Page:505
VII. ఉద్దాలకుని అంతరంగాన్వేషణ
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ చిత్తవృత్తులను గమనిస్తున్నావా? ఇవి ఇహ - పరలోకముల పట్ల గల ఆసక్తిచే అతిదీర్ఘమై ఉంటున్నాయి. అవి తమ యందు అనేక వాసనలు కలిగి ఉండి కంటికి (పైకి) కనబడకుండానే, సూక్ష్మమై ప్రవర్తిస్తున్నాయి. ఇవి క్షణక్షణం జీవుని సమాధి నుండి నివర్తింపజేస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్తవృత్తులను ఆత్మ యొక్క తత్త్వమును స్వీకరించుట యందు నియమించగలిగామా, అప్పుడిక నిర్మలత్వమును ప్రకటించగలవు. పదునైన కత్తి యొక్క అంచు వంటి ఈ చిత్తవృత్తుల గురించి, ఏమాత్రం, ‘పోనీలే’ అనే తాత్సారం కూడదు. చక్కటి ఈ మానవజన్మ పొందిన తరువాత ఇక నిదానం పనికిరాదు. శ్రవణము, మననము మొదలైన ఉపాయాలచే ఈ బుద్ధి పరమాత్మపై లగ్నమయ్యేట్లు చేయాలి. వివేకం సహాయంతో బాహ్యవృత్తులను నిరోధిస్తూ క్రమంగా ‘అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలము’ అగు ఆత్మవస్తువుతో స్నేహం పెంపొందిం చుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి కదా! ఈ శరీరము పుష్టి, దీప్తి కలిగి ఉన్నప్పుడే గురు శుశ్రూష, వినటం, యోచించటం, ఉపశమనము వంటి ఉత్తమ ప్రయత్నములను స్వీకరించాలి. సద్భుద్ధిని చక్కగా పెంచి, పరిపోషించుకోవాలి. అట్లా కాకుండా, శరీరం వృద్ధాప్యంలో ప్రవేశించిన తరువాత అప్పుడిక ఈ జీవుడు ఏమిచేయగలడో నాకేమీ అర్థం కావటంలేదు.
నా వాక్యాలలోని అంతరార్థం చక్కగా గ్రహించ గలిగినట్టి ఓ రాఘవా! నేను చెప్పు వాక్యార్థమును భావన చేయుటచే ఈ జీవుడు తప్పకుండా ఉత్తమ సుఖమును పొందగలడు. ‘ఉద్దాలకుడు’ అను మహర్షి ఏ విధంగా అయితే సర్వపదార్థములనూ పరిశోధిస్తూ క్రమంగా పంచ కోశములను, వాటి కారణము లందు లయింప జేసి అధిష్ఠానమగు సన్మాత్రము కొరకై అన్వేషణ సాగించాడో నీవు కూడా అట్లాగే ధీరబుద్ధిచే అంతఃకరణమును మాటి మాటికీ శోధించు. ఆత్మ కొరకై అంతరంగము నందు అన్వేషణ కొనసాగించు. అప్పుడు అంతా నీకే విదితమౌతుంది.
శ్రీరాముడు : హే మహావక్తా! నేను ఉద్దాలక మహర్షి గురించి విని ఉన్నాను. కానీ, ఆయన “అంతరంగ శోధన అన్వేషణ” గురించి విని ఉండలేదు. ఆ మహానుభావుని కథనమేమిటో
వివరించండి.
శ్రీవసిష్ఠమహర్షి : పంచభూతముల పరిశోధనచే ఉద్దాలక మహాముని ఏ విధంగా పరమజ్ఞాన దృష్టిని పొందారో - అదంతా వివరించి చెపుతాను విను.
Page:506
గంధమాదన పర్వతంపై గల ఒక వనప్రదేశంలో ఒక తటాకం ఉన్నది. ఆ తటాకం ప్రక్కనే గల ఒక కొండశిఖరం పై ‘ఉద్దాలకుడు’ అనే పేరుగల ఒక మునిబాలుడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి నేను నా పురుషప్రయత్నంచే తప్పకుండా శాస్త్రప్రవచితమైన ఉత్తమ పురుషార్థం సాధించగలను” అనే కొండంత ఆత్మవిశ్వాసం ఉండేది.
మొట్టమొదట ఆతడు తాను విన్న, చదివిన శాస్త్రవిషయ సారమును పరిశీలించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆతని బుద్ధి తన ప్రకంపనములను వదలనే లేదు. “ఇక ఇట్లా కాదు. నేను మునుముందుగా శుద్ధమైన అంతఃకరణం సంపాదించాలి. ఆ తరువాతే మిగతా విషయాలు” - అని అనుకున్నాడు. ఇక శ్రద్దగా తపస్సు, అధ్యయనము మొదలైన తీవ్రప్రయత్నములతో కొంత కాలం గడిపాడు. క్రమంగా ఆతనియందు వివేకము ప్రవేశించింది. ఒక్కసారి ఈ సంసార ప్రహసన మంతా గమనించిన తరువాత ఆతనికి ఎంతో భయమనిపించింది.
ఒక రోజు ఒక ప్రదేశంలో ఏకాంతంగా ఆసీనుడై శుద్ధ చిత్తముతో ఇట్లు యోచించసాగాడు.
ఉద్దాలకుడు (తనలో) : దేని యందైతే విశ్రాంతి పొందిన తరువాత ఇక మనుజుడు మరల దుఃఖించడో, జన్మతో సంబంధమే ఉండదో అట్టి వస్తువు ఏది? మనస్సు లేని చోట దేనితోనూ సంబంధం ఉండదు కదా! మనోవ్యాపారమంటూ ఉండనట్టి పవిత్రమైన ఉత్తమ పదము నందు నేను విశ్రమించెదను గాక! అయితే అది ఎలా సాధ్యం? అది సాధ్యపడాలంటే, “ఏదో పొందాలి” అనే భోగతృష్ణను జయించివేయాలి. “ఈ పని, తరువాత ఆ పని, ఇవి పొందాలి, ఇందుకు ఏదో చేయాలి” … అనేదంతా కల్పనతో కూడినదే. ఆత్మ పదమునందు విశ్రాంతి తీసుకుంటూ అట్టి కాల్పిక వ్యవహారములు చూచి ఎప్పటికి పకపకా నవ్వుకుంటానో! కమల పుష్పదళంపై నీటి బిందువులు ఉండవచ్చు గాక.
కదా వికల్పజాలం మే న లగిష్యతి చేతసి |
స్థితమప్యుజ్ఞితాసఙ్గం పయః పద్మదలే యథా ॥ (శ్లో 21, సర్గ 51)
కమలం ఆ నీటి బిందువులను స్వీకరించదు కదా! ఆ విధంగా అభాసమాత్రమైన ఈ దృశ్య వికల్పములు నన్ను ఎప్పటికి స్పృశించకుండా ఉంటాయో! ఉత్తమబుద్ధితో అతి కల్లోలమైన తృష్ణను ఎప్పటికి అధిగమిస్తానో? ఈ లోకములోని ప్రాణుల సంసార క్రియలను పిల్లవాళ్ళు ఆడుకుంటున్న ఆట లాగా ఎన్నటికి చూస్తానో? నా చిత్తము ఇప్పటికిమాత్రం క్షణక్షణం చంచలమై ఉంటోంది. వికల్పములు కలిగి ఉన్నదై, ఊయలలాగా చంచలత్వం వహిస్తోంది. ఒక పిచ్చిపట్టినవాని వలె భ్రమతో కూడుకుని ఉండే నా మనస్సు ఎన్నటికి శమిస్తుందో?
Page:507
ఓ నా అంతఃకరణమా! నీవు ఎప్పటికి ఆత్మస్వరూపమును పొందుతావు? ఎప్పటికి ఈ తుచ్ఛ దృశ్య ప్రపంచమును చూచి ఎగతాళి చేయగలవు? పూర్ణబుద్ధిని పొంది ఏనాటికి బ్రహ్మాండ శరీరధారి అగు విరాట్పురుషుని వలె హాయిని, సంతుష్టిని పొందుతావో కాస్త తెలియజేస్తావా? నేను అంతఃకరణము నందు ‘సమరూపము’ కలిగి ఉన్నవాడనై పరమాత్మతో ఐక్యమవ్వాలి. ప్రశాంత - సౌమ్య-సమగ్ర స్వరూపుడను కావాలి. అమృతము, కౌస్తుభమణి మొదలైనవాటి యందు, ధర్మఅర్థ-కామ విషయము లందు నిస్పృహుడను కావాలి. వేలాది ఆశలతో నిండి ఉన్న ఈ అతిచంచల దృశ్య శోభను నిద్రపోతున్నవాని వలె పొందాలి, అది ఎట్లా సాధ్యం? కల్పనలన్నీ శమిస్తే, అప్పటి నా బుద్ధి మాత్రమే ఈ బాహ్య అభ్యంతర జగత్తును “చిన్మాత్రమయం”గా వీక్షించగలదు. అట్టి వీక్షణ యందు సుస్థిరుడనై ఉండాలి. ఇది ఇప్పటి నా కార్యక్రమం.
చిత్తము శాంతించు గాక! గుడ్డివానికి చూపు వచ్చినట్లుగా నేను ‘చిదేకరసము’ అనబడు పరమ ప్రకాశమును పొందాలి. అభ్యాస వశంచే అట్టి ఉత్తమ ప్రకాశము సమృద్ధమగుచుండగా కాల కళలన్నీ దూరంగా త్యజించి వేయబడాలి!
ఇష్టం-అయిష్టం, హేయం-ఉపాధేయం (something to get rid of - something to get) తొలగి నా అంతఃకరణము శుద్ధం కావాలి. స్వప్రకాశపదము నందు సుస్థితుడనై ఆనందమును సాధించాలి.
దురాశ - కానీ, ఇప్పటి నా స్థితి అందుకు అనుకూలంగా లేదే? ఈ వర్తమాన అజ్ఞానాంధకారపు కాళరాత్రి దురాశలతో, అవిద్యతో, జడత్వంతో, అనేక దోషాలతో నిండి ఉన్నది. అన్నిటికీ కారణం మనస్సే కదా!
ఈ మనస్సును ఎందుచేత జయించలేక పోతున్నాను? ఒక పర్వత గుహలోని అంతర్భాగంలోని శిలలాగా మనోవ్యాపార రహితుడనై నిర్వికల్ప సమాధి యందు ఎందుకు ఉండలేక పోతున్నాను? అహంకారమే నన్ను మోసగిస్తోంది. ‘స్వాభిమానము’ అనే మహామదం గల ఈ అహంకారమును ‘జ్ఞానము’ అనే ఆయుధంతో నిర్మూలించాలి.
నిర్వికల్ప ధ్యానము నందు విశ్రాంతి పొందాలి. నా మనస్సు మౌనవ్రతం అవలంబించి ఉండగా తలపై పక్షులు గూడుకట్టుకునే స్థితి నేను ఎందుకు పొందగూడదు? ధ్యానము నందు స్థిర బుద్ధి కలవాడనై స్థాణువువలె నిశ్చలంగా ఉండెదను గాక! "తృష్ణ కామాదులతో కూడి జన్మించటం” అనే అలవాటును త్యజించి సంసార పటాటోపాన్ని చిత్తు చేసెదను గాక!
విషయైర్నీయమానే తు చిత్తే మర్కట చఞ్చలే |
న స లేభే సమాధానప్రతిష్ఠాం ప్రీతిదాయినీం | (శ్లో 39, సర్గ 51)
ఈ విధంగా యోచన చేసిన ఆ ఉద్దాలకుడు మరల మరల ఆసీనుడై ధ్యానం అభ్యసించసాగాడు. అయితే, ఆతని చిత్తంమాత్రం కోతిలాగా విషయముల వైపుకే ఆకర్షించబడుతూ ఉండేది. ఆతను
Page:508
కోరుకొన్నట్లు సంతోష దాయకమగు స్థిరప్రతిష్ఠ (సమాధి) పొందనే లేదు. కొద్దిసేపు బాహ్య విషయాలు బాహ్యము నందే త్యజించి సత్వగుణ ప్రధానమగు సమాధి యందు స్థితిని పొందేవాడు. ఇంతలోనే రజోగుణం వచ్చి ఆక్రమించేది. చిత్తము భయమును, ఆలశ్యమును, ఉద్వేగమును పొందేది. కొద్ది నిముషాలలో ఆతని మనోమర్కటం సమాధి సుఖమును త్యజించి కల్లు త్రాగినవాడు వీథిలోనికి వెళ్ళినట్లు ఎక్కడెక్కడికో పరుగులు తీసేది.
కొంతసేపు హృదయాకాశంలో సూర్యుని వంటి జ్యోతిని చూస్తూ ఉండటం…. ఇంతలోనే బహిర్ముఖం కావటం…. మరికొంతసేపటికి “అరే … ఈ విషయములు నన్ను ఆక్రమిస్తున్నాయే” అని గుర్తుకు రావటం… మరల సంఘర్షణ మరల ప్రయత్నించి సమాధి వైపుగా సిద్ధం కావటం… ఇంకొంచెం సేపు ఇటు విషయములను, అటు సమాధిని కూడా త్యజించి అజ్ఞాన ఆత్మజ్యోతుల మధ్యగా ఒకానొక ‘సన్నిద్రాస్థితి’ యందు చిక్కుకుని ఉండి పోవటం…
ఈ విధంగా ఉద్దాలకుడు ప్రతి రోజూ ధ్యానం కొరకు ప్రయత్నిస్తూ ధ్యానవృత్తు లందు వ్యాకులం పొందుతూ ఉండేవాడు. మొత్తం మీద, తృష్ణ శేషించియే ఉండేది. తృష్ణా తరంగములచే సంకటములు పొందుతూనే ఉండేవాడు. ఎక్కడో దోవతప్పిన బాటసారిలాగా ఏకాకి అయి ఆ పర్వతముపై వ్యాకుల చిత్తంతో అటూ ఇటూ తిరుగుతుండే వాడు.
కొంతకాలం గడచింది. ఇక ఇట్లా కాదని, ఒక రోజు ఒక కొండగుహలో ప్రవేశించాడు. ఆకులతో ఒక ఆసనం తయారుచేసుకొన్నాడు. దాని పైన మృగచర్మం పరచాడు. క్రమంగా చిత్త వృత్తులను సూక్ష్మపరచుకున్నాడు. విషయములు సమీపించకుండా మనస్సును కట్టడి చేశాడు. ఉత్తర దిక్కుగా కూర్చుని కాలిమడమలచే వృషణములను తొక్కిపట్టి, బ్రహ్మ మొదలైన గురుపరంపరా ప్రాప్తమైన ’పద్మాసనం’ వేసి కూర్చున్నాడు. ఇక ఏకాగ్రతతో ఇట్లు చింతన చేయసాగాడు.
ఓ మూర్ఖమనసా! కొంచెం ఆగు, ఎటు పోతున్నావ్? ఈ సంసారవృత్తుల వలన మనకేం ప్రయోజనం? చివ్వరికి దుఃఖమునే కలిగించబోయే కార్యక్రమములను ఎవరైనా చేబడతారా? దుష్ట స్థితి గతులకు తీసుకుపోయే మార్గంలో ఎవరైనా తెలివి గలవారు ఆసక్తి కలిగి ఉంటారా? మనం ‘శాంతి’ అనే అమృతం వదలిపెట్టటమేమిటి? కల్పవృక్షం వదలి ముళ్ళకంపలోకి దూరట మేమిటి? అందుకని నా ప్రియాతి ప్రియమైన మనస్సా! కాస్త యోచించు. నీవు బ్రహ్మ లోకానికి వెళ్ళినా, (లేక) పాతాళ లోకానికి వెళ్ళినా, ఏం ప్రయోజనం? మనం నిరతిశయానంద రూపమైన నిర్వాణం సంపాదించాలి గాని ..కాకి లాగా, పిచ్చుక లాగా పీచు వంటి విషయపరంపరలను కాదు. నీవు చెప్పినట్లుగా ఇన్నాళ్ళూ ఆశలవెంట పరుగులు తీశాను. ఏమైంది? ఆశలు తీరనప్పుడల్లా దుఃఖం
Page:509
వచ్చిపడింది. ఒక ఆశ తీరగానే మరొక ఆశ వచ్చి పడింది. ఆశలు తీరనంతకాలం అపూర్ణత్వము వచ్చి పడుతూనే ఉన్నది కదా!
కనుక, నీవు భోగములందలి ఆశను త్యజించు. నిరతిశయానంద రూపమైనట్టి సుందరమైనట్టి, శ్రేయమైనట్టి మోక్షము కొరకే ప్రయత్నించు. ఈ ’ఇష్టములైనట్టివి చేకూర్చుకోవటం - ఇష్టం లేని వాటిని వదలించుకోవటం" అనే వ్యవహారమంతా నీకు దుఃఖమునే కలుగజేస్తోంది సుమా! ఏమి సుఖం? ఎక్కడి సుఖం? నూతిలో కప్పలాగా ఈ శబ్ద, స్పర్శ, రూపాది ఇంద్రియ విషయములలో నిరర్ధకంగా నీవు ఎందుకు చిక్కుకుంటున్నావ్? సరే, ఇంతకాలం తిరిగావు. ఇప్పటి వరకూ ఏమి పొందామో చెప్పు? సర్వ వృత్తుల యొక్క ఉపరమము (Withdrawal) కొరకై మనం ఎందుకు ప్రయత్నించ కూడదు? అదొక్కటే సదేహ - విదేహ కైవల్యములకు మార్గమైయున్నది.
ఓ చెవులారా ! వ్యర్థముగా భేదము పొందవద్దు. మరల మరల బహిర్ముఖం అవుతూ, గీతములకై, ఘంటానాదములకై పరుగులు తీసి చివరికి మూర్ఖ మృగముల వలె క్షయం పొందటం భావ్యమా? ఆటవికులు చేసే ఆడ ఏనుగుల ఘీంకార శబ్దానుకరణను విని పరుగులు తీస్తూపోయి వాళ్ళు పన్నిన వలలో పడిపోయే మగ ఏనుగులాగా ఉన్నది మన విన్యాసం!
ఓ రసేంద్రియమా! ఎఱను చూచి లొట్టలు వేస్తూ పరుగులు తీసి గాలమునకు చిక్కుకునే చేపలాగా నాశనమును తెచ్చిపెట్టుకోవద్దు.
ఓ నేత్రములారా! ’నేత్రవృత్తి’తో ఏకత్వము పొంది రూపలోభముచే ఎగిరెగిరి, నిప్పులోనికి పయనించి దగ్ధం అయ్యే మిడతలాగా మీరు రూపాకర్షణలకు లోను కాకండి.
ఓ నాశికమా! సువాసనచే ఆకర్షించబడి పువ్వులో ప్రవేశించి, అక్కడనుండి బయటకు రాలేక శల్యమయ్యే తేనెటీగలాగా కడతేరకు.
కురఙ్గలిపతఙ్గభమీనాస్త్వేకైకశో హతాః |
సర్వైర్యుకైరనర్థేస్తు వ్యాప్తస్యాజ్ఞ కుతః సుఖమ్ || (శ్లో 21, సర్గ 51)
ఓ అజ్ఞాన మానసమా! ఏనుగు, చేప, మిడుత, తేనెటీగ - ఇవన్నీ ఒక్కొక్క ఇంద్రియమునకే వశీభూతమై వినాశనము తెచ్చిపెట్టుకుంటున్నాయి. ఇక పంచేంద్రియములు గల ఈ మానవునకు సుఖమెక్కడిది?
ఓ మనస్సా! నీవు పట్టుపురుగును చూచావా? అది తన నుండి సహజంగా వెలువడే ‘చొంగ’ చేత తన్ను తానే బంధించుకొనుచున్నది. ఆ బంధమును బహుగట్టిగా, సువిశాలంగా నిర్మించుకుని, మధ్యగా తాను విశ్రమించుచున్నది. ఇక ఆపై ఆ బంధనము నుండి బయల్వెడలలేక కృంగిపోతోంది. దిక్కు తోచక అలమటిస్తోంది. నీవు కూడా నిన్ను నీవు బంధించుకోవటానికే ఈ విషయవాసనలను నీ యందు కలిగి ఉంటున్నావు. “ఏదేదో వినాలి, చూడాలి, స్పర్శించాలి, ఆఘ్రాణించాలి, రుచిచూడాలి” అనుకుంటూ బయలుదేరుతున్నావు.
Page:510
ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏవేవో కల్పనలలో ప్రవేశిస్తున్నావు. కళ్ళు మూసినా తెరచినా పరుగులు మాత్రం ఆపవు కదా! కొంచెం సేపు నీ ఇంద్రియ తాదాత్మ్యము ఆపు. నే చెప్పేది శ్రద్ధగా
విను.
’పుట్టటం - చావటం’ మొదలైన రూపములలో ఉన్న ఈ సంసారరోగమును మనం ‘రహితం’ చేయాలి. అందుచేత ’కర్మ - ఉపాసన’లచే నీవు శుద్ధిపడు. జ్ఞానవిషయాలు మరలమరల విను. అజ్ఞానం సమూలంగా నశించిందా - - ఇక నీకు అనంత విజయం ప్రాప్తించగలదు.
దేనినైనా ఆశ్రయించే ముందు, “ఇది మనకు యోగ్యమా? అయోగ్యమా? యుక్తమా? అయుక్తమా? శ్రేయమా? ప్రేయమా? అర్హమా? అనర్హమా? ఉచితమా? అనుచితమా?” …అని పరిశీలించాలి. అంతేగాని గుడ్డిగా దుఃఖంలోనో, ఆవేశంలోనో, భయంలోనో, అనుభవంలోనో ప్రవేశించరాదు. ఈ ‘జగత్ ప్రవృత్తి’ ని కించిత్ పరిశీలించు. ఇదంతా మరణ, దారిద్ర్య, నీరస, యౌవన, వార్ధక్యాలు కలిగి అగమ్యంలోనికి పరిగెత్తుకుపోతున్నది. అశ్రద్ధగా ఉన్నామా మరణానంతర ప్రవృత్తి ‘నరక-స్థావర’ గతులకు దారి తీస్తున్నది. ‘జగత్ ప్రవృత్తి ఇట్టిది’ అని మనకు తెలిసి కూడా వాటిని త్యజించకుండా ఎందుకు లీనమై ఉండాలి? మనం అధమత్వాన్ని ఎందుకు ఆశించటం? ఎంత చెప్పినా వినవా? నీవు హితం లేని దానివి కనుకనే నేను చెప్పే హితోపదేశం వ్యర్థమవుతోంది.
సర్వమును విచారించిచూచినవాడు చూస్తూ ఊరుకోడు. చిత్తమును పూర్తిగా నాశనం చేయ వలసిందే. శీతకాలంలో మంచు ఎక్కువగా ఉంటున్నట్లు, అజ్ఞానాధిక్యత ఉన్నంతవరకూ చిత్ర యొక్క ఆధిక్యత ఉండి తీరుతోంది.
వసంతకాలం రాగానే మంచు కరిగిపోతుంది. వివేకము వర్ధిల్లుతుండగా ఈ చిత్తము, ఇది కల్పించే న్యూనత, ఆధిక్యతలు, సుఖ దుఃఖములు తొలగిపోతాయి. వాసనాక్షయం అగుచుండగా చిత్తము తన రూపమునే కోల్పోవుచున్నది.
చిత్తము నందు అవివేకము పేరుకుని ఉన్నప్పుడు ఆ అసద్రూప చిత్తమునకు ఎంత బోధిస్తే మాత్రం ఏం లాభం? వివేకి విషయంలో మాత్రమే శాస్త్రబోధ మహా ప్రభావితమౌతోంది.
అవివేకికి శాస్త్ర శ్రవణం చేసినప్పటికీ చిత్తములో మార్పు ఉండదు. వివేకికి క్రమ క్రమంగా చిత్తమే ఉండదు.
అందుచేత ఓ మనస్సా! నీవు వివేకముచే నశించుటయే స్వభావముగా గలిగి ఉన్నావు. అసద్రూపం అయి ఉన్న నిన్ను ఎందుకు త్యజించరాదు? నీకు బోధించి, క్రమంగా నిన్ను త్యజించటమే మంచిది. లేకుంటే నిన్ను ఊరకే వదిలితే, ఇక నేను కూడా తెలివి తక్కువవాడిని అవవలసి వస్తోందే గాని, ప్రయోజనం ఉండటం లేదే?
Page:511
నేనెవడను?… సర్వ వికల్పములకు ఆవల ఉన్నవాడను. నిర్వికల్పుడను. చిత్ రూపము చేత ప్రత్యక్షమై ఉన్నవాడను. అహంకార వాసనా రహితుడను. అహంకారమునకు బీజభూతమైనట్టి చిత్తముతో నాకు ఎట్టి సంబంధం లేదు. అజ్ఞానుల దృష్టికి “ఈ శరీరం నేను. అనేక ఆత్మలలో ఒక ఆత్మను నేను”– అనునట్లుగా తోచుచున్నది. అనేక దుఃఖముల కొరకే మనస్సు అట్టి భావనలను ఆశ్రయిస్తోంది. ఒక మారేడు పిందెలో ఏనుగు ఉన్నదంటే ఎవరు నమ్ముతారు? అనంతమగు ఆత్మ తత్త్వము పరిచ్చిన్నత్వమును భావన చేసి, ఆ తదుపరి అధిగమించలేకపోతోంది.
మనస్సు ‘దుఃఖ ప్రదములగు వాసనలు” అనే బురదలో ఇరుక్కొనుట చేతనే తదితర యాతనలన్నీ వచ్చి పడుతున్నాయి. వాసనలను ఎల్లప్పుడూ ఆశ్రయించాలనుకొనే ఈ మనస్సును నేను దూరంగా త్యజించివేస్తున్నాను.
“ఈ దేహమే నేను, ఒక ఆత్మను నేను,. వేరువేరు ఆత్మలు తదితరులు" - అనునది మిథ్యాభ్రాంతి నుండి పుడుతోంది. విచారణ శూన్యులగు బాలుర వంటి వారికి అట్టి యోచన వస్తోంది. అదే అహంకారం. అది మహామోహము గాక మరింకేమీ కాదు. విచారణ పరుడగు నాకు అట్టి దుర్య్వసన పూర్వకమైన అహంకారంతో పని లేదు.
జ్ఞానమే నా స్వరూపం!… కాలు బొటనవేలునుండి శిరస్సు వరకు గల ఈ శరీరము యొక్క అణువణువూ చాలా బాగా విచారించాను. నేను జ్ఞానమాత్రమును. మరింకేదీ కాదు. జ్ఞానమే బాహ్యమున ఈ దిక్కులన్నిటినీ పరిపూర్ణం చేసి ఉంటోంది. అదియే ముల్లోకము లందు ఏకరూపమై వెలయుచున్నది. దాని యందు “దేశ - కాల - దేహ” పరిచ్ఛేదం అంటూ ఏదీ లేనే లేదు. అందు మరొక పదార్ధం అంటూ ఏదీ ఉండజాలదు.
దేనికైతే పరిచ్ఛిన్నరూపము గానీ, నామవికల్పముగానీ, ఏకత్వముగానీ, అనేకత్వముగానీ, మహత్వముగానీ, అణుత్వముగానీ ఉండనే ఉండవో… అట్టి జ్ఞానస్వరూపమే నేను.
జ్ఞానస్వరూపుడనగు నేను నా సాక్షిరూపముచే ఈ మనస్సు అనబడుదానిని ఎదురుగా గాంచు చున్నాను. వివేకంచే జనించిన జ్ఞానంచే మనస్సును ఇప్పుడు నా యందు లయం చేసివేస్తున్నాను.
శరీరం - ఇక్కడ మాంసము, ఇక్కడ రక్తము, ఇక్కడ బొమికలు, ఇక్కడ ప్రాణవాయువులు ఇంతేకదా ఈ శరీరం? ఇక ఇందులో ‘అహంకారం’ అనబడేది ఎక్కడున్నది? ఈ దేహము యొక్క సంచలనాత్మక శక్తి ప్రాణవాయువులకు సంబంధించినది.
ఇందలి జ్ఞానము మహాచైతన్యమునకు సంబంధించినది. ‘జన్మ-జర-మరణము’ మొదలైనవన్నీ శరీరమునకు సంబంధించినవి. ఇందులో అహంభావముగా ఉన్నదేది?
Page:512
మాంసము, రక్తము, ఎముకలు, చలనశీలమగు ఇంద్రియములు, ఎఱుగుట (జ్ఞానము) ఇవన్నీ ‘నేను’ అను పదమునకు భిన్నమైనవే కదా! కాని ఏమి చమత్కారం! ‘నేను’ అనునది వాటన్ని టిని ‘నావి’ అనుచున్నది. ఏది ఏమైనా అవి మాత్రం ‘నేను’ కాలేవు. మరి ఈ ఉపాధిరూపమున ‘నేను’ అను అహంభావరూపమున ఉన్నదేది?
చెవులు, ముక్కు నాలుక, చర్మము, కళ్ళు - వీటన్నిటికీ వేరై, వీటి యందు ఉండి, అనుభవమును పొందుచున్నది ఏది? ఎక్కడిది?
నేను - ఈ మనస్సు ‘నేను’ అను పదముచే ఉద్దేశించబడటానికి వీలులేదు. ఇందు గల వాసనలు కూడా “నేను” అనబడునది అయి ఉండటానికి కుదరదు. కనుక, చిన్మాత్రమగు ఆత్మయే అహంభావరూపమున, లేక ‘నేను’ అను రూపమున ప్రకాశించుచున్నది.
ఆరోపిత దృష్టి - ఇక ఆరోపిత దృష్టితో చూద్దాం. ఈ వినటం, చూడటం, స్పర్శించటం, ఆఘ్రాణించటం, రుచి చూడటం - ఇవన్నీ ‘నేను’ చేతనే పొందబడుచున్నాయి. అనుభవములన్నీ అనుభవజ్ఞుని ప్రదర్శనలే కనుక అవన్నీ నేనే.
అపవాద దృష్టి - “నేను ఏదై ఉన్నాను?" అను ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు, అపవాద దృష్టి (Attributive perception)చే చూస్తే ఇవేమి నేను కాదు.
‘నేను సర్వమును ఎఱుగుచున్నవాడను’ అనునదే సత్యము. “ఈ దేహము నేను. దీని తోనే ఉంటాను. దీని తోనే పోతాను" - అనునది మాత్రం సత్యదృష్టి కాదు.
ఆహా! పిచ్చికుక్క వెంటబడినప్పుడు ఒక పిల్లవాడు అనేక వికారములు ప్రదర్శిస్తున్నట్లు, నేను ఇంతకాలం నేను కాని వాటిచేత వికారములు పొందాను. ఎంతో బాధించబడ్డాను. అమ్మయ్యా! సౌభాగ్య వశం చేత ఇంతకాలానికి ‘అజ్ఞానము’ అనే దొంగను కనిపెట్టాను. పరమార్థమగు ’ఆత్మ జ్ఞానము’ అనే సొత్తును అపహరించిన ఆ దొంగ ఆట ఇక సాగనివ్వను.
ఎందుకంటే, నేను స్వతహాగా దుఃఖరహితుడనే. అట్టి నేను దుఃఖములు పొందటమేమిటి? ఆకాశమునకు, మేఘములకు సంబంధముంటుందా? అవి రెండూ ఒక్కటి అవుతాయా? లేదు అట్లాగే ఈ దుఃఖములకూ, నాకూ సంబంధం లేదు.
నవరసాలు పోషించే నటునిలాగా ‘అహంకారం’ అనే వేషం ధరించి నేను నా మనస్సుకు ఉపదేశాలు చేస్తున్నాను. ఈ శరీరం ధరించి, శరీర సంబంధ మాత్రములైన ‘తెలుసుకోవటం, ఉండటం, రావటం, పోవటం’ మొదలైనవి నిర్వర్తిస్తున్నాను. అయితే, ఆత్మ సందర్శనం చేత నేను అసలు అహంకారవిషయుడనే కాను. నటుడు తాను వేసే వేషం కంటే వేరైన వాడే కదా!
నేను లేకపోతే ఈ కళ్ళు ఉండవు, చూపు ఉండదు, చూడబడేవీ ఉండవు. నా కంటే వేరుగా చూస్తే వాటికి ఉనికి లేదు. అవన్నీ ఈ దేహము నందో, లేక, మరెక్కడనో ఉంటే ఏమున్నది? లేక పోతే ఏమున్నది? నేను వాటన్నిటికీ సంబంధించినవాడను కాను.
Page:513
ఏమి చమత్కారం! చెట్టు మీద భూతంలాగా ఈ జగత్తు నందు పచార్లు చేసే ఈ ’అహమ్’ అనునది ఎవరు? ఎవనిచే, ఎప్పుడు, ఎట్లు, ఎందుకు కల్పించబడుచున్నది? -ఈ ప్రశ్నకు రాకుండానే నేను ఇంతకాలం గోతిలో చిక్కిన లేడిలాగా పడిఉన్నానేమిటి?
ఈ కన్ను ఏదో ‘రూపము’ అనే విషయాన్ని చూస్తోంది. అది ఆ రూపమును గాంచుట యందు నిమగ్నమై ఉండగా, ఇక ఆ దృశ్య విషయమును ‘ఇది దుఃఖ విషయము’ అను అర్థమును ఇచ్చి తదనుభవం పొందుచున్న నేనెవడిని?
ఈ త్వక్ (చర్మము) స్పర్శయందు ఉన్ముఖమగు చుండగా, “ఆహా! బాగుగదా!” అని చెప్పుచూ దుష్ట పిశాచంలాగా పాల్గొనుచున్న అహమ్ ఎవరు?
నాలుక రుచిని స్వీకరిస్తూ ఉండగా “ఇప్పుడు భుజిస్తున్నాను. ఇవి ఎంత రుచిగా ఉన్నాయి!” అనే దుష్టభ్రమ కలుగుచున్న దెవరికి? చెవుల శబ్దమును పొందుతూ ఉండగా “అయ్యో! ఈ మాటలచే నన్ను ఇంతగా అవమానిస్తున్నారా?” అనే దుఃఖమును పొందుతూ, అతి దీనంగా స్పందిస్తున్నది ఎవరు? ఈ ముక్కు ఏదో వాసన పొందుచుండగా "అబ్బే! ఏం బాగోలేదు” అనుకుంటూ చెప్పుచున్నదెవరు?
అహంకార కల్పన! - ఈ ఇంద్రియములు తమ పనులు చేస్తూ ఉంటే, వాటి యందు, మృగతృష్ణా జలం లాగా అహంకారం వచ్చి తేలియాడుచున్నది. కనుక… “ఈ దేహేంద్రియాదులే నేను” అనే “భావన” భ్రాంతి నుండి, బూటకపు కల్పన నుండి బయలుదేరుతోంది. ఈ దేహేంద్రియాదుల పట్ల గల అహంభావము ఇప్పుడు నాచే పరిత్యజించబడుగాక!
ఈ దేహమును కదల్చుచున్న దెవరు? వాసనలా?…లేదు. ఎందుకంటే, ఒకడు సదభ్యాసం చేత వాసనా రహితుడైనప్పటికీ ఈ దేహము తన జీవన హేతువగు కర్మయందు ప్రవర్తన కలిగియే ఉంటోంది. ‘కనుక శరీరవ్యాపారమునకు వాసనలు కారణం’ అనటానికి వీలులేదు. వాసనలు దేనికి సంబంధించినవో ఈ దేహకర్తృత్వం అద్దానిది అవుతుంది.
ఓ మలిన చిత్తమా! నేనిప్పుడు చేస్తున్న విచారణ అంతా నీవు గమనిస్తున్నావు కదా! ఒక్క విషయం గ్రహించు. వాసనారహితంగా జరుగుచున్న కర్మ వ్యవహారము లందు ’నేను దుఃఖిని’ అనే అనుభవం ఉండజాలదు. వర్తమాన కర్మలు ఎప్పుడైతే వాసనారహితమౌతాయో, ఇక “భవిష్యత్తులోని సుఖ - దుఃఖానుభవములు” కూడా ఉండజాలవు.
అదియే వాసనాత్యాగం. మూర్ఖులగు ఓ ఇంద్రియములారా! మీరు మీ వాసనలను త్యజించి, అటుపై యథాతథంగా మీ పనులను నిర్వర్తించారా - - ఇక మీరూ, నేనూ దుఃఖం పొందము. ఒక బాలుడు మట్టితో బొమ్మ తయారు చేసుకొని, ఆడుకుంటూ, అది పగిలిపోతే పెద్దపెట్టున ఏడుస్తాడు చూచారా? మీరు కూడా విషయ సముపార్జన యందు శ్రమిస్తున్నారు. కోల్పోతున్నప్పుడు దుఃఖం పొందుతున్నారు. … అందుకు వాసనలు కలిగి ఉండుటే కారణం.
Page:514
ఓ ప్రియమైన శుద్ధ చిత్తమా! అదిగో, ఆ తటాకంలో తరంగములు అగుపిస్తున్నాయి కదా! ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ తరంగములు జలము కంటే వేరా? కాదు. ఈ వాసనాదృష్టులు కూడా జ్ఞానదృష్టితో చూస్తే “ఆత్మ కంటే వేరు కాదు” - అని గ్రహించు.
ఓ ఇంద్రియములనే పిల్లవాళ్ళల్లారా! పట్టుపురుగు తన దారములో చిక్కుకొని నశించునట్లు మీరు మీయందు బయలుదేరే తృష్ణ యందు చిక్కుకొని వ్యర్థముగా పరితపించకండి.
కొండను ఎక్కుచున్న బాటసారి వడదెబ్బకు క్రిందబడి కొట్టుకొంటున్నట్టు మీరు ‘సంసారం’ అనే ముళ్ళ ప్రదేశంలో పడి కొట్టుకోకండి. పూలను దారం బంధించి ఉంచుతున్నట్లు మీరు బంధింపబడి ఉండుటకు వాసనలే కారణం.
‘వాసనలు’ అనబడేవి ఎక్కడి నుండి వచ్చాయి? భ్రాంతి నుండే! భ్రాంతిచే కల్పించబడేవి యథార్థం కాదు. అవి ‘సంకల్పించకపోవటం’ అనే శస్త్రం చేత సులభంగా ఛేదించబడగలవు. గాలి వాటుకు దీపం ఆరిపోవుచున్నట్లు వాసనలే అజ్ఞానానికి, వినాశనానికి హేతువులు అగుచున్నాయి. చిత్తము అనగా వాసనలే.
88
హే చిత్త సర్వేన్డ్రియకోశ తస్మాత్స ర్వేన్టియైరైక్యముపేత్య నూనమ్ |
ఆలోక్య చాత్మానమసత్స్వరూపం నిర్వాణమేవామలబోధమాస్స్వ । (శ్లో 69, సర్గ 52)
సర్వ ఇంద్రియములను ఆయా పనులకు పురమాయిస్తూ క్రింద - మీద చేసే ఓ చిత్తమా! ఇప్పటి దాకా మనం చెప్పుకున్న విచారణలోని ఆయాకారణాల వలన ఒక క్రొత్త విషయం వెలికివస్తోంది.
నీవు కూడా తదితర ఇంద్రియములలాగానే అసత్తువు, ఉపకరణ మాత్రము అయి ఉన్నావు. ఇక నుండి సాక్షిరూపమైన ‘ఇంద్రియరూప మాత్రము’ అయి ఉండు. వేద శాస్త్రజ్ఞులు మనకేం చెప్పుచున్నారు? “ఏకమేవాద్వితీయం బ్రహ్మ”“ద్వితీయమైనదంటూ మరొక్కటేదీ స్వయం ఉనికి కలిగి ఉండలేదు” - అని కదా! మనం దీనిని చక్కగా గ్రహిద్దాం. అంతేగాని భ్రమను కలిగి ఉండవద్దు. భ్రమ అనే విషూచి అనంత దుఃఖదాయకమైయున్నది. ’అహంకారము కలిగి ఉండుట’ అను అలవాటే ఆ భ్రమ, లేక, వాసన యొక్క స్వరూపం. అదే అనేక సార్లు అజ్ఞాన ప్రేరితమైన విషయ అభిలాషలను కలుగజేస్తోంది. ఆత్మతో సంబంధమును, ఏకత్వమును అనుబంధమును దూరం చేస్తోంది.
‘ద్వైతము / ద్వితీయము’ అనే విషూచిని మనం అతి నిపుణతతో అధిగమిద్దాం… త్యజిద్దాం. ఓ మిత్రమా! చిత్తమా! నీవు సంసారరహితుడవు కమ్ము. ఈ జనన - మరణాది సర్వభయములను త్యజించు. పూర్ణానంద స్వరూపుడవు కమ్ము.
Page:515
బాలుని దృష్టిలో ‘బేతాళుడు’ అనే లేని ఆకారం కల్పించబడుచున్నదే! అట్లాగే బుద్ధి యందు అహంకారము, సూక్ష్మవాసనలు కల్పించబడుచున్నాయి. అట్టి వాసనల సహాయంతో మనస్సు జడములను ఉపయోగించి తదితర జగత్తును పొందుతోంది. మనస్సు జాగ్రత్తు నందు, ఇంద్రియ విషయము లందు పాల్గొనుచూ అనేక జాగృతృశ్యానుభవములు సంపాదించుకుంటోంది. అదే మనస్సు స్వప్న సమయంలో భావనచే వాసనామయ విషయములను నాడీ ప్రదేశంలో పొందుతోంది.
మనస్సు యొక్క ‘జాగ్రత్, స్వప్న’ - - అనుభవములు నా సమక్షంలో జరుగుచున్నాయి. నేనో… చిత్వ్సరూపుడనై, నిర్లిప్తుడనై అంతా వీక్షిస్తూ ఉన్నాను.
నా స్వరూపమైనట్టి ‘చిత్తు’నకు జనన మరణములు లేవు. ‘సర్వవ్యాపి, నిరాకారము’ అయిన చైతన్యము నందు ఉద్భవించేదేది? నశించేదేది?… కాబట్టి, జీవుడు దేని యందు నశిస్తాడు? జీవుని యందు ఏది నశిస్తుంది?… స్వస్వరూపమగు ‘చిత్తు’ నకు ఈ శరీరాదుల యొక్క రాక పోకలచే క్రొత్తగా వచ్చేదేమున్నది? కోల్పోయేదేమున్నది?…
ఎందుకంటే… ‘సర్వాత్మ’ యగు చైతన్యమే అందరి యొక్క జీవనము. అట్టి చైతన్యమే నేను. సమస్త దేశ కాలము లందూ, సర్వ వస్తువులందూ చిత్ స్వరూపమే వ్యాపించియున్నది. మరప్పుడు ‘జీవించు కాలము, జీవించని కాలము’ అనేవి ఎక్కడున్నాయి? అనగా, నా స్వస్వరూపమగు చిత్తునకు జీవన - - నిర్జీవనములు లేవు. ఏ కాలంలోనూ ఏదీ అభిలషించ వలసిన పనే లేదు. "ఇది మరణించుచున్నది, ఇది జీవించుచున్నది” - ఇట్టి అనేక వికల్ప కల్పనలన్నీ కేవలం మనస్సుకే గానీ, నిర్మలమగు ఆత్మకు కావు. ఏ అంతరంగమైతే “ఈ దేహాదులే నేను” అను దురహంభావనను తన యందు ఏర్పరుచుకొని ఉంటోందో… అట్టి అంతరంగము మాత్రమే తన యందు జనన మరణాదులను పొందుతోంది. ఆత్మ యందు మాత్రం ‘అహమ్’ భావన గాని, మరే భావన గానీ ఉండవు. ఇక దానికి జనన మరణాదులు ఎక్కడుంటాయి? మృగతృష్ణ మిథ్యాభ్రమ అయినట్లు; దేహము, మనస్సూ - ఈ రెండూ మిథ్యయే. వాటి యందు ప్రతిబింబించే ‘అహంకారము’ మాత్రం సత్యమైనదెట్లా అవుతుంది? …జడమే కదా … అభిమానం దేనికి?
ఈ కనబడే పదార్థముల విషయానికి వస్తే … ఇవన్నీ కూడా జడమైనవే కదా! ఈ శరీరం కూడా ఒక జడపదార్థం మాత్రమే. ఇది స్వయముగా ఏదీ చేయుటలేదు.
చైతన్యస్వరూపుడనగు నేను ఈ దేహము మొదలైన జడపదార్థములపట్ల అభిమానం ఎందుకు
కలిగి ఉండాలి?
❖
Page:516
ఈ పదార్దములన్నీ ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా నేను ఉన్నాను. ఈ రక్తమాంసమయ దేహమునందు లీనమగుచూ, ’ఇది నాది’ అని తలచుచున్న మనస్సును చూస్తే నాకు జాలివేస్తోంది. అట్టి అభిమానము విచారణ చేసినప్పుడు తప్పక నశించుచున్నది.
మనస్సు - చిత్తము - బుద్ధి అనునవి స్వయంగా చైతన్యములు కావు. జడములు మాత్రమే! అవి మరొక దానిచే ప్రవర్తింపజేయబడుచున్నాయి. అవి కల్పనలోని విభాగములు. కనుక అవి అహంకారము అను దానిని తామే సృష్టించగలవా? …లేదు. ఇక ఈ దేహంలో ఇంద్రియములున్నాయి కదా!… ఇవి ఉపకరణములు మాత్రమే. ఇవి ‘రూపము’ మొదలైన విషయములను సాక్షాత్కరింప జేయుటలో నిమగ్నమై ఉన్నాయి.
ఈ బాహ్యపదార్థములు తమ తమ పదార్థత్వమును వ్యక్తపరచుట యందు స్థితి కలిగి ఉన్నాయి. వాటన్నిటి యందూ ‘నేను’ అనునది ఎక్కడున్నది? ఇవన్నీ నాచే ఉపయోగించబడుచూ, ‘తెలుసుకోబడుచున్నవి’ అయి ఉన్నాయి.
ఇక ‘గుణములు’ విషయం!… శాస్త్రకారులు గుణములను సత్వము రజము తమము అను మూడు విధాలుగా విభజించారు. ఈ సత్వరజోతమస్సులు “ప్రకాశము (తెలివి) పొందుట, ప్రవృత్తిని పొందుట, మోహము పొందుట" - - అను మూడు రకాలుగా ఏర్పడి ఉంటున్నాయి. ఈ త్రిగుణముల రకరకాల పాళ్ళకలయికయే ప్రకృతి. మాయ, ప్రధానము అని కూడా దీనిని పిలుస్తారు.
గుణములు ఎవరివి? … గుణివి (one who is exhibiting qualities). గుణి లేకుంటే గుణాలు ఉండవు. కనుక గుణములు స్వయంగా జడములు మాత్రమే. గుణి గుణములకు ముందే, గుణాల కంటే సూక్ష్ముడై, గుణములకు స్థానమై, కారణమై ఉంటున్నాడు. అతడు గుణములకు అప్రమేయుడు.
గుణి యొక్క స్వరూపము ‘సత్ బ్రహ్మము’. అది సర్వదా తన స్వాత్మభావన యందు నెలకొని ఉన్నది. అది అఖండము. “అహంకారము” అనబడేది అఖండమగు సత్ బ్రహ్మము నందు చోటు పొందజాలదు. అనగా ‘అహంకారం’ అనేది ఎక్కడా, ఏ రూపంలోనూ ఉండజాలదు.
బాగున్నది!… అయితే, ఈ ‘జీవుడు’ అని తారసపడేవాడెవడు? ఒకే సూర్యుడు అద్దం లోనూ, తటాకం లోనూ, కళ్ళ యందు ప్రతిబింబిస్తున్నాడు కదా! … అదేవిధంగా ఒకే చిత్తు ఈ దేహము లన్నిటి యందూ ప్రతిబింబిస్తోంది.
అనగా… ఈ దేహమున కనిపించే చిదాభాసుడు పరమానంద చిదాత్మయే. సర్వవ్యాపి, సర్వకాలమయుడు, మహత్తరరూపుడు అగు చిదాత్మ సర్వదేహము లందూ ‘దేహి’ గా వెలయుచున్నాడు. అట్టి మహత్తర రూపునకు ‘ఈ దేహము నాది’ అను దేహాభిమానము, అహంకారము ఎట్లా కలుగుతాయి. కనుక అట్టి అల్పభావము ఆపాదితమే గానీ, వాస్తవం కాదు.
దేహి - ఈ దేహము నందు దేహిగా అభిమానం కలిగి ఉంటున్నవాడెవడు? వాని ఆకారము ఎట్టిది? ఆతడు ఎట్లా ఏమని నిరూపించబడతాడు? ఆతని రంగేమిటి? రూపేమిటి? ఏ పదార్ధముచే ఆతడు తయారగుచున్నాడు?
Page:517
అహం భావము ప్రదర్శిస్తున్న నేనెవరిని? నేను అహంభావమునా? అందుకు వేరైన వాడినా? అహంభావము నాచే గ్రహించబడుచున్నదా? లేక, నేను అహంభావముచే గ్రహించబడుచున్నావా? అహంభావము నన్ను కల్పిస్తోందా? నేను అహంభావమును కల్పించుకుంటున్నానా?
భావాతీతం! - ఇట్లు యోచించినప్పుడు ’నేను అహం భావమునకు మునుముందే ఉండి ఉన్నాను” అని తెలిసిపోతోంది. ఈ భావాభావములు నా యందు గానీ, భావాభావములు యందు నేను గానీ లేము.
అవును. ఈ ప్రపంచమున ’అహంభావాభిమాని’ అనువాడెవ్వడూ యథార్ధానికి లేడు. కనుక నేను అహంకార రహితమగు చిదాత్మ స్వరూపుడను. అట్టి నాకు ఎద్దానితోనూ ఏ సంబంధమూ లేదు. అహంకారము అసత్తేనని నిరూపించబడుతోంది కదా! ఇక ఎవనికి దేనితో ఏమి సంబంధం? అట్టి సంబంధము యొక్క అభావము సిద్ధిస్తున్నప్పుడు సర్వద్వైతకల్పనలూ వాటంతట అవే నశిస్తున్నాయి. మరి నేను నిర్లిప్తుడను, అప్రమేయుడను, అసంగుడను కదా!
ఈ విధంగా ఈ జగత్తంతా బ్రహ్మాత్మకమే అయి ఉన్నది. సత్వరూపుడనగు నేను ఎందుకు వ్యర్థంగా శోకించాలి? అన్ని సమయాలలోనూ నేను అద్వైత సామ్రాజ్యమున స్థితుడనై ఉన్నానని
నిరూపించబడుతోంది కదా!
ఈ జీవుడు చేరతగ్గ అన్నిటికన్నా ఉత్తమోత్తమ స్థితి ఏది? …ఏకమై, నిర్మలమై, సర్వవ్యాపకమై శుద్ధమై ఉన్నట్టి ఆత్మపదమే - అన్ని రూపు లందు, అన్ని దిక్కులందూ, అన్ని వేళలందూ వెలయుచున్నది. మరి ‘అహంకారము’ అనే కళంకమే అసంభవం. అహంకారమనేది లేనే లేనప్పుడు, ఇక దానిని ‘తొలగించుకోవాలి’ - అనేది ఎక్కడుంది? అట్టి ప్రసక్తి అక్కర్లేదు.
పదార్థములు లేవు ఆత్మ మాత్రమే ఉన్నది - యథార్థానికి పదార్థజాలమంటూ ఎక్కడా ఏదీ లేదు. సర్వవ్యాపియగు ఆత్మ మాత్రమే ఉన్నది. ఒకవేళ అభాస మాత్రం చేత ఎప్పుడైనా పదార్థముల ఉనికి సంభవించినా, ఆత్మతోటి వాటికి ఎట్టి సంబంధమూ లేదు. బాహ్యపదార్థములు - ఆత్మదృష్ట్యా చూస్తే - అవన్నీ ఆత్మచే కల్పించబడి, భావించబడుచున్నవే! ఆత్మ నిర్వర్తించే మననమే తన రూపముగా గల ఈ మనస్సు ఇంద్రియములతో గూడి, స్వప్న దృష్టాంతములాగా విజృంభిస్తోంది. అది పొందుచున్న భావన అంతా తనకు తానే కల్పించుకొనుచున్నది. అది తనకు బాహ్యమైన పదార్థములేవీ సాక్షాత్కరించు కోలేదు. బాహ్యపదార్థము లేవీ దానిని స్పృశించజాలవు. కల్పనయే మనస్సును - పదార్థములను ఒక చోటికి తెచ్చుచున్నది. కనుక ఈ జగత్తు యొక్క అసలు రూపం కల్పన మాత్రమే.
ఇక చిత్ ఎల్లప్పుడూ నిర్లిప్తమైనది. అది మనస్సుతో గానీ, ఇంద్రియములతో గాని, బాహ్య పదార్థములతో గానీ సక్తము (Attached / Involved) అగుటలేదు. వాటన్నిటికీ అది అతీతమై, అనిర్వచనీయమై ఉంటోంది. వాస్తవానికి - 1. బాహ్యపదార్థములు, 2. ఇంద్రియములు, 3.
Page:518
మనస్సు, 4.చిత్ - - ఈ నాలుగు ఒక దానితో మరొకటి కలియకుండానే తమ తమ స్థానములలో ఏర్పడి ఉంటున్నాయి. రాయి, మణి, లోహము, త్రాడు (సూత్రము) ఒకచోట ఆభరణ రూపంలో ఉన్నా అవి ఒకదానికి మరొకటి వేరే కదా!
అజ్ఞానము నుండి అహంకారము అజ్ఞానము చేతనే మహాభ్రమ ఉదయిస్తోంది. అట్టి మహాభ్రమ వలన ‘ఇది నాది, ఇవి ఇంకా పొందాలి’ అనే వ్యవహారం ఏర్పడుతోంది. వాస్తవం ఎరుగక పోవటమే అజ్ఞానం. అది జగత్య్రాంతిగా పరిణమిస్తోంది.
ఆత్మతత్త్వము ఏమరుస్తున్నప్పుడు ‘అహంకారము’ అనే చమత్కృతి ఉదయిస్తోంది. వేడి ఉన్నచోట మంచు ఉంటుందా? ఆత్మను దర్శించగానే - అహంకారము, పదార్థభావనా, - రెండూ తొలగిపోతాయి. అనగా అవి లేనివిగా తెలియవస్తాయి.
ఆత్మకు భిన్నమైనదేదీ లేదు. అంతయు బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి బ్రహ్మమునే భావనచేస్తాను.
అహంకారభ్రమస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ |
అపునః స్మరణం మన్యే నూనం విస్మరణం వరమ్ || (శ్లో 25, సర్గ 53)
ఆకాశంలో కనిపిస్తున్న నీలపు రంగులాగా మిథ్యారూపంగా కనిపిస్తున్న ఈ అహంకారం నా స్మృతి పథంలో పూర్తిగా తొలగేంత వరకు అధిగమించివేస్తాను. అట్లు అధిగమించిన తరువాత, శేషించుచున్న ఆత్మస్వరూపము నందు ఆత్మ స్వరూపుడనై ఉంటాను. శాంతాత్ముడనై, నిర్మలాకాశమువలె అనంతత్వము, అఖండత్వము, శుద్ధత్వము, శాశ్వతత్వము వహిస్తాను. మూల అవిద్య సహితంగా అహంకార భ్రమను సర్వదా త్యజించివేస్తూ ఆ భ్రమకు కూడా సర్వదా సాక్షిమాత్రుడనై ఉంటాను.
లాభం, నష్టం - వృద్ధి, క్షయములు తమ స్వభావముగా గల ఈ దేహాదులపట్ల ‘ఇది నేను, ఇది నాది’ అను అహంభావము ఎన్ని అనర్థాలు కలుగ జేస్తోంది! ఎన్నెన్ని తాప, సంతాపములకు కారణమగుచున్నది! అవును. హృదయాకాశంలో ‘అహంకారము’ అనే మేఘం స్పురించగానే, ఇక దుర్వాసనలతో గూడిన ఈ దేహాదులు మరల మరల ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. దేహములను అనుసరించినంత కాలం ఇహ పరలోకములు, మరణములు, పునర్జన్మలు, దుఃఖములు కలుగుతూనే
ఉంటాయి.
అహంకారము అనే గ్రద్దకు కనబడుచున్న భోగ్యపదార్థములన్నీ ఎప్పటికో అప్పటికి నాశన మయ్యేవే కదా! పాపం, అజ్ఞానులగు అనేకమంది జీవులు, “ఇంత వరకూ ఇది పొందాను. ఇహ ఇక్కడి నుండి ఇది పొందబోవుచున్నాను“ అను రూపంలో అంతరంగంలో అవిశ్రాంత భావోద్రేకం కలిగి ఉంటున్నారు. అట్టి అంతఃకరణము జ్ఞానాగ్ని చేత దగ్ధమొనర్చబడు గాక! ”ఇది ఉన్నది, ఇది లేదు” - అనునట్టి చింతలన్నీ భ్రమకల్పితమగు అహంకారము వైపుగానే సారించబడుచున్నాయనీ, ఆత్మ వైపునకు కాదనీ జనులంతా గుర్తించెదరు గాక!
Page:519
భూయః ప్రయచ్ఛత్యరసో న పాషాణవదఙ్కురమ్ || (శ్లో 32, సర్గ 53)
ఉద్దాలకుడు : ఈ దేహాదులందు ఎప్పుడైతే అహంభావము క్షయిస్తుందో, అప్పుడిక సంసారవృక్షము ఎండి నీరసించగలదు. ఆత్మజ్ఞానం ఉన్నచోట రాగము గాని, ద్వేషము గాని, తృష్ణ గాని ఉండవు. మనస్సు నందు “ఈ ప్రపంచం మిథ్యయే" అను ఉన్నతమైన నిశ్చయం దృఢపడిందా … ఇక భోగ వాసనలు సన్నగిల్లుతాయి. మనస్సు చిత్ ప్రతిబింబమును నిర్మలస్వభావముతో కూడి గ్రహిస్తూండగా, క్రమంగా సంకల్ప – వికల్పములను త్యజించగలుగుతుంది. రాగరహితమైనప్పుడు శుద్ధమగుచున్నది. ఆత్మను దర్శించినప్పుడు స్వస్థత పొందగలుగుచున్నది.
ఈ చిత్తము తన అవయవరూపములైనట్టి ఈ ఇంద్రియములను బహిర్ముఖము నుండి అంతర్ముఖము వైపుగా తరలించినప్పుడు తత్త్వజ్ఞానం ఉదయిస్తోంది. జ్ఞానాగ్నిలో తనకు తానే దగ్ధమై, ఆత్మ ప్రకాశంచే నిర్మలత్వం పొందుతోంది. "ఆహా! ఈ దేహం నా కంటే భిన్నమైనది కదా!” అని గ్రహించినదై విషయవాసనలను త్యజిస్తోంది. స్వవినాశనమును కూడా అంగీకరించి గొప్ప దేశభక్తి గల యుద్ధవీరుని వలె ‘బ్రహ్మతత్త్వము’ అనే సామ్రాజ్యమునకు తన సేవలను అందిస్తోంది.
ఈ మనస్సును శుద్ధపరచటంలో అశ్రద్ధగా ఉన్నామా… ఇది దేహానికి సంతాపం కలుగ జేస్తూ ఉంటుంది. అట్లాగే, దేహము మనస్సునకు సంతాపకరము అగుచున్నది. కుండ పగిలితే అందులోని నీళ్ళు తొలగుతాయి కదా! అలాగే ఈ మనో దేహములలో ఒకదాని వాసనలు నశిస్తే, రెండూ నశిస్తాయి. కుండలోని నీరు కుండను ఆశ్రయించుకుని ఉన్నట్లు శరీరము, మనస్సు ఒకదాని కొకటి కాస్త సహకరించుకుంటున్నాయి. అయితే, ఇంతలోనే, పరస్పరం సంతాపకారణమయి, ద్వేషించుకుంటున్నాయి. అవిద్య నశిస్తే, ఆ రెండూ ‘లేనివి’ అగుచున్నాయి. ఆ రెండూ రహితత్వమును సంతరించుకున్నప్పుడు ఈ జీవునకు పరమసుఖము లభించగలదు. ఆ రెండిటిలో ఏ ఒక్కటి ఉన్నా ఈ జీవునకు దుఃఖము శమించటమనేది కల్ల. విరుద్ధ స్వభావం కలిగిన ఈ మనోదేహములు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖపరంపరలు వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ రెండిటి సంబంధము వలననే జీవునకు విషయసుఖము లందు ఆసక్తి జనించుచున్నది. అట్టి దౌర్భాగ్యం తప్పక గమనించ వలసిన విషయం.
బాలుడు పిశాచముల యొక్క కల్పన చేసుకుంటూ ఉంటాడే!… అట్లాగే ఈ మనస్సు తన సంకల్పముల చేతనే ఈ దేహమును కల్పించుకొనుచున్నది. ఈ శరీరమును ఒక వైపు నుండి భోజనము మొదలైన వాటిచే పుష్టిచేస్తూ, మరొకవైపు నుండి తన దుఃఖములన్నీ ఈ దేహమునకు అంటగట్టుచున్నది. మనస్సుచే దుఃఖములను అందుకున్న ఈ శరీరం దుర్వ్యసనములను సేవిస్తూ,
Page:520
రాగ-ద్వేష-శోక-మోహ-లోభ-పాపాదులను ఉత్పన్నం చేస్తూ, తద్వారా జనించిన కుసంస్కారాలను మనసులోనికి నెట్టుచున్నది. అనగా, మనస్సుకే ద్రోహం తలబెట్టుచున్నది. కన్నకొడుకే తండ్రిని బాధించునట్లు ఈ శరీరము మనస్సు యొక్క భ్రమను అధికం చేస్తోంది.
*
ఇక ఈ అనేక జీవుల పరస్పర సంబంధం ఇంకా చమత్కారంగా ఉంటోంది. స్వతఃగా చూస్తే ఒకడు మరొకనికి మిత్రుడు కాడు, శత్రువూ కాడు. కాని సుఖకల్పనచే ‘మిత్రుడు’, దుఃఖ, భయకల్పనచే ’శత్రువు’లను మనస్సు పొందుచున్నది.
నాస్తి శత్రుఃప్రకృత్యైవ, నచమిత్రం కదాచన,
సుఖదం మిత్రమిత్యుక్తమ్, దుఃఖదా శత్రువత్కృతాః ॥
ఎవరి వలన సుఖం లభిస్తుంటే ఆతడు మిత్రుడని, ఎవరి వలన దుఃఖం సంభవిస్తుందో ఆతడు శత్రువని మనస్సుచే ప్రతీతి ఏర్పరచబడుచున్నది.
ఈ శరీరం దుఃఖములను అనుభవిస్తూ మనస్సును హింసిస్తోంది. ఇక మనస్సు కూడా తన సంకల్పములచే ఈ దేహమును దుఃఖానుభవ స్థానంలో కూల్చివేస్తోందాయె! ఇట్టి పరస్పర దుఃఖ దాయకము, స్వభావ విరుద్ధములైన దేహమనస్సుల పోకడలను ఈ జీవుడు గుర్తించకున్నాడేం?
మనస్సు నశిస్తే శరీరము దుఃఖం పొందదు. అందుచేత “శ్రద్ధ - అసక్తి - అత్యవసరము” లతో కూడిన ప్రయత్నం చేసి జ్ఞానమును, తత్సాధనములను సమకూర్చుకొనెదనుగాక! మనస్సునకు ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ దేహం ఉండి ఏం లాభం? లేకపోయి ఏం లాభం? అనర్థములు తప్పునవి కావు.
ఓ మనోదేహములారా? మీరిద్దరూ పైకి ఒకరికొకరు సహకరించుకున్నట్లు ఉన్నా, లోలోన ఒకరిని మరొకరు హింసించుకుంటున్నారు. అయితే ‘అభేదాధ్యాస’ (A Sense beyond all differences)చే ఏకరూపులగుచున్నారు. వంట చేసేటప్పుడు అగ్ని, జలము సహకరిస్తున్నట్లు మీరిద్దరూ మోక్షోపాయ సాధనల విషయంలో నాకు సముచితంగా సహకరించండి.
మనస్సు నశిస్తే దేహము వాసనారహితమగుచున్నది. అప్పుడు దేహరాహిత్యము అనుభవమౌతోంది. కానీ, దేహం నశించినా మనస్సు నశించటంలేదు. అందుచేత వివేకముతో ముందుగా మనస్సును నశింపజేస్తాను. ‘సంకల్పము - తృష్ణ’ అను రెండు చక్రములు గల ఈ మనస్సును త్యజించి, తత్ఫలితంగా ప్రాప్తించే ‘పరమాత్మ’ అనే విశాలభూమిలో ప్రవేశించి ప్రశాంతంగా, సుఖంగా ఉంచుతాను. క్షయిస్తున్న మనస్సు క్రమంగా తన స్వభావమైన వాసనాపరంపరలను కూడా క్షయింపజేస్తుంది కదా! ఇక నాకు దుఃఖించుటకు విషయములేమి ఉంటాయి?
చర్మ - రక్త - మాంస - బొమికలతో కూడిన ఈ శరీరం అల్పాశయునకు శత్రువు వంటిదే. అయితే, మనస్సు ఉంటే ఇది శత్రువులా ప్రవర్తిస్తుంది. మనస్సు ఉపశమిస్తే ఇది ఉన్నా ఒక్కటే,
Page:521
లేకున్నా ఒక్కటే. దానితో నాకు సంబంధమే ఉండదు కదా! అజ్ఞానదశలో ఉన్నప్పుడు ఏఏ భోగములను ఆకాంక్షించానో - అట్టి భోగములతో నాకేమి సంబంధం లేదు. ఈ శరీరమునకు సంబంధించిన సుఖావేశములతో నాకేమి పని?
xX
ఓ ‘ఉద్గాలకుడు’ అను పేరుచే ఆరోపించబడినవాడా! నేను దేహమును గాని, నామమును గాని, మనస్సును గానీ కాదు. నా యందు స్ఫురించే ఈ నామ రూపముల కంటే ఆత్మ అత్యంత విశిష్టమైనది.
ఒక ఉక్తి చెపుతాను… విను. ఈ శరీరం మరణించినప్పుడు, ఇక్కడ కాళ్ళు - చేతులు తదితర దేహము ఉన్నప్పటికీ అది కదలగలదా? లేదు. కానీ, ఈ దేహంతోబాటే నేను లేకుండాపోయే వాడను కాదు. ఈ దేహమునకు అతీతమైన వాడను. ఇచ్ఛాశక్తిచే ఈ దేహమును కదిలించేవాడను. అదలించేవాడను. నిత్యుడను. నిరంతర ప్రకాశ శీలుడను. వ్యాపక స్వరూపుడను. సూర్యమండలమందలి సూర్యునితో కూడా సాంగత్యం పొంది, అట్టి ఆకాశములోని సూర్యుని ఎరుగుచున్నట్టివాడను. అంతేగాని, కేవలం అజ్ఞుడను, దుఃఖిని కాదు. నాకు దుఃఖము గానీ, దుఃఖత్వము గానీ, అనర్థత్వము గానీ లేవు. దేహం ఉన్నా, పోయినా నేనెప్పుడూ సంతాపరహితుడనే.
యత్రాత్మ తత్ర న మనో నేద్రియాణి న వాసనాః । పామరాః పరితిష్ఠన్తి నికటే న మహీభృతః ॥ (శ్లో 74, సర్గ 53)
ఆత్మ ఎప్పుడైతే వికసిస్తుందో ఆ స్థానం, లేక, స్థితిలో మనస్సు గానీ, ఇంద్రియములు గాని, వాసనలు గాని ఉండజాలవు. రాజుగారు నివసించే అంతఃపురంలో భిక్షగాళ్ళు ఉంటారా?
ఓ శరీర మనస్సులారా! మీ ఇద్దరికంటే విలక్షణమైన నేను బ్రహ్మ పదమును ఎల్లప్పుడూ పొందియే ఉన్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ అది పొందబడియే ఉన్నది.
నేను కేవలుడను! …ఇట్లు సమస్త దృశ్య వ్యవహారముపై విజయము పొందాను. శాంతుడను, నిరవయవుడను అయ్యాను. నాకు ఇచ్ఛలు గానీ, క్రియలు గానీ లేవు. నువ్వుల నుండి నూనె వేరు పడిన తరువాత, ఆ నూనె, నువ్వులు సంబంధం గాని, సమాన లక్షణాలు గానీ కలిగి ఉండవుకదా!
నాకిప్పుడు దేహ - ఇంద్రియ - - మనస్సులు మొదలైన వాటితో ఏమాత్రం సంబంధం లేదు. ఇక ఈ దేహేంద్రియ మనస్సులు ఉంటే ఉండనీ. అదీ వినోదమే. ఆత్మ పదము నుండి అభాస మాత్రంగా ప్రకటితమగుచున్న బుద్ధి నా సమక్షంలో ఏదైనా ‘శేషించిన ప్రారబ్ధకర్మ’ ను పొందవలసి వస్తే, పొందనీ. కర్మలే లేనివానికి ప్రారబ్ధకర్మలు ఎక్కడివి?
సర్వమునకు సాక్షి అయిన నాకు ఈ దేహాదులతో ఈ దేహాదుల అనుభవంగానీ, అభిమానంగానీ ఉండాలనిగానీ, ఉండకుండాలనిగానీ లేదు.
Page:522
ఓ సహ ఆత్మజ్ఞానులారా! అత్యుత్తమమగు ఏకాత్మ బుద్ధితో సంచరించే మీరే నాకు బంధువులు, స్నేహితులు కూడా. మీరంతా నిరంతర ఆత్మోదయం కలిగి, సములై, స్వస్థులై, సౌభాగ్యయుతులై ఉంటున్నారు కదా! నా మీద దయతో మీ జట్టుతో నన్ను కూడా చేర్చుకోండి.
ఓ ‘ఉద్దాలకుడు’ అను పేరుతో పిలువబడుచున్న ఆత్మదేవా! నీవు ఏ ప్రమేయం లేకుండానే, స్వతహాగానే అత్యంత స్వచ్ఛులై ప్రకాశిస్తున్నావు. పూర్ణకాములై, ఆత్మసత్త స్వరూపులై రమణీయ ఆనందం, ఉపశమనములచే వెలుగొందుచున్నావు. సదాచారము, మృదుభాషణము, పూర్ణత్వము, అబాధిత్వము మీ భావములలోని అకృత్రిమ లక్షణములై ఉంటాయి. ప్రకాశము, ద్వైతరాహిత్యము, వికల్పరాహిత్యము మీ స్వభావములే అగుచున్నాయి. ఓ ఉద్దాలకనామధేయ ఆత్మదేవా! నీకు నమస్కారం.
సమస్తమూ కల్పన చేతనే ఆవిర్భవిస్తోంది. ఆ సర్వకల్పనలకూ ఆవల, సమస్త కల్పనలకు కారణభూతుడనై, స్థానమై, ఆధారభూతుడనై నేను ఉన్నాను.
ఇప్పుడు అజ్ఞాన మనస్సు రహితమైపోయింది. వికల్పయుక్తమగు చిత్తము మచ్చుకైనా దొరకుటలేదు. ప్రత్యక్షముగా కళ్ళకు కనిపించే ఈ దృశ్యజాలమంతా త్యజించివేయబడింది. నేను బ్రహ్మానందస్వరూపుడనై పరమాత్మయందు అనిర్వచనీయము, ఆద్యంత రహితము అయిన శాంతిని, విశ్రాంతిని పొందుచున్నాను.
ఈ విధంగా విచారణ చేస్తూ ఉద్దాలకుడు నిర్మలమైన, ఉదారమైన బుద్ధితో కనులు సగం మూసుకొన్నారు.
అర్ధ ఉన్మీలిత నేత్రుడు అయి, ఉద్దాలకుడు ‘పరబ్రహ్మము’ అను పదములో సంస్థితుడగుటకు ఉద్యుక్తుడయ్యాడు. ఓంకారమే పరమపదము యొక్క సంజ్ఞ కదా! ఇక ఘంటానాదం లాగా ఓంకారం ఉచ్చరించ ప్రారంభించాడు. ‘ఓం’కారానికి శిరస్సు వంటిదైన ‘అర్ధమాత్ర’ను ఆశ్రయించాడు. ఓంకార వృత్తికి శబ్దార్థముల వలె ఉపహితమైన చైతన్యమును అనుసరించుచూ, సుషుమ్నానాడిని సమీపించాడు. "కూటస్థ జీవచైతన్యము ఇక బాహ్యమునకు ఏమాత్రం అభిముఖం కాదు” అను స్థితి వరకూ ఓంకారము ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ప్రణవము ‘అ’కారము - ·’ఉ’ కారము ’మ’
కారము - అర్ధమాత్ర - అను నాలుగు పాదములు కలిగి ఉన్నది.
’అ’కారం … రేచకం - ప్రణవము యొక్క ‘ప్రథమాంశ’ యగు అకారమును ఉచ్ఛ స్వరముతో ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆతని దేహం అప్పుడు సంక్షుభ్రమై, బాహ్య ప్రదేశములకు వెళ్ళుచుండే
Page:523
ఉత్సాహం చూపుచుండే వాయువు చేస్తున్న శబ్దంతో నిండిపోయింది. ‘రేచకము’ అను పేరుతో చెప్పబడే ‘ప్రాణ నిష్క్రమణ క్రియ’ ఆతని శరీరమును ఖాళీ చేయసాగింది.
అట్లు ఆతని దేహము నుండి వెలువడిన వాయువులు చిత్ రస పూరితమై, గూడును వదిలిన పక్షి లాగా బాహ్యాకాశంలో ప్రవేశించాయి. అప్పుడు ఆతని హృదయంలోని జ్వాజ్వల్యమానమగు అగ్ని దేహాన్నంతటినీ ఆక్రమించింది. ఆతని భౌతికదేహం భస్మమైనది. అయితే రామా! ఉద్దాలకునకు, అట్టి స్థితి ప్రణవముయొక్క ప్రథమక్రమభావన చేతనే అనుద్వేగకరంగా కలిగింది. అంతేగానీ, హఠయోగం చేత కాదు. ఎందుకంటే బలవంతంగా చేసే హఠయోగం శ్రమ, దుఃఖములనే కలుగజేస్తుంది సుమా!
‘ఉ’కారం …కుంబకం - క్రమంగా ఉద్దాలకుడు ’అ’కారోచ్చారణ నుండి ’ఉ’కారోచ్ఛారణ సమారంభించాడు. అప్పుడు ’ఉ’కారోచ్చారణ క్రమంలో ప్రాణముల సమస్థితి ఏర్పడింది. ‘నిశ్చల కుంభము’ అను పేరుతో ప్రసిద్ధమైన ప్రాణక్రియ జరిగింది. నాసికారంధ్రములలో వాయువు నిరోధించబడింది. ఆ వాయువు పైకిగానీ, క్రిందకుగానీ, బయటకుగానీ, లోపలికిగానీ పోజాలక చలనరహితమైనది. శరీరమును భస్మమొనర్చగల అగ్ని మెరుపువలె క్షణంలో శాంతించింది. అప్పుడు ఎఱ్ఱటి శరీరభస్మము మాత్రమే కనిపించింది. తెల్లటి బొమికలు చేష్టారహితమై కనిపించాయి. మహా వాయువుచే ఊర్ధ్వమునకు కొనిపోబడిన ఆ అస్థిసహిత భస్మము క్షణంలో ఆకాశము నందు వ్యాపించి అదృశ్యమైపోయింది.
ఈ స్థితి కూడా ప్రణవముయొక్క ద్వితీయ క్రమంచే ఏర్పడింది. అంతేగాని, బలవంతంగా చేసే హఠయోగం వలన కాదు.
’మ’ కారం …పూరకం - ఆ తరువాత ఉద్దాలకుడు శాంతిదాయకమగు ప్రణవము యొక్క తృతీయ క్రమము నందు వాయువును పూరించాడు. అదియే ‘పూరకము’ అను ప్రాణక్రియగా అప్పుడు ‘జీవ చైతన్యము’ అనే అమృతము యొక్క మధ్య గల ప్రాణసమూహం మంచు యొక్క స్పర్శలాగా బాహ్యాకాశంలో శీతలత్వం పొందింది.
క్రమంగా ఆ జీవ చైతన్యము గగన మండలత్వం పొందింది. ఆతని ప్రాణవాయువులు చంద్రుని చల్లటి కిరణములు లాగా అమృత తుల్యములయ్యాయి. వాయువుచే కొనిపోబడగా మిగిలిన దేహభస్మముపై ఆతని ప్రాణవాయువుల యొక్క అమృతధార కురిసింది. అప్పుడు చంద్ర బింబమువలె శోభాయమానమైన ఒక క్రొత్త శరీరం ప్రకటితమైనది. చతుర్భుజములతో విష్ణుభగవానుని ఆకృతి వలె నూతనశరీరం ఉదయించింది.
ఆ ఉద్దాలకుని నూతన శరీరం వికసిత నేత్రములతో, ముఖముతో, అతి దీప్తితో శోభను పొందింది. జలప్రవాహం తటాకమును నింపునట్లు, వసంత కాలం వచ్చి వృక్షములలో రసమును నింపునట్లు అమృతమయమగు ప్రాణములు ఆ శరీరాన్ని నింపాయి. నిర్మలస్వరూపము, దోష రహితమగు ఆతని నూతన శరీరం ప్రస్తుతం చేయబోయే కార్యక్రమములకు తగినట్లుగా ఉన్నది.
Page:524
అటు తరువాత ఉద్దాలకుడు ఒకచోట పద్మాసనమున శరీరమును ’సుదృఢం’ చేశాడు. ఏనుగును కట్టుకంబళమును కట్టినట్లు పంచేంద్రియములనూ బంధించాడు.
‘నిర్వికల్ప సమాధి’ నిమిత్తం తన మనన స్వభావమును వినిర్మలం చేయటానికి ప్రయత్నించ సాగాడు. “ఆశ - - తృష్ణ - విసుగు - ఆలశ్యము” లవైపుగా వెళ్ళుచున్న తన స్వభావము (మనస్సు)ను, ప్రాణయుక్తమైన చిత్తమును శుద్ధ పరచి, మరలించుటకు అనేక విధములుగా ప్రయత్నించాడు. దున్నపోతు త్రాళ్ళచే లాగబడునట్లు ఆతనిని చిత్తము సుదూరంగా ’బంధువులు - గృహములు సుపరిచితులు” వైపుగా లాగబడుచూ ఉండటం గమనించాడు. అట్లు విషయములవైపుగా పరుగులెత్తే వ్యాకుల చిత్తమును మరల మరల సునిర్మలమొనర్చి బలపూర్వకంగా నిరోధించేవాడు.
క్రమంగా ఆతని ప్రయత్నం ఫలించింది. రెండుకళ్ళు అర్ధనిమీలితం చేశాడు. మౌనవ్రతధారి అయి, ప్రాణాపాన నిశ్చలాభ్యాసంచే ముఖము నందు ’శీతలసుగంధము’తో పోల్చతగిన ఒకానొక ప్రశాంతతను పొందాడు. అట్టి ప్రశాంత స్థితిలో ఇంద్రియములను విషయముల నుండి వేరుచేసి తన ప్రశాంత స్వభావమునందు ఇముడ్చుకున్నాడు. సూర్యభగవానుడు లోకములను త్యజించుచున్నట్లు ఆయన బాహ్య విషయధ్యాసను త్యజించివేశాడు. ఆత్మతత్త్వదర్శనము వృద్ధిపొందుచుం చుండగా మనో వాక్కులు మొదలైన విషయములన్నీ తన యందే లయం చేసివేశాడు.
అప్పుడు కాలిమడముచే ‘గుదస్తంభనం’ చేసి నవద్వారములందలి వాయువును నిరోధించారు. ఆతని కంఠము ఇప్పుడు ఆత్మరస ప్రపూర్ణమై రజోగుణ, తమోగుణములను అభావించుచు స్వచ్ఛమైనది. మనస్సును ధారణా యుక్తులచే సమాధికి అభిముఖం చేశాడు. ఆ మనస్సును తన హృదయాకాశంలోనే ధరించి ఉన్నాడు. అప్పుడది నిర్మలాకాశంలాగా నిర్మలత్వమును, సౌమ్యత్వమును పొందింది.
మధ్య మధ్యలో మందంగా విచ్ఛేదకరములగు విపరీత భావాలు పొడచూపేవి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ బ్రహ్మాకార వృత్తిచే ఆ వికల్ప సమూహం తనను సమీపించకుండా జాగరూకుడ య్యేవాడు. క్రమంగా వికల్పజాలములన్నీ నశించాయి.
ఆ తరువాత తన హృదయాకాశంలోకి దృష్టినంతా సారించాడు. తమోగుణ ప్రేరితమైన అంధకారముచే ఆచ్ఛాదితమైన వివేకసూర్యుని (అస్పష్ట వివేకానుభవమును) చూచాడు. వెనువెంటనే ‘సత్వగుణాభివృద్ధి’ ని ఆశ్రయించి, తద్వారా ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానము, మనస్సులచే తమోగుణ ప్రేరితమైన అంధకారమును నశింపజేశాడు. అప్పుడు ఒకానొక రమణీయమైన ‘తేజః పుంజము’ ను దర్శించాడు. అట్టి దర్శనములో పాత్ర వహిస్తున్న రజోగుణమును గమనించి, దానిని మ్రింగివేసి సత్వగుణ సమృద్ధుడైనాడు. క్రమంగా ఆ తేజఃపుంజము ఉపశమించింది.
అప్పుడు ఆ మునీంద్రుని మనస్సు నిద్రా తరంగములచే చంచలమై, భ్రమణశీలమై ఉండసాగింది. మద్యపానముచే మత్తెక్కిన మనిషిలాగా ఆతడు నిద్రను పొందాడు. కానీ వివేక
Page:525
ప్రబోధచే ఆ నిద్రను వినష్టం చేశాడు. నిద్ర నశించిన తరువాత మనస్సు ‘వివిధ వాసనలతో పరికల్పితమైన రూపముగల ఆకాశము’ ను భావన చేయసాగింది. ఆతడు ఆ ఆకాశమును కూడా తొలగించి వేశారు. ఆ విధంగా ఆకాశానుభూతికూడా నశించిన తరువాత ‘మత్తు దిగుచున్నప్పటి తాగుబోతు’ లాగా కొంచం విమోహితుడైనాడు.
ఆ మనోమోహాన్ని కూడా పారద్రోలిన తరువాత ఆతని అప్పటి మనస్సు క్షణకాలం నిర్వికల్ప సమాధిలో విశ్రమించింది. అప్పటి స్థితి ‘తేజస్సు, తమము, నిద్ర, మోహము’ - అనేవి లేనట్టిది. వాక్కుకు అగోచరమైనది.
ఆతని చిత్తము అట్లు విశ్రమించి, మరల ఇంతలోనే ప్రపంచ వృత్తికి మరలింది. కాసేపు ప్రవృత్తిలోనూ, మరికొంచెం సేపు నివృత్తిలోనూ ప్రవర్తిస్తూ ఆతని చిత్తము త్వరలోనే చిత్తత్వము వదలి చిద్రూపత్వమును పొందింది. అతిశీఘ్రంగా సర్వప్రపంచము కంటే అన్యమైన ఆకారమును పొందింది. వృత్తిగత చైతన్యము తన విషయాకారమును త్యజించి సర్వవృత్తులకూ సాక్షి అయినట్టి కేవల చిద్రూపత్వమును సంతరించుకొని ప్రకాశించింది.
తత్త్వసాక్షాత్కారం - క్రమంగా ఉద్దాలకుడు సమాధిద్వారా తత్త్వసాక్షాత్కారం యొక్క ప్రబోధం
పొందాడు.
శ్రీరాముడు : తత్త్వసాక్షాత్కారం అనగా?
శ్రీవసిష్ఠమహర్షి :“సర్వ ప్రపంచమునకు అధిష్ఠానం, ద్వైతరహితము, శుద్ధము, మహత్తరము అగు చిదాకాశమే నేను” అని ఎరుగుటయే - తత్వసాక్షాత్కారము యొక్క ప్రబోధమని అంటాం. “నీవుగా కనిపించేది నేనే" అనబడు స్వభావసిద్ధమైన, అకృత్రిమమైన ఎఱుక ఆస్వాదనయే తత్త్వ సాక్షాత్కార ప్రబోధం.
అట్టి స్థితిలో ఆతడు దృశ్య, దర్శన వర్జితుడైనాడు. ఏదైతే సర్వవిషయ లేశములకు ఆధార భూతమో, సముద్రతుల్యమో, బ్రహ్మాది మహాత్ములచే సర్వదా ఆస్వాదించబడుచున్నదో అట్టి ఆనందాన్ని పొందాడు. ఆనందసాగరం అన దగినట్టి పరమాత్మ యొక్క సత్తాసామాన్య రూపమును అవధరించాడు. ఉద్దాలకుని ‘జీవచైతన్యము’ అనే హంస ఆనందసరోవరంలో స్థితి కలిగి పూర్ణచంద్రుని వలె గాలి వీచని ప్రదేశంలో దీపంలాగా, గోడపై లిఖించబడిన కళాఖండంలాగా, తరంగాలే లేనట్టి సముద్రం లాగా, శరత్కాలంలోని మేఘములలాగా నిశ్చలత్వం పొందింది.
అట్టి మహాప్రకాశమునందు ఆతడు చిరకాలం ఉన్నాడు. అతడు ఆ స్థితిలో ఉంటూ ఉండగా మనోమార్గంలో అనేక మంది ఆకాశసంచారులను, సిద్ధులను, అనేక మంది దేవతలనూ చూచాడు. ‘ఇంద్రుడు, సూర్యుడు’ మొదలైన అనేక పదవులను ప్రసాదించగల విచిత్రమైన అనేక సిద్ధులు ఆతనిని సమీపించాయి. ఒక ఉదార చిత్తుడగు యువకుడు తనదారిన పోతూ పిల్లలు ఆడుకొనే ఆటలను పట్టించుకుంటాడా? అలాగే ఉద్దాలకుడు కూడా ఆతడు ఆ సిద్ధులను ఆదరించనేలేదు.
Page:526
అట్లు సిద్ధులను నిరాకరించిన తరువాత ఆతడు ‘సమాధి’ అను ఆనందమందిరంలో ఆరు నెలల కాలం ఉన్నాడు. సిద్ధ, సాధ్య, బ్రహ్మాదులకు మాత్రమే సాధ్యం అగుచూ ఉండే సర్వోత్కృష్టమగు ‘జీవన్ముక్తము’ అను పదము నందు ప్రతిష్ఠితుడైనాడు. అక్కడ పూర్ణమగు ఆత్మానందమును పొందాడు.
ఆతని ఆత్మచైతన్యము క్షుద్రమైన విషయానందము గాని, విషయసుఖము గాని లేనిదై స్వప్రకాశమగు తన పూర్ణస్వరూపము నందే ఉండి శోభించింది.
ఎవ్వడైనా సరే, ఎవరైనా కొంత సమయం మనస్సుచే అట్టి సమాధియందు స్థిమితము పొందితే, ఇక ఆతని మనస్సు స్వర్గసుఖములు గానీ, విషయసుఖములు గానీ చూచి ప్రీతిని పొందే ప్రసక్తియే ఉండదు. అట్టి నిర్వికల్పసమాధిలో ఏర్పడే ఆనందమే బ్రహ్మానందమనీ, ఆత్మైక్యస్థితి అని చెప్పబడుతోంది. అచ్చట ఉండే స్థితియే శాంతి యొక్క ఆత్యంతికము, నిత్య శ్రేయము కూడా. అక్కడ విశ్రమించే వానిని ఇక ఎట్టి భ్రమ బాధించదు. అట్టి అఖండ అప్రమేయ దృష్టి కలవాడు ఇక ’దృశ్యదృష్టి’ యందు ప్రవేశం చేయడు.
అనగా… శ్రవణ, మనన, సమాధుల సహాయంతో శుద్ధచిత్తమును పొందినవారు ఆ మహదానంద పదమును పొంది, ఇక ఆపై ఈ దృశ్యప్రపంచమును ఒక విషయంగానే చూడరు. చక్రవర్తి పదవి అధిష్ఠించినవాడు ఒక పెంకుటిల్లును చూచి "ఇట్టి ఇల్లు కలిగి ఉండటం ఎంతో సంతోషం కలుగజేస్తుంది కదా!” అని తలుస్తాడా? లేదు కదా!
శ్రీరాముడు : అట్టివాడు ఇక ఈ ప్రపంచమువైపు ఎప్పటికీ దృష్టి సారించడా?
శ్రీవసిష్ఠమహర్షి : అట్టి ‘ఆత్మ పదము’ నందు విశ్రాంతి పొందినవానిని ‘ప్రబుద్ధచేతస్కుడు’ - అని అంటారు. అట్టి స్థితిలో సమాధిని అవధరించినవాడు ఇతరులు ఎంతో ప్రయత్నిస్తే గానీ మరల ’వ్యుత్థానదశ’కు రాడు. ఆరవ భూమిక దశలో బాహ్యప్రయత్నం చేత వ్యుత్థానదశకు తిరిగిరావచ్చు.
- ఇక ఏడవ భూమికలో ప్రవేశించినవాడు తనకు తానుగా వెనుకకు మరల వలసిందే.
మహాత్ముడగు ఉద్దాలకుడు ఆ విధంగా ఆరునెలలు సమాధి స్థితియందుండి, మరల తనకు తానే ఉత్థానదిశగా ప్రబుద్ధుడైనాడు. మధ్యే మార్గంలో మహాతేజఃసంపన్నులను, చామరములను వీస్తూ సేవించే దేవతాస్త్రీలను, పతాకములు అమర్చబడిన దేవతా విమానములను, మునులను, విద్యాధరులను చూచాడు.
అక్కడి కొందరు దేవతలు ఆతనిని పలకరిస్తూ ఇట్లు సంబోధించారు. ఓ మహానుభావా! ఉద్దాలకా! మీకు ప్రణామం చేస్తున్న మమ్ములను అనుగ్రహిస్తూ, గమనించండి. ఈ విమానం ఎక్కి దేవలోకం రండి. ఈ మొత్తం ప్రపంచంలో ఉండే భోగములన్నిటి కన్నా కూడా స్వర్గలోకమే అధికమైనది కదా! మీరు ఏభోగములను కోరుకుంటే అవన్నీ కల్పాంతమువరకు అనుభవించవచ్చు.
Page:527
ప్రపంచంలో తపస్సు, యజ్ఞము మొదలైన కార్యక్రమములన్నీ స్వర్గభోగములు అనుభవించటం కోసమే నిర్ణయించబడ్డాయి కదా! ఈ విద్యాధరుల వైపు చూస్తున్నారా! వీరంతా మిమ్ములను ఉపాసిస్తున్నారు. ధర్మ, అర్థ, కామములలో ముఖ్యఫలం కామమే కదా! అట్టి కామానందం ప్రసాదించ గల ఉత్తమ స్త్రీలు స్వర్గంలోనే ఉంటారు.”
ఆ మాటలు విని, ఉద్దాలకుడు చిరునవ్వుతో వినమ్రంగా వారికి అతిథి సన్మానపూర్వకంగా నమస్కరించాడు. కానీ, భ్రమరహితుడై వారు చెప్పిన మాటలు పట్ల మౌనం వహించాడు. వారి పట్ల అభినందన గానీ, త్యాజ్యము గానీ ప్రకటించలేదు. “ఓ సిద్ధులారా! నా నమస్కారం స్వీకరించి సెలవు ఇప్పించండి" అని పలికి యథాతథంగా సమాధి వ్యాపారం కొనసాగించాడు. విషయభోగ విరక్తుడైన ఆ ఋషీశ్వరుని సేవిస్తూ సిద్ధులు కొద్దిరోజులు వేచి ఉండి మరల ఎటో వెళ్ళిపోయారు.
అది మొదలుకొని జీవన్ముక్తిని పొందిన ఉద్దాలకుడు తన ఇచ్ఛాపూర్వకంగా వనములందూ, ఆశ్రమములందూ సంచారం చేస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఒక చోట ఆసీనుడై ధ్యాననిష్ఠలో ప్రవేశిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఒక్క రోజు, కొన్నిరోజులు, సంవత్సరం, కొన్ని సంవత్సరములు సమాధియందు ఉంటూ, మరల మేల్కొంటూ ఉండేవాడు.
క్రమంగా పొందిన జ్ఞాన తేజస్సుచే అతడు ఒకవైపు చైతన్యముతో ఐక్యమై ఉంటూనే మరొకవైపు వ్యవహార తత్పరుడై ఉండేవాడు. ఉభయములోని ఏకత్వము పొందేవాడేగాని, అజ్ఞానివలె విక్షేపం పొందేవాడుకాదు. సర్వకాల సర్వావస్థలలోనూ సమాధియొక్క అభ్యాసం వదిలేవాడు కాడు. శ్రీరాముడు : మహర్షీ! అంటే, ఉద్దాలకుడు ప్రపంచమును పొందుచున్నప్పుడు, ప్రపంచరహితుడు అగుచున్నప్పుడూ సమాధి యొక్క అభ్యాసం కొనసాగిస్తున్నాడని చెప్పుచున్నారు కదా! ఆతని ఇప్పటి సమాధి యొక్క అభ్యాసం నిర్వచించి చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : చెపుతాను విను - - 1. అంతఃకరణము, 2. ఆ అంతఃకరణములో ఏర్పడే వృత్తులకు సాక్షియగు చైతన్యము - ఈ రెండిటినీ ఆతడు వేరు పరచి, పరిశీలించే వాడు. అదే ఆతని వర్తమానపు సమాధి యొక్క అభ్యాసము. అట్టి అభ్యాసముచే అపరిచ్ఛిన్నమగు చిద్భావమును పొందేవాడు.
ఇక ఆతని యందు రాగ ద్వేషాదులు లేవు. అహంకార, మమకారాలు; పరిచ్ఛిన్న, అపరిచ్ఛిన్నములు, ఉద్వేగ, ఉదాసీనములు లేవు. సూర్యకాంతి భూమిపై సమరూపమున వ్యాపించు చున్నట్లు ఆతడు సర్వభూతము లందూ సమరూపుడై వర్తిస్తూ ఉండేవాడు. అంతటా బ్రహ్మమునే గాంచుచూ ఉండేవాడు. ఎవరైనా సరే, ‘సాక్షిచైతన్యము’ అను సమాధి యందు భావన చేయటం చిరకాలం అభ్యసిస్తూ రాగా, అప్పుడు స్వప్రకాశమైనట్టి ‘నిరతిశయానంద చిద్రూపము’ తప్పక పొందుతారు. ఉద్దాలకుడు సంపాదించిన నిర్ద్వంద్వ, అద్వైత, అప్రమేయ సుస్థితిని అభ్యాసంచే ఎవరైనా తప్పక పొందవచ్చు.
Page:528
ఒక కళాఖండంలో లిఖించబడిన సూర్యుడు ఉదయించడు అస్తమించడు కదా! ఆతడు ఈ దృశ్యవ్యవస్థలో ఉదయించటం లేదు… అస్తమించటం లేదు. సర్వత్రా శాంతిమయుడై ఉన్నాడు. ఆతని చిత్తము నిరతిశయానంద ప్రాప్తిచే ఉపశమించింది. కర్మ బీజములన్నీ క్షయించుటచే, ఆతనిపట్ల జననమరణ పాశములన్నీ విచ్ఛిత్తి పొందాయి.
"ఈ జన్మ - జరా - మరణాలు దేహపరిమితములే గాని, నన్ను స్పృశించేవి కావు”-
అనునది అతని వర్తమానానుభవం. ఆతడు అపరిచ్ఛిన్నమగు ‘సత్తాస్ఫూర్తి’ అనే ఉత్కర్ష (Sense)చే మహాభావయుతుడైనాడు.
ఇక ఆతని వర్తమాన నూతన దేహం ప్రత్యక్షరూపమై, నిర్మలమై, పూర్వదశా విస్మరణచే చిత్త రహితమై, బ్రహ్మస్వభావమై వెలుగొందింది. కనుక, ఇది ఆతని భావ, అనుభవముల దృష్ట్యా ఆతని పూర్వదేహము వంటిది కాదని గ్రహించు. ఆతని స్వభావము ‘సత్తాసామాన్యము’ ను సంతరించుకుని ఉన్నది.
ఎప్పుడైతే చిత్తు వృత్తిరహితమై ప్రతిబింబత్వము నుండి తన బింబరూపమగు చైతన్యమున లీనమౌతుందో - అప్పటి బింబము యొక్క ఆకాశసదృశమగు నిర్మల సత్తయే ‘సత్తా సామాన్యము.’ శ్రీరాముడు : అది ఎట్లా, ఎప్పుడు సిద్ధిస్తుంది?
శ్రీవసిష్ఠమహర్షి : చిత్తవృత్తి యందు అభివ్యక్తమగుచున్న చైతన్యము ఈ బాహ్య - - అభ్యంతర జగత్తు నంతా నిరాకరించి, కేవలం స్వస్వరూపమున ఎప్పుడు ఉంటుందో అప్పుడు సత్తా సామాన్యము సిద్ధించినట్లు. అట్టివాడు సర్వభూతములపట్ల పారమార్థికమైనట్టి ’స్వస్వరూప చిన్మాత్రానుభవం’ కలిగి ఉంటాడు. ఒక దృష్టాంతం చెపుతాను. తాబేలు కొంచెం ప్రమాదం గమనించగానే తన అవయవాలను స్వయంగా, అసంకల్పితంగా తనలోకి లీనం చేసుకుంటుంది చూచావా! ఈ సామాన్య సత్త సంపాదించిన యోగి ఈ ఎదురుగా ఉండే సమస్తమును ప్రత్యేకమైన భావనాయత్నం లేకుండానే స్వభావ సిద్ధంగా ఆత్మ యందు లయం చేసుకుంటాడు. సమస్తమును తన ఆత్మగా దర్శిస్తాడు. అదియే సప్తమ భూమికకు సంబంధించిన ప్రరూఢ దృష్టి.
ఈ స్థితిలో ‘సదేహముక్తి - విదేహముక్తి’ అనే భేదం ఉండదు. ఈ విషయం ఒకటి రెండు సార్లు ముముక్షు వ్యవహారప్రకరణలో, ఆ తరువాత కూడా గుర్తు చేశాను.
Page:529
అట్టి దృష్టి 4,5 భూమికలలో కూడా కలుగుతుంది. అయితే అది సప్తమభూమికలో రూఢి చెందుతుంది. అట్టివానికి వ్యుత్థాన దశయందు కూడా వెంటనంటే ఉంటుంది. బోధచే అట్టి దృష్టి జ్ఞానికి తప్పక కలుగుతుంది. అజ్ఞానికి ఎంత విన్నా కలుగదు.
జీవన్ముక్తులగు మహాత్ములంతా అట్టి దృష్టి యందే ఉండి, ఈ భూమిపై పాదరసంలాగా, ఆకాశంలో వాయువులాగా నిర్లిప్తంగా ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. మేమంతా అట్టి దృష్టి అభ్యసిస్తూ ఈ భూతలంపై ఉంటున్నాం. ఆకాశంలో నారదుడు మొదలైనవారు, ఊర్ధ్వలోకాలలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలైనవారు అట్టి దృష్టినే కలిగి ఉంటున్నారు.
ఇక ఉద్దాలకుని విషయం కొనసాగిద్దాం. ఆతడు సర్వభయ వినాశకరమగు ‘సత్తా సామాన్యము’ లేక ’జీవన్ముక్తము’ ను ఆశ్రయించి ప్రారబ్ధక్షయం అయ్యే వరకు ఈ ‘జగత్’ అను రూపం గల గృహంలో వసించాడు. కొంతకాలం జరిగిపోయింది. ఆ తరువాత ఆతడు ‘నేనీ దేహమును త్యజించి విదేహముక్తుడను అగుదును గాక!’ అనే దృఢబుద్ధిని పొందాడు. ఆశ్రమం నుండి బయలుదేరి ఒక పర్వతప్రాంతం చేరాడు. అక్కడ గల ఒక సెలయేటి ఒడ్డున పద్మాసనం అవధరించాడు. కళ్ళు సగం మూశాడు. కాలిమడమతో గుదమును నిరోధించి తొమ్మిది ఇంద్రియద్వారములను సంయమనం చేశాడు. చిత్తముచే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏకం చేసి హృదయంలో చేర్చాడు.
హృదయగత వృత్తులను స్వస్వరూప చైతన్యములో ఏకం చేశాడు. క్రమంగా చిదనరూపుడైనాడు. సమముగా ఉన్న కంఠంతో శోభించాడు. నాలుకను కంఠము యొక్క ఊర్ధ్వ ప్రదేశంలో ప్రవేశపెట్టాడు. నెమ్మదిగా ప్రాణవాయువులను నిరోధించుచూ వచ్చాడు. ఆతడు ఇప్పుడు దంతములతో దంతములను స్పృశించటం లేదు. తన మనోదృష్టిని బాహ్య, అభ్యంతరములందు గానీ, ఊర్ధ్వ, అధోభాగములందు గానీ, రూపము మొదలైన విషయములందుగానీ, శూన్యము నందుగానీ ఉంచుటలేదు. కేవలం చిన్మాత్రము నందే స్థితుడై ఉన్నాడు.
ప్రాణప్రవాహ నిరోధం చేత ఆతని దేహము మనస్సు మొదలైనవి తమ చంచలత్వమును వదలిపెట్టాయి. ఇక ఆతడు సమరూపుడై, ప్రసన్నముఖుడై, చిద్రూపుడై బ్రహ్మానందానుభవం పొందాడు. ఆతని శరీరం గగుర్పొడిచింది. రోమములు నిక్కబొడుచుకున్నాయి. క్రమంగా “అంతఃకరణ వృత్తి విలయం” అను అభ్యాసంచేత చిత్ సామాన్యరూపమున ప్రవేశించాడు. ప్రతి బింబమును వదలి, బింబభూతమగు చిన్మాత్రమును అభ్యసించటం చేత హృదయము నందు బ్రహ్మానందమును అనుభవించాడు. అట్టి ‘చిత్ సత్త’ ను అనుభవించటం చేత, కొంత సమయానికి తన యొక్క ఉద్దాలక రూపమును మరచి, క్రమంగా తన యొక్క స్వానుగతమైన నిత్య ప్రకాశరూపము లేక చిత్ సామాన్య రూపమును పొందాడు. అనగా, ఈ జగత్తు కంతటికీ ఆశ్రయభూతమై సర్వదా అపరిచ్ఛిన్న
Page:530
మైనట్టి ఆత్మ సత్తాయే నేను. అను ఏకత్వానుభవం పొందాడు. విక్షేపమంతా సంపూర్ణంగా నశించగా, సమరూపుడై సర్వోత్తమానంద ప్రాప్తి పొందాడు. అతి సుందరమగు ముఖకాంతితో పరమ విశ్రాంతి పొందాడు. ప్రారబ్ధముల వినాశనముచే, జీవించి ఉండగానే సర్వోత్కృష్టమగు నిర్మల పదము అవధరించాడు. ఇక ఆతనియందు చిరకాలానుగతమైన సంసారభ్రమ మొదలంటా రహితమైనది.
చిత్రంలో లిఖించబడిన చిత్రంలాగా, పూర్ణచంద్రుని లాగా శోభించాడు. స్వనిర్మల పదమున ప్రశమనం పొందాడు. సర్వవికల్పరహితుడు, నిర్వికారుడు, అతిసౌందర్య స్వభావుడు అయ్యాడు. బ్రహ్మలోక పర్యంతము గల సర్వసుఖములను త్యజించివేసినవాడయ్యాడు. ఏ బాహ్యమైన ఐశ్వర్యమైనా సరే ఎక్కడ ఒక గడ్డిపరక వంటిదౌతుందో - అట్టి వాక్ అగోచరమగు పరమానందమును పొందాడు.
ఆ ఆనందం ఎట్టిది? మనం మాటలలో ఏం చెప్పుకోగలం? ఆ ఉద్దాలకుడు ఇప్పుడు పొందిన బ్రహ్మానందము అవధులు లేనిదని చెప్పవచ్చు. ఓ రామా! సర్వజీవరాసుల యొక్క ఉత్తమోత్తమ లక్ష్యం అదే. ఈ అంతులేని బ్రహ్మాండములన్నీ దాని యందే ఉన్నాయి. అందుచేత అది అపరిమితము. అది ఈ అనంతాకాశమును కూడా తన పొట్టలో వ్యాప్తం చేసుకొని ఉంచుకొనగలదు. అదియే దిక్కులన్నీ ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నది. సర్వమునకు ఆధారభూతమూ, పరిపోషకమూ అదే! ఎంతో భాగ్యం చేత మాత్రమే ఉత్తమ జీవులచే అది సేవించబడుతోంది.
సర్వవాక్-ప్రవృత్తి-నివృత్తి-నిమిత్త-ఉపాదాన ధర్మములకు అది అతీతమైయున్నది. దానినే ‘సత్యజ్ఞానానందము’ అని వేదజ్ఞులు పిలుస్తున్నారు. ఎప్పుడైనా సరే, ‘ఇది సుఖము’ అనుటకు
కారణము అదే.
ఉద్దాలకుడు అట్టి శుద్ధ బ్రహ్మము లేక బ్రహ్మానందరూపము పొందాడు. ఆతని జీవము ఆ రీతిగా విదేహత్వము నిర్మల, అనాది బ్రహ్మభావము పొంది అక్కడే ఆరు నెలల వరకు ఉన్నది. ఆ తరువాత ఆతనిచే పరిత్యజించబడిన భౌతికదేహము ఆ పర్వత ప్రదేశంలో నాడులు అనే తంతువులు కలిగి వీణవలె ఒప్పుచున్నది.
అనంతరం కొంతకాలానికి పర్వతకన్యలతో కూడిన బ్రాహ్మి మొదలైన మాతృగణం ఒకానొక భక్తుని కోర్కెలు తీర్చటానికి ఆకాశము నుండి ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ మాతృగణంలో ఒకరైన ఖింఖిణీదేవి ఆ ఉద్దాలకునిచే పరిత్యజించబడిన భౌతిక దేహాన్ని తనకు కిరీట హారంగా చేసుకొన్నది. మహాభగవతియగు ఖింఖిణీదేవి శిరోమాల యందు ఆ ఉద్దాలకుని దేహం శయనించింది.
ఓ రాఘవా! ఈ దృశ్యమంతటికీ సంబంధించిన వివేకము జనించగా స్ఫురించే ఆత్మానందమే ఇందలి సారం. ఆరంభం నుండి, ఉద్దాలకుని విదేహముక్తి వరకు గల కథనం విన్నావుకదా! ఎవని హృదయంలో అయితే ఇందలి కథనం ఉత్పన్నమై ‘ఉత్తరోత్తర భూమికలను అవధరించుట’ అను రూపమున విస్తరిస్తుందో - అట్టివాడు ధన్యుడు. అట్టివాడు త్రివిధ తాపములచే తపించడు.
Page:531
అట్టివాడు ఈ ప్రాపంచిక విషయములందు సంచరిస్తే సంచరించుగాక! అయినప్పటికీ “సత్యము, శాంతము, సహజ సంతోషము" - అనే సుగంధములను వీడడు. సర్వోత్తమమగు మోక్ష ఫలమును తప్పక పొందుతాడు.
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామా! మనం ‘ఉద్దాలకుని విదేహముక్తి’ ప్రసంగంలో చెప్పుకొన్న విధంగా నీవు వివేకము, వైరాగ్యము, సమాధుల అభ్యాసంతో కూడిన వాడవై ఎప్పటియట్లే విహరించు. ఆత్మతో ఆత్మ గురించి చక్కగా విచారణచేసి ‘వ్యాపక పరబ్రహ్మము’ నందు విశ్రాంతి పొందు. ఈ దృశ్యమంతా ఉపశమించబడి ఆత్మపదము యొక్క అనుభవం సుస్థిరపడే వరకు పదే పదే అనేక
కోణముల నుండి విచారణ కొనసాగించాలి.
శ్రీరాముడు : మహాత్మా! ‘విచారణ’ అనగా మీ నిర్వచన మేమిటో సంక్షిప్తంగా చెప్పండి. శ్రీవసిష్ఠమహర్షి :‘విచారణ’ అంటే - శాస్త్రములను ఉత్తమ బుద్ధితో వినటం… చిత్త శోధనము, ఆత్మతత్త్వ పరిశీలన… గురువాక్యములందు విశ్వాసం… ఆత్మవస్తువుపై నమ్మకము, సదవగాహనను పెంపొందించుకోవటం… ఇంద్రియములను నిరోధించి ఆత్మానుభవంవైపు తరలించటం
ఎవ్వరికైనా సరే, “వైరాగ్యము, ఆత్మ చింతనాభ్యాసము, వేదాంత శాస్త్ర శ్రవణము, ఆత్మ పరీక్ష, గురువాక్య విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, ప్రజ్ఞ - అను క్రమముచే బ్రహ్మపదము తప్పక చేకూరగలదు.
ఒకడు సర్వమును త్యజించి కేవలం ప్రజ్ఞను మాత్రమే ఆశ్రయిస్తే, ఒక్క ప్రజ్ఞచే కూడా బ్రహ్మపదము లభిస్తుంది.
నీ బుద్ధి జ్ఞానయుక్తమై, అతి తీక్షమై అవిద్యాకళంకరహితమై ఉండటానికి సర్వవిధ ఉపాయాలు ఆశ్రయించు. ఒకవేళ ‘వైరాగ్యము’ మొదలైన సామాగ్రి లేకపోవచ్చు గాక - అయినా కూడా సుతీక్షమైన బుద్ధిని సంపాదిస్తే అందు నిత్యమగు బ్రహ్మము సుస్పష్టముగా ప్రకటన కాగలదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు భూత, భవిష్యత్, వర్తమానములకు ఈశ్వరుడై ఉన్నారు. మీకు నమస్కరిస్తూ రెండు ప్రశ్నలు అడుగుచున్నాను.
ఒక వైపు వ్యవహార తత్పరుడై ఉంటూనే, మరొకవైపు సమాధిస్థితుని వలె, విశ్రాంతి పొందుచున్నట్టి జ్ఞాని ఎవరైనా ఉన్నారా?
ఒకడు ఒక ఏకాంత స్థలంలో సమాధి నియమమును అనుష్ఠించుచున్నాడనుకోండి. మరొకడు సమాధినిష్ఠుడై కూడా, వ్యవహారతత్పరుడై ఈ జనావళి మధ్య సంచరిస్తున్నాడనుకోండి. ఈ ఇద్దరిలో శ్రేష్ఠుడెవడౌతాడు?
Page:532
శ్రీవసిష్ఠమహర్షి : రామా! అసలు ‘సమాధి’ అంటే ఏమిటని నీవనుకుంటున్నావో చెప్పు. శ్రీరాముడు : “గుణ సముదాయ రూపమైన ఈ దృశ్యప్రపంచమంతా అనాత్మయే” - అని గ్రహించటం. అట్లు పరికించుట చేత అంతఃకరణం శీతలత్వం పొందుతుంది. అట్టి స్థితియే ‘సమాధి’ అని చెప్ప బడుతోందని నా అభిప్రాయం.
శ్రీవసిష్ఠమహర్షి : ఈ దృశ్యముతో మనకు సంబంధం ఎందుకు ఏర్పడుతోంది? మనస్సు ఉండుట చేతనే కదా! “అట్టి మనోసంబంధమైన దేదీ ఆత్మయగు నాకు లేదు” - అని నిర్ణయించుకొన్న తరువాత, పూర్ణకాముడై కూడా ఒకడు వ్యవహారపరుడగుచున్నాడు. మరొకడు ఏకాంతము నందు సంస్థితుడగుచున్నాడు.
వారిద్దరూ అంతఃకరణంలో పూర్ణకాములే. కనుక ఇద్దరూ సుఖవంతులే! ఎందుకంటే, సర్వ తపోధ్యానాదుల అంతిమ ఫలితం ఏమిటి?… అంతఃకరణ శీతలత్వమే!
ఒకడు ఒక ఏకాంత ప్రదేశంలో సమాధిని ఆశ్రయించాడనుకుందాం!… కానీ ఆతని అంతః కరణం మాత్రం అనేక అంతఃకరణ వృత్తులచే చంచలమగుచున్నదనుకో . ఆ సమాధి పిచ్చివాని గంతుల వంటిదే కదా! అట్లాకాకుండా మరొకడు అనేక విషయపరంపరల మధ్య తాండవనృత్యం చేస్తూ ఉండగా ఆతని చిత్తము మాత్రం వాసనారహితమై ఉంటూ ఉంటే - ఆతని మనఃస్థితి ఒక ప్రబుద్ధుని ఏకాంత సమాధిస్థితితో సమానమే అవుతుంది.
అందుచేత రామా! వ్యవహారతత్పరుడగు జ్ఞాని, అరణ్యంలో ఏకాంతాన్ని ఆశ్రయించిన జ్ఞాని - ఇద్దరూ ఒక్కటేనయ్యా! వారిరువురు సంశయరహితమగు బ్రహ్మమును పొందినవారే అగుచున్నారు.
ఒకానొకడు ఒక కథ వింటున్నాడనుకో… కానీ, ఆతని అంతరంగ లక్ష్య - ఉద్దేశములకు సంబంధించిన ముఖ్యచిత్త విభాగం మరెక్కడో సంలగ్నమైయున్నదని అనుకుందాం… అప్పుడాతడు ఆ కథకు సంబంధించిన పాత్రల సుఖదుఃఖములను తాను పొందుతాడా? లేదు. అట్లాగే, వాసనలు నశించిన తరువాత ఈ చిత్తము క్రియలు నిర్వర్తిస్తూనే, ’నిర్వర్తించనిది’గా, అనగా, అకర్తగా
ఉండిపోగలుగుతుంది.
ఇంకొక దృష్టాంతం విను. ఒకడు తన అంగములను కదల్చకుండా చేష్టారహితుడై శయ్యపై నిదురిస్తున్నాడనుకో… కానీ, అతని చిత్తము గోతిలో పడిపోతున్నట్లుగా కల కంటోందనుకుందాం
అప్పుడాతని చిత్తము భయాందోళలనతో ‘పడిపోవుట’ అను కర్తృత్వము అనుభవిస్తూ ఉంటుంది… కాళ్ళూ చేతులు పదిలంగా శయ్యపై విశ్రమిస్తున్నప్పటికి కూడా… ఘన వాసనలతో కూడిన చిత్తము భావనలచే ఏర్పడిన సంసక్తతలకు కర్తయే అగుచున్నది.
చిత్తము యొక్క అకర్తృత్వమే చిత్తము యొక్క సమాధి. అదియే కేవలీభావముకూడా. అదియే పరమసుఖము. విశ్రాంతి.
Page:533
అయినా ఒక ప్రశ్న. "ధ్యానము - అధ్యానము, సమాధి-అసమాధి” … అను శబ్దములను దేనిని దృష్టిలో పెట్టుకుని చెప్పుచున్నారు? శరీరమును దృష్టిలో ఉంచుకొనా? కానే కాదు. శరీరము కదల వచ్చు, కదలక పోవచ్చు. చిత్తం యొక్క చంచలత్వ-అచంచలత్వములనే ‘అసమాధి-సమాధి’ అని పిలుస్తున్నారు. కాబట్టి రాఘవా! నీవు వాసనారాహిత్యముచే అట్టి చిత్తమును అంకురరహితం చేయాలి. వాసనారాహిత్యముతో కూడిన మనస్సునే స్థిరత్వము యొక్క అనుభవంగా గ్రహించు. అదియే ధ్యానము, కేవలీ భావము, సమాధి కూడా. వాసనారహితమగు మనస్సు అత్యున్నతమగు బ్రహ్మ పదమునకు దారి తీయగలదు. ఆ బ్రాహ్మీస్థితియే మోక్షం. ఘనవాసనలతో కూడిన చిత్తము రకరకాల కర్తృత్వములను కలిగియున్నదగుచున్నది. ఆ కర్తృత్వముల ద్వారా దుఃఖములన్నీ వచ్చి ముంగిట వాలుచున్నాయి. ఇది గ్రహించి నీవు వాసనలను సూక్ష్మతరము చేయి.
‘సమాధి’ అను దానికి మరొక వైపు నుండి నిర్వచనం వినుజగత్తు దేహము మొదలైనవాటితో సమావేశమైయున్న ఈ దృశ్యము నందు “ఇది నేను, ఇది నాది” అను రూపము గల అహంకార మమకారములు ఏర్పడుచున్నాయి. వాటి నుండి ఇచ్ఛ, భయము, శోకము ఉత్పత్తి అవుచున్నాయి. “నాది” అనునది చిత్తము నుండి మొదలంట తొలగించ బడితే, అట్టివాని ఆత్మ ప్రశాంతపడుతుంది. అట్టి ప్రశాంతస్థితియే సమాధి.
కనుక రామా! అట్టి సమాధి యొక్క అనుభవము నందు, ఈ కర్మలు చేయటం, చేయకపోవటం ఒక ప్రత్యేకమైన విషయమే కాదని నీవు గ్రహించాలి. సమస్త పదార్థముల పట్ల ‘అహమ్ - మమ’ అను అభిమానములను త్యజించి, ఆ తరువాత ఇక నీ అభిమతాసారం చరించు.
ఒక కొండపై ఏకాంతంగా ఉండు. లేదా… గృహస్థుడవై వ్యవహారములను నిర్వర్తించు. రెండూ నీకు ఒక్కటే అవుతాయి.
ఏ గృహస్థుడైతే అహంకారాది దోషములను నశింపజేసి సమాహిత చిత్తం సంపాదించు కుంటాడో - అట్టి గృహం అతనికి నిర్జనప్రదేశంలోని ఆశ్రమంతో సమానమే అవుతుంది. సమాహిత దృష్టి కలిగి, నిత్య - అపరోక్షస్థితి పొందినట్టి నీవంటి మహాత్ములకు గృహమూ ఒక్కటే, అరణ్యమూ ఒక్కటే. ఆకాశము మొదలైన పంచభూతముల దృష్ట్యా ‘ఇది గృహము ఇది అరణ్యము’ అన్న తేడా ఎక్కడున్నది? ‘చిత్తము’ అనే మహాకాశంలో ‘శాంతము’ అను స్వస్థత సంపాదించుకొని ఉన్నవానికి జన సమూహముచే వ్యాప్తమైన నగరం కూడా నిర్జన వనమే. రాగాది వృత్తులచే విక్షేపము పొందుచున్న చిత్తము గల మూఢునకు నిర్జన వనం కూడా అనేక జన సమ్మర్దములు - సమాచారములతో నిండిన నగరమగుచున్నది.
Page:534
ఈ సంసార జీవుని చిత్తము నిండా అనేక రాగ, ద్వేష, భయములతో కూడిన విషయపరంపరలు నిక్షిప్తమై ఉన్నాయి. విషయములన్నీ లయిస్తే, అప్పుడు వాసనాబీజము మాత్రమే మిగిలి, చిత్తము సుషుప్త దశను పొందుతుంది. ఇక వాసనా బీజం కూడా తొలగితే, ఆపై చిత్తము శాంతమయమై ఉంటుంది. ఆ శాంతమయచిత్తమే మోక్షం పొందుతుంది. అంతే గానీ, విషయ సహిత చిత్తము ఎట్లా పొందుతుంది?
ఇది గ్రహించి, రామా! ఆపై ఏది, ఎట్లు ఉచితమనుకుంటావో అట్లాగే ఆచరించు. సమాధి యందున్నట్టి ద్రష్ట ఆత్మను సర్వపదార్థములకు, విషయములకు, సంఘటనలకు అతీతమైనదిగా గాంచుచున్నాడు. తాను వ్యవహారమునందు ఉన్నప్పుడు ఆత్మయే సర్వ పదార్థముల రూపముగా ఉన్నట్లు గాంచుచున్నాడు. ఎవనిపట్ల రాగ - ద్వేషములు నశించిపోతాయో, ఎవనికి సమస్త పదార్థములు బ్రహ్మముగా, సమరూపముగా కనిపిస్తాయో - అట్టి విశాలాకారయుతుడే ’సమాధి స్థితుడు’ అనబడతాడు.
వింటున్నావా రామా! మరల ఒకసారి ప్రకటిస్తున్నాను. సమాహిత చిత్తము జాగ్రత్తులోని - -
స్వప్నములోని ఆయా సమావేశములను, సర్వ దృశ్య వ్యవహారములను బ్రహ్మరూపము గానే వీక్షించుచున్నది. స్వప్న ద్రష్ట స్వప్నంలో చూచేవి స్వప్నద్రష్ట కంటే వేరైనది కానట్లే, జాగ్రత్ ద్రష్ట కూడా జాగ్రత్లో చూచేది ఆ జాగ్రత్ ద్రష్టకు వేరైనదేదీ కాదు. జ్ఞాని అంతర్ముఖమైన మనస్సు కలవాడై తాను నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడు, తెలిసిన తెలియని ప్రదేశాలలో ఉన్నప్పుడు "ఈ తటస్థ బడుచున్నదంతా ఆత్మస్వరూపుడనగు నా స్వరూపమే” - అని గ్రహించి ఉంటున్నాడు. ఎందుకంటావా? ప్రాణికోట్ల చేత, పృథివి మొదలైన పంచభూతముల చేత నింపబడి ఉన్న ఈ దృశ్యజగత్తు అంతర్ముఖదృష్టి గలవానికి విషయమే కాదు. ఇదంతా ఆతనికి ఎందుకూ ఉపకరించక, సదా శూన్యరూపమునే పొందుచున్నది.
దృశ్యమునకు సంబంధించిన సర్వధ్యాసలు, (వాటికి సంబంధించిన కామ, క్రోధ, లోభములు) ఉపశమించినప్పుడు అంతఃకరణంలో శీతలత్వం (Calmness & Tranquility) చోటుచేసుకుంటుంది. అట్టివాడు సర్వేసర్వత్రా ప్రశాంతతను దర్శించగలడు.
అన్తస్తృష్ణోపతప్తానాం దావదాహమయం జగత్ I
భవత్యఖిలజన్తూనాం యదన్తస్తద్బహిః స్థితమ్ (శ్లో 34, సర్గ 56)
ఇక తదితర సంసారజీవుల అంతరంగంలో ‘తృష్ణ’ అనే అగ్నిజ్వాల ఏర్పడి ఉండటం చేత వారికి ఈ జగత్తంతా దావాగ్నిచే నిండి ఉన్నట్లుగా మరియు, దాహమయమై ప్రాప్తిస్తోంది. అంతః కరణం ఏ విధంగా ఉంటే బాహ్యజగత్తు ఆ రీతిగానే అనుభవమౌతోంది.
Page:535
చిత్తమే బాహ్యమున జగత్తుగా ప్రాప్తించుచున్నదని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఈ అంతరిక్షం,
పృథివి, వాయువు, ఆకాశము, పర్వతము, నదులు, దిక్కులు - - ఇవన్నీ అంతఃకరణము యొక్క వివిధ రకములైన స్పందన విభాగములే అయిఉండి, బాహ్యమున తోచుచున్నాయి. చిత్తము లేనిదే బాహ్యమే ఉండదు.
మఱిచెట్టు నుండే మట్టి విత్తులు బయలుదేరుచున్నట్లు సత్స్వరూపమగు ఆత్మ యందు గల ఈ జగత్తు బాహ్యముగా గోచరిస్తోంది. యథార్థానికి ఏవీకూడా బాహ్యమున గాని, అంతరమున గానీ లేవు. అంతా పూర్వవాసనలను అనుసరించే జీవునకు అనుభవమవటం జరుగుతోంది. ఒక చిన్న డబ్బీలో ఉంచబడ్డ కస్తూరియొక్క సువాసన ఆ చుట్టుప్రక్కల వ్యాపించి ఉంటున్నట్లు, లోన గల ఆత్మ తత్త్వమే బాహ్యమున జగదాకారముగా భాసించుచున్నది. అనగా ఆత్మయే విశాలత్వముచే బాహ్యమున జగద్రూపముగానూ, అంతరమున అహంకారరూపముగానూ స్ఫురించుచున్నది.
అయితే, ఒక ముఖ్యవిషయం. బాహ్యమున ఈ జగత్తు గాని, అంతరమున అహంకారం గానీ, ఆత్మ కాదు. అది స్థూలమైన ఏ రూపమూ కాదు. ఆ రెండిటి యందూ అనుస్యూతమై ఉన్న విభు స్వరూపమగు సన్మాత్రమే అది. ఆత్మ తన యొక్క ఆంతరికమగు చిత్తము ఏ పూర్వవాసనలతో కలిగి ఉన్నదో తదనుసారమే బహిర్ముఖంగా తదితర జగత్తును గాంచుచున్నది. ఈ జాగ్రత్ వాసనలచే హృదయంలో స్వప్నమనో రాజ్యములను కూడా గాంచుచున్నది. బాహ్యము నందూ, అంతరం నందు కూడా అనుస్యూతమై ఉన్న సద్రూపమగు ఆత్మ నుండి ఈ జగత్తు అనుదాన్ని మనం వేరు చేశామా, అప్పుడీ జగత్తు అనబడేది మృతప్రాయమే అవుతుంది. అట్లు వేరు చేయనంత కాలం ఈ బాహ్య, అభ్యంతరములు తొలగనే తొలగవు. అహంకార, మమకారముల ‘అధ్యాస’ చే పదార్థాల అల్ప, అధిక భేదము గురించిన భయము కలుగుతూనే ఉంటుంది. అందుచేత సర్వ భేదాలకు అతీత్వము అభ్యాసం చేస్తూ ఉండాలి.
మనోవ్యాధిచే నిహతుడగుచున్న జీవునకు ఈ ఆకాశం, భూమి, పర్వతము, నదులు, దిశలు …ఇవన్నీ ఆధిభౌతిక - ఆధిదైవిక - ఆధ్యాత్మిక తాపములను కలుగజేస్తూనే ఉంటున్నాయి. మనో వ్యాధి తొలగేది ఎట్లా?
యస్త్వాత్మరతిరేవాన్తః కుర్వన్కర్మేన్ధియైః క్రియాః I న వశో హర్షశోకాభ్యాం స సమాహిత ఉచ్యతే ॥ (శ్లో 43, సర్గ 56)
ఎవ్వడైతే అంతరమున ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడో, అంతటా సన్మాత్రమగు ఆత్మనే వీక్షిస్తూ ఉంటాడో - అట్టివాడు ఈ దృశ్యమునకు పట్టుబడడు. అట్టివాడు కర్మేంద్రియములచే క్రియలు ఒనర్చుచున్నప్పటికీ హర్ష - శోకములకు వశుడుకాడు. ఇక, అతడు ’సమాధిస్థితుడు’ అని అనిపించుకుంటాడు. ప్రశాంతబుద్ధికలిగి, అంతటా ఆత్మను గాంచుచూ, ఇక ప్రాపంచిక పదార్థముల గురించి శోకించక, వాటిని తలచక ఉండేవాడు సమాధిపరుడు. అట్టి సుస్థితికి చేరినట్టి మహనీయుడు ఉత్పత్తి - - వినాశనయుక్తమగు ఈ జగత్తుయొక్క గతిని వీక్షిస్తూ, అజ్ఞులందు ప్రసిద్ధమై ఉంటున్న ఈ అహంమమత్వాది దృష్టులను చూచి నవ్వుకుంటూ ఉంటాడు.
Page:536
సమాధి బుద్ధి - "సూర్యకిరణములు కెరటములలో ప్రతిబింబించటం జరుగుచున్నప్పుడు అక్కడ వెండితీగలు ఉన్నట్లు భ్రమ కలుగవచ్చు గాక! అవి మెఱుపులే గానీ వెండితీగలు ఎలా అవుతాయి? ప్రత్యగాత్మయే వాస్తవ స్వరూపముగా గల నా యందు ఈ అహంకార, మమకారములు గానీ, తదితర జనన మరణాది వికారములు గానీ ఉండజాలవు. నేను సర్వదా అసంగుడను. అద్వైత స్వరూపుడను. కూటస్థుడను. సమరూపమగు బ్రహ్మమునే నేను.” అనునదే సమాధి బుద్ధి. కాబట్టి ఆతని పట్ల జీవస్థితి, అహంకారము, దృశ్యము, జగత్తు మొదలైన విభాగములు ఉండవు. మనస్సు ఉండదు. ఆ మనస్సు చేసే కల్పనలూ ఉండవు. సర్వాత్మ స్వరూపుడగు అట్టి జ్ఞాని మాత్రమే ఉనికి కలిగినవాడు అగుచున్నాడు. ఇక తక్కినవారు లేనివారే అవుతారు. అట్టి సమదర్శి ఆకాశము వలె స్వచ్ఛుడై ఉంటాడు.
శ్రీరాముడు : మహర్షీ! సమదర్శియొక్క శాస్త్రవిహిత విశేషాలు ఎట్లా ఉంటాయి?
శ్రీవసిష్ఠమహర్షి : అట్టి సమదర్శి ఆకాశము వలె స్వచ్ఛుడై ఉంటాడు. సహజం గాను, స్వభావసిద్ధం గాను లోకానుకూలము కొరకై శాస్త్ర, శిష్టాచారములకు అవిరుద్ధమైన బాహ్యక్రియలు ఒనర్చుచూ ఉంటాడు. హర్ష, క్రోధ - వికారములు ఎదురు పడినప్పుడు శిల, కొయ్యల వలె చలించక శాంత స్వభావుడై ఉంటాడు. సర్వజీవులనూ తనవలె చూస్తూ ఉంటాడు. స్వభావంగానే పరుల ద్రవ్యములను మట్టిగడ్డల వలె చూస్తాడు. అట్టివాని దృష్టే సరి అయిన దృష్టి.
అజ్ఞాని - అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుందో కూడా చెపుతాను. ఇక్కడి సువర్ణము, ఐశ్వర్యము మొదలైన వాటిని ఆతడు మిథ్యారూపములుగా గాంచడు. పోనీ, సద్రూపములుగా గాంచుతాడా… అదీ లేదు. ఆతనికి సద్రూపానుభవమే లేనప్పుడు సద్రూపముగా ఎట్లా గాంచుతాడు? జ్ఞాని మాత్రమే ఈ పదార్థ జాలమును మిథ్యారూపముగానూ, సద్రూపముగానూ కూడా గాంచగలడు.
ఉత్తమాశయము కలిగి, బ్రహ్మపదమును పొందినవాడు ధనహీనుడు కావచ్చు. లేక ఐశ్వర్య వంతుడు కావచ్చు. ఆతనికి పుత్రులు, బంధువులు ఉండవచ్చు … ఉండకపోవచ్చు. ప్రాపంచికమైన అభ్యుదయ స్థితి పొందవచ్చు … పొందకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆతడు మాత్రం సమరూపుడై, హర్షశోకములచే, ప్రాప్తాప్రాప్తములచే ఆటంకపరచబడజాలక యథాతథంగా ఏర్పడి ఉంటూ ఉంటాడు. అట్టివాడు అనేక భోగములతో స్వజనులతో నిండి ఉన్న గృహము నందు ఉన్నా… లేక సర్వ భోగవిరతుడై జనరహితమైన కీకారణ్యంలో ఏకాంతంగా ఉన్నా… కాక, మన్మథుని తీవ్రవేగమును పొందుతూ మద్యపానరతుడై ఉన్నా… బహిరంగ ప్రదేశంలో నృత్యం చేస్తూ ఉన్నా… లేదా, సర్వమును పరిత్యజించి జటాధారి అయి పర్వతగుహలో తపస్సు చేస్తూ మౌనవ్రతుడై ఉన్నా… సదా, చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు ఒంటికి అలదుకొని స్త్రీలను లాలిస్తూ ఉన్నా… ఆయా లౌకిక కార్యములందు నిమగ్నమై ఉన్నా… తన జ్ఞానము యొక్క బలిమిచే దేని చేతా తాకబడకుండా ఉంటాడు. ఎందుకంటే, ఆతడు మనస్సును వికార రహితంగా ఉంచుకుంటాడు.
Page:537
మనో-దేహము లందు ఆతడు అహంకారమును ఆశ్రయించకపోవటం చేత, ఆతడు ఏది ఒనర్చు చున్నప్పటికీ ఒనర్చనివాడు అయి ఉంటున్నాడు. బంగారము బురదలో పడినంత మాత్రం చేత అది తన సహజసిద్ధమగు స్వప్రకాశమును వదులుకుంటుందా? లేదేఁ!
ఇక అజ్ఞానులంటావా? వాళ్ళు విషయములు సేవిస్తున్నప్పుడల్లా వాసనలు పెంపొందించు కుంటున్నారు. అజ్ఞాన వాసనలతో ఇంద్రియములను అజ్ఞాన మార్గంలో ఉపయోగిస్తూ … ఇంకా ఇంకా సాంసారిక దృష్టులను, సంస్కారాలను అధికం చేసుకుంటున్నారు. భోగ్యములైనట్టి శబ, స్పర్శ, రూప, రస, గంధములు వారి మనస్తత్వములపై పెత్తనం చెలాయిస్తున్నాయి.
కాబట్టి, విజ్ఞుడైనవాడు ఈ కనబడే వస్తువుల గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు ఆతని పట్ల సర్వవస్తువులు తమంతట తామే కాలక్రమంగా శమిస్తాయి. “అనేక వస్తువుల సత్త" - యొక్క అభావముచే చిత్తము నందలి కళంకములన్నీ స్వయంగా నశిస్తాయి. శ్రీరాముడు : స్వామి! అసలు వాసనలు ఎలా ఏర్పడుచున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : అహంకార, మమకారముల అధ్యాస చేతనే ‘వాసన’ అనబడే అనర్థం ఏర్పడుతోంది. ఫలితమేమిటి? ఆనందమే స్వస్వరూపముగా గల ఈ జీవుని జీవితమంతా అనేక రీతులైన దుః ఖములకు ఆలవాలమైపోతోందే! అహంకారం నశించిందా… జ్ఞానం తనంతటతానే స్వయంగా వికసిస్తుంది. అట్టి జ్ఞాన ప్రభావంచేత అంతఃకరణంలో సమత్వం ఉదయిస్తోంది. ఒకడు చీకట్లో మెత్తటి త్రాడును తాకి ’అమ్మబాబోయ్’ అని అరచి, గడగడ వణుకుచున్నాడనుకో…. “అది పాము కాదు, త్రాడే” అని తెలిసిపోతే వికారాలన్నీ మటుమాయమౌతాయికదా!
కాబట్టి రామా! జ్ఞానము సంపాదించి, తద్వారా దేనితోనూ సంబంధము లేనివాడవై ఉండు.
యత్కరోతి యదశ్నాతి యద్దదాతి జుహోతివా | నతజ్ఞస్య నతత్రజ్ఞో మాకరోతు కరోతువా ॥
ఏది చేస్తున్నా, భుజిస్తున్నా, ఇస్తున్నా, హోమం చేస్తున్నా, జ్ఞానికి వాటితో గాని, వాటికి జ్ఞానితో గాని సంబంధమే ఉండదు. అదీ చమత్కారం! ఆతనికి ఆ కర్మలు చేయటం, చేయక పోవటం ఒక్కటే. పూర్ణజ్ఞానికి కర్మలచే గానీ, కర్మల యొక్క అభావంచే గానీ, ప్రయోజనమేముంటుంది చెప్పు? ఆతడు అన్ని స్థితులందూ ఆత్మ జ్ఞానముచే ఆత్మ యందే సంస్థితుడై ఉంటాడు. గండశిలపై పడిన విత్తు మొలుస్తుందా? జ్ఞాని యొక్క అంతఃకరణము నందు కోర్కెలు జనించవు. ఆతని యందు ఏదేది జనిస్తుందో అదంతా జలమందలి తరంగముల వలె ఆతని రూపమే (ఆత్మ రూపమే) అయి ఉంటుంది? ఇంక స్పర్ధకు చోటెక్కడ? ఓ రాఘవా! ఈ బ్రహ్మాండమంతా జ్ఞాని యొక్క స్వరూపమే. ఆతడూ బ్రహ్మాండస్వరూపమే అవుతాడు. ఎందుకంటే … యథార్థానికి ఈ జగత్తులో దేశ, కాల, వస్తు కృతమగు విభాగమంటూ ఏదీ లేదు. ఇక్కడ అనుభవము మాటేమిటంటావా? స్వకీయమగు కల్పనయే ఇట్లు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నదని గ్రహించు. జ్ఞానియగు ఉత్తమ పురుషుడు అతిపావనము, ఏకరూపము, సర్వాద్వైత బంధరహితము అగు సన్మాత్రరూపుడై ఉంటాడు.
Page:538
జ్ఞానికి, పరమాత్మకు భేదమేమీ లేదు. అజ్ఞానము అనబడేది భ్రమ మాత్రమే. కనుక అజ్ఞాని “ఎఱుకను ఏమరచిన పరమాత్మ” కాక మరింకేమీ కాదు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘురామా! ఆత్మ స్వప్రకాశయుక్తమై అంతటా వెలయుచున్నది. అదియే అజ్ఞాన కారణం చేత “అహంకారము - వస్తుజాలము - దేశకాలములు".. మొదలైన విశేషములతో కూడిన జగత్తుగా విస్తారత సంతరించుకుంటోంది.
‘అనుభవం’ - అనునది ఆత్మయొక్క విన్యాసమే. లవణము యొక్క లవణత్వానుభవం చెఱుకు యొక్క మాధుర్యానుభవం… శిల యొక్క కాఠిన్యానుభవం…. పర్వతము యొక్క గురుత్వానుభవం… జిహ్వము యొక్క రుచిత్వానుభవం… వృక్షము యొక్క శాఖత్వానుభవం… ఆకాశము యొక్క శూన్యత్వానుభవం… అహంకారం, కుండ, గోడ, శరీరము, ఆవర్తము మొదలైన రూపత్వానుభవం… అంతా కూడా ఆత్మ యొక్క ‘అనుభవము’ అనబడు స్వవిస్తారమే
సుమా!
జ్ఞాన దృష్టిచే చిద్ర్బహ్మము తోటి సర్వపదార్ధములు అభేదమే సిద్ధిస్తోంది. ఆత్మ యొక్క ఘనత్వానుభవం అహంకారం గానూ, ఆ అహంకారముచే సిద్ధిస్తున్న పదార్థజాలం గాను ప్రకటిత మౌతోంది. అజ్ఞాన దృష్టికి మాత్రమే చిత్తము చిత్తు కంటే వేరైన దాని వలె దృశ్యమానమౌతోంది. ఆత్మ యొక్క చైతన్యము ద్వారా కలిగే సత్తా రూపానుభవమే స్వయముగా అహంకారరూపంగా ఏర్పడుతోంది. ఆ కనబడేదానిని మనం ‘చిదాభాసుడు’ అని అంటున్నాం.
చూచావా! అంతరాత్మ తన స్వప్రకాశము యొక్క అనుభవముచే వృత్తిభేదం చేత భిన్న వస్తు జాలములుగా చిదాభాసము లందు అనుగతమై ఉంటోంది. స్వయముగా తాను విస్తరించి, తనచే ఏర్పడి ఉన్న చోటును తనకు అన్యమైనదాని వలె గాంచుచున్నది. అహంకారముగా ఆవిర్భవిస్తున్నది. అది ఆత్మ యందు ఆత్మ యొక్క చిత్ (Awareness) రూపమే! అదియే ’అంతఃకరణము’ అను మరొకటిగా కవులు వర్ణిస్తున్నారు. అంతఃకరణమంతా ఆత్మయే.
యథార్థానికి ఆత్మ పదార్థరూపంగా ఏదీ అగుటలేదు. నీరు తరంగంగానూ, ఆవర్తంగానూ, బుద్బుదం గానూ, ఏమైనా మారిపోతోందా! నీరు సర్వదా నీరుగానే ఉంటోంది కదా! … అట్లాగే, ఆత్మ కన్నా భిన్నంగా మరొక పదార్థమేదీ సంభవించదు.
ఆత్మ ఆస్వాదించ తగినట్టి మరొక్కటేదీ ఎక్కడా ఏర్పడజాలదు. వికారము పొందటానికై ఆత్మకు భిన్నమై వేరొక్కటేదీ ఎక్కడా లేదు. "ఆత్మచే పొందబడుచున్నది” అనునదంతా గొడ్రాలి రెండవ కుమారుని వలె పొంతనకు దొరకని వాక్యం.
Page:539
ఆత్మ జన్మించదు. మరణించదు. అది శరీరాంతర్గతమై, శరీరములకు ముందు వెనుక, శరీరసమయంలోను - బయట - లోపలా అంతటా ఒకే తీరుగా సర్వదా వెలయుచున్నది. అసత్తు అగు ఈ జగత్తంతా ఆత్మయందే భాసించుచున్నది. అనంతపరిపూర్ణజ్ఞాన స్వరూపమగు పరమాత్మ ఏకరూపముననే ఉన్నాడు. తనయందు తానే జగతూపంగాను, తదితర సర్వరూప - నామతత్వములుగాను స్థితి కలిగియున్నాడు.
8
ఓ రాఘవా! ఇప్పటివరకూ నేను చెప్పుచున్న దానిని అనుసరించి “అహంకారమునకు, జగత్తునకూ భేదమేమీ లేదు” - అని నిరూపించబడుతోంది కదా!
-
ఒక అత్యుత్తమ సత్యం ప్రకటిస్తున్నాను. విను. వాస్తవానికి చిత్తముగానీ, చిత్తము కలవాడుగానీ, జగత్తు అనబడు విభ్రమముగాని లేవు. వస్తూ ఉన్న వర్షం ఒక్కసారి ఆగిపోవునట్లు, శుద్ధ సన్మాత్ర జ్ఞానము చే ఈ జగత్తు ప్రశమనము పొందగలదు. అనగా నీవు జ్ఞానివైనావా…. నీ దృష్టిలో ఈ జగత్తు ఒక్కక్షణంలో లేకుండా పోగలదు. జలంలో తరంగాలు ఎందుకుంటున్నాయి? జలమే తరంగాలుగా అగుపించటం జరుగుతోంది కదా!
ఆ జలము యొక్క ద్రవత్వస్వభావంచేతనే కదా! మాయావియగు ఈశ్వరుడు స్వమాయచే ఆవృతమైన “జ్ఞప్తిరూపనిజాత్మ” యందు ఈ జీవదశలను పొందుచున్నాడు. అనగా ఏమిటి? “నేను జీవుడను … ఇది జగత్తు“ అను రూపముగల భావము ఆ ఈశ్వరుడే తనకుతాను తనయందు కల్పించుకొనిన మాయచే గాంచి, అనుభవించుచున్నాడు. అట్టి అనుభవమును గాంచుచున్నట్టి సమయంలో “నేను ఈ దృశ్యవ్యవహారమునకు స్వయముగా రచయితనైయున్నాను. కనుక ఈ కనబడే సర్వమునకు నేనే ఈశ్వరుడను. సర్వదా పూర్ణుడను” అనే విషయం పూర్తిగా ఏమరుచుచున్నాడు.
ఎంతటి చమత్కారం! ఏ విధంగా అయితే జలమునందు ద్రవత్వమూ, వాయువునందు చంచలత్వమూ ఉన్నాయో, అదేవిధంగా జ్ఞప్తిమాత్రుడగు ఈశ్వరునియందు అహంకారము - దేశము - కాలము మొదలైనవన్నీ ఉన్నాయి. ఈశ్వరస్వరూపుడు అగు ఈ జీవుడు ఒక వైపునుండి ‘నేను ఈశ్వరుడను’ అను భావముచే ఆవరణము (Limitation)గానీ, పరిచ్ఛేదము (Partition)గానీ లేనట్టి తన నిరతిశయానంద జ్ఞానమును ఎరుగుచునే ఉన్నాడు. అయితే, మరొకచోట మరొకవైపున, అహంకారవశంచేత ‘నేను జీవుడను’ అను రూపముగల జీవభావము పొందుచున్నాడు. అట్టి జీవభావముచే ఈ పంచభూత, ప్రాణ, ఇంద్రియాదులందు విషయసంబంధమగు ’అధ్యాస’ కలిగి ఉంటున్నాడు. అట్టి సమయంలో “ఈ దేహమే నేను. ఈ దేహమునకు అనుభవమగుచున్నవే నా పరిధి”… అని భావించుచున్నాడు. అయితే, ఈ స్వయంకల్పిత పరిమితులు యథార్థమా? కానేకాదు.
అగుటకు వీలు లేదు కూడా.
అజ్ఞాని ఆయా కర్మవాసనల చేతనూ, దర్శన, లాభాది భోగ వైచిత్రములచేతనూ ప్రియ - మోద - ప్రమోద వ్యవహారముల చేతనూ అనేక దృష్టిపరంపరలను తనయందు కలిగి ఉంటున్నాడు.
Page:540
తృప్తి పొందాలని తపిస్తూ ఎచ్చటెచ్చటికో వెళ్ళి వెతుకుచున్నాడు. అయితే ఒకడు జ్ఞాని కావచ్చు… అజ్ఞాని కావచ్చు. ఎరుగబడుచున్న వైచిత్ర్యమంతా అభిన్నమగు ఆత్మచేతనే నిర్వర్తించబడుచున్నదని గ్రహించు. ఈశ్వరుడే ఇచ్ఛాకామములకు అనుగుణంగా తన అంగములను ఆయారూపములుగా పరిణమింపజేస్తున్నాడని గమనించు.
పరమార్థస్థితి - ఓ రామచంద్రా! ఈ జగత్తంతటికీ అధిష్టానమైయున్న పరమాత్మ యొక్క జ్ఞానమే పరమార్థ స్థితి. సర్వజీవుల జీవనము దేనియొక్క అధీనమైయున్నదో…. అట్టి పరమానంద రూపమే ఈ జీవుని స్వరూపం. సచ్ఛాస్త్రములు, గురూపదేశములు సహకరించుచుండగా ఎప్పుడైతే జీవుడు ఈ సత్యం గ్రహిస్తాడో అప్పుడిక “ఈ భోక్త - భోగ్యముల రెండిటి యొక్క అధిష్ఠానం చిద్రూపమగు ఆత్మయే” … అని తప్పక గ్రహిస్తున్నాడు. ఇకప్పుడు జీవ, ఈశ్వరులకు భేదమేమున్నది? ఎక్కడున్నది?
“ఈశ్వరుడే సంకల్పముల ఆధిక్యత చేత జీవుడగుచున్నాడు. జీవుడే సంకల్ప, ఆసక్తి క్షయం చేత ఈశ్వరుడగుచున్నాడు. జీవ, ఈశ్వరుల భేదం లేనట్లే, ఈశ్వరుడు, బ్రహ్మమునకు భేదం లేదు. అనగా, శాంతమై… అఖండమై, పరిపూర్ణమై బ్రహ్మము మాత్రమే శేషించుచు…. అది సర్వుల వాస్తవరూపమై ప్రకాశించుచున్నది.
బోధప్రయోజనం… సాక్షాత్ ప్రయోజనం కాబట్టి రామా! ఈ జగత్తంతా బ్రహ్మమే. “అట్టి బ్రహ్మము ప్రశాంతము జననరహితము… ఏకము … అనాది… పూర్ణప్రకాశస్వరూపము ఆనందైకరసము… విషయచిహ్నరహితము” అనునది మన ఇప్పటి వరకు జరిగిన చర్చ యొక్క సారాంశము. ఈ జగత్తు యొక్క ప్రశాంతరూపమును బోధించుట కొరకు బోధించువారమగు మేము కొన్ని భేదరూపములగు శబ్దజాలమును ఆశ్రయించటం తప్పటం లేదు.
శాస్త్రకారులచే బోధ యొక్క ప్రయోజనము కొరకు “మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జీవుడు, ఈశ్వరుడు"… మొదలైన శబ్దజాలం కల్పించబడుతోందికదా! ఈ శబ్దజాలమంతా బోద • ప్రయోజనము కొరకే గాని, సాక్షాత్ ప్రయోజనముకొరకు కాదని నీవు గ్రహించు. నీవు ఇవన్నీ వింటూనే, భోగత్యాగలక్షణం ద్వారా అఖండార్థరూపమైనట్టి ‘ఓం’ కారము యొక్క లక్ష్యార్థమును గ్రహించు.
ఆ లక్ష్యార్థం నిత్య, అపరోక్ష చిన్మాత్రమే అయి ఉన్నది. అదియే మనందరి వాస్తవ రూపమని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. అదే సమస్తం అయి, ముందు, వెనుక, మధ్యల యందు ఆక్రమించియున్నది.