CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:298

X. స్థితి ప్రకరణము - విషయ సమీక్ష

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం ఈ ప్రకరణంలో చర్చించుకొన్నట్టి అన్ని విషయముల సారమును క్రోడీకరించి సంక్షిప్తంగా ఇప్పుడు కొన్ని విశేషాలు చెపుతాను. అటు తరువాత మనం ఈ పదవ రోజు చర్చను ముగించబోతున్నాం.

మహాగుణులగు కొందరు ఈ భూమిపై జన్మిస్తున్నారు. వారు తత్త్వవిచారణాసమర్థమగు రాజసిక సాత్త్విక వృత్తులతో ఆనందమయంగా సంచరిస్తూ ఈ భూమిని పావనం చేస్తున్నారు. ఆకాశంలో పూర్ణచంద్రునిలాగా నలువైపులా ఆహ్లాదమును ప్రసరింపజేస్తున్నారు. గాలి వేగానికి దుమారం లేచినంత మాత్రంచేత ఆకాశము కలుషితం అవుతుందా? వారి మనస్సులు కూడా దుః ఖములందు పడుటలేదు. బంగారముతో తయారుచేయబడిన పద్మము చీకటిపడినప్పటికీ వాడదు కదా! వారు గొప్ప ఆపదలలో కూడా మ్లానమనస్కులు అగుటలేదు. యాదృచ్ఛికంగా లభించిన నీటితో అడవిలోని వృక్షములు సంతోషించుచున్నట్లు, ఆ మహనీయులు లభించనిదేదీ కోరుకోరు. వృక్షములు ఇతరులకు నీడను, ఫలములను ఇవ్వటమే స్వభావంగా కలిగి ఉంటాయి గాని, “వీరు నాకు నీరు కూడా పోయలేదే? మరి నీడను ఎందుకివ్వాలి?” అని అనుకుంటున్నాయా? లేదే! వారు కూడా ఈ సంసార జనులకు ఆహ్లాదమును, ఆనందమును, జ్ఞానదృష్టిని ప్రసాదిస్తూంటారు. అది వారి స్వభావమే కాని, మరేదో ఉద్దేశించి వారు అట్లు చేయుటలేదు. నిర్మలమైనట్టి వారి బుద్ధి ’మోక్షము’ అను ఒకే ఒక్క ఉపయోగము కొరకై ‘శాంతి’ మొదలైన అమృత గుణము లందు నిమగ్నమై పుష్టిని పొందుతూ ఉంటుంది.

చంద్రుడు ఎప్పుడైనా తన శీతలత్వమును వదలి ఉంటున్నాడా? లేదు. ఆ మహనీయుల సౌమ్యమైన బుద్ధి అపత్కాలంలో కూడా అంతరంగంలో సమగ్రమైన సమాధానం కలిగే ఉంటుంది. అంతే గాని, “దైన్యం-క్రోధం-ద్వేషం-అసూయ” మొదలైన దుర్వ్యసనాలకు లోను కాదు.

వారి ప్రకృతి ‘మైత్రి’ మొదలైన కళ్యాణగుణములతో గూడి ఒప్పుతూ ఉంటుంది. ఆత్మను ఎఱిగినట్టి సాధుపురుషులు సౌమ్యభావులై, సమరసులై సుందరగుణములతో సర్వదా ఒప్పుతూ ఉంటారు. అట్టి ఆపదలకు అతీతమగు ఆత్మస్థితిని పొందుటయే కర్తవ్యముగా భావించబడు గాక!

ఓ ప్రియజనులారా! దుఃఖములను వీడండి. ఈ జీవితముల పట్ల, జన్మల పట్ల, దృశ్యాల పట్ల… “ఇవి ఏమి అయున్నాయి? నేనెవరు? నాకు వీటికి ఉన్న సంబంధమెట్టిది? ఏది భావన? ఏది భావించునది?”… మొదలైన విషయములలో ఉత్తమ విచారణ పెంపొందించుకోండి. ‘ఆత్మతత్త్వము’ యొక్క ఔన్నత్యం గ్రహించిన ఉత్తములు, దాన్ని సముపార్జించటానికే జ్ఞాన

Page:299

విజ్ఞానాలను అభ్యసిస్తున్నారు. తమ యొక్క “సత్వగుణాధిక్యత”చే రజోగుణమును క్షయింప జేసుకొంటూ, ఆత్మసాన్నిధ్యమును పొందుచున్నారు. ఆత్మానందము, ఆత్మసామీప్యము ఎట్టిదో గ్రహించి ఉంటున్నారు. సచ్ఛాస్త్రముల, పెద్దల ప్రవచనముల, స్వవిచారణల సమృద్ధిచే వారు “ఈ ప్రపంచంలో పొందబడుచున్నవి, గాంచబడుచున్నవి… ఇవన్నీ అనిత్యము” అని గ్రహించి ‘నేను చిత్తశుద్ధిని పొందేది ఎట్లా?’ అను ఏకైక లక్ష్యముతో కర్మిష్టులగుచున్నారు. ఈ ఐహిక, ఆముష్మిక క్రియలన్నిటినీ ఆపదలుగా భావించి అల్లంతదూరంలోనే ఉంచుచున్నారు. అంతే గాని, వారు అజ్ఞాన ప్రవాహమున పడుట లేదు. వాటి పట్ల ఇచ్ఛ-ద్వేషములు గాని, గ్రాహ్య-త్యాజ్య బుద్ధి గాని వారికి ఉండుట లేదు.

విచారణ చేస్తూ ఉండాలి - నాయనలారా! మీరు అసమ్యక్ దర్శనం (perception of inequality) ను తగ్గించుకుంటూ రావాలి సుమా! “నెనెవడను? ఈ సంసారాడంబరమంతా ఎట్లా ఉత్పన్నమగుచున్నది?”… అను జ్ఞానబోధకమగు విచారణ చేస్తూ ఉండాలి. తెలివిగల వాడెవడైనా అత్యంత యత్నంతో సాధువులను సమీపిస్తూ, వారితో చేయు సంభాషణ సహాయంతో వివేకమును పెంచుకుని, అప్పుడు ఈ జన్మ కర్మాది సాంసారిక విషయాల పట్ల సదవగాహనను ఆశ్రయిస్తాడు. పైన చెప్పినట్లు విచారణ చేస్తూనే ఉంటాడు. అంతేగాని, తన జీవితమును వృథా చేసుకోడు.

మీరు కర్మసూత్రములచే బంధింపబడి చతికిలపడి ఉండకండి. అనర్థములైన వ్యవహారము లనే రోజురోజుకూ పునశ్చరణ చేస్తూ రోజులు వెళ్ళబుచ్చకండి. ఈసంసారంలో ఇక్కడ అక్కడ కొన్ని ప్రియమైన వస్తువులు కనబడుచున్నమాట నిజమే. అయితే అవన్నీ ఒకనాటికి నశించబోవు చున్నాయి కదా? వాటిచే ఎందుకు మోసగించబడాలి?

ఈ భూమిపైకి ఎంత మంది రాలేదు? ఎంతమంది పోలేదు? ఇక్కడ వినూత్నమైన వస్తువు అంటూ ఏమి ఉన్నది? కనుక సర్వ పటోటాపాలు వదలివేయండి. చాతక పక్షి మేఘ జలాల కొరకే ‘అన్వేషణ-నిరీక్షణ’లను పాటిస్తుంది గాని, మురికిగుంటలలోని నీరు కొరకు కాదు. మీరు కూడా ఉత్తమ జ్ఞానమును, అట్టి సంజ్ఞలను ప్రసాదించు సాధువులను ఆశ్రయించండి.

ఈ అంతర్గతమైన అహంకారం గురించి… బహిర్గతములైన ‘శరీరములు’ మొదలైనవాటి గురించి… ఈ బంధుమిత్ర సమాగమముల గురించి… కొంచెం సత్యదృష్టితో యోచన చేయండి. “వీటిని పెంపొందించుటకు ప్రయత్నించుటచే, ఇవి మమ్ములను సంసార సాగరం నుండి తరింప జేయగలవా?” అని ప్రశ్నించుకోండి. మరల మరల మీకు మీరే యోచించుకోండి.

గడచినదాని గురించి వగచటం అనవసరం. ఇక తాత్సారం చేయవద్దు. ఇప్పుడిక సంసార తారకమగు ఆత్మవిచారణ చేపట్టండి. విచారణచే సత్యము మీ మీ హృదయము లందే సుప్రకటితం కాగలదు. స్వశరీరములోని సాక్షిని దర్శించండి.

అస్థిరములైన ఈ శరీర-అహంకారముల పరిమితదృష్టిని పరిత్యజించండి. ముత్యాల హారంలో అంతర్లీనంగా ఉన్న తీగవలె ఉన్నట్టి సాక్షిస్వరూపమగు ఆత్మను వీక్షించండి. సర్వవ్యాప్తం,

Page:300

నిత్యము, సర్వమును భావించునది అయినట్టి ఆ పరమవస్తువునందే ఇదంతా ప్రకటితమగు చున్నట్లుగా గ్రహించండి. ఈ సువిశాలమైన భూప్రదేశమునందు, ఆ ఆకాశంలోనూ, సూర్యుని యందూ, భూరంధ్రములలోనూ, నివసించే ఒక చిన్నపురుగులోనూ, ఆ పురుగులోని ఒక అణువులోను… అన్నిటా చిత్స్వరూపమే వెలయుచున్నది.

ఒక ఉపమానం. ఒకచోట అనేక కుండలు ఉన్నాయనుకో… ఆ అన్ని కుండలలోని ఆకాశము ఒక్కటే కదా! వివిధ శరీరములలోని ’చిత్తు’కు భేదమేమీలేదు.

‘కారం-తీపి-చేదు” మొదలైన రుచులు వేరువేరైనప్పటికీ, ఆ రుచిని గ్రహిస్తున్న తత్త్వము ఒక్కటే అయున్నది కదా! అంతేకాని కారము రుచికి ఒక తత్త్వము, తీపిరుచికి మరొకతత్త్వము ఏర్పడి ఉండుటలేదే! అనేక చోట్ల ప్రకాశించుచున్నప్పటికీ చిద్వస్తువు ఒక్కటే. అనేక గ్రామాలలో ప్రసరించు సూర్యరశ్మి ఒకే సూర్యతత్వం. అంతేగాని “ఆయా కిరణములు వేరు వేరు వస్తువులపై ప్రసరించుచున్నాయి కాబట్టి అవన్నీ వేరు వేరు”… అనటం ఉచితం కాదు కదా!

ఉన్నది సర్వదా ఒక్కటే! ఒకే వస్తువు సర్వదా వెలయుచుండగా "ఈతడు పుట్టినాడు… చచ్చినాడు…” ” అనునదంతా అసంగతమే అవుతుంది. ఉత్పన్నమైయ్యేది, నశించేది సత్యవస్తువు ఎట్లా అవుతుంది?

ఓ రాఘవా! దేనినైతే “ఇది జగత్తు” అని నీవు గాంచుచున్నావో అదంతా కూడా ‘చిత్’ యొక్క ప్రతిబింబము మాత్రమే. ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఇది ఆ రెండింటికీ విలక్షణమైనది.

ఇతడి చిత్తం అశుద్ధమై(దోషపూరితమై), విషయాల పట్ల ప్రేలాపన కలిగి ఉన్నదైనప్పుడు - అట్టి సమయంలో ఈ జగత్తు సత్తుగానే అతనికి తోచుచున్నది.

ఏ మహాత్ముడు మోహనివృత్తుడై ఉంటున్నాడో అతనికి ఇది ‘అసత్తే’ అని తెలియవస్తోంది. అందుచేతనే ’ఈ దృశ్యం అనిర్వచనీయం. అధ్యాసరూపమునైతే మోహకారణమే అగుచున్నది”… అని చెప్పబడుతోంది.

ఈ జగత్తే మిథ్య అయి ఉన్నది. ఇక మోహమేమిటి? ఆ మోహమునకు ఒక కారణం ఉండుట ఏమిటి? మిథ్య అయినదానికి కార్య కారణములు కూడా మిథ్యయే కదా!

కాబట్టి రామా! నీవు ’జన్మ-స్థితి మరణము’ల గురించి దుఃఖించవలసిన అవసరమే లేదు. ఆకాశం వలె సర్వత్రా సముడవై నిర్మలభావమునందు వెలసియుండుము. సత్యమై, నిత్యమై, ఆనందమయమైన నీ స్వస్వరూపమునే అవధరించి ఉండుము. “నేను జీవుడను… స్వల్పుడను… పుట్టుచున్నాను… చచ్చుచున్నాను…” మొదలైన బలహీనమైన భావములను త్యజించివేయి.

“నేను అఖండము, నిర్వికారము అగు ఆత్మ వస్తువునే అయి ఉన్నాను…” అని భావించు చుండగానే ఇప్పుడే ఇక్కడే మోక్షస్వరూపుడవు కాగలవు. అంతేగాని, మోక్షం ఎప్పుడో ఎక్కడో పొందవలసినది అయి ఉండలేదు.

Page:301

ఉత్తమ గుణ సముపార్జన -

శ్రీ వసిష్ఠ మహర్షి: భవిష్యత్తును నిర్ణయించేది వర్తమాన ప్రయత్నములే!

నాయనా! రామా! నీవు లభించిన అవకాశములను వృథాపరచుకోకుండా ఉత్తమ గుణములను సముపార్జిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీచ ప్రవృత్తులను త్యజించుట యందు, ఉత్తమ కర్మలను ఆశ్రయించుటయందు జాగరూకుడవై ఉంటూ ఉండాలి.

బాహ్యాభ్యంతరము లందు “సహించుట” అను శక్తిని కలిగి ఉండాలి. ధీరుడవు, విచారణ పరుడవు అయి ఉండు. సూక్ష్మమైన బుద్ధిని సంపాదించుకో. సర్వవిఘ్నములకన్నా, సర్వ ప్రతిబంధకముల కన్నా కూడా బలవంతుడవగుచూ ఉండాలి.

సద్గురువులను ఆశ్రయించి, వారితో శాస్త్రవిచారణ చేయి. విషయములకు సంబంధించిన తృష్ణను నీ మనస్సు నుండి ఎప్పటికప్పుడు తొలగించివేస్తూ ఉండు. ఆత్మవేత్తలు కనబడినప్పుడు వారిని ఆశ్రయించు, శరణువేడు. వారు విజ్ఞానదాయకమగు ఉత్తమ విషయాలు బోధిస్తారు.

మనోనాశనము సాధించు. అప్పుడు సమాధి స్వయముగా లభించగలదు. శాస్త్రములచే చెప్పబడుచున్న అర్థములను వివేకముతో అభ్యసించుచు, ఎవడైతే ’సుసంగి’ అగుచున్నాడో… అట్టి శుద్ధపురుషుడు ఆత్మస్వరూపమును ఎఱుగుటకు అర్హుడగుచున్నాడు.

ఓ రాఘవా! నీవు ధీరుడవు. పవిత్ర ఆచరణము గలవాడవు. ఉత్తమ గుణములు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి. “సృష్టి” అనబడే మనోమలం నీ నుండి దూరంగా తొలగుతోంది. అట్టి నిర్మల స్వరూపుడవగు నీవు దుఃఖ రహితమగు ఆత్మ యందు వెలయుచుండుటకు అడ్డేమి

ఉంటుంది?

శరత్కాలంలోని మేఘరహిత ఆకాశంలాగా ’జగత్తును’ తనయందు రహితం చేసుకొను ఆత్మజ్ఞుడు స్వచ్ఛత నిర్మలత-ప్రశాంతత్వము-అఖండత్వము స్వయంగా పొందుచున్నాడు. అట్టి వానికి ఇక సంసార భయమెక్కడ? ఓ ఉత్తమ జ్ఞానీ! (వైరాగ్య ప్రకరణంలో) నీవు ప్రకటించిన విశ్లేషణా చాతుర్యం మమ్ము ముగ్ధులను చేసింది. మనం ఈ పదిరోజులుగా చేస్తున్న సంభాషణ ప్రభావంచేత నీ మనస్సు బాహ్యవస్తుచింతన క్రమక్రమంగా త్యజిస్తున్నట్లు నేను గమనిస్తున్నాను. మహాశక్తివంతమగుచున్న నీ బుద్ధి పరమాత్మతో ఏకీభావం పొందుతోంది. అందుచేత మా ఉద్దేశములో నీవు ముక్తుడవే అయి ఉన్నావు. ఈ విషయంలో సందేహమే లేదు.

ఓ సభికులారా! రాగద్వేషములంటూ ఏ మాత్రం లేని వాడైన ఈ రాముడు తదితరులకు ఆదర్శప్రాయుడే అగుచున్నాడు.

బహిః లోకోచితాచారా విహరిష్యన్తి యే జనాః ॥

భవార్ణవం తరిష్యన్తి ధీమన్తః పోతకాన్వితాః ॥

‘జ్ఞానము’ అనే నౌకను పొందినట్టి బుద్ధిమంతులు బాహ్యలోకము కొరకు ఉచితంగా

Page:302

వ్యవహరిస్తూ ఉంటూనే ఈ సంసార సాగరమును ఇట్టే దాటివేస్తున్నారు. నేను ప్రతిపాదిస్తున్న అనేక సత్యవాక్యాలు అవిచారణపరులకు ఉదాసీనంగానే కనిపిస్తున్నాయేమో గాని, బుద్ధిమంతులు, సుజనులు, సమదర్శులు, ఉత్తమదృష్టి సంపన్నులు తమ జ్ఞానదృష్టిని మరింత బలోపేతం, పరిపుష్టం చేసుకుంటున్నారు.

ఓ రామా! నీవు సర్వదా జ్ఞానివే అయి ఉండాలి. ఈ శరీరం ఉన్నంతవరకూ విషయముల పట్ల ఏమాత్రం ఆసక్తిలేనివాడవై, ద్వేషములను, వాసనలను వీడి, లౌకికమైన ఆచారములను ఆచరిస్తూ వ్యవహరిస్తూ ఉండు.

ఉత్తమజ్ఞానులు, సాత్వికగుణసంపన్నులు అగు జీవులు ఈ ప్రపంచములోకి వచ్చి “పరిశుద్ధత్వం-పరమశాంతిత్వం” సముపార్జిస్తున్నారు. లోకకళ్యాణ కారకులగుచున్నారు. ఉత్తమ కర్మల యందు ఆచరణపరులై పరమశాంతిని పొందుచున్నారు.

ఇక, మరికొందరు జీవుల విషయం చూస్తే… వారు ఎద్దులాగా, నక్కలాగా పరవంచకులై ఉంటున్నారు. శిశువుల వలె మూఢులే అయ్యి, వారు మానవజన్మ అను ఉత్తమ అవకాశాన్ని వృథా చేసుకుంటున్నారు. అట్టి వారిని చూస్తున్నప్పుడు లోకకళ్యాణమే ప్రవృత్తిగా కలిగిన మా వంటి మునులకు జాలియే వేస్తోంది. అట్టివారిని గురించి విచారిస్తే మాత్రం ఏం ప్రయోజనం?

కర్మసిద్ధాంతము - "నీవు మనస్సును ఎప్పటికప్పుడు పరిశుద్ధం చేసుకొనుట”… అను మహత్తరమైన ఆశయం కలిగి ఉండు. అట్టి మనోనిర్మలత కొరకు సర్వాత్మకుడగు ఆ పరమేశ్వరుని ‘స్వధర్మము’ అను పుష్పములతో పూజించుము. అట్టి అవగాహన కలిగియున్నప్పుడు నీవు లోక కళ్యాణ కారకుడవే అవుతావు. ఈ ప్రపంచమును కొంచెము పరిశీలినగా చూస్తూ ఉంటే నీకు ఇందులో సాత్త్వికులైన ఉత్తమ పురుషులు తప్పకుండా తారసపడతారు. వారియందలి ఉత్తమ గుణములను గమనించు. ఆ గుణములను నీవు కూడా అలవరచుకో. అట్లు, ఉత్తమ ఆదర్శాలను స్వీకరించేవాడు, శాంతి, శమము మొదలైన ఉత్తమ లక్ష్యములను కలిగి ఉండేవాడు, శాస్త్రము, స్వధర్మములకు అనుచితంగా నిష్కామబుద్ధితో కర్మలను నిర్వర్తించేవాడు… అట్టి వాడు క్రమంగా ’జ్ఞానోపయోగము’ అయినట్టి శుద్ధశరీరమును పొందుచున్నాడు.

ఈ జన్మయందు నీవు అనుసరించు గుణములే ముందు ముందు ఆయా ఉత్తరోతర కర్మ జ్ఞాన స్థితులందు నిన్ను నియమిస్తున్నాయి… అనునదే కర్మ యొక్క సిద్ధాంతము. కాబట్టి, కర్మ బద్ధుడగు జీవుడు ఇతఃపూర్వపు కర్మలచే నియమించబడినవాడై ప్రవర్తించుచున్న మాట నిజమే. కాని వర్తమాన పురుషకారముచే పూర్వజన్మ సంస్కారములు తప్పక జయించివేయబడగలవు. (ఇతఃపూర్వపు కర్మ సంస్కారాలు + వర్తమాన ప్రయత్నాలు) = (ఈ జీవుని వర్తమాన భవిష్యత్తులు)

పురుషుడు అంటే పురుషకారము ప్రదర్శించువారు, ప్రయత్నశీలురు. అంతేగాని, ‘మగవారు’ అని అర్థం

చేసుకోరాదు.

Page:303

"అయ్యో! నేను ఈ ఈ తప్పులు చేసియున్నాను కదా? నా గతి ఏమగును? ఇంతే, ఇక నేను బాగుపడను… ఎవ్వరో మహానుభావులే సరికాగలరు…. నేను సరి అయ్యే ప్రసక్తి ఎప్పటి విషయమో గాని, ఇప్పటి విషయం కాదు…” ఈ విధంగా స్వల్పమగు భావములకు తావిచ్చి వర్తమాన కర్తృగతిని బలహీనపరచుకోవద్దు.

ఇప్పుడు చేయవలసినట్టి శారీరక మానసిక ప్రయత్నములు నీ చేతిలోనే నీ నిర్ణయమును అనుసరించే ఉంటున్నాయి. మరిక తాత్సారం దేనికి చెప్పు?

కొందరు తమ భూత భవిష్యత్తులపై… అపరిపూర్ణమైన, బలహీనతలతో కూడిన… అభిప్రాయాలను కల్పించుకొని సాలెపురుగు వలె అందులోనే చిక్కుకొని ఉంటున్నారు. తమ నరకములను తామే నిర్మించుకొని పరితపించుచున్నారు. అయిన దాని గురించి వగచటం ఆపు. భూతకాలం అట్లుండనీ. “ఇప్పుడు నేను ఏది చేయాలి?…. ఏది చేయకూడదు”… అను విషయమునకు రమ్ము. ఉత్తములగు సాధుపురుషులను, శాస్త్రములను ఆశ్రయించు. వర్తమాన కార్యక్రమమును పూర్ణమైన సదవగాహనతో నిర్ణయించుకో. ఆలోచన-శ్రద్ధ అవగాహనలను ఉత్తేజపరుచుకో. ప్రశాంతముగా, గంభీరంగా, సాలోచనగా ’ఆత్మప్రాప్తి కొరకు ప్రయత్నములను

చేయుచుండుము.

శత్రురాజులు తమ బలపరాక్రమములతో బాధించుచున్నప్పుడు, అప్పుడు వారు పౌరుష బలముచేతనే జయించబడుచున్నారు కదా! ఈ బుద్ధి అనే రాజ్యం ‘తామస రాజస’ గుణములు… అనే శత్రురాజులచే వేధింపబడుచున్నది. అట్టి ఈ ‘బుద్ధి సామ్రాజ్యము’ ను రక్షించుకోవాలి. లేదా, రాక్షస-పిశాచాది యోనులలో ఈ బుద్ధి ప్రవేశించే ప్రమాదం ముంచుకురాగలదు. బురదలో ఇరుకుకున్న దున్నపోతును బయటకు తెచ్చునట్లు ఈ బుద్ధిని ఉద్ధరించే ప్రయత్నాలు సర్వదా చేస్తూ ఉండాలి.

చిత్తము, పురుషకారము - సాధుపుంగవులు సాధుపుంగవులు తమ తమ ’వివేకము’ యొక్క ఫలితంగానే సాత్వికగుణ సంపన్నులగుచున్నారు. స్వచ్ఛమైన మణిని ఏ ద్రావణంలో ముంచితే ఆ రంగునే కలిగి ఉంటుంది కదా! ఈ ‘చిత్తము’ అనే మణి కూడా అంతే. దీనిని ఎందులో నియమిస్తామో అది అద్దానియందే తన్మయమై ఉంటూ ఉంటుంది.

చిత్తమునుండే ‘పురుషకారము’ కూడా ఉత్పన్నమగుచున్నది. ముముక్షువులంతా తమ యొక్క పౌరుషబలముచేతనే అమూల్యమైన గుణములను ఆర్జిస్తున్నారు. అంతేగాని ఎవ్వరి గుణములను మరెవరూ ప్రసాదించుట ఇక్కడ ఉండదు. అట్టి పౌరుషబలము చేతనే వారు శుభజన్మలను పొందుచున్నారు. ‘గుణి’ అయినవాడు తన పురుషకారముచే పొందలేనిది… ఈ స్వర్గ, మర్త్య పాతాళములలో ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మచర్యము, వీర్యము, వైరాగ్యము, ఇవి

Page:304

ఉన్నప్పుడే ఒకడు ఉత్తమ వస్తువును సాధిస్తాడు. ఈ ఆధ్యాత్మక్షేత్రంలో కూడా అది అట్లే అగుచున్నది. “అఖండ, అద్వితీయ, స్వస్వరూపాత్మ సంస్థానము”… విషయం కూడా అట్టిదే.

గుణి (గుణములు కలిగియున్నవాడు) - ఓ రఘురామా! ఇప్పుడు నీకు ఉపదేశించిన, ఉపదేశించబోవుచున్న ఆత్మతత్త్వము అత్యంత దుఃఖనివృత్తికరము సుమా! ఇది జీవునికి నిరతిశయ మైన శాంతిని ప్రసాదించగలదు. సకల జనులకు హితం చేకూరుస్తుంది. అందుకని ఇది శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ బద్ధకములచే తిరస్కరించకూడదు. సకల జనులలో విశుద్ధములగు సత్వ గుణములు వృద్ధికావాలనునదే మా ఆశయం.

“బుద్ధి బలముచే ఆత్మభావనయందు ఈ జీవుడు సుస్థిరుడు అగుట” అనునదే ఈ ప్రయత్నము ఉద్దేశించుచున్న అంతిమ ప్రయోజనం. ఆత్మభావన సుస్థిరమగుచుండగా ఇక మనస్సు తన చంచలత్వమును వదలి శాంతిని పొందగలదు. అట్టి ఆత్మావలోకనము ఎవ్వరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యమే.

కాబట్టి ఓ సభికులారా! మీరంతా ప్రయత్నశీలురై ఉండవలసినదిగా మీ శ్రేయోభిలాషుల మగు మేము మరల మరల హెచ్చరించుచున్నాము. మీలో ప్రతి ఒక్కరికీ ‘ముక్తస్వరూపులు’ కాగల అవకాశము, అధికారము తప్పక ఉన్నది.

ఓ రామచంద్రా! నీవు మహామహిమాన్వితుడవు. శాంత్యాది మహత్తర గుణాలు నీ యందు ప్రస్ఫుటమౌతున్నాయి. పరమసాత్వికుడవుగా నిన్ను మేము గుర్తిస్తున్నాము. తదుచితంగానే ప్రవాహపతితములగు కార్యములను నిర్వర్తించెదవు గాక. నిన్ను నిమిత్తం చేసుకొని ప్రతి మానవునకు నేను ఈ విషయం గుర్తు చేస్తున్నాను.

నాయనలారా! ‘సంసారాసక్తి’ అనే మోహమునకు మీ హృదయంలో చోటివ్వకండి. స్వతహా గానే మోక్షస్వరూపులగు మీరు మీ మీ ముక్తస్వరూపమును ఏమఱువకండి. స్వస్వరూపము గురించి ఎఱుకయే జన్మ ఎత్తినందుకు ఉత్తమ ప్రయోజనమైయున్నది.

సభలోని వాతావరణం అలౌకిక ప్రశాంత గంభీరతలతో నిండిపోయింది. సభికులంతా వసిష్ఠమహర్షి చెప్పు ఒక్కొక్క వాక్యములోని ఔన్నత్యమును గమనించుచు “ఆహాఁ! ఈ ఋషులు మాపై ఎంతటి అవ్యాజమైన ప్రేమ కలిగియున్నారు!” అను భావన పొందారు. రామచంద్రునితో సహా అనేకమంది వదనములలో వికాసము ప్రస్పుటమైనది. ఆ సభలోని రాజులు, పండితులు, తదితరులు దీర్ఘాలోచనామగ్నులై కనబడ్డారు.

సభలోని అనేకుల ‘మనస్సు’ అనే చపల వానరం భోగపదార్థములకు సంబంధించిన మననమును త్యజించి, మౌనభావంతో ఆత్మవస్తువు వైపు సాలోచన కొనసాగించసాగింది. దశరథుడు మొదలైన రాజులు ప్రశాంతచిత్తులై ఉన్నారు.

Page:305

ఆధ్యాత్మిక శిక్షణాబలంచే లక్ష్మణుడు మొదలైన వారి హృదయాలు ‘బ్రహ్మస్వరూపం’ అనే లక్ష్యమును సుస్థిరీకరించుకున్నాయి.

మునుల హృదయాలు వికసించి, ‘ముఖములు’ అనే పద్మములు ‘ప్రశాంతత’ అను సువాసన వెదజల్లాయి.

సూర్యభగవానుడు అస్తమాద్రిని సమీపిస్తున్నాడు. సభ ముగిసింది. సభికులు క్రమంగా తమ సాయం సంధ్యాది కార్యక్రమాల కొరకు గృహోన్ముఖులయ్యారు.

(పదవ రోజు విచారణ పూర్తి అయింది)

స్థితి ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు

ఓం తత్సత్