CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:244

VII. దాశూర కథనం

  1. దాశూరుడు - - చిత్త సువిశాలత్వం

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జనులలో కొందరు అనేక క్రియావ్యవహారములలో తలమునకలై ఉంటున్నారు. భోగైశ్వర్యములచే వారి బుద్ధి నశించి ఉంటోంది. ఫలితమేమిటి? వారు తమను తామే వంచన చేసుకొంటున్నారు. అంతేకాదు ఇతరులను కూడా ’వంచనదృష్టి’తోనే గాంచుచున్నారు. మరి, అట్టి వారు సత్యవస్తువగు పరమాత్మను దర్శించుట ఎట్లో చెప్పు? వారికి ప్రశాంతత - ఆనందములు అనుక్షణం సుదూరమే అగుచున్నాయే!

యే తు పారంగతాబుద్ధేరింద్రియైర్న వశీకృతాః |

త ఏనాం జాగతీం మాయాం పశ్యన్తి కరబిల్వవత్ II (శ్లో 2, సర్గ 48)

ఎవరైతే ఈ బుద్ధిని కూడా అతిక్రమించివేస్తున్నారో, ఈ ఇంద్రియములకు వశీభూతులు కాకుండా ఉంటున్నారో… అట్టి మహాత్ములు ఈ జగన్మాయను అరచేతిలోని పండువలె స్పష్టంగా గాంచుచున్నారు. ఎవరు శ్రద్ధగా, సమగ్రంగా, మహాపరాక్రమవంతులై విచారణను ఆశ్రయించి ఉంటున్నారో, అట్టి వారు ఈ జగన్మాయను, బాగుగా ఎరుగగలుగుచున్నారు. పాము కుబుసాన్ని వదలి వేస్తున్నట్లు, వారు ఈ సర్వమును సర్వదా త్యజించియే ఉంటున్నారు. వారికి ఈ జగత్తు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ప్రాపంచిక క్షేత్రంలో వ్యవహరిస్తున్నప్పటికీ వారు ఏమాత్రం బంధమున తగుల్కొనరు. అగ్ని చేత దగ్ధమైన బీజము మరల మొలకెత్తుతుందా? వారి యొక్క ‘మనస్సు-బుద్ధి -చిత్తము-అహంకారములు’ (అంతరంగ చతుష్టయం) అంతా జ్ఞానముచే దగ్ధమై ఉంటున్నాయి.

ఇక అజ్ఞాని ఏం చేస్తున్నాడు?… శారీరక, మానసిక వ్యధలతో పూర్ణమై, నేడో రేపో నశించ బోయే ఈ దేహం కోసం మాత్రమే అతడు ప్రయత్నాలు సలుపుచున్నాడు. అంతేగాని, ఆత్మోద్ధరణ కొరకు ప్రయత్నమే చేయడాయె? అతడది గ్రహించి ఆత్మోద్దరణ కొరకై యత్నించు గాక!

ఈ సంసార చక్రము విషయముల పట్ల ప్రీతిగొనియున్న వారిని సంతోషింపజేయటానికే కల్పింపబడుచున్నది. “దాశూర కథనం’ లోలాగా వాస్తవానికి ఇదంతా శూన్యమే. శ్రీరాముడు: స్వామీ! “ఇదంతా దాశూర కథనంలాగా” అని శలవిచ్చారు కదా! అనగా? దాశూరుని కథనమంటే ఏమిటో దయచేసి వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి: సరే, నీ కిప్పుడు ’దాశూరోఖ్యాయిక’ సవివరంగా చెపుతాను. వినుమగధ దేశంలోని ఒక ఏకాంత పర్వత ప్రదేశంలో ‘శరలోముడు’ అనే పేరుగల ఒక మహాత్ముడున్నాడు. ఆయన తన భార్యపుత్రులతో ఒక ఆశ్రమంలో ఉంటూ నిరంతరం తపో ధ్యానాదులను నిర్వర్తిస్తూ ఉండేవారు.

Page:245

అతని ఏకైక కుమారుడు దాశూరుడు. ఆ కుటుంబంలోనివారు వాళ్ళంతా ఎంతోకాలం అన్యోన్యంగా కలిసి ఉన్నారు. పక్షులు గూటిని వదలి వెళ్ళునట్లు శరలోముడు, ఆతని భార్య కాలక్రమంగా తమ శరీరాలను త్యజించి ఎటో వెళ్ళారు. ఇక దాశూరుడు తల్లిదండ్రుల వియోగం చేత పరమదుఃఖక్రాంతుడై, దిక్కుతోచక ఆ పర్వతముపై గల వనము లందు, గుహ లందు పిచ్చిపిచ్చిగా సంచరించసాగాడు. చాలా రోజులు ఆ విధంగా గడచిపోయాయి. అదృశ్య శరీరులగు అక్కడి వనదేవతలు ఆ యువకుని దీన చిత్తమును గమనించారు. "ఏమిటబ్బా! ఈ పిల్లవాడు దుఃఖిస్తూ ఎన్నో రోజులుగా పిచ్చివాడై తిరుగుచూనే ఉన్నాడు.!…’ అనుకుని, జాలి పడసాగారు. తమ మధ్య రాత్రిబగళ్ళు నిస్తేజంగా, వెట్టిచూపులతో వగరుస్తూ తిరుగుచున్న ఆ బాలుని మనస్సు మార్చాలని అనుకున్నారు. పరుల దుఃఖం తమదిగా భావించే వారికి సర్వేశ్వరుడు సర్వదా అభ్యున్నతిని ప్రసాదిస్తూ ఉంటాడు కదా!

ఒక ఉత్తమ క్షణంలో వనదేవతలు ఆ కుర్రవానితో అదృశ్య శరీరులై యిట్లు సంబోధించారు. వనదేవతలు: ఓ మహా ప్రాజ్ఞుడవగు మునికుమారా! దాశూరా! ఇదేమిటయ్యా? అజ్ఞానివలె నీవు ఎందుకు దుఃఖిస్తున్నావో చెప్పు? ఈ ప్రపంచము యొక్క చంచలస్వభావమేమిటో నీవు ఇంకా గుర్తించలేదా ఏమిటి? ఇక్కడికి అనేకమంది జీవులు వచ్చి జన్మలు పొంది, కొంతకాలము అటు ఇటూ సంచరించి, మరల ఎటో వెళ్ళిపోవుచున్నారు. ఇది అనుదినం, అనుక్షణం జరుగుతున్న తతంగమే కదా! ఇక్కడి ప్రతిపదార్థం ‘నశించుట’ అను స్వభావంతోనే పుట్టుచున్నది. ఇక్కడ జరుగు చున్న వ్యవహారమంతా సూక్ష్మదృష్టితో, వివేకదృష్టితో పరిశీలించాలి గాని, మూర్ఖదృష్టితో కాదే!

ముందుగా నీ యొక్క వ్యవహారబుద్ధిని పరిశుద్ధపరచుకో. ఆ తరువాత ఆయా బాహ్య సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ మహాప్రసిద్ధులగు ‘బ్రహ్మ’ మొదలైన లోక పాలకులే వినాశనమొందుచున్నారే? ఏదైతే పుట్టుచున్నదో అది ఒకనాటికి నశించక తప్పదు’… అనుటలో నీకైమనా సందేహం ఉన్నదా? అక్కరలేదు. నీ తండ్రి మరణ విషయమై నీవు వ్యర్థంగా ఎందుకు శోకిస్తున్నావో చెప్పు? అసలు, జన్మిస్తున్నదెవరు? మరణిస్తున్నదెవరు? ఈ శరీరములు, తత్సంబంధములు స్వప్నతుల్యం కాక మరింకేమిటి? సూర్యుని లాగా ఉదయించిన ప్రతీది అస్తమించవలసినదే! అయితే,

విజ్ఞులు ఈ ప్రాప్తించిన ఆయుఃకాలమును ఎట్లు సద్వినియోగపరచుకొనుచున్నారు?… అజ్ఞానులు దీనిని “పిల్లవాని చేతిలోని సూది” వలె ఎట్లు అపవిత్ర పరచుకొని వేసట చెందుచున్నారు? ఈ విషయాలు, గమనించు. మొట్టమొదట నీ దృష్టిని పరిశుద్ధపరచుకో…! ’వివేక దృష్టి, ఉత్తమాశయా’లతో కూడిన సత్ప్రయత్నములతో దైవప్రసాదితమైన ఈ ఆయుష్షుని సద్వినియోగపరచుకో.

దాశూరుడు ఆ వనదేవతల స్నేహవాక్యములు విని ఊరట చెందాడు. ఇకప్పుడు లేచి, పితృ మరణానంతరం నిర్వర్తించవలసిన క్రియలన్నిటినీ పూర్తి చేశాడు. ఆ తరువాత బ్రాహ్మణ ధర్మమగు

Page:246

తపస్సు చేయటం ప్రారంభించాడు. వేదములను అధ్యయనం చెయ్యటం, వాటి యొక్క అర్థ విచారణ చేయటం, నిష్ఠతో అందలి ఉత్తమ ప్రవచనములను సదవగాహనతో ఆకళింపు చేసు కోవటం - మొదలైన ప్రయత్నములచే అతనియందు క్రమక్రమంగా పవిత్రమగు ‘శ్రోత్రియత్వం’ సిద్ధించింది.

అయితే అతడు ఇంకను జ్ఞేయమగు బ్రహ్మమును విశ్రాంతి, అనుభవముల పూర్వకంగా ఎరిగియుండకపోవటచే అతని చిత్తము ‘శుద్ధ - అశుద్ధ’ వికల్పములను కలిగి ఉండేది. పరమ పవిత్రమగు ’విశ్రాంతి’ అతనికి అల్లంత దూరంగానే ఉండేది. ఈ దృశ్యము స్వతహాగా ’శుద్ధమే’ అయినప్పటికీ అతనికి మాత్రం ‘అశుద్ధము’ గా తోచుచూ ఉండేది.

ఉత్తముడు తన ఉత్తమ ప్రయత్నముల నుండి విరమిస్తాడా? లేదు. ఆ దాశూరుడు కూడా స్వసంకల్పముచే ఒక చెట్టుపైన ఒక మూల చేరాడు. ఒక పక్షిలాగా ఆసీనుడై మరల తపస్సు చేయటం ప్రారంభించాడు. కొంతకాలం గడిచింది. ఆ తపస్సు కూడా అతనికి ’పరిశుద్ధధర్మము”* అను పవిత్ర స్థితిని ప్రసాదించనే లేదు.

అయితే అతడు ఎంతగానో మనస్సును ‘తపస్సు’ నందు నియమిస్తున్నప్పటికీ ప్రాపంచికమైన విషయాలు, సంఘటనలు, వ్యక్తులు అతని బుద్ధిని ఆక్రమించియే ఉండటం జరుగుతోంది.

“ఇప్పుడు నేను ఏం చేయాలి? నా మనస్సు నందు ఆక్రమించియున్న ఈ దృశ్యముతో ఏర్పడిన సంబంధము… అనే దోషం సన్నగిల్లేదెట్లా? సరే. సర్వత్యాగము చేతనే పవిత్రత్వము సముపార్జించబడగలదని వేదవాక్యసారం కదా! అందుచేత ఈ నా శరీరమునే అగ్నికి తర్పణం చేస్తాను. అప్పుడు అగ్నిదేవుడు కనికరించి నా మనస్సు యొక్క క్షోభను, దోషమును తొలగించ వచ్చు. ఈ భూపదార్థములపై నాయందు ఏర్పడుచున్న ’ఆకర్షణ’కు అగ్నిదేవుడే వైద్యుడై నన్ను రక్షించగలడు”… అని యోచించాడు. చెట్టు నుండి క్రిందకు దిగి ఒకచోట అగ్నిని ప్రజ్వలింప జేసాడు. తన భుజముల నుండి మాంసమును కోసి హోమం చేయటం ప్రారంభించాడు.

అప్పుడు అగ్నిదేవుడు ’ఇదేమిటి? ఈ బాలకుడు ఇంతకు తెగించాడేమి? సరే, దేవతల కంఠప్రదేశమైనట్టి అగ్నిరూపమగు నాయందు పడుచున్న ఈతని శరీర ఖండములు భస్మము కాకుండు గాక! ఇతడు మునపటి వలె పూర్ణశరీరుడై యుండుగాక!" అని సంకల్పించాడు. బృహస్పతి ముందు సూర్యభగవానుడు ప్రత్యక్షమయినట్లు అగ్నిదేవుడు ఆ దాశూరుని ముందు కల్పిత శరీరములో ప్రత్యక్షమైనారు.

అగ్నిదేవుడు : ఓ సాధూ! దాశూరా! నీ త్యాగనిరతికి, పట్టుదలకు మెచ్చుకుంటున్నానయ్యా! ఏమి కోరి ఇంతటి సాహసం చేస్తున్నావో చెప్పు, నీకు అభిమతమైన వరం కోరుకో.

ఏదేది మనం చేయవలసివస్తోందో అవన్నీ భగవదర్పిత బుద్ధితో ‘ఇది ధర్మమైయున్నది’ అను భావనతో రాగ-కౌతుక రహితంగా నిర్వర్తించుటయే “పరిశుద్ధ ధర్మభావన’ అగుచున్నది.

Page:247

దాశూరుడు: తండ్రీ! పరమపవిత్ర స్వరూపులగు తమ యొక్క కనికరము చేతనే లోకములు మనగలుగుతున్నాయి. మావంటి అల్పజీవులకు దేవతల కటాక్షవీక్షణలను ప్రసాదింపజేసే మహనీయులు మీరు. మీ పాదములు అంటి మ్రొక్కుచున్నాను. సాష్టాంగదండ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి.

మహానుభావా! ప్రాణులతోను, అనేక పదార్థములతోను నిండియున్న ఈ ‘పృథివి’ నన్ను ఆకర్షితుణ్ణి చేస్తోంది. నా బుద్ధి క్షణకాలంలో కలుషితమౌతోంది. అట్టి ఈ ఎదురుగా కనబడుచు న్నట్టి పృథివిని త్యజించివేయగలుగు బుద్ధిని, శక్తిని వరంగా ప్రసాదించండి. ఈ సర్వము త్యజించి వృక్షము పైననే స్థితి పొందగలిగేటట్లు అనుగ్రహించండి.

అగ్నిదేవుడు: (చిరునవ్వుతో) పుత్రకా! సరే, అట్లే అగు గాక! నీ మనోరథము సిద్ధించు గాక! అందుకుగాను, నీ వర్తమాన తపస్సుయజ్ఞం మొదలైన ప్రయత్నాలను కొనసాగించు. నియమిత కాలంలో నీ మనస్సు పరిశుద్ధమౌతుంది.

ఇట్లు ఆశీర్వదించి అంతర్థానమైనాడు. అప్పుడు దాశూరుడు ఒకచోట అశీనుడై ’నేను పృథివిని త్యజించిన వాడనయ్యాను. ఇందలి ఏ పదార్థము నాకు సంబంధించి లేదు. నేను ఇందలి ఏ పదార్థమునకు సంబంధించినవాడను కాను…” అని మననం చేయసాగాడు. అయినా కూడా తృప్తి లభించలేదు.

అప్పుడు ఎత్తైన ఒక కదంబవృక్షమును ఎన్నుకున్నాడు. ఆ వృక్షము ఆకాశమును అంటుచు, ఫలయుక్తమై తన కొమ్మలచే ’ఛాయ’చే అనేక ప్రాణులకు ఆహ్లాదం కలుగజేస్తూ ఉండేది. భూమిపై అపవిత్రమైన బుద్ధిగల అతడు మఱిచెట్టుపై విష్ణుభగవానుని వలె ఏకాగ్ర చిత్తంతో ఆ కదంబ వృక్షపు కొమ్మపై ఆత్మశుద్ధి కొరకు మరల తపస్సు చేయటానికి ఆసీనుడైనాడు. మరల ఒక్క క్షణం తన చుట్టు పట్ల పరికించి చూచాడు. ఆ క్షణంలో అతని దృష్టి మరల చంచలత్వం పొందింది. కౌతుకంతో చుట్టూ పరికిస్తున్న అతని దృష్టికి అక్కడ నదులు, పర్వతములు, నిర్మలాకాశం, నీలి మేఘములు, పల్లవములు, పుష్పసమూహములు, పక్షుల కలకలారావములు, సెలయేళ్ళ శబ్దములు, అరణ్యము, స్వర్గము, భూమి మొదలైన వాటితో కూడిన వ్యవహారమంతా దిక్కులన్నీ నిండి కనిపించాయి. వాటిచే ఆతని బుద్ధి దృష్టి ఆకర్షించబడటం కొనసాగనారంభించింది.

ఒక్క క్షణం అదంతా పరికించి చూస్తూ ’ఆహాఁ! మాయ ఎంత చమత్కారమైనది! నా దృష్టి పరిశుద్ధమవనంతవరకు ఏ మూల వెళ్ళి కూర్చుంటే ఏం ప్రయోజనం? ఈ విషయమే వనదేవతలు నాకు గుర్తు చేశారు కదా…!” అని ఆలోచించి కొంత ప్రశాంత చిత్తముతో నవ్వుకొన్నాడు. ఆ దిక్కుల నుండి తన దృష్టిని వెనుకకు మరల్చి మరల ఘోరతపస్సు ప్రారంభించాడు.

కాని ఏం లాభం? కేవలం కర్మకాండ యందు మాత్రమే తత్పరుడయ్యాడు. పరమార్థజ్ఞాని కాలేకపోయాడు. ‘స్వర్గమును పొందుట’ వంటి స్వల్ప ఫలములకు మాత్రమే అర్హుడు కాగలిగాడు.

మానసిక యజ్ఞం - అప్పుడు దాశూరుడు ఇట్లు యోచించాడు."ఎంత కాలం తపస్సు చేస్తే ఏం ప్రయోజనం? బాహ్య కార్యక్రమముల వలన ఉత్తమ ప్రయోజనమేదీ నాకు కనిపించుట

Page:248

లేదు. ఇంకేమి ఉపాయం? అన్నిటికీ కారణం మనస్సే కదా! కనుక ఇక నుండి మానసిక యజ్ఞం ప్రారంభిస్తాను” అని అనుకున్నాడు. మనస్సుతోనే అగ్ని యొక్క ఉపాసన ప్రారంభించాడు. ‘అశ్వమేధయాగం’ వరకు గల అనేక యజ్ఞక్రియలన్నిటినీ క్రమంగా ఆచరించాడు. ఆ వృక్షపు కొమ్మ మీదనే ఆసీనుడై పది సంవత్సరాల కాలం దేవతా ప్రీత్యర్థం ఒక దాని తరువాత మరొకటిగా అనేక మానసిక యజ్ఞములను నిర్వర్తించాడు. అప్పటికి అతని చిత్తము క్రమంగా రాగద్వేషరహితం కాసాగింది. సువిశాలత్వం పొందింది. ప్రతిబంధకములన్నీ క్షయిం చాయి. సంస్కారములు పవిత్రత పొందాయి. చిత్తము నిర్మలం కాగా, అతనికి జ్ఞానోదయమ యింది. జ్ఞానముచే అజ్ఞానావరణమంతా ఛిన్నమైపోయింది. వాసనామలమంతా నశించింది.

  1. వనదేవత - పుత్రాభిలాష్

ప్రశాంతచిత్తుడగు ఆ దాశూరుడు ఆ కదంబ వృక్షపు కొమ్మపై మౌనం వహించియున్నాడు. ఒక రోజు ఒక వనదేవత గొప్ప సౌందర్యముతో కూడిన శరీరము ధరించి అతని ఎదురుగా నిలచినది. మనోహరమగు వచనములతో తన అభ్యర్థనను ఇట్లు తెలిపింది.

వనదేవత: పరిశుద్ధుడవు, మోక్షస్వరూపడవు అగు ఓ మునికుమారా! మీకు జయమగుగాక! దాశూరుడు: ఓ కమలాక్షీ! నీ యొక్క శోభాతిశయం చేత మన్మథుని కూడా విచలితుని చేయ గలిగినట్లు ఉన్నావు. అంతటి సౌందర్యరాశివగు నీ వెవరవు? ఈ లతపై కూర్చుని నా ఎదుట ఎందుకు సాక్షాత్కరించావు?

వనదేవత: హే మునీ! “ప్రాప్తించనిదంటూ ఏదైనా ఉంటే, అదంతా మహాత్ములను సమీపించి అర్థించితే చాలు, తప్పక ప్రాప్తిస్తుంది”… అని పెద్దలు అంటూ ఉంటారు. ముందుగా నేనెవరో చెపుతాను, వినండి. అనేక కదంబవృక్షములతోను, అందమైన పూతీగలతోను శోభిస్తున్న ఈ వనంలోని వనదేవతను నేను. లతల సమూహమే నా నివాసస్థానం. ఈ మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి యాచిస్తున్నాను.

శ్రీ దాశూరుడు: ఏమా సంఘటన? నీ అభిలాష ఏమిటి?

వనదేవత: మొన్నటి చైత్రశుక్ల త్రయోదశినాడు దేవలోకంలోని నందనవనంలో ఒక ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అనేక ప్రదేశముల నుండి వనదేవతలు వచ్చి సమావేశ మయ్యారు. ముల్లోకములందలి వనదేవతలను పరామర్శించుచు, వేడుకలలో పాల్గొనుటకు గాను నేను కూడా వెళ్ళాను. ఆ ’కామోత్సవం’లో అనేకమంది వనదేవతలు తమ పుత్రులను కూడా వెంటబెట్టుకొని అటూ ఇటూ తిరగటం చూచాను. వారు తమ బిడ్డలను ముద్దు ముద్దు మాటలతో లాలించటం నాకెంతో ముచ్చట గొలిపింది. నేను పుత్రహీనను. అందుచేత నా మనస్సు ఎంతగా క్షోభించిందో మాటలతో చెప్పలేను. వాళ్ళు తమ పుత్రుల అల్లరి చిలిపి మాటలను వింటూ కళ్ళలో

Page:249

ఆనందం ప్రకటించటం చూచాను. “ఏనాటికైనా నేను అట్లు పుత్రులను పొందగలనా?’ అను ఆలోచన నన్ను వేధించసాగింది. ”ఏమి చేయాలి?” అని తీవ్రంగా యోచిస్తూ ఉండగా, మీరు గుర్తుకు వచ్చారు. “ఆ ముని సమస్త పురుషార్థములకు కల్పవృక్షము వంటివారు… ఇక నీకేం లోటు… పోయి అభ్యర్థించు”… అని తోటి వనదేవతలు నన్ను ఉత్సాహపరిచారు. ఇక నేను పుత్రహీననని దుఃఖించవలసిన పనేమున్నది?

ఓ మహాత్మా! నాకు ఒక కుమారుని ప్రసాదించండి. ఒకవేళ మీరు నా విన్నపమును తిరస్కరిస్తారా? అందుకు నేను తగిన నిర్ణయమే చేసుకుని వచ్చాను. ఇప్పటికిప్పుడు ఇక్కడ ‘అగ్ని’ ని సృష్టించి అందులో ఈ నా దేహమును ఆహుతి చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే, “నాకు ఇతర దేవతల వలె పుత్రులు లేరే?” అనే దుఃఖం భరించలేను. ఇంతకన్నా మరణించటమే ఉచితమని నేను నిశ్చయించుకున్నాను.

ఆ ముని ప్రశాంతంగా అంతా విన్నారు. మహాత్ముల హృదయం నవనీతంలా సుతిమెత్తగా ఉంటుంది కదా! ఆయన జాలి పొంది ఇట్లు పలికారు.

శ్రీ దాశూరుడు: ఓ వనదేవతా! పుత్రుని కొరకై నీవు స్వశరీర త్యాగానికి కూడా సిద్ధపడ్డావు కదా! సంతోషం. ఇదిగో, ఈ పుష్పమును స్వీకరించు. నెల రోజులలో నీకు ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు. నీ త్యాగనిరతికి తార్కాణంగా అతడు మహాసౌందర్యవంతుడు జగత్పూజ్యుడు అయి ఉంటాడు. మహాజ్ఞాన సంపన్నుడగు అతనిని పొందినందుకు నీ జన్మసార్ధకమౌతుంది.

వనదేవత ఆ మాటలు విని ఎంతో సంతోషించింది. ఆ ఋషి పాదాలు స్పృషించి నిజస్థాన మునకు మరలింది. క్రమంగా మాసాలు, ఋతువులు, సంవత్సరములు గడచిపోసాగాయి. ఒక నాడు ఆ వనదేవత పండ్రెండేళ్ళ వయసుగల కుమారుని వెంటబెట్టుకుని ఆ మునిని సమీపించింది. వనదేవత: హే మహాత్మా! ఈ పిల్లవాడే మన కుమారుడు. నేను ఇతనిని సర్వవిద్యాసంపన్నునిగా తీర్చిదిద్దాను.

దాశూరుడు: చాలా సంతోషం. విద్యలన్నీ చక్కగా నేర్చినాడు కదా?

వనదేవతః నేర్చాడు. కాని ‘ఆత్మజ్ఞానం’ మాత్రం ఇతడింకా పొందనేలేదు. ఏది గ్రహించిన తరువాత ఇక జీవుడు ఈ సంసారచక్రంలో తగుల్కొనడో… అట్టి దివ్యము, నిత్యోదిత అమృతానందమయము అగు ’ఆత్మస్వరూపానుభవం’ ఇతనికి బోధించ వలసియున్నది. ‘ఇతడు జ్ఞాని అవుతాడు’ అను మీ ఒకప్పటి ఆశీర్వాదవాక్యం సిద్ధింపజేయ ప్రార్ధన. ఇతనికి మీరే దయతో జ్ఞానోపదేశం చెయ్యండి. మీ అంశయే అయిన ఇతడు జ్ఞాని కావటం మీకు కూడా సంతోషకరమైన

విషయమే కదా!

దాశూరుడు: అట్లాగే అగుగాక! ఇతడు ఇక్కడే ఉంటాడు. ఇక నీవు యథాస్థానికి వెళ్ళవచ్చు. నీకు

శుభమగుగాక!

x

Page:250

తన తండ్రి, గురువు అగు ఆ మహామునిని సేవించుకుంటూ ఆ బాలుడు రోజులు గడుప సాగాడు. అనేక క్లేశములను భరిస్తూ తండ్రి వద్ద అనేక జ్ఞాన విషయాలు వినేవాడు. అనేక యుక్తులను ఉపయోగించి దాశూరుడు ఆత్మవస్తుతత్త్వాన్ని విశదపరుస్తూ ఉండేవాడు. ‘ప్రత్యగాత్మ యందు నిరంతరస్థితి కలిగియుండుటకు ఉపాయములేమిటి…’ అను విషయము అనేక కథల, యుక్తుల సహాయంతో కూలంకషంగా చర్చిస్తూ ఉండేవాడు.

కల్పితములైన అనేక దృష్టాంతములు… లోకప్రసిద్ధమైన ఇతిహాసములు… పూజ్యులగు మహనీయుల ప్రవచనాలు, అభిప్రాయాలు… వేద వేదాంతాలలోని ఆయా సిద్ధాంతములు.., వ్యాఖ్యానాలు… అనేక అర్థములను సూచించు కథలు… స్వానుభవాలు, అవగాహనలు… ఈ విధంగా అనేక చమత్కృతులను క్రోడీకరించి ఉత్తమవచనముల ద్వారా ఆత్మ గురించిన

సమాచారం ప్రసాదించసాగారు.

ఒకరోజు నేను అయోధ్య నుండి కైలాసములోని మందాకినీ నదిలో స్నానం చేయటానికి బయలుదేరాను. అదృశ్యరూపంలో ఆకాశమార్గంలో పయనిస్తున్నాను. సప్త ఋషి మండలము లోని ’స్వర్గలోకాకాశం’ దాటి, వెళ్ళుచున్నాను. కాకతాళీయంగా ఆ దాశూరుడు, అతని కుమారుడు ఉన్న భూగోళంలో ప్రవేశించాను. రాత్రి అగుటచే కొంచము విశ్రమించాలని ఆ వృక్షమధ్య భాగంలో ప్రవేశించాను. ప్రశాంతమౌన చిత్తుడనగు నాకు వారిద్దరి సంభాషణ వినిపించింది. ఆ సంభాషణను నీకు వివరించి చెపుతాను, విను.

  1. ఖోష్ఠుడు - మూడు శరీరాలు

దాశూరుడు: ఓ కుమారా…! ఇట్టిదే అయినట్టి మరొక విశ్వం ఉన్నది. అక్కడ ఒక ప్రదేశంలో ఒక ఆశ్చర్యజనకమైన సంఘటన జరిగింది. అది చెపుతాను, విను…

విశ్వంలో ఒక భూపాలుడు ఉన్నాడు. అతని పేరు ఖోష్ఠుడు" అతడు ముల్లోకాలలోను సుప్రసిద్ధుడు. గొప్ప శ్రీమంతుడు. జగత్తులన్నీ జయించగలిగినంతటి సామర్థ్యం కలవాడు. అతడు మహాజ్ఞాని కూడా. కాబట్టి అతని ఆజ్ఞలు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగువారికి కూడా శిరోధార్య మగుచున్నాయి. అతడు మహాసాహసి అని, గొప్ప పరాక్రమవంతుడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ ముల్లోకాలలో ఎవరికీ అతనిని వశం చేసుకోవటం అంత తేలికైన పని కాదు. అయితే అతనిలోనే అసంఖ్యాకంగా ‘ప్రవృత్తులు’ ఉన్నాయి. అవన్నీ సుఖప్రదాలై ఉంటున్నాయి.

ఎవరైనా తమ పిడికిలితో ఆకాశమును జయించగలరా? ఉత్తమ పరాక్రమశీలుడగు అతనిని తమ శస్త్రాస్త్రబలంచే ఎవ్వరూ జయించలేరు. దివ్యమగు అతని లీలలు మహాగంభీరముగా

ఖః = ఆకాశము ; ఖోత్థుడు = అవ్యాకృతాకాశం నుండి జనించినవాడు.

Page:251

ఉంటున్నాయి. అతడు తనకు తానే “స్వప్నము - - మనోరథము’ లకు సంబంధించిన స్వీయరచనలు చేస్తూ ఉన్నాడు. “అతని ఊహా కల్పిత రచనా చమత్కృతులు ఆ ఇంద్ర-విష్ణు-శంకరులు కూడా ఊహించలేరా”…? అన్నట్లు ఉంటున్నాయి.

అతడు సర్వవేళల మూడు శరీరములు కలిగి ఉంటున్నాడు. అందులో ఒక్కటి ఉత్తమమైనది, ఒకటి మధ్యమము, ఒకటి అధమమైనది. ఆ శరీరములు సర్వవ్యవహారములు నిర్వర్తించగల సామర్థ్యము కలిగి ఉన్నవి. వింటున్నావా కుమారా?

దాశూరుని పుత్రుడు: తండ్రీ! వింటున్నాను. ఇంతకీ అతడు ఉన్నది ఎక్కడ? ఈ జగత్తు లోనా? లేక, బైట ఇంకెక్కడన్నానా?

శ్రీ దాశూరుడు : విశాలమగు ’అవ్యాకృతాకాశం’లోనే అతడు త్రిశరీరధారి అయి ఉద్భవించాడు. అతడు ఉన్నది, అతని సంచనలము అవ్యాకృతాకాశంలోనే. అయితే ఏం? అతడు తుచ్ఛ విషయము లందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు. ఏవేవో విధి-నిషేధములను ఆశ్రయించి అనేక స్థితిగతులను దర్శించుచున్నాడు.

అతడు ’అవ్యాకృతాకాశం’లోనే “బ్రహ్మాండము” అనే నగరం స్వయంగా మనోకల్పితంగా నిర్మించాడు. ఆ బ్రహ్మాండనగరం 14 భువనములచేత, 3 లోకముల రూపంగా, 3 వేదములతో కూడినదై శోభిస్తోంది. అందులో చంద్రసూర్యులు తరగని దీపాలవలె వెలుగుచున్నారు. ఆ బ్రహ్మాండంలో అనేక రకరకాలైన శాస్త్రీయ-అశాస్త్రీయ ప్రవర్తనామార్గాలు ఉండి ఉన్నాయి. అవన్నీ ఊర్ధ్వ-అధోగతి రూపములతో విలసిల్లి ఉంటున్నాయి. అతి విశాలమైనట్టి ఆ బ్రహ్మాండనగరంలో అనేకమంది దేవతలను, మనుష్యులను, తదితర జీవులను అతడు సృష్టించాడు. వారంతా జంగమాత్మకమై (జన్మించు స్వభావం గల) స్వరూపం కలిగి ఉన్నారు. విషయముల పట్ల ధ్యాస కలిగియుండుటచే వారు విమూఢులు, ఆత్మాకాశపరిచ్ఛేదకులు అయి ఉన్నారు. వారిలో కొందరు ఊర్ధ్వ భాగమున నియమించబడ్డారు. కొందరు మధ్యభాగమున, మరికొందరు అధోభాగమున నియోగించబడ్డారు.

అందులో కొందరు చాలా శీఘ్రంగా నశించిపోతున్నారు. ఇక మరికొందరో, చాలా కాలానికి గాని నాశనం పొందుటలేదు. ఆ జీవులంతా నల్లటికేశములతో, నవ ద్వారములతో, ప్రాణ-అపాన వాయు చలనములతో, పంచ జ్ఞానేంద్రియములతో, రక్త మాంస-బొమికలతో నిర్మించబడే ఈ భౌతిక ఉపాధులతో కనిపిస్తున్నారు.

మహాత్ముడగు ఆ రాజు తన యొక్క మహత్తర మాయాశక్తిచే ’యక్షసమూహము’ను కూడా రచించాడు. ఆ యక్షులు ఆత్మాకాశమున ‘ఆఛాదన’ రూపంలో ఉన్నారు. వారు ‘ఆత్మజ్ఞాన ప్రకాశము’ పట్ల నిత్యము భయభీతులై ఉంటున్నారు. అట్టి ఆత్మాఛాదకులు కార్యప్రవృత్తులగు చున్నారు. వారు కార్య ప్రవృత్తులైనందుకు ప్రయోజనంగా అనేక విధములైన క్రీడా విషయములు ఉత్పన్నమగుచున్నాయి.

Page:252

తానే బ్రహ్మాండనగరమునకు ‘సృష్టికర్త’ అయినప్పటికీ ఆ రాజు సంకల్పములచే నడిపించ బడి అనేక స్థూల సూక్ష్మ-కారణ శరీరములందు యక్షులతో కూడి విహరిస్తున్నాడు. ఒక శరీరంలో ప్రవేశించి కొంచెము సేపు విహరించి, ఇంతలోనే ఆ శరీరమును విడచి వేస్తున్నాడు. అక్కడి నుండి బయలుదేరి మరల ఇంకొక దేహమును ఆశ్రయిస్తున్నాడు.

అతని చిత్తము ఎంతో చంచలమైనది. అది ఒక్కొక్కప్పుడు ’భవిష్యత్తు నగరము’ను తన యందు సృష్టించుకొని అందులో ప్రవేశించి, అక్కడ అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటోంది. అతని చిత్తము జాగ్రత్తు, సుషుప్తులను త్యజించి స్వవిరచితమైన స్వప్నలోకంలో ప్రవేశించుచు విహారం చేయుచుండెడిది. ఇంతలోనే అతని ఆ చపల చిత్తము ఇంకొక సమయంలో క్షణంలో సర్వ జాగ్రత్-స్వప్న సంకల్పములన్నీ త్యజించి వేసి సర్వభావనలు విలయించునట్టి సుషుప్తిలో ప్రవేశించాలనే కోర్కె పొందేది.

అప్పుడు ఆ ఖోతునిచిత్తంలో కర్మ బీజములు సంస్కార రూపంలో ఉండేవి. అవన్నీ ‘మూఢత్వము’ అను అవిద్యయందు దాగి ఉండేవి. ఇంతలోనే, మరల అతనిపట్ల చిత్తము ఉత్పన్నమైనదై, సుషుప్తి నుండి లేచి కూర్చుని క్రమంగా మరల జాగ్రత్-స్వప్న దశలను పొందుతూ ఉండేది. ఆ సమయంలో మరల అనేక విస్టార కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఉండేది.

ఆ ఖోతుని ఓడించగలిగిన వారెవ్వరూ లేరు. అయితే ఏం? అతని చిత్తము ఒక్కొక్కసారి తన చేతులలో తానే ఓడిపోతూ ఉండేది. ’అయ్యో! నేనొక అజ్ఞానిని. నాకేమీ తెలియదు. భృత్యుడను. పరమ దుఃఖితుడను’ అను భావనలు స్వీకరించి అతడు ఎంతగానో దుఃఖిస్తూ, వాపోతూ ఉంటాడు. మరొకప్పుడు ఇతఃపూర్వం అనుభూతమైన సుఖములను స్మరిస్తూ ‘ఇప్పుడవన్నీ నాకు లేవే?’ అను దీనత్వము సంతరించుకొంటాడు. ‘ఇతడే ప్రపంచంలోని దుఃఖాలన్నీ కాపురం ఉండే వృక్ష రాజమా…!’ అన్నట్లు కనబడతాడు. నవరసాలు పోషించే నటునిలాగా ఆ వ్యవహారమంతా ఆ భోతుని చిత్తము వేస్తున్న వేషములే.

మహాత్ముడగు ఆ భోష్ఠుడు తక్కువవాడేమీ కాదు. తలచుకుంటే, వాయువు సముద్రమును కదలించుచున్నట్లు, అతడు దేనినైనా జయించివేయగలడు. అందుచేత కొన్ని సమయములలో అతడు జాగ్రత్-స్వప్న-సుషుప్తులలోని శత్రువులందరినీ ఆక్రమించివేస్తున్నాడు. ఆ సమయంలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులు అతనికి సంపదలుగానూ, సామంత రాజ్యములుగానూ ప్రకాశి స్తున్నాయి గాని భారంగా కాదు. దుఃఖపూరితంగా కాదు. అంతయు జయించి, అంతయు గ్రహించి అతడు ఒక సమయంలో అత్యంత ప్రసన్నుడై సుఖిస్తూ ఉంటున్నాడు.

అతడు అంతరంగమందలి జ్యోతి చేతనే ప్రకాశితుడగుచున్నాడు. అయినప్పటికీ వ్యవహార దృష్టిలో అనేక మౌఢ్యతలచే పరివేష్టింపబడుచున్నాడు. ఎందుకో అనంత సంఖ్యలో అతనిని అనేక వేదనలు సమీపిస్తున్నాయి.

Page:253

  1. సంసార సాగరము - వికల్ప వ్యవహారము

దాశూరుని కుమారుడు: హే తండ్రీ! పవిత్రాంతఃకరణమూర్తీ ! మీరు పరోక్షంగా, ఏదో సత్యమును ప్రతిపాదిస్తున్నట్లు నా కనిపిస్తోంది. ఖోష్ఠుడు అనే పేరుతో మీరు చెప్పుచున్న ఆ రాజు ఎవరు? యథార్థానికి మీరు ఏమి చెప్పదలచారు? భవిష్యత్ నగర నిర్మాణం అనే పదప్రయోగానికి అర్థమేమిటి? ఈ వర్తమానకాలంలో కూడా అతడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అతని బ్రహ్మాండము ఎటువైపు ఉన్నది?

‘వర్తమాన-భవిష్యత్ నగరములు’… అని మీరు అనటం కొంత పరస్పర విరుద్ధంగాను, వ్యామోహజనితంగాను ఉన్నదని నాకనిపిస్తోంది.

దాశూరుడు: కుమారా! ఆ విషయాలన్నీ యథార్థరూపంగా చెపుతాను. శ్రద్ధగా వింటే, ఈ సంసారము యొక్క తత్త్వమేమిటో నీవే గ్రహిస్తావు. ఈ ప్రపంచము అసత్యమని, ’పరమార్థ సత్త’చే పరిశీలిస్తే ఈ జగత్తు లేనేలేదనీ తెలియజేయటానికే నిగూడార్థ రూపంలో ఉన్న ఖోతుడి గురించి విశేషములు వర్ణించి చెప్పాను. ఇక అసలు విషయం వినుఖోష్ణుడు: అవ్యాకృతాకాశము (A space where there tends to be no matter) నుండి ఉత్పన్నమైన సంకల్పాత్మకమగు మనస్సే ఆ పేరుతో మనం చెప్పుకున్నాం. అతడు (అనగా మనస్సు) స్వసంకల్పములచే జనించిన వాసనల చేతనే రూపము పొందుచున్నాడు. వాసనలే మనస్సు, వాసనారాహిత్యమే మనోరాహిత్యం.

తత్స్వరూవమిదం సర్వం జగదాభోగి విద్యతే ॥

జాయతే తత్ర జాతే తు తస్మిన్నష్టే వినశ్యతి ॥ (సర్గ 53, శ్లో 7)

ఈ కనబడే విశాల జగత్తు అంతా సంకల్పమయమగు మనస్సేగాని, మరింకేమి కాదు. మనస్సు యొక్క స్వరూపమే సంసారము A- ఈ శరీరాదులు కూడా. మనస్సు ఉత్పన్నమైనప్పుడే జగత్తు ఉత్పన్నమౌతోంది. మనస్సు నశిస్తే జగత్తు కూడా నశిస్తోంది.

వృక్షమునకు శాఖలు ఉంటాయి కదా! పర్వతమునకు శిఖరములు ఉంటాయి…. అలాగే ‘బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు ఇంద్రుడు’ మొదలైనవారంతా మనస్సు యొక్క అవయవములే అయి ఉన్నారు.

వాస్తవానికి బ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందు జగత్ సత్తరహితమే అయి ఉన్నది. అనగా బ్రహ్మము (అవ్యాకృత, ఆకాశము) నందు జగత్తులు, పదార్థములు, అహమ్, త్వమ్ సుఖ-దుఃఖ సంఘటనలు మొదలైనవేవీ లేవు. అత్యుత్తమమైన దృష్టిచే మనస్సు అనబడేది కూడా లేదు. అయితే, అట్టి బ్రహ్మము నందు ‘చైతన్యప్రతిభాస’ చేత ‘సమష్టి సృష్టి’ అను ఒకానొక స్వభావము ఉదయిస్తోంది. అది నీటియందు కెరటములు ఉదయించుట వంటిది. నేను ’సమష్టి

Page:254

సృష్టికి కర్తను’ అనే తత్త్వమే సమష్టిజీవుడు, విరించి, బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు… ఇత్యాది పేర్లతో చెప్పబడుతోంది.

ఇట్లు సంకల్పమయమగు మనస్సు ఈ త్రిలోకములను రచించుచున్నది. ఈ సూర్య చంద్రులు, 14 లోకములు, సుందరపర్వతములు, సముద్రములు, అందలి తరంగములు, భూమి, ఆకాశం మొదలైనవన్నీ సంకల్పము చేతనే రచించబడి విరాజిల్లుచున్నాయి. ఊర్ధ్వ-అధో లోకాలు, పుణ్య-పాపములు ఇవన్నీ ఉంటున్నది ‘మనస్సు’ అనే నగరంలోనే. ఈ దేవమనుజ-కిరాతక -పిపిలీకాది జీవులన్నీ పచార్లు చేస్తున్నది మనస్సు అనే మైదానంలోనే.

సంకల్పత్మాకమగు ’మనస్సు’ అనే రాజు యొక్క క్రీడ కొరకే ఈ ‘జగత్తు’ అను రూపంగల నగరంలో ‘అహంకారము - - దేహము - - దేహమును రక్షించు శక్తులు ’… ఇవన్నీ నిర్మించబడు చున్నాయి. అహంకారము చేత అనేక దేహములు నిర్మించబడగా, అందులో కొందరు ఊర్ధ్వమున దేవతలుగాను, మరికొందరు మధ్యగా మానవులుగాను, ఇంకొందరు పాతాళమున నాగులు మొదలైనవారు గాను నెలకొలుపబడుచున్నారు. వారంతా చెవులు-కళ్ళు-ముక్కు మొదలైన నవద్వారములతో, మాంసం-అస్థులు తదితర సరంజామాతో, వేరు వేరు ప్రాణవాయు సంచనలములతో సుఖ-దుఃఖసహితులై ఉంటున్నారు. పంచేంద్రియదేహులగు వీరందరు సంకల్పముచే నిర్మించబడిన నగరంలో నివసించేవారే సుమా! మనస్సే యక్షుని ప్రదర్శన వలె ఇట్లు అనేక రూపములను ధరిస్తోంది.

ధాన్యం కొట్టులో పిల్లి దాగి ఉన్నట్లు, కొలిమి తిత్తిలో పాముపిల్ల దాగినట్లు, ముత్యపు చిప్పలో ముత్యము ఉంటున్నట్లు ఈ శరీరములలో అహంకారము దాగి ఉంటోంది. దీపం క్షణంలో విజృంభించి క్షణంలో నశించునట్లు ఈ అహంకారం కూడా ఆయా ఉపాధులలో క్షణ కాలం విజృంభిస్తోంది. క్షణంలో ఆ ఉపాధులను త్యజిస్తోంది.

సముద్రములో తరంగాలు ఏర్పడుచున్నట్లు మనస్సులో అనేక సంకల్పాలు ఏర్పడు చున్నాయి. ఈ సంకల్పమయాత్మకమగు మనస్సు నిజసంకల్పిత వస్తువులను గాంచటం, అట్లు గాంచినవి భవిష్యత్తులో పొందటం జరుగుతోంది. అది సంకల్పించనిదేదీ పొందదు. ఆయా బాహ్య వస్తుజాలముతోను, తదితర ఉపాధులతోను సంబంధము వహించి, ‘ఇవి నాకు చెందినవి… వీటిని నేను పొందుటచే మాత్రమే సంతోషించగలను… ఇవి నేను ఎప్పటికీ కలిగి ఉండాలి…. వీరు నా వారు… వీరు పరాయి వారు…’ అను రీతిగా అది స్వప్నత్వము పొందుచున్నది. ‘భవిష్యత్ లో పొందవలసినవి… త్యజించవలసినవి’… అను రూపము గల ఉద్వేగము ఈ మనస్సు ఊహ-అపోహలను పొందుటచేతనే, మనం కథలో ‘భవిష్యత్ నూతన నగరమును పొందుచున్నాడు’ అని చెప్పుకున్నాం. ఈ మనస్సు ఇట్లు మొదట మాయాచక్రంలో తగుల్కొనుచున్నది. ఇక ఆపై జాగ్రత్ - స్వప్నములు పొందుచున్నది. ఎప్పుడో ఒకప్పుడు మౌన

Page:255

సుఖమును అపేక్షించి, సుషుప్తి యందు ప్రవేశిస్తోంది. అనగా ఈ మనస్సు ’అసంకల్పస్థితి’ వహించి భావరాహిత్యము అవధరిస్తోంది. కాని అది జడమగు స్థితే గాని మనోరాహిత్యస్థితి కాదు కదా! ఎందుకంటే జాగ్రత్-స్వప్నములలోని సంస్కారములు సుషుప్తి దశలో అప్రకటితంగా, అవ్యక్తంగా ఉండనే ఉంటున్నాయి. జాగ్రత్లో వ్యక్తం కావటానికి సంబంధించిన తహతహ అంతర్లీనంగా ఉండే ఉంటోంది.

ఒకదానివెనుక ఒకటిగా అనేక ఉపాధులందు తిరుగాడుచున్న ఈ మనస్సు ఒక సమయంలో సుఖవిశ్రాంతి కొరకు సమాధిని అపేక్షిస్తోంది. అట్లు సమాధిని ఆశ్రయిస్తూ, ఈ జన్మ పరంపరా వ్యవహారమును త్యజిస్తోంది. అప్పుడు మనస్సు యొక్క పరిభ్రమణమునకు ఆట విడుపు కలుగుచున్నది.

  1. సంకల్పరాహిత్యం-ఆత్మాశ్రయం

దాశూరుడు: ప్రియకుమారా! బాలుడు క్షణంలో సంకల్పించి భ్రమాత్మకమైన పిశాచాదులను ఎదురుగా చూస్తూ కెవ్వున ఏడుస్తాడు చూచావా? ఈ మనస్సు కూడా స్వకల్పనామాత్రం చేత అనంతంగా దుఃఖములను ఏర్పాటు చేసుకుంటోంది. సంకల్పమయాత్మకమగు ‘మనస్సు’ అనే రాజు ఈ ’విశాల ప్రపంచం’ రూపంగా తన దుఃఖమును విస్తరింప జేసుకుంటున్నాడు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలగుతాయి కదా! ఎప్పుడైతే ఈ మనస్సు ‘ఖండితమగుసత్త’ యొక్క అభావన ఆశ్రయిస్తుందో, అప్పుడు అది క్రమంగా తన ’జగత్తు రూపవిస్తరణ’ను కూడా నశింప జేసుకొంటుంది, లేక ఉపసంహరించుకుంటుంది.

ప్రాపంచిక సుఖ విశేషాలు ఎట్లాంటివి? మనస్సు యొక్క కోతి చేష్ట మాత్రమే!

కోతి చేష్ట - ఈ మనస్సు యొక్క పరితాపములకు అంతు ఎక్కడ? ఇందుకు పెద్దలు ఒక దృష్టాంతం చెపుతూ ఉంటారు. ఒక వడ్రంగి పెద్ద దుంగను అంపముతో మధ్యకు చీలుస్తూ ఉన్నాడు. ఇంతలో భోజనమునకు సమయం అయింది. అందుచేత రెండుగా విభాగించబడుచున్న దూలం మధ్యలో ఒక పుల్లను ఇరికించి భోజనానికి వెళ్ళాడు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చింది. స్వకీయమైన చపలచిత్తంతో, ఆకతాయితనంగా నిరర్థకమైన కుప్పిగంతులు, పరుగులు, లాగడం, పీకడం చేస్తూ, చేస్తూ ఆ దుంగ మధ్య తన కాలుపెట్టి పుల్లను పెరకనారంభించింది. ఇంకేముంది? కొద్ది క్షణాలలో పుల్ల జారిపోయింది. ఆ కోతి యొక్క కాలు దుంగ యొక్క చీలికలో ఇరుకుకొన్నది. ఇక ఆ కోతి బాధచే పెద్దగా కేకలు వేయనారంభించింది…. ఈ మనస్సు యొక్క చర్యలు కూడా అట్టివే. ఇది తన చపలచిత్తముచే స్వకల్పనలయందు చిక్కుకుని మహాపరితాపం పొందుతోంది.

కుక్క, బొమిక (ఇంకొక దృష్టాంతం) - ఒక కుక్కకు ఒక బొమిక ఎక్కడో దొరికింది. ఆకలితో నకనకలాడుచున్న ఆ కుక్కకు ఆ బొమికను చూడగానే రుచికరమైన మాంసము లభించి నట్లు

Page:256

భావన ఏర్పడింది. ఆవురావురమంటూ బొమికను నమలసాగింది. పాపం, ఆ నములుచున్న వేగానికి పంటి నుండి రక్తం కారసాగింది. అప్పుడు ఆ కుక్క ఇట్లా అనుకుంటోంది… "ఈ బొమిక నిస్సారమైనదని మూర్ఖులు అనుకుంటున్నారు. నాకు ఇందులోంచి రక్తం లభిస్తోంది. నేను తెలివి గలదానను కాబట్టి ఇందులోంచి రక్తం పొందుచున్నాను కదా…!” ఇక ఆ రక్తమును చప్పరించ సాగింది. ఈ మనస్సు యొక్క సుఖవేదన కూడా అట్లే ఉంటోంది.

గాడిద, తేనెతుట్టె (ఇంకొక దృష్టాంతం) - ఒక గాడిద నిస్సత్తువగా నడుస్తోంది. ఒక చోట నేలపై పడ్డ తేనెతుట్ట కనబడింది. అందులో తేనె చుక్క కూడా లేదు. అయినా ఆ గాడిద నిస్సార మగు తుట్టెను నములుతూనే ఉన్నది. దానికి మిగులుచున్నది పంటిబాధ మాత్రమే. ఆ తుట్టెను వదిలితే తేనె లభించలేదని దుఃఖం. నములుతూ ఉంటే, కళ్ళవెంట నీరు కారేంత శ్రమ.

అట్లాగే ఈ మనస్సు కూడా విషయభోగములందు తగుల్కొని ఉంటోంది. ఈ మనస్సు యొక్క చేష్టలు గురించి ఏమని చెప్పాలి? క్షణంలో ఆసక్తి. మరుక్షణం విరక్తి. బాలుని చేతలు లాగా క్షణక్షణం ఏవేవో వికారములను పొందుతోంది. విషయాలు లేకపోతే లేనందుకు దుఃఖం విషయాలు ఉంటే, విషయాల వలన దుఃఖం.

దాశూరుని కుమారుడు: తండ్రీ! మీరు చెప్పుచున్నది అక్షరాలా నిజం. ‘భోత్తుడు’ అను శబ్దార్ధంతో మీరు వర్ణించి చెబుతూన్న ఈ మనస్సు నన్ను క్షోభింపజేస్తోంది. నేనిప్పుడు ఏం చేయాలి? దాశూరుడు: ఈ మనస్సు ఏ ఏ విషయములలో, వస్తువులలో తగుల్కొనుచున్నదో సుతీక్షమైన దృష్టితో పరిశీలించు- ఇది దేనిని ‘ప్రియము’ అని భావిస్తోంది?… దేనిని ద్వేషిస్తోంది?… వేటి వల్ల కామం, క్రోధం, మాత్సర్యం కలిగి ఉంటోంది?… దేనిని మమకార దృష్టితో చూస్తోంది?… కాస్త గమనించు, క్రోడీకరించి, పర్యవేక్షించు.

ఇప్పుడు, సంకల్పాత్మకమగు ఈ మనస్సును అట్టి బాహ్య విషయముల నుండి వెనుకకు మరల్చు. అనగా, క్రమంగా వాటి గురించి సంకల్పించటం సన్నగిల్లాలి. అందుకు సమాధిని, మౌనమును అవలంబించు. ‘ఆత్మజ్ఞానం’ అనే తరుణోపాయంచే ఈ మననం చేయు స్వభావమును యుక్తియుక్తంగా నిర్మూలించు. బ్రహ్మము యొక్క స్వభావమును ఆశ్రయించు. నీచే ఆత్మ విశ్రాంతి స్వీకరించబడుగాక!

అందుకుగాను మన ఈ వర్తమాన చర్చవంటి ప్రయత్నములు తప్పక ఉపకరించగలవు. దాశూరుని కుమారుడు: పితృదేవా! మీరు జీవుని యొక్క మూడు శరీరముల గురించి ప్రస్తావనకు తెచ్చారు. ఆ మూడు శరీరముల యొక్క విశేషములేమిటో వివరించండి.

దాశూరుడు: ’సంకల్పించుట’ అనునదే తన యొక్క రూపముగా గల ఈ మనస్సుకు మూడు స్వభావములు ఉన్నాయి. ఆ మూడు స్వభావములు ఉత్తమ మధ్యమ-అధమ రూపములు కలిగి యున్నవై, ఈ జగత్ స్థితికి కారణమగుచున్నాయి. ఈ మూడు శరీరములే ‘సత్వ-రజ-తమో గుణములు’ గా సంజ్ఞాపూర్వకంగా చెప్పబడ్డాయి.

Page:257

మనస్సు యొక్క తమోరూపం - ఈ ప్రకృతికి సంబంధించిన స్వాభావిక క్రియలచే నిత్యం అజాగ్రత్త, సోమరితనం, నిద్ర, బద్ధకం, ఆలస్యం వంటి సంకల్పాలు ఉదయిస్తూ ఉంటున్నాయి. అట్టి సంకల్పముల కారణంగా ఈ జీవుడు ఎంతో దీనత్వం పొందుచున్నాడు. ఫలితంగా ‘క్రిములు, కీటకములు, స్థావరములు’ మొదలైన యోనులు ప్రాప్తించటం జరుగుతోంది.

మనస్సు యొక్క రజోరూపం - ఈ స్వభావంచేత రాగము, తృష్ణ, కర్మలతో వస్తువుతో సంగము, లోభము, ఆలోచనల నుండి క్రియల నుండి విరమించలేకపోవటం వంటి సంకల్ప స్థితులు కలుగుతూ ఉంటాయి. రజోగుణ రూపమైన సంకల్పములచే ఈ జీవుడు ‘మానవజన్మ’ కు యోగ్యమైన వ్యవహారములు ఆచరించటం జరుగుతోంది. అయితే, కార్యసాధకమగు మానవ ఉపాధి పొందిన తరువాత ఉత్తమ కార్యక్రమంతో సమున్నతి కొరకై సమయాన్ని, అవకాశాలను సద్వినియోగపరచుకొనే బదులుగా, ఈ మానవ ఉపాధి ధరించియున్న సమయమంతా ఈ జీవులలో కొందరు ఈ లోకంలో ‘పుత్రులు-ధనం- గృహాలు’ మొదలైనవి పొందుటకు మాత్రమే యత్నిస్తున్నారు. వాటి యందు సంతోషమును వెతకటం చేస్తున్నారు. ఈ విధంగా అజాగ్రత్తపరులు అథమ స్థితులవైపు ఆకర్షితులగుచున్నారు.

మనస్సు యొక్క సత్వరూపం - ఈ స్వభావం చేత మనస్సు ‘జ్ఞానం-శాశ్వతసుఖం -అప్రమేయత్వము’ వంటి సంకల్పములను ఆశ్రయిస్తోంది. ఆ జీవుడు సత్వరూప సంకల్పములచే ‘ధర్మము-జ్ఞానము’ మొదలైన వాటి యందు ప్రియమును పొందుచున్నాడు. ఆ మనస్సు అట్టి ధర్మ-జ్ఞానములను ఆశ్రయిస్తూ క్రమంగా అచిరకాలంలో ‘కేవలీభావము’ను ఆశ్రయిస్తున్నది. శాస్త్రములచే వర్ణించి చెప్పబడుచున్న ‘స్వారాజ్యస్థితి’ని పొందుచున్నది. సత్వగుణానుకరణం కారణంగా ఈ దృశ్యమునకు సంబంధించిన సర్వ ప్రతిబంధకములను క్రమంగా త్యజిస్తోంది. ’దృశ్యపారతంత్ర్యము’ (దృశ్యానికి వశం అగుట) అనుదాని నుండి స్వాతంత్ర్యం పొందుచున్నది. ‘బ్రహ్మపదము’ లేక ‘మోక్షము’… అనగా సర్వసంకల్పముల రహితత్వమని గ్రహించు. సర్వాదృష్టీః పరిత్యజ్య నియమ్య మనసా మనః । |

సబాహ్యాభ్యన్తరార్థస్య సంకల్పస్య క్షయం కురు ॥ (సర్గ 53, శ్లో 38) కాబట్టి కుమారా! బాహ్యదృష్టులన్నీ త్యజించు. మనస్సు నందు ఈ బాహ్య అభ్యంతరములలోని సర్వపదార్థముల గురించిన సంకల్పములను రహితం చేయి.

మనస్సు చేతనే మనస్సును నిగ్రహించాలి. సంకల్పరాహిత్యమే బంధవిముక్తి.

ఒకడు వేలకొలది సంవత్సరముల తపస్సు చేయవచ్చు గాక! లేక, ఈ దేహమును నేలపై ఘర్షింపజేస్తూ చూర్ణం చేయవచ్చు…, అగ్నిలోనో, బడబాగ్నిలోనో ప్రవేశించవచ్చు…, భయంకర మైన గుంటలలోనో, కత్తుల సమూహంపైననో దూకి ఈ శరీరమును ఖండఖండములుగా చేసుకొనవచ్చు…! ఏ త్రిమూర్తులనో, లేక కరుణా సముద్రులగు దుర్వాస దత్తాత్రేయ-బుద్ధుడు మొదలైనవారిని ’ఉపదేష్ట’లుగా కలిగియుండవచ్చు…! స్వర్గ-మర్త్య-పాతాళ భూలోకములలోని

Page:258

ఏవైనా ప్రత్యేకతలు గల ప్రదేశాలలో వసించవచ్చు గాక…! కాని ఏం ప్రయోజనం? ఏం లాభం? జరుగునదేమిటి? చివరికి ‘సంకల్పానాశనం’ ఆశ్రయించి, తద్వారా మాత్రమే సంకల్పములను జయించగలడు గానీ, వేరే త్రోవ లేదు. సంకల్పరాహిత్యం చేతనే మోక్షం లభించగలదని మాత్రం గ్రహించు. ’పరిశుద్ధ స్థితి’ అయినట్టి మోక్షము లేక ’బంధవిముక్తి’కి సంకల్పరాహిత్యమే ఆత్యంతిక మైన ఉపాయం.

తదితరములైన అనేక చోట్లకు పోవుచున్న మనస్సును వెనుకకు మరల్చి ఆత్మభగవానుని కరచరణముల వద్దకు చేర్చాలి. ఆ తరువాత ఆత్మవస్తువుకు వేరైన సంకల్పపరంపరలు త్యజించాలి. సర్వము ఆత్మస్వరూపంగా సందర్శించాలి.

“ఇక్కడ ఆత్మకు వేరైనదేదీ లేనేలేదు” అను అఖండానుభవము దృఢీకరణమగుగాక!

అందుచేత చిరంజీవీ! నీకు నీవే సంకల్పనాశనమునకై ప్రయత్నించు. నీ సంకల్పములు నీస్వస్వరూప-స్వస్వభావమునందు విలయించుచుండగా, అప్పటి సంకల్పించు సంస్కారమునకు ఆవల ఉన్నట్టి నీయొక్క అనిర్వచనీయస్థితి-బాధారహితమైనదీ, పరమపవిత్రమైనదీ, సుఖమయ మైనదీ అని నీవే గ్రహించగలవు. అయితే అట్టి సంకల్పానాశనము అప్రయత్నశీలునికి ఎలా లభిస్తుంది చెప్పు? అందుచేత సంకల్పముల అతీతత్వము కొరకై అందుకు ’శ్రవణ మనన -నిధిధ్యాస’ రూపములతో కూడిన ఉత్తమ ప్రయత్నములను నీవు ఆశ్రయించాల్సిందే.

ఓ పాపరహితుడా! కుమారా! నీచే అనుక్షణికంగా ‘సంకల్పములు’ అను సూత్రపు దారానికి ఈ సమస్త పదార్థములు గ్రుచ్చబడి ఉన్నాయి. అట్టి సంకల్పదారం త్రెంచబడిందా… క్షణ భంగురమగు ఈ ప్రాపంచిక పదార్థములన్నీ నీ నీ సమక్షమునుండి మటుమాయం అవుతాయి. సత్-అసత్ మయమైనట్టి వికల్పములన్నీ నీయొక్క సంకల్పమునుండే ఉత్పన్నమౌతున్నాయి గాని, మరింకెక్కడినుండీ కాదు. అన్నిటికీ కారణం ’నీవు సంకల్పించుట’యే! సర్వమునకు కారణమైయున్న సంకల్పము ద్వారా ‘ఇది సత్తా? అసత్తా?’ అనే చర్చలు ఆశ్రయించినంత మాత్రం చేత ఉత్తమ ప్రయోజనం లభించుటలేదని విజ్ఞుల యొక్క అనుభవం. వికల్పములగు ఈ పదార్థములు… సత్యవస్తువు… సర్వసంకల్పములకు అతీతము, పరిశుద్ధము… పరమార్థము… అయిఉన్న బ్రహ్మమును స్పృశించగలవా? లేదు.

అందుచేత, “నీ సర్వ సంకల్పములు లయించగా అప్పుడు “నీ సమక్షంలో శేషించునదే బ్రహ్మము’ అని గ్రహించు. నీవు ఇక బ్రహ్మవేత్త మాత్రుడవు కాదు. బ్రహ్మమే అవుతావు. కార్య రూపమున ఉన్న ఈ దృశ్యవ్యవహారమంతా కూడా కారణరూపమగు ’స్వసంగము, (one’s own attachment) లేక ‘స్వసంకల్పములు’. (one’s own perceptions…) అను వాటియందే ప్రవర్తించు చున్నది సుమా! స్వసంకల్పరాహిత్యము చేతనే ఈ ‘జగత్తు లేకుండా పోవుట’ జరుగగలదు. సంకల్పరహిత శుద్ధ స్వస్వరూపమే పరబ్రహ్మము.

Page:259

పుత్రా! నీకు మరల గుర్తు చేస్తున్నాను. నీ మనస్సు దేనిని ఏ విధంగా స్థితిపూర్వకంగా (As a form of) చింతిస్తుందో అది అట్లే పరిణమించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అందుచేత నీవు సర్వవేళల సంకల్పములకు ఆవల ప్రశాంతుడవై ఉండుటను అభ్యాసం చేయి. “నేను సంకల్పించుట - అను ప్రక్రియ కంటే ముందే శుద్ధుడనై ఉన్నాను… కనుక వాస్తవానికి సంకల్పరహితుడనే” అను ఎఱుకను గ్రహించి ఉండు. అటుపై ప్రాప్తించిన వ్యవహారములను ఆచరిస్తూ ఉండు. సంకల్పాలు త్యజించుచుండుటచే క్రమంగా అభ్యాసవశంచేత చిదాత్మ ఈ విషయముల నుండి (శబ్ద-స్పర్శ - రూప-రస-గంధాదుల నుండి) స్వయముగా వెనుకకు మరల గలదు.

ఆహాఁ! చమత్కారం గమనించావా! కేవలం సత్యస్వరూపము, బ్రహ్మమయము అగు ఆత్మ అసత్యమగు ’మాయ’కు వశమై ఈ దేవ మనుష్య జంతు ఆదిగా గల భిన్న యోనులలో జన్మి స్తోంది. వ్యర్థంగా ఈ జగత్తు రూపంలో గల దుఃఖములన్నీ అనుభవిస్తోంది. ఇదంతా శుద్ధమగు ఆత్మకు యోగ్యమైనదేనా? … కానే కాదు. అనేక యోనులలో, ఉపాధులలో ప్రవేశిస్తూ మృతి చెందుతూ… ఈ విధంగా దుఃఖములన్నీ అనుభవిస్తూ ఉండటం వలన ఏం ప్రయోజనం చెప్పు? అందుచేతనే బుద్ధిమంతులగు వారు అన్నిటిని ప్రక్కకు పెట్టి దుఃఖరహితమగు ఆత్మనే ఆశ్రయిస్తున్నారు. ఇక బుద్ధిహీనుల వ్యవహార మంటావా… అది మనకు అనుసరణీయం కాదు కాబట్టి అప్రస్తుతమే అవుతుంది. దాని వలన కలిగే ఉత్తమ ప్రయోజనం ఏమున్నది? బుద్ధి హీనత్వం అనేక దుఃఖములకే దారితీస్తోందని గుర్తు చేస్తున్నాను. అందుచేత నీవు తత్త్వజ్ఞానం కొరకే ప్రయత్నించు. ఈ వికల్పజాలమంతా బలత్కారంగా దూరీకరింపజేయి.

నిరతిశయానంద ప్రాప్తి కొరకు అద్వితీయమగు మోక్షపదము కొరకు యత్నించు. అట్లా కాకుండా, స్వల్ప లక్ష్యాలతో దృశ్యవ్యవహారం నందు బద్ధుడవు అయితివా… నిబిడాంధకార రూపములగు అనేక దుఃఖపరంపరలు నీ కొరకు వేచి ఉంటాయి. ఇప్పుడు నీ ఎదురుగా రెండు మార్గములు ఉన్నాయి- 1) సంకల్పించుట అను స్వభావము ఆశ్రయించి ఉండుట 2) సంకల్ప రాహిత్యమును అభ్యసించుట. ఈ రెండింటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకో. సమన్వయం చేయి. ఆపై నీ ప్రయత్నములను తదనుకూలంగా తీర్చిదిద్దుకో.

  1. సంకల్ప విచికిత్స

దాశూర పుత్రుడు: తండ్రీ! ఈ సంకల్పము అనేది ఏ విధంగా ఉంటోంది? అసలు అది ఎట్లా ఉత్పన్నమౌతోంది? ఎట్లా వృద్ధి చెందుతోంది? ఎట్లా నశిస్తోంది? ఎలా, ఎక్కడి నుండి, ఎప్పటి నుండి, ఎవరి ప్రోద్బలంచేత ఎవరి కొరకు బయల్వెడలుతోంది?

దాశూరుడు: అనంతము - సత్తాసామాన్యము - ఆత్మస్వరూపము అగు చైతన్యము నిర్వచించబడ లేనట్టి కారణంగా ఒకానొకప్పుడు విషయములవైపు ఉన్ముఖమగుచున్నది. అట్లు విషయములవైపు

Page:260

ఉన్ముఖం అగుటయే సంకల్పము యొక్క అంకురము. ఆ అంకురం అల్పమాత్రమే అయినప్పటికీఅ , అది సత్తను పొందినదై చిదాకాశము యొక్క నలువైపుల వ్యాపించుచున్నది. ఆ సంకల్పాంకురము తన అధిష్ఠానమగు ’చిత్ స్వరూపము’ నే మరుగుపరచుచున్నది. అటుపై జడమగు ప్రపంచాకారం పొందుటకు గాను క్రమంగా ఘనత్వం పొందుతోంది. అట్లు ప్రాప్తిస్తున్న విషయ రూప జగత్తును ‘ఇదంతా నాకంటే వేరుగా బాహ్యమున ఏర్పడి ఉన్నది.. అను భావన చేస్తోంది. ఒక బీజము ‘మొలుచుట’ అను క్రమమును పొందుచున్నది చూచావా? అట్లాగే, ఆ చిత్ శక్తి సంకల్పత్వము పొందుతోంది. అటుపై ఒక సంకల్పము నుండి మరొక సంకల్పము ఉదయిస్తోంది. ఇక ఆపై ఈ సుదీర్ఘమైన సంకల్ప వ్యవహారమంతా విస్తరిస్తోంది. సంకల్పముల వెంట నిష్కారణంగా దుఃఖ పరంపరలు వచ్చి పడుచున్నాయి. అయితే సముద్రములో ఎన్ని తరంగాలు ఉదయిస్తే ఏమున్నది? అవన్నీ జలమే అయి ఉన్నాయి కదా! ఈ జగత్తంతా సంకల్పమాత్రమే. సంకల్పము తప్ప వేరుగా ఈ ప్రపంచంలో దుఃఖ-సుఖములంటూ ఎవరికీ ఏవీ లేవు.

ఈ మనస్సు కాకతాళీయన్యాయం చేత వివర్తభావము ఆశ్రయిస్తోంది. ఇది మిథ్యా రూపముననే ఉత్పన్నమౌతోంది. మృగతృష్ణవలె, రెండవ చంద్రుని భ్రాంతివలె ఇది అసత్యమైనదే! కాని దీని వృద్ధిని మాత్రం మనం చూస్తున్నాం. ప్రకృతి శాస్త్రంలో ‘మాతులుంగము’ అను పేరుగల చెట్టు గురించి చెబుతారు. ఆ చెట్టు పళ్ళు తిన్నవారికి అంతఃకరణంలో తెల్లటి పదార్థముల పట్ల భ్రాంతిపూర్వకమైన ప్రీతి ఏర్పడుతుంది. ఫలితంగా తెల్లటి పదార్థములు అత్యంత రుచికరమైనవిగా అనుభవమౌతుంది. ఆ ప్రీతి అసత్యమే అయినప్పటికీ తెల్లటి పదార్థములు తింటున్నప్పుడు అతనికి ప్రశస్తమైన రుచి మాత్రం అనుభవమౌతుంది. అదే విధంగా, మత్తు పదార్థములు సేవించువారికి చుట్టూ ఉన్న వస్తువులన్నీ గాలిలో తేలియాడుచున్నట్లు అనుభవమౌతాయి. ఈ వస్తువులు ఎగిరి పడటం అవాస్తమే అయినప్పటికీ అతనికి సత్యముగానే అగుచున్నది. ఈ జీవునియందు ‘సంకల్పించుట’ అను ప్రవృత్తి ఉద్భవించి, ఈ పదార్థములతోటి… వ్యక్తులతోటి సంబంధము వాస్తవమైన అనుభవముగా అతనికి ప్రాప్తించుచున్నది. కానీ అవన్నీ ఈ జీవుని యొక్క ఇష్ట-అయిష్టములను ఆశ్రయించే ఉంటున్నాయి.

దాశూరుని కుమారుడు: పితృదేవా! ఈ జన్మ-కర్మలకు, ఈ సంబంధాదుల భ్రమలకు కారణం అంతరమైనదా? బాహ్యమైనదా? నేను తదితరులు ఎట్లా ఉత్పన్నమగుచున్నాము?

దాశూరుడు: నీవు మిథ్యారూపముననే ఉత్పన్నమైనావు. అట్లే నేను కూడా. ’ఈ శరీరము - దృశ్యము తదితర సంబంధ బాంధవ్యములు’… దృష్ట్యా చూచినప్పుడు మనమందరం మిథ్యారూపులమే. ఇక నిత్య-సత్య-శుద్ధమగు మన స్వస్వరూపము దృష్ట్యా మనం సర్వదా సత్స్వరూపులమే. మన యొక్క ‘సత్’ స్వరూపమున ఏ క్షణమందు ఎట్టి మిథ్యాత్వము లేనేలేదు. నేను బోధిస్తున్న ఈ మన ఆధ్యాత్మ శాస్త్రాన్ని తెలుసుకున్నావా - ఇక మిథ్యాత్వము నీ దృష్టి నుండి పూర్తిగా తొలగిపోగలదు.

ఈ దుఃఖజాలమంతా నీకు ఎందుకు ప్రాప్తిస్తోంది…? చెప్పమంటావా! ’వేద వేదాంతాలచే సుస్పష్టపరచబడుచున్నట్టి పూర్ణాత్మ అనగా… నేనే! అట్టి ఆత్మకు గాని, ఆత్మయే స్వరూపముగా గల

Page:261

నాకు గాని, ‘నేను’ ’నాది’ అనునదంతా ఉండజాలదు. తదితర పదార్థములగు వస్తువులు -

సుఖము-దుఃఖము-జన్మలు-మొదలైనవన్నీ మిథ్యారూపమే అయి ఉన్నాయి…’ అనునట్టి ఎరుకకు సంబంధించిన విశ్వాసం ఏర్పడకపోవుట చేతనే.

ఇదే ‘ఆత్మ విశ్వాసం’ సుమా! అట్టి ఆత్మ విశ్వాసము దృఢపడిన తరువాత ఇక అజ్ఞానమునకు కారణం ఏం ఉంటుంది? ‘నేను ఆత్మను… శరీరమును కాను’… అను విశ్వాసం లేకపోవటచేతనే ఈతడు అజ్ఞానమునకు చోటిచ్చుచున్నాడు. క్షణంలో స్వల్పవిషయాలు కూడా అతనిని విచలితుణ్ణి చేస్తున్నాయి. ఎక్కడ విచారణ చేసిన తరువాత ఇక దుఃఖము ఉండదో, అక్కడ విచారణ చేయటం మానివేసి ఈ జీవుడు దుఃఖితుడై చతికిలపడుచున్నాడు.

కుమారా! వాస్తవానికి ఈ జన్మాదులతో గాని, ఈ దృశ్యములోని ఆయా పదార్థములతో గాని నీకు ఏ సమయమందు కూడా సంబంధం లేదు. అయినప్పటికీ భ్రాంతిచే నీకు నీవే అట్టి సంబంధమును కల్పించుకొనుచున్నావు. కాస్త యథార్థ దృష్టితో చూచి, ఈ ఆత్మకు జన్మలు ఎక్కడ ఉన్నాయో చెప్పు? శరీరము కంటే ముందు కూడా నీవు ఉన్నావు. అనగా, ఈ శరీరముతో నీవు పుట్టుట లేదు - ఇతఃపూర్వమే ఉన్నావు. శరీరము నేలకూలిన తరువాత కూడా నీవు ఉంటున్నావు. అనగా శరీరపతనంతో బాటు నీవు రహితం అగుటలేదు. ఈ శరీరము ఉన్నప్పుడో, నీ ఉనికి గురించి వేరే చెప్పేదేమున్నది? మనో-బుద్ధి-అహంకారములతో కూడిన సూక్ష్మశరీరముతో ఈ శరీరమును ఉపయోగించుకుంటూ సంచారము సలుపుచూ ఉండనే ఉన్నావు కదా! సూక్ష్మశరీరం యొక్క చావు పుట్టుకలను ఎవరైనా గాంచుచున్నారా? లేదే. లేనప్పుడు ’నేను చచ్చాను… ఆతడు చచ్చాడు’… అనునదంతా భ్రమ కాక మరేమిటి?

వాస్తవానికి నీవు ఒక్కడివే సత్యము. సూక్ష్మశరీరము కూడా అసత్యము మాత్రమే. జలమే సర్వదా సత్యము. జలము కంటే వేరైనది జలము కానిది - అగు ‘తరంగములు’ అనబడేది. ఎక్కడైనా లభిస్తుందా? అందుచేత, ‘నేను జ్ఞానం పొందియున్న - - పొందియుండని సమయాలలో కూడా శుద్ధ చైతన్యస్వరూపుడనే అయి ఉంటున్నాను’… అని గ్రహించు. దోషపూరితమైన సంకల్పములకు వశీభూతుడవగుటచేతనే ఇట్లు మూఢుడివి, సంసారివి అగుచున్నావు.

పుత్రా! ఇప్పుడు చెప్పేది విను. ఇతఃపూర్వం అనుభూతములైన సుఖ-దుఃఖాది పదార్థముల గురించి ‘సంస్మరించుట-సంకల్పించుట-సమాశ్రయించుట’లను క్రమంగా సన్నగిల్లచేయి. ఎట్లా? కేవలం అఖండము, నిర్మలము, నిత్యము అగు ఆత్మను భావన చేయుట చేతనే. అట్టి భావనామాత్రంచేత ‘ఆత్మసిద్ధి’ అనే ఐశ్వర్యం పొంది ఈ జీవుడు భవ్యజీవుడు కాగలడు. “నేను జన్మ మృత్యు రహితుడను… శుద్ధుడను… శాశ్వతమగు అమృతస్వరూపుడను”… అని భావన చేయుటలో ఏమి కష్టమున్నదో నాకు చెప్పు? మరి జనులు ‘మోక్షము దుర్లభము’ అని ఎందుకు అంటున్నారో నేను గ్రహించలేకపోవుచున్నాను. ‘మోక్షమనేది చాలా కష్టమైన విషయం’ అని బాలురు మాత్రమే అంటున్నారు.

Page:262

‘ఎందుకని అట్లు అనిపిస్తోంది?’… అనేది మేము పరిశీలించాం. కారణం…? ‘వారి స్వస్వరూపమునందు వారికి తగినంత విశ్వాసం ఏర్పడకపోవుట చేతనే’… అని అనక తప్పదు.

స్వస్వరూపము పట్ల అట్టి విశ్వాసము కలిగించి, తదితర పదార్థముల పట్ల, విషయముల పట్ల అనాసక్తి-దుఃఖరాహిత్యం కలుగజేయటానికే ఈ వేద వేదాంత క్రియా-జ్ఞాన వ్యవహారాలన్నీ ఉన్నాయి. “దృశ్యఅనాసక్తి-ఆత్మవస్తువును ఎఱుగుటలో ఆసక్తి” కలిగించునంతవరకే ఈ విధి నియమాదుల పాత్ర. ఎప్పుడైతే స్వస్వరూపమగు ఆత్మయందు పూర్ణవిశ్వాసము సుస్థిరమౌతుందో, అట్టి అప్పటి ఉత్తమస్థితి ’మోక్షస్థితి’ కంటే వేరైనదేదీ కాదు సుమా!

అభావించటం - ఎప్పుడైతే నీవు సంకల్పనాశనము కొరకు యత్నిస్తావో, ఇకప్పుడు ఈ జనన-మరణాది భయమును పొందవు. ‘భావన’ చేయకున్నంత మాత్రంచేత సంకల్ప ప్రవాహం క్రమంగా క్షీణించగలదు.

ఒక పువ్వు యొక్క దళములు మర్ధించాలంటే కొంత శ్రముంటుందేమో, చేతులు మర్దించాలి. ‘భావించక పోవుట’ యందు క్రియకు సంబంధించిన శ్రమయే ఉండదు కదా! ఇక ఇందులో కష్టమేమి ఉంటుంది? కల్పనావినాశనము… అను మోక్షస్థితి కష్టమైనదనుట భావ్యం కాదు. చేతుల మర్దన అనే శ్రమ కూడా ఉండనట్టిది మోక్షభావన.

కేవలం భావనా విస్మరణ మాత్రం చేత అరక్షణంలో సంకల్పవినాశనం సిద్ధిస్తుంది. అయితే, ఎటొచ్చీ అట్టి ‘సంకల్పరాహిత్యస్థితి’ లో సుస్థిరుడవై ఉంటే చాలు. భావాతీతమైనదే తత్పదం.

నిరంతరం ఆత్మ యొక్క పూర్ణానందరూపమును చింతనచేస్తూ ఉండు. ఆత్మయందే స్థితి కలిగియుండు. అప్పుడు అసాధ్యమగు వస్తువు కూడా సిద్ధించగలదు. ఇందులో సందేహం లేదు. ఆత్మ దేనిచేతను హరింపబడుటగాని, నశింపజేయబడుట గాని, సంభవింపజాలదు. అందుచేత ఉత్తమ సంకల్పంచే అధమ సంకల్పాన్ని త్యజించివేయి. “ఈ కనబడే ఈతడు మమాత్మ స్వరూపుడే కదా!” అను భావనతో వ్యవహరిస్తూ ఉండు. ‘నేను పూర్ణమగు ఆత్మనే’ అనేదే ఆ ఉత్తమ సంకల్పం.

మనస్సుతో మనస్సును విచ్ఛిన్నం చేయి. స్వాత్మయందు సుస్థిరుడవై ఉండు. ‘నిస్సంకల్ప మాత్రము, సులభసాధ్యము’… అయినట్టి ఈ మాత్రం ప్రశాంతబుద్ధిచే గ్రహించటంలో, ఆచరించటంలో ఏమి కష్టమున్నదో చెప్పు?

’అట్లా ఎట్లా? మోక్షము అంత సులభమా? అంత తేలికగా నాకు లభించుటయా? లేదు… అది మాకు ఎన్ని జన్మలకో గాని లభించదు…’ అని నీవు సంకల్పించటం జరిగితే, ఇక ఆ తరువాత ఆ తదనంతర ప్రాప్తి కూడా అట్లే అయి ఉంటున్నది.

‘నేను ఇప్పటికే పూర్ణుడను, మోక్షస్వరూపుడను, ఈ మనో-బుద్ధి-చిత్త-అహంకారాదులకు సంబంధించనట్టి శుద్ధస్వరూపడను’… అని భావన చేశావనుకో.. నీ అనుభవం తదనుకూలంగానే ఉంటోంది. భావన యొక్క అనుసంధాన తీవ్రతను అనుసరించి అది అట్లే సత్యమై నీవు ఈ క్షణమందే మోక్షస్వరూపుడవు, పూర్ణుడవు కాగలవు.

Page:263

సంకల్పము మొత్తముగా శమించిందా… ఈ జగత్తంతా శమించగలదు. ఓ మహామతీ! సంకల్పము యొక్క అభావమాత్రం చేత సంసారదుఃఖమంతా సమూలంగా తొలగిపోతుంది. సంకల్పో హి మనోజీవచ్చిత్తం బుద్ధిః నవాసనా |

నామ్నైవాన్యత్వమేతేషాం నార్థేనార్థవిదాంవర ॥ (సర్గ 54, శ్లో 20)

సంకల్పమే మనస్సు. అదియే “జీవుడు, చిత్తము, వాసనాసహితమగు బుద్ధి” కూడా. ఈ మనస్సు-బుద్ధి-అహంకారము చిత్తము మొదలైన వాటియందలి భేదమంతా నామమాత్రమే గాని వాస్తవం కాదు. సంకల్పమునకు అన్యముగా ప్రపంచమున ఏదీ కించిత్ కూడా లేదు.

అట్టి సంకల్పము అనబడుదానిని నీ హృదయంలోనే, “నీ చేతిలో ఓడిపోయిన నీ సామంత రాజు” వలె స్వవశం చేసుకోవాలి. అట్లు చేయకుండా ఊరకే ఎందుకు పరితపిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు.

  1. ఆరోపితం

దాశూరుడు: ఈ జగత్తు “ఆకాశము” వలె శూన్యమైనది మాత్రమే.

దాశూరపుత్రుడు: ఈ జగత్తు శూన్యమైనప్పుడు ద్రష్ట కూడా శూన్యుడే అవుతాడా? "జగత్తు లేదు” అనుకుంటే, జగద్వ్యవహారములే కుదరవు కదా? అప్పుడు అట్టి అవగాహనగల జీవులతో నిండిన జగత్తు జడమే అయిపోతుందేమో?

దాశూరుడు: విశాలమైన ఎడారిలో ఒకడు ’మృగతృష్ణ’ను చూచాడనుకో… విశ్లేషణచే “మృగ తృష్ణలో జలము ఉండదు" అని గ్రహించబడినప్పుడు ఆ ఎడారి పొందే నష్టమేమిటో చెప్పు? ఈ జగత్తు, జీవుడు మొదలైనవన్నీ నీ పట్ల తొలగిపోయినప్పటికీ “దృక్” రూపుడవగు నీకు, (లేక ఆత్మకు) ఏ మాత్రం లోటు ఉండదు. అది ఏ మాత్రం శూన్యత్వం పొందదు. యథారీతిగా పూర్ణమయ్యే ఉంటుంది.

మృగతృష్ణతో సమానమైన ఈ జగత్తు ‘అసత్’ స్వరూపములగు వికల్పముల చేతనే ఆవిర్భూతమగుచున్నది. ఈ “జగత్తు” అనునది ఆరోపిత వ్యవహారం మాత్రమే. ఆరోపించబడింది తొలగిస్తే పోయేదేమున్నది?

మిథ్యాభూతమగు సంకల్పమే స్వయంగా మిథ్యాభూతమగు ఈ మొత్తం జగత్ వ్యవహారాన్ని ప్రకటితమొనర్చుచున్నది. అట్టి సంకల్ప వ్యవహారం నిరోధించబడగా, నీవు సంకల్ప రహితుడవ గుచున్నావు. నీ దృష్టిలో ‘లేనివే’ అని తెలియవచ్చిన పదార్థములచే నీవు బాధింప బడవు. జగత్తు పట్ల “ఇది సత్యమైనదే” అనే బుద్ధి తొలగుచుండగా, ఇక నీయందు వాసనలు సంభవించవు.

భావనాక్షయమే వాసనాక్షయం కూడా. సర్వభావనలూ తొలగినప్పటికీ, ఇక తొలగింప జాలనిదేదో… అదే నీవు. వాసనాక్షయమే మోక్షస్థితి యొక్క సంప్రాప్తము.

Page:264

కాబట్టి నాయనా! దృఢమైన అభ్యాసముచే ’ఈ దృశ్యము లేదు… ఈ జగత్తంతా అసత్యము’ అని గ్రహించు! ఎప్పుడైతే నీవు ‘దృశ్యరాహిత్యం’ అవధరిస్తావో, ఈ దేహాదులందు ఆత్మ భావము లేకుండా ఉంటావో - - అప్పుడు నీవు ఈ సుఖ-దుఃఖములలో తగుల్కొనే ప్రసక్తే ఉండదు. ‘ఈ దేహం, ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ వస్తుసముదాయము మిథ్యారూపములే కదా…” అని నిశ్చయించుటచే వానియందు నీకు ఆసక్తి-అభినివేశములు జనించవు. ఆసక్తి నశించిందా, ఇక ‘హర్షం-దుఃఖం’, ‘జననం-మరణం’ మొదలైనవన్నీ నీపట్ల అసంభవములే అవుతాయి. కాబట్టి సుఖ దుఃఖాది విభ్రమమలు నీకెప్పుడైనా ప్రాప్తిస్తుంటే ’ఇదంతా అసత్తుయే” అను నిశ్చయమును కలిగియే ఉండు. ఆపై ఎట్లు ఉచితమో అట్లే వ్యవహరించు.

విషయ విస్మరణం - ఈ మనస్సే చిద్వస్తువు యొక్క ప్రతిబింబమువంటి ‘జీవుడు’ అను రూపమును ధరిస్తోంది. ఈ జగత్తు రూపమైనట్టి భూత భవిష్యత్తు-వర్తమాన జగత్తునంతటినీ మనస్సే నిర్మించుకుంటూపోతోంది. అదే సర్వమును ఉద్భవింపజేస్తోంది. పరివర్తింపజేస్తోంది. నశింపజేస్తోంది. అది ఒక సమయంలో విషయములతో సంబంధమును పొందినదై వాసనలచే ఆచ్ఛాదితమగుచున్నది.

అయితే ఒక ప్రశ్న. ఇంతటి వ్యవహారమును నిర్వర్తిస్ను ఈ మనస్సు స్వయంశక్తి కలిగి యున్నదా? లేదు. అది వాస్తవానికి జడమైనది. అది అధిష్ఠానమగు ‘శుద్ధ చైతన్యం’ యొక్క సంబంధం చేతనే స్ఫురణ శక్తియుతమై యున్నది. అట్టి శుద్ధ చైతన్యమే నీ వాస్తవ స్వరూపం గాని, ఈ శరీర మనస్సులు నీవు కావు. అయితే మలినము-చంచలము అగు ’ఇచ్ఛ’చే ప్రేరేపించబడుట చేతనే మనస్సు ఈ ‘జగత్తు రచన’ అను వ్యవస్థను నిర్వర్తించుచున్నది. ‘హృదయం’ అనే వనంలో ’కోతి’ వంటి ఈ జీవుని మనస్సు స్వ-ఇచ్ఛానుసారంగా, స్వయంకల్పిత కార్యక్రమానుసారంగా ఈ జగత్తులో లీలలు నిర్వరిస్తోంది.

ఈ జీవుడు (లేక మనస్సు) ఒకప్పుడు విశాలాకారయుతుడగుచున్నాడు. మరొకప్పుడు అత్యంత సంకుచితరూపం పొందుచున్నాడు.

ఒకప్పుడు జాగ్రత్-స్వప్న సంసక్తతచే “నేను పరాధీనుడను” అను భావం పొందుచున్నాడు. మరొకప్పుడు “నేను సర్వమునకు అసంబంధితుడను” అను రీతిగా భావనను ఆశ్రయిస్తున్నాడు. సంబంధమే లేని చోట, యిక బంధమంటూ ఎక్కడిది?

ఈ ‘సంకల్పములు’ అను తరంగాలు ఎప్పటి నుండి పుడుచున్నాయో దేశకాలముల దృష్ట్యా గ్రహింప శక్యము కాకయే ఉన్నాయి. అయితే, “సంకల్పములు విషయముల పట్ల ఏర్పడు ‘ధ్యాస’ చేతనే ఉద్భోధితమై, వృద్ధి చెందుచున్నాయి”… అని మాత్రం తప్పక చెప్పవచ్చు. దేశ కాలములు సలకల్పార్గతములే! ‘విషయవిస్మరణం’ అను ఒక వజ్రాయుధంచేత మాత్రమే ఈ సంకల్ప వ్యవహారమంతా సమూలంగా నశించగలదు.

Page:265

  1. ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది - లేనిది ఏనాడు లేదు.

ఈ జీవునియందలి సంకల్పించు స్వభావం అల్పవిషయం చేత కూడా ప్రజ్వరిల్లుతోంది. క్షణభంగురములు, జడత్వమును ఆశ్రయించి ఉన్నట్టివి, అప్రకటితరూపములు అయినట్టి సంకల్పములే ఈ జగత్తులో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి.

ఓ ప్రియకుమారా! ఈ ప్రపంచంలో ఏదైతే అసత్యమైయున్నదో, అదంతా శీఘ్రంగా నివారించబడుటయే ఉచితం కదా!

అసత్ వస్తువు సత్ అవుతుందా? ఎన్నటికీ కాదు. ఇందులో సందేహం లేదు.

‘సత్’ అను వివేచనను ‘సంకల్పాలు’ అను వాటికి అన్వయించి చూద్దాం. ఒకవేళ ‘సంకల్పం’ అనునది సత్స్వరూపమే అయి ఉంటే ఇక దానిని నిగ్రహించటం ఎవరి తరం చెప్పు? అది స్వతహాగా అట్లే ఉండగలదు. అది “సత్స్వరూపము” కాదు కాబట్టే, కొందరు మహనీయులు దివ్య మగు ఆత్మజ్ఞానంచే సంకల్పరహితులై, స్వసత్తచే స్వయంప్రకాశంగా వెలుగొందుచున్నారు.

‘సంకల్పము’ అనునది అసత్తే కనుక దానిని దమింపజేయడం తప్పక సుసాధ్యమే. ఈ ‘ప్రపంచము’ రూపములో నీకు సంప్రాప్తించుచున్న మాలిన్యము సత్యమే అయితే ఇక దానిని తొలగించుట ఎట్లు? బొగ్గుకు ఉన్న నలుపును ఎంత శుభ్రపరచినా తొలగించగలమా? దాని నలుపును తొలగించుటకు యత్నించువాడు మూర్ఖుడే అవుతాడు కదా!

ఈ జగత్తు, ఇందు జీవునకు స్ఫురించుచున్న సంకల్ప వ్యవహారంతో సహా సత్యం కానే కాదు.

  1. ప్రయత్నించినవాడే గ్రహిస్తున్నాడు.

ప్రియపుత్రకా! ఈ ప్రపంచము యొక్క స్థితి అనిర్వచనీయము. ఇది అనాదికాలంగా సిద్ధించి ఉంటోంది. ‘జ్ఞానము’ అనే పరమార్థం చేత ఇది తప్పక సంపూర్ణముగా తొలగగలదు. జ్ఞాని మాత్రమే అతి విస్తారమగు ఈ సంసారమాలిన్యమును విచ్ఛిన్నం చేయగలుగుతున్నాడు. ధాన్యము యొక్క పొట్టు ఎట్లా పోతుంది? దంచుట చేతనే కదా! రాగిపై చిలుము తొలగుతుందా? ‘తోముట’ అను క్రియచే తప్పక తొలగుతుంది కదా! ఈ సంసారమాలిన్యము కూడా ‘జ్ఞాన భూమికల అభ్యాసం’ అనే ప్రయత్నముచే తప్పక తొలగుతుంది. పురుష ప్రయత్నము తప్పక ఫలదాయకమవుతుంది. ఇందులో సందేహం లేదు. అందుచేత అభ్యాసక్రమముచే నీవు ‘శుద్ధము-అఖండము-నిష్కళంకము-నిత్యము’ అగు నీయొక్క స్వస్వరూపాత్మను గాంచగలవు. అట్లు గాంచుట జరుగుచుండగా సర్వవ్యధలు, వేదనలు, భేదభావనలు వాటంతట అవే తొలగుతాయి. ఓ బిడ్డా! నీవు సరి అయిన ఉపాయములను ఆశ్రయించకపోవుట చేతనే మిథ్యా వికల్పయుక్తమగు ఈ సంసారమంతా ఇంతవరకు జయించబడక పోవటం జరుగుతోంది. అట్లే

Page:266

తదితరులగు సర్వజీవుల విషయం కూడా, ‘అసంకల్పము’ అను యత్నముచే ఇది శీఘ్రముగా విలయమొందుచున్నది. ఈ విషయంలో ఎవ్వరికీ సందేహాలు అక్కర్లేదు.

అసద్వస్తువు ఎక్కడైనా చిరకాలం స్థిరంగా ఉంటోందా?… లేదు. చీకట్లో ఉన్నవాడు దీపం వెలిగించుకుంటే ఇక ఆ చీకటి ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడికి పోతోందని చెప్పాలి? దృఢమైన దృష్టితో చూస్తే ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఇక కనిపిస్తారా? ఈ సంసారము కూడా తత్త్వ విచారముచే మిథ్యాత్వము పొందుతోంది. ఓ ప్రియకుమారా! సర్వదా ఒక్క విషయం గుర్తుంచుకో. నీవు ఈ సంసారమునకు చెందినవాడవు కావు. అట్లాగే ఈ సంసారము కూడా నీకు చెందినది కాదు. కనుక నిశ్చింతగా ఈ సంసార భ్రాంతిని విడిచిపెట్టు. "ఈ సంసారము మిథ్యయే” అని తెలిసిన తరువాత కూడా ఇక నీకీ చింతనలు ఎందుకు చెప్పు? కనుక సర్వ విషాదపూరిత చింతలు క్రమక్రమంగానో, ఒక్కసారిగానో త్యజించివేయి.

“నేనొక జీవుడను. అనేక విభవములతో కూడిన ఈ భోగవిలాసాలు యుక్తమే. ఇందులో కొన్ని వస్తువులు, వ్యవహారములు పొందుటచే నేను ఆనందించగలను. కొన్నిటిని నేను వదల్చుకో వలసియున్నది.” - ఇవన్నీ సాంసారిక వీచికలేనని గ్రహించు.

నీ రూపమున, మరియు ఈ దృశ్యము రూపమున ప్రకటితమగుచున్నదేది? సర్వ విధములా ప్రకాశించుచున్నది ఆత్మయే కదా! సర్వము ఆత్మయే అయి ఉండగా నీకు దిగుళ్ళు, రంధులు ఎందుకు కలగాలి? వాటి ప్రమేయమును నీవు ఎందుకు ఆశ్రయించాలి?… అందుచేత సర్వదా నిశ్చింతుడవై ఉండు.

శ్రీ వసిష్ఠ మహర్షి: వింటున్నావా రామచంద్రా! వారి సంభాషణ అట్లు ముగిసింది. ఆపై నేను వారి ముందు భౌతిక రూపుడనై ప్రదర్శించుకున్నాను. వారిద్దరు వినమ్రతతో నన్ను ఆహ్వానించి, పూజించారు. దాశూరుడు చెప్పిన ఆప్తవాక్యములను అభినందించాను. అందలి సారవిశేషాలను పునఃసమీక్షిస్తూ ప్రసంగించాను. సంసారము నుండి ఈ జీవుని తరింపజేయగల అనేక గాథలు వినిపించాను. మేం ముగ్గురం ఆత్మవిషయమై అనేక దృక్పథముల నుండి అనేక విషయాలు చెప్పుకున్నాం.

ఆ రాత్రి ఉల్లాసంగా గడచిపోయింది. ఆ మరునాడు ఆ తండ్రీకొడుకులు నన్ను భక్తి పూర్వకంగా సాగనంపారు. నేను నా కార్యక్రమము ననుసరించి ఆకాశంలో ప్రవేశించి మునులు వేచియున్నచోటికి పయనించాను.

ఇప్పుడీ ’దాశూరాఖ్యాక’ విన్నావు కదా! దీనిని అనుసరించి “ఈ జగత్తు ప్రతిబింబము వలె అసత్యమైనది” అని గ్రహించు. ఈ సంభాషణను అనుసరించి ప్రజలలో “ఇది దాశూరాఖ్యాయిక వంటిది” అనునది ప్రచారంలోకి వచ్చింది.

Page:267

  1. దాశూరాఖ్యాయిక: విజ్ఞాన సారాంశము

ఈ ‘నేను-నీవు’ అనునదంతా ఆత్మయే. కనుక ‘అధిష్ఠాన చైతన్యం’ దృష్ట్యా చూచినప్పుడు ఇవి వాస్తవమే. ఆరోపితం దృష్ట్యా ఇవి అవాస్తములేనని కూడా గ్రహించు.

“నేను-నాది” ఇత్యాది అధ్యాసలను త్యజించివేయి. దాశూరమహాముని తన కుమారునికి చెప్పిన సిద్ధాంతాలలోని అంతర్లీనగానాన్ని గమనించు. ఉదారచిత్తుడవు, ఆత్మనిష్ఠుడవు అగుము. వికల్పాత్మకమగు ’మనస్సు’కు హేతువు అగుచున్న అజ్ఞాన మాలిన్యమును ’నేను ఆత్మ తేజమునే” అను ప్రస్తావనచే కడిగివేయి.

ఆత్మతత్త్వమును అవలోకించుచూ ఉన్నావా… ఇక నీవు అతి శీఘ్రముగా మోక్షపదమును పొందగలవు. ఈ పదునాలుగు లోకములలో పూజ్యుడవు కాగలవు.

ఇట్టి పరిశుద్ధ "స్వస్వరూపాత్మదర్శనము”చే మావంటి ఋషులకు కూడా నీవు నమస్కరింప తగిన వాడవగుచున్నావు.