CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:230

పదవ రోజు

VI. దాశూరోపాఖ్యానము

(ప్రారంభ విచారణ)

  1. జీవన్ముక్తుడు - స్థితి, గుణములు, గతులు

శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ పదవ రోజు విచారణ ప్రారంభంలో, దాశూరోపాఖ్యానంలో ప్రవేశించే ముందు ఈ ’స్థితిప్రకరణము’లో ఇప్పటివరకు మనం చర్చించిన విషయము ఒక్కసారి ఇంకొక కోణం నుంచి సమీక్షిద్దాం.

ఓ రామచంద్రా! పైకి ఎంతో రమణీయంగాను, అత్యంత వాస్తవంగాను కనిపించే ఈ ‘నాకు చెందినవి’ అని చెప్పబడు “ధనము, వస్తుజాలము, పుత్రులు, స్వజనులు” మొదలైనవన్నీ ’సంకల్ప నగరము’* నందలి పదార్థములవంటివి. ఊహలు వచ్చిపోతున్నట్లే అవి కూడా వచ్చిపోతూ ఉంటున్నాయి. క్షణకాలంలో కనిపించే ఇంద్రజాలంలాగా, ’మృగతృష్ణ’లోని తరంగములలోని విభేదవ్యవహారంలాగా ఈ ధన-పుత్ర-స్వజన-గృహ-వస్తుజాలాదులపట్ల సంబంధములన్నీ ఏర్పడుచున్నాయి. అట్టి స్వప్న సదృశ విషయాలు ఉంటే ఏముంది? లేకుంటే ఏముంది? స్వప్నం లోని సంఘటనలను బాలురు మాత్రమే మననం చేసుకుంటూ దుఃఖము పొందుతారేమో గాని, విజ్ఞులు మాత్రం కాదు. “మాయామోహం” చేత ఏవేవో చమత్కార విషయాలు అతిశయించుటచే ఎవరు సుఖించగలరు చెప్పు? ‘విషయభోగముల పట్ల, ‘నాది’ అను రూపం గల మమకారాదుల పట్ల అనురాగము కలిగి ఉండుట’… అనునది చివరకు మూఢత్వము వైపుకే దారితీస్తోంది.

ఈ భోగములను, వీటి పర్యవసానములను గమనిస్తున్నప్పుడు జ్ఞానికి వైరాగ్యమే కలుగు చున్నది. అజ్ఞానిని అవన్నీ క్షణంలో వశం చేసుకొని, అతిత్వరలో దుఃఖితునిగా చేసివేస్తున్నాయి.

ఓ జనులారా! ధనాదులు మొదలైనవి నశించుచున్న సమయంలో సుఖదుఃఖాలను పొంద వలసిన పనిలేదని గుర్తుచేస్తున్నాను. ఇవన్నీ ఈ రోజు కాకపోయినా, ఏదో ఒక రోజు ‘నాశనం’ అను స్థితిని తప్పక పొందబోవుచున్నాయి. భ్రమ కలిగియున్న వారికి అవి నరక హేతువులే అగు చున్నాయి. కాబట్టే సాధుపుంగవులగు మహాత్ములు వాటిపట్ల సర్వదా విరక్తి కలిగి వర్తిస్తున్నారు.

"సంకల్ప నగరము : ఒకడు తన ఊహయందు ఒక నగరమును కల్పించి, అందు వస్తుజాలమును, జనులను తన సంచారమును ఊహిస్తూ అనుభవమును పొందుట.

Page:231

కనుక మీరంతా ‘తత్త్వజ్ఞులు’ కావాలి. అందుకు ప్రయత్నమును ఆశ్రయించి ఉండండి. ఈ ప్రపంచంలో ఏ పదార్థములు వినష్టములగుచున్నాయో, వాటిపట్ల ‘ఉపేక్ష’ కలిగి ఉండండి. అంతేగాని ‘అపేక్ష’ కాదు.

కామము - ప్రాప్తించినవాటిని మాత్రం సేవిస్తూ ఉండండి. జ్ఞానులు స్వభావసిద్ధంగానే “అప్రాప్తములైన వాటిపట్ల ఇచ్ఛలేకుండుట - ప్రాప్తించిన వాటిపట్ల అనురాగ - విద్వేషములు కలిగి యుండకుండుట”… అనునది సాధన చేస్తూ ఉంటారు. అప్రాప్తములపట్ల ఏర్పడుచున్న ఇచ్ఛయే ‘కామము’ - అదే గొప్ప శత్రువు. అది ఈ ప్రపంచమున జీవులను తన ఇచ్ఛ వచ్చినట్లు భ్రమింపజేస్తోంది. ప్రచ్ఛన్నరూపమున “నిర్దయగా వధించే శత్రువు” వలె తారసపడుతోంది. మీరంతా ఈ ‘కామము’ విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలి సుమా!

జ్ఞానవంతులు కావాలి. అజ్ఞానమునకు చోటు ఇవ్వకూడదు.

ఈ జనులలో కొందరు “ప్రపంచరహితమగు బ్రహ్మము” గూర్చి సమాచారం కలిగి ఉంటున్నప్పటికీ, పాపం, అప్రమత్తులై ఉండకపోవటం చేత ఈ ‘సంసారాడంబరము’ యొక్క వంచనను గుర్తెరుగుటలేదు. అట్టి ప్రమత్తతచే వారు దుర్భర భావనలను, దీనదశలను, వినాశనమును పొందుచున్నారు. అందుచేత ముందుగా ముముక్షువు అయినవాడు ఈ దృశ్య ప్రపంచములోని సంఘటనల పట్ల, పదార్థముల పట్ల ’ప్రీతి’ని నివర్తింపజేసుకోవాలి. అందుకు యుక్తి ఏదైనా ఫరవాలేదు. “పరమార్థతత్వము’తో కూడియున్న నిర్మలబుద్ధి“ని సంపాదించుకున్న వాడు మాత్రమే ఇక్కడ మోహసముద్రంలో క్రుంగకుండా తనను తాను రక్షించుకుంటున్నాడు. ఎవడైతే “ఈ జగత్తంతా అసత్యము” అని ఎరిగినవాడై సమస్త పదార్థముల నుండి “ఉపరతి” (withdrawal) పొందుతాడో, అట్టి వివేకిని మిథ్యయే అయివున్న ఈ అవిద్య ఏమీ చెయ్యదు, చెయ్యలేదు కూడా. ”ఈ సమస్తమైన జగత్తూ, చివరికి నేను కూడా ఒకే పరబ్రహ్మమును స్వరూపముగా కలిగియున్నాము”… అని నిశ్చయించుకొనువాని బుద్ధి, ఇక ఇచ్ఛ-అనిచ్ఛలను స్వయంగానూ, స్వభావసిద్ధంగానూ, అప్రయత్నంగానూ త్యజించి వేస్తోంది. అట్టి బుద్ధిని సంపాదించుకున్నవాడు ఈ సంసార సముద్రమున మునుగడు.

ఓ రాఘవా! ’వ్యక్తము-అవ్యక్తము’ల రెండింటి మధ్య వ్యాపించియున్న శుద్ధ బ్రహ్మ పదమును ముందుగా ఎరుగుము. అట్టి ప్రత్మగాత్మస్వరూపమునే సర్వదా ఆశ్రయించి ఉండు. ఇక ఈ బాహ్య- అభ్యంతర జగత్తులంటావా… వీటిని గ్రహించవద్దు, త్యజించవద్దు. శుద్ధ పరబ్రహ్మ స్వరూపమే నీవు… నేను… ఈ జగత్తు కూడా. అట్లయి ఉండగా, ఈ ‘గ్రహించుట-త్యజించుట’ అను వేదనలతో పని ఏమున్నది?

పూర్ణవిరక్తి, సంతుష్టి, అభిమానరాహిత్యము కలిగియుండుము. ‘ఆకాశము’ వలె దేని యందునూ ‘ఆసక్తి’ లేకయే ఉండు. అటుపై ఈ ప్రపంచంలో యథాతథంగా వ్యవహరిస్తూ ఉండు.

Page:232

‘ఇచ్ఛ, అనిచ్ఛ’ ఈ రెండూ కూడా లేనట్టి తత్త్వజ్ఞాని వ్యవహారములు సలుపుచూ ఉన్నప్పటికీ, అతని బుద్ధి ఏ మాత్రం ’లిప్తము’ అవటం లేదు. కమలము నీళ్ళలో ఉన్నప్పటికీ ఆ నీరు కమలమును అంటుతోందా? పడవ నీళ్ళలో ఉన్నా కూడా, నీటిని పడవలోకి రానిస్తున్నామా? లేదు కదా!

ఆసక్తి రహితమైన నీ మనస్సు ఇంద్రియసహితముగా “దర్శించుట-వినుట-స్పృశించుట” మొదలైన క్రియలందు పాల్గొనుచున్నదా? అయితే కానీ. నీవు మాత్రం ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడవై ఉండు. అంతరంగమున, ఇచ్ఛారహితుడవై వెలుగొందుచుండుము. “ఇది నాది”… అను భావన ఏర్పడుచున్నప్పుడు “ఇది అసత్తే కదా” అను అవగాహనతో ఈ సర్వమును దర్శిస్తూ ఉండు. ఒకవేళ ఏ సమయందైనా ‘శబ్దము-స్పర్శ’ మొదలైన ఇంద్రియార్థములపట్ల అభిముఖం కావలసిన అవసరం ఏర్పడినదనుకో… వాటియందు నీ మనస్సు తగుల్కొనకూడదు. నీవు వాటియందు నిమగ్నుడవు కాకుండెదవు గాక!

ఇచ్ఛ-అభిమానము-భావావేశము మొదలైనవి లేకుండా ఉండటమే వాస్తవమైన అభ్యాసం. ఇంద్రియవ్యాపారములను నిర్వర్తిస్తూ ఉండు… లేదా చేయకయే ఉండు. ఏది ఏమైనా… “ఇదంతా జీవుని స్వకీయ కల్పనయే. అట్టి కల్పనకు కర్త - భోక్త అగుచున్న ఈ జీవుడు సర్వదా నిష్క్రియుడు, శుద్ధుడు అగు పరబ్రహ్మమే అయివున్నాడు" అను దృష్టిని సుస్థిరపరచుకోవాలి! ఎప్పుడైతే ‘ఇంద్రియార్థములు’ అయినట్టి ఈ శబ్ద - స్పర్శ-రూప - - రస - - గంధములు నీకు రుచికరములు కాకయే ఉంటాయో, అప్పుడు నీవిక జ్ఞాన - విజ్ఞానసంపన్నుడవై ఈ సంసార సముద్రమును దాటి వేస్తున్నట్లే అవుతుంది. అట్టి స్థితిలో నీవు ఈ జగత్తులో తదితరులవలె సంచరిస్తున్నా…, లేక సర్వం త్యజించి సమాధినిష్ఠుడవైయున్నా… ఫరవాలేదు. అట్టి అవగాహన పొందిన తరువాత ఇక ఆపై నీవు నీవుగా కోరుకొనకపోయినప్పటికీ, ‘ముక్తి’ అనునది అనాయాసంగా నిన్ను సమీపించగలదు.

కాబట్టి రామా! “సర్వోత్తమ పదప్రాప్తి" కొరకు జ్ఞానవైరాగ్యములను ఆశ్రయించు. ఉత్తమ ప్రజ్ఞచే వాసనాసమూహముల నుండి నీ చిత్తమును వేరు చేయి.

ఒక నదిని దాటాలంటే ‘నావ’ కావాలి కదా! అట్లాగే ‘ప్రజ్ఞ’ అనే నౌకను ఎక్కి ‘వాసనలు’ అను జలముతో నిండియున్న ఈ సంసారసాగరమును దాటివేయవచ్చు. అట్లు ప్రజ్ఞను ఆశ్రయించనివారు సంసారసాగరంలో మునిగిపోతున్నారు.

ముందుగా నీ బుద్ధిని వివేక- వైరాగ్యయుక్తం చేయి. తీక్షవంతం చేయి. పరమ ధైర్యోపేతము, ఉత్సాహవంతము అయిన బుద్ధితో ఆత్మతత్త్వమును విచారించు. ఆ తరువాత ‘స్వాత్మపదము’ నందు ప్రవేశించు. జ్ఞానముచే ‘పరివర్ధితము’ అయిన చిత్తము కలవాడవగుము. బుద్ధిమంతులు, తత్వవేత్తలు అగు మహాత్ములు ఎట్లు విహరిస్తున్నారో అట్టి అవగాహనతో కూడుకొని నీవు కూడా విహరించాలి గాని, ఒక మూర్ఖునివలె కాదు సుమా! నిత్యతృప్తులు, మహాధీశాలురు, జీవన్ముక్తులు ఎట్లు పలుకుచున్నారో, ఏ ఉద్దేశము కలిగి ఉంటున్నారో, ఏ అర్థములను గ్రహిస్తున్నారో నీవు పరిశీలించు, గమనించు.

Page:233

అంతేగాని, స్వ-పర వంచకులగు (Those who are deceptive towards themselves as well as towards others) అల్పదృష్టిగలవారి ఆచరణ నీకు తగదు.

ఈ ప్రపంచంలో ’జగత్తు-బ్రహ్మము’ల యథార్థమేమిటో ఎరిగినట్టి మహాత్ములు ఉన్నారు. వారు విద్య, తపస్సు మొదలైన ఉత్కర్షలతో కూడిన ప్రభవములను గాని, అభిమానముగాని, కుల శీలాదులతో కూడిన కీర్తి ప్రతిష్ఠలను గాని వాంఛించరు, ఇచ్ఛగించరు, త్యజించరు. ప్రాప్తాలైన వాటిని మాత్రం అనుసరిస్తూ ఉంటారు. “ఇవన్నీ మిథ్యారూపాలే”… అని సుస్పష్టంగా ఎరిగియే ఉంటున్నారు. మిధ్యారూపమైనవి పరమపురుషార్థమును ఎక్కడైనా తెచ్చి పెట్టగలవా?… లేదు. అట్టి మహాత్ములు సర్వము నశించినప్పుడు కూడా భిన్నులు కాకయే ఉంటున్నారు. ఇంద్రుని ఉద్యానవనమునకు కూడా వారిని ఆకర్షించగల శక్తి లేదు. సూర్యభగవానునివలె వారు శాస్త్ర ప్రసిద్ధమై ఉన్నట్టి తమ నియతిని త్యజింపకయే ఉంటున్నారు. అనగా తమకు విధించినది అంగీక రిస్తూ నిర్వరిస్తున్నారు. “విజ్ఞానము” అను మంచి సారథిని నియమిం చుకున్నవారై స్వస్థచిత్తులై, దేహము అను రథమును అధిరోహించి లీలామాత్రంగా ప్రపంచమంతటా విహరిస్తునారు.

ఓ రామచంద్రా! అట్టి మహత్తర విజ్ఞానము నీకు ఇప్పటికే ప్రాప్తించియున్నది సుమా! కనుక చక్కటి నిశ్చయముతో బుద్ధిబలముచే ’జ్ఞానము’నందు సుస్థితుడవై యుండుము. ప్రత్యక్షమగు ’ఆత్మదృష్టి’ని అవలంబించియుండుము. అభిమాన మాత్సర్యములు లేనివాడవై ఈ భూమిపై విహరించు. అదియే సర్వోత్తమమగు ‘సిద్ధి’ అని చెప్పబడుతోంది. స్వస్థచిత్తుడవై సర్వక్రియలకు అతీతుడవగుము. “విషయకౌతుకముచే వీక్షించాలి” అను కోరిక లేనివాడవై ఉండు. అంతఃకరణం నందు పరమశాంతిని పొందినవాడవై, లోకానుకూలంగా, శాస్త్రానుకూలంగా వ్యవహరించు.

ఈ వాక్యములు శ్రీరాముని అంతఃకరణమును నిర్మలతచే శోభిరపజేశాయి. అతని హృదయము అతి మధురమగు ‘జ్ఞానము’ అను అమృతముచే నిండిపోయింది. అతడు పూర్ణ చంద్రునివలె శాంతమును పొందాడు.

  1. బ్రహ్మాండముల చమత్కారం

శ్రీరాముడు మహాత్మా! సర్వధర్మజ్ఞా! వేదవేదాంగముల సారమైనట్టి తమయొక్క నిర్మల వచనములచే ప్రభావితుడనగుచున్న నేను ఇప్పుడు పూర్ణరూపమున స్వస్థుడనైయున్నాను. అనేక ఉపమానములు - యుక్తుల సహాయంతో మీరు మా హృదయములందు పరమార్థ యుక్తమగు ‘ఆత్మతత్త్వము’ను ప్రకాశింపజేస్తున్నారు. తమ శ్రేష్ఠవాక్యములు ఎంతగా విన్నప్పటికీ నాకు తనివి

తీరటం లేదు.

Page:234

మీరు ఇతఃపూర్వము రాజస-సాత్విక తామసిక జీవజాతుల ప్రసంగంలో “బ్రహ్మాండముల ఉత్పత్తి” గురించి కొన్ని విశేషాలు చెప్పారు. వేద, పురాణములను ప్రమాణంగా తీసుకొని మీరు చెప్పిన విషయాలు కాక, మరికొన్ని విషయాలు మరికొంత సుస్పష్టత కొరకై చెప్పండి.

ఈ బ్రహ్మాండాలన్నీ ఎవరు ఎవరి కొరకు ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారు? వీటిపై సర్వ అధికారాలు కలిగి ఉంటున్నది ఎవరు? ఇవన్నీ ఉన్నదెక్కడ? ఎందులో? ఈ బ్రహ్మాండాలకు ఆవల ఉన్నది ఏమిటి? ఈ కాలగతి అంతా నడుపుచున్నది, ఈ సర్వక్రియలను శాసిస్తున్నది ఎవరు? ఇదంతా ఎప్పటికి వినాశనము కానున్నది. ఇక్కడి సృష్టి, ప్రళయములకు మూలకారణమేమిటి? అసలు ఈ జగత్తులో సత్యమైనదేది? అసత్యమైనదేది?

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బ్రహ్మాండముల రచనా చమత్కృతి గురించి సంక్షిప్తంగా చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

శ్రీ వసిష్ఠమహర్షి: అనేక బ్రహ్మాండములు ఉద్భవించాయి… గతించాయి. నేటికి అనేక లక్షల మంది బ్రహ్మలు, వేలకొలది నారాయణులు, శంకరులు గతించారు. ఇప్పుడీ బ్రహ్మాండమునందు అనేక విధములైన ఆచార విచారాదులు కలిగిన దేవ-రాక్షసాదులు విహరిస్తున్నారు. అట్లే ప్రతి ఒక్క బ్రహ్మాండములో అనేక రీతులుగా వ్యవహారసరళి జరుగుచున్నది. ఒకే కాలమునందు మరియు వివిధకాలము లందు ఏర్పడుచున్నట్టి అనేక బ్రహ్మాండములలో అనేక జీవులు జన్మించారు. బ్రహ్మ మొదలగు సమష్టి సృష్టికర్తలచే నిర్మించబడిన బ్రహ్మాండములలో ఈ జీవుల ఉత్పత్తి ఒక విచిత్రమైన ఇంద్రజాలములవలె ఒప్పుచున్నది.

ఈ సృష్టులన్నీ ఒకప్పుడు మహేశ్వరునిచే నిర్మించబడుచున్నాయి. మరొకప్పుడు బ్రహ్మదేవుడే వీటిని రచించుకుంటూ పోతున్నాడు. వేరొకప్పుడు మునుల చేతను, విష్ణువు చేతను ఇవన్నీ రచించబడుచున్నాయి.

కొన్ని బ్రహ్మాండములలో బ్రహ్మదేవుడు కమలమునుండి ఉద్భవిస్తున్నారు. మరొకప్పుడు జలములోంచి బయల్వెడలుచున్నారు. అట్లాగే అండము నుండి, ఆకాశము నుండి కూడా కొన్ని బ్రహ్మాండములు ఉద్భవించటం జరుగుతోంది. ఒక బ్రహ్మాండములో మహేశ్వరుడు, మరొక దానిలో సూర్యుడు, ఇంకొక దానిలో ఇంద్రుడు అట్లే విష్ణువు మరియు తదితరులు ఆ బ్రహ్మాండము లోని తదితర దేవతలపై ఆధిపత్యం వహించి ఉండటం జరుగుతోంది.

ఒక ‘సృష్టి’ యందు ఈ భూమి అంతా మొట్టమొదటగా వృక్షములచే వ్యాప్తమై ఉంటోంది. మరొకప్పుడు మనుష్యులచేత, పర్వతములచేత ఆక్రమించబడుతోంది. ఒక భూమండలము మట్టిమయం, మరొకటి శిలామయం, ఇంకొకటి రాగిమయం, అట్లే స్వర్ణమయంగాను ఉంటున్నాయి. ఓ రామా! అంతదాకా దేనికి…? మన ఈ బ్రహ్మాండమే తీసుకో… ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన జగత్తులు ఉన్నాయి. అట్లే తదితర బ్రహ్మాండముల విషయం కూడా. కొన్ని జగత్తులలో ఒక్క సూర్యుని ప్రకాశము మాత్రమే కలదు, మరింకేదీ ఏ మాత్రం లేదు. కొన్నిటిలో

Page:235

అసలు ‘ప్రకాశము’ అనునదే లేదు. ఆహాఁ! బ్రహ్మమే రూపముగా గల ఈ మహాకాశంలో సముద్రజలంలోని తరంగాలలాగా ఎన్ని బ్రహ్మాండములు ఉత్పన్నమౌతున్నాయి! ఎన్ని లయిస్తు న్నాయి! సముద్రంలోని కెరటాలకు అంతు ఎక్కడ? ఎడారిలో ఎన్ని మృగతృష్ణలు ఉన్నాయో లెక్కించి చెప్పేదెవరు? తంగేడు చెట్టుకు కాచే పూలు ఎన్నని, ఎన్నిసార్లని చెప్పమంటావు? పరమాత్మయందు ఈ ప్రపంచముల శోభ అనంతసంఖ్యలో ప్రకటితమౌతున్నాయి. ఇంకా… సూర్యకిరణములలోని త్రసరేణువులను (ధూళిరేణువులను) లెక్కపెట్టవచ్చునేమో! పరబ్రహ్మమున గల ఈ చంచల జగత్ సమూహములను మాత్రం ఎవరు లెక్కబెట్టగలరు? వర్షాకాలంలో అనంత సంఖ్యలో దోమలు, రెక్కపురుగులు పుట్టి, సంచరించి, నశిస్తాయి చూచావా? నిరంతరం ఉత్పన్నం అవుతూ, నశించుచున్నట్టి ఈ సృష్టి సమూహములు ఎప్పటినుండి కొనసాగుతున్నాయో చెప్పటం ఎవరి తరం? అయితే, “ఈ అనంత జగత్ - ప్రవాహరూప వ్యవహారమంతా అనాది, ఈ సర్వము పరబ్రహ్మమే”… అని గ్రహించు. శాస్త్రాదులచే మనకు అందజేయబడుచున్న వివరణ అదే. ఆద్యంతరహితమైన ఈ సృష్టి నిరంతరం తరంగమువలె స్ఫురిస్తూనే ఉన్నది.

ఈ సృష్టికి ముందు పూర్వసృష్టి ఉన్నది… ఆ పూర్వసృష్టికన్నా ముందు ఇంకొక సృష్టి ఉన్నది… ఆ ఇంకొక సృష్టికన్నా ముందు వేరొక సృష్టి ఉన్నది… ఆ వేరొక సృష్టి కంటే ముందు మరొకటి ఉండనే ఉన్నది…

ఇట్లు ఈ వ్యవహారమునకు అంతులేదు, ఉండబోదు, నదిలో తరంగాల లాగానే ఈ సురఅసుర-మనుష్యాది ప్రాణికోట్ల వివిధజాతులన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి. బ్రహ్మదేవుని యొక్క ఈ బ్రహ్మాండం వంటివే, ఒక సంవత్సరములోని క్షణములవలె, వేలాది బ్రహ్మాండాలు పుట్టి ఇతఃపూర్వమే కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ బ్రహ్మాండాలన్నీ స్థితి కలిగియున్నది ఎక్కడ?

అన్యాః సంప్రతి విద్యన్తో వర్తమానశరీరకాః

ప్రాన్తో బ్రహ్మవురస్యాస్య వితతే బ్రహ్మణఃపదే. (శ్లో 22, సర్గ 47)

ఓ రామచంద్రా! సర్వుల అంతరంగమున అతి సూక్ష్మంగా ‘బ్రహ్మపదము’ అనునది వ్యాపించియున్నది. అట్టి ఆత్మపదము లేక బ్రహ్మమునందే ఇవన్నీ స్థితి పొందియున్నాయి. అట్టి హృదయాంతరంగమే… "హృదయపుండరీకము, బ్రహ్మపురము, బ్రహ్మపట్టణము’… అని కూడా శాస్త్రకారులు పిలుస్తున్నారు.

అనగా, ‘హృదయమే బ్రహ్మాండముల స్థితి స్థానము’ అని గ్రహిస్తున్నావు కదా! ఇవన్నీ బ్రహ్మపురంలో దృశ్యమానమై ఉంటున్న శోభలే సుమా! ఆకాశమందు శబ్దం పుట్టి, నశించు చున్నట్లు, ఈ బ్రహ్మాండములు కూడా ఉత్పన్నమై, స్థితిపొంది, నశించి పోవటం జరుగుతోంది.

మట్టిలోనే ’కుండ’ అనునది ఉన్నది కదా…! విత్తు యొక్క అంకురమునందే చిగురు దాగి ఉన్నది కదా…! అదే విధంగా బ్రహ్మమునందే భూత-వర్తమాన-భవిష్యత్ కాల సృష్టి పరంపర లన్నీ ఉన్నాయి.

Page:236

అయితే ఒక చమత్కారం. విశాలాకారయుక్తాలైన ఈ సృష్టి పరంపరలు, ఈ త్రిలోకాలు… ఇవన్నీ తత్త్వజ్ఞానం పొందనంతవరకు మాత్రమే బ్రహ్మమునందు ఇట్లు దృశ్యమానమౌతూ ఉంటున్నాయి. అసలు ‘బ్రహ్మాండము’ అనగా ఏమిటి?

‘అజ్ఞులచే, బ్రహ్మమునందు ’అధ్యాస’ చేయబడి, దర్శించబడుచున్నది. అనిర్వచనీయము, మిథ్యా రూపము అయినదే ఈ బ్రహ్మాండ వ్యవహారము”… అని చెప్పబడుతోంది. అజ్ఞానము శేషించి ఉన్నంతవరకు ఆ అజ్ఞానమును అనుసరించియే ఈ జగత్తులన్నీ పెంచబడుతూ, పోషింప బడుచూ త్యజించబడుచున్నాయి. తత్త్వజ్ఞానుల దృష్టిలో ఇవి ఏ కాలమందునూ లేనే లేవు. ’ఊహ’లో కనిపించే మహాసౌధాలకు స్థితి ఎక్కడ? అంతు ఎక్కడ?

  1. జ్ఞాని ఇదంతా ఎట్లా చూస్తున్నాడు?

ఆహాఁ! ఏమి విచిత్రం! తరంగాలు లాగానే క్షణభంగురమైన ఆకృతి గల ఈ సృష్టి సమూహాలు చిత్ర విచిత్రములైన రూపములతో, ప్రాణుల విచిత్రమైన చేష్టలతో కూడి ఉన్నాయి కదా! అయితే జ్ఞాని వీటన్నిటినీ మరొక విశిష్టమైన దృష్టితో చూస్తున్నాడు. ఆతని అవగాహనను అనుసరించి ఇవన్నీ పరమాత్మ కంటే వేరైనవి కావు. పరమాత్మయే ఇదంతా!

‘పరమాత్మ నుండే ఈ సృష్టి పరంపరలు ప్రాదుర్భవిస్తున్నాయి”… అనే వాక్యం అజ్ఞానులచే తమ అసంపూర్ణ అవగాహన కారణంగా మాత్రమే ఏర్పడుతోంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ మైనది ఏదైనా ఉంటే కదా, ఒకదాని నుండి మరొకటి ఉద్భవించటం!

జలముకంటే వర్షధారలు వేరా? ఆలోచించే వానికంటే ‘ఆలోచన’ వేరైనదా? మేఘములు జలముకంటే వేరైనవా? భావించేవానికంటే భావన వేరా? వృక్షము కంటే దాని కొమ్మలు, ఆకులు, పుష్పములు, కాండము మొదలైనవన్నీ వేరు అని అనటం ఎట్లా?

యథార్థానికి జ్ఞానికిగాని, అజ్ఞానికి గాని… ఈ సృష్టి బ్రహ్మము కంటే వేరుగా ఇంకెక్కడా, మరింకే విధంగానూ లభించేది కాదు.

అవ్యాకృత ఆకాశము నుండే ఈ స్థూలభూత నిర్మితములైన “శరీరము” మొదలైనవి, మరియు సూక్ష్మభూత నిర్మితములైన ‘ఇంద్రియములు’ మొదలైనవి, తక్కిన సమస్త పదార్థములు ఉత్పన్నములౌతున్నాయి. ఇవన్నీ కూడా సూక్ష్మతత్త్వములతో (శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం - తన్మాత్రలు) అవినాభావ సంబంధం కలిగినవై ఉంటున్నాయి. ఆ అవినాభావ సంబంధమే సృష్టి.

ఇక్కడ సృష్టికి సంబంధించి చెప్పబడిన కొన్ని శాస్త్ర, పురాణ ప్రవచనములు ఉదహరిస్తాను. విను. అన్నిటికన్నా ముందుగా ఒక సమయంలో ఆకాశము స్థూలభావం పొందుతోంది. అందు లోంచి ‘సమష్టిసృష్టి’ అను స్వభావము గల ‘బ్రహ్మదేవుడు’ అను తత్త్వము ఉదయిస్తోంది. “అనేక

Page:237

పదార్థాలతో కూడిన ఈ సృష్టి అను స్వరూపం కలవాడను నేనే" అను అహంభావమే బ్రహ్మదేవుని యొక్క నిజస్వరూపం. అతడే ‘ప్రజాపతి’ అని, ‘ఆకాశజుడు’ అని కూడా పిలువబడుచున్నాడు.

ఒకప్పుడు వాయువునందు ఏర్పడుచున్న స్థూలభావముచే సమష్టి సృష్టి అహంకారియగు ప్రజాపతి ఆవిర్భవించుచున్నాడు. అందుచేత, అతడు ’వాయుజుడు’ అని చెప్పబడుచున్నాడు. అట్లాగే అగ్ని నుండి స్థూలభావం పొందుటచే ఆ ప్రజాపతిని ‘తేజసుడు’ అని, పృథివి నుండి స్థూలభావం పొదు ప్రజాపతికి ‘పార్థిపుడు’ అని, జలము నుండి స్థూలభావము పొందిన ప్రజాపతికి ‘వారిజుడు’ అని పౌరాణికంగా చెప్పబడుచున్నారు. ఈ ఆకాశము - వాయువు - జలము - అగ్ని - పృథివి అనబడు ఐదు భూతములు రెండేసిగా విభజించబడి, మరల వాటిలో ఒకొక్కటి నాలుగు విభాగములుగా చేయబడింది. అట్లు విభక్తములైన ఒక్కొక్క భాగము (5x2x4=40 లో ఒక్కొక్కటి అర్ధభాగం నాలుగు భాగములందు చేర్చబడగా అప్పటి మిగతా అర్ధభాగము నుండి బ్రహ్మదేవుడు ఉత్పన్నమగుచున్నాడు అతడే సమష్టి - సృష్టి ఇచ్ఛాస్వరూపుడు (The form of universal will). అతడే భవిష్యత్తు కాలంలోని జగత్రియలన్నీ ఒనర్చుచున్నాడు.

నారాయణుడు - ఇతడు స్వయంభువు. ఇతని జన్మకు మరింకేదీ కారణం కాదు. వాస్తవానికి జన్మరహితుడగు ఈతడు జలంలో ప్రథమ తరంగంలాగా ఆవిర్భవిస్తున్నాడు. స్వకీయ మాయచే ఇతడే సర్వ తదితర వ్యవహారములకు కారణము. కాబట్టి, ఇతడు ’ఆదికారణుడు’గా వేద వేదాంగాలచే స్తుతింపబడుచున్నాడు. ఈ జీవుని యొక్క ఆది స్వరూపమే అతడని గ్రహించు. అతడి హృదయమే “ఆకాశజుడు, వాయుజుడు, తైజసుడు, వారిజుడు, పార్థివుడు"… అను ప్రజాపతు లకు జన్మస్థానమైయున్నది. నారాయణుని ముఖము నుండో, పాదముల నుండో, వెనుక భాగం నుండో, పృష్టముల నుండో, నేత్రముల నుండో, హస్తాదుల నుండో… ఇట్లా ఏదో ఒక భాగము నుండి ఈ నామ రూప శబ్దాదులన్నీ ఉదయిస్తున్నాయి.

ఆ నాయణుడు అనబడు ఆది పురుషుని యొక్క నాభిప్రదేశం నుండి ఒక కమలము ఉత్పన్నమగుచున్నది. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తున్నాడు. అందుచేత అతడు ‘పద్మజుడు’ అను పేరుతో శ్లాఘించబడుచున్నాడు.

శ్రీరాముడు: స్వామి "జీవుని యొక్క శుద్ధ స్వరూపమే” అయి ఉన్నట్టి ఆ నారాయణుని యొక్క నాభికమలము నుండి ‘సమష్టి సృష్టి’… అను స్వరూపంగల బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తున్నాడు కదా! అట్లు ఆవిర్భవించేది ఎవరు? నారాయణుడేనా? లేక మరింకొకరా?

శ్రీ వసిష్ఠ మహర్షి: (పకాలున నవ్వుతూ…) ఓ రాఘవా! “నారాయణుడు బ్రహ్మదేవునిగా పరిణతి చెందుచున్నాడు”… అని తలచకూడదు సుమా! ఎందుచేతనంటావా? ఒక్క ప్రథమ తత్వమగు స్వస్వరూపము తప్ప తక్కినదంతా స్వప్నభ్రాంతి వంటిదే. ఇది మిథ్యారచనాచక్రము, మనోకల్పిత రాజ్యములవలె ’మాయ’యే అయివున్నది.

Page:238

నారాయణుడు = జీవుని సర్వసంకల్పములకు ముందే ఉన్నట్టి శుద్ధ స్వస్వరూపము. బ్రహ్మదేవుడు = అనేక ఉపాధులను సంకల్పిస్తున్నట్టి ఆ నారాయణుని (లేక ఈ జీవుని) సమష్టి సృష్టి సంకల్పము.

వాస్తవానికి పరమాత్మ దేనితోనూ ఎట్టి సంగమమూ ఏ సమయమందునూ లేనివాడు. అతడు అద్వితీయుడు (ఈ జీవుని శుద్ధస్వరూపమునకు అతడు వేరుగా మరెక్కడా లేదు). మరి, అట్టి ఆ శుద్ధతత్వము (నారాయణుడు) నందు ఆశ్చర్యజనకమూ, ద్వితీయమూ అయినట్టి ఈ సృష్టి జనించుట ఏమిటి? లేదు. ‘మాయ’ యొక్క కార్యము మాత్రమే కనుక ’పురుషుని నాభికమలము నుండి పురుషుడు ఉద్భవించెను” అను వ్యవహారమంతా బాలుని మనోరాజ్యము వంటిదే. ఈ విషయము గ్రహించి, ఆపై నాచే చెప్పబడు సృష్టి విశేషాలు వినుమరొకప్పుడు నిర్మలాకాశంలో మనస్సు యొక్క శక్తిచే ఏదో విభాగము (ఉదా: బంగారు రంగులు విరజిమ్ము వనములు మొ॥) సంకల్పించబడగా, అందులోంచి సృష్టికర్తయగు బ్రహ్మ దేవుడు ఆవిర్భవిస్తున్నాడు. ఇంకొకప్పుడు మహాపురుషులగువారు జలమునందు వీర్యము ఉంచగా ఆ వీర్యము నుండి భూమి అను పద్మమో లేక విశాలమగు బ్రహ్మాండమో బహిర్గతమౌతున్నది. అట్టి ‘భూపద్మము’ నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు ‘పద్మజుడు’ అని చెప్పబడుచున్నాడు.

ఒకప్పుడు పూర్వకల్పములోని ఒక భక్తుడు ఈ కల్పంలో ‘బ్రహ్మ’ అగుచున్నాడు. మరొక సారి పూర్వకల్పములోని వరుణుడు గాని, వాయువుగాని ఈ కల్పంలో సృష్టికర్తయగు ‘బ్రహ్మ’ గా అగుచున్నారు.

ఇదంతా అట్లు ఉండనిమ్ము, మరొకకోణం నుంచి అసలు ప్రశ్నకు వస్తే, అనగా, పరమార్థంగా చూస్తే, బ్రహ్మము నందు “బ్రహ్మలు” ఎక్కడ? బ్రహ్మము బ్రహ్మముగానే ఉంటోంది గాని మరింకేదీ ఎన్నడూ బ్రహ్మమునందు ఉత్పన్నమగుటలేదు.

ఈ విధంగా శాస్త్రకారులచే వివిధ రీతులుగా బ్రహ్మదేవుని విచిత్రమైన ఉత్పత్తుల గురించి చెప్పబడినది వర్ణించి చెప్పాను. అంతా విన్నావు కదా! అయితే వారల ఉత్పత్తి యందు ‘నియమము” అనునదేదీ లేనేలేదు. బ్రహ్మదేవుని సృష్టిలాగానే తదితరమగు సర్వము యొక్క సృష్టి కూడా ‘నియమము’ అనునది లేకుండానే ఏర్పడుతోంది.

మనోవిలాసమాత్రము - అంతా విన్న తరువాత ముఖ్యంగా ఒక్క విషయం గ్రహించు : మనోవిజృంభణమిదం యాశ్చ జాతయశ్చేతమాగతాః |

సంబోధనాయ భవతః సృష్టిక్రమ ఉదాహృతః (శ్లో 48, సర్గ 47)

ఈ “ప్రపంచము” అనబడేది మనస్సు యొక్క విలాసము మాత్రమే. ఇదియే ఇక్కడ ముఖ్యమైన సిద్ధాంతము. ఈ విషయం నీవు చక్కగా గ్రహించటానికే వివిధ సృష్టుల క్రమమంతా చెప్పాను. ఈ సాత్విక, రాజసిక, తామసిక జీవజాతులు కూడా మనోవిలాస మాత్రం చేతనే

Page:239

సంభవిస్తున్నాయని గ్రహించు. ఎంతవరకైతే ఈ మనస్సు సమూలంగా నశించకుండా ఉంటోందో, అంతవరకు ఈ సృష్టి-వినాశనములు, సుఖ-దుఃఖములు, జ్ఞాన-అజ్ఞానములు, బంధ-మోక్షాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ సృష్టికర్తలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ప్రియ-అప్రియ వస్తువులు, వాటి పట్ల స్నేహ- శత్రుభావనలు మరల మరల ఉత్పన్నవటం, శమించటం జరుగుతూనే ఉంటుంది.

మనస్సే అన్నిటికీ మూలం. దీపం వెలగటం ప్రారంభించి, అస్థిరమగు ఆకారము కలిగి యుండి మరల ఎప్పుడో శమిస్తుంది చూచావా? అట్లే బ్రహ్మదేవుడు మొదలగు చతుర్ముఖ ఆకారములు ఏర్పడటం, శమించటం… ఇదంతా కాలము యొక్క ప్రవాహగతిత స్వభావమే కాని మరింకేమి కాదు.

దీపం స్వల్ప కాలంలోనే లయిస్తోంది. ఇక బ్రహ్మదేవుడో… ద్విపదార్ధంతమున అంతర్థాన మగుచున్నాడు. అనగా “ద్వైతప్రకృతి” లయించగా ఆతడు కూడా శమించుచున్నాడు. ఈ ఇద్దరి భేదం కాలహరణమే గాని మరింకేమీ కాదు.

కాలన్యాయము - “కృత-త్రేత-ద్వాపర కలి” యుగాలు మరలమరల సంభవిస్తున్నాయి. -

అట్లాగే చక్రభ్రమణంలాగా ఈ జగత్తులు వస్తున్నాయి… పోతున్నాయి… రోజులు యుగములు కల్పములు… మన్వంతరములు - వీటి పరంపరలు ఒకదాని వెనుక మరొకటిగా మరల మరల ఏర్పడుచున్నాయి. రోజులు దొర్లుచున్నట్లే కార్యసమూహమంతా మరల మరల సంభవిస్తోంది. ఈ జగత్తంతా పరిచ్ఛిన్నములగు అనేక పదార్థములతో కూడి ఉంటోంది. జీవులు ‘ఆయువు’ అను గాలివాలుకు మరల మరల ఈ జగత్తులోకి వచ్చిపోవుచున్నారు.

బాగుగా కాల్చబడగా కణకణలాడే ’ఇనుపముద్ద’లో స్వభావ సిద్ధంగానే అగ్నికణములు ఉండి ఉంటాయి కదాకదా! ! చిదాకాశమున ఈ సమస్త పదార్థములు స్వభావంగానే స్థితి కలిగియున్నాయి. ఒక వృక్షములో "ఫలములు కాయుట, పూలు పూయుట” అను స్వభావం రసరూపమున అవ్యక్తంగా ఉండి, ఆయా ఋతువుల సమయంలో ప్రకటితమౌతూ ఉంటున్నట్లే ఈ జగత్తంతా పరమాత్మయందు స్వతహాగా ఉండి ఉంటోంది.

  1. ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చింది? చిత్స్పన్ద ఏవ సర్వాత్మా సర్వదై వేదృశాకృతిః |

యదస్మాజ్జాయతే సర్గో ద్వీస్టుత్వమివ లోచనాత్ ॥ (శ్లో 58, సర్గ 47)

సర్వాత్మకమగు చైతన్యం నుండి ఏదేది వివర్తమగుచున్నదో (బయల్వెడలుచున్నదో) అదంతా చిద్రూపమే అవుతుంది కాని, మరింకేమీ కాదు. “పరమాత్మ నుండి సృష్టులు ఏర్పడుచున్నాయి”… అనునదంతా "కంటి దోషముచే వినీలాకాశంలో రెండవ చంద్రుని చూడటం” వంటిది మాత్రమే.

Page:240

ఈ సృష్టి అంతా చైతన్యము నుండే ఆవిర్భవిస్తోంది. అట్టి చైతన్యమునందే అది ‘స్థితి’ కలిగి ఉంటోంది. చంద్రకిరణములు చంద్రునికంటే వేరుగా కనిపించినంత మాత్రంచేత “చంద్రుడు వేరు, చంద్రకిరణములు వేరు” అని అనగలమా? లేదు. ఈ కనబడే సృష్టి కూడా చైతన్యము కంటే వేరైనది కాదు. అయితే సర్వశక్తిమంతుడగు పరమాత్మ స్వభావం ’అసంగము, అద్వితీయము అయి ఉన్నది కదా! అట్టి పరమాత్మ యందు కనబడుచున్న ఈ ప్రపంచము వాస్తవము కాదు. స్వకీయ భ్రమచే ద్రష్టయే ఇదంతా ఇట్లు దర్శించుచున్నాడు.

అందుచేత, “ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చినది?"… అను ప్రశ్న ముఖ్యం కాదు. “ఇట్లు భేద దృష్టిచే బ్రహ్మమునకు బదులుగా ద్వితముతో కూడిన జగదనుభవమునకు మాత్రమే నేను ఎందుకు పరిమితుడనగుచున్నాను?” అనునది ముఖ్యమైన ప్రశ్న.

“జగత్తు” అనబడేది చిత్స్వభావమునకు భిన్నమైనది కానేకాదు. అనేక జన్మల దురభ్యాసము యొక్క ప్రభావముచేతనే ఈ జీవుడు దోషసహితమగు "జగత్తు వేరు, నేను వేరు, బ్రహ్మము వేరు” అను దృష్టితో గాంచటం జరుగుతోంది.

సర్వశక్తిమంతుడగు పరమాత్మ తనయందుతానే ఇట్లు మాయాసమేతుడై “జగత్ప్రష్ట” అను కర్తృత్వమునకు స్వయముగా ఒడిగట్టుచున్నాడు. అతడు అట్లు గాంచటం బహుచమత్కారమైన విషయమే. అది చిద్విలాసము, అనిర్వచనీయము అని చెప్పబడుతోంది. అయితే ఈ జగత్తు, ఇందలి చిత్రవిచిత్రములైన వస్తుజాలానుభవం ఇవన్నీ కూడా ప్రళయము అనబడు స్థితికి ఈవల మాత్రమే ఉంటాయి. ఆవల ఉండవు. ఏ జీవుని దృష్టిలో ప్రపంచభావమంతా లయించి పోతున్నదో అతనికి ‘ప్రపంచము’ అనునదే లేని విషయమగుచున్నది.

ఎవ్వరి దృష్టిలో ఈ జగత్తు లేదో, అతనికి బంధమెక్కడిది? బంధం లేనిచోట, ఇక ‘మోక్షము’ యొక్క ప్రసక్తి కూడా ఉండదు కదా!

ఓ మహామతీ! రామచంద్రా! జ్ఞాని యొక్క దృష్టిలో ఈ జగత్తంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఏ విధంగా చూచినా సరే ’ప్రపంచం లేనిదే’ అని సుస్పష్టపడుతూనే ఉన్నది. అయితే అజ్ఞాని యొక్క దృష్టికి మాత్రం ఈ ప్రపంచం ‘ప్రవాహము’ రూపములో నిరంతరం ఉండియే ఉంటోంది. ‘మిథ్యయే’ అయినప్పటికీ ఈ సాంసారికమాయ నిత్యమైనదానివలె అజ్ఞానులకు అనుభూత మౌతోంది. ఇక్కడ ఆత్మయే దృష్టితోకూడినదై ఉంటోంది. ‘దృష్టి’ ఉన్నంతకాలం మాయ ఉంటోంది. జగత్తు ఉంటోంది. కనుక ఒక రకంగా ఇదంతా నిత్యమైనదే కదా! నిత్యమైన దానికి సృష్టి ఏమిటి? స్థితి ఏమిటి? లయమేమిటి?

జగత్తు యొక్క ఉత్పత్తి-వినాశనముల గురించి కొన్ని అభిప్రాయాలు :

  1. మీమాంసకుల యొక్క అభిప్రాయం (పునరుత్పత్తి వాదం) - - ’ఈ జగత్తు ఉదయిస్తోంది. కొంతకాలం తరువాత నశిస్తోంది. మరల పుడుతోంది. కనుక ఇదంతా ఉత్పత్తి - - వినాశనము -

Page:241

పునరుత్పత్తి కలిగి ఉంటోంది. ప్రవాహంలో ముందుకుపోతున్న జలం స్థానంలో వెనుకటి నీరు క్షణంలో ప్రవేశిస్తోంది.”

ఆ విధంగా తరంగతత్వంగా శాశ్వతంగా కనబడుచున్నట్లు ఈ ప్రపంచం కూడా, ఒక విషయం తొలగిన క్షణమే మరొక విషయం ‘దృష్టి’ యందు ప్రవేశించుచుండుటచే, ’ఉత్పత్తి - -

వినాశన సహితం’ అనునదీ వాస్తవమే. దృశ్యము యొక్క ఉనికి’ దృష్ట్యా చూస్తేనేమో, ‘జగత్తు’ ఏదో రూపమున ద్రష్టపట్ల ఉండనే ఉంటూ, ‘నిత్యము’ అనునది కూడా వాస్తవమే అగుచున్నది.

  1. క్షణికవాదుల అభిప్రాయం (క్షణికం) - "ఈ జగత్తు అనుక్షణం నశించిపోతోంది. క్షణక్షణం మార్పుచెందని వస్తువంటూ ఇక్కడ ఏదీ లేదు. నశ్వరములై, క్షణంలో విధ్వంసమొందే ‘విద్యుత్’ వంటి పదార్థములే ఇవన్నీ.” ఇట్లు తమ తదితర ప్రవచనములు నిర్వాహణార్థం అనేక వాదోపవాదములతో ప్రతిపాదించబడు క్షణిక సిద్ధాంతం కూడా ఉచితమే.

ప్రవహించు నీటిలో జలబిందువులు క్షణకాల మాత్రమే ‘ద్రష్ట’ కు ఎదురుగా ఉంటాయి కదా! ఒకానొక జలబిందువేమో క్షణికం. జలతరంగం అనుక్షణికం. అట్లాగే ఒకానొకదృశ్యంగా క్షణికమే అయినప్పటికీ దృశ్యపరంపరగా అనుక్షణికమే!

  1. సాంఖ్యులు మొదలైన వారి అభిప్రాయం (స్థిరవాదం") - “ఇక్కడ చంద్రుడు - సూర్యుడు - కొండలు మొదలగునవి స్థిరంగానే ఉంటున్నాయి కదా! కాబట్టి ఇదంతా స్థిరమే. ఈ జీవుడు సుస్థిరస్వరూపుడే గాని, ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు ఉండనివాడు కాదు.”

‘స్వసత్త’ దృష్ట్యా చూచామనుకో, ఇక్కడ ఎవరైనా ఏదైనా మార్పుగాని, చేర్పుగాని పొందుచున్నారా? లేదే! ఒకడు బాల్యంలో ఏ ‘సత్త’ అయి ఉన్నాడో, ఇక, నలుబది ఏండ్ల తరువాత, ఏబది ఏండ్ల తరువాత కూడా అదే ‘సత్త’ అయి ఉంటున్నాడు కదా! కనుక ‘స్థిరవాదము’ కూడా మరొక కోణము నుండి ఉచితమే అగుచున్నది.

‘స్వసత్త’ స్థిరమే అయినట్లు, అద్దాని దృశ్యసందర్శనా చమత్కారమూ స్థిరమే!

స్థిరము, కల్పితము - ఇక మరొక విశ్లేషణ విను.

యథార్థానికి పరమాత్మ ఏకము, అనంతము, అనిర్వచనీయము అయి ఉన్నది. అట్టి సమున్నతమగు పరమాత్మయందు సంకల్పితమగు వస్తు జాలమంతా ఎట్లా ఉంటుంది చెప్పు? ఎక్కడ ఉంటుంది? కనుక బ్రహ్మం నందు పదార్థజాలము ఉండజాలదు. అట్టి శుద్ధ పరబ్రహ్మమే నీ యొక్క నా యొక్క ఈ సర్వుల యొక్క వాస్తవ స్వరూపమైయున్నది.

ఇక ఈ దృశ్యవ్యవహారమంటావా… ఈ సమస్తము మరల మరల సంభవిస్తూనే ఉంటుంది. ఈ జనన-మరణములు, సుఖ-దుఃఖములు, కరణ-కర్మములు, ఇవన్నీ ఆత్మ దృష్ట్యా లేవు. కాని శరీరము-మనస్సుల దృష్ట్యా ఇవి ఉంటూనే ఉంటున్నాయి. మరల మరల కలుగుచున్నాయి. ఆకాశంలో సూర్యుడు మరల మరల ఉదయిస్తున్నట్లే ఈ జీవుని హృదయంలో ఆశలు మరల

Page:242

మరల చిగురిస్తున్నాయి. ఈ ఆకాశం, పర్వతములు, సముద్రములు, తదితర సృష్టి… ఇవన్నీ గతిస్తూ మరల మరల ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. అదే రీతిగా దేవతలు, దైత్యులు, ఇంద్రుడు, వరుణ-వాయువులు మొదలైనవారంతా మరల మరల ఉత్పన్నమౌతూనే ఉన్నారు. లోకములు, లోకాంతరములు, సంగముమోక్షము మొదలగు క్రియలు మరల మరల సంభవిస్తూనే ఉన్నాయి. ఈ పృథివి కూడా అనేకసార్లు నశిస్తూ మరల ఉత్పన్నమగుచున్నది. సూర్య చంద్రులు మరల మరల ఉద్భవిస్తున్నారు. కొందరు జీవులు స్వర్గము నుండి తమ యొక్క పుణ్యం క్షయమగుటచే మరల భూమిపై పడుచున్నారు. భూమిపై నివసించే కొందరు జీవులు పుణ్యఫలంగా స్వర్గాదులు చేరుచున్నారు. ఈ సృష్టి వ్యవహారమంతా మరల మరల వస్తోంది, పోతోంది. అనేకమంది ఇంద్రుల అధికారం పూర్తి అగుటచే క్రొత్త వారు ఎందరో వచ్చి ఇంద్రసింహాసనం అధిష్ఠిస్తున్నారు. అనేకసార్లు కృతయుగపు స్థితిగతులు కలియుగంచే కలుషితం చేయబడుచున్నాయి. అనేక కల్పములు దొర్లిపోతున్నాయి.

  1. ప్రాప్తించేదంతా ఇతఃపూర్వపు అభాసానుగతమే!

ఎవనికి ఏ ఇతఃపూర్వపు అభ్యాసం ఏర్పడి ఉన్నదో ఆ అభ్యాసము ననుసరించే అతని సంకల్పములు ఉంటున్నాయి. సంకల్పములను అనుసరించే అనుభవములు పదే పదే ఏర్పడు చున్నాయి. ఒక సమయంలో ఇదంతా రసవిహీనంగాను, అత్యంత భారంగాను, త్యజించుటకు అర్హమైనదిగాను ఉంటోంది. మరొకప్పుడు ఇదే జగత్తు అనేక ఆశలతో, సుందరమైన విషయము లతో ఉన్నట్లు దర్శించబడుతోంది. విషయపరంపరారూపమగు ఈ మనస్సు ఒకానొకప్పుడు శిథిలమైన ఆకృతిని ధరించి తన యొక్క జన్మస్థానమగు సాక్షితత్వమునందు విలీనమగుచున్నది. మరల మనస్సే జగత్ సమూహములను విస్తరింపజేస్తోంది.

ప్రళయం అయిన తరువాత మరల సృష్టి ప్రారంభం అవుతోంది. అప్పుడు మరల సమస్త పదార్థములు ఉత్పన్నమౌతున్నాయి. మరల ఈ జగత్తు చక్రము వలె పరిభ్రమించటం ప్రారంబి స్తోంది. దీర్ఘభ్రమరూపమైనట్టి ఈ‘మహామాయ’ యొక్క ఆడంబరంలో ’ఇది ఇట్లు నిర్ణయించ వచ్చును…’ అనదగిన సత్యవస్తువుగాని, అసత్యవస్తువుగాని ఏది ఎక్కడ ఉన్నది? కల్పనచే రచింప బడినట్టి ఆకారం కలిగిన ఈ సంసార చక్రం భ్రమ వంటిదే సుమా! యథార్థానికి ఇదంతా ‘లేనిదే’ అగుచున్నది.

ఓ రాఘవా! ఈ జగత్తంతా అజ్ఞానము చేతనే అవిర్భూతమగుచున్నది. నేత్రదోషం చేత ఆకాశంలో ఎందరో చంద్రులు కనిపిస్తున్నట్లు ఈ జగత్తు ఇందలి సంఘటనలు, జనులు అనేక రీతులుగా ద్రష్టకు ప్రాప్తిస్తున్నారు.

అనేక వికల్పములచే ఈ జగత్తు నిరంతరం వ్యాప్తమైయున్నది.

Page:243

అవిద్యామానమగు కర్తృత్వముచే నిర్మించబడిన ఇదంతా అధిష్ఠానమగు బ్రహ్మము కంటే వేరే కాదు. కాబట్టి నీవు ‘జగత్తు’ రూపంగా చూస్తే ఇదంతా అసత్యమే.

ఓ రామచంద్రా! అసలు ‘ఈ జగత్తు సత్యము’ అనే మూఢబుద్ధి నీకు ఎందుకు కలిగిందో చెప్పు? శ్మశాన సదృశమై, రుద్రునిచే ఏదో ఒకప్పటికి సర్వము మ్రింగబడబోవుచున్నదే కదా! అట్టి ఈ జగద్విన్యాసము చూచి భ్రమ పొందవలసిన పనేమీ లేదు.