Page:286
IX. కచుని గానం
శ్రీ వసిష్ఠ మహర్షి: దేవతల గురువు బృహస్పతి. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే కచుడు. ఆ కచుడు ‘బ్రహ్మవిద్య’ను ఒకప్పుడు ’మననము’ చేత, నిధిద్యాసచేత బాగా అభ్యసించి ఉన్నాడు. అట్టి అభ్యాసం యొక్క పరిపాకం చేత ఆత్మయందు విశ్రాంతి పొందాడు. ‘సమ్యక్జ్ఞానం’ (Equality towards everything everywhere, all times) అనే అమృతం పానం చేశాడు. ఇక అతని బుద్ధిలో… పంచభూతములచే తయారు చేయబడిన - అతి నికృష్టము… అగు ఈ దృశ్యము నందు ఏమాత్రం అనురాగముగాని, విరాగముగాని లేకుండా పోయింది. ఉదాసీనుడయ్యాడు. ఆత్మ కంటే వేరుగా పొందవలసినదేదీ అతనికి కనిపించుటలేదు. అప్పుడు ఆతడు ఈ విధంగా ఆత్మతత్వాన్ని గానం చేయనారంభించాడు.
❖
కిం కరోమి క్వ గచ్ఛామి కిం గృష్ణామి త్యజామికిం |
ఆత్మనా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా || (శ్లో 5, సర్గ 58)
శ్రీ కచుడు: ఆహాఁ! ఇప్పుడు నేనేమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేనిని గ్రహించాలి? మహా ప్రళయంలో ఈ బ్రహ్మాండమంతా జలంతో నిండిపోవుచున్నట్లు, ఈ విశ్వమంతా ఆత్మచే పరిపూర్ణమై ఒప్పుచున్నది కదా!
సమస్తము ఆత్మమయమేనని నేను తెలుసుకున్నాను. తత్త్వజ్ఞానోదయం కానంతవరకే దుః ఖములు నన్ను సమీపించాయి. జ్ఞానం ఉదయించిందా, దుఃఖములు… ఆ దుఃఖములను అనుభవించే జీవులు… ఆ జీవులకు ఇష్టమగుచున్న సుఖము… అంతా కూడా కేవలం ‘శూన్యము మాత్రమే’ అని తోచుచున్నది. “సమస్తము ఆత్మమయమే”… అని గ్రహించుచుండగా ఇక కోల్పో యేది ఏముంది? పొందేదేముంది? ఆత్మచేతనే సర్వదుఃఖరహితుడనగుచున్నాను. ఆత్మకు వేరైన వస్తువు ఎక్కడా ఏదీ లేదు కాబట్టి, ఇక నాకు దేనివలనకూడా ఏ ప్రత్యేకమైన ప్రాప్తి ఉండదు.
స్వర్గమా? మర్త్యలోకమా? పాతాళలోకమా? అవన్నీ కూడా ఆత్మతోనే నిండి ఉన్నాయి. ఇక వాటిలో భేదమెక్కడ? ఆత్మయే అయిఉండుటచే, భేదమెక్కడ? ఈ శరీరము యొక్క బైట, లోపల, సర్వ దిక్కులందు, పైన, క్రింద… అంతటా సర్వత్రా ఆత్మయే వ్యాపించియున్నది. ఆత్మ లేనిది, ఆత్మ కానిది అయిన చోటు ఏది? ఏదీ లేనే లేదు.
Page:287
‘కుండ’ యొక్క ఆకారము ఉన్నదెందులో? మట్టిలోనే కదా! ఈ జగత్తు అంతా సర్వదా అట్లే ఆత్మయందే ఉన్నది. మట్టి, "అయ్యో! నేను కుండనయ్యానే?” అని వేదన చెందుతుందా? లేదు కదా! మట్టి సర్వదా మట్టియేకదా!
సర్వత్రైవస్థితోహ్యాత్మా సర్వమాత్మమయంస్థితమ్ । |
సర్వమేవేదమాత్వైవ మాత్మన్యేవభవామ్యహమ్ ॥ (శ్లో 8, సర్గ 58)
అనగా ఈ జగత్తుకు అధిష్ఠానం ఆత్మయే. ఇక వివర్తభావంగా చూస్తే… ఆత్మయే ఈ జగత్తు రూపమున ప్రకాశిస్తోంది. తత్త్వదృష్టిచే ఇదంతా ఆత్మయే అయి ఉన్నది. ఈ విధంగా నేను ఎల్లవేళల పరమాత్మ స్వరూపమగు ఆత్మయందే నెలకొనియున్నాను. కాబట్టి పరిశుద్ధమగు పరమాత్మయే నేను. బ్రహ్మము-బ్రహ్మదేవుడు అనబడేదంతా నేనే.
“పరమాత్మకంటే వేరుగా ‘జీవుడు’ అనబడేవాడు ఒకడు ఉన్నాడు” అని అంటే… అది మిథ్యతో కూడిన ప్రతిపాదన మాత్రమే. పరమాత్మకంటే అన్యంగా ఖండరూపమున నేను లేను. అందుచేత నేను ఈ చేతన-అచేతన రూపములందు అంతటా కూడా ఆత్మస్వరూపుడనై వ్యాపించి ఉంటున్నాను.
“సన్మయము” (Absolute Existence) అయినట్టి ఆత్మయే ఆకాశమండలమును కూడా పూర్ణం చేసివేస్తూ సర్వత్రా వెలయుచున్నది. నిర్మలము, నిత్యోదితము, అఖండము అయినట్టి ఆత్మయే స్వరూపముగా గల నేను ఆ విశేషణములన్నింటికీ సర్వదా, సర్వస్థితులలోనూ తగియే
ఉన్నాను కదా…!
కనుక మంచిది! ఇప్పుడు… “నేను పరిపూర్ణుడనై ఆనందస్వరూపుడనై, సుఖమయుడనై ఏకమగు ఆత్మ మహాసముద్రమునందు అంతటా సర్వదా సుస్థితుడనైయున్నాను”… అని నాచే గ్రహించబడుచున్నది.
ఈ విధంగా ఆ కచుడు గానం చేస్తూ ఉన్నాడు. ఇట్టి భావనకు ‘సంజ్ఞ’ అయినట్టి ‘ఓం’ కారమును ఉచ్చరించ ఆరంభించాడు. ఓంకారము యొక్క ’అర్థమాత్రము” నందు సమస్తము లయం చేసివేశాడు. ఇప్పుడు అతడు అభ్యంతరమగు ‘కారణము’ నందులేడు. బాహ్యము అయినట్టి ‘కార్యము’ నందు కూడా స్థితి కలిగియుండలేదు. కేవలం పరమాత్మ స్వరూపము మాత్రం భావన చేస్తున్నాడు. సమస్త కల్పనాకళంకములు రహితం చేసుకున్నాడు. శుద్ధుడయ్యాడు. ’ప్రాణగతి’ని కూడా హృదయమునందు విలయం చేశాడు. మేఘరహితమగు నిర్మలాకాశంలాగా “నిర్మలాంతఃకరుణుడు”… అయ్యాడు.
Page:288
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! “సర్వము ఆత్మయే” అను దర్శనము పొందిన తరువాత, అట్టి జీవుని యొక్క అవగాహనను నీకు తెలియజేయటానికే ఈ కచుని సమాలోచనను వర్ణించి చెప్పాను. భోగములను నమ్మి ఉండరాదు. ఆత్మనే ఆశ్రయించి ఉండటం ఉచితం.
ఈ ప్రపంచములో కనబడుచున్నవన్నీ సమీక్షిస్తే ఇవి… "అన్నము-పానము-స్త్రీ సంగమము’ … ఇంత మాత్రమే కదా! ఇంతకు మించి ఇక్కడి ఆయా పదార్థములలో ఏమి పురుషార్ధం ఉన్నది? వివేకి అయినవాడు ఈ విషయాన్ని శ్రుతి-స్మృతుల సహాయంతో, సద్గురువులు చెప్పుచున్న ఉపదేశములచేత, స్వానుభవంచేత నిశ్చయించుకుంటున్నాడు. ఇక ఆతడు భోగములను ఏమాత్రం ఆశించుట లేదు.
ఓ జనులారా! మీరు పశు, పక్ష్యాదులలాగా మూఢులై, “నీచము, నశించే స్వభావము కలిగినవి”… అయినట్టి విషయభోగముల పట్ల విశ్వాసం కలిగి ఉండటం ఉచితమా? అయ్యో! గాడిదల వలె నివసిస్తూ ఉత్తమమగు ఈ మానవజన్మను వృథాపరచుకోవటం మంచిదా? “రక్తమాంసములు మాత్రమే” అయిన ఈ తుచ్చ శరీరాదులపై మీకు అహంకార మమకారములు (నేను, నాది-అను భావములు) ఎందుకు ఏర్పడుచున్నాయి? వీటిలో ‘కేశములు, బొమికలు’ తప్ప ఇంకేమీ ఉత్తమ విషయాలు లభిస్తున్నాయి చెప్పండి? ఆహారనిద్రామైథునాలకే పరిమితులు కాదలచుకొన్నవారు జంతు ఉపాధులను మించి ఏం గొప్ప ప్రయోజనం పొందుచున్నారు?
ఈ భూమి అంతా మట్టిమయమే…! వృక్షములన్నీ కొయ్యతోనే నిండి ఉన్నాయి…! “పైన ఆకాశం క్రింద భూమి” గల ఈ ప్రపంచంలో సుఖప్రదమగు అపూర్వ వస్తువు ఏమి ఉన్నది? ఈ ఇంద్రియములను గమనిస్తే, ఇవి ఎప్పటికప్పుడు అల్పమైన విషయాలు పొందటానికే ఆరాట పడుచున్నాయి. అవి ఎంత చూచినా, వినినా, పొందినా వివేకము పొందటానికి ఏమాత్రం సమాయత్తమగుటయే లేదు.
నాయనా! రామా! ఈ ’సంసారారణ్యం’లో సంచరించే జనులయొక్క వ్యవహారములన్నీ విచారించబడనంతసేపు మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. కాని అవన్నీ చివరకు మోహ హేతువులుగానే పరిణమిస్తున్నాయి. పాపం, ఈ మానవుడు సుఖమును గూర్చిన అనేక ఆశలు కలిగి ఉంటున్నాడు. వేటి వేటి కొరకై ‘ముందు ముందు సుఖించగలను’ అని అనుకుంటూ ప్రయాసతో ప్రయత్నములు చేస్తున్నాడో, అవన్నీ దుఃఖప్రదములే అవుతున్నాయి. ఇక్కడ గల పాప భావములకు పాప విషయకాలుష్యమునకు, వియోగ విషాదాదులకు అంతు ఉండుట లేదు కదా!
ఈ పంచేంద్రియములు, ఈ మనస్సు ప్రతి క్షణం ఏవేవో వస్తువులను పొందటం, కోల్పోవటం చేస్తున్నాయి. ఈ విషయసంపదలను చూచుకొని మురిసినంతసేపు పట్టదు. మన ఈ గొప్ప గొప్ప శరీరములు ఏ క్షణమైనా పతనం కావటానికి సిద్ధపడియే ఉంటున్నాయి.
Page:289
ఎంతటి చిత్రమైన విషయం! ఈ జీవుడు, రక్తం, మాంసం, చర్మముల సంఘాతములచే ఏర్పడుచున్న బొమ్మవంటి స్త్రీ దేహమును చూచి "ఆహాఁ! ఈమె నా ప్రియురాలు… ఈమె ఎంత అందంగా ఉన్నది…!” అని తలచుచు మురిసిపోవుచున్నాడు. అట్టి మాంస బొమికల అమరికను ఆలింగనం చేసుకొని ‘ఇంతకుమించి ఇంకేమి కావాలి?’ అని తలచి విజ్ఞాన, వివేకముల మార్గము నుండి వైదొలగుచున్నాడే…! ఓ రామా! ఇదంతా అజ్ఞానికి సంతోషప్రదమైతే అగుగాక! జ్ఞానికి ఇదంతా అత్యంత చోద్యం, అస్థిరం, అసత్యము కూడా. సరైన అవగాహన లేకుంటే ఇది దుఃఖ ప్రదమే. ఈ విషయభోగములను అల్లంత దూరంలోనే చూచిన వివేకి వాటిలోని విషత్వమును గమనిస్తున్నాడు. విషయములు పొందినంత మాత్రంచేత ‘భోగతృష్ణ’ క్షీణించగలదా? లేదు. తాంపరిత్యజ్యభోగాస్థాం స్వామైకత్వగతింభజ |
అనాత్మమయభావేన చిత్తంస్థితిముపాగతమ్ ॥ (శ్లో. 11, సర్గ 59)
ఇట్టి భోగములందు విశ్వాసము త్యజించుటయే మంచిది. నీవు కేవలం ఆత్మనే ఆశ్రయించు. శరణువేడు, భావించు. అంతే గాని భోగవాసనలను అధికం చేసుకుంటూ అనాత్మ స్వరూపమగు దేహాదులు గురించి భావనను చేయనేవద్దు. అట్టి నీచభావనలయందు నీ చిత్తము స్థితి పొందిందా… మరుక్షణము నుండి అసన్మయమగు ఈ జగజ్జాలమంతా వచ్చి ఎదురుగా నిలచి ఉంటోంది.
శ్రీ రాముడు మహర్షీ! బ్రహ్మము నుండి “బ్రహ్మదేవుడు” అను సమష్టిజీవుడు ఎట్లు ప్రకటితమగుచున్నాడో వివరించండి. అతని యొక్క మనస్సుచే ఈ జగత్తు ఎట్లా ఉత్పత్తి చేయబడుతోందో కూడా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి మొట్టమొదట ’సంకల్పించుట” అను విశేషముతో కూడుకొన్న మనస్సు రూపంలో ఒక భావకెరటం ఉత్పన్నమగుచున్నది. ‘ఎఱుగుట’ అను తత్వము నుండి బయల్వెడలిన ఆ ప్రథమక్రియాచైతన్యమే ప్రథమ జీవుడు. ఆతడే హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు కూడా. అట్టి "సంకల్పాత్మక మనోరూపము, కల్పితము అయిన ఆకృతి గల చైతన్య స్రవంతి” యే భావిసృష్టికి సంబంధించిన యత్నము ఒనర్చుచున్నది.
అతని అట్టి సంకల్పమే మహాప్రకాశయుక్తమైన తేజమును రచించుచున్నది. ఆ సంకల్ప పరంపరావ్యవహారం తన తేజస్సుచే దిక్కులన్నీ వ్యాపించుచున్నది. అపరిచ్ఛిన్నమై, ఆవరణ రహితమై ఒప్పుచున్నది.
అట్టి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై వెలుగొందుచున్నాడు. ఈ మనో-బుద్ధి-చిత్తఅహంకారములే అతని చతుర్ముఖములు. అట్టి చతుర్ముఖముల ప్రసరణచే (తన మనో తేజముచే)
Page:290
“స్వసదృశమే” (Not different from his own self) అయినట్టి ఈ కనబడే దృశ్యజగత్తును నిర్మించుచున్నాడు. అనగా… మనస్సే హిరణ్యగర్భుడు. ఆ మనస్సుచే గాంచబడేదే దృశ్యజగత్తు.
నేను, నీవు తదితరులు కూడా మనస్సునందే మనస్సుచే మనస్సు కొరకు ఈ జగత్తును ఇట్లు పొందుచున్నాం. అట్లు “స్వకల్పనాసామర్థ్యము” చే సృష్టించబడ్డ తేజోమండలము నందలి తేజము నుండి సూర్యమండలం ఉద్భవించింది. ఆ సూర్యమండలం అగ్నిజ్వాలల వంటి తన కిరణములచే ఆకాశమును నింపివేస్తోంది.
అట్లు సూర్యుడు నిర్మించబడిన తరువాత శేషించిన కళారూపమును తొమ్మిది విధాలుగా విభజించబడ్డాయి. అట్లు తొమ్మిదిమంది ప్రజాపతులు ఏర్పడ్డారు. వారు బ్రహ్మదేవుని సంకల్పంచే సమస్త సిద్ధులు పొందినవారై స్వసంకల్పములను అనుసరించారు. తదనుసారంగా తమ ఎదుట మాయా పదార్దములను చూడసాగారు. “మరీచి" మొదలైన ఈ ప్రజాపతులచేతనే దేవతలు, దానవులు మొదలైన వివిధములైన జీవరాశులు ఏర్పడినాయి. వారింకా అనేక స్వభావములతో, తత్త్వములతో, శక్తులతో కూడిన జనులను, వస్తువులను సృష్టించారు. కాలక్రమంగా పుత్రులు, పౌత్రులు మొదలైన పరంపరచే ఈ సృష్టి అంతా పరివర్ధమానమగుచున్నది.
ఆ తరువాత సమష్టి సృష్టి అహంకారియగు బ్రహ్మదేవుడు వేదసంస్మరణం చేయుట ద్వారా ఈ జగతియందు ‘నియతి’ ని కల్పించుచున్నాడు.
ఇక్కడ నీవు గ్రహించవలసినదేమిటి? మనస్సే ఆ విధంగా విశాలమగు బ్రహ్మదేవుని రూపం ధరిస్తోంది. అట్లు ధరించి “భూతసంతతిచే పరివ్యాప్తమైయున్న ఈ సంకల్పమయ సృష్టి”ని విస్తరింపజేస్తోంది. ఇక ఈ సృష్టి ‘సముద్రం-పర్వతాలు-వృక్షాలు దిక్కులు’ మొదలైన అనేక పదార్థములచే పూర్ణమై ఉంటోంది. అన్ని దిక్కులను ఆక్రమించిన ఉదరభాగం కలిగి ఉంటోంది.
క్రమంగా ఈ ’సృష్టి’ అనబడు జగదృశ్యము అనేక శారీరక సుఖదుఃఖములతోను, మానసిక వ్యధలతోను, జరా, జన్మమరణములతోను కూడినదై ఉంటోంది. అందుచేతనే “ఈ దృశ్యమును త్యజించినవారై ఉండండి” అని ఆత్మతత్త్వము ప్రవచించే శాస్త్రములు మనకు చెప్పు చున్నాయి. “మనస్సుచే కల్పించబడినది మాత్రమే”… అయినట్టి ఈ సృష్టి వ్యవహారమంతా రాగ ద్వేష మయమగు దృష్టిచే గాంచబడిందా… ఇదంతా ’ఉద్విగ్నత’కు కారణమగుచున్నది. అట్టి మనో కల్పన యందు సాత్విక రాజసిక తామసాలనే త్రిగుణాలు నిండుగా ఆక్రమించుకొని ఉంటున్నాయి.
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ప్రతిపాదిస్తున్నాను. హిరణ్యగర్భుడు అదిగా ప్రారంభ మైన ఈ మనోమయ సృష్టి అంతా ఆత్మదృష్ట్యా ‘లేనిదే’ అగుచున్నది. అందుచేత ‘స్వస్వరూపాత్మ’ యొక్క ఆత్యంతికానుభవము కొరకై ఆ మనోమయసృష్టి మొదలంటా త్యజించబడాల్సిందే.
❖
Page:291
బ్రహ్మదేవుని నుండీ ఈ మనస్సు ఆవిర్భవిస్తోంది కదా! ఈ మనస్సు ఇతఃపూర్వపు కల్పంలో ఏ వస్తువును ఎట్లు దృశ్యమానంగా పొందిందో, ఈ కల్పమునందు నేటి వరకు అట్లే పొందుచున్నది.
ఈ మనస్సు, దీని యొక్క ‘సమష్టిత్వము’ దృష్ట్యా సర్వభూతములందు ఉన్నది. వ్యష్టి దృ ఇది కొన్ని భూతములందు మాత్రమే మననము కలిగియుంటోంది.
ఈ ప్రపంచమును సంకల్పించుచు, తదనుసారంగా తనకు తానే వీక్షించుచున్నది ఈ మనస్సే కదా! ఇక్కడ లభిస్తున్న ‘జగన్మోహము’ అంతా మనస్సుచే అకస్మాత్తుగా కల్పించబడి స్థిరత్వం పొందుతోంది.
అంతా సంకల్పబలమే - సంకల్పబలం చేతనే జగత్రియలన్నీ ఉత్పన్నములౌతున్నాయి. సంకల్పబలం చేతనే దేవతలు నియతికి వశులై వెలువడుచున్నారు. సంకల్పముచే జనించిన సృష్టిలో దేవ దానవాది చక్రవర్తులు తమ తమ స్వభావములైనట్టి సాత్విక రాజసిక తామసిక వృత్తులను ప్రకటిస్తూ ప్రేరేపణ పొందుచున్నారు. ఇక్కడి జన్మ- జరా-బంధ-మరణాదులన్నీ సంకల్పమాత్రములే.
ఒక్కొక్కప్పుడు సాత్విక-రాజసిక తామసిక వృత్తులచే ఈ సృష్టి మరల మరల బాగుగా పీడించబడుచున్నది. అప్పుడు మనోమయజనితుడు అగు బ్రహ్మదేవుడు పద్మాసనము వైచుకుని ఉండి, ఇట్లు సంకల్పిస్తున్నాడు…
"ఆహాఁ! ఈ పాతాళము, భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గమార్గములు, రుద్రులు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, పర్వతములు, సాగరములు మొదలైన ఆయా పదార్థములతో కూడిన వ్యష్టి జగత్తంతా మనస్సు యొక్క స్పందనచేతనే ఏర్పరచబడుచున్నాయి కదా!
మనస్సు యొక్క క్రియాశీలత్వమే ఇదంతా. మనస్సు నా నుండే ప్రభవిస్తోంది. కనుక, ఈ వ్యవహారమయ సృష్టి అంతా నా నుండే ఉద్భవించుచున్నది. ఇదంతా నా సంకల్పమే. దీనిని నలువైపులా వెదజల్లింది నేనే. అట్టి ఈ సంకల్పములను ఇప్పుడు విరమించెదనుగాక!”- ఇట్లు నిశ్చయం చేసుకుంటున్నాడు. శాంతుడగుచున్నాడు. ‘కల్పనలు’ అను అనర్థసంకటముల నుండి విరతి (withdrawl) చెందుచున్నాడు.
అట్టి సమయంలో అనాదిగా సర్వదా సిద్ధించియే ఉన్న బ్రహ్మమును మనస్సుచే స్మరించ ప్రారంభించుచున్నాడు. అంతే… ఇకపై స్మరణ మాత్రం చేతనే అతడు పరమాత్మను పొందుచు న్నాడు. వ్యవహారములలో పాల్గొనుచున్న ఒక వ్యక్తి ఎంతో అలసిపోవుటచే, ఆ వ్యవహారములు ముగిసిన తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు సుఖవిశ్రాంతిని పొందుచున్నాడు చూచావా? ఆ బ్రహ్మ
Page:292
దేవుడు కూడా అట్టి విశ్రాంతినే ఆశ్రయించుచున్నాడు. ‘ఆత్మ’ యొక్క ఆకారముగానే ప్రకాశించుచున్న ‘బ్రహ్మపదము’ నందు విలీనచిత్తుడు అగుచున్నాడు. అహంకార మమకారాలు త్యజించి పరబ్రహ్మమున శాంతిని పొందుచున్నాడు. అలలు లేని సముద్రంలాగా ఆత్మయందు సుస్థితుడగుచున్నాడు. “మౌనము అవధరించినవాడు, భావాతీతుడు”… అగుచున్నాడు.
అట్టి ఉపసంహరణ సమయంలోని తతంగం ఏమిటో వర్ణించి చెపుతాను, వినుసముద్రము అలలు నుండి విడివడునట్లు, బ్రహ్మదేవుడు జగత్ నిర్మాణానికి మూల కారకమగు విషయముల ధ్యానము (సృష్టి పట్ల అధ్యాస) నుండి విడివడుచున్నాడు. ఇట్లు తలచుచున్నాడువిచారయతిసంసారం సుఖదుఃఖసమన్వితమ్ ।
ఆశాపాశశతైర్బద్ధం రాగద్వేషభయాతురమ్ (శ్లో 41, సర్గ 59)
“ఆహాఁ! ఈ సంసారమంతా దుఃఖసమన్వితమే కదా! ఇదంతా జీవునికి ఆశాపాశ రూపములు గానే ప్రాప్తిస్తోంది. ఇది రాగ ద్వేష భయములతో నిండి ఉంటోంది. నా పుత్రులగు ఈ జీవులు అజ్ఞానముచే దృశ్యమునకు బద్ధులైపోతున్నారు. పదే పదే జనన-మరణ దుఃఖాలను పొందుచున్నారు. వీరంతా ఉద్దరించబడేది ఎట్లా?”
క్రమంగా దయార్ధ చిత్తుడగుచున్నాడు. జీవరాశుల సుఖం కొరకు మోక్షాన్ని ప్రసాదించ గల “ఆధ్యాత్మశాస్త్రము” ను రచించుచున్నాడు. వేద వేదాంత సంగ్రహములను, పురాణములను రచింపజేయుచున్నాడు. అట్టి ‘ప్రక్రియ’ యందు నేను, వ్యాసుడు, వాల్మీకి మొదలైనవారమంతా నియమించబడ్డవారమే సుమా!
అట్లు ఆ బ్రహ్మదేవుడు ‘సృష్టి’ అను ఈ పరిశ్రమ నుండి వెలువడి తన పూర్వపదమును (past glory) పొందుచున్నాడు. బ్రహ్మముతో ఐక్యము, అభేదములే అతని పూర్వపదము. అట్టి పూర్వపదాన్ని అవలంబించి, గాలులు వీచనట్టి సమయంలో సముద్రుని వలె… పరమ ప్రశాంతు డగుచున్నాడు. ఈ రీతిగా స్వస్వరూపమున వెలయుచున్నాడు. అనగా, అతడు ఈ జగత్తును కల్పిస్తున్నాడు. వీక్షిస్తున్నాడువీక్షిస్తున్నాడు. . శాస్త్ర రచనలచే నియమాదులు కల్పించుకొని మరల ఆత్మస్థుడగుచున్నాడు.
శ్రీరాముడు: ఇట్లు ‘సృష్టి’ లేక ‘దృశ్యము’ యొక్క కల్పన ఉనికి ఉపశమనములకు కారణమగుచున్న మనోరూపుడగు బ్రహ్మయొక్క ఉనికి ఎచ్చట?
శ్రీ వసిష్ఠ మహర్షి వాస్తవానికి బ్రహ్మదేవుడు చిత్స్వరూపుడే. అతడు సంకల్పరహితుడే. సంకల్పించుటకు మునుముందే ఉండి ఉన్నాడు. అయినప్పటికీ తనయొక్క ’ఇచ్ఛ’ చే లోకములను అనుగ్రహించుట కొరకు లోకవ్యవహార పారాయణుడగుచున్నాడు.
వాస్తవానికి అతనికి ఆర్జన లేదు. అనాదరణ కూడా లేదు. శరీరగ్రహణము లేదు… నానాత్వము లేదు. అతనికి చేతనము-స్థితి-వినాశనములు కూడా లేవు.
Page:293
అతనికి అన్ని భావములు, చిత్తవృత్తులు కూడా సమానమే. సర్వదా పరిపూర్ణస్వరూపుడై ‘మహాసముద్రము’ వలె వెలయుచున్నాడు. కాని, ఒక్కొక్కప్పుడు తన అప్రమేయత్వము పట్ల నిదురించి, జగత్తుపట్ల జాగరిల్లుచున్నాడు. ఆ సమష్టి సంకల్పస్వరూపుడు అగు బ్రహ్మదేవుడు బ్రహ్మము కంటే వేరైనవాడు కాదు.
ఇదంతా ఇట్లా ఉండగా ‘బ్రహ్మముతో ఏకము’ అను అత్యంత సాత్విక స్థితి ఒకటి ఉన్నది. అది నిష్కల్మష హృదయులు, పదార్థరాహిత్యం పొందినవారు మాత్రమే దర్శిస్తున్నారు. వారు “మనస్సే బ్రహ్మము” అను అనుభవమునకు అర్హులగుచున్నారు.
5. “సృష్టి-జీవుడు" - పరిణామ చమత్కారం
సృష్టి ఏర్పడి ఉన్నట్టి చైతన్యమునే ‘జీవుడు’ అంటున్నాం. అయితే, ఈ జీవత్వము ఏర్పడక ముందే ఆత్మయొక్క ఔన్నత్యము స్థితి కలిగియే ఉన్నది. ఈ సృష్టికి పరముగా చిదాకాశము ఉన్నది. మనస్సునందు రూపములు ఏర్పడి, గాంచబడతాయి చూచావా! ఆ విధంగానే చిదాకాశము నందు ఈ సృష్టి ఏర్పడుచున్నది. నిర్మల ప్రశాంతజలంలో ఆవృత్తములు ఏర్పడుచున్నప్పుడు, ఆవృత్తములు జలం కంటే వేరుకాదా కదా! అట్లాగే, జగత్తు - దృశ్యములకు సంబంధించిన చిత్తవృత్తులు “చిదాకాశము కంటే వేరు” అని అనటానికే వీలులేదు.
అట్టి సృష్టిలోని ప్రథమరూపములే ‘ప్రజాపతులు’ అని చెప్పబడుచున్నారు. ఆ ప్రజాపతుల సంకల్పములను అనుసరించే ‘నియతి’ మొదలైనవి ఏర్పడుచున్నాయి.
చిదాకాశము - →→ సృష్టి సంస్కారములు : → ప్రజాపతులు - ఓషధులు- చంద్రకళ -కల్పన - సంకల్పములు: దేవతలు - కర్మలయందు ఆసక్తి-మానవులు : తదితర జీవోపాధులు.
ప్రజాపతులు - వీరు ప్రథమ సృష్టిలోని వారు. వీరియందు బ్రహ్మజ్ఞానము స్వతఃసిద్ధమై ఉంటోంది. అయితే "మేము తదితర జీవుల సమున్నతి కొరకు ఉపాసన మొదలైనవాటిని కల్పించాలి”… అనే సంస్కారం కలిగి ఉంటున్నారు.
దేవతలు - ప్రజాపతులు ఏర్పడిన తరువాత అదే కల్పన దేవతల రూపమున ఉదయిస్తోంది. వీరు సుసంస్కారము స్వభావముగా కలిగి ఉంటున్నారు. వీరు ఉపదేశ మాత్రం చేతనే బ్రహ్మజ్ఞానం పొందుచున్నారు.
మనుష్యులు - వీరికి పురుష ప్రయత్నం చేత మాత్రమే బ్రహ్మజ్ఞానం లభిస్తోంది. సాధు సంగము, శాస్త్రాభ్యాసము, ఇంద్రియ జయము మొదలైన ఉపాయములను అభ్యసిస్తేనే బంధమును త్యజించగలుగుచున్నారు. “ఉత్తమఫలము’ అయినట్టి ‘బ్రహ్మజ్ఞానము’ సుస్థిరమయ్యే వరకు వారు శ్రవణమననములను ఆశ్రయించవలసి వస్తోంది.
Page:294
ఈ విధంగా ఈ సృష్టి ’సృష్టము లేక సంకల్పితము” అయినట్టి అనేక ఉపాసనలతోను, ‘యజ్ఞము’ మొదలైన ఉచితకర్మలతోను, “ద్వేషము, రాగము, ప్రేమ, పరిమితదృష్టి”… మొదలైన నిషిద్ధ మిశ్రమ కర్మలతోను ప్రకాశిస్తోంది. ఇందులో ప్రవేశించుచున్న జీవుల వాస్తవ స్వరూపము శుద్ధతత్త్వమగు ఆత్మయే అయినప్పటికీ, వారు ‘పొందుట-కోల్పోవుట’ మొదలైన క్రీడాకౌతుకం అవలంబించి ఉంటున్నారు. గర్విస్తున్నారు… హింసిస్తున్నారు… దుఃఖిస్తున్నారు…. ఒకరితో మరొకరు కీచులాడుకుంటున్నారు. వారిలో వారు వాదులాడుకుంటున్నారు. ఈ విధంగా ఉచిత, అనుచిత ప్రారబ్ధకర్మల వేగముతో సృష్టిలోని ఆయా వ్యవహారమంతా వర్ధిల్లుతోంది. అనేక జీవుల, జీవజాతుల క్రోధ-లోభ వ్యవహారములతో ప్రవర్తించు ఈ సృష్టులు ”బ్రహ్మదేవుని సంకల్పము” యొక్క బలంచేతనే ‘సత్తు’ ను పొందుచున్నాయి.
ఈ త్రివిధ సృష్టులు ఇట్లు ఉండగానే ఈ జీవుడు సర్వదా బ్రహ్మమేనని గ్రహించి ఉండు.
శ్రీరాముడు: తండ్రీ వసిష్ఠ మహర్షీ! అనంతసంఖ్యలో దీపితమౌతున్న ఈ జీవగణమంతా ఎక్కడి నుండి, ఎందుకు ఎట్లా వచ్చి సృష్టిలో ప్రవేశిస్తున్నాయి?
శ్రీవసిష్ఠమహర్షి: భగవంతుడగు బ్రహ్మదేవుడు ఒక సమయంలో “ఆత్మసమాధి (ఆత్మను మాత్రమే దర్శించుచుండుట) - మౌనము“ అను రూపంలో ఉండే తన స్వస్వభావమును విడిచి, లేచి, ఈ సృష్టి పరంపరావ్యవస్థను ఏర్పరచుచున్నాడు. అతని ఇచ్ఛయే ఇదంతా. అందుచేత ”సృష్టికి మూలం ఇచ్ఛ" అని చెప్పబడుతోంది.
అట్లు ఏర్పరచబడిన ఈ సృష్టి లేక జగత్తులో అనేకమంది మృతతుల్యులగు జీవులు లేచి పడుచున్నారు. వారు ‘జీవనతృష్ణ’ అనే గాలికి కొట్టుకువచ్చి ఇందు పాల్గొనుచున్నారు. దృష్టిభేదము ననుసరించే ఇదంతా ఏర్పడి ఉంటోంది.
ఈ భూతజాలమంతా (లేక, ఇక్కడి జీవులన్నీ) బ్రహ్మమునుండే లేచుచున్నాయి… జగదృశ్యమును అంగీకరించి సంసారపంజరములో ప్రవేశిస్తున్నాయి. ‘ఏదో పొందాలి, చూడాలి, కావాలి’ మొదలగు రూపంగల ‘తృష్ణ’ యే జగద్వ్యహారములంతటికీ మూలకారణమై ఉంటోంది.
ఈ పంచభూతమయ శరీరాదులన్నీ ఆకాశం నుండి ధూళికణాల వలె బయల్వెడలు చున్నాయి. ఇక్కడి పంచభౌతిక నిర్మితములన్నీ ఆకాశంలోంచి బయలుదేరి, మరల ఆకాశంలోనే లయమౌతున్నాయి. ’ఆకాశమే ఈశ్వరుని ప్రథమపుత్రుడు’ అని అందుకే శాస్త్రకారులు చెప్పారు.
జలం నుండే తరంగాలు లేస్తున్నాయి కదా! ఈ జీవగణములన్నీ అనాది యగు ‘బ్రహ్మపదము’ నుండే ఉత్పన్నం అగుచున్నాయి. బ్రహ్మము చేతనే బ్రహ్మము నందు కల్పనాదృష్టిచే
Page:295
పొందబడుచున్నాయి. పొగ మేఘాలలో మేఘాలలో ప్రవేశించుచున్నట్లు ప్రవేశించుచున్నట్లు ఈ ఈ జీవగణం ఆకాశంలో
జేరుచున్నాయి.
అంతా సంకల్పమాత్రమే - జీవులు పరబ్రహ్మమునందే ఆకాశ వాయువులతో కూడి సంచారం కొనసాగిస్తున్నారు. ఈ జీవులు, ఈ ఆకాశ వాయువులు పరబ్రహ్మము నుండి సంకల్పప్రభావం చేతనే ఏర్పడుచున్నాయి.
తేజస్సు (అగ్ని) - జలము పృథివి ఇవన్నీ సృష్టించబడిన తరువాత జీవులు ప్రాణవాయువులచే ఆక్రమించబడుచున్నారు. అన్నిటికీ మూలం సంకల్పమే. మనో-బుద్ధిచిత్త-అహంకారముల సమన్వయమే లింగదేహము,
పరమాత్మ మహాసముద్రంలో లింగదేహ తరంగాలు అనంతంగా ఏర్పడుతున్నాయి. “ప్రాణవాయువులు-భూతతన్మాత్రలు-అన్నము-జలము” అవన్నీ కలసి పంచవిధ వాయువులుగా మారుచున్నాయి. ఆ పంచవిధ వాయువులు స్థూలదేహంలో ప్రవేశిస్తున్నాయి. అట్లు ప్రవేశించి ‘తేజస్సు’ యొక్క భావం పొందుచున్నాయి. అట్లు తేజస్సు భావన పొందిన జీవులు ప్రాణ రూపమును దాల్చి ఈ జగత్తునందు ఉత్పన్నులగుచున్నారు. అయితే ఎందుకో వారి జ్ఞానం అపరిపక్వంగా, అస్ఫుటంగా ఉంటోంది.
శక్తి స్వరూపాలు, భావనామాత్రులు, సూక్ష్మశరీరరూపులు అగు జీవాభిమానులు సృష్టి యందు ఏర్పడి ఉంటున్నారు. వారు భావనోద్రేకానుసారం ’ధూమమార్గం’ లో ప్రవేశిస్తున్నారు. పూర్ణచంద్రోదయం అయ్యేవరకు క్షీరసముద్రమునకు కూడా ఆశ్రయమైనట్టి ఆకాశ కోటరంలో ఉంటున్నారు.
పూర్ణచంద్రుడు ఉదయించగానే ‘ఆకాశకోటరం’ లేక లింగశరీరయుతము సృష్టి స్వభావంలో ప్రవేశించుచున్నారు. తరువాత, వారు చంద్రకిరణములలో ప్రవేశిస్తున్నారు. అప్పుడు చంద్రకిరణముల సహాయంచే పుష్టిని సంపాదించుకొని, ఆ కిరణముల ద్వారా రస పూర్ణమైన ఫలములను ఆశ్రయిస్తున్నారు. అట్లు చంద్రకిరణముల నుండి వేరువడి, బిడ్డ తల్లి పాలిండ్లను ఆశ్రయించినట్లు ఫలములలో ప్రవేశించి మాతృగర్భంలో కొద్ది సమయం ఉండి ఉంటున్నారు.
ఆ ఫలములు సూర్యకిరణముల వలన పక్వం పొందుచున్నాయి. వాటిని ప్రజాపతులు, జనులు భుజించటం జరుగుతోంది. అప్పుడు ఆ ఫలాలలోని జీవులు ’వీర్యము’ యొక్క రూపాన్ని గ్రహించుచున్నారు. వీర్యరూపము నందు మూర్ఛితులై ఉండి ఉంటున్నారు. ఆ తరువాత వారు యోనులందు ప్రవేశించి మాతృగర్భంలో ఉంటున్నారు.
శ్రీరాముడు: ఆ స్థితిలో వాసనలు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి?
Page:296
శ్రీ వసిష్ఠ మహర్షి: జీవులు ఆకాశంలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు, గాఢనిదురలో ఉన్నప్పుడు కూడా వారి వాసనలు అణిగి, లీనమై ఉంటున్నాయి. మట్టియందు కుండ, కొయ్య యందు అగ్ని మూగగా ఉన్నట్లు వాసనలు కూడా గర్భస్థశిశువునందు అణిగి ఉంటున్నాయి. ఆ తరువాత ఆయా ఉపాధులను పొంది యోగమార్గంలోనో, భోగమార్గంలోనో పయనిస్తున్నారు. ఈ యోగులందరినీ ముఖ్యంగా రెండు విధాలుగా విభజిస్తూ ఉంటారు. అవి1. జీవన్ముక్తుడు; 2. మిశ్రమగుణి
జీవన్ముక్తుడు - ఈతడు పూర్వజన్మలో పరమ వైరాగ్య జీవితము గడిపినట్టినాడు. అనగా భోగముల కొరకు కాకుండా, భక్తి-జ్ఞానముల కొరకు, నిర్మల హృదయం కొరకు కర్మలను ఒనర్చినవాడు. భోగాసక్తి రహితమవటం చేత, అట్టివాడు దైవాంశసంభూతుడై, సాత్వికవృత్తిని స్వీకరించి జీవన్ముక్తుడై వ్యవహరించుచున్నాడు.
మిశ్రమగుణి - ఈతడు దేవయోనిని పొంది కూడా, జన్మమరణ పరంపరలను త్రెంచుకొనుటలేదు. భోగాసక్తుడై ఉంటున్నాడు.
యోగుల మరొక విధమైన విభాగం వినుప్రథమ ప్రజాపతి - ఈతడు ఆత్మనుండి ప్రప్రథమముగా ఏర్పడియున్నాడు. ఈతని నుండే తదితర సృష్టి ఏర్పడి ఉంటోంది. ఈ ప్రప్రథమ ప్రజాపతితత్వమునకు సంబంధించినవానికి మరల జన్మించటం అనేదే ఉండదు.
రాజస సాత్వికులు - వీరు కేవల సాత్వికులయ్యేంతవరకూ పదే పదే జన్మిస్తూనే ఉన్నారు. కేవల సాత్వికులు - వీరు సర్వదా ఆత్మతత్త్వము విచారించి ఉంటున్నారు. అట్టివారు అతి స్వల్పసంఖ్యలో ఉంటారు. అందుచేత దుర్లభులు. వీరు జ్ఞానానందమయ స్వరూపులై ఉంటున్నారు.
ఈ జీవులలో మరికొందరు క్రమక్రమంగా సాత్వికత వదలి తామసులగుచున్నారు. వారు తామసులై, మూఢులై స్థావరస్థితుల వరకు రాలుచున్నారు. వారి గురించి మనం తరువాత తరువాత చెప్పుకుందాం. వారంతా “నేను ఎవరు? ఈ దృశ్యమేమిటి?” అనే ప్రశ్నకే రాకుండా కేవలం దృశ్యముతో సంబంధములను కల్పించుకొని అనేక స్థితిగతులందు దొర్లుచున్నారు. అనేక సుఖదుఃఖములను పొందుతూ ఈ జన్మ కర్మల చక్రములో పరిభ్రమిస్తున్నారు.
జన్మలు పొందుతూ కూడా ‘సంసారభావము’ ను ఈషన్మాత్రంగా కూడా పొందని జీవులు కూడా ఉన్నారు. వారు నరులలోను ఉన్నారు. సురులలో ఉన్నారు… జంతువులలోను ఉన్నారు. శ్రీరాముడు: హే మహర్షీ! తాము కేవలసాత్వికులా?
శ్రీ వసిష్ఠ మహర్షి: నేను ఉత్తమ ఆత్మ విచారణపరుడను మాత్రమే. కేవల సాత్వికుడను కాదు. ఎందుకంటే, కేవలసాత్వికునియందు సమాధినుండి విఘ్నము కలుగజేయ గలిగేదేదీ ఉండదు.
Page:297
అతనికి ప్రారబ్ధము అనేదే ఉండదు. కాని నా విషయమంలో ఈ "రాజస పౌరోహిత్యము” అనే విఘ్నము, లేక ప్రారబ్ధము ఉండనే ఉన్నది. అందుచేత నేను ఇంకొంచెం రాజససాత్వికుడనే గాని పరిపూర్ణమగు కేవల సాత్వికుడను గాదు.
శ్రీరాముడు: మరి నా విషయము స్వామీ?
శ్రీ వసిష్ఠ మహర్షి: నీవు నా వలే శమ దమాది గుణాలు పొందియున్నావు. కాని ఇంకా ఆత్మపదమునందు విశ్రాంతి లభించలేదు. సంసారభ్రాంతి ఇంకా స్వల్పంగా తొలగవలసి ఉంది. అందుచేత ’తత్’ పదం గురించి మరికొంత తీవ్రంగా విచారణ, పరిశీలన అవసరం. అయితే, మన ఈ విచారణాసమయములోనే పూర్ణభావమును పొందగల విభవమును కలిగియే ఉన్నావు.
“బాగుగా విచారణచేయాలి” అను పురుషకారము ఆశ్రయించువారు లక్ష్యము ఎందుకు జేరరు? అట్టి ఆత్మతో ఏకత్వము, ఆత్మ లక్షణములన్నీ పొందటం”… అను రూపము గల ‘తత్’ పదమే పరమోత్తమమైనది. అట్టి ఉత్తమోత్తమ పదము పొందటానికి ప్రతిజీవునకు హక్కు ఉన్నది.
అందుచే ఓ సర్వజనులారా! మీరంతా ఉత్తమవిచారణదాయకమగు గురువులను, శాస్త్రములను ఆశ్రయించండి. నిష్కామభావముతో సాత్వికకర్మలు ఆచరించండి. నిష్కామత్వమే మోక్షము అని చెప్పబడుతోంది. ఆత్మను మీరు సర్వదా కలిగియే ఉన్నారు. “నేను సర్వదా మోక్షరూపుడనే”… అను రూపముగల “బ్రహ్మా హమ్” భావనను పొందియే ఉండండి. అట్టి అవగాహన సముపార్జించుటకు ఈ మానవజన్మ ఉత్తమమైన అవకాశం. ఈ అవకాశమును వృథాపరచుకోకండి.
అట్టి పూర్ణానుభవం పొందిన, పొందుచున్న మహనీయులు మన మధ్యలోనే కొందరు తప్పక ఉన్నారు. వారి కొరకై వెతకండి. "మీరంతా ’పూర్ణత్వము’ యొక్క అనుభవము వెతుక్కుంటూ ఈ ఈ యోనులందు ప్రవేశిస్తున్నారు”… అని గుర్తుచేస్తున్నాను. అట్టి అనుభవం పదార్థములను, విషయములను పొందినంత మాత్రం చేత ప్రాప్తించగలదా? లేదు. అందుచేత పుల్లలను ప్రోగు చేయు పిట్టలవలె ధన-జన-యౌవనాలను మాత్రం చూస్తూ, ఉత్తమలక్ష్యమును ఏమఱువకండి. నిదురలేచి మీ ఆత్మయొక్క ఔన్నత్యమును గ్రహించండి.