[[@YHRK]] [[@Spiritual]]
Rȃma Poorva Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
విషయ సూచిక :
శ్రీరామతాపనీయార్థం భక్తధ్యేయకలేవరం . వికలేవరకైవల్యం శ్రీరామబ్రహ్మ మే గతిః .. |
శ్రీరామ తాపనీయ అర్థం భక్త ధ్యేయ కలేవరం | శ్రీరామ తాపినీ (ఉపనిషత్తు యొక్క) అర్థము, భక్తులకు ధ్యేయ మూర్తి (ధ్యాన లక్ష్యము), |
వికలేవర కైవల్యం శ్రీరామ బ్రహ్మ మే గతిః | మూర్తి రహితము (నిరవయవము), కైవల్యము అయిన శ్రీరామ బ్రహ్మమే నాకు గతి |
ఓం చిన్మయేఽస్మిన్మహావిష్ణౌ జాతే దశరథే హరౌ . రఘోః కులేఽఖిలం రాతి రాజతే యో మహీస్థితః .. 1.. స రామ ఇతి లోకేషు విద్వద్భిః ప్రకటీకృతః . రాక్షసా యేన మరణం యాంతి స్వోద్రేకతోఽథవా .. 2.. రామనామ భువి ఖ్యాతమభిరామేణ వా పునః . రాక్షసాన్మర్త్యరూపేణ రాహుర్మనసిజం యథా .. 3.. ప్రభాహీనాంస్తథా కృత్వా |
ఓం చిన్మయే అస్మిన్ మహావిష్ణౌ జాతే దాశరథే హరౌ రఘోః కులే అఖిలం రాతి రాజతే యో మహీ స్థితః | ఓం. చిన్మయుడైన మహావిష్ణువగు హరియే దశరథ పుత్రుడుగా రఘుకులము యందు జన్మించి, భూమి మీద ఉన్నవారికి అఖిలము ప్రసాదించి, ప్రకాశించుటచే |
స రామ ఇతి లోకేషు విద్వద్భిః ప్రకటీకృతః | అతడు రాముడు అని లోకమునందు విద్వాంసులచే ప్రకటించబడినాడు (కీర్తించబడినాడు) |
రాక్షసా యేన మరణం యాంతి స్వ ఉద్రేకతో అథవా రామ నామ భువి ఖ్యాతం అభిరామేణ వా పునః | మరియొక విధముగా చెప్పినచో, ఎవని స్వీయ పరాక్రమము చేత రాక్షసులు మరణము పొందుదురో అతడు రాముడు. అభిరామము చేత (ప్రతీ జీవుని మనస్సును రంజింప చేయుట చేత) భువి యందు రామ అను నామముతో ఖ్యాతి పొందినవాడు, లేదా మరలా |
రాక్షసాత్ మర్త్య రూపేణ రాహుః మనసిజం యథా ప్రభావహీనాంశు తథా కృత్వా | మర్త్య రూపమున ఉన్న రాక్షసులను ఏ విధంగా మనో సంజాతుడైన చంద్రుడిని రాహువు ప్రభావ విహీనుడిని చేసినట్లు ఆ విధంగా చేయుట చేత రాముడు అని ప్రసిద్ధి చెందెను |
రాజ్యార్హాణాం మహీభృతాం . ధర్మమార్గం చరిత్రేణ జ్ఞానమార్గం చ నామతః .. 4.. తథా ధ్యానేన వైరాగ్యమైశ్వర్యం స్వస్య పూజనాత్ . తథా రాత్యస్య రామాఖ్యా భువి స్యాదథ తత్త్వతః .. 5.. రమంతే యోగినోఽనంతే నిత్యానందే చిదాత్మని . ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే .. 6.. |
రాజ్య అర్హాణాం మహీ భృతాం ధర్మ మార్గం చరిత్రేణ జ్ఞానమార్గం చ నామతః, తథా ధ్యానేన వైరాగ్యం ఐశ్వర్యం స్వస్య పూజనాత్ తథా రాతి అస్య రామ ఆఖ్యా భువి స్యాత్ అథ తత్త్వతః | రాజ్య అర్హత కలిగిన మహీపతులను తన చరిత్ర (Purity in Character) చేత ధర్మ మార్గం, మఱియు నామము చేత జ్ఞాన మార్గం చూపినందున, అట్లే తనపై ధ్యానము చేత వైరాగ్యమును, తన యొక్క పూజనము చేత ఐశ్వర్యమును ఆ విధముగా ఇచ్చుటచే రాముడు అని భువి యందు ఖ్యాతి చెందెను - అని తత్త్వవేత్తలు చెప్పుదురు |
రమంతే యోగినో అనంతే నిత్య ఆనందే చిత్ ఆత్మని ఇతి రామ పదేనా అసౌ పరం బ్రహ్మ అభిధీయతే | అనంతమైన, నిత్య ఆనందమైన చిత్ ఆత్మ యందు యోగులు రమించుట చేత ఈ రామ అను పదముతోనే పరబ్రహ్మ ప్రకటింపబడుచున్నాడు |
చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్యాశరీరిణః . ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా .. 7.. రూపస్థానాం దేవతానాం పుంస్త్ర్యంగాస్త్రాదికల్పనా . ద్విత్తత్వారిషడష్టానాం దశ ద్వాదశ షోడశ .. 8.. అష్టాదశామీ కథితా హస్తాః శంఖాదిభిర్యుతాః . సహస్రాంతాస్తథా తాసాం వర్ణవాహనకల్పనా .. 9.. శక్తిసేనాకల్పనా చ బ్రహ్మణ్యేవం హి పంచధా . కల్పితస్య శరీరస్య తస్య సేనాదికల్పనా .. 10.. |
చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణః | పరబ్రహ్మ చిన్మయుడు, అద్వితీయుడు, నిష్కలుడు, అశరీరి అయిఉన్నాడు |
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనా | ఉపాసకుల కార్యార్థమై బ్రహ్మమునకు రామునిగా రూపము కల్పింపబడెను |
రూప స్థానం దేవతానాం పుంస్త్రీ అంగ అస్త్రాది కల్పనా | ఆ రూప స్థానమున దేవతలకు పురుష స్త్రీ అంగ అస్త్రాదులు కల్పింపబడెను |
ద్వి చత్వారి షట్ అష్టానాం దశ ద్వాదశ షోడశ | రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పరహారు మఱియు |
అష్టాదశామీ కథితా హస్తాః శంఖాదిభిః యుతాః | పద్దెనిమిది చేతులు ఉన్నట్లు, శంఖము, చక్రము మొదలగునవి ధరించినట్లు కల్పించి చెప్పబడెను |
సహస్ర అంతాః తథా తాసాం వర్ణ వాహన కల్పనా | సహస్రాది విధములుగా ఆ దేవతలకు వర్ణములు, వాహనములు కల్పించబడెను |
శక్తి సేనా కల్పనా చ బ్రహ్మణ్య ఏవం హి పంచధా | వారికి శక్తులు, సేనలు కల్పించబడెను మఱియు బ్రహ్మమునందు పంచ విధ మూర్తులు (విష్ణు, శివ, దుర్గ, సూర్య, గణపతి) |
కల్పితస్య శరీరస్య తస్య సేనాది కల్పనా | కల్పితము యొక్క శరీరమునకు తగినట్లు వారి యొక్క సేనలు మొదలగునవి కల్పించబడెను |
బ్రహ్మాదీనాం వాచకోఽయం మంత్రోఽన్వర్థాదిసంజ్ఞకః . జప్తవ్యో మంత్రిణా నైవం వినా దేవః ప్రసీదతి .. 11.. క్రియాకర్మేజ్యకర్తౄణామర్థం మంత్రో వదత్యథ . మననాంత్రాణనాన్మంత్రః సర్వవాచ్యస్య వాచకః .. 12.. సోఽభయస్యాస్య దేవస్య విగ్రహో యంత్రకల్పనా . వినా యంత్రేణ చేత్పూజా దేవతా న ప్రసీదతి .. 13.. ఇతి రామపూర్వతాపిన్యుపనిషది ప్రథమోపనిషత్ .. 1.. |
బ్రహ్మాదీనాం వాచకో అయం మంత్రో అన్వర్థాది సంజ్ఞికః | బ్రహ్మాది దేవతలకు వాచకము ఈ (రామ) మంత్రము, ఇది తగినట్లుగా అర్థమును అన్వయము చేసినచో సంజ్ఞికము (గాయత్రీ మంత్రము) అగును |
జప్తవ్యో మంత్రిణా న ఏవం వినా దేవః ప్రసీదతి | మంత్ర అర్థములు బాగుగా తెలిసిన గురువు దగ్గర దీక్ష పొంది జపించవలెను, లేనిచో (మంత్ర) దేవత ప్రసన్నము కాదు |
క్రియా కర్మ ఇజ్య కర్తౄణాం అర్థం మంత్రో వదతి యథ | క్రియ, కర్మ, యజ్ఞ సహితముగా నిర్వహణ చేయు కర్తకు అర్థము (లక్ష్యార్థము) ఈ మంత్రము చెప్పును |
మననాత్ త్రాణనాత్ మంత్రః సర్వ వాచ్యస్య వాచకః | మననముచేత తరింపచేయునది మంత్రము, సర్వ వాచ్యమునకు (చెప్పదగిన సర్వమునకు) వాచికము మంత్రము |
సో అభయస్య అస్య దేవస్య విగ్రహో యంత్ర కల్పనా | అతడు (రాముడు) అభయము నొసగుటకు, ఆ దేవత యొక్క విగ్రహము మరియు యంత్రము కల్పించబడినది |
వినా యంత్రేణ చేత్ పూజా దేవతా న ప్రసీదతి | యంత్రము లేకుండా పూజించినచో దేవతలు ప్రసన్నత చెందరు |
స్వర్భూర్జ్యోతిర్మయోఽనంతరూపీ స్వేనైవ భాసతే . జీవత్వేన సమో యస్య సృష్టిస్థితిలయస్య చ .. 1.. కారణత్వేన చిచ్ఛక్త్యా రజఃసత్త్వతమోగుణైః . యథైవ వటబీజస్థః ప్రాకృతశ్చ మహాంద్రుమః .. 2.. తథైవ రామబీజస్థం జగదేతచ్చరాచరం . రేఫారూఢా మూర్తయః స్యుః శక్తయస్తిస్ర ఏవ చేతి .. 3.. ఇతి రామతాపిన్యుఓఅనిషది ద్వితీయోపనిషత్ .. 2.. |
స్వర్భూః జ్యోతిర్మయో అనంత రూపీ స్వ ఏన ఏవ భాసతే | స్వయంభువు, జ్యోతిర్మయుడు, అనంత రూపీ, స్వయముగనే ప్రకాశకుడు, |
దైవత్వేన సమో యస్య సృష్టి స్థితి లయస్య చ | దైవత్వము చేత సముడు, సృష్టి స్థితి లయములు చేయువాడు, మఱియు |
కారణత్వేన చిత్ శక్త్యా రజః సత్త్వ తమో గుణైః | కారణత్వము చేత, చిత్ శక్తి చేత సత్త్వ రజో తమో గుణములైనవాడు |
యథా ఏవ వట బీజ స్థః ప్రాకృతః చ మహాన్ ద్రుమః | ఏ విధముగా వట బీజమునందు ప్రాకృతమైన మహా వృక్షము స్థితి కలిగియున్నదో |
తథా ఏవ రామ బీజ స్థం జగత్ ఏతత్ చరా అచరం | అదే విధముగా రామ బీజమునందు ఈ చర అచర జగత్తు అంతా స్థితి కలిగియున్నది |
రేఫ రూపా (ఆరూఢ) మూర్తయః స్యుః శక్తయః త్రిస్ర ఏవ చ ఏతి | రకారము యందు మూడు శక్తి స్వరూపములు మూర్తీభవించి చేరినవి [ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి] |
సీతారామౌ తన్మయావత్ర పూజ్యౌ జాతాన్యాభ్యాం భువనాని ద్విసప్త . స్థితాని చ ప్రహితాన్యేవ తేషు తతో రామో మానవో మాయయాధాత్ .. 1.. జగత్ప్రాణాయాత్మనేఽస్మై నమః స్యా- న్నమస్త్వైక్యం ప్రవదేత్ప్రాగ్గుణేనేతి .. 2.. ఇతి రామతాపిన్యుపనిషది తృతీయోపనిషత్ .. 3.. |
సీతారామౌ తన్మయ అవత్ర పూజ్యౌ | సీతారాములు తత్ (సత్ చిత్ ఆనంద) స్వరూపులు, రక్షకులు, పూజనీయులు |
జాతాన్యాభ్యాం భువనాని ద్విసప్త స్థితాని చ ప్రహాణి ఏషు తేషు | ఆయా లోకములన్నీ వారి యందే స్థితి కలిగియుండి మఱియు లయమగుచున్నవి. పదునాలుగు (14) లోకములు వారి నుండియే జనించును [ఏడు ఊర్ధ్వ లోకములు - భూ, భువ, సువ (స్వ), మహ, జన, తప, సత్య; ఏడు అధో లోకములు - అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాల, నరక] |
తతో రామో మానవో మాయయా అధాత్ | అటువంటి రాముడు (స్వకీయ) మాయచేత మానవుడై ఉన్నాడు |
జగత్ ప్రాణాయ ఆత్మనే అస్మై నమః స్యాత్ | జగత్తుకు ప్రాణము మఱియు ఆత్మ స్వరూపుడు అయి ఉన్న రామునకు నమస్కరించి |
నమస్త్వ ఐక్యం ప్రవదేత్ ప్రాక్ గుణేన ఏతి | నమస్కరింపదగిన, గుణాతీతుడైన రామునితో ఐక్య భావనతో (నేనే రాముడిని అని) సత్సంకల్పం చేయవలెను |
జీవవాచీ నమో నామ చాత్మారామేతి గీయతే . తదాత్మికా యా చతుర్థీ తథా మాయేతి గీయతే .. 1.. మంత్రోయం వాచకో రామో రామో వాచ్యః స్యాద్యోగఏతయోః . ఫలతశ్చైవ సర్వేషాం సాధకానాం న సంశయః .. 2.. యథా నామీ వాచకేన నామ్నా యోఽభిముఖో భవేత్ . తథా బీజాత్మకో మంత్రో మంత్రిణోఽభిముఖో భవేత్ .. 3.. |
జీవ వాచీ నమో నామ చ ఆత్మా రామ ఇతి గీయతే | "నమో" పదము జీవ వాచకము మఱియు "రామ" ఆత్మ అని (వేదములో) గానము చేయబడుచున్నది |
తత్ ఆత్మికా యా చతుర్థీ తథా మాయ ఇతి గీయతే | దాని ప్రాకృతికము (స్వాభావికము) చతుర్థీ విభక్తితో ("ఆయ") కలసి మాయ అని కీర్తింపబడుచున్నది |
మంత్రో అయం వాచకో రామో వాచ్య స్యాత్ యోగ ఏతయోః | ["నమో రామాయ" అను] ఈ మంత్రము వాచకము, రాముడు వాచ్యము, వీటి (వాచక వాచ్య) సంయోగముచే |
ఫలదః చ ఏవ సర్వేషాం సాధకానాం న సంశయః | సాధకులకు అన్ని ఫలములు లభించును, సంశయము లేదు! |
యథా నామీ వాచకేన నామ్నో యో అభిముఖో భవేత్ | ఏ విధముగా నామీ (పేరు కలిగినవాడు) అయిన ఒకడు ఆ నామము పిలవటము చేత అభిముఖుడు అగునో (పిలిచిన వైపుకు తిరుగునో) |
తథా బీజ ఆత్మకో మంత్రో మంత్రిణో అభిముఖో భవేత్ | అదే విధముగా బీజాత్మక (రామ) మంత్ర ఉచ్చారణతో ఆ మంత్రస్వరూపుడైన దేవత (రాముడు) అభిముఖుడు అగును |
బీజశక్తిం న్యసేద్దక్షవామయోః స్తనయోరపి . కీలో మధ్యే వినా భావ్యః స్వవాంఛావినియోగవాన్ .. 4.. సర్వేషామేవ మంత్రాణామేష సాధారణః క్రమః . అత్ర రామోఽనంతరూపస్తేజసా వహ్నినా సమః .. 5.. సత్త్వనుష్ణగువిశ్వశ్చేదగ్నీషోమాత్మకం జగత్ . ఉత్పన్నః సీతయా భాతి చంద్రశ్చంద్రికయా యథా .. 6.. |
బీజశక్తీం న్యసేత్ దక్షవామయోః స్తనయోః అపి | బీజశక్తులను కుడి ఎడమ స్థనముల యందు (హృదయముకు రెండు ప్రక్కల) న్యాసము చేయవలెను |
కీలో మధ్యే వినా భావ్యః స్వ వాంఛా వినియోగవాన్ | (హృదయ) మధ్యమున మంత్ర కీలకము వాంఛారహితుడై వినియోగించవలెను |
సర్వేషాం ఏవ మంత్రాణాం ఏష సాధారణః క్రమః | అన్ని మంత్రములకు సాధారణముగా ఇదే విధమైన క్రమము ఉండును [ప్రతీ మంత్రమునకు బీజము, కీలకము, ఋషి, దేవత, (షట్) అంగ న్యాసములు ఉండును] |
అత్ర రామో అనంతరూపః తేజసా వహ్నినా సమః | ఇక్కడ రాముడు అనంత రూప తేజసుడు, అగ్నితో సమానుడు |
సత్వ అనుష్ణగు విశ్వశ్చేత్ అగ్నీషోమాత్మకం జగత్ | సత్త్వ రూపముగా చల్లని కిరణములు కలిగిన చంద్రుని వలె ఉన్న రాముడు సీతతో కలసి అగ్ని సోమాత్మకమయ జగత్తుగా ప్రకటితమైనాడు |
ఉత్పన్నః సీతయా భాతి చంద్రః చంద్రికయా యథా | చంద్రుడు చంద్రికలతో (వెన్నెలతో) భాసించునట్లు రాముడు సీతతో కలసి ప్రకాశిస్తున్నాడు |
ప్రకృత్యా సహితః శ్యామః పీతవాసా జటాధరః . ద్విభుజః కుండలీ రత్నమాలీ ధీరో ధనుర్ధరః .. 7.. ప్రసన్నవదనో జేతా ఘృష్ట్యష్టకవిభూషితః . ప్రకృత్యా పరమేశ్వర్యా జగద్యోన్యాంకితాంకభృత్ .. 8.. హేమాభయా ద్విభుజయా సర్వాలంకృతయా చితా . శ్లిష్టః కమలధారిణ్యా పుష్టః కోసలజాత్మజః .. 9.. దక్షిణే లక్ష్మణేనాథ సధనుష్పాణినా పునః . హేమాభేనానుజేనైవ తథా కోణత్రయం భవేత్ .. 10.. తథైవ తస్య మంత్రస్య యస్యాణుశ్చ స్వఙేంతయా . ఏవం త్రికోణరూపం స్యాత్తం దేవా యే సమాయయుః .. 11.. స్తుతిం చక్రుశ్చ జగతః పతిం కల్పతరౌ స్థితం . కామరూపాయ రామాయ నమో మాయామయాయ చ .. 12.. నమో వేదాదిరూపాయ ఓంకారాయ నమో నమః . రమాధరాయ రామాయ శ్రీరామాయాత్మమూర్తయే .. 13.. జానకీదేహభూషాయ రక్షోఘ్నాయ శుభాంగినే . భద్రాయ రఘువీరాయ దశాస్యాంతకరూపిణే .. 14.. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ . భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే .. 15.. |
ప్రకృత్యా సహితః శ్యామః పీతవాసా జటాధరః | ప్రకృతితో సహితుడు, శ్యాముడు, పీతవాసుడు (పసుపు రంగు వస్త్రము ధరించినవాడు), జటాధరుడు [శ్యాముడు = నీల ఆకాశములో దట్టమైన నల్లని మబ్బులు పట్టినప్పుడు ఆ కలయిక రంగులో ఉండువాడు] |
ద్విభుజః కుండలీ రత్నమాలీ ధీరో ధనుర్ధరః | స్థిరమైన రెండు భుజములు కలవాడు, కుండలములు రత్నమాలలు ధరించినవాడు, ధీరుడు, ధనుర్ధరుడు |
ప్రసన్న వదనో జేతా ధృష్టి అష్టక విభూషితః | ప్రసన్న వదనుడు, విజయుడు, ధైర్యవంతుడు, అష్టక విభూషితుడు (అష్ట యోగ సిద్ధి విభూషితుడు) [అష్ట యోగ సిద్ధులు = అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము] |
ప్రకృత్యా పరమేశ్వర్యా జగత్ యోన్య అంకిత భృత్ | ప్రకృతితో కూడిన పరమేశ్వరుడు, జగత్తుకు యోని (మూలము) అయిన సీతను కలిగియున్నవాడు |
హేమ అభయాత్ విభుజయా సర్వ అలంకృతయా చితా శ్లిష్టః కమల ధారిణ్యా పుష్టః కోసలజాత్మజః | బంగారు ఆభరణములతో అభయము ఇస్తూ (రాముని) ఎడమ భుజము ప్రక్కన సర్వాలంకారముగా (రామునితో) చనువుగా, కమలము ధరించి, అగ్నియందు ఉద్భవించిన, సమృద్ధిగా ఉన్నదియైన సీతకు ఆత్మ అయినవాడు |
దక్షిణే లక్ష్మణేన అథ సధనుష్పాణినా పునః | మరలా (రాముని) కుడి ప్రక్కన ధనస్సు చేతిలో ధరించిన లక్ష్మణునితో ఉన్నవాడు |
హేమా భేన అనుజేన ఏవ తథా కోణ త్రయం భవేత్ | భూమితో, చంద్రునితో ఉన్న సూర్యుడు వలె రాముడు సీతతో, అనుజుడైన లక్ష్మణునితో కలసి త్రికోణముగా (like triangle ∇) ఉన్నాడు |
తథా ఏవ తస్య మంత్రస్య యస్య అణుః చ స్వజే అంతయా | అదే విధముగా (రెండు పదములున్న) ఆ ("నమో రామాయ") మంత్రమునకు అంతమున "నమః" ఉపాసనచే జత చేర్చినచో ("నమో రామాయ నమః") |
ఏవం త్రికోణ రూపం స్యాత్ తం దేవా యే సమాయయుః | (అప్పుడు ఏర్పడిన) ఆ విధమైన (మఱొక) త్రికోణ రూపమున దేవతలు వచ్చి [NOTE: ఇక్కడ భౌతిక త్రికోణము మఱియు మంత్ర రూప త్రికోణము మధ్య సారూప్యత భావించవలెను నమో ⇒ జీవాత్మ ⇒ సీత రామాయ = రామునకు ⇒ పరబ్రహ్మ అయిన రాముడు నమః = న ఇదం మమ ⇒ ఉపాసన ⇒ లక్ష్మణుడు] |
స్తుతిం చక్రుః చ జగతః పతిం కల్పతరౌ స్థితం | జగత్తుకు పతియైనవాడు, కల్ప వృక్షము క్రింద కూర్చున్నవాడు అయిన రాముని చుట్టూ చేరి (ఈ విధముగా) స్తుతి చేసిరి - |
కామరూపాయ రామాయ నమో మాయామయాయ చ | కామరూపుడైన, (పరబ్రహ్మము యొక్క) మాయామయ రూపుడైన రామునికై నమస్కారము |
నమో వేదాది రూపాయ ఓంకారాయ నమో నమః | వేదములు మొదలైన వాటి (జ్ఞాన) రూపము కలిగినవానికి నమస్కారము, ఓంకారరూపుడికి నమో నమః |
రమా ధరాయ రామాయ శ్రీరామాయ ఆత్మ మూర్తయే | లక్ష్మీధరుడైన రామునకు, ఆత్మ స్వరూపుడైన శ్రీరామునకు, |
జానకీ దేహ భూషాయ రక్షోఘ్నాయ శుభాంగినే | జానకి దేహమునకు అలంకారమైనవాడు, రాక్షసులను సంహరించినవాడు, శుభమైన అంగములు కలవాడు, |
భద్రాయ రఘువీరాయ దశాస్య అంతక రూపిణే! | భద్రునకు, రఘువీరునకు, దశకంఠక అంతక రూపుడకు నమస్కారము |
రామ భద్ర మహేష్వాస రఘువీర నృపోత్తమ | రామభద్రా! మహేష్వాసా (గొప్ప ధనస్సు కలవాడా)! రఘువీరా! నృపోత్తమా! |
భో దశాస్య అంతక అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే | ఓ రావణాంతకా! మమ్మలను రక్షించి, మాకు శ్రియమును (భక్తి జ్ఞాన వివేక వైరాగ్య సంపదలను) నీవు అనుగ్రహించుము |
త్వమైశ్వర్యం దాపయాథ సంప్రత్యాశ్వరిమారణం . కుర్వితి స్తుత్య దేవాద్యాస్తేన సార్ధం సుఖం స్థితాః .. 16.. స్తువంత్యేవం హి ఋషయస్తదా రావణ ఆసురః . రామపత్నీం వనస్థాం యః స్వనివృత్త్యర్థమాదదే .. 17.. స రావణ ఇతి ఖ్యాతో యద్వా రావాచ్చ రావణః . తద్వ్యాజేనేక్షితుం సీతాం రామో లక్ష్మణ ఏవ చ .. 18.. విచేరతుస్తదా భూమౌ దేవీం సందృశ్య చాసురం . హత్వా కబంధం శబరీం గత్వా తస్యాజ్ఞయా తయా .. 19.. పూజితో వాయుపుత్రేణ భక్తేన చ కపీశ్వరం . ఆహూయ శంసతాం సర్వమాద్యంతం రామలక్ష్మణౌ .. 20.. |
త్వం ఐశ్వర్యం దాపయ అథ సంప్రతి అశు అరి మారణం | రామ! నీవు ఐశ్వర్యమును ప్రసాదింపుము అని దేవతలు ప్రార్థింపగా అప్పుడు వెనువెంటనే త్వరగా రాముడు శత్రుమర్ధనం చేసెను |
కుర్వంతి స్తుత్య దేవాది అస్తేన సార్థం సుఖం స్థితాః | రాముని స్తోత్రము చేసి దేవతలు మొదలైనవారు దొంగలు (శత్రువులు) లేనివారై కోరిన అర్థం సంపాదించి సుఖముగా ఉన్నారు |
స్తువంతి ఏవం హి ఋషయః | అదే విధముగా ఋషులు కూడా రాముని స్తోత్రము చేసిరి |
తదా రావణాసురః రామపత్నీం వనస్థాం యః స్వనిర్వృత్తి అర్థం ఆదదే | అప్పుడు రావణాసురుడు రామపత్నిని వనస్థలము నుండి తన నాశనము కొఱకే తెచ్చుకొనెను |
స రావణ ఇతి ఖ్యాతో యద్వా రావాత్ చ | పెద్దగా అరచుట చేత అతడు రావణ అని ఖ్యాతి చెందినవాడు, మఱియు |
రావణః తదా వ్యాజేన ఈక్షితుం సీతాం రామో లక్ష్మణ ఏవ చ | రావణుడు అలా మోసగించుట చేత సీతను చూచుటకు రామలక్ష్మణులు |
విచారేతుః తదా భూమౌ దేవీం సందృశ్య చ ఆసురం | విచారము చేయుచూ అలా భూమి యందు సీతా దేవిని మఱియు అసురుడుని కనిపెట్టుటకు వెళ్లి |
హత్వా కబంధం శబరీం గత్వా తస్య ఆజ్ఞయా తయా పూజితో వాయుపుత్రేణ భక్తేన చ కపీశ్వరం ఆహూయ | కబంధుని సంహరించి, శబరి వద్దకు వెళ్లి, ఆమె చేత పూజించబడి, ఆమె ఆజ్ఞ తీసుకొని, భక్తితో వాయుపుత్రుడైన హనుమంతుని చేత మరియు కపీశ్వరుని (సుగ్రీవుని) చేత ఆహ్వానించబడగా |
శంసతాం సర్వం ఆద్యంతం రామలక్ష్మణౌ | మైత్రీ ప్రతిజ్ఞ చేసి ఆద్యంతము సర్వము రామలక్ష్మణులు వివరించిరి |
స తు రామే శంకితః సన్ప్రత్యయార్థం చ దుందుభేః . విగ్రహం దర్శయామాస యో రామస్తమచిక్షిపత్ .. 21.. సప్త సాలాన్విభిద్యాశు మోదతే రాఘవస్తదా . తేన హృష్టః కపీంద్రోఽసౌ స రామస్తస్య పత్తనం .. 22.. జగామాగర్జదనుజో వాలినో వేగతో గృహాత్ . తదా వాలీ నిర్జగామ తం వాలినమథాహవే .. 23.. నిహత్య రాఘవో రాజ్యే సుగ్రీవం స్థాపయత్తతః . |
స తు రామే శంకితః సన్ ప్రత్యయార్థం చ దుంధుభేః | రాముని (సామర్థ్యము) యందు శంక కలిగిన సుగ్రీవుడు తన అనుమానము తొలగించుకొనుటకు దుంధుభి యొక్క |
విగ్రహం దర్శయామాస యో రామస్తమచిక్షిపత్ | (పెద్ద) కళేబరమును చూపించగా రాముడు దానిని తేలికగా తన్ని విసిరివేసెను |
సప్త సాల అన్వి భిద్య ఆశు మోదతే రాఘవః తదా | సప్త సాల వృక్షములను ఒకేసారి భేదించి రాముడు సుగ్రీవుని ఆనందింపచేసెను |
తేన హృష్టః కపీంద్రో అసౌ సరామస్తస్య పత్తనం జగామా గర్జత్ అనుజో వాలినో వేగతో గృహాత్ | దానిచే సంతోషించిన కపీంద్రుడు ఆ రామునితో (కిష్కింద) పట్టణమునకు వెళ్లి గర్జించగా అనుజునికొఱకు వాలి వేగముతో గృహము నుండి |
తదా వాలీ నిర్జగామ తం వాలినం అథ ఆహవే నిహత్య రాఘవో | అలా బయటకు వచ్చెను, ఆ వాలిని అప్పుడు యుద్ధరంగములో రాఘవుడు సంహరించి, |
రాజ్యే సుగ్రీవం స్థాపయేత్ తతః | పిమ్మట(కిష్కింద) రాజ్యమునందు సుగ్రీవుని స్థాపించెను |
హరీనాహూయ సుగ్రీవస్త్వాహ చాశావిదోఽధునా .. 24.. ఆదాయ మైథిలీమద్య దదతాశ్వాశు గచ్ఛత . తతస్తతార హనుమానబ్ధిం లంకాం సమాయయౌ .. 25.. సీతాం దృష్ట్వాఽసురాన్హత్వా పురం దగ్ధ్వా తథా స్వయం . ఆగత్య రామేణ సహ న్యవేదయత తత్త్వతః .. 26.. తదా రామః క్రోధరూపీ తానాహూయాథ వానరాన్ . తైః సార్ధమాదాయాస్త్రాణి పురీం లంకాం సమాయయౌ .. 27.. తాం దృష్ట్వా ఉదధీశేన సార్ధం యుద్ధమకారయత్ . ఘటశ్రోత్రసహస్రాక్షజిద్భ్యాం యుక్తం తమాహవే.. 28.. హత్వా బిభీషణం తత్ర స్థాప్యాథ జనకాత్మజాం . ఆదాయాంకస్థితాం కృత్వా స్వపురం తైర్జగామ సః .. 29.. |
హరీన ఆహూయ సుగ్రీవః త్వ ఆహ చ ఆశా విదో అధునా | వానరులను పిలిపించి సుగ్రీవుడు వారిని ఆదేశించెను - మీరు దిక్కులన్నీ తెలిసినవారు, వెంటనే |
ఆదాయ మైథిలీం అద్య దదత్ అశ్వ ఆశు గచ్ఛత | మైథిలిని తెచ్చి రామునకు ఇచ్చుటకు ఇప్పుడే త్వరితగతి వెళ్లవలెను |
తతస్తతత అర హనుమాన్ అబ్ధిం లంకాం సమాయయౌ | దాని తరువాత వేగంగా హనుమంతుడు సముద్రమును దాటి లంకలో ప్రవేశించెను |
సీతాం దృష్ట్వా అసురాన్ హత్వా పురం దగ్ధ్వా తదా స్వయం | సీతను చూసి, అసురులను సంహరించి, పురమును దగ్ధము చేసి, అప్పుడు స్వయముగా |
ఆగత్య రామేణ సహా న్యవేదయత తత్త్వతః | తిరిగివచ్చి రామునితో తెలిసిందంతయూ నివేదించెను |
తదా రామః క్రోధరూపీ తాన్ ఆహూయ అథ వానరాన్ | అప్పుడు క్రోధరూపియైన రాముడు ఆ వానరులందరినీ పిలిచి |
తైః సార్థం ఆదాయ అస్త్రాణి పురీం లంకాం సమాయయౌ | వారిని లక్ష్యార్థము గొనిపోయి అస్త్రధారియై లంకా పురమునకు వెళ్లెను |
తాం దృష్ట్వా తత్ అధీశేన సార్థం యుద్ధం అకారయత్ | ఆ లంకను చూసి దాని అధిపతితో జయము కొఱకు యుద్ధము చేసెను |
ఘటశ్రోత్ర, సహస్ర అక్ష జిద్భ్యాం యుక్తం తం ఆహవే హత్వా | కుంభకర్ణుని, ఇంద్రజిత్తుని యుక్తముగా వారిని యుద్ధరంగమున హతమార్చెను |
విభీషణం తత్ర స్థాప్య అథ | తరువాత విభీషణుని అక్కడ (రాజ్యాధిపతిగా) స్థాపించెను |
జనకాత్మజాం ఆదాయ అంక స్థితాం కృత్వా స్వపురం తైః జగామ సః | జనకపుత్రిని స్వీకరించి తొడపై కూర్చుండబెట్టుకొని స్వపురమునకు వారందరితో వెళ్లెను |
తతః సింహాసనస్థః సన్ ద్విభుజో రఘునందనః . ధనుర్ధరః ప్రసన్నాత్మా సర్వాభరణభూషితః .. 30.. ముద్రాం జ్ఞానమయీం యామ్యే వామే తేజప్రకాశినీం . ధృత్వా వ్యాఖ్యాననిరతశ్చిన్మయః పరమేశ్వరః .. 31.. ఉదగ్దక్షిణయోః స్వస్య శత్రుఘ్నభరతౌ తతః . హనూమంతం చ శ్రోతారమగ్రతః స్యాత్త్రికోణగం .. 32.. భరతాధస్తు సుగ్రీవం శత్రుఘ్నాధో బిభీషణం . పశ్చిమే లక్ష్మణం తస్య ధృతచ్ఛ్రత్రం సచామరం .. 33.. తదధస్తౌ తాలవృంతకరౌ త్ర్యస్రం పునర్భవేత్ . ఏవం షట్కోణమాదౌ స్వదీర్ఘాంగైరేష సంయుతః .. 34.. ద్వితీయం వాసుదేవాద్యైరాగ్నేయాదిషు సంయుతః . తృతీయం వాయుసూనుం చ సుగ్రీవం భరతం తథా .. 35.. బిభీషణం లక్ష్మణం చ అంగదం చారిమర్దనం . జాంబవంతం చ తైర్యుక్తస్తతో ధృష్టిర్జయంతకః .. 36.. విజయశ్చ సురాష్ట్రశ్చ రాష్ట్రవర్ధన ఏవ చ . అశోకో ధర్మపాలశ్చ సుమంత్రశ్చైభిరావృతః .. 37.. తతః సహస్రదృగ్వహ్నిర్ధర్మజ్ఞో వరుణోఽనిలః . ఇంద్వీశధాత్రనంతాశ్చ దశభిశ్చైభిరావృతః .. 38.. బహిస్తదాయుధైః పూజ్యో నీలాదిభిరలంకృతః . వసిష్ఠవామదేవాదిమునిభిః సముపాసితః .. 39.. |
తతః సింహాసనస్థః సన్ ద్వివిభుజో రఘునందనః | పిమ్మట (అయోధ్యలో) సింహాసనమునందు స్థాపితుడైనాడు శక్తివంతమైన రెండు భుజములు కలిగిన రఘునందనుడు |
ధనుర్ధరః ప్రసన్నాత్మా సర్వ ఆభరణ భూషితః | ధనుర్ధరుడై, ప్రసన్న ఆత్ముడై, సర్వ ఆభరణ భూషితుడై |
ముద్రాం జ్ఞానమయీం యామ్యే వామే తేజః ప్రకాశినీం ధృత్వా | కుడి చేతితో జ్ఞానమయీ ముద్రతో, ఎడమ చేతితో తేజో ప్రకాశమగు ధనుస్సును ధరించి |
వ్యాఖ్యాన నిరతః చిన్మయః పరమేశ్వరః | నిరంతర (మౌన) వ్యాఖ్యానుడు, నిరతుడు (always detached), చిన్మయుడు, పరమేశ్వరుడు అయి ఉన్నాడు రాముడు |
ఉత్ దక్షిణయోః స్వస్య శత్రుఘ్న భరతౌ ధృతః |
[రాముడు తూర్పు వైపు చూస్తూ మనకు అభిముఖముగా ఉన్నాడని ఊహిస్తే...] తన యొక్క (రాముడికి) ఉత్తర దక్షిణముల (ఎడమ కుడి) వైపు శత్రుఘ్నుడు భరతుడు నిలబడి ఉన్నారు |
హనూమంతం చ శ్రోతారం అగ్రతః స్యాత్ త్రికోణగం | శ్రోత్రరూపముగా (వినయముగా దోసిలి పట్టి) రామునకు ముందు పక్క త్రికోణముగా హనుమంతుడు నిలబడి ఉన్నాడు |
భరతాత్ అస్తు సుగ్రీవం శత్రుఘ్న అధో విభీషణం | భరతునకు క్రిందగా సుగ్రీవుడు, శత్రుఘ్నునకు క్రిందగా విభీషణుడు ఉన్నారు |
పశ్చిమే లక్ష్మణం తస్య ధృతః ఛత్రం సచామరం | పశ్చిమము (వెనుక) వైపు లక్ష్మణుడు (రాముని కోసం) ఛత్రము చామరము పట్టుకుని ఉన్నాడు |
తత్ అధస్తౌ తాలవృంత కరౌ త్ర్యశ్రం పునః భవేత్ | లక్ష్మణుడికి (కొంచెము) క్రింద విసనకర్రలు పట్టుకొని (శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, భరతుడు) త్రికోణము (triangle) ఏర్పడినట్లు ఉన్నారు |
ఏవం షట్కోణం ఆదౌ స్వదీర్ఘ అంగైః ఏష సంయుతః | ఆ విధముగా (రాముని చుట్టూ) షట్కోణమునకు (for hexagon) దీర్ఘ అంగములుగా (like the long sides and the vertices) వీరు ఏర్పడినారు |
ద్వితీయం వాసుదేవ ఆద్యైః ఆగ్నేయాదిషు సంయుతః | రెండవ ఆవరణలో (పైన చెప్పిన మొదటి ఆవరణలోని వారి ప్రక్కగా) వాసుదేవ మొదలైనవారు కూడియున్నారు |
తృతీయం వాయుసూనుం చ సుగ్రీవం భరతం | రెండవ ఆవరణలో (మరలా) వాయుసుతుడైన హనుమంతుడు మఱియు సుగ్రీవుడు, భరతుడు, |
తథా విభీషణం లక్ష్మణం చ అంగదం చ అపి అరిమర్ధనం జాంబవంతం చ | అదే విధముగా విభీషణుడు, లక్ష్మణుడు, అంగదుడు, శత్రుఘ్నుడు మఱియు జాంబవంతుడు |
తైర్యుక్తః తతో ధృష్టిః జయంతకః విజయః చ సురాష్ట్రః చ రాష్ట్రవర్ధన ఏవ చ అశోకో ధర్మపాలః చ సుమంత్రః చ అభిః ఆవృతః | వీరితో పాటు యుక్తముగా (దశరథుని కొలువులోని మంత్రి వర్గమైన) ధృష్టి, జయంతకుడు, విజయుడు, సురాష్ట్రుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు మఱియు సుమంత్రుడు చుట్టూ ఆవరించి ఉన్నారు |
తతః సహస్రదృక్ వహ్నిః ధర్మజ్ఞో వరుణో అనిలః ఇందు ఈశ ధాత్ర అనంతాః చ దశభిః చ అభిః ఆవృతః | అక్కడ వేలాది కన్నులు కలిగిన ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, వరుణుడు, అనిలుడు, చంద్రుడు, ఈశుడు, బ్రహ్మ, అనంతుడు మఱియు పది దిక్కులలోని దేవతలు పరివేష్టించి ఉన్నారు |
బహిః తత్ ఆయుధైః పూజ్యోః నీలాదిభిః అలంకృతః | బాహ్యమున వారి పూజనీయమైన ఆయుధములు ఉన్నవి, నీలుడు మొదలైన వానరులు అలంకృతమై ఉన్నారు |
వసిష్ఠ వామదేవాది మునిభిః సముపాసితః | వసిష్ఠుడు, వామదేవుడు మొదలైన మునులు రాముని ఉపాసించుచున్నారు |
ఏవముద్దేశతః ప్రోక్తం నిర్దేశస్తస్య చాధునా . త్రిరేఖాపుటమాలిఖ్య మధ్యే తారద్వయం లిఖేత్ .. 40.. తన్మధ్యే బీజమాలిఖ్య తదధః సాధ్యమాలిఖేత్ . ద్వితీయాంతం చ తస్యోర్ధ్వం షష్ఠ్యంతం సాధకం తథా .. 41.. కురు ద్వయం చ తత్పార్శ్వే లిఖేద్బీజాంతరే రమాం . తత్సర్వం ప్రణవాభ్యాం చ వేష్టయేచ్ఛుద్ధబుద్ధిమాన్ .. 42.. దీర్ఘభాజి షడస్రే తు లిఖేద్బీజం హృదాదిభిః . కోణపార్శ్వే రమామాయే తదగ్రేఽనంగమాలిఖేత్ .. 43.. క్రోధం కోణాగ్రాంతరేషు లిఖ్య మంత్ర్యభితో గిరం . వృత్తత్రయం సాష్టపత్రం సరోజే విలిఖేత్స్వరాన్ .. 44.. కేసరే చాష్టపత్రే చ వర్గాష్టకమథాలిఖేత్ . తేషు మాలామనోర్వర్ణాన్విలిఖేదూర్మిసంఖ్యయా .. 45.. అంతే పంచాక్షరాణ్యేవం పునరష్టదలం లిఖేత్ . తేషు నారాయణాష్టార్ణాంలిఖ్య తత్కేసరే రమాం .. 46.. తద్బహిర్ద్వాదశదలం విలిఖేద్ద్వాదశాక్షరం . అథోం నమో భగవతే వాసుదేవాయ ఇత్యయం .. 47.. ఆదిక్షాంతాన్కేసరేషు వృత్తాకారేణ సంలిఖేత్ . తద్బహిః షోడశదలం లిఖ్య తత్కేసరే హృయం .. 48.. వర్మాస్త్రనతిసంయుక్తం దలేషు ద్వాదశాక్షరం . తత్సంధిష్విరజాదీనాం మంత్రాన్మంత్రీ సమాలిఖేత్ .. 49.. హ్రం స్రం భ్రం వ్రం లూెం శ్రం జ్రం చ లిఖేత్సమ్యక్తతో బహిః . ద్వాత్రింశారం మహాపద్మం నాదబిందుసమాయుతం .. 50.. విలిఖేన్మంత్రరాజార్ణాంస్తేషు పత్రేషు యత్నతః . ధ్యాయేదష్టవసూనేకాదశరుద్రాంశ్చ తత్ర వై .. 51.. ద్వాదశేనాంశ్చ ధాతారం వషట్కారం చ తద్బహిః . భూగృహం వజ్రశూలాఢ్యం రేఖాత్రయసమన్వితం .. 52.. ద్వారోపతం చ రాశ్యాదిభూషితం ఫణిసంయుతం . అనంతో వాసుకిశ్చైవ తక్షః కర్కోటపద్మకః .. 53.. మహాపద్మశ్చ శంఖశ్చ గులికోఽష్టౌ ప్రకీర్తితాః . |
ఏవం ఉద్దేశతః ప్రోక్తం నిర్దేశః తస్య చ అధునా | ఆ విధంగా (రామ పట్టాభిషేకమును పోలినట్లు) సంక్షిప్తంగా ఇప్పుడు దానికి (రామ పూజా యంత్రముకు) నిర్దేశము చెప్పబడుచున్నది |
త్రిరేఖా పుటం ఆలిఖ్య మధ్యే తార ద్వయం లిఖేత్ | మూడు రేఖలతో త్రికోణమును పుటముపై లిఖించుకొనవలెను, దాని మధ్యలో రెండు సార్లు తారకము (ఓం) లిఖించవలెను |
తత్ మధ్యే బీజం ఆలిఖ్య తత్ అధః సాధ్యం ఆలిఖేత్ | వాటి మధ్యమునే బీజము ("రాం" అని) లిఖించి దాని క్రింద సాధ్యము లిఖించుకొనవలెను |
ద్వితీయ అంతం చ తస్య ఊర్ధ్వం షష్టి అంతం సాధకం తథా | సాధ్యము ద్వితీయ విభక్తితో ("రామం" అని) ఉంచి, దాని పైన షష్ఠి విభక్తితో ("రామస్య" అని) సాధకము లిఖించుకొనవలెను |
కురు ద్వయం చ తత్ పార్శ్వే లిఖేత్ బీజాంతరే రమాం | రెండు సార్లు "కురు కురు" అని మఱియు దాని రెండు ప్రక్కల రమా బీజము (శ్రీం) లిఖించుకొనవలెను |
తత్ సర్వం ప్రణవాభ్యాం చ వేష్టయేత్ చ శుద్ధ బుద్ధిమాన్ | మఱియు బుద్ధిమంతులు తత్ సర్వం సూచికముగా రెండు శుద్ధ ప్రణవములతో (ఓం) ఇటు అటు చివరలలో చుట్టవలెను |
దీర్ఘ భాజి షడస్రే తు లిఖేత్ బీజం హృత్ ఆదిభిః | దీర్ఘ స్వరముతో ఆరు కోణములయందు హృదయాయ మొదలగునవి బీజముతో లిఖించవలెను (రాం హృదయాయ నమః, రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వౌషట్, రైం కవచాయహుం, రౌం నేత్రత్రయాయ వౌషట్, రః అస్త్రాయ ఫట్) |
కోణ పార్శ్వే రమా మాయే తత్ అగ్రే అనంగం ఆలిఖేత్ | కోణము ప్రక్కలందు రమా (శ్రీం), మాయా (హ్రీం) బీజములను, కోణాగ్రములందు అనంగ (కామ) బీజము (క్లీం) లిఖించవలెను |
క్రోధం కోణాగ్ర అంతరేషు లిఖ్య మంత్ర అభితో గిరం | కోణము పైన మఱియు అంతర భాగములలో క్రోధ బీజమును (హుం) లిఖించి మంత్రముతో వాక్ (సరస్వతీ) బీజమును (ఐం) లిఖించుకొనవలెను |
వృత్తత్రయం స అష్టపత్రం సరోజే విలిఖేత్ స్వరాన్ | మూడు వృత్తములను అష్ట దళములతో సరోజములు (పద్మములు) వేసి వాటి యందు స్వరములు (అక్షరమాలను) లిఖించుకొనవలెను |
కేసరే చ అష్టపత్రే చ వర్గ అష్టకం అథా లిఖేత్ | కేసర (పువ్వు మధ్యలో ఉండే సన్నని దారము) యందు మఱియు అష్ట దళములలో అష్ట వర్గములు (క వర్గము, చ వర్గము, ట వర్గము మొదలైనవి) లిఖించవలెను |
తేషు మాలా మనోః వర్ణాత్ విలిఖేత్ ఊర్మి సంఖ్యయా | ఆ వర్ణమాల భావముతో అల (wave) రూపమున (క్రింద) చెప్పబోవు సంఖ్యలలో లిఖించుకొనవలెను |
అంతే పంచాక్షరాణి ఏవం పునః అష్టదలం లిఖేత్ | చివర పంచ అక్షరాలు (ఓం, శ్రీం, హ్రీం, క్లీం, ఐం) అదే విధముగా అష్టదళములలో లిఖించవలెను |
తేషు నారాయణ అష్ట అర్ణాం లిఖ్య తత్ కేసరే రమాం | వాటి (పద్మ దళముల) యందు నారాయణ అష్టాక్షరాలు (ఓం, న, మో, నా, రా, య, ణా, య) లిఖించి, అ పద్మ కేసరముల యందు రమా (శ్రీం) బీజం వ్రాసుకొనవలెను |
తత్ బహిః ద్వాదశదలం విలిఖేత్ ద్వాదశ అక్షరం | దాని బాహ్యమున పన్నెండు దళములు లిఖించి ద్వాదశ అక్షర మంత్రము |
అథోం నమో భగవతే వాసుదేవాయ ఇతి అయం | "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని క్రింద లిఖించుకొనవలెను |
ఆది క్ష అంతాన్ కేసరేషు వృత్త ఆకారేణ సంలిఖేత్ | అ నుండి క్ష వరకు అక్షరమాలను కేసరములు (పువ్వు మధ్యలో ఉండే సన్నని దారములు) యందు వృత్తము ఆకారముతో లిఖించవలెను |
తత్ బహిః షోడశ దలం లిఖ్య తత్ కేసరే హ్రియం | బాహ్యమున పదహారు దళములు లిఖించుకొని వాటి కేసరముల యందు |
వర్మ అస్త్ర నతి సంయుక్తం దలేషు ద్వాదశ అక్షరం | కవచము, అస్త్రం, "నమో" సంయుక్తముగా దళముల యందు పన్నెండు (12) అక్షరములు |
తత్ సంధిషు విరజాదీనాం మంత్రాన్ మంత్రీ సమాలిఖేత్ | వాటి (కేసరుల) సంధుల యందు విరాజిల్లుచున్నట్లు మంత్రములను మంత్రవేత్త బాగుగా వ్రాయవలెను |
హ్రం స్రం భ్రం వ్రం ల్రం అం శ్రం జ్రం లిఖేత్ సమ్యక్తతో | హ్రం స్రం భ్రం వ్రం ల్రం అం శ్రం జ్రం అను బీజాక్షరములను సరిగ్గా వ్రాయవలెను, |
బహిః ద్వా త్రింశారం మహాపద్మం నాదబిందు సమాయుతం | బాహ్యమునందు ముప్పది రెండు (32) దళముల మహాపద్మం నాదబిందు (ఓం) సహితముగా |
విలిఖేత్ మంత్రరాజ అర్ణాన్ తేషు పత్రేషు యత్నతః | లిఖించి మంత్రరాజ అక్షరములు ఆ పద్మ దళములందు జాగ్రత్తగా వ్రాయవలెను |
ధ్యాయేత్ అష్టవసూన్ ఏకాదశ రుద్రాం చ తత్ర వై | ధ్యానించి అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను మఱియు అక్కడే |
ద్వాదశేన అంశ్చ ధాతారం వషట్కారం చ తత్ బహిః | ద్వాదశ ఆదిత్యులను, ధాతారం (బ్రహ్మదేవుని), వషట్కారం (హోమము చేయునప్పుడు చెప్పు పదము) వ్రాయవలెను, మఱియు దాని బయట |
భూగృహం వజ్రశూలాఢ్యం రేఖా త్రయ సమన్వితం | భూగృహమును వజ్రశూలాఢ్యుని (వజ్రశూల సంపన్నుడైన మహాశివుని సూచించు) మూడు రేఖలతో సమన్వితం చేయవలెను |
ద్వార ఉపేతం చ రాశ్యాది భూషితం ఫణి సంయుతం | ద్వారముల వద్ద రాశులతో అలంకరించి ఫణులతో సంయుతము చేయవలెను |
అనంతో వాసుకిః చ ఏవ తక్షః కార్కోట పద్మకః మహా పద్మః చ శంఖః చ గులికో అష్టా ప్రకీర్తితాః | అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్మకుడు, మహా పద్మ, శంఖుడు, గులిక అని అష్ట ఫణులు (నాగులు) కీర్తింపబడువారు |
ఏవం మండలమాలిఖ్య తస్య దిక్షు విదిక్షు చ .. 54.. నారసింహం చ వారాహం లిఖేన్మంత్రద్వయం తథా . కూటో రేఫానుగ్రహేందునాదశక్త్యాదిభిర్యుతః .. 55.. యో నృసింహః సమాఖ్యాతో గ్రహమారణకర్మణి . అంత్యాంఘ్రీశవియద్బిందునాదైర్బీజం చ సౌకరం .. 56.. హుంకారం చాత్ర రామస్య మాలమంత్రోఽధునేరితః . తారో నతిశ్చ నిద్రాయాః స్మృతిర్భేదశ్చ కామికా .. 57.. రుద్రేణ సంయుతా వహ్నిమేధామరవిభూషితా . దీర్ఘా క్రూరయుతా హ్లాదిన్యథో దీర్ఘసమాయుతా .. 58.. క్షుధా క్రోధిన్యమోఘా చ విశ్వమప్యథ మేధయా . యుక్తా దీర్ఘజ్వాలినీ చ సుసూక్ష్మా మృత్యురూపిణీ .. 59.. సప్రతిష్ఠా హ్లాదినీ త్వక్క్ష్వేలప్రీతిశ్చ సామరా . జ్యోతిస్తీక్ష్ణాగ్నిసంయుక్తా శ్వేతానుస్వారసంయుతా .. 60.. కామికాపంచమూలాంతస్తాంతాంతో థాంత ఇత్యథ . స సానంతో దీర్ఘయుతో వాయుః సూక్ష్మయుతో విషః .. 61.. కామికా కామకా రుద్రయుక్తాథోఽథ స్థిరాతపా . తాపనీ దీర్ఘయుక్తా భూరనలోఽనంతగోఽనిలః .. 62.. నారాయణాత్మకః కాలః ప్రాణాభో విద్యయా యుతః . పీతారాతిస్తథా లాంతో యోన్యా యుక్తస్తతో నతిః .. 63.. సప్తచత్వారింశద్వర్ణగుణాంతఃస్పృఙ్మనుః స్వయం . రాజ్యాభిషిక్తస్య తస్య రామస్యోక్తక్రమాల్లిఖేత్ .. 64.. ఇదం సర్వాత్మకం యంత్రం ప్రాగుక్తమృషిసేవితం . |
ఏవం మండలం ఆలిఖ్య తస్య దిక్షు విదిక్షు చ | ఈ విధంగా మండలమును లిఖించి దాని నాలుగు దిక్కులందు, నాలుగు విదిక్కులందు [తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర దిక్కులందు మఱియు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్య విదిక్కులందు] |
నారసింహం చ వారాహం లిఖేత్ మంత్ర ద్వయం తథా | నారసింహ (క్ష్రౌం), వారాహ (హుం) బీజ మంత్ర ద్వయములను లిఖించవలెను |
కూటో రేఫ అనుగ్రహ ఇందు నాద శక్తి ఆదిభిః యుతః | (నారసింహ మంత్రములోని) రకార కొమ్ము చేత చంద్రుడు (మఱియు ఇతర గ్రహములు), నాద, శక్తి మొదలగువాని అనుగ్రహయుతముగా |
యో నృసింహః సమ ఆఖ్యాతో గ్రహ మారణ కర్మణి | సమముగా లిఖించిన ఆ నృసింహ బీజము కర్మల యందు గ్రహ బాధలు తొలగించునది |
అంత్య అంఘ్రి ఈశ వియత్ బిందునాదైః బీజం చ సౌకరం | అంత్యమున ఈశ, విష్ణు, బిందు నాదములచే సంయుతము మఱియు సూకరం (వారాహ) సూచకము |
హుంకారం చ అత్ర రామస్య మాలామంత్రో అధున ఈరితః | ఈ హుంకార బీజము, మఱియు రాముని యొక్క మాలామంత్రము ఇప్పుడు చెప్పబడుచున్నది |
తారో నతిః చ నిద్రాయాః స్మృతిః మేధః చ కామికా | తారకము (ఓం), నతి (నమో) మఱియు నిద్ర బీజము (భ), స్మృతి బీజము (గ), మేధ బీజము (వ) మఱియు కామికా బీజమునకు (త) |
రుద్రేణ సంయుతా వహ్నిః మేధ అమర విభూషితా | రుద్రునితో (ఏకారముతో) సంయుతము కాగా (తే), అగ్ని బీజము (ర్), మేధ బీజము (ఘ), అమర బీజము (ఉకారము) వీటితో విభూషితమైనది |
దీర్ఘ అక్రూరయుతా హ్లాదిని అథో దీర్ఘ సమాయుతా క్షుధా | అక్రూర (సౌమ్యమైన చంద్ర) బీజము (నం) తరువాత హ్లాద బీజము (ద) దానికి దీర్ఘము కూడి (దా) మఱియు క్షుధా బీజము (య) కూడినది [ఇంతవరకు ఈ బీజములతో "ఓం నమో భగవతే రఘునందనాయ" ఏర్పడును] |
క్రోధినీ అమోఘా చ విశ్వం అపి అథ మేధయా | విశ్వముతో (ర) కూడిన అమోఘముతో (క్ష) క్రోధినీ బీజము (ఓ), మేధా బీజమునకు (ఘ) |
యుక్తా దీర్ఘ జ్వాలినీ చ సుసూక్ష్మా మృత్యురూపిణీ | దీర్ఘ యుక్తమవగా (నకారము), జ్వాలినీ బీజమునకు (వ) సూక్ష్మ రుద్ర బీజము (ఇకారము) కూడి, మృత్యురూపము (శ) |
సప్రతిష్టా హ్లాదినీ త్వచ్ క్షేల ప్రీతిః చ స అమరా | హ్లాదినీ బీజముతో (ద్) త్వచ్ (కప్పుకొని) ప్రతిష్టితమైనది [ఇంతవరకు ఈ బీజములతో "రక్షోఘ్న విశదాయ" ఏర్పడును] క్షేల (మ), ప్రీతి (ధ) మఱియు అది అమరముతో (ఉకారముతో), |
జ్యోతిః తీక్ష్ణ అగ్ని సంయుక్తా శ్వేత అనుస్వార సంయుతా | జ్యోతి (ర), తీక్ష్ణాగ్నితో (ప్ర) సంయుక్తమైన అనుస్వారముతో శ్వేత (స్+అ = స) బీజముతో సంయుతమైన |
కామికా పంచమో ల అంతస్త అంతా అంతో థ అంత ఇతి అథ | కామిక బీజమునకు (త) ఐదవ అక్షరము (న) అనుస్వారమైనది (న్న), ల అక్షరము తరువాతది (వ), థ అక్షరమునకు తరవాతది (ద) కూడి పిమ్మట |
సన్ అనంతో దీర్ఘాయుతో వాయుః సూక్ష్మయుతో విషః | నకారమునకు అనంత ఆకారముతో (న+ఆ = నా), దీర్ఘముతో కూడిన వాయు బీజము (యా) విష బీజమునకు (మ) సూక్ష్మ ఇకారముతో (మ+ఇ = మి) |
కామికా కామకా రుద్రయుక్త అథో అథ స్థిర అతపా | కామికా బీజము (త), మరల కామ బీజమునకు (త) రుద్రయుక్తముతో (ఏకారము) కూడినదై (తే) తరువాత స్థిర బీజము (జ), శాంతింపచేయుటకు సకార బీజమునకు ఏకారముతో (సే) కూడెను [ఇంతవరకు ఈ బీజములతో "మధుర ప్రసన్న వదనాయామిత తేజసే" ఏర్పడును] |
తాపినీ దీర్ఘ యుక్తా భూః అనలో అనంత గో అనిలః | తాపినీ బీజము (బ), భూ బీజముకు (ల) దీర్ఘాకారముతో (లా), అనల [అగ్ని] బీజము (ర్), అనిల [వాయు] బీజము (య) తరువాత అనంతమైన అనల (అగ్ని) బీజముకు (ర్) |
నారాయణాత్మకః కాలః ప్రాణ అంభో విద్యయా యుతః | నారాయణాత్మక ఆకార బీజము (ర్+ఆ = రా), కాల బీజము (మా) వీటికి ప్రాణ బీజము (య) సంయుతమై, అంభో బీజ (వి) యుతముగా |
పీతరాతిః తథా ల అంతో యోనీ యుక్తః తతో నతిః | పీత బీజమునకు (ష్) రతి బీజము (ణ్) ఏకమై, లకారము తరవాత అక్షరమునకు (వ) యోని (ఏకారము) యుక్తమై (వే) దానితో నమస్కారము (నమః) [ఇంతవరకు ఈ బీజములతో "బలాయ రామాయ విష్ణవే నమః ఓం" ఏర్పడును] |
సప్త చత్వారింశత్ వర్ణ గుణాంతః స్పృఙ్మనః స్వయం | నలుబది ఏడు (47) బీజ వర్ణములతో ఈ మంత్రము "ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయామిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః ఓం" ఈ మంత్రము త్రిగుణాతీతము గావించి స్వయముగా మనస్సును శుద్ధి చేయునది [మంత్రము యొక్క అర్థము - ఓం = అకార (సృష్టి), ఉకార (స్థితి), మకార (లయ) స్వరూపుడైన పరమాత్ముడు భగవతే రఘునందనాయ = భగవంతుడైన శ్రీరామునకై నమో = నమస్కారము రక్షోఘ్న = రాక్షసులను తరిమివేయువానికై విశదాయ = శుద్ధమైనవానికై మధుర ప్రసన్న వదనాయ = తేజోమయ ప్రసన్న వదనం కలవానికై అమిత తేజసే = అమితమైన తేజస్సు కలవానికై బలాయ = బలమైనవానికై రామాయ = రామునికై విష్ణవే = విష్ణు స్వరూపునికై నమః = నమస్కారము] |
రాజ్యాభిషిక్తస్య తస్య రామస్య ఉక్త క్రమాత్ లిఖేత్ | రాజ్యాభిషిక్తుడైన రాముని యొక్క ఈ మంత్రమును ముందు చెప్పిన క్రమములో యంత్రమునందు లిఖించుకొనవలెను |
ఇదం సర్వాత్మకం యంత్రం ప్రాక్ ఉక్తం ఋషిసేవితం | సర్వాత్మకమైన ఈ యంత్రమును ప్రాచీన ఋషులు సేవించిరని చెప్పబడెను |
సేవకానాం మోక్షకరమాయురారోగ్యవర్ధనం .. 65.. అపుత్రాణాం పుత్రదం చ బహునా కిమనేన వై . ప్రాప్నువంతి క్షణాత్సమ్యగత్ర ధర్మాదికానపి .. 66.. ఇదం రహస్యం పరమమీశ్వరేణాపి దుర్గమం . ఇదం యంత్రం సమాఖ్యాతం న దేయం ప్రాకృతే జనే .. 67.. ఇతి.. ఇతి తురీయోపనిషత్ .. |
సేవకానాం మోక్షకరం ఆయుః ఆరోగ్య వర్ధనం | (ఈ మంత్ర సహిత యంత్రము) సేవించువారికి మోక్షకరము, ఆయురారోగ్యములు వర్ధింపచేయునది |
అపుత్రాణాం పుత్రదం చ బహునా కిం అనేన వై | పుత్రులు లేనివారికి పుత్రులు ఇచ్చునది, మఱియు బహు విధములు చెప్పనేల? |
ప్రాప్నువంతి క్షణాత్ సమ్య గత్ర ధర్మాదికాన్ అపి | వెంటనే ధర్మము మొదలైనవి (ధర్మము, జ్ఞానము, వైరాగ్యము అను ఐశ్వర్యములు) కూడా లభించును |
ఇదం రహస్యం పరమం ఈశ్వరేణ అపి దుర్గమం | ఈ పరమ రహస్యమును (సద్గురు కృప లేనిచో) ఈశ్వరునిచేత కూడా తెలుసుకొనుటకు దుర్గమము |
ఇదం యంత్రం సమ ఆఖ్యాంతం న దేయం ప్రాకృతే జన ఇతి | ఈ యంత్రమును ప్రాకృతిక బుద్ధులతో (అహంకార, కామ, క్రోధాది గుణములచే బద్ధులై) ఉన్న జనులకు చెప్పరాదు |
ఓం భూతాదికం శోధయేద్ద్వారపూజాం కృత్వా పద్మాద్యాసనస్థః ప్రసన్నః . అర్చావిధావస్య పీఠాధరోర్ధ్వ- పార్శ్వార్చనం మధ్యపద్మార్చనం చ .. 1.. కృత్వా మృదుశ్లక్ష్ణసుతూలికాయాం రత్నాసనే దేశికమర్చయిత్వా . శక్తిం చాధారాఖ్యకాం కూర్మనాగౌ పృథివ్యబ్జ స్వాసనాధః ప్రకల్ప్య .. 2.. విఘ్నేశం దుర్గాం క్షేత్రపాలం చ వాణీం బీజాదికాంశ్చాగ్నిదేశాదికాంశ్చ . పీఠస్యాంఘ్రిష్వేవ ధర్మాదికాంశ్చ నత్వా పూర్వాద్యాసు దీక్ష్వర్చయేచ్చ .. 3.. మధ్యే క్రమాదర్కవిధ్వగ్నితేజాం- స్యుపర్యుపర్యాదిమైరర్చితాని . రజః సత్వం తమ ఏతాన్ వృత్త- త్రయం బీజాఢ్యం క్రమాద్భావయేచ్చ .. 4.. ఆశావ్యాశాస్వప్యథాత్మానమంత- రాత్మానం వా పరమాత్మానమంతః . జ్ఞానాత్మానం చార్చయేత్తస్య దిక్షు మాయావిద్యే యే కలాపారతత్త్వే .. 5.. సంపూజయేద్విమలాదీశ్చ శక్తీ- రభ్యర్చయేద్దేవమవాహయేచ్చ . అంగవ్యూహానిలజాద్యైశ్చ పూజ్య ఘృష్ట్యాదికైర్లోకపాలైస్తదస్త్రైః .. 6.. వసిష్ఠాద్యైర్మునిభిర్నీలముఖ్యై- రారాధయేద్రాఘవం చందనాద్యైః . ముఖ్యోపహారైర్వివిధైశ్చ పూజ్యై- స్తస్మై జపాదీంశ్చ సమ్యక్ప్రకల్ప్య .. 7.. ఏవంభూతం జగదాధారభూతం రామం వందే సచ్చిదానందరూపం . |
ఓం భూతాదికం శోధయేత్ ద్వారపూజాం చ | ఓం. భూతాదికములను శుద్ధిచేయుచూ (యంత్రమునకు) ద్వారపూజ చేయవలెను మఱియు |
కృత్వా పద్మాద్య ఆసనస్థః ప్రసన్నః | పద్మ మొదలగు ఏదో ఒక ఆసనములో స్థిరముగా కూర్చొని ప్రసన్న మనస్కుడై చేయవలెను |
అర్చా విధానస్య పీఠాధరః ఊర్ధ్వ పార్శ్వేషు | పీఠము మీద ప్రతిష్ఠించిన దేవతను పైన ఇరుప్రక్కల యందు విధి విధానముగా అర్చన చేసి |
తత్ మధ్య పద్మార్చనం చ | మఱియు దాని మధ్య భాగములో పద్మార్చన చేయవలెను |
కృత్వా మృదు శ్లక్ష్ణ సుతూలికాయాం రత్న ఆసనే దేశికం అర్చయిత్వా | మృదువైన మెత్తటి అందమైన పరుపుపై ఉంచిన రత్న సింహాసనము పైన గురువును అర్చించి |
శక్తిం చ ఆధార ఆఖ్యకాం కూర్మనాగౌ పృథివి అబ్జ స్వ ఆసన అధః ప్రకల్ప్య | ఆధార శక్తిని, కూర్మ నాగములను పృథివీమయ ఆసనమును పీఠము క్రింద బాగుగా కల్పించి |
విఘ్నేశం దుర్గాం క్షేత్రపాలం చ వాణీం బీజాదికాం చ అగ్ని దేశాదికాం చ | విఘ్నేశుని, దుర్గను, క్షేత్రపాలకుని (శివుని) మఱియు సరస్వతిని బీజాక్షరములుచే పూజించి ఆగ్నేయ మొదలగు విదిక్కుల యందు |
పీఠస్య అంఘ్రిషు ఏష ధర్మాదికాం చ | పీఠము యొక్క పాదము యందు ధర్మము మొదలైనవి (ధర్మ, అర్థ, కామ, మోక్షములను) |
నత్వా పూర్వాది అసు దిక్షు అర్చయేత్ చ | నమస్కరించి తూర్పు మొదలు నాలుగు దిక్కులందు అర్చించవలెను |
మధ్యే క్రమాత్ అర్క విధి అగ్ని తేజాంసు ఉపరి ఉపర్యాదిమైః అర్చితాని | మధ్యలో క్రమముగా సూర్య, విధి, అగ్ని తేజములను పైన ప్రధమములుగా అర్చించాలి |
రజః సత్త్వం తమ ఏతాన్ వృత్త త్రయం | మూడు వృత్తముల రూపమున సత్త్వ రజో తమో గుణములను |
బీజ ఆఢ్యం క్రమాత్ భావయేత్ చ | మఱియు ఐశ్వర్యమయ బీజాక్షరములను క్రమముగా భావించవలెను |
ఆశా వ్యాశాసు అపి అథ ఆత్మానం | ఆశా (అష్ట వసువులకు చిహ్నముగా అష్ట దిక్కుల) భాగముల యందు కూడా పూజించవలెను, తరువాత ఆత్మను (హృదయమును) |
అంతరాత్మానం వా పరమాత్మానం అంతః జ్ఞాన ఆత్మానం చ అర్చయేత్ తస్య దిక్షు | అంతరాత్మను లేదా పరమాత్మను అంతర జ్ఞానాత్మను దాని (పీఠము) యొక్క (అష్ట) దిక్కుల యందు ప్రతిష్ఠించవలెను |
మాయ అవిద్యే యే కల అపార తత్త్వే సంపూజయేత్ | (తూర్పు మొదలు నాలుగు దిక్కుల యందు) మాయ, అవిద్య, కళ, అపార తత్త్వములను చక్కగా పూజించవలెను, |
విమలాదీః చ శక్తీః అభ్యర్చయేత్ దేవం ఆవాహయేత్ చ | విమల మొదలగు శక్తులను బాగుగా అర్చించవలెను, మఱియు (యంత్ర) దేవతను ఆవాహము చేయవలెను |
అంగ వ్యూహ అనిలజాద్యైః చ పూజ్య | అంగ వ్యూహము (క్రమము) జలము మొదలైనవాటితో పూజ చేయవలెను |
ఘృష్ట్యాదికైః లోకపాలైః తత్ అస్త్రైః | ఘృష్టి మొదలగు (ఘృష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్ర వర్ధన, అకోప, వాయు, చంద్ర, ఈశాన, బ్రహ్మ, అనంత) వారిని పూజించవలెను, లోకపాలకులను వారి అస్త్రములను పూజించవలెను [ కుబేరుడు (North) - గద, యముడు (South) - పాశము, ఇంద్రుడు (East) - వజ్రాయుధము, వరుణుడు (West) - పాశము ఈశాన (NorthEast) - త్రిశూలము, అగ్ని (SouthEast) - దండము, నిరృతి (SouthWest) - ఖడ్గము, వాయు (NorthWest) - అంకుశము, బ్రహ్మ - పద్మము, విష్ణు - చక్రము ] |
వసిష్ఠాద్యైః మునిభిః నీలముఖ్యైః | వసిష్ఠుడు మొదలగు మునులు (వసిష్ఠుడు, వామదేవుడు, జాబాల, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి మొదలగువారిని) పూజించవలెను, నీలుడు మొదలగు ముఖ్యులు (నీల, నల, సుషేణ, మైంద ద్వివిదులు మొదలగు వానరులను) పూజించవలెను |
ఆరాధయేత్ రాఘవం చందనాద్యైః ముఖ్య ఉపహారైః వివిధైః చ పూజ్యైః | చందనాదులతో రాఘవుని ఆరాధించి వివిధములగు ముఖ్య ఉపహారాలతో సహా పూజించవలెను |
తస్మై జపాదీం చ సమ్యక్ ప్రకల్ప్య | రామునికై జపము మొదలైనవాటిని చేసి బాగుగా సంకల్పించుకొనవలెను |
ఏవం భూతం జగత్ ఆధారభూతం రామం వందే సత్ చిత్ ఆనంద రూపం | అటువంటి భూతము (రూపము), జగత్తుకు ఆధారభూతము అయిన సత్ చిత్ ఆనంద రూపుడైన రామునికి వందనము |
గదారిశంఖాబ్జధరం భవారిం స యో ధ్యాయేన్మోక్షమాప్నోతి సర్వః .. 8.. విశ్వవ్యాపీ రాఘవో యస్తదానీ- మంతర్దధే శంఖచక్రే గదాబ్జే . ధృత్వా రమాసహితః సానుజశ్చ సపత్తనః సానుగః సర్వలోకీ .. 9.. తద్భక్తా యే లబ్ధకామాంశ్చ భుక్త్వా తథా పదం పరమం యాంతి తే చ . ఇమా ఋచః సర్వకామార్థదాశ్చ యే తే పఠంత్యమలా యాంతి మోక్షం .. 10.. ఇతి పంచమోఽపనిషత్ .. |
గదా అరి శంఖ అబ్జ ధరం భవ అరిం | గద, చక్రము, శంఖము, కమలము ధరించినవాడిని, భవమునకు శత్రువుని (భవహరుడిని) |
స యో ధ్యాయేత్ మోక్షం ఆప్నోతి సర్వః | అటువంటి (విష్ణు రూపుడైన) రాముని ఎవరు ధ్యానించెదరో వారందరూ మోక్షము పొందెదరు |
విశ్వవ్యాపీ రాఘవో యః తదానీం అంతర్దధే శంఖ చక్రే గదా అబ్జే ధృత్వా | విశ్వవ్యాపియైన రాఘవుడు అప్పుడు శంఖ చక్రములను, గద కమలములను (తన స్వాభావిక విష్ణు రూపమును) ధరించి |
రమా సహితః సానుజః చ సపత్తనః సానుగః సర్వలోకీ | రమా సహితుడై, అనుజులతో సహా మఱియు పురవాసులతో, పరిజనులతో, సమస్త ప్రజానీకముతో పరంధామము చేరెను |
తత్ భక్తా యే లబ్ధ కామం చ భుక్త్వా తథా పదం పరమం యాంతి తే చ | ఆ రాముని భక్తులు ధర్మయుతమైన అర్థకామములను అనుభవించి అదే విధముగా పరమపదమును వారు పొందెదరు |
ఇమ ఋచః సర్వ కామార్థదాః చ యే తే పఠంతి అమలా యాంతి మోక్షం | సర్వ అర్థకామములను ఇచ్చునది అయిన ఈ ఋక్కులను ఎవరు పఠించెదరో వారు పరిశుద్ధులై మోక్షమును చేరుదురు |
ఇతి పంచమ అధ్యాయః | ఇది పంచమ అధ్యాయము |
చిన్మయేఽస్మింస్త్రయోదశ . స్వభూర్జ్యోతిస్తిస్రః . సీతారామావేకా . జీవవాచీ షట్షష్టిః . భూతాదికమేకాదశ . పంచఖండేషు త్రినవతిః . ఇతి శ్రీరామపూర్వతాపిన్యుపనిషత్సమాప్తా .. |
చిన్మయే అస్మిన్ సః త్రయోదశ స్వభూః జ్యోతిః తిస్రః సీతా రామ అవ ఏకా | చిన్మయులు, వీరి యందే త్రయోదశ (13) కరణములు (ఐదు బాహ్యేంద్రియములు, ఐదు అంతరేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము) కలవారు, స్వయంభువులు, త్రయాగ్ని స్వరూపులు [ గార్హపత్యము (పిత), దక్షిణాగ్ని (మాత), ఆహవనీయము (గురువు) ] అయిన రక్షించువారైన సీతారాములు ఏకము (ఒక్కరే), |
జీవవాచీ షట్ షష్టిః భూతాదికం ఏకాదశ పంచ ఖండేషు త్రినవతిః | వారే అరువది ఆరు (66) జీవవాచక రూపములు వారే పదకొండు (11) భూతాదిక రూపములు, ఐదు (5) ఖండములందు తొంభై మూడు (93) రూపములు కలిగిన జగత్ స్వరూపము [NOTE: సాంఖ్య శాస్త్రములో జగత్ ప్రకృతి తత్త్వమును విచారణ (analysis) కొరకు అనేక సంఖ్యలతో సంగ్రహించబడినది.] |
ఇతి శ్రీరామ పూర్వ తాపినీ ఉపనిషత్ సమాప్తా | రామ పూర్వ తాపినీ ఉపనిషత్తు సమాప్తము |
Rȃma Poorva Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com