Page:476
పదమూడవ రోజు VI.మనోదర్పణం గాధి వృతాంతం
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! “ఈ సంసారమాయ అంతమయేది ఎట్లా?” - అను ప్రశ్నకు సమాధానం “చిత్తమును జయించుటే” అయి ఉన్నదయ్యా! మరి ఉపాయమంటూ, వేరే ఏమీ లేదు. ఇక మిగతా (తదితర శాస్త్ర నిర్దేసిత) ఉపాయాలన్నీ చిత్తమును జయించుట కొరకే రచించబడి ఉన్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! అసలు ‘జగత్తు’ అనబడే ఈ మాయ ఎట్లా విస్తరిస్తోంది? ఆ వైచిత్ర్యమేమిటి? ఈ జీవునిపట్ల గుదిబండవలె సంప్రాప్తిస్తున్న ఈ ‘చిత్తము’ అనునది ఎట్లా రూపుదిద్దుకుంటోంది? శ్రీ వసిష్ఠమహర్షి : చిత్తము అనబడేది ఆత్మస్వరూపుడగు ఈ జీవుని స్వయంకృత చమత్కారమే! నీ ప్రశ్నకు సమాధానంగా ’గాధి’ అనే ఒక బ్రాహ్మణ బాలకుని వృత్తాంతం చెపుతాను. శ్రద్ధగా విను.
కోసల దేశంలో ఒకానొకప్పుడు ’గాధి’ అనేపేరు గల ఒక బ్రాహ్మణబాలకుడు ఉండేవాడు. ఆ పిల్లవాడు గొప్పగుణశాలి, వేదవేత్త, బుద్ధిమంతుడు, ధర్మమూర్తి కూడా. ఆతని చిత్తము చిన్నప్పటి నుండి విషయములపట్ల విరక్తి కలిగి, ఎంతో శోభిస్తూ ఉండేది. ఉత్తమ భావాలు గల ఆ గాధి ఒక రోజు తన బంధుజనమునందరినీ క్షణంలో త్యజించివేసి, అరణ్యం చేరాడు. అక్కడ ‘గిరి’ అను పేరు గల ఒక ప్రదేశంలోని ఒక సరోవరం సమీపంగా ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతంగా తపస్సు ప్రారంభించాడు. “పరంధాముడగు విష్ణుమూర్తి యొక్క మహత్తర దర్శనం నాకు లభించును గాక” అను ఏకైక ధ్యేయముతో శ్రద్ధగా తపస్సు కొనసాగించసాగాడు.
ఎనిమిది మాసాలు గడిచాయి. ఆ పిల్లవాడి పట్టుదల, ఏకాగ్రత, భక్తిశ్రద్ధలు చూచి విష్ణుమూర్తి చాలా సంతోషించారు. ఒక సుదినం ఆయన శంఖ చక్ర గదాధారి అయి గాధి ముందు ప్రత్యక్షమైనాడు. శ్రీవిష్ణుమూర్తి : ఓ ప్రియబాలకా! నీ ఏకాగ్రత, నిర్మలహృదయం చూచి సంతోషించానయ్యా. నీ తపస్సు ఫలించింది. ఇకలే బిడ్డా! ఏమి కావాలో కోరుకో.
గాధి : హే మహావిష్ణో! నారాయణా! మీరు అసంఖ్యాక జగత్తులలోని ప్రాణుల హృదయములలో సాక్షిస్వరూపులై ఉంటారు కదా! అట్టి మహత్తర స్వరూపులగు మీకు ఇవే సాష్టాంగ దండప్రణామాలు,
Page:477
మూడు జగత్తులకు - (స్వర్గ, మర్త్య, పాతాళ జగత్తులకు; జాగ్రత్, స్వప్న, సుషుప్త జగత్తులకు) - -
సర్వదా ఆధారభూతులగు మీకు పదే పదే నమస్కారం.
హే భగవాన్! నాకొక చిన్నకోరిక ఉన్నది. చిదాకాశము నందు మీ వలన కల్పించబడే ఈ సంసారమాయ యొక్క పూర్వాపరాలు దర్శించాలని నా అభిలాష.
శ్రీవిష్ణుమూర్తి : ఓc! తప్పకుండా, ప్రియగాధీ! నీవు నా మాయను దర్శిస్తావు!… తదనంతరం నా భక్తుడవవటం చేత త్యజిస్తావు కూడా!
ఇట్లు పలికి శ్రీమహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆ బాలకుడు జగత్పతిని దర్శించటం చేత పరమప్రీతిని పొందాడు. మనస్సులో శ్రీవారిని దర్శించిన మధురానుభవం నిండియుండగా, క్రమంగా రోజులు గడుపసాగాడు. ఎప్పటి లాగానే తపస్సు, ధ్యానము, స్వాధ్యాయము, అతిథిపూజ నిర్వర్తిస్తూ అదే ఆశ్రమంలో చాలా రోజులు గడిపాడు.
ఒకరోజు ఉషఃకాలం సరోవరంలో స్నానం ఆచరించి ఒడ్డున ఒక చక్కటి చోట పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆతని మనస్సు విష్ణుభగవానునితో కలిగిన సమాగమం, మాయ యొక్క చమత్కారముల గురించి యోచన చేస్తూ ఉన్నది. కొంతసేపైన తరువాత యథాసమయమైన తరువాత మరల స్నానాదులు చేయాలని లేచి సరోవరంలో ప్రవేశించాడు. స్నానమైన తరువాత ఆచమనం చేసి, సంకల్పం చెప్పి “అఘమర్షణ సూక్తం” పఠించసాగాడు.
…అప్పుడు హఠాత్తుగా ఒక చోట యథాలాపంగా ఉచ్చారణ ఆగిపోయింది. తరువాత శ్లోకం గుర్తుకు రాలేదు. గుర్తుచేసుకొనే ప్రయత్నంలో మరొక మంత్రమేదో స్మృతికి వచ్చి, స్ఫురించ సాగింది. ధ్యాస - పరధ్యాసలను సమన్వయించుకుంటూ ఉండగా నీటి మధ్యలో ఏదో దృష్టిని ఆకర్షించింది. అక్కడ అతనికి ఏదో విశేషపరంపరలు కనిపించసాగాయి. అన్నిటినీ మరచి ఇక అటే దృష్టి, శ్రద్ధలను సారించసాగాడు. తన ధ్యాస నీటిమధ్యలో ఉండి ఉండగానే ప్రాణాలు దేహం నుండి బహిష్కరించబడుచున్నట్లు నవ్యానుభూతి పొందసాగాడు. అతని ధ్యాస ఏదో నూతన మార్గంలో ప్రసరించసాగింది. ఆ గాధియొక్క తదనంతరానుభవం ఇట్లా కొనసాగింది.
నిలుచున్నపాటునే గాధి యొక్క ప్రాణాలు శరీరంలోంచి బహిర్గతమైనాయి. శరీరం నేల కూలింది. “అయ్యో! నేను ఎంత ప్రయత్నించినా ఈ దేహం ఉపయోగానికి రావటంలేదే?” - అని ఆ జీవుడు కొద్దిసేపు తచ్చాడుతూ విచారించాడు. పాలిపోయిన ఆ శరీరం యొక్క ముఖం ఎండిపోయిన ఆకులాగా శుష్కమైపోయింది. కళ్ళుమూతలుబడి, బిగదీసుకుపోయాయి. ఎవరో బంధువులు ఆ నిర్జీవ శరీరం అక్కడుండటం గమనించారు. కొద్దిసేపట్లో ఈ వార్త అటూ ఇటూ పొక్కింది. దగ్గిర బంధువులంతా ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడకు చేరారు. ధూళితో నిండిన ఆ శరీరాన్ని దీనంగా చూస్తూ ఆతని తల్లి నెత్తి - నోరూ బాదుకుంటూ రోదించసాగింది. సోదరీసోదరులు కాళ్ళ దగ్గర
Page:478
ప్రక్కప్రక్కన కూర్చుని ఏడుస్తూ కళ్ళనీళ్ళు కార్చసాగారు. వారి రోదనధ్వని కొద్దిసేపు బిగ్గరగా, మరికొంతసేపు ఏవేవో అస్పష్ట శబ్దాలతో వినిపించసాగింది. అవయవములు ఒకదానితో మరొకటి ఇంతకాలం కలిసి ఉండి, ఇక చాలునని, వియోగం కొరకు మౌనంగా వేచి ఉన్నట్లు ఉన్నాయి. ప్రాణాలు నోటి నుండి నిష్క్రమించాయి కాబోలు… నోరు తెరచి ఉన్నది. పళ్ళు మిఱమిఱ మెరుస్తూ చూచేవారికి కొంచం భయం కలిగిస్తున్నాయి. చెవులు మౌనంగా రోదనలను వింటూ, “నా పట్ల ఎవరికి ఎంత ప్రేమ ఉన్నదో?" అని గమనిస్తున్నట్లుగా ఉన్నాయి. కాస్త దూరం నుండి చూస్తుంటే, ఏదో నిశ్చలమైన తపస్సులో నిమగ్నమైనట్లుగా ఆ దేహం మౌనంగా, శాంతంగా కనబడుతోంది. “నాయనా, బాబూ! ఎంతపని చేశావు… చెప్పినా వినలేదుకదా! అంతటివాడివి, ఇంతటివాడివి, అట్లా అనేవాడివి, ఇట్లా ఉండేవాడివి, మేం పాపిష్టివాళ్ళం… నిన్ను దక్కించుకోలేకపోయాం” అని చాలాసేపు అరుస్తూ ఉండుటచేత అక్కడి చాలామంది బంధువుల గొంతుకలు జీరబోయాయి. కానీ ఏం లాభం? వాళ్ళు ఏడ్చి ఏం సాధించగలరు? అశుభమగు ఆ ’శవము’ను అక్కడి నుండి తొలగించి దూరంగా నిర్జన ప్రదేశంలో పారవేసిరావలసిందే కదా.
‘గాధి’ అని ఇంతకాలం సంబోధింపబడుతూ వస్తున్న ఆ దేహి తన భౌతిక దేహము యొక్క గతినంతా గమనిస్తూ ఇక చేసేది లేక మరొక చోటు వెతుక్కుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ఆ మృతాత్మ అరణ్యప్రాంతంలో గల ఒక ఆటవిక కుగ్రామంలో ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించింది. అక్కడి గర్భవాసనా వ్యధలచే వ్యాకులపడింది. క్రమంగా నియమితకాలంలో శిశువై జన్మించింది. ఆటవిక జాతి నివసించే ఒక వాటికలో జన్మించిన ఆ బాలుడు ‘కటంజుడు’ అనే పేరుతో పిలువబడుచూ క్రమంగా 14 ఏళ్ళ బాలుడైనాడు. ఆ పిల్లవాడు అక్కడి పెద్దల మాటలు పెడచెవిని పెట్టుచూ అల్లరి చిల్లరగా తిరుగ ప్రారంభించాడు. కొన్ని వేటకుక్కలను వెంటబెట్టుకుని చుట్టు ప్రక్కల గల అడవులలో సంచరిస్తూ వందలాది మృగములను చంపుతూ కాలం గడుపసాగాడు. మృగముల పచ్చి మాంసమే అక్కడి జనులకు ముఖ్యాహారం.
కొంతకాలం తరువాత అక్కడి శ్వపచ (కుక్క మాంసం తినే ఒకానొక జాతివారి) కన్యను వివాహం చేసుకొన్నాడు. వాళ్ళిద్దరూ అక్కడ చిలక-గోరింకల వలె విహరించసాగారు. వారికి చాలా మంది సంతానం కలిగారు. కొంతకాలానికి దొంగతనం వంటి దుష్ప్రవర్తనల కారణంగా అక్కడివారిచే ఊరి నుండి వెడలగొట్టుబడుటచే, ఊరికి దూరంగా ఒక గుడిసె కట్టుకొని ఉండవలసివచ్చింది. ఆతని బుద్ధి పరమ కాఠిన్యంగా, చేతలు బహుక్రూరంగా ఉంటూ ఉండేవి.
కొంత కాలానికి అక్కడ ప్రబలిన ఒక భయంకరవ్యాధి సోకి ఆతని భార్య, పిల్లలు ఒకరొకరుగా మరణించారు. పాపం ఆతడు ఒంటరివాడైపోయాడు. గుంపులోంచి తప్పిపోయిన లేడి లాగా విలవిల్లాడి పోయాడు. ఆతని ఇతఃపూర్వపు హింసాప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని ఊరివారు గాని, తదితర బంధువులు గాని ఊళ్ళోకి రానీయలేదు. ఆతనికి సంసారము పట్ల విశ్వాసం సన్నగిల్లింది.
Page:479
ఒక మారుమూల ప్రదేశంలో ఒక చోట కూర్చుని చాలా రోజులు రోదించాడు. ఏం చేయాలి మరి? అక్కడి శ్వపచజాతి వారు ఆతనిని దరిజేరనీయరాయె! తన దుష్ట, నీచ చర్యలకు బహిష్కరించారు మరి! కొద్ది రోజుల తరువాత కటంజుడు అక్కడి నుండి లేచాడు. దీర్ఘప్రయాణాలు చేస్తూ, చుట్టుప్రక్కల దేశాలు సందర్శిస్తూ భిక్షాటనంతో కడుపు నింపుకుంటూ కొంతకాలానికి “కీర” అనే దేశం చేరాడు. ఆ దేశానికి ముఖ్య పట్టణమైన కీరనగరం ప్రవేశించాడు.
ఆతడు ఆ విధంగా కీర పట్టణంలో ప్రవేశిస్తూ అక్కడంతా ఎంతో సందడిగా ఉండటం చూచాడు. అక్కడి విశేషాలు తెలిశాయి. ఆ దేశపురాజు ఆ క్రితం రోజే అకస్మాత్తుగా మరణించాడు. దురదృష్టవశాత్తూ చనిపోయిన ఆ రాజుకు సంతానంలేదు. ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం ఆ పరిస్థితులలో పట్టపుటేనుగు ఆ దేశపు ఏ ఏ పౌరుడి మెడలో పూలదండ అలంకరిస్తే ఆతడే రాజు అవుతాడు. ఆరాజ్యంలోని వివిధ ప్రదేశాల నుండి ప్రజలు తమతమ అదృష్టములను పరీక్షించు కోవటానికి కీర పట్టణానికి తరలివచ్చారు. ఆ రోజు తదితర రాజ్యప్రజలకు వేరే దేశపు పౌరులకు) పట్టణప్రవేశం నిషేధం. అయితే భిక్షకుడగు కటంజుని విషయం అక్కడి సైనికుల దృష్టికి రానేలేదు. వచ్చి ఉంటే, ఆతనిని అక్కడ ఉండనిచ్చేవారు కాదు.
రాజవీధులన్నీ జన సందోహంతో నిండిపోయాయి. ఎవరికి వారే మెడలను సవరించుకుంటూ దేవుళ్ళకు మొక్కుకోవటం, ఊహలలో విహరించటం చేస్తున్నారు. భిక్షకులంతా ఒక వైపుగా నిలబడి ఈ తతంగమంతా కుతూహలంగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఆ భిక్షకులలో ఒక చివరగా బిక్కుబిక్కు మంటూ, అక్కడి తదితర భిక్షకుల అదరింపులు, ఛీదరింపులూ పొందుతూ ఆకలి, విసుగులను దిగమ్రింగుకుంటూ కటంజుడు ఒక మూల నిలబడి చూస్తున్నాడు.
ఇంతలో సర్వాంగసుందరంగా అలంకరించిన పట్టపుటేనుగు ఆ వీధిలోకి రానే వచ్చింది. తమని దాటి ముందుకు పోతున్న పట్టపు ఏనుగును చూస్తూ, జనులు ఉస్సురనుకుంటూ, అక్కడి సైనికులకు వెరచి, మాట పైకి రాకుండా, నిరుత్సాహంగా చూస్తున్నారు.
ఇంతలో ఆ ఏనుగు భిక్షకులు నిలుచున్నచోటికి వచ్చింది. సరాసరి కటంజుని మెడలో పూల మాల వేసింది. కటంజుడు ఆ హటాత్సంఘటనకు విస్తుపోయాడు. ఇంకా ఆశ్చర్యం నుండి తేరు కోకుండానే, ఒక్కసారి దుందుభులు మ్రోగాయి. సైనికులు ఆ భిక్షకుని పేరు అడిగి తెలుసుకున్నారు. "మన క్రొత్త మహారాజు కటంజులవారికి విజయోస్తు, దిగ్విజయమస్తు!” - - అని బిగ్గరగా కేకలు మిన్నుముట్టాయి. పరిచారికలు చేతిలో పూదండతో ఆతనిని సమీపించారు. వారు వివిధ గంధ లేపనములతో, ఆభరణములతో ఆతనిని అలంకరించారు. ప్రజలు చుట్టుముట్టి జేజేలు పలుకు చుండగా కటంజుని రాజసభకు తీసుకొనిపోయి, రాజసింహాసనంపై కూర్చోబెట్టారు. బ్రహ్మాండంగా ఐదు రోజులు పట్టాభిషేకమహోత్సవం జరిగింది. క్రొత్తగా వచ్చిన రాజుకు “గవలమహారాజు” అని నూతన నామధేయం ప్రతిక్షేపించారు.
Page:480
ఇకప్పటి నుండి ఆతడు కీరపుర స్త్రీలతో విరాజిల్లుతూ, చింతావిషాదరహితుడై మంత్రులతో కూడి రాజ్యపాలన చేయసాగాడు. కొద్ది నెలలో ఆతని ఇచ్ఛను అనుసరించి అనేక రాజశాసనాలు అమలుకు వచ్చాయి. కార్యదక్షులగు ప్రతినిధులు రాజ్యంలోని వివిధ ప్రదేశముల నుండి రాజ శాసనములు అమలుపరుస్తుండగా, అతడు దక్షతతో రాజ్యం ఏలుచూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడపసాగాడు. ఆతడు “గవలమహారాజు” అనే నూతన నామధేయంతో అక్కడ ప్రసిద్ధికెక్కాడు. ప్రజలందరూ ఆ మహారాజును ఎంతగానో ప్రస్తుతించుచూ ఉండేవారు.
గవలమహారాజు (కటంజుడు) యొక్క పరిపాలనాదక్షతచే ప్రజలు శోక - భయ - PODE
ok
రహితులై సుఖంగా కాలంగడుపుచుండేవారు. ఆ సమయంలో అతడు తన ఇంతఃపూర్వపు ఆటవిక జీవితమంతా పూర్తిగా విస్మరించాడు. నిరంతరం స్తవనములతో, మంగళగీతములతో ఆనందిస్తూ, మత్తులో ఉన్నవానివలె రోజులు గడపసాగాడు. ఆ విధంగా ఎనిమిదేండ్లు గడచిపోయాయి. అతని సంస్కారమే మారిపోయింది. దయ - - దాక్షిణ్యము - దానము - న్యాయము వంటి ఆర్యగుణములతో ఆతడు ప్రజలకు ప్రియుడైనాడు.
ఒకరోజు గవలునకు ఎందుకో తన మునుపటి రోజులు గుర్తుకు వచ్చాయి. “ఈ రాజ్యపాలన, ఈ సంరంభములు బాగానే ఉన్నాయి గాని, నా మునుపటి ఏకాంత జీవితం ఇప్పుడు లభించుటయే లేదే? పూర్వం ఆటవిక - శ్వపచజాతిలో ఉన్నప్పుడు గోచి పెట్టుకొని వేటాడుతూ ఉంటే ఎంత బాగుండేది! …రహస్యంగానైనా సరే, ఒక్కరోజు ఈ రాజ్యపాలన ప్రక్కకు పెట్టి, నా ఇంతఃపూర్వపు రూపంలో దగ్గిరగా ఉన్న అడవిలో సంచరించి రావాలి“ అని అనుకున్నాడు. ఆలోచన వచ్చినదే తడువుగా, ఆ సాయంకాలం అంతఃపురం త్వరగా చేరాడు. ఏకాంత మందిరంలో ప్రవేశించాడు. తన అలంకరణములన్నీ ఊడదీసి ఆటవిక రూపంలో గోచిపెట్టుకొన్నాడు. “అమ్మయ్యా! హాయిగా ఉన్నది. ఈ కృత్రిమమైన అలంకారాలు మనిషికి ఎందుకు?” - అని అనుకుంటూ, ఒకరిద్దరు మంత్రులకు - రాజుకు మాత్రమే తెలిసి ఉండే రహస్యమార్గం గుండా అంతఃపురం నుండి బైటపడ్డాడు. ఆతడు ఇప్పుడు అచ్చం ఇతః పూర్వపు కటంజునిలాగానే ఉన్నాడు. అయితే, ఆతని చిత్తము ఇప్పుడు తన ప్రాచీన క్రౌర్యమును త్యజించి ఔదార్యముతో నిండి ఉన్నది.
క్రమంగా కీరపట్టణం వదలి, అడవుల వైపుగా వెళ్ళే మార్గంలో అడుగులు వేస్తూ బయలు దేరాడు. కొద్దిసేపు నడచిన తరువాత ఆతనికి ఒకచోట అత్యంత సుపరిచితమైన ఆటవికుల డప్పుల బూరల శబ్దం వినిపించింది. “ఇదేమిటి, మా శ్వపచులు ఉపయోగించే బూరలశబ్దాలు వినబడు తున్నాయి?” అని అనుకుంటూ అటువైపుగా నడిచాడు. ఆశ్చర్యం! వాళ్ళు ఎవరో కాదు! తన శ్వపచ జాతి బంధువులే. వాళ్ళ డప్పుల శబ్దాలకు పూర్వసంస్కార ప్రభావం చేత ఒక్కసారి పైకి ఎగిరిగంతులు
Page:481
వేయసాగాడు. వాళ్ళతో బాటే లయగా నృత్యం చేయ ప్రారంభించాడు. ఆ శ్వపచుల నాయకుడు కటంజుని గుర్తుపట్టేశాడు.
శ్వపచులనాయకుడు : ఓరి కటంజుడా! నువ్వట్రా! ఈ కీరదేశం ఎప్పుడొచ్చావు? ఇంతకాలం ఏమైనావు! చాలా రోజులకు కనిపించావే! ఇప్పుడు నాజూకుగా తయ్యారయ్యావు! ఇదివరకు మొరటుగా అందరిని హింసిస్తూ హంగామా చేసేవాడివి కదా! ఇంతకాలం ఎక్కడో ఏ అడవిలోనో నీవు ఏ మృగానికో ఆహారమైపోయావని అనుకున్నాం. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడి రాజు కళలను ఆదరిస్తాడని, మన తప్పెట నృత్యం చూచి బట్టలు, డబ్బు ఇస్తాడని విని మేము వచ్చాం. ఇక్కడ ఏంచేస్తున్నావు? ఇక్కడి వాళ్ళు ఎవరైనా తెలుసా?
ఆ శ్వపచులనాయకుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కటంజునకు నోట మాట రాలేదు. ఇంకేం మాట్లాడకుండా వెనుకకు తిరిగి కీరపట్టణం వైపు పరుగు లంకించుకున్నాడు. అక్కడి శ్వపచజాతివాళ్ళు "వీడికి ఇంకా బుద్ధిరాలా?” అని అనుకుంటూ తమ తప్పెట తాళనృత్యం కొనసాగించారు.
కటంజుడు ఎవ్వరికంటా పడకుండా అంతఃపురం చేరి మరల రాజవస్త్రాలు ధరించాడు. “ఇంకా నయం! కీరరాజ్య ప్రజలకి నేను వేరే దేశపు ఆటవికులలోని శ్వపచజాతివాడినని తెలియలేదు. బ్రతికిపోయా" - అని అనుకున్నాడు. అక్కడి రాజ్యాంగ విధానం అతడు ఎఱిగియే ఉన్నాడు.
మరొకరెండు రోజులు గడిచాయి. రెండో రోజు సాయంకాలం రాజసభాప్రాంగణంలోని వినోద భవనానికి రాజు ఏనుగుపై తరలి వచ్చాడు. ప్రజల వినోదం కొరకు మంత్రులు ఆ రోజు శ్వపచుల తప్పెటనృత్యం ఏర్పరచారు. రాజు ఎప్పటిలాగానే ఆ సభకు వచ్చి సింహాసనం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాడు. శ్వపచజాతి నాయకుడు, తదితర శ్వపచజాతి వారు కటంజుని గుర్తుపట్టారు. “అయ్య బాబోయ్! మన కటంజుడే ఇక్కడి రాజు!” అని ఆశ్చర్యపోయారు. తమలో తాము గుసగున “లాడటం ప్రారంభించారు. ఇదంతా ఏమాత్రం తెలియని రాజు ఎప్పటిలాగానే పోయి రాజ సింహాసనంపై ఆసీనుడైనాడు. శ్వపచజాతినాయకుడు ఒక మంత్రిదగ్గరకు వెళ్ళి ”అయ్యా! ఆ రాజు ఎవరో కాదు. మా ఆటవిక శ్వపచజాతి వాడే. మా ఊరి నుండి ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజయ్యాడని మాకు తెలియనే తెలియదు” అని చెప్పుకుంటూపోతున్నాడు. అది వింటున్న కీరరాజ్యపు మంత్రి అవాక్కయ్యాడు.
ఏమిటీ? మా గవలమహారాజు మా దేశపు పౌరుడు కాదా? పైగా ఆతడు ఒక ఆటవికుడా? అందులోనూ, కుక్కమాంసం తినే ఆచారంగల శ్వపచజాతి వాడా? ఎంత ఘోరం, అరిష్టం జరిగి పోయింది! కీరదేశపు రాజ్యాంగం ప్రకారం ఇది చాలా అరిష్టముతో కూడిన దోషమైన విషయమే? ఇప్పుడేంచేయాలి?
తప్పెట నృత్యం జరుగుతుండగానే ఈ విషయం తదితర మంత్రులకు తెలిసిపోయింది. క్రమంగా గుసగుసలు బయలుదేరాయి. వినోదసమయం అయిపోయేసరికి విషయమంతా చాలా
Page:482
మందికి తెలిసిపోయింది. రాజు అంతఃపురానికి వెళుతూ జనులలో అనేకులు విషణ్ణంగా ఉండటం గమనించాడు కూడా. అయితే, అప్పటికీ అతనికి కారణం తెలియదు. కనుక పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత ఆతనికి జరిగిందేమిటో తెలిసింది. క్రమంగా ‘ఒక దూరదేశపు శ్వపచజాతివాడు ఇంతకాలం రాజ్యం ఏలాడు’ అనే వార్త కీరదేశమంతా పాకింది. పురవాసులలో అనేకమంది దేశభక్తికలవారు దుఃఖితులైయ్యారు. సేవకులు ఆతని ఆజ్ఞలను తృణీకరించసాగారు. ఆతనిని “క్రూరకర్మలు చేసే ఒక అమంగళుడు” గా ప్రజలు చూడసాగారు. రాజసభకు ప్రజలు రావటం మానివేశారు. సేవకజనులలో చాలామంది అంతఃపురానికి రావటంలేదు. ఆతడు చాలాసార్లు పలకరించినా మంత్రులు తిరిగి పలుకుటయేలేదు. ”ఏమిటిది? క్రమంగా నేను చిల్లిగవ్వ కూడా లేని దూరదేశపు బాటసారిగా అయిపోతున్నానా?” అని వ్యధ చెందసాగాడు.
నాలుగురోజులు గడిచాయి. రాజ్యాంగసంరక్షకులగు మంత్రులందరూ ఒకచోట సమావేశ మైనారు. అయ్యో! ఈ పొరపాటు ఎట్లా జరిగినా మంత్రులమైన మనమే కదా, బాధ్యులం! మనం చాలాకాలం ఈ విదేశీ శ్వపచుని పాలనలో ఉన్నాం! రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు పరచలేకపోవటం మనది ఎంత తప్పు! - అని చర్చించుకోసాగారు.
కొద్దిమంది మంత్రులు “దేశానికి మేము చేసిన ఈ తప్పుకు ఆత్మాహుతియే శరణ్యం”– అని నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు అక్కడ పెద్ద అగ్నిగుండం తయారుచేసి "కీరరాజ్యమునకు మా వలన అంటిన దోషము తొలగుగాక! కీరప్రజలకు మంచి జరుగుగాక” అని కేకలు వేస్తూ అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మాహుతి చేసుకున్నారు. పట్టణమధ్యంలో జరిగిన ఈ సంఘటనను చూస్తూ స్త్రీలు పెద్దగా కరుణారసస్వరముతో ఏడవసాగారు. అనేకమంది ప్రజలు ఆ అగ్నిగుండం చుట్టూ నిలుచుని చూస్తూ తమ బుద్ధిని కోల్పోయారు. నిప్పులో ఉడుకుచున్న శరీరముల దుర్గంధం పట్టణమంతా వ్యాపించింది.
ఇది ఇట్లా ఉండగా, రాజు నిర్వీర్యుడు - అధికారహితుడు అయ్యాడని సంఘవిద్రోహులకు తెలిసిపోయింది. దొంగలముఠాలు దేశంలోని అనేకచోట్ల ఇళ్ళపై బడి ఇష్టం వచ్చినట్లు దోచుకోసాగారు. అనేక జరగరాని సంఘటనలు చోటు చేసుకోవటం చేత ప్రజలు తమ మాన - ధనాదులకు రక్షణ కోల్పోయారు.
కాకతాళీయంగా రాజయి, సద్గుణములతో సజ్జనసహవాసము, ఎనిమిదేళ్ళు రాజ్యాధికారం అనుభవించిన కటంజుడు ఒక్క నాలుగు రోజులలో ఏర్పడిన కకావికలాలన్నీ గమనించాడు. “అయ్యో! నా వల్లనే కదా, ఈ జరగరానిదంతా జరిగిపోతోంది! ఇంతగొప్ప దేశానికి నా కారణంగా ఇంతటి అనర్థం జరిగిపోతుంటే, నేను ఇప్పుడేం చేయాలి? అయినా ఇకనేను ఎవరికోసం, ఎందుకు జీవించాలి? మరి కొంతమంది మంచివారు ఆత్మాహుతి చేసుకోక ముందు నేనే తొలగితే, వీరు
Page:483
మరొక రాజును శాస్త్రానుసారం ఎన్నుకుంటారు. అందుచేత ఈ ప్రజల ఇప్పటి దుర్దశ తొలగటానికి నాకు నేనే ప్రాణత్యాగం చేస్తాను!”
ఇట్లు తలచి కటంజుడు వీథిలోకి వచ్చాడు. ఒక ప్రదేశంలో చితిపేర్చాడు. “ఓ కీరదేశ ప్రజలారా! మీరు ఆవేశపడి మరికొన్ని అనర్ధములు తెచ్చిపెట్టుకోకండి. కీరదేశ సంక్షేమం కోరి ఈ గవలుడు భౌతికదేహం అగ్నిపాలు చేస్తున్నాడు” అని మూడుసార్లు పెద్దగా ప్రకటిస్తూ మరిక ఎవ్వరేమంటున్నదీ ఏమాత్రం వినకుండా అగ్నిప్రవేశం చేశాడు.
సరోవరంలో అఘమర్షణ సూక్తం గానం చేస్తూ యథాలాపంగా ఉన్న గాధి కంఠంలో మంటగా ఉన్నట్లు అనిపించి, ఒక్కసారి నలువైపులా చూచి, తాను ఎక్కడున్నదీ గుర్తుతెచ్చుకున్నాడు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఒడ్డుకు చేరిన సముద్ర తరంగం క్షణ కాలంలో శాంతిస్తుంది చూచావా! అట్లా గాధి పొందిన దృశ్యమంతా క్షణంలో మటుమాయమైపోయింది. మనోసంకల్ప రూపమగు సమ్మోహనము నుండి ఆతడు విరతి (withdrawl) పొందాడు. కల్లుత్రాగుటచే మత్తెక్కినవాడు కైపు తగ్గగానే, ఆ మత్తు నుండి విడివడునట్లు ఆతడు కీరరాజ్య పాలన - దేశ వ్యవహారాలు మొదలైన వాటి నుండి విడివడ్డాడు. "ఆహా! నేను గాధి అను పేరుతో పిలువబడే మునిని కదా” అని నిజ రూపం తలచుకుంటూ, జల మధ్యం లోంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆకాశం, నేల, దిక్కులు ఎప్పటి వలెనే ఉన్నట్లు గమనించి ఎంతో ఆశ్చర్యపడ్డాడు.
గాధి తనలో తాను “ఆహా! నేనెవడను? ఏమి చూచాను? ఇప్పుడు నాకు అనుభవమైనదంతా ఏమిటి?" అని జరిగినదంతా తర్కించుకున్నాడు. ఓహో! అదీ సంగతి. కొంచం అలసిపోయి ఉండటం చేత, డస్సి ఉన్న నేను కొద్దిక్షణాలు ఏదో భ్రమను స్వప్న సదృశంగా చూచాను కాబోలు.” అని అనుకుంటూ బాటలో నడవసాగాడు. ఆశ్రమం వైపు పోతూ ఇంకా ఇట్లు తలపోయసాగాడు. గాధి (తనలో తాను) : నేను రాజ్యపాలన చేస్తూ చేస్తూ నా వలన తదితరులకు జరిగిన దోషమును పరిహరించుకోవటం కోసం అగ్నిలో ప్రవేశించాను కదా! ఆ అనుభవమునకు సంబంధించిన స్త్రీలు, మంత్రులు, శ్వపచజాతి ఆటవికులు, సభికులు మొదలైన వారంతా ఎవరు? ఎక్కడున్నారు? నేనా, అవివాహితుడను, స్త్రీ యొక్క కరస్పర్శను కూడా ఎరుగను. ఇక నా బంధువులా, వాళ్ళంతా దూరంగా ఉండే నా స్వగ్రామంలో ఉన్నారాయె! మరి నేను అగ్ని ప్రవేశం చేసింది ఎవరి సమక్షంలో? స్వప్న నగరం వంటి ఈ సంఘటనలను అసలు ఎందుకు పొందినట్లు?
అవును! అదంతా స్వప్నం వలె భ్రమయే అయి ఉంటుంది. నేను మృతి చెందటం నా బంధు వులు రావటం, ఈ భౌతిక దేహమును చూచి ఏడవటం, నేను మరొక తల్లి గర్భంలో ప్రవేశించటం,
Page:484
ఆటవిక శ్వపచులలో పుట్టి పెరగటం, పెళ్ళి, పిల్లలు, మా జాతివారి గ్రామ బహిష్కరణ, పరరాజ్య ప్రయాణం, రాజవటం, నా తోటి గ్రామస్థులు నన్ను గుర్తించటం, మంత్రులకు ఆ రహస్యం తెలిసి పోవటం, వారిలో కొందరి ఆత్మాహుతి, చివరికి నేనే ఆత్మాహుతి చేసుకోవటం, ఇదంతా సుదీర్ఘంగా అనుభవించినాను గాని, అంతా ఒక స్వప్నమే అయి ఉంటుంది. ఇప్పటికి అది కలే గాని, అబ్బా! అప్పటికి మాత్రం ఎంతగా సత్యమైన అనుభవం! ఏడ్చాను, నవ్వాను, హింసించాను, భంగపడ్డాను, భయపడ్డాను, రాజ్యాధికారం చెలాయించాను! …నేను పొందనిది లేదు. అరె! “నేను గాధిని” అనే విషయమే ఆ ఆ సుదీర్ఘ సమయంలో జ్ఞాపకం రాలేదే? అవునులే. స్వప్న సమయంలో జాగృత్ స్థితి విశేషం జ్ఞాపకం రావటం లేదుగా! ఇదీ అంతే.
అయినా, అంత సుస్పష్టంగా అనేక విషయాలు అనుభవించాను కదా! ఊళ్ళో వాళ్ళని హింసించటం చేత వాళ్ళు నన్ను నా పెళ్లాం బిడ్డలను బహిష్కరించారు. నా పెళ్ళాం బిడ్డలు నా కళ్ళ ఎదురుగా మరణించారు. నేను దేశ దేశాలు నడుచుకుంటూ కీరదేశం ప్రవేశించాను. భిక్షకుల మధ్యలో భయంభయంగా నిలబడి ఉన్న నన్ను పట్టపు ఏనుగు వచ్చి పూలమాలతో అలంకరించింది. రాజయ్యాను. న్యాయనిర్ణయాలు చేస్తూ, రాజ్యపాలన చేశాను. మా గ్రామంవారైన శ్వపచులు నన్ను ఊరి బయట చూచి గుర్తించారు. ఆ రోజు నేను గోచీ పెట్టుకుని రాజాంతఃపురం నుండి రహస్య మార్గం గుండా బయటకు వెళ్ళకపోతే నేను ఇంకా రాజుగానే ఉండే వాడినేమో! అరెరేఁ! నేనట్లా చేయవలసింది కాదు.
కనుక అదంతా అసత్యమో, స్వప్నమో ఎలా అవుతుంది? కాదు. ఏది నిజం! ఏది అసత్యం! చండాల-రాజ జీవితములలో ఒక్కటైనా సత్యమా! రెండూ స్వప్నమేనా? ఇదే విష్ణుమాయ కాబోలు. అవును! పిచ్చెక్కిన పులి పిచ్చి పిచ్చిగా అడవులలో సంచరిస్తున్నట్లు ఈ చిత్తము కూడా భ్రాంతి దృష్టులతో పరిభ్రమించటం జరిగిందా? అయి ఉండవచ్చు.
ఈ విధంగా ఆయా సంఘటనను గురించి చిత్తము యొక్క మోహము గురించి ఆలోచిస్తూ గాధి అక్కడి తన ఆశ్రమం చేరాడు. కొద్దిరోజులు గడచిపోయాయి. ఆతడు యథాప్రకారంగా తన ధ్యాన, తప, అధ్యయనాదులు కొనసాగించసాగాడు.
ఒక రోజు ఒక బాటసారి ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆతడు, దీర్ఘమైన ప్రయాణాలు చేసి ఉండటం చేత కాబోలు, ఎంతో అలసిపోయి, నీరసంగా కనిపించాడు. గాధి ఆ అతిథిని ఆహ్వానించి, ఉపచారాదులతో సేవించాడు. కొంతసేపైన తరువాత ఆ బాటసారి కాస్త ఓపిక, ఉత్సాహము పుంజుకున్నాడు.
గాధి : అయ్యా! మీ అలసట తొలగిందా? మధ్యాహ్నం మీరు వచ్చే సమయంలో ఎంతో అలిసి పోయి, డస్సి ఉన్నారు. ఏమైనా అనారోగ్యం కారణమా?
బాటసారి : లేదు నాయనా! నేను ఇంతగా కృశించి ఉండటానికి ఒక ముఖ్య కారణమున్నది.
Page:485
ప్రయాగలో ఆలయం చుట్టూ రోజుకు వేయి అంగప్రదక్షిణాలు 100 రోజులుగా చేశాను. అందుచేతనే నీరసంగా కనిపిస్తున్నాను. నీ అతిథి సేవలచే నా అలసట కొంచం తగ్గింది. చాలా సంతోషం. గాధి : అంత శారీరక శ్రమ పొందవలసిన అగత్యం మీకేమున్నది? బాటసారి : అదంతా ప్రాయశ్చిత్తంగా చేయవలసి వచ్చింది.
గాధి : మీరేమి తప్పు చేశారని ప్రాయశ్చిత్తం అవసరమైనది?
బాటసారి : ఇక్కడికి ఉత్తరంగా చాలా దూరంగా ‘కీర’ అనే ప్రసిద్ధ దేశం ఉన్నది. ఆ దేశానికి గల సరిహద్దులలో ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుకునే వాడను. ఒకసారి ప్రజల ఆహ్వానం మీద అక్కడి ముఖ్య పట్టణమైన కీరనగరం వెళ్ళాను. పురాణాలు చెప్పుతూ అక్కడివారి ఆతిథ్యంలో చాలా రోజులు గడిపాను. అయితే అక్కడ అకస్మాత్తుగా రాజ్యాంగ విరుద్ధమైన ఒక అపశ్రుతి బయటకు పొక్కింది. ఆ దేశాన్ని ఎనిమిదేళ్ళుగా ఒక పరాయిదేశీయుడు పాలించాడు. అంతే గాదు… ఆ రాజు ఇతఃపూర్వం ఒక ఆటవిక - కుక్క మాంసంతినే ఆచారం గల శ్వపచజాతి వాడట. ఆతడు విజాతీయుడని తెలియగానే ఆతనిని అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఆతని పాలనలో ఉన్నందుకుగాను వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ప్రారంభించారు. నేను చూస్తూ ఉండగానే అక్కడి కొందరు రాజ్య శ్రేయోభిలాషులు, ఆ ఆ రాజు కూడా అగ్నిలో ప్రవేశించారు. ఆ విధంగా నిండు ప్రాణాలు కళ్ళకెదురుగా హాహాకారాలు చేస్తూ మసికావటం చూచి నా మనస్సు కకావికలు అయినది. ఇక అక్కడ ఉండలేకపోయాను. ఎన్నో మైళ్ళు కాలినడకన ప్రయాణించి ‘ప్రయాగ’ వెళ్ళాను. అక్కడ నా మనస్సుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి 100రోజులు ఉపవాసం ఉంటూ దైవార్చన సాగించాను. ప్రతిరోజూ దేవాలయంలో వేయి ప్రదక్షిణలు, అంగప్రదక్షిణలు, ధ్యాన పూజాదులు నిర్వర్తించాను. కొన్ని రోజులయిన తరువాత నా మనస్సు కుదుటపడింది. ఇక కొన్నాళ్లకి అక్కడి నుండి బయలుదేరి దేశాటనం చేస్తూ ఈ రోజుకు నీకు అతిథినయ్యాను. నియమ నిష్ఠలతో నిర్వర్తించిన ధ్యాన పూజాదుల వలన కలిగిన శారీరక శ్రమ వల్ల నేను కొంచం కృశించినట్లున్నాను.
ఆ బాటసారి చెప్పుచున్నదంతా విన్న తరువాత గాధిమునికి ఆశ్చర్యం వేసింది. ఏవేవో ప్రశ్నలు వేసి కీరపట్టణం గురించి ఏవేవో విశేషాలన్నీ విన్నాడు. ఆ రాత్రి వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళకు తెలియకుండానే గడచిపోయింది. తెల్లవారిన తరువాత ఉపాహారం తీసుకొని బాటసారి గాధి వద్ద సెలవు తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. అతిథి మర్యాదలతో ఆ బాటసారిని సాగనంపిన తరువాత ఇక గాధి ఆలోచనలో పడ్డాడు.
గాధి : అరె! ఎంత ఆశ్చర్యం! ఈ బాటసారి చెప్పిన దానికీ, నేను తటాకంలో అఘమర్షణ మంత్ర పఠనం చేస్తూ భ్రాంతి వశం చేత పొందిన అనుభవ పరంపరలకూ ఎంతో పొంతన కుదురుతోందే! నేను ఏది దర్శనం చేశానో అదంతా ఇతనికి పూసగుచ్చినట్లుగా ఎవరైనా చెప్పారా? ఎవరు చెపుతారు? నేను మరెవ్వరితోనూ చెప్పనే లేదు కదా! ఏది మాయ? ఏది భ్రాంతి? చూస్తుంటే ఈ
Page:486
ఆశ్రమం, ఇక్కడి మా స్వగ్రామంలోని నా బంధువులు, ఈ బాటసారి… ఇవన్నీ మాయలోనివేనా! లేక, కీర రాజ్యం మాయలోనిదా? నేనెవరిని? ఈ మాయ ఏమిటి? గాధి అనగా నేనేనా? మరెవ్వరన్నానా?
నేను ఆ బంధుజనం మధ్యలో అగ్నిప్రవేశం చేయటం ‘మాయలోనిదే’ అనటంలో ఏమాత్రం సందేహం లేదు కదా! ‘కీర నగరం’ అనబడేది ఉన్నదా? లాభం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ సర్వ అనుభవ పరంపరలోని సత్యాసత్యములేమిటో కనిపెట్టవలసిందే. కనిపెట్టేది ఎట్లా! ఆ! ఏమున్నది ఈ బాటసారి ‘ఉత్తరం వైపు కీరదేశం’ గురించి సూచించాడు కదా!
ప్రయత్నశీలుడు పొందలేనిదంటూ ఏముంటుంది? గాధి జగన్మాయను సంపూర్ణంగా దర్శించా లనే ఉద్దేశంతో తన ఆశ్రమం నుండి బయలుదేరాడు. చాలా రోజులు ప్రయాణించి ముందుగా ఆటవిక శ్వపచులు ఉండే జనారణ్య ప్రాంతం చేరుకున్నాడు. తాను పుట్టి, కటంజుడు అను పేరుతో పెరిగి సంచరించిన ఆ గ్రామంలో తన జ్ఞాపకాలకు సంబంధించిన ఎన్నో చిహ్నాలు చూచాడు. పుట్టి ఎన్నో ఏళ్ళు పెరిగిన ఆ ప్రాంతమంతా ఎంతో సుపరిచితంగా కనిపించింది. అది చూచిన ఆతని మనస్సంతా వైరాగ్యంతో నిండిపోయింది. అక్కడి ఆతని ఇతఃపూర్వపు గృహం గోడలు కూలి ఉన్నాయి. తాను ప్రతిరోజూ పరుండే చాప శిథిలమై ఓ మూల కనిపించింది. ఊరికి చివరిగా ఉన్న ఆ గుడిసెలో భోజన పానములకు ఉపయోగించిన చిప్పలు, బొచ్చెలు, కుండలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా బొమికలు పుట్టెలతో నిండి ఉన్నది. అంతా పరిశీలిస్తూ ఆతడు శ్వపచుల గ్రామమంతా చుట్టి వచ్చాడు. అక్కడి వారిలో తనకు పూర్వపరిచయస్థులు కొందరు తారసపడ్డారు. వారిలో తనకు సుపరిచయమైన ఒక వ్యక్తితో వారి భాషలో సంభాషణ ప్రారంభించాడు. గాధి : బాబూ ! నీ పేరు సుబ్బడు కదా!
ఆ మనిషి : ఆ! నేనే నయ్యా సుబ్బడు. నాపేరు నీకెలా తెలిసింది?
గాధి : అదిగో, ఆ చివర ఊరికి దూరంగా గుడిసె కనిపిస్తోందే! అక్కడ ఎవరుండేవారు?
ఆ వృద్ధ శ్వపచుడు : ఓహో! అదా! అక్కడ కటంజుడనే ఒకడు పెళ్ళాంబిడ్డలతో ఉండేవాడు. వాడు మా వాడే. అయితే ఊళ్లో దొంగతనాలు, తిట్టటం, కొట్టటం చేస్తుంటే మా నాయకులు బహిష్కరిస్తే పెళ్లాం బిడ్డలతో సహా వెళ్ళి అక్కడ గుడిసె కట్టుకున్నాడు. చాలాకాలం క్రితం పెళ్లాం బిడ్డలు చచ్చిపోతే వాడు ఏదో దేశానికి వెళ్ళి భిక్షాటనం చేసుకుంటూ రాజు అయ్యాడు. ఆ మధ్య అక్కడేదో గొడవ వచ్చి చచ్చిపోయాడని విన్నాను. ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత ఆతను చాలా మంచివాడుగా మారాడట. ఆతని గురించి తమరు ఎందుకు అడుగుచున్నారు? మీరు గాని కీరదేశం వాళ్ళా?
ఈ విధంగా అక్కడి వారి అనేకులతో కటంజుని గురించి సంభాషించాడు. అక్కడి వారికి ఏదో సర్దిచెప్పుచూ అక్కడే ఒక మాసం రోజులు గడిపాడు. తాను ఆటవిక - శ్వపచజాతి సంబంధమైన
Page:487
భావము చేత పొందిన విశేషాలనే అక్కడివారు కూడా కటంజుని పరంగా చెప్పటం విన్నాడు. అయితే ఆ గాధి యొక్క చిత్తము అప్పటికీ తృప్తి పొందలేదు. అక్కడ ఉన్న అనేక అడవి ప్రదేశాలను గుర్తుపడుతూనే, తనలో ఇట్లు చింతించసాగాడు.
గాధి (తనలో) : ఆహా! నేను ఎన్నో ఏనుగులను చంపి, ఆ దంతములను ఈ గోడలలో గ్రుచ్చి మట్టితో తాడించాను. ఈ ఏనుగు దంతములు ఇంకా చెక్కుచెదరలేదు. ఇక్కడ నా భార్యతో, కొడుకులతో సమావేశమై మాంసపు ముక్కలు కాల్చుకు తినటం, సురాపానం చేయటం - - అవన్నీ ఇప్పటి సంఘటనలలాగానే ఉన్నాయే! ఎన్నోసార్లు నా భార్యతో కూడి వానరమాంసం తిని, కల్లు తాగి సింహచర్మం పరచుకొని పరుండే వాళ్లం. మాంసం తిని బలిసిన జోడు కుక్కలను ఇక్కడే కట్టేసే వాళ్ళం. అప్పుడు నా చిన్నతనంలో ఇక్కడ అమ్మోరి గుడి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదిగో, ఇక్కడ బండరాయి మీద కూర్చుని జంతువుల రక్తం త్రాగుతూ, పాటలు పాడుకుంటుండే వాళ్ళం కదా! ఈ మూల, పొదల దగ్గిర పిట్టలను పట్టుకోవటానికి వల పన్నే వాళ్ళం. ఆహా! విధాత చేష్టలు ఎంత చిత్రమైనవి! సరే! ఇప్పుడు కీరదేశం వెళ్ళి అక్కడి చమత్కార విషయాలుకూడా చూచి వెళ్తాను.
ఇట్లా అనుకుంటూ, ఇక అక్కడి నుండి కీరదేశంలో ప్రవేశించాడు. తాను గవలమహారాజుగా సంచరించిన అక్కడి ప్రాంతాలు చూస్తూ కీరనగరం ప్రవేశించాడు. అక్కడ ప్రజలతో సంభాషించాడు. గాధి : బాబూ! ఇక్కడ కొంతకాలం క్రితం ‘కటంజుడు’ అనే ఒక శ్వపచజాతివాడు రాజ్యం ఏలాడట గదా! ఆ విశేషాలు కాస్త చెప్పండి.
కీరపురవాసి : ఓ తాపసీ! మీరు విన్నది నిజమే. ఇక్కడి మహారాజు సంతానం లేకుండా మరణించటం చేత, ఇక్కడ ‘మంగళహస్తి’ అనే పేరు గల ఆచారమును అనుసరించి కటంజుడనే పేరు గల శ్వపచుడు ‘గవలరాజు’అనే పేరుతో ఎనిమిదేళ్ళు రాజ్యం ఏలాడు. ఆతడు విదేశీయుడని తెలిసిన తరువాత మేం ప్రజలమంతా ఆతనిని త్యజించాం. అప్పుడాతడు నిప్పులలోకి దూకి ప్రాణాలు విడిచాడు. అదంతా జరిగి ఇప్పటికే ఒక సంవత్సరం అయింది.
గాధి అనేకులతో గవలమహారాజు గురించి అనేక విషయాలు చర్చించగా, అవన్నీ తన జ్ఞప్తిలో అనుభవపేటికలో ఉన్నట్టి విషయాలుగా తెలియవస్తున్నాయి. “సందేహం లేదు ఇక్కడ గవలరాజుగా ఎనిమిదేళ్ళు రాజ్యం ఏలింది నేనే” అని తలచుచూ నగరంలో సంచరించసాగాడు. ఇంతలో ఆ రాజవీధిలో దూరం నుండి ఏదో కోలాహలం వినవచ్చింది. జనం ప్రక్కగా వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పటి రాజు విష్ణువు అనే అతను ఆ సమయంలో వాహ్యాళికై గుఱ్ఱాల మీద తన సైనికులతో వెళ్ళటం - అంతా గమనించాడు.
ఏమి ఆశ్చర్యం! ఏమి చమత్కారం! నేనిప్పుడు తటాకంలో నిలుచుని, అఘమర్షణ మంత్రం చదువుచూ, ఒక స్వప్న సదృశంగా కొద్ది నిమిషాలు పరధ్యానంలో ఉండిపోయాను. ఆ కొద్ది
Page:488
నిమిషాలలో 70 సంవత్సరాల సుదీర్ఘానుభవం పొందటమేమిటి? అప్పటివన్నీ ఇప్పటి నా ఈ జాగ్రత్లో ఇక్కడ సరితూగుతూ ప్రాప్తించటమేమిటి? ఇక్కడ నాకు తారసపడినదంతా స్వప్నము వలె అళీకము (భ్రమ) అనునది తథ్యమే కదా! ఈ భ్రమ అంతా ఎక్కడి నుండి ఎట్లా వచ్చి నాకు ప్రాప్తించిందో - నేను గ్రహించలేకపోతున్నాను.
ఆహోఁ! “మనోమోహము” అనే వలలో చిక్కుకుని ఒక పక్షిలాగా నేను ఎంత అలసిపోయాను! ఎన్నెన్ని కష్టాలుపడ్డాను! ఈ నా మనస్సే అనేక వాసనలచే కొట్టబడినదై, తనయొక్క ‘బోధ’ స్వరూపమును కోల్పోయి ఒక చిన్నపిల్లవాడులాగా నలువైపులా పరుగులుతీసి ఈ మాయనంతా గాంచినదే!… ఎందుకు ఇట్లా జరిగింది?
ఓహో! చక్రధారుడగు విష్ణు భగవానుడు నాకిచ్చిన వరం సఫలం చేయటానికే నాకు ఈ మాయను రుచి చూపించి ఉంటారు. నా కిప్పుడంతా గుర్తుకు వస్తోంది. ఇక నేను నా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఈ మాయ యొక్క స్థితి గతుల గురించి సమన్వియించుకోటానికి, ఎరుగటానికి ప్రయత్నం చేస్తాను.
గాధి ఇట్లు నిర్ణయించుకుని, తాను నివసిస్తూ ఉండే గిరి ప్రాంత సమీపంలోని ఆశ్రమం చేరాడు. ఇక ఆ రోజు నుండీ కొంచెం నీళ్ళుమాత్రమే పుచ్చుకుంటూ భక్తి, ఏకాగ్రతలతో విష్ణుప్రీతి కొరకు తపస్సు ప్రారంభించాడు. ఒక సంవత్సరకాలం గడిచింది. ప్రసన్నమూర్తి, శ్యామలాకారుడు, పుండరీకాక్షుడు, ఆశ్రితజనవత్సలుడు అగు విష్ణుభగవానుడు ఒక శుభదినం గాధికి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. ఆ ముని వెంటనే స్వామి పాదాలపై బడి, మ్రొక్కి, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, పూలు చల్లి, స్తోత్రం చేసి ఆనందపరిచాడు.
శ్రీమన్నారాయణుడు : పుత్రా! మరల ఏమి కోరి నా దర్శనం కొరకు ధ్యానం చేస్తున్నావయ్యా? నీవు నా ‘మహామాయ’ను చూచావు కదా! నీవు కోరినట్లే మాయను చూపాను. మరల ఏమి విశేషం? గాధి : హే భగవాన్! మీ అనుగ్రహవశం చేతనే కాబోలు, ఈ భూమి నంతటినీ ప్రకాశింపజేస్తూన్న మాయ యొక్క మహిమను సందర్శించాను. అంతా అయిన తరువాత ఇప్పుడు అనేక సందేహాలు నన్ను పుంఖానుపుంఖాలుగా చుట్టుముట్టుచున్నాయి. ప్రభూ! నేను తటాకంలో నిలబడి అఘమర్షణ మంత్రం జపిస్తూ కొద్దినిమిషాలు కాబోలు, పరధ్యానంలో మునిగాను. అంతే! నా మనస్సు నందే 60 సంవత్సరముల సుదీర్ఘానుభవం ఆ ఆ కొద్దినిమిషాలలో ఒక స్వప్నంలోలాగా పొందాను. ఇంతలో యథాస్థానంలో జాగృత్ పొంది నిజాశ్రమం చేరాను.
ఇంతవరకూ బాగానే ఉన్నది. అయితే ఇప్పుడొక బహుచమత్కారమైన విషయం చూచాను. అదేమిటంటే - నేను ఏదేదైతే మనస్సులో సందర్శించానో - అదంతా ఈ జాగ్రత్లో ఏర్పడియే ఉంది. మనస్సులో ఏదేదో పొందటమేమిటి?… అదంతా ’జాగ్రత్’లో ఏర్పడి ఉండటమేమిటి? నాకు అసలు ఏమీ అర్ధమే కావటం లేదు. ‘కటంజుడు’ అను ఆటవికునిగా, కీరదేశాన్ని ఏలిన గవళమహారాజుగా
Page:489
నేను గాంచినదంతా వాసనల చేత నా మనస్సులోనే పొంది ఉన్నాను కదా? భ్రమ చేత పొందిన సుదీర్ఘ-అల్పకాలిక అనుభవముల ఉత్పత్తి-వినాశనములు, ఆ ఉపాధి రాక పోకలు, తదితరములు - మనస్సుతో ఏర్పడినవే కదా! మనస్సులో ఏర్పడినవి మనస్సులోనే ఉండాలి. మరి, బయట ఎందుకు వాస్తవమై కనిపిస్తున్నాయి? అట్లా బయట (జాగ్రత్లో) కనిపించటానికి కారణమెవ్వరు? స్వప్నంలో లాగా తారసపడిన “ఆ వ్యక్తులు, ఆ ప్రదేశములు” ఇవన్నీ బయటకు ఎవరు తెచ్చారు? ఆ వ్యక్తులంతా ఎవరు? వారికి, నాకు, నా మనస్సుకు ఏమిటి సంబంధం? ఎవరు ఎవరి గురించి ఎందుకు ఎచ్చట స్వప్నంలోలాగా గాంచుచున్నారు? ఆ కీరదేశ జనులకు, ఆటవిక శ్వపచ జాతి జనులకు నేను ఏర్పడియే ఉన్నాను…. అదెట్లా ఒనగూడింది? ఇవన్నీ మీ నుండి తెలుసుకోవాలను కున్నాను. అందుకే మీ సందర్శనం కొరకు నిష్ఠతో ధ్యానించాను. మీరు జగద్గురువులు. మాయకు ఆవలుండి, మాయను రచిస్తున్న పరాత్పర స్వరూపులు. మీరుగాక, నాకు ఇంకెవరు దిక్కు? అందుచేత నేను చూచినదంతా ఏమిటో సవిస్తరంగా చెప్పమని ప్రార్థిస్తున్నాను.
శ్రీమన్నారాయణుడు : కుమారా! నీవు చూచినదీ, చూచుచున్నదీ - - అంతా ఆత్మయొక్క స్వరూపమే. అయితే, “మాయను చూడాలి” అనే నీ యొక్క వాసనాబీజము నుండే ఈ జగద్రూపభ్రమ అంతా ఏర్పడి, అనుభవమైనది. ఆ దర్శనం చేస్తున్న సమయంలో తత్త్వదృష్టి కొరవడుట చేత నీ చిత్తము దృశ్యముతో తాదాత్మ్యభావన పొందటం జరుగుతోంది. ఈ విషయం మొట్టమొదట గుర్తించు. తదాత్మ్య భావము చెందకపోయావా… నీకీ వర్తమాన దృశ్యమూ లేదు, కీరదేశపు దృశ్యమూ లేదు. ఉభయములు ఆత్మస్వరూపములే!
ఇక, అక్కడి జనులంతా ఎవరంటావా?…అన్నివైపులా జలంతో నిండిన మహాసముద్రంలో ఒక కెరటం మరొక కెరటమును తాకుతున్నట్లు, ఒక ద్రష్టకు మరొక ద్రష్ట తారసపడుచున్నాడు. ఒక చమత్కారమైన ప్రశ్న. ఈ ఎదురుగా కనబడే ఆకాశం, పర్వతములు, భూమి, దిక్కులు - ఇవన్నీ నీకు ఎక్కడో బయటగా ఉన్నాయని అనుకుంటున్నావా? కానే కాదు.
ఒక విత్తనంలో “మహావృక్షం, ఆకులు, కాండము, కాయలు, పూలు, కొమ్మలు, వేళ్ళు…. వాటి వాటి భవిష్యత్ కార్యక్రమములు” అంతర్లీనంగా ఉన్నాయి కదా? అట్లాగే, దేశ కాల వశంచేత చూడబడుచున్న విశేష పరంపరలన్నీ చిత్తములోనే ఉండి ఉంటున్నాయి. విత్తులోంచి ఏదో సమయంలో మహావృక్షపు వివిధ భాగాలన్నీ వెలువడుచున్నట్లు - సర్వ అనుభవములు చిత్తము నుండే బయల్వెడలి ప్రకటితమగుచున్నాయి. వాస్తవానికి ‘దృశ్యము’ అనబడే వ్యవహారం అంతా మనస్సులోనే ఉన్నది గాని, బయట ఏనాడూ లేదు. విత్తులో ఉన్నదే బయట రూపం దిద్దుకుంటున్నట్లుగానే… మనస్సులో ఉన్నదే ఎదురుగా దర్శించబడటం, అనుభవించబడటం జరుగుతోంది.
ఒక కుమ్మరి ఉన్నాడు. ఆతడు రకరకములైన చిత్రవిచిత్ర ఆకారములలో కుండలు మొదలైన వాటిగా మట్టిని మలచుచున్నాడు. ఆతడు తాను చేస్తున్న ఆకారములన్నీ తన మనస్సులోనే కలిగిఉన్నాడు కదా! ఆ విధంగానే దర్శన స్పర్శనాది క్రియలు, రకరకాలైన చింతనలు, భూత-వర్తమాన-భవిష్యత్
Page:490
కాలములు, ఈ ఇంద్రియములకు తారసపడుచున్న సూర్య చంద్ర నక్షత్రాది పదార్థజాలములు ఇవన్నీ మనస్సులో ఉండి, మనస్సుచే నిర్మించబడి, మనస్సుచే పొందబడుచున్నవే! మనస్సే వాటిని నిర్మించి, మరల మనస్సే వాటిని ఉపసంహరిస్తోంది. మనస్సు చేసే నిర్మాణచమత్కారములేమిటో దృష్టాంతంగా నీకు చెప్పాలంటే “పిల్లలు - వారి ఆటలు, వృద్ధులు - వారి భ్రమలు, జనులు - వారి మద ఆవేదన అనురాగ రోగాది సందర్భములలో విషయములను పొందే విధానం” …ఇవి గమనిస్తుంటే నీకే అంతా తెలియగలదు. ఒకడు తన స్వప్నంలో ఏవేవో ప్రదేశాలను, వ్యక్తులను చూస్తున్నాడనుకో… ఆ ప్రదేశాలు, వ్యక్తులు ఆ స్వప్నద్రష్టయొక్క భావపరంపరలలోని అంతర్లీన విభాగములే కదా! ఒకడు ఏదో భ్రాంతిలో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వస్తువులను గమనించడు. మదముచే నిండిన మనస్సుతో ఒకడు ఒక సుందర స్త్రీని చూస్తున్నప్పుడు “ఇది రక్త మాంస-బొమిక లచే తయారు కాబడిన భౌతిక పదార్థమే" అనే విషయం స్ఫురించదు. ఒక గొప్ప చెట్టు యొక్క కాయలు, పూలు, ఆకులు కనబడతాయిగాని, వేళ్ళు కనబడనట్లు, సత్పదార్థమైనట్టి బ్రహ్మము అవలంబిస్తున్న మనస్సు నందే ఈ లక్షలాది సంఘటనల పరంపరలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి.
ఒక చెట్టును వ్రేళ్ళతో సహా పెకలించి పడేశామనుకో… ఇక ఆ చెట్టుకు క్రొత్త ఆకులు కాయవు కదా! వాసనల నుండి విముక్తుడైన జీవునకు ఇక జన్మకర్మలు ఉండవు. వాసనల చేతనే మనస్సు తయారు చేయబడింది.
అనంత జగజ్జాలములు ఇమిడి ఉన్న అట్టి “వాసనామయ ప్రపంచము” నందే నీకు అనుభవమైన శ్వపచజాతి జీవుని భావము ప్రకటితమైనది. ఇందులో ఆశ్చర్యమేమున్నదయ్యా? వాసనల ప్రతిభాస వలననే రకరకాల మనోవ్యధలతోనూ, సంరంభములతోనూ కూడిన ఆటవికభావములన్నీ నీవు పొందావు. అంతే కాదు… అట్టి ‘వాసనామయ ప్రపంచం’ యొక్క చమత్కారం చేతనే “ఆ బాటసారి రావటం, ఆతనితో భుజించటం, సంభాషించటం, ఆయా విశేషాలు విని ఆశ్చర్యపడటం, మాయను తెలుసుకోవాలనుకోవటం, నా కొరకై ధ్యానం చేయటం”– మొదలైనవన్నీ కూడా పొందడం జరిగింది. గాధి : స్వామి! స్వప్న సదృశంగా కటంజుడు అనే పాత్రధారణచేస్తూ… ఏవేవో మనస్సులో దర్శించటం - భౌతికంగా నా ఆశ్రమానికి వచ్చిన అతిధి - బాటసారితో సంభాషణ… ఈ రెండూ ఒక్కలాంటివే నంటారా?
శ్రీమన్నారాయణుడు : అవును. ఆ ఆటవికజనం ఏ విధంగా భ్రమ మాత్రమే అయి ఉన్నదో, ఆ అతిథితో సంభాషణ కూడా ఆ విధంగానే భావనల, వాసనల ప్రకటీకరణమే అయిఉన్నది. ఇంకా విను. “ఇప్పుడు లేచి శ్వపచుల గ్రామం, కీరదేశం వెళ్ళుచున్నాను… ఇక్కడి ఈ జనులతో సంభాషించు చున్నాను… వ్యక్తులను గుర్తిస్తున్నాను… ఆయా సంఘటనలతో సరిచూచుచున్నాను…” మొదలైనవన్నీ కూడా భ్రమలోని అంతర్లీనభాగమే సుమా! "ఇది కటంజుని పురాతన గృహం…” అని అక్కడి వారు చెప్పటం, “ఔను… ఇవన్నీ నేను ఒకప్పుడు పొందియున్నవే” - అని తలపంకించటం కూడా భ్రమ చేతనే జరుగుతోంది. “ఇదిగో… ఇప్పుడు కీరనగరం వచ్చాను… వీరు గవలమహారాజు
Page:491
అనబడియున్న నా గురించే చెప్పుచున్నారు… నేను వింటున్నాను… ఎంత ఆశ్చర్యం… వీళ్ళు నాకు ఇంతఃపూర్వం తెలిసినవారే" - అని నీవు భావిస్తున్నదంతా మనస్సు యొక్క వికారములే గాని, మరింకేమి కాదు. ఓ మునీ! ఇన్ని మాటలెందుకు? నీవు దేనిని ’ఇది నిజమే’ అని అనుకుంటు న్నావో - ఇదంతా మనస్సు యొక్క కల్పన అని, మోహము యొక్క అభ్యున్నతి అని గ్రహించు.
ఈ మనస్సు వాసనతో కూడుకొని ఉన్నప్పుడు ఇది తన అంతరమున ఏది దర్శించాలని అనుకొంటే అద్దానినే దర్శించగలదు. మామూలుగా అసాధ్యమైన విషయాలు కూడా ఒకడు తన స్వప్నంలో దర్శిస్తున్నాడు కదా!
కనుక గాధీ! మనోమోహమే జగత్తుకు బీజం. ఆ ఆటవికులు, ఆ కీరదేశీయులు, వారి ఆచార నమ్మకములు, వారి ప్రాయశ్చిత్త బుద్ధులు, ఆ రాజధాని, అక్కడి జనుల దేహత్యాగములు… వీటినన్నిటినీ నీవు మోహము చేతనే పొందావు. జీవుడు మోహము చేతనే ఈ శరీరమును, ‘వీటి వలన - వీటి ద్వారా’ ఏర్పడే సంబంధ బాంధవ్యములనూ పొందుచున్నాడు.
శ్రీగాధి : పరంధామా! ఇప్పుడు నేను పొందిన కీరరాజ్యాది అనుభవములు భౌతికమా? మానసికమా! ఆ అనుభవములు నన్ను ఎలా సమీపించాయి?
శ్రీమన్నారాయణుడు : సుదీర్ఘప్రయాణం చేస్తున్న ఒక బాటసారిలాగా ఈ నీ వర్తమాన శరీరాన్ని ఆశ్రయించి ఉన్నావు. తపోధ్యానాదులచే డస్సి ఉన్న నీవు నిజ వాసనలచే ఆ ‘అనుభవములు’ అను చోటికి వెళ్ళావు. ఒక అద్దములోని దృశ్యము మరొక అద్దంలో ప్రతిబింబించినట్లు మరొక ద్రష్టత్వము నీయొక్క ద్రష్టత్వములో ప్రతిబింబించింది. కానీ అవన్నీ సత్యమైనవే కావు.
స్వప్నంలో ఏదో ఆకస్మికంగా చూస్తూ ఆ స్వప్నద్రష్ట తన్మయుడౌతాడు చూచావా? ఆ రీతిగా నీవు ఆటవికత్వము, రాచరికత్వము మొదలైనవన్నీ పొందావు. నీయందలి ద్రష్టత్వపు అంతరంగ వాసనలే నిన్ను అందుకు పురికొల్పాయి. ఏది ఏమైనా వాటిలో ఏ ఒక్కటీ నీవు కావు. నీవు చూచిన కీర నగరం మాయయే. ఒక పిచ్చివాని వలె మనస్సునందే అంతా పొందుచూ నాలుగు వైపులా పరిభ్రమించి వచ్చావు.
కాబట్టి, ఇకలే! లేచి, శాంతుడవై ఉండు. నిజాశ్రమ ధర్మమునకు ఉచితమైనట్టి స్వాధ్యయనము అగ్మి హోత్రము మొదలైన కార్యములను యథారీతిగా ఆచరించు. ఎందుకంటే ఇహలోకంలో కర్మశూన్యులైన మనుజులు శ్రేయమును పొందజాలరు.
సర్వేశ్వరుడగు నారాయణుడు ఇట్లు ఉపదేశించి, చిరుమోముతో క్షణంలో అంతర్థానమైనారు.
Page:492
విష్ణుభగవానుడు అంతర్ధానమైన తరువాత గాధి తనకు కలిగిన ‘సమ్మోహనము’ గురించి మరల విశ్లేషించటం ప్రారంభించాడు.
గాధి (తనలో) : ఇదేమిటి? “అంతా మోహము చేతనే గాంచినావు" - అని నారాయణుడు వ్యాఖ్యా నిస్తున్నాడు? అసలు అతిథి, ఈ భూమండపము - - ఇవన్నీ ఉన్నాయా? లేవా?
ఆతడు మరికొన్ని చిన్న - పెద్ద సందేహాలు పొందాడే గాని, సంశయములు తొలగనే లేదు. ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందనే లేదు. ఇక అక్కడి నుండి లేచి ఆకాశంలోని మేఘంలాగా అటూ ఇటూ సంచరించసాగాడు. మరల ఒకసారి ఆటవిక గ్రామం, కీరదేశం వెళ్ళి తిరిగి నిజాశ్రమమైన గిరి ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమం చేరిన రోజు నుండి మరల విష్ణుభగవానుని ఆరాధించసాగాడు. అతి స్వల్పకాలంలో జనార్థనుడు మరల ప్రత్యక్షమైనారు. ఎవరికి ఆ విష్ణుదేవుడు ఒకసారి దర్శనమిస్తారో, అట్టివారికి ఆతడు బంధువు అవుతాడు. స్వామి చిరునవ్వుతో గాధిని సమీపించి ఆతని ప్రక్కనే చేరి కూర్చున్నారు.
శ్రీమన్నారాయణుడు : ఏమిటయ్యా? మరల నా దర్శనం కోరుకున్నావు? మళ్ళీ ఏమైంది? గాధి : స్వామి! సుస్వాగతం! మీకు శ్రమనుకలిగించి నందుకు క్షమించండి. ఏం చేయమంటారు మరి? ఈ మాయ యొక్క చమత్కారం నన్ను అత్యంత ఆశ్చర్యపరుస్తోంది.
హే శ్రీమన్నారాయణా! మీ దర్శనమైన తరువాత నేను కీరదేశం తదితర స్వప్న భావిత ప్రదేశములలో ఒక ఆరు నెలల పాటు తిరిగి వచ్చాను. క్రితంసారి వెళ్ళినప్పటి సమాచారం ఈసారి సమాచారంలో ఏమీ భేదం లేదు. ప్రభూ! "భూమండల ప్రదేశమంతా మాయ చేతనే చూచావు” అని మీరు అన్నారు కదా? మాయావశం చేత నేను గాంచినది “మరొకచోట - మరొక సమయంలో” ఎట్లు ఏర్పడి ఉన్నాయో నాకు బోధ పడుటలేదు.
ఇక రెండవ ప్రశ్న. నేను చూచిన మాయ నాకు సంబంధించినది మాత్రమే కదా! మరి కొందరు జనులు కూడా నేను చూచిన మాయలో భాగస్వాములై ఇప్పటికీ భౌతిక ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారే? ఆ ఆటవికుని వృత్తాంతమంతా ఈ ఇంద్రియములకు లభిస్తూ ఉండటం జరుగుతోందే? మీరు నాకు “ఇది మాయయే” - అని చెప్పారు. సరే, బాగానే ఉన్నది. మాయచే అంతరంగమున చూడబడినవి జగత్తులోనికి ఎలా "ఇతర జీవుల స్వతంత్ర రూపాలు”గా ఉన్నాయో నేను గ్రహించలేకపోతున్నాను. 1. అది మాయయే, 2. అక్కడి జనులు పూర్వాపరాలు ఈ రెండు విషయాలు సమన్వయ మగుటయేలేదు. పైగా అక్కడ అంతా చూచిన తరువాత నా మోహము మరింత అధికమైనది.
అయితే, సత్యస్వరూపులగు నోటివెంట ‘అయథార్థం’ అయినదేదీ రాదని నేను ఎఱుగుదును. మహాత్ముల వచనములు మోహమును తొలగిస్తాయేగాని, వృద్ధిచేయవు. అయితే నాలో తెలియరాని
Page:493
అజ్ఞానం పేరుకొని ఉన్నది. మీ కృపచేత మాత్రమే అది తొలగగలదు. అందుకే మీ ముందు మరల ప్రస్తావిస్తున్నాను.
కీరరాజ్యం మొదలైనవన్నీ అక్కడ ఏర్పడి ఉండగా, “అదంతా భ్రమయే నయ్యా!" అని చెప్పుచున్నారు. ఎందుచేత?
శ్రీమన్నారాయణుడు : ఓహో! అదా? ఆ విషయం కొంత చూచాయగా చెప్పే ఉన్నాను. మరికొంత వివరంగా చెపుతాను విను.
కీరదేశవాసులు - భూతమండలమున ఉన్న కీరదేశ వాసులు అందరి చిత్తము నందు కూడా నీ చిత్తమునందు లాగానే - కటంజుని ఆటవిక వృత్తాంతం అంతా కాకతాళీయన్యాయముచే ప్రతి భాసించటం జరుగుతోంది. అయితే… ఒక వ్యక్తి నందు, లేదా ఒక సమూహమునందు… ఏదైతే మిథ్యారూపంగా ప్రతిభాసిస్తోందో - అట్టి ప్రతిభాస మొదలంట తొలగే వరకు అట్లాగే ప్రతిభాసిస్తుంది. జ్ఞానం వెల్లివిరిసినప్పుడు అదంతా మటుమాయమౌతుంది.
ఆ ఆటవికశ్వపచుల కీకారణ్యగ్రామంలో ఒకానొక శ్వపచజాతివాడు ఒక గుడిసె నిర్మించు కున్నాడు. అక్కడికి ఇప్పుడు వెళ్ళిన నీవు, “ఈ గుడిసె నేను నిర్మించుకున్నదే” అని అనుకుంటున్నావు. ”ఈ గుడిసె కటంజునిది“ - అని అక్కడివారు తలచుచున్నారు. ఒక తాటిచెట్టుపై కొన్ని కాకులు వ్రాలినప్పుడు దూరంగా ఉన్న ఏదో వస్తువు ఆ చోట నుండి “తినే వస్తువు” లాగా ఆ కాకులన్నిటికీ అనిపించవచ్చు. వాటన్నిటిలోని ఆకలి, దప్పికల సంస్కారం చేత అది అట్లా అనిపిస్తోంది. అంతమాత్రం చేత ఆ చూడబడేది ఆహారపదార్థమే అవవలసిన పని లేదు.
అనేకులు ఒక చోట చేరి కల్లు సేవించారనుకో… వారందరికి పరిసరాలన్నీ తేలియాడుచున్నట్లు కనిపించవచ్చు గాక. అంత మాత్రంచేత అక్కడివన్నీ ఎందులోనో తేలియాడుచున్నట్లా? అట్లే ఒక్కొక్కసారి అనేకులు ఈ స్వప్నమాత్ర జగత్తును ఒకే భ్రాంతితో గాంచుచున్నారు. ఒకడు “నీవు నా తండ్రివి” అను భ్రాంతిని పొందుచుంటే, “అవును, నీవు నా ప్రియమైన కుమారుడివి” అని మరొకరు గాంచు చున్నారు. అంతమాత్రం చేత తండ్రి-కొడుకుల సంబంధంలో భ్రాంతి యొక్క విభాగము, పాత్ర లేదా? ఉన్నది. గడ్డి మొలచిన ప్రాంతంలో అనేక లేళ్ళు విశ్రమిస్తున్నట్లు, ఈ జీవులు ఒకే విధమైన భ్రాంతి విశేషంలో పాల్గొనుచున్నారు. ఒకే ఆటలో అనేకమంది బాలురు క్రీడించుచున్నారు చూచావా? ఒకే యుద్ధంలో అనేకమంది సైనికులు కలిసి "వీరు మన శత్రువులు… మేమంతా ఈ దేశం వాళ్ళం” అని తలచుచు వధించటం, బంధించటం, జయించటం, పారిపోవటం, ఓడిపోవటం సామూహికంగా పొందుతూ ఉంటారే! ఓ గాధీ! ఈ సంసార జీవులంతా ఆ విధంగా పరస్పరం స్వప్నానుభవం వంటిది పొందుచున్నారు. ఒక కాలదృష్టితో మరొక కాలగమనాన్ని అల్పంగానో, అధికంగానో భావించటంకూడా మాయలోని విభాగమే. అఖండ పరమాత్మరూపమగు ‘కాలము’ అనబడునది ఆత్మ యందే స్థితి కలిగియున్నది. అయినప్పటికీ కాలము దేనికీ ప్రతిబంధకము
Page:494
కాదు, ఉత్పాదకమూ కాదు… కాలస్వరూపుడగు భగవంతునికి రూపమంటూ ఏదీ లేనే లేదు. ఆతడు అఖండుడు. ఆతనినే “జన్మ, కర్మ - రహితమగు బ్రహ్మము” అని కూడా పెద్దలు చెప్పుచున్నారు. గాధి : కాలము యొక్క రూపము ఈ సంవత్సర, యుగ కల్పములే కదా!
శ్రీమన్నారాయణుడు : నిజమే. అయితే కాలము సూర్య - చంద్ర గమనములచే కల్పితమైనదే. ఒక భావస్థిరత్వము అంగీకరించిన తరువాత కాలము పొందబడుచున్నది. ఉత్పాతరూపమగు కాలముచేత తదితర సర్వ పదార్థములు పరికల్పితమగుచున్నాయి.
“భ్రాంతి చిత్తులగు జీవులు ఒకే విధమైన ప్రతిభాస (లేక) భ్రమచే ఒకే విధమైన సంభ్రమము పొందుతూ ఉంటారు”–- అనునది ఇక్కడ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమును అనుసరించే కీరదేశవాసులు “ఆటవికుడు రాజగుట" - అనుదానిని గాంచినారు. నీవుకూడా ఆ రీతిగానే అదంతా పొందావు. అందుకే అదంతా ‘మాయయే’ అని చెప్పాను.
సరే! అయినదేమో అయింది. ఇప్పుడు చిత్తనైర్మల్యము నీవు సంపాదించాలి. మనస్సును అధిగమించి స్వబుద్ధిచే ఆత్మవిచారణ చేయి. అందుకు నీ ఆశ్రమవాసానికి సంబంధించిన తపోధ్యానములను నిర్వర్తిస్తూ ఉండు. మరి ఇక నాకు సెలవా?
ఇట్లు పలికి విష్ణు భగవానుడు అంతర్ధానమైనారు. గాధి మాత్రం మోహముతో కూడిన మనోవ్యాధి నుండి బయటకు రాలేకపోయాడు. ఇంకా అధికమైన స్థూలబుద్ధికలవాడై ఏవేవో అనుమానాలతో సతమతమవసాగాడు. కొద్దిరోజులు గడచిన తరువాత మరల విష్ణు భగవానుని ఆరాధించటం ప్రారంభించాడు. మరల విష్ణుదేవుడు ఆతని యందు ప్రత్యక్షమైనారు. ఆతడు ప్రణామం చేసి, మనోవాక్కాయములచే పూజించి మరల ఇట్లు పలుకసాగాడు.
గాధి : దేవాదిదేవా! మీరు ‘అదంతా మోహమే’ అని చెప్పివెళ్ళారు, బాగానే ఉంది. కానీ, ఆ ఆటవిక జీవితం, చావు, పుట్టుక మొదలైన అనేక అనర్థములతో కూడిన ఆ సాంసారిక వ్యవహారమంతా తలచుకుంటేనే ఇప్పటికీ ఎంతో భయం వేస్తోంది. నా చిత్తము విషాదముతో విమోహితమౌతోంది. ఇప్పుడు ఈ మోహబుద్ధి తొలిగేది ఎట్లా? హే భగవాన్! భక్త సులభుడా! నాలోని మోహం నివృత్తి చేయమని చెప్పి, మీరు వెళ్ళిపోతే చాలదు. నివృత్తి అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి. నన్ను ఏదైనా పవిత్ర కార్యక్రమము నందు నియమించండి. నన్ను కాపాడండి.
శ్రీమన్నారాయణుడు : (పకపకానవ్వుచూ) శంభరాశురుని ఆడంబరంలాగా ఈ జగత్తంతా మాయా మయమైనదే! అట్టి ఆశ్చర్యకరమైన ’కల్పన’ అంతా ఆత్మతత్త్వవిస్మరణ చేతనే ఉద్భవించింది. ఆటవిక గ్రామం, ఆ కీరదేశ రాజరికం, తదితర వృత్తాంతములు అజ్ఞానవశంచేత తప్పక సంభవమే. స్వప్నంలో ముందుగా అనుకోని ఏవేవో విషయాలు, ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు స్వప్నద్రష్టకు సత్యమువలే అనుభవమగుచున్నాయి కదా?
Page:495
భూత మండలములోని కీరదేశవాసులు కూడా నీలాగానే భ్రమను పొందుచున్నారు. నీవు వారి దగ్గిరకు పోయి సంభాషించినప్పుడు వారు తమ భ్రమలనే వల్లించిచెప్పారు. అవి విని నీవు నీ భ్రమచే “ఇట్లా ఎట్లా అయినది?" అని వేదన పొందుచున్నావు. నీ సుస్పష్టత కొరకు నీ అనుభవములోని మరికొన్ని విశేషాలు చెప్పుతాను. ఇవి వింటే నీ చింతలు తొలగుతాయి.
కటంజుడు అను ఒకానొక జీవుడు ఇప్పుడు నీచే గాంచబడిన శరీరము, గ్రామము, గృహము కలిగి పూర్వము భూత మండలమున (In the zone of matter) జనించి ఉన్నాడు. ఆతడు అదే విధంగా తన కుటుంబసభ్యులను పోగొట్టుకుని ఆ తరువాత కీర రాజ్యానికి ప్రభువు అయినాడు. ఆ తరువాత జనులకు తన జన్మరహస్యం తెలియుటచే అగ్ని ప్రవేశం చేశాడు.
నీవు తటాకంలో ప్రవేశించి అఘమర్షణ మంత్రం జపిస్తూ ఉండగా, నా సంకల్పవశం చేత ఆ కటంజుని (ఆటవికుని) వృత్తాంతము (లేక) అనుభవమంతా నీ అంతఃకరణంలో ప్రకాశించింది. అట్లా ప్రకాశిస్తున్న దానినంతా పొందుతూ, “నేను కటంజుడను" అని నీవు అందలి అనుభవ పరంపరలన్నీ పొందావు.
ఈ చిత్తము బహుమచత్కారమైనది. అది ఒకప్పుడు తాను చూచినది విన్నది క్షణంలో త్యజిస్తుంది. మరొకప్పుడు, సుదీర్ఘ కాలం కలిగి ఉంటుంది. చూస్తూనే, చూడకుండా ఉండిపోతుంది. అసలు ఏ మాత్రం ఎన్నడూ చూడనివి పొందుతూ పోతుంది. ఒకడు స్వప్నంలోను, మనోరాజ్యంలోను, సన్నిపాత సమయము నందు రకరకాలైన అనేక దృశ్యవ్యవహారములను గాంచటం తెలుసు కదా! ఆ విధంగానే జాగ్రత్తులో కూడా స్వయముగా భ్రమను వీక్షించగలదు.
ఇందుకు దృష్టాంతాలు అనేకం చెప్పుకోవచ్చు. త్రికాలజ్ఞుడైన ఒక యోగి దృష్టి యందు భవిష్యత్ కాలము నందలి సమస్తమూ భూతకాలస్థము వలే తెలియుచున్నది కదా! అట్లాగే గడచి పోయిన కటంజుని చరిత్ర వర్తమాన కాలమైన నీ బుద్ధియందు నా సంకల్పముచే కనిపింపజేయటం జరిగింది. అయితే ఇక్కడొక చిత్రం! అప్పటి ఆయా అనుభవాలలో నిమగ్నమైనది నీవేగాని, అట్లు నిమగ్నమవటానికి నేను చేసింది ఏమీ లేదు. నేనల్లా, నీ మనోదర్పణంలో కొన్ని అనుభవ పరంపరలను ప్రతిబింబింప జేసాను. అంతేఁ!
“ఈ శరీరాదులు నేను… ఈ కుంటుంబము, ఇల్లు, వాకిలి నావి… వీరు నా వారు… ఇది నా ఊరు… ఇవి నా కులగోత్రములు” - అనునట్టి అనేక భ్రమలందు అజ్ఞాని నిమగ్నుడగుచున్నాడు. వాటిని మహత్తరమైనవిగా గాంచుచు తాదాత్మ్యము చెందుచున్నాడు. కానీ జ్ఞాని అవే సంఘటనలను పొందుచున్నప్పటికీ, గాంచుచున్నప్పటికీ, వాటియందు ఏమాత్రం నిమగ్నుడు అగుటలేదు. ఎవ్వడైతే “సమస్తమూ ఆత్మయే” - అను సర్వా హమ్ భావనను కలిగి ఉంటాడో ఆతడు వాటియందు ఏ మాత్రం నిమగ్నుడు కాడు. అందుచేత, ఆతడు ఈ పదార్థవిభాగముచే కలుగు అనర్థభావమును అతడు పొందకుండానే ఉంటాడు. పరిచ్ఛిన్న పదార్థములందు కలుగుచుండే అహంభావనయే
Page:496
బంధకారణమగుచున్నది. అంతకుమించి ఈ జీవునకు వేరుగా బంధమెక్కడిది? ఈ జీవుడు వాస్తవానికి అమృతతుల్యమగు శుద్ధ చైతన్యస్వరూపమే కదా! ఎండు సొరకాయ బుఱ్ఱ నీటిలో పడినా నీటిలో మునుగదు చూచావా? సత్యాసత్యవివేకి అయినట్టి జ్ఞాని భ్రమలలో, సుఖ దుఃఖాలలో మునుగడు.
నీవు ఇంతకు ముందు వాసనాజాలగ్రస్థుడవు, విచేతసుడవు (one who adopted ignorance and illusion) అయ్యావు. అందుచేతనే నీ అంతరంగము నందు ఆ కటంజుని వృత్తాంతమంతా దోషబుద్ధిచే పొడమినది. అనగా ‘అజ్ఞానము’ అనే మనోవ్యాధి నీయందు ప్రవర్తించటం జరిగింది. అజ్ఞానము తొలగకపోవుట చేత ఇంకా నీ ఆత్మస్వరూపమును నీవు దర్శించుటలేదు. వర్షం పడుతుంటే ప్రయత్నం చేసి ఇంటిలోకి పరుగులు తీసేవాడే జడివాన నుండి తప్పించుకోగలడు. నిలబడి వర్షం పడే చోటే ఉండేవాడు తడవక ఏంచేస్తాడు? పూర్ణజ్ఞానము లేకపోవుట చేత నీవు చిత్తభ్రమను తొలగించుకో లేకపోయావు. అందుచేతనే నీ చిత్తంలో ఏదేది భాసిస్తుందో అద్దాని యందలి
అభిమాన కారణంగా వెంటనే దానికి వశీభూతుడవగుచున్నావు.
మాయ నాలుగువైపులా విస్తరించి ఉన్నది. అట్టి ఈ మాయ యొక్క నాభిస్థానము (It’s Root) చిత్తము నందు ఉన్నది. అట్టి చిత్తము లేక మనస్సును ఎదుర్కొని పోరాడాలి. మనస్సును ఆత్మ యందు లయింప జేసి, దానిని రహితం చేయాలి. అట్టి వారిని మాయాచక్రం ఇక ఏమీ చేయలేదు, ఏమాత్రం బాధించలేదు. కనుక ఓ గాధీ! నీవిక లెమ్ము. మనోనిరోధకమగు తపస్సును ఇక్కడే పది సంవత్సరాలు ఆచరించు. అంతేగాని నిష్ఫలమైన వేదన, అభిలాషలతో కాలం వృథా చేసుకోకు. నిర్మలహృదయం సంపాదించావా… అనంత - అఖండ జ్ఞానం పొందగలవు.
ఇట్లు పలికి విష్ణుభగవానుడు అంతర్థానమైనాడు.
భగవానుడు చెప్పినదంతా ఆ గాధి మరల మరల విచారణ చేశాడు. ఇతఃపూర్వపు కటంజుని భావపరంపరలను పరిశీలించి విచారణ చేశాడు. భావప్రదర్శనరూపమైనట్టి విచిత్రమైన దైవగతి - జగత్తిని విశ్లేషించి చూచాడు. వివేక వైరాగ్యములు పొందాడు. "అహో! నా చిత్తము నందు ప్రతిబింబించిన కొన్ని క్రియా విశేషములను నేను చేస్తున్నట్లు భావించి భ్రమించాను కదా! … వాస్తవానికి సర్వవేళలా నేను విజ్ఞానస్వరూపుడనే!” అని గ్రహించాడు. చిత్త నిరోధము కొరకు, జ్ఞానలక్ష్మిని సంపాదించటానికి ఆతడు ఋష్యమూకపర్వతంపైకి వెళ్ళాడు. విష్ణుభగవానుడు ఆజ్ఞాపించినట్లు అక్కడ పదేళ్ళు తపస్సు చేశాడు. క్రమంగా భయ, క్రోధములను విసర్జించి పారమార్థిక సత్త”ను అవధరించాడు. జీవన్ముక్తస్వరూపుడైనాడు.
బ్రహ్మానందనిమగ్నుడై, పరిపూర్ణచిత్తుడై, పూర్ణ చంద్రుని వలె అనంత బ్రహ్మాకాశము నందు
విహరించసాగాడు.
Page:497
శ్రీరాముడు : అవును స్వామి! మీరన్నట్లు మాయ అతిచమత్కారమైనదే! వేగంగా తిరుగుచూ, సర్వాంగాలను ఛేదించ గల ఈ మాయను విజ్ఞులగువారు ఎట్లా నిరోధించగలుగుచున్నారో చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! ఈ సంసారరూప మాయాచక్రం నలువైపులా విస్తరించియున్నది. ఇట్టి సంసార చక్రము యొక్క ఇరుసు (Inner - wheel) ఈ మనస్సేనని గ్రహించు. పురుషప్రయత్నం చేత, ధీరబుద్ధి చేత ఈ మనస్సు (లేక) చిత్తమును నిరోధించామా… మాయ యొక్క చక్రభ్రమణం కూడా దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు ఆడుకునే త్రాడుతో చుట్టబడిన చక్రం యొక్క భ్రమణం ఆ త్రాడును పట్టుకుంటే ఆగిపోతుంది కదా? ఈ మనస్సును నిరోధించాలి. ఇక మోహం ఉండదు.
ఓ రామా! నీవు చక్రయుద్ధంలో కుశలుడవే కదా! ఈ మాయాచక్రం నిరోధించటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? నాభిస్థానం పట్టుకుంటే, చక్రం ఆగిపోతుంది. కాక ఆ చక్రం యొక్క తదితర భాగములను పట్టుకోబోయామా… చేతికి గాయం కాగలదు. ఈ మనస్సును నిరోధించాలి.
ఇక మోహము ఉండదు.
ఈ మనస్సు ‘జన్మజరామరణములు’ అనే సంసారచక్రంలో ఇరుసులాగా ఉంటోంది. మనస్సును మనస్సుతోనే నిరోధించాలి. ఉద్ధరించాలి, పరిభ్రమణము నుండి ఈ మనస్సును మళ్ళించు. ఆత్మయే తన స్వరూపముగా కలిగియుండి కూడా ఈ జీవుడు ఎందుకు దుఃఖములు పొందుచున్నాడు?
ఎందుకో విను- ఈ జీవుడు తన దేహభృతి కొరకై చాలా ఉపాయములను అందిపుచ్చు కుంటున్నాడు. మరి చిత్తము గురించో? … చిత్తమును నిరోధించ గల ఉపాయములు ఆశ్రయించక పోవుట చేతనే అనేక దుఃఖపరంపరలను ఒకటి తరువాత మరొకటిగా పొందుతూ పోతున్నాడు. చిత్తము నిరోధించబడితే, ఇక కృత్రిమమగు దీనస్థితులన్నీ తొలగిపోయినట్లే. ఈ సంసార మహారోగం ఉపశమించాలంటే ‘చిత్తనిరోధము’ తప్ప వేరే ఔషధం లేనే లేదు. మరి, తపో-దాన-తీర్థ క్రియాదులంటావా… అవన్నీ చిత్తనిరోధము కొరకే ఉన్నాయి.
అందుకని, ‘పరమశ్రేయమైనట్టి చిత్తమును వశపరచుకొనుట’ అనుదాని గురించి యోచించు. ఆ పని వదలి చిన్నపిల్లల ఆటల లాగా ఏవేవో కార్యక్రమాల వల్ల ఏం ప్రయోజనం? కుండ యొక్క ఆకాశం కుండలోనే ఉన్నట్లుగా, చిత్తము నందే ఈ సంసారమంతా ఉన్నదని పదే పదే ప్రకటిస్తున్నాను. కుండపగిలితే ‘ఘటాకాశం’ (Space belonging to the pot) అనేది ఉంటుందా? ఎక్కడుంటుంది?
Page:498
చిత్తము నశించిందా - సంసారము కూడా నశిస్తుంది. నీవు ‘చిత్తము’ అనే కుండను ‘ఆత్మ తత్త్వ జ్ఞానము’ అనే ఉపకరణముచే పగులగొట్టి బ్రహ్మకాశములో ప్రవేశించు. శ్రీరాముడు : అచిత్తత్వదశ ఎలా పొందటం?
శ్రీవసిష్ఠమహర్షి : అందుకు రెండు ఉపాయాలను చెపుతాను.
ఈ రెండు ఉపాయాలను అనుసరించు. అప్పుడు చిత్తము అచిత్తత్వదశను తప్పక పొందగలదు. భవిష్యత్ - భవిష్యత్తు గురించి సంకల్పములను, సంబంధములను, పదార్థభావములను క్రమంగా త్యజిస్తూ వచ్చావా… అప్పుడు పరమపావనమగు చిత్తరహితస్థితిని తప్పక పొందగలవు. చిత్తము అంటే సంకల్పములే!
సంకల్పములు ఉన్నంతవరకూ సంకల్పవిభూతులు (Effects of Perceptions) ఉండియే ఉంటాయి. అవి ఉంటే చిత్తము కొనసాగుచూనే ఉంటుంది. సంకల్పములు కాకుండా చిత్తమునకు వేరే రూపమెక్కడిది? కనుక రామా! నీవు నీ అంతరంగమునందు సర్వసంకల్పములు త్యజించివేయి. ఆత్మ చిత్తరహితమై ఉంటే, “ఆత్మ తన కూటస్థ రూపమున ఉన్నది“ అని అంటాం. అప్పుడు ఈ సంసారమునకు మూలభూతమైన “కామ, కర్మ, వాసనలు” మూలజ్ఞానంతో సహా పటాపంచలవు తాయి. ఇదియే మహాసిద్ధ మంత్రం.
ప్రత్యక్ చైతన్యము - చిత్తరహితమగు ఆత్మను “ప్రత్యక్ చైతన్యము” అని అంటూ ఉంటారు. స్వస్వభావయుతము, మనోరహితము అయిన ఆత్మయందు కల్పనారూపమైన మాలిన్యమే ఉండదు. ఆత్మ యొక్క మహత్తర స్థితి ఏమిటో గ్రహిస్తే - అది వాస్తవానికి చిత్తము లేనట్టి పరమార్థ స్థితియే అవుతుంది. మనందరి స్వస్వరూపమగు ఆత్మ స్వతఃగా నిరతిశయానంద స్వరూపము, పరమాత్మ స్వభావము, సర్వజ్ఞము, సమ్యకృష్టిమయము అయి ఉన్నది.
ఆశల నుండి దుఃఖం - శ్మశానంలో కాకులు ఉన్నట్లు ఎక్కడ ధ్యాస - ఆసక్తి ఉంటే, అక్కడ ఆశలు ఉంటాయి. ఎక్కడ ఆశలు ఉంటే అక్కడికి సుఖ, దుఃఖములన్నీ వచ్చి చేరుతాయి. ఆశ నుండే మిగతా సంసారమంతా పరిఢవిల్లుతోంది. స్వస్వరూపాత్మ యొక్క ‘ఏమఱపు’ చేతనే బాహ్యత్వ పూర్వకమైన “ధ్యాస” ప్రభవించి ప్రవృద్ధమౌతోంది. వస్తుతత్వమేమిటో గ్రహించిన జ్ఞానుల మనస్సు నందు ‘ఆశలు’ అనేవే ఉండవు. ఇదంతా మిథ్యయేనని వారికి తెలుసు.
శ్రీరాముడు : పదార్థములలోని మిథ్యాత్వము జీవుడు గ్రహించేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : శాస్త్ర - సజ్జన సాంగత్యముల సహాయంచేత ‘మనోనిరోధం’ నిరంతరం అభ్యసిస్తూ రాగా, అప్పుడు ఈ వస్తువులందలి అవస్తుతత్వమేమిటో ఎరుగబడుతూ ఉంటుంది. అందుచేత, ఓ సభికులారా! దృఢ ప్రయత్నములచే, సునిశ్చియములచే, శాస్త్ర సత్సాంగత్యాదులచే క్రమంగా ఈ చిత్తములోని అవివేకమును తొలగించండి. బలవంతంగా అయినా సరే, ఆ మనస్సును ఆత్మ
Page:499
యందు ప్రవేశపెట్టండి. ముల్లును ముల్లుతోనే తీయగలం. వజ్రమును వజ్రముతోనే సానపెట్టగలం. పరమాత్మ దర్శనమునకు ఆత్మజ్ఞానమే ముఖ్య కారణమగుచున్నది.
శ్రీరాముడు : మహర్షీ! ఆత్మజ్ఞానమునకు ముఖ్యకారణమగుచున్నదేది? మరొక్కసారి చెప్పండి. శ్రీవసిష్ఠమహర్షి : స్వానుభూతములగు సుఖ - దుఃఖములను ఆత్మయే త్యజించుటకు ఇచ్ఛగించుచున్నది కదా! కనుక ఆత్మజ్ఞానమునకు ఆత్మయే ముఖ్యకారణం. అందుచేతనే, “బద్ధుడనై ఉన్న నేను ఉద్ధరించ బడేది ఎట్లా?" - అని తలచువానికి మాత్రమే శాస్త్రములు, గురువులు మార్గము చూపగలుగుతాయి.
మనోరహితం - ఓ రామచంద్రా! నీవు మాట్లాడుచున్నప్పుడూ, ఇచ్చుచున్నప్పుడూ, పుచ్చుకొను చున్నప్పుడూ, కనులు మూసినప్పుడూ, తెరచినప్పుడూ, అన్ని సమయములలో మనోరహితుడవై ఉండు. లేక, ఆత్మవస్తువును మాత్రమే మననం చేస్తూ ఉండు. కేవలం చైతన్యమును మాత్రమే పారాయణం చేస్తూ ఉండు. నిరంతరం ఆత్మచింతనచే ఆత్మయొక్క నిర్మలత్వం అనుభవం కాగలదు.
నాయనా! నీవు జన్మిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, మరణిస్తున్నప్పుడు, తదితర మహర్దశ - దుర్దశ లందు, నిష్క్రియుడవైనప్పుడు, క్రియాతత్పరుడవైనప్పుడు, అన్ని వేళలా “నేను శుద్ధమగు ఆత్మ సత్తయే కదా” అనునట్టి కేవల చైతన్యాంశమునందే సుస్థిరుడవై ఉండు. “నాది, నాకు చెందినది, నా దేహము, నాకు సంబంధించినవారు” అను రూపము గల సర్వవాసనలూ త్యజించు. సర్వదా తదేక నిష్ఠతో చైతన్య మాత్ర తత్పరుడవగుము. వర్తమానంలో, భూతకాలపు యోచనలలో, రాబోవు వార్ధక్యాది దశలలో, రాజత్వాది స్థితులలో, దేహం ఉన్నప్పుడు, లేనప్పుడు - - అన్ని వేళలా చైతన్య మాత్రము నందే ఏకైక ‘నిష్ఠ’ కలిగి ఉండు. అద్దానినే భావించు, అనుసంధానం చేయి. సమాధి తత్పరుడవగుము.
సర్వకాల, సర్వావస్థల యందు “నేను ఆత్మ స్వరూపమగు చైతన్యమును. అదియే ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు కూడా” - అను ఎఱుకను వదలనే వద్దు. బాల్య, యౌవన, వార్ధక్యాల లోనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తులలోనూ కేవల చైతన్యమునే ఆశ్రయించు. అద్దాని యందే నీ నిష్ఠ అంతా ప్రతిష్ఠించబడు గాక! ‘బాహ్య విషయాలు’ అనే మాలిన్యం నీచే త్యజించబడు గాక!
మనస్సును ఆత్మ యందు విలయమొనర్చుచూ, ఆశాపాశములను త్వరత్వరగా విచ్ఛేదన మొనర్చుచుండుము. అప్పుడు కేవలం విజ్ఞాన స్వరూపము నందు సంస్థితుడవగుటలో నీకేమి కష్టముండదు.
సంబంధమే లేదు…. నీయందు శుభ, అశుభములు, ఇష్ట అయిష్టములు, ఆశ నిరాశలు శమించు గాక! ప్రతిజీవుడు తాను కోరుకుంటున్న ఉత్తమశాంతి, ఆనందములను ఆత్మ చైతన్యమును ఆశ్రయించినప్పుడే పొందగలడు. కర్మ-కర్తృ-కరణ సహితుడవై ఉన్నప్పటికీ, నీవు మాత్రం వాటన్నిటి కంటే వేరైన వాడివై ఉండుము. విజ్ఞానమయ బుద్ధి కలిగి ఉండు.
ఈ ఇంద్రియములు, ఇంద్రియవిషయములు నిన్ను స్పృశించనట్టి సాక్షిరూపమును వహించు. ఒక అద్దంలో ప్రతిబింబించే వ్యవహారంలాగా ఈ సర్వదృశ్యవ్యవహారములను గాంచుచుండుము.
Page:500
అద్దమునకు అందులో ప్రతిబింబించే దృశ్యమునకు సంబంధమే ఉండదు కదా! ఆ అద్దం ‘ఇవి నా వస్తువులు’ అనే మమకారం ఏమైనా కలిగి ఉంటుందా?
నీకు కూడా (దర్పణము - దర్పణాంతర్గత ప్రతిబింబిత వస్తువు వలె) ఈ సంసారముతో ఏమాత్రం సంబంధమే లేదు. ఉండవలసిన పని లేదు. సాక్షిరూపమున సర్వ వ్యవహారములు గాంచు చుండుము. ’నిర్వికల్పము నిరాలంబము’ అయినట్టి కేవల నిజరూపము (one’s own absolute form) అగు చిన్మాత్రము నందు స్వరూపస్థితి కలిగి ఉండు.
ఓ రఘువీరా! నీవు ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు సంబంధించినవాడవే కావు. అట్లాగే, సృష్టి-స్థితి-ప్రళయములు కూడా నీకు లేవు. అందుచేత ముక్తిరూపమున వీటన్నిటికీ ఆవల ఉన్న పరబ్రహ్మమే నీవై ఉండు.
నీవు సర్వ దృశ్యములను కేవలం ప్రకాశింపజేయువాడవు. గదిలో దీపముచే ప్రకాశించబడే వస్తువులకు దీపము యొక్క ప్రకాశమునకు సంబంధమేమున్నది? నీచే ప్రకాశింపజేయబడుచున్న
- - అనగా గాంచబడుచున్న - వస్తుజాలమునకూ, నీకూ సంబంధము లేదు. అట్టి బుద్ధి వృత్తులకు ఆవల ఉంటూ, “బుద్ధి వృత్తులను కూడా ప్రకాశింపచేయుచున్న చిన్మాత్రమునే నేను” అని గ్రహించి, అచ్చట స్థిరుడవై ఉండు.
నిజచైతన్యం - ’స్వ-పర’ ధ్యాసలను త్యజించివేయి. ఈ జగత్తు ఉన్నా, లేకున్నా నీవు మాత్రం ‘విభాగ రహితమైన వజ్రస్తంభం’ లాగా ఆత్మను ఆశ్రయించి స్థిరంగా ఉండు. సంకల్ప మయములే అయినట్టి లౌకిక విషయాల మధ్య ఉండవలసి వస్తున్నప్పుడు ‘ధీరత్వ - ధార్మిక’ భావాలు కలిగి ఉండి, అదే సమయంలో ‘ధర్మాధర్మ రహిత స్థితి’ ని పొంది ఉండు.
ఓ రాజీవలోచనా! రఘుపుంగవా! ఎవడైతే జ్ఞానమాత్రము - - సాక్షీరూపము అగు తన ఆత్మ తత్త్వమును అనుభూతమొనర్చుకుంటాడో అట్టివానికి హాలహల విషం కూడా అమృతతుల్యమే అవుతుంది. ఈ జీవులలో అనేకులు ‘నిర్మలము - నిరవయవము’ అగు తమయొక్క శుద్ధచైతన్యమును విస్మరించటం చేతనే అజ్ఞానం ఉదయిస్తోంది. అజ్ఞానం చేత సంసారభయమునకు సంబంధించిన మహామోహము పుట్టుకొస్తోంది. అదంతా సర్వ అనర్థములను ఉత్పత్తి చేస్తోంది.
కనుక నిర్మలమగు నిజచైతన్యమును జపిస్తూ ఆరాధిస్తూ మననం చేస్తూ రాగా, ఈ సంసార భ్రమకు కారణమగుచున్న మహామోహం దానంతట అదే తొలగిపోతుంది. ఇందులో సందేహించ వలసిన పనేమీ లేదు.
ఆశ క్ష్మీ జ్ఞానం - ఎవడైతే స్వస్వరూపమును అవధరించి ‘ఆశ’ అనే మహాసముద్రాన్ని దాటివేస్తాడో, అప్పుడు జ్ఞానభాస్కరుని కిరణాలు ఆతడున్నచోట నలువైపులా ప్రసరిస్తాయి. జ్ఞానమున్న చోట ఆశ ఉండదు. ఆశ ఉన్నచోట జ్ఞానము పెంపొందదు.
Page:501
స్వాత్మభావమును అవలోకిస్తూ, అద్వైత బ్రహ్మానందమున సంస్థితుడైన మనుజునకు మిక్కిలి రుచికరమైన అమృతం కూడా ఎక్కడబడితే అక్కడ ఉండే నీరులాగా గోచరిస్తుంది. ప్రత్యగాత్మ భావం పొందిన అట్టి జీవన్ముక్తులతో మునులమగు మేము ఎల్లప్పుడూ మైత్రి కలిగి ఉంటాం.
ఇక ఈ విషయం ఎరుగని మనుజుల విషయమంటావా… మా దృష్టిలో వారు మనుజాకారంలో ఉండే జంతుజీవుల వంటివారే. ‘స్వజ్ఞానం’ కారణంగా ’సర్వోతీత సర్వ స్వరూప స్థితి - సర్వోన్నత స్థితి’ ని పొందిన తత్త్వజ్ఞాని వద్దకు తదితర జ్ఞానార్తులు, యోగులు జ్ఞానం కొరకై సమీపిస్తూంటారు.
తత్త్వజ్ఞుడు - ‘దివ్యజ్ఞాన నేత్రయుతుడు’ అగు తత్వవేత్త ఏది ఎట్లు దర్శిస్తున్నాడో అది తత్త్వజ్ఞులు కాని వారిచే ఇంతవరకూ దర్శించబడుటలేదు. ఇక ముందు దర్శింపబడజాలదు. ఈ సూర్యప్రకాశం సహాయం లేకుండానే వారు అంతర్లీన సత్యాన్ని సుస్పష్టంగా చూస్తున్నారు.
ఏ జీవుడైనా సరే, స్వజ్ఞాన వశం చేతనే సర్వోన్నత స్థితిని పొంది ఉంటున్నాడు. మిట్టమధ్యాహ్నం దీపపు వెలుగు ఒక అవస్తువే కదా! బ్రహ్మవిద్యచే ఆత్మను ఎఱిగిన వానికి సూర్య, ఇంద్రాది ఆయా మహా లోకములన్నీ అవస్తువులే అవుతాయి. ఓ రామా! మహాతేజస్సు కలవారి లోనూ, యోగ వశిత్యాది సిద్దులు పొందిన వారిలోనూ, బలవంతులలోనూ, ఆయురైశ్వర్యములు కలవారి లోనూ, గొప్ప విద్వత్తు, వక్తృత్వములు కలవారి లోనూ - వీరందరిలో తత్త్వజ్ఞానము ఉన్నవాడే అత్యంత ఉన్నతుడై వెలయుచున్నాడు.
ఆత్మజ్ఞాని ఔన్నత్యం - పరమేశ్వరుని నిజరూపం ఆత్మయే. ఆత్మరూపుడగు పరమేశ్వరుని ప్రకాశం చేతనే ఈ సూర్య, చంద్ర, అగ్ని, మణి, తారలు ప్రకాశిస్తున్నాయి. జ్ఞేయులగు - జ్ఞాత (తెలిసికొను దానిని తెలిసియున్న వారగు) తత్త్వజ్ఞుల ప్రభావం చేతనే ఈ జగత్తులో ఆనందవీచికలు ప్రభవిస్తున్నాయి.
ఆత్మజ్ఞాన రహితులగు మానవులు నేలలో పురుగుల కంటే, కీటకముల కంటే, జంతువుల కంటే అధికులేమీ కాదు. ఎందుకంటే, ఒకడు ఆత్మజ్ఞుడు అవనంత వరకూ ‘మోహము’ అనే పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. తత్త్వవేత్తల దృష్టిలో ఆత్మజ్ఞుడు మాత్రమే సచేతనుడు. అతడు మాత్రమే స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆత్మజ్ఞుడు కానివాడు దేనికీ స్వతంత్రుడు కాదు. అందుచేత అచేతనుడే. ఆతడు దుఃఖము కొరకే అనేక ఆశలు, ఉద్వేగములు, తాత్సారములు కలిగి ఉంటున్నాడు.
అజ్ఞాని సర్వదా మృతుడే. ఆత్మజ్ఞుడే సజీవుడు.
ఆత్మానుభవ ప్రభావం - ఆకాశంలో దట్టంగా మేఘములు అలుముకున్నప్పుడు నాలుగు వైపులా ప్రకాశము సన్నగిల్లుతుంది కదా!… ఈ చిత్తము స్థూలపదార్థములను రాగయుక్తముగా భావిస్తూ ఉన్నప్పుడు స్థూలమగుచున్నది. అట్టి సమయంలో ఆత్మజ్ఞానం పలాయనం చిత్తగించుచున్నది. అయితే జ్ఞాని తన మనస్సులోంచి క్రమంగా విషయభోగాలందలి అభిలాషను తొలగిస్తూ ఉంటాడు. ప్రాప్తించిన వాటి పట్ల లోభము గాని, ప్రాప్తించని వాటి పట్ల ఆశ గాని ఆతనికి ఉండదు. తన మనస్సును ఎండుటాకు వలె కృశింపజేస్తాడు. సర్వకాల సర్వావస్థల యందును ‘ఆత్మజ్ఞానము’
Page:502
అనే అమృతమును సేవిస్తూ సంతృప్తిగా, ప్రశాంతంగా ఉంటాడు. ఆతనికి ఈ జన్మ, జరా, మృత్యువులు గానీ, వాటి మధ్య సంఘటితమయ్యే ఆయా వ్యవహారములు గానీ ఒక లెఖ్కలోనికిరావు. ఆతడు అనాత్మ యందు ఆత్మభావము కలిగి ఉండడు. ప్రతి అనుభవమును ఆత్మభావముచే పునీతం చేసి మహాప్రభావ సంపన్నుడై ఉంటాడు.
అనాత్మభావం - ఓ రామచంద్రా! స్వతహాగా సూక్ష్మమే అయిన ఈ చిత్తము చమత్కారంగా స్థూలత్వం పొందుతోంది. ఈ దేహము పట్ల ఆశచేతను, పుత్ర, దార, ధనాది విషయాలపై ఏర్పడే మమకారము చేతనూ చిత్తము స్థూలపడుతోంది. అదంతా భ్రాంతి చేతనే. అహంకారము యొక్క వికారమే మమకారభ్రాంతి! దృశ్యము నందు ఏర్పడుచున్న భ్రాంతి పూర్వకమైన ఆసక్తి ’ఈ శరీరమే నేను’ అను ఒకానొక అజ్ఞానవృత్తిని వృద్ధి చేస్తోంది. వ్యర్థమైన పదార్థములను ఇచ్చగించుట చేత, దోషభావముల చేత, జరామరణముల పట్ల గల దురవగాహనల చేత బుద్ధి అనారోగ్యమగుచున్నది. “బాహ్య వస్తుజాలం రమణీయమైనది" - అనే వికల్పభావం చేత, “ఇవి స్థిరంగా ఉండగలవు” అనే తుచ్ఛవిశ్వాసం చేత ఈ జీవుడు త్యాజ్యగ్రాహ్య వ్యవహారములన్నీ శ్రమించి మరీ స్వీకరిస్తున్నాడు. ఫలితం? ఆతని ఆ చిత్తమౌఢ్యమే శారీరక మానసిక వ్యధల రూపమున విస్తరిస్తోంది. ఇక ఆపై ఉన్మత్త క్రియా వ్యవహారాలు, అంతు లేని దుఃఖాలూ, అనేక జన్మ పరంపరలు వచ్చి కూర్చుంటున్నాయి.
ఓయీ! జీవుడా! నీవు అవిచారణ చేతనే తుచ్ఛములైన ధన, మణి, స్త్రీ (శృంగారం) వంటి స్వల్ప విషయాలు గొప్పవైనట్లు భావించి తుచ్ఛమైన ప్రలోభంలో పడుచున్నావు. నీ మనస్సు స్థూల మగుచున్నది. అందుచేతనే ఆత్మబోధ తగినంతగా గ్రహించలేకపోతున్నావు.
కనుక, దృశ్యము పట్ల ఏర్పడే ఆశను త్యజించు. అధిష్ఠానమైయున్న స్వస్వరూపమగు ఆత్మ యొక్క విస్తారతను, ప్రసన్నతను, కాలః కాలత్వమును గ్రహించు. ఆనందించు. అంతేగాని, ఉత్పత్తి - - వినాశన స్వభావయుతాలైన ఈ పదార్థములు నీకేం ఉత్తమ వస్తువును చేకూరుస్తాయి చెప్పు? అవన్నీ నీకు చివరికి విషయ వైషమ్యత్వమును తెచ్చి పెడుచున్నాయి. భయంకరములైన విషయ భోగములను సేవిస్తూ పుండుపై వ్రాలే ఈగ లాగా తుచ్ఛత్వం కొనితెచ్చుకుంటే ఎట్లా? సునిశిత - సుతీక్ష దృష్టిని వదలి, స్థూలత్వం పొంది ఏం ప్రయోజనం?
అందుచేత ఈ చిత్తం వికాసవంతమగు చైతన్యాన్ని ఆశ్రయించి స్వతంత్రం పొందు గాక!
ఓ రామచంద్రా! చిత్తము అనే వృక్షం శరీరము అనే ప్రదేశంలో నెలకొని ఉంటోంది. అనేక చింతలు ఈ చిత్తవృక్షమును పర్యవేక్షించి ఉన్నాయి. ఆ వృక్షం నుంచి ’పుట్టటం పెరగటం చావటం’ అనే పళ్ళు నిరంతరం కాస్తున్నాయి. అది ‘ఆశలు’ అనే పొడవాటి కొమ్మలతో, వికల్పములు (Misconceptions) అనే ఆకులతో విస్తరించి ఉన్నది. అట్టి చిత్తవృక్షము గురించి తాత్సారం చేయటం ఉచితం కాదు. ఇక ఏమాత్రం శంకించకుండా ’ఆత్మ విచారణ’ అనే అంపముతో ఆ వృక్షమును మొదలంట వ్రేళ్ళతో సహా నరికి, పెకలించి వేయాలి.
Page:503
మనస్సు, సూక్ష్మబుద్ధి - ఈ మనస్సు అనేక అనుమానాలకు తావు. ఇది సర్వదా బహిర్ముఖం అగుటకే ఉత్సుకత చూపుతోంది. ఎన్ని అనుభవములు పొందుతున్నా, ఎంతకాలం గడచిపోతున్నా కూడా ఇది అంతర్ముఖం అవటమే లేదు. అరె! ఏమాత్రం విశ్రాంతి పొందటానికి ప్రయత్నించదే? ద్వేషములను, అసూయలను ఆశ్రయిస్తుందే గానీ, ‘శమ, దమ, తితిక్ష’ మొదలైన ఉత్తమ ఉపకరణాల ఊసే ఎత్తదేం? అన్ని వేళలా క్రోధమునూ, సుఖ, దుఃఖాలను మాత్రం పొందుతోంది. తన విశ్రాంతి స్థానమేదో తానే గ్రహించలేకపోతోంది. ఇట్టి మనస్సు అనే ఏనుగును ‘అతి సూక్ష్మ బుద్ధి’ అనే సింహం యొక్క గోళ్ళు ఉపయోగించి నిరోధించాలి.
ఓ మనస్సా! ఇక నీవు శమించు. ఆత్మజ్ఞాన వివేకం కలుగనంతసేపే నీ ప్రతాపం.
ఓ రాఘవా! చిత్తము అనే పిశాచం తనకు వీలున్నంత వరకూ తృష్ణ (Passion)నే సేవిస్తోందయ్యా! ‘అజ్ఞానం’ అనే వటవృక్షం క్రింద విశ్రమిస్తోంది. నిత్యం ‘అనంతకోటి జన్మలు’ అనే మహారణ్యంలో సంచరిస్తోంది. అజ్ఞానులలోని చాంచల్యమే దాని రూపం. ఏమి దాని విన్యాసం! ఏమి దాని ఎత్తుగడలు! అట్టి చిత్తమును వివేక - వైరాగ్యములతో నిరోధించాలి. స్వాత్మ గృహం నుండి దానిని వెడలగొట్టనంత వరకు ఆత్మకు ‘ముక్తి’ అనుమాట కల్ల.
ఈ మనస్సును ఒక విషసర్పంతో పెద్దలు పోలుస్తూ ఉంటారు. దీనికి "శుభ- అశుభ కర్మలు” అనే రెండు కోరలున్నాయి. ఇది ‘దేహము’ అనే కుబుసమును కలిగి ఉండి, విశ్రాంతి లేకుండా ప్రాణవాయువులను భక్షిస్తోంది. ‘భయములు’ అనే మృత్యువును తెచ్చిపెడుతోంది. అట్టి ఈ మనో - విషసర్పాన్ని ‘అభ్యాస, వైరాగ్యములు’ అనే గరుడ మంత్రముచే నిర్జించాలి. లేకపోతే, ఇది అనేక దేహరూప శవములను భక్షిస్తూ అమంగళస్వరూపంతో దిక్కులన్నీ సంచరిస్తూనే ఉంటుంది. ‘అవమానము, శోకము, భయము’ అనే దుర్వ్యసనములను కలుగజేసుకుంటూ ఇట్లు బిగ్గరగా రోదిస్తూనే ఉంటుంది.
ఈ మనస్సు ఒక కోతి వంటిది. ఇది జన సమూహమును, వారితో సంబంధములను గాంచుచూ, పిచ్చిపట్టిన దానివలె గంతులేస్తోంది. దీనిని నాలుగు వైపుల నుండీ బంధించాలి. లేకపోతే ఆత్మసిద్ధి ప్రాప్తించదు.
అభావము - నాయనా! రామా! నీవు అభావమును ఆశ్రయించి వాసనలను, సంకల్పములను, తదితర సర్వ కల్పనలను బుద్ధిపూర్వకంగా నిరోధించెదవు గాక! తద్వారా జీవన్ముక్త ఫలమును పరిపూర్ణముగా పొందెదవు గాక!
అసంకల్పముచే సుకృత - దుష్కృత ఉభయవిషయములను పరిత్యజించు. ఈ జన్మ - జాతి భేదములన్నిటినీ మనస్సులో రహితం చేయి. శంకారహితంగా స్వస్వరూపమునందు యథాతథంగా విహరిస్తూ ఉండు.
❖
Page:504
ఈ మనస్సు కోపము - అసూయ - - ఆశ - ఉద్వేగము మొదలైన రూపంతో ఆ పరబ్రహ్మమును కప్పి ఉంచుతోంది. తృష్ణ అనే నోరు తెరచి ‘విషయములు’ అనే మాంసపు ముక్కలను నములునట్లు చేస్తోంది. మోక్షము విషయంలో నిద్ర - ఆలశ్యములను కలుగజేస్తోంది.
ఇట్టి మనస్సు పట్ల నీవు దయ చూపవద్దు. నిర్దయగా దీనిని నియమించి నీ యొక్క వైరాగ్య మహాప్రయత్నమునకు మనస్సు వల్ల కలుగుచున్న విఘాతములను, అడ్డులను తొలగించుకో!
అప్పుడు నీవు పూర్ణానందైశ్వర్యుడవు కాగలవు. శుద్ధ చిత్తముచే మలిన చిత్తమును పూర్ణముగా శమింపజేసి అఖండ శోభాయమానుడవు కమ్ము.
తత్త్వజ్ఞానం చేత మనస్సును మలినరహితం చేసి ప్రత్యగాత్మ యందు నియమించు.
ఇక ఆపై ఈ స్థూల - - సూక్ష్మ - కారణ శరీరసహితమగు సమస్త జగత్తును అనాదరంతో తృణప్రాయంగా చూడు. క్రమంగా ఈ సంసారము నుండి తరించు. శాస్త్రములకు అవిరుద్ధంగా మెలగుచూ ఉండు. లోకములకు శుభం కలుగజేసే దృష్టితో లీలాపూర్వకంగా ఈ ప్రపంచమున వ్యవహరించెదవు గాక!