CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:73

III. భృగు - యమ సంవాదము - -

తదనంతర చర్చ

  1. చిత్తము - ప్రాప్తాప్రాప్తములు

శ్రీరాముడు : మునీంద్రా! భృగుని కుమారుడైన ఆ శుక్రునికి తన యొక్క మనోరథ ప్రతిభ (force of his own wish) చేతనే స్వర్గలోక సంచారం, దేవకన్యతో సాంగత్యం మొదలైనవి ప్రాప్తించాయి కదా! ఈ విషయంలో నాదొక సందేహం. ఈ జీవులలో ఎందరో ఏవేవో మనోరథములు కలిగి ఉంటున్నారు కదా! మరి, అనేకుల యొక్క "నేను ఇది పొందుతాను. ఇవి చేస్తాను” అను ప్రతిభ సఫలం ఎందుకు అగుటలేదు?”“నేనిప్పుడు స్వర్గము చేరి సర్వ సుఖములు అనుభవించెదను గాక” అని సంకల్పించగానే ఎవ్వరికైనా అట్లే ప్రాప్తించాలి కదా? ప్రాప్తించుటలేదేం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏదైనా ప్రాప్తించాలంటే భావనయొక్క పరిశుద్ధత, ఏకాగ్రత అవసరం. శుక్రాచార్యుడు తాను పొందాలని కోరుకొన్నది తన మనోరాజ్యంలో సఫలమై పొందటానికి కారణం ఇతఃపూర్వపు కల్పమునందలి అతని ప్రయత్నాదుల ఔన్నత్యమే. పూర్వ కల్పమునందలి అతని అంతిమ జన్మయందు గొప్ప ఉపాసనాదులచే ఏకాగ్రతను, లక్ష్యశుద్ధిని, సాధించటంలో ప్రావీణ్యతను అలవరచుకుని ఉన్నాడు. ఉత్తమ సంస్కారములు, ఆత్మతో తాదాత్మ్యము కొరకై ఆశయము పొంది ఉన్నాడు. అందుకు ఫలితంగానే ’బ్రహ్మఋషి’కి పుత్రుడై కళంకరహితమైన జన్మను పొందాడు. ఈ కల్పము యొక్క ప్రారంభంలో సత్యాత్మ యొక్క భావనను పొందుటకు అర్హమైన “మానవ-మునికుమార విద్య-సమృద్ధి”లతో కూడిన జన్మను సంపాదించాడు. శ్రీరాముడు : తండ్రీ! ‘సత్యాత్మ భావన’ అనగా ఏమిటో… మరికొంత వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వకోర్కెలు నశించినప్పుడు అట్టి స్థితిలో శేషించే చిత్తము యొక్క స్థితియే ‘సత్యాత్మభావన’ అను పేరుతో చెప్పబడుతోంది. దానినే "నిర్మల చిత్స్వరూపము” అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ చిత్తము నిర్మలము, సత్యాత్మ స్వరూపము అవుతుందో - అట్టి చిత్తము ఎల్లా భావన చేస్తుందో అది ఆ విధంగానే శీఘ్రంగా అవుతూ ఉంటుంది.

శుక్రుని చిత్తములో ఒక చమత్కారమైన విభ్రమము ఏర్పడినట్లు మనం కథలో చెప్పుకున్నాం కదా! ఏ విధంగా స్వయంగానే అతని చిత్తమునందు విభ్రమము ఉత్పన్నమైనదో, అదే విధంగా ప్రతి జీవునియందు చిత్త విభ్రమము ఉత్పన్నమౌతోంది. ‘ఆత్మస్వరూపభావన’ నుండి చ్యుతి పొంది బాహ్యదృష్టిని ఆశ్రయించి చైతన్య సత్తయే శాస్త్రకారులచే ‘జీవుడు’ అనే పేరుతో పిలువబడుతోంది. ఒక విత్తనమే - అంకురము, కాండము, ఆకులు, కాయలు, కొమ్మలు - మొదలైన రూపములుగా అగుచున్నది. అలాగే, సమస్త ప్రాణుల యొక్క “స్వయం కల్పిత భ్రాంతి”యే ఈ ద్వైతవిభాగమును ఏర్పరచుచున్నది. అది స్వస్వరూపవిస్తారం అయి, ఇట్లు, తనను తానే ప్రకటించుకొనుచున్నది.

Page:74

ఈ ఎదురుగా ఉండి, ’ప్రపంచము’ అని చెప్పబడుచున్న దృశ్యవ్యవహారమంతా ప్రతి జీవుని చిత్తము నందు మిథ్యారూపముగా ఉదయిస్తోంది. మిథ్యారూపముగా ఉనికిని కొనసాగిస్తూ… ఎప్పుడో మిథ్యారూపముగానే లయం పొందుచున్నది.

కాని, యథార్థానికి ఈ జగత్తు ఉత్పన్నమగుట లేదు, నశించుటలేదు. మాయచే ఉన్మత్త స్త్రీలాగా ఈ జగత్తు రూపంగా తనయొక్క ప్రభావమును ప్రకటించుచున్నది.

నాస్తమేతినచోదేతి జగత్కించన కస్యచిత్ |

భ్రాంతి మాత్రమిదం మాయా ముగ్దేవ పరిజృంభతే ॥ || (సర్గ 17, శ్లో. 8.)

ఇప్పుడు మన అనుభవములలో వేరువేరు విధములుగా ఈ జగత్తు ప్రత్యక్షమై ఉంటోంది. అనగా, ఒక ముని అయినట్టి నాకు ఒక రీతిగా, ఒక రాజు అయినట్టి నీకు మరొక రీతిగా స్వయంకృతమైన కార్యక్రమాలను అనుసరించి ప్రాప్తిస్తోంది కదా!

అట్లాగే తక్కిన జీవులకు కూడా మిథ్యారూపములైన వేరు వేరు జగత్తులు ప్రత్యక్షముగా కనిపించుచున్నాయి. వేరు వేరు విషయములు వేరు వేరుగా "ఇది దుఃఖకరము, ఇది సుఖకరము, ఇది అవశ్యము, ఇది అసంగతము, ఇది సవ్యము, ఇది అపసవ్యము”…. అని నిర్వచించబడి దర్శించబడుచున్నాయి. అయితే ఒకనికి కనబడే ‘జగద్భమ’ యొక్క రీతి మరొకరికి కనిపించుట లేదు. ఎవరి భ్రమ, సుఖ-దుఃఖములు, భావాభావములు - వారివే అగుచున్నాయి. ఒకడు తన స్వప్నంలోనో, సంకల్పనగరంలోనో చూచుచున్న వ్యవహారం ప్రక్కనేవున్న మరొకనికి కనిపిస్తోందా? లేదు కదా! అదే విధంగా ఒక జీవుని యొక్క భ్రమతో కూడిన “జగద్దర్శనము” మరొక జీవునికి అట్లుగాక వేరొక విధంగా ఉంటోంది. “సంకల్పము” అనబడే బహువిస్తీర్ణమైన ప్రదేశంలో ‘జగద్రూపములు’ అనే అసంఖ్యాకములైన నగర సమూహములు ఏర్పడుచున్నాయి. “ఇవన్నీ మిథ్యయే” అనే అవగాహన ఒక్క జ్ఞానదృష్టి కలవానికి మాత్రమే నిర్దుష్టముగా ఏర్పడుచున్నది. మాయచే ఆశ్రయించబడిన జీవుడు “ఇదంతా వాస్తవమే” అను రూపం గల భ్రాంతిని పొందుచూ, అనుభవించుచున్నాడు. ఒక్క మానవులే కాదు. దేవత-రాక్షస జీవులు, పిశాచ-యక్ష జీవులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు.

అంతే కాదు. మనమందరం కూడా శుక్రుని లాగానే సంకల్పమాత్ర శరీరులమే! ‘మిథ్య’ అయిన దానిని సత్యముగా తలచుచు ఇట్లు ఉత్పన్నమైనాము.

ఈ వ్యష్టియే కాదు. వ్యష్టి (Individual) కి పరమైనట్టి సమష్టి సృష్టి అహంకారియగు హిరణ్యగర్భ రూపుడు’ కూడా ‘ఈ జగత్ సృష్టి పరంపరలు’ ఈ విధంగానే మిథ్యారూపంగా పొందటం జరుగుతోంది. ఈ అనేక ఉపాధి - వస్తు జాలముల నిర్మాణము వెనుక ఏర్పడి ఉన్న ఇచ్ఛాశక్తియే హిరణ్యగర్భుని ప్రదర్శన.

వాస్తవానికి ఈ వ్యష్టి-సమష్టి జీవులిరువురు ఆత్మస్వరూపులే అయివున్నారు. ’అవస్తువు’ అయినట్టి ఆత్మ యందు “జగత్తు-శరీరము” మొదలైన వస్తుత్వమంతా ఎట్లా ఉంటుంది? ఎట్లా

Page:75

ప్రవేశిస్తుంది? ఎక్కడినుండి ప్రవేశిస్తుంది? లేదు. కనుక శరీరాదుల రూపంలో స్ఫురించేదంతా మిథ్యయే అయివున్నది.

ప్రతి చిత్తము నందు మిథ్యారూపమగు జగత్తు ఉంటూనే ఉన్నది. “ఆత్మచే ఆత్మయందు ప్రథమ సంకల్పము“ ఏర్పడుచున్నది. అట్టి ప్రథమ సంకల్పం ‘ఆత్మయందు ఈశ్వరత్వము’ అని శాస్త్రాలచే (వేదాలచే) చెప్పబడుతోంది. సంకల్పము చేతనే ఈ జగత్తు వ్యవస్థితి పొందియున్నది. తత్త్వజ్ఞానము పొందుటచే ఈ జగద్రూపస్థితి ఏ విధంగా ఏర్పడినదో తప్పక గ్రహించబడగలదు. ఉత్తమ ప్రయత్నము, అవగాహనలను ఆశ్రయించుచున్నవారు, ”అనాదియగు అజ్ఞానమునందు స్థితిపొంది యున్న ఈ చిత్తమే అనేక విధములుగా కార్యయుక్తమగుచున్నది” అని జ్ఞానులు ఎఱుగు చున్నారు. అట్లు ఏర్పడు ‘ఎఱుక’ యొక్క ప్రభావంచే ఈ చిత్తము తనంతట తానే నశించుచున్నది.

  1. సత్యవస్తు విచారణ

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీటి కదలికలను అనుసరించి నీటిలో ప్రతిబింబిస్తున్న సూర్య బింబము పైకి-క్రిందికి కదులుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నీటిలోని సూర్యుని చూడటం మానేసి, ఆకాశంలోని సూర్యుని చూచామనుకో… అప్పుడు నిశ్చల స్వభావుడగు సూర్యుడు కనబడతాడు. కదులుచున్న మేఘాలతో కలిపి చంద్రబింబమును చూస్తూ ఉంటే, చంద్రబింబం మేఘకదలికలను అనుసరిస్తూ ఉన్నట్లుంటుంది. మేఘాలు మన ’దృష్టి’ని ఆకర్షించకపోతే అప్పుడు నిశ్చల చంద్రుడు అగుపిస్తాడు. అదేవిధంగా ‘ప్రతిభాస’ (reflective) అనబడు ద్వితీయ విశేషముతో కూడిన అవగాహనాదులు ఉన్నపుడు మాత్రమే ‘జగత్తు’ అనబడేది అనుభవమవటం జరుగుతోంది. సత్య వస్తువగు బ్రహ్మము సాక్షాత్కరించిన తరువాత ఇక ‘జగత్తు’ అనేది ఉండదు. ఒక ఏనుగు కట్టుకంబమునకు కట్టివేయబడుతూ ఉంటుంది కదా! అట్లాగే ‘చిత్తము’ అనబడే ఏనుగుకు ఈ జగత్తే కట్టుకంబము సుమా!

చిత్తము యొక్క ఉనికియే జగత్తు. జగత్తు యొక్క ఉనికియే చిత్తము.

చిత్తమును అనుసరించే జగత్తు ఉంటుంది. చిత్తము లేని చోట జగత్తు కూడా లేదు.

చిత్తము - జగత్తులలో ఒకటి నశిస్తే, రెండవది కూడా తనంతట తానే నశించుచున్నదని గ్రహించు. అయితే అట్టి ఈ “జగత్తు యొక్క లేదా, చిత్తము యొక్క”… నాశనము ’సత్యవస్తువును గురించిన విచారణ” చేత మాత్రమే సాధ్యం.

చిత్సత్తైవ జగత్సత్తా జగత్సత్తెవ చిత్తకమ్

ఏకాభావాద్ద్వయోర్నాశః స చ సత్యవిచారణాత్ (సర్గ 17 శ్లో.19)

మట్టిచే దోషయుక్తంగా ఉన్న మణిని శుభ్రమైన నీటిలో కడిగినప్పుడు ప్రకాశవంతంగా స్వచ్ఛంగా కనబడుతుంది కదా! ఈ చిత్తములోని దోషములు రహితం చేయబడినప్పుడు, అట్టి శుద్ధ చిత్తమే పరమాత్మ యొక్క స్వరూపము! లేక అదియే పరమాత్మ! అదియే సత్యస్వరూపము!

Page:76

శుద్ధ చిత్తం, విశేషములు - శుద్ధ చిత్తం తన యందు దేనిని ప్రతిభాసింప చేసుకుంటుందో, అది ’సత్యమే’ అయి ప్రాప్తిస్తుంది. అనగా, శుద్ధచిత్తము దేనిని స్వయముగా ఎట్లా సంకల్పించటం జరుగుతుందో, అది అట్లే సత్యమైన అనుభవంగా రూపము పొందుతోంది. శుద్ధ చిత్తము యొక్క ఏకాగ్రత స్వల్ప సమయంలో సఫలం అవుతుంది.

“చిత్తము శుద్ధ పరచుట” అనునది ఒక్కటే ఈ జన్మల - కర్మల యొక్క ఉత్తమోత్తమమైన ఆశయము. ఇక తదితరములన్నీ తత్సంబంధమైన - తదుచితమైన ఆశయములు మాత్రమే.

అయితే, ఈ చిత్తం శుద్ధం కావాలంటే ఏమి చేయాలి? చిరకాలంగా ఏకాగ్రత అభ్యసించుటే అందుకు మార్గం. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆకాశములోని ఆయా విశేషములు తటాకంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి కదా! అదే విధంగా, ఈ చిత్తము వివిధ సంకల్పములచే కలుషితం అవకపోతే, అద్దానియందు అత్యంత సులభంగా అద్వైత రూపముతో కూడిన ఆత్మ జ్ఞానము, ఆత్మ విజ్ఞానము ప్రతిభాసిస్తాయి.

చిరమేక దృఢాభ్యాసా చ్ఛుద్ధిర్భవతి చేతసః | |

అనాక్రాన్తస్య సంకల్పైః ప్రతిభోదేత చేతసః ॥ (సర్గ 17, శ్లో. 21)

మలిన వస్త్రమునకు రంగు వేస్తే నిలుస్తుందా? లేదు కదా! అదే విధంగా అనేక జగద్విషయములకు సంబంధించిన భావావేశ వృత్తులు తనయందు చంచలశీలంగా కలిగియున్న చిత్తములో అద్వైతతత్త్వ ప్రతిపాదికమగు ఆత్మజ్ఞానము నిలకడ పొందకుండానే పోతుంది.

ఈ సాంసారిక జీవుడు “ఇప్పుడు నేను స్వర్గం పొందాలి, విష్ణు లోకం పొందాలి”, మొదలైన భావనలు చేస్తున్నప్పటికీ అతడు శుక్రాచార్యునివలె వాటిని సత్యమై పొందలేకపోతున్నాడు. దానికి కారణం, అతడు తదితరములైన (వేరైన) అనేక సంకల్పములు కూడా కలిగి ఉండటమే. అందుచేత ఈ జీవుని యందు ఏకాగ్రత కొరవడుతోంది. అసంఖ్యాకములైన అనేక సంకల్పములు ఒక్కసారే చిత్తములో కాపురం ఉండి ఉండటం చేత అతనికి “నేను స్వర్గము చేరెదను” అనే సంకల్పం వాస్తవత్వం పొందకముందే మరొక సంకల్పమేదో వచ్చి మొదటి సంకల్పమును త్రోసివేస్తోంది. శుక్రాచార్యుని చిత్తమునందు “అనేక విశేషములు” లేక “అనేక జగత్తులు” అను రూపముగల వేరు వేరు సంకల్పములు లేవు. ఏకైక సంకల్ప నిష్ఠుడై “నేను ఇప్పుడు స్వర్గము చేరుచున్నాను… ఇంద్ర సభలో ప్రవేశించాను… ఇంద్ర భగవానునితో సంభాషించుచున్నాను…” ఇట్లు భావన చేశాడు. ఏకాగ్రత యొక్క ప్రభావంచేత అవన్నీ సత్యంగానే పొందాడు. అందుచేతనే అతడు స్వర్గము చేరుట, దేవతా స్త్రీతో విహారము చేయుట… ఇవన్నీ వాస్తవత్వము పొందాయి.

ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా విశేషము కలిగియున్నారంటే, అట్టి విశేషము వెనుక ఏకాగ్రతయే దాగి ఉండి ఉంటుంది సుమా!

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పినదానిని బట్టి ఆ శుక్రుడు తన యొక్క కల్పనా జగత్తులో ప్రవేశించి, అందులో ఇంద్రుడు, దేవతాస్త్రీ, ఆయా ఉపాధులు మొదలైనవి పొందాడని నేను

Page:77

గ్రహిస్తున్నాను. అయితే, నా సందేహమేమంటే, ఆ శుక్రుని చిత్తములోని కల్పనాత్మకమైన జగత్తులో ఈ సూర్యుడు, చంద్రుడు - ఉదయాస్తమయములు మొదలైన కాలక్రమమంతా ఎట్లా ఏర్పడింది? అతని చిత్తమునందు ప్రతిభాస అనునది ఏర్పడేటప్పుడు ఈ ఉదయాస్తమయములు మొదలైనవి గ్రహించబడవు కదా! అతనికి అనేక విశేషములతో కూడిన జగత్తులు ఎట్లా లభించాయి? ఆ జగత్తులకు కర్తలు ఎవరు? అవన్నీ అట్లా ఎందుకు కల్పించబడ్డాయి? అతనికి కనిపించినదంతా మన ఈ జగత్తు వంటిదేనా?

  1. సంస్కారములు - • అనుభవములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! శుక్రుడుగాని, నీవు గాని, నేను గాని, మరింకెవరైనా గాని, పురుగు మొదలైన జీవులుగాని… మనమంతా "ఉత్పత్తి, వినాశనము”లతో కూడిన ఈ దృశ్యజగత్తును ఎట్లా చూస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం చెపుతాను విను. అది విన్న తరువాత, నీ ప్రశ్నకు సులభంగా సమాధానం వస్తుంది…. ఈ చిత్తం ఏ విధంగా రూపు దిద్దుకుంటోంది?

స్వకీయ విశ్లేషణ / అవగాహన

One’s own

శ్రేష్ఠులైనట్టి తదితరుల జ్ఞానేంద్రియ శక్తులు ప్రేరణ Activation of Impulses Others As Inspiration & Example

శాస్త్ర పాఠములు

Dictations showered by Scriptures etc.,

  1. జ్ఞానేంద్రియశక్తులు - తల్లితండ్రుల నుండి ఈ జీవుని కొరకై సంక్రమిస్తున్నట్టి ఈ కంటికి కనబడుచున్న ‘భౌతికదేహం’ నందు “చూచుట-వినుట-ఆఘ్రాణించుట-రుచి-స్పర్శ”… అనబడే ‘జ్ఞానేంద్రియశక్తులు’ క్రియాశీలకమౌతున్నాయి. ఇవియే ప్రకృతి సంబంధమైన ఉపకరణములు. అట్టి జ్ఞానేంద్రియములతో, ఈ జీవుడు ఆయా విషయములను సమీపిస్తున్నప్పుడు అనుభవములు ఏర్పడుచున్నాయి. అట్టివి కొన్ని ఇష్టమైనవి, మరికొన్ని అయిష్టమైనవి ఇంకొన్ని మిశ్రమమైనవి అగుచున్నాయి. అవి చిత్తము నిర్మించబడు విధమునకు దోహదపడుచున్నాయి.

  2. శ్రేష్ఠులైనట్టి తదితరుల ప్రేరణ - శ్రేష్ఠులగు ఇతరుల అభిప్రాయములు, అనుభవములు, చింతనలు, పాఠములు, బోధలు, వారి వారి ప్రవర్తన మొ||నవి ఈ చిత్తము యొక్క రూపమును ప్రభావితం చేస్తూ ఉంటాయి.

Page:78

  1. శాస్త్రపాఠములు - గ్రంథాలు, శాస్త్రములు ప్రతిపాదిస్తున్నది పఠిస్తూ ఉన్నప్పుడు, అందలి విశేషములను గ్రహిస్తూ ఉన్నప్పుడు…. అట్టి జీవునియొక్క దృష్టి-అవగాహన - భావన పరిణతి చెందుతూ ఉంటాయి. అవి చిత్తం యొక్క రూపురేఖలలోని మార్పుకు కారణమవుతూ ఉంటాయి.

  2. స్వకీయమైన విశ్లేషణ అవగాహన - ఈ జీవుని స్వకీయమైన విచారణ, పరిశీలన, అవగాహన, పరిశోధన ఈ చిత్తము యొక్క తదనంతర స్థితి గతులను నిర్ణయిస్తూ ఉంటాయి.

ఈ నాలుగు విధములైన ప్రయత్నములచేతనే మనమంతా కూడా మన చిత్త సంస్కారాలను సముపార్జిస్తున్నాం. అట్టి మన చిత్తములను అనుసరించి ఈ జగత్తును చూస్తున్నాం. అనుభ విస్తున్నాం, భావిస్తున్నాం. అట్లే శుక్రుని విషయం కూడా. ఒకని చిత్తము అతని యొక్క కర్మ ఎరుకలను అనుసరించి ఎప్పటికప్పుడు క్రొత్త రూపములను సంతరించుకొంటోంది. ఇక ఆపై అతని యొక్క లౌకిక - పారలౌకిక జగత్తులన్నీ సంస్కార రూపంలో అతని చిత్తము నందే స్థితి పొంది ఉంటున్నాయి.

ఎవరైనా సరే, జీవించియున్నప్పుడు గాని, మరణించినప్పుడు గాని, స్వప్నము నందు గాని, సంకల్పనగరము నందు గాని… తన చిత్తమునందు సంస్కార రూపమున ఉన్నదే అనుభవముగా పొందుచున్నారు. ఎవ్వడూ కూడా, తన చిత్తములో లేనిదేదీ ఏ క్షణంలోనూ ఏమాత్రమూ పొందడు. చిత్తమే అనుభవం.

బీజము - దృష్టాంతానికి ఒక బీజాన్ని తీసుకుందాం. గాలి, సూర్యరశ్మి, నేల వంటి సహకారి కారణములు లభించినప్పుడు, ఆ బీజమే ’కాలము-క్రియ’ల క్రమమును అనుసరించి ఒక “మహా వృక్షం”గా పరిణమిస్తోంది. మహావృక్షం యొక్క సంస్కారమంతా ఆ బీజంలో దాగియే ఉంది కదా!

జీవుడు - అదే విధంగా, చైతన్యమే తన వాస్తవస్వరూపమైనట్టి ఈ జీవుని యందు “అవిద్య” అనే సంస్కారం ఉన్నది. అట్టి ‘అవిద్య’ జీవునియందు బీజమువలె ఉంటోంది. ఇక “తల్లిదండ్రుల చేత ప్రసాదించబడిన ఈ పాంచభౌతిక శరీరం, ‘శాస్త్ర-పితృ-బోధలు’… ఇవన్నీ ఒనగూడు చున్నప్పుడు ఇవి సహకారి కారణములౌతున్నాయి. “ఈ జగత్తును ఇట్లు దర్శించుట” అనునదే సంసారమహావృక్షముగా పరిణమిస్తోంది. ఓ రాఘవా! ఈ జీవుడు ఇట్లు జగత్తుగా చూస్తున్నదంతా వాస్తవానికి తన చిత్తమునందే, చిత్తము యొక్క మహిమ చేతనేనని గ్రహించు. ఈ జీవుడు ఎట్టి వాసనకు బద్ధుడో, అట్టి వాసనను అనుసరించి తనయందు సర్వమును గాంచుచున్నాడు. శ్రీరాముడు : “నా చిత్తమే ఇట్లు విస్తరించి ఈ జగత్తు యొక్క దర్శనము (perception of this world) గా పరిణమిస్తోంది”… అనే అభిప్రాయం చమత్కారమైన విషయమే.

శ్రీ వసిష్ఠమహర్షి : అవును ఇందుకు దృష్టాంతము మనం పొందుచున్న స్వప్నములే. ఒకనికి తన స్వప్నంలో కనబడే శరీరములు భవనములు మొదలైనవన్నీ స్వయం కల్పితములే కదా! మనస్సు యొక్క భావనయే అట్లు పరిణమిస్తోంది. అలాగే, ఈ జగద్దర్శనము కూడా ఒక దీర్ఘమైన స్వప్నము

Page:79

వంటిది మాత్రమే. మనస్సు యొక్క భావనా పరంపరలే జగద్రూపంగా పరిణమించినవై ఉంటున్నాయి.

శ్రీరాముడు : ఈ ’జగత్తు ఎవరికి వారికే వారియొక్క స్వప్నము వంటిది అయినప్పుడు, “ఇది ఈ వస్తువు… ఇది సరియైనది… ఇది సుందరము” వంటి అనేక అనుభవములు అనేకులకు ఒకే …….

తీరుగా ప్రాప్తిస్తున్నాయి కదా! ఇది గోడ అనే విషయం నేనూ, మరొకరు కూడా అనుభవిస్తున్నాం. అదే స్వప్నదృశ్యం విషయానికి వస్తే నేను పొందే స్వప్నము (కల) నా ప్రక్కనే ఉన్నవాడు పొందుట లేదు. అందుచేత “ఇది స్వప్నము వంటిది” అనటం ఎంతవరకూ ఉచితం…?

శ్రీ వసిష్ఠ మహర్షి : "అనేకులకు ఒకే తీరుగా కనబడుచున్నది కదా?”… అనునది నీ సందేహమా? సరే, దృష్టాంతము సహాయంతో వివరిస్తాను విను. ఒక చోట కొందరు సైనికులు ఉన్నారు. వారంతా పగలు యుద్ధంలో పాల్గొన్నారు. రాత్రి అయినది. వారంతా నిదురిస్తున్నారు. వారందరు తెల్లవారి తాము యుద్ధము చేయవలసియున్న శత్రు సైన్యము గురించి కలలు కంటున్నారు. ఇప్పుడు చెప్పు…. వారంతా, తమ స్వప్నములో చూచినది ఒకే శత్రుసైన్యం కదా!

వారు ఒక్కొక్కరుగా తలుస్తున్నది ఒకే శత్రుసైన్యం గురించి ఐనప్పటికీ, వారంతా వారి వారి ధైర్య - స్థైర్యములను, భావన, రాజభక్తి, బంధువులకు సంబంధించిన మమకారములు మొదలైన ఆయా విషయాలను అనుసరించి అనేక రీతులుగా ఆయా స్వప్న సంఘటనలు పొందుచున్నారు. ఈ జగత్తు విషయం కూడా అంతే. అవిద్యచేత ప్రతి జీవుడు కూడా "ద్వైతవిభాగం” అను రూపం గల తన స్వప్నంలో ఈ ‘జగత్తు’ అనబడు దృశ్యమును గాంచుచున్నాడు. ఈ దృశ్యమానం అయ్యేదంతా వాస్తవానికి ఒక్కొక్క జీవునికి, అతని వాసనలను అనుసరించి ఒక్కొక్క రకంగా సంప్రాప్తిస్తోంది. కాని అతడు “నాకిదంతా ఎట్లా కనబడుతుందో అందరికీ అట్లే కనబడుతోంది” అని మాత్రం భావన చేస్తున్నాడు. “నాకు ఏదేది కనబడుటలేదో, మిగతావారికీ అట్లాగే కనబడుట లేదు” అను భ్రమ ఏర్పడటం జరుగుతోంది. ఒకవేళ అందరికీ ఒకే తీరుగా కనబడటం జరుగు తుంటే, అప్పుడు ఇన్ని భావావేశాలు - అభిప్రాయభేదాలు, ఇన్ని రకాల దృష్టులు, అవగాహనలు ఎందుకు ఉంటున్నాయి చెప్పు? జనులలో ఏర్పడే స్పర్థలకు కారణం వేఱువేఱు దృష్టులే కదా!

అందుచేత, మనం ఈ "ద్రష్ట దృశ్యత్వము” అను వ్యవహారమంతా సునిశితంగా పరిశీలించటం జరిగితే మనకు ఇట్లు తెలియవస్తోంది…. “ప్రతిజీవుడు తన చిత్తము నందే ఆ చిత్త సంస్కారములను అనుసరించి, ఒక స్వప్న వ్యవహారంలాగా ఈ జగత్తును తన రీతిలో గాంచుచున్నాడు.”

అదియే ‘జగత్తు’ అనబడు పేరుతో విరాజిల్లుతోంది సుమా! కనుక, “జగత్తు ఎక్కడి నుండి బయల్వెడలుతోంది?” అనునది సముచితమైన సమాధానమే!

Page:80

  1. పరస్పరం

శ్రీరాముడు : మహాత్మా! ఈ ‘జగత్తు’ అనబడునది ఎవరికి వారికే తమ యొక్క స్వప్నం వలె భావనానుసారం ఏర్పడుట, ప్రాప్తించుట జరగుతోంది కదా! ఈ జగత్తులు ఆయా జీవులు పరస్పరం కలిసియే ఉంటున్నాయా? విడివిడిగా ఉంటున్నాయా? ఈ విషయం నాకు వివరించి చెప్పండి. “నా చిత్తము నందు నేను చూచు జగత్తు - మీ చిత్తమునందు మీరు చూచుచున్న జగత్తు” వేరువేరా? అట్లా అయితే ఒకరి భావాలతో, అనుభవములతో మరొకరికి సమన్వయం ఎట్లా ఏర్పడుతోంది?

శిష్యులను సముద్ధరించాలనే ఉద్దేశంతో గురువులు “దీనిని ఇట్లా ఆచరించండి“ అనే రూపం గల ‘ప్రవృత్తి’ని సూచించే శాస్త్ర విషయాలు రచిస్తున్నారు కదా! అట్టి శాస్త్ర విషయాలు శిష్యులపై ప్రభావం చూపుతున్నాయి. మరి ఎందుకు చూపుచున్నాయి? మీరు చెప్పుచున్నట్లు ” ఈ జగత్తు - దర్శించే ద్రష్ట యొక్క స్వప్నము మాత్రమే”… అనునదే వాస్తవమైతే, మరి ఒక గురువు యొక్క “స్వప్న విషయమాత్రములే” అయినట్టి అతని శాస్త్రావలోకనం, శాస్త్ర ప్రవచనం అతని శిష్యుని (స్వప్నజగత్తు అనదగ్గ) జాగ్రత్లో ఎట్లా ప్రవేశించి, ప్రభావితమౌతున్నాయి? జగత్తు స్వచిత్త మందలి ప్రకటనమే అయినప్పుడు గురువు చెప్పటమేమిటి? శిష్యుడు విని ఉద్ధరించబడట మేమిటి? మీరు చెప్పే “స్వప్న దర్శనం" అను సిద్ధాంతం ప్రకారం గురువు శిష్యుల సమ్మేళనం గాని, ’మోక్షం’ అనే స్థితి గాని సిద్దించవు కదా! ఎందుకంటే, “ఒకరి మనస్సు ఇంకొకరి మనస్సుతో కలియటం” అనేది జరుగదు కదా?

నా స్వప్నం - మీ స్వప్నం ఒకదాని కెదురుగా మరొకటి తారసపడుతున్నాయా? లేదే? శ్రీ వసిష్ఠ మహర్షి : మనస్సు రెండు విధాలుగా ఉంటోంది- 1) ’శుద్ధ మనస్సు’ ; 2)దృశ్య వ్యవ హారాలతో ఇష్ట అయిష్టాలనే సాంసారిక సంబంధం ఏర్పరచుకొని ప్రవర్తిస్తున్న ‘మలిన మనస్సు’.

మలిన మనస్సు శుద్ధ మనస్సుతో కలియటం అశక్యమే.

శుద్ధ చిత్తములు పరస్పరం కలుస్తాయి. అట్లాగే, ఒకే విధమైన సాంసారిక దోషము, ఆర్తి పరామర్శగల దోష మనస్సులు పరస్పరం కలుస్తున్నాయి.

ఒకే విధమైన చిత్త సంస్కారదోషము కలిగినవారి యొక్క ‘స్వప్నభావన’ కాకతాళీయంగా మరికొన్ని మనస్సులందు కూడా ఉండి ఉంటోంది. అనేక మనస్సులు ఒకేవిధమైన ‘దోషదృష్టి’తో ఈ జగత్తును చూస్తున్నాయి (లేక) పొందుచున్నాయి. అంటే కొన్ని విషయాలు అనేక మనస్సులకు ఒకే విధంగా అనుభవమౌతున్నాయి. తత్ఫలితంగా “ఈ జగత్తు బాహ్యమున కలదు” అను భావన చైతన్యం నందు రూఢిపడి ఉంటోంది. ఇదియే మాయ యొక్క చమత్కారం. అవాస్తవాన్ని వాస్తవం వలె చూపించుటయే ఇందులోని గమ్మత్తు.

ఏకరూపము గల జలములే కలుస్తున్నాయి.

Page:81

ఒక శుద్ధ చిత్తమునకు ఏది కనబడుతోందో మరొక సమానమైన శుద్ధ చిత్తమునకు అదే దర్శనమగుచున్నది. ఒక విధమైన దోషముగల చిత్తము దేనిని ఎట్లు గాంచుచున్నదో, అదే విధమైన దోషము ఉన్నట్టి మరొక చిత్తము దానిని అట్లే గాంచుట జరుగుతోంది.

అయితే ఈ జీవులు ఇదంతా ఇలా చూడటం వాటి వాటి వాసనా ప్రభావంచేతనే సుమా! వాసనలు క్షయిస్తే, ఈ భూతప్రపంచమునకు అందజాలని ‘ఏకరూపతత్వజ్ఞానం’ కలుగుతోంది.

విషయ వాసనలు ఉన్నంతవరకు జగత్తు కనబడుతోంది. వాసనలతో కూడుకొని చూడబడుచున్నదంతా స్వప్నతుల్యమే. ఎందుకంటే, వాసనలు మార్పు చెందినప్పుడు, ఇదే జగత్తు వేరొక రీతిగా అనుభవమౌతోంది కదా!

భ్రమాత్మకమైన దృష్టి ఉన్నంత వరకే “అతని అనుభవం, నా అనుభవం” వంటి కల్పిత భావాలన్నీ ఉంటున్నాయి. వాసనలు తొలగినప్పుడు ఈ “నేను-నీవు-జగత్తు” అనేవన్నీ ‘స్వస్వరూప జ్ఞానాగ్ని’ యందు భస్మీభూతమైపోతున్నాయి. సర్వవిషయాలకు అతీతత్వం నిర్మల మనస్సునకు మాత్రమే సాధ్యమగుచున్నది. అట్టి శుద్ధ చిత్త స్థితియే "చిన్మాత్ర పరిశేషత్వము” (The ultimate essence of absolute self) అను పేరుతో కూడా పిలువబడుతోంది.

అప్పుడీ జీవుడు ‘పరమ కైవల్యపదము’ అయినట్టి మోక్షమును పొందుచున్నాడు. అనేకంలో అంతర్లీనంగా సర్వదా ఏర్పడియున్నట్టి ’ఏకము అద్వితీయము’ను దర్శించుచున్నాడు.

  1. జీవుడు - - ఖండత్వము, అఖండత్వము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవులందరూ కూడా తమ తమ కల్పిత ప్రపంచములందు "స్థూలసూక్ష్మ-కారణ” శరీరాలతో సంబంధం కలిగి ఉంటున్నారు. వాటితో తాదాత్మ్యం పొందుచున్నారు. ఫలితం? ఆయా జగత్తులన్నీ అనేక భిన్నత్వములతో వారికి ప్రాప్తిస్తున్నాయి. అట్టి భిన్నత్వమంతా ‘శబ్ద-స్పర్శ–రూప-రస-గంధములు’… అను తన్మాత్రల యొక్క ‘ప్రతిభాస’ (Reflection) చేతనే సంభవిస్తోంది. ఈ ప్రతి దేహములోని ఆత్మ వాస్తవానికి సర్వదా స్వయంప్రకాశ స్వరూపము (self luminious), చిదేకరసము (Indivisible consciousness) అయి వున్నది. అట్టి ’నిర్వివాదాంశము అఖండము’ అగు ఆత్మయే ఆయా విధములుగా, భిన్నములుగా కల్పించబడుచున్నది. అయితే ఈ కల్పనా వ్యవహారమంతా వాస్తవము కాదు.

ఒకే చైతన్యము సర్వవ్యాప్తమైయున్నది. సర్వప్రాణులు గాఢనిద్ర నుంచి మేల్కొనగానే ఈ ద్వైత వ్యవహార ప్రవృత్తి పొందుచున్నారు. అయితే, స్వప్నమునందు, జాగ్రతునందు కూడా ఆయా వస్తు జాలమునందు ఏర్పడుచున్న ప్రవృత్తి - నివృత్తులన్నీ… ఏకరసమైన చైతన్యము యొక్క “సర్వ వ్యాప్తి” చేతనే సిద్ధించుచున్నది. “ఏకైక చైతన్యజ్యోతి వలననే, ప్రవృత్తియందు వ్యవహరిస్తున్నట్టి ఈ జీవులంతా… “ఇది కుండ, ఇది వస్త్రము" అనునట్టి అనుభవములన్నీ పొందగలుగుచున్నారు.

Page:82

ప్రవృత్తిర్వా నివృత్తిర్వా తన్మాత్రావృత్త పూర్వకమ్ | సర్వస్య జీవజాతస్య సుషుప్త త్వాదన్తరమ్ ॥ (సర్గ 18 శ్లో.2)

  1. సాక్షిచైతన్యము యొక్క ‘సంకుచిత, పరిమిత’ భావన - ’సాక్షి చైతన్యము’ ఈ ఉపాధితో తాదాత్మ్యము చెందటం జరుగుతోంది. అనగా ‘నేను ఈ పాంచభౌతిక దేహమాత్రుడనే’ అనే ఖండభావన కలిగి ఉంటోంది. ఇంద్రియములందు ప్రజ్ఞను ప్రవేశింపజేసుకొని, తత్ఫలితమైన ఆయా అనుభవములందు అధ్యాస (Avocation) కలిగి ఉంటోంది”.

  2. ద్వితీయమైనదంటూ లేనట్టి ఏకైక బ్రహ్మము - “సర్వజీవులందు ఏకైక బ్రహ్మమే ప్రసరించి సర్వదా ఉండి ఉంటోంది. చూచేవాడు, చూడబడేవాడూ బ్రహ్మమే”.

ఈ రెండు కారణముల సమన్వయంచేత ఒకరు మరొకరిచే కల్పించబడిన దృష్టులను సృష్టులను అటువంటి దృష్టితో చూచుచున్నారు. “ఏకత్వము - అల్పదృష్టి" ఈ రెండు ఒకేసారి ఉండియే ఉంటున్నాయి. చిన్మాత్రము… ఏకత్వము… ఈ రెండింటి యొక్క ప్రభావం చేత చిత్రవిచిత్రములైన (సృష్టికి సంబంధించిన) సంకల్ప రచనలు పరస్పరం మిళితం అగుచూ, అనుభవమౌతున్నాయి. ఘనీభూతమై ప్రవర్తిస్తున్నాయి.

మరికొన్ని జగత్తుల కల్పనలు పరస్పరం మిళితం కాకుండానే వేరువేరుగా ఉండి, అట్లే వేరువేరుగా లయం పొందుచున్నాయి. ఇక ఇంకొన్ని జగత్తులు పరస్పరం తారసపడినప్పుడు నాశనం పొందుచున్నాయి. అనగా ఒకడు ఒక జగత్తును పొందుట ద్వారా రెండవ జగత్తును త్యజించివేస్తున్నాడు. అట్లాగే ఒకని ఈ రోజు స్వప్నదృశ్యం - రేపటి స్వప్న దృశ్యం ఒకదానితో మరొకటి కలియటం లేదు కదా! కానీ, స్వప్నద్రష్టమాత్రం? ఒక్కడేకదా!

అయితే ఈ జగత్తులన్నీ కలియటం- లయించటం విడిపోవడం… ఇదంతా జరుగుచున్నది ఎందులో? ఇవన్నీ జనిస్తున్నదీ, ఉంటున్నదీ, లయిస్తున్నది బ్రహ్మము నందే సుమా! బ్రహ్మం ఏకం, సద్రూపం (One and True) అయివున్నది. ఈ జగద్రూపములన్నీ బ్రహ్మము యొక్క ప్రభావం చేతనే ఒక దానితో మరొకటి కలుస్తున్నాయి. వ్యవహార యోగ్యత్వమును సంతరించుకుంటున్నాయి. శ్రీరాముడు : ఈ ‘జీవుడు’ అనబడువాడెవ్వడు? అతనికి అనుభవములు, పరిమితులు ఏర్పరచు చున్నది ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : చైతన్యము లేక బ్రహ్మము స్వరూపముగా కలిగియున్న ఈ జీవుడు తన యొక్క స్వయంకల్పితము… స్వయంభావన ద్వారానే ఈ పరిమితత్వమంతా పొందుచున్నాడు. ఈ లోకంలో ఏ జీవుని తన భోగానికి అనుకూలమైనట్టి ఏ కర్మలు ఎచట వేడుకచే ఆకర్షిస్తున్నాయో, అతడు అద్దానిని పరిమితదృష్టిచే అందుకు అనుకూలంగా మాత్రమే దర్శిస్తున్నాడు. ఇంతకు మించి అధికంగా అతడు చూచుట లేదు.

శ్రీరాముడు : అతడు తన భోగానుకూలమైన భావనను అనుసరించే ఈ జగత్తులోని వస్తువులకు, సంఘటనలకు ఆయా అర్థములు ఇస్తూ, తదనుకూలంగానే అనుభవాన్ని పొందుచున్నాడంటారా?

Page:83

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అందుకు ఫలితంగా అతడు పరిమితమైన దృష్టి - - దృక్పథములను ఆశ్రయిస్తూ, తనకు తాను పరిమితత్వాన్ని ఆపాదించుకుంటున్నాడు.

శ్రీరాముడు : మహాత్మా! ఈ సర్వజీవులు బ్రహ్మమే అయి వున్నారు కదా! ఈ వేరు వేరు భావనలు, అభిప్రాయాదులు మొదలైనవి ఎట్లా, ఎందుకు, ఎప్పటి నుండి ఏర్పడి ఉంటున్నాయి? వీటి నన్నింటినీ ఎట్లా అవగాహన చేసుకోవాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : “బ్రహ్మము-జీవులు”… అనే తతంగమంతా "జలము-తరంగములు”గా అభివర్ణించబడ్డాయి. అంతా జలమే అయినప్పటికీ, ఒక కెరటము యొక్క ఆకారము, సంభ్రమము మరొక కెరటమునకు … ఏర్పడుచున్నదా? లేదు కదా! ఒక చిత్తము మరొక చిత్తము యొక్క మనో రాజ్యాన్ని కూడా అట్లే పొందుటలేదు. బంగారమంతా ఒక్కటే అయినా, వేరు వేరు ఆభరణాలు వేరు వేరుగా కనబడుట, ఉపయోగపడుట జరుగుతోంది. ఒక చిత్తము ఒక విధంగా, మరొక చిత్తము మరొక విధంగా ఈ జగత్తును దర్శించుచున్నది. ఒక చిత్తమునకు ఏర్పడుచున్న భోగానుభవం మరొక చిత్తమునకు ఏర్పడుట లేదు. కనుకనే, ఇది మనో - జీవభేదములకు కారణమగుచున్నది. ఒక కెరటము యొక్క ఆకారము, వేగము మరొక కెరటముతో పోల్చినప్పుడు “ఇవి రెండూ వేరు వేరు అని అనిపిస్తుంది కదా! అదే రీతిగా ‘ఈ జీవులు వేరు’ అని తోచుచున్నది. ఇదంతా అజ్ఞాన దృష్టిచేతనే ఏర్పడటం జరుగుతోందని నీవు గ్రహించు. కెరటములన్నింటిలోను ఉన్నది జలమే అయివున్నట్లు… జీవులన్నింటిలో ఉన్నది చైతన్యస్వరూపమగు బ్రహ్మమే. ఆ అద్వితీయ- నిర్మల - నిర్లిప్త - నిత్యోదిత - - అఖండ చైతన్యమే జాగృతమై ఈ సర్వఉపాధులందునూ వెలయుచున్నది. వేరు-వేరు గదులలో వెలుగుచున్నట్టి దీపశిఖలు వేరువేరు విశేషములను వస్తుసముదాయమును వెలిగిస్తున్నప్పటికీ, అగ్ని ఒక్కటేకదా!

  1. శరీరము - జీవుడు - – దృశ్యము - బ్రహ్మము

శ్రీరాముడు : మహర్షీ! ఈ వేరు వేరు శరీరములన్నీ కనబడుతున్నాయి కదా! ఈ శరీరములను, ఈ జీవజాతులను, వీటిలోని భిన్నత్వములను, ఏకత్వములను, వ్యష్టి సమష్టులను ఎలా

అవగాహన చేసుకోవాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : భిన్న మనోరాజ్యరూపములగు సృష్టుల గూర్చిన కర్మవాసనలు… జలములోని తరంగముల వలె.. బ్రహ్మమునందు ఏర్పడుచున్నాయి. ఈ వేరు వేరు కర్మవాసనలు ఒక్కొక్కప్పుడు కొంత సమత్వమును కలిగి ఉంటున్నాయి. ఒకే సమయంలో ఫలోన్ముఖములవటం, ఒక దానితో మరొకటి సంబంధం కలిగి ఉండటం కూడా జరుగుతోంది. అట్టి సమయంలో “ఇది వ్యష్టి (Unit)

Page:84

మనము - మనది -నీవు నీది - వారు - వారిది "… అనునదంతా వాసనలచేత ఏర్పడి

అఖండము, అప్రమేయము అగు వాస్తవమును కప్పి ఉంచుతున్నాయి. అట్టి సమష్టి - వ్యష్టి స్థూలసత్త అధిగమించబడినదనుకో… లేక “అమనఃస్థితి - అమనస్కస్థితి” దృఢాభ్యాసముచే పొందబడినదనుకో… అప్పుడు…

ఈ దేహం యొక్క అభావం అత్యంత స్వాభావికంగానే సిద్ధిస్తుంది. అనగా, “నేను దేహాన్ని కాదు. ఇందలి అనుభవముల ‘కర్త-భోక్త’ అయివున్న ప్రజ్ఞాతత్వమే నేను. దేహముల రాక పోకలకు వేరుగా చైతన్యమూర్తిత్వంతో వెలుగొందుచున్నాను. ఆ ప్రజ్ఞాతత్వమే ‘నీవు, ’అతడు’ కూడా-” అను అనిర్వచనీయమైన ఒక ఉత్తమ అవగాహన సిద్ధిస్తోంది.

శుద్ధ బంగారం తన యొక్క సువర్ణత్వమును విస్మరించి ఆభరణత్వమును తనపై ఆపాదించు కుంటున్నట్లు, శుద్ధ ప్రజ్ఞాస్వరూపుడగు జీవుడు తనపట్ల శరీరత్వాన్ని, ఖండత్వంను ఆపాదించు కుంటున్నాడు. అనగా, చిద్రూపము (The absolute form of wisdom) ఒక సమయంలో “నేను నిత్య, నిర్వివాదాంశ అఖండ సత్యమును” అను రూపమున ఉండే తన స్వాభావిక ఆత్మ స్థితిని ఏమరుస్తోంది. “ఈకాళ్ళు, చేతులు, తదితరములైన ఆకారములు గల దేహమే నేను. దీనితో పుట్టుచున్నాను. దీనితోనే వృద్ధి పొందుచున్నాను - శిథిలమగుచున్నాను” అని అత్యంత దృఢంగా భావన చేయుచున్నది.

ఇక ఈ జీవులు యొక్క “తదితర జీవుల ఉపాధులు” అనే అనుభవం ఎట్టిది? వినుయోగులు ‘హఠ యోగాభ్యాసం’ చేత తమ యొక్క శుద్ధ ప్రాణవాయువును మరొకరి భౌతిక శరీరంలో ప్రవేశింపజేసి ఆ వేరైన దేహ-ప్రాణములను తమ వశం చేసుకొని ఆ వేరైన శరీరం లోంచి శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవించటం గురించి విన్నావు కదా! మంత్రశాస్త్రము లోని పరకాయ ప్రవేశము ఇట్టిదే. అదే విధంగా ఒక శుద్ధ మనస్సు కూడా మరొక సృష్టికి ఆశ్రయ భూతమైన మనోరాజ్యమును ఎరుగుచున్నది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి…

సర్వేషాం జీవ రాశీనా మాత్మా వస్థా త్రయం శ్రితః

జాగ్రత్స్వప్న సుఘప్త్యాఖ్య మత్ర దేహోన కారణమ్ (సర్గ 18, శ్లో. 12)

ఈ జీవులందరి యొక్క ’జాగ్రత్-స్వప్న-సుషుప్తి" అవస్థలన్నిటికీ ఆశ్రయం ’ఆత్మ’యే అయివున్నది. అంతేగాని, ఈ అవస్థలన్నిటికీ ఆశ్రయం దేహం కాదు సుమా! కాని, ఈ ‘జాగ్రత్కల్పన’ అనునది దేహము లేనిచో సిద్ధించుటలేదు.

జీవాత్మ ఉంటేనే దేహం. దేహం ఉంటేనే జీవాత్మ.

ఈ విధంగా జీవాత్మకు, దేహమునకు ‘అన్యోన్యాశ్రయ దోషం’ సంభవిస్తోంది. అనగా జీవాత్మయే అవస్థలు.

Page:85

జీవాత్మ అంటే జాగ్రత్-స్వప్న సుషుప్తి అవస్థలు.

తరంగము కంటే జలము వేరు కానట్లు ఈ దేహము జీవాత్మకంటే భిన్నమైనది కాజాలదు. జీవాత్మ బ్రహ్మమునకు భిన్నం కాదు.

శ్రీరాముడు : తండ్రీ! తత్త్వజ్ఞాని ఇదంతా ఎట్లా దర్శిస్తున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అతడు సుషుప్తికి ఆవల ఉన్నట్టి నిత్యనిర్లిప్త మౌనస్థితిని సర్వదా అన్ని స్థితు లందు, అన్ని వేళలందు గాంచుచున్నాడు. అట్టి స్థితికే “తురీయము” అనే శాస్త్రీయనామం ఇవ్వ బడింది. అతడు “అవస్థాత్రయం”లో కేవల సాక్షిత్వాన్ని తన స్వరూపంగా వహించి ఉంటున్నాడు. తన యొక్క జ్ఞానముచే చైతన్యకరమగు ఆత్మభావమును పొందుచున్నాడు. “నేను జీవుడను" అను భావన నుండి సంపూర్ణముగా నివృత్తి పొందుచున్నాడు. ఇక అజ్ఞానియో, స్వకల్పనచే దేహము లందు, అట్టిదేహమునకు తారసపడే కల్పనా రూప ప్రపంచమునందు ప్రవృత్తుడగుచున్నాడు.

ద్వయోరేక స్వరూపైవ స్వసౌహర్ద నిదర్శనాత్ ।

అజ్ఞః సుఘప్తో సంబద్దో జీవః కశ్చిత్స సర్గ భాక్ ॥ (సర్గ 18, శ్లో 15)

“సుషుప్తస్థితి” అనునది మౌనం, శాంతం, ఆనందం కలిగి ఉంటోంది. మోక్షస్థితి కూడా అట్టిదే. కాని, మోక్షము నందు నిరతిశయానందము ప్రాప్తించుచున్నది. సుషుప్తస్థితి అనేది జ్ఞానికి, అజ్ఞానికి కూడా సమానమే. అయితే జ్ఞానము పొందనట్టి సుషుప్తి సహితుడైన అజ్ఞాని ఆ సుషుప్తి గతించిన తరువాత స్వప్న, జాగ్రత్తు లందు సంసారమును అనుభవిస్తున్నాడు.

ఇక జ్ఞానియో… “ఈ సంసారానుభవమంతా మొదలే అసత్యమైనది” అను ఎరుక కలిగి ఉంటున్నాడు. ఇదంతా ఒక స్వప్నంలాగా అసత్తుల్యమేనని అతనికి సుస్పష్టంగా తెలిసిపోతోంది. “నేను సర్వదా అఖండమగు స్వస్వరూప స్థితిలో ఉండి ఉంటున్నాను” అని అతడు గ్రహిస్తున్నాడు.

జ్ఞాని స్వస్వరూపస్థితి భావనను త్యజించుటలేదు… అజ్ఞాని దృశ్యవ్యవహారంతో ఏకత్వం పొందుతూ స్వస్వరూపస్థితిని ఏమరచుచున్నాడు.

ఈ జ్ఞాని - అజ్ఞానుల భేదం ఇంతవరకే. ఇక మిగతా విషయలన్నీ యథాతథమే.

చిద్వస్తువు (Consciousness) సర్వవ్యాపియు, సర్వరూపము అయి ఉన్నది. ఆ కారణం చేతనే ఒక జీవుడు మరొకని సృష్టిలోకి ప్రవేశించగలుగుతున్నాడు. ఒక్కొక్క సృష్టియందు విభిన్నము లైనట్టి అనేక సృష్టులు ఉండగలుచున్నాయి. అనేక సృష్టులలోని ఒక్కొక్కదానిలో ఇంకెన్నో అవాంతర సృష్టి రచనలు… అరటి పువ్వులోని దళములవలె… ఏర్పడి ఉంటున్నాయి. విశాలరూపమగు బ్రహ్మము స్వభావసిద్ధంగానే ఈ సృష్టులన్నిటి యొక్క బాహ్య అభ్యంతరము లందు వ్యాపించి యున్నది. ఈ వివిధ సృష్టులలో ప్రవేశించి ఉన్నప్పటికీ, బ్రహ్మమునందు మాత్రం ఏ ఏ క్షణమందు

Page:86

ఎట్టి భేదము ఏర్పడుట లేదు. అద్దాని నిర్మలత్వము, విశుద్ధత్వము, అప్రమేయత్వము సర్వదా నిరాటంకముగానే ఏర్పడి ఉంటున్నాయి.

ఒక బీజము ‘జలము సూర్యరశ్మి నేలసారము” మొదలైన వాటితో సమన్వయము పొందినప్పుడు గొప్ప వృక్షమగుచున్నది. మరల ఫలాదుల ద్వారా పూర్వకాలపు బీజభావమును పొందుచున్నది. బ్రహ్మము కూడా కామ్యకర్మాదుల యొక్క సంబంధంచే ‘మనస్సు’ అను రూపము పొందుతోంది. ఫలితంగా ఈ “పుట్టుట-చచ్చుట” అను కల్పనను తనపట్ల తానే కల్పించుకుని, అనుభవించుచున్నది. మరల ఏదో సమయంలో ఆధికారమైనట్టి దేహము (Body which can be very useful instrument in attaining highest knowledge) పొందుతోంది. ‘జ్ఞానార్త్’ కారణంగా ’వినుట మననం చేయుట - గ్రహించుట’ అను రూపము గల జ్ఞాన సంస్కారములను ఆశ్రయిస్తోంది. అట్టి ప్రయత్నముల ఉత్కృష్ట ప్రయోజనంగా ఇతఃపూర్వమే సర్వదా సిద్ధించియే ఉన్నట్టి ’బ్రహ్మస్వరూపము’ మరల పొందుచున్నది.

  1. బ్రహ్మము - - జగత్తు రూపంగా ప్రాప్తించటం

శ్రీ రాముడు : మహర్షీ! బ్రహ్మమే కారణముగా కలిగినట్టి ఈ జీవుడే జగత్తు రూపముగా విజృంభించుచున్నాడు కదా! అయితే అట్లు బ్రహ్మము ఖండత్వముతో కూడిన ‘నేను జీవుడను’ అను భావావేశం ఎందుకు ఎప్పుడు ఎట్లా పొందుచున్నది? బ్రహ్మము ’నేను బ్రహ్మమునే… నిత్యమునే… సత్యమునే…” అను స్వస్వభావమును కోల్పోయి ఈ జన్మపరంపరంలన్నింటినీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటోంది? అందుకు మూలకారణమేదైనా ఒకటి ఉన్నదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మం ఈ ‘జీవుడు’ అను భావన ఎందుకు పొందుతోంది? అనే ప్రశ్నకు "స్వయముగా ఆశ్రయించుట’ అని కాక ఇంకే సమాధానం చెప్పలేం. ’మూలము అనుదానికి మూలమే లేదు’ అని మాత్రం పరిశీలనచే తప్పక తెలియ వచ్చుచున్నది. అందుచేత సర్వమునకు మూలమై, సర్వమునకు కారణమైన ‘ఆత్మ’ ఎట్లు కారణరహితమో, మాయ అనబడే ఈ స్వస్వరూపం నుండి ఏర్పడిన ‘చ్యుతి’ కూడా కారణ వర్జితమే. “ఒకడు వినోదం కొరకై నాటకం దర్శిస్తున్నాడు”… అనే విశేషంలో, “వినోదం ఎందుకు జనించింది?” అంటే ఏం చెప్పగలం? మూలమగు బ్రహ్మమునకు మూలమే లేదు.

శ్రీరాముడు : బ్రహ్మమే జగత్తు యొక్క ఉనికికి కారణము, స్థానము కూడా! అందుచేత ’జీవుడు

అగుట - జగత్తులను గాంచుట - - జ్ఞాన సముపార్జనచే పూర్ణత్వమును తిరిగి అధిరోహించుట” ఇదంతా బ్రహ్మము యొక్క స్వభావమే అయి ఉన్నదని మనం అనుకోవచ్చా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మము నందు కార్యకారణములు, జన్మకర్మలు ఎట్లా ఆపాదిస్తాం?” బ్రహ్మము నందు ఏకారణత్వమునూ సిద్ధింపజేయలేం. అందుచేత ‘బ్రహ్మం యొక్క స్వభావం ఇది’

Page:87

అనునదంతా కొంత సాపేక్షకతను (comparison) దృష్టిలో పెట్టుకుని, గురుశిష్య బోధ కొరకు మాత్రమే కల్పించబడుతోంది. ఎందుకంటావా? శిష్యునియొక్క “స్థితి, గతి”లను బట్టి కదా, గురువు బోధను రచించేది! బ్రహ్మము ఎల్లప్పుడూ కూడా…

  1. నిర్విశేషము - అందు శేషించినదంటూ ఏదీ ఇక ఉండదు. సర్వము అధిగమించబడగా శేషించేదే బ్రహ్మము.

  2. నిరాకారము - దానికి ఎట్టి ఆకార, విశేషములు ఆపాదించలేం.

  3. నిర్వికారము - అద్దానియందు “జీవుడు-నీవు-నేను” మొదలైన వికారములు లేవు. తరంగమునకో, ఆవర్తమునకో ఆకారము ఉండవచ్చు గాని, జలమునకు ఆకారమెక్కడిది? అందుచేత "బ్రహ్మం నందు ఈ ‘కారణం’చే ఈ ‘కార్యం’ రూపమగు జగత్తు యొక్క ఉత్పత్తి జరుగుతోంది….” అను అసాధారణ ధర్మరూపంతో కూడిన ’ధర్మము’ను నిర్వచించలేం. ప్రతిపాదించలేం.

బ్రహ్మము నిర్వికారము, అద్వితీయము, అసంగము కదా! అందుచేత యదార్థానికి అది అకారణమే అయివున్నది. అందుచేత “ఈ ప్రపంచమంతా బ్రహ్మమే” అని ప్రతిపాదించినంత మాత్రంచేత "బ్రహ్మము నందు కారణము - నిమిత్తము… సంభవిస్తున్నాయి”… అను ఆరోపణ సరి కాదు. అట్లు “కారణ నిమిత్తాదులు బ్రహ్మమునందు సంభవించుట” అనేది బ్రహ్మము యొక్క స్వభావమునకే విరుద్ధం.

కాబట్టి ఆ కారణము, వివర్త రూపము అయినట్టి ఈ జగత్తు మిథ్యయే! అకారణమే అయివున్నది సుమా!

శ్రీరాముడు : మరిక సారరహితము, జడము, దుఃఖమయము అయిన ఈ జగత్తు గురించి విచారించి ఏం లాభం?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అందుచేతనే మనం సారభూతమగు బ్రహ్మము గురించే

విచారించటం ఉచితం.

“బ్రహ్మము నందు ఖండత్వరూపమగు ‘నేను జీవుడను’ అను భావన ఎందుకు ఏర్పడుతోంది?” అనే ప్రశ్నను ఇప్పుడు పరిశీలిస్తున్నాం కదా! ఒకనికి ఒక వ్యాధి వచ్చింది. ఎంతో బాధను అనుభవిస్తూ, అతడు ఒక వైద్యుని సమీపించాడు. “ఇతనికే ఈ వ్యాధి ఎందుకొచ్చింది? ప్రక్కవానికి రాలేదేం? ఎప్పుడు ఏమేమి ఎంతెంత తిన్నాడు? ఎందుకు తిన్నాడు”… అని ఆ వైద్యుడు తాత్సారం చేస్తూ ఉంటాడా? చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ఆ రోగి వ్యాధి అనుభవిస్తూనే ఉంటాడు కదా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? సరి అయిన ఔషధం రోగికి ఇవ్వటం… తద్వారా రోగనివారణ, ఉపశమనం కలగటం… ఇవి కదా ముఖ్యం! అదే విధంగా శాస్త్రములు, గురువులు కూడా ”బ్రహ్మతత్వమునందు ఈ జగద్భావన ఎప్పుడు వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది…” అను తర్జన - భర్జనలకన్నా కూడా…“ ఈ

Page:88

జీవుడు బ్రహ్మమే స్వరూపముగా కలిగియున్నాడు, కాని భ్రమ చేత జగద్భావమును తీవ్రముగా పొంది దుఃఖాదుల అనుభవపరంపరలు పొందుచున్నాడు. బ్రహ్మమే స్వరూపముగాగల ఈ జీవుని యందు ‘నేను జనన-మరణ రహితుడను’ అను ఎరుక ఏర్పరచుట ఎట్లు? ఇతడు తనను బ్రహ్మముగా గ్రహించుట ఎట్లు?”… అను విషయమునే తరచు పరిశీలించి, ఉపనిషత్తుల వంటి ఉత్కృష్ట శాస్త్రముల ద్వారా ఆయా ఉపాయాదులను ప్రతిపాదించటం జరుగుతోంది. అందుచేత, బ్రహ్మమే సదా విచారించబడు గాక!

విత్తనం మహావృక్షమవటం, బ్రహ్మము జీవుడుగా అవటం -

  1. బీజము దేశకాలాదుల సహాయంచే మహావృక్షమగుచున్నది.

  2. బ్రహ్మము దేశకాలాదులను అంగీకరించి జీవుడుగా భాసిస్తోంది.

ఈ రెండింటినీ ఉపమాన, ఉపమేయాలుగా ఉదహరించేటప్పుడు, ఒక భేదం గమనించాలి. బీజం తన ఆకారాన్ని కోల్పోయి ఆయా ‘ఆకులు, కొమ్మలు’ మొదలైన రూపములన్నీ పొందుతోంది కదా! కానీ, బ్రహ్మం తన స్వరూపాన్ని త్యజించకుండానే ఈ “జగత్ దృశ్యము”… అను రూపంగా ప్రకటితమౌతుంది. అయితే, బీజమే ’అంకురము” అగుచున్నట్లు బ్రహ్మమే ఈ “ద్రష్ట - దర్శనం -దృశ్యం” అను వ్యవహారంగా రూపుదిద్దుకుంటోంది. కాబట్టి బీజాంకురన్యాయము "బ్రహ్మము - జీవుడు-దృశ్యము”లకు తగియే ఉంటోంది.

శ్రీరాముడు : బీజములో ఉన్నదంతా ఆకారసహితమైయున్నది. కాని బ్రహ్మమో, ‘ఆకారము’ అనబడే వికారమే కలిగియుండలేదు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, అందుచేత "బ్రహ్మము బీజము వంటిదే” అనే ఉత్ప్రేక్ష సమగ్రం కాదని మనం అనుకున్నాం. బ్రహ్మముతోటి పోల్చతగినదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు.

బీజస్యాకృతి మత్సర్వం తేనానాకృతిమత్సదమ్ | నీయుజ్యతే సమాకర్తుం తస్మాన్నాస్త్యుపమాశివే ॥ (సర్గ 18, శ్లో. 25)

బ్రహ్మము తనకు సమానము తానే అగుచున్నది. అది మరింకే వస్తువువంటిది కాదు.

సూక్ష్మదృష్టితో చూచినప్పుడు “ఈ జగత్తు ఉత్పన్నమైనది కాదు" అని తెలియవస్తోంది. అట్లాగే “ఇది ఉత్పన్నము కానేలేదు” అని కూడా అనలేము. అయితే భావన ఏర్పడిన తరువాతనే జగత్తు ఉనికిని సంతరించుకుంటోంది. దృశ్యము అనబడేది అనిర్వచనీయమై, జీవునిచే (లేక) బ్రహ్మముచే స్వయంకల్పితమై ఏర్పడుచున్నదని గ్రహించు.

కల్పన ఉంటే… జగత్తు కూడా ఉంటోంది. కల్పన లేనప్పుడో… జగత్తు కూడా సర్వదా “లేనిదే” అగుచున్నది.

దృశ్యమ్ పశ్చన్, శ్వమాత్మానం న ద్రష్టా సంప్రపశ్యతి| ప్రపంచాక్రాంత సంవిత్తే, కస్య ఉదేతి నిజాస్థితిః? ॥ (సర్గ 18, శ్లో. 27)

Page:89

ఒక ద్రష్ట ఈ దృశ్యమును చూడటం జరుగుచున్నప్పుడు తన యొక్క ఆత్మ స్వరూపమును గాంచుటలేదు. ఎందుకంటే, ఆ సమయంలో అతని జ్ఞానము ప్రాపంచిక విషయ వాసనలచే ఆక్రమించబడటం జరుగుతోంది. అందుచేత స్వస్వరూపమునందు ’స్థితి, నిష్టలు” ఏర్పడుట లేదు. ఫలితం ఏమిటి? ఏదైతే ఏ క్షణంలో కూడా కాకయే ఉన్నాడో, దేనికైతే ఏ మాత్రం సంబంధించకయే ఉన్నాడో… అట్టి దాని యందు (దృశ్య వ్యవహారము నందు) అతనికి నిమగ్న పూర్వకమైన అనుభవం కలుగుతోంది. ఇక నిజస్థితిలో ఉండగలిగేది ఎట్లు? ఎన్నటికీ?

ఒక ప్రశ్న. ఒకడు మృగతృష్ణను చూస్తున్నప్పుడు జలము యొక్క భ్రాంతిని పొందుచున్నాడు కదా! ఆ క్షణాలలో, "ఈ విశాల ప్రదేశంలో అకస్మాత్తుగా ఈ సమయంలో జలం ఎక్కడి నుండి వస్తుంది? సూర్యరశ్మి గాలివీచికలు - - క్రీనీడలు - ఈ మూడిటి సమన్వయమే ఇట్లు జల తరంగముల వలె నాకు కనబడుతోంది”… అనే సత్యజ్ఞానం ఏ మూలకో వెళ్తుంది.

ఎండమావులు గురించి “క్రీనీడే కదా…” అనే పరిజ్ఞానం ఉండి ఉన్నప్పుడు, “ఇది జలం” అనే దృష్టి ఏమౌతోంది? వికర్షితమైపోతోంది కదా! భ్రమలో ఉన్నప్పుడు “ఇది మృగతృష్ణ మాత్రమే. ఇక్కడ తటాకము ఉండజాలదు”… అనే విషయం జ్ఞాపకానికి రావటం లేదు.

ఒకటి రెండవ దానిని కనబడకుండా చేస్తోంది కదా!

మాయాదృష్టిచే “ఆత్మ”, సత్యదృష్టిచే జగత్తు… “లేనివే” అగుచున్నాయి.

ద్రష్ట యొక్క కళ్ళే (దృష్టిత్వమే) ఆకాశము వలె విశాలమైన స్వరూపము కలిగినవై ఉంటున్నాయి. సర్వత్రా వ్యాపించినదై సర్వమును ప్రకాశింపజేయుచున్నాయి. ఈ చూపు సర్వ పదార్ధములను గాంచగలుగుచున్నది. అయితే ఇన్ని విషయములను చూచుచు, గుర్తించుచున్నట్టి ఆ చూపు తనను తాను మాత్రం దర్శించలేకపోతోంది. ఏమి చమత్కారం? మాయాభ్రమ ఎంతటి ప్రబలమైనదో కదా! చూచేవాని యొక్క చూపుకు ఆ చూచేవాడు కనిపించటంలేదు. కానీ, చూడబడేదంతా కనిపిస్తున్నది చూచే వానిలోనే!

తన యందు తాను ఎట్టి భ్రమను కలిగి యుండనట్టి జీవుణ్ణి మనం “ముక్తపురుషుడు” అని పిలుస్తున్నాం. అట్టి ముక్తపురుషుడు దృశ్యరూపమైనట్టి ఈ ద్వైతమును కాకుండా, సర్వేసర్వత్రా ఆత్మనే గాంచుచున్నాడు. దృశ్యమును స్వస్వరూపాత్మ విశేషంగా సందర్శిస్తున్నాడు. కాని తన యందు మాయను పొందుచున్న ద్రష్టకో, ఈ జగత్తు బాహ్యమున ఇంద్రియ విషయమాత్రమై ఘనీభూతమై ప్రాప్తిస్తోంది.

ఆకాశము వలె సర్వవ్యాపకమైనట్టి ఈ ద్రష్ట తన యొక్క పరమార్థ స్వరూపమును గాని, తన వంటిదే అయి వున్న ఇతరుల పరమార్థ స్వరూపమును గాని గాంచుట లేదు. బ్రహ్మం ఆకాశం వలె అన్నివైపుల, సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ జీవులు ఎంతో ప్రయత్నం చేసిన తరువాత కూడా అట్టి బ్రహ్మమును దర్శించలేకపోతున్నారు. ఎందుచేత? ఈ దృశ్యమును దృశ్యరూపముగా చూచునంతవరకు బ్రహ్మ స్వరూపప్రాప్తి అత్యంత దూరముగా ఉన్నదే అగుచున్నది.

Page:90

ఇందుకు ఒక లౌకికమైన దృష్టాంతము చెపుతాను విను. ఒకచోట, ‘కుండ’ మొదలైన కొన్ని పదార్థాలు ఉన్నాయి… ఒక వ్యక్తి చూపు అటు పడింది. కంటిపాపలో వస్తువులు ప్రతిబింబించి నంత మాత్రం చేత ఆ వ్యక్తి వాటిని చూడగలడా? లేదు. ఆ కనుల వెనుక ద్రష్ట ఉన్నాడు. ద్రష్ట వృత్తిని పొందితేనే దృశ్యము పొందబడుతోంది. అయితే, ఆ ద్రష్ట ఆయా వృత్తులను పొందినంత మాత్రంచేత విచ్ఛిన్నుడు అయ్యేవాడు కాదు. అతడు వాస్తవానికి సాక్షితత్వమై, దృష్టిని కూడా వెలిగించుచున్నవాడై ఉంటున్నాడు. అట్టి ద్రష్ట దృశ్య విషయస్వరూపము పొందినప్పుడు మాత్రమే “కుండ” మొదలైనవి తనయందు ప్రకాశింపజేస్తున్నాడు. ఆ ద్రష్ట విషయరూపత్వమే పొందుట లేదనుకో… అప్పుడేమౌతుంది…? ఆ పదార్థముల అనుభవం ద్రష్టకు సాక్షాత్కారం కాదు. అప్పుడు “ఈ పదార్థము ఇది, ఇట్టిది"… అను అనుభవమే ఉండదు. ఈ దృశ్యము, బ్రహ్మము ఈ రెండిటి యొక్క అనుభవప్రాప్తి ఇట్టివే!

జీవుని యందు ‘వృత్తి’ మరల మరల విషయరూపత్వము పొందుతోంది. అట్టి ఆ వృత్తిని విషయత్వము నుండి వేరు చేసి సూక్ష్మమైన బుద్ధి సహాయంతో “కేవల పరమాత్మ స్వరూపము” నందు లయింపజేయాలి. ఇది కష్టతరమైన విషయమైనప్పటికీ అభ్యాసముచే ఈ ప్రపంచములో అన్నీ సులభం అవుతాయి కదా! “ఈ జగత్తులో తారసపడుచున్న ’నేను - నీవు - అది - ఇది’… మొదలైనవన్నీ స్వస్వరూపమే అయివున్న ఆత్మకంటే వేరైనవి కావు…” అని నిరంతర నిశ్చయము కలిగియుండటమనేది క్రమక్రమంగా చేసే అభ్యాసంచేత తప్పక సాధ్యమే. ఎందుకంటే, సత్యము అదియే కదా! సత్యమేవ జయతే!

శ్రీరాముడు : అనేక లౌకిక వ్యవహారములు నిర్వర్తించుటలో నిమగ్నమై యున్న మాకు అట్టి అభ్యాసం సాధ్యమేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రవాహపతితములగు ఆయా కార్యములను ఆసక్తిరహితంగా (without attachment) నిర్వర్తిస్తూ ఉండే వారికి అట్టి ఆత్మ దృష్టి సులభమే అవుతుంది. ఓ సర్వ సభికులారా! సర్వజనులారా! మీరంతా అట్టి మహత్తరమగు ఆత్మదృష్టి కలిగియుండుటకే ప్రయత్నం చేయండి. “అఖండము, నిత్యము అగు ఆత్మయే నేను" అను భావన కలిగి యుండుటలో ఏమి కష్టమున్నది? అట్టి భావనను మననపూర్వకంగా ధరించి, ఆపై లౌకిక జగత్తులో ఏది ఎట్లు ఉచితమో, అట్లే నిర్వర్తించండి. దీని వలన మీకు శుభమే జరుగుతుంది. అన్ని వేసటలు తొలగిపోతాయి.

ఓ రామచంద్రా! ఈ దృశ్యమైతే కనిపిస్తోంది. కాని ద్రష్ట కనిపిస్తున్నాడా? లేదు కదా! ఈ భౌతిక శరీరము ద్రష్టచే వెలిగించబడుచున్నది మాత్రమే కాని, స్వయముగా ద్రష్ట కాదు. దృశ్యంచ దృశ్యతే తేన, ద్రష్టా? రామ! నపశ్యతే

ద్రద్దైవ సంభవతి ఏకో! నతు దృశ్యమ్ ఇహ అస్తిహి ||

యథార్థానికి ‘ద్రష్ట’ మాత్రమే ఉన్నాడు. దృశ్యము ఏ మాత్రము లేనే లేదు. ద్రష్ట ఈ దృశ్యములో దేనిని ఎట్లు సంభావన చేస్తాడో, అది ఆ రూపముగానే సంప్రాప్తిస్తూ ఉంటోంది.

Page:91

స్వయముగా "సర్వస్వరూపుడు” అయి ఉండుటచే ’ద్రష్ట’యే దృశ్యరూపముగా ప్రసరించి ఉంటున్నాడు.

శ్రీరాముడు : ఈ దృశ్యములో కనబడుచున్న ద్రష్టలు ఇందలి ఏ కారణంగా ఏర్పడుచున్నారు? శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దృశ్యమంతా స్వస్వరూపానుభూతమే సుమా! అట్టి ఆ దృశ్యంలో ఏదో క్రియలచే ద్రష్ట ఏర్పడటం అనేది అత్యంత అసంగతం.

దృశ్యము స్వతహాగా, నీ కంటే వేరుగా లేనే లేదు. ఇక ‘ద్రష్టత్వము’ నీ కంటే వేరుగా ఎక్కడుంటుంది.

కాబట్టి దృశ్యము ఎట్లు అవాస్తవమో, ద్రష్టత్వము కూడా అట్లే అవాస్తవము. ఈ దృశ్య -

ద్రష్టత్వములకు ఆవల రెండింటికీ అతీతమై నీ యొక్క స్వస్వరూపము నిశ్చలమై ఉన్నది. ఆ స్వస్వరూపమే అఖండమై, అద్వితీయమై, సర్వత్రా వ్యాపించినదైయున్నది. అయితే, పదార్థదృష్టిని (perception of matter), తద్వారా ద్రష్టత్వము (the stance of perceiver) ను విడనాడక పోవుట చేతనే ఈ జీవునకు నిత్యసత్యమగు ఆత్మతత్త్వము అనుభవమగుటలేదు. ద్రష్టత్వము, దృశ్యములను అధిగమించిన అవగాహన పెంపొందించుకొనువారికి “దృశ్యము నా స్వరూపమే” అను భావన సులభమే అగుచున్నది.

  1. చిత్తము - జగత్తులు

శ్రీరాముడు : అయితే మునీంద్రా! ‘సర్వశక్తిమంతుడగు రాజు’ లాగా ఈ ఆత్మయే దృశ్యమును సంపాదించి, అట్టి దృశ్యమునకు తనకుతానై ద్రష్టత్వము వహించుచున్నదని అనవచ్చునా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అంతాకూడా ఆత్మచే తనకొరకు తానే నిర్మించుకొనుచున్నదే అని అనక తప్పదు. ఆత్మ తన యొక్క ఇతరములైన అపేక్షలన్నీ లేకుండా కేవలం ఒక పదార్థమును (విషయమును ఆశ్రయించినప్పుడు ఆ పదార్థమునే అనుభవించుచు, అట్టి రూపముగానే ఉదయించుచున్నది.

ప్రకృతిలోని ‘మాధుర్యము’ అను రసము యొక్క ఉల్లాసమే పటికబెల్లం రూపమును పొందుతోంది. అదే మాధుర్యము తనయొక్క రసరూపత్వము త్యజించకుండానే "ఫలములుపుష్పములు-లతలు” మొదలైనవాటియందు అంతర్లీనమై ఉంటోంది. అదే విధంగా…

“చిత్” (Awareness) అను ఉల్లాసము రూపముగాగల ఈ జీవుడు ఈ ’దేహములు’ మొదలైన రూపమును పొందుచున్నాడు. ఈ ద్రష్ట తనయొక్క చిత్స్వరూపమును త్యజించకుండానే, “ద్రష్ట-దర్శనము”లుగా అగుచున్నాడు. తనయందు ‘జాగ్రత్తు’ అను స్వప్నమును గాంచుచున్నాడు.

“ఈ ‘ఉప్పు ఖండములు’ ఇతఃపూర్వం ఎక్కడ ఉండి ఉన్నాయి?" అను ప్రశ్నకు సమాధానం “ఇవి ‘లవణము’ అను రసము రూపమున జలమునందే ఉండి ఉండేవి” అని చెప్పాలి కదా! అదే విధంగా ఆత్మయందే అహంకారము మొదలైనవి ఉండి ఉన్నాయి.

Page:92

అనేక మట్టిగడ్డలు ఒకచోట ఉన్నాయనుకో… ఆ మట్టి గోడలన్నిటిలో ఉన్నది ఒకమట్టియే కదా! ఒకే చిద్వస్తువు అనేక ఆకారములుగాను, రూపములుగాను ఉదయిస్తోంది. "చిత్ రసఉల్లాసము”చే అనేక దృశ్యములుగా దృశ్యమానమగుచున్నదంతా పూర్ణప్రదమగు స్వస్వరూపమే! అటువంటివే….. ఈ జగత్ ఖండములు కూడా!

‘చైతన్యము’ తన యొక్క సంకల్పముల ప్రభావంచేత నిర్మించబడుచున్న దృశ్యములను తానే స్వయంగా గాంచుచు, అనుభవించుచున్నది. జీవశక్తి ఈ దృశ్య ప్రపంచమును ఈ విధంగా పొందుతోంది. అనగా ఆత్మ తన యొక్క విస్తృత స్వరూపమును ఈ రూపముగా భావన చేయు చున్నది… అని విజ్ఞులు అవగాహన చేసుకుంటున్నారు.

ఇక సమానమైన ఆకారములు కలిగినట్టి వాసనలు ఉదయించటం చేత కొన్ని జగత్ ఖండములు పరస్పరం కలియటం జరుగుతోంది. అట్లు వివిధ జగత్తులు ఒకదానితో ఒకటి ప్రవర్తిస్తూ మరల ఎప్పుడో నశించుచున్నాయి. మరికొన్ని జగత్ ఖండములు ఒకదానితో మరొకటి

కలియటమే లేదు.

ఓ రామచంద్రా! నీవు ’పరమ సూక్ష్మదృష్టి’తో, ’జ్ఞానముతో కూడిన చిత్తముతో” ఇదంతా గమనించాలి. ఈ వేలాది ప్రపంచములను చూస్తున్నావా? చిత్తమునందు, ఆకాశము నందు, శిలల యందు, అగ్నిజ్వాల లందు, వాయువు నందు, అరణ్యము లందు, సముద్ర గర్భము లందు, ప్రతి పరమాణువు నందు వేలకొలది ’జగత్ సమూహములు” పొందబడుచున్నాయి.

ప్రతి నువ్వు గింజలోనూ నూనె ఉండి ఉన్నది కదా…! ఆరీతిగా, ప్రతి చిత్తమునందు లక్షల కొలది జగత్తులు ఉన్నాయి. ఈ చిత్తమునకు (అనగా ఈ చిత్తములోని జగత్తులకు) సిద్ధి కలిగినప్పుడు ఈ చిత్తమే ‘చైతన్యముగా’ అగుచున్నది.

అనుబంధములు, భేదభావనలు - శుద్ధము, సర్వవ్యాపకము అయిన “చైతన్యము” యొక్క అంతరము నందు పరస్పర సమ్మేళనము సిద్ధిస్తోంది. అట్టి సమ్మేళనమే ఈ జీవుల యొక్క అనుబంధములు - భేదభావములు కూడా. అట్టి అనుబంధత్వము కారణంచేత ఒక భ్రమలాగా బ్రహ్మ మొదలగు సృష్టిదేవతలచే కల్పించబడిన ఈ భౌతిక జగత్తు జీవులందు ప్రతిబింబిస్తోంది.

ఈ ప్రపంచము ఒక దీర్ఘ స్వప్నము వంటిది. కొందరు జీవులు ఒక స్వప్నము నుండి మరొక స్వప్నమును పొందుచున్నారు. ఇట్టి స్వప్న పరంపరల యొక్క పరిభ్రమణమే దృశ్యముగా అనుభవ మవుతోంది. వాసనల దార్ద్యము (density) చే అది దృఢరూపమును పొందుతోంది. చైతన్యము తన యొక్క వాసనలని అనుసరించి దేనిని ఎట్లు భావిస్తే అది అట్లే అనుభవరూపం పొందుతోంది. ఆ విధంగా చైతన్యము స్వప్న సదృశంగా అనుభవిస్తున్నదంతా అనుభవసమయంలో సత్యముగానే ఉంటోంది. ఒక బీజమునందు వృక్షతత్వమంతా దాగి ఉంటున్నట్లు, వాసనతో నిండియున్న చిదణువునందు సూక్ష్మ రూపమున ఈ జగత్తులన్నీ ఉంటున్నాయి.

Page:93

చిత్ పరమాణువులు, జగత్ పరమాణువులు - -“చిత్" అంటే ‘ఎరుక’ కదా! ఈ అనేక మంది జీవులు అనేక చిత్ పరమాణువులు. అట్టి ఈ చిత్ పరమాణువుల భావనా వైచిత్రమే జగత్పరమాణువు లందు ప్రవేశిస్తున్నాయి. ఈ “జగత్తు - - చిద్వస్తువు”… ల పరస్పర ప్రవేశము, పరస్పర సమావేశము ఎంతటి ఆశ్చర్యకరమైనది!

ఒక విధంగా ఇక్కడ చిదాకాశమే చిదాకాశమునందు జగత్తుగా ప్రదర్శనమవటం. అనగా, వాస్తవానికి లీనమవటం జరుగుతోంది.

ఈ చిదాకాశమునే భ్రమరూపమగు జగత్తుగా అందరు చూడటం జరుగుతోంది.

కాబట్టి రామా! నీవు “ద్వైతము - ఏకత్వము”… అను రెండు భ్రమలు త్యజించివేయి. ఈ జీవులు ‘చిత్’ అను అంశమును స్వభావముగా కలిగియున్నారు. అట్టి వీరు, ‘చిదంశములే’ అయినట్టి దేశ-కాల-క్రియా రూపములైన అణువులను ఏదో అన్యమైన బాహ్య వ్యవహారము వలె గాంచుచున్నారు.

వాస్తవానికి ద్రష్టకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ సంభవించదు. ద్రష్టయే దృశ్యరూపమున విస్తరిల్లుచూ…., ఆస్వాదిస్తున్నాడు.

బ్రహ్మదేవుని నుండి ఒక కీటకము వరకు ఈ సర్వప్రాణుల జీవన విధానము, భావన చేయు రీతి… అంతా కూడా వారి వారి అంతఃకరణోపాధి (మనస్సు - బుద్ధి - చిత్తము - - అహంకారము) చేతనే ప్రాప్తిస్తోంది. అయితే, ’జాగృత్’ లోని సర్వవ్యవహారములు గాఢ నిద్రా సమయంలో మరుగునపడి ఉంటున్నట్లు, సంసార వ్యాపకము ఆశ్రయించు సమయంలో ఆత్మదృష్టి మరుగున పడుతోంది. ప్రళయకాలంలో జీవునిలో ఇదంతా ’అప్రకటితం’గా, సృష్టికాలంలో స్వప్నానుభవం లాగా ’ప్రకటితం’గాను, అగుచున్నది. అనగా, ఈ జగత్ వ్యవహారదృష్టి అంతఃకరణంలో ఉండి ఉంటోంది. భావించబడునదంతా అధిగమించి, భావించువాని తత్వమేమిటో పరిశీలించామా… బ్రహ్మ మొదలుకొని పురుగువరకు ఇక్కడ గల ప్రతి జీవుని స్వరూపము (దృశ్యరహిత ద్రష్టగా) నిత్యము, అఖండము, అప్రమేయము అయివున్నాయి.

ద్వైత భ్రాంతి, వ్యష్టి - ఓ రాఘవా! ఈ జగత్తు ఒక అనిర్వచనీయమైన ’స్ఫురణ’గా ప్రాప్తిస్తోంది. యథార్థమైన దృష్టిని పెంపొందించుకున్న మహనీయులకు ఇక్కడ ’అర్థవంతమైనది, సారవంతమైనది’ - - అనునది ఏదీ లభించకున్నది. తీవ్రమైన జ్వరములో బాధింపబడు మానవుడు పరిసరములన్నీ తిరిగిపోతున్నట్లు భావిస్తూ ఉంటాడు. అట్లాగే ఈ ‘జీవుడు’ అని చెప్పబడుచున్న ‘చిత్’ స్వరూపుడు తనకుతానే ద్వైతమైన రూపాదులను అనుభవిస్తున్నాడు. స్వస్వరూపమగు ఆత్మనే అతడు అట్లు వివిధ రీతులుగా (అనేక జగత్ దృశ్యపరంపరల రూపంగా) పొందుచున్నాడు.

చైతన్యమే స్వరూపముగాగల ఈ చిత్ అణువు (జీవుడు) తనయొక్క ‘అంతఃకరణము’ (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము… అను ఉపాధి)చే ఈ ఇంద్రియములలో ప్రవేశిస్తోంది. వీటి ద్వారా ఇంద్రియజ్ఞానము వెడల గ్రక్కుతోంది. స్వయముగా విశాలమగు దృశ్య దేహరూపమున స్పురించుచున్నది.

Page:94

ఈ దృశ్యమునకు ‘బీజభూతము’ అని చెప్పదగ్గ చైతన్యము సర్వవ్యాపకము, నాశరహితము సుమా! ఒక చోట అనేక కుండలున్నాయి. అవి ఆయా సమయాలలో కుమ్మరిచేత నిర్మించ బడుతున్నాయి. కుండలన్నిటిలో ఉన్నది మట్టే కదా! వేరు వేరు సమయములలో తయారు చేయ బడిన వేరు వేరు కుండలు వేరువేరైన మట్టివలె కనిపిస్తాయి. వేరువేరు కుండలలో ఒక కుండ, వంటి ఈ వ్యష్టి జీవుడు స్థూలదేహంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా తదితర స్థూల దేహములను గాంచుచున్నాడు. అతడు “నేను దేహమును” అను దృష్టి త్యజించినప్పుడు, తన యందు మరియు ఇతర కుండలలో (దేహములలో) కూడా ఘటాకాశము వలె అతి సూక్ష్మమైనట్టి ’ఆత్మాకాశము’ను గాంచగలడు.

"నేను నాశరహితమగు ఆత్మను” అని గ్రహించినప్పుడు అట్టి మహాత్ముడు సర్వుల యందలి నాశరహితత్వమును, అభేదత్వమును గాంచగలుగుచున్నాడు. తన యందు సర్వమును, సర్వము నందు తనను సర్వదా సందర్శించగలడు.

సమష్టి బ్రహ్మాండాత్మకుడు - “నేను ఈ సమష్టి - - తత్త్వమును’ అను సమష్టి అహంకారమును ఆశ్రయించి యున్న మరొక జీవుడు తనయందే అనేక దోషములతో కూడిన ఈ జగత్తును గాంచుచున్నాడు. తాను చూస్తున్న సమష్టి వ్యవహారంలో దీర్ఘకాలంగా అభేదం పొంది, మునిగి తేలుతున్నాడు. అందులోనే “ఉత్పన్న - వినాశములు” అను స్వప్నం పొందుచున్నాడు. అట్టి స్వప్న రూపమగు జగత్తునందు అనేక రూపములైన “స్వప్నములలో స్వప్నములు” వంటివి ఒక పరంపరగా పొందుచున్నాడు. ఊహానిర్మితమైన పర్వతశిఖరం నుండి ఊహానిర్మితమైన జలపాతం వెంట ఊహానిర్మితమైన శరీరములను దొర్లించుచు, బీభత్సమంతా అనుభవిస్తున్నాడు. (సమష్టి సృష్ట్యహంకారి - బ్రహ్మదేవుడు).

విద్య, అవిద్య - ఓ రామచంద్రా! అసంఖ్యాకములైన ఉపాధులతో కూడిన ఈ విస్తారమైన ప్రపంచమును గమనిస్తున్నావా? ఇవన్నీ స్వకీయమైన కల్పనాచమత్కారము చేతనే స్ఫురిస్తున్నాయి.

ఈ దేహాలు… చూడు. వీటిలో కొన్ని దేహములు పరస్పరంగా అనేక భ్రమ విభ్రమములు కలిగి ఉంటున్నాయి. మరికొన్ని దేహములు సర్వభ్రమలు త్యజించివేసి ఆత్మయందు స్థితి కలిగి ఉంటున్నాయి. కొన్ని “వ్యాప్తమై, దృశ్యమానమగుచున్న ఈ ప్రపంచం అసత్తు, స్వప్నతుల్యం అయి వున్నది కదా?” అను ఎరుక కలిగియుండి, ఇక ఆపై, తదితర జీవుల వలెనే ఆయా దృశ్య వ్యవహారాలలో క్రీడామాత్రంగా పాల్గొనుచున్నాయి. అట్టి జీవులను ’సుజ్ఞానులు’ అని అంటున్నాం. శ్రీరాముడు : తండ్రీ! ఈ దృశ్యములలో విడివిడిగా వేరు వేరు సంస్కారములతో కూడి కనిపిస్తున్న ఈ జీవులంతా సత్యముగా ఉన్నారా? లేరా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దృశ్యమంతటా ప్రసరించివున్నది ఆత్మయే. ఆత్మయే సర్వముయొక్క అధిష్ఠానము అయివుండుటచేత ఇందులో ప్రతిజీవుడు “సత్యమే” అయివున్నాడు.

అంతేకాదు…

Page:95

ఎచట సర్వవ్యాప్తియగు ఆత్మ కలదో, అచట సమస్తం వివర్తరూపమున ఉదయిస్తూనే ఉన్నది. జీవము, ఆ జీవము యొక్క ప్రతిభాస, ఆ ప్రతిభాసలో మరల జీవము… ఇట్లు, ఆత్మయే స్వస్వరూపముగా గల ప్రతి జీవియందు ఏర్పడి ఉంటోంది. జీవుడు… ఆ జీవునిలో మరొక జీవుడు… అందలి ప్రతిజీవునిలో మరికొంతమంది జీవులు… ఈ విధంగా అరటి మట్టలవలె ఒక జీవునిలో అసంఖ్యాకములగు జీవరూపములు ఉంటూనే ఉంటున్నాయి.

‘ప్రపంచం’ అనుదానితో కూడినవాడైనట్టి ఈ జీవునియందలి ’జీవసత్త’కు కారణం ఏమిటి? అవిద్యతో కూడుకున్నట్టి చైతన్యమే సుమా!

శ్రీరాముడు : అయితే, మహర్షీ! అతి దీర్ఘకాలంగా జన్మ కర్మల మధ్య చిక్కిన ఈ జీవునియందు పొరలుపొరలుగా ఏర్పడియున్న అల్పత్వము తొలిగేది ఎట్లు? ఎన్నటికి? ఇతనిలో ఆత్మకు సంబంధించిన అనుభవం ఏర్పడేది ఏ విధంగా?

దృశ్యబుద్ధిపరావృత్తా సమమే తదన న్తరమ్ | హేమ్నీవకటకాదిత్వం పరిజ్ఞాతవినశ్యతి ॥ (సర్గ 18, శ్లో 63)

శ్రీ వసిష్ఠ మహర్షి : జీవునియొక్క ఈ బుద్ధి దృశ్యపదార్థములవైపు అభిముఖమై ఉండి ఉంటోంది. ఇప్పుడీబుద్ధి, దృశ్యపదార్థముల నుండి వెనుకకు మరల్చబడి, ప్రత్యగాత్మవైపు అభిముఖం అయితే చాలు. ఆభరణత్వమునకు అతీతమైన దృష్టితో చూచువారికి దానియందు బంగారమే ప్రత్యక్షమై తీరుతుంది కదా! ఈ జీవుడు తనయందలి పదార్థత్వమును అధిగమించివేస్తే, అప్పుడు ప్రత్యగాత్మత్వముతో ప్రకాశించగలడు. అనగా తనయందలి ’ఆత్మలక్షణములు’ అయివున్నట్టి అఖండత్వము అప్రమేయత్వము, అశరీరత్వము, అద్వితీయత్వము, అకాలత్వము లను అతడు గ్రహించటం జరుగుతోంది.

అయితే ఆభరణములకు క్రొత్తగా ఏమైనా ప్రయత్నములచే సువర్ణత్వము వచ్చిపడుతోందా? శ్రీరాముడు : లేదు. ఆభరణములు (గాజులు, గొలుసు) మొదటే సువర్ణము, క్రొత్తగా సువర్ణత్వము రావలసిన పనిలేదు.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అదే విధంగా, "నేను స్వయముగా ప్రత్యగాత్మస్వరూపమునే…” అను భావన సుస్థిరమగుచుండగా, ఈ బాహ్య అభ్యంతర ప్రపంచమంతా అట్టి జీవుని దృష్టిలో స్వయముగా రహితమై పోతోంది. నేను స్వతఃగా సదా ప్రత్యగాత్మ స్వరూపుడనే”…. అని నిర్మల హృదయుడు గమనించుచూనే ఉన్నాడు.

విచారోయస్యనోదేతి కో_హంకిమిదమిత్యలమ్ | తస్యానర్నవిముక్తోసౌ దీర్ఘాజీవజ్వరభ్రమః ॥ (సర్గ 18, శ్లో 64)

ఎవనియందైతే, “నెనెవరిని? ఈ ప్రపంచమేమిటి?” అను విచారణ కలుగుతుందో, అట్టి వానికి మాత్రమే, ”ప్రత్యగాత్మ అనేది నాయందలి నిత్యసత్యమే” అని తెలియవస్తోంది. అట్టి

Page:96

దర్శనము పొందినందుకు ప్రయోజనంగా గొప్ప రోగరూపంగా ప్రాప్తిస్తున్న ‘సంసారము’ అనబడే ఈ దీర్ఘకాల విభ్రమమంతా తొలగిపోతుంది.

అట్లా కాకుండా… ఎవని దృష్టిలో అయితే, "ఇది జగత్తు, ఇది నీవు. ఇది నేను. ఇది నాది. ఇది పొందవలసియున్నది…” అనుబుద్ధి తొలగదో, అట్టివాడు బంధము కలిగియే ఉంటున్నాడు. శ్రీరాముడు : ఈ జీవుడు తనయందలి పూర్ణత్వమును అనుభవపూర్వకంగా గ్రహించాలంటే తత్వవిచారణ ఒక్కటే శరణ్యమని నేను అనుకుంటున్నాను.

విచారఃసఫలస్తస్య విజ్ఞేయోయస్యసన్మతేః |

దినానుదినమాయాతి తానవం భోగగృధ్నుతా॥ (సర్గ 18, శ్లో 65)

శ్రీ వసిష్ఠమహర్షి : అవును నిజమే. అయితే సద్బుద్ధి గలిగినట్టి ఏ మనుజుడైతే ఒకవైపు విశ్లేషణ

- అవగాహనలను సంస్కరించుకుంటూనే, మరొకవైపు తనయందలి భోగలాలసత్వమును

క్షణక్షణం క్షీణింపజేసుకుంటూ ఉంటాడో… అట్టి వానిచే చేయబడుచున్న విచారణ మాత్రమే సఫలమగుచున్నదని గ్రహించు.

మంచి ఔషధం సేవిస్తే ఆరోగ్యం పొందుతాము కదా! "ఇంద్రియములను జయించుట” అనునది అభ్యసిస్తే వివేకము అనునది ఫలవంతమౌతూ ఉంటుంది.

అట్లా కాకుండా, కొందరి విషయంలో ఒక విచిత్రం జరుగుతోంది. వారిలో వివేకము కేవలం వచనామాత్రంగానే (కబుర్లవరకే ఉంటోంది. ఆ వివేకం వారి మనస్సునందు ఏర్పడుట లేదు. వారి అవగాహనలలో, కర్మలలో ప్రతిబింబించుటలేదు. చిత్రపటంలోని అగ్నితో నీళ్ళు కాచుకోగలమా? మనస్సునందు వివేకమును ప్రస్ఫుటం చేసుకోలేనివాడు, మాటలు చెప్పగలిగి నప్పటికీ, అవివేకిగానే శేషించుచున్నాడు. అయితే ‘వివేకము’ అనేది స్వగతమైన అవగాహనకు సంబంధించినదేగాని, బాహ్యగతమైన రూప-నామ-క్రియాదులకు సంబంధించినది కాదు.

“కోరికలు సన్నగిల్లుట” అను మార్గములో ప్రయాణం చేస్తూ ముందుకు పోతున్న మానవునికి మాత్రమే వివేకము వికసించుట జరుగుతోంది.

వాయువు యొక్క సత్త (The existence of air) ఎన్ని మాటలు వింటే ఎరుగగలం? ఆ వాయువు మనను స్పర్శించినప్పుడు క్షణంలో ఎరుగుతాం కదా! అన్నిటికన్నా ముఖ్యం అనుభవం.

ఒక చిత్రపటంలోని అగ్ని నిజమైనా అగ్నా? అందలి అమృతం నిజమైన అమృతమా? అందలి స్త్రీ నిజమైన స్త్రీయా? కాదు కదా! అట్లాగే “వాచావివేకము ఏర్పడినంతమాత్రంచేత నిజమైన వివేకం పొందినట్లు కాకపోవచ్చు" అని శ్రోతలకు జాగరూకత చెప్పుచున్నాను. “వాచా మాత్ర వివేకం (Not true discrimination), ‘పరిమిత దృష్టి’ ఉన్నచోట అవివేకమే అవుతుంది. అనుభవమే వివేకమునకు తార్కాణం.

xXx

Page:97

వసంతకాలం ప్రవేశించిన వనంలో కొన్ని విశేషాలు ఏర్పడుతాయి కదా! అట్లాగే వివేకము ఉదయిస్తున్నట్టి జీవునియందు కొన్ని విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి. వివేకము యొక్క ఆగమనముచే మొట్టమొదట రాగము సన్నగిల్లుతుంది. ఆ తరువాత వైరము సమూలముగా నశించిపోతుంది. అప్పుడు జ్ఞానము వికసిస్తూ ఉండగా, “ 66 ఇష్ట వస్తువు లభించుగాక! అయిష్ట వస్తువు తొలగు గాక”… అను ఆవేశ కావేశాలు కూడా క్రమంగా సన్నగిల్లుతూ ఉంటాయి.

కాబట్టి ఓ సభికులారా! సర్వజనులారా! అనుభవముతో కూడిన వివేకముగల మానవుడు ధన్యుడు. అతడు పరమపావనుడు. మీరంతా మీయొక్క అవివేకమును తొలగించుకోవటానికనే నియుక్తులు అవండి. ఈ ఉత్తమ మానవజన్మ పొందినందుకు గాను ’సార్థకత’కు ప్రయత్నించండి. ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ!

  1. శుద్ధ చైతన్యము - ప్రాపంచిక క్లేశములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక వృక్షమునకు ప్రారంభస్థితి బీజమే అయివున్నది కదా! ఈ జీవునకు బీజము "బ్రహ్మము” అయి వున్నది. అట్టి బ్రహ్మము ఆకాశము వలె సర్వత్రా వెలయుచున్నది. ఈ జీవునిపట్ల మనకు కనిపించే జగత్తులో అనేక జగత్తులు అంతర్లీనమై ఉన్నాయి. అరటి మట్టలవలె, భూమిపైగల పెద్ద సంఖ్యలో ఉన్న కీటకములవలె ఈ జీవుని యందు అనేకమంది జీవులు ఉన్నారు. వేసవిలో చమటలో నుండి ఆయా క్రిమిజాలమంతా ఉత్పన్నమౌతుంది చూచావా? శుద్ధ చైతన్యము బాహ్య అభ్యంతరము లందు అనేక దృశ్య రూపములను ధరించుచు అనుభవించుచున్నది. అది ఎక్కడ దేనిని ఆశ్రయిస్తుందో అక్కడ అద్దానిగా అవశ్యము పరిణమిస్తూనే ఉంటుంది.

ఈ జీవులు అనేక విధములైన ఆరాటములతో ఏమేమి ప్రయత్నములు చేస్తున్నారో, అవన్నీ ‘స్వాత్మసిద్ధి’ చేత మాత్రమే చివరికి పరిసమాప్తి పొందుచున్నాయి సుమా! అయితే వారు మధ్య మధ్యలో ఏ ఉపాసనాక్రమముచే ఏఏ విధంగా ప్రయత్నిస్తారో ఆయా విధంగా అట్లే ఆయా పరిణామాలు ప్రాప్తిస్తూ వస్తున్నాయి.

దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. యక్షులను ఆరాధించేవారు యక్షులనే చేరుచున్నారు. హిరణ్యగర్భుడగు బ్రహ్మను ఆరాధించేవారు బ్రహ్మనే పొందుచున్నారు.

అఖండము, నిత్యము, సర్వము అగు బ్రహ్మమును ఆరాధించేవారు బ్రహ్మానుభవమునే పొందుచున్నారు. కాబట్టి రామా! ఏది ఉత్తమమైనదో అదియే నీచేత ఆరాధించబడుగాక!

మన శుక్రుడు మొట్టమొదట ’అప్సరస రూపము” అను దృశ్యమును చూచాడు. అట్లు చూస్తున్నప్పుడు, “మలిన చిత్తస్వభావము”చే బద్ధుడు అయినాడు. మరొక సమయంలో “నేను

Page:98

దుష్ట సాంసారిక స్వభావమును ఆశ్రయించానేమిటి?” అనే ’మెళుకువ’ను ఆశ్రయించాడు. మరల తపస్సును, ధ్యానమును నిర్వర్తించుటచే జ్ఞానమును సముపార్జించాడు. చిత్తము శుద్ధము అయింది. అట్టి చిత్తనిర్మలత్వము యొక్క ప్రభావముచే “ముక్తి”ని సంపాదించాడు.

వాస్తవానికి ఈ జీవుడు శుద్ధ చైతన్యస్వరూపుడే.

శుద్ధ తత్వానుభవమునందు ఉండి ఉండియే…. ఈ శుద్ధచైతన్యము ఒకప్పుడు కాకతాళీయంగా ప్రాపంచిక వ్యసన క్లేశములను స్వయముగా ఆశ్రయిస్తోంది. అయితే, ఒకడు ఆదమరచినంత మాత్రం చేత తననుతాను కోల్పోవుచున్నాడా? లేనే లేదు. అట్లాగే ఏ జీవుడూ కూడా ఎప్పుడూ కంటె ’ఆత్మత్వము’ను ఏ మాత్రం కోల్పోవుటయే లేదు.

  1. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములు

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను గురించి కొన్ని విశేషాలు మాకు చెప్పారు. వీటికి ఒకదానితో మరొకదానికి గల సంబంధమేమిటో మరికొంత వివరించండి.

ఈ జాగ్రత్తు సత్యమువలె వ్యవహారహేతువై, కార్య - కారణములతో కూడినదై ఇట్లు ఎందుకు ప్రాప్తిస్తోంది?…. స్వప్నము భ్రమగాను అసత్యముగాను ఎందుకు ఉండి ఉంటోంది?… జాగ్రత్తు స్థిరంగాను, స్వప్నం అస్థిరంగాను ఎందుకు ఏర్పడి ఉంటోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రతిజీవుని యొక్క శుద్ధ చిత్ స్వరూపమునకు ఆకారముగాని, వికారములు గాని లేవు. అది భావముకంటే మునుముందే ఉండుటచే భావాతీతమైనది. అది గుణములకు వేరై ఉండుటచే త్రిగుణరహితమైనది. అనిర్వచనీయమై ఉండి కూడా, “ఉండుట - గ్రహించుట - ఆనందించుట” అను మూడు ప్రకటనలు కలిగి ఉంటోంది. (సత్-చిత్-ఆనందం)

శుద్ధస్వస్వరూపం

భావములు

అనుభవములు

త్రిగుణములు

1

V

జాగ్రత్ స్వప్నము సుషుప్తి

స్వప్నము

Page:99

ఓ రాఘవా! జాగ్రత్తు స్థిరప్రత్యయయుక్తమైనది స్వప్నము అస్థిరమైనది… అనే అభిప్రాయం నీవు వెలిబుచ్చుచున్నావు కదా! అయితే స్వప్నము కూడా ఆ స్వప్నము అనుభవించ బడుచున్నట్టి సమయంలో “ఇది వాస్తవమే” అనే అభిప్రాయము కలుగజేస్తూనే ఉన్నది. అట్టి అభిప్రాయం కలిగించకపోతే ‘స్వప్నము’ అనే అనుభవమే ఉండేది కాదు. అంటే స్వప్నము కూడా ఆ స్వప్న సమయములో జాగ్రత్తు లక్షణములు కలిగి ఉంటున్నట్లే కదా!

అదే విధంగా ఈ ‘జాగ్రత్తు’ కూడా అనేక అస్థిరములైన విశేషములు కలిగి ఉండటం చేత ఇదంతా స్వప్నతుల్యమే అగుచున్నది. ఇక “అనుభవ విశేషం" (The process of experiencing) విషయానికి వస్తే…. “ఇది స్థిరము - ఇది అస్థిరము” అను భావన ప్రాప్తించటం తప్పించి, జాగ్రత్ స్వప్నములకు భేదమేమున్నది చెప్పు? ఆ రెండింటిలోని ‘అనుభవం’ అనునది మాత్రం సమమే అయి ఉన్నది. ఆ రెండూ కూడా ద్రష్ట యొక్క అనుభవములే కదా!

స్వప్నం కూడా స్వప్నకాలంలో కొంత స్థిరత్వమును జీవునకు పొందింపజేస్తూనే ఉన్నది. అందుచేత స్వప్నానుభవం జాగ్రత్ అనుభవమునకు సమానమైనదే.

అట్లాగే ఒకడు తనయొక్క బాల్యపు అనుభవములను, సంబంధములను, భావనలను గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అవన్నీ స్వప్నములాగానే హృదయాకాశంలో చూడబడుచూ ఉంటాయి. అసలు ఈ జాగ్రత్ - స్వప్నములను “అనుభవములు - అనుభవజ్ఞుడు… దృష్ట్యా చూచినప్పుడు ఏ అనుభవం ఎంతసేపు స్థిరంగా ఉంటోందో చెప్పు?

“స్వప్నము కూడా జాగ్రత్తువలెనే అనుభవం కాగలదు?“ - అని చెప్పటానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. “హరిశ్చంద్రుడు” అను రాజుకు ఒక్క రాత్రి యందలి స్వప్నంలో 12 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ప్రాప్తించింది. ”అసత్యము పలుకకుండుట“… అను అతని జాగ్రత్ సంస్కారం స్వప్నంలో కూడా ప్రతిభాసించింది. ఏ బుద్ధియొక్క “స్థైర్యాంశము” (That which tends to be constant) చే మనం ఈ జాగ్రత్తును చూస్తూ “ఇదంతా సుస్థిరమైనదే”… అని భావన చేయటం జరుగుతోందో, అదే బుద్ధియొక్క స్థైర్యాంశము కారణంగా స్వప్నములో కూడా స్వప్న సమయంలో అట్టి భావనయే మనం కలిగి ఉంటున్నాం. “స్వప్నము కూడా జాగ్రత్తువలెనే అన్ని విధములా అనుభవమునకు రాగలదు” అనే విషయం మనం ఉత్పత్తి ప్రకరణం లోని లవణోపాఖ్యానంలో గమనించాము కదా!

స్వప్నంలో కూడా జాగ్రత్తువలె ‘జ్ఞానాంశ’ స్థిరమైనదే. అయితే ‘స్వప్నబుద్ధి’ కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్వప్న వ్యవహారం ప్రాప్తించటం జరుగుతోంది.

ఏది ఎంతవరకు స్థిరంగా తోస్తూ ఉంటూఉంటోందో అది అంతవరకు ’జాగ్రత్తు’తో సమానమే కదా!

జాగ్రత్తు - ఇక్కడ (జగత్తులో) కనిపిస్తున్న అనేక విశేషాలన్నీ “క్షణభంగురమే” అయి -

ఉండుటచే ఈ జాగ్రత్తు కూడా స్వప్నము వంటిదే.

Page:100

దేనిచేతనైతే ఈ శరీరము ఉజ్జీవించబడుతోందో, అట్టి శరీరాంతర్గత తత్త్వమునే, "తేజము, వీర్యము, జీవము, చైతన్యము” మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ ‘జీవించుట’ అను కార్య క్రమమునకు హేతువు ఆ చైతన్యమే. ఈ శరీరం మనోవాక్కర్మలచే (by, thought, speech of action) వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పుడు… ప్రాణవాయువులచే ప్రేరితమైన జీవచైతన్యం హృదయం నుండి బయటకు వెడలుచున్నది. బాహ్య ప్రదేశాలలో సంచరిస్తోంది. జీవ చైతన్యం దేహాంతరంలో ఉన్న నాడులో సంచరిస్తున్నప్పుడు, శరీరమంతటా ‘జ్ఞానం’ లేక ‘సంవిత్తు’ ఉదయిస్తోంది.

ఆ జీవచైతన్యమే ’దృశ్యము’ వైపు ప్రసరించుచున్నప్పుడు “జగత్తును పొందుచున్నాను” అను భావన పొందుచున్నది. ఇట్టి అనుభవమునే ‘చిత్తము’ అని అంటున్నాం. అనగా జీవచైతన్యమే దృశ్యమునకు సంబంధించిన ’జగత్ భ్రమ’ను తన యందు అంతు లేకుండా దర్శించుచున్నది. అట్టి జగత్ భ్రమ అటు జాగ్రత్తులోను, ఇటు స్వప్నంలోను కూడా ఉదయిస్తుంది. విహారం సల్పుతోంది.

జాగ్రత్-స్వప్న దృశ్యాలు రెండూ చిత్తము యొక్క అంతర్గత అంతరాంతర విశేషాలే! శ్రీరాముడు : అయితే ఈ జగద్దర్శన వ్యవహారమంతా చిత్తము యొక్క అంతర్గతములో ఏర్పడి ఉంటున్న చమత్కారమేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఎట్లా అంటావా? ఈ జీవచైతన్యమే ’నేత్రములు’ మొదలైన ‘ఇంద్రియ ఛిద్రములు’ గుండా బాహ్య ప్రదేశములకు వ్యాప్తి చెందుచున్నది కదా! అట్లు వ్యాప్తి చెందుచు, వాయువీచికవలె తాను ప్రసరించిన చోటును ఆక్రమించుచు పలువిధ వికారములచే పూర్ణమగు రూపమును తనయందే తాను గాంచుచున్నది.

జీవచైతన్యము స్వతహాగా స్థిరత్వమును పొంది ఉంటున్నప్పుడు, స్వీయ లక్షణమైన స్థిరత్వమును బాహ్యమున దర్శిస్తోంది. అదేరీతిగా స్వతహాగా అస్థిరత్వము పొందుచున్నప్పుడు, అదే అస్థిరత్వమును అట్లే అంతరమున కూడా దర్శిస్తోంది.

ఈ జీవుని యొక్క ‘ఇది స్థిరముగానే ఉన్నది’ అను భావన అతని “స్వసత్త” యొక్క స్థిరత్వము నకు సంబంధించినదే కాని, మరింక దేనికో సంబంధించినది కాదు. బాహ్యమున ఏదీ స్థిరత్వం కలిగియుండుటలేదు. అట్లే అంతరమున కూడా!

నీ భావనను అనుసరించే సర్వము నీయందు ప్రవర్తించుచున్నది. చిత్తమును అనుసరించే జగత్తు దృశ్యమానమగుచున్నది. స్వసంకల్పములను అనుసరించే, ఈ కనబడే నిత్యానిత్య అనుభవములు ఏర్పడటం, ఉండటం జరుగుతోంది.

దేనిని ఎట్లు పొందుచున్నావో, అదంతా అట్లు నీ చిత్తము నందే ప్రాప్తించుచున్నది. స్వప్నం కూడా చిత్తము యొక్క ‘జాగ్రత్తుకు వేరైనచోట’ నిర్వర్తిస్తున్న స్వీయరచనా చమత్కృతియే!

Page:101

సుషుప్తి - మరొక సమయంలో ఈ శరీరం మనస్సు - వాక్కు - - కర్మలచే ఏ మాత్రం క్షోభ చెందకుండా ఉంటోంది. అనగా మనస్సు-వాక్కు-కర్మలు మౌనం లేక నిశ్శబ్ధం వహించి ఉంటాయి. అప్పుడిక జీవచైతన్యము శాంతముగాను, స్వస్థతగాను ఉంటోంది. ’’సమత్వము’ చెందినట్టి ప్రాణవాయువుతో కూడి, అక్షుభితమై ఉంటోంది? గాలి వీచికలు లేనిచోట దీపం సంచలన రహితంగా ఉంటుంది చూచావా? “సుషుప్తి" అనబడు స్థితిని “నిశ్చలమగుచోట వెలిగే దీపం”తో పోల్చవచ్చు. ఈ సమయంలో అవయవములందలి నాడులయందు దృశ్య విషయ సంబంధమైన జీవప్రసారం ఉండదు. అనగా నేత్రములు మొదలైన ఇంద్రియముల ద్వారా బహిః ప్రసరణ (outward flowing) ఉండదు.

నువ్వులందు నూనె ఉన్నట్లు మంచునందు శీతలము ఉంటున్నట్లు, నెయ్యిలో తైలత్వము ఉంటున్నట్లు సుషుప్తిలోని జీవునియందు మనస్సు అంతర్గతమై మరుగునపడి ఉంటోంది. అట్టి సమయంలో, ఇంద్రియ విషయములేవీ ధ్యానింపబడుటలేదు. కనుక జీవ చైతన్యము బ్రహ్మాత్మ యందు సౌమ్యము వహించి ఉంటోంది. ఒకానొక “సౌమ్యప్రాణ సహిత స్థితి” అనుభవమౌతోంది. స్వప్న - జాగ్రత్తులకంటే వేరే ప్రత్యేకత గల మౌన స్థితిని పొంది ఉంటోంది.

అట్టి సుషుప్తదశలో జ్ఞాన అజ్ఞానములకు భేదం ఉండదు. కానీ ‘ఎరుక’ అనునది ఉండియే ఉంటుంది. ఆ ఎరుక సుషుప్తి సమయంలో ‘మౌనము’ అను అనుభవము పొందుచున్నది.

తురీయము - ఇది జాగ్రత్- స్వప్న సుషుప్తులకంటే విలక్షణమైనది. అయితే, అట్టి మూడు సమయములందు అది ప్రకాశించుచూనే ఉన్నది. ప్రజ్వరిల్లుతూ ఉంటున్నది. ఇది వేరైనట్టి ఒక అవస్థ కానేకాదు. మూడు అవస్థలయందు కూడా నిశ్చలముగా, మార్పు చేర్పులు పొందక ఉన్నట్టి నిత్యసాక్షిత్వమే "తురీయము”.

శ్రీరాముడు : మహర్షీ! ఈ తురీయావస్థ ఎప్పుడు ఎట్లు ఎట్టి వారిచే పొందబడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు అనేక ప్రయత్నముల ప్రయోజనంగా మరియు శాస్త్రసారమును ఎఱుగుటచే చైతన్యము యొక్క నిత్యసమత్వమును గ్రహించుచున్నాడు. తత్ప్రయోజనంగా, సమస్త దృశ్య వ్యవహారములనుండి ’ఉపరతి’ని పొందుచున్నాడు. ఈ రెండింటినీ సునిశితపరచుచున్నట్టి స్వప్రయత్నముల చేతనే బ్రహ్మ సాక్షాత్కారము ప్రాప్తించుచున్నది.

ఏకాగ్రత, విచారణ యోగి “సర్వ సమత్వము’ అనెడి దృఢమైన ’బోధ’ను కలిగి ఉంటున్నాడు. అతడు జాగ్రత్తు నందు ఉండవచ్చు… లేదా… స్వప్నావస్థయో లేక సుషుప్తావస్థయో ఆశ్రయించ వచ్చు. వ్యవహారశీలుడై ఈ సంసారిక, లౌకిక కార్యక్రమములందు నిమగ్నుడై ఉండవచ్చు. లేదా, సర్వ కార్యక్రమములను త్యజించి ఏకాంత నిష్ఠుడై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతని “నిశ్చలసర్వసమ-నిత్యోదిత” స్థితికి ఏమాత్రం లోటు ఉండటం లేదు. “ఈ నేను-నీవు-అతడు-జగత్తు అను వ్యవహారమంతా… సర్వపరిశేష్యము, స్వస్వరూపము అయినట్టి ఆత్మకంటే వేరే ఏమి కాదు”… అని గ్రహించియే, అతడు ఈ సర్వమును దర్శించుచున్నాడు.

Page:102

అట్టి స్థితినే మనం ‘తురీయావస్థ’ అంటున్నాం. వాస్తవానికి తురీయస్థితి అనిర్వచనీయమైనది. మాటలకు అందనిది. అయితే, అనుభవముచే గ్రహించబడేదే! జాగ్రత్-స్వప్న సుషుప్తులకు కేవల సాక్షియై, అతీతమై,…. ఆ మూడు విశేషములను తన యందు కలిగియుండి ఉన్నట్టిది.

సుషుప్తి నుండి స్వప్న జాగ్రత్తులకు పునఃప్రయాణం - సుషుప్తి యందు జీవచైతన్యము సౌమ్యత్వమును పొందుచూ, ప్రాణములతో సంచలనరహితమైన ఏకత్వము పొందుతోంది కదా! అట్టి జీవచైతన్యము కొంత సమయమైన తరువాత మరల ప్రాణములచే సంచాలితమగుచున్నది. అప్పుడు అనుభవమునకు సంబంధించిన స్పందన పొందనారంభిస్తోంది. క్రమంగా ఇంద్రియ దృశ్య విశేషముల గురించిన చాంచల్యముచే చలనము పొందుతోంది. అప్పుడు భోగము పొందుటకు అనుకూలమైనట్టి ఇతఃపూర్వపు సంస్కారముల ‘ఉద్బోధ’ రూపుదిద్దుకుంటోంది. అట్టి ఉద్బోధయే ‘చిత్తము’ రూపమున ఉదయించుచున్నది.

సుషుప్తి నుండి స్వప్నములోనికి పునరాగమనం - స్వప్నస్థితి యొక్క పునఃప్రవేశ సమయంలో జీవచైతన్యము భావాభావముల రూపమున కల్పనా జగత్తును భ్రమగా పొందుతోంది. అట్టి భ్రమల యొక్క ఫలితంగా తన అంతఃకరణము నందే దృశ్యమును శీఘ్రంగా అవలోకించటం, తాను అద్దాని యందు పాల్గొన్నట్టి అనుభవం పొందటం జరుగుతోంది.

ఎప్పుడైతే జీవచైతన్యము ప్రాణవాయువుచే కొంచెము సంక్షుభితం అవుతుందో, అప్పుడు ‘భావనచేయుట’ అను స్థితిని పొందుచున్నది. ఇక ఎక్కువగా సంక్షుభితం అవటం జరిగితే అప్పుడు విపరీత భావనలను ఆ స్వప్న జగత్తునందే పొందటం జరుగుతోంది.

నాడులు ‘శ్లేష్మజలము’చే పూర్ణమై ఉండునప్పుడు, ఆ సమయంలో నిద్రావస్థలో ఉండే జీవుడు తన అంతఃకరణలోనే అనుభవములు, సంఘటనలు, సంభ్రమములు పొందుచున్నాడు. అదంతా “బాహ్యమున ఏర్పడే ఏవేవో సంఘటనలే” అనుకుని అతడు దర్శిస్తూ ఉంటాడు. స్వప్న సమయంలో నాడులు రక్తముచే పూర్ణమై ఉంటాయి. ధాతుమయమైన ప్రదేశమును, కల్పితమైన కాలమును జీవుడు తనయందు భావనాపూర్వకంగా జాగ్రత్తుతో సమానంగానే గాంచుచు, ”ఇదంతా బాహ్యమునందే ఏర్పడుతోంది"… అని మాత్రం అనుకుంటూనే పొందుచున్నాడు.

స్వప్నానుభవం కూడా జాగ్రదనుభవం వంటిదే! - ఈ జీవుడు స్వప్నములో కూడా "నేత్రాదుల ద్వారా జాగ్రత్తులో బాహ్యము నందలి వస్తు జాలమును అవలోకించుట… అను అనుభవముతో సమానమైన వ్యవహారత్వమునే పొందుచున్నాడు. వాస్తవానికి అతడు భౌతికమైన నేత్రములను ఉపయోగించటమే లేదు. నేత్ర రహిత సందర్శనం కొనసాగుతోంది.

శ్రీరాముడు : స్వప్నంలో సంఘటనలు రచించుచున్నది స్వపద్రష్టయేనా? మరింకెవ్వరన్నానా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు అనుభవములు అనునది స్వరూపముగా కలవాడే అయివున్నాడు కదా! ఇతడు తనయందు ఏ వాసనలు కలిగివుంటే స్వప్నములో ఆ వాసనలకు సంబంధించిన సంఘటనలనే గాంచుచున్నాడు. అయితే, ఆ స్వప్నము పొందుచున్న సమయంలో జీవచైతన్యము

Page:103

ఈ నేత్రములు మొదలైన ఇంద్రియములలోకి ప్రసరించకుండానే ఆలోచనా సంక్షుబ్దమును (Disturbance by coming across series of thoughts) మాత్రం పొందుచున్నది. అది తన అంతః కరణమునందే తన వాసనలను అనుసరించి ఆయా పదార్థములకు సంఘటనలకు సంబంధించిన అనుభవం కల్పించుకొనుచున్నది.

అందుచేత, ఈ జీవునియందు స్వప్నము బాహ్యము నుండి మరెవ్వరో కల్పించుటలేదు. అనాక్రౌన్హేన్దియచ్ఛిద్రో యతః క్షుభో న్తరేవసః |

సంవిదానుభవత్యాశు సస్వప్న ఇతి కథ్యతే ॥ I (సర్గ 19, శ్లో. 33)

స్వప్నం (నిర్వచనం) = జీవచైతన్యము యొక్క మందబుద్ధి వాసనలతో కూడినప్పటి భావ తరంగములు. అంటే భౌతికమైన ఇంద్రియములు నిద్రాణమై ఉండగా, మనస్సుచే లేక ఊహ యందు ఇంద్రియానుభవములు గాంచటం.

బుద్ధి మందముగా ఉండటం, వాసనలు విజృంభించుట, ఆర్తి… ఈ మూడు అటు స్వప్నమునకు, ఇటు జాగ్రత్తుకు కూడా కారణమగుచున్నాయని గ్రహించు.

జాగ్రత్తులోకి పునఃప్రవేశం -

సమాక్రౌన్తద్ధియచ్ఛిద్రో యః క్షుభోవాయునాయదా ।

పరిపశ్యతి తజ్జాగ్రదిత్యాహుర్ముని సత్మమాః ॥ (సర్గ 19, శ్లో. 34)

జీవుడు ప్రాణవాయువుచే విక్షుబ్ధమై బాహ్యశబ్దాది విషయములను కాంచుటను మునులు జాగ్రత్తని వచిస్తున్నారు. అంటే ప్రాణవాయువు నాడులందు ఇంద్రియములందు ప్రసరించు చుండగా, ‘బాహ్య వస్తువుల విషయములు’ సంస్పర్శను వాసనలతో కూడి భావనలతో జోడించి అనుభవమును పొందటం.

అయితే, జ్ఞానవంతుడు, ధీమంతుడు అయిన వాడెవ్వడూ అసత్యమగు ఈ జగత్తు నందు ఎన్నడూ సత్యత్వ బుద్ధి కలిగియుండడు సుమా!

ఈ స్వప్నతుల్యమగు వ్యవహారములందు “ఇవన్నీ సత్యమే” అని భావన చేసేవాని దృష్టియే స్వయంగా…. ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక… తాపాలు పొందటానికి కారణమగుచున్నది.

ఈ ‘జాగ్రత్తు’ విషయమై సత్యత్వబుద్దిని ఆశ్రయించే సంసారజీవుల స్థితి ఎన్నెన్ని దోషములకు చోటు ఇస్తోందో చెప్పటం ఎవరితరం? ఈ ‘దృశ్య లేక సంసార’ వ్యవహారంలో కనిపిస్తున్న ఈ విశేషములు సత్యము, నిత్యము”… అను తాదాత్మ్యమే మృతమనీ…. ఇందలి అసత్యమును అనిత్యమును ఎఱిగి, తాదాత్మ్యము చెందకుండుటే అమృతత్వమనీ కవులు చెప్పుచున్నారు.

అందుచేత అట్టి సంసార సత్యత్వదృష్టిని జయించుటను "మృత్యువును జయించుట” అని గ్రహించు.

Page:104

  1. మనస్సు యొక్క రూపము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఇప్పుడు నీకు ’జాగ్రత్- స్వప్నము-సుషుప్తు’ల స్వరూపమేమిటో కొన్ని విశేషాలు చెప్పాను కదా! ఇదంతా ఆత్మవిషయం ప్రకటించటానికి వీలుగా చెప్పాను. అంతకు మించి వాటిచే వేరే ప్రయోజనం లేదు.

ఒక ఇనుపగుండు అగ్నితో సంబంధం పెట్టుకున్నదనుకో… అప్పుడేమౌతుంది? అగ్ని యొక్క రూపమునే పొందుతుంది కదా! అదేవిధంగా ఈ చిత్తము దృఢనిశ్చయముతో ఏ పదార్థములను ఎంతగా భావిస్తుందో అంతవరకు అద్దానిరూపమునే చెందుచున్నది. “భావము-అభావము”, “గ్రహించుట-త్యజించుట”… మొదలైన దృష్టులన్నీ చైతన్యం నందే కల్పించబడుచున్నాయి. ఇక్కడ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ ‘కల్పన’యే రూపముగా కలిగి ఉన్నాయి కాబట్టి అవి సత్యములు ఎట్లా అవుతాయి చెప్పు?

శ్రీరాముడు : కాని, అనుభవమవటం జరుగుతోంది కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఈ జీవుడు “కల్పన“ (Projections of the Mind) ను ఆశ్రయించినంత కాలం ఈ దృశ్యవ్యవహారం సంప్రాప్తమై ఎదురుగా ఉండియే ఉంటోంది కూడా! ఏమరువ వీలులేదు. అందుచేత మనోచాపల్యముచే కలుగుచుండిన ఈ భావ అభావాలను, గ్రహణ త్యాగాలను “అనిర్వచనీయం” అని విజ్ఞులు అభివర్ణిస్తున్నారు. అవి మనస్సు యొక్క నిర్వచనాలను అనుసరించి ఉంటాయి. ఈ జగత్తును మనస్సే ఈ కనబడే విధంగా నిర్దేశించటంచేత ఇట్లు అనుభవమౌతోందయ్యా!

ఏది ఆత్మ కంటే తదితరమై తారసపడుతోందో అదంతా ఆ ద్రష్ట యొక్క మనస్సే! స్వప్నసదృశమే! “వ్యష్టి” రూపమున భ్రాంతి ఏర్పడటానికి కర్త ఈ మనస్సే! అనగా, మనస్సే “నేను ఒక వ్యష్టిని” అని మననం చేయుటచే వ్యష్టి ఏర్పడుతోంది. అట్లే సమష్టి రూపమున ‘జగత్ స్థితి’కి కారణమగుచున్నది కూడా మనస్సే సుమా! విశ్వమునకు కారణభూతమగు మనస్సే సర్వ

కళంకములకు మూలము.

ఓ రామా! మనస్సే పురుషుడు. కాబట్టి ఎట్లాగైనా సరే, ఈ మనస్సును శుభమార్గమున నియోగించాలి. సర్వజనులారా! ఈ మనస్సును, దీని స్వభావమును చక్కగా గ్రహించండి. దీనిని శుభమార్గమునందే ప్రయత్నపూర్వకంగా నియోగించటం ఉచితం. సర్వదా శ్రేయస్కరం కూడా.

శుక్రాచార్యుని అనుభవం ఏమిటో గమనించారు కదా! ఈ భౌతిక దేహమే పురుషుడై ఉంటే అత్యంత బుద్ధిమంతుడైన శుక్రుడు అనేక వికారములతో కూడిన పెక్కు జన్మల గూర్చిన భ్రమ ఎలా పొందాడు? కనుక, పురుషకారము అనేది సర్వదా మనస్సుకు సంబంధించినదే కాని శరీరము నిర్వర్తించేది కాదు. ఆ ‘గోడ’ ఎట్లాగైతే కేవలం జడమాత్రమై స్వయం నిర్ణయాధికారము లేకయే ఉంటోందో, ఈ శరీరమునకు కూడా స్వయం నిర్ణయాధికారం లేదు. మనస్సు దేనిని మననం

Page:105

చేస్తుందో అట్లే సర్వము ప్రాప్తిస్తోంది. అందుచేత ప్రయత్న పూర్వకంగా స్వల్పవిషయములన్నీ త్యజించబడుగాక! ఈ మనస్సు ఉత్తమోత్తమమైన దానియందే నియోగించబడుగాక!

శ్రీరాముడు : ఈ మనస్సును నియోగించుటకై, ఈ జగత్తు నందు అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనదేది?

శ్రీ వసిష్ఠ మహర్షి : అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనది. మహత్తరమైనది “స్వస్వరూపమే”.

శ్రీ రాముడు : అట్టి స్వస్వరూపమును మనస్సుతో ధ్యానించుటకు ఎప్పుడు ఎక్కడ ఎట్లు ఉపక్రమించాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వస్వరూపమును ధ్యానించుటలో, భావించుటలో మరొక ప్రదేశమునకు వెళ్ళవలసిన పనేమున్నది? సర్వజనులారా! ఆత్మ వస్తువు సర్వదా ఉపాధిరహితం. భ్రమ రహితం, అప్రమేయం, నిత్యం అయివున్నది. అట్టి ఆత్మవస్తువునే సర్వదా ధ్యానించండి. అట్టి ప్రయత్నంలో శ్రమ ఏదీ ఉండదు సుమా! “నేను సర్వదా అఖండము, జన్మరహితము అయిన ఆత్మనే”… అని భావించుటలో కష్టమేముంటుంది? మరికొంత కాలం తరువాతనో, లేక ఏదో కార్యక్రమము ముగించిన తరువాతనో ఆత్మ సంబంధించిన ‘ఉపాసన’ ఆరంభించాలనుకోవటం అజ్ఞాన పూర్వకమైన అభిప్రాయమని మేము గమనిస్తున్నాం.

ఇప్పుడే, ఇక్కడే, ఏది ఎట్లు ఉంటోందో అదంతా అట్లు ఉండగానే “స్వస్వరూపమును ధ్యానించుట, భావించుట” తప్పక చేయవచ్చని అందరికీ మనవి చేస్తున్నాను. జీవుడు ఏ రూపాన్ని ధ్యానిస్తే అతడు అట్టి రూపముగానే పరిణమిస్తున్నాడు. లేక, పొందుచున్నాడు. ఆత్మ యొక్క అప్రమేయత్వంను, నిర్వికల్పత్వంను ధ్యానించు జీవి ఆత్మత్వమునే అనుభవంగా పొందుచున్నాడు. శ్రీరాముడు : స్వామి! మా పై కరుణతో ”ఆత్మను భావించుట" అనగా ఏమిటో మరికొంత విశేషయుక్తంగా చెప్పండి.

ద్రష్ట సం

1E“జగత్తు” సర్వ సంకల్పములకు కర్త, cx అనబడే

ద్రష్టత్వము వహించుటకు C మునుముందే ము సందృశ్యానుభవం

ఏర్పడి & ఉండినట్టిది E సంకల్పరహితత్వము

చైతన్యము

సంకల్పసహితత్వము

Page:106

శ్రీ వసిష్ఠ మహర్షి : "సంకల్పములను రచించుట, లేక నిర్వర్తించుట” అను స్వభావముగల ఈ జీవుడు సంకల్పములు ప్రారంభం కాకముందే, ఉండి ఉన్నాడు. అట్టి సంకల్పములకు ‘ఆదిస్థితి’ యందు అతడు అనిర్వచనీయుడై, వాక్కు మొదలైన వాటికి అందనివాడై, శుద్ధతత్వస్వరూపుడై ఉండి ఉన్నాడు కదా! ఆ శుద్ధతత్వమే.. ‘ఆత్మ’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది. అట్టి ఆత్మ సంకల్పించు సమయము నందు కూడా… ఉండి ఉన్నది. అట్టి శుద్ధతత్వమే స్వస్వరూపము.

స్వస్వరూపభావనచే ఏర్పడు నిశ్చలత్వం, అసంగత్వములే ఆత్మ సాక్షాత్కారముగా చెప్ప బడుతోంది. అట్టి ఆత్మానుభవమునకు సర్వులు అర్హులే. ఓ జనులారా! మీరంతా బలవంతులై అందుకు అర్హత సముపార్జించు కోవాలి. అంతేగాని, "ఈ నా వర్తమానం అందుకు అడ్డు కదా!” అని భావించి ప్రవాహపతితులు కావద్దని హెచ్చరిస్తున్నాను.

అభిపతతి మనః స్థితః శరీరం నతువపురాచరితం మనః ప్రయాతి। అభిపతతి తవాత్ర తేనసత్యం సుభగమనః ప్రజహాత్వసత్యమన్యత్ ॥ (సర్గ 20, శ్లో. 9)

ఈ మనస్సు ఎక్కడుంటే అక్కడికి ‘శరీరము’ ఆవశ్యము పోగలదు. కాని, శరీరము ఎక్కడుంటే అక్కడికి మనస్సు పోవలెనను నియమము లేదు. మరింక ఈ శరీరము గురించి భ్రమపొందవలసిన పనేమున్నది?

ఈ శరీరము ఎక్కడ ఉండవలసివస్తోందో అక్కడే ఉండనివ్వండి. మనస్సును మాత్రం స్వస్వరూపము నందు సుస్థిరం చేయండి. ఓ రామచంద్రా! నిత్యసత్యమైయున్నట్టి ‘ఆత్మవస్తు ప్రాప్తి’ యందు మాత్రమే నీ మనస్సు నియోగించబడుగాక! అందుచేత ‘అసత్యములే’ అయినట్టి ఈ దేహ, ఇంద్రియాలను, తదితర భేదపూర్వకమైన భ్రమలను నీవు త్యజించివేయి. ఈ దేహ, ఇంద్రియాల పట్ల గూడుకట్టుకొని ఉన్న విశ్వాసం నుండే సర్వసంసార భ్రమలు, బంధములు మరింతగా ఏర్పడు చున్నాయిని గ్రహించు.

చైతన్యతత్వమైయున్న నీ శుద్ధ స్వరూపమునకు జడపదార్థములైనట్టి ఈ శరీరాదులను ఆపాదించి భ్రమ చెందవద్దు. “ఈ శరీరమే నేను. ఆ శరీరము మరొకరు” అను భావనలోని అనర్థమేమిటో ముందు గ్రహించు.

స్వస్వరూపతేజోమయుడవై ప్రకాశించుచూ సర్వలోకములకు శుభప్రదుడవయ్యెదవుగాక!

  1. విజ్ఞానవాదము

శ్రీరాముడు : ఓ మునీంద్రా! ధర్మజ్ఞా! సముద్రంలో బడబాగ్నిలాగా, నా హృదయంలో ఇప్పుడు ఒక గొప్ప సందేహం పుట్టి కల్లోలం కలిగిస్తోంది. అదేమిటో చెపుతాను వినండి.

“బ్రహ్మం దేశ కాలాదులచే పరిచ్ఛిన్నమయ్యేది కాదు. అది సర్వదా వ్యాపకమై, నిరామయమై ఉంది”… అని మనం అనుకున్నాం కదా! అట్టి ”నిష్కళంక నిర్వస్తువు" అగు

Page:107

బ్రహ్మం నందు విషయాకారముచే కలుషితమైనట్టి ఈ ‘మనస్సు’ అనబడేది ఎట్లా, ఏ కారణం చేత, ఏ రూపమున, ఎప్పటి నుండి స్థితిపొంది ఉంటోంది? ఆత్మజ్ఞులు శాస్త్రములు.. "బ్రహ్మము నందు అవిద్యా రూపమైన కళంకము ఏ కాలమందును లేదు”… అని చెప్పుచుండటం జరుగుతోంది. మరి ఈ మనస్సు ఎట్లు, ఏ కారణంగా ఉదయిస్తోంది?…, ఈ విషయం ముందు చెప్పండి. అటుపై ‘ఈ మనసును నిరోధించుటెట్లా? అనే ప్రశ్నను మరల పరిశీలించవచ్చు. ఈ ప్రశ్నపై కొంత సంవాదము జరిగింది కానీ, ఇంకా కొంత వినాలని నా అభిలాష.

శ్రీ వసిష్ఠ మహర్షి : చాలా చక్కగా, మంచి ప్రశ్నకే వచ్చావు. ఇప్పుడు నీ బుద్ధి మోక్షమును పొందుటకు సంపూర్ణమగు అర్హత పొందుచున్నదని నేను భావిస్తున్నాను. పూర్వాపరవిచారణ యందు తత్పరమైయున్న నీ బుద్ధియొక్క ప్రభావంచేత శంకరాదులు పొందిన ఉత్తమస్థితిని నీవు తప్పక పొందగలవు.

అయితే మనం ఇప్పుడు “స్థితి ప్రకరణం”లో ఉన్నాం కదా! వర్తమాన విషయవిచారణ దృష్ట్యా నీ ప్రశ్నకు ఇది తగిన సమయం కాదు. నిర్వాణ ప్రకరణంలో ప్రవేశించినప్పుడు మనం “ఆత్మకు మలినత్వం ఎట్లా వచ్చినది?” అనే ప్రశ్నను కొన్ని కోణముల నుండి పరిశీలిస్తాం. ప్రస్తుతం “ఆత్మ స్వతహాగా శుద్ధమైనది” అనే విషయం అనేక దృక్పథముల నుండి నిరూపిస్తున్నాం. “మనస్సు ఎట్లా ఉదయిస్తోంది” అనుదానిగురించి, “శుద్దాత్మానుభవం’ గురించి మనం నిర్వాణ ప్రకరణంలో పరిశీలిస్తున్నప్పుడు ఈ నీ ప్రశ్న అడుగు. “శుద్ధమైన ఆత్మకు దోషమెట్లా ప్రాప్తించింది?” అనే విషయం నిర్వాణ ప్రకరణంలో సవివరంగా, విస్తారంగా చర్చించబోతున్నాం. ఇప్పటికి మాత్రం “మనస్సును శుద్ధిపరచటమెట్లా?” అనేవిషయం ముఖ్యంగా పరిశీలిస్తున్నాం.

మనం ఏ సిద్ధాంతం గురించి వర్తమానంలో విచారిస్తున్నామో అద్దానిని గురించి ఇప్పటికి చర్చించటం (అవగాహనా సౌలభ్యం దృష్ట్యా) ఉచితం కదా!

ఇప్పుడు మనం “ఉత్తమమైన అవగాహన కలిగియున్న మనస్సు” గురించి విచారిద్దాం. ఈ ప్రాణ సమూహమంతా “జన్మ-కర్మలు” అనే జాలములో చిక్కి ఆయా పాట్లు పొందుచున్నది. కారణంగా? మనస్సు కారణంగా కదా!

మనస్సే … ప్రకృతి, కర్మ కూడా!

మనస్సు - అజ్ఞాని అవిచారణ కారణంగా “స్వతహాగా అసత్యమే” అయినట్టి అనేక భ్రమలతో కూడిన అనుభవములను పొందుచున్నాడు. అజ్ఞానముతో ఉపసహితమైన చైతన్యమును ‘ప్రకృతి’ అంటున్నాం. మనన ధర్మము చేత ‘ప్రకృతి’ అనునది ఏర్పడుచున్నది. కాబట్టి మనస్సు అంటే కూడా అదే సుమా! ఆ స్థితియందు ”ప్రియత్వము ఉద్వేగము”లతో కూడిన కర్మేంద్రియ వ్యాపారములు నిర్వర్తించబడుచూ ఉంటాయి. కాబట్టి దీనినే “కర్మ” అని కూడా నిర్ణయిస్తుంటారు.

Page:108

ఈ “మనస్సు-కర్మలు-జీవుడు భగవంతుడు” అను విషయములకు భిన్న మత వాదులు చిత్ర విచిత్రములైన శాస్త్రదృష్టులను, అనేక నామరూపములను కల్పన చేసి తమ అనుయాయుల ముందు ఉంచుచున్నారు. వాటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెపుతాను. అవన్నీ నీ ప్రశ్నకు తగిన సమాధాన సమన్వితమైన యోచనను అందిస్తాయి అనేది నా ఉద్దేశం.

“వాసనల నుండి అవగాహనలు" - ‘సుగంధం’ గల ప్రదేశంలో వర్తించిన వాయువు తాను సుగంధరూపమునే పొందుతుంది కదా! మననశక్తిచే చంచలమై ఉంటున్న ఈ మనస్సు, యే వాసనతో గూడి, ఎట్టి భావమును గ్రహిస్తుందో తాను అట్టి రూపమునే పొందుతూ ఉంటుంది. ఈ కారణం చేత కొందరు తమ వాసనలచే కల్పితములైన ఆయా సిద్ధాంతములను ఆయా యుక్తుల సహాయంతో నిర్ణయిస్తున్నారు.

అట్టి ‘అవగాహన’ వారు ‘అత్యంత వాస్తవమైనది’ గానే గాంచటం జరుగుచున్నది.

పదార్థములను భావన చేయు స్వభావము గల ఈ మనస్సు అట్టి పదార్థములతోటి తన్మయ మగుచున్నది. ఆ పదార్థ రూపమునే చెందుతోంది. మనస్సునకు వశమై వర్తించు ఆ శరీరము కూడా అదే రూపమును, అనుభవమును పొందుచున్నది.

జ్ఞానేంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించునప్పుడు ఈ కర్మేంద్రియములు కూడా ఆ విషయములందు ప్రవర్తిస్తున్నాయి. గాలిలో ధూళి ఏర్పడుచున్నట్లు, ఆత్మయందు ఈ కర్మ వ్యవహారమంతా సిద్ధిస్తోంది. కర్మేంద్రియములు నియమించబడుచుండగా, క్రియాశక్తి వ్యక్తమగుచున్నది.

కాబట్టి మనస్సు యొక్క బీజము “కర్మయే”! మరి, కర్మ యొక్క బీజమో? మనస్సే! ‘పుష్పము - - పరిమళము’ ఒకదానితో మరొకటి అభేదమైనట్లు ఈ కర్మ - మనస్సులు వేరు వేరు కాదు.

దృఢమైన భావనావశం చేతనే మనస్సు ‘మననము’ అనుదానిని స్వీకరిస్తోంది. అట్టి భావన యొక్క ప్రభావం చేత ‘స్పందము’ లేక ‘కర్మ’ అనబడు శాఖ ఉత్పన్నమవుతుంది. ఈ మనస్సే క్రియను, ఆ క్రియయొక్క ఫలములను ఆదరభావంతో సిద్ధింపజేయుచున్నది. ఆ తరువాత “ఆయా కర్మల ఫలములను పొందుచున్నాను” అను అనుభవమును స్వీకరిస్తూ వెనువెంటనే బంధమున తగుల్కొనుచున్నది.

అహమ్ త్వమ్ తత్ - - ఇప్పుడు విజ్ఞానవాదము ననసురించి ’అహమ్-త్వమ్-తత్’లను విశదీకరిస్తానుఈ మనస్సు ఏ భావనను స్వీకరిస్తుందో, ఆ భావనయే నిశ్చయమై పరిణమిస్తోంది. దేనినైతే, “ఇది శ్రేయోదాయకము - ఇది కాదు - ఇప్పుడు నేను అల్పత్వములో ఉన్నాను - ఇట్లు వీరు చెప్పి నట్లు మాత్రమే ఆచరించాలి అప్పుడు సముద్ధరించబడగలను”… అను రూపము గల భావోద్వేగము ఈ జీవుడు కలిగి ఉంటాడో… అది ఆ జీవునకు ఆ రీతిగానే సంప్రాప్తిస్తోంది.

Page:109

వాసనాదార్ద్యముచే ‘అహమ్-త్వమ్ తత్’ శబ్దములకు వివిధ భావనలతో కూడిన భిన్నమైన మతనిశ్చయములు జనులచే స్వీకరించబడుచున్నాయి. ఆ నిశ్చయములను అనుసరించే వారు తమ తమ ధర్మార్థ కామమోక్షముల కొరకు ఆయా వేరు వేరు ప్రయత్నముల చేస్తూ ఉంటున్నారు. ఆ శబ్దముల కొన్ని నిర్వచనములను (కొన్ని శాస్త్రములు ప్రవచనములను) వినుకపిల సిద్ధాంతం -

1) అహం = ఇది స్వతహాగా అనేక దోషములు కలిగి ఉంటోంది. అట్టి ’అహం(నేను) లోని దోషాలను శుశ్రూష, తపస్సు, ధ్యానం మొదలైన ప్రయత్నములచే తొలగించుకోవాలి. 2) త్వమ్ (నీవు) = ఈ ‘నీవు’ అను రూపంలో ప్రాప్తించేదంతా అత్యంత నిర్మలము, అసంగము అయి ఉన్నది.

3) తత్ (అది) = అహం, త్వమ్ల కంటే విలక్షణమైనది. అది కోపగించుట, ప్రేమించుట, వరాదులను ఇచ్చుట మొదలైన త్రిగుణములకు సంబంధించిన వ్యవహారములను నిర్వర్తిస్తూ ఉంటుంది. సత్కర్మలను సన్మానించటం, దుష్కర్మలను శిక్షించటం నిర్వర్తిస్తూ ఉంటుంది. సగుణ బ్రహ్మవాదులు - వీరు భగవంతునకు గుణములు ఆపాదిస్తూ మరల మరల అట్టి నిశ్చయమునే ధ్రువీకరించటం జరుగుతోంది. అట్టివారు సగుణ బ్రహ్మమును ప్రవచిస్తున్నారు. తదనుకూలంగానే, శాస్త్రములు రచించబడటం, ప్రవచించబడటం జరుగుతోంది.

అనగా, ఈ జగత్తుకు ఏది ఉపాదాన కారణమో అట్టి ‘తత్’ (భగవంతుడు) కూడా సుఖ దుఃఖ జడాత్మకమగు జగత్తు వలె గుణాత్మకమని వారిచే ప్రతిపాదించబడుతోంది.

పరిణామవాదులు - - మరికొన్ని సిద్ధాంతముల ప్రకారం… ఈ జీవుడు చేసే ఆయా సాధనల యొక్క అంతిమ ప్రయోజనంగా ఈ ‘అహమ్’… త్వమ్లోనూ, త్వమ్ వెళ్ళి ’తత్’లోనూ విలీనమై పోతోంది. చివరికి ’తత్’యే ఆద్యంతములలో శేషించి ఉంటోంది.

ఇట్లా ఇంకా ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. భిన్న సిద్ధాంతములు ప్రతిపాదించే వారిలో కొందరు, “మేము చెప్పేదే ఉపాయం. ఇది తప్ప మరింకే విధంగాను ఎవ్వరికీ మోక్షము లభించదు”- అనే నిశ్చయమును చెప్పుచున్నారు. అయితే ఆ గురువులు వారి శిష్యులందు కొంత ఏకాగ్రత, ధారణ అలవడుటకు అట్లు “ఇట్లే అనుసరించండి” అని చెప్పటం జరుగుతోంది. వారి శిష్య ప్రశిష్యుల అవగాహనలో కొంత అల్పమైన విజ్ఞాన దృష్టి ఏర్పడటం కూడా జరుగు తోంది. అప్పుడు ఒక అభిమతమును ఆశ్రయించువారు ”స్వసంకల్పితమైన నియమములు” అనే భ్రమచే ఇతర ఉపాయములను విచారణలను, అవగాహనలను దూరం నుండే నిరసించటం, విభేదించటం జరుగుతోంది.

Page:110

వేరు వేరు గురువులు వేరు రీతులలో విధివిధానములు, నియమములు నిర్ణయిస్తూ, జీవిత పరమార్థములు - జ్ఞానవిజ్ఞాన విశేషములు ప్రవచిస్తున్నారు. అయితే, వారి శిష్య, ప్రశిష్యులలో కొందరు పరమార్థం ఏమిటో మరచి కేవలం విధి, విధానాలను మాత్రం అవిచారణ పూర్వకంగా ఆశ్రయిస్తూ తదితర గురువులను, ఇతర గురువులు చెప్పు జ్ఞాన, విజ్ఞాన విశేషములను మొదలే ద్వేషించటం, చేస్తున్నారు. తద్వారా కలహించుకోవటం, హింసించుకోవటం చూస్తున్నాం.

ఇదంతా బాలురు, మూర్ఖులు, రాగద్వేషపూరితులు, జాత్యహంకారులు అగు వారి వలననే అట్లు ప్రాప్తిస్తోంది. గురువులు తమ తపోధ్యానాలచే గ్రహించినది లోకక్షేమం కోరి ప్రవచిస్తుంటే, అందలి జ్ఞానసారాన్ని మానవాళి అంతా గ్రహించవచ్చు. స్వవివేకముచే పరిశీలించవచ్చు.

ఏ ఉత్తమ భావనను అంతరంగమున ఆశయపూర్వకంగా స్వీకరించి, అందుకు గాను ప్రయత్నశీలురమౌతామో అదియే ప్రయత్నముల తీవ్రతను అనుసరించి, ఆ ఆ రూపమైన ప్రయోజనమే ప్రాప్తిస్తూ ఉంటుంది.

అందుచేత భావ ఔన్నత్యము చేతనే మనస్సు కుదుట పడగలదు. ఎప్పుడు ఒకని “సర్వము ఆత్మవిన్యాసమే” అను ఆశయమునకు సానుకూలమై ఉంటుందో, అది అతనికి మరింత శోభాయ మానమని మా అభిప్రాయం.

ఇంకా కొన్ని సిద్ధాంతాలు -

వేదాంతవాదులు - వీరు శ్రుతులను (వేదములును) ప్రమాణంగా తీసుకొని ’అధ్యారోపవాద న్యాయమును’ అనుసరించి “ఈ జగత్తంతా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు”… అనే నిశ్చయమును దృఢపరచుకోవలసినదిగా ప్రవచిస్తున్నారు. “అట్టి దృఢ నిశ్చయము చేతను, శమదమాదులను నిరంతరం ఆశ్రయించుట చేతను సర్వోత్తమమగు ‘ముక్తి’ లభించ గలదు” అని చెప్పుచున్నారు. అందుకు విరుద్ధమగు మరి దేనిచేత కూడా ముక్తి లభించదని ప్రకటన చేస్తున్నారు. తదనుకూలంగా శాస్త్రములు ప్రవచించుచున్నారు.

అయితే వారిలో కొందరు “మేము నిర్ణయించుకున్న విధి నియమములు” మాత్రమే వాస్తవము, తదితర విషయము లేవీ “మోక్షసాధకములు కావు” అనునది వాదన పూర్వకంగా ప్రకటిస్తున్నారు. కనుకనే, ఇంతలోనే అభేద దృష్టి నుండి చ్యుతి పొందటం జరుగుతోంది.

విజ్ఞానవాదులు - “స్వబుద్ధి చేతను, శమ, దమములచేతను మాత్రమే ముక్తి లభించగలదు. మరింకే ఉపాయం లేదు"… అని ప్రతిపాదించుచు, ఈ బుద్ది సునిశితమగుటకు గాను కొన్ని నియమ, నిష్ఠలు చెప్పుచున్నారు. ఈ సిద్ధాంతమునే గ్రంథాదుల ద్వారా ప్రకటించుచున్నారు.

అర్హతాదులు - వీరూ విజ్ఞానవాదమే ప్రకటిస్తున్నారు. అయితే, స్వాభిమతమును అనుసరించి చిత్ర విచిత్రములైన దిగంబరత్వము, భిక్షాటనము మొదలైన ఆచారములను కల్పించి, తదనుగుణంగా గ్రంథములను నిర్మించి ప్రచారం చేస్తున్నారు.

Page:111

ఇంకను మరికొన్ని సిద్ధాంతముల ప్రకారం “ఈ జీవుడు బాహ్యదృష్టిచే జీవత్వము, స్వస్వరూపముచే శివత్వము వహించియున్నాడు. సర్వజీవులు ఆ శివత్వము నుండి ప్రకటిత మగుచున్న కిరణముల వంటి వారే!”… అను ‘తత్త్వమ్’ భావనను ప్రకటిస్తున్నాయి.

చూచావా! ఇక్కడ మనం దృష్టాంతము కొరకు రెండు మూడు సిద్ధాంతములను సంగ్రహంగా చెప్పుకున్నాం. వాస్తవానికి అనేక విచిత్రములైన సిద్దాంతములు, (భగవంతుని గురించిన) అవగాహనలు భగవదన్వేషకులచే ఆశ్రయించబడుతున్నాయి. మరికొందరు అన్వేషకులు తమ యొక్క అవగాహనను, స్వవివేకమును, పరిశీలనను ప్రక్కకు పెట్టి, ఇక కేవలం తదితర సిద్ధాంతములను ఖండించుట యందు, తిరస్కరించుట యందు మాత్రమే నిమగ్నమైయున్నారు.

ఓ రాఘవా! ఏ నిమిత్తం లేకుండానే శాంతజలమునందు అనేక బుద్బుదములు ఉత్పన్న మౌతాయి కదా! అట్లే అకారణంగా అనేక నిశ్చయములను ప్రకటించు వేరు వేరు శాస్త్రరీతులు, వాటిని ఉద్బోధించు గురువులు ఈ ప్రపంచంలో ఏర్పడటం జరిగింది. మరింకెన్నో శాస్త్రరీతులు ఏర్పడబోవుచున్నాయి.

మణులన్నిటికీ సముద్రమే నిలయం కదా! వివిధ శాస్త్రరీతులన్నిటికీ మనస్సే ‘ఉనికిపట్టు’.“మా గురువు చెప్పినదే వినాలి. మరింకెవ్వరు ఏమి చెప్పినా ఎవ్వరూ వినకండి"… అని నిర్దేశించువారు, ఇతర వాదములను, అభిప్రాయములను ద్వేషించువారు కలహించుకొను వారు ‘సత్’ వస్తువును పొందేదెట్లా?

ఇక్కడ ఒక రహస్యం చెపుతాను విను. వేప చేదు కాదు. చెఱకు తీపి కాదు. అట్లే చంద్రుడు శీతలము కాదు. అగ్ని ఉష్ణము కాదు. ఎవడు ఏ అనుభవమును చిరకాలంగా “ఇది మధురం… ఇది అప్రియం, ఇది సుందరం, ఇది ద్వేషింపతగినది, ఇది స్వీకరించాలి, ఇది తిరస్కరించాలి” అని భావనచేస్తాడో అది అతనికి అట్లే ప్రాప్తించటం జరుగుతూ ఉంటుంది. ఆ వస్తువా, ఇక ఆ రీతిగానే అనుభవమౌతుంది. ఈ కారణంచేతనే చంద్ర-సూర్య-అగ్ని మండలములలో నివసిస్తున్న దేవతలు, యక్షులు మొదలైన జీవులకు ’శీతలము-ఉష్ణము’ మొదలైన బాధలు కలగటమే లేదు. ఈ శాస్త్రరీతులు వాటి పట్ల ఏర్పడు రాగద్వేషాదులు అట్టివేనని జనులు గ్రహించెదరు గాక!

ఓ సర్వజనులారా! ‘జీవితము’ అనునది అత్యంత విలువైనది. అట్టి ఈ అవకాశమును ఏవేవో వాదోపవాదములతో వృథాపరచుకోరాదని మా ఉద్దేశం. సర్వజనుల శ్రేయోభిలాషులమైన మేము మా అభిప్రాయమేమిటో కూడా ప్రకటించుచున్నాము. వినండిఈ మానవుడు స్వతహాగా ఆనందమయస్వరూపుడే. అయితే, అతని స్వస్వరూపమునకు సంబంధించి సమగ్రము, ఉత్తమము అయిన ‘అవగాహన’ మరుగునపడి ఉంటోంది. అతని ఎరుక ఆయా రాగద్వేషాదులచే కప్పబడి, మేఘావృతమైన ఆకాశమువలె ఉంటోంది. అందుచేత జనులు నిరతిశయ బ్రహ్మానందము కొరకే యత్నించెదరు గాక! మనస్సును బ్రహ్మమయం చేయండి. తద్ద్వారా బ్రహ్మమే ప్రాప్తిస్తోంది.

Page:112

“నేను సర్వదా అఖండము, నిత్యము, నిర్మలము అయిన బ్రహ్మమునే అయి ఉన్నాను. ‘నీవు అది - జగత్తు’… ఇదంతా బ్రహ్మమే. అట్టి చైతన్య బ్రహ్మమే అందరియందు, అంతట ఏకస్థమై వెలయుచున్నది” అను భావనను ఈ మనస్సు ఆశ్రయించుగాక! అట్లు ఆశ్రయించటమే “మనస్సు బ్రహ్మమయమగుట”… అయి ఉన్నది.

ఒక బాలుడు బాటలో నడుస్తూ ఏవేవో పదార్థాలు చూచి “ఇవి నాకు ప్రియమైనవి… అందుచేత ఇవి నాకు కావాలి…” అని ప్రీతి గొనుటచే అవి అవశ్యం పొందవలసినవిగా కనబడతాయి కదా! అట్లే ఈ మనస్సు కూడా అనుక్షణం అనేక పదార్థముల పట్ల ఆకర్షణ వికర్షణలను పొందుతోంది. ఫలితం? ఈ జీవునికి అనేక దుఃఖ పరంపరలు వచ్చిపడుచున్నాయి. అంతులే కుండా అసంఖ్యాకమైన ‘జన్మలు’ ప్రాప్తిస్తున్నాయి. ఎప్పుడైతే మనస్సు బ్రహ్మమయం అవుతుందో, ఇక తుచ్ఛములైన “దృశ్యముయొక్క ప్రాప్తిచే జనించు సుఖ దుఃఖములు” అట్టి జీవుని ఏమాత్రం క్షోభింపజేయలేవు.

అపవిత్రమసద్రూపం మోహనంభయకారణమ్ | దృశ్యమాభాసమాభోగి బంధమాభావయానఘ | (సర్గ 21, శ్లో 36)

మాయైషాసాహ్యవిద్యైషా భావనైషాభయావహా | సంవిదస్తన్మయత్వం యత్తత్కర్మేతి విదుర్బుధాః ॥ (సర్గ 21, శ్లో 37)

ఓ రాఘవా! ఈ ‘దృశ్యము’ యొక్క స్వభావమేమిటో సునిశితంగా పరిశీలిస్తున్నావా? ఇదంతా అపవిత్రము, అజ్ఞానదాయకము, అసద్రూపము, భయహేతువు, బంధదాయకము అయి, ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. ఎందుచేత?… ఈ జీవుడు విజ్ఞానముతో కూడిన విచారణను అలవరచుకోకపోవటం చేతనే సుమా! అందుచేత, ఈ దృశ్యమును నీవు భావనయే చేయకపోతే, అది ఇంకేమి చేయగలదు చెప్పు? “అసలు ద్రష్ట దృశ్యమయమగుట… అనునదే బంధమునకు హేతువు అయినట్టి కర్మ” అని బుద్ధిమంతులు చెప్పుచూ ఉంటారు. అదియే మాయ, అదియే అవిద్య కూడా! భయప్రదమగు భావనకూడా అదియే.

‘మనస్సు’ అంటే ‘దృశ్యము’ అనే అర్థం సుమా!

మనస్సే మోహ, అజ్ఞానములకు హేతువైయున్నది. అనేక ఆసక్తులు, ద్వంద్వములు ఈ మనస్సులో నిరంతరం పరిభ్రమిస్తున్నాయి. అట్టి బురదతో నిండియున్న ఈ మనస్సును శుద్ధం చేయాలి. సంసారపు మత్తు అంటే ఏమిటి? ఏ దృశ్యతన్మయత్వమైతే స్వభావ సిద్ధంగానే ఉదయించి అనుభవమౌతోందో… అద్దానినే ‘సంసారం’ అని అంటున్నాం. దృశ్యరూపత్వమే అవిద్య మరియు అజ్ఞానం కూడా! మేఘములచే కప్పబడినప్పుడు సూర్యుడు కనిపించడు కదా! ఈ దృశ్యముచే ఆవరించబడిన ఈ జీవులు కూడా పరమశ్రేయమగు స్వస్వరూపమును దర్శించలేకున్నారు.

ఈ ‘అవిద్య’ ఎట్లా ఉత్పన్నమౌతోంది?…. ఇది సంకల్పమాత్రం చేతనే ఉత్పన్నమగుచున్నది. ఒక బాలుడు ఆకాశంలో మేఘముల ఆకృతులను చూచి "అది చెట్టు. ఆ ప్రక్కన తటాకం, అక్కడ

Page:113

ఒక మృగం,”… ఈ విధంగా ఆలాపన చేస్తాడు చూచావా? అట్లాగే ఈ దృశ్యం కూడా స్వయం కృతంగా జీవునకు ప్రాప్తిస్తోంది.

శ్రీరాముడు : ఈ ’అవిద్య’ లేక ‘దృశ్యభావన’ శమించేది ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి : సంకల్పముల కారణంగా ఏర్పడి ఉంటున్న అవిద్య… ‘నిస్సంకల్పము’ (సంకల్పించకుండటం) అని మౌనరూపయత్నముచే శమించగలదు. సంకల్పరాహిత్యముచే భావన నశిస్తుంది. అప్పుడు భావాతీతమగు స్వస్వరూపము యొక్క అనుభవం సుస్థిరమౌతుంది. పదార్థముల పట్ల, విషయముల పట్ల అసంగమే అందుకు మార్గం.

1) ‘సమాధి’ (Complete cessation of thought) యొక్క దార్ద్యముచే, 2) శ్రవణ, మనన రూపమగు తత్త్వవిచారణచే - - పదార్థముల పట్ల అకృత్రిమమైన అసంగము ఏర్పడుతోంది. “సత్య దృష్టి” చేకూరి, ‘అసత్యదృష్టి’ సన్నగిల్లుచుండగా ’కల్పనా రాహిత్యము స్వయముగా ఏర్పడుతోంది.

అట్టి నిర్వికల్పమునందు… స్వచ్ఛ స్వభావయుక్తము, పరమార్ధము సత్యస్వరూపము అయినట్టి ‘ఆత్మభావన’ సంప్రాప్తించుచున్నది. ఇక్కడ మనం ‘భావన’ అని అంటున్నప్పటికీ, అది భావరహితమైన స్థితియే.

అట్టి విషయరహిత పరమాత్మయందు వ్యక్తిత్వముగాని, అవ్యక్తిత్వముగాని ఉండవు. విషయ జనితములైన సుఖ దుఃఖాలు ఉండవు. అట్టి ‘పరమాత్మస్థితి’ జీవునిచే తన హృదయంలోనే పొంద బడుచున్నది. కేవల శుద్ధ స్వభావరూపమైన హృదయమునందు మాత్రమే ఆత్మతత్త్వము ప్రత్యక్ష మగుచున్నది. ఆత్మవస్తువు స్వయంగా అంతరంగమున అనుభవైకవేద్యమే సుమా!

  1. ఆత్మబోధ ఎట్టి వారికి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు నిష్కారణంగా ఈ దేహ, ఇంద్రియములందు “ఇవియే నేను” అనబడు అహంభావము కలిగియుంటున్నాడు. అత్యంత అనర్థహేతువైనట్టి “అహమ్ దేహమస్మి” అను భావన చేతనే ఆత్మభావన పొందబడకపోవటం జరుగుతోంది. ఎవనికైతే ఈ ’దేహ ఇంద్రి యముల’తో ఆత్మయొక్క “అభేదభావన” ఉండదో…. ఎవ్వని యందు సర్వవాసనలు తొలగి పోతాయో… అట్టి పుణ్యచరితునకు మాత్రమే పూర్ణమగు ఆత్మభావన ప్రాప్తిస్తోంది.

ఒకడు చీకటిలో ఒక త్రాడును చూచి, “ఒకవేళ ఇది త్రాడు కాదేమో? పామేమో?” అనే సందేహమును ఆశ్రయించుటచేత క్రమంగా అతనికి ఆ త్రాడుయందు పామే కదలాడుచున్నట్లు కనబడుతుంది. బంధరహితమగు చిదాకాశమే స్వరూపముగాగల ఈ జీవుడు కల్పిత వస్తువును అన్యవిధంగా కల్పన చేస్తూ స్వాత్మయందు బంధము కల్పించుకొనుచున్నాడు. “ఈ సంఘటనలతో, వ్యక్తులతో నాకు సంబంధమున్నది. అందుచేత ఇవి నాకు సుఖ దుఃఖకరములు”… అని భావన చేస్తే అది అట్లే అగుచున్నది. “చిదాకాశమే స్వరూపముగా గల నాకు ఈ భావనలతో, అట్టి

Page:114

భావనల ప్రయోజనంగా ప్రాప్తిస్తున్న ఈ ’జగత్తు’తో సంబంధమెక్కడిది?” అను భావస్థితిని ఆశ్రయిస్తేనో.. తదనుకూలంగానే అంతా ప్రాప్తిస్తోంది.

ఒకే ఆకాశము పగలు ఒకవిధంగా, రాత్రి మరొక విధంగాను కనబడుతోంది కదా! అలాగే ఆత్మకూడా భిన్న రూపములను ధరిస్తోంది.

ఈ జీవుడు అనేక సంసార దుఃఖ పరంపరలలో పడి కొట్టుమిట్టాడటం నిర్వివాదాంశమే కదా! అయితే, తననుతానే అతడు గమనించుటలేదు.

యదతుచ్ఛమనాయాసమ్ అనుపాధి గత భ్రమమ్ । తత్తత్కల్పన యాతీతం తత్సుభాయైవ కల్పతే || (సర్గ. 21, శ్లో. 48) మహత్తరమై, స్వభావసిద్ధమై, ఉపాధిరహితమై, భ్రమవర్జితమై సర్వకల్పనలకు అతీతమైనట్టి ఆత్మను ఎరుగుటచేత మాత్రమే అతడు దుఃఖరహితుడు కాగలడు. ఒకడు శూన్యమగు ఒక ’గుహ’లో ప్రవేశించి “ఇక్కడ సింహము ఉండవచ్చునేమో?” అనే భయమును పొందుతాడు. అయితే, ఆ గుహను చక్కగా పరిశీలించిన తరువాతో, లేక అట్లు పరిశీలించిన వారి వివరణలను విన్న తరువాతో ”ఇక్కడ సింహము మొదలైనవేవీ లేవు. ఖాళీ స్థలం మాత్రమే ఉన్నది" అని గ్రహిస్తాడు. అదేవిధంగా ఈ జీవుడు “నేను ఈ దేహమునందు బద్ధుడనై ఉన్నాను కదా” అనే భయమును పొందుచున్నాడు. సాధువాక్యముల శ్రవణం, మననం ఆశ్రయించుచుండగా, ఆత్మను బాగా ఎరుగుట చేతనే సంసారబంధము తొలగిపోతుంది.

ఒక బాలుడు పెద్ద మట్టిచెట్టు యొక్క కాండమును చూస్తూ దట్టమైన చీకటి కారణంగా “అమ్మబాబోయ్! అదిగో…! అది దయ్యమే“ అని తలుస్తూ ఉంటాడు. అట్లే ఈ జీవునకు కూడా ”ఈ నా దేహము - ఈ జగత్తు ఈ సంబంధ బాంధవ్యములు నాకు సంబంధించిన వారు - నా వారు కాని వారు”… మొదలైన అనేక భ్రమలు కలుగుచున్నాయి. ఆ భ్రమలన్నీ క్షణక్షణం ఒక రూపం పోగొట్టుకొని మరొక రూపం పొందుతూ పోతున్నాయి. ఓ రామా! ఇదంతా ’కల్పన’ను అనుసరించే ఏర్పడి ఉంటున్నది. కల్పనావశంచేత జీవునకు ఈ విభవ దారిద్ర్యములు, దానికి అనుకూలమైన శుభాశుభములు క్షణంలో ప్రాప్తిస్తున్నాయి. మరల అవన్నీ క్షణంలో నశిస్తున్నాయి. భావనానుసారమే పదార్థములు కూడా ఆయా ప్రయోజనములు కలుగజేస్తున్నాయి. జ్ఞానులైన మహనీయులు ఇదంతా గమనించి, ‘ఈ సర్వపదార్ధములు భావనానుసారమే ఉంటున్నాయి’ అను ఎరుకను గ్రహించి ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. ఇవన్నీ కూడా జీవుల వారి దృష్టిని అనుసరించే భిన్నములుగా గోచరిస్తున్నాయి.

ఈ చిత్తము దృఢభావనచే దేనిని ఎంతకాలము ఏ విధంగా భావిస్తుందో, అది అంతకాలం అట్లే ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏది సత్యం? ఏది మిథ్య ?

ఈ ప్రపంచమున సత్యము కానట్టి, మిథ్య కానట్టి వస్తువంటూ ఏదీ లేదు.

Page:115

నతదస్తియత్సత్వం, నతదస్తి నయన్మృషా | యద్యథాయేన నిర్ణీతం, తత్తథాతేన లక్ష్యతే ॥

ఎవడు ఏ ప్రకారంగా దేనిని నిర్ణయిస్తాడో అతనికి ఆ పదార్థములు అట్లే అనుభూత ములౌతూ ఉంటాయి. ఒకడు తన ’మనస్సు’చే ఆ ఎదురుగా కనబడుచున్న ఆకాశంలో ఒక ‘స్త్రీ’ యొక్క కల్పనను దృఢంగా చేశాడనుకో… అతడు కామాతురుడై ఆకాశంలో ఉన్న వనంలో సంచరిస్తున్న ఆ కల్పిత సుందరస్త్రీ వెంట పరుగెత్తగలడు.

అద్వైతానంద పారమార్థిక రూపం - కనుక ఓ రామచంద్రా! ఒక ’సుషుప్తి’ యందు ఉన్న వాడు ఏ విధంగా సర్వపదార్థరహితుడై ఉంటాడో, అదే విధంగా నీవు నీ సంకల్పము లందు ఉండి యున్నట్టి సర్వపదార్థములను త్యజించివేయి. సర్వవేళలందు నీ యొక్క “పారమార్థిక అద్వైతానంద రూపము” నందే స్థితి కలిగియుండుము.

ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక ’మణి’ని ఉంచామనుకో… ఆ మణియందు ఎదురుగ ఉన్న కొండ ప్రతిబింబిస్తుంటే ఆ మణికి ప్రాప్తించే లాభమేమైనా ఉన్నదా? లేక, అట్లు ప్రతిబింబించక పోతే మణికి వచ్చే నష్టమేమి? ప్రతిబింబించినప్పుడు, ప్రతిబింబించనప్పుడు కూడా ఆ మణి ఒకే తీరుగా ఉంటుంది కదా! నీవు కూడా మనస్సు నుండి ‘ఇచ్ఛ’ అనుదానిని తొలగించివేయి. నీవు ఇచ్ఛా రహితుడవై ఉండగానే, ఈ జగత్ వ్యవహారములు నీయందు ప్రతిబింబించుగాక! నీకొచ్చే హాని ఏమి? మణి ఒక జడమైన వస్తువు కాబట్టి ఎదురుగా ఉన్న వస్తువులు తనయందు ప్రతిబింబించుట నిరోధించజాలదు. మరి నీవో? నిత్యము నిర్మలము అగు చైతన్యమే స్వరూపముగా కలిగియున్నావు కదా! అందుచేత ఇచ్చారహితంగా, అనాసక్తి పూర్వకంగా తప్పక ఉండగలవు. కొంచెము అభ్యాసానికి సిద్ధపడితే చాలు.

వాస్తవానికి ‘ఇచ్ఛా సహితంగాను, ఆసక్తిపూర్వకంగాను ఉండుట’ అను దానియందు శ్రమ ఏమి ఉన్నది. కనుకనే మోక్షరూపము = సర్వశ్రమలను త్యజించివేయుట అని చెప్పబడుతుంది.

ఓ రఘునందనా! "నాయందు ఏ జగత్తెతే ప్రతిబింబించుచున్నదో అదంతా మిథ్యయే”… అని నిశ్చయించుకొనుము. అట్లు నీయందు ప్రతిబింబిస్తున్న వస్తువుల, విషయముల రూపమును నీవు తాదాత్మ్యముచే పొందకుండెదవు గాక! లేదా…

ఈజగత్తు పరమాత్మకంటే అభిన్నమైనదే కదా! కనుక నాకు జగత్తుగా కనబడేదంతా పరమార్థమున బ్రహ్మమే” అను నిశ్చయమును కలిగియుండు. "అనంతము, అనాది”యగు ఆత్మ యొక్క స్వరూపమును ఆత్మసహాయం చేతనే సునిశ్చితం చేసుకొనగలం.

ఇక నీ చిత్తమునందు ప్రతిబింబించు అన్య జగత్పదార్థములు, తదితర దేహాత్మదృష్టి గల ప్రాపంచిక జీవుల అర్థవాద పలుకులు… నిన్ను రాగయుక్తం చేయకుండా జాగరూకుడవై ఉండు. ఆత్మదృష్టిని సర్వదా అలవరచుకో.

Page:116

ఒక చోట కొన్ని చిత్ర విచిత్రములైన రంగులుగల పదార్థములు ఉన్నాయి. అవన్నీ ఒక శుద్ధ మైన స్పటికంలో ప్రతిబింబిస్తున్నాయి. అయినప్పటికీ ఆ స్ఫటికంలో ఆ రంగులు ఉండి ఉన్నాయని అనలేం కదా! అదేవిధంగా, ఈ ద్వైతపదార్థాలకు సంబంధించిన రాగం మొదలైన ఎట్టి దోషాలు లేనట్టి శుద్ధ స్వరూపుడవే నీవు సుమా! అట్టి నీ యొక్క శుద్ధ స్వరూపం నందు ప్రారబ్ధ కర్మ భోగాలకు ఉచితమైనట్టి జగత్ వ్యవహారేచ్ఛ ప్రవేశిస్తే, ప్రవేశించనీ… అందుకు నీకు అభినివేశం పొందవలసిన పనేమున్నది? అయితే నీవు మాత్రం దానితో ‘తాదాత్మ్యం’ చెందనే వద్దు.

నీ శుద్ధ స్వస్వరూపతత్వములో మార్పు చేర్పులు ఏర్పరచగలిగినదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. అట్లే ప్రతి జీవి విషయంలో కూడా!…

  1. సాక్షి చైతన్యము - జగద్యవహారము

శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! సమాధిని అభ్యసించుచు, "ఈ బాహ్యభ్యంతర జగత్తుల గురించి ఏర్పడి ఉంటున్న మననమంతా మిథ్యా వ్యవహారమే” అని ఎరుగుము. అట్లు ఎరుగుటచేత క్రమంగా నీవు జగమలను, మిథ్యామననమును త్యజించివేయగలుగుతావు. అప్పుడు నీ బుద్ధి విశుద్ధరూపముగా పరిణమించుతుంది.

ఈ కనిపించే ప్రతి ఒక్క జీవుడు చైతన్యము యొక్క ప్రకటనయే అయి ఉన్నాడు కదా! చైతన్యము కాకుండా ఇక ఏదేది అనిపిస్తోందో అదంతా ‘భ్రమయే’ అయివున్నది. ఎప్పుడైతే చైతన్యము తప్ప వేరైన ద్రష్టల వ్యవహారమంతా త్యజించబడుచున్నదో, అట్టి విచారవంతుడగు జీవుని స్వభావం స్వయంగా నిర్మలమగుచున్నది సుమా! కనుక నీవు ’అజ్ఞాన భూమికా భేద రూపము’ అయినట్టి ఈ దృశ్యంను త్యజించివేసి జ్ఞానభూమికలందు ప్రవేశించాలి. ‘సాక్షి చైతన్యం’ నందే అనుభవమగుచున్న దృశ్యమును, ద్రష్టను కూడా వేరు వేరు చేసివేయుము. సర్వదా సాక్షి చైతన్యమే నీవు అగు. నీవై ఉండు, నీ యందలి సాక్షిచైతన్యముచే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చీమ నుండి బ్రహ్మదేవుని వరకు) కూడా సాక్షిచైతన్యంగా గాంచుచుండుటచే ‘ఆత్మదృష్టి’ దృఢపడగలదు.

బాహ్యమునకు ప్రపంచానుకూలంగానే వర్తించు. ఏదైతే శాస్త్ర నిర్ణయములచే మరియు స్వబుద్ధిచే చేయబడటం స్వధర్మమైయున్నదో అది నిర్వర్తిస్తూ ఉండు. అజ్ఞాన దృష్టియందు ఉన్నట్టి తదితరుల సానుకూల్యతలను పరిగణిస్తూ కర్మలు చేయి. అయితే, “సర్వుల యందలి సత్యము సాక్షీ తత్వమే అయివున్నది”… అను భావనను అంతర్లీనంగా సుస్థిరపరచుకో.

ఇక “నీవు-నేను-నీ వారు నా వారు నీవి-నావి-కాలము-దూరము-స్థలము-ప్రియముఅప్రియము”… ఇవన్నీ ప్రతిబింబమాత్రంగా… అజ్ఞాన దృష్టియొక్క అనుభవములుగా గుర్తించి, వీటిని వేరుపరచివేయి. ఈ ప్రతిబింబమాత్ర ఆయా విషయములలో తాదాత్మ్యము చెందవద్దు.

‘సాక్షితత్వము’ నందే నిశ్చలుడవై సర్వదా ఉండుము. అప్పుడు ఆత్మ నిర్మలం కాగలదు.

Page:117

శ్రీరాముడు : హే మహర్షీ! ఆత్మ నిర్మలత్వము పొందటానికి మరి కొన్ని ఉపాయాలు చెప్పమని ప్రార్ధిస్తున్నాను.

శ్రీ వసిష్ఠమహర్షి : ఈ జీవుని యొక్క ఆత్మ నిర్మలానుభవము కొరకు శాస్త్రములచే, గురువులచే ప్రతిపాదించబడిన కొన్ని ఉపాయములు, లేక మార్గములను ఇక్కడ చెపుతాను విను.

  1. అజాగరూకత నుండి జాగరూకత వైపు -

జాగర్తవ్యే పరేతత్త్యే జాగరూకస్యజీవతః | |

సుప్తస్య ఘన సంమోహమయే సంసారవర్త్మని॥ (సర్గ 21, శ్లో. 3)

ఆత్మతత్వ విషయమునందు సర్వదా జాగరూకుడవై ఉండాలి. అంతేకాని, మహామోహమయ మగు ఈ సంసారమార్గంలో నిదురిస్తూ ఉండరాదు. ఆత్మరూపము విషయమై జాగరూకులై ఉండుట, ఏమరుపును జయించుటలను ‘యోగము’ అని అంటున్నాము. “సర్వము ఆత్మయే… ఆత్మ కానిది, ఆత్మకు చెందనిది అంటూ ఎక్కడా ఏదీ ఉండజాలదు…” అను పూర్ణార్థము గ్రహిస్తూ తద్వారా నిర్మలత్వము, శుద్ధత్వమును పెంపొందించుకో..

  1. అనురక్తి నుండి, విరక్తి వైపు - స్వల్ప సుఖము నుండి బ్రహ్మదేవుని సుఖపర్యంతము విరక్తి కలిగి ఉండు. సర్వదృశ్య పదార్థములపట్ల, విషయముల పట్ల ‘అనురక్తి’ సన్నగిల్లుచుండగా “ఒకానొక పరిపుష్ఠితో కూడిన అతీతత్వము - క్రమముక్తి” పరిఢవిల్లుతూ ఉంటుంది.

  2. ఇచ్ఛా ద్వేష త్యాజ్యం - భోగకాలమునందు అనుభవమునకు వచ్చుచున్న ఆయా రసవంతమగు పదార్థములు, విషయములు, నామ రూపములు పైకి రమణీయంగా ఉంటున్నాయి. కాని, క్రమేణా తుచ్ఛమై పరిఢవించబోతున్నాయి. “ఇవన్నీ ఉంటే ఉండనీ… లేక తొలగనీ… ఇవి నావి కావు. నేను వీటిలో లేను… ఇవి నాలో లేవు. యాదృచ్ఛికంగా ఇవి ఏర్పడి, మరొకప్పటికి విడిపోతున్నాయి” అని జ్ఞానదృష్టికలవారు గ్రహిస్తున్నారు. ఇచ్ఛా ద్వేషరహితమైన “అవగాహన - అనుభవము - దృష్టి”లను ఆశ్రయించువారి ఆత్మ వినిర్మలమౌతోంది.

  3. విషయములతో అసంగము - విషయములతో ఏర్పడు సంగమే విషయభావన. అట్టి భావనయే ఈ దృశ్య జగత్తు యొక్క ప్రాప్తి అయి ఉన్నది. ‘విషయ భావన’ అనే మంచు కరిగి పోయిందా, ఇక ఈ జీవుని ఆత్మ సునిర్మలం కాకేమౌతుంది?

సంగము - - సంగము జీవుని మలినపరచుచున్నది. సంగము నుండే తక్కిన మనోరోగముల నబడు ‘కామ-క్రోధ-లోభ-మోహములు’ బయల్వెడలుచున్నాయి.

ఆకాశమున సూర్యరశ్మి ప్రసరించగానే మంచు కాస్తా కరిగిపోతుంది కదా! అజ్ఞానాకాశము నందు "ఆత్మతో ఏకత్వము” అనే సూర్యుడు ఉదయించాడా, అట్టి విజ్ఞాన సూర్యుని కిరణ ప్రభావంచే విషయములతో ఏర్పడు సంగము… అనే చీకటి తప్పక తొలగిపోతుంది. అది ’సుజ్ఞానాకాశం’ గా ప్రకాశిస్తోంది.

Page:118

  1. తృష్ణారాహిత్యము - తృష్ణయే లేకుంటే ఈ జీవునికి, ఆత్మభగవానునికి అంతరమే లేదు. ‘తృష్ణ’ అనే తటాకంలో అసంఖ్యాకములైన “మనోరథములు” అనే తరంగములు వృద్ధి చెందు చున్నాయి. ఆ తటాకంలో ‘మూఢత్వము’ అనే ఏనుగు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ’తృష్ణ యొక మరొక రూపమే మనో చాంచల్యము. తృష్ణను త్యజించుటచే, మనోచాంచల్యము జయించబడగా, అప్పుడు మనస్సు స్వయముగా శాంతించుచున్నది. అప్పుడు మాత్రమే ఆత్మ లక్షణమైనట్టి ‘నిర్మలత్వము’ ప్రకాశించుచున్నది.

  2. వాసనాజాలమును త్రెంచివేయటం అనేక ఇతఃపూర్వపు ఆసక్తి, క్రియా విశేషములచే ఈ జీవుడు తన యొక్క వాసనాజాలము (maze of tendencies) ను నిర్మించుకొని అందులో చిక్కిన పక్షిలాగా కొట్టుకొంటున్నాడు. పెద్ద ఎండుకట్టెల ప్రోగును ఒక అగ్నికణిక సహాయంతో భస్మం చేసి వేయవచ్చు కదా! ఒక నావ గలవాడు గొప్ప లోతైన నదీ ప్రవాహమును దాటివేయగలుగుతాడు కదా! అట్లాగే "వైరాగ్యము”… అనే ఆయుధమును దగ్గర ఉంచుకొన్నవానిని ఈ సాంసారిక వాసనాజలం ఏ మాత్రం బాధించలేకపోతుంది.

“సంసారము” అనబడే వాసనాజాలము ప్రజ్ఞతో కూడిన వైరాగ్యముచే త్రెంచి వేయబడుగాక! విషయగ్రంథి విచ్ఛిన్నమొనర్చబడగా, ఆత్మ యొక్క నిర్మలత్వము, అఖండత్వము, అప్రమేయత్వము అనుక్షణికమై అనుభూతమగుచున్నది.

  1. మనస్సు ఉపశమనము - చిల్లగింజలు వేస్తే నీరు నిర్మలం అవుతుంది కదా! ఈ మనస్సు నందు ‘ఆత్మజ్ఞానం’ అనే చిల్లగింజను ప్రవేశింపచేయాలి. 1) శాస్త్రాదులను పరిశీలనాత్మకమైన దృష్టితో విచారించటం చేత, 2) గురువులు బోధించే విషయాలను అవగాహన పూర్వకంగా గ్రహించుటచేత, 3) స్వయముగా చేయు ఆత్మానాత్మ పరిశీలన చేత ‘జ్ఞానం’ మనస్సులోకి ప్రవేశిస్తోంది. ప్రకాశమానం అవుతోంది.

ఈ ’మనస్సు’ను కామవర్జితం (Desirelessness) చెయ్యాలి. దీనిని విషయ గుణ అనుసంధాన రహితం చెయ్యాలి. సంసార పదార్థములైనట్టి “పుత్ర కళత్ర-గృహ-ప్రతిష్ఠాదు” లను దూరము నుంచే త్యజించి వేస్తూ “ఈ సర్వము ఆత్మయే” అను అంతరంగమందలి బోధను సుస్థిరపరచుకోవాలి. భోగ, - లాభములు అభినివేశము నుండి దృష్టిని మరల్చాలి.

అప్పుడు ఈ ‘మనస్సు’ అనే పంజరములోంచి ‘అజ్ఞానము’ అనే పక్షి ఎగిరిపోతుంది. 8. సందేహ ప్రవృత్తిని జయించివేయటం -

శాక్తే సందేహ దౌరాత్మ్యే గతకౌతక విభ్రమమ్ |

పరిపూర్ణాన్తరం చేతః పూర్ణేందురివరాజతే || (సర్గ 22, శ్లో. 10)

నాయనా! రామా! సందేహించుట అను దుష్ట సంస్కారమే “సంసారనివృత్తి“ అను ఉత్తమ స్థితిని తాత్సారం చేయిస్తోంది. ఇట్టి ”సందేహించుట” అను దోషము శమించుగాక! ఈ చిత్తమును

Page:119

‘భ్రమ-కౌతుక’ రహితం చేశామా, ఇక అంతరమున, ఇది పరిపూర్ణమైన పూర్ణచంద్రుని వలె శోభించగలడు.

విచారణను ఆశ్రయించనివాడు, శ్రద్ధలేనివాడు, అనుమానాలతో కాలయాపన చేసేవాడు వినాశనము వైపే పయనిస్తున్నాడు. సంశయాత్మునకు ఇహంలోను, పరంలోను సుఖంలేదు.

  1. భేదదృష్టిని శమింపజేయటం- వాయువు శమిస్తే సముద్రము ప్రశాంతమగుచున్నది కదా! "ఇది వేరు, అది వేరు, నేను, నాది, వీరు ఇట్టి వారు, వారు అట్టి వారు”… అను భేదదృష్టులు దోషరహితమగు ‘సమమ్ బ్రహ్మమ్’ దృష్టిచే శమించగలదు. ఉత్తమదృష్టిని అభ్యసించుటే అందుకు ఉపాయం. “ఎవరిలోనైతే నేను ఏవేవో దోషములను చూస్తున్నానో, వారంతా నావలెనే ఆత్మయే స్వరూపముగా కలిగియున్నారు” అని మరలమరల మనస్సుకు గుర్తుచేయాలి. ఎట్లాగైనా సరే, ఏ ఉపాయం చేతనైనా సరే, “సమదృష్టి”ని సుస్థిరం చేసుకోవాలి. సమదృష్టి… అల్పత్వము నుండి ఔన్నత్యము వైపు మార్గం చూపుతుంది. ఉత్తమ సౌందర్య పూర్వకమైన అవగాహనను అట్టివాడు పుణికి పుచ్చుకుంటాడు.

సమత్వము మృగ్యమగుటచేతనే వాసనలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా అంతఃకరణం అజ్ఞానాంధకారమయమగు జడత్వముచే నిండిపోయి ఉంటోంది. అట్టి మనస్సు జర్జరితమగుచు ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాలలో సంచరిస్తూ, ఏవేవో భావావేశకాలను పుణికిపుచ్చుకుంటూ,… ఆయాసమంతా తెచ్చిపెట్టుకుంటోంది.

"చీకటి సూర్యోదము” లాగా “భేదదృష్టి జ్ఞానము” ఏర్పడుచున్నాయి. జ్ఞానదృష్టి వికసిస్తూ ఉంటే, భేదదృష్టి స్వయముగా అంతరించుటకు సంసిద్ధపడుతూ ఉంటుంది.

  1. అభ్యాసము - ఓ రామా! శాస్త్రములు వల్లెవేస్తూ కూడా కొందరు ‘ఆత్మదృష్టి’ వైపుగా దృష్టి సారించలేకపోతున్నారు. సాంసారిక ద్రష్టత్వమునే సర్వదా ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా దుః ఖాలు తొలగకపోగా, ఇంకా అధికమగుచున్నాయి. ఇట్లు ఎందుకు జరుగుతోంది? ఈ మనస్సును ఇంద్రియములను సరియైన అభ్యాసము నందు నియమించకపోవుట చేతనే సుమా! జ్ఞానంచే అభ్యాసమును పరిశుద్ధపరచాలి, ఉత్తేజపరచాలి. లేకుంటే జ్ఞానము సముపార్జించి ఏం ప్రయోజనం?

ఉత్తమ అభ్యాసములను ఆశ్రయించే జీవునియందు మాత్రమే హృదయసరోవరంలో వివేకము అనే కమలం వికసిస్తోంది. అట్టి ‘వివేకకమలం’ చైతన్య భాస్కరుని చూచి పులకిస్తోంది.

వివేకి అయినవాడు ఉత్తమ లక్ష్యముల నుండి ఏ పరిస్థితుల యందు చ్యుతి పొందడు. అతడు తన అభ్యాసములను దీపమువలె కాపాడుకుంటాడు. అభ్యాసమే సత్వగుణమును పెంపొందింపజేస్తుంది. చంద్రకిరణములు ఈ జగత్తును ఆహ్లాదపరుస్తున్నట్లు, సత్వగుణము ఈ బుద్ధిని సువిశాలం చేసి, ఉత్తమ అవగాహనను ప్రసరింపజేసి ఆహ్లాదపరచగలదు.

మా ఉద్దేశంలో అభ్యాసం అనగా, “గురుసేవ, ప్రేమ, దయ, దాక్షిణ్యము, శ్రవణము, మననము, నిధిధ్యాస”… మొదలైనవాటిని ఆశ్రయించటం అయి ఉన్నది.

Page:120

ఓ రామచంద్రా! ఇక పెద్దగా, వివరంగా చెప్పేదేమున్నది? వాయువు, భూమి, జలము, అగ్ని లేనట్టి ఆకాశకోశము ఏ విధంగా ఉంటుంది? ఎంతో నిర్మలంగాను, విశాలంగాను, ఉదయ అస్తమయములు లేనిదిగాను ఉంటుంది కదా! అదే విధంగా జ్ఞేయుడు (ఎరుగవలసినది ఎరిగిన వాడు) అయినట్టి ధీమంతుడు నిర్మలాకాశస్వరూపుడై, “నాకు ఉదయాస్తమయములు లేవు“ అను ఎరుక కలిగి ఉంటున్నాడు. ”ఖండము-అఖండము, జీవుడు - బ్రహ్మము, పరిచ్ఛిన్నముఅపరిచ్ఛిన్నము”… ఈ బేధములన్నీ అజ్ఞానము ఉన్నచోట మాత్రమే ఉంటున్నాయి.

’తత్వవిచారము’చే ‘ఆత్మస్వరూప సాక్షాత్కారం’ పొందినవానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు కూడా స్వల్పమైనవిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటావా? ‘సృష్టించుట’ మొదలైన అధికారము లందు కూడా క్లేశము ఉండి ఉన్నది సుమా!

  1. జ్ఞానుల - - అజ్ఞానుల అనుభవాలు

ఎవని చిత్తమైతే, ఈ ఆకారాదులతో కూడి ఉండినప్పటికీ, "అహంకారరహితం” అయి ఉంటుందో అట్టివానికి ఈ సంసారకల్పన ప్రాప్తించుటలేదు.

‘మృగతృష్ణ’ యందు ఒక మూఢమృగమునకు జలము ఉన్నట్లు కనిపిస్తుంది. జ్ఞానికి జలం కనిపిస్తుందా? లేదు. అతడు కెరటముల పరంపరలు చూస్తూ కూడా, ఇదంతా భ్రమయే, క్రీనీడ మాత్రమే కనుక ఇక్కడ జలం “ఉండజాలదు” అని గ్రహిస్తున్నాడు.

తరంగవరిమే లోకాః ప్రయాన్యాయాన్తిచేతసః | క్రోడీకుర్వన్తిచాజ్ఞంతే నజ్ఞం మరణజన్మనీ II (సర్గ 22, శ్లో. 18)

వాసనావశం చేతనే ఈ జీవులందురూ తరంగముల వలె ఉత్పన్నమగుచున్నారు. నశించు చున్నారు. ఈ జనన మరణములు, సుఖదుఃఖములు, సమృద్ధి-అసమృద్ధిలు మొదలైనవన్నీ అజ్ఞానిని తమ వశం చేసుకుంటున్నాయి. జ్ఞానినో, ఏమీ చేయలేకపోతున్నాయి. అనే

ఆవిర్భావ-తిరోభావము (రాక పోక) లతో కూడిన ఈ ప్రపంచమంతా అజ్ఞాని కొరకే, అజ్ఞానము చేతనే, అజ్ఞాన విషయంగానే - ఉదయిస్తోంది, లయిస్తోంది.

జ్ఞానికి ఈ ‘జగత్తు’ అనునదే ఉండి ఉండుట లేదు. మొదలే ఉదయించనట్టి దానికి నాశనమేమిటి? "ఊహలో కల్పించబడిన ఒక అరణ్యంలో ప్రవేశించి మృగములను అతి లాఘవంగా వేటాడటం” అను కార్యక్రమంలాగా, తత్వజ్ఞాని లీలా మాత్రంగా ఈ జగత్తు నందు సంచరిస్తున్నాడు. రమిస్తున్నాడు. ఇక అజ్ఞాని అంటావా, అతడు తనయొక్క స్వయంకల్పిత కౌతుకము” చే ఈ జగత్తు నందు “ఇదంతా వాస్తవమే” అనే బుద్ధిని పొందుచున్నాడు. అట్లు ‘వాస్తవము’ గా భావించబడుదానిచే బంధింపబడుచున్నాడు.

Page:121

ఒకచోట ఒక ‘కుండ’ ఉన్నది. అది ఉన్నా, లేక పగిలినా ఆ ‘స్థలము’ (Space that is occupied by the pot) కు వచ్చే లాభం గాని, నష్టం గాని ఏమైనా ఉన్నదా? ఘటమునకు ఉత్పత్తి వినాశనం ఉండవచ్చు గాక. కానీ, ఘటాకాశమునకు ఉత్పన్నమేమిటి? నాశనమేమిటి? అట్లాగే ఈ శరీరము భూషించబడు గాక, లేక దూషించబడు గాక! ఆత్మకు ఎట్టి వికారములు ఉండవు. ఆత్మజ్ఞుడు ఈ ఉత్పత్తి నాశనము లేవీ తనయందు కలిగియుండుటలేదు. “నేను ఈ శరీరమునే!” అను అల్పజ్ఞతను ఆశ్రయించువాడు మాత్రమే,… ఈ జన్మ మృత్యువులను అనుభవించుచున్నాడు సుమా! సాయంకాల సమయంలో సూర్యకిరణములు ప్రసరించుటచే విశాల భూమి యందు మృగతృష్ణ ఎటకో మటుమాయమైపోతోంది కదా! ఉత్తమ వివేకము ఉదయించగానే మిథ్యా భూత మగు ఈ దృశ్యము, వాసనలు, సంకల్పవ్యవహారములు… ఇవన్నీ తమంతటతామే నశిస్తాయి.

ఓ జనులారా! “నేనెవరు? ఈ ప్రపంచము ఎట్లు ఉత్పన్నమైనది…?” అనే విషయాలు విచారణ చేయనంత వరకు ‘కారుచీకటి’ వంటి మిథ్యారూపం అయివున్న ఈ ”జగదాడం బరము”… అంతా ఇట్లు ప్రాప్తిస్తూనే ఉంటుంది.

ఈ దృశ్యప్రపంచము మిథ్యాభ్రమ సమూహములచేతనే ఆవిర్భవిస్తోంది. అనేక ఆపదలకు స్థానభూతమై ఉంటోంది. ఎవడైతే ’ఆత్మభావన’చే ఈ దృశ్య వ్యవహారమును నిస్సారమైనదానిగా చూస్తాడో, అతడే దీని నిజ స్వరూపమును గాంచుచున్నవాడు అవుతాడు. సత్యదృష్టికి ఇదంతా లేనిది గానే తెలియవచ్చుచున్నది. కాబట్టి "ఈ దేశ కాలాదుల వశంచేత ఉత్పన్నమయ్యే ’ఆధ్యాత్మిక

ఆధిభౌతిక అధిదైవిక.’ తాపత్రయములు, అట్లే, ఈ సమస్త దుఃఖములు శరీరమునకు సంబంధించినవి మాత్రమే. అంతేకాని ఇవన్నీ పూర్ణానంద స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అగు నాకు సంబంధించినవి కావు"… అను నిశ్చయమును మీరంతా కలిగి ఉండండి. ఈ విధంగా భ్రమ రహితమైన నిశ్చయము కలవాడు మాత్రమే సత్యమును గాంచగలుగుచున్నాడు.

ఈ ప్రపంచము అంతులేనట్టి ‘దిక్కులు-కాలములు’ మొదలైన వాటితోను, అనేక పరిచ్ఛిన్నములతోను, ’ఉత్పత్తి - చలనము’ ఆదిగా అనేక క్రియా వ్యవహారములతోను కూడి ఉన్నది. అట్టి ఈ ప్రపంచమునందు ‘అంతటా నేనే వ్యాపించి ఉన్నాను’… అను అనుభవము కలవాడే నిజమైన జ్ఞాని.

వాలగ్ర లక్షభాగాత్తు కోటిశః పరికల్పితాత్ |

అహంసూక్ష్మఇతవ్యాపీ యంపశ్యతసపశ్యతి ॥ (సర్గ 22, శ్లో. 26)

“సర్వవ్యాపకుడనై, సర్వదా ఉన్నట్టి నేను ఒక రోమము యొక్క అగ్రభాగమందలి ఒక కోటి వంతు భాగము యొక్క ఒక లక్షవ భాగము కంటే కూడా ఇంకనూ ఎంతో ఎంతో సూక్ష్మమైన వాడను”… అని ఎరుగబడే సత్యమును చూచుచున్నాడు.

ఆత్మజ్ఞుడు - ఆత్మజ్ఞుడు ఈ జీవాత్మను అసదతీతుడుగాను, భిన్నమైన దానివలె కనిపిస్తున్న ఈ జగత్తును "చైతన్యజ్యోతిమాత్రము” గాను ఎరుగుచున్నాడు.

Page:122

జగత్తును పరమాత్మకు అభిన్నంగా గాంచువాడే ఆత్మజ్ఞుడు. సర్వశక్తిమంతుడు, అసరేతుడు, అద్వితీయుడు అగు చిదాత్మ సమస్తమునందు ఉన్నట్లు చూచు దృష్టే వాస్తవ దృష్టి.

“ఆధి-వ్యాధి-భయాదులచే ఉద్విగ్నమగుచు, జనన-మరణయుక్తమై యున్న ఈ దేహము నేను కాదు”… అని ఏ బుద్ధిమంతుడు ఎరిగి ఉంటాడో, అతడే యథార్థజ్ఞానము కలవాడు.

“నా యొక్క మహిమయే పైన, క్రింద, ప్రక్కలందు అంతటా వ్యాపించియున్నది. నాకిక రెండవవాడే లేడు" అని తెలుసుకొనువాడే సమ్యక్ జ్ఞాని.

“దారంలో మణులు గ్రుచ్చబడినట్లు, నాయందే ఈ ప్రపంచమంతా గ్రుచ్చబడి ఉన్నది. ఈ అంతఃకరణము అనుదానికి కూడా కర్తను నేనే… అంతే గాని అంతఃకరణము ‘నేను’ కాదు.. అను అనుభవము కలవాడే పరమార్థమును ఎరిగినవాడు.

"అహంకారముగాని, దృశ్యముగాని కించిత్ కూడా ఏ క్షణంలోనూ లేనేలేవు. ఇదంతా కూడా నిరామయమగు బ్రహ్మమే అయి అయి ఉన్నదిఉన్నది. . ఇక సర్వరూపములకు అతీతుడనగు నేను భూత-భవిష్యత్-వర్తమాన కాలములందు వ్యక్తావ్యక్తముల మధ్య స్థితి కలిగి యున్నాను. సముద్రమునకు తరంగములు ఎట్లాగో, అదే విధంగా ఈ త్రిలోకములు నా యొక్క అవయవములే అయి ఉన్నాయి”… అని నిజాంతఃకరణము నందు అనుభూత మొనర్చుకొన్నవాడే సమ్యక్ దర్శి అని, పూర్ణజ్ఞాని అని చెప్పబడుచున్నాడు.

చైతన్యము యొక్క సమక్షమే లేకపోతే ఈ త్రిలోకముల వ్యవహారమంతా మృతప్రాయమే అయి ఉండేది. ఇవన్నీ చైతన్యసత్తాస్ఫూర్తి చేతనే ఉనికిని పొంది, పరిపాలించబడుచున్నాయి. ఆత్మ తత్వము దృష్ట్యా తదితరములైనవన్నీ ఏక్షణము నందూ లేనే లేవు. ఈ విషయం ఉత్తమ విచారణ సహాయంతో సత్యస్వరూపుడగు జ్ఞాని ఎరుగుచునే ఉన్నాడు సుమా! మహాత్ముల యొక్క ‘దృష్టి’ ఈ సాంసారిక దేహాదుల నుండి మొదలే మరల్చబడి ఉంటోంది. వారి అవగాహనలో ఈ ’నీవు-నేను’ అనునవన్నీ ఆత్మపరమే అయి చెన్నొందుచున్నాయి. అట్టి ఉత్తమ నేత్రములు కలవారే ’సంసార తాడనము’ను నిరోధించగలుగుచున్నారు. సత్యమును చూడగలుగుచున్నారు.

‘చైతన్యము’ సర్వదా విషయములకు సంబంధించినది. అది ‘స్వసత్తా ప్రకాశమున’ జగత్ సమూహము లందు అంతటా వ్యాపించి ఉన్నది. ఆద్యంత రహితము, భైరవము అగు శరీరము గల చైతన్యమును (లేక ఆత్మను) సర్వులయందు, సర్వదా, సర్వముగా గాంచువాడే యదార్థ తత్వవేత్త. “ఈ సుఖ దుఃఖములు, ఈ శాస్త్ర - గురు - దేవతలందు ఏర్పడుచున్న శ్రద్ధ, వివేకమును నిదురలేపి ఆత్మతత్వమేమిటో పరిచయం చేసే శ్రవణ మనన క్రమములు ఇవన్నీ కూడా నిర్వచించేది, ప్రవచించేది, పరిరక్షించేది దేనిని? నా యొక్క వాస్తవ స్వరూపము గురించే! ఇవన్నీ నేనే అయి ఉన్నాను”… అను అనుభవమునందు సుస్థిరుడై ఉండువాడే యథార్థ తత్త్వదర్శి.

ఇంకా ఆ సుజ్ఞాని యొక్క అవగాహనను వర్ణించి చెపుతాను… విను.

Page:123

“ఈ జగత్తంతా నిరతిశయానందముచే పరిపూర్ణమైయున్నది. బ్రహ్మానందము అనుదాని యొక్క స్వల్ప విభాగముచే పరితప్తమైయున్నది. అట్టి ఆ సువిస్తార జగత్తు నందు ఒక అత్యంత స్వల్పమైన ప్రదేశంలో ఆ ‘ఐహిక పారలౌకిక’ వస్తుజాలమంతా ఉండి ఉన్నది. అందుచేత, ఇవి ఎంత స్వల్పమైనవి! ఈ భోగ్యవస్తు సముదాయం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఇందు దుఃఖ భూయిష్టమై, త్యజించదగినది ఏది? సుఖవంతమై గ్రహించదగినది ఏది?”

అప్పుడు అట్టి వివేకము యొక్క ప్రభావంచే ‘భ్రాంతి’ తొలగిపోయి, ఆనందము ఉదయిస్తోంది.

66 “ఈ జగత్తును ‘ఇది’ అని నిర్వచించలేము. ఎవడు దేనిని ఎట్లు భావిస్తే అది అతనికి అట్లే ప్రాప్తిస్తుంది. ఇది అగమ్యమైనది. ఇట్టి దృశ్యజగత్తులో సుఖమెక్కడ? శాంతమెక్కడ? ఎందుకంటే ఇందులో సుఖశాంతులు వెతకటం నేతి బీరకాయలో నెయ్యి కొరకు వెతకటం వంటిది. నాయందు విక్షేపము ఏర్పడినప్పుడు ఈ జగత్తులో విషయాలన్నీ విక్షేప పూరితంగా ప్రాప్తిస్తున్నాయి. నేను విక్షేపరహితుడనై ఉంటే ఇది కూడా విక్షేపరహితంగానే ఉంటుంది. అందుచేత ఇదంతా స్వయంగా విక్షేపరహితంగాను, నా యొక్క ప్రకంపనముచే విక్షేప సహితంగాను ఉంటోంది"… అని తార్కిక జ్ఞానము, సమ్యక్ భావన కలిగియున్నప్పుడు, ఇక ఈ జగత్తులోని “ఇది త్యజించాలి, ఇది పొందాలి” అను రూపముగల త్యాజ్య గ్రాహ్యకల్పన అంతా నశించక ఏం చేస్తుంది చెప్పు? అట్లు ఎవరి దృష్టిలో జగత్ చంచలత్వం నశిస్తుందో, అట్టివాడే ఉత్తమ పురుషుడు.

ఏ మహాత్ముడైతే ‘ఆకాశము’ వలె ఏకాత్మ స్వరూపుడై ఉంటాడో, పదార్థములందు పూర్ణ భావనగా వ్యాపించి ఉంటూ కూడా, ఆయా పదార్థములను పొందకయే ఉంటాడో, (వాటి యందు అనుక్తుడు కాకయే ఉంటాడో)…. అట్టి వాడు ’నిరతిశయానందము’నకు అర్హుడు అగుచున్నాడు. అతడే మహేశ్వర స్వరూపుడు.

ఓ రామచంద్రా! అట్టి మహాపురుషులు ఉన్నారు. వారు ఈ భూమిపై నిశ్చింతగా సంచరించు చున్నారు. వారు ఈ జాగ్రత్ -స్వప్న సుషుప్తులనబడే మూడు అవస్థల నుండి విముక్తులై, తమను తాము ఈ మూడింటికి వేరైన తత్త్వముగా గాంచుచున్నారు. మృత్యువునకు కూడా ప్రేమాస్పదులై, మృత్యువును కూడా ఒక దినచర్యవంటిదిగా గాంచుచున్నారు. సౌమ్యులై సర్వత్రా సమబుద్ధి కలవారై ‘తురీయావస్థ’ అనబడే ఉత్తమ పదమునందు ఉపస్థితులై ఉంటున్నారు.

అట్టి మహాత్ములు తారసపడినప్పుడు నావంటి మునులు కూడా శిరస్సు వంచి నమస్కరించుచున్నారు. మేము అట్టివారికి సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తున్నాం.

ఓ రాఘవా! ఈ బ్రహ్మాండములందు అంతటా ఒకే బ్రహ్మము వ్యాపించియున్నది. నిస్సంశయముగా నీవు ఇట్టి దృఢనిశ్చయము కలిగియుండుము. అనేక విచిత్రములు, రమణీయములు అయిన పదార్థములతో కూడిన ఈ జగత్తు యొక్క సృష్టి - స్థితి - లయములందు అపరిచ్ఛిన్నమగు ‘బ్రహ్మవృత్తి’నే సర్వదా కలిగియుండుము.

Page:124

సాక్షాత్ శివ స్వరూపుడవై, జ్ఞానవంతుడవై, జీవన్ముక్తుడవగుము. అప్పుడు అట్టి ఆత్మారాముడవగు నీకే నేను నమస్కారం చేస్తున్నాను.

  1. శరీరము - - నగరము - శరీరి - రాజు

శ్రీరాముడు : ఓ మునీంద్రా ! ముక్తుడు ఈ శరీరమును, తదితర దృశ్యవిశేషములను ఎట్లు ఏ దృష్టిచే చూస్తూ ఉంటాడో చాలా విశేషాలు చెప్పారు. ముముక్షువులకు మార్గదర్శకమగు అతని దృక్పథము - అవగాహన - పరివర్తనల గురించి ఇంకనూ మరికొంత తెలియజేయండి. ముక్తి పొందిన జీవుడు శరీరమును కలిగి ఉంటాడా? లేక త్యజించివేస్తున్నాడా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మమునే ఆశ్రయించి ఉంటున్న జీవుని మనం ‘జీవన్ముక్తుడు’ అని పిలుస్తున్నాం. అట్టి వాడు ప్రారబ్ధము (వర్తమానము కొరకు ప్రాప్తించే సంచితకర్మ వ్యవహారము) క్షయం అయ్యేవరకు వ్యవహారములను అనుసరిస్తూనే ఉంటున్నాడు. ఈ శరీరమును పాలించుచూ కూడా, దీని పుణ్యపాపములచే అంటకయే ఉంటున్నాడు. నీవు ఎప్పుడైనా కుండలు తయారుచేసే చక్రమును చూచావా? ఆ చక్రము కుండ తయారయిన తరువాత కూడా మరికొంత సేపు పరిభ్రమిస్తూ ఉంటుంది కదా! అట్లే జీవన్ముక్తుడగు పురుషుడు ‘శరీరత్వము’(Iam this body) ను వదలి ‘శరీరిత్వము’ను (I am the one who utilises this body) స్వీకరించినప్పటికీ, ఈ శరీరము లను ధరించియే ప్రవర్తిస్తున్నాడు. అయితే జీవన్ముక్తునకు ‘శరీరము కలిగియుండుట’ అనేది బంధము అగుట లేదు సుమా! ఇది భోగమోక్షములను కలుగజేయటానికే ఉపయోగ పడుతుంది. ఈ శరీరము అతనికి సుఖము కొరకే ప్రవర్తిస్తోంది. అంతేకాని దుఃఖము కొరకు కాదు. మరొక విధంగా చూస్తే, అతనికి దేహమువలన సుఖమూలేదు. లేకపోవుటచే కష్టమూ లేదు.

జ్ఞానదృష్టిని అలవరచుకొనుచున్న యోగి దుఃఖాదులచే ఏమాత్రం స్పృశించబడుటలేదు. ఈ దేహము గురించి విజ్ఞులు చెప్పు కొన్ని వివేషములను చెపుతాను… విను.

ఈ ‘దేహము’ అనే నగరం అనేక గుణ విశేషములు కలదై ఎంతో రమణీయంగా ఒప్పుచున్నది. అంతులేని విలాపములతో సంచరిస్తోంది. ‘ఆత్మదర్శనము’ చే మాత్రమే దీని సత్యాసత్యములు గ్రహించబడుచున్నాయి.

నేత్రములే దీని కిటికీలు. ఇంద్రియములే ఇందలి దీపములు. ‘చేతులు’ అనే విస్తృతమైన మార్గం ద్వారా ఆయా పదార్థముల ప్రాప్తిని పొందుతోంది. రోమములు’ అనే లతలతో, ’తొడలు’ అనే స్థంభములతో ఒప్పుచున్నది. ఎముకల సంధులే దీని హద్దులు. కపాలము ఈ దేహనగరంలోని విశాల ప్రదేశం. వక్షస్థలము ఇందలి తటాకం వంటిది. భుజములే క్రీడాప్రదేశములు. చెవులు - నోరు ఈ నగరములోని ద్వారములు. కంఠమే ఇందలి బిలము.

-

Page:125

‘నవరంధ్రంలు’ అనే నవద్వారంల నుండి ప్రాణవాయువులు ప్రవేశించటం, నిష్క్రమించటం అనుక్షణం జరుగుతోంది. ముఖంలో నివసిస్తున్న ‘నాలుక’ పలువిధములైన భోజనం ఆరగిస్తోంది.

ఈ శరీరము అనే నగరం యొక్క అధోమార్గం గుండా ‘మలము-మూత్రము’ అనే బురద దూరంగా తొలగించబడుతోంది. ‘చిత్తము’ అనే ప్రదేశంలో ‘అనేక చింతలు’ అనే జనులు సంచరి స్తున్నారు. ఇంద్రియాలు అనే పశువులు విచ్చలవిడిగా ఈ నగరాన్ని దుర్గంధమయం చేస్తున్నాయి.

ముఖము నుండి వెలువడుచున్న చిరునవ్వులే ఇందలి పూలతోటలోని పూలు. తత్త్వజ్ఞులగు వారు తమ ‘దేహము, మనస్సు’ల గురించి సుస్పష్టముగా ఎరుగుచున్నారు. అందుచేత వారి పట్ల ఈ శరీరం శుభప్రదంగానే పరిణమిస్తోంది. ఇది వారికి మోక్షరూపమైనట్టి హితమును, శుభమును, సుఖమును కలుగజేస్తోంది.

కాని అజ్ఞానికి మాత్రం ఈ శరీరం అనేక దుఃఖాల-అశుభాల నిలయంగా ప్రాప్తిస్తోంది.

ఈ శరీరము నశిస్తున్నప్పుడు జ్ఞాని అత్యంత స్వల్పమైన విషయముగా దర్శించుచున్నాడు. అతని దృష్టిలో ఈ శరీరనాశన మాత్రంచే సత్యవస్తువు ఏదీ పోవుట లేదు. లేక ఇది నిలచి ఉంటుందా, అదీ మంచిదే! జ్ఞాని దీనిని ఉపయోగించి భోగ మోక్షములను అనాయాసంగా పొందుచున్నాడు.

ఈ శరీరము జీవునకు ఒక రథము వంటిది. దీనిని ధరించిన జీవుడు ఈ ప్రపంచంలో చమత్కారంగా కొంచెం సేపు సంచరించి ఎప్పుడో దీనిని త్యజించివేస్తున్నాడు. అట్టి కొద్ది కాలంలోనే “శబ్ద-స్పర్శ-రూప రస గంధములు”… అనే విషయములను, “స్వజనులు-పరులు -బంధువులు-మిత్రులు-అసంబంధులు-శత్రువులు”… మొదలైన పరస్పర వ్యతిరిక్తమైన సంబంధ బాంధవ్యములను పొందుచున్నాడు. అయితే అతడు జ్ఞానలక్ష్యమును, దృష్టిని కలిగియుంటేనో, ఈ శరీరము నుండి అతనికి ‘మోక్షము’ అనబడు ’ఉత్తమమైన సుస్థిరమైన అవగాహనతో కూడిన మనస్సుకు పరమైన…” స్థితి లభిస్తోంది. కనుక జ్ఞానికి ఈ శరీరరథము లాభదాయకమే.

ఈ శరీరనగరం ‘సుఖ-దుఃఖములు’ అనే క్రియలను స్వయముగా ధరిస్తోంది.

జ్ఞానికి ఉత్తమ విషయములను నేర్చుకొనుటకు, చేకూర్చుకొనుటకు ఈ శరీరం ఉపయోగి స్తోంది. ఈ శరీరంచే నిర్వర్తించబడు శాస్త్రయుక్తమైన క్రియల ద్వారా తనలో దుష్ట స్వభావాలకు అతడు చికిత్స పొందుచున్నాడు. అందుచేత ’ప్రశాంతము అనబడు నిర్లిప్త అంతరంగస్థితి, సమగ్రమగు అవగాహన"… లను లక్ష్యములను కలిగియుండి, ఈ శరీరంను ఒక ఉపకరణంగా, చేతి కఱ్ఱ వలె ఉపయోగించుకుంటున్నాడు.

ఇంద్రుడు అమరావతిలో సుఖంగా ఉన్నట్లు దుఃఖరహితుడు స్వస్థ చిత్తుడు అగు జ్ఞాని ఈ శరీరనగరమును పాలిస్తూ ఇందులో సుఖంగా ఉంటున్నాడు.

Page:126

అతని మనస్సు “నేను పుట్టాను. చచ్చుచున్నాను… ఇవన్నీ నావి… ఇవి నాకు ఉండాలి… నేను వారికంటే ప్రత్యేకత కలిగినవాడిని…” అను లోభపూరితమైన ఆవేశమును పొందుటలేదు. వివేకయుక్తమైన బుద్ధి పొందుచు, ‘మోహము, అధర్మము’.. అను దుశ్చర్యలను దూరమునుండే త్యజిస్తున్నాడు. అజ్ఞానయుక్తములైన లోభ కోప మాత్సర్యాదులు అతనిపై దండెత్తలేకపోతున్నాయి. అవి అతని జ్ఞానతీక్షణతకు వెరచి బిక్కుబిక్కుమంటూ బలహీనులగు శత్రురాజువలె దూరంగా ఉండిపోతున్నాయి. సర్వ సంసార దుఃఖములకు మూలము ’ఆసక్తి’యే కదా! అట్టి ఆసక్తిని అతడు జయించివేసి ఉంటున్నాడు. కామభోగములు, సర్వ సుఖ దుఃఖవిలాపరూపమగు ’తృష్ణ’లను గుర్తించి అతడు వాటియందు తగుల్కొనుట లేదు. సర్వవేళలందు బాహ్య - అభ్యంతరములందు పరమాత్మనే దర్శించుచు “ఆధ్మాత్మిక - ఆదిభౌతికములు” అనే రెండు నదుల సంగమములందు ప్రశాంతంగా స్నానమాచరిస్తున్నాడు. ఈ ఇంద్రియములపట్ల, పైకి రమణీయంగా కనబడే విషయములపట్ల అతడు సర్వవేళల పరాన్ముఖుడై ఉంటున్నాడు. అందుచేత, అవి అతనిని నిరోధించటం గాని, కట్టడి చేయటం గాని చేయలేకపోతున్నాయి. ఏది ఎట్లా జరుగుచున్నప్పటికీ అతడు మాత్రం ‘ధ్యానము’ అనే అంతఃపురమునందు నిత్యము సుఖపూర్వకంగా వసిస్తూ ఉంటాడు. ఆత్మ తత్వము ఎరిగినవానికి ఈ శరీరము సుఖప్రదమే అగుచున్నది. ఎందుకంటావా? 1. భోగమోక్షములను ప్రసాదిస్తోంది కనుక 2. ఈ శరీరం ఉంటే దృశ్యం ఉంటోంది. అయితే ఈ శరీరం పోతేనో? ఏదీ కొంచెం కూడా నశించుట లేదు.

ఒక కుండ ఉన్నప్పుడుగాని లేక పగిలిననప్పుడుగాని ఘటాకాశము గాని, మహాకాశము గాని ఏమైనా ఖండించబడుచున్నాయా?… లేదే! ఈ శరీరము నశిస్తే ఇందు ప్రవేశించి అనుభవములను పొందుచున్న ఆత్మ వస్తువుకు పొందునది గాని, కోల్పోవునది గాని ఏమీ ఉండదు. జ్ఞాని ఈ దేహము కలిగియున్నప్పుడే దీని విషయమంతా గ్రహిస్తున్నాడు. వాయువు ప్రసరిస్తూ ఉండగా ఒక గోడ తారసపడితే ఆ గోడను తాకుతుంది. అక్కడ గోడలేకుంటే? తన ప్రసరణను ఇంకా కొనసాగిస్తుంది. అంతే గాని "అయ్యో! ఇక్కడ గోడ పడిపోయింది కదా…” అని తలచి వాయువు కూడా నశిస్తుందా? లేదే! అదే విధంగా శరీరం నేల కూలినా ఇందలి జీవాత్మ ఏమి కోల్పోదు. శరీరం ఏర్పడుచున్నప్పుడు క్రొత్తగా ఏదీ పొందదు.

జ్ఞాని యొక్క ఆత్మ తాను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, ఈ శరీరమునకూడా ఉండి ప్రారబ్ధ భోగము (Fruits of actions done in the past lives) లను అనుభవిస్తూ ఉంటోంది. అంతకంతకు మును ముందే తనయందు సాక్షాత్కరించినట్టి పూర్ణానందమయమగు ‘ఆత్మస్వరూపము’ అను పురుషార్థమును పొందియే ఆయా సంఘటనలయందు మౌనంగా పాల్గొనుచూ ఉన్నది. అనుభవమునకు అతీతమైన ప్రజ్ఞను అవధరించి సర్వమునకు సాక్షియగుచున్నది.

రెండు నదుల సంగమము = ఆత్మ, శరీరముల సంబంధములను విజ్ఞాన దృష్టితో ఎరిగి ఉండుటయే “సంగమమందు స్నానం” గా ఇక్కడ చెప్పబడింది.

Page:127

శ్రీరాముడు : అంటే అతడు అన్నియు నిర్వర్తిస్తూ ఏమీ నిర్వర్తించనివాడే అగుచున్నాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. జ్ఞాని ఆయా అర్థక్రియాదులపట్ల ఉన్ముఖుడై ప్రారబ్ధ కర్మానుసారంగా ప్రాప్తిస్తున్న కర్తృత్వమును, కర్మత్వమును నెరవేర్చుచున్నాడు. ఈ విధంగా వ్యవహారదృష్టితో చూస్తే అతడు అంతా చేస్తూనే ఉంటాడు. అయితే, యథార్థానికి ఏమీ చెయ్యనివాడే అగుచున్నాడు. “నేను సర్వత్రా సర్వదా వ్యాపించియే ఉన్నాను” అను ఎరుకను కలిగి ఉంటూనే లీలామాత్రంగా ఈ దృశ్య కార్యక్రమాలను వినోదపూర్వకంగా పొందుచున్నాడు. ‘త్యాజ్యం’ అనే విమానం అధిరోహిస్తున్నాడు. చమత్కారంగా, అతి సుందరంగా, పరమశాంతియుతంగా ఈ జగత్తునందు సంచారము సలుపుచున్నాడు. ‘మైత్రి’ అనే ప్రియురాలితో కూడుకొనినవాడై ఉంటున్నాడు. అతనికి ఇటు అటు ‘సత్యత్వము’, ‘ఏకత్వము’ అనబడే ఇద్దరు ప్రియాతిప్రియమైన మిత్రులు వెంటనంటి ఉంటున్నారు. ఆకాశంలో ఆ సూర్యుని చూడు… అతడు వనములోని లతలను నిర్లిప్తంగా చూస్తూ “తన కిరణజాలమును ప్రసరింపజేయుట’ అను ధర్మమును నిర్వర్తిస్తున్నాడు కదా! జ్ఞాని కూడా అతి దూరస్థుడై నశ్వరము, దుఃఖగ్రస్తము అగు ఈ లోకములన్నీ చూస్తున్నాడు. సర్వదిక్కులను తన యొక్క “సత్-చిత్”ల ప్రసరణముచే పూర్ణమొనర్చుచున్నాడు. సమస్త సంపదలతో కూడిన పూర్ణచంద్రునివలె అఖండ శోభాయుక్తుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. శంకరభగవానుడు కాలకూట విషం మ్రింగితే, ఆ విషం ఆయన కంఠమునకు ఆభరణమే అయి, ఆయనకు ’నీలకంఠుడు’ అను ప్రశంసను తెచ్చిపెట్టింది కదా! జ్ఞానిచే సేవించబడు కార్యక్రమములు, భోగసముదాయములు కూడా దుఃఖమును గాక సుఖమునే కలుగజేస్తున్నాయి.

“ఇతడు నిజమైన యముడు కాదు… కేవలం వేషం వేసినవాడు”.. అని తెలిసిన తరువాత ఆ వ్యక్తితో సంభాషణ వినోదమునే కలుగజేస్తుంది కాని విషాదమును కాదుకదా! అట్లాగే, "ఈ భోగములన్నీ మిథ్యారూపములే” అని తెలిసిపోయిన తరువాత ఇవి అట్టి జీవునికి దోషరహితమైన సంతోషమును చేకూర్చగలుగుతాయి.

నటులు సామూహిక నృత్యం చేస్తూ దూరంగా పోతూ ఉంటే ప్రేక్షకులు చమత్కార దృష్టితో చూస్తూ ఉంటారు కదా! జ్ఞాని కూడా ఈ స్త్రీ ధన రాజ్య పూజ్యాది వ్యవహారములన్నీ ఒక నాటకములోని సంఘటనలను చూస్తున్నట్లు, తనకు ఏమాత్రం సంబంధమే లేనట్లు అవగాహన కలిగి ఉంటాడు. బహుదూరం పోవలసిన బాటసారి మార్గమధ్యంలో తారసపడే గ్రామ సమూహములను నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు కదా! జ్ఞాని కూడా ఈ సర్వలోక వ్యవహారములను ఆసక్తిరహితంగా ఉద్వేగాదులు లేనివాడై చూస్తున్నాడు.

ఎక్కడో కొండయొక్క ఎత్తైన శిఖరమును, అక్కడి వృక్షముల వృద్ధి క్షయములను జనులు రాగరహిత దృష్టితో చూస్తూ ఉంటారు. అట్లాగే మమత్వము లేనట్టి జ్ఞాని యొక్క దృష్టి కూడా సర్వ కార్యములందు, విషయములందు సంఘటనలయందు రాగరహితమై ఒప్పుతూ ఉంటుంది.

Page:128

జ్ఞాని ప్రారబ్ధకర్మానుసారంగా ఈ ఇంద్రియములకు ప్రాప్తించే విషయములను అనుభవించ వలసివస్తే… అప్పుడు వాటిపట్ల ఏ విధమైన స్వీకార, తిరస్కార రూపమైన పట్టుదలా వహించడు. అట్లాగే, “ఇవి నేను పొందలేకపోయానే….? ఏమైనా సరే, ఇవి నేను పొందవలసిందే!“ అను యత్నపూర్వక ‘గ్రాహ్యభావన’ ఆశ్రయించదు. “ఏదో పొందాలి”… అని చెప్పనలవి కాని తపన, ఆతృత అతనియందు ఉండదు. సదా పరిపూర్ణరూపుడై, పరిపూర్ణకాముడై దర్శనమిస్తూ ఉంటాడు. నెమలిపింఛంతో కొండను కొడితే కొండకేమైనా అవుతుందా? ఇక్కడ వచ్చి - పోయే మహర్దశలు, దుర్దశలు జ్ఞానిని ఏమాత్రం చలింపజేయజాలవు.

ఈ స్థూలశరీరము సూక్ష్మశరీరములకు మూల కారణమైన అజ్ఞానము అతనియందు

నశించిపోతుంది.

సంశాన్త సర్వసందేహో గలితాఖిల కౌతుకః |

సంక్షీణ కల్పనాదేహో జ్ఞః సమ్రా వరాజతే ॥ (సర్గ 23, శ్లో. 49)

అతడిక సంశయరహితుడై ఉంటాడు. ఈ సర్వభోగములందు అతనికి మిథ్యాత్వమే దర్శన మిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకౌతుకములను వర్ణించినవాడై ఉంటాడు. ‘నాయందు ఈ స్థూల సూక్ష్మ దేహముల కల్పనకు చోటే లేదు… జనన మరణాదులు లేవు" అను బోధను ఆశ్రయించి ఉంటున్నాడు. రాజసూయ యజ్ఞఫలం పొందిన చక్రవర్తివలె శోభిస్తూ ఉంటాడు.

అయితే ఇక్కడ ‘చక్రవర్తి’ అనే దృష్టాంతమును జ్ఞానియొక్క “అవగాహన - పరిమోత్కృష్ట భావన”లను వివరించటానికి మాత్రమే వాడాను. యథార్థానికి, “అపారము పూర్ణము” అయివున్న మహాసముద్రంలాగా జ్ఞాని పూర్ణ స్వరూపమగు తన ఆత్మచే ఆత్మయందే శోభించుచున్నాడు.

జనులు ఒక పిచ్చివాడిని, అతని చేష్టలను చూచి నవ్వుకుంటూ ఉంటారు కదా! అనేక భోగేచ్ఛలచే క్షణక్షణం వ్యాకులచిత్తులగుచు, స్వస్వరూప సమాచారము విషయమై అసావధానత్వం వహించువారిని చూచి జ్ఞాని నవ్వుకుంటూ ఉంటాడు.

ఎవరో త్యజించి, దూరంగా విసరిన వస్తువులను ఆశ్రయించి భద్రముగా దాచుకునే వ్యక్తిని చూచి అందరం పరిహసిస్తూ ఉంటాం కదా! తుచ్ఛమైన ఆసక్తులను కలిగియుండే అజ్ఞానుల ఇంద్రియ ప్రవృత్తులను, మూర్ఖపు కౌతుకాలను చూచి జ్ఞాన దృష్టి గల యోగులు నవ్వుకోవటంలో ఆశ్చర్యమేమున్నది?

  1. మనోనిగ్రహం - ఇంద్రియ నిగ్రహం

ఓ రామచంద్రా! మనం ఒక ఏనుగును అంకుశంతో నిగ్రహిస్తాం. ఈ ‘మనస్సు’ అనే మదపుటేనుగు “ఆత్మసుఖము” అను దానిని త్యజించి ‘ఇంద్రియవిషయములు’ అనే దుష్టమార్గంలో ఎటకో పరుగులు తీస్తోంది. అట్టి ఈ మనస్సును ఏం చేయాలి? నిరోధించాలి. ఎట్లా? అందుకు చిన్న చిన్న విజ్ఞాపనలు సరిపోవు. విచారణ - - సుజ్ఞానములను నిరంతరం ఆశ్రయించాలి.

Page:129

ఈ మనస్సు అతి చంచలమైనది కదా! అందుచేత, ఇది భోగముల వైపుగా రాగ లోభపూరిత వృత్తులను పొందుతూ ఉంటోంది. అట్టి వృత్తి రూపము పొందకుండా నీవు నీ మనస్సు విషయంలో జాగరూకుడవై ఉండాలి సుమా! విషాన్ని వెడలగ్రక్కుచున్న ఒక లతనో లేక పామునో ఎట్లా దూరంగా ఉంచుతావో, అట్లాగే భోగములపట్ల ఏర్పడుచున్న వృత్తులు నిన్ను సమీపించ కుండా చూచుకోవాలి. అట్టి దుష్ట దుర్బల వృత్తులను మొదలే నిరోధిస్తూ ఉండటం మంచిది.

ఎప్పుడైతే మనస్సు చిరకాలం నిగ్రహించబడి, వృత్తులను పొందక ఉంటుందో, అప్పుడు అట్టి మనస్సులో మా బోధ కొంచెం ప్రవేశించినా చాలు, అమోఘమైన ప్రయోజనం పొందుతోంది. ఎవరి మనస్సైతే ఎల్లప్పుడూ ఆయా భోగ, రాగవృత్తులను ఆశ్రయిస్తోందో, అట్టి వారి ముందు మేము ఎంత విస్తారమైన, సవివరమైన బోధను ప్రతిపాదించినా, అదంతా చెవిటివాని ముందు శంఖము ఊదినట్లే అవుతోంది.

మహాసముద్రం తనయందు భూమినంతా నింపివేయగలగినంత జలం ఉన్నప్పటికీ, నదుల నుండి వచ్చే జలమును స్వీకరిస్తూ ఉంటుంది కదా! నిగ్రహించబడిన మనస్సుగలవారు అనేక రూపములుగా అనేక ప్రదేశముల నుండి వారి వద్దకు చేరుకున్న జ్ఞాన విషయములన్నీ సులభంగా స్వీకరించగలగుచున్నారు. అట్లు స్వీకరించి, వాటిని తమ ఉత్తమ బుద్ధిచే విచారించి మరింత సమున్నతులు కాగలుగుచున్నారు. మనస్సు నిలకడలేనిచోటికి వచ్చి చేరే జ్ఞాన సమాచారం నిష్ప్రయోజనమే అవుతోంది.

నిగ్రహించబడిన మనస్సు అత్యంత సులభంగా తృప్తిని, ఆనందమును, సంతోషమును పొందుతోంది.

ఓ రాఘవా! ఉత్తమమైన ఆత్మజ్ఞానము ఈ జీవుని యందు వికసించకుండా నిరోధిస్తున్నది ఏది? ఇంద్రియములతో ఏర్పడుచున్న తాదాత్మ్యమే సుమా! ఇంద్రియానుభవముల పట్ల స్వయముగా కల్పించుకొనిన మోహమే ఈ జీవుని అనేక యోనులందు త్రిప్పుచున్నది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమలను పొందింపచేస్తోంది. ఇక ఈ జీవుడు ఒక ఉపాధి నుండి ఇంకొకదానికి పరుగులు తీస్తూనే ఉన్నాడు.

అందుచేత చేతిని చేతితో నలిపి, దంతములను దంతములతో కొరికి, అవయవములను అవయవములతో ఆక్రమించి… ఎట్లాగైనా సరే, సర్వప్రయత్నములతో ఈ ఇంద్రియములను మాత్రం జయించాలి.

చమత్కారమైన విషయమేమంటే, ఈ ప్రపంచంలో కొందరు అనేక విషయములందు పండితులై ఉండి కూడా, అనేక విజయోత్సాహములతో ప్రపంచమును ఆశ్చర్యపరుస్తూ కూడా, చివరికి ఈ ‘ఇంద్రియములు’ అనే శత్రువులకు క్షణంలో దాసానుదాసులగుచున్నారే! ఈ ఇంద్రియములే మొట్టమొదటగా జయించబడవలసిన శత్రువులు. ఏతావతి ధరణీతలే సుభగాస్తే సాధుచేతనాః పురుషాః |

పురుషకలాసు చ గణ్యా నజితాయే చేతసా స్వేన ॥ (సర్గ 23, శ్లో. 60)

Page:130

ఈ భూమి మొత్తం మీద ఇంద్రియములను జయించినవారే భాగ్యవంతులు. అట్టి వారు మాత్రమే సావధానముతో కూడిన చిత్తమును సంపాదించగలుగుచున్నారు. అట్టి ‘చిత్తము’ యొక్క ప్రభావముచే అతి కుశలముగా ఈ సంసారమును జయించి వేసి, స్వస్థచిత్తులగుచున్నారు.

ఓ సర్వజనులారా! “మా దృష్టిలో వీరు మంచివారు కాదు… వారు గొప్పవారు కాదు… ఈ వ్యక్తిలో ఇట్టి దోషాలు ఉన్నాయి…” మొదలైన పరుల దోషములను ఎంచు ప్రవృత్తులను కాస్త కట్టిపెట్టండి. “వారు మా శత్రువులు… వీరిని మా కండబలంతో, బుద్ధిబలంతో నిర్జించ గలం… ఇకపై వీళ్ళ వీళ్ళ సంగతి చూడాలి! ఇక చూస్తాం….” అని మననం చేస్తూ మీరు పరుగులు తీస్తున్నది ఎటు వైపు? మీ హృదయ కుహరంలోనే ”దుష్టసంకల్పములు, విషయ వాసనలు” అనే రెండు కాలకూట విషసర్పాలు సంచరిస్తూ ఈ జన్మ కర్మలను విషపూరితం చేస్తున్నాయి. ఇంటిలోనే శత్రువులను పెట్టుకొని ఎక్కడో ఉన్న ఎవరో శత్రువుల గురించి ఎందుకో వేగిరపాటు? ఎవని హృదయంలో అయితే ‘దుష్టమనస్సు’ అనే సర్పం వినాశనం పొందుతుందో, అట్టి వాడు స్వస్వరూప సాక్షాత్కారమును అతి సులభంగా పొందుచున్నాడు. నిర్మలాంతఃకరణుడు అగుచున్నాడు.

అందుచేత మీరంతా “ఈ ఇంద్రియముల వేగమును నిరోధించటం ఎట్లా? ఈ మనస్సును ఏ సన్మార్గపు ఆచరణచే పరిశుద్ధ పరచుకోవాలి?” అనే విషయాలు మరలమరల పరిశీలించండి. శాస్త్రాదులు అందుకు ఉపకరించాలనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రతిపాదించబడుచున్నాయని గ్రహించండి.

  1. ఉపేక్ష పనికి రాదు

శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ ఇంద్రియములను చూస్తున్నావా! ఇవి ‘తృష్ణ’ చే నిండియున్నవై, మహానరకప్రదములు అగుచున్నాయి.

ఈ ‘ఇంద్రియములు’ అనే శత్రువులను జయించాలంటే ఓర్పు-నేర్పు -శ్రద్ధ- ఈ మూడూ

అవసరం.

కృతఘ్నుడు తాను ఎవరి యొక్క సహాయం పొందాడో వారినే బాధిస్తాడు కదా! ఈ ఇంద్రియాలు కూడా తమకు ఆశ్రయమైనట్టి దేహమునే శిథిలపరచుటకు, నశింపజేయుటకు సిగ్గు లేకుండా సిద్ధపడుచున్నాయి. పాపధనం కూడబెట్టడంలో ‘మహాదిట్ట’ అయి ఉంటున్నాయి.

ఇంటి ప్రక్కనే బలవంతుడైన శత్రువు ఉంటే ఎవరికి శాంతి ఉంటుంది? ఈ ఇంద్రియములు జీవుని ప్రశాంతతకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అయ్యో! ఈ ఇంద్రియములు జీవుని ఎంతగా క్షోభపెడుతున్నాయో చెప్పలేం. ఇవి విషయములను ఆపేక్షించుచు ‘పొందవలసినవి, చేయ వలసినవి’ అనే రెక్కలు కలిగి ‘దేహం’ అనే గూటిలో ప్రవేశించి మరల మరల విజృంభిస్తున్నాయే!

Page:131

‘వివేకము’ అనే వలపన్ని ఈ ఇంద్రియ పక్షులను పట్టి వశం చేసుకోవాలి. అట్టివాడు మాత్రమే అచ్ఛేద్యమగు శాంతస్వరూపుడు అగుచున్నాడు. వివేకులు సమగ్రమగు ‘అవగాహన’ అనే నిలకడ కలవారై పైపైకి మాత్రమే రమణీయంగా ఉండే ఈ ఇంద్రియ విషయము లందు ఏ మాత్రం ప్రీతిని గాని, కౌతుకమును గాని పొందకుండా ఉంటున్నారు. ఇంద్రియములను ఓడించి వేసి, తమ చిత్తమును స్వాధీనము చేసుకున్నవారై ‘మట్టి’ మొదలైన పంచభూత సమ్మేళనముచే నిర్మించబడిన ఈ స్వశరీరమును ఒక ఉపకరణమాత్రమైనదిగా చూస్తున్నారు. అందుకు ఫలితంగా ఆ వివేకులు పరమసుఖమునే పొందుచున్నారు. అట్టి సుఖమును గొప్ప సామ్రాజ్యమును ఏలుతున్న చక్రవర్తులు కూడా పొందలేకపోతున్నారు.

ఎవడైతే ఈ ఇంద్రియములను తన భృత్యులుగా చేసుకుంటాడో (తాను వాటికి భృత్యుడు కాడో…) ‘దుష్ట మనస్సు’ అనే శత్రువును జయించివేస్తాడో… అట్టి వాని పరిశుద్ధమగు బుద్ధి ’వసంతకాలంలోని లతలు’ వలె వృద్ధి చెందుతోంది. మేము చేయు బోధలు అతని పట్ల రసమయమై అతి పవిత్రతను సంతరించుకుంటున్నాయి.

శ్రీరాముడు : స్వామి! ఈ భోగవాసనలు నశించేది ఎట్లా?

శ్రీ వసిష్ఠమహర్షి : ఎవరినైనా ఉద్దరించగలిగేది వారి యొక్క ‘అభ్యాసము’ మరియు వారి ‘వైరాగ్యపూరితమైన విచారణ’ అని గ్రహించు.

సర్వప్రయత్నములచే ఈ చిత్తము యొక్క గర్వమును నశింపజేయాలి.

ఇంద్రియ శత్రువులను జయించటానికి అభ్యాసము, దైవీగుణములను ఆశ్రయించుట ఉపాయమైయున్నది. ఉత్తమ అభ్యాసం ఆశ్రయించేవారు తమ భోగవాసనలను స్వయంగా నశింప జేసుకోగలగుచున్నారు. ఇందులో సందేహము లేదు. అభ్యాసమును ఆశ్రయించకుండా, "మేము ఉద్ధరించబడటం ఎలా?” అని ఖాళీచేతులతో గురువును ఎంతగా ప్రశ్నిస్తే ఏం ప్రయోజనం?

ఓ రామచంద్రా! ‘ఏకం’ అయినట్టి “బ్రహ్మతత్త్వం”ను అభ్యసించుట చేత మనస్సు క్రమంగా జయింపబడగలదు. మనస్సు జయింపబడనంత కాలం ‘అజ్ఞానం’ అనే గాడాంధకారం ఉండనే ఉంటుంది. ఆ చీకటి ఉన్నంతసేపు వాసనలు జుట్టు విరగబోసుకున్న పిశాచాలలా విజృంభిస్తూనే

ఉంటాయి.

“నేను స్వల్పుడను… శరీరమాత్రుడను… చావుపుట్టుకల మధ్య మాత్రమే ఉన్నవాడను”… అను స్వల్పత్వమును నీవు త్యజించు. మనస్సునందు ఆత్మకు సంబంధించిన సమాచారము చేతను, వివేకపూరితమైన పరిశీలనాదులచేతను నింపివేయి. వివేకవంతుడవై ఉండు. అవివేకివి కావద్దు. “నా గతి ఇంతే… నే బాగుపడటమేమిటి?… నేను ఉద్ధరింపబడజాలను… ఎందుకంటే నేను అల్పుడను కదా”… ఇట్టి అవివేకమును, ఆ అవివేకమునకు సహకరించు వాక్యక్రమములను, భావనలను దూరంగా నెట్టివేయి.

Page:132

వివేకి యొక్క మనస్సు. తాను గ్రహించిన లక్ష్యం వైపుగా కార్యక్రమాలుగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అది అతనికి గొప్ప సేవకుడు.

అది అతనిని సత్కార్యములవైపు ప్రేరణ కలిగిస్తుంది. కనుక మంచి మిత్రుడు. ‘ఇంద్రియములు’ అనే శత్రువులపై దాడిచేసి అణచివేస్తుంది. కనుక గొప్ప సామంత రాజు. ప్రేమభావము కలిగి ఉంటుంది. అందుచేత అత్యంత ప్రియురాలగు

పాలించి, ఆ జీవుని అనేక దుఃఖములు, ప్రమాదాల నుండి రక్షిస్తూంటుంది. కా కాబట్టి తండ్రి. ఈ విధంగా వివేకి విషయంలో అతని మనస్సు అతనికి క్షేమమునే కలుగజేస్తోంది.

’ఈ మనస్సు అనుల్లంఘ్యనీయమైన శాసనము కలిగి ఉంటోంది. అయితే దాని యొక్క వాస్తవరూపము చైతన్యము. అది చైతన్యము కంటే వేరైనది కాదు. ’స్నేహము వివేకము ఉత్తమ బుద్ధి’లచే దానిని వశం చేసుకోవాలి…" అని మనకు శాస్త్రములు బోధిస్తున్నాయి. చైతన్యము యొక్క స్వయంకల్పనయే ఈ మనస్సుకు మూలము. సాధన-ఉపాసనలు కొనసాగు చుండగా, ఈ మనస్సు తన యొక్క మనోరూపమును త్యజించి “చైతన్య మాత్రము”గా శేషించు చున్నది. తత్త్వజ్ఞానసిద్ధిని ప్రసాదించి, మరుక్షణం తాను అదృశ్యమగుచున్నది.

శాస్త్రదృష్టిచే ఈ జీవితము అనే గని పరిశీలించబడగా, సౌభాగ్యవశంచేత, “మనస్సు యొక్క స్వభావమునకు సంబంధించిన సమాచారము” అనే మణి ఈ జీవునికి లభిస్తోంది. అట్టి ఈ మనస్సు ‘ఆచార్యుల పాఠములు - సహపాఠకులతో కూడి చేయబడిన విచారణ’ అను వాటి సహాయం చేత స్వానుభవ పర్యంతము (upto one’s own absolute sense of experience) విచారించబడగా ‘నిధిధ్యాస’ అనే ఉత్తమ కార్యక్రమం ప్రాప్తిస్తోంది. అప్పుడు ఈ మనస్సు జ్ఞానంచే సుప్రబోధం అగుచు సప్తభూమికలను అనుశ్రుతం చేసుకుంటోంది. అప్పుడు మిక్కిలి ప్రశాంతతో శోభించుచు లోక కళ్యాణకారకమే అవుతోంది.

సరిదిద్దబడుచున్న మనస్సు - ఈ మనస్సును మనం సరిదిద్దుకున్నామా, ఇక ఇది ‘సాధన చతుష్టయం’ మొదలుకొని తత్త్వసాక్షాత్కారము వరకు ఉత్తమ కర్మలను మనచేత నిర్వర్తింపజేస్తుంది. ‘జన్మలు’ అనే అత్యంత ప్రాచీనమైన వృక్షాన్ని మొదలంట ఖండింపజేస్తూ, నిరతిశయానందమును ప్రసాదించుచున్నది. ఇది తనకు తానే సమర్పించుకొని ఈ జీవునకు ‘ఆత్మభావన’ అనే ఒక గొప్ప ప్రయోజనమును ప్రసాదించుచున్నది.

కనుక ఓ సర్వజనులారా! మహత్తరమై ఈ మనస్సును చక్కగా నియోగించండి. అప్పుడు ‘ఆత్మోద్ధరణ’ ప్రసాదించుటలో ఇంతకు మించిన శ్రేయోదాయకమైన దంటూ ఇంకేదీ ఉండదు. బురదతో నిండిన కాళ్ళతో ఎవరైనా ఇంటిలోకి ప్రవేశిస్తారా? మీ మనస్సులను ‘వివేకం’ అనే జలంతో పరిశుద్ధపరచుకోకుండా ఈ దృశ్యం నుండి ఆంతరంగంలోకి ప్రవేశిస్తే, దుఃఖాదులే

తారసపడతాయి సుమా!

Page:133

మనస్సే బంధము…. మనస్సే మోక్షము - ఓ రామచంద్రా! వివేకరహితులగువారు, మూర్ఖులు మాత్రమే అనేక ఉత్పాతములతో కూడి ఉన్న ఈ సంసారభూములందు సంచరిస్తూ సుదీర్ఘమైన ప్రయాణాలు చేయటానికి ఉద్యుక్తులౌతున్నారు. నీవు మాత్రం వివేకయుక్తుడవు అయి, ఈ సంసారమునందు చిక్కకుండేందుకే యోచించు. భయంకరమైన వ్యాధి వచ్చి పడుతుంటే, దానికి చికిత్స గురించి యోచించకుండా ఎవరైనా ఉంటారా? ఓ రామా! అనేక అనర్థములు

సంసార మాయాముదితామ్ అనర్థశతసంకులామ్ ।

మా మహామోహమిహికామ్ ఇమాం త్వమవధీరయ॥ (సర్గ 24, శ్లో. 17)

తనయందు ఉంచుకొని, నీ ముందు కపటంగా వ్యక్తమగుచున్న ఈ సాంసారికమాయను ఉపేక్షించవద్దు.

“దామ-వ్యాళ-కటన్యాయము” అనే మూర్ఖత్వం పొందవద్దు. “భీమ-భాస-దృఢన్యాయము" ను స్వీకరించి వివేకివి కమ్ము.

అప్పుడు ‘దుఃఖరాహిత్యము’ అనునది నీ చేతిలోని విషయమే అవుతుంది. ‘ఈ దృశ్య భూతమగు శరీరమే నేను’ అను రూపముగల మిథ్యానిశ్చయమును పూర్తిగా త్యజించు. ఈ మిథ్యా వస్తువులన్నింటికీ భిన్నమైనట్టి ‘సత్యము’ అగు ఆత్మవస్తువు ఆశ్రయించు. నీవు రావచ్చు… పోవచ్చు… తినవచ్చు… తిరుగవచ్చు… అయితే సర్వదా అమనస్కుడవై ఉండు. ఎట్టి బంధమున తగుల్కొనవద్దు.

అప్పుడు నీవు ముక్తుడవే అవుతావు.