CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము V.ఉపశమన ప్రకరణం

ఉపశమన ప్రకరణము

I. ప్రకరణ పరిచయం

  1. పదవ రోజు రాత్రి.. పునశ్చరణ

పదవ రోజు రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నది. అయోధ్యానగరమంతా సౌమ్యము, సుందరము, రమణీయము అగు ప్రకృతిచే అలంకారయుక్తమై ఉన్నది. ఒక్క రామచంద్రుడు తప్ప తక్కినవారంతా ఆ రాత్రి క్షణంలాగా నిదురలో గడిపివేశారు. రాముడు మాత్రం ఆ రాత్రంతా వసిష్ఠమునీంద్రులచే ఉపదేశించబడిన వాక్యములను చింతన చేయసాగాడు.

శ్రీరాముడు (తనలో) : ఆహా! ఏమి ఈ సంసార సంభ్రమణం! ఈ మనుజులంతా ఎవ్వరు? ఈ విచిత్ర ప్రాణిసమూహమంతా వస్తున్నది ఎక్కడినుండి? వీరంతా ఎటు పోతున్నారు? అసలీ మనస్సు యొక్క స్వరూపమేమిటి? ఇది శమించేది ఎట్లా? ఈ చమత్కారమైన మాయావ్యవహారమంతా ఎవరు, ఎవరి కొరకు, ఎక్కడ, ఎందుకు, కల్పిస్తున్నారు? ఈ మాయకు ఇంతటి నైపుణ్యము ఎక్కడి నుండి వస్తోంది? ఇది అసలు నివారించబడగలదా? జీవునికి ఈ గుణదోషములన్నీ ఎక్కడి నుండి వచ్చిపడుతున్నాయి?

.. ఆకాశం కంటే కూడా అతిసూక్ష్మము, అతి విశాలము… అయినట్టి ఆత్మ ఈ విధంగా, జీవుడుగా ఎందుకు పరిణమిస్తోంది…?

ఈ సంకుచితత్వము ఎంతగా ఘనీభవించి ఉన్నది! ఈ పది రోజులుగా వసిష్ఠ మునీంద్రులు ఆత్మ గురించి, మనోనాశనం గురించి, ఇంద్రియజయం గురించి అనేక విశేషాలు వివిధ కోణముల నుండి చెప్పియున్నారు. అయినాకూడా వెలుగునీడలవలె జ్ఞాన, అజ్ఞానములు ఏర్పడుచూనే ఉన్నాయే? నా వివేకము ఇంకనూ పూర్ణముగా వికసించదేమి?

అవును. ఆత్మయే స్వయముగా ఈ “జీవుడు - చిత్తము – మనస్సు” మొదలైన రూపములలో ఈ అసన్మయమైనట్టి సంసారమును విస్తరింపజేస్తోంది. ఈ అహంకారము మొదలైనవన్నీ ‘మనస్సు’ అనే త్రాడుచే చుట్టబడి ఉంటున్నాయి. అట్టి మనస్సు సంక్షయించిందా…. అప్పుడు ’నేను జీవుడను’ అను స్వల్పాభిప్రాయం కూడా తొలగిపోతుంది. దుఃఖోపశమనం సిద్ధిస్తుంది. మరి అహంకారమును, మనస్సును, “నాది- మాది - నేను - మేము" అను మోహమును రూపుమాపాలంటే ఉపాయాలేమిటి? హంస నీటిని విడచి, పాలను పీల్చునట్లు, విషయ భోగములతో కూడిన అల్పధ్యాసల నుండి ఆత్మను వేరుచేయటం ఎట్లా?

309

Page:310

భోగములన్నీ త్యంజించివేద్దామా? “నాకీ రాజ్యము వద్దు, పదార్థములతోటి తదితర సర్వజనులతోటి అసలు ఎట్టి సంబంధమూ వద్దు" అను నిర్ణయమునకు వద్దామా? మంచిదే…. కానీ, వాటిని నేను వదలినా, అవి నన్ను వదులుతాయా? వాటిని దూరంగా త్యజించితే ఈ శరీర ధారణం సాధ్యమేనా? కాదేమో? త్యజించకపోతే విపత్తులు వచ్చిపడుతూనే ఉంటాయే? అరెరే! భలే సంకటం వచ్చిందే!

ఆత్మ అనునది సర్వదా సిద్ధించియే ఉన్నది. స్వతహాగా అన్నివేళల సిద్ధించి ఉన్న దానిని పొందటమేమిటి? కోల్పోవటమేమిటి? ఇక ఆత్మకు ఏ అఖండత్వము, అప్రమేయత్వము, నిత్యత్వము మొదలైనవన్నీ వర్ణించబడ్డాయో అవి ఆత్మయే స్వరూపముగాగల నాకుకూడా వర్తిస్తాయి కదా! ‘ఆత్మ తత్త్వప్రాప్తి’ అనునది మనోమాత్ర విషయమే అవుతుంది…. అంతే గాని అది ఈ ఇంద్రియములకు విషయమే అయి ఉండలేదు.

పైగా, బాహ్యవిషయములు తెలుసుకోవటానికి కూడా ఈ మనస్సే పరికరమగుచున్నది. ఈ ఇంద్రియములను వెలిగిస్తున్నది, ఉపయోగించుచున్నదికూడా మనస్సే. అట్టి మనస్సును కూడా నియమిస్తున్నది, అధిరోహిస్తున్నది ఎవరు? నిర్విషయుడనగు నేనే కదా!

ఆహా! బాలుడు తనయొక్క అజ్ఞాన కారణంగా చీకటిలో దయ్యమును చూస్తూ ఉంటాడే…. అట్లాగే మనస్సుకు కూడా గుదిబండలాగా ఈ దృశ్యముతో బంధము ఏర్పడుతోంది. మరి మనస్సును సన్మార్గంలో ఎట్లా నడిపించాలి? ఇక నాకు ఒక్కటే ఉపాయం కనబడుతోంది. తన ప్రియుడు లభించిన తరువాత స్త్రీ మరిక అన్యుని స్మరిస్తుందా? లేదు కదా…! నా ఈ బుద్ధి కూడా సంసార భ్రమలను ఆశ్రయించ కుండా పరమశాంతి పూర్వకమగు ఆత్మత్వమునే అవధరించు గాక! ఆపై ఇక అన్యపదార్థముల గురించి చింత ఏముంటుంది? నా మనస్సు క్రోధరహితమై, కామవర్జితమై, పవిత్రవంతమై పాపరహితమై ఉండు గాక! అప్పుడది స్వయముగానే ఆత్మ పదమునందు విశ్రాంతి పొందగలుగుతుంది. ఆహా! సద్గురువులగు వసిష్ఠులవారు బోధించియున్న ఏడవ భూమికయందు ఎప్పటికి సంస్థితుడనై సుస్థిరుడనై ఉంటానో! ఎప్పటికి ‘జీవన్ముక్తి’ సుఖమునందు దృఢపూర్వకంగా విశ్రాంతి పొంది, ఈ జగత్తునందు యథావిధిగా విహరిస్తూ ఉంటానో కదా!

ఈ నామనస్సు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కల్పనలను రచించుకుని అందులోనే మునిగి తేలుతోంది కాని, వాటిని త్యజించదేం? అది ఎప్పటికి తన వికల్పత్వము త్యజించుటచే నీటిలో ప్రవేశించిన ఉప్పుచే తయారు చేయబడ్డ బొమ్మ లాగా ఆత్మయందు లయించిపోతుందో కదా! అది తన తుచ్ఛరూపమును త్యజిస్తేగాని ఉద్వేగము, దుఃఖము నశించవు.

ఈ ‘సంసారము’ అనే సముద్రము ‘తృష్ణ’ అనే తరంగాలతో వ్యాపించి ఉన్నది. ఆశ అనే మొసళ్ళు ఇందులో యథేచ్ఛగా సంచారం చేస్తున్నాయి. ఈ సంసారసముద్రం దాటేది ఎప్పుడు? దుఃఖము, దిగుళ్ళు మొదలైనవి లేకుండేవి ఎన్నటికి?

Page:311

ఈ ప్రపంచములో ప్రవేశించిన కొందరు శమదమాది ఉత్తమగుణములను ఆశ్రయించి తత్ఫలితంగా పరిశుద్ధులగుచున్నారు. ఉత్తమమగు ఆత్మపదమును పొందుటకు అర్హులగుచున్నారు. నేను కూడా అట్టి అర్హత పొందాలి? శోకరహితుణ్ణి కావాలి? అది ఎట్లా, ఎన్నటికి ఒనగూడుతుందో?

ఓ చిత్తమిత్రమా…! ఓ సంసారజ్వరమా! ఏమిటి నీవు చేస్తున్నది? ఈ స్త్రీ, పుత్రశరీరాది సంభ్రమములన్నీ కలుగజేస్తున్నావా? ఫలితమేమిటి? మేము సత్యవస్తువగు ఆత్మను పొందకయే పోవుచున్నాము కదా? కట్టుకొయ్యకు త్రాడుచే దున్నపోతు కట్టివేయబడినట్లు మేము నీయొక్క దుష్ట, అల్ప, అధమ దృష్టులచే బంధింపబడుచున్నామే? ఓ ప్రియచిత్తమా! అయినా, నిన్నని ఏం లాభం? ఇదంతా మా స్వయం కల్పితం మాత్రమే. ఏది ఏమై ఉన్నప్పటికీ మాయందు అజ్ఞానం మాత్రం తొలగుటలేదు. అందుకే నీవు దుష్టవై దశదిశలవైపు విజృంభిస్తున్నావు. ఇక చాలు. నీవు దూరదృష్టి, నిర్మలదృష్టి ఆశ్రయించదలుచుకోకపోతే నిన్ను నేను ఉపేక్షించను. నీవు నా సేవకుడివేగాని, యజమానివి కాదు సుమా! అందుచేత ఇక ఉపశమించు.

మనం ఉచితమైన విషయములను ఉచితమైన రీతిగా స్వస్వరూపజ్ఞాన లక్ష్యముతో విచారించాలి. ఎంతకాలం మమ్ములను అల్పప్రలోభములతో బాధిస్తావు చెప్పు? అయినా నీ రూపమేమిటి? ఎక్కడ ఉంటావు? నీవు ఏ పదార్థంతో తయారుచేయబడ్డావు?

మా అజ్ఞానమే నీయొక్క స్వరూపం. అంతకు మించి నీకు రూపురేఖలే లేవు. అయితే సర్వులలో ఏకస్థమైయున్న ఆత్మతత్త్వమొక్కటే నీకు విషయము, లక్ష్యము, మననము, దిక్కు అగుగాక!

ఓ బుద్ధీ! మనం తెచ్చిపెట్టుకున్న ఈ ‘చిత్తము’ అను జాడ్యమును చూచావా? ఇది మనిద్దరినీ కూడా రాగద్వేషముల వైపుగా త్రోసి వేయుచున్నదే! ఈ చిత్తము ఎప్పుడైతే గాలివీచికలు లేని స్థలంలో దీపం లాగా ప్రశాంతమై, ప్రకాశవంతమై, బాధారహితమై ఉంటుందో, అప్పుడు నీకు, నాకు కూడా ఇంతటి నీచత్వము, మూర్ఖత్వము, జాడ్యత్వము ఉండవుకదా!

మిత్రమా! బుద్ధీ! జీవుడు అను రూపము పొందియున్న నేను నీకు ఒక విన్నపం చేస్తున్నాను. నా మాట కాదనకపోతే నేను, నీవు కూడా మోక్షస్వరూపులం కాగలం. మనం ఈ పది రోజులుగా పసిష్ఠ మునీంద్రుని వచనాలు విన్నాం. మరి కొద్ది రోజులు వినబోతున్నాం. ఆ వాక్యముల సారాన్ని, అందు ప్రకటితమగుచున్న నాయొక్క, నీయొక్క వాస్తవమగు స్వరూప స్వభావములను గ్రహిద్దాం. ఓ మతీ! నీకు సాష్టాంగ దండప్రణామం చేసి మరీ వేడుకొంటున్నాను…… నా మాట విను. ఈ సంసారమును త్యజించివేయుటలో నాకు సహకరించు, అప్పుడు నీవు భవ్యమగు పూర్ణపదప్రాప్తిని

పొందగలవు.

ఓ ఇంద్రియములారా! విషయముల పట్ల గల అభిలాషచే మీరు పొందుచున్నదేమిటి? అతి త్వరగా శిథిలమే అగుచున్నారు. మీరు సహకరించాలే గాని, మనం ఆత్మపదమును ఎందుకు పొందలేము? అందుచేత మనం ఈ సంసారమును అనాదరిద్దాం. ఈ వస్తు సముదాయము నుండి ప్రాప్తించే ఇంద్రియసుఖము తుచ్ఛము, తృణప్రాయము, దుఃఖ పరిణామయుతము అయి

Page:312

ఉంటోంది. "నేను ఆత్మత్వము పొందేదెట్లా?” అను మార్గములో పయనిస్తున్న నాకు ఉచితరీతిగా మీరు సహకారం అందించెదరుగాక! ఇప్పుడు నియమనిష్ఠాదులచే కొంచెం బాధింపబడుచున్నప్పటికీ, మీకు ‘స్పర్థ’ తొలగి నిరవధికమగు సుఖమునే పొందగలరు సుమా!

ఓ మనస్సా! ఎన్నో ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం ఇప్పటికే మనం ఎంతగా నిర్వర్తించామో ఎవరు చెప్పగలరు? ఇప్పటికి ఈ వసిష్ఠ మునీంద్రుల ఆప్తవాక్యములు వినే భాగ్యం పొందాము. ఎంతోకాలంగా “ఈ శరీర -ధన -బంధు వియోగములచే ఏర్పడుచున్న దుఃఖాలు తొలగేది ఎట్లా?" అని మనం యోచిస్తూ ఉండేవారము కదా! ఇప్పుడు నిర్మల జ్ఞాన దృష్టితో ఈ బోధ విందాం. తద్వారా నీవు సంకుచితత్వం వదలి సువిశాలత్వం పొందగలవు.

మనస్సుతో ఏది పొందుతామో అదే పొందబడినదగుచున్నది. అయితే, మనస్సుచే ఒక విషయం అనేకసార్లు ఆలోచింపబడినప్పటికీ, అద్దానిని నిశ్చయ స్వరూపమగు బుద్ధి కూడా గ్రహించాలి. బుద్ధి గ్రహించకపోతే ఆ ప్రయత్నం నిష్ఫలం అవగలదు సుమా! నా మనస్సు శాశ్వతాత్మనే అన్నిటా అంతటా మననం చేస్తూ ఉండునుగాక! నా ఈ చిత్తము ఆత్మజ్ఞాన విషయముల కొరకై ఉరకలు వేస్తూ ఉండునుగాక!

అందుచేత ఈ నా బుద్ధి అర్థమును గ్రహించుటలో సర్వదా సమాయత్తమై అతితీక్షణము,

సునిశితము అయివుండు గాక!

శ్రీ వసిష్ఠ మహర్షి ఇప్పటి వరకు వైరాగ్యము, దైవము, ముముక్షుత్వము మొదలైన అనేక విషయాలు చెప్పారు. వైరాగ్య ప్రకరణం, ముముక్ష వ్యవహార ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం పూర్తి అయ్యాయి. అనేక దృష్టాంతాలతో ఈ జీవుని వాస్తవ స్వభావము, ఆరోపితమైన ప్రమేయత్వముల గురించి విశదపర్చారు. ఉత్పత్తి, స్థితి ప్రకరణాల అవగాహన అర్హుడగు జీవునికి వివేక దృష్టిని, పరమోత్తమమగు అవగాహనను ప్రసాదించగలవు.

శ్రవణం అవసరమే. శ్రవణమే లేకపోతే ఉత్తమ విచారణము యొక్క సమాచారం లభించదు. అయితే శ్రవణమొక్కటే సరిపోతుందా? …లేదు.

ఆత్మతత్త్వము గురించిన మననం అత్యంతావశ్యకం. మననముచే నిశ్చయాత్మకమైన బుద్ధి, బుద్ధికి కూడా ఆవలనున్న స్వస్వరూపానుభవం ఈ రెండు ఒనగూడగలవు. అందుచేత నా “మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు” ఆత్మతోటి అద్వితీయమైన అనుభవంతో పరితప్తమగు గాక!

పరిభూషిత మగుగాక!

Page:313

పదకొండవ రోజు

  1. ఎఱుగబడటమే ప్రాప్తించటం

ఆ విధమైన ఆలోచనలతో రామచంద్రుడు ఆ రాత్రంతా గడిపాడు. ఇంతలో భళ్ళున తెల్లవారింది. శ్రీరాముడు సోదర సమేతంగా వసిష్టాశ్రమములో ప్రవేశించాడు. మహర్షికి సోదరులు సాష్టాంగ నమస్కారములతో ప్రియవచనములతో సంతోషం కలిగించారు. ఆయనను రథమునందు కూర్చుండబెట్టి, సేవించుచూ సభకు కొనివచ్చారు. దశరథ మహారాజు సింహాసనం దిగి ఎదురేగి మహర్షికి సుస్వాగతం పలికాడు. ఇతర రాజులు, సామంతరాజులు, ఋషులు, మునులు, ప్రజలు మొదలైన వారంతా సభలో తమ తమ స్థానములు అలంకరించారు. ఆహాఁ! ఆ సభలోని వారందరూ పూర్వ పుణ్యవశాత్తు “వసిష్ఠుని ముఖమండలమునుండి వెలువడే ఆప్త వాక్యాలు వినుట” అను ఉత్కృష్టమగు అవకాశమును పొందివున్నారు. మొదటగా దశరథ మహారాజు ఇట్లు పలికాడు. దశరథ మహారాజు: సభలోని వారందరికి సుస్వాగతం. మనందరికి అనేక జన్మల సుకృతఫలంగా ఋషులు ఈ సభకు వేంచేయడం, మహత్తరమగు ఆత్మ గురించి ప్రవచనముచే మమ్ములను, మా ప్రజలందరినీ, మనందరినీ పునీతులను చేయడం జరుగుతోంది. శ్రీ వసిష్ఠ మహర్షి - రామచంద్రుల మధ్య జరుగుతున్న సంవాదము పది రోజులుగా వింటున్నాం. ఈ రోజు పదకొండవ రోజు “ఉపశమనం” అను విషయం గురించి విచారణ ప్రారంభమగుచున్నది.

హే వసిష్ఠ మహర్షీ! మా పాదాభివందనం స్వీకరించండి. నిన్నటి రోజు సుదీర్ఘంగా సంభాషించుట చేత ఏర్పడిన శ్రమ నివారణమయినదని భావిస్తున్నాను. ఆనందదాయకమగు మీ ‘వచనములు’ అను అమృతవృష్టిచే మేమందరము పరితృప్తులమగుచున్నాము. మా అంతఃకరణములు శీతలమొనర్చ బడుచున్నాయి. అవివేక పూర్వకమైన, అజ్ఞానపూర్వకమైన, అవిచారణాపూర్వకమైన అనేక అల్ప దృష్టులు మీ ప్రవచన స్రవంతి ప్రసాదిస్తున్న ’ఆత్మదృష్టి’చే మ్రింగివేయబడుచున్నాయి.

మేము అపూర్వమగు ఆనందం పొందుచున్నాము. సర్వోత్తమమగు బ్రహ్మపదమే ఆశయముగా గలిగినట్టి మీ వాక్యాలు మాలోని రాగము, మోహము మొదలైన వికారములకు అమోఘమైన ఔషధంగా పరిణమిస్తున్నాయి. “సజ్జన సాంగత్యమే ఆత్మావలోకమునకు సుఖమైన బాట” అను వాక్యమును నిరూపిస్తున్నాయి.

మా స్వరూపము గురించి ప్రవచిస్తూ, మాకు మా యొక్క అఖండ, అప్రమేయత్వములను సుస్పష్టపరచుచున్నందుకు మీకు మరల మరల నమస్కరిస్తున్నాం.

చంద్రకిరణములు అంధకారమును తొలగించునట్లుగా, మీ బోధ మా శారీరక మానసిక దోషములను దూరీకరిస్తున్నాయి. మీ మాటలు వింటున్నంత మాత్రంచేతనే ‘తృష్ణ - లోభము’

Page:314

మొదలైన తీవ్ర జాడ్యాలు సన్నగిల్లుచున్నాయి. పుట్టుగుడ్డి సిద్ధాంజనము (మంత్ర సిద్ధమైన కాటుక)ను కళ్ళకు పెట్టుకుంటే చీకట్లో కూడా వస్తువులను చూడగలుగుతారు కదా! అట్లే మీ వాక్యములు వింటూ ఉండగా స్వస్వరూపమగు శుద్ధాత్మను మేము ఇప్పుడు చూడగలుగుచున్నాము. మీరు అనేక యుక్తులచే, దృష్టాంతములచే మా హృదయములందలి సంసారవాసనలు క్షీణింపజేస్తున్నారు. ఉదారమైన చిత్తము గల మీవంటి మహాత్ముల వచనములవలె ఆనందం కలుగజేసేవి ఈ సృష్టిలో ఇంకేం ఉన్నాయి? ఏమీ లేవు.

కుమారా! రామచంద్రా! బ్రహ్మవేత్తలతో సంభాషించని దినములన్ని అంధకారయుక్తములేనని గ్రహిస్తున్నావు కదా! ఇప్పుడు ఈ మునీంద్రులు మనందరిపట్ల అతి ప్రసన్నంగా వున్నారు. ప్రస్తుత విషయం గురించి నీవు ఉచితమైన రీతిగా ప్రశ్నిస్తూ ఉండు. ఏమాత్రం సంశయించకు. నిన్ను నిమిత్తంగా చేసుకొని ఈ మహర్షి అనేక ఆధ్యాత్మ విశేషాలు ప్రపంచానికి ప్రతిపాదిస్తున్నారు. వారు చెప్పేదంతా నీకు, మాకు ఈ సభికులందరికి భవిష్యత్తులో అనేకమంది ముముక్షువులకు శుభప్రదం కాగలదు.

హే మహర్షీ! మీ తదుపరి వాక్యామృతం గ్రోలటానికి మేమంతా వేచి ఉన్నాం. మీ కరుణ రూపమగు ఆత్మతత్త్వజ్ఞానం కొనసాగించి లోకములను పావనం చేయ ప్రార్థన. శ్రీరాముడు: స్వామీ! మహర్షీ! ఎంతో ఉదారబుద్ధితో మీరు చెప్పుచున్న వచనామృతం నేను స్వీకరించగలగడం, గ్రహించగలగడం - మీ ప్రవచనాశక్తి విశేషం చేతనే. ఇదంతా మీరు మాపై ప్రసరించు కరుణామృతం. తమ ఆదేశమును అనుసరించి, మీరు చెప్పినది ఈ సంవాద సమయంలో విన్న తరువాత మరల ఆ విషయములను రాత్రి నిద్రించే ముందు పునశ్చరణ చేసుకుంటున్నాను. ముఖ్య విషయాలు నెమఱవేస్తున్నాను. అట్లు చింతన చేస్తున్నంతమాత్రంచేత నా హృదయంలో ఎప్పటినుంచో తిష్ట వేసియున్న నిద్ర, మౌఢ్యము, జడత్వము సన్నగిల్లుచున్నాయి. హృదయమును ఎంతగానో విస్తరింపజేస్తున్నాయి. మీరు చెప్పు బోధ మనోహరంగాను, పరమ పురుషార్థసాధకంగాను, బ్రహ్మానందప్రదంగాను, పరమ పవిత్రంగాను ఉన్నది. పది రోజులుగా మీరు చెప్పుచున్నదానిని ముందు వెనుకలు విచారణపూర్వకంగా గత రాత్రంతా పునఃపఠనం చేశాను.

మీ ఉత్తమోత్తమ ప్రవచనము సనక సనందనాదులకు కూడా శిరోధార్యమే. కరువు కాటకాల చేత మోడువారిన ప్రదేశంలో కారుమబ్బులు, చల్లటి గాలులు, కుండపోత వర్షం ఎంతటి ఆహ్లాద జనకంగా ఉంటాయో, మీ వాక్యాలు అంతటి ఆనందప్రదంగా ఉన్నాయి. వాటిని మననం చేసుకున్నప్పుడు బుద్ధి సౌభాగ్యప్రదమౌతోంది. స్వల్పజ్ఞులము, పుణ్య పాప భావములచే దొర్లింప బడుచున్నవారము, స్వయంకృత, అల్ప భావములకు బద్ధులము అగు మమ్ములను, వికాసవంతము, స్వచ్ఛము అగు మీ ప్రవచనాలు పరమశోభాయుక్తంగా ప్రభావితం చేస్తున్నాయి, తీర్చి దిద్దుచున్నాయి. ఆ సర్వాత్మస్వరూపుడగు పరమేశ్వరుడే మీ రూపంగా మాపై కరుణాప్రవాహం వర్షింపజేస్తున్నాడు. మమ్ము పరిశుద్దులుగా తీర్చిదిద్దడానికి మాపై కరుణతో మీరు, తమ ఉపదేశములను కొనసాగించ వలసిందిగా ప్రార్థన.

Page:315

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రియ రామచంద్రా! ఇప్పుడు మనం ఉపశమన ప్రకరణములో ప్రవేశిస్తున్నాం. "ఇది హితకరము, ఉత్తమ సిద్ధాంతయుక్తము” - అని విజ్ఞుల అభిప్రాయం. సావధానచిత్తుడవై

వినుఒక మండపము కొన్ని స్తంభములచే అవధరింపబడుచున్నట్లుగా ఈ సుదీర్ఘ సంసారము రాజస-తామస జీవులచే నిత్యము అవధరించబడుతోంది. ఇక సత్వగుణమునందు స్థితి కలిగియున్న ధీరులు ఈ సంసారమాయను నీలాగానే నిరాదరించివేస్తున్నారు. పాము కుబుసమును విడుచునట్లు వారు “నేను జీవుడను“ అను భావమునే విడిచివేస్తున్నారు. సత్వ జాతిలోని బుద్ధిమంతులు, రాజససాత్వికులు కూడా ”ఈ జగత్తుకు మూల కారణమేమిటి?” అను ప్రశ్నను మథించి, విచారించడం జరిగినప్పుడు తప్పక బ్రహ్మమును ఎఱుగుచున్నారు.

శ్రీరాముడు : సారవస్తువగు బ్రహ్మమును ఎట్టివారు ఎఱుగుచున్నారు? ఎట్టివారు ఎఱుగలేక పోవుచున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవరి బుద్ధి అయితే శాస్త్ర, సజ్జన సాంగత్యములచే, యజ్ఞ, దాన, తపాల వంటి సత్కార్యముల అభ్యాసములచే సర్వవిధములైన పాపభావములను త్యజించివేస్తుందో, “ప్రజ్వలించు దీపము” వలె ప్రకాశవంతంగాను, నిర్దోషంగాను ఉంటుందో, అట్టి వారికి మేము చెప్పు ‘బ్రహ్మము’ అనబడునది తప్పక అనుభవమగుచున్నది. ఓ రామా! ఆత్మయే నిత్యము, స్థిరము, సత్యము, సర్వశేష్యము (సర్వదా మిగిలి ఉండేది కదా! ఇక దిగుళ్ళు అనుమానములు ఎందుకు? అది మనందరి నిజ స్వరూపమే! అయితే, … ఆత్మచే ఆత్మ గురించి విచారించి ఎఱుగనంత వరకు అది ఎవరికీ ప్రాప్తించుటలేదు.

అది అనుభవపూర్వకంగా ఎఱుగబడుటయే, “ప్రాప్తించుట” సుమా! నాయనా! నీవు ప్రాజ్ఞులలో ప్రమాణశీలుడవు. ధీరుడవు ఉత్తమ సాత్విక రాజసిక భావములు కలవాడవు. నీవు మేము చెప్పునది తప్పక గ్రహించగలవు. మరొక విషయం. ఈ జీవులలో అనేకులు నివురుగప్పిన నిప్పువలె నిర్మల స్వభావులై, బ్రహ్మమును ఎఱుగగలుగుటకు అర్హులై, తగినవారై ఉన్నారు. అయితే వారిలో కొందరు అనేక అల్పజ్ఞాన వాక్యములు విని, అంతటితో వేదోపనిషత్ సారవస్తువగు ఆత్మ శాస్త్రము విషయమై కొన్ని దురభిప్రాయములు కలిగి ఉంటున్నారు. అట్టివారిని ఉద్దేశించి మేము “నాయనలారా! మీరు స్వయముగా పరిశీలించి ఆత్మశాస్త్రముచే జీవులు - సంఘములు పొందు ప్రయోజనమేమిటో గ్రహించండి. కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి పరిశీలనారాహిత్యం వహించి ఉండటంచేత జన్మ కర్మలు వృథా అగుచున్నాయి. అపవిత్రంగానే ఉండిపోతున్నాయి” అని హెచ్చరిస్తున్నాం.

ఓ సర్వజనులారా! మీరంతా ఈ ‘సంసారసంరంభము’ను అంతటినీ వివేచనా బుద్ధితో పరిశీలించి చూడండి. ‘ఇది నిత్యం, సత్యం. ఇది అనిత్యం, కనుక అసత్యం’ అని విభాగం చేయండి. సత్యము నందే పరాయణులు కండి. అన్ని తరగతులలోని జనుల యోగ క్షేమములు దృష్టిలో పెట్టుకొని మేము ఈ అధ్యాత్మశాస్త్రమును ప్రతిపాదించుచున్నాము. లోక కళ్యాణమే మా ధ్యేయం.

Page:316

దయచేసి నికృష్టమగు భేద భావ ప్రవాహంలో కొట్టుకుపోకండి. మానవజన్మ ఎంతటి ఉత్తమ అవకాశమో గ్రహించండి. ఇక్కడ మిమ్ములను ఉద్ధరించడానికి శాస్త్రములు, గురువులు సర్వదా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సర్వసన్నిద్ధులు కండి.

శ్రీరాముడు : తండ్రీ! ఏది సత్యమో, ఏది కాదో నిర్ణయించడం ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : దీనికి శాస్త్రములు ప్రమాణము చెప్పుచున్నాయి.

1) ఏ వస్తువైతే ‘ఆది’లోను, ’అంతము’లోను లేదో, అది మధ్యలోకూడా ’లేనిదే’ అగుచున్నది. 2) ఏది ఆద్యంతములలో ఉండియే ఉన్నదో, అది మధ్యలో కూడా తప్పక ఉండియే ఉన్నది. 3) ఆద్యంతాలలో లేని పదార్థం గురించి “ఇది సత్యమే” అను బుద్ధిచే ఎవడు నిమగ్నుడౌతాడో… అట్టి మూర్ఖునకు వివేకము జనించేది ఎట్లా?

ఇక్కడ ముక్తి ఎవరికి? బంధమెవరికి? అను ప్రశ్నలను మేము తరచి తరచి చూచాం. పరిశీలించాం. పరీక్షించాం. గమనించాం.

జాయతేమనఏవేహ మనఏవవివర్ధతే |

సమ్యగ్దర్శనదృష్ట్యాతు మనఏవహిముచ్యతే || (సర్గ 5, శ్లో 11)

"ఈ ప్రపంచమున మనస్సే ఉత్పన్నమగుచున్నది. మనస్సే వృద్ధి చెందుతోంది. సమ్యక్ దృష్టి పొందినప్పుడు మనస్సే ముక్తిని పొందుతోంది.”

88

ఓ రామచంద్రా! ఈ పది రోజులుగా మనం చేసియున్న విచారణలోని విశేషములను ఎప్పటికప్పుడు ’పూర్వపర’ మననము చేస్తూ, మరల మరల మనోబుద్ధులచే పరిశీలించి, హృదయంలో పదిలపరచుకుంటున్నావు కదా! అది అత్యావస్యకం సుమా!

ఇతఃపూర్వం ’సత్వ −రజ -తమో గుణభేదం’చే తయారుకాబడిన ఈ జీవజాతులన్నిటి విచిత్ర - ఉత్పత్తుల గురించి కొంతవరకు మనం చెప్పుకున్నాం. పరబ్రహ్మము గురించి అనేక విషయాలు చర్చించుకున్నాం.

పరబ్రహ్మమే మాయాశక్తిచే ‘జగత్తు’ రూపముగా అజ్ఞాన దృష్టికి కనబడుచున్నది. అదియే పరమార్థమున పరిశీలిస్తే ’నిష్ప్రపంచకము’ అయి ఉన్నది. ఈ స్థూల-సూక్ష్మ-సత్-అసత్ దృశ్యజగత్తుకంటే విలక్షణమైనది అది.

జగదీశుడు, సర్వశక్తిమంతుడు అగు పరమాత్మనుండి ఈ జగత్తు మనోకల్పిత చమత్కారంచేత ఎట్లు కల్పితమైనదిగా ఉత్పన్నమగుచున్నదో,… ఇప్పటిదాకా చూచాం.

మాయ - ఈ ‘మాయ’అనేది కాలవశంగా చూస్తే ఎప్పటికప్పుడు జలతరంగంలాగా అనుక్షణం మార్పులు చెందుతూ నాశనమయ్యేదిగానే ఉంటోంది. అనగా, దేశ కాలముల దృష్ట్యా అంతము

Page:317

కలిగియే ఉంటోంది. ప్రవాహరూపంగా చూస్తేనో….. ఇదంతా అనంతమైనది. చిత్తమే మనుజుడు. చిత్తమే మాయ.

అనేకమంది మహనీయుల అభిప్రాయములను పరిశీలించి, ఆ తరువాత ఈ అధ్యాత్మ, శాస్త్ర విషయములను నీముందు ఉంచుచున్నాను. ఈ విషయములను (ఈ సంవాదములోని విశేషాలను) మననపూర్వకంగా హృదయంలో పదిలపరుచుకోవాలి. వివేకముతో హృదయమును విస్తారపరచుకోవాలి. అప్పుడు మోక్ష స్వరూపడవు కాగలవు. మాయ స్వయముగా స్వస్థానమగు ఆత్మయందు లయించగలదు. దృశ్యము - దేహములు - సంబంధములు - అనుబంధములు - బాంధవ్యములు - జన్మ - జీవనము - మృత్యువు మొదలైనవి ఎవరి దృష్టిలో బంధములు కావో…. వారిని “మోక్ష స్వరూపులు” అని పిలుస్తున్నారు.

ఆత్మవేత్తలు అవ్యాజమైన ప్రేమతో అందిస్తున్న ఆత్మజ్ఞాన సమాచారం అనాదరించటం ఉచితము కాదు. శ్రేయము కాదు! అనేక సత్కర్మల ప్రయోజనంగానే “ఆత్మ యొక్క స్వభావమై చెప్పబడు సమాచారము పరిశీలించాలి….” అనే ఉత్సుకత ఈ జీవునిలో బయలుదేరుచున్నది.

మమ్ము ఆశ్రయించుచున్న శిష్యులు, తదితర ప్రియజనులు ’శరీరాత్మభావము”ను త్యజించెదరు గాక! ఆత్మతో ఏకత్వము పొంది, ’అఖండము, అద్వితీయము, శుద్ధము, శాశ్వతము అగు ఆత్మయే నేను’ అను ఎఱుకను, భావనను సుస్థిర పరచుకొనెదరుగాక! ఇదియే మా ఉద్దేశము, లక్ష్యము

కూడా.

  1. ఇప్పటికి లేనిది? ఇంకనూ పొందవలసియున్నది? శ్రీరాముడు : మహాత్మా! మనస్సే ఈ ముల్లోకములందు సంసారియగు జీవుడుగా అగుచున్నది. కదా! …అది ఎట్లా ‘జీవుడు’ రూపం పొందుతోంది? ఎట్లా జరామరణములకు పాత్రమగుచున్నది? …అనే విషయమై మీరు అనేక విశేషాలు బోధించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు… ఈ సంసారము నుండి తరించుటకు నిశ్చలమైన, సులభమైన మార్గమేమిటో …అది బోధించండి. శ్రీవసిష్ఠ మహర్షి : మొట్టమొదట మనుజుడు శాస్త్రాభ్యాసం చేత, తీవ్రవైరాగ్యం చేత సజ్జన సాంగత్యం చేత మనస్సును శుద్ధపరచుకోవాలి. ఈ మనస్సును జ్ఞానమునకు యోగ్యమైనదానిగా తయారుచేయాలి. ఆ విధంగా సౌజన్యయుక్తం అగుచున్న మనస్సుకు వైరాగ్యం ప్రాప్తిస్తుంది. అప్పుడు అతడు “నేనుఆత్మ-జన్మ-దృశ్యము” మొదలైన వాటి వాస్తవతత్వం అభ్యసించటానికి ఉపక్రమించాలి. శాస్త్రజ్ఞులు, బ్రహ్మవిష్ణులు అయిన సద్గురువులను విధిపూర్వకంగా సమీపించాలి. వారు ఉపదేశించే మార్గంలో ధ్యాసను నిలపాలి, గ్రహించాలి. నిష్కామకర్మ, సాత్వికమైన భావాలు, సుతీక్షము, విస్తారము అగు అవగాహనల సహాయంతో క్రమంగా పరమపవిత్రమగు ఆత్మపదమును పొందగలడు. పరిశుద్ధమగు ‘విచారణ’ చేతనే ఈ జీవుడు చివరికి ఆత్మను దర్శించగలుగుతాడు.

Page:318

తావద్భవమహాంభోధౌ జనస్తృణవదుహ్యతే | విచారతటవిశ్రాన్తిమేతి యావన్నచేతసా ॥ (సర్గ 5, శ్లో 18)

బుద్ధి సహాయంతో ‘ఆత్మవిచారణ’ అనే ఆవలి ఒడ్డు జేరుటయే ఈ జీవునికి విశ్రాంతి. అప్పటి వరకు ఈ జీవుడు కెరటాలపై తేలియాడే గడ్డిపరకలాగా ఈ సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు.

విచారణచే ఆత్మతత్త్వము ఎరిగినవాని బుద్ధి సమస్త మానసిక రుగ్మతలను తొలగించివేస్తోంది. ఒక స్వర్ణకారుడు “ఇది బంగారము, ఇది భస్మము” అని చిటికలో గ్రహిస్తాడు కదా! తత్త్వజ్ఞునకు స్వయముగా నిత్య-అనిత్య వివేకం కలుగుతోంది. అజ్ఞానముచే ఈ దృశ్యమును ఒక పరిచ్ఛిన్న వ్యవహారముగా గాంచుచున్న జీవులారా! మీరంతా నిరుత్సాహపడకండి! ఓపికతో తత్త్వవిచారణ చేయండి. అప్పుడు మీరు తప్పకుండా వివేకము పొందగలరు. తద్వారా మీ స్వస్వరూపమేమిటో, ఎంతటిదో మీరే గ్రహించగలరు. “నేను దేశ కాలాలచే అపరిచ్చిన్నుడను, అక్షయుడను, శాశ్వతుడను” అని తెలుసుకుంటారు. ఈ భయ, దుఃఖాదులు ప్రాప్తించటానికి మూలకారణమేమిటి?

సారవంతమగు ఆత్మను ఎఱుగనివానికే చిత్తసమ్మోహం అనబడేదంతా ఉంటుంది. ఆత్మను ఎఱుగటం జరిగిందా, అది సుఖదాయకం అవుతుంది. భ్రమలన్నీ తొలగుతాయి. అది ఎఱుగబడక పోతే దుఃఖమునకే హేతువగుచున్నది. అనంత సుఖమును, శాంతమును సముపార్జించాలంటే ఆత్మను ఎఱుగవలసిందే! అందుకు వేరే మార్గం లేదు. నాశనమే పర్యవసానముగాగల ఈ దేహముతో మిశ్రమమైయున్న ఆత్మను పంచకోశముల నుండి వేరుచేసి చూడాలి సుమా! అప్పుడే ఈ జీవునకు స్వస్థత లభిస్తుంది. అందుకు వివేకము అత్యంత ఆవశ్యకం.

శ్రీరాముడు : హే మహర్షీ! ఆత్మ ఈ శరీరమునందు (పంజరములో) పిట్ట వలె చిక్కుకున్నది కదా! ఈ శరీరము ఏర్పడి ఉన్నంతకాలం విశ్రాంతి ఎక్కడిది?

శ్రీవసిష్ఠ మహర్షి : బురదలో ఒక మణి పడిందనుకో… ఆ మణికి, బురదకు సంబంధం ఎక్కడన్నా ఉంటుందా? నిర్మలమగు ఆత్మకు ఈ దేహంతో ఏమాత్రం సంబంధం లేదు.

మరొక దృష్టాంతము విను. పద్మము జలంలో ఉంటుంది కదా……! అట్టి ఒక పద్మము యొక్క దళములపై కొన్ని జలబిందువులు ఉండవచ్చు. కానీ ఆ జలబిందువులు పద్మదళంలో ప్రవేశించవు కదా! అట్లాగే, పంచకోశములు ఆత్మను స్పృశించలేవు. ఆత్మలో ప్రవేశించలేవు.

ఈ బ్రహ్మం - జీవుడు ఉపాధిచే భిన్నం కావచ్చు. అధిష్ఠానం దృష్ట్యా వేరువేరు కానేకాదు…. ! ఈ జీవుడే సత్యదృష్టిచే ‘బ్రహ్మము’ అయి ఉన్నాడని గ్రహించవలసినదిగా చేతులెత్తి ప్రకటించుచున్నాను.

* పంచకోశములు : 1) శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము

2) అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.

Page:319

‘జడమే’ అయినట్టి ఈ మనస్సు ’మురికి గుంటలో తాబేలు’ లాగా పడి ఉన్నది. ఆత్మ విచారణను వదలి భోగద్వారములైనట్టి ఇంద్రియ విషయముల వెంట పరుగులు తీస్తూ బహు కలుషితమై ఉంటోంది. మనస్సు ఈ విధంగా ఎంతకాలం నిమగ్నమౌతుందో అంతకాలం ఈ సంసారాంధకారమును ద్వాదశాదిత్యులు వచ్చికూడా పటాపంచలు చేయలేరు. అటువంటి ఈ మనస్సు ప్రబుద్ధమైనదా, మరుక్షణం యథార్థవిషయం తప్పక ఆకళింపు చేసుకుంటోంది.

మనస్సు దేహముతో తాదాత్మ్యము చెందుతూ ఉంటే…. ప్రాజ్ఞుడైనవాడు అది పట్టించుకో కుండా వృథాకాలయాపన చేస్తాడా? లేనేలేదు. “నా హృదయము నుండి అజ్ఞానం తొలగిపోవాలి” అని నిర్ణయం చేసుకుంటాడు. గురువులను ఆశ్రయించి ఉపదేశం పొందుతాడు. ఆత్మజ్ఞులచే ప్రబోధించబడినవాడై తపోయజ్ఞ దానాదులతో మనస్సును పరిశుభ్రపరచుకుంటాడు. ఎందుకంటే, ఈ సంసారం అత్యంత దుఃఖప్రదమైనది కదా!

ధూళిచే ఆకాశము అపరిశుభ్రమౌతుందా? లిప్తమౌతుందా? అసలు ధూళికి, ఆకాశమునకు సంబంధమెక్కడిది? ఈ దేహాదులు ఉండనీ… లేకుండనీ! … ఆత్మ ఈ దేహాదులచే, ఈ పంచకోశాలచే లిప్తమయ్యే ప్రసక్తే లేదు. బురదలో బంగారు ఉంగరం ఉంటే బురద బంగారమౌతుందా? బంగారము తన స్వతత్వమును కోల్పోయి బురదగా సంతరించుకుంటుందా! ఈ జడదేహంలో ఆత్మతో కలిసి ఉన్నప్పటికీ ఇది ఆత్మరూపం ఎలా చెందుతుంది? చెందదు. ఆత్మ జడదేహ విభాగి అవుతుందా?

అవదు.

శ్రీరాముడు : సుఖదుఃఖాదులు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి? ఇవి శరీరానివా? ఆత్మవా? శ్రీవసిష్ఠ మహర్షి : అదిగో ఆ ఆకాశమును చూడు! దానిలో మాలిన్యము గాని, బిందుత్వము గాని ఉన్నాయా? ఉండవు కదా! ఆత్మ యందు ప్రతీతమై అగుపిస్తున్న ఈ సుఖదుఃఖాదుల అనుభవం అసత్యమైనదే! ఆత్మకు సుఖదుఃఖాదులు లేవు.

పోనీ, “ఈ సుఖ దుఃఖాదులు శరీరమునకు సంబంధించినవే” అని అందామా? ఈ శరీరము స్వతహాగా జడమే కదా! జడమైన వస్తువునకు అనుభవమనేదే ఉండదు. ‘ఒక కలం అనుభూతిని పొంది కవిత్వం రాస్తోంది’ అని అనం కదా! అనుభవమే ఉండనట్టి వస్తువుకు సుఖమేమిటి? దుఃఖం ఏమిటి? లేక ‘ఇవి ఆత్మకు సంబంధించినవి’ అందామా? ఆత్మ సర్వానికి అతీతమైనది కదా!

అందుచేత “ఆత్మయే స్వయముగా సుఖదుఃఖముల భావన చేసి తద్వారా వివర్తము పొందుతోంది. తనయొక్క భావనాపరిధిలో బాలురక్రీడవలె, భావనావిన్యాసంగా సుఖదుఃఖాదులన్నీ పొందుతుంది అని అనక తప్పదు.

అందుచేత “అంతాకూడా నిత్యము, ప్రశాంతము అయినట్టి ఆత్మయొక్క రూపమే….” అను భావనతో ఇక్కడి పదార్థములను, సంఘటనలను గాంచుచుండుము. ఆత్మయందు కనిపించే ఈ విశాల సృష్టి సమూహమంతా జలంలో కనిపించే తరంగముల వంటిదే. ఒక మణి అకారణంగానే సమీపవస్తువులపై ప్రకాశమును ప్రసరింపజేయుచున్నట్లు, ఆత్మ స్వసత్తామాత్రంచేత అకారణంగానే ఈ సృష్టిని విస్తరింపజేస్తూ ఉన్నది.

Page:320

అజ్ఞాన దృష్టి యందలి ‘జగత్తే’… జ్ఞానదృష్టిచే ఆత్మ!… ఈ జగత్తు, ఆత్మ ఒకే రూపములు కావు. అట్లాగే వేరువేరు రూపములైనవి కూడా కావు. జలమే తరంగరూపం కదా! తరంగము జలమే కదా!

ఈ జగత్తు మిథ్యయే. అయినప్పటికీ అజ్ఞానకారణంగా ఇట్లు భ్రాంతిరూపంగా విస్తరిస్తోంది. సమ స్తంఖల్విదంబ్రహ్మ సర్వమాత్మైవమాతతమ్

అహమన్యదిదంచాన్యదితి భ్రాన్తింత్యజానఘ. (సర్గ 5, శ్లో 39)

ఈ జగత్తంతా బ్రహ్మమే కనుక “నేను వేరు…. బ్రహ్మము వేరు” అను భ్రాంతిని త్యజించివేయుము. ఎందుకంటావా? బ్రహ్మము దేశ కాలములచే పరిచ్ఛేదమగునది కాదు.

అట్టి బ్రహ్మము నందు “నేను - నీవు - - జగత్తు” అనబడు విచ్ఛేదం ఎట్లా సంభవం చెప్పు? అగ్నిలో మంచుకణం ఉంటుందా? ఎలా ఉంటుంది? అగ్నిలోని ఒక అగ్నిశిఖకు సంబంధించినవి, సంబంధించనివి, ఆ అగ్నిలో ఏమి ఉంటాయి? ఏకము, సర్వరూపము అయిన పరమాత్మ యందు ఇక రెండవ కల్పనయే సంభవించదు.

‘చిత్’ రూపమగు ఆత్మయే ’స్వస్వరూప అభావం" అనబడు ఒకానొక సమయంలో ఇట్లు ‘జగత్తు’ అనబడు క్షణక్షణ పరిణామయుతమగు అనుభవప్రాప్తిని పొందటం జరుగుతోంది. ఈ పొందబడుచున్నదంతా స్వయంకల్పితమగు భావనను అనుసరించే ఉంటోంది. భావనయే సుఖము, భావనయే దుఃఖము. ఇక, ఆత్మయో? భావనలకు ఉత్పత్తి-స్థితి-లయస్థానం.

నశోకోస్తినమోహోస్తి న జన్మాస్తినజన్మవాన్ | యదస్తీహతదేవాస్తి విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 43, సర్గ 5)

నిర్ద్వంద్వోనిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ ।

అద్వితీయోవిశోకాత్మా విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 44, సర్గ 5)

సమఃస్వస్థఃస్థిరమతిః శాన్తకోకమనామునిః | మౌనీవరమణిస్వచ్ఛో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 45, సర్గ 5)

వివిక్తఃశాస్త్రసంకల్పో ధీరధీర్విజితాశయః | యథాప్రాప్తానువర్తీచ విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 46, సర్గ 5)

వీతరాగోనిరాయసో విమలోవీతకల్మషః | నాదాతా నపరిత్యాగీ విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 47, సర్గ 5)

విశ్వాతీతపదంప్రాప్తః ప్రాప్తప్రాప్తవ్యపూరితః |

పూర్ణార్ణవవదక్షుభో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 48, సర్గ 5)

వికల్పజాలనిర్ముక్తో మాయాంజనవివర్జితః | ఆత్మనాత్మ తృప్తాత్మా విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 49, సర్గ 5)

Page:321

అనన్తాపారపర్యన్త వపురాత్మవిదాంవర |

ధరాధరశిరోధీరో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 50, సర్గ 5)

వాస్తవానికి ఇక్కడ దుఃఖముగాని, మోహముగాని, జన్మగాని, జన్మను పొందునట్టిదిగాని లేదు. ఏదైతే కలదో అది సర్వదా ఉండియేవున్నది. దానినే ‘ఆత్మ’ అని అంటున్నాం. కనుక నీవిక దుఃఖరహితుడవు, నిశ్చింతుడవై ఉండుము. శీతోష్ణములు, మొదలైన ద్వంద్వములకు అతీతుడవై, నిత్యసత్యమగు స్వస్వరూపమునందు స్థితి కలిగియుండుము.

“లేనిదేదో పొందవలెను… ఉన్నదేదో విడువవలెను… ఇది ప్రాప్తించాలి… అది ప్రాప్తించ కూడదు… వీరు మా వారు… వారు కాదు…” - అనునట్టి యోగక్షేమభావములకు కట్టుపడవద్దు. ఆత్మవంతుడవై, అద్వితీయుడవై శోకరహితుడవై, సంతాపవర్జితుడవై ఉండుము. సముడవు, స్వస్థ చిత్తుడవు, స్థిరమైన బుద్ధి కలవాడవు అయి ఉండుము. మౌనివై, ఒక ఉత్తమమైన మణిలాగా స్వచ్ఛతతో ప్రకాశించెదవుగాక!

“అవిద్య” గాని, దానియొక్క కార్యక్రమవ్యవహారములుగాని స్వతఃసిద్ధమైనవి కావు. కల్పితమైనవి మాత్రమే. సంకల్పరహితుడవై, ధీరబుద్ధితో స్వాధీనచిత్తము కలిగియుండుము.

ప్రాప్తించిన వ్యవహారములను నిర్వర్తిస్తూనే, దుఃఖరహితుడవై ఉండుము. దుఃఖాదులను నీవు గ్రహించవద్దు. ‘గ్రహించటం’ అనే స్వభావం చేతనే దుఃఖములు సంభవిస్తున్నాయి. వీతరాగుడవు, చింతారహితుడవు, నిర్మల చిత్తుడవు పాపవర్జితుడవు అగుము. ఏ పదార్థమునూ గ్రహించనూ వద్దు… త్యజించనూ వద్దు.

సర్వదా ప్రపంచమునకు అతీతమైయున్న (ఆవల ఉన్న) బ్రహ్మపదమును పొందియే ఉండుము. ఆత్మవస్తువు వాస్తవానికి సర్వదా ప్రాప్తించియే ఉన్నది. “ఇప్పటికి లేనిది ఒకటి ఉన్నది….. అది నేను పొందాలి" అను యోచన సాంసారికమైనదేనని, జ్ఞానాగ్నిచే అది దగ్ధం కాగలదని గ్రహించు.

పూర్ణుడవై పూర్ణసముద్రంలాగా విక్షోపరహితుడవు కమ్ము. విజ్ఞానివై ఎట్టి శోకమును పొందనే వద్దు. వికల్ప జాలం నుండి విముక్తుడవు కమ్ము. వికల్పజాలమంతా నీ నుండే, నీ చేతనే కల్పితమై బహిర్గతమౌతోంది. నీయొక్క విజ్ఞానముతో కూడిన దృష్టి అవగాహనలు మాత్రమే అద్దానిని నిరోధించగలవు.

గురువులుగా మేము మీ స్వరూప విషయమై విశ్లేషణము చేసిచూపుతున్నాం. అయితే దర్శించవలసినది, గ్రహించవలసినది మీరే! ’మాయ’ అనే పొర మీపట్ల తొలగిపోవు గాక!

ఓ రామా! ఆత్మయందు, ఆత్మచే పరితృప్తుడవై, సంతాపములు లేనివాడవై ఉండుము. “నేను ఆత్మస్వరూపుడను” అను ఎఱుకతో చైతన్యస్వరూపము సంతరించుకో. మేరుపర్వతం లాగా ధీరుడవై సహనశీలుడవై, పరితాపరహితుడవగుము.

ప్రాప్తించిన దానిని అనుభవించుచు, ఏ వాంఛలు లేక, గ్రహణ, త్యాగరహితుడై ఉన్నవాడు స్వల్ప ప్రయత్నాల చేతనే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని స్వయంగా గాంచుచున్నాడు. మహాసముద్రము

Page:322

లాగా ’ఆత్మ’చే ఆత్మయందు పరిపూర్ణుడవై, పూర్ణకాముడవై శాంతి సుఖములను ఆశ్రయించుము. అమాయకులగు కొందరు జీవులు “ఈ ఎదురుగా కనబడు సంఘటనలు, పదార్థాలు, వస్తు జాలం అన్నీ వాస్తవమే” అని భావన చేయుట చేతనే ఇక్కడ దుఃఖం, రాగం, కౌతుకం, ఆవేశం, హింసాప్రవృత్తి భయం, క్రోధం మొదలగునవి ఏర్పడుచున్నాయి. ”ఈ ప్రపంచం మిథ్యా రూపం” అని ఎరుగువాడు అసత్స్వరూపం అయినట్టి ఇద్దాని కొరకు పరుగులు తీస్తాడా? లేదు.

ఓ రామా! నీవు తత్త్వజ్ఞుడవు. కల్పనారహితుడవు. ఇక నీకు పెద్దగా చెప్పవలసింది ఏముంటుంది? చిలుక, పంజరము’లో చిక్కుకున్నట్లు ఆత్మ శరీరమునందు చిక్కుకున్నదని భావించ కూడదు. మౌనము - ప్రశాంతము - నిర్మలము - - అఖండము - సత్యము - నిత్యము అగు ఆత్మ ఎక్కడ? జడము, భ్రమాత్మక, స్వప్నతుల్యము అగు ఈ దేహమెక్కడ? అభాండమగు ఆకాశము ఘటాకాశరూపంగా (కుండలోని ఆకాశరూపంగా) ఘటంలో (కుండలో) చిక్కుకున్నదని అనటం

సమంజసం కాదుకదా!

కనుక, ఆధి వ్యాధి వర్జితుడవై నిరంతరం ఆత్మజ్ఞానం కలిగి సుఖవంతుడవు కమ్ము. నీ ఉత్తమ, ప్రశాంత గుణములయొక్క భావీకరణముచే సమస్త జనులను ప్రసన్నులుగా చేస్తూవుండు. సమదృష్టి కలిగివుండి, చిరకాలంగా రాజ్యమును చక్కగా పాలించు.

“ప్రారబ్ధవశంచేత అనుభవించతగిన, నిర్వర్తించవలసిన కర్మలందు, వాటి ఫలములందు త్యాగముగాని, రాగముగాని యుక్తము కాదు” అని గ్రహించి ఉండు.

  1. కర్మబద్ధులు - విముక్తులు

ఓ రామా! “నాకు అద్వితీయమైనట్టి ‘ఆత్మ’ యొక్క సన్నిధానమాత్రం చేత ఈ జగద్వ్యవహారమంతా నేనే ఒనర్చుచున్నాను" - అను నిశ్చయమును జ్ఞానసిద్ధులగు యోగులు కలిగివుంటున్నారు. అట్టి నిశ్చయము కలిగియుండి, ఆపై కార్యములందు ప్రవృత్తుడగువాడు ’ముక్తుడే’ అని మా అభిప్రాయం. ముక్త స్థితికి కర్మానుష్ఠానం విరోధము కాదు. కావలసిన పనిలేదు!

కర్మబద్ధులు - ఈ జీవుడు అనేక ప్రయాసల తరువాత మనుష్యదేహం పొందుచున్నాడు. అట్లు మనుష్యదేహం పొందిన తరువాత కూడా ’నిష్కామ కర్మానుష్ఠానము నందు తత్పరులు కానివారు దుఃఖముల వైపుకే పయనించుచున్నారు. నిందిత కర్మలచే ఈ జీవుడు నరకమునకు వెళ్ళుచున్నాడు. మరల అక్కడి నుండి కామ్య - కర్మానుభవం కొరకు స్వర్గం వెళ్ళుచున్నాడు. కొందరు విహిత కర్మ లందు బద్ధకముచే అశ్రద్ధపరులై ఉంటున్నారే! అట్టివారు ఒక నరకమునుండి మరొక నరకమునకు, ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు, ఒక భయమునుండి మరొక భయమునకు అనుక్షణం ప్రయాణాలు చేస్తున్నారు. స్వవాసనలను దట్టంగా కల్పించుకొంటూ వాటికి తామే బద్ధులగుచున్నారు. దుష్కర్మ ఫలముల ఆధిక్యత చేత జంతు జన్మలు, అక్కడి నుండి స్థావర రూపములు పొందుచున్నారు.

Page:323

శుద్ధ సాత్వికులు - కొందరు ధన్యులగు జీవులు తమయొక్క మనస్సుచే ఈ మనస్సుకే సాక్షీభూతమైయున్న ‘ఆత్మ’ను గురించి విచారణ చేస్తున్నారు. తమయందలి తృష్ణను రహితం చేసి వేస్తున్నారు. కర్మయందు అకర్మ, జన్మయందు జన్మరాహిత్యం వారికి సుస్పష్టముగా సర్వదా సర్వత్రా అనుభవమగుచున్నాయి. అట్టి జీవులే శుద్ధ సాత్వికులు, వారు ఉత్తమ కైవల్యమును పొందుచున్నారు.

నిషిద్ధకర్మలు - హింసించుట, ద్వేషించుట, క్రోధము, పారుష్యము, లోభము మొదలైనవి “ఆశ్రయించకూడదు” అని శాస్త్రములు గుర్తుచేస్తున్నాయి.

రాజస సాత్వికులు - ఈ జీవులు సాత్వికము, లోక కళ్యాణ కారకములగు కర్మలకు సంబంధించిన ప్రవృత్తి - సంస్కారములను కలిగియుంటున్నారు. "స్వధర్మభావనతో భగవదర్పిత భావనతో ఈ కర్మలు నేను చేయాలి. తద్వారా సర్వాత్మకుడగు ఆ భగవంతుని సంతోషింపజేయాలి” అను మననము కలిగి, ఆయాకర్మలందు ప్రవృత్తములగుచున్నారు. వీరు క్రమంగా ఒక శ్రేష్ఠమైన జన్మ నుండి మరికొంత శ్రేష్ఠమైన జన్మను అనుభవించుచూ, ఒకానొక పవిత్రసమయములో (ఒకానొక జన్మలో) ముక్తులగుచున్నారు. అట్టివారు తమయొక్క చివరిజన్మలో, పుట్టినవెంటనే పూర్ణచంద్రునివలె వృద్ధిని గాంచుచున్నారు. వారి ఆయా జన్మలలో “సాధన చతుష్టయం” బలపడుచూ వెంటనంటి వస్తూ ఉంటాయి. బ్రహ్మవిద్యకు ఉపాయభూతములైన సమస్త విద్యలు వచ్చి చేరుచున్నాయి. శ్రేష్ఠత్వము, మనోహరత్వము, మైత్రి, సౌజన్యము, కరుణ, జ్ఞానము మొదలైన గుణములన్నీ ఆతనిని వచ్చి ఆశ్రయిస్తున్నాయి.

ఓ రాఘవా! ఎవడైతే సమస్త కార్యములు చేస్తున్నప్పటికీ, ఫల, అఫలములందు సమరూపుడై వర్తిస్తాడో, హర్ష శోకములు పొందకయే ఉంటాడో, అతని పట్ల ఈ సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములన్నీ నిర్లిప్తం అయిపోతాయి. తెల్లతెల్లవారినప్పటి చీకటిలాగా నశించిపోతాయి. చిత్తము సమస్త సద్గుణములచే పరిశుద్ధమౌతూవుంటుంది. అట్టి సదాచారసంపన్నుణ్ణి జనులు “ఈతనిని మేము కలిగి ఉండాలి” అని తలుస్తారు. ఎందుకంటే, ఆతని యందు సద్గుణ సంపద స్వయముగా, అసంకల్పితముగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

సాధన చతుష్టయం - సాధు సాంగత్యం, శ్రవణం, మననం, నిధిధ్యాస మొదలైన ఉత్తమ గుణములచే పరిపూర్ణుడై ఉంటున్న ఆతనిని చూచి సంతోషించినవారై సద్గురువులగు జ్ఞానులు జ్ఞానసంపదను ప్రసాదిస్తున్నారు. “ఇది ఆత్మ - ఇది అనాత్మ” అను వివేకము వారియందు స్వయంగా ప్రకాశిస్తుంది. అట్టి విచారయోగము సహాయంచే ఆ జీవుడు ఆనందైకరసమగు ఆత్మస్వరూపమును వీక్షించగలుగుతాడు. అంతఃకరణమునందు ఆత్మకు లక్షణములైన అఖండత్వము, నిత్యత్వము, శుద్ధత్వము, ప్రకాశమయత్వము మొదలైనవి రూపము దిద్దుకుంటాయి. ఆత్మయే ఆతని మననము, స్వభావము అగుచున్నది. ఉత్తమ శాంతియే ఆతని ధారణ. మనస్సు సర్వదా నిర్గుణ (గుణములకు అతీతమైన) బ్రహ్మము రూపమందు ఐక్యమై ఉంటోంది. ‘ఆత్మ’ అనబడు అనుభవమునందు నిత్యము ప్రబోధితుడై అతడు ఉంటున్నాడు.

Page:324

చూచావా రామా! ఉత్తమ లక్ష్యంతో, దృష్టితో, భావనతో ఉపాధిని పొందిన జీవుడు జీవితం అను ఈ అవకాశమును వృథా పరుచుకోడు. మహాత్ములు, ఆత్మద్రష్టలు అగు సద్గురువులను సేవించి, వారు బోధించు యుక్తులచే నిర్మల బుద్ధిని సంపాదించుకుంటాడు. అట్టి బుద్ధిచే చిత్తమునందలి ఆత్మవస్తువును ప్రకాశింపజేసుకుంటాడు.

అంతఃకరణమున ప్రకాశించుచున్న బ్రహ్మమును అనునిత్యంగా ఆస్వాదిస్తున్నాడు. పరమ పురుషార్థ రూపమగు ఉత్తమగతిని తన యొక్క స్వస్థానమునందే పొందుచున్నాడు.