Page:541
VIII. సురఘు-మాండవ్య-పర్ణాదుల సంవాదం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! శాస్త్రములచే, గురువులచే ఉపయోగించబడుచున్న “జీవుడు
- ఈశ్వరుడు - మనస్సు - బుద్ధి - అహంకారము” - మొదలైన శబ్దమయ దృష్టి అంతా శిష్యులకు
అద్వితీయము - ఏకము - అఖండము అగు ఆత్మ విషయం బోధించటానికై కల్పించబడుచున్నది. ఈ విషయం విశదీకరించ గల “సురఘురాజు, మాండవ్య మహర్షి, పర్ణాదుడు” - అను ముగ్గురి మధ్య జరిగిన ఒక పురాతనమైన సంవాదము చెపుతాను …..విను.
‘కైలాసము’ అను ప్రసిద్ధ హిమాలయ శిఖరం శంకరభగవానుని నివాసమై ఒప్పుచున్నది. ఆ పర్వత ప్రాంతంలో ఒక చోట ఒక కిరాత రాజ్యం ఉన్నది. అక్కడి ఆటవికులు అడవులలో సంచరిస్తూ రుద్రాక్షమాలలు, ఇంధనము (కట్టెలు), ఫలములు సంపాదించి, తదితర ప్రదేశములలో విక్రయిస్తూ జీవితాలు గడుపుతూ ఉంటారు. ఆ రాజ్యమును ఒకప్పుడు ‘సురఘుడు’ అనేవాడు పాలిస్తూ ఉండే వాడు. “హేమజట’ అనునది ఆతని మరొక పేరు. సురఘుడు విభవాలలో కుబేరునితోనూ, జ్ఞానములో బృహస్పతితోనూ, కావ్య సాహిత్యాదులలో శుక్రాచార్యునితోనూ సమానుడని జనులు అనుకుంటూ ఉండేవారు. ఆతడు ప్రజలను కన్నబిడ్డలవలే పాలిస్తూ ఉండేవాడు. దుష్టజనుల విషయంలో మాత్రం కాలయముని వలె సింహస్వప్నంగా ఉండేవాడు. అక్కడి రాజ్యాంగాన్ని అనుసరించి దొంగల విషయంలో, తదితర సంఘవిద్రోహుల విషయంలో అతిక్రూరంగా శిక్షలు అమలు పరుస్తూ ఉండే వాడు. “నిగ్రహ అనుగ్రహాలకు ఆతనికి అతడే సాటి" అని అందరూ అనుకుంటూ ఉండేవారు.
ఆ సురఘు చాలాకాలం ఆ కిరాతరాజ్యం ఏలాడు. కొంతకాలానికి జ్ఞానసంపన్నుడగు ఆతని హృదయంలో ఒక నూతన వేదన ప్రారంభమైనది. “అయ్యో! నేను నిర్దయగా శిక్షలు అమలుపరుస్తున్నానే! ఇది హింసయే అవుతుంది కదా! శిక్షలు అమలుపరచేటప్పుడు వారి రోదనం కర్ణకఠోరంగా ఉంటున్నదే! సర్వజీవరాశులు ఆ భగవంతుని స్వరూపులే కదా! ఈ బాధించటం ఎంత వరకూ ఉచితం?" అని తనలో తాను మథనపడుతూ ఉండేవాడు. కొన్ని రోజులు అట్లా గడిచాయి. ఒకరోజు రాత్రి విశ్రాంతి గృహంలో పవళించి ఉండగా ఆతని అంతర్ మథనం ఇంకా అధికమైనది.
సురఘు (తనలో) : అయ్యో! నేను అధికారం ఉన్నది కదా అని, అనేక మందిని దుఃఖితులనుగా చేస్తున్నానా? సర్వప్రాణుల దుఃఖమూ నావంటిదే కదా! అందుచేత నా దగ్గర ఉన్న ధనమంతా అందరికి పంచివేస్తే - అప్పుడు పేదరికం ఉండదు. అప్పుడు సంఘవిద్రోహులే ఉండక పోవచ్చుకదా! ఉట్టి దండనతో ఏం ప్రయోజనం?
Page:542
అయ్యో! నిర్దయగా శిక్షలు అమలు పరచకపోతే జనులలో అధర్మప్రవృత్తి నశించదు. అమలు పరిచితే జీవులను హింసించటమే అవుతుంది. ఏం చేయాలి? ఈ రాజ్యం ఏలే పని ఎంత నీచమైనది? రాజుగా ఉన్నంత కాలం వధ - బంధనాది వ్యవహారం తప్పేటట్లులేదు. పోనీ రాజ్యం వదిలేద్దామా! రాజ్యం అరాచకమౌతుందను కారణంగా ఈ మంత్రులు, నా జాతి ఆటవిక ప్రజలు నన్ను వదిలేటట్లు లేరు? వీళ్ళందరినీ తప్పించుకొని నేనెక్కడికి వెళ్ళగలను? నా కుమారులు ఎదిగేవరకు రాజవంశంలో పుట్టటం చేత ఈ ధర్మం అనివార్యం. ధనం పంచటానికి మంత్రులు ఒప్పుకోరు. నా ఆలోచన విని వాళ్ళు పకాలున నవ్వుచున్నారు. ఇప్పుడు నాకు త్రోవ ఏమిటి?… ఇట్లా ఆలోచిస్తూ ఆ రాత్రంతా కునుకు లేకుండా గడిపాడు.
అతని పూర్వజన్మ పుణ్యవశం చేత కాబోలు, ఆ మర్నాడు ఉదయం మాండవ్య మహర్షి ఆ త్రోవలో పయనిస్తూ శిష్యులతోసహా ఆ ప్రాంతానికి రావటం జరిగింది. మహాజ్ఞాని, శాస్త్రకోవిదుడు అగు ఆ మహర్షి గురించి వినటం చేత సురఘురాజు వాళ్ళని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ
మహర్షిని, వారి శిష్యులను తన సేవలతో సంతోషపెట్టాడు. మహర్షిని తన మందిరానికి ఆహ్వానించి ఏకాంతంగా ఆయనతో సంభాషించసాగాడు.
సురఘు రాజు : హే మహర్షీ! మాండవ్యా! తమ రాకచే నేను అనిర్వచనీయమైన పరమశాంతిని పొందుచున్నాను. పేదవానికి రాజు కనికరంలాగా మీ సాన్నిధ్యం నాకు లభించింది. మీలాంటి మహనీయుల కృపారసవృష్టి ప్రసరించటానికి గాను, నేను ఎప్పుడు ఏం పుణ్యం చేశానో ఏమో!
దేవా! సర్వధర్మజ్ఞా! మీకు శ్రమ అనుకోకపోతే నాకున్న ఒక సంశయమును నివృత్తి చేయమని వేడుకొంటున్నాను. మీవంటి మహనీయులతో సంసర్గం ప్రాప్తించిన తరువాత మావంటి సంసార జీవులకు దుఃఖశమనం తప్పక కలుగగలదని పెద్దల వాక్యం. దుఃఖము యొక్క తత్త్వము ఎరిగిన పండితులు “సంశయమే దుఃఖము యొక్క మూలస్థానం” అని చెప్పుతారు కదా! స్వామీ! నా
సంశయమేమిటో వినండి.
నేను రాజుగా దోషులను క్రూరంగా దండించ వలసివస్తోంది. మరికొందరిని అనుగ్రహించ వలసి వస్తోంది. ఈ దండన, అనుగ్రహములను నిర్వర్తించే విధినిర్వహణలో నాకు విషమ దృష్టే సంప్రాప్తిస్తోంది కానీ సమదృష్టి కాదు. సమదృష్టిచే మాత్రమే జీవుడు మోక్షమార్గానికి అర్హుడౌతాడని మోక్షశాస్త్రములు ఘోషిస్తున్నాయి. మరి ఇట్టి పరిస్థితులలో నాయందు సమదృష్టి యొక్క ఛాయలైనా ఎట్లా ఉద్భవించగలవో నాకర్థమవటం లేదు. అనేక రోజుల నుండి ఈ విషయమై నాలో అంతర్ సంఘర్షణ జరుగుతోంది. నాకు దిక్కుతోచటం లేదు. ఈ రాజ్యం వదలి ఎచ్చటకో పారిపోవాలని, సమదృష్టికై ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలని అనేకసార్లు అనుకున్నాను. అయితే ఇక్కడి రాజవంశంలో పెద్ద కొడుకునై పుట్టినందుకు నేను రాజుగా ఉండక తప్పుటలేదు. ఎక్కడికో పారిపోతే, అప్పుడు నేను ధర్మము తప్పినవాడనే అవుతానేమోనని కూడా నా సందేహం!
ఇప్పుడు ఏమిచేయటం ఉచితమో తమరు ఆనతివ్వండి. మీరు ఉచితమని అంటే, ఇప్పటికిప్పుడు మీకు శిష్యుడనై సర్వము పరిత్యజించి వచ్చేయటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు
Page:543
ఏది ఉచితమో, అది మీరు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాను. నాపై దయతో సముచితమైన మార్గం చూపండి. ఈ ‘రాజదండన’ వంటి క్రూర క్రియలను నేను కొనసాగించలేను. నాపై దయతో నన్ను ఆజ్ఞాపించండి.
మాండవ్యమహర్షి : ఓ రాజా! నీ మనస్సు అలసత్వం చేత అల్పత్వం పొందిందయ్యా. ఈ శరీరాన్ని స్నానాదులు ఏ విధంగా ధూళి మొదలైనవాటిని తొలగిస్తాయో, మనస్సును కూడా ఆత్మసమాచారము, నిర్మల పర (ఆత్మ) ధ్యానము వంటి ప్రయత్నములచే ప్రతిరోజు నిర్మలస్నానం చేయించాలి. నీవు త్యజించవలసినది త్యజించవలసినంతగా త్యజించలేదు. ఆశ్రయించి ఉండవలసినది తగినంతగా ఆశ్రయించటం లేదు. అందుచేతనే నీ మనస్సు అల్పభూములలో చిక్కుకొని వేదన చెందుతోంది. నిస్తేజం అనుభవిస్తోంది.
సురఘు : స్వామి! ఈ మనస్సు యొక్క అల్పత్వం తొలగేది ఎట్లా?
మాండవ్యమహర్షి : అందుకు ఎల్లప్పుడూ మూడు విధములైన ప్రయత్నములను ఆశ్రయించాలిమనస్సు ఏర్పరచుకొంటున్న రాగమును తొలగించి ఎప్పటికప్పుడు వైరాగ్యంతో నింపాలి. 2. కర్మల ప్రయోజనముల పట్ల ఏర్పడే ‘ఆశ్రయము’ ను నిరోధించి, “కర్మఫల త్యాగము” లేక “కర్మఫలములను భగవంతునికి సమర్పణ చేయుట” అను త్యాగమును అభ్యసించాలి. 3. ఆత్మజ్ఞానపర్యంతము ‘శ్రవణము, మననము’ మొదలైన ఉపాయాలను అనుసరిస్తూండాలి. మనస్సులో ఏర్పడే సంతాపం ‘స్వవిచారణ’ చే శీఘ్రంగా ఉపశమించగలదు.
ఈ పుత్ర, స్త్రీ, జన, ధనాదులు ఏమై ఉన్నాయి?… నా శరీరంలో చోటుచేసుకొని ప్రవర్తించుచున్న ఈ ఇంద్రియములతో నాకు ఏర్పడుచున్న సంబంధము ఎట్టిది?… ఈ మనో-బుద్ధి-అహంకారముల స్వరూపం ఎట్టిది?… ఇంతకీ నే నెవరిని?… ఈ జగత్తు ఎక్కడినుంచి ఏ విధంగా నాకు ప్రాప్తిస్తోంది?… ఎట్లా ఉపశమిస్తోంది?… ఈ జనన మరణములు ఎట్లా కలుగుచున్నాయి?
ఓ రాజా! స్వమనస్సుచే పై విషయాలు బాగుగా విచారణ చేయాలి. అట్టి తీవ్ర, దీర్ఘవిచారణ చేత నీవు ‘పూర్ణమహత్వము’ ను పొందుతావు. నీయొక్క సత్ స్వభావమును ఎఱుగుటచే ఇక ఈ సుఖ, దుఃఖాది దశలు నీ చిత్తమును డోలాయమానం చేయలేవు. అప్పుడు నీ మనస్సు జగత్ స్వరూపమును విడచి “సర్వదా సిద్ధించియే ఉన్న దుఃఖ రహితమగు బ్రహ్మ స్వరూపము" ను సంతరించుకుంటుంది. అప్పుడది జలమందు తరంగంలాగా తనకు తానే శమించగలదు. అది జీవన్ముక్త వ్యవహారమునందు సమర్థత పొందగలిగినప్పుడు మలినరూపము వదలి పూర్వఃపూర్వ తత్పూర్వరూపం పొందగలుగుతుంది.
నీవిప్పుడు దృశ్యమును సందర్శిస్తున్నావు కదా! ఎప్పుడైతే నీవు ఆత్మను సందర్శిస్తావో, ఇకప్పుడు లోకపాలకులగు బ్రహ్మమొదలైనవారు కూడా, బిడ్డలు తండ్రికృప కోరుకొంటున్నట్లు, నీ కృపను కోరుకుంటారు. అందుచేత వివేకజనితమైన జ్ఞానముచే నీవు ఆత్మను అవలోకించు. అప్పుడు ‘ఆకాశము
Page:544
గోష్పాదజలం (ఆవు గిట్టచే ఏర్పడిన గుంటలోని జలం)లో ఏనుగు మునుగుతుందా? ఎలా మునుగుతుంది? …కానీ, ఆ గోష్పాదజలంలో శిథిలమైన అంగములు గల ఒక దోమ లాగా నీ మనస్సు ‘దృశ్య సంపర్కము’ అనే సంసార గోష్పాదజలంలో చిక్కుకుంటోంది. అది అనేక నీచదృష్టులను, అవగాహనలను, అభిప్రాయములను కలిగి ఉండి దృశ్య వ్యవహారంలో ప్రవేశిస్తోంది.
ఈ మనస్సు తన యందు వాసనలను కలిగి ఉంటోంది. అందుచేతనే దృశ్యము నందు ఆకర్షణ-వికర్షణల తాడనం పొందుతోంది. అందుచేత ఓ రాజా! ‘స్వయం జ్యోతిస్వరూపం’ అయినట్టి ‘ఆత్మమాత్రానుభవం’ శేషించే వరకూ నీవు అంతయూ త్యజిస్తూ పోవలసిందే.
బంగారపు గనిలో పనిచేసేవాడు బంగారం లభించే వరకూ గనిని శోధిస్తూనే ఉంటాడు కదా! ఆత్మలాభం కలిగేంత వరకూ ఆధ్యాత్మ శాస్త్రములను విచారణ చేస్తూనే ఉండాలి.
“వస్తు రూప బుద్ధి… ఆత్మబుద్ధి" - వస్తురూప బుద్ధియే సర్వ అనర్థములకూ కారణమగు చున్నది. అట్టి వస్తురూప బుద్ధిని ఉత్తమ బుద్ధిచే పరిశుభ్రపరచాలి. నిర్మలమగుచున్న బుద్ధి సాయంతో క్రమంగా ఈ దృశ్యము నంతటినీ పరిత్యజించి వేయాలి. అప్పుడు నీ చేతనే నీకు ‘ఆత్మ’ అను పూర్ణ లాభం చేకూరుతుంది. అట్లా కాకుండా ఏదో ఒక చోట కొన్ని విషయములు మాత్రం త్యజిస్తే ఆత్మలాభం ఎలా చేకూరుతుంది?
నీవు కొన్ని విషయములను వదులుతూ, మరికొన్ని విషయములను ఆదరిస్తూ ఉండుట చేతనే నీకు ఇప్పటి డోలాయమానస్థితి ఏర్పడుతోంది. నాయనా! మరల చెప్పుచున్నాను - యావత్సర్వం న సంత్యక్తం తావదాత్మా న లభ్యతే | సర్వావస్థాపరిత్యాగే శేష ఆత్మేతి కథ్యతే ॥ (శ్లో 44, సర్గ 58)
సమస్త పదార్థములు త్యజించబడనంత వరకూ ఆత్మానుభవప్రాప్తి కలుగదు. సర్వావస్థలను పరిత్యజించుటచే, అప్పుడు నీయందు ఏది శేషిస్తుందో - అదే ‘ఆత్మ’ అని చెప్పబడుతోంది.
ఈ మామూలు లౌకిక జీవితమే చూడు…! ఇక్కడ ఒక ఉత్తమ వస్తువును పొందాలంటే కొన్ని స్వల్పవస్తువులను త్యజించవలసి వస్తోంది. సామాన్య ప్రాపంచిక వస్తువుల విషయమే ఇట్లా ఉంటే, ఇక ఆత్మలాభం గురించి వేరే చెప్పాలా? సర్వ త్యాగం కాకుండా, కొన్ని వదలి మరికొన్నిటిని పట్టుకుని ఉంటే ఆత్మ ఎట్లా లభిస్తుంది? అందుచేత సర్వ, అన్య విషయముల కొరకై కార్యములను నిర్వర్తించటం” - అనేది పరిత్యజించి, "సర్వయత్నములూ ఆత్మలాభము కొరకే” చేయాలి. అప్పుడు మనుజుడు అద్దానిని తప్పక పొందుతాడు. అట్లా కాకపోతే… పొందడు.
అందుచేత, ‘స్వాత్మావలోకనము’ కొరకు సర్వస్వము త్యజించాలి. ఉపాయం అదొక్కటే.
Page:545
జగత్తు - (జ…గత్) జనిస్తూ … గతిస్తూ ఉండేదంతా ‘జగత్తు’ అను పేరుతో వ్యవహరించ బడుతోంది. ఈ జగత్తులో వర్తమానంగా నీవు పొందుచున్న సర్వమును… అది గతించే లోపల నీవే దానిని త్యజించినవాడవై ఉండు.
నీకున్న సర్వము త్యజించుచూ పో!… సర్వము త్యజించిన తరువాత కూడా ఏదైతే ఇక నీవు త్యజించుటకు వీలు కాదో, అదే పరమపదమని ఇంకొకసారి ప్రకటిస్తున్నాను. అట్టి పరమపదమును అధిరోహించి, అటుపై ఈ జగత్తులో లీలావినోదిగా, క్రీడావిహారిగా వినోదించు.
సురఘుడు : మహర్షీ! అసలీ జగత్తు అనబడేది ఏ మూలపదార్ధముచే తయారుచేయబడుతోంది? శ్రీమాండవ్యమహర్షి : ఈ జగత్తంతా కార్య - కారణ మయమైయున్నది. ఇదంతా కూడా సన్మాత్రాత్మ యందు స్వకల్పనచే ఏర్పడి ఉంటోంది. ‘సత్’ నుండి బయల్వెడలి, ఆ సత్తుకు భిన్నమైన దాని వలె రూపం కలిగి ఉంటోంది.
నీవు సత్ స్వరూపుడవు. కనుక, నీచే చూడబడేదంతా నీస్వరూపమే అయి, నీకు భిన్నమైన దాని వలె నీకు సంప్రాప్తిస్తోంది. వాస్తవానికి ఇదంతా నీకు అభిన్నం. అట్టి నీకు భిన్నమై ప్రాప్తించేదంతా (అనిపించేదంతా) నీవు త్యజించు. అందుకు కారణమగుచున్న నీయందలి మూల ఆజ్ఞానాన్ని కూడా నాశనం చేయి.
నీ మనోరూపమైనదంతా నీచే నీయందే లయించివేయబడు గాక! లయం కాబడుచున్న మనస్సు సత్-చిత్ రూపమును పొందుచున్నది. నీ మనస్సు లయించేది నీ రూపము నందే సుమా! మనస్సు లయించగా శేషించేది ఏది? ఏకరస బ్రహ్మమే.
ఏకరస బ్రహ్మము ఇక అనుభవమాత్రమే కాని, అది ద్రష్టత్వము కాదు. ద్రష్టత్వము లేని చోట ద్రష్ట లేడు, దృశ్యం లేదు. సుఖదుఃఖాలు, కార్య - అకార్యము లనబడేవన్నీ ఉండనే ఉండవు. నీ అశాంతి తొలగిపోవుటకు అది అత్యుత్తమ మార్గం.
నేను చెపుతూ, ఉద్దేశించుచున్నదేమిటో అది స్వవిచారణచే నీవు తప్పక గ్రహించగలవు. యోచన చేయి. విచారణచేయి. ఇక మేము వెళ్ళివస్తాం. శలవా?
ఇట్లు పలికి మాండవ్యమహర్షి సురఘు రాజును, అతని ప్రజలను ఆశీర్వదించి, అక్కడి నుండి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. సురఘ రాజు వారికి వీడ్కోలు చెప్పి, ఆ తరువాత ఒకానొక ఏకాంత ప్రదేశం చేరాడు.
అక్కడ పద్మాసనాసీనుడై ఏకాగ్రచిత్తంతో స్వవిచారణ ప్రారంభించాడు.
Page:546
సురఘురాజు (అంతరంగంలో) త్యజించవలసినది త్యజించవలసినంతగా త్యజించలేదని మహర్షి నాకు గుర్తు చేశారు. విచారణ ఇంకా కొనసాగించమని ఆజ్ఞాపించారు. దీనిని గురించి విచారణ? ఈ గ్రాహ్య - త్యాజ్యములు నిర్వర్తిస్తున్న ‘నేను’ గురించి కదా!
ఇంతకీ నేనెవడను? - కిరాతరాజ్యం ఏర్పడి ఉన్న ఈ పర్వతము, పర్వత ప్రాంతం నేనా? కాదు. ఇవన్నీ బాహ్యమున ఉన్నాయి కదా! …నేను ఈ పర్వతమును కాదు. ఈ పర్వతము నాది కాదు. అట్లాగే ఈ జగత్తు నేను కాదు. ఈ జగత్తు కూడా నాది కాదు. నేను ఈ నేలను కాదు… ఈ నేల నాది కాదు.
ఈ కిరాత రాజ్యము కూడా నేను కాదు. ఎందరో రాజులు ఈ రాజ్యమును పాలించారు. మరింకెందరో పాలించనున్నారు. కనుక ‘ఈ రాజ్యము నాది’ అనునది అవాస్తవమే. కేవలం సర్వ జనులు సమ్మతించుటచేత మాత్రమే నేనీ రాజ్యానికి రాజయ్యాను. కల్పనా మాత్రం చేతనే ‘రాజుగా ఈ రాజ్యం నాదే’ - అనే భ్రమపూర్వకమైన భావన కలుగుతోంది. ఈ ‘రాజు’ అనే సంకేతం త్యజిస్తే అప్పుడు నేను ఇక్కడ దేనికీ సంబంధించనివాడను అవుతాను. ఇక్కడి రాజుతో ఏర్పడే మంత్రి - ప్రజ - - - సేవకజన - శత్రు రాజ్యసంబంధములకు కూడా నేను సంబంధించని వాడను అవుతాను.
అమ్మయ్యా! సంకేతముచే ఇంతవరకూ ఏర్పడియున్న, కల్పించుకొనియున్న ’సంకేత సంబంధం’ క్రమంగా నా దృష్టి పథం నుండి తొలగుతోంది.
కుటుంబముచే నేను పరిమితుడైనవాడనా?- సరే, ఇక ఈ ’భోగజాలము, కుటుంబము’ విషయానికి వద్దాం. ఇవన్నీ నావా? కావు. ఇందలి సభ్యులందరికీ వేరువేరు ఆశలు, జీవిత లక్ష్యములు ఉండి ఉండగా, ‘వీరు నావారు’ అని నేను భ్రమించటమేమిటి? నా కుటుంబసభ్యులు, భృత్యులు నాతో కల్పితసంబంధం కలిగి ఉంటున్నారు. అదంతా వాస్తవమెట్లా అవుతుంది? సందర్భానుచితంగా ఇవన్నీ మార్పు, చేర్పులు చెందుచున్నాయి కదా?
నేను శరీరమునా? - చేతులు, కాళ్ళు మొదలైనవాటితో కూడిన ఈ దేహంలో జడములైనట్టి మాంసము, ఎముకలు మొదలైనవి కూడా ఉన్నాయి. కానీ నేను ఈ దేహములోని తదితర విభాగముల వలె ఒక జడవస్తువునా?
‘ఇది ఇట్లు’ అని గ్రహించగలుగుచున్న నేను జడమెట్లా అవుతాను? నీళ్లలో కమలం ఉన్నప్పటికీ నీళ్లు వేరు, కమలం వేరు కదా! జడమగు రక్త-మాంస-అస్థులతో కూడిన ఈ శరీరమునకు, చైతన్యమగు నాకు సంబంధమెట్లా ఉంటుంది? ఇవి ఎన్నటికీ నావి కావు. ఈ కర్మేంద్రియములు నేను కాదు.
నేను భోగములకు సంబంధించినవాడినా? ఈ భోగములు నేనా? ఎట్లా ? భోగములు బాహ్యములైన అనుభవములే కదా? ఈ భోగములు చవిచూస్తున్న ఇంద్రియములు కూడా నేను
Page:547
కాను. అవి నావి కావు. అట్లాగే జడమాత్రములై మిథ్యా రూపంగా కనిపించే బుద్ధి మొదలైనవి కూడా నేను కాదు.
నేను మనోరూపుడనా? - సర్వ సంసార దోషములకూ మూలమైనట్టి మనస్సును నేనా? అసలు, మనస్సు అంటే ఏమిటి? మననము అను ప్రక్రియయేకదా! మనస్సు అను దానికి స్వకీయమైన ఉనికి ఎక్కడున్నది? కాబట్టి మనస్సు గాని, బుద్ధిగానీ, అహంకారము గానీ, నేను కాదు. ఈ మూడూ అంతఃకరణము యొక్క భౌతికరూపములు.
ఈ విధంగా విచారించగా ఈ దేహము మొదలుకొని ఇంద్రియములు మనస్సు -
బుద్ధివరకూ గల ఏవీ నేను కాదని అతిస్పష్టంగా తేలిపోతోంది.
నేను ప్రమేయుడనా? - ఇక మిగిలింది ఈ ప్రమేయము (Relationship)తో కూడుకొని ఉన్న చేతనుడగు ఈ జీవుడే కదా? అయితే ‘నేను ఒక జీవుడను’ అని అనుకొనుచున్న నేను అట్టి జీవ భావము ప్రారంభం కావటానికి ముందే ఉండివున్నాను.
త్రిపుటి (Three - Dimensions) - 1. తెలుసుకొనుచున్నవాడు (Perceiver), 2. తెలియబడు చున్నది (Object), 3. తెలివి / తెలుసుకొనుట (Perceiving) … త్రిపుటికి సాక్షి అయిన మరొకదానిచే త్రిపుటి ఎరుగబడుచున్నది. అందుచేత వ్యక్తిగత ప్రమాత (The Perceiver or Knower) ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కానేరదు.
మాండవ్య మహర్షి “సర్వమును త్యజించవయ్యా!" అని ఆజ్ఞాపించారు కదా! కనుక సాక్షిచే ఎఱుగబడుచున్న ప్రమాత ప్రమేయములను కూడా త్యజించివేస్తున్నాను. అవి నేను కానప్పుడు వాటిని త్యజిస్తే నాకేమి నష్టం? ఏమి కష్టం?… ‘ఇవన్నీ నావి కావు, నేను కాదు’ అని గమనిస్తే చాలుకదా! అవును.. ఇప్పుడు శేషించిన వికల్ప, సంకల్ప రహితమగు విశుద్ధచైతన్యమగు ఆత్మనే నేను.
ఆహా! ఎంత ఆశ్చర్యం! నేను ఇతఃపూర్వం కూడా ఆత్మను సర్వదా పొందియే ఉన్నాను! కానీ, నిత్యసాక్షిత్వమును వదిలి నేను జీవుడను… నేను భోక్తను అని అనుకుంటూ దయ్యం పట్టిన వాని వలె ఇంతకాలం ప్రవర్తిస్తున్నాను.
ఎప్పుడైతే సర్వమునకు సాక్షి రూపుడను నేను’ అని గుర్తు చేసుకొన్నానో, మరుక్షణం ఉత్తమమగు పురుషార్థలాభుడను అగుచున్నాను. ఇది నాకు ఎంత సుఖప్రదమైన విషయం! అనంతరూపుడగు ఆత్మయే నేనైయున్నాను. అట్టి నా పరమాత్మత్వమునకు అంతమే లేదు.
నా యందు ఏ పరమాత్మ ఉన్నదో అదే పరమాత్మ బ్రహ్మదేవుని యందు ఇంద్రుని యందు, యముని యందు, వాయువు నందు, సర్వభూతజాలము నందూ సమముగా అవతరించినదై ఉన్నది. ముత్యపుమాల యందు దారం లాగా సర్వుల యందూ అనుగతమై ఉన్నది.
నా యొక్క, సర్వుల యొక్క ‘స్వానుభవమాత్రం’ అగు చితశక్తి అతి నిర్మలమైనది. అది విషయ వ్యవహార వివర్జితమైనది. అది సర్వ దిక్కులనూ సర్వదా పూర్ణమొనర్చుచున్నది. అత్యంత మధురమైనది.
Page:548
అయితే అజ్ఞానులకు మాత్రం అది భయంకరాకృతిగానే తోచుచున్నది. సర్వపదార్ధము లందూ వ్యాపించి ఉన్న ఆ చితశక్తి అతిసూక్ష్మమై ఉండుటచే, ప్రజ్ఞానదశ యందు ఏర్పడి ఉన్న స్థూలదృష్టి కారణం చేత నేను గుర్తించలేకపోయాను.
అట్టి ఉత్పత్తి వినాశనరహితమగు చితశక్తినే నేను. చితశక్తి స్వరూపుడనగు నేను పాతాళము నుండి బ్రహ్మలోకము వరకూ సమస్త భువనము లందూ స్థితి కలిగి ఉన్నాను. సర్వశక్తి నిలయం ఆ చితశక్తియే. అయ్యది నిరతిశయానందముచే పరిపూర్ణమైయున్నది. సూర్యుడు మొదలైన ప్రకాశింప జేసే వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసేది అదే. ’బ్రహ్మాండములు’ అనే ముత్యములను ధరించిన
దారం అది.
అది సర్వాకార-వికారయుక్తమై కూడా సర్వాకార వికార వివర్జితమై ఉన్నది. భూతకోట్ల అన్నిటి రూపమూ అదే. కనుక సర్వ రూపత్వము ఆ చిత్ శక్తికే ఆపాదయోగ్యము. పదునాలుగు లోకములందలి పదునాలుగు విధములైన జీవరాసులను తన ఉదరమున ధరిస్తున్నది అదే.
జగత్తు అనబడు అనుభవరూపమంతా ఆత్మయే కానీ మరింకేమీ కాదు. ఆ ఆత్మయే సమస్తము అయి ఉండుటచే సుఖ దుఃఖ దశలన్నీ మిథ్యారూపములు మాత్రమే!
‘పరాచైతన్యము’ అను వేద ప్రసాదిత నామధేయమునకు అది ఒప్పుచున్నది. చైతన్య రూపమై ఉన్న నా ఆత్మ జగత్తంతా వ్యాపించియున్నది. మరొక వైపుగా, ఇచ్చట ప్రవేశించి నాట్యం చేస్తోంది.
యథార్థానికి ఈ మనోదేహాదులు లేవు. తుచ్ఛములైనట్టి ఈ దేహము, దాని ద్వారా ప్రాప్తిస్తున్న దృశ్యం నశిస్తున్నప్పటికీ, ఆత్మ ఏమాత్రం నశించుటలేదు… మరి ఈ జగజ్జాల నాటకమంతా ఏమిటి? అవును…. తెలిసింది. ఇదంతా ‘చిత్తము’ అను నటుడే తన నటనా చాతుర్యంతో రచిస్తున్నాడు. ఎప్పుడైతే బుద్ధి జగద్విశేషాలతో తన్మయత్వము పొందకుండా సాక్షిత్వము పొందుతుందో, అప్పుడు ఇందలి నాటకీయత్వమంతా తెలిసిపోతోంది. దీపం వెలుగుతుంటేకదా, గదిలోని వస్తువులు ఏమై ఉన్నాయో తెలిసేది!
ఆహా! నేను నిగ్రహ, అనుగ్రహములతో ప్రజలను శిక్షిస్తున్నప్పుడూ, సన్మానిస్తున్నప్పుడూ నా మనస్సు ఎందుకు వ్యాకులత పొందిందో ఇప్పుడు తెలుస్తోంది. నాకు వ్యర్థంగా దేహబుద్ధి కలగటం చేతనే, అట్లు భ్రమ పొందాను. అందుకే దుఃఖించాను. యథార్ధానికి అసలు ఈ దేహమే లేని పదార్థం కదా!
అమ్మయ్య! ఇప్పటికి నేను జ్ఞానవంతుడనయ్యాను. శరీరాదు లందు ‘ఈ శరీరమే నేను… ఆ శరీరమే ఆతడు’ అను రూపంలో ఏర్పడిన ‘దేహాత్మదృష్టి’ అనే దుర్దశ తొలగింది. మరుక్షణం చూడ వలసినది చూస్తున్నాను. పొందతగినది పొందుచున్నాను.
ఈ కనబడే జగద్గతమైన దృశ్య వ్యవహారమంతా ’మాయ’ చే ‘చిత్తు’ నందు స్వప్నసదృశ్యంగా సంభవించుచున్నది. ఈ జగత్తు నందు ‘ఆత్మ’ లేక ’చిత్తు’కు అన్యమై ఏర్పడేదంటూ ఎక్కడా ఏదీ
Page:549
లేదు. ఇక అందులో నిగ్రహమేమిటి? అనుగ్రహమేమిటి? అవన్నీ ఎక్కడున్నాయి? ఎట్లా ఉన్నాయి? సుఖం, దుఃఖం, మానం, అవమానం … ఇవన్నీ స్వయంకల్పితం, ఊహాజనితం అయిన కథా సన్నివేశాల వంటివి కాక మరింకేమిటి? కాబట్టి ‘నేను వీరిని శిక్షిస్తున్నాను, వారిని సంతోష పెడుతున్నాను’… అను భావన కూడా స్వప్న జనితమగు భ్రమ వంటిదే. అంతా కూడా వ్యాపకబ్రహ్మమే అయిఉండగా సుఖమేమిటి? దుఃఖమేమిటి? నేను ఇంతకాలం మూఢుడనై దోషదృష్టితో జగద్దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు సౌభాగ్య వశం చేత మాండవ్యమహర్షి గుర్తు చేయటంతో, జ్ఞానిని కావటం
జరిగింది.
❖
ఆనంద స్వరూపం, పరిపూర్ణం అగు ఆత్మ యొక్క అనుభవం కలిగిన తరువాత ఇక దేనికై శోకించాలి? దేనికి మోహితుణ్ణి కావాలి? ‘ఇంకనూ చూడాలి? ఇంకా పొందాలి’ అని ఎందుకు అనుకోవాలి? ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆగమ-సంచిత-ప్రారబ్ధ కర్మలు ఎవరికి? ఎందుకంటే ‘అలౌకిక చమత్కారం’ అగు చిదాకాశ మొక్కటే విద్యమానమై ఉన్నది కదా!
కిం చిదేవమిదం నామ చిదాకాశం విరాజతే |
నమో నమస్తే నిస్తత్త్వ దిష్ట్వా దృష్టో సి సున్దర II (శ్లో 36, సర్గ 50)
భౌతికత్వమే లేనట్టి ఓ స్వస్వరూప పరమాత్మా! నీకు నమస్కరింస్తున్నానయ్యా! మహద్భాగ్యం చేతనే నీవిప్పటికి నాయందు నేనుగా కనిపించావు. కదయ్యా!
ఆహా! ఇప్పటికి నేను ప్రబుద్ధుడనై సర్వము చక్కగా ఎరుగగలిగాను. గురుదేవుడగు మాండవ్య మహామునికి, ఆయన వాక్యములకు నమస్కారం. సమ్యక్ జ్ఞానం ఉదయించిన కారణంచేత నేను అనంత రూపుడనయ్యాను. అనంతరూపమగు ఓ నా ఆత్మస్వరూపమా! నీకు నేను చేతులెత్తి మ్రొక్కుచున్నాను. అహో! నా స్వస్వరూపమే అయిన ఆత్మ గురించిన జ్ఞానం ఎంత మహత్తరమైనది! అట్టి జ్ఞానముచే అత్యంత సహజంగా, అకృత్రిమంగా రాగ ద్వేషముల అభావం ఏర్పడుతోంది. తద్ద్వారా జాగ్రత్ - స్వప్న సుషుప్తులలోని విషయ స్థితి నశిస్తోంది. నన్ను నేను ఉపాధిరహితునిగా గాంచుచున్నాను. ’బ్రహ్మమునందు ఏకీభావము’ అను ఒకానొక నిశ్శబ్ద పూర్ణానుభవం తారస పడుతోంది. సంసార భ్రమరహితుడునగుచున్నాను. అహమ్, మమ (నేను, నాది) అను వృత్తులు లేనివాడనగుచున్నాను. సర్వమునకు సాక్షీభూతమగు ఆత్మ లేక శుద్ధబ్రహ్మము నందు సమరూపుడనై ప్రకాశించుచున్నాను.
వింటున్నావుకదా, రామచంద్రా! మన ఈ విశ్వామిత్రుడు రాజర్షిత్వమునుండి బ్రహ్మర్షిత్వము పొందారు చూచావా! అట్లాగే ఆ హేమజట (లేక సురఘురాజు) తన వివేకముచే సంపాదించిన సునిశ్చయముచే పరమోత్తమమగు ‘బ్రహ్మపదము’ ను పొందాడు. రాత్రింబవళ్ళు కలుగజేస్తున్నప్పుడు సూర్యభగవానుడేమన్నా భేదముగానీ, మోదముగానీ పొందుచున్నాడా? లేదే! ఆ విధంగానే ఆ
Page:550
రాజు కూడా తాను అనుష్టించుచున్న ధర్మార్థముల వలన ప్రాప్తించే క్రియలచే గానీ, దైవగతిచే అనివార్యంగా ప్రాప్తించే అనర్థములు, దుఃఖప్రదములగు ప్రవాహపతిత వ్యవహారములచే గానీ, ఏమాత్రం భేద మోదములు పొందటం లేదు. జల ప్రవాహముచే అనునిత్యంగా తాడనం పొందే పర్వతం యథాతథంగా, నిర్వికారంగా ఉంటున్నట్లు తాను నిర్వర్తించే రాజోచితమైన నిగ్రహ (punishing) –- అనుగ్రహ (Awarding) విషయముల పట్ల అచంచలుడై, దుఃఖరహితుడై ఉంటున్నాడు. దైనందినక వ్యవహారములు సలుపుచున్నప్పుడు హర్షామర్షములను (Happiness and unhappiness) పొందనివాడై తన ఉదార, గంభీర స్వభావంతో సముద్రమును కూడా మించిపోయాడు. “సుషుప్తిచే నిశ్చలము, చైతన్యముచే ప్రకాశవంతము” అగు చిత్తవృత్తిచే నిశ్చల ప్రకాశమయమగు అగ్నిశిఖ
వలె ప్రకాశించాడు.
ఆతడిప్పుడు నిర్దయుడు కాడు. దయావంతుడు కాడు. ద్వంద్వము, మత్సరము లేవు. అనర్థిగాని, అర్థిగాని, అతిబుద్ధిసహితుడుగానీ కాకుండానే యథారీతిగా ప్రాప్తించిన కార్యములను ఆచరిస్తూ సమదర్శియై ఒప్పుచున్నాడు. అతని అంతఃకరణం ఇప్పుడు సమదర్శనశీలమై చపలరహితమై, ధీరత్వ సమన్వితమై, వృత్తిరహితమై, పూర్ణ చంద్రుని వలె సంపూర్ణత్వము సంతరించుకొని ఉన్నది.
ఎవడైతే, ఈ జగత్తంతా చిత్తము యొక్క కల్పన మాత్రమే … అని నిశ్చయించుకుని ఉంటాడో, ఆతని బుద్ధి ఇక ఈ భౌతిక సుఖదుఃఖములు లేనిదే అగుచున్నది.
ప్రబుద్ధుడై, నిరంతరం సమాధినిష్ఠుడై ఉన్నవాడు ఈ శరీరాదులను బాహ్యవస్తువుగా చూస్తూ, సర్వదా ఉల్లాసముతో ఉంటాడు. ఆతని చిత్తం ఆతనికి వికాసమును ప్రసాదిస్తూ ఉంటుంది. ఆతడు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు నిదురిస్తున్నప్పుడు సర్వదా చైతన్యమునందు లయం పొంది
ఉంటాడు.
ఆ రాజు కూడా అట్లే చైతన్యము నందు ఐక్యత పొందియున్నాడు. రాజ్యపాలనను నిర్వర్తిస్తూ కూడా, అత్యంతాసక్తి రహితుడై ఉన్నాడు. అఖండాకారయుతుడై ప్రకాశించాడు. నదీజలం పూర్ణ సముద్రంలో కలియునట్లు, మంచుగడ్డ కరుగుటచే తన ఆకృతిని వీడునట్లు అతడు సర్వమును స్వస్వరూపము నందు లయింపజేసుకొని ‘నేను సర్వమునకు సాక్షిని’ అను సాక్షీరూపంలో ప్రవేశించాడు. బ్రహ్మాండములన్నిటికీ ఉత్పత్తి స్థానము, బ్రహ్మాదులకు కూడా నియంత అయినట్టి పరబ్రహ్మమునందు ప్రవేశించాడు. స్వబుద్ధిచే నిర్మలము దుఃఖరహితము ఆనంద పరిపూర్ణము అగు ఆత్మను పొందాడు. అట్టి ఆత్మప్రాప్తిచే ఈ జన్మ మొదలైన దశలను మనస్సులో అధిగమించివేశాడు.
కుండ పగిలితే కుండలోని ఆకాశం మహాకాశంలో లీనమగుచున్నట్లు ఆతని భావన పూర్ణత్వం పొందగా ఆతడు పరబ్రహ్మస్వరూపుడైనాడు.
ఓ దశరథరామా! నీవు కూడా హర్షశోకాదులకు కారణమగుచున్న ’పాపదృష్టి’ని నశింప జేసుకొని ద్వంద్వరహితుడవై అత్యంత శ్రేయోదాయకమగు మోక్షపదమును ఆశ్రయించు. అప్పుడు
Page:551
నీవు తప్పక దుఃఖరహితుడవౌతావు. చీకట్లో కదులుతుంటే ఏదైనా తగలటంచేత బాలుడు క్రింద పడవచ్చు. దీపం ఉంటే ఆ ఇబ్బంది ఉండదు కదా! ఆ సురఘు మహారాజు ‘జ్ఞానదృష్టి’ అనే దీపం చేబూనటం చేతనే ఆతని మనస్సు అజ్ఞానాంధకారంలో పడకుండా కాపాడుకోగలిగాడు.
ఒకడు గోతిలో పడినప్పుడు ఏం చేస్తాడు? ఒడ్డున ఉండే వేటినైనా ఆలంబనంగా పట్టుకుని బయటకు రావటానికి ప్రయత్నిస్తాడు కదా!
వివేకమును, వివేకులను ఆశ్రయించి తద్వారా తన చిత్తమునకు శాంతిని ప్రసాదించాలి. ఆ సురఘు మాటిమాటికీ పవిత్రదృష్టిని అభ్యసించాడు. ఇతరులకు కూడా అద్దానిని ఉపదేశించాడు. క్రమంగా ఏకము అయినట్టి బ్రహ్మమునందు సమాధితత్పరుడైనాడు.
శ్రీరాముడు : మునీంద్రా! మీరు “ద్వంద్వరహితం అవాలి" అని ఆజ్ఞాపిస్తున్నారు. అయితే మా మనస్సు గురించి గమనిస్తున్నారా? గాలి వీచే చోట నిలబెట్టబడి ఉన్న నెమలి పింఛంలాగా ఈ మనస్సు స్థిరంగా ఉండటమే లేదే! దీనిని స్థిరీకరించేది ఎట్లా? ఎంతగా మరల మరల విన్నా కూడా ఇది బ్రహ్మపదము నందు ఏకాగ్రనిష్ఠ పొందుట లేదు. దీనిని సుస్థిరీకరించటం ఎట్లాగో చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : మనస్సు విషయంలో ఇప్పటికే 13 రోజులుగా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. సరే …జ్ఞానియగు సురఘు ఆతని చిన్ననాటి స్నేహితుడగు పరిఘుడి మధ్య ఒక అద్భుతమైన సంవాదం జరిగింది. ఆ తరువాత ఆ ఇద్దరూ కూడా ‘ఏకరూపసమాధి’ యందు తమ తమ చిత్తములను సంలగ్నం చేసియున్నారు. తమ చిత్త, ఇంద్రియముల విషయంలో అత్యంత ప్రబుద్ధులై ఉన్నారు. అందుచేత వారిరువురి పరస్పర సంవాదము ఈ సమయంలో ప్రస్తావించటానికి సముచితంగా ఉంటుంది. వీనులకు విందై, హృదయములను పవిత్ర పరచగలదు. అది నీ ప్రశ్నకు సమాధానంగా చెపుతాను. విను.
శ్రీవసిష్ఠ మహర్షి : పారశీక దేశాధిపతి ‘పరిఘ’ అనునాతడు మన సురఘు రాజుకు చిన్ననాటి స్నేహితుడు. ఒకప్పుడు పారశీక దేశంలో అనావృష్టి సంభవించింది. అక్కడి ప్రజలు అనేకమంది ఆకలి బాధకు తాళలేక మరణించటం జరిగింది. అది చూచి పరిఘరాజు తట్టుకోలేకపోయాడు. ‘అయ్యో! నా ప్రజల కష్టమును తొలగించ లేకపోయానే! ఇక నేను రాజుగా అనర్హుడను’ అని తలచాడు. బహుదూరపు బాటసారి ఒక చోట మార్గమధ్యంలో తగలబడుచున్న గ్రామం చూచి కూడా తన దీర్ఘ ప్రయాణం కొనసాగించునట్లు ఆతడు ఆ రాజ్యమును త్యజించి అక్కడి నుండి బయలుదేరాడు. విరాగి అయి, అరణ్యంలోని ఒకానొక ఏకాంత ప్రదేశంలోని ఒక గృహంలో ప్రవేశించాడు. అక్కడ తపస్సు చేయటం ప్రారంభించాడు. శాంతిని, ఇంద్రియదమమును ఆశ్రయించి
Page:552
చాలా కాలం తపస్సును కొనసాగించాడు. ఆ దీర్ఘకాలంలో అక్కడ గల ఒక వృక్షము నుండి తమకు తాముగా వ్రాలిన ఆకులను తింటూ ఉండేవాడు. అక్కడికి కొంతదూరంలో ఉంటున్న ఆటవిక గ్రామ జనులు ఆకులు తింటూ తపస్సు చేసే ఆతనికి ‘పర్ణాదుడు’ అను పేరు పెట్టి చెప్పుకునేవారు.
అనేక సంవత్సరములు ఏకాగ్రతతో తపస్సు చేయటంచేత, సమాధిని అభ్యసించటం చేత ఈశ్వరానుగ్రహం ఆతనిపై ప్రసరించింది. చిత్తము శుద్ధి పొంది ఆతడు రాజర్షి అయ్యాడు. క్రమ క్రమంగా జ్ఞానయుక్తుడై, సద్బుద్ధియుతుడై, శీతోష్ణాది ద్వంద్వరహితుడై, ఆశావర్జితుడై, శాంతచిత్తుడై, రాగ, ద్వేష, క్రోధరహితుడై జీవన్ముక్తుడుగా ప్రసిద్ధికెక్కాడు.
ఆ విధంగా తపస్సు యొక్క ప్రభావంచే పరమ పవిత్రమైన మనస్సును సంపాదించుకొన్న ఆ పరిఘుడు కొన్నాళ్ళ తరువాత లోకసంచారం చేయటానికి బయలుదేరాడు. ఒకసారి కాకతాళీయంగా సురఘుడు రాజ్యమేలుతున్న కిరాత రాజ్యం ప్రవేశించాడు. చిన్ననాటి పరిచయం చేత సురఘుని కలిశాడు. జీవన్ముక్తులు అయిన ఆ ఇద్దరూ ఏం సంభాషించుకున్నారో శ్రద్ధగా విను.
సురఘురాజు : మిత్రమా! బహుకాలం తరువాత కలిశాం. మీరు ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేస్తూ ఉంటారని వింటూనే ఉన్నాను. జనులు ‘పర్ణాదముని’ అను పేరుతో మీ సుదీర్ఘ ఏకాగ్ర తపస్సు గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. పరమపవిత్రమగు సుకృతం చేతనే మీరు ఇక్కడికి రావటం, నేను మీ సమక్షమును ఆస్వాదించటం జరుగుతోంది. మీ సందర్శనముచే చిత్తము పరమానందభరితమౌతోంది. మనస్సు శీతలత్వం పొందుతోంది. వియోగం ప్రేమను ద్విగుణీకృతం చేస్తుందని పెద్దలు అంటారు. మన చిన్ననాటి సంభాషణలు లీలలు, చేష్టలు స్మరించు కుంటుంటే గొప్ప వినోదంగా ఉంటుంది.
పర్ణాదుడు : మిత్రమా! మాండవ్య మహర్షి కృప చేత మీరు ఆత్మజ్ఞానం పొందారని నేను కూడా విన్నాను. నేను తపస్సుచే ఈశ్వరుని ఆరాధించి ఆయన కృపచే ఆత్మజ్ఞానం పొందాను.
సరే! మీరిప్పుడు దుఃఖరహితుడవై పరమకారణమగు బ్రహ్మము నందు విశ్రాంతిని పొందారు కదా? ఆత్మారాముడవగుటచేత మీ చిత్తముతో ప్రసన్నత్వం ఉదయించిందా? ప్రసన్న గంభీరములతో కూడిన సమదృష్టిచే సర్వజనహితంగా రాజ్యపాలన చేస్తున్నారు కదా? మీ రాజ్యంలో ప్రజలు ధన ధాన్య సంపన్నులై, శారీరక, మానసిక బాధలు లేకుండా సంతాపవర్జితులై జీవిస్తున్నారు కదా? ప్రజలు ఎట్లా కోరుకుంటారో అట్లే పాలన జరుగుతోంది కదా? ధర్మరక్షణలో అధర్మశిక్షణలో మీ యశస్సు అన్ని వైపులా విస్తరిస్తోందా? ధాన్యం కళ్లెంలో పని చేసేవారు మీ యశస్సు గురించి ఆనందంగా పాటల రూపంలో పాడుకుంటున్నారా? మీ ధన-ధాన్య-ఐశ్వర్య-భృత్య-కుటుంబ-పుత్ర -నగరాదులు క్షేమంగా ఉన్నాయి కదా? మీ ఈ భౌతిక శరీరం మానసిక వ్యధారహితమై ఇహ-పర లోకము లందు ఉత్తమ ఫలములను ప్రసాదించ గల పుణ్యకార్యము లందు నియోగించబడుతోంది కదా? ఈ విషయములు అనేవి అమాయక జీవులకు రమణీయంగా తోచుచూ, అజ్ఞాన క్రియలచే
Page:553
చివరికి శత్రువులుగా పరిణమిస్తున్నాయి. అట్టి విష సర్పములను నిరోధించటానికి మీరు “వైరాగ్యం” అనే గరుడ మంత్రం మననం చేస్తున్నారు కదా?
ఆహా! మిత్రమా! మనిద్దరం చాలాకాలం వియోగం అనుభవించాం. కాలవశం చేత ఈ రోజు కలుసుకున్నాం. ఈ శరీరధారులగు జీవులకు ప్రతిరోజూ ఇష్ట- అనిష్టములు, సంయోగవియోగములు, సుఖ-దుఃఖములు కలుగుతూ ఉంటాయి. నా ప్రియ స్నేహితులైన మిమ్ము కలవటం ప్రీతికరం అయిన విషయం. ఈ దీర్ఘజీవదశలో ఎన్నడో విడిపోయి ఈ రోజు కలిశాం. ప్రాణుల కర్మానుసారంగా నడచే ఈశ్వరేచ్ఛ యొక్క విలాసం ఎంత చిత్రమైనది!
సురఘు : ఔను మిత్రమా! ఈశ్వరేచ్ఛారూపమగు నియతియొక్క ఆశ్చర్యకరమైన ’గతి’ని ఎవరు ఎరుగగలరు? మనిద్దరం ఎంతోకాలం ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు కలుసుకున్నాం. ఈశ్వరేచ్ఛే ఈ రోజు మనిద్దరినీ కలిపింది. నాకైతే ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నదయ్యా! మిమ్ము చూచుట చేత పాపము క్షయించగా పుణ్య వృక్షం ఫలిస్తోంది. నేను వ్యాకులరహితుడను కృతకృత్యుడను అయ్యాను. మీ రాకచే మా నగరం, మా ప్రజలు పరమ పవిత్రమగుచున్నాము.
"మహాత్ములతో సమాగమం మోక్షముతో సమానం” అని పెద్దలు అంటారు కదా! ఇప్పుడు ఆత్మానుభవం విషయంలో మీ నుంచి కొన్ని విశేషాలు వినాలనుకుంటున్నాను.
పరిఘముని : నాకూ మీ నుంచి వినాలని ఉన్నది. ఈ సంసారజాలము నందు ఏఏ క్రియలు నిర్వర్తించబడుచున్నాయో… అవన్నీ కూడా సమాహిత చిత్తునకు మాత్రమే సుఖప్రదమౌతున్నాయి. తదితరులంతా అనుక్షణికమైన సుఖదుఃఖ భావపరంపరలచే తాడనం పొందుచున్నారు. సాంసారిక విషయములలో ఎక్కడో ఏదో సుఖం ఉన్నట్లు మినుకుమినుకుమంటూ భ్రమ కలుగజేస్తోంది. అసలు సంకల్పములే లేకపోయాయా .. సమాధి సుఖం లభిస్తుంది. అట్టి పరమ శాంతిమయమగు సమాధి సుఖం ముందు ఈ సాంసారిక సుఖములు ఎంతటి అల్పమైనవి! జ్ఞాని అయినవానికి సమాహిత చిత్తం అవసరం. సమాహితచిత్తం సంపాదించటానికి సమాధి అనుష్ఠానం తప్పితే వేరే మార్గమేముంటుంది? కనుక ఈ సాంసారిక విశేషములను త్యజించి మనస్సుతో వ్యవహార రహిత సమాధిని మీరు దినచర్యలో కొంత సమయం కేటాయించి అనుష్ఠించుచున్నారు కదా! సురఘురాజు : అదేమిటి మిత్రమా… అట్లా అడుగుచున్నారు? “సంకల్పవర్జితము - శాంతియుతము శ్రేష్ఠము - శ్రేయోదాయకము అయినట్టి పరమానందమును అనుభవిస్తున్నావా?” అని అడగకుండా, “మనస్సుతో మధ్యమధ్యలో వ్యవహారరహిత సమాధిని అనుష్ఠిస్తున్నావా?” అని అడుగు చున్నారే! ఎందుకంటే జ్ఞాని వ్యవహారములలో ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కూడా అసమాహిత చిత్తుడై ఉంటాడా? ఉండడు కదా! అసమాహిత చిత్తుడైనవాడు జ్ఞానియే కాదు కదా!
Page:554
జ్ఞాన సహితులైనవారు నిత్య ప్రబుద్ధ చిత్తులై ఉంటారు. వారు ఈ ప్రాపంచిక క్రియలు నిర్వర్తిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ సదా ఏకత్వనిష్ఠులై ఉంటారు. అనగా, ఆత్మనిష్ఠులై ఉంటారు. అట్టి ఏకత్వ నిష్ఠయే వారి సమాధి. వారు వేరుగా అవశ్యమైన భౌతికసమాధిని ఆశ్రయించవలసిన పనేముంటుంది? పరిఘమని : జ్ఞానమంటే ఏమిటి? సమాధి ఎప్పుడవసరం?
సురఘు : జ్ఞానము సమాధి యొక్క అభ్యాసము గురించి నా మరికొన్ని అభిప్రాయములు వివరిస్తాను. వినండి. ఒకడు ప్రపంచమునంతా త్యజించి ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి, అక్కడ పద్మాసనం వేసుకుని "బ్రహ్మాంజలి” ని సమర్పిస్తున్నాడనుకోండి. ఆతని చిత్తం ఆత్మ స్వభావమునందు విశ్రాంతి పొందకపోతే, ఇక, ఆతని సమాధి ఎట్టిది? ఆతని స్థితి సమాధి అని ఎట్లా అనిపించు కుంటుంది చెప్పండి?
అందుచేత ‘ఆత్మతత్త్వబోధ’ అనే అగ్నిచే సమస్త ఆశలు అనే గడ్డిపరకలు ఆహుతి అవటమే సమాధికాని, ప్రపంచం పట్ల తూష్ఠీభావం కలిగి, ఇంద్రియములకు పని చెప్పనంతమాత్రం చేత అది సమాధి అని అనిపించుకుంటుందా? ఏకాగ్రము నిత్యతృప్తము, అబాధితము అయిన ఆత్మ వస్తువును దర్శించటమే సమాధి. అట్టి సత్యవస్తు అవలోకనమే పరాప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞయే పరాకాష్ఠ.
ఎవ్వడైతే క్షోభ, అహంకార రహితుడై ద్వంద్వములలో తగులుకోకుండా ఒక కొండలాగా స్థిరమైన ఆకృతి కలిగి ఉంటాడో అట్టివాడే సమాధి స్థితుడు. అట్టివాడు నిశ్చింతను స్వభావపూర్వకంగా కలిగి ఉంటాడు. ఆతడు పొందవలసినది పొందినట్లే. ఆతనికిక త్యజించవలసినది గాని, స్వీకరించ వలసినదిగాని, ప్రాప్తించినదిగాని, ప్రాప్తించనిదిగాని ఉండవు. పరిపూర్ణ మనోగతుడై ఉంటాడు.
అట్టి జ్ఞానయుక్త మనస్కునకు నిరంతర సమాధి సిద్ధించినట్లే! పిల్లలు వ్రేళ్ళతో పట్టుకున్న దారం కొంచం గట్టిగా లాగగానే తెగుతుంది. సమగ్రము జ్ఞానయుతము అగు అవగాహన లేకుండా కేవలం మనస్సును బలవంతంగా భౌతికమైన సమాధిలో కూర్చోబెడితే, అది ఎప్పుడో విచ్ఛిన్నం అవుతుంది. జ్ఞాని యొక్క సమాధి విచ్ఛిన్నం కాదు. ప్రాపంచిక విషయములతో వ్యవహరించ వలసి వచ్చినప్పటికీ ఆతని సమాధి (లేక) సమాహిత చిత్తము యథాతథంగానే ఉంటుంది.
సూర్యుడు రోజంతా లోకములను ప్రకాశింపజేస్తున్నాడు. ఆ సమయంలో ఏమైనా విరామం కోరుకుంటున్నాడా? లేదు. దృఢ సంస్కారబలంచేత జ్ఞాని యొక్క బుద్ది కూడా ఆత్మతత్త్వావలోకనంలో ప్రవేశించి, ఇక మరింకెక్కడో విశ్రాంతి విరామములను కోరుకోదు. జలం ప్రవహిస్తూ ఉండగా ఒక్కక్షణమైనా ఆగుతుందా? ఆవరణ నాశనముచే విజ్ఞాన దృష్టి (లేక, బోధ స్థితి లేక ఆత్మజ్ఞానం) ఏర్పడే వరకు జ్ఞానమార్గంలో పయనించేవాడు ఆగడు.
న విస్మరత్యవిరతం యథా కాలః కలాగతిమ్ న విస్మరత్యవిరతం స్వాత్మానం ప్రాజ్ఞధీస్తథా || (శ్లో 16, సర్గ 62)
కాలము తనయొక్క ‘గతి’ అను కళను వీడనట్లు, జ్ఞాని యొక్క బుద్ధి ప్రేమాస్పదమగు ఆత్మను ఎన్నటికినీ మరువదు. నడిచేటప్పుడు కాళ్ళకదలిక ఆపనట్లు ఆతని బుద్ధి నిశ్చయస్వరూపమగు
Page:555
చిన్మాత్రమును ఏమరువదు. మిత్రమా! ఆవరణము నశించగానే చైతన్యస్ఫూర్తి విషయరహితమౌతుంది. ఆ చైతన్యస్ఫూర్తి ఇక ఎల్లప్పుడూ ఆత్మాకారవృత్తి కలిగి ఉంటుంది.
ఏ పదార్థమైనా ‘సత్త’ లేకుండా ఉంటుందా? జ్ఞానికి "ఆత్మాకార వర్జితమగు సమయం” అంటూ ఏదీ ఉండదు. “నేను లేను. కానీ ఈ పదార్థములు ఉన్నాయి” అన్న ప్రసక్తి ఎక్కడన్నా ఉంటుందా? “సద్గుణవంతుని నీచపనులు” అనునది ఉండదు కదా! నీచపనులు చేసేవాడు సద్గుణ
వంతుడెలా అవుతాడు?
ఆత్మజ్ఞానికి ఆత్మను ఉపాసించని సమయమంటూ ఏదీ ఉండదు. ఆతని ఆత్మోపాసన అనుక్షణికం. పరిస్థితులు ఎలా ఉన్నా అవి ఆత్మజ్ఞానిని స్పృశించలేవు.
సర్వదా స్వస్వరూపముచే నేను ఆత్మనే. కనుక నిర్మలుడనై శాంతాత్ముడనై ఉన్నాను. అనగా సమాధి నిష్ఠుడనై ఉన్నట్లే. ఎద్దానితోనూ ఏ భేదమూ నాకు కనిపించుటలేదు. నా సత్త ఎల్లప్పుడూ ఆత్మయందే, అఖండమగు ఆత్మగానే సిద్ధిస్తోంది. నాసత్త యొక్క ఒక కళమాత్రమే ఈ మనస్సు.
మనస్సు ఉన్నదంటే సమాధిరాహిత్యం ఉన్నట్లే. అందుచేత ’మనస్సుతో సమాధిని అభ్యసించటం’ అనేది ఎక్కడుంటుంది? మనస్సుకు స్వకీయమైన ఉనికి-రూప గుణములు ఎక్కడున్నాయి.
మనస్సుకు సమాధినిష్ఠ కలగటమనేదే ఉండదు… సర్వదా నిత్యమగు ఆత్మతత్త్వమొక్కటే ఉన్నది… ఆత్మ ఒక్కటే సర్వవ్యాపకమై సర్వరూపములుగా ప్రసరించుచున్నది… ఆ అఖండ, అప్రమేయ ఆత్మయే నేను… ఆత్మకు వేరుగా ‘మనస్సు’ అనబడేదేదీ లేదు.
ఇక నాకు సమాధి ఏమిటి? అసమాధి ఏమిటి? మనస్సు ఏమిటి? దానిని నియోగించట మేమిటి? నియోగించలేకపోవటమేమిటి?… నా దృష్టిలో మనోబుద్ధులనబడేవి ఉండుటయే లేదు.
కార్య కారణ పరిణామ విభాగరహితులగు మహాత్ములు నిత్యం సర్వస్థితు లందు సమాహితత్వం కలిగి ఉండగలుగుచున్నారు. ఇక అక్కడ సమాధి, అసమాధి భేదములను కల్పించే వాక్యములకు చోటు ఉండటం లేదు.
నిర్మొహమాటమైన నా అభిప్రాయం మరొక్కసారి వినండి. సర్వభేదములు చేరలేని ఆత్మయే నా స్వరూపం, స్వభావం, స్వస్థానం కూడా! నేను ఇప్పుడూ, అప్పుడూ, ఎప్పుడూ ఉపాధి రహితుడనే, ఇక, నేను-నీవు-మనస్సు మొదలైనదంతా నా చిత్కళయే.
పరిఘ మునీంద్రుడు : ఓ నేస్తం! మీరు నిజంగా జ్ఞానవంతులే! పరమమగు బ్రహ్మపదమును పొందారు. తత్ఫలితంగా పూర్ణచంద్రుని వలె శీతలాంతఃకరణము కలిగి వెలుగొందుచున్నారు. మధుర రసపూర్ణులై ‘ఆనందము’ అనే సంపదచే సేవించబడుచున్నారు. శీతల, లేత, సుందర కమలము
Page:556
వలె విరాజిల్లుచున్నారు. మీ పలుకులు నిర్మలంగా, విశాలంగా, పూర్ణంగా గంభీరప్రకటాశయ యుక్తంగా ప్రభవిస్తున్నాయి.
ఆహా! స్నేహితుడా! మీరిప్పుడు స్వచ్ఛంగా ఆనందపూర్ణంగా, అహంకారమేఘరహితంగా, ప్రత్యక్షంగా, విశాలంగా, గంభీరంగా, ఉండే శరత్కాల ఆకాశంలాగా విరాజిల్లుచున్నారు. ఇష్ట, అనిష్ట సర్వవిషయములందు సమరూపులై కన్పట్టుచున్నారు.
సారాసార పరిచ్ఛేద పారగస్త్వం మహాధియా |
జానాసి సర్వమేవేదం యథాస్థిత మఖణ్ణితమ్ ॥ II (శ్లో 6, సర్గ 63)
ఉత్తమ బుద్ధిచే సార, అసారములను నిర్ణయించి పారంగతులయ్యారు. “ఈ దృశ్య జగత్తంతా అఖండపూరమై బ్రహ్మముగానే, యథారీతిగా ఉన్నది” - అనునట్టి ఉత్తమోత్తమజ్ఞానం పొందారు.
ఇక్కడ కనబడే ఉత్పత్తి. నాశనముల రహస్యమేమిటో గ్రహించారు.
ఇక్కడి ఆరోహ, అవరోహములచే (ups & downs) ప్రేరితమగుచున్న ’చంచలరాగ దశలు’ మీ యందు చోటు చేసుకోలేక పోతున్నాయి. దేని కంటే ఇక ఉత్తమమైన వస్తువు ఈ ప్రపంచం మొత్తంలో ఇంకొకటేదీ లేదో, ఉండబోదో, అట్టి నిజాత్మ వస్తువు పొందినవారై స్వమహిమ యందు పరితృప్తులై ఉన్నారు.
ఆత్మ - పరమాత్మయగు మీ కిదే నమస్కరిస్తున్నాను. మీ అవగాహన విషయమై మరికొంత వినాలని నా అభిలాష.
సురఘురాజు : మునీంద్రా! ఈ దృశ్యప్రపంచ మంతా మిథ్యయే కదా! కనుక మనకిక్కడ గ్రహించ దగ్గ పదార్థ మంటూ ఏదీ లేదు. గ్రహించ వలసినదే లేనప్పుడు, త్యజించ వలసినది మాత్రం
ఏముంటుంది?
గ్రహిస్తే కదా… త్యజించేది! “ఇది ఉత్తమము… ఇది తుచ్ఛము” - అను వ్యవహారమంతా కేవలం దేశ కాలముల వలననే సంభవిస్తోంది. విజ్ఞుల అభిప్రాయం ప్రకారం, తుచ్ఛాతుచ్ఛములకు సంబంధించిన నిందా-స్తుతులను త్యజించివేయాలని కదా! దేశ కాలవశం చేత ఇప్పుడు ప్రాముఖ్య మైనది మరొకప్పటికి, ఒక నాటికి తుచ్ఛంగా కనిపిస్తోంది. ఈ విషయం ప్రతి ఒక్క జీవునికి అనుభవమగుచున్న విషయమే.
“అసలు నిందాస్తుతులు ఎందుకు కలుగుచున్నాయి?" అని మనం విచారణ చేస్తే “రాగము చేతనే” అని సమాధానం లభిస్తోంది. రాగము ఎట్లు ఉద్భవిస్తోంది?… ఇచ్ఛ వలననే.
ఇచ్ఛయో? …అజ్ఞానంలోంచి, అజ్ఞానంచేత బయలుదేరుతోంది. కనుక బుద్ధిమంతుడైనవాడు మహోదారమగు బ్రహ్మపదార్థముచే ఇచ్ఛగించుతాడు. ఇంకదేనినీ కాదు.
ఈ ముల్లోకములందూ గల స్త్రీ-పర్వత-సముద్ర-వనములు, సమస్త ప్రాణులు, పృథివి, పంచ భూతములు ఇవన్నీ వాస్తవరహితములే. వీటన్నిటి యందు సారమంటూ ఏదీ లేదు.
Page:557
ఈ పురాతన శూన్యజగత్తునందు ఉన్నదంతా మాంస - అస్థి - కాష్ఠ - మట్టి - శిలామయమైనది మాత్రమే. ఇందులో మనం ఇచ్చగించవలసిందీ, వాంఛించవలసిందీ ఏముంటుంది? ఇచ్ఛ నివృత్తి కాగా, రాగద్వేషములు సంక్షయిస్తాయి. ఇంక అనేక మాటలెందుకు? ఎప్పుడైతే ఈ మనస్సు సర్వత్రా రాగద్వేషరహితమై శాంతమై, ఆత్మైకరసమై తన ఆత్మయందు కేవలం పరితృప్తి పొందుతుందో - అదియే ఉత్తమ ప్రతిష్ఠ. అదియే విశ్రాంతి. అదియే సమాధి. అదియే యోగము, జ్ఞానముకూడా.
వారిద్దరు ఒకరినొకరు ఆత్మదృష్టితో సందర్శించుకుంటూ తెల్లవార్లూ సంభాషించుకున్నారు. మరునాడు వారు ఒకరి వద్ద మరొకరు సెలవు తీసుకుని, తమ తమ నియతిని అనుసరించి మార్గ పరాయణులయ్యారు.
శ్రీవసిష్ఠ మహర్షి : రాఘవా! మాండవ్యుల బోధ, సురఘు, పరిఘ (పర్ణాదముని)ల సంభాషణ విన్నావు కదా! వారి సంభాషణలోని అంతర్లీనగానమును విను. నీవు కూడా అట్టి జ్ఞానముచే ఇక్కడే పరమపదలాభమును సంపాదించు. అందుకొరకై ధీరులగు విజ్ఞులతో కలిసి చక్కగా విచారణ చేయి. ఉత్తమమైన ’సుతీక్షబుద్ధి’చే హృదయాకాశంనుండి ‘అహంకారము’ అనే కాలమేఘమును నశింపజేయి. సకలలోకాతీత ప్రాప్తము, ఆనందకరము, నిర్మలము అయిన చిత్తము నీయందు ప్రవేశించుగాక!
సర్వులలో అంతర్హితుడై ఉంటున్న ఆ పరమాత్మ ఒక్కడే ధ్యానయోగ్యుడు! … అతడే శరణువేడ తగినవాడు! …ఆతడే మన స్వస్వరూపుడవటంచేత ఆతనిని ఆరాధించటం అత్యంతతేలికైన విషయమే! …అదే సర్వానంద సంపత్తి స్వరూపం! …సుప్రసన్నం. చిదాకాశస్వరూపం!
అట్టి పరమాత్మ యందే స్థితి కలిగియుండు. నిత్యము ఆత్మవిచారణ తత్పరుడవై ఉండు. అంతర్ముఖుడవై, సుఖరూపుడవై చిదాస్వాదనపరుడవై ఉండు. అప్పుడిక నీ చిత్తము దుఃఖములచే పీడించబడే ప్రసక్తే ఉండదు. బాహ్యంలో కనబడే వ్యవహారతత్పరత, రాగద్వేషములు, జలము పద్మమును తాకనట్లు నీ అంతఃకరణమును కలుషితం చేయలేవు. నీవు వాటన్నిటికంటే మహత్తర స్వరూపుడవని గ్రహించు. ఏనుగు సింహమును బాధించగలదా? ఉత్తమ జ్ఞానంతో శాంతచిత్తుడవై ఉంటే, ఈ మనస్సు నిన్నేం చేస్తుంది? ఎట్లా బాధిస్తుంది.
నందనవనంలో ముళ్ళ చెట్లు ఉంటాయా? జ్ఞానియొక్క చిత్తములో భోగలంపటం ఉండదు. ఆతడు అనేక దీనదశలను పొందవచ్చుగాక! ఆతని చిత్తం మాత్రం తన విశాలరూపమును త్యజించదు. క్షుద్రమగు విషయ సుఖములను కాంక్షించక, కేవలం ఆత్మ వైపునకే అభిముఖమై ఉంటుంది. ఇక్కడి ఇంద్రియవిషయములకు ఎవడైతే అనురక్తుడై ఉంటాడో, ఆతడే ఇక్కడి జనన-మరణాదులను
Page:558
చూచి దుఃఖములను పొందుతాడు. ఏ చిత్తమైతే సమస్తమును విచారించి, “ఈ ఇంద్రియాలు, విషయాలు, శరీరాలు, తదితర దృశ్యములు అవిద్యయే! మిథ్యాభ్రాంతియే" - అని ఎరుగుచున్నదో, అద్దానికి ఇక దుఃఖం ఎక్కడినుండి వస్తుంది?
శ్రీరాముడు : మహర్షీ! మనస్సుకు ’కర్తృత్వం (నేను కర్తను) అనుదోషం తొలగాలంటే ఏం చేయాలి? శ్రీవసిష్ఠ మహర్షి : రామా! ముందుగా ఈ మనస్సు పొందుచున్న మోహం, భ్రమల గురించి గమనించు. క్రమక్రమంగా అప్రమేయత్వమును అలవరచుకో. చక్కగా ఈ మనస్సు పొందుచున్న భావాభావములను గమనించావా… కర్తృత్వాభిమానం తనంతటతానే తొలగుతుంది. అది నిన్ను స్పృశించనైనా లేదు.
‘అవిద్య’ అనే చీకటిలో దీపం ఒక్కటే….! అది, “ఈ జగత్తు అవిద్య చేతనే అనుభవమగు చున్నది.” అనే ఉత్తమ జ్ఞానం ఉదయించటమే! స్వప్నంలో పులులు, గండు పిల్లులు నిన్ను భయపెడు చున్నాయి అనుకో!… ఆ భయం పోయేదెట్లా? “ఇది స్వప్నం” అని గ్రహించుట చేతనే కదా! అవిద్య కూడా అంతే. ‘ఇది అవిద్య’ అని గ్రహిస్తే చాలు… అది తొలగిపోతుంది, తొలగిపోయినట్లే!
చేపలు నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఆ నీళ్ళు చేపల కళ్ళను స్పృశించలేవు చూచావా! నీవు వ్యవహార పరుడవై ఉన్నప్పటికీ అంతరమున సంసారాసక్తుడవు కావద్దు. కేవలం బ్రహ్మమునందే నిమగ్నమైన బుద్ధిని కలిగి ఉండు. అప్పుడు కర్తృత్వ దోషములు, దుఃఖములు నిన్ను స్పృశించలేవు. ప్రదీప్తమగు చైతన్యమయ ప్రకాశం ప్రసరించుచుండగా అజ్ఞానాంధకారం క్షయించక ఏం చేస్తుంది?
తత్వజ్ఞాని యొక్క బుద్ధి స్వతహాగా పరమానందమును పొంది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జీవుడు జ్ఞాన సూర్యునిచే ప్రబోధితుడైనాడా, ఇక మరెప్పుడూ మోహము పొందడు. ఏ రోజులలో హృదయాకాశంలో ఆత్మచిత్భావన విస్తరిస్తుందో ఆ రోజులే జీవసహితములు. అట్టి క్రియలే ఆనంద యుక్తములు. నిరంతరాత్మచింతనచే మోహము తొలగి అంతఃకరణము శీతలత్వం పొందుచున్నది.
తాని మిత్రాణి శాస్త్రాణితాని తాని దినాని చ ।
విరాగోల్లాసవాన్యేభ్య ఆత్మచిత్తోదయః స్ఫుటమ్ ॥ (శ్లో 19, సర్గ 63)
ఎవరివల్లనైతే ఈ చిత్తము వైరాగ్యోల్లాసయుతమై ఆత్మాకారవృత్తిచే అభ్యుదయం పొందుతుందో, అట్టి వారే ఈ జీవునకు నిజమైన మిత్రులు. అట్టి శాస్త్రములే ఆప్తశాస్త్రములు. ఆ రోజులే రోజులు.
ఆత్మ దర్శనము నందు అనాదరణ కలిగి ఉన్న జీవులు దీనులు. ఎందుకంటే వారు ఈ జనన-మరణ చక్రము నందు అనేక దుఃఖములను పొందుచున్నారు.
ఈ జీవుడు అనేక విధములైన ఆశాపాశములచే నిరంతరం బంధింపబడుచున్నాడు. భోగ తృణములను అపేక్షిస్తూ అనేకసార్లు వార్ధక్యముచే కురూపుడగుచున్నాడు. శోకములు, దుఃఖములు పొందుచున్నాడు. దుష్కర్మలచేత, మోహంచేత, రాగం చేత, తృష్ణలచేత ఈడ్వబడుచూ, ‘మనస్సు’ అనే గృహంలో బంధితుడగుచున్నాడు. పుత్ర, స్త్రీ, బంధువులతో ఏర్పడే ‘నావి, నావి’ అను దురవగాహన లన్నీ చివరికి అతనికి బంధనములు అవుచున్నాయి. వార్ధక్యము - దుష్కర్మలు ఆతని విశ్రాంతిని
Page:559
అనుక్షణం దూరం చేస్తున్నాయి. అతడు ఇహ - - పరలోకములకు రాకపోకలు సాగిస్తూ అలసిపోయి తీవ్ర మనఃతాపముచే తప్తమగుచున్నాడు. పైకి పచ్చగా కనబడుచున్నాకూడా, అంతఃకరణంలో మాత్రం అతిదీనుడై ఉంటున్నాడు. భూత భవిష్యత్తుల గురించి అనేక చింతనలతో సతమతమగు చున్నాడు. తన ఇంద్రియములచే తానే పరాజితుడగుచున్నాడు. నిత్యం కామ్యకర్మలచే ఆకర్షితుడ గుచున్నాడు. ఆవిర్భావ - తిరోభావములను మోస్తూ అజ్ఞానమహారణ్యంలో సొమ్మసిల్లి నేల కూలుచు న్నాడు. అనర్థములు - దుఃఖములు - దారిద్ర్యములు మరలమరల పొందుచున్నాడు. కర్మభారములచే శిథిలశరీరములతో ఆక్రందనం చేస్తున్నాడు.
ఎద్దువంటి ఈ జీవుని మనస్సు ‘సంసారము’ అనే బురదలో కుతిక్కాయ వరకు లేవలేనంతగా చిక్కుకుని ఉన్నది. ఉత్తమ ప్రయత్నముచే జ్ఞానబలం సంపాదించి ఆ మనస్సును బురద నుండి బహిర్గతం చేసినప్పుడు మాత్రమే మానవజన్మకు ప్రయోజనమున్నట్లు.
ఆత్మను దర్శించినప్పుడు మాత్రమే చిత్తము క్షయిస్తుంది. అప్పుడు భ్రమలన్నీ పోతాయి. జ్ఞానముచే ఆత్మ దర్శించబడగలదు. అయితే జ్ఞానం ఎలా లభిస్తుంది? నావికుని వలన నౌకాయానం లభించునట్లు మహానుభావుడగు జ్ఞాని యొక్క సాంగత్యముచే ఈ సంసారసాగరాన్ని దాటటానికి యుక్తి లభిస్తుంది. ఎక్కడ జ్ఞానిలేడో… ఆ ప్రదేశం నివాసయోగ్యమే కాదు. జ్ఞాని యొక్క వచనముల చేత, అభిప్రాయములచేత, భావతరంగాలచేత అతడు ఉన్నచోటు పరమ పవిత్రం అవుతుంది. సజ్జనులగు జ్ఞానులవలన ప్రపంచమునకు ప్రశాంతత, జీవులకు విశ్రాంతి లభించగలదు.
కొంచెము వివేకము ఆవిర్భవించినట్టి ధీమంతుడు ఇక నిదురపోకూడదు. ఏది ఏమైనా సరే, మహామోహదాయకము, సంతాపదాయకము అయినట్టి ఈ ప్రపంచము నందు ఆదమరచి ఉండరాదు. ఆత్మలాభం ప్రాప్తించేవరకూ నిరంతరం యత్నశీలుడై ఉండాలి. అంతేకాని, దేహాభి మానంతో మాన-మద-గర్వాదులతో ‘జన్మలు’ అను బురదలోకి తనను తాను త్రోసివేసుకోరాదు.
కిమిదం కథమాయాతం కింమూలమితి కింక్షయమ్ | దేహదుఃఖమితి ప్రాజ్ఞః ప్రేక్షణీయం ప్రయత్నతః ॥ (శ్లో 36, సర్గ 64)
ఈ దేహమేమిటి? దేహ సంబంధములగు దుఃఖాదులేమిటి? ఇవన్నీ ఎట్లా కలుగుచున్నాయి? వీటికి మూలమేమిటి? ఇవి ఎట్లా తొలగుతాయి? … బుద్ధిమంతులు ఈ విధమైన ప్రశ్నలకు రావాలి. వచ్చి ప్రయత్నపూర్వకంగా విచారణ చేయాలి.
ఆత్మజ్ఞానులను సమీపించి సమాచారం సేకరించాలి. ఓ మిత్రులారా! శ్రోతలారా! ధనము గాని, మిత్రులుగాని, ఆత్మజ్ఞానమునకు వేరైన శాస్త్రములుగాని అజ్ఞాన సాగరమున నిమగ్నమైన జీవుని ఉద్ధరించగలవని అనుకుంటున్నారా? లేదు.
నిరంతర సహవాసంతో శుద్ధమనస్సును ఆశ్రయించండి. అట్టి శుద్ధమనస్సుతో కొంచెం పరామర్శించి చూడండి. ఈ మాత్రం చేత ఆత్మోద్ధరణ సంభవమగుచుండగా అట్టి ప్రయత్నం
Page:560
చేయరెందుచేత? అరె! ఉత్తమమగు మానవజన్మచే లభిస్తున్న అనేక అవకాశములను బూడిద చేసుకుంటున్నారే! అది సరికాదు. అభ్యాస, వైరాగ్యములతో యత్నం చేయండి. తత్త్వజ్ఞానం సంపాదించటంలో తాత్సారం చేయవద్దని అందరికీ మనవి చేస్తున్నాను. దురాశచే ఏర్పడే శోక మోహముల విన్యాసమేమిటో గమనిస్తూ కూడా, ఉపేక్షిస్తూ ఉంటే ఎట్లా? అందుచేత ఆదరణపూర్వకంగా ఆత్మోద్ధరణకు నడుం కట్టండి. సన్మార్గంలో అహంకారం నశించేవరకూ విచారణను ఆశ్రయించండి. ఈ దేహమును “మట్టి - కొయ్య శిల వంటిది”గా చూడటం అభ్యసిస్తూ ఉంటే చాలు… క్రమంగా సర్వదేవేశుడగు ఆ పరమాత్మ గూర్చిన జ్ఞానం లభ్యం కాగలదు. అహంకారం నశిస్తూ ఉండగా, చిద్రూపము ప్రకటితమగుచూ రాగలదు. వెలుగు రాగానే చీకటి ఎక్కడికో వెళ్ళిపోవుచున్నట్లు, అహంకారం నశిస్తూ ఉంటే ఆత్మదర్శనం స్వయంగా సిద్ధించగలదు. అప్పటి నిరతిశయానందంచే ఏర్పడే విశ్రాంత, నిర్వికల్పస్థితియే పరిపూర్ణస్థితి. అందుకు మనం అందరం అర్హులమే. అయ్యది మన స్వస్వరూపస్థితియే అయిఉన్నది కదా! ఇక అనర్హత ఎందుకుంటుంది? … అందుకు ప్రయత్నించనప్పుడు మానవునికి ఇక జంతువుకు భేదమేమున్నట్లు?
విషయరహితమగు మనస్సుతో సాటివచ్చేదేదీ ఈ మూడు లోకాలలోనూ లేదు. అందు దృశ్యం కొరకై రాగం ఉండటానికి చోటే ఉండదు. కేవలం చిత్ప్రకాశం మాత్రమే అంతటా ఆక్రమించు కొని ఉంటుంది. ఇక నిర్వికల్పసమాధి అయినట్టి తురీయదృష్టి పొందావా… దానితో పోల్చతగినది మరేదీ ఉండదు. దానికదే సాటి. ఆ స్థితిలో విక్షేపములేవీ ఉండవు కనుక సుషుప్తితో పోల్చవచ్చు. అయితే సుషుప్తిలో జడత్వం (ఎరుక లేకపోవటం) ఉంటుంది. అదిమాత్రమే భేదం. ఆ అవస్థ ఆకాశమువలె సర్వవ్యాపకమైనది.
ఒక చోట ఒక కుండ ఉన్నదనుకో! ఆ కుండ పగిలితే కుండలోని ఆకాశం ఏమౌతుంది? మహాకాశంతో ఏకత్వం పొందుతుంది. అయితే, కుండలోని ఆకాశము మహాకాశము నుండి వేరు పడినదెప్పుడు? ఎప్పుడూ లేదు. అట్లాగే ఏ జీవునియందు మనోహంకారాలు తొలగుతాయో, ఆతనికి సర్వపదార్థములలోని అంతరమున ఉన్న పరమసత్యము గోచరించగలదు. ఆ పరమసత్యమే ‘తత్’. ఆ తత్రే’త్వమ్’. అదియే నీవు. రామా! అట్టి స్థితి స్వయముగా యోగముచే సిద్ధించగలదు. అది సుషుప్తికి దూరాతి దూరమేమీ కాదు. కానీ సుషుప్తి కానే కాదు. అయితే అది వాక్కుకు అతీతమైనది. అది ఈ జీవునికి హృదయములోనే అనుభూతమగుచున్నది సుమా!
అనుభూతిం వినా తత్త్వం ఖణ్ణాదేరానుభూయతే ॥
అనుభూతిం వినా రూపం నాత్మనశానుభూయతే ॥ (శ్లో 53, సర్గ 64)
అనుభవం అనేది లేకపోతే సామాన్యములైన చక్కెర, పటికబెల్లం మొదలైనవాటి తత్వమే గోచరించదు. ఇక ఆత్మానుభవం గురించి వేరుగా చెప్పాలా? ‘అనుభవం’ అనేది లేకపోతే ఆత్మస్వరూపం కూడా గోచరించదు.
Page:561
ఈ జగత్తంతా అనంతాత్మ స్వరూపమే. ఇక చిత్తముయొక్క బాహ్యవిషయములంటావా, ఇవన్నీ పరిణామయుతములు. కొంతకాలం గడచిన తరువాత ఇవి ఇట్లా ఉండవు. ఇట్టి దృశ్యమును పట్టుకుని వ్రేళ్ళాడవలసిన పనేమున్నది? అందుచేత రామా! ఈ బాహ్యవిషయములు నీచే శమించి వేయబడుగాక! సర్వత్రా దీప్తమై, బ్రహ్మాది దేవతలకు దేవదేవుడై వెలయుచున్న ఆత్మ నీపట్ల అనుభూతమగుచు, ప్రకటితమగుగాక!
పంచమ భూమికయందు విషయవాసన నశిస్తుంది. ఆరవ భూమికయందు పరమపురుషార్థమగు ఆత్మప్రకాశము ఉదయిస్తుంది.
ఏడవ భూమికలో సమాధి, అసమాధులు ఏకత్వాన్ని సంతరించుకుంటాయి. అట్టి సమత్వ కారణంచేత బ్రహ్మాదులకుకూడా అచింన్యమైనట్టి ‘కేవలానందైక స్వరూపం’ అను ఆత్మానుభవం శేషిస్తోంది.