Page:539
VIII. బాల వినోదము
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సముద్రంలో తరంగములు ప్రకటితమగుచున్నట్లు, పరమపదమగు బ్రహ్మము నుండే ఈ ‘మనస్సు’ అనునది ప్రకటితమగుచున్నది. “మనస్సు లేదు” అని, “మనస్సు తప్ప మరింకేమీ లేదు” అని కూడా చెప్పవచ్చు సుమా!
మనస్సు లేదు = ‘మనస్సు’ వాస్తవానికి లేదు. బ్రహ్మం మాత్రమే ఉంది. అయితే మనస్సుగా ప్రాప్తించేదంతా బ్రహ్మం గురించిన ఏమరుపు-అజ్ఞానం యొక్క వికాసము మాత్రమే అయి ఉంది.
మనస్సు తప్ప మరింకేమీ లేదు = శుద్ధబ్రహ్మమే ఇట్లు స్వకీయమైన ఇచ్చచే సువిశాల దృశ్యరూపంగా వివర్తము చెందుచున్నది. కనుక, ఈ కనబడే సర్వము ఆ ద్రష్టయొక్క మనస్సే!
రెండు వివరణలూ సమంజసమే అగుచున్నది. జలసామాన్య రూపము ఎరిగినవానికి “జలము వేరు, తరంగము వేరు” అను దృష్టి ఉంటుందా? ఉండదుకదా! జ్ఞానుల దృష్టిలో ఈ మనస్సు బ్రహ్మమే అయిఉన్నది? అంతేకాని ఇది వేరే ఏదీ కాదు. “జలమే ఇట్లు తరంగము అగుచున్నది“ అనే దృఢభావం లేనివానికి ”ఈ తరంగము వేరు, ఆ తరంగము వేరు" అనే దృష్టి బలపడి ఉంటుంది. అజ్ఞానుల యొక్క స్వకీయచిత్తమే సంసారభ్రమణకు కారణమగుచున్నది. అట్టి అజ్ఞానులకు ఉపదేశించటానికే మేము వాచకములను (Technical words, jargons), వాచ్యములను (Meaning conveyed by such words) కల్పించుచున్నాము. అట్టి భేదకల్పన అంతా బోధను సునిశితం చెయ్యటానికీ, అజ్ఞాని యందు జ్ఞానదీపము వెలిగించటానికీ అయిఉన్నది.
పరమాత్మ సర్వశక్తిమంతుడు, నిత్యుడు, సర్వత్రా పరిపూర్ణుడై వెలుగు చున్నవాడు. అట్టి సర్వశక్త్యోపేతునికి సర్వశక్తిత్వమే శోభిస్తుంది కాని, అల్పత్వము కాదు. అతనిలో లేని వస్తువే లేదు. సర్వవ్యాపి అగు అతడు తనయొక్క సర్వశక్తిత్వము అంతటా క్రియారూపమున ప్రకటితం చేస్తున్నాడు. అతడు ప్రతి జీవునియందు ఉండిఉన్నాడు. ప్రతి జీవుడు అతనికంటే వేరు కాదు. ఆ బ్రహ్మము యొక్క చేతనశక్తి సర్వవిధ ప్రాణులందు కలదు. అదియే వాయువునందు చలనశక్తిగాను, బల్లయందు కఠినశక్తిగాను, జలమునందు ద్రవశక్తిగాను, అగ్నియందు ప్రకాశశక్తిగాను, ఆకాశమందు శూన్యశక్తి గాను, సంసారస్థితియందు వ్యవహారయోగ్యత్వ శక్తిగాను గాంచబడుచున్నది. ఈ విధంగా ఆ బ్రహ్మము యొక్క శక్తులన్నీ దశదిశలా వ్యాపించి ఉన్నాయి. నాశనవంతములగు పదార్థములందలి నశింప జేసేశక్తి ఇదే. దుఃఖితులైన వారిలోని శోకశక్తి, ప్రసన్నులందలి ఆనందానుభవశక్తి, సృష్ట్యాది యందలి- ప్రళయము నందలి ఉత్పత్తి - వినాశకశక్తి ఆ బ్రహ్మమే అయి ఉన్నది. సర్వపదార్థముల యొక్క “బీజము” అదే.
Page:540
ఒక బీజంలో భవిష్యత్ వృక్షము, ఆ వృక్షముయొక్క ఆకులు, పూలు, కాయలు, కొమ్మలు …. ఇదంతా సంస్కార రూపమున దాగియున్నది కదా! వృక్షముయొక్క ధర్మములన్నీ ఒకప్పటి విత్తుకు వేరైనవి కావు. ఈ జగత్తు, ఇందలి శుభ - అశుభ వ్యవహారములు …. ఇవన్నీ బ్రహ్మమునందే ఉండిఉన్నాయి. అట్లే, “చిత్తము – జడము”ల మధ్య ఉన్నట్టి ఈ ’జీవుడు’ అనబడుచున్న చిదాభాసుడు (చిద్వస్తువు యొక్క ప్రతిబింబము వంటివాడు కూడా సాక్షి చైతన్యము యొక్క ప్రకటనయే. అట్టి సాక్షి చైతన్యమే స్వరూపముగా కలిగి, అతడు బ్రహ్మమునందే స్థితి కలిగియున్నాడు. ‘నేను జీవుడను’ అను భావన చేయటం బ్రహ్మము యొక్క ఒకానొక స్వభావమే అయి ఉన్నది. ఇక ఈ దృశ్యప్రపంచం విషయానికి వస్తే, ఇందలి పదార్దములన్నీ మాయతో కూడుకొనినట్టి చైతన్యము యొక్క వివర్తమే. ఇవన్నీ కూడా శుద్ధ చైతన్య రూపములే అయి ఉన్నాయి. కనుక రామా! ఈ జగత్తు, ఇందలి ‘నేను’ అను ‘భావన’ చేస్తున్న జీవత్వము…. “ఇదంతా చిద్రూప బ్రహ్మమే” ….. అను దృష్టితోనే చూడాలి.
“చిత్ లేక ఎరుక” శరీరముగా కలిగియున్న ఆ పరమాత్మయే మహత్తరమైన శరీరము కలిగియున్నవాడై ఈ ‘నేను - నీవు - - జగత్తు’ మొదలైన సర్వవ్యవహారములతో కూడుకొని సదా ప్రకాశించుచునే ఉన్నాడు.
మనస్సు అంటే ఏమిటి? మనన శక్తిని కలిగియున్నప్పటి చైతన్యమే ‘మనస్సు’ అనే శబ్దంతో పిలువబడుతోంది. జలమును ఒడ్డున ఉండి చూస్తున్నవానికి “ఇది జలము - ఇవి వేరువేరు తరంగములు - ఇది ఆవర్తము” అను బుద్ధి కలుగుచున్నట్లు, ఈ జీవుడు మనస్సు అనేవి ప్రతిభాసా రూపమున ఆత్మయందే ఉండి ఉంటున్నాయి. "ఆత్మనుండే మనన రూపమగు మనస్సు ఆవిర్భవిస్తోంది” అనుటలో సందేహమేమిటో చెప్పు? ఓ రఘురామా! ఈ సమస్తము బ్రహ్మము యొక్క శక్తియే. కనుక ఈ బ్రహ్మాండమంతటినీ బ్రహ్మస్వరూపముగానే దర్శించు. ఇక ‘అది-ఇది-నేను’ ఇత్యాది భిన్న విభజన అంతా ప్రతిభాసావశంచేతనే ఉత్పన్నమగుచున్నది.
ఒక దృష్టాంతము విను. ఒకచోట ప్రశాంతజలముతో కూడిన ఒక తటాకం ఉన్నది. అందలి జలంలో విశాలమైన ఆకాశం ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు నక్షత్రములు ప్రతిబింబిస్తున్న విభాగములోని జలము, చంద్రుడు ప్రతిబింబిస్తున్న విభాగములోని జలము వేరువేరా? ఏది ఎట్లు ప్రతిబింబిస్తున్నా జలమంతా ఒక్కటే అయి ఉన్నది కదా! అద్వితీయ బ్రహ్మమునందే ఈ సమస్తము ప్రతిబింబిస్తోంది. వేరు వేరు సంస్కారములతో కూడిన ఈ వేరు బాహ్య - అభ్యంతర (Outward and inward) చిత్త రూపములను ధరిస్తున్నది ఒకే పరబ్రహ్మము. నిప్పుకు నిప్పురవ్వలులాగా, ఆ బ్రహ్మము యొక్క చిత్ శక్తియందు ప్రకటితమగుచున్న కిరణపుంజములమే మనమంతా! అన్ని అగ్నికణములు అగ్నియే అయి ఉన్నట్లు మనమంతా బ్రహ్మమే అయి ఉన్నాము. దేశకాలానుగుణంగా భూమి యందు ధాన్యశక్తి ప్రకటితం అవుతూ ఉంటుంది కదా! అట్లాగే పరమాత్మకూడా దేశకాలములను అనుసరించి వ్యవస్థితమగుచున్న ఫలరూపంగా ఈ “నీవు-నేను-దృశ్యము” మొదలైన రూపములలో కనబడే ఆయా శక్తులను వ్యక్తమొనర్చుచూ ఉంటాడు.
Page:541
అయితే ప్రతిభాసగా కనిపిస్తున్నది యథార్థముగా ఉన్నదౌతుందా? “ప్రతిభాసితం కారణంగా ఎండమావులలో జలము కనిపిస్తోంది. కనుక, అట్లు కనిపించటానికి కారణం అందలి జలమే” అని అనగలమా? అక్కడ వాస్తవమైన జలము లేనే లేదు కదా? ఇక అది కారణమవటమేమిటి? “దృశ్యము ఉండుట చేతనే దృష్టి ఉంటున్నది” అనునది సమంజసంకాదు. లేక, అది పరిపూర్ణమైన అవగాహన కాదు. ఇక పరమార్థ దృష్టితో చూస్తే, ఎవ్వరూ దేనిని గాంచుటలేదు. ఎందుకంటే ఈ ద్రష్ట యొక్క స్వభావం ‘సత్త’ (“Existence” Experience) యే కదా! ఎక్కడ ‘సత్త’ (Absolute Experience) మాత్రమే కలదో, అక్కడ ఎవరు దేనిని చూస్తారు?*
“ఆత్మ సత్త”కు అన్యమైన దృష్టి ఏర్పడుతుంటే, అందుకు కారణం అజ్ఞానమే” అని గ్రహిస్తావు గాక!
శ్రీరాముడు : మరి మేము ఈ దృశ్యమును ‘ఘనీభూతమైన సత్యము’ వలె పొందుచున్నామే? శ్రీ వసిష్ఠమహర్షి : కారణం? తగినంత విచారణ, పరిశీలన, లేకపోవుటయే! జ్ఞానులు మీమాంస యొక్క నాలుగు అంగములను ఉపయోగించి దృశ్యము యొక్క సత్యాసత్యములను పరిశీలిస్తున్నారు. 1) ప్రతియోగి = “అది ఉన్నదా? లేదా?” అను విచారణ
2) వ్యవచ్ఛేదము = విభాగించి పరిశీలించుట
3) సంఖ్య = విడివిడిగా పఠించుట (Studying in separate components)
4) రూపము = Analysis of “what is its actual form?”
వారు ఈ దృశ్యజగత్తును “మీమాంస” (Logic) చే పరిశీలించి, ఆపై శాస్త్రముల రూపంలో ప్రవచిస్తూ, మనకుకూడా చెప్పుచున్నారు.
ఈ జగద్వైచిత్రములన్నీ స్వయముగా వాస్తవమైనవికావు. ఇవన్నీ మనస్సు చేతనే కల్పించ బడుచున్నాయి. మనస్సు చైతన్యము యొక్క మనన శక్తియే. కనుక అట్టి మనన శక్తి యొక్క కల్పితదృష్టిచే కనిపించుచున్న ఇవన్నీ కూడా …. వివర్త రూపమున బ్రహ్మము నందే, బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నట్లు అగుచున్నది. ఇదంతా బ్రహ్మమే. ఇవన్నీ బ్రహ్మమునకు వేరైనవి కావు”.
“ఈ దృశ్యము బ్రహ్మమే అయిఉన్నది (విశ్వమ్ విష్ణుః)” అను విషయమే ఉపనిషత్తులు, సత్య ద్రష్టలగు మహర్షులు అనేక రీతులలో ఘంటాపథంగా నిరూపించుచున్నారు. ప్రతిభాసాత్మకమైన ఈ మనస్సుకు అతి విచిత్రమైన ఒక శక్తి ఉన్నది. ఇది ఏ విధంగా దేని యందు ప్రవృత్తమగుచున్నదో అది ఆ విధంగానే ప్రాప్తించగలదు. ఐందవుల సృష్టియే మనకు ఇక్కడ దృష్టాంతము.
“యత్తత్పస్యాత్ అద్వైతమేవాభూత్ తత్ర కేన పశ్యత?”
Page:542
అందుచేత, రామా! “నాతో సహా ఈ ఈ సర్వము సర్వదా అంతా చైతన్యమే అయి ఉన్నది. త్రికాలములలోను (In the past, in the present and also in the future) పరబ్రహ్మమునకు వేరైనది ఎచ్చటా లేదు” …. అనియే నీ మనస్సు అన్ని వేళలా ప్రవృత్తమగుచుండుగాక! దాని ఫలితంగా మోక్షం స్వయంగా ప్రాప్తించగలదు. ఒకడు తనకు ప్రవాహపతితంగా ప్రాప్తిస్తున్న ఆయా కార్యములను నిర్వర్తిస్తూ “నాతో సహా సర్వం బ్రహ్మమే" అను భావన కలిగియుండుటలో ఏమి కష్టముంది చెప్పు?
ఏ జలములో అయితే ప్రశాంతత ఉన్నదో అదే జలములో తరంగత్వము కూడా ఉంటున్నది కదా! “తరంగము” అనబడేది ఎక్కడో బైటనుండి వచ్చిచేరే ఏదైనా పదార్థముకాదు. ‘చ్యుతి’ (Deviation) పొందటం (అనగా, ఈ జగద్భావమును అనుసరించటం); ‘అచ్యుతి’ పొందటం, (అట్టి జగద్భావమును త్యజించి ఉండటం) ఇదంతా కూడా బ్రహ్మము లేక పరమాత్మ యొక్క చమత్కారముతో కూడిన స్వభావమే అయి ఉన్నది. పరమాత్మయందే ఈ ప్రపంచ కల్పనంతా ఉండి ఉన్నది. ఇట్టి కల్పన అంతటికీ కారణం జీవరూపమున ఉన్నట్టి పరబ్రహ్మమేకాని, మరిక వేరే ఏదీ కాదు. కల్లోలముతో కూడిన సముద్రంలోని బుద్బుదములు, తరంగాలు, ఆవృత్తములు అంతా జలమే కదా! జ్ఞానికి అంతటా బ్రహ్మమే వ్యాపించియున్నట్లు అగుపిస్తోంది. వికారవంతమైయున్నట్టి ఈ జగత్తునందు పరమాత్మకు వేరుగా ఏదీ లేదు. ఆ పరమాత్మయందు - - నామరూప క్రియాత్మకమైన
– వేరొక సత్త ఎక్కడి నుండి ఎట్లా వచ్చిచేరగలదు చెప్పు? ముత్యపు చిప్పలో వెండి ఉంటుందా? భ్రమచేత మాత్రమే నిర్లిప్త-నిరవయవమగు బ్రహ్మమునందు "ఉత్పన్నమగుట, నశించుట, ఉండుట, పోవుట” మొదలైన దృశ్యవికారములు భాసించుచున్నాయి. ఆత్మ వాస్తవానికి నామరూప రహితమే అయి ఉన్నప్పటికీ, తన ఇచ్ఛను అనుసరించే ఈ జగత్ వైచిత్ర్య రూపమున భాసించుచున్నది. అట్లు ‘భాసించుట’ను తానే గాంచుచు, తన శృంఖలములను (Fetters or Limitations) తానే నిశ్చయించుకొనుచున్నది. మరొక తరుణంలో అఖండత్వమును ఆశ్రయించుచున్నది.
“కర్త-కరణము-కర్మలు-జననములు-మరణములు” ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే. అతనికి అన్యముగా ఎక్కడా ఏ కల్పనా ఉండజాలదు.
పరమార్థ దృష్టికి లోభమోహములు కూడా లేవు. ఆత్మయందు ఆత్మకు లోభముగాని, తృష్ణగాని ఎట్లా ఉంటాయి? ఈ జగత్తు, దీని కల్పనా క్రమము ఆత్మయే అయి ఉన్నది. సువర్ణమే ఆభరణములుగా ప్రకాశించుచున్నట్లు ఆత్మయే ఈ ఈ మనస్సుల రూపమున ప్రకటితమగుచున్నది. ఇక చిత్తము గురించి ఒక్క మాటలో చెప్పాలంటే …. ఇది ఉత్తమోత్తమమగు ఆత్మ పదము యొక్క “అనభిజ్ఞత్వము” లేక “ఏమరపు”…. మాత్రమే! అదియే ఈ జీవుడు!
శ్రీరాముడు : స్వామీ! మరి ఈ బంధముల మాటేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : అజ్ఞాన దశలో ఎంతగానో అనుభవమునకు వచ్చుచున్న ఈ బంధము జ్ఞానముచే విచ్ఛేదనమగుచున్నది. అప్పుడు “బంధమనునది మొదలే లేదు" అను అనుభవమే
Page:543
శేషిస్తోంది. ఆకాశమే శూన్యత్వమును వ్యక్తమొనర్చుచున్నట్లు, “అజ్ఞాత-చిన్మయి” అగు ఆ పరమాత్మయే తన సంకల్పముచే జీవత్వమును (నేను జీవుడననే స్థితిని) లీలగా, క్రీడగా ప్రకటిత మొనర్చుచున్నాడు.
ఆహాఁ! ఎంత చమత్కారం! ఈ జీవుడు వాస్తవానికి ఆత్మ స్వరూపుడే అయినప్పటికీ, అనాత్మ భూతమగు ఈ అహంకారము మొదలైన వాటితో “అభేదము”ను సంపాదించుకొనుచున్నాడు. మరుక్షణమే ఈ దృశ్య జగత్తు అంతా ఆవిర్భవించటం, ఎదురుగా నిలచియుండటం జరుగుతోంది. జీవుని యొక్క ద్వైత రూపముతోకూడిన ఈ కలుషిత దృష్టి అంతా మిథ్యమాత్రమే.
నిత్యాసంభవః బంధస్య, బద్ధం స్మీతి కుకల్పనా? యస్య కాల్పనికన్తస్య మోక్షో మిథ్యా స తత్త్వతః |
సత్యత్వాదాత్మనశ్చైవ, క్వాత్మా బద్ధః? క్వముచ్యతే ॥
ఓ సర్వజనులారా! మీరంతా ఆత్మయే అయి ఉన్నారు కదా! మరి, “కాదు నేను బద్ధుడను, ఎప్పటికో ఎవరి దయ వలననో ఎట్లో బంధ విముక్తి పొందవలసి యున్నది” అను కుకల్పన ఎందుకు చేస్తున్నారో చెప్పండి? యథార్థానికి “మోక్షము” అనుబడునది కూడా లేదు. ఎవరిపట్ల అయితే…., ‘బంధమే కుకల్పితము’ (false attribution) అని నిరూపిస్తున్నామో, అట్టి ఆత్మకు మోక్ష వ్యవహారం కూడా మిథ్యయే గాక మరేమిటి?
శ్రీరాముడు: గురువర్యా! మీరు చెప్పుచున్న దానిని అనుసరించి “ఆత్మ, మనస్సు” అనబడు ఈ రెండింటిలో ఆత్మకు బంధముగాని, మోక్షముగాని ఉండజాలదు. ఈ జీవుడు ఆత్మయే స్వరూపముగా కలిగియున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఈ మనస్సు దేనిని ఎట్లా నిర్ణయిస్తే అది అట్లే అగుచున్నది. కాబట్టి మనస్సే బంధమై యున్నదా? మనస్సే బంధమునకు, మోక్షమునకు కారణ మగుచున్నదని మీరు చెప్పియున్నారు. అయితే, ఈ మనస్సు యొక్క దర్శనమంతా కల్పితము మాత్రమే కదా! అంతా కల్పితమే అయినప్పుడు, ఈ మనస్సుకు మాత్రం బంధమెక్కడిది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, మనస్సు కల్పితమైనదే. చైతన్యము జగద్వస్తువుపై ఆసక్తి కొనియున్నప్పుడు, అట్టి ప్రసరణముయొక్క రీతినే ‘మనస్సు’ అని అంటున్నాం. అదికాక మనస్సుకు వేరే రూపమేమి ఉన్నది? ఒకడు దీర్ఘస్వప్నంలో చూచిన అనేక పదార్థాలు అతడు జాగ్రత్తుకు వచ్చేసరికి మిథ్యయే అగుచున్నాయి కదా! అదేవిధంగా, బంధమును గూర్చిన అజ్ఞానుల కల్పన మిథ్యయే. జ్ఞానుల దృష్టిలో ‘మోక్షము’ యొక్క కల్పన కూడా మిథ్యయే. అనిర్వచనీయము, తుచ్ఛము అయినట్టి ‘అజ్ఞానము’ వలననే ఈ బంధ - - మోక్షముల కల్పన అంతా జరుగుచున్నదని గ్రహించు. బంధ మోక్షములు సత్యములేనని అనటం వేద - ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నదానికి విరుద్ధంకూడా. ఉపనిషత్తులు “ఓయీ! జీవుడా! నిత్యోదిత చైతన్యస్వరూపుడగు నీకు బంధమెక్కడిది? నీవు సర్వదా అమృత పరమానంద స్వరూపుడవే” అని అవి ఎలుగెత్తి చెప్పుచున్నాయి. నేను కూడా, నా స్వానుభవముచే “పరమార్థమున బంధమోక్షములు లేవు” అనే ప్రకటిస్తున్నాను.
*"నముముక్షుర్నవైముక్త ఇత్యేషా పరమార్థతః”
యథార్థానికి ముముక్షువు గాని, ముక్తుడు గాని లేరు. ఆత్మ మాత్రమే ఉంది.
Page:544
ఓ ప్రాజ్ఞుడా! రామచంద్రా! “త్రాడును చూచి పామని అనుకోవటం” మొదలైన అనేక దృష్టాంతములచే ఈ “కల్పన” యొక్క అవస్తుత్వము గురించి ప్రబుద్ధుడైయున్న శిష్యుని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పుచున్నాం. ఇక ప్రబుద్ధుడు కానట్టి అజ్ఞాన శిష్యుని దృష్టిలో పెట్టుకొని “బంధము - - బంధవిముక్తి” మొదలైన తతంగమంతా విశదీకరిస్తున్నాం. “నాయనా! నీవు నిష్కారణంగా ‘నేను బద్ధుడను’ అను భావం స్వీకరించావు. నీయొక్క బంధమునకు విచారణయే ఉపాయం. నీవెవ్వరో, ఈ దృశ్యమేమిటో గ్రహించు. తద్వారా మోక్షభాగివి కమ్ము” అని బోధిస్తున్నాం. సర్వము గ్రహించిన తరువాత ఆ అజ్ఞాని …. విజ్ఞాని అగుచున్నాడు. ఇక ఆపై అతనికి బంధమోక్షముల ప్రసక్తి అక్కర్లేదు. అట్టి విజ్ఞాన శిష్యునితో సంభాషించునపుడు “బంధ-మోక్షములు లేవు” అను పరమ సత్యం సంభాషిస్తున్నాం. తత్త్వవేత్తలకు బంధ-మోక్షముల వ్యామోహం ఉండదు. బంధ మోక్షముల కల్పనంతా అజ్ఞానియొక్క జ్ఞానాభివృద్ధి కొరకేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. అజ్ఞానిని జ్ఞానిగా తీర్చిదిద్దుటయే గురువుల ధర్మము నిర్వర్తిస్తున్న మా కర్తవ్యమైయున్నదికదా! అందుచేత ప్రథమంలో కొంత కల్పన అవసరమై ఉంటోంది. ఈ విషయములన్నీ తత్త్వజ్ఞులు ఎరిగియే ఉన్నారు. ఓ సత్యవ్రతా! రామా! మాయావేష్టితుడగు పరమాత్మ నుండి మొట్టమొదట మనస్సు, ఆ తరువాత బంధ మోక్షముల గురించిన కల్పన, అటుపై ఈ జగన్నిర్మాణం క్రమక్రమంగా ఒక బాలక్రీడవలె రూఢీ పడుతోంది. ఈ స్థితి అంతా “బాల వినోదము” లోలాగా ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. ఈ జగదృశ్య బాలవినోదం ఎట్లా ఉంటే ఏం? పరమాత్మయే సర్వదా, అన్నిటా వెలుగొందుచున్నాడని గ్రహించు.
శ్రీరాముడు : మునీంద్రా! “బాల వినోదము నందువలె” అని అంటున్నారు కదా! అనగా ఏమిటి? ఆ “జగదృశ్య-బాలవినోదం" అనబడే చమత్కారమేమిటో చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి :“బాలకాఖ్యాయిక” లేక “బాల వినోదము” అను ఒక మాట అధ్యాత్మ శాస్త్రంలో ప్రచారమై ఉన్నది. దాని వెనుక ఒక కథ ఉన్నది. అదేమిటో చెపుతాను. విను.
అనగా, అనగా, ఒక బాలుడు ఉన్నాడు. అతని బుద్ధి “ఇది నిజము, ఇది కాదు” అనే విమర్శ చేయలేనట్టిది. బుద్ధి మాంద్యము గల ఆ పిల్లవాడు ఒక రోజు తన దాదితో "అవ్వా! నాకు నిద్ర రావటం లేదే. ఏదైనా రాజుల చరిత్ర వినిపించవూ?” అని అంటూ మారాం చేశాడు.
దాది : సరే, అబ్బాయీ! నీ వినోదం కొరకు ఆనందదాయకము, మధుర శబ్దములతో కూడినది అయిన “ముగ్గురు రాజకుమారుల అనుభవాలు” అనే కథ చెప్పుచున్నాను. ఇది విని, నీవు ఎంతో నేర్చుకోవచ్చు.
Page:545
ఒకచోట ఒక నగరము ఉన్నది. ఆ నగరంలో ఇళ్ళు-వాకిళ్ళు-బాటలు-వృక్షములు… ఇటువంటివేవీ లేనేలేవు. ఆ నగరమంతా ’శూన్యము’ తో మాత్రమే నిండియున్నది. ఆ శూన్యనగరంలో ముగ్గురు రాజకుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు గొప్ప అందగాళ్ళు, ధార్మికులు, వీరులుకూడా! అయితే, ఆకాశంలో ఎక్కడన్నా ఒక చెరువు ఉంటుందా? ఎక్కడన్నా నీళ్ళలో నక్షత్రాలు ఉంటాయా? బాలుడు : అబ్బే! ఉండవు. ఉండవు. ఎట్లా ఉంటాయి?
దాది : అదేవిధంగా, ఆ ముగ్గురు రాజపుత్రులలో ఇద్దరు ఇప్పటికింకా జన్మించనేలేదు. ఇక మూడవవాడు, ఇంకా ఎప్పటికో తల్లి గర్భంలో ప్రవేశించవలసియున్నది.
బాలుడు : అవ్వా! ఆశ్చర్యంగా ఉన్నదే ! అయితే ఆ రాజపుత్రుల గురించి నేను వినాలి. ఎందుకంటే పెద్ద అయిన తరువాత నేను కూడా రాజకుమారుడనౌతాను కదా! అట్లాగే చేస్తాను. వాళ్ళేంచేశారు? దాది : పాపం, దైవవశంచేత ఆ ముగ్గురు రాజపుత్రుల బంధు జనమంతా మరణించారు. అప్పుడు వారు ఎంతో దుఃఖాక్రాంతులయ్యారు. మలిన ముఖంతో ఒకచోట గుమిగూడి, కొంత సమాలోచన తరువాత ఒక నిశ్చయానికి వచ్చేశారు. “మనం ఇక్కడ ఇంకా ఉండి ఏం ప్రయోజనం? మన బంధువులంతా మరణించారాయె! ఇక లాభంలేదు. ఈ శూన్యనగరం వదలి ఏదైనా మరొక నగరం వెళ్ళిపోదాం” అని అనుకొన్నారు. ఒక రోజు వాళ్ళు బుధ - శుక్ర - శనులవలె ఆ శూన్య నగరం నుండి ఆకాశమార్గంలో బయలుదేరారు. ఆకాశ మార్గమధ్యంలో ఎండవేడిమికి ఎంతో తపించారు. అక్కడ (ఆకాశంలో) వేడి ఇసుకలో నడవటం చేత గుఱ్ఱాల కాళ్ళు కాలాయి. మంద నుండి వేరుపడ్డ మృగములలాగా వాళ్ళు ఎంతో పరితాపం పొందారు.
బాలుడు :ఊఁ! ఆ తరువాత?
దాది : అయినాసరే, వాళ్ళు ఆ ఆకాశంలోని ఇసుకతిన్నెలపై (ఇసుక గట్లపై) ఎట్లాగో అట్లా చాలా దూరం పయనించారు. ఒకచోట వాళ్ళకి మూడు పెద్దచెట్లు కనిపించాయి. ఆ మూడు వృక్షాలు లతలతోను, ఫలములతోను, పుష్పములతోను నిండి ఉన్నాయి. వాటి కొమ్మలు అనేక పక్షులకు ఆశ్రయమయి ఉన్నాయి.
అయితే, ఆ మూడు మహావృక్షములలో రెండు ఇంకా మొలవలేదు. మూడవదానికి ఇంకా బీజం ఏర్పడలేదు.
మన రాజకుమారులు అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్నారు కదా! అందుచేత ఆ చెట్ల నీడలలో ఇంద్రుడు - - అగ్ని - వరుణుడులాగా చాలాసేపు విశ్రమించారు. కొంత సేదతీర్చుకొన్నారు. తృప్తితీరా చాలా పండ్లను భుజించారు. పుష్పములను మాలలుగా చుట్టి ధరించారు. బాలుడు : చెట్లే మొలవని ఆ పళ్ళు తియ్యగానే ఉన్నాయా? పుల్లగా ఉంటాయా ?
దాది : అబ్బో! భలే తియ్యగా ఉన్నాయి. ఆ తరువాత చాలాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని మరల బయలుదేరారు. చాలా దూరం వెళ్ళిన తరువాత వారికి ఒకచోట తరంగములచే చంచలమై గొప్ప శబ్దం చేస్తూ ఉండే మూడు నదులు కనిపించాయి.
Page:546
ఆ నదులలో ఒకదానికి గట్లు అనేవి లేనేలేవు. ఇక తక్కిన రెండు నదులలో గట్లే కాదు,…. ‘నీరు’ కూడా ఉండదు.
గంగలో త్రిమూర్తులు స్నానం చేస్తున్నట్లు సూర్యతాపముచే పీడితులైన ఆ మన ముగ్గురు రాజకుమారులు ఆ మూడు నదులలో తీరికగా స్నానాలు చేశారు. ఎంతోసేపు జలక్రీడలాడారు. స్వచ్ఛమైన ఆ నీరు త్రాగి ప్రసన్నులైనారు.
బాలుడు : గుఱ్ఱాలకు నీళ్ళు పట్టారా ? లేదా ? ఊఁ!
దాది :ఆఁహా! గుఱ్ఱాలకు నీళ్ళు పట్టారు కూడా! ఇంతలో క్రమంగా సూర్యాస్తమయం అయింది. వారికి కనుచూపుదూరంలో నూతనంగా నిర్మించబడిన ఎత్తైన భవనములు కలిగిన ఒక నగరం కనిపించింది. ఆ నగరంలో, విశాల నీలాకాశంలో లాగానే, వృక్షాలు-పూమొక్కలు-జలము ఉండనట్టి సుందరవనములు, శూన్యసరోవరములు ఉన్నాయి. ఆ శూన్యసరోవరాలలో అందమైన కమలములు అప్పుడప్పుడే వికసిస్తున్నాయి. దూరానికి నగరవాసులు గానములు వినిపిస్తున్నాయి. ముగ్గురు రాజకుమారులు ఆ నగరంలో ప్రవేశించారు. అక్కడ వారికి అన్నిటికన్నా ఎత్తైన మూడు భవనాలు
కనిపించాయి.
వాటిలో రెండింటికి నేల, పునాదులు లేవు. మూడవదానికి గోడలు కూడా లేవు.
వారు మొదటి రెండు భవనాలను వదలి, గోడలు - నేలకూడా లేనట్టి మూడవ గృహంలో ప్రవేశించారు. ఆ రాజకుమారులు తమ అందమైన ముఖములతో ఆ భవనంలో పచార్లు చేయసాగారు. అట్లా సంచరిస్తూ ఒకచోట బంగారంతో తయారైన మూడు పాత్రలు చూచారు.
ఆ పాత్రలలో రెండు కపాలములవలె అన్ని వైపులా మూసుకొని ఉన్నాయి.
ఇక మూడవపాత్ర ‘చూర్ణం’ (Powder) రూపంలో ఉన్నది.
వారు ఉత్తమధీశాలురు కదా! అందుచేత చూర్ణమైన పాత్రనే ఎంచుకొన్నారు. దానితో అప్పటికప్పుడు పదిశేర్లు అన్నమును, తదితర పదార్థములను వండుకొన్నారు. మరి ఆ ముగ్గురూ ఏమన్నా సామాన్యులా? గొప్ప ధర్మబుద్ధి కలవాళ్ళాయ్! అందుచేత వాళ్ళు భోజనం చేయటానికి అతిథులుగా ముగ్గురు బ్రాహ్మణులను ఆహ్వానించారు.
అందులో ఇద్దరికి దేహాలే లేవు. ఒకనికి ముఖము కూడా లేదు.
ఓ బాలకా! వింటున్నావా!
బాలుడు : ఓc! బాగా వింటున్నాను. భలేగా ఉన్నది. ఇంకా చెప్పు. అప్పుడేం జరిగింది? దాది : ఇంకేమున్నది? వారిలో ముఖములేని అతిథి ఉన్నాడు చూచావా? అతడు అన్నములోని చాలాభాగం తినివేశాడు. ఇక మిగిలిన దానిని ఆ ముగ్గురు రాజకుమారులు సుష్టుగా భోంచేశారు. తృప్తిచెందినవారై, అప్పటికీ ఇప్పటికీ కూడా లేనట్టి - భవిష్యత్తులో ఎప్పటికో ఉండబోయే…. ఒకానొక నగరంలో (భవిష్యన్నగరంలో) వేటాడటానికి వెళ్ళారు. వారు నేటికికూడా అట్లే వేటాడుచూ
Page:547
సుఖంగా ఉన్నారు. ఆ భవిష్యన్నగరంలోని మృగాలు - పక్షులు ఆ రాజకుమారులు వేటాడుతూ
ఉంటే - తోడుగా ఉంటూ ఉన్నాయి.
ఓ అబ్బాయ్! ఈ ఉత్తమమైన చరిత్రను మొదటి నుండి చివరిదాకా విన్నావు కదా! ఇది మరిచిపోకూడదు సుమా! దీనిని చక్కగా నీ మనస్సులో పెట్టుకో. అప్పుడు గొప్ప పండితుడవు అవుతావు. సరేనా?
బాలుడు : అవ్వా! అలాగే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీవు నిద్రపో. నేను ఇట్లా ఆ రాజకుమారులను మననం చేస్తూనే పడుకొంటాను.
ఓ రామచంద్రా! నీకు ఇంతకుముందు “చిత్తాఖ్యానం“ చెప్పానుకదా! ఇప్పుడు, ’ఈ జగత్తంతా మనోవికల్పం మాత్రమే’ అని నిరూపించటానికే దృష్టాంతపూర్వకమైన ఈ ’బాలవినోదం’ చెప్పాను. సంకల్ప - కల్పనలన్నీ దృఢపడటంచేతనే ఈ ‘సంసార రచన’ అంతా స్థిరత్వం పొందుతోంది. ఈ కల్పనా దృశ్యమంతా ప్రతిభాసా రూపమే. అయినప్పటికీ, ఈ బంధమోక్ష వ్యవహారమంతా విస్తరింప జేస్తోంది. ”ఇది ఎట్లా సాధ్యం!" అని ప్రశ్నించుకోకుండానే, ఆ పిల్లవాడు ఆయా సంఘటనలు వింటూ ఎంతగా ఆనందించాడో చూచావా! జీవుడు కూడా ముందు - వెనుకలను పరిశీలించకుండానే ఈ “భావములు–అభిప్రాయములు-నిర్వచనములు-సంబంధములు, ఉద్వేగములు (Perceptions, Opinions, Definitions, Relationships, Emotions etc.)” …. మొదలైన వాటిని అవధరిస్తున్నాడు.
ఈ కనపడేదంతా సంకల్పమాత్రమేగాని వేరే ఏమీ కాదు. సంకల్పముచే భాసించేది యథార్థ మెట్లా అవుతుంది చెప్పు? ఇదంతా వాస్తవానికి లేనిదిగా, అనిర్వచనీయంగా చెప్పబడింది. ఈ ఇంద్రియములు, ఇవి గాంచుచున్న భూమి-ఆకాశము-వాయువు-దిక్కులు-పర్వతములు మొదలైన పదార్థజాలం స్వప్నములోని వస్తువులవలె ఊహామాత్రము, అసత్త్యుల్యము అయి ఉన్నాయి. నేనిప్పుడు చెప్పిన భవిష్యన్నగరంలోని ముగ్గురు రాజకుమారులు, నదులు, ముగ్గురు అతిథులు ‘సంకల్ప మాత్రమే’ అయినప్పటికీ, ఆ పిల్లవాడుమాత్రం అంతరంగమునందు ఉత్సుకత, అభిలాష, వికల్పములు పొందుచూనే ఉన్నాడు కదా!
“ఈ జగత్తు యొక్క అనుభూతి అంతా సంకల్పమాత్రమే” అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే. ఆత్మతత్త్వజ్ఞానము ఎరిగినవారు, జ్ఞానదృష్టికలవారు ఈ సత్యమును గ్రహించగలుగు చున్నారు. వారికి మాత్రమే అది గ్రాహ్యమగుచున్నది. ఇక తక్కినవారంతా ‘ఇది సత్యమే’ అని భావించుచు, ఒక అనుభవమునుండి మరొక అనుభవమునకు ప్రయాణిస్తూనే ఉన్నారు. అట్టి ప్రయాణమునకు ‘అంతు’ ఉండుట లేదు. అనేక తరంగములుగా కనబడుచున్నదంతా సముద్ర జలమే అయినట్లు, ఈ స్ఫురించునది, - - మరియు ఇట్లు స్ఫురించుదాని అనుభవము పొందుచున్న “ఖండభావన” తో కూడిన ‘ద్రష్ట’ లేక ‘జీవుడు’ కూడా సంకల్పమాత్రమే. పరమాత్మ నుండి మొట్టమొదట సంకల్పము మాత్రమే ఉదయించింది. ఆ తరువాత, ఈ "ప్రాణుల యొక్క, మరియు సూర్యుని
Page:548
యొక్క” దైనందిన క్రియలచే ‘కాలము’ విస్తరిస్తోంది. క్రమంగా ఆ కాలమును అనుసరించి ఈ జగద్రూపమంతా విస్తారం పొందుతోంది.
కాబట్టి రామా! ఈ ప్రపంచమంతా సంకల్పరూపమే. మనోవికారములు, రాగద్వేషవృత్తులు, వాటికి సంబంధించిన తదితర విషయములు - ఇవన్నీ సంకల్పమాత్రమే. కనుక, నీవు నిర్వికల్ప (వికల్పములు లేనట్టి) సమాధి (మానసిక సుస్థిరత) ను ఆశ్రయించు. అనగా, సర్వసంకల్పములకు ఆవల గల “స్వస్వరూపము”ను అభ్యసిస్తూ-ఆస్వాదిస్తూ ఉండు. సర్వసంకల్పములనుఅధిగమించిన వాడవై ఉండు. అట్లు సంకల్పములను త్యజిస్తే ఇప్పుడే, ఇక్కడే, ఇదంతా ఇట్లు ఉంటూ ఉండగానే నీవు పరమశాంతిని పొందగలవు.
అజ్ఞాని తన యొక్క సంకల్పవశం చేతనే మోహితుడగుచున్నాడు. జ్ఞానికో, మోహమే ఉండటం లేదు. ఆహాఁ! అజ్ఞుడు, నాశరహితమగు పరమాత్మ యందు క్షణభంగురము, భావనాను సరణము, అనుక్షణ పరిణామయుతము అగు ‘జగత్తు’ అనబడు దానిని మనస్సు యొక్క సంకల్పం చేత గాంచుచున్నాడు. భ్రాంతిని పొందుచున్నాడు.
శ్రీరాముడు : ఓ బ్రహ్మవిద్వరా! ఈ ఆత్మ మహామోహమయమగు సంసార భ్రమను దేని వలన పొందుతోంది? "నశ్వరము”, అగు సంకల్పములను కల్పన చేస్తున్నదెవరు? నిత్యాత్మ చేస్తోందా? లేక నశ్వరాత్మ చేస్తోందా? జగత్పారవస్యమును పొందుతోంది నిత్యాత్మయా! నశ్వరాత్మయా?
అహంకారమా?
“నిత్యాత్మ చేస్తోంది” అనటానికి వీలు లేదు. అట్లా అంటే సంకల్పముతోబాటు అదీ నశించాలి. అప్పుడు ఆత్మయొక్క నిత్యత్వానికి హాని కలుగుతుంది కదా!
ఇక “నశ్వరాత్మ తన సంకల్పముచే తనను రచించుకొంటోంది” అని ఎట్లా అంటాము? అట్లా అంటే, ఆత్మను మరొకటేదో వచ్చి ఆశ్రయించుచున్నట్లు అవుతుంది కదా? అది కూడా వేదవాక్యములకు సరిపోదు. సంకల్పితమగు నశ్వరాత్మ జడమా? చేతనమా? ‘జడము’ అని అంటే, అది చిదాత్మతో ఐక్యం ఎట్లా పొందుతోంది? ‘చేతనము’ అందామా? చిద్వస్తువు నిష్క్రియము కదా! అది ఎట్లా సంకల్పిస్తుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : పరమాత్మ ‘అహం’ అను అనుభవరూపముగల అవిద్యతో కూడుకొని ఈ సర్వప్రాణులందు ఉండిఉన్నాడు. బాలుడు దయ్యములను హృదయంలో కల్పించుకొని వాటిని బాహ్యమున చూస్తాడు చూచావా? అట్లే ఆ పరమాత్మ ఈ నశ్వర సంకల్పాత్మకులగు ప్రాణులను
*నశ్వరము : ఏ క్షణమునందునూ నిలకడయే లేనట్టిది; ఎప్పటికప్పుడు మార్పుకు లోనగునట్టిది.
Page:549
మిథ్యా రూపములుగానే కల్పించుకొని దర్శించుచున్నాడు. “ఒకే పరమాత్మయందు అంతయు స్థిర పడియున్నది“ అనునది నిర్వివాదాంశము. ఇక “అహంకారము” అనబడునది వేరొకటి ఎట్లా ఎక్కడ ఉంటుంది? వాస్తవానికి పరమాత్మ భేదరహితుడు. భేదరహితుడగు పరమాత్మ యందు ‘అహంకారము’ అనునదే లేదు. అతడు సర్వదా అఖండుడే. కాని మండుటెండలో మృగతృష్ణ కనబడునట్లు, స్వతహాగా ఏమాత్రం లేనట్టి అహంకారము భ్రాంతిచే భాసించుచున్నది. ఏది భ్రాంతి మాత్రమే అయి ఉన్నదో అట్టిదానిని “ఇది అసత్యమే కదా!" అనే దృష్టిచే దర్శించటమే జ్ఞానం. అనిత్యమైన దానిలో నిత్యాత్మే దాగి ఉన్నది. నిత్యాత్మలోనే అనిత్యమైనది కనబడటం జరుగుతోంది. జలము తనయందు తానే ‘తరంగము’ రూపమున వ్యక్తమగుచున్నది కదా!
“ఆత్మానాత్మనమాశ్రిత్య, స్ఫురత్యతః యథా అంబసా”
“ఈ ఆత్మ తనను తానే (మనస్సు రూపమున) ఆశ్రయించినదై, అటుపై తానే కార్యరూపమగు, (As an Eventuality) ఈ జగత్తుగా ప్రకటితమగుచున్నది” అని మేము ఈ జగత్తు విషయమై గ్రహిస్తున్నాం. కనుక ఓ విజ్ఞానఖనీ! రామచంద్రా! అసద్విషయము, (that which is not infact true) గురించిన భ్రాంతిని నీవు త్యజించు. ఇక అహంకారము విషయానికి వస్తే …… జాగ్రదహంకారం స్వప్నంలో లేదు. స్వప్నాహంకారం సుషుప్తిలో లేదు. కనుక అహంకారం స్వతహాగా లేదు. స్వతహాగా లేనట్టి ఈ అహంకారమును చూచి, "అయ్యో! దీనిని నేను ఎట్లా తొలగించుకోవాలి?” అనే భ్రమాత్మక మైన ప్రయత్నము అనవసరం. అసత్యమును అసత్యముగానే దర్శించు. సత్యస్వరూపము, ఆనంద మయము అగు ‘సమ్యక్ దర్శనము’ (Perception of Equality in all) నే ఆశ్రయించు. అట్టి సమ్యకిస్థితియే పరమాత్మ యొక్క స్వరూపము.
అజ్ఞానరహితుడవై సునిశితమైన బుద్ధిచే ప్రయత్నపూర్వకంగా ఆత్మతత్త్వ విచారణ చేయటమే ఉచితం. అసద్వస్తువు గురించి ప్రయత్నము, అనగా,“ఈ నా అహంకారము తొలగించుకొంటాను” అనే అభినివేశము ఉచితం కాదు.
అబద్ధో బద్ధ ఇత్యుక్త్వా కిం శోచసి ముధైవహి? అనంతస్య ఆత్మతత్త్వస్య కిం, కథం, కేన బద్ధ్యతే?
ఓ రామచంద్రా! ఓ సర్వజనులారా! మీలో ఏ ఒక్కరు బద్ధులు కానేకారు. మరి మీరు “నేను బద్ధుడను. విముక్తి ఎప్పటికి?” అని తలచుచూ ఎందుకు అనవసరంగా దుఃఖిస్తున్నారు? మీ అందరి వాస్తవస్వరూపము ఆత్మయే కదా! అనంతమగు ఆత్మ ఎవనిచే ఎట్లు బంధింపబడగలదు? ఆహాఁ! భేదరహితమగు పరమాత్మయందు భేదాభేదముల గూర్చిన భ్రాంతి కల్పించబడుచున్నది. తొలగవలసింది భ్రాంతి మాత్రమే. భ్రాంతి తొలగగానే, ఇక బంధమేమిటి? ముక్తి ఏమిటి? ఆత్మ యందు వాస్తవానికి ఈ దేహాదులు లేవు. అది దేహరహితమే అయినప్పటికీ, దేహముతో కూడి యున్నట్లు కనిపించుచున్నది. ఈ దేహము ఛిన్నాభిన్నమవవచ్చు గాక! ఆత్మకు వచ్చే హాని ఏమీ ఉండదు. భేదా భేదములు, తదితర వికారములు ఈ శరీరమునకే గాని, ఆత్మకు ఉండవు. ఈ
Page:550
దేహము నశించవచ్చు. లేక, అనేక గాయములచే, పుండ్లచే నిండిపోవచ్చు. ఎంతో బలం పుంజుకో వచ్చు. లేక క్షీణించవచ్చు. ఇవన్నీ ఆత్మకు సంబంధించినవే కావు. కంసాలి (లేక వడ్రంగి) ఉపయోగించే కొలిమివద్ద ఉండే తోలుతిత్తి చిరిగిపోవటం జరిగితే అందలి వాయువుకు ఏమైనా హాని కలుగుతుందా? సూర్యకిరణములు గోడపై పడుచున్నప్పుడు, ఆ గోడ నేలకూలటం జరిగితే సూర్యకిరణములు పోగొట్టుకున్నదేముంటుంది? ఈ దేహము యొక్క మరియు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములచే ద్రష్టలగు మనకు వచ్చే హానిగాని, లోపముగాని ఏమీ ఉండదు. “నేను శరీరము కంటే విలక్షణ స్వరూపము కలవాడను. అట్టి నా యొక్క స్వరూపమునకు ఈ శరీరాదులవలన, తదితర భావాదులవలన కలిగే మార్పు చేర్పులేమి ఉంటాయి?” అనియే మనం భావించాలి. ఓ రామా! “దేహము-ఆత్మ” ఈ రెండింటికీ సంబంధము “మేఘము - ఆకాశము” ల సంబంధము వంటిది మాత్రమే. ఈ జగద్రూపమంతా మనస్సే. మనోరూపమగు ఈ జగత్తు యొక్క అంతర్లీనశక్తి చిదాత్మయే. ఆ చిదాత్మ మనస్సు కంటే కూడా అతి సూక్ష్మమైనది. అది ఎన్నటికీ నశించేది కాదు.
ప్రజ్ఞాస్వరూపమునకు జనన నాశనాది వికారములు ఉండవు. అది ఎచ్చటికీ పోదు. ఎక్కడి నుండి రాదు. “ఆత్మ” సర్వవేళల అవినాశి అయిఉండగా, ఇక ఈ దేహాదుల వినాశమునకు ఎందుకు దుఃఖితులం కావాలి? ఒక మేఘం నశిస్తే, దానిని తాకుచున్న వాయువు ఏమౌతుంది? శ్రీ రాముడు : మరొక మేఘమును తాకుతుంది. లేదా, ఆకాశమును పొందుతుంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : అంతేగాని, మేఘము నశించినంతమాత్రం చేత, దానిని తాకుచున్న వాయువు నశించదు కదా! ఈ దేహము నశించటం జరిగినప్పుడు బద్ధాత్మ మరొక దేహమును పొందుతుంది. ‘ముక్తాత్మ’ అయితే పరమపదమునే పొందుచున్నది. ఇందులో దుఃఖించవలసిన విషయమేమున్నది? ఈ సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటున్నట్టి జీవుని మనస్సే శాశ్వతమై ఉంటూ ఉంటుంటే, ఇక, ఆత్మ విషయం వేరుగా చెప్పాలా?
నాశనభూతమగు ఈ దేహమునకు అవినాశియగు ఆత్మకు ఉన్న సంబంధం, కుండ బదర న్యాయము వంటిది.
ఒక కుండలో ఒక ఫలము వున్నది. ఏదో ప్రమాదవశాత్తు ఆ కుండచిట్లిపోయింది. అంతమాత్రం చేత ఫలము నశిస్తుందా? శరీరము నశించినప్పుడు ఈ జీవాత్మ చిత్తాకాశమును పొందుచున్నది. అట్లాగే, పగిలినప్పుడు కుండలోని ఆకాశము ఏమౌతోంది? కుండలోపల, కుండ బయట కూడా ఉన్నట్టి మహాకాశముతో లీనమగుచున్నదికదా! అసలు, “కుండలోని ఆకాశము కుండ పగులుటచే బాహ్యాకాశమున లీనమగుట” అనునది మాత్రం ఎక్కడున్నది? ఆకాశమంతా సర్వదా అఖండంగా ఉండి ఉన్నదికదా! చిత్తము కూడా క్షయించినప్పుడు ఈ జీవుడు అఖండుడు అగుచున్నాడు. మహాకాశ స్వరూపుడుగా వెలుగొందుచున్నాడు.
ఈ ప్రాణుల యొక్క మనోమయదేహము ‘మృత్యువు’ అనే వస్త్రం కప్పుకొని ’దేశ-కాలములు’ అనే ప్రదేశము లందు దాగుకొనుచున్నది. ఆత్మ వస్తువుకు చిత్ర విచిత్రములైన రంగులను
Page:551
పూయుచున్నది. ఇట్టి మోసయుక్తమైన మనస్సు గురించి నీవు తపించవలసిన పనేమున్నది? ఇక మరణము మాటేమిటంటావా? పాపం అనేక గృహవ్యవహారములందు నిమగ్నమైన ఈ జీవుడు అంతిమశ్వాస సూచితమగు మరణమువరకు ‘ఆత్మ’ యొక్క స్వభావమేమిటో, ఎంతటిదో ఎరుగకయే ఉంటున్నాడు. తనపై తనకే సమగ్రమైన అవగాహన లేకుండుటచే అనేక భ్రమలకు లోనగుచున్నాడు. ఆత్మ మరుగునపడుటయే మరణము. ఆత్మను ఎరుగనట్టి మూర్ఖుడు మాత్రమే “అయ్యో! నేను చచ్చుచున్నాను” అనే భావావేశము పొంది ’మరణము’ అనుదానిని గాంచుచున్నాడు. ఆత్మయే స్వరూపముగా గలిగిన నీకుగాని, నాకుగాని, మరింకెవ్వరికిగాని మరణమనేదేదీ లేదు. మనమంతా అమృతానంద స్వరూపులమే. నిత్యత్వము, అప్రమేయత్వము మన సహజ స్వభావమే అయిఉన్నది. మరిక మరణము గురించి భయమెందుకు? ఈ మరణమనునది జీవునియొక్క ప్రారంభముగాని, అంతముగాని కాదు. లోకంలో ఎవరైనా “నేను లేకుండా పోవుచున్నాను” అను అనుభవం పొందు చున్నారా? అట్టిది ఎవరూ గాంచుటలేదు. జ్ఞాని తన యొక్క శరీరము తొలగినపుడు ‘స్వసత్త’ (Self State with the sense - ”I exist") ను అనుభవిస్తూనే ఉన్నాడు. కనుక అతనికి మరణానుభవం లేదు. వాసనలతో కూడిన అజ్ఞానియొక్క మనస్సు జన్మలను, మృత్యువులను ఎప్పటికప్పుడు పొందుచూ, అనుభవిస్తూనే ఉన్నది. కనుక, ‘మరణము’-అతని విషయంలో మరొక దేహమునకై ‘నంది’ పలుకుటయే అగుచున్నది.
రెక్కలు వచ్చిన తరువాత పక్షి గూటిలో ఇక ఉండదుకదా! అట్లాగే నీవు ఈ ‘వాసనలు’ అను గూటిని త్యజించివేయి. మనఃశక్తియే ఇష్ట- అయిష్ట వస్తువులందు, రాగ ద్వేషములు కలిగి ఉంటున్నది. తద్వారా బంధమున తగుల్కొనుచున్నది. స్వప్నంలోలాగా, మనస్సు భ్రాంతి చేతనే ఈ ‘కల్పన’ అంతా వ్యర్థంగా చేసుకొంటోంది. ఇది అవిద్యారూపమే కదా! కాబట్టి ఈ మనస్సును నశింపజేయటం సుఖప్రదం. ఇది అభివృద్ధి పొందుచున్నప్పుడు దుఃఖమే కలుగుచున్నది.
‘మనస్సు వృద్ధి పొందుట’ అనగా అవివేకము పరిఢవిల్లుటయే.
శ్రీ రాముడు : ఈ మనస్సు నిరంతరం తుచ్ఛత్వం, మలినత్వం ఆశ్రయిస్తోందే? ఎందుచేత? దీనిని నిరోధించటం ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : తత్త్వజ్ఞానముయొక్క ‘అల్పత్వము’ చేతనే ఈ మనస్సు మిథ్యారూపమైనట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తోంది. మంచుతోను, మేఘములతోను కప్పబడినప్పుడు ఆకాశము మలినమైనట్లు కనబడుతుంది. కాని, వాస్తవానికి ఆకాశము సర్వదా నిర్మలమైనదే కదా! స్వతహాగానే స్వచ్ఛమే అయినట్టి ఆకాశము మలినమొనర్చగలిగేది ఏది ఉన్నది చెప్పు? ఇక ఈ మంచు, మేఘములు అంటావా అవన్నీ వస్తూ, పోతూ ఉంటాయి. అంతమాత్రంచేత అవి ఆకాశమును తాకలేవు, మార్చలేవు కదా! భ్రాంతిచేతనే నీ మనస్సు “నేను సహజంగా తుచ్ఛమైనదానను. మలినమైన దానను” అని భావించుచున్నది. అది ఏమాత్రం వాస్తవం కాదు.
#
Page:552
మానసిక శక్తియే దీర్ఘస్వప్నము వంటి మిథ్యారూపమగు ఈ జగద్వైచిత్ర్యమంతటి నీ సత్యమైనదానివలె కల్పన చేయుచున్నది. ఒక చిన్న దృష్టాంతము విను. ఒకని కంటికి ‘తిమిర-రోగము’ (a disease that leads to constant movement of eye-lids) అనే వ్యాధి వచ్చినదనుకో అప్పుడాతడు ఆకాశంలో రెండు చంద్రులను, రెండు సూర్యులను చూస్తాడు.
1) రెండు చంద్రులు కనబడుటకు కారణం? చంద్రుడా? కాదుకదా! కంటియొక్క దోషమే అట్లు కనబడుటకు కారణమగుచున్నది.
2) రెండవది దృష్టిదోషమును ఆశ్రయించి ఉన్నప్పటి భావనామాత్రవైచిత్ర్యమే కదా! అంతేకాని, సత్యం కాదు కదా!
మానసిక శక్తియే జగత్తుయొక్క ఆకారమును భావనామాత్రంగా గాంచుచున్నది. కనుక ఈ జగత్తు యొక్క కర్తృత్వమును మనస్సుకే ఆపాదించక తప్పదు. రెండు చంద్రులు కనబడుటకు చంద్రుడు కారణం కానట్లు ఈ జగత్తుల స్థితికి ఆత్మకారణం కాదు. దృశ్యము కూడా కారణం కాదు. ఉన్నదంతా ద్రష్టయొక్క మనోరాజ్యములోనే ఉన్నది.
ఓ రామా! సూర్యుడు తన తీక్ష కిరణాలతో మంచును కరిగించివేస్తాడు చూచావా? నీవుకూడా ఆత్మవిచారణచే మనస్సుయొక్క స్వరూపమును నశింపచేయి. తత్త్వవిచారణచే చిత్తము లయంకాగా, "నిర్మలాకాశం” లాగా ఆత్మసాక్షాత్కారం తప్పక సిద్ధించగలదు. ఓ సర్వసభికులారా ఆత్మతత్త్వము ఎరుగకపోయారా …. అనేక అనర్థములు కలిగించగల అవిద్య పలువిధములైన జన్మలకు, అనేక రకములైన బ్రహ్మాండముల అనుభవమునకు కారణం కాగలదు.
ఈ మనస్సు ఆత్మను ఆశ్రయించటం జరుగుచున్నప్పుడు తనను తానే వివేక - వైరాగ్యములచే నాశనము చేసుకొంటోంది. అందుకే కవులు, “మనస్సు ఆత్మను సమీపిస్తున్నప్పుడు స్వసంహార నాటక పాత్ర ధరించి నృత్యం చేస్తోంది" అని వర్ణిస్తూ ఉంటారు. తనయొక్క నాశనము కొరకే ఇది ఆత్మను దర్శించుచున్నది. ఆత్మ ప్రాప్తించనంతకాలం తన నాశనము ఎట్లా సాధ్యమో తానే ఎరుగలేకపోతోంది. దుర్బుద్ధికలవాడు తాను పొందుచున్న సంకటములకు, దౌర్బల్యములకు తానే కారణం అని ఎరుగలేడు చూచావా? ఇది కూడా అట్టిదే. ఏ వివేకులైతే మనోనాశనమును వాంఛించు చున్నారో, అట్టివారి అభీష్టమును ఈ మనస్సు తప్పక, సంకల్పబలమును అనుసరించి, సిద్ధింప చేస్తోంది. కాబట్టి ఈ మనస్సు ఆత్మయొక్క ఇచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తోందని గ్రహించు. ఆత్మకు ఇచ్ఛగల వ్యవహారములను నిర్వర్తించటంలో ఈ మనస్సుకు క్లేశమేమీ ఉండదు. వివేకము, ఉత్తమ సంస్కారములు గల చిత్తము తన యొక్క వివేకబలమును అనుసరించి ఇతఃపూర్వపు సర్వసంకల్ప వికల్పములను త్యజించివేస్తోంది. ఆశలన్నిటినీ వదలుచున్నది. అప్పుడిక సహజంగానే బ్రహ్మాకారవృత్తి కలిగి ఉంటోంది.
నస్సు లయించినప్పుడు పరమపురుషార్థమగు మోక్షము స్వయముగానే సిద్ధించుచున్నది.
Page:553
“మనస్సుకన్నా ముందే స్వసత్తస్వరూపుడనై నేను ఉండనే ఉన్నాను” అను ఎరుక, అట్టి ఎరుకతో కూడిన సుస్థిరస్థితియే ‘మనోనాశనము’ అనే శబ్దముచే చెప్పబడుతోంది, ఉద్దేశించబడుతోంది కూడా! మనస్సు కన్నా (ఆలోచనల కన్నా) ఆ “ఆలోచనలు చేయుచున్నవాడు” మునుముందుగానే ఉండాలి కదా! అతడే ఆత్మ యొక్క ఉనికికి తార్కాణం. అతని గురించిన మననమే “ఆత్మోపాసనమోక్షస్థితి కూడా".
అట్టి మోక్షస్థితిలో దుఃఖములన్నీ శమించుచున్నాయి. కనుక ఓ రాఘవా! అట్టి మనోనాశనము కొరకే నీవు ప్రయత్నించాలి. అంతేగాని…. మనోవిస్తృతి, విస్తరణ- కొరకు నీ ప్రయత్నములను వ్యర్థం చేసుకోరాదు సుమా! సంసారమనే ఘోరారణ్యం మిక్కిలి దట్టమైనది. ఈ అరణ్యంలో ’సుఖ
- దుఃఖములు’ అనే అసంఖ్యాకములైన వృక్షములు, ’మృత్యువు’ అనే కొండచిలువ నివసిస్తున్నాయి. ఈ అరణ్యమునకు అవివేకముతో కూడిన మనస్సే ప్రభువు. అన్ని విపత్తులకు అవివేకమే హేతువు. కనుక జాగరూకుడవై ఉండాలి సుమా!