CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:381

పన్నెండవ రోజు

III. పుణ్యుడు - పావనుడు సంవాదం

  1. మహాత్ముల అవగాహన-సంచారం-స్వభావం

శ్రీరాముడు : హే మహాత్మా! తమరు నిన్నటి రోజున ‘ముక్తులు - - వారి లక్షణములు’ విషయమై అనేక విశేషాలు చెప్పారు. జీవన్ముక్తులైన మహాత్ములు ఈ జగత్తులో తదితర జీవులు లాగానే ఆయా ‘ఉపాధి, స్థితిగతి, జీవన వ్యాపారము’ మొదలైనవి కలిగి చరిస్తున్నారని అన్నారు కదా! అట్టివారి అవగాహన, సంచారం, స్వభావం ఏ రీతిగా ఉంటాయో మరికొంత వినాలని ఉన్నది. శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! జీవన్ముక్తులైన మహానుభావులు అనేకులు సమాహితమైన చిత్తంతో, కామము, లోభము, మోహము మొదలైన దుర్గుణములను అధిగమించినవారై ఈ ప్రపంచంలో లీలామాత్రంగా పాల్గొనుచున్నారు. వారి గురించి సవివరమైన వ్యాఖ్యానం మరల మరల చేయటం అవసరమే. కనుక చెపుతాను విను.

జీవన్ముక్తుడు ఈ ప్రపంచమునందు సంచరిస్తున్నప్పటికీ, ఆతడు మొదట్లో, మధ్యలో, చివర కూడా రసహీనమే అయినట్టి ఈ సంసారము యొక్క గతులను చూస్తున్నప్పుడు దుఃఖించడు. హసించడు. ప్రాప్తించిన కార్యములను మాత్రం ప్రియాప్రియాతీతుడై చేస్తూ ఉంటాడు. శత్రుమిత్రులందు సమదృష్టి కలిగి ఉంటాడు. ధ్యేయవాసనలను (Outgoing tendency of the senses) త్యజించివేసి ఉంటాడు. అతని దృష్టిలో “అది పొందలేదు … కనుక పొందాలి; ఇది ఇట్లు కాదు… వీరు హితులు… వారు అహితులు” అనునవన్నీ సారహీనమైన పిల్లల ప్రేలాపనలు మాత్రమే. ఆతడు ఉద్వేగరహితుడై, సజ్జనులకు హితకరుడై ఉంటాడు. ఆతని అంతఃకరణము సర్వదా ‘వివేకము’ అనే వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటుంది. ‘జ్ఞానము’ అనే ఉపవనంలో ప్రవేశించి, ఎప్పుడూ వాహ్యాళి సలుపుతూ ఉంటాడు. సర్వమునకు అతీతమైయున్న ’బ్రహ్మపదము’ను ఆశ్రయించినవాడై, పూర్ణ చంద్రుని లాగా శీతలాంతఃకరణానుభవం పొందుతూ ఉంటాడు. ఆ మహాత్మునికి ఇక్కడ మిక్కిలి అప్రసన్నత్వమునూ - మిగుల సంతుష్టుడుగనూ చేయగల్గునదేదీ ఉండదు..

ఇక, ఈ ఇంద్రియములను ఆకర్షిస్తున్న విషయములు తటస్థపడినప్పుడు వాటితో శత్రువుల మధ్య ఉన్నట్లే ఉంటాడు. అయితే తన దయ, దాక్షిణ్య భావములను మాత్రం వీడడు. గురుసేవ, సంఘసేవ వంటి సమయోచితములైన కార్యములను లోకానుకూలంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. అట్టి పుణ్యాత్మునకు ఇక దుఃఖముల ఊసెక్కడ?

Page:382

ఆతడు “దీనిని నేను కోరుకొన్నాను… పొందాను” అనే ఇష్టము దరిజేయనీయడు. “అయ్యో! ఇది ఇప్పుడు ఎందుకు పొందాను?” అనే అయిష్టము కలిగి యుండడు. సర్వమును మొదలంట సన్న్యసించియే ఉంటాడు.

నాభినన్దతినద్వేష్టి న శోచతినాకాజ్ఞతి |

మౌనస్థః ప్రకృతారంభీ సంసారేనావసీదతి || (శ్లో 7, సర్గ 18)

దేనినీ వాఛించడు, ద్వేషించడు. కనుక ఆతనికి అసంతృప్తి ఉండదు. దుఃఖించవలసిన పని ఉండదు. ’మితభాషి’ అయి, ప్రాప్తించిన కార్యక్రమాలందు ఆసక్తిరహితంగా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అడిగితే ఉపయోగకరమైన వాక్యములనే పలుకుతాడు. అడగకపోతే, ఒక రాయిలాగా మెదలకుండా ఉంటాడు. సర్వుల పట్ల ప్రియమును వహించి ఉంటాడు. అయినా కూడా, ఎవ్వరి పట్ల ఉద్రేక పూరితములైన ప్రేమద్వేషములు కలిగి ఉండడు. మృదుభాషి అయి, ప్రాణికోట్ల హృదయమును ఎఱిగినవాడై ఉంటాడు. తదితరులనందరిని తనకంటే వేఱుకానివారిగా దర్శిస్తూ ఉంటాడు. అనేక యుక్తాయుక్తమైన విషయములతోను, దృష్టులతోను ఆశలతోను, క్రియలతోను కూడియున్న ఈ లోక వృత్తాంతమంతా అరచేతిలో ఉసిరిగపండు వలె సుస్పష్టం గాను, పక్షపాతరహితం గాను చూస్తూ ఉంటాడు.

ముక్తిపదమును అలంకరించిన మహాత్ములు తమ అంతరమున శీతల బుద్ధికలిగి ఉన్నవారై నాశవంతమగు ఈ జగత్తు యొక్క గతినంతటినీ చూచి, నవ్వుకుంటూ ఉంటారు.

చూచావా రామా! ఎవ్వరైతే తమ చిత్తమును జయించి వేస్తారో, ఈ ఇహ పరములు రెండిటినీ ఎఱిగి ఉంటారో అట్టి మహాత్ముల స్వభావమేమిటో నీకు తెలియజేశాను.

మూర్ఖత్వము - ఇక మరి కొందరు తమ చిత్తమును జయించకుండా, విషయ భోగములు అనే బురదలో ఇరుకుకొని ఉంటున్నారు. మూర్ఖత్వము వహించి ఉంటున్నారు. అట్టివారి గురించి కూడా, ఒకటి రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. వినుఅట్టివారికి అగ్నిజ్వాలల వంటి నారీసమూహమే గొప్ప విషయంగా తోచుచున్నది. ధనము, గృహము మొదలైన వాటి పట్ల గల అభిలాషచే కలహము, క్లేశము, దుఃఖము, దురవగాహన మొదలైన ఆపదలనన్నిటినీ తెచ్చిపెట్టు కుంటున్నారు. అట్టి వారు యజ్ఞము, యాగము వంటి ఆయా కర్మలను ఫలాపేక్షతో చేస్తున్నారు… ఫలితమేమిటి? నిరంతరంగా అనేక సుఖదుఃఖ దశలకు లోను కావటమే అగుచున్నది.

ఇప్పుడు చేయవలసిన దేమిటి? - ఓ ప్రియరామచంద్రా! నీవు ‘ధ్యేయవాసన’ తొలగించబడగా, అప్పటి పూర్ణదృష్టినే అవలంబించాలి సుమా! ’జీవన్ముక్తత’ను ఆశ్రయించు. స్వస్థచిత్తుడవై ఈ

లోకమునందు హాయిగా విహరించు.

అంతరంగమున సమస్త ఆశలు త్యజించివేయి. రాగములు, వాసనలు లేనివాడవై ఉండు. బాహ్యమునమాత్రం వర్ణాశ్రమ ధర్మములను నెరవేర్చుచు, ఈ లోకమున వ్యవహరిస్తూ ఉండు.

Page:383

చక్కగా, ఉత్తమ ఆచారసంపన్నుడవై ఉంటూనే, అంతరమున క్రియారహితుడవై ఉండు. ఈ సాంసారికమైన, పారమార్థికమైన దశల నన్నిటినీ చక్కగా విచారణ చేయి. మహత్తరమగు ‘బ్రహ్మపదము’ను భావన చేస్తూ యథాతథంగా ఉండు.

అంతరంగమున ఆశావర్జితుడవై, బాహ్యానికి శుభాశుభయుక్తుడవై క్రియలను ఆచరిస్తూ ఉండు. ఈ ధన బంధు జనాదులన్నీ తొలగుచున్నప్పుడు లోకమర్యాద కొరకు ప్రతిస్పందిస్తున్నప్పటికీ, అంతరమున మాత్రం ప్రశాంత స్థితిని విడువవద్దు,.. విడువవలసిన పనిలేదు. గాలికి కొండపైగల చెట్లు కదలుతాయేమోగాని, కొండ కదలుచున్నదా?

బయటకు అవసరమైన చోట కోపం చూపిస్తూన్నప్పటికీ, అంతరమున మాత్రం కోపమనునదేదీ లేనివాడవై ఉండు. బాహ్యానికి సర్వకార్యములు నిర్వర్తిస్తూ, అంతఃకరణమునందు మాత్రం సర్వమునకు అకర్తవై, క్రియారహితుడవై ఈ లోకమున మెలగుచూ ఉండు.

ఓ రఘరామా! ఈ కనబడే సర్వపదార్థముల సారాసారమేమిటో నీకు తెలుసు. ఈ మన సంవాద ప్రారంభంలో నీవు సుస్పష్టంగా ప్రకటించావు. కాబట్టి, ఏది ఎట్లు ’ధర్మనిరతి’చే ఉచితమో, అది అట్లే నిర్వర్తించు. అయితే ఈ క్రింది విషయం గుర్తుంచుకో.

కృత్రిమోల్లాస హర్షస్థ, కృత్రిమోద్వేగ గర్షణః | కృత్రిమారంభ సంరంభో, లోకే విహర, రాఘవ ॥

ఓ రాఘవా! కృత్రిమమైన ఉత్సాహం, కృత్రిమమైన హర్షం, కృత్రిమమైన ఉద్వేగం, కృత్రిమ నింద, కృత్రిమమైన కార్యారంభం, కృత్రిమ క్రోధం కలిగి ఈ లోకంలో విహరించు. అయితే, అహంకారాన్ని పారత్రోలివేసి స్వస్థ చిత్తుడవై సర్వదా ఆకాశం వలె శోభిస్తూ ఉండు. కళంకరహితుడవై, మేఘరహిత వినీలాకాశంలాగా విస్తరించియుండు. ఇక్కడ రూపం పొందే రకరకాల ఆశాపాశముల నుండి విముక్తుడవై, సర్వవృత్తులందు అతీతత్వము, మహామహిమత్వము వహించి యుండు. పైకి మాత్రం ఈ రీతిగానే ఈ వర్ణాశ్రమ స్వభావ యోగ్యములైన, లేక, ప్రజాహితములైన కార్యములను చేస్తూ ఆనందమయంగా ఈ లోకమున విహరించు.

నబంధోస్తినమోక్షోస్తి దేహినఃపరమార్థతః ।|

మిథ్యేయమింద్రజాలశ్రీః సంసారపరివర్తినీ ॥ (శ్లో 27, సర్గ 18)

ఓ రామచంద్రా! యథార్థానికి బంధం గాని, మోక్షం గాని లేనే లేవు. ఈ కనబడేదంతా ’మిథ్యయే’ అయినట్టి ఇంద్రజాల వైభవం మాత్రమే. ఇంద్రజాలమే ఈ సంసార చక్రము నంతటినీ త్రిప్పుతోంది. ఈ ప్రపంచమంతా భ్రాంతిమాత్రమే. ఇది అజ్ఞానం చేతనే ఏర్పడటం, కనబడటం జరుగుతోంది. బాగా దాహంతో ఉన్నవాడికి మృగతృష్ణలో తియ్యటి నీళ్ళు కనిపిస్తాయి చూచావా? అజ్ఞానంతో కూడిన ఆర్తి కలవాడు జగత్తు పట్ల “ఇదంతా నిజమే” అను బుద్ధిని కల్పించుకొనుచున్నాడు.

Page:384

నాయనా! నీవు ఆత్మస్వరూపుడవేకదా! అసంగము, ఏకరూపము, సర్వవ్యాపకము అయినట్టి ఆత్మకు అస్సలు బంధమెట్లా కలుగుతుందో చెప్పు? బంధమే లేకపోతే, ఇక మోక్షమెక్కడిది? ఎవరికి? ఈ బంధ, మోక్ష, ఆర్తులు సాక్షాత్నము లేనంత వరకే ఏర్పడుచున్నాయి.

తత్త్వ జ్ఞానం యొక్క అభావం చేతనే ఈ విశాల సంసార భ్రాంతి ఉత్పన్నమవుతోంది. ఒకడు త్రాడును చూచి, ’పాము’ అని భయపడ్డాడనుకో, ఆ భయం పోయేది ఎట్లా? ’అది త్రాడు మాత్రమే’ అని ఎరుగుట చేతనే కదా! తత్త్వ జ్ఞానం చేత మాత్రమే ఈ సంసారభ్రాంతి ఉపశమనం పొందుతోంది.

రాఘవా! నీవు ఇప్పటికే నీ సూక్ష్మబుద్ధిచేత ఆత్మతత్త్వమును గ్రహించావు. అహంకారరహితుడ వయ్యావు. ఇక, ఆకాశము వలె నిర్మలుడవై చెన్నొందుము. సర్వదా సర్వమునకు కేవల సాక్షిరూపుడవై ఉండుము. బంధుమిత్రుల గురించిన సర్వవాసనలనూ నిశ్చింతగా త్యజించివేయి. ఎందుకంటావా? అసత్ స్వభావులైన బంధుమిత్రాదుల గురించి చింత వ్యర్థమే అవుతుంది ‘సత్’ స్వభావుడవు అగు నీవు అసత్తుకంటే, అవిద్యకంటే, వాటి సర్వ కార్యముల కంటే విలక్షణమైనవాడవు సుమా!

అవిద్యాకారణం చేత నిన్ను సమీపిస్తున్న "నేను బంధము కలవాడను .. బద్ధుడను” అనునట్టి వాసనలను క్రమక్రమంగా త్యజించివేయి. ఈ భోగములతోను, భోగసాధకులైనట్టి బంధుమిత్రాదుల తోను, ఈ కనబడే జగత్ పదార్థములతోను, శుభాశుభకర్మలతోను ఆత్మకు ఏమాత్రం సంబంధం లేదు. నీవు ఆత్మవే అయి ఉన్నావు. ఇక దేనికోసం ఎందుకు పరితపించాలి?

ఆత్మతత్త్వమొక్కటే సారమైనది. ’అట్టిసార వస్తువునే నేను” అను దృఢ బుద్ధి కలిగిన తరువాత నీకిక భయమెందుకుంటుంది? జగమలచే నీవు భీతి ఎందుకు చెందాలో చెప్పు? చైతన్యదృష్టితో పరిశీలించి చూస్తే ఈ బంధు జనులు అసలు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఇక సుఖ దుఃఖము లేమిటి? పరితాపమెందుకు?

ఒకవేళ - “ఆత్మ నిత్యమే అయి ఉండవచ్చు గాక! కాని, సంగము పొందుతోంది. తద్వారా దుఃఖం పొందుచున్నది కదా!” అని అంటావేమో? ఇక్కడ ఒక్క విషయం నీవు ముఖ్యంగా గమనించు.

నీవు ఇతఃపూర్వం ఉండియే ఉన్నావు. భావికాలంలో కూడా ఉండబోవుచున్నావు. … సరే, ఇప్పుడు ఉండనే ఉన్నావు. నీ బంధువులు కూడా అంతే కదా!… అట్టి నిత్య స్వభావముగల ఆత్మను ఎఱిగిన తరువాత ఇక సుఖదుఃఖ, “న్యూన - అధిక” భావములకు చోటెక్కడిది?

మరొక విషయం - ఇప్పుడు ఈ వర్తమానకాలంలో నీకు సమీపంగా కనిపించే బంధువులను ప్రాణసమానంగా భావించి, వారి కొరకు దుఃఖిస్తున్నావు, బాగానే ఉన్నది! మరి, నీ గడచిపోయిన జన్మల మాటేమిటి? ఆయా జన్మలకు సంబంధించిన బంధువుల గురించి కూడా దుఃఖిస్తూ కూర్చుంటున్నావా? ఇప్పటి ఈ బంధువులు కూడా భవిష్యత్తులో అట్టివారేకదా! కాబట్టి అట్టివారి కొరకు పరితాపం పొందటం ఉచితమెట్లా అవుతుంది?

Page:385

ఇక మనం ఈ జీవుల యొక్క ఒకరితో మరొకరికి ఏర్పడుచున్న మనస్సు యొక్క సంబంధములను చూస్తామనుకో… మనోదృష్టితో చూస్తే నీవు, నీ బంధువులు పూర్వం వేఱువేఱుగా ఉన్నారు. ఇప్పుడో? ఇప్పుడు కూడా వేఱువేఱుగానే ఉన్నారు. ఇకపై కూడా ఆ విధంగానే ఉంటారు. ఈ మార్గంగా అంతా పరిశీలిస్తే ఈ ‘బంధుత్వం’ అనబడేది స్వల్పకాలికమని, మొదలే భ్రమ అని తెలియ వచ్చుచున్నది. అట్టి వీరల గురించి సత్యమని నమ్మి ఎందుకు శోకించాలి?

పోనీ, ఈ భౌతిక శరీరం దృష్ట్యా చూద్దామా? పూర్వం ఉన్నవారు ఇప్పుడు లేరు. ఇప్పుడున్నవారు ముందు ముందు ఉండబోరు. అసలు, సంసారమే నీపట్ల క్షీణించుచుండగా, మధ్యలో ఈ బాంధవ్యాల గురించి దుఃఖించటమేమిటి? ఈ విధంగా “ఆత్మ సంగము ఏర్పరుచుకుంటోంది” - - అని అనుకు న్నప్పుడు కూడా నీవు ఎవరి గురించీ శోకించవలసిన పనిలేదు. ఇక అసంగమగు ’కూటస్థ ఆత్మ’ గురించి గ్రహించావా… ఇక నీకు “దుఃఖించవలసిన పనిలేదు” - అని వేరే చెప్పనే అక్కర్లేదు.

కాబట్టి ఈ మాయామయ జగత్తు విషయంలో అసలు శోకించటం ఏమాత్రమూ యుక్తం కాదు. ’సహజ సంతోష వృత్తి’ని అవలంబించటమే ఉచితం. ఏది చేయవలసి వచ్చుచున్నప్పటికీ, అవన్నీ నిర్లిప్తంగా నిర్వర్తించు. కాని, సహజంగానే ఆనంద స్వరూపుడవగు నీవు ఎల్లప్పుడూ సహజ సంతోషవృత్తిని అలవాటు చేసుకో.

మాగచ్ఛదుఃఖితాయుక్తా ప్రాకృతేజాగతేక్రమే |

తథైవముదితాయుక్తా యుక్తంకార్యానువర్తనమ్ || (శ్లో 42, సర్గ 18)

ఈ ప్రాపంచక పదార్థములచే నీవు సుఖదుఃఖములకు లోను కావలసిన పనేమీ లేదు. సర్వత్రా సమరూపము అభ్యసించుటచే మహనీయులు ఈ సుఖదుఃఖాలను అధిగమించివేస్తున్నారు. పరమాత్మ సర్వవ్యాపి, సమరూపుడు కదా! నీయందు కూడా ఆతడే సమరూపుడై వ్యాపించి ఉన్నాడని గ్రహించు.

ఓ రామచంద్రా! నీవు అనంతుడవు. ‘సత్’ స్వరూపుడవు. ఆకాశము వలె సర్వ వ్యాపకుడవు. సర్వత్రా ప్రకాశమయమైన జ్యోతిస్వరూపుడవై వెలుగుచుండగా ఇక, అంధకారమునకు చోటెక్కడిది? శుద్ధ స్వరూపుడవగు నీయందు సుఖదుఃఖాదులు బంధుత్వ, అబంధుత్వాదులు ఉండటమేమిటి? నీవే సర్వహృదయము లందు ఉన్నవాడవై ఒక పూలదండలోని ధారంలాగా సూక్ష్మరూపమున అంతటా వ్యాపించి ఉన్నావు. అయితే, అతిసూక్ష్మమగు నీ రూపము ఈ సర్వ జగత్పదార్థము లందు వ్యాపించి ఉన్నప్పటికీ, అది స్థూలదృష్టికి మాత్రం గోచరించుటలేదు.

అజ్ఞానియే మరల మరల జన్మలను పొందుచున్నాడు. జ్ఞాని, వీటిని వేటినీ పొందుటయే లేదు. జ్ఞాని ఈ శరీరాదులచే జన్మించడు. ఇవి నశించినప్పుడు తాను నశించడు. ఆతడు ఈ ప్రపంచ స్థితిని చూచి మోహించడు. జ్ఞానబలముచే సర్వదా సుఖరూపుడుగానే ఉంటాడు. ఆహా!

Page:386

ఈ సంసారమంతా నిరంతరం దుఃఖపూర్ణమై అజ్ఞానముచేతనే విస్తారమగుచున్నది కదా! కాని రామా! నీవు మాత్రం ’జ్ఞాని’గానే అయి ఉండాలి సుమా! “నాకు జన్మాదులు ఉండవు” అని గ్రహించటమే జన్మరాహిత్యం.

ఈ కనబడేదంతా భ్రమ మాత్రమే… భ్రమకు భ్రమ కాక మరొక రూపమెక్కడున్నది?… స్వప్నంలో కనిపించే వాటికి స్వప్నత్వమే స్వరూపం గాని, ఇక మరే పదార్థంతో అవి తయారవుతాయి చెప్పు?… మిక్కిలి ప్రకాశవంతమై స్ఫుటరూపం కలిగి భాసిస్తూ, భ్రమ మాత్రమే అయిన ఈ జగత్తు సర్వశక్తిమంతుడగు ఆ పరమాత్మ యొక్క శక్తియే అయి ఉన్నది.

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఒకనికి మరొకడు బంధువుగాని, శత్రువుగాని కానేరడు. ఈ శత్రు, మిత్ర ఉదాసీనులంతా కాలానుగతంగా ‘ఈశ్వరేచ్ఛ’ చేతనే సంభవించుచున్నారు. ఈ జగత్తులో తారసపడే వ్యవహారమంతా జలములోని తరంగాలలాగా ఒకదానికి మరొకటి కారణమగు అనేక సంఘటనలతో ఎప్పటికప్పుడు ఛిన్నాభిన్నమగుచున్నది. ఇట్టి ఈ జగత్తును మననం చేస్తూ, దుఃఖిం చేవారు మా దృష్టిలో అమాయక బాలురవంటివారు మాత్రమే.

చలనశీలమగు సంసార చక్రం నిరంతరం పై నుండి క్రిందకు, క్రింద నుండి పైకి తిరుగాడుతూనే ఉన్నది. స్వర్గంలోని జీవులు ఒకానొకప్పటికి నరకం చేరుచున్నారు. నరకంలోని జీవులు స్వర్గానికి వెళ్ళుచున్నారు. ఒకడు ఒక ద్వీపం వదలి మరొక ద్వీపం ప్రవేశించునట్లే ఈ జీవులంతా ఒక ఉపాధిని వదలి మరొక ఉపాధిని ఆశ్రయించుచున్నారు. ఇట్టి స్వప్నకల్పితమైన అవాస్తవ జగత్ వ్యవహారముల కొరకు కొందరు మాయాబద్ధులగు జీవులు తెంపులేని శోకం అనుభవిస్తున్నారు. మరి వారికి నేనేమి, ఎట్లా చెప్పాలి?

ఒకప్పుడు మహాధీరులై అటూ ఇటూ సంచరిస్తున్న వారు మరొకప్పుడు అతి దీనత్వం పొందు చున్నారు. దీనులు మహాధీరులగుచున్నారు. పతనము ఉత్పత్తిలచే ఈ జీవులు తమకు తామే విభ్రమములను కల్పించుకొనుచు, సంచలనము పొందుచున్నారు. దీపశిఖకు స్థిరాకారం ఉంటుందా? ఈ సంసారచక్రము నందు కూడా ఏదీ ఎన్నటికీ ’ఒక రూపము’ కలిగి ఉండుటలేదు. ఈ సంసార దృష్టి ఏర్పడి ఉన్నంతవరకు స్వచ్ఛత్వము గాని, దుఃఖరాహిత్యము గాని ఏ జీవునకు కూడా సాధ్యపడేది కాదు. అనుక్షణం ‘మార్పు’ చెందుచుండే స్వభావంగల ఈ విషయముల పట్ల ఇది మాకు ఇట్లు ఉండాలి… అని అనుకొని ఎవడు సుఖం పొందగలడు చెప్పు? అందుచేత, రామా! ఈ ప్రపంచంలో తారసపడే “నాది, నాకు చెందినది, నీది, నీకు చెందినది, వారిది, వారికి చెందినది”– మొదలైనవన్నీ -

మెల్లకన్నువాడు రెండవ చంద్రుని చూచునట్లు, కేవలం భ్రమ చేత మాత్రమే అట్లు అనిపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రమూ సందేహంలేదు. అందుచేత ఈ “నేను”, “నీవు", ఈతడు నా వాడు, ఆతడు శత్రువు” - అనునట్టి మిథ్యాదృష్టులన్నీ నీ పట్ల నశించు గాక. అయితే ఆయా అనుకూలములైన వ్యవహార సరళి లోకమునకు అవసరమైయున్నది కనుక, ఇక్కడి వ్యవహారతత్పరతను లీలామాత్రంగా బాహ్యమునకు మాత్రమే అవలంబించు. నీకు బంధువులుగా ఉన్నవారి పట్ల ….

Page:387

ఆత్మదృష్టిచే చైతన్యమాత్ర స్వరూపులుగాను, లౌకిక దృష్టిచే నీ ఆయా కర్తవ్యములు గాను భావించు… అంతేగాని, ఒక గాడిదలాగా లేనిపోని భారములన్నీ కల్పించుకొని భ్రమాత్మికమైన నమ్మికతో, ఈ సంసార లంపటములయందు కాలయాపన తాత్సారములతో కూడిన బుద్ధిని పొందవద్దు. నిష్కారణముగా దుఃఖములను, వాసనాభారములను తెచ్చిపెట్టుకోవద్దు. వాసనలను క్షీయింపజేయ గల క్రియలను విచారణలను శ్రద్ధగా ఆశ్రయిస్తూరాగా, ఈ సంసారభారం స్వయంగా రహితమైపోగలదు.

అయం బంధుః అయంనేతి గణనా లఘుచేతసాన్ | ఉదారచరితానాంతు విగతావరణైవధీః ॥

“ఈతడు బంధువు, ఈతడు శత్రువు” అనే భేదదృష్టంతా అల్పబుద్ధి కలవారికే ఉంటుంది. ఉదారచరితులకు అట్టి పరిచ్ఛిన్నదృష్టిగాని, ఆవరణయుక్తమైన బుద్ధిగాని ఉండదు. వారు, “ఈ సర్వము నందు నేను ఉండనే ఉన్నాను.. ఈ సర్వము సర్వదా నా యందే ఉన్నది” అను నిశ్చయము గల ధీరబుద్ధి కలిగి ఉంటారు. కనుకనే వారిపట్ల సర్వ ఆవరణలు (All Limited perceptions) తొలగిపోతున్నాయి.

నాస్తమేతినచోదేతి యశ్చిదాకాశవన్మహాన్ |

సర్వంసంపశ్యతిస్వస్థః స్వస్థోభూమితలంయథా ॥ (శ్లో 63, సర్గ 18)

అట్టి ప్రాజ్ఞునకు ఇక ఉత్పత్తి వినాశనములు ఉండవు. ఆతడు ‘ఆకాశము’ వలె మహత్తరమైన రూపము కలిగి, సర్వ విక్షేపములు నశించినవాడై స్వస్థచిత్తుడై ఉంటాడు. ఆకాశమున ఎక్కడో ఉండి ఈ భూతలమును వీక్షించుచున్నట్లు ఆతడు ఈ జగత్పదార్థములను, జనులను, సంఘటనలను చిద్విలాసంగా, భావాభావములకు అతీతంగా చూస్తూ ఉంటాడు.

ఓ రామచంద్రా! ఈ ప్రపంచమునగల జీవ జాతులన్నీ ఈ జీవునకు బంధువులే. ఎందు కంటావా? ఆతడు అనేక వేలాది జన్మలు ఎత్తియే ఉంటాడు. ప్రతి జీవజాతిలోను అతడు అనేక మార్లు జన్మించియే ఉంటాడు. ఇక ఆతని జాతి ఏది? ఆతని జాతి కానిదేది? కనుక ‘నేను ఈ జాతికి చెందిన జీవుడను’ అని తలచుట భ్రమ కాదా చెప్పు? పలువిధములైన విచిత్ర జన్మభ్రమలతో గూడిన ఈ జగత్తునందు, “ఈతడు నా బంధువు - - ఈతడు నా శత్రువు" అనునదంతా మిథ్యా దృష్టి రూపముననే భ్రాంతిగా విజృంభిస్తోంది. వాస్తవానికి చూస్తే ఈ ముల్లోకములందలి జీవులు జీవభావదృష్టిచే నీ బంధువులే అయి ఉన్నారు. వారూ జీవులే…. నీవు జీవివేకదా! అంతేకాదు. ప్రతిజీవుడు అనేక జీవజాతులలో జన్మలు పొందుచూనే ఉన్నాడు. ఇక బ్రహ్మభావ దృష్టితో చూచావా…. నీవే వారందరి స్వరూపముగా అగుచున్నావు. కాబట్టి నీ వారు కాని వారెవ్వరు?

ఈ విషయంలో ప్రాచీనమైన కథ ఒకటున్నది. ఇద్దరు అన్నదమ్ముల సంవాదముచే “బంధుత్వము అనబడునది స్వయం కల్పితమైన చమత్కారమే” అని నిర్ణయింపబడింది.

Page:388

  1. నదుఃఖార్హం

జంబూద్వీపంలో గల ఒక పర్వతంపై ‘దీర్ఘతపుడు’ అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆతడు ఉదార మనస్కుడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, మహాతపశ్శాలి కూడా. ఆతనికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారి పేర్లు పుణ్యుడు, పావనుడు. గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని, ఆతడు తన ఇద్దరు కొడుకులతోను, భార్యతోను ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉండేవాడు.

కొంతకాలం గడచిన తరువాత ఆతని ఇద్దరు కుమారులలో పెద్దవాడైన పుణ్యుడు అభ్యాసవశం చేత ‘బ్రహ్మజ్ఞాని’ అయ్యాడు. కాని, రెండవవాడగు పావనుడు మాత్రం కొంత గ్రహించి, మరికొంత గ్రహించక మిగిలి ఉన్నాడు. ఆతడు ‘పూర్ణ బ్రహ్మపదము’ పొందకపోవటం చేత మార్గమధ్యంలోనే వ్రేలాడుతూ ఉండేవాడు.

ఆ విధంగా అనేక సంవత్సరాలు దొర్లాయి. అదృశ్యమైన రూపంతో జీవుల ఆయువును క్షణ క్షణం మ్రింగివేసే స్వభావం గల కాలం గడచిపోసాగింది. దీర్ఘతపునకు వందేళ్ళు నిండాయి. ఒక నాటికి ఆతనికి ఈ సంసారముపై తిరస్కారపూర్వకమైన బుద్ధి పుట్టింది. నశ్వరమైన జీవుల చేతను పుట్టుక, రోగము, అకస్మాత్ సంఘటనలు, వార్ధక్యము, మృత్యువు, మొదలుగాగల వివిధ దుస్సవహమైన, నిస్సారమైన వృత్తాంతముల చేతను నిండి ఉండి, భయంకర ఆకారము కలిగిన ఈ సంసారముపై ప్రీతిని త్యజించాడు. యోగబలంతో వార్ధక్యముచే జర్జితమైన తన భౌతికదేహం త్యజించాడు. కల్పనా రహితము, విషయములు లేనట్టిది, నిత్యోదిత చేతనా స్వరూపము, రాగద్వేష రహితము అయినట్టి ‘బ్రహ్మపదము’ నందు ప్రవేశించాడు. ఎంతో కాలం, భర్తను సేవిస్తూ వస్తున్న ఆతని భార్య కూడా బ్రహ్మభావము పొందినదై తన భర్తను అనుసరించింది. సామాన్యమైన భౌతిక దృష్టికి వారిద్దరు అలభ్యులు, అగోచరులు అయ్యారు.

చనిపోయిన తల్లితండ్రుల భౌతికదేహాలకు పుణ్యుడు దహనము మొదలైన అంత్యక్రియలు పూర్తి చేశాడు. ప్రజ్ఞచే నిత్యానిత్యములు ఎఱిగియుండుటచే ఆతడు యథాతథంగా తన సాధన పఠనాదులను కొనసాగించసాగాడు. కాని పావనుడు మాత్రం తల్లితండ్రులను పోగొట్టుకొన్న దుఃఖం నుండి బహుకాలం విడివడలేక పోయాడు. అత్యంత దుఃఖాక్రాంతమైన మనస్సుతో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల గల అరణ్యంలో పిచ్చిపిచ్చిగా సంచరిస్తూ విలపించసాగాడు. ఇది గమనించిన పుణ్యుడు ఒకరోజు పావనుని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ఈ విధంగా సంభాషించసాగాడు. పుణ్యుడు : తమ్ముడూ! అజ్ఞానిపై ఈ విధంగా ఎందుకు పరితాపం పొందుచున్నావు? నీవు, నేను, నాన్నగారు, అమ్మ ఒకచోట కూర్చుని అనేకసార్లు చర్చించిన ఆత్మ విశేషాలన్నీ మరచిపోయావా? నీవు గొప్ప తెలివిగలవాడివే కదా! మన అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పు? వాళ్ళు ‘బ్రహ్మపదము’ను పొందారు. ఆ బ్రహ్మమే సర్వ జీవులకు నిలయం కదా! బ్రహ్మవేత్తల స్వరూపం కూడా అదే. స్వస్వరూపం పొందిన వాళ్ళ గురించి ఎందుకు రోదిస్తున్నావో చెప్పు?

Page:389

పావనుడు : అన్నా! మనలను కని, పెంచి, పెద్దచేసిన అమ్మ నాన్నలు మన కళ్ళముందు నుంచి మాయమై, ఎటో వెళ్ళిపోయారే? ఆ భగవంతుడికి మనం ఏం అన్యాయం చేశామని ఈ పిచ్చిపని

చేశాడు చెప్పు?

పుణ్యుడు :“ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి” అను రూపము గల భావనలన్నీ ఉత్తమ సత్యము పట్ల ఉదాసీనత, విచారణ కొరవడటం, అజ్ఞానం… కారణంగానే ఉదయిస్తున్నాయి. శోకించతగని వాటి గురించి నీవు శోకిస్తున్నావు. “గతించిపోయిన, గతించిబోయే” విషయాల గురించి శోకించి లాభమేమున్నది చెప్పు?

తమ్ముడూ! “దీర్ఘతపుడు నా తండ్రి, ఆతని భార్య నా తల్లి” అని భావిస్తున్నావు… బాగానే ఉంది. కాని, వాస్తవానికి వారు మాత్రమే నీకు తల్లితండ్రులా? కాదు. ఎందుకంటే నీవు ఇంతకు ముందు వేలాది జన్మలలో అనేక మంది తల్లితండ్రులను పొందియున్నావు. అదేవిధంగా వారు కూడా తమ ఇతఃపూర్వపు జన్మలలో వేలాదిమందిని తమకు బిడ్డలుగా పొందియున్నారు. కనుక, “నీవు, నేను” మాత్రమే వారికి పుత్రులం" అనటం మూర్ఖమే అవుతుంది. ఇట్టిదే ప్రతిఒక్క జీవుని యొక్క ప్రతిఒక్క సంబంధం కూడా !

మిత్రబాంధవవృన్దాని జన్తోర్జన్మనిజన్మని |

ఋతావృతావతీతాని ఫలానివమహాతరోః ॥ (శ్లో 34, సర్గ 19)

ప్రతిజన్మలోను ఈ జీవునకు ఎందరో బంధువులు, మిత్రులు, పరిచయస్తులు కలుగుచున్నారు. "ప్రేమవశం చేతనే నేను నా తల్లితండ్రుల గురించి శోకిస్తున్నాను” అని నీవు అనదలచుకొంటే, మరి, నీవు నీ గతించిపోయిన జన్మలలోని తల్లి తండ్రుల గురించి, బంధువుల గురించి ఎందుకు శోకించుటలేదో నేను తెలుసుకోవచ్చా?

పావనుడు : నిజమే, నీవు చెప్పేదానిలో వాస్తవముంది. అయితే ఈ దృశ్యం మరల మరల వస్తోంది, పోతోంది. ఇదంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది?

పుణ్యుడు : ముక్కుకు సూటిగా నీ ప్రశ్నకు బదులివ్వాలంటే - ’జగత్ కల్పన’కు అజ్ఞానమే కారణం. ‘అజ్ఞానము’ చేతనే ఈ దృశ్యమంతా ప్రకటితమవటం, ఎదురుగా నిలిచి ఉండటం, భ్రమింపచేయటం జరుగుతోంది.

యథార్థానికి నీకు మిత్రులుగాని, సోదరులు గాని, తదితర బంధువులు గాని లేరు. ఎఱ్ఱటి ఎండకు కాలిపోతున్న ఎడారిలోని ఇసుక దిబ్బపై నీళ్ళు ఉంటాయా? బ్రహ్మస్వభావమగు ఆత్మయందు జన్మము లేదు. మరణము లేదు. ఇక, నీకు కనిపిస్తున ధన ధాన్య రాజ్య విభవములు, ఐనవాళ్ళు, కానివాళ్ళు, అనుబంధములు… ఇవన్నీ భ్రమతో కూడిన సాంసారిక దృష్టికి మాత్రమే తారస పడుచున్నాయి. పైగా, ఇవన్నీకూడా, మూడు నాళ్ళముచ్చట్లే కదా! “ఇవి నాకు కలవు” అని విఱ్ఱవీగేంత సేపు పట్టదు… వీటి రాకపోకలు! అందుచేత, సోదరా! కాస్త పరమార్థదృష్టిచే సత్యాన్ని విచారించు. ఈ ”నేను - నాది - నీది" అను వ్యవహారమంతా కేవలం కల్పనయే అయి ఉన్నది.

Page:390

అంతేకాని, వాస్తవం మాత్రం కాదు. ఇప్పుడు మన ఇరువురి మధ్య ఏర్పడివున్న అనుబంధమును విజ్ఞాన దృష్టిచే పరిశోధించామనుకో, “నీకు నేను గాని, నాకు నీవు గాని ఏ ఒక్కక్షణమందు కూడా లేము” - అనియే తెలియవస్తోంది. అందుచేత, “స్వప్నంలోని వస్తుజాలం వంటిది, భ్రమ చేత మాత్రమే అనుభవమగునది" - అయినట్టి ఈ “నీవు, నేను” మొదలైన భ్రమలన్నీ నీ హృదయంలోంచి ముందుగా పారత్రోలివేయి.

పావనుడు : మరి ఈ జీవుల జన్మ మృత్యువుల సంగతేమిటి?

పుణ్యుడు : “ఇది నశించుచున్నది, ఇది జన్మించుచున్నది”- ఇటువంటి దృష్టులన్నీ స్వసంకల్పములతో రూపం పొందిన భ్రమచేత మాత్రమే నీముందుకు వస్తున్నాయి. మరల మరల విజృంభిస్తున్నాయి. అంతేకాని అదంతా వాస్తవమైనది కాదు.

‘ద్రష్టత్వము’ అను క్రియావిశేషమునకు కూడా కర్తయగు ఆత్మ ఒకానొక తరుణంలో అజ్ఞాన తాపముచే ఆఛ్చాదితమై ఉంటోంది. ఎడారిలో మృగతృష్ణాజలం కనబడుతోందిచూడు. అట్లాగే “శుభ, అశుభ కర్మలు” అనే చంచల, స్వవాసనపూర్వకమైన తరంగాలు ఈ అనంత సంసార సాగరంగా స్ఫురిస్తున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కప్పి వేస్తున్నట్లు, సాంసారిక భావనలు ఆత్మాకాశాన్ని కప్పివేస్తున్నాయి. అయితే మేఘములు కమ్మినంత మాత్రం చేత ఆకాశం లేకుండా పోతుందా?… లేదు. ఈ భ్రమలన్నీ ఏర్పడవచ్చు, లేక మరొకప్పుడు తొలగిపోవచ్చు. నిర్మలమైన చిదాకాశము ఎప్పటియట్లే అప్రమేయముగా, అఖండముగా సర్వదా ఉండి ఉంటోంది.

చిదాకాశమే నీయొక్క, నాయొక్క, మన అమ్మా, నాన్నల యొక్క వాస్తవ ్వరూపం.

  1. సంబంధబాంధవ్యముల అతీతత్వము కఃపితాకించవామిత్రం కామాతాకేచబాన్ధవాః ॥ స్వబుద్యైవావధూయనే వాత్యయా జనపాంసవః ॥ (శ్లో 1, సర్గ 20)

పుణ్యుడు : తమ్ముడూ! పావనుడా! తల్లి ఎవరు? తండ్రి ఎవరు? మిత్రులెవరు? బంధువులు ఎవరు? గొప్ప గాలి వీస్తుంటే ధూళి లేస్తుంది చూచావా! ఈ అనేక జీవుల సంబంధములు ఆ ధూళి లోని వేరు వేరు రేణువుల యొక్క సామీప్య సంబంధములవంటివి మాత్రమే.

ప్రతి జీవునకు తదితర జీవులంతా ఆ జీవుని యొక్క ‘స్వబుద్ధి, భ్రాంతి’లచే కల్పించబడినవారై ఉన్నారు. ఆత్మయే రాగ, ద్వేష, మోహములను ఆశ్రయించుచున్నప్పుడు - “వీరు బంధువులు, వీరు మిత్రులు, వీరు హితులు” - అనువాటితో కూడిన ఈ ప్రపంచం విస్తరింప జేయుచున్నది.

ఒకనిని చూచి నేను “ఇతడు నాకు సంబంధించినవాడు” - అని సంకల్పించినప్పుడు మాత్రమే అతడు నాకు బంధువు అగుచున్నాడు. అట్లా కాకుండా, “ఆతడు అప్రియమైనవాడు, వ్యతిరేకి, ద్వేషింపదగినవాడు”– అను రూపం గల వ్యతిరేకభావనచే శత్రువు అగుచున్నాడు. భావనామాత్రం

Page:391

చేతనే విషము అమృతము గాను, అమృతము విషము గాను అగుచున్నది. ఈ సంసారము యొక్క ప్రాప్తి, స్థితి, గతి కూడా కేవలం ‘భావించుట’ అను క్రియావిశేషము చేతనే సంభవిస్తోంది.

సర్వదేహములందు ఏకరూపమున వెలుగుచున్నట్టి ’సర్వవ్యాపి’యగు ఆత్మకు “ఇతడు నా బంధువు, ఇతడు నా మిత్రుడు" అను కల్పన ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నీవైనా, నేనైనా ఈ రక్త మాంస బొమికలతో కూడిన అస్తిపంజర శరీరములమా? కాదు. ఈ దేహగృహం మనం ఆశ్రయించాం గాని మనం ఈ దేహములం కాము సుమా! అందుచేత కొంచెం ఏకాంతంలో కూర్చుని “చేతనా స్వభావుడైన నాయొక్క యదార్థ స్వరూపము ఏమై ఉన్నది…?” అని నీ చిత్తములోనే విచారణ చేయడం ప్రారంభించు.

పరమార్థమగు “శుద్ధ చైతన్య దృష్టి”తో ఈ దృశ్యమును ఆమూలాగ్రం పరిశీలన చేయడం జరిగితే, అప్పుడు, ““పావనుడు’ అనబడే నీవు గాని, ’పుణ్యుడు’ అని పిలువబడుచున్న నేను గాని ఈ దేహపరంగా లేనే లేము" అని తెలిసి వస్తుంది. దేహము పట్ల ‘ఇది నేను’ అను రూపము గల అభిమానం, మిథ్యా జ్ఞానం ఏర్పడియుండుట చేతనే ఈ మన రూపాలన్నీ ఈ విధంగా విజృంభించి, లయిస్తున్నాయి. ఈ కనబడే వేలాది వేర్వేరు శరీరములన్నీ ‘కల్పన’ చేతనే కన్పిస్తున్నాయి కాని, ఇవన్నీ స్వతహాగా ఉన్నవి కావు.

మనం భౌతిక దృష్టిచే, లేక, “దేహ దృష్టి” చే పరిశీలిస్తే - ఇక్కడ నశ్వరమైనది కానిదేమున్నది? ఇక్కడ తల్లి ఎవరు? అయినవాడెవ్వడు? కానివాడెవ్వడు? మిత్రుడెవ్వడు? శత్రువెవడు? ఈ ఎదురుగా కనబడుచున్న ‘దేహములు’ అను ఉపాధులకు అతీతమై, సాక్షిమాత్రమై ఉన్నట్టి ‘చైతన్య దృష్టి’ అలవరుచుకున్నావనుకో… అప్పుడు అనంతరూపమగు ‘చిదాత్మ’ మాత్రమే ఉనికి కలిగి అగుపిస్తుంది. అట్టి చిదాత్మ యందు “ఇది నాది, అది నీది” అనే భేదం ఉంటుందా? ఉండదు. ఒక సముద్ర తరంగానికి ఏ తరంగం ఏ తరంగానికి శత్రువు? ఏ తరంగం ఏ తరంగానికి మిత్రుడు? ఉన్నదంతా జలమే కదా!

పావనుడు : అయితే అన్నా!. ఈ ప్రశ్నకు బదులు ఇవ్వు. మనోబుద్ధి అహంకారములు అనబడే సూక్ష్మ తత్వమే నేను కదా! అట్టి మనోబుద్ధులకు “ఈతడు నా అన్న“ - అని నీవు లభించుచున్నావే? మరి “శత్రు మిత్రులు, బంధువులు కానివారు” లేరని నీవు ఎట్లా అనగలవు? జన్మ పొందినప్పటి నుండీ ఏర్పడియున్న బంధువులను ”వీరు నా వారు" అని అనుకోవటం లోకధర్మమే కదా! వారిని యథారీతిగా బంధుత్వపూర్వకంగా కలిగియుండటం ఎందుకు సముచితం కాదు?

పుణ్యుడు : నీవు చెప్పేది బాగానే ఉన్నది. అయితే, నాది మరొక ప్రశ్న. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే జన్మచే ఏర్పడుచున్న ఈ సంబంధబాంధవ్యములు శిరోధార్యమేనని అనుకుందాం…. మరి, ఇతఃపూర్వం గడచిన అనేక జన్మలలో బంధు మిత్ర ధనాదుల మాటేమిటి? అవన్నీ అక్కడక్కడ వదలి వచ్చినందుకు ఇప్పుడు దుఃఖిస్తూ కూర్చుంటున్నావా? ఈ వర్తమాన జన్మలో కూడా ఎన్నెన్నో అనుబంధాలు ఏర్పడటం, మరల కాలముచే మ్రింగివేయబడటం జరుగుతోంది కదా!

Page:392

ఏది ఏమైనా, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరముల తరువాత క్రితం జన్మలోని విశేషాలు లాగానే రూపరహితం కాబోతున్నాయి కదా! ఈ విషయం నీవుగాని మరొకరుగాని ఒప్పుకోక తప్పదు. అయితే, ఎప్పటికప్పుడు, ఆ వర్తమాన సమయంలోని బంధు మిత్ర శత్రుత్వాదులు నిన్ను మోహింపజేస్తున్నాయి. ఇది గమనిస్తున్నావా?

ఎప్పటికప్పుడు వచ్చి పోతూ ఉండే ఈ సంబంధముల పరంపరలో దేనికొరకు హర్షించాలి? దేని కొరకు దుఃఖించాలి? అందువలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఈ అత్యంత కల్పితమైనట్టి అనేక బంధుమిత్రాదులలో కొందరు మరణాదులు పొందినందుకు దుఃఖించటం, మరికొందరి వృద్ధిని చూచి సంతసించటం ఇదేనా, మన పని? మనం ఇందుకే జన్మిస్తున్నామా? మనం ఈ దేహంతో పుట్టటానికి మునుముందు ఇవన్నీ లేనేలేవు కదా!

తమ్ముడూ! మరొక మాట నీవు ఇంతక్రితం మృగజాతులలో జన్మించి ఉన్నావు. అనగా, వాటందరిలో నీకు బంధువులు ఉన్నారు. మరి ఆ మృగములు వేటాడబడుచున్నప్పుడు నీవు దుఃఖించుట లేదేమి?

పావనుడు : అయి ఉండవచ్చునేమో! అయితే అవన్నీ ఇప్పటి నా దృష్టిపథంలో లేవు కదా! పుణ్యుడు : అవును! ఆ రీతిగానే ఈ వర్తమానపు సంబంధాదులన్నీ ఒకప్పటికి నీ దృష్టిపథంలోంచి తొలగిపోబోతున్నాయి. ప్రతిజీవుడు ’వృక్షము, సింహము, పులి, చేప’ మొదలైన అనేక రూపములను ఎత్తుచు, ఎన్నో బంధుత్వములను పొందటం, త్యజించటం చేస్తూనే ఉన్నాడు. అయితే ఏం? ఎప్పటి కప్పుడు వర్తమాన కల్పన యందు నిమగ్నమగుచు, ’అయ్యో నేనొక అల్ప దుఃఖ పేద జీవిని” అని దుఃఖములు తెచ్చిపెట్టుకుంటున్నాడు. అంతరంగమునందు ఆత్మదృష్టి ఏర్పడనంత వరకు ఈ వ్యవహార స్రవంతికి అంతు లేదు.

అనేక జన్మల చమత్కారం - “తపస్సు - ధ్యానము భగవత్కటాక్షము”ల ప్రయోజనంగా నాకు ప్రాప్తించిన సునిశిత దృష్టిచే నేను చూడగలుగుచున్నట్టి నీ పూర్వజన్మల కొన్ని వృత్తాంతాలను

చెబుతాను వినునీవు పూర్వం ఒకానొకప్పుడు “దశార్ణవ” అను పేరుగల దేశంలో ఒక కోతివై పుట్టావు. ఆ

తరువాత “తుఫార” అనే మరొక దేశంలో రాజకుమారుడవై పుట్టావు.

ఇంకా, మరికొన్ని విశేషాలు చెప్పమన్నావా? అయితే వినుఒకప్పుడు కోసలదేశంలో ఒక బ్రాహ్మణుడుగా జీవిస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవాడివి. వంగ దేశంలో ’లొట్టిపిట్ట’గా అనేక చెట్లను ఆశ్రయించావు. ఒకచోట గుఱ్ఱంగా పుట్టి అనేక యుద్ధ భూములలో ప్రవేశించి డెక్కలతో అనేక మృతదేహములను స్పృశించావు. మరొకచోట ఒక తాటిచెట్టు తొఱ్ఱలో పురుగుగా జీవించావు. దోమగాను, బాతుగాను పుట్టి ఉన్నావు. మరొకప్పుడు హిమాలయాల లోని ఒక కొండశిఖరప్రాంతంలోని ఒక ఇరుకైన చోట రంగులచారలు గల పురుగుగా పుట్టావు. మరొక చోట నేలలో తేలుగా జన్మించి, ఒకటిన్నర సంవత్సరములు గడిపావు. ఆ తరువాత ఒక

Page:393

చండాల కన్యకకు పుత్రుడవై జన్మించావు. ఆ తరువాత ఇక్కడి దీర్ఘతపునకు, అంటే మన తండ్రికి - ఈ విధంగా కుమారుడవై జన్మించావు. ఇంకా చెప్పాలంటే ఈ జంబూద్వీపంలోనే అనేక జీవ జాతులలో అనేక మార్లు పుట్టటం, చావటం నిర్వర్తించి ఉన్నావు.

విశుద్ధమైనట్టి “సూక్ష్మబుద్ధి”చే నాకు లభిస్తున్న ’సంయక దర్శనము’ అను ప్రభావంచేత నీకు చెప్పినదంతా నేను ఎదురుగా చూడగలుగుచున్నాను. అనేక జన్మలలో చేసిన ఆయా ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనంగా నాకు ఈ దివ్య దృష్టి ప్రాప్తించింది. నాకు కూడా అజ్ఞానస్థితిలో అనేక జన్మలు గడచిపోయాయి. జ్ఞానాభివృద్ధి కొరకై ఆ సంగతి కూడా ప్రస్తావిస్తాను.

నేను కూడా కుక్కగాను, కప్పగాను, మృగములను వేటాడే వేటగానిగాను, వంగదేశంలో ఒక చెట్టుగాను, వింధ్య పర్వత ప్రాంతంలో ఒక ఒంటెగాను, కొంగగాను, ఒక రాజుగాను, పులిగాను జన్మించటం జరిగింది. పదియేళ్ళు గ్రద్దగా ఉన్నాను. ఒక వందయేళ్ళు సింహంగా జీవించాను. కొంతకాలం ఒక పిచ్చుకనై గూళ్ళు కట్టుకుని జీవించాను. మరల మరొక ప్రదేశంలో ఒక సమయంలో ఒక మండలాధీశునికి కుమారుడుగా పుట్టి అనేకమందిని హింసిస్తూ పెత్తనం చెలాయించాను. నా దుష్టస్వభావానికి ప్రతిఫలంగా ఆ జన్మలో నేను కొందరిచే సంహరించబడ్డాను కూడా! ఆహా! ఏం చెప్పాలి! భిక్షకుడు ఇంటింటికీ వెళ్లి కబళం కోసం కేకలు వేస్తున్నట్లు నేను అనేక ఉపాధులలో ప్రవేశించాను. మరల ఇంతలోనే నిష్క్రమించాను. ఇటువంటి అసంఖ్యాకమైన భూతకాలపు జన్మలను నేనిపుడు సుస్పష్టంగా సంస్మరించగలుగుచున్నాను.

కాబట్టి తమ్ముడూ! నీకూ నాకు కూడా ఇంతకు ముందు ఎందరో తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు, బంధువులు వేరువేరుగా ఏర్పడి, తరువాత మరెప్పుడో కాలముచే ఎటకో తీసుకుపోబడ్డారు. ఇక ఈ వర్తమానంలోని మనిద్దరి అన్నదమ్ముల సంబంధము కూడా అటువంటిదే. ఈ గడచిపోయిన అసంఖ్యాకమైన సంబంధాలలో వేటివేటి కొరకు సంతోషించాలి? వేటివేటి కొరకు దుఃఖించాలి? పావనుడు : అన్నా ! ఔను ! నిజమే…!

పుణ్యుడు : నీవు ఎవరి కోసం దుఃఖించవలసినపనీ లేదు. ఎందుకంటావా? జగత్తు స్థితే అట్టిది. అనన్తాఃపితరోయాన్తి యాన్త్యనన్తాశ్చమాతరః |

ఇహసంసారిణాంపుంసాం వనపాదపపర్ణవత్ ॥ (శ్లో 33, సర్గ 20)

వనమందలి వృక్షపర్ణముల వలె సంసారజీవు లమగు మనకు ఎందరో సంబంధీకులు సంభవించారు, సంభవించ బోవుచున్నారు.

కింప్రమాణమతఃపుత్ర దుఃఖస్యాత్రసుఖశ్యచ ॥

తస్మాత్సర్వంపరిత్యజ్య తిష్టావఃస్వచ్ఛతాంగతౌ ॥ (శ్లో 34, సర్గ 20)

ఈ తతంగమంతా “ఇది సుఖము, ఇది దుఃఖము" అను భావనతో పరికించదలచుకొన్నావా…

ఇక ఈ సుఖదుఃఖములకు అంతు ఎక్కడ? కనుక, నీవు ఈ దృశ్యదృష్టిని, దీని వలన కలుగుచున్న శోకమును పరిత్యజించాలయ్యా! మనం ఇప్పుడు నిర్మలత్వమునే ఆశ్రయించుదాం.

Page:394

సావధానం - ఈ ప్రపంచమంతా మనకు ఎదురుగా ప్రాప్తిస్తున్నది కదా! అయితే “ఇదంతా మనస్సులోనే అహంభావ రూపంగా ఉన్నది" అని ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఇది వేరు, అది కావాలి, వారు మావారు కాదు, ఏదో పొందాలి” మొదలైన తుచ్ఛ దృశ్యవ్యధలను విడచి పెట్టి, ఆత్మజ్ఞులు అనుసరించే మార్గం మనం ఎందుకు అనుసరించరాదు? అదే మనకు శ్రేయస్కరం, అంతే గాని, ఆయా స్వల్పవిషయాల గురించి మననం చేస్తూ, దుఃఖిస్తూ కాలయాపన చేయటం ఏం ఉచితం? ఈ ప్రపంచంలో “జన్మ ఉన్నతి పతనం” అను కార్యములు ఒక పెద్ద చక్రము యొక్క పరిభ్రమణం లాగా అనివార్యంగా కొనసాగుతున్నాయి. ఇటువంటి అతి చంచలమైన సంసార స్థితిగతులను పట్టుకుని మనం ఎందుకు వ్రేలాడాలి? వాటిలో ఏదో ఎందుకు దేవులాడాలి?

అందుచేత, భావ అభావములకు అతీతమై, స్థితిగతులచే మలినపరచజాలని విషయమగు “ఆత్మ” గురించే మనం సావధానమనస్కులమై విచారణ చేద్దాం. అంతేగాని, మనం మూఢచిత్తులం కాకూడదు. మూర్ఖంగా దృశ్యమునే ఆశ్రయించ దలచామా - ఇక దీనత్వము, నైరాశ్యము, అజ్ఞానము మాత్రమే లభించే ప్రాంతాలకు జేరవలసివస్తుంది.

జ్ఞానుల చర్యలు, అజ్ఞానుల చర్యలు - తమ్ముడూ! యథార్థానికి నీకు తల్లి గాని, తండ్రి గాని లేరు. దుఃఖములూ లేవు. జన్మలూ లేవు. ఎందుకంటే నీవు అన్ని సమయములందూ ’శుద్ధాత్మ’యే స్వస్వరూపముగా కలిగి ఉన్నావు. నీకు వేరుగా ఈ జన్మలు గాని, ఈ దేహములు గాని లేవు. అయితే అజ్ఞానులు ఇక్కడి దృశ్యములోని ‘సత్యము, సారము’ గమనించటంలేదు. వారు తమ ఈ సంసారయాత్రలో అనేక క్రియావ్యవహారములను నిర్వర్తిస్తూ ‘మొదలే అసత్యము’ అయిన వ్యవహారము లందు “ఇవి ఎంతో సారవంతమైనవి" అను బుద్ధిని ఏర్పరుచుకొని గుర్తించుచున్నారు.

ఇక తత్త్వజ్ఞానులేంచేస్తున్నారంటావా? వారు ఉదాసీనులై ’స్వస్థత’తో కూడిన చిత్తము కలిగి ఉంటున్నారు. ఆయా ప్రాప్తించిన కార్యములను సంగరహితులై నెరవేర్చుచున్నారు. ఈ ఈ సర్వమునకు కేవలం సాక్షీమాత్రులై ఉంటున్నారు.

రాత్రిపూట గదిలో దీపం వెలిగిస్తాంకదా! ఆ వెలుగులో గదిలో వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ దీపమునకు “వీటికి వెలుగు ఇవ్వటం నాకు ఇష్టం. ఇవంటే నాకు ఇష్టం ఉండదు. అందుచేత, వీనికి నేనెందుకు వెలుగు ఇవ్వాలి?” అను రాగముతో కూడిన కర్తృత్వాభిమానము ఉన్నదా? లేదు. నీవు కూడా ఆయా క్రియలకు కర్తవగుచున్నప్పుడు అభిమానరహితుడవై, అకర్తవై ఉండు. తత్వజ్ఞులు ఆ విధంగానే ఈ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఒక దర్పణంలో ఆయా ఎదురుగా ఉన్న వస్తువులు ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఆ ప్రతిబింబిత వస్తుజాలము యొక్క ధర్మములను దర్పణము పొందుతోందా? లేదే! అట్లాగే, తమ యందు అధ్యస్తమై ఉంటున్న ఆయా కార్యములను, వ్యవహారసంబంధములను గమనిస్తూ, నిర్వర్తిస్తూ కూడా, జ్ఞానులు, తమయొక్క ఆత్మత్వమును, ఆత్మ ధర్మములను త్యజించరు. "అఖండమగు ఆత్మయే నా స్వరూపము” అను సుదృఢమైన ధ్యాసచే ‘దృశ్యతాదాత్మ్యము’ అను దోషమును సుదూరంగా విడచివేస్తున్నారు.

Page:395

అందుచేత తమ్ముడూ! ’ఇచ్ఛ’ అనేరూపంతో ఏర్పడుచున్న కళంకమును ముందుగా త్యజించివేయి. నీ హృదయంలో స్వయంగా వివేకబలంచే ఆత్మభావన సాక్షాత్కరింపజేసుకో. ’ఆత్మ స్థితి’ని సర్వదా ఆశ్రయించు. ఈ సంసారభ్రమను మొదలంట త్యజించివేయి. ఈ దృశ్యవ్యవహారమంతా త్యజించ బడగా, ఇక అప్పటికి కూడా శేషించబడి ఉండే స్వస్వరూపస్వభావముచే సంతుష్టుడవై ఉండు.

ఆ విధంగా పుణ్యునిచే బోధింపబడిన పావనుడు సూర్యోదయసమయంలో భూమి ప్రకాశించ నారంభించునట్లుగా వికసిత హృదయుడయ్యాడు. బహుకాలం అన్నదమ్ములిద్దరు పరస్పర సహ జీవనంతో జ్ఞానవిజ్ఞాన పారంగతులైనారు. కాలక్రమంగా అఖండము, అద్వితీయము అయినట్టి నిర్వాణము అధిష్ఠించారు. నూనె తరిగి పోయినట్టి దీపంలాగా వాళ్ళిద్దరు మనోప్రశమనమును

పొందారు.

  1. ధ్యేయవాసన - చికిత్స

శ్రీవసిష్ఠమహర్షి : చూచావా! పుణ్యుడు చెప్పినట్టుగానే, ప్రతి జీవునికి ఇతఃపూర్వమే అనేక దేహాలు, అట్టి ప్రతి దేహమునకు సంబంధించి అనేక మంది బంధుమిత్ర, అమిత్రాదులు ఉండి ఉంటారు. వారిలో ఎవరిని త్యజించాలి? ఎవరిని గ్రహించాలి? “అసలు ఈ జీవునకు శోకము, మోహము ఎక్కడి నుండి దిగుమతి అగుచున్నాయి?” అనే విషయం మేము పరిశోధించాం. “అంతరంగములోని తృష్ణయే” అని సమీక్షిస్తున్నాం. అందుచేత శాంతి పొందాలంటే తృష్ణను జయించాలి.

అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఆయా విషయములను కల్పిత వ్యవహారములను ఆశతో కూడుకొని ఆశ్రయిస్తూపోతే, ఆ పయనానికి అంతెక్కడ? శాంతి ఎప్పటికి చెప్పు? కట్టెపుల్లలు వేస్తున్న కొద్దీ అగ్ని జ్వలిస్తూనే ఉంటుందికదా! విషయ చింతన చేతనే ఈ సాంసారిక దుస్థితులు వృద్ధి చెందుతున్నాయి. విషయ చింతన లేకపోతే దుఃఖాదులు కూడా ఉండవు.

ధ్యేయ వాసన - “ఏదో పొందాలి, ఇంకేదో కావాలి, ఏవేవో ఇంద్రియ విషయముల ప్రాప్తిచే మాత్రమే ఉపశమనము, లేదా, అంతా అశాంతియే, తదితరులకు లభించే వన్నీ నాకు లభించాలి, నాకు చెందినవి తదితరులకు లభించకూడదు” - ఇట్టి అనేక ధ్యేయవాసనలను ఈ జీవుడు కలిగి ఉంటున్నాడు. ఆ మార్గంలో ఎన్నటికి శాంతి? కనుక నీవు ”ధ్యేయ వాసనా త్యాగము” అనే రథం అధిరోహించు. కరుణాదృష్టితో, ఉదార చిత్తముతో తదితర జీవరాసులన్నిటినీ దర్శించి సర్వభూతదయ కలిగియున్న వాడవై ఈ ప్రాకృత వ్యవహారములను ఆచరిస్తూవుండు. అంతేగాని, ఇక్కడ భేద దృష్టి యందు తాదాత్మ్యం చెందవద్దు. "ధ్యేయ వాసనారాహిత్యం” ఆశ్రయించినవాని స్థితి ‘స్వస్థితి’ అవుతుంది. అట్టి స్థితియే నిర్మల నిష్కామ ఉపాధిరహిత బ్రాహ్మీస్థితి. వివేకము, పరమార్థబోధలను తన వెంట నిడుకుని, ఈ జగత్తునందు విహరించేవాడు ఇక్కడ మోహితుడు కాడు. ఆతనిని సంపదలన్నీ వదలి

Page:396

వెళ్ళవచ్చు గాక! బంధువులు బహిష్కరించవచ్చుగాక! ఆతడు దైన్యము పొందడు. సుస్థిరమైన స్వతత్వమును అవధరించగలడు. జ్ఞాని యొక్క దృష్టి, అవగాహనలచే ఏర్పడే స్వధైర్యమును మించిన సంపద గాని, స్వజనము గాని లేరు. ఆపదల సమయంలో ప్రతికూల స్థితిగతులలో నిస్సహాయ వాతావరణంలో మనలను రక్షించేది అదే. అందుచేత నీవు జ్ఞానివై ఉండు.

ఓ రామా! ఈ "విషయములు” అనే ఆపదల నుండి నిన్ను నీవే లేవనెత్తుకోవాలి. వైరాగ్యము చేతనూ, శాస్త్రాధ్యయనము చేతనూ, మహత్తరమైన ఉదారము మొదలగు గుణముల చేతను ఆత్మోద్ధరణకై ఉద్యుక్తుడవు కావాలి. విషయ త్యాగము చేసేవారి చిత్తము స్వల్పసమయంలో మహత్తర రూపం పొందుతుంది. అట్టి చిత్తము ప్రసాదించే ఫలితమేమిటంటావా? ఈ ముల్లోకములలోని రత్నరాసులు గాని, తదితర ఐశ్వర్యములన్నీ గాని లభించినప్పటికీ, ఆ నిర్మల చిత్తము ముందు దిగదుడుపే. “శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, సంఘటనల పట్ల ఏర్పరచుకొన్న ఆశానిరాశలు” - వీటినే ‘విషయములు’ అని అంటున్నాం. విషయ త్యాగములు చేయక పోవుటచేతనే ఈ సంసార కుక్షిలోని జీవులు మరల మరల ఊర్ధ్వ, అధోగతులను, జననమరణములను పొందుచున్నారు. ఫలితంగా వారి మనస్సులు దుఃఖమయములుగా ఉంటున్నాయి.

అదే మనస్సు బ్రహ్మజ్ఞానముచే పరిపూర్ణమైనప్పుడు ఇక ఈ లోకమంతా అమృతమయముగా కనపడుచున్నది. పాదరక్షలు ధరించి నడిచేవానికి బాటలన్నీ చర్మం పరచినట్లు ఉంటాయి కదా!

అయితే ఒక్క విషయం; ఆశకు వశం గాని మనస్సు మాత్రమే వైరాగ్యము యొక్క సహాయము చేత ‘పూర్ణత్వం’ పొందుతోంది. ఆశ ఎక్కడ ఉంటుందో అక్కడ “దుఃఖం మోహం” అనే మాలిన్యాలు ఉండనే ఉంటాయి. ఆశ - అనే వాసనాత్యాగం చేసిన వారి హృదయంలో ‘లోభం, దైన్యం’ ఉండవు. అగస్త్య మహాముని జలం పానం చేయగా మిగిలియున్న శూన్యసముద్రంలాగా అది ప్రశాంతము పొందుచున్నది. తృష్ణను జయించి ’శాంతము, వైరాగ్యము’లతో కూడుకొని ఉన్నప్పుడే, ఈ హృదయం శోభిస్తుంది. ఇచ్ఛారహితులు, బ్రహ్మజ్ఞానముచే పూర్ణులగువారు ఈ ముల్లోకములను తృణప్రాయంగా చూస్తున్నారు. ఈ జనసమూహము, తత్సబంధములు గోష్పాదజలంలాగానూ, ఒక ‘మహాకల్పము’ కూడా అర్ధ నిముషములాగానూ కన్పట్టగలదు. ఇచ్ఛారహితునియందు మనకు కనిపించే శీతల సౌమ్యత్వము మనకు హిమాలయ పర్వతాలలోగాని, పూర్ణ చంద్రునియందుగాని, చందన వృక్షమందుగాని, అరటి తోటలోగాని లభించదు సుమా! అతని యందుగల ప్రశాంతతను క్షీరసాగరంతోనో, జగన్మాత లక్ష్మీదేవి ప్రసన్న వదనంతోనో పోల్చవచ్చునేమో!

ఈ అంతఃకరణమును కలుషితం చేస్తున్నదేది?… “ఆశ” అను పిశాచమే! ఈ చిత్తం యొక్క ఆశలే, దశదిశలా ప్రసరించి ఉన్నాయని గ్రహించు. ఆశ తొలిగించబడినప్పుడు ఇదే చిత్తము బ్రహ్మమై వెలుగొందుచున్నది. ఎప్పుడైతే ఆశలు లయిస్తాయో, రహితమౌతాయో - మరుక్షణం అంతకు ముందటి అల్ప ధైర్యం కూడా బహువిస్తారమైన ఒక మహా వృక్షంలాగా శతశతాధిక శాఖలుగా విస్తరిస్తుంది. వైరాగ్యయుక్తుడు, ఇంద్రియములను జయించివేసినవాడు, ఆశ నశించగా

Page:397

ధైర్యము వహించినవాడు, అగు జీవుడు ఉత్తమోత్తమమైన పదమును తనకు తానే అధిరోహిస్తాడు. ఆతనికి మరొకరెవరో వచ్చి ప్రసాదించవలసిందేమీ ఉండదు.

అభయం! - ఓ రాఘవా! ఈ జీవుడు కనుక పవిత్రాంతఃకరణుడై, చిత్తవృత్తులకు చోటు ఇవ్వకుండా ఉన్నాడనుకో … ఇక ఈ జన్మకర్మ మొదలగు వాటి గురించి భయాదులు ఉండవు. ఈ చిత్తము వృత్తిరహితమై “అచిత్తత్వము” పొందిందా, ఇక ఈ జీవుడు పూర్ణమగు మోక్ష స్థితిని పొందినవాడే అవుతాడు.

చింతన చేయటమునే ‘వృత్తి’ అని అంటున్నాం. అట్టి చిత్త వృత్తి ‘ఆశ’ చేతనే ప్రవృత్త మౌతోంది. కదలించబడుతోంది. ‘ఆశ’ అనే చిత్త వృత్తిని జయిస్తే, ఈ జీవుడు తప్పక “చిత్తరాహిత్య స్థితి”కి అర్హత పొందుతాడు.

ఏది ఏ వృత్తితో కూడుకొని ఉంటుందో - అది ఆ వృత్తి యొక్క “అభావము” చేతనే నివృత్తి అవుతుంది. కనుక చిత్తమును ఉపశమింపజేయడానికి “భావరాహిత్యం” లేక “భావాతీతమైన కేవల సాక్షిమాత్రం” అభ్యసిస్తూ రావాలి. ఈ "పుత్ర, విత్త, లోక” విషయముల గురించి సర్వకోర్కెలను వదలి వేయాలి. ఇక విధి-ధర్మములు అంటావా…. అవన్నీ ఆశ, నిరాశ, వేదన, దోష దర్శనం వంటి దోషభావములచే సృశించబడని బుద్ధితో ఉపాసనాభావంతో నిర్వర్తించబడు గాక!

ఓ సభికులారా! ఆశ అనబడే సంసార బంధమును విడనాడి, చిత్తమును ముక్తత్వము వైపు నడిపే ఉపాయాలను గురించి యోచించండి. మనసులో ఉండే దుష్ట ఆశలే ఆత్మకు బంధనమును కల్పించుచున్నాయి. అట్టి దుష్ట ఆశలు ఉపశమించిన తరువాత ఇక ముక్తుడు కానివాడు ఎవడుంటాడు? కనుక క్రమక్రమముగా ఆశలు త్యజించివేస్తూ ఉండండి. లేదంటే బలి చక్రవర్తిలాగా అకస్మాత్తుగా ప్రబోధం పొందండి. పరిపూర్ణమైన జ్ఞానవృత్తిని అవలంబించండి.

శ్రీరాముడు : హే మహర్షీ! “ఆత్మ తత్త్వ ప్రవచనము” అను తమ యొక్క కృపారస స్రవంతిచే మేమంతా ధన్యులమౌతున్నాం. నిర్మలమగు ఆత్మ పథంనందు విశ్రాంతి పొందుచున్నాం. హృదయంలో ’తృష్ణ’ అనే నిబిడాంధకారం ఉపశమిస్తోంది.

మీ దివ్యమైన వచనములు వింటున్నకొద్దీ ఇంకా వినాలనిపిస్తోంది. మీరు బలి చక్రవర్తి అకస్మాత్తుగా ప్రబోధితుడైనాడని అన్నారు కదా! ఆ వృత్తాంతము తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తమ వంటి మహాత్ములు ‘బోధ’ అనే అమృతం వర్షింప జేయటంలో అలసటయే ఎరుగరు కదా!