CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:425

V. ప్రహ్లాద - నారాయణ సంవాదం

  1. హిరణ్యకశిప సంహారం

శ్రీ వసిష్ఠ మహర్షి : రఘురామా! దానవేశ్వరుడు, హరిభక్తులలో శ్రేష్ఠుడూ అయిన ప్రహ్లాదుడు ఒకప్పుడు విచారణ చేసిన విధమేమిటో చెబుతాను. ఈ విచారణ పరిశీలించుటచేత సర్వోత్తమమైన జ్ఞానం లభించగలదని అనుభవజ్ఞులగు మహనీయుల అభిప్రాయం.

పాతాళలోకంలో ‘హిరణ్యకశిపుడు’ అనే పేరు గల ఒక దైత్యుడు ఉండేవాడు. ఆతని ముందు సురలు గాని, అసురులు గాని యుద్ధంలో నిలబడలేకపోయేవారు. ఆతడు నారాయణుడంతటి యుద్ధ నైపుణ్యం కలవాడని లోకప్రసిద్ధి. తన బలపరాక్రమములతో ఇంద్రుని జయించి, ఆతని వద్ద ముల్లోకముల ఐశ్వర్యములను లాగివేసికొని అనుభవిస్తూ ఉండేవాడు.

హిరణ్యకశిపుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు శ్రీహరిని శరణువేడారు. “సరే! సరి అయిన సమయం రానీయండి” అని చెప్పి వారికి ఆయన అభయమిచ్చి పంపారు. కొంతకాలానికి హిరణ్యకశిపునకు “ప్రహ్లాదుడు” అనే కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు శ్రీమన్నారాయణుని పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉండేవాడు. హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడు వరగర్వంతో క్రిందా మీదా చూడకుండా “హరిభక్తి” కలిగి ఉన్న ప్రహ్లాదుని అనేక రకాలుగా హింసించాడు. ఆశ్రితవత్సలుడగు హరి తనను దూషించినా, ఏమనడు గాని…. తన భక్తుని బాధిస్తే ఊరుకుంటాడా?

ఒకరోజు ప్రహ్లాదుని పిలిచి హిరణ్యకశిపుడు, “ఏమిరా, అబ్బాయీ! నీవు చెప్పే హరి ఎక్కడ ఉన్నాడురా? నాకు భయపడి ఎప్పుడో పారిపోయాడు. ఇప్పటికిప్పుడు నీ హరిని చూపించు… ఎక్కడున్నాడో! లేదా, హరిభక్తి మరచిపో. ఈ రెండూ కాదంటావా, ఈ రోజు ఈ గదాదండంతో నిన్ను సంహరిస్తాను… అప్పుడు ఏ హరి వచ్చి అడ్డుకుంటాడో చూస్తాను" అని హూంకరిస్తూ పలికాడు. అప్పుడు అనన్యమైన భక్తి గల ప్రహ్లాదుడు “నాన్నా! హరి సర్వాంతర్యామి. అతడు లేని చోటే లేదు. నీవు కోరుకోవాలే గాని, ఆయన నీకు అంతటా దర్శనమిస్తాడు. నీ అంతః శత్రువులైన కామ-క్రోధ-లోభ-మోహ మద మాత్సర్యాలను జయించి, నిర్మల హృదయంతో ఒక్కసారి ఈ సర్వమును పరిశీలించు. అంతా నీకే స్పష్టమౌతుంది” అని వినమ్రతతో పలికాడు.

అంతే… హిరణ్యకశిపునకు భలే కోపం వచ్చింది. “ఓరీ దుష్టుడా! అంతటా వ్యాపించి ఉన్నాడని పిచ్చిపిచ్చి మాటలు పలుకుతున్నావు, అయితే నీ హరిని ఈ స్తంభంలో చూపించగలవా….?” అని పలికాడు. అప్పుడు ప్రహ్లాదుడు “ఓ! తప్పకుండా! సర్వమునకు అంతర్యామి, శాశ్వతమైన ఆధారము అయిన నారాయణుడు ఈ స్తంభములో మాత్రం ఎందుకు ఉండడు?” అని చేతులు

Page:426

జోడించి నమస్కరించాడు. హిరణ్యకశిపుడు తనలో, “ఈ రోజు ఈ సంగతేదో తేల్చుకోవాలి….” అని అనుకున్నాడు. గద చేతపట్టుకుని వీరావేశంతో ఆ ప్రక్కనే ఉన్న స్తంభమును గదతో మోదాడు. “పెటపెటా” ధ్వనులతో స్తంభం చీలిపోయింది. చిత్రమైన “సింహం తల - - మానవుని మొండెం” రూపంలో భయంకర శబ్దాలు చేస్తూ ఒక ఆకారం బయల్వెడలింది. కొద్దిక్షణాల్లోనే ఆ రాక్షసుడిని అదుపులోనికి తీసుకొని పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో, ఇంట్లో బయట, లోపల కానట్టి గుమ్మం మీద, ‘ఆయుధములు’ అని చెప్పబడనట్టి తన గోళ్ళతో ఆ హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపివేసింది.

దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అగు ఆ శ్రీహరి ఆ విధంగా లోకకంటకుడగు హిరణ్యకశిపుని, అతని పరివారాన్ని దునుమాడి భక్తుడగు ప్రహ్లాదునికి, దేవతలకు, ఎల్లలోకములకు అభయమిచ్చి లక్ష్మీ సమేతుడై అంతర్థానమైనాడు. భక్తులకు లక్ష్మీ నరసింహ స్వరూపమును ఉపాసనకై ప్రసాదించి, తన ఆశ్రిత వాత్సల్యాన్ని లోకమునకు చాటాడు.

క్రమంగా అంతా సద్దుమణిగింది. ప్రహ్లాదుడు అంతఃపురం జేరాడు. ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడై తండ్రి స్థానములో రాజ్యం ఏల వలసియున్నది. నరసింహస్వామి కొద్ది గంటలలో సృష్టించిన కల్లోలాల గురించి యోచిస్తూ, ఆ రోజు రాత్రి ప్రహ్లాదుడు ఏకాంతంగా తనలో ఈ విధంగా చింతించసాగాడు.

  1. నారాయణీకరణం

ప్రహ్లాదుడు (తనలో) : ఆహా! ఈ మా కుటుంబ సభ్యులగు రాక్షసులలో కొందరు కొందరు “మేం గొప్పవాళ్ళం! గొప్ప సంపదలు గలవాళ్ళం! మమ్ములను ఎవరేం చేస్తారు?” అని ఎప్పుడూ విఱ్ఱవీగుతూ సంచరించేవారు. వాళ్ళందరినీ శ్రీమన్నారాయణుడు కొద్ది నిమిషాల సమయంలో నల్లులను నలిపినట్లు సంహరించివేశాడే! ‘మేం గొప్ప పరాక్రమాలు కలవాళ్ళం!’ అనుకున్నవాళ్ళు చివరకు, ఆ సామర్థ్యంతో ఏం స్థిరత్వం పొందారు? అందరూ కూడా చంచల సముద్రంలో తరంగాలులాగా కొంతకాలం క్రితం ఈ భౌతిక ప్రపంచంలో ఉద్భవించి, మాన-మద-గర్వాలతో నినాదాలు చేస్తూ, ఆయా శరీరాలతో కొద్దికాలం ఈ భూమిపై సంచరించి, చివరకు ఆ శరీరాలను ఇక్కడే వదలి ఎటో వెళ్ళి పోయేవారే కదా! ఆ రాజ్య సంపదలు, దేవతల పట్ల ఉపయోగించే దూషణ శబ్దజాలాలు ఇప్పుడే మైనాయి? ఎందుకు పనికివచ్చాయి? హరి నృశింహరూపుడై వచ్చి క్షణాలలో అనేకమంది రాక్షసవీరుల మాన-మద-గర్వాలు హరించివేశారే! అంతా హరించుకుపోగా, వారికి ఈ లోకంలో ఏమైనా

మిగిలిందా?

ఇదంతా పరిశీలిస్తుంటే ఇవి ఎంత కష్టతరమైన విషయాలు! "మమ్మల్ని చూచి దేవతలే పారిపోతున్నారు, చూచారా!” … అని గర్విస్తూ చేసియున్న సంచారం ఈ రోజు రాక్షసజాతికి ఏం

Page:427

సుఖం తెచ్చిపెట్టింది? ఈ సంపదలు అల్పమైన మిత్రులు కాబట్టే ఇవి మమ్ములను దుఃఖపూరితులుగా చేసివేస్తున్నాయి. దేవతలచేత ఊడిగం చేయించుకున్నట్టి ఉద్యమపరులగు రాక్షస వీరుల ఇళ్ళు ఇప్పుడు దైన్య - నిరుత్సాహాలతో పొగచూరుచున్నాయి. మొన్నమొన్నటి వరకూ దేవతలు నా తండ్రికి భయపడి దీనులై ఉండేవారు. ఇప్పుడో - నా బంధువులు ఆ దైన్యత్వాన్ని తాము అనుభవిస్తున్నారు. విధిగతిని ప్రవచించటం ఎవరి తరం! నిన్నటిదాకా మా నగరం వనములతో, భవనములతో ఈ సృష్టికే ప్రత్యేకమైన ఆభరణములాగా వెలుగొందేది. ఇప్పుడేమైనది? ఆ నరసింహస్వామి వచ్చి రెండు గడియల కాలంలో తన తాండవంతో అంతా నేలమట్టం చేశాడు. పేరు పేరునా బయటకు పిలిచి అనేకమంది రాక్షస వీరులను మట్టుపెట్టాడు.

ఏ వింజామరములైతే మా తండ్రి సేవలో నిరంతరం పరిశ్రమిస్తూ ఉండేవో - అవన్నీ ఇప్పుడు ఆ ఇంద్రుని సేవించటానికి వెళ్ళాయి. ఆ నారాయణుని శరణు వేడినందుకు దేవతల కష్టాలు కడతేరి, వారు సంతోషముగా ఉంటున్నారు. ‘విపత్తు’ అనే సముద్రంలో మునిగిపోతున్న దేవతలను విష్ణు భగవానుడు రక్షించాడు. అన్నిటికీ ఆయనే సమర్థుడు. ఆయన అండచూచుకొనే… ఈ రోజు దేవతలది పైచేయి అయి, వారు దైత్యులను వేధింప గలుగుతున్నారు. బాణాలు, కండబలం, లౌకికమైన తెలివితేటలు ఉపయోగించి నరసింహరూపుడగు విష్ణుదేవుని ఎవరు వశం చేసుకోగలరు?

ఈ లోకములోని శరణార్థులందరికీ శరణు వేడుటకు అత్యంత శ్రేయోదాయకమైన స్థానమే శ్రీమన్నారాయణుడు. అందుచేత సర్వభావములచేతను, సర్వప్రయత్నములచేతను ఆ హరిని శరణు వేడటమే ఉపాయం. జీవులందరికీ ఆతడేగదా, గతి! ఆ విష్ణువును వశపరచుకోవాలంటే ఆయనను ప్రేమించాలి. అల్పమైనవాటిని ప్రేమించి అల్పమైన గతిని నేను ఎందుకు పొందాలి?

సృష్టి - - స్థితి - - లయములకు కారణభూతుడగు ఓ పరమేశ్వరా! నారాయణమూర్తీ! సర్వమునకూ మూలకారణము, అచింత్యము అగు నీ మహిమకు నమస్కారం!

అస్మాన్నిమేషాత్ ఆరభ్య నారాయణమజం సదా |

సంప్రపన్నోస్మి సర్వత్ర నారాయణమయోస్మ్యహమ్ ॥

‘జన్మ’ అనబడునదేదీ లేనివాడా! జన్మకర్మలకు ఆవల ఉన్నవాడా! హే నారాయణా! ఈ

క్షణం నుండి నిన్ను మాత్రమే శరణు వేడుచున్నానయ్యా! ఈ సర్వ దేశ - కాల - వస్తువులందు

అంతటా నేను నారాయణమయముగా గాంచుచున్నాను.

ఓం నమోనారాయణాయేతి మంత్రః సర్వార్థ సాధకః |

నా పైతి మమ హృత్కోశాత్ ఆకాశాదివ మారుతః ॥

ఆకాశము నుండి వాయువు తొలగి, మరింకెక్కడికైనా వెళ్ళి పోగలుగుతుందా? లేదు. అట్లాగే “ఓం నమోనారాయణాయ" అనే మంత్రం ఏమాత్రం నా హృదయకోశము నుండి తొలగకుండుగాక! సర్వార్థ సాధకమై సర్వదా వెలుగొందుగాక!

Page:428

తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం … ఇంకా తదితర దిక్కులన్నీ కూడా విష్ణు స్వరూపములే. ఆకాశము కూడా విష్ణు స్వరూపమే. ఈ జగత్ అంతా విష్ణు స్వరూపమే అయినప్పుడు, ఇక నేనో! అప్రమేయుడగు ఆ విష్ణువునే కదా! అహో! ఇప్పుడు నేను విష్ణుమయుడను అయ్యాను. “నేను విష్ణు రూపుడనే“ అను ఐక్యము పొందకుండా, ”విష్ణువునకు వేరైనదేదీ ఎక్కడా ఉండజాలదు…” అను అవగాహన కలిగి ఉండకుండా విష్ణుపూజ చేస్తే స్వల్పప్రయోజనమే - అని నాకు అనిపిస్తోంది. హరిః ప్రహ్లాదనామాయో మత్తో నా న్యోహరిః పృథక్ I

ఇతి నిశ్చయవానన్తర్వ్యాపకో_హంచ సర్వతః ॥

విష్ణువే ప్రతిఒక్కని రూపంగా ప్రదర్శితమౌతున్నాడు. నేను విష్ణురూపుడనే. నా రూపం మరొకటేదో అయి ఉండదు. ఉండజాలదు. అట్లాగే సర్వ జీవులు కూడా! ఆ విష్ణువే ఈ ఈ ఉపాధిలో ’ప్రహ్లాదుడు’ అను పేరు కలిగి ఉంటున్నాడు!

మరొక ఉపాధిలో మరొక పేరు! విష్ణువుకు వేరుగా ఎక్కడ ఏమి ఉన్నది? …అందుచేత నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. నేనే విష్ణువును. నేనే ఈ సర్వరూపాలలో సర్వదా వ్యాపకుడనై ఉన్నాను. ఈ అనంత ఆకాశమును తన రెక్కలతో నింపి వేయగల గరుడుడు నాకు వాహనమె ఉన్నాడు. పక్షులు చెట్ల కొమ్మలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయే…! ఆ విధంగా చక్రము, శంఖము, గద, అస్త్రములు మొదలైనవన్నీ ఈ నా చేతులలో అరూపంగా, ప్రేమాస్పదంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నాయి.

నా ఈ చేతిగోళ్ళు మణి మాణిక్యాల వలె కాంతులు వెదజల్లుచున్నాయి. క్షీరసాగరం మథిస్తు న్నప్పుడు, ఆ ఒరిపిడికి నొప్పి పొందినది ఈ నడుమే. ఆ విష్ణువు కీర్తి అనేక శోభలతో, అనేకమంది మూర్తుల రూపమున నాకు కనిపిస్తోంది. అహో! విష్ణుమాయయే క్రొత్త జగత్ సమూహములను ఎప్పటికప్పుడు ప్రకటించుచూ “ఒక గొప్ప ఇంద్రజాలంలోని విలాసం” లాగా నాకు ఎదురవుతున్నది.

అనేక నామ రూపాలతో జయ జయ నినాదాలు ఈ జనులు పలికేది ఆ ఏకోనారాయణునే కదా!

విష్ణు స్వరూపుడనగు నా ముఖమునందు ఈ సూర్యచంద్రులు రెండు కళ్ళలాగా వెలుగొందు చున్నారు. నా నీలమేఘ శరీరమే అంతటా అన్నివేళలా అఖండమై వెలుగొందుచున్నది. ధవళ ఛాయలతో శబ్దరూపమై ఆకాశమువలె మూర్తీభవించు ‘పాంచజన్యము’ అనే శంఖము ఈ నా కుడిచేతిని అలంకరించి ఉంటోంది. బ్రహ్మదేవునికి జన్మస్థానమైయున్న కమలము నా నాభి యందు జన్మించి నా చేతిని అలంకరించి ఉంటోంది. దేవ దానవులను కూడా మర్దించగల గద, దిక్కులను రక్తవర్ణముతో నింపివేయగల సువర్ణచక్రం నన్ను అంటిపెట్టుకొని ఉంటున్నాయి. చెడును ఖండించి, దేవతలకు, భక్తులకు ఆనందాన్ని ఇచ్చే ఖడ్గమిదే. ధనుష్టంకారాలతో దుర్మార్గుల గుండెలు ‘దడేలు’ మనిపించగల శారఙ్గము అను పేరుగల ధనుస్సు నా హస్తమును అలంకరించియున్నది.

అసంఖ్యాకములగు ఈ బ్రహ్మాండములన్నిటినీ నా యందు అనంతకాలంగా ధరించి ఉంటున్నాను. ఈ భూమి నా రెండు పాదములు. ఆకాశం నా శిరస్సు. ఈ ’స్వర్గ-భూ-పాతాళములు’

Page:429

అనబడే మూడు లోకములు నా భౌతిక శరీరం. దిక్కులు నా పొట్ట. గరుడుని మూపును అధిరోహించి నేను వస్తుంటే లోకకంటకులు, అధర్మ నిరతులు అయిన దుష్టజీవులు వెనక్కు తిరిగి పారిపోతున్నారు. ఆ నీలవర్ణుడు, పీతాంబరధారి, గదాధరి, లక్ష్మీసమేతుడు అచ్యుతుడు అయిన మహావిష్ణువును నేనే అయి ఉన్నాను. సంకల్ప మాత్రం చేత ఈ ముల్లోకములను క్షణంలో దహించివేయగలను కదా! ఇక నన్ను ఎదుర్కొనగలవారు ఎవరు? కాలాగ్నిలో ప్రవేశించే మిడతలాగా నన్ను ఎదుర్కొనువాడు స్వవినాశనము గావించుకొనుచున్నాడు. మంద దృష్టి కలవారు వెలుతురును సహించలేనట్లు దేవతలు, రాక్షసులు నా తేజోమయ రూపమును చూచి సహించలేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, రుద్రుడు మొదలగు మహనీయులంతా వేనోళ్ళ ఎల్లప్పుడూ పొగడుచున్నది నన్నే! నేను పరమైశ్వర్యయుక్తుడను.

సర్వ ద్వంద్వములకు అతీతుడను. సర్వోత్తమమైన మహిమతో కూడుకున్న వాడను. సముద్రంలో సుడిగుండం ఉన్నట్లు, ఈ మూడులోకములు నాయందే ఉన్నాయి.

ఒక వైపు నుండి దుష్టులగువారిని బలాత్కారంగా వినాశనమొనర్చటం, మరొక వైపుగా మేఘాలకు, పర్వతాలకు, సర్వ జీవులకు నివాసస్థానమై ఉండటం - ఈ రెండూ నా కార్యక్రమములే!

సర్వ సృష్టులు తన యందు ధరిస్తున్న నా విశ్వ - విశ్వంభర - విశ్వాంతరాళ విశ్వాంతర్గత విశ్వరహిత రూపం క్షణకాలం సాక్షాత్కరించినంతమాత్రం చేత ఈ జీవుల సర్వ దుఃఖములు తొలగిపోతాయి! అట్టి విష్ణుస్వరూపుడనగు నాకు నేను సాష్టాంగ దండ ప్రణామములు చేస్తున్నాను.

  1. విష్ణు స్తవనం

ఆ విధంగా ప్రహ్లాదుడు తన తనువును, మనస్సును విష్ణుమయంగా చేస్తూ, ఇంతలోనే “నేను ఇప్పుడు అట్టి మహిమాన్వితుడగు మహావిష్ణువును పూజించి సంతసింపజేస్తాను”… అని తలచాడు. ప్రహ్లాదుడు : శంఖ చక్ర గదాధారివగు ఓ మహాప్రభో! విష్ణుమూర్తీ! నా పూజ యొక్క అనుకూలత కొరకు కల్పించుకున్న ఈ రూప నామములు ఒక వ్యష్టి కాదు! సమష్టి కూడా కాదు. మరి ఇంకెవరు? నా వాస్తవస్వరూపమే! ఇందులో ఏమీ సందేహమునకు ఆస్కారం లేదు.

నాయొక్క “వాస్తవరూపమే” అయిఉన్న ఆ విష్ణు భగవానుని హృదయంలోనే ఉండి - నాకు నేనే, నా గురించి నేనే ఈఈ పలుకులన్నీ పలుకుచున్నాను. హృదయంలో నుండి, ప్రాణవేగంచే భావన ద్వారా కల్పించబడుచున్న ఈ పుష్పాంజలిని, ఆ విష్ణుభగవానుని పాదాలకు సమర్పిస్తూ… ఇదే నా స్తోత్రం!

వైనతేయ సమారూఢః స్ఫురచ్ఛక్తి చతుష్టయః శంఖ చక్ర గదా పాణిః శ్యామలాంగ చతుర్భుజః చంద్రార్క నయనః శ్రీమాన్ కాస్త నన్దకనందనః పద్మపాణిః విశాలాక్షః శారఙ్గధన్వా మహాద్యుతిః ॥

Page:430

తదేనం పూజయామ్యాశు పరివార సమన్వితమ్ సపర్యయా మనోమయ్యా సర్వసంభార రమ్యయా తతఏనం మహాదేవం పూజయిష్యామ్యహమ్ పునః పూజయా బాహ్యసంభోగమహత్యా బహురత్నయా ॥

గరుడుని తన వాహనంగా కలవాడు, “ఇచ్చ, జ్ఞానము, క్రియ, అనుగ్రహము” అనే నాలుగు దివ్యమైన శక్తులు కలవాడు, శంఖము, చక్రము, గద చేతులందు ధరించినవాడు, చంద్ర సూర్యులే తన రెండు కళ్ళుగా కలవాడు, అయిన ఆ విష్ణువు సర్వే సర్వత్రా వెలుగొందుచున్నాడు. ‘నందకము’ అను పేరు గల ఖడ్గం చేత ధరించి సుజనులకు సంతోషం కలుగజేస్తూ ఉంటాడు. విశాలమైన నేత్రములు కలవారై, చేతిలో కమలము కలిగియుంటాడు. భుజము ‘శారఙ్గము’ అను పేరు గల ధనుస్సు ధరించి భక్తులకు ఉత్సాహం కలుగజేస్తూ ఉంటాడు. అట్టి సాంగ - సపరివార - సమేతుడగు విష్ణుదేవుని పూజ మనస్సుతో ప్రారంభిస్తున్నాను.

మనస్సుతో పూజ అయిన తరువాత రత్నములు పుష్పాదులతో బాహ్యమైన పూజ కూడా చేస్తాను. ఉభయ రీతులలో అర్చించెదను గాక!

ఇట్లా తలచి, ఆ ప్రహ్లాదుడు సర్వసామాగ్రి సహితంగా లక్ష్మీపతియగు విష్ణుదేవుని పూజించాడు. అభిషేకములతోనూ, పూలతోనూ, ధూప దీప నైవేద్యములతోనూ, ప్రదక్షిణ నమస్కార-ఆత్మ సమర్పణ లతోనూ ఆయనను అర్చించాడు. ఆ అంతఃపురంలోనే ఉచితాసనం సమర్పించాడు. ఉత్తమ, నిష్కల్మష భక్తితో నిండిన మనస్సుతో మానసిక పూజ ఆచరించాడు.

కొంతసేపు బాహ్యపూజ. మరికొంత సేపు మానసికమైన పూజ. ఈ విధంగా ఆతని సాధన కొనసాగింది. కొన్ని రోజులు అర్చనాదులను చేస్తూనే ఉన్నాడు. "యథా రాజా, తథా ప్రజా” అన్నట్లుగానే అక్కడి దైత్యులు కూడా విష్ణుభక్తిని అలవరచుకోసాగారు. ప్రజలు ఆచారములకు కారణభూతుడు రాజే కదా!

  1. దేవతలలో కలకలం - ఊరట

రాక్షసులందరూ విష్ణుద్వేషం త్యజిస్తున్నారనీ, విష్ణుభక్తిని సమాశ్రయిస్తున్నారని వార్తలు స్వర్గలోకం వరకు వ్యాపించాయి. ఇంద్రాది దేవతలు ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. “ఈ దైత్యు లేమిటి? విష్ణుభక్తిని స్వీకరించటమేమిటి? ఎందుకిట్లా జరుగుతోంది?” అని ఆశ్చర్యపోసాగారు. గబగబా క్షీరసాగరం జేరి, నారాయణునితో ఇట్లు నివేదించారు.

దేవతలు : హే దేవాధిదేవా! ఆదినారాయణా! ఎంత ఆశ్చర్యమో చూచారా? మీ పట్ల ఎల్లప్పుడూ విరోధభావాలు కలిగి ఉండే రాక్షసులు ఈ రోజు మీ పట్ల భక్తితో తన్మయులై ఉంటున్నారు. మరి,

Page:431

కారణమేమిటో తెలియదు. ఇదంతా ఏదైనా మాయయొక్క చర్య కాదు కదా! నిన్న మొన్నటి దాకా ప్రశాంతచిత్తులగు మునుల ఆశ్రమాలకు వచ్చి విధ్వంసం చేస్తూ ఉండటమేమిటి? ఈనాడేమో … పవిత్రమైన జన్మ - స్థితి - గతులకు కారణం కాగల విష్ణుభక్తిని అలవరచుకోవటమేమిటి? ఎంతో ఉత్తమ కర్మల ప్రయోజనంగా విష్ణుభక్తి అలవడుతుంది. దుష్కర్మలను నిర్వర్తించేవారు మాయలోనే కొట్టుమిట్టాడుతారు తప్ప… విష్ణు భక్తికి అర్హత పొందకూడదే? పరహింసాపారాయణుడై ఉండే ఒక నీచుడు నీతి శాస్త్రకోవిదుడైనాడంటే అది ఎంత అసమంజసం? ఈ రాక్షసులు విష్ణు భక్తులౌతున్నారంటే, ఈ వార్త మమ్ములను ఎందుకో, భయపెట్టుతోంది. అమూల్యమైన ఒక మణి చెత్త కుండీలోనో, గాజు పెంకుల మధ్యో ఉండటం ఏం ఉచితం చెప్పండి! అకాలంగా పుష్పాలు పూస్తే… అది సుఖ ప్రదమంటారా? ఎక్కడన్నా మేక, కుక్క కలిసి జీవిస్తాయా? ఏ పదార్థం ఎక్కడుండటం శోభ కాదో

అది అక్కడుండటం శుభమెట్లా అవుతుంది? పులి శాకాహారం తీసుకుంటుంటే … అది అపసవ్యమే కదా! ఏ జీవికి ఏఏ గుణాలు ఉంటాయో… ఆ జీవి అందుకు తగినట్టి స్థితి గతులకే యోగ్యుడౌతాడని వేదనిర్ణయం కదా! అనుచితమైన రెండు వస్తువులు ఒకే చోట ఉండకూడదు కదా! కమలములు నీళ్ళులో ఉన్నప్పుడే శోభిస్తాయిగాని…. నేలపై శోభించవే! ఈ దానవులు ఎంతో కాలంగా క్రూరము - విచారణరహితము - - అపవిత్రము అయిన ఏవేవో ఆచార వ్యవహారాలలో నిమగ్నమౌతూంటారు. మరొకరిని హింసించటంలో తప్పు లేదని సముదాయించుకుంటారు. మరి… అధమమైన నీచప్రవృత్తి గల రాక్షసులెచట? సృష్టి మొత్తంలో అత్యంత పవిత్రము, అనేక జన్మలలో ఆర్జించుకున్న పుణ్య ఫలితం అయినట్టి విష్ణుభక్తి ఎక్కడ? కమలాలు ఉండే సరస్సులో దుష్టమొక్కల పెరుగుదల దుఃఖ ప్రదమే అయినట్లు …మీ పట్ల దానవుల భక్తి కూడా మాకు శుభ సూచక మనిపించటం లేదు. శ్రీమన్నారాయణుడు : ఓ దేవతలారా! ప్రహ్లాదుడు నా భక్తుడు. మీరు అతని గురించి చింతించవలసిన పనే లేదు. ఆతనికి ఇదే ఆఖరు జన్మ. ఈ జన్మలోనే తన యొక్క భక్తి ప్రభావం చేత మోక్షమునకు అర్హుడు అగుచున్నాడు. ఇంతకీ మీరు ఎందుకు దుఃఖిస్తున్నారో చెప్పండి?

గుణవాన్ నిర్గుణోజాత ఇతి అనర్థక్రమం విదుః |

నిర్గుణో గుణవాన్ జాత ఇత్యాహుః సిద్ధిదంక్రమమ్ ॥

గుణవంతుడు గుణహీనుడైతే అనర్థమౌతుంది గాని, గుణహీనుడు ఎందుచేతనైనా గుణవంతుడు అవుతూంటే …అది మంచిదే కదా! అది అందరికీ సంతోషమైన విషయమే. ప్రహ్లాదుని సుగుణములు, మరొకరిని దుఃఖపెట్టేవి కానేకావు. సర్వసహజీవులకు విష్ణుతత్త్వానందం కలుగజేయ గలిగేది. అందుచేత మీరు నిశ్చింతగా మీమీ స్వస్థానములకు వెళ్ళండి. విష్ణుతత్త్వం అందరి సొత్తు సుమా!

ఇట్లు పలికి విష్ణుభగవానుడు క్షీరసాగర కెరటములలో అంతర్థానమైనాడు. అప్పటి నుండి దేవతలు ఊరటజెందారు. తాము కూడా ఆతని పట్ల స్నేహ, సౌహార్ధభావాలు కలిగి ఉండటం ప్రారంభించారు. మహాత్ములు ఎవరి పట్ల సంతుష్టి కలిగి ఉంటే, తదితరులకు కూడా వారి పట్ల

గురి కుదురుతుంది కదా!

Page:432

  1. తరుణోపాయం

ప్రహ్లాదుడు ఈ శరీరంతోను, వాక్కుతోను, మనస్సుతోను వివిధ సమయాలలో వివిధరీతులుగా విష్ణు పూజ చేస్తూ కొన్ని రోజులు గడిపాడు. కొంతకాలానికి, ఆతని అంతరంగంలో వివేకము, సంతుష్టి, వైరాగ్యాది ఉత్తమ గుణాలు పెంపొందాయి. ఈ దృశ్య ప్రపంచంలో ఇంద్రియాలకు తారసపడే భోగసముదాయాలు - -’పెద్దల దృష్టిలో పిల్లల ఆటలు’లాగా అర్థరహితంగా తోచ సాగాయి. మనుష్యులు సంచరించే చోట తేళ్లు, పాములు సంచరిస్తాయా? శాస్త్రార్థములను మననం చేస్తూ ఉండే ఆ ప్రహ్లాదుని మనస్సులో లౌకికమైన ధన, నారీ జనాది విషయాలకు చోటు లభించటం లేదు. ఆతనికి ఈ సకల దృశ్యపదార్థములలో ఏ ఒక్కటీ ప్రీతి గొలుపటం లేదు. “ఈ దృశ్య భోగాలన్నీ రోగ రూపములే కదా! వీటిలో ఏం ప్రత్యేకత ఉన్నది?" అను నిస్సంశయమైన అవగాహన ఆతని యందు రూపుదిద్దుకొన్నది.

ఆతడు భోగాల పట్ల సర్వ ఆశలను విడనాడాడు. అయినప్పటికీ, ఎందుకో… ఆతని మనస్సు పూర్ణ విశ్రాంతి పొందనే లేదు. ఆతని చిత్తము ఇటు భోగములను ఆశ్రయించుటలేదు… అటు శుద్ధ బ్రహ్మమునందు విశ్రాంతి పొందుట లేదు. ఆతనికి ఏమి చేయాలో పాలుపోవటం లేదు.

విష్ణు భగవానుడు తన యొక్క “శుద్ధసాత్వికము - సర్వత్రా వ్యాప్తము” … అయినట్టి జ్ఞాన శక్తిచే తన భక్తుడగు ప్రహ్లాదుని మానసిక స్థితిని గమనించాడు. భక్తులకు సంతోషం, ఉత్సాహం కలిగించటం ఆయన యొక్క స్వభావం కదా! అందుచేత పాతాళమార్గంగుండా ప్రహ్లాదుని పూజా మందిరంలో ప్రవేశించాడు. ప్రహ్లాదుడు తన ఎదుట మూర్తివంతుడై ప్రత్యక్షమైన విష్ణుభగవానుని చూచాడు. పులకిత శరీరుడై హర్షాతిరేకంతో పెద్ద గొంతుకతో ఇలా గానం చేశాడు. ప్రహ్లాదుడు :

త్రిభువన భవనాభిరామకోశం, సకల కలంకహరం పరం ప్రకాశమ్ అశరణశరణం శరణ్యం, ఈశం, హరిమ్, అజమ్, అచ్యుతమ్, ఈశ్వరం ప్రపద్యే II

కువలయదలనీల సంనికాశం, శరదమలాంబర కోటరూపమానమ్ భ్రమర = తిమిర-కజ్జల-అంజనాభం, సరసిజ చక్ర-గదాధరం ప్రపద్యే॥ విమల మలికలాప కోమలాంగం, సితజల పంకజ కుడ్మలాభ శంఖమ్ | శ్రుతిరణిత విరన్చి చంచరీకం, స్వహృదయ పద్మదలాశ్రయం ప్రపద్యే ॥ సితనఖగణ తారకావికీర్ణం, స్మితధవలానన పీవరేన్దు బింబమ్ హృదయమణి మరీచిజాలగంగం, హరిశరదంబరమ్ ఆతతమ్ ప్రపద్యే అవిరలకృతసృష్టి సర్వలీనం, సతతమ్ అజాతమ్, అవర్ధనమ్, విశాలమ్ గుణశతజరఠాభిజాత దేహమ్, తరుదలశాయినమ్ అర్భకం ప్రపద్యే ॥

Page:433

నవ వికసిత పద్మరేణుగౌరం, స్ఫుటకమలా వపుషా విభూషితాంగమ్ దినశమ సమయా అరుణాంగరాగం, కనకనిభాంబర సుందరం ప్రపద్యే|| దితసుత నలినీ తుషారపాతం, సురనలినీ సతత ఉదిత అర్కబింబమ్ కమలజ నలినీ జలావపూరం, హృదినలినీ నిలయం విభుం ప్రపద్యే ॥ త్రిభువన నలినీ సితారవిందం, తిమిర సమాన విమోహ దీపమగ్ర్యమ్ స్పుటతరమ్ అజడం చిదాత్మతత్త్వం, జగదఖిలార్తిహరం హరింప్రపద్యే ॥

ప్రభో ! శ్రీమన్నారాయణా! వాసుదేవా! త్రిలోకరక్షకా! హృదయం లోపల, బయట కూడా ఉన్న అంధకారం నశింపజేయు మహానుభావా! ఈ జగత్తులు, సూర్యచంద్రులు ఏర్పడుటకు కారణ మైనవాడా! నమస్కారమయ్యా! దిక్కులేనివారికి దిక్కునీవేకదయ్యా! సర్వ శరణ్యుడవు, ఈశ్వరుడవు, అజుడవు, సర్వ దుఃఖహారుడవు అగు ఓ విష్ణుభగవాన్ ! నేను నిన్ను శరణువేడుచున్నాను. హృదయ కమలంలో వేదమే స్వరూపముగా గలిగినట్టి బ్రహ్మదేవుని ధరించినట్టి నీవే మమ్ములను రక్షించాలి! అనంత, ఆకాశస్వరూపుడవు. ఆదిమధ్యాంత రహితుడవు, ఈ విశాలసృష్టినంతా నీ యందు లీన మొనర్చుకున్నవాడవు, ఉత్పత్తి - వినాశ రహితుడవు అగు ఓ తండ్రీ! ప్రళయ కాలసమయంలో నీవు “సత్యము” మొదలైన మాయాగుణములచే ప్రేరేపితులై, సనాతనులై, సుందర దేహులై ఒక పసిబిడ్డ రూపంలో మట్టిచెట్టు ఆకుపై శయనిస్తారట కదా! అట్టి మీకు సాష్టాంగదండ ప్రణామములు. లక్ష్మీదేవిచే అలంకరించబడిన వక్షస్థలం గల మిమ్ములను సేవిస్తున్నాను. సర్వవ్యాపకులై, దుష్ట క్రియలను నిర్వర్తించే రాక్షసులను మట్టుబెట్టి, మీ భక్తులగు దేవతలను, తదితరులను సర్వదా రక్షిస్తూ ఉంటారు కదా! నాకు మార్గము - ఆశ్రయము - లక్ష్యము మీ పాదములు మాత్రమే! మిమ్ములను శరణువేడుచున్నాను. కిరణములన్నిటికీ సూర్యుడు ఉత్పత్తిస్థానమైనట్లు… ఈ జగత్తులోని ప్రతిజీవికి ఉత్పత్తి స్థానం మీరే! ‘అజ్ఞానం’ అనే కారుచీకటిలో తారట్లాడుతుంటే, మాకు లభిస్తున్న కాంతి దీపమే మీరు. మీరు నిత్యులు! స్వయం ప్రకాశకులు! జడత్వముకంటే విలక్షణమైనట్టి చిదాత్మస్వరూపులు! స్మరణ మాత్రంచేత సర్వజీవుల దుఃఖమును హరించివేసేవారు! హే శ్రీహరీ! నారాయణా! సర్వేశ్వరా! దీనబంధూ! మిమ్ములను నేను మరలమరల ఆశ్రయిస్తున్నాను. శరణు వేడుచున్నాను. ప్రియురాలు ప్రియుని పొందగోరునట్లు, బెంగపడిన బిడ్డ తల్లియొక్క స్పర్శను కోరు కున్నట్లు, నేను మీ ఆగమనాన్ని కోరుకొంటున్నాను. మీ దర్శనమైనది, ఇక నాకేం కావాలి!

ప్రహ్లాదుడు చేసిన స్తుతులను విని విష్ణుభగవానుడు సంతోషించి, ఎంతో వాత్సల్యంతో ఇట్లు

పలికాడు -

శ్రీమన్నారాయణుడు : పుత్రా! ప్రహ్లాదా! నీ భక్తిపూర్వకమైన స్తోత్రానికి నేను సంతసించాను. నీలో ఉన్న కొంచెం నిరుత్సాహం తొలగించాలనే ఉద్దేశంతో వచ్చాను. నీకు ఏమి కావాలో కోరుకో! అది నేను నీకు సంతోషంగా ఇచ్చి నిన్ను ఆనందపరుస్తాను.

*

Page:434

ప్రహ్లాదుడు అది విని, కాస్త యోచనలో పడ్డాడు. ఆహా! ఏమి సుదినం! సర్వలోక నియామకు డగు పరంధాముడు నా ముందుకు వచ్చి ఏమి కావాలో కోరుకోమంటున్నారే! ఏదో సామాన్యులైతే, మనం సామాన్యమైన విషయాలు అడుగుతాం! సర్వకర్త, సర్వభోక్త అగు ఈ సర్వేశ్వరుని ఏం అడగాలి? ఏవో కొన్ని వస్తువులు అడగవచ్చు! … కాని, ఏది పొందినా, అదంతా కొంత కాలానికి విసుగు కలిగిస్తుంది. … చివరికి దుఃఖంగా పరిణమిస్తుంది కదా!

ప్రహ్లాదుడు : స్వామీ! నేను ఏదీ కోరి ధ్యానించటం లేదు. మీపట్ల స్వభావసిద్ధంగా ప్రేమ జనించింది. నాకు ఇంకేం కావాలి. అహంతు అ కామః!

శ్రీమన్నారాయణుడు : నాయనా! నీ అప్రకృత్రిమ భక్తి ప్రేమలకు మరింతగా సంతోషించాను. ఏది కావాలన్నా ఇచ్చి సంతోషింపజేయటానికి నేను సంసిద్ధం.

ప్రహ్లాదుడు (తనలో) : అయినా… ఈ సర్వలోకములలో ఉత్తమోత్తమమైనదేది? సర్వసంసార దుఃఖములను తొలగించగలిగేది ఏదైనా ఉన్నదా? అట్టిదేదైనా ఉండి ఉండవచ్చునేమో! అయితే, స్వల్పబుద్ధిగల నాకు అదియేమో తెలియటం లేదే!

అయినా, నా ఎదురుగా ఉన్నది సామాన్యుడా! సర్వజ్ఞుడగు నారాయణుడు కదా! నా బుద్ధిని ఉపయోగించి ఏదో ఒకటి అడిగే బదులు, ఆయననే సంప్రతించి, ఆ తరువాత అడిగితే పోలేదా? ప్రహ్లాదుడు (శ్రీమన్నారాయణునితో): హే ప్రభో! మీరు సర్వసంకల్పముల ప్రదాత కదా! సర్వ లోకాలలో అంతఃస్థితులై ఉంటారు. ఇక మిమ్ములను నేనేం కోరాలి! దర్శనం ప్రసాదించారు. నాకు అంతే చాలు! అయితే, అంతటి మీరు నాపై దయతో ఏదైనా కోరుకోమంటే… ఏదోకటి కోరుకోవాలి కదా..! నా అల్పబుద్ధిని ఉపయోగించి ఏమైనా కోరితే… ఆ కోరిన దాని ప్రయోజనం కూడా అల్పంగానే ఉంటుంది. మీరు భక్తులకు తండ్రి, సోదరుడు, మిత్రుడు, సర్వస్వము కదా!

అందుచేత మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. మీరు ఏది సర్వోత్తమమని, దుఃఖసంసార దోషరహితమని అనుకుంటారో … అట్టి దానిని, నా అర్హతను అనుసరించి మీరే ప్రసాదించండి. మీరు ఏది ఇస్తే, దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తాను.

శ్రీమన్నారాయణుడు : నాయనా! ప్రహ్లాదా! సర్వోత్తమమైనది సర్వదోషరహితమైనదై ఉండాలి. సర్వవస్తువులకు, దృశ్యమంతటికీ అతీతమైనదై ఉండాలి కదా! అందుచేత, పరమానందదాయకమైనది వస్తుజాలంలో లేదు. ‘ముక్తి’యే అన్నిటికీ మించినది. అయితే, సంసార భ్రమరహితమైనట్టి ముక్తస్థితి సమగ్రమైనట్టి నీయొక్క అవగాహననుండే ప్రాప్తిస్తుంది. అందుకు నీకు నీవుగా తత్త్వవిచారణను ఆశ్రయించటమే ఉపాయం.

పరమోత్తమమైన ఆశయంగల నీవు బ్రహ్మమునందు ప్రశాంతపూర్వకమైన విశ్రాంతి లభించే వరకూ ‘తత్త్వవిచారణ’ను చేయి. ఆత్మయొక్క స్వరూప స్వభావాల గురించి "విచారణ”కు ఉపక్రమించు. శుభమస్తు!

FH

Page:435

ఇట్లు పలికి, చిరునవ్వు కురిపిస్తూ నారాయణుడు అంతర్థానమైనాడు. ప్రహ్లాదుడు స్వామికి భక్తి పారవశ్యంతో హృదయకుసుమాంజలి సమర్పించటం పూర్తి చేసి, అప్పటికప్పుడే ఏకాంతంగా ఒక చోట పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కొంతసేపు అత్యంత ప్రీతిపూర్వకంగా శ్రీమన్నారాయణుని స్తోత్రం గానం చేశాడు. ఇక ఆ పై విచారణకు ఉపక్రమించాడు.

  1. తత్త్వ విచారణ

ప్రహ్లాదుడు (అంతరంగంలో) : సర్వసంసార దుఃఖాలను సంహరించ గల ఆ విష్ణుమూర్తి ఇప్పుడు నాకు చెప్పినదేమిటి? ‘విచారణ చేయి’ అని కదా! సరే, ఇప్పుడు నేను విచారణ ప్రారంభిస్తున్నాను. నేను విచారణ చేయవలసింది దేని గురించి? ‘నేను’ గురించే! అదియే ఆత్మవిచారణ కూడా కదా!

నేను అనగా ఎవడను? - ఈ మాట్లాడుచూ, నడుచుచూ, కూర్చుంటూ, ఆయా ప్రయత్నములు చేస్తూ, విషయములను స్వీకరిస్తూ ఇప్పుడు ఈ విచారణకు ఉపక్రమిస్తున్నట్టి నేను ఎవరు?… దృశ్యంలోని ఒక వస్తువునా?

“కొయ్య-రాయి-మట్టి” వంటి ఒక పదార్థమునా? దేహములో ఉంటూ సర్వమును చూస్తున్నట్టి నేను ఒక బాహ్యమైన వస్తువును ఎట్లా అవుతాను? ఒక వస్తురూపంగా చూస్తే ఈ దేహమునకు బాహ్యమైనదేదీ నేను కాదు.

ఈ దేహమే నేనా? - (ఒక్కసారి తన దేహం వైపు చూచాడు). ఈ కనబడే నా దేహమును ఒక్క సారి పరిశీలనగా చూస్తే, ఇది కొద్దికాలం క్రితం రూపందిద్దుకొని మరికొద్ది కాలంలో నశించబోతోంది. ఇది స్వయంగా ఏమి చేయలేదు. దీనిని ఆయా క్రియలకు వినియోగిస్తున్నది నేను. మరి నేను ఈ

దేహమును అవుతానా? రక్త - - మాంస - - బొమికలచే రూపంకలిగియున్న ఈ దేహం ప్రాణవాయువుచే ఉనికి - చలనములను పొందుతోంది. ఈ దేహనాశనమునకు కూడా సాక్షినైన నేను ఇందులోని కాళ్ళు, చేతులు, చర్మము అవటానికే వీలులేదు.

నేను శబ్దమునా? - “ప్రహ్లాదా” అని జనులచే పిలువబడుచున్న నేను ఒక శబ్దమునా? శబ్దం ఈ నా చెవులచే కల్పించబడినదై శూన్యాకాశంలో ఉత్పన్నమౌతూ, ఇంతలోనే శూన్యమును పొందు తోంది. పైగా, అది బాహ్యమునందే ఉంటోంది. స్వయంగా ప్రవర్తించేదికాదు కనుక అది జడమైనది మాత్రమే. జడమైనది నేనెట్లా అవుతాను?

స్పర్శానుభవమే నేనా? - ఈ చర్మమును ఏదైనా తాకినప్పుడు ఒకక్షణ కాలంలో ’స్పర్శ’ అనే అనుభవం పుట్టి, ఇంతలోనే నశించిపోతోంది. ఒకప్పుడు ఏర్పడి, మరొకప్పుడు లేకుండా పోవుచున్న అచేతనమగు ’స్పర్శ’ను నేనెట్లా అవుతాను. అది నాచే పొందబడే ‘అనుభవం’ మాత్రమే. ‘అనుభవజ్ఞుడు’ అయిన నేను వేరు… అనుభవం వేరు. స్పర్శజ్ఞానం-స్పర్శాభవం నాకు కొన్ని సమయాలలో ఉండవచ్చు గాక! మరికొన్ని సమయాలలో ఉండకపోవచ్చు. అయ్యది నేనెట్లా అవుతాను?

Page:436

నా స్వరూపము రుచియా?- ఈ శరీరంలో ఒక భాగమై ఈ శరీరంలాగానే అనిత్యమైన ఈ నాలుక నేను తింటున్నప్పుడు ‘రుచి’ అను అనుభూతిని కలుగజేస్తోంది. పైగా, ఈ నాలుక నా ముక్కు క్రింద నుండి కంఠభాగం వరకు మాత్రమే విస్తరించియున్నది. ‘ఆస్వాదన’ అనేది కూడా ఒక బాహ్యమైన అనుభవం మాత్రమే. అటు పదార్ధము - ఇటు నాలుక ఒక చోట జేరినప్పటి నా అనుసంధానమే అది. అనగా అది నా సమక్షంలో నాచే, ప్రభావితమై ఉంటోంది. అట్టి జడానుభవం మరి నేనెట్లా అవుతాను? కాను.

కనబడే రూపము నేనా?- ఒకానొక రూపంతో నేను చూడబడుచున్నాను. అయితే ఇక్కడ చమత్కారం ఏమంటే - ఈ రూపము అనబడేది కనుల యొక్క అధీనంలో ఉంటూ, ద్రష్ట యందు పరికల్పన పొందుచున్నది. ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించి నా ఈ దేహము "ప్రియ-అప్రియ, శత్రు-మిత్ర” ఇత్యాది భావాలతో దర్శించబడుతోంది. నేను ఈ దేహంలో ద్రష్టత్వము’ అనే నా ‘కళ’ ను ప్రదర్శిస్తున్నాను. కనుక ద్రష్ట ఈ నా భౌతిక రూపము కంటే వేరు అయి ఉన్నాడు. రూపం ఏర్పడటానికి ముందే ద్రష్ట ఉన్నాడు. ఎట్లా అంటే, చూచేవాడు మునుముందుగా ఉంటే కదా, ‘చూడటం’ అనే ప్రక్రియ ఏర్పడగలిగేది?

అందుచేత దృష్టి యొక్క స్వభావమగు ’రూపము’ను నేను కాదు. ఆ రూపమును గుర్తిస్తున్న ‘ద్రష్ట’ యొక్క స్వభావమును స్వీకరిస్తున్న వాడనే నేను. కనుక ‘రూపం’ యొక్క అనుభవ పరిమితుడను నేను కాదని తేలిపోతోంది.

సువాసన (ఆఘ్రాణం) నేను అవుతానా! - రూపములాగానే గంధము కూడా అనుభవం మాత్రమే. అది కూడా స్వయంగా ప్రవర్తించేది కాదు. కాబట్టి అది నేను కాదు.

మరి ఇంతకీ ఈ ప్రపంచంలో సంచారం చేస్తున్నట్టి నేను ఎవరు?

ఈ మనస్సు - బుద్ధి - అహంకారములు నేనా? - - నా యొక్క మననము చేయు స్వభావమే మనస్సు కదా! అనగా, నేను ఈ దృశ్యము మొదలైన వాటిని మననం చేస్తూ ఉండగా, అట్టి ప్రక్రియను విజ్ఞులు ‘మనస్సు’ అనే పేరు పెట్టారు. నేను చేస్తున్న పని వేరు… నేను వేరు కదా! అందుచేత మనస్సు అనబడేది కూడా నేను కాదు.

అదే కారణంగా నిర్ణయాత్మకస్వభావం అయినట్టి ఈ ‘బుద్ధి’ కూడా నేను కాదు. ’నేను చేయు నిర్ణయము - నేను’ వేఱువేటై ఉన్నాము కదా!

ఇక ‘అహంకారము’ అనబడేదానికి నేను వస్తే… ‘నేను’ అను భావనయే అహంకారము కదా! ఆ భావనను భావనచేస్తున్న నేను “అట్టి భావనకంటే ముందే … అట్టి భావన ఏర్పడుటకు స్థానమై” ఉండనే ఉన్నాను కదా! కనుక “నేను ఒక జీవుడను… ప్రహ్లాదుడను… ఈ జాతి వాడను” వంటి పరిమిత అహంకారభావన ఏదీ నేను కాదు.

మరినా వాస్తవ స్వరూపమేమిటి? నేనెవడను? - (ఒక్కసారి ఆనందంగా కేకవేసి, మరల ఇట్లు అనుకోసాగాడు.) …ఓహో! ఇప్పుడు తెలిసిపోతోంది. ఆత్మకు మమత్వమనేదేదీ లేదు

Page:437

మనస్సు లేదు. ఆత్మ మనస్సు కంటే మునుముందే ఉన్నది. ఈ పంచేంద్రియములకు సంబంధించిన ఏ అనుభవమూ ఆత్మ కాదు …సర్వ సంకల్పములకు ఆవల ఆత్మ ఉన్నది. … శుద్ధ చైతన్యరూపము అద్దానిది … అట్టి ఆత్మయే ఎల్ల వేళలా నేను.

చిన్మయరూపుడనగు నా యందు విషయము లనేవే ఉండవు. సర్వమును ప్రకాశింపజేయునది నేనే. శాశ్వతమూ, అఖండమూ అగు నా యొక్క స్వస్వరూపము చేతనే గదిలోని దీపం వలె, - ఒక రాయి మొదలుకొని, సూర్యుని వరకూ సర్వమూ ప్రకాశింప జేయబడుతోంది.

ఈ జగత్తంతా ఏ నిర్వికల్ప చిదాభాసం అయి ఉన్నదో … అట్టి సర్వ వ్యాపకమగు సర్వాత్మయే

నేను!

అగ్ని చేతనే అగ్నికణములు ప్రజ్వరిల్లుచున్నాయి కదా! చైతన్య స్వరూపుడనగు నావలెనే ఈ ఇంద్రియ వృత్తులన్నీ స్ఫురిస్తున్నాయి. అన్నిటినీ వెలిగిస్తూ సర్వకార్యములందు ప్రసరించి ఉన్నది ఆత్మయే. దాని సమక్షమునందు సర్వపదార్థముల సత్త ప్రతిపాదించబడుతోంది. ప్రతిబింబములకు ఆశ్రయం అద్దమే కదా! ఈ దేహ - ఇంద్రియ - మనో - - - బుద్ధులకు ఆత్మయే ఆశ్రయమైవున్నది. చంద్రుడు శీతలంగా, పర్వతం ఘనంగా, పాలు ద్రవంగా ఉండేది ఆ చిద్రూపప్రభావం చేతనే.

“ఈ ఎదురుగా ఉండే పదార్థాలు (Matter) ఎక్కడ నుండి వచ్చాయి?” అని మనం పరిశీలించు కుంటూ పోయామనుకో. అప్పుడు కూడా “ఆకాశం … ఆకాశం నుండి వాయువు …వాయువు నుండి అగ్ని, …అగ్ని నుండి జలం …జలం నుండి ఘనం” అను పరిశీలనలన్నీ ఆత్మ దగ్గిర నుండే బయలుదేరి, ఆత్మ వద్దకు వచ్చి ఆగుచున్నాయి. ఎందుకంటే… ఆకాశం ఆత్మ యొక్క ధ్యానం నుండే బయల్వెడలుతోంది.

ప్రతిదానికీ మరొక కారణం ఉండి తీరుతోంది … ఒక్క ఆత్మకు తప్ప! ఆత్మకు మాత్రం మరొక కారణమంటూ ఏదీ లేదు. ‘సత్’ రూపమైనట్టి అదే, సర్వ కారణములందూ వ్యాపించి ఉంటోంది.

ఆత్మచేతనే సర్వమూ కలుగుచున్నాయి. “శీతలం” నుండి అనేక ఆకారములైన మంచు గుట్టలులాగా ఆత్మ భగవానుని నుండే సృష్టికి కారణ భూతులగు బ్రహ్మ - విష్ణు - మహేంద్రాదులు ఆవిర్భవిస్తున్నారు. వారంతా సృష్టికి కారణమగుచూ, ఆత్మయే తమ ఉత్పత్తి - ఉనికి - ఔన్నత్యములకు కారణముగా కలిగి ఉంటున్నారు. అట్టి ఆత్మకు, ఆపై, మరొక కారణమంటూ ఏదీ లేదు. దానిని మనమెవ్వరమైనా “చిత్తము - విషయము - ద్రష్ట - దర్శనము - దృశ్యము” అని పిలువదలచుకొంటే, అదంతా ”పరిమితమైన అవగాహన వల్లనే" అని అనకతప్పదు.

అట్టి నిత్య స్వయంప్రకాశరూపము, నా రూపము, సర్వుల స్వస్వరూపము అగు ఆత్మకు పలుమార్లు వందన సమర్పణ చేస్తున్నాను.

ఇప్పుడు నాకు తెలియవస్తున్నదేమంటే…. నిర్వికల్పమగు “చిదాత్మ” యందే గుణ భూతములైన పదార్ధములన్నీ స్థితి కలిగి ఉండి, భావావేశముచే ప్రకాశిస్తున్నాయి.

Page:438

ఇదంతా సంకల్పమాత్రమే! - సూక్ష్మమగు ఈశ్వరరూపమే కారణములన్నిటికీ కారణమై ఉన్నది కదా! అయితే ఆ చైతన్యము ఏ పదార్థము గురించి ఎట్లు సంకల్పిస్తుందో, అది అట్లే అంతటా సంభవించుచున్నది. మరింకేది కాదు. “ఇది కుండ” అని అనుకుంటే అట్టిది “మట్టి కంటే వేరైన కుండ” అనునట్లుగానే అనుభవమౌతోంది. అది దేనినైతే భావించదో అట్టిది స్థూల సూక్ష్మ రూపమున ఉన్నప్పటికీ కూడా అది నశించినదిగానే అగుచున్నది. ఆ విశాల చిదాకాశము ఒక దర్పణము వంటిది. ఈ జగత్సంబంధమైన భూతాకాశాది విశేషములు, పదార్ధములు, అన్నీ అందులో ప్రతిబింబిస్తున్నాయి.

అట్టి చిదాకాశమే నేను. ఆత్మయందే ఈ పదార్థములన్నిటి యొక్క - మనోబుద్ధిచిత్తాహంకారాల యొక్క - ఉత్పత్తి, వృద్ధి, క్షయాలు అధ్యస్థమై ఉన్నాయి.

స్వస్వరూపమగు ఆత్మను పొందటానికి అర్హతలేమిటి? - అట్టి ఆత్మ అజ్ఞులచే గాంచబడుటలేదు. ఇక చిత్తరహితులగు నిర్మల జీవుల చేతనో - అది సర్వదా పొందబడియే అనుభవమౌతోంది. అతి నిర్మలమగు చిదాకాశము సజ్జనులగు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తోంది. సమస్తమునకూ కారణ భూతమగు చిద్రూపము నుండే వివిధమగు ఆచారములతో కూడిన దృశ్యలత విజృంభిస్తోంది. కొండపై నుండి చెట్లు లేస్తున్నట్లుగానే, చేతనరూపుడగు పరమాత్మ నుండి ఈ సువిశాల ప్రపంచమంతా ఆవిర్భవిస్తుంది.

బ్రహ్మ నుండి గడ్డిపరకవరకూ సర్వాన్ని ప్రకాశింపజేసేది పరమాత్మే. తాను ఆకార రహితము, ఆద్యంత రహితము, ఏకము, సర్వవ్యాపకము అయి ఉండికూడా, అదే తరుణంలో ఈ చరాచర ప్రాణికోట్ల హృదయాంతరములలో ‘అనుభవం’ రూపమున ఉన్నది నేనే. ఆ పరమాత్మయే సర్వరూపుడై, ప్రహ్లాద రూపుడై కూడా చెన్నొందుచున్నాడు. అనగా, ఈ ప్రహ్లాదనామ ధేయజీవుని సద్గుణ దుర్గుణాలన్నీ ఆ పరమాత్మ!

ఈ ఎదురుగా కనబడేదంతా ఉన్నది నాలో…! - ఈ స్థావర జంగమాత్మకమగు ప్రాణికోట్ల శరీరాలన్నీ అపరిచ్ఛిన్న రూపంగా పరమాత్మ స్వరూపుడనగు నాయందే ఉన్నాయి. అనుభవ స్వరూపము, ఏకమూ అగు నేనే సర్వమునకు దృక్కును కూడా.

నేనే ద్రష్టను …చూడబడుచున్నది కూడా నేనే! … దృక్, ద్రష్ట, దర్శనము - - ఇవన్నీనా చిత్కళలే! ఈ అసంఖ్యాకములగు కాళ్ళు చేతులు కలిగినవాడను నేనే.

నేను సూర్యుని రూపమును ధరించి … అదిగో.. ఆకాశంలో విహారం చేస్తున్నాను. వాయు దేహముతో అన్ని వైపులా సంచారం చేస్తున్నాను. శంఖ - చక్ర - గదా సహితమగు నా రూపమే జగత్తుగా వ్యవహరించబడుచున్నది.

నేనే ఈ జగత్తునందు ఆవిర్భవించి కూడా, సర్వదా పద్మాసనముపై విరాజమానుడవై నిర్వికల్పసమాధియందు మిక్కిలి శాంతిని పొందుచున్నాను …చతుర్ముఖుడగు బ్రహ్మను నేనే.

Page:439

తాబేలు తన శరీర భాగములన్నీ తన యందు దాచుకుంటుందే! ఆ రీతిగా నేను త్రినేత్రుడనై ప్రళయకాలంలో ఈ జగత్తునంతా సంహారమొనర్చున్నాను. ఒక సమయంలో ఇంద్రరూపమును పొంది ఈ మూడు లోకములను నేనే పాలన చేస్తున్నాను.

కుమారస్వామినై దేవతల సేనానాయకుడనైనది నేనే. ఈ అనేక స్త్రీ పురుష రూపములు కూడా నావే! నేనే!

ఒక వైపు అనంత ముఖుడనై ఒప్పుచున్నాను. మరొక వైపు దేహదారుడను అగుటచే దేహత్వమును పొందుచున్నాను నేనే జీవాత్మను. నేనే పరస్వరూపుడను. పరమాత్మను! నేనే రసరూపుడనై భూమి యందు మొక్కలను ఉత్పన్నం చేస్తున్నాను. స్వలీలార్థమిదం చారు జగదాడమ్బరం తతమ్ ।

మయాభిజాత బాలేన పఙ్కక్రీడనకం యథా ॥ (శ్లో 49, సర్గ 34)

ఆడుకోవటానికి బాలుడు మట్టిబొమ్మను నిర్మించుకొనునట్లు, నాయొక్క విలాసము కొరకే ఈ జగదాడంబరమంతా విస్తరింపజేశాను. ఈ లోకక్షేమాభిలాషులగు దేవతల, లోకకంటగులగు రాక్షసుల రూపంగా చెన్నొందుచున్నది నేనే!

ఇదంతా నన్నే ఆశ్రయించి ఉంటోంది - - నేనే అంతటా కార్యరూపమున వ్యాపించి ఉన్నాను కదా! అయితే, నా స్వస్వరూపం నాకు సాక్షాత్కారమైన మరుక్షణం ఈ కార్యరూపసత్తా అంతా నశించగలదు. అంటే ఏమిటి…? తత్త్వదర్శనముచే జీవన్ముక్తుడనైనానా,.. పరివ్యక్తమగుచున్న ఈ జగత్తంతా అప్పుడు “లేనిదే” అయిపోతోంది. నా “చిద్రూపము” అనే దర్పణము వంటి స్వరూపంలో ఏది ప్రతిబింబిస్తుంటే అది మాత్రమే ఉనికిని కలిగి ఉంటోంది. తదితరమైన దానికి ఉనికియే లేదు. అందుకే నాకంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదీ లేనే లేదు.

పుష్పములోని శోభ, సుగంధము, కాంతి కూడా నేనే! ఏదైతే సంకల్పరహితమై ఉన్నదో అది నేనే!… రసతన్మాత్ర (The factor of taste) మొట్టమొదట జలంలో వ్యాపించి ఉండి, అదే వృక్షములోకి ప్రసరిస్తోంది కదా! ఆ విధంగానే అన్నిటికీ నిమిత్తకారణాన్ని(That which is causing all else) నేనే.

సర్వోత్తముడనై, సర్వపదార్థములందూ అంతర్యామినై నా ఇచ్ఛచే ఈ పలు విధములైన ‘జీవ సంవిత్తు’ లను ఉత్పన్నం చేస్తున్నాను. పాల యందు నేయి, జలమునందు రుచి ఉన్నట్లు, అన్నింటా - అందరి యందూ మూడు కాలములందూ చితశక్తిరూపంగా ఉంటున్నాను. దిక్కులన్నీ పూరించుచూ భ్రమగాని, సంకోచముగానీ లేనివాడనై ఉన్నాను. సర్వపదార్థములకు అస్థిత్వము ప్రసాదించుటచే ‘సర్వకర్త’ ను నేనే. విరాట్ సామ్రాట్టుగాను (సమష్టి - వ్యష్టిగానూ) వ్యవహరిస్తున్నది నేనే.

నేనెంతటి విశాల రూపుడను! - ఈ ‘విశాల జగత్తు’ అనే రాజ్యం నేను కోరకుండానే లభిస్తోంది. ఆహా! నేనెంతటి విస్తార స్వరూపుడనో కదా! నాయందు నేనే ఇమిడి ఉండుట లేదే! నిరతిశయానందరూపమున స్వయంగా అనుభూతమగుచున్న నా ఆత్మయొక్క అంతమును నేను

Page:440

చూడలేకపోతున్నానే! రాజఠీవితో నడచిపోతున్న ఒక ఏనుగును ఉసిరికాయలో పట్టి ఉంచగలమా? బ్రహ్మచే నిర్మించబడిన ‘జగత్తు’ అను చిన్నిఇంట్లో అనంత విస్తారస్వరూపమగు నా చిత్స్వరూపము పట్టేదెట్లా? ఈ లోకాలు ఈ బ్రహ్మాండాలు దాటిపోయి, “24 లేక, 36 తత్త్వాలు” దాటి పోయి వెళ్ళుచున్నప్పటికీ నా స్వస్వరూపమునకు అంతుదొరకటమే లేదు.

నాకు, ఈ పరిమిత కల్పనలా? ఎట్లా కుదురుతుంది?

ఇదంతా బాగానే ఉన్నది … ఇప్పుడు నాదొక సందేహం"అనంతుడను, ఆశ్రయరహితుడను” అగు నాకు ఈ దేహాదుల కల్పనంతా ఎట్లా కలిగింది? ఆది - అంతము లేని చిత్ స్వరూపుడనగు నేనెక్కడ? రక్త మాంస నిర్మితమైన ‘శరీరము’ అనబడే ఈ పరిమితత్వము - న్యూనత ఎక్కడ? ఇది నాకు సంభవించటమేమిటి? ఈ ‘నీవు - నేను’ అను కల్పనలన్నీ మిథ్యా రూపములు, భ్రమమాత్రమే కదా!

దేహము ఉండుట ఏమిటి? లేకుండుట ఏమిటి? మృతుడెవడు? జీవితుడెవడు?

ఆహా ! ‘ఆత్మజ్ఞానము’ ను వదలిపెట్టి, ఈ ప్రాపంచిక ఐశ్వర్యములందు, “ఇవి ఎంత బాగున్నాయి!" అని ప్రీతిగొన్నట్టి నా పూర్వీకులంతా ఎంతటి మూర్ఖులు!

క్వేయం కిల మహాదృష్టిర్భరితా బ్రహ్మబృంహితా | క్వసరీసృపభీమాశా భీమా రాజ్యవిభూతిభిః || (శ్లో 67, సర్గ 34)

బ్రహ్మజ్ఞానమును ప్రవృద్దం చేయగల ఇప్పటి నా పూర్ణ దృష్టి ఎచట…? త్రాచు పాములులాగా భయంకర ఆపదలతో కూడిన ఈ రాజ్యాలు, సంపదలు ఎక్కడ?

అవును. శుద్ధ చిన్మయ దృష్టే అన్ని దృష్టులకన్నా ఉత్తమోత్తమైనది.

చిన్మయ దృష్టి - నేను విషయవర్జితుడనై, సర్వపదార్థములందూ సాక్షి రూపమున ఉన్నాను. అట్టి చిదాత్మస్వరూపుడనగు నాకు నేనే మరల మరల నమస్కరించుచున్నాను. చిరకాలంగా “తుచ్ఛ సంసార ప్రవాహము” న పడి ఉన్న నేనిపుడు ”జన్మరాహిత్యము” అనే ఒడ్డుకు చేరుతున్నాను.

ఇప్పటికి నేను సర్వ అనర్థములు నివృత్తి అవగల స్వస్థానం వైపు తిలకిస్తున్నాను. ఏ సుఖం పొందాలో, అది పొందటం చేత ఇప్పుడు నేను సఫలుడను. సర్వోత్తముడను.

ఇట్టి శాశ్వతమగు ఆత్మజ్ఞానసామ్రాజ్య సుఖమును వదలుకోవటమేమిటి? దుఃఖములగు ఈ భౌతిక రాజ్యసంపదలను పట్టుకుని వ్రేలాడటమేమిటి? ఎంతటి తుచ్ఛము? ఈ రాజ్యాది సంపదలన్నీ కొయ్య - మట్టి - శిలా మయమే కదా! వీటియందు ప్రీతి గొనటమంటే ఒక కీటకంలా ఈ ఉపాధిని వెచ్చించటమే అవుతుంది.

నా తండ్రి హిరణ్యకశిపుడు తక్కువవాడేం కాదు. మహాతపశ్శాలియే. కాని, ఆయన చేసినదేమిటి? “అవిద్యామయములే” అయినట్టి ఈ రాజ్యాలు ఏలటం, తినటం, త్రాగటం యందు మాత్రమే దృష్టి ఉంచి, ఆయన ఈ అవయవాలను తృప్తి పరచటానికే అవకాశాలన్నీ వినియోగించారు. కాని,

Page:441

ఏం సాధించినట్లు? ఏం పురుషార్థం పొందినట్లు? హృదయంలోని అజ్ఞానం తొలగనేలేదే? ఈ బ్రహ్మానంద సాగరం ముందు రాజ్యాలు పొందటం, వాళ్ళనీ, వీళ్ళనీ ఓడించటం ఎంత చిన్న విషయాలు? బ్రహ్మానందం పొందితే, ఇక తక్కినవన్నీ పొందినట్లే. అంతేకానీ, రాజ్యాలు పొందితే బ్రహ్మానందం లభిస్తుందా? లేదే. పరిపూర్ణమగు బ్రహ్మానందం పొందేవానికి ఈ తుచ్ఛ విషయములలో వెతకవలసిన సుఖం ఏమైనా ఉంటుందా? ఏ మాత్రం ఉండదు.

అనంతమగు ‘దివ్యపదము’ను వదలిపెట్టుకొని, పరిచ్ఛిన్నమగు ఇంద్రియ వ్యవహారములను వాంఛించే వాడు ఏదో తెలివితక్కువచేతనే అట్లు చేస్తున్నాడు కాని, నిజంగా తెలిసికాదు. తియ్యటి తెల్లద్రాక్షపళ్ళను ఇంట్లో పెట్టుకొని, “తెల్లటి వేపపళ్ళు తెల్లటి ద్రాక్షపళ్ళకంటే మరింతరుచిగా, సొగసుగా ఉంటాయి”…. అని తలచుచు వేపపళ్ళు తిందామని వేపచెట్టు ఎక్కేవాడిని ఏమనాలి? పూర్ణమగు ఆత్మదృష్టిని వదలి, దృశ్యము పట్ల ఆసక్తి కలిగి ఉండటం అట్టిది. చెఱకురసం ప్రక్కన పెట్టి, కుంకుడు రసంకోసం కష్టించి తెచ్చుకోవటమే అది! అది మూర్ఖత్వమే మరి.

నా పూర్వీకులు తెలివితక్కువచేత గొప్ప గొప్ప రాజ్యాలు ఏలాలని కోరుకున్నారు. నేను మాత్రం ఆ తప్పు చేయను. భోగములను ఆశ్రయించటానికి ఉపయోగపడే ఈ శరీరమును చూచుకొని “ఈ శరీరముతోటివాడినే నేను” అనే బుద్ధిని జయిస్తాను. “ఈ శరీరము కంటే విలక్షణమైన నిత్యమగు ఆత్మవస్తువునే నేను” అను రూపంలో ఉండే ‘ఆత్మబోధ దృష్టి’ ని ఆశ్రయించటం కోసమే సర్వదా ప్రయత్నిస్తూ ఉంటాను.

ఆరాటమంతా మటుమాయం- ఆత్మతత్త్వమును ఆశ్రయిస్తున్నప్పుడు “ఈ మూడు లోకములలో ఇక పొందవలసినదేమీ లేదు” అను అవగాహన కలుగుతోంది. ఇక రాజ్యాలు పొందినవాడో, ఇంకా ఏదో కావాలనీ, పొందాలనీ ఆరాటపడుచూనే ఉన్నాడు కదా? “చిద్వస్తువు”నందే సమస్తమైన అనుభవములూ ఉన్నాయి. అట్టి చిద్వస్తువునే ఎందుకు అనుభవించరాదు?

ఎందుకంటే… సర్వవ్యాపకమై, స్వస్థ్యమై, నిర్వికారమై, స్వస్వరూపమై, సర్వదా వెలుగొందుచున్నట్టి ఆ చైతన్యమునందే సమస్త సుఖములు, అందుకు సాధనలు ప్రతిబింబిస్తున్నాయి.

తేజములోని ప్రకాశశక్తి… చంద్రునిలోని శీతలము… త్రిమూర్తులలోని జ్ఞాన - ఐశ్వర్య - విజయములు… ఇంద్రునిలోని త్రిలోకాధిపత్యము… ఇవన్నీ కూడా అఖండ చైతన్యము లోనివే. మనస్సు యొక్క శీఘ్రగతి, వాయువులోని బలము, అగ్నిలోని దాహకత్వము, జలములోని రుచి, తపస్సిద్ధులు ఇవన్నీ కూడా అనిర్దేశము, అప్రమేయము అగు చైతన్యమునందే ఒనగూడుచున్నాయి.

సూర్య ప్రకాశము అనేకచోట్లకు ఒకేసారి ప్రసరిస్తోంది కదా! వికల్పరహితమైనట్టి చిత్శక్తి వివిధ పదార్థములలో ఒకేసారి ప్రసరించి ఉండి, సర్వ అనుభవములకూ తానే కర్త - భోక్త అయి ఉంటోంది. తానే ఆయా పదార్థముల రూపములను పొందినదై తద్వారా ఈ సువిశాల ప్రపంచమును రచించుకొంటూ పోతోంది.

Page:442

అఖండమగు శుద్ధచైతన్యము త్రికాలములందలి అనేక పదార్థములతో కూడి అనేక కల్పనలను అనుభవిస్తోంది. కానీ, స్వస్వరూపమున అది పరిపూర్ణముగానే సర్వదా ఉండి ఉంటోంది. అనేకమైన అనుభవాలు ఉన్నాకూడా, సమత్వముచే పూర్ణరూపమున విరాజిల్లుతోంది.

పదార్థము లందు భేదముండవచ్చు గాక, అనుభవం ఒక్కటే కదా! ఒకే అనుభవం చేదు, తీపి, ప్రియము, ఆశ్చర్యము, అవసరము, అనవసరమూ వంటి అనేక కోణములను ప్రకటిస్తోంది. తేనెను, వేపరసమును రుచి చూస్తున్న అనుభవం ఒక్కటే. అదేవిధంగా… అద్వయమై, సత్తారూపమై ఉన్న ‘చిత్’ శక్తిచే జీవుల భావములు, పదార్థ జాలములు ఇదంతా ఏకకాలమున సమరూపమున అనుభవించబడుచున్నాయి. అనగా… సంకల్పవర్జితమైన, సూక్ష్మాతిసూక్ష్మమైన ఆ చితశక్తి సర్వ పదార్థము లందూ ఒకేసారి వ్యాపించియున్నది.

  1. వర్తమాన - భూత - భవిష్యత్తులను నిషేధించటం : దృశ్యము యొక్క అభావ స్థితి

ప్రహ్లాదుడు (అంతరంగంలో) : ఒకప్పుడు ఈ చిత్తము వేదవచనములు, ఆచార్యుల ఉపదేశములు విని బాగుగా విచారణ చేయటం చేత ‘దృశ్య సమూహం యొక్క అభావన’ అనుదానిని గుర్తెరుగుతోంది. అనగా దృశ్యం యొక్క ‘భావించకుండుట’ ను ఆశ్రయిస్తోంది. అందుకు ఫలితంగా శోక - మోహ జనితమైన దుఃఖమును పరిత్యజిస్తోంది. ఆ స్థితిలో ఈ సమస్తపదార్థములను చూస్తున్నప్పుడు, ‘ఇవన్నీ లేనివే కదా!’ అనబడు నిషేధము చేయుచున్నది. అప్పుడిక పరమార్థ - అద్వైత భావము కలిగి ఉంటోంది. అప్పటి చిత్తము “వస్తువులపైననో, విషయములపైననో, జీవులపైననో రాగము కలిగి యుండుట” అను దుష్టస్వభావమును విడచిపెట్టేస్తోంది.

అట్టి విషయరహిత చిత్తము గురించి చెప్పుకోవాలంటే… అది గడచిపోయిన కాలానికి చెందిన సర్వవిషయాలతో సంబంధము లేనిదగుచున్నది. అదియే వాసనారాహిత్యము కదా! … ఈ వర్తమాన కాలంలో ప్రాప్తిస్తూ, ఎదురుగా నిలచియున్న దృశ్యమును కూడా ఉపేక్షిస్తూ త్యజించి వేస్తోంది. “ఇది పొందాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది తొలగాలి” అను విధంగా రూపం కలిగి వుండే ‘భవిష్యత్తుతో సంబంధాలు’ కూడా వదలివేస్తోంది.

ఎక్కడ దృశ్యవ్యవహారం ఉంటుందో, అక్కడ మాత్రమే ‘భూత-వర్తమాన-భవిష్యత్తులు’ అనబడేవి ఉంటాయి. చిత్తంలో నుండి దృశ్యవ్యవహారమే తొలగితే, అట్టి చిత్తము కాలమును అధిగమించినది అగుచున్నది. అప్పుడు ఆ చిత్తమే సమత్వము తన స్వభావముగా గల ‘చితశక్తి’ అగుచున్నది.

చిత్ శక్తికి అన్యమైనదంటూ ఏదైనా ఉంటే, అదంతా భ్రమ యొక్క ప్రభావమే. అట్టి త్రికాలాలకూ అతీతమైన ’సమత్వము’చే నా చిత్తము నింపివేయబడి, అది శుద్ధచైతన్యమై అలరారు గాక!

Page:443

ఏదైతే అన్ని వేళలా ఉండి ఉండటం చేత నిత్యమై యున్నదో, అట్టిది భూతకాలమని, గాని, భవిష్యత్ కాలమని గాని, వర్తమాన కాలమని గాని చెప్పలేం కదా!

అనిత్యమైన విశేషాల కంటే సూక్ష్మమైనట్టి చితశక్తియే ఆదరణీయం. అయితే అట్టి నిత్యమగు చితశక్తి వాక్కునకు అవిషయమే అయినట్లున్నదే! “అవును. ఆత్మ అనబడేది ఎక్కడున్నది?” అను కొందరి “”ఆత్మ - అభావ సిద్ధాంతము’ కూడా, ఇంద్రియానుభవముల దృష్ట్యా జగత్ పదార్థముల దృష్ట్యా “ఔను కదా!” అను రీతిగా సార్థకమే అగుచున్నది.

త్రికాల విషయములన్నీ త్యజించిన చిత్తమే వేద వేదాంతాలచే ప్రతిపాదించబడే అత్యుత్తమ మైన విషయం

ఆత్మ : నాయొక్క - తదితరులందరి యొక్క స్వస్వరూపమునకు ఏమాత్రం వేరు కానట్టి విషయరహిత చిత్తమే, లేక చితశక్తియే ‘ఆత్మ’ అని కూడా చెప్పబడుతోంది.

బ్రహ్మము : : మహత్తరమైనదగుటచే అదియే బ్రహ్మము అని కూడా పిలువబడుతోంది. నాస్తి : ఇంద్రియములకు విషయమే కాదు గనుక “అది ఎక్కడున్నది?”…అని ప్రశ్నించ బడుతోంది. ‘లేదు’ అని వాదించబడుతోంది.

సర్వము: శబ్ద ప్రకృతి కంతటికీ అదే నిమిత్తము. కనుక, ’అది సర్వము’ అని ప్రతిపాదించ బడుతోంది.

మోక్షము: మరి సర్వము “తానే” అయి ఉన్నది కదా! ఆ పరమ చైతన్యమునందు దృశ్యమంతా శమించి పోవుచున్నది. కనుక “మోక్షము” అని కూడా అనబడుచున్నది. బంధరహితమగు ఆత్మను అంతటా - - అన్నిటా - అంతాగా సందర్శించటమే ‘మోక్షము’.

సంకల్పజాలము - కంట్లో పొరవంటి దోషము ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వస్తువులు కనిపించవు కదా! చైతన్యము కూడా ‘విషయముల గురించి సంకల్పించుట’ అను దోషము కలిగి ఉన్నప్పుడు జగత్తును సమ్యకృష్టితో వీక్షించజాలదు. ఒక పక్షి యొక్క ఒక కాలును తాడుతో కట్టి ఉంచితే ఆ పక్షి ఆకాశంలో ఎగురగలదా? “ఇది ఇష్టం, అది అయిష్టం” అనే మాలిన్యమును అడ్డు పెట్టుకున్న ఆ చిద్వస్తువు ఆకాశమును వ్యాప్తం చేయలేకపోతోంది.

అనగా… “నేను కాళ్ళు - చేతులు గల ఒక జీవుడను" అనే మరల మరల తలచుచున్నదిగాని, “నేను చిత్ చైతన్యమును” అని అనుకొని చిదాకాశములో విహరించలేకపోతోంది.

బోయవాని వలలోకి పక్షులు వచ్చి పడుచున్నట్లు, ఈ జీవులంతా తమయొక్క సంకల్పపరంపరల చేతనే మోహం అనే జాలంలో పడుచున్నారు. నా తండ్రి హిరణ్యకశిపుడు, నా తాతలు మొదలగు వారంతా తెలిసి తెలిసీ సంకల్ప జాలముచే పరివేష్టితులై చివరికి “అసంఖ్యాక విషయ సమూహాలు” అను వాటి యందే కూలిపోయారు. ఫలితం? దుఃఖరహితమగు ఆత్మపదవిని వారు గుర్తించనేలేదు. పాపం! దీనులగు నా పూర్వీకులనేకులు ఈ భూమిపై శరీరం పొంది, గర్వితులై కొద్దికాలం అటూ

Page:444

ఇటూ సంచరించి, చివరికి పొగలో పడ్డ పురుగులాగా వినాశనం పొందారే! ఏవేవో భోగములకొరకై ఆరాటపడి, అందుచేత కలిగే సుఖ దుఃఖములవెంట పరుగులు తీసే బదులు, వాళ్ళుకూడా తమకున్న ఓపికను, అవకాశములను ఆత్మతత్త్వము తెలుసుకోవడానికి ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది! దుర్బుద్ధితో, ‘దృశ్య’ లేక ‘సాంసారిక’ భావాభావములనే చీకటి పొరలలో చిక్కుకునేవారు కాదు కదా! చివరికి జరుగుచున్నదేమిటి? ఎన్నో చక్కటి ఉపాయాలు ఉండి, తెలివితేటలు ఉండి కూడా క్రిమికీటకముల వలె అన్న - పాన - మైథునముల కొరకై బ్రతికి దీనంగానే గతించిపోతున్నారే! తెలిసికూడా తెలియని వారై చరిస్తున్నారే!

ఎవనియందైతే సత్య - - జ్ఞాన ప్రభావం చేత ‘ఇష్టములు - అయిష్టములు’ అనే ప్రోద్బలము శమిస్తోందో, అట్టివాని జీవితమే సార్థకం.

స్వస్వరూపం సర్వదా కళంకరహితమే! ఎక్కడన్నా చంద్రునిలో ఉష్ణత్వముంటుందా? ఉండదు. శుద్ధమై, నిర్మలాకృతిచే వెలుగు స్వస్వరూపమగు చిద్వస్తువునందు కళంకము ఉండటం ఎట్లా సాధ్యం? అందుచేత, “నేను కళంకితుడను… స్వల్పుడను… పాపిని” అను మాటలు సరికాదు. అట్లు, “నేను అజ్ఞానిని - బద్ధుడను - - అల్పుడను”… అని మనోధర్మాలను ఆత్మపై ఆపాదించటం ఏఒక్కరికీ సరికానేకాదు.

ఓనా ఆత్మదేవా! నమస్కారం! - నిర్మలము, నిత్యము, నిఖిలము, నిరుపమానము అగు ఓ నా ఆత్మదేవా! స్వస్వరూపమా! నీవు అవిచ్ఛిన్నమగు చిదాత్మస్వరూపమవు. అట్టి నీకు నమస్కారం. అనగా, నాకే నా ఈ నమస్కారం.

హే ఆత్మ భగవాన్! ఒక మణి తానున్న చోట అన్ని వైపులా కాంతిని ప్రసరిస్తుంది కదా! నీవు ఉన్న చోట నలువైపులా జ్ఞానమును ప్రసరింపజేస్తావు. నీ గురించి ఇంతకాలానికి తెలుసుకున్నాను. ఎంత ఆశ్చర్యము! ఎంతో, ఎక్కడెక్కడో వెతికి వేసారి, చివరికి నిన్ను నా యందే సర్వదా ఉండి ఉన్నట్లుగా కనుగొన్నాను. నేనూ నీవు ఒక్కటే!

“నేను నిన్ను పొందాను” అనునది సరి అయిన వాక్యమే కాదు. "నిష్కళంక తేజోమయుడవైన నీవు నేనే అయి ఉన్నావు” అనునది ఇప్పుడు గ్రహిస్తున్నాను. మహామహిమాన్వితాశయముతో కూడిన నీ నిత్యోదయమును నేను గాంచుచున్నాను. ఓ ఆత్మదేవా! నిన్ను ఏదో ఏదోగా, ఎక్కడోగా, ఎప్పటికోగా అనుకోవటం చేత ఏర్పడిన సర్వ వికల్పజాలములనుండి విడివడి, ఇప్పటికి నాకు వాస్తవస్వరూపంగా లభిస్తున్నావు.

ఓ ఆత్మ భగవాన్! పరమార్థమున ఏదేదైతే నీ రూపమై ఉన్నదో అది అట్లే, యథాతథంగానే ఉండుగాక! “నేను అల్పుడను… స్వల్పుడను… జీవుడను" అని అనుకుంటూ, తద్వారా నిన్ను కించపరచినందుకు కాస్త క్షమించవయ్యా! ‘నేను’ అనునది లేదు. అంతటా తానే ఉన్నది. ఆ తానే నేను. “ప్రహ్లాదుడు” అను నామధేయముతో పిలువబడుచున్న హే ఆత్మనారాయణా! నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా! ‘జీవుడు’ అని దేనినైతే అంటున్నామో, అందుకు అభిన్నుడవు నీవు.

Page:445

నీవే, లేక, నేనే బ్రహ్మము కూడా! ఓ ప్రహ్లాదా! ఓ అనంతుడా! ఓ అంతర్యామి! “నేను…. నేను” అను శబ్దమునకు నిత్యార్థమై ఉన్నవాడా! నీవే శివమూ, శాంతమూ, అద్వైతమూ, ఆనందమూ కూడా. “సర్వాంతర్యామియగు నారాయణుడే సర్వదా సర్వరూపాలుగా వేంచేసి ఉన్నాడు” అని వేద-పురాణ-ఉపనిషత్తులు ఎలుగెత్తి గానం చేస్తున్నాయి కదా? అనగా? ”ఈ ప్రహ్లాదుడు’ - అను జీవాత్మ రూపంగా వేంచేసి ఉన్నది నారాయణుడే - అనియే కదా! కనుక నేను నారాయణుడనే! బ్రహ్మ మొదలైన వేదజ్ఞులు “వేదాంతవేద్యా!” అని ఎప్పుడూ సంబోధన చేస్తున్నది నా స్వరూపమునే! ’వేదము’ అనగా తెలియబడేది. ‘వేదాంతుడు’ అనగా తెలియబడేదంతా తెలుసు కుంటున్న ఆయన. ‘వేదాంత వేద్యుడు’ అనగా తెలుసుకుంటూ ఉంటున్నట్టి ఆయనను తెలుసుకుంటున్న వాడు. ఆ తెలుసుకునే ఆయనే నారాయణుడు. ఆయనే నేను.

ఏమీ తెలియని అజ్ఞానులు కూడా సర్వదా సర్వప్రదేశములందూ సంబోధించేది నన్నే కదా! సమస్త ఇంద్రియములకూ అధిష్టాన దేవతవై భాసించు ఓ పరమాత్మా! నీ కన్నా వేరుగా ‘నేను’ అనేదే లెనప్పుడు “ఏదో ప్రయత్నించి ఈ నేనుకు మోక్షం కల్పించాలి" అనునది ఎంతటి హాస్యజనిత వాక్యం! “నేను వేరు, ఆ నారాయణుడు వేరు” అని నీ కొరకై (నాతండ్రి వలె) ఎక్కడో వైకుంఠంలోనో, తదితర లోకాలలోనో వెతకటం ఎంతటి హాస్యాస్పదం? ఎంతటి మూర్ఖత్వం? ఎంతటి దురహంకారం?

నా రూపంగా నీకు నీవే, … ప్రహ్లాద రూపంతో నారాయణమూర్తి రూపానికి నమస్కరించు కోవటం నీ చమత్కార విశేషం, లేక నీ ప్రతీతి యొక్క ప్రభావం. ’ప్రహ్లాదుడు’ అను పేరుతో చెప్ప బడుచున్న నేనే పరమాత్మను. నారాయణుడే ఈ ప్రహ్లాద నామధేయ జీవుడు. (శివోజీవః)

నేనే భక్తుడను… నేనే భక్తిని… నేనే భక్తి లభ్యుడను. (జీవోశివః శివోజీవః)

పూర్ణ చంద్రుని లాగా అమృతతుల్యుడను. నిర్మలుడను. ఆనందైక రసమూర్తిని. నారాయణుడను. ఎందుకంటే…. ఓ శ్రీమన్నారాయణా! నీది కానిదేమున్నది?

నా సన్నిధానంలో నీవు, అతడు మొదలైనవి కల్పిత దృష్టిచే మాత్రమే ఉన్నాయి. హే ప్రకాశ స్వరూపా! ఆత్మ చైతన్య భగవాన్! నాకు అన్యమైనదంటూ ఏది ఎక్కడున్నది చెప్పండి? నా సొంతము, వాస్తవము, అఖండము అగు మీకిదే చేతులెత్తి మరల మరల మ్రొక్కుచున్నాను. జగద్రూపుడనై, సర్వ దృశ్యరూపుడనై మొక్కుచున్నాను.

  1. సుఖ విశ్రాంతి

పహ్లాదుడు (అంతరంగంలో) : ఇక్కడ ఎవరెవరైతే, ఏమేమైతే కనబడుచున్నాయో - ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూప బోధకమూ, ఏకమూ, వికారరహితమూ, అనుభవస్వరూపమూ, ఓంకార సంజ్ఞచే ఉద్దేశించబడినదీ అగు ఆత్మయేకాని, మరి వేరొకటేదీ కాదు. వీరు- వీరంతా ఆత్మస్వరూపులే! నేనూ ఆత్మస్వరూపుడనే! కనుక వీరంతా మమాత్మస్వరూపులే! అట్టి చైతన్యాత్మ యొక్క ప్రభావము ఈ

Page:446

బొమికలు - మాంసము - క్రొవ్వూ - రక్తము లందు వ్యాపించి ఉన్నప్పటికీ, వీటన్నిటి కంటే అది పరము అయి ఉన్నది. అంతరమున ఉంటూనే సూర్యుడు మొదలైన మహాప్రభావవంతములగు పదార్థ జాలమునంతా ప్రకాశింపజేస్తోంది. అది తలచుకొని స్వసత్తచే అగ్నిని ఉష్ణముగానూ, అమృతమును రసవంతముగానూ చేసివేసేస్తోంది.

నారాయణత్వం - ఒక రాజుగారు సర్వభోగాలను అనుభవిస్తున్నట్లు, ఆత్మయే ఈ ‘శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ’ భావములన్నీ పొందుతోంది.

అది నిష్క్రియం… కానీ గతివంతమంతా అదే. శాంతం… కానీ, సర్వవ్యవహారాలు నిర్వర్తిస్తోంది. నిర్లిప్తం… కానీ, కర్మలన్నీ ఆచరించేదీ అదే.

ఈ ఆత్మ ఇతఃపూర్వం ఎట్లా ఉన్నదో ఇప్పుడూ అట్లే ఉన్నది. ఇక ఎప్పటికీ అట్లాగే ఉండ బోతోంది. నేను ఆత్మనే అయిఉండి, అప్పుడప్పుడు ఏమఱచినంత మాత్రం చేత… నేను ఆత్మను కానిదెప్పుడు?

అజ్ఞాన ప్రహ్లాద రూపుడనై మమనారాయణ స్వరూపం ఏమరచి ఎన్నో జన్మపరంపర లందు సంచరించియున్నప్పటికీ, నారాయణత్వం నన్ను ఏమాత్రం ఏ క్షణంలోనూ ఏమరచనేలేదు. అది నన్ను వదలలేదు. వదలదు కూడా. అది ఇక్కడ ఎలా ఉన్నదో, ఇంకొకచోట కూడా అట్లే ఉన్నది. ‘జీవుడు’ అనబడు వేషధారణచే ఈ విహిత - నిషిద్ధ కర్మలను, కర్మఫలములను అనుభవిస్తూనే తాను మాత్రం సర్వవృత్తులకూ ఆవల, సమరూపమున సర్వదా సర్వమై వెలయుచున్నది. పరమార్థంగా చూస్తే దానికి రాక పోకలు లేవు. కానీ, కర్మానురూపంగా స్వయంగా ఆవిర్భవిస్తున్నది అదే. తన యొక్క సన్నిధాన మాత్రంచేత, బ్రహ్మదేవుని నుండి ఒక గడ్డిపురుగు వరకు (పిపీలికాది బ్రహ్మ పర్యంతం) గల భోక్త - భోగ్యములకు తానే ఆధారమై ఉంటూ, పదనాలుగు భువనములను క్రియావంతం చేస్తోంది. తాను ఎప్పుడూ నిష్క్రియమై ఉంటూనే, స్వసత్తచే వాయువుకంటే కూడా వేగంగా పయనిస్తూ ఉంటోంది. తనయందు తానే ఉండి ఒక రాయి కంటే ఎన్నో రెట్లు నిష్క్రియత్వము, ఆకాశము కంటే ఎన్నెన్నో రెట్లు నిర్లిప్తత్వము కలిగి ఉంటోంది.

జరామరణములను దాటి వేయటమెట్లా? వాయువు ఆకులను కదల్చుచున్నట్లే ఆత్మ సర్వ ప్రాణికోట్ల మనస్సులను చలింపచేస్తూ ఉంటోంది. సారథి గుఱ్ఱములను అదలించి నడిపిస్తున్నట్లు, నారాయణ స్వరూపమగు మమాత్మ ఈ ఇంద్రియ సమూహములన్నిటినీ నడిపిస్తోంది. అనేక దుర్దశలను తన యందు దాచుకొని ఉన్న ఈ ‘దేహము’ అనే గృహంలో అది ఏవేవో కార్యక్రమములను రచించుకుని ఉంటోంది. ఆత్మ సామ్రాట్టు ఈ శరీరాలలోని శబ్ద స్పర్శాది ఇంద్రియార్థములన్నీ చవిచూస్తున్నాడు.

మనం అట్టి పరమాత్మను కనుగొనటానికే సర్వదా అన్వేషణ సాగించాలి. పరితపించాలి! ధ్యానించాలి!… ఎందుకా?… ఆ ఆత్మ దేవుని ధ్యానించినప్పుడు మాత్రమే మనుజుడు జరా మరణములను దాటివేయగలడు.

Page:447

అత్యంత సులభం - ఓ సహజీవులారా! అట్టి ఆత్మదేవుని పొందటం చాలా దుర్లభమని అనుకుంటున్నారా? కానేకాదు సుమా! మీ జ్ఞాన చక్షువులు తెరవండి. ఆతడు అతిసులభంగా మీ ఎదురుగా లభిస్తాడు. స్మరణ మాత్రం చేత ఉత్తమ బంధువుగా మీకు వశుడు కాగలడు. సర్వప్రాణుల హృదయాంతరంగుడే నారాయణుడు. సర్వప్రాణికోట్ల హృదయకమలంలో సంచరించే ఆయన కంటే దగ్గరివాడెవ్వడూ లేడు. మీకు మీ సుగుణ దుర్గుణములు కూడా ఆయన కంటే దగ్గిరైనవి కావు. ఉచ్ఛ స్వరంతో కేవలం ప్రణవోచ్చారణతో స్మరించినంత మాత్రం చేతనే ఆ ఆత్మ స్వరూపము మీకు అభేదమై ప్రత్యక్షమగుచున్నది.

ఆత్మానారాయణో గతిః - ఒక డబ్బు ఉన్నవాడిని సేవించారనుకోండి… ఏమౌతోంది? అభిమానము, గర్వము కలిగించ గల కొంత ధనం లభించవచ్చేమో! అదే, ఆ ఆత్మభగవానునే సేవిస్తే….? మీలో ఉన్న అభిమాన గర్వాదులు తొలగిపోతాయి. ఆ ఆత్మదేవుడే మీరై ప్రకాశిస్తారు.

ఆయనని సేవించటమెట్లా? ఆయన సర్వసంపద సహితుడు కాబట్టి, మీ సంపదలు ఆయనకెందుకు? … అందుచేత మీ భావనచే ఆయనను సేవించండి.

ఆయన ఎక్కడున్నాడు?… పుష్పాలలో సుగంధం, నువ్వులలో నూనె, రసమయ పదార్థాలలో రుచి ఉన్నట్లు ఆత్మభగవానుడు సర్వదేహము లందు వ్యాపించి ఉన్నాడు. మనందరి హృదయాలలోనూ ఆయన ఎల్లప్పుడూ ఉండి ఉన్నప్పటికీ, మనం అవిచారణవశంచేత చేతనారూపమగు ఆత్మ భగవానుని తెలుసుకోలేకపోతున్నాము. చాలా కాలం క్రితం ఎప్పుడో ఎక్కడో చూచి మరచిన బంధువు వలె మనం ఆయనను పలకరించకుండా ఈ ప్రాపంచిక కల్పనలలో మునిగితేలుతున్నాం. ఇక చాలు. ఇక నుండి ఆత్మానారాయణుని అనుక్షణ సందర్శనమునకై మనమంతా ఉపక్రమించెదము గాక!

ప్రయోజనం? - తత్త్వవిచారణచే పరమేశ్వరుడగు ఆ ఆత్మ ఎరుగబడిందా, అప్పుడు ఎంతో ఇష్టమైనవాడు కనిపించినట్లుగా జీవునకు పరమానందం ఉదయించగలదు. ఆత్మదృష్టిచే శరీర సంబంధమాత్రములైన జరామరణముల వ్యవహారం విచ్ఛిన్నమై పోతుంది. జీవుడు తనకు తానే తెచ్చిపెట్టుకొన్న ‘ఆశలు’ అనే త్రాళ్లు ముక్కలు ముక్కలుగా త్రెంచివేయబడతాయి. కామ-క్రోధమోహాది శత్రుభటులు వెనక్కు చూడకుండా తుఱ్ఱుమని పారిపోతారు. వారి తిరోగమనం చూచి మనం చిరునవ్వు చిందిస్తాం. ఇక తృష్ణ, అసంతృప్తులు మనస్సు ముందు నిలువలేక మటుమాయ మవుతాయి.

అస్మిన్దృష్టే జగద్దృష్టం శ్రుతేస్మిన్సకలం శ్రుతమ్ |

స్పృష్టేచాస్మిఇజ గత్సృష్టం స్థితేస్మిన్సంస్థితం జగత్ || (శ్లో 19, సర్గ 35)

పరమాత్మను దర్శిస్తే బ్రహ్మాండమంతా దర్శించినట్లే. పరమాత్మ కథనం వింటే సమస్తమూ శ్రవణం చేసినట్లే. పరమాత్మను స్పృశిస్తే జగత్తంతా స్పృశించినట్లే. ఆతని ఉనికియే జగత్తుకు ఉనికి. దృక్స్వరూపుడగు ద్రష్ట ఉండి ఉండటమే ఆతని ఉనికికి సాక్ష్యం, దృష్టాంతం కూడా!

Page:448

  1. ఇంద్రియాతీతజాగృత్

పహ్లాదుడు (అంతరంగంలో) : ఇంద్రియాలన్నీ నిదురిస్తున్నప్పుడు కూడా మేల్కొని ఉండేదేది? ఆత్మయే. ఈ ఇంద్రియములు అవివేకులపై ప్రహారాలు సలుపుచుండగా, ఆత్మదేవుడు జీవులకు రక్షకుడై ప్రశాంతనిర్వైషమ్యాలను అందించుచున్నాడు.

అంతటా విహరిస్తున్నది ఆత్మయే!- జీవరూపమున అటూ ఇటూ, పైనా - క్రిందా సంచరిస్తున్నది ఆత్మయే. ఈ భోగములన్నీ అనుభవిస్తున్నది అదే. శరీరమునకు వస్త్రము అలంకరణ మగుచున్నట్లే, ఈ దృశ్యవ్యవహారమంతా ఆయనకు అలంకారప్రాయం. అది శాంతంగా స్వవశంగా ఉంటూనే చెఱుకుగడలో రసంలాగా అనేక విషయాలను స్వీకరిస్తూ, త్యజిస్తూ తాను సర్వదేహములందు వ్యాపించి ఉన్నది. రాత్రింబగళ్ళు లాగా అనేక విషయాలను స్వీకరిస్తూ త్యజిస్తూ తాను మాత్రం ఎప్పటిలాగే అధిష్ఠానసత్తగా ఉంటోంది.

సర్వవ్యాపకము - ఆకాశమునందలి శూన్యము, వాయువునందలి నిరంతర చలనము, అగ్ని యందు ప్రకాశము, పదార్థములందలి రసము (లేక రుచి), అగ్నిలోని ఉష్ణము, చంద్రునిలోని శీతలము, బ్రహ్మాండములందలి సత్తారూపము ఆ ఆత్మయే! ఆత్మానారాయణుడే!

మసి యందు నలుపు, మంచు నందు చల్లదనము, పుష్పములో సువాసన ఉన్నట్లే సర్వదేహము లందు దేహి వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా అయితే కాలము, సత్త సర్వత్రా వ్యాపించి ఉన్నాయో, ఏ విధంగా ఈ భూమి అన్ని వైపులా అనుగతమై ఉన్నదో - అదే రీతిగా ఆత్మ ఈ కళ్ళు మొదలైన అన్ని ఇంద్రియాలలో వ్యాపించి ఉండి, అన్నిటినీ ప్రకాశింపజేయుచున్నది. దేవాదిదేవుడగు ఆత్మ బ్రహ్మాది దేవతలకు కూడా ఉనికి స్థానమైయున్నది.

నేను ఆ ఆత్మను : ఆత్మానారాయణుడను! - కేవలశుద్ధ స్వరూపుడను. ఆకాశమునకు ధూళి కణములతో ఏం సంబంధం? కమలము, జలము ఒక దానితో మరొకటి కలువవు కదా! ఆత్మయే స్వరూపముగా గల నాతో కలువగలిగింది ఏదీ లేదు.

ఈ జగత్తులో ఏర్పడే కల్పనలతో నాకేం పని? జీవుని భయకంపనలతో ఒక శిలకేం సంబంధం? నాకు ఎట్టి అన్యపదార్థములతో ఏమాత్రం సంబంధమే లేదు. సుఖ దుఃఖములు ఈ దేహమునకు కలుగవచ్చు. కలుగకపోవచ్చు. సొరకాయ నీటిలో పడినంత మాత్రం చేత ఆ సొరకాయలోని ఆకాశమునకు వచ్చే హాని ఏముంటుంది.

సుఖ దుఃఖముల వలన నాకు వచ్చే హాని ఏమీ లేదు. ఎవ్వడైనా ఒకదారం తీసుకొని దీపము యొక్క ప్రకాశమును బంధించగలడా? సర్వపదార్థములకు అతీతుడను, ఆత్మయే స్వరూప స్వభావములుగా గలవాడను అగు నన్ను భావాభావములు గాని, ఇంద్రియములు గాని, కామ క్రోధాదులు గాని బంధించలేవు. వాటితోనాకు సంబంధమే లేదు.

Page:449

బంధము, ముక్తి మొదలైనవి మనస్సుకు మాత్రమే. నాకు కాదు.

ఆకాశమును ఎవరు బంధించగలరు? మనస్సును హత్య ఎవరు చేయగలరు? ఈ దేహం వంద ముక్కలైనప్పటికీ దేహరహితమైన ఆత్మ ఖండితం ఎట్లా అవుతుంది? కుండ పగలవచ్చు, లేక కుండకు చిల్లి పడవచ్చు, కుండకు, ఆ కుండలోని ఆకాశమునకు సంబంధమే లేదు కదా! ఆకాశమునకు

ఏమి హాని?

“అదృశ్య పిశాచము” అన దగ్గ ఈ మనస్సే వ్యర్థంగా సర్వరూపములను గ్రహిస్తోంది. మనస్సు ఉంది కనుకనే, మనస్సును అనుసరించే దృశ్యజాలమంతా ఏర్పడి ఉంటోంది.

అయితే మనస్సు స్వయంగా ఏదీ చెయ్యలేదు. దానిచేత అన్నీ చేయిస్తున్నది నేనే. అయితే, జడ మాత్రమైన మనస్సు యొక్క కోతిగంతులు ఉపశమించాలంటే ‘ఆత్మజ్ఞానం’ ఒక్కటే మందు. అనేక సుఖ దుఃఖకరములగు వాసనలతో ఆజ్ఞాన దశలను కష్టపడి మరీ ఆశ్రయిస్తున్న మనస్సుకు ఆత్మజ్ఞానం చేత అపరిమితమగు సుఖవిశ్రాంతులు లభిస్తున్నాయి.

ఏమి విచిత్రం! ఇంతకాలం చూచిందీ, అనుభవించిందీ, గ్రహించిందీ, సంకటములన్నీ పొందిందీ మరొకటైనట్టిది. అది మనస్సే గాని, నేను కాదు. “నేను దీనికి భోక్తను అనగా ’మనస్సు’ అనబడేది ఉపయోగబడే ఒక ఉపకరణము. నేను ఆ ఉపకరణమును ఉపయోగించువాడనై ప్రత్యేకంగా ఉన్నాను” - అను అధ్యాస అజ్ఞానముచేతనే కలుగుతోంది.

ఇతఃపూర్వపు ‘అజ్ఞానం’ అనే ఇంద్రజాలమునకు రచయిత ఎవరు?… నేనే సుమా! చైతన్యము నందు ప్రతిబింబిస్తున్న ప్రకృతిని, చైతన్యమును వేఱుచేసి చూచిన మరుక్షణం ఈ మనస్సు, దేహము ఇవన్నీ నా భావనలుగానే తెలియవస్తున్నాయి.

ఓ సమస్త సహజీవులారా! మీరంతా మమాత్మస్వరూపులే! నేను మీ ఆత్మస్వరూపుడనే!

సంబంధమేమి లేనట్టిది - దోషదృష్టిచేతనే అజ్ఞానమనే తెర ఉండి ఉంటోంది. శుద్ధాత్మకు ఏ క్షణంలోనూ ఎట్టి హాని లేదు. అందుచేత భోగములు పొందాలని గాని, వదలాలని గాని నాకు కోర్కె ఉండ వలసిన అవసరమేదీ లేదు. జీవించాలి, మరణించాలి - అనే వాంఛలతో కూడా నాకు పని లేదు. ఏది ఎట్లైనా రానీ… పోనీ, నాకు అపేక్ష అక్కర్లేదు. ఉపేక్ష కూడా అఖ్కర్లేదు. ఈ దేహంలో వివిధ వాసనలు ఉండవచ్చు… తొలగవచ్చు. నాకు వాటితో గాని, వాటికి నాతో గాని సంబంధమే లేదు.

ఓయీ! అజ్ఞానమా! - కేవలం పరిశీలించక పోవటం చేత ఇంతకాలం నీ చేతిలో ఓడిపోతూ వచ్చాను. అనేకసార్లు నాలోని జ్ఞానరత్నాలను అపహరించి నన్ను అపహాస్యం పాలుచేశావు. అనేక మార్లు పెత్తనం చెలాయించావు. అయితే ఏం? సర్వాంతర్యామియగు నారాయణునిచే “ఆత్మ గురించి విచారణకు ఉపక్రమించు” అని బోధించబడ్డాను కదా! ఒకసారి నేను విచారణకు పూనుకోగానే, ఎక్కడికో పారిపోవుచున్నావే! ఏదీ! నీ వాదోపవాదములేమిటో చెప్పు! ఆత్మానుభూతితో సరితూగే బ్రహ్మానందాన్ని నీవు ఇంద్రియార్దాలలో చూపగలవా?

Page:450

పరమాత్మయగు విష్ణు భగవానుని అనుగ్రహంచేత కలిగిన విచారణజ్ఞానముచే “అజ్ఞానము” అనే ఇంటి దొంగను కనిపెట్టేశాను. ‘పరబ్రహ్మజ్ఞానము’ అనే మంత్ర సహాయంతో అహంకారపిశాచాన్ని పారద్రోలివేశాను. వివేకధనం సంపాదించి ‘దురాశ’ అనే అజ్ఞాన దారిద్ర్యాన్ని వదలించుకున్నాను. అందుచేత నేనిపుడు పరమేశ్వరుడనై వెలయుచున్నాను.

  1. ఆత్మ సూర్యోదయం - అహంకార, మమకార అస్తమయం పహ్లాదుడు (అంతరంగంలో) : నేనిపుడు తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను. చూడవలసినదంతా చూచాను. దేనిని పొందిన తరువాత ఇక పొందవలసినదేమీ ఉండదో - అట్టి ఉత్తమ పదార్థమగు ఆత్మజ్ఞానాన్ని పొందాను. ఇది ఒక పరమార్థమైన ప్రదేశం. ఇక్కడ అనర్థములు గాని, విషయసర్పములు గాని, మోహపూర్వకమైన ఆశలు గాని లేవు. తృష్ణ రజోగుణం అనే ధూళి, బూజు ఇక్కడ కనిపించవు. ‘ఉపశాంతి’ అనే దిశగా వీస్తున్న ఆనందవీచికలచే ఆహ్లాదం వెల్లివిరిస్తోంది. ఈ పారమార్థిక ప్రదేశం ఎంతటి మహత్తరమైనది! స్తుతి, ప్రణామం, ప్రార్థన, నియమము, శ్రవణముల చేత విష్ణు భగవానుని సేవించుట చేతనే ఈ ఆత్మదేవుడు నాకు ప్రత్యక్షమై లభించాడు. ఇంతా అయిన తరువాత, నేను గాంచినది మరెవ్వరినో కాదు.

నా ఆత్మ స్వరూపమే నా కోరికపై ఇట్లా విష్ణురూపముగా ప్రాప్తించింది.

అహంకారమునకు ఆవల ఉన్నట్టి అట్టి విష్ణు భగవానుని ఆత్మ చైతన్యము నా స్మృతిపథంలోనే లభించింది. ఆయన అనుగ్రహంచేత అహంకారమునకు స్థానమే లేనట్టి సనాతన బ్రహ్మము (లేక) ఆత్మ నాచే దర్శించబడుచున్నది.

ఓనా అహంకారమా! - - సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలచే నడిపించబడే నిన్ను ఇప్పుడు దాటి వేస్తున్నాను. ఇంతకాలం నీవు చేస్తున్నదేమిటి? ఇంద్రియములను ఎఱగావేసి నన్ను వశం చేసుకున్నావు. "తృష్ణ, కామము, దుఃఖములు, వాసనా సమూహములు, ఉత్పత్తి-పతనములు, ఊర్ధ్వ-అధోలోకములు, రకరకాల ఉపాధులు, ఆశాపాశములు … ఇవన్నీ కల్పించి, వీటికి సంబంధించిన అనేక కార్యక్రమములలోకి ప్రేరేపించింది నీవు కాదా?

నాకు శత్రువువై నా ఆత్మనే నీవు ఆక్రమించావే? అల్పసామర్ధ్యము, పిరికితనము కలవాడు పిశాచములచే బాధించబడినట్లు నేను ఈ సంసారమున చిక్కి నీకు ఎంతోకాలం బందీనయ్యాను. నేను ఆత్మ గురించి సంప్రదిస్తున్న మరుక్షణం నీవు నీ ఉనికినే కోల్పోతున్నావు.

విజ్ఞానదృష్టిని పొందినట్టి నేనిప్పుడు నిన్నొక చిన్న ప్రశ్న వేస్తున్నాను… నీవు అసలు ఉన్నావా? ఉంటే, ఎక్కడున్నావు?…

చీకట్లో దయ్యంలా స్ఫురించే నీవు వివేకోదయంచే ఆత్మ ప్రబుద్ధం కాగా, ఎటో అదృశ్యమై పోయావు. దీపం వెలిగించగానే చీకటి ఎక్కడికి పారిపోతుందో, నీవుకూడా అక్కడికే పారిపోయావు.

Page:451

ప్రకాశమానమగు దీపం వెలిగినట్లు ఇప్పుడు నా హృదయంలో వివేకము వెలగగానే అహంకారము యొక్క ఛాయ కూడా లేకుండా పోతోంది.

ఓ ఆత్మ భగవానుడా! స్వస్వరూపుడా! సూర్యోదయం కాగానే దొంగలు వెనక్కి చూడకుండా పారిపోతారు కదా! ఆత్మజ్ఞానోదయం (లేక) ఆత్మసాక్షాత్కారం అయిందా - అహంకారం మొదలైనవన్నీ పలాయనం చిత్తగించవలసిందే. చూచారా! మీ దర్శనం కానంతవరకూ కఠోరుడగు అహంకార యక్షుడు ఎంతగా భ్రమింపజేశాడో… మాటలతో చెప్పలేను. పిశాచాలులాగా మిథ్యారూపంగా ఆవిర్భవించిన అహంకార - మమకారాలు తొలగిపోగా కొండచిలువ తొలగించబడిన వృక్షంలాగా నేను స్వస్థుడనయ్యాను. ఆశలన్నీ శమించటం చేత, గొప్ప వర్షం పడిన తరువాత దావాగ్నిలాగా, అంతఃకరణం ప్రశాంతపడుతోంది. సుఖంగా ఇదే జగత్తులో ఉంటున్నాను.

ఇక అహంకారం లేదు. మోహం లేదు. దుఃఖం లేదు. దురాశ లేదు. మనోవ్యధ లేదు.

ఎక్కడైనా ఆకాశంలో పూతోటలు ఉంటాయా? లేదు. ఆత్మ యందు ద్వితీయమైనదేదీ ఉండటానికే వీలు లేదు. చిత్తము నందు అహంకారము అనే పిచ్చి ఉండటం చేతనే ఇంతకాలం జ్ఞానం శోభించలేదు. దుమ్ముకొట్టి ఉన్న గుడ్డకు ఎంత రంగు వేస్తే మాత్రం ఏమి అంటుతుంది? అహంకారం, తృష్ణ నిండి ఉన్న మనస్సు జ్ఞాన సమాచారం విననే వినలేదు. ఒకవేళ వినినా ప్రయోజనం లభించదు.

హే ఆత్మ భగవాన్! మీ సమక్షము అతిప్రసన్నము, అహంకారరహితము, ఆనందసాగరము, సాక్షీమాత్ర స్వరూపము అని సుజ్ఞానులు ప్రవచిస్తూ ఉన్నారు. తమకు వందనములు. ఎండిన తటాకంలో మొసళ్ళు చచ్చిపోతున్నట్లు, భ్రమలు తొలగిన మనస్సుతో అహంకార - మమకారాలు నిస్తేజమైపోతాయి. ఆత్మజ్ఞానము యొక్క ప్రభావంచేత చిత్తము స్వయంగా శమిస్తోంది.

అహంకారరహిత సువిశాల ఆత్మతత్త్వమా! ఏమి నీ మహిమ! ఆశ - చింతలు లేని దానవై సర్వమునకు సాక్షీమాత్రంగా, ఆనందమే స్వభావముగా కలిగి యున్నావు. బుద్ధిలో ప్రతిబింబించే చైతన్యము నీవే. ఈ “నేను-నీవు, అతడు-ఆమె-ఇది-అది” అనబడే సర్వ జీవుల హృదయము లందు, మనస్సు లందు సర్వదా ప్రకాశిస్తున్నట్టి నిన్ను ఏమని వర్ణించాలి? వేద వేదాంగాలే నిన్ను వర్ణించాలంటే, వాటికి మాటలు చాలకపోతున్నాయి. నా పంచ ప్రాణాలు, పది ఇంద్రియాలు, మనస్సు బుద్ది నాతో సహా ఈ సర్వజీవులు - ఈ కళలన్నీ నీ యొక్క కల్పితరూపములు. ఎందుకంటే నీవు అన్నివేళలా “నిరవయవము, నిత్యోదితము, అమృత రూపము” అయి ఉన్నావు. నీకు నీవే పరిపూర్ణమై ఉంటూ సత్-శాంత ప్రభావముచే హృదయాంధకారమునకు దీపపు కాంతివగుచున్నావు. సర్వవ్యాపివైనప్పటికీ, అదృశ్యరూపమున ఉన్నదానిపై ఒప్పుచున్నావు. (లేక)

ఈ పంచ ప్రాణములు, దశ ఇంద్రియములు, ఈ మనస్సు, బుద్ధి, ఈ కనబడే ప్రహ్లాదాదిగా సర్వజీవులు నా యొక్క కల్పిత రూపములు.

పరమాత్మ (ఆవల ఉన్న ఆత్మస్వరూపం = పరమ్ + ఆత్మః) నా నిజస్వరూపం.

Page:452

నేను నిజరూపంగా నిరవయవమును. నిత్యోదితుడను. అమృత స్వరూపుడను.

ఓ చిద్రూప భగవాన్! ఓం నమోనారాయణాయ! సర్వవృత్తులకు అతీతులై, ఏతత్సమయంలోనే మీరు పరమప్రేమను ప్రకటించుచున్నారు. సర్వపదార్థముల స్వభావమునకు ఆధారభూతులై ఉన్నారు. బుద్ధికి ఆవల ప్రకాశిస్తూ ఉండే మిమ్ములనే అందరూ అనేక పేర్లతో ఆరాధిస్తున్నారు…. అర్చిస్తున్నారు. అట్టి మీకు ఇప్పుడు నమస్కరిస్తున్నాను. మీపట్ల నా నమస్కారం తెంపు లేని జలధారవలె సదా, సర్వదా కొనసాగుగాక! నేనే మీరు! మీరే నేను!

  1. మనస్సుతో మనోజయం

పహ్లాదుడు (అంతరంగంలో) : అమ్మయ్యా! ఇప్పటికి కదా, నేను కామాగ్నిచే తప్తమై, మీదకు వస్తున్న మనస్సు అనే ఖడ్గమును - శమాది గుణములతో కూడినదైన మరొక ఖడ్గముతో ఛేదించి వేయగలుగుచున్నాను!

సహజీవులను నారాయణునికి అన్యంగా దర్శించటమే ఈ ఇంద్రియముల బహిర్ముఖత్వం. సర్వే సర్వత్రా నారాయణ సందర్శనమే (అనన్యదర్శనమే) అంతర్ముఖత్వం.

అట్లు, బహిర్ముఖంగా పోతున్న ఇంద్రియాలను ఇంద్రియములతోనే నిగ్రహించి ఆత్మోన్ముఖం చేస్తున్నాను. శుద్ధ మనస్సుచే మలినమనస్సును జయించి ఆత్మాహంకారముచే, ఈ శరీరాహంకారాన్ని మర్దించి నిశ్చింతగా ఆత్మోన్ముఖుడనగుచున్నాను. త్యజించ వలసినదంతా త్యజించగా ఇక త్యజించుటకు అశక్యమై శేషించే ‘చిత్’ మాత్రమునందు స్థితి పొంది సర్వోత్తముడనై భాసించుచున్నాను.

శ్రద్ధచే అశ్రద్ధను అడగింపజేస్తున్నాను. విచారణచే అవిచారణను ప్రక్కకు నెట్టుచున్నాను. ‘నేను ఎఱుగుచున్నవాడను’ అనబడే జ్ఞాతృత్వాభిమానమును రహితంచేస్తూ కేవల జ్ఞప్తి మాత్రుడనై వెలుగొందుచున్నాను. సత్యాత్మ స్వరూపమగు నా స్వస్వరూపమా! ఆత్మదేవా! తమకు నమస్కారమయ్యా! అంతటా సర్వదా వేంచేసి ఉన్న స్వామీ! ఓం నమో భగవతే వాసుదేవాయ!

మనసామనసి చ్ఛిన్నే నిరహంకారతాం గతే |

భావేన గలితే భావే స్వచ్ఛస్తిష్ఠామి కేవలః || (శ్లో 77, సర్గ 35)

మనస్సు మనస్సుచే ఛేదించబడగా అప్పుడు అహంకారం ‘నిర్మూలమై. ‘దేహా–హమ్’ భావం ప్రక్కకు నెట్టబడి ’బ్రహ్మా-హమ్’ భావము అధిరోహింపబడ, ‘నేనే’ కేవల చిద్రూపుడనై ఉన్నాను. ఇక ఈ శరీరం విషయానికి వస్తే, ఇది భావన, అహంకారం, మనస్సు అనునవేవీ లేకుండా, తాను కోరునదంటూ ఏమీ లేకుండా, కేవలం ప్రాణక్రియామాత్రంచే శుద్ధాత్మయందు నెలకొనియున్నది.

సర్వులందు ఒకేరీతిగా ఉండే ఓ ఆత్మదేవా! (సమం సర్వేషు బూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్!). నీవు నిన్ను ప్రేమించే భక్తులను భోగైశ్వర్యముల సంప్రదానముచే అనుగ్రహిస్తూ ఉంటావు. విశ్వేశ్వరులగు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల నిజస్వరూపము నీవే. పరమశాంతియుతమగు మీ

Page:453

యందు నాకు ఇప్పటికి నిరతిశయానందము, పరమ విశ్రాంతి లభించుచున్నది. మోహబేతాళుడు, అహంకార రాక్షసుడు, దురాశాపిశాచం నీ ఊసుఎత్తగానే ఇక నాకు కనబడకుండా అదృశ్యమైనారు. దురహంకారం, తృష్ణ తోకముడుచుటచే నేను సంతాపరహితుడనైనాను. “నేను కొందరికంటే అధికుడను కదా” - అను రూపంగల స్వాభిమానం నడ్డి విరగగొట్టబడింది. దురాశలకు మూలమైన అసంఖ్యాకమైన వాసనలు సౌభాగ్యవశంచేత క్షయించాయి. ఏం ఆశ్చర్యం! మిథ్యారూపమైన దురహంకారమును ఆశ్రయించినప్పటి నేను ఎవడను? ఎవడైననూ, ఇప్పుడు మాత్రం ఆత్మగానే శేషించుచున్నాను. ప్రత్యక్షముగా నిరతిశయానంద రూపుడనైనాను. అపరిచ్ఛిన్న బ్రహ్మాకార వృత్తియుతుడనగు నేను హాయిగా దృశ్యమునందు ఉంటూనే విముక్తుడనైనాను.

ఈ స్వాత్మానుభవం శాస్త్రముల, జ్ఞానులు వాక్యముల ప్రమాణమునకు సరిపోవుచూ, మననమాత్రముచే స్వతఃసిద్ధంగా పొందబడినదగుచున్నది. మనస్సు సర్వమును వదలివేసి, కేవలం అఖండము, అప్రమేయమునందు సమాధినిష్ఠ పొందుగాక. భగవంతుడగు ఆత్మయందే సర్వము నియోగించుచున్నాను.

ఇప్పటి నా మనస్సు - మనస్సు విషయ శూన్యమౌతోంది. మనన వివర్జితమూ, ఈషణా రహితము అగుచున్నది. అహంకారమమకార భ్రమలన్నీ పరిత్యజించింది. రాగరహితమై భోగేచ్ఛను విసర్జించింది. కట్టెలన్నీ బయటకు లాగబడగా శేషించే అగ్నిగుండంలాగా శమించింది. అహో! ఒకప్పుడు ఈ మనస్సు ఏవేవో సంఘటనలకు ఎంతగా ఆక్రోశించేది… ఎంతగా పరితపించేది! ఒకే సమయంలో అనేక రకాలుగా, అనేక సమయాలలో ఒక రకంగా ఉంటూ, అనేక ఉపాధుల రాక పోకలకు వశమైపోయి సహింపనలవికాకుండా ఉండేది. అట్టి ఆపదలన్నీ ఇప్పుడు తొలగి

పోయాయి.

అద్వయ చిద్రూపము - పూర్ణాత్మ ఇప్పుడు అనుభవమగుచున్నది. కేవల సాక్షి చైతన్య స్వరూపమగు నాపట్ల జడత్వము గాని, జనన మరణాదులుగాని ఉండటానికి అవకాశమే లేదని ఇప్పుడు గ్రహించాను.

  1. ఆత్మస్తవనం

ప్రహ్లాదుడు ఏకాంతముగా ఆత్మతత్త్వమును ఉద్దేశించి, మరల ఇట్లు స్తవనం చేయసాగాడు. ప్రహ్లాదుడు : చాలా రోజులు గడచిపోయిన తరువాత ఇప్పటికి నిరతిశయానందమగు ఆత్మ స్మృతికి వచ్చింది. హే ఆత్మదేవా! అదృష్టవశంచేత మీ పునఃదర్శనమయింది. మహాత్ముడవగు మీకు నమస్కారం. మిమ్ములను చూస్తూ, నమస్కరిస్తూ, చిరాలింగనమొనర్చుచున్నాను. కడివెడు పాలలో చిన్న పాత్రతో నీరు పోసినప్పుడు ఆ నీరు తన రూపమును పోగొట్టుకొని పాలతో ఏకమగుచున్నదే! నా మనస్సు కూడా మిమ్ములను సమీపించి మీతో ఏకత్వము పొందుచున్నది. నేను - మీరు

Page:454

ఒక్కటే అగుచున్నాము. హే ఆత్మ భగవాన్! మీరు కాకుండా ఈ ముల్లోకాలలో పరమప్రియమైనవాడు ఇంకెవ్వడూ ఎవ్వరికీ ఎక్కడా లేనే లేడు. మిమ్ములను పొందనంతకాలం రక్షణ ధ్వంసన - ఆగమన - నిష్క్రమణ - మొదలైన క్రియా వ్యవహారములు జరుగుచున్నాయి. మిమ్ములను పొందిన మాహాత్మ్యముచే నేను ఇంద్రియములు లేనివాడనైనాను. ఈ ఇంద్రియములు, ఇవి చూస్తున్న విషయములు ఎక్కడ ఉంటున్నాయో, ఎక్కడికి పోవుచున్నాయో ఏమోగాని, నేను మాత్రం ఇంద్రియాతీతుడను, నిష్క్రియుడను అగుచున్నాను.

ఓ ఆత్మదేవా! మీరు మీ సత్త వలన ఈ విశ్వమంతా వ్యాపించి, సర్వత్రా అగుపించుచున్నారు. ఇక్కడి నుండి మీరు మరెక్కడికి పోగలుగుతారు! అసలు మీరు లేనిచోటెక్కడ? అందుచేత, “వెళ్ళుట - వచ్చుట” అనునదంతా మీకు సంబంధించినది కాదగును.

ఒకప్పుడు నీవు జన్మరహితులని, నేను జన్మసహితుడనని భ్రమచేత అనుకుంటూ ఉండేవాడను. ఇప్పుడు మనిద్దరి మధ్య ఆ భేదంకూడా లేనేలేదని తెలిసిపోతోంది.

ఇప్పుడు నాకు నీవు సమీపస్థుడ వయ్యావు. ఎంతటి సమీపస్థుడవంటే … నాకు నీవుగాని, నీకు నేను గానీ వేరుగా లేనేలేము. ఓ హితుడా! అదృష్టవశంచేత నేడు నీ సాక్షాత్కారం పొందాను.

స్వామి! అఖండమగు ఆత్మదేవాదిదేవా! నీవు కృతకృత్యుడవు ! జగత్కర్త, భర్త నీవే! స్వామి! నీకు నమస్కారం! నీ యందున్న నాకు, నా యందున్న నీకు నమస్కారం. ఈ ప్రహ్లాదోపాధి యందు నీవే ఉండి సర్వాత్మకమగు నీకు నీవే నమస్కరించుకోవటం ఈ చమత్కారం. ఈ సంసారంలో ఆకు లోని ఈనెలాగా అంతర్లీనంగా ప్రసరించి ఉన్నది నీవే.

ఓ నిత్యనిర్మలాత్మా! చక్రహస్తా! అర్ధచంద్రధరా! విబుధనాథా! పద్మజా! బ్రహ్మదేవా! విష్ణూ! శంకరా! ఇంద్రుడా! పదేపదే ప్రణామములు స్వామి!

వ్యవహార దృష్టికి మన ఇద్దరి మధ్య కనబడే భేదమంతా నీటికి అలలకు గల భేదమే! అది అసత్య కల్పనయే. అనంత విచిత్ర రూపిణి, సదసద్రూపిణియగు మాయ వలన మనిద్దరి మధ్య అసత్యం కల్పనగా విజృంభిస్తోంది. నీవు లీలావినోది కదా! మాయ అనబడేది నీ కల్పనయే. ద్రష్ట - స్రష్ట - సృష్టి కూడా నీవే! నాయందు, సర్వులయందు, సర్వముయందు వ్యాపించియున్నది నీవే! నా యందు నేనుగా ఉండి కామాది దోషాలచే అసత్పథంతో తన పూర్ణభావాన్ని కోల్పోయి ఇంతకాలంగా నీవే సంచరిస్తున్నావు. జన్మ జన్మాంతరాలుగా బహువిధ దుఃఖములను, వ్యవహారములను చవి చూచావు. ఇంతలోనే క్రమక్రమముగా వివేకానుకూలమగు అనేక దృష్టాంతములను చూచావు.

వ్యవహారదృష్టి ఉన్నంత వరకు నిన్ను ఎవరు పొందగలరు? హే పరాత్పరా! నీవు, ఈ మట్టి - కొయ్య - పాషాణాలతో కూడిన తక్కిన జగత్తంతా మిథ్యయే. నిన్ను పొందితే సర్వమూ పొందినట్లే. పొందకపోతే ఏమి పొందనట్లే! నిన్ను పొందినవారికి ఇక కోర్కెలుండవు. కోర్కెలు ఈడేరటమనగా అదియే! ప్రభూ! నేను నిన్ను సర్వదా పొందియే ఉన్నాననీ, నీకూ నాకూ అంతరమే లేదనీ గ్రహించాను.

Page:455

అట్లు గ్రహించుటచే నిన్ను "పొందినవాడను, కనుగొనినవాడను” - అయ్యాను. నీ యథార్థ రూపం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. మోహము తొలగించి నిన్ను నేను సర్వత్రా చూచుచుండగా ఇక కళ్ళతోనో, స్పర్శతోనో ఒకటి రెండు చోట్ల మాత్రమే చూడటమేమిటి? ఇంద్రియము లందు, అంతరంగ వృత్తులందు వ్యాపించి అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నట్టి నీవు అనుభూతికి గోచరం కానిదెప్పుడు! నిన్ను కొత్తగా పొందవలసినదిగా ఎట్లా అనడం?

నీవు నాలోనే ఉన్నావు. నిన్ను మరెక్కడో వెతకవలసిన పనిలేదు. ఒక శబ్దమును విన్నంత మాత్రం చేత, ఆ శబ్దశక్తిని ప్రకాశింపజేస్తున్నట్టి నీవు నాకు దూరస్థుడవు అవుతావు? తీపి - - చేదు - కారములను ఆస్వాదిస్తూ నీవు ఏ క్షణంలోను అప్రత్యక్షమైనవాడవు కాదు. నేను ఒక పుష్పసువాసన ఆఘ్రాణిస్తున్నప్పుడు ఈ చేతిలోను, ముక్కులోను ఉండి, ప్రీతిచే అనుభవ రూపంగా తారసపడే నీవు ఎల్లప్పుడు చేతిలోని పండు వలె (కరతలామలకం వలె) తారసపడియే ఉన్నావు.

వేద వేదాంతములచే, తర్కము, మీమాంస మొదలైన శాస్త్రములచే, పురాణములచే వర్ణించి చెప్పబడుచున్న సనాతనమగు ఆత్మను ఒక్కసారి తెలుసుకున్నామా - ఇక మరుచుట అనేది ఉండదు. హే ఆత్మదేవా! నిర్మల స్వరూపులగు నిన్ను గాంచిన తరువాత ఇక ఇంతఃపూర్వపు రుచికరములైన భోగములు ఇప్పుడు లెక్కకు వచ్చుటయే లేదు. నీ యొక్క నిర్మల ప్రభావము చేతనే సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. ఈ పర్వతములను భారవంతముగా చేసినది మీరే. ఆకాశమును ఆక్రమించి వాయువును సంచరింప జేస్తున్నది మీరే! నమస్తే వాయుః! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి! భూమి సర్వమునకు ఆధారమగుచుండగా, ఆ భూమికి మీరే ఆధారం.

అమ్మయ్య! నేడు నాకు, గల భేదం అదృష్టవశం చేతనే తొలగినది. నీవే నేను… నేనే నీవు. మనిద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. జలమునకు, తరంగమునకు భేదమేమున్నది? కొండకు - కొండరాయికి భేదమెక్కడిది? కుండలో నింపిన తటాక జలానికి - తటాకంలోని జలానికి భేదం ఏముంటుంది? ఈ ‘నేను - నీవు’ మొదలైన శబ్దములన్నీ నీ మాహత్మ్యముచే ప్రకటనమగుచూ, నిన్నే తెలియపరుచుచున్నాయి. సమానాధికములు ఏమాత్రము లేనట్టి కార్యకారణ ఉపాధికారకములైన ‘నేను - నీవు’ అను శబ్ద ద్వయమునకు ఇదే నమస్కారం. ఇక ఉపశమించమని ఆ శబ్ద ద్వయమునకు నా విన్నపం. నిత్యసత్యమగు అభేదమే పరిఢవిల్లును గాక!

  1. నాకు … నేనే నమస్కారం!

అనంతుడు, నిరహంకారుడు, రూపహీనుడు, అత్యంత సమస్వరూపుడు అగు నాకు నేనే నమస్కరించుచున్నాను. సత్యము, సాక్షీభూతము, నిరాకారము, అపరిచ్చిన్నము అగు ఆత్మ దేవుడు నా యొక్క నిర్మల స్వరూప, స్వభావములై వెలయుచున్నాడు. కొత్తగా ఇంకేం కావాలి?

Page:456

ఈ మనస్సు ఏవేవో కారణాలు కల్పించుకొని ఎందుకోసమో క్షోభించుచుండవచ్చు గాక! ఇంద్రియ వృత్తులు స్ఫురించుచున్నాయా? అయితే కాని! ప్రాణ - ఆపానములు ప్రవహింపజేయు ఏదో శక్తి విజృంభిస్తోందా? విజృంభించనీ. చర్మ - మాంస - బొమికలతో కూడిన ఈ భౌతిక శరీరము మనస్సు అనే సారథిచే ఆశాపాశములనే త్రాళ్ళ సహాయంతో సంచరింపజేయబడుచున్నదా! ఏది ఏమైనా కానీ! కాకపోనీ! వీటితో నాకు సంబంధమే లేదు. ఈ శరీరం ఇట్లాగే అనేక రోజులు ఉండనీ. లేక, ఎప్పుడో ఒకప్పుడు నేలకూలనీ! ఈ సర్వ, కార్యక్రమములకు మూలము, కారణభూతము అగు ఆత్మను గ్రహించాను. ఇంక నాకు ఏమి భయం? ఇంకేమి కావాలి? వచ్చేదేమున్నది? పోయేదేమున్నది?

చాలాకాలం తరువాత నేను నాయందుగల ఆత్మదేవుని చూస్తున్నాను. ఈ జగత్తు ఎట్లాగైతే కల్పాంత సమయంలో లయమైపోతోందో, అట్లాగే నా భ్రాంతి కూడా ఇప్పుడే అంతమొందింది. ఈ సంసారములో తిరిగి తిరిగి అలసి, సొలసిపోయి ఉన్న నాకు ఇప్పుడు పరమ విశ్రాంతి అయిన ఆత్మభగవానుడుండే స్థానములో ఆతిథ్యం లభించింది. ఓ ఆత్మదేవా! నీవు సర్వమునకు అతీతుడవు. సర్వుల స్వస్వరూపము నీవే. అట్టి నీ యొక్క స్వరూపమును చేతులెత్తి చూపించుచున్న వేదాది శాస్త్రములకు, గురువులకు నమస్కారం. భోగ్యవస్తువులన్నీ ప్రకాశింపజేస్తూకూడా, నీవు వాటి దోషములచే ఏమాత్రం స్పృశించబడవు కదా! అభినివేశ శూన్యము, ఉదాసీనము, సర్వసమము అగు సాక్షీభావంగా నీవు వెలుగొందుచున్నారని గుర్తిస్తున్నాను.

హే పరమాత్మా! పువ్వులందు సువాసన ఉన్నట్లు, తోలుతిత్తిలో గాలి ఉన్నట్లు నువ్వులలో నూనె ఉన్నట్లు నీవు సర్వజీవులలో వెలుగొందుచున్నావు. నీవు నిరహంకారుడవై కూడా రక్షిస్తున్నావు - శిక్షిస్తున్నావు - దానమొనర్చుచున్నావు - స్వీకరిస్తున్నావు - - పోరాడుచున్నావు - - పరిగెడుచున్నావు. మరి, నీ మాయ అంతటిది. నీ "ప్రోద్బలం - సంకల్పం - సహకారం - - పాల్గొనడం” చేతనే సృష్టికాలంలో నేను జీవ స్వరూపంతో అనేక ఉపాధులలో ప్రవేశించడం, వాటిని పాలించడం జరిగింది. ఇంతలోనే నీ సంకల్పమును అనుసరించి ప్రళయ కాలంలో ఈ జగత్తును, ఉపాధులను ఉపసంహరించి ఉపరతిని పొందటం జరుగుతోంది.

ఒక చిన్న మఱివిత్తనంలో ఒక పెద్ద మఱివృక్షము యొక్క స్వభావమంతా దాగి ఉన్నది కదా! అత్యంత సూక్ష్మరూపుడవగు నీయందు ఈ సంసారమండలమంతా త్రికాలములందూ ఇమిడి ఉన్నది. నీవే భ్రాంతి కల్పితములగు వివిధ పదార్థముల ఆకృతిని వహించి ప్రకటించుకొనుచున్నావు. అనేక భావ పరంపరలన్నీ బయల్వెడలుచున్నది నీనుండే కదా! చివరికి, అఖండానందమయ స్వరూపము ఆవిర్భవిస్తున్నది నీ నుండే.

Page:457

  1. ఓ స్వస్వరూపాత్మ దేవా!

ప్రహ్లాద నామధేయా! ఓ నా స్వస్వరూపాత్మదేవా! "నేనెవ్వడను? ఎక్కడున్నాను?” - అనే విషయాలు నీవు మరలమరల యోచించవలసినదిగా నా మనవి. పూర్వమోహదశలను చూచి నీవు నవ్వటమే జరుగుతుంది. స్వచ్ఛంగా నవ్వుకుంటూనే ఈ క్రోధ, మాన, కాపురుష, క్రూరత్వములను సర్వదా పరిత్యజించుము. నీచ జనులకు మాత్రమే ఉచితమైన మాన, మద, గర్వములను మహనీయులు దగ్గరకు రానిస్తారా? ఒకప్పుడు ‘చింతలు’ అనే అగ్నిలో దగ్ధమగుచూ కార్యములందూ, పీడలందూ, ఆరంభములందూ సంక్షుభితమయ్యే అజ్ఞానదశలు తొలగిపోయినాయి సుమా! ఆ దుర్దశలన్నీ కూడా విజ్ఞాన వికాసముచే భస్మం చేయబడ్డాయి. ఇప్పుడు నీవు దేహనగరమునకు రాజై ‘పూర్ణమనోరథులు’ అయ్యావు.

ఓ స్వస్వరూపస్వామి! ఆకాశమును ఎవడైనా తన పిడికిలిలో బంధించగలడా? అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించే ఆయా సుఖదుఃఖ సంఘటనలచే నీవు బంధింపబడలేరు. అవి నిన్ను తాకనైనా లేవు. ఈ ఇంద్రియములు, చిత్తము, భోగములు - వీటన్నిటికంటే సమున్నతులగు నీవు నీకే సర్వదా చెందియున్నట్టి ఆత్మసామ్రాజ్యాన్ని అధిరోహించావు.

అపారామ్బరపాన్ధస్త్వ మజస్రా స్తమయోదయః । అవభాసకరో నిత్యం బహిరన్తశ్చ భాస్కరః ॥ (శ్లో 46, సర్గ 36)

అనంత ఆకాశంలో బాటసారియగు ఆ సూర్య భగవానుని వలె మీరు స్వయంప్రకాశ స్వరూపుడవై, జ్ఞానదృష్టికి “నిత్యోదిత ఆత్మ ప్రకాశము”గానూ, అజ్ఞాన దృష్టికి "ప్రహ్లాదుడు అనబడే ఒక వ్యక్తి” గానూ తెలియవస్తున్నావు.

స్వతహాగా నిష్క్రియుడవు, పరమశాంత, నిర్లిప్త అప్రమేయ స్వరూపుడనగు నీముందు నీ సేవ కొరకై ఈ ఇంద్రియములు, ఇంద్రియార్థములు నిలచి ఉన్నాయి. కాముకునికై కామిని తళుకు బెళుకులు చూపునట్లు ఈ ఎదురుగా ఉన్న రూపాదులన్నీ ‘దృష్టి’ అను సేవకురాలిచే కనులలో ఉండే దర్శనశక్తికి ఉపాహారంగా కొనిరాబడుచున్నాయి. సర్వదా ప్రశాంతంగా అచ్యుతులై ఉంటూనే ఈ ’దృశ్యము’ను స్వీకరించండిగాని, తాదాత్మ్యము చెందటమా? కానేకాదు. అవసరం లేదు.

ఓ ప్రహ్లాదాత్మదేవా! నీవు మహనీయుడవు. ఎందుకంటే, ఒకవైపు - ఈ శరీరమధ్యంలో ఉండి సాక్షిస్వరూపులై ప్రాణవాయువుల సంచారము వీక్షిస్తూ ఈ ఇంద్రియములద్వారా ఈ జగత్తును పొందుచున్నావు. మరొకవైపు మార్పు చేర్పులు ఉండనట్టి బ్రాహ్మీతత్త్వమునకు నిత్యసాక్షులై వెలుగొందు చున్నారు. ఈ ‘దేహము’అనే పుష్పము యొక్క సౌరభము నీవే. ఇందలి అమృతరసము నీవే. నీవు ఈ దేహమును విడచినారా - ఇక ఆపై ఇది ఎవరికి ప్రేమాస్పదమౌతుంది? ఈ ప్రహ్లాద ఉపాధిలోనే కాదు. సర్వప్రాణులందు, అణువణువునా నిండియున్న స్నేహరసం నీవే. ‘శరీరము’ అనే కట్టెయందు అణిగియున్న నిప్పువలె నీవు ఉండనే ఉన్నావు. సర్వోత్తమాస్వాదమగు అమృత రూపుడవు నీవు. సమస్త తేజములను ప్రకాశింపజేసేది నీవే.

Page:458

ఈ పదార్థములన్నిటి ఉనికినీ గ్రహించేది నీవు. అంతర్-హృదయస్తులగు ఆత్మదేవా! ఈ దృశ్యమంతా నీ సంప్రదర్శనమే! నీయొక్క ప్రభావంచేతనే ఈ కళ్ళు మొదలైన ఇంద్రియములు తమ పనులను తాము చేయగలుగుతున్నాయి. వాయువు యొక్క చలనమునకు, చిత్తము యొక్క చాంచల్యమునకు, బుద్ధి యొక్క ప్రకాశ, అప్రకాశములకు మూలకారణం నీవే.

నీవు ఉపసంహరించుటచేతనే ఈ వాక్కు ‘మరణము - మూర్ఛ - నిద్ర’ లందు విలీనమై పోవుచున్నది. ఇంతఃపూర్వపు శరీరములను, ఇప్పటి ఈ శరీరమును, ఇక ముందు ఏర్పడబోయే శరీరమును దీపమువలె ప్రజ్వరిలింపజేసేది నీవే. ఒకే బంగారము నుండి అనేక ఆభరణములు ఉత్పన్నమగుచున్నట్లు, నీ నుండియే ఈ వివిధ సంసారపదార్థములు, సంబంధములు, సంఘటనలు ఉత్పన్నమగుచున్నాయి. నీకు నీవే, స్వవిలాసముగా ‘నేను - నీవు అతడు’ అను మాయతో గూడిన శబ్దములన్నీ వ్యవహారింపజేయుచూ, స్పందించుచున్నావు. నీవే, ఈ ప్రహ్లాద నామధేయ వ్యష్టిగా ఉంటూనే, ఇంతలోనే ఏతత్సమయంలోనే అసంఖ్యాక ప్రాణుల ఆకార, ఆచారాదుల రూపంగా పరిలక్షింపబడుచున్నారు. వేరువేరు అగ్ని శిఖలు వేరువేరు అగ్ని ఖండములని అజ్ఞాన దృష్టికి అనిపించవచ్చునేమోగాని, అగ్ని సర్వదా ఒక్కటే కదా! నీ సృష్టియందు నీవే నీకంటే వేరైన ఆకారము వలె అగుపడుచున్నావు. సర్వాకారములూ నీకు అభిన్నమైనవే.

ఈ బ్రహ్మాండమంతా నిండియున్న అవిచ్ఛిన్న స్వరూపుడవు నీవే. చెట్టుకు వేలాది పూలు పూస్తున్నట్లు ఈ భూతజాలమంతా నీయందే ఉత్పత్తి అయి పరిభ్రమిస్తోంది. నీ వలననే ఈ విధంగా అభివ్యక్తమయ్యే సర్వ పదార్థములూ సృష్టి రూపమున ప్రకాశమొందుచున్నాయి.

చూస్తున్నది మిూరే …. చూడబడుచున్నది మీరే! - ఓ నా స్వస్వరూపాత్మ స్వరూపా! ప్రహ్లాద నామధేయా! ఒక గుడ్డివాడు ఒక అందమైన యువతి రూపలావణ్యములను చూడగలడా? లేడు. నీవే లేకపోతే, ఇక ఈ అందమైన వస్తుసంపద ఉండి కూడా లేనట్టే. ఎందుకంటే, వస్తువులకు కార్య

కారణ శక్తిని ప్రసాదించేది నీవే కదా! నీవే లేకపోతే ఈ శరీరము, ఈ జగద్వివిశేషములు నిస్తేజము, అనుభవరహితము అగు కొయ్య, మట్టితో సమానమే. వెలుగు ఉండుట చేతనే ఒక గొప్పకొండ యొక్క ఔన్నత్యాన్ని చూడగలుగుతాం. వెలుగు లేకపోతే, అంతా చీకటిమయమే కదా!

ఓ ఆత్మేశ్వరా! నిన్ను పొందిన తరువాత ఇక సర్వ సుఖ దుఃఖాలు నశించిపోతాయి. సూర్యుడు ఉదయించగానే చీకటి, మినుకుమినుకుమనే నక్షత్రాలు, మంచు - అన్నీ లీనమైపోతాయి కదా! నిజానికి నీ అంగీకారం చేతనే సుఖ దుఃఖములు ఏర్పడి ఉండగలుగుచున్నాయి. ఎంతటి చిత్రమో

చూచారా?

  1. నీవు దర్శించుచుండుటచేతనే సుఖ దుఃఖములు స్థితిని పొంది ఉంటున్నాయి.

  2. నీవు కాదంటే, అవి ఇక ఉండవు.

  3. దీపం తొలగించగానే దీపపు కాంతి చీకట్లో విలీనమై పోవునట్లు, నిన్ను దర్శించగానే

సుఖ దుఃఖములన్నీ, స్వయంగా సంపూర్ణముగా లయించగలవు.

Page:459

ఏవి నీ సత్తచే ఏర్పడి ఉంటున్నాయో, అవి నీ అద్వితీయ దర్శనముచే ‘లేనివి’ అగుచున్నాయి. నిన్ను ఆశ్రయించి ఉన్నవి నిన్ను ఆశ్రయించుటచే మాత్రమే జయింప బడుచున్నాయి.

అయినా ఒక్కమాట! వాస్తవానికి పరమానంద స్వరూపుడవగు నీ యందు అత్యంత భంగురమైన సుఖ దుఃఖము లెక్కడ! ఒక నిమిషములో ఒక లక్షవభాగము ఎప్పుడు పుడుతోందో, ఎప్పుడు నశిస్తోందో ఎవ్వరమైనా గమనిస్తున్నామా? అట్లాగే నిన్ను ఎరిగినట్టి జ్ఞాని దృష్టిలో ఆ సుఖదుఃఖాలు ఎప్పుడు ఏర్పడుచున్నాయో ఎప్పుడు తొలగుచున్నాయో గమనించుటకు అర్హమే అగుటలేదు. అయినా, ఈ సుఖదుఃఖములు నీ అనుగ్రహం చేత పుడుతూ, నశిస్తూండటమేమిటి? …అవి నిన్నే భ్రమింప జేయమేమిటి?

జగత్తు, ఉత్పత్తి, లయములు - ఈ జగత్తు నీవు గాంచుటచే ఉత్పన్నమగుచు, నిన్ను గాంచుటచే విలీనమై పోవుచున్నది. దృష్టాంతానికి ఒక స్వప్న ద్రష్ట తన స్వప్నంలో చూచే వస్తుజాల మంతా స్వప్నం అంతమైనప్పుడు ఎటు పోతున్నాయి? అట్లాగే ఆత్మజ్ఞానము ప్రాప్తించగానే ఈ జగత్తు ఎటు పోవుచున్నది? “లేనిదే” అగుచున్నది. “ఈ జగత్తు ఏ క్షణమందూ లేదు” - అని తెలిసిపోతోంది. ఏ క్షణంలోనూ ఏమాత్రం లేనట్టి ఒక వస్తువు ఒక కార్యమెట్లా నిర్వర్తిస్తుంది? ఎవరైనా కొన్ని జల తరంగములను ఒక మాలగా చుట్టి తన మెడలో ధరించగలరా? “సుఖ - దుఃఖములు లేవు…” అను ఆత్మజ్ఞాన సంబంధమైన ఎఱుకచే, ఇవి పుట్టిన మరుక్షణం చచ్చుచున్నాయి. వివేకులు మిమ్ములను దర్శించుటచే సర్వస్థితులందూ ఏకరీతిగా ఉండగలుగుచున్నారు.

ఓ అనంతరూపా! అవివేకులకు మీరు ఎన్ని రకములుగా తోచుచున్నారో చెప్పనలవికాదు. వాస్తవానికి మీకు ఇహ పరములనేవి లేవు. మీరు అవయవరహితులు! నిరహంకారీ! నిరాకారీ! సర్వకర్తా! ఓ ఈశ్వరా! సర్వేశ్వరా! ప్రహ్లాదనామధేయుడగు నా స్వరూపమా! సర్వస్వరూపా! ఆత్మభగవాన్! నీ ఆకారము బ్రహ్మాండము కంటే ఎంతో ఎంతో విస్తృతమైనది! పరమశాంతిపరాయణా! నీకు దిగ్విజయమగు గాక! నిఖిల ఆగమములకు నీవు అతీతము! ఆగమములకు (వేదములకు) ఆధారుడవు! జయ జయ! పరమాత్మా! జాతా! (పుట్టుచున్నది మీరే!) అజాతా! (పుట్టుక లేని) క్షతా! (నశించుచున్నది) అక్షతా! (నాశనము లేని) భావా! అభావా! జయా! అజయా!… నీకు సర్వదా జయమగుగాక!

ఇప్పుడు నేను శాంతుడనైనాను. యదార్థమేమిటో తెలుసుకున్నాను. జయించాను. ఇందులకే ఇంతకాలం జీవించాను. నాకూ - నీకూ కూడా నానమస్కారం!

నా వాస్తవ స్వరూపము తత్ స్వరూపము, - నిరామయమూ, స్వతఃసిద్ధమూ, స్వసంసిద్ధమూ రాగరంజనా రహిత స్వరూపమూ అయిఉన్నది. ఇక నాకు బంధమేమిటి? విపత్తెక్కడ? సంపద ఎక్కడ? నాకు జననమరణము లెక్కడివి? నేను క్రొత్తగా నిరామయమగు నిత్యశాంతి పొందటమేమిటి? …నేను సర్వదా శాంతి స్వరూపుడనే అయి ఉన్నాను.

Page:460

  1. దానవులు - - దీనత్వము

ఈ విధంగా చింతనచేస్తున్న ప్రహ్లాదుడు క్రమంగా నిర్దోషము - నిర్ద్వంద్వము - నిర్వికల్పము అగు స్వస్వరూప సామ్రాజ్యములో ప్రవేశించాడు. సమాధిని అవధరించాడు. ఒక చిత్రపటంలోని బొమ్మలాగా, శిల్పిచే మలచబడిన శిలావిగ్రహంలాగా ఉండిపోయాడు. అట్టి నిర్వికల్ప సమాధిలో సుస్థిరుడైనాడు.

అక్కడి అసుర మంత్రివరేణ్యులు, తదితరులు ప్రహ్లాదుని సమాధి నుండి ప్రబోధింపజేయాలని ఎంతగానో ప్రయత్నించారు. కాని ఏమి లాభం? అతడు మాత్రం రాతియందు చెక్కబడిన సూర్యుని వలె ప్రశాంతభావంతో ఏకదృష్టితో ఉండిపోయాడు. ఏ పిలుపు కాని, ఏ దృష్టి కాని అతని దరి చేరటమేలేదు. … ఆ విధంగా కొన్నిరోజులు గడచిపోయాయి.

అంతరంగంలో ఆతడు ఏకము - అఖండము - అప్రమేయం - నిర్విషయము - నిరవధికము అగు బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. ఆతని అనుభవస్థితి వాక్యాలకు అందేది కాదు ఒక చెంబు సహాయంతో సముద్రజలం ఎంతటిదో ఏమని విశదపరచగలం? అయితే, బయటకు మాత్రం చూచేవారికి “ఈతడు నిరానంద స్వరూపమగు మృత్యువును పొందినాడా ఏమి?” - అన్నట్లుగా ఉన్నది. ఇక పాతాళ సామ్రాజ్యములో అసుర జాతి యొక్క జీవనవిధానం కొన్ని మార్పులు చెందసాగింది. ఎందుకంటే వాళ్ళను పాలించే నాయకుడు లేడు. మొన్నమొన్నటిదాకా దేవతలకు సింహస్వప్నమై, విష్ణుద్వేషి అయి, బలపరాక్రమవంతుడై పరిపాలించిన హిరణ్యకశిపుడు నృసింహస్వామి చేతిలో హతమైపోయాడు. నేడు ఈ ప్రహ్లాదుడు సమాధిని అవధరించి రాక్షసనాయకత్వానికి సుదూరముగా, అంతరంగ వ్యవస్థితుడై స్వస్వరూప ఏకాంత పారవస్యము నందు ఉండిపోయాడు. ఎవరెంత ప్రబోధం చేసినా ఆతని పట్ల అది చెవిటివాడి ముందు శంఖారావమగుచున్నది.

రాజు లేకపోతే అల్పయోచనలుగలవారి కార్యక్రమం ఉదృతమై అంతా అరాచకమే అవుతుందిగదా! పాతాళపురంలో అరాచకం ప్రారంభమైంది. “పెద్ద చేప చిన్నచేపను మ్రింగటం" - అనే మత్సన్యాయం తాండవించింది. బలవంతులు బలహీనులను పీడించసాగారు. ప్రజలు నిస్సహాయులై అనేక పీడలు ఎదుర్కొనవలసి వచ్చేది. సామాన్య ప్రజలు దిక్కేలేక నిస్సహాయులు

కాసాగారు.

ఏకరసస్వరూపము పొందియున్న ప్రహ్లాదునకు ఈ వివరాలన్నీ తెలియనే తెలియవు. ఆతడు సుషుప్తిలోని వ్యక్తిలాగా సమాధి తత్పరుడయ్యే ఉన్నాడుకదా! ఇక బలవంతులగు దైత్యులు విచక్షణా శూన్యులై ఆవేశ కావేశాదులతో తమలోతామే కలహించుకోసాగారు. గుణవంతులు గుణహీనులచే హింసించ బడసాగారు. బలహీనుల సొత్తు బలవంతులు లాక్కోవటం, జనులు మాన మర్యాదలు వదలి ప్రవర్తించటం, అధర్మం, అబలల, పీడితుల గొంతుకలు వినిపించుకోకపోవటం - - ఇవన్నీ

Page:461

అంగీకార యోగ్యం కాసాగాయి. అంతఃపురంలో కట్టుబాట్లు భ్రష్టమైనాయి. అనేకులు అధర్మపరుల దుశ్చర్యలకు తమ ధన, జనములను పోగొట్టుకొని, చెప్పుకొనుటకు దారిలేక, ఇక చేసేది లేక, చింతామగ్నులై, బిచ్చగాండ్రై చరించసాగారు.

t

ఎప్పుడూ లేనిది, హఠాత్తుగా ఆంతరంగికంగా రాక్షస జాతిలో ఇట్టి పరిణామాలు రావడం చూచి అక్కడి పెద్దలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. మరొక వైపు దేవతాబాలకులు వచ్చి అసురులను పరాభవిస్తుంటే, వాళ్ళలో వాళ్ళకు ఐకమత్యం లేక, అవమానాలు దిగమింగుకోవలసి వచ్చింది. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకొనుచూ, ఉద్విగ్నతతో దీనులు కాసాగారు.

  1. సృష్టికే ఎసరు

ఆ విధంగా అనేక రోజులు గడచిపోయాయి. నిఖిలజగత్కళ్యాణకారకుడు, క్షీరసముద్ర నివాసి, శత్రుమర్దనుడు అగు విష్ణుమూర్తి ఒక రోజు తన నిద్రాముద్రను విడిచారు. నెమ్మదిగా కళ్ళు తెరిచారు. పాతాళం, తద్ద్వారా దేవలోకం, తదితర లోకాలూ అస్తవ్యస్తంగా ఉండటం గమనించారు. తన జ్ఞాననేత్రములచే సర్వజగత్తు యొక్క గతి - దుర్గతులను పరిశీలిస్తూ ఇట్లు తనలో యోచించ

సాగారు.

శ్రీమహా విష్ణువు (మనస్సులో) : ఆహా! పరమభక్తుడగు ప్రహ్లాదుడు బ్రహ్మపదమున విశ్రమించియున్న ఈ సమయంలో పాతాళ లోకంలో నాయకుడు లేకుండాపోయాడు. ఇక దానవులు తమను తామే హింసించుకొంటూ క్రమంగా తమకు తామే బలహీనులగుచున్నారు. రాక్షసులు లేకపోతే, అప్పుడు పర్యవసానమేమిటి? దేవతలలో “మేము విజయము పొందాలి” అనే పట్టుదల ఉండదు. పట్టుదల ఉండని చోట ఉత్తమ శక్తి, యుక్తులు బలహీనపడిపోతాయి. క్రమంగా దేవతల ఉనికికే ఎసరు వస్తుంది. దేవతలు శాంతించి, వారంతా ద్వంద్వరహితమైన బ్రహ్మమును పొందుతారు. అభిమాన రహితులై స్వర్గసుఖములను త్యజించివేస్తారు.

దేవతలు ఆ విధంగా నాశనమవటం జరిగితే అప్పుడేమౌతుంది? క్రమంగా భూలోకంలో యజ్ఞ యాగాది క్రియలు కూడా నశిస్తాయి. ఇష్ట భోగములనూ, తదితర ప్రయోజనములను ప్రసాదించే దేవతలు లేకపోతే ఇక కర్మలకు ప్రయోజనములు ఏం ఉంటాయి? అందుచేత “కర్మ ఉత్కృష్టత" అను కార్యక్రమముతో కూడిన మానవులు బద్ధకస్థులౌతారు. క్రియలు నశిస్తే కర్మభూమి అగు భూలోకం నశించిపోతుంది. భూలోకమే నశిస్తే ఇక ఏమున్నది? ఈ సంసారమే నశించ బోవుచున్నదే!

అరే! భలేచిక్కు వచ్చిపడిందే. ప్రళయం తరువాత నేను చేసిన ఈ సృష్టి అకాలంగా, అర్ధంతరంగా లుప్తమైపోతోందికదా! నాచే కల్పితమైన ఈ విశాలజగత్తు నశిస్తే నా ఈ లీలయే భంగమై పోగలదు.

Page:462

అప్పుడు నేను కూడా “చంద్ర - నక్షత్ర - ఆకాశ” శూన్యమగు నా ఈ శరీరమును విలీనమొనర్చుకొని తత్ పదమున వెలయవలసివస్తుందే! అది అకాలమగు విపరీతపరిణామం అవటం చేత ఉచితం కాదు, శ్రేయము కాదు. ఎందుకంటే, ఈ జీవులు ప్రకృతిలో లయం పొందినప్పటికీ, మూలాజ్ఞానం ఉండనే ఉంటుంది. కాబట్టి ‘మరల జన్మించాలి’ అనే తపన మిగిలియే ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడియే ఉండవలసిన అగత్యమున్నది. అందుచేత ఈ దానవులు తమతమ పరాక్రమములతో జీవించి ఉండటం అవసరమే. రాక్షసులు ఉంటే, దేవతలు కూడా ఉంటారు. అప్పుడు తపస్సు, యజ్ఞము మొదలైన క్రియావ్యవహారాలకు కూడా చోటు ఉంటుంది. సంసారము అనబడునది ఉంటుంది. అప్పుడు సృష్టికి సంబంధించిన అసందర్భపూర్వకమైన రసాభాస ఉండదు. కనుక నేనిప్పుడు పాతాళలోకం వెళ్లి ప్రహ్లాదుని ‘రాజ్యపాలన’ అను కర్తవ్యంలో నియమించటమే సముచితం. ఒకవేళ ప్రహ్లాదుని బదులుగా మరొకరిని రాజ్యపాలనయందు నియమిద్దామంటే, అది సమంజసం కాదు. ఎందుకంటే ఈ ప్రహ్లాదదేహము అత్యంత పవిత్రమైనది. ఈతడు ఇక మరల జన్మించడు. వర్తమానానికి ఈతడు కొంతకాలం రాజ్యపాలన నిర్వర్తించవలసిన ‘యోగం’ ఉన్నది. అటుతరువాత కూడా కల్పాంతమువరకు ఈతడు ఈ సృష్టికే ఒక ఆభరణమై జీవించటమే ఈశ్వరనియతి.

నియతికి ఏమాత్రం భంగం కాకూడదు కదా! అందుచేత నేనిప్పుడు ప్రహ్లాదుని ప్రబోధింప జేస్తాను. ఈతడు తనయొక్క జీవన్ముక్త స్థితిలో నిర్విఘ్నంగా ఉంటూనే, రాజ్యపాలన చేయుచుండును గాక! అప్పుడే దేవతలూ ఉంటారు… అసురులూ ఉంటారు. ద్వంద్వము ఉంటుంది. అప్పుడు మాత్రమే నా లీల చెక్కు చెదరకుండా ఉంటుంది. వాస్తవానికి ఈ జగత్తు యొక్క ఉదయము - క్షయమూ, ఈ రెండూ నాకు ఒక్కటే అయినప్పటికీ నేను యథారీతిగానే సర్వమూ ఏర్పాటు చేసి ఉంచటం ఇప్పటినా స్వభావము అయి ఉన్నది.

ఇప్పుడు ఈ క్షీరసాగరశయనము ఈ రీతిగా ఒక ప్రక్క కొనసాగిస్తూనే, యోగనిద్రలో ఉండి ఉంటూనే, ఇక్కడ నిద్రాముద్రకు భంగం లేకుండానే నేను పాతాళానికి వెళ్ళటం, ప్రహ్లాదునితో సంభాషణ, జగత్తును సుస్థిరీకరించటం మొదలైనదంతా జరుగుచుండును గాక.

  1. నారాయణోపన్యాసము

ఆ విధంగా యోచించిన శ్రీహరి సర్వాత్మకుడైయుండినట్టి తనయొక్క ప్రభావంచేత క్షీరసాగరంలో శయనసముద్రంలో ఉంటూనే, నీరు కూడా చొరజాలనట్టి పాతాళబిలం ప్రవేశించారు. ప్రహ్లాదుని అంతఃపురం ప్రవేశించి అక్కడ బ్రహ్మదేవునివలె సమాధి యందు నిమగ్నమైయున్న ప్రహ్లాదుని చూచారు. ఆ దగ్గిరలో పచార్లు చేస్తున్న రాక్షసులు నారాయణాగమనముచే ప్రవేశించిన వైష్ణవ తేజమునకు తాళలేక దూరంగా వెళ్ళసాగారు. వాళ్ళంతా విషయమేమిటో అర్థంగాక తమ మంత్రి వర్యులకు ఆ విశేషమును నివేదించటానికి పరుగులు తీశారు.

Page:463

ఆకాశంలో అప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు. విష్ణు భగవానుడు వేంచేసి ప్రహ్లాదుడు సమాధిలో ఉండియున్న విశాల మందిరంలో ఒక ఉన్నతాసనంపై ఆసీనులైనాడు. శంఖ, చక్రాది ఆయుధములను ధరించి పరివార సమేతుడైయున్నారు. లక్ష్మీదేవి పూతీగ వంటి హస్తములతో స్వామికి వింజామరలు వీచుచున్నది. దేవ - ఋషులు, మహర్షులు ఆయనకు నమస్కరిస్తూ స్తోత్రములు సమర్పిస్తున్నారు. నవ్వుతో కూడిన నునులేత పెదవులతో స్వామి, “నాయనా! ప్రహ్లాదా! లే! ప్రబుద్ధుడవు కమ్ము" అని పలుకుతూనే పాంచజన్యం పూరించారు. విష్ణుదేవుని ప్రాణవాయువుల నుండి జనించిన ఆ ధ్వని రాక్షసులను మూర్ఛిల్లేటట్లు చేసింది. ఆ ధ్వని విని విష్ణుదేవుని అనుచరులు బ్రహ్మానందం పొందారు.

రాక్షసుల చక్రవర్తి అయినట్టి ప్రహ్లాదుడు విష్ణుదేవుని శంఖానాదం ఎక్కడో హృదయాంతరాళలోని లోతుల నుండి విన్నాడు. నాదస్వరం విన్న ఆడత్రాచుపాములాగా బోధను పొందసాగాడు. ఆతని ప్రాణశక్తి క్రమంగా బ్రహ్మరంధ్రమునుండి లేచి శరీరమంతా వ్యాపించింది. ప్రాణవాయువులు నెమ్మదిగా అంగ ప్రత్యంగములలోనికి ప్రవేశించాయి. ఇంద్రియ నవ ద్వారములు ఉత్తేజితము లైనాయి. "లింగ శరీరము” అనే దర్పణమునందు చైతన్యము ప్రతిబింబించింది. అది క్రమంగా విషయోన్ముఖమై చిత్రడరూపమున మనోభావంగా పొందింది. ఆ విధంగా చిత్తము సంచలనమును ఆశ్రయించుచుండగా ఆతని నేత్రములు అర్ధనిమీలితములు అయి విచ్చుకున్నాయి. నాడీ రంధ్రములలో దాగి ఉన్న జ్ఞానశక్తి ప్రాణాపానవాయువుల వలన సముత్సాహపూరితమైనది. ఇక, ప్రహ్లాదుడు నెమ్మదిగా కదలసాగాడు.

ప్రాణములు పూరితం అయిన తరువాత ఆతని మనస్సు పరిపూర్తి పొందసాగింది. తెల్లవారిన తరువాత సరోవరంలాగా ఆతని ప్రాణములు, మనస్సు, కళ్ళు వికసించాయి. “నాయనా! ప్రహ్లాదా! ప్రబుద్ధుడవు కమ్ము" అను శబ్దతరంగాలు ఆతని చెవులను, మనస్సును మరల మరల తాకాయి. మననశక్తి, స్మృతిశక్తి అభివృద్ధి అగుచుండగా ఆతడు తటాలున లేచి శ్రీవిష్ణుమూర్తికి నమస్కరించాడు.

శ్రీమన్నారాయణుడు : నాయనా! ప్రహ్లాదా! నీవు నీ నిజస్వరూపమును స్మరించుటచే ధన్యుడ వైనావయ్యా! నాకు సంతోషం. అయితే ఒక్క విషయం. నీకు ఈ నీ దేహాన్ని తిరస్కరించి, త్యజించ వలసిన అవసరం ఇప్పుడేమున్నది? ఇటు ప్రారబ్ధముయొక్క ప్రభావముచే ఏర్పడి ఉన్న దానవ రాజ్యన్నీ, అటు అప్రమేయము, నిర్మలము, నిత్యము అగు ఆత్మస్వరూపమును ఒక్కసారే అవధరించి ఉండవచ్చును కదా! ఇప్పటికే నీవు సంకల్పరహితుడవయ్యావు. కనుక నీకు కొత్తగా త్యజించ వలసినదేమున్నది? గ్రహించవలసిన దేమున్నది? ఆత్మతో ఏకత్వము పొందిన తరువాత ఇక నీకు ఈ శారీరక సుఖదుఃఖముల వలన వచ్చే కీడు, మేలు ఏమున్నాయి?

కనుక, లేఁ! ఈ నీ భౌతిక దేహము ఈ కల్పాంతమువరకు అనేక జీవులకు మార్గదర్శకమై ఉండబోవుచున్నది. అవశ్యం జరగబోయే నియతి అది. అందుచేత, నీవు చక్కగా లేచి రాజ్యపాలన

Page:464

చేయి. ప్రవాహపతితంగా ఏదైతే తప్పక నిర్వర్తించవలసి వస్తుందో అద్దానిని జ్ఞానులు త్యజించరు. తప్పక నిర్వర్తిస్తారు. కనుక నీవు ఉద్వేగరహితమైన భావములతో ఒనగూడినవాడవై, కల్పాంతము వరకు ఈ ఉపాధితో నిలచి ఉండు. కుండ పగిలినప్పుడు ఆ కుండలోని ఆకాశం మహాకాశంలో విలీనమైపోతుంది కదా! నీవు కూడా ఈ ఉపాధి కల్పాంతమునందు నేలకూలగానే ఆపై ఇక బ్రహ్మపదమున వెలయగలవు. ఇప్పటికి మాత్రం ఈ శరీరంతో జీవన్ముక్తుడవై ప్రకాశించెదవు

గాక!

88

పుత్రా! ఇప్పుడే “ఇది కల్పాంతము” అని ఒకవేళ పొరబడ్డావా ఏమిటి? ద్వాదశ ఆదిత్యులు ఒక్కసారే ప్రేరేపితులై ఒకేచోట ఉదయించటం, ఎక్కడికక్కడ జగత్తు ప్రజ్వలించటం మొదలైన కల్పాంతము యొక్క సంజ్ఞలేమీ లేవు కదా! ఈ జీవులు, ఆ పర్వతములు, నీవు, నేను, ఆకాశము, తదితర జగత్తు - ఇవన్నీ ఏమీ చెక్కు చెదరనేలేదే! మరి, “ఈ శరీరము త్యజించబడాలి” అనే అభినివేశము దేనికి? ఇది కల్పాంతము కానేకాదు. అందుచేత నీకు నీవుగా ఈ దేహమును పరిత్యజించనే వద్దు. కేవలం దేహం అట్టి బెట్టుకున్నంత మాత్రంచేత, అది అజ్ఞానమనిపించుకోదు. ఎవనిమ నస్సైతే తన యందు అజ్ఞానము, అల్పవిశేషముల ఆశ్రయం కలిగి ఉంటుందో, తన యందు దుఃఖ మోహములను పేర్చుకుని ఉంటుందో … అట్టివానికి మాత్రమే ఈ శరీరధారణమనేది బాధాకరమై ఉంటుంది.

“నేను ఎందుకూ పనికిరానివాడను. ఎందుకు తగుతాను? ఇక నా గతి, నేను చేయగలిగినది ఇంత మాత్రమే.

కృశో2_తిదుఃఖీ మూడో2 హమేతాశ్చాన్యాశ్చభావనాః |

మతిం యస్యావలుమ్పన్తి మరణం తస్య రాజతే ॥ (శ్లో 38, సర్గ 39)

నేనొక మూఢుడను, దుఃఖితుడను, శరీరమాత్రుడను, అల్పకాలికుడను …అని భావించే వానికే ’మృత్యువు’ అనే అనుభవం ఆవశ్యకమగుచున్నది.

బద్ధ జీవులు - ఈ జగత్తులో కొందరు జీవుల అంతఃకరణములు అనేక ఆశపరంపరలు కలిగిఉంటున్నారు. అనేక చంచల వృత్తులు వచ్చిచేరి, ఆ అంతః కరణములను అనేక దుర్మార్గములలోకి ఈడ్చుకునిపోతున్నాయి. ఎందుచేత? ఆత్మవ్యతిరిక్తమైన అవివేకమును స్వీకరించుటచేతనే! అవివేకము తృష్ణ రూపమున తాండవించుటచేతనే! అందుకు ఫలితంగా వారు అనేక సాంసారిక విషయములను గాడిదలవలె మోస్తున్నారు. వారి చిత్తములలో అనేక వృత్తులు అనుక్షణం ఏర్పడి, అవన్నీ అనేక సుఖదుఃఖ ఫలములను అవిశ్రాంతపూర్వకంగా ఇచ్చుకుంటూ పోతున్నాయే! ’కామము’ మొదలైన అనర్థములచే ఆ మనస్సులు క్షణక్షణం అటూఇటూ ఈడ్వబడుచున్నాయే! అట్టివారు తమయందు ‘కామము’ అనే సర్పమును కలిగియుండి అనేక ఆధివ్యాధులకు అర్హమగుచున్నారు. అట్టివారికే ‘మరణము’ అనే ఔషధము ఆవశ్యకమగుచున్నది… అంతేగానీ, నీవంటి వారికి కాదు.

Page:465

మరణము అంటే ఏమిటి?… ఓ ప్రహ్లాదా! ఈ శరీరము పరిత్యజించబడుటయే లోకములో ‘మరణము’ అనే పేరుతో వ్యవహరించబడుతోంది. ఆత్మకు మరణమెక్కడిది? అది సర్వదా నిష్క్రియము కదా! ఇక ఈ శరీరము అసత్తే కదా! అసత్యము, భ్రమమాత్రము అయిన ఈ శరీరానికి మాత్రం "ఈ శరీరము చచ్చుచున్నది” … అనే పదప్రయోగం ఎంతవరకు సమంజసం? కనుక ‘మృత్యువు’ అనే ప్రక్రియను ఈ శరీరమునకు కూడా మనం ఆపాదించటం కుదరదు.

ఆత్మజ్ఞానం కలుగనంతవరకు శరీర భ్రమ ఉండియే తీరుతుంది. “అన్ని వైపులా ఆత్మతత్త్వమును దర్శించుట” అను విరామం లేని యథార్థదర్శియొక్క జీవితమే నిజమైన జీవనం. అదిమాత్రమే సర్వవిధములా శోభించుచున్నది.

ఎవడైతే అహంభావరహితుడై, నిర్లిప్తుడై, సమదృష్టిని పొందిఉంటాడో - అట్టివాడు ధన్యుడే! కనుక రాగద్వేషరహితమగు బుద్ధితో ఈ జగత్తును సాక్షివలె దర్శిస్తూ ఉండాలి. ఈ జగత్తు యొక్క అసారత్వమును సంపూర్ణముగా గ్రహించి, అటుపై “గ్రహించటం - త్యజించటం” అనబడే రెండిటినీ వదలివేయాలి. ఈ చిత్తమును సాక్షిస్వరూపమునకు సమర్పించివేయాలి. తుచ్ఛమగు వ్యవహార రూపంగా ప్రకాశిస్తున్న ఈ బాహ్యవస్తువులందు మనస్సు సక్తము కాకూడదు. ఈ మనస్సును బ్రహ్మము నందు మాత్రమే లీనం చేయాలి. సత్యదృష్టిని అవలంబించి, ఆపై లీలగా లౌకిక వ్యవహారములు ఆచరించుచున్నప్పటికీ, అన్నివేళలా వాసనాశూన్యుడై ఉండాలి.

ఇష్ట, అయిష్టములు సంఘటిల్లుచున్నప్పుడు ఎవడైతే ఎట్టి రాగ ద్వేషాలు ఏమాత్రం పొందడో …అట్టి వాని జీవితమే ధన్యము. మానససరోవరంలో ఉత్తమ జాతి హంసలు సంచరిస్తున్నట్లు హృదయసరోవరంలో కూడా శాంతి, క్షమ, భక్తి, వైరాగ్యము, ఉత్తమ ఆశయము - మొదలైన ఉత్తమ గుణములు వెల్లివిరియు గాక! ఎవనిని చూస్తే… లేక… ఎవని పేరు చెప్పుకుంటే తదితర జీవులు ఆనందమును పొందగలుగుతారో, అట్టివారి జీవితము ధన్యము.

నీవు అంతటి మహామాన్యుడవు -ప్రహ్లాదుడవు! సార్థకనామధేయుడవు! కనుక ప్రియ ప్రహ్లాదా! నీ యొక్క చరిత్ర వినటంచేత, నీ జ్ఞాన భక్తివాక్యాలు అనుసరించటంచేత ఈ సర్వజనులు శుభమును పొందగలుగుతారు. అటువంటి నీకు ఈ జీవితముపట్ల అయిచ్చ ఉదయించవలసిన పనేమున్నది? ఇచ్ఛాయిచ్ఛలకు అతీతుడవు కదా!

  1. దేహము - జీవము - - జీవుడు

శ్రీమన్నారాయణుడు : బిడ్డా! ప్రహ్లాదా! నీయొక్క సమాచారవిశేషములు అధికం చేసే ఉద్దేశంతో నీకు ఈ దేహము, జీవనము, మరణము, జీవుల గురించి మరికొన్ని వాక్యాలు చెపుతాను, వినుస్థైర్యం దేహస్య దృష్టస్య జీవితం ప్రోచ్యతేజనైః |

దేహాన్తరార్థం దేహస్య సంత్యాగో మరణం స్మృతమ్ || (శ్లో 1, సర్గ 40)

Page:466

‘జీవము’ అనగా ఏమిటి? ప్రత్యక్షంగా ఎదురై కనిపిస్తున్న ఈ రక్తమాంసమయ దేహము యొక్క ఉనికినే జనులలో అనేకులు ‘జీవనము’ అని పిలుస్తున్నారు. ఈ జీవుడు మరొక దేహము కొరకై దీనిని విసర్జించినప్పుడు, ఆ ప్రక్రియయే ‘మరణము’ అని చెప్పబడుతోంది. నీవు మహామతివి అవటంచేత ఈ రెండు అవస్థలనుండి విడివడ్డావు. “ఈ దేహముతోటిదే మా జీవనము” అని అనేక మంది జీవులు మరలమరల మననం చేస్తున్నారు. అది నిజమా? కాదు!

నీ విషయానికివస్తే నీకు అట్టి దేహాత్మకమైన బుద్ధి లేనేలేదు. అందుచేత నీ ప్రాణములకు ’ఇంకొక చోటికి పోవటం’ - అనేదే ఉండదు. ఇక నీకు జీవితమూలేదు, మరణమూలేదు. “నీకు జీవితమే తగుతుంది… మరణము తగదు” - అని నేను ఇంతవరకు చెప్పినదంతా కేవలం దృష్టాంత ప్రదర్శనము కొరకే. సర్వజ్ఞుడవైన నీకు మరణమేమిటి? జీవితమేమిటి? ఆకాశము స్వతహాగా శూన్యమైనది. అందులో వాయువు ఉన్నది. వాయువు ఆక్రమించుకొని ఉన్నంతమాత్రం చేత ఆకాశము తన శూన్యత్వమును త్యజిస్తోందా? లేదుకదా! కనుక దేహబుద్ధి ఏ మాత్రం లేనట్టి నీవు సర్వదా దేహశూన్యుడవే అయి ఉన్నావు.

వ్యవహారం - అయితే వ్యవహారం కొరకు, దేహధర్మములైనట్టి శీత-ఉష్ణ-స్పర్శ జ్ఞానాదులు నీకు ఉన్నాయి కనుక, ‘నీవు ఈ దేహమున ఉన్నావు’ అని వ్యవహరించబడుతోంది. వృక్షము ఎత్తుగా పెరగటానికి ఆకాశము కారణము కాకపోయినప్పటికీ, “ఆచోట (ఆకాశం)లో ఒక పెద్ద వృక్షము ఉన్నది" అని జనులు చెప్పుకుంటూ ఉంటారు కదా! ఇది కూడా అట్టిదే. ఆకాశం సదా నిరాకారంగానే ఉంటుంది గాని, వృక్షాదులు ఆకారం సంతరించుకోదు కదా!

ఇక్కడ స్పర్శ - జ్ఞానముల విషయంలో ‘ఆత్మయే దీనికి కారణం’ - అని చెప్పబడుతోంది. అది లోకరీతి. నీవు మాత్రం ఆత్మప్రబోధం పొందుటచే నీపట్ల ద్వైతమంతా ఉపశమించింది. పరిచ్ఛిన్నమగు దేహాత్మ బుద్ధి అజ్ఞులకు మాత్రమే ఉంటుంది గాని, నీ వంటి విజ్ఞులకు కాదు. నీ బుద్ధి ఒక్క పరబ్రహ్మము నందు మాత్రమే పరినిష్ఠమై ఉండుటచే, నిన్ను శాస్త్రాదులు "చిత్ప్రకాశం .” అని వర్ణిస్తున్నాయి. సర్వదా సర్వరూపుడవగు నీపట్ల దేహ - అదేహములు, పరిగ్రాహ్య పరిత్యాజ్యములు అపాదింపబడజాలవు. జలమునకు ఆకారమెక్కడున్నది? …“స్వయమ్ ఆత్మా!”

ప్రియప్రహ్లాదా! అత్యంత ఆహ్లాదకరమైన వసంతకాలం రానిమ్ము… లేదా, సర్వమును దిగమ్రింగి వేయగల ప్రళయకాలం వచ్చిపడనీ కొండలు నేల కూలనీ … ఉత్పాతగాలులు వీచనీ … ఈ జగత్తంతా భస్మం కానీ … వచ్చేదేమున్నది? పోయేదేమున్నది? ఆత్మ యందే సర్వదా వెలయుచున్న నీకు వచ్చే కీడేమిటి? మేలేమిటి? ఈ పదార్థములన్నీ ఎంతగానో ఉండు గాక, లేదా ఊడు గాక! ఇంతకు అంత అగుగాక, లేక వినష్టమైపోవు గాక! ఈ శరీరమే ఖండఖండములగు గాక! ఆత్మ నశించదు. వర్ధిల్లదు. ఈ శరీరస్పందనము ఆత్మస్పందనమెట్లా అవుతుంది? అవదు.

ఆత్మతో ఏకత్వము పొందినవారికి “నాకు దేహముతో ఉనికి, సంబంధములు ఉన్నాయి. నేను దేహము కలవాడను” - - అను చిత్తవిభ్రమమంతా నశించుచున్నది. అప్పుడిక "త్యజించుచున్నాను

Page:467

- త్యజించుటలేదు”– అను కల్పన అంతా ఉండదు. “దీనిని పూర్తి చేసిన తరువాత అది నిర్వర్తించవలసి ఉన్నది… అది ప్రారంభిస్తాను ఇది పరిత్యజిస్తాను” - అనే సంకల్పములన్నీ క్షయించిపోతాయి. ముక్త పురుషులు అన్నీ చేస్తూనే ఏదీ చేయనివారే అయి ఉంటున్నారు. “అవయవములే కర్మలు చేస్తాయి. నిరవయవియగు ఆత్మ దేనికీ కర్త కాదు. అట్టి నిష్క్రియమగు ఆత్మయే నేను” - అని -

భావించువానికి కర్తృత్వమెక్కడుంది? ఎక్కడ అకర్తృత్వము ఉంటుందో, అక్కడ అభోక్తృత్వము కూడా సిద్ధించుచున్నది.

అభోక్తృత్వం ప్రాప్తించాలంటే ‘నేను దేనికీ కర్తను కాదు’ అను అకర్తృత్వము ఆశ్రయించటమే సర్వోత్కష్టమైన ఉపాయం.

ముక్తి, పరమ శాంతి - కర్తృత్వము, భోక్తృత్వము నశించాయా … ఇక శేషించేది పరమ శాంతియే సుమా! అట్టి శాంతి సుస్థిరమైనప్పుడు దానిని శాస్త్రములు ముక్తి అని పిలుస్తున్నాయి.

ప్రబుద్ధులు, చిన్మయులు, విశుద్ధులు అగువారు సమస్తము అతిక్రమించి వెలయుచున్నారు. గ్రహించుట కొరకై త్యజించునది గాని, త్యజించుటకై గ్రహించునది గాని ఇక్కడ వారికేదీ ఉండుటలేదు. గ్రహించబడుచున్నది - అట్లు గ్రహించుటకు కర్త, అవయవములు, అవయవి, వాటికి సంబంధించిన ప్రమాణ-ప్రమేయములు ఇట్టి వివిధ వికారములన్నీ అజ్ఞాన సమయంలో తారసపడతాయేమోగాని, ఆత్మను ఎరిగిన జ్ఞానులందు వాటికి చోటుండదు. "గ్రహించువాడు, గ్రహించబడునది” - అను వ్యవహారసరళి సన్నగిల్లగా అప్పుడు ఉదయించే శాంతికే ‘మోక్షము’ అను మరొక పేరు.

నీ వంటి పురుషశ్రేష్ఠులు సర్వదా అట్టి ముక్తియందు వెలయుచూ, శాంతులై ఉంటున్నారు. సుషుప్తి సమయంలో అవయవముల కదలికలవలె ఈ జగత్తులో సంచారం చేస్తున్నారు. నాయనా! పరబ్రహ్మబోధ పొందియుండుటచే నీకు సర్వవాసనలు తొలగిపోయినాయి.

పరావబోధవిశ్రాస్తవాసనో జగతి స్థితిమ్ |

అర్ధసుప్త ఇవేహేమాం త్వం పశ్యాత్మస్థయా ధియా ॥ (శ్లో 21, సర్గ 40)

కాబట్టి, ఈ జగత్ స్థితినంతా అవలోకిస్తున్నప్పుడు ఆత్మయందు సంస్థితమైన బుద్ధి కలవాడవై, సగం నిద్రిస్తున్న వానివలె ఉండు. పరబ్రహ్మమునందు లీనమైన చిత్తము కలవారు, "ఇవి చాలా బాగున్నాయే!” అని తలచి, ఏ బాహ్యవస్తువు లందూ ఏమాత్రం ఆసక్తి గొనరు. ఇక్కడి దుఃఖాలచే ఉద్విగ్నులు కారు. ఒక అద్దము తనకెదురుగా ఏముంటే అద్దానినే తన యందు ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా! నిత్యముక్తులగు వారు అనాసక్తులై, అనిచ్ఛాపూర్వకంగా ఆయా ప్రాప్తములైన కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు.

జాగ్రతి స్వాత్మని స్వస్థాః సుప్తాః సంసారసంస్థితౌ బాలవత్ప్రవివేపన్హే సుషుప్తసదృశాశయాః ॥ || (శ్లో 24, సర్గ 40)

ఉత్తమ ఆత్మదర్శనము చేయుచున్న మహనీయులు నిర్మలహృదయులై ఈ సంసార విశేషములన్నీ చూస్తున్నప్పుడు మౌనము, నిర్లిప్తత, అతీతత్వము వహించి ఉంటున్నారు. నిద్రలో బాలుడు

Page:468

అసంకల్పితంగా నడచివెళ్ళుచూ ఉంటాడు. చూచావా?… అట్లా ఉంటుంది, ఈ సంసారంలో జ్ఞానుల సంచారం!

8

ప్రియభక్తా! ప్రహ్లాదా! నీవు అంతరమున బ్రహ్మపదమును పొందియే ఉన్నావు. అందుచేత విధివశాత్తూ తారసపడి, నీ విధ్యుక్తధర్మమై ఎదురుగా నిలిచిన ఈ పాతాళలోక చక్రవర్తిత్వమును యథారీతిగా పొంది ఉండు. అనంతరం చ్యుతిరహితమగు పరబ్రహ్మమును యథారీతిగా పొంది ఉండు. తదనంతరం చ్యుతిరహితమగు పరబ్రహ్మతత్వమును అవధరించగలవు.

అయితే అవన్నీ కూడా సర్వదా నీయొక్క నిర్విషయానంద స్వరూపమున నిర్విషయతత్వమై ప్రదర్శనమగు గాక! నీవు సర్వదా అచ్యుతుడవే సుమా!

  1. ప్రహ్లాద పట్టాభిషేకము

ఆ విధంగా ‘జగదద్భుత వస్తుదర్శకుడు’ అగు ఆ శ్రీమన్నారాయణుడు వెన్నెలవంటి సుమధుర వాక్కులు పలికాడు. ఉత్తమజ్ఞానోదయమగు మాటలచే ప్రహ్లాదుని కనులు వికసింపజేశాడు. భగవానుని మాటలన్నీ శ్రద్ధగా విన్న ప్రహ్లాదుడు మననవ్యాపారమును అవలంబించినవాడై, వినమ్రుడై ఇట్లు

పలికాడు.

ప్రహ్లాదుడు : తండ్రీ! నారాయణా! దీర్ఘకాలంగా, అసంఖ్యాక జన్మలుగా ఏవేవో మానసిక వ్యాపారాలచే డస్సియున్న నేను తమ అనుగ్రహం చేత సర్వ విశేషములను అధిగమించి నిర్విషయమునందు కొద్ది క్షణాలు విశ్రాంతిని పొందాను. స్వస్వరూపమున సుస్థిరుడనై తత్ఫలితంగా “సమాధి - అసమాధి” స్థితులలోని సమస్థితిని, సమబుద్ధిని అవధరించాను. స్వామి! నిర్మల బుద్ధితో నా అంతరంగమున మీ దర్శనం చేసుకున్నాను. ఈ రోజు ఈ సమయంలో మీరు నా బాహ్యమునందు కూడా దర్శనం ప్రసాదించారు.

హే మహానుభావా! ఆదివిష్ణూ! ఇప్పుడు నేను ఏమై ఉన్నానో చెపుతాను… వినండి. అనంత నిర్మలాకాశమున ఒకానొక ఆకాశవిభాగము ఎలా వెలయుచున్నదో… అట్లే సర్వవిధ సంకల్పముల నుండి విడివడినట్టి నేను స్వతఃసిద్ధము (That which is Present by Itself) నందు సర్వదా నిత్యవిముక్తుడనై వెలయుచున్నాను. మీ యొక్క ఆజ్ఞ తీసుకొని ఆత్మచింతన యందు ప్రవేశించాను. ఎందుకొరకు? ఏదో శోకమోహముల చేతనో, బీభత్సవిషయములచే ఏర్పడిన వైరాగ్యం చేతనో, సంసారభయం చేతనో, ఈ శరీరం త్యజించాలనో, సమాధిని ఆశ్రయించ లేదు. స్వస్వరూపం యొక్క దర్శనభాగ్యం కొరకే ఆ చింతనయందు నిమగ్నుడనైనాను. మనస్సు నిర్మల మగుచున్నది. అనేకత్వమంతా తొలగుతూ, క్రమంగా ఏకత్వము నాపట్ల తాండవించుచున్నది. ఒకే వస్తువు వెలయుచున్న చోట శోకమెచ్చట? జన్మలేమిటి? సర్వదా సర్వముగా ఉన్న నాకు స్థితి గాని, విలయము గాని, భయాభయములు గాని ఎక్కడి నుండి వస్తాయి?

Page:469

హే మహేశ్వరా! సర్వేశ్వరా! ఇప్పుడు నాకు ‘ఈ దేహము త్యజించాలి’ అనే ఇచ్ఛ కూడా లేదు. ఎందుకంటే, స్వతఃసిద్ధముగా ప్రాప్తించిన పవిత్రేచ్ఛతో వర్తమానంలో ఎందుకంటే, దృశ్య మంతటినీ త్యజించి దీనికి అతీతమైన స్వయంప్రకాశమున సుప్రసిద్ధంగా అవస్థితుడనై ఉన్నాను. "ఇది సంసారము. దీనిని వదిలించుకోవాలి” .. అను పరితాపము అజ్ఞానదశలోనే ఉంటుందిగాని, సుజ్ఞాన దృష్టిని అవధరించిన తరువాత కాదు.

దేహభ్రాంతి - “దేహము ఉంటే దుఃఖం ఉంటుంది. దేహము లేకుంటే గొడవే ఉండదు” అని భావిస్తే అది మూర్ఖత్వమేనని నా ఉద్దేశం. ఎందుకంటే, "ఇది ఉండాలి… ఇది ఉండకూడదు… ఇది సుఖము.. ఇది దుఃఖము” అనురూపంగా కనిపించే ఊగిసలాటంతా చిత్తము యొక్క చాంచల్యమే. ఆ చిత్తము అల్పవిషయములను ఆశ్రయించి ఉండుట చేతనే అట్లు ప్రవర్తిస్తోంది. ’నేను వేరు… తదితరులు లేరు’ అనునది ఆత్మబుద్ధి లేనిచోట మాత్రమే ప్రబలుచున్నది. దుర్బలులను సాంసారిక మిథ్యాభ్రాంతులు సమీపిస్తున్నాయి గాని, ప్రాజ్ఞులను అవి సమీపించలేవు.

తండ్రీ! కమలలోచనా! నారాయణా! నేను ఇప్పుడే “నా అంతరంగమున ఉన్న నిత్య సత్యము. వాస్తవము ఏమి?” అని తీవ్రపరిశీలన చేశాను. ఒక చమత్కారమైన విషయం నిస్సందేహమై తెలియవచ్చింది. నీవే నాయందు సర్వదా సత్యమై, నిత్యమె, అఖండమై, అప్రమేయమై వెలయుచున్నావు.

నీవు కాక మరేమి లేనట్టి నాయందు హేయ - ఉపాధేయములు, త్యాజ్య - గ్రాహ్యములు (కలిగి ఉండవలసినవి - త్యజించవలసినవి) అంటూ నాకేమీ కనిపించటంలేదు. ఇక ‘సత్ - అసత్’ రూపమున ఉత్పన్నమైన ఈ జగత్తు అంటారా? ఇది ఆత్మ చైతన్యము యొక్క అభాస లేక ప్రతిబింబ భావన మాత్రమే. స్వామి! నేను ఇప్పుడే స్వస్వరూపము యొక్క సర్వవ్యాప్తిని గ్రహించాను. స్వభావవశం చేతనే దృక్ దృశ్య విచారణ చేసి, అందుకు ఫలితంగా స్వయంగా పరమాత్మ స్వరూపుడ నయ్యాను. భావ, అభావ విముక్తుడనై సమాధిని ఆశ్రయించాను. ఇప్పుడు మీ ఆజ్ఞానుసారం ఈ స్థితిని పొందాను.

స్వస్వరూపమున విశ్రమిస్తూనే, మీరు ఆజ్ఞాపిస్తున్నది నిర్వర్తించటానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. హే పుండరీకాక్షా! శాస్త్రములు చెప్పియున్న విధి, విధానములతో మిమ్ములను ఇప్పుడు పూజిస్తాను. నా పూజ దయచేసి స్వీకరించండి.

ఎవ్వని బాహ్యాభ్యంతరములందైతే అసంఖ్యాక జగత్తులు ఉన్నాయో అట్టి భువనేశ్వరుడగు నారాయణుని ప్రహ్లాదుడు మంత్ర - క్రియ స్తోత్రాదులచే పూజించాడు. అప్పటికప్పుడు శ్రీమన్నారాయణుని సమక్షంలో ప్రహ్లాదుడు సింహాసనాన్ని అధిరోహించాడు. దేవతలు ఆ పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసి ప్రహ్లాదుని భక్తి విశేషాలు శ్లాఘించారు. మహోత్సవానంతరం నారాయణుడు ప్రహ్లాదుని ఉద్దేశించి ఇట్లు పలికారు.

శ్రీమన్నారాయణుడు : ప్రియ ప్రహ్లాదా! సమదర్శనము చేయు బుద్ధితో, ఇష్ట - అనిష్ట ఫలములను త్యజించి, విషయానురాగములు గానీ, భయక్రోధములు గానీ లేనివాడవై రాజ్యపాలన చేసెదవు

Page:470

గాక! సర్వోత్తమము, ఆనందమయము అగు అద్వితీయ దివ్యపదమును పొందినప్పటికీ నీకు విధించబడిన ఈ రాజ్యపాలన నిర్లక్ష్యము చేయకుండెదవు గాక! నీ తండ్రి, పినతండ్రుల వలె స్వర్గమర్త్య లోకాలలో ఉద్వేగములు కలిగించకుండెదవు గాక! ప్రజానుగ్రహము, శత్రునిగ్రహము మొదలైన అవశ్య కర్తవ్యములు ప్రాప్తించినప్పుడు దేశ - కాల - క్రియల ఔచిత్యమును దృష్టిలో పెట్టుకొని, సేవాభావంతో భగవత్ భక్తి, సమర్పణ భావములతో నిర్వర్తించు. రాగ రహితమైన బుద్ధి నిన్ను సర్వదా ఆశ్రయించి ఉండును గాక!

ప్రహ్లాదుడు : స్వామి! నాకు దిక్కు, మార్గదర్శకులు, సద్గురువులు మీరే. మీ కరుణ చేతనే నేను మహత్తరమైన ఆత్మతత్త్వమును దర్శించి పునీతుడనైనాను. తమ వాక్యములు నాకు మరల మరల ప్రసాదించవలసినదిగా నా విన్నపము. ఈ సంసారము సర్వదా నన్ను ఆక్రమించకుండేది ఎట్లా? శ్రీమన్నారాయణుడు : మమత్వమును పరిత్యజించి సమభావముతో నీ విధ్యుక్తమైనది నిర్వర్తించావా … ఇక ఈ విషయములు నిన్ను ఏమాత్రం స్పృశించలేవు.

అయినా నీకు పెద్దగా ఏం చెప్పాలి? ఈ సంసారము యొక్క గతినంతా చక్కగా గ్రహించియే ఉన్నావు కదా! అత్యుత్తమమైన బ్రహ్మపదమును పొందియే ఉన్నావు. ఇక నీకు క్రొత్తగా చేయవలసిన ఉపదేశమేమీ లేదు. విషయాసక్తి గాని, భయక్రోధములుగాని లేనట్టి నిన్ను, నీ పాలనలోని ప్రజలను దుఃఖ దుర్గంధములు వేధించలేవు. ఇకనుండి అసుర స్త్రీలు నిరంతరం తమ మంగళ సూత్రముల గురించి భయపడుతూ ఉండవలసిన పనేమీ లేదు. దేవదానవుల సఖ్యతచే జగత్తులు ప్రశాంతమయంగా ఉండగలవు. నీ ఉనికిచే సర్వజనులూ ఆనందముగా జీవించగలరు. గాఢమగు అజ్ఞానాంధకారాన్ని నిరసించిన నీవు ఇట్లే సర్వదా స్వప్రకాశమానమగు బ్రహ్మాత్మభావమున వెలుగొందుము. శత్రువులగు కామ, క్రోధాదులను దగ్గరకు రానీయకుండా, బాహ్యమున రాజ్యలక్ష్మిని, అంతరమున శాంతి మొదలైన గుణములతోకూడిన “ఆత్మ - స్వారాజ్యలక్ష్మి ని ఏలుకో! విజయోస్తు… దిగ్విజయోస్తు!

ఇట్లు పలికి, సర్వేశ్వరుడగు నారాయణుడు యథాస్థానమగు క్షీరసాగరం ప్రవేశించాడు. ప్రహ్లాదుడు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికాడు.

  1. సమీక్ష

శ్రీ రామచంద్రుడు : హే భగవాన్! సర్వధర్మజ్ఞ! శ్రీ వసిష్ఠ మహర్షీ! అత్యంత శుద్ధములగు ప్రహ్లాద కథనమునకు సంబంధించిన వివరణచే నేను ఎంతో తృప్తి పొందాను. చంద్రునిలోని ఓషధులవలె మీ ప్రవచనమంతా నన్ను ఎంతో ఆహ్లాదపరిచింది. పరమ పవిత్రములగు మీ వాక్యములు వినినంత మాత్రం చేతనే గొప్పసుఖమును పొందాను.

అయితే నాదొక చిన్న సందేహం. మీరు ఇంతఃపూర్వం "పురుష ప్రయత్నము వలననే సర్వము ప్రాప్తమై, సుసంపన్నమౌతాయి” అని చెప్పియున్నారు కదా!

Page:471

మరి ప్రహ్లాదుడు విష్ణుభగవానుని సహాయం లేకుండానే తన స్వకీయ ప్రయత్నమాత్రం చేతనే ఎందుకు ప్రబోధం పొందలేదు? విష్ణువే ప్రత్యక్షమై మార్గం చూపుతూ ప్రబోధం ప్రసాదించారు కదా? అట్టి అగత్యం ఎందుకు ఏర్పడింది?

శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామా! మహాత్ముడగు ఆ ప్రహ్లాదుడు ఏదైతే పొందాడో అదంతా ’స్వీయపౌరుషబలం’ చేతనే పొందాడుగానీ, మరింక దేనిచేతనో కాదు.

మరొక విషయం! ’నారాయణుడు’ అనగా ఎవరు? ఒక వ్యక్తియా?… కానే కాదు. నువ్వులు నూనె వలె, పూలు వాసన వలె, రంగులు చిత్ర పటమువలె, ఆత్మయు నారాయణుడు అభిన్నులు. తటాకము - జలములాగా జనార్ధనుడు - - ఆత్మ ఈ ఈ రెండూ పర్యాయ పదములే నని గ్రహించు. విష్ణువే ఆత్మ. సర్వజీవుల యొక్క, ఈ జగత్తు యొక్క ఆత్మయే విష్ణువు.

ఆ ఆత్మయే తన పరమశక్తి వలన ‘ప్రహ్లాదుడు’ అను ఆత్మను విష్ణుభక్తునిగా ఒనర్చింది. అనగా, ప్రహ్లాదుడు ఆత్మ వలననే ప్రబోధం పొందాడు. అంతరంగ నిత్య స్వస్వరూపమగు ఆతడు స్వయముగా విచారణపరుడై, క్రమంగా పరమోత్కృష్టమైన స్వస్వరూప జ్ఞానం పొందాడు.

ఒక సమయంలో ఆత్మ స్వయంగా ప్రబోధమొందుచున్నది. మరొకప్పుడు భగవంతుడు, భక్తసులభుడు అగు విష్ణుని ప్రబోధము పొందుతోంది.

అయితే ఒక్క మాట. ఒకడు సుదీర్ఘకాలం పూజ - ధ్యానాది అనేక కార్యక్రమములు నిర్వర్తించవచ్చు గాక! విచారణహీనుడైతే మాత్రం ఆ బ్రహ్మదేవుడైనా సరే, జ్ఞానమును కలిగించజాలడు. కనుక ’పురుష ప్రయత్నముచే కలుగు ఆత్మవిచారణ’యే స్వస్వరూప సాక్షాత్కారమునకు ముఖ్యమైన

ఉపాయమని అందరూ గమనించెదరుగాక!

పురుష ప్రయత్నము -

శ్రీరాముడు : మరి వరము ప్రసాదించటం మొదలైన వాటి మాట ఏమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవన్నీ మధ్యేమార్గ ఉపాయములు మాత్రమే. అందుచేత నీవు ముఖ్య ఉపాయమైనట్టి ’ఆత్మవిచారణను అవలంబించుట’ను తప్పక ఆశ్రయించు. కొంచెము శ్రమించి అయినా సరే, పంచేంద్రియములను వశపరచుకో. సర్వవిధములా ‘ఆత్మవిచారణ’ అనేది అభ్యాసం చేయి. ఒక్కటి సర్వదా గుర్తు పెట్టుకో … ఎవరెచ్చట ఏది పొందుచున్నప్పటికీ, అదంతా వారియొక్క పురుష ప్రయత్నఫలమేగానీ, మరింకెవ్వరో ఎక్కడినుండో ఇచ్చింది కాదు.

అందుచేత నీవు పురుష ప్రయత్నమును ఎప్పటికప్పుడు అవలంబించి, ఈ ఇంద్రియములను దాటివేయి. ఈ ఇంద్రియములకు ఎదురుగా ఉండి కనబడుచున్న దృశ్యరూప సంసార సముద్రమును దాటి, దాని కావల ఉన్న పరమపదమును పొందుము.

శ్రీరాముడు : అయితే జనార్ధనుడు ప్రహ్లాదునకు ప్రత్యక్షమై మార్గదర్శకము ప్రసాదించారు కదా! ఆయన దయచేతనే ప్రహ్లాదుడు ఆత్మదర్శనం చేయగలిగాడు కదా?

Page:472

శ్రీవసిష్ఠ మహర్షి : పురుష ప్రయత్నం లేకుండానే జనార్ధనుడు కనిపించగలిగితే, యిక పశు పక్షాదులకు కూడా ఆత్మదర్శనము లభిస్తూ ఉండేదే.

ఎంతటి ఉత్తమ గురువైనా ప్రయత్నహీనుడైన శిష్యునకు తత్త్వబోధ చేయగలుగుతాడా? స్వస్వరూపాత్మానుభవం కలుగజేయగలడా? లేదు. ఏ పురుషప్రయత్నము చేయని అజ్ఞానిని కూడా గురువే కనుక ఉద్ధరించగలిగితే, దాని అర్థం ఆ గురువు తనకు ఇష్టమైతే ఒక ఎద్దుకో, ఒక లొట్టి పిట్టకో, మరొక తన ఇష్టమైన జీవునకో ఆత్మోద్ధరణ గావించేవాడే. కానీ అది అట్లా సంభవించదు. ముఖ్యంగా, ఒకటి గమనించాలి. ఆత్మ సామ్రాజ్యంలో తదితరుల వలన గాని, గురువు వలన గాని, ధనము వలన గాని మహత్పదము లభించదు. మరింక?

ఏ విధమైన ప్రయత్నం చేసైనా సరే… ఈ మనస్సును వశపరచుకొనగలిగితే చాలు. తనంతట తానే ఈ జీవుడు మహత్పదమును పొందవచ్చు. ఒకడు వైరాగ్యమును అవలంబించి, అభ్యాసవశంగా ఈ ఇంద్రియ సర్పములను స్వాధీన మొనర్చుకున్నాడా, ఇక ఆపై ఆతనికి ఈ మూడు లోకములలో పొందవలసినదేమీ ఉండదు. అందుకు శాస్త్రములు, గురువులు సహకారం అందించటానికి సర్వదా సిద్ధంగా ఉన్నాయి.

అందుచేత రామా! నీవు ఆత్మ ద్వారా ఆత్మను ఆరాధించుము, దర్శించుము. ఆ తరువాత ఇక ఆత్మయందే వెలయుము. అందుకు చేసే ప్రయత్నంలో శాస్త్రములు, గురువుల అనుభవం, మహనీయుల చరిత్రలు నీకు చక్కగా ఉపకరించగలవు.

భక్తి నుండి జ్ఞానము - అయితే, కొందరు శాస్త్రములచే అందింపబడుచున్న స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారాన్ని వింటున్నా కూడా, ‘అవగాహన - దృష్టి - కర్మ’ ల దృష్ట్యా, తమ బుద్ధిచే అప్పటికప్పుడే స్వీకరించలేకపోతున్నారు. ఎందుచేత? సాన పెట్టవలసియున్న కత్తిలాగా వారి బుద్ధి కొంత సునిశితం కావలసి ఉన్నది. అట్టివారు గాలిచే ఎగురకొట్టబడిన ఎండుగడ్డిపరక లాగా ఈ సంసారఎడారిలో పచార్లు చేస్తున్నారు. అట్టి వారి సంసారాక్రందనలు వినిన సత్యద్రష్టలగు జ్ఞానులు అట్టి సంసార జీవులను సత్పథమున పెట్టి సముద్ధరించటానికి, నిష్కల్మష హృదయులుగా జేయటానికి ‘విష్ణుభక్తి’ ని కల్పించారు. అట్టి భక్తిని ఆశ్రయించువారు క్రమంగా చిత్తశుద్ధిని పొంది, ఈ సంసారాసక్తతనుండి విడిపడినవారగుచున్నారు. భక్తిచే విశుద్ధమైన మనస్సు లభిస్తోంది. విశుద్ధమైన మనస్సుచే ఆత్మవస్తు సందర్శనం ప్రాప్తించుచున్నది.

అందుకే భక్తి యొక్క అభ్యాసము (ప్రయత్నము) - వైరాగ్యము (రాగరాహిత్యము) - ఈ రెండూ ఎల్లప్పుడూ కాపాడుకోవాలి - - అని చెప్పబడుతోంది.

సర్వతత్త్వ స్వరూపుడు, సర్వజీవస్వరూపుడు అగు సర్వేశ్వరుని ప్రేమించుటయే భక్తి కదా! భక్తిచే జ్ఞానము ప్రజ్వరిల్లుతోంది. కాని కొందరు భగవంతుని పట్ల భక్తిని నిలుపుకోలేకపోతున్నారు. అనగా, అనేక విషయవాసనలు, దృశ్య సంపర్కములు, కలిగియుండుటచే బుద్ధి యందు ఏకాగ్రత, నిర్మలత్వము కొరవడి ఉంటోంది. అట్టి జీవుల కొరకు "పూజించుట - పూజింపబడుచున్నది (పూజ్య - పూజకములు” అనునవి గౌణముగా (at lower stage) కల్పించబడ్డాయి.

Page:473

అయితే ఇంద్రియములు వశం కాకపోయినంత కాలం ఈ జీవునకు ‘ఉత్తమదృష్టి’ లభించదు. పూజలు మొదలైనవి ‘ఇంద్రియాలను వశపరచుకొనుట’ అను మార్గంలో ఏర్పరచబడిన ఉపాయాలు మాత్రమే. సర్వపూజలయొక్క అంతిమ ప్రయోజనము ఈ జీవుడు ఇంద్రియ లోలత్వమును జయించి, తానే వాటిని వశం చేసుకోవటం. ఏ జీవుడైతే ఈ ఇంద్రియములకు వశమగుచున్నాడో, అట్టివాడు ఈ సంసారారణ్యంలో అవిశ్రాంతంగా సుఖదుఃఖ బద్ధుడగుచున్నాడు. ఒకటి తరువాత మరొకటిగా ఉచ్ఛ - నీచ జన్మ పరంపరలను పొందుతూనే ఉన్నాడు. అందుచేత ’పూజల యొక్క ప్రయోజనము ఇంద్రియములను వశం చేసుకోవటమే’ అని మరొకసారి సర్వజనులకూ గుర్తు చేస్తున్నాను. ‘విచారణ - - ఇంద్రియముల ఉపశమము’ ల కొరకై ఒక్కసారే ఉపక్రమించాలి. ఈ రెండూ లేకపోతే హరి లభించడు. ఆ రెండూ లేనివాడిని హరి కూడా కాపాడలేడు.

అందుచే రామా! నీవు నీ చిత్తము ‘విచారణ - ఉపశమనము’ లను బాగా ఆశ్రయించునట్లు, ఇక అప్పటి నూతన చిత్తముతో ఆత్మను ఆరాధించు. అప్పుడు తప్పక ఆత్మజ్ఞానము, ఆత్మ స్థితి సిద్దించ గలవు. ఆ రెండూ లేనప్పుడు మానవుని చిత్తమునకూ, గాడిద చిత్తమునకూ భేదమేమున్నది? ఇంకొక విషయం. నీవు కేశవాదులను ఎంతగా ప్రార్థిస్తావో, అంతకన్నా ఎక్కువగా ముందు నీ చిత్తమును ప్రార్థించు.

"ఓ చిత్తమా! నీవు తుచ్ఛమైన ఈగలవలె క్రుళ్ళిన పదార్థముల వంటి ఈ నశ్వర ఇంద్రియ అనుభవమునే ఎందుకు ఆశ్రయించుచున్నావమ్మా? ఆ ప్రక్కనే అమృత కలశం ఉంటే, అది వదలిపెట్టి ఈ ఇంద్రియ మార్గములో ఉన్న దుర్వాసనలతోకూడిన మాంసము వంటి విషయాలను ఆశ్రయించి ‘చాలు … చాలు’ అనుకుంటున్నావా? ఎదురుగా ‘ఆత్మ’ అనే ఉత్తమ పదార్థం ఉండగా అనర్థములను, సంసార బంధములను, దృశ్యపదార్థజాలమును ఎందుకు ఆశ్రయించాలి చెప్పు?” అని క్రమక్రమంగా ఈ నీ చిత్తమునకు బోధ చేయి. ఆత్మను ప్రాప్తింపజేయగల ఉత్తమ ప్రయత్నములందు నియమించు.

సర్వస్యైవ జనస్యాస్య విష్ణురభ్యన్తరే స్థితః

తం పరిత్యజ్య యే యాన్తి బహిర్విష్ణుం నరాధమాః. (శ్లో 26, సర్గ 43)

ఓ రామచంద్రా! అసలు ‘విష్ణువు’ ఎక్కడున్నాడు? ఆతడు సర్వజనుల అభ్యంతరమున (అంతరంగమున) వెలయుచున్నాడు. అట్టి అంతరంగ విష్ణువును త్యజించి బహిర్ విష్ణువును సేవించే విషయం అత్యంతికము (Finest) కాదు సుమా!

హృదయ గుహయందు వెలయుచున్న సనాతన చైతన్యతత్వమే ఆత్మయొక్క ముఖ్య శరీరం. అదే నారాయణుని ముఖ్య స్వరూపం, నివాస స్థానం కూడా. ఇక, ఈ శంఖ-చక్ర గదాధర రూపం అంటావా, ఇది మాయచే కల్పించబడినదే! ముఖ్య విషయం విడచి, గౌణము (అముఖ్యము, అప్రధానము, తత్లక్షణ మాత్రము, గుణసంబంధమైనది)ను మాత్రమే ఆశ్రయించేవాడు స్వల్పాహారం కోసం అమృతమును ఏమరచుచున్నవాడే అవుతాడు. ఆతడు మహత్తరమును విడచి స్వల్పమునకై

Page:474

అఱ్ఱులు చాచుచున్నట్లే అవుతుంది. అందుచేత రఘునందనా! ఆత్మ వివేకమే అన్నిటికన్నా ఉత్తమమైనది. అదియే పరమ లక్ష్యమైయున్నది. అన్ని ప్రయత్నములయొక్క ఉత్తమ ప్రయోజనం అదే. ఆత్మోపాసనయే విష్ణుభక్తియొక్క అర్థము-విధి-విధానము కూడా! “ఈ కనబడే సర్వ దేహులు-నాతోసహా-ఆత్మ స్వరూపులే” - అనునదే విష్ణుభక్తి యొక్క పూర్ణ లేఖ్యాంశము.

బాహ్య మూర్తిపూజ - అయితే కొందరు ‘ఆత్మ వివేకము’ విషయమై సరిగా పట్టించుకోవటం లేదు. మోహమగ్నమగు చిత్తమునకు వశులై, సుందరమగు ఆత్మతత్త్వమువైపుగా దృష్టి సారించలేక పోవుచున్నారు. కారణం? వారి వారి చంచల చిత్తమే. అట్టి చంచలచిత్తుడు అభ్యాసబలం కొరకై శంఖ-చక్ర-గదాధారియగు విష్ణుమూర్తిని అర్చించటం సాధకులసౌకర్యము కొరకై విజ్ఞులు, శాస్త్రములు పరికల్పిస్తున్నాయి. అది వృథా అని నా ఉద్దేశం కాదు సుమా! అట్లు బాహ్యమూర్తిని అర్చించుచూరాగా, తపస్సు - వైరాగ్యములు బలపడుచుండగా… క్రమంగా చిత్తము నిర్మలమగుచున్నది. అట్టి నిత్య పూజ యొక్క ప్రయోజనంగా ఉత్తమమైన వివేకం ఉదయిస్తుంది. వివేకము క్రమంగా చిత్తమును దోషరహితం, పవిత్రం చేస్తుంది. బీజమే కొన్నాళ్లకి పుష్పలత అయి, ఆ తరువాత పుష్ప - - ఫలాదుల సౌరభాన్ని వెదజల్లుతుంది కదా! శాస్త్రములు ప్రతిపాదిస్తున్న హరిపూజాఫలముగా ఆత్మ తనంతట తాను తనను పొందుచున్నది.

అభ్యాసవశం, ఆకస్మికం - ఓ రఘువీరా! ఒకానొక ప్రతిభావంతుడు విష్ణువు నుండి (అనగా సాకార బ్రహ్మం నుండి) ఒక వరం పొందాడనుకో… ఆ ఫలించిన వరం కూడా అభ్యాస ప్రయోజనమే కదా! అంతేగాని ఆకస్మికంగా… ప్రయత్నమనేదే ఏమీ లేకుండా (అప్రయత్నంగా) ఎవరికీ ఏదీ లభించదు. అయితే, కొన్ని కొన్ని ప్రయత్నముల యొక్క ఒకానొక ప్రయోజనం మనకు అప్పటికప్పుడే ఎదురుగా కనపడకపోవచ్చు. మరొక సమయంలో ఏర్పడుచున్న ప్రయోజనములను చూస్తున్నప్పుడు, అల్ప దృష్టిగల జనులు ఏదో తెలియని ‘అదృష్టము’ అనబడు దానికి ఆపాదిస్తున్నారు. “సమగ్ర దృష్టితో ఇదంతా పరిశీలించినప్పుడు “ఏదైనా సరే, పురుషకారము చేతనే పొందబడుచున్నది” అని తప్పక తెలియవచ్చుచున్నది.

మనస్సు, నియామకం - సుఖము దుఃఖము మానము - అవమానము, గ్రాహ్యము త్యాజ్యము, అల్పము - అధికము ఈ విశేషాలన్నీ ఉన్నది మనస్సులోనే. భూమియే సర్వ సంపదలకు ఆకరమై (Abode) ఉన్నట్లు మనస్సు యొక్క నియామకమే (The conditioning of mind) సర్వవ్యవహారములకు ఆధారం. భూమి త్రవ్వే వానికి, కట్టెలు కొట్టేవానికి, సుతీక్ష్యమైన శాస్త్ర ప్రతిపాదిత విషయాలు పరిశీలించేవానికి - అందరికీ కార్యసిద్ధి కావాలంటే నిగ్రహమే (disciplining the mind) ఉపాయం అవుతోంది. మరింకేదీ ఉపాయమై ఉండలేదు.

మనస్సు, ఉపశమనం -

తావజ్జన్మసహస్రాణి భ్రమన్తి భువి మానవాః | యావన్నోపశమం యాతి మనోమత్తమహార్ణవః II (శ్లో 37, సర్గ 43)

Page:475

“మనస్సు” అనే మహాసముద్రం ఉపశమించనంతవరకు జీవుడు వేలకొలదీ జన్మలు ఎత్తుతూ ఈ భూమండలమున పరిభ్రమిస్తూనే ఉంటాడు. ఒకానొకడు బ్రహ్మవిష్ణు రుద్రాదులను చిరకాలం పూజించవచ్చు! వారికి ఆతని పట్ల ఎంతో వాత్సల్యం కలుగవచ్చు గాక! అయినా కూడా, వారు ఆతని సత్ ప్రయత్నం, సదవగాహన లేకుండా “మనోవ్యాధి” అనే ఉపద్రవం నుండి ఆతనిని రక్షించగలరా? లేదు.

దేహవ్యాధికి ఔషధం - చికిత్స ఎవరికి వారే స్వీకరించాలి కదా! అట్లాగే మనోవ్యాధికి చికిత్స ఎవరికి వారే స్వీకరించాలి. ఒకరికొరకై మరొకరు చికిత్స తీసుకోవటం ఎలా కుదురుతుంది? అందుచేత నీకు నీవే విచారణ చేయాలి. అయితే, అట్టి విచారణకు కావలసిన సమాచారం, సందేహ నివృత్తి మొదలైనవి గురువులు, త్రిమూర్త్యాది దేవతలు, శాస్త్రములు తప్పక అందించటం జరుగుతుంది. వస్తువుపై వెలుతురు పడినా, ఆ వస్తువును నీవు కనులు తెరచి చూచినప్పుడు కదా, నీకు తెలియవచ్చేది!

అందుచేత, రాఘవా! నీవు ఇంద్రియములకు, అంతఃకరణమునకు ఎదురుగా (విశేషములుగా) తారసపడే ఈ బాహ్యవిషయములను వదలివేయి. అంతర్హితుడవు అగుము. చైతన్య స్వరూపం ఒక్కదానినే చింతించుము. అప్పుడు నీకిక జన్మ- పునర్జన్మల ప్రహసనమంతా మొదలే ఉండదు. సంవేద్యములగుచున్న (ఈ తెలియవచ్చుచున్న) సర్వ బాహ్య అభ్యంతర విషయములనుండి విడివడి “నిరామయము, పరమానందమయము, అనంతము, సన్మాత్రము" అగు చైతన్యాన్నే ఆస్వాదించు.

“నేను సర్వదా శుద్ధ చైతన్యమునే కదా!” అని భావించుచు నిన్ను నీవు గాంచు. నిన్నే సర్వత్రా సర్వముగా దర్శించుచుండుము. సర్వము నీ స్వరూపంగా అభ్యసిస్తూ ఉండు. (మమత్మా సర్వభూతాత్మా

- మమసాధర్శ్య మాగతః) అప్పుడు అట్టి చైతన్య తత్త్వమును ఆస్వాదిస్తున్న నీవు, పునరావృత్తి రహితమగు స్థానమును పొందగలవు. అప్పుడు ఈ పునర్జన్మాదులు నీకు ఆపాదించబడవు.

నీ దృష్టిలో నీవు పునర్జన్మరహితుడవై ఉంటావు. సర్వాత్మకుడవై ఆత్మారాముడవై అనుక్షణికంగా ఆత్మసాక్షాత్కారం ఆస్వాదిస్తూ ఉంటావు.

(పన్నెండవ రోజు విచారణ పూర్తి అయింది)