CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:529

VII. చిత్తచాంచల్యము

  1. ఈ కనబడేదంతా ఉన్నది మనస్సులోనేనా?

శ్రీరాముడు : హే మహర్షీ! మనకు కనబడుచున్న ఈ జగత్ వైచిత్రమంతా మనస్సు నుండే ఆవిర్భవిస్తోందంటారా? ఇదంతా మనః కల్పితమేకాని, మరింకేమీ కాదని మీ అభిప్రాయమా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఒక ఎడారిలో ప్రచండ సూర్యతేజము కారణంగా ఉత్పన్నమైన మృగతృష్ణ ఆ సూర్యతేజమును ఆవరించినదై జలభ్రాంతిని కలుగజేయటం జరుగుతోంది కదా! అట్లే జడమగు మనస్సు స్వయం ప్రకాశవంతమైన ఆత్మను ఆవరించివేసి ఉండగలుగుతోంది. మనస్సు యొక్క జడమునకు సంబంధించిన అంశమే ఆత్మను మరుగుపరచి ఉంచుతోంది. అట్టి “మరుగు” యే జగత్తుగా ప్రాప్తిస్తోంది. ఈ విధంగా “మనస్సే జగత్తునకు కారణం" అని నీవు చెప్పినది అక్షరాలా నిజమే.

ఈ జగత్తు బ్రహ్మరూపమే! అయితే,… మనస్సే ‘జగత్తు’ అను ఆకృతిని పొంది, ఒక చోట మనుష్యరూపముగాను, మరొకచోట దేవతారూపముగాను రూఢిపొందుచున్నది. ఒకచోట రాక్షస రూపంగాను, మరొకచోట యక్షరూపంగా, ఇంకొకచోట గంధర్వ రూపంగాను, కిన్నెర రూపంగాను అవతరించుచున్నది. అంతేకాదు. ఈ మనస్సే భిన్న భిన్న ఆచారములుగా, పంచభూతములుగా, గ్రామ, నగరాది రూపములుగా విస్తరించుచున్నది. మహావిశాలరూపమై కూడా మనస్సే వ్యక్త మగుచున్నట్లు మేము దర్శిస్తున్నాము. కాబట్టి ఓ సర్వజనులారా! మీరంతా ఈ మనస్సు గురించే బాగా విచారించండి. ఈ మనస్సు యొక్క శక్తి - యుక్తులు, స్వభావ వైచిత్రములు గ్రహించండి. అట్టి మనస్సును పరిశీలించటం వదలి, గడ్డి పరక - కొయ్య - - లతలవంటి ఈ స్థూల దేహముల గురించి, ఎదురుగా కనిపించే ఆయా దృశ్య సంబంధ వ్యవహారముల గురించి మాత్రమే విచారించటం చేత వచ్చే ప్రయోజనమేమీ ఉండదు.

సర్వవ్యాపకమగు ఈ జగత్తంతా మనస్సు చేతనే పరిపూర్ణమైయున్నది. అట్టి ఈ మనస్సును శోధించినప్పుడు మాత్రమే ఈ కర్త-కర్మల రూపము చక్కగా తెలియబడగలదు. కర్త-కర్మల చమత్కార మంతా గ్రహించిన తరువాత ఇక ఆపై పరమాత్మయే శేషించుచున్నదని మా అనుభవమైయున్నది. అట్టి ఆత్మ సర్వ వస్తువులకు అతీతమై, సర్వవ్యాపి అయి, సర్వమునకు ఆశ్రయమైయున్నది. అద్దాని కృపాతిశయంచేతనే ఈ మనస్సు లోకంలో పరుగిడగలగడం, పలు విధములుగా విజృంభించటం జరుగుతోంది కూడా! ఈ ‘మనస్సు’ అనునది ఆత్మయొక్క ‘ఇచ్ఛ ఆలోచన’ అను రూపమైన ‘కర్మ’ యేనని మేము ఎంచుచున్నాము.

Page:530

అట్టి మనస్సే ఈ దేహాదులకు కూడా కారణం. మనస్సే ఉత్పన్నమౌతోంది. అదియే విజృంభి స్తోంది. అదియే అన్ని వైపుల ప్రవర్తిస్తోంది. అదియే లయించుచున్నది. అంతే కాని ‘ఆత్మ’ కాదు. ఎందుకంటావా? ఆత్మకు జనన మరణాదులు, ఉత్పత్తిలయాలు లేవు. నాయనా! రామా! ఈ ఆత్మ విచారించబడిందా, ఇక మనస్సు స్వయంగానే లయించగలదని శాస్త్రనిశ్చయం. మనస్సు లయించిన మరుక్షణం మోక్షం ప్రాప్తించగలదు. భ్రమదాయకమైనట్టి ‘మనస్సు’ అనబడే కర్మ క్షయించినపుడు ఈ జీవుడు ముక్తుడు అగుచున్నాడు. అట్టివాడు ఈ ప్రపంచంలో మరల జన్మించుట లేదు. శ్రీరాముడు : ఓ ముని శ్రేష్ఠ! మీరు ఇంతకుముందు …. సత్వరజస్తమోగుణముల దృష్ట్యా ఈ జీవులను పదునాల్గు విధాలుగా వర్ణించారు కదా! వాటన్నిటికీ ముఖ్య కారణం సదసదాత్మకమగు ఈ మనస్సే అయిఉన్నదని నేను గ్రహిస్తున్నాను. అయితే, నాదొక సందేహం. బుద్ధిరహితమగు శుద్ధ చైతన్యమునందు ఈ ‘మనస్సు’ అనబడునది ఎట్లా ఉత్పన్నమైనది? ఈ చిత్ర విచిత్రములైన జగన్నిర్మాణం చేసే విధంగా అది ఎట్లా విస్తరిస్తోంది? బుద్ధి ఉంటే కదా సృష్టి సంభవించటం? మరి బుద్ధిగాని, మనస్సుగాని ఎట్లా ఏర్పడుచున్నాయి?

శ్రీ వసిష్ఠమహర్షి : అతి విశాలమైన మూడు ‘ఆకాశములు’ ఉన్నాయని ఇతఃపూర్వమే చెప్పియున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్పుచున్నాను. అవి :

1) భూతాకాశము (Zone of matter)

2) చిత్తాకాశము (Zone of thought)

3) చిదాకాశము (Zone of awareness, consciousness)

సర్వసామాన్యములైన ఈ మూడు వాటి వాటి కార్యములందు సువ్యవస్థిములై ఉన్నాయి. ఈ మూడిటికి “శుద్ధ చిత్ శక్తి" చేతనే స్థితి లభించుచున్నది.

చిదాకాశము: బాహ్య జగత్తునకు అంటక, అంతటికీ ‘సాక్షి’ అయిఉంటోంది. అది - ఈ బుద్ధి, మనస్సు మొదలైనవి - ఉండుటకు, లేకుండుటకు కూడా సాక్షీభూతమై, ఈ సర్వభూతములందు ఏకస్థమై, సర్వమునందూ వ్యాపించి ఉంటున్నది.

చిత్తాకాశము : ఈ జీవులందరి వ్యవహారములకు ఇదే హేతువుకదా! అందుకే దీనిని “సర్వ హితము” (సర్వజనులకు హితమైనది) అని కూడా అంటూ ఉంటారు. కార్య-కారణములన్నిటికీ ఇదే మూలమై ఉన్నది. అందుచేత సర్వశ్రేష్ఠమై ఉంది. ఇది జగద్వ్యాపకమై వికల్పరూపమై ఉంటోంది.

భూతాకాశము : ఈ భౌతికమైన కంటికి కనబడుచున్నది. ఇది పది దిక్కులలోను వ్యాపించి, విశాలమైన దేహము కలదై ఉంటోంది. ఇది వాయువు యొక్క సూర్యుని యొక్క మేఘము యొక్క …. విశాల రూపమై వెలయుచున్నది.

“మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో”

Page:531

భూతాకాశ - చిత్తాకాశములు రెండు చిదాకాశము నుండే ఉత్పన్నమౌతున్నాయి. ‘పగలు’ జరుగుచున్న కార్యములన్నిటికీ పగలే కారణమగుచున్నట్లు చైతన్యమే అన్నిటికీ కారణమగుచున్నది. “నేను జడస్వరూపుడను… నేను జడస్వరూపుడను” అనునట్టి చిద్వస్తువు యొక్క మలిన నిశ్చయమే మనస్సు. దీనివలననే ఈ ఆకాశాదులు ఉత్పన్నమౌతున్నాయి. అయితే రామా! ఇక్కడ నీవు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేమిటంటే, ఆత్మతత్త్వము ఎరుగనట్టి వానికి ఉపదేశించటం కోసమే ఈ మూడు అకాశాలు కల్పించబడుచున్నాయి. జ్ఞాని యొక్క దృష్టికి మాత్రం ఈ మూడు విభాగములతో పని లేనేలేదు.

ఎందుకంటే, పరమమగు బ్రహ్మమొక్కటే అంతటా నిండియున్నది. అంతయు తానే అయి వెలుగుచున్నది. భూత-భవిష్యత్ వర్తమాన కాలములందు అదియే ఏకరసమై, నిత్యమై, ’కాలము’ అనే కల్పనయే లేనిదై ప్రకాశించుచున్నది. ఓ రఘురామా! జ్ఞానప్రాప్తి కలుగనంతవరకు నీకీ మూడు ఆకాశముల కల్పన ఉండనే ఉంటుంది. సర్వకల్పనలు నశించేవరకు, జ్ఞానోదయం అయ్యేవరకు ఇట్టి ఉపదేశములు అవసరమే అగుచున్నాయి. నీవు కూడా జ్ఞానోదయం అయ్యేవరకు ఈ విభాగమంతా పరిశీలిస్తూ ఉండు.

మాయా కళంకితమైన చిదాకాశము నుండి చిత్తాకాశము, భూతాకాశము ఉత్పన్నమౌతూనే ఉంటున్నాయి. ఆహాఁ! ఏమి విచిత్రమో చూచావా? మాయావేష్టితమైనట్టి చైతన్యమే “చిత్తత్వము (‘చిత్తము’ అను స్వభావం)” ను పొంది ఆ మలినరూప సంచయమంతా జగత్తు రూపమున గాంచు చున్నది. వివిధ కల్పనలతో కూడినదై, “త్రిలోకములు” అను ఇంద్రజాలమును నిర్మించుకొనుచున్నది. “ఇది ముత్యపు చిప్పయే కదా! ఇందు వెండి ఉండటానికి అవకాశమెక్కడ?” అను జ్ఞానము లేనివాడు ఆ ముత్యపు చిప్ప యందు వెండినే చూస్తూ ఉంటాడు. అజ్ఞానికి మాత్రమే చైతన్యము నందు మలిన రూపమగు చిత్తము యొక్క అనుభవం కలగటం జరుగుతోంది. లోకంలో ‘అజ్ఞానము’ అనే దోషముచే మాత్రమే బంధము కలుగుచున్నది ‘జ్ఞానము’ అను బలముచే మోక్షరూపమగు ఆనందము సిద్ధించుచున్నది.

ఈ జగద్రూపము యొక్క రహస్యము ఇంత మాత్రమే.

  1. అడవిలో చిక్కుకున్న బాటసారులు

ఓ రామచంద్రా! ఈ ‘చిత్తం’ అనునది ఎక్కడినుంచో ఆకస్మికంగా ఉత్పన్నమై వచ్చిపడింది. సరే, ఇప్పుడేం చేయాలి? ఈ చిత్తం ఎక్కడినుండి వస్తే మనకేం? ముందుగా ఈ చిత్రాన్ని ’ఆత్మవిముక్తి’ యందు జాగరూకతతో నియోగించాలి. స్వస్వరూపి, సర్వాత్మకుడు, బ్రహ్మతత్వ స్వరూపుడగు పరమాత్మ యందు దీన్ని లగ్నం చేయాలి. క్రమంగా వాసనలన్నీ రహితం కావాలి. అప్పుడు ఏ విధమైన కల్పన లేనిదై, ఈ చిత్తం ‘ఆత్మ స్వరూపము’నే పొందుచున్నది. ఆత్మ రూపంగానే వెలుగొందుచున్నది.

Page:532

ఈ చరాచరజగత్తంతా చిత్తమునకే అధీనమైయున్నది. అనగా, బంధ-మోక్షములు కూడా చిత్తము యొక్క అధీనంలో ఉన్నట్లే కదా! ఈ సందర్భంలో పూర్వం నా పితృదేవులగు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన చిత్తచాంచల్యమునకు సంబంధించిన ఒక చమత్కారమైన కథ గుర్తుకు వస్తోంది. అది చెపుతాను విను.

ఒకచోట ఒక గొప్ప అరణ్యం ఉన్నది. ఆ అరణ్యం అతి విశాలమై, శూన్యవంతమై, అశాంతి మయమై, అతిభయంకరమై ఉన్నది. దాని ముందు అనేకవేల లక్షల యోజనాలు కూడా అత్యంత స్వల్ప భాగంగా కనిపిస్తున్నాయి, అది అంత విస్తీర్ణమైనదన్నమాట! ఆ మహారణ్యలో అతిభీకరమైన ఆకారము కలిగిన ఒక పురుషుడు ఉన్నాడు. అతడు అనేక చేతులు, అనేక కాళ్ళు కలిగియున్నాడు. “మహావ్యాకులచిత్తుడై ఉన్నాడా?” అని అతనిని చూచినపుడు అనిపిస్తోంది. చూడటానికి అతిభయంకర మైన ఆకృతితో ఉన్నాడు. “ఇతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు?” అని నేను మరికొంత పరిశీలనగా చూచాను. అతడు తన వేలాది చేతులతో అనేక గుదిబండలు తీసుకొని తన వీపుపై తానే బాదుకొంటూ, ఆ అరణ్యంలో పిచ్చిపిచ్చిగా సంచరిస్తున్నాడు. అటుఇటు పరుగులు తీస్తున్నాడు. అతిదీనంగా తనను తానే బాధించుకొంటున్నాడు. అట్లా అతడు అనేక యోజనముల దూరం పరిగెత్తడం చూచాను. పాపం, వివేకదృష్టి లేకపోవడం చేత అత్యంత వివశుడై పడుచూ, లేస్తూ. ఇటు అటు తిరుగుచూ, బాగా అలసిపోయి ఉన్నాడు. అతని అవయవములన్నీ తీవ్రమైన హింసను అనుభవిస్తున్నాయి.

అట్లా అతడు పరుగులు తీస్తూ పోయి పోయి ఒక లోతైన నూతిలో పడ్డాడు. ఆ నుయ్యి యొక్క లోపలిభాగం అత్యంత దట్టమైన చీకటి అలుముకుని ఉండటంచేత అసలేమీ కనిపించుటలేదు. చాలా సేపటికి ఆ పురుషుడు ఆ నూతిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మరుక్షణం మరల తననుతానే బాదుకొంటూ పరిగెత్తడం ప్రారంభించాడు. చాలా దూరం పరుగెత్తి ఈమాటు మరొక ప్రదేశం ప్రవేశించాడు. అతడు ప్రవేశించిన ప్రదేశమంతా దట్టమైన ముళ్ళపొదలతో నిండి ఉంది. అది అత్యంత బాధాకరంగా ఉండినది. అగ్నిని సమీపించిన మిడుతలాగా అక్కడ ఎంతో క్లేశం అనుభవించాడు. అక్కడ గల రక్కిస ముళ్ళు అతని దేహమును నిర్దాక్షిణ్యంగా బాధించాయి. ఇంతలోనే అక్కడి నుండి లేచాడు. తననుతానే కొట్టుకొంటూ అటు-ఇటు పరుగెత్తసాగాడు. అట్లా చాలాదూరం వెళ్ళాడు. ఈ మాటు ఒక అరటిచెట్ల వనంలో (తోట) ప్రవేశించాడు. ఆ తోట పున్నమినాటి చంద్రుని కిరణాలులాగా శీతలంగాను, మనోహరంగాను ఉండియున్నది. మరల ఎందుకో ఒక్క క్షణంలో ఆ అరటితోటను వదలి తనను తాను బాదుకొంటూ పరుగెత్తసాగాడు. చాలా దూరం పరిగెత్తటంచేత అతని అవయవములు ఛిన్నాభిన్నం కాసాగాయి. మరల గుడ్డివాడిలాగా ఇతఃపూర్వపు అంధకూపంలోకి పోయి పడ్డాడు.

కొంతసేపు గడచింది. ఆ చీకటి నుయ్యిలోంచి మరల బైటకు వచ్చాడు. మళ్ళా అరటితోటలో ప్రవేశించాడు. అక్కడి నుండి ముళ్ళతోకూడిన గంభీరమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ విధంగా

Page:533

అతడు ముళ్ళపొదల నుండి నూతిలోకి, నూతిలోంచి అరటితోటలోకి తనను తాను పీడించుకొంటూనే పరిగెత్తటం చాలాసేపు నా వివేక దృష్టితో నేను గమనించాను. అతడు నిష్కారణంగా పరుగులు తీస్తూ అలసిపోవటం, తనను తానే హింసించుకోవటం, రోదించటం చూచి నాకు ఎంతో జాలివేసింది.

అప్పుడు నేను నా యోగబలంతో అతనిని మార్గంలో ఒకచోట ఒక ఐదు నిమిషాలు ఆపాను. “ఏమయ్యా బాబూ! నీవు ఎవరవు? ఇటువంటి విచిత్ర కార్యం ఎందుకు చేస్తున్నావు? నీ బాధ ఏమిటి? నిన్ను నీవే ఎందుకు బాధించుకొంటున్నావు? నీకేం కావాలి? వ్యర్థంగా ఇట్లు ఎందుకు విమోహితుడవగుచున్నావు?” అని ప్రశ్నించాను. నేను ఇట్లా ప్రశ్నిస్తూ ఉండగానే అతడు పెద్ద గొంతుకతో ”ఓ మునీ! నేనెవ్వరనూ కాదు. నేనేమీ చేయుటలేదే? నీవే నన్ను హింసిస్తున్నావు. ఇక్కడ నీకేం పని? నీవే నా శత్రువు” అని ఆవేశంగా అరవసాగాడు. నేను అనునయ వాక్యాలతో అతనిని కొంత ప్రశాంత పరచాను. నాపై గౌరవంతో, నమ్మికతో నేను చెప్పేది వినటం ప్రారంభించాడు. చాలాసేపు గడచిన తరువాత లేచి నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా తలపంకించాడు. “అవునులే, మిత్రమా! నిన్ను చూడగానే నేను సుఖముగాని దుఃఖముగాని పొందుటలేదు. నీ సహచర్యంతో సత్యాసత్య, నిత్యానిత్య విషయం ఏమిటేమిటో తెలుస్తోంది" అని పలికాడు. తనయొక్క శిథిలములైన అవయవములవైపు ఒకసారి తేరిపార చూచాడు. కొద్దిసేపు సంతుష్టుడైనాడు. ఇంతలోనే ఎలుగెత్తి దుఃఖించసాగాడు. కన్నీళ్లు ప్రవహించసాగాయి. కొన్ని క్షణాలకు ఎందుకో ఏడుపు ఆపాడు. తన అంగములను చూచి నన్ను ఎరుగుచు నవ్వుకొన్నాడు. ఇంతలోనే వికటాట్టహాసం చేశాడు. ఆ అట్టహాసం ముగించిన తరువాత నా ఎదుట అతడు క్రమంగా తన అవయవములన్నిటినీ త్యజించి వేయసాగాడు. మధ్యమధ్యలో నాతో సంభాషిస్తున్నాడు, సంప్రదిస్తున్నాడు. అతిభయంకరమైన అతని శిరస్సు మొదట నేల వ్రాలింది. ఆ తరువాత క్రమంగా అతని కాళ్ళు, చేతులు, వక్షస్థలం, పొట్ట జారి పడ్డాయి. ఈ విధంగా నియతి శక్తి-జ్ఞానముల ప్రభావములచే అతడు అంగములన్నీ త్యజించాడు. అటు తరువాత స్వస్థత చెందటానికి ఉద్యుక్తుడయ్యాడు.

అతనిని అట్లాగే వదలి నేను మరొకవైపు చూచాను. అక్కడికి మరికొద్దిదూరంలో, మరొక ఏకాంత ప్రదేశంలో అట్టివాడే అయినట్టి మరొకడు కనిపించాడు. అతడు కూడా మొదటివానివలెనే తనను తాను బాదుకొంటూ హింసించుకొంటున్నాడు. గట్టి బాహువులతోను, ఆ బాహువులలో గల గుదిబండలతోను తనను తాను బాదుకోవడం అతిదారుణమైన విషయమనిపించింది. అతడు కూడా నూతిలో పడటం, బయల్వెడలటం, ముళ్ళ పొదలలోకి పరుగులు తీయటం, అక్కడినుండి అరటితోటలో ప్రవేశించటం చేస్తున్నాడు. మరల మరల దుఃఖిస్తున్నాడు. ఇంతలోనే తననుతానే సుదాయించుకుంటూ సంతోషిస్తున్నాడు. మరల, మరికొంతసేపైనతరువాత తననుతాను బాదుకొంటున్నాడు. అతని వింతక్రియలను కూడా చాలాసేపు చూస్తూ ఉన్నాను. అప్పుడు అతనిని కూడా ఆపాను. కొన్ని ప్రశ్నలు వేశాను. అతడు సమాధానాల కొరకు యోచించాడు. లభించలేదు. అప్పుడు నన్ను మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ విధంగా మా ఇద్దరి మధ్య అనేక ప్రశ్నలుPage:534

జవాబులు నడిచాయి. ప్రశ్న-సమాధానాల ద్వారా అతనికి అనేక విషయాలు బోధించాను. అతడు ఒక ప్రక్క ఏడుస్తూ - నవ్వుతూనే మరొక ప్రక్క నేను చెప్పుచున్నదానినంతా విచారించాడు. అతని అంగాలన్నీ అప్పటికప్పుడే ఛిన్నాభిన్నములైనాయి. అప్పటికప్పుడు నిర్మలరూపుడయ్యాడు. ప్రయాసతో కూడిన పరుగులను ఆపి, ఇక అక్కడినుండి బయల్వెడలటానికి సిద్ధమైనాడు.

ఇక త్రోవలో ఆ అడవిలో మరికొంతదూరం పరిశీలిస్తూ పోయాను. మరొక ఏకాంత ప్రదేశంలో అట్టివాడే మరొకడు తారసపడ్డాడు. అతడు కూడా పరిగెత్తుకుంటూపోయి ఒక అంధకూపంలో పడటం చూచాను. అతడు ఆ నూతిలోంచి బైటకు వస్తాడేమోనని అతనికోసం కాచుకు కూర్చున్నాను. చాలా సమయం గడచిపోయింది. ఏదీ? ఆ మూర్ఖుడు ఆ నూతిలోంచి బైటకు రాడే? ఇక వెనుకకు మరలాలని ఉద్యుక్తుడనౌతున్నాను. ఇంతలో అతడు బైటకు రావటం చూచాను. నేను అతనిని పలకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండగానే అతడు నా కేకలు వినిపించుకోకుండా మరల ఆ చీకటి నూతిలోకి దూకబోయాడు. ఎట్లాగో అతి కష్టంగా నా యోగబలంతో బలవంతం మీద అతనిని ఆపాను. ఇతఃపూర్వంలోలాగానే అవే ప్రశ్నలు వేశాను. అతడు నా ప్రశ్నలను అర్థంచేసుకున్నట్లు లేడు. నన్ను గుడ్లు ఉరిమి చూస్తూ “ఓ మూర్ఖుడా! నీకేమీ తెలియదు. నేను నిన్ను నమ్మను. నన్నెందుకు ప్రశ్నిస్తావు? నీవు దుష్టుడివలె ఉన్నావే? నువ్వు నాకేం చెపుతావు? ఇక ఆపు. నీలాంటి వారిని ఎందరినో చూచాను. నిన్ను నమ్మేది లేనేలేదు. నేను నాసంగతి ఇంతే” అని అరచుచు యథాప్రకారం తన వ్యాపారంలో మునిగాడు. మరల ఆ చీకటి నూతిలోకి దూకాడు.

ఆ తరువాత నేను ఆ ఆ మహారణ్యంలో సంచరిస్తూ, ఇట్టి వారినే అనేకులను చూచాను. వారిలో కొందరు నా ప్రశ్న, సమాధానాల ప్రభావంచే బోధితులైనారు. వారి దృష్టి పథంలోనించి స్వప్నం వలె మిథ్య అయినట్టి వారి గుదిబండలు ధరించిన చేతులతో కూడిన దేహము “లేనిది” కాసాగింది. వారు శాంతులయ్యారు. కొందరు నా వాక్యములు విననైనాలేదు. వారు అక్కడి అంధకూపములలో పడిలేస్తూనే ఉన్నారు. మరికొందరు అరటితోటలోంచి చాలాసేపటికి బైటకు వస్తున్నారు. నేను చెప్పేది లక్ష్యపెట్టకుండా మళ్ళా పొదల అడవిలోకి పరుగెత్తుకుపోతున్నారు. ఇంకా కొందరు ముళ్ళపొదల అడవిలోనే ఉంటూ, అక్కడే అంతులేని వేదనలు పొందుచున్నారేగాని, బయటకు వచ్చుటలేదు.

కొందరు “నువ్వు చెప్పక్కర్లేదు…. ఇది మా ఇష్టం" అని నాతో పలుకుచూ, కామ్య కర్మ పరాయణులై ఇటూ - - అటూ తిరుగుచూనే ఉన్నారు. నన్ను పట్టించుకోవటంలేదు.

ఆ మహారణ్యమంతా ఈ విధంగానే ఉన్నది.

ఓ రామచంద్రా! ఆ మహారణ్యము ఇప్పటికి అక్కడే ఉన్నదయ్యా! దానియందు ఆయా పురుషులు ఆ విచిత్ర వ్యవహారములను అట్లే చేస్తున్నారు. నేనే కాదు. నీవు కూడా ఆ మహారణ్యం చూచావు. చూస్తున్నావు కూడా! కాని, సూక్ష్మబుద్ధితో గమనించకపోవుటచే ఆ అరణ్యమును

Page:535

ఎరుగకపోతున్నావు. ఆ అరణ్యం అందరికీ కనిపిస్తూనే ఉన్నది. ఈ సభలో చాలామందికి ఆ ఆరణ్యబాటసారులు తారసబడుతూనే ఉన్నారు.

ఆహాఁ! ఏమి దౌర్భాగ్యం! ఉత్తమమైన మనుజ జన్మ పొందికూడా తాము సంపాదించుకొన్న బుద్ధికౌశలత్వాన్ని సద్వినియోగపరచుకోవటం లేదే? దానిని వృథాయే చేసుకుంటున్నారు కదా! అతి భయంకరము, ముళ్ళచే నిండియున్నది. గాఢాంధకారముచే వ్యాప్తమైనది అగు ప్రదేశములను వారు “ఇవి పుష్పవాటికలే కదా” అని తలచి మోహం చెందుచున్నారే? వాటినే మరల మరల సేవిస్తూ దుఃఖితులౌతున్నారు. "వీరు సంస్కరించబడేది, శాంతిని పొందేది ఎట్లా” అనియే నేను

మరల మరల యోచించటం జరుగుతోంది. మేము వారికి ఏ రకంగా సహాయం చేసేది?

  1. కథా సంఘటనలు - ఉద్దేశము

శ్రీరాముడు : మహాత్మా! ఆ మహారణ్యం ఉన్నది ఎక్కడ? ఎట్లా ఉన్నది? నేను దానిని చూచానని అంటున్నారే? చూచినట్లు నాకు గుర్తులేదే? అందున్న ఆ భీకరమైన ఆకారములుగల జీవులు ఎవరు? వారంతా అట్లా ఆయారీతులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు ఎప్పుడు ఎందుకు ఆ మహారణ్యంలోకి వెళ్ళారు? ఈ సభలోని మహనీయులెందరో ఆ అరణ్యం చూస్తూనే ఉన్నారని అన్నారుకదా! మీరు ఏ ఉద్దేశంతో ఈ సంఘటన చెప్పారో నేను గ్రహించలేకపోతున్నాను. దయచేసి మీ ఉద్దేశమేమిటో మీరే వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ వృత్తాంతమంతా చెపుతాను. విను. ఆ మహారణ్యముగాని, ఆ పురుషులుగాని ఎక్కడో లేరు సుమా! అత్యంత గంభీరము, విశాలము అయిన ఈ సంసారమే ఆ శూన్యారణ్యము.

బ్రహ్మము విచారించబడినప్పుడు “ఇదంతా ఆత్మచే పరిపూర్ణమైయున్నది. కదా” అని గ్రహించ బడుతుంది. అప్పుడిక ఆత్మకు వేరైనదేదీ ఎక్కడా గోచరించదు. అనగా, పరమార్థ దృష్టిచే ఈ సర్వము బ్రహ్మము రూపంగానే కనిపిస్తుంది. అప్పుడీ సంసారారణ్యం వస్తురహితమై శూన్యంగా గోచరిస్తుంది.

అట్లా కాకుండా జగద్దృష్టితో చూచినప్పుడు మాత్రం ఇది మహావికారయుక్తమై ఉంటోంది. ఈ సంసారారణ్యంలో అనేక సాంసారిక దృష్టులచే వికృతాకారం కలిగి సంచరిస్తున్నవారు ఈ జీవులే సుమా! వీరు భ్రాంతిచే అత్యంత దుఃఖితమైన చిత్తము కలవారై ప్రవర్తిస్తున్నారు. వారలను చూస్తున్న ద్రష్టయగు నేను ఆ జీవునియందలి వివేకమును. నేను వారిని ఈ సంసారారణ్యంలో అట్టి సంచలనముతో చూస్తున్నది నాయొక్క వివేకము చేతనే కదా! వివేకముచే వారి మనస్సులకు “ప్రబోధము” కలుగజేయుటకు నిరంతరం శాస్త్రములు, గురువులు యత్నించుచునే ఉన్నారు. వారంతాకూడా ’వివేకము’, అనుదానిచే ఉద్దేశింపబడ్డారు. ఈ సంసారంలో సంచరిస్తున్న కొందరు తత్త్వజ్ఞానరూపమగు ప్రబోధమును పొందినవారై అద్దాని ప్రభావంచేత చిత్తశాంతిని పొంది ముక్తులు

Page:536

అవుతున్నారు. మరికొందరు వారివారి వివేకములను వాంఛించక తిరస్కరిస్తూ అజ్ఞానకూపంలో పడుచున్నారు.

“అగాధమగు చీకటి నూతులు” = నరకములు

“అద్దాని నుండి లేవనివారు” = పాపకార్యములందు ప్రవృత్తి కలవారు. “అరటితోటలో ప్రవేశించినవారు” = స్వర్గలోక భోగములందు ఆసక్తులై తత్సంబంధమైన యజ్ఞాది పుణ్యకార్యములకు ఆయత్తమగుచున్నవారు. పుణ్యవంతులు. “ముళ్ళపొదల అరణ్యంలో ప్రవేశించువారు” = కర్మపరంపరాసక్తులతో కూడిన మనుజ రూపమున పరిణామము పొందినవారు. అంటే, కర్మ చక్రమును పొందినవారు. ఈ మనుజ జన్మ పొందినవారిలో కొందరు జ్ఞానసంపన్నులై సంసార బంధము నుండి తప్పించుకొని ముక్తులగుచున్నారు. మరికొందరు ఒక యోని నుండి మరొక యోనికి వెళ్ళుచు స్వర్గ - నరక - భూలోకముల మధ్య పరిభ్రమిస్తున్నారు.

‘ముళ్ళపొద’ = దుఃఖములచే పూర్ణమై, భౌతిక స్వభావయుక్తమై, కుటుంబ, బంధు, స్నేహాదులు కలిగి రకరకాల ఇచ్చలతో కూడుకొని యున్నట్టి ఈ చిత్తము యొక్క స్థితి.

కొందరు ఆయా శాస్త్రములచే నిర్ణయింపబడుచున్న పుణ్యకర్మలను ఆచరించుచున్నారు. తద్వారా, తమ మనస్సును పరిశుద్ధ పరచుకుంటున్నారు. ధ్యేయ వస్తువు నందు (పరమాత్మయందు) తమ చిత్తమును సంలగ్నం చేస్తున్నారు. ఆయా ఉపాసనలను, సుహృద్భావపూర్వకమైన త్యాగాదులను ఒనర్చుచు, “గ్రహమండలము-సప్తర్షి మండలము-ధ్రువమండలము” మొదలైన ఉత్తమ పదములకు, గతులకు అర్హులగుచున్నారు. అట్టివారు అధికమైన తేజోసంపన్నులై తత్త్వజ్ఞానముచే ఎల్లప్పుడు శ్రేయమునే పొందుచున్నారు.

"కొందరు అజ్ఞులు నన్ను తిరస్కరించారు” = ఆత్మ జ్ఞానమును ఆశ్రయించక, కొందరు తమ వివేకమును తామే తిరస్కరిస్తూ దూషించుచున్నారు.

“నిన్ను చూడగానే నశించుచున్నాను. నీవు మా శత్రువు” = ఈ మాటలు చిత్తము యొక్క విలాసమే. వివేక దృష్టి ఏర్పడుచుండగా చిత్తము క్రమంగా వినాశనం పొందటమే అది. “ఆర్తనాదం చేస్తూ బిగ్గరగా ఏడ్చువాడు” = భోగములు, విషయములు త్యజించుచుండగా భేదము పొందుచున్నట్టి ఈ చిత్తము యొక్క చమత్కారం.

వివేకము కొంత కొంత వికసించుచున్నప్పుడు ఇక భోగములు త్యజించబడుతూ వస్తాయి. అప్పుడు ప్రారంభదశలో ఈ చిత్తము కొంత కొంత దుఃఖము పొందుతూ ఉంటుంది. అల్పవివేకము గల చిత్తము స్త్రీ, పుత్రులు మొదలైన వాటిని కరుణాదృష్టితో తిలకిస్తూ “ఎంత కష్టం వచ్చింది! నా బంధువుల గతి ఏమిటి? వీరికి నేనంటే ఎంత అభిమానం!” అని తలచుచూ దుఃఖములు పొందు తోంది. పూర్ణజ్ఞానము, ఆత్మపదప్రాప్తి ఇంకా పొందనప్పుడు ఈ స్నేహములు మొదలైనవి కోల్పోయే సమయంలో చిత్తము కొంత ఆవేదన పొందటం సహజమే. ఇదంతా సంసార వైచిత్ర్యమే సుమా!

Page:537

“నన్ను ఎరుగుచు, ఆ ఆ పురుషుడు నవ్వాడు = వివేకమును పొందిన చిత్తము సంతుష్టిని పొందుచున్నది.

వివేకము పొందిన చిత్తము క్రమంగా సంసార స్థితిని, తనయొక్క చిత్తత్వమును త్యజిస్తుంది. అప్పుడు ఆ చిత్తములో అకృతిమమైన ఆనందం వెల్లివిరుస్తుంది. అందరిపట్ల స్నేహభావం స్వయముగా పెంపొందించుకొంటుంది. ఇంతవరకు తనయందు చోటు చేసుకొన్న మోహము, ద్వేషము, లోభము మొదలైన అజ్ఞాన వీచికలను గుర్తుకు తెచ్చుకొని, “ఆహాఁ! మిథ్యావికల్పములతో రచించబడుచున్న విషయములచే నేను ఇంతకాలం ఎంతగా వంచింపబడ్డాను! ద్వేషము, ఆవేశము, కోపము, రాగము మొదలైనవి ఎంతటి హాస్యాస్పదమైన విషయాలు!" అని ఆ జీవుడు ఆశ్చర్యపడుతూ ఉంటాడు. వివేక ప్రాప్తిని పొంది “వ్యాపక బ్రహ్మము” నందు విశ్రాంతి పొందిన చిత్తమునకు ఇతఃపూర్వపు సంసారానుభవమంతా హాస్యాస్పదంగాను, స్వప్నమాత్రంగాను ఉంటూ ఉంటాయి. “నేను పడ్డ క్లేశములన్నీ నా అజ్ఞానము యొక్క పరిణామమే కదా” అని అతడు గ్రహిస్తాడు.

“నేను అతనిని ఆపి ప్రశ్నించాను” = వివేక బలముచే చిత్తము నిగ్రహించబడినది. “అవయవములన్నీ ఛిన్నాభిన్నమై లుప్తం అయ్యాయి” = చిత్తము శాంతించగా, సర్వ పదార్థములపట్ల ఆశలు ఉపశమించాయి. ”వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళు గలవాడు” = ఇష్ట-అయిష్టములే రూపముగాగల ఈ చిత్తమే ఆ విధంగా వర్ణించబడినది. మనస్సులో ఎన్ని ఆశలు? ఎన్ని ఆసక్తులు? ఎన్ని ప్రియాప్రియములు? “తనను తానే బాదుకొనుచున్నాడు. హింసించుకొనుచున్నాడు” = దుష్ట సంకల్పములచే ఈ మనస్సు తనను తానే బాధించుకొనుచున్నది. “తననుతానే కొట్టుకొనుచు, పరుగెత్తుచున్నది” = మనస్సు తన యందలి వాసనలచే కొట్టబడుచు, ముల్లోకములందలి అనేక యోనులలో ప్రవేశించుచున్నది.

ఓ రామచంద్రా! అజ్ఞానము యొక్క విచిత్రమైన లీలలు చూచావా? ఈ చిత్తము తన కోర్కెలను అనుసరించే తననుతానే బాధించుకొనుచు పరుగులు తీయుచున్నది. జీవుడు బ్రహ్మపదము పొందవలె నని లక్ష్యము పొందియుంటున్నప్పటికీ, “వాసనారాహిత్యము” అతడు పొందనంతవరకు అతని చిత్తము దుర్విషయముల అభ్యాసముచే ‘క్షోభ’ చెందుచూనే ఉన్నది. చిత్తములన్నీ సంసారారణ్యంలో పరుగులు తీస్తున్నాయి. ఈ జీవుని దుఃఖములను విస్తరింపజేయుచున్నది మనస్సే. అది అనేక ఆవేదనలను తనయందు దాచుకొన్నదై, మిక్కిలి భిన్నముగా అటు-ఇటు పరుగులు తీస్తోంది. పట్టుపురుగును గమనించావా? అది తనచేత నిర్మించబడిన గూటియందు తానే చిక్కుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ మనస్సు కూడా తననుండి బయలుదేరిన సంకల్ప-వాసనాదులచేతనే బంధింపబడి, అనేక వేదనలకు గురి అగుచున్నది. ఊరకుక్కను గమనించావా! అది ఎందుకో- ఏమిటో తెలియకుండానే వీధులలో చుట్టి చుట్టి పరుగులు తీస్తోంది. బాలుడు భవిష్యత్తులోని సాధకబాధకాలు

Page:538

తెలియక దుష్ట పదార్థాలను భుజించటం, దుష్టప్రదేశాలలో సంచరించటం చేస్తూ ఉంటాడు. ఈ మనస్సు ముందు-వెనుకలను, ప్రయోజన-నిష్ప్రయోజనములను చూచుకోకుండానే అనర్థములను ఆశ్రయిస్తోంది. అనేక దుఃఖపూరితములైన కార్యక్రమములకు తనను తానే బలవంతంగా సమర్పించుకొంటోంది. చపలమగు కోతి తన చాపల్యం చేత చీల్చబడుచున్నట్టి దుంగలో కాలుపెట్టి యమయాతనలు తెచ్చిపెట్టుకొంటుంది చూచావా? చంచలమగు మనస్సు కూడా అనేక ఆసక్తులచే రాగద్వేషములను సంతరించుకొని సంచరించుచు అనేక దుర్భర పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకొంటోంది. శ్రీరాముడు : మహర్షీ! మరి ఈ మనస్సు తన చాంచల్యము వదలదా? దీని గతి ఇంతేనా? శ్రీ వసిష్ఠ మహర్షి : నిరుత్సాహపడవలసిన పనిలేదయ్యా! దీనిని అభ్యాస ప్రభావంచేత తప్పకుండా వశం చేసుకోవచ్చు. ఓ జనులారా! బాహ్యాడంబరములను, వృథాకాలయాపనలను, అల్ప లక్ష్యములను క్రమక్రమంగా తగ్గించుకోండి! మనసుకు మౌనం, ప్రశాంతత, సర్వులపట్ల అవ్యాజమైన ప్రేమ అలవాటు చేయండి. ఈ మనస్సు చిరకాలం ప్రపంచ రహిత సమాధిని అభ్యసించాలి. అనగా, మీ మనస్సు ప్రపంచమునకు సంబంధించిన మననము చేయకుండా చూచుకోండి. ఆత్మభావననే (సర్వము ఆత్మస్వరూపంగా) దృఢం చేసుకోవాలి. ఇక వేరే ఉపాయంలేదు. మనస్సు యొక్క ప్రమాదము వలననే ఈ జీవునకు అనేక దుఃఖములు పర్వతమంత ఆకారంగా వృది చెందుచున్నాయి. ఈ మనస్సు వశీకృతమైనదా…. ఇక మిగతా జాడ్యమంతా తనంతటతానే నశిస్తుంది.

మానవుడైనవాడు, శాస్త్రార్థములను చక్కగా గ్రహించాలి. ఉత్తమమైన సంస్కారములను అలవరచు కోవాలి. సమభావనను అన్నివేళల అభ్యసిస్తూ ఉండాలి. రాగద్వేషములకు విచలితం కావటమును తగ్గించుకొంటూ ఉండాలి. ఇంద్రియముల ప్రభావమును నిరోధిస్తూ దృష్టిని సర్వాత్మస్వరూపుడగు పరమాత్మవైపుకు సారించాలి. అప్పుడాతడు తప్పక అతి పవిత్రమగు బ్రహ్మపదమున చిరకాలం ప్రతిష్ఠితుడు కాగలడు. అట్టి “ఆత్మసారూప్య స్థితి" యందు జన్మాది వికారములు ఉండవు. అది పరమశాంతిదాయకమైనది. అందు ఈ ఆధ్యాత్మిక - ఆధిభౌతిక - - ఆధిదైవిక తాపములకు చోటు ఉండదు. అట్టివాడు దుఃఖములు పొందడు. విపత్తులకు విచలితుడు కాడు. ఓయీ! మానవుడా! ఈ జన్మయందే, ఇప్పుడే ఉత్తమమైన ప్రయత్నములు, విచారణలచే అట్టి ఆత్మస్థితిని ప్రాప్తింపజేయు విషయమై ఎందుకు శ్రద్ధ కలిగి ఉండరాదు? చిత్తమును జయించి, జ్ఞానస్థితిని పొందుటకు ఇంతకన్నా ఉత్తమమైన అవకాశము ఎక్కడున్నది?