[[@YHRK]] [[@Spiritual]]

Rȃma Rahasya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


రామ రహస్య ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఉపనిషత్ పరిచయ శ్లోకము

కైవల్య శ్రీ స్వరూపేణ రాజమానం మహః అవ్యయం మోక్ష సంపద స్వరూపముచే ప్రకాశవంతమైనది, మహత్తరమైనది, అవ్యయమైనది,
ప్రతియోగి వినిర్ముక్తం శ్రీరామపదం ఆశ్రయే ఆధారభూతమైనది, బంధవిముక్తముచేయు శ్రీరామపదమును ఆశ్రయించెదను.



రామ తత్వమును ఉపదేశించిన ఉపనిషత్తులు

రహస్యం రామతపనం వాసుదేవం చ ముద్గలం |
శాండిల్యం పైంగలం భిక్షు మహః శారీరకం శిఖా ||
రామ రహస్య ఉపనిషత్, రామ తాపిని ఉపనిషత్, వాసుదేవ ఉపనిషత్, ముద్గల ఉపనిషత్, శాండిల్య ఉపనిషత్, పైంగల ఉపనిషత్, భిక్షుక ఉపనిషత్, మహోపనిషత్, శారీరక ఉపనిషత్, యోగశిఖ ఉపనిషత్.
ఇవి రామ తత్వమును ఉపదేశించిన ఉపనిషత్తులు.

ఒకటవ అధ్యాయము - రామ తత్త్వము

1.1 ఋషులు హనుమంతుని దర్శించుట
ఓం సనక ఆద్యా యోగివర్యా అన్యే చ ఋషయః తథా సనకుడు మొదలైన యోగివర్యులు మఱియు ఇతర ఋషులు

[సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు - వీరు బ్రహ్మమానస పుత్రులు అని ప్రతీతి]
ప్రహ్లాద ఆద్యా విష్ణుభక్తా హనూమంతం అథా బ్రువన్ ప్రహ్లాదుడు మొదలైన విష్ణుభక్తులు హనుమంతునితో ఈ విధముగా చెప్పిరి.
1.2 సర్వమునకు మూల తత్త్వము ఏది?
వాయుపుత్ర మహాబాహో కిం తత్త్వం బ్రహ్మవాదినాం, ఓ వాయుపుత్రుడా, మహాబాహూ! బ్రహ్మవాదులకు ఏది తత్త్వము (the Ultimate Essence)?
పురాణేషు అష్టాదశసు, స్మృతిషు అష్టాదశసు అపి, చతుర్వేదేషు, శాస్త్రేషు, విద్యాసు ఆధ్యాత్మికే అపి చ పద్దెనిమిది పురాణములందు మఱియు పద్దెనిమిది స్మృతులందు, నాలుగు వేదములందు, శాస్త్రములందు మఱియు ఆధ్యాత్మిక విద్యలందు కూడా,
సర్వేషు విద్యాదానేషు, విఘ్న సూర్య ఈశ శక్తిషు, అన్ని విద్యాదానములందు, విఘ్న సూర్య ఈశ శక్తులందు (అయా వైదిక మతముల యందు),
ఏతేషు మధ్యే కిం తత్త్వం, కథయ త్వం మహాబల వీటి అన్నిటియందు మూలతత్త్వము ఏది? ఓ మహాబలా! మాకు వివరించి చెప్పుము.
1.3 రాముడే సర్వమునకు మూల తత్త్వము
హనుమాన్ హ ఉవాచ - హనుమంతుడు అప్పుడు ఈ విధంగా చెప్పెను -
భో యోగీంద్రాః చ ఋషయో విష్ణుభక్తాః తథా ఏవ చ, ఓ యోగీంద్రులారా, మఱియు ఋషులారా, మఱియు అటులనే విష్ణుభక్తులారా!
శృణుధ్వం మామకీం వాచం భవబంధవినాశినీం, భవబంధవినాశము చేయగల నా ఈ వచనములు శ్రద్ధతో వినండి,
ఏతేషు చ ఏవ సర్వేషు తత్త్వం చ బ్రహ్మతారకం, (మీరు పేరుకొన్న) అన్నిటియందు తత్త్వం మఱియు బ్రహ్మతారకము (ఏదనగా)

రామ ఏవ పరం బ్రహ్మ, రామ ఏవ పరం తపః, రామ ఏవ పరం తత్త్వగ్ం,

రాముడే పరబ్రహ్మ, రాముడే పరంతపము, రాముడే పరతత్త్వము,
శ్రీరామో బ్రహ్మ తారకం. శ్రీరాముడే తారకబ్రహ్మము.
1.4 రామ తత్త్వమునకు అంగములు
వాయుపుత్రేణ ఉక్తాః తే యోగీంద్రా ఋషయో విష్ణుభక్తాః వాయుపుత్రునిచే చెప్పగా ఆ యోగీంద్రులు, ఋషులు, విష్ణుభక్తులు
హనుమంతం పప్రచ్ఛుః, రామస్య అంగాని నో బ్రూహి - ఇతి. హనుమంతుని ఈ విధంగా పరిప్రశ్నించిరి - రాముని యొక్క (తత్త్వ) అంగములు మాకు తెలుపుము.
హనుమాన్ హ ఉవాచ - హనుమంతుడు అప్పుడు ఈ విధంగా చెప్పెను -
వాయుపుత్రం, విఘ్నేశం, వాణీం, దుర్గాం, క్షేత్రపాలకం, సూర్యం, చంద్రం, నారాయణం, నరసింహం, వాయుదేవం, వారాహం తత్ సర్వాన్ సమాత్రాన్ వాయుపుత్రుడు (హనుమంతుడు), విఘ్నేశ్వరుడు, సరస్వతి, దుర్గ, క్షేత్రపాలకుడు (శివుడు), సూర్యుడు, చంద్రుడు, నారాయణుడు, నరసింహుడు, వాయుదేవుడు, వరాహమూర్తి - వీరందరని మాత్రా సహితముగా

[ మాత్రా సహిత దేవతా మంత్రములకు కొన్ని ఉదాహరణములు -
ఓం హూం హనుమంతే రుద్రాత్మకాయే హూం ఫట్ స్వాహా
ఓం గం గం గ్లౌం గణపతయే నమః
ఓం ఐం క్లీం సౌం సరస్వత్యై నమః
ఓం దుం దుర్గాయై నమః
ఓం హం, హ్రౌం, హ్రీం శివాయ నమః
ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
ఓం సోం చంద్రాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం క్ష్రౌం నారసింహాయ నమః
ఓం యం వాయుదేవాయ నమః
ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ నమః ]
సీతాం, లక్ష్మణగ్ం, శత్రుఘ్నం, భరతం, విభీషణగ్ం, సుగ్రీవం, అంగదం, జాంబవంతం, ప్రణవం (మఱియు) సీత, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, ఓంకార ప్రణవ మంత్రము -
ఏతాని రామస్య అంగాని జానీథాః, వీరందరినీ రాముని యొక్క (తత్త్వ) అంగములుగా మీరు తెలుసుకొనవలెను,
తాని అంగాని వినా రామో విఘ్నకరో భవతి. ఆయా అంగములు లేకుండా రాముని వాచకము విఘ్నములు కలుగచేయును.

[అనగా రాముడు అను మాట కేవలము ఒక నామవాచకము కాదు. రామ శబ్దము ఆయా అంగములతో సహా అర్థము చేసుకున్నప్పుడు అది పరబ్రహ్మ ఉపాసన అగును.]
1.5 ప్రణవమునకు, రామమంత్రమునకు అధికారము (అర్హత)
పునః వాయుపుత్రేణ ఉక్తాః తే హనుమంతం పప్రచ్ఛుః - వాయుపుత్రునిచే చెప్పబడినవారై మరల వారందరూ హనుమంతుని వినయముగా ఇట్లు ప్రశ్నించిరి -
ఆంజనేయ మహాబల విప్రాణాం గృహస్థానాం ప్రణవాధికారః కథం స్యాత్ ఇతి. ఓ ఆంజనేయా! మహాబలా! బ్రాహ్మణులకు, గృహస్థులకు ఓంకార ప్రణవ మంత్రము జపించుటకు అధికారము ఏ విధముగా వచ్చును?
స హ ఉవాచ - శ్రీరామ ఏవ ఉవాచ ఇతి, అతడు (హనుమంతుడు) చెప్పెను - శ్రీరాముడే ఈ విధంగా చెప్పెను అని,
యేషాం ఏవ షడక్షర అధికారో వర్తతే తేషాం ప్రణవ అధికారః స్యాత్ న అన్యేషాం, ఎవరికైతే షడక్షర (ఓం-న-మః-శి-వా-య) మంత్రమునకు (గురూపదేశముచే) అధికారము కలదో వారే ఓంకార ప్రణవమునకు అధికారం కలవారు, అంతే కాని ఇతరులు కారు.
కేవలం అకార ఉకార మకార అర్ధం మాత్రాసహితం ప్రణవం ఊహ్య కేవలము అకార, ఉకార, మకార అర్ధమాత్రాసహితమైన (అ + ఉ + మ్ = ఓం) ప్రణవమును భావించి
యో రామ మంత్రం జపతి తస్య శుభకరో అహం స్యాం, తస్య ప్రణవస్య అకారస్య ఉకారస్య మకారస్య అర్ధ మాత్రాయాః చ ఋషిః చ ఛందో దేవతా ఎవరు రామ మంత్రము జపించుదురో వారికి నేను (హనుమంతుడు) శుభకరుడను అగుచున్నాను. ఆ ప్రణవముయొక్క అకార ఉకార మకార అర్ధమాత్రలు (అ, ఉ, మ్ శబ్దాక్షరాలు) యొక్క ఋషి, ఛందస్సు మఱియు దేవతలను
తత్ తత్ వర్ణ వర్ణావస్థానగ్ం స్వరవేదాగ్ని గుణాను ఉచ్చార్యాత్ అన్వహం ఆయా వర్ణముల వర్ణావస్థానముల స్వర వేదాగ్ని గుణములను (అనగా వేదములో చెప్పినట్లు అర్థసహితముగా స్వరసహితముగా) ఉచ్చారణ చేస్తూ ప్రతిదినము
ప్రణవమంత్రాత్ ద్విగుణం జప్త్వా పశ్చాత్ రామమంత్రం యో జపేత్ ప్రణవమంత్రముకంటే రెండింతలు జపించిన (అనగా ప్రణవార్థమును బాగుగా మననము చేసిన) తరువాత రామ మంత్రమును ఎవరు జపిస్తారో
స రామో భవతి ఇతి రామేణ ఉక్తాః తస్మాత్ రామ అంగం ప్రణవః కథిత ఇతి. అతడు రాముడే అగును అని రామునిచే చెప్పబడెను, కావున ప్రణవము రామునికి అంగము అని చెప్పబడెను.
1.6 రామ నామ మహిమ
విభీషణ ఉవాచ - విభీషణుడు చెప్పెను -
సింహాసనే సమ ఆసీనం రామం పౌలస్త్యసూదనం ప్రణమ్య దండవత్ భూమౌ పౌలస్త్యో వాక్యం అబ్రవీత్, సింహాసనమునందు చక్కగా ఆసీనుడై ఉన్న రాముడుని, పౌలస్త్యుని (రావణుని) సంహరించినవానిని, సాష్టాంగ దండ ప్రణామము చేసి పౌలస్త్యుడు (విభీషణుడు) ఇట్లు అడిగెను -
రఘునాథ మహాబాహో కేవలం కథితం త్వయా, ఓ రఘునాథా! మహాబాహూ! కేవలం నీవే చెప్పగలవాడవు,
అంగానాం సులభం చ ఏవ కథనీయం చ సౌలభం. (రామ తత్త్వ) అంగములలో సులభమైనది మఱియు సౌలభ్యమైనది ఏది?
శ్రీరామ ఉవాచ - శ్రీరాముడు ఇట్లు చెప్పెను -
అథ పంచదండకాని పితృఘ్నో మాతృఘ్నో బ్రహ్మఘ్నో గురుహననః కోటియతిఘ్నో ఈ ఐదు విధములైన పాపములు - పితృహంతకుడు, మాతృహంతకుడు, బ్రహ్మహత్యా పాతకుడు, గురుహంతకుడు, కోటి మంది యతులను హత్య చేసినవాడు,
అనేక కృత పాపో యో మమ షట్ నవతి కోటి నామాని జపతి అనేకములైన పాపములు చేసినవాడైనా ఎవరు 96 కోట్లు సార్లు నా (రామ) నామములు జపించునో
(స) తేభ్యః పాపేభ్యః ప్రముచ్యతే, వారు సర్వ పాపములనుండి విముక్తులగుదురు,
స్వయం ఏవ సత్ చిత్ ఆనంద స్వరూపో భవేత్, న కిం? వారు స్వయముగా సత్ చిత్ ఆనంద స్వరూపులే అగుదురు (అనగా వారు తమ యొక్క స్వస్వరూపానుభవము పొందెదరు), కాక మరేమి?
పునః ఉవాచ విభీషణః - తత్ర అపి అశక్తః అయం కిం కరోతి? మరల విభీషణుడు అడిగెను - ఆ విధముగా (అన్నిసార్లు రామ నామ జపము) చేయుటకు శక్తి లేనివారు ఏమి చేయవలెను?
స హ ఉవాచ ఇమం - రాముడు ఈ విధంగా చెప్పెను -
కైకసేయ పునశ్చరణవిధి అవశక్తోయో మమ మహోపనిషదం, మమ గీతాం, కైకపుత్రుడు (రామ) నామ పునశ్చరణవిధి (జపము) చేయుటకు శక్తిలేనివాడు నా మహోపనిషత్తును, నా గీతను,
మత్ నామసహస్రం, మత్ విశ్వరూపం, మమ అష్టోత్తరశతగ్ం, నా సహస్ర (1000) నామములను, నా విశ్వరూపమును, నా అష్టోత్తరశత (108) నామములను,
రామ శతాభిధానం, నారదోక్తస్తవరాజం, హనుమాత్ ప్రోక్తం మంత్రరాజాత్మకస్తవం, రామ శతాభిధానమును, నారదోక్తస్తవరాజమును, హనుమంతునిచే చెప్పబడిన మంత్రరాజాత్మకస్తవమును,
సీతాస్తవం చ రామషడక్షర ఇతి ఆదిభిః మంత్రైః యో మాం నిత్యం స్తౌతి సీతాస్తవమును మఱియు రామషడక్షర (శ్రీరామరామేతి) మంత్రమును ఎవరు నన్ను గూర్చి నిత్యము స్తుతిస్తారో
తత్ సదృశో భవేత్, న కిం భవేత్, న కిం భవేత్ వారు నా సామ్యరూపము (సత్ చిత్ ఆనంద స్వరూపము) పొందెదరు, కాక మరేమి అగుదురు? కాక మరేమి అగుదురు?



రెండవ అధ్యాయము - రాముని మంత్ర సముదాయము

2.1 రాముని మంత్రములు ఏవి? అను ప్రశ్న
సనక ఆద్యా మునయో హనూమంతం పప్రచ్ఛుః సనకుని ప్రముఖముగా చేసుకొని మునులు హనుమంతుని వినయముగా ప్రశ్నించిరి -
ఆంజనేయ మహాబల తారక బ్రహ్మణో రామచంద్రస్య మంత్రగ్రామం నో బ్రూహీతి ఆంజనేయా! మహాబలా! తారక బ్రహ్మమగు రామచంద్రుని యొక్క మంత్ర సముదాయమును మాకు వివరించుము.
2.2 ఏకాక్షర రామ మంత్రము
హనూమాన్ హ ఉవాచ - హనుమంతుడు ఈ విధంగా చెప్పెను -
వహ్నిస్థం శయనం విష్ణోః అర్ధచంద్ర విభూషితం వహ్ని (అగ్ని) బీజాక్షరమును (ర్), విష్ణు శయన (ఆది)శేష బీజమును (ఆ), అర్ధచంద్ర బీజమును (o) బాగుగా అలంకరించినట్లు సంధింపబడిన (ర్ + ఆ + o = రాం శబ్దము)
ఏకాక్షరో మనుః ప్రోక్తో మంత్రరాజః సురద్రుమః (రాం అనబడు) ఏకాక్షరము మంత్రరాజము, కల్పవృక్షము అని విజ్ఞులు చెప్పిరి.
2.3 ఏకాక్షర రామ మంత్రమునకు అంగములు
బ్రహ్మా మునిః స్యాత్ గాయత్రం ఛందో రామో అస్య దేవతా (ఈ రాం ఏకాక్షర మంత్రమునకు) బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, రాముడు దేవత అయిఉన్నవి.
దీర్ఘ అర్ధేందు యుజ అంగాని కుర్యాత్ వహ్ని ఆత్మనో అగ్నికి ఆత్మయైన “ర్” బీజాక్షరమునకు, “ఆ”కార దీర్ఘాక్షర బీజమును, అర్ధచంద్ర బీజమును (o) సంధించి ఆయా కరాంగ న్యాసము చేయుచూ
మనోః బీజ శక్తి ఆదిబీజేన ఇష్టార్థే వినియోజయేత్ మనస్సును మూల శక్తి యందు ఆదిబీజాక్షరముతో (రాం అనుచూ) శ్రద్ధతో వినియోగించవలెను (తద్వారా మనస్సును స్వాత్మయందు లయం చేయవలెను).
2.4 ఏకాక్షర రామ మంత్రమునకు ధ్యానము
సరయూ తీరేన మందార వేదికా పంకజ ఆసనే సరయూ నది తీరమునందు, మందార వృక్ష వేదిక మీద, కమలాసనము నందు,
శ్యామం వీరాసన ఆసీనం జ్ఞాన ముద్రోప శోభితం (నీల మేఘ) శ్యామ వర్ణముతో, వీరాసనము వేసుకొని, జ్ఞాన ముద్రతో శోభించుచున్నవాడు,
వామ ఊరున్యః తత్ హస్తం సీతాలక్ష్మణ సంయుతం ఎడమ తొడపై ఎడమ హస్తము పెట్టుకున్నవాడు, సీతాలక్ష్మణులతో కూడియున్నవాడు,
అవేక్ష్యమాణం ఆత్మానం ఆత్మన్యం ఇత తేజసం అంతర్ముఖుడై తన ఆత్మయందే తన మనస్సు స్థితి పొంది స్వరూప తేజస్సును వీక్షిస్తూ తేజస్సుతో వెలుగొందుచున్నవాడు,
శుద్ధః స్ఫటిక సంకాశం కేవలం మోక్షకాంక్షయా చింతయన్ శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్నవాడైన శ్రీరాముని కేవలము మోక్ష కాంక్షతో చింతించుచూ,
పరమాత్మానం భానులక్షం జపేత్ మనుం పరమాత్మను సాధకుడు 12 లక్షలు (రాం అనుచూ) జపం చేయవలెను.
2.5 రెండు అక్షరముల రామ మంత్రము
వహ్నిః నారాయణో నాడ్యో జాఠరః కేవలః అపి చ, వహ్ని (ర్) , నారాయణ (ఆ), నాడ్య (మ్), జఠరాగ్ని (అ), కేవల (విసర్గ) బీజాక్షరములు కూడగా ( ర్ + ఆ + మ్ + అ + ః = రామః)

[నాడ్యః = నాడీ వ్యవస్థ]
ద్వ్యక్షరో మంత్రరాజః అయం సర్వాభీష్టప్రదః, రెండు అక్షరాల ఈ మంత్రరాజము (రామః) సర్వాభీష్టములను ప్రసాదించును,
తతః ఏకాక్షర ఉక్తం ఋష్యాది స్యాత్ ఆద్యేన షడంగకం ఏకాక్షర (రాం) మంత్రమునకు వలెనే (ద్వి అక్షర రామః మంత్రమునకు కూడా) ఋషి మొదలగునవి మఱియు షడంగములు అవే చెప్పబడినవి.

అనగా రామః మంత్రమునకు బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, రాముడు దేవత.

NOTE: షడంగన్యాసము అనగా మంత్రమును (లేదా మంత్ర బీజాక్షరములను) ఆరు భాగములుగా చేసి అంగుష్ఠాది కరన్యాసములతో (అంగుష్ఠాయ నమః, తర్జనీభ్యో నమః, మధ్యమాభ్యో నమః, అనామికాభ్యో నమః, కనిష్ఠికాభ్యో నమః, కరతల పృష్ఠాభ్యో నమః) మఱియు హృదయాది న్యాసములుతో (హృదయాయ నమః, శిరసే నమః, శిఖాయై నమః, కవచాయ నమః, నేత్రత్రయాయ నమః, అస్త్రాయ నమః) చెప్పుదురు.
2.6 మూడు అక్షరముల రామ మంత్రములు
తార మాయా రమా అనంగ వాక్ స్వబీజః చ షట్ విధః త్ర్యక్షరో మంత్రరాజః స్యాత్ సర్వాభీష్ట ఫలప్రదః, తారకము (ఓం), మాయా (హ్రీం), రమా (శ్రీం), అనంగ (క్లీం), వాక్ (ఐం), స్వబీజ (రాం) బీజాక్షరములు ఆరు విధములుగా “రామః” మంత్రమునకు ముందున చేర్చి మూడు అక్షరాల మంత్రముగా జపించినచో ఆ త్రయ అక్షర మంత్రరాజము సర్వాభీష్టముల ఫలములు ప్రసాదించును.

అనగా, 1) ఓం రామః 2) హ్రీం రామః 3) శ్రీం రామః 4) క్లీం రామః 5) ఐం రామః 6) రాం రామః
2.7 నాలుగు అక్షరముల రామ మంత్రములు
ద్వ్యక్షరః చంద్రభద్రాంతో ద్వివిధః చతురక్షరః, రెండు అక్షరముల రామః మంత్రమునకు చివర చంద్ర మఱియు భద్ర చేర్చినచో రెండు విధములుగా నాలుగక్షరాల మంత్రములగును.

అనగా, 1) రామచంద్రః 2) రామభద్రః.
ఋష్యాది పూర్వవత్ జ్ఞేయం ఏతయోః చ విచక్షణైః ఋషి మొదలైన అంగములను పూర్వపు మంత్రములకు చెప్పినవాటివలె ఈ రెండు మంత్రములకు కూడా అదే విధంగా విచక్షణులైనవారు తెలుసుకొనవలెను.
2.8 ఐదు అక్షరముల రామ మంత్రము
సప్రతిష్టౌ రమౌ వ ఆయౌ హృత్ పంచార్ణో మనుర్మతః, (ర్) బీజమునకు (ఆ) ప్రతిష్ఠ బీజము కలిపి దానికి చివర “ఆయ” మఱియు హృదయమును (నమః ) కలిపి పంచ వర్ణముల “రామాయ నమః” అను మంత్రమును మానవులకు నిర్దేశింపబడినది,
విశ్వామిత్ర ఋషిః ప్రోక్తః పంక్తిః ఛందో అస్య దేవతా రాంభద్రో బీజశక్తిః ప్రథమార్ణం ఇతి క్రమాత్, రామాయ నమః మంత్రమునకు విశ్వామిత్రుడు ఋషి, పంక్తి ఛందస్సు, రామభద్రుడు దేవత, రాం అను ప్రథమార్ణము బీజశక్తి అని ఈ క్రమముగా చెప్పబడినవి,
భ్రూమధ్యే హృది నాభి ఊర్వోః పాదయోః విన్యసేన్మనుం భ్రూమధ్యమునందు, హృదయమునందు, నాభియందు, తొడలయందు, పాదములయందు న్యాసము చేయవలసినదిగా చెప్పబడినది.
షడంగం పూర్వవత్ విద్యాత్ మంత్రార్ణైః మనునా అస్త్రకం. షడంగములు, మంత్రార్ణములు, మంత్రముతో న్యాసము పూర్వమువలె తెలుసుకొనవలెను.

[రాం హృదయాయ నమః, మాం శిరసే స్వాహా, యం శిఖాయై ఫట్, నం కవచాయ హుం, మః నేత్రత్రయాయ వౌషట్]
2.9 రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరముల రామ మంత్రములతో చేయవలసిన ధ్యానము
మధ్యే వనం కల్పతరోః మూలే పుష్పలత ఆసనే, వన మధ్యమునందు, కల్పవృక్షము మూలమున, పుష్పలత ఆసనముపై కూర్చున్నవాడు,
లక్ష్మణేన ప్రగుణితం అక్షః కోణేన సాయకం, లక్ష్మణునిచే చక్కబెట్టిన నారి గల ధనస్సును చూచుచున్నవాడు,
అవేక్ష్యమాణం, జానక్యా కృతవ్యజనం, ఈశ్వరం, అంతర్ముఖుడైనవాడు, జానకిచే విసనకర్రతో సేవించుబడువాడు, ఈశ్వరుడు,
జటాభార లసత్ శీర్షం, శ్యామం, మునిగణావృతం శిరస్సుపై జటలతో వెలుగొందువాడు, (నీల మేఘ) శ్యాముడు, మునులచే పరివేష్టించబడినవాడు,
లక్ష్మణేన ధృతః ఛత్రం అథవా పుష్పక ఉపరి లక్ష్మణుడు ఛత్రము పట్టుకొనగా, పుష్పక విమానముపై కూర్చున్నవాడు,
దశాస్యమథనం శాంతం స సుగ్రీవ విభీషణం దశకంఠుని సంహరించినవాడు, ప్రశాంతుడు, సుగ్రీవ విభీషణాదులచే కూడినవాడు అయిన
ఏవం లబ్ధ్వా జయార్థీతు వర్ణ లక్షం జపేత్ మనుం ఈ రూపముగా లభించిన ఆ శ్రీరాముని మంత్రము జయము కోరువాడు లక్ష సార్లు జపించవలెను.
2.10 ఆరు అక్షరముల రామ మంత్రములు
స్వకామశక్తి వాక్ లక్ష్మీ స్తవాద్యాః పంచవర్ణకాః షట్ అక్షరః స్వ (రాం), కామ (క్లీం), శక్తి (హ్రీం), వాక్ (ఐం), లక్ష్మీ (శ్రీం), స్తవ (ఓం) ఆదిబీజములను పంచవర్ణ మంత్రముతో (అనగా రామాయనమః) జతకలిపి ఆరు వర్ణముల మంత్రములు
షట్ విధః స్యాత్ చతుర్వర్గ ఫలప్రదః ఆరు విధములగా జపించినచో చతుర్వర్గ పురుషార్థములు (ధర్మ - అర్థ - కామ - మోక్షములు) లభించును.

[షట్ అక్షర మంత్రములు = 1. రాం రామాయ నమః, 2. క్లీం రామాయ నమః, 3. హ్రీం రామాయ నమః, 4. ఐం రామాయ నమః, 5. శ్రీం రామాయ నమః, 6. ఓం రామాయ నమః]
పంచశత్ మాతృకా మంత్రవర్ణ ప్రత్యేక పూర్వకం [అ నుండి క్ష వరకు] 50 వర్ణములలో అక్షరములను ప్రత్యేకముగా ముందు వైపు జత చేయగా
లక్ష్మీ వాక్ మన్మథాదిః చ తారాది స్యాత్ అనేకథా లక్ష్మీ (శ్రీం), వాక్ (ఐం), మన్మథ (క్లీం), తార (ఓం) బీజాక్షరములతో కూడా కలిపినచో అనేక విధములుగా రామ మంత్రములు ఏర్పడును.
శ్రీరామ మన్మథ ఏకైకం బీజాది అంతర్గతో మనుః చతుర్వర్ణః స ఏవ స్యాత్ షడ్వర్ణో వాంఛిత ప్రదః మన్మథ బీజము (క్లీం) మొదలైన చతుర్వర్ణ ఆదిబీజములను (శ్రీం, ఐం, క్లీం, ఓం) శ్రీరామ మంత్రముతో కూర్చి షట్వర్ణ మంత్రములుగా చేసి జపించినచో సర్వ శుభ వాంఛలు సిద్ధించును.

అనగా - ఓం రాం రామచంద్రః, ఓం రాం రామభద్రః, శ్రీం రాం రామచంద్రః, శ్రీం రాం రామభద్రః, మొదలగు మంత్రములు.
2.11 స్వాహా, హుంఫట్, నమః అంత్యాక్షరముల రామ మంత్రములు
స్వాహా అంతో హుంఫట్ అంతో వా నతి అంతో వా భవేత్ ఈ రామ మంత్రములకు చివరలో స్వాహా లేదా హుంఫట్ లేదా నమః చేర్చవచ్చును,

[ఓం రాం రామచంద్రాయ స్వాహా, ఓం రాం రామచంద్రాయ హుంఫట్, ఓం రాం రామచంద్రాయ నమః, మొదలగు రూపములలో మంత్రములు ఉచ్చరించవచ్చును]

[స్వాహా అనగా హవిస్సు దేవతలకు బాగుగా అందును గాక! అని]

[హుం ఫట్ చేయువాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము, దుఃఖములను తొలగించువాడు]
అయం అష్టావింశత్ ఉత్తర శత భేదః షట్ వర్ణ ఈరితః ఈ విధముగా షడక్షర మంత్రములకు నూట ఇరవై ఎనిమిది (128) భేదరూపములు ఉన్నవి
బ్రహ్మా సంమోహనః శక్తిః దక్షిణామూర్తిః ఏవ చ అగస్త్యః చ శివః ప్రోక్తా మునయో అనుక్రమాత్ ఇమే, బ్రహ్మ, సమ్మోహనుడు, శక్తి, దక్షిణామూర్తి, అగస్త్యుడు, శివుడు - వీరు వరుసగా ఆరు అక్షరములకు ఋషులు,
ఛందో గాయత్ర సంజ్ఞం చ శ్రీరామః చ ఏవ దేవతా గాయత్రి ఛందస్సుగా సూచించబడునది , శ్రీరాముడే దేవత
అథవా కామబీజాదేః విశ్వామిత్రో మునిః మనోః లేదా కామ బీజము (క్లీం) మొదలగునవి (అనగా ఓం, శ్రీం, క్లీం, ఐం, హ్రీం, రాం) ఈ మంత్రమునకు బీజాక్షరములు, విశ్వామిత్రుడు ఋషి అని చెప్పవచ్చును,
ఛందో దేవ్యాది గాయత్రీ రామభద్రో అస్య దేవతా గాయత్రీ దేవతాదులు ఛందస్సు, రామభద్రుడు దేవత,
బీజశక్తీ యథాపూర్వం షట్ వర్ణ అను విన్యసేత్ క్రమాత్ శక్తిబీజములు ఇంతకు పూర్వము చెప్పిన విధముగానే ఆరు అక్షరములకు క్రమముగా అన్వయించుకొనవలెను
బ్రహ్మరంధ్ర భ్రువోర్మధ్యే హృత్ నాభి ఊరుషు పాదయోః బ్రహ్మరంధ్రమునందు, భ్రూమధ్యమునందు, హృదయము, నాభి, తొడలు, పాదములయందు
బీజైః షట్ దీర్ఘయుక్తైః వా మంత్రార్ణైః వా షడంగకం ఆరు బీజాక్షరముల దీర్ఘవర్ణములతో కాని, మంత్రములతో కాని షడంగములను కరన్యాసము మఱియు హృదయన్యాసము చెప్పుకొనవలెను
2.12 షడక్షర మఱియు స్వాహా, హుంఫట్, నమః అంత్యాక్షర రామ మంత్రములకు ధ్యానము
కాల అంభోధర కాంతి కాంతం అనిశం వీరాసనాత్ ఆసితం నీలమేఘకాంతి వంటి శరీర ఛాయ నిరంతరము గలవాడు, వీరాసనం వేసుకొని కూర్చున్నవాడు,
ముద్రాం జ్ఞానమయీం దధానం అపరం హస్తాంబుజం జానుని జ్ఞానముద్రలో (జ్ఞానమయుడై) ఉన్నవాడు, ఆపైన హస్తముతో పద్మము ధరించిన భంగిమలో ఉన్నవాడు,
సీతాం పార్శ్వగతాం సరోరుహకరాం విద్యుత్ నిభాం రాఘవం పశ్యంతం పద్మము పట్టుకొని విద్యుల్లత వలె ఉన్న సీతచే చూడబడుచున్నవాడు,
మకుటాంగాది వివిధా కల్పోః జ్వలాంగం భజే కిరీటం మొదలైన వివిధ ఆభరణములుతో శోభించుచున్నవాడైన రాముని భజించుచున్నాను
2.13 ఏడు అక్షరముల రామ మంత్రములు
రామః చ చంద్ర భద్ర అంతో జ్ఞే అంతో నతియుతో ద్విధా రామచంద్ర మఱియు రామభద్ర చివరన ఆయ అని (చతుర్థి విభక్తితో), దానికి అంతములో నమః (హృదయము) జతచేయగా రెండు విధములుగా

[ 1) రామచంద్రాయ నమః 2) రామభద్రాయ నమః ]
సప్త అక్షరో మంత్రరాజః సర్వ కామ ఫలప్రదః ఏడు అక్షరాల మంత్రరాజములు అయి సర్వ శుభేచ్ఛలను ఫలింపజేయును
2.14 ఎనిమిది అక్షరముల రామ మంత్రములు
తారాది సహితః సః అపి ద్వివిధో అష్టాక్షరో మతః తారకము (ఓం), మాయా (హ్రీం), రమా (శ్రీం), అనంగ (క్లీం), వాక్ (ఐం), స్వబీజ (రాం) బీజాక్షరముల సహితముగా ఆ సప్తాక్షర మంత్రములు రెండు విధములుగా అష్టాక్షర మంత్రములుగా కూడా తెలియవచ్చును

[ ఓం రామచంద్రాయ నమః, ఓం రామభద్రాయ నమః ]
[ హ్రీం రామచంద్రాయ నమః, హ్రీం రామభద్రాయ నమః ]
[ శ్రీం రామచంద్రాయ నమః, శ్రీం రామభద్రాయ నమః ]
[ క్లీం రామచంద్రాయ నమః, క్లీం రామభద్రాయ నమః ]
[ ఐం రామచంద్రాయ నమః, ఐం రామభద్రాయ నమః ]
[ రాం రామచంద్రాయ నమః, రాం రామభద్రాయ నమః ]
తారం రామ చతుర్థ అంతః క్రోడ అస్త్రం వహ్నితల్పగా తరింపచేయు రామ శబ్దముతో చివరన (చతుర్థి విభక్తితో) ఆయ రూపము కలిపి అంతములో హృదయ (నమః) అస్త్రముతో “రామాయనమః” అగ్నిసంయోగమగును

[Note: “ఆయ” అనుదానికి “చతుర్థ” నానార్థము. రామ శబ్ద రూపము చతుర్థి విభక్తిలో రామాయ <అనగా రాముని కొఱకు> అగును. ]
అష్టార్ణో అయం పరో మంత్ర ఋష్యాదిః స్యాత్ షడర్ణవత్ ఈ అష్టాక్షర పరమ మంత్రములకు ఋష్యాదులు షడక్షర మంత్రము వలె తెలుసుకొనవలెను
పునః అష్టాక్షరస్య అథ రామ ఏవ ఋషిః స్మృతః మఱల అష్టాక్షర మంత్రమునకు కూడా రాముడే ఋషి అని గుర్తించుకొనవలెను
గాయత్రం ఛంద ఇతి అస్య దేవతా రామ ఏవ చ గాయత్రి ఛందస్సు అని, ఈ మంత్రమునకు రాముడే దేవత అని, మఱియు

తారం శ్రీబీజయుగ్మం చ బీజశక్త్యాదయో మతాః

శ్రీ బీజముతో కూడి శక్తిబీజములు జతపఱచిన రామ మంత్రములు తరింపచేయునదిగా తెలుసుకొనవలెను

[ ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామభద్రాయ నమః ]
[ హ్రీం శ్రీరామచంద్రాయ నమః, హ్రీం శ్రీరామభద్రాయ నమః ]
[ శ్రీం శ్రీరామచంద్రాయ నమః, శ్రీం శ్రీరామభద్రాయ నమః ]
[ క్లీం శ్రీరామచంద్రాయ నమః, క్లీం శ్రీరామభద్రాయ నమః ]
[ ఐం శ్రీరామచంద్రాయ నమః, ఐం శ్రీరామభద్రాయ నమః ]
[ రాం శ్రీరామచంద్రాయ నమః, రాం శ్రీరామభద్రాయ నమః ]
షడంగం చ తతః కుర్యాత్ మంత్రార్ణః ఏవ బుద్ధిమాన్ ఆ మంత్రాక్షరములను విడిగా షడంగ న్యాసమునకు (కరన్యాసము, హృదయన్యాసము) బుద్ధిమంతులు పొందుపఱచుకొనవలెను
తారం శ్రీబీజయుగ్మం చ రామాయ నమ ఉచ్చరేత్ శ్రీ బీజముతో కలిపి రామాయ నమః (“శ్రీరామాయనమః”) అని ఉచ్చరించినచో తరింపచేయును
గ్లౌం ఓం బీజం వదేత్ మాయాం హృత్ రామాయ పునః చ తాం గ్లౌం, ఓం, మాయా (హ్రీం) బీజములుతో రామాయ మఱియు హృదయము (నమః) జతపఱచి పునశ్చీకరణము (repeated combinations) చేసినచో అవి

[ 1) ఓం శ్రీం రామాయ నమః, 2) ఓం హ్రీం రామాయ నమః, 3) గ్లౌం శ్రీం రామాయ నమః, 4) గ్లౌం హ్రీం రామాయ నమః ]
శివో మా రామ మంత్రో అయం వస్వర్ణస్తు వసుప్రదః శివో మా రామ మంత్రములు అనబడునవి, ఇవి స్వర్ణమయ ఐశ్వర్యములు ప్రసాదించునవి
ఋషిః సదాశివః ప్రోక్తో గాయత్రం ఛంద ఉచ్యతే వీటికి సదాశివుడు ఋషి అని, గాయత్రి ఛందస్సు అని చెప్పబడెను
శివో మా రామచంద్రో అత్ర దేవతా పరికీర్తితః శివో మా రామచంద్రుడు వీటికి దేవత అని వర్ణింపబడెను
దీర్ఘయా మాయయా అంగాని తార పంచార్ణ యుక్తయా మాయా బీజముల దీర్ఘస్వరములతో (హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రోం, హ్రః) షడంగములు రామ పంచార్ణము (నమోరామాయ) యుక్తముగా న్యాసములు చెప్పుకొనవలెను.

[హ్రాం ఓం నమో రామాయ హృదయాయ నమః, హ్రీం ఓం నమో రాయాయ శిరసే స్వాహ, హ్రూం ఓం నమో రామాయ శిఖాయై వౌషట్, హ్రైం ఓం నమో రామాయ కవచాయ హుం, హ్రూం ఓం నమో రామాయ నేత్రత్రయాయ వౌషట్, హ్రః ఓం నమో రామయ అస్త్రాయ ఫట్]
2.15 శివో మా రామ ధ్యానము
రామం త్రినేత్రం సోమార్ధధారిణం శూలినం పరం (సర్వజీవరాసులలో) రమించువాడు, త్రినేత్రుడు, అర్ధచంద్రధారుడు, శూలధారి, (త్రిగుణాత్మక ప్రకృతికి) పరమైనవాడు,
భస్మోః ధూళిత సర్వాంగం కపర్దినం ఉపాస్మహే సర్వాంగములందు భస్మము ధరించినవాడు అయిన కపర్దిని (జటాజూటధారిని) ఉపాసించుచున్నాను

[ఇక్కడ రాముని శివరూపములో ధ్యానిస్తున్నాము. అనగా రామ శివ అభేదము ప్రకటించబడుచున్నది.]
రామ అభిరామం సౌందర్య సీమాం సోమావతంసికాం రాముని ప్రియురాలు, అమితమైన సౌందర్యం కలది, చంద్రాకార కర్ణభూషణములు కలది,
పాశాంకుశ ధనుర్బాణధరాం ధ్యాయేత్ త్రిలోచనాం (దండించుటకు) పాశాంకుశమును, ధనస్సు బాణములను ధరించునది
ధ్యాయతి ఏవం వర్ణలక్షం జపతర్పణ తత్పరః అటువంటి పార్వతీ స్వరూపియైన సీతను అక్షరలక్ష జపము శ్రద్ధతో చేసి
బిల్వపత్రైః ఫలైః పుష్పైః తిల-ఆజ్యైః పంకజైః హునేత్ బిల్వపత్రములతో, ఫలములతో, పుష్పములతో, నువ్వులు నెయ్యితో, తామర పుష్పములతో హోమము చేయవలెను
స్వయం ఆయాంతి నిధయః సిద్ధయః చ సుర ఈప్సితాః స్వయముగా వచ్చు నిధివంటివాడు, సిద్ధి కలిగించువాడు మఱియు దేవతలకు కూడా కోరినది ఇచ్చువాడు
పునః అష్టాక్షరస్య అథ బ్రహ్మ గాయాత్ర రాఘవాః అష్టాక్షర మంత్రముతో పరబ్రహ్మయైన రాఘవుని మఱల కీర్తించెదను
ఋష్యాదయస్తు విజ్ఞేయాః శ్రీబీజం మమ శక్తికం ఋష్యాదులను తెలుసుకొని శ్రీం బీజముతో నేను శక్తిస్వరూపుడైన
తత్ ప్రీత్యైవినియోగః చ మంత్రార్ణైః అంగ కల్పనా రాముని ప్రీతికొఱకు మంత్రార్ణములు విభజించి వాటితో అంగన్యాసము కల్పించెదను
కేయూర అఙ్గద కంకణైః మణిగణైః విద్యోతమానం సదా కేయూర కంకణములు మణిగణములు శరీరాంగములందు ధరించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న

రామం పార్వణ చంద్రకోటి సదృశః ఛత్రేణ వై రాజితం

కోటి పూర్ణచంద్రులతో సమానమైన గొడుగుతో విరాజిల్లుచున్న రాముని
హేమ స్తంభ సహస్ర షోడశయుతే మధ్యే మహా మణ్డపే పదహారు వేల స్తంభములు గల తెల్లని మహా మండపము మధ్యమున
దేవేశం భరతాదిభిః పరివృతం రామ భజే శ్యామలం దేవేంద్రుడు, భరతుడు మొదలైనవారు చుట్టూ ఉన్న నీలమేఘశ్యాముడైన శ్రీరాముని భజించుచున్నాను
2.16 అష్టాక్షర రామ మంత్ర మహత్యము
కిం మంత్రైః బహుభిః వినశ్వరఫలైః ఆయాస సాధ్యైః వృథా (రామ మంత్రము కాకుండా ఇతరములైన) అనేక విధములైన మంత్రములు ఎందులకు? అవన్నీ నశించిపోయే ఫలములే ఇవ్వగలిగినవి. పైగా అవి సాధించుటకు ఎంతో ఆయాస ప్రయాసలు పడవలెను. ఆ ఫలములన్నీ వృథాయే.
కించిత్ లోభ వితాన మాత్ర విఫలైః సంసార దుఃఖ ఆవహైః కొంత ప్రలోభపఱచి వికటితమై చివరకు నిష్ఫలము అయి సంసార దుఃఖమును తెచ్చిపెట్టేవి.
ఏకః సన్నపి సర్వమంత్రఫలదో లోభాది దోషోః జితః ఒకేఒక్క మంత్రముతో సర్వమంత్రముల ఫలములు ఇచ్చునది, లోభము (ఆశ) మొదలైన దోషములు జయింపచేయునది,
శ్రీరామః శరణం మమ ఇతి సతతం మంత్రో అయం అష్టాక్షరః “శ్రీరామః శరణం మమ” అనే ఈ అష్టాక్షరమంత్రమునే సర్వదా జపించదగినది.
ఏవం అష్టాక్షరః సమ్యక్ సప్తధా పరికీర్తితః ఈ అష్టాక్షర మంత్రము చక్కగా ఏడు విధములుగా చెప్పబడినది

1. ఓం రామచంద్రాయనమః, ఓం రామభద్రాయనమః
2. హ్రీం రామచంద్రాయనమః, హ్రీం రామభద్రాయనమః
3. శ్రీం రామచంద్రాయనమః, శ్రీం రామభద్రాయనమః
4. క్లీం రామచంద్రాయనమః, క్లీం రామభద్రాయనమః
5. ఐం రామచంద్రాయనమః, ఐం రామభద్రాయనమః
6. రాం రామచంద్రాయనమః, రాం రామభద్రాయనమః
7. శ్రీరామః శరణం మమ
2.17 తొమ్మిది అక్షరముల రామ మంత్రములు
రామ సప్తాక్షరో మంత్ర ఆద్యంతే తార సంయుతః రామ సప్తాక్షర మంత్రములకు మొదలు చివర “ఓం” జతపఱచినచో
నవ అర్ణో మంత్రరాజః స్యాత్ శేషం షడ్వర్ణవత్ న్యసేత్ నవాక్షర మంత్రములు అగును, చివరకి వీటికి కూడా షట్ వర్ణ మంత్రములకు వలె న్యాసము చెప్పుకొనవలెను.

ఇవి నవాక్షర మంత్రములు -
1. ఓం రామచంద్రాయనమః ఓం
2. ఓం రామభద్రాయనమః ఓం
2.18 పది అక్షరముల రామ మంత్రము
జానకీ వల్లభం జ్ఞేంతం వహ్నేః జాయా హుం ఆదికం జానకీ వల్లభం అంతమున ఆయ (జ్ఞే) మఱియు అగ్నికి భార్య (అనగా స్వాహా దేవత) ఆ ముందు హుం చేర్చినచో “జానకీ వల్లభాయ హుం స్వాహా”
దశ అక్షరో అయం మంత్రః స్యాత్ సర్వ అభీష్ట ఫలప్రదః ఈ దశాక్షర మంత్రము సర్వ శుభేచ్ఛలు ఫలప్రదము చేయును
దశ అక్షరస్య మంత్రస్య వసిష్ఠో అస్య ఋషిః ఈ పది అక్షరముల మంత్రములకు వసిష్ఠుడు ఋషి
విరాట్ ఛందో అస్య దేవతా రామః సీతాపాణిపరిగ్రహః విరాట్ ఛందస్సు మఱియు సీతను పాణిగ్రహణము చేసిన రాముడే దేవత
ఆద్యో బీజం ద్విఠః శక్తిః కామేన అంగం క్రియా మతా దీనికి ఆది బీజములలో మొదటిదైన రాం బీజము, ద్విఠ (స్వాహా) శక్తి, కామబీజముచే (క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః) అంగన్యాస క్రియకు తెలుసుకొనవలెను

[ఆదిబీజములు = స్వ (రాం) , కామ (క్లీం), శక్తి (హ్రీం), వాక్ (ఐం), లక్ష్మీ (శ్రీం), స్తవ (ఓం) ]
శిరో లలాట భ్రూమధ్యే తాలు కర్ణేషు హృది అపి శిరస్సు, నుదురు, భ్రూమధ్యము, తాలు (అనగా నోరు మఱియు ముక్కు మధ్యమున), చెవులు, హృదయము మఱియు
నాభి ఊరు జాను పాదేషు దశార్ణాత్ విన్యసేత్ మనోః నాభి, తొడలు, మోకాళ్ళు, పాదములు - ఈ పది స్థానాలలో (దశాక్షర మంత్రములోని) పది అక్షరములతో (కర మఱియు హృదయ) న్యాసము చెప్పుకొనవలెను
2.19 రామ ధ్యానము
అయోధ్యానగరే రత్నచిత్రే సౌవర్ణ మణ్డపే అయోధ్యానగరమందు రత్నములతో చిత్రములతో కూడిన సువర్ణ మండపమునందు
మందారపుష్పైః ఆబద్ధ వితానే తోరణాంచితే సింహాసనే సమాసీనం పుష్పక ఉపరి రాఘవం మందారపుష్పములతో కట్టిన తోరణములు అంచులు కలిగిన పుష్పక సింహాసనము మీద చక్కగా కూర్చుని ఉన్న రాఘవుని
రక్షోభిః హరిభిః దేవైః దివ్యయానగతైః శుభైః రాక్షసులచేత, వానరులచేత, దేవతలచేత, దివ్య విమానములయందు ఉన్నవారిచే, శుభకరులచే
సంస్తూయమానం మునిభిః ప్రహ్వైః చ పరిసేవితం మునులుచే చక్కగా స్తుతింపబడినవాడు, దోసిళ్ళతో నమస్కరించబడినవాడు, మఱియు భక్తితో సేవింపబడినవాడు,
సీత అలంకృత వామ అంగం లక్ష్మణేన సమన్వితం ఎడమ ప్రక్కన సీతా సహిత అలంకృతుడు, లక్ష్మణునితో కూడియున్నవాడు,
శ్యామం ప్రసన్న వదనం సర్వ ఆభరణ భూషితం శ్యామవర్ణుడు, ప్రసన్నమైన ముఖము కలవాడు, అన్ని ఆభరణములు ధరించిన రాముని
ధ్యాయాత్ ఏవం జపేత్ మంత్రం వర్ణ లక్షం అనన్య ధీ ధ్యానిస్తూ దశాక్షర మంత్రమును అనన్య బుద్ధితో అక్షర లక్ష జపించవలెను
2.20 పది అక్షరముల మరో రామ మంత్రము
రామం జ్ఞేంతం ధనుష్పాణయే అంతః స్యాత్ వహ్ని సుందరీ రామం చివర ఆయ(జ్ఞే) తరువాత ధనుష్పాణయే ఆ చివర అగ్ని యొక్క భార్యయైన స్వాహా (అనగా “రామాయ ధనుష్పాణయే స్వాహా”)
దశ అక్షరో అయం మంత్రః స్యాత్ మునిః బ్రహ్మ విరాట్ స్మృతః ఛందస్తు, దేవతా ప్రోక్తో రామో రాక్షసమర్దనః ఈ దశాక్షర మంత్రమునకు బ్రహ్మ ఋషి, విరాట్ ఛందస్సు, రాక్షససంహారియైన రాముడే దేవత అని చెప్పబడెను
శేషం తు పూర్వవత్ కుర్యాత్ చాపబాణధరం స్మరేత్ మిగిలినవన్నీ (అంగన్యాసం) ఇదివరకు చెప్పబడినట్లుగా తెలుసుకొని ధనుర్బాణములు ధరించిన రాముని స్మరించవలెను.
2.21 పదకొండు అక్షరముల రామ మంత్రములు
తార మాయా రమా అనంగ వాక్ స్వబీజైః చ షడ్విధః తారకము (ఓం), మాయా (హ్రీం), రమా (శ్రీం), అనంగ (క్లీం), వాక్ (ఐం), స్వబీజ (రాం) బీజాక్షరములతో ఆరు విధములుగా
దశ అర్ణో మంత్ర రాజస్యాత్ రుద్రవర్ణాత్మకో మనుః పది అక్షరాల మంత్రముల సహితముగా ఏకాదశ మంత్రములు అగును

1. ఓం రామాయ ధనుష్పాణయే స్వాహా
2. హ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహా
3. శ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహా
4. క్లీం రామాయ ధనుష్పాణయే స్వాహా
5. ఐం రామాయ ధనుష్పాణయే స్వాహా
6. రాం రామాయ ధనుష్పాణయే స్వాహా
శేషం షట్ వర్ణవత్ జ్ఞేయం న్యాస ధ్యానాదికం బుధైః మిగిలినవి (ఋష్యాదులు), న్యాస ధ్యానాదులు ఆరు అక్షరముల మంత్రములకు (ఓం రామాయ నమః మొదలగునవి) వలె బుధులు తెలుసుకొనవలెను
2.22 పన్నెండు అక్షరముల రామ మంత్రములు
ద్వాదశ అక్షర మంత్రస్య శ్రీరామో ఋషిః ఉచ్యతే, జగతీ ఛంద ఇతి ఉక్తం శ్రీరామో దేవతా మతః ద్వాదశ అక్షర మంత్రములకు శ్రీరాముడే ఋషి అని చెప్పబడెను, జగతీ ఛందస్సు అని, శ్రీరాముడే దేవత అని తెలుసుకొనవలెను
ప్రణవో బీజం ఇతి ఉక్తః క్లీం శక్తిః హ్రీం చ కీలకం ప్రణవమే (ఓం) బీజము అని, క్లీం శక్తి అని, మఱియు హ్రీం కీలకం అని చెప్పబడెను
మంత్రేణ అంగాని విన్యస్య శిష్టం పూర్వవత్ ఆచరేత్ మంత్రముతో అంగములు (కర, హృదయ) న్యాసములయొక్క విధి విధానము పూర్వము చెప్పబడిన మంత్రములకు వలె ఆచరించవలెను
తారం మాయాం సముచ్చ ఆర్య భరతాగ్రజ ఇతి అపి తారకము (ఓం), మాయా (హ్రీం) వేదోక్తస్వర బీజములతో కూడి ఆర్యుడైన భరతాగ్రజ అని
రాం క్లీం వహ్నిజాయ అంతం మంత్రో అయం ద్వాదశ అక్షరః రాం (స్వబీజము), క్లీం (అనంగ) బీజములతో కూడి మఱియు అగ్నియొక్క భార్యయైన స్వాహాదేవి (అనగా స్వాహా అను శబ్దము) అంత్యమున చేర్చినవి ఈ ద్వాదశాక్షర మంత్రములు

1) ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహా
ఓం హృత్ భగవతే రామచంద్రభద్రౌ చ జ్ఞేయుతౌ 2) ఓం నమో భగవతే రామచంద్రాయ (మరియు) ఓం నమో భగవతే రామభద్రాయ
అర్క అర్ణో ద్వివిధో అపి అస్య ఋషి ధ్యానాది పూర్వవత్, ఛందస్తు జగతీ చ ఏవ మంత్రార్ణైః అంగ కల్పనా అగ్నిబీజాక్షరములతో రెండు విధములైన ఈ పన్నెండు అక్షరముల మంత్రములకు కూడా ఋషి, ధ్యానాదులు పూర్వము వలె చెప్పవలెను, జగతీ ఛందస్సు అని, మఱియు ఆయా మంత్రాక్షరములుతో అంగన్యాసములు కల్పించుకొనవలెను
2.23 పదమూడు అక్షరముల రామ మంత్రము
శ్రీరామ ఇతి పదం చ ఉక్త్వా జయరామ తతః పరం శ్రీరామ అనే పదమును, దాని తరువాత జయరామ అని చెప్పి
జయద్వయం వదేత్ ప్రాజ్ఞో రామ ఇతి మనురాజకః ఆపైన జయ అనునది రెండుసార్లు చెప్పి ప్రాజ్ఞులైనవారు మనుషులలో ఉత్తముడైన రామ అని చివర చేర్చుకొనినచో

“శ్రీరామ జయరామ జయ జయ రామ” అను మంత్రము అగును.
త్రయో దశ అర్ణ ఋష్యాది పూర్వవత్ సర్వకామదః ఈ పదమూడు అక్షరముల మంత్రమునకు ఋష్యాదులు పూర్వపు మంత్రము వలె చెప్పుకొని సర్వశుభేచ్ఛలను పొందవచ్చును
పదద్వయ ద్విర ఆవృత్తేః అంగం ధ్యానం దశ అర్ణవత్ పదద్వయములను చెప్పుకొనుచూ దశాక్షర మంత్రము వలె అంగ న్యాస ధ్యానములు చెప్పుకొనవలెను.

[శ్రీరామ రామ హృదయాయ నమః, శ్రీరామ జయరామ శిరసే స్వాహా, మొదలగునవి ఈ విధముగా ఏర్పాటు చేసుకొనవచ్చును.]
2.24 పద్నాలుగు అక్షరాల రామ మంత్రములు
తారాది సహితః సః అపి స చతుర్దశ వర్ణకః తారకము (ఓం), మాయా (హ్రీం), రమా (శ్రీం), అనంగ (క్లీం), వాక్ (ఐం), స్వబీజ (రాం) బీజాక్షరములతో పదమూడు అక్షరాల మంత్రము పద్నాలుగు అక్షరాల మంత్రములు అగును

ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ
హ్రీం శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీం శ్రీరామ జయరామ జయ జయ రామ
క్లీం శ్రీరామ జయరామ జయ జయ రామ
ఐం శ్రీరామ జయరామ జయ జయ రామ
రాం శ్రీరామ జయరామ జయ జయ రామ
2.25 పదిహేను అక్షరాల రామ మంత్రము
త్రయోదశ అర్ణం ఉచ్చ ఆర్య పశ్చాత్ రామ ఇతి యోజయేత్ పదమూడు అక్షరాల మంత్రముకు చివర రామ చేర్చినచో
స వై పంచదశ అర్ణస్తు జపతాం కల్ప భూరుహః అది పదిహేను అక్షరాల మంత్రము అగును, అది జపించువారికి కల్పవృక్షమగును

“శ్రీరామ జయరామ జయ జయ రామ రామ”
2.26 పదహారు అక్షరాల రామ మంత్రము
నమః చ సీతాపతయే రామాయ ఇతి హనద్వయం నమః మఱియు సీతాపతయే రామాయ అని హన రెండుసార్లు చెప్పి
తతస్తు కవచ అస్త్ర అంతః షోడశ అక్షర ఈరితః దాని చివర కవచము (హుం ఫట్) చేర్చిన పదహారు అక్షరముల మంత్రము అగును

“నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్”
తస్య అగస్త్య ఋషిః ఛందో బృహతీ దేవతా చ సః ఆ మంత్రమునకు అగస్త్యుడు ఋషి అని, బృహతీ ఛందస్సు, శ్రీరాముడు దేవత,
రాం బీజం శక్తిః అస్త్రం చ కీలకం హుం ఇతి ఈరితం రాం బీజము, ఫట్ శక్తి మఱియు హుం కీలకం అని చెప్పబడెను
ద్వి పంచత్రి చతుః వర్ణైః సర్వైః అంగం న్యసేత్ క్రమాత్ ఈ మంత్రములోని రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరములు జతచేసుకొని క్రమముగా అంగములు చెప్పుకొనవలెను
2.27 పదిహేడు అక్షరాల రామ మంత్రములు
తారాది సహితః సః అపి మంత్రః సప్త దశ అక్షరః తారకము (ఓం), మాయా (హ్రీం), రమా (శ్రీం), అనంగ (క్లీం), వాక్ (ఐం), స్వబీజ (రాం) బీజాక్షరములతో పదహారు అక్షరాల మంత్రము పదిహేడు అక్షరాల మంత్రములు అగును

ఓం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
హ్రీం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
శ్రీం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
క్లీం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
ఐం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
రాం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్
[హుం ఫట్ చేయువాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము, దుఃఖములను తొలగించువాడు]
2.28 పద్దెనిమిది అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే రాం జ్ఞేంతం మహా తతః ఓం నమో భగవతే రామాయ మహా తరువాత
పురుషాయ పదం పశ్చాత్ హృత్ అంతో అష్టాదశాక్షరః పురుషాయ పదము తరువాత హృదయము (నమః) చివర చేర్చిన అష్టాక్షర మంత్రము అగును

“ఓం నమో భగవతే రామాయ మహా పురుషాయ నమః”
విశ్వామిత్రో మునిః ఛందో గాయత్రం దేవతా చ సః ఆ మంత్రములకు విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందస్సు, రాముడు దేవత
2.29 పంతొమ్మిది అక్షరాల రామ మంత్రములు
కామాది సహితః సః అపి మంత్ర ఏకోనవింశకః కామ (శ్రీం) మొదలగు బీజాక్షరములు చేర్చినచో పంతొమ్మిది అక్షరముల మంత్రములు అగును

“ఓం శ్రీం నమో భగవతే రామాయ మహా పురుషాయ నమః”
“ఓం హ్రీం నమో భగవతే రామాయ మహా పురుషాయ నమః”
“ఓం క్లీం నమో భగవతే రామాయ మహా పురుషాయ నమః”
“ఓం ఐం నమో భగవతే రామాయ మహా పురుషాయ నమః”
2.30 ఇరవై అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే రామాయ ఇతి పదం వదేత్ ఓం (తారకము) నమో భగవతే రామాయ అని పదము పలికి
సర్వ శబ్దం సముచ్చ ఆర్య సౌభాగ్యం దేహి మే వదేత్ సర్వ అనే శబ్దం కలిపి బాగుగా సౌభాగ్యం దేహి మే అని చెప్పి
వహ్నిజాయాం తథా ఉచ్చార్య మంత్రో వింశ అర్ణకో మతః (అగ్నిదేవుని భార్యయైన స్వాహాదేవిని సూచిస్తూ) స్వాహా అని చేర్చి ఇరవై అక్షరాల మంత్రము తెలుసుకొనవలెను

“ఓం నమో భగవతే రామాయ సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహా”
2.31 ఇరవై ఒకటి అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే రామాయ సకలం వదేత్ ఓం (తారకము) నమో భగవతే రామాయ సకలం అని పలికి
ఆపన్నివారణాయ ఇతి వహ్నిజాయాం తతో వదేత్ ఆపన్నివారణాయ అని స్వాహా అని చెప్పి
ఏకవింశ అర్ణకో మంత్రః సర్వాభీష్టఫలప్రదః ఇరవై ఒకటి అక్షరాల మంత్రము అనుకొనినచో సర్వశుభేచ్ఛలు సిద్ధించును

“ఓం నమో భగవతే రామాయ సకలాపన్నివారణాయ స్వాహా”
2.32 ఇరవై రెండు అక్షరాల రామ మంత్రము
తారం రమా స్వబీజం చ తతో దాశరథాయ చ ఓం (తారకము) శ్రీం (రమా) రాం (స్వబీజం) మఱియు దాశరథాయ అని మఱియు
తతః సీతావల్లభాయ సర్వాభీష్టపదం వదేత్ దానికి సీతావల్లభాయ సర్వాభీష్ట అనే పదము చెప్పి
తతో దాయ హృదంతో అయం మంత్రో ద్వావింశత్ అక్షరః దానికి దాయ కూడి నమః (హృదయము) అని చేర్చి ఇరవై రెండు అక్షరాల మంత్రము చేసుకొనవలెను

“ఓం శ్రీం రాం దాశరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః”
2.33 ఇరవై మూడు అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే వీర రామాయ సంవదేత్ ఓం (తారకము) నమో భగవతే వీర రామాయ అని చక్కగా చెప్పుకొని
సకల శత్రూన్ హన ద్వంద్వం వహ్ని జాయాం తతో వదేత్ సకల శత్రూన్ తరువాత హన శబ్దము రెండు సార్లు చెప్పి స్వాహా అని చెప్పినచో
త్రయోవింశత్ అక్షరో మంత్రః సర్వశత్రునిబర్హణః ఈ ఇరవై మూడు అక్షరముల మంత్రము సర్వ (అంతః) శత్రువులను నశింపచేయును

“ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రూన్ హన హన స్వాహా”
విశ్వామిత్రో మునిః ప్రోక్తో గాయత్రీ ఛంద ఉచ్యతే ఈ మంత్రమునకు విశ్వామిత్రుడు ఋషి అని, గాయత్రీ ఛందస్సు అని చెప్పబడెను
దేవతా వీరరామో అసౌ బీజాద్యాః పూర్వవత్ మతాః దీనికి వీరరాముడే దేవత అని, బీజాదులు (బీజము, శక్తి, కీలకం) పూర్వ మంత్రములకు వలె తెలుసుకొనవలెను
మూలమంత్ర విభాగేన న్యాసాన్ కృత్వా విచక్షణః విచారణపరులు మూలమంత్రమును (ఆరు పదములుగా) విభజించి (కర, హృదయ) న్యాసములు చేయవలెను
2.34 వీర రాముని ధ్యానము
శరం ధనుషి సంధాయ తిష్ఠంతం రావణ ఉన్ముఖం బాణమును ధనుస్సుకు సంధించి రావణుని వైపు చూచుచున్నట్లు ఉన్న,
వజ్రపాణిం రథ ఆరూఢం రామం ధ్యాత్వా జపేత్ మనుం హస్తమునందు వజ్ర (ఆయుధమును) ధరించి, రథమును అధిరోహించిన రాముని ధ్యానము చేయవలెను.
2.35 ఇరవై నాలుగు అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే శ్రీరామాయ పదం వదేత్ ఓం (తారకము) నమో భగవతే శ్రీరామాయ అని చెప్పి
తారక బ్రహ్మణే చ ఉక్త్వా మాం తారాయ పదం వదేత్ తారక బ్రహ్మణే అని చెప్పి మఱియు మాం తారాయ (నన్ను తరింపచేయి) అని చెప్పి
నమః తారాత్మకో మంత్రః చతుర్వింశతి మంత్రకః నమః ఓం అని చేర్చిన మంత్రము ఇరవై నాలుగు అక్షరాల మంత్రమగును

“ఓం నమో భగవతే శ్రీరామాయ తారక బ్రహ్మణే మాం తారాయ నమః ఓం”
బీజాదికం యథా పూర్వం సర్వం కుర్యాత్ షట్ అర్ణవత్ బీజము మొదలగునవి ఏ విధముగా పూర్వము ఆరు అక్షరాల రామ మంత్రమునకు చెప్పబడెనో అన్నీ ఆ విధముగా తెలుసుకొనవలెను
2.36 ఇరవై ఐదు అక్షరాల రామ మంత్రము
కామః తారో నతిః చ ఏవ తతో భగవతే పదం క్లీం (కామ బీజము) ఓం (తారక బీజము) నమః కూడి భగవతే అను పదము
రామచంద్రాయ చ ఉచ్చ ఆర్య సకల ఇతి పదం వదేత్ రామచంద్రాయ కూర్చి సకల అనే పదముతో చెప్పుకొని
జన వశ్యకరాయ ఇతి స్వాహా కామాత్మకో మనుః జన వశ్యకరాయ స్వాహా అని చేర్చగా ఇది కామాత్మక మంత్రము
సర్వవశ్యకో మంత్రః పంచవింశతి వర్ణకః సర్వ వశీకరణ మంత్రము ఇరవై ఐదు అక్షరములు కలది

“క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహా”
2.37 ఇరవై ఆరు అక్షరాల రామ మంత్రము
ఆదౌ తారేణ సంయుక్తౌ మంత్రః షట్ వింశత్ అక్షరః (ఈ ఇరవై ఐదు అక్షరాల రామ మంత్రమునకు) మొదలున ఓం యుక్తముగా చేర్చినచో ఇది ఇరవై ఆరు అక్షరాల మంత్రము అగును.

“ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహా”
2.38 ఇరవై ఏడు అక్షరాల రామ మంత్రము
అంతే అపి తార సంయుక్తః సప్త వింశతి వర్ణకః చివర కూడా ఓం (తారకము) యుక్తముగా చేర్చినచో ఇది ఇరవై ఏడు అక్షరాల మంత్రము అగును.

“ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహా ఓం”
2.39 ఇరవై ఎనిమిది అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే రక్షోఘ్న విశదాయ చ ఓం (తారకము) నమో భగవతే రక్షోఘ్న (నశింపచేయు) విశదాయ (స్పష్టముగా) మఱియు
సర్వవిఘ్నాన్ అంతః సమ ఉచ్చ ఆర్య నివారాయ పదద్వయం సర్వ విఘ్నాన్ చివరన కూర్చి నివారాయ అను పదము రెండు సార్లు చేర్చిన
స్వాహా అంతో మంత్రరాజో అయం అష్టావింశతి వర్ణకః స్వాహా అనే అంత్యముతో ఈ మంత్రరాజము ఇరవై ఎనిమిది అక్షరాలు కలది.

“ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వవిఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహా”
2.40 ఇరవై తొమ్మిది అక్షరాల రామ మంత్రము
అంతే తారేణ సంయుక్త ఏకోన త్రింశత్ అక్షరః (ఈ ఇరవై ఎనిమిది అక్షరాల మంత్రమునకు) చివర ఓం (తారకము) యుక్తముగా చేర్చినచో ఇది ఇరవై తొమ్మిది అక్షరాల మంత్రమగును.

“ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వవిఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహా ఓం”
2.41 ముప్పది అక్షరాల రామ మంత్రము
ఆదౌ స్వబీజ సంయుక్తః త్రింశత్ వర్ణాత్మకో మనుః (ఈ ఇరవై తొమ్మిది అక్షరాల మంత్రమునకు) ముందు రాం (స్వబీజము) యుక్తముగా చేర్చినచో ఇది ముప్పది అక్షరాల మంత్రమగును.

“రాం ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వవిఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహా ఓం”
2.42 ముప్పది ఒకటి అక్షరాల రామ మంత్రము
అంతే అపి తేన సంయుక్త ఏక త్రింశతాత్మకః స్మృతః (ఈ ముప్పది అక్షరాల మంత్రమునకు) చివర కూడా రాం (స్వబీజము) యుక్తముగా చేర్చినచో ఇది ముప్పది ఒక్క అక్షరాల మంత్రముగా చెప్పబడును.

“రాం ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వవిఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహా ఓం రాం”
2.43 ముప్పది రెండు అక్షరాల రామ మంత్రము
రామభద్ర మహేష్వాస రఘువీర నృపోత్తమ మహత్తర ధనుర్ధారుడవైన రామభద్రా! రాజులలో ఉత్తముడవైన రఘువీరా!
భో దశాస్యాంతకాస్మాకం శ్రియం దాపయ దేహి మే దశముఖుడిని అంతము చేసినవాడా! మాకు దేహమునందు శ్రేయస్సు ప్రసాదించుము.

NOTE: ఈ రెండు పాదములు కలిపి ముప్పది రెండు అక్షరాల మంత్రము -

రామభద్ర మహేష్వాస రఘువీర నృపోత్తమ
భో దశాస్యాంతకాస్మాకం శ్రియం దాపయ దేహి మే
అనుష్టుభ ఋషీ అనుష్టుప్స ఛందో రామః దేవతా ఈ మంత్రమునకు అనుష్టుభ ఋషి అని, అనుష్టుప్స ఛందస్సు అని, రాముడు దేవత అని,
రాం బీజం అస్య యం శక్తిః ఇష్టార్థే వినియోజయేత్ రాం బీజము అని, యం శక్తి అని, ఇష్టార్థము సిద్ధించుట కొఱకు ఈ మంత్రమును వినియోగించవలెను.
పాదం హృది చ విన్యస్య పాదం శిరసి విన్యసేత్ ఈ మంత్రములోని మొదటి పాదముతో హృదయాయ నమః అని, రెండవ పాదముతో శిరసే స్వాహా అని,
శిఖాయాం పంచభిః యస్య త్రివర్ణైః కవచం న్యసేత్ అందు ఐదు అక్షరములుతో శిఖాయై వౌషట్, మూడు అక్షరములతో కవచాయ హుం అని,
నేత్రయోః పంచవర్ణైః చ దాపయేత్ అస్త్రం ఉచ్యతే ఐదు అక్షరములతో నేత్రత్రయాయ వౌషట్ మఱియు “దాపయ” అంటూ అస్త్రాయ ఫట్ అని న్యాసము చెప్పుకొనవలెను.
2.44 రామ ధ్యానము
చాపబాణధరం శ్యామం స సుగ్రీవ విభీషణం ధనుర్బాణములు ధరించినవాడు, నీల వర్ణము కలిగినవాడు, సుగ్రీవ విభీషణ సహితుడు,
హత్వా రావణమాయాంతం కృతః త్రైలోక్య రక్షణం రావణుని మాయను అంతము చేసి వానిని (అనగా కామము అనే అంతఃశత్రువును) సంహరించి ముల్లోకములను రక్షించినవాడు
రాంచంద్రం హృది ధ్యాత్వా దశలక్షం జపేత్ మనుం (అటువంటి) రామచంద్రుని హృదయమునందు ధ్యానిస్తూ పదిలక్షలు రాముని జపించవలెను
2.45 రామ గాయత్రీ మంత్రము
వదేత్ దాశరథాయ ఇతి విద్మహే ఇతి పదం తతః దాశరథాయ అని విద్మహే అని పదములు చెప్పి వాటితో
సీతాపదం సముత్ ధృత్య వల్లభాయ తతో వదేత్ సీతా అనే పదమును వల్లభాయ అనే పదమును బాగుగా సంధించి (అనగా మనస్సులో సీతారాముల రూపమును ధ్యానిస్తూ) చెప్పవలెను మఱియు
ధీమహి ఇతి వదేత్ తన్నో రామః చ అపి ప్రచోదయాత్ ధీమహి అని చెప్పుచూ తన్నో రామః ప్రచోదయాత్ అని కూడా జతచేసుకొనవలెను

“దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నో రామః ప్రచోదయాత్”
2.46 బీజాద్య రామ గాయత్రీ మంత్రము
తారాదిః ఏషా గాయత్రీ ముక్తిం ఏవ ప్రయచ్ఛతి ఆద్యమున ఓంకారము చేర్చినచో ఈ (రామ) గాయత్రీ మంత్రము ముక్తినే ప్రసాదించును
మాయాదిః అపి వైదుష్యం రామాదిః చ శ్రియం పదం మాయా (హ్రీం) ఆద్యమున చేర్చినచో గొప్ప విద్వత్తు ఇచ్చును, రాం (స్వబీజము) ఆద్యమున చేర్చినచో సంపద కలుగచేయును
మదనేన అపి సంయుక్తా సమ్మోహయతి మేదినీం క్లీం (మదన / కామ) బీజము కూడా చక్కగా కూర్చి జపించినచో ఈ మంత్రముచే సమ్మోహనా శక్తి లభించును

“ఓం హ్రీం రాం క్లీం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నో రామః ప్రచోదయాత్”
NOTE: ఇది ఇరవై తొమ్మిది (29) అక్షరాల మంత్రము.
పంచ త్రీణి షట్ అర్ణైః చ త్రీణి చత్వారి వర్ణకైః చత్వారి చ చతుః వర్ణైః అంగన్యాసం ప్రకల్పయేత్ ఐదు, మూడు, ఆరు అక్షరములతో మరియు మూడు, నాలుగు అక్షరములతో క్రమముగా నాలుగు మఱియు మిగిలిన నాలుగు అక్షరములతో అంగన్యాసము కల్పించుకొనవలెను

అనగా,
దాశరథాయ హృదయాయ నమః, విద్మహే శిరసే స్వాహా, సీతావల్లభాయ శిఖయాయ వౌషట్, ధీమహి కవచాయ హుం, తన్నో రామః నేత్రత్రయాయ వౌషట్, ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్, ఓం హ్రీం రాం క్లీం - ఇతి దిగ్బంధః / ఇతి దిగ్విమోకః
బీజధ్యానాదికం సర్వం కుర్యాత్ షట్ వర్ణవత్ క్రమాత్ బీజము, ధ్యానము మొదలగునవి ఆరు అక్షరాల రామ మంత్రమునకు వలె క్రమముగా చేసుకొనవలెను
2.47 నలుబది ఏడు అక్షరాల రామ మంత్రము
తారం నమో భగవతే చతుర్థ్యాం రఘునందనం ఓం నమో భగవతే రఘునందనాయ
రక్షోఘ్నవిశదం తద్వత్ మధుర ఇతి వదేత్ తతః రక్షోఘ్నవిశదాయ మధుర
ప్రసన్న వదనం జ్ఞ అంతం వదేత్ అమిత తేజసే ప్రసన్న వదనాయ అమిత తేజసే
బలరామౌ చతుర్థ్య అంతౌ విష్ణు జ్ఞ అంతం నతిః తతః బలరామాయ విష్ణవే నమః ఓం
ప్రోక్తో మాలా మనుః సప్త చత్వారింశద్భిః అక్షరైః అని చెప్పబడిన మాలాధారణ చేయదగు ఈ మంత్రమునకు నలుబది ఏడు (47) అక్షరములు.

“ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్నవిశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలరామాయ విష్ణవే నమః ఓం”
ఋషిః ఛందో దేవతా ఆది బ్రహ్మానుష్టుభ రాఘవాః ఈ మంత్రమునకు బ్రహ్మ ఋషి, అనుష్టుభ ఛందస్సు, రాముడు దేవత
సప్త ఋతు సప్త దశ షట్ రుద్ర సంఖ్యైః షడంగం ఏడు, ఆరు, ఏడు, పది, ఆరు, పదకొండు సంఖ్యలలో ఈ మంత్రములోని ఆయా అక్షరములతో క్రమముగా షడంగ న్యాసము చెప్పుకొని
ధ్యానం దశాక్షరం ప్రోక్తం లక్షం ఏకం జపేత్ మనుం ధ్యానము పది అక్షరముల రామ మంత్రమునకు వలె చెప్పుకొని ఈ మంత్రమును ఒక లక్షసార్లు జపము చేయవలెను
2.48 సీతా షడక్షర మంత్రము
శ్రియం సీతాం చతుర్థి అంతాం స్వాహా అంతో అయం షట్ అక్షరః “శ్రీం సీతాయై స్వాహా” అనునది సీతా షడక్షర మంత్రము
జనకో అస్య ఋషిః ఛందో గాయత్రీ దేవతా మనోః ఈ మంత్రమునకు జనకుడు ఋషి, గాయత్రీ ఛందస్సు,
సీతా భగవతీ ప్రోక్తా శ్రీం బీజం నతిశక్తికం సీతా భగవతీయే దేవత, శ్రీం బీజము, నమః శక్తి అని చెప్పబడెను
కీలం సీతా చతుర్థ్య అంతం ఇష్టార్థే వినియోజయేత్ ‘సీతాయై’ అనునది కీలకం, ఈ మంత్రమును శుభేచ్ఛ పూరించుకొనుటకు వినియోగించుకొనవలెను
దీర్ఘ స్వరయుతాది ఏన షట్ అంగాని ప్రకల్పయేత్ (శ్రీం బీజముతో) దీర్ఘ స్వరయుక్తముగా (అనగా శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః వీటితో) షడంగములు బాగుగా కల్పించుకొనవలెను
స్వర్ణాభాం అంబుజకరాం రామ ఆలోకన తత్ పరాం [ధ్యానము] స్వర్ణకాంతితో వెలుగుచూ, చేతిలో పద్మము ధరించి, రాముడినే తదేకముగా ఆలోకనముగా చూచుచూ,
ధ్యాయేత్ షట్ కోణ మధ్యస్థ రామ అంక ఉపరి సంస్థితాం రాముని తొడపై కూర్చుని ఉన్న సీతాదేవిని షట్కోణ (చక్ర యంత్రము) మధ్యలో భావరూపముగా సంస్థాపించి ధ్యానము చేయవలెను
2.49 లక్ష్మణ సప్తాక్షర మంత్రము
లకారం తు సముద్ ధృత్య లక్ష్మణాయ నమో అంతకః “లం లక్ష్మణాయ నమః” అనునది ’ల’కార బీజమును చక్కగా ధరించిన (లక్ష్మణ సప్తాక్షర) మంత్రము ఇది.
అగస్త్య ఋషిరస్య అథ గాయత్రం ఛంద ఉచ్యతే ఈ మంత్రమునకు అగస్త్యుడు ఋషి, గాయత్రీ ఛందస్సు అని చెప్పబడెను
లక్ష్మణో దేవతా ప్రోక్తో లం బీజం శక్తిరస్య హి నమస్తు లక్ష్మణుడే దేవత, లం బీజము, మరియు శక్తి నమః అని,
వినియోగో హి పురుషార్థ చతుష్టయే చతుర్విధ పురుషార్థములు (ధర్మార్థకామమోక్షములు) సాధించుకొనుటకు వినియోగించుకొనవలెను
దీర్ఘభాజా స్వబీజేన షట్ అంగాని ప్రకల్పయేత్ లం బీజమును దీర్ఘస్వరయుక్తముగా (అనగా లాం, లీం, లూం, లైం, లౌం, లః వీటితో) షడంగములు బాగుగా కల్పించుకొనవలెను.
ద్విభుజం స్వర్ణ రుచిర తనుం పద్మ నిభ ఈక్షణం [ధ్యానము] రెండు (స్థిరమైన) భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, పద్మపత్రములవంటి నేత్రములు కలవాడు,
ధనుర్బాణధరం వందే రామ ఆరాధన తత్ పరం ధనుస్సు బాణములు ధరించినవాడు, ఎల్లప్పుడూ రామసేవాతత్పరుడైన లక్ష్మణుని నమస్కరించుచున్నాను.
2.50 భరత సప్తాక్షర మంత్రము
భకారం తు సముద్ ధృత్య భరతాయ నమో అంతకః “భం భరతాయ నమః” అనునది ’భ’కార బీజమును చక్కగా ధరించిన (భరత సప్తాక్షర) మంత్రము ఇది,
అగస్త్య ఋషిః అస్య అథ శేషం పూర్వవత్ ఆచరేత్ ఈ మంత్రమునకు అగస్త్యుడు ఋషి మఱియు మిగిలిన అంగములు పూర్వము (లక్ష్మణ మంత్రమునకు వలె) ఆచరించవలెను.
భరతం శ్యామలం శాంతం రామసేవా పరాయణం ధనుర్బాణధరం వీరం కైకేయీ తనయం భజే [ధ్యానము] శ్యామవర్ణము కలవాడు, శాంతుడు, రామసేవా పరాయణుడైన భరతుని, ధనుస్సు బాణములు ధరించినవాడు, వీరుడైన కైకేయీ తనయుడిని భజించుచున్నాను
2.51 శత్రుఘ్న సప్తాక్షర మంత్రము
శం బీజంతు సముద్ ధృత్య శత్రుఘ్నాయ నమో అంతకః “శం శత్రుఘ్నాయ నమః” అనునది ’శ’కార బీజమును భకారముతో చక్కగా ధరించిన (శత్రుఘ్న సప్తాక్షర) మంత్రము ఇది,
ఋషి ఆదయో యథాపూర్వం వినియోగో అరి నిగ్రహే ఋషి మొదలైన అంగములు ఇంతకు ముందు (లక్ష్మణ భరతులకు వలె) చెప్పుకొని శత్రువులను జయించుకొనుటకు ఈ మంత్రము చెప్పుకొనవలెను,
ద్విభుజం స్వర్ణ వర్ణాభం రామ సేవా పరాయాణం లవణాసుర హంతారం సుమిత్రాతనయం భజే [ధ్యానము] రెండు (స్థిరమైన) భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, రామసేవా పరాయణుడైన, లవణాసురుడుని సంహరించిన సుమిత్రా తనయుని భజించుచున్నాను.
2.52 హనుమ సప్తాక్షర మంత్రము
హృం హనుమాన్ చతుర్థ్యంత హృదంతో మంత్రరాజకః “హృం హనుమతే నమః” అనునది హృదాకారముతో హనుమంతుని మంత్రరాజము
రామచంద్ర ఋషిః ప్రోక్తో యోజయేత్ పూర్వవత్ క్రమాత్ రామచంద్రుడు ఋషి మఱియు ఇతర అంగములు పూర్వపు మంత్రములకు వలె చెప్పుకొనవలెను,
ద్విభుజం స్వర్ణ వర్ణాభం రామ సేవా పరాయణం మౌంజీ కౌపీన సహితం మాం ధ్యాయేత్ రామ సేవకం - ఇతి. [ధ్యానము] రెండు (స్థిరమైన) భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, రామసేవా పరాయణుడైన, (ధృఢముగా నడుము చుట్టూ చుట్టుకున్న) మౌంజీ కౌపీనము సహితుడైన రామ సేవకుడగు హనుమంతుని నేను ధ్యానించుచున్నాను.

మూడవ అధ్యాయము - రామ యంత్రము, పూజాపీఠము

3.1 పూజాపీఠము గురించి హనుమంతుని పరిప్రశ్నించుట
సనకాద్యా మునయో హనూమంతం పప్రచ్ఛుః - సనకుని ప్రముఖముగా చేసుకొని మునులు హనుమంతుని వినయముగా ప్రశ్నించిరి -
ఆంజనేయ మహాబల పూర్వోక్త మంత్రాణాం పూజాపీఠం అనుబ్రూహీతి, ఆంజనేయా! మహాబలా! పూర్వము చెప్పిన మంత్రములకు పూజాపీఠము మాకు వివరించుము.
హనూమాన్ హ ఉవాచ - హనుమంతుడు ఈ విధంగా చెప్పెను -
3.2 యంత్రములోని షట్కోణము
ఆదౌ షట్కోణం తన్మధ్యే రామబీజం సశ్రీకం, ముందుగా షట్కోణం (hexagon) లిఖించి, దాని మధ్యలో రాం మఱియు శ్రీం బీజాక్షరములు వ్రాసి,
తత్ అథోభాగే ద్వితీయాంతం సాధ్యం, దాని క్రింద భాగంలో ద్వితీయ విభక్తి అంత్యముతో (“రామం”) సాధ్యమును వ్రాసి,
బీజ ఊర్ధ్వభాగే షష్ట్యంతం సాధకం, బీజముల పైభాగములో షష్ఠి విభక్తి అంత్యముతో (“రామస్య”) సాధకమును వ్రాసి,
పార్శ్వే దృష్టిబీజే, ప్రక్కలందు దృష్టి బీజములను వ్రాసి,
తత్ పరితో జీవ ప్రాణశక్తివశ్యబీజాని, వాటి చుట్టూ జీవ, ప్రాణ, శక్తి, వశ్య బీజములు వ్రాసి,
తత్ సర్వం సమ్ముఖ ఉన్ముఖాభ్యాం ప్రణవాభ్యాం వేష్టనం, వాటన్నీ ముందు వెనుక ముఖభాగములలో రెండు ప్రణవములతో చుట్టూ చుట్టి,
అగ్నీ ఈశానుః వాయువః పురః పృష్ఠేషు షట్ కోణేషు దీర్ఘభాంజి హృదయాది మంత్రాః షట్కోణమునందు ఆగ్నేయ, ఈశాన్య, వాయువ్య, తూర్పు, పడమర భాగములందు దీర్ఘ స్వర హృదయాది (అగ్నిబీజ రకార) మంత్రములతో
క్రమేణ రాం రీం రూం రైం రౌం రః ఇతి, క్రమముగా రాం, రీం, రూం, రైం, రౌం, రః అని వ్రాసి,
దీర్ఘ భాంజి తత్ యుక్త హృదయాది అస్త్రాంతం షట్ కోణ పార్శ్వే రమా మాయా బీజే, దీర్ఘ స్వరములతో యుక్తముగా హృదయాయ నుంచి అస్త్రాయ ఫట్ వరకు (న్యాస్యము కొరకు) షట్కోణముల ప్రక్కలందు రమా (శ్రీం), మాయా (హ్రీం) బీజాక్షరములను వ్రాసి,
కోణాగ్రే వారాహం హుం ఇతి, మొదటి కోణమునందు వారాహ బీజమైన హుం అని,
తత్ బీజ అంతరాలే కామబీజం, ఆ బీజముల మధ్యమునందు కామబీజమును (క్లీం) వ్రాసి,
పరితో వాక్ భవం, అన్ని ప్రక్కలందు వాక్ బీజమును (ఐం) వ్రాసి,
తతో వృత్త త్రయం స అష్ట పత్రం, అక్కడ మూడు వృత్తములు, వాటి ప్రతిదానికి ఎనిమిది పత్రములు (దళములు) గీసుకొని,
తేషు దళేషు స్వరాన్ అష్టవర్గాన్ ప్రతిదళం మాలాం అనువర్ణ షట్కం, అంతే పంచాక్షరం ఆ దళములయందు అష్టవర్గముల (అ, క, చ, ట, త, ప, య, శ) యొక్క స్వరములు ప్రతి దళమునందు ఆరు అక్షరముల చొప్పున మాల వలె వ్రాసుకొని, చివరలో పంచాక్షరములు వ్రాసుకొనవలెను
3.3 యంత్రములోని అష్టదళ పద్మము
తత్ దళ కపోలేషు అష్టవర్ణాన్ పునః అష్టదళపద్మం, ఆ (చివర) దళ కపోలమునందు అష్ట వర్ణముల కొఱకు మరలా అష్టదళ పద్మమును చేసుకొని,
తేషు దళేషు నారాయణ అష్టాక్షరో మంత్రః, వాటి దళములయందు నారాయణ అష్టాక్షర మంత్రము (“ఓం నమో నారాయణాయ” లోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దళమునందు) వ్రాసుకొని,
తత్ దళ కపోలేషు శ్రీబీజం ఆ దళ కపోలములనందు శ్రీం బీజమును వ్రాసుకొనవలెను
3.4 యంత్రములోని ద్వాదశదళ పద్మము
తతో వృత్తం, తతో ద్వాదశదళం, తేషు దళేషు వాసుదేవ ద్వాదశ అక్షరో మంత్రః, అక్కడో వృత్తము, దానికి పన్నెండు దళములు, ఆ దళములయందు వాసుదేవ ద్వాదశ అక్షర మంత్రము (“ఓం నమో భగవతే వాసుదేవాయ” లోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దళమునందు) వ్రాసుకొని,
తత్ దళ కపోలేషు ఆదిక్షాంతాన్ ఆ దళ కపోలములయందు అ నుండి క్ష వరకు వ్రాసుకొనవలెను
3.5 యంత్రములోని షోడశదళ పద్మము
తతో వృత్తం తతః షోడశ దళం, అక్కడ వృత్తము, దానికి (చుట్టూ) పదహారు దళములు లిఖించుకొని,
తేషు దళేషు హుం ఫట్ నతి సహిత రామ ద్వాదశ అక్షరం, వాటి దళములమీద ద్వాదశాక్షర రామ మంత్రము హుం ఫట్ నమః సహితముగా (“ఓం నమో భగవతే రామచంద్రాయ హుం ఫట్ నమః”) వ్రాసుకొని,
తత్ దళ కపోలేషు మాయా బీజం సర్వత్ర ఆ దళ కపోలములయందు మాయా (హ్రీం) బీజమును అన్నిచోటలా వ్రాసుకొని,
ప్రతికపోలం ద్విరావృత్త్యా హ్రం స్రం భ్రం వ్రం అం శ్రం జ్రం కపోలమునకు ఆవల ఒక్కొక్కటీ రెండుసార్లు హ్రం, స్రం, భ్రం, వ్రం, అం, శ్రం, జ్రం అని వ్రాసుకొనవలెను
3.6 యంత్రములోని ద్వాత్రింశత్ దళ పద్మము
తతో వృత్తం, తతో ద్వాత్రింశత్ దళ పద్మం, అక్కడ వృత్తము, దానికి ముప్పది రెండు (32) దళములతో పద్మము వేసి,
తేషు దళేషు నృసింహ మంత్రరాజ అనుష్టభ మంత్రః దాని దళములయందు నృసింహ మంత్రరాజమగు అనుష్టుభ ఛందస్సుతో 32 అక్షరాల మంత్రమును (ఒక్కో అక్షరము ఒక్కో దళముపై వ్రాసి)

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం”
తత్ దళ కపోలేషు అష్టవస్వ ఏకాదశ రుద్ర ద్వాదశ ఆదిత్య మంత్రాః ప్రణవాది నమో అంతా చతుర్థ్య అంతాః క్రమేణ దాని దళ కపోలములయందు అష్టవసువుల (8), ఏకాదశ రుద్రుల (11), ద్వాదశ ఆదిత్యుల (12) మంత్రములు ఓం నమో అని మొదలుపెట్టి ఆయ అంత్యముతో వచ్చునట్లు క్రమేణా (31 దళములయందు) వ్రాసుకొని,
తత్ బహిః వషట్కారం పరితః (చివరి 32వ దళముయందు) బయట వషట్ అని చుట్టూ వ్రాసుకొనవలెను
3.7 యంత్రములోని ప్రతిష్ఠలు
తతో రేఖా త్రయ యుక్తం భూపురం అక్కడ మూడు రేఖలతో భూపురములు వేసుకొని,
ద్వాదశ దిక్షుః రాశి ఆది భూషితం పన్నెండు రాశులు అన్ని దిక్కులందు వ్రాసుకొని,
అష్ట నాగైః అధిష్ఠితం ఎనిమిది నాగులను ప్రతిష్ఠించి,
చతుః దిక్షు నారసింహబీజం, నాలుగు దిక్కులయందు నారసింహ బీజమును (క్షౌం) వ్రాసి,
విదిక్షు వారాహ బీజం, మూల దిక్కులయందు (ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతీ) వారాహ బీజమును (హుం) వ్రాసుకొని
ఏతత్ సర్వాత్మకం యంత్రం సర్వకామప్రదం మోక్షప్రదం చ ఈ విధమైన సర్వాత్మకము సూచించు యంత్రము అన్ని శుభేచ్ఛలను మఱియు మోక్షమును ప్రసాదించునది.
ఏకాక్షరాది నవాక్షర అంతానాం ఏతత్ యంత్రం భవతి, ఏకాక్షర మంత్రము నుండి నవాక్షర మంత్రముల వరకు ఈ యంత్రము సూచకము అగును,
తత్ దశ ఆవరణాత్మకం భవతి, అది దశ ఆవరణాత్మకమై ఉన్నది,
షట్కోణ మధ్యే స అంగం రాఘవం యజేత్, షట్కోణము మధ్యలో అంగములతో సహా రాఘవుని పూజించవలెను,
షట్ కోణేషు అంగైః ప్రథమ అవృతిః, ఆరు కోణములయందు అంగములు ప్రథమ ఆవృతి,
అష్టదళమూలే ఆత్మాది ఆవరణం, అష్టదళమూలమునందు ఆత్మ మొదలగునది ఆవరణము (అనగా వ్యాప్తి చెంది ఉన్నది),
తత్ అగ్రే హనుమదాది ఆవరణం, దాని ముందు ప్రక్క హనుమంతుడు మొదలగువారు ఆవరణము,
ద్వాదశ దళేషు వసిష్ఠాది ఆవరణం పన్నెండు దళములందు వసిష్ఠుడు మొదలగువారు ఆవరణము,
షోడశ దళేషు నీలాది ఆవరణం పదహారు దళములందు (అగ్ని దేవుని అంశయైన) నీలుడు మొదలగువారు ఆవరణము,
ద్వాత్రింశత్ దళేషు ధ్రువాది ఆవరణం ముప్పది రెండు దళములందు ధ్రువుడు మొదలగువారు ఆవరణము,
భూపురాంతర ఇంద్రాది ఆవరణం భూపురములలో ఇంద్రుడు మొదలగువారు ఆవరణము,
తత్ బహిః వజ్రాది ఆవరణం దాని బయట వజ్రము మొదలగునవి ఆవరణము,
ఏవం అభ్యర్చ్య మనుం జపేత్ ఈ విధముగా భావించి పూజాపీఠమును (యంత్రమును) పూజించవలెను
3.8 ఇతర రామ మంత్ర పూజాపీఠములు
అథ దశ అక్షరాది ద్వాత్రింశత్ అక్షర అంతానాం మంత్రాణాం పూజా పీఠం ఉచ్యతే ఇప్పుడు పది అక్షరాల మంత్రముల నుండి ముప్పది రెండు అక్షరాల మంత్రముల వఱకు పూజాపీఠము చెప్పబడును,
ఆదౌ షట్ కోణం తత్ మధ్యే స్వబీజం తత్ మధ్యే సాధ్య నామాని మొట్టమొదట ఒక షట్కోణము లిఖించి, దాని మధ్యలో స్వబీజము (రాం) వ్రాసి, దాని మధ్య సాధ్య నామాలు,
ఏవం కామబీజవేష్టనం తతః శిష్టేన నవార్ణేన వేష్టనం దాని చుట్టూ కామబీజముతో (క్లీం) వ్రాసి, మిగిలిన తొమ్మిది అక్షరములు చుట్టూ వ్రాసి,
షట్ కోణేషు షట్ అంగాని అగ్నీ ఈశాసుర వాయువ్య పూర్వ పృష్ఠేషు షట్కోణములు యందు అనగా ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, వాయువ్యము, తూర్పు, పశ్చిమల వైపు ఆరు అంగములు వ్రాసి,
తత్ కపోలేషు శ్రీమాయే కోణాగ్రే క్రోధం వాటి కపోలములయందు శ్రీం, మాయా (హ్రీం) బీజములు, ముందు ప్రక్క కోణములందు క్రోధ బీజము (హుం) వ్రాసి,
తతో వృత్తం తతో అష్ట దళం తేషు దళేషు షట్ సంఖ్యయా మాలాం అనువర్ణాన్ అక్కడ ఒక వృత్తము గీసి, దానికి ఎనిమిది దళములు వేసి, ఆ దళములయందు ఆరు అక్షరముల చొప్పున మూలను క్రమముగా వ్రాసి,
తత్ దళ కపోలేషు షోడశ స్వరాః ఆ దళములయందు పదహారు స్వరములు (అచ్చులు) వ్రాసుకొనవలెను.
తతో వృత్తం తత్ అర్పిత ఆదిక్షాంతం (“అ” ఆది “క్ష” అంతం) అక్కడ మరో వృత్తము, దాని చుట్టూ అ నుండి క్ష వరకు అక్షరములు,
తత్ బహిః భూపురం స అష్ట శూలాగ్రం దాని బయట భూపురములందు (ద్వారములందు) ఎనిమిది శూలాగ్రములందు (శూలము వలె ఏర్పడిన ప్రదేశములందు),
దిక్షు విదిక్షు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర దిక్కులందు మఱియు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్య విదిక్కులందు,
నారసింహ వారాహే నారసింహ బీజము (క్ష్రౌం) మఱియు వారాహ బీజము (హుం) లిఖించవలెను.
ఏతత్ మహాయంత్రం ఆధారశక్త్యాది వైష్ణవ పీఠం ఇదే మహాయంత్రము, ఆధార శక్తి మూలము, వైష్ణవ పీఠము.
అంగైః ప్రథమ అవృతిః, మధ్యే రామం, వామభాగే సీతాం దీనికి అంగములే ప్రథమ ఆవృతి, మధ్యలో రాముడు, ఎడమ భాగమందు సీతయు,
తత్ పురతః శాఙ్గం శరం చ వారి ఎదుట ధనుర్బాణములు,
అష్టదళ మూలే హనుమదాది ద్వితీయ ఆవరణం అష్టదళ మూలమునందు హనుమ మొదలగువారు రెండవ ఆవరణం,
సృష్ట్యాది తృతీయ ఆవరణం, ఇంద్రాదిభిః చతుర్థీ, వజ్రాదిభిః పంచమీ సృష్టికి మూలమైనది మూడవ ఆవరణం, ఇంద్రుడు మొదలైన దేవతలు నాలుగవ ఆవరణం, వజ్రము మొదలైనవి ఐదవ ఆవరణం,
ఏతత్ యంత్ర ఆరాధన పూర్వకం దశాక్షరాది మంత్రం జపేత్ అటువంటి ఈ యంత్రమును పది అక్షరముల మంత్రము మొదలగు రామ మంత్రములతో జపము చేస్తూ ఆరాధన చేయవలెను

నాలుగవ అధ్యాయము - రామ మంత్ర జపముకు ఏర్పాటు విధి

4.1 శ్రీరామ మంత్రముల పురశ్చరణ, అనగా ఏర్పాటు విధి విధానములు
సనకాద్యా మునయో హనూమంతం పప్రచ్ఛుః - సనకుడు మొదలైన మునులు హనుమంతుని పరిప్రశ్నించెను -
శ్రీరామ మంత్రాణాం పురశ్చరణ విధిం అనుబ్రూహి ఇతి. శ్రీరామ మంత్రముల యొక్క జపముకు ఏర్పాటు విధిని చెప్పుము.
హనుమాన్ హ ఉవాచ - హనుమంతుడు ఈ విధముగా చెప్పెను -
నిత్యం త్రిషవణస్నాయీ పయో మూలఫలాది భుక్ నిత్యమూ మూడు వేళలా స్నానము చేసి, పాలు కందమూలములు ఫలములు భుజించవలెను,
అథవా పాయస ఆహారో హవిష్య అన్నాద ఏవ వా లేదా పాయస ఆహారమును, హవిష్యాన్నమును భుజించవలెను,
షట్ రసైః చ పరిత్యక్తః, స్వ ఆశ్రమ ఉక్త విధిం చరన్ ఆరు రుచులను (ఉప్పు, పులుపు, కారము, తీపి, వగరు, చేదు) పరిత్యజించవలెను, ఉన్న ఆశ్రమములో చెప్పబడిన విధిని ఆచరించవలెను,
వనితాదిషు వాక్ కర్మ మనోభిః న స్పృహః శుచిః స్త్రీ మొదలైన భోగములందు మనోవాక్కాయములచే స్పృహ లేనివాడై శుచుడై ఉండవలెను,
భూమిశాయీ బ్రహ్మచారీ నిష్కామో గురుభక్తిమాన్ భూశయనము చేయుచూ, బ్రహ్మచారియై, నిష్కాముడై, గురువుయందు భక్తి కలిగినవాడై,
స్నాన పూజా జప ధ్యాన హోమ తర్పణ తత్ పరః స్నానము, పూజ, జపము, ధ్యానము, హోమము, తర్పణ విషయములందు శ్రద్ధ కలిగినవాడై,
గురు ఉపదిష్ట మార్గేణ ధ్యాయన్ రామం అనన్య ధీః గురువు ఉపదేశించిన మార్గములో శ్రీరాముడిని అనన్య బుద్ధితో ధ్యానిస్తూ ఉండవలెను,
సూర్యేందుగురుదీపాది గో బ్రాహ్మణ సమీపతః శ్రీరామ సన్నిధౌ మౌనీ మంత్రార్థం అనుచింతయన్ సూర్యుడు, చంద్రుడు, గురువు, దీపము, గోవు, బ్రాహ్మణ సమీపమునందు, శ్రీరామ ఆలయమునందు మౌనముగా రామ మంత్రార్థమును బాగుగా చింతించుచుండవలెను,
వ్యాఘ్రచర్మ ఆసనే స్థిత్వా స్వస్తికాది ఆసన క్రమాత్ పులిచర్మముపై సుఖాసీనుడై స్థిరముగా కూర్చుని స్వస్తిక మొదలైన యోగాసనములు క్రమముగా వేయవలెను,


తులసీ పారిజాత శ్రీవృక్షమూలాదిక స్థలే పద్మాక్ష తులసీ కాష్ఠ రుద్రాక్ష వృత మాలయా


తులసి, తామర, ఉసరిక వృక్షముల మొదలున కూర్చుని, పద్మాక్ష తులసీ చెక్కలు రుద్రాక్షలతో చుట్టిన మాలతో
మాతృకా మాలయా మంత్రీ మనసైవ మనుం జపేత్ అభ్యర్చ్య వైష్ణవే పీఠే జపేత్ అక్షర లక్షకం మాతృకామాల (అక్షరమాల) మంత్రములు మనస్సు యందు జపిస్తూ, వైష్ణవ పీఠమును అర్చించి, అక్షర లక్ష జపించవలెను.
తర్పయేత్ తత్ దశాంశేన పయసాత్ (అక్షరమాల అక్షర లక్ష జపములో) పదవ అంశను పాలతో తర్పణము చేస్తూ చేయవలెను,
తత్ దశాంశతః జుహుయాత్ గో ఘృతేన ఏవ దానిలో (అక్షరమాల అక్షర లక్ష జపములో మరొక) పదవ అంశను నెయ్యితో హోమము చేస్తూ చేయవలెను,
భోజయేత్ తత్ దశాంశతః అందులో (అక్షరమాల అక్షర లక్ష జపములో మరొక) పదవ అంశను ప్రసాదము (భోజనము) పెట్టుచూ చేయవలెను,
తతః పుష్పాంజలిం మూలమంత్రేణ విధివత్ చరేత్ రామ మూలమంత్రముతో విధిని అనుసరించి (మిగిలిన జపము చేయుచూ) పుష్పములు సమర్పించవలెను,
తతః సిద్ధమనుః భూత్వా జీవన్ముక్తో భవేత్ మునిః ఆ రీతిగా చేయగా సిద్ధిని పొంది జీవన్ముక్తుడు, ముని అగును.
అణిమాదిః భజతి యేనం యూనం వరవధూః ఇవ అణిమ మొదలైన యోగ అష్ట సిద్ధులు (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము) వరుని వధువు వరించినట్లుగా లభించును,
ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా నైవ యోజ్యో, రామమంత్రః కేవలం మోక్షసాధకః ఐహిక కార్యములు సిద్ధించుట కొఱకు మఱియు మహా విపత్తులయందు ఉపయోగించకూడదు, ఈ రామమంత్రము కేవలము మోక్షసాధకము!
ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం ఐహిక సాధ్యములు పొందుట కొఱకు రామసేవకుడైన నన్ను (హనుమంతుని) స్మరించవలెను
యో రామం సంస్మరేత్ నిత్యం భక్త్యా మనుపరాయణః ఎవరైతే రాముని నిత్యమూ అనన్య భక్తితో సంస్మరించెదరో
తస్య అహం ఇష్ట సంసిధ్యై దీక్షితో అస్మి, వారికి నేను కోరికలు సిద్ధింపచేయుటకు దీక్షాబద్ధుడనై ఉన్నాను,
మునీశ్వరాః! వాంఛితార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘవస్య తు ఓ మునీశ్వరులారా! రాఘవుని భక్తులకు వాంఛితార్థములు ప్రసాదిస్తాను
సర్వథా జాగరూకో అస్మి రామకార్య ధురంధరః ఇతి. ఎల్లప్పుడూ జాగరూకుడనై రామకార్య ధురంధరుడనై నేను (హనుమంతుడను) ఉన్నాను.

ఐదవ అధ్యాయము - రామ మంత్రార్థము, ఫలశృతి

5.1 శ్రీరామ మంత్రార్థము
సనకాద్యా మునయో హనూమంతం పప్రచ్ఛుః - శ్రీరామ మంత్రార్థం అనుబ్రూహి ఇతి. సనకుడు మొదలైన మునులు హనుమంతుని పరిప్రశ్నించెను - శ్రీరామ మంత్రార్థమును చెప్పుము!
హనుమాన్ హ ఉవాచ - హనుమంతుడు ఈ విధముగా చెప్పెను -
సర్వేషు రామ మంత్రేషు మంత్రరాజః షడక్షరః సర్వ రామమంత్రములలో మంత్రరాజము వంటిది షడక్షర మంత్రము

[రామ షట్ అక్షర మంత్రములు = 1. రాం రామాయ నమః, 2. క్లీం రామాయ నమః, 3. హ్రీం రామాయ నమః, 4. ఐం రామాయ నమః, 5. శ్రీం రామాయ నమః, 6. ఓం రామాయ నమః]
ఏకధా చ ద్విధా త్రేధా చతుర్థా పంచధా తథా షట్ సప్తధా అష్టధా చ ఏవ బహుధా అయం వ్యవస్థితః ఈ షడక్షర మంత్రము ఒకటిగను, రెండుగను, మూడుగను, నాలుగుగను, ఐదుగను, ఆరుగను, ఏడుగను, ఏనిమిదిగను మఱియు అనేక విధములుగా ఉన్నది.

[అనగా అక్షరమాలతో (అ నుండి క్ష వరకు) ఆదిబీజాక్షరములతో (రాం, క్లీం, హ్రీం, ఐం, శ్రీం, ఓం) కలిపి రామాయనమః మంత్రములు అనేక విధములుగా పునశ్చీకరణము (repeated combinations) చేసుకొనవచ్చును.]
షడక్షరస్య మాహాత్మ్యం శివో జానాతి తత్పరః రామ షడక్షర మంత్రము యొక్క మహత్యము పరిపూర్ణముగా శివునికే తెలియును.
శ్రీరామ మంత్రరాజస్య సమ్యక్ అర్థో అయం ఉచ్యతే. శ్రీరామ మంత్రరాజము యొక్క సమగ్ర అర్థము ఈ విధముగా చెప్పబడెను.
నారాయణ అష్టాక్షరే చ శివ పంచాక్షరే తథా సా అర్థక అర్ణద్వయం రామో రామంతే యత్ర యోగినః నారాయణ అష్టాక్షరములో (“ఓం నారాయణాయ నమః” యందు “రా”) మఱియు శివ పంచాక్షరములో (“ఓం నమః శివాయ” యందు “మ”) ప్రాణ బీజ అక్షరములు రెండు కలిసిన “రామ” మంత్రము, ఎక్కడ యోగులు రమించుచున్నారో అదే మంత్రార్థము!


రకారో వహ్నివచనః ప్రకాశః పర్యవస్యతి, సచ్చిదానందరూపో అస్య పరమాత్మార్థ ఉచ్యతే


రకారము (ర్) అగ్నిబీజాక్షరము, జ్ఞానము ఇచ్చునది, (ఈ రామ మంత్రము) సత్ చిత్ ఆనంద రూపమైన పరమాత్మ అర్థమును సూచిస్తున్నది
వ్యఙ్జనం నిష్కళం బ్రహ్మ ప్రాణో మాయ ఇతి చ స్వరః, వ్యఙ్జనైః స్వరసంయోగం విద్ధి తత్ ప్రాణయోజనం నిష్కళ బ్రహ్మము, ప్రాణము, మాయ, స్వరము సూచించుచున్నది, స్వర సంయోగమును సూచించునది, అది ప్రాణశక్తికి జననస్థానముగా తెలుసుకొనుము
రేఫే జ్యోతిర్మయే తస్మాత్ కృతం ఆకార యోజనం రకారము (ర్) జ్యోతిర్మయము (అగ్ని బీజాక్షరము) కావున దానికి “ఆ”-కారము (ప్రాణము) జననస్థానముగా కూర్చబడినది
మకారో అభ్యుదయ అర్థత్వాత్ స మాయ ఇతి చ కీర్త్యతే మకారము (మ్) ఉదయించుట అనే అర్థము వలన అది మాయ అని కూడా కీర్తింపబడుచున్నది

[అనగా అవ్యక్తమైన చైతన్య ఆత్మయందు (ర్-కారము యందు) ఆకారము (ప్రాణం మఱియు మూర్తము) వ్యక్తమగుట దానికి మాయ అని నిర్దేశింపబడుచున్నది]
సో అయం బీజం స్వకం యస్మాత్ స మాయం బ్రహ్మ చ ఉచ్యతే కావున, ఈ రామ మంత్ర శబ్దబీజము స్వకీయమైన మాయతో కూడుకున్న పరబ్రహ్మము అని చెప్పబడుతున్నది
స బిందు సః అపి పురుషః శివః సూర్య ఇందు రూపవాన్ జ్యోతిః, తస్య శిఖా రూపం నాదః, సః ప్రకృతిః మతః ఆ రామ మంత్రార్థమే బిందువు, అదే పురుషుడు కూడా, అదే శివుడు, సూర్య చంద్ర జ్యోతి రూపుడు. దాని యొక్క శిఖా రూపము నాదము. అదే ప్రకృతి అని అర్థము చేసుకొనవలెను
ప్రకృతిః పురుషః చ శోభౌమాయా బ్రహ్మణః స్మృతౌ ప్రకృతి పురుషులు రెండూ మాయాశోభితములై బ్రహ్మమునందు కల్పించబడినాయి
బిందునాదాత్మకం బీజం వహ్ని సోమ కలాత్మకం బిందు-నాదాత్మకమైన బీజము వహ్నిసోమ కళాత్మకమైనది
అగ్నీషోమాత్మకం రూపం రామబీజే ప్రతిష్ఠితం అగ్నీ సోమాత్మక రూపము రామబీజమునందే ప్రతిష్ఠితమై ఉన్నది.
5.2 వేదాంత మహావాక్య సమానము
యథా ఏవ వట బీజస్థః ప్రాకృతః చ మహాద్రుమః ఏ విధంగా ఐతే వట బీజమునందు ప్రకృతిపరమైన మహా వటవృక్షము అవ్యక్తరూపముగా ఉన్నదో
తథా ఏవ రామబీజస్థం జగత్ ఏతత్ చర అచరం అదే విధంగా రామ బీజమునందు ఈ చరాచరమైన జగత్ అంతా స్థితి కలిగి ఉన్నది
బీజ ఉక్తం ఉభయ అర్థత్వం రామనామాని దృశ్యతే బీజములో చెప్పిన రెండు అర్థములు రామనామములందు కనిపించుచున్నవి
బీజం మాయా వినిర్ముక్తం పరబ్రహ్మ ఇతి కీర్త్యతే (రామ) బీజము మాయాతీతమైన పరబ్రహ్మము అని కీర్తించబడుచున్నది
ముక్తిదం సాధకానాం చ మకారో ముక్తిదో మతః (రామ బీజము) సాధకులకు మోక్షప్రదము, మఱియు మ-కారము ముక్తిదాయకము అని తెలుసుకొనవలెను
మారూపత్వాత్ అతో రామో భుక్తి ముక్తి ఫలప్రదః లక్ష్మీస్వరూపమైన రామ బీజము భుక్తి ముక్తి (ఇహ పర) ఫలములు ఇచ్చునది
ఆద్యో రా తత్ పదార్థః స్యాత్ మకారః త్వం పదార్థవాన్, తయోః సంయోజనం అసి ఇతి అర్థే తత్త్వవిదో విదుః మొట్టమొదట “రా” అను బీజాక్షరము తత్ పద అర్థమునకు సూచకము, తరువాత “మ”కారము త్వం పద అర్థము అగును. ఆ రెండిటి కలయిక అసి అనే అర్థముతో (తత్ త్వం అసి - అనే మహా వాక్యార్థముగా) తత్త్వవిదులు తెలుసుకొనుచున్నారు

[రా + మ = తత్ త్వం అసి = అదియే (ఆ పరబ్రహ్మమే) నీవు అయిఉన్నావు]
నమః త్వం అర్థో విజ్ఞేయో రామః తత్ పదం ఉచ్యతే, అసి ఇతి అర్థే చతుర్థీ స్యాత్ ఏవం మంత్రేషు యోజయేత్ [రామాయ నమః అను షడక్షర మంత్రములో] నమః అనునది “త్వం” అర్థమును, రామః అనునది “తత్” అను అర్థమును సూచించునట్లుగా గ్రహించవలెను, చతుర్థి విభక్తియైన ఆయ అనునది “అసి” అని మంత్రమునందు అర్థము తెలుసుకొనవలెను
తత్త్వమస్యాది వాక్యం తు కేవలం ముక్తిదం యతః “తత్ త్వం అసి” మొదలైన మహావాక్యములు కేవలము ముక్తిని ఇచ్చునవి,
భుక్తి ముక్తి ప్రదం చ ఏతత్ తస్మాత్ అపి అతిరిచ్యతే భుక్తిని ముక్తిని కూడా ఇచ్చునది కావున ఈ రామ మంత్రము పరమ శ్రేష్ఠము.
5.3 ఫలశృతి
మనుషు ఏతేషు సర్వేషాం అధికారో అస్తి, దేహినాం ముముక్షూణాం విరక్తానాం తథా చ ఆశ్రమవాసినాం ప్రణవత్వాత్ సదా ధ్యేయో యతీనాం చ విశేషతః మనుషులు అందరికీ (రామమంత్రము జపించుటకు, రాముని ఉపాసించుటకు) అధికారము కలదు. దేహధారులకు, ముముక్షువులకు, విరక్తులకు, మఱియు (అన్ని) ఆశ్రమవాసులకు, విశేషించి యతీశ్వరులకు ప్రణవ సమానము అగుట వలన ఎల్లప్పుడూ (రామ మంత్రము) ధ్యానింపతగినది
రామమంత్రార్థ విజ్ఞానీ జీవన్ముక్తో న సంశయః రామమంత్రార్థమును అనుభవపూర్వకముగా తెలుసుకున్న విజ్ఞాని జీవన్ముక్తుడే అగును, ఇందు సంశయము లేదు
య ఇమాం ఉపనిషదం అధీతే సో అగ్నిపూతో భవతి, స వాయుపూతో భవతి సురాపానాత్ పూతో భవతి, స్వర్ణ స్తేయాత్ పూతో భవతి బ్రహ్మహత్యాత్ పూతో భవతి ఎవరైతే ఈ ఉపనిషత్తు అధ్యయనం చేస్తారో వారు అగ్నిపూతులు అగుదురు, వారు వాయుపూతులగుదురు, సురాపానము చేసిన పాపము నుండి విముక్తులగుదురు, స్వర్ణము దొంగతనము చేసిన పాపము నుండి విముక్తులగుదురు, బ్రహ్మహత్యా పాపము నుండి విముక్తులగుదురు
స రామమంత్రాణాం కృతపురశ్చరణో రామచంద్రో భవతి, తత్ ఏతత్ ఋచాభి ఉక్తం (ఈ ఉపనిషత్తులో చెప్పబడిన) రామమంత్రములను పురశ్చరణ చేసినచో వారు రాముడే అగును. ఇదే విషయము ఋక్కులు (వేదములు) చెప్పుచున్నవి.
సదా రామో అహం అస్మి ఇతి తత్త్వతః ప్రవదంతి యే, న తే సంసారిణో నూనం రామ ఏవ న సంశయః, ఎల్లప్పుడూ “నేనే రాముడిని!” అని తాత్వికముగా ఎవరు భావించుచున్నారో వారు ఇక సంసారులు కారు. అప్పుడు, రాముడే అగుదురు. ఇందులో సంశయము లేదు.
ఓం సత్యం ఇతి ఉపనిషత్ ఓం సత్యం - ఇది రామ రహస్య ఉపనిషత్తు.

రామ రహస్య ఉపనిషత్ - సారాంశ పుష్పమ్

రామ రహస్య ఉపనిషత్ సమాప్తము



Rȃma Rahasya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com