Page:471
VI.ఐందవ - బ్రహ్మాండములు
-
శ్రీరాముడు : శ్రుతులు, (“తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః“ వంటి) కొన్ని మహావాక్యముల ద్వారా, ”బ్రహ్మము వలన జగత్తు ఉత్పన్నమైనది” అని ప్రకటిస్తున్నాయి కదా! ఇక్కడ ‘వలన’ (because of) అనే పంచమీతత్పురుష మనకు వినబడుతోంది. అనగా, ఆ వాక్యములు ’జగత్తు - బ్రహ్మములు వేరు వేరు” అని ప్రకటిస్తున్నట్లే కదా! అప్పుడు “ఈ సర్వము అభిన్నము” అని మనం ఎట్లా అనగలం?
పోనీ, “జగత్తు, బ్రహ్మము వేరు వేరు” అనే నిర్ణయానికే వస్తే, మనం మన ఈ సంభాషణలో ఉపయోగిస్తున్న శబ్ద ప్రవృత్తి అంతా ఈ జగద్వ్యవహారమునకు సంబంధించినదే కదా! ఇట్టి శబ్ద జాలంతో బ్రహ్మమును ప్రతిపాదించటం ఎట్లా? ఇక విచారణగాని, ఉపదేశంగాని సాధ్యపడేదెట్లా? శ్రీవసిష్ఠ మహర్షి: అవును. శబ్ద ప్రవృత్తి బ్రహ్మమును స్వయముగా ప్రకటించలేని మాట నిజమే. ఉపదేశము కొరకు శాస్త్రకారులచే శాస్త్రములందు తాత్కాలికంగా కావించబడుచున్న భేదకల్పనచేత మాత్రమే ఈ శబ్ద ప్రవృత్తి (మనస్సు, బుద్ధి, ఆత్మ, బ్రహ్మం మొదలైన శబ్ద ప్రయోగాలు) సంభవించటం జరుగుతోంది. లోక వ్యవహారం కొరకై కావించబడుచున్న శబ్ద ప్రవృత్తితో కూడిన ఉపదేశమంతా ‘ప్రతియోగి’ మరియు ‘పక్షము’ (To Counter an approach before proposing a finer concept) మాత్రమే సుమా!
వాస్తవానికి “సత్యము” అనుభవపూర్వకమై మాత్రమే వెలయుచున్నది. దానిని మరెవ్వరు దేని చేతకూడా చూపించలేరు. అయితే శిష్యుడు ఉత్తమ ప్రయత్నశీలుడై, ఆత్మను గ్రహించుటకు ఉద్యుక్తుడైయున్నప్పుడు (ఉద్యమిస్తున్నప్పుడు) తత్వదర్శి అయినట్టి గురువు “ఇది కాదు”-“నేతి”– అనే అర్థాన్ని సూచించే అనేక శబ్దార్థముల సహాయంతో, దృష్టాంతములతో సంభాషిస్తూ, శిష్యునకు తన అనుభవం - అవగాహన ఏమైయున్నదో ఏమిటో తెలియజేస్తున్నాడు. అట్లు గురువులచే శిష్యులకు తెలియజేయబడుచున్నవే శాస్త్రములు కూడా! శాస్త్రముల ద్వారా కొంత విధి నియమములను, మరికొంత విచారణను సద్గురువులు లోకమునకు అందిస్తున్నారు. శాస్త్రములను జీర్ణం చేసుకొన్నట్టి కొందరు మహనీయులు శాస్త్రసారాన్ని మరల తమను ఆశ్రయించినవారికి
* పంచమీ తత్పురుష / విభక్త ప్రత్యయం : ’వలనన్, కంటె, పట్టి.
ప్రతియోగి (Criticism) : దేని గురించి అయినాసరే, దాని భేదముగాని, అభావము గాని తెలియచేసే ప్రతిపాదనము (“అది అట్లు అగుటకు వీలు లేదు” అను ప్రతిపాదన)
పక్షము (Holding) : ఏదైనా సందిగ్ధమైన విషయమును కొన్ని అనుమాన ప్రమాణములచే నిశ్చయించటం.
Page:472
బోధిస్తున్నారు. బోధస్వరూపమై ఎట్టి పదజాలములకు, వాక్యపరంపరలకు అందజాలనట్టి ఆ బ్రహ్మతత్వమును ఆ శిష్యుడు గురుశాస్త్రవాక్యముల సహాయంచేత, స్వవిచారణా ప్రభావం చేత తనయందే, అనుభవపూర్వకంగా దర్శించుచున్నాడు.
ఇక నీ ప్రశ్నకు వద్దాం. ఒక దీర్ఘమైన, సమగ్రమైన విషయమును పరిశీలిస్తున్నప్పుడు మనం మహత్తరమైన తత్త్వబోధను అవగతం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకాని, మధ్యలో మధ్యే మార్గంగా చెప్పిన ఒక్కవాక్యమును మాత్రం తీసుకొని, మిగతాదంతా ప్రక్కకునెట్టి, తర్జన - భర్జనలు మొదలుపెట్టడం ఉచితంకాదు.
బాలునితో తల్లి “నాయనా! అదిగో దయ్యం, నీవు ముద్ద తినకపోతే వచ్చిపడుతోంది,” అని ‘దయ్యము’ అనబడే అక్కడ లేని విషయం కల్పించి చెప్పుతుంది. కాని అది వాస్తవమా? కాదు. “ఆ తల్లికి అక్కడ దయ్యం కనిపించింది” అని ఏమాత్రం అనుకోము కదా! అక్కడ ఆ తల్లికి బిడ్డ కడుపు నిండా తిండి తినటం ముఖ్యం. అట్లాగే శాస్త్రాలు కూడా “బ్రహ్మము - జగత్తు” అని చెప్పుచున్నప్పుడు “జగత్తు-బ్రహ్మము”…. అనబడే రెండు విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒక తీరుగా, మరొకటి మరొక తీరుగా ఉన్నాయి” అని చెప్పుచున్నట్లుగా కొద్దిసేపు ఎవరికైనా అనిపించవచ్చేమో. “అట్టి భేదవ్యవహారమంతా ‘అభేదదృష్టి’ కొరకే కల్పించబడుతోంది”. అని గ్రహించటమే సదవగాహన అని మా ఉద్దేశం. “అసలీ వ్యవహారభేద కల్పనలు శాస్త్రములు ఎందుకు చేయాలి?” అని అంటావా? మనం స్వప్నంలో వస్తువులను, మనుష్యులను, కొండలను, మొదలైనవి చూస్తూ ఉంటాము. అవన్నీ ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? లేకుంటే, కలుగుచున్న అనుభవం మాటేమిటి? స్వప్నంలో కనబడే “ఒక ఇల్లు, ఒక మిత్రుడు ” - ఈ రెండు ఒకే ‘కల్పన’ లేక ‘ఊహ’ చే తయారుచేయబడ్డాయా? ఆ రెండింటిని ద్వైతం అనాలా? అద్వైతం అనాలా? అనిర్వచనీయం అనాలా?…. ఒక స్వప్నంలోని ఆయా కల్పితవస్తువులకే ఇన్ని లక్షణములు ఆపాదిస్తున్నాము కదా! ఇక సత్యవస్తువు అయినట్టి ఆత్మ గురించి ప్రతిపాదించాలంటే ఎన్ని పద్ధతులు కావాలి? ఉపదేశము కొరకై ఆయా శబ్దార్థాలు అవశ్యకమే అగుచున్నది. శాస్త్రములు రచించబడే సమయంలో, లేక తత్త్వము బోధించే సమయంలో అనేక శబ్దములు, వాటికి అర్థములు కల్పించబడుచున్నాయి. దానినుండి విషయం విభాగం
చేయబడుతోంది.
కారణ భావము కార్యభావము (Cause & Effect)
స్వామి భావము స్వభావము
హేతువు హేతుమంతము
అవయవములు అవయవి
భేదపరిణామము అభేదపరిణామము
భావము పదార్థముల వైచిత్ర్యము విద్య అవిద్య
సుఖము | దుఃఖము
Page:473
ఇవన్నీ కల్పిత విభాగములు, పదజాలములే…. ఒప్పుకొంటాను. ఎందుకంటే యథార్థానికి, వర్తమాన ప్రవచనము యొక్క “లక్ష్యము” అయి ఉన్న బ్రహ్మమునందు ఏ విధమైన భేదకల్పనలు లేవు. కాని, ఇవన్నీ శాస్త్రములచే గురువులచే కల్పించబడ్డాయి. ఎందుకోసం? అజ్ఞానులకు (People who are not aware of), అర్ధజ్ఞానులకు (People who are half-aware of) బోధించుట కొరకే.
అట్టి భేదకల్పన అంతా…. సత్యవస్తువును ప్రతిపాదిస్తున్న ఆత్మజ్ఞాని అయిన గురువుకు (శిష్యుడికి బోధించటానికై) అత్యంత అవసరమే అవుతోంది. తత్త్వజ్ఞానం ప్రాప్తించిన తరువాత శిష్యుని హృదయం నుండి ఈ భేదకల్పన స్వయంగానే ఉపశమించుచున్నది. ఇకప్పుడు మౌనము మాత్రమే శేషించుచున్నది.
అజ్ఞానికి, ఈ ఎదురుగా కనబడే దృశ్యమంతా కూడా…. ఖండముగా, అర్థము కానిదిగా, దుఃఖ భరితమైనదిగా, అగమ్యమైనదిగా ప్రాప్తిస్తోంది. అప్పుడు సంక్లిష్టమైన విచారణ ఆవస్యకమూ, శరణ్యమూ అవుతోంది. అట్లు ఈ దృశ్యం, అగమ్యంగా, అర్థం కానిదిగా కనిపించటం జరుగకపోతే, మా వంటి గురువులు రంగప్రవేశం చెయ్యవలసిన అగత్యం ఏమి ఉంటుంది? మేము ఆత్మ గురించి, అనాత్మ గురించి బోధిస్తున్నాము. అట్లు మా వాక్యములు వింటున్న ఆ శిష్యుడు క్రమంగా "ఈ దృశ్యము - ఆద్యంతరహితము, విభాగశూన్యము, అఖండము - అయినట్టి పరమాత్మయే కాని మరింకేమీ కాదు” అని దృఢంగా తెలుసుకుంటున్నాడు. అందుచేత రామా! అట్టి ఆత్మబోధప్రాప్తి క్రమంగా తప్పక లభించగలదు.
అయితే ఇప్పటికి మాత్రం ఈ ద్వైతకల్పనను ఉద్వేగరహితుడవై శ్రద్ధాసక్తులతో విను. కాలులో ముల్లు విరిగినప్పుడు ఏం చేస్తాం? మరొక ముల్లుతెచ్చి కాలిలో విరిగిన ముల్లును ఆ ముల్లు సహాయంతో బైటకు లాగి, ఆపై ఆ రెండుముళ్ళు ఆవల పారవేస్తాం కదా? అట్లాగే, ఈ ద్వైతాద్వైత బోధ కూడా జ్ఞానప్రాప్తి జరిగేవరకే ముముక్షువును వెంటనంటి ఉంటుంది. ఆపై, అంతా గ్రహించ బడిన తరువాత, అతడు స్వయంగా, స్వభావ సిద్ధంగా సర్వపదజాలమును తానే త్యజిస్తున్నాడు.
ఈ ప్రపంచంలో కొందరు తమతమ కల్పనల గురించి వాదోపవాదములు చేసుకొంటూ ఉంటారు. కాని ఈ వాదనలన్నీ వేదాంతోపదేశమునకు పూర్వము మాత్రమే సంభవిస్తూ ఉంటాయి. తత్త్వం ఎరిగిన తరువాత, ఈ జీవుని “వాస్తవ-కల్పిత" స్వరూప స్వభావాలు గ్రహించబడిన తరువాత ఇక ఆపై ద్వైతము యొక్క స్ఫురణయే ఉండదు. ఈ వాచ్యము (చెప్పుట) వాచకము (చెప్పబడునది) ల సంబంధం ‘ద్వైతదృష్టి’ సమయంలో మాత్రమే ఏర్పడగలుగుచున్నది. ఉత్తమదృష్టికి తార్కాణం అనుభవమే. అట్టి అనుభవమునకు ఈ చర్చ అంతా ఎంతో అవసరమగుచున్నదని మరల గుర్తు చేస్తున్నాను.
ఓ రాఘవా! నీవు ‘వలన - నుండి’ అని చెప్పు మహావాక్యములను బోధ కొరకు ఉపయోగించబడే సాధన పరికరములుగా మాత్రమే చూడాలి.
(ఉదా: “యతోవా ఇమాని భూతాని జాయనే” దేని నుండైతే సమస్త భూతములు ఉత్పన్న మవుతున్నాయో.”…. ఇది సాధనవాక్యము మాత్రమే.)
Page:474
ఇక అఖండబ్రహ్మమును ప్రతిపాదించే మహావాక్యాలు ఉన్నాయి. ఈ మహావాక్యముల లక్ష్యార్థం అయినట్టి “నేను అఖండుడను” అను ఉత్తమమైన ఎరుకయందే నీవు నీ చిత్తమును నిలపాలి. అట్లు నిలుపుతూనే నేను చెప్పుచున్నదంతా వింటూ ఉండు.
“భ్రాంతి మాత్రమే” అయినట్టి ఈ మనస్సు అనిర్వచనీయమైన మాయయొక్క ప్రభావం చేత ఉదయించి, తన రూపమే అయి ఉన్న, ఈ జగత్తును విస్తరింపజేయుచున్నది.
మనస్సును బట్టే జగత్తు ఉంటుంది. మనస్సుకు వేరుగా జగత్తు లేదు. మనస్సు లేకుంటే జగత్తు కూడా లేదు.
‘మాయారూపము’ అయి ఉన్న ఈ జగత్తును ద్రష్టయొక్క మనస్సే ఎట్లా విస్తరింపచేస్తోందో నీకు చెప్పటానికి, సుబోధకమైన ‘ఐందవులు’ అను వారికి సంబంధించిన ఒక వృత్తాంతము చెపుతాను. అది విన్నావా…. “ఈ జగత్తు అంతా భ్రాంతి మాత్రమే”…. అను విషయము గురించి సుస్థిరమైన నిశ్చయం పొందగలవు. సంకల్పమాత్రంచేత ఉదయించగలుగుచున్నట్టి ఈ త్రిలోకముల గూర్చిన భ్రాంతిని త్యజించి, శాంతచిత్తుడవౌతావు. అట్టి పరిజ్ఞానము నీకు ఆత్మయందు సుస్థిరుడవై ఉండటానికి సహకరించగలదు. నాయనా! సూక్ష్మమైన దృష్టి సునిశితమైన ప్రజ్ఞతో నా వాక్యములలోని వివేకసారాన్ని గ్రహించావా, ఇక ఆపై మనోవ్యాధి యొక్క ’ఊసు’ అయినా ఉండదు. “ఐందవ ఉపాఖ్యానము” అనబడే ఈ పురాతనమైన కథలోని విషయపరిజ్ఞానంచే “ఈ జగత్తంతా మనోమాత్రమే. ఇసుకలో నూనె ఉంటుందా? ఈ శరీరాదులు కూడా సత్యదృష్టిచే లేవు" అనునట్టి ఒకానొక నూతన దృష్టి అలవడుచున్నది.
నాయనా! రాఘవా! రాగద్వేషాలచే కలుషితమైయున్న ఈ చిత్తమే “సంసారము” అని పిలువ బడుతోంది. రాగాదులు మనస్సునుండి తొలగిన మరుక్షణం ఈ సంసార భ్రమకూడా తొలగిపోతోంది. చిత్తమే అన్నిటికీ మూలం. చిత్తమే…. పాలన, విచారణ, వ్యవహారములకు సంబంధించిన సమాలోచన, సంపాదన, ధారణ మొదలైన ఆయా లౌకిక క్రియా వ్యవహారంగా తనకుతానే విస్తరిస్తోంది. కనుక ఓ సభికులారా! మనం ఎప్పుడెప్పుడు ఏదేది లక్ష్యముగా కలిగి ఉంటామో, అదంతా అట్లుగా స్వీయచిత్తమే పరిణమించుచున్నదని గ్రహించండి. ఈ దృశ్యమునంతటినీ తనయందు ధరించుచున్నది ఆకాశరూపమగు చిత్తమేకాని, మరింకొకటేదీ కాదు. చిత్తమే క్రమంగా ఈ దేహము - ఇంద్రియములతో కూడి వర్తిస్తున్నప్పుడు, “ఈ దేహము నేను. ఈ ఇంద్రియములు నేను. ఇది
“అహం బ్రహ్మస్మి” : నేను బ్రహ్మమును
“తత్త్వమసి” : నీవు అదియే అయి ఉన్నావు
“సర్వం ఖల్విదం బ్రహ్మ’ : ఇదంతా బ్రహ్మమే
“జీవో బ్రహ్మేతి నా పరః ఈ జీవుడు బ్రహ్మయే అయి ఉన్నాడు.
Page:475
నేను చేస్తున్నాను. వీరు నా వారు. ఇవి నా పరిమితులు” అనునట్టి అహంభావమును, మమకారమును, ప్రమేయమును పొందుచున్నది. చిత్తములోని చిదంశము అహంకారంగాను, జడంశము జగద్రూపం అయిన దృశ్యముగా ప్రకటితమౌతోంది.
చిత్తము
చిదంశము జడంశము
అహంకారము దృశ్యము
నిరాకారుడగు బ్రహ్మదేవుడు ఆదిసృష్టి యందు ‘స్వతహాగా లేనివే’ అయినటి…. ఈ భూమి, ఆకాశం మొదలైన దృశ్యజాలమును ఒక సమయంలో ఒకానొక స్వప్నమువలె గాంచుచున్నాడు. మరొకప్పుడు సర్వమును (స్వప్న విశేషములవలె) త్యజించుచున్నాడు. అనగా, అప్పుడు అతడు దృశ్యమును గాంచుటలేదు. ఇంకొకప్పుడు అతడు…. ఈ సృష్టి, స్థితి, లయములను, పంచభూతాత్మిక మైన బ్రహ్మాండములను, అహంభావమును, సమష్టి - సూక్ష్మ స్వరూపమగు హిరణ్యగర్భ దేహమును, సూత్రాత్మస్వరూపమును…. వీటినన్నిటినీ కూడా “శూన్యమే కదా!” అను జ్ఞానదృష్టిచే చూస్తున్నాడు. అనగా, అతని దృష్టిలో ఇవన్నీ స్వప్నవస్తువులవలె ‘లేనివే’ అగుచున్నాయి.
బ్రహ్మదేవుడు : అట్టి ప్రథమ భావనను చేయువాడు. త్రిలోకములతో కూడిన ఈ సమష్టికి కర్తృత్వము వహించుటయే అతని స్వభావం.
ప్రశాంతము, నిర్మలము అయిన జలంలో సూర్యప్రకాశం అత్యంత సుందరంగా వ్యాపిస్తూ ఉండునట్లు, సర్వవ్యాపి అయినట్టి ఆత్మ భగవానుడు. ’విషయ రూపములు’ అనదగినట్టి ఈ సర్వదేహ
మనస్సులలో వ్యాపించియున్నాడు. అది అట్లా ఉండగా…. ఈ ‘చిత్తము’ అనే బాలుడు అజ్ఞాన కారణంచేత “మిథ్యారూపమే” అయినట్టి ఈ జగత్తును బేతాళవిన్యాసమువలె చూచుచున్నాడు. అదే చిత్తము జ్ఞానము పొందినప్పుడు నిర్వికారము, శుద్ధము, నిత్యము అగు తత్త్వమే తానని, ‘అదే తదితరులు కూడా’ అని ఎరుగుచున్నది.
ఇప్పుడు “ఐందవోపాఖ్యానం” అని లోకప్రసిద్ధికెక్కియున్న ఒకానొక కథనం విన్నావో, ఇక… మమకారమును, భ్రమను కలుగజేయకలుగుచున్న ఈ దృశ్యమును ఆత్మ ఎట్లు పొందుట జరుగు చున్నదో నీవు గ్రహించగలవు. మధురమైన శబ్దములతో ఉత్తమమైన అర్థసహితంగా, దృష్టాంత యుక్తంగా నీకు అది చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఇది అనేక సంశయాలను నివారించగలదు. శ్రోతల హృదయాలలో వ్యాపించి కలకాలం ఉండగలదని అభిలాష.
* ఆదిసృష్టి : సర్వదా శుద్ధతత్వమే అయిఉన్న చైతన్యము "బాహ్యమునకు సంబంధించిన అనుభవం పొందెదను గాక” అను భావన పొందుట ‘ఆదిసృష్టి’ గా చెప్పబడినది.
Page:476
శాస్త్రవిధిని అనుసరించకుండా, దృష్టాంతాలు లేకుండా, కఠినపదజాలంతో ఎంత గొప్పవిషయం చెప్పినా శ్రోతలు ఆనందించలేరు కదా! కథలు, దృష్టాంతాలు మొదలైనదంతా శ్రోతల అభిరుచిని దృష్టిలో పెట్టుకునే మేము చెప్పుచున్నాం సుమా!
ఓ ప్రియరామచంద్రా! భగవంతుడగు మత్పిత్రుదేవులు బ్రహ్మదేవుడు ఈ ఐందవులకు సంబంధించిన ఒకానొక కథన చమత్కారమును నాకు, మన ఈ విశ్వామిత్ర మహర్షికి-ఒకప్పుడు చెప్పియున్నారు. ఇందు "ఈ జగత్తు మనోమాత్రమే” అని నిరూపించబడింది. శ్రద్ధగా విను.
సర్వాంతర్యామి, పరమానందస్వరూపుడు అగు నా తండ్రి బ్రహ్మదేవుని నేను ఒక సందర్భంలో ఇట్లు ప్రశ్నించటం జరిగింది- "తండ్రీ! ఈ సృష్టులన్నీ ఎట్లా కలుగుచున్నాయి? ఈ సృష్టిరూపమున కనిపిస్తున్నదంతా వాస్తవానికి ఏదైఉన్నది? ఎక్కడినుండి ప్రాప్తిస్తోంది.?”
శ్రీ బ్రహ్మదేవుడు : పుత్రా! వసిష్ఠా! ఒక తటాకంలోని జలంలో విచిత్రమైన ఆవర్తములు (Circles) ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ జలముయొక్క రూపములే కదా! ఈ మనస్సు మహత్తరమైన కల్పనాశక్తి కలిగి ఉంటోంది. అదే ఇట్లు జగత్తు రూపమున స్ఫురిస్తోంది. ఈ ప్రశ్న వింటున్నప్పుడు నాకు ఒకప్పటి చమత్కారమైన సంఘటన ఒకటి గుర్తుకు వస్తోంది. చెపుతాను, విను.
శ్రీబ్రహ్మదేవుడు : అద్వితీయుడనగు నేను ఒకానొక కల్పాంతములో జగత్తునంతా యథారీతి ఉపసంహారం చేశాను. ఏకాగ్రమనస్కుడనయ్యాను. స్వస్థచిత్తుడనై, ఆ కల్పముయొక్క రాత్రి అంతా ప్రశాంతముగా విశ్రమించాను. తెల్లవారింది యథాప్రకారంగా సంధ్యావందనాదులు ముగించాను. ఇక కల్పప్రారంభసూచకంగా ప్రజలను సృష్టించుటకు ఉద్యుక్తుడనై తలెత్తి ఆకాశమువైపు పరికించి చూచాను. ఆ ఆకాశంలో అంధకారముగాని, ప్రకాశముగాని లేవు. అంతములేనట్టి శూన్యమే అయి ఉన్నది. అట్లా కొద్ది క్షణములు పరికించి చూస్తూ ఉండగా, ఆ ఆకాశంలో ఎక్కడో నా మనోనేత్రానికి వేరువేరు సృష్టులు కనిపించాయి. ఆ సృష్టులన్నీ కూడా ఎట్టి ప్రతిబంధకములు లేకుండా, చక్కగా వ్యవస్థితమైయున్నట్లు గమనించాను. ప్రతి ఒక్క సృష్టిలోను ఒక్కొక్క బ్రహ్మ ఉండటం గమనించాను. వారందరు నా ప్రతిబింబమువలెనే ఉన్నారు. ప్రతిసృష్టి యందు స్వర్గ మర్త్య -పాతాళ లోకములు ఉన్నాయి. కాలచక్రము, ఋతువులు, పృథ్వి, ఊర్ధ్వ-అథో లోకములు, స్వర్గ నరకములను ప్రాప్తింపజేయగల శుభ-అశుభ ఆచారములు, వేద ఇతిహాస, పురాణములు, ఉపనిషత్తులవంటి విచారణ గ్రంథములు ప్రవర్తిస్తున్నాయి. ప్రతి సృష్టి ప్రకాశ-అంధకారములతో, నక్షత్రమండలములతో, సముద్రములతో, పర్వతములతో - మనోహరంగా కనిపిస్తోంది. ఆ
Page:477
బ్రహ్మాండములలో వేరువేరుగా దేవతలు, మనుష్యులు, నాగులు, గంధర్వులు…. వారివారి లోకములలో వెలయుచుండటం చూచాను. యుగములు, కల్పములు, క్షణములు, నిమిషములు, పదార్థముల ఉత్పత్తి-స్థితి-ఉపశమనములు…. ఇవన్నీ కొంతసేపు గమనించాను. నా మనో నేత్రమునకు కనిపించిన ఆ పది బ్రహ్మాండములను చూచి చాలా ఆశ్చర్య చకితుడనయ్యాను.
"ఇది ఏమిటి? ఈ బ్రహ్మాండములన్నీ ఎట్లా ఉత్పన్నమైనాయి? నా మనోనేత్రములకు ప్రత్యక్షమై కనిపిస్తున్న ఈ సృష్టులు ఇక్కడికి ఎలా వచ్చాయి?”…. నాలో నేను ఎంత తర్కించుకున్నప్పటికీ ఆ
సృష్టుల వ్యవహారమేమిటో నాకు బోధపడనేలేదు.
అప్పుడు నాకు ఆకాశంలో ఒకానొక బ్రహ్మాండంలో ఒక సూర్యుడు తారసపడ్డాడు. వెంటనే, నేను అతనిని ఎలుగెత్తి పిలిచాను. “ఓ సూర్యభగవానుడా! ఇటు రావయ్యా! నీవెవరు? నిన్ను సృష్టించింది ఎవరు? నేను ఇంతవరకు ’కల్పాంత నిద్ర’ పోయి, ఇప్పుడే నిదుర లేచానే! ఈ జగత్తు లన్నీ ఎట్లా ఉత్పన్నమైయున్నాయి? ఈ విషయం నీకు తెలుసా? నిన్ను ఎవరు సృష్టించారు? నీకు తెలిస్తే తెలిసినదంతా చెప్పు!” అన్నాను.
సూర్యుడు :“హే బ్రహ్మదేవా! ఈ దృశ్యప్రపంచమునకంతటికీ సర్వదా కారణరూపులు మీరే కదా! దీనిని మీరే ఎరుగక పోవటమేమిటి? సర్వవ్యాపియగు ఓ మహాత్మా! పితామహా! నన్ను అడిగి, నా వలన ఆ బ్రహ్మాండముల విషయం విని వినోదాన్ని పొందుదామనుకొంటున్నారా? సరే. ఇది కూడా సంతోషమే. విచిత్రమైన నా యొక్క ఉత్పత్తి గురించి చెప్పుచున్నాను. వినండి.
హే పరమాత్మా! ‘మాయాశక్తి’ యే నిరంతరం ఈ జగన్నిర్మాణమంతా చేసుకొంటూ పోతోంది. తత్త్వజ్ఞానము యొక్క అభావము (లేక) ‘మరుపు’ కారణంగా ఆ మాయాశక్తిచే ప్రకటించబడునవన్నీ ‘సత్యము’గా తోచటం జరుగుతోంది. ఒక్కసారి ప్రబోధం పొందటం జరిగిందా…. ఇక ఆ తరువాత ఇదంతా అసత్యముగానే తెలియవస్తోంది. ఇట్లు ఈ మాయ ‘సత్-అసత్’ రూపమైయుండి, దేశ-కాలాదులతో కూడుకొన్నదై, పరిచ్ఛిన్నత్వము సంతరించుకొని విజృంభిస్తోంది. అయితే ఇదంతా మనోవిలాసమాత్రమేనని తత్వజ్ఞులైనట్టి మీకు వేరుగా చెప్పేదేమున్నది? సర్వము ఎరిగియున్నట్టి మీకు ‘మాయ-మనస్సు’ ల విలాసం గుర్తుచేస్తూ, ఇక ఐందవులకథ వినిపిస్తున్నాను.
కైలాసపర్వతపు క్రింద భాగంలోగల జంబూద్వీపంలో ‘సువర్ణజట’ అనే ఒక ప్రదేశం ఉన్నది. మీ కుమారులగు మరీచి మొదలైనవారి నివాసం అక్కడేకదా! అచ్చట ‘ఇందువు’ అనే ఒక గృహస్థుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు కశ్యపుని వంశమునకు సంబంధించినవాడు. గొప్ప ధర్మాత్ముడు. బ్రహ్మజ్ఞాని. ఎల్లప్పుడు, బ్రహ్మనిష్ఠులగు సాధు - సత్పుంగవులతో సాంగత్యము కలిగి ఉండేవాడు.
అతనికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. అందుచేత భార్యతోసహా, కైలాసపర్వత సమీపంలో గల ఒక నిర్మానుష్యప్రదేశం చేరి, అక్కడ జలము మాత్రమే తీసుకొంటూ ఘోరతపస్సు ప్రారంభించాడు. చాలాకాలం గడచిన తరువాత ఒకరోజు కైలాసనాథుడగు పరమేశ్వరుడు
Page:478
పార్వతీసమేతుడై ప్రత్యక్షమయ్యాడు. ఋషభారూఢులై వేంచేసియున్న ఆ ఆదిదంపతులను ఇందువు, అతనిభార్య భక్తిరసపూరితమైన స్తోత్రాదులతో పూజించారు.
ఇందువు : దేవేశా! భగవానుడా! పార్వతీనాథా! మీ దర్శనముచే మా జన్మలు సార్థకమయ్యాయి. మాపై కరుణతో గొప్ప తెలివితేటలు, ధారణాసామర్థ్యము, మేథస్సు గల పదిమంది కుమారులను ప్రసాదించమని వేడుకొంటున్నాను. అనుగ్రహించండి.
పరమేశ్వరుడు : “అట్లే అగునుగాక” అని వరమును ప్రసాదించి సపరివారంగా అంతర్ధానమయ్యాడు. ఇందువు భార్యాసమేతంగా సంతోషంగా నిజాశ్రమం చేరాడు. వారికి కాలక్రమంగా మహాతేజః సంపన్నులు, సౌందర్యవంతులు అయిన పదిమంది పుత్రులు కలిగారు. వారంతా ఏడు సంవత్సరముల ప్రాయమునకే సర్వశాస్త్రములు అభ్యసించారు.
చాలాకాలం గడచిపోయింది. కాలక్రమంగా ఇందువు, అతనిభార్య తమ తనువులను చాలించి విదేహముక్తులు అయ్యారు. ఆ పదుగురు ఐందవులకు అక్కడ బంధువులెవ్వరూ లేరు. వారు తలితండ్రుల వియోగంచే ఖిన్నులై, ఆ ఆశ్రమంలో ఉండలేక అక్కడినుండి బయలుదేరారు. కైలాస పర్వతశిఖరంచేరి, అక్కడ ఒకచోట కొంతసేదతీరుటకై బసచేశారు. ప్రయాణపు బడలిక తీరినతరువాత, ఒకచోట అందరు సమావేశమై, ఇట్లు సంభాషించుకోసాగారు.
సమావేశం - - సమాలోచన
జ్యేష్ఠసోదరుడు : తమ్ములారా! మన తల్లితండ్రులు మనను విడచి విదేహముక్తులయ్యారు. ఇక వారల గురించి శోకించడం అనవసరం, అప్రస్తుతం, అర్థరహితం కూడా. వారు మనకు ఈ మానవదేహములను ప్రసాదించి మహోపకారం చేశారు. ఈ మానవజన్మ ఒక మహత్తరమైన అవకాశంగా మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. అందుచేత మనం ఇప్పుడు భవిష్యత్తు కొరకు ప్రయత్నశీలురం కావాలి. ప్రయత్నించువాడే ఏదైనా సాధిస్తాడు. ప్రయత్నమే చెయ్యనివారు పొందేదేముంటుంది? చేయకలిగేదేముంటుంది?
అయితే ఇప్పుడు దేనికొరకు ప్రయత్నించాలి? మనకు ఇహ - - పరములందు అత్యంత సుఖమును, శ్రేయస్సును చేకూర్చకలిగేది ఏది? కీర్తి, ఐశ్వర్యం, సంతృప్తి, ఆనందాలను సొంతం చేసుకోవాలంటే, ఏది లక్ష్యముగా కలిగియుండి మనం ప్రయత్నించాలి? మన ప్రధాన లక్ష్యము ఏమిటో మీరంతా మీమీ అభిప్రాయములు చెప్పండి. అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాత మనమంతా ఒక నిర్ణయానికి వద్దాం. అప్పుడు భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుందాం.
రెండవ సోదరుడు : నా దృష్టిలో, ఎవరికైతే మంచి గృహములు, గ్రామములు ఉంటాయో - అట్టివాడు ఐశ్వర్యవంతుడు. మండలాధిపతి అనేక మందిపై పెత్తనం చెలాయించగలడు. కనుక మనమందరం మండలాధిపతులం అయ్యే ఉపాయం యోచించడం మంచిది.
మూడవ సోదరుడు : సోదరులారా! మనకు స్వల్పవిషయమైనట్టి ‘మండలాధిపతి’ ఎందుకు చెప్పండి?
Page:479
మండలాధిపతులను నియమించేది, పెరికివేసేది రాజులే కదా! రాజే మహదైశ్వర్య సంపన్నుడు. కనుక మనమందరం రాజులం కావటానికి ప్రయత్నిద్దాం.
నాలుగవ సోదరుడు : అన్నలారా! తమ్ములారా! దేశాధిపత్యమా? అంతటితో తృప్తి చెందుచున్నారా? అది సరి కానేకాదు. మహద్విభవోపేతుడగు “చక్రవర్తి” అయితే అనేక రాజ్యాలను పరిపాలించ వచ్చును కదా! కాబట్టి మనకు చక్రవర్తి ఐశ్వర్యమే వాంఛనీయం. అందుకొరకే ప్రయత్నశీలురం కావాలని నా అభిప్రాయం.
ఐదవ సోదరుడు : కాదు. చక్రవర్తి ఎంత? అతని మహారాజ్యమెంత? మనం మహేంద్రపదవికే ఎందుకు ప్రయత్నించకూడదు?
ఈ విధంగా అనేక తర్జన భర్జనలు జరిగాయి. చివరికి ఆఖరి సోదరుడు లేచాడు. ఆఖరి సోదరుడు : మహేంద్రపదవి అవీ ఇవీ, ఉత్తమమైనవంటున్నారా? ఏమి తెలివి తక్కువ ఆలోచన? ఎందుకంటారా? అది బ్రహ్మదేవుని విభవములు, ఆయుష్షు దృష్ట్యా చూస్తే, స్వల్పమైనదే కదా? బ్రహ్మదేవుని యొక్క కొద్దినిమిషములకాలంలో మహేంద్రుని దీర్ఘమైన ఆయుష్షు సమసి పోతోంది. కాబట్టి కల్పము గడచిపోయినా కూడా నశించనట్టి ఉత్తమపదవి ఏదైనా ఈ లోకంలో ఉన్నదేమోనని యోచన చేస్తే "బ్రహ్మదేవుని పదవి మాత్రమే” అని నాకు అనిపిస్తోంది.
జ్యేష్ఠ సోదరుడు : ఓ తమ్ములారా! మీ సమాలోచనలన్నీ విన్నాను. మన ఆఖరి సోదరుడు చెప్పుచున్నట్లు, సమస్త ఐశ్వర్యములలో కెల్లా బ్రహ్మదేవుని పదవే ఉత్తమోత్తమమైన పదవి అని మాకు కూడా అనిపిస్తోంది. కల్పము నశించినా, ఆ పదవి మాత్రం నశించుట లేదు.
మిగతా సోదరులంతా ఈ ఆలోచనను, “మంచిది మంచిది, బాగున్నది బాగున్నది"; అని ప్రశంసించారు. అందరూ కలసి “జగత్ పూజ్యుడైన బ్రహ్మదేవుని పదవి మనం పొందవలసిందే” అని తీర్మానించుకున్నారు.
బాగానే ఉన్నది. కాని బ్రహ్మపదవి పొందటం అంటే మాటలేం కాదే! ఎట్లా పొందటం? ఈ ప్రశ్న వారి మనస్సును, అన్ని ఆలోచనలను ఆక్రమించివేసింది. అప్పుడు అత్యంత తేజోసంపన్నుడైనట్టి పెద్ద కుమారుడు దీర్ఘంగా ఆలోచించుకొని, ఆపై ఇట్లు పలుకసాగాడు.
జ్యేష్ఠ కుమారుడు : ఓ సహోదరులారా! మీరు విచారించవలసిన పనేమీలేదు. మనం బ్రహ్మదేవుని దివ్యపదము పొందువిషయమై నాకు ఒక గొప్ప ఉపాయం తట్టుచున్నది. మీరంతా దృఢ చిత్తంతో నేను చెప్పేది వినండి.
మనమంతా ఉత్తమమైన ‘ఆసనం’ స్వీకరించి ఆసీనులమౌదాం.
"సర్వప్రకాశములకు కారణభూతుడై, పరమప్రకాశవంతుడగు బ్రహ్మదేవుడను ‘నేనే!’ నా శక్తి యొక్క సహాయం చేత నేనే స్వయముగా బ్రహ్మాండమును సృష్టిస్తున్నాను. ఇంతలోనే సంహారం
Page:480
కూడా చేసివేస్తూ ఉంటాను.” అని భావనచేద్దాం. జీవన పర్యంతము అట్టి ధ్యానము విడువవద్దు. మనం బ్రహ్మపదవి పొందేవరకు అట్లు నిశ్చలంగా ధ్యానం చేస్తూనే ఉందాము. ఓ తమ్ములారా! ఈ శరీరాలు ఎప్పటికైనా శిథిలం కావలసిందేకదా! కనుక, ఈ శరీరము వైపు మనం దృష్టి సారించనేవద్దు. మన దేహముల విషయం కాల క్రమేణా,… “ఏది ఏట్లో- అది అట్లే”… అగుగాక!
మిగతావారందరికి ఆ వాక్యాలు అత్యంత సమంజసంగా కనిపించాయి. వారంతా ఒక చక్కని ప్రశాంతమైన ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ ఆయాస్థానాలలో ఉచితాసనములను ధరించి కూర్చున్నారు. మనస్సుచే, వాక్కుచే, శరీరముచే మౌనం వహిస్తూ ధ్యానపరులయ్యారు. చిత్రంలో లిఖించ బడిన చెట్లయొక్క, ఆకులవలె నిశ్చలత్వం వహించారు. బాహ్యవృత్తులను నిరోధించి, చిత్తమును అంతర్ముఖం చేశారు. ఇక ఆపై ఇట్లు చింతించసాగారు.
“ఇప్పుడు నాకు ఒక వికసించిన, విశాలమైన కమలం గోచరమౌతోంది. ఆ కమలముపై ఆసీనుణ్ణి అయిఉన్నాను. ఈ జగత్తు అంతటికీ స్రష్ట - కర్త - భోక్త కూడా నేనే. నేనే ఈశ్వరుడను. యజ్ఞస్వరూపుడను. జ్ఞానవేత్తలగు మహర్షులంతా నాయందే ఉన్నారు.
శిక్ష, వ్యాకరణము–మొదలైన అంగములు, పురాణములు మొదలైన ఉపాంగములు, గాయత్రీ యుక్తమైన వేదమంత్రములు, సర్వమానవకోటి…. ఇవన్నీ నాయందే స్థితి కలిగి ఉన్నాయి. లోక పాలకులు, యముడు, సిద్ధులు నివసించే లోకములన్నీ నాయందే ఉన్నాయి. ఉత్తమ స్వరములతో విభూషితమైన స్వర్గలోకము కూడా నాయందే ఉన్నది. అనేక పర్వతములు, ద్వీపములు వనములతో కూడి భూమండలము, నక్షత్రమండలము…. ఇవన్నీ నాయందు నిక్షిప్తమై, ఇదిగో, ఇప్పుడు ప్రకటిత మవుతున్నాయి.
ఆహాఁ! ఈ విశాల ఆకాశము, దేవతాస్త్రీలతో అత్యంత సుందరంగా ఉండే దేవలోకము, దైత్యదానవులతో నిండి ఉండే పాతాళలోకం…. ఇవన్నీ నాయందు ఎంత సహజంగా శోభిస్తున్నాయి! యజ్ఞభోక్త అయినట్టి ఇంద్రుడు నాయందే త్రిలోకనగరములను పాలించుచున్నాడు. అరుగో. పన్నెండు మంది ఆదిత్యులు తమ కిరణములచే దిక్కులను నింపివేస్తూ, పన్నెండు మాసములను తపింపజేయు చున్నారు. గోపబాలుడు గోవులను మేపుతూ ఉంటాడు కదా! అట్లే ఇంద్రుడు, యముడు, కుబేరుడు మొదలైన లోకపాలకులు నియతియుక్తులై, నా అంతరంగములో ఉన్నట్టి తమ తమ లోకములను పాలించుచున్నారు.
జలమునందే తరంగములు ఉత్పన్నమగుచున్నట్లు, నాయందే చమత్కారములైన వివిధ నామ రూపాత్మకమైన వేల వేలాది జీవజాతులు-జీవ ధర్మములు, జీవులు; వారి కొరకై ఆహార-విహారములు ఉత్పన్నములగుచున్నాయి. నశించుచున్నాయి. జీవులంతా ఒకప్పుడు ఐశ్వర్యయుక్తులు అగుచున్నారు. మరొకప్పుడు దారిద్ర్యబాధచే క్రుంగిపోవుచున్నారు. వీరందరి కొరకై తపస్సు-ప్రార్థన-యోగ సాధనాలు ప్రవర్తిస్తున్నాయి.
Page:481
ఈ సృష్టి అంతా నా చేతనే నిర్మించబడుచున్నది. దీనినంతా మన్వంతరాలుగా మారి పోషిస్తున్నాను. మరల మరొకప్పుడు, నేనే దీనినంతా సంహారం చేస్తూ ఉంటాను. సమస్త లోకములకు ఈశ్వరుడను నేనే. ఏది ఏమైతేనేం? సర్వదా ఆత్మయందే స్థితి కలిగియున్నాను. కనుక పరమ శాంతియే నా స్వరూపము. ఇదిగో, ఇప్పుడు సృష్టికాలం. ఇప్పుడిప్పుడే లయము సంప్రాప్తిస్తోంది. యుగము తరువాత యుగము వస్తోంది. పోతోంది. ఇప్పటికి ఒక బ్రహ్మసంవత్సరము గడచి పోయింది. ఈ రోజుకు ఈ కల్పము గడచిపోయింది. ఇప్పుడు బ్రహ్మరాత్రి గడచుచున్నది. కాబట్టి పూర్ణాత్మ స్వరూపుడను, పరమేశ్వరుడను అయి ఉన్న నేను తదనంతర సృష్టిని కల్పించుచున్నాను…….’ 99
ఆ పదిమంది ఐందవులు ఈ రూపము కలిగినట్టి భావపరంపరలను మనస్సుతో అనుసంధానం చేయసాగారు. కొంతకాలం గడిచింది. వారంతా పర్వతమువలె నిశ్చలులయ్యారు. ఒక శిలావిగ్రహం లాగా స్థిరచిత్తంతో ధ్యాన నిమగ్నులయ్యారు. బ్రహ్మదేవుని ధర్మములు చాలా కాలం భావన చేస్తూ ఉండిపోయారు. కొంతకాలానికి వారు మనస్సులోని సర్వదోషములను జయించివేయుటచే, “బ్రహ్మ పదము”ను సమీపించసాగారు. అత్యంతశోభతో కూడుకొన్నవారై చిరకాలం విరాజిల్లుచున్నారు.
హే బ్రహ్మదేవా! ఆ విధంగా ఆ ఐందవులు ఉపాసనా క్రమముచే…. లోకముల యొక్క ప్రాణులయొక్క సృష్టి - స్థితి - - సంహారముల గురించి భావించుచు వచ్చారు. అట్లు బ్రహ్మోపాసన యందు నిమగ్నులైయుండగా, ఎప్పుడో వారి భౌతిక శరీరాలు ఎండకు - - వానకు - గాలికి సంస్పృశ్య విషయమైయుండే ఒక ఎండుటాకు వలె నేల వ్రాలిపోయాయి. ఇటు అటు - చిందర వందరగా పడియున్న వారి శరీరభాగములను మాంసాహారులైనట్టి అడవి మృగాలు భక్షించాయి. ఇట్లు దేహములు పతనము చెందినతరువాత కూడా వారు “బ్రహ్మభావన” (…. నేను సృష్టి కర్తయగు బ్రహ్మను - అను భావన) చేస్తూనే ఉన్నారు. నాలుగు యుగములు గడచిపోయాయి. కల్పక్షయం అయింది. కల్పాంతము వచ్చిపడినది. సూర్యుడు తన తీక్ష కిరణములచే లోకములను ధ్వంసం చేయటం ప్రారంభించాడు. ప్రళయమేఘములు, కల్పాంతవాయువులు అనేక ప్రాణికోట్లను నేల కూల్చివేశాయి. జగత్తంతా జలమయమైపోయింది. ఇంత తతంగం జరుగుచున్నప్పటికీ, ఆ ఐందవులు మాత్రం, శరీరరహితులై, అట్లే సూక్ష్మ శరీరముతో కూడి ధ్యానమునందు నిమగ్నులై ఉండి ఉన్నారు.
వారంతా ఆ విధంగా సుఖంగా “నేను బ్రహ్మదేవుడను. సర్వము సృష్టిస్తున్నాను” అను రూపము గల ధ్యానములో నిమగ్నమైయున్నారు కదా! "అహం బ్రహ్మదేవాస్మి” అను నిష్ఠను వారు వీడలేదు. కాలక్రమంగా వారు పదిమంది బ్రహ్మలు అయినారు. వారిచే సంకల్పించబడిన పది బ్రహ్మాండములు వారి చిత్తాకాశమునందే ప్రతిష్ఠితమైయున్నాయి.
అట్టి పదిబ్రహ్మాండములలో, ఒకానొక బ్రహ్మాండమునందు నేను సూర్యుని రూపము ధరించినవాడనై ప్రవర్తిస్తున్నాను. రాత్రి - పగళ్ళను, తదితర వస్తుజాలమును అత్యంత అకర్తృత్వము వహించి నిర్వర్తించుచున్నాను. ఆకాశములో సంచరిస్తూ, కాల - కర్మ విభాగములను నిర్మించు స్వభావముచే నియమించబడి ఉన్నాను.
Page:482
శుద్ధ చిత్తముతో కూడుకొన్న మనోనేత్రములతో మీరు చూచిన ఆ పది బ్రహ్మాండములు ఎట్లా సృష్టించబడ్డాయో వివరించి చెప్పాను. ఇక మీకేది ఉచితమని తోస్తే, అట్లే నిర్వర్తించండి. హే ప్రభూ! మీకు తెలియనిదేమున్నది! ఈ దృశ్యము వివిధ కల్పనల…. బంధహేతువై మోహదాయకమే అగుచున్నది. జీవునకు సంభవిస్తున్న బాహ్య - అభ్యంతర ఇంద్రియతాదాత్మ్యమే ఇందుకు దృష్టాంతము. కాని, ఈ దృశ్యమంతా చిత్తభ్రాంతి మాత్రమే. ఇదంతా యథార్థమైనది కానేకాదు. ఎందుకంటే, ఇందులో మార్పుచెందని దంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు కదా!
పుత్రా! వసిష్ఠా! అదంతా విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. చాలా సేపు నా యందు ఎంతో తర్జన - భర్జనలు జరిగాయి. అప్పుడు నేను ఆ సూర్యభగవానునితో ఇట్లా అన్నాను.
నేను (బ్రహ్మదేవుడు) : ఓ భాస్కరా! ఆ ఐందవులు తమయొక్క దృఢసంకల్పమాత్రంచేత తమ చిత్తాకాశంలో ఈ బ్రహ్మాండములన్నీ సృష్టించి, దర్శించుచున్నారు కదా! ఇక నేనేం చెయ్యాలి? క్రొత్తగా సృష్టి చేయుటచే ఒరిగే ప్రయోజనమేమున్నది? కాబట్టి, నా ధర్మము అయినట్టి “సృష్టించటం” అనే కార్యక్రమం ఆపివేయాలా? మౌనం వహించి ఉండాలా? లేక, ముందుగా వీరి సృష్టి లేకుండా చేయాలా? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? నాకేం పాలుపోవటంలేదు.
శ్రీసూర్య భగవానుడు: ఓ బ్రహ్మదేవా! జనులు కర్మలు ఎందుకు నిర్వర్తిస్తున్నారు. కొందరు, ‘భవిష్యత్తులో ఏదో పొందాలి’ అనే ఆశచే … ఇంకొందరు, ‘దైవ లిఖితం’ అని అనుకుంటూ, … మరి కొందరు, ‘దోష నివారణకై’ అని భావించి, … వేరేకొందరు, ’నా వారికొరకై’ అని అనుకుంటూ, … ఇంకా కొందరు, ’తప్పదు కదా’ అని అనుకుంటూ ఆయా కర్మలు చేస్తున్నారు.
అయితే, మీరు సంకల్ప వర్జితులు, సర్వసంకల్పములకు ఆవల ఉన్నట్టి నిర్మల స్వరూపులు, ఇచ్ఛారహితులు కదా! అట్టి మీరు ఏదైనా ప్రయోజనం ఆశించి ఈ సృష్టి కార్యమును నిర్వర్తిస్తున్నారా? లేదుకదా! ఓ జగన్నాథా! బాలుడు ఏమీ కోరకుండానే ఆడుట, పాడుట చేస్తున్నట్లు మీరుకూడా ఈ విధిని క్రీడాపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. ఈ సృష్టి అంతా ఒక ’లీల’ యే కాని, మరింకేమీ కాదు. అట్లే అగ్నిగోళస్వరూపము ధరించినట్టి సూర్యుడనగునేను కూడా, ఎట్టి ఇచ్ఛ లేకుండానే నిశ్చల-నిర్మల జలంలో ప్రతిబింబిస్తున్నాను. నిష్కాముడగు మీచే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సంభవిస్తోంది. మరి నేనో, కోరకుండానే నా ఎదురుగా నడచివెళ్ళుచున్న మానవుని యొక్క నీడ ఏర్పడుటకు కారకుడనగుచున్నాను.
విజ్ఞానమే స్వరూపముగా కలిగియున్నట్టి మీకు దేహాభిమానమేమిటి? ద్వంద్వములెక్కడ? మీరు అహంభావరహితులు. ‘నేను - నాది’….అను భావావేశం లేనివారు. అందుచేత మీ వంటి వారు దేనిని వాంఛించరు. త్యజించరు. ఇచ్ఛాద్వేషములు లేకుండానే, నేను, రాత్రింబవళ్ళను నిర్మిస్తూ పోతున్నట్లు మీరుకూడా "ఇది ప్రాప్తించుగాక! ఇది తొలగుగాక” అను రూపము గల ప్రాప్తాప్రాప్తములకు సంబంధించిన దృష్టిని ఆశ్రయించ కుండానే సృష్టిస్తున్నారు; మరల
Page:483
పరిపోషిస్తున్నారు. ఇట్టే సంహరిస్తున్నారు. సత్యద్రష్టలగు జ్ఞానుల అభిప్రాయం ప్రకారం ఇదంతా మీయొక్క విలాసం మాత్రమే.
ఇంతకాలంగా మీరు “ఇది నా కర్తవ్యము” అని తలచి, ఆసక్తిరహితంగా నిత్యము చేస్తూవస్తున్నట్లే, ఇప్పుడు కూడా ఎట్టి స్వార్థము లేకుండా పరమార్థ భావనతో యథారీతిగా చేస్తూ ఉండటమే ఉచితం. ఒకవేళ యథాప్రాప్తములైన కర్మలను త్యజించి, ఈ ‘సృష్టించడం’ అనేది మానివేశార నుకుందాం. అప్పుడు మాత్రం మీరు పొందే అపూర్వవస్తువు ఏమున్నది చెప్పండి? ఒక దర్పణము దేనిని వాంఛించకుండానే, దేనిపట్లకూడా ఇచ్ఛాద్వేషములు లేకుండానే, ఎదురుగా ఉన్నదంతా “తనయందు ప్రతిబింబింపజేయుట” అను క్రియా వ్యవహారం సల్పుచున్నది కదా! అదేవిధంగా సత్పురుషులు కూడా “ఇది నాకు ప్రాప్తించాలి” లేక, “ఇది మరోవిధంగా ఉండాలి” వంటి కల్పనకు, వాంఛకు తావు ఇవ్వకుండానే ఎల్లప్పుడు తమకు ప్రాప్తించిన కర్మలను నిర్వర్తిస్తున్నారు. ఆత్మజ్ఞానులకు “అయ్యో! మేము అది చేయలేదే?” అను రూపముగల అప్రాప్తములైన కర్మలను మననం చేయాలని ఏమాత్రం కోర్కె ఉండదు. అజ్ఞానులు, మాయామోహితులు మాత్రమే తమకు ప్రాప్తించిన కర్మలయందు దృష్టి ఉంచక, అప్రాప్తములైన వాటి గురించి యోచించుచూ, “వారి పనులు మాకు ఇచ్చి ఉంటే ఎంత బాగు!” అని ఆవేదన చెందుతూ ఉంటారు. వారంతా కర్మహస్యం ఎరుగనివారే అగుచున్నారు. జ్ఞానులకు, తమకు ప్రాప్తములైన కర్మలను త్యజించాలనే పట్టుదలగాని, అంటిపెట్టుకొని ఉండాలనే ఇచ్ఛ ఉబలాటములు గాని ఉండవు.
❖
కాబట్టి, ఓ బ్రహ్మదేవా! “వాస్తవానికి నేనేమీ చేయుటలేదు” అను అనుభవమునే జ్ఞానులు కలిగి ఉంటున్నారు. మీరుకూడా కర్మను నిర్వర్తిస్తున్న సమయమందు “నాహంకర్తా నైవకించిత్ కరోమి” = నేను కర్తను కాదు. నేనేమీ చేయుటలేదు… అనురూపముగల మౌనము లేక నుషుప్తి -
వంటి భావన వహించటమే ఉచితం. ఎవ్వడైనా ఎప్పుడైనా ఆసక్తితో కూడుకొన్నవాడై ఏదైనా చేస్తే మాత్రమే … అట్టి కర్మయొక్క కర్తృత్వము, వాటి ఫలితముల భోక్తృత్వము సంప్రాప్తిస్తుంది. కర్తృత్వ -భోక్తృత్వ భావములు ఉన్నచోట మాత్రమే, సుఖ దుఃఖానుభవములు దీర్ఘమైన ప్రభావం కలిగి ఉంటున్నాయి. ‘నాహంకర్తా’ అనునట్టి భావన కలవానికి కర్మ ఎక్కడ? ఫలితమెక్కడ? ఒకవేళ ఏ సమయమందైనా కర్మ ప్రతీతి (నేను చేయవలసి వచ్చుచున్నదే?’ అను భావన) కలిగినా కూడా - “ఆఁ! ఇదంతా స్వప్నమాత్రమే కదా!" అని తలచుచు, నిష్కాములమై, ప్రాప్తించిన కార్యములను నిర్వర్తించటమే ఉచితమని నా అభిప్రాయం. జన్మలు ఏర్పడుచూ ఉండగా కూడా జన్మ రాహిత్యం ఆస్వాదించటం మోక్షస్వరూపుని అంతిమ లక్షణం కదా!
ఓ దేవా! ఇప్పుడు మీరు ఐందవుల సృష్టిని చూచి కొంత ఆశ్చర్యమును, కొంత వినోదమును పొందియున్నారు కదా! మీ సృష్టి తదితరులకు వినోదకరంగా, సంతోషం ప్రసాదించేదిగా ఉంటూ ఉంటుంది. అందుచేత, మీ కర్తవ్యమై ఉన్నట్టి సృష్టిని తదితరులు వినోదము, ఉల్లాసముల కొరకై నిర్వర్తిస్తూనే ఉండండి.
Page:484
ఇప్పుడు మీరు ఆ ఐందవులు సృష్టించిన సృష్టులను మనోనేత్రములచే మాత్రమే దర్శిస్తున్నారు. చర్మచక్షువులచే చూడలేరు. అన్యులచే గావించబడిన సృష్టులను మనం మనోనేత్రములచే మాత్రమే చూడగలం. కాని, సృష్టికర్త తాను సృష్టించినదానిని మాత్రం అవశ్యం తన చర్మచక్షువులచే చూడగలుగుతాడు. ఒకడు ఒక వస్తువుపట్లగాని, వ్యక్తిపట్లగాని ఏర్పరచుకొన్న ప్రియత్వము, అట్టి ప్రియత్వ కారణంగా కనిపిస్తున్న అందచందాలు అతనికే ఆ విధంగా తెలియవస్తాయికాని, ఇతరులకు కాదుకదా! అట్లే సృష్టికర్త మాత్రమే “దీనిని నేను సృష్టించితిని” అని ఎరుగగలడు.
మరొక్క విషయం. ఈ పది బ్రహ్మాండములు ఆ ఐందవులయొక్క దృఢచిత్తముచే ప్రతిష్ఠితములై, సృష్టించబడ్డాయి. బ్రహ్మాండములను గాని, వీటిని సృష్టించినట్టి ఐందవులను గాని ఎవ్వరూ నశింపజేయలేరు. ఎందుచేతనంటారా? మనమెవ్వరమైనా ఒకని కర్మేంద్రియములచే చేయబడిన కార్యం నిరోధించగలం కాని, మనోనిశ్చయముచే చేయబడే కార్యము నిరోధించటమెట్లా? ఇక్కడ చమత్కారమేమంటే …. ఎవని చిత్తమునందు ఏది దృఢంగా నిశ్చితమై ఉంటుందో అద్దానిని అతడే తొలగించుకోవాలి. అంతేగాని, మరెవ్వరు దానిని తొలగించజాలరు. అసలు ఒక వ్యక్తియొక్క మనస్సులో ఒక దృఢనిశ్చయం ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి? బహుకాలంగా మనస్సునందు ఆ నిశ్చయమునకు సంబంధించిన సంకల్పములను అత్యంత ప్రియంగా, తీవ్రేచ్ఛతో అభ్యసించటంచేతనే కదా! కనుక, అట్లు ఏర్పడిన దృఢనిశ్చయం శాప వరాదులచేతగాని, దేహపతనము చేతగాని, మరింకే బాహ్యమైన ప్రయత్నంచేతగాని నివారించబడజాలదు. దృఢనిశ్చయమును సంకల్పిస్తున్నట్టి మనస్సు స్వయంగా దానికి వ్యతిరేకమైన సంకల్పములచే ఆ దృఢనిశ్చయమును ఉపసంహరించ వలసిందే. అట్లా ఉపసంహరించబడేవరకు ఆ నిశ్చయం ‘అట్లే’ ఉంటుంది. ఏదైతే మనస్సులో స్థిరంగా నిశ్చయింపబడుతుందో - ఆ మనుజుడు ఆ నిశ్చయమునకు సంబంధించిన రూపమునే పొందుచున్నాడు కాని, అన్యమైనరూపమును కాదు. ఏది ఏమైతేనేం? రాతిపై నీళ్ళు ఉన్నప్పటికీ, ఆ నీళ్లు ఒక బీజము అంకురించటానికి సహాయం చెయ్యలేవు కదా! ఈ సంసారదుఃఖం ఉపశమించాలంటే - ఒక్క ఆత్మబోధ తప్ప తక్కినవన్నీ నిష్ప్రయోజనములే.
ఈ జగత్తులన్నీ సృష్టించుచున్నది ’మనస్సే’ కదా! మనస్సే పరమపురుషుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు, ఎప్పుడు, ఏది, ఎక్కడైనా పొందుచున్నా అదంతా మనస్సుద్వారానేగాని, శరీరంచేత ఏ మాత్రం కాదు. ఈ మనస్సుయొక్క సామర్థ్యమేమిటో ఇప్పుడే ఈ ఐందవుల బ్రహ్మదేవత్వంలో చూచాము కదా! వారు కొంతకాలం క్రితం సామాన్యమైన మానవులై ఉండి, మనస్సు యొక్క దృఢ భావనచే బ్రహ్మపదమును పొందగలిగారు. ఈ జీవుడుకూడా మనస్సుయొక్క భావనను, ఆశ్రయించు స్వభావమును అనుసరించే ఆయా దేహములను పొందుచున్నాడు. ఒకనికి "నేను దేహమును” అనే భావనయే లేదని అనుకొందాం…. అప్పుడు అతడు ఈ దేహముయొక్క ధర్మములైనట్టి జనన-మరణములచే కూడా బాధింపబడజాలడు. బాహ్యదృష్టి మరియు శరీరదృష్టి కలవానికి
Page:485
మాత్రమే ఈ సుఖదుఃఖాది అనుభవములు ఉంటున్నాయి. కనుక, ఈ ప్రపంచములోని అనుభవము లన్నిటికీ కారణం మనస్సే. “(కృత్రిమ)ఇంద్రుడు-అహల్య”ల వృత్తాంతమే ఇందుకు మనకు తార్కాణం.
బాహ్యదృష్టి : బాహ్యమునందు “ఇది ప్రియము - ఇది అప్రియము” అను భావన. అంతర్జృష్టి : "ఈ శరీరము, ఈ మనో-బుద్ధి-అహంకారాలే నేను” అను పరిమిత భావన. బ్రహ్మదేవుడు : నాయనా! సూర్యుడా! నీ వచనములు చాలా యుక్తియుక్తంగానే ఉన్నాయి. నీవు చెప్పినదంతా అత్యంత సత్యము. నాకు చాలా సంతోషం కలుగజేశాయి. ఇప్పుడు సందర్భానుసారంగా “అహల్య ఇంద్రుల వృత్తాంతం” అని అన్నావు కదా! వారి వృత్తాంతమేమిటో వినిపించవూ? వారిద్దరి కథ వింటే నా దృష్టి మరికొంత పవిత్రత పొందగలదని భావిస్తున్నాను. అనంత కిరణములచే నిత్యోదితుడవై ఉండే ఓ సూర్యుడా! నీవు చెప్పబోయేది శ్రద్ధగా వింటున్నానయ్యా!
పూర్వము ‘ఇంద్రద్యుమ్నుడు’ అనే మహారాజు మగధదేశమును పరిపాలిస్తూ ఉండేవాడు. “మనరాజు గొప్ప ప్రతిభాశాలి" అని ఆ రాజ్య ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. అతని భార్య అహల్య. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆ పురములోనే ‘ఇంద్రుడు’ అనే పేరుగల ఒక జారుడు లోలుడు) ఉండేవాడు. అతని గురించి ఆ నగరంలో పరిపరి విధములుగా చెప్పుకొంటూ ఉండేవారు.
అంతఃపురములోని చెలికత్తెలు ఆ ఇంద్రునియొక్క (స్త్రీ సాంగత్యములకు సంబంధించిన) విచ్చలవిడి ప్రవర్తన గురించి చెప్పుచున్నప్పుడు రాణి అహల్య నవ్వుకుంటూ వింటూ ఉండేది. ఒకసారి, ఆ అహల్య గౌతముని పత్నియగు అహల్య-ఇంద్రులగురించిన పురాణగాథ వినటం జరిగింది. ఆ కథాప్రసంగమును తనకే అన్వయించుకొని, చంచలము - దుష్టసంకల్పములు గల మనస్సు కలిగియుండుటచే, జారుడగు ఇంద్రునియందు ఆసక్తి కలిగియుండటం ప్రారంభించింది. “ఈ ఇంద్రుడు అనబడేవాడు ఎంత అందంగా ఉంటాడోమరి! లేకపోతే, అంతమంది స్త్రీలను ఆకర్షిస్తాడా! లేదుకదా! అతడు నాయందు ఆసక్తి కలిగి, నన్ను వెతుక్కుంటూ వస్తే ఎంత బాగు! అవును, ఎందుకు రాకూడదు?” అని కుసంకల్పం చేయటం ప్రారంభించింది. చిలవలు - పలవలుగాను, అత్యంత దీర్ఘంగా తలపోయుటచేత కొన్నాళ్ళకు “ఇంద్రుని సాంగత్యము నాకు ఆవశ్యకము” అను భావన ఆమెయందు దృఢతరం కాజొచ్చింది. ఫలితంగా దుఃఖితురాలు అయ్యేది. అక్కడి రాజభోగములు ఆమెకు ఏమాత్రం ప్రీతిగొలిపేవి కావు. తన ఆలోచనలకు తానే ’వివశ’ అయి సిగ్గునుకూడా విడచివేసింది. “ఇదిగో! ఇక్కడ ఎవ్వరో నిలబడ్డారు…. ఇతడే ఇంద్రుడు….. అవును. సందేహం లేదు. ఇతడే నా ప్రియుడు…. నా కోసమే వచ్చాడు…..” అని చెట్టును, గోడను, స్తంభమును చూచికూడా అరవటం ప్రారంభించింది. ఆ రాణియందు మిక్కిలి స్నేహంగల
Page:486
ఒక సఖి ఆమెయొక్క దీనావస్థనంతా గమనించింది. "ఓ రాణీ! ఈ పిచ్చి ఏమిటి? ఈ దుః ఖమేమిటి? సరే. ఏడవవద్దు. ఊరుకో. ఎట్లాగైనా సరే, నేను ఆ యువకుడగు ఇంద్రుని నీ వద్దకు తప్పకుండా తీసుకొస్తాను” అని లాలనగా పలికింది. అది విని ఆ రాణి వికసిత నేత్రములతో కొంత ఉపశమనం పొందింది. తన ఇష్టసఖి పాదాలపై వ్రాలి మరల మరల దీనంగా వేడుకొన్నది. మరింకే ఊసు ఎత్తినా, అది ఆమె చెవికి చేరుటలేదు.
ఎట్లాగైతేనేం… ఆ సఖి ‘ఇంద్రుడు’ అనబడు యువకుణ్ణి కలుసుకొన్నది. రాణి వృత్తాంత మంతా తెలియజేసింది. ఎట్లాగో….. అతనిని ఒక రహస్య ద్వారం గుండా అంతఃపురంలోకి తీసుకొచ్చింది. ఆ రాత్రి అహల్య ఒక రహస్య ప్రదేశంలో ఇంద్రునితో పొందు అనుభవించింది. ఆ విధంగా ఆ రాణి ఒక సామాన్యయువకునికి వశమైపోయింది. అతనియందు ఆసక్తిచే, “ప్రపంచమంతా అతనితోడిదే! అతని తరువాతే ఇక ఏదైనా సరే!” అను రూపం గల తన్మయత పొందసాగింది.
ఆ విధంగా అనేక రోజులు గడచిపోతున్నాయి. అతనియందు వ్యామోహము ఎప్పటికప్పుడు అధికమగుచు ఉండేది. అతడు కూడా ఆమె పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేవాడు. అతనిపై గల వ్యామోహంచేత అహల్య ఉత్తమగుణములుగల తన భర్త ఇంద్రద్యుమ్నుని కూడా అల్పునిగా తలచుచూ ఉండేది. ఇంద్రుని గురించి తలచుకొనుచున్నప్పుడెల్లా ఆమె ముఖము ఎంతో సంతోషంతో వికసిస్తూ ఉండేది. ఇక ఇంద్రుడు కూడా ఆమెయందు ఆసక్తి కలవాడై, ఆమె వియోగమును ఒక్కక్షణమైనా సహించలేకపోయేవాడు. కొన్నాళ్ళకు, అతిసంతాపకరము, జుగుప్సాకరము, అధర్మప్రవృత్తి రూపము అయినట్టి వారిరువురి దృఢప్రేమబంధము రాజుయొక్క దృష్టిలోకి వచ్చింది. అప్పుడు ’జ్ఞానము-తితిక్ష’ మూర్తీభవించిన ఆ ఇంద్రద్యుమ్నుడు “వీరిద్దరి పరస్పర ప్రేమ సాంఘిక విరుద్ధంకదా! కాబట్టి వీరిద్దరిని తగినరీతిగా శిక్షించక తప్పదు. అది నా రాజధర్మమై యున్నది. తద్వారా ఇట్టి నీచ ప్రవర్తనము నుండి వీరిని విరమింపజేస్తాను" అని తలచాడు.
అది శీతకాలం. వారిద్దరిని రాజు సభకు పిలిపించి, గట్టిగా మందలించాడు. భయపెట్టాడు. కాని ఏం లాభం? వాళ్ళు మాత్రం “ఏది ఏమైనాకానీ, మేము మాత్రం ఇంతే. మా ఇద్దరికీ ఒకరి కొకరు కావాలి” అని మూర్ఖంగా మాట్లాడసాగారు. ఇక చేసేదేముంది? రాజశాసనమును అనుసరించి, వారిని సంస్కరించే ఉద్దేశంతో “ఇంద్రియములను బిగదీసివేయు చలి వాతావరణంలో వీరిద్దరు నాలుగు రోజులు కట్టివేయబడుదురుగాక” అని న్యాయవేత్తలచే నిర్ణయించబడింది. భటులు వారిని చల్లని నీటిలో నాలుగు రోజులు ఉంచారు. వారిలో ఏమాత్రం పరివర్తనలేదు. పైగా మామూలు వాళ్లెవరైనా రెండో రోజుకో, మూడో రోజుకో ఆర్తనాదాలు చేసేవారే! వారిద్దరికి కించిత్ కూడా బాధ గాని, దుఃఖము గాని కలుగలేదు. ఒకరితో మరొకరు సంభాషించుకొంటూ సంతోషముతో ఉండి ఉన్నారు. వారి పట్ల ఆ శిక్ష నిష్ప్రయోజనమే అయింది. ఆ వార్తను భటులు రాజుకు నివేదించారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు కొంత ఆశ్చర్యపడి, వారిద్దరిని సమీపించి "ఓ దుష్టజీవులారా! మేము విధించిన శిక్షచే ఏమాత్రం బాధ ప్రకటించనేలేదని, ఆ శిక్షచే మీరిద్దరు ఆనందమే
Page:487
పొందుచున్నారని, ఈ భటులు చెప్పారు. నిజమేనా? ఎందుచేత?” అని ప్రశ్నించాడు. అప్పుడే నీటి నుండి బయటకు తేబడిన ఆ ఇద్దరు రాజుతో “ఓ రాజా! మీరు విన్నది నిజమే. మేమిద్దరం శిక్షా సమయంలో కూడా ఒకరినొకరం స్మరించుకొంటున్నాం. దృఢప్రేమబద్ధులమై యున్నాము. అందుచేత మాకు దేహస్మృతియే లేదు. దేహస్మృతి లేనివానికి చలి ఏమి చేస్తుంది? మా మనఃసంబంధం అత్యంత దృఢమైనదవటంచేత, మీ భటులచే బాధించబడినప్పటికీ మేము ఆనందంగానే ఉన్నాము. ఈ అవయవములు ఛేదించబడతాయంటే, అందుకుకూడా మేము సిద్ధమే. మేము మా ప్రేమ సంబంధబలం చేత సంతుష్టులంగానే ఉంటాము.”
అంతావిన్న రాజుకు చాలా కోపంవచ్చింది. “ఓ భటులారా! వీరిని అగ్నిచే కుత కుత ఉడికి పోతున్న గదిలోకి త్రోయించండి. రెండు రోజుల వరకు వీరిని పలకరించనే వద్దు. అరిచి గీపెడుతున్నా సరే, మీరు జాలి చూపవద్దు. ఈ లోగా మరణించారా, సరే. రేఁ!, లేదా, రెండు రోజుల తరువాత వీళ్ళని నా దగ్గరకు తీసుకురండి, అప్పుడు చూద్దాం…..” అని ఆజ్ఞాపించాడు. అచటకూడా వారు ఏ మాత్రం భేదం చెందలేదు. ఒకరినొకరు తలచుకొంటూ ప్రసన్నులైయున్నారు. అప్పుడు ఏనుగులచే త్రొక్కించబడ్డారు. వారు విషాదమే చెందలేదు. అస్సలు, ఆ త్రొక్కిసలాట వారిని ఏమీ చెయ్యలేక పోయింది. వారిద్దరు మాత్రం అన్నివేళల అన్యోన్య స్మృతిచే హర్షమునే పొందుచున్నారు. అప్పుడు రాజు వారిని కొరడాలచే కొట్టించాడు. అయినప్పటికీ వారిద్దరు ప్రసన్నముగానే ఉండియున్నారు. ఇక వారిని శిక్షించి ప్రయోజనం లేదని గ్రహించిన మహారాజు వారిద్దరిని తన వద్దకు పిలిపించాడు.
ఇంద్రద్యుమ్నుడు: ఓ తుచ్ఛబుద్ధులారా! మీ ఇద్దరినీ సంస్కరించాలని ప్రయత్నించాం. ఇంత జరిగినప్పటికీ, మీరు ఇంకా సుఖసంతోషములతో ఎట్లా ఉంటున్నారో — నాకు కాస్త చెపుతారా? ఇంద్రుడు : ఓ రాజా! నాకీజగత్తు అంతా అహల్యామయంగానే కనిపిస్తున్నది. నాయొక్క ‘ప్రేమ’ కారణంగా కాబోలు - నాకు ఈ ప్రపంచం ఈమె రూపముగానే తోచుచున్నది. ఈమెకు కూడా సర్వదా నా రూపమే గోచరిస్తోంది. అందుచేతనే, మీరు విధిస్తున్న దండనలన్నీ మాకు బాధకలుగజేయ లేకపోతున్నాయి. మా ఇద్దరికీ ఈ ప్రపంచమంతా ఒకరిరూపంగా మరొకరికి కన్పించుటచేతనే, అగ్నిబాధ, జలస్పర్శ, తాడనము మొదలైనవిగాని, “ఎవ్వరేమనుకొంటారో?” అనే భీతి మొదలైనవిగాని మమ్ములను ఏమీ చేయలేకపోయాయి.
ఓ మహారాజా! ఇంద్రద్యుమ్నా! నేను ఈ శరీరమునా? కాదు. నేను మనోమాత్రుడను. మనస్సే పురుషుడు. ఇక, మీకు కన్పించే ఈ దేహము మనస్సుయొక్క కల్పనాదృష్టికి ఇట్లు కనబడు చున్నదే కదా! అతిశక్తివంతమైన మనస్సును, దానియొక్క స్వకీయమైన ప్రేమ మొ॥) కల్పనలను మీ పంచభూతపరిమిత దండనలు ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఎంతటి శక్తి కలవారైతే ఏం?
Page:488
మనస్సుచే నిర్మించబడుచున్న అనుబంధమును, భావకలాపమును ఎట్లా ఛేదించగలరు? ఈ శరీరము వృద్ధి పొందవచ్చు. కాని, మనస్సు మాత్రం… “దృఢభావన” చే ఇష్టములైన, “అనుభూతి” మొదలగు వాటిని ఎప్పటికీ అట్లే ఉంచుకోగలదు. ఈ విషయం మా ఇరువురిపట్ల నిరూపించబడుతోంది కదా! ఈ మనస్సు చాలాకాలం ఒక పదార్థమును వాంఛించుచున్నదనుకోండి….. అప్పుడది దాని యందు సంలగ్నమగుచుండుటచే, ఆ పదార్థాకారమునే పొందుచున్నది. అట్టి దృఢభావము పొందిన ‘మనస్సు’ను ఆయా భౌతికమైన ప్రతిబంధకములు తాకనైనా తాకలేవు.
ఓ ప్రియమహారాజా! ఈ మనస్సుకు గల ఒక ముఖ్యమైన లక్షణం గురించి చెపుతాను. వినండి. ఇది తనయొక్క తీవ్ర సంకల్పముచే దేనిని ఎట్లు నిశ్చయిస్తుందో - దానిని అట్లే స్థిరముగా “గాంచుట పొందుట” చేస్తూ ఉంటుంది. ఇక వరములుగాని, శాపములుగాని, మరింకే బాహ్యమైన ప్రయత్నములుగాని అట్టి తీవ్రసంకల్పయుతమైన మనస్సును నిరోధింపజాలవు. ఒక లేడి పెద్ద బండరాయిని కదల్చగలదా? తీవ్ర అభిలాష కలిగిన మనస్సును తనయొక్క ఇష్టవస్తువు నుండి దృష్టిని మరలింపగలిగిన వారెవ్వరు చెప్పండి?
ఈ అహల్య నా కంటికి చూపువలె, దేవాలయములో వేంచేసియున్న దేవతారూపమువలె - నా మనస్సులో ప్రతిష్ఠితమైయున్నది. మేఘాలుగాని, గ్రీష్మఋతువుగాని, ఒక కొండను బాధించలేవు కదా! నా “జీవహేతువు” అయినట్టి ఈ నా ప్రియురాలిని భావన చేసినంతమాత్రంచేత, తదితర దుఃఖములు ఎన్నైనా భరించుటకు ఓర్పు, శక్తి వచ్చిపడుతున్నాయి. “నేను ఎట్లాగైనా ధనికుణ్ణి కావాలి” అని కోరుకొనువానికి డబ్బు సంపాదించటంలోను, దాచి పెట్టుకోవటంలోను, లోభ వ్యవహారసరళిలోను వచ్చే సాధక బాధకములన్నీ సుఖప్రదములే అగుచున్నాయి కదా! నా విషయం కూడా అట్టిదే. నేను ఈ వర్తమాన మానసిక స్థితిని అనుసరించి, ఈమె పొందు కొరకు ఏ దుఃఖా నుభవమునైనా పొందటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మా ఇద్దరిని అనేక విధాలుగా భయపెట్టారు. కాని మాకు ఏ క్షణంలోకూడా భయమని అనిపించనేలేదు. నేను ఎక్కడైనా ఉండవచ్చు. లేదా, ఎక్కడైనా పతనం చెందవచ్చు. అచ్చట కూడా నేను నా ప్రియురాలి సమాగమము తప్ప, ఇంకేమీ తలచను…… భావించను. ఓ మహారాజా! మీరు సర్వము తెలిసినవారే. అంతా మనస్సే కదా! నా మనస్సుచేతనే అహల్య నాకు ప్రియురాలు అయినది. ఆమెయొక్క మనస్సుచేతనే సామాన్య పౌరుడనగు నేను ఒక మహారాజ్ఞికి అత్యంత ప్రియుణ్ణి అయ్యాను. దృఢసక్తి పొందియున్నట్టి మా ఇరువురి మనఃస్వభావములను ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఎవ్వరూ మార్చలేరు. ధీరులయొక్క చిత్తము దేనియందైనా నిమగ్నమైనదా…. ఇక దాని స్థిరత్వం ఎవరు పాడుచేయగలరు చెప్పండి? ధీరులు కానివారు మాత్రమే కొంతవరకు (ధ్యానము - పూజ - పఠించుట మొదలైన) ప్రయత్నములను ఆశ్రయించి, ఇంతలోనే ఒక చిన్న అడ్డంకి రాగానే వెనుకకు మరలుచూ ఉంటారు. “అట్లు కొనసాగించ లేకపోవటానికి ఫలానా పరిస్థితులు, ఫలానా వ్యక్తులు కారణం” అని వారు తమను తామే మోసం చేసుకొంటూ ఉంటారు.
Page:489
వర-శాపములచే ఈ భౌతిక శరీరము ఒక రూపమును పోగొట్టుకొని, మరొక రూపం (మరొక శరీరం) పొందితే పొందవచ్చు. అంతేగాని, దృఢచిత్తం మాత్రం తప్పకుండా అన్ని విక్షేపాలను జయించి స్థిరంగా ఉండగలదు. ఇందులో సందేహించవలసిన పనిలేదు. ఒక వేళ విక్షేపం కలిగితే… అందుకు కారణం చిత్తము స్థిరత్వము కలిగియుండక పోవటము మాత్రమే సుమా!
ఈ శరీరము మాత్రం మనస్సునకు ఎప్పటికీ కారణం కాదు. మనస్సే శరీరమునకు కారణమగుచున్నది. లతలలోను, వృక్షములలోను రసము వ్యాపించి ఉంటుంది చూచారా? అట్లాగే మనస్సే శరీరము నందు అంతటా వ్యాపించియున్నది. జీవాత్మకు మనస్సే మొట్టమొదటి శరీరమై ఆయా భోగానుభవములకు హేతువు అవుతోంది. ప్రపంచములోని ప్రాణికోట్ల శరీరములన్నీ మనస్సు చేతనే కల్పించబడుచున్నాయి. మనస్సుచేతనే దర్శించబడుచున్నాయి. స్వీకరించటం త్యజించటం… అంతా మనస్సుయొక్క వ్యవహార దక్షతయే అయిఉన్నది. “ప్రథమ శరీరము” అని చెప్పబడుచున్న మనస్సునందే “నేను-నేను” అను అభిమానం కూడా ఉదయిస్తోంది. అట్లు ఉదయించుట చేతనే… అట్టి మనస్సుచే భిన్న శరీరములు ఏర్పడుచున్నాయి. ఇన్ని మాటలెందుకు? ఈ జీవత్వమునకు ముఖ్యకారణం (లేక) అంకురం మనస్సే సుమా! దానినుండే ఈ దేహములన్నీ ఏర్పడుచున్నాయి.
ప్రభూ! అంకురం (‘మొలచుట’ అను స్వభావం) నశిస్తే పుష్పములు కూడా నశిస్తాయి. కాని పుష్పములు నశిస్తే అంకురము నశిస్తుందా? లేదు. అదేవిధంగా, ఈ దేహము నశించినా మనస్సు ఉంటుంది. కాని, మనస్సు నశించటం జరిగితే, ఇక దేహమెక్కడ?
కనుక అయ్యా! మేమిద్దరం పరస్పరం ప్రేమబద్దులం. మా గురించి మీరు ఎందుకు వేసటచెందుతారు చెప్పండి? మీ శ్రేష్ఠమగు చిత్తమును పరమ పురుషార్థమునందే నియోగించితే ఈ ‘జన్మలు-కర్మలు’ అను బంధము నుండి మిమ్ములను మీరు రక్షించుకోగలరు. అట్లుచేసి, బంధము నుండి, విముక్తులు అవటానికే ప్రయత్నించండి. అదే ఉచితం.
ఓ సుబుద్ధీ! చక్రవర్తీ! నేను ఈ అహల్యనే అన్నివైపులా, అంతటా చూస్తున్నాను. నా చిత్తము ఇప్పుడు ఈమె రూపమే అయి ఉండటంచేత ఈమె సాంగత్యం చేత సర్వదా ఆనందము పొందుచున్నది. మీరు ఇప్పటికే అనేక రకాలుగా మమ్ములను హింసించుటకు యత్నించారు. అవన్నీ మీకు, మీ ప్రజలకు దుఃఖములను కలుగజేస్తాయేమోకాని, మాకు మాత్రం కాదు. అందుచేత ఇక మమ్మల్ని మా త్రోవలో పోనివ్వండి. ఇక్కడికి దూరంగా మా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాం.
అంతా విన్న మహారాజు ఎంతో ఉద్రిక్తుడైనాడు. తన ఆసనం ప్రక్కనే ఆసీనుడైఉన్న రాజగురువగు “భరతుడు” అనునాతని వైపుచూచి ఇట్లు పలుకసాగాడు.
Page:490
ఇంద్రద్యుమ్నరాజు : గురువర్యా! భరతమునీ! ఇతని ఆగడపు మాటలు వింటున్నారా? పరస్త్రీని అపహరించి మహాపాపమునకు ఒడిగట్టాడు. ఇంకా, ఏవేవో గర్వోక్తులు పలుకుచున్నాడు. నేను అనేక ప్రయత్నములచే కూడా, ఇతనిని ఏమీ చేయలేకపోయాను. మీరు మహాశక్తి సంపన్నులు కదా! “శిక్షించతగ్గవానిని శిక్షించకపోతే, ఆ రాజుకు పాపం చుట్టుకుంటుంది”- అని మన రాజ్యపు న్యాయశాస్త్రం ఘోషిస్తోంది. అందుచేత, మీరు మీ తపోశక్తిచే ఇతని పాపకార్యమునకు తగిన విధంగా ఏదైనా శాపం ఇవ్వండి. అటుపై వీళ్ళిద్దరిని పంపివేద్దాం.
అప్పుడా రాజగురువు ఇంద్ర - అహల్యల పాపకృత్య మంతా మరల విచారణ చేశాడు. ఎంతో చెప్పి చూచాడు. లాభం లేకపోయింది.
భరతమునీంద్రుడు : ఓ దురాత్ములారా! మీరిద్దరు చెయ్యరాని దోషపూరిత క్రియలు చేశారు. ఓయీ అహల్యా! నీవు భర్తృ దోహం చేసి పాపం చేశావు. ఓ ఇంద్రుడా! నీవు పరాయి స్త్రీతో అపవిత్రమైన సంబంధము కలిగి ఉన్నావు. ఈ రాజ్య-శాశనానుసారం, రాజాజ్ఞను అనుసరించి మిమ్ములను శిక్షించే నిమిత్తం నా తపస్సును వినియోగిస్తున్నాను. మీ ఇరువురి దోషపూరిత ప్రవర్తన శిక్షార్హం. అందుకు ఇదే నా శాపం. “మీరిద్దరు మరణించెదరు గాక!”
ఇంద్రాహల్యలు : ఓ రాజా! ఓ మునీంద్రా ! మీరిద్దరు అల్పబుద్ధి కలవారే అగుచున్నారు.
ఓ మహామునీ! మీరు మాకు ఇట్టి శాపం ఇచ్చి, నిష్కారణంగా మీ దుష్కరమైన తపస్సు వ్యర్థం చేసుకొన్నారు. మా ఉద్దేశంలో ఈ శాపము మా ఇద్దరికి చేయగల హాని ఏదీలేదు. మీ వాక్య ప్రభావం చేత ఈ దేహాలు నశించవచ్చు. కాని ఒకరినొకరు ప్రేమించుకొంటున్నది ఈ భౌతిక దేహాలనా? కాదు. మనోరూపులమైనట్టి మాకు నాశనమెక్కడిది? మా చిత్తము సూక్ష్మము, చిన్మయము, అగోచరము కదా! మా మనస్సులు మీయొక్క శాపపర్యవసానానంతరం కూడా నశించకుండానే ఉంటాయని గ్రహించండి.
దృఢస్నేహబద్ధులగు వారిద్దరు ఇట్లు ఎలుగెత్తి పలికారు. ఒకరు చెప్పుచుంటే మరొకరు ‘అవును…. అవును’ అనురూపముగల అనుకూల శబ్దములు చేశారు.
శాప ప్రభావంచేత వారిద్దరు నేలకూలి మరణించారు.
వారిద్దరికి ఒకరిపై మరొకరికి విడదీయరాని అనురాగమున్నది కదా! అందుచేత, మరుజన్మలో రెండు లేళ్ళుగా జన్మించారు. ఆ తరువాత అనేక పక్షి జంటల జన్మలు ఎత్తారు. ఇక ఇప్పుడు, నేను సంచారం చేసే ఒకానొక బ్రహ్మాండములో ఒకచోట వారిద్దరు పరస్పరాసక్తత కలిగియుండి— తపః సంపన్నులగు బ్రాహ్మణ దంపతులుగా జన్మించారు.
చూచారా! పితామహా! దుస్సాధ్యములగు శాపములు కూడా వారిద్దరి మనస్సులను విడదీయ లేకపోతున్నాయి. వారియొక్క స్నేహసంస్కారముచే వారు ఎక్కెడెక్కడ జన్మించినప్పటికీ స్త్రీ - పురుషులు
Page:491
గానే ఉంటున్నారు. వారి సహజ ప్రేమ భావమును, అత్యధిక స్నేహమును చూచి వృక్షములు కూడా ప్రేమరసపూర్ణములై ఉంటున్నాయి.
కనుక, శాపాదులు మనస్సును భేదింపలేవు. మరలింపజాలవు. ఐందవుల సృష్టులను నశింప జేయటం ఇప్పుడు ఉత్తమమైన పనికాదు. మీవంటి మహాత్ములు రాగము, మదము మాత్సర్యములను దగ్గిరకు రానివ్వరు కదా! ఈ లోకమునకు, అనేక బ్రహ్మాండములకు ప్రభువు అయినట్టి మీరు అట్లా చేయటం దీనత్వమునకే హేతువు అవుతుంది. బ్రహ్మాండములను సృష్టించగలశక్తి - సంపన్నములు గల వారి-వారి మనస్సులను ఎవ్వడూ దేనిచేతా నశింపజేయలేడు. అందుచేత, ఆ ఐందవులను తమ దివ్యదృష్టి కలిగియే ఉండనివ్వండి.
మీరు కూడా, మీ చిత్తాకాశమునందు యథావిధంగా ప్రజలను సృష్టించండి.
చిత్తాకాశము ఈ పాంచభౌతిక సంబంధమైన ఆకాశము వంటిది కాదుకదా! అది అనంతము. మీకు సర్వము తెలిసే ఉన్నప్పటికీ… మన ఉభయుల పునశ్చరణ కొరకు - - సందర్భం వచ్చినది కనుక చెప్పుచున్నాను. మనం పూర్ణతత్త్వాన్ని పరిశీలించినప్పుడు, ఆకాశములు మూడు రకములుగా విభజించబడుచున్నాయి -
భూతాకాశము (Zone of matter)
చిత్తాకాశము (Zone of thoughts)
చిదాకాశము ( Zone of Consciousness)
మొదటి రెండూకూడా చిదాకాశము చేతనే ప్రకాశింపబడుచూ, అనంతములే అయిఉన్నాయి. కాబట్టి ఓ జగదీశా! మీరు ‘ఒకసృష్టి’ గాని, లేక ’రెండుసృష్టులు’ గాని, లేక ’అనేక సృష్టులు’ గాని ఇతఃపూర్వము వలెనే సృష్టించండి. ఆ పదిమంది ఐందవులు మీదైనదంటూ ఏదీ ఆక్రమించియుండ లేదు కదా! ఇక వారిపై కోపందేనికి చెప్పండి? చిదాకాశమునందు వాస్తవానికి సృష్టిత్వము లేకయే ఉన్నది. అది ఎవరిది? ఎట్టిది? మాయచేతనే “నేను-నాది - నీవు-నీది-అది-ఇక్కడ-అక్కడ”… అను భేదమంతా తోచటం జరుగుతోంది. కనుక, సర్వజ్ఞులగు మీరు మీ “స్వకీయ ప్రేరేపణ”ను అనుసరించి సృష్టికార్యము చేయుచు, నిరభ్యంతరంగా ఆత్మయందు స్థితి కలిగియుండవచ్చు. బ్రహ్మదేవుడు : ఓ ఓ సూర్యభగవానుడా! నీవు చెప్పుచున్నదంతా చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలా చక్కగా సత్యవిషయమును, నా యొక్క విహిత - - అవిహితములను గుర్తుచేశావు. నీవు అన్నట్లు ఆకాశములన్నీ అనంతములే. "చిత్తాకాశము” అనగా “మనస్సహితమైన చిదాకాశము” కాకుండా మరింకేమీ కాదు. కాబట్టి చిత్త చిదాకాశములు రెండూ అనంతములే. ఇక ఈ భూతాకాశము ఈ కనబడే సృష్టియందు అంతర్భూతమై ఉంటోంది. బ్రహ్మాకాశము (లేక చిదాకాశము)
Page:492
నకు వాస్తవానికి దేనితోనూ సంగము (Attatchment) లేదు. కనుక నాకు అభిమతమగుచున్న ఈ సృష్టిని ఒనర్చుచు, స్వధర్మమైనట్టి నిత్యకర్మను నిర్వర్తించెదను గాక! ఓ భాస్కరా! నాకు ఇప్పుడు ఉత్తమ విషయమును (ధర్మమును) గుర్తు చేసినట్టి నీవే నా ఈ ‘సృష్టి’ అను కార్యక్రమము నందు, “ప్రథమ-మనువు” అగుదువుగాక! ఇక ప్రాణులను సృష్టించుటే నా తక్షణ కర్తవ్యం. నాయొక్క ప్రతినిధిగా నీవు నాచే ప్రేరితుడవై, నీ ఇచ్ఛానుసారంగా సృష్టిని గావించు!
బ్రహ్మదేవుడు : నాయనా! వసిష్ఠా! మహాతేజస్వియగు ఆ ఆ భానుడు నేను చెప్పినదానికి అంగీకరించాడు. అప్పటికప్పుడు తన శరీరమును ’రెండు భాగాలుగా విభజించాడు. అందులో ఒక శరీరమును ‘ఐందవ సృష్టి’ లోని సంచరించుచున్న బ్రహ్మాండము నందు “సూర్యుడు”గా ఉండి యథాతథంగా లోకములను ప్రకాశింపచేయటం కొనసాగించాడు. రెండవ శరీరముతో, నాచే ప్రసాదించ బడిన ‘మనువు’ పదవిని అలంకరించి నా అభిమతానుసారం సృష్టులను నిర్మించ ప్రారంభించసాగాడు.
శ్రీ బ్రహ్మదేవుడు : ప్రియపుత్రా! వసిష్ఠ "ఈ సృష్టులన్నీ ఎట్లా కలుగుచున్నాయి?” అను నీ ప్రశ్నకు సమాధానంగా “ఐందవ బ్రహ్మాండము” మరియు “ఇంద్రాహల్యల ప్రహసనం” చెప్పాను. ’మనస్సు’ యొక్క సర్వకర్త ృత్వము, శక్తి గురించి తెలియజేయుటయే నా ఉద్దేశం. ఇది ఇట్లు కనిపించి, అనుభవమగుటకు కారణం? నీ మనస్సు ఇట్లు భావించుట - - సంకల్పించుటయే సుమా!
ప్రతిజీవిలోని మనస్సు అంతటి మహాశక్తి సమన్వితము, సర్వకర్తృత్వ సహితము, సర్వభావనా సమర్థము అయి ఉన్నది సుమా! అయితే ఈ జనులు స్వల్ప విషయములనే మళ్ళీ మళ్ళీ ఆశ్రయిస్తూ, సంకల్పించుచుండుటచే, వారి మనస్సులు స్వల్ప ప్రయోజనములను మాత్రమే పొందుచున్నాయి.
ఈ చిత్తమునందు ఏదేది ప్రతిభాసిస్తోందో - అది మాత్రమే వ్యక్తమగుట, స్థిరత్వము పొందుట, సాఫల్యమగుట జరుగుచున్నది. ఈ మనస్సుయొక్క సామర్థ్యమెట్టిదో ఐందవబ్రహ్మాండములు నిరూపిస్తున్నాయి. ఐందవులు మనోభావనాబలం చేతనే బ్రహ్మపదమును పొందగలిగారు. ఐందవుల చైతన్యమే చిత్తత్వము పొందటం జరిగింది. ఆ చిత్తత్వము నందలి ‘భావన’ యే, హిరణ్యగర్భత్వము (సమష్టిసృష్టి భావన)ను సంతరించుకొన్నది. అంతేకాదు, మనందరి విషయం కూడా అట్టిదే. చైతన్య స్థితి నుండి చిత్తత్వము పొంది, తత్ఫలితంగా మనం ఈ ఈ రూపములను ఆశ్రయించాము. చిత్తమే ప్రతిభాసారూపముచే (In the process of reflection) ‘దేహము’ మొదలైన రూపములను ప్రకాశింపజేయుచున్నది. అనగా, ఈ దేహాదులు చిత్తముకంటే ఏమాత్రం వేరైనవి కావు.
ఈ చిత్తము చాలా సమయాలలో అనేక కల్పనలతో కూడుకొని ఉంటోంది. మిరియపుగింజ కారంగాను, ద్రాక్షపండు తియ్యగాను ఉంటూఉంటాయి కదా! ఈ జీవుని చిత్తము కూడా
Page:493
కామ్యకర్మలను, వాసనలను ఆశ్రయించటం, కలిగియుండటం స్వభావంగా పొంది ఉంటోంది. చిత్తము ఎట్లా ఉంటే అద్దాని భావసంస్కారములను అనుసరించే వ్యక్తీకరణ కూడా ప్రాప్తిస్తూ ఉంటుందని గ్రహించు. చిత్తము యొక్క మననమును - మననములను అనుసరించే సృష్టిలోని వివిధ దేహాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఈ జీవుడు భ్రాంతిచే తన సూక్ష్మ వాసనలనే స్థూలముగా భావించి, “నేను మనుజుడను, నేను దేవతను”… అని తలచుచూ వ్యర్థముగా మోహితుడు అగుచున్నాడు.
సూక్ష్మవాసనలతో కూడుకొని యున్న చిత్తమునే ‘జీవుడు’ అంటున్నాం. స్థూలత్వ భ్రాంతిచే అదియే ‘దేహము’ అని కూడా దర్శించబడుచున్నది. ఏది ఏట్లైనా ఉండనీ! ఈ సూక్ష్మ, స్థూల శరీరములు, వీటిని దర్శించటం ఇదంతా కల్పనామాత్రమే. వాస్తవానికి ఈ జీవుడు సాక్షాత్ బ్రహ్మమే అయి ఉన్నాడని సర్వదా ఎరుక కలిగియుండుము.
ఓ విశ్వామిత్ర - వసిష్ఠులారా! దారము కంటే వస్త్రము వేరైనదని అనగలమా? ఈ “నేను’-నీవుఅతడు” మొదలుగాగల తదితరములన్నీ… అత్యంతాశ్చర్యకరమైన ఈ చిత్తముకంటే వేరేమీ కాదు. అయితే, ఈ చిత్తము వాస్తవానికి స్వరూపరహితమైనదే. కల్పిత మాత్రమైనదే. కాని, మనం ఐందవ బ్రహ్మాండములు (ఐందవోపాఖ్యానం) విషయంలో గమనించినట్లు ఇది సత్తను పొంది వర్తించుచున్నది. “జడము మాత్రమే” అయిన ఈ చిత్తము ఇద్దాని ఆధారమగు చైతన్యము చేతనే సత్తను పొందుచున్నదని గ్రహించు. ఐందవుల మనస్సే ‘బ్రహ్మ’, ‘బ్రహ్మాండము’ లుగా పరిణమించినది కదా!
1) భూతికంగా ఘనీభూతమై కనిపించే ఈ పాంచ భౌతిక దృశ్య సృష్టి వస్తుతః మనోరూపమే అయి ఉన్నది. (లేక) ఇదంతా సంకల్ప రూపమే!
2) అనుభవమునకు కారణమగుచున్న ’అనుభూతి’ - స్వయంకృతమే! (లేక) స్వయం నిర్మితమే! 3) జగత్ సంకల్పము ఆత్మ సంకల్పమునందు లయిస్తే …, సర్వమూ పరమాత్మనుభవంగా శేషించగలదు.
మనం కూడా మన సంకల్పముల ప్రభావంచేతనే బ్రహ్మ - - మహర్షులము అయినాము. అట్టి మనస్సుచే స్థితి పొందినట్టి మనం, మనచే రచించబడిన ఈ జగత్తు … ఈ సర్వం సంకల్ప రూపముననే భాసించుచున్నది.
ఈ చిత్తముయొక్క కల్పనచేతనే ఒకడు ‘నేను బ్రహ్మను’ అని, మరొకడు "నేను అత్యంత పరిమితమగు పురుగును” అని అనుభవం పొందుచున్నారు. వాస్తవానికి, పరమాత్మయే ఈ సర్వ దేహాదుల రూపమున ప్రకాశించుచున్నాడు. పరమాత్మయే జగత్తు - - జగద్రహితమగు చిదాకాశము కూడా అగుచున్నాడు.
నిర్మలమగు చిత్తమే పరమార్థ స్వరూపము సుమా! అంతేకాదు. పరమార్థ స్వరూపమగు చిత్తమే ఏమరపుచే, భావనావశంచేత ‘జీవుడు’ గాను, ‘మలిన చిత్తము’ గాను పరిణమించుచున్నదని
Page:494
గ్రహించు. అట్టి మలిన చిత్తమే ఈ దేహాదుల రూపమున వ్యక్తమగుచున్నది. కల్పనయే అయినప్పటికీ, ఈ దృశ్యము సుఖదుఃఖముల రూపమున ఈ జీవునికి బంధము, బాధ కలిగించుచునే ఉన్నాయి కదా! ఎందుచేత?
ఒక దృష్టాంతము చెపుతాను. విను. ఒకడు తనయొక్క అజ్ఞానశక్తిచే ఉత్పన్నము చేసుకొన్నట్టి స్వప్నమునో, ఊహనో, లేక సంకల్పమునో చాలాకాలం అట్లే కలిగియున్నాడనుకో….. అప్పుడు ఏమవుతుంది? అది అతనిచే జాగ్రత్వలెనే దర్శింపబడుతుంది. అనగా "ఇది అత్యంత వాస్తవమే” అని అనిపిస్తుంది. అదే విధంగా చిద్వస్తువుచే వ్యాప్తమైయున్న ఈ జాగ్రత్ ప్రపంచము కూడా ఈ జీవునకు,… నాకు ఆ ఐందవసృష్టిలాగా,… సత్యమువలెనే అనుభూతమౌతోంది.
నాయనలారా ! విశ్వామిత్ర వసిష్ఠులారా ! ఈ చిత్తమే ప్రపంచమునంతటినీ ఉత్పన్నము చేయుచున్నది. అతి సూక్ష్మ వాసనా మయమైనట్టి "శబ్ద స్పర్శ రూప రస-గంధములు” అనే తన్మాత్రలకు సంబంధించిన ’అధ్యాస’ (Avocaiton) బలపడుటచేత ‘జగత్తు’ అనబడు అనుభవం ఏర్పడుతోంది. ఒకనికి కంటిచూపు దోషంచేత ఆకాశంలో రెండవచంద్రుడు కనబడుతూ ఉంటాడే! ఈ ‘జగత్తు’ దర్శనముకూడా అట్టిది మాత్రమే.
ఈ ‘అహంభావము’ రూపమున ప్రకాశించునది, దానిని ఆశ్రయించుకొని అనుభవమగు చున్నది… ఇదంతా సత్తు కానేకాదు. ఎందుకంటావా? ఏదైతే త్రికాలములందు అనగా, ఇంతకు ముందు - ఇప్పుడు - ఇకముందు కూడా, ఉండి ఉంటుందో… అట్టి దానిని మాత్రమే మనం ‘సత్తు’ అని అనగలం. ‘గాఢనిద్ర’ లో ఈ జీవుడు ఉండి ఉన్నప్పుడు జాగ్రత్ రూపమైన అహంకారము అనుభవమగుటలేదు కదా! ఒకప్పుడు ఉన్నట్లుతోచి, మరొకప్పుడు లేకుండా పోయేదానిని సత్తు అనిగాని, సత్యమనిగాని ఎట్లా అనటం? పోనీ, అహంభావమును ఆశ్రయించి లభ్యమయ్యేదంతా “ఇది అసత్తు మాత్రమే“ అని అందామా? అసత్తు అయిన వస్తువు లభించనే కూడదు కదా! సద్వస్తువు ఎల్లప్పుడు సత్తుగానే (అనగా ఉండియే) ఉంటుంది. అసద్వస్తువు అసత్తుగా (లేకయే) ఉంటుంది. ఈ ‘అహంకారము’ అనునది - - సత్తుకు, అసత్తుకు కూడా విలక్షణమై ఉండిఉండుటచే అద్దానిని “మాయకము, అనిర్వచనీయము” అని విజ్ఞులు అంటున్నారు. ఎందుకంటే విచారణ ప్రభవించి, వికసించేవరకు అది ఉంటోంది. విచారణచే నిర్మలమైన బుద్ధి కలవాని దృష్టిలో అది ఉండుట లేదు. ‘అహం’ అని భావించుటకు మునుముందే ఆ భావకుడు భావరహితుడై భావములకు అతీతుడై ఉండి ఉన్నాడు కదా! అదియే ఈ జీవుని వాస్తవస్వరూపం.
ఈ మనస్సు సంకల్పాత్మకము, విశాలము అయి ఉంటోంది. అట్లే అది జడము, అజడముకూడా అయి ఉన్నది. ఎట్లా అంటావా? బ్రహ్మము అద్వితీయముకదా! కనుక మనస్సు స్వతహాగా బ్రహ్మ స్వరూపమే కదా! కనుక అజడము. కాని దానికి స్వకీయమైన ఉనికి ఎక్కడ? ద్రష్ట ఉంటేకదా, దాని ఉనికి! కాబట్టి జడమే. అది ఈ దృశ్యమే తన రూపముగా కలిగియున్నది. ’దృశ్యము యొక్క
Page:495
అనుభవం’ ఉండి ఉంటున్న సమయంలో ఈ మనస్సు సత్యమైనదానిలాగానే కనిపించుచున్నది. కాని, బ్రహ్మానుభవకాలమందు మాత్రం (‘నేను బ్రహ్మమునే’ అను ఎరుక కలిగి యున్నప్పుడు) అది బ్రహ్మము కంటే వేరుగా ఏమాత్రం లభించుటలేదు. ఇందుకుగాను ఒక దృష్టాంతము చెపుతాను. ఒకడు ఒక ఆభరణము యొక్క ఆకారమును, అంద చందములను పరిశీలిస్తున్నాడనుకో…. అప్పుడతనికి “ఇది గొలుసు, అది ఉంగరం, ఇది గాజు, ఇది ముక్కుపుడక" మొదలైన ఆకారములే (ఆభరణత్వమే) కనిపిస్తాయి కాని, అందలి అన్ని ఆభరణములలోని బంగారమువైపు దృష్టి ఉండదు. ఆభరణమును చూస్తున్నప్పుడు బంగారము కనిపించదు. అనగా అదే ఆభరణములను సువర్ణదృష్టితో చూచినప్పుడు… ఆ ఆభరణములన్నీ బంగారముకన్నా వేరు కానివిగా (అభిన్నమైనవిగా) తెలియవస్తాయి. మనస్సుకూడా బ్రహ్మంలో, -బంగారంలో ఆభరణత్వమువలె, -స్థితి కలిగియున్నది. చైతన్యము జడమును ఎట్లా ఎరుగుతోంది?
హిరణ్యగర్భుడు (సమష్టి సృష్టి స్వరూపుడు) అగు బ్రహ్మ సర్వస్వరూపుడు కదా! అందుచేత జడ-చైతన్యములన్నీ బ్రహ్మమే అవుతాయి. అయితే, బ్రహ్మదేవుడు మొదలుకొని, ఒక రాయి వరకు సమస్త పదార్థములు యథార్థానికి “జడ - చైతన్యముల” రెండింటికీ విలక్షణమై ఒప్పుచున్నాయి. ‘అహంకారము’ గురించి మనం అనుకొన్నట్లే, అవికూడా మాయారూపములై అనిర్వచనములై (Illusionary and undefinable) ఉంటున్నాయి. జీవుడు చైతన్యమే స్వరూపముగా కలవాడుకదా! కొయ్య మొదలైనవి జడము. చైతన్యరూపుడగు జీవుడు కొయ్యమొదలైన జడపదార్థములు పొందికను ఎట్లు అనుభవిస్తున్నాడు? ఈ ప్రశ్నకు శాస్త్రకారులు ఇస్తున్న సమాధానమేమిటో విను. ఇక్కడ నాలుగు విషయాలు పాల్గొనుచున్నాయి.
ప్రమాత : ఎరిగెడువాడు (that which is knowing)
ప్రమాతృచైతన్యము చైతన్యముయొక్క ‘ఎరుగుట’ అను స్వభావం.
ప్రమేయము : ఎరుగబడుచున్నది (that which is being known)
ప్రమేయ చైతన్యము :‘ఎరుగబడుట’ అను స్వభావము. జీవునిలోని ప్రమాతృచైతన్యము, ఆ కొయ్యలోని ప్రమేయచైతన్యము… ఈ రెండు వృత్తిద్వారా అభేదము పొందుటచేతనే - - ఆ రెండిటి యొక్క పొందిక (Association) సందర్భపడుతోంది.
కాబట్టి ‘చైతన్యము’తో ‘చైతన్య సంబంధము’ కలుగుట వలన అనుభవము - అనేది సిద్ధిస్తోంది. సాదృశసంబంధము వలననే పొందిక లభిస్తోంది. చైతన్యరహితమైన వస్తువు అనుభవమునకే లభించదు. కనుక, జగత్తు అంటే చైతన్యమే రూపముగాగల జీవుడు… చైతన్యమే స్వరూపముగాగల ఆయావస్తువులతో ఏర్పడుచున్న సామ్యముయొక్క “అనుభవం పొందటం.”
బ్రహ్మము సర్వదా విషయరహితమైనదే!
అయితే ఒక్క విషయం. విశాలమైన ఇసుక ఎడారి మధ్యలో ఎక్కడైనా ఫలవృక్షాలు ఉంటాయా? ఉండవు కదా! వాక్కుకు కూడా అతీతమై (అనుభవ మాత్రమైయున్న) ‘పరబ్రహ్మము’ నందు
Page:496
చేతనారూపంగా కనిపించే ‘నీవు - నేను’ అనునవిగాని, అచేతనంగా కనిపించే పదార్థజాలముగాని లేవు. బ్రహ్మమునందు ‘ఇది జడము’-‘ఇది చైతన్యము’ అనునట్టి శబ్దార్థముల కల్పనయే ఉండదు. అయితే ఈ చిద్వస్తువు ఒకానొకచోట దృశ్యమునందలి ఆయా పదార్థములతోను, వ్యక్తులతోను, సంఘటనలతోను ఏర్పరచుకొన్న సంబంధము కారణంగా ఒక ‘స్ఫురణ’ కలిగి ఉంటోంది. జలము కొన్ని సమయములలో ఆవృత్తములు (Circles) తోకూడి ఉంటుంది చూచావా? బ్రహ్మమునందు ఏర్పడు ద్రష్టత్వము-దృశ్యత్వము కూడా అట్టివి మాత్రమే. సర్వదా జలము జలముగానే ఉంటోంది. ఆ వృత్తమునకు ముందు, ఆవృత్తసమయంలో, ఆ తరువాతకూడా జలం జలమేకదా! జగద్భావము ఏర్పడుచున్నప్పుడు కూడా బ్రహ్మము బ్రహ్మముగానే ఉండిఉంటోంది. విషయసంబంధమైన చైతన్యము లేక బ్రహ్మముయొక్క స్ఫురణనే ‘మనస్సు’ అంటున్నాం. మనయొక్క విచారణ, మనస్సును రెండు రకాలుగా విభజించవచ్చు.
dimension / The experiencer)
The experiences)
చిత్ అంశమును ‘అజడము’ అని, విషయాంశమును ‘జడము’ అని అంటున్నాం. మనం చూస్తున్న ఈ జడవస్తు జాలమంతా ఆ విషయాంశమే. ఈ జీవుని యందుగల "తెలుసుకొనుట” అను స్వభావం రెండు విధములైన ప్రసరణ కలిగి ఉంటోంది.
చిదంశము విషయాంశము
ఎరుగుట/
తెలుసుకొనుట
నిర్మలము - నిత్యము వస్తువులు, విషయములు ఆద్యంత రహితము అగు మొ॥ విశేషములతో స్వస్వరూపము కూడిన బాహ్యజగత్తు
ఈ జీవుడు అన్ని వేళల చాంచల్యమును పొందుచున్నాడు. జగద్భాంతిని అనుభవిస్తున్నాడు. జగత్తు చిద్రూపమే : చిత్తమునందలి చిదంశమే (Knower concept) (1) చిత్తము (2) జగత్తు అను రెండు విధములుగా విభజించబడుచున్నది. కాని, ఈ కనబడే జగత్తుకూడా, విజ్ఞాన దృష్టితో చూస్తే, చిద్వస్తువు మాత్రమే అవుతుంది. చైతన్యముతో ఈ జగత్తు అభేదమే! అందుచేత ఆత్మదృష్టి కలవారు, “ఈ జగత్తు చిద్రూపమే అయి ఉన్నది, మరింకేమీ కాదు” అని సిద్ధాంతీకరించుచున్నారు.
Page:497
భేద దృష్టిచే మాత్రమే… ఈ చైతన్యము-మరొక ఏవేవో రూపములు ధరించుచున్నట్లు అనుభూత మవుతోంది. వాస్తవానికి చైతన్యము విభాగరహితం సుమా! కాని, విభాగము కలదాని వలె కన్పట్టుచున్నది.* అది భ్రమ రహితమే అయినప్పటికీ, భ్రమయుక్తముగా ప్రవర్తించుచున్నది.
నాయనా! వసిష్ఠా ! యథార్థానికి ’భ్రమ’ అనబడునది ఏదీ లేదు. “చేతనస్వరూపుడగు ఈ జీవుడు భ్రమను పొందుచున్నాడు” అనటం కూడా మా ఉద్దేశంలో సరికాదు. మరి ఇదంతా ఏమంటావా? పూర్ణసముద్రము తనయందు “తరంగములు” అను అనుభవం పొందుచున్నది కదా! సర్వదా పూర్ణమే అయిఉన్న చైతన్యము తనయందు ఈ "జగత్తులు-పదార్థములుభావాభావములు” మొదలైన రూపముగల అనుభవం పొందుచున్నది. అంతే!
‘చిద్వస్తువు’ - స్వస్వరూపం లేక ప్రతి ఒక్కరి వాస్తవ శుద్ధ స్వరూపం అయి ఉన్నది కదా! ‘జడము’ కూడా చిద్రూపమే అయిఉన్నది సుమా! ఎందుచేతనంటే ‘జడము’ అని చెప్పబడుచున్నది కేవలం జడము మాత్రమే అయి ఉంటే… స్వస్వరూపము దృష్ట్యా చిద్వస్తువగు నీకు అది భాసించ కుండానే ఉండేది. జాగ్రత్లో ఉన్నవాడే జాగ్రత్లో ఉన్నవాడితో సంభాషించగలడు. నిద్రించువాడు జాగ్రత్ - పురుషునితో ఎట్లా మాట్లాడుతాడు చెప్పు? స్వతహాగా చైతన్యమే అయిఉన్న నీవు అట్టి చైతన్యము యొక్క జడంశమునందు జడమునకు సంబంధించిన అనుభవం పొందుచున్నావు. కనుక జడంశము ‘చిత్’ యొక్క ఒకానొక అంశ మాత్రమే!
శ్రీ బ్రహ్మదేవుడు : “జ్ఞానము యొక్క చైతన్యాంశమునందు ‘అహంభావము (నేను-నాది’ అను జడత్వపు భావన ఉదయిస్తోంది" - అనునదే ఇక్కడ మనకు సిద్ధాంతము. ఏదైతే ఎందులోంచి - బాహ్యకారణమేదీ లేకుండా ఉదయిస్తుందో… అట్లు ఉదయించేదంతా ఆ మూలవస్తువుకు వేరైనది అయిఉండదు కదా! శుద్ధతత్వమగు బ్రహ్మము లేక ఆత్మ ‘జీవుడు’ అనబడు మరొక తత్త్వముగా పరిణమించినట్లు తోచినప్పటికీ వాస్తవానికి బ్రహ్మమునందు బాహ్యమైన లేక బాహ్యము నుండి నియోగించబడిన కారణమేదీ లభించుటలేదు కాబట్టి… ఈ జీవుడు సర్వదా బ్రహ్మమే అయివున్నాడు. శ్రీ వసిష్ఠ మహర్షి : తండ్రీ! అట్లా అయితే మరి ఈ ‘అహంకారము,’ అద్దానిచే అనుభవించబడుచున్న ‘జడత్వము’ మాట ఏమిటి?
శ్రీ బ్రహ్మదేవుడు : సూర్యుని తేజస్సే సూర్యకిరణరూపమై వస్తువులపై ప్రసరిస్తోంది కదా! అనగా, సూర్యకాంతి వస్తువు ఆకారం సంతరించుకొని కనబడుతోంది. “చైతన్యాంశమే అట్లు వివర్త భావము
* అవిభక్తంచ, భూతేషు విభక్తమివచ స్థితమ్…. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం.
Page:498
పొందుచున్నది“ అని అనక తప్పదు. అనగా ఈ జగత్తు, ఈ జగత్తును దర్శించుచున్నట్టి ద్రష్టవగు నీవు, నీతో ఈ సంభాషణ చేయుచున్నట్టి నేను… అంతా చైతన్యము యొక్క ప్రకటనయే అయిఉన్నది. చైతన్యమునకు అన్యమైనదంటూ ఏదీ ఎక్కడా లేదు. జలమునకు వేరుగా “తరంగములు” అనబడు మరొక బాహ్యవిశేషమేమైనా పరిణమించుచున్నదా? ఆ జలం మరొకటిగా మారుచున్నదా? లేదు. ఆ సమయంలో జలమునకు వేరుగా మరొకటి ఏదీ అగుచున్నదిలేదు. అదేవిధంగా ‘పరమాత్మ’ యందు అహంకారము మొదలైనవేవీ లేవు. మరి లేని అహంకారమును తొలగించుట లేక త్యజించుట ఏమిటి చెప్పు? కనుక, “అహంకారము చైతన్యముయొక్క సంప్రదర్శనమే!” అను సందర్శమును పెంపొందించుకొండి.
“నేను శుద్ధ చైతన్యమునే” అనునదే జ్ఞానసారం.
- దృశ్యమందలి సారము కూడా… ‘ద్రష్ట’ యందలి సారముకంటే వేరైనదేదీ కాదు. అనగా, అన్నిటియందును ఏకైక చైతన్యమే ఏకరసమై సర్వదా ప్రకాశించుచున్నది.
నాయనా! అహంభావమే ‘మిథ్య’ అయినప్పుడు, ఇక అట్టి ‘అహం’ భావనచే ఉత్పన్నము లగుచున్న విషయముల మాట ఏం చెప్పాలి? అవన్నీ ఎండమావులలోని నీటిని కడవలలో నింపి తెచ్చుకోవటం లాగా అత్యంత భ్రమాత్మకమే అవుతాయి. అందుచేత “అవన్నీ అప్రస్తుతం అనగా, ప్రస్తుతమే లేవు” అని గ్రహించు. ద్వైతదృష్టి అంతా తొలగిపోగా, అప్పుడు శేషించేదే ‘ఆత్మ’ అయి ఉన్నది కదా! అట్టి ఆత్మయందు ఇక అహంకారమునకు, అల్పత్వభావనకు, అఖండమునకు వేరైన అస్థిత్వమునకూ చోటెక్కడ?
శ్రీ వసిష్ఠమహర్షి : పితృదేవా! మరి మాకు ఘనీభూతమై తోచుచున్న ఈ ’అహంభావన’ ఎక్కడి నుండి వచ్చిపడుతోంది?
శ్రీ బ్రహ్మదేవుడు : నీరు అధికమైన శీతల వాతావరణము నందు ఉంచబడినప్పుడు ‘మంచు’ గా ప్రాప్తించుచున్నది చూచావా? చేతన వస్తువు స్వస్వరూపమునకు సంబంధించిన అజ్ఞానమును అంగీకరించి, అట్లు అంగీకరిస్తున్న సమయంలో "అహంకారము - ‘విషయానుభవము’ అనునట్టి రూపమును పొందుచున్నది.
ఒక చిన్న హాస్య సంఘటన చెపుతాను. విను. ఒకడు ఒక అర్ధరాత్రి తటాలున నిద్రలేచి, తన ప్రక్కనే నిద్రిస్తున్న తన స్నేహితుని నిద్రలేపి, “మిత్రమా! ఇప్పుడు నాకొక కల వచ్చింది. ఆ కలలో - - నేను చచ్చినానట. అప్పుడు నా శరీరమును ఎవ్వరో మోసుకొని వెళ్ళుచూ, నా మంచితనము గురించి చెప్పుకొంటున్నారు. ‘ఇతడు మరల బ్రతికితే ఎంత బాగుండు!’ అని అనుకొంటున్నారు. కాని చనిపోయినట్టి నేను మరల బ్రతకటం అసాధ్యం కదా, ….” అని చెప్పుకుపోతున్నాడు. స్వప్న ద్రష్టయగు తానే మరణిస్తే స్వప్నమెక్కడిది? తన కల్పన ఉంటేకదా,… ఆ కల్పనలో ఆయా వ్యక్తులుండటం! అతని శరీరము మోయుచున్నవారెవరు? స్వపద్రష్టచే సంకల్పించబడి, దర్శించబడేవారే కదా!
Page:499
మరొకడు “రాత్రి కలలో నేను గాఢ నిద్రపోతూ ఉండగా, ఆ కలలో ఒకడు మా ఇంటిలో ప్రవేశించి నన్ను నిద్రలేపినట్లు కలవచ్చింది. అప్పుడేమైనదంటే…..”” అని కలలోని విశేషాలు చెప్పుచున్నాడు. తానే గాఢనిద్రలో ఉంటే ఆ స్వప్నములోని మరొకడు ఎక్కడి నుండి వచ్చాడు? స్వప్నమంతా స్వప్నద్రష్ట యొక్క స్వకీయకల్పనయే కదా! అదే విధంగా చైతన్యము కూడా మిథ్యారూపంగా జడత్వానుభవం పొందుచున్నది. సర్వాత్మకమగు ఆ చైతన్యము తన అనంత రూపములోని ఒకానొక చోట జడస్థితిని అనుభవించుచున్నది. దృఢమైన అజ్ఞానమును ఆశ్రయించుట ద్వారా స్వస్వరూపానుభవం ఏమరుస్తోంది. ‘సంస్కృతి’ అని చెప్పబడు బాహ్యదృష్టి కలిగియుంటోంది. అనగా అది తన సర్వాత్మకత్వమును మరచి, తనకు ఎక్కడ ’దృష్టి (Avocation) ఏర్పడుచున్నదో
అక్కడ జడాకారము, పరిమితత్వమును వహించి ఉంటోంది. సమస్త వస్తువులకు ఆదికారణం మనస్సే. ఆ మనస్సే అన్నిటా, అన్ని రూపములలోను వ్యక్తమగుచున్నది. అదే ఆకాశమువలె, అత్యంత విశాలమై అనేక రూపములను స్వయముగా దర్శించుచున్నది. ఇక దానిని నియమిస్తున్నది ఎవ్వరంటావా ? దాని వాస్తవ స్వరూపమైనట్టి ఆత్మయే.
ఓ జనులారా! మీరు మొట్టమొదట అభ్యాసము, వైరాగ్యము మొదలైన ఉత్తమ గుణములను అలవర్చుకోండి. అప్పుడు మీ చిత్తములు జ్ఞానము పొందుటకు ‘అర్హత’ పొందుతాయి. జ్ఞానము అభివృద్ధి పొందుచూ ఉండగా ఇక “స్థూల - సూక్ష్మ - కారణ” శరీరముల భ్రాంతిని మీ అంతట మీరే పరిత్యజించివేస్తారు. “ప్రతిభాసాత్మక (Image like) చిత్తము” అనుదానిని మీయొక్క ‘చిత్తము’ నే ఉపయోగించి స్వయముగా విచారణ చేయండి. అప్పుడు నేను చెప్పు దానిలోని వాస్తవాన్ని మీరే గ్రహించగలరు. చిత్తము అపరిశుభ్రంగా ఉన్నంతకాలం భ్రమాత్మకములగు అనుభవములు, తత్ఫలితములు, సంసారదుఃఖ పరంపరలు తప్పునవికావు. చిత్తము శుద్ధమైనంతమాత్రం చేతనే నిత్య నిరతిశయానందమును పొందగలరు. మీరంతా ఈ దేహాదుల పరిశుభ్రతకొరకు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారుగాని, చిత్త నిర్మలత్వము కొరకు తగినంత ప్రయత్నశీలురు అగుచున్నారా? లేదు. కనుక, పరిశీలించి చూచుకోండి. చిత్త నిర్మలత గురించి అశ్రద్ధ వహించియుండుటచేత అనేక దౌర్భాగ్యములు వచ్చి పడుచున్నాయి. చిత్తముచే “చైతన్య పరబ్రహ్మము” అయి ఉన్న స్వస్వరూపమును గ్రహించాలి. అది మానివేసి ఈ దేహాది ఖండములను మాత్రమే విచారించుచు ఆయుష్షును వృథా చేయుటచే ప్రయోజనమేమున్నది?
ఏది సత్యమో దానిని గురించే విచారించాలి. అట్టి విచారణ రూపమగు జ్ఞానమే సఫలమౌతుంది. అసత్యము, కల్పితము అయిన దాని గురించి ఎంత విచారించి ఏం ప్రయోజనం? అట్టి అసత్యమైన దానిని ఆశ్రయించుటచే శ్రమకు ఫలితంగా అసత్యమైనది, కల్పితమైనదే ప్రాప్తించటం జరుగుతుంది. అందుచేతనే సంసారజీవులను దుఃఖాదులు ఆశ్రయించుకొనియే ఉంటున్నాయి. ఆకాశంలో "తన యొక్క కల్పన” అను వికారముచే గాంచబడే వృక్షమును ఎవరైనా శోధిస్తారా? ఈ దేహాదుల
Page:500
విషయం కూడా అట్టిదే. అందుచేత, జ్ఞానులు ఈ దేహముల రాక - పోకల గురించిన విచారణను ప్రక్కకు పెట్టి, దేహి (లేక) చైతన్యతత్వము గురించి శోధించుచున్నారు. నాయనలారా! సర్వప్రసరణ శీలమగు ‘ఆత్మ’యే మీరు. కాబట్టి "నేను ఈ దేహపరిమితుడను” అని భావించి భేదము చెందకండి.
ఓ ప్రియ తనయులారా! వసిష్ఠా! విశ్వామిత్రా! "జీవుడనగా ఈ దేహమే. మరింకేమీ కాదు” అని చెప్పుచూ, కొందరు దేహాత్మవాదులు ఆయా ప్రమాణములతో ఈ జీవునకు అల్పత్వం ఆపాదించు చున్నారు. ఈ చిత్తము దేనిని ఎట్లు భావించునో అది అట్లే అయి, ప్రాప్తిస్తూ ఉంటుంది. అహల్య, ఇంద్రుల మనోనిశ్చయము యొక్క ప్రభావమే మనకు ఇందుకు దృష్టాంతము. కనుక అట్టి ఈ చిత్తముతో ఉత్తమోత్తమమైన భావనయే చెయ్యాలి. కాని, “నేను స్వల్పుడను, శరీరమును, అల్పుడను” అను రూపము గల నీచ భావనలు ఎందుకు చెయ్యటం? “సర్వాత్మకమైనట్టి చైతన్య పరబ్రహ్మమే ఈ “నీవు-నేను” మొదలైన సర్వరూపములుగా ఒకే జలం అనేక తరంగములు అగుచున్నట్లు
ప్రకటితమౌతోంది. కనుక నేను పరబ్రహ్మమును. నాకు ఆద్యంతాలు లేవు. జన్మ- జరా - మృత్యువులు లేవు. ఇదంతా నాకంటే వేరైనది కాదు” అని భావన చెయ్యాలి. అట్లే “ఈ కనబడే ప్రతి ఒక్కరు పరబ్రహ్మ స్వరూపులే(తత్-త్వమసి)” … అను మననమును ప్రవృద్ధం చేసుకోవాలి. అట్లు భావించుట చేతనే మీరు ఉత్తమత్వమును పొందగలరని గ్రహించండి.
ఈ చిత్తము ఏ విధంగా స్ఫురించుచున్నదో, అట్టి స్పురణను అనుసరించే ఆయా ఉపాధి పరంపరలు వచ్చి చేరుచున్నాయి. వాస్తవానికి, ఈ దేహముగాని, లేక, అహంకారముగాని … స్వప్నములోని వ్యక్తులు, వస్తువుల వలె … “లేనివే” సుమా! కనుక ఓ వసిష్ఠా! సర్వదా ఏకరూపమై, ఇచ్ఛారహితమై ఉన్నట్టి ఆత్మనే ఎరుగుము. అట్లు ఎరుగుచూ ఇచ్ఛారహితుడవై ఉండుము.
ఒక బాలుడు ఎవ్వరో చెప్పిన మాటలు విని తనకుతానే కల్పించుకొనినట్టి భ్రమపూర్వకమైన కల్పన చేత బేతాళదేహమును ఎదురుగా చూస్తూ, భయాదులను అనుభవిస్తూ ఉంటాడు. పంచభూతాత్మకమైన తన ఈ దేహమెక్కడ? జడలు - కోరలు - నాలుక మొదలగు కల్పనలతో మనస్సుచే ఊహగా చూడబడే బేతాళ దేహము ఎక్కడ? ఆ రెండింటికీ సంబంధమే లేదు కదా! కల్పనలు నశించగానే ఆ బేతాళుడు, భయాదులు, … అన్నీ తొలగిపోతున్నాయి. ఆత్మ కూడా కల్పనావశం చేతనే ఈ ‘మనుష్యుడు’ మొదలైన దేహములుగాను, ఈ సర్వదృశ్య ప్రపంచముగాను అగుచున్నది. ఆ దేహాదులు నశించుచున్నప్పుడు తానే నశించుచున్నట్టి భావనకు లోను అగుచున్నది. అవిద్యా కల్పన నశించిన మరుక్షణం సర్వభ్రమలు తొలగిపోతాయి. అప్పుడు స్వస్వరూపప్రాప్తి స్వయముగానే సంభవించుచున్నది.
Page:501
శ్రీవసిష్ఠమహర్షి : తండ్రీ! బ్రహ్మదేవా! మీరు నాకు అత్యుత్తమమైన విషయమే బోధిస్తున్నారు. ఆత్మజ్ఞానమే అన్నిటా ఉత్తమమైనది. అయితే, మీరు చెప్పిన విషయాలలో ఒక్కటిమాత్రం నాకు యుక్తియుక్తంగా కనిపించటం లేదు. మీరు ఒకప్పుడు నాతో “శాప - మంత్రాదులు అమోఘమైనవి. అవి తమ ప్రభావం కలిగియే ఉంటాయి” అని చెప్పియున్నారు. మరి ఇప్పుడేమో “దృఢమైన మనోబలిమి కలవానిని శాప-మంత్రాదులు ఏమీ చెయ్యలేవు” అనే అర్థం వచ్చేవిధంగా చెప్పుచున్నారు. అంటే, ‘శాప’, ‘మంత్రములు’ మొదలైన శక్తులు వ్యర్థమైపోగలవంటారా? “శాపమంత్రాదుల శక్తిచే మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియములు మూఢావస్థ చెందగలవు” అని అనేక సందర్భములలో నిరూపించబడినట్లు నేను వినియున్నానే? * స్వామీ! వాయువు-దాని చలనము, నువ్వులు-నూనె, అగ్ని-ఉష్ణము వేరువేరైనవి కావు కదా! అట్లే ఈ మనస్సు-శరీరము ఒక్కటే కదా! ఎందుకంటే “మనస్సును అనుసరించే ఉపాధి ఉంటుంది" అని మీరు కూడా ఇప్పుడు చెప్పియున్నారు. కాబట్టి ఈ శరీరము మనస్సు యొక్క రూపమే. వర - శాపాదులు మనస్సును ప్రభావితం చేయలేకపోతే, ఇక దేహమును కూడా ఏమీ చెయ్యలేకపోవటమే జరగాలి. కాని అహల్య, కృత్రిమ ఇంద్రుల భౌతిక దేహములు శాపము యొక్క ప్రభావం చేత నేల కూలి, వారిద్దరూ మరణించారు కదా! ఎందుచేత?
పోనీ, మీరు అంటున్నట్లు, “ఈ దేహము వాస్తవము కాదు. అది చిత్తముయొక్క కల్పన మాత్రమే” అనే అనుకుందాం. “ఎండమావులవలె, రెండవ చంద్రునివలె ఈ దేహము వ్యర్థముగా అవాస్తవత్వముతో కూడి కనబడుతోంది. అయినప్పటికీ కూడా, ఈ దేహము, మనస్సులలో “ఒకటి నశిస్తే, రెండవది కూడా నశిస్తోంది” … అనునదే లౌకిక దృష్టికి తెలియవస్తోంది. రెండూ సమాన సత్తయే కలిగి ఉంటున్నాయి. మనస్సు నశించినప్పుడు అట్టివాని శరీరం మాత్రం ఉంటుందా? నశిస్తుందనే నా ఉద్దేశం. మరి ఇక, శరీరము నశించినప్పుడు కూడా మనస్సు నశించవలసియే
ఉంటుంది కదా?
వరశాపాదులచే శరీరము నశించినప్పుడు కూడా మనస్సు నశించదంటారా ఏమిటి? శాపాదులవలన మనస్సు ఎందుకు ప్రభావితం కాకుండా ఉండగలుగు చున్నది? శరీరము మాత్రమే ఎందుకు ప్రభావితమౌతోంది?
ఈ విషయాలన్నీ మరికొంత వివరించి చెప్పండి.
“శాపము మనస్సుపై పనిచేస్తుంది” అని నిరూపించే కొన్ని ఇతిహాస సంఘటనలు ఉన్నాయి. నహుషుడు శాపవశం చేత సర్పము అయ్యాడు. అట్లు సర్పంగా మారి, తన వంశమునకు సంబంధించిన వారు, తనకు ప్రియాతి ప్రియులు అయి ఉన్న భీముడు మొదలైనవారిని బాధించాడు.
కొందరు ధర్మాత్ములు కూడా శాపవశం చేత పిశాచజన్మలు ఎత్తి తమ జాతివారగు మానవులనే భక్షించినట్లు కొన్ని కథలు చెప్పుచూ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మహర్షి బ్రహ్మదేవుని ఇట్లు ప్రశ్నించుచున్నారు.
Page:502
శ్రీ బ్రహ్మదేవుడు : కుమారా! శుద్ధమైనట్టి శుభకర్మల చేత, పురుష ప్రయత్నముచేత ఈ జగత్తులో పొందరాని వస్తువంటూ ఏదీ లేదు. ప్రయత్నము చేతనే ఎవ్వరైనా ఏదైనా అధిరోహించగలరు, వహించగలరు, నిరోధించగలరు.
ఈ ప్రపంచంలో బ్రహ్మ నుండి ఒక పురుగు వరకు దేహధారులైనట్టి ప్రాణికోట్లన్నిటికీ రెండు శరీరములు ఏర్పడి ఉంటున్నాయి.
1) మాంసనిర్మితమగు ఈ ’భౌతిక దేహము’
2) సర్వకార్యములకు కారణమగుచు, సదా స్థిరమై ఉండి ఉంటునట్టి ’మనస్సు’ “మాంసదేహము” : అందరికీ కనబడుతూనే ఉంటుంది కదా! ఇది సకల విధములైన శాపముల చేతను, శస్త్రములచేతను, క్షుద్రవిద్యలచేతను బాధింపబడగలదు. ఈ పాంచభౌతికదేహము జడము. స్వయముగా ఏదీ నిర్వర్తించలేదు. కాబట్టి అత్యంత అసమర్థము. అతి దీనమైనది. తామరాకుపై నీటి బిందువు వలె అతిచంచలము కూడా. ఇది ఏ క్షణమైనను వినాశనం కావచ్చు. ప్రారబ్ధకర్మల చేత, రాజదండనము చేత, వాయువు - జలము - క్రియలు మొదలైన ప్రకృతి పదార్థములచేత ఎదుర్కొనబడుతూ ఉంటుంది.
“మనస్సు” : ఇది ఇతరుల భౌతిక దృష్టికి కనబడేది కాదు. ఈ మనస్సు స్వతంత్రమైనదీ అస్వతంత్రమైనదీ కూడా! ఎవ్వరైతే పురుష ప్రయత్నమును ఆశ్రయిస్తూ, నిత్యము ధైర్యమును అవలంబిస్తూ ఉంటారో అట్టివారి మనస్సు దుఃఖమును పొందకుండా ఉంటుంది. జీవుని యొక్క ఈ మనోమయదేహము, ఏ విధమైనయత్నము ఇతడు చేస్తాడో, ఆ విధమైన ఫలములను
పొందుతూ ఉంటుంది.
మాంసమయ దేహము తనంతటగా ఏ ప్రయత్నం చేయలేదు. దేనినీ సాధించలేదు. ఏదైనా సరే, మనోమయ దేహము క్రియావంతమగుచున్నప్పుడే అంతా ఫలవంతమవటం జరుగుతోంది. ఈ మనస్సు కనుక ఎల్లప్పుడు పవిత్రమైన దానినే చింతించటం, ధ్యానించటం జరుగుతూ ఉంటే, మాంసమయదేహమునందలి మార్పుచేర్పులు ఆ చింతనను ఏమీ చెయ్యలేవు. “ఒకడు ఒకదానికొరకు ఎంతటి తీవ్రేచ్ఛతో భావన-సంకల్పము -ప్రయత్నములను గావించుచున్నాడు?” అనునదే ప్రయోజనం యొక్క సరళిని నిర్ణయిస్తోంది. ఈ మాంసమయదేహము అగ్నియందు పడుగాక! మట్టిలో కలిసిపోవుగాక! లేక అనేక నామరూపములతో విజృంభించుగాక! ఏది ఏమైనప్పటికీ… “మనస్సు దేనినైతే దీక్షతో చింతించుచున్నదో, అద్దానినే ఈ జీవుడు పొందుచున్నాడు" అని గ్రహించు.
ఈ భౌతికదేహము స్వయముగా ఏమాత్రం క్రియాకారకము కాదని అనుకొన్నాముకదా! అయినప్పటికీ పురుషప్రయత్నం అధికంగా సిద్ధించుచున్నప్పుడు ఇది కూడా నిర్విఘ్నంగా కొన్ని ఫలములను కలుగజేస్తూ ఉంటుంది. ఒక గొప్ప ‘ముని’ లో కనిపించే ముఖవర్చస్సు, ప్రశాంతచిత్తుని చూడగానే మనకు కనిపించే ప్రశాంత - ప్రజ్ఞ ఆనందములు ఇట్టివే. పురుష ప్రయత్నము మనస్సు యొక్క రూపమే అయిఉన్నది. అనగా అట్టి ఫలములన్నీ “మనస్సే మనస్సుకు అట్టి
Page:503
ఫలమును కలుగజేస్తోంది” అనియే గ్రహించాలి కాని “పాంచభౌతికమైన ఉపాధి అట్లు కొందరిని ప్రభావితం చేస్తోంది” అని భ్రమించటం ఉచితంకాదు. పురుష ప్రయత్నంచేతనే కృత్రిమేంద్రుడు తన యొక్క “మనస్సు”ను “అహల్యామయం”గా చేసివేశాడు. అట్లు మనస్సు అహల్యనే మననం చేస్తూ ఉండటం చేత భౌతికదేహము ఎంత బాధింపబడుచున్నప్పటికీ అతడు ఆ బాధను పొందనేలేదు. ఇట్లు “భౌతికదేహం బాధింపబడటం - కాని మనస్సులు ఆ బాధను పొందకపోవటం” అనే చమత్కారం అనేక గాథలలో నీవు వినే ఉంటావు. ఉదాహరణకు మాండవ్య మహర్షి ఒకసారి తన మనస్సును తీవ్రమైన తపస్సులో వినియోగించాడు. కొందరు దొంగలు రాజభటుల దృష్టినుండి తప్పించుకొని ఆ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి తలదాచుకొన్నారు. భటులు ఆ ఆశ్రమంలో ప్రవేశించి మహర్షిని చూచి "ఇతడు కపటముని వేషం ధరించిన దొంగల నాయకుడే అయిఉంటాడు” అని తలచి, అతనిని బంధించి, తీసుకుపోయి, రాజాజ్ఞపై ‘కొరత’ వేశారు. కాని అతడు కొంచెము కూడా బాధ అనుభవించనేలేదు. ఎందుచేత? మనస్సు తపస్సునందు లగ్నమైనప్పుడు శారీరకశ్రమ బాధగా అనుభవమునకు రాలేదు కాబట్టి ! ఆ విధంగా బాధ దృష్టికి రాకపోవడం ప్రతిరోజు ప్రతిఒక్కరికీ అనుభవమయ్యే విషయమే. ధ్యాన నిష్ఠ కూడా ఉత్తమ పురుష ప్రయత్నము చేత మాత్రమే సాధ్యం కదా!
ఇలా, మానసికప్రవృత్తి ప్రభావం గురించి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మరొక సంఘటన చెపుతాను. విను. ‘దీర్ఘతపుడు’ అనే మహర్షి ఒకసారి ఒక యజ్ఞం చేయతలపెట్టాడు. యజ్ఞసామాగ్రి కొరకై ఒకరాజును ఆశ్రయించాలని బయలుదేరాడు. అట్లా నడచిపోతూ ఉండగా త్రోవలో విధివశాత్తూ ఒక నూతిలో పడిపోయాడు. ఆ నూతినుండి తనంతటతానే బయటకు వచ్చుటకు ఏమాత్రం వీలు కాలేదు. అతని మనస్సు మాత్రం “నేను లోకమునకు శుభం కలుగజేయగల ఈ యజ్ఞం చెయ్యాలి” అనునట్టి బలవత్తరమైన సంకల్పము కలిగి ఉన్నది. అప్పుడు ఆ నూతిలోనే ఊహతో, లేక, మనస్సుతో మహాయజ్ఞం ప్రారంభించాడు. ఋత్విక్కులను ఆహ్వానించాడు. అగ్నిగుండమును సంకల్పించాడు. సశాస్త్రీయంగా అంతా నిర్వర్తించాడు. అప్పుడు ఇంద్రుడు ప్రసన్నుడై ఆ నూతి నుండి దీర్ఘతపుని బైటకుచేర్చి, తన ఇంద్రపదవిని సమర్పించాడు. చూచావా? వసిష్ఠా! ఇక్కడ మనస్సుచే చేసిన పురుషప్రయత్నం శరీరం పాల్గొనకపోయినప్పటికీ ఉత్తమ ప్రయోజనం ప్రాప్తింపజేసింది. ఇంతకు ముందు మనం ఐందవుల గురించి చెప్పుకొన్నాం. వాళ్ళు సామాన్య మానవులే కదా! ఐతే ఏం? పురుష ప్రయత్నంచే మనోబలం (చిత్తైకాగ్రత) సంపాదించారు. మనోబలం చేత బ్రహ్మపదప్రాప్తిని పొందారు. వారినిప్పుడు ఆ స్థానం నుండి తొలగించటం నా వల్ల కూడా కాదు కదా! ఆ విధంగానే, ఈ దేవత లలో, మానవులలో, జంతువులలో, తదితర పాతాళ జీవులలో కొంతమంది తమ యొక్క చిత్తెకాగ్రత్త మరియు, “జ్ఞాన, ఉపాసనలు” ఏమాత్రం త్యజించకుండా ఉంటున్నారు కూడా. నాయనా! ధ్యేయ వస్తువు (The aspect aimed at as the goal) నందు ఏకాగ్రచిత్తము కలిగి ఉంటే అట్టి చిత్తమును
కొరత : పదునైన శూలమునకు శరీరమును నిలువుగా గ్రుచ్చటం.
Page:504
శారీరక, మానసిక వ్యాధులుగాని, శాపములుగాని, విద్రోహచర్యలు గాని, పాప స్వభావులగు రాక్షసుల ప్రయత్నములు గాని విరమింపజేయలేవు. బండశిలను కమలము ఛేదించగలదా?
కొందరు శాపమును పొందినప్పుడు (నహుషుడు మొదలైనవారు) ఆయా శాపములచే నిర్ణయించ బడిన నూతన శరీరాలు పొందటం, జ్ఞానప్రాప్తి విషయంలో అసమర్థులై ఉండటం జరుగుచున్నమాట నిజమే. దానికి కారణం చిత్తము యొక్క అదృఢత్వమే సుమా! “నేను చచ్చాను. ఇప్పుడు నేను ఒక పామును అయ్యాను” అనునట్టి భ్రమాత్మకమైన అనుభవం ఒక జీవుడు పొందటానికి కారణం… ఈ శరీరమును ఎంతో నమ్మికతో గాంచుటచేతనే. అనగా “నేను ఈ శరీరమును” అను భావనయే అట్టి దౌర్భాగ్యమునకు దారితీస్తోంది. అది కూడా చిత్తము యొక్క అశుభములకు దారితీయు ప్రయత్న రూపమే.
సావధానచిత్తులైనవారు ఈ ప్రపంచమునందు జాగృత దశయందు గాని, స్వప్నమునందుగాని ఎట్టి దోషముల చేత కూడా పీడింపబడజాలరు. అసావధానచిత్తులే ఎప్పటికప్పుడు రాగ ద్వేషముల చేత, సుఖదుఃఖముల చేత, మాన అవమానముల చేత తాడనం పొందుచున్నారు. ఆ ద్వంద్వముల ప్రభావం చేత అనేక క్లేశములు అనుభవిస్తున్నారు. ‘సంసారము’ అని శాస్త్రములచే చెప్పబడుచున్నది ఏమిటి? ఈ జీవుడు నిజరూపమగు ఆత్మ విషయమై అసావధానచిత్తుడై ఉండుటయే సుమా! ఓ సర్వజనులారా! మీరు పురుష ప్రయత్నమునే ఆశ్రయించండి. మనస్సును మనస్సుచేతనే పవిత్రమార్గంలో
నియోగించండి.
మనసైవ మనస్తష్మా త్పౌరుషేణ పుమానిహ । స్వకమేవ స్వకేనైవ యోజయే త్పావనే పథి ॥ (సర్గ : 92; శ్లో. 28. )
అంతేగాని, “నేను ఈ శరీరమును. ఒకప్పుడు పుట్టుచున్నాను. మరొకప్పుడు చచ్చుచున్నాను. ఇవన్నీ నావి. వీరు నా వారు” అని పలుకుచు మీమీ చిత్తములను అల్పత్వమువైపు నియోగించకండి. ‘అజ్ఞానము’ అనే చీకటినూతిలోకి మిమ్ములను మీరే త్రోసివేసుకోకండి.
ఓ మునీంద్రా! ఈ చిత్తమునందు ఏ వస్తువు స్ఫురిస్తే అది రూఢిపడి క్రమంగా స్థూలత్వమును పొందుచున్నది. క్రమంగా అదియే అతనికి సత్యముగా తోచుచున్నది. తల్లి తన బిడ్డ మొరాయిస్తూ అల్లరిచేస్తున్నప్పుడు. “ఓయీ! అల్లరి మాను. లేదా, అటువైపు ఆ చీకట్లోకి చూడు. అక్కడ ఒక బూచి ఉన్నది…. కనిపిస్తోంది కదా! ఆ బూచిని పిలుస్తాను. ఆపై నీ ఇష్టం” అని, అంటూ ఉంటుంది. ఆ వాక్యములు ఆ బాలుని చిత్తమునందు ప్రవేశిస్తాయి. రూఢిపడతాయి. అప్పుడు అతనికి ఆ చీకట్లో నిజంగా ‘బూచి’ అనునదేదో కించిత్ కదలికలతో కనిపిస్తూ ఉంటుంది. మనస్సే అట్లు కల్పనచేసుకొని కనులతో చూస్తోంది.
Page:505
ఈ మనస్సు ఆయా పురుష ప్రయత్నములచే ఎప్పటికప్పుడు యితః పూర్వపువాసనలను త్యజించివేస్తూ, నూతన - దృఢ వాసనల ప్రాబల్యంచేత నూతన రూపములుగా అగుచున్నది. ప్రవహించటం ప్రారంభించిన జలం ఒక క్షణంలో తరంగరూపం చెందుతోంది కదా! ఈ మనస్సు కూడా క్రొత్త క్రొత్త దృఢభావనలచే వెంటవెంటనే ధ్యేయ వస్తురూపమును పొందగలదు. అందుకే మానవుడు మనస్సును ఉత్తమభావనలవైపే నడిపించాలి.
దృఢభావనకు మహత్తరమైన శక్తి ఉన్నది. దృఢభావనచే మనస్సు సూర్యబింబమునందు కూడా అంధకారమును గాంచగలదు. ఓ కుమారా! సర్వము భావనామయమే సుమా! ఈ మనస్సు దేనిని భావిస్తే అద్దానినే శీఘ్రంగా పొందుచున్నది. అట్లు పొందినదానిని హర్ష విషాదములతో అనుభవించుచున్నది. “కర్తయగు మనస్సే భోక్త కూడా అగుచున్నది" అని మేము గ్రహిస్తున్న నిత్య సత్యమును ప్రకటిస్తున్నాము. దృఢభావనచే ఈ చిత్తము చంద్రుని యందు కూడా అనేక అగ్ని జ్వాలలు గాంచుచు, ఉష్ణత్వమును అనుభవించగలదు. దగ్ధమై, పరితాపం కూడా పొందగలదు. ఈ చిత్తము తన భావము చేత రాతినేలలో జలానుభవము పొంది ఆ జలమును త్రాగి తృప్తిగా నాట్యం చెయ్యగలదు. తన కల్పన చేతనే ఆకాశంలో గొప్ప వనమును దర్శించి ఆ వనంలో సంచరిస్తూ పుష్పాలను, ఫలములను కోయటం, వృక్షములను పెంచటం, నరకటం కూడా చెయ్యగలదు.
ఇట్లు మనస్సే బంధము, మనస్సే మోక్షము. మనస్సు తాను కల్పించిన ఇంద్రజాలమును తానే వీక్షించుచున్నది. జీవుని యొక్క జగద్దర్శనమంతా అట్టిదే సుమా!
కాబట్టి ఓ వసిష్ఠ-విశ్వామిత్రులారా! సర్వ జనులారా! “ఈ జగత్తు సత్తు కాదు! అసత్తు కాదు.” అనియే భావించండి. మీమీ ఉత్తమ ప్రయత్నములచే పలువిధములైన కల్పనలతో కూడిన ఈ పరిచ్ఛిన్నదృష్టిని క్రమక్రమంగా త్యజించండి.
"సర్వగామి, అఖండము, అద్వితీయము అయిఉన్న ఆత్మతత్వమునే ‘నేను’. ఈ నా చిత్తముయొక్క స్వరూపము కూడా ఆ చిదాకాశతత్త్వమే”
అని భావించి, సర్వకల్పనలను త్యజించి, సుఖరూపులు అగుదురుగాక!
Page:506
శ్రీవసిష్ఠ - రామచంద్రుల పరిశీలన
బ్రహ్మము సర్వదా అనిర్వచనీయము. వాక్కుకు అతీతము. అట్టి అనిర్దేశ్య తత్త్వమగు బ్రహ్మము నుండి మొట్టమొదట సర్వ వ్యాపకమగు అవ్యాకృతము ఉదయించింది. అది కాలక్రమంగా సంకల్ప వికల్పరూపమగు మనన శక్తిచే కొంత స్థూలత్వమును చెంది “మనస్సు” అగుచున్నది. ఆ మనస్సు ఒకానొకప్పుడు సూక్ష్మ భూత కల్పనతో కూడి ఉంటోంది. అప్పుడు అద్దానినుండి తేజోరూపమగు “సమష్ఠి లింగ శరీరాభిమాని” అయినట్టి “పురుషుడు” (పురుషకారమే స్వభావముగా గల తత్త్వము) ఉదయిస్తున్నాడు. అట్టి సమష్టిసృష్టి - అభిమానిని, ‘బ్రహ్మ’ అని, ‘హిరణ్యగర్భుడు’ అని, ’స్వయంభువు’ RAMA లక్షణములను దృష్టిలో పెట్టుకొని శాస్త్రములు వర్ణిస్తున్నాయి. ఈ సమష్ఠియగు ఆ బ్రహ్మ మనోరూపుడు మాత్రమే కదా! కనుక, మనోరూపమే జగత్తునకు కర్త అయి ఉన్నది.
మననతత్త్వమే ఆకారముగా గల భగవంతుడు బ్రహ్మదేవుడు ’సంకల్పరూపుడు’ అయిఉన్నాడు. అతడు దేనిని ఎట్లు సంకల్పిస్తాడో, దానిని వెంటనే అట్లే దర్శిస్తూ, మరియు పొందుతూ ఉంటాడు. అతడు “సంకల్పసిద్ధి” కలవాడు. అతడు తనయొక్క సంకల్పశక్తి ప్రభావంచేత అవిద్యను* కల్పించినాడు.
అట్టి అవిద్యాకల్పన చేతనే బ్రహ్మదేవుడు ఈ పర్వత - తృణ - సముద్రయుక్తమగు జగత్తును సృజించారు. చిత్తమే స్వరూపముగా గల బ్రహ్మ నుండే సృష్టి జనించుచున్నది.
కాని కొందరు, “జడములగు పరమాణువుల చేతనే ఈ సృష్టి ఏర్పడినది" అని వాదిస్తున్నారు.
పరమాత్మ భగవంతుడు - - జగత్తు … వేరు వేరు సిద్ధాంతములు
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు గురించిన వేరువేరు సిద్ధాంతములు ప్రవచించబడుచున్నాయి కదా! వాటి గురించి సంగ్రహంగా చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ఆయా వాదములలో కొన్నిటిని ఇక్కడ వివరిస్తాను.
1) పరమాణు వాదము : "జడములైన వేరు వేరు పరమాణువులే ఈ సృష్ట్యి. పరమాణువులు తప్పిస్తే, ఇక ఎక్కడా ఏదీ లేదు. భగవంతుడు అనబడునదేదీ ఎక్కడా లేదు.”
అవిద్య = అనాత్మయందు ఆత్మాభిమానము కలుగజేయునది.
Page:507
మనకు ఇది ఉత్కృష్టమైన సత్యమును ప్రసాదించగలుగుటలేదు. ఎందుచేతనంటావా? ఈ వస్తుజాలములన్నీ అనేక స్వరూప - స్వభావములు కలిగి ఉంటున్నాయి కదా! ఇంద్రియములకు వస్తువులకు ఒకానొక సానుకూల్యత ఎట్లా ఏర్పడుతోంది? ఈ పరమాణువులు ఇన్ని రకములుగా ఒనగూడవలసినదిగా శాసించుచున్నదెవరు? నాలుక-ఉప్పులందు ఆ సమన్వయమును కల్పించి, రుచి యొక్క అనుభవమును పొందింపచేస్తున్నదేది? కర్తయే లేకపోతే, ఈ సూర్య చంద్ర నక్షత్ర భూమి-వృక్షాది చమత్కారమైన వస్తువులతో కూడిన ఈ జగన్నిర్మాణము ఎట్లా సిద్ధిస్తోంది?
2) ప్రధాన కారణ వాదము : ఈ వాదము ప్రతిపాదించు ద్రష్టలు "సర్వమునకు పరమాత్మయే కర్త” అని చెప్పుచున్నారు. అయితే భగవంతుడు అసంగుడు. ఉదాసీనుడు. కార్య కారణములకు అతీతుడు” అని సామవేదాదులు శ్లాఘిస్తున్నాయి. ఆయనకు ఈ సృష్టి కార్యము నిర్వర్తించుటవలన కలిగే ప్రయోజనం ఏమి ఉంటుంది? సర్వ ప్రయోజనములకు అతీతుడై, సాక్షీభూతుడైయున్న పరమాత్మ తత్త్వమునకు ఈ “జగత్ కర్తృత్వం” (Intention of designing th world) ఎట్లా ఆపాదిస్తాం? కనుక ప్రధాన కారణ వాదము కూడా సరిపోదనే మేము భావిస్తున్నాం.
3) విజ్ఞానకారణ వాదము : వీరు “భగవంతుడే ఈ జగత్తురూపమున వివర్తం పొందుచున్నాడు” అని చెప్పుచున్నారు. అయితే, చైతన్య స్వరూపుడగు భగవంతుడు జడరూపమును ఎట్లా పొందుతాడు? అందుచేత, ఈ విజ్ఞానవాదము కూడా అత్యుత్తమ సత్యము ప్రకటించలేదని అనిపించుచున్నది.
4) శూన్యవాదము : “శూన్యమునుండే ఈ జగత్తు వచ్చుచున్నది. కొంతకాలానికి శూన్యమునందే లయించపోబోవుచున్నది” అని వీరు చెప్పుచున్నారు. అయితే "శూన్యం నుండి పదార్థములు ఎట్లా ఎవరి కారణంగా ఎందుకు ఉత్పన్నములు అవుచున్నాయి?” ఈ ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. ఈ విధంగా, ఈ వాదములన్నీ ప్రకటించబడ్డాయి.
ఇక, ఈ విషయంలో మరొక అభిప్రాయం కూడా చెపుతాను, విను.
ఈ సృష్టి యథార్థానికి ఉత్పన్నమే అయి ఉండలేదు.
చైతన్యమే, అనిర్వచనీయమగు మాయాశక్తిచే, “నేను జీవుడను” అను సంకల్పమును స్వీకరించి తనయందు దీనినంతా ఇట్లు తానే గాంచుచున్నది. (తద్భావయ - తద్విశతే)! కనుక ద్రష్ట. -
దృశ్యములు ’అద్వితీయ చైతన్యము’నకు వేరైనవి కావు.
సముద్రములోని తరంగములవలె ఈ త్రిలోకములందలి పదార్థజాలమంతా….. స్వసంకల్పమే స్వరూపముగా గల సమష్టి మనోరూపము చేతనే ఉత్పన్నమగుచున్నది, భావించబడుచున్నది, అనుభవించబడుచున్నది. కనుక ఇదంతా భావనామయమే. సమష్టి మనోరూపప్రజ్ఞ కలిగినట్టి ’సమష్టి-అహంకారి’ని ‘బ్రహ్మదేవుడు’ అని పిలుస్తున్నాం.
చైతన్యమే సమష్టి మనోరూపమున పదార్థ జాలమంతా సంకల్పించి దర్శించుచున్నది. చైతన్యము సంకల్పించనట్టి దానికి అస్థిత్వమే లేదు. కనుక, “ఈ జగత్తు ఉత్పత్తి కాకయే ఉన్నది” అని నిశ్చయించ
Page:508
బడుతోంది. బ్రహ్మము యొక్క ‘చితశక్తి’యే“సమష్టి అహంకారోపాధి యందు ప్రవేశించుచున్నాను” అను కల్పన చేయుచు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) పొందుచున్నది. వ్యష్టి-సమష్టి అహంకార ఉపాధులలోని చిదాభాస శక్తులు సర్వశక్తివంతమగు బ్రహ్మముకంటే వేరేమీ కాదు. అనగా, ప్రతి వ్యక్తీ బ్రహ్మమే అయిఉన్నాడు. కాని అజ్ఞానముచే "నేను జీవుడను. నేను శరీరధారిని, పరిమితుడను”
ఇట్లు అనేక విధములుగా భ్రమించుచున్నాడు. ‘అవిచారణ’ (Non enquiry) ఉన్నంతవరకు ఈ భ్రమ ఉంటూనే ఉంటుంది.
సూర్యుని నుండి వేలాది కిరణములు బయలుదేరుచున్నాయి. అయితే ఆ వివిధ కిరణములన్నీ సూర్యుని నుండి వేరైనవా? కావు కదా! అదేవిధంగా, బ్రహ్మదేవునియొక్క వివర్తభావము పొందిన వివిధ శక్తులే ఇట్లు అనేక జీవుల వలె ప్రకటితం అగుచున్నాయి. ప్రతి ఒక్క కిరణము వేరువేరైన వస్తువులపై ప్రసరించవచ్చుగాక ! కాని, అనేక సూర్యకిరణములలో ఏకత్వమే సత్యము కదా! బ్రహ్మదేవుడు, అతని నుండి ప్రసరించుచున్న ఈ వ్యష్టిజీవులు …. వీరంతా చైతన్యముకంటే వేరైన వారు కారు. సమష్టి జీవుని సంకల్పము సుదృఢం అగుచున్న సమయంలోనే ఈ జగత్తు ఆవిర్భవించు చున్నది. సమష్టి జీవుడే వివిధ జీవులుగా అయి, ఈ జగత్తును అనుభవించుచున్నాడు.
ఇందలి ప్రతిజీవి సమష్టిజీవుని తత్త్వమే అయి ఉన్నది.
సమష్టిజీవుడు బ్రహ్మముకంటే వేరు కాదు. వ్యష్టి జీవుడు కూడా బ్రహ్మమే.
ఈ జీవులంతా ‘చిదాకాశము’ నుండే బయలుదేరియున్నారు. అట్లు బయలుదేరి మాయాకాశ మందలి పంచభూతమాత్రమగు ఉపాధులతో కలయుచున్నారు. “అన్నివేళలందూ వీరంతా చిదాకాశ స్వరూపులే” అని వేదవాక్యములు ప్రకటిస్తున్నాయి కదా! వీరు “వాసనలు, కర్మలు” అనుసరించి స్థావర జంగమ రూపాలను పొందుచున్నారు. ప్రాణశక్తి ద్వారా వీర్య - రక్తాది రూపమున బీజత్వమును పొందుచున్నారు. అయినప్పటికీ తమయొక్క చిదాకాశత్వమును త్యజించుట లేదు. అట్లు బీజత్వము పొంది, యోనిమండలమునుండి వారు ఈ జగత్తున ఉత్పన్నమగుచున్నారు. కాకతాళీయ న్యాయముచే సంభవించిన వాసనాజాలమును అనుసరించి తమ తమ కర్మఫలములను అనుభవించుచున్నారు. శుభాశుభవాసనలతో కూడుకొని ”పుణ్య-పాపకర్మలు” అనే త్రాడుచే కట్టబడి లింగశరీరాలను ధరించుచున్నారు. ఒకప్పుడు ఉత్తమలోకములకు, మరొకప్పుడు నరకలోకములకు పోవుచున్నారు.
ఈ ప్రాణులన్నీ ఇచ్ఛారూపములే అయి ఉన్నవి సుమా! అనగా ‘చిత్తశక్తి’ తన ఇచ్ఛను అనుసరించే ఈ ఏకానేక రూపములను ధరించుచున్నది. ఈ జీవులు తాము గాఢముగా కోరుకొన్నట్టి ఉపాధులను భావాభావములను పొందుచున్నారు. రామచంద్రా! మరొక చెప్పుచున్నాను. విను. *కామమయయేవాయమ్ పురుషః = ఈ జీవుడు ఇష్టమే స్వరూపముగా కలిగియున్నాడు. -శ్రుతి
Page:509
ఆయా జీవులు తమ ఇచ్ఛను అనుసరించే అసంఖ్యాకములగు జన్మలు పొందుచున్నారు. సంసారములోని చమత్కృతులన్నీ మరల మరల అనుభవిస్తున్నారు. వాసనలను అనుసరించి వర్తిం చుచూ ’కర్మ’ అనే వాయువీచికలచే ఒకచోటినుండి మరొకచోటికి ఎగురగొట్టబడుచు సంచరిస్తున్నారు. ఒకానొక జన్మయందు ఈ జీవుడు యాదృచ్ఛికంగా “నేను ఉపాధిమాత్రుడనుగాను. ఈ కార్యకారణములకు (Cause & effect) సంబంధించినవాడను కూడా కాను; కార్య-కారణరహితమగు ఆత్మయే నేను” అనునట్టి ఆత్మజ్ఞానమును సముపార్జించుచున్నాడు. అట్టి ఆత్మ జ్ఞానము యొక్క ప్రభావం చేత ‘ముక్తుడు’ అగుచున్నాడు. ఈ జన్మ, కర్మ, దృశ్యాదులను తన ఆత్మ యొక్క జడంశముగా ఆస్వాదిస్తూ ఆత్మత్వమును పుణికి పుచ్చుకొని ఉంటున్నాడు.
మరికొందరు జీవులు తమ స్వస్వరూపమే అయి ఉన్నట్టి చిద్వస్తువును ఎరుగుటలేదు. అజ్ఞానముచే మోహితులై అనేక కల్పముల పర్యంతము ఈ ప్రపంచములో జన్మిస్తూనే ఉన్నారు. ఇంకా కొందరు శుభజన్మలను అనుభవించినవారై, ఈ జన్మలో కూడా శుభకర్మపరాయణులై ఉంటున్నారు. అట్టి శుభకర్మపరాయణులు కొద్ది జన్మలలో ముక్తిని పొందగలరు. సముద్రంలో ఆవిరి రూపమున లేచిన జలము ఎప్పటికో సముద్రమే జేరుచున్నది కదా! ఈ జీవులంతా ఒకానొ కప్పుడు తమ స్వస్వరూప స్థితినుండి చ్యుతిపొంది ఈ సంసారారణ్యంలో అశాంతిగా, అవిశ్రాంతిగా సంచరిస్తూ ఉన్నారు. తత్త్వజ్ఞానము పొందనంతవరకు ఆ సంచారము కొనసాగుతూనే ఉంటుంది. ఉత్తమం, ప్రశాంతం అయిన మోక్ష స్థితియే సర్వజీవులలోని అంతర్లీనమై ఉంటున్న ఆర్తి సుమా!
ఓ దశరథవరపుత్రా! రామచంద్రా! ఈ విధంగా జీవులందరి ఉత్పత్తి బ్రహ్మము నుండే కలుగుచున్నది. బ్రహ్మము ఏమాత్రం మార్పు చేర్పులు పొందక, యథాతథంగా ఉండియుండగా
ఈ మనస్సు మాత్రం అనేక ఆవిర్భావ, తిరోభావములను కలిగి ఉంటోంది. క్షణభంగురములైన ఈ జన్మలను చూచుకొని, ఎప్పటికప్పుడు “ఇట్లు ఇప్పుడు ఇక్కడ కనబడుచున్నదంతా ఇట్లే సర్వదా శాశ్వతంగా ఉండబోవుచున్నది” అని భ్రమిస్తోంది. అనేక జన్మలకు కారణమై ప్రవర్తిస్తున్న “వాసనలు” అనువాటిచే వ్యాకులత్వము పొందుతోంది. సంసార జ్వరముచే పీడింపబడుచున్న జనులకు అనేక సంకటములు, అనర్థములు కలుగజేస్తున్నది ఎవరనుకొంటున్నావు? ఈ మనస్సే సుమా! ఇది ద్రష్టను (లేక జీవుని) అనేక దిక్కులందు, అనేక దేశములందు, అనేక కాలములందు సంచరింప జేస్తోంది. చిత్రవిచిత్రములైన భ్రమలను కలుగజేస్తూ, అనేక విక్షేపములతో కూడియున్న ఈ మనస్సును “సమ్యక్ జ్ఞానము” (Perception of Unity in Diversity) అనే గండ్రగొడ్డలిచే నరికివేయాలి. అప్పుడు అది ఇక ఈ జగత్తు అనే మహారణ్యంలో మరల ఉత్పన్నము కాదు. సమ్యక్నమే ఈ జీవుని యొక్క సంసారవ్యాధికి దివ్యమైన ఔషధం.
Page:510
ఓ రామచంద్రా! బ్రహ్మవస్తువు సర్వదా అన్నిచోట్ల అభేదరీతిలోనే ఉండిఉంటోంది. కాని, త్రిగుణములతో కూడుకొన్నదై, “సాత్విక-రాజసిక-తామస” గుణభేదములచే ఈ లోకంలో ప్రకటిత మగుచున్నది. అనేక కెరటములవంటి ఈ అనేక జీవులు శాస్త్రములచే విభాగించబడి జ్ఞానాభివృద్ధి కొరకు వర్ణించి చెప్పబడుచున్నారు. అట్టి ఉత్తమ మధ్యమ జీవుల ఉత్పత్తి గురించి చెపుతాను విను. ఈ ప్రపంచంలో కనిపించే జీవుల విభాగం
(1) ‘ఇదం ప్రథమతా’ జన్మ : ఒకానొకడు ఇంతకుముందు కల్పములోని చివరి జన్మయందు తన యొక్క అనేక ప్రయత్నముల సహాయంచేత “శమము - దమము” సంపాదించియే ఉంటాడు. కాని జ్ఞాన విశ్లేషణం వినక పోవటంచేతనో, లేక ఏవైనా బలవత్తరమైన విఘ్నములు కలగటం చేతనో జ్ఞానప్రాప్తిని, స్వస్వరూప అనుభవమును పొంది ఉండడు. ఇప్పుడు ఈ కల్పమునందు జన్మను పొందియుంటాడు. ఇట్టివాడు బాల్యమునుండే శమ - దమాది గుణములు, భక్తి, సాత్విక భావములు కలిగియుంటాడు. కనుక, జ్ఞాన ప్రాప్తికి యోగ్యుడు అగుచున్నాడు. ఇట్టివారిలో కొందరు ప్రవక్తలై తమ బోధామృతంచే అనేకులను అజ్ఞానాంధకారం నుండి కాపాడుతూ ఉంటారు.
అయితే పూర్వకల్పము నందు పూర్ణముగా శుభాభ్యాసము కలిగియున్నవారే ఈ “ఇదం ప్రథమతా” అనే విభాగానికి చెంది యుంటారు. వారు ఈ జన్మ యందో, లేక మరు జన్మ యందో ముక్తికి అర్హులు అగుచూ ఉంటారు.
(2) ఉత్తమ సంపన్నమైన జన్మ (గుణపీవరీ) : వీరు ఇంకా ఇదంప్రథములంతటి తీవ్రవైరాగ్యం పొందియుండరు. పుణ్యలోకముల కొరకై ఉపాసనాదులను మాత్రం ఇంకా చేస్తూ ఉంటారు. వీరు ఇక పది లేక పదిహేను జన్మలలో ముక్తులు అగుటకు క్రమంగా సిద్ధమగుచున్నారు.
(3) స-సత్వులు : వీరు గుణపీవరీల తరువాత తరగతికి చెందినవారు. వీరు పుణ్య పాపములతో కూడుకొనిన మిశ్రమ కర్మలు నిర్వర్తిస్తూ ఆయా సుఖ-దుఃఖములను పొందుచూ ఉన్నారు. కాని “మేము మెల్లమెల్లగా సత్వగుణమును పెంపొందించుకొనెదముగాక” అను ఉత్తమమైన లక్ష్యము, ఆశయము కలిగిఉంటున్నారు. ఉత్తమ కర్మలవైపు ఇంకనూ శ్రద్ధను అభివృద్ధి చేసుకోవలసి ఉన్నది.
వీరు సుమారు వంద జన్మలలో సత్వగుణమును ఆరూఢం చేసుకోగలరు. క్రమంగా ముక్తిని పొందటానికి సిద్ధమౌతున్నారు.
(4) అధమసత్వులు : వీరు విచిత్రములైన ప్రాపంచికవాసనలు కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. మలినమైన అంతఃకరణముతో ఆయా సుఖదుఃఖరూపములుగల ఫలముల కొరకై మరల మరల ఆశ్రయించటం, జన్మలు ఎత్తటం చేస్తూ ఉంటారు. వారు తమ “దృష్టిని పరిశీలించుకొనే దాకా అట్లు వేలాది జన్మలు ఎత్తుతూనే ఉంటారు. వీరికి అశ్రద్ధ బాగా ఉండి ఉంటుంది. కాని, అధ్యాత్మశాస్త్రం పట్ల (ఆత్మ విషయమై విచారణ పట్ల) విముఖత మాత్రం కలిగి ఉండరు. కనుక, వారు అభివృద్ధి
Page:511
చెందుటకు అనేక అవకాశములు కలిగియే ఉంటారు. ఏవైనా ఉత్తమ సంఘటనల వలన గాని, కాకతాళీయంగా గురువులబోధ వినుటచేతగాని వీరు ఆత్మజ్ఞానము వైపు సుముఖులు కావటానికి కొంత అంతరంగమునందు సిద్ధపడే ఉంటారు.
(5) అత్యంత తామసీ : వీరు కూడా కొంత వరకు అధమసత్వుల లక్షణములే కలిగి ఉంటారు. అయితే వీరు అధ్యాత్మశాస్త్రం పట్ల విముఖత్వము (disliking, Non-accepting) కలిగి ఉంటారు. సర్వదా అనేక సంశయములచే - శాస్త్రము యొక్క గురువుల యొక్క సామీప్యతను తిరస్కరిస్తూ ఉంటారు. ఎన్నో కల్పములు, వేలకొలది జన్మలు గడచిపోవచ్చుగాక! "ఆత్మవస్తువు” అనే దూరస్త వస్తువు వైపు పయనించే విషయంలో, వీరికి వీరియొక్క సంశయత్వము- ప్రయత్నరాహిత్యములే అడ్డుపడుతూ ఉంటాయి.
(6) రాజసులు : వీరు పూర్వ కల్పమునందలి తమయందు శేషించియున్న వాసనలను అనుసరించి విచిత్ర కర్మాచరణములు కలిగి ఉంటూ ఉంటారు. అనేక మధ్యరకపు (జంతు) జన్మలు ఎత్తుతూ ఉంటారు. అయితే వారిలో “ప్రయత్నము” అను రూపముగల ఆర్తి బయలుదేరింది. అందుచేత వారు కొన్ని జన్మలలో మనుష్యత్వమును గ్రహించి, ఆ తరువాత కర్మానుసారంగా స్వర్గ
- - నరకములకు వెళ్ళివస్తూ మరి కొన్ని జన్మలు గడుపుతారు. వారు మోక్షప్రాప్తియందు ఏమాత్రం నిశ్చయం ప్రస్తుతానికి కలిగిలేరు.
(7) రాజస - సాత్వికులు : వీరికి ఇప్పుడిప్పుడే వైరాగ్యం కొంచం కొంచెం ఉదయించుచున్నది. సమీపంలోనే ’జ్ఞానప్రాప్తి’ సిద్ధించు జన్మలను పొందగలరు. మోక్షార్హమైన ఉపాధులను పొందుచు, మోక్షప్రాప్తికి యోగ్యమైన కర్మాచరణం కలవారై ఉంటారు. వీరు కొంత నిశ్చలబుద్ధి గల మోక్ష - యత్నపరులని అనవచ్చు. వీరు ఇప్పటికి ఇంకా పూర్ణమైన ’లక్ష్యశుద్ధి’ ఏర్పడి ఉండకపోవచ్చు. కాని వారి యందలి ప్రయత్నశీలత్వమే వారి కవచం.
(8) రాజస-రాజసులు : వీరు యక్ష - గంధర్వ యోనులలో ఎక్కువగా పుట్టుచూ ఉంటారు. కొలది జన్మలలో ’రాజస-సాత్వికత’ను స్వీకరించనున్నారు. అప్పటినుండి ముక్తికొరకై యత్నించగలరు. వర్తమానంలో మాత్రం ‘ముక్తి’ యొక్క శబ్దార్థములు వారికి తెలియవు. వీరు సర్వదా ఏవేవో మానసిక, శారీరక క్రియావ్యవహారములందు నిమగ్నులగుచు, స్వప్నంలోలాగా విజ్ఞాన దృష్టి లేకుండా కాలం గడుపుచున్నారు.
(9) రాజస-తామసులు: వీరు అల్పమైన ప్రయత్నము కలవారు. ఎన్ని వందల జన్మల తరువాతో గాని, వారియందు ‘ప్రయత్నము’ అనునది కొంత వేగం పుంజుకోదు. వీరు ఎప్పటికో ‘రాజస రాజసులు’ ఆపై, రాజస సాత్వికులు కాబోవుచున్నారు. వీరు “అత్యంత తామసీలు” సమానమే.
(10) రాజసాత్యంతామసీలు : వీరు తమస్సుచే ఆవరించబడి కార్యములను చేస్తూ ఉంటారు. ఎన్ని వేల జన్మలు జరుగుచున్నప్పటికీ “నేనేమిటి? నేనెవ్వరు?" అనే విషయం వారి దృష్టిన పడుటయే
లేదు.
Page:512
(11) తామసులు : వీరు ఇప్పటికే అనేక కల్పములందు జన్మించారు. బహుకాలం జరిగి పోయింది. మోక్ష విషయమై ఒకానొక ప్రగాఢ నిద్ర అనుభవిస్తున్నారు. ఎవ్వరేది చెప్పినా వినుటలేదు. వారికి తోచుటలేదు. కాని, వీరిలో కొందరు వర్తమాన జన్మను సార్థకపరచుకొనువారు కూడా లేకపోలేదు సుమా!
(12) తామస-సత్వులు : తామసులై ఉండి, మోక్షప్రాప్తికి యోగ్యమైన కార్యాచరణం ప్రారంభిస్తున్నారు. అట్లు ప్రారంభించి ఉత్తమ పదమును పొందిన ఉదాహరణలు కూడా అనేకం (కర్కటి, ప్రహ్లాదుడు ఇట్టివారే).
(13) తమోరాజసులు : దూరంగా ఎక్కడో మినుకు మినుకుమంటున్న కాంతిని చూచి, అటువైపు వెళ్ళుట గురించి యోచించుచున్నట్లు, ఈ తమోరాజసులు ఇప్పుడిప్పుడే ప్రయత్నశీలుర గుచున్నారు. వీరు కొన్ని జన్మలలో అట్లే కొంచము కొంచము ప్రయత్నశీలురగుచు ఉంటారు. ఆ ప్రయత్నముల నుండి విముఖులు కాకపోతే, వీరు తామససత్వులు కాగలరు.
(14) తామస-తామసులు : వీరు ఇప్పటికే అనేకవేల స్థావర జంగమ జన్మలు ఎత్తారు. ఇంకా ఎంతగానో జన్మిస్తూ పోవాలనే దృష్టియే కలిగి ఉంటున్నారు. వీరు ఎప్పటికి ఎట్లు జ్ఞానము వైపు దృష్టి మరల్చుతారో ఎవ్వరం చెప్పలేం. వీరు అత్యంత తామసులు.
లక్షలాది జన్మలు గడచిపోతున్నాయి. ‘జ్ఞానం’ విషయమై మూఢత్వం ఆవరించి ఉన్నది. మార్పు చేర్పులు లేవు. ప్రగాఢమగు దుఃఖ మోహములు ఆక్రమించివేసి ఉన్నాయి. వారు ఏమాత్రం ముక్తి గురించి వినరు, చూడరు. వారికేమీ తెలియదు. మౌనము, మౌఢ్యము వారి యందు తాండవిస్తున్నాయి. అయితే, వారందరిలో ఎవ్వరైనా-ఏక్షణంలోనైనా నిదురలేచి ‘ఆత్మజ్ఞానం’ వైపుగా అడుగులు వేయటానికి, నడచి వెళ్ళుటకు సర్వదా ‘సంసిద్ధత’ అంతరంగమున కలిగియే ఉన్నారు. అంతా బ్రహ్మమే
ఓ రామచంద్రా! భిన్నభిన్న ఉపాధులు (Physical bodies) గల ఈ జీవజాతులన్నీ బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నాయి. బ్రహ్మమునకు వేరైనవి కావు. చలించుచున్న సముద్ర జలంలో అసంఖ్యాకంగా తరంగాలు బయల్వెడలుచున్నాయి కదా! ఆ తరంగములన్నీ జలముకంటే వేరైనవా? కాదు. దీపం నుండి వేలాది కిరణములు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణములు దీపం కంటే వేరైన అస్థిత్వం కలిగి ఉంటున్నాయా? లేదు. అట్లే ఆ సర్వవిధ భౌతిక, మానసిక స్థితిగతులతో ప్రకటిత మగుచున్న జీవరాసులన్నీ బ్రహ్మముకంటే వేరుకాదు. ప్రజ్వలించుచున్న అగ్నినుండి సన్నటి కాంతి పుంజములు లేచుచున్నట్లు, ఈ ప్రాణికోట్లన్నీ బ్రహ్మమునుండే ప్రభవిస్తున్నాయి. వృక్షం నుండి శాఖల వలె, బంగారము నుండి ఆభరణములవలె, జలము నుండి “జలబిందువులు - ఆవర్తములుతరంగములు-బుడగలు” వలె, చంద్రబింబము నుండి చంద్రకిరణములవలె, మహాకాశం నుండి ఘటాకాశం వలె బ్రహ్మం నుండే ఈ ప్రాణికోట్లు, అవి దర్శించుచున్న దృశ్యములు ఉత్పన్న మవుతున్నాయి.
Page:513
ఎండమావులలో జలతరంగముల అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ ఎండమావులు సూర్యకాంతి కన్నా వేరైనదాని మూలంగా ఏర్పడుట లేదుకదా? సూర్యకాంతి ప్రసరించకుంటే ఎండమావులే ఏర్పడేవికావు. ఈ ద్రష్ట బ్రహ్మము యొక్క స్వరూపమే. ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించే దృశ్యం ఉంటోంది. మనం ఇప్పుడు చెప్పుకొన్న అనేక విభాగములతో కూడిన జీవజాతులన్నీ ఏ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయో, ఆ పరమాత్మయందే లీనమౌతున్నాయి. * కొన్ని లేచిన కొద్ది క్షణాలకే లీనమౌతున్నాయి. మరికొన్ని అనేక జన్మల తరువాత ఎప్పటికో లీనమౌతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, జగత్తుకు బ్రహ్మమునకు భేదం లేదు. ఈ రెండిటికీ జల-తరంగముల సంబంధమే దృష్టాంతము. మరి ఈ కనబడుచున్న అనేకత్వము మాట ఏమిటంటావా? ఉపాధులందు ద్రష్ట కలిగియుంటున్న భ్రమాత్మకమైన దృష్టి కారణంగానే ఈ భేద ప్రతీతి అంతా ఏర్పడుతోంది. ఈ జీవజాతులన్నీ ఉపాధిభేదం చేత బ్రహ్మాండములందు అంతటా వ్యవహరిస్తున్నాయి. మరల ఆ సర్వేశ్వరుని యందే లయిస్తున్నాయి. వ్యవహరిస్తున్నట్టి సమయంలో స్వర్గాదులకు పోతున్నాయి. మరల అక్కడి నుండి అధోలోకములైనట్టి నరకాదులకు వెళ్ళుచు, పరిభ్రమిస్తున్నాయి. మాయ యొక్క చమత్కారం అట్టిది. అది అనిర్వచనీయం, అద్భుతం.
అయితే నాయనా! రామచంద్రా! ఇదంతా చూచి నీవు భ్రమించవలసిన పనేమీ లేదు. ఆ సర్వేశ్వరుని శరణువేడు. సర్వదా సర్వేశ్వరత్వమును ఆరాధించు. ఆ సర్వేశ్వరత్వమునే భావించు.
“ఇదంతా నాదే. నేనే ఈ సర్వమునందు అంతర్లీనంగా ప్రసరించియున్నాను. నేను కానిదంటూ ఎక్కడా ఏదీలేదు”…. అను సంభావనను ఆశ్రయించు.
మనస్సులో ఉండే దోషభావనలన్నీ తొలగించుకొని, నిర్మలుడవుకమ్ము. ఆత్మారాముడవై విరాజిల్లు. ఈ దృశ్యమంతా నీ స్వస్వరూపంగా ఆస్వాదించు.
శ్రీరాముడు : హే సద్గురూ! “బ్రహ్మము నుండే ఈ జీవులు ఉత్పన్నమైనారు” అని చెప్పబడుచున్నది కదా! అట్టి వ్యవహారమును కలుగజేయుచున్న ఫలప్రదాత ఎవ్వరై ఉన్నారు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక వృక్షమునుండి ఆ వృక్షము యొక్క పూలు, ఆ పూలలోని
సుగంధము - - ఆ వృక్షమునకు అభిన్నమైనవే కదా! అట్లే కర్త, ఆ కర్త యొక్క క్రియ ఏకమే అయి ఉంటాయి. ఈ కర్త - క్రియలనబడు రెండూ కూడా పరమపదమైనట్టి బ్రహ్మము నుండే వ్యక్తము
సగుట = ఆత్మభావము నందు సువ్యవస్థమై ఉండుట (లేక) “నేను బ్రహ్మమునే” అను అఖండ అప్రమేయ-అద్వితీయ-సర్వనియామక “తత్త్వభావం” అవధరించి ఉండటం.
Page:514
లవుతున్నాయి. ఇక్కడ చమత్కారం చూచావా? వాస్తవానికి ఏ కల్పనలు ఉండనట్టి నిర్మల- పరబ్రహ్మము నందు అజ్ఞానముచే జీవత్వము స్ఫురించుచున్నది. ఆకాశంలో, ’లేని నీలత్వం’ కనిపిస్తోందికదా! ఇది కూడా అట్టిదే.
“ఈ జీవులు బ్రహ్మము నుండి ఉత్పన్నమయ్యారు” అనేదికూడా అసత్యమైన సిద్ధాంతమేనని, అది అజ్ఞానముచేతనే ప్రబలుచున్నదని గ్రహించు. పూర్ణాత్మ జ్ఞానులు ఉండేచోట ఇట్టి భ్రాంతి వాక్యములకు చోటు ఉండదు. ఎందుకంటే ద్వైతకల్పన ఉన్నచోట మాత్రమే, “ఒకదాని నుండి, మరొకటి ఉత్పన్నమగుట” అనే దర్శనము ఏర్పడగలదు. “ద్రష్టయే దృశ్యమును కల్పించి దర్శించుటచే, ద్రష్ట కంటే వేరుగా దృశ్యము లేదు” అను అవగాహనతో కూడిన అద్వైతస్థితియందు విజ్ఞానము సుస్థిరపడినప్పుడు, ఇక ఆపై అట్టి భేదభావనయే ఉండదు.
అయితే గురువులు తమ శిష్యులయందు ఉత్తమోత్తమమైన లక్ష్యము రూపుదిద్దుకొనుటకు వీలుగా ఒకానొక బోధక్రమమును రచించుచూ, “ఇది బ్రహ్మము, వీరు జీవులు. వీరు బ్రహ్మమునుండే బహిర్గతమయ్యారు” అను ద్వైత కల్పనను ప్రతిపాదిస్తున్నారు. ఇదంతా బోధ కలిగించుటకే అయి ఉంది. లోకము నందు గాంచబడేది కూడా ఇట్టి కల్పనాక్రమమే. ఒకవేళ ’అద్వితీయమగు బ్రహ్మము నుండే లేక అసంగుడగు పరమాత్మ నుండే ఈ కనబడేదంతా ఉత్పన్నమౌతోంది“ అని చెప్పుకొన్నా, అట్లు ఉత్పన్నమగుటకు ఉపాదానకారణం బ్రహ్మమే (లేక పరమాత్మయే) అయిఉండాలి. ఎందుకంటే పరమాత్మను నియమించునది మరేదీ ఉండజాలదుకదా! కనుక, ”ఈ జగత్తు బ్రహ్మము యొక్క రూపమే. ద్రష్ట బ్రహ్మము కంటే వేరైనవాడు కాడు” అని మనకు ఇక్కడ సిద్ధిస్తోంది. ఎందుకంటావా?
“ఉత్పత్తి”కి ముందు ఈ జగత్తు ఎక్కడ ఉన్నది? బ్రహ్మమునందే సంస్కారరూపంలో అణిగియున్నది సుమా! బ్రహ్మము ద్రష్ట-దర్శనములకు ముందే, దేనిచేతనూ తాకబడక, అసంగమైయున్నది. భ్రాంతిచే “ఉత్పత్తి-ఆకారము-భావన-అనుభవము” అను రూపములతో కూడి ఈ జగత్తు ప్రాప్తి స్తోంది. భ్రాంతిచేత బ్రహ్మమే ఇట్లు జగత్తుగా కనిపించటం జరుగుచున్నదని మేము సిద్ధాంతీకరిస్తున్నాం.
అసంఖ్యాకములైన ఈ జీవరాసులన్నీ బ్రహ్మము నుండే ఉత్పన్నమై మరల ఆ పరమపదమగు బ్రహ్మమునందే లయించుచున్నాయి. జలములోనే బుద్బుదములు (Bubbles) లేచి లీనమగు చున్నాయి కదా! త్రికాలము* లందు ఈ జీవరాసుల “సృష్టి-స్థితి-లయలు” అనే ప్రక్రియ ఇట్లే జరుగుచున్నది. అయితే, పురుషునికి, అతని కర్మలకు పుష్ప- గంధముల వలె భేదం లేదు. జలము-జల కదలికల వలె అవి రెండూ పరమాత్మ నుండే ఉత్పన్నమై, తిరిగి పరమాత్మ యందే లయించుచున్నాయి. శ్రీరాముడు : మునీంద్రా! మనకు ఈ దైత్య-నాగ-మనుష్య-దేవత-జంతు రూపములలో పాంచభౌతిక ఉపాధులు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎట్లా ఏర్పడుమన్నాయి?
త్రికాలములు = సృష్టి - స్థితి - లయములు
Page:515
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మరల మరల ఏర్పడుచున్న పాంచభౌతిక ఉపాధులన్నిటినీ నిర్మించుచున్నది అంతరంగములోని వాసనలే. వాసనలు ప్రియాప్రియ సంకల్పములకు వేరుగా ఏవీ కావు కదా! బాహ్యమునందు ఏర్పడుచున్న ప్రియ-అప్రియములకు మూల కారణం ఆత్మయొక్క విస్మరణమే సుమా! “ఆత్మ యొక్క స్వరూపమును ఏమరిచియుండుట” అనుదానికి వేరుగా జన్మాంతర ఫలదాత ఏదీ లేనేలేదు. "బాహ్యమున ఎక్కడో ఉండి ఎవ్వరో ఏదో చేస్తున్నారు” అనునదంతా వాస్తవం కాదు. ద్రష్ట యొక్క (1) అభిలాష, (2) ఆత్మవిస్మరణ…. ఈ రెండే అంతటికీ కారణమగుచున్నదని గ్రహించు. వాస్తవానికి జన్మలు లేవు, కర్మలు లేవు.
“కర్మలు - ప్రభావములు” ఉన్నాయా? లేవా?
శ్రీరాముడు : మహాత్మా! “జన్మలూ లేవు - కర్మలూ లేవు” అని మీరు అంటున్నప్పుడు, నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. రాగరహితులైన పెద్దలచే ఈ లోకమున వేదసమ్మతంగా ధర్మము, వ్రతము మొదలైనవి నిర్ణయించబడినాయికదా! అట్లాగే స్మృతులు, పురాణాలు, కాలకల్పసూత్రములు ప్రవచించే ఇతిహాసములు మొదలైనవి, కూడా ఉన్నాయి. “నాయనలారా! ఇది పుణ్యం. ఇది పాపం. ఇది ఇట్లాಇಲ್ಲ చేయండి. అది అట్లు చేయకండి” అని ఆయా విధి-విధానములను శాస్త్రములు జనులకు చెప్పుచున్నాయి.
ఈ ప్రపంచంలో విశుద్ధ సత్వగుణోపేతులు, ధీరులు, చక్కటి సమదృష్టి కలవారు, బ్రహ్మ సాక్షాత్కారము పొందియున్నవారు అగు సాధువులు సంచరిస్తున్నారు. వారి వాక్కులు, వారి ఆచరణలు, వారి శాస్త్రవ్యాఖ్యానములు తత్వజ్ఞానానుభవం లేని అనేకులకు ప్రమాణాలు అవుచున్నాయి. అనుసరణీయమౌతున్నాయి. అట్టి శాస్త్రనియమములు, ఆర్యనిర్ణయములు అనుసరించి అనేక మంది జనులు తమయొక్క ఉచిత - అనుచితములను నిర్ణయించుకొని, అప్పుడు ప్రవర్తిస్తున్నారు. కొందరైతే -“ఇతడు సాధువులు చెప్పిన మార్గంలో నడచుకోవటంలేదు. అందుచేత ఇతనిని మేము బహిష్కరి స్తున్నాం” అని కూడా అంటూ ఉంటారు. సంధ్యావందనము వంటి శిష్టాచారములను అనుసరించని వారికి దుఃఖమే కలుగగలదని లోకప్రతీతి కూడా ఉన్నది.
పైగా మహాత్మా! ఈ "కర్మ-కర్త” అను రెండూ కూడా, ఒకదానిచే మరొకటి కలుగుచున్నవని లోకంలో అంటూ ఉంటారు. శాస్త్రప్రతీతి కూడా అట్లాగే ఉంటోంది. అనగా, “కర్మచేత కర్త ఏర్పడు తుంది. కర్త, కర్మని సిద్ధింపచేస్తోంది. చెట్టు నుండి విత్తు, విత్తునుండి చెట్టు ఏర్పడుచున్నట్లు…. జీవుని వలన కర్మ, ఆ కర్మ వలన జీవుడు ఉనికిని ఏర్పాటు చేసుకొంటున్నారు” అని అర్థం అవుతోంది. మీరు చెప్పుచున్నట్లుగానే, ఈ జీవుడు ఏ వాసన కలిగియుండి ఈ సంసార పంజరంలోనికి త్రోయబడుచున్నాడో అట్టి వాసనలను అనుసరించే ఫలానుభవములను కూడా పొందటం జరుగు తోంది. వాసనలే జన్మకు మూలం. ఆ వాసనలు ఏర్పడుచున్నది ఎక్కడినుండి? కర్మలనుండే కదా!
Page:516
మహర్షీ! ఇదంతా ఇట్లుండగా, ఇప్పుడు అసలు నా సందేహమేమిటో చెపుతాను. వినండి.
“జన్మకు బీజభూతమైన కర్మ అంటూ ఏదీ లేదు. ఎట్టి కారణం లేకుండానే ఈ జీవులు బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నారు” అని మీరు అక్కడక్కడ అంటున్నట్లుగా నాకు అనిపిస్తూ వస్తోంది. ఎందుచేత? కర్మలు అసలు ఉన్నాయా? జన్మలు కలిగేది కర్మ ప్రభావం చేత కాదా? శ్రుతులలోని కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యములలోని సారమును అనుసరించి దుష్కర్మలు, సుకర్మలు వాటి వాటి ప్రయోజనమును కలిగియే ఉంటాయికదా! మరి, మీరు కర్మల వ్యవహారమే తిరస్కరించి, “ఇచ్ఛ, ఆత్మ విస్మరణలే అంతటికీ కారణం” అంటున్నారేమిటి? ‘కర్త’, ‘కర్మ’ - ఈ రెండూ కూడియే ఉత్పన్నమౌతాయికదా! కాబట్టి ఈ జగత్తు జన్మ - కర్మల హేతు - ఫలరూపమే కదా! బ్రహ్మము నందు కర్మల వ్యవహారమే లేదనుకొంటే బ్రహ్మరూపులగు ఈ అనేక విధములైన ద్రష్టలు, (లేక) జీవులంతా కర్తృ - కర్మల వ్యవహారం లేకుండా ఎట్లు జన్మించుచున్నారని అర్థం చేసుకోవాలి?
బ్రహ్మము (ఆ పరమాత్మ) కారణరహితుడు, మాయాసహితుడు అని కదా మీరు అన్నారు! అట్టి బ్రహ్మము నందు ‘ఆకాశము’ మొదలైన ఈ అనుభవమునకు వచ్చుచున్న పదార్థములు, బ్రహ్మదేవుడు మొదలుగా అనేక స్థూల - సూక్ష్మ ఉపాధులు, ఆయా ఫలానుభవాలు ఎట్లా ఏర్పడుచున్నాయి? కర్మలకంటే వేరైన కారణం ఏముంటుంది? ఈ కనబడేదంతా ‘సృష్టి’ అను కర్మ రూపఫలమే కదా? ఇదంతా కర్మఫలానుభవమే అయినప్పుడు ఈ జన్మ కర్మల వ్యవహారం తిరస్కరించటమెట్లా చెప్పండి?
ఒకవేళ మీరు “కర్మలు లేవు. కర్మలు నిష్ప్రయోజనమైనవి” అని సిద్ధాంతీకరించటం జరిగితే, అప్పుడు లోకంలో నరకాదులను గూర్చిన భయమే లేకుండాపోతుంది. అప్పుడు లోక సంకరమే ఏర్పడుతుంది. పాపభయం పోతుంది. పాపభయం లేకపోతే లోకంలో “మత్స్యన్యాయం” (చిన్నచేపను పెద్దచేప మింగటం) ప్రవర్తించి, బలవంతుడు బలహీనుణ్ణి హింసిస్తాడు. అప్పుడు సర్వనాశనమే చేకూరగలదు కూడా. స్వామీ! ”బ్రహ్మమునందు కర్మలు లేవు. జన్మలకు కర్మ కారణం కాదు” అని అంటున్నప్పుడు మీరు కొంత సందిగ్ధమునే కలుగజేస్తున్నారు. ఓ వేదవరేణ్యా! ముందు నాకీ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ఒకనిచే నిర్వర్తించబడిన కర్మలు ఫలవంతము అవుతాయా? కావా? ఈ నా సంశయమును
తొలగించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! కర్మల విషయమై మంచి ప్రశ్న వేశావు. ఈ సమాధానం విను. దీని వలన కొంత విశేషమైన జ్ఞానం కలుగుతుంది.
❖
ఉదా ||“సాధుకారీ సాధుభవతి - పాపకారీ పాపోభవతి ॥ "పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి - పాపః పాపేన కర్మణా జాయతే||”
Page:517
మనః సంబంధమైన క్రియయే కర్మకు బీజము కదా! ఇట్లు మనస్సుతో చేసిన క్రియకే ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది.
ప్రథమ సృష్టి యందు* పరబ్రహ్మము నుండి మనోరూపము ఆవిర్భవించింది. అట్టి ప్రథమసృష్టి సమయంలోనే మనోరూప ఉపాధులచే కలుగుచున్న సమష్టి - వ్యష్టి జీవుల కర్మలు కూడా ప్రకటితం అవుచున్నాయి. అప్పుడే ఈ జీవులు పూర్వ కర్మ వాసనానుసారం దేహములందు అభిమానం కలిగి ఉంటున్నారు. "పుష్పము - - దాని సువాసన” వేరువేరు కానట్లే “మనస్సు, కర్మలు” అనబడు రెండూ వేరువేరైనవి కావు. వాటియందు భేదం లేదు. విజ్ఞులైనవారు ’క్రియాస్ఫురణ (tinge of activity)” నే ‘కర్మ’ అని అంటున్నారు. సంస్కార రూపమగు మనస్సే అట్టి కర్మకు ఆశ్రయం కాబట్టి, కర్మయే మనస్సు. నాయనా! రామా! ఎవ్వడు ఎక్కడైనా ఉండవచ్చు. కర్మయొక్క ఫలితంనుండి మాత్రం తప్పించుకోలేడు. అది ప్రాప్తించియే తీరుతుంది.
#
“కర్మ” అంటే ఏమిటి? ఈ జన్మ యందు గాని, ఇతఃపూర్వపు జన్మలందు గాని నిర్వర్తింప బడియున్న మనస్సుతో కూడినట్టి పురుషప్రయత్నములే సుమా! అట్టి పురుష ప్రయత్నం ఎన్నటికీ నిష్ప్రయోజనం కాదు.
అవిద్యచే ఉద్భవించిన ఈ మనస్సే క్రియావంతమగుచున్నది. ఈ మనస్సు ‘చిదాత్మ’ యొక్క ఉపాధియే కదా! కనుక కర్త-భోక్త కూడా ఈ మనస్సే అగుచున్నది. నీవు చెపుతున్నట్లు “చేయబడిన కర్మ ఫలవంతము కాకుండా ఉండుట చేయబడని కర్మ ఫలించుట” ఈ రెండూ కుదిరే విషయాలే కావు. శాస్త్రప్రమాణములు ఈ విషయమే అనేకచోట్ల నిరూపిస్తున్నాయి. అందుచేత ‘మత్స్యన్యాయము’ ప్రసక్తే లేదు.
శ్రీరాముడు : అయితే మహర్షీ! ఒక కర్మ, దాని నుండి ఫలితము….. ఆ ఫలితము నుండి మరొక కర్మ…. ఈ విధంగా చర్వితచరణంగా సాగవలసినదేనా? ఈ కర్మల వ్యవహారమునకు నాశనమంటూ లేనే లేదా? ఈ మనస్సు ఎల్లప్పటికీ ఇంతేనా?
శ్రీవసిష్ఠ మహర్షి : ’నలుపుదనము’ లేకుండాపోతే అప్పుడిక ‘కాటుక’ కూడా ఉండదు కదా! అట్లే, కర్మ నశిస్తే, కర్మ రూపమే అయి ఉన్న మనస్సు కూడా స్వయంగా శాంతిస్తుంది.
“నేను అకర్తను” అను అవగాహనయే కర్మనాశనము.
కర్మనాశనమే మనోనాశనము. అట్లే, మనస్సు నశించుటయే కర్మయొక్క సంక్షయము అయి ఉన్నది. అయితే, అట్టి మనోనాశనము ముక్తులకు మాత్రమే కలుగుచున్నది సుమా! "నేను సర్వాత్మకమగు బ్రహ్మమునే” అనునట్టి అనుభూతిపూర్వకమైన ఎరుక గలవాడే, అనుభవపూర్వకమైన ప్రజ్ఞను
’ప్రథమసృష్టి : వృత్తిగాని రాగముగాని లేనట్టి చిన్మయస్వరూపుడే ఈ జీవుడు. అట్టి పూర్ణానుభవము నుండి బాహ్యదృష్టిని లేక ’వృత్తి’ని, ’రాగము’ను అవలంబించటం ప్రారంభించుట చేతనే సృష్టి ప్రాప్తిస్తోంది. అట్టి ప్రారంభమే ప్రథమసృష్టి.
Page:518
సుస్థిరపరచుకొన్నవాడే ముక్తుడు. కనుక ముక్త స్వరూపము పొందిన తరువాత ఇక మనస్సు ఉండదు. మనస్సు లేదు కనుక ‘కర్మ’ కూడా ఉండదు. బద్ధులైనట్టి అజ్ఞానులకు మాత్రం మనస్సు ఉండియే ఉంటుంది. మనస్సు ఉన్నంతవరకు కర్మలు, ఆ కర్మలకు ఫలితములు ఉండియే తీరుతాయి.
అగ్ని, ఉష్ణత్వములను గమనించావా? ఆ రెండిటిలో ఒకటి క్షీణిస్తే రెండవది కూడా క్షీణిస్తుంది కదా! ‘చిత్తము - కర్మలు’ అను ఈ రెండింటిలో ఒకటి నశిస్తే, రెండవది కూడా స్వయముగానే నశిస్తోంది. ఈ చిత్తము స్ఫురణ రూపమును పొంది, విహితమైనట్టి - నిషిద్ధమైనట్టి కర్మల (acts which one ‘should do’ and ‘should not do’) ద్వారా పుణ్య - పాపముల రూపమున, ధర్మాధర్మముల రూపమున పరిణమించుచున్నది. కర్మ కూడా, దాని ఫలభోగానుసారంగా, ‘స్ఫురణ’ రూపమును (లేక చలనరూపమును) పొంది ’చిత్తము’ అగుచున్నది. వాస్తవానికి ఈ రెండూ ఒక్కటే. అయినాకూడా ‘చిత్తము, కర్మ’ అను రెండు పేర్లతో లోకంలో వ్యవహరించబడుతోంది. ఇవి రెండు ఒకదానికి మరొకటి కారణమూ, రూపము అగుచున్నవి.
చిత్తరాహిత్యమే మోక్షము. లేక కర్మరాహిత్యమే మోక్షము.
’కర్మరాహిత్యము’ అనగా “నిష్క్రియ రూపమైన జడత్వమును ఆశ్రయించుట” అని మాత్రం అర్థం చేసుకోకూడదు సుమా! మరింకేమంటావా?
తననుతాను ’అకర్త’గా తనయందలి అకర్తాతత్త్వమును దర్శించుచున్నవాడు ఆత్మవస్తువుగానే శేషించుచున్నాడు. ఫలితంగా కర్తృత్వమునూ, భోక్తృత్వమునూ అధిగమిస్తున్నాడు.
శాస్త్రములలో అనేకచోట్ల చెప్పబడిన విహిత నిషిద్ధ కర్మల అంతిమ ప్రయోజనం కర్మరాహిత్యమే లేక చిత్తరాహిత్యమే. అనగా, “నా హం కర్తా! నా హం భోక్తా!" - నేను కర్తను కాదు భోక్తను కాదు! ….అను రూపముగల ఆత్మ యొక్క ధర్మమును ఈ జీవుడు సంతరించుకొనుటయే ఉత్తమోత్తమ ప్రశాంత స్థానమైయున్నదని సూక్ష్మదృష్టిచే జనులు గ్రహించెదరుగాక! అట్టి ప్రశాంత-మౌన-అంతరంగ స్థితియే ‘మోక్షము’ అను శబ్దముచే వ్యవహరించబడుతోంది. సర్వం యొక్క అంతర్యామిత్వం స్వభావ సిద్ధంగా అభ్యాసఫలంగా అవధరించువాడు స్వతఃసిద్ధంగా కర్మలకు అతీతుడై వెలుగొందుచున్నాడు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! ఈ మనస్సు యొక్క రూపం భావనయే సుమా! భావించుటయే “మనస్సు కలిగియుండుట" అయి ఉన్నది. భావన చలన స్వభావం కలది. మనస్సు చేతనే ఆయా కర్మలన్నీ నిర్వర్తింపబడుచున్నాయి. క్రియలు సూక్ష్మత్వమును, అదృశ్య రూపత్వమును పొందియున్నప్పుడు అవి అంతరంగంలో సంస్కార రూపమును లేక సూక్ష్మవాసనల రూపమును (Subtle tendencies) పొంది ఉంటున్నాయి. అట్టి సంస్కారములను అనుసరించే భావికాలపు జన్మలు, కర్మలు, ఫలములు జీవులు పొందటం జరుగుతోంది.
Page:519
శ్రీరాముడు : స్వామీ! మీరు మనస్సు గురించి కొన్ని విషయాలు చెప్పారు. చమత్కారమైన కథలు కూడా వినిపిస్తున్నారు. ఈ మనస్సు దృఢసంకల్పాత్మకమైన రూపం కలిగి ఉంటోందని, జడ చైతన్యములనే ఉభయ - స్థితులు కలిగి ఉంటోందని నేను గ్రహిస్తున్నాను. ఈ మనస్సు యొక్క స్వరూపమేమిటో దయచేసి మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : అనంతుడు, సర్వశక్తిమంతుడు, మాయావేష్టితుడు అయినట్టి ఆ పరమాత్మ మొట్టమొదట "సంకల్పించుట” అను భావనతోకూడిన క్రియారూపమును స్వీకరించుచున్నారు. అట్టి సంకల్పాత్మకమగు ప్రథమ కల్పన యొక్క స్వరూపమే మనస్సు. అదియే వికల్పాత్మకమైన వ్యవహారములలో సత్ - అసత్ ల రెండిటిమధ్య ‘స్మృతి’ రూపమున ఉండి ఉంటోంది.
స్మృతి రూపమగు భావనయే “మనస్సు”.
చిద్రూపమై, సర్వజ్ఞమై భాసించు ఆత్మయందు “నా హమ్వేదోస్మి - నేను ఏదో ఎరుగను” అనునట్టి ఒకానొక ప్రతీతి అనిర్వచనీయమైన కారణంగా కలుగుచున్నది. అట్టి ప్రతీతియే “మనస్సు”.
అకర్త - అభోక్త అయినట్టి చిదాకాశాత్మయందు “నేను కర్తను” అను వ్యవహారము దేనివలన కలుగుతోందో …. అదే “మనస్సు”.
ఓ రాఘవా! ఎక్కడైనా గుణరహితుడైన ‘గుణి’ ఉంటాడా? ‘గుణి’ అని అంటేనే “గుణములు కలవాడు" అని అర్థం కదా! ఈ జగత్తునందు స్పందస్వభావముగల కల్పనాత్మకమైన శక్తియే లేకపోతే మనస్సు కూడా ఉండటం సంభవించేదేకాదు. అగ్ని - ఉష్ణములు వేరువేరుగా ఉండటం సంభవిస్తుందా! లేదు కదా! కర్మయుక్తమైన మనస్సులు - మనోయుక్తమైన జీవులు వేరువేరుకాదు. వేర్వేరుగా ఉండజాలరు. ఈ చిత్తము (లేక మనస్సు) “ఫలధర్మిణి” (that which produces fruits of action) అను సంకల్పమునే శరీరంగా కలిగియున్నది. ఇది మాయామయము. కారణరహితము. అనేక విధములైన రచనలతో, కల్పనలతో కూడియున్నది. వాసనాయుతము. అట్టి ఈ చిత్తము జగత్తంతా వ్యాప్తమైయున్నది.
❖
ఎవడు, ఎచట - ఏ రూపమున ఉన్నట్లు కల్పన చేస్తాడో, ఆ కల్పనను అనుసరించి ఫల స్వరూపముగా అట్టి రూపమునే అతడు పొందుచున్నాడు. ‘వాసన’ అనబడు వృక్షము (The tree of tendency) నకు కర్మయే బీజము అయి ఉన్నది. మనస్సు యొక్క గతియే ఈ శరీరము. (This ‘Physical Body’ is merely one sequence of ‘Thought’) చిత్రవిచిత్రములైన ఆయా క్రియలన్నీ వాసనావృక్షము యొక్క శాఖలు. ఆయాఅనుభూతములు అగుచున్న క్రియాఫలములు ఆ వృక్షము యొక్క పండ్లు. అయితే జ్ఞానులగువారు మాత్రం ‘అసంగము’ (Unattachment) అనే ఒకానొక పదునైన గొడ్డలితో ఈ వాసనావృక్షమును కూకటివేళ్ళతో సహా త్రెంచివేస్తున్నారు.
మనస్సు తాను ఏమి చింతిస్తుందో దానిని అనుసరించే కర్మేంద్రియాలు ఆయా పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. అందుచేత “మనస్సే కర్మ" అని మనం నిర్ణయిస్తున్నాం. స్వస్వరూపమును
Page:520
మరచిన “అపరిచ్ఛిన్న - చిదేకరూపుడు" అగు పరబ్రహ్మము కాకతాళీయ యోగముచేత, అకస్మాత్తుగా -
ఒక సమయంలో బాహ్య విషయములవైపు ఉన్ముఖమగుచున్నది. అట్లు ఉన్ముఖమగుచున్న ’చిత్శక్తి’నే ఆయా స్థితిగతులను అనుసరించి అనేక పేర్లతో శాస్త్రకారులచే పిలువబడటం జరుగుతోంది.
శుద్ధ చైతన్యమునందు బోధ కొరకు రకరకాల పర్యాయపదములు కల్పించబడ్డాయి. శుద్ధ చైతన్యము ఏ బాహ్యకారణముగాని, ఉపాదానముగాని లేకుండానే, అకారణంగా ఒకానొకప్పుడు అవిద్యచే కలుషితమైనట్లు ఉంటోంది. అప్పుడు “స్ఫురణ” (జ్ఞాపకము) యొక్క రూపము కలిగి, వికల్పములచే అనేక రూపములను పొందుచున్నట్లు భావించుచున్నది. “వృత్తులు ఎట్లా రూఢి పడుచున్నాయి?” అనే విషయం నీవు గ్రహించటానికి వీలుగా ఈ యోగవాసిష్ఠమునందు, తదితర ఆధ్మాత్మ శాస్త్రములందు ఉపయోగించబడిన కొన్ని పదజాలములను చెపుతాను, విను1) మనస్సు : “స్ఫురణ”ను మూలముగా కలిగియున్న భావన. ‘భావించుట’ అను స్వభావము. 2) బుద్ధి : పదార్థముల “ముందు వెనుక” లను పరిశీలించటం. “ఈ వస్తువు (లేక విషయము, లేక వ్యవహారము లేక వ్యక్తి) ఇట్టిది" అను విశేషమును గ్రహించగలుగునట్టి సామర్థ్యము.
3) అహంకారము : మిథ్యయే అయినట్టి ఈ దేహము పట్ల “నేనీ దేహమును, ఈ దేహమునందు మాత్రమే ఉన్నాను. దేహ పరిమితుడను. తదితరులు కూడా దేహమాత్రులే” అనునట్టి దేహాభిమానము కలిగి, అట్టి ”పరిమితసత్త” ను స్వయంగా ఆశ్రయించునప్పుడు, ఆ స్వభావమే అహంకారము. “నేను-నేను-నాది-నాది" అను రూపముగల అహంకారమే సర్వ అనర్థములకు హేతువు అగుచున్నది. అందుచేతనే దీనిని ‘బంధహేతువు’ అంటూ ఉంటారు.
4) చిత్తము : తగినంతగా విచారణ చేయకుండానే ఒక విషయమును స్వీకరిస్తూ, మరొక విషయమును త్యజిస్తూ ఉండే “నిలకడలేనితనము”.
5) కర్మ : చైతన్యం స్పందము (చలనం)ను ముఖ్యధర్మముగా కలిగి ఉంటోంది. అట్టి స్పందము ఏర్పడుచున్న సమయంలో, అసద్వస్తువు సత్యమైనదానివలె గోచరిస్తూ ఉంటుంది. "నేను కర్తనగు చున్నాను”. అను భావన పొందిన చైతన్యం శరీర, అవయవాదులను ఒకచోటి నుండి మరొక చోటికి కదల్చుటకు ఆయత్తమగుచున్నది. ఆయా ఇంద్రియములను నియమించుటకు ఆలోచనల ·- భావనల రూపమున ప్రవృత్తమగుచున్నది. అట్టి ప్రవృత్త వ్యవహారమునే ‘కర్మ’ అంటున్నాం. 6) కల్పన : చైతన్యము ఆకస్మికంగా (కాకతాళీయంగా) తనయొక్క స్వస్వరూపమునకు సంబంధించిన పూర్ణభావనను త్యజించి, తాను అభిలషించిన పరిచ్ఛిన్న భావమును, లేక, ’నేను అసంపూర్ణమును అను వెలితిని కల్పించుకొనుచున్నది. అప్పుడు ఆ చిద్వస్తువే “కల్పన” అనే పేరుతో పిలువబడుతోంది.
‘కల్పారంభం - కల్పాంతము’ అనునవి ద్రష్ట యొక్క "కల్పనా వ్యవహారం స్వీకరించుట సర్వకల్పనలు త్యజించుట”ను అనుసరించే ఉంటున్నాయి.
7) సంసృతి : పూర్వము చూచినవి, చూడనివి, మరియు ఇప్పుడు చూస్తున్నవి అగువాటి
Page:521
గురించి ఏర్పడుచున్న నిశ్చయములచే అంతఃకరణము చేష్టితం (flexible) అగుచున్నది. దృశ్యముతో ఏర్పడుచున్న సుఖ-దుఃఖ సమన్వితమైన సంబంధమే “సంసృతి”.
8) వాసన : చైతన్యము తాను అనుభవించిన మరియు భావించిన పదార్థములను సూక్ష్మశక్తుల భావనారూపమును కలిగి ఉంటోంది. అట్లు సూక్ష్మమై, సూక్ష్మచేష్టా సహితమై ఉండునప్పటి ఆ చైతన్యమే ‘వాసన’ అని పిలువబడుతోంది.
9) విద్య : ఒకానొకప్పుడు ఈ చైతన్యమే - “శుద్ధమగు ఆత్మతత్త్వమొక్కటే సత్యమైనది. ఈ ద్వైత దృష్టి అవిద్య చేతనే కలుగుచున్నది. యథార్థానికి ఈ దృశ్యప్రతీతి అంతా మూడువేళల సత్యము కానేకాదు” అనునట్టి జ్ఞాన రూపమున ప్రకాశించుచున్నది. అప్పుడు ఆ సంవిదాత్మనే ‘విద్య’ అనే పేరుతో పిలుస్తున్నారు.
10) ప్రయత్నము : ఈ చైతన్యము క్రియాశీలత్వం పొందటమే ప్రయత్నం. అట్టి అనేక ప్రయత్నములలో కొన్ని ఆత్మను మరపించేవి, మరికొన్ని ఆత్మను గుర్తు చేసేవి అయి ఉంటున్నాయి.
11) మలము : తదితరమైన భావన యొక్క "ఆవరణ” ఈ ఆత్మను మరుగుపరచి, విస్మరించేట్లు చేస్తోంది. అట్టి ఆవరణ శక్తి ప్రాధాన్యము (over-covering) వలన ఈ ఆత్మయందు ఆరోపించ బడునదంతా ‘మలము’ అనే శబ్దముచే వ్యవహరింపబడుతోంది.
12) విస్మృతి : మిథ్యారూపమైన ఆయా వికల్పములచే అనేక రకములైన ఆలోచనలకు సంబంధించిన విక్షేపములు (perturbances) ఏర్పడుచున్నాయి. చైతన్యము యొక్క ‘విక్షేప శక్తి’ ప్రాధాన్యమే విస్మృతి.
13) ఇంద్రియములు : మనోరూపమును సంతరించుకొన్న చైతన్యము - వినుచూ, చూచుచూ, స్పృశించుచూ, ఆస్వాదించుచూ, వాసన చూచుచూ, సంకల్పించుచూ - ఉంటోంది. ఇట్లు ఆయా ఇంద్రియములచే భోగానుభవకార్యములను నిర్వహిస్తోంది. తద్వారా ఈ జీవత్వము పొందిన ‘ఇంద్రుడు’ అను పేరుతో చెప్పబడు ఈశ్వరుని తృప్తిపరచుచున్నాయి కనుక, వాటిని ’ఇంద్రియములు’ అంటున్నాం.
14) ప్రకృతి : పరమాత్మ ఇంద్రియాలకు ఎదురుగా కనబడేవాడు, గాంచబడేవాడు కాడు. అనగా దృశ్య దృష్టిచే అతడు అలక్షితుడు (one who cannot be experienced by ‘sences’)" అయి ఉన్నాడు. అట్టి పరమాత్మయందు, అతని కంటే ఏమాత్రం వేరు కానట్టి కర్తృత్వరూపము ఏర్పడుతోంది. ఇది నీటి యందు తరంగములు ఏర్పడుటవంటిదే. “నేను కర్తనగుచున్నాను” అను కర్తృత్వ రూపము కారణముగా ఏర్పడుచున్నదే ‘ప్రకృతి’.
15) మాయ : శుద్ధ చైతన్యమునందు ఒకానొక విస్మరణ ఏర్పడుచున్నది. ఆ విస్మరణ …. సత్యమగు ఆత్మను మిథ్యగాను, మిథ్యారూపమైన ఈ జగత్తును, ఇందలి అనుభవములను అత్యంత దృఢమైన సత్యముగాను దోపింపచేయుచున్నది. సత్యాసత్యముల వికల్పమునకు హేతువగుచున్న చైతన్యము యొక్క స్వభావమే “మాయ”.
Page:522
16) క్రియ : వినటం, చూడటం, ఆఘ్రాణించటం, రుచిచూడటం, స్పర్శ వంటి ఆయా కర్మలచే చైతన్యం లోకమునందు కార్యకారణరూపత్వము పొందుచున్నది. అదే ’క్రియ’ అనబడుతోంది.
ఓ రామా ! ఒక విషయం గమనిస్తున్నావా? ఇవన్నీ చైతన్యము యొక్క రూపాంతరములే. చైతన్యం విషయోన్ముఖమైనప్పుడు అవిద్యచే మలినమగుచున్నది. స్ఫురణ రూపదర్శనాన్ని పొందుతోంది. చైతన్యమే స్వయముగా చిత్తము యొక్క రూపము స్వీకరిస్తోంది, తద్వారా సంసార బంధమున తగుల్కొనుచున్నది. అట్టి త్రోవలో రూఢిపడినదై, మనం చెప్పుకొంటున్న అనేక పేర్లకు తగుచున్నది.
చైతన్యము తనకు తానే “నేను అజ్ఞానిని, బద్ధుడను, ఈ దేహపరిమితుడను” అనునట్టి దోషముతోకూడిన భావనను, అనుభవ సిద్ధిని పొందుచున్నది. ఇంద్రియానుభవములపట్ల గల ఆసక్తిచే ఏర్పడిన ద్వైతవాసనా కళంకమును ”తన స్వభావమే” అయినట్లు ఆపాదించుకొంటోంది. అవిచారణ వశంచేత పూర్ణమగు తన స్వస్వరూపము నుండి ‘చ్యుతి’ (displacement) పొందుచున్నది. చూచావా, ఎప్పుడైతే చైతన్యము వివిధ కల్పనలతో గూడిన జడమగు ఈ దేహాదులవైపు అభిముఖం అగుచున్నదో అప్పుడు ఆ చిద్వవస్తువునే ‘జీవుడు’ అని, ‘మనస్సు’ అని, ’చిత్తము’ అని, ‘బుద్ధి’ అని ఇట్లు అనేక విధములైన శబ్దములతో చెప్పుకుంటున్నాం.
పరమాత్మ పదము నుండి తొలగి, అవిద్యచే కళంకితమైన ఈ చైతన్యమే…. ఆయా ప్రకటిత మగుచున్న వృత్తులను అనుసరించి …. ఆయా పేర్లుతో శాస్త్రకారులచే పిలువబడుతోందని గ్రహించు.
శ్రీ రాముడు : గురువర్యా! మునీంద్రా! ఇంతకీ ఈ ‘మనస్సు’ అనునది జడమా? చేతనమా? ఈ విషయం ఇంకా నాకు బోధపడనేలేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు చిత్ - అచిత్ రూపమైయున్నది. అనగా, ఇది జడముకాదు. చేతనము కాదు. చైతన్యమే సంసార దశ యందు ఉపాధి దోషంతో కూడుకొని ఉన్నప్పుడు ‘మనస్సు’ అని పిలువబడుతోంది. అనగా, చైతన్యమునకు వేరుగా ‘మనస్సు’ అనబడునది ఏదీ లేదు. ‘ఆలోచన’ అనునది ఆలోచించువానికి వేరుగా ఉంటుందా? ఉండదు కదా!
“మనస్సు సత్-అసత్తులకు విలక్షణమై ఉంటోంది" అని చెప్పబడుతోంది. ఈ మనస్సే జగత్తు అనబడు అనుభవమునకు కారణభూతమై ఉంటోంది. కాని మనస్సునకు పరమాత్మ కారణం కాదు సుమా! ఉపాధి భేదం చేత భిన్నభిన్నంగా కనబడేటట్లు చేస్తున్నది ఈ మనస్సే. అవిద్యచే కళంకితమైన చైతన్యమే మనస్సు లేక, చిత్తము. ఆత్మను గూర్చిన నిశ్చయత్వము లేకపోయినప్పుడు కలుగు స్థితియే ‘చిత్తము’ అని చెప్పబడుతోంది. చిత్తము చేతనే ఈ జగత్తు అను రచన సాగించబడుతోందని గ్రహించువాడు ఆత్మ యొక్క స్వభావమును పొందుటకు అర్హుడగుచున్నాడు.
Page:523
మనస్సును “మలినోపాధిని పొందినట్టి చైతన్యము యొక్క జడ - చేతనముల మధ్యగా
స్వీయకల్పితమైన చంచలరూపమే” అని కూడా అనవచ్చు.
చిద్వస్తువు మలినోపాధితో సంబంధం ఏర్పరచుకొనుచున్నప్పుడు (నాచే గాంచబడు చున్న ఈ దృశ్యములో అంతర్గతమైయున్న ఈ శరీరమే ‘నేను’ అను భ్రమ పొందినప్పుడు), అట్టి సంబంధముచే చంచల భావయుక్తమగుచున్నది. అయితే ఆవరణరాహిత్యము దృష్ట్యా చూచినప్పుడు అన్నివేళల దోషరహితంగాను, కళంక వర్జితంగానే ఉండిఉంటోంది కూడా! అందుచేత మనస్సు జడమూ కాదు, చేతనమూ కాదు. ఈ మనస్సుకే అహంకారము, బుద్ధి, జీవుడు మొదలైన చిత్రవిచిత్రములైన పేర్లు ఉన్నాయి. ఒకే నటుడు అనేక వేషములు ధరించి, నాటకమాడుచున్న సమయంలో అనేక పేర్లతో ప్రేక్షకులచే గాంచబడతాడు చూచావా? ఈ మనస్సే క్రియా భేదంచే అనేక పేర్లు కలిగియున్నది.
ఈ చిత్తం యొక్క వివిధ సంజ్ఞల గురించి మనం చెప్పుకొన్నాం కదా! దీనినే భిన్న అభిప్రాయాలు కలవారు కల్పనా భేదంచేత అనేక రీతులుగా చెప్పటం జరుగుతోంది. అనేక తర్క- వితర్కములచే ఏర్పడుచున్న అభిమతములను అనుసరించి, కొందరు ‘అణుత్వము, ద్రవత్వము’ మొదలైన ధర్మములను మనస్సుకు ఆపాదిస్తున్నారు. తమ బుద్ధి ప్రసరణమును అనుసరించి మనో-బుద్ధి-ఇంద్రియములకు సంజ్ఞాభేదములను ఇస్తూ, వారు చిత్రవిచిత్రములైన రీతులుగా దర్శించుచున్నారు. ఈ మనస్సును కొందరు ‘జడమైనది’ అంటున్నారు. మరికొందరి అభిప్రాయానుసారం - ఇది జీవునికన్న భిన్నమైనది. అలాగా ‘అహంకారం, బుద్ధి’ల గురించి కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పటం జరుగుతోంది. ’ ఇక మా అభిప్రాయమేమిటో చెపుతాను విను.
నైయాయికులు (గౌతమ మహర్షి) : అహంకారం ఒకానొక ద్రవ్యవిశేషం. ఈ జీవుడు అహంకారమునకు భర్త వంటివాడు. మనస్సు అణుస్వరూపమైనది. ఇక బుద్ధి, అంతఃకరణం - ఆత్మకు సంబంధించినవి. ఆత్మ సాక్షాత్కారమైన తరువాత బుద్ధి, అంతఃకరణాలు ఉండియే ఉంటాయి. కాని మనస్సు, అహంకారాలు మాత్రం త్యజించబడతాయి.
సాంఖ్యులు (కపిలముని) : "బుద్ధి” అనేది ప్రకృతి చేస్తున్న పనే. సత్వ-రజ-తమోగుణముల ప్రదర్శనమే ప్రకృతి. బుద్ధియే మహతత్త్వము. బుద్ధిని మించినదేదీ ఎక్కడా లేదు. బుద్ధిని అనుసరించే అంతా ఉంటోంది. మనస్సు పదకొండు ఇంద్రియముల అంతర్గతమై ఉన్నట్టిది.
చార్వాకులు (చార్వాకుడు) : బుద్ధి ఈ శరీరమునకు అంతర్గతమయ్యే ఉంటోంది. అది శరీరము యొక్క ధర్మం అయి ఉన్నది. చైతన్యము కూడా శరీరము యొక్క గుణము లేక లక్షణము మాత్రమే. అహంకారరూపముననే ‘ఆత్మ’ అని చెప్పబడేది ఉన్నది. అయితే, అది శరీరముతో వస్తుంది. శరీరంతో పోతుంది. పూర్వాపరవిచారము చేయునది మనస్సు. అట్టి ఈ మనస్సును సంతసింపచేయుటయే బుద్ధియొక్క ధర్మము.
పంచరాత్రులు : ’వాసుదేవుడు’ అను పేరుగల పరమాత్మ నుండి ‘సంకర్షణుడు’ అను పేరుగల జీవుడు కలిగాడు. ఆ సంకర్షణుడే అహంకారము. వాని నుండి ‘ప్రద్యుమ్నుడు’ అను మనస్సు, ‘అనిరుద్ధుడు’ అనే బుద్ధి ఏర్పడుచున్నాయి. సర్వము వాసుదేవమయమే. మిగతాదంతా మాయయే.
వైశేషికులు : ‘అహంకారము’ అనేది కూడా ఒకానొక ద్రవ్యవిశేషమే. ఇక ఈ ‘బుద్ధి’ ఐదు వికల్పములచే ఐదు విధములుగా ఉంటోంది. అవి - స్మృతి, ప్రత్యక్షము, అనుభవము, తర్కము, విపర్యము. అహంకామునకు కర్త జీవుడు. అహంకారమును దాటినప్పుడు శేషించునదే పరమాత్మ స్థానము.
Page:524
అహంకారం, మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ సంకల్పవృత్తి భేదంచేత వేరువేరుగా పిలువబడు చున్నప్పటికీ, అంతఃకరణము యొక్క ఏకత్వముచే అవన్నీ ఒకరూపమే అయి ఉన్నాయి. సంకల్పించు వాని నుండి సంకల్పము వేరుకాదు కదా! చూచువాని నుండి చూపువేరా? అందుచేత చైతన్యమే అహంకరించునపుడు - అహంకారము,
నిర్ణయించునపుడు - - బుద్ధి
మననము చేయునపుడు - మనస్సు
అంతేగాని ‘అహంకారము’, ‘మనస్సు’, ‘బుద్ధి’ అనునవేవీ విడిగా ఏమాత్రం లేనేలేవు. కర్తకు వేరుగా క్రియలు ఎక్కడుంటాయి? సూర్యుని నుండి సూర్యకిరణములు వేరా? అయితే, …. అట్లు అహంకరించుటకు ముందు …. చైతన్యము ఉండిఉన్నది. భావించుటకు ముందే భావించు వాడు ఉండనే ఉన్నాడు కదా! అట్టి ‘అహమ్’ అను భావనాక్రియ ’జరుగుచున్నప్పుడు త్యజించునపుడు’ ఏర్పడి ఉండేది, శేషించేదీ ఆ చైతన్యమే. అహంకారమునకు అతీతమైన దృష్టితో పరికించి చూస్తే “సర్వము చైతన్యమయమే” అని తెలియవస్తుంది.
అఖండమగు చైతన్యము ‘నేను ఖండితుడను” అని భావించుటయే…. అహంకరించుట అయి
ఉన్నది.
ఈ మనోబుద్ధి చిత్త అహంకారముల గురించి వేరు వేరు ఆచార్యులు వేరు వేరు కల్పనలతో తమ శిష్యులకు బోధించటం జరిగింది. వేరు వేరు కాలములందు బయలుదేరిన బాటసారులు దూరంగా ఉన్న ఒకే నగరమును ఆకారాదులకు సంబంధించిన వివిధ అవగాహనలతో వివిధ రీతులుగా దర్శిస్తూ ఉంటారు కదా! అట్లే వేరువేరు గురువులు తమ శిష్యులను తీర్చిదిద్దటానికి వేరు వేరు సిద్ధాంతాలు ప్రతిపాదించియున్నారు. వారంతా వారి వారి బుద్ధి యొక్క అనుభవమును బట్టి, శిష్యుల యొక్క అవగాహనా సామర్థ్యమును అనుసరించి తమ యొక్క తపోఫలితంగా తాము గ్రహించింది నిర్ణయించి ప్రజలకు చెప్పటం జరుగుతోంది.
అట్టి వారిలో కొందరు ఆత్మపథమును అధిష్ఠించుటకు ప్రయత్నించుచున్నారు. మరికొందరు పరమార్థమగు బ్రహ్మతత్వమును అధిష్ఠించక పోవుటచే కొంత అపరిపక్వతతో కూడిన అవగాహన కలిగి ఉంటున్నారు. ఇక వారివారి శిష్యులలో కొందరు అపూర్ణమగు అవగాహనచేత, గురువుల ఉద్దేశము ఏమిటో సరిగ్గా గ్రహించకుండా, "మీ సిద్ధాంతములన్నీ తప్పు. మా సిద్ధాంతమే సరి అయినది” అనునట్టి కాలయాపనకు, రాగద్వేషములకు దారితీయగల వాదోపవాదములందు నిమగ్నులగుచున్నారు.
వాస్తవమేమిటో గ్రహించిన తరువాత…. “ఆయాదూరముల నుండి ఆత్మవస్తువు దర్శించినపుడు, అట్లు తోచుచున్నది. ఆత్మ వాస్తవానికి అనిర్వచనీయమైనది. అద్దానిని వాక్కుగాని, మనస్సుగాని ప్రకటించలేవు. ద్రష్ట యొక్క స్వస్వరూపము నుండి అది వేరుకాదు. అందరు అదియే అయి ఉండి, అటే పయనిస్తున్నారు. శ్రద్ధను బట్టి మనస్సులో దోషములు తొలగుచున్నాయి. నిర్మలమైన మనస్సుకు
Page:525
పరమాత్మ స్వయముగా, సుస్పష్టముగా అంతర్-హృదయేశ్వరుడై ప్రకటితమగుచున్నాడు” తెలియవస్తోంది. సత్యమేదో గ్రహించినవాడు ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనమని, కాలయాపన యేనని తెలుసుకొంటున్నాడు. “సర్వము లయించగా, ఇక అప్పటికీ శేషించి, విస్తరిల్లియుండే నాయొక్క స్వరూపమే ఇదంతా" - అని గ్రహించుచున్నాడు. తనయొక్క వాస్తవ స్వస్వరూపం గురించి మరొకరు సిద్ధాంతీకరించి చెప్పవలసిన అగత్యం ఇక కనిపించదు.
అనేకులు వేరువేరైనట్టి “దేశ కాల దృష్టులు” యొక్క ప్రభావంచేత కొన్ని విధినియమములకు సంబంధించిన ఆచార-అవగాహనల భేదం కలిగి ఉంటున్నారు. అట్టి వారిలో కొందరు, “ఈ మార్గమే ఉత్తమమైనది” అని ప్రశంసిస్తూ పరులను దూషిస్తూ ఉంటున్నారు. అట్టివారిలో మరికొందరు “ఫలేచ్చ”చే అట్టి ఫలమునకు సాధన భూతమగు కర్మయందే ఆసక్తిగల చిత్తులు అగుచున్నారు. గురువుల వాక్యములలోని జ్ఞానసారాన్ని తిరస్కరిస్తూ కేవలం బాహ్య ఆచారవ్యవహారములకు పరిమితులై అనేక భేదదృష్టులకు లోనగుచున్నారు. “సర్వం ఖల్విదం బ్రహ్మ ప్రతి ఒక్కడు బ్రహ్మమే అయిఉన్నాడు” వంటి ఉపనిషత్ ప్రమాణ వాక్యములను ఏమరచుచున్నారు.
కర్మలు, విధి-విధానములు అనేక రీతులుగా ఉంటేఉండనీ, ఆత్మవిచారణ విషయంలో అనేక గురువుల అభిప్రాయాలు ముముక్షువు తప్పక గ్రహించవచ్చును. ఇందులో తప్పేముంటుంది? అయితే, మానవుడు మనోనైర్మల్యము కొరకు ప్రయత్నించాలి, గ్రహించాలి, వినాలి. అనేకత్వములో అంతర్లీనమై జాజ్జ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఏకత్వము యొక్క అనుభూతిని పొందుటకు ఉద్యుక్తుడు కావాలి. అంతేగాని, “ఇది ఇంతవరకే. ఇక మేమేదీ వినం, గ్రహించం” అనునట్టి వ్యర్థమగు పలుకులతో, విచిత్రయుక్తులతో కల్పితవచనములతో ఆత్మకు భిన్నత్వము ఆపాదించుట ఉచితము కాదని మా అభిప్రాయం.
స్నానము, దానము మొదలైన క్రియలు చేసేవాడు ఆ క్రియలను ఏ విధమైన కర్తృత్వముతో చేస్తాడో, అతని మనస్సు అట్లే విషయములను పొందుచున్నది.
ఈ క్రియలన్నీ - నన్ను పవిత్రుణ్ణి చేయగలవు - పుణ్యవంతుని చేయగలవు- పరిశుభ్ర పరచగలవు - ధనికునిగా చేయగలవు - జ్ఞానినిగా చేయగలవు అందగానిగా చేయగలవు.
ఈ విధాలుగా ఎవడు ఏ విధమైన భావనచేస్తే అతడు ఆతీరుగానే పొందగలడు. మరి, మనస్సు యొక్క వైచిత్ర్యము అట్టిది. మనస్సు దేనిని ఎట్లు భావిస్తే అది అట్లే సత్యమై ప్రాప్తిస్తోంది. వేరువేరు ఆచార్యులు “అహంకారము-మనస్సు-బుద్ధి-పరమాత్మల”ల గురించి చెప్పిన సమాచారం కూడా వారివారి శిష్యులకు అట్లే సత్యమై తోచుచున్నది.
Page:526
ఒకడు వేరువేరు సమయ సందర్భములలో వేరువేరు కార్యక్రమములందు నిమగ్నమై ఉన్నాడనుకో… అతడు ఎప్పటికప్పుడు చేస్తున్న పనిని బట్టి “మావటివాడు-సారథి-వ్యవసాయ దారుడు-కుటుంబపు యజమాని-సేవకుడు-మిత్రుడు” …. అని ఆయా సందర్భములలో వేరువేరు జనులచే పిలువబడుచూ ఉండవచ్చు. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఆ అన్ని సందర్భములలోనూ “ఒక్కడే” అయి ఉన్నాడు కదా! మనస్సు అన్ని వేళల ఒక్కటే అయిఉంటున్నప్పటికీ, అది నిర్వర్తించే కార్యక్రమములను అనుసరించి, “జీవుడు, వాసన, కర్మ" మొదలైన పేర్లతో పిలువబడుచున్నది.
అయితే ఈ జీవులయందు ఉండి, ఈ సర్వ అనుభవములను పొందుచున్నది చిత్తమే కదా! ఎందుకంటావా? చిత్తరహితుడు ఏదైనా చూస్తున్నప్పటికీ ఏదియు గాంచకయే (గ్రహించకయే) ఉంటున్నాడు. చిత్తసహితుడు, భుజించుట, వాసనచూచుట, తద్వారా సుఖదుఃఖములను పొందుట జరుగుతోంది. ఒకచోట ఉండియున్న రూపములను చూడగలుగుటకు వెలుతురే కారణం అయినట్లు, సమస్త పదార్థములను ఆయావిధములుగా గ్రహించటానికి మనస్సే కారణం. అందుచేత, “బద్ధ చిత్తము” కలవాడు మాత్రమే బంధమును పొందుచున్నాడు. “ముక్త చిత్తము” కలవాడు ’మోక్షభావి’ అగుచున్నాడు.
‘మనస్సు జడము’ అనటం ఎట్లా? అది సంచలనము కలిగి ఉంటోంది కదా! పోనీ ‘చేతనము’ అని అందామా?
అది స్వయముగా చలించలేదు. ఆత్మయొక్క సామీప్యములో మాత్రమే ‘చలనము-గతి’లను స్వీకరించగలుగుచున్నది.
అది చేతనమే అయి ఉంటే ఇక అద్దానికి జడరూపమైన జ్ఞానమే (పరిమితమైన, ఖండమైన జ్ఞానమే) ఉండేది కాదు.
అందుచేతనే “అది జడము కాదు. చేతనము కాదు” అని మొట్టమొదటే చెప్పాను. అట్టి మనస్సు ఎప్పుడైతే వ్యక్తమవటం జరుగుతుందో, అప్పుడే ఈ జగత్తు కూడా జడ చేతనములకు విలక్షణమై ఆవిర్భవించుచున్నది.
మనస్సు ఏకరూపమైనప్పుడు (భ్రాంతి రూపమును త్యజించి బ్రహ్మాకారమును పొందినప్పుడు) ఇక ఆ మరుక్షణం ఈ జగత్తు ఇట్లుండదు. అనగా అట్టివాని దృష్టిలో జగత్తు లేనిదే అగుచున్నది. ఇందలి అనేకత్వము, పదార్థత్వము నశించుచున్నది. అనగా, ఈ జడచేతన జగత్తంతా స్వస్వరూపాత్మ యొక్క సంప్రదర్శనా విలాసంగా అనుభూతమవగలదు. అట్లుగాక మనస్సు మలినజలం లాగా కలుషితమైనప్పుడు మనస్సే జగత్తుకు కారణరూపముగా (ఇదంతా ఇట్లు తోచుటకు “కారణము”గా) రూపొందుచున్నది. అట్టి కలుషితమైనట్టి సమష్టిరూప మనస్సు నుండే ఈ కనిపించే జగత్తు అంతా ఉత్పన్నమైయున్నది సుమా!
ఓ రామచంద్రా! దోషదృష్టి, జడదృష్టి తొలగినాయా, అప్పుడు ఈ మనస్సు బ్రహ్మమే అగుచున్నది.
Page:527
“ఈ మనస్సు జగత్తుకు కారణము” అనటం కూడా అసమంజసమే అని అనిపించుకొంటోంది. పోనీ “బాహ్యపదార్దజాలమే సంసారమునకు కారణము” అందామా? బాహ్యపదార్థమంతా జడ రూపమే కదా! జడమైనది ఒకానొక కర్తృత్వమును ఎట్లా నిర్వర్తించగలదు చెప్పు? అందుచేత “సంసారమునకు దృశ్యమే కారణం” అనటం యుక్తియుక్తం కాదు.
మనస్సు
జడ చైతన్య విభాగము
విభాగము
జడ మాత్రమగు మనస్సు సంసారమునకు కారణం కాజాలదు. కనుక “జడము - చైతన్యము” కూడా కానట్టి మనోవిభాగమే పదార్థములకు కూడా కారణమగుచున్నది.
చిత్తము లయిస్తే జగత్తుకూడా లయించుచున్నది. చిత్తములేనివానికి జగత్తే ఉండదు. ఇక్కడ “రహితం కావటం” అనగా “నిర్మలమగుట” అనియే అర్థం. కాలము ఒక్కటే అయి, ఋతుభేదంచే అనేక రూపములు ధరించుచున్నట్లు …. ఒకే మనస్సు వివిధ కర్మలచే (చిత్తము, అహంకారము మొదలైన) వివిధ నామములను ధరిస్తోంది.
శ్రీరాముడు : మునీంద్రా! ఈ జీవునియొక్క అహంకారం, ఇంద్రియాలు, క్రియలు, దేహము మొదలైనవన్నీ అనేక సందర్భములలో అతనినే బాధించుచున్నాయి కదా! మరి, ’ఇదంతా మనస్సే అయి ఉన్నది. జీవునియొక్క మనస్సే అతనిని బాధిస్తోంది” అనటం సమంజసమా? కాదేమో? ఈ జీవుని దుఃఖింపజేయటంలో "అహంకారం, ఇంద్రియాలు, క్రియలు, దేహము”ల పాత్ర ఏమిటి ? అవన్నీ మనస్సుకంటే వేరేకదా! మనస్సు యొక్క పాత్ర ఏమిటి?
శ్రీవసిష్ఠమహర్షి : మనస్సుతో సంబంధం లేకుండానే ఈ అహంకారము, ఇంద్రియములు, క్రియలు, దేహములు జీవుని బాధిస్తున్నాయంటావా?….ఊహూ! మనస్సు లేనప్పుడు కూడా అవి ఇతనిని క్షోభింపజేయగలిగితే, అప్పుడు “మనస్సు కంటే అవన్నీ వేరు” అని నేనుకూడా ఒప్పుకుంటాను. కాని అట్లు జరగటంలేదు. కనుక మనస్సు కంటే అవన్నీ వేరుకాదు. ఓ రామా! ఎవరైనా “దేహము వేరు. మనస్సు వేరు. జీవుడు వేరు” అని వాదిస్తుంటే, అట్టివారు యథార్థ వస్తువును ఎరిగినవారు కాదనే మా అభిప్రాయం. జ్ఞానమునకు సంబంధించిన ఉత్తమ శిక్షణ పొందకపోవుటచేతనే వారు అట్లా వాదిస్తున్నారు. మనస్సే “దేహానుభవము" అను వేషమును వేస్తోంది. ‘జీవుడు’ అని మనం అంటున్నది మనస్సునే.
❖
Page:528
‘మనఃశ్శక్తి’ సర్వవ్యాపకమై ఉండుటచే, కుతర్క శక్తి కూడా మనస్సు అనే దేవుని యందే ఉండి ఉంటోంది.
శుద్ధ చైతన్యమునందు జడత్వ రూపమగు కలుషిత శక్తి ఉదయించిన మరుక్షణం ఈ జగద్వైచిత్ర్యమంతా కలుగుతోంది.
‘చేతనము’ అయినట్టి సాలెపురుగు నుండి జడమగు సాలెతంతువులు (దారం) ఉత్పన్నమగు చున్నది కదా! నిత్యజ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మము నుండి మనోరూపమగు ప్రకృతి జననంపొంది, రూపుదిద్దుకొంటోంది.
అవిద్యా కారణం చేతనే కుతర్క - - వితర్కములైన అనేక భావనలు చిత్తమునందు రూఢిపడుచున్నాయి.
చైతన్యము యొక్క పర్యాయ వృత్తులే ‘జగత్తు’. కాని, భ్రమచే జగత్తు చైతన్యమునకు వేరైనదిగా తలచబడుచున్నది. అనగా, మనస్సు యొక్క వాస్తవరూపం ఆత్మచైతన్యమే! కనుక, ఈ ఎదురుగా కనబడేదంతా-జడచేతనములతో సహా ఆత్మ చైతన్యవిన్యాసమే!
నిర్మలమగు చైతన్యమొక్కటే ఈ జీవ-మనోబుద్ధి-అహంకార రూపములుగా ప్రసిద్ధికెక్కుచున్నది. అదియే లోకంలో చేతనమని, జీవమని, చిత్తము అని జడమని …. ఇంకా అనేక సంజ్ఞలచే పిలువబడుచున్నది. ఈ విషయంలో సంశయము అవసరములేదని చేతులెత్తి ప్రకటించుచున్నాను. ఆత్మచైతన్యం ఈవిధంగా అద్వితీయం! నిత్యనిర్మలం!