CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:325

II. జనకోపాఖ్యానము

1.సిద్ధగీతాగానం

‘మిధిల విదేహ’ అనే పేరుగల రాజ్యమును జనకమహారాజు పాలిస్తున్నాడు. ఆయనకు దేనిపట్లా ఎట్టి వ్యధ ఉండేది కాదు. ’ఇది ఆపద, ‘ఇది సంపద’ అనబడు స్పర్ధ అంతరంగమున లేకుండానే మహావిష్ణువులాగా సౌజన్యపూర్వకంగా రాజ్యం పాలిస్తూఉన్నారు. అయితే ఆయనకు సందేహాలు ఎక్కడో అంతరంగంలో చూచాయగా మినుకుమినుకుమంటూ ఉండేవి. ఈ జీవుడెవడు? ఈ సంసారము ఏమై ఉన్నది? భ్రమలను కల్పిస్తున్నది ఎవరు? భ్రమలను కల్పించుచున్నవానికి, ఆ భ్రమలు అనుభవించుచున్నవానికి గల సంబంధమేమిటి?

నేనెవరు? ఈ రాజ్యాదులు నావేనా? కాదా! అహంకారము భ్రమయా? వాస్తవమా? అందరి యందు భగవానుడు ఉన్నాడని వేదములు ఘోషిస్తున్నాయి, అయితే నాయందు కూడా ఉండాలి కదా! ఉంటే ఏ రూపములో ఉన్నాడు?

జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అనగా ఎట్టిది? ఎవరిచే కల్పితం? ఈ మనస్సు పొందే అల్పత్వాన్ని, చంచలత్వాన్ని నిరోధించటం సాధ్యమేనా? ఇక్కడ ఏది త్యజించాలి? ఏది గ్రహించాలి?

ఇట్లు అనేక ఆలోచనలు పొందుతూ ఉండేవాడు. ఒక రోజు ఆయన వనవిహారం చేసే ఉద్దేశంతో సపరివారంగా ఒక పర్వతప్రాంతం చేరారు. పరివారము నంతటినీ వదలి పర్వతగుహలలో ఒంటరిగా సంచరించసాగాడు. ఒక చోట ఆయనకు కొన్ని శబ్దములేవో అలవోకగా వినిపించ సాగాయి. అనేక సాధనలచే సముపార్జించియున్న యోగబలంతో మనస్సును ఏకాగ్రం చేసి ఆ శబ్దములను వినసాగాడు.

ఆ శబ్దములు అదృశ్యరూపులగు సిద్ధుల పరస్పర సంభాషణ అయి ఉన్నట్లు యోగబలం చేత, తార్కిక బలంచేత గ్రహించాడు. “ఆహాఁ! ఇక్కడ ఏదో సంభాషణ వినవస్తోంది. ఇవి సిద్ధులు మాట్లాడుకొనే మాటలు! అయితే సిద్ధులు ఏకాంతవాసులు కదా! మహానుభావులతో సమీప్యత అంత తేలికగా లభించదు. ఈ రోజు నా పుణ్యం ఫలప్రదమౌతోంది కాబోలు. వీరు పవిత్రాత్మ స్వభావులు. వీరి మాటలు వింటుంటే, ఉత్తమోత్తమమగు ఆత్మవస్తువు గురించే సంభాషించు కుంటున్నట్లు నాకు అనిపిస్తోంది. సరే, పూజ్యులగు వీరి వాక్యములను వినమ్రతతో శిష్యభావనా సమన్వితుడనై వినెదను గాక" - అని తనలో అనుకున్నాడు. మనస్సును తదితర విషయముల నుండి వెనుకకు మరల్చి ఏకాగ్రతతో ఆ శబ్దమును వినుటకు, అర్థమును గ్రహించుటకు ఉద్యుక్తుడయ్యాడు.

Page:326

ఒకానొక సిద్ధుడు : మిత్రులారా, ఇప్పుడు ఆత్మజ్ఞాన విషయమై కొన్ని విశేషాలు చెప్పుకుందాం. కొంత సమాచారం చర్చించుకొందాం. మనమన అవగాహనలకు సంబంధించిన అనుభవాలను విశ్లేషించుకుందాం.

ఒకటవ సిద్ధుడు :

ద్రష్ట దర్శనముల సంయోగ స్థానం ఒకటి చూస్తున్నది. మరొకటి చూడబడుచున్నది. అవియే - ద్రష్ట - దృశ్యములు కదా! పరిమిత, అపరిపక్వ దృష్టికి, ఈ ద్రష్ట - దృశ్యములు వేరు వేరైనవిగా అనిపించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అయితే ఈ ద్రష్ట -దృష్టి -దర్శనం -దృశ్యం కూడా ఒకానొకచోట సంయోగము పొందుచున్నాయి. ఏకైక రూపమై ప్రదర్శనమగుచున్నాయి. అట్టి నిరుపమానందన స్వరూపం అయిన సంయోగ స్థానం ఏదై ఉన్నది?

ఒకానొక అనిర్వచనీయమగు తత్త్వము ఈ ‘నేత్రములు’ మొదలైన ఇంద్రియముల ద్వారా విషయములతో సంయోగమును ఆశ్రయిస్తోంది. ఆ తత్త్వమే ’ఇంద్రియ విషయములు’ అను ఆకారముగల బుద్ధివృత్తులను పొందినదగుచున్నది. సర్వమును ’ఇది సుఖము’, ‘ఇది దుఃఖము’ ‘ఇది కావాలి’ ‘ఇది వద్దు’ అని నిర్ణయించేది, భావనచేసేది, అనుభవమును పొందేది అదే.

అట్టి నిరతిశయ భూమానంద స్వరూపమైన ఆత్మనే…… నేను ఆరాధిస్తున్నాను. ‘భగవంతుడు’ అని చెప్పబడుచున్నది అదే. సవికల్ప - నిర్వికల్ప సమాధులచేత, బాహ్య - అభ్యంతర ఇంద్రియ నిగ్రహములచేత నాచే నిరంతరం ఉపాసించబడుచున్నది అదే.

ఎవరు ఎక్కడ ఉంటే, అది వారికి అక్కడే, అప్పుడే లభించియే ఉన్నది. ఇక దాని కొరకు మరొక స్థానం వెళ్ళాలా? మరి కొంత సమయం వేచి ఉండాలా? ఎందుకు?

అయ్యది “నా యొక్క సర్వుల యొక్క, సర్వము యొక్క స్వస్వరూపమునకు వేరైయున్నది. కాదు. అట్టి అద్వితీయమైనది (వేరుకానట్టిది), అఖండమైనట్టిది (అనేక జీవులుగా మారు స్వభావము లేనట్టిది), స్వస్వరూపమైనట్టిదియగు ఆత్మ భగవంతునకు ఇదే నా నమస్కారం. దృశ్యరూపము, నా స్వరూపముకూడా సర్వదా అయి ఉన్న ’ఆత్మ’కు ప్రణామములు. సర్వజీవులు తానై, సర్వసాక్షిగా వేరై ప్రదర్శనమగుచున్న అస్మదాత్మదేవా! నీకు నమస్కారం!

రెండవ సిద్ధుడు :

భావనకు మునుముందే ఉన్న సాక్షిసత్త - ఈ “నేత్రములు” మొదలైన ఇంద్రియములందు ‘అనుభవము’ స్వరూపముగా ప్రత్యక్షమై "జ్ఞానము” ఉండి ఉన్నది. - ఆ జ్ఞానం ఈ ఇంద్రియములు రూపుదిద్దుకొనుటకు ముందే ఉండి ఉన్నది.

‘నేను చూచుచున్నాను’ అను రూపముగల అనుభవమునకు ముందే ఆ అనుభవమును ఆశ్రయించు ‘నేను’ ఉండియే ఉన్నది. అదే విధంగా ‘నేను’ అనబడునది భావించబడుటకు ముందే, ఆ ‘నేను’ను భావించుటకు సిద్ధమగుచున్న సత్త ఉండియే ఉండాలి కదా?

Page:327

భావించువాడు భావనకంటే మును ముందే ఉండి ఉన్నాడు. అట్టి ‘సాక్షి రూపసత్త’ విషయమై కొందరు “అది ఉన్నది…. అదియే ఉన్నది“ - అని అంటున్నారు. మరి కొందరు ”అది కళ్ళకు కనబడటం లేదుగా!… కనుక లేదు" - అని వాదిస్తున్నారు.

“అసత్తన్నా సదుచ్యతే” - అది ‘ఉన్నది’, ‘లేదు’, అని కూడా చెప్పబడుతోంది. అట్లు ’ఉన్నది’, ‘లేదు’ అను విషయమై ఆ రెండింటిని దర్శిస్తూ, అనుభవం పొందే ఒకానొక సాక్షిత్వము ఉండాలి కదా! ఈ అస్థిత్వ - నాస్థిత్వము (ఉన్నది - లేదు) పక్షముల రెండిటియందును మధ్యగతమై, సాక్షిస్వరూపమున వెలుగొందుచూ ఉన్నదేది?

ఔను…..! అది మనస్సుకు, వాక్కుకు అలభ్యముగానే ఉంటోంది. అనుభవమాత్రమే అగుచున్నది. అదియే ‘ఆత్మ’ అను సంజ్ఞతో మనం చెప్పుకుంటున్నాం.

ఆ ఆత్మ తాను ప్రకాశిస్తూ, తదితరములైన సర్వ వస్తువులను, సమస్త దృశ్యములను ప్రకాశింపజేస్తోంది. అది ‘అస్థిత్వము’ను ఆశ్రయించిందా……. ‘జగత్తు’ అనే కార్యము ఏర్పడుచున్నది. అది ’నాస్థిత్వము’ను ఆశ్రయించినప్పుడో…. ‘జగత్తు’ తిరోభావరూపము పొందుచున్నది. అట్టి ఆత్మవస్తువునే అనేకులు అనేక నామ - రూపములతో ఉపాసిస్తున్నారు. అందరి ఆరాధన, తపన అదియే. అట్టి ’ఆత్మతత్త్వము’ను నేను నిత్యము ఉపాసిస్తున్నాను.

మూడవ సిద్ధుడు :

ఆధారుడు, నియామకుడు - “నేను, నీవు, అతడు, ఆమె, వారు, వీరు" అనునవన్నీ ఉన్నది ఎక్కడ? ఎందులో? ఈ సర్వమునకు ఆధారం ఎవరు? ఈ సమస్తము ఎవనికి చెందినది? వీటన్నింటిని నియమించుచూ ప్రభువై పాలించుచున్నవాడు ఎవరు?

ఎవనియొక్క సంకల్ప బలముచేత సర్వము ఉత్పన్నమై ఒకానొక నియమానుసారం ప్రవర్తిస్తోంది? ఈ సర్వమునకు ‘కారణ భూతుడు’ ఎవడు? ఎవడు ఉంటే మాత్రమే ఇవన్నీ ఉండ గలుగుచున్నాయి? అసలు ఈ సమస్తము ఎవడై యున్నాడు? మాయచే జగద్వ్యవహారములన్నింటినీ నిర్వహిస్తూ సర్వరూపములు తానే అయి ఉన్నాడు…. నామరూపములకు సంబంధించనివాడు ఎవడు? అట్టి సత్యము, నిత్యము, సమము, సర్వము అగు పరమాత్మనే నేను ఆరాధిస్తున్నాను.

నాలుగవ సిద్ధుడు :

సర్వనిర్వచనములకూ ఆలవాలము, సూచకము (Zone of/indicative of - all definitions)–“అహమ్….. (నేను)” అను భావన సర్వులయందు సర్వదా సర్వమునకు కారణమై వెలుగొందుచున్నది కదా…! ఈ ’అ’కారము ఆదిగా, ’హ’ కారము అంతముగా గల ’అహమ్’ అను శబ్దము సూచిస్తున్నది దేనిని?… అదియే ‘ఆత్మ’ అనబడు మరొక శబ్దముతో కూడా ప్రతిపాదించబడుతోంది. అదియే తదితర వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తోంది.

Page:328

అంతేకాదు! సర్వవేదాలలో, తదితరమైన శాస్త్రాలలో అనుగతమైనది అదే. బహు విధాలుగా నామ రూపాదులతో కూడినదై అనేక చమత్కారాలచే ప్రవచింపబడుచున్నది కూడా అదే!

అన్ని అక్షరముల సముదాయ రూపమగు శబ్దజాలమునందు అతడు అంతర్గతుడై ఉన్నాడు. “ఇది సుందరమైనది…. ప్రియమైనది… స్వీకరింపతగినది….. ఆశ్చర్యకరమైనది… పవిత్రమైనది” మొదలైన నిర్వచనములన్నీ ఎవరివి? అహంభావనకే ఆది అయినట్టి ‘శుద్ధచిత్’ తత్వము యొక్క చమత్కారమే. ఆ ఆత్మభగవానుడే సర్వాకారుడు అయి ఉన్నాడు.

అనగా, అతడే సర్వులుగా ఆకారము గ్రహించుచున్నాడు కదా! కాబట్టి సర్వ నియామకుడు, సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు. ఆ సర్వవ్యాపకుడు అనవధ్యుడు. ఆతనిని వధింపగలిగినది, నిరోధింప గలిగినది ఎక్కడా ఏదీ ఉండజాలదు. ఆతడు విభాగములుగా అగుటయే లేదు.

ఆతడు వాస్తవానికి ఏనాడూ మరొకటేదీ అగుట లేదు. కనుక ’జీవుడు’, ‘మనస్సు’ మొదలైన వన్నీ ఆతనిపట్ల భ్రమచే ఆపాదించబడుచున్నవి మాత్రమే. ఆతడు సర్వదా నిర్గుణ బ్రహ్మము నందే స్థితి కలిగివుంటున్నాడు. జలం తరంగమగుచున్నప్పటికీ జలము జలముగానే ఉంటోంది కదా!

“సోహమ్… సో హమ్… సో హమ్" - ఆతడే నేను .. నేను ఈ నామ రూపములు కాదు. మనోబుద్ధులు నేను కాదు. చిత్తహంకారములు నేను కాదు. ఆతడే నేను….. నేనే ఆతడు.

శ్వాసఉచ్ఛ్వాసలచే ‘సోహమ్’ మంత్రం అసంకల్పితంగానే నాచే నిరంతరం జపించబడుచున్నది కదా! అట్టి ఆత్మ పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను… ఉపాసిస్తున్నాను. శరణు వేడుతున్నాను. ఆతడు నిరామయుడు (తీళిజీళీజిలిరీరీ) అని తెలిసికూడా, నామరూపములను ఉపకరణములుగా తీసికొని ఆ ఆత్మానంద తత్త్వమువైపుగా ప్రయాణిస్తున్నాను.

ఐదవ సిద్ధుడు :

న అన్యమ్, న బాహ్యమ్ - ప్రతి ఒక్క జీవుని ’హృదయ గుహ’లోను ఒకానొక ‘సత్త’ స్వరూపుడగు భగవానుడు కాపురము ఉండివున్నాడు. సాక్షి స్వరూపుడై వెలుగొందుచూ, సర్వమునూ అతడు వెలిగించుటకు మూలకారకుడు అగుచున్నాడు. అతడెవరు? అతి చమత్కారంగా, ‘న అన్యమ్’, ‘న బాహ్యమ్’ (Not different from one’s own self. Not anything outside).

అంతరాత్మ స్వరూపుడగు ఆ భగవంతుని ఏమరచి, ప్రక్కకు పెట్టి …. ఈ జీవుడు ఎక్కడో ఉన్నట్లుగా భావించబడు అన్యదేవతలను ఆశ్రయిస్తున్నాడేమిటి? ఎంత ఆశ్చర్యం?

ఓయీ, జీవుడా! నీ హృదయంలో సర్వదా వేంచేసియుండి, సర్వ స్థితిగతులందు, నిశ్చలుడు, నిర్మలుడు అయివుంటున్న ఆ అంతరాత్మయే నీవు. మరేదీ నీవు అయి ఉండలేదు…. ఉండబోవు! చేతిలోని ’మణి’ని పూర్తిగా మరచి, ఎక్కడో దూరముగాగల ఒక్క గాజు ముక్కను చూచి "అహో! అది నన్ను సమీపించకూడదా…! ఏంచేస్తే అది పొందగలను?” అని నీవు ఎందుకు కలవరిస్తున్నావు? గుప్పిట విప్పి మణిని చూచినట్లు స్వహృదయమునకు స్థానమైయున్న ఆ స్వస్వరూపాత్మను దర్శించవేం?

Page:329

ఆ భగవంతుడు అంగుష్ఠమాత్రుడై సర్వుల హృదయములందు సుఖాసీనుడై అంతరాత్మ స్వరూపుడైయుండియే ఉన్నాడు. అందుచేత, ప్రతి ఒక్కరికి మేము చెప్పుచున్నది ఒక్కటే… సర్వ జీవులారా! మీలో ఏ ఒక్కరూ పరితపించవలసిన పనేమీ లేదు. ఆ పరమాత్మ మీ హృదయమునందే సర్వదా వేంచేసియున్నారు. అది గ్రహించండి… ఆరాధించి తరించండి. పరమాత్మ స్వరూపులై సంతృప్తులు అవండి. నా ఆరాధన, ఆరాధ్యము సర్వాంతర్యామి అగు నా అంతరాత్మయే!

ఆరవ సిద్ధుడు :

ఆశ రహితంకాగా అప్పుడు శేషించి ఉండేది! - - ఈ జీవుని యందు క్షణక్షణం అసంఖ్యాకంగా, అంతులేకుండా ఏవేవో క్రొత్త క్రొత్త ఆశలు ఏర్పడుచున్నాయి. ఈ ‘ఆశ’ అనుదానికి అంతు ఉండటంలేదు. ఆశలు ఎందుకు ఏర్పడుచున్నాయి? ‘ఆశించుట’ అను ప్రకృతి సంబంధమైన స్వభావము చేతనే కదా! ఒకానొక జీవుడు సమస్త ఆశలు పరిత్యజించాడనుకో… అప్పటికీ ఆతనియందు శేషించి ఉండునదేమిటి?

ఆ శేషశయనుడు (అట్లు శేషించు దాని యందు శయనించువాడు) ‘చిద్రూప పరబ్రహ్మము’ అను సంజ్ఞతో చెప్పబడుచున్నాడు. అదియే బ్రహ్మము. అదియే మర్మము. అది సర్వదా ప్రాప్తించియే ఉన్నది. అట్టి బ్రహ్మముయొక్క జ్ఞానానుభవము ప్రాప్తించిన తరువాత ఇక ‘ఆశ’ అను విషలతకు స్థానమెక్కడిది? వెలుతురు ఉన్నచోట చీకటికి ఉనికి ఎక్కడ?

హృదయమును ఆశారహితము చేసి అప్పుడు శేషించి ఉండే ఆత్మయే నాచే ఆరాధించబడు పరమోత్కృష్టతత్త్వము. అదియే నా ఆరాధ్య దైవము. అదే సర్వస్వము. నా ప్రయత్నములన్నీ అటు వైపుకే!

ఏడవ సిద్ధుడు :

క్షుద్రాశయం, మహాశయం ఈ జగత్తులో ‘భోగము’ అను అనుభవమును పొందడానికి అనేక వస్తువులు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాస్తవానికి సారరహితం. ఇవి అనుక్షణం ఒక స్థితి నుండి మరొక స్థితికి పయనిస్తున్నాయి.

శాస్త్ర వాక్యములు, గురుబోధలు “ఈ జగత్ పదార్థములు నిస్సారములే” అని పదే పదే జీవులకు గుర్తు చేస్తున్నాయి. ఈ జీవులు అవన్నీ వింటూకూడా ఎందుకో ’దుర్బుద్ధి’నే ఆశ్రయిస్తున్నారు. “ఈ వస్తుజాలం సుఖప్రదములు. ఇవి మమ్ములను తదితరుల కన్నా గొప్పగా చేస్తాయి…. కనుక కలిగి ఉంటాం గాక” .. అను యోచనయే జీవన విధానమును శాసించటం జరుగుతోంది. వీరు స్వల్ప వస్తువులకొరకై ద్వేషించుకొనుచున్నారు… దుఃఖించుచున్నారు… శ్రమించు చున్నారు…. పరుగులు తీస్తున్నారు. ఫలితంగా, అజ్ఞానంచే ఆవరించబడిన మనస్సు గలవారై మరల మరల అనేక నీచ ఉపాధులు పొందుచున్నారు. దుర్బలమైన స్థితి గతులు తెచ్చి పెట్టు కుంటున్నారు.

Page:330

అట్టి భోగ్యవస్తువులను జీవిత లక్ష్యముగా అంగీకరించు మానవులు వారిని మానవులు అని అనకూడదు. మానవరూపంలో ఉన్న గాడిదల వంటి వారే! ఎందుకంటే వారు తమ మనస్సు లందు ఎన్నో ‘నిష్ప్రయోజనకరము, త్యాజ్యార్హము’ అగు వేదనలు, రోదనలు మోస్తున్నారు కదా!

‘ఆత్మ జ్ఞానము’, ‘ఆత్మానుభవము’ - అనునవి లక్ష్యముగా కలిగి జీవించువారి జీవితములు మాత్రమే అర్థయుక్తము, శుభకరము, పవిత్రము కూడా! వారి కర్మలు, వారి శబ్దములు, భావములు క్రమంగా సుఖ శాంతులు సంతరించుకోగలవు.

కనుక ఆత్మతత్త్వజ్ఞానులు, ఆత్మస్వభావులు అగుటకు యత్నించుటచే మహాశయులు (మహత్తరమైన ఆశయములు కలవారు) అగుట ఎంత ఉత్తమం! అట్టి మహాశయమే నా మార్గం.

ఎనిమిదవ సిద్ధుడు :

ఇంద్రియ సద్వినియోగం - పర్వతాలు రెక్కలతో లేస్తూ ఊళ్ళమీద పడుతుంటే, ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతముల రెక్కలను ఖండిస్తున్నాడు కదా…! అట్లాగే ‘ఇంద్రియములు’ తమ ఇష్టం వచ్చినట్లు ఆయా విషయములపై వ్రాలుచుండగా ఈ మానవుడు చూస్తూ ఊరుకోవటం ఉచితం కాదు. ‘వివేకము’ అనే దండముతో వాటిని పదేపదే అణచివేయాలి.

ఇంద్రియసర్పాలు యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉండే సమయంలో ఆజీవుని హృదయంలో సుఖశాంతులు ఉండే అవకాశమెక్కడిది? ఈ ఇంద్రియాలను నియమించటం ఎఱుగనప్పుడు ఇవి అనంత దుఃఖములలోకి ఈ జీవుని త్రోసివేస్తున్నాయి. దుర్భర జన్మపరంపరలను ప్రాప్తింప జేస్తున్నాయి.

అరేఁ! ఎంతో శ్రమించిన తరువాత, ఆశ్రమకు ఫలితంగా ‘మానవుడు’ మొదలైన ఉత్తమమైన ఉపాధులు పొంది కూడా, ఈ జీవులలో అనేకులు వాటిని సద్వినియోగపరుచుకోవటం లేదే? శాస్త్రములు, “ఇంద్రియములను ఎట్లు నియమించటం ఉచితం?”– అనే విషయమై అనేక మార్గములు చూపుచున్నాయి.

ఇంద్రియాలు దుర్వినియోగబడకుండు గాక! ఎందుకంటే, అందుకు అంతిమ ప్రయోజనం దుఃఖం, అవివేకం, సంకుచితత్వమే అగుచున్నది. "ఇది సన్మార్గం, ఇది దుర్మార్గం” అని విచక్షణ చేయబడి, అప్పుడు సరియగు మార్గములో, అనగా శాశ్వతము, అఖండము అగు ఆత్మావగాహన పెంపొందించు మార్గంలో ఈ ఇంద్రియములు వినియోగించబడుగాక! సర్వ అవకాశములు సద్వినియోగ పరచుకుని ఆత్మావగాహన పెంపొందించుకోవటమే సన్మార్గం. అదియే నా సాధన.

తొమ్మిదవ సిద్ధుడు :

ఇంద్రియాతీతత్వం - ఈ విషయములన్నీ కూడా దుఃఖప్రదములుగానే పరిణమిస్తున్నాయి. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ ఇంద్రియ సంబంధితములే కదా!

మరిప్పుడు ఉపాయమేమిటి? విషయముల వెంటే పరుగులు తీయాలా? …లేదు.

Page:331

మానవుడు ఈ బాహ్య, అభ్యంతర వ్యాపారములను నిరోధిస్తూ ఉండాలి. అప్పుడు క్రమంగా ఈ విషయములచే ఏర్పడుచున్న దుఃఖము రహితం అవుతుంది. అట్లు నిరోధించటంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే.

అయినాసరే! బాహ్య - అభ్యంతర వ్యాపారములు క్రమపరచాలి. “అల్పసుఖమును త్యాగం చేసి ఉత్తమ సుఖమును సముపార్జించటం" - అనేది లోకంలో అందరికీ తెలిసిన విషయమేకదా! విషయ సుఖము అధిగమించబడిందా….. అప్పుడు ఆత్మసుఖమే లభించగలదు కదా! అట్టి ‘ఉపశమనము’చే ఇంద్రియ వ్యాపారం నిరోధిస్తే, చిత్తము శమిస్తుంది.

చిత్తము ఇంద్రియములనుండి రక్షితమయిన చోట ‘జడత్వము’ లేనట్టి శుద్ధ పరబ్రహ్మానుభవం లభించగలదు. ఉత్తమ స్థితి లభించగలదు. అప్పుడు ప్రాప్తించుచున్న నిత్యోదిత ‘ఆత్మ’ లేక పరబ్రహ్మమునకు ఇవే నా నమస్కారములు. ఆనిత్యోదిత పరబ్రహ్మమే నా దృష్టి, నిష్ఠ కూడా!

ఒకానొక సిద్ధుడు : మంచిది… ఈ సమయంలో మనం చక్కటి విషయాలు గుర్తు చేసుకున్నాం. ఇక

ఈ విషయములు మనం మరికొంత యోచించుకుంటూ ఉండెదముగాక! ఇక మనం మన

స్వస్థానములకు వెళ్లుదాం!

  1. విచిత్ర ప్రపంచం స్థితిగతులు - ముందువెనుకలు

ఆ విధంగా సిద్ధులు గానం చేసిన గీతములలో అర్థమును తరచి తరచి యోచిస్తూ జనకమహారాజు ఇక ఇంటిముఖం పట్టాడు. కొంతయోచన తరువాత ఆతనియందు ఒక భీరువు వలె విషాదం ఏర్పడింది. క్రమంగా అంతఃపురం జేరాడు. పరివారమునంతటినీ వారి వారి స్థానములకు పంపివేశాడు. కోట యొక్క ఒక ప్రసాదభాగం అధిరోహించాడు. ఒకచోట ఒంటరిగా అటూఇటూ పచార్లు చేస్తూ అతి చంచలముతో కూడినట్టి ఈ విచిత్రమైన ప్రాపంచిక గతుల గురించి తీవ్రమైన పరిశీలన చేయసాగాడు.

జనక మహారాజు (స్వగతంగా) : అంతులేకుండా ఆశలు…! అల్పమైన జీవితకాలం…! ఆహా! ఎంతటి భేదకరమైన విషయం! ఏమి విపత్తు వచ్చిపడింది! ఈ జన్మమృత్యుజరాభయాదులలో ఎప్పుడో ఎందుకో చిక్కుకున్నాను. ఇంకేమున్నది? మిక్కిలి కష్టప్రదమైన చంచల జీవిత దశలందు బలాత్కారంగా దొర్లించబడుచున్నానే!

ఈ స్వల్ప జీవితాన్ని, రాజ్యాదులను చూచి ఎందుకు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నేను మురిసిపోతున్నాను? ఈ అనంత కాల వ్యవస్థలో నా జీవితం ఎంత స్వల్పమైనది?

Page:332

అట్టి స్వల్పకాలిక జీవితంలో ఎన్ని స్థితిగతులు!… ఎన్ని ఒడుదుడుకులు…! ఇంతలోనే ధనం, రాజ్యం, జాతి,అధికారం, ప్రతిష్ఠ… మొదలైన మాయా వస్తువుల పట్ల అంతులేనన్ని ఆశలు కల్పించుకొని, ఆ ఆశాపాశముల బంధంలో ఇరుక్కొని ఉన్నానే! “విమర్శ- విశ్లేషణ - అవగాహన”లను ఆశ్రయించని నాకు కాలమును దుర్వినియోగ పరుచుకుంటున్నందుకు ధిక్కార మగుగాక!

ఈ రాజ్యము, రాజరికము మొదలైన పైపై పటాటోపాలు మహా అయితే కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఆపై ఇవన్నీ తొలగవలసినదేకదా! నాకున్న బుద్ధి, శక్తి, యుక్తి ఇవన్నీ కూడా వీటిని కొద్దికాలం కలిగి ఉండటానికి మాత్రమే వెచ్చిస్తే, అది ఎంతటి మూర్ఖత్వం! ఎంతమంది ఇతః పూర్వం ఈ రాజ్యం ఏలారు? కాలక్రమేణా ఎంతమంది వచ్చి ఈ మిథిలా నగరం ఏలబోవుచున్నారు. అయ్యో! ఈ తుచ్ఛమైన ‘బుద్ధి’ నన్ను “దుర్గతులు, నీచ భావము, తుచ్ఛమైన ఉపాధులు” వైపుగా నడిపిస్తోందేమిటి? ముందు ముందు ప్రాప్తించబోవు దుఃఖముల శమనము కొరకు ఇప్పుడు నేనేమైనా చేస్తున్నానా? అసలు ఈ విషయం గుర్తించి, చింతిస్తున్నానా? లేదు. ఇట్లా అయితే ఇక ఒక కంచరగాడిదకు నాకు తేడా ఏమి ఉంటుంది?

నేను వాస్తవానికి అనాది అయిన, అనంతమైన స్వరూపముగల ఆత్మ చైతన్యమునేకదా! మధ్యలో ఈ అల్పమైన ‘జీవితము’ అనబడునది నా స్వకీయమైన "శరీరముతో ఏర్పరుకొనిన సంబంధము” చేతనే ప్రాప్తించుచున్నది. ఇదంతా అవివేకముయొక్క ప్రభావమే. ఒక చిత్రపటంలోని చంద్రుని చూచి అమాయకబాలుడు, “ఈ చంద్రుని చల్లటి అమృతతుల్యమైన కిరణాలు నన్ను ఆహ్లాద పరుస్తున్నాయి” అని చెప్పుకొంటుంటే ఏమనాలి? “ఈ దేహమే నేను” అని భావించుచు, అనాత్మభూతమగు ఈ దేహాదులను ఆత్మరూపంగా తలచుచు వ్యర్థంగా కాలము గడపివేస్తున్నాను. ఇంతకు మించి నా విషయమై విశేషమేమీ లేనట్లు భ్రమతో కూడిన ధైర్యము కలిగి ఉంటున్నాను. ఏమి మూర్ఖత్వం!

ఎంత కష్టకాలం! -

ప్రపంచరహితేనాహ మింద్రజాలేనజాలినా |

హాకష్టమతిముహ్యామి కేనాస్మిపరిమోహితః ॥ (శ్లో 9, సర్గ 9)

ఏ ఐంద్రజాలకుని ఇంద్రజాలముచే పరమమోహితుడనై నేను ఈ ’రాజ్యము, రాజసింహాసనం, బంధువులు, స్వజనులు మొదలైనవాటిచే మోహం పొందుచున్నాను? ఈ ఎదురుగా కళ్ళకు కనబడేవి సత్యమని, నిత్యమని నేను ఎందుకు భావన చేస్తున్నట్లు?

జగత్పదార్థముల భావన - ఈ దృశ్య జగత్తును ఎంతగా పరిశీలించి చూస్తే ఏమి లాభం? ఇందులో సత్యమైన, అపరిచ్ఛిన్నమైన వస్తువంటూ ఏదైనా ఉన్నదా? ఈ ప్రపంచమంతా వెతికి చూచినప్పటికీ అట్టి వస్తువు లేదు కదా! ఈ నా శరీరమే కొంతకాలానికి నేలకూలిపోబోవుచుండగా ఇక ఎదురుగా నిలచియున్న జగత్పదార్థముల విషయం వేరే చెప్పేదేమున్నది? అసత్యము, అనిత్యము అయినవాటిచే నాకు చిత్త విశ్రాంతి ఎట్లా లభిస్తుంది?

Page:333

అజ్ఞానదృష్టికి స్వల్పమైన విషయములు, పదార్థములు మహత్తరమైనవాటివలె అగుపిస్తున్నాయి. తత్ఫలితంగా సత్య వస్తువుయొక్క అనుభవం అత్యంత దూరంగానే ఉండిపోతుంది. నేను ఏ సత్యవస్తువుకై అన్వేషిస్తున్నానో, అది నా మనస్సుకు కూడా సాక్షి అయి, ఈ సర్వమునకు నియామకమై వెలుగుచున్నది.

ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చూడాలి? - - ఆ సత్యవస్తువు నాకు ఎంత సమీపంలో ఉన్నదో తరచి చూస్తే ‘ఆ సత్యమే నేను’ అని తెలియ వస్తోంది. అట్టి ’నిత్య శుద్ధ అఖండ-అప్రమేయ’ పరమాత్మ యొక్క దర్శనం ఎక్కడికి వెళ్ళితే లభిస్తుంది? అతడు నా హృదయమునందే హృదయమునకు సాక్షీభూతుడై ఉన్నాడు కదా! కనుక ఆతని కొరకు హృదయమునందే వెతకాలిగాని, ఎక్కడో బయట వెతికితే ఏం లాభం? నా దివ్య చైతన్య - స్వభావం నాయందే వెతికి దర్శించాలికాని, మరెక్కడెక్కడో కాదే!

హృదయములోనే ఉంటూ కూడా ఆతడు ఎందుకు లభించుట లేదు? బాహ్య పదార్ధముల పట్ల నిరంతరం ఏర్పడుచున్న ప్రియాప్రియములతో కూడిన భావనయే అందుకు అడ్డగుచున్నది కదా! …కనుక, సర్వ బాహ్యపదార్థములను త్యజించివేసెదనుగాక! అసలు అపేక్ష ఎందుకు ఉండాలి?

ఈ జీవులలో అనేకులు “మేము భోగములను పొందవలసియున్నది” అను లక్ష్యముతో అల్ప ఆశ్రయములగు ధనార్జన, పంచేద్రియములను సంబంధించిన రాగముతో కూడిన విషయములు - మొదలైన వాటియందు తీవ్రముగా ప్రవృత్తులగుచున్నారు. కాని ఏం లాభం? అవి లభించినా, అవన్నీ క్షణభంగురములే కదా!

నీటిలో ‘ఆవృత్తములు’ ఎంత కాలం నిలిచి ఉంటాయి? ఇవన్నీ కూడా అంతమాత్రమే! చిటికెలో మాయం అయ్యేవే! ఈ ధనాదులు సంపాదించే కాలంలో, కలిగియుండే కాలంలో కూడా జీవునకు అనేక దుఃఖములను కలుగజేస్తున్నాయి కదా! ఇట్టి తుచ్ఛము, నిస్సారము అయినట్టి పదార్థముల కొరకు ప్రయత్నించుచూ, వర్తమానపు శక్తి యుక్తులనన్నిటినీ నేను ఎందుకు నేలపాలు చేసుకోవాలి?

‘పరబ్రహ్మం’ అను శబ్దంచే చెప్పబడుచున్న ఆత్మవస్తువు సర్వదా తాను వెలుగుచూ సర్వమునూ వెలిగించుచూ ఉండియే ఉన్నది. అది ఈ నా శరీర ధారణకు ముందే ఉంది. ఇప్పుడు కూడా ఉంది ఈ శరీరం త్యజించబడవచ్చు, అయినప్పటికీ అది అట్లే ఉండి ఉంటోంది. దాని యందు ఏ సమయం లోనూ ఎట్టి మార్పుచేర్పులు ఉండవు. ఆ పరబ్రహ్మము నా కంటే వేరైనది కాదు. బ్రహ్మానంద స్వరూపం, ఏకైక సత్యం అదియే. అట్టి ఆత్మ వస్తువును ఎఱుగుట కొరకు, అట్టి ఎఱుక ’అనుభవం’గా పరిణమించుటకు ఈ వర్తమానపు శక్తియుక్తులను నేను ఎందుకు వినియోగించ రాదు? ఏ విషయసుఖాలైతే, ఉపేక్షించినంత మాత్రం చేత నిత్య సత్యమగు ’ఆత్మ’యే లభిస్తుందో, అట్టి ’ఆత్మ స్వభావం’ను వదలి…. గడ్డిపరకల వంటి విషయ సుఖాల కొరకు, ఈ రాజ్యం, అధికారం మొదలైన తుచ్ఛ వ్యవహారాల కొరకు నేను ఎందుకు అఱ్ఱులు చాచాలి? ఎవరి కొరకు అపేక్షించాలి? అవి ఉంటే ఉండనీ, లేదా తొలగనీ! అందులో ఏం విశేషం ఉన్నది? ఈ రాజ్యాదులు ఎదురుగా ఏర్పడి ఉన్నంత మాత్రం చేత అవి నావి అవుతాయా? అవన్నీ బాహ్యమైనవే కదా! నాది విదేహరాజ్యం.

Page:334

‘నాది’ అనతగినదిక్కడ ఏమి ఉన్నది - ప్రతిక్షణం, ప్రతిరోజు, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం వస్తోంది, పోతోంది. “అనేక సుఖాలు పొందవలెనను లక్ష్యంతో ఆయా ప్రయత్నాలన్నీ నిర్వర్తించటం” - అనునదంతా చివరకు దుఃఖరూపముగానే పరిణమిస్తోంది. అసలు ఈ ప్రపంచంలో వినాశనం కానిదంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు. అతి త్వరలో కాలగర్భంలో కలిసిపోయే ఏ వస్తువునైనా ‘ఉత్తమ వస్తువు’ అని అనటం ఎట్లా?

కాబట్టి ‘నేను కలిగియున్నాను’ అని ఏదేది నాచే భావించబడుచున్నదో - అట్టి రాజ్యములు, తదితర జనులతోటి సంబంధ బాంధవ్యములు, ఈ శరీరాదులు … ఇవన్నీ భ్రమ కారణంగానే అట్లు భావించబడుచున్నాయి.

అనంతమగు మహాకాల దృష్టిచే, లేక… తత్త్వదృష్టిచే చూచినప్పుడు ‘ఇంద్రుడు - బ్రహ్మ’ మొదలైన వారి పదములు కూడా అత్యంత స్వల్పమైనవిగాను, కాలముచే నశించిపోయేవి గాను, దుఃఖ ప్రయాసలతో కూడుకొన్నవి గాను తెలిసిపోవుచుండగా ఇక ఈ అత్యంత స్వల్పకాలికమగు ఈ మిథిలా రాజ్య సింహాసనం ఎంతటిది?

ఈ దృశ్య జగత్తును వివేచనాదృష్టితో పరిశీలిస్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది…. జీవులకు నిరంతర చిత్త విశ్రాంతి పొందింపజేయగల పదార్థమేదీ ఇక్కడ లేనేలేదు.

ఈ రోజు సుందర స్త్రీలు, మహారాణులు తమ జడలకు అలంకరించిన సుకుమార సుగంధ పుష్పాలు రేపటికి వాడి, శల్యమై ఒక మూలకు నెట్టివేయబడుచున్నాయి. నేడు ఈ శరీరం అనేక కిరీటాలను, భుజకీర్తులను ధరించి, అనేకులను శాసిస్తూ ఇటూ - అటూ తిరుగుచుండ వచ్చుగాక! ఇదే శరీరం కొద్ది రోజులకు మూల్గుతూ మట్టి యందు కూలబోవుచున్నదే….!

మరి మూర్ఖురాలగు నా చిత్తం ఇదంతా గమనించదేం? ఇది ఆయా తుచ్ఛ విభవము లందు, సంబంధము లందు, జాత్యహంకారము లందు ఎందుకు విశ్వాసం కలిగి ఉండి, రోజులు గడుపుచున్నదో నాకు అర్థం కాదు!

ఆకాశంలో పిల్లగాలులు ఆస్వాదిస్తున్న ఒక పక్షి ఆ ఆకాశాన్ని వదిలి “ఈ అడవిలో నేలపై బియ్యపు గింజలు ఎలా వచ్చిపడ్డాయి?" అనే ఆలోచనే చేయకుండా, నేల వ్రాలి వలలో చిక్కుకుని వేటగాని చేతులలో హింసించబడుచున్నది కదా! …ఆ పిట్ట వేటగాని బుట్టలోకి త్రోసివేయబడు చున్నట్లు, నా ఈ చిత్తము తుచ్ఛము, నశ్వరము, ప్రమాదకరము” అగు విషయ సుఖముల వైపుకే ఆకర్షించబడుతోంది!

ఆశాపాశములు -

అరజ్జురేవబద్ధోలి_హ మపంకో2_స్మికలంకితః | పతితోస్యుపరిస్థోపి హా మమాత్మఙ్ఞతాస్థితిః॥ (శ్లో 16, సర్గ 9)

హాఁ ! హతవిధీ! ఇక్కడ త్రాడువంటిదేమి ఎదురుగా లేకున్నప్పటికీ నేను మాత్రం ఇక్కడి విషయములకు కట్టివేయబడి ఉన్నానే? ఆశాపాశములు వివేచనా శక్తిని కట్టివేసి ఉంచుతున్నాయి.

Page:335

బురద లేకుండానే నేను కళంకితుడనగుచున్నాను. జన్మ జన్మలుగా ఆర్జించిన దుర్వాసనలు, కుసంస్కారములు నన్ను దోషపూరితునిగా చేస్తున్నాయి.

“నీవు ఆత్మవే సుమా”- అని పెద్దలు పలుకుచున్నారు. ఆ వాక్యం విని కూడా ఏం లాభం? సర్వమునకు ఆవల ఉన్నట్టి నేను ఇప్పుడు ఇక్కడ జడత్వముచే కూలబడి ఉన్నాను. నా ఆత్మ యొక్క వాస్తవతత్త్వాన్ని ఇక్కడ “అజ్ఞానం, దురాశలు, రాగద్వేషములు, జాతి మొదలైన అహంకారాలు" - కప్పివేస్తున్నాయి. కారుమేఘం సూర్య ప్రకాశాన్ని అచ్ఛాదించునట్లు, నేను స్వతఃగా మహాధీమంతుడును, శుద్ధుడను, అఖండుడను అయినప్పటికీ మోహం వచ్చిపడి నన్నెందుకో ఆవరించి వేస్తోంది.

ఏది నేను? ఏది నాది? -

క ఇ మే మహాభోగాః? క ఇమే మమబాంధవాః?

బాలో భూతమయేనేవ సంకేతేన అహమాకులః ॥

ఈ మహాభోగము లేమి? ఈ నా బంధువులంతా ఎవరు? ఆహా! ఒక బాలుని లాగా వ్యర్థంగా “నేను, నాది” అను కల్పనచే నిష్కారణంగా వ్యాకులపడుచున్నానే? ఈ ‘భోగం’, ‘దృశ్యం’ లందు నేను ఎందుకు స్వయంగా విశ్వాసం కల్పించుకొనుచున్నాను? నా యొక్క తుచ్ఛ విశ్వాసమే నాకు జరా-మరణాల కల్పనను ఆపాదింపజేయుచు, అత్యంత భయదాయకం అగుచున్నదే? ఈ ధన, బాంధవాదులు ఉంటే ఉండనీ, …లేదా పోతే పోనీ! వీటితో నాకేమిపని? నీటిలో ఏర్పడే ‘బుడగలు’ లాగా ఇవన్నీ మిథ్యా రూపంగానే సంప్రాప్తిస్తున్నాయి. వీటితో సంబంధాలు దర్పణంలోని ప్రతిబింబాల వంటివే కదా!

మనం అనేకమంది చక్రవర్తుల గురించి విన్నాం. వారు మహా భోగములు అనుభవించారు. ఉత్తమగుణ సంపన్నులగు బంధువులను కలిగియున్నారు. …. అవన్నీ ఏమైనాయి? కేవలం నామ మాత్రంగానే మిగిలాయే? ఇప్పటి నాకు సంబంధించిన వస్తువిశేషములన్నీ భవిష్యత్లో అంతే కాబోతున్నాయి. మరి ఈ వర్తమానము నందు నేనెందుకు విశ్వాసం వహించి ఉండాలి? గొప్ప రాజుల విభవాలకు ఏం గతి పట్టింది. అంతే కాదు… ఇతఃపూర్వపు బ్రహ్మదేవునిచే రచించబడిన అనేక బ్రహ్మాండాలన్నీ ఇప్పుడేమైయ్యాయి? మటుమాయమై పోయాయే! అనేక మంది బ్రహ్మలే గతించారు. ఈ బ్రహ్మాండం యొక్క గతి కూడా అంతే కాబోవుచున్నది. ఇక నాకు ‘నాది’ అనబడు భావం గాని, అపేక్ష కాని ఎందుకు ఉండాలి?

జలం బుద్భుదములను తన యందే లయం చేసుకుంటూ ఉంటుంది. ‘కాలుడు’ అనబడువాడు లక్షల కొలది ఇంద్రులనే మ్రింగివేశాడు. మరి స్వల్ప విశేషముల యందు విశ్వాసము కలిగి ఉండే నా వంటి మూర్ఖులను చూచి విజ్ఞులు నవ్వుకొనుటలో తప్పేమున్నది?

అనంతకోటి బ్రహ్మదేవులు గతించారు. అనేక సృష్టిపరంపరలు గడిచిపోయాయి. ఎందరో రాజులు కోట్ల సంఖ్యలలో ధూళికణములవలె వినష్టమైపోయారు. ఇక నేనెంత? ఈ రాజ్యమెంత? ఈ నా బంధుజనమెంత? ఈ స్వల్ప ఇంద్రియ సుఖములు ఎంతటివి? ఈనా స్వల్ప జీవితమునందు

Page:336

ఏవేవో పొందాలని ఆశలు కలిగి వుండడం ఎంతటి మూర్ఖత్వం! ఎంతటి నీచమైన స్థితి! ఎంతటి అల్పాశ్రయం!

దేహాత్మ బుద్ధి - - ఈ ప్రపంచమంతా ‘సంసారము’ అనే రాత్రి యందు పొందబడుచున్న ఒకానొక దుష్టస్వప్నం వంటిది మాత్రమే. ‘ఈ నా దేహం, తదితర దేహంలు, పదార్థజాలం’ మొదలైన వాటి యందు ఇంతకాలంగా ఎంతో నమ్మికతో వ్యవహరిస్తున్న నాకు ధిక్కారమగు గాక! పుత్రులు, పేరు ప్రతిష్ఠలు మొదలైన కల్పనలన్నీ కూడా వ్యర్థములు, అసత్య స్వరూపాలు కూడా! ఈ ‘అహంకారం’ అనే పేరు గల పిశాచంతో కూడి ఉండాలని నాకు చెప్పినదెవరు? ఇట్లా అజ్ఞాని వలె నేను ఎందుకు ఉంటున్నాను? ఒకవైపు క్షణములు, నిమిషాలు, రోజులు, సంవత్సరాల రూపమున ఉన్న సూక్ష్మ కాలం చేత ఆయువు క్షణక్షణం విచ్చిన్నమైపోతోందే. మరొకవైపు ఏవేవో ఆశలు, ఆర్తులు, అసంతృప్తులు ఇంతకింతకు ప్రవృద్ధమగుచూ ఎదురుగా ఉన్న సమయమంతా ఆక్రమించి వేస్తున్నాయే!.

ఇదంతా చూస్తూ కూడా నేను ఎందుచేత విచారణ చేయుటలేదు?

ఓ ఆశా సమూహములారా! మీరంతా నా ముందు ఎందుకు విజృంభిస్తున్నారో చెప్పండి? కాలం యొక్క గతి ఎట్లున్నదో గమనిస్తున్నారా? ఏమి కాలమహిమ! బ్రహ్మ మొదలైన దిక్పాలకులే వారి వారి ఆసనములలో ప్రతిమలుగా కాలం చేత శాసించబడి ఆటాడింపబడుచున్నారే? మరి ఏమి ఆశించి ఏం లాభం? కాలం యొక్క క్రీడా వ్యసనము కారణముగా క్షీరసాగరంలో ప్రశాంతంగా నిదురించే విష్ణుదేవుడంతటి వాడు కూడా ఆకాశాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొనవలసివస్తోంది.

ఈ కాలము మహా రుద్రులను ఎందరినో భక్షించివేసింది. ఓ నా ఆశలారా! అట్టి కాలము నందు మీరు, నేను ఒక లెక్కా? మరి ఇదంతా గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెత్తనం చెలాయిస్తున్నారేం?

అనురక్తి, విరక్తి - తెల్లవారుతోంది, ప్రొద్దుగ్రుంకుతోంది. … రోజులు గడిచిపోతున్నాయి. కాని, దోషరహితం, ఆనంద స్వరూపం అయిన వస్తువు లభించిన రోజు ఒక్కటైనా ఉన్నదా? లేదు. చెరువు ఒడ్డున కాకులు, కొంగలు వచ్చి వ్రాలునట్లు ఈ ప్రాణుల యొక్క చిత్తము లందు భోగముల పట్ల ‘ఆశ’ స్ఫురిస్తోంది. వారు ఆ ఆశల వెంటనే పరుగులు తీస్తున్నారు. అంతేకాని ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించుట లేదు… పొందుట లేదు. మరి ప్రయోజనమేమిటి? అనేక కష్ట సుఖములు వస్తున్నాయి…. పోతున్నాయి.

కష్టాత్కష్టతరంప్రాప్తో దుఃఖాద్దుఃఖతరంగతః |

అద్యాపినవిరక్తోస్మి హాధిఙ్మామధమాశయమ్ ॥ (శ్లో 31, సర్గ 9)

అల్పమైన కష్టం నుండి అధికమైన కష్టం, చిన్న దుఃఖం నుండి పెద్ద దుఃఖం, ఇట్లా దుర్భర అనుభవాలన్నీ వచ్చి పడుతున్నప్పటికీ నాకు ఈ సంసారం పట్ల విరక్తి ఏర్పడటం లేదు. నేను ఎంతటి అధమ చిత్తుడను! ఏ రమణీయ పదార్థాలపై నేను దృఢమైన ప్రతిష్ఠ కలిగి ఉన్నానో అవన్నీ నశించిపోయేవే కదా! ఈ ప్రపంచంలో ’చిరస్థాయి’గా వుండే వస్తువు ఏదైనా ఒక్కటన్నా ఉన్నదా?

Page:337

ఈ సంఘటన-దుర్ఘటనలు, ఈ సంబంధ బాంధవ్యములు, ఈ సుఖదుఃఖములు, ఈ ప్రియ, అప్రియములు, ఈ శరీరపు ఆకర్షణ-వికర్షణలు … ఇవన్నీ కూడా కొంతకాలం క్రితం లేవు. మరి కొంతకాలం తరువాత ఉండవు. మధ్యలో ఉన్నట్లు తోచుచున్నాయి. ఇవి సత్యము ఎలా అవుతాయి?

ఈ ‘వయస్సు’ అనబడేది మధ్య కాలంలో మాత్రమే రమణీయంగా ఉంటోంది. ఈ ‘యాగం’ మొదలైనవి తదనంతరంగా కొద్దికాలం మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. ఇంద్రియ అనుభవములు విచారణ చేయకపోవుటచేతనే ప్రియంగా ఉంటున్నాయి. ఏది ఏమైతేనేం? ఏవేవి రమణీయముగా ఉంటున్నాయో, అవన్నీ కూడా ‘వినాశనము’ అను ఒక అగమ్య ప్రదేశము వైపుకు ఎక్కుపెట్టబడి ఉన్నాయి. మరివన్నీ అపవిత్రము కాక ఇంకేమిటి?

మనుజుడు ఏయే పదార్థములయందు తనయొక్క విశ్వాసమును బంధించుకొని ఉంటున్నాడో, ఆయా పదార్థములన్నీ తరచూ దుఃఖమునే కలిగించడం మనం చూస్తూనేవున్నాం.

జీవులు ఎందరో ఈ ప్రపంచంలోకి వస్తున్నారు. ఇక్కడకు వచ్చి ఇక్కడ జడస్వభావమును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ నాది, నీది అను లోభమును కలిగియుంటున్నారు. అట్టి లోభ స్వభావము యొక్క ఫలితమేమిటి? అధికమైన పాపపు క్రియలతో కూడినది, అధికమైన క్రూరత్వముతో కూడినది, అధికమైన దుఃఖములను జనింపజేసేది అయినట్టి భవిష్యత్ స్థితిని పొందటమే కదా!

మానవ జన్మ ప్రాప్తించింది ఇందుకా? అయ్యో! బాల్యమంతా అజ్ఞానముతో గడిచిపోతోంది. యౌవనమందామా… మన్మధుడు అను వానిచే పచ్చిగా మోసగించబడుతోంది. వార్ధక్యం కుటుంబ చింతలు, ఒడలుచున్న భౌతికదేహములచే బాధింపబడుచున్నది.

ఇక ఈ జీవులు తమను తాము ఎప్పటికి ఎట్లు ఉద్ధరించుకోగలరో? చర్విత చరణంగా జన్మలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ జీవుడు తన యొక్క శాశ్వతత్వమును మాత్రం గమనించ లేకపోతున్నాడు.

నిస్సార సంసారం -

ఆగమాపాయివిరసం దశావైషమ్యదూషితమ్ ।

అసారసారంసంసారం కింతత్పశ్యతిదుర్మతి ॥ (శ్లో 37, సర్గ 9)

ఈ సంసారం అపారమైనది. నిస్సారమైనది. అయినప్పటికీ ఎంతో సారవంతమైనదిగా ఎంచ బడుతోంది. ఇది ఆద్యంతములలో అసద్రూపమైనది(Unreal from the beginning to the end). భోగకాలములో విరసమైనదై ప్రాప్తిస్తోంది (Distasteful at the time of experiencing). దారిద్య్రము, రోగము, వార్ధక్యము, భయము, ఉద్వేగము - మొదలైన వాటిచే పరమదూషితమైనది. అట్టి ఈ నిస్సార సంసారమును దుర్బుద్ధి చేతనే నేను ఆశ్రయిస్తున్నాను. అపరిపక్వమైన అవగాహన చేతనే ఇందు ఏదో పొందవలెనని దేవులాడుచున్నాను.

ఒకడు రాజసూయము, అశ్వమేధము మొదలైన అనేక యాగములను ఎంతో ప్రయాసతో నిర్వర్తించి, చివరకు బ్రహ్మ దేవత్వం పొందుతాడు. కాని మహాకాలము యొక్క సమక్షములో ఆ ఆ

Page:338

బ్రహ్మదేవత్వము కూడా క్షణికమే కదా! ఎక్కడ ఏ గొప్ప విశేషమున్నది? ఆపదలచే పీడించబడని ప్రదేశమంటూ ఈ ముల్లోకములలో ఎక్కడ ఉన్నది? "అనేక సుఖములకు ఆలవాలము, అనేక పుణ్య కార్యముల యొక్క అంతిమ ప్రయోజనము” అని చెప్పబడే స్వర్గలోకమే అసురులు చేసే దండయాత్రలచే బాధింపబడుచున్నదే! ఇక భూ, పాతాళాల గురించి వేరే చెప్పేదేముంది?

బాహ్యమే ఈ విధంగా ఉన్నది. ఇక అంతఃకరణం అగు ‘చిత్తం’ గురించి ఏం చెప్పాలి? ఈ చిత్తము నిండా అనేక శారీరక మానసిక వ్యాధులు, వ్యధలు నిక్షిప్తమై ఉన్నాయి. చెదలు కొయ్యను బాధిస్తున్నట్లు ఎన్నో దురవగాహనలు చిత్తములో తాండవం చేస్తున్నాయి. ఇవన్నీ విచారించబడేది ఎట్లా? ఎప్పటికి?

ఏదో ఆర్తి…! - ఈ ఎదురుగా ఉన్న వర్తమాన జగత్తు విషయానికి వస్తే దీనినెత్తిపై ‘నాశనము’ అనునది అవశ్యం నెలకొనియున్నది. రమణీయమని అనుకొనబడే వస్తువులన్నిటిలో అరమణీయతే దాగి ఉంటోంది కదా! “ఇవి సుఖప్రదములు” అని అనుకొనబడేవాటియందు అనేక దుఃఖపరంపరలు వ్యవస్థితములై ఉంటున్నాయి.

మరి నేను దేనిని చూచి ‘ఇది నిర్దుఃఖము’ అని నిర్ణయించి ఆశ్రయించాలో అర్థమవటం లేదు. ఈ జగత్తు, ఇందలి పదార్థాలు చివరికొచ్చే సరికి దుఃఖములే ప్రయోజనంగా కలిగి ఉండగా, మరి నా మనస్సునందు “ఇది పొందాలి….. అది పొందాలి” అనే ఆరాటం ఎందుకు?

ఎప్పటికప్పుడు దేనికి దానికే క్షణికం -

జాయన్తోచమ్రియనేచ ప్రాకృతాఃక్షుద్రజంతవః | ధరాతైరేవనీరధ్రా దుర్లభాఃసాధుసాధవః | (శ్లో 42, సర్గ )

ప్రాకృతస్వభావులగు క్షుద్రజీవులు అనేకులు జన్మిస్తున్నారు. చచ్చుచున్నారు. ఇట్టి అనేక జీవులచే ఈ జగత్తు పరిపూర్ణమైయున్నది. కాని, ఉత్తములగు మహాత్ములు అతి దుర్లభంగా ఎక్కడోగాని తారసపడుట లేదు. ఈ విలాసినుల అందమైన కళ్ళు వీరి ప్రేమాధిక్యత మొదలైనవన్నీ క్షణభంగురమే కాబట్టి, వీరిని ఆశ్రయించినవారు నవ్వులపాలు అగుచున్నారు. ఎవరికైతే ‘కన్ను తెరిస్తే సృష్టి - కన్ను మూస్తే ప్రళయము’ అయి ఉన్నదో, అట్టి జగత్పాలకులే కాలముచే మ్రింగబడుచున్నారు.

ఇక ఈ వర్తమానం, ఇందు ఏర్పడియున్న స్థితిగతులు క్షణికంగాక మరింకేమిటి? సంపదలకంటే ఆపదలే నయమే! ఈ ప్రపంచంలో ‘దీర్ఘకాలంగా ఉండేవి, రమణీయము లైనవి’ అయిన కొన్ని పదార్థములు ఉన్నాయనే అందాం!…కాని, వాటన్నిటి యొక్క పర్యవసాన మేమిటి? వాటిని ఆర్జించటం, రక్షించుకోవటం, వినియోగించటం - ఇవన్నీ శ్రమతో కూడుకున్నవే కదా! ఓ నా చిత్తమా! అట్టివాటిని ఆశించటంలో ఏం ప్రయోజనం పొందగోరుచున్నావు చెప్పు? ఈ విచిత్రమైన సంపదలన్నీ ‘నశించుట’ అను స్వభావం తప్పక కలిగియే ఉన్నాయి. కనుక అవి నా దృష్టిలో గొప్ప ఆపదలే అగుచున్నాయి. ఏది ప్రియమో, అది కోల్పోవుచున్నప్పుడు బాధగానే ఉంటుంది కదా! ‘కోల్పోవుట’ అనేది ఏనాటికైనా తప్పేది కాదు మరి!

Page:339

అందుచేత, ఓ సంపదలారా! మీకన్నా ఆపదలే నయం. ఎందుకంటారా? “దారిద్ర్యము, బంధు వినాశనము" మొదలైన ఆపదలు “సాధువులను దర్శించుట, తీర్థ యాత్రలను సేవించుట, వ్రతాలు, పూజలు ఆచరించుట” మొదలైన వాటియందు నన్ను నియోగిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు వివేక, వైరాగ్యాల వైపుగా నన్ను నడిపిస్తున్నాయి. అందుచేత, నేను సంపదల కంటే ఆపదలే ఉత్తమ మైనవిగా అభిప్రాయబడుచున్నాను.

వ్యర్థ కల్పనలు - సముద్రజలంలో ప్రతిబింబించే చంద్రుడు నిజచంద్రుడు కాకపోయినప్పటికీ ఉపరితలపు నీటియొక్క కదలిక “చంద్రుని కదలిక” అని అనిపిస్తూ భ్రమింపజేస్తుంది కదా! ఈ ‘జగత్తు’ అనునది మనస్సు యొక్క వివర్తము మాత్రమే. పైగా, ఇది క్షణభంగురం. అట్టి ఈ జగత్తు లోనికి ‘నేను’ ‘నాది’ అనబడునవి ఎక్కడినుండో వచ్చిపడుచున్నాయి. అట్టి వ్యవహారసరళి అంతా నిరర్థకమే అయి ఉన్నది. ‘భోగములు పొందవలెను’ - అను ఆశతో కూడిన ఈ మనస్సు కాకతాళీయ న్యాయముచే జగత్ స్థితిని పొందుచున్నది. ముందుగా మనస్సు, ఫలితంగా ఈ జగత్తు. “ఇది కావాలి, ఇది తొలగాలి" - - అను కల్పనలను వ్యర్థంగా చేస్తోంది. ఫలితంగా, ఈ ‘జగత్తు’ అనబడేదంతా నా చుట్టూ అలుముకోనారంభిస్తోంది.

ఈ సాంసారిక దశలన్నీ దేశ కాల వస్తువులచే పరిమితము, సంకుచితము, నిరోధము పొంది ఉంటున్నాయి. ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపములచే సంతప్తమై ఉంటున్నాయి. అగ్ని శిఖ వంటి ఈ సాంసారిక దశలందు ఒక దోమవలె నేను ఎందుకు అనురక్తుడనై ఉంటున్నానో…. ఎంత తరచినా కూడా అర్థమగుటలేదు.

ఇక్కడ ఆవేశపూరితమైన అనురక్తి కలిగిఉండటం ఎంతటి ప్రమాదం. ఇంతకన్నా అగ్ని యందు భస్మం అవటం మేలు. లేక, రౌరవాది నరకములలో దొర్లటం మంచిది. అంతే గాని, సుఖదుఃఖ రూపములగు ఈ సాంసారిక దశలను ఏవేవో కల్పనలు చేసుకుంటూ ప్రవర్తించటం మాత్రం ఉచితం కాదు. ఈ సంసారమే సర్వ దుఃఖములకు మూలస్థానం. దీని యందు పడిన జీవులకు ఇక సుఖమెక్కడిది? అల్పమైన దుఃఖమును అధికమైన దుఃఖ సంఘటనతో పోల్చుకొనుచూ, ‘ఇది సుఖరూపము’ అను భావన మాత్రమే ఇక్కడ సుఖముగా చెప్పబడుచున్నది. “ముందు ముందు దుఃఖముగా పరిణమించగలదు" అని తెలిసి కూడా ఈ జీవుడు కొన్నిటిని సుఖప్రదములుగా గాంచుచున్నాడు. ఇంకేమని చెప్పాలి?

మనస్సును రహితం చేసేది ఎట్లా - ఆహా! నేను కూడా అధముడనై, కట్టె, రాయి వలె మూగ వాడినై, అజ్ఞానినై ఇంతకాలం విచారణాహీనుడుగానే ఉండిపోయానే? ఈ విశాల సంసార వృక్షానికి మూలం మనస్సే కదా! ‘సంసారము’ అనబడే వ్యవహారం అసంఖ్యాకములగు సంకల్పములతో బ్రహ్మాండములతో, విరాట్ పురుషులతో, సుఖదుఃఖ ఫలములతో, రాగ, లోభాలతో కూడియున్నది. ఇంతటి వ్యవహారములు రుచిచూస్తూవున్న చిత్రకారుడు ఎవరు? మనస్సే కదా!

Page:340

ఈ మనస్సు యొక్క రూపమేమిటి? - - మననముచేయు స్వభావమే మనస్సు. మననమే సంకల్పము కూడా! అట్టి సంకల్పము ఉపశమించిందా…. సంసారమే ఉపశమించగలదు. ‘సంకల్పించ కుండుట’ అనునది అభ్యసించామా … అప్పుడు ఈ సంసార వృక్షము నీరు లేని చెట్టు లాగే శోషించిపోతోంది.

‘అవిచారణ’ అను అశ్రద్ధచే ఏర్పడిన “ఆశించుట, ప్రియముగా భావించుట, లాభము, అసూయ, ఇంద్రియ విషయ లోలత్వము" మొదలైనవి ఈ సంసార వృక్షమును మరల చిగురింప చేస్తున్నాయి. “వివేకముతో కూడిన అవగాహన, అమనస్కముతో కూడిన అభ్యాసము” ఈ ఇద్దరూ అంగరక్షకులై, ఈ జీవుని ‘సంసారము’ అను ప్రమాదము నుండి కాపాడగలరు.

ఈ సంసార వృత్తులు పైకి మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. ‘మనస్సు’ అనే వానరం యొక్క ఉనికిచేతనే చపలత్వము పొందుచున్నాయి. ఇందలి పదార్థజాలమంతా నాశవంతమైనదే.

ఇట్టి సంసారవృత్తులలో నేనెందుకు పడి కొట్టుకోవాలి? అనేక ఆశాపాశములతో కూడి, ఉచ్ఛ, నీచ స్థితులతో కూడినదై మహా దుఃఖప్రదములైన ఈ సంసార వృత్తులలో నేను ఎంతకాలంగా, ఎంతగా రమించానో! …అదంతా గతం మాత్రమే. “హా! చచ్చాను! చంపుతున్నాయి! ఇక గతేమిటి! నేను పాపిని! దుఃఖితుడను! బలహీనుడను!” అనుకొనే రోజులు గతించిపోయాయి.

గతం గతః! ఇప్పుడు నేను ‘పరితాపము’ అను స్వభావమును తొలగించుకొంటున్నాను. ఇక విశ్రాంతి పొందెదను గాక! ఇప్పుడిక ఎటువంటి సాంసారిక వస్తువుల గురించిగాని, వ్యక్తుల గురించి గాని, సంబంధముల గురించి గాని, సంఘటనల గురించిగాని నేను దుఃఖించవలసిన పనియే లేదు.

నేను ఎందుకు దేని గురించి వేసట చెందాలి? చాలు… నేను ఇప్పుడు ప్రబుద్ధుడనైనాను, ప్రసన్నుడనైనాను. నా ‘పారమార్థిక ధనము’ను దొంగిలించుచున్న దొంగను కనిపెట్టాను. ఆ దొంగ ఎవ్వరో కాదు… నా మనస్సే! అతను దొంగయే కాదు, ప్రమాదకరమైన శత్రువు కూడా. అతనిచేత నేను చాలా కాలంగా మోసగించబడుచున్నాను. పీడించబడుచున్నాను.

సరే… ఇక నేనే ఆ మనస్సును పీడించటం ప్రారంభిస్తాను. ఇంతకాలం ఈ మనస్సును పరిశీలించ లేదు, సరియైన చికిత్సను ఆశ్రయించ లేదు. ఇప్పుడు “ఉత్తమ కార్యాచరణము, శాస్త్రోక్తమైన అభ్యాసము, గురువులు చూపు లక్ష్యమువైపు దృష్టి సారించటం” మొదలగు శుభ ప్రయత్నములు ఈ మనస్సును ఉద్ధరించవలసిందే!

ఈ మనస్సు వివేక ప్రభావముచే ‘అనాది’ యగు ’బ్రహ్మతత్వము’నందు ప్రతిష్ఠింపబడుగాక! అట్టి బ్రహ్మజ్ఞానానుభవమునందు ఇది ప్రశమనము పొందుగాక.

వివేకోదయం - ఆ సిద్ధుల వాక్యములు వినుచుండగా నాయందు ’అజ్ఞానము’ను పరిశీలించ గల సత్యదృష్టి బలపడుచున్నది. వారి ఉపదేశములు నన్ను మహా బలవంతునిగా తీర్చిదిద్దుచున్నాయి.

Page:341

ఇక నేను “నిరతి శయానందమునకు సాధనము” అని చెప్పబడుచున్న ’పరబ్రహ్మము’ను శరణు వేడుటకు ఉపక్రమిస్తున్నాను.

ఇప్పటి నుండి ఆత్మస్థితుడనై వుంటాను. తదితర వ్యసనములన్నీ త్యజించి వేస్తాను. ఏకాంతముగా, సుఖముగా ఉంటాను. “ఈ దేహమే నేను, ఈ రాజ్యాదులు నావి” మొదలైన అసత్య స్ఫురణలను పారద్రోలివేస్తాను. ఇక్కడి సుఖము నాది కాదు. దుఃఖము నాదికాదు. ఈ రెండింటినీ చూపిస్తూ భ్రమింపజేసే మనస్సు కూడా నాదికాదు. ఈ విధంగా ఈ ’మనస్సు’ అనే శత్రువును వధించి వివేకము ద్వారా సప్తమ భూమికారూపమైనట్టి ’పరమ శాంత స్థితి’ని పొందుతాను.

అట్టి త్రోవను చూపించగల ఓ వివేకమా! నీకు నమస్కారం! రమ్ము. మనం ఈ జన్మకర్మల మనోజాడ్యమును తొలగించివేద్దాం. నీవు నాకు సేనానాయకుడివై తోడుగా ఉంటేనే నేనీ సంసార జాడ్యముపై యుద్ధం ప్రకటించి, జయించగలుగుతాను.

  1. సునిశ్చయం

ఆ విధంగా జనక మహారాజు కోటలో ఒక ఏకాంత ప్రదేశంలో చింతన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆంతరంగికుడైన ఒక ద్వారపాలకుడు రాజును సమీపించి ఇలా విన్నవించసాగాడుఆంతరంగికుడు : హే మహారాజా! తమకు సదా సర్వదా దిగ్విజయమగు గాక! ఇప్పటికే కాలాతీత మైనది. అదిగో బ్రాహ్మీముహూర్తం ప్రారంభం కానున్నది. నేటి ఉదయానికి మీ కొరకై ఎన్నో ముఖ్య రాచకార్యములు వేచి ఉన్నాయి. లేచి, మంగళస్నానం కొరకు సిద్ధంకండి. వేదపారాయణులగు బ్రాహ్మణులు కొద్దిసేపటి క్రితమే వచ్చి ’అఘమర్షణం’ జపిస్తున్నారు. వారంతా తమ వేదోచ్ఛరణలతోను, వేదార్థ ప్రసంగములతోను మిమ్ములను మెప్పించి, మీ వద్ద దక్షిణతాంబూలములు స్వీకరించ వేడుక కలిగియున్నారు. మీ సంధ్యావందనాది కార్యక్రమముల కొరకు అంతా సిద్ధం చేయబడి ఉంది. మీ వంటి మహనీయులు తమ కార్యక్రమముల విషయంలో నియమమును అతిక్రమించి వర్తించరు కదా! నా ఈ అధికప్రసంగమునకు క్షమార్హుడను. తమ ఆజ్ఞావాక్యములకై వేచియున్నాను.

ద్వారపాలకుడు చెప్పుచున్న విషయములను గంభీరంగా వింటూనే, ప్రశాంత, మౌన చిత్తుడగు ఆ మహారాజు విచిత్ర జగతితి గురించి ఇట్లు పర్యాలోచించసాగాడు……! జనకమహారాజు (తన అంతరంగమున) : “ఈ రాజ్యమేమిటి? ఈ సుఖమేమిటి? క్షణభంగురమైన రాజ్యసుఖములతో నాకిప్పుడు కొంచెమైనా ప్రయోజనం లేదుకదా! ‘మృగతృష్ణ’ అంటే ఏమిటో తెలిసిన తరువాత అట్టి మృగతృష్ణలో నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి మూర్ఖుడు మాత్రమే పరుగులు తీస్తాడు. కనుక నేను ‘మిథ్య’ యగు ఈ సంసారమంతా పరిత్యజించివేస్తాను. ’శాంత సముద్రం’లాగా ఏకాంతమును ఆశ్రయించి ఉంటాను. అసద్రూపములైన ఈ భోగములతో నా కేమిటి పని?

Page:342

సర్వ కర్మలను త్యజించి కేవలం బ్రహ్మమును శరణువేడి సుఖశాంతి సమన్వితుడనౌతాను. ఓ చిత్తమా! కొంచెం నా మాట విను. ఈ “జన్మ, జరా, మరణ, జడత్వ” రూపమగు సాంసారిక అల్ప అనుభవము అనే బంధం మనం తొలగించుకోవాలి సుమా! మనకు సంబంధించినది అసంబంధితమైన దాని నుండి వేరు చేసి అవగాహనతో దర్శించాలి. ఉపశమనం కొరకు ప్రయత్నిద్దాం. విషయ సుఖ లేశములను ఆస్వాదించుటలో అత్యంత చాతుర్యంగల నీ అభ్యాసమును త్యజించు. భ్రాంతి చేత మాత్రమే నీవు ఈ ప్రాపంచిక స్థితులందు సుఖమును అవలోకిస్తున్నావు. కాని, అవన్నీ అత్యంత స్వల్ప సుఖములు మాత్రమే. వాటి వలన ఏర్పడే దుఃఖము మాత్రం అపారం.

ఓ ప్రియాచిత్తమా! శక్తియుక్తులు ఉన్న కాలమంతా భోగాశక్తియందు నిమగ్నమగుచున్నావు. భోగించు శక్తి క్షీణించినప్పుడు అశక్తురాలవై అల్పత్వమును అనుభవించుచున్నావు. నిజం చెప్పు… ఇంతవరకూ నీకు నిజమైన తృప్తి అంటూ ఎప్పుడైనా లభించిందా? ప్రయోజనము లేని శ్రమ ఎందుకో చెప్పు?

బ్రహ్మమును విచారించుటచేతమాత్రమే అకృత్రిమమగు తృప్తి లభిస్తోంది. అందుచేత నీవు సద్వస్తువు వైపు మరలుటయే ఉచితం.”

ఆ మహారాజు ఇట్లు విచారణ చేస్తూ ఉండగా ఆతని చపలచిత్తము శమించింది. ఆయన ఒక చిత్రములోని పురుషుని వలె మౌనస్థుడయ్యారు. ఆంతరంగిక ద్వారపాలకుడు రాజు యొక్క స్వభావౌన్నత్యమేమిటో కొంతవరకు ఎరిగినవాడే. అందుచేత భయ, గౌరవాదులతో ఏమీ మాట్లాడ కుండా, నిలుచునియున్నాడు. ఆ తరువాత జనకమహారాజు ఒక్క క్షణంలో సర్వమును తూష్ఠీభావంతో త్యజించినవాడయ్యారు. శాంతచిత్తుడై ప్రాణికోట్ల జీవన విధానమును తలచుకొంటూ ఇట్లు మరల చింతనచేయసాగాడు.

నేను ఆత్మను కాని దెప్పుడు? - ఈ ప్రపంచంలో గ్రహించదగ్గ వస్తువేది? దేనిని నేను ప్రయత్నించి సాధించాలి? ఇక్కడ ‘నాశరహితము, ఉత్తమము, ఆనందకరము, దోషరహితము’ అయిన ఏదైనా పదార్థము ఉంటేకదా, అందుకు విశ్వాసముతో ప్రయత్నించగలిగేది? అట్టి పదార్థము లేనప్పుడు నేను ఈ ఎదురుగా కనబడే వస్తువులచే ఎందుకు బంధించబడాలి? ఆకర్షించబడాలి? వికర్షించ

బడాలి?

ఆయా క్రియాదులందు తత్పరుడనై ఉండుటచేతగాని, లేక నిష్క్రియత్వముచే గాని నాకు ఏం ప్రయోజనం? ఎందుకంటే ఉత్పన్నమైన ప్రతి వస్తువు నశించిపోవుచున్నది. ఈ శరీరమే తీసుకుందాం. ఇది అసద్రూపంగానే ఆవిర్భవించింది. ఇక ఇది ఉండుట చేత గాని, లేక, లేకుండకపోవుట చేత గాని నేను పొందే మార్పు - చేర్పులు ఏమి ఉంటాయి?

నేను క్రియలందు ఆసక్తుడనై ఉండవచ్చు, లేదా క్రియారహితుడనై ఉండవచ్చు. అట్టి ఉభయ అవస్థలలోకూడా సమరూపముగా స్థితి పొందియున్నట్టి పరిశుద్ధ చైతన్య స్వరూపుడనే నేను. ఈ వర్తమాన క్షణంలో కనబడుచున్న శరీరము వంటి అనేక శరీరములు రావచ్చుగాక! పోవచ్చుగాక!

Page:343

అవేవీ కూడా నేను కాదు. నాకు సంబంధించినవి కూడా కాదు. నేను వాటికి సంబంధించినవాడను కూడా కాదు. వాటికి అతీతమై, కాని, వాటి ఉనికికి కారణమగుచున్న శాశ్వతతత్వము, అనిర్దేశము, అప్రమేయమునై ఉన్నాను. ఎందుకంటే చైతన్యం చైతన్యంగానే ఉంటుందికాని అది ‘జడం’ అవుతుందా? లేదు. ’శుద్ధ చైతన్యమే’ అయి ఉన్న నాకు ఈ శరీరాదులచే కలిగే హాని ఏమి? వృద్ధి ఏమి? నాభివాంఛామ్యసంప్రాప్తం సంప్రాప్తంనత్యజామ్యహమ్ | స్వస్థఆత్మనితిష్ఠామి యన్మమాస్తితదస్తుమే ॥ (శ్లో 24, సర్గ 10)

కాబట్టి నేను ప్రాప్తించని దానిగురించి కోరవలసిన పనిలేదు. ప్రాప్తించిన దానిని వదలవలసిన పనికూడా లేదు. అందుకని, సర్వదా స్వస్థరూపమున ఆత్మయందే నెలకొని ఉంటాను.

అసలు ఆత్మ నన్ను విడచి వెళ్ళినది ఎప్పుడు? అది సర్వదా నాయందే నిరతిశయానంద రూపంలో సాక్షిస్వభావంతో, నా కన్నా వేరు కానట్టిదై వేంచేసియే ఉన్న -అదే నేను. నేను అఖండం, అప్రమేయం, అద్వితీయం, నిత్యోదితం, నిత్యనిర్మలం, జగదతీతం, జగదాత్మకం అగు ఆత్మస్వరూపుడనే!

ఏ ఆత్మ స్వరూపము నాదై ఉన్నదో, అది నేను సర్వదశలందు సర్వదా కలిగియే ఉన్నాను. ఇక భ్రమ ఎందుకు? క్రొత్తగా పొందవలసినది ఏమి ఉంటుంది?

నా యొక్క అజ్ఞానకాలంలో కూడా నేను అఖండం, శుద్ధం, నిత్యం, నిర్మలం, సర్వం అయిన ఆత్మనే అయి ఉన్నాను. ’ఆత్మ’ అనబడునది నా కంటే వేరుగా లేనేలేదు. నేను దానికి వేరుగా లేను. కార్యాకార్యములు -

నమమేహకృతేనాల్డో నాకృతేనేహకశ్చన |

క్రియయా2_ క్రియయావాపి యత్ప్రప్తంతదసన్మయమ్ ॥ (శ్లో 25, సర్గ 10)

ఆయా కార్యాలు చేయుట చేత గాని, లేక చేయకుండుట చేత గాని నాకిక ఎట్టి ప్రయోజనమూ లేనేలేదు. క్రియాక్రియలచే ప్రాప్తించినదంతా ‘మిథ్యా రూపములే’ అయి ఉన్నాయి. “నేను అది పొందలేకపోయానే? ఎలా పొందాలి?"… అనే ఉద్వేగం గాని, చంచలం గాని నే నెందుకు, ఎవరి నిర్ణయం ప్రకారం పొందాలి? శాస్త్రములచే చెప్పబడినవి, లౌకికంగా నిర్ణయించ బడుచున్నవి అనేక కార్యక్రమములు నా సమ్ముఖమునకు వచ్చుచున్నాయి. మంచిదే. వాస్తవానికి వాటి నుండి నేను కర్తగా పొందవలసినది గాని, పొందదగినవి గాని లేవు. అయినప్పటికీ క్రమానుసారం ప్రాప్తించే ఆయా క్రియలు నా ఈ చేతులు, కాళ్ళచే నిర్వర్తించబడు గాక! ఎందుకంటే చేష్టారహితుడనైతే ఈ శరీరం శుష్కిస్తుంది కదా! దీనిని నేనుగా ఎందుకు శుష్కింపజేయాలి?

ఆసక్తిరాహిత్యం - ఆసక్తి రహితుడనై సమరూపమున నెలకొని ఉంటాను. ఇకప్పుడు అట్టి సమరసభావనను భావించు భావనారాయణుడగుచుండగా… ఈ దేహము యొక్క ఉత్పన్నమునకు కారణమగుచున్న క్రియ, అక్రియలు, ఆ క్రియాక్రియల ఫలితములగు పుణ్య పాపములు, పుణ్య పాపములకు స్థానభూతమైన ప్రారబ్ధములు… ఇవన్నీ ’లేనివే’ అవుతాయి. సర్వప్రయోజనములు

Page:344

నన్ను తాకకుండా నాకు వేరై ఉంటాయి. నేను ఆయా స్థితులందు జ్ఞాన మహిమచే నిర్లిప్తుడనై ఉంటాను. అదియే నా నిర్వికల్పసమాధి!

చైతన్యమే అయినట్టి నాకు ‘సశరీరము, అశరీరము’ అనబడు వ్యక్తావ్యక్తములచే ప్రయోజనము గాని, హాని గాని ఏముంటుంది? నేను ఆసక్తిరహితుడనవటమే నా సర్వ ప్రయత్నముల ప్రయోజనం. ఆపై ఏది ఎట్లా ఉంటే ఏం? ఏది ఎట్లా ఉండకపోతే ఏం?

“కర్మ” అనుదాని యందు రెండు తత్త్వాలు ఇమిడి ఉన్నాయి1. కర్తృత్వము (I am the doer); 2. భోక్తృత్వము (I am the enjoyer of fruits of action).

ఈ రెండూకూడా మనస్సుచే కల్పించబడినవి మాత్రమే. ఈ రెండు ఉపశమించటం జరిగిందా, ఇక సర్వకార్యములు కూడా “నాచే చేయబడనివే” అవుతాయి. ఈ కర్తృత్వము, భోక్తృత్వము విషయములలో మనుజుడు తన అంతఃకరణంలో ఎటువంటి నిశ్చయం రూఢిగా కలిగి ఉంటాడో ఆతడు ఈ దేహము, భావము మొదలైనవన్నీ ఆ తీరుగానే పొందుతూ ఉంటాడు.

ఆత్మనిశ్చయము- నేను ఈ శరీరముతో పుట్టలేదు. దీనితో నశించువాడను కాను. నేను దేనికీ కర్తను కాను. భోక్తను కాను. ఎందుకంటే ఇవన్నీ స్వతఃసిద్ధమగు నిర్ణయము కలిగిలేవు. కనుక జడమై ఉన్నాయి.

నేను ’జ్ఞానము’ యొక్క ముందు, వెనుకల కూడా ఉన్నట్టి జ్ఞేయమే స్వరూపముగా కలవాడను. శుద్ధ చైతన్యమే అయి ఉన్న నాకు కర్తృత్వము లేదు. భోక్తృత్వము కూడా లేదు. ఈ కర్తృత్వ, భోక్తృత్వములు దృశ్యమునకు సంబంధించినవి మాత్రమే. ఇక నేనో… అనుభవమే స్వరూపముగా గల జ్ఞాన (knower) తత్త్వమును.

అమ్మయ్య! ఇప్పుడు నా బుద్ధి "కర్తృత్వము, భోక్తృత్వము” అనే జాడ్యమును దూరీకరించినదై శుభ్రము చేయబడిన దర్పణము వలె ప్రకాశిస్తోంది. ఒక గొప్ప వ్యాధి నుండి నివారణ పొందినదై ‘ఆత్మ పదము’ అనబడు దానియందు దృఢనిశ్చయము సంతరించుకుంటోంది.

ఇప్పటివరకు నాకు ఏర్పడి ఉండిన ఇష్ట అనిష్టముల ప్రాప్తికి కారణం ఎవరు? మరెవ్వరూ కాదు… నా అవిచారణయే! నా అధీరత్వమే! నా అల్పమైన ఎరుకయే! అట్టి అధీరత్వమును నేను ఈ క్షణమే త్యజించివేస్తున్నాను.

  1. చిత్తమును శాసించటం

ఆ జనకమహారాజు తన అంతరంగంలో ఈ విధమైన చింతన చేస్తూ మౌనం వహించి ఉన్నాడు. “ఆ సూర్య భగవానుడు కాంతిని ప్రసాదించుట, (కిరణజన్య సంయోగముచే) వృక్షములు, పశువులు, మనుష్యులు మొదలైన వాటిని జీవింపజేయుట, తటాక జలమును ఎండింప జేయుట

Page:345

మొదలైన క్రియలను మౌనముగా నిర్లిప్తముగా, అసంగముగా నిర్వర్తిస్తున్నాడు కదా! నేను కూడా ఆయా ప్రాప్తించిన క్రియలను నిర్వర్తించెదను గాక” అను స్వకీయమైన సునిశ్చయమును పొందాడు. గాంభీర్యము, ప్రశాంతత, ఆనందము ఆయన ముఖము నందు తొనికిసలాడాయి. అప్పుడు ప్రక్కనే నిలచియున్న ద్వారపాలకుని వైపు దృష్టి సారించారు.

జనకుడు : ఓయీ! ద్వారపాలకా! నీ "విద్యుక్త ధర్మ నిర్వహణ” నాకు సంతోషం కలుగజేస్తోంది. నేడు నిర్ణీతమైన రాజకార్యములకు అంతా సిద్ధం చేయించండి. దేవ, బ్రాహ్మణులు యథారీతిగా పూజించెదము గాక!

ఆ రోజు పగలంతా సభాకార్యక్రమములు, న్యాయనిర్ణయ కార్యక్రమములు, విద్యావినోదములు యథారీతిగా జరిగాయి. ఆ రాత్రి చాలాసేపు రాజు ఏకాంతంలో ధ్యానమగ్నుడై గడిపాడు. కాని, చిత్తము పరిపరివిధాలుగా పోతూనే ఉండటం గమనించాడు. “అరె! ఈ మనస్సు ఈ విధముగా అనేకత్వమును, దుష్టత్వమును, విషాదత్వమును, బలహీనత్వమును మాత్రమే ఆశ్రయిస్తోందేమిటి? ఇంత విన్నాను… ఇంత విచారణ చేశాను… కాని ఏం లాభం?" అని ఆశ్చర్యపోయాడు.

జనక మహారాజు : ఓ ‘చిత్తము’ అను పేరుగల మిత్రమా! నీతో ఈ సమయంలో కొన్ని విషయాలు ముచ్చటించాలని ఉన్నది. ఇటు వచ్చి నాకు ఎదురుగా కూర్చో…!

ఓ ప్రియ చిత్తమా! ఈ చపల సంసారము ఆత్మకు నిజమైన సుఖము ప్రసాదించగలుగుచున్నదా చెప్పు? కనుక నీవు శాంతమును పొందుము. శాంతముచే మాత్రమే ఉత్తమ ఆత్మసుఖము లభించగలదు.

చిత్తము : ఔనూ… ఈ సంసారము అనబడేది ఎక్కడి నుండి వచ్చిపడింది?

జనకుడు : చెపుతాను, విను! నీవు ఏ విధంగా సంకల్పములు చేస్తూన్నావో, ఆ విధంగానే… ఆయా రూపముననే ఈ సంసారము విశాలత్వము చెందుతోంది. ఒకడు ఒక విత్తును తెచ్చి, దానిని మహావృక్షముగా పెంచి పోషించిన తరువాత "అయ్యో! ఈ విశాల శాఖలుగల మహావృక్షము ఎక్కడి నుండి దాపురించింది. దీని వలన ఇంటిగోడలు పగులుచున్నాయి; పురుగులు, ముళ్ళు, చెత్తచెదను ఆవరిస్తున్నాయి” అని వగచునట్లు నీవు కూడా ఈ సంసారము గురించి వగచుచున్నావు. చిత్తము : నేను పొందుచున్న ఈ వ్యధలకు కారణమేమిటి?

జనకుడు : ఓ దుష్టచిత్తమా! నీయందు భోగముల పట్ల ఇచ్ఛ ఉన్నది. అదియే సకల దుస్థితులకు కారణమగుచున్నది. ఫలితంగా శారీరక మానసిక వ్యాధులు నిన్ను వదలి పెట్టకున్నాయి.

విషయ చింతన, విషయములు - ఈ ఇంద్రియములకు సంబంధించిన శబ్ద-స్పర్శ-రూపరస-గంధానుభవములు చేతనే జనన మరణ రూపమగు ఈ సంసారమంతా ఆవిర్భవిస్తోంది. కనుక ఈ ఇంద్రియ విషయముల పట్ల, దృశ్యవస్తువుల తోటి సంబంధ బాంధవ్యముల పట్ల ఏర్పడు ‘చింతన’ లేక ’మననము’ను త్యజించు. అప్పుడు శాంతి లభించకపోతే నన్నడుగు.

Page:346

ఇక్కడ కొంచెం పరిశీలనగా చూడటం జరిగితే, సారవంతమైనది, దీర్ఘ సుఖమును, లేదా, దుఃఖ మిళితం కాని సుఖమును ఇవ్వగలిగేది ఏమున్నది? మన వద్ద ‘బుద్ధి’ అను పేరుతో చెప్పబడే విశ్లేషణ శక్తి ఉన్నది. అట్టి బుద్ధితో పరిశీలించి ఏది శ్రేష్ఠమో దానినే స్వీకరించాలి గాని, ఏది అలవాటో దానిని మాత్రమే గ్రహించటం ఉచితం కాదు కదా! కనుక నీవు ‘గ్రుడ్డి’గా ముందుకు అడుగులు వేయవద్దని నా మనవి.

ఓ సాధూ! ప్రియచిత్తమా! ఈ సంసారము అపారమైనది. ఒకదానికి ప్రయోజనంగా మరొకటి ప్రాప్తిస్తూనే ఉంటుంది. "ఇది పొందిన తరువాత నాకింక ఆశించవలసినది ఏదీ ఉండదు” అని జీవుడు అనుకుంటూనే, ఏవేవో ఆశిస్తూ ఉంటాడు. సరే… పొందుతాడు, లేక, పొందడు… ఏది ఏమైనా ఆశించటం మాత్రం ఆగదు. అది ఆతడు గమనించుట లేదు. ఆశించినంతకాలం దుఃఖం, శ్రమ, ఉద్వేగం తప్పవు.

కాబట్టి ఉపాయమేమిటి? ‘ఆశ’ అనుదానిని లేక, ‘ఆశించుట’ అను స్వభావమును త్యజించటయే ఉపాయం. ఈ దృశ్యమును ఆసక్తిచే గ్రహించనూ వద్దు… ద్వేషముచే త్యజించనూ వద్దు… ‘ఆశించకపోవటం’ అనుదానిని అభ్యసిస్తూనే ఆత్మకాముడవగుము. సాక్షి రూపమున స్థితి కలిగియుండుము. అటు తరువాత ఏది ఎట్లు ఉచితమో అట్లే ఆచరించుము.

ఏవీ కూడా నిన్ను స్వయముగా స్పృశించుటలేదు. నీవు ఆసక్తితో ఆశించినప్పుడు, ఆశ్రయించి నప్పుడు మాత్రమే అవి నిన్ను లోబరుచుకుంటున్నాయి. తత్ఫలితంగా సుఖదుఃఖములు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. కనుక ఓ చిత్తమా! నీ దోషములన్నీ నీయొక్క స్వయంకృతములే!

అయినా, ఈ దృశ్యము సత్యమైతే మనకెందుకు? లేక ‘మిథ్య’ అయితే ఏమున్నది? దీని యొక్క గుణ అగుణములచే మనం ఎందుకు హర్ష విషాదములు పొందాలి?

ప్రియమైన మనస్సు గారూ! ఈ దృశ్యముతో మనకేమీ సంబంధం లేదు. అది నీ యొక్క భావనను అనుసరించి మాత్రమే ఉంటోంది. “ఏదైతే స్వయముగా లేదో… అట్టి వస్తువుతో నీకు సంబంధం ఎట్లా పొసుగుతోంది?” అని ప్రశ్నిస్తే నాకొక సమాధానం లభిస్తోంది. ఈ మనస్సు కూడా లేని వస్తువే కదా! అసలు నీవే లేవు. మరొక లేని వస్తువగు దృశ్యముతో నీకు సంబంధం… ఆ సంబంధము యొక్క ప్రభావంచే నేను సుఖదుఃఖములు, మానావమానములు, ప్రియా ప్రియములు పొందటమా? ఇదంతా ఎంతటి చమత్కారమైన విషయం!

“ఒక గొడ్రాలు ఉన్నది. ఆమె యొక్క రెండవ కుమారుడు ఆకాశంలోని ఒక చదునైన ప్రాంతంలో కొన్ని విత్తులు నాటాడు. అదొక పెద్ద పూదోటగా పరిణమించింది. ఆ పూదోటలో అనేక రకాల పూల తీగలు, మొక్కలు వేరువేరు వరుసలలో కనబడుచున్నాయి. అందులోని రెండవ వరుసలోని మూడవ మొక్కకు పూచే ఆ పెద్ద పువ్వు చూచారా! అది ఎంత అందంగా ఉన్నది?”

ఈ దృశ్య పదార్థములతో ఏర్పడు సంబంధము ఆ పూవుపట్ల ఏర్పడు ప్రియత్వము వంటిది. ఈ పదార్థములు అసద్రూపములే (అసద్రూపము = ఒక వస్తువు కొద్ది క్షణముల క్రితం ఒక

Page:347

రూపంగాను మరికొన్ని క్షణముల తరువాత మరొక రూపంగాను ఉంటోందనుకోండి… అప్పుడు అది వర్తమానంలో ‘అసద్రూపం’ అని చెప్పబడుతోంది. అయి ఉన్నాయి.

పోనీ ఓ మనసా! “నా న్యత్ కించిదస్తి" (ఆత్మతప్పితే మరింకేదీ లేదు) అను సిద్ధాంతము ప్రకారం నీవు స్వతఃగా ఆత్మవే కదా! ‘జగత్తు’ అనబడునది అసత్తే అయి ఉన్నది కదా! ఆత్మ యొక్క మననమే మనస్సు. కనుక స్వతఃగా చైతన్యమే అయి ఉన్న మనస్సుకు క్షణకాలికము, భావనామాత్రము, అసత్తు అగు ఈ జగత్తుతో సంబంధం ఉండటమేమిటి? ఎక్కడన్నా చచ్చిన వానికి బ్రతికియున్నవానికి ‘స్పర్శ’ మొదలైన సంబంధాలు పొసగుతాయా?

లేదా, “మననము” అను నా స్వభావము (మనస్సు), మననము చేయబడుటచే ఏర్పడియున్న దృశ్యము - ఈ రెండూ - సత్తే అని అనుకుందాం. రెండూ స్థితికలిగియే ఉన్నప్పుడు ‘సత్తా’ దృష్ట్యా రెండిటిలోను సత్తా అనబడు ఏకత్వము ఉన్నట్లే కదా! ద్రష్ట ఉన్న చోటే దృశ్యముంటుంది. భావకుడు ఉన్న చోటే భావన ఉంటుంది. కనుక ఉభయములు ఒకే తత్త్వం యొక్క రెండు వైపులు.

ఈ అభిప్రాయం మనం ఒప్పుకుంటే ‘మనస్సు - దృశ్యము’ సర్వదా కలిసియే ఉంటున్నాయి కదా! ఇక సంయోగ వియోగ భావములచే హర్ష విషాదములు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి?… కారణం, నీ దగ్గర ఆత్మ విషయమై తగినంత సమాచారం లేకపోవటమే సుమా! మరి సమాచారం కొరకు ప్రయత్నించాలి కదా! అందుకేం చేయాలి? శాస్త్రములను, గురువులను సమీపించి సమాచారం సేకరించాలి. స్వయముగా విచారణ చేయాలి. అంతేగాని “నేను దుఃఖితుడను…. అల్పుడను” అని అనుకుంటూ కూర్చుంటే ఏమిటిలాభం?

కనుక ఓ మనస్సా! ఈ ‘సంసారము’ అనేది మానసిక వ్యాధి యొక్క రూపమే. ఇది కలుషితమైనది. క్షణక్షణం విక్షేపముతో కూడినట్టిది.

అట్టి ఈ సంసారమును దయచేసి త్యజించు. సమాధిని అభ్యసించు. శాంతరూపమగు ఆత్మ యందు నిలకడ పొందటానికే ఉత్సాహం కలిగియుండు. అంతేగాని స్వయంగా భ్రమను స్వీకరించటం, మోహము మందత్వము కలిగియుండటం నీకు ఉచితమా? ఎందుకు? ఎంతకాలంగా ఈ పదార్థములను ఆశ్రయించుటచే ఏమి ప్రయోజనం చెప్పు?

నతదిహాస్తి సమున్నతముత్తమం వ్రజసియేనపరాం పరిపూర్ణతామ్

తదవలంబ్య బలాదతిధీరతాం జహిహిచంచలతాం శఠరేమనః. (శ్లో 18, సర్గ 12)

ఈ దృశ్యంలో పూర్ణత్వము లేదు. ఇందులో ఏమైనా అనుమానమున్నదా? అందుచేత అభ్యాస, వైరాగ్యములచే ధీరత్వము నవలంబించి చంచలత్వమును విడచివేయవలసినదిగా నిన్ను శాసిస్తున్నాను!

Page:348

  1. భూత భవిష్యత్లను జయించడం - - వర్తమానంలో ఏర్పడి ఉండడం శ్రీ వసిష్ఠ మహర్షి : శ్రీరామచంద్రా ! ఆ జనకుడు ఆ విధముగా విచారణ చేస్తూనే యథాప్రాప్తంగా రాచకార్యములు నెరవేరుస్తూ ఉండేవాడు. ధీరత్వముతో కూడిన తన సునిశిత బుద్ధిని ఉపయోగిస్తూ “నేను” “నాది” అనబడు అహంకార మమకారములను అధిగమించాడు. ఆయనకు విషయముల పట్ల ఏమాత్రం ఉత్సుకత, ఉద్వేగములు ఏర్పడుట లేదు. ఈ ఎదురుగా ఉన్న దృశ్యములు అతడు త్యజించుట లేదు. గ్రహించుట కూడా లేదు. దేని పట్లా ప్రియత్వము గాని, ద్వేష బుద్ధిగాని ఏర్పడ కుండానే వర్తమాన కాలములో ప్రాప్తించుచున్నదానిని శోకరహితుడై నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. అన్ని సమయముల యందు వివేకమును విడుచుట లేదు. అందుచేత ‘సమ్యక్ జ్ఞానం’ ఏ మాత్రం కళంకితం అగుటలేదు. మేఘాలు లేనట్టి నిర్మలమైన ఆకాశములో సూర్యుడు నిర్విరామంగా ప్రకాశి స్తున్నట్లు అతని హృదయములో నిష్కళంకమగు చిదాత్మత్వము సర్వదా ప్రకాశించసాగింది. “ఔను! నేను బ్రహ్మమయుడను. సర్వభూతజాలములందు సదృశ్యమైయున్న ఆత్మ భగవానుడను. అందుచేత నేను సర్వభూతాత్మ కోవిదుడను అగుచున్నాను. సర్వులూ, సర్వమూ నాయందే, నా సర్వ రూపం గానే నిత్యము ఉండి ఉండటం జరుగుతోంది," - అను ఎఱుక, భావన, అనుభవం అతని యందు సుదృఢత్వం పొందాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! అట్టి ఆత్మానుభవం పొంది యుండి కూడా క్లిష్టత, స్పర్ధలతో కూడిన లౌకికమగు రాజ్యపాలన నిర్వర్తించగలిగారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ లోక వ్యవహారములన్నీ మాయ చేతనే సంభవిస్తున్నాయి. అయితే అసంగము అయినట్టి ఆత్మ ఏ ఒక్క వ్యవహారముచేతనూ ఏ ఒక్క క్షణములో కూడా స్పృశించబడుటలేదు. ఈ విషయము జనకుడు సుస్పష్టంగా గ్రహించాడు. సమచిత్తుడగు అతడు ఈ రాజ్యాదుల విషయములో ప్రసన్నత్వము పొందుటలేదు. దుఃఖము పొందుట లేదు. సర్వదా ‘విముక్తుడు’ అగుటచే ఆతడు పూజ్యుడు, జ్ఞానవృద్ధుడు, ఇహపరముల పట్ల నిశ్చలానుభవుడుగా మనఃస్థితి పొందాడు. అందుచేత ‘రాజ్యాన్ని పాలించుట’ అను ప్రవాహపతితత్వమగు ధర్మమును ప్రశాంత చిత్తముతో నిర్వర్తించు చున్నాడు. యథావిధిగా రాజ్యం ఏలుచూకూడా శోకము, పరితాపము, వివశత్వము మొదలైనవి ఆతడు పొందుటలేదు.

“మానసిక దోషములచే స్వస్వరూపము నుండి తిరోభావం పొందటం …. మరలా ఆవిర్భావం పొందటం”– ఈ రెండూ ఆతని పట్ల ఏర్పడుట లేదు. దైనందికంగా వచ్చిపోయే హర్షవిషాదములు, అర్థ అనర్థములు ఇవన్నీ అకర్తృత్వాభిమానం యొక్క ప్రభావం చేత, ఆత్మ చైతన్యమునందు, తరంగములు సముద్రములోలాగా, లయించి ఉంటున్నాయి.

సుషుప్తియందు ఉన్నవానివలె ఆతడు మెలగుచూ ఉన్నాడు. రాగద్వేషములు, భూతభవిష్యత్తుల గురించిన చింతలు ఆత్మ సామీప్యతచే తడిపివేయబడ్డాయి. వాసనాభావంబున మనస్సు భూత

Page:349

భవిష్యత్తులను జయించి, వర్తమానంలో ఏర్పడి మాత్రమే ఉంటోంది. అనగా దానిలో భూత -

భవిష్యత్తుల చింతలు తొలగిపోయాయి. కేవలం వర్తమానంలో మిక్కిలి ’సంతుష్టి’తో అనువర్తిస్తోంది. చూచావా రామా! ఒకడు తన మెడలో ధరించిన గొలుసు కనిపించక, ఇల్లంతా వెతకి చిందులు వేసి చివరికి మెడలోనే ఉన్నట్లు గమనించి ప్రశాంతపడునట్లు, ఈ జీవుడు సర్వదా ప్రాప్తించియే ఉన్నట్టి ఆత్మ యొక్క సమాచారము, లేక, జ్ఞానముచే మాత్రమే ప్రశాంతత పొందగలడు. అట్టి ఆత్మజ్ఞానం లభించేంతవరకూ ఈ చిత్తముచే తత్త్వ విచారణ చేయిస్తూనే ఉండాలి. ‘ఆత్మతత్త్వ విచారణ’ అనేది సజ్జన సాంగత్యముచే అభ్యుదయం పొందుతూ ఉంటుంది. “సర్వ సమత్వ దృష్టి” అలవడుతూ ఉంటే ఈ మనస్సు విశాలత్వం పొందుతుంది.

1 స్వవిచారణ, 2 సజ్జన సాంగత్యము … ఈ రెండింటితో సమానమైనవి ఇంకెక్కడుంటాయి? అందుచేత రామా! నీ యొక్క “ఊహ, అపోహ”లను సచ్ఛాస్త్రము, వివేకములచే శోధన చేయి. లక్ష్యశుద్ధితో శాస్త్రానుసారం ప్రయత్నిస్తూవుండగా, క్రమముగా నీ బుద్ధి నిర్మలమవుతుంది. అప్పుడు అఖండమగు ఆత్మను, లేక ఆత్మతత్త్వమును నీకు మరింకెవ్వరూ గుర్తు చేయనక్కర్లేదు. అప్పుడు నీవు అజ్ఞానాంధకారముచే బాధించబడవు సుమా!

ప్రజ్ఞ - ఓ మహామతీ! రామచంద్రా! ఈ సంసారము అనేక దుఃఖ కల్లోలములతో అనేక విపత్తులతో నిండివుంటోంది. “అధిగమించడానికి సాధ్యమా?” - అను రీతిలో అనేక విషయ పరంపరలు ప్రాప్తిస్తున్నాయి. అయితే, ఈ సంసార నదీ జలమును “ప్రజ్ఞ” అనే నావ సహాయముతో దాటివేయవచ్చు. కోమలమైన పూతీగను అల్పమైన గాలి కూడా అటు ఇటూ కదిలిస్తూ బాధిస్తుంది. ప్రజ్ఞా విహీనుడైన ఒక మూఢుని అతి స్వల్పమైన విషయములు కూడా బాధించగలుగుతాయి.

ఒకానొకడు నిస్సహాయుడుకావచ్చు. శాస్త్రములలోని ఆయా వివరణాదులు అతనికి తెలియకపోవచ్చు. కాని అతడు కనుక శ్రద్ధ, ప్రజ్ఞలతో కూడిన పరిశీలకుడై, క్రమంగా విజ్ఞానశీలుడు అయినాడా…. ఇక ఆతడు ఈ సంసార సముద్రమును అవలీలగా దాటివేస్తున్నాడు, కార్యసిద్ధిని పొందుచున్నాడు. అజ్ఞుడో…. అతడు ఎంతో బలవంతుడైతే మాత్రం ఏమి లాభం? చివరకు అధో గతే శరణ్యమగుచున్నది. అందుకే మానవుడైనవాడు తన ప్రజ్ఞను ‘శాస్త్రము’’సత్సాంగత్యము’ అను రెండింటి సహాయముతో కాపాడుకోవాలి. తోటమాలి అందమైన పూల మొక్కలను అతి జాగ్రత్తగా రక్షించుకొనుచున్నట్లు, ఈ జీవుడు కూడా ప్రజ్ఞను, అవగాహనను దృఢపరచగల ఆయా కార్యక్రమాలను కాపాడుకోవాలి. అనేక సత్కర్మల రూపమున ప్రజ్ఞ (Wisdom) తప్పకుండా, ఉత్తమమైన, అమృత తుల్యమైన ఫలములను ప్రసాదించగలదు.

ఈ జనులందరూ ధన - వస్తు - - అధికారాలను సంపాదించడానికి అనేక ప్రయత్నములను చేస్తున్నారు కదా! అదే విధముగా ఈ ప్రజ్ఞను వృద్ధి చేసుకోవడానికి కూడా సర్వ ప్రయత్నములు

చేయాలి కదా!

"అసలు ఈ సంసారము అనబడేది ఎక్కడినుండి, ఎట్లా విజృంభిస్తోంది?”

Page:350

సీమాన్తంసర్వదుఃఖానా మాపదాంకోశముత్తమమ్ |

బీజంసంసారవృక్షాణాం ప్రజ్ఞామాన్యంవినాశయేత్ || (శ్లో 27, సర్గ 12)

ప్రజ్ఞామాంద్యముచేతనే సర్వ దుఃఖములకు, ఆపదలకు అలవాలమైన ఈ సంసారము స్వీయ హృదయము నుండి ఉద్భవిస్తోంది సుమా! అందుచేత మీరంతా ఏమాత్రం బద్ధకించకండి. ప్రయత్న శీలురై ప్రజ్ఞామాంద్యమును తొలగించుకొండి? స్వర్గ, పాతాళ, బ్రహ్మ లోకములలో ఏయే సుఖములు ప్రాప్తించగలవని జనులు అనుకుంటూ ఉంటారో, అవన్నీ కూడా ఇప్పుడే, ఇక్కడే ఉత్తమ ప్రజ్ఞచే, ఇదంతా అర్థం చేసుకున్నవాడు పొందుచున్నాడు. నాయనలారా! మహానుభావులంతా ఉత్తమోత్తమమైన తమ యొక్క ‘ప్రజ్ఞ’ చేతనే ఈ ఎదురుగా తారసపడుచున్న భయంకర సంసారాన్ని దాటి వేస్తున్నారు. అంతేగాని వారు ఎచ్చటకో వెళ్ళుట చేతనో, ఏదో చూచుట చేతనో కాదు సుమా! దానము, తీర్ధము, తపస్సు - - వీటంన్నిట యొక్క అంతిమ లక్ష్యము ఉత్తమ ప్రజ్ఞ సముపార్జించుటయే!

పారమార్థిక జీవితం విషయం అటుంచి ఈ లౌకిక జీవితం విషయం కూడా అంతేకదా! ఈ భూమిపై చరించుచున్న ఈ జీవులు ఏవేవైతే సంపత్తులు పొందుచున్నారో…. అవన్నీ ‘ప్రజ్ఞ’ అనే పండ్ల చెట్టు నుండి రసభరితమై పడిరాలిన ఫలములే కదా! అంతే కాదు. భయంకరమైన పంజా గల ఒక సింహమును రెండు మూడు నక్కలు తమ తెలివితేటలతో, ’ప్రజ్ఞ’తో జయించి వేస్తున్నాయి. ప్రజ్ఞ కారణంగానే సామాన్యుడై పుట్టిన ఒకానొకడు మహానాయకుడు కావడం, రాజు కావడం చూస్తున్నాం. అట్లాగే స్వర్గ - మోక్షములు మొదలైనవి కూడా ప్రజ్ఞావంతులకే లభిస్తున్నాయి.

ప్రజ్ఞ = తెలివి + ప్రయత్నము + సాహసము.

గొప్ప విషయాలు కూడా ప్రజ్ఞానవంతుడు స్వల్పకాలంలో గ్రహించి అనేక మందిని అధిగమించి వేయటం ప్రపంచంలో మనం చూస్తున్న విషయమే.

వివేకుల హృదయంలో ఉండేది ఈ ‘ప్రజ్ఞ’ అనే మణియే. అది వారికి కల్ప వృక్షములాగా కోరుకొన్న ఫలములు సిద్ధింపజేస్తూ ఉంటుంది. నావను నడపటం చేతనైనవాడు తుపానును ఎదుర్కోగలుగుతాడు. ఈత నేర్చినవాడే మునిగిపోకుండా గట్టుజేరుతాడు. అశిక్షితుడు, అప్రజ్ఞావంతుడు సంసార సాగరాన్ని దాటగలడా? లేదు. ప్రజ్ఞను సునిశితం చేయని వాని బుద్ధి స్వల్ప విషయములచే ఆకర్షణ వికర్షణలకు లోను అవుతోంది. వివేక వైరాగ్యములతో కూడిన బుద్ధి సన్మార్గములో నియమించ బడినప్పుడు ఆ బుద్దే నావలాగా సంసారమును దాటింపజేస్తోంది. అసన్మార్గమును ఎన్నుకొన్నందుకు పర్యవాసనం ఆపదలు, దుఃఖాలు వచ్చిపడటంలో ఆశ్చర్యం ఏమున్నది? కవచం ధరించిన వానిని బాణాలు తాకినా ఏమీ చేయలేవు కదా! ప్రజ్ఞ లేక తెలివి మరుగున పడిన క్షణాలలో ‘తృష్ణ’ వచ్చి చేరుతుంది. కామ, క్రోధ, లోభ, మోహాదులు ఆ తృష్ణ యొక్క సైనికులై వాటి నుండి రాగము, ద్వేషము, చింత మొదలైనవన్నీ వచ్చి పడుచున్నాయి. ప్రజ్ఞావంతుని అవన్నీ ఏమాత్రం సమీపించలేవని గ్రహించు.

Page:351

ఓ రామచంద్రా! నీవు సమ్యక్ దృష్టిని సంపాదించి, అట్టి దృష్టిచే ఈ ప్రపంచమును గాంచుచూ మోక్ష స్వరూపుడవు కావాలని అనుకుంటున్నావా! అయితే వెంటనే ప్రజ్ఞను ఆశ్రయించు. గుణదోషతత్త్వ వివేకము ద్వారా ’సమదర్శి’వి అగుము. ఇక సంపదలు గాని, ఆపదలు గాని నిన్నేమీ చేయలేవు.

పిధానంపరమార్కస్య జడాత్మావితతోసితః | అహంకారాంబుదోమత్తః ప్రజ్ఞావాతేనబాధ్యతే ॥ || (శ్లో 39, సర్గ 13)

ప్రజ్ఞ కొరవడిన తరుణంలో ఏర్పడిన ‘అహంకారము’ అనబడే దట్టమైన మేఘము ‘పరమాత్మ’ అనే సూర్య భగవానుని కనబడకుండా కప్పివేస్తుంది. ఆ మేఘము "ప్రజ్ఞ” అనబడే వాయువీచికచే త్రోసివేయబడుతుంది!

మొక్కలు నాటే ముందు రైతు భూమిని దున్ని సిద్ధము చేయునట్లు నీవు హృదయమును “స్వవిచారణ, గురువాక్య విశ్లేషణ, ఉత్తమ కార్యక్రమములు” అను భాగాలు గల నాగలితో హృదయ క్షేత్రమును సిద్ధము చేసి ‘వివేకము - ప్రజ్ఞ’ అను పంటను సంపాదించు. అప్పుడు ఈ విచారించ బడుచున్నదంతా నీకు స్వయముగా సుస్పష్టం కాగలదు.

  1. మనోవిచారణ

ఓ రామచంద్రా ! "ఆత్మానుభవ ప్రాప్తి” అనే మార్గములో ముఖ్యముగా మూడు ప్రతిబంధకాలు తారసపడుచున్నాయి -

  1. అసత్భావన - “అసత్” లేక “అసత్యము” అయిన విషయములను పదే పదే సత్యమైనట్లు భావన చేయుట.

  2. అహంకార మమకారములు - “నేను మరియు నాది” అను భావనను ఆశ్రయించడం. తనను తాను తదితరులకు వేరైనట్లుగా దర్శించటం.

  3. దేహాత్మభావన - “ఈ దేహమే నేను. దేహ పరిమితుడనైన నేను దీనితో వృద్ధి క్షయములు పొందువాడనై ఉంటున్నాను” అను రూపముగల సంకుచితత్వమును భావన చేయడం. ఆ జనకమహారాజులాగా నీవు కూడా పరిశుద్ధ చిత్తముచే ఆత్మ విచారణ చేయి. పై విఘ్నములను ప్రయత్నపూర్వకముగా తొలగించుకో. అప్పుడు జ్ఞానులు పొందినట్టి బ్రహ్మపదమును నీవు కూడా పొందగలవు. ప్రాజ్ఞులైనట్టి కొందరు సాత్వికులు, మరియు రాజస సాత్వికజాతీయులు ప్రాప్తములన్నింటిలోకి అత్యంత ఔన్నత్యము అయినట్టి ఆత్మతత్త్వమును స్వయముగా తమయొక్క వివేక బలముచేత గ్రహిస్తున్నారు.

ఆత్మశాంతి పొందనంతవరకూ ఈ ‘ఇంద్రియములు’ అనే శత్రువులను సరియైన రీతిలో నియమించి, ఆత్మానుసంధానం చేస్తూనే ఉండాలి.

Page:352

శ్రీరాముడు : మహాత్మా! ఈ ఇంద్రియములను అనేక దుఃఖములతో కూడిన సంఘటనలు ఆశ్రయించి ఉంటున్నాయి. ఇక మేము ఈ దుఃఖములను ఎట్లా జయించడం?

ప్రసన్నేసర్వగేదేవే దేవేశేపరమాత్మని | స్వయమాలోకితేసర్వాః క్షీయన్తెదుఃఖదృష్టయః || (శ్లో 4, సర్గ 13)

శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వమునందు వ్యాపించియున్నవాడు, సర్వ ఇంద్రియ నియామకుడు ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపమే తానైయున్న, ఆ పరమాత్మ ప్రసన్నుడై సాక్షాత్కరించగానే సమస్త దుఃఖాలు వాటంతట అవే క్షయిస్తాయి. ఈ మనుష్యానందం మొదలుకొని బ్రహ్మానందం (సృష్టికర్తకు లభించే ఆనందం) వరకు “ఆ పరమాత్మ యొక్క అనుభవము” అనే ఆనందము ముందు ’సూర్యుని ముందు దివిటీ’ లాగా అత్యంత స్వల్పమైనవే. ‘పర అపర’ స్వరూపుడైన ఆ పరమాత్మ సాక్షాత్కరించిన తరువాత ఇక మోహములు, వాటికి బీజము వంటివైన దుర్వాసనలు, అహంకారము, సర్వ విధమైన ఆపదలకు సంబంధించిన భయోద్వేగములు స్వయముగా శమించిపోతాయి.

ఓ రామా! వివేకముతో కూడిన బుద్ధితో "ఈ సమస్తము బ్రహ్మమే కదా….!” అన్న దృష్టిని కలిగియుండుటే పరమ పురుషార్థమగు ఐశ్వర్యమని మా అభిప్రాయం. ఎవ్వడైతే నిరంతర ఆత్మవిచారణ గావించుచు, “ఈ జగత్తు అనిత్యమే కదా!” అను నిర్ణయముచే సర్వాతీతత్వము అలవరచుకుంటాడో అట్టివాడు కాలక్రమేణా జనకమహారాజులాగా ఉత్తమ శాంతిని తప్పక పొందుతాడు.

శ్రీరాముడు : ప్రారబ్ధము చేతనే వివేకము ప్రాప్తిస్తుందా? లేక అది స్వయముగా తనంతట తానే ఏదో ఒక ఆకస్మికమైన సమయములో ఉదయిస్తుందా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏ జీవుడైతే ఈ సంసారం పట్ల భయభీతుడై “ఉత్తమమైన అవగాహనయే ఇందుకు మార్గము” అని గ్రహించి ఆత్మ జ్ఞానము కొరకు స్వప్రయత్నమును ఆశ్రయిస్తాడో, అట్టివానికి మాత్రమే వివేకంతో కూడిన దృష్టి రూపుదిద్దుకుంటుంది. ‘ఆత్మజ్ఞానము’ అనబడేది ధనము వలన గాని, బంధువుల వలన గాని, ‘దైవం’ అనుదాని చేతగాని అనేక కర్మల చేత గాని ప్రాప్తించేది కాదు. అందుకొరకై చేసే పురుష ప్రయత్నము చేతనే అది సాధించబడుతోంది. వివేకము, వైరాగ్యము - ఈ రెండింటి విషయంలో "ప్రారబ్దం ఉంటేనే అవి లభిస్తాయి”… లేదా “స్వయంగా, కాకతాళీయంగా లభిస్తాయి” అని తలచి, తెలియని ఏదో శక్తిపై ఆధారపడేవారు, మా దృష్టిలో, మూర్ఖులు మాత్రమే.

“ఆఁ! ప్రారబ్ధం ప్రతికూలంగా ఉంటే మేమేమి చేస్తాం? అందుకే వివేకం మాకు లభించడం లేదు” అని తలచే వారు జ్ఞానుల దృష్టిలో, ఆయా వికల్పాలకు దాసో2 హమ్ అంటున్న మందభాగ్యులు మాత్రమే! కనుక, ఓ సభికులారా! మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను. మీరంతా అట్టి మాటలు కట్టిపెట్టండి. చక్కగా వివేకముతో కూడిన దృష్టిని అలవర్చుకోండి. ఆత్మ చేతనే ఆత్మను దర్శించండి. ఉత్తమ బుద్ధి ద్వారా సంసారసాగరమును దాటివేయండి. మనమిప్పుడు చెప్పుకున్న ఈ జనకుని వృత్తాంతము అజ్ఞాన వృక్షమును ఛేదించగలదని, జ్ఞాన సుఖమును కలిగించగలదని పెద్దలు అంటూ ఉంటారు. సుబుద్ది ఒక్కడే తన యందు పరమాత్మ సాక్షాత్కారమును గాంచగలడని చెప్పుటే దీని ఉద్దేశము.

Page:353

ఎండ వేడిమి చేత మంచు కరిగిపోతుంది. అట్లాగే ఆత్మతత్త్వ విచారణచే ఈ సంసార పటాటోపము, లేక, వికల్పము క్షణాలలో నశించిపోతోంది. “ఈ దేహమే నేను” అనునదే అజ్ఞానము యొక్క పరాకాష్ఠ. అట్టి సంకుచిత స్వభావం నశించిందా, ఇకప్పుడు మహత్తరమైన, సర్వ వ్యాప్తమైన నిజాత్మప్రకాశము స్వయముగానే ఆవిర్భవిస్తోంది. అనగా, ఆత్మ యొక్క విస్తారము ఉదయించగలదు.

  1. స్వయం విచారణ

శ్రీరాముడు : మహర్షీ! జనక చక్రవర్తి మహారాజుగా ఉంటూనే పాము కుబుసమును విడుచునట్లు… అహంకారాన్ని త్యజించివేశారు కదా! అది అట్లు ఎలా సాధ్యపడింది? ఏ పరికరాలు, కార్యక్రమాలు ఆయన ఉపయోగించారు? లేక, సిద్ధులు చెప్పిన అభిప్రాయములు విన్నంతమాత్రం చేతనే ఆయన సంసారమును జయించి వేశారా? లేక, అందుకు మరేమైనా కారణాలు ఉన్నాయా?

శ్రీ వసిష్ఠ మహర్షి : సిద్ధుల వాక్యములను మననం చేస్తూ స్వయంగా విచారణ చేయుట చేత ‘అహంకారము’ అనబడే మూలవాసనను ఆయన జయించారు (లేక) త్యజించారు (లేక) అతీతత్వము వహించారు. అయితే, ఏదైనా ఎవ్వరికైనా లభించాలంటే సుదీర్ఘమైన అభ్యాసం, విచారణ అవసరం కదా! అట్లాగే, చిరకాలమిత్రుడైన ’స్వవిచారణ’యే ఆతనికి అందుకు తోడైనది. అహంకారము క్షయించగా విశాలచిదాకాశము నిర్మలం అవుతుంది. ‘అజ్ఞానాంధకారము’ అనగా, “ఈ దేహము మొదలైనవే నేను” అని తలచుటయే కదా! అట్టి అజ్ఞానం నశిస్తే ఇక ఎట్టి బాహ్యమైన పరికరములు అవసరం లేకుండానే ఆత్మ ప్రకాశము స్వయంగా ఆవిర్భవిస్తోంది. అందుచేతనే, ఉత్తముల దృష్టిలో: 1. ఈ జగత్తు స్వయంగా లేదు … భావనను, అనుసరించి ఏర్పడి ఉంటోంది.

  1. ‘అహం’ అను పదవాచ్యము కూడా లేదు. 3. నేను పూర్ణ స్వరూపుడనేగాని శూన్యముకాను.

  2. అను మూడు అవగాహనలు ఏకసమయంలో ఏర్పడి ఉంటున్నాయి. అట్లాగే నీ మనస్సు కూడా సర్వదా ప్రశమనం పొందిఉండుగాక! ఎదురుగా ఉండే వస్తువులందు నిమగ్నము కాకయే ఉండుగాక! అసలు ‘బంధము’ అంటే ఏమిటి? -

ఉపాదేయానుపతనం హేయైకాన్తవివర్జనమ్ |

యదేతన్మనసోరామ తద్బద్ధంవిద్ధినేతరత్ …॥ (శ్లో 20, సర్గ 13)

ఆయాప్రాప్తించియున్న వస్తువులందు, స్థితి గతులందు కొన్నిటిపట్ల “వీటిని ఎల్లప్పుడూ నేను కలిగి యుండాలి” అని, మరికొన్నిటిపట్ల “ఇవి తొలగాలి” అని బుద్ధిని కలిగియుండుటే రాగ ద్వేషముల యొక్క రూపము. రాగద్వేషములు కలిగియుండుటే బంధము. అవి లేకుండుటే బంధరాహిత్యము లేక ‘ముక్తి’ లేక ‘మోక్షము’.

తొలగాలి = హేయదృష్టి లేక త్యాజ్య బుద్ధి; పొందాలి = ఉపాదేయ దృష్టి లేక గ్రాహ్య బుద్ధి.

Page:354

ఈ రెండు దృష్టులను త్యజించి ఇక ఇప్పుడు శేషించే ‘సాక్షి రూపం’ నందు ‘నిలకడ’ కలవాడవై స్వచ్ఛతను పొంది ఉండు. గ్రాహ్య - త్యాజ్య బుద్ధిని నశింపజేసుకొన్నవారు ఇక దేనినీ ఇచ్ఛగించరు. దేనినీ ద్వేషించరు. వారి హృదయమునందు “బ్రహ్మాత్మత్వము” అనబడే సమరసభావన అకృత్రిమంగా వెల్లివిరిసి ఉంటుంది. ఆకాశం మేఘములచే ఆవరించబడి ఉన్నప్పుడు చంద్రుడు కనబడతాడా? ”ఏదో పొందాలి… ఏదో తొలగాలి" అను రూపముగల తృష్ణ హృదయములో ఏర్పడి ఉన్నంత వరకు అట్టి వికల్పము యొక్క ప్రభావం చేత ఈ జీవుని పట్ల సంసారము ఉండియే తీరుతోంది. సంసారం ఉన్నంతవరకు భేద భావం, జీవ భావం అనే జాడ్యం వదలదు.

అనుకూలమైన పదార్థములందు “ఇచ్ఛ” ప్రతికూలమైన పదార్థముల పట్ల “అయిష్టత”, లాభాలాభముల పట్ల రాగద్వేషములు - ఇవి ఏర్పడుచున్నచోట బుద్ధి మందగిస్తూనే ఉంటుంది. ఆతనిలో వైరాగ్యం ప్రదీప్తం కాదు. అట్టి తరుణంలో బ్రహ్మాత్మ రూపమైన సమత్వము, నిర్మలత్వము ఎట్లు ఉండగలుగుతాయి?

వాస్తవానికి నిరామయము, ఏకము అగు పరబ్రహ్మమే సదా వెలుగుచుండగా ఇక ఈ భేద కల్పనలన్నీ భ్రమ కాక ఏమిటి చెప్పు? ఇష్టము-అయిష్టము, పొందబడినవి-పొందవలసినవి మొదలైనవన్నీ చపల వానరం వంటి ఈ చిత్తము యొక్క నృత్య భంగిమలే. చిత్తము గంతులు వేస్తుంటే ‘సౌమ్యత్వము, నిష్కామత్వము’ లకు చోటులేకుండా పోతోంది. కొందరు మహనీయులు తమ యొక్క ఉత్తమ ప్రయత్నముచే త్యాజ్యగ్రాహ్య దృష్టిని జయించి వాసనారహితులై ఉంటున్నారు. అట్టి జ్ఞానులందు ఆశా రాహిత్యం, నిర్భయం, నిత్యత్వం, సమత్వం, జ్ఞానం, నిరపేక్ష, నిష్క్రియత్వం (నేను అకర్తను అను ఎఱుక) నిర్వికల్పత్వం, ధైర్యం, మైత్రి, సమబుద్ధి, తుష్టి, శాంతి, మృదుభాషణ మొదలైనవి స్వయంగా రూపము పొందుచున్నాయి.

శ్రీరాముడు : తండ్రీ! ఈ చిత్తము అల్పత్వమును ఆశ్రయిస్తూ ఆత్మత్వమునకు దూరమగుచున్నది కదా! ఏమిటి ఉపాయం? మేమేం చేయాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : నీరు పల్లపు ప్రాంతాలకు పోతుంటే ఏం చేస్తున్నాం? వంతెనకట్టి ఆ ప్రవాహాన్ని నిరోధించి ఎత్తు ప్రాంతాలకు తరలిస్తున్నాము కదా! అట్లాగే, ఈ చిత్తము అధోగతికి వెళుచున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా? లేదు. ‘ధ్యానము’ ‘భగవన్నామ స్మరణ’ మొదలైన ప్రత్యాహారముల చేత చిత్తమును ఆయా విషయముల నుండి వెనుకకు మరల్చాలి

బాహ్య అనర్థాన్ ఇమాం త్యక్త్వా ; తిష్ఠన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ | సర్వథా సర్వదా సర్వాన్ అన్తరాంశ్చ విచారయ II

ఒక చోటకూర్చుని ఉన్నప్పుడు లేక నడుచుచున్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు

Page:355

ఈ మనస్సు బుద్ధి, ఆత్మ ఏమై ఉన్నాయి? నేను ఎవడను? ఎంతటి వాడను? నేను వేటికి ‘సంబంధించని’వాడను? దేనికి ‘సంబంధించిన’ వాడను? దేని కొరకు ఏ రూపంగా ప్రయత్నించాలి? వేటి పట్ల ఉదాసీనంగా ఉండాలి?

…ఈ విషయాలు విశ్లేషణపూర్వకంగా గ్రహించి ఉండు. అందుకు శాస్త్రములు, జ్ఞానుల ప్రవచనములు నీకు సహకరించ గలవు. అట్టి "విచారణ, అవగాహన ఆశ్రయించబడని సమయంలో ‘మోహం’ అనే దారపుప్రోగులతో ‘చింతా సమూహాలు’ అనే ముళ్ళుతో కూడిన (వాసనలు) అనే వల నేయబడుతోంది. “తృష్ణ, కోరికలు తీర్చుకొనుట” అను ప్రయోజనమే రూపంగా గల చేపలు పట్టటానికి ‘సంసారం’ అనే తటాకంలోకి ఆ వల పదే పదే విసరబడుతోంది… ఫలితం? అనేక జన్మ పరంపరలు! ఈ వాసనలు అనే వలను ‘బుద్ధి’ అనే పదునైన కత్తితో త్రెంచుకుంటూపోవాలి. మహా వాయువు మేఘాలను ఖండఖండం చేయునట్లు బుద్ధిచే వాసనలను మొదలంట పెరికివేయాలి.

ఓ రామచంద్రా! అందుచేత చిరకాలాభ్యాసం ఆశ్రయించుట ద్వారా నీ బుద్ధిని దృఢతరం చేయి. ‘ఆత్మను భావించుట’ అను ప్రయత్నముచే అది స్థైర్యము పొందేటట్లు చేయి. చిత్తము ధీరత్వముతో కూడుకొని ఉండాలి సుమా! మనస్సు ఈ సంసారము, లేక, అవిద్య యందు అనాదిగా తగుల్కొని యున్నది. అట్టి మనస్సును సముద్ధరించటానికి అత్యంత నిర్మలమైన, సునిశితమైన బుద్ధిని సముపార్జించాలి.

నీ మనస్సు అఖండమగు బ్రహ్మాకార వృత్తిచే ప్రకాశించు గాక! ఈ సంసార వృక్షమును అట్టి బ్రహ్మాకార వృత్తి అనే గొడ్డలిచే నరకటం అత్యంత సులభం. మనస్సు వృత్తుల యొక్క సముదాయమే కదా! బ్రహ్మాకార వృత్తిచే తదితర వృత్తులన్నీ మ్రింగివేయబడు గాక! అప్పుడు ఇక్కడే, ఇప్పుడే బ్రహ్మపద ప్రాప్తి పొందుటచే సుస్థిరుడవు, సౌమ్యరూపుడవు, అనంత, అఖండానంద స్వరూపుడవు పరమేశ్వరుడవు అవుతావు. ఆత్మదృష్టిని స్థిరం చేసుకొన్నావా, నీవు పరమేశ్వరుడవై మా అందరిచే నమస్కరించతగినవాడవే అవుతావు.

ఎవడైతే అంతటా ఆత్మరూపమునే చూస్తూ, ఈ దృశ్యము పట్ల "సన్మాత్ర భావన” చేస్తూ అన్య పదార్థ భావనను త్యజించి వేసి ఉంటాడో, అట్టి వానిని ఈ హర్షశోకవిషాదములు’ అనే దోషాలు అంటజాలవు. తాక జాలవు.

రాగద్వేషవినిర్ముక్తః సమలోష్టాశ్మకాంచనః |

యుక్తఇత్యుచ్యతేయోగీ త్యక్తసంసారవాసనః ॥ (శ్లో 43, సర్గ 13)

ఎవడైతే రాగ ద్వేషముల పరిధి నుండి తనను తాను తొలగించివేసుకొని మట్టిని, రాయిని, బంగారాన్ని సమబుద్ధితో చూస్తాడో, అట్టివాడు ముక్తుడే.

అట్టివాడు ఏది చేస్తున్నా, ఏది భుజిస్తున్నా, ఏది దానం చేస్తున్నా, ఏది వధిస్తున్నా - దేని పట్లా కూడా ఏమాత్రం “ఆసక్తి” అనేది కలిగి ఉండడు. ఆసక్తి లేదు కాబట్టి వాటిచే కలుగుచుండే

Page:356

సుఖదుఃఖములందు సమభావము కలిగియుండగలుగుతాడు. “ఇది ఇప్పుడు ఇట్లు చేయుట మాత్రమే నా వంతు”- అని భావించుచూ, ఇష్ట అయిష్టములను పరిత్యజించేవానిని బంధించగలిగే కర్మలు ఎక్కడా ఏమీ ఉండవు.”

  1. మనస్సు - - ప్రశాంతత

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహామతీ! రామా! ఈ జగత్తు అంతా చైతన్యమయమే కదా! ఇక, భోగాశ కలిగి ఉండాల్సిన పనేముంది? భోగాశను వీడినట్టి మనస్సు అకృత్రిమమైన ప్రశాంతతను పొందుతోంది. శ్రీరాముడు : హే మహర్షీ! ఈ మనస్సు జడమైనదా? చేతనమైనదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ మనస్సు జడమైనదే. అందుచేత, అది స్వయంగా దేనిని సాధించలేదు. తనను తాను ఉద్దరించుకోలేదు.

ఒక వనంలో ఒక సింహం ఉన్నది. అది జంతువులను వేటాడటానికి బయలుదేరుతోంది. ఆ ప్రక్కనే ఉన్న ఒక పిల్లి మాంసం మీద గల అపేక్ష వల్ల ఆ సింహమును అనుసరించి వెళ్ళుచున్నది. అట్లాగే, ఈ మనస్సు అనే పిల్లి స్వయంగా దేనినీ సాధించలేదు గాని, తనకు సాక్షిగా తనను ప్రకాశింపజేయుచున్న ఆత్మ నుండి చైతన్యము పొందినదై ఆత్మయొక్క ఇచ్ఛాదులను ఆశ్రయించి ప్రవర్తించుచున్నది. చిత్త శక్తి యొక్క ప్రభావం చేత ప్రాప్తించుచున్నది. దృశ్యము నందు ప్రవేశించి ఆయా అనుభవములకు ‘భోక్త’ అగుచున్నది. “అసద్రూపము” అయినట్టి ఈ మనస్సు అద్వితీయమైనట్టి ఆత్మను ఏమరచి, కేవలం జగదాకారమును భావించటం జరుగుతోంది. కాని, చైతన్యము యొక్క ప్రభావం చేతనే అది జీవించటం జరుగుతోంది. అదే మనస్సు మరొక సమయంలో ఆత్మను సంస్మరించుటచే తన మనోరూపమును - జడత్వమును వదలినదై మరల చైతన్యముగా అగుచున్నది. స్వయముగా జడము, చైతన్యముచే ప్రకాశింపబడునది అగు ఈ మనస్సు మృతప్రాయమే అవుతుంది గాని, కార్య సమర్థము కాగలదా? లేదు.

‘చిత్తము’ అంటే ఏమిటి? -"చిత్స్వభావం’ నుండి స్వయంగా అభివ్యక్తమైన కల్పన అసత్ మయమైన విషయములను ఆశ్రయించియుండటం. లేక, నిత్య అనిత్యములను విశ్లేషించక పోవటం.”

కలన (illution)– చిత్తము ‘చిత్’ నుండే బయల్వెడలుచున్నది. ఈ చిత్తము “ద్రష్ట, దర్శనము, దృశ్యము” అను రూపమున క్రియారూపంగా ఆవిష్కరించ బడుచున్నప్పుడు, అట్టి ‘చిత్’ యొక్క త్రిపుటీ చమత్కారమే “కలన”, “కల్పన” అను శబ్దములచే చెప్పబడుతోంది.

కల్పనయే మరొకప్పుడు “నేను చిద్రూపాన్నే గాని ఈ ద్రష్ట, దృశ్యం మొదలైన సంకుచితుడను, లేక, పరిమితుడను కాదు” అని ఎఱుగుచున్నది. సముద్రం నుండి బయలుదేరిన ఉప్పు బొమ్మ ఏ కారణంగానో మరల సముద్రంలో పడితే ఏమౌతుంది? నామరూపాలు పోగొట్టుకొంటుంది. అట్లే ఈ చిత్తము స్వస్వరూపమును ఎఱిగినప్పుడు తిరిగి చిద్రూపమే అగుచున్నది.

Page:357

విషయరహితమైన చైతన్యమే “సనాతన బ్రహ్మము” అని అంటున్నాం. ఆ చైతన్యం విషయ సహితమైనప్పుడు ‘జీవుడు - కలన - కల్పన’ మొదలైన శబ్దములుగా చెప్పుకొంటున్నాం. అనగా బ్రహ్మమే కించిత్ ‘విషయాసక్తి’ పొందినప్పుడు కల్పనారూపమై హృదయంలో సద్వస్తువును బోలి ఉంటోంది. ఆ ‘ఆసక్తి’యే సంకల్ప వికల్ప రూపములతోకూడి ’మనస్సు’ అగుచున్నది.

ఈ మనస్సు నిత్యానుభవ రూపమైనట్టి తన ఆత్మను విస్మరించి ‘స్మృతి’ రూపమును చెందుచున్నప్పుడు, జడరూపమును బోలి, “చిత్తము” అని అనిపించుకుంటోంది.

చిత్తము యొక్క ధర్మములు -

  1. జరిగిపోయిన విషయముల గురించి ‘మననం’ చేయటం లేక ‘విషయాకార కల్పన’

కలిగి ఉండటం.

  1. భవిష్యత్తు విషయము గురించి సంకల్పములు ఆశ్రయించటం.

3.“ఇది పొందాలి ఇది తొలగాలి” అను రూపమునగల హేయ - ఉపా దేయములతోగూడిన పరిచ్ఛిన్నత్వము.

ఈ చిత్తమే బ్రహ్మాండాకారమును (macrocosm) స్వమాయావశంచేత పొందుచున్నది. మరొకప్పుడు తనను తాను మరచి “నేను ఒక జీవుడను (microcosm)… నేను ఈ శరీరమును… ఇవి నావి….. ఇవి కావు…. ఇవి నాకే ఉండాలి……” మొదలుగా గల అనేక జీవ భ్రాంతులకు లోను అగుచున్నది. మరల అర్హత పొంది, గురువుల చేత, శాస్త్రములచేత బోధింపబడేంతవరకు తనయొక్క అద్వితీయ పూర్ణానంద స్వరూపమును గుర్తెరుగుట లేదు.

  1. ప్రమత్తత - పరిభ్రమణం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఉత్తమమైన బుద్ధి పొందటమనేది అనేక జన్మలలోని పరిశ్రమకు ప్రయోజనంగా సిద్ధించుచున్నది. ఈ మానవ జన్మ బుద్ధిని సునిశిత పరుచుకొనుటకు ఒక మహత్తరమైన అవకాశము. శాస్త్రములను విచారణ చేయుటచేత, ఉత్తమమైన వైరాగ్యమును ఆశ్రయించుటచేత, ఇంద్రియ నిగ్రహమును అవలంబించుట చేత తనను తాను ఉద్ధరించుకోవాలి. జాగ్రత్ - స్వప్న సుషుప్తుల నుండి అతడు తన చిద్రూపమును వేరుపరుచుకోవాలి.

చైతన్యమే స్వరూపముగా గల ఈ జీవుడు “సంసార మోహము” అనే కల్లు త్రాగి ప్రమత్తతో వుంటున్నాడు. "విషయములు” అనే మృగములు సంచరించే అరణ్యంలో పచార్లు చేస్తూ అనేక ఒడుదుడుకులు అనుభవిస్తున్నాడు. “అజ్ఞానము” అనే మత్తుతో అల్ప దృష్టులచే వేసట పొందుచున్నాడు. దీనికి కారణమేమిటి?

శ్రీరాముడు : “జ్ఞానము” యొక్క అభావనయే. అజ్ఞానముయొక్క ఆశ్రయమే కదా!

Page:358

శ్రీ వసిష్ఠ మహర్షి : “శాస్త్రం - శ్రవణం - ప్రభోదం” అనువాటి సహాయంతో బ్రహ్మ రూపత్వం పొందబడాలి. లేకపోతే ఈ దృశ్యజగత్తు నందు అవిశ్రాంతమైన పరిభ్రమణం తప్పించుకోలేనిది. చిత్తం ప్రబుద్ధం కానంత వరకూ ఆత్మ అనుభూతము కాదు.

ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ, ఈ జగత్తు యొక్క స్థితి “ఊహలోని రూపములు” లాగా మిధ్యాభూతమే అయి వున్నది. చిత్తము యొక్క వృత్తి రూపమే ఈ “జగత్తు" అనబడే కల్పన. శ్రీరాముడు : ‘కల్పితమాత్రం’ అగు ఈ జగత్తును కల్పిస్తున్నది ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃకరణము నందున్న “సర్వసాక్షి" రూపమగు పరమ చైతన్యమే ఈ ‘కలన’ లేక ‘కల్పన’ లేక ‘చిత్తము’ను ప్రకాశింపచేస్తోంది. ఎంతటి చమత్కారమో చూచావా!

చైతన్యము వాస్తవానికి జ్ఞానమే ధర్మముగా కలిగియున్నది. ‘నిత్యబోధ’ స్వరూపమైయున్నది. ‘సర్వసాక్షి’ అయి వున్నది. కాని, చిత్రంగా అంతఃకరణ వృత్తిచే అల్పత్వము చెందుతోంది. అయితే, ఆ అంతఃకరణ వృత్తి ‘సాక్షి చైతన్యము’ యొక్క ‘నిరంతర ప్రబోధ’ చేతనే ప్రవర్తించగలుగుతోంది.

ఒకచోట శిలచే మలచబడిన ఒక నర్తకి శిల్పమున్నదనుకో…. ఆ శిలాకన్య స్వయముగా నృత్యము చేయగలదా? లేదు కదా! అట్లే, సాక్షి చైతన్యము లేకపోతే ఈ మనస్సు గాని, ‘కలన’గాని ఎక్కడా దేనిని ఎరుగజాలవు. చిత్రంలోని రాజు శంఖం పూరించు శబ్దం వినిపించలేనట్లు, మృగతృష్ణా సదృశమైన ఈ మనస్సు కూడా చైతన్యము యొక్క సహకారం లేకపోతే క్రియావంతం కాలేదు. ఆత్మ యొక్క శక్తి చేతనే మనస్సు ఉంటోంది. వాస్తవానికి ఆత్మకు వేరుగా ‘మనస్సు’ అనేదే లేదని మనం ఇతఃపూర్వమే కొన్నిసార్లు చెప్పుకున్నాం.

రాముని కంటే వేరుగా రాముని గుణములు వుంటాయా? జలమునకు వేరుగా తరంగాలు వుంటాయా? …మనస్సు గాని, సంకల్పము గాని ఆత్మకు వేరుగా లేవు. అవి శుద్ధ చైతన్యము కంటే వేరు కాదు.

అయితే అజ్ఞానుల స్ఫురణశక్తి యొక్క బాహ్య ప్రసరణచే ‘మనస్సు’ అనే పేరుతో అధ్యాత్మశాస్త్ర బోధ కొరకు చెప్పుకుంటున్నాం. సంకల్పము గాని, విషయ వృత్తులు గాని ఏర్పడనప్పటి ‘జీవసంవిత్తు’ పరమాత్మయే అగుచున్నది.

జీవుడు - ఈ ‘జీవుడు’ అనబడువాడు… స్పందాత్మకమగు ప్రాణం మరియు చిదాత్మకమగు ఆత్మతత్వం ఈ రెండింటి యొక్క అజ్ఞానపూరితమైన “అధ్యాస” చేతనే ఉత్పన్నమగుచున్నాడు. చిద్రూపము చమత్కారములైన ‘కల్పనలు” చేయుచున్నవి.

“ఈ దేహమే నేను, ఇది నా స్వభావము”… “ఈ పుత్రుడు - భార్య - ధనము - ఇవన్నీ నావి”… “ఇవి సుఖకరములు ఇవి దుఃఖకరములు”… “ఇవి ప్రియములు - గ్రాహ్యములు -

ఇవి త్యాజ్యములు”… “ఇవి మాజాతి - అది కాదు”… ఇత్యాది జడభావములను ఆశ్రయిస్తోంది. అట్లు ఆశ్రయిస్తున్న సందర్భములో మనం ఆ చిద్రూపమును “జీవుడు’ అని అంటున్నాం.

Page:359

శ్రీరాముడు : అట్టి జీవునికి బుద్ధి చిత్తము మొదలైనవన్నీ ఎక్కడినుండి వచ్చి చేరుతున్నాయి? ఈ జగత్తు ఎక్కడినుండి ఏర్పడుచున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పం నుంచి ఏర్పడుతోంది. సంకల్పమే జగత్తు. …కాని సంకల్పమునకు స్వకీయమైన ఉనికి ఎక్కడ? అట్టి “అసత్తు” అయినట్టి సంకల్పమునకే “బుద్ధి - చిత్తము – జీవుడు.” మొదలైన పేర్లను శాస్త్రవేత్తలు కల్పించడం జరిగింది. కాని, పరమార్థానికి అవేవీ లేవు.

కేవలం ఆత్మయే ఏకరసమై సర్వదా అన్నివైపులా, అన్ని వేళలా వెలుగొందుచున్నది. అందుచేత, ఈ జగత్తు అంతా ఆత్మయే. ఈ కాలము యొక్క క్రమము కూడా ఆత్మయే. ఆత్మ ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమై, స్వచ్ఛమై వెలుగుచూ వున్నది. అది అత్యంత నిర్మలమైనది. అది అల్ప బుద్ధికి “లేదేమో!“ అని అనిపిస్తోంది. కాని సర్వదా సర్వము నందు శుద్ధ చిద్రూపమై వెలయుచునే ఉంది. ఈ కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలకు లభించదు కాబట్టి ”అది అసత్తు”గా కొందరు అవగాహన చేసుకుంటున్నారు. ఇంద్రియములకు అవిషయమైనది, కేవలము అనుభవమునకు మాత్రం ప్రాప్తించేది అయినట్టి ఆత్మ సర్వదా సద్వస్తువేనయ్యా!

శ్రీరాముడు : అట్టి ఆత్మ సాక్షాత్కారం దూరస్థమగుటకు కారణం ఈ మనస్సే కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను. విషయములు అనే వాసనలను కలిగియున్నంత వరకు ఈ మనస్సు ప్రతిబంధకమే అయి ఉంటోంది. అయితే, ఎక్కడైతే చిత్స్వరూప సాక్షాత్కారం కలిగి ఉంటుందో అక్కడ అజ్ఞాన కారణమైన ఈ మనస్సు తనంతట తానే శమిస్తోంది. వెలుతురు వుండే చోట చీకటి ఎట్లావుంటుంది?

  1. “ఆత్మ దృష్టి” ఉన్న చోట ఈ దృశ్యము అదృశ్యమై వుంటోంది.

  2. "దృశ్య దృష్టి” అవలింబించే చోట ‘ఆత్మ’ అనుభవమునకు లభించడం లేదు. అనగా, చిత్తముచే కల్పించబడిన మిధ్యావస్తువు, మిధ్యా సంబంధములు మననము చేస్తూ వుంటే, ఆత్మ విస్మరించబడుతోంది.

దృష్టియే సృష్టి. దృష్టియే జగత్తు. ఏది ఏ దృష్టితో చూస్తే ఇది ఆ విధముగానే ప్రాప్తిస్తోంది. మరొకరకముగా చెప్పాలంటే అతి స్వచ్ఛమైన “ఆత్మ సంవిత్తు” యొక్క సంకల్ప పరంపరల చేతనే ఈ దృశ్యములన్నీ ఆవిర్భూతములగుచున్నాయి. అందుచేత రామా! నీవు ఈ ’దృశ్యదృష్టి’ని త్యజించు. ‘ఆత్మదృష్టి’నే ఆశ్రయించు. “నాకు ఇష్టమైన వారు, నాకు ఇష్టము లేని వారు కూడా ఆత్మస్వరూపులే కాని, మరింకేమి కారు” అనే అవగాహన కలిగి ఉండి, ఇక ఆపై విధివిధానముల ప్రకారం నీ కార్యక్రమములను నిర్వర్తించు.

శ్రీరాముడు : ఆత్మ యొక్క దర్శనం అవడం ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పమే చిత్తము. పరమాత్ముని సంకల్పమే ‘జగత్తు’ అనబడు దృశ్యము. సంకల్పము యొక్క అభావమే…. చిత్తము యొక్క నాశనము కూడా. చిత్తము అభావించబడితే…. ఇక ఆపై మోక్షము స్వతహాగానే ఎదురు వచ్చి నిలబడగలదు.

Page:360

సంకల్పము ఉంటే మనస్సు ఉంటుంది. మనస్సు అడ్డుగా ఉన్నంతవరకూ ఆత్మ దర్శనము కాదు. సర్వ సంకల్పములు త్యజించబడ్డాయనుకో… ఇకప్పుడు శేషించేది సత్తా సామన్యమే.

ఆత్మసందర్శనం - కాబట్టి నీవు ఈ “నేను - నాది” అను మూలవృత్తులతో సహా సర్వ -

సంకల్పములకు ఆవలకు చేరుకో. అప్పుడిక మిగిలి ఉండే ’సత్తాస్థితి’ యందు స్వస్థుడవై ఉండు. శ్రీరాముడు : ఈ ‘నేను - నాది’ అనబడే మూలవృత్తులు ఎందు నిమిత్తం, ఎందులో నుంచి, ఎప్పుడు, ఎట్లా బయల్వెడలుచున్నాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవి బయల్వెడుచున్నది చిత్తము నుండే. చిత్తమో…. ఆత్మ సత్తా నుండే.

ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయముగా ‘సంకల్పము’ అనబడు క్రియా విశేషము వైపుగా ఉన్ముఖమగుచున్నది. అప్పుడది తన యొక్క “చిత్స్వరూపము”నందు కించిత్ ‘అన్యధా’ భావము పొందుచున్నది. ఆ ‘అన్యధా’ యొక్క రూపమే - “అహము… త్వమ్… సః” (నేను-నీవు-అతడు) అనునవి. అట్టి అన్యధా భావమే ఈ సంసారోత్పత్తికి హేతువు. ఆ సమయంలో ఏర్పడుచున్న ‘ధ్యాస’ కు ‘చిత్తము’ అను పేరు పెట్టబడింది. "కనుక ‘అన్యధా’ అను ధ్యాస యొక్క ప్రసరణయే చిత్తమునకు బీజము” - అని శాస్త్రములు ప్రవచిస్తున్నాయి.

కలన (Illusion): కలన లేక కల్పన అను మరొక పేరు కూడా ఉపయోగించబడింది. ఆత్మ తన యొక్క నిత్య నూతనమగు "నిర్వికల్ప చిత్స్వభావము” నుండి ఒకానొకప్పుడు ‘చ్యుతి’ పొందినదగుచున్నది. అట్లు ‘సంకల్ప వ్యవహారము’ కళంకితమైన సత్తయే ’కలన’అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అట్టి ’కలన’ యొక్క ప్రతిభ చేత ఈ జగత్తు యొక్క ఉత్పత్తి నిమిత్తం ‘మనస్సు’ ఆవిర్భవిస్తోంది. సంకల్పములే మనస్సు యొక్క రూపం.

కలనయే ప్రాణశక్తి కూడా. ప్రాణశక్తి నిరోధించబడినప్పుడు మనస్సు కూడా విలయమగు చున్నది. ఒక అద్దం పగిలిపోతే, ఆ అద్దంతో పాటే అందలి ప్రతిబింబం కూడా నశించడం జరుగుతుంది కదా! ప్రతిబింబము దర్పణము యొక్క కల్పిత రూపమే అయినట్లుగా, ఈ మనస్సు కూడా ప్రాణము యొక్క రూపమే అయి వున్నది.

స్పందనము + అనుభవము = మనస్సు, ప్రాణము.

ఒక్కడు ఎక్కడో దూరముగా ఉన్న ఒకానొక పదార్థముయొక్క మానసికానుభవం తన యందు పొందుచున్నాడనుకో… అట్టి మనోకల్పిత పదార్ధముతో ఏర్పడిన అట్టి సంబంధము ఒకా నొక ‘గతిశక్తి’ చేతనే సంభవిస్తోంది కదా! ఆ గతి శక్తినే ‘స్పందనము’ అని కూడా అంటున్నాం. అట్టి గతి శక్తి చిత్తముతో కూడుకొని ఉన్నప్పుడు ‘అనుభవము’ అనునది సిద్ధిస్తోంది. చిత్తము మరెక్కడో వుంటే… ఆ సమయములో ’చూపు’ ఒక వస్తువుపై ప్రసరించినప్పటికి ఆ అనుభవము’ అనునది ఏర్పడదు. కనుక చిత్తమే ఒక వస్తువుతోనో లేక విషయముతోనో ఏర్పడే ’సంబంధము’ను నిర్వచించడం, శాసించడం జరుగుతోంది. అందుచేత చిత్తమే జగత్తు. చిత్తమే సంసారము.

Page:361

“స్పందము - అనుభవము" ఈ ఉభయ శక్తుల సమ్మేళనమే భావాభావములకు కారణం. -

వాటి సమ్మేళనమే ‘ప్రాణము’. ఆ ప్రాణమే మనస్సు. ’ప్రాణవాయుశక్తి’ని చలింపచేసేది చైతన్యమే!

ప్రాణవాయువు సర్వ రాగములు త్యజించుట చేతను, (వైరాగ్యము చేతను), ప్రాణాయామ అభ్యాసము చేతను, సమాధిని ఆశ్రయించుట చేతను అసద్వ్యసనములు క్షయించుట చేతను, పరమార్థమైనట్టి ‘బ్రహ్మజ్ఞానము’ చేతను నిరోధింపబడగలదు. ఈ ప్రాణవాయు శక్తి చలనరూపమే అయి ఉన్నది కదా! అది తన యందు చలన శక్తి కలిగియున్నప్పటికీ అది స్వయముగా తనకు తాను చలించలేదు. అనగా అది స్వతహాగా జడమైనదే. దానిని చలింపచేయునది ఎవరు?… ఆత్మ చైతన్యమే సుమా! …అట్లాగే మనస్సు కూడా. మనస్సు స్వతహాగా జడమే అయివుండి, ఆత్మ చైతన్యము చేత ప్రవర్తింపచేయబడుచున్నది. ఆ ఆత్మయే స్వయం ప్రతిభచే ‘చితశక్తి’ లేక జ్ఞానశక్తి స్వరూపమై, అతి స్వచ్ఛమైన, స్వయంవ్యాపకమై ఉన్నది.

సంకల్పించకపోవడమే మనో నాశనం - సంసారోపశమనం.

ఈ వర్తమానపు ఉపశమన ప్రకరణము యొక్క సారాంశము సంక్షిప్తముగా రెండు మూడు వాక్యాలలో చెప్పుకోవాలంటే…

“చిత్+స్పందశక్తి” ఈ రెండింటి యొక్క సంబంధమే మనస్సు. అట్టి సంబంధము మిధ్యారూపమున ఉత్పన్నమగుచున్నది. కనుక మనస్సు మిధ్యయే అయి ఉన్నది. అందుకే ఈ మనస్సును ‘అవిద్య - మాయ’ అని కూడా అంటున్నాం. అదియే ఈ ‘సంసారము’ అను దానిని కలుగజేస్తున్న అజ్ఞానం. చిత్ - స్పందములకు ‘సంకల్పించుట’ అను ప్రక్రియ చేత సంబంధము ఏర్పడుచున్నది. కనుక సంకల్పించుటయే మనస్సు యొక్క రూపము.

అందుచేత - ‘సంకల్పించకుండుట’ అను విశ్రాంతిచే ఈ ‘సంసారము’ అనబడేది తృటిలో జయించివేయబడగలదు. ఈ జగత్తు యొక్క ఉపశమనము సంకల్ప రాహిత్యము చేతనే జరుగగలదు.

  1. ‘జలము’ ఉపమానం - చైతన్యము

శ్రీ వసిష్ఠ మహర్షి : జలమును - - తరంగములను ఉపమానంగా తీసుకొని చైతన్య తత్త్వమును విశదీకరిస్తాను. వినుజలమును భేదదృష్టితో దర్శిస్తున్నప్పుడు …జలము యొక్క కదలిక, తరంగ దృష్టి, తరంగాలు” …అనే వివర్తము ఏర్పడుతోంది. అదే విధంగా చైతన్యమే … స్పందనశక్తి, అంతఃకరణము యొక్క సంకల్పము, చిత్తము" … అయి ఉంది.

వాయువు నందలి చలనముతో పోల్చతగు స్పందనశక్తి (Vibration) ఒకప్పుడు చైతన్యము చేత ప్రబోధితం అవుతోంది. విషయములతో కూడిన చైతన్యమే సంకల్ప పరంపరల ఫలితంగా చిత్తముగా పరిణమిస్తోంది.

Page:362

ఈ చిత్తము (మనస్సు) అనబడేది ఒక బాలునికి కనిపించే దయ్యం లాగా మిధ్యారూపంగా కల్పించబడుచున్నది. తరంగము వాస్తవానికి జలమే కదా! ఈ చిత్తము యొక్క వాస్తవ స్వరూపం కూడా అఖండ మండలాకారమగు ఆ చిద్వస్తువే సుమా!

ఎక్కడైనా తరంగములు ఏ ప్రయత్నమైనా చేసి జలాన్ని ఖండించగలవా? జలాన్ని తరంగం ఖండించటం ఏమిటి? అది మొదలే హాస్యాస్పదం. అట్లాగే, ఆ "చిత్స్వభావము” (చిత్ యొక్క నిర్మలత్వము - పూర్ణత్వము - అఖండత్వములను) ఏ అన్యమైన దాని చేతను ఖండింపబడజాలదు. జలము .. ఒకానొక ద్రవపదార్ధము. తరంగమో… ఆ జలము యొక్క కదలికచే ఏర్పడే ఒకానొక ఆకారము. ఈ రెండూ అభేదమే కనుక అవి ఒకదానిని మరొకటి ఎదుర్కొనటమనేది ఉండదు. అట్లాగే ’చిత్’కు ’అచిత్’క్కు అసలు అభేదమే ఘటిల్లదు. మరి అచిత్ (దృశ్య పదార్ధము - నీవు - నేను మొదలైనవి) బయలుదేరి చిన్ను మరొకటిగా ఎట్లా చేస్తుంది? చిత్ను ఖండించటమేమిటి? తరంగముల భేదం చేత జలం వేరువేరు కానట్లే ’జీవులు - జగములు’ మొదలైన వాటి చేత చిత్ ఖండం కాదు కాబట్టి అది “అఖండము”.

మనస్సు అనునది ఎక్కడ? జలములో ‘తరంగము’ అని చెప్పబడే వేతైన పదార్థమున్నదా? కనుక, “చిత్ మనస్సు అను స్పందన కలిగి ఉన్నది! ఆ మనస్సు ఆత్మను ఆవరించి ఉంటోంది” అనునవన్నీ అల్పమైన ప్రవచనములు మాత్రమే.

అభేదము దర్శిస్తున్నప్పుడో…! ఒక వేళ ఈ ‘చిత్’ స్పందరహితమై అమనస్కంగా ప్రకాశిస్తోంది అనుకో.. అట్టి స్థితిలో కేవలము చిద్రూపమే శేషించి ఉంటుంది కదా! ఇకప్పుడు మనస్సుకు చోటు గాని, రూపము గాని ఉండదు. ‘నేను కేవల స్వరూపుడను’ అను అచింత్యమైన ఎఱుక మాత్రం ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఈ విధంగా భేద - అభేదములు అనబడే రెండు పక్షము లందు "చిత్తము అనబడే పదార్దమే లేదు.” అని విశ్లేషించబడుతోంది. అయితే “మరి మాకు మనస్సు అనుభవమౌతోంది కదా…!” అని ఎవరైనా అంటారేమో!

నాయనలారా! ఆ మనస్సుగాని, చిత్తముగాని మీ స్వస్వరూపము కంటే వేరైనవి కావు, కానేరవు. వేరుగా తోచుట భ్రమ మాత్రమే. ఇక మీరో? … చిత్ యే స్వరూపముగా కలిగి ఉన్నవారు. భ్రమ చేత మాత్రమే అనుభవమగుచున్న ఈ చిత్తము అనబడు దానిని “సమ్యక్” యొక్క అభ్యాసముచే జయించి వేయండి. అట్టి అభ్యాసము యొక్క ప్రయోజనమే “బ్రహ్మజ్ఞానము”.

అందుచేత ఓ రామచంద్రా! నీవు “మనస్సు అనబడేది ఒకటి ఉన్నది. ఏదేదో చేసి దానిని తొలగిస్తాను” … అనే దుర్బల మనఃసంకల్పములను దరికి రానీయకు. అట్లు మొండిగా భావించుటచే కొందరు శ్రమ - క్లేశములకు లోనగుచున్నారు. ఉన్న వస్తువునైతే మనం తొలగించుటకు ప్రయత్నించ వచ్చు. లేని వస్తువును ఎట్లా తొలగిస్తాం? ’సంకల్పించుట’ అను క్రియను మాని వేసి చూడు. ఇక ‘మనస్సు’ అనేది ఎక్కడున్నది? అభ్యాసమే సంకల్పరాహిత్య స్థితిని ధ్రువీకరించటానికి ఉపాయం.

Page:363

శ్రీరాముడు : తండ్రీ! సంకల్పాత్మకమైన మనస్సు అనబడేది అసలు ఉందా? లేక లేదా? …“మనస్సుచే ఈ జీవుడు బద్ధుడగుచున్నాడు” అని కొన్ని శాస్త్రములు చెప్పుచున్నాయి కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : “సంకల్పాత్మకమగు మనస్సు" అనునది ఎక్కడా లేదు. సంకల్పము చేయుటయే మనస్సుగా చెప్పబడుతోంది. అది మిధ్యా జ్ఞానముచే ఉత్పన్నమగుచున్నది. కల్పనయే దాని రూపము. హృదయమందు ఉన్నట్టి సాక్షి చైతన్యమునకు జ్ఞానోదయమైన మరుక్షణం అది శమించిపోవుచున్నది.

ఈ మనస్సు జడమైనది మాత్రమే. దానిని తొలగిస్తున్నది సాక్షి చైతన్య స్వరూపుడవగు నీవే. “నేను ఆత్మస్వరూపుడనే” అను భావనను ఆశ్రయించావా… ఇక అది మృతప్రాయమే అగుచున్నది. ఎఱిగినంత మాత్రం చేత మృతప్రాయంగా మిగిలిపోయే ఈ మనస్సుచే ఈ ప్రపంచము సృష్టించబడట మేమిటి? పొందబడుట ఏమిటి? రూపము గాని, ఆధారము గాని లేని మనస్సుచే సాక్షి చైతన్యుడవగు నీవు బాధింపబడటం ఏమిటి?… ఇవన్నీ మూర్ఖ వాక్యములు కావా చెప్పు?… నెమలి ఈకచే కొండ పిండి చేయబడటమంటే ఎట్లాంటిదో…. చంద్ర కిరణము తాకుటచే బుగ్గలు కందటమంటే ఎటువంటిదో… స్వతః సిద్ధమగు ఉనికియే లేని మనస్సుచే ఆత్మ స్వరూపుడగు జీవుడు హింసించబడటం కూడా అట్టిదే!

“ఒకడు మనస్సుచే అనేకచోట్లకు ఈడ్వబడుచున్నాడు”… “మరొకడు ఈ మనస్సును జయించడానికి తీర్థయాత్రల నిమిత్తమై దట్టమైన అడవులలోకి ప్రయాణములు చేస్తున్నాడు”… ఇటువంటి కథనమంతా మా దృష్టిలో చిన్నపిల్లల చేష్టలే. పరమార్థ దృష్టిచే మనస్సు మొదలైనవి లేవు. “ఏకమ్ సత్” అని శాస్త్రాలు అనటంలో ఉద్దేశ్యం అదే! ఎందుకంటే మనస్సు ఒక మిధ్యా రచనయే కదా! ఎంత అన్వేషించినా “ఇదిగో, మనస్సు అనబడునది ఇక్కడ ఈ రూపంలో ఉంది” …..అన్నట్లుగా మనకేమన్నా లభించుచున్నదా?…లేనే లేదు. ఒక మిధ్యా వస్తువు చైతన్య మూర్తిని జయించుటయా? స్వప్నంలో కనిపించిన ఒక చెఱువులో ఆ స్వప్న ద్రష్ట మునిగి మరణించుటయా?

ఆహా! మహామాయావి అగు ఆ మయునిచే సృష్టించబడిన ఇక్కడి ‘దృశ్యము’ అను మాయ ఎంతటి చమత్కారమైనదో చూస్తున్నావా రామా? తనకు స్వరూపమే లేదు…. ఊరుకున్నంత మాత్రం చేతనే, అది లేకయే పోగలదు… అటువంటి ’మనస్సు" అనబడు మిధ్యా వస్తువుచే ఈ జనులందరు ఆడించబడుచున్నారు. కనుక మనస్సు స్వయంకల్పితం మాత్రమే కాని, ఎవరో కల్పించి మనకు అంటకట్టింది కాదు.

  1. అజ్ఞానవశం చేత….

శ్రీవసిష్ఠ మహర్షి: ఎప్పుడైతే అజ్ఞానం కలిగిందో, అప్పుడు ఈ జీవుడు సర్వ ఆపదలకు అర్హుడగు చున్నాడు. ఆతడు పొందని క్లేశం ఏమున్నది…? అసలు ఈ ‘సృష్టి’ అంతా కూడా అజ్ఞాన కారణంగానే ఉత్పన్నమగుచున్నది. అయ్యో! ఎంతటి విషాదకరమైన విషయం! ఈ జీవుడు అజ్ఞాన వశం చేతనే ‘మనస్సు’ దేహం మొదలైనవిగా గల జడవస్తువులచే బాధింపబడుచున్నాడు. పోనీ ఆతడు సరిగ్గా

Page:364

పరిశీలన చేస్తున్నాడా? లేదు. మరల మరల ‘అసన్మార్గము’నే అవలంబిస్తున్నాడు. తన దుఃఖము కొరకే ఈ సృష్టిని సమాశ్రయించి ఉంటున్నాడు.

శ్రీ రాముడు : మరి ఈ జాడ్యమునకు ఉపాయం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు, ఈ సృష్టి - ఇవన్నీ ఎట్లా ఉత్పన్నమైనాయి? ‘అవిచారణ’ చేతనే కదా! అందుచేత అజ్ఞానమయమైన ఈ సృష్టి ‘సువిచారణ’ మాత్రం చేత పేలవమైపోతోంది. ఇక దీనిని గురించి దుఃఖించటం ఎందుకు?

ఈ సృష్టి మనుజుని స్వయం కల్పితమైనట్టి ‘భ్రాంతి’ యొక్క రూపమే అయి ఉన్నది. “సాయంకాలం ఆకాశంలో పక్షులు అటూ ఇటూ ఎగురుతుంటే అది నాకు నా ప్రియురాలి విరహం గుర్తు చేస్తోంది" అనే వ్యాఖ్యానం ఎంతగా భ్రమ స్వయం కల్పితమో, ఈ సృష్టిని కూడా ఈ జీవుడు అట్టి స్వయంకల్పిత కథనముల చేతనే పొందుచున్నాడు. అట్టి కథనములను మొదలంటా త్యజించాడా… ఇక ఇదంతా ఆ జీవుడు తన స్వస్వరూపంగానే ఆస్వాదించగలడు.

ఏది ఏమైతేనేం? “మిధ్యారూపము, కల్పితము, ఎచ్చటా కూడా ఉనికి లేనిది, అల్పము” అయినట్టి ఈ మనస్సు చేత లోకమంతా హతం కావటం మనం చూస్తున్నాం. అయితే, మానవుడన్న వాడు కల్పితమయమగు ఈ సృష్టిని, ’అసద్రూపము’ అయి ఉన్న ఈ మనస్సును తన వశం చేసుకో వటానికి సిద్ధపడాలి. అట్లా సిద్ధపడని వాడు అద్యాత్మ జ్ఞానప్రవేశమునకు ఏ విధంగా అర్హుడు కాగలడు చెప్పు? అల్పదృష్టి, స్వల్పములనైన వాటి కొరకు ఆశ, బలహీనమైన అవగాహనలు గల జీవుల యొక్క దుష్టబుద్ధి బాహ్యపదార్ధము లందే స్థిరపడిపోయి ఉంటుంది. “వీటిని పొందితే నేను పూర్ణత్వమును పొందుతాను” అని భ్రమను చెందుతోంది. అట్టి బుద్ధి తన అంతరంగము యొక్క స్వరూపమును గ్రహించలేకపోతోంది. సూక్ష్మమైన విశేషములను గుర్తించలేకపోతోంది. సూక్ష్మ బుద్ధి లేని సమయములో ఈ సంసారము యొక్క అల్ప శబ్దములకు కూడా ఈ మనస్సు భీతిల్లుచున్నదే! అల్పమైన విషయముల పట్ల అహంకార - మమకారములు ఏర్పడుచున్నవే!

జ్ఞాన శూన్యుడైనవాడు తన యొక్క మనస్సు చేతనే అతి క్రూరముగా దీర్ఘకాలము నుండి హింసించబడుచున్నాడు. స్వల్ప సుఖములచే పరిపరి విధములుగా మోసగించబడుచున్నాడు.

అనేకమైన అపనమ్మకములతో, స్వల్పములయిన విషయముల మధ్య ఉన్మత్తుడై వ్యవహరించే అట్టి వాని ముందు ఉత్కృష్టమైన సత్య విషయములను ప్రతిపాదించుట ఎట్లాగో మేము గ్రహించ లేకపోతున్నాము.

Page:365

  1. ఉపదేశములకు అర్హులు - - అనర్హులు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇప్పుడు శాస్త్రములచే చెప్పబడు ఉపదేశముల సారమును గ్రహించనట్టి వారి విషయమై కొన్ని విషయములు సర్వజనులకు మనవి చేస్తున్నాను.

కొందరు జనులు ఈ సంసార సాగరములో “విషయ - సుఖాభిలాషలు” అనే తరంగములచే కొట్టుకొని పోబడుచున్నారు. ’పరమార్థ విషయము’లో వారు అత్యంత చెవిటితనం, మూగతనం వహించి ఉంటున్నారు. ఆత్మ తత్వ విచారణ చేయడం, యుక్తి సహాయంతో ఉత్తమ సత్యమును పరిశీలించటం - ఇవన్నీ వారిని సమీపించుట లేదు. అట్టివారు అధ్యాత్మ విద్యను గ్రహించడానికి అనర్హులే అగుచున్నారు.

“కళ్లు మూసుకొనే నడుస్తాం! అది అంతే” అని చెప్పుకుంటూ కళ్లు తెరవని బాటసారికి బాట ప్రక్కన గల పూతోటను ఎవరు చూపించగలరు? వాసన చూడలేని వారికి సుగంధం వెదజల్లే అత్తరులు, రసాయనాలు అందిస్తే ఏం ప్రయోజనం? మత్తుగా త్రాగినవాడికి ‘వాదము - చర్చ’ ద్వారా నిజము నిరూపించడానికి ప్రయత్నించగలమా? ఆతడు న్యాయ నిర్ణయమును అర్థం చేసుకో గలడా? విచక్షణ - సద్విమర్శలను ఆకళింపు చేసుకోగలడా?

ఒకడు తన సందేహములను తీర్చుకోవడానికని శ్మశానానికి వెళ్ళి పెద్ద గొంతుకుతో శవ పేటికలతో అరిచి చెప్పితే ఏదైనా ప్రయోజనముంటుందా? మూర్ఖునికి నీతి వాక్యములు వినిపించ గలమా? మనస్సు మొండికేస్తూ ఉండగా దురభ్యాసములకు దాసోహమగుచున్న వానికి సన్మార్గము యొక్క ఔన్నత్యము గురించి చెప్పే సుందరమైన భాషాప్రయోగాలు ఎందుకు పనికి వస్తాయి? అనర్హుల ముందు ఆధ్యాత్మ విద్యను ప్రతిపాదించడం అట్టిదే అగుచున్నది.

ఓ సర్వజనులారా! నాదొక విన్నపము. ఏ మనస్సైతే ‘యదార్థానికి లేదు’ అని క్రిందటి సర్గలో మనం నిరూపించామో… “అట్టి మనస్సు నా ఇచ్ఛ యొక్క రూపమే. ఇచ్ఛ, అభ్యాసములను బట్టి మనస్సు ఉంటోంది. కనుక “ఇచ్ఛ, అభ్యాసములు సరి అయిన మార్గములో నియమిస్తూ ఉంటే ఇక మనస్సు జయించబడినట్లే” అని ఎందుకు సంభావించరాదు?

మరొక విషయం. ఒకానొక బాటలో “ఆ దూరంగా ఎత్తుగా కన్పిస్తున్నది ఒక పెద్ద బండ రాయేమో?” అని సందేహము, భయము ఏర్పడి ఉన్నాయనుకో… అది దూరముగా చూచిన రథ సారధి “అయ్యో! ఎట్లా ప్రయాణించడం … అని భయపడుతున్నాడనుకుందాం. ఇంతలో “అది బండరాయి కాదు, ఏదో క్రీనీడ మాత్రమే… అక్కడ బండరాయి లేదు” అని ఎదురుగా వస్తున్న బాటసారులు చెప్పారు. ఇప్పుడు "ఆ బండరాయి తొలగించబడినట్లే” అని ఎందుకు భావించరాదు. శ్రీరాముడు : అవును. రథసారధి నిరభ్యంతరంగా అట్లు భావించవచ్చు.

శ్రీ వసిష్ఠ మహర్షి : అదే రీతిగా “మనస్సు అనేదే లేదు” అని శాస్త్రములు, మేము కూడా

Page:366

స్వానుభవ పూర్వకంగా ప్రకటిస్తున్నాం కదా! కాబట్టి "ఈ మనస్సు సర్వదా తొలగించబడినట్లే” అని

ఎందుకు భావించరాదు.

యదార్థానికి ‘లేనిదే’ అయినట్టి మనస్సుకు “ఈ మనస్సును జయించడం మా వల్ల కాదు” అనుకుంటూ తిరుగాడే వారు ఎక్కడో దూరముగా కనిపించిన త్రాడును చూచి పామనుకుని ఇక్కడ నుఱుగులు కక్కేవారే అవుతారు.

జ్ఞానదృష్టి - జ్ఞాని ఎల్ల వేళల తన ఆత్మనే సర్వత్ర దర్శిస్తూ ఉంటాడు. ఆయా తదితర శరీరములను చూచుచున్నప్పుడు “ఓహో! ఇక్కడ ప్రాణ శక్తులు ప్రకటనమగుచున్నాయి కదా!” అని మాత్రమే తలచుచున్నాడు. ఆ శరీరములలో ఆత్మయే చైతన్యమూర్తిగా వ్యవహరిస్తూ జడమగు ప్రాణాదులను చలింపజేయుచున్నదని గ్రహిస్తున్నాడు. రెండు పాత్రలలోని ఒకే ద్రవము వలే, రెండు గృహముల స్థానంలో ఒకే ఆకాశము వలే, ఈ నానా విధ దేహాలలో ఒకే ఆత్మ అధిష్టించి ఉంటోందని ఆతడు ఎరుగుచున్నాడు.

జ్ఞాని తన ఇంద్రియములను చూచి “ఓహో! మీరంతా మీ మీ ధర్మములను నియుక్తులగు చున్నారు కదా! మంచిది” అను విధముగా దర్శిస్తున్నాడు. ఇక అతనికి మనస్సు అనేదేదీ, ఎక్కడా

వేరే అగుపించదు.

ఆత్మ… జ్ఞానశక్తి కలిగి ఉంటుంది. ప్రాణములు స్పందనశక్తి కలిగి ఉంటున్నాయి. ఇంద్రియములు… రూపము, రసము మొదలైన వాటిని సాక్షాత్కరించుకొను శక్తి కలిగి ఉంటున్నాయి.

"ఈ ఆత్మ - ప్రాణ - ఇంద్రియములు వాటి ధర్మములను అనుసరించి ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. మరిక బంధం ఎవరికి?… ఎక్కడ?…” అని జ్ఞాని ప్రపంచమును ప్రశ్నిస్తున్నాడు.

ఈ కనబడే జీవులందరిలో ప్రస్ఫుటమగుచున్న వ్యవహార శక్తంతా సర్వ శక్తిమంతుడు, సర్వ నిర్మాత అగు ఆ పరమాత్మ యొక్క కిరణముల ప్రసరణయే అయి ఉన్నది. అదిగో! ఆకాశములో సూర్యుని చూడు. అనంత సంఖ్యలో సూర్య బింబము నుండి కిరణాలు బయలు దేరుచున్నాయి. ఆ కిరణములన్నీ సూర్యుని స్వభావమును వేరైనవి కావు. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క వస్తువును ప్రకాశింప జేస్తోంది. కాబట్టి “తటాకంపై ప్రసరించే కిరణం వేరు… ఇంటిపై ప్రసరిస్తున్న కిరణం వేరు”… అని అనగలమా? లేదు కదా! ”ఈ వేరువేరు జీవరాసుల ద్వారా ప్రకటితమగుచున్న దంతా ఒకే ఆత్మ శక్తియే" అను అనుభవం ఉత్తమ జ్ఞానులు పొందుచున్నారు. ఏ జీవి దేనిని అవగాహన చేసుకుంటున్నప్పటికీ “ఎఱుగుట” అను స్వభావము ఒకే తీరై ఉన్నది కదా!

జగత్తు లేదు… ఆత్మయే ఉన్నది - ఈ జగత్తును విజ్ఞాన దృష్టితోను, భ్రాంతి రహితమైన దృష్టితోను చూస్తున్నప్పుడు “ఇది అంధప్రాయమే, లేక, లేనిదే" అని తెలియవస్తోంది. అట్టి ఉత్తమ దృష్టిచే ఈ జీవుడు అనబడువానికి ఆత్మ కంటే వేరైన సత్తా లేనేలేదు. ఈ శృతి వాక్యములు చూడు: “నాన్యోస్తి దృష్టమ్” = ఈ కనబడుచున్నదేదీ బ్రహ్మము కన్నా వేరుగా ఉండుట లేదు. “నాన్యోస్తి విజ్ఞాతమ్” = బ్రహ్మము కంటే వేరుగా ఏదీ తెలియబడుట లేదు. “జీవో బ్రహ్మేతి నాపరః” = ఈ జీవుడు బ్రహ్మమే గాని, వేరే ఏమీ కాదు.

Page:367

…ఈ వాక్యములన్నీ జగత్తు యొక్క మిధ్యత్వమునకు, ఆత్మ యొక్క సత్యత్వ - నిత్యత్వములకు ప్రమాణములగుచున్నాయి.

శ్రీరాముడు : : అయితే స్వామి! “బ్రహ్మము చేతనము - ఈ జీవుడు అచేతనము” - అని అనవచ్చా? శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లా అయితే ఈ జీవుని యందు శక్తి ఉండేది కాదు. స్వకీయమైన ప్రయత్నము - అవగాహన - బంధము - మోక్షము” మొదలగునవి కూడా ఉండేవి కావు. అందుచేత జ్ఞానులు సిద్ధాంతీకరించునది విను‘ఆత్మ’ కంటే వేరుగా ఈ చిత్త జీవులు లేరు. ఉన్నట్లు తోచటమంతా స్వకీయమైన భ్రమచేతనే. అందుచేత నీకు పైపై కనిపిస్తున్న ఈ ‘జీవుడు చిత్తము’ అనునవి ప్రతిబింబ మాత్రములు, అసద్రూపములు మాత్రమే. కనుక “ఈ జీవుల వాస్తవస్వరూపము “నిత్యము-నిర్మలము-అఖండము అయిన ఆత్మయే” - అను దృష్టిని కలిగి ఉండు.

ఓ జనులారా! మీ చేత మీరే కల్పించుకుంటున్న “మనస్సు” అనబడు దాని కారణంగా మీ యొక్క ’పరమార్థ దృష్టి’ని కోల్పోవుచున్నారే! అందుకు ఫలితంగా మీరు పొందుచున్న దుఃఖ పరంపరలను చూస్తుంటే - మానసిక రోగపీడితుడగు కుమారుని బాధలు చూస్తున్న తండ్రిలాగా - మాకు ఎంతో పరితాపం కలుగుతోంది.

మూర్ఖత్వము - పరిమిత దృష్టిని ఆశ్రయించి "సూక్ష్మము, మంద్రము” అయిన ఆత్మ విశ్లేషణా సమాచారం మొదలంట్లా తిరస్కరిస్తున్న మూర్ఖులు అనేకులు ఈ భూమిపై సంచారం చేస్తున్నారు. ఈ ఇంద్రియ విషయములే మహత్తరమైనవని తలచే అట్టివారు తాము పయనిస్తున్న మార్గము ఎట్టిదో ఎరుగలేకున్నారు.

‘గాడిద, మూర్ఖుడు’ - ఈ ఇద్దరు అనేక దుఃఖభారములను అనుభవించుటకే జనించు చున్నారు. అల్పమైన అవగాహనయే కారణం అవటం చేత, మున్ముందుగా “అసంతృప్తి” పొంది, అటు తరువాత “మాకు అవి లేవు, మేము ఇవి పొందలేదు" - ’ అని ఇక ఈ మానవుడు అసంతృప్తికి కారణాలు వెతకడం జరుగుతోంది. నిందించటం, ద్వేషించటం, దూషించటం మొదలైన నరక మార్గ పతితులుగా పరిణమించటం జరుగుతోంది.

సముద్రంలో ఎన్నో బుద్భుదములు లేస్తున్నాయి. అయిస్తున్నాయి. అదేవిధంగా ఈ “దేహం నందు ఆత్మాభిమానం, ఇంద్రియ విషయముల పట్ల ఆకర్షణ, పాప కర్మల పట్ల బుద్ధి కలిగినట్టి అనేక మంది జీవులు జనిస్తున్నారు. మరణిస్తున్నారు. ఎన్నో కోళ్ళు, పశువులు ప్రతిరోజు కసాయివారి చేతులలో విగత జీవులగుచున్నాయి. ఈ భూమిపై జనించే ప్రాణులలో ఎన్నో కోట్ల ఈగలు, దోమలు ప్రతి రోజూ వాయువు చేత నసింపజేయబడుచున్నాయి. జాలరి వల వేసి వేలాది చేపలను పట్టి కాల్వగట్టు ప్రక్కన పరచి అమ్ముచున్నాడు. విచారణ, పరిశీలన లేనట్టి మూర్ఖ మానవుల జన్మలు కూడా అట్టివే అగుచున్నాయి.

Page:368

అట్టి మూర్ఖుల గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? నీటిలో ఒక పెద్ద చేప అనేక చిన్న చేపలను, కీటకములను మ్రింగుచున్నది. ఆ పెద్ద చేప ఒకనాడు ఒక జాలరి చేతికి చిక్కి శల్యమగు చున్నది. పేను వంటి స్వల్పమగు పురుగులను పెద్ద జాతి పురుగులు మ్రింగుతున్నాయి. ఆ పెద్ద జాతి పురుగులు సాలె పురుగు నిర్మించిన గూటిలో చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఆ సాలెపురుగును పెద్ద జాతి బొద్దింక వచ్చి భోంచేస్తోంది. ఆ బొద్దింకను కప్ప భుజిస్తోంది. కప్పను పాము ఆరగిస్తోంది. పామును ముంగిస ముంగిసను పిల్లి - పిల్లిని కుక్క - కుక్కను ఎలుగుబంటి

ఎలుగుబంటిని చిరుత పులి - చిరుత పులిని సింహం - సింహమును శరభం - ఈ విధంగా ఒక

దానిని ఒకటి చంపుకుంటున్నాయి. శరభం పెద్ద కొండను ఎక్కి మేఘమును ఢీకొనబోయి చచ్చుచున్నది.

ఆ మేఘము వాయువుచే తొలగించివేయబడుతోంది. వాయువు పెద్ద పెద్ద పర్వతములచే తన దిశను కోల్పోతోంది. ఆ పర్వతములను వజ్రాయుధం క్షణంలో చూర్ణంగా చేసివేయగలుగుతోంది. వజ్రాయుధం ఇంద్రునిచేతికి దాస్కో హం అవుతోంది. ఆ ఇంద్రుడు విష్ణుదేవునిచే ఒక్కక్షణ కాలంలో నియమించబడుచున్నాడు. మరొక క్షణంలో తొలగించబడుచున్నాడు. అంతటి విష్ణువు వంటివాడు కూడా కాలమహిమ చేత అనేక దుఃఖములతో కూడుకున్న చేప, తాబేలు, పంది వంటి ఉపాధులలో ప్రవేశించవలసి వస్తోంది.

అనేక విషయములు తెలిసిన మహా పండితులు, శరీర సౌష్టవము కలవారు కూడా తమ దేహములలో ప్రవేశించిన సూక్ష్మజీవులచే భక్షించబడుచున్నారు.

చూచావా రామా! ఈ విధంగా ఈ కనబడే ప్రాణి కోట్లన్నీ ఆయా తదితర ఆదిభౌతిక జీవుల పాలబడి విచ్ఛిన్న మగుచున్నాయి. అవి ఈ భూమిపై సంచరిస్తున్న కొద్దికాలం అజ్ఞాన విషయములను ఆశ్రయించి, వాటినే అంటి పెట్టుకొని వుంటున్నాయి. అజ్ఞానం చేతనే ఈ జీవులు పరస్పరం హింసించుకోవడం - భక్షించుకోవడం చేస్తున్నాయి. …. అయితే జ్ఞానికి ఇక్కడ కోరుకొనవలసిన విషయం గాని, ద్వేషించ వలసిన విషయం గాని ఉండుట లేదు.

ఒక పురుగు దగ్గర నుండి అనేక జీవజాతులు ఈ భూమిపై నిరంతరం ఉత్పత్తి, వినాశనములు పొందుచున్నాయి. జలాశయాలలో పెద్ద ఆకారములు గల మొసళ్ళు తిమింగలములు ఉత్పన్నమగు చున్నాయి. భూమి లోపల తేళ్ళు - - పాములు - రకరకాల ఆకారములుగల పురుగులు - ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక ప్రాణి దేహము నందే అనేక సూక్ష్మ ప్రాణులు, విచిత్ర క్రిమిజాలం ఉత్పత్తి పొంది, నివసించి ఇంతలోనే నశిస్తున్నాయి. స్థావరములగు వృక్షములలోను, పొదలలోను, రంగు రంగుల క్రిమి కీటకములు పుట్టుచున్నాయి. మంచుకొండలలో కూడా కొన్ని ప్రాణులు నివాసం కలిగిఉన్నాయి. ఇంకా మలములందు కొన్ని కీటకములు జనించి, చరిస్తున్నాయి. ఇట్టి అసంఖ్యాకములైన రకరకములగు ప్రాణులన్నీ జ్ఞానముతో కూడిన ఆశ్రయము, అవగాహనలు లోపించిన కారణంగానే ఏర్పడుచున్నాయి. అయితే ఇట్టి ఈ సృష్టి వ్యవహారముల పట్ల “అపేక్ష -

Page:369

దుఃఖము - రాగము - ద్వేషము" మొదలైనవి ఉండవలసిన అగత్యమే లేదు. నిరంతర ఉత్పత్తి - వినాశనములతో కూడిన సంసార భ్రమలను ‘సుఖ దుఃఖ’ భావములు రెండూ ఉచితములు కావు. శ్రీరాముడు : ఈ విధంగా మహా వృక్షము యొక్క ఆకుల వలె పలువిధములైన జీవకోట్లు ఉత్పత్తి అగుచున్నాయి. మరల వినాశనం పొందుచున్నాయి. వీరి దుఃఖములన్నీ తొలగేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : తన బుద్ధిని ’సునిశితము - నిర్మలము’ చేసుకొన్న వారికే సత్య దృష్టిచే శాంతి ప్రాప్తించుచున్నది. అల్ప విషయములపై ధ్యాస కలిగి వ్యవహరిస్తున్న కుబుద్ధులను దుఃఖ రహితులను చేయటం ఎలాగో మాకు కూడా తెలియడం లేదు. మా విచారణ వినకుండానే తిరస్కరించే వారి దౌర్బల్యము మేమెట్లా తొలగించగలం చెప్పు? అందుకే శ్రీరామావతారం ఈ జగత్తుకు అత్యావస్యకమై… నీవు అవతరించావు.

ఈ మనుజులలో కూడా కీటక-ఈగ-తేనెటీగ-జంతువు-వృక్ష ధర్మాలు ఆశ్రయించే వారు ఉన్నారు. అట్టివారు ఉపదేశములకు అర్హులు కాలేక పోవుచున్నారు. దృశ్య విషయము లందు సంలగ్నమైన మనస్సు గల మనుజునకు, పశువులకు భేదమేమీ ఉండదు. పశువులు త్రాటితో ఈడ్వబడుతూ ఉంటే, మూఢచిత్తులగు మనుజులు తమ మనస్సుల చేతనే ఈడ్వబడుచున్నారు. ‘స్వచిత్తము’ అనే బురదలో ఇరుక్కొని “సర్వనాశనము” అను పర్యవసానము కొరకై అనేక కార్యారంభములను రచించుకొంటున్న వారిని చూచినప్పుడు - - గోడలు, శిలలు కూడా - "అయ్యో! పాపం” అని రోదిస్తున్నాయి.

శ్రీరాముడు : జీవునికి ఇన్ని దుఃఖములు ప్రాప్తించటానికి కారణమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవరైతే తమ చిత్తములను జయించరో … వారికి అంతటా దుఃఖములే సంప్రాప్తమౌతూ ఉంటాయి. అప్రయత్నశీలురను, పిడివాదములు చేసే వారిని, ఇంద్రియ విషయములే ఉత్తమ ప్రాప్తములుగా భావించే వారిని, దుఃఖ పర్యవసానము గల కార్యక్రమములను పరమ ఉత్సాహహముతో ప్రారంభించే వారిని, వాటిపై గొప్ప నమ్మకము గలవారిని ఆయా పర్యవసానములే ఆలోచింపచేయగలగాలి. లేదా, అవతార మూర్తివగు నీ వర్తనమే మార్గం చూపాలి. వారు వర్తమానములో మాత్రం ఈ బోధకు తగినంతగా అర్హులు అగుటలేదు. ఎవరైతే తమ చిత్తములను జయించి ఉంటారో అట్టివారి పట్ల మా బోధ తెల్లటి వస్త్రముపై రంగు వలె “సుస్థిరము, మహా ప్రభావ సమన్వితము” అగుచున్నది. అర్హులగువారి కొరకై గురువులు వెతుకుతూ ఉంటారు.

  1. మనోనాశనం

శ్రీరాముడు : ‘మనస్సు’ అనబడేది లేదని మీరు చెబుతున్నది అంగీకార యోగ్యమే అయినప్పటికీ,

మమ్ములను ఈ ఈ ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖములు, భయగర్వములు, విడచిపెట్టనంత వరకు ప్రయోజన మేముంటుంది చెప్పండి! అందుచేత మనస్సును అతీత స్థితిలో సుస్థిరపరుచుకోవడం ఎట్లా?

Page:370

శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! పదే పదే చెప్పినదే మరలా చెప్పుచున్నాను. ‘మిధ్యయే’ అయి ఉన్న మనస్సు అనబడేదాని గురించి వ్యర్థమైన కల్పనలు చేయవద్దు. అమ్మచే వర్ణించబడే “ఆ బారెడు జడలతో పిల్లికళ్ళు గల దయ్యం” గురించి విని బాలుడు నిజంగానే “దయ్యము” అనే దానిని చూస్తున్నట్లు భ్రమించి కెవ్వున అరుస్తాడు చూచావా? ఆ విధముగా మనస్సుచే జనులు క్షణంలో బద్ధులు, దుఃఖితులు అగుచున్నారు. ఆత్మ తత్త్వమును ఏ మరిచి మూఢునిలా అనంతకాలం ఈ మనస్సు నలువైపులా విజృంభిస్తూనే ఉంటోంది. అయినా రామా! నీవిప్పుడు ఈ మన సంవాదముచే పరమార్థ సత్యమగు ’ఆత్మ’ను చక్కగా ఎఱుగుచున్నావు కదా! ‘చిత్తము’ అనేది సంకల్ప పరంపరలు కారణంగానే వృద్ధి చెందుతోంది. అందుచేత నీవు ఈ దృశ్య సంకల్పములను వెనువెంటనే త్యజించి వేయి. ఈ దృశ్యమును గనుక నీవు ఆశ్రయించావా… ఇక అంతే .. నీవు చిత్తసహితుడవు, బద్ధుడవు అవుతావు. “ఈ దృశ్యము అసత్యము, అసంభవము కూడా" - అని ఎఱిగిన వాడవై దీనిని త్యజించావా - ఇక నీవు చిత్త రహితుడవు ముక్తుడవు అగుచున్నావు.

ఈ దృశ్యము త్రిగుణముల స్వైరవిహారము కారణముగా మాయతో కూడినదై వుంటోంది. దీనిని ఆశ్రయించావా … బంధము. పూర్తిగా త్యజించావా …మోక్షము.

ఈ సత్యమును గ్రహించి అట్టి ఎఱుకను అంతరంగమున పదిలపరుచుకొని, ఇక ఆపై ఏది ఎట్లు ఉచితమో, అది అట్లే నిర్వర్తించు. "ఆ బాహ్య - - అభ్యంతర దృశ్యములు రెండూ నేను కాను” అని భావించుచూ ఒక పర్వతములాగా స్థిరముగా వుండు.

  1. హృదయేశ్వరుడగు ఆ పరమాత్మ యొక్క ఉనికి ఆకాశంలా అతి విశాలమైనదని ఎఱిగి ఉండు. ఆయనే నీకు కనబడే ఆయా నామరూపాలు అగుచున్నాడని సమాధానము పొంది ఉండు.

  2. “ఇది జగత్తు - ఇది ఆత్మ" అను భ్రాంతి రూపమై ద్వైతకల్పనను పూర్ణముగా వదిలివేయి. అప్పుడు శేషించి ఉండే సాక్షి చైతన్యమునందు సిద్ధుడవై ఉండు. లేదా అట్టి అభ్యాసాన్నైనా ఆశ్రయించు.

3. “దృశ్యము - దృష్టి”ల మధ్య ‘దర్శనము’ అనే గల అనుభవం ఉంటోది కదా!… అట్టి అనుభవమునకు కర్తయగు ఆత్మయే దృష్టి - దర్శన - దృశ్యము లందు అనున్యూతమై ఉంటోంది. అట్టి విషయరహిత సాక్షితత్వమును సర్వదా భావన చేస్తూ ఉండు. అట్టి భావనలో జగత్తు ఉండదు కనుక అది ‘భావరహిత స్థితి’ యే అవుతుంది.

  1. ఆస్వాదించునది - ఆస్వాదించబడునది అను రెండిటికీ మధ్య ఉండే విషయరాహిత్యాన్ని ఆరాధించు, ఉపాసించు.

  2. అనుభవి - - అనుభవనీయము (The Experiencer - Experiences) అను రెండిటి మధ్య నిరాలంబమై, ఆ రెండిటి కన్నా వేరుగా ఉనట్టి శుద్ధతత్త్వమును సమాశ్రయించి ఉండు.

  3. జాగ్రత్ - స్వప్న – సుషుప్తిల మూడిటి కంటే విలక్షణమైన స్వరూపము నందు మనోబుద్ధులను ప్రతిక్షేపించి ఉండు.

అట్టి “శుద్ధ చిన్మాత్ర స్వభావనము” అని పిలువబడే ఆత్మసత్తను ఏమరచి, విషయములను

Page:371

భావించటం, దృశ్యముచే ఆకర్షించబడటం దౌర్భాగ్యం అనిపించుకోదా? అట్లు దృశ్యమును ఆశ్రయిం చుటే “చిత్త దశను పొందటం" అని గ్రహించు.

ఓ మహాబాహో! రామా! "ఆత్మ జ్ఞాన స్వరూపము” అనే యుక్తి చేత చిత్తము అనే సంకెళ్ళను త్రెంచివేయి. చిత్తము అనే పంజరము నుండి ఆత్మ అనే సింహమును విడిపించు.

శుద్ధమగు స్వాత్మస్థితిని వదలి విషయోన్ముఖుడవు నీవు ఎందుకు కావాలి? విషయములు పట్ల ధ్యాసచే విషయాకారుడవై బంధమును పొందుతున్నావు. ఇతఃపూర్వపు అనుభవము, దృశ్య సంస్కారముల కారణం గానే ఆత్మకు అన్యమైన ‘చిత్తము - స్థూలము’ అను రూపములు ప్రాప్తించటం జరుగుతోంది. మరల అభ్యసిస్తూ రాగా, “నిరంతరము మననము“ మొదలగువాటిచే ఈ చిత్తము ఆత్మత్వము దృఢనిశ్చయంతో స్వీకరించటం జరిగితే, అప్పుడా చిత్తము ’శుద్ధాత్మ’తో స్వయముగా ఏకమగుచున్నది. అప్పుడు “ఇది ఆత్మ - ఇది చిత్తము” అని చెప్పటానికి కూడా “ద్వైతము” అనేది మిగలదు. ”జగత్తంతా ఆత్మయే” అనే జ్ఞానం అంతఃకరణంలో వికసించిన తరువాత ఇక విషయ సహితమగు చేతనమెక్కడ? ఉపాధి సహితమగు చిత్త మెక్కడ? చేతనమగు మృతులెక్కడ? …. కేవల పరమార్థ స్థితి’ యందు వీటన్నిటికీ చోటే వుండదు.

చిత్తము అంటే అసలు ఏమిటి? - “ఈ దేహము - - ఈ ఇంద్రియములు - - వీటి వ్యవహారములు – ఇవే నా రూపము” అను పరిమిత దృష్టి - అనుభవస్థితియే - ’చిత్తము’ అను శబ్దముచే చెప్పబడుతోంది. అట్టి చిత్తమే, ఆద్యంతాలు లేనట్టి దుఃఖాలను విస్తరింపజేస్తోంది. “నేను ఈ భౌతిక శరీర పరిమితుడను” అన్న కీలక స్థితిని పరిశీలించి పరమార్థంగా చూచినప్పుడు "బ్రహ్మమునకు అన్యంగా ’జీవసత్త’ అనబడేదే లేదు” అని తెలియవస్తోంది. కనుక “నేను బ్రహ్మమునే!” అనునట్టి అనుభవమును, అనుభూతిని పొందుటయే చిత్తము యొక్క ఉపశమనము సుమా! అదే పరమ సుఖము.

"ఈ చిత్తము కూడా జగత్తులోని భాగమే కదా! ఈ జగత్తంతా ఆత్మయే” అను నిశ్చయం చేత ‘చిత్తము లేకపోవటం’ అనేది సిద్ధించగలదు. దానినే చిత్తము యొక్క నాశనం, ఉపశమనం అని కూడా పిలుస్తున్నాం.

ఇట్టి సత్యజ్ఞానోదయమైనప్పుడు “స్వాత్మయే - అంటే నేనే ఈ జగత్తు“ అను అనుభవస్థితి కలుగుతోంది. ఇకప్పుడు సూర్యోదయముచే చీకటి పటాపంచలైనట్లు, మనస్సు స్వయంగానే నశించి పోతోంది. మనస్సు అనే సర్పం శరీరంలో ఉండి యధేచ్ఛగా సంచరిస్తున్నంత వరకు భయము - ఉత్కర్షలు ఉండేతీరుతాయి. అట్టి సర్పమును ”బ్రహ్మాత్మైక్య విజ్ఞానము” చేత, ‘సమాధి’ చేత పట్టి, ఆశ, తృష్ణ అనే కోరలు పీకి “సర్వసమత్వము” అనే బుట్టలో వేయాలి. ఇక దాని వల్ల భయముండదు.

చిత్తమే ఇష్టము. మనస్సే మననము. చిత్తములో నుండి పుట్టుకొస్తున్న భ్రాంతి అనే దయ్యమున “సమైక్యజ్ఞానము” అన్న మంత్రముచే బలాక్రమంగా వినాశనం చేయాలి. ఎందుకంటే, ఎంతో బలము గలది, మొండిది అయిన ఈ చిత్తపిశాచము అనేక జన్మలుగా శరీరంలో ప్రవేశించి

Page:372

ఆక్రమించుకొని ఉంటోంది. “నేను - నీవు - తదితరులు - సర్వము… పరిశుద్ధమగు - ఆత్మయే” అను ఉత్తమ భావనచే ఇక చిత్తపిశాచము ఈ దేహంలో నిలవలేదు. అప్పుడు ఉద్వేగము - - వ్యధ తొలగుతాయి. భయములు వేసటలు - భ్రమలు ఉండవు.

“ఆత్మ సర్వదా లభించియే ఉన్నది కదా! ఇక నాకు రాగమెందుకు? ద్వేషమెందుకు? కోర్కెలతో పనేమున్నది? ఇక నాకు బాహ్యమున గాని, అంతరంగమున గాని అపేక్షించవలసినదేదీ ఉండ జాలదు. ఏదీ నాకు సుఖముగాని, దుఃఖముగాని కాజాలదు" - అనే నిశ్చయముతో ఆత్మజ్ఞులు ఈ జగత్తులో వ్యవహరిస్తున్నారు. అందుచేత వారు చిత్తరహితులే అగుచున్నారు. అంతఃకరణములో ఎట్టి కోర్కెలు జేరకుండా, దుఃఖరహితమైన ఉత్తమపదమును సొంతం చేసుకుంటున్నారు.

  1. తృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఈ జీవుడు ఒకానొక అతిగట్టిదైన త్రాడుచే చేతులు కట్టబడి ఈ సృష్టిలోకి మరల మరల ఈడ్చుకురాబడుచున్నాడయ్యా! ఆ త్రాడు పేరే “తృష్ణ”. ఇప్పుడు ఈ తృష్ణ గురించి కొన్ని విశేషాలు చెపుతాను. వినుఆత్మ ఒకానొకప్పుడు తన బ్రహ్మస్వభావమును ఏమరచి, చిత్తము అను దానిని ఆశ్రయిస్తోంది. అట్టి చిత్తము అపవిత్రమగు ఈ సంసారము అనబడు దానికి బీజమగుచున్నది. అట్టి చిత్తము జీవుని బంధించు జాలము వంటిది సుమా! అంటే ఏమిటి? ఆత్మ ఇంద్రియ వృత్తులకు సంబంధించిన అనుభవములను ఆశ్రయించినదై, చిత్తముచే కల్పించబడిన “ఈ దేహాదులే నేను” అను నిశ్చయమును పొందుతోంది. ఆ చిత్తము రాగ ద్వేషములు, వాసనలు ఏర్పడటానికి దోహదమగుచున్నది.

అంతకంతకు పెరిగిపోతున్న ఈ తృష్ణ మహామోహప్రదమగుచున్నది. మహాభయ దాయకమగు చున్నది. అది ఆత్మనే మూర్ఛిల్ల జేస్తోందే? అది ఉదయించినప్పుడల్లా అనంతాత్మ యందు జగత్తులు అను వికారములు ఏర్పడుచూనే ఉన్నాయి.

ఓ రఘురామా! ‘ప్రళయాగ్ని’ వేడిమినైనా సహించవచ్చునేమో గాని ఈ తృష్ణ యొక్క దాహకత్వం సహించటం బ్రహ్మ రుద్రాదులకు కూడా అంత తేలిక కాదు. ఆహా! అతి తీక్షమై కృష్ణవర్ణము (నలుపు)తో కూడినదై, అతి దీర్ఘమై, అనేక దుఃఖములే ప్రయోజనముగా కలిగినదై, శీతలము -

భయంకరము కూడా అయినట్టి ఈ తృష్ణ అనే ఖడ్గము ఉపాధిపరంపరలను అత్యంత క్రూరంగా పరపర నఱకివేయుచున్నదే! “వారించుటకు అలవి కాదేమో” అని అనిపించే “న్యూనత, అవమానము, స్వల్పత్వము, అసూయ, దుఃఖము, జాడ్యము" ఇవన్నీ ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఈ విషయం మేము బాగా పరిశోధించాం. “ఇవన్నీ ఈ జీవుని యొక్క ‘ఇది-అది కావాలి’ అను రూపం గల తృష్ణ నుండే బయలుదేరుచున్నాయి” అని మేము కనుగొన్నాం.

ఈ తృష్ణ అనే పెద్దపులి మనస్సు అనే బిలంలో ప్రవేశించి ‘ఇంద్రియములు’ అనే రక్తమాంసాలను

Page:373

ఆకలిగా పీక్కుతింటున్నది. ఈ ప్రాణులను కొండరాళ్ళ మీదికి, ముళ్ళ పొదలలోకి ఈడ్చుకుపోయి ముక్కలు ముక్కలుగా చేసి నములుచున్నది.

తృష్ణాపీడుతుడైన జీవుడు - అది ఎప్పుడు, ఎట్లా పుడుతోందో, ఏ రూపంగా మనస్సును ఆక్ర మిస్తోందో, ఈ జీవుడు గమనించలేకపోవుచున్నాడు. దాని చేత పీడించబడుచున్న ఈతడు అతి దీనమైన అంతః కరణం కలిగి ఉంటున్నాడు. శక్తిహీనుడై, విమోహితుడై ఆక్రందనములు చేస్తున్నాడు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున అనేక విషయములు, వ్యవహారములచే పదే పదే ప్రతిహతుడగు చున్నాడు.

తృష్ణ అనే త్రాచుపాము ఎక్కడ ఉండదో, అక్కడ మాత్రమే ప్రాణవాయువులు స్వస్థత పొందు తాయి. అక్కడ అసంకల్పితంగా పుణ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. కందిరీగల చేతను, తదితర కీటకముల చేతను స్పృశించబడని పూతీగ మరింత అందమైన పుష్పాలను ప్రసాదించగలదు కదా!

తృష్ణారహితుడు ప్రారంభించే ప్రతి కార్యక్రమము అద్భుతమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. లోకమునకు అనిర్వచనీయమైన శుభమును, ఆహ్లాదమును చేకూర్చగలుగుతుంది. అతని ప్రతిపలుకు సుఖ శాంతిప్రదములు అవుతాయి.

“అసలు తృష్ణ నివసించే చోటెక్కడండీ?" అని ప్రశ్నిస్తే… “అది గూడు కట్టుకుని ఉండేది వివేక రహితుని హృదయంలోనే! అది అక్కడ అత్యంత వ్యాకులత్వంచే భ్రమరూపంగా ఉరకలు వేస్తోంది” అనునదే మా సమాధానం. అయ్యో! కాలికి కట్టిన యంత్రపు త్రాడుచే అంత పెద్ద పక్షి కూడా ఈడ్వబడుచున్నట్లు ఈ జీవులు అనేక బంధనములు, సంకుచిత స్వభావముల వైపు నెట్టుకుపో బడుచున్నారే! తృష్ణను ఆశ్రయించినందుకు ఫలితంగా చివరికి మిగిలేది క్షయము, చింత, శోకములు, కూలబడటములే అగుచున్నది. తృష్ణచే ఉద్భవించిన చింతలచే గొప్ప ప్రజ్ఞాపాటవములు కలవారు, అనేక విషయములు తెలిసివారు కూడా చివరికి విచ్ఛిన్నులై హతమొనర్పబడుచున్నారు కదా! దయాశూన్యము, కర్కశము అయిన వేట కత్తి యొక్క పదునైన అంచుచే సాధు జంతువులు ఖండిచ బడుచున్నట్లు “దయ, వివేకము, ఉత్తమ ఆశయము, భగవధ్యానము” మొదలైన సాధు గుణాలు తృష్టచే తెగకొట్టబడుచున్నాయి. నూతిపై మొలచిన పచ్చటి తృణములను (గడ్డిపరకలను) భక్షించడానికి వెళ్ళి, లేడి నూతిలో పడిపోయినట్లు, ఈ తృష్ణను వెన్నంటి వెళ్తే మూఢుడు ‘నరకం’ అనే అంధకూపంలో పడిపోతున్నాడు. లోకంలో “ముసలితనం చాలా దుర్భరం. చివరకు కళ్ళు కూడా కనబడవు కదా!” అంటూ ఉంటారు. కాని అతి సూక్ష్మమైన ఈ తృష్ణా పిశాచం వార్ధక్యం కంటే కూడా అధికంగా ఈ జీవుని గ్రుడ్డివానిగా, దీనునిగా చేసివస్తోంది.

అమంగళకరమగు ‘తృష్ణ’ అనే పిశాచం హృదయంలో కిచిత్ ప్రవేశించుట చేతనే అంతటి తృష్ణచే బంధితుడైన ఆ సూర్యభగవానుడు కూడా ఒక గుంజకు త్రాటిచే కట్టబడినట్లు ఆకాశంలో అటూ ఇటూ త్రిప్పబడుచున్నాడు. అందుచేత ఓ రామా! ఈ ప్రాణి కోట్ల ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తూ దుఃఖమే ప్రయోజనంగా కలిగిన ఈ ‘తృష్ణ’ అనబడే భూతము నీచే అల్లంత దూరంలోనే త్యజించివేయబడు గాక!

Page:374

తృష్ణచేతనే వాయువు వీచుచున్నది, పర్వతములు నిలబడుచున్నాయి, ఈ భూమి జీవరాసులను ధరిస్తోంది. ఈ మూడు లోకములు కూడా తృష్ణచేతనే ధరింపబడుచున్నాయి. ఒకడు ఒకచోట ఒక త్రాడు చేత కట్టబడితే, ఆ బంధం నుండి విడిపించుకోవటం తేలికే నేమో గాని, ‘తృష్ణ’ అనే బంధం నుండి మాత్రం ఈ జీవుడు అంత తేలికగా విడివడలేడు. అందుకు “మహా ప్రయత్నం” కావాలి. అందుచేత, రామా! నీవు ”సంకల్పములను విడుచుట" అను ఉపాయంతో తృష్ణను పరిత్యజించు.

సంకల్పములే మనస్సు. మనస్సే తృష్ణకు ఉనికి స్థానం. అజ్ఞానముతో కూడి బలవత్తరమగు సంకల్పముల పరంపరయే తృష్ణ అయి ఉన్నది. మరొక రహస్యం. “ఈ దేహమే నేను" అనబడు దేహాభిమానమును ఈ జీవుడు ఎందుకో ఆశ్రయించుచున్నాడు. అజ్ఞానమయము, సర్వ దురాశలకు నిమిత్తము అయినట్టి అట్టి అభిమానమే తృష్ణకు నివాస స్థానం కల్పించుచున్నది. అనాత్మభూతములైన ఈ దేహము మొదలైనవాటి యందు ఆత్మాభిమానం త్యజించిన మరుక్షణం దుఃఖములన్నీ తమంతట తామే సమసిపోతాయి. అప్పుడు నీవు జ్ఞానిగా పరిగణింపదగిన వాడవౌతావు.

అందుచేత “నేను సర్వపదార్ధములకు అతీతముగా నిత్యమై, సత్యమై, భవ్యుడనై ఉన్నాను” అను రూపము గల “అనహమ్" భావనచే ఈ తృష్ణ అనబడు దానిని కత్తిరించివేయి. ఈ జగత్తులో కనిపించే విభూతులన్ని తిరస్కరించి వేయి. ప్రపంచాతీతమగు ‘పరబ్రహ్మము’ నందే సుస్థిర చిత్తుడవు, స్వస్థుడవు కమ్ము.

  1. చికిత్స

శ్రీరాముడు : హే మహాత్మా! సద్గురూ! “ఈ తృష్ణ, అహంకారములను త్యజించండి” అని మీరు చెప్పిన వాక్యాలు అత్యంత ఆప్తవాక్యాలు గానూ, గంభీరంగానూ ఉన్నాయి. కాని, నాదొక సందేహం. ’అహంకారం’ను త్యజించ వలసివస్తే ఈ దేహమును కూడా పరిత్యజించ వలసివస్తుందేమో కదా! ఎందుకంటే, అహంకారమునకు ప్రాణమునకు ఒకానొక ఐక్యత ఉన్నది. మరి ఒక వైపు ప్రాణములను రక్షించుకుంటూ కూడా మరొక వైపు అహంకారమును వినాశనం చేయటం సంభవమేనంటారా? పెద్ద పాకను ఒక తాటి స్తంభము ధరించి ఉంటున్నట్లు అహంకారమే ఈ దేహమును ధరించుచున్నది. అట్టి అహంకారమే నశిస్తే, ఇక ఈ దేహమును ధరించే దెవరు? ఇది నేలకూలక తప్పదు. కాబట్టి హే మహావక్తా! నేను ఈ అహంకారమును ఎట్లా పరిత్యజించాలి చెప్పండి? ఈ ”అహంకారము

- - ప్రాణము - శరీరము”ల సంబంధం విషయంలో నన్నేం చేయమంటారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ లోకంలో జనులు మూడు రీతులైన అహంకారమును కలిగి ఉంటున్నారు1. “ధ్యేయ-జ్ఞేయ" వాసనతో కూడిన అహంకారము (దేహాహంకారము) -

ధ్యేయము = ఇంద్రియములచే పొందబడవలసినవిగా భావించబడుచున్నవి.

జ్ఞేయము= ఇంద్రియములచే తెలుసుకొనవలసినవిగా భావించబడుచున్నవి.

Page:375

ఇట్టి అహంకారము కలిగి ఉన్న జీవుల భావన లేక, అంతఃకరణము నందలి నిశ్చయము విను! దేహేంద్రియములు, అన్న పానాలు, తదితర బాహ్య పదార్ధముల సంఘాతమే నేను. ఈ దేహం, ఈ అన్నపానాదులు నా జీవితము నిమిత్తమే ఉన్నాయి. ఇవి ఉన్నచోటే నేను ఉన్నాను. ఇవి లేనప్పుడు నేను కూడా లేను…. - ఇది ‘పరిమితావగాహన’, మరియు, ’ప్రధమాహాంకారము’ అని కూడా శాస్త్రములు పిలుస్తున్నాయి.

  1. ’ధ్యేయ వాసనాత్యాగము’తో కూడిన అహంకారము (చిద్రూపాహంకారము) - ఇట్టి త్యాగ మార్గమును అవలంబించిన జీవులు తత్త్వవిచారణను ఆశ్రయించుటచే ఈ దేహ - ఇంద్రియ సంఘాతమును, మనస్సును వేరు చేసి పరిశీలిస్తున్నారు. క్రమంగా, “ఈ మనస్సు, దేహం, ఇంద్రియాలు అసత్తే అయి ఉన్నాయి” అను నిశ్చయము దృఢపరుచుకొనుచున్నారు. అట్టి విచారణ-నిశ్చయముల యొక్క బలముచే “నేను ‘సద్వస్తువు’ అగు చిద్రూపాహంకారమును” అను రెండవ అహంకారమును హృదయములో ప్రవేశపెట్టుచున్నారు. "ఈ దృశ్యములో కనిపిస్తున్న, వినిపిస్తున్న ఏ ఒక్క వస్తువుతో కూడా నాకు సంబంధమే లేదు. అవి నా యందు లేవు. నేను వాటి యందు కూడా లేను” అను ఎఱుకను, బుద్ధిని, పరిపక్వపరుచుకొనుచున్నారు. ఆ అవగాహనను అంతర్లీనంగా కలిగి ఉంటూనే లీలామాత్రంగా ఆయా నియమితమైన క్రియలను నిర్వర్తించుచున్నారు. అట్టి ప్రశాంత బుద్ధితో కూడిన నిశ్చయము యొక్క ప్రభావంచే సర్వ బాహ్య విషయములపై ప్రియ - అప్రియములను తొలగించుకొనుచున్నారు. ఉపసంహరింప జేసుకొనుచున్నారు. లోకానుకూలంగా లోకోపకార దృష్టితో నిర్వికారంగా వర్తమానము నందు చేయవలసనవి మాత్రం నిర్వర్తిస్తున్నారు.

అతడు "ధ్యేయ త్యాగాహంకారి” అగుచున్నాడు. అట్టివాడు అట్టి ఉత్కృష్టతచే ముక్తుడే సుమా!

  1. జ్ఞేయ వాసనాత్యాగముతో కూడిన అహంకారము - ఇట్టి అహంకారము ఆశ్రయించే -

మహనీయుడు “నాతో సహా ఈ జగత్తు అంతా బ్రహ్మమే కదా! ఇక వాసన లెవరికి? ఎందుకు? ఎక్కడ?“ అను రూపము గల సాక్షాత్కారం పొందుచున్నాడు. వాసనలన్నింటిని క్షయింప జేసి, నిర్మాల్యుడగుచున్నాడు. అహంకారమునకు ఆవల సాక్షిస్వరూపమును అభ్యసించుచున్నాడు. సర్వ మానసిక వికల్పములను త్యజించివేస్తున్నాడు. ”తను, తదితరులతో సహా సర్వము దివ్యము అగు ఆత్మ ప్రదర్శనా చమత్కారమే!” అను దృష్టిని, అవగాహనను పెంపొందించుకుంటున్నాడు.

అట్టివాడు సదా నిర్వికల్పుడగుచున్నాడు. సర్వదా దేహరాహిత్యాభిమాని అగుచున్నాడు. ఈ విధమైన వాసనాత్యాగముచే దృశ్య కల్పనంతా సమసిపోగా, ప్రశాంత స్థితిని పొంది ‘ఎరుగుట’ అను దానిని ఉపసంహరించి ’నిర్వికల్ప సమాధి’యందు ప్రవేశించుచున్నాడు. అతడు ‘జ్ఞేయత్యాగి’ అనుపేరుతో చెప్పబడుచున్నాడు.

ధ్యేయ వాసనాత్యాగం అవలంబించి, లోకమునకు ఉచితమైన కార్యములను ఒనర్చు జీవన్ముక్తు లైన వారిలో జనకమహారాజు వృత్తాంతం ఒక దృష్టాంతం. జ్ఞేయ వాసనాత్యాగం చేసి శాంతిని

Page:376

పొందినట్టి విదేహముక్తులగు మహాత్ములు ఉన్నారు. అట్టివారు సర్వోత్తమమగు బ్రహ్మము నందే స్థితి కలిగియున్నారు. శుకమహర్షి అట్టివారే. ఓ రామచంద్రా! ఈ ధ్యేయ - జ్ఞేయ వాసనా త్యాగులిద్దరూ సమానులే సుమా! రెండు మార్గములు ముక్తిదాయకములే అవుతాయి. ఈ జీవునకు సంతాపము లేకుండా చేసి, క్రమముగా ఆత్మతత్వమును ప్రాప్తింపజేస్తాయి. జ్ఞేయ వాసనాత్యాగి = సమాధి యందు అర్హుడైనవాడు విదేహముక్తుడు = దేహరహితుడు.

ధ్యేయవాసనాత్యాగి = సమాధి నుంచి లేచి వ్యుత్థానకాలంలో వ్యవహరించే వాడు; జీవిస్తూ ఉంటూనే ముక్తత్వము కలిగి ఉన్నవాడు. దేహవాసహితుడు, దేహము ఉండి కూడా దేహవాసనలు లేనివాడు.

వీరిద్దరూ కూడా ‘అవిద్య’ను అధిగమించుటచే కేవల బ్రహ్మ పదంలో సుస్థితులై ఉంటున్నారు. ఈ దేహ-విదేహముక్తుల గురించి (ధ్యేయ - జ్ఞేయవాసనా త్యాగుల గురించి పదకొండు రోజులుగా కొన్ని విషయాలు చర్చించాం. ఇక ముందు కూడా మరికొన్ని విషయాలు చెప్పుకో బోతున్నాం.

  1. జీవన్ముక్తుడు

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు తృష్ణ నుండి విడివడినట్టి జీవన్ముక్తుల గురించి, విదేహముక్తుల గురించి విశదీకరించటం జరిగింది. "ధ్యేయ వాసనాత్యాగి - జ్ఞేయ వాసనాత్యాగి” అనబడుచున్న వారిద్దరి గురించి మరి కొన్ని విశేషాలతో నిర్వచించి ముందుగా చెప్పమని నా ప్రార్ధన. అటు తరువాత యదావిధిగా తదితర విషయాలు ప్రస్తావన కొనసాగించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! నీవు కోరిన విధంగానే జీవన్ముక్త - విదేహముక్తులను నిర్వచిస్తాను విను. వారు ఏ ఉపాయములచే తృష్ణ నుండి విడివడుచున్నారో నీవే గ్రహిస్తావు.

ఎవడైతే కాలానుగతంగా నిరంతరం ఏర్పడుచుండుటే, స్వభావంగా కలిగి ఉండే ఆయా సుఖ దుఃఖాలను, హర్ష శోకాలను తన అంతరంగంలో పొందకుండానే ఉంటాడో అట్టివాడే ‘జీవన్ముక్తుడు’ అని పిలవబడుచున్నాడు. అతనికి ఇష్ట- అయిష్టములు గాని రాగ-ద్వేషములు గాని ఉండవు. ఇక, ఆయా ప్రాప్తించే వ్యవహారములను మాత్రం, సుషుప్తుని వలే మమకార - కర్తృత్వములు లేకుండానే నిర్వర్తిస్తూ వుంటాడు.

అతనికి “ఈ దేహమే నేను, దేహ సంబంధములైన ఈ ధన-గృహ-బంధుజనుల వ్యవహారం నాది” అనే అహం - మమత్వములు ఉండవు. హర్ష శోకములు గాని, కామ క్రోధములు గాని, దర్పము దీనత్వములు గాని అతని అంతరంగ ప్రజ్ఞను ఏమాత్రం స్పృశించవు. ఇక ఇక్కడ తారసబడే ఇంద్రియ విషయములను దూర ప్రదేశములోని ఎవరికో సంబంధించినవిగా చూస్తాడు. తన

Page:377

అంతరంగంలో (నిదుర లేచి స్వప్నములను చూస్తున్నట్లు) ఆతడు ‘ఆత్మజ్ఞానము’ అను స్థానంలో నిదుర లేచి ఉంటాడు. ఈ సర్వమును ’ఆట, ఆటవిడుపు’ల వలె చూస్తూ ఉంటాడు. సర్వకళా పరిపూర్ణుడైన పూర్ణచంద్రుడు ఏ తీరుగా, తన ఉనికిచే తాను ఆహ్లాద భరితుడై, తదితరులను ఆహ్లాద పరుస్తూ ఉంటాడో, మన ఈ జీవన్ముక్తుడు కూడా స్వాభావికంగానే సంతోషము, ఉల్లాసములచే పరిసేవితుడై వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ’విదేహముక్తులు’ విషయానికి వస్తే వారు ఇంద్రియ గోచరమైన ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించినవారు కారు. వారి గురించి వచనముల చేత చెప్పటమంటే చిన్న పాత్రతో “పెద్దధాన్యపు గుట్ట”ను కొలవటం వంటిది. ఇప్పటికి మాత్రం ముక్తుని స్థితి గతులు ఏ తీరుగా ఉంటాయో మరి కొన్ని విశేషాలు చెపుతాను. వినువిషయ రహితము (సర్వ ఆశలు అధిగమించినట్టిది) - ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ముక్తి’ అనగా ఈ ఇంద్రియ విషయముల పట్ల సర్వ ఆశలు వర్జితమైనప్పటి ’ఇచ్ఛ’చే, ప్రవాహపతితంగా ప్రాప్తించిన కర్మలను ఆచరించుచుండటమే. ఎప్పుడైతే, ఈ జీవుని యొక్క బుద్ధి - దృశ్య విషయములో “ఇది సత్యమే” అను భావన, భోగముల పట్ల ఆశ కలిగియున్నదై; బాహ్య పదార్ధము లందు స్థితి కలిగి ఉంటుందో - అదియే దృఢమగు సంసారబంధము!

జీవన్ముక్తులు తమ హృదయమును సంకల్పరహితం చేసుకుంటున్నారు. బాహ్యపదార్ధము లందు లీలామాత్రంగా పాల్గొనుచున్నారు. వారు విషయ ఆశావర్జితమైన ఇచ్ఛచే ఆయా పరిస్థితులకు అనుకూలంగా ప్రశాంతమైన అంతరంగముతో వ్యవహరిస్తున్నారు.

బాహ్య పదార్ధముల పట్ల గల ఆసక్తి చేత తృష్ణ వృద్ధి పొందినప్పుడు ఈ జీవుడు ‘బద్ధుడు’ అగుచున్నాడు. విషయములన్నిటి యందు వాసనారహితమైన చిత్తము కలిగి ఉన్నప్పుడు, ఈ జీవుడే ‘ముక్తుడు’ - ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఇంత మాత్రమే.

క్షోభరహితం - ముక్తుని యందు మనకు కనిపించే ఒక విశేషమేమంటే - విషయములు ప్రాప్తించటానికి ముందు గాని, ఆ విషయములు తొలగుచున్నప్పుడు గాని ఆతని యందు ఆ రాగ విరహాదులచే కలిగే దుఃఖం ఉండదు. ఎల్లప్పుడు అతడు వర్తమానకాలము నందు స్థిరమైన బుద్ధి కలిగి ఉండి, ఉచితానుచితములను అనుసరించి "ఇది నాకర్తవ్యమై ఉన్నది, అందుచేత చేస్తున్నాను” …అని నిర్ణయించుకుని ఉంటాడు.

“ఈ వస్తువో, విషయమో నాకు ప్రాప్తించాలి" - అను ఇచ్ఛయే బంధం. అనగా, ఇంద్రియాలను స్వీకరించిన జీవుడు, ఇంద్రియ విషయాలకు దాసుడవటం జరుగుతోంది. ఈ పదార్ధముల గతి, పరిణామములు ఎఱిగావా… ఇక వాటి పట్ల తృష్ణ ఏర్పడదు. ఈ ‘సత్-అసత్’ రూపములైన పదార్దములచే ఆకర్షణ-వికర్షణలను చెందకుండా ఉండే పరమోదార చిత్తము గల మహాత్ముడు జీవన్ముక్తిని పొందినట్లే. అందుచేత ప్రియరాఘఘవా! నీవు బంధ-మోక్షములను, సుఖ-దుఃఖాలను, ఆశ-నిరాశలను, సత్ అసత్లను మొదలంట్ల త్యజించి ఉండు. ప్రశాంతమగు ఆకాశము వలె క్షోభరహితుడవై ఉండు. మహా సముద్రము వలె ప్రాప్తాప్రాప్తము లందు గాంభీర్యం వహించి

Page:378

ఉండు. “జన్మ-మృత్యు రహితమగు ఆత్మ స్వరూపుడను" అని ఎఱిగి ఉండు. ఇక ఈ జనన-మరణ చింతలచే మనస్సును మరెన్నటికీ కళంకితం చేసుకోకు.

గొప్ప నిశ్చయం కలిగి ఉండటం- ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ దృశ్యపదార్ధము లేవీ నీవు కావు. నావి కావు. ఇవేవీ నీ యందు ఏక్షణమందు కూడా లేవు. నీవు కూడా వాటి యందు లేవు. ఈ దృశ్య పదార్ధములన్నీ ‘వాస్తవ పదార్ధము’ కంటే అన్యంగానే ఉంటున్నాయి. అతి తుచ్ఛమైన పర్యవసానము కలిగినవి అగుచున్నాయి. అయితే, నీవు మాత్రం వీటన్నిటికీ అన్యమైనట్టి నీ శుద్ధ స్వస్వరూపమును ఆశ్రయించి ఉండు.

ఈ ప్రపంచమంతా ‘అసత్తే’ అయినట్టి అజ్ఞానముచే ఆవిర్భవించి ‘సత్-అసత్’ రూపమున స్థితి కలిగి ఉంటోంది. ఇక నీవో… దీనికంతటికీ పరమై వెలయుచున్నావు. అట్టి సర్వమునకు అతీతమగు చైతన్యమూర్తివగు నీవు పదార్ధముల పట్ల ’తృష్ణ’ కలిగి ఉండటమేమిటి? ఎంత అసమంజస మైన విషయమది! అదిఎట్లా సంభవమో చెప్పు?

ఒక్కసారి ఈ ‘దేహము - దృశ్యము’లను కాస్త పరిశీలించి చూచినప్పుడు నాలుగు విధములైన నిశ్చయములు కలుగుచున్నాయి1.దేహాత్మ భావన - తల్లి తండ్రులచే నిర్మించబడినట్టి "కాళ్ళు, చేతులు, పొట్ట, తల”గల ఈ దేహమే నేను” అనే భావన. ఇది అజ్ఞాన దృష్టి చేతనే కలుగుచున్నది. నిశ్చయంగా ఇది మహాబంధముగా పరిణమించబోవుచున్నది.

2 శుద్ధ చైతన్యభావన - ఈ దేహేంద్రియము లకన్నిటి కంటే వేడైనట్టి, అత్యంత సూక్ష్మమైనట్టి శుద్ధ చైతన్యమునే ’నేను - అను నిశ్చయం. ఇది మోక్షమునకు దారి తీస్తోంది.

  1. “సర్వాత్మాహమ్” భావన - - ఈ జగత్తునందలి సర్వజీవుల యొక్క ఆత్మస్వరూపమును నేను! నేను అక్షయడను - అను నిశ్చయము. ఇది కూడా మోక్షదాయకం అగుచున్నది.

  2. “జగదహమ్” భావన - ఆకాశము వలె శూన్యమే అయినట్టి ఈ ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతికాత్మకమైన ఈ జగత్తంతా ‘నేను’ - అను అవగాహన. ఇది కూడా మోక్షమునకు దారి తీస్తోంది.

ఈ నాలుగింటిలో మొట్టమొదటిది మలిన వాసనలచే ఏర్పడుతోంది. బంధమగుచున్నది. తక్కిన మూడు శుద్ధ సాత్విక వాసనల ప్రయోజనంగా లభిస్తోంది. కనుక, సత్వరం అనుసరణీయమగు చున్నాయి. “ఈ జగత్తంతా ఆత్మస్వరూపుడనగు నేను అయి ఉన్నాను” - అను నిశ్చయం అవలంబించి ఉన్న తరువాత, ఇక అట్టివాని చిత్తము భేదము ఎట్లా పొందుతుంది? వాస్తవానికి అంతా కూడా ఆత్మ యొక్క మహిమచే వ్యాపించి ఉంటోంది. అందుచేత ‘సర్వము ఆత్మయే’ అనే నిర్ణయం చేసుకొన్న జీవుడు ఇక బంధంలో తగుల్కోడు.

అవగాహన - సర్వమునకు అధిష్ఠానమైఉన్నట్టి ఆత్మ వివిధమైన వాదములచే వివిధమైన పేర్లతో పిలువబడుతోంది. “శూన్యం, బ్రహ్మం, పురుషుడు, ప్రకృతి, విజ్ఞానము, ఈశానుడు, మాయ, శివము” అను పేర్లన్నీ ఆత్మకు చెందినవే.

Page:379

వాస్తవానికి ఈ జగత్తంతా సదా సన్మాత్ర స్వరూపం అయి ఉన్నది. ఇందులో ద్వైతము గాని, భిన్నత్వం గాని ఎచ్చటా ఏ మాత్రం లేవు. పరమార్థ సత్య జ్ఞానం చేత ఈ ప్రపంచమంతా వ్యాపించ బడి ఉన్నది. అయితే భ్రాంతి గల బుద్దికి అసత్యమైనదంతా సత్యము వలె గోచరించటం జరుగుతోంది. అనంతమైన ఆకృతి గల సముద్రమంతా జలము చేతనే పూర్ణమై ఉన్నది కదా! బ్రహ్మ నుండి ఒక స్థంభం వరకు ఈ జగత్తంతా ఆత్మ చేతనే పరిపూర్ణమై ఉన్నది. అందుచేత ప్రమాణములచే అసలు విషయం గ్రహించబడినప్పుడు "బ్రహ్మమొక్కటే సత్యము” అను వాక్యముచే సమీక్షించ బడుతోంది. సముద్ర జలము కంటే తరంగాలు వేరా? మట్టి కంటే మట్టిబొమ్మ వేరా? శిల కంటే శిల్పం వేరా? కాదు. బ్రహ్మము కంటే భిన్నంగా ‘జగత్తు’ అనబడునది ఏ నాడూ, ఏ క్షణం నందు వేరు కాదు.

ద్వైతాద్వైత తత్పరం - ‘జీవుడు’ అని మనం పిలుస్తున్నది ’స్వసత్త’నే. ఆ బ్రహ్మసత్తయే “అద్వైత పరమాత్మమయ శక్తి” అని కూడా గ్రహించు. అట్టి బ్రహ్మసత్త ‘జగత్ రచన’ అనే లీలచే ఈ జగత్తుగా విజృంభిస్తోంది. ద్వైతరూపం గాను, అద్వైతరూపం గాను, ఇంకా ఏవేవో భేదములచే కనబడే ఈ జగత్తంతా బ్రహ్మమే. ఆ ఆ బ్రహ్మమే “నా వారు, నీ వారు, భార్య, భర్త, సోదరులు" - మొదలైన అనేకానైకమైన భావానుగతములైన రూపములతో కూడి కనిపిస్తోంది. అజ్ఞానము చేత రచించబడుచున్న ఇట్టి జగత్తు వృద్ధి చెందితే ఏమున్నది? నశిస్తే ఏమున్నది? నీ స్వరూపము జ్ఞానమే అయి ఉండగా నీవు ఈ అనేక నామరూపముల పట్ల సుఖ దుఃఖములు పొందవలసిన పనేముంటుంది? అందుచేత, నీవు ఆయా క్రియలందు వ్యవహరిస్తున్నప్పుడు కూడా, అద్వైతమును ఆశ్రయించియే ఉండు. అద్వైత సత్తామయుడవై ఉండు. ఆయా కర్మలను ఆచరిస్తున్న క్షణాలలో మాత్రం ద్వైతమును ఆశ్రయించిన వాని వలె వ్యవహరించు. ఈ విధంగా ద్వైతాద్వైతముల రెండిటి యందు తత్పరుడవై ఉండు. అంతేగాని అనేక అశుభనిమిత్తములచే నిండి ఉన్న ఈ భయంకర సంసారభూములందు అజ్ఞానముచే ద్వైత వ్యవహారములను నమ్ముకొని, అందు తన్మయుడవై వెట్టిగా, మొండిగా కూలిపోవద్దు. నీ అద్వైత-నిత్యానంద-అఖండత్వమును ఏమరువవద్దు.

“ఈ జగత్తు బ్రహ్మమే” అను ఎఱుక మరియు జ్ఞప్తి పరమార్థంగా పరిశీలిస్తే ఈ ‘ద్వైతము’ అనునది సంభవమే కాదు. ఈ దృశ్య వ్యవహారమంతా కల్పన చేస్తున్నది చిత్తమే కదా! అట్టి కల్పన వాస్తవ మెట్లా అవుతుంది?

శ్రీరాముడు : అయితే ఈ జగత్తు ద్వైతమా? అద్వైతమా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచమున ద్వైతమూ లేదు. ఏకమూ లేదు. సంఖ్యా సహితమైన దానిలో మాత్రమే "ద్వైతము, అద్వైతము” - అనబడేవి సంభవించవచ్చునేమో! మహాత్ములు ఈ జగత్తును సంఖ్యా రహితమైనదానికిగా గాంచుచున్నారు. సత్ నుండి భావనా రూపంగా ఉదయించటం చేత, ఇది ‘సన్మాత్రమే’ లేక ‘బ్రహ్మమే’ అయి ఉన్నది.

యదార్ధానికి దేహముల సంఘాతరూపములై కనిపించున్ను ఈ “నేను - నీవు” అనునవి గాని, ఈ జగత్తు అనబడునదిగాని లేనేలేవు.

Page:380

‘నేను’ అనునది బ్రహ్మమే. బ్రహ్మము జన్మరహితమైనది. కనుక ‘నేను’ అనబడేది కూడా జన్మరహితమైనదే!

‘నేను నీవు - ఈ జగత్తు’ అనునవన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయని అనుకున్నాం కదా! బ్రహ్మము సర్వోత్తమమైయున్నది. అది అనాది. ప్రకాశములన్నిటికీ ప్రకాశము. దానిని విశద పరచటానికే వేరు వేరు శాస్త్రములు అనేక ప్రమాణాలను ఉపయోగిస్తున్నాయి. ఆ బ్రహ్మమునకు ‘జన్మించుట’ మొదలైన వికారములు లేవు. అది సర్వ చింతనల కంటే అతీతమైనది. నిర్వికారమైనది. దాని యందు ఇంద్రియ సమూహమంతా లేదు.

ప్రాణశక్తి అంతటికీ ఆధారం కూడా బ్రహ్మమే. అది సర్వ కల్పనా రహితమై సర్వకారణములకు కారణమై, నిత్యోదితమైన స్వరూపమై, సర్వవ్యాపకమై యున్నది. ఈ కళ్ళు మొదలైన సర్వ ఇంద్రియము లలో చిత్రకాశమై ఉన్నది అదే! మనం ఎన్ని వాక్యాలు ఉపయోగించినప్పటికీ దానిని విశదీకరించ లేమనే చెప్పక తప్పదు. ఎందుకంటే, అది అనుభవమాత్రమే కదా! ఈ చర్చలన్నీ చేసిన తరువాత చివరికి అది లభిస్తున్నది స్వస్వరూపము నందే. స్వస్వరూపముగానే !

ఓ రామచంద్రా! మరల ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. విను ఈ జగత్తు, ఇందులో తారసపడుచున్న నేను - నీవు - వాడు - వీడు మొదలైనవన్నీ… ఆ ఆనందైక బ్రహ్మమే అయి ఉన్నాయి. ఉన్న నిజం అదే. అందుచేత ‘ఇదంతా బ్రహ్మమే’ అనే నిశ్చయం నీవు నిరభ్యంతరంగా కలిగియుండు. శాంతి ప్రవచనములతో ఆ నాటి సభ చాలించబడింది.

(పదకొండవ రోజు విచారణ పూర్తి అయింది)