[[@YHRK]] [[@Spiritual]]

Nrusimha Uttara Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


నృసింహ ఉత్తర తాపినీ ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఉపనిషత్ పరిచయ శ్లోకము

నృసింహ ఉత్తర తాపిన్యాం తుర్య తుర్యాత్మకం మహః నృసింహ ఉత్తర తాపినీ ఉపనిషత్ యందు మహత్తరమైన తురీయ తురీయమైన ఆత్మ (చెప్పబడినది)
పరమ అద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షం ఉపలభ్యతే (ఇది శ్రద్ధగా పఠించినచో) పరమ అద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షముగా ఉపలభ్యమగును


ఒకటవ ఖండము -

చతుష్పాద బ్రహ్మము యొక్క నాలుగు పాదములు

1.1 ఆత్మ = ఓం = బ్రహ్మము
ఓం దేవ ఆహ వై ప్రజాపతిం అబ్రువత్ దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగిరి
అణోరణీయాంసం ఇమం ఆత్మానం ఓంకారం నో వ్యాచక్ష్వ ఇతి అణువుకన్నా అణువైన ఈ ఆత్మను, ఓంకారమును గురించి మాకు వివిరింపుము అని
తథా ఇతి అట్లే అని, ప్రజాపతి ఇట్లు చెప్పసాగెను -
ఓం ఇతి ఓం ఏతత్ అక్షరం ఇదం సర్వం ఓం! అని, ఈ ఓం అక్షరమే ఈ సర్వము
తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇతి, సర్వం ఓంకార ఏవ దాని యొక్క ఉపవ్యాఖ్యానమే (expressions itself are) భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు. సర్వము ఓంకారమే!
యత్ చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ మరియు త్రికాలాతీతమై ఉన్నదేదో అది కూడా ఓంకారమే
సర్వం హి ఏతత్ బ్రహ్మా ఈ సర్వము బ్రహ్మమే
యం ఆత్మా బ్రహ్మ తం ఏతం ఆత్మానం ఓం ఇతి బ్రహ్మణ ఏకీకృత్య ఏ ఆత్మయే బ్రహ్మమో ఆ ఈ ఆత్మను ఓం అని బ్రహ్మముతో ఐక్యము చేసి
బ్రహ్మ చ ఆత్మానం ఓం ఇతి ఏకీకృత్య బ్రహ్మము, ఆత్మ, ఓం - వీటిని ఏకీకృతం చేయవలెను

(అనగా బ్రహ్మము, ఆత్మ, ఓం ఒక్కటే అని అర్థంచేసుకొని ఓంకార ఉపాసన ద్వారా బ్రహ్మమును ఆత్మ రూపముగా అనుభవము తెచ్చుకొనవలెను అని ఈ ఉపనిషత్ నిరూపిస్తుంది. )
తత్ ఏకం అజరం అమృతం అభయం అదే ఏకము, అజరం (జీర్ణము కానిది), అమృతం (మార్పు లేనిది), అభయం
ఓం ఇతి అనుభూయ తస్మిన్ ఇదం సర్వం త్రిశరీరం ఆరోప్య తన్మయం హి ఓం అని అనుభూతము చేసుకొని దాని యందు ఆరోపించబడిన ఈ త్రిశరీర సర్వము తత్ మయమే

[ త్రిశరీరము = శరీర త్రయము = కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము

ఏకరస బ్రహ్మమునందు అవిద్యచే (By virtue of attribution) కారణ శరీరము (Causal Body), దాని నుండి సూక్ష్మ దేహము (Subtle Body or Tendencies / Thought Body), దాని నుండి స్థూల దేహము (Physical Body) ప్రకటితమైనవి (have manifested).

పూర్ణబ్రహ్మమునందు కేవలము ఆరోపించబడిన (merely attributed) అవిద్యకు, శరీరత్రయములకు నిమిత్త, ఉపాదాన కారణములు ఏకరస అఖండ బ్రహ్మమే! ]
తత్ ఏవ ఇతి సంహరేత్ ఓం ఇతి తం వా ఏతం త్రిశరీరం ఆత్మానం అదియే (ఓం = బ్రహ్మము = ఆత్మ) అని, (త్రిశరీరమును) ఉపసంహరించి, దానిని ఓం అని, లేదా ఆ త్రిశరీరమును ఆత్మ (అని గ్రహించి)
త్రిశరీరం పరం బ్రహ్మ అనుసందధ్యాత్ త్రిశరీరమును (స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను) పరబ్రహ్మతో అనుసంధానము చేయవలెను
1.2 చతుష్పాద బ్రహ్మము యొక్క మొదటి మూడు పాదములు
స్థూలత్వాత్ స్థూల భుక్త్వాత్ చ సూక్ష్మత్వాత్ సూక్ష్మ భుక్త్వాత్ చ ఐక్యాత్ ఆనంద భోగాత్ చ సో అయం ఆత్మా చతుష్పాత్ (1) స్థూలత్వము వలన స్థూల భుక్త్వము (స్థూల విషయ భోగము) వలన, (2) సూక్ష్మత్వము వలన సూక్ష్మ భుక్త్వము వలన, (3) (స్థూల సూక్ష్మ) ఐక్యము వలన, (4) ఆనంద భోగము వలన - ఆ ఈ ఆత్మ చతుష్పాదములు కలిగినది
జాగరిత స్థానః స్థూల ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూలభుక్ చతురాత్మా విశ్వో వైశ్వానరః ప్రథమః పాదః జాగరిత స్థానుడు, స్థూల ప్రాజ్ఞుడు, ఏడు (7) అంగములు పంతొమ్మిది (19) ముఖములు (నోరులు) కలవాడు, స్థూల విషయ భోక్త, చతురాత్మ విశ్వరూప “వైశ్వానరుడు” - ఇది ఆత్మ / ఓం / బ్రహ్మము యొక్క మొదటి పాదము

[సప్త (7) అంగాః = 1) ద్యులోకము - శిరస్సు 2) సూర్యుడు - నేత్రములు 3) వాయువు - ప్రాణము 4) ఆకాశము - దేహ మధ్య భాగము 5) జలము - మూత్ర స్థానము 6) భూమి - పాదములు 7) అగ్ని - నోరు]

[ఏకోనవింశతి (19) ముఖాః = ఐదు జ్ఞానేంద్రియములు 1) చెవులు - వినికిడి 2) కన్నులు - చూపు 3) చర్మము - స్పర్శ 4) ముక్కు - వాసన 5) నోరు - రసము; ఐదు కర్మేంద్రియములు 6) వాక్కు 7) చేతులు 8) పాదములు 9) పాయువు - మల విసర్జనం 10) ఉపస్థ - మూత్ర విసర్జనం; పంచ ప్రాణములు - 11) ప్రాణ 12) అపాన 13) వ్యాన 14) ఉదాన 15) సమాన; అంతరంగ చతుష్టయము 16) మనస్సు 17) బుద్ధి 18) చిత్తము 19) అహంకారము]
స్వప్న స్థానః సూక్ష్మ ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః సూక్ష్మ భుక్ చతురాత్మా తైజసో హిరణ్యగర్భో ద్వితీయః పాదః స్వప్న స్థానుడు, సూక్ష్మ ప్రాజ్ఞుడు, ఏడు (7) అంగములు పంతొమ్మిది (19) ముఖములు (నోరులు) కలవాడు, సూక్ష్మ విషయ భోక్త, చతురాత్మ హిరణ్యగర్భ “తైజసుడు” - ఇది ఆత్మ / ఓం / బ్రహ్మము యొక్క రెండవ పాదము
యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్త స్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనంద భుక్ చేతోముఖః చతురాత్మా ప్రాజ్ఞ ఈశ్వరః తృతీయ పాదః ఎక్కడ సుప్తిలో (నిద్రలో) ఏ కోంచెము కామము కోరుకొనడో, ఏ కొంచెము కూడా స్వప్నము చూడడో, ఆ సుషుప్తమున ఉన్న సుషుప్త స్థాన ఏకీభూతుడు, ఆ ప్రజ్ఞానఘనుడే, ఆనందమయుడే, ఆనంద భోక్త చేతోముఖుడు, చతురాత్మ ప్రాజ్ఞ “ఈశ్వరుడు” - ఇది ఆత్మ / ఓం / బ్రహ్మము యొక్క మూడవ పాదము
ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ (ప్రభవ అపి అయౌ) హి భూతానాం త్రయం అపి ఏతత్ సుషుప్తం స్వప్నం మాయామాత్రం ఈతడే సర్వేశ్వరుడు, ఈతడే సర్వజ్ఞుడు, ఈతడే అంతర్యామి, ఈతడే సర్వమునకు యోని, భూతములకు ప్రభవము (జన్మ మూలకారణము) - స్థితి - లయము, (ప్రతీ జీవునిలో అనుభవమగుచున్న) ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు ఈ ఆత్మ యొక్క మాయామాత్రములే.
చిత్ ఏకరసో హి అయం ఆత్మా చిత్ ఏకరసుడు ఈ ఆత్మయే (The Self is the Enjoyer of His Oneness).
1.3 చతుష్పాద బ్రహ్మము యొక్క నాలుగవ పాదము
అథ తురీయః పిమ్మట నాలుగవ పాదము (చెప్పబడుచున్నది)
చతురాత్మా తురీయా వసితత్వాత్ ఏకస్య ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పైః చతురాత్మ తురీయా వసితత్వము వలన ఏకమునకు 1) ఓత 2) అనుజ్ఞాత 3) అనుజ్ఞ 4) అవికల్పము చేత
త్రయం అపి అత్రా అపి సుషుప్తం స్వప్నం మాయామాత్రం మూడు కూడా, అనగా ఇక్కడి జాగ్రత్ సహా సుషుప్తి స్వప్న అనుభవములు, కేవలము మాయామాత్రమే!
చిత్ ఏకరసో హి అయం ఆత్మా చిత్ ఏకరసమే ఈ ఆత్మ
1.4 అనిర్వచనీయ ఆత్మకు ఇది ఆదేశము
అథ అయం ఆదేశో ఇప్పుడు ఈ ఆత్మకు ఇది ఆదేశము -
న స్థూల ప్రజ్ఞం న సూక్ష్మ ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం న అప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం ఈ ఆత్మ స్థూల ప్రజ్ఞ కాదు, సూక్ష్మ ప్రజ్ఞ కాదు, రెండు కలిసిన ప్రజ్ఞ కూడా కాదు. అది ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞ కాదు, ప్రజ్ఞానఘనము కాదు.
అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్ష్యం అచింత్యం అవ్యవదేశ్యం ఏకాత్మ్యం ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అది అదృష్టము (దృష్టము కానిది), అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్ష్యము, అచింత్యము, అవ్యవదేశము (అఖండము), ఏకాత్మ, ప్రత్యయ సారము (సత్యము), ప్రపంచము ఉపశమించు స్థానము, శాంతము, శివము, అద్వైతము (తనకు వేరుగా రెండవది లేనిది), చతుర్థముగా (జాగ్రత్-స్వప్న-సుషుప్త స్థితులకు ఆధారమైన నాలుగవ స్థితిగా) తలచదరు
స ఆత్మా స విజ్ఞేయ ఈశ్వర గ్రాసః తురీయతురీయః ఆ ఆత్మయే విజ్ఞేయము (అది ఒక్కటే బాగుగా తెలుసుకొనవలసినది [లేదా] తెలియబడునదంతా అదే అయి ఉన్నది), ఈశ్వర గ్రాసము (ముద్ద), తురీయతురీయము (తురీయమునకు కూడా అప్రమేయ సాక్షి)!

రెండవ ఖండము -

ఓంకార ఉపాసన ద్వారా ఆత్మతో అనుసంధానము

2.1 అభిన్న ఆత్మ యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త, తురీయ చతురావస్థల భిన్నత్వము
తం వా ఏతం ఆత్మానం జాగ్రతి అస్వప్నం అసుషుప్తం ఆ ఈ ఆత్మ జాగ్రత్తులో (మెలుకువలో - ప్రస్తుత అనుభవములో) అస్వప్నము, అసుషుప్తము (స్వప్న-సుషుప్తులు లేనిది)
స్వప్నే అజాగ్రతం అసుషుప్తుం స్వప్నములో అజాగ్రతం అసుషుప్తము (జాగ్రత్-సుషుప్తలు లేనిది)
సుషుప్తే అజాగ్రతం అస్వప్నం సుషుప్తిలో అజాగ్రతం అస్వప్నము (జాగ్రత్-స్వప్నములు లేనిది)
తురీయే అజాగ్రతం అస్వప్నం అసుషుప్తం అవ్యభిచారిణం నిత్యానందం సత్ ఏకరసం హి ఏవ తురీయమునందు అజాగ్రతము, అస్వప్నము, అసుషుప్తము, అవ్యభిచారిణము (నియమములకు అతీతమైనది), నిత్యానందము, సత్ ఏకరసమే అయినది
2.2 ఆత్మ కేవల సాక్షిత్వము
చక్షుషో ద్రష్టా శ్రోత్రస్య ద్రష్టా వాచో ద్రష్టా మనసో ద్రష్టా బుద్ధేః ద్రష్టా ప్రాణస్య ద్రష్టా తమసో ద్రష్టా సర్వస్య ద్రష్టా ఆత్మ చక్షువులకు (చూపుకు) ద్రష్ట (చూచువాడు), శ్రోత్రములకు (వినికిడికి) ద్రష్ట, మనస్సుకు ద్రష్ట, బుద్ధికి ద్రష్ట, ప్రాణమునకు ద్రష్ట, తమస్సుకు ద్రష్ట, సర్వమునకు ద్రష్ట
తతః సర్వస్మాత్ అన్యో విలక్షణః ప్రధానముగా ఆత్మ సర్వమునకు అన్యముగా ఉండి విలక్షణమైనది
చక్షుషః సాక్షీ శ్రోత్రస్య సాక్షీ వాచః సాక్షీ మనసః సాక్షీ బుద్ధేః సాక్షీ ప్రాణస్య సాక్షీ తమసః సాక్షీ సర్వస్య సాక్షీ ఆత్మ చక్షువులకు (చూపుకు) సాక్షి (the Witness Beyond), శ్రోత్రమునకు (వినికిడికి) సాక్షి, వాచకమునకు సాక్షి, మనస్సుకు సాక్షి, బుద్ధికి సాక్షి, ప్రాణమునకు సాక్షి, తమస్సుకు సాక్షి, సర్వమునకు సాక్షి
తతో అవిక్రయో మహాచైతన్యో ఆత్మ వికారములు (స్పర్థలు, మార్పులు లేని) మహాచైతన్యము (శుద్ధ ఏఱుక / తెలివి)
అస్మాత్ సర్వస్మాత్ ప్రియతమ ఆనందఘనం హి ఏవం ఆత్మయే సర్వముకన్నా ప్రియతమమైనది, అదే ఆనందఘనము
అస్మాత్ సర్వస్మాత్ పురతః సువిభాతం ఏకరసం ఏవ అజరం అమృతం అభయం బ్రహ్మ ఏవ అపి అజయ ఆత్మయే అన్నిటికన్నా పూర్వమైనది, బాగుగా (స్వ)ప్రకాశమైనది (అన్నిటినీ ప్రకాశింపచేయునది), అదే ఏకరసము (అనుభవమునకు ఆధారము, మహాద్రష్ట), అజరము, అమృతము, అభయము, అజేయము, బ్రహ్మమే అయిన
ఏనం చతుష్పాదం మాత్రాభిః ఓంకారేణ చ ఏకీకుర్యాత్ ఈ ఆత్మ యొక్క నాలుగు పాదములను ఓంకార మాత్రలతో ఏకీకృతము చేయవలెను
2.3 ఓంకారములో అకార మాత్రతో ఏకీకృతము
జాగరిత స్థానః చతురాత్మా విశ్వో వైశ్వానరః చతూరూపో అకార ఏవ జాగరిత స్థానుడు, చతురాత్మా విశ్వుడు, వైశ్వానరుడు, చతూరూపుడు అకారుడే
చతూరూపో హి అయం అకారః స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః అకార రూపైః ఆప్తే ఆది మత్వాత్ వా ఈ అకారుడు (ఓంకారములో అకారము) చతూరూపుడు, ఎట్లు అనగా స్థూల-సూక్ష్మ-బీజ-సాక్షి అను నాలుగు అకార రూపులతో కలిసి ఆదియై ఉండుట చేత, లేదా
స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ ఆప్నోతి హ వా స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత (సర్వము) పొందినవాడు

[అనగా, ఈ లక్షణముల చేత జాగ్రత్ అవస్థలో ఉన్న అనుభవ పురుషుడు ఉపాధికి అతీతంగా పూర్ణుడే అయి ఉన్నాడు]
ఇదం సర్వం ఆదిః చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో ఈ సర్వమునకు ఆదియై ఉండువాడు అగును
2.4 ఓంకారములో ఉకార మాత్రతో ఏకీకృతము
స్వప్న స్థానః చతురాత్మా తైజసో హిరణ్యగర్భః చతూరూప ఉకార ఏవ స్వప్న స్థానుడు, చతురాత్మా తైజసుడు, హిరణ్యగర్భుడు, చతూరూపుడు ఉకారుడే
చతూరూపో హి అయం ఉకారః స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః ఉకారరూపైః ఉత్కర్షాత్ ఉభయత్వాత్ వా ఈ ఉకారుడు (ఓంకారములో ఉకారము) చతూరూపుడు, ఎట్లు అనగా స్థూల-సూక్ష్మ-బీజ-సాక్షి అను నాలుగు ఉకార రూపులతో ఉత్కర్షం (మహత్తరమై సర్వము తనలో ఆకర్షించుట) చేత, లేదా
స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ ఉత్కర్షతి హ వై స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత ఉత్కర్షమై (గొప్పదై) ఉన్నవాడు

[అనగా, ఈ లక్షణముల చేత స్వప్న అవస్థలో ఉన్న అనుభవ పురుషుడు ఉపాధికి అతీతంగా పూర్ణుడే అయి ఉన్నాడు]
జ్ఞాన సంతతిం సమానః చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అఖండ జ్ఞానమునకు సమానమైనవాడు అగును
2.5 ఓంకారములో మకార మాత్రతో ఏకీకృతము
సుషుప్త స్థానః చతురాత్మా ప్రాజ్ఞ ఈశ్వరః చతూరూపో మకార ఏవ సుషుప్త స్థానుడు, చతురాత్మా ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు, చతూరూపుడు మకారుడే
చతూరూపో హి అయం మకారః స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః మకార రూపైః మితేః అపీతేః వా ఈ మకారుడు (ఓంకారములో మకారము) చతూరూపుడు, ఎట్లు అనగా స్థూల-సూక్ష్మ-బీజ-సాక్షి అను మకార రూపములచే కొలవబడి (తనలో) ప్రవేశించినవాడు అగుట చేత, లేదా
స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ మినోతి (మినుతే) హ వా స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత కొలవబడినవాడు (measured)

[అనగా, ఈ లక్షణముల చేత సుషుప్త అవస్థలో ఉన్న అనుభవ పురుషుడు పూర్ణుడే అయి ఉన్నాడు]
ఇదం సర్వం అపీతిః చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో ఈ సర్వము ప్రవేశించినవాడు అగును
2.6 ఓంకారములో అమాత్రతో తురీయ ఏకీకృతము
మాత్రా-అమాత్రాః ప్రతిమాత్రాః కుర్యాత్ “మాత్ర (అ, ఉ, మ్) అమాత్ర (మాత్రా రహిత తురీయము)”లలో ప్రతీ మాత్రను స్వరమునకు తగినట్లుగా (వేదవిహితముగా) ఉచ్చరిస్తూ ఉపాసించవలెను (భావనలో ఆత్మతో ఏకీకృతము చేయవలెను)
2.7 తురీయ ఆత్మయే జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఓత-అనుజ్ఞాత-అనుజ్ఞ-అవికల్పము
అథ తురీయ ఈశ్వర గ్రాసః ఇప్పుడు తురీయ ఈశ్వర గ్రాసుడు (ముద్ద) గురించి -
స స్వరాట్ స్వయం ఈశ్వరః స్వప్రకాశః ఆ తురీయమే స్వరాట్టు, స్వయం ఈశ్వరుడు, స్వప్రకాశుడు
చతురాత్మ ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పైః చతురాత్మ తురీయము 1) ఓత 2) అనుజ్ఞాత 3) అనుజ్ఞ 4) అవికల్ప చతూరూపమై అయి ఉన్నది
ఓతో హి అయం ఆత్మా హి అథ ఏవ ఇదగ్ం (1) ఓత :- తురీయ ఆత్మయే ఓతమై ఇదంతా అయి ఉన్నది

[Note: చతురాత్మ తురీయములో జాగ్రత్-స్వప్న-సుషుప్త స్థితులు ఒకదానితో మరొకటి ఓతమై (వలలో వలె గుచ్చబడి) ఉన్నవి]
సర్వం అంతకాలే కాలాగ్నిః సూర్యో అస్త్రైః అనుజ్ఞాతో హి (2) అనుజ్ఞాత :- సర్వం అంతకాలమునందు కాలాగ్ని సూర్యుని అస్త్రములతో అనుజ్ఞాతుడు (Authority) అగునట్టి
అయం ఆత్మా హి అస్య సర్వస్య స్వాత్మానం దదాతి ఇదగ్ం సర్వం స్వాత్మానం ఏవ కరోతి ఈ తురీయ ఆత్మయే ఈ సర్వమునకు స్వాత్మను ఇచ్చును, ఈ సర్వమును స్వాత్మానమే చేయును

[ఎక్కడెక్కెడ “నేను” అను స్పృహ వ్యక్తమగుచున్నదో ఆ దృష్టిలో అంతా ఏకాత్మ తురీయ బ్రహ్మమే!]
యథా తమః సవితా అనుజ్ఞ ఏకరసో హి అయం ఆత్మా చిత్ రూప ఏవ (3) అనుజ్ఞ :- ఏ విధముగా తమస్సును రహితము చేసి సవిత (సూర్య కాంతి) ప్రజలకు ప్రేరణ అగునో, అట్లే ఏకరసుడు చిత్ రూపమే అయిన ఈ తురీయ ఆత్మయే (జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు) అనుజ్ఞ ఇచ్చుచున్నది
యథా దాహ్యం దగ్ధ్వా అగ్నిః అవికల్పో హి అయం ఆత్మా వాక్ మనో అగోచరత్వాత్ చిద్రూపః (4) అవికల్ప :- ఏ విధముగా దహింపదగిన దానిని దహించి అగ్ని అవికల్పమగునో, అట్లే వాక్కు మనస్సులకు అగోచరమగుట చేత ఈ చిత్ రూప అయిన తురీయ ఆత్మయే అవికల్పుడు అగుచున్నాడు
2.8 ఓత, అనుజ్ఞాత, అనుజ్ఞ, అవికల్ప అను ఓంకార రూపములు
చతూరూప ఓంకార ఏవ చతూరూపో హి అయం ఓంకార ఓంకారమే చతూరూపము, చతూరూపమే ఓంకారము
ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పైః ఓంకారరూపైః ఈ ఓంకార 1) ఓత [Interwoven] 2) అనుజ్ఞాత [Authorized] 3) అనుజ్ఞ [Permitted, Allowed] 4) అవికల్ప [Absence of Alternative] అనునవి ఓంకార రూపములు (విశేషణములు)

[ఆత్మకు ఏ లక్షణములు చెప్పలేము. ఓంకారము ఆత్మకు సంజ్ఞ. అకార-ఉకార-మకారములను అర్థభావములతో ఓంకార ఉచ్చారణ, ఉపాసన ద్వారా ఆత్మ సాక్షాత్కారము సాధించవచ్చును అని మున్ముందు విశదీకరించబడును.]
ఆత్మ ఏవ నామరూపాత్మకం హి ఇదగ్ం సర్వం (కేవలం ఆపాదిత) నామరూపాత్మకమే అగు ఈ సర్వము ఆత్మయే
తురీయత్వాత్ చిద్రూపత్వాత్ చ ఓతత్వాత్ అనుజ్ఞాతృత్వాత్ అనుజ్ఞాత్ అవికల్ప రూపత్వాత్ చ అవికల్పరూపం హి ఇదగ్ం సర్వం, న ఏవ తత్ర కాచన భిదా అస్తి తురీయత్వము చేత, చిద్రూపత్వము చేత మఱియు ఓతత్వము చేత, అనుజ్ఞాతృత్వము చేత, అనుజ్ఞ చేత, అవికల్ప రూపము చేత మఱియు అవికల్పరూపమే ఈ సర్వము, అక్కడ కొంచెము కూడా (తత్త్వము దృష్ట్యా) ఏ భేదము లేదు
2.9 తురీయ ఓంకార ఉపాసనచే ఆత్మ ఫలశృతి
అథ తస్య అయం ఆదేశో ఇప్పుడు దాని (తురీయ ఓంకారము) యొక్క ఆదేశము -
అమాత్రః చతుర్థో అవ్యవహార్యః ప్రపంచ ఉపశమః శివో అద్వైత ఓంకార ఆత్మ ఏవ మాత్రా రహితము, చతుర్థము, అవ్యవహార్యము, ప్రపంచ ఉపశమ స్థానము, శివము, అద్వైతము, ఈ ఓంకార ఆత్మయే!
సంవిశతి ఆత్మనా ఆత్మానం ఆత్మచే ఆత్మను లయించును (మనస్సు తురీయాత్మనందు లయించును)

[ఓంకార ఉపాసనచే స్థూల ఆకాశము చిత్తాకాశములో, చిత్తాకాశము చిదాకాశములో లయించును. ఇవన్నీ ఆత్మయే!]
య ఏవం వేద, ఏష వీరో నారసింహేన వా అనుష్టుభా మంత్రరాజేన ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో - ఆ వీరుడు నారసింహ లేదా అనుష్టుభ మంత్రరాజము చేత
తురీయం విద్యాత్ ఏష హి ఆత్మానం ప్రకాశయతి తురీయము తెలుసుకొని ఆ ఆత్మను ప్రకాశింపచేసుకొనును (స్వాత్మానుభూతిపరుడు అగును)
సర్వ సంహార సమర్థః పరిభవ అసహః ప్రభుః వ్యాప్తః సర్వ సంహార సమర్థుడు, పరాభవము సహింపనివాడు, ప్రభువు, వ్యాపించినవాడు అగును
సత్ ఉజ్జ్వలో అవిద్యా తత్ కార్యహీనః సత్ ఉజ్జ్వలుడు, అవిద్య మఱియు దాని కార్యము లేనివాడు అగును
స్వాత్మ బంధహరః స్వాత్మ అనుభవముచే బంధము హరింపచేసుకున్నవాడు అగును
సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్ఠానః సర్వదా ద్వైత భావ రహిత ఆనందరూపుడు, సర్వాధిష్ఠానుడు అగును
సన్మాత్రో, నిరస్తా అవిద్యా తమో మోహో సన్మాత్రుడు (కేవల సత్ స్వరూపము అనుభవించువాడు), అవిద్య - తమస్సు- మోహము పోగొట్టుకున్నవాడు అగును
అహం ఏవ ఇతి తస్మాత్ ఏవం ఏవే మమాత్మానం పరం బ్రహ్మ అనుసందధ్యాత్ ఏష వీరో నృసింహ ఏవ ఇతి అది నేనే అని, కావున ఈ విధముగా ఈ చతురాత్మయే నా యొక్క ఆత్మ అని పరబ్రహ్మతో అనుసంధానము చేసుకొను ఆ వీరుడు నృసింహుడే!

మూడవ ఖండము -

ఓంకార మాత్ర-అమాత్రలు

3.1 తురీయ చింతన
తస్య హ వై ప్రణవస్య యా పూర్వా మాత్రా సా ప్రథమః పాదో భవతి ఆ ప్రణవమునకు ఏది మొదటి మాత్రయో (అ) అదే దానికి (చతుష్పాద ఆత్మకు) మొదటి పాదము
ద్వితీయా ద్వితీయస్య తృతీయా తృతీయస్య రెండవ మాత్ర (ఉ) రెండవ పాదము, మూడవ మాత్ర (మ్) మూడవ పాదము
చతుర్థి ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పరూపా తయా తురీయం చతురాత్మానం అన్విష్య ఆ ప్రణవమునకు నాలుగవది అమాత్రా (మాత్రా రహిత) 1) ఓత 2) అనుజ్ఞాత 3) అనుజ్ఞ 4) అవికల్ప రూపమైన చతురాత్మ తురీయమును దానితో (అమాత్రతో ) అన్వేషించి

[మాత్ర = measured; అమాత్ర = unmeasured]
చతుర్థపాదేన చ తయా తురీయేణ అనుచింతయన్ గ్రసేత్ మరియు నాలుగవ పాదమైన ఆ తురీయము చేత బాగుగా చింతించి (ఆత్మను, బ్రహ్మమును) గ్రహించవలెను
3.2 చతురాత్మ ప్రథమ పాదము - అకారము
తస్య హ వా ఏతస్య ప్రణవస్య యా పూర్వా మాత్రా పృథివి అకారః ఆ ఈ ప్రణవమునకు ఏది మొదటి మాత్రయో అది పృథివీ “అ”కారము
స ఋగ్భిః ఋగ్వేదో బ్రహ్మ వసవో గాయత్రీ గార్హపత్యః సా ప్రథమ పాదో భవతి అది ఋక్కులతో కూడిన ఋగ్వేదము, బ్రహ్మ, వసువులు, గాయత్రీ ఛందస్సు, గార్హపత్యాగ్ని ఆ మొదటి పాదము అగును
భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః అన్ని పాదములందు స్థూల, సూక్ష్మ, బీజ, సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు
3.3 చతురాత్మ ద్వితీయ పాదము - ఉకారము
ద్వితీయా అంతరిక్షం స ఉకారః రెండవ పాదము అంతరిక్ష “ఉ”కారము
స యజుర్భిః యజుర్వేదో విష్ణురుద్రాః త్రిష్టుప్ దక్షిణాగ్నిః సా ద్వితీయః పాదో భవతి అది యజుస్సులతో కూడిన యజుర్వేదము, విష్ణు రుద్రులు, త్రిష్టుప్ ఛందస్సు, దక్షిణాగ్ని ఆ రెండవ పాదము అగును
భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః అన్ని పాదములందు స్థూల, సూక్ష్మ, బీజ, సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు
3.4 చతురాత్మ తృతీయ పాదము - మకారము
తృతీయా ద్యౌః స మకారః మూడవ పాదము ద్యౌలోక “మ”కారము
స సామభిః సా సామవేదో రుద్ర ఆదిత్య జగతీ ఆహవనీయః సా తృతీయ పాదో భవతి అది సామములతో కూడిన సామ వేదము, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, జగతీ ఛందస్సు, ఆహవనీయాగ్ని ఆ మూడవ పాదము అగును
భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః అన్ని పాదములందు స్థూల, సూక్ష్మ, బీజ, సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు
3.5 చతురాత్మ చతుర్థ పాదము - అర్ధమాత్ర
ఆవసానే అస్య చతుర్థి అర్ధమాత్రా (అమాత్ర) సా సోమలోక ఓంకారః చివరన ఉన్న నాలుగవ పాదమునకు అర్ధమాత్ర, అది సామలోక ఓంకారము
సా అథర్వణైః మంత్రైః అథర్వవేదః సంవర్తకో అగ్నిః మరుతో విరాట్ ఆ పాదము అథర్వణ మంత్రములతో కూడిన అథర్వ వేదము, సంవర్తకాగ్ని (ప్రలయాగ్ని), మరుత్తు (వాయువు), విరాట్టు
ఏకర్షిః భాస్వతీ స్మృతా సా చతుర్థః పాదో భవతి అది ఏకర్షి, స్మృతులచే భాసించునది, అది నాలుగవ పాదము అగును
భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిః అన్ని పాదములందు స్థూల, సూక్ష్మ, బీజ, సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు
3.6 తురీయ ఉపాసన
మాత్ర అమాత్రాః ప్రతిమాత్రాః కృత్వ మాత్రలను (పృథివి, అంతరిక్ష, ద్యులోక, సామలోకములను), అమాత్రను (మాత్రా రహిత తురీయమును ఉద్దేశించి) ప్రతీ మాత్రను స్వరమునకు తగినట్లుగా (వేదవిహితముగా) ఉపాసించవలెను (ఉచ్చరిస్తూ భావనలో ఆత్మతో ఏకీకృతము చేయవలెను)

[“ఓం” అనునది దీర్ఘ ఘంటా నినాదము వలె ఉచ్చరించాలి. ఓంకారము ఉచ్చారణ పూర్తి కాగా ఆ నిశ్శబ్దములో మనస్సు తురీయములో లీనమగును!]
ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్ప రూపం చింతయన్ గ్రసేత్ (నాలుగవది, అమాత్రా / మాత్రా రహిత రూపమైన తురీయాత్మను) 1) ఓత 2) అనుజ్ఞాత 3) అనుజ్ఞ 4) అవికల్ప రూపమును బాగుగా చింతించి గ్రహించవలెను

[ప్రజ్ఞకు తెలియబడునదంతా అకార-ఉకార-మకారములలో ఇమిడి ఉన్నదని తెలుసుకొని, ఓంకార ఉపాసనతో అమాత్ర (unmeasured) తురీయములో లీనమగు అభ్యాసము చేయవలెను.]
3.7 ఆత్మ ఫలశృతి
జ్ఞో అమృతో హుతసంవిత్కః శుద్ధః సంవిష్టో నిర్విఘ్న ఇమ అది (తురీయమును దర్శించి) తెలిసుకున్న జ్ఞాని అమృతుడు, హుతమును పొందినవాడు, శుద్ధుడు, సంవిష్టుడు (సిద్ధుడు), నిర్విఘ్నుడు అగునని తెలుసుకొనవలెను
ఇమం అనునియమే అనుభూయే హ ఇదం సర్వం దృష్ట్వా ఈ తురీయమును నియమముగా స్వానుభూతము చేసుకొని ఈ సర్వమును చూచినవాడు
స ప్రపంచహీనో అథ సకలః సాధారో అమృతమయః చతురాత్మా అతడు ప్రపంచహీనుడు, సకలుడు, సాధారుడు (అతడే సర్వమునకు ఆధారుడు, అతనికి వేరే ఆధారము అవసరము లేనివాడు), అమృతమయుడు, చతురాత్మ
3.8 ఆత్మకు సాంగ లింగ పూజ
అథ మహీపీఠే సపరివారం ఇక మహీపీఠము (అనగా లింగము, అనగా చిహ్నము) యందు పరివార సహితముగా
తం ఏతం చతుః సప్త ఆత్మానం అతడే ఈ సప్తాత్మ, చతురాత్మ స్వరూపుడు
చతుః ఆత్మానం మూలాగ్నావగ్నిరూపం ప్రణవం సందధ్యాత్ నాలుగు తత్త్వముల ఆత్మ స్వరూపుడు, మూలాగ్ని యందు అగ్ని రూపమైన ప్రణవమును సంధానము చేసినవాడు
సప్త ఆత్మానం చతురాత్మానం అకారం బ్రహ్మాణం నాభౌ సప్తాత్మ, చతురాత్మ, అకారమైన బ్రహ్మను నాభి యందు (అకార రూపముగా)

[Note :- సప్తాత్మ అనగా ఏడు చక్రములకు అధిష్ఠానమైన ఆత్మ అని ఒక అర్థము చెప్పుదురు - 1) మూలాధారము, 2) స్వాధిష్ఠానము, 3) మణిపూరకము, 4) అనాహతము, 5) విశుద్ధి, 6) ఆజ్ఞా, 7) సహస్రారము]

[Note :- చతురాత్మ అనగా జాగ్రత్-స్వప్న-సుషుప్త-తురీయములకు అధిష్ఠానమైన ఆత్మ]
సప్త ఆత్మానం చతురాత్మానం అకారం విష్ణుం హృదయే సప్తాత్మ, చతురాత్మ, అకారమైన విష్ణువును హృదయము యందు (ఉకార రూపముగా)
సప్త ఆత్మానం చతురాత్మానం అకారం రుద్రం భ్రూమధ్యే సప్తాత్మ, చతురాత్మ, అకారమైన రుద్రుని భ్రూమధ్యము యందు (మకార రూపముగా)
సప్త ఆత్మానం చతురాత్మానం చతుః సప్త ఆత్మానం ఓంకారం సర్వేశ్వరం ద్వాదశాంతే సప్తాత్మ, చతురాత్మ, చతుః / సప్త ఆత్మయు అయిన ఓంకారమైన సర్వేశ్వరుని ద్వాదశ అంతమున

[Note :- ద్వాదశాంతం అనగా బ్రహ్మ రంధ్రం, సహస్రార కమలం]
సప్త ఆత్మానం చతురాత్మానం చతుః సప్త ఆత్మానం ఆనంద అమృత రూపం షోడశాంతే సప్తాత్మ, చతురాత్మ, చతుః / సప్త ఆత్మయు అయిన ఆనంద అమృత రూపుని షోడశ అంతమున
అథ ఆనంద అమృతే స ఏతాం చతుర్థా సంపూజ్య పిమ్మట ఆనంద అమృతమున వీరి అందరినీ నాలుగు పాదముల రూపముగా (చతుష్పాదాత్మగా) నాలుగు ఉపహారములతో బాగుగా పూజించవలెను
3.9 శరీరత్రయ ఉపసంహార ఆత్మ ధ్యానము
తథా బ్రహ్మాణం ఏవ విష్ణుం ఏవ రుద్రం ఏవ విభక్తాంస్త్రీన్ ఏవ అవిభక్తాంస్త్రీన్ ఏవ లింగరూపాన ఏవ చ అదే విధముగా బ్రహ్మను, విష్ణువును, రుద్రుని, విభక్తులను, అవిభక్తులను మఱియు లింగరూపులను కూడా
సంపూజ్య ఉపహారైః చతుర్థ అథ లింగాన్ సంహృత్య నాలుగు ఉపహారములతో (కానుకలతో, సేవలతో) బాగుగా పూజించి, పిమ్మట లింగమును (పూజ కొఱకు మాత్రమే ఏర్పరచుకున్న చిహ్నమును) ఉపసంహరించి
తేజసా శరీర త్రయం సంవ్యాప్య తేజస్సుచే (భావనలో) శరీరత్రయమును (స్థూల-సూక్ష్మ-కారణ శరీరములను) బాగుగా వ్యాపింపచేసి
తత్ అధిష్ఠానం ఆత్మానం సంజ్వాల్య ఆత్మను తత్ (శరీరత్రయమునకు) అధిష్ఠానముగా బాగుగా జ్వలింప చేసి
తత్ తేజ ఆత్మ చైతన్య రూపం బలం అవష్టభ్య గుణైః ఐక్యం సంపాద్య ఆ తేజో ఆత్మ చైతన్య రూపముగా బలమును నిగ్రహించి గుణములతో ఐక్యము సంపాదించి (త్రిగుణాతీత దృష్టితో)
మహాస్థూలం మహాసూక్ష్మే మహాసూక్ష్మం మహాకారణే చ సంహృత్య మహాస్థూల దేహము మహాసూక్ష్మ దేహమునందు, మహాసూక్ష్మ దేహము మహాకారణ దేహమునందు లయింప చేసి
మాత్రాభిః ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్ప రూపం చింతయన్ గ్రసేత్ (అ, ఉ, మ్) మాత్రలచే 1) ఓత 2) అనుజ్ఞాత 3) అనుజ్ఞ 4) అవికల్ప (మాత్రా రహిత) రూపమును బాగుగా చింతించి (తురీయాత్మను) గ్రహించవలెను


నాలుగవ ఖండము -

నారసింహ యోగము

4.1 ఆత్మ పరబ్రహ్మ ఓంకారము
తం వా ఏతం ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం ఆ ఈ (తురీయ) ఆత్మ పరబ్రహ్మ ఓంకారము!
తురీయోంకార అగ్ర విద్యోతం అనుష్టుభా నత్వా ప్రసాద్య తురీయోంకార అగ్రముగా (తురీయమునకు కూడా ముందే, అనగా సాక్షియై) ప్రకాశించు వానిని (నారసింహుని) అనుష్టుభముతో నమస్కరించి, ప్రీతి పొంది
ఓం ఇతి సంహృత్య అహం ఇతి అనుసందధ్యాత్ “ఓం” అని ఉపసంహరించి, అహం (నేనే) అని అనుసంధానము చేసి
తథా ఏతం ఏవ ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం ఈ ఆత్మయే (నేనే) పరబ్రహ్మ ఓంకారము (అని సిద్ధి పొందవలెను)
4.2 నారసింహ యోగ సాధన
తురీయ ఓంకార అగ్ర విద్యోతం ఏకాదశ ఆత్మానం నారసింహం నత్వ ఓం ఇతి సంహరన్ అనుసందధ్యాత్ తురీయ ఓంకార అగ్రమున (తురీయ తురీయముగా) ప్రకాశించు ఏకాదశ (“అహం”) ఆత్మ స్వరూపుడైన నారసింహుని నమస్కరించి ఓం అని ఉపసంహరించి అహమాత్మను ఓంకార నారసింహునితో అనుసంధానము చేయవలెను

[Note: నృసింహ పూర్వ తాపిని ఉపనిషత్తు యందు “నృసింహం భీషణం భద్రం … మృత్యుమృత్యుం నమామి అహం” మంత్రములో “అహం” ఏకాదశ స్థానముగా వివరించబడినది]
తథా ఏతం తథా ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం తురీయ ఓంకార అగ్ర విద్యోతం ఆ ఆత్మయే (నేనే) పరబ్రహ్మ ఓంకార, తురీయ ఓంకార అగ్రమున వెలిగొందునది
ప్రణవేన సంచిత్య అనుష్టుభా నత్వా ప్రణవముచే బాగుగా చింతించి అనుష్టుభ మంత్రముతో నమస్కరించి
సచ్చిదానంద పూరాత్మసు నవాత్మకం సచ్చిందానంద పూర్ణ ఆత్మల (అనంత కోటి జీవుల) యందు నవాత్మకుడై (ఎల్లప్పుడు క్రొత్తవాడి వలెనే) ప్రకటితమగు
సచ్చిదానంద పూర్ణ ఆత్మానం పరంబ్రహ్మ సంభావ్య సచ్చిదానంద పూర్ణ ఆత్మనే పరబ్రహ్మగా భావించి
అహం ఇతి ఆత్మానం ఆదాయ మనసా బ్రహ్మణ ఏకీకుర్యాత్ అహం (నేనే పరబ్రహ్మ) అని ఆత్మను (అంతరేంద్రియమును) తీసుకెళ్లి మనస్సులో భావనచే (పరబ్రహ్మతో) ఏకము చేయవలెను (అహం బ్రహ్మా౽స్మి)
యత్ అనుష్టుభ ఏవ వా ఏష నమసా వా ఏష ఉపవసన్ ఏష హి ఏది అనుష్టుభమో దానికి అనుసంధానము చేస్తూ దాని దగ్గరగా ఉండవలెను
4.3 నృసింహుడే సర్వాత్ముడు
సర్వత్ర సర్వదా సర్వాత్మా నృసింహ అసౌ పరమేశ్వరో అసౌ హి సర్వత్రా సర్వదా సర్వాత్ముడు - ఈ నృసింహుడే, ఈ పరమేశ్వరుడే!
సర్వత్ర సర్వాత్మాన్ అంతః సర్వం అత్తి నృసింహ ఏవ సర్వత్రా సర్వాత్మలను (సర్వ జీవులను) సర్వమును అంతరమునందే సంహరించువాడు (తనలోనే లయింపజేసుకొనువాడు) నృసింహుడే!
ఏకల ఏష, తురీయ ఏష ఏవ, ఉగ్ర ఏష ఏవ, వీర ఏష ఏవ ఈతడే ఏకుడు, ఈతడే తురీయుడు, ఈతడే ఉగ్రుడు, ఈతడే వీరుడు
మహాన్ ఏష ఏవ, విష్ణుః ఏష ఏవ, జ్వలన్ ఏష ఏవ ఈతడే మహత్తు, ఈతడే విష్ణువు, ఈతడే జ్వలనుడు
సర్వతోముఖ ఏష ఏవ, నృసింహ ఏష ఏవ, భీషణ ఏష ఏవ ఈతడే సర్వతోముఖుడు, ఈతడే నృసింహుడు, ఈతడే భీషణుడు
భద్ర ఏష ఏవ, మృత్యుమృత్యుః ఏష ఏవ, నమామి ఏష ఏవ, అహం ఏవం ఈతడే భద్రుడు, ఈతడే మృత్యుమృత్యుడు (మృత్యువుకే మృత్యువు), ఈతనికే నేను నమస్కరిస్తున్నాను అని
యోగ ఆరూఢో బ్రహ్మణ్యే వా అనుష్టుభం సందధ్యాత్ ఓంకార ఇతి యోగ ఆరూఢుడు బ్రహ్మమును, లేదా ఓంకారమగు అనుష్టుభమును, అనుసంధానము చేయవలెను
4.4 నారసింహ యోగ ఆరూఢమునకు రెండు శ్లోకములు
తత్ ఏతౌ శ్లోకౌ భవతః దాని కొఱకు రెండు శ్లోకములు కలవు -
1) సంస్తభ్య సింహం స్వసుతాన్ గుణార్థ అంతః సంయోజ్య శృంగైః ఋషభస్య హత్వా 1) సింహమును స్తంభింపచేసి తన సుతులైన గుణార్థములను అంతరములో బాగుగా కలిపివేసి, ఋషభము యొక్క కొమ్ములతో సంహరించి

[వాయువును స్తంభింపచేసి చిత్తము అను సింహమును, తన సుతుల వంటి గుణార్థములను హృదయాంతరములో బాగుగా కలిపివేసి, యోగము అను ఋషభము యొక్క కొమ్ములతో ఆ విషయార్థములను సంహరించి, త్రిగుణాతీతత్వ దృష్టి సాధించి]
వశ్యాం స్ఫురంతీం అసతీం నిపీడ్య సంభక్ష్య సింహేన స ఏష వీరః స్ఫురించు అసతిని పీడించి సింహమును వశీకరించుకొని బాగుగా భక్షించినవాడు, అతడే వీరుడు

[పునరావృత్తులుగా స్ఫురించు కులత వంటి చిత్తవృత్తులను అష్టాంగ యోగాభ్యాసముచే పీడించి, చిత్తము అను సింహమును వశీకరించుకొని చిత్తమును తన ఆత్మలో లయింపచేసుకున్నవాడు అతడే వీరుడు, అనగా నారసింహుడే, అగును]
2) శృంగ ప్రోతాన్ పాదాన్ స్పృష్ట్వా హత్వా తాం అగ్రసత్ స్వయం 2) కొమ్ములతో గుచ్చి, పాదములతో స్పృశించి, సంహరించి, స్వయముగా దానిని మ్రింగి

[చిత్తము అను సింహమును యోగము అనే వృషభము యొక్క కొమ్ములతో గుచ్చి, పాదములతో స్పృశించి, సంహరించి, స్వయముగా దానిని మ్రింగి అనగా చిత్తమును ఆత్మలో లయము కావించి]
నత్వా చ బహుధా దృష్ట్వా నృసింహః స్వయం ఉద్బభౌ ఇతి నమస్కరించి మఱియు అనేక విధముల చూడగా నృసింహుడు స్వయముగా పైకి ప్రకాశించెను

ఐదవ ఖండము -

నృసింహుడే ఆప్తతమార్థము, వ్యాప్తతమము, ఉత్కృష్టుడు,

మహావిభూతి

5.1 నృసింహుడే ఆప్తతమార్థము
అథ ఏష ఉ ఏవ అకార ఆప్తతమార్థ ఇప్పుడు ఈ ఉకార-అకారమే ఆప్తతమార్థము (పొందవలసిన వాటిలో అత్యంత గొప్ప ఫలము)
ఆత్మని ఏవ నృసింహే దేవే వర్తత అదే (ఆ ఫలమే) ఆత్మయందే వర్తించు నృసింహ దేవుడు!
ఏష హి ఏవ ఆప్తతమ ఏష హి సాక్షి ఏష ఈశ్వరః ఆ నారసింహుడే ఆప్తతముడు, ఆతడే సాక్షి, ఆతడే ఈశ్వరుడు
తత్ సర్వగతో స హి ఇదగ్ం సర్వం ఏష హి వ్యాప్తతమ ఇదగ్ం సర్వం ఆతడే సర్వగతుడు, ఈ సర్వమూ ఆతడే, ఈ సర్వమూ వ్యాపించియున్నవాడు ఆతడే
యత్ అయం ఆత్మా మాయామాత్ర ఇదంతా (జగద్దృశ్యమంతా) ఆత్మ యొక్క మాయామాత్రము (మాయావిలాసము)
5.2 నృసింహుడే వ్యాప్తతమము
ఏష ఏవ ఉగ్ర ఏష హి వ్యాప్తతమ ఈతడే ఉగ్రుడు, ఆతడే వ్యాప్తతముడు (సర్వములో అంతరాంతరమున వ్యాపించియున్నవాడు)
ఏష ఏవ వీర ఏష హి వ్యాప్తతమః ఈతడే వీరుడు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ మహాన్ ఏష హి వ్యాప్తతమ ఈతడే మహాన్, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ విష్ణుః ఏష హి వ్యాప్తతమ ఈతడే విష్ణువు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ జ్వలనః ఏష హి వ్యాప్తతమ ఈతడే జ్వలనుడు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ సర్వతోముఖ ఏష హి వ్యాప్తతమ ఈతడే సర్వతోముఖుడు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ నృసింహ ఏష హి వ్యాప్తతమ ఈతడే నృసింహుడు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ భీషణ ఏష హి వ్యాప్తతమ ఈతడే భీషణుడు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ భద్ర ఏష హి వ్యాప్తతమ ఈతడే భద్రుడు, ఆతడే వ్యాప్తతముడు

ఏష ఏవ మృత్యుమృత్యుః ఏష హి వ్యాప్తతమ

ఈతడే మృత్యుమృత్యువు, ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ నమామి ఏష హి వ్యాప్తతమ ఈతడే నమామి (నా చేత నమస్కరించదగినవాడు), ఆతడే వ్యాప్తతముడు
ఏష ఏవ అహం ఏష హి వ్యాప్తతమ ఈతడే అహం, ఆతడే వ్యాప్తతముడు
ఆత్మ ఏవ నృసింహో దేవో బ్రహ్మ భవతి ఆత్మయే ఈ నృసింహ దేవ బ్రహ్మము!
య ఏవం వేద సో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అతడే అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు
న తస్య ప్రాణా ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలీయంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మా అపి ఏతి ఆతని ప్రాణములు ఉత్క్రమణము (పైకి పోవుట) జరుగక (సంసార భవ చక్రము నుండి విడివడి) బ్రహ్మములోనే బాగుగా లీనమై ఆతడు బ్రాహ్మీసమానుడు అగును
5.3 నృసింహుడే ఉత్కృష్టుడు
అథ ఏష ఏవ ఓంకార ఉత్కృష్టతమార్థ ఆత్మని ఏవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తతే ఇక ఈ ఓంకారమునకు అత్యంత ఉత్కృష్ట అర్థము, ఆత్మయందే వర్తించు నారసింహ దేవ బ్రహ్మము గురించి -
తస్మాత్ ఏష సత్యస్వరూపో న హి అన్యత్ అస్తి కావున ఈతడు సత్యస్వరూపుడే కాని అన్యము కాదు!
అప్రమేయం అనాత్మ ప్రకాశం ఏష హి ఈ నారసింహుడే అప్రమేయుడు, (స్వతఃసిద్ధి లేని) అనాత్మను ప్రకాశింపచేయువాడు

[ఉదాహరణ: ఏ విధముగా అనగా దృశ్యములోని వస్తువులన్నీ భూతాకాశమునందే ఉనికి కలిగి ఉన్నా, ఆకాశము అప్రమేయమై ఉండునట్లు]
స్వప్రకాశో అసంగో అన్యత్ న వీక్షత ఆత్మాతో న అన్యథా ప్రాప్తిః ఆత్మ మాత్రం హి ఏతత్ ఉత్కృష్టం స్వప్రకాశుడు, అసంగుడు, (తాను దేనికీ వేరు కాదు కనుక) అన్యముగా చూడబడలేనివాడు, (ఇప్పటికే లభ్యమై ఉన్న) ఆత్మ మాత్రుడే కావున అన్యథా (ఎప్పుడో ఒకప్పుడు) పొందబడేవాడు కాడు, ఈతడే ఉత్కృష్టుడు (the Ultimate)
ఏష ఏవ ఉగ్ర ఏష హి ఉత్కృష్ట ఈతడే ఉగ్రుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ వీర ఏష హి ఉత్కృష్ట ఈతడే వీరుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ మహాన్ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే మహాన్, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ విష్ణుః ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే విష్ణువు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ జ్వలనః ఏష ఏవ హి ఉత్కృష్ట ఈతడే జ్వలనుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ సర్వతోముఖ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే సర్వతోముఖుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ నృసింహ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే నృసింహుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ భీషణ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే భీషణుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ భద్ర ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే భద్రుడు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష హి ఏవ మృత్యుమృత్యుః ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే మృత్యుమృత్యువు, ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ నమామి ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే నమామి (నా చేత నమస్కరించదగినవాడు), ఆతడే ఉత్కృష్టుడు
ఏష ఏవ అహం ఏష హి ఏవ ఉత్కృష్టః ఈతడే అహం, ఆతడే ఉత్కృష్టుడు
తస్మాత్ ఆత్మానం ఏవ ఏనం జానీయాత్ కావున ఈతడిని ఆత్మగానే (స్వాత్మ, స్వయం ఆత్మగానే) తెలుసుకోవలెను
ఆత్మ ఏవ నృసింహో దేవో బ్రహ్మ భవతి ఆత్మయే నృసింహ దేవ బ్రహ్మ అయి ఉన్నాడు
య ఏవం వేద సో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అతడే అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు
న తస్య ప్రాణా ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలీయంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మా అపి ఏతి ఆతని ప్రాణములు ఉత్క్రమణము (పైకి పోవుట) జరుగక (సంసార భవ చక్రము నుండి విడివడి) బ్రహ్మములోనే బాగుగా లీనమై ఆతడు బ్రాహ్మీసమానుడు అగును
5.4 నృసింహుడే మహావిభూతి
అథ ఏష ఏవ మకారో మహావిభూతి అర్థ ఆత్మని ఏవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తతే పిమ్మట (ఓంకారములో) ఈ మకారమే మహావిభూతి అర్థము (ఫలము), ఆత్మయందే వర్తించు నారసింహ దేవ బ్రహ్మము
తస్మాత్ అయం అనల్పో అభిన్నరూపః స్వప్రకాశో కావున ఈతడు అనల్పుడు, అభిన్నరూపుడు, స్వప్రకాశుడు
బ్రహ్మ ఏవ ఆప్తతమ ఉత్కృష్టతమ నారసింహ బ్రహ్మమే ఆప్తతముడు (పొందవలసిన అత్యుత్తమమైనవాడు), ఉత్కృష్టతముడు (ఉత్తమోత్తముడు)
ఏతత్ ఏవ బ్రహ్మా అసి సర్వజ్ఞం మహామాయం మహావిభూతి ఈతడే బ్రహ్మము, సర్వజ్ఞము, మహామాయ, మహావిభూతి!
ఏతత్ ఏవ ఉగ్రం ఏతద్ధి (ఏతద్ హి) మహావిభూతి ఈతడే ఉగ్రం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ వీరం ఏతద్ధి మహావిభూతి ఈతడే వీరం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ మహత్ ఏతద్ధి మహావిభూతి ఈతడే మహత్ ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ విష్ణు ఏతద్ధి మహావిభూతి ఈతడే విష్ణు ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ జ్వలత్ ఏతద్ధి మహావిభూతి ఈతడే జ్వలత్ ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ సర్వతోముఖం ఏతద్ధి మహావిభూతి ఈతడే సర్వతోముఖం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ నృసింహం ఏతద్ధి మహావిభూతి ఈతడే నృసింహం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ భీషణం ఏతద్ధి మహావిభూతి ఈతడే భీషణం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ భద్రం ఏతద్ధి మహావిభూతి ఈతడే భద్రం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ మృత్యుమృత్యుం ఏతద్ధి మహావిభూతి ఈతడే మృత్యుమృత్యుం ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ నమామి ఏతద్ధి మహావిభూతి ఈతడే నమామి (నా చేత నమస్కరించదగినవాడు) ఇదే మహావిభూతి
ఏతత్ ఏవ అహం ఏతద్ధి మహావిభూతి ఈతడే అహం ఇదే మహావిభూతి
5.5 ఆత్మయే పరబ్రహ్మయైన నృసింహ దేవుడు
తస్మాత్ అకార-ఉకారాభ్యాం ఇమం ఆత్మానం ఆప్తతమం ఉత్కృష్టతమం కావున అకార-ఉకారములతో ఈ ఆత్మను, ఆప్తతమమును, ఉత్కృష్టతమమును
చిన్మాత్రం సర్వద్రష్టారం సర్వసాక్షిణం సర్వగ్రాసం సర్వప్రేమాస్పదం చిన్మాత్రను, సర్వద్రష్టారమును (ప్రతీ దృష్టిలో ఉన్న ద్రష్ట తానే అయిన మహాద్రష్టను), సర్వసాక్షిని, సర్వగ్రాసమును, సర్వప్రేమాస్పదమును
సచ్చిదానందమాత్రం ఏకరసం పురతో సచ్చిదానందమాత్రుడును, ఏకరసమును, పురాతనుడను
అస్మాత్ సర్వస్మాత్ సువిభాతం అన్విష్య ఆప్తతమం ఉత్కృష్టతమం మహామాయం మహావిభూతిం దాని నుండే సువిభాతమగును ఈ సర్వమును అన్వేషించదగినదియును, ఆప్తతమమును (పొందదగినవాటిలో ఉత్తమోత్తమైనది), ఉత్కృష్టతమమును, మహామాయను, మహావిభూతిని
సచ్చిదానందమాత్రం ఏకరసం పరం ఏవ బ్రహ్మ మకారేణ జానీయాత్ సచ్చిదానందమును, ఏకరసమును, పరబ్రహ్మమును మకారముచేత తెలుసుకొనవలెను
ఆత్మ ఏవ నృసింహో దేవః పరం ఏవ బ్రహ్మ భవతి ఆత్మయే పరబ్రహ్మయైన నృసింహ దేవుడు!
య ఏవం వేద సో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అతడే అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు
న తస్య ప్రాణా ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలీయంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మా అపి ఏతి ఆతని ప్రాణములు ఉత్క్రమణము (పైకి పోవుట) జరుగక (సంసార భవ చక్రము నుండి విడివడి) బ్రహ్మములోనే బాగుగా లీనమై ఆతడు బ్రాహ్మీసమానుడు అగును
ఇతి ఆహ ఏవ ప్రజాపతిః ఉవాచ ఈ విధముగా ప్రజాపతి చెప్పెను


ఆరవ ఖండము -

నారసింహుని అనుష్టుభముచే ఆత్మజ్యోతిని అన్వేషించుట

6.1 పాపాసురుని నుండి దేవతల విముక్తి
తే దేవా ఇమం ఆత్మానం జ్ఞాతుం ఇచ్ఛంత ఆ దేవతలు ఈ ఆత్మను తెలుసుకొనుటకు ఇచ్ఛ కలిగిరి
తాన్ ఆసురః పాప్మా పరిజగ్రాహ వారిని అసురుడైన పాపము పరిగ్రహించెను
త ఐక్షంత హంతి ఏనం ఆసురం పాప్మానం గ్రసామ ఇతి అసురుడైన ఆ పాపమును వారు పట్టుకొని చంపుదుమని చూచిరి
ఏతం ఏవ ఓంకార అగ్ర విద్యోతం తురీయతురీయం ఆత్మానం వారు ఆ ఓంకారాగ్రమున వెలుగొందు తురీయతురీయుడైన ఆత్మను సమీపించి (తెలుసుకొను ప్రయత్నముతో)
ఉగ్రం అనుగ్రం వీరం అవీరం మహాంతం అమహాంతం విష్ణుం అవిష్ణుం ఉగ్రమును, అనుగ్రమును, వీరమును, అవీరమును, మహత్తును, అమహత్తును, విష్ణువును, అవిష్ణువును,
జ్వలంతం అజ్వలంతం సర్వతోముఖం అసర్వతోముఖం నృసింహం అనృసింహం జ్వలంతమును, అజ్వలంతమును, సర్వతోముఖమును, అసర్వతోముఖమును, నృసింహమును, అనృసింహమును
భీషణం అభీషణం భద్రం అభద్రం మృత్యుమృత్యుం అమృత్యుమృత్యుం భీషణమును, అభీషణమును, భద్రమును, అభద్రమును, మృత్యుమృత్యువును, అమృత్యుమృత్యువును,
నమామి అనమామి అహం అనహం నమామిని, అనమామిని, అహమును, అనహమును
నృసింహ అనుష్టుభ ఏవ బుబుధిరే నృసింహ అనుష్టుభము చేతనే తెలుసుకొనిరి
6.2 నృసింహ సోమము యొక్క మహిమ
తేభ్యో హా సావ ఆసురః పాప్మా సచ్చిదానంద ఘన జ్యోతిః అభవత్ ఆ దేవతల ప్రయత్నముతో సోమముచే (అమృతముచే) పాపాసురుడు (కూడా) సచ్చిదానంద ఘన జ్యోతి అయ్యెను

[Note: సోమము / అమృతము అనగా వివేకముతో చేయు ద్వంద్వ విచారణచే పొందు ఆత్మ అనాత్మ జ్ఞానము]
తస్మాత్ అపక్వ కషాయ ఇమం ఏవ ఓంకార అగ్ర విద్యోతం తురీయతురీయం కావున అపక్వ కషాయమైన ఈ ఓంకారాగ్రమున ప్రకాశించు తురీయతురీయుడైన
ఆత్మానం నృసింహ అనుష్టుభ ఏవ జానీయాత్ ఆత్మను నృసింహ అనుష్టుభముచేతనే తెలుసుకొనవలెను
తస్య ఆసురః పాప్మా సచ్చిదానంద ఘన జ్యోతిః భవతి అట్టివానికి పాపాసురుడు (కూడా) సచ్చిదానంద ఘన జ్యోతి అగును
6.3 దేవతలు తురీయ ఆత్మ జ్యోతిని చేరుట
తే దేవా జ్యోతిః ఉత్తితీర్షవో ద్వితీయాత్ భయం ఏవ పశ్యంత ఆ దేవతలు (సచ్చిదానంద ఘన) జ్యోతిని చేరుటకునై ద్వితీయము (ద్వంద్వ దృష్టి) వలన భయము చూచినవారై
ఇమం ఏవం ఓంకార అగ్ర విద్యోతం తురీయం ఆత్మానం ఆ ఈ ఓంకారాగ్రమున ప్రకాశించు తురీయ ఆత్మను
అనుష్టుభా అన్విష్య ప్రణవేన ఏవ తస్మిన్ అవస్థితాః అనుష్టుభముచే అన్వేషించి ప్రణవము చేతనే దాని (జ్యోతి) యందు అవస్థితులై ఉండిరి
తేభ్యః తత్ జ్యోతిః అస్య సర్వస్య పురతః ఆ జ్యోతి వారికంటె, ఈ సర్వమునకు ముందే పురాతనమైనది
సువిభాతం అవిభాతం అద్వైతం అచింత్యం అలింగం సర్వ ప్రకాశం ఆనందఘనం శూన్యం అభవత్ (ఆ సచ్చిదానంద జ్యోతి) సువిభాతము, అవిభాతము, అద్వైతము, అచింత్యము, అలింగము, సర్వ ప్రకాశము, ఆనందఘనము, శూన్యము అయినది

ఏవం విత్ స్వప్రకాశం పరం ఏవ బ్రహ్మ భవతి

ఈ విధముగా తెలుసుకున్నవాడు స్వప్రకాశమైన పరబ్రహ్మయే అగును (స్వస్వరూప విజ్ఞానము కలుగును)
తే దేవాః పుత్ర ఈషణాయాః చ విత్త ఈషణాయాః చ లోక ఈషణాయాః చ స సాధనేభ్యో వ్యుత్థాయ ఆ దేవతలు (సాధనలో సిద్ధి కలిగినవారు) సంతానమునకు సంబంధించిన కామముల నుండి, విత్తమునకు సంబంధించిన కామముల నుండి, లోకమునకు సంబంధించిన (పేరు ప్రఖ్యాతలు మొదలగు) కామముల నుండి (చిత్తములో) సాధనములతో సహా వదిలివేసి
నిరాకారా నిష్పరిగ్రహ అశిఖా అయజ్ఞోపవీతా నిరాకారులై (గృహ వర్జితులై), (సంసారము పట్ల) సంగ వర్జితులై, శిఖను వదిలి, యజ్ఞోపవీతమును (కర్మానుష్ఠానమును) త్యజించి
అంధా బధిరా ముగ్ధాః క్లీబా మూకా ఉన్మత్తా ఇవ పరివర్తమానాః అంధుల వలె, బధిరుల వలె, ముగ్ధులై, పేడితనము కలిగినవారి వలె, మూగవారి వలె, ఉన్మత్తులు (పిచ్చివారి) వలె తిరుగుదురు
శాంతా దాంతా ఉపరతాః తితిక్షవః సమాహితా శాంతులై, దాంతులై (ఇంద్రియములను నియమించినవారై), ఉపరతులై (ఇంద్రియ వ్యవహారములు ఉపసంహరించినవారై), తితిక్ష (ఓర్పు) కలిగినవారై, సమాహితులై (సమాధి దృష్టి పొందినవారై)
ఆత్మరతయ ఆత్ర్మక్రీడా ఆత్మమిథునా ఆత్మానందాః ఆత్మరతులై, ఆత్మక్రీడులై, ఆత్మసంయోగముచే ఆత్మానందులగుదురు
ప్రణవం ఏవ పరంబ్రహ్మాత్మ ప్రకాశం శూన్యం జానంతః ప్రణవమునే పరబ్రహ్మాత్మ ప్రకాశమైన శూన్యముగా (నిర్విషయముగా) తెలుసుకున్నవారగుదురు
తత్ర ఏవ పరిసమాప్తాః అక్కడితో పరిసమాప్తిని పొందిరి
6.4 ఆత్మ ఫలశృతి
తస్మాత్ దేవానాం వ్రతం ఆచరన్ ఓంకారే పరబ్రహ్మణి పర్యవసితో భవేత్ కావున దేవతల యొక్క వ్రతము ఆచరించువాడు ఓంకారరూపమైన పరబ్రహ్మమునందే పర్యవసితుడు (వ్యవస్థితుడు) అగును
స ఆత్మని ఏవ ఆత్మానం పరంబ్రహ్మ పశ్యతి అతడు తన ఆత్మ యందే తన ఆత్మను పరబ్రహ్మగా దర్శించును
తత్ ఏష శ్లోకః అందుకు ఈ (క్రింద) శ్లోకము ఉన్నది -



శృంగేషు అశృంగం సంయోజ్య సింహం శృంగేషు యోజయేత్



శృంగముల యందు అశృంగమును బాగుగా కలిపి సింహమును శృంగముల యందు కలుపవలెను

[త్రిగుణములను గుణాతీతత్వ దృష్టిలో ఏకం చేసి చిత్తమును ఆత్మలో లయము చేయవలెను]
శృంగాభ్యాం శృంగం ఆబధ్య త్రయో దేవా ఉపాసత ఇతి శృంగములతో శృంగమును బంధించి ముగ్గురు దేవతలు ఉపాసించుచున్నారు

[సంకల్పములను సంకల్పముతో బంధించి చిత్తవృత్తి నిరోధము అభ్యాసము చేసి జాగ్రత్-విశ్వుడు / అకారుడు, స్వప్న-తైజసుడు / ఉకారుడు, సుషుప్తి-ప్రాజ్ఞుడు / మకారుడు అను ముగ్గురు దేవతలు తురీయమును ఉపాసించుచున్నారు]


ఏడవ ఖండము -

అకార, ఉకార, మకార ఉపాసన

7.1 దేవతల ప్రశ్న
దేవా హ వై ప్రజాపతిం అబ్రువన్ దేవతలు ప్రజాపతిని అడిగిరి -
భూయ ఏవ నో భగవాన్ విజ్ఞాపయతి ఇతి తథా ఇతి భగవాన్! మాకు ఇంకను బోధించుము, అనగా ప్రజాపతి అట్లే అనెను
7.2 అకార ఉపాసన
అజత్వాత్ అమరత్వాత్ అజరత్వాత్ అమృతత్వాత్ అశోకత్వాత్ అమోహత్వాత్ అనశనాయత్వాత్ అపిపాసత్వాత్ అద్వైతత్వాత్ చ అజత్వము (జన్మ లేకపోవటము) వలన, అమరత్వము వలన, అజరత్వము (జరా / ముసలితనము లేకపోవుట) వలన, అమృతత్వము వలన, అశోకత్వము వలన, అమోహత్వము వలన, అనశనాయత్వము (ఆకలి లేకపోవుట) వలన, అపిపాసత్వము (దాహము లేకపోవుట) వలన, అద్వైతత్వము వలన
[ఆత్మకు ఉన్న ఈ “అ”కార లక్షణములను ఉపాసిస్తూ]
అకారేణ ఇమం ఆత్మానం అన్విష్య అకారము చేత ఈ ఆత్మను అన్వేషించి [తరువాత ఉకార ఉపాసన చేయవలెను]
7.3 ఉకార ఉపాసన
ఉత్కృష్టత్వాత్ ఉత్పాదకత్వాత్ దుష్ప్రవేష్టత్వాత్ ఉత్కృష్టత్వము (శ్రేష్ఠత్వము) వలన, ఉత్పాదకత్వము (తయారుచేయగల సామర్ధ్యము) వలన, దుష్ప్రవేష్టత్వము (ప్రవేశించుటకు అసాధ్యము) వలన
ఉత్థాపయితృత్వాత్ ఉద్ద్రష్టృత్వాత్ ఉత్కర్తృత్వాత్ ఉత్పథవారకత్వాత్ ఉత్థాపయితృత్వము (ఉద్ధరించగల సామర్ధ్యము) వలన, ఉద్ద్రష్టృత్వము (ఉత్తమ దృష్టి సామర్ధ్యము) వలన, ఉత్కర్తృత్వము (నిజముగ చేయగల సామర్ధ్యము) వలన, ఉత్పథవారకత్వము (దిగజారు త్రోవ నుండి మరల్చగల సామర్ధ్యము) వలన
ఉద్గ్రాసత్వాత్ ఉద్భ్రాంతత్వాత్ ఉత్తీర్ణవికృతత్వాత్ చ ఉద్గ్రాసత్వము (సంహరించి తినుట) వలన, ఉద్భ్రాంతత్వము (పైకి క్రిందకు గిర్రున త్రిప్పుట) వలన, ఉత్తీర్ణవికృతత్వము (మార్పుకు ఆవల ఉండుట) వలన

[ఆత్మకు ఉన్న ఈ “ఉ”కార లక్షణములను ఉపాసిస్తూ]
ఉకారేణ ఇమం ఆత్మానం పరమం బ్రహ్మ నృసింహం అన్విష్య ఉకారము చేత ఈ నృసింహ పరబ్రహ్మ ఆత్మను అన్వేషించి
అకారేణ ఇమం ఆత్మానం ఉకారం పూర్వార్ధం ఆకృష్య సింహీకృత ఉత్తరార్ధేన తం సింహం ఆకృష్య అకారము చేత ఈ ఆత్మను ఉకార పూర్వార్ధమును (ముందున్న సగమును) ఆకర్షించి సింహీకృతము చేసి (సింహముగా చేసి) ఉత్తరార్ధముతో ఆ సింహమును ఆకర్షించి (తరువాత మకార ఉపాసన చేయవలెను)
7.4 మకార ఉపాసన
మహత్త్వాన్ మహస్త్వాన్ మానత్వాన్ ముక్తత్వాన్ మహాదేవత్వాన్ మహత్వము (glory) వలన, మహస్త్వము (mightiness) వలన, మానత్వము (measurement) వలన, ముక్తత్వము (freedom) వలన, మహాదేవత్వము (supremacy) వలన
మహేశ్వరత్వాన్ మహానత్వాన్ మహాచిత్త్వాన్ మహానందత్వాన్ మహాప్రభుత్వాత్ చ మహేశ్వర్వత్వము (ominiscience and omnipotence) వలన, మహానత్వము (greatness) వలన, మహాచిత్త్వము (intelligence) వలన, మహానందత్వము (blissfulness) వలన, మహాప్రభుత్వము (controllability) వలన

[ఆత్మకు ఉన్న ఈ “మ”కార లక్షణములను ఉపాసిస్తూ]
మకార అర్థేన అనేన ఆత్మని ఏకీ కుర్యాత్ మకార అర్థము చేత గుణరహిత ఆత్మతో ఏకీకృతము చేయవలెను (సింహమును భక్షించవలెను)

[NOTE - అకార-ఉకార-మకార ఉపాసనా క్రమమును స్థూల-సూక్ష్మ-కారణ శరీరత్రయమును ఆత్మతో ఏకీకృతము చేయు విధము, మఱియు జాగ్రత్-స్వప్న-సుషుప్త-తురీయ చతురావస్థలను ఆత్మతో ఏకీకృతము చేయు విధము అని అన్వయము చెప్పవచ్చును.]
7.5 అకారముతో ఆత్మను వెతక ప్రారంభించవలెను
అశరీరో నిరింద్రియో అప్రాణో అతమాః సచ్చిదానంద మాత్రః ఆత్మ అశరీరుడు, నిరింద్రియుడు, అప్రాణుడు, అతమస్సుడు, సచ్చిదానంద మాత్రుడు
స స్వరాట్ భవతి య ఏవం వేద అతడే (ఆత్మయే) స్వరాట్, అని ఎవడు ఇట్లు తెలుసుకొనునో
కస్త్వం (కః త్వం?) ఇతి అహం ఇతి హ ఉవాచ ఏవం ఏ వేదం సర్వం “నీవు ఎవరు?” అనగా “నేను (ఆత్మ)” అనుచూ ఈ విధముగా సర్వమును తెలుసుకొనును
తస్మాత్ అహం ఇతి సర్వ అభిదా కావున “నేను” (ఆత్మ జ్ఞానము) సర్వము ఇచ్చును
అనంతస్య ఆదిః అయం అకారః స ఏవ భవతి అనంతమునకు ఆది ఈ అకారమే, అతడు (అకారమును ఆత్మగా తెలుసుకున్నవాడు) అకారమే అగును
సర్వం హి అయం ఆత్మా అయం హి సర్వాంతరో సర్వము ఈ ఆత్మయే! అదే సర్వమునకు అంతరము!
న హి ఇదం సర్వం అహం ఇతి హ ఉవాచ ఏవ నిరాత్మకం ఆత్మ ఏవ ఇదం సర్వం ఈ సర్వము నేను (ఆత్మ) కాదు అని చెప్పినచో ఈ సర్వము నిరాత్మక ఆత్మయే అగును

[NOTE - “నేతి” అనగా “న ఇతి” అను సిద్ధాంతముతో విచారించి “ఇది ఆత్మ కాదు!, ఇది ఆత్మ కాదు!” అని అనాత్మను వేరుచేయుచుండగా ఆత్మ (శుద్ధ నేను) అనుభవమునందు స్థితి కలిగియుండుట]
తస్మాత్ సర్వాత్మకేన అకారేణ సర్వాత్మకం ఆత్మానం అన్విచ్ఛేత్ కావున సర్వాత్మకమైన అకారము చేత సర్వాత్మకమైన ఆత్మను వెతకవలెను
బ్రహ్మ ఏవ ఇదగ్ం సర్వం సచ్చిదానంద రూపగ్ం ఈ సర్వము సచ్చిదానంద రూపమగు బ్రహ్మమే!
7.6 ఉపాసకుడు మకారుడు అగుట
సచ్చిదానంద రూపం ఇదం సర్వం సత్ హి ఇదం సర్వం ఈ సర్వము (జగత్తు) సచ్చిదానంద రూపము, ఈ సర్వము సత్తుయే

[సత్ స్వరూపమైన ఆత్మలో ప్రకటితమైన జగత్ కూడా సత్తుయే అగును, అనగా జగత్తు ఆత్మయే]
సత్సదితి చిత్ హి ఇదం సర్వం కాశతే ప్రకాశతే చ ఇతి ’సత్’‌లో సత్ అయిన ఈ సర్వము చిత్ (శుద్ధ ఎఱుక, తెలివి) చేత వెలిగొంది ప్రకాశించుచున్నది

[ఆత్మ సత్-చిత్! అందులో ప్రకటితమై ప్రకాశించబడు జగత్ కూడా సత్తు-చిత్తు, అనగా ఆత్మ కంటె వేరుగా జగత్తుకు ఉనికి, ప్రకాశము లేదు]
కిం సత్ ఇతి? ఇదం ఇదం న ఇతి అనుభూతిః ఇతి క ఏష ఏతి ఏది సత్యం? అని - ఇది, ఇది కాదు అని, అనుభూతి కలిగించునది అది ఏది? అని వెతుకుతూ

[తెలియబడునదంతా ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞను వెలుగించునది ఏదో ఉన్నది అని దానిని ప్రజ్ఞచే గుర్తించి]
యం ఇదం న ఇతి అవచనే న ఏవ అనుభవత్ ఉవాచ ఎవడు ఇది కాదు అని మాట్లాడకనే “కాదు” అని అనుభవములో చెప్పునో
ఏవం ఏవ చిదానందావ అపి అవచనే న ఏవ అనుభవత్ ఉవాచ ఇదే అని, కాదు అని కూడా మాట్లాడకనే చిదానందమున చెప్పునో
సర్వం అన్యత్ ఇతి స పరమానందస్య బ్రహ్మణో నామ బ్రహ్మ ఇతి సర్వమునకు అన్యమైనది అయిన ఆ పరమానంద బ్రహ్మమునకు బ్రహ్మ అని పేరు!
తస్య అంత్య అయం మకారః దానికి అంత్యము ఈ మకారము
స ఏవ భవతి అతడు అదే (మకారుడే) అగును

[అనగా ఏకాంతముగా అంతరంగములో వివేకముతో సత్-అసత్ విచారణ చేయువాడు తాను మకారరూపమగు బ్రహ్మము అని అనుభవపూర్వకముగా తెలుసుకొనుచూ మకారుడే అగును]
7.7 అకార-ఉకార-మకారముల చేత బ్రహ్మమును అన్వేషించుట
తస్మాత్ మకారేణ పరమం బ్రహ్మా అన్విచ్ఛేత్ కిం ఇదం ఏవం ఇతి కావున మకారము చేత పరబ్రహ్మమును అన్వేషించవలెను, ఇది ఏ విధముగా? అనగా
అకార ఇతి ఏవ ఆహా విచికిత్సన అకారమే అని అనగా, సంశయించుచుండగా (ఔను! అని)
అకారేణ ఇమం ఆత్మానం అన్విష్య మకారేణ బ్రహ్మణ అనుసందధ్యాత్ ఉకారేణ అవిచికిత్సన అకారము చేతనే ఆత్మను అన్వేషించి, మకారము చేత బ్రహ్మముతో అనుసుంధానము చేసి, ఉకారము చేత అసంశయుడు అయి
అశరీరో అనింద్రియో ప్రాణోతమోః సచ్చిదానందమాత్రః (ఉపాసకుడు) అశరీరుడు, అనింద్రియుడు (ఇంద్రయములు దాటినవాడు), ప్రాణోత్తముడు (ప్రాణశక్తికి మూలాధారుడు), సచ్చిదానందమాత్రుడు అగును
స స్వరాట్ భవతి య ఏవం వేద ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అతడే స్వరాట్టు అగును
7.8 నారసింహ అనుష్టుభము లక్షణముల వలన బ్రహ్మ సతతమే!
బ్రహ్మ వా ఇదం సర్వం (మకారుడైన ఆ ఉపాసకుడే) బ్రహ్మ లేదా ఈ సర్వము
అత్తృత్వాత్ ఉగ్రత్వాత్ వీరత్వాత్ మహత్వాత్ విష్ణుత్వాత్ భక్షణ వలన, ఉగ్రత్వము వలన, వీరత్వము వలన, మహత్వము వలన, విష్ణుత్వము వలన
జ్వలత్వాత్ సర్వతోముఖత్వాత్ నృసింహత్వాత్ భీషణత్వాత్ భద్రత్వాత్ జ్వలత్వము వలన, సర్వతోముఖత్వము వలన, నృసింహత్వము వలన, భీషణత్వము వలన, భద్రత్వము వలన
మృత్యుమృత్యుత్వాత్ నమామిత్వాత్ అహంత్వాత్ ఇతి సతతం హి మృత్యుమృత్యుత్వము వలన, నమామిత్వము వలన, అహంత్వము వలన (బ్రహ్మ) సతతమే (నిత్యమే)!
7.9 మకారము చేత మనోసాక్షిత్వ ఉపాసన
ఏతత్ బ్రహ్మా ఉగ్రత్వాత్ వీరత్వాత్ మహత్త్వాత్ ఈ బ్రహ్మ ఉగ్రత్వము వలన, వీరత్వము వలన, మహత్వము వలన
విష్ణుత్వాత్ జ్వలత్వాత్ సర్వతో ముఖత్వాత్ విష్ణుత్వము వలన, జ్వలత్వము వలన, సర్వతోముఖత్వము వలన,
నృసింహత్వాత్ భీషణత్వాత్ భద్రత్వాత్ నృసింహత్వము వలన, భీషణత్వము వలన, భద్రత్వము వలన
మృత్యుమృత్యుత్వాత్ నమామిత్వాత్ అహంత్వాత్ ఇతి మృత్యుమృత్యుత్వము వలన, నమామిత్వము వలన, అహంత్వము వలన (సతతమే) అని (గ్రహించవలెను)
తస్మాత్ అకారేణ పరమం బ్రహ్మ అన్విష్య కావున అకారము చేత పరబ్రహ్మమును అన్వేషించి
మకారేణ మనాది అవితారం మనాది సాక్షిణం అన్విచ్ఛేత్ మకారము చేత మనస్సు మొదలగు వాటిని రక్షించువానిని, మనస్సు మొదలగు వాటికి (మనోబుద్ధ్యహంకారచిత్తములకు) సాక్షిని అన్వేషించవలెను
7.10 ఉపాసకుడు స్వరాట్టు సృష్టి-స్థితి-లయ కారకుడు అగును
స యత్ ఏతత్ సర్వం అపేక్షతే అతడు (తాను స్వరాట్టు అని గ్రహించిన ఉపాసకుడు) ఎప్పుడైతే ఈ సర్వమును అపేక్షించునో
తత్ ఏతత్ సర్వం అస్మిన్ ప్రవిశతి అప్పుడు ఈ సర్వము అతనియందు ప్రవేశించును
స యదా ప్రతిబుధ్యతే తత్ ఏతత్ సర్వం అస్మాత్ ఏవ ఉత్తిష్ఠతి మరల ఎప్పుడు ఇష్టపడునో అప్పుడు ఈ సర్వము అతనియందు మేల్కొనును
తత్ ఏతత్ సర్వం నిరూహ్య ప్రత్యూహ్య సంపీడ్య అతడు ఈ సర్వమును ఊహించి (కల్పించి), అవరోధించి, సంపీడించి
సంజ్వాల్య సంభక్ష్య స్వాత్మానం ఏవ ఏషాం దదాతి ఇతి సంజ్వలింపజేసి, సంభక్షించి తన ఆత్మనే ఇచ్చును (అనగా అతడే నిమిత్త కారణము, ఉపాదాన కారణము అగును)
అతి ఉగ్రో, అతి వీర్యో, అతి మహాన్, అతి విష్ణుః, అతి జ్వలన్ అతి (utmost) ఉగ్రుడు, అతి వీర్యుడు, అతి మహాన్, అతి విష్ణువు, అతి జ్వలనుడు
అతి సర్వతోముఖో, అతి నృసింహో, అతి భీషణో, అతి భద్రో అతి సర్వతోముఖుడు, అతి నృసింహుడు, అతి భీషణుడు, అతి భద్రుడు
అతి మృత్యుమృత్యుః, అతి నమామి, అతి అహం భూత్వా అతి మృత్యుమృత్యువు, అతి నమామి, అతి అహము అయి
స్వే మహిమ్ని సదా సమానతే తన యందు, తన మహిమ యందు సదా సమానమై (తానే తన కల్పనా జగత్తు అయి) ఉండును
7.11 ఉపాసకుడు మకారార్థమును సాధించుట
తస్మాత్ ఏవ మకారార్థేన పరేణ బ్రహ్మణ ఏకీ కుర్యాత్ అందువలనే (ఉపాసకుడు) మకారార్థముచే (మకార ఉపాసనా లక్ష్యమైన) పరబ్రహ్మమునందు ఏకీకృతము చేయవలెను
ఉకారేణ అవిచికిత్సన అశరీరో నిరింద్రియో ప్రాణోతమాః ఉకారము చేత నిస్సంశయుడై అశరీరుడు, నిరింద్రియుడు, ప్రాణతముడు (అప్రాణుడు, ప్రాణమునకు ఆవలివాడు),
సచ్చిదానందమాత్రః స స్వరాట్ భవతి య ఏవం వేద సత్-చిత్-ఆనంద మాత్రుడు అగును, అతడే స్వరాట్ అగును - ఏ ఉపాసకుడు ఈ విధముగా తెలుసుకొనునో!
తత్ ఏష శ్లోకః - అందుకు ఈ (క్రింద) శ్లోకము కలదు -
శృంగం శృంగార్థం ఆకృష్య శృంగేణ అనేన యోజయేత్ శృంగమును, శృంగార్థమును ఆకర్షించి అశృంగమున కలుపవలెను

[ఇంద్రియములను, ఇంద్రియార్థములను ఆకర్షించి నిరింద్రియములో మనస్సున సంయోగము చేయవలెను]
శృంగం ఏనం పరే శృంగే తం అనేన అపి యోజయేత్ ఈ శృంగమునే పర శృంగమునందు, అశృంగముతోను సంయోగింప చేయవలెను

[దానిని (మనస్సును) ప్రాణమునందు, ప్రాణమును తేజస్సులో సచ్చిదానందమునందు సంయోగము చేయవలెను]


ఎనిమిదవ ఖండము -

ఓంకారమే సత్-చిత్-అభయ ఆత్మానుభవమునకు అనుజ్ఞ

8.1 ఆత్మ ఏకము, అద్వితీయము, ఓతప్రోతము, అవికల్పము
అథ తురీయేణ ఓతః చ ప్రోతః చ హి అయం ఆత్మా నృసింహో పిమ్మట, తురీయము చేత ఓతప్రోతమైన (జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలతో గుచ్చబడినదియైన తురీయమునకు సాక్షియైన) ఈ ఆత్మ నృసింహుడే!
అస్మిన్ సర్వమయం సర్వాత్మా ఈతడే సర్వమయుడు, సర్వాత్మా
అయం హి సర్వం న ఏవ అతో అద్వయో హి ఈతడే సర్వము, ఈతనికన్నా అద్వయము లేదు

[Note: రెండు అద్వయములు ఉండుట హేతుబద్దము కాదు!]
అయం ఆత్మ ఏక ఏవ అవికల్పో ఈ ఆత్మ ఏకము, అవికల్పము

[ఆత్మలో అనేక దృష్టులు, సృష్టులు కల్పితమై లయమగుచూ ఉన్నా, అవన్నీ ఆత్మ కంటే వేరు కాకపోగా, ఈ ఆత్మలో వికారములే లేవు. There is never any distortion in Brahman. Apparent distortion is mere verbal attribution.]
న హి వస్తు సత్ అయం హి ఓత ఇవ సద్ఘనో అయం చిద్ఘన ఆనందఘన ఏవ సత్ వస్తువు అగు ఈ ఆత్మ ఓతము (గుచ్చబడినది) వలె కాదు, అది సద్ఘనము - చిద్ఘనము - ఆనందఘనము!

[Unlike distinct ties of multiple threads, Atman is singleton and continuous like that of water.]
ఏకరసో అవ్యవహార్యః కేనచన అద్వితీయ ఓతః చ ప్రోతః చ ఏవ ఆత్మ ఏకరసుడు, అవ్యవహార్యుడు, దేనికైననూ ద్వితీయుడు కాడు - ఓతప్రోతమే! (ఒకే దారముతో అడ్డముగా నిలువుగా అల్లుకున్న వలలో దారము వంటిది)

[Atman is the undual, inherent connection for everything like vertically and horizontally sewn “single” wire of a fishnet.]
8.2 వాక్కుయే ఓంకారము, వాక్కుయే ఈ సర్వము
ఓంకార ఏవం న ఏవం ఇతి పృష్ట ఓం ఇతి ఏవ ఆహ ఓంకారము ఇదా, ఇది కాదా అని ప్రశ్నించుకోగా ఓం ఇదే (ఈ ఆత్మయే) అని చెప్పబడెను!
వాగ్వా ఓంకారో వాగ్ ఏవ ఇదం సర్వం న హి అశబ్దం ఇవ ఏహ (ఈహ) అస్తి వాక్కుయే ఓంకారము, వాక్కుయే ఈ సర్వము అని ఎవరు తెలుసుకొనునో అశబ్దము వలె ఉండుట కోరుకొనడు (స్తబ్ధుడై ఉండక ఓంకార ఉచ్చారణతోనే ఆత్మను ఉపాసించును!)
8.3 చిన్మయమే ఓంకారము, చిన్మయమే ఈ సర్వము
చిన్మయో హి అయం ఓంకారః చిన్మయం ఇదం సర్వం చిన్మయమే ఈ ఓంకారము, ఈ సర్వము చిన్మయము

[Note: నా అనుభవములో బాహ్యము, అంతరము, అభ్యంతరము కూడా కేవలము తెలివియే! ఆ శుద్ధ ఏఱుకయే నేను!]

తస్మాత్ పరమేశ్వర ఏవ ఏవం ఏవ తత్ భవతి కావున ఆ పరమేశ్వరుడే ఈ విధముగా అది (ఓంకారము) అయి ఉన్నాడు
8.4 ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చునది
ఏతత్ అమృతం అభయం, ఏతత్ బ్రహ్మా అభయం వై బ్రహ్మ భవతి ఇదంతా అమృతము, అభయము! ఆ బ్రహ్మమే అభయము, అభయమే బ్రహ్మము!
య ఏవం వేద ఇతి రహస్యం ఎవరు ఈ విధముగా తెలుసుకొనునో, రహస్యమును తెలుసుకున్నవాడు అగును
అనుజ్ఞాతా హి అయం ఆత్మ ఏష హి అస్య సర్వస్య స్వాత్మానం అనుజానాతి (ఓంకారముతో) అనుజ్ఞాత (Authority) అయిన ఆ ఈ ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చునది అని తెలుసుకొనవలెను

[ఎక్కడికక్కడ ప్రకటమై ఉన్న నేను అనే స్పృహ ఆత్మ యొక్క ప్రకటనే!]
న హి ఇదం సర్వం స్వత ఆత్మవిత్ ఈ సర్వము స్వతహాగా ఆత్మను ఎఱిగినది కాదు
న హి అయం ఓతో న అనుజ్ఞాతా ఇది (ఆత్మ) ఓతము (గుచ్చబడినది) కాదు, అనుజ్ఞ ఇచ్చునది కాదు
అసంగత్వాత్ అవికారత్వాత్ అసత్వాత్ అన్యస్య (ఎందుచేత అనగా ఆత్మ యొక్క) అసంగత్వము వలన, అవికారత్వము వలన, అన్యమునకు అసత్వము (దేనికైనా అద్వితీయము) వలన
అనుజ్ఞాతా హి అయం ఓంకార ఓం ఇతి హి అనుజానాతి (అందుచేత ఆత్మకు సంజ్ఞ అయిన) ఈ ఓంకారమే అనుజ్ఞాత [Authority], కావున “ఓం” ద్వారానే (ఆత్మను) తెలుసుకొనవలెను
8.5 సర్వము చిత్‌యే, ఓంకారమే అనుజ్ఞ
వాగ్వా ఓంకారో వాగ్ ఏవేదం సర్వం అనుజానాతి వాక్కుయే ఓంకారుడు, వాక్కుయే ఈ సర్వము అని తెలుసుకొనవలెను
చిన్మయో హి అయం ఓంకారః, చిత్ హి ఇదం సర్వం నిరాత్మకం చిన్మయమే (చిత్‌మయమే) ఈ ఓంకారుడు, ఈ సర్వము చిత్‌యే మఱియు నిరాత్మకము (అనగా చిత్‌కు వేరుగా మరొక ఆత్మ కలిగినది కాదు! సత్‌యే చిత్! చిత్‌యే సత్!)
ఆత్మసాత్ కరోతి తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తత్ భవతి తనను తానే పొందునది కావున ఈ సర్వము కూడా ఏకమే అయిన పరమేశ్వరుడే అగును!
ఏతత్ అమృతం అభయం ఇది అమృతము, అభయము
ఏతత్ బ్రహ్మ, అభయం వై బ్రహ్మ, అభయం హి వై బ్రహ్మ భవతి ఇది బ్రహ్మ, అభయమే బ్రహ్మ, బ్రహ్మమే అభయము అగునది
య ఏవం వేద ఇతి రహస్యం అనుజ్ఞ ఎవరు ఈ విధముగా తెలుసుకొనునో! ఇది (ఈ ఓంకారమే) రహస్యం తెలుసుకొనుటకు అనుజ్ఞ (Permission)
ఏకరసో హి అయం ఆత్మా ప్రజ్ఞాన ఘన ఏవ అయం ఈ ఆత్మయే ఏకరసుడు (అనుభవైకము, ఏకానుభవము), ఇదే ప్రజ్ఞానఘనము
యస్మాత్ సర్వస్మాత్ పురతః సువిభాతో అతః చిద్ఘన ఏవ హి సర్వము (జగత్తు) కన్నా పూర్వము బాగుగా ప్రకాశించుట చేత ఆత్మ చిద్ఘనమే!
8.6 సర్వము సత్‌యే, వాక్కుయే అనుజ్ఞ
అయం ఓతో న అనుజ్ఞాత ఏతత్ ఆత్మ్యం హి [లక్షణ రహితమైన] ఈ ఆత్మ ఓతము కాదు, అనుజ్ఞాత కాదు
ఇదం సర్వం సత్ ఏవ ఈ సర్వము సత్‌యే
అనుజ్ఞ ఏకరసో హి అయం ఓంకార [పరమాత్మను సూచించు] ఈ ఓంకారమే ఏకరసమునకు (for the Experience of Oneness) అనుజ్ఞ (Permission)
ఓం ఇతి హి ఏవ అనుజానాతి ఓం అనియే (ఉచ్చరిస్తూనే) దీనిని (ఆత్మను) తెలుసుకొనవలెను
వాగ్వా ఓంకారో వాక్ ఏవ హి అనుజానాతి వాక్ ఓంకారుడు, వాక్కుయే అనుజ్ఞ (Permission) ఇచ్చునది

[“ఓం” అని వాక్ ఉచ్చారణ ద్వారానే చిదాత్మను తెలుసుకొని, అనుభవము చేసుకొనవలెను]
చిన్మయో హి అయం ఓంకారః చిత్ ఏవ హి అనుజ్ఞాతా ఈ ఓంకారుడు చిన్మయమే, చిత్‌యే అనుజ్ఞాత
8.7 ఆత్మయే ఓంకారము, ఓంకారమే ఈ సర్వము
తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తత్ భవతి ఇతి కావున ఏకము అయిన పరమేశ్వరుడే అది (ఓంకారము) అయిఉన్నాడు
ఏతత్ అమృతం అభయం ఇది అమృతము, అభయము
ఏతత్ బ్రహ్మా, అభయం వై బ్రహ్మా, అభయం హి వై బ్రహ్మ భవతి ఇది బ్రహ్మము, ఈ బ్రహ్మము అభయము, అభయమే ఈ బ్రహ్మము అగును
య ఏవం వేద ఇతి రహస్యం ఎవడు ఇట్లు తెలుసుకొనునో! ఇది రహస్యము!
అవికల్పో హి అయం ఆత్మా అద్వితీయత్వాత్ అద్వితీయత్వము వలన ఈ ఆత్మ అవికల్పము
అవికల్పో హి అయం ఓంకారో అద్వితీయత్వాత్ ఏవ అద్వితీయత్వము వలననే ఈ ఓంకారము అవికల్పము

[అనగా, ఆత్మయే ఓంకారము! ఓంకారమే ఆత్మ]
చిన్మయో హి అయం ఓంకారః చిన్మయం ఇదం సర్వం ఈ ఓంకారము చిన్మయము, ఈ సర్వము చిన్మయమే

[అనగా ఓంకారమే ఈ సర్వము!]
8.8 అభయమే బ్రహ్మము, బ్రహ్మమే అభయము
తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తత్ భవతి కావున ఏకము అయిన పరమేశ్వరుడే అది (ఓంకారము) అయిఉన్నాడు
అవికల్పో అపి అవికల్పుడు (అద్వితీయుడు) కూడా అయి ఉన్నాడు
న అత్ర కాచన భిదా అస్తి ఇక్కడ ఏ కొంచెము భేదము లేదు
న ఏవ తత్ర కాచన భిదా అస్తి అక్కడ కూడా ఏ కొంచెము భేదము లేదు!
అత్ర హి భిదాం ఇవ మన్యమానః శతధా సహస్రధా భిన్నో మృత్యోః స మృత్యుం ఆప్నోతి ఇక్కడ భేదము వలె ఉన్నదని భావించినవానికి వందల విధములుగా, వేల విధములుగా భేదములు మృత్యువునందు ఉండును, (భేద దృష్టి తొలగనివాడు) అతడు మృత్యువునే పొందును
తత్ ఏతత్ అద్వయం స్వప్రకాశం మహానందం ఆత్మ ఏవ ఆ ఈ అద్వయము, స్వప్రకాశము, మహానందము ఆత్మయే!
ఏతత్ అమృతం అభయం ఇది అమృతము, అభయము
ఏతత్ బ్రహ్మ అభయం వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి ఇది బ్రహ్మము, బ్రహ్మమే అభయము, అభయమే బ్రహ్మము!
య ఏవం వేద ఇతి రహస్యం ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో రహస్యమును (గుహ్యతమము) తెలుసుకున్నవాడు అగును.

తొమ్మిదవ ఖండము -

అహం ఏవ బ్రహ్మా!

9.1 అద్వైత ఆత్మయే సిద్ధించియున్నది
దేవ ఆహ వై ప్రజాపతిం అబ్రువత్ దేవతలు ప్రజాపతిని అడిగిరి -
ఇమం ఏవ నో భగవన్! ఓంకారం ఆత్మానం ఉపదేశ ఇతి తథా ఇతి భగవాన్! మాకు ఇప్పుడు ఈ ఓంకార ఆత్మను ఉపదేశించుము అనగా ప్రజాపతి అట్లే అనెను
ఉపద్రష్ట అనుమంత్ర ఏష ఆత్మా నృసింహః చిత్ రూప ఏవ ఉపద్రష్ట (సాక్షి), అనుమంత్ర (అనుగ్రహించువాడు) అయిన ఈ ఆత్మా నృసింహుడు చిద్రూపుడే
అవికారో హి ఉపలబ్ధః సర్వస్య సర్వత్ర ఈతడే అవికారుడు, సర్వులకు సర్వత్రా ఉపలబ్ధుడు (పొందబడువాడు, గ్రహించబడువాడు, అతిదగ్గిరవాడు)
న హి అస్తి ద్వైత సిద్ధిః ఆత్మ ఏవ సిద్ధో ద్వైతమునకు సిద్ధి అనునది లేదు, ఆత్మయే సిద్ధించి ఉన్నది (అనగా ఆత్మకు రెండవది లేదు అనునదే నిర్ధారణ)
ద్వితీయో మాయయా హి అన్యత్ ఇవ మాయ చేతనే ద్వితీయము అగుపించును, ఆత్మకు అన్యము వలె గోచరించును
స వా ఏష ఆత్మా పర ఏష ఏవ సర్వం కానీ, ఈ సర్వము కూడా ఈ పరమాత్మయే
తదా ఆహి ప్రజ్ఞ ఏవ ఏషా అవిద్యా జగత్ సర్వం ఆత్మా అప్పుడు (మాయ వలన) ప్రజ్ఞ చేతనే (అనుభవము) పొందబడు ఈ అవిద్యా జగత్ సర్వము ఆత్మయే!
9.2 స్వప్రకాశ చైతన్య ఆత్మకు జడమైన జగత్తు లింగము
పరమాత్మ ఏవ స్వప్రకాశో అపి అవిషయజ్ఞానత్వా పరమాత్మ మాత్రమే స్వప్రకాశుడు, మఱియు ఆతడు విషయ జ్ఞానము వలె గ్రహింపబడువాడు కాదు
జ్ఞానం ఏవ హి అన్యత్ర అన్యం న విజానాతి అనుభూతేః కేవల జ్ఞానమే అయినవాడు, మఱియు ఆతడు మరొకచోట మరొకడిగా తెలియబడువాడు కాదు

[అనగా ప్రతి ఒక్కదానికి ఈ ఆత్మ అనన్యము]
మాయా చ తమోరూప అనుభూతిః తత్ ఏతత్ జడం మోహాత్మకం అనంతం మాయ మఱియు తమోరూప అనుభూతి అగునది ఏదో అది అంతా జడం, మోహాత్మకం, అనంతం

[Note: మాయ అనంతం!]
ఇదం రూపమస్య అస్య వ్యంజికా ఈ (జగత్) రూపము దానికి (ఆత్మకు) వ్యంజికము (లింగముచే / చిహ్నముచే ఉన్నదిగా తెలుపునది)

[Note: ప్రజ్ఞ చేత ఆ ప్రజ్ఞను వెలిగించు ఆత్మను తెలుసుకొనలేము. కనుక పొగను బట్టి నిప్పు ఉన్నదని తెలుసుకున్నట్లు జడమైన జగత్తును బట్టి జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణములు స్వప్రకాశ చైతన్య ఆత్మ అని, ఆత్మ ఉనికిని తెలుసుకుంటున్నాము.]
నిత్య నివృత్తో అవిమూఢైః ఆత్మ ఏవ ద్రష్ట అస్య సత్త్వం అసత్త్వం చ దర్శయతి నిత్య నివృత్తులు, అవిమూఢులు చేత ఆత్మయే ద్రష్టయై దాని (మాయచే జగత్తు) యొక్క సత్త్వ-అసత్త్వములను దర్శింపచేయును
9.3 ఆత్మయందు మాయా స్వరూపము
సిద్ధత్వ-అసిద్ధత్వాభ్యాం స్వతంత్ర-అస్వతంత్రత్వేన స ఏషా సిద్ధత్వ అసిద్ధత్వ ద్వంద్వముల చేత, స్వతంత్ర అస్వతంత్రత్వముల చేత ఆ ఈ మాయ

[Note: మాయకు స్వతఃసిద్ధత లేదు, ఆత్మ చైతన్య అభాసచేత సిద్ధత్వము పొందినది; మాయ స్వతంత్రమైనది కాదు, కానీ కర్తృత్వ-భోక్తృత్వ రాహిత్య ఆత్మ సమక్షములో మాయ స్వతంత్రమైనది వలె ప్రవర్తిస్తున్నది]
వటబీజ సామాన్యవత్ అనేక వటశక్తిః ఏక ఏవ తత్ యథా సామాన్యమైన వటబీజము (మఱ్ఱి విత్తు) యందు అనంత వటశక్తి ఆ బీజముతో ఏకమే అయి ఉన్నట్లు
వటబీజ సామాన్యం ఏకం అనేకాంత స్వ అవ్యతిరిక్తాని వటాంత్సబీజాన్ ఉత్పాద్య తత్ర తత్ర పూర్ణం సత్ తిష్ఠతి ఏవం ఏవ ఒక సామాన్య వటబీజము తనకు వ్యతిరేకము కాని (ఆ మఱ్ఱి విత్తు లాంటివే అయిన) అనేక సంఖ్యలలో బీజములతో సహా వటములను ఉత్పాదించి అక్కడ అక్కడే (ఆయా అనేకానేక సబీజ వటములలో) సంపూర్ణమై ఉండునట్లు
ఏషా మాయా స్వ అవ్యతిరిక్తాని పూర్ణాని క్షేత్రాణి దర్శయిత్వా జీవ ఈశ అవభాసేన కరోతి ఈ మాయ తనకు వ్యతిరిక్తము కాని పూర్ణములైన క్షేత్రములను చూపించి జీవ ఈశ అవభాసం (మిథ్యా జ్ఞానము, అవిద్య) చేత (జగత్ కల్పనను) చేయును
మాయా చ అవిద్యా చ స్వయం ఏవ భవతి మాయ మరియు అవిద్యలచే స్వయముగా (జగత్తు అనుభూతి) అగును

స ఏషా చిత్రా సుదృఢా బహు అంకురా

(అవిద్యా స్వరూపమైన) ఈ మాయ చిత్రము, సుదృఢము, బహుత్వ అంకురము కలది
స్వయం గుణభిన్న అంకురేషు అపి గుణభిన్నా (మాయ) స్వయముగా గుణభిన్నమైనది, అంకురముయందు కూడా గుణభిన్నమైనది (గుణములచేత మాత్రమే భేదములు ప్రకటితము చేయుచున్నది)
సర్వత్ర బ్రహ్మ విష్ణు శివ రూపిణీ చైతన్య దీప్తా ఈ మాయ సర్వత్రా బ్రహ్మ విష్ణు శివ రూపిణి అయి చైతన్యముచే ప్రకాశింపబడునది
తస్మాత్ ఆత్మన ఏవ త్రైవిధ్యం సర్వత్ర యోనిత్వం కావున (మాయ / అవిద్య వలన) ఆత్మయందు త్రైవిధ్యము (త్రిగుణాత్మకము), సర్వత్రా యోనిత్వము ఆపాదించబడినది
9.4 ఈశ్వర, హిరణ్యగర్భ, జీవ స్వరూపములు
అభిమంతా జీవో నియంతి ఈశ్వరః అభిమానము కలవాడు జీవుడు, నియంత ఈశ్వరుడు
సర్వ అహం మానీ హిరణ్యగర్భః సర్వము నేను అను అభిమానము కలవాడు హిరణ్యగర్భుడు
త్రిరూప ఈశ్వరవత్ వ్యక్త చైతన్యః సర్వగో హి (అ హిరణ్యగర్భుడు) త్రిరూపుడు (త్రిగుణాత్మరూపుడు), ఈశ్వరుని యందే ఈశ్వరుని వలె వ్యక్త చైతన్య స్వరూపుడు, సర్వగతుడు
ఏష ఈశ్వరః క్రియాజ్ఞానాత్మా సర్వం సర్వమయం (అ హిరణ్యగర్భుడు) సర్వ క్రియా జ్ఞానాత్ముడు, సర్వమయుడు
సర్వే జీవాః సర్వమయాః సర్వావస్థాసు తథా అపి అల్పాః సర్వ జీవులు కూడా సర్వ అవస్థలలో సర్వమయులు, అయినా కూడా (అజ్ఞానముచేత) అల్పులు
స వా ఏష భూతాని ఇంద్రియాణి విరాజం దేవతాః కోశాన్ చ సృష్ట్వా ప్రవిశ్య అమూఢో మూఢ ఇవ వ్యవహరన్నాః తే మాయయా ఏవ అతడే (ఈశ్వరుడే హిరణ్యగర్భుడుగా) ఈ భూతములను, ఇంద్రియములను, విరాజిల్లు దేవతలను మఱియు (పంచ) కోశములను సృష్టించి, ప్రవేశించి అమూఢుడైనా తన మాయచేతనే మూఢుని వలె వ్యవహరించుచున్నాడు
తస్మాత్ అద్వయ ఏవ అయం ఆత్మా సన్మాత్రో నిత్యః శుద్ధో బుద్ధః సత్యో ముక్తో నిరంజనో విభుః అద్వయ ఆనందః పరః కాబట్టి అద్వయము అయిన ఈ ఆత్మ సన్మాత్రుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు (కేవల జ్ఞానము), సత్యుడు, ముక్తుడు, నిరంజనుడు, విభుడు, అద్వయ ఆనందుడు, పరమైనవాడు!
9.5 ఆత్మ స్వరూపము
ప్రత్యక్ ఏకరసః ప్రమాణైః ఏతైః అవగతః ప్రత్యక్ (దృశ్యవిముఖము చేత, దృశ్య అతీతము చేత) ఏకరసుడు (ఏకత్వానుభవజ్ఞుడు), ఈ (వేద వేదాంత శాస్త్ర) ప్రమాణములచే అవగతుడు అగువాడు
సత్తామాత్రం హి ఇదం సర్వం సత్ ఏవ పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ సత్తామాత్రమైన ఈ సర్వము సత్తుయే, సర్వమునకు ముందే సిద్ధించి (ఉండి) ఉన్నవాడు బ్రహ్మ
న హి అత్ర కిం చ న అనుభూయతే ఇక్కడ ఏదీ (ఆ బ్రహ్మ) అనుభవించడు

[అనగా అనుభవముచే బ్రహ్మము స్పృశించబడదు; అనుభవమునకు అందనివాడు బ్రహ్మ]
న అవిద్యా అనుభవ ఆత్మని ఆత్మయందు అవిద్యా అనుభవము ఉండదు

[   మరి ఈ జగదనుభవము ఎవరికి?
  - మాయచే ప్రజ్ఞకు అనుభవమగుచున్నది.
  - ప్రజ్ఞా అభిమానము కలిగినవాడిని జీవుడు అంటున్నాము.
  - సత్యమునకు, ఈ జీవుడు అనబడువాడు ఆత్మయే! జీవో బ్రహ్మేతి నా పరః!
  - ఆత్మ ఆ ప్రజ్ఞకు సాక్షియై ప్రజ్ఞను ప్రకాశింపచేస్తున్నది.
  - ఉత్పత్తి, స్థితి, లయములుతో కూడిన ఈ ప్రజ్ఞ మఱియు జగత్తులు నిత్యాత్మయందు మిథ్యారూప మాయా క్రీడా ప్రకటన మాత్రమే!   ]
స్వప్రకాశే సర్వసాక్షిణి అవిక్రియే అద్వయే పశ్యతే హ అపి సన్మాత్రం అసత్ అన్యత్ సత్యం హి స్వప్రకాశుడును, సర్వసాక్షియును, అవిక్రియుడును (వికారము / మార్పు లేనిదియు), అద్వయుడును, చూచువాడు, ఇంకా కూడా సన్మాత్రము, అసత్ అన్యము, సత్యము
ఇత్థం పురస్తాత్ అయోని స్వాత్మస్థం ఆనందం చిద్ఘనం సిద్ధం హి అసిద్ధం ఈ అంతటికీ ముందే ఉన్నవాడు, అయోని (తనకు మొదలు లేనివాడు), స్వాత్మ యందే స్థితి కలవాడు, ఆనందుడును, చిద్ఘనుడును, సిద్ధుడు అసిద్ధుడును కూడా!
తత్ విష్ణుః ఈశానో బ్రహ్మా అన్యత్ అపి సర్వం ఆతడే విష్ణువు, ఈశుడు, బ్రహ్మయు, మిగిలిన సర్వము కూడా!
సర్వగతం సర్వమత ఏవ శుద్ధో అబాధ్యస్వరూపో సర్వగతుడు, సర్వమతము తానైనవాడు, శుద్ధుడు, అబాధ్య (బాధింపబడని) స్వరూపుడు,
9.6 ఏది నిత్యం?
బుద్ధిః సుఖ స్వరూప ఆత్మానః హి ఏతం నిరాత్మకం అపి [పూర్వపక్షము] బుద్ధి కలవాడు, సుఖ స్వరూప ఆత్మలు (బహు రూపములు) కలవాడు, ఈతడు నిరాత్మకుడు కూడా
న ఆత్మా పురతో హి సిద్ధో న హి ఇదం సర్వం ఆత్మ పూర్వము (ముందుగా) సిద్ధుడు కాదు, ఈ సర్వము కానివాడు
కదాచిత్ ఆత్మా హి స్వమహిమస్థో నిరపేక్ష ఏక ఏవ సాక్షీ స్వప్రకాశః ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ స్వమహిమస్థుడు, నిరపేక్షుడు (అపేక్ష లేనివాడు), ఏకుడు, సాక్షి, స్వప్రకాశుడు అయినాడు
కిం తత్ నిత్యం [ప్రతిపక్షము] ఏది నిత్యము? (అనగా మరి వాని కంటే ముందు ఉన్నది ఏది?)
ఆత్మా అత్ర హి ఏవ న విచికిత్స్యం ఏతత్ ఇదం సర్వం సాధయతి [సిద్ధాంతము] ఆత్మయే! ఇందు సందేహము లేదు. అదే ఈ సర్వమును సాధించునది.

[ ఇక్కడ పూర్వపక్షము ఆత్మ అనిత్యముగా ప్రతిపాదించగా,
అప్పుడు ప్రతిపక్షము ఖండించుచూ మరి ఇక ఏది నిత్యము అగునని ఎత్తిచూపగా,
సిద్ధాంతము పూర్వపక్షమును కాదని ఆత్మయే నిత్యమని ధృవీకరిస్తున్నది. ]
9.7 అలక్షణ ఆత్మ యొక్క లక్షణములు
ద్రష్టా ద్రష్టుః సాక్షి అవిక్రియః సిద్ధో నిరవద్యో బాహ్య అభ్యంతర వీక్షణాత్ సువిస్ఫుటః ద్రష్టయందు ద్రష్ట (చూచుచున్నవానిలో చూచువాడు), సాక్షి, మార్పు చెందనివాడు, సిద్ధుడు, నిరవద్యుడు (Unblamable), బాహ్య అభ్యంతరములను కూడా స్పష్టముగా చూచువాడు
తమసః పరస్తాత్ బ్రూత ఏష దృష్టో అదృష్టో అవ్యవహార్యో అపి అల్పో నా అల్పః తమస్సుకు ఆవల ఉన్నవాడు, ఈతడు దృష్టుడు అదృష్టుడు అవ్యవహార్యుడు కూడా, అల్పుడు అనల్పుడు కూడా!
సాక్షి అవిశేషో అనన్యో అసుఖదుఃఖో అద్వయః పరమాత్మా సాక్షి, అవిశేషుడు (అభేదుడు), అనన్యుడు, సుఖదుఃఖ అతీతుడు, అద్వయుడు, పరమాత్మ
సర్వజ్ఞో అనంతో అభిన్నో అద్వయః సర్వదా సంవిత్తిః మాయయా న అసంవిత్తిః స్వప్రకాశే యూయం ఏవ దృష్టాః సర్వజ్ఞుడు, అనంతుడు, అభిన్నుడు, అద్వయుడు, సర్వదా సంవిత్తుడు (విజ్ఞానుడు), మాయ చేత అసంవిత్తుడు (అవిద్యచే మోహితుడు కాడు), (ఆత్మ) స్వప్రకాశమునందే మీరు (దేవతలు) ప్రకటితమైనారు! - అని ప్రజాపతి చెప్పెను
9.8 ఆత్మ విదిత-అవిదితములకు పరమైనది
కిం అద్వయేన ద్వితీయం ఏవ న యూయం ఏవం బ్రూహి ఏవ భగవన్ ఇతి దేవా ఊచుః దేవతలు ఇట్లు ప్రార్థించిరి - భగవాన్! అద్వయమేనా? మాకు ద్వితీయమే లేదా? మీరే ఇది వివరించండి
యూయం ఏవ దృశ్యతే చేత్ న ఆత్మజ్ఞ అసంగో హి అయం ఆత్మా అతో మీరు అసంగము అయిన ఈ ఆత్మను చూచుటకు, తెలుసుకొనుటకు కాదు అని
యూయం ఏవ స్వప్రకాశా ఇదం హి సత్సంవిన్మయత్వాత్ మరల మీరే సత్‌చిత్‌మయత్వము వలన ఈ ఆత్మ స్వప్రకాశమే అని
యూయం ఏవ న ఇతి హ ఊచుః వా అంత అసంగా వయం ఇతి హ ఊచుః మీరే (మాకు ఆత్మను చూచుటకు) కాదు అని చెప్పినారు, మరలా అంతమున మేము (ఆత్మకు) అసంగము (అభేదము) అని కూడా మాకు చెప్పినారు
కథం పశ్యంతి ఇతి హ ఉవాచ న వయం విద్మ ఇతి హ ఊచుః ఏ విధముగా మీరు చూచుచున్నారు? మేము తెలుసుకొనలేకపోవుచున్నాము - అని దేవతలు అడిగిరి
తతో యూయం ఏవ స్వప్రకాశా ఇతి హ ఉవాచ న చ అప్పుడు ప్రజాపతి - మీరు (ఆత్మస్వరూపులుగా) స్వప్రకాశులే, మఱియు (ఆత్మ తెలియబడేది) కాదు - అని ఇట్లు చెప్పెను
సత్సంవిన్మయా ఏతౌ హి పురస్తాత్ సత్‌చిత్‌మయములై (ఆత్మగా మీకు) ఈ రెండూ పూర్వమునుండే ఉన్నవి
సువిభాతం అవ్యవహార్యం ఏవ అద్వయం (ఆత్మ స్వరూపులుగా మీరు) సువిభాతము (సుప్రకాశము), అవ్యవహార్యము, అద్వయమే
జ్ఞాతో న ఏష విజ్ఞాతో విదిత అవిదితాత్ పర ఇతి హ ఊచుః ఈ ఆత్మ తెలియబడునదా లేక తెలియబడనిదా అన్నచో విదిత అవిదితములకు పరమైనది అని (ప్రజాపతి) చెప్పెను
9.9 బ్రహ్మ = ఆత్మ = ఓంకారము = సత్యం
స హ ఉవాచ ప్రజాపతి (ఇంకా) ఇట్లు చెప్పెను -
తద్వా ఏతత్ బ్రహ్మా అద్వయం ఆ ఈ బ్రహ్మ అద్వయము
బ్రహ్మత్వాత్ నిత్యం శుద్ధం ముక్తం సత్యం సూక్ష్మం పరిపూర్ణం అద్వయం సదానంద చిన్మాత్రం బ్రహ్మత్వము వలన నిత్యము, శుద్ధము, ముక్తము, సత్యము, సూక్ష్మము, పరిపూర్ణము, అద్వయము, సదానంద చిన్మాత్రము
ఆత్మ ఏవ అవ్యవహార్యం కేనచిత్ ఆత్మ దేనిచేతనైననూ వ్యవహార్యము కాదు

యద్ ఏవ తత్ ఆత్మానం ఓం ఇతి అపశ్యంతః తత్ ఏతత్ సత్యం

ఏదైతే ఆత్మయో అదే ఓం, అది చూడబడలేనిది, అదే సత్యము
ఆత్మా బ్రహ్మా ఏవ బ్రహ్మా ఆత్మా ఏవ, అత్ర హి ఏవ న విచికిత్స్యం ఇతి ఓం ఇతి సత్యం బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మము. ఈ విషయమున సందేహము లేదు, ఓం ఇతి! ఇది సత్యం!
తత్ ఏతత్ పండితా ఏవ పశ్యంతి దానినే పండితులు (నిష్కాములు, స్థితప్రజ్ఞులు, పరమ యోగులు) దర్శించిరి!
9.10 ఆత్మ లక్షణములు
ఏతత్ హి అశబ్దం అస్పర్శం అరూపం అరసం అగంధం అది (ఆత్మ) అశబ్దము, అస్పర్శము, అరూపము, అరసము, అగంధము
అవ్యక్తం అనాదతవ్యం అగంతవ్యం అవిసర్జయితవ్యం అనానందయితవ్యం అవ్యక్తము, అనాదతవ్యం (నిగూఢమైన బలము), అగంతవ్యము (చేరబడనది, గమనం లేనిది), అవిసర్జయితవ్యము (విసర్జించబడలేనిది), అనానందయితవ్యము,
అమంతవ్యం అబోద్ధవ్యం అనహంకర్తయిత్వం అచేతయితవ్యం అమంతవ్యము (తెలియబడలేనిది), అబోద్ధవ్యము (గ్రహించబడలేనిది), అనహంకర్తయిత్వము (కర్తృత్వరహితమైనది), అచేతయితవ్యము (చేతనము లేనిది),
అప్రాణయితవ్యం అనపానయితవ్యం అవ్యానయితవ్యం అనుదానయితవ్యం అసమానయితవ్యం అప్రాణయితవ్యము (ప్రాణము లేనిది), అనపానయితవ్యము (అపానము లేనిది), అవ్యానయితవ్యం (వ్యానము లేనిది), అనుదానయితవ్యము (ఉదానము లేనిది), అసమానయితవ్యము (సమానము లేనిది),
అనింద్రియం అవిషయం అకరణం అలక్షణం అసంగ అగుణం అనింద్రియము, అవిషయము, అకరణము, అలక్షణము, అసంగము అగుణము,
అవిక్రియం అవ్యవపదేశ్యం అసత్త్వం అరజస్కం అతమస్కం అవిక్రియము, (అద్వయము)అవ్యవపదేశ్యము (సంజ్ఞ, స్థానము లేనిది), అసత్త్వము (సత్త్వ గుణాతీతము), అరజస్కము (రజో గుణాతీతము), అతమస్కము (తమో గుణాతీతము),
అమాయం అభయం అపి ఔపనిషదం ఏవ సువిభాతం అమాయం (మాయాతీతము), అభయం, ఉపనిషత్తుల చేతనే సుప్రకాశము కూడా!
9.11 అవలోకమున ఆత్మ దర్శనము
సకృత్ విభాతం! ఒక్కసారిగా (at once) సుప్రకాశించినది!
పురతో అస్మాత్ సర్వస్మాత్ సువిభాతం అద్వయం పశ్యత [ప్రజాపతి దేవతలతో -] పూర్వము దీనినుండే ఈ సర్వము ప్రకాశించినది. అద్వయమును దర్శించుము!
హంసః సో౽హం ఇతి “(అ)హం సః సో౽హం” (నేను అది, అదే నేను)
స హ ఉవాచ కిం ఏష దృష్టో అదృష్టో వా ఇతి ప్రజాపతి దేవతలతో ఇంకను ఇట్లు అనెను - “అది కనిపించినదా? కనిపించలేదా?”
దృష్టో విదితా అవిదితాత్ పర ఇతి హ ఊచుః [దేవతలు - ] “విదిత అవిదితముల కన్నా పరముగా కనిపించెను” అనెను
క్వ ఏషా కథం ఇతి హ ఊచుః [ప్రజాపతి - ] “అది (ఆ మాయ) ఎది? ఎటువంటిది?” అనెను
కిం తేన న కించన ఇతి హ ఊచుః [దేవతలు - ] “దానితో ఏమి? అది (ఆ మాయ) కొంచెము కూడా లేదు!” అనెను
యూయం ఏవ ఆశ్చర్య రూపా ఇతి హ ఉవాచ [ప్రజాపతి - ] “మీరే ఆశ్చర్య రూపులు” అని అనెను

(ఆత్మ తేజో దర్శనముచే మీరే అద్వయము అగుటచే మీకు మాయ సహజముగా తొలగిపోయెను)
న చ ఇతి ఆహుః [దేవతలు - ] “కాదు / లేదు” అని ఆహుతి (అంజలి) నివేదించెను
ఓం ఇతి అనుజానీధ్వం బ్రూత ఏనం ఇతి [మరలా ప్రజాపతి - ] “ఓం” అనుచూ “ఈతని (ఇప్పుడు అనుభవమైనదాని) గురించి చెప్పుము” అనెను
జ్ఞాతో అజ్ఞాతః చ ఇతి హ ఊచుః [అప్పుడు దేవతలు -] “తెలియబడుచున్నాడు మరియు తెలియబడుటలేదు” అని చెప్పెను
న చ ఏనం ఇతి హ ఊచుః ఇతి బ్రూత ఏవ ఏనం [ప్రజాపతి - ] “అది కాదు” అని, “దీని గురించి చెప్పుము” అని చెప్పసాగెను
ఆత్మ సిద్ధం ఇతి హ ఉవాచ పశ్యామ ఏవ “ఆత్మ సిద్ధించెను!” అని, “చూచుచున్నాను!” అనెను
భగవో న చ వయం పశ్యామో [అప్పుడు దేవతలు -] భగవాన్! మేము చూడలేకపోవుచున్నాము
న ఏవ వయం వక్తుం శక్నుమో నమస్తే అస్తు భగవన్ ప్రసీద ఇతి హ ఊచుః [దేవతలు - ] “మాకు చెప్పుటకు శక్యము కాదు, నమస్తే ఓ భగవాన్! ప్రసన్నమగుము” అని దేవతలు (ఏదో) చెప్పబోయెను
న భేతవ్యం పృచ్ఛత్ ఇతి హ ఉవాచ [ప్రజాపతి - ] “భయపడకుండా అడగండి” అని అనెను
క ఏషా అనుజ్ఞ ఇతి [దేవతలు - ] “ఏది అనుజ్ఞ?”
ఏష ఏవ ఆత్మ ఇతి హ ఉవాచ [ప్రజాపతి - ] “ఈతడే ఆత్మ” అని చెప్పెను (ఇదే అనుజ్ఞ - The Final Conclusion)

[దేవతలు వారిది ఆత్మానుభవమా? కాదా? అనే సందేహములో ఉండగా జగద్గురువు, సద్గురువు అయిన ప్రజాపతి దేవతా శిష్యులకు అది ఆత్మానుభవమే అని నిర్ధారించుచున్నాడు!]
తే హ ఊచుః నమః తుభ్యం వయం త ఇతి హ [దేవతలు - ] “మీకు మా నమస్కారము” అని ప్రార్థించిరి
ప్రజాపతిః దేవాన్ అనుశశాసాను శశాస ఇతి, తత్ ఏష శ్లోకః ప్రజాపతి దేవతలకు అనుశాసనమును శాసించెను. అందుకు ఈ శ్లోకము -
ఓతం ఓతేన జానీయాత్ అనుజ్ఞాతారం ఆంతరం [ఓంకారమే ఓత-అనుజ్ఞ-అనుజ్ఞాత-అవికల్పము] ఓతము చేత ఓతమును తెలుసుకొనవలెను, ఆంతరమున అనుజ్ఞాత యొక్క
అనుజ్ఞాం అద్వయం లబ్ధ్వా ఉపద్రష్టారం ఆవ్రజేత్ ఇతి అనుజ్ఞచే అద్వయమును పొంది, ఉపద్రష్టారమును (ద్రష్టకు ద్రష్ట అయిన ఆత్మను) చేరవలెను
ఇతి ఉపనిషత్ ఇలా చెప్పబడినది నృసింహ (ఉత్తర) తాపినీ ఉపనిషత్తు.


నృసింహ ఉత్తర తాపినీ ఉపనిషత్ - సారాంశము


నృసింహ ఉత్తర తాపినీ ఉపనిషత్ సమాప్తము



Nrusimha Uttara Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com