CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:268

VIII. కచోపాఖ్యానము - ఉపోద్ఘాత చర్చ

  1. ఈ సృష్టికి కర్త ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! జడాత్మకమగు ఈ ప్రపంచం ‘లేదు’ అనే నిశ్చయం కలిగి ఉండటమే ఉచితం. ఈ ‘నేను-నాది’ మొదలైన భేద అధ్యాసల పట్ల విశ్వాసం త్యజించివేయి. వివేకులకు ఎక్కడైనా లేనిదానియందు విశ్వాసముంటుందా? అవివేకులకు మాత్రమే అసత్యమైన దాని యందు ఉద్వేగము, రాగము, సంరంభము ఉంటాయి.

నీవు వివేకివి కావాలి. అంతేగాని అవివేకమును ఆశ్రయించి దుఃఖించటమేమిటి చెప్పు? ఈ ‘దేహాలు’ మొదలైన వాటితో కూడియున్న దృశ్యజగత్తు ఆత్మ కంటే వేరుగా సత్తను పొందివుందా?.. లేదు కదా! … అందుచేత నీవు అపేక్షా రహితుడవు అవ్వాలి. అసంగం, ఉదాసీనం, చిద్రూపం అయినట్టి ‘స్వాత్మ’ యందే సుస్థిరుడవై ఉండు. అజ్ఞాని ‘అధ్యాస’ అను స్వభావం కలిగి ఉంటున్నాడు. ఫలితమేమిటి? ఆత్మకంటే వేరుగా ఈ దేహాదులందు ఆత్మతత్త్వమును ఆపాదించుకొంటున్నాడు. పరితపిస్తున్నాడు. “నేను ఈ దేహమునే, నేను చచ్చుచున్నాను, పుట్టుచున్నాను’ అని అనుకుంటు న్నాడు. ఈ శరీరము-దృశ్యము మొదలైనవాటిపట్ల సత్యత్వబుద్ధి సమంజసము కాదు సుమా!

ఈ జగత్తే సదసత్తు (Truely as well as falsely exists) అని, దీనికి ఒక నియతి అంటూ ఏదీ లేదని నీవు ఎరుగుదువు కదా! మరి దేహము మొదలుగా అనేక పదార్థములతో కూడుకొని ప్రాప్తిస్తున్న ఇక్కడి సంబంధ బాంధవ్యములపై మాత్రం విశ్వాసం ఎందుకు? ఈ జగత్తే “లేదు”… అని నిశ్చయించిన తరువాత ఇక సంబంధమేమిటి? బంధమేమిటి? ఎవరికి? ఎక్కడ? కేవలం ఆత్మ ఒక్కటే సర్వదా సిద్ధించి ఉన్నది, ఉంటున్నది. అది సర్వదా, నిర్మలము, వ్యాపకము, అనంతము, సర్వప్రమాణములు అందుకోలేనిది అయి ఉన్నది.

శ్రీరాముడు: బాగున్నది స్వామీ! అయితే, ఒక సందేహం. మీ ఉద్దేశము ననుసరించి ఈ జగత్తుకు కర్త ఎవరు? కారకులు, ప్రేరకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుండి దీనినంతటినీ నడుపుచున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ జగత్తు విషయంలో ఇప్పటికే అనేక విశేషాలు చెప్పుకున్నాం. నీ ప్రశ్నకు సమాధానంగా ఈ జగత్తు విషయంలో మా అభిప్రాయములు మరికొన్ని విశేషాలు చెప్పుచున్నాను వినుఓ రామచంద్రా! ఈ జగత్తు ఎవ్వరిచేతనూ నిర్మించబడి ఉండలేదు. అనగా దీనికి ‘కర్త’ అంటూ ఎవ్వరూ లేరు. అట్లే “ఈ విధమైన క్రమము”… అంటూ ఏదీ లేదు. "కర్త ఇట్టి విధానము

Page:269

నకు బద్ధుడు"-అనునది చెప్పుటకు వీలుగా కూడా లేదు. విజ్ఞుల అవగాహనను అనుసరించి ఏర్పడియున్న భిన్నాభిప్రాయములు ఇక్కడ ఉదహరిస్తారు.

  1. దృశ్యముచే ద్రష్ట ఏర్పడుచున్నాడు! (దృశ్యము కర్త - ద్రష్ట అకర్త) - "దృశ్యమును బట్టే ద్రష్టయొక్క అనుభవం ఉంటోంది. కనుక ‘అనుభవము’ అనబడుదానికి జగత్తే కర్త. ఆ అనుభవం ఏర్పడు ప్రదేశమే ద్రష్ట యొక్క బాహ్యము. కనుక దృశ్యమును అనుసరించి ద్రష్ట ఉంటున్నాడు.”

  2. ద్రష్టచే దృశ్యము కల్పించబడుచున్నది! (దృశ్యము అకర్త-ద్రష్ట కర్త) - ద్రష్ట యొక్క భావనయే దృశ్యానుభవం కనుక జగత్తు అకర్త. ద్రష్టయే కర్త. ద్రష్ట యొక్క అంతరంగమే అనుభవములకు స్థానం. ఆత్మసన్నిధానం చేతనే జగత్తు భాసిస్తోంది కనుక, ద్రష్టను అనుసరించే దృశ్యము ఉంటోంది.

8

ఈ ‘జగత్తు’ అనే జాలం కర్తృసహితం కావచ్చు గాక! లేక కర్తృరహితం కావచ్చు గాక! మరింకేదన్నా కానీ! నీవు మాత్రం ’ద్రష్ట-దృశ్యము పరస్పరం అభేదమైనవే” అను అధ్యాస కలిగి ఉండు. పరస్పర ’భేదధ్యాస’ చేతనే ఈ దేహములపట్ల “ఈ దేహమే నేను” అను దేహాత్మభావన సంభవించటం జరుగుతోంది. అట్టి భావనను జీవుడు మొదటగా త్యజించాలి.

కనుక రామా! నీ బుద్ధిని సునిశితం చేసుకో. పరిచ్ఛిన్నములగు ఈ దేహాదులందు స్థితి కలిగి ఉండవద్దు. అట్లు స్థితి పొందకుండానే యథారీతిగా వర్తిస్తూ ఉండు.

‘ఈ జగత్తుకు కర్త ఆత్మయే’… అని అనవచ్చా? ఈ ప్రశ్నకు మా సమాధానం విను.

ఆత్మ సర్వదా సర్వేంద్రియ రహితమైనట్టిది. అది ఏ క్షణమందు ఎట్టి మార్పు చేర్పులు పొందుటయే లేదు. కనుక ‘అది జడమువంటిది’ అని కూడా చెప్పబడుతోంది. ఆత్మ తన స్వసత్త మాత్రంచేత ఈ జగత్తు ఉనికిని పొందుతోంది. అందుచేత అజ్ఞాన దృష్టికి “ఆత్మ ఈ జగత్తుకు కర్త” అయినట్లు కనిపిస్తోంది.

‘కాకతాళీయ న్యాయం’చే ’ఈ జగత్తుకు కర్త అనువాడే లేడు" అని మేము ఎంచుచున్నాం.

కాకతాళీయ న్యాయం అనగా - ఒకచోట ఒక ఎత్తైన తాటి చెట్టు ఉన్నది. అప్పుడే వసంత కాలం ప్రవేశించుటచే ఆ చెట్టుకు తాటిపళ్ళు చక్కగా మ్రగ్గి, ఘుమఘుమలాడుతూ వ్రేలాడు చున్నాయి. ఒక కాకి ఎక్కడి నుండో ఎందుకో వచ్చి ఆ చెట్టు యొక్క తాటిపళ్ళ గుత్తిపై వ్రాలింది. అప్పుడు, ఆ గుత్తిలోని ఒక పండు బాగా మగ్గి ఉండి, గుత్తి నుండి విడివడి నేలపై పడింది. అప్పుడే నీడలో సేదతీర్చుకుందామని ఒక నక్క ఆ చెట్టు క్రిందకు వచ్చి నిలిచింది. నీడను, గాలి వీచికలను పొందుతూ ఉన్న ఆ నక్కపై తాటిపండు జారిపడింది. ఫలితంగా, ఆ నక్కకు గాయం అయింది. ఇప్పుడు చెప్పు. ఆ నక్కకు గాయము అగుటకు కారణమేమిటి? తాటిచెట్టా? కాకియా? వసంతకాలమా? తాటిపండా? నక్క చెట్టు క్రిందకు వచ్చుట చేతనా? చెట్టు నీడకు కారణమైన సూర్యుడా? గాలియొక్క వేగముతో కూడిన వీచికలా?

Page:270

ఎవ్వరు ఏదైనా అనవచ్చు. కాని "కాకతాళీయ న్యాయముచే ఉత్పన్నమైనదానికి కర్త లేడు” అనునది ఈ దృష్టాంతము యొక్క పాఠం.

ఈ జగత్తు ఏదై ఉన్నది - అనే విషయానికి వస్తే, 6 ’ ఈ జగత్తు అనిర్వచనీయం’ అని అనేక మంది ఆత్మజ్ఞానులగు వారిచే చెప్పబడుతోంది. “ఈ జగత్తు ఇందలి పదార్థ వ్యవహారములు గురించి అజ్ఞులే మరల మరల వితర్కించటం, విచారించటం చేస్తున్నారు. వివేకులు అట్లు చేయరు.” అనునదే మా అభిప్రాయం కూడా. ఎందుకంటే తర్కవితర్కములు ఒక పరిధిని, పరిమితత్వమును కలిగియుండి, అనంతమగు ఆత్మతత్వమును నిర్వచించలేకపోతున్నాయి. ఇట్లు ఆత్మ అనుభవైకవేద్యము మాత్రమే అగుచున్నది.

ఈ జగత్తు ‘భావనారూపము’ అని కొందరంటున్నారు. “ఇది క్షణక్షణం నశించుచూ, శూన్యమే అయి ఉన్నది” అని మరికొందరు చెప్పుచున్నారు. “ఇది ప్రవాహరూపమున కనిపిస్తూ మరల మరల ఉత్పన్నమగుచున్నది"… అని ఇంకొందరి అభిప్రాయం.

ఏది ఏమైనా చమత్కారమేమంటే దీనిని నీవు ఏ ఏ సంకల్పముల ధారణ చేత మరల మరల దర్శిస్తావో, ఆ ధారణలను అనుసరించే ప్రయోజన సిద్ధిని పొందుచున్నది.

శ్రీరాముడు:“ఇది నిత్య సత్తా స్వభావం కలది" అని చెప్పవచ్చని? అందామా? అంటే, ఇది ఎప్పటికీ ఏర్పడి ఉండియే ఉంటుందని” అని అనవచ్చునా?

శ్రీ వసిష్ఠ మహర్షి: ఇక్కడ ప్రతిదీ ఒకప్పుడు ఒక విధంగా మరొకప్పుడు మరొకవిధంగా ఉంటోంది. ఇక్కడ పరిణామం చెందనిదేది చెప్పు? అందుచేత ఇక్కడ ఇప్పుడు కనబడుచున్నదంతా ‘అసత్’ స్వభావయుతమని చెప్పబడుతోంది. అంటే, అది ఇప్పటికే స్వతహాగా ‘ఉనికి’ ని కలిగి ఉండలేదు.

పోనీ… ‘ఇది క్షణిక సత్త శీలమైనది’ అందామా? ఈ శరీరములోని సంకల్పించువాడు, లేక దర్శించువాడు ఉన్నాడు చూచావ్! అతడు ఆయా పదార్థముల, భావముల మార్పుచే స్పృశించ బడకయే ఉంటున్నాడు. భావనను అనుసరించే జగత్తు ఉంటోంది.

ఆత్మ వాస్తవానికి సర్వ ఇంద్రియములకు అతీతము, ఆధిభౌతిక-ఆధిదైవిక-ఆధ్యాత్మిక తాపములచే తాకబడనిది. అది ఈ జగత్కార్యమును నిరంతరం చేయుచున్నప్పటికీ అది ఏమాత్రం భేదముగాని, మోదము గాని పొందదు.

ఒక గదిలో దీపం ఉన్నది. ఆ దీపపు వెలుగు సహాయంచేత ఆ గదిలో “వంట చేయుటసంభాషించుట-చదువుట" మొదలగు కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. దీపపు వెలుగు లేకుంటే అవన్నీ ఆ ఆ విధంగా జరుగజాలవు. కాని దీపపు వెలుగే అవన్నీ చేయిస్తోందని అనలేము. దీపపు వెలుగు దేనికీ కారణం కాదు.

Page:271

ఇక్కడ మనకు రెండు వాక్యాలు సిద్ధిస్తున్నాయి1. ఆత్మయొక్క ’సమక్షం’ చేతనే జగత్తు ఉంటోంది - ఆత్మ యొక్క సన్నిధానం మాత్రం చేత ఈ జగత్తు వ్యవహార ప్రకటనలు కలిగి ఉండగలుగుతోంది. కనుక జగత్తుకు కారణం ఆత్మయే.

  1. ఆత్మ సర్వదా నిర్వికారం, నిర్విశేషం- ఆత్మ స్వతహాగా నిరవయవము, పదార్థరహితము కదా! కనుక ఆత్మ జగత్తుకు కారణమగుట లేదు.

అందుచేతనే… “ఈ జగత్తు సత్-అసత్ రూపము, అనిర్వచనీయము అయి ఉన్నది”… అని చెప్పబడటం జరిగింది. ఆత్మ కాకుండా వేరుగా ఈ జగత్తు యొక్క ఉనికికి మరింకేదీ కారణ మగుట లేదు. నిరంతరం ఈ దృశ్యము భావనానుసారం ఇట్టి స్థితే కలిగి ఉంటోంది. ఇది మిథ్యా రూపమున ఇంద్రజాలంలో లాగా ఆవిర్భవించినట్లు దృశ్యమానమై ఉంటోంది. దృశ్యానికి అతీత మగు ఆత్మత్వము వహించువారికి, ఈ దృశ్యము ఎదురుగా ఉండి కూడా ‘లేనిదే’ అగుచున్నది.

  1. నిరపేక్ష-నిస్సంగము

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జనుల వ్యవహారముల సంరంభము గమనిస్తున్నావా? అవర్యన్తస్య కాలస్య కశ్చిదంశః శరచ్ఛతమ్ |

తావన్మాత్రమహాశ్చర్యః కిమర్థం సో సుధావతి ॥ (సర్గ 56, శ్లో 13)

ఈ శరీరంతో కూడినప్పటి జీవితం అనంత దేశకాలముల దృష్ట్యా అత్యంత పరిమితమైనది కదా! ఇది అనంత కాలప్రవాహంలో ఎంతటి స్వల్పాంశమైనది! ఈ స్వల్పకాలం, సదవకాశంలా లభించిన ఈ మానవ ఉపాధి ఏర్పడియున్న సమయమంతా కూడా అతడు దేహాత్మ బుద్ధినే ఆశ్రయి స్తున్నాడే! సర్వేంద్రియములకు అతీతమైయున్న ఆత్మవైపు అభిముఖుడవటమే లేదే! ఎంత ఆశ్చర్యం!

ఈ జగత్తుకు స్వకీయమైన కర్తృత్వమే లేదు. అట్టి ఈ జగత్తునందలి ఈ దేహములతో సహా సమస్త పదార్థములు ’ఇవి స్థిరములు’… అనిపించటం మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడి స్వల్ప వస్తువులను ఆపేక్షించుచు, దూరదృష్టి లేకుండా దినములు గడపటం ఉచితమెట్లాగా?

ఓయీ జీవుడా! ఎక్కడైనా ‘అసంగము’ అగు చైతన్యమునకు, జడమగు పదార్థములకు సంబంధం ఉంటుందా చెప్పు? నీవు శుద్ధమగు చైతన్యమువే గానీ, జడమగు శరీరములు కావు, ఇంద్రియాలు కావు. ఇంద్రియానుభవాలు కావు. అట్టి ఆత్మస్వరూపుడవగు నీకు ఈ శరీరాదులతో సంయోగం ఏర్పడటమేమిటి?

కనుక; “నేను శరీరరూపుడను గాను. నా యందు శరీరాదులు లేవు. నేను ఈ శరీరపరిమితుడను కాను. శరీరం కంటే ముందే ఉన్నట్టి నేను శరీరానికి మాత్రమే పరిమితుడనై ఉండేదెట్లా?”… అని ఎందుకు భావించరాదు? అట్లు భావించినప్పుడే నీవు ఇంద్రియాతీతమగు

Page:272

స్వస్వరూపమును గాంచగలుగుతావు. అట్లా కాకుండా, ఇంద్రియానుభవ మాత్రమైనట్టి ఈ దృశ్యములోని పదార్థములు, ఇవి కలుగజేయగల సుఖదుఃఖములు… వీటన్నిటిపై నమ్మకం కలిగి ఉంటే "అసంబంధితము - దివ్యము పరిశుద్ధము - నిత్యోదితము”… అగు నీ వాస్తవ స్వరూపమును నీవు ఎట్లు గాంచగలవో మాకు అర్థమగుటలేదు. ఈ శరీరాదులు, తదితర దృశ్య పదార్ధములు స్థిరములయినా, కాకున్నా నీవు వీటి పట్ల ‘అపేక్ష’ పొందవలసిన పనేముంది? నీవు ఒక జడవస్తువు కాదే! సంకల్పములను కూడా రచించగల చైతన్యమూర్తివి కదా! బుద్బుదము వలె చంచలములైన ఈ దేహములు నశించిపోయేవే కనుక, వాటి యందు ఆసక్తి దుఃఖములనే కలుగజేస్తున్నాయి.

1) “ఉత్పత్తి-వినాశనము” అను రెండిటితో కూడుకొన్న ఈ దృశ్యజగత్తునందు “ఇవియే నేను, లేక ఇవి నావి" అను దోషముతో భావావేశము పొందటం;

2) ఆత్మను జగత్ స్వభావయుక్తంగా చూడటం… (లేక, ఆత్మయే వాస్తవ స్వరూపంగా గల సహజీవుని భౌతిక పరిమిత దృష్టితో చూడటం)…

ఈ రెండూ కూడా బంధము కలిగించుటకే కారణమగుచున్నాయని సర్వజనులకు గుర్తు చేస్తున్నాను. స్థిర-అస్థిర స్వభావయుక్తములైనట్టి ఆత్మ-జగత్తులకు "కొండ-నురుగు”ల వంటి సంబంధము మాత్రమే కలదు.

సమస్తమునకు కర్తయగు ఆత్మ అకర్తయే అయి ఉన్నది. అది ఏమీ చేయుట లేదు. నాటక రంగంలోని దీపంలాగ అన్నిటినీ ప్రకాశింపజేస్తూ కూడా ఉదాసీనంగా ఉంటోంది. సూర్యుడు ఉదయించిన తరువాత, ఇక ప్రాణులు నిదురలేచి, తమ దినచర్యలు ప్రారంభించు చున్నారు కదా! కాని దినచర్యలకూ సూర్యునికి సంబంధం ఏమి ఉన్నది? ఉదయం నుండి సాయంకాలం దాకా జరిగిపోతున్న ఆయా రోజువారీ కార్యక్రమముల దృష్ట్యా సూర్యుడు సర్వదా అకర్తయే కదా! ఆత్మ కూడా ఏమీ ఒనర్చుట లేదు. అది అన్నిటికీ కారణమగుచూ కూడా, సర్వదా ‘స్వయంప్రతిభ’ యందు ప్రతిష్టితమై ఉండి ఉంటోంది. అది చలింపకయే ఉంటూ సర్వమును చలింపజేస్తోంది.

  1. భ్రమచేతనే జగదుత్పత్తి

నదీతీరం స్వభావయుక్తంగానే ఇసుకతో ఉంటుంది కదా! ఈ జగత్తు కూడా స్వభావంగానే జీవుని పట్ల ప్రకటితమగుచున్నది. ఎటు పల్లం ఉంటే నీరు అటు ప్రవహించటం సహజం. అట్లాగే జడ-చేతనముల సంయోగమాత్రం చేత ఈ జగత్తు ఆకస్మికంగా ఉత్పన్నమైనది అగుచున్నది. అంతేగాని, దీనికి కర్త అంటూ ఎవరూ లేరు.

ఆత్మయొక్క సన్నిధానం చేతనే దీనికి ఉనికి ప్రాప్తిస్తోంది. లేదా సర్వప్రమాణములకు అతీత మగు శుద్ధచిత్తము దృష్ట్యా ఇది లేదని కూడా గ్రహించబడగలదు.

Page:273

ఓ రామచంద్రా! ఏది ఏమైనప్పటికీ ఈ ‘దేహము’ మొదలైన పదార్థములందు “ఇదియే ఆత్మ” అని తలచటం ఎవ్వరికీ ఏమాత్రం తగదు. వేగంగా గాలిలో వృత్తాకారంగా త్రిప్పునప్పుడు ఏర్పడు వృత్తముపై లేక, స్వప్నములోని కొండ, మనిషి మొదలైన వాటిపై అపేక్ష కలిగి ఉన్నామనుకో, చీకట్లో ఏదో ఆకారం చూచి "అది దయ్యము యొక్క కదలికలే” అని తలచా మనుకో… అవన్నీ అర్థంలేని పనులే కదా! ఆకస్మికంగా ఎక్కడో దూరదేశంలో కొద్దిక్షణములు నీ ప్రక్కన నిలబడి, అటుపై ఎటో వెళ్ళిపోవుచున్న నూతన వ్యక్తితో నీకు స్నేహం ఎట్లా కుదురుతుంది? భ్రమచే ఉత్పన్నమైన ఈ జగత్తు విశ్వాసపాత్రం కాదు. అట్లే ఈ శరీర విషయం కూడా. శ్రీ రాముడు: స్వామీ! ఈ జగత్తు యొక్క అభావన జీవమాత్రులమగు మాకు సాధ్యమే నంటారా? శ్రీ వసిష్ఠ మహర్షి: “చంద్రునిలో ఉష్ణత్వము, సూర్యునిలోని శీతలత్వము, మృగతృష్ణలో జలత్వము వాస్తవము కావు” అను భావన ఎంత సహజమో, ఈ జగత్తునందు భావనారహితుడై ఉండటం కూడా అట్లే సహజం. భావనలు కలిగియుండుటయే ‘శ్రమ’ కాని, కలిగి యుండకుండుట శ్రమ కాదు. కనుక భావనారహితుడవై ఉండటం అభ్యాసపరుడవగు నీకు తప్పక సుసాధ్యమే!

ఇక ఈ జగత్తులోని పదార్థజాలమంటావా?… దీనిని ’ఊహ’లోని కట్టడములవలె, స్వప్నములోని జనసమూహమువలె, ఇంద్రజాలములోని సంఘటనలవలె ఉద్వేగరహితుడవై, అంతయు తెలిసియే ఉన్నవాడై ప్రశాంతచిత్తముతో వీక్షిస్తూ ఉండు. అంతేగాని భావనామయమగు ఈ ప్రాపంచిక విషయములందు విశ్వాసము కలిగియుండవద్దు. ఏదైతే నీయొక్క ’పరమార్థ స్వస్వరూపము’ అయి ఉన్నదో… అద్దానినే సర్వదా భావించుచు, ఈ జగత్తునందు లీలామాత్రంగా విహరిస్తూ ఉండు.

  1. సన్నిధాన మాత్రం (Mere presence)

సమస్త పదార్థముల అభ్యంతరమయిన ఆత్మవస్తువే నిత్యసత్యమై యున్నది. సర్వ కర్తృత్వ అకర్తృత్వ భావనలను, సర్వ ఇచ్ఛలను తొలగించుకో! అప్పుడు శేషించు పారమార్థిక రూపమును గ్రహించు. అటుపై యథారీతిగా ఈ జగత్తులో విహరించు. ఉదాసీనుడవై, ఇచ్ఛారహితుడవై, వ్యధారహితుడవై వ్యవహరించు.

ఇదం సన్నిధిమాత్రేణ నియతిః పరిజృంభతే ॥ దీపసన్నిమాత్రేణ నిరిచ్చైవ ప్రకాశతే || (సర్గ 56, శ్లో 27)

“ఆత్మచైతన్యమే” అయి ఉన్న నీ యొక్క ’సన్నిధానం’ మాత్రం చేత నియతి ఈ జగద్వ్యవహార రూపంలో ప్రవర్తిస్తోంది. దీపము యొక్క ప్రభావము చేత ప్రకాశము దశదిశల విస్తరిస్తోంది! ఆకాశంలో మేఘమును చూచినంత మాత్రం చేత కొండమల్లెపూవు వర్షధారల భావనచే స్వయంగా వికసిస్తోంది. ఆత్మసన్నిధానమాత్రం చేతనే ముల్లోకములు ఉత్పన్నమౌతున్నాయి.

Page:274

సర్వేచ్ఛారహితే భానౌ యధా వ్యోమని తిష్ఠతి | జాయతే వ్యవహారశ్చ సతిదేవేతథాక్రియా ॥

అదిగో, సూర్యభగవానుని చూడు. అతడు ఏ ‘ఇచ్ఛ’ లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తున్నంత మాత్రం చేత ఈ జగత్తులో పూలు-చెట్లు-జీవులు అనేక ప్రయోజనములు పొందుతూ జీవిస్తు న్నారు కదా! పరమాత్మ నిష్క్రియుడై ఉండి ఉండగా, అతని సత్తామాత్రం చేత ఈ జగత్తు, ఇందలి వ్యవహారములు సంభవిస్తున్నాయి.

ఓ రామా! నీవు పరమాత్మయే స్వరూపముగా కలిగి ఉన్నావు. ఈ శరీరాదులు, పదార్థముల నీవు కావు. రత్నం ప్రకాశిస్తూ ఇచ్చారహితంగా తన కిరణపుంజములను తదితర వస్తువులవైపు ప్రసరింపజేస్తోంది. అయితే, “నేను ఈ వస్తువులను మాత్రమే ప్రకాశింపజేస్తాను… ఈ ప్రక్క వస్తువులపై కిరణములు పంపను”… అని అనుకుంటోందా? లేదు, నిర్లిప్తుడు, నిత్యుడు అగు పరమాత్మ యొక్క సత్తచేతనే జగత్సమూహములు ఉత్పన్నమౌతున్నాయి.

ఆత్మయందు కర్తృత్వ, అకర్తృత్వములు రెండూ ఉన్నాయి. ఇది ఇచ్ఛారహితం కాబట్టి “అకర్తయే”. ఆత్మ సన్నిధానంలో మాత్రమే ఇదంతా జరుగుతోంది కాబట్టి "కర్తయే” కూడా!

  1. ఆత్మ అన్నివేళల అకర్తయే

ఇంద్రియములకు విషయము గానందువలన సత్యస్వరూపమగు పరమాత్మ దేనికీ కూడా కర్తగాని, భోక్తగాని కానేరదు. అయితే, ఇంద్రియములందు అంతర్గతంగా ‘సత్త’ కలిగియున్నదేది? అదియే కదా! అందుచేతనే “కర్త-భోక్త కూడా ఆ పరమాత్మయే”… అని శాస్త్రకారులు కొన్నిచోట్ల నిర్ద్వంద్వంగా నిర్ణయించి చెప్పుచున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని సాధనకొరకు రెండు మార్గాలు ఏర్పడి ఉంటున్నాయి.

  1. మహాకర్త - “సర్వమునకు కర్త ఆత్మయే. అట్టి ఆత్మయే నేను”

  2. మహాఅకర్త - "ఆత్మకు ఏ క్షణమందును కర్తృత్వ-భోక్తృత్వములు లేవు. అట్టి పరిశుద్ధ స్వరూపమగు ఆత్మచైతన్యమునే నేను.”

ఈ రెండిటిలో నీకు ఏది శ్రేయమని, అనుకూలమని బాగున్నదనీ అనిపిస్తే అట్టి భావనను దృఢంగా ఆశ్రయించు. “సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నట్టి చిత్స్వరూపుడనగు నేను సర్వదా అకర్తనే”… అను భావన కలిగి, ప్రాప్తించిన కార్యములను నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడిక కర్మలు చేస్తున్నప్పటికీ నిర్మలుడవై, కర్మలచే దోషము పొందక ఉంటావు. "శుద్ధ స్వరూపుడనగు నేను ఏమియు ఒనర్చుటలేదు” అనే నిశ్చయము కలవాని చిత్తము ప్రవృత్తిరహితం అవుతుంది. ప్రవృత్తి రాహిత్యము కారణంగా చిత్తము వైరాగ్యం పొందుతుంది. భోగముల పట్ల అపేక్ష లేనప్పుడు అట్టి జీవుడు అకర్మపరుడే అవుతాడు.

Page:275

“నేనెప్పుడూ అకర్తనే కదా…” అను దృఢభావనచే పరమ అమృతమువంటి సర్వసమత్వమే శేషించగలదు. లేక “అంతయు నేనే ఒనర్చుచున్నాను” అను మహాకర్తృత్వాభిమానమునందు స్థితి పొంది ఉంటావా…! అది కూడా మంచిదే.

శ్రీరాముడు: ఈ లోకంలో జ్ఞానులగు ఉత్తముల భావన మరియు అవగాహన ఏ రూపంలో ఉంటున్నాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి: "శుద్ధ స్వరూపుడనగు నేను ఈ జగద్భమను పొందవలసిన పనేమున్నది? నాకంటే వేరైనదేదీ ఎక్కడా సంభవించటమే లేదు కదా! ఇక నాకు రాగమేమిటి? ద్వేషము దేని మీద?” అను భావనయందు వారు ఉంటున్నారు. ఇక “ఈ సర్వమునకు కారకుడు ఎవరు?”… అను ప్రశ్నకు వచ్చినప్పుడు, “తదితర జనులచే దగ్ధం కావించబడిన నా పూర్వశరీరములకు, ఈ జనులచే లాలించబడుచున్న ఈ వర్తమాన శరీరమునకు కూడా నేను మునుముందుగానే ఉన్నాను. సంకల్పములకు ముందే ఉండియుండి, సర్వసంకల్పములను అంగీకరించువాడను, ఆశ్రయించువాడను నేనే!”… అని గ్రహిస్తున్నాడు. అప్పుడు సర్వదుఃఖములు శమించుచున్నాయి. “నా ఈ సుఖదుఃఖముల విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశనములకు కర్తను నేనే” అని నిశ్చయించుకొనుటచే అతడి సుఖ-దుఃఖములు శమించుచున్నాయి. “నా ఈ సుఖదుఃఖములు విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశములకు కర్తను నేను” అని నిశ్చయించుకొనుటచే అతడు సుఖ-దుఃఖములను రహితం చేసుకోగలుగుచున్నాడు.

భావనయొక్క ఆరంభమే జగత్తు యొక్క ఉత్పత్తి. భావనను అధిగమించినప్పుడు జగత్తు రహితమగుచున్నది.

  1. ఆత్మ సమష్టిరూప కర్తృత్వము

వసిష్ఠ మహర్షి:

అయం కర్తేతి మత్వాన్తః కః ఖేదోల్లాసయోః క్రమః | భేదోల్లాసవిలాసేషు స్వాత్మకర్తృతయైతయా ॥ (శ్లో 41, సర్గ 56)

స్వయమేవ లయం యాతే సమతైవావశిష్యతే | సమతా సర్వభూతేషు యాసౌ సత్యావరాస్థితిః ॥ (శ్లో 42, సర్గ 57)

ఓ రామచంద్రా! నీవు ఎల్లప్పుడూ సమష్టి రూప కర్తృత్వము స్వీకరించుట చేతనే పవిత్రుడవు కాగలవు. అట్టి కర్తృత్వముచే సుఖదుఃఖములు స్వయముగా విలీనమైపోతాయి. ఆపై సమత్వమే శేషిస్తుంది. సర్వభూతములపట్ల సమభావమే సర్వోత్తమ స్థితి అయి ఉన్నది.

Page:276

అట్టి సమత్వము నందు స్థితి పొందువాడు ఇక మరల ఎన్నటికీ జన్మలు పొందడు. అనగా అతని యందు "నేను జన్మించాను, మరణించుచున్నాను” వంటి భావాలు ఉండవు. ‘పుడుతున్నాను - పెరుగుచున్నాను - చచ్చుచున్నాను’… అను భావాలన్నీ శరీరముతో తాదాత్మ్యం పొందువారికి మాత్రమే ఉంటోందని గుర్తు చేస్తున్నాను.

కాబట్టి రామచంద్రా! క్రమంగా కర్తృత్వ-అకర్తృత్వములన్నిటినీ త్యజించివేయి. మనస్సును కూడా నశింపజేయి. ఇకప్పుడు ఏ శుద్ధతత్వముంటుందో అద్దాని యందు సుస్థిరుడవుకమ్ము.

అహంకారం, దేహం, ఇంద్రియాలు నేను కాదు. వీటి వేటికీ నేను సంబంధించిన వాడను కాను. వాటి క్రియలు నాకు సంబంధించినవి కావు. అందుచేత నేను సర్వదా నిష్క్రియుడనే”… అని గ్రహిస్తూ “ఆత్మ” కు ఆపాదించబడుచున్న కర్తృత్వములను నిషేధించు.

శ్రీరాముడు: మహర్షీ! ఈ దృశ్యపదార్థము త్యజించబడగా అప్పుడిక ఆత్మలాభము స్వయముగానే

చేకూరుతుంది కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి: ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉన్నది. ఈ దృశ్యవస్తువులను నిరసించిన మాత్రం చేత సరిపోదు. అదే తరుణంలో ఆత్మను భావనచేస్తూ ఉండాలి. అప్పుడే తృప్తికరమగు పూర్ణత్వము లభిస్తుంది.

“తత్వమసి” భావన చేయటం - ‘త్వమ్’(you)ను “ఇది లేదు, ఆత్మ మాత్రమే ఉన్నది” అను నిషేధంతో బాటుగా…, ‘తత్’ అను శబ్దమును లక్ష్యమై ఉన్నట్టి ‘ఆత్మ’ భావించబడుతూ ఉండాలి.

ఆత్మను భావించటమంటే ఏమిటి? - "నేను ఆత్మనే అయి ఉన్నాను… కనుక స్వతహాగానే నిత్యుడను, పూర్ణుడను, అఖండుడను, శుద్ధుడను” …అను భావనను క్రమంగా ఆశ్రయించుటయే ఆత్మను భావన చేయటం సుమా! అంతేకాదు. ఎదురుగా కనిపించే ప్రతిజీవిని చూస్తూ ఉండగానే, “నీవు పరమాత్మ స్వరూపుడవే-తత్వమసి” …అను భావనను అనుక్షణికంగా అభ్యసిస్తూ రావటం.

ఆకాశం మేఘాలచే కప్పబడినప్పటికీ, స్వతహాగా శుద్ధమైనదైనట్లుగానే… ఈ సంకల్పాలు ఏర్పడినంత మాత్రంచేత అతడు అశుద్ధుడగుట లేదు. ‘నేను-నీవు-జగత్తు అనునదంతా ఆత్మయే. ఇట్లు ఈ జగత్తుగా ప్రాప్తిస్తున్నదంతా నేనే’ అనునట్టి సర్వాత్మకభావము కలిగి ఉండాలి.

దేహాత్మబుద్ధి, దేహభావా-స్పృశ్యం "నేను ఈ శరీరమును… శరీరపరిమితుడను… శరీరముతో ప్రారంభమగుచున్నాను… శరీరం నశించుటచే నేను నశించుచున్నాను”… అను ఈ జీవుని యొక్క బుద్ధియే దేహాత్మ బుద్ధి. ఈ దేహాత్మబుద్ధియే సర్వనరకముల స్వరూపమైయున్నది.

* నిత్యుడు = ఎల్లప్పుడూ ఉండేవాడు; పూర్ణుడు = ఇక క్రొత్తగా పొందవలసినదేదీ లేనివాడు.

అఖండుడు = వేరువేరు జీవులుగా విభాగించబడనివాడు; శుద్దుడు = స్వతహాగానే దోషరహితుడు.

Page:277

అందుచేత, ఏ ప్రయత్నంచేసి అయినా సరే, “నేను ఈ పాంచభౌతికదేహమును”… అను భావనను త్యజించివేయాలి. ఉత్తముడు, పవిత్రుడు అగు ఒక గృహస్థుడు ఏవో తళుకు బెళుకులను చూచి, ఆ మాత్రానికి ఒక పరాయి స్త్రీతో సాన్నిహిత్యం కోరుకుంటాడా? లేదు కదా! అట్లు కోరుకోక పోవుటయే అతనికి సహజమైన విషయం. అట్లాగే, సర్వనాశనం చేకూరనీ; మృత్యువు వాటిల్లనీ… ఈ దేహాత్మ బుద్ధిని ఎన్నడూ, ఎట్టి పరిస్థితులలోనూ స్పృశించరాదు. దేహాత్మభావనయే (లేక) దేహాత్మదృష్టియే విశుద్ధాత్మను కప్పిపెట్టి ఉంచుచున్నదని గ్రహించు.

ఉదేతి పరమాదృష్టిర్ణ్యోత్స్నేవ విగతాంబుదా |

యయాభ్యుదితయా రామ తీర్యతే భవసాగరః ॥ (శ్లో 48, సర్గ 56)

దేహాత్మబుద్ధిని త్యజించివేసిన మరుక్షణం మేఘరహితమగు చంద్రుని చంద్రికవలె సర్వోత్తమ మగు ఆత్మదృష్టి ఉదయిస్తోంది. అప్పుడీ జీవుడు సంసారసాగరము నుండి తరించగలుగుచున్నాడు.

ఆత్మయందు స్థితి - ఓ రఘురామా! ఇప్పుడే, ఇక్కడే రెండు విషయాలు సుస్పష్టంగా, నిర్దుష్టంగా, ఎట్టి అనుమానాలకు తావివ్వకుండా ఎరుగుము.

1) ఈ దేహాదులు నేను కాదు; 2) జడము భావానుసరణము అగు దృశ్యము నేను కాదు. తద్ద్వారా, పరిచ్ఛిన్నములగు సుఖదుఃఖములను ఆశ్రయించనివాడవు అవుతావు. అదే సమయంలో ఇట్లు నిర్ణయం చేసుకొని ఉండు:

1) ఈ దృశ్యముకంటే విలక్షణమై, లోకసిద్ధమై, స్వస్వరూపమునకు వేరు కానట్టిదయిన “శుద్ధచైతన్యము” నే నేను. నేనైన వస్తువంటూ ఈ దృశ్యజగత్తులో ఎక్కడా లేదు.

2) ఈ బ్రహ్మాండమంతా నేనే. దృశ్యముగా కనిపిస్తున్న సమస్తమునకు కర్తను నేనే.

ఇట్లు తిరస్కరించవలసిన ‘దేహాత్మభావన’ను తిరస్కరిస్తూ అభ్యసించాలి. స్వీకరించవలసిన ‘అహమాత్మా’ భావనను స్వీకరిస్తూ అభ్యసించాలి. ఈ రెండింటినీ మేళవించుకుంటూ ఈ భూమిపై సంచరించు. లేదా, ఈ జగత్వ్యాహ్యాళి త్యజించి ఒక ప్రదేశంలో సమాధి నిష్ఠుడవై యుండు. అది నీ ఇష్టం. ఎందుకంటే, ఉత్తమ భావన అవధరించిన తరువాత ఆ రెండిటియందు భేదముండదు.

ఉత్తమ నిశ్చయము కలవాడవై బ్రహ్మపదమున సర్వదా స్థితి కలిగియుండుము. ఉత్తమ సాధువులగు బ్రహ్మవేత్తలు ఆ విధంగా ’ఆత్మస్థితి’ని ఆశ్రయించి, ఆపై తమ సంచారముచే ఈ ముల్లోకములను పావనం చేస్తున్నారు. అట్టివారు వందనీయులు అగుచున్నారు.

  1. పూర్ణాశయస్వరూపము

శ్రీరాముడు: మహాత్మా! ఉత్తమ యుక్తులచే మీరు చెప్పుచున్నదంతా సత్యమైనదని, అత్యుత్తమోత్తమ మైనదనీ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. మీరు చెప్పినట్లు “పరమాత్మ కర్త అయినప్పటికీ అకర్త, భోక్త అయినప్పటికీ అభోక్త”… అయి ఉన్నాడు. అతడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, చిన్మాత్రమే స్వరూపముగా కలవాడు కూడా.

Page:278

అతడే నిర్మలపదము! సర్వలక్షణముల సారము కూడా అతడే! ఈ భూమి మీద చతుర్విధ ప్రాణులు నివసించుచున్నట్లే ఆ దేవదేవుడు సర్వభూతముల అంతరంగమున నెలకొనియున్న వాడై సమస్తము అగుచున్నాడు. నాయందు, మీయందు, సర్వులయందు ఉన్నది అతడే. అతడు నాకంటే వేరుగా లేడు. లేదా, నేను ఆయనకంటే వేరుగా లేను. కనుక, నేనే సర్వదా అన్ని జీవరాసులందును సమముగా ఉండియున్నాను.

హే మహాత్మా! మీ వాక్యామృత ప్రభావం చేత నా హృదయమందు ఇప్పుడు బ్రహ్మము ప్రకాశించుచున్నది. తమ వచనములచే నేను దుఃఖరహితుడనయ్యాను. దేవదేవుడగు ఆ పరమాత్మ ఇచ్చారహితుడు. ఉదాసీనుడు కదా! ఆయన దేనికైనా కర్తగాని, భోక్తగాని ఎట్లా అవుతాడు? కాడు. కాని తనయొక్క సత్తామాత్రం చేత సర్వలోకాలకు అస్థిత్వము ప్రసాదిస్తున్నాడు. అతని సంకల్పమే ఈ సృష్టి. కనుక, దీనికి కారకుడు, కర్త, భోక్త కూడా అతడే. ఇక ఈ దృశ్యమో, ఇచ్ఛారహితుడు, ఉదాసీనుడు అగు పరమాత్మ యొక్క చమత్కారమే!

88

హే మహర్షీ! గురువర్యా! నాకు ఎందుకో ఇంకా ఒక్క గొప్ప సందేహం తొలగుటయే లేదు. అత్యంత వినమ్రుడనై ఆ సంశయమును మీ ముందు ఉంచుచున్నాను.

  1. ఈ జగత్తు సత్-అసత్ రూపమైనది.

  2. సమిష్టిరూపమగు జగత్తే నేను. అంతేగానీ, ఒక వ్యష్టిరూపమాత్రుడను కాను.

ఈ రెండూ మనకు నిర్వివాదాంశమే. ఇక ఈ ప్రపంచం విషయానికి వస్తే ఇది ‘సమదృష్టిచే ఏకం - వ్యష్టిదృష్టిచే అనేకం’… అయి ఉన్నది. ఇటువంటి ‘వ్యష్టి-సమష్టి’… అనబడు ’అనియతం, కల్పనామయం’ అగు సృష్టి పరమాత్మయందు ఎట్లా ఉన్నది? ఎందుచేత ఉన్నది? ఎవరి కొరకు ఉన్నది?

పరమాత్మ అద్వితీయము, స్వయంప్రకాశకము, మోహాంధకారరహితము, నిర్మలము కదా! సూర్యుని యందు అంధకారం ఎట్లా ఉంటుంది?… పరిశుద్ధతత్వమగు పరమాత్మ యందు ఈ జగత్తు ఉండుట ఏమిటి? ఏ రూపంగా ఉంటోంది?

“మాయతో కూడిన బ్రహ్మము నందు మొట్టమొదట అవ్యక్తరూపమున ఈ జగత్తు ఉండి ఉన్నది. ఆ తరువాత వ్యక్తరూపమున కనపడుచున్నది”… అని అంటారా? అట్లా అయితే ‘అద్వితీయం’గా నిర్వచించబడుచున్న పరమాత్మయందు అప్రకటన స్థితిమయంగా ఈ జగత్తు ఏ రూపంలో ఎట్లు దాగి ఉన్నది?

ఈ విషయం ఎంత ఆలోచించినా నాకు అర్థమగుటలేదు. దయచేసి వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! నీ ప్రశ్నకు సరి అయిన సమాధానం ముందు ముందు నిర్వాణ ప్రకరణంలో విశ్లేషణ పూర్వకంగా వివరించబడబోవుచున్నది. నిర్వాణ ప్రకరణ సమాచారం వినుచున్నప్పుడు ఈ జగత్తు యొక్క యథార్థ రూపమేమిటో నీవే తప్పక గ్రహిస్తావు. అప్పుడు

Page:279

“మోక్షోపదేశం” మనకు విషయము అవుతుంది. అఖండాకారమగు ఆత్మ గురించిన విశేషములన్నీ గ్రహిస్తే గాని, మోక్షము గురించిన సిద్ధాంతాలు శిష్యుని ముందు ఉంచటానికి కుదరదు. అతడు సిద్ధాంతాలు స్వీకరించాలంటే మనస్సులోని సంకుచితత్త్వమునకు సంబంధించిన అనేక పరిమిత దృష్టులు తొలగాలి. ప్రస్తుతం మనం పరిమిత దృష్టులను తొలగించగల విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం.

వయసులో ఉన్నవాడు మాత్రమే స్త్రీల విరహమయ గీతములను విని అర్థం చేసుకో గలడు గాని, ఒక ఆరేళ్ళ బాలుడు ఏం అర్థం చేసుకోగలడు? అందుచేత, మరికొంత అవగాహన తరువాత గాని నేను నీకా విషయం ప్రతిపాదించి చెప్పకూడదు. “ఉత్తమ ఆత్మ సాక్షాత్కార జ్ఞానము”నకు సంబంధించిన నిర్దుష్టప్రవచనాలు అల్పబోధనగలవారికి ముందు గానే చెప్ప కూడదు”… అను నియమమును గురువులం మేము పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే అపరిపక్వ దృష్టి, సమాచారము గలవారి పట్ల మా సిద్ధాంత ప్రవచనాలు వ్యర్థం కావటమో, లేక విపరీతార్థములకు దారి తీయటమో జరుగవచ్చు కదా!

సరైన ఋతుకాలంలో ఫల పుష్పాలు శోభిస్తున్నట్లు, సరైన కాలంలో సరైన బోధ చేయుటమే ఉచితం. శుభ్రమైన వస్త్రమునకు రంగు వేస్తే ఆ రంగు చక్కగా హత్తుకుంటుంది. వివేకము, వైరాగ్యము… ఉత్తమ వస్తువుపట్ల లక్ష్యశుద్ధి, విచారణ ఉన్నవారి విషయంలోనే ‘ఆత్మజ్ఞానము’ యొక్క పరాకాష్ఠ వాక్యాలు సఫలీకృతం అవుతాయి.

అయినా కొంచెము చూచాయగా ఆయాచోట్ల నీ ప్రశ్నకు సమాధానం చెప్పుచూనే వస్తున్నాను. ఉదాహరణకు "భార్గవోపాఖ్యానం’లో కొంతవరకు ’బ్రహ్మమునందు ఈ జగత్తు ప్రకటన, అప్రకటన సమయములందు ఎట్లు ఉన్నది… అన్నది వివరించాను. అయితే సర్వ సంశయములు తొలగునంతటి విస్తారంగా చెప్పియుండలేదు. అందుచేతనే కాబోలు, ఈ విషయమై తగినంత స్పష్టంగా నీవు ఎరుగలేదు.

ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం. నీవు నీ ఆత్మ యొక్క పరిశుద్ధత్వమును, అప్రమేయత్వమును, తదితర లక్షణములను గ్రహించిన తరువాత నీయందు అఖండాత్మబోధ స్వయంగా కలుగుతుంది. ఆ తరువాత నేను చెప్పకపోయినా కూడా నీ ప్రశ్నకు సమాధానం నీవే ఎఱుగగలిగి ఉంటావు. ఇందు సంశయమేమీ లేదు.

ఒకటి అజ్ఞాన విషయం గాని, లేక సుజ్ఞాన విషయం గాని… ఆ విషయమును ఎరుగు చున్నది ఎవరు? ఆత్మయే కదా! అందుచేత జ్ఞానస్థితి యందు ఆత్మబోధచే ఆత్మయే సుప్రసన్నమై ఆత్మ గురించి ఎరుగుచున్నది.

నీకు ఇంతవరకు ’కర్తృత్వం-అకర్తృత్వం’ ల గురించి ‘భోక్తృత్వం-అభోక్తృత్వం’ ల గురించి కూడా చెప్పియున్నాను కదా! నీ ప్రశ్నకు సమాధానం ఆ చర్చలోనే కొంత చూచాయగా అయినా

Page:280

గ్రహించవలసియున్నది. అయినప్పటికీ ఎందుకో నీవు అఖండాత్మ స్వరూపాన్ని ఎరుగకయే ఉన్నావు. ఎందుచేత?… దీనిని బట్టి ఇంకా దృశ్యవాసన శమించవలసి ఉన్నదనియే తెలుస్తోంది.

ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. వాసనలచే ఆక్రమించబడువాడే ‘బద్ధుడు’. వాసనాక్షయమే ‘మోక్షము”. “నేను మరొకటి పొందవలసి యున్నది…” అని భావన చేయటయే వాసన యొక్క వృత్తిరూపం. అందుచేత నీవు "మోక్షేచ్ఛ’ను కూడా విడిచిపెట్టు. బంధం ఉన్నప్పుడే ’మోక్షము’ అనే ప్రసక్తి ఉంటుంది. “నాకు బంధము లేదు” అని ఎవరు గ్రహిస్తారో వారికి ఇక ‘మోక్షము’ యొక్క ప్రసక్తి ఎక్కడిది?

అందుకుగాను మొట్టమొదటగా ఈ దృశ్య విషయములచే పరిపూర్ణమైనట్టి రాజసిక తామసిక వాసనలను క్రమక్రమంగా వదలుకొంటూ రావాలి. ఆ సమయంలోనే ‘మైత్రి’ మొదలైన శుభవాసనలు గ్రహించు. శుభవాసనలు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయిస్తూనే, కాలక్రమంగా వాసనారాహిత్యము వైపు దృష్టి సారించు. అంతఃకరణంలో ఏ విధమైన ‘ఇచ్ఛ’ లేనివాడవై క్రమ క్రమంగా ‘సమ్యక్ జ్ఞానయుక్తము’ అయినట్టి స్థితిని అభ్యసించుచూ రమ్ము. దృశ్యవాసనా స్థానంలో “చిన్మాత్రము” అనే వాసనచే పూరించు. “అంతఃశాంతము”తో కూడిన పరిపూర్ణభావముచే “నేను ఈ దేహమంతా ఆత్మరూపుడనై నిండి ఉన్నాను… అదేరీతిగా, ఎవరెవరితో సంభాషించుచున్నానో, అట్టి ఈ సర్వజీవులందు నేనే మమాత్మ స్వరూపముచే పరిపూర్ణుడనై ఉన్నాను… అను మాధుర్యమును ఆస్వాదిస్తూ ఉండు. ‘మనస్సు-బుద్ధి’ ల సంచలనరూపమగు వాసనల పట్ల ఉపేక్ష, మౌనములను అభ్యాసం చేస్తూ ఉండు. క్రమంగా మనోబుద్ధులు పరిత్యజించబడగా అప్పుడు శేషించు ఆత్మ స్వరూపం నందు సుస్థిర సమాధానం కలిగియుండు. ఆ తరువాత ఏ అహంకారం చేత… “నేను వాసనలు పరిత్యజిస్తున్నాను" అను నిమగ్నం కలిగియున్నావో… అట్టి ఆ అహం కారాన్ని కూడా పరిత్యజించు. ఎందుకంటే అది కూడా ద్వైత కల్పన నుండే ఏర్పడుతుంది కదా!

  1. తాత్సారం చేయవద్దు

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ మహామతీ! రామచంద్రా! ఓ సర్వశ్రోతలారా! తాత్సారం మాత్రం చేయవద్దు. ఈ మానవజన్మ అత్యంత ఉత్కృష్టమైనదని, ఇది అత్యంత దుర్లభంగా మాత్రమే లభిస్తుందని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఈ అవకాశమును తగురీతి ఉపయోగించుకోవటమే ఉచితం.

జీవుని యొక్క ఈ అంతరంగంలో ఒక నిబిడాంధకారము చోటు చేసుకుని ఉంటోంది. అందులో "ప్రాణస్పందన - కాలకల్పన వాసనలు విషయములు, వాటికి ద్వారము వంటి అహంకారము” మొదలైన దుష్టపిశాచాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వాటిని నిరోధించాలి, నాశనం చేయాలి. అందుకుగాను “అఖండబ్రహ్మాకారము” అయిన బుద్ధిని పొందాలి.

Page:281

ఎప్పుడైతే నీవు.. ’విశ్వమునకు అతీతము, కేవల చిన్మయము”… అయినట్టి నీ యొక్క పారమార్థిక స్వరూపమునందు సుస్థిరుడవై ఉంటావో, మరుక్షణం నీయొక్క ’అద్వితీయ బ్రహ్మానంద స్వరూపము’ చే ఈ వర్తమాన భవిష్యత్తు లోకములను సర్వదా పావనమే చేయగలవు. అట్టి ముక్త స్వరూపుడవగు నీకు ఈ లోకములు అత్యంత సహజంగానే నీరాజనం పట్టగలవు.

  1. ‘ముక్తుడు’ అంటే?

శ్రీ వసిష్ఠ మహర్షి: వాసనలన్నీ హృదయము నుండి పారత్రోలి, ఎవడైతే సర్వస్థితులందు చింతారహితుడై ఉంటాడో, అతడే ముక్తుడు. అతడే ‘పరమేశ్వరుడు’ అని కూడా చెప్పబడుచున్నాడు. సమస్త ఆశలు అంతఃకరణం నుండి పారత్రోలబడగా, అట్టి ’శుద్ధాతఃకరణం’తో కూడిన మనుజుడే విముక్తుడు. అట్టివాడు సర్వలౌకిక వ్యవహారములు త్యజించి ’సమాధి’ని అభ్యసించు చుండు గాక! లేక ఈ ప్రపంచమున వ్యవహరించుచుండు గాక! అతని ముక్తిత్వమునకు వచ్చే లోటేమీ లేదు. నైష్కర్యేణ న తస్యార్ధ, న తస్యార్థో 2 స్థి కర్మభిః |

న సమాధాన జప్యాభ్యాం, యస్య నిర్వాసనం మనః ॥

ఈ చిత్తము వాసనారహితమైన తరువాత ఆపై ఇక నైప్యర్మ్యములచేగాని, సమాధిచేగాని, జపముచేగాని క్రొత్తగా సంపాదించవలసినదేదీ ఉండదు.

ఓ లోకకళ్యాణస్వరూపా! రామచంద్రా! మేము సమస్త శాస్త్రములను అతి నిపుణతతో విచారించాం… చాలాకాలం ఒకరితో మరొకరం ఆధ్మాత్యశాస్త్రం గురించి పదే పదే సంభాషిం చుకున్నాం… ఇట్లా ఎన్నోసార్లు శాస్త్రసారములను, పూజ్యుల ప్రవచనములను, స్వానుభవములను బాగుగా వితర్కించి, ఈ ఉత్తమ నిర్ణయానికి వచ్చాం - “వాసనాత్యాగం అవలంబించి ఆత్మస్థితి యందు సుస్థిరులం కావటం… అను పదము కంటే ఉత్తమమైన పదము మరెక్కడా ఏదీ లేదు.”

అనేకసార్లు మేము దశదిశలా సంచరిస్తూ అనేకుల తరగతుల వ్యక్తులతో సంభాషించాం. యథార్థ వస్తువగు బ్రహ్మంను ఎరిగినవారు కొందరు మాత్రమే తారసపడుచున్నారు. వారు వాసనా రహితులై ప్రశాంతతతో సంతోషంతో పరిసరాలను ఆనందపరుస్తూ సంచరిస్తున్నారు. వాసనా రాహిత్యమే ముక్తి.

  1. ఇక్కడ అభిలషింపతగినదేది?

శ్రీ వసిష్ఠ మహర్షి: అసలు ఈ ప్రపంచమునందు ’ఇష్టము- అయిష్టము’ అయిన దానికంటే వేరుగా ఏమున్నది? ఇష్ట-అనిష్టముల కొరకే ఈ సర్వజీవులు యత్నించుచున్నారు. చిత్రమేమిటంటే ఈ ఇష్టానిష్టములకంటే భిన్నమైనట్టి ’ఆత్మతత్త్వము’ కొరకు అనేకులు యత్నించుటయే లేదు.

Page:282

ఈ లౌకిక-వైదిక క్రియలు కూడా అనాత్మభూతమగు దేహాదుల కొరకే చేస్తున్నారు కాని, ఆత్మ కొరకై అనేకమంది యోచించుటయే లేదు.

పాతాలే బ్రహ్మలోకే చ స్వర్గే చ వసుధాతలే ॥

వ్యోమ్ని కతివయా ఏవ దృశ్యన్తో దృష్టదృష్టయః … (శ్లో 32, సర్గ 57)

చిదేకరసమగు బ్రహ్మమును సాక్షాత్కరించుకొనిన మహాత్ములు… ఈ బ్రహ్మ-స్వర్గ-భూపాతాళలోకములలో… ఎక్కడో గాని తారసపపడుట లేదు.

ఈ జనులలో అనేకులు "ఇది త్యజించాలి… ఇది గ్రహించాలి”… అను వ్యసనముతో కూడుకొనిన త్యాజ్య గ్రాహ్య బుద్ధినే కలిగి ఉంటున్నారే? త్యాజ్య గ్రాహ్య బుద్ధి శమించినట్టి జ్ఞానులగు మహాత్ముల సంఖ్య అల్పంగానే ఉంటోందే! ఒకడు చక్రవర్తి అయి, ఈ భూమండల మంతా ఏలవచ్చు గాక! లేదా ఇంద్రపదము పొంది ’వృష్టి’కి అధికారి అయి, మేఘములందు ప్రవేశించ వచ్చు గాక! లేక వరుణపదమును పొంది జలమును ఆక్రమించి ఉండవచ్చు గాక! కాదా, యోగసిద్ధులన్నీ పొంది హాయిగా అటూ ఇటూ విహరిస్తూ ఉండవచ్చు గాక…! అయితే మాత్రం ఏం? ఆ జీవునికి శాంతి కరువే అగుచున్నది. ఆత్మప్రాప్తిచే తప్ప మరింక దేనిచేతా కూడా ఈ జీవుడు విశ్రాంతి పొందజాలడు. ఆత్మానుభవం ఇంద్రియధ్యాసను నిశ్శబ్దపరచినవారికే లభిస్తోంది. ఇంద్రియములు అనే శత్రువులను జయించినవారే శూరులు. వారే మహాధీమంతులు.

ఓ జనులారా! ఈ జనన-మరణ రూప జ్వరమును ఉపశమింపజేయ దలచుకున్నారా? అయితే మీరు ఆత్మజ్ఞానులగు మహాత్ములను సమీపించండి. సేవించండి. ఆత్మ సమాచారం సేకరించండి. తరించండి. అంతే గాని ఈ పదార్థముల పట్ల ఏర్పడు ఇష్టాయిష్టములను నెమఱు వేస్తూ చతికిలపడి కూర్చుని ఉండవద్దు. నాయనలారా! ఈ పాతాళ భూ-స్వర్గ లోకములన్నిటి లోనూ ఉన్నది పంచభూతములే కదా! ఇందలి పదార్థములన్నీ పంచభూతముల సమ్మేళనం మాత్రమే. ఇంక ఆరవ వస్తువు ఏది ఉన్నది? మరి బుద్ధిమంతుడు, ధీరుడు అయినవానికి ఎక్కడకు వెళ్ళినా క్రొత్తగా పొందేదేముంటుంది?

అభిలషింప తగినదంటూ ఇక్కడెక్కడా ఏదీ లేదు. ఏది ఎట్లో - అది అట్లే జరుగుచుండగా, ఇక త్యజించవలసినది మాత్రం ఎక్కడ ఏమున్నది?

ఆత్మజ్ఞానమే మహాశయముగా గలిగినట్టి మహనీయులు ఇక్కడ ఊరకే కాలం వ్యర్థ పరచుకోరు. వారు వేదములందు ప్రవచించబడిన ’బ్రహ్మము’ యొక్క స్వభావాదులు ఏమిటో గ్రహిస్తున్నారు. క్రమక్రమంగా బ్రహ్మముతో ‘అభేదము’ సాక్షాత్కరించుకుంటున్నారు. అందుచేత వారికి ఈ ప్రపంచమంతా గోష్పాదజలం (ఆవు కాలిగిట్ట నేలను తాకుతుంటే ఏర్పడిన స్వల్ప గుంటలోని జలం) వలె అత్యంత సులభంగా తోచుచున్నది. ఎవరైతే బ్రహ్మజ్ఞులచే, శాస్త్రములచే చెప్పబడుచున్న యుక్తులను దూరంగా విడనాడి, విషయానుకూలంగా మాత్రమే వర్తిస్తున్నారో, అట్టివారికి ఈ సంసారము ప్రళయకాల మహాసముద్రము వలె అతి విస్తారంగా కనపడుచున్నది.

Page:283

విశాలచిత్తులై కొందరు సర్వభేదాభేదభావములను ప్రక్కకు నెట్టి ఆత్మానందమునే అనుభవిస్తూ ఉంటున్నారు. అట్టివారికి ఈ బ్రహ్మాండమంతా చేతికందించినా సరే, ఇందులో ప్రత్యేకత ఏదీ వారికి కనిపించుటలేదు. నూతనమైన ప్రయోజనములేవీ వారికి ఉండుటలేదు. “భావనానుసారంగానే అనుభవం ఉంటోంది… ఇక ఈ వస్తుజాలంలో ఏర్పడే క్రొత్తతన మేమున్నది?”… అని వారు మనలను ప్రశ్నిస్తున్నారు. మరి, మూఢులో… ఇట్టి ఈ అల్ప జగత్తులో రాజ్యము మొదలైన సుఖములు కొరకై లక్షలాది జనుల వినాశనమునకు హేతుభూతములగు “యుద్ధము, మోసము” మొదలైన క్రియలందు ప్రీతిగొని ఉంటున్నారు. మానవజన్మ యొక్క అర్థ, తాత్పర్యాలు ఇవా? కాదు. తత్త్వజ్ఞాని సహజంగానే ‘దయాళువు’ అగుచున్నాడు. దురహంకారం, దురాశ మొదలైనవి అతనికి తుచ్ఛములుగా, అతి నింద్యములుగా తోచుచున్నాయి.

జ్ఞానుల దృష్టిలో ఈ దృశ్యము లోపల మహత్తర పదార్థమంటూ ఏదీ లేదు. అత్యంత ఉత్కృష్టమైనదిగా భావించబడే బ్రహ్మదేవుని పదమే తీసుకో… అది కూడా మహాకల్పాంతమున నశించబోతోంది, కనుక అల్పమైనదే కదా! "సమస్త ప్రాణులు విలయం కావటానికి, ఉత్పత్తి కావటానికి హేతుభూతమగుచున్న బ్రహ్మపదము కూడా మానసిక వ్యధతో కూడుకొనినదే” అని చెప్పబడుతోంది. అట్టి పదవి అజ్ఞానుల దృష్టిలో గొప్పది కావచ్చునేమో గాని, జ్ఞానులు దృష్టిలో కాదు. జ్ఞానుల దృష్టిలో, “నిత్య-శుద్ధ-ముక్త- అఖండము, అతిసులభము అగు స్వస్వరూపమున సుస్థిరులై ఉండటం” అనేదే అన్నిటికీ మించియున్న పదము. అందుచేత జ్ఞానికి బ్రహ్మదేవుని పదమునందు కూడా ‘ఆకాంక్ష’ ఉండదు.

తత్వవేత్తల దృష్టిలో ఈ సృష్ట్యాదులచే ఏమీ ఉత్పన్నము కాకయే ఉంటోంది. కనుక, ఈ ముల్లోకములు సంప్రాప్తిస్తే మాత్రం ఆత్మకు క్రొత్తగా వచ్చి చేరేది ఏమి ఉంటుంది? కోల్పోయేదేమి ఉంటుంది? ఇదిగో… ఈ భూభాగం చూచావా? ఇది ఒక వైపు పర్వతములతోను, మరొక వైపు జలముతోను నిండి ఉన్నది కదా! మధ్యలో ఉన్న ఈ భూభాగములోని ‘రాజ్యము’ అను ఒక స్వల్పస్థలము క్రొత్తగా చేరి జ్ఞానిని పూర్ణునిగా చేస్తుందా? సర్వము ఎరిగిన తరువాత రాజ్యములు ఎంతటివి? భూభాగములు ఎంతటివి? అసలు ఈ శరీరము ఎంతటిది? శుద్ధము, నిత్యము అగు చైతన్యమునకు, అజ్ఞానజనితములైన “నా రాజ్యం - నా భూభాగం - నా వారు"… అనువాటికి సంబంధమెక్కడ? అందుచేత ఆత్మజ్ఞానికి ఈ పాతాళ భూ-స్వర్గ విభాగములలో ఎక్కడా కూడా అవశ్యం కర్తవ్యమైనదీ - అవశ్యం పొందవలసినదీ ఏదీ లేనేలేదు. సర్వదా సర్వత్రా ఏకత్వమే అతనికి కనబడుచున్నది. అతడు తనకుతానే ఆకాశం వలె విశాలమైన రూపం కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడు స్వస్థచిత్తుడై ఉంటున్నాడు. దేహసమూహములచే, అనేక పరస్పర వ్యతిరిక్త విషయాలచే నిండియున్న ఈ త్రిలోకములు అతనికి మృగతృష్ణా జలంలాగా, నిర్మలాకాశంలాగా శూన్య రూపంగా ఉంటున్నాయి. అతనికి వీటియందు శాంతము, రమణీయతలు మాత్రమే గోచరిస్తు న్నాయి. అతడు వాటికన్నిటికీ అతీతుడై, ఆపై వాటిని చూస్తున్నాడు. ‘ఈ జగత్తులోని పదార్థ జాల మంతా తుచ్ఛము, స్వల్పకాలికము’… అని గ్రహించి అతడు వర్తించుచున్నాడు. సూర్యుని దృష్టి ఏ

Page:284

పదార్థమునందూ ‘సంకుచితము-పరిమితము’ అవదు కదా! జ్ఞాని దృష్టి ఏ మాత్రం ఆకర్షణ వికర్షణలు పొందుట లేదు.

‘బ్రహ్మం’ అనే నిర్మల సముద్రంలో ఈ ‘దృశ్యవ్యవస్థ’ అంతా నురుగు-బుడగలు-కెరటాలు వంటిది మాత్రమే. బ్రహ్మము ఆకాశంలోని సూర్యుడై యుండగా, ఈ జగత్తు ’మృగతృష్ణ’లోని

జలము వంటిది.

ఆత్మతత్త్వమహాంభోధివీచయః సర్గరాజయః |

అనుత్తమవదాంభోద వృష్టయః శాస్త్రదృష్టయః | (శ్లో 47, సర్గ 57)

ఈ కనబడే సృష్టులన్నీ ఆత్మమహాసముద్రంలోని తరంగాల వంటివి. ఇక్కడ కనబడే వివిధ శాస్త్రసారములు సర్వోత్తమమగు ‘పరబ్రహ్మం’ అను మేఘం నుండి వర్షించు వర్షధారుల వంటివే.

ఇక్కడ ఏవేవి కనబడుచున్నాయో, అవన్నీ కూడా ‘ఆత్మ’ చేతనే ప్రకాశితములగుచున్నాయి. చమత్కారం చూచావా? ఆత్మయే వాస్తవస్వరూపంగా కలిగియుండి కూడా ఈ జీవులలో అనేకులు పరిచ్ఛిన్న దేహభావమును కలిగి ఉంటున్నారు. హింసాస్వభావయుతులై, ‘కామభోగాలు’ అనే గడ్డి పరకలను సేవిస్తూన్నారు. జ్ఞానసముపార్జనకు అర్హమైన ఉపాధులు సంపాదించుకొని కూడా మృగతుల్యంగా రాత్రి-పగలు గడుపుచున్నారు. ఇది ఉత్తమమా? సార్థకమనిపించుకుంటుందా? శ్రీరాముడు: స్వామీ! ఈ దేహములన్నిటి యొక్క ప్రయోజనమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ దేవ-మనుష్య తదితర అస్థి-మాంససహిత దేహములన్నీ అజ్ఞానమును ఆశ్రయించిన అభాగ్యజీవుల వ్యాహ్యాళి కొరకే నిర్మించబడుచున్నాయి. ఈ అనేక జీవుల అస్థిపంజరాలన్నీ అల్పజ్ఞాన జీవులను బంధించటానికి అమర్చబడిన ఎలుకల బోను వంటివే. బంధనము కొరకే సంసారారణ్యంలో ఇవి ఏర్పడి ఉంటున్నాయి. చర్మముచే కప్పబడిన తోలు బొమ్మలవంటి ఈ రక్తమాంస దేహములను భోగభూములందు ఏర్పరచి ఉంచినది అజ్ఞాన బాలురవంటి జీవుల వినోదార్థమే సుమా!

ఇక్కడి విషయాలు బహుదుఃఖపూరితమే అగుచున్నాయి. అయితే మందమైన వాయు వీచికలు పర్వతాన్ని కదల్చగలవా? సర్వత్యాగియగు వివేకిని ఈ సంసారాడంబరమంతా తాకనైనా తాకలేదు. ఇక్కడి విషయాలు, విశేషాలు అతనిని ఏ మాత్రం కదల్చలేవు.

జ్ఞాని సర్వదా సర్వోత్తమమగు బ్రహ్మపదమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అతడు దీని నంతా క్రీడామాత్రంగా సందర్శిస్తూ, సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తత్త్వజ్ఞానము యొక్క చిత్ప్రకాశం చేతనే ‘బ్రహ్మ’ మొదలగు లోకపాలకులు ఈ జగత్తునంతటినీ ప్రకాశింప జేయుచున్నారు. చిత్ప్రకాశము యొక్క ప్రభావంచేతనే ఈ నేత్రములు మొ॥ ఇంద్రియములు, ఈ బుద్ధీ, ఈ బాహ్యప్రదేశములు ఇవన్నీ కూడా ప్రవర్తించగలుగుచున్నాయి. లోకపాలకులగు బ్రహ్మ మొదలైన వారు ఒకవైపు దేహరహితమగు ఆత్మను వివేచించి చూస్తున్నారు. మరొకవైపు దేహాత్మభావముచే ఈ దేహాదులను రక్షించు ధర్మమును నిర్వర్తిస్తున్నారు.

Page:285

జ్ఞాని ఈ దేహములు పొందినందుకు ప్రయోజనంగా తనయందలి భోగవాసనలను సంక్షయింప జేసుకోవటానికి ప్రయత్నములు చేస్తున్నాడు. విశాలమైన హృదయం, శుద్ధము పవిత్రము అయినట్టి అంతఃకరణములను పొందుచూ, ఈ సర్వపదార్థములందు ఆసక్తిని త్యజించి వేస్తున్నాడు.

పరమశివుడు పార్వతీదేవి నృత్యమునే అభిలషిస్తాడు గాని, కోతుల నృత్యమును కాదు కదా! పవిత్రాతఃకరణుడికి దేనిపట్లా అభిలాష ఉండదు. ఇక్కడి నృత్య గీతాదులన్నీ అతనికి చిలుక పలుకుల వలె అర్థరహితమై ఉంటాయి. ఒక రత్నము తన యందు ప్రతిబింబించే వాటిపట్ల ’వీటిని నేను సర్వదా కలిగి ఉండాలి" అని భావన చేస్తుందా? తనయందు ప్రతిబింబిత వస్తువుల పొందుటచే తనకు లాభమేమున్నది? నష్టమేమున్నది? అనురక్తి ఏమున్నది? విరక్తి ఏమున్నది? జ్ఞాని ఈ జగత్పదార్థములను, సంఘటనలను అపరిచిత గ్రామంలోని అపరిచితుల ఇంట్లో జరిగే పెళ్ళి సందడిలాగా దూరంగా తాను ఉండి చూస్తూ ఉంటాడు.

అజ్ఞాని దృష్టిలో ఇక్కడ ఒక గడ్డిపరక నుండి బ్రహ్మలోకము వరకు ఈ పదార్థములన్నీ సుస్థిరంగాను, దుర్భేద్యంగాను ఉన్నాయి. జ్ఞానికో… ఇవి, నీటియందు ప్రతిబింబించే ’ఆకాశముచంద్రుడు-నక్షత్రములు” లాగా… అస్థిరములు, అసత్యములు, అతి చంచలములు అయి ఉన్నాయి. ఎందుకంటే, అతడు తత్త్వదృష్టిచే ఇదంతా మిథ్యారూపంగా దర్శించుచున్నాడు.

ఇక్కడి అల్ప తుచ్ఛ విషయసుఖములు, తదితర వ్యవహారములు అతనికి ప్రీతిని కలిగించుట లేదు. బంధము కలిగించుట లేదు. స్వీకార తిరస్కార భావాలకు అతీతంగా వీటిని అతడు మౌనస్వరూపుడై చూస్తున్నాడు.

అతడు దేనినీ కలిగియుండుట లేదు, త్యజించుట లేదు. అతడు అంగీకరించడు, తిరస్కరించడు. తదితర అజ్ఞానులతో తాను కూడా ఉంటున్నప్పటికీ వారి అవగాహనలు, ఆర్తులు, ఆశలు మొదలైనవి అతనికి అలవోకతో కూడిన చిరునవ్వు మాత్రమే పుట్టిస్తున్నాయి.

ఓ రామచంద్రా! ఈ విషయమై ఒకప్పుడు బృహస్పతి కుమారుడగు కచుడు చెప్పిన ఒక పవిత్రమైన వృత్తాంతమును వినిపిస్తాను.