Page:374
IV. లీలోపాఖ్యానం - సమీక్ష
జ్ఞానులగు వారు ఈ దృశ్య పదార్థములను చూస్తున్నప్పుడు “ఇవన్నీ ఆకాశము వలె ’శూన్యము, మిథ్య” మాత్రమే” అని స్వవిచారణా సామర్థ్యంచే ఎరుగుచున్నారు. ఈ ప్రపంచమంతా ఆకాశతుల్యుడగు పరమపురుషుని యందే వెలయుచున్నది. అతడే అన్నిటికి కారణము - కార్యముకూడా. అతడొక్కడే స్వయంప్రభువు. తన ఉనికికి తానే కారకుడాతడు. అట్టి ఆ పరమాత్మ ఈ పృథివి మొదలైన పంచభూతములకు సంబంధించినవాడు కాదు సుమా! అతడు చిన్మాత్రమే (that which knows, sees, experiences all else) శరీరముగా కలవాడు. అతడు మాయాపూర్వకముగా తనయందు ఈ వివర్తమంతా కల్పించుకొని, అందు వెలయుచున్నాడు. అంతే గాని, ఎక్కడా ఏదీ బాహ్యమునందు లేదు. అనగా, ద్రష్టగా, దృశ్యముగా భాసించుచున్నది అతడే. అతడు ద్రష్టత్వముకన్నా ముందే ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆ చైతన్యరూపుడగు స్వయంభువు ఎప్పుడు ఎట్లు యత్నించునో, లేక భావించునో, లేక సంకల్పించునో, …. అప్పుడు అట్లే వివర్తము పొందుచున్నాడు. అతడు ‘సృష్టి’ కొరకు యత్నించి నపుడు లేక సంకల్పించినపుడు సృష్టియే జరుగుతోంది. ‘స్థితి’ కొరకు భావించుచుండగా స్థితియే ప్రాప్తిస్తోంది. లయము కొరకు ప్రయత్నించుచుండగా ‘ప్రళయము’ ప్రాప్తించుచున్నది. (He Creates, sustains and destroys of his own volition)
ఓ ప్రియ రఘురామా! ఈ జగత్తంతా “బ్రహ్మాత్మకము అగు (బ్రహ్మమే స్వరూపముగా కలిగి నట్టి) నిర్మల చిదాకాశమునందే ప్రతిభాసించుచున్నది. అయితే పరమార్థదృష్టితో పరికించి చూచి నప్పుడు మాత్రం బ్రహ్మమున “జగత్తు” అనబడు పదార్థమునకు తావే లేదు. పరిమితాశయముల దృష్ట్యా చూచినపుడు “వ్యవహారదృష్టి” అని, మహోన్నతమగు సత్యమే ఆశయముగా కలిగియున్నప్పుడు ’పరమార్థదృష్టి’ అని చెప్పబడుతోంది. ఈ జగత్తు బుద్ధి వికారముచే ప్రాప్తిస్తున్నది మాత్రమే!
Page:375
అందుచేత ఇదంతా బుద్ధిపరిచ్ఛిన్నుడగు జీవుని యందు మాత్రమే వెలయుచున్నదని గ్రహించు. మరి అట్టి వ్యర్థమగు భ్రాంతికి ‘సత్త’ ఏమి? వాసనఏమి? స్థిరత్వమెక్కడ? నియతి ఏమి ఉంటుంది? దేనికొరకు ఏది ఆవశ్యకత కలిగి ఉంటుంది? మాయవలన మాత్రమే ఇదంతా ఇట్లు స్వప్నములోవలె దీర్ఘమైన దృశ్యముగా ప్రాప్తిస్తోంది. ఘనీభూతమైనదానివలె, ఈ జీవులను తోలుబొమ్మల వలె ఆడించుచు, వ్యవహర్తవలె ప్రవర్తిస్తోంది. పరమార్ధదృష్టిచే ఇదంతా శూన్యమే! ‘మాయ’ అను శబ్దమునకు గల అర్థమేమిటి? “ఏదైతే లేదో” … అని కదా! అవాస్తవకతతో కూడినదై, భ్రమ మాత్రమే అయినదానినే ‘మాయ’ అంటున్నాం. అంతేకాని ఇక్కడ ‘మాయ’ అనబడు ఒకానొకదానికి కర్తృత్వం ఆపాదించటం మన ఉద్దేశం కాదు సుమా!
శ్రీరాముడు : హే భగవన్! మీరు ఈ ’లీలోపాఖ్యానం’లో యథోచితమైన దృష్టాంతము లచే, జీవులకు శాంతిని ప్రసాదించకలిగినట్టి పరమార్థ దృష్టిని ప్రదర్శించారు. ఆహా! ఆశ్చర్యం! ఎంతో కాలం తరువాత ఇప్పుడు మేము తెలుసుకోవలసినది తెలుసుకొంటున్నామని మాకు అనిపిస్తోంది. స్వామీ! మీరు చెప్పిన ఉపాఖ్యానం, అందలి శాస్త్రవ్యాఖ్యానం అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అది విని, స్వయముగా విచారణ చేయుచుండుటచే, తత్త్వమును గ్రహించి శాంతిని, నిర్వాణమును తప్పకుండా మేమంతా పొందగలం. మీ వాక్యామృతం ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. ఇప్పుడు నాకు కలుగుతున్న కొన్ని సందేహములు ప్రస్తావిస్తున్నాను. అనుగ్రహించండి. ఒకే కాలము యొక్క వివిధ గతులు - రీతులు
ఒకానొక జీవుడు “వసిష్ఠ పద్మ-విదూరథుల” సృష్టులందు జీవించియుండటం మనం చెప్పుకున్న కథనంలో జరిగినది కదా! అట్లు మూడు తీరులుగా గడచినట్టి కాలము యొక్క స్వరూపము ఎట్టిది? ఆ కాలము కూడా మన ఈ కాలంలాగానే రాత్రింబవళ్ళు కలిగియున్నదేనా? అది మాసములు - సంవత్సరములు - - క్షణములుదీర్ఘకాలం మొదలైనవి కలిగియున్నదా? ఒకేసారి వేరువేరు ప్రమాణములతో వేరువేరు రీతులుగా కాలగమనం ఉంటుందా? ఆ జీవుని వేరువేరు జన్మస్థానము లందు కాలగమన ప్రక్రియ వేరువేరు సాపేక్షలు ఎట్లు కలిగియున్నది? ఒకచోట ఎనిమిది రోజులు జరుగగా మరొకచోట డెబ్బది సంవత్సరములు గడచినాయే? నా సందేహం ఇది. ఈ విషయమై మీరు చూచాయగా కొన్ని విషయాలు చెప్పియున్నారు. కాని నాయందు ఇంకా సందేహనివృత్తి కాలేదని నాకు అనిపిస్తోంది. అజ్ఞానులమగు మేము ఒక్కసారి విన్నంత మాత్రంచేత గ్రహించవలసినదంతా గ్రహించగలమా? ఎండిన మట్టి ఒకటి రెండు జలబిందువులు పొందినంత మాత్రంచేత తడుస్తుందా? లేదు. హే సద్గురూ! నా బుద్ధి తగినంతగా వికసించియుండక పోవచ్చును. నన్ను క్షమించండి. ఈ ’కాలము’ విషయమై మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : 1) సంకల్పము 2) జ్ఞానము 3) అనుభవము …. ఈ మూడింటికి ఒకానొక చమత్కారమైన అవినాభావసంబంధం ఉన్నది. ఎవడు ఎక్కడ ఎట్టి జ్ఞానమును పొందుతాడో,
Page:376
అతడు దానిపట్ల అట్టి అనుభవమునే పొందుచున్నాడు. జ్ఞానము- సంకల్పములు ఒకటికి మరొకటి తోడు, ఆధారము, మూలము అగుచున్నాయి.
ఈ విషయం కొన్ని దృష్టాంతములను తీసుకొని మరికొంత స్పష్టంగా చెపుతాను. విను. “ఇతడు నాకు ప్రియమైనవాడు” అని నిరంతరం భావించుటచే ఒకడు అట్లే ప్రియమైనవాడు అగుచున్నాడు. ”ఇతడు నాకు మిత్రుడు" అని భావించుటచే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. ఒకానొకడు విషమును “ఇది నాకు అమృతముతో సమానం” అని భావించుటచే కొంత కాలమునకు అది అతనికి అమృతప్రాయమే అగుచున్నది. పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు ఇవన్నీ ఏ భావంతో భావించబడితే, అట్టి భావనా ప్రభావంచేత ఆయా పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు అట్లే ప్రతిభాసిస్తున్నాయి. కార్యకారకములు కూడా అగుచున్నాయి.
“ఒక నిమిషము”ను అనేక కల్పములుగా భావించి, అట్టి బుద్ధిని బడయకలిగితే, అట్టివానికి ఆ ఒక్క నిమిషమే కల్పములుగా తోచగలదు. అదేవిధంగా కల్పముల యందు “ఇది ఒక్క నిమిషముతో సమానం” అనునట్టి బుద్ధి ఉంచినప్పుడు అవన్నీ మరుక్షణం నిమిషమాత్రములే అగుచున్నాయి. చిత్తముయొక్క స్వరూపమే అట్టిది. మనం దృష్టాంతంగా లౌకిక జీవిత విశేషములే తీసుకొందాం. దుఃఖములతో, భయముతో బాధితుడగుచున్నవానికి ’ఒక రాత్రి’ అత్యంత భారంగా, అనేక సంవత్సరము లంత పొడవైనదిగా తోచుచున్నది. సుఖసంపదలు పొందియున్నవానికో అదే రాత్రి - బంధు సమాగమంతో, ఆనంద-ఆహ్లాదములతో - ఒక క్షణమువలె గడచిపోతోంది. అది అట్లా ఉండగా, ఒకడు స్వప్నానుభవం పొందుచున్నప్పుడు, అతనికి స్వల్పకాలం అతిదీర్ఘంగా, దీర్ఘకాలం అతిస్వల్పంగా అనుభవమగుచున్నది. స్వప్నంలో, ”అయ్యో! మరణించాను. మరల పుట్టాను బాల్య-యౌవనాలు గడచిపోయి, ముసలివాడినయ్యాను. వందలాది యోజనముల విస్తీర్ణం ప్రయాణం చేశాను. ఎక్కడో, ఎప్పుడో ఉండియున్న వారితో కలసి సంభాషించాను” —అనునట్టి భావనోద్వేగం కలుగుతోంది కదా! ఇట్లు దీర్ఘకాలం స్వల్పంగా ఉండటం, కొద్దికాలం దీర్ఘంగా అనుభవమవటం ప్రతివారికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకరూపంగా అనుభవం అవుతూనే ఉన్నది సుమా! ‘హరిశ్చంద్రుడు’ అనే రాజు ఒక్కరాత్రి యందు 12 సంవత్సరముల కాలక్రమము యొక్క అనుభవం పొందినట్లు వినియున్నావు కదా! ‘లవణుడు’ అనే మరొక రాజు ఒక్కరాత్రి యందు డెబ్బది సంవత్సరముల ఆయువును అనుభవించియున్నాడు. అంతేకాదు. "మహర్షి మనువు’ యొక్క ఒక్క జీవితకాలం …. ప్రజాపతి బ్రహ్మదేవునికి ఒక ముహూర్తకాలం అగుచున్నది. బ్రహ్మయొక్క ఒక జీవితకాలం విష్ణువునకు ఒక రోజు అగుచున్నది. విష్ణువుయొక్క జీవిత కాలం శివునకు ఒక్కరోజు. నిర్వికల్ప సమాధియందు దివారాత్ర భేదమే ఉండదు. ఎందుచేత నంటావా? నిర్వికల్ప సమాధిని ఆశ్రయించినవానికి ఇక ‘కాలము’ అనునది మొదలంటా అసత్యముగును, ఆత్మపదార్థమొక్కటే సత్యముగాను అనుభవమగుచున్నది.
లవణుని కథ ఈ ప్రకరణంలో “ఇంద్రజాలోపాఖ్యానం” లో చెప్పబడింది.
Page:377
ఒకప్పుడు ఈ ధన-దార-పుత్ర రాజ్యాది భోగఫలములు అత్యంత మధురంగా, గొప్పవైన వాటివలె ఉంటున్నాయి కదా! ఇవన్నీ వైరాగ్యభావముతో దర్శించినప్పుడో? వాటి యొక్క చింతనయే అప్రియం అవుతోంది. ఎంతమంది చక్రవర్తులు త్రుటిలో సర్వ భోగములు త్యజించి వానప్రస్థం స్వీకరించలేదు చెప్పు? మధుర భావముతో చింతించుట చేతనే కదా. “ఉపవాసములు, తీర్థయాత్రలు, సుదీర్ఘమైన పాదయాత్రలు” మొదలైనవి ఆహ్లాదకరంగా తోచుచున్నాయి. మధురభావము యొక్క ప్రభావము చేతనే అతి కష్టతరమైనట్టి “మనోనిరోధము” కూడా ఆత్మ సుఖమును ప్రసాదిస్తూ, మధురముగా ప్రాప్తించుచున్నది. మహాపురుషులగు కొందరు తమపట్ల శత్రుత్వము వహించువారు తారసపడినప్పుడు కూడా, “వీరు నాకు మిత్రులతో సమానమే. తమ తమ ఈ పరుష వాక్యములచే నాకు మేలే చేస్తున్నారు” అని సౌమ్యభావంతో చింతించుచూ ఉంటారు. అట్టి చింతనా ప్రభావంచేత లోకరీతిగా అప్రియులు కావలసినవారు కూడా ఆప్త పురుషులగు మిత్రులుగానే పరిణమించుచున్నారు. అట్లే విషయభోగాదులు పొందుటకు గాను, కొందరు బంధువులు సాయపడువారు కావచ్చు. కాని, ”వీరు నా ఉత్తమ పురుషార్థమునకు విఘాతమునే కలుగజేస్తున్నారే!” అని భావించినప్పుడు ఆ బంధువులు అతనికి అప్రియులే అగుచున్నారు కదా!
ఓ మహాభాగా! రామచంద్రా! “అసలు ఈ జగత్తు అంతా ఏమిటి? ఏమైయున్నది“ అని పరిశీలించినప్పుడు “ఇదంతా కేవలం భావనామయం మాత్రమే” అని మనకు తెలియవచ్చుచున్నది. ”శాస్త్రాలు పఠించటం, జపములు, తపములు” మొదలైనవి …. ఉత్తమమైన “భావన, అభ్యాసం” ఈ రెండూ లేకపోవటం చేత … కొందరికి ఎంతో దుస్సాధ్యమైన వాటివలె అనిపిస్తున్నాయి. మరికొందరికి “చక్కగా గ్రహించి ఉండటం ’ఇవి శుభప్రదములు’ అని భావన కలిగియుండటం …. అభ్యాసం” … వీటి వలన జపతపాది వ్యవహారములు ఎంతో తేలికైనవిగా, ఆహ్లాదకరమైనవిగా, సుఖకరమైనవిగా అనుభవ మగుచున్నాయి. పరిశీలనాత్మకమైన బుద్ధి లేనట్టివాడు, నౌకలో పయనించుచున్నప్పుడు, ఒకవైపుకు చూచి “ఆహా! ఈ వృక్షములు గుండ్రముగా కదులుచున్నాయి” అని అనుకొంటున్నాడు. అట్లా కాకుండా, “ఈ విధంగా చెట్లు కదులుచున్నట్లు కనబడుచున్నప్పటికీ, అట్లు జరుగుట అసాధ్యం. వాస్తవానికి ఈ నౌకయే కదులు చున్నదిగాని, చెట్లు కాదు” అను భావనను దృఢం చేసుకొన్నవాడో, భ్రమకు లోనుకాడు.
ఓ రామా! బాగుగా పరిశీలించకపోవటం, విచారణ చేయకపోవటం చేతనే …. శూన్యము కూడా అనేక వస్తుజాలముతో కూడుకొని పూర్ణమువలె అనుభవం అవుతోంది. స్వప్నంలో గోడలు, భవనములు, తదితర వస్తుజాలం, బంధుజనులు కనబడటం జరుగుతోంది. వారు వాస్తవమా? కాదు. కాని అనుభవం మాత్రం ఉంటోంది. అంతరంగమందు ‘భావన’ గావించబడటం చేతనే ఆ స్వప్నవస్తువులన్నీ కనబడటం జరుగుతోంది. అవన్నీ ’జాగ్రత్తు’కు లభించకపోయినా, స్వప్న సమయంలో స్వప్నద్రష్టకు వాస్తవమనే అనిపిస్తున్నాయి. "గ్రహించటంలో గల దోషం” చేత పసుపు-పచ్చటి పదార్థములు కూడా నీలంగానో, తెలుపుగానో కనిపిస్తూ ఉంటాయి. రంగుటద్దం
Page:378
(coloured glass) లోంచి సూర్యకాంతి పడుచున్నవైపు చూస్తుంటే ఎదురుగా ఆ రంగే సర్వత్రా ఉన్నట్లు తెలియవస్తూ ఉంటుంది.
బాలుడు తన “పుట్టినరోజు పండుగ” వంటి ఆనందించవలసిన సమయంలో కూడా “ఈ ఆటవస్తువు చెడిపోయిందే” అని క్షణంలో ఖిన్నుడై దుఃఖం పొందుచున్నాడు. పేదవాడు ”అయ్యో! నాకు కనుక ధన ధాన్య సమృద్ధి ఉంటే ఎంత బాగు!“ అని అనుకొంటున్నాడు కదా! మరి, ధన-ధాన్య సమృద్ధి కలిగినవాడు సుఖించవలసినది పోయి, “నేను ఆ స్త్రీ యొక్క ప్రేమను పొందలేకపోతిని కదా!” అని తలచుచు, ప్రపంచములోని ‘నిస్తేజము’ నంతా ప్రోగుచేసుకొని కొంపకు తెచ్చుకొంటున్నాడే? వివేకహీనుడు, - తన ఎదురుగా ఉన్నది గోడే అయినప్పటికీ … ఆ గోడపై నేర్పుతో రచించబడిన రంగులచిత్రం చూచి, ”ఇది సరస్సు. అది ఖాళీ స్థలం. ఇవి చెట్లు. ఇవి పుట్టలు. అక్కడ హంసలు నీటిలో ఈత కొడుతున్నాయి” అని భ్రమను పొందుతాడు. వస్తుతః మిథ్యయే అయివున్న చీకటిలోని ‘దయ్యం’ అనబడునది, పిరికివాని దృష్టికి ఆయా కదలికలతో సహా కనిపించి, అతనికి చెమటలు పట్టేటట్లు చేస్తోంది. చివరికి ఒక్కొక్కసారి ఆ పిరికివాడిని చంపేస్తోంది కూడా! "ఇది వాస్తవమే” అను రూపముగల జ్ఞానము వలననే ఒకడు స్వప్నంలో చూచిన సుందర స్త్రీతో ఆలింగన భావం పొంది, తత్కారణంగా ఆయా వికారములు ఈ జాగ్రత్-భౌతిక దేహమునందు పొందుచున్నాడు.
ఓ రాఘవా! నిన్నొక ప్రశ్న వేస్తున్నాను. సమాధానం చెప్పు. ఎదురుగా ఘనీభూతమై నిలచి ప్రాప్తిస్తున్న ఈ “జగత్తు" ఏమయి ఉన్నదంటావు? శ్రీరాముడు : ఇది మిథ్యయగు ఆకాశము మాత్రమే.
శ్రీ వసిష్ఠమహర్షి : ఒక్కొక్కడు మేఘముల ఛాయను చూచి, తన కల్పనా బలంచేత, అది కదులుచున్నప్పుడు “ఇక్కడ ఒకానొక మిథ్యానటుడు ఉన్నాడు. అతని నీడే ఇది. అతనిదే ఈ అభినయం. అవును, ఇప్పుడు అతడు కోపం చూపిస్తున్నాడు” అని భ్రమ చెందుతాడు చూచావా! అదంతా అజ్ఞాన చాపల్యమే కదా! అజ్ఞాన ప్రభావం చేతనే అనేక పదార్థములు, నీవు నేను మొదలైనవాటితో కూడిన ఈ జగత్తు అనుభవమగుచున్నది. "స్వకీయమగు భ్రమయే ఆత్మయందు ‘జగద్రూపము’ను విస్తరింపజేయుచున్నది” అని అనేకమంది జ్ఞానులచే, శాస్త్రములచే నిర్ద్వంద్వముగా ప్రకటించబడుతోంది.
“సర్వ సమష్ఠిరూపమగు ఆకాశము నందు వృత్తి రూపమున ఏర్పడుచున్న మనోస్పందమే ఈ జగత్తు”.
అని మేము అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నాం. బాలుడిని అదలించటానికి, పెద్దవాళ్ళు “అదుగో బూచి. నీవు ఏడ్చావా, అది వచ్చి మీద పడుతుంది” అని పలుకుతూ ఉంటారు. అప్పుడా
అజ్ఞాన బాలుడు, “ఔను. నిజమే కాబోలు” అని అల్లరి మానుకొంటాడు. “మోహము - మూర్ఖత్వము
ప్రజ్ఞారాహిత్యము”ల కారణంగా అక్కడ నిజంగానే “బూచి” అనబడునదేదో చూస్తాడు. అతను
-
Page:379
చూస్తున్నదంతా మనోవికారములు కాక మరింకేమిటో చెప్పు? ఈ దృశ్య విషయం కూడా అట్టిదే. లేకుంటే ఇక్కడ సుఖములేమిటి? దుఃఖములేమిటి? ప్రియములేమిటి? అప్రియము లేమిటి? నీవారేమి? నావారేమి? అంతా మనోవికారములే సుమా! అట్లే “అక్కడ - ఇక్కడ, అప్పుడు ఇప్పుడు” …. లతో కూడిన దూరము, స్థానము, సమయము కూడా అంతే! ఇవన్నీ మనస్సుయొక్క స్వకీయకల్పనను అనుసరించే ఏర్పడుచున్నాయి. అనుభవమునకు వస్తున్నాయి.
ఓ రామచంద్రా! ఈ జగత్తు మాయాకల్పితము. ఆకార రహితము. స్వతహాగా ఎట్టి నిర్ణయము లేనట్టి జడము, ‘బోధ’ శక్తిహీనము. అందుచేతనే తత్వజ్ఞులైనవారు, ఈ జగత్తు విషయమును, “అనిద్రుడైనవాడు చూచుచున్న అపూర్వ - స్వప్నము వంటిది మాత్రమే” అని చక్కగా ఎరుగుచున్నారు.
స్తంభము తనయందు ఆయా శిల్పదృశ్యములను ( స్త్రీ, ప్రకృతి, జంతువు మొదలైన ఆకారములను) అగుపింపచేస్తోంది చూచావా? సర్వమునకు ఆధారమై, చిన్మయమై, నిర్వికారమై, పరమార్థసత్యమై, మార్పు-చేర్పులులేనట్టి ‘ఆత్మ’ అనబడు స్తంభమునందు ఈ సృష్టి ప్రాప్తిస్తోంది. “ద్రష్ట - దృశ్యము” …. ఈ రెండూ కూడా ఆత్మకంటే ఏమాత్రం వేరైనవి కావు. ఆహా! ఎంతటి చమత్కారమైనవిషయం! ఒకడు మహా విద్వాంసుడు, తెలివిగలవాడు అయివుండి కూడా, తన స్వప్నమునందు తారసపడిన యోధులచే బాధించబడుతూ, గావుకేకలు వేస్తూ ఉంటాడు. అయితే, ఆ యోధులందరు అంతరంగమున స్వయముగా తనచేత కల్పన చేయబడినవారే కదా! మరి స్వప్న
- - శత్రుయోధులకు బాధించగల సామర్థ్యం ఎట్లా వచ్చింది? ఆ సామర్థ్యము ప్రసాదించిన వారు ఎవరు? స్వప్నద్రష్ట యొక్క కల్పనాచాతుర్యమే అదంతా అయివుండి కూడా, అతడు అది ఎరుగనివాడై ఎలుగెత్తి ఏడ్చుచున్నాడు. ఈ జాగృత్ - దృశ్యానుభవముల విషయము కూడా అట్టిదే అనటంలో మాకేమీ సందేహం లేదు.
"శీతకాలం తరువాత వసంతకాలం వస్తోంది. అప్పుడు భూమి పుష్పములతో, ఫలములతో లేత చిగురులతో ‘రసమయము’ అగుచున్నది” అనునది జనులు చూస్తూనే ఉన్నారు కదా! ఆ ’రసత్వము’ ఎక్కడ దాగివుంటోంది? వసంతకాలం వచ్చేసరికి ఎక్కడి నుండి బయల్వెడలుతోంది, చెప్పు? ఆ రసత్వం భూమియందే అప్రకటితంగా ఒదిగి ఉండి, తగిన దేశ - కాలములు ప్రాప్తించి నప్పుడు బహిర్గతం అవుతోంది. బంగారం కరగించినప్పుడు ద్రవమగుచున్నది. అంతకుముందు ద్రవత్వము ఎక్కడ దాగివుంటోంది? బంగారమునందే కదా!
అట్లాగే సూక్ష్మమగు “పరమచైతన్యము” నందే ఈ ప్రపంచము అణిగి ఉంటోంది.
నీ కాళ్ళు - - చేతులు మొదలైన అంగములు ‘రాముడు’ అనబడు నీకంటే వేరుకాదు కదా! ఈ జగత్తు కూడా బ్రహ్మము కంటే వేరుకాదు. కాని ’బ్రహ్మము’ లేక ‘పరమాత్మ’ అవయవరహితము. అట్టి ఈ జగత్తునందు తోచుచున్న ఈ ‘జీవాత్మ’ కూడా ‘పరమాత్మ’ కంటే వేరైనది కాదు. కనుక
Page:380
‘జీవాత్మ’ కూడా వాస్తవానికి ప్రజ్ఞామాత్రము, అవయవరహితము అయివున్నది. ఇక ఈ జగత్తు విషయం ఏమిటంటావా? ఒక దృష్టాంతము చెపుతాను. విను.
ఒకడు ఒక పెద్ద స్వప్నమును గాంచుచున్నాడు. అందులో తాను గొప్ప చక్రవర్తి అయి శత్రురాజులతో భీకరంగా యుద్ధం చేస్తున్నాడు అప్పటికి ఆ విషయం అతనికి సత్యముగానే తోచుచుండును కదా! ఇతరులకో? అదంతా మిథ్యమాత్రమే. ఇంతలోనే, అతడు తటాలున కనులు తెరచి, తన ప్రక్కన పరుండినవానితో "ఏమయ్యా? ఆ శత్రురాజు నన్ను అంతగా హింసిస్తుంటే నీవు వచ్చి సహాయపడవచ్చును కదా? నేను నీకు ఇదివరలో ఎన్నిసార్లు ఎన్ని సహాయాలు చేయలేదు చెప్పు?” అని ప్రశ్నించాడట.
ఇది ఎంత హాస్యాస్పదం! ఆ స్వప్నం దర్శిస్తూ మధ్యలో నిదురలేచి కనులు తెరచిన వాని ప్రశ్నకు అర్థమేమున్నది? అతని స్వప్నము అతని మిత్రునకు అనుభవం అవదు కదా!
ఈ జగత్తు మాయా దృష్టికి పరమనిర్దుష్టమైన సత్యముగాను, విశుద్ధదృష్టికి మొదలే అసత్యమైన దానివలె తోచుచున్నది. వాస్తవానికి ఈ ‘జగత్తు’ అను పేరుతో చెప్పబడుచున్నదంతా సృష్టికాలమందు ప్రళయకాలమందు … మధ్యకాలమందు కూడా పరమాత్మయందే సత్ (that which exists) + అసత్ (that which does not have existence as such) రూపమున వెలయుచున్నది. ఇదంతా “స్మృతి-జ్ఞప్తు”ల (Remembrance and Knowledge retained) నుండి మాత్రమే ఇట్లు అనుభవ మగుచున్నది. అంటే,… ఈ ‘జగత్తు’ యందు సంస్కార రూపమగు సత్త మాత్రమే సంచరిస్తోంది. ద్రష్ట కనుక సంస్కారమును త్యజించటం జరిగితే, ఈ ‘జగత్తు’ అనబడునది లేనట్లే. అనగా ఏమిటి? ఒకడు తన పూర్వ స్మృతి-జ్ఞప్తులను అనుసరించి సంస్కారపూర్వకంగా దేనిని ఎట్లు దర్శించుతాడో, అది అట్లే ప్రాప్తిస్తోంది. అందుచేతనే, ఒకే ‘సంఘటన’ లేక ‘విషయము’ (లేక ‘వ్యక్తి’ లేక ‘వస్తువు’) ఒకనికి సుందరంగా తోచుచుండగా, మరొకనికి అందవిహీనంగా ఉంటోంది. ఒకినికి ప్రియంగా, మరొకనికి అయిష్టంగా, ఒకనికి అనుకూలంగా, మరొకనికి ప్రతికూలంగా, ఒకనికి రాగభరితంగా, మరొకరికి ద్వేషయుక్తంగా ఇట్లు రకరకములుగా ప్రాప్తిస్తోంది. అంతేగాని ఈ జగత్తులో, ఏ విషయమైనాసరే, … “ఇది ఇట్లే ఉంటుంది. ఇది ఇట్లు పరిమితము” అని మనం పరిధులు కల్పించి, నిర్వచించలేము. అందుచేతనే ఇది "అనిర్వచనీయము” అని అంటున్నాం.
శ్రీరాముడు : స్వామీ! మీరు ఇప్పుడు మహోన్నతమైన విషయమునే ప్రతిపాదించారు. అయితే ఇక్కడ నాది మరొక సందేహం. లీలోపాఖ్యానంలోని విదూరథుని వంశపరంపర అక్కడ మంత్రులకు, పౌరులకు ఒకే తీరుగా కనిపించింది. ‘విదూరథుడు’ అనువాడు పుట్టటం, పెరగటం మొదలైనవన్నీ ఒకానొక జీవుని స్వప్న మాత్రమై ఉన్నది కదా! ఇదంతా ఒకరికి - - మరొకరికి ఎట్లా పొసగుతోంది? ఒకరు చూస్తున్నదే మరొకరు ఎట్లా చూస్తున్నారు? ఒకని స్వప్నములోనిది మరొకరికి కనబడగూడదు కదా! ఈ జగత్తులో అనేకులకు ఒక విషయం ఒకే తీరుగా కనిపించటం ఎట్లా జరుగుతోంది? ఉదాహరణకు, “ఇది గోడ. ఇది ఇల్లు. ఇతడు మానవుడు. ఇది జంతువు” అని నేను ఎట్లా
Page:381
చూస్తున్నానో, మీకు కూడా అట్లాగే కనిపిస్తోంది కదా? ఒకని మరణం అనేకమంది బంధువులకు దుఃఖకారణమౌతుంది. ఇవన్నీ ఎట్లా సంభవిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠమహర్షి : (1) ముఖ్య సంస్కారం (2) సహకారి సంస్కారములు.
ఒక చిన్న ‘వాయురేఖ’ విశాలమగు వాయువీచికను అనుసరించే పయనిస్తుంది కదా! ఈ “చిత్తము” యొక్క ముఖ్య సంస్కారమును అనుసరించే మిగతా జ్ఞానమంతా ఉండటం జరుగుతోంది. అందుచేతనే, పౌరులకు, మంత్రులకు కూడా పరంపరాక్రమమంతా ఒకే రీతిగా కనిపిస్తోంది. "ఇతడు మా రాజు, ఈ కులము నందు జన్మించిన ఇతడు ఇక్కడి వంశపారపర్య వ్యవస్థను అనుసరించి మమ్ములను పాలించువాడగుచున్నాడు! మేము ఇక్కడి పురవాసులము” అను స్వకల్పిత స్వప్నభావనను ఇక్కడి అనేకులు పొందుచున్నారు. ఆ అందరి వాస్తవ స్వరూపము ’సంవిత్తే’ కదా! ఒకే వాయువు అనేక వీచికలగుచున్నట్లు, ఒకే జలము అనేక కెరటములగుచున్నట్లు, ఒకే సంవిత్తు ఆయా ప్రజలందరి రూపము దాల్చుచున్నది సుమా!
అయితే ఇక్కడ ఒక విచిత్రం. విదూరథుడు - రాజు రాజ్యము - మంత్రులు-ప్రజలు ….. ఇవన్నీ కూడా ఆరోపితవిషయాలే కదా! ‘సంవిత్తు’ ఈ విధంగా ఆరోపిత విషయాలలో ’ఇది వాస్తవమే’ అని భావన (లేక) అనుభవం ఎందుకు పొందుతోంది? అనేది ఒక ప్రశ్న. ’ఎందుకు? అను ప్రశ్నకు మా వద్ద సమాధానం లేదు. అయితే “ఆరోపిత విషయములను స్వీకరించుట” అనునది సంవిత్తు యొక్క స్వభావమే అయివున్నదని మాత్రం చెప్పబడుతోంది. “ఇది ఆరోపిత విషయము -
ఇది వాస్తవము” …. అని గ్రహించినప్పుడు ఆ సంవిత్తు తన వాస్తవస్వరూప - స్వభావానుభవం పొందటం మాత్రం జరుగగలదు. మణి ఇచ్ఛారహితంగానే తన కాంతి పుంజములను ఎదురుగా ఉన్న వస్తువులపై వెదజల్లుచున్నట్లు, సంవిత్తు సంకల్ప-వికల్పాదులను కలిగి ఉంటోంది. ఒకడు ఒకచోట ఒక త్రాడును చూచాడు. ‘పాము’ అని అనుకొన్నాడు. సర్వ వికారములు పొందుచున్నాడు. ఇప్పుడు అతనికి, “అది పాము కాదు. త్రాడే" అని తెలియటం ముఖ్యం. వెనువెంటనే వికారాలన్నీ పోతాయి. అతడు ప్రశాంతమగు స్వస్థితిని మరల సంతరించుకుంటాడు. సత్యవిషయము ప్రతిపాదించుటను వదలిపెట్టి, తదితర చర్చలు ఎంత చేస్తే ఏం ప్రయోజనం?
’చింతామణి’ ఏది కోరితే అది ఇస్తుంది చూచావా? అదేవిధంగా విదూరథుని జీవ చైతన్యము కూడా, “నేను ఈ వంశమున ఈ తీరుగా జన్మించెదను గాక” అనునట్టి అంతర్గత వాసనాబలం కలిగియుండటంచే అట్లే జన్మించటం జరిగింది. “చిత్పదార్థము సర్వగామి (All pervading). ఈ “జీవుడు” అని మనచే పిలవబడుచున్నవాడి వాస్తవస్వరూపము చిత్పదార్థమే కదా! అందుచేత, ‘జీవచైతన్యము’ నందు ఏమేమి అధ్యస్థమై ఉంటున్నాయో అవన్నీ సృష్టి సమయంలో పరస్పరం సంబంధితములై ప్రాప్తిస్తున్నాయి. వాసనా ప్రభావంచే ఏర్పడే అనుభవజ్ఞానమునకు జీవచైతన్యమే ఉనికి - స్థానము అగుచున్నది.
Page:382
అఖండ బ్రహ్మము
బ్రహాకార
స్వభావం ఒక గ్రామమునకు ఎల్లలు కల్పనయే అయినట్లే, ఈ
‘జీవుడువస్తు - ఆకార ’ అనబడే తత్త్వము
స్వభావం యొక్క పరిధులు భ్రమతో కూడుకొన్న ‘కల్పన’ మాత్రమే.
ప్రతి జీవుని యందు ఒకానొక బ్రహ్మాకార స్వభావం వెలయుచున్నది. అది విషయ దోషములచే ఏమాత్రం స్పర్శించబడకుండా సాక్షీభూతమై ఉండియున్నది. గదిలోని దీపమునకు, ఆ వెలుగులో జరుగు సంఘటనలకు సంబంధములేనట్లు అది దేనికీ సంబంధించకుండా ఉండి ఉంటోంది. “ఒక బాలుడు దీపపు వెలుగులో పఠించు చున్నాడు” అను విషయమే తీసుకొందాం. దీపపు వెలుగు అతని చేత చదివించు చున్నదా? లేదు. కాని వెలుగులేకపోతే చదవటం జరిగేది కాదు. బ్రహ్మాకార తత్త్వము కూడా అట్లే. “సర్వమునకు కారణమై, కాని ఎట్టి ‘కర్తృత్వము’ అనునది లేకనే” …. ఉండి ఉంటోంది. అది ‘విదేహముక్తి’ వరకు ఉండి, అటుపై బ్రహ్మమున విలీనమగు చున్నది. అయితే బ్రహ్మమునకు వేరైనది ఏ క్షణంలో కూడా, ఎక్కడా ఏదీ లేదు సుమా! ఆ బ్రహ్మాకార స్వభావం అట్లు ఉండి ఉండగానే, ఈ జీవునియందు భావనాబలము వెల్లివిరియుచున్నది. భావనాబలంచేత చిన్మయ వస్తువు ఆయా ఆకారంలో స్ఫురిస్తోంది. జీవులందరు కూడా స్వాభావికంగానే ఇట్లు స్ఫురిస్తున్నారు. అనగా, “నేను ఎక్కడ ఏ రూపమున స్ఫురిస్తున్నానో అక్కడ ఆ రూపమున నాకు ప్రాప్తిస్తున్నాను. నేను లేనిదేది నాకు ప్రాప్తించదు. అందుచేత అంతటియందు నేను విస్తరించియున్నాను” అనునది ఆత్మజ్ఞానుల అనుభవం.
88
ఓ రామచంద్రా! ఆ విధంగా చిన్మయవస్తువు ‘జగత్తు’ ఆకారంగా స్ఫురించటం సహజం. పరిపాటి కూడా. అంతమాత్రం చేత సత్యజ్ఞానమునకు వచ్చే ప్రమాదమేదీ ఉండదు. మట్టి ఎన్ని ఆకారములు పొందితే ఏమున్నది? ఆ మట్టికీ, ఆకారములకు సంబంధం లేదుకదా! మట్టితో ఏనుగును చేసినంతమాత్రంచేత మట్టి ఏనుగు అవుతుందా? మట్టి ఎప్పుడు, సర్వదా మట్టిగానే ఉంటున్నట్లు, జగత్తును పొందుచున్న ఈ జీవుడు, - జీవునిచే పొందబడుచున్న జగత్తు . ఈ
రెండు చిన్మయమగు ఆత్మ స్వరూపములే. అయితే, సముద్రమువైపు పయనించే మహానది ఇతర ఉపనదులను తనయందు విలీనం చేసుకొంటుంది చూచావా? అదేవిధంగా, “మాయ - చిత్స్ఫురణ” అయినట్టి ఈ "జగత్ - స్వభావన”ను, నిత్యసత్యమై ఉండి ఉంటున్నట్టి “బ్రహ్మాకారపు జ్ఞానము” లోబరచుకొనుచున్నది. ఈ సృష్టులు, ఈ జన్మలు, ఈ జగద్వ్యవహారములు ముక్తిని నిరోధించజాలవు.
Page:383
అనగా, ఇవి ఇట్లు ఉండి ఉండగానే జీవుడు “నేను సర్వదా ఆత్మ స్వరూపుడనే కదా!” అనునట్టి ముక్తస్వభావము తప్పకుండా పొందవచ్చు. వాస్తవానికి ఈ జీవుడు ముక్తస్వరూపుడేకాని, బద్ధుడుకాదు. అట్టి ముక్త స్వరూపమును మరుగునపరచి ఉంచుచున్నది "అజ్ఞానము అవిచారణ”యే
సుమా! అంతేకాని ఈ భౌతిక దేహముయొక్క రాకపోకలు ముక్తత్వమును భేదపరచజాలవని గ్రహించబడు గాక! జీవునకు అతని “సర్వదా సిద్ధించియున్న ముక్త స్వరూపము”ను గుర్తుచేయుట కొరకే శాస్త్రములు, శాస్త్రములచే చెప్పబడు విధి - విధానములు, నియమనిష్ఠలు, సద్గురువులు ఉండటం జరుగుతోంది.
"నేను బ్రహ్మమును. అంతేగాని ఖండ - సంకుచిత స్వరూపములగు శరీరముగాని, పరిమితాత్మ స్వరూపముగాని కాను” …. అనునదే బ్రహ్మ భావముగా చెప్పబడుచున్నది. అత్యంత దృఢంగా యత్నించువాడు ఈ జీవభావము త్యజించివైచి, విజయుడై, బ్రహ్మ భావమునందు తప్పక ప్రవేశించగలడు. ప్రతి జీవియొక్క వాస్తవస్వరూపము అపరిమితము, శుద్ధము, అప్రమేయము అగు బ్రహ్మమే కనుక, ప్రతిజీవి బ్రహ్మభావన పొందుటకు తాపత్రయపడుచూనే ఉన్నాడు. తెలిసినా, తెలియకున్నా … ప్రతిజీవి తన పూర్ణత్వమును ఎరుగుటకు, ప్రకటించుటకు …. బాహ్యజగత్తునందు, అంతరంగమునందు ఆయా ప్రయత్నములను చేస్తూనే ఉంటున్నాడు.
ఓ రామచంద్రా! ఒక పరమాణుకణము నుండి కూడా భ్రాంతిమయ జగత్తులు వెలువడు చున్నాయి. నశించుచున్నాయి. అజ్ఞానవశంచేత, ఉత్తమోత్తమమైన ఆశయం కలిగియుండకపోవుటచేత, ఈ జీవుడు అనేక మూర్ఖయత్నములను కలిగియుండి ఈ జగత్తులలో ప్రవేశిస్తున్నాడు. ఎంతగా ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం? ప్రతిబింబ మాత్రమగు ఈ బాహ్యజగత్తులో లభించగలిగినదేమి? లభించకపోవటం ఏమిటి? జ్ఞానము లభించనంతవరకు అతనికి ఉత్తమశాంతి లభించటంలేదు.
తుదిగాని, మొదలుగానిలేనట్టి (ఆద్యంతములు లేనట్టి), ‘జన్మ’ మొదలైన వికారములు గాని లేనట్టి ‘చిదాకాశము’ (The All-Pervading Consciousness) ఒక్కటే సర్వదా ఏకమై వెలయుచున్నది. సత్-చిత్ (Absolute Existence-Absolute Knowledge) దాని స్వరూప స్వభావములని చెప్పబడుతోంది. ఇక, జగత్తు ఎక్కడ? బంధమెక్కడ? విముక్తి ఎవరికి? వివేక రహితమగు లేక స్వప్నతుల్యమగు బుద్ధి కలిగియున్నప్పుడు మాత్రమే “నేను బద్ధుడను, ముక్తిని పొందవలసియున్నది” అను అభిప్రాయ పరంపరలు ఏర్పడు చున్నాయి. సర్వమునకు అధిష్ఠానము (that which support & substraction of everything) బ్రహ్మమే అయివున్నది. అట్టి బ్రహ్మము మాత్రమే సత్యము. జగత్తు మిథ్యయే. ఇక బంధమేమిటి? మోక్షమేమిటి?
ఇదంతా ఒకానొక సుదీర్ఘమైన వ్యవహారము వలె, కథారచన వలె …. ఒకదాని కొకటి సంబంధించినదై ఉంటే ఉండనీ, ఏదిఏమైనా ఇది మిథ్యయే. ఒక వృక్షము ఆకులతోను, పండ్లతోను, పువ్వులతోను నిండి ఉన్నప్పటికీ అవన్నీ ఉన్నది వృక్షమునందేకదా! అనేక పళ్ళు-పూలు-కాయలు
Page:384
ఉండవచ్చునుకాని, “వృక్షము మాత్రం సర్వదా ఏకమే (ఒక్కటే) అయివున్నది" అనటంలో సందేహం ఎక్కడిది? బ్రహ్మము కూడా సర్వశక్తి సంపన్నమై, నానావిధ - ఆకారములలో స్ఫురించుచున్నప్పటికీ
అది సర్వదా “ఏకము - అఖండము - అద్వితీయము” అయివున్నది. దానియందు నానాత్వాది కల్పనలు (that - this - I - you - he - mine - your - his - now - then మొదలైన కల్పనలు) ఏ క్షణమునందు కూడా ఉండియే ఉండలేదు. అంతేకాదు. అది సర్వవ్యాపకము. అది కానిదంటూ ఏదీ లేదు. బ్రహ్మతత్త్వము గ్రహించబడినదా, ఇక మరెన్నటికీ ఎట్టి వికారములు ఉండవు.
ఆత్మకు ఉదయాస్తమయములు లేవు. అంధకారములను కూడా ప్రకాశింపచేయటం, ’ఇది అంధకారము’ అని గుర్తించటం, అనుభవమును పొందటం…. ఇవన్నీ ఆత్మ వలననే జరుగుచున్నాయి. ఆత్మయే దిక్కుల రూపము. కాలరూపము కూడా అదే. అయినప్పటికీ, అది ఆదిమధ్యాంతరహితము, అద్వితీయము అయివున్నది. నీయొక్క, నాయొక్క, ఈ సర్వులయొక్క స్వస్వరూపము అట్టి ‘బ్రహ్మము’ లేక ’ఆత్మ’యే కాని, మరింకేదీ కానే కాదు. అది సర్వదా సౌమ్యముగా మృదుతరంగములతో కూడిన సముద్రమువలె వెలయుచున్నది. ఓ రాఘవా! వాస్తవానికి ఈ ‘నీవు-నేను’ …. అను భావములే మూలముగా కలిగియుండి కనబడుచున్న ఈ జగత్తు వాస్తవమైనది కాదు. ఇదంతా
ద్వైత - ఐక్య – సంకల్ప - వికల్ప …. రూపకమైనట్టి “మనస్సు” నుండే ప్రతిభాసించుచున్నట్లు అగుపించుచున్నది. ఆకాశము శూన్యమే అయినప్పటికీ, అందు భ్రాంతిచేత నీలత్వము, ముత్యములు మొదలైనవి గోచరిస్తున్నాయి చూచావా? ఈ జగత్తు కూడా బ్రహ్మమునందు భ్రమాత్మకమైన దృష్టి కారణంగా గోచరిస్తోంది. భ్రమ అజ్ఞానముచేత ఏర్పడుచున్నది. ‘అజ్ఞానము’ అంటే ఏమిటి? జ్ఞానరాహిత్యమే సుమా! ‘చీకటి’ అనగా వెలుగు లేకపోవటం మాత్రమేకాని మరింకేమి కాదు.
శ్రీరాముడు : హే బ్రహ్మజ్ఞా! సాధూ! ఈ “నేను-జగత్తు” అనునవి భ్రాంతి మాత్రములని మీ వాక్యానుసారం గ్రహిస్తున్నాను. అయితే ఈ భ్రాంతి ఏ కారణంచేత ఏర్పడుచున్నది? ఏ కారణము లేకుంటే, అవి ఎట్లా ప్రభవిస్తున్నాయి? వాటి స్వరూప స్వభావాలు ఏమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! నీ ప్రశ్న బాగానే ఉన్నదయ్యా! ఉత్తమము, నిర్మలము, సుతీక్షము అయినట్టి బుద్ధిచే ఈ క్రింది ప్రశ్నలను ముందుగా పరిశీలించు.
నేను ఎవరు?
ఈ చిత్తమేమిటి?
ఈ జగత్తును నేను ఎట్లా పొందియున్నాను?
దీనియందు నాచే అనుభవించబడుచున్న ఆయా పదార్థములతోటి, వ్యక్తులతోటి ఏర్పడుచున్న సంబంధ బాంధవ్యములు సత్యములా? కల్పితములా?
Page:385
ఒకవేళ కల్పితములైతే, అవి కల్పించుచున్నది నేనేనా? లేక, బాహ్యమున ఎక్కడో ఉన్నట్టి మరెవరోనా?
బాహ్యమున ఉన్నట్టి ఎవరో ఈ కల్పనలకు కారణమైయుంటే, అతడు ఎట్లు ఏ ప్రయోజనము కోరి చేస్తున్నాడు?
ఈ ప్రశ్నలకు ‘ఉపనిషత్తులు’ మొదలైన శాస్త్రములు ఇస్తున్న సమాధానమేమిటి? ఈ విషయమై అనుభవజ్ఞులగు ఆత్మజ్ఞానులు ఏమంటున్నారు?
బుద్ధి దోషరహితం అయితేకానీ ఉత్తమజ్ఞానం వికసించదు. మరి స్వబుద్ధిని సుతీక్షం నిర్మలం చేయాలంటే అనుసరించవలసిన మార్గములేమిటి?
ఈ ప్రశ్నలను పరిశీలించటం, ఉత్తమ ప్రయత్నములను ఆశ్రయించటం చేయుచుండగా ఈ జీవుడు “విదితవేత్త” (తెలుసుకొనవలసినది తెలుసుకొనినవాడు) అగుచున్నాడు. అప్పుడాతడు, "ఆహాఁ! నేను చైతన్యమే స్వరూపముగా కలిగియున్నాను. ఈ భ్రాంతి అంతా చైతన్యము నందు అంతర్గతమైయున్నది. చైతన్యమునకు బాహ్యమున, దానికంటే వేరుగా ఏ పదార్థము ఎక్కడా ఉండకయే ఉన్నది. నేను కానిదేదీ నా ముందు ప్రాప్తించటం లేదు” అని గ్రహించుచున్నాడు. అట్టివాడు తనను తాను సర్వజీవుల యొక్క అంతర్యామిగా, నిష్క్రియుడుగా, నిస్సంగుడుగా దర్శిస్తున్నాడు.
అయితే రామచంద్రా! ప్రయత్నశీలుడు మాత్రమే ‘విదితవేద్యుడు’ అగుచున్నాడు. ఉత్తమ ఆశయముతో ప్రయత్నించనట్టి ‘అప్రయత్నశీలుడు’… ఉత్తమభావనను పొందలేక పోవుచున్నాడు. అతడు ఈ భ్రమాత్మకమైన సంసారంలో నిష్ప్రయోజనంగా పైకి - కిందికి సంచరిస్తూనే ఉంటున్నాడు.
సర్వాత్మకము (సర్వులయొక్క ఆత్మస్వరూపమైయున్నది), జన్మరహితము అయినట్టి బ్రహ్మము ఒక్కటే త్రికాలములందు సత్యము. ఇక ఈ అసత్యములైనట్టి ‘నీవు - నేను - జగత్తు’ మొదలైనవన్నీ భ్రమ కారణంగానే ప్రవర్తిస్తున్నాయి. అట్టి సత్యమును అధికారులగు జనులు (Those who have
become competent to receive this knowledge by cultivating dispassion & discrimination)
గ్రహించటం కొరకే, నిన్ను నన్ను నిమిత్తంగా చేసుకొని, ఈ ‘వాసిష్ఠ రామాయణము’ అను గ్రంథమును సర్వతత్త్వస్వరూపుడగు పరమాత్మ వారిముందు ఉంచుచున్నాడు.
అవయవములకన్నా వేరైన ‘అవయవి’
ఈ జగత్తులో జనులకు అనుభవమయ్యే పదార్థములన్నీ “పంచేంద్రియములచే గ్రహించబడు చున్నవి” మాత్రమే కదా! అట్లు ఇంద్రియములకు అనుభవమగుచున్న పదార్థములన్నిటికీ వాస్తవానికి శాశ్వతమైన రూపమంటూ ఏదీ లేదు. “ఇవన్నీ బ్రహ్మమునందే. బ్రహ్మముగానే వెలయుచున్నాయి” అని బ్రహ్మజ్ఞులు చెప్పుచున్నారు. ఆభరణము బంగారము నుండి వేరా? ‘తరంగము’ అనబడునది నీరు కాకుండా వేరుగా ఇంకేదన్నా అయివున్నదా? ఈ జగత్తు కూడా ఈశ్వరునకు వేరైనది కాదు.
Page:386
ఈ అభిప్రాయం అనేకమంది జ్ఞానులచే, శ్రుతిస్మృతులచే నిర్ద్వంద్వంగా ప్రకటించబడింది. ఈశ్వరుడే జగత్తు రూపమున స్ఫురించుచున్నాడు.
కాని ఈ జగద్రూపము ఈశ్వరునియందు లేదు సుమా! దృష్టాంతము సువర్ణాభరణమే. బంగారమే ఆభరణంగా ప్రాప్తిస్తోంది. అయితే ’బంగారము తన స్వరూప స్వభావములు కోల్పోయి ఆభరణముగా మారినది" అనునది సమంజసము కాదు కదా! బంగారము బంగారముగానే ఉంటోంది. ఒకానొక ఆకారమునకు “గొలుసు-గాజు” మొదలైన ఆభరణనామము మనం ఇస్తున్నాం.
మరొక దృష్టాంతము. ఈ ’శరీరి’ని తీసుకో. ఈ అవయవి (అవయవములు కలిగియున్నవాడు. The Experiencer cum operator of the body) సర్వ అవయవాత్మకుడై చెవులందు వినటం, కళ్ళయందు చూడటం, చర్మమునందు స్పర్శ అనుభవించటం మొదలైన క్రియలన్నిటికీ ‘కర్త’ అయి ఉంటున్నాడు. అంతమాత్రంచేత అతడు “చూపు - వినికిడి - స్పర్శ” మొదలైనవిగా మారిపోవటం లేదు కదా! అదేవిధంగా చిదాత్మ (లేక అవయవశూన్యమగు చిద్వస్తువు) కూడా సర్వాత్మకమై ఉండటంచేత నానారూపములుగా ప్రకాశించుచున్నాడు. కానీ సర్వదా యథాతథుడు.
ఈ ప్రాణుల అంతరమున ఒకానొక సమయంలో అజ్ఞానంచేత “నేను - జగత్తు“ మొదలైన రూపములన్నీ ప్రకాశిస్తున్నాయి. అయితే, ”సూర్యుడు-సూర్యకిరణములు" వలె అట్టి భావన కూడా బ్రహ్మము యొక్క స్వభావమే అని గ్రహించు. అంతమాత్రము చేత బ్రహ్మమునకు వచ్చేలోటేమి ఉండదు. “అజ్ఞానమును స్వీకరించటం కూడా బ్రహ్మము యొక్క స్వభావమైయున్నది” అని గ్రహించి నప్పుడే ఆ బ్రహ్మము యొక్క సర్వాత్మకత్వము అనుభవమవగలదు. ఈ ’అనేకత్వము’ అను రూపముగల ‘జగత్ జాడ్యము’ అప్పుడు మాత్రమే తొలగుచున్నది.
ఒక స్ఫటిక శిలయందు (అట్లాగే ఒక దర్పణమునందు) ఎదురుగా ఉన్న అరణ్యం ప్రతిబింబిస్తోందనుకో అప్పుడు ఆ స్ఫటికంలో కనిపించే ప్రతిబింబ దృశ్యము స్ఫటికము కంటే వేరైనదా? కాదు కదా! దర్పణంలో ప్రతిబింబించే నీ ముఖము దర్పణమునకు వేరైనదని అనలేము కదా! చిన్మయుడగు పరమేశ్వరుని నుండి ఈ “అహంభావాత్మకము” అయినట్టి జగత్తు వేరైనది కాదు. కాని, వేరైనట్లు తోచుచున్నది. నీటి నుండి తరంగాలు చేస్తున్నాయి. మరల ఇంతలోనే విలీనమైపోతున్నాయి. ఆ తరంగములు జలముకంటే వేరైన రూప-నామములతో ప్రాప్తించినప్పటికీ, ”తరంగములు జలము కంటే వేరు” అని ఎవరనగలరు? అదేవిధంగా ‘బ్రహ్మము’ అను మహా సముద్రంలో “సృష్టులు” అనే తరంగాలు లేస్తున్నాయి. మరల లీనమై పోతున్నాయి. కాని ఆ సృష్టులన్నీ బ్రహ్మముకంటే వేరేమికాదు.
ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! వాస్తవానికి పరబ్రహ్మము పదార్థరహితము. సృష్టియందు పరబ్రహ్మము లేదు. పరబ్రహ్మమునందు సృష్టియు లేదు. ఎందుకంటావా? పరబ్రహ్మ దృష్టితో దర్శిస్తే ఇక్కడ ‘సృష్టి’ అనబడునదే తోచదు. ‘సృష్టి’ అనబడు భేదదృష్టికి ’పరబ్రహ్మము’ అనబడు అఖండ-అప్రమేయ- అద్వితీయ తత్త్వము యొక్క అనుభవము లభించుచున్నది. దర్పణంలోని
Page:387
ప్రతిబింబము వలె ఈ సృష్టి ‘మాయా ప్రతిభాస’ మాత్రమే. జ్ఞానులగువారికి ‘బ్రహ్మసత్త’ మాత్రమే ఇక్కడ లభిస్తోంది. అజ్ఞానులకే ఈ నీవు-నేను-జగత్తు అనబడు వివిధత్వమంతా తోచుచున్నది. చిత్ నందు ప్రతిఫలిస్తున్న ‘విషయజ్ఞానము’ కారణంచేత చిన్మయపరబ్రహ్మమే జగత్తుగా గాంచబడుచున్నది. కల్పన చేస్తున్నది …. కల్పనగా గాంచబడుచున్నది కూడా చిన్మయ బ్రహ్మమే సుమా!
అట్టి కల్పన యొక్క ఆరంభమున “కారణ-కారణము” (కారణముల కెల్ల కారణము) అయినట్టి బ్రహ్మమున అంతవరకు లీనమైయున్న శబ్దతన్మాత్ర ఆకాశరూపమును ధరించుచున్నది. అట్టి ఆకాశరూపమగు బ్రహ్మము ఆ తరువాత స్పర్శతన్మాత్రతో గూడి వాయుత్వము అనుభవిస్తోంది. అట్లు వాయురూపము ధరించిన బ్రహ్మమే తేజః ప్రకాశమువలె రూపతన్మాత్రతో గూడి తేజో మయత్వము పొందుతోంది. అట్లు తేజోరూపము పొందిన బ్రహ్మమే రస తన్మాత్రతో గూడి జలత్వము పొందుచున్నది. ఈ జలరూపాభిమానియగు బ్రహ్మము ’గంధ తన్మాత్ర’తో గూడి తన చిత్తముతో పృథ్వి భావము పొందుతోంది. ఇట్లు జగత్తు చిన్మయాకారముననే ప్రకాశించుచున్నది. ఈ క్రమము ప్రకాశించటం - ఇదంతా నిమిషములో లక్షవ భాగ సమయంలో జరిగిపోతోంది. ఇదే కోటి కల్పముల వరకు వెలయుచున్న సృష్టి. కాని, ‘బ్రహ్మము’ అన్ని సమయములందు మార్పు చేర్పులు లేకయే ఉంటోంది. అయ్యది "విశుద్ధము, నిత్యప్రకాశము, సృష్టి-ప్రళయములకు కూడా స్థానము, ఉదయాస్తమయరహితము, ఎట్టి ఆధారము లేకయే ఉంటున్నది” అయివుంటోంది. అయ్యది నిర్లిప్తంగా, నిష్కళంకంగా, నిశ్లేపంగా సర్వదా స్వమహిమ యందే వెలయుచున్నదని గ్రహించు.
‘పరమార్థసత్త’ యందు సృష్టి-ప్రళయములు ఉంటున్నప్పటికీ, అందు ఏర్పడుచున్న ‘వైషమ్యం’ అంటూ ఏదీ లేదు. ఈ జీవుడు అజ్ఞానముచే కప్పబడియున్నప్పుడు అనేక భేదములు పొందుచున్నట్లు కనిపించినప్పటికీ అతని వాస్తవస్వభావమగు ఆత్మ యొక్క అఖండత్వమునకు ప్రమాదమేమీ ఏర్పడటంలేదు. అదే జీవుని బుద్ధి ప్రబుద్ధమైనప్పుడు “మనస్సు - దృశ్యము” మొదలైనవి. ఇట్లు ఉండగానే అతడు ముక్తి స్వభావము పొందుచున్నాడు. ముక్తి స్వభావముచే అంతరంగమున ప్రశాంతబుద్ధిని పొంది బాహ్యమునకు యథాతథముగా వ్యవహరిస్తున్నాడు.
ఎవరు ఎట్లు తమ అంతరమున బ్రహ్మ వస్తువును గ్రహిస్తారో అది అప్పుడు వారిపట్ల అట్లే ప్రతిఫలిస్తూ ఉంటుంది. అదియే ‘మాయాశక్తి విలాసము’ అని చెప్పబడుతోంది. అట్టి పరిణామము గ్రహించినట్టి సత్యద్రష్టలగు మేము “ఈ జగత్తు బ్రహ్మముయొక్క విలాసమే కాని, మరింకేమి కాదు” అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాం. తపస్సు, ధ్యానము, విచారణలు మొదలగువాటిచే మేము ఈ విషయం గ్రహించిన తరువాతనే ఈ విషయం చెప్పుచున్నాం. “ఈ మనస్సు ఇంద్రియములతో కూడినదై బహిర్వ ృత్తులను పొందుచున్నది. తత్ఫలితంగా చూచేది, వినేది, అనుభవించేది … అంతా కేవలం నామరూపాత్మకమైన స్వకీయ కల్పనయే” అని మేము గుర్తించుచున్నాము. కాబట్టి ఇవి భేద దృష్టి దృష్ట్యా సత్యమే అవుతాయి కాని, వాస్తవము కాదు.
Page:388
వాయువు చలించనప్పుడు దాని ఉనికిని మనం గ్రహించము. చలించునప్పుడు మాత్రమే దాని స్పర్శను అనుభవిస్తున్నాం. చలనము లేనప్పుడు గాలి లేనట్లే అనిపిస్తుంది. కాని, అది లేని సమయమెప్పుడో చెప్పు? ‘అజ్ఞానము’ ఉన్నంతవరకు “చైతన్య బ్రహ్మము” మరుగునపడి, జగత్తే కనిపిస్తోంది. అజ్ఞానం తొలగితే జగత్తు లేదు. చైతన్య బ్రహ్మమొక్కటే వాస్తవమైన సత్త కలిగియున్నది. ఆ సత్తయే “సర్వుల యొక్క - సర్వము యొక్క స్వరూప - స్వభావముల గురించి ఎరుక”గా ప్రభవిస్తోంది. ఒక్కొక్కచోట అది తన స్వస్వరూపమును ఏమరచి ఉంటోంది. మరొకచోట పూర్ణమగు స్వస్వరూపజ్ఞానముతో ప్రకాశిస్తోంది. ఆకాశం అఖండమై నిర్మలమై ఉండగా అందు కొంతభాగం నిర్మలంగాను, మరికొంతభాగం మేఘాదులచే కప్పబడి ఉంటోంది కదా! ఇది కూడా అట్టిదే. అట్టి ఎరుక యొక్క త్యాజ్య-గ్రాహ్యములనే (స్వస్వరూపము గురించిన జ్ఞానము త్యజించి ఉండుట గ్రహించియుండుటనే) మనం “బంధము” అని, “మోక్షము" అని వ్యవహరిస్తున్నాం.
ఒకడు “తేజము వేరు, ప్రకాశము వేరు. సూర్యుడు వేరు. కిరణములు వేరు” అనునట్టి బుద్ధితో చూడటం జరిగితే, అవి అట్లే వేరువేరుగా తోచటం జరుగుతుంది. ”తేజ - ప్రకాశములు అభిన్నములు. సూర్యుడు - - సూర్యకిరణములు వేరు వేరు కావు" అనునట్టి దృష్టితో చూచినప్పుడు మాత్రం, అభిన్నత్వమే అనుభవముగా శేషించుచున్నది. “బ్రహ్మతత్త్వము” ప్రాప్తించుచున్నది. శ్రీరాముడు : మహాత్మా!
1) సృష్టికి ముందు ‘బ్రహ్మము’ ఒక్కటే కలదు.
2) జగత్తు - - బ్రహ్మము ఒక్కటే
ఈ రెండు వాక్యములు ఒకేసారి ఒనగూడగలవంటారా? ఏ విధంగా?
శ్రీ వసిష్ఠమహర్షి : మట్టితో ఒకబొమ్మ తయారుచేశామనుకో ఆ బొమ్మ మనం తయారు చేయటానికి ముందే “మట్టి“ ఉన్నది కదా! కొయ్యతో ఒక బొమ్మ లేక ఆకారము (ఏనుగు, గుఱ్ఱము మొదలైనవి) ఒక కమ్మరి శిల్పి మలచినాడనుకో ఆ ఆటబొమ్మ ఆకారమునకు ముందే ‘కొయ్య’ ఉండి ఉన్నది కదా! మట్టిబొమ్మగా మలచబడినప్పుడు, కొయ్య బొమ్మగా తయారు చేయబడినప్పుడు మట్టి-మట్టిగానే, కొయ్య-కొయ్యగానే ఉండి ఉంటున్నాయి. అట్లే ఆ మట్టి బొమ్మ ముక్కలైనప్పుడు కూడా మట్టిమట్టే కదా! ఈ “జగత్తు” అనబడునది కూడా, (బొమ్మ ఆకారము మట్టితో ఉండియే ఉన్నట్లు), బ్రహ్మమునందు అవ్యక్తమై ఉండి ఉంటున్నది. వ్యక్తమగుట జరిగినప్పుడు కూడా, (జగత్తు ప్రాప్తిస్తున్నప్పుడు కూడా) ఇదంతా బ్రహ్మము కంటే ఏమాత్రం వేరైనది కాదు. అయితే సాంసారికదృష్టి గలవానికి మాత్రం “పరబ్రహ్మము” అనబడే ఒకానొక సువిశాల ఎడారిలో నీటిచెలమల వలె లభిస్తున్న ఈ జగత్తులు ఎండమావులవలె అసత్యములే అయినప్పటికీ “సత్యమేనా?” అన్నట్లుగా భ్రమింపచేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ”చిన్మయ బ్రహ్మము” భ్రాంతి వలన జీవరూపమును గ్రహించి, ‘సృష్టి-క్రమము’ అనుదానికి లోబడు చున్నది. ఇక్కడ ప్రాప్తిస్తున్న జగత్ చమత్కారమంతా అదియే కారణంగా కలిగియున్నది.
Page:389
పాలలో ‘తీపి’ ఉన్నది. మిరియపు గింజలలో ‘కారము’ ఉంటోంది. నీటియందు ద్రవత్వం ఉంటోంది. గాలియందు కదలికలు ఉన్నాయి. అవన్నీ ఆ పదార్థములకు వేరైనదానివలె పదప్రయోగం దృష్ట్యా చెప్పబడుచున్నప్పటికీ ఒకదాని నుండి మరొకటి వేరు కాదు. వాటికి భిన్న భిన్నమైన
సత్త ఎక్కడ ఉన్నది? “బ్రహ్మసత్త దృశ్యము వంటిది కాదు. సృష్టికి వేరుగా బ్రహ్మమనునది ఎక్కడో లేదు. ద్రష్టయొక్క సత్తకు వేరుగా ‘బ్రహ్మము’ అనబడునదేదీ లేదు. అందుచేత ’జగత్తు’ అనబడునది “మిథ్య” అనియే సిద్ధాంతీకరించబడుచున్నది.
❖
ఎట్టి కారణం లేకుండానే బ్రహ్మము జగత్తు రూపమున ప్రకాశించుచున్నది. అట్టి ప్రకాశము బ్రహ్మముకంటే వేరేమీ కాదు. “వాసనలు-చిత్తము-జీవులు“ … అనబడునవన్నీ మనస్సునుండే ఉత్పన్నమౌతున్నాయి. ఉన్నదంతా మనస్సులోనే ఉన్నది. మనస్సు కానట్టి జగత్తే లేదు. ఇక మనస్సుయొక్క రూపమేమిటి? మననమే కదా! అనగా …. బ్రహ్మసంవిత్తే తన మనన శక్తిని ఉత్తేజితం చేసి ’జగత్తు-జీవుడు’ అను జాడ్యమును స్వయముగా అనుభవించుచున్నది. ”జ్ఞాన యోగము” వలన, “దృఢాభ్యాసం” వలన, “పురుషప్రయత్నం” వలన, ఈ మనస్సు లయించి పోయినప్పుడు, అట్టివాని దృష్టిలో ఈ జగత్తు “లేనిదే” అగుచున్నది.
ఓ రఘురామా! బ్రహ్మము సర్వాత్మకమై, శాంతమై, అజమై, చిన్మయమై, నిత్యప్రకాశకమై ఉన్నది. దానికి జనన-మరణములనునవే లేవు. అది చిదనము అయివున్నది. ఇక ఈ సృష్టి పరంపరాప్రాప్తి అంటావా…. ఇదంతా నిజానికి పరమాణు సమూహ రూపమున సంకల్పానుసారంగా ప్రతిభాసిస్తోంది. భ్రాంతి చిత్తము యొక్క సహాయం చేతనే కలుగుచున్నది కాని, అందుకు వేరెవరో కారణం కాదు. అసలు పరమాణువులేమి? ఆ పరమాణువునందు సృష్టి ఉండటం ఏమిటి? ఈ కనబడుచున్న - అనుభవమగుచున్న “సుఖ-దుఃఖ-రాగ-ద్వేషము”లతో కూడిన జగత్తు మిథ్య మాత్రమే అనటంలో సందేహం లేదు. (లేక) స్వకీయకల్పిత భావనావైచిత్ర్యమే!
నీటియందు అలలు వెలువడుచు, ఇంతలోనే అణిగిపోతున్నాయి చూచావా? ఈ జీవుని యందు కూడా జాగ్రత్-స్వప్న సుషుప్తి అవస్థలు ఏర్పడుచున్నాయి. తొలగుచున్నాయి. అట్లే ఈ శరీరాదులు ఏర్పడుచున్నాయి, తొలగిపోవుచున్నాయి. “ఈ శరీరములు, భావనలు, సంకల్పములు ఎందులేచి విలీనమైపోతున్నాయో అట్టి తత్వమే ‘స్వస్వరూపము’ అనబడునది” అని విజ్ఞులు నిర్వచించు చున్నారు. ఈ జీవుడు తన స్వస్వరూపము గ్రహించలేకపోవుటచేతనే స్వస్థత పొందలేకపోతున్నాడు. అతనికి ఒకింత భోగముల యెడ విరాగము కలిగిందా అంతమాత్రం చేతనే అతడు ఉత్తమమగు పదము పొందగలుగుచున్నాడు. సంపూర్ణంగా విరాగము కలిగినదా … ఇక ’జీవన్ముక్తి’కే తగినవాడగు చున్నాడు. “నేను-దేహము” అను రూపముగల దేహాత్మబుద్ధి కలిగియున్నవానియందు మాత్రమే “రాగములు-భోగములు” మొదలైనవన్నీ ప్రదర్శితములు అవుచున్నాయి. ‘దేహాత్మబుద్ధి’ లేనివానికి జనన మరణములే లేవు. ఆ అనుభవములన్నీ అతని దృష్టిలో స్వప్నసంఘటనవంటివే.
Page:390
“ఈశ్వరచైతన్యము - - జీవుని చైతన్యము” … ఈ రెండూ కూడా కారణము - కార్యము-ఉపాధి (cause - effect - adjunct) లేనివేనని గ్రహించెదవు గాక! వాటి అభేదమును, ఐక్యత్వమును గ్రహించిన వారే ఈ సంసారమును జయిస్తున్నారు. ముక్తికి అర్హులు అగుచున్నారు. ఈ బాహ్య దృశ్యబంధము నుండి విముక్తులై తరిస్తున్నారు. నీటినుండి తరంగములన్నీ వేరుకానట్లు, తరంగములన్నీ జలమే అయివున్నట్లు, జీవచైతన్యము ఈశ్వర చైతన్యము నుండి వేరు కానేకాదు. ఈశ్వర చైతన్యము అద్వితీయమై స్వయంప్రకాశరూపమై (Self effulgent or luminous) వర్దిల్లుచున్నది. ఆ ఈశ్వరచైతన్యమే ఒకానొకప్పుడు, - ఆకాశము మేఘముల ఆచ్ఛాధన పొందుచున్నట్లు, – ‘అహంభావము’ అను ఆచ్ఛాదన పొందుచున్నది. అప్పుడది జగద్భావనను ధరించటం జరుగుతోంది. అట్లు అహంకారాచ్ఛాదముతో జగద్భావనను పొందుచున్న ఈశ్వర చైతన్యమే ఈజగత్తు. ఈశ్వర చైతన్యాత్మకమై (లేక ఈశ్వరచైతన్యమే అంతఃతత్త్వముగా గల) ‘జగత్తు’ అని చెప్పబడే ఇది ‘సత్తు’ కాదు. ఇదంతా అసత్తు కూడా కాదు.
చైతన్య స్వరూపుడగుచు, బాహ్యమున అహంభావముతో ప్రకటితం అయ్యేది బ్రహ్మమే సుమా! ఆ బ్రహ్మము యొక్క భావనయే సంకల్ప భేదానుసారంగా విశ్వమును ప్రకాశింపచేస్తోంది. అట్టి ’అహం’ యొక్క స్వరూపము బ్రహ్మమే. ("అహం బ్రహ్మాస్మి” ఋగ్వేదం)
ఓ రాఘవా! ఈ జగత్తుగా బాహ్యమున దృఢమై అనుభవమగుచున్నదంతా జ్ఞానదృష్టిచే దర్శించినప్పుడు క్షణంలో స్వస్వరూప సత్త యందు లయిస్తోంది. స్వస్వరూపంగా సందర్శించబడుతోంది.
3. “దైవము” - అర్థము
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఒక పరమాణువును లక్ష భాగములుగా విభజించామనుకో అట్లాగే ఒక నిమిషకాలమును కూడా లక్ష భాగములుగా చేసినా మనుకో అప్పుడు ఆ లక్షవభాగమైన కాలము నందు వేలకొలది జగత్తులు, వేలకొలది కల్పములు (“కల్పన” యొక్క చమత్కారం చేత) సత్యమువలె ప్రతిభాసించగలవు సుమా! మరల అట్లు ప్రతిభాసించు ప్రతి జగత్తులోని ప్రత్యేక పరమాణువునందు ఇట్టివేయగు అనేక జగత్తులు అనుభవమునకు లభిస్తున్నాయి. అందుకే ఈ “జగత్తు” అనబడునదంతా "అంతులేని భ్రాంతి మాత్రమే” అని చెప్పబడుతోంది.
నీటియందు సుడిగుండములు లేదా ఆవర్తములు (circles) స్పష్టంగానే కనిపిస్తున్నాయి కదా! ఈ భూత-వర్తమాన-భవిష్యత్ సృష్టులు కూడా స్పష్టంగా స్థిరంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అయితే నీకు ఆ సుడిలో కనిపిస్తున్న నీరు ఏ క్షణంలో అయినా స్థిరంగా ఉంటోందా? అసలు అక్కడ నీరు కాకుండా వేరుగా ‘సుడి’ అనబడునది ఎక్కడ ఉన్నది?
ఎడారిలో కనబడే ఎండమావుల రూపమైనట్టి నదీతరంగములు, ఆ తరంగములలో “పెద్ద-చిన్న- పొడవు-వెడల్పు” కెరటముల వ్యత్యాసములు వాస్తవమా?
Page:391
బ్రహ్మమునందు స్వకీయ అజ్ఞానముచే కనిపిస్తున్న ఈ సృష్టి పరంపరలన్నీ కూడా ‘మిథ్య’ మాత్రమే! స్వప్నంలోను, ఇంద్రజాలంలోను కనబడుచున్న ఆయా పదార్థములు, సంఘటనలు అప్పటికి వాస్తవమనే అనిపిస్తున్నాయి కదా! ఈ జగత్తులోని పదార్ధములు, సృష్టులు మిథ్యా రూపమునే కలిగి ఉండి, కేవలం సంకల్పబలంచేత మాత్రమే అనుభవ యోగ్యములౌతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇదంతా “సత్యమే”… అని అనిపించటం అట్టిదే!
శ్రీరాముడు : ఓ తత్త్వజ్ఞా! జ్ఞానులు తమ విచారణా బలం చేత “ఏకాత్మరూపకము-నిర్వికల్పము” అయినట్టి పరమాత్మ బోధ” అను స్థితిని పొందుచున్నారు కదా! ఇక అప్పుడు ఆ స్థితిలో వారికి ఈ శరీరము నిలచి ఉంటుందా? లేక ‘దైవము’ అనబడు దానిచే ఆక్రమించబడి ఉంటుందా? వారిపట్ల దైవము ఎట్లా వర్తించటం జరుగుతుంది?
మరొక ప్రశ్న. “అంతా ‘నియతి’యే నిర్ణయిస్తోంది. మనదేమీ లేదు” అని చెప్పు ‘నియతివాదం’ గురించి మీ అభిప్రాయం చెప్పమని వేడుకొంటున్నాను.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! ఒకానొక “మహానియతి” ఉన్నది. ఆ మహానియతియే ప్రాణ ప్రయోజనము కొరకు "స్పందరూపిణి” గాను, వస్తు శక్తి - ప్రయోజనం కొరకు “అవశ్యం - భావని”గాను సంకల్ప - ప్రయోజనం కొరకు “ఈశ్వర సంకల్పి” గాను అగుచున్నది. ఆ నియతి వలననే తత్త్వజ్ఞుల శరీరములు కూడా నిలచియుండటం, ఆ శరీరములు లౌకిక వ్యవహారముల కొరకు యోగ్యం అవటం జరుగుతోంది. ఆ నియతియే సృష్టి యొక్క ప్రారంభము. లేక కల్పన యొక్క ప్రారంభమే అది. కనుక కల్పారంభమందు “ఇది అగ్ని, దీని నియతి ఇట్టిది, ఇది ఊర్ధ్వమునకు జ్వలించును గాక! ఇది జలము, దీని ధర్మములు ఇవి. ఇది పల్లమునకు ప్రవహించునుగాక!” అను రూపంగా పరబ్రహ్మమునందు కల్పనా వృత్తిగా జనించుచున్నది. అట్టి ఈ మహానియతియే “మహాసత్త-మహాచిత్-మహాశక్తి-మహాదృష్టి-మహాక్రియ-మహోద్భావము-మహాస్పందముమహాత్మరూపము” … ఇత్యాది నామరూపములతో శాస్త్రములచే ఆయా విలక్షణములను అనుసరించి వ్యవహరించబడుతోంది. అట్టి మహానియతి యొక్క బలముచేతనే బ్రహ్మదేవుడు జగత్సమూహములను గడ్డిపరకలవలె పరివర్తన మొనర్చుచున్నాడు. దానిని అనుసరించే రాక్షసులు, దేవతలు, దైత్యులు, నాగులు … మొదలైనవారు కల్పాంతము వరకు వ్యవస్థితులై ఉండటం జరుగుతోంది.
ఓ రామా! “బ్రహ్మ సత్త” యందు జగత్తు ఉంటే ఉండవచ్చు. లేక “జగత్తు లేదు” అని చెప్పబడవచ్చు. ఏది ఏమైనా, ’నియతి’ మాత్రం ఎన్నటికీ మారజాలదు. అయితే, ”బ్రహ్మము, నియతి, సృష్టి” . ఈ మూడు ఒక్కటేగాని, వేరువేరు కాదు. తత్వజ్ఞులు దీనిని ఇట్లే గాంచుచున్నారు. అజ్ఞానులకు విషయం తెలియపర్చే ఉద్దేశంతోనే ఈ నియతికి, “సృష్టి” అనే పేరు పెట్టారు. అట్టి ఈ సృష్టి ఆదిమధ్యాంత రహితమైన బ్రహ్మమునందే నిలచియున్నది.
స్ఫటికము నందు ఎదురుగా ఉన్న వనం ప్రతిబింబించుచున్నదనుకో అట్లు ఆ వనం స్ఫటికము యొక్క స్వచ్ఛత వలననే ప్రకాశిస్తోంది కదా! ’మాయ’తో కూడుకొని ఉన్న ‘బ్రహ్మము’
Page:392
స్వరూపముగా గల ‘సమష్టి సృష్టి సంకల్పుడు’ …. (అతడే ‘బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు, ప్రజాపతి’ అని కూడా పిలువబడుచున్నాడు) తనయందున్న నియతిని గ్రహించి, దానికి తగినట్లే సృష్టిని ఒనర్చుచున్నాడు. ఇది “నిద్రించేవ్యక్తి యొక్క హృదయాకాశంలో స్వప్నము లభించటం” వంటిదేసుమా! దేహి యొక్క ఈ దేహమునందు “ఇవి చేతులు, ఇవి కాళ్ళు…..” ఇట్లే వేరువేరు అవయవములు వేరువేరుగా చూడబడుచున్నాయి కదా! బ్రహ్మము కూడా ’హిరణ్యగర్భ భావము’ పొంది, చైతన్యబలంచేత ఈ నియతి మొదలైన వ్యవహార సరళిని గాంచుచున్నది. తద్వారా, ఈ కనబడేదంతా తననుండి వేరుకాకున్నను, వేరైనట్లు గాంచుచున్నది.
ఆ మహానియతినే ‘దైవము’ అనికూడా అంటున్నాము. అదియే సర్వకాలములందు, సర్వ వస్తువులందు ప్రసరించి ఉంటోంది. విశుద్ధచైతన్య స్వరూపమగు "ఈశ్వర సంకల్పము” అనగా ఆ మహానియతియే. “ఇది ఇట్లు నిర్వర్తించబడుటచే కాలాను గుణంగా ఇట్లు అవశ్యము ఏర్పడును” అను నియమమునే పెద్దలు ’దైవము’గా వర్ణిస్తున్నారు.
‘పురుషకారము’ (effort) అను స్పందము, సర్వక్రియలు, వృక్షములు, జంతువులు, మానవులు, రాత్రింబవళ్ళు .. ఇదంతా ఆ నియతియే. అయితే ఆ నియతికి మూలం పురుష ప్రయత్నశీలత్వమే. పురుషప్రయత్న శీలత్వము వలన నియతి, నియతి వలన పురుష ప్రయత్నశీలత్వము …. ఒకదానిపై మరొకటి ఆధారపడి ప్రళయం వరకు అట్లే నిలచి ఉంటున్నాయి. మహాప్రళయానంతరం ఈ రెండూ ఏకమైపోతున్నాయి. అనగా, అవి రెండూ స్వస్థానమగు బ్రహ్మమునందు కలిసిపోతున్నాయి.
అయితే రాఘవా! నియతి - పురుషకారము • ఈ రెండూ పురుష ప్రయత్నము మీదే ఆధారపడి, అనుసరించి ఉంటున్నాయని మరల ప్రకటిస్తున్నాను. ఇన్ని మాటలు దేనికి? నీవు నన్ను “దైవ-పురుషకారము”ల గురించి ప్రశ్నించటం, నేను చెప్పటం. ఇదంతా కూడా పురుష - ప్రయత్నరూపమే. “ఈ పురుష ప్రయత్న వ్యవహారము కూడా నియతియొక్క విభవమే” అని నీవు తప్పక గ్రహించాలి.
“ఒక్కొక్కడు దైవపరాయణుడై ‘దైవమే నన్ను నడుపును’ అని తలచి నిష్క్రియుడై ఉండటం కూడా ‘నియతి’ యొక్క ప్రభావమే. నియతి యొక్క నిర్ణయం ప్రకారం ‘పురుషుడేమీ చేయకుండుగాక’ అని అయివుంటే, అప్పుడు ఏమైనా చెయ్యవలెననే బుద్ధిగాని, ఆ బుద్ధి వలన జరుగు కర్మగాని, ఆ కర్మ వలన ఏర్పడు ప్రయోజనములు గాని జరిగెడివి కావు. అందుచేత కల్పారంభం నుండి, ప్రళయము వరకు జరిగెడివన్నీ నియతివలెననే జరుగుతున్నాయి”. అని నియతివాదులు చెప్పుచున్నారు. అవశ్యము జరుగవలసి యున్న దానిని రుద్రుడు మొదలైన వారి బుద్ధి కూడా అతిక్రమించలేక పోతోందని వారి అభిప్రాయం.
నియతి = An arrangement of cause and effect.
పురుషకారము = That which results because of efforts.
Page:393
ఓ రామా! నియతి యొక్క ప్రభావము చెప్పుచున్న ‘నియతి’వాదుల అభిప్రాయము అట్లే ఉండనిమ్ము. బుద్ధిమంతుడైనవాడు పురుషకారమును త్యజించి "నియతియే అంతా చేసుకుపోతుంది” …. అను నిర్లిప్తత్వమును ఆశ్రయించుకుండునుగాక! ఎందుకంటావా! నియతి పురుషకారముల రూపముననే కర్మలను నియమించుచున్నది. ఆయా కర్మలు ఆచరించినప్పుడే ఆయా ఫలితములు లభిస్తున్నాయి. వివిధ ప్రయోజనములు పురుష ప్రయత్నముల దృష్ట్యా వీక్షించబడకుండా, “ఈశ్వర సంకల్పము” అనబడు భావనచే దర్శించినప్పుడు, అద్దానిని “నియతి” అను పేరుతో పిలవటం జరుగుతోంది. అట్లుగాక సృష్టి-క్రియ ప్రయోజనముల దృష్ట్యా చూచినపుడు ‘పురుషకారము’ అని పిలుస్తున్నారు. ఈశ్వరసంకల్పము కూడా తుదకు పురుషకారము రూపమునే దాల్చి జీవుని సమీపిస్తోంది సుమా!
❖
“నేను నియతినే ఆశ్రయిస్తాను. జరుగవలసినదేదో జరుగుతుంది. నిష్క్రియుడనై ఉంటాను” అని పనిచేయటం మానివేసి చతికిలపడి కూర్చునేవాడు సాధించగలిగినదేమీ ఉండదు. అట్లని భోజనం, ఊపిరిపీల్చటం కూడా మానివేయగలుగుతాడా? “పురుషకారము ఆశ్రయించండి. అప్పుడే ఉత్తమ ప్రయోజనం పొందగలరు” అని మనం ఈ విధంగా పునరుద్ఘాటించుకుంటున్నాం. ”ప్రయత్నము యొక్క తీవ్రతను అనుసరించే ప్రయోజనం ఉంటుంది" అనునట్టి సర్వదా సిద్ధించియేయున్న విధానమునే ’నియతి’గా జనులు గ్రహించెదరుగాక!
“అసలు పురుషకారమే ముక్తి అని ఎందుకు అనాలి? ఒకడు సర్వకర్మలు త్యజించి, నిర్వికల్ప సమాధియందు వాయువును - మనస్సును నిరోధించి ముక్తిని పొందుచున్నాడు కదా! అందుచేత పురుషకారమును ప్రక్కకునెట్టి నియతివాదమునే స్వీకరించటం ఉచితం“ అని కొందరు నియతివాదుల అభిప్రాయం. అయితే నిర్వికల్ప సమాధిని ఆశ్రయించటం, వాయువును నిరోధించటం ఇవి కూడా పురుషకారము వల్లనే సాధ్యపడుతున్నాయి కదా! పురుషకారం లేకుండా ఎక్కడైనా, ఎన్నడైనా, ఎవ్వరికైనా, ఏదైనా లభిస్తోందా? లేదు సుమా! అయితే ఒకానొకని వర్తమాన ప్రయత్నములను మనం చూడగలమేమో కాని, అతని ఇతఃపూర్వపు కర్మలను, వాటి ఫలితంగా వర్తమానంలో ప్రాప్తిస్తున్న ప్రయోజనములను మనం సమన్వయపరచలేము. అందుచేతనే “ఇతనికి ఇది అదృష్ట కారణంగా ప్రాప్తించింది. అతనికి అది ఎంత ప్రయత్నించినా దురదృష్టకారణంగా ప్రాప్తించలేదు” ఇత్యాది వాక్యముల సహాయం చేత ‘అదృష్టము’ అనబడుదానికి ఆరోపిస్తున్నాం. వాస్తవానికి నిశిత దృష్టితో పరిశీలించి చూచినప్పుడు, పురుషకారం లేకుండా ఏదైనా లభిస్తోందని నిరూపించటం అసాధ్యమే. అందుచేత, శాస్త్రవిధిని అనుసరించి ”పురుషకారమును అవలంబించటం, అనగా, ప్రయత్నమును ఆశ్రయించటం” అనునదే పరమశ్రేయోదాయకమని మా అభిప్రాయం. సిద్ధి లభించిందా …. ఇక ఆపై అట్టి జీవుని కర్మలేవీ బంధించజాలవు. ఆ సిద్ధి యొక్క ఫలితమే నైష్కర్మ్య రూపమగు మోక్షము. ఎవడు ’తాను కర్మలకు, ఆ కర్మల ప్రయోజనములకు అతీతమైన
Page:394
శుద్ధచైతన్యతత్త్వము అయివున్నాను’, అని తెలుసుకుంటాడో అట్టి వానిని ఈ జన్మమృత్యువులు గాని, కర్మ-అకర్మలు గాని ఏమాత్రం నిర్దేశించలేవని గ్రహించు. “మోక్షస్థితి” అని చెప్పబడుచున్నట్టి అట్టి అంతరంగ - - అవగాహన స్థితియే పరమశ్రేయోదాయకమైనది సుమా!
అయితే, కేవలం కర్మలు త్యజించినంతమాత్రంచేత ఏ ఒక్కరికి ’నైష్కర్మ్యసిద్ధి (కర్మరాహిత్య స్థితి)” ప్రాప్తించదు. మనస్సును ఇచ్ఛారహితంచేసినప్పుడే అది లభిస్తోంది. అది అట్లా ఉంచి, మేము సాధ్యము-సాధనము (achievement - process of achieving) లను బాగా పరిశీలించి చూచి, “కర్మలకంటే జ్ఞానమే ఉత్తమమైనది” అని కూడా ఇక్కడ ఒప్పుకొంటున్నాం.
ఈ నియతి ‘జ్ఞానుల నియతి’ - ‘అజ్ఞానుల నియతి’ అనునట్టి రెండు విధములైన వ్యవహారశీలత్వము మనకు జగత్తులో లభిస్తోంది. “జ్ఞానుల నియతి” యందు దుఃఖరాహిత్యమే అంతిమ ప్రయోజనమగుచున్నది. దానివలన ‘అవిద్య’ (Ignorance) నాశనమైపోవుచున్నది. అట్టి నియతికి అనుకూలమైన పురుషప్రయత్నముచే ’పరమప్రాప్తి’యగు ఉత్తమ గతి లభిస్తోంది.
ఇక అజ్ఞానుల నియతి …. “ఇది ఇట్లు చేయుడు, ఫలితంగా ఈ దృశ్యమునకు సంబంధించిన ప్రాపంచిక లేక లౌకిక ప్రయోజనములు సిద్ధించగలవు" అను రూపము కలిగి ఉంటోంది. సంకల్ప - ప్రయత్నబలముల ననుసరించి ఆయా లౌకిక ప్రయోజనములు ఒనగూడుచున్నాయి. అయితే జీవుని సముద్ధరించగలిగినది బ్రహ్మజ్ఞాన మొక్కటే. నీటియొక్క ద్రవత్వమే కెరటములుగా, సుడులుగా, బుడగలుగా ప్రదర్శితములగు చున్నాయి కదా! బ్రహ్మమే నియతిరూపమున ప్రకాశించుచున్నది. బ్రహ్మమే సకల పురుషార్థముల సాధకము, సాధ్యము, సాధనము కూడా అయివున్నదని సూక్ష్మ ద్రష్టలగు ఆత్మజ్ఞానులు గ్రహించుచున్నారు.
ఓ రఘురామా! ఆ బ్రహ్మతత్త్వమే సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వశక్తి మంతమై వెలయుచున్నది. అంతేకాదు. సర్వుల ఆకారము అదియే. సర్వైశ్వర్యము, సర్వవ్యాపి, సర్వము కూడా అదే. ఆ బ్రహ్మమే ఆత్మ. అది సర్వశక్తిమంతమగుటచే, దాని ఇచ్ఛను అనుసరించి కొన్నిచోట్ల ప్రకటితం అవుతోంది. మరికొన్నిచోట్ల ప్రకటితం అగుటలేదు. కాని సర్వేసర్వత్రా ఆక్రమించియే ఉన్నది. ఎదురుగా దర్పణం ఉంటే నీ ప్రతిబింబము కనబడుతుంది. దర్పణం లేకపోతే … ప్రతిబింబము కనబడదు కాని, ప్రతిబింబము అక్కడ వరకు ప్రసరించియే ఉన్నది కదా! ఉండియే ఉన్నది కదా! బుద్ధి ఉన్నచోట మనస్సు - ఉపాధి మొదలైన రూపములుగా కనబడుతోంది.
బ్రహ్మము సాత్విక ఉపాధులందు శాంతభావమును, రాజస ఉపాధులందు చలనశక్తిని, తామసిక ఉపాధులలో జడత్వమును ప్రకటించుచున్నది. ప్రళయ - సుషుప్తులందు ప్రకటనారహితంగా
Page:395
ఉంటోంది. అది ఎచ్చట ఏ రూపమును ఎట్లు సంకల్పించుచుండునో, అచ్చట అట్టి రూపమునే అవలోకిస్తూ ఉంటుంది. దానిశక్తి ఎచ్చట ఏ రూపమున ఉదయిస్తుందో అచ్చట ఆ రూపముననే ‘వివర్తము’ చెందగలదు. అదియే నానా రూపములుగా వ్యవహృతమగుచు, వ్యవహారదృష్టికి విభిన్నములుగా అగుపించుచున్నది. కాని పరమార్థదృష్టికి ఈ జగత్తులో తోచుచున్నదంతా ఒక్కటే అయివున్నది కాని, వేరువేరు కాదు. బ్రహ్మమే ఇదంతా. ఈ “ఉపాధి-మనస్సు-బుద్ధి-జీవుడు ఈశ్వరుడు” … మొదలైన పేర్లు బుద్ధిమంతులచే లౌకిక వ్యవహారము కొరకు కల్పించబడ్డాయి. ఇంతమాత్రంచేత ఆత్మయందు ఎట్టి భేదమూ లేదు. “నీరు-అలలు-నదులు-సముద్రములు -కాలువలు-చెరువులు” ఇదంతా నామాదుల కల్పనయే కదా! అన్నిచోట్ల ఉన్నది జలమే
కదా! ఒకే బ్రహ్మతత్త్వము త్రిమూర్తులు మొదలుకొని ఒక పురుగు వరకు సర్వేసర్వత్రా అంతర్యామిత్వము వహించియున్నది. ఆభరణములు అనేకం కావచ్చు. కాని బంగారం ఒక్కటే కదా! బ్రహ్మము, అది ప్రకటించుచున్న మనోబుద్ధ్యహంకారరూపములగు ‘శక్తి’ ఒక్కటే కాని వేరువేరు కాదు.
ఈ ‘బుద్ది’ని చూచావా? ఇది దేనిని ఎట్లు నిర్ణయించుకొంటోందో, అట్లే బాహ్యదృష్టి ఏర్పడటం, అట్లే అనుభవం కావటం జరుగుతోంది. బుద్ధి కూడా బ్రహ్మము యొక్క శక్తిస్వరూపమే కదా! ఈ బుద్ధి పరమార్థదృష్టిని పొందటం జరిగినప్పుడు మరుక్షణం సర్వే- సర్వత్రా ఆత్మనే దర్శించుచున్నది. అట్టి దర్శనముచే బుద్ధియందున్న దోషములన్నీ భస్మమైపోతున్నాయి. సర్వ సమత్వభావన, సమరసానుభూతి అనుభవమగుచున్నాయి. “బ్రాహ్మీస్థితి” అని చెప్పబడుచున్నది అదియే!
బ్రహ్మము సర్వాత్మకమైయున్నది. అందుచేత జ్ఞానులకు సర్వత్రా సమభావముగానే గోచరిస్తోంది. జ్ఞానము - - అజ్ఞానము ఈ రెండిటికీ అది ఒకే రీతిగా సాక్షీభూతమై ఉంటోంది. ఒక క్షణంలో “నేను నిష్కళంక సాక్షీతత్వమును“ అని గ్రహించినదై ఉంటోంది. మరొక క్షణంలో భ్రాంతికిలోనై ఎచ్చటనో, ఎద్దానినో గాంచుచున్నది. అభిలాష పూర్వకంగా రాగద్వేషములకు లోనై తనను తానే తిరస్కరిస్తోంది. అయితే ”అట్టి దర్శనమంతా స్వప్నసదృశమే” అని జ్ఞానులు బోధించుచున్నారు.
ఈ చిత్తము ఎద్దానిని, ఎట్లు సంకల్పించుతోందో, ఎద్దానియందు “అభినివేశం (Desire to have)” పొందుతోందో, అద్దానిని అట్లే గాంచుచున్నది. కనుక, ’జగత్తు’గా నీకు ప్రాప్తించుచున్నదంతా చిత్తము యొక్క చమత్కారమే సుమా! అట్లు జగత్తుగా పొందటం “చిచ్ఛక్తి”యే అయివున్నది కదా! అందుచేత బ్రహ్మమొక్కటే సత్యము. తక్కినదంతా లేకయే ఉన్నది.
మరి "నేను జీవుడను అయివున్నాను కదా! నాకింక గతి ఏది?” అను నైరాశ్యం దేనికి? ఎవరికి? బలహీనత - స్వల్పత్వము త్యజించబడుగాక.
ఓ రామచంద్రా! నిదురలే! అజ్ఞానము త్యజించు. ఆత్మస్వరూపుడవై నిశ్చింతుడవై వెల్లివిరియుము!
Page:396
శ్రీ వసిష్ఠమహర్షి : “పరమాత్మ” ఎల్లప్పుడూ “నిర్మలము, స్వప్రకాశము, ఆనంద స్వరూపము, ఆద్యంతములు లేనిది, విశుద్ధము, సర్వగమము (అన్నివైపుల ప్రసరించి యున్నది)” అయివున్నది. అది ఏకాలమందు ఎట్టి మార్పు చేర్పులు పొందటం లేదు. అట్టి పరమానందమయమగు పరమాత్మ నుండి తటాక జలంలో మొట్టమొదటి పెద్ద కెరటము ఉత్పన్నమైనట్లు, ప్రథమచిత్తయుతుడగు ‘బ్రహ్మదేవుడు’ ఉత్పన్నమగు చున్నాడు. “నేను సమష్టిసృష్టి స్వరూపుడను” అను చిత్తము యొక్క స్వభావమే అతని శరీరము. శాస్త్రములచే ‘హిరణ్యగర్భుడు’ అని చెప్పబడుచున్న ‘ప్రథమ జీవతత్వము’ నుండి ఇక ఈ మిగతా జగత్తు అంతా వచ్చిపడుతోంది.
శ్రీరాముడు : హే మహర్షీ! బ్రహ్మము అపరిచ్ఛిన్నము, అద్వితీయము, స్వప్రకాశకము, అఖండము కదా! ఇక ఈ జీవుని చూచారా? ఇతడు పరిచ్ఛిన్నుడు. “రెండవది కలదు. నాకన్నా ‘ఇది’ వేరు” అనునట్టి ద్వితీయత్వమును అనుభవిస్తున్నాడు. “నేను పరిమితుడను. ఆధారపడిఉన్నవాడను” అను భావనోద్వేగమును పొందుచున్నాడు.
నా సందేహమేమిటో వినండి.
అట్టి బ్రహ్మము నుండి, అందుకు వ్యతిరిక్తములైన గుణములు గల ఈ ‘జీవునిసత్త’ ఎట్లు బయల్వెడలుతోంది? లేక, బ్రహ్మము ఈ ‘జీవసత్త’ అనబడు పరిమితానుభవం ఎట్లా పొందటం జరుగుతోంది? ఈ జగత్తులు ఎక్కడి నుండి ఉత్పన్నమౌతున్నాయి?
ఈ విషయం నేను గ్రహించలేకపోతున్నాను.
శ్రీ వసిష్ఠమహర్షి : అట్టి బ్రహ్మము నందు ‘మిథ్య’ అయినట్టి ద్వైతభావము అకారణం గానే కలుగుచున్నది. పెద్ద-చిన్న తరంగములు సముద్రజలంలో లేస్తాయి చూచావా? అట్లాగే “నేను సమష్టిజీవుడను. నేను వ్యష్టిజీవుడను" అనునట్టి పెద్ద చిన్న తరంగ రూపకల్పనలు బ్రహ్మము నందు కలుగుచున్నాయి.
అయితే, బ్రహ్మము ఏనాడూ ’జీవుడు’ అగుటలేదు. “మరి మాకు జీవుడు కనిపిస్తున్నాడు కదా?” అంటావా? అట్లా తోచటం అవిద్యాసంస్కారము చేతనే సుమా! మట్టితో బొమ్మను తయారుచేశామనుకో …. మట్టి తన ఆకారమును పోగొట్టుకుంటోందా? అసలు మట్టికి ఆకారమంటూ ఏదైనా ఉన్నదా? మరి బొమ్మకు ఆకారం ఉన్నది కదా? బొమ్మకు ఆకారం మట్టిలోంచే వచ్చింది కదా! అట్లే బ్రహ్మము కూడా సర్వదా నిర్మలము, సర్వవ్యాపి అయివుండి కూడా, “జీవుడు” అనబడు ఒకానొక సంకుచితత్వము తనయందు ఆపాదించుకుంటోంది. కాని బ్రహ్మమునందు ”జీవుడు అగుట” అను స్వభావం లేదు. ఈ జీవుడు బ్రహ్మమే అయివున్నాడు కాని, మరింకేమి కాదు.
మరి ఈ స్వల్పత్వాదులు ఎక్కడి నుండి వస్తున్నాయంటావా? “ఆత్మ దర్శనము” అను విషయంలో కొంత భ్రమ, అసామర్థ్యము, అవిచారణ స్వయముగా కారణరహితంగా ఆత్మయందు ఏర్పడుచున్నాయి.
Page:397
ఫలితంగా “విశాలచిదాకాశమే” అత్యంత భీషణమై తోచుచున్నది. కాని అదే చిదాకాశము జ్ఞానులకు మాత్రం ఆనందమయము, శాశ్వతము, ప్రశాంతము, ఉద్వేగరహితముగా తెలియవచ్చుచున్నది. అట్టి చిదాకాశము ఉపాధి రహితము, పరిపూర్ణము, సత్వమయము అగుటచేత, పండితులు కూడా అద్దానిని “ఇది” అని నిర్దేశించలేకపోతున్నారు. ఆ ఆ బ్రహ్మమునే "శాంతిమయమగు
పరమపదము” అని శాస్త్రములు నిర్వచిస్తున్నాయి. అదే పరమాత్మయొక్క ఆద్య స్వరూపము. ఓ రామా! నీవుగాని, నేనుగాని, మరెవరుగాని ఏ క్షణములో కూడా అద్దాని నుండి వేరైన వారము కాదు. దానిని గ్రహించుటయే జ్ఞానము. “అది వేరు, నేను వేరు. నేను అద్దానిని పొందవలసియున్నది”
అనునట్టి స్థితి ’బ్రాహ్మీస్థితి కాదు” అని గ్రహించు. "అద్దాని నుండి నేను వేరు” - అను భావమును జయించి అనిర్వచనీయమైన స్థితి పొందియుండుము. లేదా, అట్టి ప్రయత్నమునే ఆశ్రయించుము.
ఆ బ్రహ్మమే ఒకానొకప్పుడు ఉపాధితో కూడినదై, సంవిదాత్మకమై (సత్ = Entity experience విత్ = knowing experience) ప్రాణములను ధరించుచున్నది. అప్పుడు, “నేను ప్రాణతత్వమును, లేక నాకు ప్రాణములు ప్రియమైనవి“ అని భావిస్తోంది. అట్టి భావము తొలగి, ముక్తి లభించేంత వరకు ఆ సంవిత్తు ”జీవుడు” అని పిలువబడుతోంది. కనుక జీవుడు అనునది బ్రహ్మము యొక్క ద్వితీయ రూపమని, ‘మరొక ప్రస్ఫుటము’ (another manifestation) అని అనవచ్చు. శ్రీరాముడు : స్వామి! బ్రహ్మమునకు నామరూపములే లేనప్పుడు, ఇక ’జీవుడు’ అనబడు ద్వితీయరూపమేమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : నిజమే. అయితే, ‘జీవుడు’ అని మనం పిలుస్తున్న తత్వమునకు మాత్రం నామరూపములు ఎక్కడ ఉన్నాయి? జీవుడు ప్రజ్ఞాతత్వమే కాని కాళ్ళు చేతులు కాదుకదా! ఇక నామరూపాదులు ఆపాదించటం, దర్శించటం భ్రమాత్మకమగు అవగాహన వలననే ఏర్పడుచున్నాయి. బ్రహ్మము ఎట్లు వాక్కునకు అందనిదై అనిర్వచనీయమైయున్నదో, ఈ జీవుని విషయము కూడా అట్టిదే. ఈ జీవుడు కూడా వాక్కుకు అందనివాడు, అనిర్వచనీయుడు. వాస్తవానికి ఈ జీవునకు, బ్రహ్మమునకు భేదం వట్టి కల్పన మాత్రమే. అయితే అశాంతితో నిండియున్న ఈ జనుల అవగాహనను చూచినప్పుడు సత్యద్రష్టలమగు మా హృదయం ఆర్ద్రతతో నిండిపోతోంది. అందుచేతనే “ఇది సత్యము - ఇది భ్రమ“ అని బోధించుటకు ఉపక్రమిస్తున్నాం. అందుకు అనువుగా “జీవుడు” “బుద్ది”“మనస్సు” “నేను”“నీవు”“జగత్తు” అను పదజాలం ఉపయోగిస్తున్నాం. “ఈ జీవుడే పూర్ణమగు బ్రహ్మమైయున్నాడు. కనుక సర్వసందేహములను, వివాదములను, స్వప్నతుల్యములను త్యజించి నిశ్చింతులై పూర్ణభావము వహించి ఉండండి.” అని నిరూపిస్తున్నాం. ఫలితంగా అనేకమంది విచారణపరులు విచారణ-విమర్శ-విశ్వాసములను సమన్వయించుకొని, ప్రయత్నశీలురై పూర్ణానందమయులగుచున్నారు. ఇదంతా బ్రహ్మముయొక్క చమత్కారము, కల్పనా చాతుర్యమే కాని మరింకేమీ కాదు.
Page:398
చిదాకాశరూపమగు పరబ్రహ్మమున అసంఖ్యాకములు, అనుభవాత్మకములు అగు జగత్తులు ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఏది ప్రతిబింబించినా, ప్రతిబింబించక పోయినా దర్పణములో మార్పు చేర్పులేమి ఉంటాయి? ఏమీ ఉండవు కదా! అట్లే చిదాత్మ విషయం కూడా! వాయువు ప్రసరించనప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. వాయువు ప్రసరించినప్పుడో జలమంతా అనేక తరంగాలతో కల్లోలమై ఉంటుంది. కాని సముద్రజలం ’జలం’గానే ఉభయస్థితులందు ఉంటోంది.
నిశ్చలజలంలో వేయబడ్డ గులకరాయివలె …. చిత్తచాంచల్యము కలిగినప్పుడు, మనోవృత్తులతో కూడిన జీవసత్తనే ‘జీవుడు’ అని అంటున్నాం. నిర్మలమగు బ్రహ్మ వస్తువునందు ప్రాణస్పందము అధ్యారోపితమైనప్పుడు…. జలం కనిపించకుండా తరంగం కనిపిస్తున్నట్లు… బంగారం తోచకుండా ఆభరణమే తోచునట్లు .. ఆ బ్రహ్మవస్తువునందు గల “నిష్క్రియత్వము” కనిపించకుండా ఉన్నది. అప్పుడు పరిచ్ఛిన్నానుభవంతో కూడిన ‘అహంభావం’ యొక్క స్ఫురణ ఏర్పడుతోంది. అట్టి స్ఫురణయే జీవుడుగా నిర్వచించబడుతోంది.
నిప్పులో ‘వేడి’ ఉన్నట్లు, మంచులో ‘చల్లదనము’ ఉంటున్నట్లు…. బ్రహ్మము నందు చాంచల్య స్వరూపమగు జీవభావము కూడా, ముక్తి లభించనంతవరకు, ఉండి ఉంటోంది.
చిద్రూపమగు ఆ ఆత్మతత్త్వమునందు స్వభావవశంచేత కలుగు పరిచ్చిన్నత్వమే ఈ జీవుడు. బ్రహ్మము యొక్క ‘పరిచ్ఛిన్నత్వము’ లేక జీవభావము మొదలైనదంతా దృఢమగు వాసనాబలం చేత క్రమంగా అహంభావ రూపమును దిద్దుకొనుచున్నది.
*
ఓ రామచంద్రా! అటు ఆకాశంవైపు చూడు. అక్కడ నీకు ‘నీలిరంగు’ కనబడుతోంది కదా! ఆ వర్ణము ఎక్కడ ఉన్నది? అసలు ఉన్నదా? లేదు. అయినను కనిపించుచున్నది. ఈ అహంభావము జీవునియందు “ఇక్కడ ఇట్లు ఉన్నది“ అని గుర్తించుటకు వీలుగా లభించటం లేదు. కాని, అనుభవం అవుతోంది. ఆత్మదర్శనం కాకపోయినట్టి కారణంచేత ‘చిత్రచైతన్యము’ తననుతాను అహంభావముచే కుదించబడినదానివలె గాంచుచున్నది. ఈ జీవుడు పూర్వసంకల్ప సంస్కారములచే ప్రబోధితుడై, అట్టి అధ్యాసవలన ‘అహంభావము’ అను అనుభవం పొందుచున్నాడు. ఆ అహంభావమే స్వసంకల్పబలం చేత పరిచ్ఛిన్నమై ”దేశము - కాలము - దేహము“ మొదలైన భావావేశములకు లోనగుచున్నది. ఈ దేహాది ఆకారములను దాల్చుచున్నది. వాయుస్పందమువలె స్ఫురించుచు. “స్వసంకల్పించటం” అను స్వభావంచేత “చిత్తము, జీవుడు, మనస్సు, మాయ - ప్రకృతి” అనే పేర్లతో పేర్కొనబడుతోంది. సంకల్పాత్మకమైనట్టి ఈ చిత్తమే ‘హిరణ్యగర్భుడు’ అగుచున్నది. అదే సంకల్పబలంచేత పంచభూతములను, వాటి స్వభావములైనట్టి పంచతన్మాత్రలను కల్పించుచున్నది. చూచావా, రామా! ఈ విధంగా ఆ బ్రహ్మము చేతనాత్మకమగు "పూర్వావస్థ” నుండి చ్యుతిపొంది జడమగు పంచతన్మాత్రలుగా మారుచున్నది.
Page:399
పంచభూతములు పంచ తన్మాత్రలు
ఆకాశతత్త్వము నుండి శబ్దతత్త్వము
వాయుతత్త్వము నుండి స్పర్శతత్త్వము
తేజోతత్త్వము నుండి రూపతత్త్వము
జలతత్త్వము నుండి రసతత్త్వము
భూతత్త్వము నుండి గంధతత్త్వము
“పంచతన్మాత్రభావము” (శబ్ద స్పర్శ-రూప రస గంధ భావన లేక సంస్కారము) పొందినట్టి ఇతఃపూర్వపు శుద్ధ చిత్తము ఆకాశంలోని నక్షత్రంలాగా తేజఃకణంగా మారుచున్నది. బీజము, అంకురిస్తుంది చూచావా? నీరు గడ్డకట్టి ఆయా రూపములను పొందుచున్నట్లు ఆ తేజఃకణము, తనయందు బ్రహ్మము ప్రకాశించుచుండగా, అండత్వము పొందుతోంది. ’దివ్యదేహకల్పన ఆశ్రయించి దివ్య దేహమును పొందుచున్నది. అహంభావ శూన్యమైన పదార్థములందు అహంభావమును పొందుతోంది. ఇక ఆయా లోకములన్నిటియందు సంచరిస్తోంది. కొన్నిటియందు స్థావర భావమును, మరికొన్నిటియందు జంగమభావమును, ఇంకొన్నిటియందు ఖేచరత్వమును (ఆకాశ సంచారభావనను) స్వసంకల్పమహిమచేత పొందుచున్నది.
సృష్టికి పూర్వం “పంచతన్మాత్ర సంకల్పము” నుండి ఉదయించినట్టి జీవదేహమే క్రమంగా బ్రహ్మదేవుని పదమును పొందుచున్నాడు. అట్లు పొంది, సమష్టి-జీవభావముచే అతడు ఈ జగత్తును నిర్మించుచున్నాడు. స్వయంభువు అయిన సమష్టి సృష్ట్యానుభవి, స్వభావవశంచేత తాను సంకల్పించి దర్శించుదానిని తానే “ఆహాఁ! ఇది ఎక్కడినుండో ఉత్పన్నమైనది కదా” అని భావిస్తున్నాడు. అట్లే అనుభవం కూడా పొందుచున్నాడు. అయినప్పటికీ, అతడు చిత్స్వభావుడే అయివున్నాడు కదా! అందుచేత అన్నిటికీ కారణము, స్థానము అయివున్నట్టి బ్రహ్మభావమును త్యజించివేయటం లేదు సుమా! అట్లు త్యజించకుండానే ’జగత్తు’కు కారణమైన కర్మలను నిర్మించుచున్నాడు. జలము తన జలస్వభావం త్యజించకుండానే తనయందు “తరంగములు” అనబడు ఆకార వికారమును ప్రకటిస్తోంది కదా! ‘చిత్తు’ నుండి స్వాభావికంగానే ‘చిత్తము’ ఉదయించుచున్నది. తరంగములు వేరైన క్రియ - - రూప - నామము కలిగియున్నప్పటికీ, విచారించి చూచినప్పుడు, చేతితో స్పృశించినప్పుడు జలంగానే అగుచున్నది కదా! అట్లే జగత్కారణమగు కర్మలు ’జలములోని నురుగు యొక్క తెలుపు’వలె భ్రమాత్మకములు గానే ఉండి ఉంటున్నాయి. ఎందుకంటావా? వాస్తవానికి ‘చిత్’ అనునది ఈ జగత్తుల చేత గాని, జన్మలచేత గాని, కర్మలచేతగాని, మరింకెద్దాని చేతనైనాగాని, ‘బద్ధము’ అగునది కాదు. అయినప్పటికీ, భ్రమచే “నేను పరిమితాచరణ పరుడను" అను స్వప్న సదృశభావన మాత్రం పొందుతోంది. ఈ జీవుడు సర్వదా చిత్స్వరూపుడే సుమా! అట్లే సమష్టిరూపుడగు హిరణ్యగర్భుడు
కూడా!
❖
Page:400
ఒకడు తన అంతరంగమున, లేక మనస్సు నందు సంకల్పించి, అట్టి సంకల్పాను సారంగానే ఈ జగత్తును దర్శిస్తున్నాడు. అనగా, సంకల్పములు ఉదయించటానికి ముందే మనస్సు ఉన్నది. మనస్సు ఉదయించటానికి ముందే ‘జీవుడు’ ఉన్నాడు. మొట్టమొదట అతడు నిష్క్రియుడైయున్నాడు. ఆ తరువాత సంకల్పించి కర్మలను ఒనర్చుచున్నాడు. ఒక విత్తనములో "అంకురము మొలుచుట” అను సూక్ష్మభావమున ఉత్పన్నమై పెరిగి, క్రమంగా “ఆకులు-కాండము-శాఖలు-ఫలములు -పుష్పములు” మొదలైన రూపములుగా మారుచుండుట చూచావు కదా!
అట్లే హిరణ్యగర్భునియందు ఇంతకుముందే ‘సంకల్పము’ రూపమున ఉండిన జీవులు ఇట్లు నానారూపములుగా ప్రకాశము నొందుచున్నారు. అదే సమయమున “ఈ జీవులు పూర్వకల్పములలో తాము ఒనరించిన కర్మలను అనుసరించి, తదనుగుణములైన శరీరములను ఇందు పొందుచున్నారు” అనునది కూడా ఇక్కడ సహేతుకమే అగుచున్నది. ఆ తరువాత వారు జనన-మరణ కారణమగు తమ కర్మలను అనుసరించి స్వర్గ-నరకాదులను పొందుచున్నారు. అయితే “కర్మ” అనునది కూడా చిత్స్పందమేకాని వేరేమీ కాదు. అట్టి చిత్స్పందమే లేక సంకల్పచమత్కారమే "దైవము-చిత్తము-కర్మ -శుభము-అశుభము” ….. కూడా అయివున్నది.
చెట్టునుండి పూలు-కాయలు ఉత్పన్నమగుచున్నట్లు ఆదికారణమగు ’చిత్స్పందము’ నుండే ఈ జగత్తులు మరల మరల ఉద్భవిస్తున్నాయి. మరల మరల లయిస్తున్నాయి. జగత్కారకుడగు ఆత్మభగవానుడు మాత్రం నిశ్చింతుడై యథాతథంగా ఉండి ఉంటున్నాడు.
శ్రీ వసిష్ఠమహర్షి : ఆ పరమకారణమగు బ్రహ్మము నుండి మొట్టమొదట ’మనస్సు’ ఉదయిస్తోంది. కనుక ప్రతి అనుభవమునకు వస్తున్న వస్తువు మనోమయమే సుమా! ఈ దృశ్యపదార్థముల వ్యవస్థితి అంతా మనస్సునే ఆశ్రయించుకొని ఉన్నది. అయితే, ఈ ‘మనస్సు’ కూడా స్వకారణము అయినట్టి ‘పరబ్రహ్మము’ కంటే వేరైనది ఏమాత్రం కాదు.
ఈ మనస్సు తరంగమువలె ’అటు-ఇటు’ మారుతూ తాను ఆశ్రయిస్తున్న వస్తు జాలముల మార్పు-చేర్పులను తనయందు, అనుభవరూపంగా పొందుతూ ఉంటోంది. ప్రపంచంలో ఉన్న భేదములన్నీ మనస్సుచే కల్పించబడుచున్నవి మాత్రమే సుమా! ఈ మనస్సే నాశనమైతే ఇక ఈ “సుఖ-దుఃఖ-అధిక-అల్ప” . భేదభావములు తొలగిపోతాయి. అప్పుడు ఆ “సద్వస్తువు” ఒక్కటి మాత్రమే ప్రతిష్ఠించబడగలదు. మనస్సు లయమైతే ఆత్మ ఒక్కటే శేషిస్తోంది. ఇక …. “సమష్టి స్వరూపజీవుడగు హిరణ్యగర్భుడు (బ్రహ్మ) - జీవుడు-మనస్సు-మాయ-కర్త -జగత్తు” మొదలైన భేదములు తొలగుతాయి. ఈ కనబడేదంతా అప్పుడు “ఆత్మజ్ఞానము” అను జలముతో కూడిన చిత్సముద్రమై వెలయుచున్నది.
Page:401
ఈ “జగత్తు - చిత్తము” …. అనునవి ఒకానొకప్పుడు ఉంటున్నాయి. మరొకప్పుడు లేనివి అగుచున్నాయి. అనగా, “అవి అనిత్యములే” అని అనక తప్పదు కదా! అందుచేత అవి “అసత్తు” అని చెప్పబడుచున్నాయి. ఒక్క అజ్ఞానులకే ఈ “జగత్తు - చిత్తము” అనబడునవి సంకుచిత దృష్టి వలన సత్యమువలె ప్రతిభాసించుచున్నాయి. వారిపట్లనే అవి సత్త కలిగి ఉంటున్నాయి. సదసదాత్మకము
వ్యవహారదృష్టితో చూచినప్పుడు కూడా ఈ జగత్తు “సదసదాత్మకము” (ఉన్నది-లేదు) అని తెలియవస్తోంది. ఎట్లాంటావా? విను. ఒక మనస్సు “ఇది ఉన్నది” అను విధంగా సంకల్పించు చున్నప్పుడు అది అట్లే ఉంటోంది. ప్రాప్తిస్తోంది కూడా. “ఎక్కడ ఉన్నది? లేదు కదా?” అని తలచినప్పుడు ఈ జగత్తు లేకయే పోతోంది. అందుచేతనే పెద్దలు దీనిని "సదసదాత్మకము” అని చమత్కారంగా పిలుస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ పారమార్థికదృష్టియందు “చిత్తము”, “జగత్తు” . ఈ రెండూ కూడా స్వప్నములోని అనుభవంలాగా అళీకములు (ప్రతిబింబమాత్రములు) మాత్రమే. ఇందులో సందేహమంటూ ఏదీ లేదు. జ్ఞానముచే ఈ చిత్తము సంస్కరించబడనంత వరకు ఈ ’జగత్తు’ యొక్క అనుభవం సత్యముగానే ప్రాప్తిస్తూ పోతుంది. ఎప్పుడైతే చిత్తమునందు ఉత్తమజ్ఞానము జాగృతమౌతోందో …. ఇక ఆ క్షణము నుండి ఈ జగత్తు, ఇందలి పదార్థముల అనుభవం …. ఇదంతా “మిథ్య”గానే తెలియవచ్చుచున్నది. అందుచేతనే ’చిత్తము ఈ జగత్తును గాంచటం’ అనునది ఒకవిధంగా సత్యము, మరొక విధంగా అసత్యము కూడా అయిఉంటోంది.
ఓ రామచంద్రా! అంతటికీ కారణం మనస్సేనయ్యా! మనస్సే వ్యర్థంగా ఈ సంసార స్వప్నమును గాంచుచున్నది.
భ్రాంతిచే విచలితుడైయున్న బాటసారి చీకట్లో కొంచెము దూరములో గల కొండరాయిని చూచి “ఇది క్రూరమృగమో, కసాయిదొంగో కాదు కదా?” అని బెంబేలు పడతాడు చూచావా? అట్లాగే ఆత్మజ్ఞానహీనమైన ఆ మనస్సు పరమాత్మయందు మిథ్యా మాత్రమగు ఈ జగత్తును గాంచుచున్నది. అజ్ఞానబాలుడు చీకట్లోకి చూచి ”అదిగో, అక్కడ బూచి ఉన్నది. అది వచ్చి నాపై పడదు కదా?“ అని గజగజ వణుకుచున్నాడనుకో అందుకు కారణమేమిటో చెప్పు? తన చిత్తమునందు కలిగిన భయమునకు కారణమైనట్టి ఆ ‘బూచి’ అనబడునది అక్కడ వాస్తవంగా ఉన్నదో, లేదో సమగ్రంగా విచారించకపోవుటయే కారణం” అని మాకు అనిపించుచున్నది. ఆహాఁ! ఆత్మభావము నుండి ‘చ్యుతి’ నొందినట్టి ఈ చిత్తము మరల తన ఉనికి స్థానమై ఉన్నట్టి ఆత్మ తత్త్వమును విచారించకయే ఉంటోంది. అట్లు విచారించనంతకాలం, “జగత్తులు-జన్మలు-కష్టములుసుఖములు-అస్మదీయులు-ఇతరులు” అనునట్టి భ్రమలను పొందుతూనే ఉంటుంది.
ఆత్మ అవ్యక్తము, సర్వశాంతి స్వరూపము అయివున్నది. అట్టి ఆత్మయొక్క “సృజనేచ్ఛ” నుండే చిత్తము జనిస్తోంది. లేదా, ఆ సృజనేచ్ఛ (desire to project)నే ’చిత్తము’ అని పిలుస్తున్నాం.
Page:402
సృజనే చిత్తము జీవత్వము అహంకారము
“విషయతన్మాత్ర”
| అహంకారము (శబ్ద-స్పర్శ - రూప - రస గంధములకు ఇంద్రియములు దేహములు
సంబంధించిన ఆవేశము)
దేహములు శోకమోహములు స్వర్గ-నరకములు → బంధ-మోక్షములు
ఆత్మస్వరూపుడే అయివుండి కూడా తనను తానే మరచి ఉంటున్న జీవుడు అంతు లేకుండా అనేక దేహపరంపరలు, వాటి నుండి స్వర్గ నరకములు, బంధమోక్షములు అనుభవమౌతున్నాయి. బీజం నుండి వృక్షం - వృక్షం నుండి బీజం అంతులేకుండా వస్తున్నట్లు, జన్మల నుండి కర్మలు, కర్మల నుండి జన్మలు ఈ విధంగా ఒకానొక పరంపర అంతు లేకుండా సాగిపోతోంది.
అయితే రామా! ఏది ఎట్లాగైనా కావచ్చు గాక! ఆత్మ సర్వదా నిష్కళంకమే. అది జన్మించుట లేదు. దానికి దేహములు లేవు. జననమరణములు లేవు. ఈ జన్మలు, మరణాదులు, అనగా,
“ఇప్పుడు నేను జీవిస్తున్నాను. మరొకప్పుడు జీవించను" ….. మొదలైనదంతా మనస్సే అనుభవిస్తోంది. ఒక గదిలో వెలుగుచున్న దీపపు కాంతిలో ఒక బాలుడు చదువుకొనుచున్నాడనుకో … ఆ చదువబడుచున్న విషయమునకు, దీపమునకు సంబంధం లేదుకదా! దీపపు వెలుగు లేనిదే అతడు చదువగలడా? లేదు. ఆత్మకూడా, నిష్క్రియమై, సర్వమునకు సాక్షియై, సర్వమునకు కారణమై, అకర్త అయి ఉంటోంది. ఇట్లు ఆత్మ ఎన్నడు తన స్వచ్ఛతను కోల్పోవుటలేదు. ఈ దేహమునకు ‘కర్మలు’ కాకుండా వేరే “సత్త” లేదు. అందుచేత కర్మలే చిత్తము. చిత్తమే అహంభావ సమన్వితమగు ఈ జీవుని రూపము. చిత్తము కాకుండా జీవునకు వేరే రూపమేమి ఉన్నది? ఆ జీవుడే బ్రహ్మము. బ్రహ్మమే శుద్ధచైతన్య దృష్టిలో ఆత్మతత్త్వముగా, మననాదుల ద్వారా ’జీవుడు’గా వ్యవహార నామములు పొందుచున్నదని గ్రహించబడుగాక!
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఒక దీపం నుండి లక్షలాది దీపములు వెలిగించ వచ్చు కదా! ఒకే పరమాత్మ ఈ నానావిధరూపములుగా వెలుగొందుచున్నాడు. అయితే, విచారపూర్వకమైన దృష్టికి మాత్రమే బ్రహ్మము యొక్క యథార్థరూపం గోచరించటం జరుగుతోంది.
ఓ జనులారా! మీరు ’పరమాత్మజ్ఞానము’ పొందటానికి సంసిద్ధులు కండి. పరమాత్మ జ్ఞానము లభించినప్పుడు, “ఈ చిత్తముయొక్క జీవకల్పన, దృశ్యసంగము, తత్ఫలితంగా ప్రాప్తిస్తున్న బంధము
Page:403
ఇదంతా మిథ్యాకథనమే” అని బోధపడగలదు. అప్పుడు స్వతఃసిద్ధమైయున్నట్టి ‘మోక్షము’ యొక్క అనుభవం ప్రాప్తించుచున్నది. అనగా, “భ్రమ-శోకము-మోహము-సంకుచిత్వము-నైరాశ్యము -భయము-ఉద్వేగము” మొదలైన స్వకల్పిత దోషములు తొలగిపోతున్నాయి.
చిత్తమే “నేను జీవుడను” అను రూపముగల జీవస్వభావం తనపై ఆపాదించుకొంటోందని విచారణ చేయబడుగాక! విచారణ చేసినంతమాత్రంచేత ఈ చిత్తము, దానిచే ఆరోపించబడి, అనుభవించబడుచున్న ఈ దృశ్యప్రపంచము తమంతటతామే స్వయముగా తొలగిపోతాయి. సత్యమేదో ఎరిగిన తరువాత అసత్యమును దర్శించు చున్నప్పటి భావనలు, ఉద్వేగాలు ఏమౌతున్నాయి? ఈ చిత్తము-ప్రపంచముల విషయం కూడా అంతే. ఇక ఇంతమాత్రం ప్రయత్నంచేసి, విచారణశీలురు అగుటకు సిద్ధంకాకుంటే, అట్టివారిని ఎవరు రక్షించగలరు? మూర్ఖుడు తనకు శుభం కలుగచేయ యత్నించువాని వాక్యములలో స్వార్థమును, మోసమును, గాంచునట్లు, అజ్ఞానియే పరమాత్మకు అజ్ఞానమును ఆపాదించుచున్నాడు. అజ్ఞానమే ప్రపంచము రూపమున అగుపించుచున్నది. అజ్ఞాన దృష్టినే “సంసారము” అని అంటున్నాం.
❖
ఓ ప్రియరఘురామా! మరల మరల చెప్పుచున్నాను. భ్రాంతికి లోనైన చిత్తమే ఈ జనన-మరణములను, బాల్య-యౌవన-వార్ధక్యములను, స్వర్గ-నరకములను గాంచుచు నృత్యం చేస్తోంది. సురాపానం చేసినవానికి శూన్యాకాశంలో కెరటములు, వృత్తములు, కేశములు, రూపములు కనిపిస్తూ ఉంటాయి చూచావా? అజ్ఞానముతో కూడిన చిత్తము ఈ జీవునిచే అసంఖ్యాకములైన బ్రహ్మాండములను తిలకింప చేస్తోంది. “తిమిరరోగము” అను దోషముతో కూడిన కళ్ళు కలవానికి ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపిస్తారు. ’చిత్తరోగము’చే పీడింపబడుచున్న ఈ జీవుడు కూడా పరమాత్మయందు ద్వైతభ్రాంతిని గాంచుచున్నాడు. నల్లమందు మ్రింగినవాడు స్థావరములైనట్టి వృక్షాలు గాలిలోకి లేచి నృత్యం చేస్తున్నట్లు చూస్తున్నాడు. చిత్తవిమోహితుడైన ఈ జీవుడు కూడా నిశ్చలమగు ఆత్మయందు సంసారమును గాంచుచున్నాడు. బాలుడు గుండ్రంగా తిరిగే యంత్రం ఎక్కి …. “అహో! చూచారా? ఈ ఇళ్ళు, నేల, చెరువులు, కొండలు … అన్నీ గుండ్రములుగా తిరుగుచున్నాయి కదా” అని కేకలు వేయునట్లు, చిత్తముయొక్క అనుక్షణ పరివర్తనము వలననే ఈ ఈ దృశ్యములన్నీ ఇట్లు అత్యంత అనేకత్వముతో కూడుకొని చిత్రాతి చిత్రంగా అగుపిస్తున్నాయి. చిత్తము ద్వైతభ్రాంతి పొందినప్పుడు మాత్రమే ఈ ద్వైతభ్రమ అంతా కలుగుతోంది. ద్వైతానుభూతి నశిస్తే అప్పుడు ద్వైత ప్రపంచము నశించిపోవుచున్నది. “అనగా, లేనిదే అగుచున్నది”. ఒక్క పరమవస్తువు మాత్రమే ప్రతిష్ఠింపబడుచున్నది.
కట్టెలు తొలగిస్తూపోతే నిప్పు ఆరకేం చేస్తుంది? “ఆత్మ తత్త్వవిచారణ” చేత, తదనుకూలమైన అభ్యాసంచేత ఈ “విషయదర్శనము” అనే అగ్ని తొలగిపోతుంది. అప్పుడు చిత్తముకూడా
Page:404
తొలగిపోతుంది. “ఇదంతా, ఆత్మయే. వీరంతా ఆత్మ స్వరూపులే“ అని చిత్తమును అభ్యసింపచేయాలి. చిత్తము కంటే వేరుగా ఇంద్రియ విషయములు గాని, మరింకేది గాని లేవు. అందుచేత, ఓ జనులారా! ఆత్మవిషయమై జ్ఞానమును, అజ్ఞానమును వేరుపరచగల క్రియా విశేషములను అభ్యసించండి. చిత్తము యొక్క “విషయములను దర్శించటం ఆశ్రయించటం” అనే
దుర్వ్యసనములను లుప్తం చెయ్యండి. అట్టి అభ్యాసంచేత జీవుడు “ఇది నేను. ఇది నేను కాదు” అను రూపముగల ఉత్తమజ్ఞానం పొందగలడు. అప్పుడు కర్మలను ఆచరించుచున్నను, లేక త్యజించు చున్నను అతడు “ముక్తుడు” అనియే చెప్పబడుచున్నాడు.
వత్సా! రాఘవా! కొద్దిగా కల్లుత్రాగితే కొంచెము కైపు కలుగుతుంది. అప్పుడు బుద్ధి కొంత చంచలమౌతుంది. అదే కనుక అధికంగా త్రాగితే? మత్తు పూర్తిగా కలిగి మనిషి ‘నిశ్చేష్టితుడు’ అవుతాడు కదా! చైతన్యము సంపూర్ణంగా ప్రకాశించినప్పుడు ఇక, విషయముల దర్శనమే ఉండదు. కొంత చైతన్యదృష్టి, కొంత జడత్వదృష్టి ఏర్పడి ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవుడు విషయోన్ముఖుడై ప్రవర్తిస్తున్నాడు. ‘నిర్వికల్ప సమాధి’ యందు చైతన్యము యొక్క ప్రకాశము అత్యధికంగా ఉంటుంది. “ఘన చైతన్య పూర్వక స్థితి” లేక “ప్రపంచరహిత స్వసత్త”యే “పరమపదము” అని చెప్పబడుతోంది. సర్వకల్పనలు లయించినట్టి - సిద్ధి పొందినట్టి చిత్తమే విషయరహితం అవగలుగుతోంది. దృశ్యమంతా స్వస్వరూపంగా ఆస్వాదించేస్థితియే “నిర్వికల్పస్థితి”!
ఈ చిత్తము వలన, శుద్ధచైతన్యము చేత్యభావము (‘నేను అనుభవించుచున్నాను’ అను భావము) పొందుచున్నది. అనగా, “నేను కర్తను. నేను ద్రష్టను” అను భ్రమను సత్యమువలె అనుభవించుచున్నది. అయితే, గాలికి ‘స్పందము’ కంటే వేరైన సత్త లేనట్లుగా, ఈ చిత్తమునకు “విషయోన్ముఖత్వము” కంటే వేరైన ’సత్త’ లేదు. వేడి తొలగితే నిప్పు ఆరిపోవునట్లు, ఇంద్రియ విషయములు తొలగిపోగా! ‘చిత్తము’నకు ఇక ఆకారమంటూ కనిపించదు. శుద్ధచైతన్యము అనుభవించు విషయముతో “శుద్ధ చేత్యములు (లేక) శుద్ధ దర్శనములు” అని చెప్పబడుచున్నాయి.
అప్పుడిక చైతన్యము చైతన్యరూపజగత్తును చైతన్య మాత్రంగా ఆస్వాదిస్తున్న దగుచున్నది.
‘త్రాడు’ నందు ‘ఇదిపాము’ అను భ్రాంతి ఏ విధంగా కలుగుతోందో, అదే విధంగా అవిద్య కారణం చేత ఏర్పడుచున్న మిథ్యాభ్రాంతియే శుద్ధచైతన్యము నందు విషయముల భ్రమానుభవమునకు కారణమగుచున్నది. ఈ సంసార వ్యాధికి ‘ఆత్మజ్ఞానం’ ఒక్కటే సరయిన ఔషధం. అయితే చిత్తము బాహ్యవిషయములందు వైముఖ్యాన్ని (ఆకర్షించబడకపోవటం) అభ్యసించినప్పుడు మాత్రమే అంతరంగమునందు ఆత్మజ్ఞానం సుస్థిరం అవుతుంది. అందుకు వేరే ఇంకే ఉపాయం లేదు.
Page:405
ఓ రామా! ఎవడైతే బాహ్యదర్శనములను, అంతరమున ఉన్న వాసనలను పరిత్యజిస్తాడో.. అతనికి ఇక్కడే ఇప్పుడే ముక్తి లభించినట్లే! వాసనలుండటమే బంధం. వాసనా త్యాగపూర్వకమైన స్వసత్తా సామాన్యమే ముక్తి. యథార్థజ్ఞానం కలిగిన తరువాత రజ్జువు పట్ల సర్పభ్రాంతి తొలగక ఏం చేస్తుంది?
❖
ఆత్మజ్ఞానం లభించగానే యీ వర్తమానపు సంసారభ్రాంతి అంతా తొలగిపోగలదు. విషయ వాసనలు పరిత్యజించావా ….. మోక్షము నిశ్చయంగా లభించగలదని మరల గుర్తు చేస్తున్నాను. దృశ్య విషయముల పట్ల ఆసక్తి, నమ్మకము, మూర్ఖత్వము, అభిలాష తొలిగితే వాసనలు జయింప బడినట్లే కాబట్టి ఓ రఘుకులతిలకమా! రామచంద్రా! నీవు ఆసక్తిరహితుడవై ప్రవాహపతితములైన కర్మలను ప్రశాంత స్వభావముతో నిర్వర్తించుము. ఇందులో కష్టమేమీ ఉండవలసిన పనిలేదు. అనేకమంది తాము కోరుకొన్న వస్తువుకోసం, ప్రాణములైనా సరే, తృణంలాగా త్యజించివేయటం మనం ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. మరి కేవలం "అభిలాష”ను త్యజించినంత మాత్రంచేత ఉభయతారకమైనట్టి మోక్షము లభిస్తున్నప్పుడు, అందుకు వెనుకాడవలసిన అవసరమేమున్నది చెప్పు? నీవు కనుక వాంఛితములన్నిటినీ (ఇది ఇట్లు ఎందుకు ఉన్నది? అది నానుండి తొలగుగాక
ఇటువంటి అభినివేశములను) పరిత్యజించి నిర్వికారుడవై ఉండకలిగితే ఈ నిమిషంలోనే కృతార్థుడవు అవుతావు. చేతిలోని పండులాగా, ఎదురుగా గల పర్వతం లాగా పరమాత్మతత్త్వమును, ఇప్పుడే, ఇక్కడే, ప్రత్యక్షంగా పొందగలుగుతావు. దృశ్యాసక్తి తొలగగా, వృత్తిరహితుడవై ఉన్నప్పుడు ఇక నీయొక్క ఏ రూపము శేషిస్తుందో అదియే పరమాత్మ యొక్క స్వరూపం. అంతేకాని, ఆ పరమాత్మ స్థానంలేక, స్వరూపం ఎప్పుడో ఎన్నడో ఏదో నిర్వర్తించగా ఎక్కడినుండో వచ్చిపడేది కానే కాదు సుమా!
తరంగముల రూపంలో కనిపించేదంతా ఒకే సముద్రజలము కదా! పరమాత్మయే అజ్ఞానులకు ’జగత్తు’ రూపమున ప్రతిభాసించుచున్నాడు. జ్ఞానులకో … జగత్తు స్వస్వరూపంగా అనునిత్యంగా అనుభూతమగుచున్నది. ఈదృశ్యమును ఆత్మగా ఎరుగుటచేతనే మోక్షం లభిస్తోంది. ఎరుగకున్నంత కాలం ఈ సంసారబంధం ఉండియే తీరుతుంది.