CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:134

IV. దామ వ్యాళ కటన్యాయం

  1. శంబరాసుర సృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఈ ప్రపంచమునందు విహరిస్తున్న అనేకమంది జనులకు శాంతిని ప్రసాదించేది ఎట్లా?”… అను లోకపిత భావమును నీవు కలిగియున్నావు. శమదమములు నీయందు ఉన్నాయి. మోక్షము లక్ష్యముగా కలిగియున్న మహాశయుడవు. అట్టి నీకు దామ-వ్యాళ-కటన్యాయము ఉచితము కాదు సుమా! కనుక భీమ భాస దృఢ న్యాయము నందు సుస్థితుడవై, శోకరహితుడవై ఉండాలి. అదియే ఉచితం.

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ సంసారమును విస్తరింపజేసుకుంటూ అనేక దుఃఖములను ఆహ్వానించుకుంటున్న మమ్ములను మీ వాక్యములు సముద్ధరిస్తున్నాయి.

“దామ-వ్యాళ-కట న్యాయము” అనుసరించవద్దని మీరు మరల మరల హెచ్చరిస్తున్నారు కదా! మీరు చెప్పిన రెండు న్యాయములు ఏమిటో వివరించండి. ‘భీమ భాస దృఢ న్యాయం’ మమ్ములను ఎట్లా శోకరహితులుగా చేస్తుంది? రెండు న్యాయముల గురించి సవిస్తరంగా చెప్పటం చేత మేము ప్రబోధితులం కాగలం. సక్రమమైన మార్గమును ఎన్నుకుంటాం.

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే ముందుగా “దామ వ్యాళ కట న్యాయం” అనే పదప్రయోగం వెనుక గల ఇతిహాసం చెపుతాను. విను.

దామ వ్యాళ కటులు - ఒకప్పుడు పాతాళలోకమును ‘శంబరాసురుడు’ అను పేరుగల దైత్యరాజు పాలిస్తూ ఉండేవాడు. మాయను కల్పించుటలో అతనితో సమానమైన మాంత్రికుడు మరొకడు లేడు. తన మాయచే ఆకాశమునందు నగరములను, సుందరమైన ఉద్యానవనములను నిర్మించి, తన జాతి వారికి ఇస్తూ ఉండేవాడు. కృత్రిమంగా సూర్యచంద్రులను నిర్మించి, తద్వారా ఋతువులను నియమించి స్వజనులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉండేవాడు. అతని పాలనలో దానవకులం అనేక ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండేది.

అతని అంతఃపురంలో అప్సరసలను మించిన అందంగల స్త్రీలు మధురంగా గానములు చేస్తూ ఉండేవారు. అతని క్రీడావనంలో సృష్టిలో మరెక్కడా లభ్యంకాని చిత్రవిచిత్రములైన వృక్షములు, పూతీగలు ఉండేవి. అతడు “కర్తని” అనే యంత్రము కలిగి ఉండి, ఇంద్రుడిని కూడా అత్యంత భయపెట్టుతూ ఉండేవాడు. క్రీడ కొరకు రచించిన మట్టి శివుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శివుని సహాయంతో చక్రధరుడగు విష్ణుభగవానుని కూడా ఓడిస్తూ ఉండేవాడు. ఒక సమయంలో అతడు ఆకాశమునందు తన లోకవాసుల కొరకు నూరు చంద్రులను సృష్టించి పరవశింపచేశాడు.

Page:135

మాయతో ఐరావతం సృష్టించుకున్నాడు. అది ఇంద్రలోక ఐరావతం కంటే వేలరెట్ల తేజస్సుతో వెలుగొందేది. సమస్త సంపదలచే, సర్వైశ్వర్యాలతో, ఎవ్వరినైనా సరే జయింప గలిగిన వాడై విరాజిల్లుతూ ఉండేవాడు. కఠినమైన శాసనములతో సామంత రాజులను పాలిస్తూ ఉండే వాడు. భయంకర ఆకృతిగల శంబరాసురునికి దేవతలను కూడా నిర్జించివేయగల గొప్ప సైన్యం ఉండేది.

అయితే ఆ రాక్షసుడు ఎటైన వెళ్ళి ఉండటం జరిగినప్పుడో, లేక అతడు ఆదమరచి దీర్ఘకాలంగా నిదురిస్తున్నప్పుడో ఆ ఏమరపాటు సమయమును ఉపయోగించుకొని దేవతలు తమ మాయాప్రయోగంతో అనేకమంది శంబరుని అనుచరులను దునుమాడుతూ ఉండేవారు.

శంబరుడు దేవతల కపటయుద్ధ ప్రయోగాన్ని గమనించాడు. అతడు గొప్ప మాయావి కదా! “ఇప్పుడేం చేయాలి?”… అని బహుతీవ్రంగా యోచించి ఒక ఉపాయం పన్నాడు. సముద్రము తరంగమును ఉత్పన్నం చేస్తుంది చూచావా? అట్లా అతడు చపలబుద్ధి గలవారు, వీరులు అయిన కొందరు రాక్షస సైనికులను సృష్టించాడు. వారిపై అజమాయిషీకి ముగ్గురు సేనాపతులను సృష్టించాడు. కాని దేవతలు మంచి సమయం చూచి, శంబరాసురుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఆ సేనాపతులను సైన్యమును కూడా సంహరించారు.

ఈ మాటు శంబరునకు చాలా కోపం వచ్చింది. “ఈ దేవతలను అంత తేలికగా వదలి పెట్టకూడదు. వీరిని, వీరు నివసించే స్వర్గమును సర్వనాశనం చేయవలసిందే” - అని నిశ్చయించు కున్నాడు. తన బలగంతో అమరావతిపై దండెత్తటానికి బయలుదేరాడు. ఈ వార్త ఎట్లాగో దేవతల చెవుల వరకు వెళ్ళింది. శంబరాసురుడు అమరావతి ప్రవేశించకముందే దేవతలు స్వర్గమును వదలి ఎక్కడో దూరప్రదేశానికి పారిపోయి తలదాచుకున్నారు. స్వర్గలక్ష్మి క్షుద్రదేవతా సమూహం చేత ఆక్రమించబడి రోదన చేయసాగింది. అక్కడి అప్సరసలు కన్నీరు కార్చారు. శంబరుడు స్వర్గం లోని సుందరమైన వస్తువులన్నీ తన వెంట ఎత్తుకుపోతూ అమరావతిని శూన్య ప్రదేశంగా మార్చాడు. పట్టణమంతా తన సైనికులచే తగులబెట్టించాడు. భీకరంగా నినాదాలు చేసుకుంటూ స్వస్థానం అయినట్టి పాతాళలోకం చేరాడు.

ఈ విధంగా దేవ-దానవుల మధ్య వైరం అధికం కాసాగింది. దేవతలు స్వర్గమును వీడి ఎక్కడెక్కడో రహస్య ప్రదేశాలలో దాగుకొనవలసివచ్చింది. ఆ తరువాత దేవతలంతా ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై గొప్ప వ్యూహమును రచించి, ప్రయత్నపరులు అయ్యారు.

అప్పుడు శంబరాసురుడు “మొండి-క్రోధ -ధృముడు” అనే ముగ్గురు సేనాపతులను సృష్టించాడు. శంబరుడు తపస్సుకు వెళ్ళిన సమయం చూచి, మొండి-క్రోధ-ధృముడు అను పేర్లు గల ముగ్గురు సేనాపతులను దేవతలు హతమార్చివేశారు. శంబరుడు వచ్చేసరికి అక్కడ కనబడ కుండా, అదృశ్యమైపోయారు. అప్పుడు శంబరాసురునికి భలే కోపం వచ్చింది…! శంబరాసురుడు: ఓ కీటకామాత్ర జీవులగు దేవతలారా! నేను ఏమరుపాటుగా ఉండటం చూచి నా సేనాపతులను సంహరిస్తారా? నేను వచ్చేసరికి పిరికివాళ్ళై పారిపోయి, నాకు తెలియని చోట

Page:136

దాగారు కదూ? సరే! ఈ మాటు నా మహత్తరమగు మాయా శక్తిచే గొప్ప సేనాపతులను ముగ్గురిని సృష్టిస్తాను.

ఇట్లు పలికి, అప్పటికప్పుడే రాక్షసజన సృష్టికి సంబంధించిన మంత్రం ఉచ్చరించ నారంభించాడు. తత్ సంబంధించిన తంత్రం నిర్వర్తిస్తూ ఇట్లు పలికాడు.

శంబరాసురుడు : నాచే సృష్టించబడుచున్న ముగ్గురు సేనాపతులారా! మీరు గొప్ప తెలివి తేటలు గలవారు, గొప్ప యుద్ధ విశారదులు అగుదురు గాక! రూపరహితుడగు కాలుడు మూర్తిమంతుడైతే ఎంత భయంకరంగా ఉంటాడో, మీరు అంత బీభత్స స్వరూపులై ఉండెదరు గాక! అతి బలశాలురు, మాయా శక్తి సంపన్నులు అయి ఉండెదరు గాక! ఒక్కొక్కరు ఒక పర్వతం వలె గొప్ప శరీరములు కలిగి ఉంటారు. మీ స్వభావములను అనుసరించి మీకు ఈ పేర్లు పెడుతున్నాను – 1. దాముడు = ఎంతటి శత్రువులనైనా సరే, అణచివేయగలిగినవాడు.

  1. వ్యాళుడు = సర్పమువలె ఆక్రమించువాడు.

  2. కటుడు: శత్రువుల సర్వశస్త్రాస్త్రముల నుండి స్వసైన్యమును రక్షింపగలిగినవాడు.

ఆ ముగ్గురికి ఇతఃపూర్వపు జన్మలు గాని, కర్మలు గాని లేవు. ఇదే వారి యొక్క మొదటి జన్మ. అందుచేత వారి యందు ’రాగము-ద్వేషము-అహంకారము-మమకారము’ - - అనేవి లేనే లేవు. వారు ‘చేతనము’ అను ధర్మము మాత్రము కలిగి ఉండేవారు. భయం గాని, అభిమానం గాని లేవు. “మరణిస్తామేమో! పారిపోదాం" అను వికల్పము వారియందు లేనేలేదు. “చిన్మాత్రము యొక్క సన్నిధానం మాత్రంచేత దేహము ప్రవర్తించుట” అను రాగ - కౌతుక రహితమైన ప్రతిస్పందన మాత్రం వాళ్ళు కలిగియున్నారు. చూచావా రామా! ’కర్మజీవుడే’ అయివున్నట్టి ఆ శంబరాసురుడు తన కౌశల్యం చేత ’సంకల్పవృత్తి’ని హస్తలాఘవంగా ఉపయోగించాడు. అంతర్యామియగు శుద్ధ చైతన్యమును ’భావన’చే ఆరాధించుటచే ఆ దామ - వ్యాళ కటులు ఉత్పన్నమైనారు. శ్రీరాముడు : అతనిచే వాళ్ళు ఎలా కల్పించబడ్డారు. అది అతనికి ఎలా సాధ్యం?

శ్రీ వసిష్ఠ మహర్షి : వివరంగా చెప్పాలంటే, అతడు తపస్సుచే సాధించియున్న ఏకాగ్రత చేతనే సుసాధ్యమగుచున్నది. అతడు దృఢమైన చిత్తంతో ఈ విధంగా ‘సంకల్పం’ చేయటం జరిగింది.

"అంతర్యామి, చైతన్యస్వరూపడను అగు నేను చైతన్యమే స్వరూపముగా కలిగియున్న విలక్షణ మైన రూప, స్వభావాలు గల ముగ్గురు రాక్షసయోధులను సంకల్పిస్తున్నాను. అట్లు నాచే సృష్టించ బడుచున్న ఈ ముగ్గురు గొప్ప లక్షణములు, శక్తి యుక్తులు కలిగియుండెదరు గాక! సాక్షి చైతన్యం చేత ఉత్తేజితులై రాక్షస విజయం, దేవతల అపజయం అనే లక్ష్యం కలిగి ప్రవర్తించెదరు గాక!” ఇట్టి ఆ రాక్షసుని సంకల్పశక్తియే ఆ ముగ్గురు సేనాపతుల జన్మలకు కారణమైనది.

ఆ దామవ్యాళకటులకు "మేము భోగములు పొందాలి” అనే ఆశయాలు లేవు. ఉత్పన్నమైన ఆ ముగ్గురు కాకతాళీయన్యాయంచేత రాక్షస సేనాపతులుగా తమకు ప్రాప్తించిన ఆయా క్రియలను

Page:137

అంధపారంపర్యముగా అనుసరించసాగారు. గాఢనిద్ర పట్టేముందు బాలుడు ప్రక్కలో పడుకొని అసంకల్పితంగానే తన అంగములు కదలుస్తూ ఉంటాడు. చూచావా! వారు ముగ్గురు అట్లే వాసనారహితులై, ఆత్మాభిమానవర్జితులై ఆయాచేష్టలను ప్రకటిస్తూ ఉండేవారు.

దేవతలతో యుద్ధం - ఇంతలోనే దేవతలతో యుద్ధం చేయవలసివచ్చింది. ఆ ముగ్గురు యుద్ధభూమిలో ఉండగా “ ఈ ఈ శత్రువులను మేమే చంపాం… మేము బలవంతులం… ఇది మా వలననే ఇట్లు జరుగుతోంది”… అను భావనయే పొందేవారు కాదు. వాళ్ళకి యుద్ధం చేయటమే తెలుసు. అంతేగాని, “అరే, ఈ శత్రువులు ఇంత అకస్మాత్తుగా మా పై వచ్చిపడ్డారే! ఇప్పుడు ఏమి గతి? మేము చస్తామేమో?”… అనే శంక వారిలో లేదు. అందుచేత యుద్ధభూమి నుండి ఎప్పుడు ఎందుకు పారిపోవాలో వారికి తెలియదు. జీవనము-మరణము, గెలుపు-ఓటమి, సంగ్రామం విశ్రాంతి, ప్రతిష్ఠ-అప్రతిష్ఠ అనువాటి భేదమునకు సంబంధించిన మననము వారిలో ఏర్పడ లేదు. తమ పిడికిలి దెబ్బతో పెద్దకొండనైనా పిప్పిచేయగలమని వాళ్ళ నమ్మిక. పిరికితనమనునదే లేకుండా శత్రువులను ఎదుర్కొని నేలకూల్చారు. దేవతలు వారి ధాటికి ఆగలేకపోయారు. వెనుకకు తిరిగి పారిపోవటం ప్రారంభించారు. అది తెలిసి, శంబరాసురుడు పెద్దగా నవ్వుతూ “ఆహాఁ! నాచే రచించబడిన ఈ ముగ్గురు అసురుల రక్షణలో దానవజాతి కీర్తి ఇనుమడిస్తోంది కదా…!” అని గర్వం పొందాడు. “ఓ సేనానాయకులారా! నికృష్టజీవులు, మోసగాళ్ళు అయిన ఆ దేవతలను వదలకండి. వారిని అందినవారిని అందినట్లే మట్టుపెట్టండి” అని ఉసిగొలిపాడు.

దామ వ్యాళ కటులతో కూడిన దానవసైన్యం దేవతల వెంటబడింది. అప్పుడు దేవతల రాక్షసుల సంగ్రామం ఆకాశంలోను భూమి మీదా ప్రళయంలాగా దుస్సహంగా జరిగింది. పర్వతాలు చూర్ణం కాసాగాయి. పరస్పరం ప్రయోగించిన శస్త్రాస్త్రముల ధాటికి దిక్కులు పిక్కటి ల్లాయి. ‘ఘర ఝర-భర’ శబ్దములచే ఆకాశం నిండిపోయింది. మాయారచితమైనట్టి అగ్నివృష్టి, మేఘవృష్టి, పర్వతవృష్టి యుద్ధభూమిలో ప్రయోగించబడ్డాయి. మహాయోధులగు అనేకమంది ఆ యుద్ధంలో మరణించటం జరిగింది. కాని ఏం లాభం? అగ్నికి ఆజ్యం తోడైనట్లు, నేల కూలిన రాక్షస సైనికులు శుక్రాచార్యుని ’సంజీవని మహావిద్య’చే ఉజ్జీవితులయ్యారు. ఇంకేముంది? ‘సిద్ధులు-సాధ్యులు’ మొదలైనవారితో కూడిన సురగణం అసుర భయానికి చెల్లాచెదరైపోయింది.

  1. మమకారావిష్కరణ

ఆ విధంగా పారిపోయిన దేవతలంతా దానవుల దృష్టిలోంచి తప్పించుకొని ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు.

ఇంద్రుడు : ఓ దేవతలారా! మనం ఎంతటి ఘోరసంగ్రామమం చూచాము! మనలో అనేక మంది వీరులు మట్టికరిచారు. దాముడు మన పలాయనం చూచి సింహనాదాలు చేశాడు. వ్యాళుడు తన

Page:138

కబంధహస్తాలతో దేవతాస్థానములను ధ్వంసం చేస్తున్నాడు. ఇక కటుడి భయంకరమైన యుద్ధ విన్యాసం వర్ణనాతీతం. వీరికి ఇంతటి శక్తియుక్తులు ఎట్లా వచ్చాయి? మనం వీరి ముందు నిలువ లేకపోతున్నామే! ఇక మన గతి ఏమిటి?

+

దామ - వ్యాళ - కటులు విజయోత్సాహంతో సింహనాదాలు చేస్తూ దేవతల కొరకై ఎంత గానో వెతికి వేసారి ‘పిరికిపందలు! ఎక్కడికి పారిపోయారో?’ అని తలచారు. వారి జాడ కనుగొన లేకపోయారు. విజయోత్సాహంతో తమ ప్రభువు శంబరాసురుని వద్దరు వెళ్ళి తమ విజయ పరంపరలను విన్నవించుకున్నారు. పాతాళమంతటా ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి.

రహస్య స్థావరంలో సమావేశమైన దేవతలు మిక్కిలి, భిన్నులయ్యారు. ’శంబరుని నిరోధించుటకు ఉపాయం ఏమిటి?” అని ఎంతో యోచించారు. ఉపాయమేదీ తట్టలేదు. “దిక్కు లేని వారికా భగవంతుడే కదా, గతి! అందుచేత మన పితామహుడగు బ్రహ్మదేవుని ప్రార్థిద్దాం” అని నిర్ణయించుకొని వారంతా భక్తితో పితామహునికి ప్రణామం చేశారు. క్షణంలో వారందరి మధ్యలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడా దేవతలు బ్రహ్మదేవునితో దామ-వ్యాళ కటుల ఉత్పత్తి క్రమం గురించి, వాళ్ళు చేస్తున్న అనర్థముల గురించి పూసగ్రుచ్చినట్లు విన్నవించుకున్నారు. భగవంతుడగు బ్రహ్మదేవుడు సావధానంగా అంతా విన్నాడు. కొంచెము సేపు మౌనం వహించాడు. చిరునవ్వుతో దేవతా సైన్యమునకు ధైర్యం చెప్పుచూ ఇట్లు పలికాడు.

బ్రహ్మదేవుడు : ఓ దేవతలారా! కొంతకాలం తరువాత సర్వాత్మకుడగు విష్ణుదేవుని చేతులలో ఈ శంబరాసురుడు హతం కాగలడు. అంతవరకు మీరు వేచి ఉండక తప్పదు. అయితే ఈ లోగా ఈ దామ వ్యాళ కటులను నిరోధించటం ఎంతైనా అవసరం. అందుకు ఒకే ఒక మార్గం నాకు కనబడుతోంది. వారికి తమ దేహము పట్ల అభిమానము కలిగేటట్లు చేయాలి.

ఇప్పుడు మీరు వారితో యుద్ధం చేయటానికి రంగంలో ప్రవేశించండి. యుద్ధం చేస్తూ పారి పోతూ ఉండండి. ఆ విధంగా పదే పదే చేయండి. వారు అనేకసార్లు ‘గెలుచుట’ అను అభ్యాసానికి వశమవుతారు. క్రమంగా దురభిమానానికి, లోభానికి లోనవుతారు. ఒక అద్దంలో ముఖం ప్రతిబింబిస్తున్నట్లు వారి అంతఃకరణములో అహంకారం ప్రతిబింబించగలదు. ఎందుకంటే…

ఇప్పుడు మాత్రం వారియందు ‘వాసన’ అనునది కించిత్ కూడా లేదు.

“సుఖము, గౌరవము, ఆశ” అనునవి ఇప్పుడు వారియందు ఏర్పడుట లేదు. అందుచేత మీ బలపరాక్రమములు వారి ముందు కొరగాకుండా పోతున్నాయి. అహంకారము, మమకారము అనేవి లేని వారిని జయింప గలిగినది ఈ లోకంలో ఏదీ లేదు. వారిలో అహంకారము యొక్క ఛాయ ప్రవేశించిందా,.. ఇక వారిని మీరు సులభంగా జయించి వేయగలరు. నేలపైనగల గింజలను తినటానికి వెళ్ళిన పక్షులు వలయొక్క దారమునకు చిక్కుకుంటాయి చూచారా! ఈ

Page:139

జీవులు ‘వాసన’ అను సూత్రపుతాడునందు చిక్కుకుంటున్నారు. ‘ఆశలు’ అను పాశములందు తగుల్కొని, క్షణంలో వశీభూతులగుచున్నారు. ఎవరియందైతే వాసనలు సంపూర్ణంగా నశించు చున్నాయో… ఇక వారిని నిరోధించగలిగేదేది? దేనిపట్లా కూడా అనురక్తి లేనివారిని కార్య విముఖులుగా చెయ్యలేము. సుఖముచే ‘ప్రసన్నము’ పొందక, దుఃఖముచే కృశించక ఉండేవారిని జయించుట దుస్సాధ్యమైన విషయమే. ‘వాసన’ అనే త్రాడుచే కట్టబడిన జీవుడు… అతడు మహానుభావుడైనా, శక్తిమంతుడైనా, అనేక విషయములు తెలిసినవాడు అయినా… చివరికి అతడు ఒక బాలునిచే కూడా జయింపవేయబడగలడు.

కాబట్టి బిడ్డలారా! “ఈ దేహేంద్రియాలే నేను. ఈ జనులు, ధనం… ఇవన్నీ నావి” మొదలైన కల్పనలు చేయువాడే సమస్త ఆపదలకు పాత్రుడు అగుచున్నాడు. ఈ దామ - వ్యాళ - - కటులలో అట్టి కల్పనలు లేవు.

సర్వజ్ఞుడు, సర్వవ్యాపియు అయినట్టి ఆత్మతత్త్వమును గ్రహించకుండా “నేను పరిమితము -

పరిచ్ఛిన్నము అయినట్టి ఈ దేహాదులకు, దేహముచే ఏర్పడుచున్న సంబంధములకు చెందిన వాడనే కదా! ఈ తదితరులు కూడా అట్టివారే” అని తలచువాడు మోహమును పొందుచున్నాడు. మూర్ఖత్వమును ఆశ్రయించు వాడగుచున్నాడు.

దేహాత్మ బుద్ధి కలిగి వర్తించువాడు ‘జననము మరణము-బాల్యము-వార్ధక్యము’ అనునవన్నీ తన స్వరూపముపై ఆపాదించుకుంటున్నాడు. అనంతము, అప్రమేయము అగు ఆత్మను "శరీర మాత్రం”గా కల్పన చేసేవాడు తనయొక్క ఆత్మను తానే అల్పమైనదిగా చూస్తున్నాడు.

ఓ దేవతలారా! ఈ మూడు లోకములలో కూడా ‘ఆత్మ’ కంటే వేరైన వస్తువేమున్నది? లేదు. కనుక ‘ఆసక్తి’ అను బంధాన్ని పొందుట అనుచితమే అవుతుంది. “అసలు ఈ సర్వదుఃఖాలకు మూలకారణమేమిటి?” అను ప్రశ్నను జ్ఞానదృష్టితో తర్కించినపుడు, అసద్వస్తువునందు సత్యత్వ బుద్ధి కలిగియుండి, అసత్ విషయములపై నమ్మకంతో వ్యవహరించుటయే” అని విజ్ఞులు గ్రహిస్తున్నారు.

ఈ దామ - వ్యాళ - కటులకు ప్రపంచము యొక్క స్థితి పట్ల “ఇది సత్యమే” అను బుద్ధి ఏ మాత్రం లేదు. అందుచేత వారిని మీ మామూలు బలపరాక్రమములతో జయించుట దుర్లభమే. దేవతలు : పితామహా! మరి మా గతి ఏమిటి?

శ్రీ బ్రహ్మదేవుడు : మీరంతా ఒక పని చేయండి… మీరు ఓడిపోయినట్లుగా వారిముందు మరల మరల నటించండి. వారికి జయ అపజయముల పట్ల, శరీర - మమత అహంకారముల

పట్ల అభిమానం, అభిజాత్యం ఏర్పడేటట్లు చేస్తూ పోండి.

ఇంద్రుడు : హే మహామతీ! అమరావతిని కోల్పోయి మేమంతా దీనులమయ్యాం. ఈ దీనత్వం తొలగేది ఎట్లా?

Page:140

శ్రీ బ్రహ్మదేవుడు : సకల దుఃఖములకు కారణం దేహాత్మ బుద్ధియే. “ఈ నా దేహమునకు ఏమైనా అయినదా, అంతే… ఇక నా పని అయిపోయినట్లే”… అనునదే దేహాత్మబుద్ధి, మరియు దేహాభిమానం. అట్టి “అసత్య“ మగు వాసన ఎవని అంతఃకరణమునందు ఉంటుందో, అతడు ఆ జనన-మరణ రూపమగు దీనత్వమునకు లోనగుచున్నాడని గ్రహించండి. అట్టి వాడు ’నేను జయించబడుచున్నాను” అను భావోద్రేకం పొందుచున్నాడు. “ఈ దేహమునకు విలక్షణమైన అప్రమేయమగు ఆత్మనే నేను” అను భావన ఒక దోమకు ఉన్నా సరే, ఆ దోమ సుమేరు పర్వతంవలె అచలంగా, అచంచలంగా ఉండగలదనుటలో ఏమాత్రం సందేహం లేదు.

ఏ వాసన ఎచట ఉంటుందో అది అచట స్థూలత్వం పొందుతూ ఉంటుంది.

‘ధర్మి’ ఉన్న చోటే ధర్మము, ‘భావించువాడు’ ఉన్నచోటే భావన ఏర్పడుచున్నాయి. అందుచేత ఎవరెవరికి ఏదేది సంభవిస్తున్నా అదంతా భావన, వాసన, ధర్మము అను మూడింటినీ అనుసరించే ఉంటున్నాయి. నాయనా ఇంద్రా! కనుక, నీ దీనత్వమునకు కారణమేమో నీవే సూక్ష్మబుధ్ధితో గ్రహించు.

ఇంద్రదేవా! ఈ దామ వ్యాళ కటులకు సంబంధించిన వర్తమాన విషయానికి వద్దాం. ఎట్లాగైనా సరే, వీరి యొక్క అంతఃకరణములలో “ఈ జయాపజయములన్నీ మావి. ఈ ప్రసిద్ధమై కనబడుచున్న దేహాదులే మేము” అను వాసన కలిగేటట్లు చేయాలి.

ఓ బిడ్డలారా! ఈ జీవుని యొక్క సమస్త విపత్తులు, సమస్త భావాభావదశలు ‘తృష్ణ’ అనే కంటకవృక్షము నుండి బయలుదేరుతున్నాయి. వాసనాతంతువులచే బద్ధులైన వారికి మాత్రమే “మేము దీనికి సొంతదారులము” అనే విపరీత జ్ఞానం ఉదయిస్తోంది.

వాసనలు వృద్ధి చెందుచున్న కొలదీ దుఃఖములు ప్రాప్తిస్తూనే ఉంటాయి. వాసనలు సన్నగిల్లితే అది పరమసుఖమును ప్రసాదిస్తూ ఉంటుంది.

ధీరో_ప్యతి బహుజ్జోపి కులజోపి మహానపి |

తృష్ణయా బధ్యతే జన్తుః సింహః శృంఖల యాయథా ॥ || (సర్గ 27, శ్లో. 32)

ఒకడు గొప్ప ధీరుడు కావచ్చు… అనేక శాస్త్ర విషయాలు తెలుసుకొని ఉండవచ్చు, అనర్గళముగా అనేక శాస్త్రవాక్కులు ఉటంకిస్తూ ఉపన్యసించవచ్చు. గొప్ప కులములో జన్మించి ఉండవచ్చు, మహామహుడు కావచ్చు…. కాని ఏం లాభం? అతడు తృష్ణ, వాసనలకు వశమైనాడా - అల్పత్వము ఉండియే తీరుతోంది. “దేహం” అనే వృక్షంపైగల “హృదయకమలం” అనే గూటిలో ఈ “జీవుడు” అనే పక్షి ప్రవేశించి కిలకిలారవాలు చేస్తూ ప్రశాంతంగా ఉండగా, ‘తృష్ణ’ అనే వల క్రింద “ఇంద్రియ విషయాలు” అనే ధాన్యపు గింజలను చల్లి ‘మాయ’ అనే బోయవాడు చాటుగా నక్కి ఎదురుచూస్తున్నాడు. ఈ జీవులు అమాయకంగా ఆ వలపై వ్రాలుచున్నారు. ఇంకేముంది? మాయ అనే వేటగాడు మెడవంచి ఈ జీవులలో అనేకమందిని “దుఃఖ పరంపరలు” అనే బుట్టలో

Page:141

కుక్కి ఉంచుచున్నాడు. ఒక పక్షి దారముచే బంధింపబడి వివశ అయినప్పుడు ఒక అజ్ఞానబాలుడు కూడా దానిని పట్టి అటు ఇటు ఈడవగలడు కదా! ‘తృష్ణ’ అనే త్రాడుచే బంధింపబడిన ఈ జీవుడు స్వల్ప సంఘటనలచే, చిన్న చిన్న మాటలచే కూడా ఎంతగానో వేసట చెందుచున్నాడే!

ఈ దామ - వ్యాళ - కటులలో అట్టి తృష్ణను తట్టి నిదురలేపారో, ఇక వారిని మీరు తప్పక

జయించగలరు.

ఇప్పుడు ఈ శస్త్రాస్త్రములను ఉపయోగించి ఆ దామ-వ్యాళ కటులపై ఎంతగా యుద్ధం చేయటానికి ఉపక్రమించినా, అదంతా వ్యర్థమే అవుతుంది. కాబట్టి ఏవైనా ఉపాయాలతో వీరి యందు వాసనావృత్తిని, అభిమానమును అధికం చేయండి. ఎందుకంటే మీ ఈ శత్రువులకు వర్తమానంలో ‘స్త్రీ-ధన-ప్రియవస్తు-ప్రఖ్యాతి’ వంటి శుక్రనీతి విశేషముల పట్ల ఆకాంక్ష లేదు. కేవలం యుద్ధము యొక్క అభ్యాసవశం చేత ప్రమత్తులై సంకల్పంచే. వారిని అహంకారమయ మగు వాసనలను ఆశ్రయించేటట్లు చేసి, తద్వారా వారి జయించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాసనాబీజమే లేకుంటే, తదితరములైన ఉపాయాలు వారిపై ఫలించవు. పనిచేయవు. ఇంద్రుడు : ‘అహంకారవాసన’ అంటే మీ ఉద్దేశమేమిటి?

బ్రహ్మదేవుడు : "ఆహాఁ! మేము ఎంతటి పరాక్రమము గలవారము! ఎంత తెలివిగలవారము! ఇతరుల కంటే మేమే గొప్పవారం! ఇంతటి గొప్పవారమయినట్టి మా కీర్తి - ప్రతిష్ఠలు ఇంకా ఎంతో ప్రకాశించుగాక! ఈ శరీరము, ఈ తదితరులు మా పట్ల చేయు స్తోత్రములు ఇట్లే మాకు ఉండు గాక!…. అనే మమకారం వారిలో వృద్ధి కావాలి. ‘నాది’ అనునది లేనిచోట అహంకారమే ఉండ జాలదని నిశ్శంకగా చెప్పవచ్చు. ఎప్పుడైతే, “మేము గొప్పవారము కదా!” అనే అభిమానం వృద్ధి చెందుతుందో, అప్పుడు మరుక్షణం “ఇట్టి గౌరవమన్ననలు మేము కోల్పోతామేమో!” అనే అధైర్యము, నిస్సత్తువ వెంటనంటి ఉంటాయి. అప్పుడు మీరు వారిని ఇతఃపూర్వపు రాక్షస సైనికులవలెనే నిర్జించివేయగలుగుతారు. వారు ముగ్గురు వాసనలను ఆశ్రయించిన మరుక్షణం వారి పరాజయమునకు, పతనమునకు నాంది పలికినట్లే.

అందుచేతనే సుజ్ఞానులగు ఉత్తములు వాసనలను త్యజించు ప్రయత్నంలో శాస్త్రాదులను ఆశ్రయిస్తున్నారు. విధి - విధానాదులను నిర్వర్తిస్తున్నారు.

కాబట్టి, దేవతలారా! అభ్యాసవశంచేత ఆ ముగ్గురు వాసనాసహితులైయ్యేంత వరకు యుక్తి పూర్వకంగా యుద్ధం చేయండి. “ఓడి పోవడం - పొగడటం”… అను ఉపాయాలతో సంసారదోష వ్యవహారనియుక్తులు అయ్యేట్లు చేయండి. వాసనాబద్ధులైన తరువాత వారే మీకు వశులు అవుతారు. వాసనలచే బద్ధులు అయినవారెవ్వరూ అజేయులై ఉండగలరా? లేనేలేదు. పరిస్థితులు అతిత్వరలో వాసనాబద్ధులకు - అపజయము రుచి చూపటానికి సంసిద్ధమౌతూనే ఉంటాయి.

స్వవాసనా బలంచేతనే క్షణిక, విపరీతార్థ రూపమగు ఈ జగత్తు ఇంతటి ప్రభావము, దీర్ఘానుభవత్వమును పొందుతోంది సుమా!

Page:142

ఈ జగత్తు వాసనారూపమే అయివున్నది! ఓ బిడ్డలారా! దేవతలారా! సర్వజనులారా! మీరంతా మీ వాసనలకు వర్తమానమునందే సరిఅయిన చికిత్సను ఆశ్రయించండి… అని హెచ్చరిస్తున్నాను. వాసనా బీజములను తొలగించుకొని, నిత్యవిజయులు కండి.

ఇట్లు పలికి భగవంతుడగు బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దేవతలు ఆ చోటు వదలి తమ తమ స్థానములకు చేరారు.

  1. పునః యుద్ధం

బ్రహ్మదేవుని వాక్యములు మరల మరల పునశ్చరణ చేసుకుంటూ, దేవతలు తమ తమ రహస్య స్థానములలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఒక శుభముహూర్తంలో యుద్ధ సన్నిద్ధులై దుందుభులు మ్రోగించారు. మరల దేవ దానవ యుద్ధం ప్రారంభం అయింది.

మిక్కిలి భయంకరమైన ఆ యుద్ధం "ఆత్మ చైతన్యమున జగత్తురూపంలో వికారము ఇట్టి సంఘర్షణగానే ప్రారంభమవుతోంది కాబోలు” అన్నట్లుగా దుస్తరమై సాగింది. కొంతసేపు దేవతలు తమ మాయను ప్రయోగిస్తూ యుద్ధం చేస్తూ వచ్చారు. ఇంతలోనే పలాయనం చిత్తగించసాగారు. మరొకప్పుడు దానవులతో సంధి చేసుకుంటున్నారు.

ధైర్యంగా యుద్ధం చేయటం. అంతర్జానం కావటం. శరణాగతి కోరటం.

ఈ విధంగా అనేక యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధం 30 సంవత్సరములు జరిగింది. రెండవది ఐదు సంవత్సరములు, మూడవది పండ్రెండు రోజులు.

ఇంతలో ఆ దామ - వ్యాళ - కటులు, తదితర సైనికులు ఇట్లు యోచించసాగారు. “ఆహాఁ! ఈ లోకప్రసిద్ధులైన దేవతా వీరులు కూడా మమ్ము ”శరణు శరణు" అంటూ వేడుకొనుచున్నారే! మంచిది. అవునులే… మా ముందు ఎవ్వరైనా సరే, ఎంతటివారు? వీరంతా ఎంత స్వల్పమైన వారు! మేము మహాపరాక్రమవంతులం. మాకు ఏవేవో వస్తువులను దానం చేస్తూ మా నుండి ’క్షమ’ను అర్థిస్తున్నారు కదా!”

ఈ రీతిగా ఏదో మాత్సర్యముతో కూడిన అహంకారం అంతరంగమున ఎక్కడి నుండో బయలుదేరింది. అట్టి అహంకారము యొక్క దృఢాభ్యాసంచేత వారు క్రమంగా వాసనాగ్రస్థు లయ్యారు. అనేక యుక్తులచే దేవతలు చేసిన ప్రయత్నములు వారిలో దంభమును, దర్పమును, అభిమానమును పెంపొందించసాగాయి.

అహంకారం నందు వారికి ఆత్మబుద్ధి (‘నేను అహంకారమును’ అను భావన కలిగింది… “మేము గొప్పవారము.”“ఈ గొప్పతనము మాకు ఎప్పటికీ ఉండుగాక!”“ఇదంతా అనుభవించుటకు మేము జీవించి ఉండలేకపోతే ఎట్లా…?”“మేము జీవించినంత కాలం ధనప్రాప్తి కలుగుగాక! ఈ దేవతలను ఇట్లాగే ఓడించుచు, వీరివద్ద అనేక వస్తుజాలములను

Page:143

దానముగా పొందెదము గాక!" అని తలచసాగారు. క్రమంగా ఏదో తెలియరాని లోభము, అభిజాత్యము పునాదిగాగల దైన్యము, దీనత్వము వారియందు చోటు చేసుకున్నాయి.

మొట్టమొదట ’ఇది అవస్య ప్రవృత్తి’ - - ‘ఇది నిషిద్ధ ప్రవృత్తి’ (ఇది ఇట్లు ఉండుగాక - అది అట్లు ఉండకూడదు… అను ప్రవృత్తి)కి సంబంధించి కించిత్ వాసన ఏర్పడింది. "మా దేహము రోగరహితము, భోగసమర్థము అయితేనే కదా మేము కలకాలం లోక ప్రసిద్ధులమై ఉండగలిగేది!” అను మోహముతో గూడిన వాసనచే వారు గ్రస్థులయ్యారు. ‘ఆశ’ అను పాశమున బంధింపబడి క్రమంగా ఒళ్ళు దాచుకోవటం అలవాటు చేసుకోసాగారు.

ఒకప్పుడు అహంకారరహితులై భాసించిన ఆ దామ-వ్యాళ-కటులు ఇప్పుడు త్రాడును చూచి ‘పాము’ అని భ్రమించేవారి వలె, ‘చావు వద్దు, బ్రతకాలి’ అను రూపముగల ఒకానొక రాగమును, తత్సంబంధమైన అనేక కల్పనలను పెంపొందించుకున్నారు.

క్రొత్తక్రొత్త ఆశలు, తృష్ణలు చిగుర్చాయి. “ఆపాదమస్తకము మా ఈ దేహము సుస్థిరంగా ఉండేది ఎట్లా?” అనే నూతన వేదన వారిలో ప్రారంభమైంది. మా శరీరాలు బాగా ఉండాలి… ఈ ధనాదులన్నీ మా సుఖము కొరకే కదా…” అని అనుకుంటూ, అనుకుంటూ క్రమక్రమంగా బద్ధచిత్తులు అయినారు. వారి మునుపటి ధైర్యం కాస్తా కొంచంకొంచంగా క్షయించసాగింది. వాసనాసహితులవటం చేత శరీరబలం తగ్గటం ఆరంభించింది. ఇంతకు ముందు ఉండి ఉన్న పరాక్రమం, శత్రువులను సంహరించాలనే దీక్ష లోపించాయి. ‘సమర్థత’ సన్నగిల్లింది. ‘దీక్ష’ కొనసాగేచోట మాత్రమే ‘దక్షత’ కొనసాగుతుంది కదా!

అహంకారముతో కూడినయున్నట్టి వారికి, అప్పుడు, భయంకర సంసారము’ను ప్రాప్తింప జేసే స్త్రీ-అన్న-పాన-భోగములందు రాగము కౌతుకము లోభము హెచ్చింది. ఇక ముగ్గురిలో ప్రతి ఒక్కరు “వీడు ఎంతగా శ్రమిస్తాడు? కొంచెమే కదా! మరి నేను ఎందుకు శ్రమించాలి?” అను లోభమునకు సంబంధించిన సాపేక్షతను పొందసాగారు. మహోత్సాహమంతా నశించి “ఒకవేళ ఈ యుద్ధంలో చస్తామేమో?” అని మరల మరల అనుమానించసాగారు. కేవలం దేహరక్షణ మాత్రమే వాంఛించుచూ, మరణము పట్ల భయభీతులై ఉన్నారు. అప్పటి నుండి, ఇంధనము క్షీణించినప్పటి అగ్నివలె వారి బలం సన్నగిల్లింది. శత్రువులగు దేవతల ముందర నిలువలేక పోయారు. శరీరమునందు అక్కడక్కడ గాయాలు అవటం చూచి బెంబేలెత్తిపోయారు. వారు కూడా సామాన్య సైనికులవలెనే ప్రవర్తించేవారు.

కొంతకాలానికి దేవతల విజృంభణను తట్టుకోలేక దైత్యులంతా భయంతో ఆకాశము నుండి క్రిందకు పడ్డారు. అనేకమంది దానవుల శరీరాలు విచ్ఛిన్నం కాసాగాయి.

ఇట్లు సైన్యమంతా నేలకూలటం, నశించటం, శంబరాసురుని దృష్టికి వచ్చింది. ప్రళయాగ్నివలె మండిపడుతూ ’ఆ దామ-వ్యాళ కటులు ఎక్కడ…?” అని ఘీంకరించాడు. అయితే ఆ ముగ్గురు శంబరుని ఎదుటపడటానికి భయపడ్డారు. పాతాళంలోని ’నరకము’ను

Page:144

పాలించు కొందరు సామంతులను వారు శరణువేడారు. అక్కడ! శరణాగతులై, అభయం పొంది, అక్కడి రాజకన్యలను వివాహం ఆడి రోజులు గడపసాగారు. అనేక దుష్టవాసనలను గ్రహించి దీర్ఘకాలం గడిపారు. “ఈమె నా ప్రియురాలు - ఇది నా ప్రభుత్వము"… అని తలచుచు, దృఢ బంధమున తగుల్కొనినవారై రోజులు గడపసాగారు.

నరకలోకమునకు అధిపతి యమధర్మరాజు. ఒకానొకరోజు ఆయన ఏవో మహానరక కార్యముల గురించి విచారించటానికి నిజేచ్ఛను అనుసరించి ఆ ప్రదేశానికి వచ్చాడు. అతడు నరక లోక చక్రవర్తి అని తెలియక సామాన్య సైనికుడని తలచి ఆ ముగ్గురు వినమ్రులు అవక పోగా… తిరస్కారభావంతో దూషించటం, ఎగతాళి చేయటం, గేలిచేయటం జరిగింది. అప్పుడా యముడు వారిని కనుసైగమాత్రంతో “మహారౌరవం” మొదలగు నరక భూములలో పడత్రోయించాడు.

అక్కడి రేరవ-వాయువులచే వారు దగ్ధం కావించబడ్డారు. ఈ జీవుడు శరీరము త్యజించినా అతని వాసనలు అతనిని విడువవుకదా! అంతరంగమునందలి క్రూరవాసనల ప్రభావం చేత ఒక కిరాతరాజు సేవకులుగా జన్మించారు. ఆ జన్మలోవారు “వధించుట-బంధించుట” అను హింసా పూరిత క్రియలు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆ తరువాత జన్మలో వాళ్ళు కాకులు అయ్యారు. అక్కడి నుండి గ్రద్ధలై పుట్టారు. ఆ తరువాత చిలక, కుక్క, మేక, కీటకము మొదలైన అనేక జన్మలెత్తారు. ప్రస్తుతం వారు కాశ్మీరదేవాలయంలో గల ఒక చిన్న చెరువులో చేపలరూపంలో నివసించు చున్నారు. బురదలో చిక్కి దీర్ఘకాలంగా ఉంటూ వారు మరణించుటలేదు. జీవించుటలేదు.

చూచావా? వారు అనేక జన్మపరంపరలను మరల మరల అనుభవించారు. వారి భవిష్యత్తులోకి తొంగిచూచినప్పుడు వారు ఇంకా ఏవేవో అనుభవించబోవుచున్నారని తెలుస్తోంది. సముద్రంలో తరంగాలవలె వాళ్ళు ఉత్పన్నమగుచున్నారు, నశించుచున్నారు. ఆ విధంగా సంసార తరంగమున చిక్కుకుని, వాసనాతంతువులచే ప్రేరితులు అగుచు ఆ ముగ్గురు ఏ మాత్రం శాంతిని పొందలేకపోవుచున్నారు. అందుచేత, రామా! “నీవు దామ - వ్యాళ - - కట న్యాయం ఆశ్రయించ వద్దు" అని హెచ్చరించటం జరిగింది. వాసనల యొక్క దారుణమైన అనర్థమును అందరు గ్రహించటానికే ఈ దృష్టాంతమంతా నీకు చెప్పాను.

4. ‘అహమ్’ కారము దేనికి సంబంధించినది?

శ్రీరాముడు : ఆహాఁ! అవివేకం చేత, అనంతమైన సంసార దుఃఖములను అనుభవించటానికే ఈ చిత్తము పరవళ్ళు త్రొక్కుతూ, ‘నేను - నాది’ అను ఆపదను గ్రహిస్తోంది కదా! ఆ దామ - వ్యాళ

కటుల గతి ఎంత చిత్రంగా పరిణమించింది! ‘దేవతలు’ అంతటి వారిని కూడా భయపెట్ట గలిగినట్టి శంబరాసురుని సైన్యమునకు సేనాధిపతులై ఉండటం ఎక్కడ?… బురద నీటిలో చిక్కి సూర్యతాపమునకు తపించే చేపల జన్మ ఎక్కడ…? అహంకార రహితమగు ’చైతన్య సత్వము’

Page:145

యొక్క ఉత్తమ మహిమాతిశయము ఎచ్చట…? ఒక అడవిలోని ఆటవిక రాజుకు సేవచేస్తూ స్వల్పకార్యములను నిర్వర్తించు సేవకజనులవట మెచ్చట? ఇచ్చ, వాంఛ, ఉద్వేగంలోని ‘యుద్ధం చేయుట’ అను ధర్మమును పాలించుట ఎక్కడ…? మిథ్యావాసనల ఆవేశముచే పరిగ్రహింపబడి దుష్టమగు అనేక సంకుచిత వ్యాపకములందు చిక్కుకొనుట ఎంతటి ఘోరమైన విషయం!

శ్రీ వసిష్ఠ మహర్షి : నిజమే! అనేక, శాఖోపశాఖలుగా విస్తరించియున్న ఈ ‘సంసారవిషలత’ అనేది ‘అహంకారము’ అను అంకురము నుండే విస్తరించి వ్యాపించుచున్నది. కనుక రామా! ఈ అహంకారమును హృదయము నుండి తుడిచివేయాలి.

అసలు ఈ అహంకారమును మిథ్యయే అయివున్నది. ఎందుకంటావా?

‘యిదం’ అను ప్రత్యయముచే శాస్త్రములు సూచిస్తున్నట్టి ఈ కనబడే ‘దృశ్యము’ జడమే కదా! దీనికి స్వయంప్రతిపత్తి ఎక్కడున్నది? ఇది ‘అహంకారము’ అను పదార్థమునకు సూచకం కాజాలదు కదా! కాబట్టి ‘అహంకారము’ దృశ్యమునకు సంబంధించినది… దృశ్యముచే ఏర్పాటు చేయబడుచున్నది…. అని అనటానికి వీలులేదు.

‘చైతన్యము’ ఇది సర్వమునకు సాక్షిరూపము అయివున్నది కదా! సర్వసాక్షిమాత్రము నందు అహంకారము ఘటిల్లుటకు అవకాశమెక్కడిది? కాబట్టి ‘అహంకారము’ అనబడేది అటు దృక్ (The perceiver) కు, సంబంధించినది కాదు.

కనుక ‘అహంకారం’ అనబడేది దృక్ (ఆత్మ) దృశ్యములకు (Object) కూడా సంబంధించినది కాదు. ఆరెండింటికీ భిన్నమే అయివున్నది. ఆ రెండు తప్పితే ఇక్కడ మరింకేమీ వాస్తవానికి లేదు. అందుకే… “అహంకారము అనేది ఉండటానికి స్థానమే లేదు…” అను నిశ్చయమును జ్ఞానులు ప్రవచిస్తున్నారు. అందుచేత, “అహంకారము అనబడేదేది ఎక్కడా లేదు… అను జ్ఞేయమును ఆశ్రయించి, సుఖస్వరూపడవు కమ్ము. లేనివస్తువగు అహంకారమును తొలగించుట ఏమిటి? అందుచేత, “నేను ఇంకా అహంకారమును తొలగించుకోవలసియున్నది” అనునది భ్రమచేతనే "అసంగతము - అనవసరము” అగు శ్రమగా ప్రాప్తించుచున్నదని గ్రహించు.

‘పరమార్థము’ (The highest essence of Self) యొక్క రూపము వాస్తవానికి ఆనంద మయము, త్రివిధ తాపరహితము అయివున్నది. అయినప్పటికీ, అహంకారము అనబడు భ్రమ యొక్క కల్పనచే ఆచ్ఛాదితమగుటచే ’లేదేమో’ అను చమత్కారము కలిగించి, అదృశ్యరూపముగా కనబడుచున్నది. అనగా, ఈ జీవుని దృష్టికి .. “దోషరహితము, సర్వత్రా సర్వము నందు ప్రసరించియున్నది”… అగు స్వస్వరూపము దృశ్యమానమగుటలేదు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు? జన్మరహితము, నామరూపరహితము అగు తనను తానే అతడు గ్రహించుటలేదు. గురువులమగు మేము వచ్చి “ఓయీ! జీవుడా! నీ రూపము ఇట్టిది” అని గుర్తు చేయవలసివచ్చుచున్నది. అయినా ఇతడు వినీ వినకుండా పచార్లు చేస్తున్నాడు.

+

Page:146

ఆ ముగ్గురు దానవసేనానాయకులు ‘అహంకారం’ అనే పిశాచంచే పీడింపబడిన వారగు చున్నారు. కదా! వాస్తవానికి వారు దర్పణములోని ప్రతిబింబిత వస్తువులలాగా అసద్రూపులే అయి వున్నారు. అయితే మాయ యొక్క మహత్మ్యముచే సత్తాను పొందారు. ఏవేవో ఉపాధులలో ప్రవేశించారు. ఇప్పుడు చేపల ఉపాధులు పొంది ఒక మురికి గుంటలో తచ్చాడుతూ ఆకలికి అలమటిస్తున్నారు. వారి యాతనలు వర్ణనాతీతం.

శ్రీ రాముడు : మహాత్మా! ఆ ముగ్గురు దామ-వ్యాళ కటులు శంబరాసురుని మనోకల్పనా రూపులే కదా! అసద్వస్తునకు ‘ఉనికి’ గాని, సద్వస్తువుకు ‘లేమి’ గాని సంభవించవు కదా! * మరి అసద్రూపులగు ఆ దామ - వ్యాళ - కటుల ఉనికి ఎట్లా ఏర్పడింది? ఎట్లా జన్మపరంపరాదులకు దారి తీసిందో నేను గ్రహించలేకున్నాను. ఇందలి చమత్కారమేమైయున్నదో వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పింది నిజమే. అసద్వస్తువుకు ఉనికి ఎక్కడా సంభవించదు. కాని అల్పము, అసత్యము అయినది ఒకానొక బృహత్ వస్తువుగా కనబడటం జరుగుతోంది.

ఇక అసలైన బృహత్ వస్తువు అత్యంత సూక్ష్మమై, దృష్టికి లభించనిదై ఉంటోంది. ‘లేనిది’ ఉన్నదానివలె, ‘ఉన్నది’ లేనిదానివలె అగుపడుచున్నాయి!

అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అసద్వస్తువు సద్వస్తువుగా అగుచున్నదో చెప్పు? సద్వస్తువు సద్వస్తువుగానే ఉంటోంది. అసద్వస్తువు అసత్తే.

ఎటొచ్చీ వాటిని విడదీయుదృష్టిని అనుసరించి చీకటి - - వెలుగులవలె జ్ఞాన - అజ్ఞానములు ఏర్పడుచున్నాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! మరల నా సంశయమును చెపుతాను వినండి. మీరు, నేను, తదితర సభ్యులు ఇక్కడ ఉండి, ఈ సభలో ఒకానొక విషయం గురించి సంభాషించుకుంటున్నాం కదా! మనందరియొక్క ‘సత్త’ (Existence)ప్రత్యక్షముగా సిద్ధించుచున్నది.

ఇక ఆ దామ - వ్యాళ - కటులనే ముగ్గురు దానవసేనానాయకులు మాయచే కల్పించబడిన వారే కదా! కనుక వారు స్వప్నములో కనిపించే జనులవలె అసద్రూపులే మరి! అట్టి అసద్రూపులు అహంకారములను, జన్మపరంపరలను, స్వకీయమైన ఇచ్ఛను పొందటమేమిటో వివరించండి. శ్రీ వసిష్ఠ మహర్షి : మాయామయులగు ఆ ముగ్గురు దానవ సేనానాయకులు ‘అసద్రూపులు’ అనే మాట నేను ఒప్పుకుంటాను. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉన్నది. ఒకడు మృగతృష్ణలో “ఇది జలమే కదా” అను అనుభూతి పొందుచున్నాడనుకో… అతనికి అక్కడ జలము ఉన్నట్లే కనిపిస్తోంది కదా! ఆ రీతిగానే వాళ్ళు అసద్రూపులు అయినప్పటికీ సత్యంవలె భాసించుచున్నారు.

నా సతో విద్యతేభావో నాభావో విద్యతేసతః |

‘సత్త’కు ‘ఉండకపోవడం’ అనేది లేదు. ’అసత్తు’కు ఉనికి లేదు. మాయ = యామా = ఏదైతే లేకయే ఉన్నదో …

Page:147

అదే విధంగా సురులు, అసురులు, దానవులు - వీరంతా మిథ్యా రూపముగానే భాసిస్తున్నారు. వారంతాయే కాదు, నీవు, నేను, తదితర సభ్యులు… మనమంతా కూడా ఈ జీవరూపము దృష్ట్యా మిథ్యారూపముగానే విజృంభింస్తున్నాము, పోవుచున్నాము, వచ్చుచున్నాము. ’నేను రాముడను’ అను వ్యష్టిత్వమునకు సంబంధించిన భావన, ‘నేను వసిష్ఠుడను’ అనబడు శరీరభావన కూడా మిథ్యారూపములే అయివున్నాయి.

శ్రీరాముడు : ఈ "నేను - మీరు - - తదితరులైన ఇక్కడి సభికులు”… అవన్నీ వివిధ రీతులుగా అనుభూతములై ప్రాప్తిస్తున్నాయి కదా! మరి ’ ఇవి లేవు’ అనునది ఎట్లు సమంజసము?

శ్రీ వసిష్ఠ మహర్షి : “స్వప్నమునందలి స్వమరణము” అను దృష్టాంతమును మరల ఇక్కడ ఉపయోగించి చెప్పుచున్నాను, విను. ఒకడు అప్పుడే నిదురలేచి ప్రక్కవానితో, ”మిత్రమా! నాకు ఇప్పుడు ఒక దీర్ఘమైన కలవచ్చిందోయ్! అందులో నేను చనిపోయాను. ఒక నలుగురు వ్యక్తులు నన్ను మోసుకుపోతున్నారు….” అంటూ ఉన్నాడు. వెంటనే ఆ ప్రక్కవాడు “అట్లాగా! బాగున్నది. అయితే, స్నేహితుడా, ఆ స్వప్నం ఎవరికి? అదంతా ఎవరి కల్పన?” అని ప్రశ్నించాడు. అప్పుడు మొదటివాడు, “భలేవాడివేనయ్యా! అది నా స్వప్నమే… అందుచేత నా కల్పనయే” అన్నాడు. ఇక రెండవాడు, “నీ యొక్క కల్పనలో, నీవే చనిపోతే ఇక స్వప్నం ఎవరికి? స్వప్నమే ఉండజాలనప్పుడు ఆ నలుగురు మనుష్యులు ఎవరు?” అని విశ్లేషణము చేయ ప్రారంభించాడట!

అట్లాగే, ఈ కనబడే అనేకమంది జీవులు, అనేక శరీరములు అను రూపమున ఉండి ఉంటున్నదంతా మిథ్య, అసద్రూపము అయి ఉన్నాయి.

స్వప్నమునకు సంబంధించినదే మరొక దృష్టాంతము చెపుతాను. విను. ఒకడు తన కలలో ఎప్పుడో చనిపోయిన తన బంధువును చూచాడనుకో… ఆ బంధువును ‘చూచుట’ అను అనుభూతి అతనికి సత్యముగానే ప్రాప్తిస్తోంది కదా! అయినాకూడా అతడు చూచినది అసద్రూపమునే కదా! అట్లాగే, ‘అతడు మరణించాడు’ అను జ్ఞానము కూడా అసద్రూపమే అయివున్నదని ప్రజ్ఞా వంతులగు జ్ఞానులు గ్రహించుచున్నారు. ఎందుకంటావా? ఈ కనబడే జగత్తు ఇందలి సంబంధ బాంధవ్యములచే ఏర్పడు ప్రియాప్రియములు ’మిత్ర అమిత్రములు ఇవన్నీ స్వప్నమాత్రము, మాయామాత్రమే అయివున్నాయి.

“ఈ జగత్తు సత్యమే” అను దృఢనిశ్చయంగల జీవుడు మాత్రం ఇందులోని నిత్యానిత్యముల చమత్కారమును గ్రహించలేకపోతున్నాడు. కళ్లు మూసుకున్న వారు ఎదురుగా ఉన్నదేదీ చూడనట్లు, పరమ మూఢత్వం వహించినవాడు “మార్పు చెందుచున్నది; మార్పుచెందనిది” అను రెండింటినీ విడదీయలేకపోతున్నాడు.

‘పరమార్థ విచారణ’ అనే అభ్యాసం లేకపోతే ఈ జగత్తుకు సంబంధించిన… “ఇదంతా వాస్తవమే”… అను అనుభవం అంత తేలికగా తొలగదు. తత్త్వవిచారణ లేనివాడెవ్వడూ వాస్తవ మేమిటో గ్రహించలేకపోతున్నాడు. అట్లు నిత్యానిత్యవివేకము పొందుటచే లభించు ప్రయోజన

Page:148

మేమిటో గుర్తించలేకపోతున్నాడు. అందుచేతనే…“బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్యయే” అనేది ప్రతిపాదించ బడుచున్నప్పుడు అజ్ఞాని అపహాస్యంగానే గాంచుచున్నాడు.

ఒకడు మత్తుగా కల్లు తాగి ఉన్నాడు. మరొకడు ఎట్టి మత్తుపానీయం సేవించలేదు. ఈ ఇద్దరి యొక్క ప్రపంచ దర్శనంలో మేళవం లభిస్తోందా? లేదు. అంధకారం - ప్రకాశాలకు, ఛాయ - ఎండతాపములకు ఐక్యత సిద్ధించదు కదా! అట్లాగే జ్ఞాని - అజ్ఞాని ఒకే ప్రదేశమున ఉన్నప్పటికీ, వారి దృష్టి ఏమాత్రం ఏకత్వము పొందుటలేదు. ఒక శవమును చూచి, "ఓ శవమా! కాసేపు అటూ ఇటూ నడువవచ్చును కదా!” అంటే నడుస్తుందా? పిలిస్తే పలుకుతుందా? లేదు. అజ్ఞాని ముందు ఆత్మ - అనాత్మ విశ్లేషణ అనేకసార్లు “చెవిటివాని ముందు శంఖానాదమే” అగుచున్నది. అతడు సత్యమగు సాక్షి స్వరూపమునందు నిలకడ పొందలేకపోవుచున్నాడు. మనస్సు, బుద్ధి మొదలైన వాటి రూపములో బాహ్యభ్యంతరములందు ద్వైత ప్రపంచము యొక్క అనుభూతినే అవిచారణపరుడగు జీవుడు పొందుచున్నాడు. ఎంత బోధించినప్పటికీ అతడు తన అంతరంగంలో ద్వైత ప్రపంచాన్ని నిషేధించలేక పోవుచున్నాడు.

“ఈ జగత్తంతా బ్రహ్మమే” అనే కధనం అజ్ఞానిపట్ల ఏమాత్రం యోగ్యం అగుట లేదు. ఒకడు తపస్సు, బ్రహ్మవిద్య యొక్క అభ్యాసం, ఉదార గుణములు… మొదలైనవి ఆశ్రయించక పోతే సంసారదృష్టి ఉండనే ఉంటుంది. ”జగత్తుసత్యమే”… అనునది అనుభూతమొనర్చుకొనువాని ముందు బ్రహ్మం గురించిన వాక్యాలు ఎట్లా వికసిస్తాయి చెప్పు? కనుక, కొంచమైనను జ్ఞానం గల వానికి మాత్రమే "ఈ జగత్తు మిథ్య, ఇదంతా బ్రహ్మమే అయివుంది” అనే కథనం శోభిస్తోంది.

అదే విధంగా ఒక పూర్ణజ్ఞానికి అనేక చర్చలతో కూడినట్టి ఈ విధమైన బోధ అసంగతమే అవుతోంది. “అహంకారమే అసత్యమైనది” అని ఎరిగిన తరువాత అట్టివానికి ఇక దృష్టాంతములతో కూడిన ‘బోధ’ ఎందుకు? అందుచేత, మార్గమధ్యంలోని ముముక్షువు యొక్క ఉపయోగము కొరకే ఈ సంవాదములు, ఈ శాస్త్రప్రవచనములు ఉద్దేశించబడి ఉంటోంది.

శ్రీరాముడు : జ్ఞాని ఈ దృశ్యమును చూస్తున్నప్పుడు దీనినంతటినీ అతడు ఎట్లా, ఏవిధంగా, ఏరూపంగా అవగాహన చేసుకుంటున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క అనుభవంలో ఈ సర్వము ద్రష్టయగు తనతో సహా… బ్రహ్మమే అయి ఉంటున్నది. ఇక అతని స్వానుభవము నందు “ఇది పరిహసింపతగ్గది, పరిత్యజించ తగ్గది…. అనునది ఏదీ ఉండుటలేదు సర్వము బ్రహ్మము నందు స్వభావసిద్ధముగానే ఏర్పడి ఉంటున్నప్పటికీ, తరంగములన్నీ జలమే అయినట్లు ఇక్కడ బ్రహ్మముకంటే వేరుగా ఎక్కడా ఏదీ ఉండదని ఎరుక కలిగి ఉంటున్నాడు. అతడు ఏదీ గ్రహించడు. త్యజించడు.

“పరమాత్మ కంటే వేరుగా నేను ఏమియు కాను. ’బంగారము’నకు ‘ఉంగరత్వము’ అనేది ఒక ప్రతీతి (Something popular but not true) మాత్రమే! సాక్షిస్వరూపుడనగు నా యందు అహంకారము యొక్క ఉనికి కూడా మిథ్యే”… అని జ్ఞాని సుస్పష్టముగా గ్రహిస్తున్నాడు. జల

Page:149

తరంగమును చూస్తూ, “ఇది సువర్ణమై ఉండవచ్చు" అని ఎవడైనా భావిస్తాడా? అట్లే జ్ఞానికి ఈ జగత్తుపట్ల సత్యత్వబుద్ధి కలుగుటలేదు. అజ్ఞానికో… పరమార్థవస్తువగు బ్రహ్మము నందు ‘అట్టిది ఏదీ లేదేమో’ అను అభావము సంభవిస్తోంది. ఫలితమేమిటి? అజ్ఞాని ‘మిథ్యయే’ అగు అహంకారముతో తనను తాను.. మేఘములు ఆకాశమును కప్పుతున్నట్లుగా… కప్పివేసు కుంటున్నాడు. మిథ్యాహంకారమయుడు అగుచున్నాడు. జ్ఞానియో, ’సత్య-నిత్య-ఏకాత్మమయుడు’ అగుచున్నాడు. వీరిద్దరి స్వభావం మరొక రీతిగా మరొకరెవరూ చేయలేరు.

ఏ వస్తువు ఎద్దానియొక్క ’మయమై ఉంటుందో అది ఆ రూపమునే చెందుతుంది గాని,

మరొక రూపము కాదు.

ఇంతకీ ‘రాముడు’ అనగా ఎవరు? వసిష్ఠుడు అనగా ఎవరు? ’నేను ఈ శరీరమును’ అనేది పిచ్చిమాట అని అనవలసిందే. అందుచేత, మనం ఈ శరీరములచే ఒకరికి మరొకరం ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఒకరి వాస్తవమగు ఆత్మరూపం మరొకరి భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదు. బాహ్యమునకు కనుపించే ఈ మన రూపాలు తత్త్వదృష్టికి సత్యమయినవి కావు. ’యుక్తి’ని అనుసరించి చూచినప్పుడు ప్రజ్ఞయే స్వరూపముగాగల మనము శరీరముగా మారినామా? లేదు. శరీరము మనకు ఉపకరణము మాత్రమే! మనము శరీరిగా శరీరమునకు వేరై ఉన్నాము. శాస్త్ర కారులు, జ్ఞానులు ఈ విషయం ధృవీకరించుచూ, “నాయనా! నీవు జన్మరహితుడవు… అఖండుడవు.. నిత్యుడవు… శాశ్వతుడవు…” అని ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు.

చిదాకాశము ఒక్కటే…“నిరంజనము (దోషరహితము), జ్ఞానస్వరూపము వేదాంత శాస్త్ర దృష్టిచే సత్యము”… అయి ఉన్నది. అది సర్వవ్యాపకము. మేము దానిని అనేక విచారణల ద్వారా పరిశీలించిన తరువాత “అది ఉత్పత్తి, వినాశరహితమగు సద్వస్తువు, సర్వజీవుల యొక్క వాస్తవ రూపము”… అని గ్రహిస్తున్నాం.

ఈ జగత్తంతా శాంతము, శూన్యత్వ రహితము అగు ఆ సద్వస్తువుచేతనే పూర్ణమైయున్నది. అట్టి ఆ చిదాకాశమునందే… అసత్యము, విరుద్ధరూపము అయినట్టి… ఈ సృష్టి అంతా భాసించుచున్నది. కంటి దోషముచే బాధపడుచున్న వానికి సహజంగానే ఆకాశంలో వెంట్రుకల వంటి ఆకారములు కనిపిస్తూ ఉంటాయి కదా! అజ్ఞానదృష్టి కలిగియున్నపుడు ఈ ‘సృష్టి’ అనేది పరమాత్మ యందు అనుభవమగుచున్నది. సత్యాత్మ ఏ భావపరంపరలు పొందుతుందో… అట్టి భావనను అనుసరించే ‘అనుభవము’ ఉంటోంది. అనుభవం ఎట్లా ఉంటే చిదాకాశము కూడా అట్లే శీఘ్రముగా సారూప్యమగుచున్నది. సత్యాత్మ యొక్క దృష్టి బలంచేతనే ఏదైనా ఎట్లైనా ఏర్పడు తుంది. “ఇదంతా అసత్యము’ అనునది కూడా సత్యాత్మ దృష్టిచే క్షణములో ఏర్పడగలదు. శ్రీరాముడు : స్వామి! ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం?

Page:150

శ్రీ వసిష్ఠ మహర్షి :

న సత్యమస్తి నాసత్యమితి తస్మాజగత్రయే

యద్యథా వేత్తి చిద్రూపం తత్తథోదేత్య సంశయమ్ || (సర్గ 31, శ్లో 36)

ఈ మూడు లోకములలో “సత్యమైనది’ గాని ‘అసత్యమైనది’ గాని ఏదీ లేదు. అయితే చిద్రూపము లేక సత్యాత్మ దేనిని ఎట్లు ఏ దృష్టిచే గాంచునో, అది అట్లే ఉదయించుచున్నది.

ఆ దాముడు-కటుడు-వ్యాళుడు అనువారు ఎట్లా వ్యక్తమయ్యారో, ఈ జీవము-శరీరముల దృష్ట్యా జీవులందరూ అట్లే వ్యక్తం అయ్యారు. కేవలం వారి గురించే వికల్పములు ఎందుకు? ఈ కనబడే మన ప్రదర్శన కూడా అట్టిదే. కనుక ఇందు సత్యాసత్యములేమి ఉంటాయి? "నిరాకారము, సర్వవ్యాపకము, అనంతము” అగు చిదాకాశమున చైతన్యము ఏ రూపమున ఉదయిస్తుందో రూపముగానే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. చైతన్యమే ఎచ్చట దాముడు మొ॥వారి రూపమున స్వయముగా స్ఫురించిందో, అచట అట్లే, నాయొక్క నీ యొక్క రూపమున స్ఫురించటం, రూపానుభవం పొందటం, సుసంపన్నం కావటం జరుగుతోంది.

ఎడారిలో మనం చూస్తున్నది కిరణములనే అయినప్పటికీ, “ఇది (మృగతృష్ణా) జలం" అంటున్నాం కదా! నిరాకారమగు చిదాకాశము తనయొక్క ’స్వప్న ప్రతిభాస’కు ‘జగత్తు’ అనే పేరు పెట్టిపిలుస్తోంది. చిదాకాశము బాహ్యపదార్థములను పొందుచూ ‘పరిగ్రహణము’ అను వృత్తిని కలిగియుండగా అప్పుడు ఫలిస్తున్నదానినే ‘దృశ్యము’ అనే పేరుతో పిలుస్తున్నాం. అదే చిదాకాశం తన స్వయం ప్రతిపత్తిని భావించుచు, ’బాహ్యపదార్థరాహిత్యము’ను, ’సర్వ విషయాతీతము’ను గాంచుచున్నప్పుడో,… అప్పటి ప్రయోజనమును ‘మోక్షము’ అని అంటున్నాం.

‘ఇది దృశ్యము - ఇది మోక్షము’ అను సంజ్ఞలు నిర్వచిస్తోంది, ప్రసాదిస్తున్నది కూడా ఎవ్వరో తెలుసా? అద్వితీయ చైతన్యమే. యథార్థానికి చిదాకాశము ఏ సమయమందును ప్రబుద్ధమగుట లేదు… అప్రబుద్ధమగుటలేదు. చిదాకాశము ఒకప్పుడు ఎట్లా ఉండి ఉండేదో… ఇప్పుడూ అట్లే ఉన్నది. ఇక ఎప్పటికీ అట్లే ఉంటున్నది.

ఈ దృశ్యమంతా చిదాకాశమే అయి, సృష్టి వైభవమంతా మోక్షరూపమే అయి ఉండగా, ఇక పర్యాయ శబ్దములవంటి జగత్ - బ్రహ్మములకు భేదమెక్కడ చెప్పు?

ఆత్మయే ఒకప్పుడు అవిద్యతో కూడుకుని ఉంటున్నది. అప్పుడు అప్పటి తన పరమార్థ స్వరూపమునే జగత్తుగా ఎరుగుచున్నది. ఆకాశములో వెంట్రుకాకారములు లేకుండానే, తిమిర రోగము ఉన్న కళ్ళు గలవానికి ఏవేవో వెంట్రుకాకారములు కనబడటం జరుగుచున్నది కదా! పరమార్థమున ఈ దృశ్యప్రపంచం గాని, శరీరాదులు గాని లేవు. చిదాకాశమే ఆయారూపములుగా స్థితి కలిగియున్నది.

Page:151

  1. ఆధ్యారోపదృష్టి (ఇది ఉన్నది అను దృష్టిచే ఈ సర్వము యొక్క వాస్తవరూపము బ్రహ్మమే! చిదాకాశమునందు అంతయు సర్వదా సంభవమే! కనుక “ఈ సర్వము ఉండియే ఉన్నది" అని చెప్పబడుచున్నది.

  2. ఆరోపదృష్టి (ఇది లేదు అను దృష్టి) చే - ఈ "నేను - నీవు జగత్పదార్థములు’ మొదలైన వాటికి బ్రహ్మము కానట్టి ఉనికియే ఉండి ఉండుటలేదు. ‘జగత్తు-బ్రహ్మము’… అనబడు రెండింటి యందు కూడా శాంతము, భేదరహితము అగు ఒకే పూర్ణరూపము ఉండి యున్నది. కనుక ‘నేను-నీవు’ అనునవన్నీ అవాస్తవమై, అవాస్తవిక దృష్టికి మాత్రమే తారసపడుతున్నాయి.

కాబట్టి రామా! నీవు సర్వశోక భయములను త్యజించివేయుము. సర్వదా పరిపూర్ణ స్వరూపుడవై ఉండు. నీయొక్క పరిపూర్ణ చైతన్యతత్త్వం ఒక స్ఫటికశిల యొక్క మధ్యభాగంలాగా చిదనము, ప్రశాంతము, అత్యంత స్వచ్ఛము అయి ఉన్నది. కలలో నదులు-పర్వతాలు జనులు ప్రతిబింబిస్తున్నప్పుడు, అట్లు ప్రతిబింబితములై కనబడే వేరు వేరు వస్తువులలో “ఒక గోడ - మేకు మనిషి” లకు గల భేదమేమున్నది.

"ఇది ఉన్నది - ఇది లేదు” అనే భేదదృష్టి చైతన్యమునందు లేనేలేదు. నీకు ఎక్కడైనా వేరు వేరైన ప్రతీతి కనిపిస్తే “చైతన్యము ఇట్లు వేరు వేరు ప్రతీతులచే ఇచ్చట ఇట్లు ప్రకాశించుచున్నది” అని గ్రహించి, అటుపై, సర్వదా నిశ్చింతుడవై ఏది ఎట్లు ఉచితమో అట్లే నిర్వర్తించుము.

  1. సదాచారము - ప్రయోజనము

శ్రీరాముడు : ఒక బాలుడు అటు చీకట్లోకి చూచి, “ఇక్కడ ఏదో భూతపిశాచాలు ఉన్నాయి” అని తలచి, భయముతో పిశాచులు పరిభ్రమణమును అనుభవించటం జరుగుతుంది చూడండి! ఆరీతిగా, అజ్ఞుల దృష్టికి మాత్రమే “దాముడు - కటుడు - - వ్యాళుడు - నేను - - నీవు“… ఇవన్నీ తోచుచున్నాయన్నమాట! ఇవన్నీ స్వసత్తాస్వరూపమే అయివున్నాయి కదా! ఇదంతా ఎంత చమత్కారంగా ఉన్నది! సరే, మునీంద్రా! ”యథార్థానికి మిథ్యాస్వరూపములే”… అయినట్టి ఆ

ముగ్గురి దుఃఖములు ఎప్పటికి శమిస్తాయి? బురదగుంటలో చేపల రూపంలో ఆ ముగ్గురికి ముందుముందు ఏమి కానున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ’ఓహో! ఆ దామ-కట-వ్యాళుల భవిష్యత్తు కథ ఏమిటో చెప్పమంటావా? అయితే విను. ఆ ముగ్గురి కుటుంబమునకు చెందినట్టి కొందరు యముని వద్ద కింకరులై ఉన్నారు. వారు దామ - కట - - వ్యాళుల ముక్తి కొరకు యముని ప్రార్థన చేస్తారు. అప్పుడాముగ్గురు తగిన సమయంలో తమ చరిత్రలను ఇతరుల నుండి వినటం జరుగుతుంది. వారి సర్వసందేహములు అప్పటికి తొలగుతాయి. ఫలితంగా ముక్తులు కాగలరు.

శ్రీరాముడు : మీరు చెప్పే విశేషాలు మరికొంత వివరంగా వినాలని ఉన్నది. వారు తమ తమ వృత్తాంతములను ఎప్పుడు, ఎక్కడ, ఎవరివద్ద వినటం జరుగుతుంది? వారు మరల ఎట్లా దుఃఖ

Page:152

రహితులు కాగలుగుతారు. మీరు భూత-భవిష్యత్ వర్తమానములు ఎరిగినవారు కదా! ఆ

ముగ్గురి గురించి భవిష్యత్తులో కానున్నదేమిటో చెప్పండి! ప్రస్తుతం వారు చేపల ఉపాధులు కలిగియున్నారు కదా! ముందుముందు ఏమి కాబోవుచున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే. ఆ వివరాలు చెపుతాను. వినువారు ప్రస్తుతం కాశ్మీరదేశంలో గల బురదతో కూడిన ఒక చిన్న తటాకంలో చేపలుగా జీవిస్తున్నారు. అదే ప్రదేశంలో అనేకసార్లు అట్లే చేపలుగా జన్మలు ఎత్తుతారు. ఒక సమయంలో మండు వేసవిలో కొన్ని దున్నపోతులు ఆ తటాకంలోకి ప్రవేశిస్తాయి. ఆ తటాకమును ధ్వంసం చేస్తాయి. దున్నపోతుల తాడనమునకు ఆ ముగ్గురి ఉపాధులు వినాశనమౌతాయి. పద్మ సరోవరంలో వారు మూడు సారస పక్షులై జన్మిస్తారు. ఆ మూడు పక్షులు అనేక చోట్ల భోగములను అనుభవిస్తూ సంచరిస్తూ ఉంటాయి.

ఆ ఉపాధులలో వారికి కొంత ప్రశాంతత దొరుకుతుంది. క్రమంగా వివేచన చేస్తూ శుద్ధత్వమును పొందుతారు. ఒకడు వివేక దృష్టిచే ఈ సర్వమును గాంచుచున్నాడనుకో… అప్పుడు త్రిగుణములు (సత్వగుణము, రజోగుణం, తమోగుణం) భిన్నభిన్నంగా తెలియవస్తాయి కదా!

అట్లే వారు ముగ్గురియందు వేరువేరు కారణాలచే వివేక బుద్ధి ఉదయిస్తుంది.

వ్యాళుడు - కాశ్మీర దేశంలో ‘అధిష్ఠానము’ అను పేరుగల ఒక నగరం ఉన్నది. ఆ అధిష్ఠాన నగరం మధ్యప్రదేశంలో ‘ప్రద్యుమ్న’ అనే పేరుతో పిలువబడే ఒక శిఖరం ఉన్నది. ఆ కొండ శిఖరంపైగల ఒక ఇంటిలోని గోడపగులులో వ్యాళుడు పిచ్చుక అయి నివసిస్తాడు. ఒక గూడు కట్టుకుని అర్థరహితమైన శబ్దాలు చేస్తూ ఉంటాడు.

దాముడు - ఆ అధిష్ఠాన నగరమును ‘యశస్కరదేవుడు’ అనే పేరుగల రాజు పరిపాలిస్తూ ఉండగలడు. ఆ రాజు యొక్క అంతఃపురములో అనేక స్తంభాలు ఉండి ఉన్నాయి. వాటిలోని ఒక స్తంబము యొక్క వెనుక భాగంలోగల ఒక రంధ్రంలో ఒక దోమ అయి ‘ఝుయ్’ మని శబ్దం చేస్తూ దాముడు కాలం గడుపుతూ ఉంటాడు.

కటుడు - ఆ అధిష్ఠాన రాజ్యపు మహామంత్రి పేరు నరసింహుడు. అతడు బంధ-మోక్షములు రెండు గ్రహించియున్నవాడు. ఆ మంత్రియొక్క గృహంలోని పంజరంలో చిలక అయి ‘సారిక’ అనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు.

ఆ నృసింహమంత్రి తాను కొన్ని శ్లోకములుగా రచించియున్న దామ-వ్యాళ-కటుల చరిత్ర పఠిస్తూ ఉంటాడు. సారిక అనే పేరుతో చిలక రూపమున ఉన్న కటుడు నృసింహమంత్రి యొక్క ఆ గానమును అనేకసార్లు వింటాడు. సర్వమును అవగాహన చేసుకుంటాడు. విజ్ఞానదృష్టిని పొందుతాడు. అంతరంగమున ఏర్పడు బుద్ధి పరిపక్వత యొక్క ప్రభావం చేత శంబరాసురునిచే కల్పించబడినట్టి తన జీవరూపమును త్యజించటం జరుగుతుంది. ‘సంసారము’ అను దానిని సమూలంగా నశింపజేసే ఉత్తమోత్తమమగు ’మోక్షము’ను పొందుతాడు. అట్లే రాజమందిరములో

Page:153

ఉన్న దోమ(దాముడు), ‘ప్రద్యుమ్న’ అను కొండపై ఉన్న పిచ్చుక (వ్యాళుడు) ఆయా జనులు దామ-వ్యాళ-కటోపాఖ్యానం గానం చేస్తున్నప్పుడు, తమ పూర్వ చరిత్రను విని పరమోత్తమమగు నిర్వాణపదమును పొందుతారు.

ఓ రామా! ఈ విధంగా దామ - - వ్యాళ - కటుల యొక్క వృత్తాంతమంతా విన్నావు కదా! దీనిని బట్టి నీవు గ్రహిస్తున్నదేమిటి?… “నామ రూపములతో కూడిన ఈ ప్రపంచమంతా శూన్య రూపము, మాయామాత్రము అయివున్నది’… అనునది గమనించు. ఒక్కొక్క బాటసారి మృగతృష్ణను చూచి "అవి జలములోని తరంగములే… కనుక అక్కడ పుష్కలంగా జలం ఉన్నది…” అను భావమును పొందుతూ ఉంటాడు కదా! అజ్ఞానము చేతనే ఈ జీవులు అనేకమైన భ్రమలను పొందుచున్నారు. అజ్ఞానము ఈ జీవుని ‘అత్యున్నత స్థితి’ నుండి ’అధఃపాతాళము’నకు క్రుంగునట్లు చేస్తోంది. అతడు అల్పత్వములో పడత్రోయబడుచున్నాడనునది గమనించబడుగాక!

అజ్ఞానులగు మూఢులు దామ-వ్యాళ కటులవలె పతనము పొందుచున్నారు.

శ్రీరాముడు : అవును మహర్షీ! లేకపోతే, తమ కనుసైగలచే పర్వతములైనను నుగ్గునుగ్గు చేయగలవారి పరాక్రమములెక్కడ? రాజస్తంభముపైన వ్రాలే ఒక దోమ బ్రతుకు ఎక్కడ? సూర్య చంద్రులను కూడా నిరోధించగల మేధస్సు ఎక్కడ? ఒక ఇంటి చూరులో మ్రగ్గి ఉండే పిచ్చుక ఎక్కడ? చూడగానే దేవతలు భయపడి పరుగెత్తే బలపరాక్రమములెక్కడ? ఒక పంజరంలో ఇరుక్కున్న చిలుక ఎక్కడ?

  1. శ్రద్ధ - ప్రయత్నములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియజనులారా! శాస్త్రాదులచే, మహాత్ములచే ప్రవచించబడుచున్న ఉత్తమ సాధనలను ఆశ్రయించండి. ఏదైనా నియమపూర్వకంగా నిర్వహించబడినప్పుడే తప్పక సఫలం అవటం జరుగుతుంది. ఈ లౌకికములైన “ధనసంపాదన” మొదలైన ప్రాపంచిక సాధన విషయములలో గాని, పారలౌకిక విషయాలైనట్టి "శుభలక్ష్యములతో గూడిన ప్రయత్నములు, మోక్షమార్గ సేవనము”… మొదలైన విషయములందు గాని సర్వత్రాగాని తదనుకూలమైన ప్రయత్నమే ఫలప్రదమగుచున్నది.

అందుచేత రామా! మోక్షఫలము కొరకై శుభప్రయత్నములను మాత్రం నీవు ఏ క్షణమందును విడువనే వద్దు.

“శుభప్రయత్నమే ఉత్తమ ప్రయోజనములను ప్రసాదిస్తుంది” అని అనటానికి అనేక పౌరాణికమైన (పురాణములలో చెప్పబడిన) దృష్టాంతాలు ఉన్నాయి. ‘శిలాదుడు’ అనే ముని ఉన్నాడు. ఆయనకు ఎంతకాలానికీ సంతానం కలుగకపోవడం చేత, ఆయన శివుని కటాక్షము

Page:154

కొరకు గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గొప్ప భక్తి గల ఒక కుమారుని ప్రసాదించాడు. పేరు నందికేశ్వరుడు. కాని ఆ నందికేశ్వరుడు అల్పమైన ఆయుష్షు కలవాడు. అప్పుడు సద్గురువుల ఆజ్ఞను అనుసరించి నందికేశ్వరుడు ఒక సరోవరంలో శివలింగమును ప్రతిక్షేపించి ఏకాగ్రతతో, భక్తితో అర్చించాడు. శివుని అనుగ్రహానికి పాత్రుడై, మృత్యువును కూడా జయించాడు చూచావా! ఆ నందికేశ్వరుడు తన యొక్క శుభప్రయత్నములచేతనే పరమ శివుని కరచరణాలను ఆశ్రయించి, మృత్యువును జయించి, తన తల్లిదండ్రులకు అంతులేని ఆనందాన్ని కలిగించాడు. (లింగపురాణమ్)

బలి మొదలైన దానవులు గొప్ప స్వప్రయత్నముచేతనే సర్వైశ్వర్యసంపన్నులగు దేవతలను మర్దించగలిగారు. (వామన పురాణం). మరుత్తరాజు మొదలైన మహాత్ములంతా స్వప్రయత్నము చేతనే ఆయా ఔన్నత్యములను సాధించారు. ‘సంవర్తుడు’ అనే మహర్షి తన యొక్క శుభ ప్రయత్నముల ప్రభావం చేత బ్రహ్మదేవునిగా ప్రభవించి, మరో సురాసురులను సృష్టింగలిగాడు.

ఓ రాఘవా మరింకెవరెవరివో దృష్టాంతాలు మనకు దేనికి…? ఈ సభలో మనందరి కనుల ముందు కోటి సూర్యుల తేజముతో వెలుగొందుచున్న ఈ విశ్వామిత్ర మహర్షిని చూచావా? ఇతడు జన్మతః ఒక మామూలు రాజు. ఆ తరువాత ఆ రాజ్యమును తృణప్రాయంగా త్యజించి మహా ప్రయత్నశీలుడై గొప్ప తపస్సును ఆచరించాడు. మహా కష్ట సాధ్యమైనట్టి “బ్రాహ్మణత్వము’ను కూడా సముపార్జించాడు. రాజర్షి అయి, నాతో కలహించి, మరింత ప్రయత్న శీలుడై ఇప్పుడు బ్రహ్మర్షిగా వెలుగొందుచున్నారు.

అట్లాగే, ‘ఉపమన్యుడు’ గురించి విన్నావు కదా? అతడు ఒకప్పుడు అత్యంత మంద భాగ్య స్థితిని పొందియున్నాడు. నిరుపేద అయి పిండి కలిపిన నీరు కూడా లభించక, ఏదో దొరికింది తిని ఆకలి తీర్చుకునేవాడు. అట్టి ఉపమన్యుడు తన యొక్క శుభప్రయత్నములచే క్షీరసముద్రమునే

పొందగలిగాడు.

‘శ్వేతుడు’ అను మరొకడు తన యొక్క ‘భక్తి’ ప్రభావంచేత ముల్లోకములను సంహరించు స్వభావముగల యముని సంతసింపజేసి మృత్యువును జయించగలిగాడు.

‘సావిత్రి’ అనే పేరుగల రాజకన్య ‘మంగళగౌరీవ్రతము’ మొదలగు తన శుభప్రయత్నముల ప్రభావం చేత గొప్ప వాక్చతురతను ప్రదర్శించి తన భర్త సత్యవంతుని ప్రాణములను యమ ధర్మరాజు హస్తములనుండి తిరిగి పొందగలిగింది.

సశాస్త్రీయంగా నిర్వర్తించబడిన శుభప్రయత్నముల ఫలములు సుస్పష్టములు, అమోఘాలు అయి ఉన్నాయి. కాబట్టి రామా! నీవు సర్వోత్తమమగు మోక్షము గురించే సర్వదా ప్రయత్నశీలుడవై

ఉండటం ఉచితం సుమా!

నాయనా! రామా! ఈ జీవుడు అనుక్షణం "జననము-మరణము, సుఖము-దుఃఖము”… మొదలైన అనేక అసంఖ్యాకములగు భ్రాంతులన్నీ పొందుచున్నాడు. అట్టి భ్రాంతులన్నీ

Page:155

సమూలంగా పెకలించబడాలంటే, అందుకు ఒక్క ఆత్మజ్ఞానము మాత్రమే దివ్యమైన ఔషధం. అట్టి ఆత్మజ్ఞానం కొరకు అన్వేషణా పూరితమైన ప్రయత్నము నిరంతరం జరుగుచూ ఉండాలి.

అసలు, ఈ ‘బుద్ధి’ చేయుచున్నదేమిటో గమనిస్తున్నావా? ఇది సమగ్రత్వము, పూర్ణత్వము, ప్రశాంతత్వము ప్రసాదించగలిగినట్టి ఆత్మ సమాచారమును ఉపేక్షిస్తోంది. ‘క్షుధ, అసంతృప్తి, తృష్ణ, కామం’ మొదలైన ఆపదలను పరిగ్రహించే స్వభావాన్ని ప్రయత్న పూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఎంతో ప్రయాసపడి, చివరికి రోగకారకము కాగల పదార్థములన్నీ సంపాదించి దాచిపెట్టు కుంటోంది. ఇట్టి ప్రమాదభరితమగు సందర్భంలో విజ్ఞుడైన వాడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు. శ్రీరాముడు : అట్టి ఈ దుష్టబుద్ధిని నిరోధించటం, నియమించటం ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ విషయములలో గల దోషమేమిటో పరిశీలించగల ఉత్తమ దృష్టి కొరకై ప్రయత్నం, అన్వేషణ సాగించాలి. శుభప్రయత్నములు మరల మరల పట్టుదలతో ఆశ్రయించాలి. “ఆఁ! ఈ శుభప్రయత్నములు శ్రమతో కూడుకొనియున్నట్టి వ్యవహారం కదా! ఇప్పుడెట్లా సాధ్యం? ఈ వస్తుజనితమైన ఆనందములను కోల్పోయి మేము ఏం సాధిస్తాం? ముందు ముందు ఇంతకు మించినదేదో పొందుతామని నమ్మకమేమిటి?”… అనునట్టి అల్పదృష్టితో కూడుకొని, ప్రయత్న మాంద్యమును ఆశ్రయించేవారిని ఎవరు కాపాడగలరు? ఈ జీవుడు ఏవేవో జడభావనలకు ఆశ్రయమిస్తూ ఆత్మ విషయమై తాత్సారం చేస్తున్నాడు. నాయనలారా! ”వైరాగ్యమును అభ్యసించుట" అను శ్రమకు మీరు సిద్ధంగా లేకపోతే… బాధారహితము, మహత్తరము అగు ‘సచ్చిదానందము’ యొక్క లేశము కూడా ఎట్లా లభిస్తుంది చెప్పండి? శ్రమించకుండా ఈ జగత్తులో ఎవరు ఏది పొందగలరు?

శమము, పరబ్రహ్మము - ‘బ్రహ్మము’ అనగా ఏమిటి? అది ఎప్పుడో ఎక్కడో ఎట్లో తారసపడే విషయమా? కానే కాదు. ఇంద్రియనిగ్రహముచే పరిపూర్ణమైన చిదాత్మ స్వరూపమగు బ్రహ్మమే పరబ్రహ్మము సుమా! అట్టి ఇంద్రియ నిగ్రహమునే ‘శమము’ (Withdrawal from sensory avocations) అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ‘సంసారం’ అనే అనర్థము దీని మూలకారణ సహితంగా నివర్తింపబడాలంటే “శమం” ను ఆశ్రయించాలి. గొప్ప అనర్థముల నుండి కాపాడ గలదు కాబట్టి “శమమే పరమ పురుషార్థం. సర్వ ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనం శమం”అని మహనీయులు చెప్పుచున్నారు. ‘శమము’, ‘బ్రహ్మము’ అనబడు రెండూ ఒక్కటే సుమా! ఇందులో శమము అనునది శంకరునిగా (శం+కరుడు=బ్రహ్మానందమును కలుగజేయు వాడు) ఎరుగు. ఓ రామా! అభిమానమును త్యజించినవాడవై, నిత్యము శమమునే ఆశ్రయిస్తూ ఉండు. శాశ్వతమగు మోక్షప్రాప్తికి యోగ్యమైన ఉత్తమ జన్మ కర్మల గురించే ఈ జీవుడు ప్రయత్నశీలుడు కావాలి.

సత్పురుషుల సేవ - ‘నేను సర్వాత్మ స్వరూపుడను’ అను ధ్యాననిష్ఠతో కూడిన ఎరుకను సుస్థీరీ కరించుకున్నట్టి మహనీయులు ఈ భూమిపై అక్కడక్కడ ఉన్నారు. అట్టి సజ్జనులను సేవించాలి. “సత్పురుషులను సేవించుట” అను అభ్యాసము గలవారు ఈ సంసార సాగరమును అవలీలగా దాటివేయుచున్నారు.

Page:156

న తపాంసి న తీర్థాని నశాస్త్రాణి జయన్తి చ।

సంసార సాగరోత్తారే సజ్జనాసేవనం వినా ॥ (సర్గ 33, శ్లో. 14)

సత్పురుష సేవనము లేనిచో తప, తీర్థ, శాస్త్రాదులేవియు సంసారసాగరమును దాటింప శక్యములుగావు.

ఎవని యందైతే లోభ మోహ-క్రోధములు రోజు రోజుకూ తగ్గుతూ ఉంటాయో, ఎవడు తనకు విధించిన కార్యములందు శాస్త్రానుకూలంగా వర్తిస్తూ, అకర్తృత్వము వహిస్తూ ఉంటాడో, అతడే సజ్జనుడు.

  1. దృశ్యము యొక్క అత్యంత - - అభావము

సజ్జన సాంగత్యము చేయుచూ రాగా, ఆత్మవేత్తలగు వారి సంపర్గముచే, ఈ జీవునకు ఈ దృశ్యము యొక్క అభావము లభిస్తుంది. దృశ్యముకంటే అతీతమై దృశ్యము చేరజాలనట్టి స్వస్థితి అనుభవమౌతుంది. అట్టి వానియందు పరమాత్మయే శేషిస్తుంది. అతనికి ఇక ఏ అన్యభావమూ, దేని పట్ల కూడా కలుగదు. అతడు పరమాత్మయందే ఏకమై, లీనమై ఉంటాడు.

యథార్థానికి ఈ దృశ్యము ఏ సమయమునందును ఉత్పన్నము కానేలేదు. ఇక ముందు కూడా ఇది ఉండబోవుట లేదు. మరి వర్తమానంలో మాత్రం ఇది ‘ఉన్నది’ ఎట్లా అవుతుంది? అందుచేత బ్రహ్మమును ఎరిగినప్పుడు ఏదీ, దేనిచేత కూడా బాధింపబడుట లేదు. “బ్రహ్మమును ఎరిగినవాడు జగత్తును త్యజిస్తాడు…” అను వాక్యమును సునిశిత బుద్ధితో ”అతడు ఈ సర్వము బ్రహ్మముగానే దర్శిస్తాడు…” అని అర్థం చేసుకోవాలి. ఇక బ్రహ్మభావమును కలిగియుండుటచేత నష్టమేమున్నది? “నేను బ్రహ్మమునే” అను అవగాహనను ”భవిష్యత్తులో సాధించవలసిన విషయం”గా దర్శించవలసిన పనేమున్నది?

ఈ జగత్తు ఉత్పత్తియే అయి ఉండలేదు… అను సత్యమును ఉత్పత్తి ప్రకరణంలో అనేక యుక్తుల సహాయంతో నిరూపించాము కదా! ఇప్పుడు కూడా అదే ప్రతిపాదిస్తున్నాను. శ్రీరాముడు : హే మహర్షీ! ఈ త్రిలోక సంబంధమైన ‘చిదాకాశము’ గురించి సుస్పష్టమొనర్చమని వేడుకొనుచున్నాను. ‘చిదాకాశము’ అనుదానిపట్ల విజ్ఞుల అనుభవం, దృష్టి ఎట్లా ఉంటోందో మరి కొంత చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ త్రిలోక సంబంధమగు చిదాకాశము శాంతము, నిర్మలము పరమార్థ రూపము అయివున్నది. అఖండమగు నా యొక్క నీ యొక్క సర్వులయొక్క వాస్తవతత్త్వమే కదా! ఇక “నేను శాంతుడను-నిర్మలుడను-పరమార్థరూపమును, అఖండుడను-వాస్తవతత్త్వమును”… అను భావనను అభ్యసించటానికి వెనుతీయవలసిన పనేమున్నది? “నా యొక్క స్వస్వరూపము ఈ త్రిలోకములకు సంబంధించక, సంబంధించీ కూడా ఉంటున్న చిదాకాశమే” అని నిరభ్యంతరంగా గ్రహించబడవచ్చును. విజ్ఞులు అట్టి అనుభవమునే సర్వదా, సర్వత్రా పొందుచున్నారు.

Page:157

శ్రీరాముడు : అయితే మునీంద్రా! ఈ ఆకాశము మొదలైన దృశ్యపదార్థములు, అవి అనుభవ మగుచున్న ఈ ఇంద్రియాలు… ఇవన్నీ మాయాజనితము అయి ఉన్నాయంటారా? ఇవన్నీ ఎక్కడి నుండి ఏ విధంగా జనించాయి? సత్తు నుండా? అసత్తు నుండా? లేక మాయ నుండా? శ్రీ వసిష్ఠ మహర్షి : సత్తు అగు ఆత్మ వికారరహితము. అందుచేత ఆత్మ నుండి ‘ఆకాశము’ మొదలైనవి ఉద్భవించటం అసంగతమైన విషయం.

’అసత్తు అనునది స్వయముగా లేనిదే కదా! లేనిదానిలో నుంచి ఆకాశము, భూమి మొదలైనవి ఎట్లా ఉద్భవిస్తాయి?…. అందుచేత రెండు పక్షములు యుక్తములు కావు.

ఇక ఇవి ‘మాయ’ నుండి కలిగాయని అనుకుంటే… మాయ అనగా ‘మిథ్య’ అనియే కదా! మిథ్య నుండి మిథ్య అయినవే సంభవించగలవు. ఇట్లు ఈ ఆకాశాదుల ఉత్పత్తియే సంభవించుట

కుదురునది కాదు.

కాబట్టి, “కల్పితం, చంచలం అగు జీవాత్మ యొక్క సంకల్ప దర్పణము నందు ప్రతిబింబించే చైతన్యమే ఇదంతా” అని అనక తప్పదు…. ప్రతిబింబిత చైతన్యమే ఈ జగత్తును కల్పించుచున్నది. చైతన్యము దేనిని ఎట్లు కల్పన చేయుచున్నదో అట్లు ఆ కల్పననే ‘జగత్తు’ రూపముగా అనుభవించుచున్నది.

ఈ ముల్లోకముల కల్పన అంతా కూడా “చైతన్యము” అను సూర్యుని కిరణముల సమూహమే అయివున్నది. కిరణములకు, సూర్యునికి భేదమేమున్నది? లేదు కదా!

  1. అహంకారము యొక్క రూపము

ఈ సర్వవికల్పములు మిథ్యయే కాబట్టి "ఈ ముల్లోకములందలి అనుభవం నిర్వికల్పమగు పరబ్రహ్మస్వరూపమే”… అని చెప్పబడుతోంది. చైతన్యము స్వతహాగా “నిర్వికల్పమే” అయినప్పటికీ సవికల్పత్వమును చమత్కారముగా కలిగి ఉంటోంది. అట్టి సవికల్పమగు చైతన్యవృత్తి యొక్క “కనులు తెరచుట, మూయుట” అను బాహ్యచమత్కృతులే ఈ ‘జగత్తు’ అను అనుభవము యొక్క ఉత్పత్తి - - వినాశనములు అయి ఉన్నాయి సుమా!

పరమార్థమగు చిదాకాశమున “అపరిజ్ఞాతమగు అహంకారము” అనే మాలిన్యము, లేక అవిద్య ఒక “గారడి సంఘటన” వలె ఉండి ఉంటోంది.

పరిజ్ఞాతమగు అహంకారము (సర్వము గ్రహించి, సత్యదృష్టిని అంతర్లీనంగా దర్శించు జీవుడు) స్వయముగా చిదాకాశమే అయివున్నది. కాబట్టి అహంకారమును పరిజ్ఞాతం (జ్ఞాన మయం) చేస్తే ఈ దృశ్యసత్త బ్రహ్మముగానే గ్రహించబడుతోంది.

అపరిజ్ఞాతం చేస్తున్నప్పుడో, బ్రహ్మసతకంటే వేరే ఉన్నదానివలె భ్రమను కలిగించుచున్నది.

Page:158

ఇట్టి సంసారవ్యాధికి (అహంకారమును బ్రహ్మము కంటే వేరైన దానివలె పొందుట అను వ్యాధికి) ఔషధం ఒక్కటే. అది, ఈ అహంకారము యొక్క యథార్థస్వరూపం ఎరుగుటయే. హృదయావదహంభావో వారిదః ప్రవిజృంభతే ॥

తానద్వికాసమాయాలి తృష్ణాకుటజమజ్జరీ ॥ (శ్లో. 30, సర్గ 33)

దీనిని యథార్థ స్వరూపమేమిటో తెలుసుకున్నామా… ఇంకేమున్నది? ఇది ఏ విధంగానూ ఉండజాలదని తెలిసిపోతుంది. జలము జలములో కలిసిపోతున్నట్లు, పరిజ్ఞాతము అయినట్టి అహంకారం చిదాకాశముతో ఏకత్వము పొందుతోంది.

అహంకారం, దృశ్యము - ఓ రామచంద్రా! “అహంకారం అనగా ఏమిటి?” అనే విషయం -

మేము ఎంతగానో పరిశీలించాము. నేను నీవు-అతడు-ఇతడు మొదలైన వాటితో కూడుకున్న ఈ దృశ్య వ్యవహారమంతా పరిశీలించి చూస్తే, “ఈ దృశ్యము స్వతహాగా లేదు. కానీ, ’భావన’ను లేక, ‘ద్రష్ట’ను ఆశ్రయించుకొని అట్టి భావనానుసారంగా ఉన్నట్లు మాత్రం ప్రాప్తి స్తోంది” అని సిద్ధాంతీ కరించాం. ఇక్కడ సర్వేసర్వత్రా చిదాకాశమే ఉన్నది కాని, ‘దృశ్యము’ అనబడేదేదీ ఎక్కడా లేదు. ‘అహంకారము’ అనబడేదేదీ చిదాకాశము నుండి వేరైనదిగా లేదు. వివేకులు, అభయస్వరూపులు అగు జ్ఞానుల దృష్టిలో అహంకారమే ‘లేనిది’ అగుచున్నప్పుడు, ఇక అది ఒకరిని బాధించుట ఏమి? పిశాచమే ఉండజాలదని గ్రహించిన తరువాత, అట్టి పిశాచం యొక్క చర్యలకు ఉవ్విళ్ళూరు వారెవరు? భయపడువారెవరు? అయితే అల్పజ్ఞులగు బాలురకు “పిశాచం లేదు” అని ఎన్నిమార్లు చెప్పినా వారిలో కొందరికి పిశాచబుద్ధి తొలగకయేపోవచ్చు కదా! ఎంతగా బోధించినప్పటికీ ఆత్మ యందు ఇంకను నిలకడ ఏర్పడని జీవునకు ‘అహంకారము లేదు’ అనునది అవగత మగుటలేదు. ఇంకను సంశయబుద్ధి శేషించుచునే ఉంటోంది.

ఎంత వరకైతే ఈ చైతన్యము ‘అహంకారము’ చే కప్పబడి ఉంటోందో అంతవరకు స్వయం స్వరూపమగు అద్వితీయ ఆత్మతత్త్వము అనుభవమున ప్రకాశించదు. ఎప్పుడైతే ఈ జీవునికి అహంకారము యొక్క అసలు రూపం అవగతమౌతుందో, అట్టి అహంకారము యొక్క విజ్ఞాన దృష్టికి ఇక ఈ ‘స్వర్గము-నరకము-మోక్షము’ మొదలైన కల్పనలు ఉంటాయా? ఉండవు.

అహంకార మేఘం, హృదయాకాశం అహంకార మేఘం హృదయాకాశంలో సంచరించు చున్నంత సేపు “ఇంకా ఏదో పొందవలసి ఉన్నది…” అను రూపముగల తృష్ణ అనే కొండమల్లె వృద్ధి చెందుతూనే ఉంటుంది. చైతన్య సూర్యుని అహంకార మేఘం కప్పి ఉంచుట చేత, ఇక అజ్ఞాన అంధకారమే వ్యాపిస్తూ ఉంటుంది. సుజ్ఞానము యొక్క ప్రకాశము మరుగునపడి ఉంటుంది. ఫలితమేమిటి?” రోదన - ద్వేషం - నిర్దాక్షిణ్యం - నిస్పృహ - అభినివేశం - మదమాత్సర్యాలు”… ఇవన్నీ తాండవిస్తూ ఉండటం. చీకటి ఉన్నచోటే గబ్బిలములు మొదలైనవి కాపురములు చేస్తూ ఉంటాయి కదా! బాలుడు తన భ్రమచే “పిశాచము” అనబడు, అసలు లేనట్టి, ఒకానొక దానిని కల్పించుకొని, పొందుతూ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. “నన్ను ఆ భూతం నుండి కాపాడండి. నాకు ‘తోడు’ ఉండండి” అంటూ తదితరులను అర్థిస్తాడు. అట్లాగే, ఈ అహంకారము అనబడునది

Page:159

స్వతహాగా అసత్తే అయినప్పటికీ, కల్పించబడి మరీ పొందబడుతోంది. అట్టి కల్పన దుఃఖం కొరకే ఏర్పడుచున్నది. ఎందుకంటే, అహంకారము యొక్క కల్పనచే సుఖించువారు ఎవ్వరూ ఉండరు.

అహంకారము, సంసార భ్రమలు! - చీకట్లో పడివున్న ఒక వంకర టింకర త్రాడును చూచి “అమ్మబాబోయ్! ఇది పామే!” అను బుద్ధి ఏర్పడుతోంది చూచావా? అభిమానం చేత కలుషితమైన అంతఃకరణము నందు ఈ “అహంకారం” అనబడేది కల్పించబడుతోంది. ఇక అట్టి అహంకారం సర్వసంసార భ్రమలు కలుగజేస్తోంది.

“ఈ దేహమే నేను; ఈ ఇంద్రియములు నావి, నేను ఈ దేహపరిమితుడను, ఈ దేహము ముగించబడితే, అది నా ముగింపే అగుచున్నది…” ఇటువంటి మనోమోహముల కంటే వేరుగా అనర్థములు ఈ ప్రపంచంలో ఇతఃపూర్వం లేవు. ఇక ముందు ఉండబోవు. ”ఈ ప్రపంచంలో జీవునికి అనేక రూపములైన దుఃఖములన్నీ ఎక్కడి నుండి ప్రాప్తిస్తున్నాయి?” అనే విషయమును మేము ఎంతగానో పరిశీలించాం. “ఇదంతా అహంకార చక్రం యొక్క విజృంభణం, పరిణామం అయివున్నది”… అని ప్రకటిస్తున్నాం. ‘అహంకారము’ అనే విషవృక్షమును ’శుద్ధమైన మనస్సు’ అనే గొప్ప యంత్రము సహాయంతో కూకటి వ్రేళ్ళతో సహా పెకలించివేయాలి. అప్పుడు ‘ఆత్మ’ అనే సుక్షేత్రంలో సంసారనాశకరమగు ‘జ్ఞానబీజము’ అంకురిస్తుంది. అది మహావృక్షమై… “నేను అఖండుడను, నిత్యుడను” అను ఎరుక రూపంలో ఉండే మహాఫలమును ప్రసాదిస్తుంది.

నాది, నేను - ‘అహంకారము’ అనే వృక్షమునకు “నాది నేను” అనునవే రెండు శాఖలు. అట్టి నేను, నాది అనునవి ఇంద్రియవిషయముల పట్ల ‘ప్రియ, అప్రియములు’ అను వాటిని మూలంగా కలిగి ఉంటున్నాయి. అవియే వాసనలు. ఈ వాసనలు జీవుని యందు తత్వవిచారణను సన్నగిల్ల చేస్తున్నాయి. అత్యంత శ్రమతో కూడుకొనిన అనేక జన్మపరంపరలను ఈ జీవుడు పొందేట్లు చేస్తున్నాయి. జలంలో తరంగాల వలె ఈ జన్మ కర్మలు అతి చంచలములై, చివరికి అతి తుచ్ఛముగా పరిణమిస్తున్నాయి.

కాబట్టి రామచంద్రా! నీవు యథార్థానికి ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నావు. అట్టి నీకు అహంభావమేమిటి? అది నిన్ను సంకోచింపజేయటమో, బంధించటమో ఏమిటి? నీవు అహం భావ రహితుడవే సుమా! అట్లే ప్రతిజీవుని విషయం కూడా. అయినప్పటికీ అహంభావము ఆత్మను కప్పివేయుచున్నది. ఫలితంగా ఈ జీవుడు స్వయంగా ఈ సంసారచక్ర పరిభ్రమణమును తనకు ఆపాదించుకొనుచు, దుఃఖములతో కూడిన అనుభవములన్నీ పొందుచున్నాడు. “ఆత్మ స్వరూపుడ నగు నాకు ఏ సమయమందునూ జన్మ కర్మలు లేవు" అను ఎరుకను ఏమరచుచున్నాడు.

‘జన్మ’ అనే అరణ్యంలో ‘అహంకారం’ అనే అంధకారం వ్యాపించి ఉన్నంతవరకు ‘దుఃఖము’ అనే మదించిన పిశాచము విజృంభిస్తూనే ఉంటుంది. ఈ అహంకారపిశాచము మామూలు ‘పిండి-పిడక’ మంత్రములచే వదిలేది కాదని అందరిని హెచ్చరిస్తున్నాను.

Page:160

  1. అహంకారము - నివారణోపాయం

శ్రీరాముడు : మహాత్మా! ఈ అహంకారం వృద్ధి పొందకుండా ఉండే ఉపాయమేమిటి? ఈ సంసారము భయమును కలుగజేస్తోంది. ఇట్టి భయనివృత్తి కొరకు వివిధ జనులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఉపాయాలను సవివరంగా చెప్పవలసినదని ప్రార్థిస్తున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వజనుల పట్ల నీకు గల అవ్యాజమైన ప్రేమను మేము గమనిస్తున్నాము. అందుచేతనే, ఈ జీవుని యొక్క భయము, దుఃఖముల నివృత్తికొరకే ఈ ఆత్మ శాస్త్రమును మా యొక్క అనుభవసారంగా ప్రతిపాదిస్తున్నాం. ఈ సందర్భములో నీ ప్రశ్న అత్యంత సముచితం. అందుచేత నీ ప్రశ్నకు సమయోచితమైన కొన్ని విశేషాలు ఇక్కడ సమాధానంగా చెప్పుతాను. వినుఆత్మధ్యానం - ఆత్మ ఒక నిర్మలమైన అద్దము వంటిది. చిన్మాత్రమే స్వరూపముగా కలిగియున్నది. అట్టి శుద్ధ చిన్మాత్రమగు ఆత్మయొక్క స్వభావమును నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు అహంకారం వృద్ధి పొందకుండా ఉండగలదు.

విరాగం - "దృశ్యరూపంగా ప్రాప్తిస్తున్న ఈ ఇంద్రజాల సదృశ్యమైనదంతా మిథ్యయే కదా! వీటి పట్ల నాకు రాగమెందుకు? ద్వేషమెందుకు?”

ఇట్టి ‘మననము’ లేక ‘చింతన’ నిరంతరం ఒనర్చుట చేత అహంకారం వృద్ధి కాకుండా ఉంటుంది. ఎవనియందైతే “ఈ దృశ్యం వాస్తవం” అను అనుభవం గాని, “నాది… నాకే ఉండాలి” అనునట్టి వేదనగాని ఉండదో, ఎవడైతే సర్వస్థితి గతులందు ప్రశాంతచిత్తుడై వ్యవహరిస్తాడో… అట్టి వాని యందు అహంకారము తప్పక రూపుమాయగలదు.

దృశ్య వ్యవహారం నుండి స్వస్వరూపాన్ని వేరు చేసి ఉంచటం

ద్రష్ట దర్శనము దృశ్యము

Perceiver Perception Object

నేను చిత్తు జగత్త

Knower Knowing The known

పై త్రిపుటి సర్వదా ఎదరుగా ఏర్పడి ఉంటున్నది కదా! అయితే, ఒకని యందు ప్రజ్ఞ, ప్రయత్నముల ప్రభావం చేత, “ఇది గ్రహించాలి. ఇది త్యజించాలి" అను త్యాజ్య గ్రాహ్య దృష్టులు నశించుచున్నాయి. అప్పుడు అట్టివాని యందు “సమత్వము” అనబడు మధుర స్వభావం ప్రవృద్ధమౌతోంది. అహంకారము స్వయముగానే క్షీణించుచున్నది. “నా హం, ఇదంతా నేను కాదు. నేను దేనికీ కర్తను కాదు. నా వాస్తవతత్త్వము దేనికీ కర్తగానీ, భోక్తగాని అయ్యేది కాదు…” అను భావనచేతనే అహంకారము నిర్జించబడుతోంది.

ఎచ్చటైతే అంతఃకరణము నందు భేదదృష్టి లేక భేదభావన సన్నగిల్లుతూ వస్తుందో, అక్కడ అహంకారము తన తావును కోల్పోతూ ఉంటుంది.

Page:161

శ్రీరాముడు : తండ్రీ! ఇతఃపూర్వం మీరు సమాధానం ఇచ్చి ఉన్నప్పటికీ, మరల అట్టి ప్రశ్ననే అడుగుచున్నాను. ప్రశ్న ఒక్కటే అయినప్పటికీ, మీరు అనేక కోణముల నుండి సమాధానం ఇస్తున్నారు. కనుక మాకు మీ వాక్యములు అత్యంత ప్రయోజనకరంగానే ఉంటున్నాయి.

అసలీ అహంకారము యొక్క స్వరూపమేమిటి? ఈ ‘అహంకారము’ అనబడునది ఈ జగత్తునందు, స్వప్నమునందు, మనోరథములందు ఏ రూపము కలిగి ఉంటోంది?

1) దేహమునకు సంబంధించిన అహంకారము.

2) దేహమునకు విలక్షణమైన ‘బుద్ధి’ యందు ఏర్పడి ఉంటున్న అహంకారము.

ఈ రెండు అహంకారముల గురించి వివరించండి.

వివిధ రూపములైన ఈ అహంకారములు త్యజించబడేది ఎట్లా? అట్లు త్యజించుటచే కలుగు ప్రయోజనమేమిటి? ఈ అహంకారములను ఎన్ని తీరులుగా విభజించవచ్చు? ఈ విషయాలు ప్రవచించమని ప్రార్థిస్తున్నాను.

  1. త్రివిధ అహంకారములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ లోకంలో మూడు రకములైన అహంకారాలు ఉన్నాయి1) “ఈ సర్వము నేనే” 2) “ఇందులోని ఏదీ నేను కాదు” 3) " ఈ దేహమే నేను”.

  1. అహమేవ ఇదమ్ సర్వమ్… ఈ సర్వము “నేనే" -

అహం సర్వమిదం విశ్వం పరమాత్మాహమచ్యుతః I నాన్యదస్తేతి పరమా విజ్ఞేయా సా హ్యహంకృతః | మోక్షాయైషా న బస్ధాయ జీవన్ముక్తస్య విద్యతే ॥ (సర్గ 33, శ్లో. 50)

"ఈ జగత్తంతా నిండియున్నట్టి కార్యరూపుము, కారణరూపము, నాశరహితము అగు ఆ పరమాత్మను నేనే. నాకు అన్యముగా ‘జగత్తు’ అనబడునది వేరే ఎక్కడా లేదు. నేను భావించుట చేతనే జగత్తు ఉంటోంది. భావనను, భావాతీతుడను కూడా నేనే. నాచే ఎదురుగా చూడబడుచున్న వారంతా నా యొక్క “సత్-చిత్” కిరణపుంజములే…!”

ఈ అహంకారము సర్వోత్తమమైనది. ఇది మోక్షమునే కలుగజేస్తోంది. ఇట్టి భావన బంధము అవదు. ఇట్టి అహంకారము జీవన్ముక్తులయందు పరిపూర్ణత సంతరించుకుని ఉంటుంది.

  1. కేవల పరిశుద్ధ సాక్షీస్వరూపమహమ్- ఈ సర్వమునకు విలక్షణమైనట్టి పరిశుద్ధమగు ‘కేవలసాక్షీ’ స్వరూపమును నేను.

"ఈ జగత్తులో కనబడే సర్వ దృశ్యవస్తువులకంటే కూడా విలక్షణమైనవాడను. సర్వమునకు సాక్షితత్వమును, శుద్ధుడను. అప్రమేయమును అయివున్నాను. కనుక ఇందు నేను ఏదీ కాదు…!

Page:162

ఈ కనబడేది, తారసపడేది - అంతా స్వప్నసదృశ్యకము కాగా, నేను మాత్రము సత్యమును, నిత్యమును…!”. స్వప్నద్రష్ట స్వప్నముకంటే వేరేకదా! ఈ జగత్తు నాకు అట్టిదే!

ఇది కూడా శుభాహంకారమే అవుతుంది. జీవన్ముక్తులచే ఆశ్రయించబడుచూ, మోక్ష భావనయందు సుస్థీకరింపజేస్తుంది. అయితే “సప్తమ భూమిక” యందు ప్రవేశించినట్టివానికి పై రెండు అహంకారములూ కూడా కేవలం ”క్రిందిమెట్లు”గానే తెలియవస్తూ ఉంటాయి.

  1. ఇదమ్ దేహ-మే వాహమ్ ఈ కళ్లకు కనబడే పాంచభౌతిక దేహము మాత్రమే నేను, “ఈ చేతులు, కాళ్లతో కూడుకున్న దేహమే నా స్వరూపము - ఈ దేహమును అనుసరించి మాత్రమే నేను ఉండటం జరుగుతోంది. దేహమునకు వేరుగాగాని, అతీతముగాగాని నేను లేను…!”

ఇట్టి లౌకికమైన నిశ్చయము తుచ్ఛమైనది. నీచమైనది కూడా. ఇది ప్రబల శత్రువు కాబట్టి సర్వదా త్యజింపతగినదే!

‘నేను ఈ దేహమును’ అను రూపముగల అహంకారము అనేక రకములుగా విపత్కరమైనది. బలవత్తరమైన శత్రువు వంటిది కూడా! ఈ “దేహమేవా హమ్” భావరూపమగు అహంకారము ఆత్మయందు స్వభావంగానే అనాది కాలం నుండి సంసక్తమై యున్నది. హస్తము నందు ‘హస్తలాఘవము’ దాగియ్నుట్లు ఆత్మయందు "జగత్తు యొక్క కల్పన చేయుట, పొందుట” అను చమత్కారం నిక్షిప్తమై ఉంటోంది. అయితే అది అపసవ్యము, అవాస్తవము అవటం చేత, “నేను శరీరమును” అను భావన పొందుచున్న ఈ జీవుడు ఎక్కడా ఒకచోట నిలువలేక పోవుచున్నాడు.

HH

అయ్యో! అనేక దుర్వాసనలందు సర్వదా ప్రవృత్తమగుచున్నట్టి ’బుద్ధి’గల ఈ జీవుడు నిరంతరము అనేక విపత్తులలో కూలుచున్నాడే! మహాత్ములగువారు పరిశుద్ధము, అఖండము, అప్రమేయము అగు ‘అహమ్’ను ఆశ్రయించి, అటుపై ఈ జగత్తులో సంచారం చేస్తున్నారు.

“ఈ సర్వము నేనే అయినప్పటికీ, నేను ఈ దృశ్యమునకు సంబంధించినట్టి ఏదీ కాను”… అను రెండువైపుల పదునుగల కత్తితో ’నేను దేహమాత్రుడను దేహపరిమితుడను” అను భావ రూపమున ఉంటున్న ‘లౌకికాహంకార దోషమును’ ఆ సుజ్ఞానులు విచ్ఛిన్నం చేసివేయగలుగు చున్నారు. “దేహమేవాహమ్” అను దానిని “సర్వాత్మా హమ్” అనుదానిలో లయం చేస్తూ ఈ దేహ భావము నుండి నిస్సంశయపూర్వకంగా విముక్తిని పొందుచున్నారు.

“నేను దేహమును” - అను భావనచే మూడవ అహంకారము దృఢపడుచున్నది. అదియే -

బంధమగుచున్నది. “సర్వులలో సమానంగా ఉండి ఉన్న ఆత్మ చక్రవర్తిని నేనే” అను అహంకారం చేత తుచ్ఛత్వము జయించబడాలి. ’నేను దేహమును కాను”… అను నిశ్చయముచే మొదటి రెండు మహాహంకారాలు సుసాధ్యమౌతాయి.

Page:163

ఆ తరువాత క్రమంగా మొదటి రెండు అహంకారములకు సంబంధించిన శ్రమను కూడా మహాత్ములు త్యజించివేస్తున్నారు.

‘మౌనము-ప్రశాంతము-నిర్మలము’ అగు స్వస్వరూపము మాత్రం శుద్ధమై శేషించుచున్నది. ఏ విధంగా అయితే లౌకికంగా కనిపిస్తున్న “దేహమే నేను" అనే భావన స్థిరపడిందో, తదితర అహంకారములు కూడా అట్టి ఏదో ఒక లేక, కొన్ని మార్గముల ద్వారా అలవరచుకోవాలి. ఏదైనా, అభ్యాసము చేతనే సుస్థిరత పొందుచున్నది. దుష్టమగు దేహాహంకారమును తలచుకొంటే చాలు… దుఃఖములన్నీ వచ్చిపడుచున్నాయి.

దామ వ్యాళ కటులకు కలిగిన దుర్దశలను గమనించావు కదా!

దేహాహంకారమును త్యజించినవాడు తనకు తానే హితము చేసుకుంటున్నాడు.

శ్రీరాముడు : లౌకికమైన ’దేహాహంకారము’ను పరిత్యజించిన మానవుడు ఎట్లా వర్తిస్తున్నాడు? అతడు తనకు తానే ఎట్లా హితం చేసుకుంటున్నాడు? మరి కొంత వివరించండి.

శ్రీ వసిష్ఠమహర్షి : ‘ఈ సర్వము నేనే అయి వున్నాను… నేను మరొకటేదీ ఏ క్షణంలోనూ అగుట లేదు” అను భావములను స్వీకరించుటయే దేహాహంకారవ్యాధికి ఔషధమైయున్నది. "శ్రద్ధఅభ్యాసము-గురుసేవ’లచే తమ తమ ప్రయత్నములను తీవ్రతరం చేస్తున్నవారికి అది సుసాధ్యమే అవుతుంది. అట్టి ఉత్తమ భావన వృద్ధిపొందుచుండగా, అది ఆ జీవుని పరబ్రహ్మ ప్రాప్తికి సంసిద్ధునిగా చేయుచున్నది.

మొదటి రెండు అహంకారములు ఉత్తమదృష్టితో ఆశ్రయించటమనేది ఇప్పుడే ఇక్కడ నిర్వర్తించవచ్చు సుమా! అయితే… సర్వ అహంకారములు రాహిత్యముచేతనే సర్వోత్తమమగు బ్రహ్మపదము అధిరోహించబడుతోంది.

ఓ సర్వజనులారా! మీరు పరబ్రహ్మము గురించిన బోధకు తగిన వారు కావాలంటే ముందుగా ‘నేనీ పాంచభౌతిక దేహమును’ అను భావరూపమగు దుష్ట ఆశ్రయమును త్యజించాలి. "నేను ఈ దేహపరిమితుడను’ అనునది ఒక పరిమితమైన, సంకుచితమైన, అపరిపక్వ మైన, అసమగ్రమైన అవగాహన - అని, దానిని అధిగమించుటే సుఖము, శ్రేయస్కరము, ఉత్తమము అని మేము సర్వులకు గుర్తు చేస్తున్నాం. ఒకడు ఈ ప్రపంచమున వ్యవహరిస్తూ ఉండ వచ్చు. లేదా ఇదంతా త్యజించి ఒకచోట ఒంటరితనమును ఆశ్రయించి కాలము గడుపుతూ ఉండ వచ్చు. ఏది ఏమైనా అతడు స్థూలముగా ప్రాప్తిస్తున్న ఈ లౌకిక దేహాహంకారమును తత్త్వవిచారణ సహాయంచే జయించాడా… ఇక అతనికి ‘పతనము’ అనబడు ఊసు కూడా ఉండదు. అట్టి అహంకారము శమించుచుండగా పూర్ణతృప్తుడగుచున్న మానవుడు ఈ భోగములన్నిటినీ నిర్లిప్తంగా (వాటితో అనురాగ విరాగాది భావనలు చేయకుండానే చూస్తూ ఉంటాడు. భోగములు

Page:164

రుచించకపోవుటచే ఇక ‘మోక్షము’ అను శ్రేయస్సు వచ్చి ఎదురుగా నిలచి ఉంటుంది. మనస్సులోని అంధకారమువంటి ఈ ‘అహంకారము’ తొలగిన తరువాత ఇక పూర్ణానందమగు మోక్షస్థితికి వేరే ప్రతిబంధకాలు ఏమి ఉంటాయి?

అహంకార అనుసంధాన వర్జనాదేవ రాఘవ ॥

పౌరుషేణ ప్రయత్నాశ్చ తీర్యతే భవసాగరః ॥ (సర్గ 33, శో&. 70.)

అహంకారము వర్ణించుటచేతను, ధైర్యమును అవలంబించి శాస్త్రశ్రవణము మొదలైన పురుష ప్రయత్నమును ఆశ్రయించుట చేతను ఈ సంసారము తప్పక దాటివేయబడగలదు.

కనుక, మొట్టమొదట… “ఈ జగత్తంతా నేనే. కాబట్టి అంతయు నా స్వరూపమే”…. అను నిశ్చయము కలిగి యుండుము. ఆ తరువాత… “దేహాదులు నేను కాదు. ఒక దేహము కలిగి ఉన్నప్పుడు ఆ దేహమునకు మాత్రమే సంబంధించిన ధన-పుత్ర-మిత్రాది వ్యవహారములు కూడా నావి కావు… నాకు అనేక దేహములు ఏర్పడవచ్చు గాక… నేను ఏ ఒక్క దేహమును కాదు” అని భావించుటచే ప్రతిబంధకములన్నీ తొలగిపోతాయి.

అప్పుడు అట్టి ఉత్తముడు “పరిశుద్ధాత్మ”ను పొందు త్రోవలో ఉంటాడు. క్రమంగా సప్తమ భూమిక యందు స్థితి కలిగి ఉంటాడు. ఇక అతడు స్వయంగా అపరిచ్ఛిన్నమగు పరిపూర్ణాత్మ స్వరూపుడై “విదేహకైవల్యప్రాప్తిని కూడా పొందుచున్నాడు.

  1. భీమ - భాస - దృఢ న్యాయం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇక మనం ఆ శంబరాసురుని కథకు వద్దాం. దామ వ్యాళ కటులు ఆ విధంగా నశించారు కదా! వారితోపాటే గొప్ప దైత్య సైన్యమంతా నశించింది. కొన్ని సంవత్సరములు అట్లాగే గడిచాయి. ఒక రోజు శంబరాసురుడు ఒక చోట సుఖాసీనుడై ఇట్లు యోచించసాగాడు.

66 “ఈ దామవ్యాళకటులను నా మాయాశక్తిని ఉపయోగించి సృష్టించాను. కాని, ఏం లాభం? వారు తమ మూర్ఖత్వముచే మిథ్యయగు అల్పాహంకారమును, దురహంకారమును ఆశ్రయించారే! ఆ మిథ్యా కల్పనయే వారి వినాశనమునకు దారి తీసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ దేవతాధములను నేను లేని సమయంలో నిరోధించుట ఎట్లా? సరే, ఇంత కన్నా విలక్షణమైన ముగ్గురు సైన్యాధిపతులను ఈ మాటు సృష్టిస్తాను.

… వారు గొప్ప వివేకవంతులై ఉంటారు గాక! మిథ్యా విషయములైన అభిమానము, స్వోత్కర్ష (self praise), సన్మానాదులపట్ల కోరిక, గౌరవ మర్యాదల పట్ల లోభం వారికి ఏ మాత్రం ఉంచకుండు గాక! … వారిలో తత్త్వజ్ఞానం వెల్లివిరియుటచే మిథ్యాభావరహితులై ఉంటారు!"… ఈ విధమైన విశేషణములకూడిన భావతరంగం సృజియించాడు.

Page:165

సముద్రంలో బుద్బుదములు ఏర్పడుతూ ఉంటాయి చూచావా? ఆ రీతిగా, అతని యొక్క బుద్ధి, మాయాకౌశలము… రెండూ ఏకమై భీముడు, భాసుడు, దృఢుడు అనే ముగ్గురు రాక్షసులను సృష్టించాయి. ఆ ముగ్గురు సర్వజ్ఞులు. తెలుసుకొనవలసిన పరబ్రహ్మము గురించి ఎరిగి ఉన్నారు. దేని పట్లా కూడా వారికి రాగము గాని, ద్వేషములుగాని లేవు. ప్రాప్తించిన కార్యమును నిర్వర్తించా లనే శుభ బుద్ధి మాత్రం వారియందు ఉన్నది. పవిత్రమైన, పాపరహితమైన అంతఃకరణముతో ఈ జగత్తు నంతా తృణప్రాయంగా చూస్తూ ఉండేవారు.

వారు దేవతలతో అనేక సంవత్సరములు పోరాడారు.

ఆ ముగ్గురు ఏ మాత్రం అహంకారమును పొందుటలేదు. “నాది ఇది”… మొదలైన భావనలతో కూడిన వాసనలు వారి అంతఃకరణమున ఉదయించి మరుక్షణం… "ఈ ప్రపంచం మిటి? మా స్వరూపమేమిటి?” - అను విచారణను ఆశ్రయించేవారు. అట్టి విచారణచే అసత్తుల్య మైన “నేను,” - “నాది” అను భావనలను వెడలగొట్టేవారు. దేవతల స్వోత్కర్షకారక వాక్యాలు, వస్తుజాల సంబంధమైన ప్రలోభాలు ఆ భీమ-భాస దృఢులను సమీపించలేకపోయాయి.

"ఈ దేహము అసత్యమే కదా!… మరి ఈ దేవతలు? … వీరు అసత్యరూపులే…! మేము ఎవరము? ఈ జగత్తు యొక్క స్థితి ఏమిటి? ఇదంతా స్వప్నసదృశమే కదా! ఇందులో నిత్యమైన దేది? మార్పు చెందబోతున్నదేది? ఈ జీవుల సంబంధములు ఎట్టివి…?”

ఇట్టి విచారణ చేస్తూ ఉండేవారు. ఇక వారి హృదయంలో ఏమాత్రం భయాదులు ఉత్పన్నమయ్యేవి కావు.

ఈ శరీరము మిథ్యయే. కనుక ఇది లేనిదే. శుద్ధ చైతన్యము మాత్రమే సత్యము. అదియే ఆత్మ యొక్క స్థితి. మేముగాని, ఈ దేవతలుగాని, తదితరులుగాని యథార్థానికి లేము. ఇదంతా ఆత్మమయం! ….అని సుదృఢంగా నిశ్చయించుకొని, అప్పుడు యుద్ధానికి బయలుదేరేవారు. శ్రీరాముడు : ఆ భీమ భాస దృఢులు అవగాహన చమత్కారంగా ఉంది. వారి తత్పరత, బుద్ధి ఎట్టిది?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. వారు అహంకార వర్జితులు. శ్రీరాముడు : అనగా…?

శ్రీ వసిష్ఠ మహర్షి : వారికి "మేము ముసలితనమును, మృత్యువును పొందుతామేమో? ఈ దేహం, దేహ సంబంధాల గతి ఏమిటి?… అను వేసట లేదు. జడమగు దేహానికి, చైతన్యమే స్వరూపంగా గల తమకు… గల వాస్తవ అవాస్తవ సంబంధములేమిటో వారు గ్రహించి యున్నారు. భూత భవిష్యత్తుల గురించిన సర్వ ఆశ, ఆర్తులను ప్రక్కకునెట్టి, కేవలం ఎప్పటికప్పుడు ప్రాప్తించే వర్తమానము నందు చేయవలసియున్నట్టి కార్యములు గురించి మాత్రం శక్తిని, బుద్ధిని, యుక్తిని

Page:166

వినియోగించేవారు. మహాధీరతతో వర్తమానమును మాత్రం అనుసరించి వర్తించుచుండేవారు. నిత్యమూ ఆసక్తిరహితమైన బుద్ధి కలిగి ఉండేవారు. “మేము వీరిని వధిస్తున్నాము…” అనే అభిమానము గాని, అహంకారము గాని వారియందు లేదు. అందుచేత వారు వధింపని వారే అగుచున్నారు. ‘వాసనలు’ అనే జాలములో వారు చిక్కుకొనుటలేదు. ’సర్వదా నేను కృతకృత్యుడనే… అకర్తనే”… అను ఎరుక కలిగి ఉంటున్నారు. “ఇది ప్రభువుకు సంబంధించిన కార్యము కనుక నిర్ణయానిర్ణయములు మాకు సంబంధించినవి కావు. నియమము యొక్క పాలన కొరకై మేము ఇది తప్పక నిర్వర్తించవలసియున్నది. కనుక అట్లే ఆచరించెదము గాక”… అను అప్రమేయత్వముతో కూడిన భావనమాత్రం కలిగి ఉంటున్నారు. వీతరాగులై, ద్వేషరహితులై, నిరంతరం సమదృష్టి కలిగియుండి, ‘యుద్ధము’ అను కార్యక్రమములో తత్పరులై యున్నారు.

వారు దేవతా సైన్యమును అతి సులభంగా హరించివేశారు. భోక్త భోగ్యవస్తువును అనుభవించినట్లు వారు యుద్ధమును ప్రదర్శించారు. అప్పుడు దేవతా సైన్యం నిస్సహాయులై పరుగెత్తి క్షీరసాగరంలో శయనించియున్న శ్రీ మన్నారాయణుని శరణువేడారు. విష్ణువు వారికి శరణాగతి ప్రసాదించి, “బిడ్డలారా! ఆ భీమ-భాస-దృఢులు జయింపబడలేరు. అయితే మీరు వెళ్ళి శ్వేత ద్వీపంలో ప్రవేశించి సుఖంగా ఉంటూ ఉండండి. మరి కొంతకాలము అయిన తరువాత ఆ శంబారాసురుని విషయం నేను చూచుకుంటాను” అని చెప్పి వారిని పంపించివేశాడు. తగిన సమయంలో విష్ణుభగవానుడు శంబరాసురునిపై దండెత్తి తన చక్రాయుధంతో అతనిని సైన్య సమేతంగా మట్టుపెట్టాడు. సృష్టిలో నిర్వర్తిస్తున్న సానుకూల్యమగు పాత్రను దృష్టిలో పెట్టుకొని దేవతలను కాపాడాడు. నారాయణునిచే హతులైన శంబరాసురుడు విష్ణులోకం చేరాడు.

అప్పుడు జరిగిన ఘోర సంగ్రామంలో, ఆ భగవానుడు భీమ-భాస-దృఢులకు విదేహ కైవల్యం ప్రసాదించాడు. ఆ ముగ్గురు రాక్షసులు వాసనారహితులు కదా! అందుచేత వారికి “పునర్జన్మలు” అనే గతి లభించనేలేదు. శాంతమనస్కులై, కేవలం స్వస్వరూపమగు ఆత్మయందు

పరిఢవిల్లారు.

  1. వాసనారాహిత్యము

తస్మాద్వాసనయా బద్ధం ముక్తం నిర్వాసనం మనః | రామ నిర్వాసనీభావ మాహరస్వ వివేకతః (సర్గ 34 శ్లో. 27)

చూచావా, రామచంద్రా! వాసనాసహితమగు మనస్సు “బద్ధము” అగుచున్నది. వాసనా రహితమగు మనస్సో,… ముక్తినే పొందుచున్నది. కనుక నీవు అవశ్యం ’వాసనారాహిత్యము’ను సంపాదించుకో.

సత్యవస్తువును బాగుగా విచారించుటచే వాసనలను నివర్తించగలవు.

Page:167

చమురు హరించిన తరువాత దీపం ప్రశమనం పొందుతుంది కదా! వాసనలు నశించాయా, ఇక, చిత్తమే ఉండదు. చిత్తములేని చోట సుఖం ఎక్కడ? దుఃఖం ఎక్కడ? ఆశ ఎక్కడ? మోహం ఎక్కడ?

సమ్యక్ దర్శనం, అవాస్తవ దర్శనం - ఇప్పుడిక్కడ దృశ్యకల్పన చేస్తున్నది ఎవరు?… పరిపూర్ణ మగు ‘ఆత్మ’ దృశ్యకల్పన చేస్తోందా?…. ఈ మాట కొంచెము కూడా సత్యము కాదు.

తాను పరిపూర్ణమై యుండి, దోషరహితమగు శుద్ధ చైతన్యం అయివుండి ఆయా కల్పనాదులు చేయుటచే వచ్చే ప్రయోజనమేమున్నది?

లేక మనస్సు చేస్తోందా? మనస్సు జడమైనదే కదా! దానిచే పనిచేయించాలంటే అందుకు మరొకటేదో ఉండి ఉండాలి. దానికి స్వతంత్రం ఎక్కడ ఉన్నది? లేదు.

కాబట్టి “దృశ్యాకరమగు భావన భ్రమచేతను, స్వస్వరూపము యొక్క విస్మరణ చేతను ఏర్పడుచున్నది”… అను సిద్ధాంతీకరింపబడుచున్నది. ఒకడు దీపపు కాంతికి ఎదురుగా నిలుచున్నాడనుకో.. కాంతి ప్రసరణమునకు తానే అడ్డుగా ఉండుటచే ‘నీడ’ అనునది ఏర్పడుతోంది కదా! స్వస్వరూపము యొక్క విస్మరణము చేతనే దృశ్యము ఘనీభూతమై ప్రాప్తించుచున్నది. అందుచేత - “నేను భావాతీతుడను" అను గ్రాహ్యమును కలిగియుండుము.

చిన్మాత్ర స్వరూపమగు పరమాత్మయే అంతటా గాంచుచుండుము. అప్పుడు… ఆ పరమాత్మ స్వరూపమే సర్వత్రా ఉన్నది. ఆ పరమాత్మ యొక్క కళయే నాయందు కూడా సర్వదా జ్ఞ్వాజ్వాల్య మానంగా వెలుగుచున్నది"… అని గ్రహిస్తావు. అప్పుడు ‘సమ్యక్ దర్శనము’ ప్రాప్తిస్తుంది. అదియే ముక్తి. అసమ్యక్ దర్శనమే బంధము.

వస్తుశూన్యమైన చిత్తము - ఈ జగత్తంతా ఆత్మయే అయి ఉండగా, ఇక ఎవడు ఎచట దేనిని భావిస్తాడు చెప్పు? అందుచేత సత్యవస్తువు విచారించు. అప్పుడు ‘చిత్తము-వాసన’… అనబడు రెండూ కూడా వాటి శబ్దార్దములతో సహా విలీనమైపోతాయి. వాటి విలీనమే ‘పరమపదము’ అయి ఉన్నది. కనుక, త్రిపుటి,* అద్దాని భావనాసంస్కారము కూడా భ్రమపూర్వకమైన ‘అవస్థ’ నుండే ఏర్పడుచున్నాయని గ్రహించు.

వాసనతో కూడిన చిత్తమే ఈ జగత్తునందు స్థితి కలిగియుండి, సంచారం చేస్తోంది. లేదా, వాసనాగ్రస్థమగు చిత్తమునందు మాత్రమే ఈ జగత్తు అనబడునది ఉండిఉంటోంది. అట్టి చిత్తము మాత్రమే బద్ధమగుచున్నది. చిత్తము వాసనారహితమయినప్పుడు ‘ఇతడు జీవన్ముక్తుడు” అని అంటున్నాం.

చిత్తమే కుండ-గుడ్డ-నీవు-నేను మొదలైన సర్వ జగత్ పదార్థరూపాలుగా స్థితి పొందివుంది. ఒక బాలుడు చీకటిలో ఏదో ఆకారము చూచి… “ఇది దయ్యము కాదు కదా? అవును..

త్రిపుటి చూచువాడు చూడబడునుది చూచుట ద్రష్ట దృశ్యము - దర్శనము

Page:168

అనుమానం లేదు… ఇది దయ్యమే!” అని భయమును పొందటం వంటిదే ఈ జగత్తును పొందుట కూడా! “ఓయీ, బాలుడా, అది దయ్యం కాదు. ఈ రోజు ఉదయం నీవు ఆడుకుంటున్నప్పుడు చూచిన స్తంభము మాత్రమే అది. ఇక వెత చెందవలసిన పనేమున్నది?”… అని అతని తండ్రి బోధించినప్పుడు ఆ బాలుని యందు బేతాళభావము శమించిపోతోంది కదా! సద్గురువులగు పూర్ణాత్మజ్ఞానులు, “బిడ్డలారా! ఈ జగత్తు, ఇందలి సంఘటనలు, పదార్థములు ఇవన్నీ వాస్తవం కావు. సత్యస్వరూపులగు మిమ్ములను బంధింపగలిగేది ఇక్కడ ఏమి ఉన్నది? ఏదీ లేదు” అని ప్రకటిస్తున్నారు. అనేక దృష్టాంతముల సహాయంచే బోధిస్తున్నారు. అప్పుడీ జీవులలో కొందరు శ్రద్ధ, ఆసక్తులతో విని, మననము చేసి, పరీక్షించి సత్యమేమిటో అవగతం చేసుకుంటున్నారు. ఈ జగత్తును పదార్థరహిత దృష్టితో చూస్తున్నారు. అనగా, తమ చిత్తమును వస్తు శూన్యం చేస్తున్నారు. శేషించిన పదమపదమగు ఆత్మయందు నిశ్చలమై ఉంటున్నారు.

“దామ వ్యాళ కట న్యాయం“…..“భీమ భాస దృఢ న్యాయము” -

దేహాత్మభావముగా పరిణమించిన ఈ చిత్తమునకు ఇప్పుడే ఇక్కడే సరి అయిన చికిత్స చేయాలి. భీమ-భాస-దృఢులవలె దానిని ఆత్మాకారముగా పరిణమింపజేయాలి. ఆపై నీవు నిశ్చలుడవై, ఎట్టి వికారములు పొందక, చేయవలసి వచ్చుచున్న దానిని నిస్సంగబుద్ధితో, కర్తృత్వాభిమానరహితుడవై చేస్తూ ఉండు. నిర్లిప్తుడవై “ఇచ్చట కనిపిస్తున్న దేహములు సత్యము కాదు… ఈ దృశ్యము కూడా సత్యము కాదు… సర్వదా సర్వత్రా సర్వము నందు సర్వులయందు ఆత్మమాత్రమే సత్యము” అని భావించి నిశ్చింతుడవగుము. ఒకప్పుడు నా తండ్రి బ్రహ్మదేవుడు ఈ ఉభయన్యాయముల గురించి హెచ్చరిక చేసియున్నారు. అదంతా ఇప్పుడు నీ ముందు ఉంచాను.

“మీరంతా భీమ-భాస-దృఢ న్యాయమే అనుసరించండి" అని ప్రియ శిష్యుడవగు నిన్ను నిమిత్తంగా చేసుకుని… అమృతానందమే వాస్తవ స్వరూపముగా గల సర్వజనులకు… ప్రతిపాది స్తున్నాను. ఓ ప్రియజనులారా! మీరంతా మహాబుద్ధిమంతులు కావాలి సుమా! సర్వత్రా అసంసక్త బుద్ధి కలిగి వర్తించుటచే “దృఢశోభ” అనే ఐశ్వర్యం లభించగలదు. ఈ సంసారం సుఖ దుఃఖాలచే పరిపూర్ణమై, అనేక జన్మ-కర్మలను నిర్మించి జీవునికి ప్రసాదిస్తోంది. త్రివిధమైన తాపములు అనుభవింపజేస్తోంది.

ఇది సమూలంగా విచ్ఛిన్నం కావాలంటే ‘నేను ఆత్మ స్వరూపుడను’ అను అవిచ్ఛిన్నమగు సమరసభావన ఒక్కటే ఉపాయం.