[[@YHRK]] [[@Spiritual]]

Bhasma Jȃbȃla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


భస్మ జాబాల ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఉపనిషత్ పరిచయ శ్లోకము

యత్ సామ్యజ్ఞాన కాలాగ్ని స్వ అతిరిక్త అస్తితా భ్రమం స్వస్వరూపముకంటే వేరుగా ఏదో (జగత్) ఉనికి ఉన్నది అనే భ్రమను కాలాగ్నిలో
కరోతి భస్మనిశ్శేషం తత్ బ్రహ్మ ఏవ అస్మి కేవలం నిశ్శేషముగా భస్మము చేసి, భేద దృష్టి తొలగించి, అంతటా సమదృష్టిని కలుగచేయు ఏ జ్ఞానము కలదో, ఆ శుద్ధైక జ్ఞానరూపమైన కేవల బ్రహ్మమే నేను.
[సామ్య జ్ఞానము అనగా బ్రాహ్మీదృష్టి, సమ భావన! ఈ భస్మ జాబాల ఉపనిషత్ అధ్యయనం చేయువాని దృష్టిలో త్రిపుటీ <ఈశ్వర, జీవ, జగత్> ఏకత్వము నిశ్చయము అగుచున్నది.

పూజా సమయమందు సామ్యజ్ఞానము సూచించే భస్మము (విభూతి) ధరిస్తూ ఈ సర్వసమత్వ భావము మననము చేయవలెను.]


ప్రథమ అధ్యాయము -

భస్మ తత్త్వము

1.1 ఈశ్వర స్తుతి
ఓం. అథ జాబాలో భుసుండః కైలాస శిఖర ఆవాసం, ఓంకార స్వరూపిణం, మహాదేవం, ఉమార్ధకృత శేఖరగ్ం, సోమ-సూర్య-అగ్ని నయనం జబాల ఋషి వంశస్థుడైన భుసుండ మహర్షి (జాబాలుడు) కైలాసశిఖర ఆవాసుడు, ఓంకారస్వరూపుడు, ఉమా సహితుడై, అర్ధచంద్రా ధరుడై, త్రినేత్రుడైన (సోమ, సూర్య, అగ్నులను నేత్రములుగా కలిగిన) మహాదేవుని
అనంత ఇందు రవి ప్రభం, వ్యాఘ్రచర్మ అంబరధరం, మృగహస్తం, భస్మ ధూళిత విగ్రహం అనంతమైన చంద్ర సూర్య కాంతితో ప్రకాశిస్తున్నవాడు, పులిచర్మము ధరించినవాడు, మృగహస్తుడు, భస్మ ధూళిత విగ్రహుడు,
తిర్యక్ త్రిపుండ్రరేఖా విరాజమాన ఫాలప్రదేశగ్ం నుదుటి యందు అడ్డముగా మూడు రేఖలతో ప్రకాశించువాడు (జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థాత్రయమును లీలగా వెలిగింపచేయువాడు),
స్మిత సంపూర్ణ పంచవిధ పంచాననం చిరునవ్వుతో సంపూర్ణముగా ఐదు (సృష్టి, స్థితి, తిరోభావ, అనుగ్రహ, లయ) విధములైన ఐదు (సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన, అఘోర) ముఖములు కలిగినవాడు,
వీరాసన ఆరూఢం, అప్రమేయం, అనాద్యంతం, నిష్కళం, నిర్గుణం, శాంతం, నిరంజనం, అనామయం, హుం ఫట్ కుర్వాణం వీరాసనము భంగిమలో కూర్చున్నవాడు, అప్రమేయుడు, ఆది - అంతము లేనివాడు, ఏ కళంకము అంటనివాడు, ఏ గుణములకు బద్ధుడు కానివాడు, ప్రశాంతుడు, నిరంజనుడు, ఏ కలత చెందనివాడు, హుం ఫట్ చేయువాడు (అనగా అజ్ఞానముచే కలుగు భయము, దుఃఖములను తొలగించువాడు),
శివ నామాని అనిశం ఉచ్చరంతం శుభసూచకముగా శివనామములు నిరంతరం ఉచ్చరిస్తూ ఉండువాడు,
హిరణ్యబాహుం, హిరణ్యరూపం, హిరణ్యవర్ణం, హిరణ్యనిధిం, హిరణ్యబాహుడు, హిరణ్యరూపుడు, హిరణ్యవర్ణుడు, తానే భక్తులకు హిరణ్యనిధి వంటివాడు,
అద్వైతం, చతుర్థం, బ్రహ్మ-విష్ణు-రుద్ర అతీతం, ఏకం, అశాస్యం అద్వైత తత్వస్వరూపుడు, జాగృత్-స్వప్న-సుషుప్తి మూడు స్థితులకు సాక్షియైన నాలుగవదైన తురీయస్వరూపుడు, బ్రహ్మ-విష్ణు-రుద్రులకు (సృష్టి-స్థితి-లయములకు) అతీతుడు, కేవల ఏకస్వరూపుడు, శాసింపబడనివాడు
1.2 భస్మవిధి గూర్చి భుసుండుని పరిప్రశ్న
భగవంతం శివం ప్రణమ్య ముహుర్ముహుః అభ్యర్చ్య శ్రీఫలదళైః భగవంతుడుయైన శివుని ప్రణమిల్లి మరల మరల మారేడు పండ్లతోను, ఆకులతోను,

[మాఱేడు రెమ్మకు మూడు ఆకులు ఉంటాయి. అది త్రిపుటిని సూచిస్తున్నదని వాటి ఏకత్వమే శివుడు అని భావన చేస్తూ, వాటితో ఆరాధించవలెను.

త్రిపుటి = <ఈశ్వర, జీవ, జగత్>, <జ్ఞాతా, జ్ఞానం, జ్ఞేయం>, <ద్రష్ట, దర్శనం, దృశ్యము>, <సృష్టి, స్థితి, లయము>, <జాగ్రత్, స్వప్న, సుషుప్తి> మొదలుగునవి.]
తేన భస్మనా చ నత ఉత్తమ అంగః కృతాంజలిపుటః పప్రచ్ఛ అధీ హి మఱియు భస్మముతోను పూజించి, సాష్టాంగ నమస్కారము చేసి, దోసిలి ఒగ్గి, వినయముతో భుసుండుడు ఇట్లు పరిప్రశ్నించెను -
భగవన్! వేదసారం ఉద్ధృత్య త్రిపుండ్రవిధిం భగవంతుడా! వేదసారమును ఉద్ధరించునట్టి త్రిపుండ్రవిధి (సామ్యజ్ఞానము సూచించుచూ నుదుటిపై మూడురేఖలు పెట్టుకునే భస్మము తయారుచేసుకునే విధి విధానము),
యస్మాత్ అన్య న అపేక్ష ఏవ మోక్ష ఉపలబ్ధిః దేనిచేత ఇతరమైన అపేక్ష లేని కేవల మోక్షము (కైవల్యము) పొందబడునో, అట్టి విధిని (పూజా నియమమును) చెప్పుము.
కిం భస్మనో ద్రవ్యం? కాని స్థానాని? మనవో అపి అత్ర కే వా? కతి వా? భస్మకు ద్రవ్యం ఏమి? స్థానములు ఏవి? ఆయా స్థానములందు మంత్రములు ఏవి? అవి ఏన్ని?
తస్య ధారణే కే వా అత్ర అధికారిణో? నియమః తేషాం కః వా? ఆ భస్మను ధరించు వారికి ఉండవలసిన అధికారము (అర్హత) ఏమిటి? వారు పాటించవలసిన నియమములు ఏమి?
మాం అంతేవాసినం అనుశాసయా మోక్షం ఇతి. శిష్యుడనైన నాకు మోక్షమార్గము ఉపదేశించుము.

    Reference NOTE:
    ఈ ఉపనిషత్తులో ఉటంకించబడిన అగ్నిహోమమునకు సంబంధించిన మంత్రములు వేదవాఙ్మయములో
    “విరాజ హోమ మంత్రములు” మఱియు “వ్యాహృతి హోమ మంత్రములు” అన్న పేర్లతో ఉన్నవి.

1.3 భస్మ వర్ణన
అథ సహ ఉవాచ భగవాన్ పరమేశ్వరః పరమ కారుణికః :- అప్పుడు పరమ కరుణా స్వరూపుడు, భగవంతుడు అయిన పరమేశ్వరుడు ఇలా చెప్పెను :-
ప్రమథాన్ సురాన్ అపి సః అను ఈక్ష్య పూతం (భేద దృష్టిని తొలగించే సామ్యజ్ఞాన భస్మను సంపాదించదలచినవాడు) ప్రమథ గణాలను మఱియు దేవతలను అంతరంగములో తలచుకొని, శుద్ధుడై,
ప్రాతః ఉదయాత్ గోమయం బ్రహ్మపర్ణే నిధాయ తెల్లవారు ఝామునే గోమయమును (పవిత్రమైన ఆవు పేడను) బ్రహ్మపర్ణమునందు ( పలాశ / మోదుగ చెట్టు ఆకులో ) ఉంచి,
‘త్రయం బకం’ ఇతి మంత్రేణ శోషయేత్ యేన కేన అపి తేజసా ‘త్రయం బకం’ అనే మంత్రమును ఉచ్చరిస్తూ ఏదో ఒక వహ్నిలో ఎండింపచేసి,
తత్ స్వగృహ యుక్తమార్గేణ ప్రతిష్ఠాప్య వహ్నిం తన స్వగృహములో అనుకూలమైన విధంగా ఆ అగ్నిని ప్రతిష్ఠ చేసి,
తత్ర తత్ గోమయ ద్రవ్యం నిధాయ అక్కడ ఆ గోమయ ద్రవ్యము ఉంచి,
‘సోమాయ స్వాహా’ ఇతి మంత్రేణ ‘సోమాయ స్వాహా’ అనే మంత్రముతో
తతః తిలవ్రీహిభిః సః ఆజ్యైః జుహుయా అయం తేన అష్టోత్తర సహస్రం నువ్వులతోను, నెయ్యితోను కలిపి తర్పణము చేస్తూ ఈ మంత్రముతో 1008 సార్లు
స అర్ధం ఏతత్ వా తత్ర ఆజ్యస్య పర్ణ మయీ జుహూః భవతి లేదా అందులో సగం (504) సార్లు కానీ ఆకులో నెయ్యితో ముంచి హోమములో తర్పణము చెయ్యవలెను.
తేన న పాపం శృణోతి ఆ విధంగా చెయ్యగా అతడు పాపము వినడు.
తత్ హోమమంత్రః ‘త్రయం బకం’ ఇతి ఏవ దానికి ‘త్రయం బకం’ అనేదే హోమమంత్రము.

[త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోః ముక్షీయ, మా అమృతాత్]
అంతే స్విష్టకృత్ పూర్ణాహుతిః చివరలో స్విష్టకృతి మంత్రములతో పూర్ణ ఆహుతి సమర్పించవలెను.
తేన ఏవ అష్ట దిక్షు బలి ప్రదానం దానితో (అగ్ని) చుట్టూనే ఎనిమిది దిక్కుల యందు దేవతలకు (అన్నముతో) బలి ప్రదానము చేయవలెను.

[ఇది జ్ఞాన యజ్ఞము. ఇక్కడ జీవహింస చెయ్యరాదు].
తత్ భస్మ గాయత్ర్యా సంప్రోక్ష్య (అగ్నిలోని) ఆ భస్మను గాయత్రీ మంత్రము ఉచ్చరిస్తూ నీటిని చల్లుతూ సంప్రోక్షణ చేసి
తత్ ధః ఇమే రాజతే తామ్రే మృణ్మయే పాత్రే నిధాయ ఆ భస్మను బంగారు లేదా వెండి లేదా తామ్ర లేదా మట్టి పాత్రలో ఉంచి,
రుద్రమంత్రైః పునః అభ్యుక్ష్య రుద్ర మంత్రములతో మరల నీటితో చల్లుతూ సంప్రోక్షణ చేసి
శుద్ధ దేశే సంస్థాపయేత్ పరిశుద్ధమైన ప్రదేశమునందు ఆ భస్మను ఉంచవలెను.
తతో భోజయేత్ బ్రాహ్మణాన్, తతః స్వయం పూతో భవతి తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టగా, తాను స్వయముగా పవిత్రుడు అగును.
‘మానస్తోక’ ఇతి, ‘సద్యోజాతం’ ఇత్యాది పంచబ్రహ్మమంత్రైః భస్మసంగృహ్య మానస్తోక అని మఱియు పంచబ్రహ్మమంత్రములు (సద్యోజాతం ప్రపద్యామి, వామదేవాయ నమో, అఘోరేభ్యో అథ ఘోరేభ్యో, తత్పురుషాయ విద్మహే, ఈశాన సర్వవిద్యానాం) జపిస్తూ భస్మను చేతితో తీసుకొని,
‘అగ్నిః ఇతి భస్మ’, ‘వాయుః ఇతి భస్మ’, ‘జలం ఇతి భస్మ’, అగ్నియే ఈ భస్మము, వాయువు కూడా ఈ భస్మమే , జలము ఈ భస్మమే,
‘స్థలం ఇతి భస్మ’, ‘వ్యోమ ఇతి భస్మ’, ‘దేవా భస్మ’, ‘ఋషయో భస్మ’, భూమి ఈ భస్మమే, ఆకాశము కూడా ఈ భస్మమే, దేవ గణము అంతా ఈ భస్మమే, ఋషి గణము అంతా ఈ భస్మమే,
‘సర్వగం హ వా ఏతత్ ఇదం భస్మ’, సర్వమూ ఈ భస్మమే అయి ఉన్నది,
పూతం పావనం నమామి అటువంటి పవిత్రము, పావనము అయిన ఈ భస్మమునకు నమస్కారము.
1.4 భస్మ ధారణ
సద్యః సమస్త అఘ నాసకం ఇతి శిరసాభి నమ్య వెంటనే సమస్త పాపములు నాశనము చేయునని భావించి భస్మను శిరసా నమస్కరించి,
పూతే వామహస్తే ‘వామదేవాయ’ ఇతి నిధాయ వామదేవాయ అంటూ పవిత్రమైన ఎడమ చేతియందు భస్మ ఉంచుకుని
‘త్రయం బకం’ ఇతి సంప్రోక్ష్య త్రయంబకం అనే మంత్రము ఉచ్చరిస్తూ నీరు చల్లుతూ భస్మను సంప్రోక్షణ చేసి,
‘శుద్ధగ్ం శుద్ధేన’ ఇతి సంమృజ్య, సంశోధ్య శుద్ధగ్ం శుద్ధేన అనే మంత్రముతో భస్మముపై రాసి (శుభ్రము చేసినట్లుగా భావించి) పవిత్రము చేసి
తేన ఏవ ఆపాదశీర్షం ఉద్ధూళనం ఆచరేత్, తత్ర బ్రహ్మమంత్రాః పంచ అదే విధంగా పాదముల నుండి శిరస్సు వరకు భస్మను అద్దుకోవాలి, అక్కడ పంచబ్రహ్మ మంత్రములు (సద్యోజాతం ప్రపద్యామి, వామదేవాయ నమో, అఘోరేభ్యో అథ ఘోరేభ్యో, తత్పురుషాయ విద్మహే, ఈశాన సర్వవిద్యానాం) ఉచ్చరిస్తూ చెయ్యవలెను.
తతః శేషస్య భస్మనోవినియోగః తర్జనీ మధ్యమ అనామికాభిః మిగిలిన భస్మను అరచేతిలో మధ్య మూడు వ్రేళ్ళతో (తర్జనీ = చూపుడు వ్రేలు, మధ్యమ = మధ్య వ్రేలు, అనామిక = ఉంగరం వ్రేలు) అద్దుకొని త్రిపుండ్ర రేఖలు శరీరం మీద పెట్టుకొనుటకు వినియోగించాలి,
‘అగ్నేః భస్మా అసి’ ఇతి భస్మ సంగృహ్య భస్మా! నీవే అగ్ని అని అంటూ భస్మము గ్రహించి,
‘మూర్ధానం’ ఇతి మూర్ధన్య అగ్రేన్యసేత్ మూర్ధానం అంటూ మొదట శిరస్సు మీద భస్మము పెట్టుకోవాలి,
‘త్రయం బకం’ ఇతి లలాటే త్రయంబకం అంటూ నుదిటి మీద భస్మముతో త్రిపుండ్రరేఖలు అద్దుకోవాలి,
‘నీలగ్రీవాయ’ ఇతి కంఠే నీలగ్రీవాయ అంటూ కంఠముపై,
కంఠస్య దక్షిణే పార్శ్వే ‘త్రయ ఆయుషం’ ఇతి త్రయ ఆయుషం (బాల్య, యవ్వన, జరా ఆయువులు నీవే) అంటూ కంఠము క్రింద భాగమున,
‘వామ’ ఇతి కపోలయోః వామ అంటూ దవడల యందు,
‘కాలాయ’ ఇతి నేత్రయోః కాలాయ అని నేత్రములపై,
‘త్రిలోచనాయ’ ఇతి శ్రోత్రయోః త్రిలోచనాయ అంటూ చెవుల వద్ద,
‘శృణవామ’ ఇతి వక్త్రే శృణవామ అని ముఖము అంతటా,
‘ప్రబ్రవామ’ ఇతి హృదయే ప్రబ్రవామ అంటూ హృదయమందు,
‘ఆత్మన’ ఇతి నాభౌ ఆత్మన అని నాభియందు,
‘నాభిః’ ఇతి మంత్రేణ దక్షిణ భుజమూలే నాభిః అనే మంత్రముతో కుడి భుజమూలమున (భుజము క్రింద మఱియు మోచేతి పైన)
‘భవాయ’ ఇతి తత్ మధ్యే భవాయ అని కుడి చేతి మధ్యమున,
‘రుద్రాయ’ ఇతి తత్ మణిబంధే రుద్రాయ అని కుడి చేతి మణికట్టుపై,
‘శర్వాయ’ ఇతి తత్ కరపృష్టే శర్వాయ అని కుడి కరపృష్టములందు (అరచేతి వెనకవైపు),
‘పశుపతయే’ ఇతి వామబాహుమూలే పశుపతయే అని ఎడమ భుజమూలమున (భుజము క్రింద మఱియు మోచేతి పైన),
‘ఉగ్రాయ’ ఇతి తత్ మధ్యే ఉగ్రాయ అని ఎడమ చేతి మధ్యలో,
‘అగ్రేవధాయ’ ఇతి తత్ మణిబంధే అగ్రేవధాయ అని ఎడమ మణికట్టుపై,
‘దూరేవధాయ’ ఇతి తత్ కరపృష్టే దూరేవధాయ అని ఎడమ కరపృష్టమందు (అరచేతి వెనకవైపు),
‘నమో హంత్ర’ ఇతి అగ్ం సే నమో హంత్ర అని భుజ శిరస్సులపై,
‘శంకరాయ’ ఇతి యథా క్రమం భస్మ ధృత్వా శంకరాయ అంటూ యథాక్రమముగా భస్మము ధరించి,
‘సోమాయ’ ఇతి శివం నత్వా సోమాయ అని శివునికి నమస్కరించి,
తతః ప్రక్షాళ్య తత్ భస్మ ఆపః ‘పునంతు’ ఇతి పిబేత్, న అథో త్యాజ్యం తరువాత నీటితో ప్రక్షాళన చేసుకొని, పునంతు అని నీటిని త్రాగవలెను, క్రిందకు నీటిని వదలరాదు.
ఏతన్ మధ్యాహ్న సాయాః ఏషు త్రికాలేషు విధివత్ భస్మ ధారణం అప్రమాదేన కార్యం ఈ విధంగా ఉదయ, మధ్యాహ్న మఱియు సాయం కాలములందు యథావిధిగా భస్మధారణం ఏమరపాటు లేకుండా చేయవలెను.
ప్రమాదాత్ పతితో భవతి. నిర్లక్ష్యము చేసినచో పతనము చెందును.
1.5 భస్మధారణ నిత్య ధర్మము
బ్రాహ్మణానం అయం ఏవ ధర్మో అయం ఏవ ధర్మః బ్రాహ్మణులకు ఇదియే ధర్మము, ఇదియే ధర్మము.
ఏవం భస్మధారణం అకృత్వా న అశ్నీయాత్ న ఆపో అన్నం అన్యత్ వా ఈ విధంగా భస్మధారణ చేయకుండా బ్రాహ్మణులు అన్నము కాని ఏదీ కాని తినరాదు, మఱియు నీరు కూడా త్రాగరాదు.
ప్రమాదాత్ త్యక్త్వా భస్మధారణం న గాయత్రీం జపే పొరపాటున భస్మధారణ చేయకుండా గాయత్రీ మంత్రము జపించరాదు,
న జుహుయాత్ అగ్నౌ, న తర్పయేత్ దేవాన్ ఋషీన్ పిత్రాదీన్ భస్మము ధరించకుండా అగ్నిహోత్రములో హోమము చేయరాదు, దేవతలకు, ఋషులకు, మఱియు పితృదేవతలకు తర్పణము చేయరాదు
అయం ఏవ ధర్మః సనాతన, సర్వ పాప నాశకః, మోక్ష హేతుః ఇదే సనాతన ధర్మము, సర్వ పాప నాశకము, మోక్షకారణము.
నిత్యో అయం ధర్మో బ్రాహ్మణానాం బ్రహ్మచారి గృహి వానప్రస్థ యతీనాం బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, యతులకు ఇదే నిత్య ధర్మము
1.6 భస్మధారణ నిత్య ధర్మము తప్పినచో ప్రాయశ్చిత్తము
ఏతత్ అకరణే ప్రత్యవే ఇతి ఈ భస్మధారణ ధర్మము తప్పినచో దోషము కలుగును,
బ్రాహ్మణః అకృత్వా ప్రమాద ఎన ఏతద్ అష్టోత్తర శతం జలమధ్యే స్థిత్వా గాయత్రీం జప్త్వో పోషనేన ఏకేన శుద్ధో భవతి బ్రాహ్మణుడు పొరపాటున ఈ భస్మధారణ ధర్మము తప్పిన ప్రాయశ్చిత్తముగా నీటి మధ్యలో నిలచి 108 సార్లు గాయత్రీ మంత్రము జపించి ఒక రోజు ఉపవాసము చేయగా శుద్ధుడగును,
యతిః భస్మ ధారణం త్యక్త్వా ఏకదా ఉపోష్య ద్వాదశ సహస్ర ప్రణవం జప్త్వా శుద్ధో భవతి యతి భస్మధారణ ధర్మము తప్పిన ఒక రోజు ఉపవాసము చేసి 1000 సార్లు ఓంకారము జపించినచో శుద్ధుడగును,
అన్యథా ఇంద్రో యతీన్ సాలావృకేభ్యః పాతయతి అట్లు చేయనిచో ఇంద్రుడు యతులను తోడేళ్ళకు పారవేయును (అనగా బుద్ధి ఇంద్రియ విషయములలో దృఢముగా చిక్కుకొనును).
భస్మనో యది అభావః తదా నర్యభస్మ దాహనజన్య మన్యతి వా వశ్యమంత్ర పూతం ధార్యం ఒకవేళ ఈ విధముగా చేసుకున్న భస్మము లేకున్నచో వేరే ఇతర హోమములోని కాల్చబడిన బూడిద తెచ్చుకొని వశ్యమంత్రముచే పవిత్రము చేసుకొని ధరించవలెను.
ఏతత్ ప్రాతః ప్రయుంజానో రాత్రి కృతాత్ పాపాత్ పూతో భవతి ఈ విధంగా భస్మధారణ ప్రాతఃకాలమున చేసినచో అంతకు ముందు రాత్రి చేసిన పాపము నుండి పవిత్రుడగును,
స్వర్ణ స్తేయాత్ ప్రముచ్యతే బంగారము దొంగిలించిన పాపము నుండి విముక్తుడగును,
మాధ్యం దినే మాధ్యందినం కృత్వ ఉపస్థానాంతం ధ్యాయమాన ఆదిత్య అభిముఖో అధీయానః మధ్యాహ్న సమయమునందు మాధ్యాహ్నిక అగ్నిహోత్ర కర్మ నిర్వర్తించి సూర్యునికి అభిముఖుడై ఈ కృతిని ధ్యానించినచో


సురాపానాత్ పూతో భవతి, స్వర్ణ స్తేయాత్ పూతో భవతి, బ్రాహ్మణ వధాత్ పూతో భవతి


సురాపానము చేసిన పాపము నుండి పవిత్రుడగును, బంగారము తస్కరించిన పాపము నుండి పవిత్రుడగును, బ్రాహ్మణహత్యా పాతకమునుండి విముక్తుడగును.
గో వధాత్ పూతో భవతి, అశ్వ వధాత్ పూతో భవతి గోవును చంపిన (లేదా హింసించిన) పాపము నుండి విముక్తుడగును, గుఱ్ఱమును చంపిన (లేదా హింసించిన) పాపము నుండి విముక్తుడగును,
గురు వధాత్ పూతో భవతి, మాతృ వధాత్ పూతో భవతి, పితృ వధాత్ పూతో భవతి గురువును చంపిన (లేదా అవమానించిన) పాపము నుండి విముక్తుడగును, తల్లిని చంపిన (లేదా అవమానించిన) పాపము నుండి విముక్తుడగును, తండ్రిని చంపిన (లేదా అవమానించిన) పాపము నుండి విముక్తుడగును
1.7 భస్మధారణ ఫలస్తుతి
త్రికాలం ఏతత్ ప్రయుంజానః సర్వ వేద పారాయణ ఫలం అవాప్నోతి త్రికాలములందు సామ్యజ్ఞాన భావ సహితంగా భస్మధారణ చేసుకున్నవాడు అన్ని వేదములు పారాయణ చేసిన ఫలము పొందును (ఏలననగా వేదముల యొక్క లక్ష్యము అభేద అద్వైత దృష్టి కలుగచేయటయే కదా!).
సర్వ తీర్థ ఫలం అశ్నుతే అనపబ్రువః సర్వం ఆయుః ఇతి విందతే సర్వతీర్థ ఫలము పొందును, పాపరహితుడై దైవహితమైన దీర్ఘాయువును పొందును,
ప్రజాపత్యగ్ం రాయస్పోషం గౌపత్యం ఏవ ఆవర్తయేత్ ప్రజాపతి స్థితిని, గొప్ప సమృద్ధిని, గోసంపదను పొందును.
ఉపనిషదం ఇతి ఆహ! భగవాన్ సదాశివః సాంబః సదాశివః సాంబః ఇట్లు ఉపనిషత్తుగా భగవంతుడైన సాంబ సదాశివునిచే నిర్దేశింపబడినది.

ద్వితీయ అధ్యాయము -

జీవులకు భస్మేశ్వరుని ఉపదేశము

2.1 మనుష్యుని ప్రధాన కర్తవ్య విషయమై భుసుండుని పరిప్రశ్న
అథ భుసుండో జాబాలో మహాదేవగ్ం సాంబం ప్రణమ్య పునః పప్రచ్ఛ - పిమ్మట జాబాల ఋషి వంశస్థుడైన భుసుండ మహర్షి సాంబ మహాదేవుని నమస్కరించి మరల పరిప్రశ్నించెను -
కిం నిత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం? బ్రాహ్మణులకు ఏది నిత్య కర్తవ్యము?
యత్ అకరణే ప్రత్యవే ఇతి బ్రాహ్మణః? దేనిని చేయకున్నచో బ్రాహ్మణునకు దోషము కలుగును?
కః పూజనీయః? కో వా ధ్యేయః? ఎవడు పూజనీయుడు? ఎవడు ధ్యానింపదగినవాడు?
కః స్మర్తవ్యః? కథం ధ్యేయః? క్వ స్థాతవ్యం? ఎవడు గుర్తుంచుకోదగినవాడు? ఏ విధంగా ధ్యానము చేయవలెను? ఎట్లు స్థాపించుకొనవలెను?
ఏతత్ బ్రూహి - ఇతి. ఇదంతా చెప్పుము.
2.2 శివలింగ పూజా సాధనములు
సమాస ఏన తగ్ం హ ఉవాచ - సంగ్రహముగా అతనికి (జాబాలునికి పరమశివుడు) చెప్పెను -
ప్రాక్ ఉదయాత్ నిర్వర్త్య శౌచాదికం తతః స్నాయాత్ ప్రాతఃకాలముననే శౌచాదికము నిర్వర్తించుకొని, తరువాత స్నానముచేసి,
మార్జనం రుద్రసూక్తైః, తతః చ హతం వాసః పరిధత్తే రుద్రసూక్తములు పఠించి మనస్సు నిర్మలము చేసుకొనవలెను, తరువాత కొత్త వస్త్రము ధరించి,
పాప్మన్ ఉపహత్యా ఉద్యంతం ఆదిత్యం అభిధ్యాయన్ పాపములను ప్రక్షాళనము చేయు “ఉద్యంతం ఆదిత్యం అభిధ్యాయన్” అను మంత్రముతో సూర్యుని ధ్యానించి

[ఉద్యంతం అస్తమయ్యంతం ఆదిత్యన్ అభిధ్యాయన్
కుర్వన్ బ్రాహ్మనో సకలం భద్రమస్నుతే
అసౌ ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్
య ఏవం వేద అసౌ ఆదిత్యో బ్రహ్మః ]
ఉద్ధూళితం ఆఙ్గం కృత్వా యథాస్థానం భస్మనా భస్మ ధూళిని శరీరాంగములయందు యథాస్థానములలో రాసుకొని

త్రిపుండ్రం శ్వేతేన ఏవ రుద్రాక్షాన్ శ్వేతాన్ బిభృయాన్ ఏవ

తెల్లటి భస్మతో త్రిపుండ్ర నామములు నుదుటయందు పెట్టుకొని, తెల్లటి రుద్రాక్షలు ధరించవలెను.
తత్ర సమ్మర్శన్ తథా అన్యే ఆ స్థానముల విషయమై అన్యాలోచన అవసరంలేదు.
మూర్ధ్ని చత్వారింశత్, శిఖాయాం ఏకం త్రయం వా, తలమీద 40 రుద్రాక్షలు, శిఖలో 1 లేదా 3 రుద్రాక్షలు,
శ్రోత్రయోః ద్వాదశ, కంఠే ద్వాత్రింశత్, బాహ్వోః షోడశ షోడశ, చెవులకు 12 రుద్రాక్షలు, కంఠమునందు 32 రుద్రాక్షలు, రెండు బాహువులకు 16 - 16 చొప్పున ,
ద్వాదశ ద్వాదశ మణిబంధయోః, షట్ షట్ అంగుష్ఠయోః రెండు చేతుల మణికట్టులయందు 12 - 12 చొప్పున, రెండు చేతుల బొటన వ్రేలుయందు 6 - 6 రుద్రాక్షలు చొప్పున ధరించి,
తతః సంధ్యాం స కుశో అహరహః ఉపాసీత సంధ్యాకాలమునందు దర్భలతో ప్రతిదినము ఉపాసించవలెను.
అగ్నిః జ్యోతిః ఇత్యాదిభిః అగ్నౌ జుహుయాః “అగ్నిః జ్యోతిః” మొదలైన మంత్రములతో అగ్నియందు హోమము చేసి,
శివలింగం త్రిసంధ్యం అభ్యర్చ్య కుశేషు ఆసీనో శివలింగమును మూడు సంధ్యలలో అర్చించి, దర్భలమీద కూర్చుని,
ధ్యాత్వా సాంబం మాం ఏవ, సాంబుడనైన నన్నే ధ్యానించి,
వృషభ ఆరూఢం హిరణ్యబాహుం హిరణ్యవర్ణం హిరణ్యరూపం ఎద్దు (నంది, అనగా యోగము) పైన కూర్చుండువానిని, హిరణ్యబాహుని, హిరణ్యవర్ణుని, హిరణ్యరూపుని,
పశుపాశవిమోచకం పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం పశుపాశము (జీవత్వ బుద్ధి సంకుచిత్వము) నుండి విమోచకుని, పరమపురుషుని, కృష్ణపింగళుని (జీవులకు మూలాధారమునుండి శక్తిని ప్రసాదించువాని), ఊర్ధ్వరేతుని,
విరూపాక్షం విశ్వరూపం సహస్రాక్షగ్ం సహస్రశీర్షగ్ం విరూపాక్షుని, విశ్వరూపుని, వేలాది కన్నులు కలవాని (అన్ని దృష్టులకు ఆధారమైన దృక్ స్వరూపుని), వేలాది శిరస్సులు కలవాని (అన్ని బుద్ధులకు జనితుని),
సహస్రచరణం విశ్వతోబాహుం విశ్వాత్మానం ఏకం అద్వైతం అనంతమైన పాదములు కలవాని, విశ్వమంతా అనంతమైన చేతులు కలవాని, విశ్వమే తానైనవాని, ఏకుడుని (ఒకేఒక్కడుని), అద్వైతుని (తనకు వేరుగా రెండవది అంటూ లేనివాడిని),
నిష్కళం నిష్క్రియగ్ం శాంతగ్ం శివం అక్షరం అవ్యయగ్ం నిష్కళుడిని, నిష్క్రియుడిని, శాంతుడిని, శివుని, అక్షరుడిని, అవ్యయుడిని,


హరిహర హిరణ్యగర్భ స్రష్టారం అప్రమేయం అనాద్యంతగ్ం


సృష్టి - స్థితి - లయము తానే అయినవాడిని, అప్రమేయుడిని, ఆది అంతము లేనివాడు అయిన ఈశ్వరుని
రుద్రసూక్తైః అభిషిచ్య సితేన భస్మనా రుద్రసూక్తములతో, తెల్లని భస్మతో అభిషేకించి
శ్రీఫలదళైః చ త్రిశాఖైః ఆర్ద్రైః అనార్ద్రైః వా ఏవ తత్ర సంస్పర్శః మఱియు మారేడు ఆకులతో మూడు శాఖలతో పచ్చివైనా ఎండువైనా సరే అవి కలసి ఉండునట్లు
తత్ పూజా సాధనం కల్పయేః చ నైవేద్యం ఆ పూజా సాధనములను మఱియు నైవేద్యమును ఏర్పరచుకొనవలెను.
2.3 రుద్ర మంత్రములు
తతః చ ఏకాదశ గుణ రుద్రో జపనీయ ఏక గుణో అనంతః తరువాత ఏకాదశ గుణ సంకేత రుద్రులను (మహాదేవ, శివ, మహారుద్ర, శంకర, నీలలోహిత, ఈషణ రుద్ర, విజయ రుద్ర, భీమ రుద్ర, దేవదేవ, భావోద్భవ, ఆదిత్యాత్మక శ్రీరుద్ర) జపిస్తూ ఏక గుణుడు (అద్వైత స్వరూప) అనంతుడను (పరమేశ్వరుడను) భావింపవలెను.
షడక్షరో అష్టాక్షరో వా శైవో మంత్రో జపనీయః షడక్షర (ఆరు అక్షరముల) శైవ మంత్రము లేదా అష్టాక్షర (ఎనిమిది అక్షరముల) శైవ మంత్రము జపించతగినది.
‘ఓం’ ఇతి అగ్రే వ్యాహరేన్, ‘నమ’ ఇతి పశ్చాత్, తతః ‘శివాయ’ ఇతి అక్షరత్రయం ఓం అని ముందుగా ఉచ్చరిస్తూ, తరువాత నమః అంటూ, తరువాత శివాయ అనే అక్షరత్రయము చెప్పవలెను. “ఓం నమః శివాయ” - ఇదే షడక్షర శైవ మంత్రము.
‘ఓం’ ఇతి అగ్రే వ్యాహరేన్, ‘నమ’ ఇతి పశ్చాత్, తతో ‘మహాదేవాయ’ ఇతి పంచాక్షరాణి ఓం అని ముందుగా ఉచ్చరిస్తూ, తరువాత నమో అని, తరువాత మహాదేవాయ అనే పంచాక్షరములు చెప్పవలెను. “ఓం నమో మహాదేవాయ” - ఇదే అష్టాక్షర శైవ మంత్రము.
న అతః తారకః పరమో మంత్రః ఇంతకన్నా తరింపచేయు మంత్రము లేదు,
తారకః అయం పంచాక్షరః ఈ పంచాక్షర మంత్రము (సంసారము నుండి) తరింపచేయునది.
కః అయం శైవో మనుః శైవః తారకః అయం ఉపదిశ్యతే మనుః మనుష్యులకు శైవ మూలమంత్రమేది అన్నచో ఈ తారక మంత్రమే ఉపదేశించబడును.
అవిముక్తే శైవేభ్యో జీవేభ్యః శైవోః అయం ఏవ మంత్రః తారయతి అవిముక్త క్షేత్రము (కాశీ) నందు శైవ పరులైన జీవులను ఈ శైవ తారక మంత్రమే ముక్తి కలిగించును.
స ఏవ బ్రహ్మ ఉపదేశో. అదే బ్రహ్మోపదేశము.
2.4 ఈశ్వరుడు తన మూల తత్త్వమును వర్ణించుట
బ్రహ్మసోమః అహం, పవనః సోమః అహం, పవతే సోమః అహం బ్రహ్మ సోముడను (బ్రహ్మపదార్థము) నేనే, పవన సోముడను (వాయు తత్వము) నేనే, పవిత్ర సోముడను (పవిత్రపఱచు రసస్వరూపము) నేనే,
జనితా మతీనాగ్ం సోమః అహం బుద్ధులను ప్రేరేపించు సోముడను (మూలశక్తిని) నేనే,
జనితా పృథివ్యాః సోమః అహం, జనితా అగ్నేః సోమః అహం పృథివియొక్క తత్వమునకు (properties) మూలము నేనే, అగ్నియొక్క తత్వమునకు (essence) మూలము నేనే,
జనితా సూర్యస్య సోమః అహం, జనితా ఇంద్రస్య సోమః అహం సూర్యునకు శక్తికారకుడను నేనే, ఇంద్రునకు ప్రేరణకారకుడను నేనే,
జనితా ఉత విష్ణోః సోమః అహం ఏవ విష్ణువుయొక్క వ్యాపక స్థితి తత్వమునకు మూలము నేనే,
జనితా స యః చంద్రమసో దేవానాం భూర్భువఃస్వః ఆదీనాగ్ం సర్వేషాం లోకానాం చ చంద్రుని రసతత్వమునకు, దేవతలకు, భూః-భువః-సువః మొదలగు అన్ని లోకములకు మూల ఆధారము నేనే, మఱియు
విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం, జాయమానం చ యత్, సర్వస్య సోమోః అహం ఏవ జనితా విశ్వమున, భూత (జీవరాసి) రూపమున, భువనమున చిత్రమైన అనేక విధాలుగా జనించినది, పుట్టుచున్నది ఏదైతే ఉన్నదో దానికంతటికీ సోముడు అనబడు నేనే మొదలు.
విశ్వాధికో రుద్రో మహర్షిః హిరణ్యగర్భాదీన్ అహం జాయ మానాన్ పశ్యామి విశ్వాధికుడను (విశ్వమునకు అతీతుడను), రుద్రుడను, మహర్షిని, నేను నా యందు జనించు హిరణ్యగర్భాదులను (సాక్షిగా) చూచుచున్నాను,
యో రుద్రో అగ్నౌ, యో అప్ను, య ఓషధీషు యే రుద్రుడు అగ్ని యందు, నీటి యందు, ఓషధులందు ఉన్నాడో,
యో రుద్రో విశ్వా భువనా వివేశ ఏవం ఏవ అహం ఏవ ఆత్మా అంతరాత్మా యే రుద్రుడు విశ్వ భువనములను వ్యాపించి ఉన్నాడో అది నేనే, నేనే అంతటికీ ఆత్మను అంతరాత్మను,
బ్రహ్మజ్యోతిః యస్మాత్ న మత్తో అన్యత్ పరో అహం ఏవ పరో విశ్వాధికో నేనే బ్రహ్మజ్యోతిస్సును, దేనికైతే ఇతరము అనేది లేదో అదే నేను, నేనే పరుడను, విశ్వాధికుడను,
మాం ఏవ విదిత్వా అమృతత్వం ఇతి తరతి శోకం నన్ను తెలుసుకొనుటచేత మాత్రమే అమృతత్వము పొంది శోకము నుండి తరించెదరు,
మాం ఏవా విదిత్వా సాంసృతికీం రుజం ద్రావయామి నన్ను తెలుసుకొనుటచేత మాత్రమే సంసారస్రవంతి త్రెంచి దాటవేయుదును.

తస్మాత్ అహగ్ం రుద్రోయః, సర్వేషాం పరమా గతిః సః అహం సర్వాకారః

కావున నేనే రుద్రుడను, సర్వులకు పరమ గతి ఎవ్వరో ఆ సర్వాకారుడను నేనే.
2.5 విశ్వేశ్వరుని ఉపదేశము
యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి ఎవని యందు ఈ భూతములు (జీవులు) పుట్టుచున్నవో, ఎవని వలన పుట్టినవి జీవించుచున్నవో,
యత్ ప్రయంతి అభిసంవిశంతి, తం మాం ఏవ విదిత్వ ఉపాసీత ఎవని యందు ప్రవేశించి లయము చెందుచున్నవో, ఆ నన్నే తెలుసుకొని ఉపాసించి
భూతేభిః దేవేభిః అభీష్టంతో అహం ఏవ భూతములు, దేవతలు ఈప్సితార్థులగుదురో - అది నేనే!
భీషా అస్మాక వాతః పవతే, భీషోదేతి సూర్యః నా వలన భయము చేతనే వాయువు వీచుచున్నది, నా భయము చేతనే సూర్యుడు,
భీషా అస్మాక అగ్నిః చ ఇంద్రః చ నా భయము చేతనే అగ్ని మఱియు ఇంద్రుడు (తమ ధర్మములు నిర్వర్తిస్తున్నారు),
సోమః అత ఏవ యో అహగ్ం సర్వేషాం అధిష్ఠాతా నేనే సోముడను, కావున సర్వులకు అధిష్ఠాన దేవతను నేనే,
సర్వేషాం చ భూతానాం పాలకః సః అహం సర్వ భూతములకు పాలకుడను కూడా నేనే,
పృథివీ సః అహం, ఆపః సః అహం, తేజః సః అహం, వాయుః సః అహం, కాలః సః అహం పృథివి నేనే, నీరు నేనే, తేజస్సు నేనే, వాయువు నేనే, కాలము నేనే,
దిశః సః అహం, ఆత్మా మయి సర్వం ప్రతిష్ఠితం దిక్కులు నేనే, ఆత్మ నేనే, నా యందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది.
బ్రహ్మ విత్ ఆప్నోతి పరం, బ్రహ్మమును తెలుసుకున్నవాడు పరమును పొందును,
బ్రహ్మ శివో మే అస్తు సదాశివ ఓం! ఓంకార రూపము (సూచకము) అయిన బ్రహ్మమే తానైన శివుడు నా యందు సదా శుభము చేకూర్చు గాక!
అచక్షుః విశ్వతః చక్షు, అకర్ణో విశ్వతః కర్ణ కన్నులు లేనివాడిని, విశ్వమే కన్నులుగా ఉన్నవాడిని, చెవులు లేనివాడిని, విశ్వమే చెవులుగా కలిగినవాడిని,
ఆపాదో విశ్వతః పాద, ఆపాణిః విశ్వతః పాణిః పాదములు లేనివాడిని, విశ్వమే పాదములుగా ఉన్నవాడిని, చేతులు లేనివాడిని, విశ్వమే చేతులుగా ఉన్నవాడిని
అహం అశిరా విశ్వతః శిరా శిరస్సు లేనివాడిని, విశ్వమే శిరస్సుగా ఉన్నవాడిని,
విద్యా మంత్రే ఏక సంశ్రయో, విద్యా రూపో, విద్యా మయో, విశ్వేశ్వరో అహం, అజరో అహం విద్యా మంత్రములకు (వేదముకు) నేనే ఆశ్రయమును, జ్ఞానరూపుడను, జ్ఞానస్వరూపుడను, విశ్వేశ్వరుడిని నేను, ముసలితనము (మార్పు) చెందనివాడిని,
మాం ఏవం విదిత్వా సగ్ంసృతి పాశాత్ ప్రముచ్యతే నన్ను తెలుసుకొనుట మాత్రము చేతనే సంసార పాశములనుండి బాగుగా విముక్తుడగును,
తస్మాత్ అహం పశుపాశవిమోచకః కాబట్టి నేను పశుపాశము (జీవ బుద్ధి సంకుచితత్వము) నుండి విమోచకుడను,
పశవః చ మానవాంతం మధ్యవర్తినః చ యుక్త ఆత్మానో యతంతే మాం ఏవ ప్రాప్తుం పశువుల నుండి మానవుల వఱకు మధ్య ఉన్న జీవరాసులు నియతాత్ములై ప్రయత్నించి నన్నే పొందుదురు,
ప్రాప్యంతే మాం న పునః ఆవర్తంతే, న పునః ఆవర్తంతే! నన్ను పొందిన తరువాత తిరిగి పునరావృత్తి పొందరు, తిరిగి పునరావృత్తి పొందరు!
త్రిశూల గాం కాశీం అధి శ్రిత్య త్యక్త ఆసవో అపి మయి ఏవ సంవిశంతి త్రిశూల సంఙ్ఞయగు కాశీలో ఉండి ప్రాణములు వదిలిపెట్టినవారు కూడా నా యందే ప్రవేశింతురు.
ప్రజ్వలత్ వహ్నిగ్ం హవిః యథా న యజమానం ఆసాదయతి యజ్ఞములో ప్రజ్వలించు అగ్నిని పొందిన హవిస్సు మరలా యజ్ఞకర్తను ఎలా పొందదో
తథా సంత్యక్త్వా కుణపం న తత్తాదృశం పురాప్రాప్నువంతి అలా మృతకళేబరము విడిచిన ప్రాణము నాలో లయము చెంది మరల తిరిగి జన్మించదు.
ఏష ఏవ ఆదేశ, ఏష ఉపదేశ, ఏష ఏవ పరమో ధర్మః, సత్యాత్ ఇదే ఆదేశము, ఇదే ఉపదేశము, ఇదే పరమ ధర్మము, ఇది సత్యము,
తత్ర కదాచిత్ న ప్రమదితవ్యం తత్రోః ధూళన త్రిపుండ్రాభ్యాం తథా రుద్రాక్షధారణాః తథా మత్ అర్చనాత్ చ దీనిని ఉపేక్షించరాదు. భస్మ ఉద్ధూలన (చిమ్మటము), త్రిపుండ్రధారణ (మూడు నామములు శరీరాంగములయందు పెట్టుకోవటం), రుద్రాక్షధారణ మఱియు నా అర్చన విస్మరించరాదు,
ప్రమాదేన అపి న అంతర్దేవసదనే పురీషం కురయాత్ పొరపాటున కూడా దేవాలయ అంతరంగ ప్రాంగణమునందు పురీషము విసర్జించరాదు,
వ్రతాన్ న ప్రమదితవ్యం, తద్ధి (తత్ హి) తపః, తద్ధి తపః వ్రతము మరువరాదు, అదే తపస్సు, అదే తపస్సు.
2.6 కాశీ వర్ణన
కాశ్యామ ఏవ ముక్తి కామానం న తత్ త్యాజ్యం, న తత్ త్యాజ్యం ముక్తి పొందగోరువారు కాశీ యందే ఉండి తపస్సు వదలరాదు, తపస్సు వదలరాదు.
మోచకో అహం అవిముక్తే నివసతాం, న అవిముక్తాత్ పరం స్థానం, న అవిముక్తాత్ పరం స్థానం, న అవిముక్తాత్ పరం స్థానం మోక్షార్థులకు నేను కాశీ యందే ఉన్నాను, కాశీ మించి గొప్ప స్థానము లేదు! కాశీ మించి గొప్ప స్థానము లేదు! కాశీ మించి గొప్ప స్థానము లేదు!
కాశ్యాం స్థానాని చత్వారి, తేషాం అభ్యర్హితం అంతర్గృహంతః, అపి అవిముక్తం అభ్యర్హితం కాశీయందు స్థానములు నాలుగు, వాటిలో పూజ్యమైనది అంతర్గృహము, అందులో అవిముక్త స్థానము బహుపూజ్యమైనది.
తత్ర స్థానాని పంచ, తత్ మధ్యే శివాగారం అభ్యర్హితం ఆ అవిముక్తమునందు ఐదు స్థానములు, వాని మధ్యలో శివాలయము ముఖ్యమైనది,
తత్ర ప్రాచ్యాం ఐశ్వర్యస్థానం, దక్షిణాయాం విచాలనస్థానం, పశ్చిమాయాం వైరాగ్యస్థానం, ఉత్తరాయాం జ్ఞానస్థానం అక్కడ తూర్పున ఐశ్వర్యస్థానము, దక్షిణాన విచాలన (లయ) స్థానము, పశ్చిమాన వైరాగ్య స్థానము, ఉత్తరాన జ్ఞానస్థానము,
తస్మిన్ యద్ అంతర్ నిర్లిప్తం అవ్యయం అనాది అనంతం అశేష వేద వేదాంత వేద్యం ఆ శివాలయమునందు ఎవడు అంతరనిర్లిప్తుడు, అవ్యయుడు, అనాది, అనంతుడు, అశేష వేదాంతవేద్యుడు,
అనిర్దేశ్యం అనిరుక్తం అప్రచ్యావం అశాస్యం అద్వైతం సర్వాధారం అనాధారం అనిర్దేశ్యుడు (దేనిచేతనూ సూచింపబడలేనివాడు), అనిరుక్తుడు (వర్ణనాతీతుడు) , అప్రచ్యావుడు (పతనములేనివాడు), అశాస్యుడు (శాసింపబడనివాడు), అద్వైతుడు (తనకు రెండవది లేనివాడు), సర్వాధారుడు (సర్వమునకు తానే ఆధారుడు), అనాధారుడు (అన్యాధారము అవసరం లేనివాడు),
అనిరీక్ష్యం, అహరహర్ బ్రహ్మ విష్ణు పురందరాది అమర వర సేవితం మాం ఏవ అనిరీక్ష్యుడు (దర్శింపలేనివాడు), ప్రతిదినము బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే సేవించబడువాడు ఎవడో వాడు నేనే,
జ్యోతిఃస్వరూపం లింగం మాం ఏవ ఉపాసితవ్యం, తత్ ఏవ ఉపాసితవ్యం జ్యోతిస్వరూపుడను, లింగస్వరూపుడను అయిన నేనే ఉపాసించదగినవాడను, ఆ లింగము మాత్రమే ఉపాసించతగినది.
న ఏవ భాసయంతి తత్ లింగం భానుః చంద్రః అగ్నిః వాయుః ఆ లింగమును సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని, వాయువు కాని భాసింపచేయలేరు,
స్వప్రకాశం విశ్వేశ్వరాభిధం పాతాళం అధి తిష్ఠతి, తత్ ఏవ అహం స్వప్రకాశుడు, విశ్వేశ్వర అభిధుడు, పాతాళమునందు (కూడా) అధిష్ఠానుడై ఉండువాడు, వాడే నేను.
తత్ర అర్చితో అహగ్ం సాక్షాత్ అర్చితః త్రిశాఖైః బిల్వదళైః దీపైః వాయో అభిసంపూజయేత్ అక్కడ సాక్షాత్తు నన్నే అర్చించవలెను, మూడు శాఖలున్న మాఱేడు ఆకులతో దీపవాయువులతో నన్నే చక్కగా పూజించి,

[మాఱేడు ఆకు మూడు శాఖలతో త్రిపుటిని సూచిస్తున్నదని భావన]
మన్మనా, మయ్య హితాసు, మయ్య ఏవ అర్పిత అఖిల కర్మా నాయందే మనస్సు ఉంచి, నన్నే ఏకాగ్రపరచుకొని, నా కొఱకు కర్మలను అర్పించి,
భస్మ దిగ్ధ అంగో, రుద్రాక్ష ఆభరణో శరీరాంగములందు భస్మము ధరించి, రుద్రాక్ష ఆభరణాలు ధరించి,
మాం ఏవ సర్వభావేన ప్రసన్నో, మత్ ఏక పూజా నిరతః సంపూజయేత్ సర్వభావములచే నా యందే ప్రసన్నుడై, నన్నే నిరంతరము అంతరంగములో పూజిస్తే,
తత్ అహం అశనామి, తం మోచయామి సంసృతి పాశాత్ దానిని నేను ఆస్వాదిస్తాను, వానిని సంసార బంధములనుండి విముక్తుడిని చేస్తాను
అహరహర్ అభ్యర్చ్య విశ్వేశ్వరం లింగం తత్ర రుద్రసూక్తైః అభిషిచ్య ప్రతిదినము పూజించి విశ్వేశ్వరుని లింగమును అక్కడ రుద్రసూక్తములతో అభిషేకించి,
తత్ ఏవ స్నపనం పయస్త్రిఃపీత్వా మహా పాతకేభ్యో ముచ్యతే అక్కడే శయనించి, పలుమార్లు అభిషేకజలం త్రాగినచో మహా పాపముల నుండి విముక్తుడగును, న శోకం ఆప్నోతి, ముచ్యతే సంసార బంధనాత్. శోకము పొందడు, సంసార బంధముల నుండి విముక్తుడగును.
2.7 ప్రాయశ్చిత్తము
తత్ అనభ్యర్చ్య న అశ్నీయాత్ ఫలం అన్నం అన్యత్ వా, యత్ అశ్నీయాత్ రేతో భక్షీ భవేత్ శివుని పూజించకుండా ఫలము కాని, అన్నము కాని, మఱి ఏదీ కాని తినకూడదు, ఎవడు (పూజించకుండా) తింటాడో రేతస్సు భక్షించినవాడగును,
న ఆపః పిబేత్, యది పిబేత్ పూయపో భవేత్ (పూజించకుండా) నీరు త్రాగరాదు, త్రాగితే (పుండు నుండి కారు) పస తాగినవాడగును,
ప్రమాదేన ఏకదా త్వ అనభ్యర్చ్య మాం, భుక్త్వా భోజయిత్వా పొరపాటున ఒకసారి నన్ను పూజించకుండా భుజించినా భుజింపచేసినా,
కేశాని వాపయిత్వా గవ్యానాం పఞ్చసంగృహ్య ఉపోష్య జలే రుద్రస్నానం జపే త్రివారం రుద్ర అనువాకం తలకేశములు క్షవరము చేసుకొని, గోపంచకము త్రాగి, ఉపవాసము చేసి, జలముతో రుద్రస్నానము చేసి మూడుసార్లు రుద్రానువాక మంత్రములు జపించి
ఆదిత్యం పశ్యన్ అభిధ్యాయన్ స్వకృత కర్మకృత్ రౌద్రైః ఏవ మంత్రైః కుర్యాన్ మార్జనం సూర్యుని చూచుచూ ధ్యానించి నిత్య కర్మ చేసుకొని రుద్రం మొదలైన మంత్రములతో (మనస్సును) శుభ్రపరచుకొని,
తతో భోజయిత్వా బ్రాహ్మనాన్ పూతో భవతి, అన్యథా పరేతో యాతనాం అశ్నుతే బ్రాహ్మణులచే భుజింపచేసిన పిమ్మట పవిత్రుడగును, లేకున్నచో మరణం తరువాత యాతనలు అనుభవించును.
పత్రైః ఫలైః వా అన్యైః వా అభిపూజ్య విశ్వేశ్వరం మాం తతో అశ్నీయాత్ పత్రములతో ఫలములతో లేక ఇతరములతో విశ్వేశ్వరుడైన నన్ను పూజించి అప్పుడు భుజించవలెను.
కాపిలేన పయసాః అభిషిచ్య రుద్రసూక్తేన మాం ఏవ శివలింగరూపిణం బ్రహ్మహత్యాయాః పూతో భవతి కపిల (గోధుమ వర్ణ) గోవు క్షీరముతో రుద్రసూక్తములతో శివలింగరూపుడైన నన్నే అభిషేకించినచో బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడగును.
కాపిలేన దధ్నాః అభిషిచ్య సురాపానాత్ పూతో భవతి కపిలగోవు పెరుగుతో (శివలింగమును) అభిషేకించినచో సురాపానము నుండి విముక్తుడగును.
కాపిలేన ఆజ్యేన అభిషిచ్య స్వర్ణ స్తేయాత్ పూతో భవతి కపిలగోవు నెయ్యితో (శివలింగమును) అభిషేకించినచో బంగారము దొంగిలించిన పాపము నుండి విముక్తుడగును.
మాధునా అభిషిచ్య గురుదార గమనాత్ పూతో భవతి తేనె చేత (శివలింగమును) అభిషేకించినచో గురుపత్ని గమనము నుండి విముక్తుడగును.
సితయా శర్కరయా అభిషిచ్య సర్వజీవ వధాత్ పూతో భవతి తెల్లని చక్కర చేత (శివలింగమును) అభిషేకించినచో సర్వజీవ వధ నుండి విముక్తుడగును.
క్షీరాది అభిరేతైః అభిషిచ్య సర్వాన్ అవాప్నోతి కామాన్ పాలు మొదలైన పూజాసామాగ్రితో (శివలింగమును) పూజించిన (ధర్మ పరమైన) అన్ని కోరికలు తీరును.
ఇతి ఏకైకం మహాన్ ప్రస్థశతం మహాన్ ప్రస్థశతమానైః శతైః అభిపూజ్య ముక్తో భవతి సంసార బంధనాత్ ఈ విధంగా ఒక్కో పూజావస్తువు వందల మహాప్రస్థముల సంఖ్యలలో లేదా వేల సంఖ్యలలో సమకూర్చుకుని (శివలింగమును) పూజించినచో సంసార బంధము నుండి విముక్తుడగును.
2.8 శివలింగ పూజా విధానము, ఫలశృతి
మాం ఏవ శివలింగరూపిణం ఆర్ద్రాయం పౌర్ణిమాస్యాం వా అమావాస్యాయాం వా మహావ్యతీపాతే గ్రహణే సంక్రాంతావ శివలింగరూపుడైన నన్ను ఆర్ధ్రానక్షత్రమున పౌర్ణిమనాడు కాని అమావాస్యనాడు కాని, పెద్ద ఉపద్రవములప్పుడు, గ్రహణముల సమయమున, సంక్రాంతి యందు కాని

[సూర్యుడు ప్రతి మాసికమునకు ఒక రాశిలో ప్రవేశించును, ఆ రోజును సంక్రాంతి అంటారు. ఆ విధంగా ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు ఉంటాయి. ఉదాహరణకు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అంటారు.]
అభిషిచ్య తిలైః స తండులైః, స యవైః సంపూజ్య బిల్వదళైః అభ్యర్చ్య తిలల(నల్ల నువ్వులు)తో, తండులముల(బియ్యము)తో, యవల(అలసందలు/మినుములు)తో చక్కగా పూజించి, మాఱేడు పత్రములతో అర్చించి,
కాపిలే ఆజ్యాన్విత గంధసారధూపైః పరికల్ప్య కపిల (గోధుమ వర్ణ) గోవుల నెయ్యితో గంధపుచెక్క ధూపముతో ఏర్పాటు చేసుకొని
దీపం నైవేద్యం సాజ్యం ఉపాహారం కల్పయిత్వాత్ ఆద్యాత్ పుష్పాంజలిం దీపము నైవేద్యము వెన్నతో ఉపాహారము కల్పించి పుష్పములతో నమస్కారము చేయవలెను,
ఏవం ప్రయతో అభ్యర్చ్య మమ సాయుజ్యం ఇతి ఈ విధంగా శాస్త్రవిహితుడై పూజించినచో నా సాయుజ్యము పొందును.
శతైః మహాప్రస్థైః అఖండలైః తండులైః అభిషిచ్య వంద మహాప్రస్థముల సంఖ్యలో ఖండితముకాని తండులములతో (బియ్యపు గింజలు) పూజించినచో
చంద్రలోక కామాత్ చంద్రలోకం అవాప్నోతి చంద్రలోకము కోరినచో చంద్రలోకము పొందెదరు,
తిలః ఏతావద్బిః అభిషిచ్య వాయులోక కామో వాయులోకం అవాప్నోతి అదే సంఖ్యలలో తిలలతో (నల్ల నువ్వులుతో) అభిషేకించినచో వాయులోకము కోరినచో వాయులోకము పొందెదరు,
మాషః ఏతావద్భిః అభిషిచ్య వరుణలోక కామో వరుణలోకం అవాప్నోతి అదే సంఖ్యలలో పెసలతో అభిషేకించినచో వరుణలోకము కోరినచో వరుణలోకము పొందెదరు
యవైః ఏతావద్భిః అభిషిచ్య సూర్యలోక కామః సూర్యలోకం అవాప్నోతి అదే సంఖ్యలలో అలసందలు/మినుములు గింజలతో అభిషేకించినచో సూర్యలోకము కోరినచో సూర్యలోకము పొందెదరు
ఏతైః ఏతావద్భిః ద్విగుణైః అభిషిచ్య స్వర్గలోక కామః స్వర్గలోకం అవాప్నోతి వీటికి రెండురెట్లు ఆయా గింజలతో పూజించినచో స్వర్గలోకం పొందగోరువారు స్వర్గలోకం పొందెదరు,
ఏతైః ఏతావద్భిః చతుర్గుణైః అభిషిచ్య బ్రహ్మలోక కామో బ్రహ్మలోకం అవాప్నోతి వీటికి నాలుగురెట్లు ఆయా గింజలతో పూజించినచో బ్రహ్మలోకం పొందగోరువారు బ్రహ్మలోకం పొందెదరు,
ఏతైః ఏతావద్భిః శతర్గుణైః అభిషిచ్య చతుర్జాలం బ్రహ్మకోశం యత్ మృత్యుః న అవపశ్యతి తమతి ఇతి వీటికి వందరెట్లు ఆయా గింజలతో పూజించినచో చతుర్జాలమైన (అన్న, ప్రాణ, మనో, విజ్ఞాన-ఆనంద కోశములకు మూలమైన) బ్రహ్మకోశమును, ఎక్కడ మృత్యువు చూడడో అది చేరును
యం మత్ లోక కామో మత్ లోకం అవాప్నోతి, న అన్యం మల్లోకాత్ పరం ఎవడైతే నా లోకమును కోరుకొనునో అతడు నా లోకమును పొందును, నా లోకము కంటే పరమైన లోకము లేదు.
యం అవాప్య న శోచతి, న స పునరావర్తతే, న స పునరావర్తతే అది పొందినచో ఇక విచారించడు, తిరిగి పునరావృత్తి పొందడు, పునరావృత్తి పొందడు.
2.9 శివలింగ ఉపాసన, ఫలశృతి
లింగరూపిణం మాం సంపూజ్య చింతయంతి యోగనః, సిద్ధాః సిద్ధిం గతా లింగరూపుడనైన నన్ను బాగుగా పూజించి యోగులు (నన్నే ధ్యానలక్ష్యముగా) చింతించుచుందురు, సిద్ధులు సిద్ధిని పొందుదురు,
యజంతి యజ్వానో, యాజ్ఞికులు (నన్నే యాగదేవతగా భావించి) యజ్ఞములు చేసెదరు,
మాం ఏవ స్తువంతి దేవా స అంగా స ఉపనిషత్ స ఇతిహాసా దేవతలు, వేదవేదాంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు నన్నే స్తుతించుచుందురు,
న మత్తో అన్యత్, అహం ఏవ సర్వం, మయి సర్వం ప్రతిష్ఠితం, నాకంటే వేరుగా ఏదీ లేదు, నేనే సర్వము, నా యందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది,
తతః కాశ్యాం ప్రయతైః ఏవా అహం అన్వహం పూజ్యః అక్కడ కాశీ యందు పుణ్యవ్రతులకు నేనే పూజ్యుడను,
తత్ర గణా రౌద్రాననా నానాముఖా నానాశస్త్రధారిణో నానారూపధారా నానాచిహ్నితాస్తే అక్కడ గణములు రౌద్రముఖులు, నానాముఖులు, నానాశస్త్రధారులు, నానారూపధారులు, నానాగుర్తులు ధరించినవారు,
సర్వే భస్మ దిగ్ధాంగా రుద్రాక్ష-ఆభరణాః కృతాంజలయో నిత్యం అభిధ్యాయంతి వారందరూ భస్మమును శరీరమంతా ధరించి రుద్రాక్ష ఆభరణులై కృతాంజలులై నిత్యము నన్నే ధ్యానించుచున్నారు,
తత్ర పూర్వస్యాం దిశి బ్రహ్మా కృతాంజలిః అహర్నిశం మాం ఉపాస్తే అక్కడ తూర్పు దిక్కున బ్రహ్మ కృతాంజలుడై ప్రతిదినము నన్నే ఉపాసించును
దక్షిణస్యాం దిశి విష్ణుః కృత్వైవ మూర్ధాంజలిం మాం ఉపాస్తే దక్షిణ దిక్కున విష్ణువు శిరస్సు దోసిలి ఒగ్గి నన్నే ఉపాసించును,
ప్రతీచ్యాం ఇంద్రః సః నత అంగ ఉపాస్తే పశ్చిమ దిక్కున ఇంద్రుడు సాష్టాంగముగా నమస్కరిస్తూ నన్నే ఉపాసించును,
ఉదీచ్యాం అగ్నికాయం ఉమ-అనురక్తా హేమ-అంగ-విభూషణా హేమవస్త్రా మాం ఉపాసతే ఉత్తర దిక్కున అగ్నికాయులు, అంబ ఉపాసకులు, బంగారు విభూషణధారులు, బంగారు వస్త్రధారులు అందరూ నన్నే ఉపాసించును,
మాం ఏవ దేవాః చతుర్మూర్తిధరా నేనే నాలుగు దిక్కుల దేవతా మూర్తి స్వరూపుడను.
దక్షిణాయాం దిశి ముక్తిస్థానం తత్ ముక్తి మంటప సంజ్ఞితం దక్షిణ దిక్కున ముక్తిస్థానమును సూచించు ముక్తిమంటపమున
తత్ర అనేక గణాః పాలకాః సాయుధాః పాపఘాతకాః అక్కడ అనేక గణములు, పాలకులు, సాయుధులు, పాపఘాతకులు,
తత్ర ఋషయః శాంభవాః పాశుపతా మహాశైవా అక్కడ ఋషులు, శాంభవీ ఉపాసకులు, పశుపతి ఉపాసకులు, మహాశైవులు
వేదావతగ్ంసం శైవం పంచాక్షరం జపంతః తారకం సప్రణవం మోదమానాః తిష్ఠంతి, వేదాత్మరూపమైన శైవ పంచాక్షర తారక మంత్రము ఓంకార సహితముగా జపిస్తూ సంతోషముగా ఉందురు,
తత్ర ఏకా రత్నవేదికా తత్ర అహం ఆసీనః అక్కడ ఒక రత్నవేదిక ఉన్నది, దానిపై నేను ఆసీనుడనై ఉన్నాను
2.10 కాశీలో ప్రాణములు విడుచువాడు పొందు ఉత్తమ స్థితి
కాశ్యాగ్ం సః త్యక్త్వ కుణపాంశ్చైవానానీయ స్వస్యాంకే సన్నివేశ్య కాశీ యందు శరీరము విడచి ప్రాణములు వదిలినవారిని నా తొడపై తీసుకొని
భసిత రుద్రాక్షభూషితా అనుపః స్పృశ్యం భస్మ రుద్రాక్ష భూషితులను నీటితో స్పృశించి
అభూత ఏతేషాం జన్మ మర్త్యం చ ఏతి తారకగ్ం శైవం మనుం ఉపదిశామి వీరికి మరల మర్త్య (మృత్యువుతో కూడిన) జన్మ కలుగకుండుగాక అని శైవ తారక మంత్రము ఉపదేశించెదను,
తతః తే ముక్తా మాం అనువిశంతి విజ్ఞానమయేన అంగేన, న పునరావర్తంతే అప్పుడు వారు ముక్తులై విజ్ఞానమయ దేహముతో నాలో ప్రవేశించెదరు, ఇక మరల పునరావృత్తినొందరు (తిరిగి మృత్యు లోకములోకి రారు).
2.11 బ్రహ్మవిద్య అధ్యయన అభ్యాసములు, ఫలశృతి
హుత అశన ప్రతిష్ఠగ్ం హవిః ఇవ తత్ర ఏవ ముక్త్యర్థం ఉపదిశ్యతే హోమాగ్నిలో హుతము చేసిన హవిస్సు వలె అక్కడనే (కాశీ అంతరగృహములో ఉన్న రత్న వేదిక యందే అసీనుడై ఉన్న శివునిచే) ముక్తికొఱకై మంత్రము ఉపదేశించబడును,
శైవో అయం మంత్రః పంచాక్షరః తత్ ముక్తిస్థానం, తత ఓంకారరూపం శైవపరమైన ఈ మంత్రమే పంచాక్షరి, అదే ముక్తిస్థానము, అదే ఓంకారరూపము,
తతో మదర్పిత కర్మణాం మదావిష్టచేతసాం మద్రూపతా భవతి, నా అన్యేషాం ఎవరు నా కొఱకే కర్మలు (మఱియు కర్మఫలాసక్తి) అర్పిస్తారో, నా యందే ఆవేశపూరితమైన మనస్సు కలవారో, వారు నా రూపమే పొందెదరు, మరే ఇతరులు కాదు.
ఇయం బ్రహ్మవిద్యే ఇదే బ్రహ్మవిద్య.
అయం బ్రహ్మవిద్యా ముముక్షవః కాశ్యాం ఏవ ఆసీనా వీర్యవంతో విజ్ఞానమయం బ్రహ్మకోశం చతుర్జాలం బ్రహ్మకోశం ఈ బ్రహ్మజ్ఞానము పొందు ముముక్షువులు కాశీ యందే ఉండినవారై ప్రయత్నశీలురై విజ్ఞానమయమైన బ్రహ్మకోశమును (అనగా) చతుర్జాలమైన (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ) బ్రహ్మకోశమును
యం మృత్యుః న అవపశ్యతి, యం బ్రహ్మ న అవపశ్యతి దేనిని మృత్యువు చూడదో, దేనిని బ్రహ్మ (హిరణ్యగర్భుడు) చూడలేడో,
యం ఇంద్ర అగ్ని న అవపశ్యేతాం, యం వరుణ ఆదయో న అవపశ్యంతి దేనిని ఇంద్రుడు, అగ్ని చూడలేరో, దేనిని వరుణుడు మొదలగువారు చూడలేరో
తం ఏవ తత్ తేజః ప్లుష్ఠవిడ్ భావగ్ం హైమం ఉమాం సంశ్లిష్య అటువంటి స్థితిని ఏ తేజోపుంజములు హైమావతియైన ఉమ (పార్వతి) యొక్క భావము (హృదయము) కౌగిలించుకొని ఉన్నదో,
వసంతం చంద్రకోటి సమప్రభం చంద్రకిరీటగ్ం వసంతమయమై (ఆహ్లాదకరమై), కోట్లాది చంద్రుల సమానమైన ప్రభతో, చంద్రకిరీటధారియై,
సోమ-సూర్య-అగ్ని నయనం భూతిభూషిత విగ్రహం శివం మాం ఏవం అభిధ్యాయంతో ముక్తకిల్బిషా త్యక్తబంధా మయి ఏవ లీనాః భవంతి చంద్ర సూర్య అగ్ని నేత్రములు కలవాడై (త్రినేత్రుడై), భస్మధార విగ్రహుడైన, శివుడైన నన్నే ఏకాగ్రముగా ధ్యానిస్తూ ఉన్నవారై, పాపము పోగొట్టుకున్నవారై , బంధవిముక్తులై, నా యందే లీనమగుదురు.
2.12 ఈశ్వర విముఖులు పొందు దుర్గతులు
యే చ అన్యే కాశ్యాం పురీషకారిణః ప్రతిగ్రహపరాః, త్యక్త భస్మ ధారణాః, త్యక్త రుద్రాక్ష ధారణాః, త్యక్త గ్రహయాగాః, త్యక్త విశ్వేశార్చనాః, త్యక్త పంచాక్షర జపాః ఇతరులు (శాస్త్ర విహితంగా నివసించువారు), కాశీ యందు పురీషము విసర్జించువారు, వస్తువులను గ్రహించి కూడబెట్టువారు, భస్మధారణ వదిలేసినవారు, రుద్రాక్ష ధారణ వదిలేసినవారు, గ్రహ యాగములు వదిలేసినవారు, విశ్వేశ్వరుని అర్చన విడిచిపెట్టినవారు, పంచాక్షర జపము చేయనివారు,
త్యక్త భైరవార్చనా భైరవీం ఘోరాం యాతనాం నానావిధాం కాశ్యాం పరేతా భుక్త్వా తతః శుద్ధా మాం ప్రపద్యంతే చ అంతర్గృహే రేతో మూత్రం వా విసృజంతి తదా తే సించతే పితౄన్ భైరవార్చన వదిలిపెట్టినవారు నానావిధములైన ఘోరమైన భైరవీ సంబంధిత యాతనలు కాశీ యందు మరణించిన తరువాత అనుభవించి తరువాత శుద్ధులై నన్ను పొందెదరు, మఱియు కాశీ అంతరగృహమున రేతస్సును, మూత్రమును విసర్జించువారు వాటితో పితృతర్పణ చేసినవారగుదురు,
తం ఏవ పాపకారిణం మృతం పశ్యన్ నీలలోహితో భైరవః తం పాతయతి అస్త్రమండలే జ్వలజ్జ్వలనకుండేషు అన్యేష్వపి అటువంటి పాపాత్ముడు చనిపోవటం చూసి నీలలోహితుడైన భైరవుడు అస్త్రమండలమున జ్వలించే కుండలయందు ఇతరములయందు వానిని పారవేస్తాడు,
తతః చ అప్రమాదేన నివసేద ప్రమాదేన నివసేత్ కాశ్యాం లింగరూపిణ్యాం కాబట్టి నిర్లక్ష్యము లేకుండా లింగరూపమైన కాశీ యందు నివసించవలెను.
ఇతి ఉపనిషత్. ఇలా చెప్పబడినది భస్మ జాబాల ఉపనిషత్తు.

భస్మ జాబాల ఉపనిషత్ - సారాంశ పుష్పమ్

భస్మ జాబాల ఉపనిషత్ సమాప్తము



Bhasma Jȃbȃla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com