Page:169
V. దామవ్యాళకటోపాఖ్యానం: విషయ విచారణ
(మనస్సు)
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ మనస్సును గమనిస్తున్నావా? ఇది అత్యంత ఉత్సాహంగా ఉరకలు వేస్తూ విషయములవైపుకే పరుగులు తీయుచున్నది. ఈ సంసారము జీవుని పట్ల విజృంభించటానికి కారణం మనస్సే సుమా! ఫలితమేమిటి? ఈ జీవుడు సమస్త దుఃఖములను, ఆపదలను నిరంతరం పొందుచున్నాడు.
ఇందుకు ఉపాయం మనోనిగ్రహమే అయివున్నది. ఇప్పుడు జ్ఞానము యొక్క సర్వస్వమును ఒక వాక్యంలో చెపుతాను… ఇది విని ధారణను ఆశ్రయించెదవు గాక!
"భోగేచ్ఛా మాత్రకోబంధః తత్యాగో మోక్ష ఉచ్యతే”
విషయభోగములందు ఇచ్చ ఏర్పడి ఉండుటయే బంధము. అట్టి ఇచ్ఛను పరిత్యజించుటయే మోక్షము.
అనేక పాఠములచే పని ఏమున్నది? ఈ ఒక్క విషయం ఆచరించు, చాలు. అది ఏమంటే… "ఈ ప్రపంచమున ఏ వస్తువు ప్రీతివంతముగా తోచుచూ ఉంటుందో, అట్టి విషయమును లేక వస్తువును విషమువలె, అగ్ని వలె చూడటం.”
మరల మరల విచారణ చేస్తే " ఈ విషయ భోగములు ప్రమాదమునకే, అనగా, దుఃఖము అను అంతిమ ప్రయోజనమునకే దారి తీస్తాయి” అనే విషయం తెలిసిరాగలదు. అందుచేత ముందుగానే అట్టి నిశ్చయమును కలిగియుండుము. భోగవాసనలు త్యజించివేయి. భోగవాసనా త్యాగపూర్వకంగా విషయములు సేవిస్తే, అప్పుడు అవి సుఖప్రదములే అవుతాయి.
ముళ్ళ తీగవిత్తు నుండి ముళ్ళ తీగపొద పుట్టుచున్నది కదా! వాసనాగ్రస్థమగు బుద్ధి నుండి ’రాగము’ మొదలైన అనేక దోషములు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎవరి బుద్ధి అయితే అట్టి వాసనాజాలంతో తగులుకోకుండా, రాగ, ద్వేష రహితంగా, అచంచలంగా ఉంటున్నదో, అట్టి బుద్ధి మాత్రమే పరమశాంతిని పొందుతోంది. శాంతి మొదలైన శుభగుణసమన్వితము, దుఃఖ ఉద్రేక రహితము, శుభప్రదము అగు బుద్ధి జ్ఞానము వైపు, సమాధివైపు పయనించుచున్నది. ఫలితంగా ‘మోక్షము’ అనే ఫలమును ఉత్పన్నం చేస్తోంది.
Page:170
ఓ రామా! ఈ సర్వము ‘భావము’ నందే ఉదయించటం జరుగుతోంది సుమా! కనుక ఉత్తమ భావనానుసంధానం చేతనే మనస్సు ప్రశాంతత పొందుచున్నది. ఉత్తమ భావములు ఉన్న చోట ‘అజ్ఞానం’ అనే దట్టమైన మేఘము క్రమంగా నశించగలదు. సౌజన్యము శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందగలదు. వివేకము సూర్యతేజమువలె ప్రకాశించగలదు. అట్టివాడు ఆత్మవస్తువును పొందుతాడు. ఆత్మ లాభముచే హృదయము నందు ధైర్యము, ప్రశాంతత, పరమానందము వృద్ధి పొందుచున్నాయి. ఆ జీవుడు కృతార్థుడగుచున్నాడు.
ఇట్టి మార్గంలో అత్యంత శోభను కలుగజేయగలిగేది సత్సాంగత్యము. వివేకము వృద్ధి అగుచుండగా ఏకాగ్రత అనుదాని నుండి ‘సచ్చిదానందము’ అనే శ్రేష్ఠరసము ప్రవహిస్తూ ఉంటుంది. ఆత్మను గురించిన అవగాహన ధృడపడుచుండగా, ఇక అట్టి వాని మనస్సు నిర్ద్వంద్వం, నిష్కామం, ఉపద్రవరహితం అగుచున్నది. క్రమంగా తన చపలత్వమును త్యజిస్తోంది. శోక మోహ భయ వర్జితము అవుతోంది. సంశయరహితమగుచున్నది.
ఇచ్ఛా దోషరాహిత్యము - ఓ రాఘవా! "నేను విషయాలను, వైచిత్ర్యములను దర్శించాలి… పొందాలి”… అను ఇచ్ఛను ఈ మనస్సు ఎల్లప్పుడూ కలిగి ఉంటోంది. “నేను ఏదో పొందాలి…” అను భావోద్వేగమును నీ మనస్సు నుండి తొలగించివేయి. అప్పుడు ఈ మోహ కల్పనాజాలమంతా దానంతట అదే తొలగిపోతుంది. ఈ మనస్సు నిర్లిప్తము, ఆశావర్జితముగా చేయాలి. ‘ప్రవృత్తి’ అనుదాని పట్ల ప్రమేయరాహిత్యము, సంసర్గరాహిత్యము అలవాటు చేయాలి. మానసిక చింతలను “పూర్ణాత్మా హమ్” భావనచే క్రమక్రమంగా జయించివేయాలి. ఈ మనస్సు శోకరహితమై, స్వచ్ఛమై విషయములపట్ల ఆసక్తులను వదలినదై ప్రకాశించునుగాక!
ఎప్పుడైతే ఈ ’మనస్సు’ అనునది పలువిధాలైన మనోరథములతో, తృష్ణతో, సంశయాలతో నిండి ఉండటం జరుగుతుందో, ఇక ఆ జీవుని “నేను ఈ దేహమునకు సంబంధించినవాడను” అను రూపమున ఉండే “స్థూలదేహభావము” అనే దయ్యము పట్టుకుంటుంది.
ఈ మనస్సు నుండి స్థూలత్వమును పారద్రోలగలిగావా… ఇక అది ఈశ్వర స్వరూపము అగుచున్నది. అప్పుడు “ప్రత్యగాత్మత్వము” అనబడు జీవన్ముక్తిని సాధించిపెట్టగలదు. అందుచేత ఈ మనస్సును స్వసామర్థ్యము - - నిగ్రహము నందు నియమించు. అప్పుడది తనకు ఏ మార్గము దుఃఖభరితమో, ఏ మార్గము అనుసరణీయమో, ఏది ’స్వస్వరూపానందము’ను ప్రసాదించగలదో గ్రహిస్తుంది. క్రమంగా ”సాధ్యాసాధ్యములు, స్వపరములు” మొదలగు వికల్పములను త్యజించు చున్నది. అంటే ఆ తరువాత కల్పితమైనట్టి తన రూపాన్ని కూడా తృణప్రాయంగా త్యజించివేస్తుంది. ఈ మనస్సు నశించేది ఎట్లా? అసలు, మనోనాశనము అనగా ఏమి?
మనసో2భ్యుదయో నాశో మనోనాశోమహోదయః I
జ్ఞ మనోనాశమభ్యేతి మనోజ్ఞన్య వివర్ధతీ ॥ (సర్గ 35, శ్లో 18)
మనస్సు విషయాదులందు ప్రవర్తించకుండా ఉన్నదా, వినాశనము పొందుచున్నట్లే. మనో
Page:171
నాశనమే (మనస్సు యొక్క దృశ్య విషయ రాహిత్యమే) ఆత్మలాభము యొక్క ఉదయము సుమా! బ్రహజ్ఞాని యొక్క మనస్సు క్రమంగా, పూర్తిగా వినాశనము పొందుచున్నది. (లేక, దృశ్య విషయములన్నిటినీ ఆత్మచమత్కారంగా దర్శిస్తోంది).
అజ్ఞాని యొక్క మనస్సో, సర్వదా వృద్ధియే చెందుతోంది. నాయనా! రామా! ఈ జగచ్చక్రమంతా మనోమాత్రమే అయివున్నది. ఈ పర్వతములు – దేవతలు -
శత్రువులు - మిత్రులు - ఇదంతా మనస్సే అయివున్నది.
వికల్పములచే దృష్టి-అవగాహన మలినము కాగా, అప్పుడు ఆ చిద్వస్తువుకు సంభవిస్తున్న స్వస్వరూపమునకు సంబంధించిన విస్మరణమే మనస్సు.
ఈ జీవుని సంసారములోకి నెట్టివేయుచున్నట్టి మనస్సే వాసన. వాసనావశం చేత మనస్సులోకి విషయములు ప్రవేశిస్తున్నాయి. అప్పుడు ఆ సమయంలో చిద్వస్తువు పరిచ్ఛిన్నము వలె తోచుచున్నది. వ్యవహారయోగ్యత - సంసర్గము వికల్పములచే మాలిన్యము పొందుచున్నది. అట్టి దోషముతో కూడుకున్న భావన పొందుచున్న బ్రహ్మమే ఈ జీవుడు. ఈ జీవుడు విషయము లందు పడి, వాటిని చిరకాలము అభ్యసించుటచే అభిమానము పొందుచున్నాడు. అజ్ఞత్వము (లేక) స్వస్వరూపవిస్మరణను పొందుచున్నాడు. వికల్పములచే మోహితుడై, సారభూతమగు ఆత్మ సుఖమును పోగొట్టుకొని నిస్సారభూతుడగుచున్నాడు. అప్పుడాతని బాహ్యవిషయాను సంధాన రూపమైనట్టి వ్యతిరిక్త చింతనలే మనస్సు రూపమున కల్పన గావించబడుచున్నాయి.
ఆత్మ యొక్క రూపమేమిటి?- శుద్దమగు ఆత్మ జీవ రూపము కాదు. ఈ శరీర రూపము కూడా కాదు. రక్తమాంసాది రూపము కానే కాదు.
ఈ శరీరాదులన్నీ పరిచ్ఛిన్నములై, జడములై ఉన్నాయి కదా! ఆత్మ సర్వదా ఆకాశము వలె నిర్లిప్తమై, అనిర్వచనీయమై ఉంటోంది. అరటి బోదెను ఛేదించిన అక్కడ దళములు గాక ఇంకేమి ఉంటాయి? ఈ దేహమును విచ్ఛిత్తి చేసినప్పుడు కూడా ఇందు ’రక్తము-మాంసము-బొమికలు” తప్పితే వేరే ఏమీ లభించవు. అట్లాగే, వాస్తవానికి… ఈ భౌతిక దేహము ’జీవుడు’ కాదు.
మనస్సే జీవుడు…! -
మనో జీవో నరం విద్ధి తదేవాకారమాగతమ్ | ఆత్మనాత్మానమాదత్తే స్వవికల్పాత్మకల్పితమ్ ॥ (శో 25, సర్గ 35)
మనస్సే ఆకారం పొందుతోంది. అదే వికల్పములన్నింటినీ పొందుతోంది. అదే మరొకప్పుడు మరల తన యొక్క ఆత్మను తానే గ్రహిస్తోంది. ఆత్మార్పణ యజ్ఞకార్యం నిర్వర్తిస్తోంది.
పట్టుపురుగు తన జాలమును తానే నిర్మించుకుంటూ __ఉంటుంది చూచావా? స్వవాసనావశం చేత ఈ జీవుడు తన వికల్పములచే స్వీయబంధము కొరకై జాలమును నిర్మించు
Page:172
కుంటున్నాడు. భ్రమమయమగు ఈ మనస్సు ఒక దేహమును త్యజించిన తరువాత మరల వేరైన దేశకాలములందు వేరైన దేహమును ధరించుచున్నది. మనస్సు ఏఏ వాసనలు కలిగి ఉంటుందో… వాటిని అనుసరించే, తదనురూపంగానే శరీరములు ఉత్పన్నములగుచున్నాయి. ఒకడు నిదురిస్తున్నాడనుకో… అతడు తన చిత్తములో ఏమేమి కలిగి ఉంటాడో దానిని అనుసరించే స్వప్నమును పొందటం జరుగుతుంది కదా! ఏ విత్తునాటితే, అట్టి చెట్టే వస్తుంది. ముందుముందు వచ్చే దేహములు కూడా అట్లే ప్రాప్తిస్తున్నాయి. ఈ వర్తమాన శరీరము కూడా అట్టిదే.
ఉత్తమ వాసనలు గల చిత్తము ఉత్తరోత్తర మహత్తరరూపమునే పొందబోవుచున్నది. నీచ వాసనలు గల చిత్తము ముందు ముందు నీచ జన్మల యొక్క అనుభవమును పొందబోవుచున్నది.
అందుచేత జీవుడు ఎప్పటికప్పుడు తన సంకల్పాలను, ఆసక్తులను పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. తన మనస్సు యొక్క దోషములేమిటో గమనించుకుంటూ ఉండాలి. శరీరము యొక్క ఆరోగ్యం ఎంతగా అవసరమో, అంతకన్నా ఎక్కువగా ముందుగా ఈ మనస్సుకు సరిఅయిన చికిత్స చేసుకోవాలి. అయ్యో! సృష్టిలో ప్రవేశించియున్న అనేకమంది జీవులు తమ మనస్సుకొరకై చికిత్సను ఆశ్రయించుటలేదు. పైగా ప్రలోభాదులకే ఆశ్రయం ఇస్తున్నారు!
అతి స్వల్పవిషయములైనట్టి స్త్రీ-ధనం-ఇంద్రియానుభవాలు, పేరు ప్రతిష్ఠలు మొదలైన స్వల్పకాల పరిమిత వ్యవహారములకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆత్మ జ్ఞాన విషయంలో అజాగరూకులై ఉంటున్నారు.
"నేను దేనికి సంబంధించినవాడను? దేనికి సంబంధించని వాడను? ఏది అయి ఉన్నాను? ఏది కాకయే ఉన్నాను?…” అని వారు సద్విమర్శ చేయరేం? పిశాచముల గురించి వాసన గల వాడు రాత్రి స్వప్నంలో పిశాచములను చూస్తాడు కదా! క్షుద్రవాసనాయుక్తమగు ఈ చిత్తము నీచత్వమునే పొందుచున్నది. ఒక సరోవరంలోని అతి కాలుష్యముగల జలంలో దుర్వాసనలు ఉండకుండా ఉంటాయా? అతి నిర్మలమగు జలంలో అరుచి ఉంటుందా? మనస్సు మిక్కిలి మలిన మైతే… అది చేసే పనులు వాటి ప్రయోజనాలు దోషపూరితంగానూ, దుఃఖకరంగానూ ఉంటాయి. మనస్సు నైష్కర్మ్యముచే, వాసనారాహిత్యముచే, సమగ్రమగు సమరసభావనచే నిర్మలంగా ఉన్నదనుకో… అప్పుడు దాని కార్యములు, ప్రయోజనములు శుభకరంగానే ఉంటాయి. శ్రీరాముడు: తండ్రీ! ఈ జీవుడు దోషమును గ్రహించి కూడా పూర్వ సంస్కార బలంచేత వాసన, దుఃఖాదులు బలవత్తరముగా పొందటం జరుగుతోంది. మరటువంటప్పుడు అతని గతి ఏమిటి? మీరు చెప్పిన ఔన్నత్యము సుస్థిరీకరించుకోవటం ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి: చంద్రుడు క్షయిస్తున్నా “నేను మరల పూర్ణుడను కాగలను" అనే ఆశ త్యజించడు కదా! నిర్మల చిత్తుడైనవాడు దారిద్య్రము మొదలైనవాటిచే పీడింపబడుచున్నప్పటికీ శాంతి, మనః సమాధానరూపకమగు ఉత్తమగతిని విడచిపెట్టడు.
బంధమెవరికి? ముక్తి ఎవరికి?
Page:173
యథార్థానికి ఇక్కడ బంధముగాని, మోక్షముగాని, లేవు. బంధ, అబంధములయొక్క
భావము లేదు. ఇంద్రజాలంలో జరుగుతుంది చూచావా? అట్లాగే మాయయే మిథ్యారూపమున ఉదయించి, లయించుచున్నది.
సర్వైవ బ్రహ్మసత్తేయ మిత్యేషా పరమార్థతా
పరిస్ఫురతి నిఃసారః సంసారో యమసన్మయః (శ్లో 37, సర్గ 35)
“అంతయు బ్రహ్మము”… అనునదే పరమార్థ సత్యము. ఇక ఈ జగత్తంటావా, ఇది నిస్సారము, అసన్మయము అయి స్ఫురిస్తుంది.
“నేను అంతము (లేక) నాశనము కలవాడను, అల్పుడను” అనే దుష్టభావముచే కలుగు చున్న వికల్పములను ఈ జీవుడు త్యజించాలి. అట్టి స్వల్పత్వము తొలగిపోవాలంటే ఆత్మ భావించ బడాలి. “నేను అనంతుడను. శాశ్వతుడను, అఖండుడను, సర్వకల్పనలు నావే.. అంతే కానీ అవి నేను కాదు” అను రూపముగల నిశ్చయముచే స్వల్పత్వము తనంతటతానే నశించుచున్నది.
ఓయి! జీవుడా! సర్వవ్యాపకము, నిర్మలము, ఆత్మ స్వరూపము అయి ఉన్న నీవు “నేను దేహ మాత్రుడను” అని అనుకొనుటచేతనే అన్ని దుఃఖములు వచ్చి పడుచున్నాయి. ఈ ప్రపంచమంతా స్వవికల్పకల్పితము మాత్రమే సుమా! నీ స్వరూపమునకు నీవే స్వల్పత్వము ఆపాదించుటచే, అట్టి భావనయే సర్వవిధ బంధముగా పరిణమించుచున్నదని గ్రహించు.
వాస్తవానికి “నీవు-నేను-జగత్తు”… మొదలైనదంతా కూడా బంధ మోక్ష రహితము, ద్వైత అద్వైతా వర్జితము అగు బ్రహ్మసత్తయే అయివున్నది. ఇది ఏమాత్రం సందేహింప అవసరం లేని పరమార్థసత్యము. అయితే ఈ జీవుడు ఆ పరమార్థసత్యమును దర్శించుటలేదు. కొందరు ధీరులు, నిర్మలహృదయులు మాత్రం ఈ దృశ్య రూపంతో కూడిన తమ యొక్క మనోబుద్ది అహంకారాలను పరిశుద్ధం చేసుకుంటున్నారు. ఆయా ప్రయత్నములచే ఆసక్తిరహితులు, అమనస్కులు అగుచున్నారు. అట్టివారు ఈ అధికారదేహముతోనే బ్రహ్మమును దర్శించగలుగు చున్నారు.
తెల్లటి గుడ్డ ఏ రంగునైనా సహజంగా, చక్కగా స్వీకరించగలుగుతుంది కదా!
సమత్వము, సమాధి అభ్యసించుచూరాగా, అప్పుడు ‘ధర్మవృద్ధి’ అనే నిర్మలజలంలో పరిశుభ్రం కావించబడిన మనస్సు బ్రహ్మసంబంధమగు దృష్టిని అతిశీఘ్రంగా గ్రహించుచున్నది.
ఆత్మను భావించుచూ బుద్ధిని అధిగమించాలి - “అంతా ఆత్మయే అయివున్నది”… అను సర్వాత్మకమగు భావనచే ”ఇది త్యజించాలి… అది గ్రహించాలి…” అను పట్టుదలతో కూడిన బుద్ధి శమిస్తోంది. ఆపై నీవు ఈ బంధ మోక్షముల దృష్టి కూడా పూర్తిగా పరిత్యజించవచ్చు. అట్టి స్థితిలో ఒక స్వచ్ఛమైన స్ఫటికములో ప్రతిబింబించే దృశ్యములాగా, నీయందు ఈ జగత్తు ప్రతిభాసమాత్రంగా (Merely like a refraction) అనుభమవుతూ ఉంటుంది. శాస్త్రశ్రవణాదులచే, వైరాగ్యపూర్వకమగు అభ్యాసముచే శుద్ధమొనర్చబడిన బుద్ధిగలవాడు ఈ శరీరమును, శరీరముతో
Page:174
ఏర్పడుచున్న సంబంధ బాంధవ్యములను, ఈ జగత్తును ఆ విధంగా ప్రతిభాసమాత్రంగా దర్శించగలుగున్నాడు.
చమత్కారం ఏమిటంటే… ఈ మనస్సు పదార్థములతో తదాత్మ్యము పొంది ఏకరూపము పొందుచున్నప్పుడు అట్టి సమయంలో ఆత్మతో సారూప్యము (Oneness) పొందలేకపోతోంది. శ్రీరాముడు: మీరు చెప్పునది వాస్తవమే. మరి మేము ఎప్పటికైనా ఆత్మతో ఏకరూపత్వము పొందగలమంటారా? మేము ఈ సాంసారిక దృష్టులను వదిలించుకునేది ఎట్లా చెప్పండి? స్ఫటికంలో దృశ్యంవలె, ఈ దృశ్యమును స్వస్వరూపాంతర్గతంగా సందర్శించేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి: నాయనా! రామా! ఆధ్యాత్మ క్షేత్రంలో నిరాశ నిస్పృహలకు స్థానం లేదు. “అసత్యదృష్టిని నేను ప్రయత్నబలంచే తప్పక జయించగలను”… అను ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఈ మనస్సు బాహ్యాభ్యంతర దృష్టులన్నింటినీ జయించి, ఆత్మయందు లీనమైనదా… ఇక సర్వోత్కృష్టమగు బ్రహ్మపదమును పొందినట్లే సుమా! అట్లు పొందినవారు అనేకులు ఉన్నారు. కొంచెం వివేకముతో ప్రయత్నం చేస్తూ ఉంటే అది ప్రతి ఒక్కరికి తప్పక సుసాధ్యమే.
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ దృశ్యమంతా మిథ్యయే అయివున్నది. అట్టి దృశ్య మయమవటమే మనస్సు యొక్క రూపం. అంతేగాని, మనస్సుకు వేరుగా రూపమంటూ ఏదీ లేదు.
తర్క శాస్త్రమును అనుసరించి… ఏదైనా మొట్టమొదట చిట్టచివరా ’అసత్తే’ అయి ఉంటుందనుకో… అది మధ్యలోకూడా అసత్తే. ఈ సిద్ధాంతము ననుసరించి మనస్సు ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోవుచున్నది. కనుక, మనస్సు అసద్రూపమే అయివున్నది. మనస్సును అసద్రూపంగా ఎరుగనివానికి తనయందే దుఃఖములన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి సుమా!
మనస్సు ఒకప్పుడు ఉండటం, మరొకప్పుడు లేకపోవటం…. అనుదాని దృష్టాంతం! నిద్రా సమయంలో, పరమోత్కృష్ట మోక్షస్థితిలో ఈ జీవుడు మనోరాహిత్యమును పొందుచున్నాడు కదా! కనుక మనస్సు ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు ఉండనిదే అగుచున్నది.
అసద్రూపం - స్వతహాగా అవాస్తవమై, భ్రమ ఉన్నప్పుడు ప్రాప్తించేదేదైతే ఉన్నదో, అది “అసద్రూపము” అను శబ్దముచే చెప్పబడుతోంది.
“ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే” అనే ఎరుక (లేక) భావన కలిగియుండకపోతే ఈ దృశ్యము దుఃఖప్రదమే అవుతుంది.
“అంతయు ఆత్మయే”… అను జ్ఞానముచే భోగ మోక్షములు రెండూ పొందబడగలవు.
Page:175
“జలము వేరు… ఈ తరంగములు వేరు" అనునట్టి వాసనతో కూడిన బుద్ధితో అజ్ఞానము
“జలతరంగములు రెండూ కూడా ఒక్కటే”… అనునట్టి ఏకత్వబుద్ధియే జ్ఞానము. ఒక నీటి బొట్టు
నీరు వేరువేరు ఎట్లా అవుతాయి? నీరు… నీటి బొట్లలో, నీటిబొట్టు… నీటిలో ఉండియే
ఉన్నాయి.
శ్రీ రాముడు: మరి ఈ హేయము (త్యజించవలసినది ఏమిటి? ఉపాదేయము (స్వీకరించవలసినది) ఏమిటి? ఈ నానాత్వమంతా ఎట్లా ఏర్పడుచున్నది.
శ్రీ వసిష్ఠమహర్షి: స్వగతమైన అవగాహన దృష్టిదోషముచే ప్రాప్తిస్తున్న ఈ నానాత్వమంతా స్వతహాగా అసద్రూపమే. అనగా స్వయముగా లేదు. కాని ఉన్నట్లు కనబడుచున్నది. జననమరణ రూపమున గల దుఃఖమంతా భావనను అనుసరించే ప్రాప్తిస్తున్నాయి. ఈ హేయ ఉపాధేయములు అభావించబడినాయనుకో… అప్పుడు శేషించునది ఏమిటి?…. అనంతరూపమగు ఆత్మయే.
‘మనస్సు’ అనబడునది సంకల్పములచే కల్పించబడినది మాత్రమే. కాబట్టి అసత్తుగాక మరింకేమి? ‘అసత్తు’ అయిన వస్తువు నశించుటచే ఎవరికి ఏమి నష్టం చెప్పు? స్వప్నంలో కనబడుచున్న పదిమంది మరణిస్తే ఎవరు దేనిని కోల్పోవుచున్నారు?
నీకు ఇప్పుడే పరిచయం అయిన ఒకడు ఉన్నాడనుకో… అతడు నిన్ను, నీవు అతనిని ఉదాసీనంగా, రాగద్వేషరహితంగా చూచుకుంటూ ఉంటారు కదా! అట్లాగే పదార్థ రూపం ఎరిగిన వాడు ఈ పాంచభౌతిక దేహమును అట్టి దేహంతో కల్పించబడుచున్న సంబంధ బాంధవ్యములను అత్యంత ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు. ఇక అది ఎరుగనివాడో ఎదురుగా ఉన్నదానిని సత్యము గాను, నిత్యము గాను, ప్రియమైనదాని గాను… మొదలైన ఆయా కల్పనలతో చూస్తూ, తాదాత్మ్యం చెందుచున్నాడు.
ద్రష్ట దృశ్యము
ద్రష్టగాని, దృశ్యముగాని లేనట్టి ’దృక్’ స్వరూపము
శ్రీరాముడు: స్వామి! నా యొక్క ( ఈ జీవుని యొక్క వాస్తవస్వరూపం అవగతమగుటకు దృష్టాంతపూర్వకమైన విశేషములు చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి
తదనేది శివం జ్ఞానం యన్మధ్యం ద్రష్టృదృశ్యయోః
తస్మిన్సత్యే మనః శాస్త్రం పాంసుర్వాయుక్షయే యథా॥ (సర్గ 35, శ్లో 55)
“దృష్ట… దృశ్యము”ల మధ్యగల ‘దృక్’ రూపమే నీ స్వరూపము అయివున్నది… అని గ్రహించు. ఆ దృక్ూపము అనాది, అనంతమగు శివస్వరూపము. అదియే నిరతిశయానంద
Page:176
కరమగు ఆత్మయొక్క జ్ఞాన స్వరూపం కూడా. వాయువు శమిస్తే ధూళి కూడా శమించినట్లు, ప్రయత్నశీలుడు అగుచున్న వాని యొక్క మనస్సు అధిష్ఠానమగు ఆత్మయందే శమించుచున్నది.
మనస్సు శమించుటచే శరీరాలు కూడా శాంతించుచున్నాయి. అప్పుడు అవిద్యావరణం (లేక) సంసారం అనే మంచు కురియదు. వాసనలు శమించగానే స్వస్వరూపమునందు మనస్సు యొక్క నిలకడ ప్రాప్తిస్తోంది.
అజ్ఞానమే హృదయమునందు ‘భయము’ అనే మకిలిని పుట్టిస్తోంది. అజ్ఞానము తొలగితే తృష్ణ కూడా తొలగుచున్నది. రాగం మొదలైనవన్నీ సన్నగిల్లుచున్నాయి. ఇంద్రియభావన వెనుకకు మరలుతోంది. మోహం త్యజించబడగా నీవు జాజ్వల్యమానుడవై వెలుగుతూ ఉంటావు. అప్పుడు, దేహమునకు సంబంధించిన క్షుద్రభావములు ఊసుకూడా ఉండదు. సంకల్పములు ఉండవు. నీ యందే నీకు ‘ఆత్మస్వరూపము’ అను ఆకాశము ప్రత్యక్షముగా స్ఫురించగలదు. "అట్టి మహోదయ సంపన్నుడవగు నీ యొక్క స్వచ్ఛ ప్రకాశమును వర్ణించుటకు వాక్యములు చాలవు”.
తృష్ణ త్యజించినట్టివాని హృదయము విమోహమై, వివేకయుక్తమై, పాశ వర్జితమై, తమోగుణ రజోగుణ రహితమై శోభిస్తోంది. చిత్తము పూర్ణవిమలత్వము పొందుతోంది. “ఆత్మజ్ఞానము” అను ఫలమును పొందినట్టి ఆ వివేకి తన సంచారమనే ఈ పృథ్విని పవిత్రం చేస్తున్నాడు. అహంకార రహితమగు అట్టి వానికి ఈ బ్రహ్మాండమంతా ఆత్మప్రకాశయుక్తంగాను, స్వచ్ఛ శీతల ఛాయా సహితంగాను కనబడుతోంది. కనుక నీ యొక్క బుద్ధి విస్తరిల్లుటకొరకు, మనోనిర్మలత్వము కొరకు “కర్మలు నిర్వర్తించుట” అను యజ్ఞమును నిర్వర్తించు.
ఓ రామా! మలినము, చంచలము అయిన ‘అహంకారము’ను హృదయము నుండి పార ద్రోలివేయి. మరుక్షణం అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వేశుడు, వాసనారహితుడు, శాంత చిత్తుడు అగు ఆ ఆత్మదేవుడు నీ హృదయమున స్వయముగా ప్రభువై విరాజిల్లుతాడు.
‘తత్త్వవిచారణ’చే ’ఆత్మ’ అను జ్యోతి ప్రాప్తించగా, సమస్తదోషములు తొలగిపోతాయి. అట్టి ఆత్మ స్వరూపడగు జీవుడు ఈ జననమరణములలో, ఐహిక పారలౌకిక స్థితులలో ఉద్వేగరహితుడై ఉంటున్నాడు. అతడు స్వదేహనగరంలో తాపత్రయరహితుడై విలాసంగా విహరిస్తున్నాడు.
శ్రీరాముడు: మహాత్మా! విశ్వమునకు అతీతమైనట్టి ఆ చిదాత్మయందు ఈ ప్రపంచమంతా ఎట్లు స్థితిని పొందియున్నది? నా జ్ఞానాభివృద్ధి కొరకై, ఈ విషయములో, "జ్ఞానుల అవగాహన” ఏమిటో విశదపరచండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రశాంతముగా ఉన్న సముద్రజలంలోనే, తరువాత, తరువాత…. ఉత్పన్నం కాబోయే తరంగాలు, వాటివాటి ఆకారాదులు అభేదపూర్వకంగా ఉన్నాయి కదా! అదే విధంగా ఈ సృష్టి కూడా ఇట్టి సృష్టికి పూర్వము చిదాత్మయందే ఉండి ఉన్నది.
Page:177
ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, తన యొక్క ‘సూక్ష్మత్వము’ కారణంగా అది కంటికి కనబడకయే ఉంటోంది. అతి సూక్ష్మమగు ఆత్మ కూడా ‘సర్వవ్యాపి’ అయినప్పటికీ మనస్సుకు అగోచరంగా ఉంటోంది.
నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఒక స్పటికశిల ఉన్నదనుకో… ఆ శిలయందు ఎదురుగా దూరంగా ఉన్నట్టి దృశ్యము ప్రతిబింబిస్తోంది… అందులో ప్రతిబింబించేదంతా సత్తుగాని అసత్తు గాని (ఉన్నది లేక లేనిది) కాకుండానే అనిర్వచనీయమైయున్నది కదా! ఆ స్ఫటికంలో దృశ్యం లాగానే ఆత్మయందు ఈ సృష్టి ఉన్నది.
ఆకాశమునందు ఆ మేఘములను చూడు… మేఘములు ఉన్నదెక్కడ? ఆకాశమునందే కదా! అట్లు మేఘములకు ఆకాశమే ఆధారభూతమైనప్పటికీ, ఆకాశము మేఘములచే స్పృశించ బడుతోందా? లేదు. ఆ పరాచైతన్యం తనయందున్న ఈ సృష్టులన్నిటికీ ఆధారభూతమై ఉంటోంది. కాని ఈ సృష్టులచే అది ఏమాత్రం స్పృశించబడుటలేదు.
చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి తటాకజలంలో ప్రతిబింబరూపంగా అగుపిస్తూంటాయి కదా! ఈ శరీరమునందు ఉన్నట్టి ఆత్మ ప్రతిబింబరూపమున ఈ రీతిగా వ్యక్తమగుచూ ఉంటుంది.
చిదాత్మ సర్వసంజ్ఞలకు, సంకల్పములకు సంబంధించినది. నాశరహితమైనది. "జీవించుట, విషయాలు” మొదలైన సంజ్ఞలన్నీ చిదాత్మయందే కల్పించబడుచున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, వేదజ్ఞులు ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు - - అది ఆకాశముకంటే అత్యంత స్వచ్ఛమైనది.. నిష్కళంకమైనది… కళాసహితము, కళారహితము కూడా”… అని చెప్పుచున్నారు. అయినా కూడా, వారు ఆత్మను జగత్తుకు అభిన్నమైనదానిగా వర్ణించటం జరుగుతోంది.
సముద్రంలో తరంగాలను చూడు. వేరు వేరు తరంగాలు వేరువేరుగా గోచరిస్తూ ఉంటాయి. కాని అవన్నీ జలమే కదా! జలము కంటే అధికంగా తరంగములలో ఇంకేమున్నది? ’చైతన్యము అనే మహాసముద్రంలో ‘నీది, నాది’ అను రూపమున అనేకత్వము స్ఫురించవచ్చు గాక! అయిన ప్పటికీ చైతన్యమునకు భిన్నంగా ఈ ప్రపంచమున ఏదీ ప్రకాశించుటలేదు. ఏదీ లేదు కూడా…! ఈ చైతన్యము ఏదైనా విషయమును అనుభవించుచున్నప్పుడు, అది వాస్తవానికి తన యందే, తన రూపమునే అట్లు అనుభవించుట జరుగుచున్నది.
చైతన్యము సర్వదా ఆత్మ స్వరూపముననే స్థితి కలిగి ఉంటున్నది. అజ్ఞులు మాత్రమే "ఈ జగత్తు ఆత్మకంటే వేరు” అను అభిప్రాయమును కలిగి ఉంటున్నారు.
జ్ఞానుల దృష్టికి… మిథ్యా స్వభావముగల ప్రపంచము ద్రష్టయొక్క కల్పనయే అయి వున్నది. “కల్పన” అనునది ఆ కల్పనచేయువాని చమత్కార వ్యవహారమే అయినట్లు, ఈజగత్తు ఆత్మకు అభిన్నమై, ఆత్మయొక్క చమత్కార వ్యవహారమై వెలయుచున్నది.
Page:178
- చైతన్యము సర్వదా కేవల ప్రకాశస్వరూపమైనది.
జీవుల జన్మ మరణాది కర్మలకు కారణమై ఒప్పుచున్నది. - ఇది ఎప్పుడూ నశించదు. ఉత్పన్నమవదు.
లేవదు. కూర్చోదు. వచ్చుట లేదు. పోవుటలేదు.
దానికి ‘ఈ స్థానము, ఆ స్థానము’ అనునది ఉండదు. - అది సర్వత్రా వ్యాపించి, ఏకరూపమై యున్నది.
నిత్యనిర్మలమగు చైతన్యము (లేక ఆత్మ, లేక బ్రహ్మము) సర్వదా తన స్వరూపముననే వ్యవస్థితమైయున్నది…! ఉదాహరణకు జీవుడు ఎట్టి భావాదులను పొందుచున్నప్పటికీ తనను తాను త్యజిస్తున్నాడా? లేదు కదా! ఈ చైతన్యము తన సత్యస్వరూపము దృష్ట్యా మార్పు చేర్పులు లేకయే ఉంటోంది. కాని, ఒకడు త్రాడునందు పామును చూస్తున్నట్లు ఈ ప్రపంచరూపమున వివర్తభాగము మాత్రం పొందుచున్నది. అగ్ని ‘తేజస్సు’ రూపమున జలం ’ప్రవాహం’ రూపమున స్ఫురిస్తోంది చూచావా? అట్లే, చైతన్యము సృష్టి విలాసరూపమున స్ఫురిస్తోంది.
చిదాత్మ ‘సృష్టి రచన’ అను స్వభావముతో కూడుకొనినదై ఉంటోంది. అదే సమయంలో, సర్వవ్యాపి కూడా అయి ఉంటోంది. స్వప్నద్రష్ట ‘స్వప్నమును రచించుట’ అను చమత్కారమును కలిగియుండి, స్వప్నంలో “సర్వవ్యాపి” అయి ఉన్నాడు కదా! ఇదికూడా అట్లే!
యథార్థానికి చిదాత్మ ప్రకాశమయమే… కాని వ్యవహారదృష్ట్యా అప్రకాశమయంగా తోచుచున్నది. అది నిత్య నిర్మలము, సంశయరహితమూ అయినప్పటికీ.. దృశ్యములో తారసపడే కార్య కారణముల దృష్ట్యా సంశయసహితము అగుచున్నది. అవిద్యాకారణం చేత అవిద్య యందు కృత్రిమ రూపముగా ప్రతిబింబించుచున్నది. అట్లు ప్రతిబింబించుచున్నప్పుడు తన యొక్క అనంత రూపమును ఏమరచుచున్నది. అంత మాత్రమే గాని, అది తన అనంతత్వమును ఏ మాత్రం కోల్పోవుట లేదు. ’అహంభావము’ అను స్వల్పత్వమును మననరూపముగా పరిగ్రహించి, క్రమంగా ‘జీవత్వప్రాప్తి’ని పొందుచున్నది. పదార్థముల పట్ల అనేకత్వము దృఢపడగా ఈ ప్రపంచ కల్పన మంతా అనుభవించుచున్నది. ’ఇది కలదు, ఇది లేదు, ఇది కావలెను, ఇది తొలగవలెను, ఇది ఇట్లు ఉండవలెను, అది అట్లా ఎందుకుండాలి….” అనునట్టి ఇష్ట, అనిష్టములను, స్వీకార తిరస్కారమును పొందుచున్నది. దీనినే ‘దేహాత్మభావము’ అని అంటున్నాం. ఈ చిదాత్మ అనేకాలైన విహితకర్మలు, నిషిద్ధకర్మలు అనేక శారీరక మానసిక క్రియలు మొదలైనవాటి ద్వారా ఈ ప్రపంచ మంతటినీ తన యొక్క ‘భోగ్యవస్తువు’గా పొందుచున్నది. కాని, చిదాత్మ ఏదీ ఒనర్చుట లేదు.
ఆహాఁ! చైతన్యము యొక్క మహిమ చూచావా? అదియే తనయందు స్వయముగా ‘జగత్తు’ అను అంకురరూపముగా ఉన్నతిని పొందుచూ కూడా, స్వస్వరూపస్థితి త్యజించకయే ఉంటోంది.
Page:179
అదియే ఈ రూపవంతములైన పదార్థములు ఏర్పడి ఉండటానికి వీలుగా రూపరహితము, అమూర్తివంతము అగు ఆకాశము యొక్క కల్పనను అంగీకరిస్తోంది.
అది ‘ఇచ్చ’ భావనలు పొందకపోతే ఈ ‘జగత్తు’ అనబడేదే వృద్ధి పొంది ఉండేది కాదు. జగత్తు అనే అంకురమును చైతన్యమే తనయొక్క ప్రకాశముచే, స్పందనచే పెంచి పరిపోషించు చున్నది. చైతన్యమే వాస్తవస్వరూపముగా గల ఓ రామా! చైతన్యమే సర్వదా సర్వమునకు కారణమని గ్రహించు.
ఈ ‘జగత్తు’ అనుదానిని పృథ్వీధర్మం చేతను, అగ్నిధర్మం చేతను, వాయుధర్మం చేతను, జల ధర్మం చేతను పరిపోషించుచున్నది చైతన్య రూపమగు చిదాత్మయే. “కాలము యొక్క కల్పన, సూర్యకిరణతత్వము, ధాన్యముల ఉత్పత్తి"… ఇవన్నీ కూడా చైతన్యము యొక్క ప్రభావమే. అదే పుష్పాలలో ’గంధం’ గాను, మట్టిలో రసరూపంగాను, వృక్షంలో ఫలత్వం గాను ప్రవర్తిస్తోంది.
ఈ జగత్తులో సర్వవస్తువుల రూపమున చైతన్యము సుప్రకటితమగుచున్నది.
వసంతకాలంలో పుష్పములందలి పుప్పొడి, గ్రీష్మకాలమునందలి సూర్యతేజోవిభవము, వర్షాకాలంలో నీలమేఘ ప్రదర్శనము, శరదృతువులో ఫలదీకరణము, హేమంతంలో మంచు, శిశిర ఋతువులో శీతలవాయువులు… అంతా కూడా చైతన్యము యొక్క విభవములే సుమా!
ఓ రామచంద్రా! కాలం ఎప్పుడైనా “దినం-సంవత్సరం-యుగం“ అను రూపమున గల తన యొక్క నియతిని త్యజిస్తోందా? లేదు కదా! నదులలో తరంగముల రూపమున జలం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది కదా! అదే విధంగా సృష్టి సమూహములన్నీ గమనశీలము కలిగి ఉంటున్నాయి. ఈ ”బ్రహ్మాండముల ఆవిర్భావం - తిరోభావం" అనే నియతి ఇట్లే వర్తించుచున్నది. -
అనంత సంఖ్యలో జీవరాసులు వచ్చి, ఉండి, పోవుచున్న ఈ పృథివి ఇట్లే నియతిని అనుసరించి ‘ప్రళయము’ వరకు స్థితి కలిగి ఉంటోంది. పదునాలుగు భువనములందూ పదునాలుగు జీవ జాతులు, అనేకములైన ఆచార విచారములు, వివిధ వేష భాషలు ఉంటున్నాయి… వ్యష్టి జీవుల దృష్ట్యా అనుక్షణం ఉత్పత్తి విలయములు ఏర్పడుచూనే ఉన్నాయి.
ఇదంతా చైతన్యము యొక్క విలాసమే. అయితే తత్త్వజ్ఞానికి ఈ జనన మరణ ప్రవాహమంతా లేనిదిగానే కానవచ్చుచున్నది.
ఇక్కడ దీనులగు అనేకమంది జనులు పూర్వజన్మలకు సంబంధించిన సంకల్ప వాసనాదు లచే వివిధములైన మనోరథములను చేపట్టుచున్నారు. అంతేగాని, వారు స్వస్వరూపమును విచారించుటలేదు. స్వస్వరూపము పట్ల దట్టముగా ఏర్పడిన అజ్ఞానవశంచేత మోహముతో కూడి ఏర్పడిన ‘ఉన్మత్తత’ కలవారై ఈ లోకమున జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మరల పర లోకములకు వెళ్లుచున్నారు. ఇంతలో ‘స్థావరము’ మొదలైన మహానిద్రాపరవశములగు స్థితులను
Page:180
పొందుచున్నారు. భోగముల పట్ల గల అభిలాష కారణంగా ఐహిక పారలౌకికములైన శ్రమతో కూడిన అనేక ధర్మ అధర్మములను స్వీకరిస్తున్నారు. ఏవేవో పురుషార్థములు వారిని స్పృశిస్తున్నాయి పోతున్నాయి. ఈ జనన మరణాల ద్వారా అవిశ్రాంతంగా సంసారంలో పరిభ్రమిస్తున్నారు.
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! ఈ విధంగా స్థిరాకృతిగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండ సమూహములన్నీ బ్రహ్మమునందే మరల మరల ఉద్భవించి, లయిస్తున్నాయి. పరస్పర కారణ భావము (ఒకదానికి మరొకటి కారణం అయినట్లు భావము పొందుట) కలిగి ఉంటున్న ఈ జగత్తులన్నీ తమ అధిష్ఠానమైనట్టి చైతన్యమునందే ప్రకటితమగుచున్నాయి. పూర్ణభావన యొక్క ప్రభావంచే లయించుచున్నాయి.
లోతైన తటాకంలో అడుగున ప్రవహిస్తున్న జలము యొక్క చలనము బాహ్యమునకు కనబడదు కదా! “సత్-అసత్" రూపమున చైతన్యమే అన్నివైపులా, అంతటా ప్రకాశించు చున్నప్పటికీ, అది వ్యక్తము కాకుండానే ఉంటోంది. ‘ఎండవేడిమి’ కారణంగా మృగతృష్ణ ఏర్పడుతోంది. అందులో జలము ఉన్నట్లు దాహముతో ఉన్న మృగములకు తోచుచూ ఉంటోంది. అట్లే చిదాత్మయందు ఈ సృష్టులన్నీ గోచరిస్తున్నాయి. చిత్సారము అయినట్టి చిదాత్మయే ’ఇచ్చ-భ్రమ’ల వశంచేత తనను తాను అన్యవిధంగాను, అచిత్తుగాను గాంచుచున్నది.
జగత్తు ఉన్నదా? లేదా? - ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఇది చైతన్యము నందు స్థితి కలిగియుండలేదు. చైతన్యమునకు వేరుగా ఈ జగత్తు లేదు. ఒక దృష్టాంతము చెపుతాను. బంగారపు ఆభరణము ఉన్నది… అందులో ఆభరణము బంగారము కంటే వేరుగా ఉన్నదా? ఆభరణమంతా నిండియున్నది బంగారమే కదా! మరి “ఇది గొలుసు ఇది ఉంగరము” అను వేరు వేరు ఆకారములు, నామరూపముల మాట ఏమిటి? ఉంగరము - గొలుసు ఒక్కటేనా? వేరువేరా? 1."రెండింటిలోను ఉన్నది బంగారమే కనుక రెండూ ఒక్కటే”; 2. “వేరు వేరు నామములు, ఉపయోగములు ఉన్నాయి కనుక రెండూ వేరువేరు”… అను రెండు అభిప్రాయముల వేరు వేరు దృష్టులచే అంగీకారమే అవుతాయి. బంగారమునందు ఆభరణములు అనునది భిన్న, అభిన్నముగా ఉంటున్నట్లే, బ్రహ్మమునందు ‘నేను, నీవు’ మొదలైన వ్యవహారమంతా మాయా దృష్టికి ప్రదర్శితం అవుతోంది. అందుచేత ఈ జగత్స్వరూపమంతా అనిర్వచనీయమై ఒప్పుచున్నది.
దేనిచే నీవు శబ్ద-స్పర్శ-రూప రస గంధములను ఎరుగుచున్నావో అట్టి ఆత్మయే సర్వత్రా వ్యాపించియున్నది.
సర్వవ్యాప్తి, నిర్మలము అగు ఆత్మయందు ఏకత్వమేమిటి? అనేకత్వమేమిటి? రెండూ లేవు. ఉన్నట్లు ఉంటే, ‘అది అవిద్యచేతనే’ అని గ్రహించబడుగాక! యథార్థానికి ఆ పరమాత్మయందు
Page:181
‘మరొక కల్పన’ అంటూ ఏదీ లేదు. ఇక ఈ పదార్థముల పట్ల ఏర్పడుచున్న భావాభావములు, శుభాశుభములు విషయమేమిటంటావా?… ఇవన్నీ వాసనావశంచేతనే కల్పించబడుచున్నాయి.
తత్త్వ దృష్టిచే సర్వము ఆత్మయే. కనుక ఆత్మయందే అంతా కల్పించబడుతోంది. అట్టి కల్పనయే జగదనుభవంగా ఆత్మచే పొందబడుతోంది.
ఆత్మకు అన్యమైనదేది? - ఓ సర్వజనులారా! ఆత్మకంటే వేరుగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా పదార్థము ఉంటే, దానియందు కోర్కె ఉండటం సహజమే అవుతుంది. తనకు అన్యముగా ఏ పదార్థం సంభవించుటకే వీలులేనప్పుడు ఆత్మదేనిని ఇచ్ఛగిస్తుంది? దేనిని ద్వేషిస్తుంది? ఆత్మకు ఇచ్ఛా ద్వేషములు కృత్రిమము, అజ్ఞాతకల్పితము మాత్రమే గాని, సహజం మాత్రం కాదు. సర్వం ’తానే’ అయి ఉండగా అది దేనిని స్మరిస్తుంది? దేనిని విస్మరిస్తుంది? దేనిని నిర్మిస్తుంది? దేనిని త్యజిస్తుంది? ఏ భవిష్యత్తు ఫలం కొరకు ప్రవృత్తమౌతుంది? కనుక “ఈ సృష్టి మొదలైనదంతా ఆత్మ యందు అవిద్యచేతనే కల్పించబడుచున్నది" అని గ్రహించండి. “ఇష్టము, అనిష్టము”… మొదలైన వికల్పములన్నీ ఆత్మను స్పృశించవు. ‘ఇచ్ఛ’ యొక్క అవాస్తవికత గ్రహించబడగా, కర్త-క్రియ -కర్మముల ఏకత్వము సంభవించుచున్నది. అప్పుడు “ఆత్మ ఏమీ చేయునది కాదు”… అని గ్రహించబడుచున్నది.
ఆత్మ దేనికీ ఆధారము కాదు. అది దేనిపైనా ఆధారపడి ఉండదు. కనుక “దానికి ఆధారం గాని ఆధేయము గాని లేవు" అని ప్రకటించబడుచున్నది. దానికి ఆశ్రయమంటూ ఏదీ లేదు. ద్వితీయ కల్పనయే ఆత్మయందు అసంభవం కనుక, అది దేనికీ ఆశ్రయం కూడా కాదు. ఇచ్ఛా రహితమగు ఆత్మయందు సకర్మత్వం (A sense of being a DOER) గాని, నైష్కర్మ్యత్వం (A sense of being a NON-DOER) గాని లేవు. ఆత్మకు భిన్నముగా సాఫల్యము ఒనగూర్చు కల్పనయే మరొకటి లేదు. అట్టి కల్పనను చూస్తున్న ఇంకెవరో మరొకరు లేరు. కనుక నీవు సమస్త సంతాప జ్వరముల నుండి విముక్తుడవు కమ్ము. విముక్తుడవై, ఆపై ఏది ఎట్లు చేయవలయునో ఇప్పటి వలెనే యథాతథముగా నిర్వర్తిస్తూ ఉండు. ద్వంద్వాతీతుడవై కర్తృత్వములోని అకర్తృత్వమును దర్శించు.
ఓ రామచంద్రా! “ఇది నేను చేయుచున్నాను” అను కర్తృత్వాభిమానముచే నీవు పొందునదేమిటో చెప్పు? ఈ దృశ్యమంతా భౌతిక పదార్థమయము కాకుండా మరింకేదీ ఎక్కడా లేదు కదా! కాబట్టి కర్తృత్వాభిమానమంతా త్యజించి నిశ్చింతుడవై ఉండవచ్చు సుమా! స్వస్వరూపమగు వాస్తవతత్త్వానకు అకర్తృత్వమే సహజమగుచున్నది. కాని కర్తృత్వాభిమానం కాదు.
అందుచేత, సర్వమునకు ’అకర్తవు అగుము. వాయువుచే చలింపబడని సముద్రంలాగా, మేఘరహితమగు ఆకాశంలాగా, కడుపునిండుగా ఆహారం తిని సరోవర జలం త్రాగి తిరిగివస్తున్న సింహంలాగా స్వస్థుడవు, నిర్మలుడవు, గంభీరస్వభావుడగు, మౌనశీలుడవు అయివుండుము. హృదయమును పదార్థరహితం చేయి. “ఇది నేను చేశానే…? ఇది చేయలేకపోయానే…?” అను తలపులన్నీ ఆత్మత్వము నందు లయింపజేసి వేయుము.
Page:182
ఆత్మయే అయివున్న నీవు… ఆత్మ స్వభావుడవై.. ఆత్మలో నిలకడ కలిగియుండుటలో కష్టమేమున్నది?
శ్రీరాముడు: మహర్షీ! ఏ సాధనములచే అపరిచ్ఛిన్నమగు సుఖము, పూర్ణకామత్వము సిద్ధిస్తాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: అందుకు సాధనం, మార్గం, లక్ష్యం కూడా "ఆత్మయందు సుస్థిరుడవగుట”… అయి ఉన్నది. అట్టి స్వస్వరూపమునందలి “సుస్థిరము”లోని సుఖప్రాప్తి… ఇక అనేక ప్రయత్నములచేత గాని, అనేక లోకములలో పరిభ్రమించుటచేత గాని ఈ జీవునకు లభించేది కాదు. అందుకు మార్గం ఇప్పటికిప్పుడు స్వస్వరూపము గురించి విచారణ చేయటమే.
కనుక నీ స్వస్వరూపమును స్వబుద్ధితో విచారించుము. బాహ్య పదార్థములవైపు పరుగులు తీయు నీ దృష్టిని నిరోధించి, ఆత్మవైపు మళ్ళించు. “అంతయు ఆత్మయే కదా!” అను
పరిగ్రహణము కలిగియుండుము.
యథార్థానికి నీవు సర్వప్రపంచ మిత్రుడవు. పరమార్థదృష్టిచే సర్వదా పూర్ణుడవే అయి ఉన్నావు. సుఖస్వరూపమగు చిదాత్మవే నీవు. అంతే గాని తుచ్ఛమగు ఈ శరీరమనోబుద్ధులు నీవు కావు.
ఓ సర్వజనులారా! మీలోని ప్రతి ఒక్కరియొక్క వాస్తవ స్వరూపము అట్టిదే సుమా!
శ్రీరాముడు: హే మహాత్మా! జ్ఞానులకు కూడా కర్తృత్వములు, స్వీకరించవలసినవి, త్యజించ వలసినవి మొదలైనవి ఉంటాయంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఏదో ఒక కర్మ నిర్వర్తించనివారంటూ ఎక్కడైనా ఉంటారా? ఉండరు. జ్ఞానులు లౌకికమైన కర్మ చేయవచ్చు లేక చేయకుండవచ్చు. ఏది ఏమైనా “ఇది నేను చూస్తున్నాను… లేక… ఇది నేను త్యజించుచున్నాను…. చేయుటలేదు” అను కర్తృత్వాభిమానం ఏ మాత్రం ఉండదు. వారిలో కొందరు సుఖభోగఫలములను పొందవలసి ఉండవచ్చు…, లేక సాధన భూతములగు ఆయా కర్మలందు నియమితులై ఉండవచ్చు…, లేదా, సమాధి యొక్క వేరు వేరు భూమికలలోని ఒకదాని యందు ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా “దీనికి నేను కర్తను… ఇది నాకు సంబంధించినది”… అను ఉద్వేగం ఏమాత్రం వారియందు ఉండదు. వ్యవహారరీత్యా ప్రవర్తించినప్పటికీ వారు ప్రకటించు కర్తృత్వము వ్యవహార సానుకూల్యమునకు సంబంధించినదే గాని, అభిమానమునకు సంబంధించినది కాదు. కాని అజ్ఞానుల వ్యవహారం మాత్రం అందుకు వేరుగా ఉంటుంది.
శ్రీరాముడు: జ్ఞానులకు కర్తృత్వమే ఉండదని అంటున్నాం కదా. కానీ వారు కూడా తదితరులవలెనే కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటారు కదా?
Page:183
శ్రీ వసిష్ఠ మహర్షి: జ్ఞానులలో గోచరించే అకర్తృత్వము గురించి అజ్ఞానులలో ఉంటున్న కర్మబంధము గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను. విను.
ఏ క్రియ అయితే ఈ జీవుని అంతకరణంలో "నేను చేయుచున్నాను… దీని కర్త (లేక) కర్మ నాకు సంబంధించినవే” అను మనోవృత్తి ’నిశ్చయము’తో కూడినదై జీవునియందు ఉంటుందో, అట్టి కర్మకు మాత్రమే అతడు కర్తృత్వము పొంది ఉంటున్నాడు. అనగా “నేను దీనికి కారణమగు చున్నాను”… అను రూపముగల ఉపాదేయబుద్ధి ఉంటేనే కర్మ ఉన్నట్లు. దీనినే ‘వాసన’ అని కూడా అంటున్నాం.
ఈ మనుజుడు వాసనలను అనుసరించే ఆయా క్రియలను ఒనర్చుచున్నాడు. క్రియలను అనుసరించే ‘ఫలభోగానుభవం’ సంభవమగుచున్నది.
6ఇష్టములు
)als
ఫల
య భోగములు వాసనలు 33 య
అయిష్టములు
క్రియలను అనుసరించే అందు ఇచ్ఛ తోడగుచుండగా ఫలభోక్తృత్వము (నేను ఈ కర్మఫలమును అనుభవించెదను గాక… అను భావన) ఏర్పడుచున్నది.
వాసనలను అనుసరించే మనుజుడు క్రియలను ఒనర్చుచున్నాడు.
వాసనల ప్రభావం ఒకడు ఈ స్థూల ఇంద్రియములచే కర్మలు చేయవచ్చు… చేయకపోవచ్చు. అతడు ఎట్టి వాసనలు కలిగి ఉంటాడో… అట్టి వాసనలను అనుసరించే అతని మనస్సు స్వర్గ-నరకములందు సుఖ - దుఃఖములను అనుభవించటం జరుగుతోంది.
ఒకడు కర్మలు చేసినా, చేయకపోయినా… అతడు ‘ఆసక్తి’ కలిగి ఉంటే మాత్రం అతనికి కర్తృత్వము కలుగుచూనే ఉంటుంది.
తత్వజ్ఞానికో…? - తత్వజ్ఞానికి వాసనలు ఉండుటలేదు. కనుక కర్మలపట్ల ఆసక్తి ఉండుటలేదు. ఆసక్తి లేనిచోట కర్తృత్వము కూడా ఉండదు.
ఆసక్తి, వాసనలు, కర్తృత్వము, ఈ మూడూ అవినాభావ సంబంధం కలిగి ఉంటున్నాయి. తత్వజ్ఞాని కర్మలు చేస్తున్నప్పటికీ… ఫలానుసంధానం చేయడు. ఆసక్తిని హృదయంలో ప్రవేశింపనీయకుండా, కేవలం శరీరచేష్టామాత్రంగా ఆయా కర్మలు గావించుచున్నాడు. ఏవైనా ఫలములు ప్రాప్తిస్తున్నప్పుడు “ఇవి నాకు సుఖకరములు… లేక దుఃఖకరములు”… అను
Page:184
కల్పనను అతడు ఆశ్రయించుటలేదు. ’అంతయు ఆత్మయే కదా….” అను ఎరుకను అతడు కలిగి ఉంటున్నాడు. కర్మలు ఆచరిస్తూ కూడా అతడు వాటియందు నిమగ్నచిత్తుడు అగుటలేదు. మనోయత్కరోతి… తత్కృతంభవతి, యున్న కరోతి… తన్నకృతంభవతి అతో మనయేవకర్తృ… న దేహః ॥
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. ఈ జగత్తులో ఎవడైనా మనస్సుతో చేసినది మాత్రమే ‘చేయబడినది’ అగుచున్నది. మనస్సుతో చేయబడనిది… “చేయబడనిది” గానే
ఉంటోంది.
కాబట్టి మనస్సే సర్వకర్మల యొక్క ‘కర్త’. అంతేగాని, ఈ దేహము దేనికీ కర్త కాదు. చిత్తాదేవాయం సంసార ఆగతశ్చిత్తమయ ఏవ ॥ చిత్తమాత్రం చిత్త ఏవ స్థిత ఇతీ విజ్ఞాతమ్ ॥ (సర్గ 38, శ్లో 8)
ఈ ప్రపంచమంతా మనస్సునందే ఆవిర్భవిస్తోంది. మనోమయం, మనోమాత్రం ఈ ప్రపంచమంతా. మనస్సునందే స్థితి కలిగి ఉంటోంది. కనుక ఈ కనబడేదంతా నీయొక్క చిత్తమే కాని మరింకేమీ కాదు. ఈ విషయం మనం ఇంతకుముందు నిర్ధారించుకున్నాం కదా!
సర్వవిషయములు, సర్వవిషయ వృత్తులు శమించాయనుకో… లేక, సర్వవృత్తులు సద్వాసనలతో (‘సత్’ కు సంబంధించిన భావనలతో నిండియున్నాయనుకో… అప్పుడు అనుభవ మగుచూ ఉండేది ఏది? సర్వవిధ వృత్తులకు స్థానభూతమైయున్న జీవచైతన్యమే కదా! ‘ఎండలు’ తీవ్రంగా ఉన్నప్పుడు మృగతృష్ణ యొక్క భ్రమ ఏర్పడుతోంది. మేఘాలు వచ్చి, వర్షించాయనుకో… ఇక మృగతృష్ణా జలమెక్కడ? ఆ జలము పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది?
ఆత్మ జ్ఞానము పొందిన మనస్సు పరమశాంతినే పొందుతోంది. శ్రీరాముడు: అప్పటి వారి మనస్సు యొక్క రూపం ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రచండ సూర్యతేజస్సులో మంచుగడ్డ కరిగిపోవుచుండగా, ఆ మంచుగడ్డ యొక్క దృశ్యాకారం ఏమౌతుంది? హరించుకుపోతుంది కదా! మనస్సు కూడా ’తురీయస్థితి” యొక్క ప్రాప్తిచే బ్రహ్మరూపమే అగుచున్నది.
మూర్ఖుని మనస్సు మూర్ఖమగు దున్నపోతు బురదలో ప్రవేశించి, అందులో -
ఇరుక్కుంటుంది. మూర్ఖుడగు అజ్ఞానియొక్క మనస్సు కూడా స్వల్ప అశాశ్వత విషయములందు తగుల్కొంటోంది. విషయ భోగభూములనే అవలోకించుచున్నది గాని, తత్స్వరూపమగు ఆత్మను గాంచుటనే లేదు. జ్ఞానియొక్క మనస్సో… వాసనామయమగు క్రియలందు తగుల్కొనుటలేదు.
ఏది మనస్సుచే పొందబడిందో… అది మాత్రమే పొందబడినట్లు - ఒకడు మనస్సుతో పొందినదే ‘పొందబడినది’ అగుచున్నది. మనస్సుచే స్వీకరించబడనప్పుడు, అతడు అద్దానిని పొందనట్లే
Page:185
అగుచున్నది. శరీరముచే పొంది, మనస్సుచే పొందబడనప్పుడు “అది ఆ జీవుడు పొందుట లేదు”… అని సిద్ధాంతీకరించబడుచున్నది.
ఇందుకు ఒక దృష్టాంతము చెపుతాను విను.
ఒకడు - ఒక సుఖప్రదమైన ’శయ్య’పై చక్కగా నిదురించుచున్నాడు. ఒక గోతిలో పడిపోతు న్నట్లు స్వప్నము పొందుచున్నాడు. అతడు “నేను గోతిలో పడిపోతున్నాను… నన్ను రక్షించండి” అని కేకలు వేస్తున్నాడు. ముచ్చెమటలు పోస్తున్నాయి. పెదవులు వణుకుచున్నాయి. చూచావా, రామా! అతడు సుఖంగా పరుపుపై ప్రశాంతమైన ముద్రలో భౌతికంగా ఉండి ఉన్నప్పటికీ, అతని మనస్సు మాత్రం బీభత్సములగు అనుభవములను పొందుతోంది. కనుక, అతడు గోతిలో పడుచున్నవాడే అగుచున్నాడు.
మరొకని విషయానికి వద్దాం - అతడు పరమశాంతచిత్తుడు. "ఆత్మా హమ్” అను ఎరుక గలవాడు. అనేక స్వప్రయత్నముల ఔన్నత్యముచే, జ్ఞానవిషయమై సద్గురువుల వద్ద వినియున్న విశేషముల ప్రభావంచేత పూర్ణమగు ‘శాంతి’ అను శమస్థితిని పొందియున్నాడు… ఒకరోజు అతడు ఒక పెద్ద గుంటలోకి జారిపడుచున్నాడు. అయినప్పటికీ అ“నేను అఖండము, శరీరాదులకు అతీతము అగు ఆత్మనే కదా! నాకు శరీరముల రాకపోకలు బాహ్యస్థమైన వ్యవహారమే. కనుక నేను ఏ మార్పు చేర్పులు లేనట్టి నిత్యోదితమగు పరబ్రహ్మమును”… అను దృఢ భావనను ఆశ్రయించి ఉన్నాడు…
అతడు ‘నేను సుస్థిరుడనే’ అను భావనయే పొందుచున్నాడు. అందుచేత శరీరం యొక్క పతనం ఆతడు పొందకయే ఉన్నాడు. చూచావా! అతడి మనస్సు పతనంతో ఏకత్వం పొంద కుండుటచేత అతనికి అనుభవము లేకయే ఉంటోంది. దీనిని బట్టి మనకు తెలియున దేమిటి?
మొదటివాడు గోతిలో పడనప్పటికీ, పడుచున్నట్లు అనుభవాన్ని మాత్రం పొందుచున్నాడు కనుక, కర్తృత్వము, భోకృత్వము తెచ్చిపెట్టుకొని అనుభవిస్తున్నాడు. రెండవవాడు పడుచున్నప్పటికీ అకర్తయే అగుచున్నాడు. ఈ చిత్తము ఏ విధంగా ఉంటే, పురుషుడు అట్లాగే ఉంటాడు సుమా!
ప్రియ, అప్రియములు … సుఖ దుఃఖములు - ఓ రాఘవా! నీవు కర్మలు చేస్తూ ఉండవచ్చు… లేక, చేయకుండా ఉండవచ్చు గాక! నీ చిత్తం మాత్రం ఆ కర్మలలో ప్రియం, అప్రియం, కర్తృత్వం, భోక్తృత్వముల రూపమున మగ్నంకాకుండా చూచుకో! ఎందుచేతనంటావా? ఈ జగత్తులో ఆత్మతత్వం ఒక్కటి తప్ప మరింకేపదార్థము సత్యము కాదు. మరి ఈ చిత్తము ఎందులోనైనా ఆసక్తిగొనవలసిన పనేమున్నది? తద్వారా లభించేదేమున్నది? ఈ జగత్తు, దీనియందు అంతర్గతమై యున్న సర్వ పదార్థములు… ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యము యొక్క ‘అభాస’ (illusion) మాత్రమే సుమా!
జ్ఞేయమగు ఆత్మను అనుభవపూర్వకంగా ఎరుగని వానికే “సుఖదుఃఖములు’ అనే భ్రమలు ఉంటాయి. ఆత్మకంటే వేరుగా ఆధార, ఆధేయములు లేవు సుమా! “నా స్వరూపము ఈ కర్త, భోక్త
Page:186
మొదలైన సర్వ పదార్థములకంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఆకాశమువలె సర్వవ్యాపక మైనది”… అని జ్ఞాని ఎరుగుచున్నాడు. అట్టి నిశ్చయమును సడలించగలిగినదేదీ ఈ జగత్తు నందు అతడు గాంచుట లేదు. క్రమంగా ‘ఈ జగత్తంతా నా స్వరూపమే’ అనే భావనను కూడా పొందుచున్నాడు. ఇట్టి నిశ్చయ భావములు సుదృఢపడగా “సర్వ భూతములను ప్రకాశింప జేయునట్టి సర్వవ్యాపమగు ఆత్మయే నేను“ అను అనుభవం ఉత్పన్నమౌతోంది. “నేను సుఖ దుఃఖాలకు స్థానభూతుడను గాను”… అను దుఃఖరహిత స్థితి అతి సహజంగా అవలంబించ బడుతోంది. ఇక అతడు ప్రారబ్ధకర్మలను అనుసరించి లీలామాత్రంగా సర్వ వ్యవహారములందు పాల్గొనుచున్నాడు. వర్తించుచున్నాడు. వాటిచే కలుగు ప్రత్యేకత ఏదీ అతనికుండదు. తన ఆత్మ యందే ఈ సర్వమును, ఈ సర్వమునందు తన ఆత్మనే దర్శించేవానికి ఇక ప్రియ-అప్రియము లేమి? సుఖ-దుఃఖములేమి?
జ్ఞాని యొక్క మనస్సు - జ్ఞానియొక్క మనస్సు ఆపదలు ప్రాప్తిస్తున్న సమయంలో కూడా ఈ ప్రపంచమును శోభాయమానం చేస్తూ ఉన్నది. మనస్సు కంటే వేరుగా సుఖదుఃఖములు ఎక్కడ ఉన్నాయి? వాసనారహితమగు చిత్తము కలిగియుండుటచే జ్ఞాని సర్వదా ’అకర్త’గానే తనను తాను దర్శించుచున్నాడు. అనుభవములు అతని పట్ల అప్రభావితముగానే ఉంటున్నాయి. ఈ కాళ్ళూ చేతుల కదలికల వ్యవహారమంతా అతనియందు ప్రవేశించకయే, బాహ్యముననే ఉంటోంది.
సర్వకర్మలకు, సర్వచేష్టలకు, సర్వభావములకు, సర్వలోకములకు, సర్వగతులకు బీజము ఈ మనస్సే. అట్టి మనస్సు అనే బీజం త్యజించబడితే, కర్మలు కూడా స్వయముగా లయించగలవు.
మనస్సు ఆత్మజ్ఞానముచే మ్రింగివేయబడినప్పుడు మాత్రమే దుఃఖములు తొలగగలవు. పుణ్యపాపములు కూడా అప్పుడు విలయం పొందుతాయి. "ఆత్మకంటే వేరైనదంటూ ఎక్కడా లేదు” అని గ్రహించియున్న జ్ఞాని… ఈ శారీరక వాచక-మానసిక కర్మలచే ఆక్రమించ బడినప్పటికీ… వాటికి తాను మాత్రం వశీభూతుడు కాడు.
లీలా వినోదం - ఒక బాలుడు ఒక చోట కూర్చుని ఉండి తన మనస్సు నందు ఒక గొప్ప నగరమును,ఆ నగరములోని వీధులను, ఆ వీథులలోని ఆట వస్తువుల ప్రదర్శనమును ఊహా మాత్రంగా పొందుచూ ఉంటాడు. ఇంతలో అమ్మ పిలుపు విని అక్కడి నుండి లేస్తూ ఆ సంకల్ప మహానగరమును క్షణంలో త్యజించివేస్తాడు. “మనోనగరంగా పొందబడినదంతా వాస్తవంగా లేదు” అను ఎరుకచేతనే కదా, అతనియందు దానిని త్యజించు సమయంలో ఎట్టి క్షోభ యేర్పడుట లేదు! నగరము, నగర వినాశనము కూడా అతడు ఊహామాత్రంగానే పొందుచున్నాడు. అట్లాగే ఆత్మ కూడా కర్మలు చేస్తున్నపటికీ పరమార్థదృష్టిలో ఏమియూ చేయకయే ఉంటోంది. లీలా మాత్రంగా ఒక సమయంలో దుఃఖములను అనుభవించుచు, మరొకప్పుడు “ఇదేదీ నాకు దుఃఖం కాజాలదు”… అని గమనించుచున్నది.
ఆత్మ దేనిని దుఃఖమని తనకు తానే నిర్వచించుకుంటోందో… అది దుఃఖకరమే అగుచున్నది.
Page:187
’ఇవేవీ నాకు దుఃఖకరములు కావు” అది భావించుకొనుప్పుడో, (లేక
నిర్వచించునప్పుడో) దానికి దుఃఖము కలుగజేయగలిగేది ఈ జగత్తులో ఏదీ లేదు.
అయితే ఒకడు వస్త్రములు ధరించుచున్నంత మాత్రంచేత అతడు వస్త్రములు అగుచున్నాడా? దుఃఖములు పొందుట జరిగినను, ఆత్మ దుఃఖ రూపముగా పరిణమించుటలేదు సుమా!
హేయ- ఉపాదేయములు (త్యజించటం స్వీకరించటం) వ్యవహారయోగ్యములుగా అగుచున్న ఈ ఎదురుగా ఉండే సర్వపదార్థముల యందు వాస్తవానికి హేయత్వము గాని, ఉపాధేయత్వము గాని లేవు (Nothing is repulsive or attractive by itself). అట్టి చమత్కారమంతా చోటు చేసుకుని ఉంటున్నది బుద్ధిలోనే.
హేయత్వము - త్యజింపవలసియున్నది.
ఉపాదేయత్వము - స్వీకరింపవలసియున్నది.
“నేను త్యజించాలి” అనుకున్న వస్తువు “స్వతహాగా దుఃఖకారకము" - అని అనటానికి వీలు లేదు. ఎందుకంటే, అది ఒకప్పుడు స్వీకరించబడినదే కదా!
ఏదైనా సరే, స్వీకరించుటచేతనే దుఃఖము సంభవిస్తోంది. స్వీకరించని వానికి ఆ
విషయముతో సంబంధమే ఉండదు. ఇక దుఃఖమేముంటుంది?
ఎప్పటికైనాసరే, ఉపాదేయరాహిత్యము చేతనే (లేక ‘గ్రహించుట’ అనునది నిరోధించ బడుటచేతనే) దుఃఖము జయించవేయబడుతోంది. అయినా, ఆత్మకంటే వేరుగా ఏదీ లేనప్పుడు స్వీకరించబడేది (ఉపాదేయము) మాత్రం ఎందుకు దుఃఖింపజేయాలి? కనుక ’అవిజ్ఞాన పూర్వకమైన దృష్టిచేతనే దుఃఖాదులు వచ్చిపడుచున్నాయి… అంతేగాని హేయ - ఉపాధేయములు (త్యాజ్య గ్రాహ్యములు) స్వయముగా దుఃఖకరములు కావు"… అని గ్రహించు.
ఆత్మ అకర్త, అభోక్త అయి ఉన్నదని మనం అనుకున్నాం. అవిద్య కారణంగానే అద్దాని యందు కర్తృత్వ - భోక్తృత్వములు ఆరోపించబడుచున్నాయి. అట్టి అధ్యారోపమే అనుభవమునకు కూడా కారణమగుచున్నది. అకర్తా భావనచే క్రమంగా ఆత్మ యొక్క వాస్తవ స్వభావం అనుభూతమౌతోంది.
శ్రీరాముడు: ఈ కర్మలు త్యజించటం, అకర్తగా అవటం సాధ్యమేనా?
శ్రీ వసిష్ఠమహర్షి: నిజమే, శరీరధారి కర్మలను ఎట్లా త్యజించటం? శరీర నిర్వహణకు అవశ్యకర్మలు ఉండనే ఉంటాయి. అయితే ‘సమ్యక్ దర్శనము’ అనే బలంచేత ’కర్మలు చేయువాడను” అను భావన అధిగమించబడుతోంది. కర్మలు త్యజించుట అంటే తనను తాను సర్వకర్మలకు అతీతమైన ’ఆత్మ’గా ఎరుగుటయే. ఓ రామా! నీవు మొట్టమొదటగా సత్యవస్తువు గురించి విచారించు. అట్లు విచారించినప్పుడు “శుద్ధమగు ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు”… అని నీవే గ్రహిస్తావు.
Page:188
ఇంద్రియ దృష్టి - కొందరు ఇంద్రియార్థములగు విషయము లందు (శబ్ద స్పర్శ రూప రస గంధము లందు) రాగ ద్వేషాదులు కలిగి ఉంటున్నారు. వాటి కొరకై పుణ్యపాపములు ఆచరించు చున్నారు. అదృష్టములు (దృష్టము కానిది) అగు పుణ్యపాపములచే వివశులై ఆత్మౌన్నత్యమును గ్రహించలేక పోవుచున్నారు. అట్టి “వివశత్వబుద్ధి” గలవారి దృష్టియందు మాత్రమే ఈ కర్తృత్వ భోక్తృత్వముల ప్రతీతి అంతా సంభవించుచున్నది. ఆత్మజ్ఞానులలో అట్టి వివశత్వబుద్ధికి చోటు లభించుటయే లేదు.
ఎవరి చిత్తమైతే సంసారమునందు సక్తము కాకుండా, ఆత్మవిచారణయందు మాత్రమే మగ్నమై ఉంటుందో, అట్టి తత్త్వవేత్తలకు మోక్షము అనుదాని ప్రస్తావన యొక్క అవసరమే ఉండదు. “ఇది బంధము, ఇది మోక్షము” అను ప్రహసనమంతా సంసారము నందు ఆసక్తిగల అజ్ఞానుల కొరకు, అజ్ఞానము తొలగించుకోవటానికి సాధనంగా మాత్రమే అయి వున్నది. జ్ఞానియందు శుద్ధాత్మతత్త్వము అత్యంత సహజంగా, కేవలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వాస్తవానికి అజ్ఞాని యందు కూడా అట్లే ప్రకాశిస్తోంది.
జ్ఞాని సర్వదా ఏమియు చేయనివాడై ఉంటున్నాడు. అజ్ఞాని ఇంద్రియ వ్యవహారములను ఆత్మకు ప్రతిపాదించి "నేను చేయువాడను” అను భావమునకు లోనగుచున్నాడు.
ద్రష్టకు అభిన్నమైన ఆత్మతత్త్వము తన యొక్క సర్వస్వరూపత్వమును తనకు తానే “ప్రకటించుకొనుట, ప్రకటించుకోకపోవుట” రెండూ నిర్వహిస్తోంది.
న బంధో9 స్తి న మోక్షోస్తి నాబందోస్తి న బంధనమ్ | అప్రబోధాదిదం దుఃఖం ప్రబోధాత్ప్రవిలీయతే ॥ (శ్లో. 22, సర్గ 38) యథార్థానికి బంధముగాని మోక్షముగాని లేవు. బంధమును కల్పించగల కారణమూ లేదు. మరి దుఃఖము ఎందు కలుగుతోంది? అజ్ఞానము, అవిచారణల కారణంగానే సుమా!
అట్లు కలుగుచున్న దుఃఖం జ్ఞానంచే నశించగలదు. బంధ-మోక్షాలు మిథ్యారూపంగానే కల్పించబడుచున్నాయి. కాబట్టి రామా! సర్వమును సర్వదా త్యజించగలిగినవాడవై ఉండుము. ధీరుడవగుము. అహంకారం పారద్రోలివేయి. అనాసక్తబుద్ధిచే సర్వసాక్షిత్వం అవధరించియుండు!
శ్రీరాముడు: ఓ మహాత్మా! మీరు చెప్పుచున్నదానిని బట్టి “బంధ-మోక్షములు అనబడేవి అసంభవం. కేవలం పరబ్రహ్మము మాత్రమే సత్యము” అని అర్థమగుచున్నది. అయితే గోడ లేకుండానే ఎక్కడైనా లిఖించబడిన చిత్రం ఉంటుందా? ఈ సృష్టి అంతా ఏర్పడుతున్నది ఎక్కడ? బంధమే లేనప్పుడు మాకు కలుగుచున్న దుఃఖాదుల సంగతి ఏమిటి?
Page:189
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మమే ఈ ‘సర్వజగత్తు’ రూపమున వివర్తభావము పొందుచున్నది. అది సర్వశక్తిమంతమైనది. కార్యశక్తులన్నీ బ్రహ్మము యొక్క సంకల్పం చేత బ్రహ్మమునందే ఏర్పడి ఉంటున్నాయి. అద్దాని ఊహాశక్తి మాత్రం చేత జగత్ ప్రవృత్తి అంతా ఏర్పడి భాసించుచున్నది. దానియందు ఉనికి, అసత్తు, ఉనికిరహితం. ద్విత్వఏకత్వములు, ఏకత్వ-అనేకత్వములు, ఆది అంతములు… ఇట్టి వివిధ కల్పనలన్నీ స్వయంకల్పితానుసారమే రూపమును దిద్దుకుంటున్నాయి. శక్తిహీనమైన దానియందు ఇవన్నీ ఏర్పడగలవా…? లేదు. అయితే ఈ ఉనికి మొదలైనవన్నీ కూడా ఆత్మ కంటే అన్యమైనవి కావు. సముద్రజలంలో తరంగములు, బుడగలు, సుడులు, ఆవృత్తములు మొదలైనవన్నీ ఏర్పడుచున్నాయి కదా! అట్లు వ్యక్తమగుచున్నవన్నీ జలముకంటే వేరైనవా? కావే!
చిదాత్మ మొట్టమొదట చిత్తముతో కూడిన జీవరూపమును చెందుచున్నది. అప్పుడు వాసనామయ… మనోమయశక్తులన్నీ తనయందే ప్రకాశమొనర్చుచున్నది. ఆ శక్తులన్నిటినీ అనేక రీతులలో ప్రకటితం చేస్తోంది. ఆ ప్రకటనలే నామరూపములతో కూడిన ఆ సృష్టియొక్క అనుభవమైయున్నది. ఉపభోగం (Diversed experiencing)చే వాటినన్నిటినీ (ఈ అనేకంగా కనిపి స్తున్న సృష్టిశక్తులన్నిటినీ) ధరిస్తూ మరల ఎప్పటికో తిరోభావముచే సర్వం త్యజించి వేయుచున్నది. బ్రహ్మము నుండే…! -
లోకాః పరాద్ ఉపయాన్తి తస్మిం స్థిత్వా విశస్తి అలమ్ |
తన్మయా ఏవ సతతం తరంగా ఇవ సాగరే ॥ (శ్లో 7, సర్గ 39)
ఈ జీవులందరి వివిధ దృష్టుల ఉత్పత్తి బ్రహ్మము నుండే ఏర్పడుచున్నది. బయలు దేరుచున్నది. అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి కూడా నిరంతరం బ్రహ్మమునుండే కలుగు చున్నాయి. ఆ పరమాత్మ నుండే సమస్తము ఉద్భవిస్తోంది. పరమాత్మయందే ప్రవర్తిస్తోంది మరల పరమాత్మ యందే లయమగుచున్నది. సముద్రములో ఉత్పత్తి అగుచున్న తరంగములు మరల ఎప్పటికైనా సముద్రమందే లయమగుచున్నాయి కదా!
ఈ సర్వము నిరంతరము ఆ పరమాత్మయందే తన్మయమై ఒప్పుచున్నాయి. మట్టిచే తయారు చేయబడిన అనేక బొమ్మలు మట్టిచేతనే తన్మయమై ఉంటున్నాయి కదా!
శ్రీరాముడు: హే మహాత్మా! మీ వాక్యములు గ్రహించుట మాకు కొంచెము కష్టమైనదిగా ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటారా?.. అగ్నిలో శీతలత్వం (చల్లదనం) ఉంటుందా, ఉండదు. జలంలో దహనశక్తి ఎక్కడన్నా సంభవిస్తుందా? సంభవించదే!
చైతన్యములో జడత్వం ఉంటుందా? ఎట్లా ఉంటుంది?
Page:190
అదృశ్యమగు బ్రహ్మమునందు దృశ్యము ఉండుట ఏమిటి? నిత్యమగు పరమాత్మయందు ఈ అనిత్యత్వమంతా ఏర్పడటం సమంజసమెట్లా అవుతుంది? కనుక, మీరు చెప్పిన వాక్యము, “సమస్త పదార్థముల యొక్క ఉత్పత్తి -స్థితి-లయములు బ్రహ్మము నందే చోటు చేసుకుని ఉంటున్నాయి…” అను దానికి తాత్పర్యమేమిటో నేను గ్రహించలేకపోతున్నాను.
ఇంద్రియములకు, మనస్సుకు కూడా వేరై, అతీతమై ఉంటున్న బ్రహ్మమెక్కడ?… క్షణ భంగురమగు ఈ పదార్థజాలమెచట? ఇది బ్రహ్మము నందు ఏర్పడుట ఏమిటి?
సరే, మీరు చెప్పినట్లు ఈ జగత్తు యొక్క నామరూపములు కాసేపు బ్రహ్మము నందే ఉత్పన్నమైనాయని అనుకొందాం. అట్లా అయితే ఈ జగత్తులో తారసపడుచున్న ప్రతి ఒక్క పదార్థము బ్రహ్మము యొక్క లక్షణము కలిగి ఉండాలి! ఈ పదార్థములన్నీ సత్-చిత్ ఆనంద మయము, శాశ్వతము, అఖండము అయి ఉండాలి కదా! దీపంలోంచి పుట్టినది దీపము వలెనే ఉంటోంది. మనుజుని నుండి మనుజుడు, గోధుమల నుండి గోధుమలు కలుగుచున్నాయికదా!
ఇదంతా బ్రహ్మము నుండి పుట్టుచున్నప్పుడు, బ్రహ్మమువలెనే ఉండాలి. కాని ఇక్కడి పరిస్థితి ఏమిటి? ఇక్కడి పదార్థములన్నీ నాశసహితమై, పరిమితమై, దుఃఖజనకమై ఎందుకు ఉంటున్నాయి? ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మం నుండి కలిగితే, ఇవన్నీ నిర్వికారంగానే ఉండాలి.
“లేదు… ఈ జగత్తు ఆత్మకంటే భిన్నంగా వికారవంతమై యున్నది. కాని కాని ఇది
బ్రహ్మమునుండే పుట్టింది”… అని అంటారా? అనగా, బ్రహ్మము ‘జగద్భావము’ కలిగి ఉండాలి కదా? మరి అది ‘భావాతీతము త్రిగుణరహితము’ అని ఎందుకు చెప్పబడినట్లు?
మీరు చెప్పినట్లు “ఈ జీవులు… వారి వింత దృష్టులు… ఈ పదార్థజాలము”… ఇవన్నీ బ్రహ్మం నుండే, లేక పరమాత్మనుండే ఉత్పన్నమైనాయని అనుకుందాం… అప్పుడు “పరమేశ్వరుడు వస్తుదృష్టిని జీవులలో కలిగిస్తూ ఉంటాడు"… అను కళంకం ఆపాదించబడినట్లే కదా!
ఇంత విచారణ విన్న తరువాత నా ప్రశ్నలలో ఏదైనా లోపము ఉంటే నన్ను క్షమించండి. శ్రీ వసిష్ఠ మహర్షి: ఓహో! చాలా మంచి ప్రశ్ననే వేశావు. నీ సందేహములన్నిటికీ మేము ఇస్తున్న సమాధానం వినుజలమునకు ఆకారమున్నదా? లేదు. కాని మనకు సముద్రములోని తరంగమునకు ఆకారము కనిపించుచున్నది కదా! ఆ ఆకారము వాస్తవమైనదేనా? కాదు.
అట్లే ఈ సమస్తము బ్రహ్మమునందు స్ఫురించుచున్నది. సముద్రజలంలో తరంగరూపమున కనిపిస్తున్నప్పుడు, ‘తరంగము’ అను రూపంగా అక్కడ ఎట్టి ఘనత్వము లేదు కదా! బ్రహ్మమునందు జగత్తుకు సంబంధించిన మాలిన్యము లేశమాత్రం కూడా లేదు.
అగ్నియందు ఉష్ణత్వము తప్ప మరింకేమి ఉంటుంది?
ఈ ప్రపంచమునందు బ్రహ్మముకంటే భిన్నమైన, ఏ కల్పనా ఎక్కడా లేదు.
Page:191
శ్రీరాముడు: మహర్షీ! బ్రహ్మము దుఃఖరహితము, నిర్ద్వందము కూడా! మరి దాని నుండి కలిగిన ఈ జగత్తు దుఃఖమయముగా, ద్వంద్వసహితంగా ఎందుకు ఉన్నది? తండ్రీ! మీ వాక్యార్థము లేమిటో నాకు ఇప్పటికీ బోధపడుటలేదు. మా ఉద్దేశమేమిటో నేను గ్రహించలేకపోవుచున్నాను.
భగవంతుడు వసిష్ఠ మహర్షి రామునియొక్క ఈ ప్రశ్నను మౌనంగా విన్నారు. ప్రశాంత మైన చిత్తముతో ఆతని రెండు ప్రశ్నల పూర్వాపరములను పరిశీలిస్తూనే తనయందు ఇట్లు
యోచించసాగారు.
శ్రీ వసిష్ఠ మహర్షి: (తన అంతరంగంలో) “ఈ రామచంద్రుని బుద్ధి ఇంకను పూర్ణ ప్రకాశము పొందినట్లు లేదే? కొంచెము నైర్మల్యము ఇంకను మిగిలియే ఉన్నట్లున్నది. ఇప్పుడు ఇతని బుద్ధిని ఆత్మవస్తువునందు సూటిగా ప్రవేశింపజేయాలి. అప్పుడు ఇతనిలో ఇంకా ఏర్పడి ఉంటున్న సంశయములకు చికిత్స జరుగగలదు. ఎవరి బుద్ధి అయితే పరిపక్వత కలిగియుండదో అట్టి వాడు… “ఈ జగత్తు బ్రహ్మమే’… అను వాక్యమునకు అర్థమును గ్రహించలేదు.
ఎవరైతే పరిపక్వమైన బుద్ధితో జగద్భావము త్యజిస్తాడో, చిదేకరసమగు ఆత్మతత్వమును మాత్రమే దర్శించగల సమర్థత కలిగి ఉంటాడో… అట్టివాడు మాత్రమే “జ్ఞాతజ్ఞేయుడు’.* అట్టి ధీమంతుడు మాత్రమే “సర్వం బ్రహ్మమే” అను మోక్షప్రవచనము యొక్క పరాకాష్ఠకు తగినవాడ గుచున్నాడు. అట్టి మహాత్ములు ఆ పదార్థాదులందు దోషబుద్ధి పొందుటలేదు. వారు సర్వపరిమిత దృష్టులు అధిగమించి ఉంటున్నారు. అందుచేత ఇందలి సర్వాత్మకత్వము వారికి తప్పక అవగతమ గుచున్నది.
ఈ జగత్పదార్థముల ఉనికి, వినాశనములకు, అప్రమేయమగు ఆ ఆత్మతత్వమునకు…. ఈ రెండింటికీ కూడా ఆత్మజ్ఞానికి విరోధమేమీ కనిపించుటలేదు. అందుచేత ఈ రామచంద్రునికి నేను ఈ జగత్తులో కనబడే వస్తువులయొక్క దృశ్యము యొక్క వాస్తవతత్వమేమిటో బోధిస్తాను. అప్పుడు గాని ఇతనికి ఉత్తమ విశ్రాంతి లభించదు.
దృశ్య ప్రపంచమును ప్రాప్తింపజేయగల ‘భోగదృష్టి’ కలిగి ఉన్నంతకాలం ఈ జీవుడు దృశ్యంలోని ఏవేవో విషయములను భావిస్తూనే ఉంటాడు గాని, మహావాక్యముల యొక్క అర్థమును గ్రహించగలుగుతాడా? లేదు. పైగా, అనుక్షణం తత్త్వజ్ఞానము నుండి ‘చ్యుతి’ పొందుతూనే ఉంటాడు.
బుద్ధి పరిపక్వత పొందనప్పుడు “నాయనా! నీతోనూ, నాతోసహా ఈ సర్వము బ్రహ్మమే”… అని చెప్పితే మాత్రం ఏం లాభం? విషయభోగేచ్ఛ ఉన్నంతవరకు బ్రహ్మమును ప్రతిపాదించు వాక్యములు చిలుకపలుకులవలెనే ఉంటూ ఉంటాయి. భోగేచ్ఛ నశించిందా, అప్పుడు క్రమంగా అజ్ఞానం తొలగటం, “ఈ సర్వము ఆత్మ స్వరూపుడనగు నా మహిమయే" అను ఎరుక ఏర్పడటం ఒక్కసారే జరుగుతూ ఉంటాయి.
జ్ఞాతజ్ఞేయుడు = ఏదైతే తెలుసుకొనవలసియున్నదో అది తెలుసుకొనినవాడు.
Page:192
అందుచేత ‘అప్రబుద్ధుడు’, అర్ధప్రబుద్ధుడు అయిన శిష్యునకు మొట్టమొదట శమము, దమము (Discipline of one’s own internal and external Avocations) అభ్యసించేటట్లు చేయాలి. అప్పుడు అతని దృష్టి, అవగాహన, ఆర్తి, పరిలక్ష్యములు… ఇవన్నీ పరిశుద్ధత పొందుతాయి. అటుపై ’తత్ త్వమ్’ ’జీవోబ్రహ్మేతినాపర” మొదలైన ఆత్మతత్వప్రతిపాదకమగు వాక్యాలు సోదాహరణ పూర్వకంగా విశ్లేషించి చెప్పాలి. అర్ధప్రబుద్ధుడగు శిష్యునికి ’ఈ జగత్తు లేదు… అందుచేత దీనిని నీ హృదయమునందు రహితం చేయి… అందుకుగాను ఉత్తమ ఆచరణ పరుడవు. స్వధర్మపరుడవు కావాలి”… అని చెప్పుచూపోతే, అతనిని తికమకపరచినట్లే అవుతుంది. అపరిపక్వ దృష్టిగల శిష్యుడు గురువు చెప్పినదానికి పెడార్థం ఇచ్చి, చివరకు మహాజాలంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. శిష్యులలో కొందరు ప్రబుద్ధులై ఉంటారు. ఉత్తమమైన అర్థమును అనుద్వేగపూర్వకంగా గ్రహించి ఆకళింపు చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు. ‘భోగేచ్ఛ - లోభ మోహములు’… మొదలైన దుష్ప్రవృత్తిని త్యజించి ఉంటారు. అతడి ముందు ప్రతిపాదించబడిన ’పరమసత్యము’ గురించిన సమాధానం పవిత్రత పొందుతోంది. “నాయనా! ఈ నేను నీవు ఈ జగత్తు, ఇందలి జన్మ కర్మలు ఇదంతా బ్రహ్మము కంటే వేరైనవి కాదు. దీనంతటికి బ్రహ్మమే మూలము. ఇకముందు కూడా పరమేశ్వర తత్త్వమునకు వేరుగా ఏదీ ఎక్కడా ఉండజాలదు”… అని అర్హుడగు శిష్యునికి మాత్రమే బోధించటం సాధ్యపడుతుంది. అనింద్యమైన అవగాహన గల శిష్యుడు అది వింటున్నప్పుడు “నేను ఇది కాదు.. నేను ఇది”… అను సత్యమునకు సంబంధించిన అనుభవమును పొందుతాడు. మిక్కిలి మూఢబుద్ధిగల శిష్యుని సరిగ్గా పరీక్షించకుండానే “జగత్తు మిథ్య… సర్వము కల్పనయే.. బంధ మోక్షములు లేవు“… అని చెప్పటం చేత అల్పమేధస్సుగల శిష్యుడు అప్రతిష్ఠాకరమగు మార్గమును ఎంచుకొనుటకు, కొంచెం అవకాశం ఉండవచ్చు. “నీ ఇష్టం వచ్చినట్లు సంచరించవచ్చు” అని బోధసారమైనట్లు అనుకోవటానికి అది దోహదం చేయవచ్చు. ఎందుకంటే అట్టి శిష్యుడు తన ఉత్తమ అభ్యాసం నుండి విరమించు అవకాశం ఉన్నది.
సరే, ఉత్తముడగు ఈ నా శిష్యుడు రామచంద్రునికి అజ్ఞానాంధకారం నశింపజేసే పరమోత్కృష్ట సత్యము బోధిస్తాను.
88
ఇట్లు యోచించి శ్రీ వసిష్ఠ మహర్షి రామచంద్రుని సంబోధించటం మరల కొనసాగించారు.
Page:193
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ జగత్తు దోషభూయిష్ఠమైనది. ఈ జగత్తే బ్రహ్మము.
ఈ విధంగా సిద్ధాంతాలు వేరు వేరు కోణాల నుండి ప్రవచించబడుచున్నాయి కదా! ఇదంతా కూడా, గురువు శిష్యునికి, భగవంతుని నిర్వచనము బోధించేటప్పుడు ప్రతిపాదించబడుచున్నది. ఈ అనేక విశేషములతో కూడిన రెండు రకములైన సిద్ధాంతములను విమర్శిస్తూ పోగా… ఈ జగత్తు వాస్తవానికి ఏది అయివున్నదో… శిష్యుడు దోషరహితమైన ’స్వబుద్ధి’తో గ్రహించ గలుగుతాడు. లోకంలో గురు-శిష్యవ్యవహారమంతా ఇట్లే ఒనగూడుతోంది.
బ్రహ్మము… “సర్వశక్తిమంతము, సర్వవ్యాపకము, సర్వవస్తువులందు ప్రత్యక్షము”… అయి ఉన్నది. నీవు ఐంద్రజాలికులను చూచే ఉంటావు. వారు మాయచే అనేక క్రియల ద్వారా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆత్మ వాస్తవానికి మాయారహితము అయిఉన్నది. కానీ, మాయామయముగా అగుచున్నది. గొప్ప ఐంద్రజాలికుని వలె మట్టిని కుండగా, ప్రత్తిని వస్త్రముగా చేసి చూపుతున్నది. ఆకాశమునందు పూలతోటను, కొండపై జలాశయమును కల్పించగల ఈ ఆత్మయొక్క అపూర్వశక్తిని నిర్వచించి నిర్ధేశించేదెవ్వరు?
కల్పనావిశేషం చేత తాను ఉన్నచోటే భవిష్యత్ ఆకాశంలోని నగర నిర్మాణం చేస్తోంది. ఆకాశంలో నీలత్వం తొలగించి అక్కడ పృథ్వీతలమును నిర్మిస్తోంది. భూతలములో ఆకాశమును స్థాపిస్తోంది.
ఎఱ్ఱటి పద్మరాగమణిలో ప్రతిబింబించే ఆకాశం ఎఱుపురంగుతోనే ప్రకాశిస్తూ ఉంటుంది కదా! అట్లే ఈ జగత్తులో “ఉత్పన్నం అయినది,… ఉత్పన్నం కానున్నది” అంతా కూడా స్వతహాగా అసత్తే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క సత్తచేతనే ఈ జగత్తు సత్తువలె అనుభూత మగుచున్నది.
ఈశ్వరుడు (లేక, ఈశ్వరస్వరూపుడగు జీవుడు) స్వతహాగా అవ్యక్తరూపుడే అయినప్పటికీ విచిత్ర రూపమున తనను తాను ప్రదర్శించుచున్నాడు. ఎట్లా అంటావా?… స్వప్నంలో వస్తుజాలం అనుభవమవడం మనం చూస్తున్నాము కదా! స్వప్నద్రష్ట స్వయంకల్పితము, ఊహాజనితము అగు వస్తువులను, మనుష్యులను కల్పన చేసుకొని “ఇదంతా వాస్తవమే” అని తలచి, ఆ స్వప్నంలో సుఖ దుఃఖాదులన్నీ అనుభవిస్తున్నాడు.
అసలు ఈ జీవుడెవడు? "నేను…ఇది… శరీరము” మొదలైనవన్నీ తెలుసుకుంటున్నట్టి అవ్యక్తమగు ప్రజ్ఞరూపమే ఇతడు కదా! అయినప్పటికీ, ఇతడు కాళ్ళు - చేతులు కన్నులు
మొదలైనవాటితో కనబడుచున్నాడు.
ఇదే రీతిగా సర్వాత్మకమగు ఆత్మవస్తువు సర్వకాలములందు, సర్వత్రా, సర్వరూపమున సంభవత్వము పొందుతోంది. ఒకే ఆత్మ వస్తువు ఇంతకు ముందు జన్మించిన సర్వుల రూపమున,
Page:194
ఇప్పుడు నీవు, నేను, ఈ సభికులు, తదితరులు రూపమున, ఇకముందు ఇట్లే అనేక భవిష్యత్ జీవుల రూపమున ప్రకటితమగుచున్నది.
ఇక హర్షామర్షములకు తావెక్కడిది? ఎవరికి?…. సమత్వమును అధిరోహించిన జ్ఞాని ఎన్నటికీ విస్మయమునుగాని, గర్వముగాని, సమ్మోహమును గాని, హర్ష-శోక-వికారములను గాని పొందడు. ధీరుడైనవాడు సర్వదా సమరూపమును ఆశ్రయించి ఉంటున్నాడు.
అనంత దేశ, కాల యుక్తమగు ఆత్మయందు విచిత్రమగు దృశ్యరచనాశక్తి కనిపిస్తోంది. ఆత్మయే యత్నపూర్వకంగా అనేక ఫలితములతో, ప్రయోజనములతో కూడిన రచన యొక్క కల్పన సాగిస్తోంది. సముద్రము తనయందలి తరంగములను తిరస్కరిస్తోందా…? లేదు కదా! ఆత్మ కూడా తన ఈ అద్భుతమైన సృష్టి రచనను తిరస్కరించుటలేదు.
ఆత్మయందు ఈ జగశ్శక్తులు ఎట్లా ఉండి ఉంటున్నాయి?… పాలలో నేయిలాగా… మట్టిలో భవిష్యత్ లో ఏర్పడగల కుండలాగా… దారమునందు వస్త్రములాగా… ఒక చిన్న మఱివిత్తనంలో మహావృక్షంలాగా… ఆత్మయందు సర్వశక్తులు వ్యక్తావ్యక్తంగా స్థితి కలిగి ఉంటూ, ఒకప్పుడు వ్యవహారవంతము అగుచున్నాయి. వ్యక్తమగుచున్నాయి.
నీరు ఒకప్పుడు నిశ్చలంగా ఉంటోంది. ఎప్పుడో ఆ నీటిలో తరంగాలు ఏర్పడుచున్నాయి. మరొకప్పుడు అదే నీరు తిరిగి నిశ్చలత్వం పొందుతోంది. అయితే అనేక ఆకారాలతో కనిపిస్తున్న తరంగాలు జలం కంటే వేరైనది ఎప్పుడు? ఎప్పుడూ లేదు. అట్లాగే, బ్రహ్మం కంటే ఈ ‘నేను-నీవు -ఆకాశం-పృథివి-కాలం-దూరం’… మొదలైన వాటితో కూడిన ఈ జగత్ రచన వేరైనది
కానేకాదు.
“నాత్ర కశ్చిత్ కర్తా, నభోక్తా, నవినాశమేతి”
ఈ ప్రపంచమునకు కర్త గాని, భోక్త గాని ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏమాత్రం వినాశనము పొందుటయే లేదు. కేవలం సాక్షిస్వరూపము, నిరామయము, సమరూపము, నిత్యము, సంక్షోభ రహితము అయినట్టి ‘ఆత్మతత్వము’ నందే ఈ విధంగా అంతా సిద్ధించుచున్నది.
దీపం ఉంటే చాలు, ప్రకాశం ఉంటుంది. సూర్యుడు ఉంటే చాలు, పగలు ఏర్పడుతోంది. పుష్పం ఉంటే చాలు, సుగంధం ఉంటోంది. అధిష్ఠానమగు చైతన్యము ఉండుటచేతనే ఈ జగత్తు స్వయంగా ఉత్పన్నమగుచున్నది.
వాయువు నందు స్పందన ఉన్నది. అయితే ఆ స్పందనకు వాయువు కంటే వేరైన ఉనికి ఉన్నదా? లేదు. అట్లాగే నీకు ఎదురుగా కనబడుచున్న “ఈ జగత్తు బ్రహ్మము యొక్క అభాస మాత్రమే”… అని గ్రహించు. అనగా, బ్రహ్మమే స్వకీయకల్పనచే ఇంద్రియాత్మకమైన తాదాత్మ్యం యొక్క ప్రయోజనంగా ఇట్లు, జగత్తు లేక దృశ్యముగా ప్రాప్తిస్తున్నది. ఇంద్రియ మాత్ర భావన యందు ఆరూఢుమైవున్నవాడు ఇక్కడ అనేక వస్తు సమూహములను జన సమూహములను
Page:195
గాంచుచున్నాడు. "ప్రియము-అప్రియము”లతో కూడిన భావనయే “సత్యం అసత్యం”ల మధ్య సుఖ దుఃఖానుభవాలుగా ప్రకటితం అగుచున్నది. ఇక్కడ కనబడుచున్నదంతా సత్తు కాదు. అసత్తు
కూడా కాదు.
T
ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గ్రహించు. ఈ అనేక జగద్భావనలు వాయువీచికల వలె వచ్చి పోతూ ఉండవచ్చు గాక! అయితే, ఆత్మయొక్క సన్నిధాన ప్రభావంచేతనే ఈ జగద్దోషములు కూడా ఉనికిని కలిగి ఉంటున్నాయి. ఏది ఏమైనా, ఆత్మను ఇవేవీ స్పృశించుట లేదు. భగవానుడగు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సర్వమునకు వేరుగా, సర్వమునకు సాక్షీభూతుడై పరమాత్మస్థితి యందే శాశ్వతతత్వమై ఉండి ఉంటున్నాడు. అతనికి ఏ కర్తవ్యాకర్తవ్యములు లేవు. “నా స్వరూపము అట్టి సాక్షీభూతమగు పరమాత్మతత్త్వము కాదు. మరింకేదో అయివున్నది"… అని భావించుట చేతనే సర్వ రకములైన దోషములు వచ్చి పడుచున్నాయి.
లయమైన దానిని సృష్టించేది, సృష్టించినదానిని లయం చేసేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యందు ఈ జగత్ శక్తి ఒకప్పుడు పరిపూర్ణముగా, మరొకప్పుడు అల్పముగా వ్యక్తం అగుచూ ఉంటోంది. ఇంకొకప్పుడు అసలు వ్యక్తమే అగుటలేదు.
శ్రీరాముడు: హే మహర్షీ! ఇక్కడ నశించుచున్నదేది? స్థితి కలిగి వుంటున్నదేది? ఈ వస్తుజాల మంతా ఆత్మనుండే ఉత్పన్నము అగుచున్నదా? లేక, మరెక్కడి నుంచోనా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఆత్మస్వరూపము కాని వస్తువే నశిస్తుంది… ఆత్మస్వరూపము అయినది ఎట్లా నశిస్తుంది?… ఆత్మ స్వరూపమైనది మాత్రమే స్థితి కలిగి ఉంటుంది… ఆత్మ స్వరూపము కానిది స్థితి ఎట్లా కలిగి ఉంటుంది?
జీవుడు స్వకీయమైన అజ్ఞానముచే (బుద్ధి యొక్క అకుశలత్వం కారణంగా ఆ తత్వమును అనేక వస్తుజాలము వలె దర్శించుచున్నాడు. ఈ వస్తుజాలమంతా ఆత్మ యొక్క స్వరూపమే అయి ఉండగా, ఇక "ఆత్మ నుండి ఇవి ఎట్లా ఉత్పన్నమైనాయి?” - అనే ప్రశ్నయే ఉదయించదుకదా!
ఓ రామా! “సమ్యక్ జ్ఞానము” అనే శక్తిని ముందుగా సంపాదించు. అప్పుడు ”బ్రహ్మము నుండే ఈ సర్వము ఉత్పన్నమౌతున్నాయి” అని గ్రహిస్తావు. సూర్యకిరణములు అనేకమైనప్పటికీ, అవి సూర్యుని నుండి వేరు కాదు కదా! ఒక కిరణము ఒక వస్తువుపై, మరొక కిరణము కొండపై, వేరొక కిరణము జంతువుపై, ఇంకొక కిరణము గోడపై… ఇట్లు వేరు వేరు కిరణములు వేరు వేరు చోట్ల ప్రసరిస్తూ ఉండవచ్చు గాక! సర్వకిరణములకు సూర్యుడే ఉత్పత్తి స్థానమైనట్లు, ఈ ’సర్వము, సర్వులు’ బ్రహ్మమునే ఉత్పత్తి స్థానంగా కలిగి ఉంటున్నారు.
పరామర్థ సత్యమగు "చిత్స్వరూపబలం ఎరుక యొక్క అభినివేశము (The dynamics of knowing)” చేతనే ఈ జగత్తు దృశ్యమానమౌతోంది.
Page:196
అవిద్య, పదార్థములు… ఈ రెండూ ఒకే క్షణంలో బ్రహ్మమునందు ఉదయిస్తున్నాయి. అట్లు ఉదయించి ఆ రెండూ కూడా వేలాది శాఖలతో విచిత్రములైన శుభ, అశుభ ఫలములచే ఒప్పుచున్నాయి.
చూచావా రాఘవా! సంసారం అనేక ఆశలతో, భయంకర దుఃఖకరాలైన ప్రయోజనాలతో, భోగ, వృద్ధ అవస్థలతో కూడి ఉంటోంది. ఫలితంగా ఇది ఆత్మకు బంధస్థానమగుచున్నది.
ఈ సంసార వృక్షమును ‘వివేకము’ అనే ఖడ్గముతో ఖండించివేయాలి. "సంసారముగా అనుభవమయ్యేదంతా స్వస్వరూప విన్యాస చమత్కారమే!”…. అను అవగాహనచే సందర్శిం చటమే ఇప్పుడు ఉపాయం. ఎందుకంటే, ఉన్న సత్యం అదే కాబట్టి!
తాళ్ళు తెంచుకున్న గజరాజు ఏంచేస్తాడు? హాయిగా సువిశాలమగు వనం వైపు పరుగులు తీస్తాడు కదా! నీవు కూడా ఈ సంసారము నుండి ‘వివేకము’ యొక్క సహాయం చేత విడువడుము. ప్రశాంతముగా, గంభీరముగా సర్వము గ్రహించినవాడవై నిశ్చింతుడవగుము.
శ్రీరాముడు: మునీంద్రా! "బ్రహ్మపదమే” ఈ సర్వజీవుల యొక్క వాస్తవ స్థితి కదా! అసలు “జీవత్వము”, “విచిత్రజీవుల ఉత్పత్తి” అనునవి బ్రహ్మపదమునందు ఎట్లు, ఏ ప్రకారంగా, ఎన్ని విధములుగా ఎందుకు సంభవిస్తోందో సవిస్తరంగా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి ఈ చిత్ర విచిత్రములైన జీవజాతులన్నీ… ఎట్లు ఉత్పన్నమౌతున్నాయో, స్థితి కలిగి ఉంటున్నాయో, నశిస్తున్నాయో, ముక్తిని పొందుచున్నాయో సంక్షిప్తంగా చెపుతాను… వినుబ్రహ్మం స్వతహాగా విషయరహితమైనది. అయ్యది సర్వశక్తి స్వరూపం, నిర్మలం కూడా! అట్టి బ్రహ్మం నందు జలంలో ఆవర్తం వలె ‘చిత్శక్తి’ రూపం పొందుతోంది. ఆవర్తంచే ఏర్పడిన ఆకారాదులు జలం కంటే వేరు కానట్లు, ఈ ‘చిత్శక్తి’ బ్రహ్మం కంటే వేరు కాదు. బ్రహ్మమునకు చెందినదే అయివున్నది.
అట్టి ‘చితశక్తి’ తన యొక్క ‘సంకల్పించుట’ అను స్వభావముచే మొట్టమొదట కించిత్ స్ఫురణను ఆశ్రయించి బ్రహ్మమొదలగు ప్రారంభ సృష్టికర్తల దేహరూపమును పొందుచున్నది. అనగా, స్వల్పముగా విషయాకారము పొందుచున్నది. అట్టి ‘సంకల్పముల సమూహము’ యొక్క బలముచే చైతన్యము ఘనత్వము చెందుచున్నది. అట్టి ఘనత్వముచే…“జీవము - మనస్సు” అను ఉపాధిరూపములుగా భావన చెందుచున్నది.
ఈ విధంగా బ్రహ్మము మనస్సు యొక్క సంకల్పమాత్రం చేత తన యొక్క బ్రహ్మస్వరూప మగు “దృక్’ రూపమును త్యజించి ’ద్రష్ట" అను కర్తృత్వముతో కూడిన స్థితిని ఆశ్రయిస్తోంది.
Page:197
“నేను ద్రష్టను”… “ఇది దృశ్యం”… “ఇది నాకు చెందినది”… వంటి భావాలు బ్రహ్మం పొందుతోంది. అయితే అది సంకల్పములు పొందుతూ ఉన్నప్పటికీ అంతమాత్రం చేత సంకల్పము లకు ఆవల ఉన్న తన స్వరూపమగు ఆత్మను పోగొట్టుకొనుచున్నదా? లేనేలేదు. అది తనను తాను ఏ క్షణమందు త్యజించుటలేదు. కాని త్యజించినదానివలె, “అసత్తే”…. అయినట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తోంది.
చిత్స్వరూపము అంతటా ప్రకాశిస్తూనే ఉన్నది. కాని బాహ్యదృష్టి కలిగియున్నప్పుడు శూన్యం వలె అగుచున్నది. యథార్థానికి కనబడే దృశ్యమంతా చిన్మయ రూపమే సుమా! కాని సాంసారిక దృష్టి గలవారికి మాత్రం ఇది భూతాకాశ మాత్రంగా (పంచ భూతాల సమ్మేళనం మాత్రమేగా) కనబడుతోంది.
చైతన్యము దేనిని ఎట్లు సంకల్పిస్తే అట్లే పరిణమించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అది బ్రహ్మదేవుని స్వభావ - స్వరూపములను సంకల్పించిందనుకో… అప్పుడు అది తనను బ్రహ్మ దేవుని రూపముగానే గాంచుచున్నది. అనగా, “ఈ త్రిలోకముల రూపమున అనేక జీవరాసులతో కూడి ప్రకాశించుచున్నది నేనే… నా యొక్క స్వరూపమే” అను భావన ఎక్కడ ఆశ్రయిస్తుందో, అది అట్టి అనుభవమునే అక్కడ పొందుచున్నది. అట్టి భావనకు ఉపక్రమించిన జీవునే ’హిరణ్యగర్భుడు’ అను పేరుతో కూడా చెప్పుకుంటున్నాం. ఆ హిరణ్యగర్భుడే తదితర పదిమంది ప్రజాపతులతో కూడిన ఈ జగత్కల్పన కంతటికీ కారణమగుచున్నాడు.
చతుర్దశ విధానన్త భూతజాత నఘుంఘుమా | సృష్టిరేవమియం రామ చిత్తనిర్మితమాగతా ॥ (సర్గ 40, శ్లో 9)
పదునాలుగు లోకములందలి అనంతప్రాణికోట్ల రూపమున ఉన్న ఈ ‘సృష్టి’ అంతా చిత్తము నుండే ఏర్పడుతుంది. అందుచేత “చిత్తమే సృష్టి. చిత్తమునకు వేరుగా సృష్టిలేదు”… అని చెప్పబడుతోంది.
చిత్తము యొక్క రెండు భాగములు
సృష్టిని ఏర్పరుచుచున్న సృష్టి యొక్క అనుభవాన్ని చిత్తం పొందుచున్న చిత్తం
స్వతఃగా చూస్తే మాత్రం, ఈ సృష్టి ఆకాశమువలె శూన్యమైనది. ఇదంతా సంకల్పములోని నగరము వంటిది. కేవలము భ్రాంతి చేత మాత్రమే ఏర్పడి ఉంటోంది.
శ్రీరాముడు: బ్రహ్మము, జగత్తు వేరువేరైన లక్షణములు కలిగి ఉంటున్నాయి కదా?
Page:198
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము మహాశక్తియుతము. సర్వ లక్షణ విలక్షణము. బ్రహ్మములోనే ఈ బ్రహ్మాండాలున్నాయి. ఈ బ్రహ్మాండములో కొన్ని జీవరాసులు కేవలం అజ్ఞానము నందు ఉండి ఉంటున్నాయి. మరికొన్ని జ్ఞానయుక్తమై ఉంటున్నాయి. ఇంకొన్ని విఘ్నములు కారణంగా మధ్యమధ్యలో ‘చ్యుతి’ పొందుచున్నాయి.
ప్రపంచముతోటి సంబంధం ఉన్న జీవులలో కొందరు మాత్రమే ఉత్తమ వైరాగ్యము ఆశ్రయించి ఉండుటచే, వారు తదితరులకు ఉపదేశించటానికి అర్హులై ఉంటున్నారు. విషయ వాసనలచే జీవులలో అనేకులు ఎన్నో మానసిక వ్యాధులకు గురౌతున్నారు. ఫలితంగా దుఃఖం, పిరికితనం, భయం, ఉద్వేగం మొదలైనవాటిని పదే పదే స్వల్ప కారణాల వలన కూడా పొందుచున్నారు. క్షణంలో రాగ-ద్వేష భయ-మోహాదులచే వ్యాకులపడుచున్నారు. ఈ జీవుల లోని రాజసిక-తామసిక-సాత్విక జాతులు గురించి ముందు ముందు సవివరంగా చెప్పుకోబోవు చున్నాము. ఇప్పటికి మాత్రం… నాశరహితము, సర్వవ్యాపితము, నిరామయము, చిదాభాస స్వరూపము, భ్రమరహితము, అనాది అనంతము… అయి ఉన్న బ్రహ్మము గురించే వివరిస్తాను.
నిశ్చల సముద్రంలో తరంగముల చంచలత్వం కానవస్తోంది కదా! అట్లాగే స్పంద రహితమగు ఆ పరమాత్మ యందు క్రియావిశేషము ప్రస్ఫుటమౌతోంది. ఆ క్రియావిశేషమే ఈ విధంగా జీవభావముగా ఘనత్వం పొందుతోంది. అట్టి క్రియావిశేషము యొక్క ప్రయోజనమే ‘జగత్తు’ అనబడు అనుభవం.
శ్రీరాముడు: మహాత్మా! అనంతమగు ‘ఆత్మతత్త్వం’ నందు ‘ప్రదేశం’ అనునది ఎట్లు ఏర్పడుతోంది? అందు "క్రియావిశేషము’ ఉత్పన్నమవటమేమిటి? అవి ఎట్లు సంభవిస్తున్నాయి? ఆత్మయందు అసలు ఈ వికారములు ఎట్లు ఏర్పడుచున్నాయి? అద్వితీయమగు ఆత్మ యందు స్పంద ఎట్లా కలుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ “జీవుడు - బ్రహ్మం - మనస్సు - - బుద్ధి - అహంకారం - దృశ్యం మొదలై నవన్నీ పరమాత్మచేతనే, లేక, పరమాత్మయందే ఏర్పడుచున్నాయని గ్రహించు. అయితే ఈ వాక్ రచనలన్నీ శాస్త్రవ్యవహారం కొరకే కల్పించబడుచున్నాయి. వాస్తవానికి ఇవేవీ ఎక్కడా లేవు. అనగా పరమార్ధమున ఇవి ఆత్మకు వేరుగా ఉండుటలేదు. ఈ వికారములు, ఈ అవయవత్వము, ఈ దిక్కు, కాలముల సత్త, ఈ ప్రదేశభేదముల అనుభవం… ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నపటికీ, ఇవి పరమాత్మ యందు ఏ మాత్రం సంభవించునవి కావు.
ఆ చిత్ ప్రకాశానికి, లేక, పరమాత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. అందులో అన్యమైన ఎట్టి కల్పన లేదు, ఉండబోదు, ఉండజాలదు కూడా! ఇక శబ్ద, అర్థక్రమాలు ఎచట? కార్య, కారణత్వ మెచట? వ్యవహారదృష్ట్యా ఉత్పన్నమయ్యే వాక్యరచనకు ఆత్మయందు నిజమైన స్థానం లేనేలేదు.
అయితే, ఈ ప్రపంచమున ఏ ఏ కల్పనలు, శబ్ధార్థములు, వాక్యసమూహములు ఉన్నాయో, అవన్నీ పరమాత్మ నుండే ఉత్పన్నమౌతున్నాయి. మట్టి బొమ్మలన్నీ మట్టియే అయినట్లు అవన్నీ
Page:199
ఆత్మమయం, సద్వస్తురూపం అయి వున్నాయి. ఓ సూక్ష్మగ్రాహీ! రామచంద్రా! అగ్ని నుండి ఉత్పన్న మయ్యేవన్నీ అగ్నికాక మరింకేమౌతాయి చెప్పు? నిప్పురవ్వలన్నీ నిప్పే కదా! పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యేవన్నీ పరమాత్మ స్వరూపమే అవుతాయి. ఇక ఈ ’జనించునది, జనింపజేయునది’… అను ’భేదకల్పన’ అంతా మిథ్యయే అయివున్నది. ఈ జగత్తు యొక్క స్థితి అంతా మాయచేతనే సంభవిస్తోంది. ఇక పదార్థముల ఉత్పత్తి, వినాశనములు…” అనునదంతా ఒక కల్పన నుండి వేరొక కల్పనను ఉద్భవింపజేయుట మాత్రమే అయి ఉంటున్నది.
నీటి యందు కదలికలాగా ఆత్మయందు క్రియాశక్తి యొక్క ఆధిక్యతచేతనే “జనించునది జనింపజేయునది’… అను రూపముగల వేరు వేరు విషయాలు (జగత్తు-పరమాత్మ అనునవి) దర్శించబడుచున్నాయి.
ఒక పెద్ద రాయి నుండి ఖండింపబడిన మరొక చిన్న రాయి ఆ పెద్దరాయికంటే వేరైనది కాదు కదా! పెద్దరాయిలో, చిన్నరాయిలో పదార్థమొక్కటే. కానీ, ఆకారాదుల దృష్ట్యా వేరుగా కనబడుచున్నవి. అట్లే ఆత్మయందు కనబడే వేరు జీవులనబడే చమత్కారములన్నీ ఆత్మ ప్రసరణమే అయి వున్నది. “ఇది వేరు, అది వేరు. ఇతడు వేరు, అతడు వేరు.. నేను వేరు, నీవు వేరు” అనునట్టి ఈ శబ్దార్థవ్యవహార క్రమమంతా నామ మాత్రమే అయివున్నది. "వేరైనది-వేరుకానిది” అనేదంతా పరమాత్మ యందు లేదు.
ఎందుకంటావా? ‘పరిచ్ఛేదము’ అనేది ఉంటే కదా, భిన్నత్వము సంభవించేది! బ్రహ్మము నుండి ఉత్పన్నమైన ‘మనస్సు’ యొక్క శక్తి ద్వారా స్వభావపూర్వకంగానే ఈ నామ రూప కల్పన అంతా ప్రవృత్తమగుచున్నది. అంతే కాదు, మనస్సు యొక్క దృఢభావనచేతనే జగద్వ్యవహార మంతా సంభవిస్తోంది.
శ్రీరాముడు: అయితే “పరమాత్మ నుండి ఈ జగత్తు ఏర్పడుచున్నది" - అను వాక్యం అసమగ్రమైన అర్థమేనని అంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి: “ఒక అగ్ని శిఖ నుండి ఇంకొక అగ్ని శిఖ ఉత్పన్నమగుచున్నది”… అనునదంతా ‘వాక్కు’ యొక్క వైచిత్ర్యమేగాని, యథార్థం కాదు. ఎందుకంటే, ఆ రెండు అగ్నిశిఖలు ఒకే అగ్ని యొక్క రూపములే. పరమాత్మయందు ‘జనింపజేయునది - జనించునది’ ఎట్లా సంభవిస్తాయి చెప్పు? సర్వదా ఏకమై ఉంటున్న పరమాత్మ ఎట్లు, దేనిని, ఎందుకొరకు ఉత్పన్నం చేస్తున్నాడు?
ఒక మాట ఉన్నప్పుడు, దానికి విరుద్ధమైనది, భిన్నమైనది, రెండవది అయిన మరొకమాట ఉండటం ఆ మాట (లేక వాక్యము) యొక్క స్వభావం.
అయితే బ్రహ్మమునందు వచనాదులే ఉండవు కదా! ఇక ఈ శబ్ద అర్థ కల్పముల రూప మంటావా… ఇదంతా సముద్రములోని తరంగములకు ఒకదానికి మరొకదానికి ఉన్న భేదము వంటిదే. చిన్న పెద్ద తరంగములన్నీ జలమయమే కదా! తరంగదృష్టిని ఆశ్రయించి తద్వారా సముద్రమును, సముద్ర జలమును నిర్వచించగలమా? లేదు.
Page:200
ఈ సర్వజగత్తు బ్రహ్మమే అయి వున్నది. ఇది మేము గాంచుచున్న శాస్త్రముల సారం. ‘ప్రత్యగాత్మ’ కూడా బ్రహ్మమే అయివున్నది. ‘మనస్సు-బుద్ధి’ అనునవి కూడా బ్రహ్మమే. ఈశ్వరుడు అనుదాని శబ్ద-అర్థములు బ్రహ్మమే. సర్వ వస్తువులందలి సారము బ్రహ్మమే.
బ్రహ్మసర్వమిదం విశ్వం విశ్వాతీతం చ తత్పదమ్|
వస్తుతస్తు జగన్నాస్తి సర్వం బ్రహ్మైవ కేవలమ్ ॥ (సర్గ 40, శ్లో 30)
ఈ విశ్వమంతా బ్రహ్మము యొక్క స్వరూపమే. అయితే బ్రహ్మం ఈ విశ్వమునకు పరమైనది కూడా. ఈ జగత్తు వాస్తవానికి లేనేలేదు. అంతయు కేవల బ్రహ్మస్వరూపమే అయివున్నది.
కొద్ది క్షణముల మౌనం తరువాత -
శ్రీరాముడు: మరి ఈ విలక్షణములతో కూడిన వస్తుతత్వము మాటేమిటి? వివిధ జీవులు వివిధములైన లక్ష్యములను, ఆర్తులను కలిగి ఉంటున్నారే?
శ్రీ వసిష్ఠ మహర్షి: తరంగములు, సుడులు, బుడగలు, ఆవర్తములు - అంతా జలమే అయినట్లు… ఉంగరము, వడ్డాణం, గాజులు, గొలుసు - అంతా బంగారమే అయినట్లు… నీవు-నేను-అదిఇది-లోకములు-పదార్థములు సర్వము బ్రహ్మమే. ఈ జగత్తు సంకల్పము ఉన్నచోట అనేకముగా, శుద్ధస్వరూపము ఆశ్రయించబడినప్పుడు బ్రహ్మముగా ద్యోతకమగుచున్నది.
ఓ రాఘవా! అటు ఆకాశం వైపు చూడు. తూర్పు వైపు ఆకాశం, పడమర వైపు ఆకాశం ఒక్కటా? వేరు వేరా? "ఈ ఆకాశ విభాగము వేరు… ఆ ఆకాశ విభాగము వేరు” అనునది ఆకాశమునకు ఉంటుందా? విశాలమగు పరమాత్మయందు కూడా ఈ విభాగకల్పన లేనేలేదు. ఇక ఇది తూర్పు ఆకాశం, ఇది పడమర ఆకాశం అనునదంతా వికల్పోక్తితో కూడిన వాక్కు మాత్రమే.“నీవు-నేను-వాడు-వీడు-జన్మలు-మృత్యువు-దేవతలు-రాక్షసులు-మానవులు”….ఇవి కూడా అట్టివే. ఇవన్నీ సాపేక్షదృష్టి (Relative perception) ని ఆశ్రయించి మాత్రమే ఉంటున్నాయి. వీటి యందు అర్థవిచారణ చేసినప్పుడు ’సత్యము’నకు లభించునదేదీ ఉండుటలేదు.
ఒకచోట ఉన్నవానికి మాత్రమే “దిక్కులు, కాలము”… అను సాపేక్షతో కూడిన అనుభవం ఏర్పడి ఉంటోంది. ఆత్మయో, సర్వత్రా వ్యవస్థితమై ఉండగా, “ఆత్మయే సర్వదా నేనై ఉన్నాను” అను ఉత్తమార్థం గ్రహించినవానికి ఈ సాపేక్షత (Relativity) ఎక్కడ ఉంటుంది? ఉండదు. శ్రీరాముడు: హే మహాత్మా! ఈ మనస్సు బ్రహ్మము నుండే ఉత్పన్నమగుచున్నది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి: “బ్రహ్మము నుండి మనస్సు ఉత్పత్తి అగుచున్నది”… అనబడు వికల్పోక్తి అసత్యమైనదే సుమా! ఉదాహరణగా ఒక ప్రశ్న అడుగుతాను.
నీవు, నీ మనోరథములు వేరువేరా? నీ నుండి నీ భావనలు వేరైనవిగా చెప్పగలమా? వాటికి నీకన్నా వేరైన అస్థిత్వమున్నదా? ‘గుణి’ కంటే గుణములు వేరుగా ఎక్కడైనా ఉంటాయా?
Page:201
లేదు…. లేనప్పుడు “ఆ గుణములు, భావములు, మనోరథములు నీ నుండి ఉత్పన్న మగుచున్నాయి”… అని అనటం ఎట్లా? “అదిగో రెండవ చంద్రుడు” - ’ అని ఒక పిల్లవాడు అంటు న్నాడనుకో… ఆ రెండవ చంద్రుడు ఆతనికి ఆకాశంలో కనిపించటానికి కారణమేమిటి? ఆ చూచు వాని దృష్టిదోషమే కదా! సత్యమునకు సంబంధించిన జ్ఞానము అల్పమగుచున్నప్పుడే బ్రహ్మము నందు ఈ వికల్పములన్నీ అగుపిస్తూ ఉంటున్నాయి. “ఈ వికల్పమంతా ‘మనో చాపల్యము’ చేతనే ఉత్పన్నమగుచున్నది” అనుటలో సందేహమే లేదు. ఆత్మ యొక్క సాన్నిధ్యము చేతనే మనస్సు స్థితి - స్పందనలు పొందగలుగుతోంది. అయినప్పటికీ, “ఆత్మ ఇట్లు మనస్సుగా పరిణమిస్తోంది"… అని అనవీలులేదు. ఎందుకంటావా? ఏ క్షణ మందు కూడా ఆత్మ తన శుద్ధత్వం, నిర్మలత్వం, సాక్షిత్వం, అఖండత్వములను త్యజింపకయే ఉంటోంది. అజ్ఞానదృష్టికి మాత్రం - స్వయంకృతమైన సంకల్పములు ఘనీభూతమగుచున్నాయి. ఆ కారణంగా ఆత్మయే, ‘ఇది జీవము, ఇది జగత్తు’ అనునట్లుగా తోచుచున్నది.
సర్వస్వరూపము, సర్వవ్యాపియగు ఆ “అనంత బ్రహ్మపదము" నుండి మరింకేదీ ఎన్నడైనా సంభవించటానికే వీలులేదు. దాని నుండి ఆవిర్భవిస్తున్నట్లు తోచుచున్నదంతా బ్రహ్మమే అయి వుంది. బ్రహ్మతత్త్వము లేనిచోట ఏదీ అగుపించదు, ఉత్పన్నము కాదు. బ్రహ్మము వలననే బ్రహ్మమునకు ఇదంతా తెలియవచ్చుట జరుగుతోంది.
ఒకే వ్యక్తిని చూస్తున్న మరి కొందరు “ఇతడు నా తండ్రి… నా కుమారుడు… నా అల్లుడు… నా మనుమడు… నా మిత్రుడు…” ఇట్లా అనేక రీతులుగా అతనితో తమకు గల స్థితి, సంబంధా లను బట్టి భావిస్తున్నారు కదా! అందరూ చూస్తున్నది ఆ ఒకడినే కదా! అట్లాగే, ఒకే బ్రహ్మము అనేక నామరూపములతో ద్రష్టయొక్క స్థితిగతులను అనుసరించి కనబడుచున్నది. “ఇదంతా బ్రహ్మమే (సర్వంఖిల్విదమ్ బ్రహ్మ)” అనునది వేదవాక్యసారమే అయివున్నది. ఈ విషయమునే మనం ఈ గ్రంథంలో అనేక కోణముల నుండి సుస్థీకరణ పూర్వకంగా నిరూపిస్తున్నాం.
“పరమార్థతత్త్వము” అయి వున్న ఆ పరబ్రహ్మము నందు ‘అవిద్యాదులు’ అనబడే సంసార దోషం ఈషన్మాత్రం కూడా లేదు.
శ్రీరాముడు: స్వామి! మరి జీవునికి కనిపిస్తున్న ఈ విషయ వ్యవహారముల మాట ఏమిటి? శ్రీ వసిష్ఠ మహర్షి: ఇవన్నీ జీవునకు అసమగ్రదృష్టి, అజ్ఞానములచే దోషముల చేతనే అనుభవ మగుచున్నాయి. కనుక, అజ్ఞానం నశించిందా… ఇక ఆపై ఈ కనబడే సర్వమందలి “శుద్ధ పరమాత్మ బ్రహ్మతత్వము”… నీవు దర్శించగలవు సుమా! ఒక పాత్ర బాగా మాలిన్యముతో కప్ప బడి ఉన్నదనుకో… ఆ మాలిన్యమును శుభ్రం చేసి తొలగిస్తే పాత్ర యొక్క వాస్తవమైన మెరుపు గోచరిస్తుంది కదా! అట్లే, అజ్ఞానము నశించగానే బ్రహ్మపదము ప్రత్యక్షము కాగలదు.
దీపం వెలిగించటంచేత గదిలోని చీకటి తొలగితే, అప్పుడు గదిలోగల వస్తువులన్నీ చక్కగా
కనబడతాయి కదా!
Page:202
ముందుగా అజ్ఞానముచే కలుషితమైయున్న ఈ దృష్టిని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు ఈ విశాలదృశ్య జగత్తు సర్వ వికల్పములతో సహా దృష్టి నుండి ఉపశమించగలదు. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబము ఎంతో స్పష్టంగా చూడగలం. సత్యస్వరూపమగు బ్రహ్మము నిర్మలమైన బుద్ధి యందు నిశ్చయత్వము, స్థిరత్వము పొందగలుగుచున్నది. అప్పుడు ఆ ద్రష్ట తన యొక్క పరిశుద్ధ స్వస్వరూపమునే సర్వేసర్వత్రా, సర్వదా, సర్వముగా గాంచుచున్నాడు. ఇదే జ్ఞానానుభవం యొక్క పరాకాష్ఠ.
శ్రీరాముడు: అహో మహర్షీ! మీ వాక్యములు అత్యంత శీతలములు, నిర్మలములు, ప్రకాశ యుక్తములై, మాపై అమృతవర్షం కురిపిస్తున్నాయి. ఎన్ని సుకృతముల ఫలితంగానో "మీ ఈ ప్రవచనమును వినగలుగుట, పొందుట” అను వరం మీ నుండి పొందుచున్నాం!
హే ప్రభో! మీ వాక్యములు మహాప్రభావములు కలిగి ఉంటున్నాయి. మహోత్కృష్టమగు సత్యమునే ప్రతిపాదిస్తున్నాయని మేము గ్రహిస్తున్నాం. అయితే మా యందు అనేక జన్మలుగా పేరుకొని యున్న అజ్ఞాన దోషము చేత కాబోలు… గంభీరార్థం సంతరించుకొని యున్న మీ వాక్యములు వినుచుండగా క్షణకాలం జ్ఞానప్రకాశం బయల్వెడలుతోంది. ఇంతలోనే మరొక క్షణంలో ఎక్కడి నుండో అజ్ఞానం వచ్చిపడుతోంది. ఈ విధంగా జ్ఞాన - అజ్ఞానముల మధ్య కొట్టు మిట్టాడుచున్నాం. ఆకాశంలో మేఘముల రాకపోకలచే ఎండ - నీడలు ఏర్పడుచున్నట్లు మేము క్షణకాల జ్ఞానం, మరల ఏదో అనిర్వచనీయ అసమగ్రత్వం పొందుచున్నాం.
ఓ దేవా! ఆ పరమాత్మ అనంతము, అప్రమేయము, పరిపూర్ణము, సదా ప్రకాశవంతము, ఏక రసము, నిత్యోదితము పరమార్థస్వరూపము కదా..! అట్టి పరమాత్మయందు జన్మ కర్మలతో కూడిన ఈ వికారకల్పనంతా ఎందుకు సంభవిస్తోంది? “ఈ సృష్టి బ్రహ్మము నందు లేదు.. ఇది అయోగ్యమైయున్నది… ఈ సృష్టిబ్రహ్మమే”… మొదలైన విరోధవాక్యముల ఉద్దేశమేమిటి? ఈ విషయాలపట్ల ఆత్మ ఉన్ముఖమగుట ఏమిటి? ఈ మోహాదులు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! నేను చెప్పు సత్యార్థము ఒక్కటే. దీనిలో అయోగ్యత గాని, పూర్వాపర విరోధముగాని లేవు. వేదములచే ప్రపంచమునకు చాటబడిన మహావాక్యమలనే (అహం బ్రహ్మాస్మి, జీవోబ్రహ్మేతి నాపరః మొదలైనవి) ఇక్కడ అర్థయుక్తంగా మనం చెప్పుకుంటున్నాం. అంతే. అయితే నీవు బోధ యొక్క మధ్యలో ”తితిక్ష ప్రసన్నత ఉత్తమ అవగాహన” ఈ మూడిటిని విడువవద్దు. ఈ మన సంభాషణ అనేక కోణముల నుండి పరిశీలిస్తూ ఉండగా నీ యందు పూర్వార్థరూ ‘జ్ఞానదృష్టి’ తప్పక ఉదయించగలదు. పూర్ణార్థప్రబోధము పొందగలవు. స్వస్థ చిత్తుడవు కాగలవు. అప్పుడు ఇతఃపూర్వం వింటూ వస్తున్న వ్యవహార వాక్యముల కంటే ఉత్తమమైన సత్యపదోన్నతిని నీ అంతరంగమునందే దర్శిస్తావు.
Page:203
పూజ్యులు, ఆత్మద్రష్టలు, సద్గురువరేణ్యులు అగు మహనీయులు తాము గ్రహించిన “వాక్ అతీత… అనుభవమాత్ర"… సత్యమును సర్వజనులను ఉద్దరించే నిమిత్తం వేదాంత సిద్ధాంతముల రూపంలో ప్రతిపాదిస్తున్నారు. అట్టి ప్రయత్నములో కొంత శబ్దార్థయుక్తమగు వాక్యరచన అవసర మగుచున్నది.
ఉత్తమార్థము దృష్ట్యా చూస్తే, ఆ శబ్దములు (Jargons) కొంత భ్రమ సమన్వితములైన మాట వాస్తవమే కాని, ముల్లును ముల్లుతోనే తొలగిస్తున్నట్లు “మాయ” యొక్క దుర్వ్యసనమును మాయతో కూడిన శబ్ధార్థములచేతనే తొలగించటం జరుగుతోంది. “జీవుడు - బ్రహ్మము - ఆత్మ పరమాత్మ - మనస్సు - - బుద్ధి - జగత్తు - అహంకారము”… అను శబ్దములు అట్టివే. అయితే ఈ పదజాలము సత్యార్థజ్ఞానమునకు (బోధకు) తప్పక హేతువు అగుచున్నది. కాబట్టి “ఉపదేశ్య వస్తువగు ఆత్మజ్ఞానము బోధించటానికే ఇదంతా ఇట్లు రచించబడుచున్నది” అని గ్రహించు. “వాగ్జాలము సద్గురువులు" ఈ రెండిటి సమన్వయమును వివేకముతో గ్రహించాలి.
“వివేకదృష్టి - మహత్తర ఆశయము - అసలు ఉద్దేశం గ్రహించటం”… ఈ మూడూ ఏ సమయంలోనూ ఏమరచరాదు. మిథ్యా భ్రమలందు పడకూడదు సుమా! మన ఈ సంభాషణ శ్రద్ధగా వింటూ ఉండగా, వాచ్య వాచక శబ్దార్థమును నీవే గ్రహిస్తావు.
అజ్ఞానుల కొరకు ’బ్రహ్మము’ను ఉపదేశించటానికి లేక “సత్యశాస్త్రార్థబోధ” నిమిత్తం జ్ఞానులచే వాక్రపంచమంతా కల్పించబడినది. అయితే ఎవ్వరైతే ఇప్పటికే పరమార్థస్థితియందు ఉంటారో, అట్టివారి అనుభవమే ఉపదేశ్యవస్తువు అగుచున్నది. కనుక ఇక ఆపై ఈ వాక్రపంచంతో పనేమున్నది?
ఆత్మ వాస్తవానికి పరమశుద్ధమైనది. అందు విషయోన్ముఖత్వం గాని, కర్మగాని, మోహాదులు గాని, రాగద్వేషములు గాని లేనే లేవు. అట్టి పరమార్థమగు ఆత్మయందే ఈ జగత్తు అంతా స్థితి కలిగియున్నది. ఆత్మయొక్క భావనా ప్రభవమే ఈ సర్వం యొక్క ఉనికి స్థానం అయి ఉన్నది. ఇదే విషయం అనేక యుక్తులతో అనేక కోణముల నుండి ఈ గ్రంధము నిరూపించి, వివరించి చెప్పుచున్నది.
శ్రీరాముడు: స్వామి! మరి ఈ జీవులలో అనేకమంది యొక్క అనుభవం అందుకు వ్యతిరిక్తంగా ఉంటోంది. “ఆత్మయే స్వరూపముగా గల నేను సర్వదా పరిశుద్ధుడను… విషయరహితుడను”… అను అనుభవం చాటున పడిపోతోంది. "నేను అల్పుడను, దీనుడను, పరిమితుడను, బాధితుడను, స్వల్పుడను”…. అను భావనయే అధికమైన ప్రచారం కలిగి ఉంటోంది. కారణమేమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి: నిజమే, ఈ జీవుడు తగినంత సాధనను ఆశ్రయించకపోవుటచేతనే, ఎన్ని రోజులు గడచిపోతున్నప్పటికీ ఆత్మయొక్క శుద్ధత్వము గాంచలేకపోవుచున్నాడు. “మూల అజ్ఞాన రూపము” (Causal Ignorance) అయినట్టి తమస్సు, అప్రయత్నశీలత్వము… ఈ రెండు పరస్పరం సహకరించుకుంటూ మోహమును అనేక శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తున్నాయి.
Page:204
వాక్రపంచం లేకపోతే అట్టి “మూల అజ్ఞానము” గుర్తించబడజాలదు, తొలగించ
బడజాలదు.
అవిద్యయైవోత్తమయా స్వాత్మనాశోద్యమేచ్ఛయా ॥|
విద్యా సా ప్రార్థ్యతే రామ సర్వదోషాపహారిణీ ॥ (సర్గ 41, శ్లో 13)
అనేక జన్మలలోని ‘సుకృతము’ ఫలిస్తూ ఉండగా అంతఃకరణం శుద్ధత్వము పొందుచున్నది. అనేక జన్మలుగా స్వీకరించడిన ఉపదేశములకు సంబంధించిన వాక్రపంచం జీవుని జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేసి ఆత్మయొక్క సామీప్యత ప్రసాదిస్తోంది. "ఉపదేశక్రమము, వాక్రపంచము”… అను అవిద్య ద్వారా సర్వదోషనివారిణియగు విద్య ప్రకాశించుచున్నది.
అస్త్రము అస్త్రముచేతనే జయింపబడుతుంది కదా! పాత్రకు మాలిన్యము అంటినప్పుడు, మాలిన్యముతోనే ఆ పాత్రను తోమి, ఆపై నీటితో కడిగి రెండు మాలిన్యములను తొలగించి వేస్తున్నాం. విషము విషముతోనే శమిస్తుంది. శత్రువును శత్రువే నశింపజేస్తున్నాడు. అట్లే అవిద్య చేతనే అవిద్య నశిస్తోంది. “శాస్త్రపదజాలం" అను మాయసహాయంతో “దృశ్యం” అను మాయను ఎదుర్కొనుచుండగా, సర్వము అవగతం అవుతూ వస్తోంది. అట్టి స్థితిలో ఉభయమాయలు తమంతట తామే తొలగుచున్నాయి. అనగా శాస్త్రరచనారూపమైన మాయ స్వవినాశనము నందే ఆనందము పొందుచున్నది. మాయ యొక్క స్వభావం అత్యంత దుర్లభమైనదే… కాని, అది క్షణంలో మటుమాయ మగుచున్నది.
మాయ, విచారణ (Illussion & Enquiry) మాయయొక్క స్వరూపము, స్వభావము అనిర్వచనీయములు. అది వివేకమును ఆచ్చాదించి ఉంటోంది. అనేక జగత్తులను ఉత్పత్తి చేస్తోంది. మాయ వాస్తవానికి లేనిదే కదా! అయినా కూడా ఈ దృశ్యము యొక్క ప్రాప్తికి, ఖండితమైన భావనాపరంపరలకు కారణము మాయయొక్క రూపమే.
ఈ మాయయొక్క రూపమేమిటి? ఇది ఎంతకాలంగా కలుగుతోంది? ఈ రెండు ప్రశ్నలు సమాధానరహితంగానే ఉంటున్నాయి. కాని, ఈ మాయ ఎట్లు తొలగించబడగలదో శాస్త్రములు, గురువులు మనకు విశదపరచుచున్నారు. ఆహాఁ! మాయయొక్క కార్యమే అయినట్టి ఈ దృశ్య జగత్తు ఏ విధంగా ప్రత్యక్షమై తాండవిస్తోందో చూస్తూనే ఉన్నావు కదా! ఎంత ఆశ్చర్యం!
“అవలోకించకపోవటచేతనే… (లేక, విచారించకపోవటం చేతనే) ఈ మాయ స్ఫురించు చున్నది“… అని విజ్ఞులు ప్రవచించుచున్నారు. అవలోకించి చూచామా… తప్పక క్షణంలో నశించిపోతోంది. అపరిజ్ఞాత రూపముననే (because of not verifying the reality / fact) అది స్ఫురించటం, విజృంభించటం జరుగుతోంది. ఈ విచిత్ర సంసార బంధమును కలుగజేస్తున్నట్టి మాయ ఎంతటి ఆశ్చర్యకరం? ‘అసత్యమే’ అయినప్పటికీ ఇది సత్యమువలెనే భాసిస్తున్నదే! ఇది ఎంతటి మిథ్యా వ్యవహారంగా రచించబడుచున్నదో… ఏమని చెప్పగలం! ”అభిన్నము, పరమ పదము" అగు పరమాత్మ యందు ఈ మాయ సుదీర్ఘమైన ఒక స్రవంతిగా ఏర్పడి ఉంటోంది.
Page:205
క్షరము, విశాలము అయిన ఈ భేదమంతా నిరంతరం విస్తరింపజేస్తోంది. అందుచేత “ఈ మాయ క్షర అక్షర స్వరూపమగు పురుషునికంటే అతీతుడైన పురుషోత్తముని ఆశ్రయించి ఉన్నది”… అని చెప్పబడుతోంది.
ఓ ప్రియ రామా! నీవు మాత్రం “పరమార్థ స్థితియందు ఈ మాయకు స్థానమే లేదు”…. అను నిశ్చయమునే సర్వదా కలిగియుండుము. నీవు జ్ఞానివి కావాలంటే నీ యొక్క అవగాహన భావనలను 1) సత్యనిష్ఠుల వాక్యములు 2) వేదవేదాంత పాఠాల సారం 3) స్వకీయమైన తర్కం 4) స్వానుభవం… ఈ నాలుగిటిచేత ఉద్దీప్తం చేసుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే జ్ఞేయమగు మాయను తెలుసుకుంటావో, అప్పుడు నా ఈ వాక్యములోని అంతర్లీనమైయున్న మహత్తర ఆశయమును చక్కగా దర్శించగలవు.
ఇప్పటికీ మాత్రం నీవు పూర్ణంగా ప్రబుద్ధడవు కావలసియున్నది కదా! అందుచేత, నా వాక్యములపై విశ్వాసముంచు. గురు, శాస్త్ర వాక్యానుసారం విశ్వాసముతో “అవిద్య లేదు”… అను కొండంత బలము కలిగి యుండు. అట్టి నిశ్చయముతో సునిశితమైన బుద్ధి కలవాడవై, పరిశీలనాత్మకము, వివేచనాపూర్వకము అయిన దృష్టితో నా ఈ వాక్యాలు వింటూ వింటూ ఉండు. క్రమంగా అంతా నీకే విశదం కాగలదు.
“ఇప్పుడు మాకు ఈ దృశ్యము ప్రాప్తిస్తోంది. కాని ఈయన ‘లేదు’ అని సిద్ధాంతీకరించు చున్నారు. మరి విశ్వసించటం ఎట్లా?"… అని భావించి ఈ మన ప్రస్తుతం విచారణ వినుట విరమించావా… ఇక నీవు నీ సందేహ ప్రపంచమునందే జన్మలు, అనుభవములు, అజ్ఞాన భూమికలు పొందుతూనే ఉంటావు.
ఓ సర్వజనులారా! ఈ జీవుడు అనేక జన్మలుగా ‘అవగాహనారాహిత్యము’ తో కూడిన బుద్ధితో ఈ దృశ్యవ్యవహారంలోకి మరల మరల ప్రవేశిస్తున్నాడు. అట్టి అనేక సాంసారిక దుఃఖా లను పొందుచున్నట్టి ఈ మాయబద్ధ జీవుని దృష్టిలో పెట్టుకుని మా అనేక సంవత్సరముల పరిశ్రమను, శాస్త్రజ్ఞానమును, అనుభవమును రంగరించి ఈ యోగ వాసిష్ఠరామాయణ శాస్త్రమును ప్రతిపాదించుచున్నాము.
ఇప్పటి జీవుని స్థితిగతులు ఏమిటి? బ్రహ్మజ్ఞులచే ప్రవచించబడిన శాస్త్రములలోని అంతర్గత సారము ఎట్టిది?…. ఇవన్నీ గ్రహించిన తరువాతే ఈ విచారణను మీ ముందు ఉంచుటకు యత్నిస్తున్నాం. ఈ సంసార జీవునకు దుఃఖవిముక్తి కలగాలంటే జ్ఞానమొక్కటే సరి అయిన ఔషధం. అట్టి జ్ఞానం భక్తి, విచారణ, సత్ప్రవర్తన మొదలైన వాటిచే మాత్రమే దృఢపడుతోంది. ఈ మాచే చెప్పబడుచున్న వాక్యములు ఓర్పుతో, ఋషులపై విశ్వాసంతో, నిర్మల మైన బుద్ధితో, సూక్ష్మగ్రాహ్యపూర్వకమైన అవగాహనతో విచక్షణాసహితంగా వినండి. దీని ప్రయోజనమేమిటో క్రమంగా మీరే గ్రహించటం జరుగగలదు.
Page:206
యదిదం దృశ్యతాం యాతం మానసం మననం మహత్ అసన్మాత్రమిదం యస్మాన్మనోమాత్ర విజృంభితమ్|| (సర్గ 41, శ్లో 22)
ఈ కనబడే విశాల దృశ్యమంతా మనఃసంబంధమైనది మాత్రమే. అనగా, ఇదంతా మనస్సు యొక్క మననముచే విశాలరూపమున ఉదయించుచున్నది. మనో విలాసమాత్రమే అగుటచే ఇదంతా అసద్రూపమే అయి వున్నది. ఎవరి అంతఃకరణమునందైతే “ ఈ జగత్తంతా మాయామయము… మిథ్య"… అను నిశ్చయం కలుగుతుందో, అట్టివాడు మాత్రమే మోక్ష భావమునకు అర్హుడగుచున్నాడు.
దృష్టియొక్క చంచలత్వమే సర్వ అనర్థములకు మూలము. “బాహ్యార్థభావన… ఇంద్రియ లోలత్వము.. భ్రమపూర్వకమైన సంబంధముపట్ల నమ్మిక”… అనువాటి వలననే జీవుడు ఈ సంసార బంధములందు మరల మరల చిక్కుకుంటున్నాడు. అయితే కొందరు మహనీయులు ఈ భూత వర్తమాన భవిష్యత్తు జగద్విషయములపట్ల వివేకపూర్వకమైన అవగాహనను ముందుగా సంపాదించుకుంటున్నారు. తద్వారా ఈ దృశ్యమును అనాసక్తబుద్ధిచే, “ఎప్పుడో, ఎక్కడో, ఎవరి పట్లనో జరిగిన ఏదో సంఘటన” వలె చూడటాన్ని అభ్యసిస్తున్నారు. ఈ దృశ్యము సద్రూపము కావచ్చు. లేక అసద్రూపము కావచ్చు… దృశ్యమంతటి పట్లా ‘అనాసక్త బుద్ధి’ కలిగియుండేవానిని ఇందలి సుఖదుఃఖములు, తదితర సంఘటనలు ఏమి చేయగలవు చెప్పు?
కిం అహమ్ దేహమస్మి? నేను ఈ దేహ మాత్రుడనా?… ఎవడైతే ’ఈ దేహాదులే నేను” అను భావనచే ఈ దేహేంద్రియాదులను చూస్తూ ఉంటాడో…. అతడు తన యొక్క “శుద్ధ ఏక -
అఖండ”…. భావనను గాంచలేకపోవుచున్నాడు. అందుచేతనే అతడు ’అవిద్యావంతుడు’ అగుచున్నాడు. ఫలితంగా దుఃఖములన్నీ వచ్చిపడుచున్నాయి. పరమ పదమగు ఆత్మయందు “నేను జీవుడను, దేహిని, మనుజుడను, స్త్రీని, అధికారిని, రాజును”… మొదలైన వికారములు ఉండగలవా? ఉండలేవు. ఒక స్ఫటికంలో ఎదురుగా ఉన్న దృశ్యం ప్రతిబింబిస్తోందనుకో… “ఈ స్ఫటికంలో వృక్షములు, జంతువులు, తదితరరూపములు ఉన్నాయి. అవి కదులుచున్నాయి… ప్రవర్తిస్తున్నాయి” అని అనగలమా? లేదు కదా! కాని అవన్నీ ప్రతిబింబ మాత్రంగా స్ఫటికంలో కనిపిస్తున్నాయి. చిద్రూపమునందు ఈ నామరూపముల వ్యవహారమంతా స్ఫటికంలో ప్రతిబింబించే దృశ్యం వంటిది మాత్రమే.
ఓ రామా! వాస్తవమేమిటో చెప్పుచున్నాను, విను. ఈ నామ రూపములతో కూడిన దృశ్య జగత్తునందు నీవు లేవు. నీయందు అవి కూడా లేవు. ఏదైతే దోషభూయిష్టమైన దృశ్యరూపమున ఎదురుగా కనబడుతోందో అదంతా ‘ఆత్మకు’ వేరైనది కాదు.
శాస్త్రములు మాయ యొక్క సహాయం తీసుకొని మాయను తొలగించటానికి సహకరిస్తు న్నాయి. అవి మాయకు సంబంధించిన కార్యక్రమములతో కూడుకొని, ఉన్నప్పటికీ, ఆత్మజ్ఞానము సముపార్జించుటలో తప్పక సహకరిస్తున్నాయి.
Page:207
అవిద్యాప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ జీవుడు శాస్త్రములచే ప్రసాదింపబడుచున్న ఆత్మజ్ఞానం లేకపోతే స్వాత్మానుభవం పొందజాలకున్నాడు.
ఆత్మజ్ఞానానుభవం శాస్త్రార్థములు గ్రహించుటచే తప్పక లభించగలదు. ఆత్మజ్ఞానం లేకపోతే ’సంసారము’ లేక ’అవిద్య’ను ఎవ్వరూ దాటలేరు. ఆత్మలాభమే అక్షయమైన పదము.
శ్రీరాముడు: మహాత్మా! తదితర విషయములన్నిటికన్నా కూడా "ఈ అవిద్య ఎక్కడి నుండి వచ్చి పడింది?”… అనే ప్రశ్న నన్ను ఆశ్చర్యచకితునిగా, సమాధానరహితునిగా చేస్తోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి: “ఈ అవిద్య ఎక్కడి నుండి వచ్చింది”…. అనే ప్రశ్న ప్రక్కకు పెట్టు. ఎందుకంటే మాయ అనిర్వచనీయం. “ఈ రోగము సంభవించటానికి ఏ ఏ కారణములు ఉండి ఉండవచ్చు?” అను ప్రశ్నను సుదీర్ఘంగా తర్కించటంకన్నా కూడా, “ఇప్పుడు ఈ రోగం తొలిగేది ఎట్లా?” అనునది ఉచితమైన ప్రశ్న అని విజ్ఞుల ఉద్దేశం. అసత్యమైన ఒక భావనను మనం అసత్యమైనదానిగా గుర్తిం చటమే అన్నిటికన్నా ముఖ్యం కదా! అవిద్య వలననే హృదయ మాలిన్యమంతా వచ్చిపడుతోంది. అది హృదయస్థానమంతా ఆక్రమించి ఉంటోంది. అట్లు హృదయంలోనే తిష్ట వేసుకొని యున్న ఈ సాంసారికదృష్టిని తొలగించుకొనుట ఎట్లో జనులు శ్రద్ధతో పరిశీలించెదరుగాక!
ఇప్పటికి “అవిద్య ఎందుచేత ఉంటోంది?“ అనే ప్రసంగం వదలి “ఇది తొలగేదెట్లా” అను విషయం గురించే ప్రయత్నించవలసినదిగా శాస్త్రకారులు కూడా ప్రబోధిస్తున్నారు. “తాడు యందు పాము యొక్క ‘స్ఫురణ’ ఏర్పడటం ఎంతకాలంగా, ఎందుచేత, ఎట్లా ఏర్పడింది?” అనునది వీక్షించుచు కాలయాపన చేసే బదులు, ”ఇది త్రాడు… నిష్కారణంగా ఇది పాము యొక్క భ్రమ కలిగిస్తోంది… కనుక త్రాడును త్రాడుగా మాత్రమే గ్రహించుట ఎట్లు?” అనునది సముచితమైన ప్రయత్నం.
కాబట్టి రామా! " “ ఈ అవిద్యను నేను ఎట్లా నశింపజేస్తాను?”… అనే విషయం పరిశీలించు. యోచించు. ప్రయత్నించు. అవిద్య నశించునప్పుడే యథార్థతత్వమంతా నీకు బోధపడగలదు. అవిద్య నశించిందా… ఇక “ఇదెక్కడి నుండి వచ్చింది? ఏ రూపమున ఉన్నది? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటోంది?”… అనే విషయాలు వాటంతట అవే విశదమౌతాయి.
"శాస్త్ర పరిశీలన, ఉత్తమ ఆచరణ”… ఇప్పటికి ఈ రెండూ అవసరం సుమా! ఇంద్రియాల పట్ల ఏర్పడుచున్న వ్యామోహాన్ని ఆ రెండింటితో నిరోధించు. దృశ్యం పట్ల ఏర్పడుచున్న ఆకర్షణను ‘అసంగము’ అను ఆయుధముతో ఎదుర్కో! అప్పుడు అంతా క్రమంగా నీకే తెలిసిపోతుంది.
పరమోత్కృష్టములగు సత్యము, భ్రమల దృష్ట్యా చూచినప్పుడు ఈ “అవిద్య” అనునది “లేనిదే” అని తెలియవస్తోంది. జ్ఞానము యొక్క అభావమే అవిద్య. లేక, చక్కటి పరిశీలనాత్మక బుద్దిని వినియోగించనప్పుడే అవిద్య ప్రభవిస్తోంది. అట్లు ప్రభవించి, ఆపై అది ఈ జీవుని తన ఇచ్ఛ వచ్చినట్లు శాసిస్తోంది.
Page:208
అయినా రామా! నాదొక ప్రశ్న. “ఇది అసత్య వస్తువు… ఇందు నేను పదే పదే భ్రాంతిని పొందుచున్నాను. అట్టి భ్రాంతియే నన్ను సత్యమైనదాని నుండి దూరంగా ఉంచుతోంది…” అని ఒకడు గ్రహించాడనుకో…. అప్పుడు అసత్యవస్తువులందలి భ్రాంతిత్వము, సత్యవస్తువు నందలి వాస్తవత్వములను అనుభవానికి తెచ్చుకోవటం ఎట్లా చెప్పు?
శ్రీరాముడు: నిత్యానిత్యములను క్షుణ్ణముగా పరిశీలించుటచేతనే.
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును కదా! ఈ అవిద్య ఉత్పన్నమై, అనేక దోషములు కలిగియున్నదై, విశాలమైన ఆకృతిని ప్రదర్శించుచున్నది. ఈ జీవుని క్షణంలో అజ్ఞానాంధకారంలోకి త్రోసి వేస్తుంది. అట్టి ‘అవిద్య’ ను నిరోధించటానికి ప్రయత్నించకుండా వర్తమానమును వ్యర్థ కాలయాపనతో వెళ్ళబుచ్చు మానవులకు ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి?
అందుచేత రామా! నీవు ఈ అవిద్యను బలవంతంగా, ధీరత్వంతో నశింపజేయాలి సుమా! అప్పుడు సత్యమును నీవే ఎరుగగలవు. ఒకడు గొప్ప శూరుడో ధీమంతుడో అయితే అయి ఉండ వచ్చు గాక… కాని అతడు అవిద్యకు లోబడినాడా, ఇక అతనిని కాపాడగలిగిన వారు ఎవరు?
అందుచేతనే మరల మరల హెచ్చరిస్తున్నాను. రోగరూపములో దాపురిస్తున్న అవిద్యను నశింపజేయటానికై నీవు యత్నశీలుడవు కావాల్సిందే! అట్లు చేసితివా, ఇక నీవు ఈ సంసారదుః ఖములన్నీ క్రమంగా తప్పక జయిస్తావు. అవిద్యయే సర్వ ఆపదలకు మూలం. అనర్థములన్నిటికీ అవిద్యయే తల్లి. అవిచారణ, అవిశ్లేషణ, అశ్రద్ధలచే జ్ఞానవిజ్ఞానములు కప్పబడియుండుటవలన ఏర్పడే అల్పమైన అవగాహనలే ఈ అవిద్య యొక్క రూపము, విన్యాసము కూడా.
ఇంకా, ఆ అవిద్య ఏమేమి చేస్తోందో చెప్పమంటావా? అది భయమును, విషాదమును దుష్టమానసిక చింతలను, విపత్తులను, ఇతరులపట్ల క్రూరము, నింద్యము అగు ప్రవర్తనలను తెచ్చిపెడుతోంది.
హృదయములో ఏర్పడగల మాయామోహములన్నిటికీ అది అంకురము వంటిదే. అట్టి ‘కుదృష్టి’ రూపమగు అవిద్య ‘హృదయం’ అనే స్వగృహంలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లు తిరుగాడుతుంటే, వివేకి అయిన మానవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు… ఊరుకోకూడదు. “నేను ఈ సంసార సముద్రమును దాటుటకు ఉపాయాలేమిటి?”… అనునదే చింతిస్తూ ఉండాలి.
క్షేత్రము - క్షేత్రజ్ఞుడు
శ్రీరాముడు: హే మహర్షీ! ఈ “అవిద్య” అనే జాడ్యము అనేక అనర్థములను కలుగజేస్తూ పోతోంది కదా! ఎట్లు మేము దానిని మొదలంట తొలగించుకోగలుగుతాం చెప్పండి?
శ్రీ వసిష్ఠ మహర్షి: నిజమే, ఒక క్రూరుడు బలవంతుడూ అయిన శత్రువుగా ఈ అవిద్య వచ్చి ముంగిట వ్రాలియున్నది. అయితే ఈ అవిద్య విచారణ చేసినంత మాత్రంచేత తప్పక
Page:209
తొలగిపోగలదు. అతి విస్తృతంగా ప్రసరించి ఉంటున్న అవిద్యారోగమునకు ఔషధరూపంగా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను… వినుబ్రహ్మము స్వతహాగా అమృతస్వరూపము, సర్వవ్యాపి, నిరామయము, అనాది, అనంతము, భ్రమరహితము అయివున్నది. అట్టి బ్రహ్మమునందు "నేను శరీరము ధరించి ఉండువాడను”.. అను స్పందన లేక చలనాత్మకమైన క్రియా విశేషము ఏర్పడుతోంది. సముద్రంలో జలం ఉన్నది కదా! ఆ జలము తరంగరూపమును పొంది సముద్రమునందే ఒకచోటి నుండి మరొకచోటికి పోవుచున్నది. అట్లే ఉపాధులతో కూడుకొని యున్న బ్రహ్మము కూడా బ్రహ్మమునకు బాహ్యము కానట్టి ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు పోవుచున్నట్లగుచున్నది. చంచలత్వమంతా తనయందు తానే పొందుచున్నది.
సముద్రంలోని జలంపైకి స్పందనసహితంగానూ, లోపల స్పందనరహితంగా ఉంటోంది కదా! సర్వశక్తిమంతమగు బ్రహ్మము తనకు వేరే కానట్టి ఒకానొక చోట క్రియాశీలత్వము పొంది ఉంటోంది. అంతర్గతంగానో, సర్వదా యథాతథంగానే ఉంటోంది.
ఆకాశంలోని వాయువును చూడు. అది తనయందు తానే చలనము పొందుచున్నది కదా! దాని చలనమునకు మరొకటేదీ కారణమగుట లేదు. అదేవిధంగా స్వతహాగా కూటస్థ స్వరూప మైన ఆత్మ తనయందు తానే బాహ్యధ్యాసను పొందుచున్నది. దీపం ఎల్లప్పుడూ పైకే ప్రసరిస్తుంది కదా! ఆత్మ కూడా స్వశక్తిచే స్వస్వరూపమునందే ఈ “జగత్తు-జీవులు” అను రూపమున ప్రకాశించుచున్నది. విశాలమైన తటాకంలో ఒక ప్రదేశమందు మాత్రమే సుడిగుండములు కనిపిస్తూ ఉంటాయి. అట్టి సుడులు ఏర్పడుచోటనే జలం అతివేగంగా వృత్తాకారంగా ప్రవృత్తమౌతూ ఉంటుంది. సర్వతత్వ స్వరూపము, మహాశక్తివంతము అగు ఆత్మ కూడా తన స్వరూపము నందు కల్పించబడిన ఒకానొక ప్రదేశంలో క్రియాశక్తివిలాసయుక్తమై ఒప్పుచున్నది. జలమధ్యంలో అగ్నిశిఖలు (బడబాగ్ని) కనబడునట్లు చిద్రూప మహాసముద్రంలో ఇంద్రియ ప్రకాశమంతా స్ఫురిస్తోంది.
నిర్మల చిత్ శక్తి - చిద్రూపము స్వతహాగా నిర్మల స్వరూపము. అది ఇంద్రియములకు అతీతమైనది. కాని ఈ ఇంద్రియాలను వెలిగిస్తున్నది, పొందుచున్నది, ఉపయోగిస్తున్నది కూడా అదియే సుమా! కించిత్ క్షుభితరూపా సా చిచ్ఛక్తిశ్చిన్మహార్ణవే | తన్మయీచిత్స్ఫురత్యచ్ఛా తత్రైవోర్మిరివార్ణవే ॥ … (సర్గ 42, శ్లో 11)
అట్టి నిర్మల చిద్రూప మహాసముద్రంలో ‘జగత్భావన’ అనబడు స్వల్పవిక్షోభము ఏర్పడు తోంది. అప్పుడు అది సముద్రమందు తరంగంవలె, ఆ స్పందనతో తన్మయమగుచున్నది. ఫలితమే ఇంద్రియ సంబంధమగు చిత్-శక్తి యొక్క ప్రకటన. అయితే ఇంద్రియ సంబంధమగు చిత్శక్తి, ఆత్మచిత్-శక్తికంటే వేరైనది కాదు. కాని, వేరైన దానివలె కనిపిస్తోంది. కాల్చబడి, అగ్నిప్రకాశము వెదజల్లుచున్న ఒక ఇనుపతీగను అతి వేగంగా గాలిలో ఒక ఆకారంగా త్రిప్పుచున్నామనుకో…
Page:210
అప్పుడు ఆ స్థానంలో ఒక స్థిరమైన ఆకారం గోచరిస్తుంది. అట్లే చిత్-శక్తి ఉపాధి పారవశ్యంచేత "దృశ్యము వాస్తవము, స్థిరము” అను అనుభవం పొందుతోంది. ఆ చిత్-శక్తియే తనయొక్క సర్వశక్తిత్వ కారణం చేత ‘కాలము’ అను రూపమున కూడా స్ఫురించుతోంది. అనగా, స్వయముగా తన కాలశక్తిని ప్రదర్శించుచున్నది. దేశము, కాలము ఆ చితశక్తి నుండి బహిర్గతములగు నిప్పురవ్వలవంటివే.
భావన ఎట్లా ఉంటే ఈ జగత్తు కూడా అట్లే - ఆ చిత్ శక్తి తనయొక్క స్వస్వభావమును ఒక సమయంలో ఎరుగుచున్నది. అప్పుడు ఆద్యంతరహితమైనట్టి పరమాత్మ పదమున స్థితి పొంది ఉంటోంది. అయినా కూడా, మరొకప్పుడు విచారణను వదలియుంటున్న కారణంగా భ్రాంతి వశంచేత కల్పితరూపమే తన స్వభావముగా ఎంచుచు, “నేను పరిచ్ఛిన్నుడను”… అను భావన తన యందు దృఢపరచుకొనుచున్నది. ఆ పరమసత్త “నేను పరిచ్ఛిన్నమైనట్టి విషయమును” అను నిశ్చయమును ఆశ్రయించిన మరుక్షణం ఇక ప్రాణేంద్రియములను, నామరూపములను తన రూపములైనట్లు గాంచుచున్నది. అందుచేత “చిద్వస్తువునందు ఈ సర్వము కల్పించబడుచున్నది. అట్లు కల్పించబడుచున్న సర్వపదార్థములు చైతన్యమాత్రమే అయివున్నాయి” అని గ్రహించు. "సద్రూపమగు ఆత్మకంటే వేరైనది” అని స్ఫురించుచున్నదంతా అవస్తువేగాని, సత్యము కాదు. గాజులు, ఉంగరము మొదలగు పేర్లతో చెప్పబడుచున్న ఆభరణమునకు, బంగారమునకు గల బేధమేమున్నది చెప్పు? ఆభరణమంతా బంగారమే అయి వున్నది కదా!
చిదంశమగు ఆత్మ “భావన” చేయుచున్న సమయంలో ఈ జగత్తు యొక్క ఉనికి ఏర్పడటం జరుగుతోంది. అయితే, ఈ జగత్తు, చైతన్యము… 1) ఒక్కటే 2) వేరు వేరు… అను రెండింటి కన్నా కూడా విలక్షణమైన ఒక అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి.
దీపములు, అగ్ని : జగత్పదార్ధములు, చైతన్యము - ఒక దీపంతో అనేక దీపములు వెలిగించ బడ్డాయనుకో… అప్పుడు వేరు వేరు దీపపు వత్తులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్క దీపము తదితర దీపములకంటే వేరైనదే కదా! కాని దీపాగ్ని దృష్ట్యా చూస్తేనో? వేరు వేరు దేశ కాలములలో ఉన్న దీపములన్నిటిలోని దీపాగ్ని ఒక్కటే అయివున్నదికదా! అట్లే దేశ-కాలఉపాధుల దృష్ట్యా అనేక చైతన్యములు ఉన్నాయి. అనేక స్వరూప స్వభావములు ఉన్నాయి. కాని భూతభవిష్యత్తు వర్తమానములందలి సర్వ ఉపాధులలోని చైతన్యమంతా ఒక్కటే అయివున్నది. అయితే, దేశము, కాలము మొదలైన స్పందనశక్తితో కూడుకొని యున్న చైతన్యము "సంకల్పము” వైపునకు పరుగులు తీస్తూ, మలిన రూపమును పొందుచున్నది.
ఈ దేశ కాలాదులన్నీ ఉండి ఉన్నది ఆ చిద్రూపము నందే.
క్షేత్రజ్ఞుడు - ఈ సర్వ ఉపాధులను ఆశ్రయించి ఉంటూ సర్వ అనుభవములకు స్థానభూతమైనదేదో, అదే ‘క్షేత్రజ్ఞుడు’. ఈ శరీరము యొక్క బాహ్యాభ్యంతరములను తెలుసుకొనుచూ, తన పూర్ణరూపమును ఎరుగువాడు కనుక “క్షేత్రజ్ఞుడు” అని అంటున్నాం. రైతు యొక్క పొలము రైతు కంటే వేరుగా ఊరికి
Page:211
బయటగా ఉంటుంది కదా! క్షేత్రజ్ఞుడు ఈ శరీరాదులకు, విలక్షణమైయున్నాడు. సర్వదీపములలోను ఒకే అగ్నివలె నాలోను, నీలోను ఇంద్రునిలోను, త్రిమూర్తులలోను క్షేత్రజ్ఞుని దృష్ట్యా భేదమేమీ లేదు. అతడే శరీరి అంటే కూడా. క్షేత్రజ్ఞుడే జీవుడు.
క్షేత్రము - ఈ శరీరమే క్షేత్రము. ఈ క్షేత్రమునకు బాహ్యంగా ఇంద్రియార్థములు, దృశ్యము మొదలైనవి ఉన్నాయి. అంతరమున మనస్సు బుద్ధి మొదలైనవన్నీ ఉన్నాయి. అట్టి బాహ్య, అంతరములన్నీ ఆ క్షేత్రజ్ఞుడి చేతనే ప్రవర్తింపబడుచున్నాయి.
జ్ఞానము = క్షేత్రజ్ఞునితో ‘ఏకత్వము’ లేక ‘తాదాత్మ్యము’. ‘నేను క్షేత్రజ్ఞుడను’ అను దృఢమైన అనుభవముతో కూడిన ఎరుక.
అజ్ఞానము = క్షేత్రము (శరీరము) తోటి ఏకత్వము పొందుట. "నేను ఈ శరీరమును” అను
భావన కలిగి ఉండుట.
‘క్షేత్రజ్ఞుడు’ వాసనల గురించి కల్పనలను ఒనర్చుచూ, ‘అహంకారము’ అను రూపమును పొందుచున్నాడు. ఆ అహంకారమే పదార్థాదులను నిశ్చయించుటచేతను, తదితర కల్పనలకు హేతువు అగుట చేతను “బుద్ధి” అని చెప్పబడుతోంది. చైతన్యము కంటే జీవుడు వేరు కాదు. జీవుని కంటే అహంకారము వేరు కాదు. అహంకారము కంటే బుద్ధి వేరు కాదు… అని గ్రహించబడు గాక! సంకల్పములచే కలుషితమై నప్పుడు బుద్ధియే మననం చేయు స్వభావంచే, మనోరూపాన్ని పొందుచున్నది. ఘన వికల్పాలను ఆశ్రయించుటచే ఈ మనస్సు ఇంద్రియాల రూపాన్ని పొందు చున్నది. ఈ దేహం ప్రపంచంన ఉత్పన్నమౌతోంది. జీవధారణ చేస్తోంది. ప్రత్యక్షమై తెలియ వస్తోంది. తదితరమైన దృశ్యమంతా అనుభవంగా దేహధారుడగు జీవునిచే పొందబడుతోంది.
తెలుసుకొనుట అను వాసనలకు సంబంధించిన శుద్ధ చైతన్యము వ్యవహారదృష్టి కల్పన వాసనలను అహంకార చైతన్యము
ఆశ్రయించు తత్వము
11
క్షేత్రజ్ఞుడు జీవుడు
అహంకారము → నిశ్చయమునకు సంబంధించిన కల్పన బుద్ధి
బుద్ధి →→ఇంద్రియ విషయములను మననము చేయు స్వభావము (భావనాపరంపర) మనస్సు మనస్సు → తీవ్రమైన వికల్పనలు ఘనీభూతమైన శబ్ద స్పర్శాది భావనలు → ఇంద్రియాలు ఇంద్రియాలు → కాళ్ళు చేతులు మొ॥ అవయవాలతో సంబంధము →>> దేహము
దేహము → దృశ్యం తెలియవచ్చుట →>> దృశ్య జగత్తు
Page:212
ఇలా జీవుడు ‘సంకల్పములు’ అనే పాశములచే బంధింపబడుచున్నాడు. ‘దుఃఖమయాలే’ అయిన బాహ్యాభ్యంతరములందలి పదార్థజాలములందు తనకు తానే చిక్కుకొనుచున్నాడు.
అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ క్షేత్రజ్ఞుడు లేక జీవాత్మ అవిద్యా పరిణామవశం చేతనే ‘శరీరము, దృశ్యము’ మొదలైన విలక్షణత్వమంతా పొందుచున్నాడు. వాస్తవానికి అతని చిత్స్వభావము పరిణామరహితమైనది.
రేగు కాయ పక్వమై రేగు పండుగా పరిణమించినంత మాత్రం చేత, అద్దాని సజాతిత్వము మార్పుపొందుట లేదు కదా!
ఈ విధంగా చైతన్యము జీవరూపమును, జీవుడు అహంకారరూపమును, అహంకారము బుద్ధి రూపమును, బుద్ధి సంకల్పపరంపరలచే కలుషితమై మనోరూపమును పొందుచున్నాయి. అప్పుడు ఈ మనస్సు సఫలవిఫల (satisfied-unsatisfied) మనోరథాలతో కూడుకుని ఉంటోంది. “ఈమె నా స్త్రీ, వీరు నా పుత్రులు,. వీరు నా వారు, వారు తదితరులు"… మొదలైన శరీరాకార వృత్తులను స్వీకరించుచు, తన యందు ఆ వృత్తుల దృష్టిని పొందుతోంది. పరిచ్ఛిన్నములు, తుచ్ఛములు అయిన అనేక విషయములందు ఆసక్తి పొంది ఉంటోంది.
సముద్రము వైపు నదులు వెళ్లుచూ ఉంటాయి. మదించిన ఎద్దు ఉన్నవైపుగా ఆవు పరుగులు తీస్తూ ఉంటుంది. చిత్తమునందలి ‘ఇచ్ఛ’ అను దోషమే ఈ జీవుణ్ణి విషయములవైపు పరుగులు తీయించుటకు కారణము అగుచున్నది. ఈ చిత్తము తన యందలి ఘనాహంకారముచే చమత్కారముగా ప్రవృద్ధమగుచున్నది. పట్టుపురుగులాగా తన కోర్కెలచే తానే ’బంధితురాలు’ అగుచున్నది. చేపలు ఎఱ కోసం స్వయముగా గాలమునకు చిక్కుకుని మృత్యువాతపడతాయి చూచావా? ఈ మనస్సు కూడా "స్వసంకల్ప అనుసంధానము”చే స్వయముగా బంధమునందు తగుల్కొనుచున్నది. ఆహాఁ! ఇది ఎంతటి హాస్యాస్పదం! ఎంతటి విచారకరమైన విషయం!
“నేను బద్ధుడను”… ??? చైతన్యము తన పారమార్థిక శుద్ధరూపమును క్రమముగా త్యజించుచు “నేను బద్ధుడను” అని భావించుచున్నది. “ఆశ, సంబంధము”… ఈ రెండే అద్దానిని బద్ధునిగా చేస్తున్నాయి.
శ్రీరాముడు: జన్మ-జరా మరణముల రూపమును మరల మరల సంతరించుకుంటున్న ఈ ‘అవిద్య’ అనే జగజ్జాలం ఎక్కడ నుండి ఉత్పన్నమౌతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి: అది ఆ జీవుని యొక్క అంతఃకరణమునందే ఉత్పన్నమౌతోంది. ఈ మనస్సే తన యొక్క సంకల్పముచే శబ్దము, స్పర్శ మొదలైన విషయములకు రచయిత. విషయములే మనస్సుకు ‘అగ్నిజ్వాల’ అగుచున్నది.
అవిద్యాయుక్తమైన మనస్సు “బోనులో బంధింపబడిన సింహం"లాగా మిక్కిలి అవ్యవస్థ పొందుతోంది. క్రమంగా ఈ మనస్సు అనేక విహిత, నిషిద్ద కార్యములకు కర్తృత్వము వహించు
Page:213
చున్నది. తన ఇచ్ఛా మాత్రంచేత కల్పించబడిన బహువిధములైన కర్మలందు, జన్మలందు ఇరుకు కొనుచున్నది. ఇంకేముంది? సకల దుర్దశలను ఒకటి తరువాత మరొకటిగా పొందుతూనే ఉన్నది.
మనస్సు… మనో నిగ్రహం - ఈ మనస్సు ఒకప్పుడు మనన శక్తిచే మనోరూపమును, మరొకప్పుడు నిర్ణయాత్మక శక్తిచే బుద్ధిరూపమును సంతరించుకుంటోంది. అదియే ఇంకొకప్పుడు జ్ఞానరూపమును, క్రియారూపమును, అహంకారరూపమును, శరీరరూపమును పొందుచున్నది. ఒకే నటుడు వేరు నాటకములలో వేరు పాత్రలలో నటిస్తున్నాడు కదా! అట్లాగే మనస్సు ఒకచోట ’మాయ’ అను రూపము వహించి ఈ జీవుని భావములను సంకుచితపరుస్తోంది. ఒకచోట మూర్ఖరూపమున, మరొకచోట త్యాగరూపమున స్థితి కలిగి ఉంటోంది. ఒక సమయంలో ‘చిత్తము’ రూపమున, ‘అవిద్య’ రూపమున ఇచ్ఛ రూపమున… ఈ విధంగా ఆ మనస్సు ఎత్తుతున్న అవతారములకు అంతు ఎక్కడ? ఈ ప్రపంచమంతా సంచరిస్తున్నది మనస్సే. అదియే పలువైపులా బంధించబడి, తృష్ణ, శోకములచే పరిపూర్ణమై, రాగద్వేషములకు విశాలస్థానమై ఒప్పుచున్నది.
ఈ మనస్సు యొక్క గతి గురించి ఇంకేం చెప్పమంటావు? ఇది జరామరణమూర్ఛలకు సంబంధించిన అనేక భవభావనలచేత మరల మరల క్షోభను పొందుతోంది. ఇష్టానిష్టములైన విషయములచే తరుమబడుతోంది. తదితరులపట్ల ఏర్పడు దుష్టమైన అభిప్రాయాదులచే దూషిత మగుచున్నది. దాని ఆకృతి ఇచ్ఛయే. సంక్షోభమే దాని ప్రతాపము. ఈ అనేక రకములైన కర్మలన్నీ చిగురిస్తున్నది మనస్సు నుండే. అది అనేక అనర్థములను కల్పన చేసుకుంటూ తన యొక్క ఉత్పత్తి స్థానము, నిలయస్థానము అగు పరమాత్మ పదమునే విస్మరించి వేస్తోంది. నాలుగు వైపుల నుండి బంధింపబడుచు, అనేక దుఃఖములను అనుభవిస్తోంది.
“ఎందుచేత”… అనునది మనకు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి మా సమాధానం విను. “ఆత్మకంటే భిన్నమైన దాని వలె ప్రాప్తిస్తున్న దృశ్యరూపము గూర్చిన యథార్థ జ్ఞానం సముపార్జిం చకపోవుట చేతనే. తన భారముచే తనకు తానే భయోత్పాతములు, జరామరణభావములు పొందుచున్న ఈ దుష్ట మనస్సు సంసారారణ్యంలో సంచరిస్తూ ఉండటానికి కారణం, విచారణ చేయక పోవటమే అయి వున్నది”.
సంసారము అనబడునది ఎక్కడో లేదు. ఈ మనస్సు ఆశాపాశములను తన చుట్టూ నిర్మించుకొని, పురుషార్థహీనమై ఉంటోంది చూచావా…? అదియే సంసారము యొక్క స్వరూపము. అది చింతల చేత, క్రోధము చేత, కామము చేత అత్యంత బంధనము పొందుతోంది. ఆత్మ స్వరూపమును పొందలేకపోతోంది.
అట్టి దుర్భరమైన మనస్సును పొందిన ఈ మానవుడు చూస్తూ ఊరుకోవటం ఉచితమా? కానే కాదు. అద్దానికి వర్తమానంలోనే ఉత్తమ పురుషప్రయత్నం, అధ్యయనము, విచారణ మొదలైన ఔషధములను అందించాలి. అదియే జీవుని కర్తవ్యం.
Page:214
చూచావా రామచంద్రా! జింకల గుంపును వీడిన జింకలాగా ఈ మనస్సు ఎంతో దుఃఖా క్రాంతమగుచున్నది. ఇది, పాపం, విషజ్వాలలచే దహించబడుతోంది. “ఈ జన్మ మృత్యువులు సత్యమైనవే” అని అనుకొని ‘తెగిన కమలం’ లాగా ఎంతో బాధపడుతోంది. ఇతఃపూర్వపు అనేక దేహముల పట్ల గల అభిమానముచే ఎంతగానో వియోగము అనుభవించి… అనుభవించి అలసి పోయివున్నది. ఇప్పటి ఈ దేహపతనమును ఒక ‘పీడకల’ వలె దర్శిస్తోంది. “అయ్యో! ఈ నా ప్రియమైన దేహము కొద్దిరోజులలో అకస్మాత్తుగా నేలకూలనున్నది కదా! ఇక నా గతి ఏమిటి?” అని వాపోవుచు భిన్నరాలై ఉన్నది. ”ఓయీ! జీవుడా! నీ యొక్క ఉత్తమ ప్రయత్నముచే నన్ను సముద్ధరించవచ్చును కదా?" అని ఈ మనస్సు అభ్యర్థన చేస్తోంది. ఓ రామా! ఇట్లు అనేక దుఃఖ ములు పొంది యుండుటచే తన ’ధృతి-ఉత్సాహము’లను కోల్పోయి సంచరించుచున్న ఈ మనస్సును నీవు, ఎట్లైనా సరే, కాపాడి జ్ఞానమయం చేయాలి. సముద్రంలో కూలిపోయి విలవిల లాడుచున్న పక్షిలాగా, బురదలో ఇరుక్కుని ఉన్న దున్నపోతులాగా ఈ మనస్సు ‘జగజ్జాలము’ అనే శూన్యనగరంలో పడికొట్టుకొంటోంది.
ఓ జనులారా! బంధ హేతువులు, బంధసాధనాలు అయిన ఈ దేహం, గృహం, స్వజనం మొదలైనవాటి యందు అత్యంత ప్రీతిని కలిగియుండి తేనెలో ఇరుక్కున్న గండుచీమలాగా బాధ పడుచున్న ఈ మీ మనస్సును మీరే ఉద్ధరించాలి సుమా! లేకుంటే ఎవరు ఉద్ధరిస్తారు చెప్పండి!
ఓ సర్వజనులారా! మీకు తత్త్వజ్ఞానములందు, తత్సాధనములందు తగినంత ఆదరణ ఉండటం ఎంతైనా అవసరం. “ఆత్మజ్ఞానవిషయమై అనాదరణ” అనే సముద్రంలో మీ మనస్సులు కొట్టుకుపోవుచున్నాయే! విషయములందు నిమగ్నమగుటచే అది కుంచించుకుపోతోందే! చైతన్య రూపులగు మీరు ఈ మనస్సు యొక్క రోదనను వినండి. విని ఆదుకోండి. ’అవిచారణ’చే ఇంకా ఇంకా దానిని బాధించకండి. అప్రయత్నశీలురై ఉండకండి.
‘విషయములు’ అనే బురదలో ఇరుక్కున్న…“మనస్సు” అనే ముసలి దున్నపోతును… ‘ఉత్తమ కర్మలు’ అనే త్రాళ్ళ సహాయంచే… ‘అనాసక్తి’ అనే ప్రయత్నముచే… ‘విచారణ’ అనే శక్తిచే బయటకు లాగండి! “శుద్ధజ్ఞానము” అనే నీటితో కడగండి! ”సాత్విక స్వస్థతలు” అనే వస్త్రముచే పరిశుభ్రం చేయండి! “మోక్షము” అనే ఉత్తమ స్థలంలో విశ్రాంతి పొందనివ్వండి.
నాయనలారా! అల్ప జలము, అధికమైన బురద గల ఒక దుర్వాసనపూరితమైన తటాకం ఉన్నది. ఆ తటాకమే కామము, రాగములతో కూడిన ఆపేక్ష. అందులో ఛిన్నాభిన్నములైన అంగములతో కూడిన ఈ మనస్సు చిక్కుకున్నది. శుభ, అశుభ క్రియలతో బహుమలినమై ఆ మనస్సు సంచరిస్తోంది.
అట్టి ఆ మనస్సుకు "అకర్తృత్వం’ నేర్పాలి. ఎవడైతే జరామరణములవంటి అనేక విపత్తులతో కూడిన దృశ్యజగత్తు నుండి తన మనస్సును కాపాడుకొనుటకు యత్నించడో… ఆతడు’నరుడు’ అనిపించుకోడు; నరుని రూపంలోగల మూఢమృగమే అతడు.
Page:215
శ్రీరాముడు: దేవా! ఈ అనేకులగు జీవులయొక్క ఉత్పత్తి స్వభావమేమిటో.. బహువిచిత్రంగాను, భయమును గొలిపేటట్లుగాను ఉన్నదే! ఆహా! ఏమి భ్రమాత్మకమైన వ్యవహారం!
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును, నిజమే. ఈ అసంఖ్యాకములగు కల్పితాకారముగల జీవులు ఉపాధిచేత మాత్రమే ‘వేరువేరు’ రూపములుగా విభాగములుగా తోచుచున్నారు. వీరంతా ఈ విధంగా సంసార వాసనా ప్రవాహంలో తగుల్కొని చేతలను, మాటలు ప్రదర్శిస్తున్నారు. అయితే, జల కణములన్నీ సెలయేరు నుండే ఉత్పన్నములగుచున్నట్లు, వీరంతా బ్రహ్మము నుండే ఉత్పన్నమై ఉన్నారు… ఇప్పుడు ఉత్పన్నమగుచున్నారు… ఇకముందు కూడా ఇట్లే ఉత్పన్నం కాబోవుచున్నారు. ఇట్టి జగత్తు గురించి నీవు భ్రమించవలసిన పనేమున్నదో చెప్పు?
శ్రీరాముడు: ఆత్మస్వరూపులే అయి ఉండి కూడా వీరంతా ఇట్లు ఎందుకు, ఎవరి కారణంగా వివశత్వం పొందుచున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి: వీరంతా స్వవాసనావశం చేతనే వివశత్వం పొందటం జరుగుతోంది. వీరి అంతఃకరణములు సుఖ-దుఃఖములగు అనేకమైన విచిత్ర దశలందు ‘నిబద్ధం’ అగుచున్నాయి.
అట్టి ఈ జీవులు వివిధ భూప్రదేశములందు, జలములందు, స్థలములందు, కాలము లందు… నీటిలో బుద్భుదములు వలె…. ఉత్పన్నమగుచున్నారు… నశిస్తున్నారు. అట్టివారిలో కొందరు ఈ వర్తమాన కల్పమునందే అసంఖ్యాకంగా అనేక జన్మలు పొందినవారు ఉన్నారు.
మరికొందరు ఈ కల్పంలో కొద్ది జన్మలు మాత్రమే ఎత్తియున్నారు. ఇంకొందరు రెండు, మూడు జన్మలు మాత్రమే ఎత్తారు. కొందరు కొందరైతే, ఇంకా ఈ కల్పమునందు జన్మించియే ఉండలేదు. క్రిందటి ’కల్పము’లోని ఒక జన్మ నుండి ఇంకా తేరుకొనలేదు.
మరికొందరు జీవన్ముక్తులకు ఇదే ఆఖరి జన్మ అగుచున్నది. కొందరికి ఈ జన్మపరంపరల పరిసమాప్తి అగుటచేత, వారు ‘కైవల్యప్రాప్తి’ పొందియున్నారు.
కొందరు వేలకొలది జన్మల వరకు మరల మరల ఉద్భవిస్తూ, ఒకే ‘దేహజాతి’ యందు స్థితి పొందియున్నారు. ఇంకా కొందరు రెండు, మూడు దేహజాతులందు మాత్రమే మరల మరల జన్మలు పొందుచున్నారు.
కొందరు భిన్న భిన్న దేహములను ‘ఒక క్రమము’ అంటూ ఏదీ లేకుండా లెక్కింపలేనంతగా పొందుచున్నారు. కొందరు జీవులు నరకము నందు దీర్ఘకాలంగా గొప్ప యాతనలు పొందుచున్నారు. కొందరు అల్పసుఖము కొరకు ఎంతో ప్రయాసలు పడుతూ మనోవ్యసన రూపముతో సంచరిస్తున్నారు.
మరికొందరు దైవస్వరూపులై, మిక్కిలి ప్రసన్నులై ఉన్నారు. కొంతమంది జీవులు ‘కిన్నర-గంధర్వ-విద్యాధరుల’ వంటి మనోహరమైన రూపమును పొందియున్నారు.
Page:216
కొందరు సత్యలోకనివాసులై దివ్యశరీరములతో, ఆత్మజ్ఞాన శబ్దార్థములతో విరాజిల్లు చున్నారు. కొంతమంది “సూర్య, ఇంద్ర, వరుణ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు"గా ఉన్నారు.
కొందరు కూష్మాండ (దేవతలలో ఒక తెగ), బేతాళ, యక్ష, రాక్షస, పిశాచాదుల రూపమున ఉండి ఉన్నారు. మరికొందరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూపమున స్థితి పొందియున్నారు.
ఇందులో కొందరు తుచ్ఛ విషయములపట్ల ఆసక్తి పూరితులై స్వభావరీత్యా చంఢాల, కిరాత జన్మలు పొందుచూ, ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు క్రూరత్వమును ప్రదర్శించుచున్నారు. కొందరు పక్షి రూపమును పొందియున్నారు. అట్లే తృణము, ఓషధుల, ఫలముల, ఆకుల రూపమున కూడా కొందరు జీవులు ఉంటున్నారు.
ఇట్లా ఎంతైనా వర్ణించవచ్చు సుమా! కొందరు సంసారవైభవమును పొందుచున్నారు. “నేను రాజును కావాలి… మంత్రిని కావాలి… సంఘనాయకుడను కావాలి… ఫలానా చోట ఇళ్ళు కట్టి, వాటికి యజమానిని కావాలి… అందరూ నా అధికారం అంగీకరించాలి…” ఈ విధంగా ఉంటున్నాయి, వారి వారి సాంసారిక భావనలు!
కొందరు నారబట్టలు కట్టుకుని మునులవలె మౌనము వహించి అంతా చూస్తూ కూడా, ఏమీ పట్టనట్లు ఉంటున్నారు.
కొందరు రాగముతో మమకారముతో వేటివేటినో ప్రోగు చేసి దాచుకుంటున్నారు.
కొందరు సర్పము, కొండచిలువ, క్రిమి, కీటకములు, పురుగులు మొదలైన ఉపాధులను ఆశ్రయించి స్వల్పము, తుచ్ఛము అగు పదార్థములను మహత్తరమైన వాటివలె దర్శిస్తున్నారు.
కొందరు సింహము, మేక, ఎద్దు మొదలైన మృగరూపములు ధరించి ఆహారము పొందుట, నిద్ర, మైథునము అను రెండు మూడు కార్యక్రమములందే నిమగ్నమై ఉంటున్నారు. కొందరు ఆపదలకు వశము అగుచున్నారు. మరికొందరు సంపదలను పొందుచున్నారు.
కొందరు స్వర్గపురములలో, నరకములో, నక్షత్రమండలంలో వృక్షము యొక్క ఛిద్రంలో, వాయువులో, ఆకాశంలో స్థానములు పొంది ఉంటున్నారు.
కొందరు సూర్యకిరణములలోని రసమును గ్రహించుటకు అధికారం పొంది ఉంటున్నారు. మరి కొందరు చంద్ర కిరణములలోని ఓషధత్వము యొక్క పరిపక్వత కొరకై తమ తమ ఉపాధులను నియోగించుచున్నారు.
అన్యజనుల పట్ల శ్రేయోభిలాష కలిగియున్నట్టి కొందరు, తత్సంబంధమైన ప్రయత్నము లందే మనోవాక్కులను నియమించి సంచారం సలుపుచున్నారు. మరికొందరు చిరకాలంగా జీవన్ముక్తత్వము అనుభవించి ఇక విదేహముక్తిని సమీపించు అభిలాషతో ఉంటున్నారు.
మరి కొందరు “మాకు ముక్తి కంటే తదితర జనుల సుఖశాంతులందే మక్కువ” అను భావన కలిగియుండి, తదనుకూలంగా ఏవేవో కార్యక్రమములు ఏర్పరచుకొని వర్తిస్తున్నారు. సద్గురువులు అవతారములను ధారణచేస్తూ శిష్యలను సువిజ్ఞానులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంటున్నారు.
Page:217
భోగ లంపటంలో పడిన మరికొందరు “విదేహముక్తి”“ఆత్మ సమాచారం” మొదలైన వాటిని పరమద్వేషభావంతో పరికిస్తున్నారు.
కొందరు తీవ్రవేగంతో ప్రవహించే నదులయొక్క అధిష్టాన దేవతారూపులై ఉంటున్నారు. కొందరు ఉత్తమ స్త్రీ రూపమున, పురుషరూపమున, నపుంసకరూపమున ఉంటున్నారు.
కొందరు ప్రబుద్ధమైన ’మతి’ని కలిగి ఉంటున్నారు. మరికొందరు మిక్కిలి జడమైన అంతః కరణము కలిగి ఉంటున్నారు.
కొందరు తదితరజనులకు జ్ఞానం ఉపదేశించే ‘నిష్ఠ’ కలిగి ఉంటున్నారు. ఇక కొందరు మరెవ్వరితోనూ సంభాషించటానికి ఇష్టపడక, సమాధినే ఆశ్రయించి దీర్ఘకాలం గడిపివేస్తున్నారు.
ఇదంతా ఏమిటంటావా? ఈ జనులు తమ తమ వాసనలకు వివశులై, అవిద్యాబుద్ధులై అనేక భావావేశములను ఆశ్రయించి, ఇదంతా ఇట్లు పొందుచున్నారు. ఇదంతా ఆయా భావ దశలందు స్థితి పొందియుండుటే అయివున్నది. ఇంకా…
విహరన్తి జగత్కేచిన్నిపతన్యుత్పతన్తి చ |
కన్దుకా ఇవ హస్తేన మృత్యున్నా విరతం హతాః || (సర్గ 43, శ్లో 25)
ఇంకొందరు ఈ భూమిపై ఉన్నారు. కొందరు నరకంలో పడుచున్నారు. ఇంకొందరు స్వర్గమునకు ఎగురుచున్నారు. విసరబడుచున్న బంతిలాగా కొందరు ఒక శరీరము నుండి మరొక శరీరమునకు వెళ్ళుచున్నారు.
ఆశాపాశశతాబద్ధా వాసనాభావ ధారిణః ।
కాయాత్కాయముపాయాన్తి వృక్షాదృక్షమినాండజాః ॥ (సర్గ 43, శ్లో 26)
పక్షి ఒక చెట్టు నుండి లేచి మరొక చెట్టుపై వ్రాలుచున్నట్లు ఈ జీవులలో అనేకులు అనేక ఆశాపాశములకు బద్ధులై అనేక భవిష్యత్ దేహములను ధరించుటకు ఇప్పటికిప్పటి నుండే సిద్ధము అగుచున్నారు.
❖
ఈ జీవుడు అత్యుత్తమమగు తన ఆత్మను దర్శించనంతవరకు ఇట్లే అనేక ఉపాధి పరంపరలను అనుభవిస్తూనే ఉంటాడు. అసంఖ్యాకములగు విషయములకు, సంకల్పములకు బద్ధులై ‘మాయ’ లేక ‘అవిద్య’ ను ఆశ్రయిస్తూ, ఈ విస్తారమైన విశ్వంలో సంచారం చేస్తూ ఉంటారు. జలంలో కెరటంలాగా, ఆవృత్తములులాగా ఇట్లే తిరుగాడుతూ ఉంటారు.
ఓ రాఘవా! ఈ జనులలో కొందరు అసద్వస్తువును త్యజించి సత్యజ్ఞానమును పొంది ఉంటున్నారు. జ్ఞాన భూమికాక్రమమున ఆత్మపదమునందు స్థిరత్వము బడయుచున్నారు. అట్టి జీవులు మరల ఈ ప్రపంచమున జన్మించుట లేదు.
ఇక మరికొందరు జీవుల విషయానికి వద్దాం. వారు వివేకమును పొంది కూడా, విషయ లంపటులై ఉంటున్నారు. అందుచేత వేలకొలది జన్మలు అనుభవించి ప్రశ్నార్థకంగా మరల మరల సంసార సంకటమున పడుచున్నారు.
Page:218
ఉత్తమ సంస్కారములను ఆశ్రయించుచున్న ఇంకొందరు ఉత్తమ ప్రదేశములందు, ఉత్తమ కాలములందు జన్మలు పొందుచున్నారు. సత్సమాగమమును పొందుచున్నారు. అట్టి వారు “దేవత -గంధర్వ –ఋషి” మొదలైన విభవమంతా పొందుచున్నారు. వారిలో కొందరు గర్వితులై, సాంసారిక దృష్టిని మరల ఆశ్రయించుటచే తమ మార్గముల నుండి మరల వెనుకకు మరలు చున్నారు. కొంత వెనుకకు, మరల ముందుకు చనుచున్నారు. వారిలో కొందరైతే పక్షి, మృగము మొదలైన స్థితిగతులను కూడా కొని తెచ్చుకుంటున్నారు. తుచ్చమగు విషయములపట్ల గల ఆశచే మరల జంతువుల యోనులను పొంది నరకమునకు పోవుచున్నారు.
కొందరు మహాబుద్ధిశాలురు బ్రహ్మదేవుని మనస్సు నుండి ఉత్పన్నమగుచున్నారు. (బ్రహ్మ మానస పుత్రులగు నారదుడు, వసిష్ఠుడు, సనత్కుమారుడు మొ॥ అందుకు ఉదాహరణ). అట్టి మొదటి జన్మ యందే "బ్రహ్మము” అను మోక్షపదమున ప్రకాశించుచున్నారు. మరికొందరు తమ ఉత్పత్తి స్థానమున బ్రహ్మాండమునందో, లేక వేరొక బ్రహ్మాండమునందో… బ్రహ్మదేవునిగానో, విష్ణువు గానో, మహేశ్వరుడు గానో అగుచున్నారు. కొందరు ఉత్తమ జన్మల నుండి చ్యుతి పొంది, ధర్మవ్యతిరేకులవటం చేత స్వల్ప వ్యవధిలో పశు, పక్షి, మృగ, సర్ప ఉపాధులను పొందుచున్నారు.
ఓ రామా! ఈ ఉత్పత్తి క్రమమంతా ఈ బ్రహ్మాండములో ఏ విధంగా ఉన్నదో, తక్కిన బ్రహ్మాండములలో కూడా అట్లే ఉన్నది. అవన్నీ కూడా ఇట్లే విస్తారంగాను, సువిశాలంగాను ఉండి ఉంటున్నాయి. ఇతఃపూర్వం అసంఖ్యాకంగా బ్రహ్మాండములు నిర్మించబడ్డాయి. వాటిలో కొన్ని నశించిపోయాయి. కొన్ని ఇంకా ఉన్నాయి. ఇక ముందు కూడా ఇట్లే అనేక బ్రహ్మాండములు రచించబడబోతున్నాయి. ఇవి కాక, ఏవో కొన్ని కారణాల వలన కొన్ని సందర్భములలో ఆయా జీవుల నిమిత్తం అనేక చిత్ర విచిత్రమైన అవాంతర జగత్తులు ఆవిర్భవించుతున్నాయి. ఇంతలోనే విలయం పొందుచున్నాయి. వాటిలో కొందరు గంధర్వత్వము, కొందరు యక్షత్వము, కొందరు దేవత్వము, కొందరు దైత్యత్వము పొందుచున్నారు.
ఈ బ్రహ్మాండములో మనుష్యులు, వారి వారికి యోగ్యములైన వ్యవహారములు నిర్వర్తిస్తూ సంచరిస్తున్నారు కదా! అట్లే తక్కిన బ్రహ్మాండములలో కూడా ఉన్నారు. ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క విలక్షణముతో కూడి ఉంటోంది. ఈ జీవసృష్టులన్నీ వారి వారి స్వభావమును అనుసరించి నదిలో తరంగాలవలె పరివర్తనం చెందుచున్నాయి.
ఉత్పత్తి, వినాశనము అను రెండు చుక్కల మధ్య ఈ సృష్టులన్నీ అనుక్షణం పరివర్తనం చెందుతూనే ఉన్నాయి. ఇందులోని జీవులు తమ తమ గుణములకు అధీనులై అనిర్వచనీయులై, అనిర్దేశ్యులై ఉంటున్నారు. స్వయంసంబంధమైన ఎరుక అంతఃకరణములు కలిగి ఉండి ఉత్పత్తి వినాశనముల మధ్య అనేక భావాభావములను ప్రకటించుచున్నారు.
Page:219
అయితే రామా! వీరంతా ఉత్పన్నమగుచున్నది పరమపదమగు బ్రహ్మమునుండే సుమా! బ్రహ్మము నందే వీరు ప్రత్యక్షముగా వ్యవహరించుచున్నారు. స్వస్వరూపమగు పరబ్రహ్మత్వమును ఏఒక్కరూ ఏక్షణమందూ ఏమాత్రం త్యజించుటయే లేదు.
ప్రకాశము దీపములోనుంచే వస్తోంది. కిరణాలన్నీ సూర్యుడి నుండే వస్తున్నాయి. కాల్చబడిన ఇనుము నుండే అగ్ని కణాలు వెదజల్లబడుచున్నాయి. పువ్వు నుండే వాసన వస్తోంది. వర్షము నుండే జల బిందువులు బయల్వెడలుచున్నాయి. సముద్రం నుండే తరంగాలు వస్తున్నాయి.
అదే విధంగా ఈ జీవరాశి అంతా కాలానుగతంగా బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నది. అనేక దేహపరంపరలు ధరించి భోగానుభవం పొందుచున్నది. ఆ తరువాత మరొక సమయంలో (ప్రళయకాలంలో) బ్రహ్మము నందే స్వయముగా విలీనమగుచున్నది.
అవిరతమియమాతతా తథోచ్చైర్భవత వినశ్యతి వర్ధతే ముధైవ । |
త్రిభువన రచనాది మోహమాయా పరమపదే లహరీవ వారిరాశౌ ॥ (సర్గ 43, శ్లో 45) ఈ మాయ ‘త్రిలోకములు’ అను రచనారూపమున భ్రాంతిగా ప్రాప్తిస్తోంది కదా…! ఇదంతా ఇట్లు ‘మిథ్య’ రూపమున విస్తరిస్తున్నది ఎక్కడ? ఎక్కడో కాదు… ఆత్మయందే.
సముద్రంలోని జలంలో తరంగాలు అనేకం లేచి, కొంత సంచారం చేసిన తరువాత మరల సముద్రజలంలోనే లయిస్తున్నాయి కదా! ఇది కూడా అట్టిదే.
అయితే రాఘవా! నీవు సర్వదా ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు. "మిథ్యావ్యవహారం మాత్రమే’ అయివున్న ఈ ’సృష్టి-స్థితి-లయ’లు శుద్ధ చైతన్య స్వరూపుడవగు నీయందు లేవు. నీవు వాటి యందు లేవు. కనుక నిశ్చింతుడవై ‘శాంతి’ వహించి ఉండుము.
(సంసారావతరణము)
శ్రీరాముడు: మునీంద్రా! ప్రళయకాలంలో ఈ జీవుడు ఆత్మయందు లయించుచున్నాడని మీరు చెప్పుచున్నారు కదా! మరి అట్లా అయితే, అతడు మరల ‘ఆస్థి పంజరం’ రూపంలో గల ఈ భౌతిక దేహమును ఎట్లా ఎందుకు ఎప్పుడు ధరించుచున్నాడు?
శ్రీ వసిష్ఠమహర్షి: మనం ఈ విషయం ఇతఃపూర్వమే విచారించాం. మరి నీవు ఇంకా గ్రహించుట లేదేమిటి? పూర్వాపరములను అత్యంత సునిశితంగా విచారించగల నీ బుద్ధి ఇప్పుడు ఏమి చేయుచున్నది?
ఓ రామయ్యా! ఈ దేహములతో సహా… స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కూడా… ‘అసత్తే’ అయి వున్నదయ్యా. ఇదంతా స్వప్నంలో లాగా అభాసమాత్రంగా ఉదయిస్తోంది.
Page:220
దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ లోకములు, ఈ బ్రహ్మాండములు మొదలైనవన్నీ ఒక దీర్ఘ స్వప్నంలోలాగా మిథ్యారూపముగానే కనపడుచున్నాయి. ఈ జగత్తులో అనుభవమగుచున్న ఆకృతి అంతా… “ఒకతనికి తన కంటి దోషం చేత ఆకాశంలో రెండవ చంద్రుడు కనిపించడం” వంటిది మాత్రమే.
అజ్ఞానికి ఈ దృశ్యం, ఈ ప్రపంచం వస్తుమయంగానూ, ప్రాప్త-అప్రాప్తములతోనూ, రకరకాల పరిస్థితులతో నిండినదిగా కనిపిస్తోంది. సాంసారిక వాసనలు నశించినట్టి జ్ఞానికో…? అతడు ఈ సంసారస్వప్నమును చూస్తున్నప్పటికీ, పరమార్థదృష్టిచే ఏమాత్రం మార్పు చేర్పులూ చూడకయే ఉంటున్నాడు. అందుకని, అతనికి ఇంకొక విధంగా కనిపిస్తోంది.
ఈ సంసారము అజ్ఞానాత్మయందే ఆయా జీవుల స్వభావమును అనుసరించి పరికల్పించ బడి, దర్శింపబడుచూ… మోక్షపర్యంతము ఇట్లే ఉంటోంది. జలంలో ఆవర్తం పొందు స్వభావం ఉన్నట్లు, బీజము నందు అంకురించు స్వభావం దాగి ఉన్నట్లు జీవుని యందు చంచలమైన ఈ ’శరీరములు పొందుట’ అను స్వభావం ఉండి ఉంటోంది.
కల్పనయే… వాస్తవరూపముగాగల ఈ దేహము, దేహభావము మనస్సునందే ఉండి ఉన్నది. మనసు అనేక రూపములు కలిగియున్నది. ’వాసనారూపముచే దాని యందు అనేక దేహములు దాగి ఉన్నాయి. అట్టి అనేక దేహములలో ’కర్మపరిపాకము’చే ఏ శరీరము అభివ్యక్త మవుతుందో… ఆ శరీరపు ‘ప్రతిభాస’యే ఈ జీవునకు కాలక్రమంగా సంభవిస్తోంది. అంతేగాని అన్నిటి యొక్క ప్రతిభాస ఒక్కసారే జరుగదు. మట్టియే కుండయొక్క ఆకారముగా అగుచున్నట్లు కర్మలు, భావనలు… ఇవే శరీరముల రూపమున ప్రదర్శితం అగుచున్నాయి.
ఈ సమష్టి దేహముల కర్తయే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవత్వము కూడా ఈ జీవుని స్వభావము యొక్క ప్రవాహానుగుణమైన ఒక సంప్రాప్తియేనని గ్రహించు. ఎందుకంటే అది కూడా అతని వాస్తవతత్త్వమైయుండలేదు. అయితే సర్వక్రియా సమర్థుడు, సమష్టి సృష్టిభావకుడూ అగు బ్రహ్మదేవునియొక్క సంకల్పమాత్రముచే ఈ అపారదృష్టి అంతా స్థితి పొంది ఉంటోంది. ఆయన తన సంకల్పనా సామర్థ్యముచే వస్తు ధర్మచమత్కారమంతా రచిస్తున్నారుకదా!
శ్రీరాముడు: మహాత్మా! మొట్టమొదట జీవచైతన్యము ఉండి ఉన్నది… అది మనోరూపమును పొందుతోంది. ఆ తరువాత అది సమష్టి సృష్టి స్వరూపుడగు ‘హిరణ్యగర్భుడు’ అను ‘స్థితి’ లేక ‘పదము’ పొందుచున్నది కదా! అసలు శుద్ధ చైతన్యమునకు హిరణ్యగర్భుని రూపము పొందవలసిన అగత్యమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి: అట్టి పరిణతి యొక్క క్రమమేమిటో వివరిస్తాను. శ్రద్ధగా వినుఆత్మతత్త్వమునకు వాస్తవానికి దేశకాలపరిచ్ఛిన్నత్వమనేదే లేదు. అయితే అది స్వశక్తిచే లీలామాత్రంగా ’భావనచేయటం’ అను వ్యవహారమును ఎందుకో పొందుతోంది. ప్రశాంత జలంలో తరంగమునకు సంబంధించిన స్పందన వలె ఆ భావనయే ఈ పరిచ్ఛిన్న దేహ అనుభవమునకు, కలుషితమైన దేశకాలములు అనుభవమునకు ప్రారంభస్థానం.
Page:221
వాసనావేశమే మనస్సు యొక్క రూపం. భావనయే వాసనలకు బీజం. అట్టి మనస్సు కల్పన అకల్పనలతో చంచలమై ఉంటోంది. ‘జీవుడు’ అనగా మనస్సే అయి ఉన్నది. పుష్పము నందు గంధం వలే బ్రహ్మము నందు ‘మనఃశ్శక్తి’ అంతర్లీనమైయున్నది. అట్టి మననశక్తి యొక్క ఆవిర్భావమే “సృష్ట్యాది”.
పుర్యష్టకము - ఈ దేహమే పుర్యష్టకము అంటున్నాం. ఒక పురమునకు ఎనిమిది దిక్కులు ఉన్నట్లు, ఈ దేహమునందు ఎనిమిది తత్త్వములు నిర్వచించబడుచున్నాయి.
జ్ఞానేంద్రియ పంచకము : చెవులు చర్మము - కళ్ళు - నాలుక - ముక్కు, (+) వాటి కార్యక్రమములగు… శబ్దము - స్పర్శ రూపము - రసము గంధములు.
కర్మేంద్రియ పంచకము: వాక్కు - కాళ్ళు - చేతులు - పాయువు - ఉపస్థ.
వాయు పంచకము : ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు సమానవాయువు.
భూత పంచకము : భూమి వాయువు అగ్ని - జలము · ఆకాశము.
అంతఃకరణ చతుష్టయం: మనస్సు - బుద్ధి - - చిత్తము - అహంకారము.
అవిద్య “ఆత్మదృష్టి” లేక “ఆత్మ స్వభావము” నుండి విక్షేపము. బాహ్యాపాదార్థికదృష్టి యొక్క ఆశ్రయము.
కామము :“మరింకేదో కావాలి”… అను కోరుకొను ప్రవృత్తి.
కర్మము : క్రియావ్యాసంగము.
ఈ “పుర్యష్టకము” సర్వప్రాణుల హృదయమునందు ఒక తుమ్మెదనుబోలి ఉంటున్నది.
ఆత్మయందలి మనఃశక్తి యొక్క అత్యంత ప్రారంభస్థితియే సృష్ట్యాది. అట్టి సృష్ట్యాది యందు ఇట్లు భావనాక్రమము జరుగుచున్నది:
శబ్ద తన్మాత్ర - సర్వశబ్దములకు బీజభూతము శబ్దతన్మాత. ఇట్టి శబ్దతన్మాత్రము, ఆ శబ్దము యొక్క అనుభవమునకు స్థానమగు శ్రోత్రింద్రియము (చెవులు)ను భావన చేయుచున్నది. ఆత్మ అట్టి శబ్దస్థానమగు నిర్మలాకాశమును పొందుచున్నది.
స్పర్శ తన్మాత్ర - - తరువాత క్రమంగా ‘స్పందన’ను అనుసరించి మనస్సు ఘనత్వం పొందుతోంది. అప్పుడు ఆ మనస్సు స్పర్శకు బీజభూతమైన ‘స్పర్శతన్మాత్ర’ వైపుకు ఉన్ముఖ మగుచున్నది. అనగా ’స్పర్శ’ వైపు చలించు వాయువు యొక్క భావనను ఆత్మయే ఆశ్రయిస్తోంది. అట్టి స్పర్శ పొందు స్థానము లేక ఆకాశమే చర్మము.
రూపతన్మాత్ర - శబ్ద, స్పర్శ తత్త్వములైన ఆకాశ వాయువు సంఘాతముచే ‘రూపము’ యొక్క భావన ఏర్పడుతోంది. అదియే ‘కన్ను’ స్థానమునకు కారణమై ‘చూచుట’ అను ప్రక్రియగా కార్యసిద్ధి పొందుతోంది.
Page:222
రస తన్మాత్ర - ఇట్లు శబ్ద, స్పర్శ, రూపముల పరిణామంచేత మనస్సు మరికొంత ఘనత్వం పొందుతోంది. అప్పుడామనస్సు క్షణంలో నిర్మలప్రకాశం యొక్క భావన పొందుతోంది. ఆకాశ-వాయు-అగ్ని గుణాలచే వృద్ధి చెందిన మనస్సు రసమునకు బీజమైనట్టి “రసతన్మాత్ర”ను పొందుతోంది. రసేంద్రియమును భావించి వెంటనే రసతన్మాత్ర దశను ఆ మనస్సు పొందుతోంది.
గంధ తన్మాత్ర - అట్లే ఆ రసతన్మాత్ర గంధయుక్తమగు స్థూలరూపమును పొంది గంధతన్మాత్రగా ప్రకటించుకొనుచున్నది.
ఆ తరువాత ఆత్మయే స్వయం నిర్మితమైన మనస్సు సహాయంచేత ఈ దేహము నుండి దృశ్యజగత్తును వీక్షిస్తోంది. పంచభూతములు తమతమ సూక్ష్మదశలను త్యజించుచు, ఆకృతిని కలిగినవిగా అగుచున్నాయి. అనగా స్థూలత్వమును పొందుచున్నాయి. అనుభవము యొక్క స్థూల స్వరూపమే ఈ మనోబుద్ధుల సంచయమైయున్నది.
తీవ్రమైన వాసనలతో కూడిన మనస్సు, పుర్యష్టకముతో ప్రకటితమగుచున్న ఈ దేహమును భావనచేయుచున్నది. “నా యొక్క స్వరూపము పుర్యష్టకముతో కూడిన ఈ దేహమే కదా…” అని భావించుచు, తదనుకూలంగానే ఆయా క్రియావ్యవహారమునకు ఉద్యుక్తురాలగుచున్నది.
కర్మపరిపాకముచే మనస్సు స్థూలత్వం పొందుతోంది. అప్పుడు బాహ్యమున, అంతరమున ‘స్థూల, సూక్ష్మ’ దేహములతో ప్రకాశించుచున్నది.
పుర్యష్టక రూపమైన భావనాతత్వమునే ‘లింగదేహము’ అని అంటున్నాం. అట్టి ఆ లింగదేహము అనేక విచిత్రములైన రచనలతో కూడిన ఈ స్థూలదేహమును స్వభావసిద్ధంగానే స్వీకరించుచున్నది.
ఈ మనస్సు తన యొక్క వాసనల వలన పొందిన దేహమును ఆకాశమున వ్యాప్తమై ఉన్నదానివలె గాంచుచున్నది. “ఇది నా దేహము”. “ఇది విశాలమై వ్యాపించి యున్నది.”“నేను ఈ శరీరంలో ప్రసరించియున్నాను.”“ఊర్ధ్వభాగంలో శిరస్సుగాను, అధోభాగంలో పాదములు గాను, ఇటు అటు చేతులుగాను, మధ్యభాగంలో పొట్టగాను రూపం కలిగి ఉన్నాను" అని ఈ జీవుడు భావిస్తున్నాడు. “జ్వాలాసమూహం” వంటి ఆకృతి గల ఈ జీవుడు వ్రేళ్ళు మొదలైన అవయవములతో ప్రకటితమగుచున్న ఈ దేహమును ఎందుకు గ్రహించుచున్నాడు? తనయందలి ’మనోరథము’ అనుదానికి వశమగుటచేతనే. మననశీలమగు ఈ మనస్సు స్వవాసనావశం అగుచూ కల్పితమగు శరీరము కలిగి వర్తిస్తోంది.
మనుజునకు ఈ దేహము కాలము యొక్క ‘గతి’, లేక, పరిపాకము చేత ప్రత్యక్షరూపమున ఉదయిస్తోంది కదా! అదే విధంగా ఈ మనస్సు కూడా “స్వశరీరవృద్ధి" పొందుతోంది. అనగా విస్తారత్వమును ఆశ్రయించుచున్నది. అట్టి విస్తారత్వ ప్రభావంచేత “నేనే ఈ సర్వమునందు
Page:223
విస్తరించి విరాజిల్లుతున్నాను. నా సంకల్పమే ఇదంతా. ఇక్కడ నాది కానిది, నేను కానిది లేదు” అను భావనాదార్ద్యంచే ఈ జీవుడే బ్రహ్మదేవుని పదమును పొందుచున్నాడు.
సర్వలోక పితామహుడు, బ్రహ్మదేవుడు మొదలైన పేర్లతో పిలువబడుచున్న ఆ సమష్టిజీవుడు బుద్ధి-సత్వము-బలము-విజ్ఞానము ఐశ్వర్యములను ధరించినవాడై విరాజిల్లుచున్నాడు.
(సమష్టి తత్వాహంకారి = A ‘will’ that is operating the cosmic aspect of creation. వ్యష్టి తత్వాహంకారి = A will that is operating the individual.
నిర్మల మనస్సుతో కూడిన ఈ సమష్టి తత్త్వస్వరూపుడు కూడా చిదాకాశము నుండి సంభవించినవాడే…! అట్టి ’సత్త’చే, అతడు ఈ అజ్ఞానరూపములను, ఈ పంచీకృత వ్యవహా రములను సృష్టించుచున్నాడు. తన మనస్సు యొక్క నిర్మలత్వముచే అతడు సత్యసంకల్పుడై ఉంటున్నాడు. అతడు దేనిని ఎట్లు సంకల్పిస్తాడో, అది అట్లే పంచీకృత సమన్వితమై ప్రభవిస్తోంది.
ఈ ఆకాశము - - భూమి మొదలైన పంచీకృతములు, ఆయా అనుభవములు కూడా.. ఆత్మ యందే స్థితి కలిగినవి అయివున్నాయి. ఇవన్నీ అతడు లీలా మాత్రంగా సృష్టిస్తున్నాడు. రచిస్తున్నాడు. అతడు ఒకప్పుడు ఆద్యంత రహితమైన విశాలాకాశమును సృష్టిస్తున్నాడు. మరొకప్పుడు నిర్మల జలమును ఉత్పన్నం చేస్తున్నాడు. ఇంకొకప్పుడు ప్రళయాగ్ని జ్వాలలచే ప్రకాశమయమగు మండలమును రచించుచున్నాడు.
అట్లే భూమి, వృక్షములు, దేహములు కూడా అతని సంకల్పానుసారమే రూపము పొందుచున్నాయి. ఆ ప్రభువు జన్మ పొందిన క్షణం నుండి లోకములను సృష్టించుచు పోతున్నాడు. అతడు విష్ణువు (సృష్టించిన దాని యొక్క ఉనికి - స్థితులకు సంబంధించిన ప్రజ్ఞ) మొదలైన అనేక రూపములను ధరించి తాను సృష్టించినది తానే ‘పాలన’ చేస్తూ ఉంటాడు. అతని దేహం కూడా బ్రహ్మపదము నుండే సంకల్పబలంచేత ఉత్పన్నమగుచున్నది.
ఇట్లు ‘మనస్సు’ అనేది బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతోంది. ఒక సమయంలో అజాన ఆవృతమైనట్టి ఆ మనస్సు విష్ణుభగవానుని కుక్షియందు ఉంటోంది. అప్పుడు పూర్వ సంస్కారము లన్నీ మరచి, ఆదమరచి సుషుప్తి దశను పొంది ఉంటోంది. నిద్రలేచిన తరువాత అప్పుడు ప్రకాశమయమగు తన దేహమును అవలోకించుచున్నది.
దేహము - ఈ కనబడే దేహం పంచభూతముల (భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం) యొక్క శుద్ధ విభాగములచే రచించబడుచున్నది. కోట్ల కొలది రోమములచే వ్యాప్తమై ఉంటోంది. నవద్వారములు కలిగినదై, చర్మముచే సుందరముగా అలంకరించబడి ఉంటోంది.
ఆ భగవానుడగు బ్రహ్మదేవుడు తన ఇచ్ఛానుసారమే ఈ శరీరములను, తృష్ణలను, జీవులను, చిత్తములను తన చిత్త - శరీరమునందు కలిగి ఉంటున్నాడు.
❖
Page:224
ఇట్లు సమష్టి - సంకల్పుని ఇచ్ఛాలీలయే ఈ సర్వము అయి ఉంటోంది. నిర్మల దృష్టి గల అతడే “ఆకాశమును రచించెదనుగాక” అని చింతించినపుడు ఆకాశము ఏర్పడి ఉంటోంది.
బ్రహ్మదేవుడను పేరుగల అతడే భూత భవిష్యత్తు-వర్తమానములన్నీ ఎరుగుచున్నాడు. ఇప్పటికే అతడు ఎన్నో సృష్టి సమూహములను దర్శించాడు. “నాయందు అస్థిత్వము కలిగియున్న ఈఈ జీవుల ధర్మాధర్మములు ఇట్టివి" అని క్రమముగా అతడు స్మరించుచున్నాడు.
అట్లే వేదములను, జీవోత్పత్తిని, తదితరములను చిత్ర విచిత్రములగు సంకల్పములచే రచించుచున్నాడు. ఈ ప్రాణులకు స్వర్గమోక్షములు, ధర్మకామములు సిద్ధించటానికి అనేక విధము లైన ఆచారములను, శాస్త్రములను రచించింది ఆయనే.
ఆ సమష్టి సంకల్పుని లేక హిరణ్యగర్భుని లేక బ్రహ్మదేవుని స్వరూపము, స్వభావము కూడా మనస్సే. దృశ్యమానమైయున్న ఈ ‘సృష్టిశోభ’ అంతా మనస్సు నుండే స్థితి పొందియున్నది. హిరణ్యగర్భుని పదము పొందిన మనస్సే వివిధ రచనలచేత, క్రియావిలాసములచేత, శోభాయ మంతములగు ఈ జగత్తులను కల్పన చేయున్నది.
శ్రీరామచంద్రుడు: ఈ జగత్తు దేశకాలములు… ఎప్పుడు ఏర్పడి, ఎప్పుడు అంతమౌతున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: “ఈ జగత్తు ద్రష్ట సిద్దించుకొన్నదే. అంతేగాని, నిర్మితమైనది కాదు”… అని విజ్ఞులచే గ్రహించబడుచున్నది. అనగా ఇదంతా మనోవిలాసము, ప్రతిభాసమాత్రము అయి
వున్నది. ప్రతిభాసకంటే వేరుగా ఇక్కడెక్కడా ఏదీ లేనే లేదు.
‘దేశ కాలములు’ - దేశకాలనబడేవి ఈ బ్రహ్మాండం, ఒక్కదానిలోనే వ్యాప్తమై ఉన్నాయి… అని అనుకోకూడదు సుమా! కోట్లకొలది బ్రహ్మాండాలు వర్తమానంలో ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండము ఒక్కొక్క రీతిగా స్థితిగతులు కలిగిఉన్నది. కోట్లకొలది బ్రహ్మాండాలు భూతకాలంలో లయించిపోయాయి. కోట్లకొలది బ్రహ్మాండాలు భవిష్యత్తులో ఉద్భవించబోవుచున్నాయి. ప్రతి జీవుని హృదయము నందు అద్దంలో ప్రతిబింబిస్తున్న వస్తువుల వలె కోట్ల కొలది బ్రహ్మాండాలు ప్రతిభాసమాత్రంగా స్ఫురించుచున్నాయి. ఇంతలోనే అదృశ్యమగుచున్నాయి.
వెయ్యి మాటలెందుకు? ఒక్కసారి పైకి చూడు. అనంతపరిమాణంగల ఆకాశం కనబడు చున్నది కదా! ఇదంతా కలిసికూడా ‘దేశకాలములు’ అనబడుదానిలో ఒక్క స్వల్ప భాగమును కూడా పూరించలేకపోతున్నాయని గ్రహించు.
జగత్తు - స్వప్నద్రష్ట తన స్వప్నంలో చూచే నగరంవలె ఈ జగత్తు సంకల్పమాత్రమే అయివున్నది. "గోడ గాని, తెరగాని లేకుండానే రంగులచే లిఖించబడిన గొప్ప కళాఖండం కనబడు తోంది…” ” అను వాక్యములోని విచిత్రార్థంలాగా ఈ ‘అసత్తే’ అయిన జగత్తు ద్రష్టకు ప్రాప్తిస్తోంది.
Page:225
అయితే ఏ దేశ- కాలములలో ఈ జగత్తు ప్రతిభాసమౌతోందో, అదంతా చైతన్యమే అట్లు దర్శింప బడుచున్నదని సూక్ష్మబుద్ధితో గ్రహించు. “ఈ కనబడే సర్వమునకు అధిష్ఠానము అయినట్టి, ద్రష్టస్వరూపమునకు ద్వితీయము కానట్టి”… ఆ చైతన్యమే అంతా కూడా!
వాస్తవానికి ఈ జగత్తు శూన్యాకాశమాత్రమే. ఇదంతా నిర్మితమైన దానివలె కనిపిస్తున్నది. కానీ, అంతా కూడా అకృతమే. అనగా ఇది ఎవ్వరిచేతనూ నిర్మించబడలేదు. ఆకాశంలోని మేఘ నిర్మిత ఉద్యానవన దృశ్యం వంటిదే ఈ జగత్తు. యాదృచ్ఛికంగా ఏర్పడే సంయోగ వియోగము లచే ఆయా ఆకార వికారములు ఏర్పడుచున్నాయి. ఆపై ఇక తదితరమైనదంతా ద్రష్ట యొక్క భావనచే చోటు చేసుకుంటోంది.
ఈ దేహాదులు, ఈ త్రిలోకములు… ఇవన్నీ కూడా మనస్సు చేతనే కల్పించబడ్డాయి. ‘చూచుట’ అనే క్రియలో నేత్రముల కర్తృత్వము ఎట్టిదో, ఆ రీతిగా, ఇదంతా మనస్సు యొక్క కేవలం ‘ఊహాదృశ్యము’తో సమానమైనది గాని, సత్యము కాదు.
పదార్థయుక్తమగు ఈ జగత్తు భ్రమచేతనే గాంచబడుచున్నది. ఎందుకంటావా? “సత్తు”నకు వేరుగా ఈ పదార్థములు ఎక్కడ ఉన్నాయి?
పట్టుపురుగు తన కొరకు గూటిని నిర్మించుకొనుచున్నట్లు, ఈ మనస్సు కూడా తన నివాసము కొరకు శరీరమును కల్పించుకొనుచున్నది. సత్యదృష్టితో పరిశీలనాత్మకంగా చూస్తే ఈ మనస్సు అర్థశూన్యము, సంకల్పమాత్రమే సుమా! అయితే ఏం…? మనస్సు రచించలేనిది లేదు. ఇది ప్రాప్తించజేసుకోలేని దుష్కరవస్తువంటూ ఎక్కడా ఏదీ ఉండజాలదు. ఆశ్రయించికూడా, అది పొందజాలనట్టి శక్తులు ఆ ఫాలాక్షుని వద్ద కూడా లేవు. సర్వశక్తులు మనస్సులోనే ఉన్నాయి. ఈ సత్-అసత్ స్వరూపములగు సమస్తపదార్థములు సర్వశక్తిమంతమగు మనస్సు చేతనే సదా స్థితివంతములు అగుచున్నాయి. ఈ శరీరము కూడా మనోభావమును అనుసరించే ప్రాప్తిస్తోంది. ఈ మనస్సుకు ఏ మనఃకల్పన, వర్ణనలకూ ఏమాత్రం అందనంతటి శక్తి ఉండి ఉన్నది.
దీర్ఘస్వప్నము - “ఈ దేవతలు, అసురులు, మనుష్యులు, జంతువులు - వీరంతా ఎవరు?” అను ప్రశ్న వచ్చినప్పుడు “వీరంతా మనస్సు యొక్క సంకల్ప శక్తిచేతనే రచించబడుచున్నారు.” అను సమాధానము లభించుచున్నది. మనస్సు యొక్క సంకల్పరూప సంచలనమే నశించిం దనుకో… అప్పుడు నూనె క్షీణించుచున్న దీపంలాగా ఈ అనేక విధములైన సృష్టి దర్శనమంతా శమించి పోతోంది. కాబట్టి రామా! ఈ జగత్తు అంతటినీ ఒక దీర్ఘ స్వప్నమును చూస్తున్నట్లే, గమనిస్తూ ఉండు. “ఆకాశము" అను శబ్దమునకు గల అర్థమువలెనే ఇదంతా కల్పనా మాత్రంగా మనోవిలాసమాత్రంగా ఎరుగుము.
న జాయతే న మ్రియతే ఇహకించిత్కదాచన I పరమార్థేన సుమతే మిథ్యాసర్వం తు విద్యతే ॥ (సర్గ 45, శ్లో 14)
Page:226
అల్ప అర్థములను త్యజించి పరమార్థమును ఆశ్రయించినప్పుడు "ఈ జగత్తునందు ఏదీ ఉత్పన్నమగుటలేదు, నశించలేదు”… అనియే గ్రహించబడుతోంది. వాస్తవానికి ఇదంతా మిథ్యయే అయివున్నది. ఎందుకంటావా? ఆత్మ ఏ కాలమందు గాని వృద్ధి క్షయములు పొందుతోందా? అప్రమేయమగు ఆత్మ మనో-బుద్ధి-చిత్త అహంకారాలుగా పరిణమించటం జరుగుతుందా? ఆత్మ స్వతహాగా వస్తురహితమైయుండగా అందు సూక్ష్మ శరీరాదులు ఎట్లా ఏర్పడతాయి చెప్పు? అఖండమగు ఆత్మ వస్తువునందు ’జీవుడు’ తదితరులు వంటి ఖండత్వమంతా ఎట్లా సంభవించ గలదు? సంభవించదు.
అసలు ఒక మాట చెప్పు? నీవు సర్వదా ఈ దేహమునకు విలక్షణమైనయున్న అపరిచ్ఛిన్న మగు అనంతాత్మను వీక్షించాలి. అట్టి అపరిచ్ఛిన్న అనంతాత్మను వీక్షించకుండా ఈ అహంకార రూపమగు పరిచ్ఛిన్నమును పొందవలసిన అవసరమేముంది? అందుకు ప్రయోజనంగా ఎంతగానో విమోహితుడవే అగుచున్నావు కదా! అట్లు ఎందుకు అల్పత్వము ఆశ్రయించాలి? ఎడారిలో తరంగములకు సంబంధించిన భావన, దాహము - ఈ రెండూ కలసి మృగములకు మృగతృష్ణలో నీరు కనబడేటట్లు చేస్తాయి. అట్లే ఈ బ్రహ్మ మొదలైన సృష్టికర్తలు, తదితరములు మిథ్యగానే గోచరిస్తున్నాయి. పదార్థదృష్టిచే ఆకాశం ఏదీ కాకున్నప్పటికీ ఏదో లేత నీలిరంగు పదార్థం అయివున్నట్లు కనిపిస్తుంది. ఈ జగత్తులోని సర్వవస్తువులు ’మిథ్యారూపమే’ అయి వుండి, ’ఘనమగు అజ్ఞానము’ చేతనే ఆవృతమై ఉంటున్నాయి. నౌకలో ప్రయాణం చేస్తున్న యాత్రికునకి ఒడ్డున ఉన్న చెట్లు కదలుచున్నట్లు కనిపిస్తూ ఉంటుంది కదా! అందుచేతనే, “ఈ సమస్తం మనః కల్పితము మాత్రమే. ఇదంతా ‘ఉంది, లేదు’ అను రెండింటి కంటే విలక్షణమై, అనిర్వచనీయమై ఉన్నది”… అని శాస్త్రకారులు మనకు మరల మరల గుర్తు చేస్తున్నారు.
“ప్రపంచరహితమగు ఆత్మ“ యొక్క భావన - ఓ రాఘవా! ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది కదా! ఇక దీని యందు ’భిన్నత్వము’నకు సంబంధించిన ప్రసంగం ఎందుకు చెప్పు? అనేక తరంగములలో జలము యొక్క అధిష్ఠానముచే అభేదమే సిద్ధిస్తుంది కదా! ”ఇది పర్వతము -స్థాణువు. ఇది నగరము-సంచలనయుక్తము”… ఇటువంటి ఆడంబరమంతా అసద్రూపము, స్వప్నతుల్యమే అయినప్పటికీ, మనస్సు యొక్క భావనాబలంచేత “ఇదంతా స్వరూపమే” (ఏర్పడి ఉన్నదే) అను విధంగా పరిలక్షితమై ప్రాప్తిస్తోంది. తత్త్వవిచారణ లేనివానికి ఈ జగత్తంతా కామ వాసనాసహితము, తృష్ణారూపము, స్వర్గనరకములవంటి అనేక విషయములతో కూడినదిగా కనబడుతోంది. అతనికి ఇందులో అనేక జన్మపరంపరలు మరల మరల ప్రాప్తిస్తున్నాయి.
అందుచేత రామా! నీవు ప్రపంచరహితమగు ఆత్మవస్తువునే సర్వదా భావిస్తూ ఉండాలి. ఆత్మనే చూడాలి.
స్వప్నతుల్య జగత్తు -
యథా స్వప్నో మహారంభో భ్రాంతిరేవ నవస్తుతః ధీర్ఘ స్వప్నం తథైవేదం విద్ధి చిత్తోపపాదితమ్ ॥ (సర్గ 45, శ్లో 20)
Page:227
స్వప్నంలోని పదార్థజాతమంతా భ్రాంతి మాత్రమే గాని వాస్తవం కాదు కదా! చిత్తముచే నిర్మించబడిన ఈ దృశ్యానుభవం అట్టిదే. ఈ సంసారము అనేక భోగములకు ఆటపట్టై, విశాలం గాను, రమణీయముగాను తోచుచున్నది. కొందరికి అత్యంత దుఃఖభరితంగానూ, మరికొందరికి మోదభరితంగానూ అనుభవమౌతోంది. కాని సత్యదృష్టిచే పరిశీలిస్తే… ఇదంతా తుచ్ఛము, క్షణ భంగురము అని తెలిసిపోతోంది. ఆహాఁ! ఇదంతా ఎన్నో ఆశలకు నిలయమై ఈ జీవుని భ్రమింప జేయటానికి అనుక్షణం సిద్ధపడుచున్నది కదా…! అందుచేత రామా! ఈ దృశ్యం నిన్ను ఆక్రమించ కుండా నీవు నిరోధించాలి. అందుకు గాను ముందుగా అంతరంగమునందు దీనిని త్యజించి ఉండు. అట్లు గాక ‘ఇది అసత్తు’ అని తెలిసికూడా దీనియందు అనురాగమో లేక ఆశ నిరాశలో కలిగియుండే వారికి ఇక నేను ఏం చెప్పగలను?”“మృగతృష్ణలో నీరు ఉండదు” అని తెలిసి కూడా “పోనీలే… అయినా చూద్దాం, ఈ తరంగాలు చూచి ఆనందిద్దాం”… అని మృగతృష్ణ వైపుకు పరుగులు తీయుటలో అర్థమేమున్నది?
కనుక నీవు దేనిపట్లా ఆసక్తిగాని, అనురాగముగాని కలిగిఉండవలసిన పనేమీ లేదు. సంకల్పముల స్వరూపము, మనోరథమయము అయినట్టి ఈ ’మాయావైభవము’ వెంట పరుగులు తీస్తున్న మూఢుని తిప్పలు వర్ణనాతీతం. అతడు అనంతకాలంగా దుఃఖమునే పొందుచున్నాడు.
‘ఆత్మ’ అనబడు మహత్తరమైన వస్తువు స్వస్వరూపమునకు అద్వితీయమై ఏర్పడి ఉండనే ఉన్నది. అట్టి ఆత్మ వస్తువు సర్వదా వేంచేసి ఉండగా, అసత్తే అయినట్టి ఈ దృశ్యప్రపంచముచే ఆకర్షణ-వికర్షణలు పొందుతూ పరుగులు తీయవలసిన పనేమున్నదో చెప్పు? ఆత్మవస్తువును వదలి మరింకేదో పొందాలని తాపత్రయపడుతూ వచ్చుచున్నవాడు పరమ పురుషార్థమును పొందలేకయే పోతున్నాడు. అనేక నీచమార్గములలో అనేకసార్లు ప్రయాణించి శ్రమచే దారిగానక దుఃఖితుడగుచున్నాడు. ’త్రాడు’ను చూచి ‘పాము’ అని అనుకొని భయపడునట్లు, ఈ జగత్తు వ్యామోహమాత్రమే అయివున్నది. భావనావైచిత్ర్యము గొలిపేదిగా తోచుచున్నది. చంచలమగు తటాకజలంలో చంద్రప్రతిబింబం "చూచారా! చంద్రబింబము ఎంతగా నీళ్ళలో ఇరికిపోయి, వంకరటింకరగా ఉన్నదో?”… అని కలవరించేది బాలుడే గాని విచక్షణాజ్ఞాని కాదు. మిథ్యా భూతములగు అసత్ పదార్థములచే అజ్ఞాని మోసగించబడవచ్చుగాక! తత్త్వజ్ఞాని దేనిస్థానము ఏమిటో, ఎట్టిదో గ్రహించియే ఇందు క్రీడా మాత్రంగా సంచారం సలుపుచున్నాడు.
ఓ సర్వజనులారా! “శబ్దము-స్పర్శ - రూపము” మొదలైన గుణ సంఘాతమునకు చోటు అగుచున్న ఈ దేహమును చూచుకొని, “ఈ దేహమే నేను”… అను అహంభావమును ఆశ్రయించి, ఈ దృశ్యమునందు “సుఖం” అను స్థానం కొరకు వెతకుచుండెడివాడు జ్ఞానుల దృష్టిలో ’మూర్ఖుడు’ అని అనిపించుకుంటున్నాడని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎవడైనా ఊహ కల్పించబడిన అగ్నిచే చలికాచుకోగలడా? లేడు. మనస్సు యొక్క మననశక్తిచే ఒకడు తన ఊహలోనే గొప్ప
Page:228
నగరం, ఆ నగరంలో విశాలమైన వీథులు, ఆ వీథులలో ఒక ముఖ్యమైన ప్రదేశంలో తన మూడంతస్తుల మేడ, ఆ మేడలో అనేక గదులు, పరిచారికలను చూడగలడు కదా! అదే రీతిగా విశాలము, జడము, పంచభూతాత్మికము అగు ఈ దేహాదులు ఎదురుగా అనుభవమగు చున్నాయి. ఈ జగత్తు చిత్తము యొక్క ఇచ్ఛచేతనే ఉదయించుచున్నది. ఇచ్ఛ లేనప్పుడు అదృశ్యమై పోవుచున్నది. సంకల్పంలోచూడబడు ఒక ప్రియవస్తువులాగా ఈ నిర్మల దృశ్యమంతా మిథ్యా రూపముననే దృశ్యమానమగుచున్నది.
ఓ రామచంద్రా! ఈ జగత్తు నశించినంత మాత్రం చేత ఇక్కడ నశించేదంటూ ఏదీ లేదు. లేక ఇది వృద్ధి పొందినప్పటికీ అధికమయ్యేదేదీ లేదు. హృదయంలో మనస్సుచే నిర్మించ బడి ఏది నశిస్తోంది? ఏది వృద్ధి చెందుతోంది? స్వప్నంలో కనబడిన ఒక చెట్టు ఖండింపబడితే నశించేదేమి ఉంటుంది? చిన్నపిల్లలు తమ ఆటలలో అనేక కల్పనలు చేసుకుంటూ ఉంటారు చూచావా? ఆటలలో పిల్లలు పొందే కేరింత భేదముల వంటివే అజ్ఞానజీవుల సాంసారిక అనుభవాలు.
ఈ జగత్తు నిరంతరం మనస్సుచే కల్పించబడుచున్నది. ఇంద్రజాలంలో కనిపించే వస్తువులు నశించినా ఏదీ నశించనట్లు, ఇంద్రజాల తుల్యమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావ తిరోభావాలచే ఏవరికి ఏమి హాని ఉంటుంది చెప్పు? ఏదైతే యథార్థానికి లేదో, అట్టిది ప్రకటితమైతే ఏమున్నది? కాకపోతే ఏమున్నది?
కనుక ఇప్పుడు చెప్పు…! ఈ ప్రపంచమున “హర్షము-శోకము”లకు తావు ఎచట?
అసదేవ యదత్యస్తం తస్మాత్కిం నామ నశ్యతి |
నాశాభావే హి దుఃఖస్య కః ప్రసంగో మహామతే ॥ (సర్గ 45, శ్లో 39)
ఎల్లప్పుడు అసత్తైనట్టి దానికి నాశనమేమిటి? ‘నాశనము’ అనేదే లేకపోతే ఇక అసలు దేని గురించైనా ఎందుకు దుఃఖించాలి? సర్వదా సద్వస్తువై ఉన్న దానికి నాశనమే లేదు కదా! అవినాశియగు సద్వస్తువే నీవై ఉండగా, ఇక నీవు దుఃఖించేది దేని కొరకు? ఈ జగత్తంతా బ్రహ్మమే అయివుండగా, ఇక సుఖ దుఃఖములు కలుగవలసిన పనేమున్నది?
విజ్ఞానదృష్టి - ఇప్పుడు విజ్ఞులయొక్క అవగాహనను క్రోఢీకరించి చెపుతాను, విను‘అసత్తే’ అయి ఉన్నదానికి హాని వృద్ధులు ఆపాదించి హర్షశోకములు పొందటం బాలురు క్రీడలలో గెలుపు-ఓటముల, ఉత్సాహ-నిరుత్సాహాల అనుభవం పొందటం వంటిది మాత్రమే. అసత్యము, నిరంతర జనన మరణ స్థానము అయివున్న ఈ దృశ్యజగత్తులో విజ్ఞులైనవారికి అభిలషించవలసినదేదీ ఉండజాలదు. లేదా “ఇదంతా బ్రహ్మమే కదా!” అను అవగాహన పొందుటచే వారు దేనినీ త్యజించవలయునను సంఘర్షణ కూడా పొందకయే ఉంటున్నారు.
“ఇది గ్రహించాలి… ఇది త్యజించాలి” అనుటకు తగినదేదీ వారికి ఇక్కడ లభించుటలేదు. “ఈ నామరూపాత్మకమగు విశ్వము అసత్తు. ఇద్దాని అధిష్ఠానమగు బ్రహ్మము సత్తు” అని గ్రహించిన ప్రాజ్ఞుడు ఇదంతా చూస్తూ కూడా ఎట్టి సుఖ దుఃఖములకు లోను అగుటలేదు. ఒక్క
Page:229
అజ్ఞానియే ఈ జగత్తునందు “ఇది వాస్తవమే” అను బుద్ధికలిగియుండుటచే, ఇందలి పదార్దముల వినాశనములను చూచి అంతులేకుండా దుఃఖములను పొందుచున్నాడు.
సునిశితమైన బుద్ధితో ఈ చెప్పే విషయం గురించి యోచించు! ఏ వస్తువైతే మొదటగాని, చివరగాని ఉండుటలేదో, అది ఈ వర్తమానమునందు కూడా ’లేనిదే’ అగుచున్నది.
అసత్తును ఇష్టపడేవానికి సర్వత్రా అసత్తే కనిపిస్తుంది. సత్తు మరుగునపడి ఉంటోంది. జలంలో ప్రతిబింబించే ఆకాశమును, నక్షత్రములను, చంద్రమండలమును చూచి, “ఈ ఆకాశము, చంద్రుడు మొదలైనవన్నీ జలంలోనే ఉండి ఉన్నాయి…. అని తలచి, వాటిని పట్టుకొనుటకు గజ ఈతగాళ్ళను పిలిపిస్తారా…. ఎవరైనా…? ఒక్క అమాయక బాలుడు తప్ప! ప్రాజ్ఞులకు జలంలో ఏది ఉన్నదో ఏది లేదో తెలుసు. విజ్ఞులు ఆత్మయందు ఉన్నదానిని, లేనిదానిని వేరు చేయగలుగుచున్నారు.
ఈ ప్రాపంచిక వస్తువులు, ‘అర్థశూన్యం’. ఇవి సుఖము అను అభాస మాత్రం కలిగి వున్నాయి. అట్టి వస్తువులచే సంతుష్టిపొందుచూ, ఆయుస్సును గడిపివేయు మానవుడు చివరకు దుఃఖములనే పొందుచున్నాడుగాని, సుఖములను కాదు.
కనుక, రామా! నీవు సత్యమును మాయను విడదీసి ఉంచాలి. విడదీసి దర్శించాలి. విడదీసి ఆస్వాదించాలి. సుస్థిరపదమునే నిరంతరం ఆశ్రయించి ఉండు.
అజ్ఞానదృష్టిచే ప్రాప్తించుదానికి కలత చెందవలదు. దానియందు అనురాగముగాని, నైరాశ్యముగాని కలిగియుండవద్దు.
అజ్ఞానరహితంగా స్వస్వరూపాధిక్యత వహించియుండు. “ఇదంతా సత్యమగు బ్రహ్మమే” అని ఎరిగిన తరువాత, మౌనమును ప్రశాంతతను వీడకుండెదవు గాక!
దామ వ్యాళ కటోపాఖ్యానం - విషయ విచారణ సమాప్తం (తొమ్మిదవ రోజు విచారణ పూర్తి అయింది)