Page:398
IV. బలి చక్రవర్తి
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రఘురామా! బలి చక్రవర్తి వృత్తాంతమొకటి చెప్పుచున్నాను. ఇది వింటే శాశ్వతమైన ‘తత్త్వానుభవం’ అవగాహనకు రాగలదు.
ఈ బ్రహ్మాండమునకు ఒకానొక దిక్కు నందు భూమికి అధోభాగంలో పాతాల లోకం ఉన్నది. అది కొండంత ఆకారంగల దానవులచే తదితర పాతాళజీవులచే వ్యాప్తమై ఉన్నది. ఒకానొక సమయంలో ఆ పాతాళ లోకమున విరోచనుడు అను వాని కుమారుడు, బలి చక్రవర్తి, పాతాళ భూ లోకములను ఆక్రమించి రాజ్యమేలుతూ ఉండేవాడు. అతడు తన భక్తి, త్యాగ నిరతులచే విష్ణు భగవానుని రక్షణ పొందియున్నాడు. అందుచేత, ఆతని పేరు వింటేనే దేవతాదులు కూడా భయ పడేవారు. ఆతడు దేవతలపై దండెత్తి వారిని జయించి, వారి విభవములను సొంతం చేసుకున్నాడు. వారిని అల్పప్రదేశ పరిమితులుగా చేసివేశాడు.
చాలా కాలం గడిచిపోయింది. ఒక సమయంలో ఆ బలి చక్రవర్తి హృదయంలో వైరాగ్య పూర్వకమైన పరిశీలన జనించింది. ఇది ఇట్లా ఉండగా, ఆతడు ఒక రోజు వాహ్యాళికై బయలుదేరాడు. పరివారాన్ని, రాజ్యాన్ని వదలి ఒంటరిగా అటునుంచి మేరుపర్వత శిఖర ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశం చేరాడు. ఒకానొక అనుకూల ప్రదేశంలో సుఖాసీనుడై ఇక యోచించసాగాడు - బలిచక్రవర్తి (తనలో) : రాక్షసకులంలో పుట్టాను. తపస్సు చేసి కష్టపడి ఎంతో శక్తి సంపాదించాను. దేవతలను కూడా గజగజలాడించాను. సద్గురువులగు శుక్రాచార్యులవారి సమక్షంలో ఎన్నో యజ్ఞ, యాగాదులు నిర్వర్తించాను. ఇప్పుడు ఈ పాతాళ లోకంలో రాజ్య మేలుచున్నాను. ఎంత కాలం ఈ ముల్లోక విహారం? అనేకమైన అద్భుత కర్మలు నిర్వర్తించాను. అంతా బాగానే ఉన్నది కానీ, ఈ విశాల రాజ్యము వలన నాకు ఏమి ప్రయోజనం? ఆజ్ఞాపించటాలు - దుస్తులు - - స్తోత్రములు - -
దేవతలపై దండెత్తటాలు, - వారి విభవములను మూటకట్టుకుని పాతాళలోకం చేర్చటాలు -
తదితర రాచకార్యములు ఇవన్నీ కూడా చిన్న పిల్లల ఆటలోని కల్పిత విశేషములులాగా ఉన్నాయి. ఎన్ని భోగములు ఎంత అనుభవిస్తే మాత్రం వాటిలో ఏమున్నది ప్రత్యేకత? ఇవన్నీ నిజముగా సుఖ ప్రదములా? కానే కావు. ఈ భోగములు ‘అవిచారణ’ చేతనే రమణీయంగా తోచుచున్నాయి.
నిజానికి ఇక్కడ నాశనశీలము కానిదేది? అదే పగలు… అదే రాత్రి… అవే అన్నపానములు. ఆహా! ఈ విధంగా చర్వితచర్వణముగా చేసిందే అనేకసార్లు మరలామరలా చేసుకుంటూపోతున్నాం. అనుభవించిందే మరలా అనుభవిస్తున్నాం. ఆత్మ జ్ఞానులగు మహాత్ములు ఈ ఆశలను, ఆలోచనలను, ప్రవర్తనలను చూచి నవ్వుకుంటున్నారే! ఈ భౌతికమైన వస్తువులు, రాజ్యములు, మొదలగు వాటిని
Page:399
చూచుకొని “అహో! మేము ఎంతటి వారం!” అని మురియటమేమిటి? స్వల్పకాలంలో వేరొక గతిని పొందబోయే "ఈ భోగాలు - బంధుమిత్ర సమాగమాలు - ఈ ఈ కాంతాలింగనాలు” ఇవన్నీ పిల్లలు ఆడుకొనే ఆటల వంటివే కదా! రసహీనమైన ఈ క్రియాకలాపములందు ఎన్ని రోజులు నిష్ప్రయోజనంగా గడచిపోతున్నాయి? ఎంత ఆయుష్షు వృథా అవుతోంది! బుద్ధిమంతుడైనవానికి ఇదంతా చూస్తుంటే ‘సిగ్గు’ అనిపించదా? ఇదంతా వ్యర్థవ్యవహారమే కదా!
జలం తరంగ రూపం పొంది, మరల ఆ తరంగం జలరూపం అగుచున్నట్లు ఇతఃపూర్వపు క్రియలనే ఈ జనులు పదేపదే పొందుచున్నారు. ఇందులో క్రొత్తది, అద్భుతమైనది అంటూ ఏమున్నది?
పిచ్చివాడు “ఏమిటి ప్రయోజనం?” అని యోచించకుండానే ప్రతిరోజూ ఏవేవో క్రియలు చేస్తున్నట్లే, నేను కూడా ఈ రాజ్య, సుఖ, భోగ క్రియాదులను ఆశ్రయిస్తున్నాను. ఎందుకు? వీటిలో కర్మ రాహిత్యముగానీ, కృతకృత్యముగానీ ఏమైనా ఉన్నదా? లేనప్పుడు, శాంతి లభించనప్పుడు వీటి వల్ల ఏం ప్రయోజనం? కనపడీ కనపడకుండా ఈ కర్మలు నేను ఎంతకాలం ఆచరించాలి? దీనికి అంతు ఎక్కడ?
యథార్థానికి ఈ కనపడేదంతా వస్తు శూన్యమే కదా! వాస్తవమైనదీ, శాశ్వతమైనదీ ఉపశమన సహకారికమైనదీ ఈ ముల్లోక వస్తువులలో ఏదైనా ఉన్నదా? లేదే! ఈ అతి విస్తారమగు బాల క్రీడను ఈ జీవులు మాటిమాటికీ దుఃఖము కొరకే వ్యర్థముగా ఆశ్రయించుచున్నారే!
దేనిని పొందిన తరువాత, ఇక కర్తవ్యమంటూ ఏమీ ఉండదో అట్టి ఉత్తమ పురుషార్థం ఇక్కడేదీ కనిపించుట లేదు. ఈ తుచ్ఛమగు విషయసుఖములకంటే ఉత్తమమైనదేదీ ఇక్కడ లేదా? సరే… ఈ విషయం గురించి విచారిద్దాం…!
ఇట్లా యోచన చేస్తూనే బలి చక్రవర్తి ధ్యాననిష్ఠుడయ్యాడు. ఆ తరువాత మరల కనుబొమ్మలు విశాలం చేసి యోచించసాగాడు. ఆతనిలో ఏవో ఆలోచనలు తళుక్కున మెరిశాయి. ఇతఃపూర్వపు సంస్కారములు, తాను విని ఉన్నట్టి శాస్త్రార్థాలు స్మృతిపథంలో వెలిశాయి. అయితే వాటిని ఆతడు సమన్వయించుకోలేకపోయాడు. ఇతర ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఒకప్పుడు తనకు, తన తండ్రి విరోచనునికి జరిగిన ఒక సంభాషణను స్మృతి పథంలోకి తెచ్చుకుని పరిశీలించసాగాడు.
బలి: తండ్రీ! ఈ ఇహపర లోక విషయాలన్నీ ఆమూలాగ్రం తెలిసి ఉన్నవారు, మహాత్ములు, తత్త్వవేత్త, గొప్పమేధస్సు గలవారైన మిమ్ములను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి అనుగ్రహించండి.
ఈ జగత్తులో అనేక దృశ్యవ్యవహారములు, కార్యక్రమములు తారసపడుచున్నాయి. “సుఖప్రాప్తి” అను మృగతృష్ణలోని వ్యవహారంలాగా, ఇక్కడ తారసపడే అనేక సంఘటనలు, వ్యవహారములు
Page:400
భ్రమ మాత్రమే కదా! ఇవన్నీ దుఃఖకరములేనని నాకు అనిపిస్తోంది. ఈ భ్రమలన్నీ చాకచక్యంగా పుట్టుకొస్తున్నాయి. ఈ సంసారమునకు అంతు ఉన్నదా? ఇదంతా ఉపశమించటమెట్లా?
కోపశాన్తోమనోమోహః క్వాతీతాఃసక లైషణాః | విరామరహితంకుత్ర తాత విశ్రమణంచిరమ్ ॥ (శ్లో 45, సర్గ 22)
కింప్రాప్తేహ సమస్తేభ్యః ప్రాప్యేస్మింస్తృప్తిమాన్పుమాన్ । కిందృష్ట్వాదర్శవంభూయో నతాతోపకరోత్యలమ్ ॥ (శ్లో 46, సర్గ 22)
ఈ మనస్సు దుఃఖరహితమైన పూర్ణశాంతిని పొందే సమయం గాని, చోటు గాని ఎన్నటికైనా, ఎక్కడైనా ఉన్నదా? దేనిని పొందిన తరువాత ఈ జీవునకు మరల పొందవలసినదంటా ఏమి ఉండదు?… ఏ మార్గం లేక ఉపాయంచే బ్రహ్మ లోకపర్యంతము ఇక ఆశించవలసినదేమీ ఉండదు? …దేనిని దర్శించిన తరువాత ఇక దర్శించవలసినదేమీ ఉండదు…?
హే తండ్రీ! ఒక్క విషయం మాత్రం అత్యంతసుస్పష్టమౌతోంది. ఈ సాంసారిక భోగములు అనేకం ఉండవచ్చుగాక! ఇవన్ని కూడా వాస్తవమైన, శాశ్వతమైన సుఖమును ప్రసాదించగలిగేవి ఏమాత్రం కాదు. పైగా…. ఇక్కడి భోగములు చూచారా? ఇవి చాలా మంచివారి మనస్సులను కూడా క్షోభింపజేయగలుగుచున్నాయే! కుసంస్కారములకు మార్గమగుచున్నాయే!
సరే, నా మాటలు అటు ఉంచండి. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఇక్కడ "స్వాభావికంగానే ఆనందదాయకము, ఉత్తమము, ఎప్పటికీ ప్రశాంతదాయకము” అయిన వస్తువుగాని, విషయముగానీ ఏదైనా ఉన్నదా? ఉంటే, అద్దానిస్థితిని పొంది, నేను విశ్రాంతిని అనుభవించగలను! అప్పటిదాకా నన్ను ఆవరించియున్న విచారము, అగమ్యత్వము, అవివేకము, క్షోభ వదిలేట్లు లేవు. మిమ్ము శరణువేడుచున్నాను. బోధచే నన్ను సముద్ధరించండి.
విరోచనుడు : చాలా సంతోషం. ఇప్పటికి నీవు ఉత్తమవిచారణకు వచ్చావు. ఔను! సర్వ మనోవ్యధలు, సంతాపాలు, ఆర్తులు, కర్మవ్యవహారాలు రహితం కాగల ఒకానొక ఉత్తమ స్థానం ఉన్నది. ఆ స్థానం గురించి తెలుసుకుంటే నీకు గాని, మరెవ్వరికైనా గాని, సర్వ నిరుత్సాహాలు, ఉద్వేగాలు, దుఃఖాలు ఉపశమిస్తాయి. అయితే ఆ స్థానం గురించి, అక్కడి ‘రాజాధిరాజు’ గురించి, ఆ రాజుగారిని సేవించే ఆతని మంత్రి గురించి కొన్ని అతి చమత్కారమైన విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటో చెపుతా వినుఅంతటా అన్నివేళలా ఆక్రమించియున్న ఒక మహాసామ్రాజ్యం ఉన్నది. ఒక రాజాధిరాజు ఆ రాజ్యం ఏలుచున్నాడు. ఆ రాజ్యంలో, లేక, ఆ రాజాధిరాజుగారి సమక్షంలో ఇక్కడ కనబడే స్వర్గమర్త్య-పాతాళ లోకములు, సముద్రాలు, పర్వతాలు, వనములు, తీర్థములు, నదులు, చెఱువులు,
Page:401
భూమి, ఆకాశం మొదలగునవి లేవు. అక్కడ అంతరిక్షం లేదు, వాయువులేదు, ఈ సూర్యచంద్రులు లేరు. లోకేశులగు విష్ణు-బ్రహ్మ-ఇంద్ర-మహేశ్వరులు కూడా అక్కడ లేరు. దేవ-దానవులు గాని, భూత-యక్ష-రాక్షసాది భిన్న స్వభావజీవులు అక్కడ లేరు. పంచభూతములకు ఊర్ధ్వ-అధో దిశలకు, స్వర్గ-నరకాదులకు, హిమాలయము వంటి పర్వతాదులకు ఆ స్థానంలో చోటే లేదు.
ఆ రాజ్యాన్ని (లేక) స్థానాన్ని ఏలే ఆ రాజు మహామహనీయుడు. అద్వితీయుడు. నిత్యుడు అఖండుడు. ఆనందమయస్వరూపుడు. ఆతడు ఆనిర్వచనీయ ప్రకాశశీలుడు. రాజాధిరాజగు ఆతడు సర్వవ్యాపి. సర్వస్వరూపుడు. అంతేకాదు…. మహత్తరమైన శక్తి సంపన్నుడగు ఆ రాజు సంకల్ప మాత్రం చేతనే దేనినైనా సరే సృష్టించగలడు, స్థితింపజేయగలడు, లయకారుడై లయింపజేయగలడు.
ఆ రాజుగారు ఒకానొకప్పుడు సర్వ రాచకార్యములు నిర్వర్తించటానికి గాను తన యొక్క ‘సంకల్పము’ అను ప్రభావముచే - “సర్వలక్షణ సమన్వితుడు, సర్వలక్షణ విలక్షణుడు” అగు ఒక గొప్ప మంత్రిని, నియమించుకున్నారు. అన్నిటినీ నిర్ణయించి, సమాలోచనలు చేసి, సర్వ వ్యవహారాలు నడిపేదీ మంత్రిగారే! ఇష్టం, అయిష్టం, వాటిని ఆశ్రయించి ఉన్న నవరసాలు - ఇవన్నీ కూడా మంత్రి గారి మంత్రాంగమే. ఆ అధికారమంతా ఆ మంత్రికి ప్రసాదించింది ఆ రాజు గారే!
ఇక రాజుగారు ఏం చేస్తూ ఉంటారు? - ఆయన ఏమీ చేయరు. కేవలం సాక్షీభూతుడై సర్వమును తిలకిస్తూ ఉంటారు. రాజుగారు అక్కడ ఉంటే చాలు…. ఆయన సమక్షంలో మంత్రి చేత సమాలోచించబడి సర్వము జరిగిపోతోంది. రాజు యొక్క ఉద్దేశమును అనుసరించే, కనుసైగ మాత్రంగా మంత్రి సర్వ వ్యవహారములు నడిపిస్తున్నారు.
ఆ మంత్రి కూడా తక్కువ వాడేం కాదు. “ఇది అసంభవం… ఇట్లా ఘటిల్లదు” - అనునవి కూడా సంభవింపజేయగల సామర్థ్యం ఆ మంత్రికి ఉన్నది. అతడు ఎంతటి వాడంటే…. తన శక్తి యుక్తులు, వ్యూహాలు ప్రయోగించి మహారాజంతటి వాడిని తన మాట తూ.చ. తప్పకుండా వినేట్లు చేసుకుంటున్నాడు. ఇక రాజుగారు తన స్వభావం అధికారం ఏమరచి మంత్రి చేస్తున్న దాని కంతటికీ వశుడి వలె ఉంటున్నాడు. మంత్రి చేస్తూన్న కొన్ని పిచ్చిపనులు తనను బాధించేవి, తన అధికారాన్ని ప్రశ్నించేవి అని తెలిసి కూడా ఎందుకో అట్లా ఊరకుని ఉండిపోయి చూస్తున్నాడు.
ఏది ఏమైతేనేం! ఆ మంత్రి మాత్రం దేనిని స్వయంగా, అంటే, రాజుగారిచే ప్రసాదించబడిన అధికారం లేకుంటే ఏదీ నిర్ణయించనూ లేడు, నిర్వర్తించనూ లేడు. అనుభవించనూ లేడు. రాజును వేరుగా చూస్తే ఆ మంత్రి కేవలం జడం మాత్రమే. ఆతనికి ఆ అధికారం ప్రసాదించింది మహారాజే కదా! అజ్ఞుడై - జడుడై ఉండి కూడా, రాజుగారి కొరకు రాజు ప్రసాదించిన అధికారముల చేతనే కార్యములు నిర్వర్తిస్తూ ఉంటాడు. మంత్రి పనులు చేస్తూ ఉంటే, ఇక రాజు ఏదీ చేయకుండా సింహాసనం అధిష్ఠించి కూర్చుని సాక్షి మాత్రంగా అంతా చూస్తూ ఉంటాడు.
కుమారా! బలీ! నీవు గొప్ప బలపరాక్రమములు కలవాడివే. దేవతలను కూడా అలవోకగా అల్లల్లాడించావు. కాని ఏం లాభం? ‘ఆ రాజ్యం’ నీవు సంపాదించుకోనేలేదు. అందుకే నీకీ దుఃఖం
Page:402
సంప్రాప్తిస్తోంది. నీ బలపరాక్రమములు ’ఆ మంత్రి’ ముందర ఎందుకూ పనికిరావటంలేదు. అది
గమనించు. ఇక రాజు అంటావా…. ఆయనను జయించగల వారంటూ ఎవరూ ఉండరు. ఆయనను
ప్రసన్నం చేసుకుంటే చాలు. ఆ రాజ్యం నీకు ప్రాప్తించినట్లే!
బలి: తండ్రీ! శారీరకమైన, మానసికమైన బాధలంటూ ఉండనట్టి ఓ మహాత్మా! మీరు చెప్పే ఆ
రాజ్య స్థానం ఎక్కడున్నది? అది మనకు ప్రాప్తించేది ఎట్లా? దానిని పొందినవారెవరైనా ఉన్నారా? మీరు చెప్పే ఆ రాజాధిరాజు సమాచారం ఎప్పుడూ వినలేదే? మనం ఒక ఆటలాగా జగత్తులన్నీ మన భుజబలంతో జయించాం కదా! మనచేత కూడా జయింపబడజాలని ఆ రాజెవ్వడు? మీరు దేవతలనే భయపెట్టారు కదా! మీరు కూడా ఆతనిని జయించలేరా? ఆ మంత్రి మనందరి కంటే
బలవంతుడా?
విరోచనుడు : అవును. ఈ దేవతలు - రాక్షసులు, వీరంతా ఒక్కసారి గుమిగూడి దండెత్తినా సరే బలిష్టుడగు ఆ మంత్రిని జయించలేరు. యముడు, కుబేరుడు, ఇంద్రుడు, తదితర దేవ దానవ వీరులు - అంతా కలిసి కూడా ఆ మంత్రిని భయపెట్టలేరు. మన వద్ద ఉండే గదలు, చక్రాలు, శస్త్రాలు, రథాలు, అస్త్రాలు - ఇవన్నీ ఆ మంత్రి ముందు సూర్యుని ఎదురుగా ఉంచిన దివిటీ వంటివి మాత్రమే. మనస్సే రూపముగా గల ఆ మంత్రి శస్త్రాస్త్రములకు, ముష్టిఘాతములకు అసలు విషయమే కాడు. ఈ దేవాసురులనందరినీ, నీతో-నాతో కూడా, తన వశం చేసుకుని నడిపిస్తున్నాడు.
ఆ మంత్రి విష్ణువు కాదు. కాని, నీ ప్రపితామహుడగు హిరణ్యాక్షుడు మొదలైన మహాపరాక్రమ వంతులను ఆక్రమించి వినాశన మొనర్చుచున్నాడే! విష్ణువును నిమిత్తంగా చేసుకుని వాళ్ళందరినీ కడతేర్చింది ఆతడే. ఆతడు సర్వులకు జ్ఞానోపదేశం చేసే నారాయణుడు మొదలగు దేవతలను కూడా తన వశం చేసుకొని అనేక యోనులందు పడవేయుచు, ఆయా ఉపాధులలో ప్రవేశింప జేసి తోలుబొమ్మలాట ఆడిస్తున్నాడు! ఆతని ప్రతాపం చేతనే సామాన్యుడగు మన్మథుడు కూడా అత్యంత శక్తిమంతుడై తన పంచబాణములతో త్రిలోకములను ఆక్రమించి, సామ్రాట్టు వలె విజృంభించ గలుగుచున్నాడు. అది సరే. మనకు దేవతలకు అనేక సార్లు అనేక యుద్ధాలు కల్పించినది ‘క్రోధము’ కదా! ఈ క్రోధము అనబడేది దుష్టాకారయుతమై, గుణహీనమై, దుర్మతియుతమై సురాసుర సమూహమును వినాశనం చేస్తోందికదా! ఈ క్రోధము యొక్క ఉనికి ఆ మంత్రి యొక్క కళాప్రదర్శనా విభాగము లోనిదే!
బలి: నేను అతి చమత్కార స్వరూపుడగు ఆ మంత్రిని వశం చేసుకోగలనా?
విరోచనుడు : నీ ప్రయత్నం ఉచితం, ఆవశ్యకం కూడా! అది ఉత్తమోత్తమమైన విషయం. నీవు తప్పక సాధించగలవు. అయితే నీవు ఆ రాజాధిరాజును ఆశ్రయించి మంచి చేసుకుంటే గాని, మంత్రిని ఏమీ చేయలేవు.
మంత్రిని జయించనంత వరకు నీకు శాంతి సౌఖ్యాలు లేవు. ఆ రాజును ఆశ్రయించే వారికి మంత్రి సులభసాధ్యుడు. లేదా, పెద్ద పర్వతమును ప్రక్కకు నెట్టటం అసాధ్యమయినట్లే
Page:403
ఘనీభూతమై ఎదురుగా ఉన్న ఆ మంత్రిని కదల్చలేము. ఆతనికి వశులము, బందీలము కావలసిందే గాని, ఇంకేమీ చేయలేము.
ఒకానొకప్పుడు సుకృత పరిపాకం చేత ఆ రాజుగారిలో వివేకదృష్టి జనిస్తోంది. కాలక్రమంగా రాజుగారికి, “ఏమైనా సరే, ఈ మంత్రిని నా వశంలో ఉంచుకోవలసిందే” - అను కోరిక వృద్ధి అగుచున్నది. అటుపై స్వల్పయత్నముతోనే మంత్రి నిరోధింపబడుచున్నాడు కూడా.
పుత్రా! బలీ! నీవు అనేకమంది దిక్పాలకులను, ఇంద్రుడినీ కూడా జయించావు. కానీ ఏం లాభం? నీ ‘మనస్సు’ అనే ఈ మంత్రి ఈ మూడు లోకములందలి బలిష్ఠులైన వారందరి కంటే మిక్కిలి బలిష్ఠుడు. ఆతడు తలచుకొంటే క్షణంలో మూడు లోకములను మృతప్రాయం చేసివేయగలడు. ఆతని ముందు నీ కండ బలం ఎంతటిది? అట్టి మనస్సు అనే మంత్రిని జయించగలిగితే పరాక్రమ వంతుడ వనిపించుకుంటావు.
ఆ మంత్రివర్యుడే ఈ మూడు లోకములకు ఉనికిని, ఔన్నత్యమును ప్రసాదిస్తున్నాడు. ఆతడు అస్తమిస్తే, ఈ మూడు లోకాలుకూడా అస్తమిస్తాయి.
కనుక కుమారా! మనం ఊరికే దుఃఖిస్తూ నిర్లిప్తతను, నిరుత్సాహాన్ని, నిస్తేజాన్ని అవలంబిస్తూ కూర్చుని ఉంటే వచ్చే లాభం ఏమిటి చెప్పు? మనం అజ్ఞానమును పారత్రోలాలి. ఏకాగ్రచిత్తులమై ‘మనస్సు’ అనే మంత్రిని జయించాలి. మనస్సును జయించామా, ఇక ఇప్పటివరకు మనచే జయించ బడని లోకములన్నీ జయించబడినట్లే! లేక, మంత్రిగారు వచ్చి ఇచ్చవచ్చినట్లు మనలను ఆడిస్తున్నారా… మనం జయించిన లోకములన్నీ జయించబడనట్లే!
అందుచేత “నిత్యసుఖస్వరూపము, అనంత సిద్ధి" అయిన ఆత్మ భగవానుని, సమక్షము కొరకు మనం ‘మనస్సు’ అనే మంత్రిని జయించాలి. మనస్సును జయించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలి. అన్నిటికీ సిద్ధపడి, అందుకు ప్రయత్నించాలి.
ఈ మనస్సు అనే మాంత్రికుడు నిన్ను, నన్ను, ఈ లోకములను బొమ్మలాట ఆడిస్తూ ఉన్నాడు. మనకు ఈ బాహ్య జీవులగు దేవతలు మొదలగువారు నిజమైన శత్రువులు కాదు. వారు ‘మహా’ అయితే ఒక ఉపాధిని ఖండించగలరు. మన నిజమైన శత్రువు మన మనస్సే.
అసలైన శత్రువును కొంపలోనే పెట్టుకొని, ఆ శత్రువును గెలిచి, లోబరుచుకోకుండా, ఇక ఈ లోకములన్నీ మనం గెలిచి వశంచేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?
బలి: గొప్పబలశాలి, స్వయంకృతము అయిన ఆ మంత్రి గారిని మేమెక్కడ జయించగలం చెప్పండి? అది ఏదో కొద్ది మందికే సాధ్యం. మేము నియతిని, ప్రారబ్ధము (law of causation & tendencies born of past actions)లను అనుసరించి "రాజ్యాలు - యుద్దాలు మొదలైన అనేక లౌకిక క్రియా
Page:404
విశేషములలో చిక్కుకున్నాం. ఆ మంత్రి మహాబలశాలి అని మీరే అంటున్నారు కదా! అయినా, ఆతనిని జయించటానికి ఉపాయాలేమన్నా ఉన్నాయా? శాస్త్రాదులు చదవాలా? మంత్ర-తంత్రాలేమైనా నేర్వాలా? లేక ఇంకా ఏం చేస్తే మనం మంత్రిని తిరిగి వశపరచుకోగలం? ఈ విషయాలు సత్వరం చెప్పండి.
విరోచనుడు : కుమారా! ఆ మంత్రి మహాబలశాలి, అజేయుడు అయినమాట నిజమే. అయినప్పటికీ ఆతనిని జయించే మార్గం ఉంది చెపుతాను విను -
పుత్రయుక్త్యాగృహేతోసౌ క్షణాదాయాతివిశ్వతామ్ | యుక్తింవినాదహత్యేష ఆశీవిషివోద్దతః|| (శ్లో 3, సర్గ 24)
‘యుక్తి‘(ఉపాయం) చేత ఆతడు క్షణంలో వశీకృతుడౌతాడు. యుక్తిలేకపోయిందా, ఒక ’కోడెత్రాచు’ లాగా ఎంతటివారినైనా సరే, భస్మీ భూతంచేసి వేయగలడు.
ఒక బాలుని లాలించినట్లుగా యుక్తి చేతనే ఆతనిని లాలిస్తూ, వశం చేసుకోవాలి. అట్లా వశం చేసుకున్నామా… రాజుగారిని దర్శించి దివ్యపదమును పొందుతాం కదా! రాజు యొక్క దర్శనమైతే మంత్రి కూడా మన వశం అవుతాడు. మంత్రి మన వశం అయ్యాడా రాజు దర్శనం అవుతుంది.
యావన్నదృష్టోరాజాసౌ తావన్మస్త్రీనజీయతే | మన్తీచయావన్న జితస్తావద్రాజానదృశ్యతే || (శ్లో 7, సర్గ 24)
రాజు దర్శనం కానంతవరకు మంత్రిని జయించలేం. మంత్రిని జయించనంతవరకు రాజుగారు
మనకు కనిపించరు.
చిత్రం చూచావా! రాజదర్శనం కాకపోయినంతకాలం ఆ దుష్ట మంత్రి నిన్ను నానాతిప్పలు పెడుతూనే ఉంటాడు. “రాగములు, ద్వేషములు, హర్షము, ఉద్రేకము, మానము, అవమానము, క్రోధము, లోభము, దిగులు, దుఃఖము”, ఈ విధంగా అనేక తళుకుబెళుకులతో తన యజమానికే భ్రమగొలుపుతాడు. … ఏదోవిధంగా ఆమంత్రిని వశం చేసుకోవాలి.
అనేక శాస్త్రార్థాలు తెలిసినవారు కూడా ఆ మంత్రిని జయించలేక పోవుటచే వారికి రాజదర్శనం కావటంలేదు. అందుచేత కుమారా! బుద్ధిమంతుడైనవాడు ఈ రెండిటి కొరకు అభ్యాసపూర్వకంగా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి- 1. రాజ దర్శనం చేయటానికి, 2. మంత్రిని ఓడించటానికి.
పురుష ప్రయత్న పూర్వకమైన అభ్యాసం చేత ఆ రెండిటిని ఒక్కసారిగా నిర్వర్తించటమే శుభ ప్రదం. అభ్యాసం సఫలీకృతం అవుతూ ఉంటే ఇక దుఃఖాదులు లవలేశమైనా ఉండనట్టి ‘ఆత్మ పదము’ అను ఉత్తమ స్థానం మనం పొందగలుగుతాం. మహాత్ములగు అనేకులు ఆ స్థానం పొంది సంసార శ్రమనంతా నశింపజేసుకున్నవారై, నిత్యవికసిత హృదయులై ఉంటున్నారు. సర్వ సంశయాలూ నశించుటచే ప్రశాంత స్వరూపులగుచున్నారు.
Page:405
ఆ మహారాజుండే స్థానం ఏర్పడిఉన్న దెక్కడ? సర్వ దుఃఖములు వినాశనం పొందే మోక్షమే ఆ స్థానం. అక్కడి రాజు ఆత్మ దేవుడే కదా! అట్టి ఆత్మయే … మనుష్యానందము మొదలుకుని బ్రహ్మ దేవుని ఆనందము వరకు ఆనందము లన్నిటికన్నా పరమైయున్నది. అద్దానిని ‘నిరతిశయానందము’ అని అంటారు. అంతకుమించి కోరతగినది, పొందవలసినది ఉండదు. కాబట్టి అది ఇంద్రియానందం వంటిది కానే కాదు. ఇంద్రియములకు పరమై ఉన్న ఆ ఆత్మదేవుడే మిక్కిలి ప్రజ్ఞానవంతుడగు మనస్సును తనకు మంత్రిగా నియమించుకొనినాడు.
ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది?… మట్టి కుండగా అగునట్లు, పొగ మేఘ రూపంగా పరిణమించినట్లు, మనస్సు నందు గల సూక్ష్మ వాసనలే ఈ జగత్తు ఆకారంగా పరిణమించుచున్నాయి. బలి: "మనస్సును జయించితే సర్వము జయించబడినట్లే” అని అన్నారు కదా! ఈ మనస్సును జయించటానికి ఏమైనా యుక్తులు, ఉపాయాలు, మార్గాలు చెప్పమని ప్రార్థన.
విరోచనుడు : యుక్తిచే ఏదైనా సాధిస్తున్నాం కదా! ఈ మనస్సు విషయంకూడా అంతే. ఒక ఉపాయం చెపుతాను… వినువిషయార్ద్రతిభోః పుత్ర సర్వానేవహిసర్వథా | అనాస్థాపరమాహ్యేషా సాయుక్తిర్మనసోజయే ॥ || (శ్లో 17, సర్గ 24)
"విషయభోగములన్నిటి యందూ కోర్కెను సంపూర్ణంగా త్యజించివేస్తే చాలు” ఇదే మనో
జయమునకు ఉపాయం.
విషయములపట్ల కోర్కె లేకపోవటమే ఉత్తమమైన యుక్తి. మదించిన ఏనుగు వంటి ఈ మనస్సును “విషయ రాహిత్యము” చేత మాత్రమే వశం చేసుకోగలం. అయితే, ఒక్క విషయం.
ఏషాహ్యత్యన్తదుష్ర్పపా సుప్రాపాచమహామతే | అనభ్యస్తాతిదుష్ర్పపా స్వభ్యస్తా ప్రాప్యతేసుఖమ్ (శ్లో 19, సర్గ 24)
ఒక విధంగా చూస్తే విషయ రాహిత్యమనేది ఇంచుమించు అసాధ్యం. మరొక విధంగా చూస్తే అది సాధించటం తేలిక కూడా! అభ్యాసం చేసే వానికి సులభసాధ్యమే. అభ్యాసం లేకపోతే మాత్రం అసాధ్యం.
ఈ విషయవిరక్తి అనేది క్రమక్రమంగా అభ్యసిస్తూవస్తే పారిజాత పుష్పపు సుగంధం లాగా అంతటా వ్యాపించి విస్తృతం పొందగలదు. అయితే, విత్తనం నాటకపోతే ధాన్యం ఫలిస్తుందా? భోగము లందు ఆసక్తి కలిగియే ఉండి “విషయములు రహితం కావేం?” అనుకుని ఏం ప్రయోజనం? అభ్యాసం కొరవడితే అనుకున్నది ఎవరైనా ఎట్లా సాధిస్తారు?
అందుచేత అభ్యాసం చేతనే ఆ మంత్రిగారు నీ వశం అవుతారు. సాంసారిక విషయములందు విరక్తి చెందనంతవరకు జీవులు ఈ ‘సంసారము’ అనే మురికి గుంటలో వసిస్తూ దుఃఖాదులను పొందుచూనే ఉన్నారు. మనుజుడు ఎంతటి బలవంతుడైనా, తాను స్వయంగా నడవకపోతే, ఒక
Page:406
చోటునుండి మరోచోటికి అప్రయత్నంగా వెళ్ళిపోగలడా? అభ్యాసం లేకపోతే విషయములను ఎవ్వరూ జయించలేరు. అందుచేత దేహమును ధరించినందుకుగాను, ఈ జీవుడు ’ధ్యేయవాసన’ను త్యజించటం అభ్యసించాలి. ఏదో పొందాలి… అనేదే ధ్యేయవాసన!
కుమారా! నీవు "సుఖదుఃఖలకు”లకు అతీతమైనట్టి అప్రమేయ స్థితిని పొందాలనుకుంటే, ఎట్లాగైనా భోగముల పట్ల ఏర్పడే నమ్మకమును తగ్గించుకోవాలి. ‘విషయత్యాగము’ అనే రూపం గల పురుష ప్రయత్నమును మించిన శుభసాధనం మరేదీ లేదు.
బలి: తండ్రీ! ఇతఃపూర్వపు అనేక జన్మలలోను, ఈ వర్తమాన జన్మలోను మేము ఆర్జించియున్న ‘ప్రారబ్ధము’ మమ్ములను అల్పమైన దృశ్య విషయముల వైపు నెట్టుకుపోతుంటే మేము ఏం చేయాలి? ధ్యేయ వాసనా త్యాగం ఎట్లా సాధ్యం?
విరోచడు :“మేము నియతి లేక ప్రారబ్ధముచే ప్రేరేపించబడి మాత్రమే, శుభాశుభకర్మలు నిర్వర్తించ గలం. మాకు మేముగా ఏమీ చేయలేము” - అని బద్ధకస్థులగు వారు మాత్రమే పలుకుచున్నారు. శాస్త్రదృష్టి కలవారు ఆ విధంగా అనరు. అన్నిటికన్నా ఉత్తమమైనది వర్తమాన - ప్రయత్నమే.
ఎందుకంటే వర్తమానంలో శ్రద్ధతో నిర్వర్తించవలసియున్న ప్రయత్నం నీ చేతిలో ఉన్నది. వర్తమాన సుదృఢ ప్రయత్నములచే పూర్వ సంస్కారములను, వ్యసనములను, దౌర్బల్యములను జయించి వేయాలి.
బలి: తండ్రీ! వర్తమానపు పురుష ప్రయత్నం గురించి మీరు నొక్కి వక్కాణిస్తున్నారు… బాగానే ఉన్నది. అయితే నాదొక సందేహం. తాతగారైన ప్రహ్లాద చక్రవర్తి ఎట్టి వర్తమాన ప్రయత్నాలు లేకుండానే, బాల్యంలోనే ఈ సంసార చిటపటలైన హర్ష- దుఃఖాలను ఉపశమింప జేయగలిగారే? అది వారికి ఎలా సాధ్యపడింది?
విరోచనుడు : అట్టి మహనీయులు ఈ ఉపాధి ప్రాప్తించటానికి మును ముందే ఇతఃపూర్వపు స్వప్రయత్నాలచే హర్షామర్షములకు నిమిత్తభూతములైన పూర్వ కర్మలను క్షయింపజేసుకుని ఉన్నారు.
“అంతరంగంలో గూడుకట్టుకొని ఉన్న సుఖదుఃఖములకు సంబంధించిన ‘అవగాహన ఆశల ప్రకటనమే ప్రారబ్ధము’ - అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అయితే, ఎండమావులలో కనబడేదాని పట్ల ‘అది జలము’ - అను భావం యథార్థమైన జ్ఞానముచే నశిస్తుంది కదా! పురుష ప్రయత్నబలముచే ఏర్పడిన నియతి రూపమగు ప్రారబ్ధమును కూడా తప్పకుండా భావౌన్నత్యముచే జయించివేయవచ్చు.
సర్వమునకు కర్త అగు ఈ “జీవుడు” అనబడు వాడు మనస్సుకంటే వేరుకాదని మా అభిప్రాయం. ఈ మనస్సు దేనిని ఏ విధంగా కల్పన చేస్తుందో దానిని ఆ విధంగానే పొందటం జరుగుతోంది. మనస్సు “ఇదియే నియతి“ అని కల్పన చేస్తూ ఉంటుంది. అట్టి స్వయంకల్పితమైన నియతిని అనుసరించే “ఇది నియతి - ఇది అనియతి” అనునట్లుగా ఆయా పదార్థములను గాంచుచూ ఉంటుంది. నియతి (Destiny)ని కూడా చిత్తమే స్వసంకల్పానుసారంగా ఉత్పత్తి చేయటం జరుగుతోంది. చిత్తమే (లేక మనస్సే) స్వరూపముగా గల ఈ జీవుడు ఒకానొక అర్థవంతమైన జన్మయందు ’సాక్షి
Page:407
చైతన్యసాక్షాత్కారం’ పొందుచున్నాడు. అనగా చిత్తము “అనియతము, నిత్యము, ఏకస్వభావము”
అగు పరమాత్మ యందు ఉపశమనం పొందుతోంది. “నేను సర్వదా సాక్షిమాత్రమగు శుద్ధ చైతన్యమే” - అనే భావన పొందుచున్నది. అప్పుడు అట్టి మనస్సు గల జీవుడు సమాధి రూపమగు “నిర్విషయము”ను స్వీకరించుచున్నాడు. ఆకాశము నందు చలన రహితమైన వాయువులాగా చిత్ప్రభావము నందు సంగరహితుడై, సమాధి వహించి, మౌనస్వరూపుడై ఉంటున్నాడు. సమాధి నుండి లేచుచున్నప్పుడు శాస్త్రములు చెప్పు నియమావళిని ఆచరించుచున్నాడు. తాను గ్రహించిన ఉత్తమ సత్యమును తదితరులకు తెలియజేయుటకు ఆయా శిష్టాచారములందు ప్రవర్తించుచున్నాడు.
పుత్రా! వాయువు వీచుచున్నప్పుడు కొండపై చెట్లు కదులుతూ ఉంటాయి. కొండకాదు కదా! మోక్ష స్వరూపుడగు జ్ఞానికూడా అటు సమాధి నిష్ఠుడైయున్నప్పుడు ఇటు ఆయా వర్ణాశ్రమ ధర్మములు నిర్వర్తిస్తున్నప్పుడు సర్వవిషయములు గ్రహించి ఉండుటచే ఏర్పడిన స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. తాను మాత్రం విక్షేపరహితుడై ఉంటాడు. అయితే ఈ మనస్సు జయింపబడనంత వరకు నియతి గాని, ప్రారబ్దము గాని జయింప బడజాలదు.
మానవ జన్మ పొందుటచే ఈ జీవుడు ఉత్తమమైన ’కర్మ - - జ్ఞానము’లను ఆశ్రయించుటకు అర్హత, అవకాశము పొందినవాడగుచున్నాడు. ఇప్పటి సంకల్పములు - కార్యక్రమములను అనుసరించే ఉత్తరోత్తర పరిణామములు ఉండబోవుచున్నాయి. అందుచేత కుమారా! నీ సంకల్పములు నీ అధీనంలోనే ఉన్నాయి కనుక, చక్కగా ఉత్తమ సంకల్పములనే ఆశ్రయించు. వైరాగ్యము - పురుష ప్రయత్నముల ద్వారా బ్రహ్మ భావము గూర్చి చింతన చేయి. ఎవరికి ఏది ప్రాప్తిస్తున్నదో, లేక, ప్రాప్తించుట లేదో - అదంతా పురుషార్థము (effort) యొక్క పర్యవసానమే అయివున్నది సుమా! అందుచేత ప్రయత్నించి భోగములందు విరక్తిని సమకూర్చుకో. “అగమ్యము - సుదీర్ఘము” అగు సంసారమును అధిగమించాలంటే ‘విషయములపట్ల విరక్తి’ అను ఔషధం అత్యంతావశ్యకం. భవము (సంసారము) అధిగమించబడనంతవరకు దివ్యమగు పరమశాంతి లభించదు. మోహహేతువులైన ఈ దృశ్యవిషయములపట్ల అనురాగమున్నంతవరకు అశాంతి తొలగదు.
ఈ సంసారంలో కనబడే భోగములన్నీ అతి చంచలములు, దుఃఖప్రదములు అయి ఉన్నాయి. అయినప్పటికీ, అజ్ఞానముచే మోహితుడగుచున్న ఈ జీవుడు వాటిచే ఆకర్షించబడుచున్నాడు. అట్టి ఆకర్షణ నుండి విడివడాలంటే “శ్రవణము - మననము - - నిధిధ్యాస“లను అభ్యసించాలి. మనస్సును ఆత్మానుసంధానం చేయాలి. అభ్యాసం లేకపోతే భ్రమ తొలగదు. భ్రమ తొలగకపోతే నీ స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మదేవుని దర్శించ లేవు. ఆ రాజాధిరాజును దర్శించనంత కాలం అత్యంత వ్యాకులతో కూడిన ”విషయములను ఆశ్రయించటం, విడవటం, ఇంతలోనే మరి కొన్ని విషయములను సమీపించటం” - అనే శ్రమ తప్పదు.
ఈ నీకు పూర్ణమగు శాంతి-సంతృప్తులు లభించకపోవటానికి కారణం అల్ప దృష్టిచే విషయములను “ఇవే సర్వస్వం" అను బుద్ధితో సుదీర్ఘకాలం ఆశ్రయించటమే!
Page:408
బలి : దానవేశ్వరా! ఏ విషయవిరక్తిచే నిరంతరం ఆత్మ యందు ‘స్థితి’ కలిగి యుంటామో - అది కలిగే దెట్లా?
విరోచనుడు : గొప్పవస్తువును చూచినప్పుడు అల్పవస్తువును కోరుకోవటం స్వయంగానే సన్నగిల్లుచున్నది కదా! ఆత్మ సందర్శనముచే, లేక ఆత్మను ఎరుగుటచే విషయములపట్ల విరక్తి తప్పక పొందగలవు. అందుచేత, ‘ప్రజ్ఞ’ అనే ఒరిపిడిరాతితో ‘ఉత్తమవిచారణ’ అనే ప్రయత్నముచే ఆత్మ విచారణ చేయాలి ఆత్మచే ఆత్మదర్శనం చేస్తూ ఉండాలి.
మొదటి దశ : ఒక రోజుకు ‘పగలు, రాత్రి’ అనే రెండు విభాగములున్నట్లు, ఈ మనస్సును కూడా రెండుగా విభజించాలిమొదటి భాగమును : ఈ శరీర నిర్వహణకు కావలసిన ఉపభోగాలకు వినియోగించు.
రెండవ భాగవము : శాస్త్రముల, గురువుల బోధలను గ్రహించటానికి, ఆకళింపు చేసుకో వటానికి వినియోగించు. (లేదా) విషయములవైపు పరుగిడుచూ అపరిశుద్ధమగుచున్న ఈ మనస్సు యొక్క కొంత భాగాన్ని “గురువులను సేవించుట, బుద్ధి మంతులతో సంభాషించుట, స్వానుభవాలను శాస్త్రప్రవచనాలతో సరిపోల్చుకొనుట" - మొదలైన సన్మార్గాలలో వినియోగిస్తూ ఉండు.
రెండవ దశ : కొంతకాలమైన తరువాత నీ మనస్సు కొంత పరిపక్వమౌతుంది కదా! అప్పుడు నీ మనస్సును నాలుగు భాగాలుగా చేయిమొదటి భాగమును : దేహయాత్రకు సంబంధించిన వాటితో పూరించు.
రెండవ భాగమును : ఉత్తమ కర్మలకు వినియోగించు.
మూడవ భాగమును : గురు శుశ్రూషచే పూరించు.
నాలుగవ భాగమును : శాస్త్రశ్రవణం, మననం చేయి.
అప్పుడు క్రమంగా నీ చిత్తము తత్త్వనిశ్చయముతో కూడిన ‘పరిపక్వత’ పొందగలదు.
మూడవ దశ : క్రమంగా పరిపక్వత ప్రాప్తిస్తూ ఉంటుంది కదా! ఇక రెండు భాగములను శాస్త్ర - వైరాగ్యము లందు వినియోగిస్తూ ఉండు. తక్కిన రెండు భాగములను కూడా క్రమక్రమంగా ’ధ్యాన - గురుపూజ - ధర్మనిరతి’లతో పూరించు.
శుభ్రమైన వస్త్రం మాత్రమే రంగును చక్కగా స్వీకరించుచున్నది కదా! ఏ చిత్తములో అయితే విషయాభిలాష సన్నగిల్లుతూ వస్తుందో, అట్టి శుద్ధ చిత్తము మాత్రమే జ్ఞానప్రాప్తికి యోగ్యమగుచున్నది.
శనైః శనైః లాలనీయం యుక్తిభిః పావనోక్తిభిః | శాస్త్రార్థ పరిణామేన పాలయేత్ చిత్తబాలకమ్ ॥
ఈ చిత్తము అనే బాలుడిని యుక్తి (ఉపాయము చేతను, పవిత్రములైన శాస్త్ర వాక్యముల చేతను లాలించుచు, చిదేకరసమును పొందింపజేయాలి. అప్పుడది స్వయముగా ఆహ్లాదకరమై, సుందర- శీతలమై విరాజిల్ల గలదు. నాయనా! బలీ! ఎట్టి ‘కృత్రిమము’ గాని, ‘కుటిలభావన’ గాని ఏమాత్రం లేకుండా, ఉత్తమ ’బ్రహ్మాకారవృత్తి’ని బుద్ధిచే ఆశ్రయిస్తూ ఉండు.
Page:409
ఈ ఇంద్రియములు, ఈ విషయములు, ఈ వృత్తులు, వీటిని అనుభవిస్తున్న ఈ జీవుడు - ఇవన్నీ కూడా “సచ్చిదానంద రూపమైనట్టి అధిష్టాన బ్రహ్మమే అయి ఉన్నాయి" … అను దృష్టిని బలపరచుకో. చక్కటి ప్రజ్ఞా, విచారణద్వారా “ఆత్మ దర్శనముచే తృష్ణారాహిత్యము, తృష్ణారాహిత్యముచే ఆత్మ దర్శనము” - ఈ రెండూ పరస్పరం వృద్ధి పొందింప జేసుకుంటున్నాయి.
భోగములందు ‘అప్రీతి’ జనించుటచేతనూ, సర్వోత్తమమగు ఆత్మయొక్క సందర్శనము అగుట చేతనూ పరబ్రహ్మమునందు నీకు శాశ్వతమైన విశ్రాంతి సమకూరగలదు.
ఎందుకో తెలియదుగాని ఈ జీవుడు విషయానందమునే గొప్ప విషయంగా ఎంచుచున్నాడు. వాటి కొరకు ఆశ్రయిస్తూ ఆ ప్రయత్నంలో విశ్రాంతిని కోల్పోవుచున్నాడు. వాస్తవానికి, పూర్ణమైన శాంతికి ఈ జీవుడు అర్హుడే. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ జీవుడు పరమశాంతమగు ఆత్మయేకదా!
మరల చెప్పుచున్నాను! ఈ జీవుని స్వస్వరూపము పరమానందము, పరమశాంతము కదా! 1. విషయముల పట్ల విరక్తి లేకపోయిందా .. ఇక ఎన్ని యుక్తులుంటే ఏం ప్రయోజనం? ఆత్మను దర్శించటానికి బుద్ధి ప్రవృత్తిని పొందనే పొందదు.
కనుక నీవు ఇటు విషయవిరక్తి, అటు సమాధి ఒకేసారి అభ్యసిస్తూ రావాలని మరల గుర్తు చేస్తున్నాను. పురుష ప్రయత్నము ఉన్నప్పుడే ఈ బుద్ధి ఆత్మవైపు ప్రసరించటం జరుగుతోంది. ‘భోగత్యాగం’ అనే పురుషప్రయత్నంచే శ్రేయము అయినట్టి పరమాత్మ యందు విశ్రాంతి సులభ మగుచున్నది. పురుష ప్రయత్నంచే మాత్రమే ప్రారబ్ధమును దూరీకరించవచ్చు. భోగముల పట్ల ధ్యాసయే మోక్షమార్గంలో ప్రబలమైన ప్రతిబంధకం. విరక్తిచే వివేకం, వివేకంచే విరక్తి జనించుచు, క్రమక్రమంగా బలపడుచున్నాయి. సముద్రం- మేఘముల వలె ఒకదాని ఉనికికి మరొకటి కారణ మగుచున్నాయి. (Discrimination through dispassion and dispassion through discrimination-both should be cultivated simultaneously).
ఒక చోట ఒక ముగ్గురు మిత్రులున్నారు. ఆ ముగ్గురూ పరస్పర అనురాగంతో ఒకరికొకరు తోడై సంచరిస్తూ ఉంటారు. వారు :
భోగముల పట్ల అప్రీతి | విరాగము
‘ఇది సత్తు, ఇది అసత్తు’ - అను వివేకము
నిత్యమూ ఆత్మనే సందర్శించు అభ్యాసం
Page:410
నాయనా ! బలీ! ఎంతటి ప్రయత్నం చేసైనా, పళ్ళతో పళ్ళుకొరికి అయినా సరే… భోగముల పట్ల వైరాగ్యం సంపాదించు. ప్రారబ్ధము అనబడు ఇతఃపూర్వపు కుసంస్కారాలను, దురవగాహనలను జయించటానికి ప్రయత్నం చేయి. అందుకు వర్తమాన పురుష ప్రయత్నములే నీకు తోడు సుమా!
జీవుడు ధనం ఆర్జించినంత మాత్రంచేతనే తప్పేమీ లేదు. అయితే పురుషప్రయత్న పూర్వకంగా, జనసమ్మతమైన మార్గం అవలంబించి ఆర్జించు. అట్టి ధనాదులను మోక్షమార్గం ఉపదేశించే మహాత్ముల పాదములు ఆశ్రయించటానికి వినియోగించు. సజ్జనులు, గుణశీలురు, ఆత్మతత్త్వముతో ఏకీభావము అనుభవించువారు - అగు మహాత్ములు ఉన్నారు. వారితో సంసర్గము పొంది, వారిని ఆశ్రయించావా, విరక్తి జనించగలదు. విషయములపట్ల విరక్తిచే అంతరంగంలో ‘విచారణ’ అను దానికి తగినంత చోటు లభిస్తుంది. విచారణచే వేదోపనిషత్తులు మనకు ప్రతిపాదిస్తున్నట్టి ’అద్వైత బ్రహ్మము’నందు నిశ్చయ జ్ఞానం ఉదయిస్తుంది. ఇక ఆ తరువాత ’మననము - నిధిధ్యాస’లచే క్రమంగా అత్యుత్తమమగు ఆత్మపదము తప్పక ప్రాప్తించగలదు.
కనుక ఈ విషయములపట్ల విరక్తియే ఆత్మయందు విశ్రాంతికి బీజము, మార్గము, ఉపాయము అయి ఉన్నది. ‘కల్పన’ అను బురదయందు చిక్కుకుని, నానాక్లేశములు అనుభవిస్తున్న ఈ జీవునికి ‘దృశ్య విషయములపట్ల సదవగాహన’ ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. పుత్రా! ఇక నీ విషయానికి వస్తే నీకు పూర్ణమగు విషయ విరక్తి ఇంకా కలుగలేదు. అయినా కూడా నిర్మల చిత్తుడవగు నీకు నీ ఉత్తమ అభ్యాసముల వశంచే త్వరలో భ్రాంతి అంతా తొలగగలదు. అట్టి శుద్ధ సదాశివ బ్రహ్మ స్వరూపుడవగు నీ స్వస్వరూపమునకు ఇదే నా నమస్కారము.
నీ వర్తమాన పురుషకారమును దష్టిలో పెట్టుకొని కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నాను1. దేశాచారములకు, ధర్మనిరతికి విరుద్ధంకాని విధంగా ధనం సంపాదించు.
అట్టి ధనమును భోగముల కొరకే వ్యర్థపరుచుకోవడం శ్రేయస్సు కాదు. బ్రహ్మవేత్తలగు సాధువులు ఏమి చూచి సంతోషిస్తారో, ఆ మార్గంలో నీ ధనం వెచ్చించు. మహాత్ములతో సంసర్గమునకు అర్హుడవు అవుతూ ఉండు.
నీ సాధన సంపత్తి, మహాత్ముల ప్రవచనములు తోడు అగుచుండగా, అధ్యాత్మ శాస్త్ర విచారణను ఆశ్రయించు.
అట్టి స్వప్రయత్నము యొక్క ప్రయోజనముగా నీ కంఠము నుండి ఊడిపడ్డ హారములాగా ఆత్మలాభం పొందు.
మనోరచన - మనోవ్యాధి
బలిచక్రవర్తి (తనలో) : అవును. గొప్ప విచారణ శీలురలో ఒకరుగా శ్లాఘించబడే నా తండ్రి విరోచన చక్రవర్తి నాకు అంతా చెప్పే ఉన్నారు కదా! దైవవశాత్తు అదంతా ఇప్పుడు స్పష్టంగా గుర్తుకు వస్తోంది. సద్గురువుల స్పర్శచే కాబోలు, ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా భోగముల పట్ల
Page:411
అరుచి, అతీతమైన స్వభావం ఏర్పడుచున్నాయి. ఫలితంగా “స్వచ్ఛము - అమృత శీలము” అయినట్టి శాంతి యొక్క సామీప్యత లభిస్తోంది.
ఆహా! ఇంత వరకు అనేకమైన ఆశాపరంపరలను అనుసరిస్తూ గడ్డిపోచలవంటి ధనం, స్త్రీలు మొదలైన విషయములే మహత్తరమైనవి అనుకుంటూ వచ్చాను కదా! చివరికి ఏమైనది? స్పర్థ, అశాంతి, ఆవేశ కావేశములు నన్ను కప్పి వేశాయి! ఎంత పరితాపం పొందాను! కలలోని దుస్సంఘటన వలె అవన్నీ తుచ్ఛమని, అసత్యమని తేలిపోయింది.
అమ్మయ్య! ఇప్పుడు ఈ భూమి ఎంత ప్రశాంతంగా కనబడుతోంది! శమము ఉన్నచోట ఇక సుఖ దుఃఖ దశలన్నీ తొలగిపోతాయి. నా అంతఃకరణం పూర్ణచంద్ర బింబంలాగా నిరతిశయానందాన్ని పొందుతోంది. ఇంతవరకు మనోవేగముచే వేలాది భ్రాంతులలో సంచరించాను. అనేక క్షోభలతో కూడికొని ఉన్న ఈ విభవములు సంపాదించడానికి ఎన్నో దుఃఖపరిణామములు గల కార్యక్రమాలను నిర్మించుకున్నాను. అజ్ఞానం యొక్క విలాసముచే రక్త మాంస మాత్రములగు తుచ్ఛ శరీరములు నన్ను ఆకర్షించి వివశుణ్ణి చేశాయి.
ఎన్నో ఐశ్వర్యములను చవి చూశాను. గొప్పగొప్ప రాజ్య విభవములను అనుభవించాను. అనేక ప్రాణికోట్లను వశం చేసుకొని పరిపాలించాను. ఏం ప్రయోజనం? నా ఆశలు క్షయించాయా? లేదు. ఆశ ఉన్నంతకాలం తృప్తి ఏది?
ఈ ప్రపంచంలో నాలాగే అనేకమంది జనులు ఒకసారి అనుభవించినవే అనేకసార్లు అనుభవిస్తూ దీనులు అగుచున్నారు. ఇప్పుడు నేను సర్వము పరిత్యజించుచున్నాను. స్వబుద్ధిచే అంతా కూడా విడచిపెట్టి తత్త్వబోధచే పూర్ణస్వరూపమును సంతరించుకోదలిచాను. ‘స్వాత్మ’ యందే పరిపూర్ణుడనై ఉండి ఉండెదను గాక! ఎందుకంటే ‘మృత్యువు’ అనబడు గొప్ప విపత్తు వాటిల్లినప్పుడు ఈ స్త్రీ, రత్న, రాజ్యాది భోగములన్నీ నన్ను విడచిపెడతాయి. ఒక్క స్వాత్మ మాత్రమే నన్ను వెంటనంటి ఉంటుంది కదా! ఇంతకాలం అవివేకినై వీటిని నేను ఎందుకు నమ్ముతూ ఉన్నాను? నేను దేవతలతో విరోధం కల్పించుకున్నది ఈ తుచ్ఛ జగత్తుపై ఆధిపత్యం కోసమా?
“మనోరచన మాత్రమే” అయినట్టి ఈ దృశ్య జగత్తును నేను కలిగి యుండుటయే ఓ గొప్ప ‘మానసిక వ్యాధి’ అయివున్నది. ఇట్టి వ్యాధికి ఇప్పుడు, ఇక్కడ చికిత్స చేసుకోకపోతే ఇక ఇక్కడ జీవించినందుకు ఏం గొప్ప ఫలితం పొందినట్లు? ఆత్మ విషయం ఎఱిగియున్న మహాత్ములకు ఈ జగత్తునందు ప్రీతి జనిస్తుందా? …లేదు.
ఒక గొప్ప దుఃఖకరమైన విషయం ఏమిటంటే…. పిచ్చి వాడినై నేను ఇంతకాలంగా అల్పము అల్పకాలికము అయినట్టి ఏవేవో ప్రాపంచిక విషయాలను ఆశ్రయించాను. అనర్థములైనవాటిని కూడా అర్థవంతములని భావిస్తూ వస్తున్నాను. నా కోరికలు ఒక అంతూ పొంతూ లేకుండా క్షణానికో విధంగా ఉంటున్నాయి. అజ్ఞానపూర్వకమైన లక్ష్యములతో, హావ భావములతో నేను చేయని చండాలపుపనులేమైనా ఉన్నాయా! ఒక్కొక్క సమయంలో నేను చేస్తున్న తప్పుడు పనులన్నీ
Page:412
మరొకప్పుడు దుఃఖకరముగానే పరిణమించబోవుచున్నాయి కదా! అయినా కూడా, ఈ తుచ్ఛమైన ఇంద్రియ విషయములను అంటిపెట్టుకొని వివేచన చేయకుండా కాలాన్ని వృథా చేసుకుంటున్నానే!
అయినదేమో అయినది. ఇంకా పాత విషయాలే గుర్తుకు తెచ్చుకొని మరి కొంత కాలయాపన చేయడం అనవసరం. "ఈ వర్తమాన కాలంలో నేను కలిగి ఉంటున్న అజ్ఞానం తొలగేది ఎట్లా? ఏఏ ప్రయత్నములు చేసి ఈ వర్తమానాన్ని సఫలీకృతం చేసుకోగలను?” - అనే విషయాలు -
ఇప్పుడు నాకు ముఖ్యం.
ఆ “పరబ్రహ్మము” అనగా ఎవరు? ఎక్కడుంటాడు? ఆతడు “అనంతమైన ఆకారము కలవాడు, కారణములకే కారణము” కదా! అట్టి పరబ్రహ్మము తోటి ‘ఐక్యము’ పొందినప్పుడు మాత్రమే ఆత్మయందు పూర్ణ సుఖము ఆవిర్భవించగలదు. అజ్ఞానము నశించినప్పుడు ఐక్యము సుసాధ్యం అవుతుంది. అందుచేత ఇప్పుడు నాకు అజ్ఞానం తొలగాలి. అందుకుగాను గురువులగు శుక్రాచార్యుల వారిని శరణు వేడుతాను.
"ఈ దృశ్య ప్రపంచం ఏమై ఉన్నది? ‘అహం’ అను ప్రత్యయమే రూపంగా గల ఈ జీవుడెవడు?” ఈ రెండింటి గురించి క్షుణ్ణంగా చూసి తెలుసుకోవడానికి ఆచార్యులవారే నాకు ఇప్పుడు దిక్కు.
హే! శుక్రాచార్యా! పరమేశ్వరా! ఎవరు మిమ్ములను ఆశ్రయిస్తే, వారిని మీరు ప్రసన్నులై అనుగ్రహిస్తూ ఉంటారు కదా! అట్టి మిమ్ములను శరణాగతుడనై మనస్సుచే ధ్యానం చేస్తున్నాను. మీరు ఉపదేశిస్తేనే నేను సాంసారిక విషయములు అనే బురద నుండి బయట పడగలుగుతాను. స్వామి! ఎటో తెలియని నిస్సారమైన దూర తీరాలకు కొట్టుకుపోతున్న నాకు, మీరే ఆలంబనము. పరమాత్మ స్వరూపంలో స్వయంగా స్థితి పొందివుండడం ఎట్లాగో తెలియజేసి నన్ను ఆదుకోండి…!
ఈ విధంగా ఆ బలి కనులు మూసుకొని ఏకాగ్రతతో, భక్తిపూర్వకంగా గురువైన శుక్రాచార్యుల గురించి ధ్యానించడం ప్రారంభించాడు. బ్రహ్మజ్ఞాన తత్పరులై, నిత్యము స్వస్వరూపమందే నిశ్చలులై ఉండే శుక్రాచార్యులు తన శిష్యుని ప్రార్థన విన్నారు. "ఆహా! నా శిష్యుడు జ్ఞానము అభిలషించి నన్ను ఆశ్రయిస్తున్నాడు కదా! సంతోషం! ఇతని సందేహములను నివర్తింప జేస్తాను” తలచారు. వెంటనే శిష్యుడు బలి చక్రవర్తి ముందు ప్రత్యక్షమైనారు. ఆయన శిష్యవాత్సల్యం అట్టిది
మరి!
గురుదర్శనంచే పులకాంకితుడై బలి ప్రేమగా కాళ్ళు కడిగి శిరస్సుపై జల్లుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టి, తాను ఆయన పాదాల దగ్గిర ఆసీనుడైనాడు.
Page:413
బలిచక్రవర్తి : హే మహాత్మా! తమకు ఎంతో శ్రమ కలిగించాను, క్షమించండి. మీరు ఇతఃపూర్వమే నాపై అనుగ్రహంతో చెప్పియున్న కొన్ని తాత్త్విక విషయాలు నా బుద్ధి యందు వికసించుచున్నాయి. తమతో మరికొన్ని విషయాలు సంభాషించాలని, సంప్రతించాలని నా బుద్ది నన్ను ప్రేరేపిస్తోంది.
ఓ దేవా! ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ విషయ భోగములన్నీ అత్యంత మోహకరములే కదా! వీటిపట్ల నాకు విరక్తి ఏర్పడుతోంది. “పరమార్థ తత్త్వము గ్రహించటమే అత్యంత అవశ్యకం" - అను నిశ్చయం నాయందు ఏర్పడింది. అయితే నాలో కొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
ఈ జీవుడు సుఖమును కోరుకుంటున్నాడు కదా! సుఖములన్నిటిలోకి ఉత్తమోత్తమమైన విషయం ఏది? అట్టి అవధి యొక్క స్వరూపం ఎట్టిది? వాస్తవానికి నేనెవడను? మీరెవరు? ఈ జగత్తు ఏమైయున్నది? - ఈ తత్త్వమంతా నాకు త్వరగా తెలియజేయమని వేడుకొంటున్నాను. శుక్రాచార్యులు : నాయనా! ఇప్పుడు ఆకాశమార్గంలో ప్రయాణమునకు సన్నిద్ధుడనై ఉన్నాను. సప్తఋషులు నా వెంట వేంచేసి ఉన్నారు. ఒక దైవకార్యం నిమిత్తం అవశ్యం వెళ్ళవలసియున్నది. బలి : తమ వంటి జీవన్ముక్తులకు కూడా అవశ్యం నిర్వర్తించవలసిన కార్యక్రమములు ఉంటాయా స్వామి?
శుక్రాచార్యులు : జీవన్ముక్తులు కూడా "ప్రాప్తించిన కార్యములను ఉపేక్షించటం” అనే స్వభావం కలిగియుండరు. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం విస్తారంగా చెప్పటానికి సమయం చాలదు. అయినా కూడా సంగ్రహంగా చెపుతాను. విను.
చిదిహాస్తిహిచిన్మాత్ర మిదంచిన్మయమేవచ | చిత్త్వంచిదహమేతేచ లోకాశ్చిదితిసంగ్రహః ॥ II (శ్లో 11, సర్గ 26)
నీవు - నేను - - తదితరములనేకమైన వాటితో కూడి ఎదురుగా కనిపిస్తున్న ఈ జగత్తు కూడా చైతన్యము యొక్క స్వరూపమే. ఈ దృశ్యమంతా "చిత్తు (ఎఱుగుచున్నట్టిది) యొక్క అధీనంలోనే ఉన్నది; ‘ఎఱుక’ యందే అధ్యసించబడి యున్నది. ‘ఆరోపించబడుట’ అను చిత్తుయొక్క ప్రక్రియయే ఈ జగత్తు.
అందుచే, నీవు-నేను-అంతా చిన్మాత్రమే! ఈ సమస్త లోకములు చిన్మయములే. తత్త్వమంతటికి సారము ఇదే. నీవు కనుక శ్రద్ధావంతుడవు, వివేకివి అయ్యావా - "ప్రశాంతమగు చిత్ చైతన్యమే ఇదంతా” అను నిశ్చయముచే సర్వము పొందగలవు. అట్లా కాకుండా, శ్రద్ధ వివేకాలు లేకపోయినాయా …అధికంగా చెప్పిమాత్రం ఏం ప్రయోజనం? ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
చిత్ ‘విషయాకార కల్పన’ కలిగియుండుట.
చిత్ విషయరహితమై ఉండుట.
Page:414
విషయాకార కల్పనయే బంధము. అట్టి కల్పన లేకపోవటమే ముక్తి. విషయాకారకల్పన లేనట్టి చిత్ ‘పూర్ణాత్మ స్వరూపమే’ అయి ఉంటుంది. సమస్త సిద్ధాంతముల అంతిమ సారం ఇంతే!
ఇప్పుడు ఇట్టి నిశ్చయము అవలంబించి ఈ జగత్తునంతా అవలోకించు. అఖండాకార వృత్తిని ఆశ్రయించి సర్వము పరిశీలించు. అప్పుడు నిశ్చయముగా బ్రహ్మమును పొందుతావు.
నిత్యమైన, సత్యమైన సుఖం అదొక్కటే. ప్రియశిష్యా! పెద్దలు నాకోసం ఆకాశమార్గంలో వేచియున్నారు. ఇక సెలవు. ఇట్లు పలికి శుక్రాచార్యులు గాలియొక్క అలవలె అంతర్థానమైనారు.
అప్పుడు ధీమంతులలో శ్రేష్ఠుడైన బలిచక్రవర్తి ఇట్లు చింతన చేయసాగాడు. యుక్తముక్తంభగవతా చిదేవేదంజగత్రయమ్ | |
చిదహంచిదిమేలోకా శ్చిదాశాశ్చిదయంక్రియా ॥ (శ్లో 2, సర్గ 26)
సబాహ్యాభ్యన్తరేసర్వం చిదేవంపరమార్థతః ।
అస్తిచిద్వ్యతిరేకేణ నేహకించనకుత్రచిత్ II (శ్లో 3, సర్గ 26)
మహాత్ములగు శుక్రాచార్యులు చెప్పినది వాస్తవమే కదా! ఈ మూడు లోకములు చిన్మాత్రము (All pervading consciousness- The Knower) అను స్వరూపమే! నేను కూడా “చిత్” (ఎఱుగుట) అనేదే స్వరూపముగా కలిగి ఉన్నాను. ఈ సప్తలోకములు, సర్వ దిక్కులు, సర్వక్రియలు చిన్మయములే. ఈ బాహ్య అభ్యంతర దృశ్య సమూహమంతా చిద్రూపమే. ’చిత్తు’కు భిన్నంగా ఈ బ్రహ్మాండము నందు ఏ వస్తువునూ లేదు? ఆ చైతన్యమే సూర్యుని రూపంగా ప్రకాశింపజేయకపోతే, సూర్యునకు అంధకారమునకు భేదమెక్కడ ఉండేది?
ఈ భూమిని కూడా "ఇది భూమి” అని ఎఱుగుచున్నదేది? చైతన్యమే కదా! చైతన్యము తన మాయారూపములుగా ఈ దిక్కులను, పర్వతములను, జగత్తును, ఆకాశమును, శరీరమును ప్రకాశింపజేస్తోంది. కాబట్టి వాటన్నిటికీ ఉనికి ఏర్పడుతోంది. లేకపోతే అవే ఉండవు.
ఈ సమస్తము చిద్రూపమే! - ఈ ఇంద్రియములు, దేహము, మనస్సు, ఇచ్ఛ, శూన్యాకాశం, వీటన్నిటికీ వేరైన భావసముదాయమూ, ఈ సర్వజగద్విషయాలూ - - ఇవన్నీ చిత్ యొక్క రూపములే!
మరొక విషయం! ఈ శరీరం ద్వారా ‘శబ్దము, స్పర్శ, రూపము’ మొదలైనవన్నీ అనుభవ మవుతున్నాయి. అయితే వాటినన్నీటినీ ఎఱుగుచున్నది చిద్రూపుడనైన నేనే కాని, ఈ శరీరము స్వయంగా దేనినీ ఎఱుగజాలదు కదా! ఒక కొయ్య, ఒక మంచు గడ్డవలె అచేతనమే ఈ శరీరము. శరీరినగు నేను చేతనమును. స్వయంగా ఏదీ ఎఱుగలేనట్టి ఈ శరీరముతో నాకేం పని? “శరీర” స్వరూపుడనగు నేను ఈ శరీరమునకు ఆవల సర్వదా చైతన్య స్వభావంతో ప్రసరించియే ఉన్నాను.
Page:415
నేనెవరు? ఉపాధిచే నిర్వచింపబడనిది, సర్వజగత్తుకు ఆత్మ, చేతన స్వరూపము అగు చిద్వస్తువును నేను. ఆకాశము నందు సూర్య-చంద్ర-నక్షత్రాది ప్రకాశించు సర్వ వస్తువులందు, ఈ భూత సముదాయము నందు, సర్వ దేవతలందు, సర్వ రాక్షసులందు, సర్వ స్థావర, జంగమ జీవులందు ఉండి ఉన్నదీ ఈ చైతన్యమే!
అట్టి నిత్యోదిత చైతన్యమే నేను. ఈ బ్రహ్మాండములందంతటా కేవలం చైతన్యమే కలదు. అనగా నేను సర్వదిక్కులందు నిండియున్నాను. నాకు శత్రువెవడు? మిత్రుడెవడు?
‘బలి’ అని పిలువబడుచున్న ఈ భౌతిక శరీరం ఒకవేళ నేల కూలుతుందనుకో…. అందువలన దేహినగు నాకేమి? నేను దేహిగా, ఎఱుగువాడిగా సర్వమునకు అతీతుడనై, అసంగమై, ఈ ఎఱుగ బడుచున్న దానికంతటి కంటే ప్రత్యేకమై యథాతథంగా ఉంటాను! తమచే కదల్చబడే మేఘఖండాలు నేల కూలినా కూడా వాయుతరంగాలు యథాతథంగా ఆకాశంలో ఉంటాయి కదా!
నాచే ఎఱుగబడుచు, ఉనికిని పొందుచున్న, ఈ శరీరములచే, లోకములచే నేను ఛేదించ బడటమేమిటి? అసంభవం. ‘ద్వేషము’ అనునది కూడా చిత్ చేత ప్రకాశించబడినప్పుడు మాత్రమే ద్వేషరూపమున భాసిస్తోంది. అందుచేత ‘రాగము - ద్వేషము’ అను రెండు భావనలూ చైతన్యము యొక్క అధీనంలోనే ఉన్నాయి. అనగా, అవి కూడా చిద్రూపములే.
బలి కొంతసేపు మౌనము, ధ్యానములలో గడిపాడు.
బలి (తనలో) : ఔను! ఎంత పరిశీలించి చూచినా చైతన్యమునకు వేతైనదేదీ ఎక్కడా కించిత్ కూడా కనిపించటం లేదు. నేను సర్వదా శుద్ద - చిన్మాత్ర స్వరూపుడను. అట్టి నాయందు రాగము గాని, ద్వేషము గాని, మనస్సు గాని, మనోవృత్తులు గాని ఎట్లా ఉంటాయి? అవి లేనప్పుడు ఇక వికల్పమగు కల్పనయే నా యందు సంభవించదు కదా!
కనుక, సర్వవ్యాప్తమై, సర్వ వికల్పములకు అతీతమై, అద్వితీయమై, నిత్యమై, ఆనంద మయాత్మకమగు చిద్రూపమే నేను. నాచే ఎఱుగబడునదేదీ నన్ను మరొకటిగా చేయజాలదు. నాకు వేఱుగా ఉండజాలదు. ఈ ప్రపంచము నామరూపాలతో కూడి ఉన్నది. ఇది నామరూప రహితమగు చైతన్యమునకు ‘సంజ్ఞ’ కాగలదా? లేదు. ఏ చితశక్తి అయితే సర్వత్రా వ్యాప్తమై నామ రూప కల్పనకు అధిష్ఠానమై వెలయుచున్నచో - అదియే ఓం తత్ శబ్దాత్మక రూపమున స్ఫురిస్తోంది.
దృశ్య - దర్శనములకు అతీతమై, నిర్మలమై, నిత్యమై సర్వమునకు ద్రష్టయగు పరమేశ్వరుడను నేను! అట్టి నన్ను ప్రకాశింపజేయగలిగేది మరెక్కడా ఏదీ లేదు. నేను స్వయంప్రకాశ రూపుడను.
బాగానే ఉన్నది! అయితే నిత్య ప్రకాశమాత్రుడనగు నాయందు “నేను ఈ శరీరమును, జీవుడను” అను పరిమిత భావం ఎందుకు ఏర్పడింది?… ఆత్మస్వరూపుడనగు నేను నా ఔన్నత్యమును ఏమరచి, దృశ్యమునకు ద్రష్టత్వము ఆపాదించుకొనునపుడు ఆ కల్పనచే - నీళ్ళలో ప్రతిబింబించే చంద్రబింబంలాగా - పరిచ్ఛిన్న భావన ఉద్భవిస్తోంది.
Page:416
అనగా ‘నేను జీవుడను’ అను భావన భ్రాంతియే కాని, యథార్థము మాత్రం కాదు. ‘అంతిమ సాక్షాత్కార వృత్తి’ చే ఉద్భూతమగు శుద్ధ స్వరూపమే నేను కదా! మరి, అట్టి రూపమును స్వీకరించి, తద్వారా, ఈ ‘భ్రాంతి’ రూపమగు జీవభావమును త్యజించివేస్తే పోతుంది.
ఓ నా ఆత్మస్వరూపమా! జీవ భావ రహితమై, ‘విషయములు’ అను కళంకమే లేనట్టి ‘ముక్త స్వరూపము - మహత్తరము’ అయినట్టి ‘సాక్షి చైతన్యమే’ నీవు సుమా! అట్టి నీకు ఇదే నా నమస్కారం. నీవే చిద్రూపమువు.
“శ్రవణ-మనన - నిధిధ్యాస - సమాధి” రూపమగు ఆ నా సాక్షి చైతన్యమునకు నేను పదే పదే నమస్కారం చేస్తున్నాను. సర్వాన్ని ప్రకాశింపజేయుచు, “జ్యోతి రూపము” అయి ఉన్న నాకు నేను నమస్కరించుచున్నాను. ఆహా! నిర్విషయమై, చిద్రూపమాత్రుడనై, బ్రహ్మాండమంతా పరిపూర్ణం చేస్తున్నది నేనే కదా! శాంతస్వరూపుడను; సర్వమును ఎఱుగువాడను; సత్-చిత్ మాత్రము అగు మహస్స్వరూపుడను. ఆకాశం కంటే కూడా అనంతుడను, సర్వవ్యాపకుడను; అణువు కంటే కూడా అత్యంత సూక్ష్ముడను; స్వతఃగానే చిత్ స్వరూపుడను, శుద్ధ బ్రహ్మాన్ని అగు నన్ను సుఖము, దుఃఖము మొదలైనవి ఎట్లా స్పృశిస్తాయి?
అన్నిటినీ ఎఱుగుచూ - - దేనిచేతా కూడా ఎఱుగబడనివాడను …వర్తమానంలో ఉండిఉంటూనే, ‘భూత - భవిష్యత్తు’లందు కూడా ప్రసరించి ఉన్నవాడను; సర్వ వ్యాపకుడను, విషయ శూన్యుడను. ఇక్కడ ఉన్నదంతా నా తోనే నిండిపోయి ఉన్నది. నేను శుద్ధ-అనంత-అద్వితీయ-స్వరూపుడను. నన్ను ఈ జగత్తు గాని, ఇందులోని భావ, అభావములు గాని, ఆయా పదార్థములు గాని, దేశ కాలాదులు గాని ‘పరిచ్ఛిన్నం’ చేయగలవా?… లేదు.
నాకు పరిచ్ఛేదమే లేదు - కొందరు తత్త్వశాస్త్ర పరిచయం కొరకు “ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది అహంకారము” అని నా గురించి చెప్పుకుంటూ పోతున్నారు. అట్లు పరిచ్ఛేదం చేయటం చేత ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే, నా స్వమాయచే నేనే ఈ శరీర-మనో-బుద్ధి -అహంకారములుగా అయి వ్యవహరిస్తున్నాను కదా! “నా రూపములే” అయివున్న అవన్నీ నాకంటే వేరు ఎట్లా అవుతాయి? “నా బుద్ధి వేరు - నేను వేరు” - ఎట్లా అవుతాం? ఒక వస్తువు యొక్క ఒక వైపు రూపం అదే వస్తువు యొక్క మరొక వైపు రూపంచే నిర్మితమైనట్లు గానూ, ఆధారభూతం గానూ అనిపిస్తున్నంత మాత్రం చేత ఆ వస్తువునకు వచ్చే లోటేమిటి?
వాస్తవానికి నేను సర్వకాలములందును, సర్వత్రా వ్యాప్తమై, సర్వ కర్తనై, సర్వ స్వరూపమై వెలుగొందుచున్నాను. అద్వితీయ చైతన్య స్వరూపుడను, సర్వ విషయ స్వరూపుడను అగు నేనే, ఈ జగత్తుకు కారకుడను అగుచున్నాను.
ఇదంతా వాస్తవానికి నా సంకల్ప వికల్పములే. అయితే పరమార్థంగా చూస్తే, ఇక్కడ ఏదీ ఉత్పన్నమవ్వటం లేదు, నశించడం లేదు. …మరి, చిద్రూపుడనగు నాకు ఇక్కడగల సంకల్ప
Page:417
వికల్పములచే పనేమున్నది? బంధమేమున్నది? దేని వల్ల ఎక్కడ ఏది వృద్ధి? ఏది నాశనం? నేను ఒకప్పుడు అజ్ఞానమును ఆశ్రయించి ఉన్న సమయంలో కూడా, సర్వదా సర్వమునకు ఆవల రాజాధిరాజునై ఉండుట కొనసాగుచునే ఉన్నది. నా స్వస్వరూపమును నేను గ్రహిస్తున్నప్పుడు, నా గురించి పలుకుటకు ప్రయత్నిస్తున్న వేదాంత శాస్త్రం నన్ను ’జ్ఞాని’గా శ్లాఘించుచున్నది. అస్మదాత్మ స్వరూపాన్ని ఏమరచినప్పుడు నన్ను “అజ్ఞాని” …అని పిలుస్తోంది.
అజ్ఞానముల భేదము అంతవరకే! జ్ఞాన అజ్ఞానములు నాక్రీడలు; నాలీలలు; నాచమత్కారములు; అస్మత్ జగద్రచనాకళాకళలు మాత్రమే!
కథారచయిత కథారచనను, పాత్రల గుణ-ప్రవర్తనాదులను కల్పిస్తూ, కొనసాగిస్తూ ఉండగా,…. తత్సమయంలో తనను తాను పోగొట్టుకుంటున్నాడా? లేదే? అట్లాగే నేను అజ్ఞానిగా చరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆత్మస్వరూపుడనే!
అందుచేత ఇంతఃపూర్వపు అజ్ఞానమును చూచి ఇప్పుడు వేదన చెందవలసినది ఏదీ లేదు. నన్ను నేను ఆశ్రయించి, ప్రశాంత చిత్తుడనగుదునుగాక.
మహాప్రజ్ఞావంతుడగు ఆ బలిచక్రవర్తి ఆ విధంగా చింతన చేస్తూ, క్రమంగా ప్రశాంత చిత్తుడయ్యాడు. సర్వ సంకల్ప - కల్పనలను రహితం చేశాడు. అ-ఉ-మ అనబడు ఓంకారము యొక్క మూడు మాత్రలకు పరమై ఉన్నట్టి అర్ధమాత్రను భావించుచు మౌనం వహించాడు.
అ = సత్ (Existence); ఉ = చిత్ (Knowledge); మ = ఆనందము (Bliss); అర్ధమాత్ర
= విశుద్ధాత్మ స్వరూపము (లేక) తురీయాత్మకమగు బ్రహ్మము.
చేత్యము, చేతనము - ఈ రెండిటికీ అతీతుడైనాడు. అనగా, ధ్యానము చేయువాడు ధ్యానము - ధ్యేయ వస్తువు … ఈ మూడు విషయాలు లేని వాడైనాడు. నిర్మలుడై, వాసనలన్నీ వర్జించినవాడై, గాలివీచని చోట దీపంలాగా నిశ్చలత పొందాడు. శాంతచిత్తుడై, బ్రహ్మపదమును ఆశ్రయించాడు. ఒక శిలయందు చెక్కబడిన శిల్పములాగా చాలాకాలం స్థిరంగా ఉన్నాడు.
ఇక ఆతనియందు విషయదోషములు లేవు. “నిర్మల బ్రహ్మ భావప్రాప్తి” అను ‘సత్త’ కలిగి నిర్మలాకాశంలా శోభించాడు.
88
బలి చక్రవర్తి నిశ్చేష్టుడై, అఖండమగు ఆత్మయొక్క అనుభవమునందు నిమగ్నుడై ఉన్నాడు. సేవకులు ఆతనిని సేవించటానికి సమీపించి ఏమీ పాలు పోక, చూస్తూ నిలబడ్డారు. ఇంద్రుడు, సిద్దులు, తదితరులగు దేవతలు ఆతనిని సేవించటానికి సమీపించి, ఆతనిని ఆదరణతో చూడసాగారు. ఉదాసీనులు ఆశ్చర్యచకితులైనారు. తత్త్వజ్ఞులు “తత్వజ్ఞానం సంపాదించినందుకు ప్రయోజనం ఇదికదా!" అని ఆనందం పొందారు.
Page:418
అజ్ఞానులగు అనేకమంది రాక్షస ప్రజలు విషయమేమిటో తెలియక “ఇది శత్రువుల మంత్ర - తంత్ర ప్రమేయం కాదు కదా?” అని భయము - విస్మయము పొందసాగారు. అక్కడి మంత్రులంతా ఒక చోట గూడి “ఇప్పుడు మన కర్తవ్యమేమిటి? మన రాజును మనం దక్కించుకోవాలి. అందుకు మరి ఏమిటి ఉపాయం?” అని సమాలోచన చేశారు. మనం ఇప్పుడు ఉపాయం కోసం శుక్రాచార్యుల వారిని ఆశ్రయించవలసిందే!” అని నిర్ణయించుకున్నారు. వారంతా శుక్రాచార్యులవారికి గురుస్తోత్రం సమర్పించారు.
గురువగు శుక్రాచార్యులు దేదీప్యమానమైన దేహముతో వ్యక్తమై, అక్కడ ప్రత్యక్షమైనారు. సమాధిలో ఉన్న బలిచక్రవర్తిని చూచి సంతోషంగా తల పంకించారు. ఆర్తులై, తనను సమీపించే రాక్షస జననమును సంబోధిస్తూ ఇట్లు పలికారు.
శుక్రాచార్యులు : నాయనలారా! మన ఈ బలి చక్రవర్తి ఆత్మలో విశ్రమించి సంసార భ్రమరహితుడు అయినాడు. స్వయముగా విచారణ చేయుటచే సర్వమునకూ అధిష్ఠానమైన బ్రహ్మపదము ఈతనికి సంప్రాప్తించింది. ఉత్తమోత్తమమైన సిద్ధిని పొందాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే!
సరే! సమాహిత చిత్తుడగు ఈతనిని ఇట్లే ఆత్మ యందు సుస్థితుడై కొంతకాలం ఉండనివ్వండి. శాంతమగు ఆత్మధర్మపదమును వీక్షించనివ్వండి. ఎందుకంటే, ఇంతకాలంగా ఎన్నెన్నో విషయాలు ఆశ్రయించుటచే ఇతని మనస్సు ఎంతగానే అలసి పోయింది. ఇప్పుడితనియందు సంసార భ్రమలన్నీ తొలగిపోయాయి. అందుచేతనే ఇప్పటికి ఆత్మయందు విశ్రాంతి లభిస్తోంది. మీరు మాత్రం ఇతనిని పలుకరించ వద్దు. కాలక్రమముగా ఇతడు సమాధి నుండి స్వయంగానే జాగ్రత్తును పొందగలడు. అప్పటి వరకు మీరంతా మీమీ ధర్మములు నిర్వర్తిస్తూ రాచకార్యములు శ్రద్ధా భక్తులతో నెరవేరుస్తూ ఉండండి. మీ అందరికీ శుభమగుగాక!
శుక్రాచార్యులు ఇట్లు పలికి అంతర్థానమైనారు. దైత్యులు గురు ఆజ్ఞను శిరసావహించారు.
చాలా కాలమయినది. ఒక రోజు బలి చక్రవర్తి సమాధి నుంచి జాగృతి పొందినవాడై, కనులు తెరిచాడు. ఆతనికి, సపర్యలు చేస్తున్న సేవకులు ఈ విషయం మంత్రులకు, తదితర నగర ప్రముఖులకు తెలియజేయాలని బయలుదేరారు.
బలి చక్రవర్తి లేచి కూర్చున్నాడు. సంతృప్తి, ప్రశాంతతలతో కూడినవాడై, ఈ విధంగా ఆలోచనచేయసాగాడు.
బలి చక్రవర్తి (తనలో) :
అహోనురమ్యాపదవీ శీతలాపారమార్థికీ | |
అహమస్యాంక్షణం స్థిత్వా పరాంవిశ్రాన్తిమాగతః || (శ్లో 4, సర్గ 29)
Page:419
"ఆహా! ఈ ‘పరమార్థసంపద’ ఎంతటి రమణీయమైనది! క్షణకాలం ఇందు విశ్రమించిన మాత్రంచేత ఎంతటి విశ్రాంతి, ప్రశాంతతలను పొందాను.
ఈ సమాధి ముందు బాహ్యవిభవములైనట్టి ఈ రాజ్యాధిపత్యము, ధన, జన, నారీజనాది విభవములు ఎందుకు పనికొస్తాయి? వాస్తవానికి బాహ్యజగత్తులో శాంతి ఎక్కడ? సమాధి యొక్క పరిపాకముచే లభించే ఆనందం మరెక్కడా ఏ విధంగానూ లభించదనుటలో సందేహం లేదు. అయితే పాప కార్యక్రమముల పట్ల, విషయసముదాయముల పట్ల ధ్యాస, ఆశలు గల జనులు తమ అంతరంగమున సర్వదా ప్రసరించియున్న సమాధి యొక్క ఔన్నత్యమును గుర్తించలేకపోతున్నారు కదా! సమాధినిష్టులైన వారి సరమానందం గురించి తెలిసిఉండి ఉంటే, నా ఈ సహజనులలో అనేకులు బాహ్యజగత్తులలో ఇట్లా వృధా సంచారాలు చేసేవారా? శాంతి, సుఖముల కొరకై ఎక్కడెక్కడో బాహ్యంగా తచ్చాడేవారా? లేదు.
❖
దూరంగా జనులు హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీయటం గమనిస్తూనే, ఆతడు తన ఆలోనలు కొనసాగించసాగాడు.
"నేను ‘చిత్ ఎఱుక’ అనునదే రూపముగా కలవాడను కదా! చిద్రూపము (ఎఱుగుట అను తత్త్వము) నందు “ఇది ఇష్టము - ఇది అయిష్టము; ఇది నాది - - ఇది కాదు”– మొదలుగాగల వికల్పములు ఎక్కడ ఉంటాయి? కనుక ఇక్కడ నాకు గ్రహించవలసినదేది? త్యజించవలసినదేది?
కాని, ఎందుకో ఈ మనస్సు అనాది కాలం నుండి విషయము లందు ప్రవర్తించుచూ, వాటితో శీఘ్రంగా ఏకత్వం పొందుతోంది. వాస్తవానికి చైతన్యరూపుడనగు నేను దేనిచేత బంధింప బడగలను?… ఈ కనబడే పదార్థములచేతనా?… ఇవన్నీ నా సంకల్పమును అనుసరించే అనుభవ మగుచున్నాయి కదా! నాచే కల్పించబడిన కల్పనలు నన్ను బంధించటమేమిటి? చిత్ స్వభావుడనగు నన్ను బంధించునదేదీ ఎక్కడా ఉండటానికే వీలులేదు. కనుక నాకు బంధమనునదేలేదు. బంధమే లేనప్పుడు, ఇక మోక్షము యొక్క ప్రసంగమెక్కడిది?
"నాకు మోక్షము కలుగుగాక!” అనబడు సుప్రసిద్ధమగు లోక ప్రసిద్ధమగు వాక్యమునే తీసుకుందాం! మోక్షము శరీరమునకా? కాదు. అది జడమైనది. స్వతంత్రమైన యోచన, భావన లేని శరీరమునకు మోక్షమేమిటి?… పోనీ, మనస్సుకా? - అది కూడా జడమే. నాచే నిర్వర్తించ బడేదంతా నా మననము యొక్క రూపమే కదా! మనస్సు అంటే నా యొక్క మననము చేయు క్రియయే కదా! మననము స్వయంగా ఉన్నదికాదు. స్వతంత్ర పతిపత్తికాదు. అద్దానికి మోక్షమేమిటి? ఇక, నాకా? ‘ఎఱుగుచుండుట’ - - అనబడు చిద్రూపుడనగు నేను ఇతఃపూర్వం దేనిచేత బంధించబడ్డాను? బంధరహితుడనగు నేను ‘మోక్షము కావాలి’ అని దిక్కుల వెంట చూడటమేమిటి? మూఢత్వం కాదా? అన్నిటికీ సర్వదా వేటై (అప్రమేయుడనై) ఉన్నాను కదా! ఇక నాకు బంధమేమిటి? మోక్షమేమిటి?
Page:420
యథార్థానికి నాకు బంధముగాని, మోక్షముగాని లేవు… అమ్మయ్య! ఇప్పటికి నా అజ్ఞానం ఉపశమించింది. ఇక నాకు ’ధ్యానము’చే గాని, లేక ‘ధ్యానము చేయకపోవుట’ చేత గాని ప్రయోజనం ఏమున్నది? ‘ధ్యానాధ్యానములు’ అను రెండు భ్రమలను వదలివేసి, ‘స్వాత్మ’ రూపమునే ఉభయ సమయము లందు అవలోకిస్తూ ఉంటాను. ఇక ఏది వస్తుందో, రానీ…. పోతుందో, పోనీ…! ఈ వచ్చిపోవు వాటితో నా ఆత్మ స్వరూపమునకు ఏర్పడగల వృద్ధ - క్షయములు ఏమి ఉంటాయి? ఈ దృశ్యమంతా సర్వదా మమాత్మ స్వరూపమే కదా!
భోగములు గాని భోగముల యొక్క అభావము గాని నేనిప్పుడు కోరుకొనుట లేదు. దుఃఖ రహితమగు ‘కేవల-సమరూపము’ నందే స్థితి కలిగి ఉంటాను. ఇక ఈ జగత్తును పొందనవసరం లేదు. త్యజించవలసిన పని లేదు. అట్లే, "బ్రహ్మభావము అనబడు మరొక భావమును పొందాలి. ఈ జగద్భావమును వదలాలి”, “కర్మ, ప్రయోజనములు” మొదలుగా గల తతంగం కూడా నాకు అక్కర్లేదు.
అవన్నీ ‘అసత్యములు, భ్రమాత్మకములు’ … కదా! అసత్యములైనవాటి కొరకు ఇచ్ఛాపూర్వక మైన ‘త్యజించాలి’ అను ప్రయాస మాత్రం దేనికి? నేను మృతుడను కాదు. జీవితుడను కాదు. సత్తును కాదు. అసత్తును కాదు. ఈ దేహము గాని, ఈ రాజ్యాదులు గాని కాను. తదితర దేహములు, రాజ్యాదులు కాను.
మరి నేనెవరు? …మహత్తరమైన ’శుద్ధ చిదాత్మ’ యే నేను. అట్టి నాకు నా నమస్కారం. ఈ రాజ్యములు, ఈ శరీరము ఉంటే ఉండవచ్చు… లేకపోవచ్చు. నేను మాత్రం ఆత్మ యందు శాంతి రూపమున సుస్థితుడనై ఉన్నాను. ఉంటాను.
ఆత్మ కాక, తదితరములైన విషయములన్నీ ఉన్నా ఒక్కటే! లేకున్నా ఒక్కటే! నాకు సంబంధించిన వస్తువుగాని, విషయంగాని, ఎక్కడా ఏమాత్రం లేవు. కర్తృత్వముతోకూడిన కార్యమంటూ నాకు ఎక్కడా లేనే లేదు. ఈ ప్రాకృత వ్యవహారములైన ‘రాజ్యపాలన’ నాచే నిర్వర్తించబడినప్పటికీ, నా తత్త్వమునకు ఇబ్బంది ఏమీ ఉండజాలదు.
#
జ్ఞానులలో ఉత్తముడగు ఆ బలి చక్రవర్తి అట్లు నిర్ణయించుకొన్నాడు. పరిపూర్ణాత్మ స్వరూపుడు అయ్యాడు. ‘ఆత్మవేత్త’ అని ఆత్మజ్ఞులచే శ్లాఘించబడ్డాడు. తనను సమీపిస్తున్న దానవ జనులను సూర్యుడు ఉదయిస్తూ ఆయాలోకములను చూస్తున్నట్లు - చూడసాగాడు. వారి వారి నమస్కారములకు చిరునవ్వుతో ప్రతినమస్కారం చేసి, లేచాడు.
రాచకార్యములను, ’ధ్యేయవాసనాత్యాగము’తో కూడుకున్నవాడై యథావిధిగా నిర్వర్తించ సాగాడు. అర్ఘ్యపాద్యములతో దేవతలను, బ్రాహ్మణులను, గురువులను పూజించటం, అర్థించటానికి వచ్చినవారిని సత్కరించటం, ఎప్పటిలాగానే చేస్తూ ఉండేవాడు.
Le
Page:421
కొంతకాలం గడిచింది. ఒకానొక సమయంలో బలిచక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించాడు. ఎన్నో భూతకోట్లకు సంపదలు ఇచ్చి తృప్తిపరచాడు. శుక్రాచార్యులు మొదలగు పెద్దల శుభాశీస్సులు పొందాడు. అయితే, ఇంద్రుడు ఆ యజ్ఞమును చూచి, “ఈ బలి ఇంత గొప్పయజ్ఞం చేస్తున్నాడు. కొంపతీసి, ఆతడు ఇంద్రపదవికోసం ఇదంతా చేయటం లేదు కదా ఇతడు మహాబలోపేతుడైతే రాక్షసజాతి వారు అదిచూచుకొని మరింత లోకకంటకులౌతారు కదా!” అని భయం పొందాడు. తన జ్యేష్ఠ సోదరుడైన విష్ణు భగవానుని ఆశ్రయించాడు. అయితే బలి, ఈ భౌతికమైన స్వర్గాదుల కోసం యజ్ఞం చేస్తున్నాడా? …లేదు. జ్ఞాని అయి, స్వధర్మముననుసరించి చేస్తున్నాడు.
ఇంద్రుని కోరికను అనుసరించి, బలి చక్రవర్తిని నిరోధించే నిమిత్తం విష్ణుమూర్తి వామనావతారుడై యజ్ఞశాలను సమీపించాడు. కార్యచతురుడగు వామనుడు “అయ్యా! నాకు మూడు అడుగుల నేల ఇప్పించండి. అంతే చాలు” అని అర్థించాడు. గురువగు శుక్రాచార్యులు హెచ్చరికను కూడా పాటించ కుండా, అంతా తెలిసి కూడా, బలిచక్రవర్తి మూడు అడుగుల నేల ధారపోశాడు. “అపరిమితము, శాశ్వతము అగు చైతన్యము ముందు పరిమిత వస్తువులగు ఈ రాజ్యాదులు ఎంతటివి?” - - అని ఎఱిగి ఉండుట చేతనే ఆ విధంగా దానం చేసివేశాడు. ఇక విష్ణుభగవానుడు మాయాజాలం చేత త్రివిక్రమాకారుడై తన పాదములచే త్రిలోకములను ఆక్రమించి ‘మూడవ అడుగు’ బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి, ఆతనిని పాతాళలోకమునకు పంపి, అచ్చట పరిమితునిగా చేసి, తానే బలిచక్రవర్తికి రక్షకభటుత్వం వహించాడు.
శ్రీవసిష్ట మహర్షి : ఓ రామచంద్రా! ఇప్పటికి కూడా బలిచక్రవర్తి పాతాళలోక రాజై ఉన్నాడు. జీవన్ముక్తుడగు ఆతడు స్వస్థచిత్తుడై, నిరంతర పరమాత్మ ధ్యాన పరాయణుడై వెలుగొందుచున్నాడు. ఈ ప్రపంచముపట్ల ఇందు అనుదినం తారసపడే ప్రియా ప్రియ సంఘటనల పట్ల ఉదాసీనుడై, “నేను సర్వదా అఖండమగు ఆత్మ తత్త్వమునే కదా!” అను ఎఱుకను ఆశ్రయించి చరిస్తున్నాడు. ప్రారబ్ధ వశంచేత తనకు కాలానుగుణంగా ప్రాప్తించబోయే ఇంద్రత్వమునకై వేచియున్నాడు. సంపద అయినా, ఆపద అయినా రావచ్చు. పోవచ్చు. ఆతని సమత్వము విఘ్నము పొందుట లేదు. చిత్ర పటంలో కనిపించే భయంకరమైన దావాగ్నికి ఉష్ణత్వం ఉంటుందా? బలియొక్క బుద్ధికూడా సుఖ దుఃఖ సమయములందు చంచలము పొందుటలేదు. ఈ భోగములు, ఈ అనేక విభవములు -ఇవన్నీ ఆత్మ స్వరూపుడనగు నా సమక్షంలో జరిగే వినోదములే కదా! - - అని భావనచేస్తున్నాడు. ఆతని మనస్సు వైరాగ్య ప్రభావంచే శాంతిని పొందింది. సుఖ దుఃఖములు, భావ, అభావములు - ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో అట్లాగే పోతున్నాయని గ్రహించాడు. వాటియందు ఉపశాంతి ఉండ జాలదని గమనించి, వాటికి “అతీతత్వము” ఆశ్రయించాడు. అతడిప్పుడు రసాతలంలో, పాతాళ లోకంలో, పూర్ణచిత్తుడై, నిరంతర ఆత్మారాముడై విహరిస్తున్నాడు.
త్వరలో ఆ బలి చక్రవర్తి ఇంద్ర పదవిని పొంది, ముల్లోకములను పాలించుచు ఈ బ్రహ్మాండమున చిరకాలం వసించగలడు.
Page:422
అయితే అట్టి పదవి ప్రాప్తించినప్పుడు మోదముగాని, అది తొలగుటచే భేదముగాని పొందడు. సర్వ స్థితి గతులందు సమరూపము కలిగి సదా సంతుష్ట చిత్తుడై ఉంటున్నాడు…. ఉండగలడు. ప్రారబ్ధానుసారం ఏది ప్రాప్తిస్తే అది పొందుచూ స్వస్థచిత్తుడై, ఆకాశమువలె నిర్మలుడై విరాజిల్లు చున్నాడు. ఆ విధంగా ఆతడు పారబ్ధమును జయించివేసి, ప్రజ్ఞచే కేవలసాక్షి అయిచెన్నొందుచున్నాడు
సుమా!
శ్రీవసిష్ట మహర్షి : ఓ రాఘవా! బలిచక్రవర్తి ఏ మార్గంలో జ్ఞాని అయ్యాడో వివరించాను. నీవు కూడా అట్టి దృష్టిని అవలంబించి జీవన్ముక్తుడవగుము. “నేను నిత్యాత్మస్వరూపుడనే!” అని నిశ్చయించి, స్వపౌరుష వశం చేత అద్వైత పదమును ఆశ్రయించు.
ఓ జనులారా! తుచ్ఛమగు వస్తు సముదాయములపట్ల దృష్టినంతా నిలిపి, తృప్తికై వృథాగా వెతకకండి. బలిచక్రవర్తి అన్ని వేలాది సంవత్సరాలు సువిశాల రాజ్యాదులను అనుభవించి, తృప్తిని పొందనే లేదు. చివరికి వైరాగ్యమునే ఆశ్రయించాడు. ఇక్కడ భోగములుగా కనిపించుచున్నవన్నీ కాలక్రమేణా దుఃఖ కారకములుగానే పరిణమిస్తున్నాయి. భోగ సమూహమునంతా బుద్ధిచే త్యజించి, నిత్య-సత్య-సచ్చిదానంద-దుఃఖరహితము అయిన ఉత్తమపదమేదో అదే లక్ష్యముగా కలిగి ఉండండి.
ఈ దృశ్య పదార్థములు వివేచనాదృష్టిలేని వారికి అనేక వికారములు కలుగ జేస్తున్నాయి. “దూరపు కొండలు నునుపు”…. అన్నట్లుగా, వీటి యందు అవాస్తవం పేరుకుని ఉన్నదని గమనించండి. నిష్ప్రయోజనంగా నిష్కారణంగా ప్రాపంచిక వృత్తుల వెంట పరుగులు తీసే ఈ మనస్సును హృదయ కుహరంలో వేంచేసి - బాహ్యఅభ్యంతరములను ఆక్రమించి సర్వమునకు సాక్షి అయి వెలుగొందే ఆత్మవైపుగా ప్రయాణింపజేయటమే ఉచితం.
నాయనా! నీవు ఎట్టి వాడవో ఎఱుగుము. సర్వమును ప్రకాశింపజేయు “చిదాదిత్యుడవు” అయి, ఈ ప్రపంచమంతటా నీవే వ్యాపించియున్నావు. మరి నీకు శత్రువు ఎవరు? మిత్రుడెవడు? ఈ దృశ్యములోని ఏవో కొన్ని సంఘటనలనుచూచి, అంతమాత్రం చేత వ్యర్థంగా ఆత్మపదము నుండి ఎందుకు చ్యుతి పొందటం? ఓ మహాబాహో! నీవు వాస్తవానికి అనంతుడవు. ఆది పురుషుడవు. పురుషోత్తముడవు. చిన్మాత్ర శరీరుడవు. అట్టి నీవు స్వమాయచే ఈ వివిధ పదార్థముల రూపమును ధరించి, విజృంభిస్తున్నావు.
త్వయిసర్వమిదంప్రోత్రం జగతావరజఙ్గమమ్ |
బోధేనిత్యోది తేశుద్ధే సూత్రేమణిగణా యథా || (శ్లో 47, సర్గ 29)
“నిత్య బోధ స్వరూపుడవు, శుద్ధుడవు” అగు నీ యందు - దారము నందు మణుల వలే స్థావరజంగమాత్మకమగు ఈ ప్రపంచమంతా గ్రుచ్చబడియున్నది.
Page:423
నీవు జన్మించుట లేదు. మరణించుట లేదు. జనన మరణ భ్రాంతి ఎందుకు చెప్పు? శ్రీరాముడు : హేమహర్షీ! జీవునికి ఈ జనన మరణాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : తృష్ణ వృద్ధి చెందుటచేతనే “జన్మాదులు” అనే భవరోగం ప్రబలుతోంది. తృష్ణ సన్నగిలితే అవి కూడా సన్నగిలుతాయి. “తృష్ణ - తృష్ణా రాహిత్యము" … ఈ రెండిటిలో ఏది ఉచితమో, ఏది అనుచితమో నీవే పరీక్షించుకో. భోగములపట్ల తృష్ణను విడనాడు. కేవలం సాక్షీ మాత్రుడవై ఉండు. జగదీశ్వరుడవు - - చిదాదిత్యుడవు అగు నీ ఉనికిచేతనే, నీవు స్వీకరించుటచేతనే, స్వప్నతుల్యమైనట్టి ఈ జగద్విలాసమంతా ప్రతిభాసిస్తోంది.
ఓ సర్వజనులారా! మీరంతా వ్యర్థంగా శోకించకండి. యథార్థానికి ’సుఖ దుఃఖములు’ అనునవేవీ మీకు లేవు. మీరంతా స్వతఃగా పరిశుద్ధ చిత్తులే అయి ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు “సర్వాత్మ స్వరూపులు, సర్వవస్తు ప్రకాశకులు” అయి ఉన్నారని మరువవద్దు.
బంధము నుండి విడివడుటకై ఇప్పటికిప్పుడే ప్రయత్నశీలురు కండి. దీపమున్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి కదా! ఒక చమత్కారమైన విషయం గమనిస్తున్నారా? ఈ మనస్సుకు మొదట ప్రియంగా తోస్తున్న విషయములు, పదార్థములు చివరకు చూస్తే దుఃఖదాయకములుగానే క్రమ క్రమంగా పరిణమిస్తున్నాయి. మొట్టమొదట కొంత అప్రియంగాను, కష్టంగానూ అనిపించే తపస్సు ఇంద్రియ సంయమము మొ॥నవి జీవునకు కాలక్రమేణా అత్యంతికమైన సుఖం ప్రసాదిస్తున్నాయి.
అందుచేత రామా! సప్త భూమికలలో ఉన్నంతవరకు అభ్యాసం వదలవద్దు. ఆపై అభ్యాసమునకు
సంబంధించి కల్పన కూడా పరిత్యజించు.
శ్రీరాముడు : స్వామి! శాశ్వతమైన సమత్వము లభించేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : “ఇష్ట, అయిష్టములు” అనే కల్పన త్యజించుటచేతనే శాశ్వతమైన సమత్వం లభిస్తోంది. అట్టి సమత్వం హృదయంలో సుస్థిరపడితే జీవుడు మరల ఈ సంసారము నందు జన్మించడు. ఒక అల్లరి పిల్లవాడిలాగా ఈ మనస్సు తన ఇచ్ఛ వచ్చిన పదార్థము లందు సంలగ్నమౌతోంది. దానిని వాటి నుండి తొలగించి అధిష్ఠానమగు చిన్మాత్రమునందే నెలకొల్పాలి. అభ్యాసం చేత, ’సర్వాత్మ భావన" అను అంకుశంతో ఈ మనస్సు అనే మదపుటేనుగును నిగ్రహించాలి. అప్పుడు మోక్షము అనబడేది దానంతట అదే ముంగిటకు వచ్చి వాలుతుంది.
ఈ జీవులలో అనేకులు “ఈ దేహము నిత్యము” అని నమ్ముకొని ఉంటున్నారు. మిథ్యా దృష్టిచే కలుషితమైన ‘చిత్తము’ కలిగి ఉంటున్నారు. భోగసంకల్పములకు వశీభూతులగుచున్నారు. మూర్ఖత్వం, అవివేకములను ఆశ్రయించటం కంటే దుఃఖప్రదమైన విషయం ఇంకెక్కడా ఏదీ ఉండదు. వారంతా వివేకులు కావాలనే మా శుభాకాంక్ష.
ఆత్మతత్త్వనిర్ణయం విషయంలో వివేక, వైరాగ్యాలు చాలా ముఖ్యం. హృదయాకాశంలో ఉదయించే ‘అవివేకము’ అను మేఘమును “విచారణతో కూడిన వివేకము” అనే వాయువు యొక్క
Page:424
వేగంతో తొలగించి వేయాలి. స్వయంగా ప్రయత్నించాలి. సచ్ఛాస్త్రములు పరిశీలించటం, ఆత్మజ్ఞులు చెప్పే ఉపదేశాదులు వినటం నిర్వర్తించాలి. లేకపోతే ఆత్మవిచారణ ఎట్లా ఉదయిస్తుంది చెప్పు? ఊరకే తర్కిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? గురూపదేశముల ద్వారా అంతర్ముఖ దృష్టిచే స్వయంగా ఆత్మను అవలోకించాలి. లేకుంటే ఆత్మ వ్యక్తం కాదు.
ఓ రామా! నీవు గురూపదేశాలచే ఆత్మ స్థితిని పొందినవాడవయ్యావు. నీకు విస్తృతమైనట్టి ఆత్మ బోధ ప్రాప్తించుచున్నది. “వికల్పములంటూ లేనట్టి చిన్మాత్రయే (లేక పరమాత్మయే) దేశ కాలములన్నిటా వ్యాపించి యున్నది” - అను విజ్ఞానమును సుస్థిర పరచుకో. సర్వసంకల్పములకు అతీతుడవై, సంశయవిభ్రమములన్నీ పాముకుబుసంలాగా విసర్జించివేయి. బాహ్యప్రపంచ కౌతుకములను దరిజేరనీయ వద్దు. దుఃఖం నశించాలంటే అధిరోహణముయొక్క క్రమం చెబుతాను,
విను1. జ్ఞానము కొరకై సిద్ధపడటం.
అందుకు సాధనభూతమైన “విచారణ (Enquiry)”ను చేకూర్చుకోవటం.
విచారణచే జనిస్తున్న అవగాహనలను వివేక వైరాగ్యములచే కాపాడుకోవటం. 4. ప్రమాదము, ఆలస్యము . ఈ రెండింటిని దగ్గరకు రానీయకపోవటం.
’సమాధి సుఖము’ అను అమృతమును పానం చేయటం.
ఉత్తరోత్తర భూమికలను అధిరోహించటం.
ఏడవ భూమికయందు విశ్రాంతి, సుఖాభివృద్ధి.
ఎప్పటి వరకైతే ‘ఆత్మ దోషముతో కూడినది’ అని నీకు అనిపిస్తోందో - - అప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే! ఆవరణములు తొలగగానే సర్వ కళంకములు తొలగిపోతాయి. నీ యొక్క ‘శుద్ధ బ్రహ్మైక్యము’ ప్రకటితమౌతుంది. అప్పుడు అన్నీ తొలగి, ‘కేవల బ్రహ్మానంద స్వరూపుడవు’ అయి ఉంటావు.