మాదొక అభ్యర్థన. కైః మంత్రైః స్తుతా భగవతీ స్వాత్మానం దర్శయతి? అట్టి శైవ, వైష్ణవ, సౌర, గణేశ మంత్రములను బోధించండి. ఏ ఏ మంత్రములు అనుష్ఠానముచే భగవతి అగు త్రిపురాదేవిని దర్శించగలమో విశదీకరించండి.

పరమేశ్వరుడు : దేవతలారా ! వినండి.

(1) మనము ఇప్పుడు చెప్పుకున్న ‘‘త్ర్యంబకం యజామహే సుగంధిం, పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ । మా2మృతాత్’’ - అనే త్ర్యంబక - మృత్యుంజయ మంత్రమును - ఉచ్చరణ మనోశబ్ద భావన - అర్థతాత్పర్య మననముల పూర్వకంగా ఉపాసన చేయటంచేత ఆ భగవతి స్వాత్మ స్వరూపమై సిద్ధించగలదు.

ఆ దేవదేవి పూర్వ - తత్పూర్వంగా ‘ఓం’ అను ఏక - అక్షర స్వరూపిణి అయి విరాజిల్లుచున్నది. ద్రష్ట - దృశ్య - దర్శన (అ-ఉ-మ)గా ఉపాసించబడు గాక । అదియే ఓంకారోపాసన.

ఇంకా కూడా….,
(2) ‘‘ఓం నమశ్శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రోపాసన చేత కూడా ఆ భగవతి యొక్క స్వానుభవము సిద్ధించగలదు. కనుక ఈ యాజుషీ మంత్ర అనుష్ఠానముచే రుద్రత్వము, కల్యాణము ప్రాప్తించగలదు. అందుచేత । ఓ సమస్త జీవులారా ! ఈ ‘ఓం నమశ్శివాయ’’ పంచాక్షరీ యాజుషీ మంత్రమును శబ్దార్థ మనన పూర్వకంగా ఉపాసించండి.

(3) తద్విష్ణోః పరమం పదమ్
తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః । దివీవ చక్షుః ఆతతమ్ ‘‘విష్ణోః’’ ।। విష్ణోర్యత్ పరమం పదమ్ । ఏ విధంగా ఆకాశంలో అన్ని వైపులా సూర్యకాంతి ప్రసరిస్తూ, విస్తరించి ఉన్నదో, అట్టి కాంతిని జనులు సందర్శిస్తూనే ఉన్నారో,

- ఆ విధంగా,
శాస్త్ర హృదయమును అధ్యయనం చేస్తూ అర్థం చేసుకొన్నట్టి విద్వాంసులు, అజ్ఞానముతో యుద్ధం చేసి జయించివేసిన సూరులు (విద్వాంసులు) సర్వత్రా స్వాత్మ - సర్వాత్మ స్వరూపమగు తత్ - విష్ణు తత్త్వమునే సర్వత్రా దర్శిస్తూ ఉన్నారు.

ఎట్లాగా ? దృష్టిని జ్ఞానముచే దివ్యము చేసుకొని, దివ్య చక్షువులతో దర్శిస్తూ ఉండటం చేత! వేరుశనగ గింజలలో అంతటా నూనె ఓత ప్రోతమై ఉన్న తీరుగా, చెరుకుగడ్డలో చెరకు రసంలాగా, - విష్ణువే సత్‌స్వరూపుడై (ఉనికిచే, The Beingచే) సర్వత్రా అనుస్రుతమై, సర్వమునకు వ్యతిరిక్తమై (వేరై) వ్యాపించి ఉన్నారు (లేక ఆత్మతత్త్వమే, స్వస్వరూపమై అన్ని వైపులా ఓతప్రోతమై ఉన్నది).

అట్టి సర్వత్రా వ్యాపించి ఉన్న ‘‘సర్వతోముఖుడు - సర్వము తన ముఖమే అయినట్టి’’ సర్వవ్యాపక విష్ణుతత్త్వదర్శనమే పరమపదము. ఆకాశము వలె అంతటా విష్ణు విభవానుభవమే, విష్ణుముఖ దర్శనమే పరమ పదము. అట్టి విష్ణుతత్త్వమును సూరులు (ధీశక్తిచే) సర్వత్రా వీక్షిస్తూ ఉన్నారు. ప్రియజీవులారా ! అట్టి సూరుల మార్గమును ఆశ్రయించండి.

సూరయో బ్రహ్మాదయో దేవా స ఇతి, సదా హృదయ ఆదధతే తస్మాత్ విష్ణోః స్వరూపమ్। వసతి తిష్ఠతి భూతేషు ఇతి। వాసుదేవ ఇతి। అట్టి ‘సమస్తము విష్ణుస్వరూపమే’ అను భావన - అవగాహన - అనుభవములను సూరులగు బ్రహ్మ మొదలైన దేవతలు ఎల్లప్పుడు హృదయమునందు - ఆదధతే - విచారణ కలిగినవారై ఉంటారు. విష్ణు స్వరూపమునందే నివసించువారై ఉంటారు.

‘‘సర్వభూతజాలమునందు నిత్య నివాసుడై ఉన్నవాడే ఆ వాసుదేవుడు’’ అని సందర్శిస్తూ ఉంటారు.

వాసుదేవ మంత్రము - ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’
(ద్వాదశాక్షరీ మంత్రము)

‘‘ఓం-నమ’’ ‘త్రి’ అక్షరాణి ।  (3 అక్షరములు) 
‘‘భగవత’’ - చత్వారి ।  (4 అక్షరములు) 
‘‘వాసుదేవాయ’’ - పంచాక్షరాణి ।   (5 అక్షరములు) 
‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ 
 (1) (2)  (4)     (5)  = (12)

పరమ పవిత్రమగు ఈ ద్వాదశాక్షరీ (12 అక్షరముల) మంత్రము సర్వతత్త్వ స్వరూపుడగు వాసుదేవభావనతో (పరమార్థంతో) ఉపాసించువాడు - స ఉపప్లవం తరతి । - సమస్త గ్రహణ దోషములనుండి, అన్ని ఉపద్రవముల నుండి, సకల భయముల నుండి తరించగలడు. అతని పట్ల సర్వ విఘ్నములు నిర్విఘ్నము కాగలవు.

(ఉపప్లవములు = చంద్ర-సూర్యగ్రహణ దోషములు, ఉపద్రవములు, భయములు, విఘ్నములు, ఉల్కాపాతము మొదలైన ఉత్పాతములు)

ఆతడు పూర్ణాయుష్కుడు కాగలడు. ప్రాజాపత్యము (సర్వాధికారము) పొందగలడు. రాయసోషము (Royalty, రాజసము), గౌపత్యము (ఇంద్రియములపై ఆధిపత్యము) కలిగి ఉండగలడు.

‘‘ఓం’’ । - ప్రత్యగానందమ్ । ప్రణవ స్వరూపమ్ ।

‘ఓం’ యే ప్రణవస్వరూపంగా (అన్య - అనన్యములతో కూడిన పూర్ణస్వరూపంగా) ఉపాసించబడుతోంది. ఆత్మయొక్క సత్-చిత్‌లతో కూడిన ఆనంద స్వరూపమే ఓం । అందుచేత ‘‘ప్రత్యగానందము’’ అని వర్ణించబడుతోంది. బ్రహ్మ పురుషమ్ - బ్రహ్మము యొక్క పురుషకారమే ఇదంతా - అనునది ‘ఓం’ సంజ్ఞార్థము.

‘‘ఓం’’ = ‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కార ఇతి ।
‘అ’ = కేవలమగు ఆత్మ (లేక) కేవల స్వస్వరూపము (The Absolute)
‘ఉ’ = ప్రకృతి. కల్పనా - భావనా - అనుభూత స్వరూపము (All that being Experienced)
‘మ’ = అనుభవి. ‘జీవుడు’ అని పిలువబడుచున్నవాడు (The Experiencer)

అట్టి ‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కారములు ఏక స్వరూపమే ‘ఓం’.

హగ్ంసః శుచిషత్ । వసు అంతరిక్ష సత్ ।
హోతా వేదిషత్ । అతిథిః దురోణ సత్ ।
నృషత్ వరసత్ । ఋత సత్। వ్యోమ సత్।
అబ్జా, గోజా, ఋతజా, అద్రిజా ఋతం బృహత్ ।।

‘ఓం’ అను అక్షరము దేని యొక్క సంజ్ఞయో, అట్టి ఆత్మ ఏ విధంగా సర్వత్రా వేంచేసినదై ఉన్నది ?

హగ్ంసః శుచిషత్ । ఒకే సూర్యుడు అన్ని చోట్లా కనబడుచూ ప్రకాశమానుడగుచున్నతీరుగా ఆత్మ భగవానుడు (లేక, విష్ణు భగవానుడు) అనేక అసంఖ్యాక దేహములలో అనేక జీవచైతన్యములను ప్రదర్శించుచున్నారు.

వసుః అంతరిక్ష సత్ । ఒకే వాయువు అసంఖ్యాక వాయుతరంగాలుగా ఆకాశమంతా సంచరిస్తూ ఉన్న తీరుగా - ఒకే ఆత్మ తాను అఖండమై ఉండియే - అసంఖ్యాక జీవులలో అసంఖ్యాక మనోవృత్తులుగా ప్రదర్శనమౌతోంది.

అతిథిః దురోణసత్ । యజ్ఞ వేదికలన్నిటిలో ఒకే అగ్ని వెలుగొందుచున్న విధంగా, ఒకే ఆత్మ సమస్త జీవుల బుద్ధులలో వెలుగొందుచున్నది.

నృషత్ । వరసత్ । ఋతసత్ । వ్యోమసత్ । - అబ్జా, గోజా, ఋతజా, అద్రిజా ఋతమ్ బృహత్ ।
మానవులందరిలో, దేవతలలో, ఋగ్వేద ఋక్కులలో (ఋగ్వేద మంగళశ్లోక స్తుతులలో), సర్వత్రా ప్రదర్శనమగుచున్న ఆకాశము వలె, అబ్జములలో (సరస్సులలో, పద్మ సమూహములలో), గోవులలో, యజ్ఞములో, కొండలపై - బృహత్తర, మహత్తర సత్యమై ఆత్మయే వెలుగొందుచున్నది.

హంస (హగ్ంస)

సూర్యుడు తన యొక్క కిరణములచే సమస్తము తేజోమయము చేస్తున్న విధంగా,
‘‘హంస (హగ్ంస)’’ అను అక్షరద్వయ - పరమార్థమైన కేవల - స్వస్వరూపాత్మా యొక్క తేజో పుంజములుగా ఈ దృశ్యములో కనిపించే జల - గో - కొండ - గాలి ప్రజ్ఞాభిశక్తిచే పూర్వసౌరభముగా (పూర్వము ఆత్మయే అయి ఉన్నట్లుగా) అభిషేకిస్తూ ఉపాసించువాడు - ఆత్మాకాశ సౌర పరంధామమునందు నివాసము పొందగలడు.

గణ - ఈశత్వము

ఈ దృశ్య సంబంధమైన సమస్తము (గణము) ఆత్మ చేతనే విస్తరించబడింది. ఎవరైతే
‘‘గణానాం త్వా గణపతిగ్ం హవామహే । కవిం కవీనాం ఉపమశ్రవస్తమమ్, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతభిః సీదసాదన్ం’’ - అని మనము పైన చెప్పుకున్న త్రైష్టుభము (ద్రష్ట - దర్శన - దృశ్యముల ఏకత్వభావన)తో ‘‘పూర్వమార్గంగా ఏకార్ణమనువు’’చే గణపతిని పూజిస్తూ ఉండగా గణేశత్వమును పొందగలడు.

గాయత్రీ సావిత్రీ సరస్వతీ జపా మాతృక

గాయత్రీ సావిత్రీ సరస్వతీ మాతృకంగా చెప్పబడిన ఆత్మార్థముతో ఈ సమస్తము వ్యాప్తమై ఉన్నది. ఈ క్రింది మూల మంత్రముచే ప్రోక్తమై (చెప్పబడి) ఉన్నది.

మూలమంత్రము
1 ‘‘ఐం’’ వాగీశ్వరీ విద్మహే, ‘‘క్లీం’’ కామేశ్వరీ ధీ మహి ।
‘‘సౌః’’ తన్నో శక్తిః ప్రచోదయాత్ ।। ఇది ఉదయ కాలమున ఉపాసించవలసిన -
2 ప్రాతఃకాల ‘‘గాయత్రీ’’ ।
3 మధ్యాహ్నోపాసన - ‘‘సావిత్రీ’’ ।
4 సాయంకాలోపాసన - ‘‘సరస్వతీ’’ ।
5 నిరంతరము - ‘‘అజపా హంస’’ ।

మాతృకా పంచాశత్ (50) వర్ణ విగ్రహోపాసన

‘‘పంచాశత్ వర్ణ విగ్రహము’’ 50 అక్షరముల శబ్దతత్త్వముచే సమస్త భువనములు, శాస్త్రములు, ఛందస్సులు వ్యాప్తములై ఉన్నాయి. భగవతీ స్వరూపమే అట్టి 50 (పంచాశత్) వర్ణములుగా విస్తారితమై ఉంటున్నది.

ఓ దేవతలారా ! అట్టి భగవతీ దేవికి నేను ఎల్లప్పుడు నమస్కరిస్తూ ఉంటాను.

పైన చెప్పిన బీజాక్షర మంత్రమును (‘‘ఐం వాగీశ్వరి విద్మహే; క్లీం కామేశ్వరి ధీమహి । సౌః తన్నశ్శక్తిః ప్రచోదయాత్’’ - అను మంత్రములో) నిత్యము త్రిపురసుందరీదేవిని ఉపాసించువాడు -
- సర్వం పశ్యతి । సర్వమును చూడగలడు
- సో అమృతత్వం చ గచ్ఛతి । అమృత స్థానమునకు వెళ్లగలడు

ఇది ఎరుగుటయే - ఉపనిషత్

ఇతి త్రిపురాతాపినీ మహోపనిషత్ చతుర్థోపనిషత్ ।


త్రిపురాతాపిన్యుపనిషత్ - పంచమోపనిషత్ - ‘‘త్రైపురము’’

దేవతలు : హే భగవాన్ । పరమేశ్వరా । దేవాది దేవా । స్వామీ । క్రియాకాండ విషయమై త్రిపురసుందరీదేవి నామమునందు ‘‘త్రైపురము’’ గురించి మీరు చెప్పినందుకు కృతజ్ఞులము.

ఇప్పుడిక సవివరణగా ‘‘పరము’’ గురించి నిర్విశేషంగా (without leaving anything) చెప్పమని ప్రార్థన.

పరమేశ్వరుడు : దేవతలారా ! వినండి.

‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తులు’’ ఈ జీవుడు ప్రాపంచికంగా పొందుచున్న మూడు అవస్థలు కదా ।
ఈ మూడిటిని ‘‘త్రైపురములు’’ అని కూడా - పిలుస్తారు.
ఈ మూడు అవస్థలు స్వయం కల్పిత సంచార పురములుగా కలిగియున్న ఈ జీవుని (త్రి అవస్థల) సాక్షీ చైతన్యమే తురీయము,
అదియే ‘‘తురీయ పురుషుని రూపము’’ అని ‘‘జీవుని తురీయ స్థానము’’ అని, జీవుని ‘‘సాక్షీమాత్ర స్వరూపము’’ అని వర్ణితమై వివరించబడుతోంది.

తురీయము మాయ యొక్క అంత్యము (ఆవలిది) కూడా । అట్టి తురీయ స్వరూపమే పరబ్రహ్మము యొక్క నిర్దుష్టరూపము. అదియే ‘‘పరమ పురుషుడు’’ కూడా । అట్టి ఈ జీవుని యొక్క తురీయ స్థానమే (లేక) రూపమే కేవల జ్ఞానస్వరూపము (knower prior to knowing) కాబట్టి - ‘‘చిద్రూపము’’ సమస్తమునకు ఆవలిది కాబట్టి (పరమ్ - ఆత్మ) - ‘‘పరమాత్మ’’ ।

అట్టి తురీయ స్వరూపుడగు పరమపురుషుడే (లేక) కేవల చిద్రూపుడే (లేక) పరమాత్మయే

➤ సమస్త ‘‘వినటము’’లకు ‘‘శ్రోత’’ । అందరిలో ఉండి వింటున్నవాడు పరమాత్మయే!
➤ సమస్తము ఆయన యొక్క మనన స్వరూపమే కనుక ఆయనయే ‘‘మన్త’’ । అందరి మనస్సులలో ఆలోచనలు చేస్తున్నవాడు ఆయనయే!
➤ సమస్తమునకు ‘ద్రష్ట’ ఆ పరమాత్మయే (He is the perceiver of all))।
➤ ద్రష్టత్వమునకు పరమాత్మ మునుముందటివాడే కనుక, - ఆయన అద్రష్ట కూడా (The one prior to perception)
➤ సమస్తమునకు ప్రష్ట (అడుగువాడు, ప్రశ్నించువాడు) అగ్రేశ్వరుడు ఆయనయే । ( He is the One who is extending as all and He is the Inquiry Objective for all ).
➤ సమస్తమునకు స్ప్రష్ట (స్పష్టీకరించుచున్నవాడు కూడా ఆ పరమాత్మయే। (He is clarity of all).
➤ సమస్త ధ్వనులు ఆయననుండే బయల్వెడలుచున్నాయి. అందుచేత ఆయనయే ఘోష్ట (The maker of all sounds).
➤ సమస్తము తెలుసుకుంటున్నది ఆ భగవానుడే కాబట్టి ఆయనయే ‘‘విజ్ఞాత’’ (He is the knower of all else).
➤ ఆయన ప్రజ్ఞాన స్వరూపుడు. సర్వము తెలియజేయువాడు. కాబట్టి ప్రజ్ఞాత (The One who is making everything known).

అట్టి పరమాత్మయే జనులంతా మననము చేయవలసిన ‘‘మంతః పురషః’’ । ఆయనను తెలుసుకోవటము ఎట్లా ! ప్రతివాడు ‘‘తన యొక్క ఆత్మయే ఆయన’’ అని తెలుసుకోవలసిందే ! తనను తాను తెలుసుకుంటే ఆయనను తెలుసుకున్నట్లే ।

- - -

అట్టి పరమాత్మ యొక్క సమక్షమునందు గాని, ఆయన యందు గానీ…,

స ఇతి ఏకమేవ పరంబ్రహ్మ వీహ్రాజతే నిర్వాణమ్ । ఆ పరబ్రహ్మమే తరంగ కదలికలు లేని నిశ్చలమైన గాలివలె అనేకంగా (అజ్ఞాన దృష్టికి) కనిపిస్తూ సర్వత్రా సర్వదా ఏకస్వరూపుడై వీహ్రాజమానుడై (ప్రకాశించువాడై, విలాసపురుషుడై) ఉన్నారు. ఆయనయే నిర్వాణ స్వరూపుడు.

అట్టి స్వస్వరూప - సర్వస్వరూప ఆత్మ పురుషుని పట్ల దేవతలు, ఋషులు, పితృదేవతలు మేలుకొని ఉన్నవారై (అనిమేషులై, కనులు మూయనివారై) సర్వ విద్యల అంతిమ సారముగాను, లక్ష్యముగాను దర్శిస్తూ ఉంటారు.

‘‘మనస్సు’’ - నిశ్చలము / చంచలము

ఇంకా పరమాత్మ గురించి ఈ విధంగా శ్లోకపూర్వకంగా బోధించబడుతోంది. గానం చేయబడుతోంది.

⌘ ఈ మనస్సు ఎల్లప్పుడూ అనేక దృశ్య విషయ పరంపరలపై వ్రాలే దుర్వ్యసనము (Bad Tendency) కలిగి ఉంటోంది.

అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా । ముముక్షువు (బంధవిముక్తి కోరువాడు) మనస్సును నిర్విషయము చేయు అభ్యాసమును ఆశ్రయించాలి.

ముక్తి : యతో నిర్విషయో నామ మనసో ‘‘ముక్తిః’’ ఇష్యతే । మనస్సును నిర్విషయంగా కలిగియుండు ధారణయే ముక్తి, ఇంతకు మించి మరొక వేరైన అర్థమేదీ ‘‘ముక్తి’’ అనబడుదానికి - లేదు.

దేవతలు : మనస్సును నిర్విషయం చేయటం గురించి మరికొంత వివరించండి.

పరమేశ్వరుడు : ‘మనస్సు’ అనేది - ఆలోచించటము ప్రారంభించిన తరువాత - ఆలోచనలు యొక్క అభ్యాసరూపముచే ఏర్పడుచున్నట్టిదే. అట్టిది రెండు రీతులుగా రూపము కలిగి ఉంటోంది.

కేవలము

విషయాసక్తము

మనస్సు యొక్క
(Basic form)
శుద్ధమగు కేవలీ స్వరూపమగు మనస్సు
(Act of Extending)
అశుద్ధమగు మనస్సు
కామ వివర్జితము కామ సంకల్ప సహితము
నిశ్చలము చంచలము
జలము జల తరంగములవలె ।
నిర్విషయ మనస్సు సవిషయాసక్త మనస్సు

🌹 మనస్సు నిర్విషయాసక్తి అయి ఉన్న విభాగము - శుద్ధము / ముక్తము
🌹 మనస్సు దృశ్య విషయముల పట్ల ఆసక్తిని - అశుద్ధము / బంధము
అనుక్షణికంగా కలిగి ఉండటం జరుగుతూ ఉండే విభాగము
🌹 ఆత్మ సర్వదా నిత్యనిర్మలము. కనుక, ఆత్మకు బంధమే ఉండదు.
🌹 శరీరమో ? అది జడము. కాబట్టి శరీరానికి బంధమేముంటుంది ?

మరి బంధము ఎవరికి ? మోక్షము ఎవరికి ?

శ్లో।। మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ।
బంధనం విషయాసక్తిః । ముక్యైః నిర్విషయం మనః ।।

ఈ జీవుని యొక్క బంధనమునకు గాని, (లేక) ముక్తికి గాని (మోక్షమునకు గాని) మనస్సే కారణం. అందుచేత బోధగాని, చికిత్సగాని చేయవలసినది మనస్సుకే । అంతేగాని జడమాత్రమగు శరీరమునకు గాని, స్వయం చైతన్యానంద స్వరూపమగు ఆత్మకు గాని కాదు.

అందుచేత ముక్తి కొరకై →

(1) నిరస్త విషయా సంగమ్ । ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తున్న ఇంద్రియ విషయములతో స్నేహం చేస్తూ, సంగము (సంబంధము) కల్పించుకొని, విషయముల కామ సంకల్పములను కలిగి ఉన్న మనస్సును -
‘‘వైరాగ్య - భక్తి - యోగ - జ్ఞాన’’ సాధనముల సహాయంతో నిరోధించాలి. విషయముల నుండి వెనుకకు మరల్చాలి.

(2) క్రమంగా మనస్సు తన యొక్క చాంచల్య స్వభావమును విడచిపెట్టే విధంగా అభ్యాసములను అతి జాగరూకతతో కొనసాగించాలి.

(3) ఆ విధంగా మనస్సు నుండి ‘‘ఏదో కావాలి, పొందాలి, తొలగాలి, ఎక్కడికో పోవాలి, ఇంకేదో రావాలి’’ మొదలైన అనేక రూపములతో కూడిన కామవాసనలను పారత్రోలి వేయాలి. దూరంగా విడచిపెట్టివేయాలి.

(4) క్రమంగా నిశ్చలమైన మనస్సును ‘‘అంతటా ఆత్మనే దర్శించటము’’ - అనే ఔషధముతో హృదయమును నిశ్చలము చేసే ప్రయత్నం ఎల్లప్పుడూ నిర్వర్తిస్తూ ఉండాలి.

(5) అట్టి హృదయములో ఆత్మభావనా రూపముగా నిశ్చలమైన మనస్సు యొక్క స్థితిని ‘‘అమనీ’’ లేక ‘‘అమనస్కము’’ అంటారు.
అట్టి అమనీ (మనో అతీత) భావనను ఈ జీవుడు సంపాదించుకొంటూ ఉండగా అట్టి జీవుడు ‘‘పరమపదము’’ (The state of Al-Beyond, state of Self) పొందగలడు.
‘‘సమస్తము ఆత్మ ప్రదర్శనమే’’ అని అనుకుంటూ, అనుకుంటూ ఉండగా, ఇక ‘‘అనిపించటము’’ సిద్ధించగలదు.

(6) తావదేవ నిరోర్ధవ్యం, యావత్ హృదిగతం క్షయమ్ । ఈ విధంగా హృదయములో జనించి - గతించే స్వభావంగల ‘జగత్తు’ అనబడేదంతా స్వస్వరూపాత్మగా నిశ్చలభావన కలిగే వరకు, హృదయములో భేదదృష్టులన్నీ తొలగేవరకూ - హృదయము అఖండమగు ఆత్మతో ఏకం అయే వరకు కొనసాగించాలి. ఆత్మభావన స్వాభావికంగా సిద్ధించిందా, ఇక ప్రయత్నములతో (సాధనలతో) పని లేదు.

ఏతత్ జ్ఞానం చ, ధ్యానం చ । సమస్తమును ఆత్మగా భావన చేస్తూ, అట్టి ఆత్మయే సహజ స్వస్వరూపముగా దర్శించు ప్రయత్నమే జ్ఞానము, ధ్యానము కూడా. ఇక మిగతా గ్రంథ విశేషాలంటారా? అదంతాకూడా శేషో అన్యో గ్రంథ విస్తరః । సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించు ‘‘సాధన-సిద్ధులే’’ విస్తారంగా ఉపనిషత్, పురాణ అఖ్యాయిక, వ్యాఖ్యాన - ఇత్యాదుల పూర్వకంగా గ్రంథ విస్తరణగా జరుగుతోంది.

ఎప్పుడైతే సమస్తము ఆత్మగా సందర్శించటము - స్వాభావికము, అనునిత్యము అవుతుందో… అప్పుడిక చింతనలేదు. అచింతన ఉండదు. సమస్త పక్షపాతములు (Taking sides) తొలగిపోయి, బ్రహ్మము యొక్క (అహం బ్రహ్మస్మి । తత్త్వమసి - అను మహావాక్యముల) నిశ్చల స్వానుభవము సిద్ధించగలదు.

యోగభావన

అందుచేత యోగి ‘‘స్వరం’’తో ప్రారంభించి, ఆ స్వరమును అస్వరము (శబ్దము యొక్క జనన స్థానమగు ఆత్మ)యందు లయింపజేయాలి. అప్పుడిక ‘‘పరము’’ (All-beyond and All-present self of one’s own self) - అనే స్వ-రము సిద్ధించుకోవాలి. అట్టి అస్వరస్వర స్థానములో - భావము లేదు. అభావము లేదు.

అది సంయోగ - వియోగముములకు ఆవలిది (అతీతమైనట్టిది).

తదేవ నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం, నిరంజనమ్ । అదియే నిర్వికల్పము (సర్వ కల్పనలు లేనట్టిది), నిష్కళంకము (సమస్త కళంకములు - Mis attributions - తొలగినట్టిది) అగు బ్రహ్మము ।

తత్ బ్రహ్మమ్-ఇతి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే క్రమాత్ । ‘‘అట్టి బ్రహ్మమే నేనై ఉన్నాను’’ - అని తెలుసుకుంటూ అనుకుంటూ ఉండగా క్రమంగా బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.

సమస్తము అఖండమగు ఆత్మగా భావించటమే ‘‘నిర్వికల్పము’’ కూడా. అట్టి నిర్వికల్ప మనస్సును సంపాదించుకొన్నవానికి ‘‘ఇదంతా నా ఆత్మయే’’ అనుభవమునకు (శాస్త్రాలలో చెప్పుచున్న) ఎట్టి హేతువులతో, దృష్టాంతాలతో ఇక క్రమంగా అవసరము ఉండదు.

నిర్వికల్పమనన్తన్చ హేతు - దృష్ఠాంత వర్జితమ్ । ఈ దృశ్య కల్పన యొక్క మొదలు - చివరలకు సంబంధమే లేనట్టి (అప్రమేయమైనట్టి) మనస్సు యొక్క రూపమును (ఉన్మనీ స్వరూపమును) ఎరిగిన బుద్ధుడు (అప్రమేయమగు ఆత్మను ఎరిగిన జ్ఞాని) - ఇక దేని చేతను బంధము పొందడు. దేని చేతను పరిమితుడు, సంబంధితుడు కాడు. దేని కొరకు దుఃఖించడు. ఆయా సందర్భములచే ఉత్సాహ - నిరుత్సాహములకు లోనుకాడు.

ఓ దేవతలారా !
అఖండమగు ఆత్మయే సర్వే సర్వత్రా వేంచేసినదై ఉన్నది. అట్టి ఆత్మయొక్క అవగాహన పొందిన తరువాత ఇక ఆతని పట్ల విరోధము ఏమున్నది ?Who can stop?
ఉత్పత్పి అనునది లేదు । నాశనమగునది లేదు. బద్ధుడు లేడు. సాధకుడు లేడు. ముముక్షువు లేడు. ముక్తి లేదు.
పరమార్థంగా ఇవన్నీ శాస్త్రములు సాధనకొరకై (సాధన దశలో) వర్ణిస్తూ ఉన్నప్పటికీ, ఆత్మజ్ఞానము సిద్ధించుకొన్నవానికి అవేమీ మొదలే లేవు.
పరమార్థంగా (In its finest and highest meaning or sense)చూచే వానికి ‘అవన్నీ లేవు’ అనియే తెలిసిరాగలదు.
అవన్నీ శాస్త్రములు ఎందుకు కల్పిస్తూ ఉపసంహారము (withdrawal) బోధిస్తూ ఉన్నాయో, - అతనికి తెలిసిపోతుంది.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు ఒకదానితో మరొకటి సంబంధము లేకుండా కనబడుచూ ఉన్నప్పటికీ, అవన్నీ తన అనుభవములుగా కలిగి ఉంటున్న (అవి నావైన) నేను ఒక్కటే.

ఈ విధంగా, ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావైన నేను’’ గురించి ఎవ్వడైతే సుస్పష్ట పరచుకుంటారో, అట్టి వాడు ఇక్కడి ‘‘జనన - మరణ చక్రము’’ నుండి విడివడి పునర్జన్మ రహితుడు అగుచున్నాడు.

శ్లో।। ఏక ఏవ భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ।
ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవత్ ।।

సమస్త జీవులలోను వేంచేసి యున్న ఆత్మ ఒక్కటే. అట్టి నిత్యసత్యము - అమృత స్వరూపము అగు ఆత్మ సమస్త జీవులలో సమముగా వెలయుచున్నది. ఆకాశంలో చంద్రబింబము ఒక్కటే అయినప్పటికీ అనేక తటాకములలో (తరంగముల కదలికలను అనుసరించి) అనేక ఆకారములుగా కనబడుచున్నట్లుగా, ఒకే ఆత్మ ఈ సమస్త జీవులలో అనేక రీతులుగా లౌకిక దృష్టికి కనబడుతోంది.

‘‘కుండలోని ఆకాశము’’ దృష్టాంతము

ఒకచోట ఒక కుండ ఉన్నది. అప్పుడు మనము (1) కుండలోని ఆకాశము (చోటు, Place) అని పిలుస్తాము. కుండ పగిలితే ? లేక అక్కడినుండి కుండను తొలగిస్తే ? అప్పుడిక అది ‘‘కుండలోని ఆకాశము’’ అని అనిపించుకోదు.

అట్లాగే ఆత్మ ‘‘శరీరమునకు చెందినది’’ అను విధంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, శరీరము నశించినప్పుడు ఆత్మ నశించదు.

ఎవ్వడు కుండలోని ఆకాశము - అంతటా ఉన్న ఆకాశము (Space in the pot and all-present space) ఏకమగు రీతిగా ‘శరీరములు’ అనే కుండలు పగిలినా జీవాత్మాకాశమునకు, పరాకాశమునకు భేదము లేదని, పరాకాశ స్వరూపమే ఈ జీవుని పట్ల సత్యమగు నిజస్వరూపమని గ్రహించువాడు పరమాత్మను ఇప్పుడే, ఇక్కడే ఎరుగగలడు.

★ ★ ★

బ్రహ్మము గురించి మొట్టమొదటగా శబ్దములతో చెప్పుకోవటం జరుగుతోంది. శబ్ద మాయావృతో యావత్ - తావత్ తిష్ఠతి పుష్కలే। అట్టి శబ్ద జాలమంతాకూడా మాయలోదే అయినప్పటికీ, అట్టి వారు ‘బ్రహ్మము’ గురించి ఉపాసన చేస్తూ ఉండగా, క్రమంగా తమస్సు (Ignorance, misconceptions) తొలగుచుండగా, ఆతడు సర్వత్రా (అనేకములోని) ఏకత్వమును, ఆ ఏకత్వమే స్వస్వరూపముగాను దర్శించగలడు.

శబ్దార్ణమ్ అపరమ్ బ్రహ్మ । తస్మిన్ క్షీణే యత్ అక్షరమ్ । శబ్దజాలమంతా అపర పరబ్రహ్మము (Process Level) । శబ్దము క్రమంగా క్షీణిస్తూ, శబ్దార్థ ప్రవేశము, అక్షరమగు ఆత్మయొక్క మహత్తారనుభవము సిద్ధించగలదు.

ఆత్మ శాంతి లభించాలంటే శబ్ద విద్యాంసుడైనవాడు అర్థము యొక్క అవగాహనతో ఆత్మస్వరూపమునందు మనో బుద్ధి ఇచ్ఛలను లయింపచేసి అక్షర స్వరూపము సిద్ధించుకోవాలి.

అందుచేత ఓ దేవతలారా !
(1) శబ్దము (2) ఆ శబ్దము సూచిస్తూ ఉన్న అక్షర బ్రహ్మము రెండూ మననము చేయవలసినవే.

శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరంబ్రహ్మ అధిగచ్ఛతి । ‘‘శబ్ద బ్రహ్మము’’నందు నిష్ణాతుడైనవాడు స్వయముగా ‘‘పరంబ్రహ్మము’’ స్థానము చేరుచున్నాడు.

అందుచేత ఓ సమస్త జీవులారా !

దేవతలు : స్వామీ ! మరి శాస్త్ర గ్రంథములు అనేకములు ఉన్నాయి కదా ?

పరమేశ్వరుడు: అవును, అనేక గ్రంథములు ఉంటాయి. అయితే మాత్రం ఏమి ?

శ్లో।। గవాం అనేక వర్ణానాం । క్షీరస్యాపి ఏకవర్ణతా ।
క్షీరవత్ పశ్యతి జ్ఞానం, లింగినస్తు గవాం యథా ।

ఒకాయనకు అనేక గోవులు ఉన్నాయి. అవన్నీ (గోధుమ, తెలుపు, నలుపు, చారలు మొదలైన) అనేక రంగులు కలిగి ఉన్నాయి. ప్రతీరోజూ ఆ యాజమాని అన్ని గోవుల వద్ద పాలు పితికి ఒక బిందెలో నింపుకుంటూ ఉంటాడు. ఆ పాలు బిందెలో పోసిన తరువాత - పాలన్నీ కలసిపోయి తెలుపుగా ఉంటాయేగాని, ‘‘ఆ పాలు ఏవి ఏ రంగు ఆవువి ఎంతెంత ?’’ అనే ప్రశ్న ఏమి ఉంటుంది ?

అట్లాగే ఒకడు ఆయా అనేక గ్రంథములు అధ్యయనము చేస్తూ చివరికి తెచ్చుకునేది ‘‘స్వస్వరూపాత్మ యొక్క స్వాభావిక - స్వరూప ఔన్నత్యము’’యే అయివున్నది.

- క్షీరము   → ఆత్మ జ్ఞానము 
- అనేక ఆవులు → అనేక ఆధ్యాత్మ జ్ఞానము ప్రతిపాదించే గ్రంథములు వంటివి 

అట్టి గ్రంథములన్నీ తెలుసుకుంటూ, నిశ్చయము చేసుకోవలసింది ఏమిటి ?

శ్లో।। జ్ఞాననేత్రం సమాధాయ సమహత్ పరమం పదం
నిష్కళం నిశ్చలం శాంతం ‘‘బ్రహ్మా2హమ్’’ ఇతి సంస్మరేత్ ఇతి ।।

‘‘మహత్ పదము’’ అనే ఆత్మ తత్త్వానుభవమునకు సంబంధించినదైయున్న, నిష్కలము (కలనము - కల్పన లేనట్టిది), నిశ్చలము, పరమశాంతము అయిఉన్న ‘‘బ్రహ్మా2హమ్ । అహం బ్రహ్మాస్మి।।’’ అను పదమును స్మరించుట కొరకే గ్రంథముల అధ్యయనము సుమా !

ఎవ్వడైతే స్వస్వరూపమే అయి ఉన్న తురీయ బ్రహ్మయోనిని (జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిదగు కేవల స్వస్వరూపమును) తెలుసుకుంటాడో, అట్టివాడు అక్షరమగు ఆత్మాకాశమునందు స్థిరనివాసము సిద్ధించుకుంటున్నాడు.

అట్టి తురీయమగు బ్రహ్మయోని స్వరూప సంబంధమైన బ్రహ్మము గురించిన విద్యకొరకై పరమాత్మను మేము సర్వదా శరణు వేడుచున్నాము.


ఓ దేవతలారా !

పంచభూతములగు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మొదలైనవన్నీ కూడా ‘‘ఆకాశము’’ నుండే బయల్వెడలి, ఆకాశము నందే ఉనికి కలిగి ఉండి చివరికి ఆకాశమునందే లీనమగుచున్నాయి.

‘‘పాంచభౌతిక నిర్మితమైన ఈ భౌతిక దేహాలన్నీ కూడా (చిత్) ఆకాశము నుండే జనించి, ఆకాశము నందే చరించి, ఆకాశము నందే లీనమౌతున్నాయి’’ - అని గమనించబడు గాక!

ఎవ్వడైతే ఆత్మాకాశమే భౌతికాకాశమునకు జనన స్థానము అని గమనిస్తాడో,
అట్టి ఆత్మాకాశము భౌతికాకాశమునకు పీఠమని, స్పర్శించబడేదంతటికి పీఠమని, తేజస్సుకు పీఠమని, అమృతమునకు (జనన మరణములకు ఆవలి స్వస్వరూపమునకు) కూడా పీఠము అని - గ్రహించి ఉపాసిస్తాడో,

శ్రీ కామరాజీయమగు శ్రీచక్రములో అంతర్గతమైయున్న ఏకాదశ (11) భిన్నములైన - (పంచభూత, పంచప్రాణ, జీవాత్మ) విశేషములకు ఆది (The begining point) - ఏకము, అక్షరము అగు స్వస్వరూపాత్మయే - అని తెలుసుకుంటాడో, గ్రహిస్తాడో అట్టివాడు తురీయ స్వరూపుడై విరాజిల్లగలడు. తురీయాతీతుడై వెలుగొందగలడు

🙏 ఇతి త్రిపుర తాపిని ఉపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।