CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:640

X. ప్రకరణ సమీక్ష 1. సమీక్ష

శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! మనం ఈ ’ఉత్పత్తి ప్రకరణము’లో విచారణ చేసిన విశేషాలన్నీ క్లుప్తంగా సమీక్షించుకుందాం! విను.

ఈ మానవులలో అనేకులు జన్మించినది మొదలు మరణించే వరకు తుచ్ఛమైన లక్ష్యములతో, అర్థం లేని ఆశలతో, అల్పమైన జ్ఞానముతో బ్రతికివేయటం జరుగుతోంది. స్వల్ప సంఘటనలకు కూడా విచలితులగుచున్నారు. ఇంద్రియ విషయముల పట్ల వ్యామోహితులగుచున్నారు. అవిచారణచే కాలయాపన చేస్తున్నారు. అందుచేతనే ‘సంసారము’ అను వృద్ధమాంత్రికురాలు ఈ జీవులను తన వశం చేసుకొని, తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తోంది. ఫలితం? అంతు లేని దుఃఖపరంపరలు. ’పరమాత్మ -ఆనందము’ అనునవే స్వరూప, స్వభావములుగా కలిగి యున్న ఈ జీవుడు దుఃఖించుటయా? ఇతనికి కర్మబంధ మెక్కడిది? మోహ మెక్కడిది?

అవిద్యను నిరోధించటం ఎట్లా? - - పుట్టిన తరువాత, ఈ మానవుడు, కాస్త బుద్ధి వికసించగానే, సత్సంగతత్పరుడై ఉండాలి. “నిరంతర ప్రవాహశీలము” వంటి ఈ అవిద్య అనబడే నదీజలవేగాన్ని నిరోధించాలంటే ఈ రెండూ అవసరమై ఉన్నాయి1) శాస్త్రాభ్యాసం (సాధనలతో సహా) 2) సత్సాంగత్యము

ఈ రెండిటి ప్రభావం చేతనే జీవునకు, “ఏది గ్రహించాలి? ఏది త్యజించాలి?” అనే వివేకం ఉత్పన్నమగుచున్నది.

అప్పుడాతడు “శుభేచ్ఛ” అనబడే మొదటి భూమికను పొందుచున్నాడు.

అట్టి శుభేచ్ఛ వివేకముతో కూడుకొని బలపడగా, క్రమంగా అతడు “విచారణ" అనే రెండవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. సత్కర్మలు, ఉత్తమ ఆత్మజ్ఞానం … ఈ రెండు బండికి రెండు చక్రముల వంటివి. అట్టి ప్రయత్నశీలుని చిత్తములో జన్మజన్మలుగా పేరుకొని తిష్ఠవేసుకొనియున్న ’దుష్టవాసనలు’ బయటకు పంపివేయబడతాయి. అప్పుడు ఏర్పడే నిరంతర పరమార్థభావనచే మనస్సు సూక్ష్మత్వం పొందుచున్నది. అతడు ‘సూక్ష్మగ్రాహి’ అవుతాడు.

అప్పుడు ఈ జీవుడు ‘తనుమానస’ అని చెప్పబడే మూడవ భూమికలో ప్రవేశించుచున్నాడు.

క్రమంగా అతనియందు భేదభావము సన్నగిల్లుచున్నది. "మట్టితో రచించబడిన యుద్ధ దృశ్యములో మన సైన్యమేమిటి? శత్రుసైన్యమేమిటి? అంతా మట్టియే కదా!” అను ఎరుక ఉండనే ఉంటుంది చూచావా? అట్లే ఈ మూడవ భూమికలోని వానికి “నేను-నాది-అతడు-నీవు-నీ

Page:641

గుణములు-నా పదార్థములు”… ఇవన్నీ మొదలంటా లయించిపోతాయి. సమ్యక్ పూర్వకమైన (Unity Oriented) సమగ్రమైన (Comprehensive) అవగాహన ఉదయించి, బలం పుంజుకుంటుంది. అప్పుడాతడు “సత్త్వాపత్తి" అను నాలుగవ భూమికను పొందినవాడగుచున్నాడు.

ఆత్మజ్ఞానం వికసిస్తూరాగా ఆ యోగియందు వాసనలు సన్నగిల్లి, సూక్ష్మత్వాన్ని పొందుతాయి. వాసనలే అన్నిటికీ మూలం. ఈ అసత్యవస్తువులందు ఏర్పడుచున్న ఆసక్తి, ఈ జన్మపరంపరలు … ఇవన్నీ వాసనల నుండే ఉద్భవిస్తున్నాయి. వాసనల రూపమే ఆసక్తి. కీలుబొమ్మను ఆడించినట్లు, ఆసక్తులు ఈ జీవుని తమ ఇచ్చ వచ్చినట్లు ఆడిస్తున్నాయి. అయితే నాలుగవ భూమికయగు సత్త్వాపత్తిని ఆశ్రయిస్తూ ఉండగా కొంతకాలానికి ఈ జీవుడు అకృత్రిమమైన అనాసక్తిని తనయందు పెంపొందించుకొంటున్నాడు.

అట్టి అనాసక్తుడు ‘అసంసక్తుడు’ అను ఐదవ భూమిక యందు ప్రవేశిస్తున్నాడు.

అట్టివాడికి కర్మల చేత గాని, ఆ కర్మల ఫలితముల చేతగాని సంబంధము ఉండదు. అవి అతనిని బంధింపజాలవు. దీర్ఘకాలంగా వాసనలను సూక్ష్మం చేస్తూ, బాహ్యపదార్థములకు సుదూరుడు అగుచూ ఉంటాడు. స్వయంగా, అంతర్ముఖ వృత్తిచే "నేను జీవుడనుగాను. నిర్జీవుడను గాను. సర్వదా బ్రహ్మమునే అయి ఉన్నాను. ఈ శరీరము మొదలైనవి నేను కాదు. ఈ పదార్థ జాలము నా యందు లేదు. నేను ఈ పదార్థజాలమందు లేను. నన్ను బ్రహ్మమునుండి వేరుపరచు కారణము గాని, కార్యముగాని ఏ సమయమందును లేనేలేవు”, అను రూపముగల బ్రహ్మాకార స్వభావమును సంతరించుకొంటున్నాడు. అట్టి భావనా దృఢత్వం చేత అతనియందు బాహ్యపదార్థవిస్మృతి రూపమైన ఒకానొక ‘అతీత స్థితి’ ఏర్పడుతోంది.

అట్టివాడు సమాధినిష్ఠుడై ఉండవచ్చు. లేదా, ‘అసత్యములే’ అయి ఉన్న ఈ స్త్రీ పుత్రాది ప్రాపంచక వస్తువుల మధ్య యథాతథంగా తదితరులులాగానే ఉండవచ్చు. “స్నానం, భోజనము” మొదలైన బాహ్యక్రియలు చేస్తూ ఉండవచ్చు లేక మానవచ్చు. ఎప్పుడైతే మనస్సు ‘సూక్ష్మత్వం’ చెందినదో ఇక అతడు ‘బ్రహ్మా హమ్’ అను భావన యొక్క అభ్యాసంచే, జన్మమృత్యువులతో సహా సర్వ సంఘటనలకు వేరైన స్వభావసిద్ధ స్థితిలో ఉండి ఉంటాడు. ’స్వధర్మము’ అను ‘ప్రవర్తనను’ తదితరుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించినప్పటికీ, వాటి ప్రయోజనములపట్ల ప్రీతి, మమకారాదులు ఉండవు. వాసనలు సన్నగిల్లినవాడు, ఆయా సంఘటనలను చూస్తున్నప్పుడు ఒక పసిబాలుడు ఈ ప్రపంచమును చూస్తున్నట్లు చూస్తాడు. అప్పుడే మేల్కొన్నవానివలె, నిర్లిప్తమానసిక స్థితిని ఆశ్రయించి ఉంటాడు.

వీరిలో కొందరు తమ దైనందిన సామాన్య విషయములైవున్న స్నాన - అన్నపానాదులను కూడా ఇతరుల ప్రేరణచే మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటారు.

ఏది ఎట్లైనా ఉండవచ్చు. అట్టివానికి దేనిపట్ల కూడా సంగముగాని, అసంగముగాని ఉండదు. “ఒక యంత్రముచే త్రిప్పబడుచున్న చక్రము” వలె ప్రవాహపతితమైన ఆయా క్రియా వ్యవహారములు

Page:642

నిర్వర్తిస్తూ ఉంటాడు లేక ఏదీ నిర్వర్తించక పోవచ్చు! లేక, అన్నీ ఉత్సాహంతో నిర్వర్తిస్తూ ఉండవచ్చు కూడా! కానీ అవి అతనిని స్పృశించజాలవు.

ఏది ఎట్లా జరుగుచున్నప్పటికీ తాను మాత్రం బాహ్యపదార్థవిస్మృతి’ , అను ఒక చమత్కారమైన రూపము గల “ఉపరతి" స్థితియందు ఉంటాడు. అభ్యాసమే దృశ్యము నుండి ఉపరతికి (For withdrawal from involvement) ఉపాయం కదా!

తన ‘స్వస్వరూపము’ నందు నిలకడ పొందేవరకు ఆ యోగి శాస్త్రవిహితంగానో, లేక ఉత్తమ ఆచరణపూర్వకంగానో అభ్యాసం మాత్రం చేస్తూనే ఉంటాడు. ఇప్పటి అతని లక్ష్యము “స్వస్వరూపము నందు సంస్థితుడై ఉండుట” మాత్రమే. అంతే గాని, బాహ్యము నుండి ఏదియో పొందుట కాదు.

పదార్థాభావని - ఇట్లు సూక్ష్మమగు ‘బ్రహ్మము’ తో తన చిత్తమును ఐక్యపరచిన యోగి అసంసక్త భావన కలవాడై కొంతకాలానికి "పదార్థములను కించిత్ కూడా భావించకుండుట” అనబడు ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. సర్వ భావములకు అతీతత్వము, మౌనస్థితులను అభ్యసిస్తూ వస్తాడు.

జీవన్ముక్తుడు - ఆ విధంగా పదార్థములను, సంఘటనలను, వివిధ స్వభావులగు జీవులను భావన చేయక, బ్రహ్మము నందు మరల మరల తన చిత్తమును లయంచేస్తూ ఉండగా, కొంత కాలమునకు అతనియందు ఆత్మవిషయమై ఉత్తమమైన ఏకాగ్రత ఏర్పడుచున్నది. ఇతరుల ప్రేరణచే, లేక ఇతరుల శుభము కొరకు మాత్రమే కొన్ని ప్రాపంచిక వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ, అతని అంతరంగము మాత్రం నిర్వికారంగా, ప్రశాంతంగా, ఏదీ కోరకుండానే ఉంటూ ఉంటుంది. చమత్కారం చూడు. ఏదీ తాను కోరకుండానే, ఆయా విషయములందు వ్యవహరిస్తూ ఉంటాడు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతని అతీతస్థితి - - మౌనస్థితి యథాతథమై ఉంటాయి.

దీనిని ‘దృశ్య-అభావనస్థితి’ అని కూడా అంటూ ఉంటారు.

అట్లు ’దృశ్యాతీత’ స్థితిలో ఉంటూ ఉండగా, ఆ యోగి ఒకానొక తరుణంలో స్వయముగా ‘తురీయుడు’ అగుచున్నాడు. అనగా “నేనే సర్వేసర్వత్ర అందరియందు, అంతట, సర్వదా నిర్వికారముగా వ్యాపించియున్నాను. నేను సర్వమునకు చెందినవాడను. దేనికీ చెందనివాడను కూడా” అను అనుభవంలో ఉంటున్నాడు.

అట్టివానిని మనం “జీవన్ముక్తుడు” అని అంటున్నాం.

అతడు అభిలషితమైన వ్యవహారములు లభించినప్పుడు ప్రసన్నుడుకాడు. “ఇవి ప్రాప్తించలేదు” అని దుఃఖించడు. “నేను జీవించాలి. లేదా, మరణించాలి” అని కోరుకోడు.

“నేను జన్మమృత్యువులు, అద్యంతములు లేనివాడను” అను భావన నుండి ఏమాత్రం ‘చ్యుతి’ పొందడు. ఇచ్ఛారహితుడై ప్రారబ్ధకర్మానుసారంగా ప్రాప్తించిన దానిని మాత్రం అనుభవిస్తూ ఉంటాడు.

దుఃఖాదులు ఏర్పడుచున్నది ’భ్రమ’ చేతనే - - ఓ రామా! నీవు ఇప్పటికే అత్యంత చిత్తనైర్మల్యమును పొందావు. తెలుసుకోవలసిన ప్రత్యగాత్మను తెలుసుకుంటున్నావు. కనుకనే స్థిరాస్థిరములను

Page:643

విభాగింపగలుగుచున్నావు. ఈ ప్రపంచవిషయములను సమగ్రంగా పరిశీలించి ఉన్నావు కాబట్టే వైరాగ్యప్రకటనంలో ఉత్తమమైన అభిప్రాయాలు వెలిబుచ్చగలిగావు. ‘వైరాగ్యము’ అనేది వాసనలు సన్నగిలుటచేతనే ఏర్పడుచున్నది.

కనుక, ఇక నిరుత్సాహమెందుకు? ఎల్లవేళల సమస్థితుడవై ఉండుము. ఏ వ్యవహారమైనప్పటికీ “లోకహితము” దృష్టిలో పెట్టుకొని నిర్వర్తిస్తూ ఉండు.

నీవు స్వతహాగానే సర్వదుఃఖరహితమగు చిదాత్మ స్వరూపుడవు.

ఇక ఎన్నటికీ, హర్ష-శోకములు పొందకుండెదవుగాక! ఏ ఒక్కక్షణంలోను ఈ భౌతిక శరీరాదులు నీ రూపము అయి ఉండలేదు. స్వయంప్రకాశము, నిర్మలము, సర్వవ్యాపకము, నిత్యము అయిన ఆత్మస్వరూపమే నీవు. ఈ శరీరాదులు ఉన్ననూ, లేకున్ననూ వాటితో నీకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆత్మయే స్వరూపముగా గలిగినట్టి నీకు దుఃఖాదులు గాని, విషయ సుఖములుగాని, జననమరణములుగాని ఎట్లా ఉంటాయి? “నాకు జనన మరణములు లేవు” అనునదే వాస్తవమైన జ్ఞానం.

“లేదు. నేను పుట్టాను. చావబోవుచున్నాను. నాకు ఏవేవో లేవు; ఎన్నో లేనివి నేను పొందవలసి ఉన్నది ; కొన్ని తొలగించుకో వలసియున్నది - ఎప్పటికో, ఏదో పొంది, ఇక ఆపై పూర్ణుడను కావలసి యున్నది:” అను రూపములు గల భ్రమలన్నీ కట్టిపెట్టు.

ఇక, “నా గురించి అట్లా ఉంచు. నేను జ్ఞానము ఆర్జించుటచే జన్మమరణాదుల దుఃఖం నశిస్తుంది. కాని, నా బంధువుల విషయమై దుఃఖము నశించేదెట్లా?”… అని సంశయించకూడదు సుమా! ఎందుకంటావా? నీవు బంధు మిత్ర రహితమగు శుద్ధాత్మస్వరూపుడవు కదా! అట్టి పరిశుద్ధ - ఆత్మ వస్తువుకు బంధువులేమిటి? దుఃఖములేమిటి? మిత్రులేమిటి? చింతలేమిటి? ఈ బాలుర కేరింతలు త్యజించు. అద్వితీయమగు పరమాత్మకు లేనిపోని బంధనవ్యవహారము అజ్ఞానం చేత ఆపాదించవద్దు. ఎవరైతే “నా బంధువులు-నా వాళ్లు" అని నీవు తలచుచున్నావో, వారి శరీరముల గురించి గాని, లేక వారి వాస్తవస్వరూపమగు ఆత్మ గురించిగాని నీవు శోకించవలసినపని ఏ మాత్రం లేదు. ఈ దేహము, పృథివి మొదలైనవి పంచభూతముల పరమాణు సమూహముచే నిర్మించబడినవే కదా! ఇది సర్వదా దేశ కాల భేదములచే ‘పరివర్తనశీలము’ అయి ఉన్నది. అనుక్షణం పరివర్తనమయ్యేదానికి దుఃఖించటమేమిటి? అట్లాగైతే ఈ శరీరములో ప్రకృతి సిద్ధంగా నిత్యమూ ఏర్పడే మార్పు చేర్పులకు స్పందిస్తూ ప్రతి రోజు ఒక్కొక్క బంధువు పేరు చెప్పి కాసేపు దుఃఖిస్తావా? కాబట్టి అనివార్యమగు శరీరాదుల పరిణామశీలత్వము గురించి దుఃఖించటం ఎందుకు? ఇక ఆత్మ విషయానికి వస్తే, ఇది ఉత్పన్నమగుట లేదు. నశించుటలేదు.

ఓ మిత్రులారా! మీరంతా వాస్తవానికి నాశరహితులై ఉండగా, "నేను మరణించుచున్నాను” అను భావన ఎందుకు పొందుచున్నారో చెప్పండి? మృత్యురహితమగు ఆత్మకు దోషం అంటగట్టకండి.

Page:644

కుండపగిలితే, ఆ కుండలోని ఆకాశం కూడా బ్రద్దలగుచున్నదా? లేదే. ఘటాకాశం (space within the pot) నకు మహాకాశం (Totality of space) నకు తేడా ఏమున్నది? మహాకాశమును ఘటం వేరుపరచగలదా?

“ఘటాకాశము” అని అసలు ఉన్నదెక్కడ?

ఆత్మకు వేరుగా ఈ జీవుడెక్కడ ఉన్నాడు?

లేని విషయం గురించి దుఃఖించుట ఏమిటి?

‘దుఃఖము’ అనుదానిని మనస్సు ఆశ్రయించుచున్నప్పుడు నిత్య - - అనిత్య, సత్య - అసత్య విభాగము చేయు దృష్టిని అలవరచుకోవటం ఆవశ్యకం.

అభిలాషను త్యజించాలి - సూర్యకాంతి విశాల ప్రదేశము నందు ప్రసరించుటచే, మృగతృష్ణలో జలతరంగముల కదలికలు స్ఫురిస్తున్నాయి కదా! ఆ మృగతృష్ణాస్రవంతి వినాశనమైనంత మాత్రం చేత సూర్యరశ్మి కోల్పోయేది ఏమైనా ఉన్నదా? లేదు. ఈ శరీర నాశనము కూడా ఆత్మకు సంబంధించినదే కాదు.

నాయనలారా! అసలు నిరర్థకమూ, భ్రాంతి రూపకము అయిన పదార్థములందు మీకు అభిలాష ఎందుకు ఉదయిస్తోందో చెప్పండి?

కొంచెము సమాలోచన చేయండి - - ఆత్మయే సర్వవస్తుస్వరూపమై ఉండగా ఇక వాంఛించవలసిన రెండవ పదార్థం ఎక్కడున్నది? వినేది, చూచేది, స్పృశించేది, ఆస్వాదించేది. ఆఘ్రాణించేది … అంతా ఆత్మయే సుమా! ఆత్మకు అన్యమైన వస్తువంటూ ఎక్కడా ఏదీ లేదు. ఆకాశమునందు శూన్యత్వం ఉన్నట్లే … సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సుప్రసిద్ధుడు అగు ఆ పరమాత్మయందు ఈ "స్పర్శ” మొదలైన శక్తులన్నీ ఉన్నాయి.

నీ ఈ భౌతిక శరీరము ప్రజ్ఞాస్వభావుడవగు నిన్ను నిర్వచించగలదా? లేదు.

అట్లాగే, ఈ శబ్ద - స్పర్శాది శక్తులన్నీ కలసికూడా పరమాత్మను నిర్వచించలేవు.

జీవుని ఆశ్రయించుకొని మాత్రమే ‘శరీరము’ ఉంటున్నట్లు ఈ శక్తులన్నీ పరమాత్మ నుండి బయల్వెడలి, పరమాత్మను ఆశ్రయించుకునే ఉంటున్నాయి.

అభిలాషయే ‘వాసన’ యొక్క స్వరూపం. ఈ త్రిలోకాలలో కనిపిస్తున్న ఉపాధులన్నీ సాత్విక - రాజస-తామసముల ఆయామిశ్రమములచే ఏర్పడి ఉన్నాయి. అయితే, ఇదంతా చిత్తము నందే ఉత్పన్నమగుచున్నది.

వాసన క్షయిస్తే మనస్సు నశిస్తోంది - - మనస్సు నశిస్తే, కర్మకు నివాసభూతమైన ‘మాయ’ కూడా స్వయంగా నశిస్తోంది.

అందుచేత రామా! ఈ సంసారచక్రమును నడుపుచున్న ‘వాసన’ అనే త్రాడును నీవు ప్రయత్నపూర్వకంగా వివేకబలంచే ఛేదించివేయి. ఎరుగబడనంతవరకు, వాసనారూపమగు ఈ

Page:645

మాయ గొప్పమోహమును కలుగజేయగలదు. ఎరుగబడిందా, ఇది అనంత-సుఖమునే ప్రసాదించ గలదు. అంతేకాకుండా, బ్రహ్మసాక్షాత్కారం కూడా ప్రాప్తింపజేయగలుగుతుంది.

ఈ ‘మాయ’ వచ్చేది ఎక్కడి నుండి? -

ఆగతా బ్రహ్మణోభుక్త్వా సంసారమిహలీలయా

పునర్ద్రహ్మైవసంస్కృత్య బ్రహ్మణ్యేవ విలీయతే |

ఈ ‘మాయ’ బ్రహ్మమునుండి ఉద్భవిస్తోంది. లీలామాత్రంగా ‘సంసారము’ ను స్మరించుచున్నది. అనుభవించి, మరల స్వలీలయగు బ్రహ్మవిద్యచే సంసారనాశనమొనర్చుచున్నది. బ్రహ్మమును ఎరుగుచు, బ్రహ్మమునందే లీనమగుచున్నది. ఆహాఁ! ఎంతటి చమత్కారం ! మంగళస్వరూపుడు, రూపరహితుడు, అప్రమేయుడు, నిరామయుడు అయి ఉన్న పరబ్రహ్మనుండి, నిప్పు నుండి

నిప్పురవ్వలులాగా ఈ ప్రాణికోట్లు ఉత్పన్నము లౌతున్నాయి.

ఆకులో ఈనెలు

జలంలో తరంగాలు

బంగారంలో ఆభరణాలు

అగ్నియందు ఉష్ణము ప్రకాశము

ఇవన్నీ ఎట్లాగైతే అంతర్భాగంగా ఉన్నాయో, అట్లాగే ధ్యాన రూపమును దాల్చుచున్న ఆ పరమాత్మ యందు ఈ ముల్లోకములు ఉన్నాయి.

ఆయన యందే ఈ జగత్తు ఉత్పన్నమైనది. ఆయన యందే స్థితి కలిగి యున్నది. ఆయన యందే లయిస్తోంది. అయితే ఏం? ఆయనయందు ‘జగత్తులు’ మొదలైనవేవీ లేవు. ఉండబోవు కూడా!

అందుచేత ఈ జగత్తు పరమాత్మయే అయి ఉన్నది. ఆ పరమాత్మయే సమస్త ప్రాణికోట్ల యొక్క అంతరాత్మయగు ‘బ్రహ్మము’ అని చెప్పబడుతోంది. ఆతనిని ఎరిగినవాడు ఈ జగత్తంతా ఎరుగుచున్నాడు.

అంతేకాదు, ఎరుగుచున్నది కూడా అతడే - అతనికి నామరూపాలు లేవు. అయినప్పటికీ అనంతాకారము కలిగిన ఆ పరమాత్మకు శాస్త్రములు రచించటానికి, శిష్యులకు బోధించటానికి (వ్యవహారార్థం) “చిత్తు-బ్రహ్మము-శివుడు-విష్ణువు-ఆత్మ-పరమాత్మ ఇత్యాది అనేక పేర్లు తత్త్వజ్ఞులు కల్పించారు. అదంతా అపరిపక్వమైన అవగాహనగల శిష్యజనులను ఉద్ధరించుటకొరకే అయి ఉన్నది. అట్టి కల్పిత నామములు, రూపములు భవిష్యత్తులోకూడా తత్త్వజ్ఞులచే ప్రవచించ బడబోవుచున్నాయి.

శుద్ధసాక్షీతత్త్వము–బుద్ధి-జగత్తు - - జీవన్ముక్తులు సర్వదా “నేను సాక్షితత్త్వమును. నా స్వరూపము సర్వదా నిశ్చలమై, వికార రహితమై ఉన్నది. అది అట్లే ఉండబోవుచున్నది కూడా” అను ఎరుకయే కలిగి ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా దైవకృతంగా ఇంద్రియములకు ప్రియాప్రియములైన సంఘటనలు పొందటం జరిగినా, వాటియందు ఆసక్తిగాని, భావోద్రేకముగాని పొందరు. సర్వదా అవినాశియగు

Page:646

చిదాత్మయొక్క భావనను, అనుభవమును కలిగి ఉంటారు. అంతేగాని, సంసారస్వభావులు అగుటలేదు. వారు ‘చ్యుతి’ నుండి వెనువెంటనే నిశ్చల స్వరూపమగు ‘అచ్యుతి’ ని అవధరించుచున్నారు.

ఆకాశము కంటేకూడా అతి సూక్ష్మము, నిర్లిప్తము అయినట్టి ఆ చిదాత్మయందే ఈ జగత్తు ప్రతిబింబితమగుచున్నది. ఇది ’శుద్ధ సాక్షిస్వరూపదృష్టికి వేరుగా “సంకల్పములు-వికల్పములు, అహంకారములు - మమకారములు” మొదలైన చమత్కారములతో ప్రకటితమౌతోంది. అట్లు ప్రకటితమగుచున్నది ఏది? జగత్తా? జగత్తుజడమైనది కదా! -

జగత్తు

చైతన్యము

- బుద్ధి

1) సాక్షిచైతన్యము - జగత్తులమధ్య ‘బుద్ధి’ ప్రతిబింబించుచున్నది.

2) ‘బుద్ధి’ అనునది ‘ప్రియము - అప్రియము’ అను విభాగములు కలిగి ఉంటోంది.

3) ఈ బుద్ధి జగత్తువైపు ప్రసరించుచున్నంత వరకు జడత్వమును పొందుతోంది.

4) సాక్షి చైతన్యముయొక్క అవివేకదృష్టియే జగత్తు ;

“ఇదమ్ సర్వమ్ బ్రహ్మమ్” అనునదే వివేకము.

ఈ ‘బుద్ధి’ …. లోభము, మోహము మొదలైన విషయములందు అవిచారణాపూర్వకంగా ప్రవేశించుచున్నది. అయితే బుద్ధి ప్రేరేపిత మాత్రం చేతనే కనిపిస్తున్న ఈ ’లోభమోహాలు’ అనబడేవాటికి స్వకీయమైన అస్థిత్వం లేదు. అందుచేత “అవి యథార్థానికి లేవు” అని చెప్పబడుతోంది. భ్రమచేత మాత్రమే ఉన్నట్లు కనబడుచు, భ్రమతొలగగానే లేకుండా పోయేవాటిని ‘ఉన్నాయి’, అనాలా?, ‘లేవు’ అనాలా? అయినను, అజ్ఞానదృష్టి ఉన్నంతవరకు ఈ లోభమోహాలు ప్రతిబింబించి, దుఃఖాదులు ప్రాప్తించటానికి కారణ భూతములౌతున్నాయి.

మూర్ఖత్వము త్యజించబడుగాక! - ఓ రామచంద్రా! ‘దేశ కాల’ రహితమైన నిర్వికల్ప స్వరూపమగు చిదాకాశమే నీ-నా రూపము, ఆకారము కూడా. అట్టి చిదాకశము (Pure-Realm of consciousness or awareness) నందు నీకు ఈ లజ్జ-భయ-విషాదములతో కూడిన మోహ మంతా ఎక్కడినుండి దాపురించుచున్నదో చెప్పు? దేహమే లేనట్టి నీవు అసత్యము అయి ఉన్న ఈ దేహమును ఆశ్రయించి ఉత్పన్నములగుచున్న ఆయాస్థితి గతులను చూచి దుఃఖించుటయా? దుర్బుద్ధితో కూడుకొన్న మూర్ఖత్వమే నిన్ను దుఃఖితుని చేయుచున్నదని గుర్తు చేస్తున్నాను.

Page:647

ఆత్మ - - చిత్తము దేహము - నాయనా! రామా! ఈ దేహము ఖండఖండములుగా ఛేదించబడుగాక! అఖండమగు చైతన్యమునకు భేదన-అభేదనములు ఉండనే ఉండవు. ఎవరైనా ఉన్నట్లు చూస్తుంటే, అది అజ్ఞానము చేతనేనని మేము గమనిస్తున్నాము. దేహము నశిస్తే “అజ్ఞాని యొక్క ఆత్మయే నశించుటలేదు” అని జనులు ప్రవర్తనలను ప్రకటించటం చూస్తూనే ఉన్నాము కదా!" ఇక జ్ఞాని గురించి వేరే చెప్పేదేమున్నది? సమ్యక్ దర్శి యగు (One who perceives equality, evenness and sameness everywhere, all times) జ్ఞాని యొక్క ఆత్మకు ఈ దేహ నాశనముచే కలుగు లోటుపాటు లేమి ఉంటాయి?

వాస్తవానికి ఈ చిత్తము స్వతంత్రమైనదేకాని, పరాధీనమైనది కాదు. అనగా? నీ చిత్తము నీ అధీనంలోనే ఉంటుందిగాని, ఎవరో పరాయివారి అధీనంలో కానేకాదు. ఇకదాని చంచలత్వమంతాస్వకీయమైన విషయ మననరూపమగు అభ్యాసవశంచేతనే సుమా!

అనగా, ఇది ఎక్కడినుండో, ఎవరిచేతనో నియమించబడుటలేదు. దాని గమనాగమనములు దాని అధీనంలోనే ఉన్నాయి. “దానిశక్తి ‘ఇంతింత’ అని చెప్పలేము” అని ఐందవోపాఖ్యానంలో చూచాము కదా! ఏ ఆశ్రయము లభింపజాలని ‘సూర్యమార్గము (The orbit of Sun)’ లోకూడా అది క్షణంలో పయనించగలదు. అట్టి చిత్తమునే మనం ‘పురుషుడు’ అని అంటున్నాం. మనం ఎవరినైనా, ఎందుకైనా, సంబోధించేటప్పుడు, దృష్టిలో పెట్టుకుంటున్నది చిత్తమునే గాని, ఈ దేహమును ఏమాత్రం కాదు సుమా! జనులు మాట్లాడుకునేది, వ్యవహరించేది, ప్రేమించేది, ద్వేషించేది ఈ చిత్తమునే. కాబట్టి చిత్తమే జీవుడు. ఈ పాంచభౌతిక - - దేహము జీవుడు కాదు. ‘జీవించుట’ అను కర్తృత్వమును ఈ శరీరమాత్రమునకు ఆపాదించుట ఉచితం కాదు.

ఆత్మ దేనిచేతనూ స్పృశించబడజాలదు - ఓ రాఘవా! ఒకడు జ్ఞాని కావచ్చు, లేక అజ్ఞాని కావచ్చు, దేహము ఉండవచ్చు, లేక నశింపవచ్చును. ఆత్మమాత్రం యథారీతిగా, ముల్లోకములందు అచంచలంగా ఉండియే ఉంటోంది. అంతేకాదు, స్వస్వరూపాత్మ ఈ ముల్లోకములకు ఈవలఆవల సర్వదా ఆక్రమించుకొని వెలుగొందుచున్నది.

ఈ దేహం నశించినంత మాత్రం చేత ఆత్మ నశించదు. దీనిని సందేహించువారు తమ ఉనికిని తామే సందేహించువారు అగుచున్నారు.

ఇక ఎదురుగా కనిపిస్తున్న ఈ సుఖ-దుఃఖాలన్నీ శరీరమునకే గాని, లేదా మనస్సుకే గాని…. అగ్రాహ్యమగు ఆత్మకు కానేకాదు. చిద్వస్తువగు ఆత్మ మనోమార్గముకంటే కూడా అతీతమైనది. ఆకాశము కంటే కూడా అత్యంత విస్తీర్ణంగా వ్యాపించియున్నది. అట్టి చిద్వస్తువు ప్రాపంచక దుఃఖముల చేత గాని, విషయసుఖముల చేత గాని ఎట్లా ప్రభావితం అవుతుంది చెప్పు?

సోది అడుగుట, ఆత్మశాంతికై ప్రార్థనాదులు చేయడం, చిత్రపటమును ఆవిష్కరించడం, సావత్సరీకములు జరపడం, మానసిక ఆహ్వానాదులు….. ఇవన్నీ ఈ అభిప్రాయము యొక్క దృష్టాంతాలు.

Page:648

“దేహా హమ్ - ఆత్మా హమ్" - - ఈ చైతన్యము అనేక జన్మలుగా అభ్యస్తమై యున్న వాసనలతో కూడుకొని ఉంటున్నది. అయితే ఈ ‘వాసనలు’ అనునవి “నేను ఈ దేహమును” అను భావన యొక్క పరిధిలో మాత్రమే ఉనికి కలిగి ఉంటాయి. ఒక సమయంలో ఈ చైతన్యము జ్ఞానమును ఆశ్రయించి, ఆ జ్ఞానబలంచేత తననుతాను ఎరుగుచున్నది. అప్పుడీ “దేహాం హమ్” భావనను త్యజించివేస్తోంది. తనయొక్క యథార్థ స్వరూపమైయున్న పరమాత్మ యందే ప్రతిష్ఠిత మగుచున్నది.

అసలు ‘జీవుడు’ అనగా ఎవడు? - - ‘ఉపాధి’ అనే ప్రదేశంలో ఏర్పడి ఉండువాడు మాత్రమేనా? కానేకాదు! అట్లా అయితే, అతనికి ఉపాధికంటే వేరైన సత్తాయే ఉండేది కాదు. ఉపాధి నశిస్తే అతడు కూడా నశించేవాడే. కాబట్టి, ఈ జీవుడు దేహపరిమితుడుకాడు.

కాని, ఆత్మగా జీవుడుగా అగుట ఏమిటి? - ఆత్మను ఉపాధిపరంగా, చిత్తపరంగా చూచు అజ్ఞానదృష్టికి మాత్రమే జీవుడు అనబడువాడు తారసపడుచున్నాడు. ఆత్మకంటే వేరుగా జీవుడు అనబడే వాడే లేడు. ఇందులో సందేహం లేదు. ఆత్మ జీవుడే అగుటలేదు కదా ! ఇక ‘దేహము’గా ఎట్లా అవుతుంది?

జీవుడు ఆత్మయే అయి ఉండుటచే, ఈ ‘దేహము’ అనే పంజరం నశించినప్పటికీ అతనికి కలుగుచున్న నష్టమేమీ ఉండదు. ఓ రామా! నీవు జీవుడవే కావు. ఆత్మయే అయి ఉన్నావు. అట్లే ప్రతిఒక్కరుకూడా. ఇక దుఃఖము పొందవలసిన పనేమున్నది?

“నేను ఈ శరీరమును కాదు.”“జీవుడు’ అనబడునది కూడా నేను కాదు.” ”నేను సదా సత్స్వరూపమగు బ్రహ్మమునే అయి ఉన్నాను.”

అని భావిస్తూ ఉండు. అంతేకాని, భ్రాంతి రూపములైన నశ్వరదేహములందు “ఈ దేహమునే నేను” అనునట్టి దేహాత్మభావన చేయటం ఉచితమా? …. కాదు.

ఓ సర్వసభికులారా! సర్వజనులారా! మీలోని ప్రతిఒక్కరు “నేను అఖండుడను, అప్రమేయుడను” అనురూపమైనట్టి “ఆత్మసారూప్య భావనను” నిరభ్యంతరముగా చేయవచ్చు. శుద్ధము, అకళంకము అగు పరమాత్మకు ఏ విధమైన ‘ఇచ్ఛ’ ఉండదు కదా! ‘చిదాత్మ - స్వభావులే’ అయి ఉన్నట్టి మీరంతా “నేను ఇచ్ఛారహితుడనే” అని ఎందుకు భావించరాదు?

జగత్తు భావనామాత్రమే - - చిదాత్మ సర్వులయందు సాక్షీభూతమై, సర్వత్రా సమమై, నిర్మలరూపమై, నిర్వికల్ప స్వభావయుతమైయున్నది. అట్టి చిదాత్మయందు, అద్దమునందు వస్తువులు కనబడునట్లు, ఈ బ్రహ్మాండములన్నీ ప్రతిబింబిస్తున్నాయి. స్వచ్ఛమైన మణి అనిచ్ఛాపూర్వకంగానే (Without maintaining intentions) తనయందు సూర్యకిరణములను ప్రకాశింపజేయుటలేదా? ఆత్మకు ఏ ఇచ్ఛ లేకున్నప్పటికీ, వికల్పరహితమగు ఆత్మయందు ఈ జగత్తు ప్రతిబింబించుచున్నది. అద్దం కదలకుండానే తన యందు వస్తువుల కదలికలను చూపుచున్నది కదా! "దర్పణం - ప్రతిబింబం”ల అనిచ్ఛా పూర్వకమైన సంబంధం ఎట్లు సిద్ధిస్తుందో, ఆత్మ - జగత్తుల భేదాభేద సంబంధం సిద్ధిస్తోందని

Page:649

గ్రహించుటయే “జ్ఞానము”. అద్దములోని ప్రతిబింబము అద్దముకంటే వేరా? యథార్థానికి ఆ రెండు ఒక్కటే అయినప్పటికీ, భావనామాత్రంచేత వేరువేరుగా ఉంటున్నాయి. జగత్తుకూడా భావనా మాత్రం చేతనే ఆత్మకు వేరుగా తోచుచున్నది.

సూర్యుని సన్నిధానం చేతనే (Just by mere presence), అతని ఇచ్ఛ లేకుండానే (కిరణజన్య సంయోగము Photosynthesis మొదలైన) జగత్ కార్యములన్నీ సిద్ధిస్తున్నాయికదా! ’చేతనసత్త’ యొక్క ఔన్నత్యమాత్రంచేత ఈ జగత్తు అంతా ఉత్పన్నమగుచున్నది. ఓ రామా! ఎప్పుడైతే నీ దృష్టి నుండి ఈ నామరూపాత్మక జగత్తు నివృత్తిస్తుందో, అప్పుడు నీ చిత్తము నందు ‘ఆకాశము’ వంటి శుద్ధ చైతన్యస్వరూపము రూఢి కాగలదు. ‘దీపము’ గదిలో వెలుగుచున్నంత మాత్రంచేత ఆ వెలుగులో ఆయా వస్తువులు, వాటి భేదాభేదములు కనబడుచున్నాయి కదా! "అయితే వస్తువుల భేద వ్యవహారము దీపపు వెలుగుచేతనే కల్పించబడుచున్నది” అని అంటామా? లేదు. ఈ జగత్తులోని భేద వ్యవహారమునకు, భగవంతునికి గల సంబంధము అట్టిదే.

చిద్వస్తు స్వభావ మాత్రంచేత, భావనానుగుణంగా ఈ జగత్తు ఏర్పడి ఉంటోంది. మోహం తొలగితే చాలు! సర్వము విదితము, అనుభవము కాగలదు.

ఆకాశము యొక్క స్వరూపమేమిటి? శూన్యమేకదా! అయినప్పటికీ జనులంతా అక్కడ సుందరము, శోభాయమానము, కాంతియుతము అయిన నీలత్వమును చూస్తున్నారు. అట్లాగే, జనులు ఆత్మయందు జగత్తులను దర్శిస్తున్నారు. భావన అనుభవం… ఒకదానిని రెండవది నిర్మిస్తోంది. భావనలో ఏర్పడుచున్న భ్రమ తొలగితే అంతా విదితమే అవుతుంది.

పరమాత్మ నుండి మనస్సు, మనస్సు నుండి జగత్తు ఉత్పన్నములవుతున్నాయి. ఈ జగదాడంబర మంతా మనస్సు చేస్తున్న పనే! సంకల్పము నశించినంత మాత్రంచేత చిత్తము క్షయించగలదు. మనో-జగత్తుల వాస్తవస్వరూపం ఆత్మయే!

చిత్తము క్షయిస్తే మోహం స్వయంగానే నశిస్తుంది. మేఘాలు తొలగగానే నిర్మలాకాశం స్వయం గానే శోభిస్తుంది కదా! మోహం తొలగగానే అంతఃకరణము నందు, “జన్మవర్ణితుడు, అనాది, అనంతస్వరూపుడు, నిర్మలుడు, చిన్మాత్రస్వరూపుడు” అగు పరమాత్మ స్వయంగానే ప్రకాశిస్తున్నాడు.

  1. లఘు సమీక్ష

మరికొంత లఘువుగా సమీక్షిస్తున్నాను. విను - -

సర్వాత్మకమగు చిదాత్మయందు మొట్టమొదట “సమస్తప్రాణుల సమష్టికర్మ” రూపమున సమష్టి క్రియాశక్తి ప్రధానం అయినట్టి “మనస్సు లేక, చిత్తము” ఆవిర్భవిస్తోంది. అట్టి సమష్టిచిత్తరూపునే “బ్రహ్మదేవుడు” అని అంటున్నాం. ఆతని మనోసంకల్పమునుండి ‘మనువు’ మొదలైన మానసదేహులు ఏర్పడుచున్నారు. వారు దేహమును ధరించి, వివిధనామరూపములతో కూడిన ఈ మిథ్యాజగత్తును

Page:650

విస్తరింపజేస్తున్నారు. బాలుడు బేతాళుని రూపమును మనస్సునందు కల్పించుకొని, అదియే బాహ్యమున చూచుచున్నట్లు, ఇదంతా ఏర్పడుతోంది.

సమష్టి - వ్యష్టి భేదములచే కల్పితమగుచున్న ఈ జగత్తంతా ‘మనోమాత్రమే’! మనస్సు కూడా ‘అసత్తే’ అయి ఉన్నది. అజ్ఞానముయొక్క కార్యమే అది. సర్వమునకు అధిష్టానమై వెలుగుచున్న ‘సాక్షిచైతన్యము’ యొక్క స్ఫూర్తి చేతనే ‘అసత్తు’ అగు ఈ జగత్తు స్ఫురిస్తోంది.

అట్లు జగత్తుగా స్ఫురించుటయే దీని “ఉత్పత్తి”. అంతయు విజ్ఞానదృష్టిచే పరిశీలించుచున్న మేము, “ప్రపంచ రహితమైన సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మమే ఈ ‘జగత్తు’ రూపముగా అజ్ఞానదృష్టికి తోచుచున్నది” అని సిద్ధాంతీకరిస్తున్నాం. వాస్తవానికి ‘జగత్తు’ అనబడునదేదీ ఉత్పన్నమే అయిఉండలేదు. నిత్యోదిత-పరమానంద స్వరూపమగు ఆత్మయే స్వకీయ-అజ్ఞానకారణంగా జగత్తుగా దర్శించబడుతోంది.

పూర్ణ మహాసముద్రము యొక్క ‘సత్తామాత్రము’ నందు వలయాకారములగు తరంగముల పంక్తి (Water - ripples) ఉద్భవించి స్థితి పొందుచున్నాయి కదా! నీటిని ఆధారం చేసుకునే వలయాకారములు ఉంటున్నాయి. ఈ మనస్సు తనకు అధిష్ఠానమైయున్న సాక్షి చైతన్యము యొక్క ప్రభావం చేతనే “సద్వస్తువా?” అన్నట్లుగా భాసిస్తోంది.

వాక్కునకు లభ్యమగుచున్న ఈ విచిత్రమైన జగత్తు, ఈ దృశ్యము ‘మిథ్యయే’ అయి ఉన్నాయి. సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మమే అవికృతరూపమున సదా నెలకొనియున్నది. ఇది గ్రహించటమే- బోధించటమే శాస్త్రములు - సర్వప్రయత్నముల అంతరార్థమైయున్నది.

ఉత్పత్తి ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు

ఓంతత్సత్

మోక్షోపాయమై ఉన్నట్టి ఈ గ్రంథము యొక్క సహాయంచే ’జ్ఞాన కాంతి’ని పొందువారు మోహాంధకారంచేత గ్రుడ్డివారు అవటం జరగదు. ‘తృష్ణ’ అనేది వివేకము ఉదయించనంత కాలమే ఉంటుంది. తృష్ణ ఉన్నంతకాలం వేదనలు తప్పవు. ఓ జనులారా! లేవండి. ఈ శాస్త్రవిచారణను అనుసరిస్తూ రండి. సంసార బంధమును త్రెంచి వేయుటకు కృతనిశ్చయులు అవండి.

వసిష్ఠ మహర్షి

పుట: 130

శ్రీరాముడు : గురువర్యా! మునీంద్రా! ఇంతకీ ఈ ’మనస్సు’ అనునది జడమా? చేతనమా? ఈ విషయం ఇంకా నాకు బోధపడనేలేదు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు చిత్ - అచిత్ రూపమైయున్నది. అనగా, ఇది జడముకాదు. చేతనము కాదు. చైతన్యమే సంసార దశ యందు ఉపాధి దోషంతో కూడుకొని ఉన్నప్పుడు ‘మనస్సు’ అని పిలువబడుతోంది. అనగా, చైతన్యమునకు వేరుగా ‘మనస్సు’ అనబడునది ఏది లేదు. ‘ఆలోచన’ అనునది ఆలోచించువానికి వేరుగా ఉంటుందా? ఉండదు కదా!

పుట: 522

CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93–83972–14–2 (Set)

దోమలగూడ, హైదరాబాదు–29 మఠం se email : publication@rkmath.org

9789383972142

Vasishta Rama Samvadam : Vol 1 ISBN 93–83972–10–4 1000/- (set) www.rkmath.org