CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:406

V. కర్కటి ప్రశ్నలు

  1. ఈ జీవుడెవ్వడు? ఎందుకు ఉద్భవిస్తున్నాడు?

శ్రీరాముడు: మహర్షీ! “చిత్తము” అను ఉపాధితో కూడుకొనియున్న ఈ ’జీవుడు’ అనువానికి, ఆ “పరమాత్మకు” గల సంబంధం ఏమిటి? అసలు ఈ జీవుడు ఎవ్వడు? ఇతడు పరమాత్మనుండే ఉద్భవించాడా? ఎప్పుడు ఏ కారణంచేత ఉద్భవిస్తున్నాడు? లేక ఇంకెక్కడినుంచో వచ్చాడా?

ఈ విషయమై మరికొంత వివరించి చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : శ్రద్ధగా విను. చెప్పుచున్నాను.

స్వతహాగా “శుద్ధము-నిర్మలము-నిత్యము-అఖండము” అయినట్టి బ్రహ్మము ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కచోట అవిద్యతో కూడుకొని ఉంటోంది. అట్లు అవిద్యతో కూడుకొని ఉన్నప్పుడు… అది ఏ విధమైన శక్తితో కూడుకొని ప్రకటితం అగుచున్నదో, తనను తాను ఆ స్వరూపముగానే భావన, అవగాహన, దర్శనములను కలిగి ఉంటోంది. అట్టి దర్శనమునే ‘సంసారము’ అని అంటున్నాం. అట్టి ‘దృష్టి’ లేక ‘సంభావన’ యొక్క రూపములే బంధ మోక్షములు. అంతేగాని, ఈ బంధ-మోక్షములు అనేవి భౌతికమైన జన్మ - కర్మలకు సంబంధించినవి కావు. అఖండ చైతన్యమే స్వరూపముగా గల ఈ ’ద్రష్ట’ యొక్క అవగాహనను అనుసరించే బంధమోక్షములు ఉంటున్నాయి.

బ్రహ్మమునందు అనాదికాలంగా ప్రకటితమౌతున్న ‘చేతనశక్తి’ ని “జీవుడు” అని అంటున్నాం. చిచ్ఛక్తి (The manifestation of knowing) ఒకానొకప్పుడు సంకల్ప స్వరూపమును, చిత్త సంస్కారము లను అవలంబించి ఉంటోంది. ఇట్లు భావనలను తనంతట తానే సంకల్పించుకొని “ద్వైతభావన” ను దృఢంగా పొందుతోంది. దాని ఫలితంగా “నేను జీవుడను…. నేను పుట్టుచున్నాను…. నేను చచ్చుచున్నాను….” అను రూపముగల జననమరణాది భావములన్నీ పొందుతోంది. శ్రీరాముడు : మునిశ్రేష్ఠా! మీరు చెప్పేదానిని బట్టి “ఉత్తమోత్తమమైయున్నట్టి ’చిచ్ఛక్తి’యే స్వభావవశంచేత ‘జీవుడు’ అగుచున్నది. జనన - మరణాది భావములు పొందుచున్నది”…. అని నాకు అర్థం అవుతోంది. అయితే జీవుడే చిచ్ఛక్తి అయి ఉండి, ఇదంతా స్వభావవశం చేతనే జరిగిపోతున్నప్పుడు ఇక ”ఇది దైవము, ఇది కర్మ, ఇది బద్ధజీవి, ఇది మోక్షజీవి, ఇది కారణము” అని చెప్పటంలో అర్థం ఏమున్నది?

శ్రీవసిష్ఠ మహర్షి : ఆకాశము నందు వాయువు ఉంటోంది. ఆ వాయువు ఒకప్పుడు అధికమైన స్పందన కారణంగా వేగంగా సంచరిస్తోంది. మరొకప్పుడు అల్పమైన స్పందనముచే కదలిక లేకయే ఉంటోంది. ఇట్లు స్పంద-అస్పందములు (Vibration - Non vibration) కలిగియుంటున్న వాయువును

Page:407

మనం స్పర్శ-అస్పర్శలను అనుసరించి గుర్తిస్తున్నాం. అయితే ఆకాశము అనేది అనిర్వచనీయం. అది సాపేక్ష (By Relativity / In relation to certain Presumptions & Assumptions) చేత మాత్రమే మనం గ్రహించగలుగుచున్నాం. అది నిరాకారముకూడా!

ఆత్మాకాశమునందలి ‘జీవ చైతన్యము’ నందు ‘భావనచేయుట’ అను వాయు సంచలనమువంటి స్వభావతత్త్వము ప్రకటితమగుచున్నది. అట్టి భావన (లేక) కల్పన యొక్క స్పంద- అస్పందములే “ఈ జగత్తు ఉండటం - లేకుండా పోవటం” అను రూపములుగల సృష్టి ప్రళయములుగా ఏర్పడుచున్నాయి. ఇక ఈ జీవునియొక్క వాస్తవతత్త్వానికి వస్తే, అది ఆకాశమువలె అనిర్వచనీయము. అయినప్పటికీ అది సర్వదా లభ్యమైయున్నది. నిత్యానుభవమైయున్నది. ఈ జీవుడు వాస్తవానికి ఆకారరహితుడే. దేహమునకు ఆకారం ఉన్నది. దేహికి ఆకారం ఏది ?

ఈ జగత్తంతా చైతన్యమే సుమా! చైతన్యము కాక ఈ జగత్తుకు వేరు సత్త లేదు. ఆ చైతన్యము తాను రజోగుణసంపన్నమైన తరుణంలో తదనుగుణమైన ఉపాధిని ఆశ్రయిస్తున్నప్పుడు ఈ సృష్టి సంరంభమంతా ఏర్పడుతుంది. తాను రజోగుణమును ఉపశమింపజేసినప్పుడు తనయందు తానే శాంతమై వెలయుచున్నది. “అనిర్వచనీయం, స్వవిషయకం” అయినట్టి అజ్ఞానము కారణంగా, ఆ చైతన్యము తనయొక్క “చిద్భావము” ను, బాహ్యమైనదానివలె ‘ఇది నా చిత్తము’ అని తలచుచున్నది. అట్లు తలచుటను శాస్త్రకారులు “చిత్స్పందము” అనే పేరు పెట్టారు.

అట్టి చిత్స్పందమే ఈ “జగత్తు” అస్పందమే (స్పందరాహిత్యమే) “బ్రహ్మము”

ఆ చిత్స్పందము యొక్క వేరువేరు అవస్థలకు ఇవ్వబడిన సాంకేతిక నామములు (Jargons) ఈ “జీవుడు-దైవము-కర్మలు” మొదలైనవి. ఈ జీవుడు, ఈ శరీరమునకు కారణమైనట్టి కర్మలు, ఆ కర్మల ప్రయోజనమైనట్టి దైవము…. ఇవన్నీ జల తరంగములవలె బ్రహ్మము యొక్క స్పందములు. కాబట్టి, "అనుభూతి స్వరూపమగు చైతన్యమే చిత్ స్పందము” అని తేలుచున్నది. దానికి జీవుడు, సంసృతి, కారణము…. ఇట్లు వివిధ శాస్త్రములలో ఆయాచోట్ల చెప్పటం జరిగింది.

చైతన్యము తనకు తానుగా అవిద్యను ఆశ్రయించి, ఆ అవిద్యయందు ప్రతిబింబించుచున్నది. అట్టి ప్రతిబింబత్వం “ద్వైతభ్రమ” (యిదివేరైనది’- అను భావన)కు కారణమై ఈ దేహాదుల అనుభవం పొందుతోంది. అనగా చైతన్యం స్వవిషయకమైనట్టి అజ్ఞానం వలన ఈ కనబడుచున్న నానావిధములైన రూపములను ధరించి సృష్టిగా కనబడుచున్నది. ఇదంతా స్వసంకల్పానుసారమే అనుభవమగుచున్నది. జీవచైతన్యము తనయొక్క “ఇచ్ఛ - అభిలాష” ల కారణంగా నానావిధములైన యోనులందు ”ప్రవేశము - నిష్క్రమణము”లను అవిశ్రాంతంగా చేసుకుంటూ పోతోంది. అయితే స్వస్వరూపాత్మ సర్వదా యథాతథం సుమా!

x

Page:408

ఈ విధంగా చైతన్యము నానావిధములైన జన్మలు లేక యోనులందు ఎందుకు సంచరిస్తోంది? అవిచారణ, అజ్ఞానము, ఇంద్రియములకు సంబంధించిన దృశ్యతాదాత్మ్యము అందుకు కారణమ గుచున్నాయి. ఏది ఏమైతే ఏం? చేతనము యొక్క అంశయే ఈ జీవుడు.

అట్టి దృశ్యాసక్తితో కూడిన చేతనాంశమును “పరిమిత ద్రష్ట” అని అంటున్నాం. అద్దం మరొక వైపు తిరిగి ఉండుటచే దృశ్యము ప్రతిబింబించదు కదా! చేతనాంశము బాహ్యానుభవ దృష్టి కలిగి యుండుటచే అది తనయొక్క వాస్తవ స్వరూపమునకు సంబంధించిన ‘ఎరుక’ (లేక) ‘దృష్టి’ ని ఏమరచుచున్నది. ఆ చేతనాంశమే మరొకసారి ‘ఆత్మ’ (లేక) ‘నిర్మల సత్త’ యొక్క పూర్ణానుభవమును ఆశ్రయించి ఉంటోంది. అనగా అది సర్వ జగత్ విశేషములకు అతీతత్వము సంతరించుకుంటోంది. అట్టి స్థితియే “ఉత్తమ జ్ఞాన స్థితి”, “స్వయంజ్యోతిత్వము”, “ముక్తి” మొదలగు పేర్లతో చెప్పబడుతోంది. అట్టి ఎరుక స్థితి పొందేది ఎట్లా?

’నేను దృశ్యమునకు సంబంధించినవాడను కాను. ఈ దృశ్యము నాకు సంబంధించినది కాదు. నిష్కళంకము, నిర్మలము, సర్వాత్మకము అయినట్టి శుద్ధతత్వమునే నేను” అనునట్టి ’మననము’ దృఢపడుటచేతనే అట్టి జ్ఞానార్హత లభిస్తోంది. “ఏది తానో, అదే తదితరులు" (తత్ త్వమ్ అసి - -

సోహమ్) అను సంభావనచే ఆ జ్ఞానము పూర్ణమగుచున్నది.

ఈ చైతన్యము ఏ ఉపాధియందు ‘దృష్టి’ ఉంచుచున్నదో, అది ఆ దృష్టికి సంబంధించిన ఆకృతినే పొందుచున్నది. తనయొక్క "సంకల్పము-ఆసక్తి-అభిలాషులను అనుసరించి సూక్ష్మ భూతము లతో ఏకత్వము పొందుచున్నది. పితృశరీరమునుండి ’శుక్రము’ రూపమున వెలువడి ఆయా అభిలషిత దేహములను ఒక దానివెనుక మరొకటి పొందుతూనే పోతోంది. అట్టి ప్రతి శరీరము పొందినట్టి కాల - స్థానము లందు (Time and place) కొన్ని అనుభవములను పొందుతోంది. మరల ఆ అనుభవము-జ్ఞానములను అనుసరించి బంధమో, స్వర్గమో, మోక్షమో పొందుచున్నది.

ఏది ఏమైనప్పటికీ, ఆయా ఉపాధులందు సంచరిస్తున్న ఈ “చైతన్యాంశము” తనయొక్క “సర్వమునందు విస్తరించి ఉండుట“ అను స్వరూపమును ఏమాత్రం ఏక్షణంలో కూడా త్యజించుట లేదు. కాని, ఇక్కడ కేవలం మరచుట-భ్రమించుట… మాత్రం జరుగుతోంది. అనేక శాస్త్రములు, అనేక ప్రవక్తలు అనేక రీతులుగా చెప్పుచున్నదంతా అంతిమసారం దృష్ట్యా చూస్తే ”ఈ జీవునికి ఇతని సర్వసమత్వరూపమైనట్టి సర్వాత్మకత్వమును గుర్తు చేయుటయే” అని మా అభిప్రాయం.

ఈ సర్వజీవులలోని వాస్తవతత్వమగు చైతన్యము సర్వదా ఒక్కటిగానే ఉన్నది. దానియందు ఏ క్షణమునందుకూడా అనేకత్వమునకు తావే లేదు. కాని కేవలం భిన్నభిన్న ఉపాధులతో భిన్నభిన్న విధములుగా తననుతాను సందర్శించుకుంటోంది. “ఇతడు తండ్రి, ఇతడు కుమారుడు. ఇతడు మిత్రుడు. వీరంతా తదితరులు”… ఇత్యాది వ్యవహారమంతా కేవలం ఉపాధికి సంబంధించినదే. స్వయంకృతమగు మనోకల్పితమే! సువర్ణము సర్వదా ఒక్కటే అయినప్పటికీ, “ఉంగరం - గాజులు

Page:409

లవణుడు అను ఒక మహారాజు ఒక గంట సమయంలో అనేక సంవత్సరములుగా విస్తరించి యున్న సుదీర్ఘమైన-చండాలుని జీవితం చవిచూడడం మనం ఈ ప్రకరణంలో గమనించబోవుచున్నాం. ‘అవిద్య’ చే మోహము చెందినట్టి ఈ చిత్తము తనయొక్క అధిష్ఠానమైయున్న ఆత్మయందు “జగదృశ్యము” అనబడు స్వప్నమును గాంచుచున్నది. ప్రశాంత సముద్రంలో తరంగాలు లేచినట్లు, శాంతిమయమగు "చిదాకాశము” నందు సృష్టివైపు ఉన్ముఖమైన ‘చిత్తు’ ఉదయిస్తోంది.

ఓ రామచంద్రా! ఇలా జగత్తుగా గాంచబడుచున్నదంతా ‘మనోవికారము’ మాత్రమే సుమా! ఉల్లాసముతో కూడిన మనోతరంగములు మననరూపము ధరించి, ఆత్మకు వేరైనదానివలె ప్రవర్తించు టయే ఈ సంసారచమత్కారం. అయితే, మనస్సు ఒకానొకప్పుడు ఉద్బోధింపబడినదై “స్వసత్త” యందు లయించిపోతోంది. అనగా అది స్వరూపస్వభావముల దృష్ట్యా ‘ఆత్మ’ యే అగుచున్నది.

“చిత్” అను జలముతో కూడిన “బ్రహ్మసాగరము” నందు ఈ కనబడుచున్న అనేక జీవులంతా ‘సుడులు’ వంటివారు. ఈ దృశ్యమునందు పాల్గొనుచున్న చిత్తములు దానియందు కెరటముల వంటివి. ఇక్కడ కనిపించే స్వర్గము - నరకము మొదలగునవన్నీ నీటి బుడగలవంటివి. ఇక్కడి చమత్కారమేమిటంటే… “పరిశీలించి చూడటం జరిగితే, ఏదైతే స్వతహాగా, (లేదా, ఉత్తమమైన వాస్తవదృష్టిచేత లేనే లేదో”…… అట్టిదే ఇదంతా! అయితే, ఇదంతా కూడా “నిర్దుష్టమైన సత్యమా?” అన్నట్లుగా ప్రాప్తిస్తూ వస్తోంది. అట్టి రూపముగల అనుభవమునే “మాయ” అని అంటున్నాం. మరి ఈ మాయ తొలిగేది ఎట్లా?

పరబ్రహ్మమును గ్రహించటం ఒక్కటే ఈ మాయను ఛేదించుటకు ఉపాయం. పరబ్రహ్మము యొక్క సమక్షము అచింత్యము, మహాశక్తియుతం కూడా. అట్టి శుద్ధ పరబ్రహ్మమునందు ‘మాయ’

Page:410

యొక్క విజృంభణము స్వాభావికంగానే ఒకచెట్టు యొక్క నీడవలె ఏర్పడుతోంది. అట్టి విజృంభణమే ఒకవైపు జీవుడు (లేక ద్రష్ట) యొక్క రూపముగాను, మరొకవైపు జగత్తు (లేక దృశ్యము) రూపముగాను ఒకే సమయంలో ప్రకటితం అవుతోంది.

వాస్తవానికి జ్ఞానుల దృష్టిలో ఈ జీవుడు, సంకల్పాత్మకమగు ఈ మనస్సు, ఈ బుద్ధి, చిత్తము, అహంకారము, మాయ- ఇవన్నీ కూడా చిత్తు యొక్క వివిధ నామములే అయిఉన్నాయి. అంతటికీ కారణం మనస్సే. మనస్సే స్వయముగా తనయందు శబ్ద-స్పర్శ-రూప రస గంధములను (పంచతన్మాత్రలను) కల్పించుకొని ‘మిథ్య’ యే అయినట్టి జగత్తును సత్యమువలె విస్తరింపచేస్తోంది. మనస్సుయొక్క ఈ జగద్దర్శనం ఒకడు తన స్వప్నంలో ఆయా వస్తువులను చూచుటవంటిది. నిజానికి శుద్ధము-నిత్యము అయినట్టి ఆత్మ సర్వదా శాంతభావముననే వెలయుచున్నది. పరమార్థ దృష్టితో చూస్తే… అది దేనినీ గాంచుటయే లేదు. అట్లు అయివుండికూడా, వ్యవహారికంగా చూచినప్పుడు ఈ ఆత్మ ‘చిత్తము’ అనబడు ఒకానొక స్వభావమును ఆశ్రయించి, తత్ఫలితంగా భ్రమను అనుభవిస్తోంది.

  1. ’జాగృత్’ అవస్థ (జాగృత్లో ‘నేను’) : ఈ చిత్తము ఒక సమయంలో ఇంద్రియముల ద్వారా బాహ్యత్వమును పొందుచున్నది. దీనినే "సంస్కృతమగుట (లేక) సంస్కృతి” అని యోగశాస్త్రం చెప్పుచున్నది. అప్పటి ఆత్మయొక్క స్థితిని “జాగ్రదవస్థ” అని అంటున్నాం.

  2. స్వప్నావస్థ (స్వప్నంలో ‘నేను’) : మరొకప్పుడు ఇదే చిత్తము అహంభావముతో కూడుకొని హృదయ-కంఠమధ్య ప్రదేశంలో సంచరిస్తోంది. అది “స్వప్నావస్థ” అనబడుచున్నది.

  3. సుషుప్తి (సుషుప్తిలో ‘నేను’) : ఈ చిత్తమే ఇంకొకప్పుడు “స్మృతి" అనబడు గూటిలో వాసనలన్నీ దాచివేసి మౌనావస్థను అనుభవిస్తున్నది. దానిని “సుషుప్తి” అని అంటున్నాం.

  4. తురీయస్థితి (నాలో జాగృత్-స్నప్న సుషుప్తిజగత్తులు) : పై మూడు అవస్థలను కూడా దాటి అది తన యొక్క చిత్స్వరూపమున వెలయుచున్నది. అప్పుడు ఆ స్థితి యందు తననుతానే సర్వే- సర్వత్ర, సర్వమునందు చూచుచున్నది. ఈ సర్వము తనయందే ఉన్నట్లు గాంచుచున్నది. “జాగృత్లో నేను - స్వప్నంలో నేను - సుషుప్తిలో నేను” అను దర్శనమును అధిగమించి “నాలో జాగ్రత్ స్వప్న సుషుప్తులు” అను రూపంగా సందర్శిస్తోంది. అట్టి దర్శనమే ‘తురీయము’ అని పిలవ బడుతోంది. ఈ స్థితి ‘దృక్ - దృశ్యము’ అను రెండింటిని అధిగమించినప్పటిది సుమా! ఆ ’తురీయపదము’ లేక ‘పరమపదము’ అత్యంతశుద్ధము, సన్మాత్రము, నిరామయము, శాంతము, అఖండానందప్రదము అయి ఉన్నది. అద్దానిని పొందడం జరిగినప్పుడు ఈ దుఃఖములు, శోకములు సమూలంగా వినష్టమైపోతున్నాయి.

ఓ రాఘవా! ఒకనికి మిథ్యాదృష్టి కారణంగా నిర్మలాకాశంలో ముత్యములు ఉన్నట్లు అనిపిస్తూ, ఇంతలోనే మటుమాయం అగుచున్నట్లు తోచుతూ ఉంటుంది చూచావా? అదేవిధంగా ఆ

Page:411

పరమపదమందు (లేక) పరమాత్మయందు బ్రహ్మాండములు ప్రకాశించటం, ఇంతలోనే విలీనమై పోవటం, ద్రష్టయొక్క మిథ్యాదృష్టిచేత కానవచ్చుచున్నాయి. భ్రమచేత నిర్మలాకాశంలో కనిపించే ముత్యములకు వాస్తవమైన ‘సత్త’ ఎక్కడ ఉన్నది? ఏ సమయంలోకూడా మిథ్య అయినట్టి ముత్యములకు నిర్మలాకాశం ఆధారమని అనలేం కదా! అదంతా చూచువాని దృష్టిలోపమే అయినట్లు, ఈ బ్రహ్మాండములకు కూడా ‘సత్త’ లేదు. ఇవి బ్రహ్మమునందు అధిష్ఠితమై ఉండియుండనేలేదు. కాని, అజ్ఞాన దృష్టిచే ఈ దృశ్య బ్రహ్మాండములు ఆత్మకు వేరైనట్లు వీక్షింపబడుచున్నాయి.

ఒక బాలుడు తనకు తానే కల్పించుకొనిన ’కల్పన’ కారణంగా ఆకాశంలో ఏదో పెద్ద వృక్షం ఉన్నట్లు చూస్తూ ఉంటాడు. అట్టి భ్రమాత్మకమైన వృక్షమును “ఆకాశవృక్షం" అంటారు. “ఆ వృక్షమునకు ఉత్పత్తిగాని, ఉనికిగాని, వృద్ధిగాని, వినాశముగాని పొందుటకు ఆకాశము కారణము” అని అన గలమా? లేదు. ఎందుకంటే అదంతా చూచిన అజ్ఞానబాలకుని భ్రమయేకాని, అసలు ఆకాశంలో వృక్షం ఎట్లా ఉంటుంది?

నిష్క్రియమగు బ్రహ్మము దేనికీ కారణం కాదు.

  1. జగత్తుకు కారణం బ్రహ్మమా?

శ్రీరాముడు: అయితే మహర్షీ! “మాయచే విజృంభించుచున్న ఈ జగత్తుకు మూలకారణం బ్రహ్మమే. సర్వమునకు కర్త బ్రహ్మమే" అని లోకమునందు వ్యవహరించబడుతోంది కదా!

శ్రీవసిష్ఠమహర్షి: అవును. అట్టి లోకరీతి ఉన్నమాట నిజమే, కాని అట్టివాక్యము బోధకొరకు మాత్రమే చెప్పబడుతోంది. “ఈ ‘జగత్తు’ అనబడునది లేదు” అనునట్టి సత్యమునకు సంబంధించిన దృఢనిశ్చయం ఏర్పడే వరకే ఆ వాక్యాలు చెల్లుతాయి.

ఇక్కడ నీకు మరొక దృష్టాంతం చెపుతాను. విను. ఒక దర్పణంలో ఎదురుగా ఉన్న వస్తుజాలం, ఆ వస్తువుల కదలికలు ప్రతిబింబించుతాయికదా! ఆ దర్పణం తనయందు ఎట్టి ఇచ్ఛాద్వేషములు, ప్రియ - అప్రియములు, రాగ-విరాగములు లేకుండానే తనయందు చూపుతోంది. అనగా, “నేను ఈ వస్తువులనైతే చూపుతాను. వాటిని చూపను. ఎందుకంటే, అవి నాకు ఇష్టం కాదు….” అనునది ఆ అద్దమునకు ఉండదు. అందుచేత, ఆ ప్రక్రియ యొక్క కర్త ృత్వమును దర్పణమునకు ఆపాదించలేం. సామీప్యత-సన్నిధానముల మాత్రం చేత దృశ్యము అద్దము నందు ప్రతిబింబిస్తోంది. అంతమాత్రం చేత ఆ ప్రతిబింబిస్తున్నది అద్దములోని భాగమని కూడా అనలేం కదా! అట్లాగే, సామీప్యత-సన్నిధానం కారణంగా ఈ ‘జగత్తు’ అనబడునది ప్రకాశించబడుటచే “ఈ జగత్తుకు కారణం ఆత్మచైతన్యము” అని చెప్పబడుతోంది. అద్దమే లేకపోతే ప్రతిబింబమే ఉండనట్లు, ఆత్మచైతన్యమే లేకుంటే ‘జగత్తు’ అను అనుభవం ఎక్కడిది? ఎవరికి?… కాని, ఈ జగత్తు ఆత్మయొక్క ఒక శరీర భాగమని అనటానికి కూడా వీలు లేదు.

Page:412

ఒక బీజము నుండి అంకురములు, ఆకులు, ఫలములు ఉత్పన్నమగునట్లు, ‘చిత్తు’ నుండే చిత్తము జీవులు-మనస్సులు…. అంతా కలుగుచున్నాయి. ప్రళయసమయంలో సృష్టిరహితమై ‘శుద్ధ చిత్తు’ శేషిస్తోంది. ప్రళయానంతరం మరల “సృష్టి” ఆకారమున వివర్తమునొందుచున్నది. అంకురశక్తి మౌనంగా నిదురించియున్న బీజంలోంచి వృక్షంగా…. మరల ఆ వృక్షంలోంచి బీజముగా ఉత్పన్నమగుట లేదా? ఇది కూడా అట్టిదే.

బీజంలో ఉండిఉంటున్న “వృక్షమును జనింపజేయగల శక్తి మరియు బ్రహ్మమునందు ఉండి ఉన్నట్టి ”జగత్తును జనింపజేయగల శక్తి”…. ఈ రెండూ ఒక రకంగా సమానములైనవే. అయితే ఆ రెండింటిమధ్య ఒక భేదము గోచరిస్తోంది. ’బీజము’ కంటే వేరుగా ‘వృక్షము’ అనబడునది ప్రాప్తిస్తోంది కదా! కాని బ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానము ఉదయించిన తరువాత “బ్రహ్మము కంటే వేరుగా విశ్వము లేదు” అనబడు బోధ ఏర్పడుచున్నది. బీజము-వృక్షములు, బ్రహ్మము జగత్తులు అను దృష్టాంతములకు ఉన్న తేడా ఇంతే.

దీపం ప్రకాశిస్తూ ఉండగా, ఆ దీపపు కాంతిలో వస్తువులు కనబడతాయి. కాని “ఆ దీపమే ఈ వస్తువులను మాకు చూపుచున్నది” అని అనగలమా? అనలేము. ఎందుకంటే, “ఈ వస్తువులను ఇతనికి చూపాలి. ఇవి ఇతనికి చూపకూడదు” అనునట్టి ఇచ్ఛ ఆ దీపమునందు లేదుకదా! అయితే దీపమే లేకుంటే చూడనేలేమే! బ్రహ్మము యొక్క సమక్షంలో ఈ జన్మాదులు, భావాభావములు ఉంటున్నాయి, లేకుండా పోతున్నాయి కూడా. అయితే వీటికి బ్రహ్మము కారణము” అని అనలేం. కాని, బ్రహ్మమే లేకుంటే ఇక ఈ జగత్తు, జన్మమృత్యువులు, మొదలైనవన్నీ పొందేదెవరు? కాబట్టి, బ్రహ్మము ఉన్నది కాబట్టే జగద్వ్యవహారము, తదితరములు ఉంటున్నాయి.

భూమిని ఎక్కడ త్రవ్వటం జరిగితే…. అక్కడ ఆకాశం ఉండనే ఉండి ఉంటుంది కదా! విచారించి చూస్తే…. సర్వేసర్వత్ర “ఏకము-అద్వితీయము” అగు చైతన్యమే గోచరించగలదు.

ఒక పిల్లవాడు ఒక అద్దంలోనో, లేక స్ఫటిక శిలాఖండంలోనో ప్రతిబింబిస్తున్న ఆకాశంలోని చంద్రుని చూచి “ఇతడు వాస్తవ చంద్రుడే. ఇతనిని మనం పట్టుకోగలం” అని అనుకుంటూంటాడు చూచావా? అవిద్యామోహితులైన వారు మాత్రమే బ్రహ్మమునందు ‘జగత్తు’ను గాంచుచున్నారు. స్ఫటికశిలాఖండంలో స్ఫటిక పదార్థమే ఉన్నది గాని చంద్రుడు మొదలైనవి ఉన్నాయా? జలంలో పున్నమిరోజు చంద్రుడు కనిపిస్తున్నాడనుకో…. జలంలో జలమే ఉన్నదికాని చంద్రుడు ఎక్కడ? అద్దములో ‘గాజు-తగరము’ అను రెండు పదార్థములే కాని, అందు చంద్రుడు-ఆకాశం ఎక్కడ ఉంటాయి? ‘అరణ్యం’ అద్దములో ప్రతిబింబిస్తున్నప్పుడు, ఆ అద్దంలో మృగముల, పక్షుల కదలికలు కనిపించినంత మాత్రంచేత అవన్నీ అద్దంలో ఏర్పడుచున్నాయని అనగలమా? బ్రహ్మముకూడా ‘ప్రపంచము’ వలె ప్రతిభాసిస్తోంది. బ్రహ్మామునందు జగత్తుగా ప్రతిభాసించేదంతా బ్రహ్మమే అయిఉన్నది.

Page:413

కాబట్టి ఓ రామచంద్రా! నీచే గాంచబడుచున్న ‘ప్రపంచము’ అనబడునదంతా నీ స్వస్వరూపమునకు ఏమాత్రం వేరుకానట్టి “బ్రహ్మమే” అయిఉన్నది. “వేఱు“గా గాంచుట స్వకల్పితమైన ‘మాయ’ చేతనే. ఇట్టి ఆత్మస్వరూపమునకు సంబంధించిన ‘ఎరుక’ అంతరంగమున దృఢత్వం పొందిన జ్ఞానికి - జన్మ మృత్యువులతో సహా ఇందు ఏదీ విపరీతమైనదిగా కనిపించదు. శ్రీరాముడు : మీరు చెప్పుచున్నదంతా ఎంత చిత్రమైన విషయం! చూచారా మహర్షీ! పరిదృశ్యమానమై, ఘనీభూతమై కనిపిస్తున్న ఈ జగత్తు వాస్తవానికి ‘మిథ్య’ యే అయిఉన్నది కదా! కాని మా అనుభవమునకు మాత్రం “ఇదంతా ఇట్లే వాస్తవం” అను రూపముగల ఏదో దృష్టి ఏర్పడుతోంది. ప్రభూ! మీరు చెప్పినది వింటూ ఉండటంచేత ఈ జగత్తు యొక్క స్వరూప - స్వభావాలు క్రమక్రమంగా తెలియవస్తున్నాయి. ఇదంతా ఎంతో సూక్ష్మం, స్వచ్ఛం, ప్రస్ఫుటం అయి ఉన్నది. మహాత్మ స్వరూపమే అయిఉన్నది. కాని "మంచుతుంపరలుతో పోల్చతగిన ఈ తన్మాత్రల (శబ్ద-స్పర్శ-రూప రస -గంధముల) అసత్ దృష్టి కారణంగా, అందుకు వ్యతిరిక్తంగా కానవస్తున్నది.

తండ్రీ! ఇప్పుడు “సమష్టి - వ్యష్టి” దేహముల గురించి, ఆ దేహముల అభిమానులగు ”విశ్వుడు (Universal ‘1’) - వైశ్వానరుడు(Individual “)” అనబడువారి గురించి… వారు ఎట్లా ఉత్పన్నమగుచున్నారో చెప్పండి.

శ్రీవసిష్ఠమహర్షి :‘ఆకారము’ అంటూ ఏదీ లేనట్టి “పిశాచము” అనబడునది ఒక అమాయిక బాలుని హృదయంలో ఆకృతి కలిగిఉన్నట్లు స్ఫురిస్తుంది కదా!

ఈ జీవుడు వాస్తవానికి ‘ఆకృతి’ అంటూ ఏదీ లేనివాడే! అతడు మొట్టమొదట పరబ్రహ్మమున ప్రకాశించుచున్నాడు. అతని స్వరూపము సర్వదా పరబ్రహ్మమే. పూర్వ కల్పీయమైన జీవ సంస్కారము లను అనుసరించి ‘జీవభావము’ అనునది పరబ్రహ్మమునందు జలమునందలి తరంగమువలె ప్రకాశిస్తోంది. ఈ జీవుడు ఒకవైపు పరమశుద్ధుడు. పరబ్రహ్మము యొక్క సర్వలక్షణములను కలిగియే ఉన్నాడు. అట్లు స్వతహాగా ‘శుద్ధుడు’ అయి ఉండి కూడా వాసనలచే ఉద్భవించిన దేహములను అనుభూతిచెందుచున్నాడు. ఇతడు పరమాత్మకు అభిన్నుడే కాని, భిన్నుడుగా గోచరిస్తున్నాడు. అతడు సత్యస్వరూపుడై ఉండికూడా కల్పనతోకూడి ఈ జగత్తును దర్శిస్తున్నాడు.

పరమాత్మయే “నేను జీవుడను-దేహమును-ఖండుడను” అను కల్పనను ఆశ్రయించుటద్వారా జీవభావమును పొందుచున్నాడు. చైతన్యమే ఈ జీవుని స్వరూపము. అట్టి ఈ జీవుడు మననజ్ఞానము వలన “మనస్సు” గా ప్రకాశమును పొందుచున్నాడు. ఆ మనస్సే తన్మాత్రల గురించి చింతించుటచేత శబ్దస్పర్శాదుల అనుభవం పొందుతోంది. పరమాణువుకంటే కూడా ఎంతో సూక్ష్మమైనట్టి ఆ

మనోచైతన్యం నిర్విషయ చిదాకాశమున చమత్కార పూర్వకంగా స్పురించటం జరుగుతోంది.

ఒకేజలం “ఒక నీటిబిందువు… అనేక తరంగములు"గా కూడా అవుతోంది చూచావా! చిదాకాశమునందు వ్యష్టి (Individual ’1’)- సమష్టి (Universal ‘T’)తత్వములు కూడా అట్లాగే ప్రభవిస్తున్నాయి.

Page:414

సమష్టి పట్ల అభిమానము గల జీవుడు = హిరణ్యగర్భుడు (విశ్వుడు) వ్యష్టితత్వము పట్ల అభిమానముగల జీవుడు = వ్యష్టిజీవుడు (వైశ్వానరుడు)

సమష్టిమనో రూపుడగు హిరణ్యగర్భుని యందు మనోకల్పనా రూపంగా అసంఖ్యాకములైన బ్రహ్మాండములు స్ఫురిస్తున్నాయి. అనగా, ఈ బ్రహ్మాండములన్నీ సమష్టిమనస్సు నందే ఉన్నాయి ఇక ఈ బ్రహ్మాండములందు సూక్ష్మదేహములు ఒక గొప్ప శిలయందు చిత్రించబడిన అనేక చిత్రముల వలె ఉంటున్నాయి. విచిత్రం చూచావా? అట్టి మనోరూపమును పొందిన జీవ చైతన్యము తన స్వస్వరూపమును విస్మరించుటచే తన వాస్తవస్వభావమును గుర్తించజాలక “నేనెవడను?” అను ఒకానొక సందిగ్ధజ్ఞానము పొందుచున్నది.

ఇట్లు ‘మననము’ అను రూపముగల సూక్ష్మదేహములను (మనస్సు + బుద్ధి + చిత్తము + అహంకారములను) ఆ జీవచైతన్యం ధరిస్తోంది. ఎప్పటికప్పుడు ఇతఃపూర్వపు సంస్కారములు, పురుషార్థములతో కూడి ‘ఉపాధి’ రూపమున ఉదయిస్తోంది. క్రమంగా ‘జగత్తు’ అను శబ్దము యొక్క అర్థమును, తత్వమును అస్ఫుట - జ్ఞానరూపమున పొందుతోంది. మనోచైతన్యం “నేను శరీరమును, వ్యష్టిని” అనునట్టి మననముచే ఈ శరీరములను ప్రకాశింపచేయుచున్నది. అట్లు ప్రకాశిస్తున్న ఈ శరీరము నుండి ఆ ”జీవచైతన్యస్ఫూర్తి”, అంతరమున మనో-బుద్ధి-చిత్తఅహంకారములను, వెలుపల ఇంద్రియముల ఉత్పత్తిని, ఆ ఇంద్రియములకు అనుభవమగుచున్న వస్తుజాలముతో కూడిన జగత్తును పొందుచున్నది.

వెలుపల “రసము” శరీరమునందు ‘నాలుక’ వెలుపల “రూపము” శరీరమునందు ’కనులు’

వెలుపల “గంధము” శరీరమునందు ’ముక్కు

వెలుపల “శబ్దములు” శరీరమునందు ‘చెవులు’

ఇట్లు ఆయా ఇంద్రియ భావనలు ఘనీభూతమగుచుండగా అతనికి “శబ్దములను వినుట” మొదలైన ప్రక్రియవ్యవహారమంతా సమీపిస్తోంది. ఇట్లు జీవాత్మ కాకతాళీయంగా క్రమక్రమంగా దేహభావమును అనేకసార్లు గ్రహించుచున్నాడు.

ఈ జీవాత్మ ఏ అంశమునందు శబ్దం వినటం జరుగుతోందో దానిని ‘చెవులు’ అని అంటున్నాం. వాస్తవానికి ‘జీవాత్మ’ అనునది మిథ్యయేనని జ్ఞానులు గ్రహిస్తున్నారు. ఎందుచేతనంటే, జగన్నాటకాంతర్గతంగా పాత్రధారునివలే కనిపించే ఈ జీవుడు… జగదతీతంగా పరంజ్యోతి స్వరూపుడే! అయినా, ‘అజ్ఞాన’ అనే పాత్ర రూపంగా అజ్ఞానదృష్టికి సత్యమువలె గోచరిస్తున్నాడు.

‘చెవులు’ లాగానే ఆ జీవచైతన్యము రూపమును గ్రహించే చోటును ‘కళ్ళు’ అని, గంధమును గ్రహించేచోటును ముక్కు అని అంటున్నాం. ఈ ఇంద్రియములన్నీ భావనామయములే సుమా! ఈ జీవాత్మ భావావేశముచే, “నేను ఈ దేహము కలవాడను. బాహ్యవిషయములను ‘గుర్తించుట, అనుభవించుట, ప్రకాశింపచేయుట’ మొదలగు ధర్మములను నిర్వర్తించగల ఇంద్రియ రంధ్రములు కలవాడను" అని తలపోయుచున్నాడు.

Page:415

సమష్టి జీవుని వ్యష్టిజీవుని భావమయములైన ‘ఆతివాహిక దేహములు’ (లేక సూక్ష్మ దేహములు) మొట్టమొదట ఉత్పన్నమౌతున్నాయి.

ఓ రామచంద్రా! ఈ విధంగా అవ్యక్తమైనట్టి పరమాత్మయే అజ్ఞానముతోగూడి - ఆతివాహిక - దేహములను పొందుచున్నది. అజ్ఞానము తొలగిందా, ఇక “నేను స్థూలదేహిని, సూక్ష్మదేహిని” -

అను భ్రమకూడా తొలగుతోంది. ఆత్మజ్ఞానము కలిగిన తరువాత ప్రమాణము ఉండదు. ప్రమేయము (జీవుడు : : Objected Created) కూడా ఉండదు. ప్రమాతృత్వమూ (process of creation) ఉండదు. అజ్ఞానముచే ఏర్పడినట్టి “వ్యష్టి అభిమాని-సమష్టి అభిమాని”… లేనివే అవుచున్నాయి.

ఒకే ‘పరాసత్త’– “నేను బ్రహ్మమును” అను భావనచే బ్రహ్మముగను, “నేను సమష్టిజీవుడను” అను భావనచే ‘సమష్టి’గను, “నేను వ్యష్టిజీవుడను" అను భావనచే ’వ్యష్టి’ గను ప్రతిభాసిస్తోంది. శ్రీరాముడు : ఈ జీవుని స్వస్వరూపమైనట్టి “చిన్మాతతత్వ” అగు బ్రహ్మమునందు అజ్ఞానము యొక్క ఉనికి ఎలా సాధ్యం? అందుచేత బ్రహ్మముయొక్క అద్వైతస్థితి దానికి వేరైనదంటూ ఏదీ లేకపోవడం) స్వతఃసిద్ధమే అయిఉన్నదికదా! మరి ఇంక విధి-నియమములు-విచారణ-మోక్షము…. మొదలైన భేదకల్పనతో ఆవశ్యకత ఎందుకుంటోంది?

శ్రీవసిష్ఠమహర్షి : మంచి ప్రశ్న వేశావు. ప్రశ్న గొప్పది అయినప్పటికీ అది తగిన సమయంలో వేస్తేనే ప్రాశస్త్యం. ఏదైనా యోగ్యమైన కాలంలోనే శోభిస్తుంది కదా! నీ ప్రశ్న ఇప్పటికి తగినట్లే ఉన్నది. ఇక విను. “ఈ జగత్తంతా సమష్టి జీవాభిమాని అయినట్టి ‘హిరణ్యగర్భుడు’ అను పేరుతో పిలువబడువాని స్వప్నము’ అని చెప్పబడుతోంది. ఆ హిరణ్యగర్భుడు (అతడే బ్రహ్మదేవుడు పితామహుడు అని శాస్త్ర ప్రసిద్ధి) ఓంకారరూపమగు ప్రణవమును ఉచ్చరించుచు అద్దాని యొక్క అర్థమును గ్రహించుచు మనోరాజ్యమును విస్తరింపజేయుచున్నాడు.

ఇక ఈ ‘జీవాత్మ’ (వ్యష్టిజీవుడు) కూడా అట్లే యథాకాలమున స్వప్నతుల్యంగా స్వప్నాత్ముడగు హిరణ్యగర్భుని స్పప్నవ్యవహారమునందు ఆవిర్భవించుచున్నాడు. జీవాత్మలన్నీ హిరణ్యగర్భుని రూపమే. స్వప్నములో కనబడే స్వరూపములన్నీ స్వపద్రష్టవేగాని, మరింకెవరివో కాదు కదా!

అయితే, ఈ సమష్టిమనోరూపము ‘పరమాత్మ’ యందు దర్పణాంతర్గత ప్రతిబింబమువలె అగుపిస్తున్న ఈ దృశ్యజగత్తు స్వప్నప్రాయమే కనుక, “ఇదంతా అసత్తే" అని చెప్పబడుతోంది. అదేవిధంగా ‘వ్యష్టి – మనోరాజ్యము’ అయినట్టి జగత్తు, కూడా చిదాకాశమునందు అసత్తే అగుచున్నది. వాస్తవానికి ఈ ‘జగత్తు’ అనబడునదేదీ జన్మించుట లేదు. మరణించుటలేదు. స్వప్నంలోని సంకల్పమాత్ర రూపములకు జన్మఏమి? మరణం ఏమిటి? ఒక్క బ్రహ్మము మాత్రమే సర్వదా పరమార్థ సత్యము. ఆ బ్రహ్మమే జగద్రూపంగా, మరియు ’ప్రతిభాసితమాత్ర సత్యము’గా అగుపిస్తోంది. ఊహాతత్వముగా ప్రకాశిస్తోంది.

అట్లు ‘ప్రకాశించుట’ లేక ‘తోచుట’ కేవలం అవిచారణచేత మాత్రమే సుమా! పరిశీలించి చూస్తే ‘బ్రహ్మదేవుడు’ మొదలుకొని ఒక పురుగు వరకు…. ఈ జీవుల అందరి ‘సత్త’ కూడా

Page:416

‘సత్-అసత్’ మయమే. అజ్ఞానం తొలగిపోతే అన్నీ అసత్తులే అగుచున్నాయి. అజ్ఞానకాలంలో ఉండియే తీరుచున్నాయి.

ఒక్కొక్క జీవిది ఒక్కొక్క సృష్టి

పిపీలికాది బ్రహ్మపర్యంతము (ఒక పురుగు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు) అందరి సృష్టులు సమానమే. ఇక బేధమేమిటంటావా? ‘విశుద్ధ - సత్వప్రధానము’ చే చే బ్రహ్మదేవుడు ‘గొప్ప వాడు’ మహోన్నతుడు, మహాశయుడు అని అంటున్నాం. ’మలినసత్వ ప్రధానము అగుటచే ‘కీటకము తుచ్ఛమైనది’ అంటున్నాం. ఆ రెండిటిలోని ఇచ్ఛ, భావన మొదలైనవాటి యొక్క మూలము “సంకల్పము” ఒక్కటే. ఉభయుల అనుభవములు స్వయంకల్పితమే!

శ్రీరాముడు : “బ్రహ్మదేవుని సృష్టి - పురుగుయొక్క సృష్టి” అంటున్నారేం? ప్రతి ఒక్కజీవునికి ఒకానొక సృష్టి ఉన్నదా? మీకు ఒకతీరు సృష్టి, నాకు మరొక తీరుసృష్టి ఉన్నదని మీ ఉద్దేశమా? శ్రీ వసిష్ఠమహర్షి : అవును. ఎందుకంటే, దృష్టియే సృష్టి కదా! బ్రహ్మదేవా హంకారి… “నేను ఈ సమష్టి సృష్టియందలి సూక్ష్మదేహతత్వమును, సర్వమునకు అంతర్యామియై కల్పనకు కారకుడనగు చున్నాను” అను దృష్టి కలిగి ఉంటున్నాడు. కీటకాహంకారియో - ”ఈ రెక్కలు - కాళ్ళు - తల గల శరీరమునే నేను. ఈ శరీరమునకు ఆకలి తీర్చటం, - నిద్ర కంటే వేరుగా యింక ఎక్కడా ఏదీ లేదు”…. అను పరిమిత దృష్టి కలిగి ఉంటున్నాడు. సూర్యుడు ఒక్కడే అయినా, సూర్యకిరణాలు అనేకమై, ఒక్కొక్క కిరణం ఒక్కొక్క వస్తువును వెలిగిస్తోంది కదా! ఎవరు ఎట్టి దృష్టి కలిగి ఉంటారో, వారికి అట్టి సృష్టియే అనుభవమగుచున్నది.

శ్రద్ధ భావనలను అనుసరించే “జీవుడు అతని పురుషకారము- ” ఉంటున్నాయి. అట్టి పురుషకారము ననుసరించి కర్మలను ఆచరించటం, ఆ కర్మల ఫలములు లేక ప్రయోజనములు, ఉపాధులు ఏర్పడుచున్నాయి. సుకృతఫలముచే బ్రహ్మదేవుని జన్మలు, దుష్కృత ఫలముచే కీటక జన్మలు వస్తున్నాయి. అయితే ఈ "జన్మలు-కర్మలు సుకృతకర్మలు-దుష్కృత కర్మలు”…. ఇదంతా బ్రహ్మజ్ఞానము యొక్క ‘అభావము’, లేక, ‘ఏమరుపు’ చేతనే ఉనికిని సంతరించుకొంటున్నాయి. అనగా ఉత్తమ పరిశీలన సన్నగిల్లిన సమయంలో ‘ఉన్నవి’ అగుచున్నాయి. జ్ఞానోదయం అయినదా…. ఇక ఈ భేదబోధలన్నీ సమసిపోగలవు. ఎందుచేతనంటావా? బ్రహ్మదేవునియందు, కీటకమునందు ఉన్నట్టి ‘సత్త’ ఒక్కటే కదా!

  1. తెలుసుకొనువాడు = జ్ఞాత (Knower - Experiencer - Perceiver)

2.తెలియబడుచున్నది = జ్ఞేయము (The object being known - the experience - the perceived) 3. తెలుసుకోవటం = జ్ఞాతృత్వము (Knowledge - Experience - Perception)

ఈ మూడు తత్వములు సర్వద్రష్టలందు, లేక, సర్వ జీవులందు ఒకే రీతిగా ఏర్పడి ఉంటున్నాయి. ‘శక్తి’ అనునది ఒక్కటే అయి ఉండి, అనేక చోట్ల అనేక నామరూపములను పొందుచున్నట్లే ఒకే

Page:417

బ్రహ్మము ఆయా ద్రష్ట దర్శన దృశ్యములను సంతరించుకొంటోంది. ధారణ కలిగి ఉంటోంది. ఏది ఏమైతేనేం? బ్రహ్మమునకు భిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇక ఈ ‘ద్వైత-అద్వైత’ భేదములన్నీ భ్రమలు మాత్రమే. సాలెపురుగు తన లాలాజలముచే నిర్మించుకొనిన సాలెగూడులో తానే చిక్కి, శల్యమై బంధమును అనుభవిస్తోందికదా! అట్లాగే స్వయంగా, సహజంగా బ్రహ్మానందమయ స్వరూపుడే అయిఉన్న ఈజీవుడు తన కల్పనాశక్తిచే తానే నిర్మించుకొనినట్టి తన మాయవలన తానే ‘బంధం’ అనుభవిస్తున్నాడు.

సమష్టి మనోస్వరూపుడైన బ్రహ్మదేవుడు దేనిని ఎట్లు భావిస్తున్నాడో, ఈ జీవుడు కూడా దానిని అట్లే గాంచుచున్నాడు. ఇది ‘నియతి’ యొక్క వ్యవస్థ. ఈ ‘నియతి’ లేక ‘స్వభావము’ ను అనుసరించే ’మట్టివిత్తు నుండి మట్టి వృక్షమే రావటం; బ్రహ్మాండములు మహాకల్పాంతము వరకు వెలసి ఉండటం’…. మొదలైనవన్నీ సిద్ధించటం జరుగుతోంది.

అయితే రామా! “ఇక్కడ ఒక నియతి (ఒకానొక నియామకపూర్వకమైన విధానం) జరుగుచున్నది కదా! కనుక ఇదంతా సత్యమే” అని తలచరాదు సుమా! ఎందుకంటే, ఇదంతా ద్రష్ట యొక్క ‘భావన’ ను అనుసరించే దర్శించబడుతోంది. ‘భావనామయములు’ అయివున్న ఈ సృష్టి యొక్క స్థితిలయాలు అవాస్తవములే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శుద్ధము, సర్వవ్యాపి, ఏక మాత్రము, అనంతము అయివున్న బ్రహ్మము జ్ఞానము యొక్క స్వల్పత్వ కారణంచేత అశుద్ధంగా, ఉపాధి పరిమితంగా, అనేకములుగా, జన్మ-మృత్యు సహితంగా కనిపించడం జరుగుతోంది. మూఢుడైన ఒక బాలుడు తటాక జలంలోని అలలనుచూచి, ఆ అలలను “ఇదంతా జలమే” అను దృష్టిని ఏమరచినవాడై, “ఇవన్నీ ముందుకు దూసుకుపోతున్న చమత్కార పూర్వపు ఎత్తు - పల్లములతో కూడిన వేరువేరు కెరటములు“ అని అనుకుంటూ ఉంటాడు. వివేకములేనట్టి ఒకడు చీకట్లో త్రాడునుచూచి ‘పాము’ అనుకొని అనేక వికారములు పొందుచూ ఉంటాడు. అట్లాగే ఇదంతా ప్రాప్తిస్తోంది. అయితే, ఏ జీవునియందైతే ‘ఉత్తమము పవిత్రము’ అయినట్టి దృష్టి, మరియు ”సంపూర్ణము సమగ్రము” అయినట్టి అవగాహన లేవో, …. అట్టి వాడు మాత్రమే ఈ జగద్భేదములన్నీ అనుభవిస్తున్నాడు. కాని ఇక్కడ జీవునికి - జీవునికి మధ్యగా కనిపించే ఆయా భేదములన్నీ సత్యదృష్టికి లభించవు. ఒకడు ఇతరులతో తనచే కల్పించబడిన భేదములను అనుసరించి ’ఇతడు నా మిత్రుడు. అతడు వేరైనవాడు. వీరు నాకు ప్రియులు. వీరికి కలుగు దుఃఖము నా దుః ఖమే”…. అనునవన్నీ “వాస్తవములే” అనునట్లు పొందుచున్నాడు. “శత్రువు - మిత్రుడు” మొదలైన ఏవేవో పరస్పర విరుద్ధములైన భేదవ్యవహారములు గాంచుచున్నాడు.

బ్రహ్మమునందు పరస్పర విరోధములైన భేదాభేదములన్నీ వెలయుచున్నాయి.

తరంగాలు అనేకంగా వేరువేరుగా కనిపించినా, అవన్నీ వేరువేరా? అంతా జలమే కదా! “సువర్ణం - ఆభరణం” అనే ద్వంద్వం ఉన్నదా? ‘ఏక మాత్రమగు బ్రహ్మము’ నందు ఈ ‘జగత్తు’ అనబడునది ఆరోపించబడుతోంది. ఇక ఆపై “జగత్తువేరు… బ్రహ్మమువేరు" అనునదంతా ప్రాప్తిస్తోంది.

Page:418

మొట్టమొదట శుద్ధతత్వము, పరిపూర్ణము అగు ‘ఆత్మ’ యే ఉన్నది. ఆ ‘ఆత్మ’ యే మనో రూపమున ప్రకాశించుచున్నది. ఆ ‘మనస్సు’ నుండి అహంకారం ఉత్పన్నమౌతోంది. అనగా…. ఈ మనస్సు మొట్టమొదట “నిర్వికల్పము” నందు మౌనరూపమున ఉండి ఉన్నది. నిశ్చల జలంలో తరంగములవలె, ఆ తరువాత కల్పనా ప్రభావమునకు లోనై ‘అహంభావము’ అనుదానిచే విశిష్టమగుచున్నది. అట్టి అహంభావ - విశిష్టమైన మనస్సునుండి పూర్వానుభవరూపమైన ‘స్మృతి’ ని అనుసరించి “శబ్దేచ్ఛ-స్పర్శేచ్ఛ- రూపేచ్ఛ -రసేచ్ఛ-గంధేచ్ఛ” అనబడే పంచతన్మాత్రలు కలుగు చున్నాయి. ఈ భూతతన్మాత్రలు కల్పించబడిన తరువాత, చిత్తాత్ముడు (చిత్తముతో కూడిన ఆత్మ స్వరూపుడు) అగు ఈ జీవుడు కాకతాళీయంగా జగత్తును దర్శించుచున్నాడు.

ఈ మనస్సు దేనిని దీర్ఘకాలం ‘సత్త’ గా భావిస్తుందో, అయ్యది అట్లే సద్రూపంగానే భాసించటం జరుగుతోంది.

కనుక మనస్సే అంతటికీ కారణం.

  1. కర్కటి తపస్సు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సందర్భంలో ఒక పురాతన ఇతిహాసం చెపుతాను. ఇందులో ఒక రాక్షసి అధ్యాత్మశాస్త్ర పూర్వకమైన కొన్ని జటిల ప్రశ్నలు ప్రతిపాదించింది.

హిమాలయపర్వతపు ఉత్తరభాగంలో గల ఒక అరణ్యంలో ఒకచోట ‘కర్కటి’ అనే పేరుగల ఒక భయంకర రాక్షసి ఉండేది. అక్కడ నివసిస్తున్న జనులు ఆ రాక్షసిని ‘అన్యాయబాధిక’ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆ రాక్షసి కాటుకవలె నల్లగా, అతి భయంకరంగా ఉండేది. అది అసామాన్యమైన బలంతో భీతిని గొలుపు కార్యములు చేస్తూ ఉండేది. లోతైన కళ్ళతో, పొడవైన గోళ్ళతో, నర - కంకాళములను పుష్పమాలగా ధరించి బేతాళ నృత్యం చేస్తూ ఆ మహారణ్యంలో సంచరించేది. దానిని చూడటం తటస్థించిన జనులు బెంబేలెత్తిపోయేవారు.

దానికి ఎందుకో, ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు. తీవ్ర జఠరాగ్నితో ఆకలి అరుపులు అరుస్తూ, ఒక రోజున ఇట్లు ఆలోచించసాగింది.

“ఆహాఁ! ఈ నా ఆకలి ఎంత క్రూరమైనది? ఈ జంబూ ద్వీపంలో నివసించే మనుష్యులందరినీ ఒక్కసారి మ్రింగినా ఈ ఆకలి తీరేటట్లు లేదే? వీరందరిని నేను చంపగలనా? వీరిలో కొందరు మంత్ర - - ఔషధములు కలిగి ఉంటున్నారు. వారిని నేనేమీ చెయ్యలేను. ఇక మరికొందరు ‘నీతి-దానము-పూజ’ మొదలైనవి నిర్వర్తిస్తూ ఉంటారు. వీరందరిని నిర్జించటం, తినటం, నాకు ఒనగూడే పని కాదేమరి? ఇప్పుడు నా ఆకలి తీరేది ఎట్లా?…. పోనీ, ఒకపని చేస్తాను. తపస్సుచే సాధించరానిదంటూ ఏదీ ఉండదుకదా! అందుచేత వీరందరిని అడ్డంకులు లేకుండా నమిలి

Page:419

మ్రింగుతూ, పీల్చివేస్తూ ఉండగలందులకు శక్తి సంపాదిస్తాను. అటువంటి శక్తియుక్తుల కొరకు తపస్సు ప్రారంభిస్తాను”.

ఈ విధంగా యోచించి ఒక కొండ యొక్క అగ్రభాగంచేరింది. అక్కడ గల ఒక ప్రదేశంలో ఒంటికాలుపై నిలబడి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. అనేక రోజులు, మాసములు, ఋతువులు గడచిపోయాయి. అది నిశ్చలంగా ఘోరతపస్సు చేస్తూనే ఉన్నది.

కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఆ రాక్షసియొక్క ఏకాగ్రతపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. శ్రీబ్రహ్మదేవుడు : పుత్రీ! పట్టుదలతో కూడిన నీ సుదీర్ఘ తపస్సుకు మెచ్చాను. ఏమి కోరి తపస్సు చేస్తున్నావో చెప్పు. నీకు ఇష్టసిద్ధిని ప్రసాదిస్తాను.

కర్కటి : హే భగవానుడా! పితామహా! నమోనమః! మీ దర్శనంచేత నా భాగ్యం పండింది. నా బాధ ఏమని చెప్పమంటారు? నాకు ఆకలి దంచివేస్తోంది. ఓ భూతభవ్యేశా! నన్ను “అనాయసి-ఆయసి”….

అయినట్టి “జీవి సూచిక”గా చేసివేయండి. అప్పుడు నేను జీవుల శరీరములలో ప్రవేశించి, వారి రక్తమును జుట్టుకుంటాను.

శ్రీబ్రహ్మదేవుడు : వత్సే! సరే అట్లే అగుగాక! నీవు రూపముకలిగి ఉండి, లేనిదానివౌతావు. అతి సూక్ష్మమైన ‘రూపము’ ను అవలంబించి, నీవు - నిషిద్ధమైన, అపక్వమైన, అకాలమైన అతి అయిన “భోజనం” చేయు జనుల శరీరములలో ప్రవేశిస్తూ ఉంటావు.

కుకర్మలను నిర్వర్తించేవారిని, కుప్రదేశవాసులను (People who stay at unhealthy places) సర్వదా హింసిస్తూ ఉండగలవు. వాయు పరమాణువువలె అయి, ఆయా జనుల ‘ముక్కు’ ల ద్వారా శరీరములలో ప్రవేశించి, అపాన మార్గంగా హృదయప్రదేశమును ఆక్రమించగలుగుతావు. ప్రేగులను, ఇతర అవయవములను పీడించుచు, అక్కడి రక్తమాంసములను భక్షిస్తూ ఉంటావు. జనులు “వాతలేఖాత్మక, విసూచికావ్యాధి" అను పేర్లతో నిన్ను పిలుస్తూ ఉంటారు. గుణవంతులు-గుణహీనులు” అను భేదము లేకుండా నీవు ఎందరినో బాధిస్తూ ఉంటావు.

అయితే, గుణవంతులను దృష్టిలో పెట్టుకొని, నీ వలన కలుగు ’విసూచికావ్యాధి’ చికిత్స కొరకు సాధక జనులకు ఒక మంత్రము ప్రసాదిస్తున్నాను.

ఓ సాధకజనులారా! వినండి! హిమాలయ పర్వతములకు ఉత్తరంగా ‘కర్కటి’ అనే ఒక రాక్షసి ఉన్నది. దానికి ‘విసూచి - అన్యాయబాధి’ అనే పేర్లు కూడా ఉన్నాయి. అది వరప్రభావం

ఆసి : లోహమయము; ఆనాయసి : కంటికి కనబడనంత సూక్ష్మము; జీవిసూచిక : రక్తం పీల్చే సూక్ష్మజీవి

ప్రాణవాయువులు శరీరములో కదులుచుండు విధిని అనుసరించి “ప్రాణము-అపానము-వ్యానము-ఉదానముసమానము” అనే పేర్లతో చెప్పబడింది. ఈ విషయమై ఈ గ్రంథంలో ’నిర్వాణప్రకరణం’లో ‘భుశుండోపాఖ్యానం’లో విస్తారంగా చర్చించబడింది.

Page:420

చేత రక్తాన్ని పీల్చే వ్యాధిరూపంతో బయల్వెడలుతోంది. అది కలుగచేయగల బాధకు, రోగమునకు ఇప్పుడు నాచే ఉచ్చరించబడుచున్న మంత్రము ‘ఉపశమనము’ గా పరిణమించుగాక!

" ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయేనమః

ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం !

ఓం హర-హర! నయ-నయ! పచ-పచ! మధ-మధ!

ఉత్సాదయ దూరేకురు స్వాహా !

హిమవంతం గచ్ఛ జీవ సః స ః సః

చంద్రమండల గతోసి స్వాహా ॥ 99

(“ఓం హ్రీం హ్రాం రీం రాం బీజాక్షర రూపమగు “విష్ణుశక్తి” కి ఇదే నా నమస్కారం. ఓ భగవతీ! విష్ణుశక్తీ! నీ ‘అంశ’ యే అయిఉండి, రోగరూపమున ఉన్నట్టి ఈ నీ శక్తిని దయయుంచి హరించు. ఉపసంహరించు. పచనమొనర్చు. మథింపుము. దూరము చేసివేయి. స్వాహా రూపిణివగు ఓ రోగశక్తీ! నీవు నీ స్వస్థానమగు హిమాలయమునకు వెళ్ళిపో.”)

సాధకుడు ఈ ’మహా మంత్రము’ ను తన ఎడమచేతిపై వ్రాసి, ఆ చేతితో రోగి దేహమును తుడుస్తూ, ఏకాగ్రచిత్తంతో…. “ఈ కర్కటి రాక్షసి మంత్రముచే మర్దించబడుచున్నది. రోగి దేహము నుండి వెలువడి, హిమాలయములవైపు పారిపోవుచున్నది” అని మనస్సుతో సంకల్పించాలి. “ఈ రోగి చంద్రమండలము నుండి అమృతరసమును పొందుచున్నాడు. అందుచేత సర్వవ్యాధి వినిర్ముక్తుడు అగుచున్నాడు…” అని భావన చెయ్యాలి. ఈ విధంగా సాధకుడు శుచి అయి, ఆచమనం చేసి, ఏకాగ్రతచిత్తంతో శబ్దమును - - అర్థమును ఒక్కసారే ఆశ్రయిస్తూ నిస్వార్థ ప్రేమభావంతో అనుష్ఠానం చేస్తే, అప్పుడా విసూచికావ్యాధి సమూలంగా ఉపశమించగలదు.

త్రిలోకనాథుడగు బ్రహ్మదేవుడు ఇట్లు పలికి, ఆకాశమార్గంగుండా వెళ్ళసాగారు. ఆకాశంలోని సిద్ధులు అతనికి నమస్కరించారు. ఇంద్రునికి పై మంత్రం ప్రసాదించి తన నిజలోకానికి చేరారు.

  1. కర్కటి సూక్ష్మజీవత్వం

పర్వతమంత నల్లటి శరీరంగల ఆ రాక్షసి క్రమంగా సూక్ష్మత్వం పొందసాగింది. ‘సూది’ అంత అయినది. ఆ తరువాత అణుమాత్రమంత అయింది. నల్లటి యినుపసూదిగాను, ’జీవసూచిక’ గాను అయినది. పంచ మహాభూతములచే, పంచ జ్ఞానేంద్రియములచే, పంచకర్మేంద్రియములచే, అవిద్యచే, కామముచే, కర్మముచే (వీటినే “పుర్యష్టకము” అంటారు) కదలించబడుచు, ఆకాశంలో

సంచరించసాగింది.

Page:421

శ్రీరాముడు : మహర్షీ! ఇప్పుడు ఆ కర్కటి ఒక ‘విసూచి - - వ్యాధి’ రూపమై పరిణమించింది కదా! ఇప్పుడు దాని దేహము-రూపము లోహము వంటివా?

శ్రీ వసిష్ఠ మహర్షి : "సూచి (సూది) రూపత్వము” అని మనం చెప్పుకొంటున్నది. ఆ రాక్షసి తనయందు తనయొక్క కల్పనచే అనుభవముగా గాంచుచున్నది మాత్రమే. అంతేగాని దానియందు ’లోహత్వము’ అనునది లేదు. భ్రమచేతనే అది అట్లు అగుపిస్తోంది.

అది ఒకానొక రక్తపిపాసియగు సూక్ష్మజీవి.

అది మననశీలమగు మనస్సుతో, మిలమిలమెరిసే అతి సూక్ష్మమైన కంటి పాపలతో ఇక సంచరించసాగింది. ఆకాశమువలె నీలంరంగును పొంది, ఇతరులచేత తెలియబడకుండానే తన వ్యాపారము కొనసాగించసాగింది. ఇతరులకు మహాహానికరమై, బాధను ప్రసాదించునదై, అవయవములను క్షీణింపచేయునదై ప్రవర్తించసాగింది.

ఆహాఁ! చూచావా? ఆ రాక్షసి ఈ జగత్తంతా భక్షించాలనే కోరికతో సూది రూపమును దాల్చింది. కాని, స్వల్పమైన రూపంతో దేనిని భక్షించగలదు చెప్పు? అది తనయొక్క మూర్ఖత్వం చేత సూచీరూపం పొందిందేకాని, “ఈ అల్పమగు సూచి (సూది) రూపంతో ఇంతటి తుచ్ఛత్వముతో నేను ఏ రుచి అనుభవించగలను?”….. అని ముందు చూపుతో యోచించనే లేదు. అవును మరి. ముందు - వెనుకలను, గుణ దోషములను విచారించకుండానే “అది నాకు ఇష్టం. కనుక పొంద వలసిందే” అని మూర్ఖంగా అభిలషించేవారు చివరికి లేని పోని దుఃఖములన్నీ తెచ్చిపెట్టుకొంటారు. పాపం, ఆ రాక్షసి…. “నేను విసూచిని అవుతాను”…. అని ప్రయత్నించి ఆయా శరీరములలో ప్రవేశించే హింసాతత్వముగా మారిపోయింది. కాని, "నేను ఎంతో ఆహారం భక్షించి ఆనందిస్తాను” అను రూపము గల దాని సంకల్పము చివరకు నిరర్థకమే అయింది. ‘రుచి’ అను అనుభవం లేకుండా రక్తపానం మాత్రం చేయసాగింది.

మూఢబుద్ధితో ఇతరులను బాధించవలెనని చింతించే వారికి ‘పూర్వ పర’ విచారణ లోపిస్తూ ఉంటుంది. వారు స్వార్థంతో అభిలషించిన వస్తువుపై మాత్రమే దృష్టిఅంతా కేంద్రీకరిస్తారు కనుక, వారియొక్క ఉత్తమమైన బుద్ధి కలుషితమైపోతుంది. చివరకు అనుకున్నది లభించదు.

ఆ రాక్షసి తన స్థూల దేహమును పోగొట్టుకొని, “సూచిత్వము” గ్రహించి, కొద్దికాలం తరువాత, "అయ్యో! ఈ అతిసూక్ష్మమగు ‘సూచి’ రూపంతో నేనేమీ చేయలేకపోతున్నానే? ఇంతకన్నా ఆకలితో అలమటించినప్పటి స్థూల శరీర స్థితియే బాగున్నదే !” అని వాపోవటం ప్రారంభించింది. ఆహా! ఒకే వస్తువు (లేక) విషయముపై అనురాగము కలిగియున్న జీవునిగతి అధోగతి కాగల ప్రమాద మున్నది. ఇతరజీవుల రక్తమాంసములపై గల ప్రీతిచే ఆ కర్కటి, తన ఇతఃపూర్వపు స్థూల శరీరమును కూడా తృణమువలె వర్ణించివేసింది.

Page:422

ఓ రామచంద్రా! ఈ జీవుని చూచావా? ఇతడు ఆయా వస్తువులపై, విషయములపై, నామ రూపములపై పెంచుకొంటున్న “అతిప్రీతి అభిమానము”ల కారణంగా జ్ఞాన సముపార్జనకు అర్హత - - సామర్థ్యములను పోగొట్టుకొంటున్నాడయ్యా!

ఆ విధంగా మరికొంతకాలం గడిచిపోయింది. ఆ కర్కటి మూఢబుద్ధిని ఆశ్రయించుటచేత “నేను స్థూల దేహమును కోల్పోయాను”…. అనే విషయమే యోచించుట మానివేసింది. ‘వ్యాధియే స్వరూపముగా గల విసూచి’ అయి ఇతర దేహములందు ప్రవేశించటం ప్రారంభించింది. “మూర్ఖునకు తన వినాశనము కూడా ప్రీతినే కొలుపుతుంది“ అని అందుకే అంటూఉంటారు కాబోలు. అది ప్రాణులందు కంటికి కనబడనంత సూక్ష్మ రూపమున చుట్టలుచుట్టుకొని యున్న ‘దారము’ వలె ఆకారం కలిగియుండేది. పాపయుక్తము, క్రూరము అయిన మనోవృత్తి కలిగియుండి ప్రాణుల దేహములలో ప్రవేశిస్తూ, అక్కడ తారసపడుచున్న రక్తమాంసములను పీల్చసాగింది. అది ఏదైనా ప్రాణిని ఆశ్రయించిందా…. ఇక ఆ ప్రాణియొక్క రక్తమంతా హరించిపోవలసిందే. అది ఆ సమయంలో ”లోహదేహము - సూక్ష్మదేహము” అను రెండు దేహములు కలిగిఉండి, విచ్చల విడిగా, అన్ని వైపుల…. ఆ రెండు దేహములతో కూడి తిరుగసాగింది.

శ్రీరాముడు : హే మహర్షీ! ఆ కర్కటి ఉగ్రమైన తపస్సుచేసి భగవానుడగు బ్రహ్మదేవునే ప్రత్యక్షం చేసుకొన్నదికదా! అయినప్పటికీ, అది తన తుచ్ఛమైన ‘విసూచికత్వము’ ను (The form of a disease) ఎందుకు కోరుకొన్నది? “తపస్సుచే బుద్ధి పవిత్రత పొందుతుంది" అని అంటారు కదా! మరి ఆ కర్కటి విషయంలో అట్లు జరుగలేదేం? పైగా, బ్రహ్మదేవుడు, “నీవు పొందగోరునది అతితుచ్ఛమైనది” అని చెప్పిఉండవచ్చును కదా! ఎందుకు చెప్పలేదు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సృష్టిలో కనబడుచున్న సర్వజీవులు తమయొక్క సంకల్పవశంచేతనే స్థూలంగానో, సూక్ష్మంగానో అగుచున్నారు. ఆ కర్కటికూడా స్వకీయ అభిలాషతో కూడిన సంకల్పము కారణంగానే గొప్ప స్థూలశరీరము వదలి ‘సూచిత్వము’ (సూదిభావము) కోరుకొన్నది. క్షుద్రబుద్ధి కలిగి ఉన్నప్పుడు ఈ జీవుడు నీచవస్తువులనే అభిలషిస్తూ ఉంటాడు. ఆ రాక్షసి గొప్పతపస్సుచేసి సూచియై పిశాచత్వమును అనుభవిస్తోంది. “తపస్సు” అనునది కోరుకొనుదానిని సముపార్జించుటకు మార్గము అయిఉన్నది. ఈ జీవుడు తాను కోరుకొనునది తన జ్ఞాన-అజ్ఞానములను అనుసరించే ఉంటుంది. మరొక విషయం. తపస్సుచే పవిత్రమైనప్పుడు కూడా గుణ-కర్మ విభాగములను అనుసరించి ఆయా జీవులకు కొన్నికొన్ని వాసనలు, ఆ వాసనలను అనుసరించి లౌకికయత్నములు ఉంటూనే ఉండవచ్చు.

కర్కటి ఆ విధంగా తన తపస్సుచే ఇతరులను బాధించుటకొరకే సూచీత్వము కోరుకొన్నది. అట్లే అభ్యర్థించింది. అట్లే పొందింది. భగవంతుడు నిష్క్రియుడు సర్వసాక్షి. అకలంకుడు. జీవుడు సంస్కారము, లక్ష్యములను అనుసరించి సాధనను, సాధనను అనుసరించి ప్రయోజనములను;

Page:423

ప్రయోజనములను అనుసరించి ఆయా స్థితిగతులను పొందుచున్నాడు. ఎవడు దేనికొరకు విధి - విధాన పూర్వకంగా ప్రయత్నించటం, కర్మలను నిర్వర్తించటం జరుగుతుందో అద్దాని దిశలోనే బుద్ధి, ప్రయోజనములు మొదలైనవన్నీ ఉంటున్నాయి. అందుచేత మానవుడు ఉత్తమ ఆశయములను మాత్రమే కలిగి ఉండాలి.

మహాశయుడు కావాలి.

  1. పశ్చాత్తాపం

ఆ విసూచి స్వస్థుల దేహములలో ప్రవేశిస్తూ ఉండేది. ప్రాణవాయువులతో కలసియుండి, దేహము లందు మరింతగా వ్యాధిని కలిగిస్తూ ఉండేది. ‘రక్తము పీల్చుట’ అను హింసాక్రియ ద్వారా బుద్ధిమాంద్యము గాని, రోగము గాని లేనివారిని కూడా క్షణములలో ఆక్రమించివేసేది. ఒక్కచోట ఒక శరీరములో ప్రవేశించి రక్తమాంసములను పీల్చుచు తృప్తిగా ఉండేది. ఆ శరీరం ప్రాణరహితమైన తరువాత మరొక శరీరంలో ప్రవేశించేది. మరొకచోట మణి (మరకతము మొదలైన ఆయా రాళ్ళు, మణులు) - మంత్రము - ఔషధములచే నిరోధించబడుచూ ఉండేది. ఈ విధంగా స్థూల-సూక్ష్మము లైన రెండురూపములతో ఆకాశమునందు, భూమియందు సంచరిస్తూ అనేక సంవత్సరములు గడపివేసింది. అది ఎల్లప్పుడూ ధూళియందు, మురికివస్త్రములందు, దోషముతో కూడిన నాడులందు, శిథిలమైన తృణములందు, ఎముకలందు, పక్షులు విశ్రమించేచోట, వికృతమైన ఆవేశాదులు కలిగియున్నవారి యందు, సురాపానమువంటి మత్తు కలిగించు దురాభ్యాసములు ఉన్నచోట, యాత్రికులు ఉండే ప్రదేశంలో, బురదతో కూడిన మడుగులలో, మురికి కాలువలలో సంచరిస్తూ ఉండేది. ఇట్లా అది ఒకచోటి నుండి మరొకచోటికి అవిశ్రాంతంగా పయనిస్తూ, జీవులను దుఃఖింప చేస్తూ కొంతకాలానికి ఎంతగానో అలసిపోయింది. దాని బారినపడిన ఎందరో ప్రాణుల శరీరాలు నేలకూలాయి. ఇతరులను బాధించకలిగినపుడు ఆనందమును, నిరోధించబడినప్పుడు దుఃఖమును పొందుతూ వచ్చేది. క్రూరత్వం, బాధించటం - ఈ రెండూ దాని స్వరూప, స్వభావాలు

అయినాయి.

ఈ విధంగా అది అంతఃకరణముచే ప్రేరేపించబడుచున్నదై, తన లోహసూచిక (స్థూలము), జీవసూచిక (సూక్ష్మము) రూపముతో దిక్కులన్నీ తిరుగుతూ చాలాకాలం గడిపింది.

అనేక సంవత్సరాల తరువాత అది ఒకప్పుడు తన దేహమును చూచుకొని పశ్చాత్తాపం పొందసాగింది. పాపం! ఆ కర్కటి కూడా ఆనందమే పొందాలని అనుకొన్నది కదా! కాని ఆకలికి ‘దాసోహం’ అయి, అట్టి దుస్థితి తెచ్చుకొన్నది. దాని హృదయంలో కూడా ఇతర జీవుల పట్ల కరుణ - ప్రేమలు ఎక్కడో కొంతైనా లేకపోలేదు. అయితే, అది కాస్త మౌనం వహించి ‘ప్రశాంతత’ ను ఆశ్రయిస్తూ ఉండగా ఇంతలోనే, రాక్షస స్వభావం ప్రవృత్తమౌతూ ఉండేది. వస్త్రములందు

Page:424

ప్రవేశించి, “ఈ జీవుని బాధించటం ఎట్లా?" అని మరల యోచిస్తూ ఉండేది. ఒకప్పుడు ఉన్ని వస్త్రములలోను, మరొకప్పుడు పిల్లల చేతివ్రేళ్ళ-కాలివ్రేళ్ళ సందులందు ఉంటూ ఎంతో గర్వంపొందేది. కొయ్య-మట్టిగోడ కూడా దానికి నివాసయోగ్యమైన స్థానములే. మధ్య మధ్యలో ఏదో చెప్పరాని నిస్తేజమును, పశ్చాత్తాపమును, అనిర్వచనీయమైన దిగులును పొందుతూ ఉండేది.

ఈ విధంగా ఆ కర్కటి అనేకమంది మనుష్యుల రక్తమాంసములను పీల్చుచు, ఆకలి తీర్చుకొంటున్నప్పటికీ, దానియందు ‘తృష్ణ’ ఏమాత్రం చల్లారలేదు.

ఒకరోజు అది తన అంతరంగంలో ఎట్లు యోచించసాగిందో రేపు విచారిద్దాం.

(ఆరవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:425

ఏడవ రోజు

  1. పునః తపస్సు

శ్రీవసిష్ఠ మహర్షి : ఆ కర్కటి ఇట్లు యోచించసాగింది.

అయ్యో! ఈ సూచీత్వమును నేను ఎందుకు గ్రహించినట్లు? ఇంత సూక్ష్మమైన, శక్తిహీనమైన రూపంతో ఒక కబళం కూడా తినలేను కదా! ఇతఃపూర్వపు నా సువిశాలమైన అవయవములన్నీ ఏమైనాయి? అప్పట్లో రుచికరమైన మాంసపు ముద్దలను సమృద్ధిగా భుజించేదానిని. ఇక ఇప్పుడో…. ఇతరుల పాదములందు గ్రుచ్చుకొనుచు, నేలపై దొర్లుచు, రక్తమాంసములలో ఇంకిపోతూ ఇట్లు నికృష్టస్థితులు పొందుచున్నాను. మరలమరల మలినమగుచున్నాను. ఏమి నా బ్రతుకు? అనాథనైన నాకు బంధువులుగాని, మిత్రులుగాని లేరు. ఆశ్రయమంటూ ఏదీ లేదు. ఎంత దయనీయమైన విషయం! ఎంతటి దుఃఖసంకటం! సఖిగాని, దాసిగాని, తల్లిగాని, తండ్రిగాని, బంధువులుగాని, సేవకులుగాని, సోదరులుగాని, పుత్రులుగాని లేనట్టి ఈ బ్రతుకు ఎందుకు? ఊరికే గాలివాటుగా అటూఇటూ తిరగటానికేనా?

అస్సలు, విషాదమైన విషయం ఏమిటంటే,…. నేను తపస్సు చేసి మరీ ఈ “విసూచిస్థితి” అనే విపత్తు మరియు సంకటమును తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు చావాలన్నా, చావురాదు కదా! మూఢబుద్ధితో చక్కటి శరీరమును పోగొట్టుకున్నాను.

ఎక్కడ ‘అజ్ఞానం’ ప్రవేశిస్తుందో అక్కడ ముందుగా ‘దుర్బుద్ధి’ వచ్చి చోటు చేసుకొంటుంది కాబోలు. అట్టి దుర్బుద్ధితో కూడిన చిత్తమే అనేక అనర్థములకు దారి తీస్తుంది.

పొగలోను, తృణములలోను పడత్రోయబడుచున్న ఈ నా దుఃఖములకు అంతు ఎక్కడున్నది? ఇతరుల (అనగా మంత్రద్రష్టల) ఆజ్ఞలకు లోబడి వారి ఆజ్ఞలచే నియమించబడుచు, విరమించబడుచు, వారి ఆధీనంలో ఉంటున్నాను. మంత్ర - తంత్ర - - ఔషధములచే నిరోధించబడుచు, అంతులేకుండా బాధలను పొందుచున్నాను. ఛీ! తుచ్ఛమైన రక్తం త్రాగాలని నేను ఎందుకు కోరుకొన్నట్లు? నాకు నాలుక ఉన్నదా? రుచి తెలుసా? లేదు. కాని, నా కారణంగా ఇతర జీవులు మాత్రం హింసించ బడుచున్నారు. “ఒక దయ్యం వదిలితే, మరొకదయ్యం పట్టుకొన్నది”…. అను ‘నానుడి’ నాపట్ల అక్షరాలా నిజం అయింది. ’వినాశకాలే విపరీత బుద్ధిః” అన్నట్లుగా నాపని తయారైనది. ఇక, ఒక క్రిమికీటకము వంటి శరీరముగల నన్ను ఉద్ధరించగల వారెవ్వరు? పోనీ, శాంతి సముపార్జనకై జ్ఞానముకొరకు మహాత్ముల నెవరినైనా ఆశ్రయిద్దామా? దుష్టజీవినైన నన్ను వాళ్ళు దగ్గరకు రానిస్తారా? ఈనా అజ్ఞానస్థితి తొలగేదెట్లా? ఈ విపత్తు తొలగటానికి ఏదైనా త్రోవ ఉన్నదా? ఇంకా ఎంతకాలం ఈ దుస్థితులలో దొర్లవలసి ఉన్నదో కదా!

Page:426

ఇప్పటికిప్పుడు నేను నా పూర్వపు విశాలదేహమును పొందగలిగితే ఎంత బాగుంటుంది. ఆహాఁ! భీకరమైన ఆకృతిని ధరించి ఈ కొండపై ఒక కాలు, ఆ కొండపై రెండవ కాలు ఎప్పటికి ఉంచగలుగుతానో? మానవ కంకాళములను దండగా అలంకరించుకొని, కొండగుహలు దద్దరిల్లేటట్లు నవ్వుతూ హిమాలయ పర్వత ప్రాంతములలో ఎప్పటికి హుందాగా సంచరిస్తానో? ఒక చేత్తో మద్యపు కుండను, మరొకచేత్తో శవమును పట్టుకొని శిఖరాగ్రంపై కూర్చుని ఎప్పటికి తింటూ, త్రాగుతానో? దృఢమైన ఆ నల్లని విశాల శరీరమెక్కడ? అతి సూక్ష్మమైన ఈ ‘విసూచి’ ఉపాధి ఎక్కడ? ఓ నా పొడవైన చేతులారా? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నా ఈ దుస్థితికి కారణం నేనేకదా! మిమ్ములను పోగొట్టుకొన్నది నేనే!”

ఈ విధంగా ఆలోచించిన ఆ కర్కటి కొంతసేపు ‘ఏకాగ్రచిత్త’ అయింది. మౌనం వహించింది. ఇంతలోనే అద్దాని మనోపథంలో పూర్వసంస్కారములు ప్రేరేపణచేత “తపస్సు” అనే విషయం తళుక్కున మెరిసింది. “ఔను. ఇప్పుడు నేను తపస్సు చేయటమే ఉచితం. అదియే నా ఈ ప్రవృత్తికి తగిఉన్నది” అని యోచించింది. తన సూచీరూపమును ప్రాణవాయురూపమగు ప్రాణములందు, ప్రాణములను ‘జీవసూచిక’ యందు, జీవసూచికను ‘లోహసూచిక’ యందు ప్రవేశింపజేసింది. హిమవత్పర్వతములపై జేరి తపస్సు చేయటం ప్రారంభించింది. అప్పుడు ఇంద్రుడు చేస్తున్న విఘ్నములను కూడా లెక్కచేయకుండా, స్వస్థానమునుండి కదలకుండా, అనేక సంవత్సరములు తపస్సులో గడపివైచింది.

‘శ్రద్ధ’తో కూడిన తపస్సు ఊరికేపోతుందా! ఆ రాక్షసి బాహ్యచేష్టలను త్యజించివేసి ఏకాగ్రతతో తపస్సు చేయటంచేత, ’సత్స్వరూపమగు ఆత్మభావన’తో అనుసంధానం ఏర్పడింది. స్వయముగా ఆత్మయొక్క స్వరూప స్వభావములను విచారించుటచే, ప్రబోధం పొందింది. ఆత్మసాక్షాత్కార అనుభవం లభించింది. భూతభవిష్యత్తులందలి ఆత్మయొక్క సమస్థితిని ఎరిగినదై పవిత్రత పొందింది. తపస్సుచే పాపమంతా నశించిపోగా, తెలుసుకొనవలసిన ఆత్మను చక్కగా తెలుసుకొన్నది.

ఆ విధంగా సర్వలోకములను తపింపజేయుచు ఏడువేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సు కలుగజేస్తున్న తాపమును గమనించిన ఇంద్రుడు కూడా వ్యాకులత పొందాడు. అతడు నారదమహర్షిని సమీపించి, “మహర్షీ! ఇది ఏమి?“ అని అడిగాడు. అప్పుడు నారదమహర్షి ”ఓ ఇంద్ర దేవా! మహాతపస్వినియగు కర్కటీదేవి అనేక సంవత్సరాలు తపస్సు చేసింది కదా! ఇప్పుడు విజ్ఞానమయ శరీరం పొందింది. అందుచేతనే దాని తపోతేజస్సుచే జగత్తంతా ప్రదీప్తం అవుతోంది. ఆ ఉగ్రతపస్సుచే ప్రకృతి కూడా ఎంతగా శుష్కించుచున్నదో చూచారా?" అని పలికారు. ఇంద్రుడు: ఓ నారదమహర్షీ! ఆ కర్కటి యొక్క అప్రియమైన వృత్తాంతమంతా విన్నాను. అది ఇతః పూర్వం తన తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించి పిశాచంలాగా అదృశ్యమగు జీవసూచిత్వమును పొందింది కదా! జడబుద్దితో అది ఏమైనా భోగములను పొందకలిగిందా? అది ఎక్కడేమి చేసింది?

Page:427

శ్రీ నారదుడు : అది నల్లటి లోహసూచిక అయి ‘కత్తి’ లేక ‘ముల్లు’ చివరిభాగం ఆశ్రయంగా కలిగిఉండేది. చంచలత్వంతో, పైశాచిక భావంతో…. ప్రాణవాయు మార్గంగా జీవుల శరీరములో ప్రవేశించేది. అచట ప్రవాహరూపమున సంచరిస్తూ ’శూలబాధ’ కలిగించేది. మేధస్సు, ప్రేగులు, మొదలైనవి దానికి విశ్రాంతి స్థానం. ఆయా జీవుల భోజనమును, మాంసవిశేషములను తాను అనుభవించేది. జీవుల శరీరాంతర్భాగమును హింసించుచు అపవిత్రరసములను పొందేది. అది ఎందరు జీవుల శరీరములను పీల్చివేసిందో లెక్కే లేదు. అయితే మాత్రం ఏమున్నది? విషయ భోగముల అనుభవము యొక్క ఆనందం పొందలేకపోయింది. అశక్తతతో దుఃఖముపాలు అయినది. అనేకసార్లు “మంత్రము-ఔషధము-తపస్సు”లచే దండింపబడి, హిమాలయములవైపు పరుగులు తీసింది కూడా. ఎంత ఆహారం పొందినా దానికి ‘తృప్తి’ అంటూ ఉండేది కాదు. శరీరములేని వానికి అనుభవమే ఉండదుకదా మరి! అందుచేత “నేను నా ఇతఃపూర్వపు దీర్ఘదేహమును పొందెదను గాక!” అని ఇచ్ఛపొందింది. ఒక పక్షి శరీరంలో ప్రవేశించి, దానిని ప్రేరేపించుటద్వారా హిమాలయం చేరింది. ఆ పక్షి ముక్కులోంచి బయటికి వచ్చింది. ఒకచోట ఆసీనురాలై దీర్ఘతపస్సు ప్రారంభించింది. అప్పటినుండి ఇప్పటిదాకా తపస్సు చేస్తూనే ఉన్నది. చాలా సంవత్సరములు గడచిపోయాయి. ఆ కర్కటికి ఏదైనా వరం ఇచ్చి సంతోషింపచేసి తపస్సు నుండి విరమింపజేయటమే ఇప్పుడు ఉచితం.

నారదుడు చెప్పినదంతా విన్న ఇంద్రదేవుడు వాయుదేవునితో "ఓ వాయుదేవా! మీరు నలుదిక్కుల ప్రసరించి ఆ కర్కటి ఏ ప్రదేశమున ఉన్నదో గమనించండి. అది ఎట్లు ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియజేయండి. ఆ వర్తమానమును అనుసరించి తరువాత చేయవలసినది నిర్ణయించుకొందాము” అని ఆజ్ఞాపించాడు.

అప్పుడు వాయుదేవుడు భూతలముపై ‘దివ్యజ్ఞానాంశము’ వలె చరించుచు, జంబూద్వీపం పైగల హిమాలయ పర్వతంపై ఒకచోట కర్కటిని చూచాడు. అది అత్యంత సూక్ష్మమై, శిథిలమై ఉండి ఏకాగ్రతతో తపస్సు చేసుకొంటోంది. వాయుదేవుడు ఆ కర్కటిని సమీపించాలని ప్రయత్నించి కూడా విఫలుడైయ్యాడు. "ఓరాక్షసీ! నీవు ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు?” అని ఎలుగెత్తి బిగ్గరగా పలికాడు. కాని ఏం లాభం? ఆ శబ్దం ఆ రాక్షసి చెవులను సమీపించనే లేదు. అప్పుడాతడు ఇంద్రని వద్దకు తిరిగివెళ్ళి ఇట్లు పలికాడు.

వాయుదేవుడు : ఓ ఇంద్రదేవా! మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ ‘విసూచి’ కొరకు వెతకి అది ఉన్నట్టి స్థానం గుర్తించాను. అది ఎందుకొరకో, ఏమో…. ఉగ్రతపస్సు చేస్తోంది. ఆ తపోసమయంలో వాయువును కూడా భక్షించుటలేదు. అది తన శరీరమును లోహమయం ఒనర్చుకొన్నది. మనమెవ్వరం కూడా దానిని వరములచే తృప్తిపరచలేం. మనం పితామహుడగు బ్రహ్మదేవుని, ఈ విషయంలో, ఆశ్రయించటం మంచిది. దాని తపఃప్రభావం చేత ఆ హిమవత్పర్వతం తన సహజలక్షణమై యున్న శీతలత్వమును వదలి ఉష్ణత్వము సంతరించుకొంటోంది. అందుచేత అట్టి తీవ్రమైన తపస్సు లోకమునకు హానికరమే అయిఉన్నది.

Page:428

అప్పుడు ఇంద్రాదిలోకపాలకులు బ్రహ్మదేవుని సమీపించి విషయం నివేదించారు. పితామహుడు అంతా విని వారికి అభయం ఇచ్చి, వారిని పంపివేశారు.

  1. స్థూలదేహప్రాప్తి

ఆ కర్కటి తన యొక్క తీవ్రమైన తపస్సు యొక్క ప్రభావం చేత పవిత్రమైన బుద్ధిని పొందింది. ఆత్మవిషయమై విచారించసాగింది. అనేక యుక్తులతో బ్రహ్మమును సుస్పష్టంగా తెలుసుకొన్నది. “ఆహాఁ! ’నేను ఆత్మనే” అను భావనయే సర్వస్వము. ఆత్మజ్ఞానమే గురువు. దైవము. మమాత్మయందే ఈ సర్వము కూడా!” అని గ్రహించసాగినది. జ్ఞానదృష్టిచే ప్రశాంతముగా అనేక సంవత్సరములు మౌనం వహించియున్నది. ఒకరోజు బ్రహ్మదేవుడు ఆ కర్కటికి ప్రత్యక్షమైనాడు. కర్కటి యొక్క మనోదర్పణంలో ప్రతిబింబించి సంబోధించసాగాడు.

శ్రీబ్రహ్మదేవుడు : ఓ పుత్రీ! దీక్షాపూర్వకమైన నీ తపస్సుకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో. జీవము మాత్రమే కలిగియుండి, కర్మేంద్రియములు లేనట్టి ఆ విసూచి బ్రహ్మదేవుని మధురవచనములు విన్నది. కాని, ఎట్టి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. తనలో తాను ఇట్లు అనుకొన్నది.

"నా సంశయాలన్నీ నశించాయి. పూర్ణత్వం పొందాను. ఇక వరములతో నాకేమిపని? ఇప్పుడు నేను శాంతమును, తృప్తిని సుఖమును పొందుచున్నానుకదా! తెలుసుకోవలసినదంతా తెలుసుకొన్నాను. వివేకము లభించిన తరువాత ఇక పొందవలసినది ఏమి ఉంటుంది? ఇప్పుడు ఎట్లు ఉన్నానో, అట్లే ఉంటానుగాక! నేనే సత్యస్వరూపిణినై యుండగా, ఇక నాకు మిథ్యయగు వస్తువులను ఆశించవలసిన పని ఏమి ఉన్నది? ఆహాఁ! ఇంతకాలం అవివేకంతో ఎక్కెడెక్కడో సంచరిస్తూ అనేక దుఃఖములను పొందాను. ఇప్పటికి ఆత్మవిచారణ మాత్రంచేత నా అవివేకమంతా నశించింది. నాకు ఇష్టములేమిటి? అయిష్టములేమిటి?…..!”

అని అనుకొంటూ బదులు చెప్పకుండా మౌనం వహించియున్నది. నియతియుక్తుడైన బ్రహ్మదేవుడు ఇది చూచి చాలా సంతోషించారు. రాగరహిత అయిన ఆ కర్కటితో ఇట్లు పలికాడు. శ్రీ బ్రహ్మదేవుడు : ఓ పుత్రీ! ఆత్మజ్ఞానము పొందుటచే పరమపవిత్రురాలవయ్యావు. నీ తపస్సుకు ప్రయోజనంగా వరం స్వీకరించు. మరి “నియతి” గౌరవించబడాలికదా! ఈ భూమండలమునందే ఉంటూ మరికొంతకాలం భోగములను అనుభవించు. ఆ తరువాత ఉత్తమోత్తమమగు బ్రహ్మపదమును పొందెదవుగాక! ఇది ఈశ్వరనియతి. దీనిని మేము కూడా మార్చలేము సుమా!

ఈ తపస్సు యొక్క ప్రయోజనంగా నీ సంకల్పము ఈడేరుగాక! మరల నీ ఇతఃపూర్వపు విశాల శరీరం పొందుతావు. రాక్షసివై హిమాలయములపై సంచరిస్తావు. ఒక బీజంలో సూక్ష్మ రూపమున అంకురం (మొలకెత్తు స్వభావం) దాగి ఉంటుంది కదా! అదే విధంగా "నేను పూర్వ దేహమును పొందాలి” అనే కోరిక నీయందు అంతర్భూతమై ఉన్నది. అయితే ఏం? చిత్తశుద్ధిచే

Page:429

స్వస్వరూపమగు పరబ్రహ్మమును తెలసుకొన్నావు కదా! అందుచేత, నీవు నీ పూర్వదేహము పొంది నప్పటికీ, ఇంతకుముందువలె లోకములను బాధించవు. విశాలమైన రాక్షసి ఉపాధి పొందినప్పటికీ, నీవు ఎల్లప్పుడు నిర్వికల్పసమాధియందే ఉండి ఉంటావు. ఎప్పుడైనా ఆ సమాధినుండి లేచినప్పుడు, ఆ సమయంలో సర్వులను ఆత్మస్వరూపులుగానే చూస్తూ ఉంటావు. వ్యావహారిక దృష్టికి మాత్రం “ధారణ-ధ్యానము” లను అవలంబిస్తూ ఉంటావు. వాయువుకు స్పందము ఎట్లా స్వభావసిద్ధమో, అట్లాగే నీవు కూడా నిర్వికారంగా ఉంటూనే ఈ చేష్టాయుక్తమైన శరీరం బాహ్యానికి కలిగిఉంటావు. జ్ఞానముచే మనోపవిత్రత ఆర్జించిన నీవు రాక్షసస్వభావులు నిర్వర్తించే ఆశాస్త్రీయ హింసకు స్వభావసిద్ధంగానే దూరంగా ఉంటావు. న్యాయమును పరిపాలిస్తూనే, ప్రకృతి సిద్ధమైన ఆకలిని తీర్చుకొనుటకు మాత్రమే కొన్ని ప్రాణులను భక్షిస్తావు. నీయందు అకృత్రిమమైన న్యాయవృత్తి వచ్చి చేరుటచే, న్యాయమును అతిక్రమించువారలను మాత్రమే బాధిస్తావు. జీవన్ముక్తవై వివేకము కలిగియుండి, ఈ భూమిపై సంచరిస్తావు. నీకు శుభమగుగాక!

ఇట్లు పలికి భగవంతుడగు బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు. అప్పుడా రాక్షసి, “పితామహుడు బ్రహ్మదేవుని అభిప్రాయం అనుసరించి, అట్లే అగుగాక! ఒకానొక ఉపాధి ప్రాప్తించినంత మాత్రంచేత ఆత్మజ్ఞానమునకు లోటు ఉండవలసిన పని ఏమున్నది?" అని తలచి, తన పూర్వశరీరము గురించి చింతించసాగింది. అట్టి సంకల్పబీజంచే క్రమంగా పూర్వపు దేహం యథాతథంగా పొందింది.

ఆ విధంగా స్థూలత్వము పొందినదై హిమాలయ పర్వతములపై సంచరించసాగింది. చిత్స్వరూపమునకు సంబంధించిన జ్ఞానము తనయందు ఉదయించియుండుటచేత ఆ సంచారం కూడా ఆ రాక్షసికి ఆనందమే ఇచ్చింది. ఆ కర్కటి యందు ఇప్పుడు రాక్షసస్వభావం లేదు. ప్రాపంచిక దుఃఖ సమ్మిళితములైన వాసనలు లేవు.

  1. వాయుదేవుని ఉద్బోధ

ఆ కర్కటి ఆయా ప్రదేశాలలో సంచరిస్తూ ఒకసారి ఒకచోట పద్మాసనం వైచుకొని, శుద్ధ జ్ఞానమును ఆశ్రయించి ఆత్మధ్యానపరాయిణ అయి స్థిరంగా పర్వతంవలె ఉండిపోయింది. అట్లు ఆరునెలలు గడచిపోయాయి. ఒకరోజు సమాధినుండి లేచింది. మరల బాహ్యవృత్తులు పొందింది. మరుక్షణం ఆ రాక్షసికి ఎంతో ‘ఆకలి’ అనిపించింది. శరీరము ఉన్నంతవరకు, ఆ శరీరము యొక్క స్వభావం ఉండనే ఉంటుంది కదా!

"ఆహా నాకిప్పుడు ఎంతో ఆకలి వేస్తోందే? ఏమైనాసరే! నేను న్యాయమును మాత్రం అతిక్రమించను. పూజ్యులగు మహానుభావులను బాధించటం, వారిచే దూషించబడటం, అన్యాయంగా సంపాదించి భుజించటం…. ఇట్టి క్రియల కంటే చావటం మంచిది. ఒకవేళ న్యాయంగా సంపాదించ

Page:430

బడిన ఆహారం దొరకకపోవటం జరిగితే, అట్టి పరిస్థితులలో ఈ శరీరం నశించినా కూడా మంచిదే. అన్యాయార్జితమైన ఆహారం విషతుల్యమే. లోకసమ్మతము కాకుండునట్టి భోజనం సంపాదించి జీవిస్తే మాత్రం ఏంప్రయోజనం? పైగా, ఆత్మయే స్వరూపముగా కలిగియున్నట్టి నాకు జీవించితే ఏం ఉన్నది? మరణిస్తే మాత్రం ఏం? ఈ శరీరాదుల రాకపోకలచే సత్స్వరూపుడనగు నాకు లభించునది గాని, నేను కోల్పోవునది గాని ఏమీ ఉండదు. ఈ ‘దేహం’ అనబడే వ్యవహారమంతా సంకల్ప మాత్రమే కదా! దేహాభిమానం (‘నేను దేహమును’ అనునట్టి అల్పజ్ఞత) ఉన్నంతవరకు ఆత్మజ్ఞానం లోపిస్తూనే ఉంటుంది. కనుక ఈ జీవన్మరణముల వైపు దృష్టి సారించను.”

ఇట్లు తలచుచు, మౌనం వహించి ఉన్నది. సర్వప్రసరణశీలుడైయున్న వాయుదేవుడు ఆ కర్కటిని, ఆమె ఆలోచనల తీరును గమనించాడు. రాక్షస స్వభావం త్యజించినందుకు సంతోషం పొందాడు. ఆకాశమునందు ఉంటూనే ఇట్లు పలికాడు.

వాయుదేవుడు : బిడ్డా! కర్కటీ! నీ వితరణశీలము చాలా ఉత్తమంగా ఉన్నది. ఉత్తమ జ్ఞానివయ్యావు. అయితే, నీయొక్క శరీరధారణ, తదితర సంసారిక క్రియలు శుభప్రదమే అవుతాయి. ఆత్మ జ్ఞానులు తమయొక్క ఆయా మాటలచే, చర్యలచే ఈ భూమిని పవిత్రం చేస్తూ ఉంటారు. నిన్ను జ్ఞానము కొరకు ఆశ్రయించేవారికి జ్ఞానోపదేశం చెయ్యవచ్చును కదా! మూఢులకు అజ్ఞానం తొలగించుటయే మహాత్ముల స్వభావమైయున్నది. ఇంద్రియవిషయముల పట్ల మాత్రమే ధ్యాసగల అల్పజీవులు తారసపడినప్పుడు, అట్టివారు నీకు ఆహారమవటానికే ఉత్పన్నమైనారని భావించవచ్చు. అట్టివారిని నీవు న్యాయముగా లభించిన ఆహారంగా తలచవచ్చు. అట్టివారిని భుజించుటచే దోషము ఉండదని నా అభిప్రాయం.

కర్కటి : తండ్రీ! వాయుదేవా! మీరు నాకు ఉత్తమమైన విషయమునే గుర్తుచేశారు. నన్ను అనుగ్రహించి ఉద్ధరించినవారయ్యారు. మీరు చెప్పినట్లే ఈ ఆత్మజ్ఞానమును అజ్ఞానులకు వినిపిస్తాను. అట్లు వినుటకు తగినట్టి సంస్కారం లేనివారిని మాత్రమే భక్షిస్తాను. తద్వారా ప్రకృతి సిద్ధమైన ఈ నా ఆకలిని తీర్చుకొంటాను. ఇట్టి ఆలోచనను ప్రసాదించినట్టి సద్గురుతుల్యులగు మీ పాదములకు నమస్కరిస్తున్నాను.

  1. అరణ్య ప్రవేశం - కిరాతరాజుతో సమావేశం

ఇట్లు పలికి ఆ కర్కటి అక్కడి నుండి లేచింది. వనభూములు, పర్వత ప్రదేశములు దాటి, ఒక కిరాతరాజ్యం ప్రవేశించింది.

అప్పుడు అర్ధరాత్రి సమయం. అంతా చీకటి తాండవిస్తోంది. ఆకాశంలో దట్టంగా మేఘాలు క్రమ్ముకొని ఉండటంచేత, నేలపై కాటుకవంటి చిమ్మచీకటి వ్యాపించి ఉన్నది. అల్లంత దూరంలో ఆ కిరాతరాజ్యంలో గల ఇండ్లలో దీపాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ చీకట్లో

Page:431

పిశాచాలు తాండవిస్తున్నాయి. ఆ చుట్టుప్రక్కల దూరంగా కనిపిస్తున్న అనేక గ్రామాలలో ఆయా జీవరాశులు నిద్రాసుఖం అనుభవిస్తున్నాయి. కప్పల బెకబెకలు, కీచురాళ్ళ రణగొణలు, వాయు వీచికలకు చెట్లు కదులుచున్న శబ్దాలు వినబడుచున్నాయి.

ఆ కిరాతరాజ్యాన్ని “విక్రముడు” అనే రాజు పాలిస్తున్నాడు. అతడు మహాధీశాలి, వీరుడు కూడా. ఆరోజు అతడు తనమంత్రితో కూడుకొని ఆయుధములు ధరించి, రాజ్యమునకు సమీపంలో ఉన్న ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రజలను బాధించే మృగములను, బేతాళాది దుష్టజీవులను నిరోధించి ప్రజలకు ప్రశాంతత కలిగించటానికి వారు ఆ అడవిలో ప్రవేశించారు. తమ ప్రజలను ఆయా దుష్టవ్యాధులనుండి రక్షించటానికి ఏవైనా ఉపాయాలు వెతకటం కూడా వారి ఉద్దేశ్యం.

కిరాతరాజును, అతని మంత్రిని దూరమునుండి చూచి మన కర్కటి తనలో, “ఆహాఁ! సంతోషం, నాకిప్పుడు మంచి భోజనం లభించింది. వీరు ఒకవేళ ఆత్మజ్ఞానము లేనట్టి మూర్ఖులే అయితే, వీళ్ళ ఉనికి భూమికి భారమే అవుతుంది కదా! మూఢులు, మూర్ఖులు ఇహ-పర లోకములందు దుః ఖములను, వినాశనములను మరల మరల పొందనున్నారు. అనర్థం కలుగజేయు ప్రాణులను భక్షించటం కూడా లోకహితమే అవుతుంది. ఏ అజ్ఞాని ఆత్మను ఎరుగకుండానే జీవిస్తూ ఉంటాడో, అట్టివాడు మరణించి, నా ఆకలి తీర్చటమే ఉచితం. నేడు ఈ ఇద్దరిని భుజిస్తాను. అయితే వీరు జ్ఞానులో, అజ్ఞానులో తెలుసుకోవాలి. ఎట్లా? రూపురేఖలను బట్టి మనం జ్ఞానులను, అజ్ఞానులను నిర్ణయించలేమే? జ్ఞానులైనవారు మానవులలోను, జంతువులలోను, రాక్షసులలోను, పిశాచములలోను, దేవతలలోను ఉండవచ్చు. అట్లే అజ్ఞానులు కూడా. అందుచేత వీరిని ముందుగా పరీక్షిస్తాను. వీరు కనుక ఉత్తమజ్ఞానాన్వితులైతే మాత్రం వీరిని తాకను. సుఖము, కీర్తి, ఆయువు అభిలషించేవాడు గుణవంతులను పూజించాలే కాని, బాధించకూడదు. నేను చావటానికైనా సిద్ధమేకాని గుణవంతుల జోలికిమాత్రం పోను. ఆత్మజ్ఞానులైన సాధువులు తమవాక్యములచే తదితర జనులకు ఈ “జీవించుట” అనుదాని కంటే కూడా అధికమైన సుఖమును, ప్రసాదించగలరు. ఈ ‘శరీరపోషణ’ అను వ్యవహారం కూడా "ఆత్మగురించి వినుట” అనుదాని కొరకు నిర్వర్తించబడినప్పుడే సార్థకత కదా!

నేను నా శరీరాన్ని అర్పించి అయినా సరే గుణవంతుని రక్షిస్తాను. అట్లు రక్షించి ఈ భూమాత యొక్క సంతోషమునకు కారణమవుతాను. ఎందుకంటే, గుణవంతుడైనవాడు తన సాంగత్యంతో ఈ లోకమును పవిత్రమొనర్చగలడు. అతని సాంగత్యం ఉన్నచోట మృత్యువు కూడా సుఖప్రదమై తోచగలదు. నేను రాక్షసినైనప్పటికీ గుణవంతులైన ఆత్మజ్ఞానులను పూజించినప్పుడే కర్త ృత్వమునకు సంబంధించిన తృప్తి-సంతోషములు కలుగుతాయి. ఉత్తమ గుణాన్వితులైనట్టి జ్ఞానధనులు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే, ఆ భూదేవతల వాక్యామృతములచే జనులకు పవిత్ర దృష్టి, ఉత్తమ అవగాహన, సామరస్యము, కారుణ్యము, ఐకమత్యము, అభివృద్ధి మొదలగు శుభములు యాదృచ్ఛికంగానే చేకూరుతాయి.

Page:432

అవును. అట్టివారు తమ సాంగంత్యముచే, అమృతమయమగు గుణములచే నావంటివారి హృదయాలలో శాంతి - సౌఖ్యములను నెలకొలుపగలరు. “గుణవంతులను తిరస్కరించి, వారి వచనములను సాంగత్యమును కోల్పోవటమే మృత్యువు” అని నాకు అనిపిస్తుంది. ఓ గుణవంతులారా! మీరు ఎక్కడెక్కడ ఉండి ఉన్నా మీకు నమస్కరిస్తున్నాను. మీతో స్నేహం లభించిందా, ఇక నాకు స్వర్గమోక్షములు కూడా అఖ్కర్లేదు. ఎన్నో సత్రియలకు ప్రయోజనంగా గుణవంతులతో, జ్ఞానవంతులతో నేస్తం ఏర్పడటం జరుగుతుంది.

వీరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీరు ఏమి సమాధానం ఇస్తారో వింటాను. వీరి సమాధానం అనుసరించి వీరు జ్ఞానులగు గుణవంతులో, లేక జ్ఞానహీనులగు గుణహీనులో నాకు తెలిసిపోతుంది. వీరు గుణహీనులైతే సుష్టుగా భుజించివేస్తాను. కాక, గుణవంతులా…. పూజించి తరిస్తాను. వీరిని సంతసింపజేస్తాను.

ఈ విధంగా తనలో అనుకొన్న కర్కటి ఆ కీకారణ్యంలో కారుచీకటి యొక్క అంతర్భాగం నుండి “రాళ్ళవానయా?” అన్నట్లు మేఘగర్జన చేస్తూ ఇట్లు నిష్టూరంగా పలుకసాగింది. కర్కటి: ఓ అల్పజీవులారా! మీరెవ్వరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాట్లాడక పోయారో, ఒక్కక్షణంలో మీరిద్దరు మృత్యువాత పడగలరు. ఊ! త్వరగా మీరెవ్వరో చెప్పండి.

విక్రముడు: ఓరీ! తుచ్చుడా! ఇంతకూ నీవెవ్వరు? ఎక్కడినుండి మాట్లాడుచున్నావు? ఏదీ? నీ అల్పశరీరం మాకు కాస్త చూపించు. నీ అరుపులు విన్నంత మాత్రంచేత భయపడి మూర్ఛిల్లేవారు ఇక్కడెవ్వరూలేరు. కాస్త క్రోధం త్యజించు. అరుపులతో మమ్ము భయపెట్టాలనే ప్రయత్నం కట్టిపెట్టు. నీ సామర్థ్యమేమిటో మాకు కూడా చూడాలనే ఉన్నది.

నీవు మమ్ము భయపెట్టాలని పెద్దగా అరచి, ఆ అరుపులకు నీవే భయపడుచున్నట్లు మాకు అనిపిస్తోంది. ఆ గావుకేకలు ఆపి ఇటు రా. నీకేం కావాలో చెప్పు. ఆలస్యం చేసేవారికి కార్యసిద్ధి కష్టతరమే అవుతుందని వినియుండలేదా?

ఆ రాక్షసి ఆ మాటలు విన్నది “సరే. ఇదీ బాగానే ఉన్నది. నా భీకర రాక్షస స్వరూపం వీరికి చూపుతాను. అప్పుడు వీరి ధైర్యమెంతటిదో చూద్దాం!” అని అనుకొన్నది. మందహాసంతో గర్జిస్తూ ఒక దీర్ఘమైన కేక వేసింది. ఆ శబ్దమునకు దిక్కులు పిక్కటిల్లాయి. “ఒక పెద్దనల్లటి కొండయా?” అనుకునేంత శరీరంతో వారికి ఎదురుగా ప్రత్యక్షమైనది. ఆ రాక్షసి ఆకారం చూస్తే పిశాచాలకు కూడా గుండె బెంబేలెత్తి పోగలదు. కాని, మహావీరులగు ఆ రాజు, మంత్రి - ఇద్దరికీ కించిత్ కూడా క్షోభ కలుగలేదు. సత్యాసత్యములను వివేచన చేయగల బుద్ధి కలవారిని మోహింపజేయ గలిగినట్టిది ఈ సృష్టిలో ఏ దృశ్యం ఉంటుంది?

Page:433

మంత్రి : ఓ రాక్షసీ! నీకు అంత క్రోధం దేనికి చెప్పు? అల్పులు మాత్రమే స్వల్పకార్యము లందు కూడా అత్యధికమైన కోపతాపాదులు చూపిస్తూ ఉంటారని నీవు విని ఉండలేదా? కాస్త ఆ కోపం విడచిపెట్టు, బుద్ధిమంతులకు కోపము తగినది కాదు కదా! ధీమంతులు ఎల్లప్పుడూ యోగ్యమైన, న్యాయమైన రీతిలో మాత్రమే తమతమ కార్యక్రమములను నిర్వర్తించుకొంటూ ఉంటారు. ఓ అబలా! ఇక మా ధైర్యము సంగతి అంటావా? నేను ఒక్కమాట చెపుతాను విను. మా ధైర్యవాయువు యొక్క వీచికచే, నీవంటి అల్పకీటకములు వేలాది కూడా ఎండు గడ్డిపరకల వలె ఎగురగొట్టబడ గలదు. కనుక, దయచేసి నీ క్రోధమును ముందు త్యజించు, ఎవ్వరైతే సమత్వము, నిర్మలబుద్ధి కలిగి ఉండి, ఉచితరీతిగా వ్యవహరిస్తారో…. అట్టివారు మాత్రమే కార్యసిద్ధిని పొందగలుగుచున్నారు.

ఒక పని సిద్ధించవచ్చు, లేదా, సిద్ధించక పోవచ్చు. ఏది ఏమైనా, మొట్టమొదట మాత్రం సామమునే అవలంబించాలి కదా! వ్యవహారసమర్థులలో అనేకులు అట్లే చేస్తారు. కార్యము సునిశ్చితమైన తరువాత ఇక మూర్ఖంగా ప్రవర్తించవలసినపనేమి ఉంటుంది? ఉపాయములు నాలుగు రకములుగా చెప్పబడ్డాయి.

  1. సామము (Requesting & seeking consent) 2. దానము (Offering - increased consideration) 3. భేదము (differentiating)

  2. దండము (Applying force - punishing)

ఎదుటివారి సంసిద్ధత మొ॥ వాటిని అనుసరించి ఆయా పరిస్థితులకు ఆయా ఉపాయములను అవలంబించటం ఉచితం. ఇప్పుడు నీ కార్యసిద్ధి కొరకు ‘సామము’ ను ఉపయోగించవచ్చు. మేము అందుకు మా ’సుముఖత’ను ప్రకటిస్తున్నాం.

మంత్రియొక్క ఉత్తమమైన, సందర్భోచితమైన వాక్యములు విని ఆ కర్కటి ఆశ్చర్యపడింది. తనలో ఇట్లు అనుకొన్నది.

“ఆహాఁ! పురుషులలో శ్రేష్ఠులైన ఈ ఇద్దరిబుద్ధి ఎంతో నిర్మలమైన దానివలె నాకు తోచుచున్నదే? ఓహో! ఏమి బుద్ధిబలం! ఏమి ధైర్యం! వీరిద్దరు అనేకమంది మూఢజనులవలే నాకు అనిపించుటలేదు. వీరి వాక్కు ఎంతో ప్రశాంతత, విజ్ఞత కలిగిఉంది. ముఖకాంతులను పరిశీలించిచూస్తుంటే కూడా, వీరు ఆత్మజ్ఞానులవలెనే ఉన్నారే! రెండు నదులు ఒకచోట కలుస్తున్నప్పుడు, ఆ రెండు నదులలోని జలం ఏకమైపోతాయికదా! అదే విధంగా, ఇద్దరు - ముగ్గురు బుద్ధిమంతులు ఒకచోటికి చేరి యున్నప్పుడు వారి “చూపు, వాక్కు, అభిప్రాయములు”- ఏకం అవుతూ ఉంటాయి. అవి

మహాశయమును కలిగి ఉంటూ ఉంటాయి.

ఇప్పుడు నేను వీరియొక్క అభిప్రాయము లేమిటో తెలుసుకొంటాను. వీరిని చంపను. ఎందుకంటే, ఆత్మదృష్టిచే, “మేము నాశరహితులము” అని తెలుసుకొన్నప్పుడు మాత్రమే ఈ విధంగా - మృత్యువు ఎదురుగా నిలిచినప్పుడు కూడా - ఇంతటి ధృతి-ఉత్సాహములు ఉండటం జరుగుతుంది. అందుచేతనే నా ఈ భీకరాకారం చూచిన తరువాత కూడా వీరు వ్యధ చెందలేదు కదా!

Page:434

ఒక్క ఆత్మజ్ఞానులే మృత్యువు యొక్క వాస్తవతత్వం తెలుసుకొనగలుగుతారు. జీవులలో అట్టివారు మాత్రమే ఇంత నిర్భయంగా నిలబడి ఉండగలరు. ఆత్మజ్ఞానము ఇటు జీవించుటయందు, అటు మరణించుట యందు కూడా గల ‘ఆశ-భ్రమ’ లను మొదలంట్లా లేకుండా చేసివేయగలదు. అట్టిజీవుడు ‘జన్మ-మృత్యువులు’ రెండిటినీ బాహ్యమైన విషయములవలె దర్శించగలడు.

ఇప్పుడు నాకుగల సందేహములను వీరిముందు ఉంచుతాను. మహాత్ముల సామీప్యత పొందిన తరువాత వారిని ప్రశ్నించాలి. వారి వచనామృతమును గ్రోలాలి. ఏవైనా సందేహాలు మిగిలి ఉంటే, వాటిని నివృత్తి చేసుకోవాలి. అట్టివారి ’సమక్షం’ పొందికూడా చక్కగా ప్రశ్నించి, విని, విచారణ చేయనివారి దౌర్భాగ్యం ఏమనిచెప్పాలి? వారు అరచేతిలోని ఆహారం నేలవిడుస్తూ ఆకలితో అలమటించేవారే అవుతారు.

ఇట్లు ఆలోచనలు పొంది, ఇక కల్పాంత మేఘగర్జన వంటి గొంతుకతో ఇట్లు ప్రశ్నించసాగింది.

కర్కటి: ఓ పాపరహితులగు ధీరపుంగవులారా! మీరెవ్వరు? కాస్త సవివరంగా చెప్పండి. నిర్మల చిత్తులను చూచిన మరుక్షణం మనయందు మిత్రత్వం స్వయంగానే సిద్ధిస్తుందని పూజ్యులు అంటారు. మీ విషయంలో నాకిప్పుడు అట్లే అనిపిస్తోంది. అందుచేత ముందుగా మీ వివరములు తెలియజేయండి. మంత్రి: ఓ రాక్షసీ! ఇతడు కిరాతరాజ్య ప్రభువు. పేరు ‘విక్రమమహారాజు’. నేను ఇతని మంత్రులలో ముఖ్యుడను. ఈ రాజ్య ప్రజల క్షేమము కోరి నీవంటి హింసక స్వభావులను దండించటానికి ఉద్యుక్తులమై ఈ రాత్రివేళ ఇటు వచ్చాం. "దుష్టశిక్షణ శిష్టరక్షణ” అనునది రాజుల కర్తవ్యమే కదా! ఇట్టి మా స్వధర్మం ఉపేక్షిస్తే మేము ధర్మభ్రష్టులమౌతాము. అందుకే ఈ మా ప్రయత్నమంతా! కర్కటి: ఓ విక్రమరాజా! నీ మంత్రి స్వల్పబుద్ధి కలవాడని నాకు అనిపిస్తోంది. ఇతని సలహా అనుసరించే ఈ అర్ధరాత్రి వేళ ఇటు వచ్చి నాపాల బడ్డావు. ఇట్టివానిని మంత్రిగా పెట్టుకొన్నావేమిటి? నీవేమిరాజువయ్యా? ఉత్తమ మంత్రి ఉంటేనే రాజు కీర్తివంతుడౌతాడని నీకు తెలియదా ఏమి? రాజును అనుసరించే ప్రజలు కూడా ఉంటారు. “యథారాజా తథాప్రజా” అని లోకప్రసిద్ధి కదా! సరే అది అట్లా ఉంచు. నీకు ఒక విషయం తెలుసా?

  1. ప్రశ్నలు

సమస్త జ్ఞానములందు ‘ఆత్మజ్ఞానము’ ఉత్తమోత్తమమైనది కదా! రాజులందరిలోకూడా ఆత్మజ్ఞానము కలిగియున్నరాజు మాత్రమే ఉత్తమోత్తముడని అనిపించుకొంటాడు. ‘ఆత్మజ్ఞుడు’ అయినట్టి మంత్రి మాత్రమే దూరదృష్టిచే రాజును, రాజ్యమును కాపాడి - “శోభ” కలిగించగలడు.

“ఆత్మజ్ఞానము” ను ’రాజవిద్య’ అనికూడా అంటారు. అట్టి ఆత్మజ్ఞానము లేకపోతే రాజు సమదృష్టితో వర్తించటం అసంభవం.

Page:435

‘ఆత్మజ్ఞానం’ అనబడే రాజవిద్య ఎరుగని రాజు రాజే కాడు. ఆ మంత్రి మంత్రే కాడు. అట్టి ఆత్మజ్ఞానము మీరు ఎరుగుదురా? ఎరిగియే ఉంటే, మీరు ధన్యులే. అప్పుడు మీరు నా వలన శ్రేయమునే పొందగలరు.

ఆత్మజ్ఞానము ఎరుగకుండానే జీవిస్తుంటే మాత్రం మీరు…. మీ రాజ్యమునకు, మీ ప్రజలకు, లోకములకు, అంతదాకా దేనికీ…. మీకుమీరే కూడా అనర్థమును కలుగజేసుకొంటున్నవారవుతారు. మీరు జ్ఞానులు కాకపోతేమాత్రం, నా స్వభావానుసారం మిమ్ములను మ్రింగి నా ఆకలి తీర్చుకొంటాను. ఓ రాజ మంత్రులారా! ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఇవ్వబోయే సమాధానాలు నాకు తృప్తిని కలిగించాయా…. ఒక బిడ్డ తన తల్లికి ప్రీతిపాత్రమైనట్లు మీరు కూడా నాకు ప్రీతిపాత్రులౌతారు. లేదా, ఇక పర్యవసానమేమిటో మీరు ఇప్పటికే గ్రహించి ఉండాలి!

ఓ స్నేహితులారా! నేను అడగబోయే ప్రశ్నలకు చక్కగా, స్వానుభవం దృష్టిలో పెట్టుకొని, నిర్భయంగా, విమర్శనాపూర్వకంగా సమాధానం ఇవ్వండి. “నీ కార్యము సునిశ్చితమైనట్లే” అని మంత్రి చూచాయగా పలికాడు కదా! అనగా, నా కోర్కె సఫలంచేస్తానని మీరు ‘ప్రతిజ్ఞ’ చేసినట్లే! మీవంటి ఉత్తములు అన్నమాట తప్పుతారా? ఇక నా ప్రశ్నలు దయచేసి శ్రద్ధగా వినండి.

యథార్థానికి “ఒక్కటే” అయినప్పటికీ, ఉపాధిభేదంచేత మాత్రమే అనేకముగా కనబడుచున్నదేది? సముద్రంలో అసంఖ్యాకంగా కెరటములు లేచి లయిస్తున్నట్లు, ఏ పరమాణువులో ఈ అనేక బ్రహ్మాండములన్నీ లేచి లయిస్తున్నాయి?

‘శూన్యము’ కానట్టి ఆకాశము ఏది?

“లేనిది” అయినప్పటికీ, ఉనికిని కలిగియున్నదేది? ఇంతకీ నేనెవ్వరు?

మీ ఇద్దరిలోను ఉండి ఉంటూ, “అహం” అను భావమును కలిగి ఉంటున్నదేది?

తాను నడుస్తూకూడా, కదలక ఉంటున్నదేది?

తన ‘గతి’ (Direction) ని నిరోధించుకోకుండానే, ఒకేచోట స్థిరంగా ఉంటున్నదేది?

అది చేతనవస్తువే, కాని, ఒక పెద్ద బండరాయిలాగా ఎటూ కదలకుండా ఉంటోంది. అదేమిటి?

“చిదాకాశము” నందు ఈ విచిత్రమైన జగత్తులన్నీ చిత్రించుచున్నదెవ్వరు? ఏకాలమునందూకూడా— తనరూపమును ఏమాత్రం త్యజించనట్టిదేది?

తాను అగ్ని అయివున్నప్పటికీ, దహనశక్తి లేకయే ఉన్నట్టిదేది?

అది స్వయముగా అగ్ని కాకపోయినప్పటికీ, దాని నుండి నిరంతరం ప్రకాశం ఉత్పన్నమౌతోంది.

అది ఏది?

Page:436

తాను నాశరహితుడై, ఈసమస్తమును ప్రకాశింపజేయుచున్నవాడెవడు?

చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్రముల కంటె విలక్షణమైనట్టి ప్రకాశము కలిగినట్టిది ఏది? చూచుటకు అది విషయమేకాదు. కాని అది దృష్టికి హేతువు. అనగా, చూడటానికి తానే కారణమైయున్నది. అదేమిటి?

చెట్లను, తీగలను, పుట్టు గ్రుడ్డివారిని, ఇంద్రియములు లేనివారిని, తదితర సర్వజీవులను ప్రకాశింపజేయునది ఏది?

ఈ ఆకాశము మొదలైనవాటిని ఉత్పన్నం చేసినవారు ఎవ్వరు?

అన్నిటికీ కూడా “సత్త” కలుగజేస్తున్నదెవ్వరు? ఈ జగత్తంతా ఎందులో ఉన్నది? జగత్తంతా నిండియున్నదేది?

ఈ జగత్తు వాస్తవానికి ఏదై ఉన్నది?

చీకటిని కూడా ప్రకాశింపజేసేదేది?

ఉన్నది లేనిది కూడా అయిన అణువు ఏది?

అత్యంత దూరంగాను, అత్యంత సమీపంగాను ఉండేది ఏది?

గొప్ప మహాపర్వతమువలె ఉండే అణువు ఏది?

నిమేషస్వరూపమై [నిమిషములు - - (minutes) స్వరూపముగా కలిగినదై]…. తానే ఒక ‘కల్పము’ రూపమున కూడా ఉండేదేది?

ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ, లేనట్లే తోచేది ఏది?

చేతనము అయినప్పటికీ “ఇది అచేతనము” అని నిర్ణయింపబడగలిగేది ఏది?

వాయువువలె ప్రసరించగలిగి కూడా, వాయురూపము కానిది ఏది?

శబ్దరూపమైనప్పటికీ, అశబ్దమై ఉండేది ఏది?

అంతయు ’తానే’ అయి ఉండి, ఏదీ కానిది ఏది?

‘అహం’ భావనారూపంగా ‘అనహం’ భావనారూపంగా…. ఈ రెండు విధాలుగా ఒక్కసారే ఉంటున్నదేది?

ఒకానొకటి ఉన్నది. అది జీవుని స్వస్వరూపమునకు వేరైనది కాదు. కానీ, అదేమి చిత్రమో, అట్టి అనుభవం ఈ జీవునకు అనేక జన్మలలోని ప్రయత్నములచేత మాత్రమే లభిస్తోంది. ఏమిటది? ఏది లభించిన తరువాత, ఇక అంతకు మించిన లాభము కలుగజేయునదిగాని, లాభమైనదిగాని, కోకా ఉండదో అది ఏది?

దేనియొక్క సర్వస్వము ఎప్పటికీ లభించకుండానే ఉంటోందో…. అది ఏది?

Page:437

విషయ భోగములందలి ఆసక్తిచే, తాను ప్రసరించియున్నట్టి చోటునే తనకు బాహ్యమైన దానివలె గాంచుచు, స్వస్థతకోసం వెతుకుతోంది. తనకుతానే విస్మరించుకొంటోంది. అది ఏది? మేరుపర్వతమును కూడా తనయందు ధరించుచు, త్రిలోకములను తృణప్రాయంగా చేసివేస్తున్నది

ఏది?

దేనిని అవలోకించినంతమాత్రంచేత ఈ జగద్వ్యవహారమంతా ఒక చిన్నపిల్లవాడి నృత్యమువలె హాస్యంగా తోచగలదు?

గొప్పపర్వతములు కూడా ప్రవేశించగలిగే అణువు ఏది?

తన అత్యంతసూక్ష్మత్వము త్యజించకుండానే, మేరువు కంటే కూడా అధికమైన స్థూలత్వము కలిగి ఉండేది ఏది?

ఒక వెంట్రుకకొసలో లక్షవవంతుకంటే కూడా సూక్ష్మంగా ఉండి, అదే సమయంలో అనంతకోటి యోజనముల విస్తీర్ణం విస్తరించి ఉండేది ఏది?

ప్రకాశమును - అంధకారమును కూడా వ్యక్తపరచునది ఏది?

‘వృత్తి’ తో కూడిన జ్ఞానమంతా అసలు ఉంటున్నది ఎందులో?

అత్యంత ఆనందమయము, రుచికరము అయిఉండికూడా…. ఈ ‘తీపి’ మొదలైన రసములు లేకయే ఉన్నట్టిది ఏది?

సమస్త పదార్థములకు విలక్షణమై ఉన్నప్పటికీ, అన్నిటికీ ఆశ్రయభూతమై ఉండేది ఏది? తననుతాను ఆచ్ఛాదించుకోలేక పోయినప్పటికీ, ఈ జగత్తునంతా ఆచ్ఛాదించివేస్తున్నది ఏది? ఎద్దానిశక్తిచేత ఈ జగత్తంతా ప్రళయసమయంలోకూడా సత్స్వరూపమై వెలయుచున్నది? తాను అవయవరహితమైనప్పటికీ, ఈ సమస్తమైన కాళ్ళు, కళ్ళు, “తనవే” అయిఉన్నదేది? అనేక కల్పములు, మహాకల్పములు కూడా ఎద్దానికి ఒక నిమిషమాత్రం కూడా కాకుండా ఉంటున్నాయి?

తాను యథార్థానికి ఉత్పత్తి అనునదే లేక ఉంటోంది. కాని, దాని నుండే సృష్టికాలంలో ‘జగత్తు’ అనే వృక్షం ఆవిర్భవిస్తోంది. అది ఏమిటి?

ప్రళయకాలంలో ఈ ‘జగత్తు’ అంతా అస్పష్టమయిపోయి లయించేది ఎందులో?

మట్టి బీజములో తదనంతర మహావృక్షం దాగి ఉన్నది. అదేవిధంగా ఈ కల్పములు, ఈ సృష్టులు, ఈ జగత్తులు, నీవు, నేను ఈ మంత్రి మొదలైన చమత్కారమంతా దాగి ఉన్నది ఎందులో? ఎట్టి ప్రయోజనముగాని, కర్తృత్వము గాని లేకపోయినప్పటికి అన్నిటికీ “కర్త” అయి ఉన్నవాడెవ్వడు?”

ఒకానొక “ద్రష్ట” ఉండి ఉన్నాడు. అతడు తన అభిలాషను అనుసరించి భోగ్యపదార్థములు

Page:438

సిద్ధించుటకుగాను, తనయొక్క రూపమునే దృశ్యముగా దర్శింపజేయుచున్నాడు. అతడు ఎవ్వరు?

బంగారము తనయందు “గొలుసులు ఉంగరములు గాజులు” మొదలైన ఆభరణత్వము కలిగిఉన్నది కదా! అదేవిధంగా, “దృశ్యము-దర్శనము-ద్రష్ట”…. అనబడు త్రిపుటిని తనయందు వ్యక్తీకరించుచున్నది ఎవరు?

ఒక మహాసముద్రం ఉన్నది. అందులో సహజంగానే అసంఖ్యాకంగా తరంగాలు ఉన్నాయి. అయితే, ఆ సముద్రంలో తరంగాలన్నీ జలంకంటే వేరైనవి కాదుకదా! అట్లాగే ఈ కల్పనామయ జగత్తులన్నీ ఒకానొకదానికంటే ఏమాత్రం వేరైనవి కావు. అది ఏది?

తరంగములు సముద్రముకంటే వేరైనవన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎవని కోర్కెను అనుసరించి ఈ దృశ్య జగత్తు అంతా అతనికి వేరైనదానివలె అనిపించటం జరుగుతోంది?

జలము కంటే, సముద్రము కంటే, ద్రవత్వము వేరా? కాదుకదా! అట్లాగే, ఈ ద్వైతప్రపంచ మంతా కూడా అతి సూక్ష్మమైయున్న ఏ అద్వితీయవస్తువునకు వేరు కాకుండానే ఉండియున్నది?

ఒకచిన్న విత్తనం తనయందు మహావృక్ష తత్వమంతా ధరించియున్నది కదా! ఈ త్రిలోకములన్నీ ద్రష్ట-దర్శన-దృశ్యములతో కూడియున్నాయి. సత్-అసత్ స్వరూపమైయున్నాయి. అట్టి ఈ త్రిలోకములను సర్వదా తనయందు ధరించియున్నది ఎవరు?

భూత-భవిష్యత్-వర్తమాన రూపముతో కూడియున్న ఈ మిథ్యాజగజ్జాలమంతా ఏ సమరసపూరిత వస్తువునందు ఎల్లప్పుడు స్థితి కలిగియున్నది?

ఉత్పత్తి రహితమగు ఏ వస్తువు తన ఏకస్వరూపమును త్యజించకుండానే సవికారమగు ఈ జగత్తు అగుచున్నది?

బీజము వృక్షముగాను, వృక్షము బీజముగాను అగుటకు, అట్లే తదితర సర్వ పర్యవసానములకు కారణమై ఉంటున్నది ఏది?

దేనిసమక్షంలో ‘మేరుపర్వతం’ వంటి మహాఘనముకూడా ఒక కలువపూవులోని ఒక తంతువువలె అతిస్వల్పమైన దానివలె అగుచున్నది?

ఏది తనయందు కోట్లకొలది బ్రహ్మాండములుకూడా ఒక్కసారే కలిగియున్నది?

ఉపాధి భేదముల దృష్ట్యా (due to different adjuncts) అనేక చైతన్యములతో ఈ విశ్వమును విస్తరింపచేస్తున్నది ఎవరు?

దేనిశక్తియొక్క ప్రభావంచేతనే నీవు, ఈ మంత్రికూడా ఆయా సమస్త వ్యవహారములలో చక్కగా నిర్వర్తించగలుగుతున్నారు? ప్రవర్తించగలుగుచున్నారు?

దేనిని ఒక్కసారి దర్శించామా…. ఇక మనమంతా నిర్మలమైన బుద్ధిని పొందినవారమై అద్దానిని తప్ప, ఇంకదేనిని తలచకయే ఉంటాం?

Page:439

ఓ రాజా! నా ప్రశ్నలన్నీ విన్నావుకదా! నేను చిత్తశాంతిని పొందుటకుగాను అట్టి వస్తువు లేక ‘విషయము’ గురించి సవివరణపూర్వకంగా చెప్పండి.

మీ ప్రత్యుత్తరంతో నాలోని సంశయమంతా తొలగిపోగలదని నేను అనుకొంటున్నాను. ఎవడైతే ఈ సంశయములను తొలగించుటకు శక్తుడై ఉండడో, అట్టివాడు అవిద్యతో కూడుకొన్నవాడే కదా! అట్టివాడు అపండితుడే. ఓ బుద్ధిమంతులారా! నా సంశయాలన్నీ నివారించమని మరల మరల అర్థిస్తున్నాను.

ఆ విషయమేదీ మీకు ఇప్పటివరకు ఏమాత్రం తెలియదంటారా? మీరిద్దరు నాకు ఆహారం అవండి. మిమ్ములను భక్షించిన తరువాత, మీ రాజ్యములోని ప్రజలను కూడా మ్రింగివేస్తాను.

కనుక నా ప్రశ్నలకు సమాధానమిచ్చి, తద్ద్వారా మీ ప్రజలను కాపాడుకోండి. ఆత్మజ్ఞాన శూన్యులకు భోగాదులు ఉండి ఏమి లాభం? అదంతా వారి వినాశనము కొదికే అగుచున్నదిసుమా! అందుచేత మీరు కనుక ‘అజ్ఞానులే’ అయిఉంటే, ఆకలిచే బాధింపబడుచున్న నేను మిమ్ములను ఆరగించుటలో దోషం ఏమి ఉంటుంది? ఉండదు కదా!

ఈ విధంగా గంభీరంగా పలికి ఆ రాక్షసి మౌనం వహించింది. ఒక్కసారి ఆ అంధకారారణ్యం అంతా నిశ్శబ్దం తాండవించింది. రాజు, మంత్రులిద్దరూ అత్యంత ఆశ్చర్యంతో ఆ ప్రశ్నలన్నీ విన్నారు. మహాధీశాలియగు మంత్రి ఒకచిరునవ్వు నవ్వి, ఆపై ఇట్లు ప్రత్యుత్తరమివ్వసాగాడు.

  1. మంత్రి సమాధానం - “ఆత్మ యొక్క స్వరూప - స్వభావాలు” మంత్రి : ఓ రాక్షసీ! నీ ప్రశ్నలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాం. నీవన్నీ అత్యంత ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. ఆ ప్రశ్నలలో మహాజ్ఞానం శోభించటం మేము గమనించాము. వాస్తవానికి నీ ప్రశ్నలకు చెప్పగల సరిఅయిన సమాధానం మనోవాక్కులచే ప్రకటించబడేదికాదు. అయితే ఆత్మజ్ఞానులు, శాస్త్రములు వ్యవహరిస్తున్నతీరుగా అనుభవమే నిరూపణ అయిఉన్న సమాధానం చెప్పచున్నాను. విను.

నీ యొక్క ఉత్తమోత్తమవచనములచే “పరమాత్మ” గురించే తెలిపావు. ఆ పరమాత్మయే నేను, నీవు, మరియు ఈ సర్వంకూడా.

ఈ వర్తమానక్షణంలోనే ప్రతి ఒక్కరి స్వరూపం అది! : అట్టి ఆ పరమాత్మ “వాక్కు” నకు అతీతమై, మనస్సుకు కూడా అలభ్యమై, పంచేంద్రియముల అనుభవమునకు అందనిదై ఉంటోంది. అణుస్వరూపమై, ‘ఆకారము’ కంటేకూడా అత్యంత సూక్ష్మమై వెలయుచున్నది. ఒక విత్తనంలో “ఫలములు-పుష్పములు-ఆకులు-కొమ్మలు-కాండము-వ్రేళ్ళు -భవిష్యత్ విత్తులు”…. మొదలైన వ్యవహారమంతా ఉండిఉన్నట్లు, ‘చిత్’ అణువునందే ‘సత్-అసత్’ రూపమగు ఈ జగత్తంతా

Page:440

స్ఫురిస్తోంది. అట్టి ఆ సద్వస్తువు ఎప్పటికో ఎక్కడో ఉన్నదికాదు. అందరియొక్క ఈ క్షణములోని ఆత్మస్వరూపము అదే. అనుక్షణం ప్రతిజీవుడు అదియే అయిఉన్నాడు. సృష్టి మొదట్లో స్థితి కలిగియున్నది అదొక్కటే. అందుచేత, సమస్తపదార్థములు దానియందే సత్త పొందుచున్నాయి.

సర్వము - సర్వరూపము రూపరహితము! : ఆ పరమాత్మయే సర్వము. అందుచేత, ఇకదానికి బాహ్యమైనదంటూ ఏదీ లేదు. అదియే ఆకాశము. అయితే అది జడము కాదు. అది సర్వదా శుద్ధము, దోషరహితము కూడా. శుద్ధ చైతన్యమగు అది ఈ ఆకాశము కంటే వేరైనదికూడా. అనంతమగు ఆ ‘చిత్’ అణువు ఈ భౌతికమైన ఇంద్రియములచే దర్శించబడజాలదు. ఇంద్రియాలకు ‘అవిషయము’ అయిఉండటంచేత “అది రూపరహితము” అని చెప్పబడుతోంది. అంతయు తనరూపమే అగుటచే “సర్వరూపము" కూడా. దృశ్యము దానియందు లేదు. అందుచేత “అరూపము” అనటం

కూడా సమంజసమే.

గోచరించేదంతా అదే - - కాని అగోచరం! : సర్వము తానే అయిఉన్నది. ఏదియు కాకుండానే ఉన్నది. నేను - తండ్రిగా, సోదరునిగా, మిత్రునిగా, సేవకునిగా కుమారునిగా - ఇట్లు అనేకముగా అనేకులకు ప్రాప్తించుచు……., వీటిలో ఏ ఒక్కటీ కాకుండానే ఉన్నాను కదా. ఇది కూడా అట్టిదే.

ఒకే బంగారమునందు అనేక రకములైన అభరణములు ఉంటూకూడా, బంగారముమాత్రం మార్పులేకుండా యథారీతిగానే ఉండిఉంటోంది కదా! ఆ తీరుగానే ఒకే చైతన్యము అనంతసంఖ్యలైన ఉపాధులలో ప్రతిబింబించుటచే భిన్నభిన్నములుగా గోచరిస్తోంది. పరమాకాశస్వరూపమగు ఆ చిదణువే అన్నిటిని ప్రకాశింపజేస్తోంది. అత్యంత సూక్ష్మమై, ఇంద్రియములకు లక్షితము (object of perception) కాజాలకున్నది. అందుచేత అలక్షితము. సర్వులరూపము, సర్వరూపము అదే అయినప్పటికీ-అది ఇంద్రియములకు గోచరించేది కాదు.

శూన్యము - సర్వవ్యాపకము! : పరమాత్మస్వరూపమగు ఆ సద్వస్తువు వస్తురహితమగుటచే “శూన్యము”. అయిననూ అయ్యది సర్వుల ఆత్మస్వరూపమై ఉన్నదికదా!…. అద్దానిని ’శూన్యము’ అని ఎట్లా అనగలం? ఎవ్వరైనా తననుతానే “నేను లేను. నేను శూన్యమును” అని ఎట్లా నిషేధించుకోగలడు, చెప్పు? ఏ యుక్తిచే విచారించినా సరే “సత్తు” అసత్తు అవుతుందా? లేదు. కస్తూరి తన సువాసనలచే నాలుగువైపులా వ్యాపించియే ఉంటుంది కదా! (అంతట వ్యాపించి ఉంటున్నది. సద్రూపమగు ఆత్మయే అది. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపము.)

ఏకము = అనేకము! : ఈ ఇంద్రియవృత్తులచే చిద్వస్తువే (లేక ఆత్మయే) అనేక రూపములుగా అనుభవమౌతోంది. అంతాకూడా అది మాత్రమే. అయితే, అది శుద్ధచైతన్య మాత్రమై, ఇంద్రియములకు అతీతమగు తత్వమై, ఆ ఇంద్రియములను ప్రకాశాపజేయునదియై, అపరిచ్ఛిన్నమై ఉండి ఉంటోంది. అందుచేత అది మరింకేదీ గాకుండానే ఉంటోంది. ఆ పరమాత్మ సర్వదా ఏకమే అయిఉన్నప్పటికీ, ఉపాధిభేదం చేత అనేకంగా తోచుచున్నది. సర్వుల ఆత్మస్వరూపము అదేకనుక, ఈ జగత్తును ధరిస్తున్నది అదే. ‘జగత్తు’ అనే రత్నం ఉన్నట్టి పెట్టె ఆ పరమాత్మయే. ఆ చైతన్యమహాసముద్రంలో

Page:441

“జగత్తులు” అనే తరంగాలు ఆవర్తముల వలె (Circles or Revolutions) వ్యక్తమౌతున్నాయి.

స్వానుభవము - - అలభ్యము! : అట్లు ఇంద్రియ - మనస్సులకు లభించక, “శూన్యమా”? అని వితర్కించబడుచున్న ఆ పరమాత్మ వాస్తవానికి "స్వానుభవమే” అయిఉంటోంది. ఆత్మసాక్షాత్కారముచే తనయందే లభించుచున్నది. కాని, లభించకయే ఉన్నది. ఎందుకంటావా?

ఏ ‘అనుభవి’ కైనా (Experiencer) అతని కంటే వేరైనది మాత్రమే లభించటం జరుగుతుంది. అతని కంటే ఏమాత్రం వేరుకానిది అతనికి “లభించుట” ఎట్లా?

వాస్తవానికి అది ఎల్లప్పుడు లభించియే ఉన్నది. “అది ఆకాశరూపము అయి ఉన్నప్పటికీ, శూన్యము మాత్రం కాదు” అని జ్ఞానులు ప్రకటిస్తున్నారు.

“నేను-నీవు-నాది-నీది” - అంతాకూడా “తానే”! : ఓ రాక్షసీ! అద్వైతతత్వ - సాక్షాత్కారముచే నేను ఆత్మనే అయిఉన్నాను. నీ రూపమున వెలుగుచున్నది కూడా నేనే. అయినప్పటికీ, పారమార్థిక దృష్టిచే ఆత్మ నాది కాదు. నీదికాదు. మరెవ్వరిదీ కూడాకాదు. నేను, నీవు, అతడు — ఇత్యాది వ్యవహారమంతటికీ ఆవల అది ఉన్నది. అది కేవలం ‘బోధ’ స్వరూపం మాత్రమే. “నీవు - నేను - అతడు” అనే భేదభావమంతా అట్టి కేవలస్వరూపమగు ఆత్మయందే ఉద్భవించి లయించుచున్నది. అది మాత్రమే తనంతతానుగా అంతటా వెలుగుచూ, ఈ సర్వమును భాసింపజేయుచున్నది. ఆత్మతో ఏకత్వము సంపాదించిన నిర్మల హృదయములకు అది ఇప్పటికిప్పుడే అనుభవమౌతోంది.

నిశ్చలము వ్యాపకము! : ఆ “శుద్ధ” చైతన్యమే ఆకాశమువలె అనేక యోజనములు వ్యాపించియున్నది. అన్నివైపులా చలించుచునే సర్వదా చలించకుండానే ఉంటోంది. ఒకడు తన స్వప్నమునందు స్వీయకల్పనా ప్రభావంచేత తన హృదయమునందే వేలాదిమైళ్ళ విస్తీర్ణం, అసంఖ్యాకమైన పదార్థములను వ్యక్తులను దర్శించుచున్నాడు కదా! ఈ బాహ్యమున తోచుచున్న విస్తీర్ణములన్నీ ఆ

‘చితవస్తువు’ నందే ఉండిఉన్నాయి. ఇక, అద్దాని చలనము విషయమేమిటంటావా? అది సర్వత్రా వ్యాపించియుండుటచే, అన్నివైపులా సంచరిస్తూ ఉన్నప్పటికీ స్థిరముగానే ఉండిఉంటోంది. తనయొక్క చిదాకాశ గర్భమునందు సర్వదేశ - కాలాదులు కలిగియుండి, ఏ మాత్రం చలనము లేకయే ఉంటోంది. పొందతగిన ప్రదేశమంతా దానియందే ఉండియుండుటచే ఇక అది ఎటూ పోలేదు. ఒకతల్లి తన ‘పైట’ క్రింద పాపను ఉంచుకొని, ఆ పాపకొరకు వెతుకుచున్నదనుకో కొంతసేపటికి ఆ పాప పైటలోనే ఉన్నదని గమనించినప్పుడు క్రొత్తగా పొందినది ఏం ఉన్నది? ఈ జీవుడు వాస్తవానికి ఆత్మవస్తువే అయిఉండగా — ఇక అట్టి ఆత్మవస్తువు ఒకప్పటికి ఏదో నిర్వర్తించి ఆపై పొందటమనేది ఎక్కడ ఉంటుంది?

రాక - = పోకలు లేనిది! : ఒక కుండకు మూతనుపెట్టి, దానిని ఒక చోటునుండి మరొకచోటికి తీసుకుపోయామనుకో…. ఆ కుండలోని ఆకాశమునకు రాకపోకలు ఉంటాయా? ఉండవు. ఆత్మకు కూడా గమనాగమనములు లేవు. సమస్త “దేశ-కాల-కల్పనలన్నీ (Space - time - Imaginations) జరుగుచున్నవి. తనయందే అయిఉండగా, ఇక ఎట్లా, ఎటు పోగలదు? దృష్టాంతము

Page:442

నీ యొక్క స్వప్నమే. నీ స్వప్నంలో కనబడే విస్తారమైన ప్రదేశములు, వస్తువులు, వ్యక్తులు నీయొక్క కల్పన చేతనే దర్శించబడుచుండగా, అందులో నీవు ఒకచోటునుండి మరొకచోటికి పోవుట ఏమిటి?

జడము - - చేతనము - - కర్తృత్వరహితము!

ఆ చైతన్యము ఒకానొకప్పుడు, “ఈ జడమగు దేహమే నేను” అను రూపముగల తెంపులేని “ధ్యాస” (Cogitation) కలిగి ఉంటోంది. అప్పుడు అది చిత్తమును పొందినట్లు, జడముగా అయినట్లు భావనను ప్రదర్శిస్తోంది. అందుచేతనే, “ఆత్మ జడము - చేతనము కూడా” అని చెప్పబడుచున్నది.

కర్త - - అకర్త - - భోక్త - - అభోక్త! : ఆ చిద్వస్తువు రాతియందు కూడా వ్యాప్తమైయున్నది. అది

ఒక బండరాయిలాగా ‘మహాఘనము’ అని చెప్పబడింది. అనాది-అనంతము అయినట్టి ’చిదాకాశము’ అను గొప్ప శిలయందు ఈ ‘స్వర్గలోకం మర్త్యలోకం -పాతాళలోకం’ అనబడు విచిత్రములైన శిల్పభాగములను చిత్స్వరూపుడగు పరమాత్మయే చిత్రించుచున్నాడు. అయితే ఆ త్రిలోకముల వ్యవహారమంతా మిథ్య, కల్పన మాత్రమే సుమా! శిలలో కన్పించే ఆయా శిల్పలేఖనమంతా శిలకు వేరైనది కాదు కదా! శిల శిల్పస్థితిలో కూడా శిలగానే ఉండి ఉంటోంది. అట్లే “ఇక్కడ ఏదియు సృష్టించబడుట లేదు. ఇదంతా అకృతమే. అనగా, దీనికి ఎవ్వరూ ‘కర్త’ లేడు” అను వాక్యములు కూడా సమంజసములే అగుచున్నాయి.

‘అగ్ని’ యొక్క సత్త, తదితర భూతముల సత్త కూడా ఆత్మసత్తకు అధీనమై ఉంటోంది. ఇక ఆత్మయో, సర్వవ్యాపి కదా! ఈ జగత్తును ప్రకాశింపజేసేది ఆత్మయే. కాని అది అగ్నిలాగా మరొక దానిని దహించేది కాదు. ఆ ఆత్మచైతన్యము దేదీప్యమానమై, ప్రకాశవంతమై, ఆకాశము వలె నిర్మలమై ఉంటోంది. అట్లు ఉండగానే అద్దానినుండి జ్వలనశక్తి గల అగ్ని, తదితర భూతజాలం ఉత్పన్నమౌతున్నాయి.

దానిని స్పర్శించగలిగేదేదీ లేదు …. కాని అంతటికీ స్థానం అదే!: ఆత్మకు రూప-నామాలు లేవు. అనుభవరూపమగు ఆ ఆత్మయే చంద్ర-సూర్యాదులనుకూడా ప్రకాశింపజేయుచున్నది. అట్టి ఆత్మ యొక్క ప్రకాశమును ‘మహాకల్పాంతములు’ కూడా స్పృశించలేవు. ఈ భౌతికమైన నేత్రాదులకు లభ్యము కానట్టి అనుభవ రూపమగు ఆ ఆత్మయే హృదయంలో దీపమువలె ప్రకాశిస్తూ, సమస్తమైన తదితర ప్రకాశములకు ‘సత్త’ను కలుగజేస్తోంది. స్వయం జ్యోతిస్వరూపము….. ఇంద్రియమనస్సులకు అతీతము …. అయినట్టి ఆత్మ నుండే “నీవు, నేను, తదితర జగత్తు" అను ప్రకాశమంతా ఉత్పన్నమగు చున్నది. దీపపు వెలుతురులో వస్తువులు కనబడుచున్నట్లు, ఆత్మ యొక్క ఉనికిచేత ఈ దేహము - ఇంద్రియముల అనుభవం కలుగుతోంది. చెట్లను, పూతీగలను కూడా పోషించేది ఆ పరమ ప్రకాశరూపము, అనుభవమాత్రము అగు ఆత్మయే.

అంతా ఉన్నది అద్దానియందే…. కాని దానికి దేనితోకూడా సంబంధమే లేదు. అద్దానియందు జగత్తు - - జీవులు అనబడేవేవీ లేవు. దర్పణంలో అన్నీ అగుపడుచున్నప్పటికీ, దర్పణంలో ఏ వస్తువూ లేదుకదా! స్వప్నాంతర్గత వస్తువులతో స్వప్నదృష్టకు పోలికయే లేదుకదా!

Page:443

ఓ ఆత్మస్వరూపిణీ! అనుభవస్వరూపమగు ఆత్మయందే ఈ “దేశ-కాల-క్రియాదులు, జగత్సత్త” కూడా ఉండి ఉన్నాయని సూక్ష్మ బుద్ధికి తెలియవచ్చుచున్నది. మన బాహ్య దృష్టితో చెప్పుకొంటేపరమాత్మయే ఈ జగత్తుకు తండ్రి అయి ఒప్పుచున్నాడు. అన్నిటికి కర్త-భోక్త-ప్రభువు అతడే. కాని పరమార్థ దృష్టితో చూచినప్పుడు … అతడు పరిశుద్ధాత్ముడు అగుటచే ఏదియు కాకయే, దేనికి సంబంధించకుండానే ఉంటున్నాడు.

జగత్కారణము–జగత్స్వరూపము! : ఆ “చిత్ అణువు” తన అణుత్వమును ఏమాత్రం త్యజించకుండానే ఈ “సువిశాలజగత్తు అను రత్నమును ధరిస్తోంది. స్వప్నములో, ఆ స్వప్నమునకు ద్రష్టవై ఉన్నట్టి నీవు ఆ స్వప్నజాలమంతా చూస్తూ ఉన్నప్పటికీ అందులో కొన్నింటిని త్యజిస్తున్నప్పటికీ నిన్ను నీవు త్యజించుట జరుగుతోందా? లేదుకదా! అందులో నీవు పాల్గొనుచు సుఖదుఃఖములు, సంయోగవియోగములు అనుభవిస్తున్నప్పటికీ, ఆ స్వప్నములో తటస్థపడుచున్నదంతా నీ కంటే వేరైనదేదీ కాదు. ఈ దృశ్య జగత్తు విషయం కూడా అట్టిదే! అయితే వాస్తవానికి "ద్రష్ట-దృశ్యము -దర్శనము” … అను రూపముతో తోచుచున్న ఈ జగత్తు శుద్ధమగు ఆత్మయందు లేనేలేదు. ’మరి ఈ జగత్తు ఉన్నదెక్కడ? – అని మనం పరిశోధిస్తే, ఇది ఆత్మలోనే ఉన్నది కాని, మరింకెక్కడా లేదు. అని కూడా తేలుచున్నది. స్వప్నము నీలోనే ఉన్నదికాని, ఆ స్వప్నమునందు నీవు లేవు కదా! నీవే ఆ స్వప్న రచనా వ్యవహారము కంతటికీ కర్తవు. అంటే ఏమిటి? నీయందు, నీవే, నీ కల్పనచే (లేక) ఊహచే ఆ స్వప్నమును ఆ రీతిగా దర్శించుచున్నావు. అయితే, పరిశుద్ధమగు ఆత్మయే స్వరూపముగా గల నీయందు స్వప్న తుల్యమగు ఈ వస్తుజాలమంతా ఎక్కడుంటుంది? ఉండదు.

అద్వితీయం - నిత్యోపలబ్ధం! : ఆత్మవస్తువును పొందాలంటే అధికమైన ప్రయత్నం అవసరమగు చున్నది. అందుచేత “అది కష్టసాధ్యం” అని అంటున్నారు. బాహ్యదృష్టిచే ఎంతగా వెతికినా లభించదు కనుక “తమస్సు” అని చెప్పుచున్నారు. చిన్మాత్ర స్వరూపమే అది కనుక “జ్యోతిర్జ్యోతి” (అది వెలుగులకే వెలుగు) అని అనటంకూడా సమంజసమే. అది ఇంద్రియములకు అలభ్యం కనుక ”అత్యంతదూరంగా ఉన్నది“ అని చెప్పబడుతోంది. అదియే ద్రష్ట కదా! అందుచేత అంత సామీప్యములో ఉన్నది మరొకటేదీ లేదు” అను మాట వాస్తవమే అగుచున్నది. నీకు ’నీ’కన్నా వేరేది సమీపమున ఉన్నది చెప్పు? అన్ని సమయములలోను “… నేను …నేను …” అను రూపమున అది ప్రత్యక్షముగానే ఉన్నది కదా! అత్యంత సూక్ష్మమై అత్యంత ఘనీభూతమైకూడా ఉన్నది అదే. ఈ “నేను” అనునది ఉండనిది ఎప్పుడు?

స్వీయస్ఫురణ! : జగత్తు = స్వకీయ స్ఫురణ!

ఓ చిదానంద స్వరూపిణీ! దృశ్యమానమై కనబడు ఈ జగత్తంతా "చిత్తము యొక్క స్వయంకృతమైన స్ఫురణ” మాత్రమే సుమా! కనుక ఈ కనబడే పర్వతములు, భూమి, నీవు, నేను - మొదలైన -

వస్తువులన్నీ సత్యములు ఏమాత్రం కావు. స్వకల్పనచే ఘనీభూతమైన ’దృష్టి’ కారణంగా ఇవన్నీ ఈ విధంగా జీవునకు తోచుచున్నాయి. సర్వము కల్పనతో కూడిన దృష్టి యొక్క పర్యవసానమే అయి

Page:444

ఉండగా, ఇక ఒక అణుస్వరూపమునందు ఒక మహాపర్వతము యొక్క ‘సత్త’ సిద్ధించుటలో ఆశ్చర్యం

ఏమి ఉంటుంది?

కాలము - కాలాతీతం! : ఆత్మ “క్షణము” లో కూడా ప్రకాశిస్తూనే, అదియే ’నిమిషము’ అని, ’కల్పము’ అని కూడా కల్పింపజేస్తోంది. ఉదాహరణకు, అనేకకోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ఒకానొక నగరం క్షణంలో మనస్సునందు భాసించుచున్నది కదా! ‘కల్పము’ - అంతటి కాలములోని క్రియలనన్నిటినీ ఈ ఆత్మ తనయందు ఒక్క నిమిషంలో ప్రతిభాసింపజేయగలదు. ఒక చిన్న - -

నిర్మలదర్పణం విశాలనగరమునను కూడా తనయందు ప్రతిబింబింపజేయకలదు. అట్లాగే, ఒక్క నిమిషములో “అనేక కల్పములు” కూడా సంభవమే. ఈ “నిమిషము - కల్పము” మొదలైనవన్నీ ఒకానొక మిథ్యాత్వమును ఆశ్రయించి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులోనే ఉండి ఉంటున్నాయి. ఇక అద్దాని యందు ‘ద్వైతము-ఏకత్వము’ ఈ రెండూ సంభవములే. మిథ్యాదృష్టికి ఏది ఏ రూపంగానైనా ప్రాప్తించగలదు. ఒకని ‘ఊహాకల్పన’ యందు ఏది ఎట్లైనా ఉండగలదు కదా! ఇందుకు మనకు దృష్టాంతము “స్వప్నభ్రమ”యే. ఎంతో కాలం ప్రయత్నించిన తరువాత కూడా సంభవించనిది, స్వప్నంలో క్షణకాలంలో సంభవిస్తోంది. హరిశ్చంద్రమహారాజుకు ఒక్క రాత్రియే పండ్రెండు సంవత్సరాలుగా తోచటం జరిగింది. దుఃఖంతో బాధింపబడేవానికి కొంచెము కాలము కూడా అత్యంత దీర్ఘంగా తోచుచున్నది. సుఖము అనుభవించువానికి దీర్ఘకాలం కూడా స్వల్పకాలము వలె గడచిపోతుంది. పాచికలాడేవారికి అనేక రోజులు ఇట్టే గడచిపోతున్నాయి. “కొద్ది సమయం దీర్ఘంగాను, భారంగాను ఉండటం, దీర్ఘకాలం త్వరత్వరగా గడచిపోవటం" అనే ఈ రెండూ విషయాలు మనలో ప్రతి ఒక్కరికీ ఈ లౌకిక జీవితంలో కూడా అనుభవమగుచున్నవే!

బంగారమునందు “ఈ ఈ ఆభరణములు వేరు వేరు” అని తోచుచున్నది కదా! అట్లే, చైతన్యమునందు కూడా ఈ సత్య-అసత్యముల రూపమున గల నిశ్చయమంతా ఏర్పడుతోంది. ఈ అనేక జీవుల రూపంతో, సత్యాసత్యములతో కూడినదై ప్రకాశించుట అద్దాని చమత్కారము మాత్రమే. ఓ చైతన్యస్వరూపీ! పరమార్థ దృష్టియందు “నిమిషము-కల్పము” గాని “దూరము-దగ్గర” గాని, లేనే లేవు. “చిత్ అణువు” నందే ఉండి ఉన్నట్టి చిత్తము యొక్క వృత్తులే భిన్నభిన్నములుగా కనిపిస్తున్న వివిధ రూపములతో కూడిన ఈ దృశ్యజగత్తుకు కారణమగుచున్నది. సర్వము దేనిచే అవధరించబడుతోందో…. అట్టి అధిష్ఠానమగు చైతన్యమునందు ‘ప్రకాశము - అంధకారము’, ‘దూరము - దగ్గర’, ‘జడము - చైతన్యము’ మొదలయినవన్నీ అభ్యాసపూర్వకంగా సంకల్పించబడి, అనుభవించబడుచున్నాయి.

ప్రత్యక్షం - - అప్రత్యక్షం! : సర్వేంద్రియములకు ’ఆత్మ’ యే శక్తిని ప్రసాదిస్తోంది. కనుక, అది సర్వదా (ఆధార-రూపంగా) ప్రత్యక్షము అయి ఉండనే ఉన్నది. అయితే అది ఇంద్రియాదులకు ఎదురుగా ప్రత్యక్షమై ఉండుటలేదు. కనుక “అది అప్రత్యక్షమైనది” అని అనటం కూడా సరియే. ఆ ఆత్మయే ఒక వైపు ద్రష్ట (Seer) అయి, సద్రూపమై, ఉండి ఉంటోంది. అదే సమయంలో

Page:445

మరొకవైపు దృశ్యమై ప్రకాశించుచు ప్రాప్తించుచున్నది. అయితే, “ఎదురుగా నిలచియున్నట్టి ఈ దృశ్యము సత్యమే” అను బుద్ధి ఉన్నంతవరకు “చిత్స్వరూపబుద్ధి” ఏర్పడుటలేదు. శిల్పమును చూచేవాడు ‘ఇది శిలయే’ అనే దృష్టి కలిగి ఉండడు కదా! ఆభరణమును చూచుచున్నప్పుడు “వీటి అన్నిటిలో ఉన్నది ఒకేరకమైన ‘బంగారము’ మాత్రమే” అనే విషయం ఏమరుపాటు పొందుతోంది. బంగారము అను దృష్టితో చూస్తే “అనేక ఆభరణములు" అను భావావేశం ఉండదు. ఈ దృశ్యమునకు సంబంధించిన సంకల్పములన్నీ క్షీణించటం జరిగినప్పుడు తనతో సహా ఈ కనబడే సర్వులయందు, సర్వమునందు ’శుద్ధబ్రహ్మము’ ఒక్కటే వ్యాప్తించియున్నట్లు సుదృఢంగా తెలియవచ్చుచున్నది.

సత్తు - - అసత్తు! : ఆత్మయే - - సర్వులయొక్క వాస్తవ స్వరూపమై ఉండి ఉండుటచే అది ‘సత్తు’. అయితే, అది ఒక బాహ్యవస్తువు కాకుండుటచే, అది దుర్లక్ష్యమైన “అసత్తు" కూడా! కథారచయిత నాటకంలోని సంఘటనలను రచిస్తూ, అతడు మాత్రం కథాగమనంలో (లేక) తెరపై అగుపించనట్లు, ఆత్మ ఇంద్రియములకు ఎదురుగా అగుపించకపోవటంచేత ‘అసత్తు’ కూడా అగుచున్నది.

అది ఎల్లప్పుడు చైతన్యరూపిణిగానే ఉన్నది. ఆత్మయందు ఈ విషయములు, అనుభవములు మొదలైనవన్నీ ఉండుట అసంభవం. ఎట్టి అనుభవములు, మార్పులు, చేర్పులు, దాని యందు ఉండవు. కనుక “ఆత్మ అచేతనమైనది” అని కూడా అంటున్నారు. ఇక ఈ జగత్ విషయం ఏమిటంటావా, ఇది చిత్ (Absolute Awareness) ‘ఎరుక కలిగియుండుట’ అను తత్వము యొక్క చమత్కారం మాత్రమే. చిత్ స్ఫురణమే దీని రూపము. అందుచేత, “జగత్తును చైతన్యమే నిర్మించు చున్నది” అనుట మాత్రం ఎట్లా? సూర్యకిరణములు "మృగతృష్ణయందలి జలం”గా కనిపిస్తున్నప్పుడు, “సూర్యకిరణాలు మమ్ము భ్రమింపజేయుటకే అట్టి పని నిర్వర్తిస్తున్నాయి” అని అనగలమా? సూర్య కిరణాలకు కర్తృత్వం ఆపాదించగలమా? లేదే! అసలు, మృగతృష్ణ కనబడటానికి కారణం ఏమిటి? 1) ద్రష్ట యందలి అజ్ఞాన దృష్టి

2) సూర్యకిరణముల స్వభావసిద్ధమైన ప్రసరణ

‘అద్వైతము - విశాల రూపము’ అయిన చిద్వస్తువే ఈ జగత్తురూపంగా ‘భావన’ చే పొందబడుచున్నది.

‘సూర్యగోళము’ అనగా ఏమిటి? ‘కిరణములు - - అగ్ని’ యొక్క సంయోగమే సూర్యగోళము రూపమున మనకు ప్రాప్తిస్తోంది కదా! ‘ప్రకాశము -కిరణములు’ కాకుండా సూర్యునకు వేరైన అస్థిత్వమెక్కడ? నాస్థిత్వమెక్కడ? ఈ “నిమిషము-కల్పము“ మొదలైన వాటితో కూడిన జగత్తు కూడా బ్రహ్మమునందు కల్పించబడినదై భాసించుచున్నది. సూర్యకిరణముల సంయోగం కారణంగా ఆకాశంలో వర్ణములు ఏర్పడినప్పుడు, అది చూస్తున్నవారిలో కొందరు అజ్ఞాన బాలురు “ఓహో! ఆకాశములోని ఈ ప్రదేశమును ఎవరో బంగారముతో పూతవేశారు” అనుకొంటారు. అజ్ఞానబాలురకు మాత్రమే అట్లు అనిపిస్తుంది కదా! అజ్ఞానికి మాత్రమే అవిద్య యొక్క ప్రభావం చేత ఈ జగత్తు ప్రత్యక్షమై ఎదురుగా నిలచుచున్నది. జ్ఞానికో ఇదంతా బ్రహ్మముగానే తెలియవచ్చుచున్నది.

Page:446

వాస్తవానికి బ్రహ్మమునందు (శుద్ధస్వస్వరూపమునందు) “చిత్ - ఎరుగునది, చేత్యము -ఎరుగ బడునది” అను భేదమే లేదని విజ్ఞులైనవారు గ్రహించుచున్నారు.

స్వప్నంలో కనబడే వస్తువులు, వ్యక్తులు సత్యమెట్లా అవుతాయి? అయితే స్వప్నద్రష్టకు మాత్రం ఆ స్వప్నసమయంలో అవన్నీ సత్యమే అయినట్లు అనుభవమౌతున్నాయి. అందుచేతనే ఆ నిదురించేవాడు భయాదులు ప్రదర్శిస్తూ గావుకేకలు వేయటం జరుగుతోంది. అతడు కలవరిస్తుంటాడు. స్వప్నములోని పదార్థములు సత్యములు గాని, అసత్యములు గాని కావు. కేవలం “స్వకీయ భ్రమ మాత్రము” అయి ఉన్నాయి కదా! అట్లే ఈ జగత్తుకూడా భ్రమమాత్రమేనని గ్రహించటం ఉచితం.

ఈ విధంగా, “ఈ జగత్తు మిథ్యయే” అని సూచించే యుక్తులను మరల మరల చింతిస్తూ ఉండాలి. ఇట్లు క్రమంగా అభ్యసిస్తూ రాగా… అట్టి “ముముక్షువు" యొక్క చిత్తము నిర్మలత్వం పొందుతూ ఉంటుంది. క్రమక్రమంగా ‘అవిద్య’ అంతా నశించిపోతుంది. అప్పుడిక శేషించునది చిదాకాశ సందర్శనానందం మాత్రమే. అట్టి చిదాకాశానందము ప్రాప్తించిన ఇక ఈ సంసారదుః ఖము మచ్చుకైనా మిగిలియుండదు.

గోడకు బహువిస్తారమైన ఆకాశమునకు భేదమంటూ ఏమీ లేదు. అయితే మరి ఈ కనబడేదంతా ఏమిటంటావా? భేదంగా కనిపించేదంతా కల్పితము మాత్రమే. బ్రహ్మదేవుని నుండి ఒక చిన్నపురుగు వరకు భిన్నభిన్న అనుభవరూపములుగా రూఢిపడి ఉన్నదంతా కల్పనను అనుసరించే ఏర్పడుచున్నది. అట్టి కల్పన ఆ ద్రష్టకు వేరైనది కాదు. కల్పించువాడు కాకుండా కల్పనకు వేరు అస్థిత్వమెక్కడ?

అపరిమితము సర్వాత్మకము! : సూర్యప్రకాశము ప్రసరించుచున్న చోట దర్పణమో, మణియో ఉంటే, అవి కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కదా! చిదాకాశము నందు చిత్ప్రకాశము చేతనే ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ’అద్వైతము, అపరిమితము’ అయినట్టి చిద్వస్తువే తన యొక్క చమత్కారముచే భిన్నత్వము కలుగజేయగల శక్తి కలదై, ఇట్లు ద్వైతముగా తోచుచున్నది. అట్లు ఏర్పడుచున్న ఈ ద్వైతమంతా కూడా సర్వమునకు అధిష్టానమైనట్టి బ్రహ్మము కంటే ఏమాత్రం ఏ క్షణంలోను భిన్నమైనది కాదు. బీజములో వృక్షము యొక్క తత్వమంతా (ఆకులు, పూవులు, కాయలు, కాండము, వ్రేళ్ళు మొదలైన స్వభావమంతా వ్యాపించియున్నట్లు పరమోత్తమమగు ఆత్మప్రకాశమే సర్వేసర్వత్ర సర్వాత్మకమై వ్యాపించియున్నది. ఒక బీజము తనయందు భిన్నాభిన్నరూపములైన వృక్షవిభాగ తత్వములను కలిగి ఉన్నట్లుగా, నిర్మలాకాశము వంటి బ్రహ్మమునందు అసంఖ్యాకములైన జగత్తులు విన్యాసము కలిగి ఉంటున్నాయి. “ఈ జగత్తు అనబడునది - అత్యంత సూక్ష్మమైనట్టి బ్రహ్మమునందు ఉన్నట్లు అనుభవమగుట అనిర్వచనీయం, అవిచారణ యొక్క ఫలితం" అని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు.

ఓ రాక్షసీ! ‘బ్రహ్మము’ ఒక్కటి మాత్రమే సర్వదా, సత్యమై వెలయుచున్నది. దానికి ఆది–మధ్య – అంతములు లేవు. అది పరమశాంతమై, జన్మాదివికారములు లేనట్టిదైయుండియున్నది. ఎవ్వరైతే

Page:447

ఈ మాయను, ఈ మాయ యొక్క కార్యములను రహితం చెయ్యగలుగుతారో - అట్టివారు మాత్రమే ఆ బ్రహ్మమును అనుభవపూర్వకంగా పొందగలుగుచున్నారు. మనమంతా ప్రయత్నించవలసినది అద్దాని కొరకే సుమా! అది ఏకరూపమని, గుణరహితమని, నిర్మలమని, అద్వైతరూపమని, నిరాటంకంగా అంతటా వ్యాపించియున్నదని – జ్ఞానులు ప్రవచించుచున్నారు. శుద్ధ మానసులమగు ఈ రాజుకు, నాకు కూడా అది అనుభవయోగ్యమగుచున్నది.

యథార్థానికి అద్దాని యందు “నేను - నీవు రాజు-మంత్రి-రాక్షసి" మొదలైన కల్పనలు ఏమాత్రం లేవు. ఆ బ్రహ్మమే నేను, నీవు, ఈ రాజు అయి ఉన్నాము.

ఓ ప్రియమైన రాక్షసీ ! నీ ప్రశ్నలు అత్యంత ఉత్తమ వస్తువునే సమాధానంగా సూచిస్తున్నాయి. జ్ఞానము కలిగినట్టి ఉత్తములు మాత్రమే అద్దాని విషయమై అట్లు ప్రశ్నించగలరు. ’పరమ విజ్ఞాన పరవశం’ చేతనే నీవు అంతటి ఉత్తమ ప్రశ్నలు వేయగలిగావు.

నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏకరీతిగా ఒక్కటే అయి ఉన్నది.

“అది నామరూపరహితము” : ముముక్షువులమగు మనం, మన సౌలభ్యం కొరకు అద్దానిని ‘బ్రహ్మము’ అంటున్నాం. అది "మనందరి యొక్క అద్వితీయమగు, సచ్చిదానంద విశేష పూరితమగు ఆత్మయే.”

కర్కటి : ఆహా! అమోఘం! ఓ మంత్రీ! నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఉత్తమమైన అర్థం కలిగియున్నది. ఈ జీవునికి, సర్వ దుఃఖములను నశింపజేయగల విషయమునే గుర్తు చేస్తున్నది. మిత్రమా! విక్రమమహారాజా! ఇప్పుడు మీ వాక్యామృతమును గ్రోలాలని నాకు ఉన్నది. నా ప్రశ్నలకు మీరు చెప్పాలని భావించినది నాపై ప్రేమచే చెప్పవలసినదని అర్థిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను.

  1. విక్రమరాజు సమాధానం - “ఆత్మ ఉన్నచోటు”

ఓ ఆత్మస్వరూపీ ! విను.

ఈ జీవునకు మూడు అవస్థలు ఉంటున్నాయి.

1) జాగ్రత్,

2) స్వప్నము,

3) సుషుప్తి

ఈ మూడు విధములైన అవస్థలందు ప్రాపంచికమైన వృత్తులను రహితం చేసివేయుటచేతనే “తురీయావస్థ” అనబడు ఆత్మస్థితి కలుగుచున్నది. సమస్త సంకల్పములు తొలగించబడినప్పుడే అట్టి ’ఆత్మనిష్ఠ’ ప్రాప్తించగలదు.

Page:448

ఎవని యొక్క సంకల్పమునకు సంబంధించిన సంకోచ వికాసములచే ఈ జగత్తు యొక్క సృష్టి ప్రళయాలు సంభవిస్తున్నాయో… అట్టి పరమాత్మ గురించి ఏమని చెప్పాలి? "ఆ చైతన్య భగవానుడు ‘వాక్’కు అతీతుడు” అని వేదాంత శాస్త్రముచే ప్రతిపాదించబడుచున్నది.

బ్రహ్మము సత్-అసత్తులకు, అనగా ఉండుట-లేకుండుట అనునట్టి వ్యవహారస్థితికి, శూన్య అశూన్యములకు విలక్షణమై, అనిర్వచనీయమై ఒప్పుచున్నది. ఈ దేశ కాల పరిచ్చేదముచే భాసించు చున్నదంతా అదే…! అయినప్పటికీ, అది దేశ కాలములు కలిగియున్నట్టిది కాదు. దాని యందు ఈ దేశ-కాలాదులు లేవు. ఈ చరాచర జగత్తు అంతా సమష్టి జీవస్వరూపుడగు ఆ హిరణ్యగర్భుని చిత్తము యొక్క లీల మాత్రమే! కనబడేదంతా సత్-అసత్ల, చిత్-జడముల సంధిరూపము మాత్రమే!

ఓ మంగళస్వరూపిణీ! ఈ విశ్వరూపమున భాసించుచున్ననూ ఏతత్త్వం యొక్క ఏకరూపత్వము నకు భంగం వాటిల్లదో అట్టి తత్త్వాన్ని శాస్త్రములు ‘బ్రహ్మము’ అని పిలుస్తున్నాయి. అట్టి పరబ్రహ్మము గురించే నీవు ప్రశ్నించావు.

‘చిత్’ అణువు వాయురూపానుభవం పొందితే, మరుక్షణం భ్రాంతిచే వాయువు యొక్క ప్రాప్తి సంభవిస్తోంది. అయితే, శుద్ధ చైతన్యమగు బ్రహ్మమునందు వాయురూపాదులు లేవు. అట్లే, అది శబ్దరూపమును భావించినప్పుడు భ్రాంతిచే ఏర్పడుచున్న భావనా మాత్రంచేత “శబ్దము”ను పొందుచున్నది. కాని ‘బ్రహ్మము’ అనబడునది సర్వశబ్దార్థముల కంటే వేరైనదిసుమా! ఈ విధంగా మాయతో కూడిన పరమాత్మయే సమస్తము అగుచున్నది. కాని శుద్ధరూపము దృష్ట్యా ఏదీ కాకుండానే

ఉంటోంది.

మట్టితో అనేక ఆకారములు చేసినప్పుడు, ఆ ఆకారములన్నీ మట్టియే. ఆకారాదులు ఎదురుగా కనబడుచున్నది నిజమే కావచ్చు. అయితే ఏం? మట్టి మట్టిగానే ఉండి ఉంటోంది కదా! ‘మట్టిముద్ద - మట్టిబొమ్మ’ అను మాటలు మనం చెప్పుకుంటున్నాం. వాటి యొక్క అర్థం ‘మట్టిచే ముద్ద - మట్టిచే బొమ్మ’ (తృతీయా విభక్తి) అని మాత్రమే. మట్టికి ఆకారమెక్కడిది? సర్వశక్తివంతమగు చైతన్యమే అహంకారాదులుగా కనబడుచున్నది. అయినప్పటికీ అది అహంకారాదులుగా మారుట లేదు సుమా! అది సర్వదా అహంకార రహితమగు శుద్ధ చైతన్యముగానే శేషించి ఉంటోంది.

అయితే, ఆత్మజ్ఞానం లభించటం కష్టసాధ్యమే అగుచున్నది. అనేక యత్నములచే మాత్రమే అది పొందబడుచున్నది. ‘ఆత్మజ్ఞానము’ అను లాభం పొందిన తరువాత, ఇక దానికి మించిన లాభం అంటూ ఏదీ ఉండదు. మూలఅజ్ఞానం (root cause of ignorance) తొలగనంతవరకు, ‘ఆత్మబోధ’ కలుగనంతవరకు ఈ సంసారము విజృంభిస్తూనే ఉంటుంది.

ఓ రాక్షసీ! నిరాకారమగు ఆత్మయే సాకారరూపము వహించి ఇట్లు దృశ్యముగా ప్రాప్తించు చున్నది. అనగా, ఈ జీవుడు తానే ఈ దృశ్యమై, తనయందు తానే ‘నిమగ్నుడు’ అగుచున్నాడు. కాని, అజ్ఞాన కారణంగా అతడు ఆ విషయము ఎరుగుటలేదు. ఎడారిలోని ఎండమావులలో జలము ఉన్నట్లే ఉంటుంది చూచావా? జీవుడు ఈ దృశ్యజగత్తును కల్పించుకొని అందు వస్తుజాలము కొరకు, విషయభోగములకొరకు తన దృష్టిని సారించుచున్నాడు. ఫలితంగా, తన స్వస్వరూపమును

Page:449

ఏమరచుచున్నాడు. అనగా, తన ఆత్మను తానే తిరస్కరించుచున్నాడు! చూచావా! సర్వజీవుల యొక్క స్వస్వరూపమే అయి ఉన్నట్టి ఆ చిత్ అణువే ఒకానొకప్పుడు ఈ ‘జగత్తు’ అనబడు దానిని వెలుపలకు ప్రవర్తిల్ల చేసి మాయారూపమున దానిని బాహ్యంలో గాంచుచున్నది. మరొకప్పుడు స్వస్వరూప జ్ఞానముచే త్రిలోకములను తృణప్రాయంగా దర్శించుచున్నది. ఈ చేతనాణువు తనయందు ఏదిభావిస్తూ ఉంటే, అట్లు భావించుచున్నదానినే బాహ్యమున గాంచుచున్నది సుమా!

కాముకుడు తాను సంకల్పించు స్త్రీని బాహ్యమున భావనామాత్రంగా గాంచి, ఆలింగనం చేసుకొంటాడు చూచావా! ఇది కూడా అట్టిదే. సర్వశక్తిమంతుడగు ఆ పరమాత్మ ఆదిసృష్టి యందు ఏ విధంగా వ్యక్తమౌతాడో ఆ విధంగానే తన సంకల్పము నందు అతిశీఘ్రంగా సర్వమును పొందుచున్నాడు. నామరూపరహితుడగు ఆ ప్రత్యగాత్మయే మొట్టమొదట “సమష్టిసృష్టి నాచే దర్శించబడు గాక” అనబడు కర్త ృత్వము వహించుచున్నప్పుడు అదియే “సృష్ట్యాది”గా ప్రాప్తిస్తున్నది. ప్రత్యగాత్మ బాహ్య జగత్తును ఇచ్ఛచే దర్శించటమే సృష్ట్యాది. అట్టి “ప్రథమ సృష్టి" అను కర్త ృత్వమునకు “హిరణ్యగర్భుడు” అను పేరు శాస్త్రములు ఇచ్చాయి. ఒక దృష్టాంతము విను. ఒక బాలుడు ఏ వస్తువునైతే ఎట్లు “ఇది నాకు ప్రియము” లేక “ఇది నాకు అప్రియము” అను రీతిగా (అట్టి దృష్టిచే) గాంచుచున్నాడో . ఆయా ఆట వస్తువులు మొదలైనవి అట్లే ప్రాప్తిస్తూ ఉంటున్నాయి కదా! అదే విధంగా చైతన్యము విషయంలో కూడా జరుగుతోంది. అనగా…… మనోరూపముతో వ్యక్తమైన పరమాత్మ యందు ఏయే పదార్థములు ఏఏవిధంగా భావనాపూర్వకంగా భాసించుచున్నాయో చైతన్యము అద్దానిని అట్లే గాంచుచున్నది. ఆ ‘చిత్ అణువే’ దేశ కాల వస్తు రూపమున అంతటా నిండి యున్నది. ఈ “నేనూ-నీవు ఈ మంత్రి ఈ సర్వ సృష్టి స్థితిలయ సమన్వితమైన జగత్తు” . ఇదంతా చిత్ పరమాణువు యొక్క రూపమే.

ఈ జీవుని యొక్క వాస్తవరూపమే అయిఉన్న ఆ చిద్వస్తువు సర్వగామి (All pervading), అనాది (ఆది లేనిది) కూడా! ఆ పరమాత్మ అనబడుచున్నదానికి ‘ఆకారము’ అంటూ లేదు. ఆకారమే లేని దానికి పరిమితి ఏమి ఉంటుంది. అందుచేత, అనంతవిస్తీర్ణంగా వ్యాపించియున్నది. అనంతమైన వస్తువులు రెండు ఎట్లా ఉంటాయి? రెండవది ఉంటే అది మొదటి దాని యొక్క ‘అంతము’ నిర్దేశిస్తున్నట్లే అవుతుంది కదా! అందుచేత అద్దానికి రెండవది అనునది లేదు. ఇందుకే జ్ఞానులు “అది అద్వితీయము” అని చెప్పుచున్నారు. అయ్యది అప్రమేయము కూడా (It is not

related to anything).

కలిగియుండటం - ప్రకాశింపజేయటం! : ఇక ఈ కనబడే జగదృశ్యము విషయానికి వస్తే, ఇదంతా అత్యంత చమత్కారమైనదనే చెప్పాలి. ఎందుకంటావా? ఒక కాముకుడు, ధూర్తుడు అయినవాడు “కళ్ళు కదల్చుట" మొదలైన ఆయాచేష్టలచే అమాయకురాళ్ళైన స్త్రీలను వశపరచుకొంటూ

* ఒకపరి జగములు వెలినిడి యొకపరి లోపలికి గొనుచుఁ నుభయముఁదానై

సకలార్థసాక్షియగున య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్. అని అనుటలో భావం ఇదే! భాగవతము - గజేంద్ర మోక్షము 8.34

Page:450

ఉంటాడుకదా! ఈ జగత్తు కూడా పర్వతములు, తృణములు మొదలైన అనేక పదార్థములతోను, చేష్టలతోను, సంఘటనలతోను కూడుకొనియుంటున్నది. అట్టి ఈ జగత్తు శుద్ధచిత్ ప్రకాశమును తనవశము ఒనర్చుకొని, నాట్యం ఆడించుచున్నది. ఇదంతా ‘చమత్కారం’ కాక మరింకేమనాలి? అయితే చేతనారూపమగు ఆ ఆత్మవస్తువే స్వయముగా బాహ్యజగత్తును గాంచుచున్నది. ద్రష్ట ఉంటేనే కదా, దృశ్యము! ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించే దృశ్యము ఉంటోంది. ఏది ఏమైతేనేం? "ఈ బాహ్యమునందు చూడబడుచున్న జగత్తు అంతా ఆ చిద్వస్తువు ఆ విధంగా తనయందే అట్లు కలిగియున్నది” అని జ్ఞానులు గమనించుచున్నారు. ద్రష్టయొక్క స్వస్వరూపమగు ఆత్మయే ఈ జగత్తును కలిగియుండి, దీనిని పరివేష్టించుచు, ప్రకాశింపజేయుచున్నది.

పరిచ్ఛేదరహితం - - దృష్టాంతములకు అతీతం! : ఒక వెంట్రుకలోని చిట్టచివరి భాగపు అణువులోని లక్షవ భాగంకంటే కూడా అత్యంత సూక్ష్మాతిసూక్ష్మమైయున్న ఆ ఆత్మ వస్తువు ’దేశ కాలవస్తు పరిచ్ఛేదము లేనిదే’ అయి ఉన్నది. అందుచేత అది “అస్థూలము” అనబడుతోంది. దానిని మాటలలో ప్రకటించలేము. అయితే, ఏవో కొన్ని దృష్టాంతముల ద్వారా ఆ ఆత్మ వస్తువు గురించి మనం చెప్పుకుంటున్నాం. శుద్ధజ్ఞానమే స్వరూపముగా కలిగియున్నట్టి ఆ ‘ఆత్మచైతన్యము’ ఎట్టి సామ్యము (Example) తోకూడా నిరూపించలేం. వాక్కుచేత గాని, ఆయా శబ్దములచేతగాని, ఇంద్రియములచేతగాని చెప్పుటకు అలవికాదు. అది అనుభవమాత్రమై యున్నది. ఒక పెద్ద కొండ - - ఒక పరమాణువు…. ఈ రెండింటి నిర్మాణమును పోల్చడం ఎట్లా?

మాయతో కూడుకొని ఉన్నప్పటికీ ‘చిద్వస్తువు’ నందు అణుత్వములేదు. పోనీ “బంగారము ఆభరణము” లను దృష్టాంతముగా తీసుకొందామా అంటే… ఆత్మ ఎట్టి వేరైన ఆకారములను కూడా పొందుట లేదు. అది నిర్లిప్తము, సంకల్పముల కంటే కూడా మునుముందే ఉండి ఉన్నది. సర్వమునకు ఆధారమైయున్నది. ఏకత్వ - అనేకత్వములకు ఏమాత్రం సంబంధించినది కాదు. ఏ వస్తువూ అది కాదు. అట్టి ఆ ఆత్మ వస్తువును ఆయా దృష్టాంతములతో ఎట్లా ప్రకటించగలం? ‘అణుత్వము - - మహాత్వము’ ఇత్యాది మాటలన్నీ పరమాత్మ యందు కల్పిత వచనాలే అవుతున్నాయి. నీ యొక్క నా యొక్క అట్లే భూత - - భవిష్యత్తులలోని ప్రతి ద్రష్టయొక్క జడ-చైతన్యముతో కూడిన సత్స్వరూపము ఆ పరమాత్మయే. ద్రష్టత్వమునకు ఆవల ఉన్నట్టి ద్రష్టయొక్క స్వరూపమే ఆత్మయొక్క స్వరూపము. అంతేకాని, ఆత్మ అనగా ఎక్కడో ఉన్నట్టిది కాదు. మరెప్పటికో లభించనున్నది కాదు.

అన్ని అనుభవములకు మూలకారణం!: ప్రకాశము, అంధకారము - రెండూనూ చైతన్యము నందే వెలయుచున్నవి. అందే కల్పితమైయున్నవి. అనుభవ రూపమైయున్నట్టి ‘ఆత్మ’ అనబడు దీప ప్రకాశమే లేకపోతే, ఇక ఈ జీవులకు ప్రకాశము - అంధకారముల అనుభవమే ఎన్నడూ కలిగేది కాదు. వారియందు సద్వస్తువు లేకపోతే అసత్ వస్తువుల దర్శనం సాధ్యపడేది కాదు. సూర్యుడు మొదలైన అనేక పదార్థములు కలిగియున్న ఈ జగత్తంతా జడమే అయి ఉన్నది కదా! దానిని ప్రకాశింపజేయుచు, అనుభవము పొందగల చైతన్యమే లేకుంటే, ఈ జగత్తును అనుభవించేదెవరు?

Page:451

కాబట్టి “ఆత్మచైతన్యము–అనబడునదేదీ లేదు. అనుభవములు మాత్రం ఉన్నాయి”—అనునది అత్యంత అసంగతమైన మాట.

శుద్ధజ్ఞాన స్వరూపమగు ఆ చైతన్యము తన రూపములే అయి ఉన్న ఈ ప్రకాశము అంధకారములను తనయందు కల్పన చేసుకొనుచున్నది. ఆ చైతన్యమే ఈ ఎదురుగాగల జగత్తు తనకు బాహ్యమునందు ఉన్నదానివలె భావావేశము పొందుచున్నది.

ఓ విజ్ఞాన స్వరూపీ! ప్రియ రాక్షసీ! నీచే గాంచబడుచున్న ఈ ‘జగత్తు’ అనబడునదంతా నీ చేతనే కల్పించబడినదై, అనుభవించబడుచున్నదని గ్రహించు.

దృష్టాంతానికి, “సూర్య-చంద్ర-అగ్ని" ల ప్రకాశమే తీసుకొందాం. అవి జడ రూపమగు ‘తమోఘనము’ కంటే వేరే ఏమీ కాదు. ఎట్లా అంటావా? ప్రకాశము యొక్క వర్ణము తెలుపు. అంధకారము యొక్క వర్ణము ‘నలుపు’. వెలుతురు లేకపోవటమే చీకటి. వెలుతురు ఉండటమే చీకటి యొక్క లేమి. జడత్వదృష్టితో చూస్తే … రెండూ జడమే. “ఆ రెండిటినీ ’ఇది వెలుతురు - ఇది -

చీకటి’ అని గ్రహించుచున్నట్టి ‘స్వసత్త’ రూపమగు చైతన్యమే బ్రహ్మము" అని గ్రహించు. ఏ చైతన్యమైతే సూర్యగోళముచే జనింపచేయబడుచున్న ప్రకాశమును, అంధకారమును గ్రహిస్తోందో అట్టి చైతన్యము నుండి ప్రకటితమగు సత్త సర్వవేళల ఒకే రీతిగా ఉంటోంది.

ఆత్మయొక్క ప్రవృత్తియే ఈ జగత్తు! : ఈ కనబడే భౌతికమైన సూర్యుని ప్రకాశమునకు ఆత్మ యొక్క ప్రకాశమునకు ఏమాత్రం పోలిక చెప్పజాలము. సూర్యుని ప్రకాశము కొన్ని ప్రదేశములలో కొన్ని సమయములలో ప్రసరించుచున్నది. అయ్యది వాస్తవానికి ఆత్మ యొక్క అనుభవ - భావనల చేతనే అస్థిత్వము పొంది ఉంటోంది. కాని, ఆ చైతన్య-సూర్యుడు రాత్రింబవళ్ళు యెడతెగకుండా బాహ్యాభ్యంతరములందు, శిలయందు, జీవపదార్థములన్నిటియందు, జడములందు, ప్రకాశించు చున్నది. అద్దానియందు తమస్సునకు చోటే లేదు. ఆత్మసాక్షాత్కారము పొందినట్టి జ్ఞానులకు ఈ వివిధ భోగములతో కూడిన జగత్తు అంతా, ‘ఆత్మయందు ఆత్మగానే’ తెలియవచ్చుచున్నది. ‘త్రిలోకములు’ అని చెప్పబడుచున్న వాటితోసహా ఈ సర్వమూ ఆత్మతేజము చేతనే ప్రకాశించుచున్నాయి. చైతన్యమే ఈ జగత్తును నశింపచేయనీయకుండా ఇట్లు కార్య కారణరూపమున (As effect & cause) తనయందు ప్రవృత్తి కలిగియుండుట ద్వారా ప్రకటించుచున్నది.

సర్వ అనుభవములు ఏర్పడుచున్నది అద్దానియందే!

“తమస్సు” లేక “అజ్ఞానము” (Ignorance) ఈ జగదనుభవం రూపమున ప్రకాశితమై యున్నదని విజ్ఞులు ఎరిగియే ఉంటున్నారు.

’ఏకైక చిద్వస్తువే ప్రకాశము యొక్క - అంధకారము యొక్క రెండింటి ’సత్త’ను వ్యక్తపరచుచున్నది” అని సూక్ష్మబుద్ధికి తప్పక తెలియవచ్చుచున్నది. సత్తుకు అసత్తుకు కూడా ‘సత్త’ ను కలుగజేయునది ఆ చిద్వస్తువే. అద్దానియందే సర్వ అనుభవములు స్థితి కలిగియున్నాయి. ఆ చిత్సత్త అత్యంత

Page:452

సూక్ష్మమైనది అవటంచేత “అనాస్వాదువు - ఏమియు అనుభవించనట్టిది” వలె కనిపించినప్పటికీ, సర్వరుచులకు హేతువు అదే.

చైతన్యము సర్వవేళలందును సర్వజనులచే అనుభవరూపమున అస్వాదింపబడుచునే ఉన్నది సుమా! కనుక మేము చెప్పు ఆ చిద్వస్తువు ప్రతిఒక్కరికి అత్యంత సమీపమునందే ఉండియున్నది. వివిధ జలములలోని రసరూపమున ఉన్నది ఆ చైతన్యమే. చైతన్యమే లేక పోతే, రసమే సిద్ధించేది కాదు.

సర్వతత్త్వాత్మకం = - సర్వతత్త్వవిదూరం! : ఆ పరమాత్మ ’శుద్ధ చైతన్యస్వరూపుడు’ అయిఉండుటచేత, అతడు వ్యక్తము కాకుండానే ఉండి ఉంటున్నాడు. అందుచేత “అతడు సర్వము త్యజించివేసియున్నాడా?” అని అనిపిస్తోంది. కాని స్ఫురణ మరియు జ్ఞాపకము రూపమున సర్వజగత్తుకు ఆశ్రయమైనవాడు అతడే.

చేతనారూపమగు ఆ పరబ్రహ్మము సర్వవ్యాపకము. సర్వము తానే అయి ఉన్నది. "అది మరియొక దానిని అచ్ఛాదిస్తోంది” అనుట సమంజసం కాదు. అది తనను తానే ఎట్లా ఆచ్ఛాదించుకో గలుగుతుంది? కాని అదియే విస్తరించి సర్వమును కప్పివేయుచు, సర్వము తనయందే ధరించు చున్నది. పచ్చగడ్డి మొక్కల సమూహము మధ్యలో ఉన్న ఏనుగు తననుతానే కనబడకుండా ఆ పచ్చగడ్డి మొలకల మధ్యలో దాగుకోగలదా? ఆకాశమువలె విశాలమైన ఆకృతిగల పరమాత్మ తనను తాను దేనితో కప్పుకోగలడు?

అందరియందు ప్రదర్శితమై ఉంటున్నది అతడే! : అందరియందు ప్రదర్శితమగుచున్నదంతా అతడే. అతడు ఈ విశ్వమంతా వ్యాపించియుండి, క్షణక్షణం ఈ జగత్తంతా రక్షించుచున్నాడు. ఈ విధంగా తననుతానే ఆచ్చాదించుకొనజాలక, జగత్తునంతా ఆచ్ఛాదించుట మాయయొక్క విచిత్రశక్తి మాత్రమే.

చేతనమును ఆశ్రయించి ఉండుటచేతనే ఈ జగత్తు ప్రళయమునందు లీనమై సంస్కారరూపమున దాగి ఉంది. మరల ఉత్పన్నమగుచున్నది. వికాసము పొందుట జరుగుతోంది.

ఓ రాక్షసేశ్వరీ! ఈ విశ్వమంతా వాస్తవానికి ‘ఎరుగుట’ అను చమత్కారము యొక్క రూపం మాత్రమే. అందుచేతనే శాస్త్రములు “జగత్తు యొక్క వాస్తవరూపము చిన్మాత్రమే” అని నిర్ణయం చేస్తున్నాయి.

ఆ చిన్మాత్రమునకు కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు లేవు. కాని, సర్వప్రాణుల అంతరాత్మ అదేకదా! ఈ అనేక హస్తములు, పాదములు, నేత్రములు కలిగియున్నది అదియే. ఒక బాలుడు తన స్వప్నంలో "నేను ముసలివాడను అయ్యాను” అని కల కనటం జరిగినట్లు ఈ చేతనవస్తువు నందు ఒక్క నిమిషము అనేక కల్పములవలె తోచుచున్నది.

Page:453

చేతన సత్త యొక్క స్ఫురణయే ’కల్పాది’ రూపమును ధరించి శోభించుచున్నది. అనగా, “ఈ ‘బాహ్యజగత్తు’ అనబడు అనుభవము పొందెదనుగాక” అను కల్పనను ఆశ్రయించుటయే ’కల్పాది’ గా చెప్పబడుచున్నది.

ఒకడు తాను భుజించక పోయినప్పటికీ, తన స్వప్నమునందు, “నేను ఇప్పుడు భుజించుచున్నాను. తృప్తిగా త్రేన్చుచున్నాను” అను రూపముగల అనుభూతిని పొందుచున్నాడు కదా! ఆ స్వప్నానుభవ మంతా అంతరంగమునందే ఉండి ఉన్నట్లు బ్రహ్మమునందే ఈ మిథ్యానుభవము కలుగజేయగలుగు చున్న చిత్తవృత్తులు ఆయా వాసనలతో గూడి, ఆవృతమై ఉన్నాయి. అయినప్పటికీ బ్రహ్మము జగత్ రహితముగానే ఉండి ఉంటోంది.

అట్టి చైతన్యాణువునందే ఈ జగత్తులన్నీ ఉండిఉంటాయని అనుకొన్నాము కదా! జగత్తునందలి స్ఫురణలన్నీ కలుగుచున్నది ఆ చైతన్యాణువునుండే. స్తంభములో చెక్కబడిన స్త్రీరూపము స్థంభముయొక్క రూపమే అయినట్లు, ఈ జగత్తు బ్రహ్మముయొక్క స్వరూప స్వభావములకు వేరైనది కాదు. అయితే, ఏ పదార్థము ఎచ్చట ఉనికి కలిగి ఉంటుందో, అది అచ్చటనే ఉత్పన్నమౌతుంది. ఏది ఎక్కడ ఉండ జాలదో, అది అచట ఉత్పన్నమే అగుట జరుగదు. సర్వదా కారణరహితమే అయిఉన్న చిదాకాశము నందు ఏదీకూడా ఎన్నటికీ ఉత్పన్నము కాకయే ఉన్నదని జ్ఞానుల అవగాహన.

కాలము మొదలగు వాటిచే తాకజాలనిది : ఆహాఁ! ఆ చైతన్యము నందే భూత భవిష్యత్ -వర్తమానకాలమునందలి ఈ జగత్తులు, ఇందలి ప్రాణసమూహములు, వాటివాటి అనేక చిత్ర విచిత్రములైన అనుభవములు ఉండి ఉంటున్నాయి. నిమిషము, కల్పము కూడా చిద్వస్తువు చేతనే ఆవృతమై ఉన్నాయి. అయినా, మిత్రమా! ఒక నిమిషమునకు, ఒక కల్పమునకు తేడా ఏమిటో చెప్పు? విషయానుభవములే కదా! విషయరూపములే అయిఉన్న ఆ రెండింటినీ కూడా ఈ చైతన్యము తనయందు ఏకంచేసివేయగలుగుచున్నది. చైతన్యమే జగత్తుకంతటికీ ఆత్మ. అది ఏ సమయమందు కూడా, ఎట్టి కర్తృత్వ - భోక్తృత్వములచేతనూ స్పృశింపబడకుండానే ఉంటోంది. కేవలం ఉదాసీనంగా, మౌనంగా, ప్రశాంతంగా, నిర్లిప్తంగా, పూర్ణంగా ఉండి ఉంటోంది. ఈ విషయం జ్ఞాన-విజ్ఞాన పూర్వకముగా గ్రహించువారు సర్వదుఃఖములనుండి సహజంగానే విడివడు చున్నారు. అట్టి ఆత్మనుండే స్వభావసిద్ధంగా నీటినుండి కెరటములవలె - జగత్సత్త ఉదయిస్తోంది. ఇక ఈ భేదకల్పన, ఈ కర్తృత్వ, భోక్తృత్వ భావనలు, ఈ సుఖ-దుఃఖములు, ఈ “నేను-నాది-మేముమాది-మీరు-వారు” అను రూపంగల ఖండభావనలు…. వీటి విషయమేమిటంటావా? ఇదంతా అవిచారణచే స్వప్నమందువలె ఏర్పడుచున్న మాయయే సుమా!

ఇంకొక చమత్కారం చెపుతాను విను. ఈ ‘జగత్తు’ అనబడుదానిని ఎవ్వడు, ఏనాడు సృష్టించియుండలేదు. అట్లే ఏకాలమందు, ఎవ్వరు దీనిని లయం ఒనర్చుట లేదు. “సృష్టి - లయములు” అనబడునవి కెరటత్వము - జలత్వములవలె అంతా కల్పితములు మాత్రమే.

సృష్టి :“నేను-నీవు-అది-వస్తుజాలము - ఇంద్రియానుభవములతో కూడిన బాహ్యజగత్తు మొదలుగాగల “ద్వితీయానుభవము” యొక్క ప్రారంభము.

Page:454

లయము :“నేను - తదితరము” అంతయు ఏకమే అయిఉన్నది - అను “అద్వితీయానుభవస్థితి”. ఈ రెండు అనుభవస్థితులందును ప్రశాంతస్వరూపుడగు ప్రత్యగాత్మ యథాతథంగానే ఉండి ఉంటున్నాడు. కాని ఆయాభావనలను ఆయారూపములైన అనుభవములుగా పొందుచున్నాడు. భావనామాత్రంచేత ఏర్పడుచున్నదంతా ‘మాయ’ (యామా-ఏదైతేలేదో) అను శబ్దముచే శాస్త్రకారులు ప్రతిపాదిస్తున్నారు. వేదాంతవాక్యములు (“ఏకమేవాద్వితీయం బ్రహ్మ” మొదలైనవి) - “ఈ దృశ్యము లేదు. ఈ దృశ్యమునకు అధిష్ఠానమై యున్న పరమాత్మ మాత్రమే కలడు. ఈ దృశ్యము అధిగమించ బడుగాక! పరమాత్మయే పొందబడుగాక!" - అని పలుకుచున్నాయి. పరమార్థదృష్టిని ఆశ్రయించ వలసినదిగా మనముందు ప్రతిపాదిస్తున్నాయి. కనుక, జన్మ - మృత్యువులతో కూడిన ఈ కనబడు ‘జగత్తు’ అనబడునదంతా మాయాపరికల్పితమే అయికూడా, ‘ఇది వాస్తవము’ అనురూపముగల అనుభవమును ఎందుకో ఈ జీవుడు పొందుచున్నాడు.

భావాత్మకమే అయి ఉన్న ఈ దృశ్యము స్వతహాగాలేదు. కాని స్వప్నంలో వస్తుజాలమంతా దర్శనమిచ్చుచున్నట్లు, ఇంద్రియబుద్ధికి ఇక్కడ ఎంతయో నామరూపాత్మకమైన వ్యవహారం ఘనీభూతమై గోచరిస్తోంది. ఇది ‘వాక్కు’ నకు అవిషయమై, వికారవంతమై, అనిర్వచనీయమై యున్నదని పరిశీలనాత్మక దృష్టికి (ఆత్మ బుద్ధికి) సుస్పష్టంగా తెలియవస్తోంది. వాస్తవానికి, ఈ ’జగత్తు’ గా కనబడుచున్నదంతా “సమము, స్ఫురణరూపము” - అయిఉన్న చిదాకాశమేకాని, మరింకేమీ కాదు. చిత్వస్తువే, తనయందలి మాయావిశిష్టమగు ‘చైతన్యరూపచమత్కారం’ చేత, దృశ్యమును సిద్ధింపచేసుకోవటానికి బాహ్యప్రపంచ రూపము ధరిస్తోంది. ఆ చిద్వస్తువే ’ద్రష్ట’ యొక్క శుద్ధ స్వరూపము. అనగా, ద్రష్ట అయినట్టి ఆత్మ నేత్రములద్వారా బాహ్యావలోకనం చేస్తోంది. అయితే, అట్లు బాహ్యముగా చూడబడేదంతా ‘వేరు’ అయిన దృశ్యముగాని, వస్తువుగాని కాదు. ఎందుచేత నంటావా? బాహ్యమున-అంతరమున కూడా సర్వదా ప్రకాశించుచున్నది - నిత్యానిత్యము, సత్ స్వరూపము అగు ‘ఆత్మ’ యేకాని, మరింకేదీ కాదు. ఈ ఆత్మ - తానే అయిఉన్న సత్యవస్తువగు చైతన్యమును “ఇది బాహ్యము” అని భావన చేసి, ఆపై “ఇది కుండ-ఇది వస్త్రము” మొదలగు ఆయా పదార్థములుగా గాంచుచున్నది.

ఒకానొకప్పుడు ఆత్మయే స్వస్వరూపముగా గల ఈ ద్రష్ట “ఇది బాహ్యము -ఇవి బాహ్యవస్తువులు” అను భావావేశమును కించిత్ త్యజించి, కాకతాళీయంగా “ఇది ఇట్లేనా?” అని చింతించుచున్నాడు. విమర్శించుచున్నాడు. ‘ధ్యానము, యోగము, గురువాక్యమననము, స్వవిచారణ’ మొదలైనవి ఆశ్రయించి తన బుద్ధిని శుద్ధిచేసుకొంటున్నాడు. ఈ మనస్సు “ఆహాఁ! నాకు ఈ శరీరముయొక్క ధర్మములు గాని, ’ద్రష్ట’ యొక్క ధర్మములుగాని లేనేలేవు. లోన, బయట సర్వదా శాశ్వతమై, అఖండమై ప్రసరించియున్నది, ప్రసరించుచున్నది నేనే. అందుచేత శాస్త్రములచే చెప్పబడిన ఆత్మయొక్క స్వరూప స్వభావములన్నీ నాయొక్క స్వరూప స్వభావములే అయి ఉన్నాయి” అనునట్టి ఒకానొక

Page:455

ఎరుకను సంతరించుకొంటోంది. “నేను అనామయమగు ఆత్మనే" అను జ్ఞానము ప్రాప్తించినప్పుడు, సర్వదా ఏర్పడియున్న సత్యమే తెలుసుకొనబడుచున్నది కాని, నూతనమైనదేదీ వచ్చిచేరుట లేదు

సుమా!

"అవును నాకు జన్మ-కర్మలుగాని, బంధ-మోక్షములుగాని లేవు. ‘త్రిజగత్తులు’ అనబడునవే లేవు.”అని ఆత్మచే గ్రహించబడుతోంది. అప్పుడు అయ్యది తన విశుద్ధత్వమును పునః స్వీకరించుచున్నది. ఇంతమాత్రమే బంధ-మోక్షములు అయివున్నాయి.

ఆత్మయందే అంతర్భూతమైయున్న ఈ దృశ్యజగత్తు గురించి ఆయా విధి విధానములు, చర్చలు, సిద్ధాంతములు, శబ్దజాలము, నిర్వచనములు - ఇవన్నీ కూడా వేరువేరు ’అవగాహన - సంస్కారము’లతో కూడియున్న ఆయా జీవులకు ఉపదేశించడానికే గురువులచే కల్పించబడుచున్నాయి.

ద్రష్టయొక్క దృష్టియే - ఈ దృశ్యము : ఓ ప్రియరాక్షసీ! మరొకసారి ప్రకటిస్తున్నాను. విను. ‘ద్రష్ట’ అయిఉన్న ఆత్మయే, బాహ్యవిషయముల దృష్టిని పెంపొందించుకొని తదనుకూల భావనాబలం చేత, ఆయా బాహ్యపదార్థములు తానే అగుచు, ‘అసత్తే’ అయిఉన్న ‘జగత్తు’ అనబడు దానిని గాంచుచున్నది. అంటే, దీని అర్థం ఏమిటి? నిన్ను నీవే “బాహ్యమందు జగత్తు” గా గాంచుచున్నావు. ఇంతలోనే, మరొకప్పుడు, ఈ విషయమును అనుభవపూర్వకంగా గ్రహించి, మోక్షస్వరూపిణివి అగుచున్నావు.

అయితే, పరమార్థ దృష్టితో అదంతా గమనిస్తేనో? “శుద్ధచైతన్య స్వరూపుడు” అయినట్టి ద్రష్ట దృశ్య రూపమును పొందజాలడు. అతడు అన్ని వేళలు సర్వదృశ్యములకు అతీతుడై వెలయుచునే ఉన్నాడు. దృష్టత్వమునకు కూడా అతడు “కేవలసాక్షి”. కనుక, “అజ్ఞానము-అవిచారణ” లే ఈ ‘జగత్తు’ అనబడు అనుభవమునకు అసలైన కారణములు. నీవు సర్వదా ఆత్మస్వరూపమే!

విచారించినప్పుడు “లేదు” అని తెలియవచ్చుచున్న ఈ జగత్తుకు, “ఇది ఇప్పుడు పుట్టినది. ఇన్నాళ్ళు ఉంటుంది. ఇట్లు కరిగిపోవుచున్నది" అనబడు కాలనియతి మాత్రం ఎక్కడో చెప్పు?

“నేత్రములు” అంటే ఏమిటి? దృక్ శక్తియే కదా! ‘ప్రత్యక్షము’ గాని, పరోక్షముగాని కానిదై (అపరోక్షమై), నిత్యమైయున్నట్టి చైతన్యమే దృక్ శక్తిగా ప్రకటితం అవుతోంది. అట్టి దృక్ శక్తినే ‘నేత్రము’ అని పిలుస్తున్నాం. అంతేకాని, జడమాత్రమైన ఈ ‘కంటి గ్రుడ్డు’ ను కాదు. అట్టి దృక్ శక్తియే వాసనారూపమైనట్టి దృశ్యమును రచించి, అట్లు రచించబడుచున్నదానికి ద్రష్టత్వము వహించు చున్నదని సూక్ష్మగ్రాహ్యులు గ్రహించుచున్నారు. తండ్రిలేనిచోట పుత్రుడు ఉంటాడా? సూక్ష్మ దృష్టితో చూస్తే - ఏకత్వము లేనిచోట అనేకత్వముకూడా ఉండదు. ’ద్రష్ట’ యొక్క సత్తయే లేకపోతే, ఇక దృశ్యము యొక్క సత్త మాత్రం ఎక్కడ ఉంటుంది? ఈ ‘దృశ్యము’ అనబడేది ఎట్లు, ఎవరికి స్వయంగా సిద్ధించగలదు చెప్పు? కనుక ‘దృశ్యము’ అనునది ద్రష్టను అనుసరించే ఉంటోంది. ద్రష్టయొక్క నిర్వచనములే దృశ్యము.

Page:456

ద్రద్దైవ దృశ్యతామేతి నద్రష్టృత్వంవినా అస్తి తత్ వినా పిత్రేన తనయో, వినా భోక్తేన భోగ్యతా III (సర్గ 81, శ్లో. 65) తండ్రిలేకుంటే కొడుకేమిటి? ‘భోక్త’ లేకుంటే భోగ్యవస్తువుయొక్క ఉనికి ఎక్కడ?

ద్రష్టయగు ఆత్మయే దృశ్యభావమును పొందుచున్నది. అట్టి భావనను అనుసరించే దర్శనం కూడా ఉంటోంది. అందుచేత, ఈ దృశ్యము - “భావనాస్వరూపము, స్వసంకల్పమాత్రము, స్వప్న దర్శనము వంటిది" - - అని అంగీకరించక తప్పదు.

ఎక్కడ ‘ద్రష్ట’ భావము (A feeling that ‘I am perceiver’) ఉన్నదో, అక్కడ మాత్రమే దృశ్యము సిద్ధిస్తోంది. ఎవ్వడైతే “నేను ద్రష్టత్వమునకు కూడా అతీతమైనవాడను. సత్యస్వరూపమగు పరిశుద్ధ చైతన్యమును. నాకు దృశ్యముగాని, జన్మాదులుగాని లేవు“ అను దృఢభావనయందు సుస్థిరుడై ఉంటాడో, అట్టివానికి ఈ దృశ్యములేదు, జన్మలులేవు, మృత్యువులేదు, జగత్తులేదు. “నా స్వస్వరూపము నకు జన్మమృత్యువులు లేవు” అను రూపముగల దృఢమైన ఎరుకయే “జన్మరాహిత్యము” గా చెప్ప బడుచున్నది. ఇప్పుడు చెప్పు! “నేను ద్రష్టను కూడా కాదు ద్రష్టత్వమునకు మునుముందే ఉండిఉన్నట్టి కేవలసాక్షి స్వరూపస్వభావుడను” అని ఇంతమాత్రం భావించుటలో కష్టమేమి ఉన్నది? బంగారము అనేక ఆభరణములుగా ప్రదర్శితమగుటకు సామర్ధ్యము కలిగియున్నది కదా! అట్లే ఈ ద్రష్ట కూడా, తాను చైతన్యస్వరూపుడే కనుక, దృశ్యములో అనేకత్వము నిర్మించుకొనుటలో సామర్థ్యము కలిగి ఉంటున్నాడు. ఆకారాదులు వహించుచు, దర్శించుచు కూడా నిరాకారుడై ఉంటున్నాడు.

అయితే, ద్రష్ట, ఈ దృశ్యమును గాంచకలుగు సామర్థ్యము కలిగి ఉంటున్నాడు. కానీ, ఈ దృశ్యమునకు…… అది స్వతహాగా జడమే కాబట్టి….. ద్రష్టకు సత్త కలుగజేయగల సామర్థ్యము లేదు సుమా! ఆభరణము బంగారమునకు ‘సత్త’ కలుగజేయుట ఎంత అసమంజసము? బంగారమే ఆభరణమునకు సత్త కలుగజేయుచు, నిరాకారముగా ఉండిఉంటోంది. బ్రహ్మము జీవుడగుట అట్టిదిగా గ్రహించబడుగాక!

వాస్తవానికి, సువర్ణమునందు ’ఆభరణము’ అనబడు భ్రమ అవివేకముచేతనే కలుగుచున్నది. అట్లే, చిత్శక్తి చేత నిర్మించబడిన దృశ్యమునందు చిత్ప్రసరణచే సత్యభ్రాంతి కలుగుతోంది. ఆభరణ దృష్టితో చూచేవానికి బంగారమునకు సంబంధించిన లోహదృష్టి ఉండదు కదా! దృశ్యస్ఫురణ ఉంటున్నప్పుడు, ఆ దృశ్యము దర్శించుటలో ఆ ద్రష్ట తనయొక్క పాత్రేమిటో గమనించకుండానే దర్శనము చేస్తున్నాడు. అయితే, బంగారు ఆభరణమునకు ఆభరణ సత్తను ప్రసాదిస్తున్నది ఏది? బంగారమే కదా! ఈ దృశ్యమునకు కూడా చేతనస్వరూపుడగు ‘ద్రష్ట’ యే దృశ్యత్వమును కలుగచేయు చున్నాడు. ద్రష్ట లేనప్పుడు దృశ్యము ఎక్కడవుంటుందో చెప్పు?

ఒకడు ఒకచోట ఒక బల్లపై గల రెండు వేరువేరు రకములైన రెండు బంగారు గొలుసులను చూస్తున్నాడనుకో .ఆ చూచువాడు. ‘ఆభరణ దృష్టి’ తో చూస్తుంటే రెండు వేరువేరైన ఆభరణములు కనిపిస్తాయి. అతడు ‘సువర్ణ దృష్టి’ తో చూస్తుంటేనో…. ఒకే బంగారం రెండు గొలుసులలోను

Page:457

కనిపిస్తోంది. అనగా, సువర్ణదృష్టికి ‘ఆభరణములు’ అనేది మరుగునపడిఉంటోంది. ఆభరణ దృష్టికి బంగారమునకు సంబంధించిన ధ్యాస మరుగునపడుతోంది. అదే రీతిగా :

దృశ్యదృష్టి ఉన్నసమయంలో ’ద్రష్ట’కు సంబంధించిన పాత్ర మరుగునపడి ఉంటున్నది. ద్రష్టను పరిశీలింపబడుచున్నప్పుడు దృశ్యము విషయం దృష్టిలో ఉండుట లేదు.

ఈ విషయమై మరొక చిన్న దృష్టాంతము చెపుతాను. విను.

వృత్తిని కప్పి ఉంచే మరొక వృత్తి : దూరంగా కదలివచ్చుచున్న ఏదో ఆకారమును ఒకడు చూస్తున్నాడనుకో…. ఇంతలో, “అది పశువా? మనిషా?” అని పరిశీలనాత్మకంగా చూస్తున్నాడు….. “ఓహో అది పశువు కాదు …… మనిషే….. అరె, మనవాడేనయ్యా….! అని అనటం జరిగిందని

అనుకొందాం.

ఇప్పుడు ఈ సంఘటనలో జరుగుచున్నదేమిటి? :

  1. మొట్టమొదట “విషయరహితమైన శుద్ధ చైతన్యము” స్వరూపముగా గలిగియున్నట్టి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతనియందు ‘ద్రష్టత్వము’ అను సామర్థ్యము ఉన్నది. అయితే ఆ సామర్థ్యము “మూసుకున్న కళ్ళలోని చూచుశక్తి" లాగా అప్రకటితమైయున్నది.

  2. నిర్మల జలంలో తరంగం బయలుదేరుతుంది…. చూసావా? అలాగే అతనియందు “ద్రష్టత్వము అను వ్యాపకమునకు ఉపక్రమిస్తాను…” అను ‘భావపూర్వకమైన-క్రియాపూర్వకమైన’ స్పందన బయలుదేరింది.

  3. అట్టి ప్రారంభవృత్తినుండి, “ఆ దూరంగా, కదలి వస్తున్న ఆకారము ఏమైయున్నది?” అను రూపముగల రెండవ ‘వృత్తి’ లేక ‘ధ్యాస’ బయలుదేరుతోంది. ఈ రెండవ ధ్యాస మొట్టమొదట ‘వృత్తి’ (Thought)ని కప్పివేస్తోంది.

  4. ఆ రెండవ వృత్తి నుండి “అది పశువా? లేక మనిషా?” అను మూడవ నిర్ణయాత్మ వృత్తి

రూపం పొందుతోంది.

5. “అవును అది పశువుకాదు…. మనిషే…. మనవాడే కూడా!” అను మరొక వృత్తి బయలుదేరి తదితర వృత్తులనన్నిటినీ మరుగు పరచుతోంది.

ఆ తరువాత ఆ స్థానంలో మరొక వేరైన ‘వృత్తి’ ఏర్పడుచూ ఉంటుంది….!

విషయరహితమైన శుద్ధ సత్,

ద్రష్టత్వము వహించు ‘వృత్తి’ లేక ధ్యాస,

విషయమును గ్రహించటం, నిర్ణయించటం, అనుభవం,

కొంత సమయానంతరం ఆ విషయమును త్యజించటం,

మరొక విషయమును స్వీకరించటం

ఇదంతా కొద్ది క్షణములలోనో-ఒక్కక్షణంలోనో ఒకటి తరువాత మరొకటిగా జరిగిపోతోంది.

Page:458

ఈ విధంగా ప్రతి జీవుడు వాస్తవానికి విషయములకు అతీతుడు, విషయరహితుడు అయి ఉండి కూడా, ఈ అనేక విషయపరంపరలను ఒకదాని తరువాత మరొకటిగా స్వీయఇచ్ఛ చేతనే పొందటం జరుగుతోంది.

“ద్రష్ట”– ఈ దృశ్యమును గాంచుచున్నప్పుడు… తన స్వస్వరూపాత్మను గాంచుటలేదు. అనగా, “దృశ్యాకారవృత్తి” మనస్సునందు ఏర్పడి ఉన్నప్పుడు, ఆత్మాకారవృత్తి సంభవించదు. అయితే, దృశ్యము సంభవిస్తున్న సమయంలో ఆత్మాకారము మరెక్కడికో పోవుచున్నదా? లేదు. అది యథా తథంగా ఉండి ఉండగా, అందు దృశ్యమునకు సంబంధించిన ‘భావన’ లేక ‘వృత్తి’ ఏర్పడిఉంటోంది. ఆత్మాకారమే లేకపోతే, ఇక దృశ్యాకారము ఏర్పడునది ఎక్కడ? కాని దృశ్యాకారము ఏర్పడిఉన్నప్పుడు “ఆత్మాకారము లేదేమో” అనురీతిగా (అసత్తుల్యంగా) ఆ ద్రష్టయొక్క దృష్టియందు ఏర్పడుచున్నది. అయితే, వివేకముచే దృశ్యభ్రాంతి తొలగినప్పుడు, ఇక “కేవల ద్రష్ట” మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు.

అందుచేత ముముక్షువు అయినవాడు “ఈ దృశ్యాకారవృత్తి నన్ను మోహింపచేయకుండునుగాక! ఈ దృశ్యము ఉంటే ఉండనీ. లేక తొలగనీ. ఏది ఏమైనా నేను ద్రష్టత్వమునకు కూడా అతీతమైనట్టి అనిర్వచనీయ - శుద్ధతత్వమునే” అనియే భావించాలి. అట్టి భావమును దృఢపరచుకొనుటకే ప్రయత్నశీలుడు కావాలి. అప్పుడిక అతని యందు అకృత్రిమమగు ఆత్మాకారవృత్తి (’నేను ఆత్మనే’ అను రూపముగల ఎరుక) తనంతట తానే స్వయముగా ప్రాప్తించుచున్నది. కాని, అనేక మంది అవివేకులు, ”ఈ దృశ్యము నందలి ఈ ఈ విషయములు పొందితిని. అయ్యో! ఇంకను ఇవి పొందలేకపోయాను కదా?” అని వేదనను ఆశ్రయించి ప్రయత్నించుచు, తద్వారా దృశ్యాకారవృత్తినే అభివృద్ధి చేసుకొంటున్నారు. “నేను ఆత్మతత్వమునే” అను ఉద్దేశమును అభివృద్ధి చేసుకొన్నంతమాత్రం చేత ఈ జీవుడు దుఃఖరహితుడు కాగలడు. ఇక తాత్సారం ఎందుకు చెప్పు?

దర్శనము లేనట్టి ద్రష్ట : ఈ "ద్రష్ట-దృశ్యము” ల విషయమై మరికొంత విచారిద్దాం. “ద్రష్ట” అనబడువారు త్రిపుటియందు (ద్రష్ట-దర్శనము-దృశ్యము అను వ్యవహారమునందు) అంతర్గతుడై, ఉంటున్నాడు. తాను ‘దర్శనము’ నకు వేరుగా ఉంటూ, ఈ ‘దృశ్యము’ చే ఏమాత్రం స్పర్శించబడనివాడై ఉంటున్నాడు. కాని, ఈ దృశ్యమునకు కారకుడు తానే అగుచున్నాడు. అతడు ‘అద్రష్ట’ అయిఉన్నప్పుడు ‘వాక్యములకు అందనివాడు’ గా అగుచున్నాడు. దర్శించుచున్న సందర్భమునందు మాత్రమే మనో వాక్కులకు లభించుచున్నాడు.

దృశ్యము ఉన్నప్పుడే ద్రష్ట ఉంటున్నాడు : “ద్రష్ట” దృశ్యరహితుడు అయినప్పుడు “పరిశుద్ధ చైతన్యము” అని అనిపించుకొంటాడు. అంతేకాని, ద్రష్ట అని పిలువబడడు. కనుక ఎప్పుడైతే, జ్ఞానోత్పత్తి యొక్క ప్రభావంచేత ‘ఈ దృశ్యము ఏక్షణమందూకూడా లేనిదే’ అనునట్లు అనుభవం అవుతుందో, అప్పుడు ద్రష్ట-దృశ్యములు రెండూ కూడా లేనివే అగుచున్నాయి. ఓ ప్రియరాక్షసీ! వాస్తవానికి నీకు దృశ్యముగాని, ద్రష్టత్వముగాని లేవు. నిర్మలచైతన్యమే నీవు, నేను, ఈ మంత్రి,

Page:459

తదితరులు కూడా! కాని, ఆకాశమును మేఘము కప్పివేసి ఉంచుతుంది చూచావా? అట్లే, దృశ్యము పట్లగల “ఇది సత్యము” అను బుద్ధి ద్రష్టత్వమునకు కారణమగుచున్నది. అట్టి భావావేశమే స్వస్వరూపముయొక్క అఖండానుభవమును కప్పి ఉంచుచున్నదని గ్రహించు. శుద్ధ సత్వమైయున్న ఆత్మ యొక్క స్వరూపమును గ్రహించిన తరువాత, ఇక దృశ్యవృత్తిగాని, భేదములుగాని ఉండవు. ఇది గ్రహించువాడు తాను ‘నిత్యము - నిర్మలము - సత్యము’ మొదలైన విశేషణముల అనుభవం పుణికిపుచ్చుకుంటున్నాడు. సాక్షాత్ బ్రహ్మమే అగుచున్నాడు.

దీపపు వెలుగు వస్తువులు చూచేవాడు : మరొక దృష్టాంతము చెపుతాను. సూక్ష్మ బుద్ధితో గ్రహించు.

ఒక గదిలో అంతా చీకటిగా ఉన్నది. అప్పుడు ఒక దీపం వెలిగించబడినది. ఆ దీపము వెలుగుచుండగా, దీపపు వెలుగులో అక్కడున్న ఆయాకొన్నివస్తువులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు : నీవు చూస్తున్న ఆయావస్తువులపై వెలుగుగా ప్రసరించి అవి నీవు చూడకలుగునట్లు చేస్తున్నదేది? దీపమే కదా….!

కాని “ఆ వస్తువులను నీకు చూపునది దీపమే” అని అనగలమా? ‘చూపుట’ అనబడు కర్తృత్వము దీపమునకు ఎట్లా ఆపాదిస్తాం? దీపమునకు ఇచ్ఛ-అయిచ్ఛలు లేవుకదా!

నీయందలి వస్తువృత్తులే ఆయా వస్తుజాలములలో కొన్నిటిని చూచుటకు కొన్నిటిపై దృష్టి సారించక పోవటానికి కారణము అగుచున్నాయి.

కాని, దీపం లేకుంటే ఆ వస్తువులు కనబడేవే కావు కదా!

ఈ దృష్టాంతమును దృష్టిలో పెట్టుకొని, ఇక నేను చెప్పునది విను : “ద్రష్ట-దర్శనము-దృశ్యము" … ఈ మూడిటిని (త్రిపుటిని) ఆత్మయే ప్రకాశింపజేయుచున్నది. అనగా చైతన్యరూపమగు ఆత్మయొక్క సమక్షము (Presence) చేతనే ఈ మూడు స్థితివంతము లౌతున్నాయి.

అయితే "దృశ్యత్వబుద్ధిని ఆత్మయే కల్పించుచున్నది” అని అనలేం. అనగా, ఈ కల్పనయొక్క కర్తృత్వము ఆత్మకు ఆపాదించలేము.

ఆత్మయే లేకపోతే ఈ ద్రష్ట-దృశ్యముల ఎరుకయే ఏర్పడేది.

ఆత్మయొక్క విశేషము ఏమిటో ఏమరచిన అజ్ఞాని దృశ్యవృత్తిలో నిమగ్నమగుచున్నాడు. జ్ఞానియో “ద్రష్ట-దర్శనము-దృశ్యము” లనే త్రిపుటిని ఆత్మయందు లయము ఒనర్చుచున్నాడు. ‘ఆత్మవృత్తి’ ని మాత్రమే అంగీకరించుచు, ఆత్మానుభవము పొందుచు, ఆత్మయే అయిఉంటున్నాడు. అసద్రూపంగా వెలయుచున్న ’ఆభరణము’ యొక్క ఆకారాదులను, ఆ బంగారమును పరిశీలించు కంసాలి, - తన తార్కిక బలంతో ఆభరణ సంబంధమైన ఆకారాదులను ప్రక్కకు పెట్టి బంగారము, అద్దాని నాణ్యత పై దృష్టి పెట్టుచున్నాడు కదా! అది కూడా అంతే.

Page:460

ఓ ప్రియా! బ్రహ్మానంద స్వరూపిణీ! కర్కట నామధేయీ ! అసలు ఒక్కసారి ఈ కనబడే దృశ్యమంతా సమగ్రంగా గమనించు. నీ చుట్టూ, నా చుట్టూ ఉన్నదంతా పంచభూతసముదాయము మాత్రమే కదా! అంతకు మించిన దృశ్యవస్తువంటూ ఎక్కడ ఏది ఉన్నది చెప్పు? అయితే, ఇదంతా ఆత్మయొక్క వృత్తిని అనుసరించే అనుభవమౌతోంది. ఆవిధంగా, స్వభావసిద్ధమైయున్న ‘చైతన్యతత్వము’ కంటే భిన్నమైనట్టి దృశ్య-పదార్థమంటూ ఎక్కడా ఏదీ లేదు. ఆత్మ సర్వవ్యాపి, సర్వానుభవస్వరూపము అయి ఉన్నది కదా! అందుచేత ఆత్మానుభవం సిద్ధించిన మరుక్షణం ద్రష్ట-దృశ్యముల ఐక్యత సహజంగాను అకృత్రిమంగాను ప్రాప్తించగలదు. ఆత్మ యొక్క ఇచ్ఛానుసారమే ఫలప్రాప్తి జరుగుతోంది కనుక, “పదార్థములు - ఇచ్ఛ’ ’… రెండిటి యొక్క ఐక్యత స్వయముగానే సిద్ధించుచున్నది. దీనిని బట్టి నీవు గ్రహించవలసినది ఏమిటి? సముద్రము కంటే తరంగములు వేరుకావు కదా! అట్లే “ఆత్మేచ్ఛ” కు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదని గమనించు.

పరమాత్మ : ఆ పరమాత్మ దేశ కాల వస్తువులచే పరిచ్ఛిన్నుడు కాడు. అందరియొక్క ‘ఆత్మ’ అతడే. వానికి భిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ ఉండదు. అతడు ఎక్కడోలేడు. ఎన్నటికో లభించబోయే వాడుకాడు. సర్వుల అనుభవస్వరూపుడై వెలుగుచున్నది అతడే. కాబట్టి “సర్వ ఇచ్ఛల స్వరూపము అతడే” అనే ఒకానొక ఉత్తమ రహస్యం జ్ఞానివైన నీ ముందు ప్రస్తావిస్తున్నాను. “ఆ పరమాత్మ సత్-చిత్ స్వరూపుడు” అని (ఋగ్వేదాది) శాస్త్రములు ప్రతిపాదిస్తున్నాయి. నేత్రములనే ప్రకాశింప జేయుచున్న అతడు, అవే నేత్రములచే ఎట్లా చూడబడగలడు చెప్పు? అందుచే అవివేకులు అతని గురించి… “అతడు ఎవ్వరికీ కనబడుటలేదు కదా! అందుచేత అసత్తుల్యుడేమో! అనగా, అతడులేడేమో!” - అని భావిస్తున్నారు.

స్వస్వరూపుడగు పరమాత్మ యందు ద్వైతమేమిటి? ఏకత్వ మేమిటి? అందుచేత “ద్వైతము మిథ్య - ఏకత్వము సత్యము" అనికూడా చెప్పలేము. ఎందుచేతనంటావా? రెండవవస్తువు ఉన్నప్పుడు కదా… “అది - - ఇది ఒక్కటే” అను ఏకత్వమును సంభవింప చేయకలిగేది! ‘ఆకారము-దాని నీడ’ వలె, ద్వైత - ఏకత్వములలో ఒకటి ఉంటేగాని, రెండవది సిద్ధించదు. రెండవవస్తువే లేనప్పుడు ఒకే వస్తువు యొక్క ఏకత్వం ఎట్లా ఉంటుంది? “ఏకత్వము లేదు” అని అనుకొన్న మరుక్షణం ద్విత్వము కూడా లేనట్లే అగుచున్నది.

“ఆత్మ ద్వైతాద్వైత భేదరహితము”…అను భావము నీ హృదయమునందు పదిలపరచుకో! సముద్రముకంటే ద్రవత్వము వేరైనదా? కాదుకదా! “ద్వైత - ఏకత్వములు పరమాత్మ కంటే భిన్నమైనవి కావు” అని గ్రహించుటయే జ్ఞానము.

జగత్తు : సత్వము-రజము-తమోగుణముల ‘సామ్యస్థితి’ లేక ‘అతీతస్థితి’ నుండి చ్యుతి నొందనట్టి బ్రహ్మమునందు అనేక కార్యవ్యవహారముతో కూడియున్న ఈ జగత్తు కన్పట్టుచున్నది. ఒక బీజమునందు మహావృక్షము ఉన్నట్లు. ఈ జగత్తు అంతా ఆత్మయందే ఉండియున్నది. బంగారము - ఆభరణములు వేరు వేరు కానట్లు, ఈ ద్వైత ప్రపంచము బ్రహ్మమునకు వేరైనది కాదు. ఉత్తమ

Page:461

“బోధ” పొందినట్టి తత్వవేత్త ఈ ‘ద్వైతము’ ఏమిటో, ఏమై ఉన్నదో ఎరిగియే ఉంటున్నాడు. కనుక అతడు “ఇది ద్వైతము … కాదు, అద్వైతము” మొదలగు మీమాంసలు కలిగియుండుట లేదు. జలత్వము ద్రవత్వము వేరా? వాయువు కంటే దాని చలనత్వము వేరువేరని ఎవరనగలరు? ఈ ద్వైత ప్రపంచమంతా ఈశ్వరునికంటే వేరైనది కాదు. నీవు, నేను ఈ మంత్రి కూడా అంతే ! ఓ చైతన్య స్వరూపిణీ ! రాక్షసీ! ఈ ద్వైత అద్వైత అనుభవములు రెండూ క్రియాత్మకములే కాబట్టి దుఃఖప్రదములే అవుచున్నాయి. బుద్ది నైపుణ్యం చేత ఈ రెండింటినీ రహితం చెయ్యాలి. ’అదియే ఉత్తమ జ్ఞానం’ అని అనిపించుకొంటోంది.

త్రిపుటి : ద్రష్ట - దర్శనము - దృశ్యము; ప్రమాతృత్వము - - ప్రమాణము - ప్రమేయము త్రిపుటితో కూడిన ఈ జగత్తు “చేతనము” అయి ఉన్న స్వస్వరూప తత్వమునందే ఉండియున్నది. వాయువు ఒకప్పుడు తనయందు చలనము కలిగి ఉంటూ, మరల ఇంతలోనే మరొకప్పుడు ఆ చలనమును రహితము చేసుకొనుచున్నది కదా! ఆత్మకూడా, ఒక సమయంలో తనయందు ’జగత్తు’ అను కల్పన కల్పించుకొనుచు, మరొకప్పుడు, దీనినంతటినీ తన స్వస్వరూపమునందు లయము చేసుకొనుచున్నది. ఆహాఁ! ఈ మాయ ఎంతటి చిత్రమైనదో, ఎంతటి భయంకరమైనదో చూచావా? జీవులను మోహింపచేయుటలో దీనిని మించినవారు మరెవ్వరూ లేరు. అది ఒక పరమాణువులో కూడా విస్తారమైన త్రిలోకములను అనుభవింపజేయగలదు.

(ప్రమాత: ఎరుగెడువాడు, ప్రమేయము: ఎరుగతగినది, ప్రమాతృత్వము: ఎరుగుట అను స్వభావం, ప్రమాణము ఎరుగబడు విధము.)

అయితే, వేదములు, “ఏకమేవాద్వితీయమ్ బ్రహ్మ”, “జీవో బ్రహ్మేతినాపరః” అను వాక్యముల ద్వారా “రెండవవస్తువే లేదు” అని ప్రతిపాదించుటచేత, అస్సలు ఆత్మయందు ‘మాయ’ అనబడు మరొకవస్తువు ఉండటం ఏమిటి? అందుచేత ఈ జగత్తంతా చిత్చైతన్యమే కాని మరింకేమీకాదు. ఏదైతే తదితరంగా తోచుచున్నదో, అదంతా ‘అవిచారణ’ కారణంగానే అట్లు తోచుచున్నది.

"దృశ్యము ద్రష్టకు అభేదమైనదే!” అని గమనించు.

సదసత్తు : చిదణుస్వరూపుడగు పరమాత్మయే తనయందు లీలామాత్రంగా, సంకల్పమాత్రంగా, కారణం లేకుండానే, ఈ బ్రహ్మాండములను ధరించుచున్నాడు. కనుక ఓ రాక్షసీ! ఈ కనబడే జగత్తులన్నీ చిత్ - చైతన్యమునందే ఉండి ఉన్నట్లు సర్వదా నీవు గ్రహించి, ఆపై ఇక్కడ యథాతథంగా సంచరించు. ఈ ద్వైత ప్రపంచమును చిద్రూపపరమాణువు నందు అద్వైతరూపంగా (చిత్ భగవానునకు వేరు కానట్టిదిగా) గాంచువాడే సత్యదర్శి-సమదర్శి కూడా! యథార్థానికి ఈ ద్వైతాద్వైతములు గాని, బీజ-అంకురములు గాని, స్థూల సూక్ష్మములు గాని, అణు బ్రహ్మాండములు గాని లేవు. ఉండజాలవు కూడా. ‘త్రిలోకములు’ అనబడునవి ఏమైనా ఉన్నాయని మనం అనుకోదలిస్తే - అవి చైతన్యాణువునందే “సత్ - అసత్” రూపములుగానే ఉండి ఉన్నాయి. వ్యక్తులకు - వ్యక్తులకు, వ్యక్తులకు - పదార్థములకు సంబంధములన్నీ కల్పనచే ఉంటూ, కల్పనాతీత

Page:462

దృష్టితో పరిశీలిస్తే ఉండడం లేదు. ఈ త్రిలోకముల ఉనికి కూడా అట్టిదే. ఇవి శాంతములు కావు. అశాంతములు కూడా కావు. పరమార్థ దృష్టితో చూచినప్పుడు పంచభూతముల యొక్క ఆయా పాళ్ళ కలయిక మాత్రమే అయిన ఈ పదార్థజాలం లేనివి గానే జ్ఞానులచే గాంచబడుచున్నాయి. ఒకానొక దృష్టికి మాత్రం ఘనీభూతమై తోచుచు, మరొకదృష్టిచే లేకయేపోతున్న దానిని “ఉన్నది” అనాలా? లేక “లేదు” అనాలా? అందుకే, “ఇదంతా సదసత్తు” అని చెప్పబడుతోంది.

త్యాగి - అత్యాగి : ఈ జగత్తు గాని, దానికి భిన్నమైన మరొకటి గాని లేవు. కేవలము ‘చైతన్యము’ మాత్రమే ఉన్నది. అది ఎప్పుడు, ఎట్టి పూర్వ సంస్కారములను ఆశ్రయించి ఆవిర్భవిస్తుందో, అట్లే స్ఫురించుచు, అట్టి అనుభవమునే పొందుచున్నది. ఈ సృష్టి రూపమున ఆ చైతన్యమే ఉత్పన్న మగుచు ఉంటున్నప్పటికీ, అంతమాత్రం చేత తన “యథాతథ-నిత్యోదిత-ప్రకాశత్వము”నకు తరుగు పొందుట లేదు. కనుక “ఈ సృష్టి ఏ సమయంలో కూడా ఉత్పన్నము కాకయే ఉన్నది" అను వాక్యము కూడా సముచితమే అగుచున్నది. ప్రపంచరహితమైన చిదాకాశము సర్వదా ఏకరూపముననే ఉన్నది. కాని, భ్రమానుభవముచే అనేక రూపములుగా కన్పట్టుచున్నది. వృక్షము తన వృక్షస్వభావము త్యజించకుండానే బీజమును ఉత్పన్నము చేయుచున్నది. ఆ బీజము మరల భూమిపై మహావృక్షము అగుచున్నది. పరమార్థతత్వమగు బ్రహ్మము ఈ జగత్తు రూపమున ఉదయిస్తోంది. జనన మరణాది కల్పనలతో కూడిన ఈ ’జగద్రూపము’ యొక్క అనుభవమును పొందుతోంది. కాని ఆ అనుభవకాలంలో కూడా బ్రహ్మము తన స్వరూప స్వభావములు ఏమాత్రం కోల్పోవుటలేదు. ఒక యువకుడు వివాహము చేసుకొని పుత్రులు పొందుటచే తండ్రిగా పిలువబడు చున్నప్పుడు “తండ్రి” అనబడు మరొకటేదీ అగుటలేదు. అతడు తన స్వస్వరూపమునకు సంబంధించిన స్వరూప-స్వభావములు త్యజించుటగాని, మార్పు చేర్పులు పొందుటగాని జరుగుటలేదు కదా! బ్రహ్మము విషయము కూడా అట్టిదే. ఈ జీవునికి వేరైనవాడు కానట్టి ‘బ్రహ్మము’ అనబడు ఆ పరమాత్మ త్యాగ అత్యాగములు రెండూ కలవాడే. ఎట్లా అంటావా? అతడు అసంగుడు, అద్వితీయుడు (ద్వితీయము అనునది లేనివాడు) కదా! అందుచేత అతడు సర్వత్యాగపరుడైయున్నాడు. అతడు సర్వవ్యాపి కదా! అందుచేత, దేనినీ త్యజించకయే, ఏకరూపమున సర్వదా ప్రకాశించుచున్నాడు.

చిత్అణువు : కమలనాళములోని తంతువుకంటే కూడా కోట్లాదిరెట్లు సూక్ష్మాతిసూక్ష్మమైయున్న ’చిత్‘- అణువునందు కోట్లాది జగత్ సమూహములు ఉండగలవు. ఉండియున్నాయి. మహత్తరమగు అట్టి చిత్ - పరమాణువు చేతనే ఈ జగత్తంతా వ్యాప్తమైయున్నది. అద్దానిచేతనే ఉత్పత్తిని పొందుతోంది. అద్దాని సహాయంచేతనే కార్యవంతం అవుతోంది కూడా. అయినప్పటికీ, ఈ పరమాత్మ ఈ ‘జగత్తు’ అనబడు దానిచే స్పృశించబడక నిర్వికారుడే అయిఉన్నాడు. కల్పిత - - గంధర్వనగరం (llusion Visualised in the Sky) చే స్పృశించకుండానే ఆకాశం ఎల్లప్పుడూ నిర్మలంగానే ఉంటోంది కదా! మేఘములు మొదలైనవి ఆకాశపు స్వచ్ఛతను తొలగించ గలుగుచున్నాయా? లేదే! అట్లే పరమాత్మయే అయి ఉన్న ఈ జీవుని వాస్తవస్వరూపము జన్మ-మృత్యువులచే, తదితర సంబంధబాంధవ్యములచే స్పృశించబడుటలేదు. ఆకాశము ఏ సమయమందూ కూడా దేని చేతనూ ఏ

Page:463

దోషమూ తాను పొందకుండా, ఎప్పటి అట్లే స్వచ్ఛంగా, నిర్లిప్తంగా, అఖండంగా, నిర్మలంగా, ఏకంగా ఉండి ఉంటున్నది. అట్లాగే, పరమాత్మకూడా సర్వదా నిర్వికారుడు, నిర్మలుడూ, నిర్లిప్తుడు! అయితే, ఆ పరమాత్మయే ‘నేను జీవుడను’ అను భావనను స్వయంగా భ్రమపూర్వకంగా పొందుచు న్నాడు (జీవోశివః! జీవో బ్రహ్మేం తి నాపరః). అట్టి అజ్ఞానకాలంలో - “జడము, అవిద్యాస్వరూపము, సుషుప్తి” - మొదలైనవాటితో సమానమైనట్టి ‘ద్వైతస్థితి’ని గాంచుచున్నాడు. అట్లు ’ద్వైతము’ దర్శించు సమయము నందు కూడా, పరబ్రహ్మము ‘ఏకమై ప్రకాశించుట’ అనుదానికి లోటేమీ ఉండుట లేదు.

క్రియారూపమైనట్టి ఈ జగత్తు అధిష్ఠానమగు ఆత్మతత్వము కంటే ఏమాత్రం వేరు కాదు. కాబట్టి ఓ స్నేహితురాలా! నీ ప్రశ్నలన్నిటికి సమాధానం… “ఆ పరమాత్మయే.”

ఈ ‘జగత్తు’ పరమార్థమగు బ్రహ్మమే అయి ఉన్నది. కనుక “ఈ జగత్తే” అని నీ ప్రశ్నలకు సమాధానంగా చెప్పటం కూడా ఉచితమే అవుతుంది.

ఈ ప్రపంచమునకు రూపకల్పన చేస్తున్నది నేనే. అయితే నేను ఈ ప్రపంచమునకు అతీతమైనట్టి “పరమోత్కృష్టమైన” నేను అను “తత్త్వము”ను కూడా! అంతేగాని నేను ఈ ప్రపంచరూపుడను గాను. ఈ కనబడే జగత్తునందు నేనుగాని, ఇది నాయందుగాని లేవు.

అద్వైత బ్రహ్మస్వరూపుడనే “నేను.”

ఇక నాకు జన్మ-మృత్యువులెక్కడ? ఉనికి ఎక్కడ? లేమి ఎక్కడ? నేను ఏదై ఉన్నానో, నీవు కూడా అదే (తత్ త్వమ్). కనుక, నీ ప్రశ్నలన్నిటికీ మేము ఇచ్చే సమాధానం ఇదే.

“అది నేనే!”

“అది నీయొక్క వాస్తవ స్వరూపమే! ప్రతి ఒక్కరియొక్క వాస్తవ స్వస్వరూపమే!”

  1. పరస్పరం

రాజు-మంత్రులను చూడకముందు ఆ కర్కటి కొంత చపలచిత్తము కలిగి ఉండేది. ఆ ఇద్దరి ‘విజ్ఞానమయమైన-ఆత్మవస్తునిర్ణయాత్మక’ వాక్యాలు శ్రద్ధగా విన్నది. మరుక్షణం ఆత్మజ్ఞానముయొక్క ప్రాప్తిచే పరమానందం పొందింది. తన మనస్సునందు శేషించియున్న కొద్దిపాటి మాత్సర్యమును, చాపల్యమును విడనాడింది. ఇక ఆ రాక్షసికి బాహ్యదృష్టిగాని, ఆ బాహ్యదృష్టిచే ఏర్పడు సంతాపము గాని తొలగిపోయాయి. చిత్తము ప్రశాంతత పొందినది. ఆనందమయంగా ఇట్లు పలికినది. కర్కటి : ఓ రాజ–మంత్రులారా! మీ ఇద్దరి వాక్యములు వినినంత మాత్రంచేతనే నా జన్మ ధన్యమైనది. మీ ఇరువురిలోను శాంతమయమై, నిత్యోదితమై, ఏకరసమైన చంద్రకిరణములవంటి ఉత్తమ ఆత్మజ్ఞానం వెల్లివిరుస్తోంది. ఇది చాలా మహత్తరమైన విషయం! వివేకయుక్తములైన మీ ఇరువురి వాక్యములు

Page:464

వినిన తరువాత నేను మీకు “దాసోహం” అంటున్నాను. మీరిద్దరు నాకు పూజ్యులు. మీతోకూడిన సత్సంగముచే నేను నిర్మలంగా ప్రకాశించుచున్నాను. “సజ్జనులతోటి సాంగత్యము అద్భుతమైన ప్రభావం కలిగి ఉంటుంది” అనే శాస్త్రప్రవచిత విషయం మీరిద్దరు మరొక్కసారి నిరూపించి చూపారు. మరల మరల మీ పాదాలు స్పృశిస్తూ ప్రణామంచేస్తున్నాను. చేతిలో దీపం ఉన్న తరువాత, ఇక అంధకారమెక్కడ ఉంటుంది? మీయొక్క సంసర్గముచే నా మనస్సులోని రాక్షస ప్రవృత్తులు, కుసంస్కారములు ఉపశమిస్తున్నాయి. దుఃఖం తొలగిపోతున్నది.

ఓ రాజ-మంత్రులారా! ఒక రాక్షసినైనట్టి నాపట్లే మీ విజ్ఞానసమన్విత వాక్యములు ఇంతటి ప్రభావం చూపించినప్పుడు, ఇక తదితరులు వింటే ఎంతటి ఉత్తమ ప్రయోజనం కలుగుజేస్తాయో? ఇతరులలో అనేకులు ఈ వాక్యములు వింటే మరుక్షణం దుఃఖరహితులు అవుతారు. ఈ మీ వాక్యములు అనేకమంది ముముక్షువుల చెవులకు విందు చేయునుగాక!

ఓ విక్రమ మహారాజా! సుబుద్ధివగు ఓ మహామంత్రీ! “మహాత్ములు” అయి ఉన్న మీ ఇద్దరితో ఇంతకుముందు నేను పరుషవాక్యములు పలికినందుకు నన్ను క్షమించండి. ‘క్షమ’ యే మీవంటి మహానీయులకు భూషణమై ఉంటుందని పెద్దలు చెప్పగా విన్నాను. ఆకాశములో సూర్య-చంద్రులవలె భూమిపై వెలుగొందుచున్న మీ మీ ఇద్దరు నాకు అత్యంత పూజనీయులు, ప్రీతిపాత్రులు అగుచున్నారు. ఇప్పుడు ఏదైనా కోరుకొమ్మని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అత్యంత వినమ్రతతో మీ మనోరథం ఈడేర్చటానికి సిద్ధంగా ఉన్నాను.

విక్రమమహారాజు : ఓ ప్రియరాక్షసీ ! మా రాజ్యములోని ప్రజలు ఒక ఈతిబాధకు లోనగుచున్నారు. ‘విసూచిక’ అనబడు ఒక వ్యాధిరూపమైన మహమ్మారి ఇక్కడి ప్రజలను పట్టి పీడిస్తోంది. అది హృదయమును బలహీన పరచివేయుటచే, ఆ రోగికీ ఏ ఔషధము ఇచ్చినప్పటికీ నిష్ప్రయోజనమే అవుతోంది. మా దగ్గర ఉన్న మంత్ర - తంత్ర శక్తులన్నీ ఆ మహమ్మారి ముందు కొఱగాకుండా పోతున్నాయి. మీ వంటి మహాత్ములనెవరినైనా ఆశ్రయించి ఏదైనా మంత్రము-తంత్రము-ఔషధము పొంది తద్వారా మా ప్రజలకు సుఖశాంతులను కలుగజేయాలనే ఉద్దేశంతోనే మేమిద్దరం ఈ అర్ధరాత్రి ఇటువైపు వచ్చాం.

మీ వంటి రాక్షసులు అట్టి మహమ్మారులను నిరోధించగలిగే శక్తియుక్తులు, ఉపాయములు కలిగి ఉంటారని వింటూ ఉంటాం. మీవంటివారిని వశపరచుకొని, తద్వారా మా ప్రజలను మేము కాపాడుకోవాలని మా ఉద్దేశం. అది రాజులమగు మాకు విధ్యుక్తధర్మమే కదా!

మా రాజ్యములోని మంత్రద్రష్టలు మాకు చెప్పిన కొన్నికొన్ని విషయములను అనుసరించి “నీవు గొప్ప మంత్రశక్తిగల దానవు" అని మేము అనుకుంటున్నాం. మా సంకల్పము, దైవనిర్ణయం కూడా ఒకే తీరుగా ఉన్నాయి కాబోలు! ఇప్పుడు నీవు తారసపడ్డావు. నిన్ను ఒక కోరిక కోరుతున్నాం.

ఆ విసూచివ్యాధి మా ప్రజలను హింసించకుండా ఉండునట్లు అనుగ్రహించు. అంతేకాదు. మా ప్రజలను నీవు హింసించవద్దని మా మనవి.

Page:465

కర్కటి: ఓ రాజా! ఒక రాజుగా, నీ ప్రజాక్షేమం కోరినవాడవై, మంచి కోరికనే కోరావు. నీ వితరణశీలత తప్పక మెచ్చుకోతగ్గదే. మీరిద్దరు నాకు ఇప్పుడు గురుతుల్యులు కదా! ఇక ఇప్పటి నుండి మీ రాజ్యములోని ఏ ప్రాణిని నాకు నేనుగా హింసించనని మీకు మాట ఇస్తున్నాను. మీ అభీష్టమును అనుసరించే ఉంటాను. ఆ విసూచి వ్యాధిని నివారించటానికి మంత్రం తప్పక చెపుతాను. విక్రముడు: కానీ, నీవు జన్మతః రాక్షసివి కదా! ప్రకృతి నిర్ణయమును అనుసరించి నర-జంతు దేహములను భుజించుట నీయొక్క స్వభావమే అయిఉన్నది. మరి నీవు ‘అహింస’ ను నియతిగా గ్రహిస్తే ఇక ఈ నీ శరీరనిర్వహణయే కష్టతరం అవుతుందేమో? ఇంకొక విషయం. నీవు ఎవరో, నీ పూర్వవృత్తాంతమేమిటో, ఇంతటి ఆత్మదృష్టి ఎట్లా పొందావో తెలుసుకోవాలని మాకు ఉన్నది. కర్కటి: హే మహాత్మా! మీరిద్దరు ప్రవచించిన ఆత్మవచనములు నాయొక్క ‘ఆత్మదృష్టి’ కి ఎంతో దృఢత్వం చేకూర్చాయి.

నేను ఒకానొకప్పుడు ఒక పర్వతముపై ఆరునెలలు సమాధియందు ఉండి ఉన్నాను. ఆ తరువాత సమాధినుండి లేవగానే వ్యుద్ధానకాలమునందు) నాయందు ‘భోజనము’ గురించి సంకల్పము ఉదయించింది. జీవులను భక్షించాలనే ఉద్దేశంతోనే ఇటువైపు వచ్చాను. ఇప్పుడు మరల ఆపర్వతశిఖరం చేరుతాను. ధ్యాననిష్ఠయందు నిమగ్నమైపోతాను. ఒక శిలాశిల్పంలాగా నిశ్చలత్వము వహిస్తాను. అమృత స్వరూపమగు ఆత్మ గురించి భావనచేస్తూ ఉంటాను. మీరు చెప్పిన వాక్యార్థములను మననం చేస్తూ ఈ జీవితము గడుపుతూ ఉంటాను. ఆ తరువాత నా ఇచ్ఛానుసారంగా ఎప్పటికో అప్పటికి ఈ ఉపాధిని త్యజించివేస్తాను. ఈ శరీరము త్యజించబడేవరకు నేనిక ఏ ప్రాణిని హింసించను.

ఇక నా ఇతః పూర్వపు విశేషాలు చెపుతాను వినండి. నేను ‘కర్కటి’ అనే పేరుగల రాక్షసిని హిమాలయ పర్వతపు ఉత్తరదిక్కునగల ఒకగుహలో నివసిస్తూ ఉండేదానను. ఒకసారి గొప్పతపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించాను. బుద్ధిమాంద్యంచేత “విసూచిక” అనే సూక్ష్మ ఉపాధితో వ్యాధి స్వరూపురాలయ్యాను. అనేకజనుల రక్తమాంసములు పీల్చుచు ఉండేదానను. అప్పుడు గుణవంతుల రక్షణకై బ్రహ్మదేవుడు ఒక మంత్రమును లోకములకు ప్రసాదించటం జరిగింది. ఓ రాజా! బ్రహ్మదత్తమైన ఆ మంత్రమును మీకిప్పుడు ఉపదేశిస్తున్నాను. అది శ్రద్ధగా పఠించువారు అట్టి ఉపాసనాబలంచేత…. ఇతరుల హృదయములోని శూలబాధను క్షణంలో నశింపజేయగలరు. కలుషితనాడులందలి శూలబాధను తొలగించుట కొరకు బ్రహ్మదేవునిచే ప్రవచించబడిన విసూచికామంత్రమును నావద్దనుండి మీరిద్దరు స్వీకరించుటకు సిద్ధంకండి. అదుగో…. అక్కడ ఏదో సరస్సు కనబడుతోంది. అక్కడికి మనం ముగ్గురం నడచివెళ్ళుదాం. స్నానము, ఆచమనము ముగించిన తరువాత నేను మంత్రప్రదానం చేస్తాను.

వారు ముగ్గురు నదీతటం జేరారు. ప్రజల క్షేమమే ఆశయముగా గల రాజు - మంత్రులిద్దరూ ఆ రాక్షసికి గురుభావంతో ప్రణామం చేశారు. బ్రహ్మప్రోక్తము, సిద్ధిదాయకము అయినట్టి విసూచి

Page:466

మంత్రమును, ఆమంత్రమునకు సంబంధించిన సంకల్పవిధానమును కర్కటి నుండి నేర్చుకొన్నారు. కర్కటి : మిత్రులారా! మీకు, మీ రాజ్యమునకు శుభమగుగాక! ఇక నాకు సెలవు ఇప్పిస్తే, నా స్వస్థానమునకు చేరుకొంటాను.

విక్రమరాజు : ఓ స్నేహితురాలా! దీర్ఘదేహీ! ఈ విసూచీమంత్రము మాకు ప్రసాదించుటచే ఇటుమాకు, అటు మా ప్రజలకు ఎంతో మేలు చేశావు. ఇప్పుడు నీవు మాకు గురువువు, స్నేహితురాలివికూడా అయ్యావు. నీ మీద వాత్సల్యంతో గౌరవంతో నీకు తగిన భోజన సదుపాయం చెయ్యాలని మేము అనుకొంటున్నాము. ఎందుకంటే, జ్ఞానుల ఆవశ్యకత ఈ భూమిపై ఎంతో ఉన్నది.

ఇప్పుడు మేము ఒక నిశ్చయానికి వచ్చాం. మాపై కరుణతో, ప్రేమతో మా ఈ నిశ్చయమును అంగీకరిస్తావని తలుస్తాము. సజ్జనులగు మహాత్ములను ప్రేమతో దర్శించినంత మాత్రంచేత వారితో స్నేహం సిద్ధిస్తుందని పెద్దలు అనగా విన్నాము. మా నిశ్చయమేమిటో విను.

నీవు అందమైన ఆభరణములు ధరించి మనోహరమైన ఆకృతితో మా రాజగృహమునకు రావచ్చు. అచట నీవు సుఖంగా ఏలోటూ లేకుండా ఉండవచ్చు. అక్కడ మేము మా సేవకులను నియమిస్తాం. వారు నీకు అన్న పానీయములు చేకూర్చుచు నీకు సేవ చేస్తూ ఉంటారు.

కర్కటి : ఓ రాజా! నీవు కోరినట్లే, నేను ఒక సుందరస్త్రీ రూపం ధరిస్తే, నీవు తప్పక అన్నపానీయములు చేకూర్చుతావు. కాని, నేను జన్మతః రాక్షసిని కదా! మీ మానవులు భుజించే అన్నపానీయములు మాకు రుచిస్తాయా? లేదు. సామాన్య భోజనం మాకు తృప్తిని కలిగించవు. ఈ రాక్షస ప్రవృత్తితో కూడిన దేహము ఉన్నంతవరకు మా స్వభావం ఇట్లే ఉంటుంది. కనుక, నా అన్నపానాదుల గురించి నీవు చింతించవద్దు. నిశ్చింతగా నీ రాజ్యం చేరి, ప్రజలను కన్నబిడ్డలవలె పాలించుకో. నాకు సెలవు ఇప్పించు.

విక్రమరాజు : నీవు అన్నమాట నిజమే. అయితే మాత్రం ఏం? ముందుగా ఒక సుందర రూపము దాల్చినదానవై, బంగారు ఆభరణములతో శోభిల్లుచు, మా అంతఃపురంలో కొన్నాళ్ళు ఉండి విశ్రాంతి తీసుకో. మా రాజ్యములోని దుష్టులను, చోరులను, నిరంతర హింసాపరాయణులను వధించటానికి ఒకచోటకు చేరుస్తూ ఉంటాము. అట్టివారిని నీకు ఆహారంగా సమకూరుస్తాము. నీవప్పుడు నీ సుందర స్త్రీ రూపము త్యజించి, రాక్షసిరూపివై ఆ వధింపతగువారిని హిమాలయపర్వత గుహలోనికి గొనిపోయి అక్కడ భుజించు. నీవలె అధికంగా భుజించేవారికి ఏకాంతభోజనమే బాగుంటుంది కదా! అట్లు భుజించి తృప్తిగా ఆ గుహలో కొంతకాలం విశ్రమించు. ఆ తరువాత నిదురలేచి సమాధిస్థితి స్వీకరించు. సమాధినుండి లేచిన తరువాత మా నగరం వస్తూఉండు. మరల యథావిధిగా క్రూరులు, పాపులు అయినట్టి ప్రాణులను నీ కొరకు సిద్ధంచేసి ఉంచుతూ

ఉంటాము.

నీకు సంకోచం అబ్జర్లేదు. ఇట్లాచేయటం పాపం కాదు. "స్వధర్మేణచ హింసైన మహాకారుణయా సమా”…. స్వధర్మ పూర్వకమైన హింస కూడా మహాకరుణతో సమానమే.

Page:467

అందుకు నీవు ఒప్పుకుంటే, ఈ నీ స్నేహం మాకు మరెంతో కాలం లభ్యమౌతుంది. అది మాకు మహదానందమైన విషయమే అవుతుంది. స్నేహం స్థిరపడిన తరువాత, విరుద్ధస్వభావముతో కూడిన జీవులైనప్పటికీ, వారిమధ్య స్నేహబంధం తొలగదుకదా! మేము, ఇకపై నిన్ను ‘కందరాదేవి’ అని పిలుస్తాం.

రాక్షసి : ఓ స్నేహితుడా! అట్లే అగుగాక! నీవంటి ఉత్తమ శ్రేయోభిలాషుల మాట తీసివేయగలనా? నా ‘ఆకలిబాధ’ విషయంలో నీవు చూపుచున్న ఔదార్యమునకు సంతసించుచున్నాను. నీకు, ఈ మంత్రికి, నీ ప్రజలకు శుభమగుగాక!

ఆ ముగ్గురు రాజగృహం చేరారు. ఆ రాత్రంతా ఆత్మవిషయమై అనేక విషయాలు చర్చించు కొంటూ గడిపివేశారు. సుందరస్త్రీ రూపం ధరించిన ఆ రాక్షసి మరునాడు నగరంలోని వింతలు, విశేషాలు అన్నీ చూచివచ్చింది. రాజు, మంత్రులు తమ తమ రాచకార్యములలో నిమగ్నమైనారు.

ఆ విధంగా ఆరు రోజులు గడచిపోయాయి. ఏడవ రోజు రాత్రి విక్రమమహారాజు తన భటులను పిలిపించాడు. ఓ భటులారా! తక్షణం వెళ్ళండి. తమయొక్క దుష్టప్రవృత్తి కారణంగా మన రాజశాసనమును అనుసరించి మరణశిక్ష విధింపబడి, చావుకై ఎదురుచూస్తున్న నేరస్థులు ఏఏ చెఱసాలలో ఎక్కడెక్కడ ఉన్నారో విచారించండి. అట్టి నేరస్థులందరినీ మన నగరానికి తీసుకురండి” — అని ఆజ్ఞాపించాడు. శిక్షయొక్క అమలుకై ఎదురుచూస్తున్న కొంతమంది నేరస్థులను ఒకచోటికి రప్పించారు. రాజు ఆ రాక్షసిని సమీపించి, “ఓ కందరాదేవీ! ఇదిగో….. వీరందరిని నీకు ఆహారంగా ఇస్తున్నాను. వీరు నేరప్రవృత్తి కలవారు. మా రాజశాసనములను అనుసరించి మరణదండన విధింపబడినవారు. అందుచేత నీకు ఆహారం అవుతారు" అని పలికాడు.

ఆ రాక్షసి సంతోషించింది. రాజువద్ద సెలవు పుచ్చుకొన్నది. తన భీకరమైన ఆకారమును ధరించి, వారందరిని తన భుజంపై వేసుకొని హిమాలయపర్వత గుహకు రివ్వున ఎగిరింది. వారిని సుష్టుగా భుజించి మూడురోజులు నిదురించింది. ఆకలి తీరుటచే స్వస్థచిత్త అయి ’సమాధి’ని అవధరించింది. ఐదు సంవత్సరాలు సమాధిలో ఉండిపోయింది. ఒకానొక రోజు సమాధినుండి వ్యుత్థానం పొందింది. రాజు విక్రమార్కుని అభిప్రాయం గుర్తుకువచ్చుటచే మళ్ళీ కిరాతరాజ్యం ప్రవేశించింది. అక్కడ రాజు - - మంత్రులను కలుసుకొన్నది. ఉచితమర్యాదల తరువాత, ఆ ముగ్గురు ఆత్మవిషయమై సంభాషణలతోను, అనేక కథాప్రసంగములతోను కొన్ని రోజులు గడిపారు. ఒక రోజు, రాజుచే సిద్ధము గావించబడినట్టి, వధింపబడతగ్గ ప్రాణులను తనవెంట గైకొని హిమాలయ పర్వతములవైపు రివ్వున ఎగిరిపోయింది.

Page:468

  1. కందరాదేవి

ఓ రామచంద్రా! నేటికికూడా ఆ రాక్షసి ఆ పర్వతముపైనే నివసిస్తోంది. ఒకప్పుడు ధ్యాననిష్ఠ యందు, మరొకప్పుడు వ్యుత్థానస్థితియందు ఉండిఉంటోంది. ఆ కిరాతప్రభువు, అతని మంత్రి మాత్రం కాలానుగుణంగా కోర్కెలన్నీ త్యజించివేసి, శాంతచిత్తులై, విదేహముక్తిని పొందారు. ఆ రాజు యొక్క వంశపరంపరలోని తర్వాతి ప్రభువులు కూడా ఆ రాక్షసితో మిత్రత్వము కలిగి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆ రాక్షసి రావటం, వారు దుష్టజీవులను ఆమెకు ఆహారంగా ఇవ్వటం… ఇప్పటికీ ఆ రాజ్యంలో జరుగుతోంది. అయితే మహాత్ములు ప్రత్యుపకారం చెయ్యటమే స్వభావంగా కలిగిఉంటారు కదా! యోగసిద్ధిని పొందియున్న ఆ రాక్షసి తన మంత్ర - యోగశక్తిచే అక్కడి ప్రజలకు కలిగే అరిష్టములను, పిశాచాదుల నుండి వచ్చే భయాదులను తొలగిస్తూ ఉంటోంది. ఆయా రోగములను కూడా నివారిస్తూ ఉంటోంది. రాజ్యం వలన రాక్షసికి, రాక్షసివలన రాజ్యమునకు ఉపకారమే జరుగుతూ వస్తోంది.

ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆ కర్కటి చాలాకాలం వరకు ధ్యాననిష్ఠయందు ఉండటం జరిగితే, ఆ కారణంచేత చాలాకాలం కిరాతరాజ్యం వచ్చేదికాదు. అప్పుడు అక్కడి ప్రజలు, రోగనివారణకొరకై ఒక ఎత్తైన ప్రదేశంలో ఆమె విగ్రహం స్థాపించి…. ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. ఆమెను “కందరాదేవి”, “మంగళేతర" అనే పేర్లతో ఆరాధిస్తూ ఉంటున్నారు.

అప్పటినుండి, ఆ రాజ్యమును పాలించే రాజులంతా సింహాసనం అధిష్ఠించేముందు కందరాదేవియొక్క విగ్రహప్రతిష్ట రాజ్యంలో ఎక్కడో అక్కడచేసి, అప్పుడు మాత్రమే రాజ్యభారం స్వీకరించేవారు. అట్లా ప్రతిష్ఠ చేయకపోతే అక్కడి ప్రజలకు అరిష్టం కలుగగలదని అక్కడి పెద్దల అభిప్రాయం. “కందరాదేవిని పూజించుటచే ప్రజలు అరిష్టముల నుండి, రోగములనుండి విముక్తిని పొందుతారు” అను ఒకానొక దృఢభావన అక్కడి ప్రజలకు శుభ, శ్రేయస్సులనే కలుగుజేస్తూ ఉన్నది. ఆమె విగ్రహములు, దేవాలయములు నేటికీ ఉన్నాయి. పూజింపబడుచున్నాయి. ఆ దేవి యొక్క లిఖిత చిత్రముకూడా అక్కడి ప్రజల ఇండ్లలో అలంకరించబడి కష్టములు, రోగములు తొలగించునవై ఉంటున్నాయి.

సకల కోమల మంగళకారిణీ కవీలితాఖిల వధ్యమహాజనా।

జయతిసాత్ర కిరాతజనాస్పదే పరమబోధవతీ చిరదేవతా||

అని ఆ కందరాదేవి ప్రార్థింపబడుచున్నది. “సర్వులకు సస్యసమృద్ధి, ఐశ్వర్యము, సకలసంపత్తులు, ఆయురారోగ్యములు ప్రసాదించు మా కందరాదేవి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ సర్వదా మమ్ములను కనికరించునుగాక” అని, అక్కడి సర్వజనులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు.

Page:469

  1. సమీక్ష

ఓ రామచంద్రా! మన ఈ “ఆధ్యాత్మ తత్వప్రసంగం” లో "ఈ ప్రపంచము యొక్క ఉత్పత్తి” విషయమై కొన్ని విశేషాలు వివరించటానికే, నీకు, ఈ ‘కర్కటి ప్రశ్నలు’ చెప్పాను. దీనిని బట్టి గ్రహించవలసింది ఏమిటి?

ఈ జగత్తంతా - ఆదిగాని, మధ్యగాని, అంతముగాని లేని, పరమకారణము అయినట్టి ‘బ్రహ్మము’ నుండే ఉత్పన్నము అయినది. ద్రష్ట-దృశ్యము కూడా పరబ్రహ్మ స్వరూపమే!

కాని, యథార్థానికి, బ్రహ్మమునందు ఏ క్షణంలో కూడా ఏదీ ఉత్పన్నమే అగుటలేదు. నీటిలో వేరువేరు ఆకారములు కలిగిఉండే చంచల తరంగాలు, గుండ్రటి ఆవృత్తములు మొదలైనవన్నీ కనబడుతూ ఉంటాయి. నీరే ఆ అన్ని ఆకారములుగా పరిణమించటం జరుగుతోంది కదా! కానీ, నీరు ఏదైనా మార్పుచెందుతోందా? మరింకేదైనా అగుచున్నదా? లేదే! అట్లాగే పరబ్రహ్మము నందు భూత - భవిష్యత్ - వర్తమాన కాలాత్మకమైనట్టి ఈ జగత్తు ఉన్నది. పరబ్రహ్మము తనయొక్క స్వభావసిద్ధమైన సమత్వ - సామ్యత్వములను ఏమాత్రం ఏ క్షణంలో కూడా త్యజించటం లేదు. అట్లు త్యజించకుండానే, సర్వమునకు కర్త అయి, ఈ జగత్తు యొక్క నిర్మాణం చేస్తోంది.

’కొయ్య ’లో ఒక విగ్రహం చెక్కబడుచున్నట్లుగానే, ఈ కనబడుచున్న ‘సృష్టి’ అనబడే దంతా స్వయముగా, బ్రహ్మమునందే ఒకానొక ‘మిథ్యాకల్పన’ రూపమున ఉదయించటం జరుగుతోంది. అంతేకాని "ఈ సృష్టి అంతా ఎక్కడినుండో బయలుదేరి ఇక్కడికి ఎప్పుడో వచ్చి చేరుచున్నది” అని భ్రమించకూడదు సుమా! ఈ దృశ్యము బ్రహ్మమే!

బీజముకంటే - ఆకులు, పుష్పములు, ఫలములు వేరా? కాదు కదా! కానీ, అవన్నీ వేరు వేరు ఆకారములతో విలక్షణంగా కనిపిస్తున్నాయి. ఈ అనేక పదార్థములతో కూడుకొని కనిపిస్తున్న జగత్తు బ్రహ్మము కంటే వేరుకాదు. కాని, భిన్నంగా కనిపిస్తోంది. పుష్ప ఫల ఆకుల సత్త బీజములో ఉన్నంత వరకు - - “పుష్పాదుల సత్తకు - బీజము యొక్క సత్తకు”-– ఏమైనా భేదం ఉన్నదా? బ్రహ్మము నందు చితనకు (‘తెలుసుకొనుట’ అను తత్త్వమునకు)…. చేత్యమునకు (తెలియబడు తత్త్వమునకు) భేదము లేదు. వాయువునకు, ఆ వాయువు యొక్క చలనమునకు భేదమేమి ఉంటుందో చెప్పు? చితక్కు, చేత్యములకు (తెలుసుకొనుటకు, తెలియబడుటకు) భేదభావ మంతా విచారణలేనట్టి సమయమునందే ఏర్పడుతోంది. లేక స్ఫురిస్తోంది. అట్టి భేదభావన అసత్యమే కాబట్టి, ”అయుక్తము, దుఃఖకారకము“ కూడా అగుచున్నది. అనిర్వచనీయమగు ‘మాయ’ చేత మాత్రమే ఏర్పడుచున్నట్టి ఆ ‘భేదదృష్టి’ నశించాలంటే, ‘ఆత్మవిచారణ’ అనేది మాత్రమే ఉపాయం. ఆత్మవిచారణచే, “దృశ్యము ద్రష్టయొక్క స్వస్వరూప విన్యాసమే!”… అని సుస్పష్టం కాగలదు.

ఈ భ్రాంతి కారణరహితంగానే ఉత్పన్నమగుచున్నది. మరల ఇంతలోనే, జ్ఞానముచే నశించ గలదు. అవిచారణచే ఉత్పన్నమైనది కాబట్టి విచారించుటచేత తొలగిపోతోంది. ఓ రఘుకులతిలకమా! రామచంద్రా! నీవు “భేదదృష్టియే రూపముగా గల భ్రాంతి" ని త్యజించివేయి.

Page:470

ఎప్పుడైతే బ్రహ్మసాక్షాత్కారం అవుతుందో అప్పుడు ఈ మాయను సమగ్రంగా ఎరుగ గలుగుతావు. ఈ మన వర్తమాన ‘ఉపదేశం’ శ్రద్ధగా వింటూ ఉంటే…. భ్రాంతి రూపమునగల హృదయగ్రంథులు క్రమంగా తప్పక ఛేదించివేయబడుతాయి. ఆ తరువాత ఇక అజ్ఞానముయొక్క శబ్దార్థముల గురించిన భేదభావమంతా స్ఫురించకుండానే పోతుంది. అట్టి సమయంలో నీవే స్వయముగా ‘బ్రహ్మము’ అయి ఉన్నట్లు గ్రహిస్తావు. ‘చిత్తము’ నకు కారణమైనట్టి అవిద్య, అట్టి ఈ చిత్తముచే కలుగుచున్న అనర్థములు…. అన్నీ కూడా, ఈ ఉపదేశముచే తప్పక శాంతించగలవు.

ఈ కర్కట్యుపాఖ్యానం యొక్క సారం:

ఈ జగత్తు బ్రహ్మము నుండే బయల్వెడలుతోంది.

బ్రహ్మము నందే ఉంటోంది.

బ్రహ్మము నందే లయిస్తోంది.

కనుక ఈ జగత్తు సర్వదా బ్రహ్మమే!

ఈ ద్రష్ట బ్రహ్మమే.

‘దర్శన - దృశ్యములు’ ఈ ద్రష్టకన్న వేరు కాదు. కనుక అవి కూడా బ్రహ్మమే.