Page:562
IX. భాస - విలాస సంవాదం
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఆధ్యాత్మికయానం సుమార్గం కావాలంటే అభిమానత్యాజ్యం ఎంతో ఆవశ్యకం సుమా!
శ్రీరాముడు :‘అభిమానం’ అంటే తమ ఉద్దేశం?
శ్రీవసిష్ఠమహర్షి : "ఈ ధనము, గృహము, బంధు జనము మొదలైనవి నావి. ఈ శరీరమే నేను” అని అనుకోవటమే అభిమానం. మనస్సుతో అభిమానమనే మనో విభాగమును జయించి, ఆ మనస్సుతో ఆత్మదర్శనం చేయాలి. అభిమానమును జయించకుండా, దానిని కలిగియుండి ఎంతగా శాస్త్రాలు చదివినా, ఏమి విన్నా… ఏం ప్రయోజనం? చిత్రపటంలోని సూర్యుడు కిరణములను ప్రసరింపజేయగలడా? లేదు కదా! అహమ్, మమ అను భ్రమాత్మకమగు అభిమానం త్యజించకపోతే ఈ జగత్ దుఃఖం అస్తమించదు. అది ఉన్నంత వరకు ఆపత్తులు, వ్యాకులతలు, అజ్ఞాన బీజాంధకారాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఈ విషయమే నిరూపిస్తూ ’ 6 భాస - విలాస సంవాదం’ అనే ఒక ప్రాచీన ఇతిహాసం ఉన్నది. అది వింటే అభిమాన త్యాజ్యము యొక్క ఆవశ్యకత ఏమిటో మరికొంత సుస్పష్టమౌతుంది. చెపుతాను. విను.
సహ్యపర్వత ప్రాంతం అతి సుందరమై ఒప్పుతూ ఉంటుంది. ఆ పర్వత ప్రాంతంలో మానవ - కిన్నెర - సిద్ధ - విద్యాధర - సాధువులకు నివాసయోగ్యమై, అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఆ పర్వత ప్రాంతంలో ఒక చోట అత్రిమహాముని ఆశ్రమమున్నది. ఆ ఆశ్రమానికి కొంచెం దగ్గరలో శుక్రుడు, బృహస్పతి అను పేరు గల ఇద్దరు తాపసులు నివసిస్తూ ఉండేవారు. పేరుచే మాత్రమే గాని, వీరివురు దేవ, దానవ గురువులు కారు. ఆ ఇద్దరూ ఆప్తమిత్రులు. ఇద్దరూ శాస్త్ర విషయాలలోను, తపస్సు, ధ్యాననిష్ఠలందు గొప్పనిష్ణాతులు. వాళ్ళిద్దరికి విలాసుడు, భాసుడు అనే పేరుగల కుమారులు ఉండేవారు. ఆ భాస, విలాసులిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతూ ఏకమనస్కులై, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. చిన్నప్పటి నుండి అక్కడి ఆశ్రమధర్మములైన తపోధ్యానములు కలిసి నిర్వర్తిస్తూ ధ్యానవిషయములు వింటూ తమ తండ్రులకు అత్యంత ప్రీతిపాత్రులై ఉంటూ ఉండేవారు.
కొంతకాలం గడిచింది. భాస, విలాసులు యౌవనంలో ప్రవేశించారు. అంతా కాలముయొక్క మహిమయే కదా! కాలగతిని ఎవరు నిరోధించగలరు? అనుక్షణిక గమనశీలం అగుకాలం మౌనంగా, ఏది ఎట్లున్నా, తాను మాత్రం గతిస్తూ, స్థితి గతులను తన రీతిలో మార్చివేసుకుంటూ పోతుంది కదా! ఆ శుక్ర బృహస్పతులు కొంతకాలానికి వార్ధక్యము పొంది గూటిని విడిచిన పక్షుల వలె
Page:563
భౌతిక దేహములను త్యజించి స్వర్గస్థులైనారు. తండ్రులు మరణించడంచేత భాస, విలాసులు జలము నుండి పెరికి వేయబడిన కమలద్వయమువలె దీనులు, ఉత్సాహరహితులు, సంతప్త హృదయులు అయ్యారు. తండ్రులకు దహనక్రియలు యథారీతిగా నిర్వర్తించారు. మహాత్ములు లోకరీతిని ఉల్లంఘించరు కదా!
వారిద్దరూ చింతాగ్రస్థులై పెద్ద పెట్టున దుఃఖిస్తూ చేష్టారహితంగా అక్కడక్కడే కొద్దిరోజులు గడిపారు. తమ తండ్రులతో ఏర్పడిన అనుబంధం చేత, వారు విరక్తి, అనురక్తి, వేదనల నుండి ముక్తులు కాలేకపోయారు. ఒక రోజు వారిట్లు సంభాషించుకున్నారు –
భాసుడు : మిత్రమా! చూచావా! మనం తండ్రులను కోల్పోయాము. అయితే శరీరధారులందరికీ ఎప్పటికో అప్పటికి మృత్యువు అనివార్యమే కదా! అయినా వారినుండి వియోగం మనం భరించలేక పోతున్నామే! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించు.
విలాసుడు : ఔను. తేనెటీగ ఒక పుష్పము వదిలి మరొక పుష్పమును ఆస్వాదించునట్లు ఈ జీవుడు ఆత్మజ్ఞాని కానంతవరకూ, ఒక శరీరమును వదలి మరొక శరీరమును గ్రహిస్తూ ఉంటాడు. కనుక మృత్యువు అనునది అత్యంత సామాన్యమైన దినచర్య వంటిది. ఈ విషయం మన తండ్రుల నుండి మనం అనేకసార్లు విన్నాం. అయినా, మన తండ్రుల నుండి మనకు కలిగిన ఈ వియోగం అత్యంత దుర్భరంగా ఉన్నది. ఎందుచేతనో మరి?
భాసుడు : ఎందుచేతనంటే, మనం ఎన్నో జ్ఞానవిషయాలు విన్నాం కాని, మనకు అనుభవజ్ఞానం లేదు. ఇక్కడ ఎంతకాలంవున్నా, మన మనస్సులు కుదుటపడవేమో!
విలాసుడు : అవును నీవు చెప్పింది నిజం. ఇక ఇక్కడ మనం ఉండటం ఉచితం కాదు. ఉండి చేసే దేమీ లేదు. మనం దేశాటన చేసి లోకాన్ని చూసి అనుభవజ్ఞానం సంపాదిద్దాం.
భాసుడు : మనం వేర్వేరుగా రెండు దిక్కులుగా పోదాం. పదేళ్ళ తర్వాత ఇద్దరం మరల ఇక్కడే కలుద్దాం.
ఇట్లు నిర్ణయించుకొని ఇద్దరూ ఎవరి త్రోవలో వారు అక్కడ నుండి బయలుదేరారు. రోజులు, మాసములు, సంవత్సరములు గడిచిపోయాయి. అనుకున్నట్లుగానే పదేళ్ళ తర్వాత అదే రోజు ఆ ఆశ్రమ ప్రాంతంలో ఒకరినొకరు కలిశారు. ఇట్లు సంభాషించుకున్నారు.
విలాసుడు : నా ఉత్తమ బంధువగు భాసుడా! స్వాగతం. మన వియోగం తరువాత నీవు ఇంతకాలం ఎక్కడెక్కడ సంచరించావు? నీ తపస్సు ఫలించిందా? బుద్ధి సంతాపరహితం అయినదా? విద్య సఫలీకృతమైనదా? ఆత్మజ్ఞానివైనావా? సర్వదా క్షేమమే కదా?
Page:564
భాసుడు : మాననీయుడగు విలాసుడా! నీకు నేను కూడా సుస్వాగతం పలుకుచున్నాను. అమ్మయ్య! సౌభాగ్యవశం చేత నిన్ను మరల కలుసుకోగలిగాను. ఇక నా క్షేమ సమాచారాలు ప్రశ్నిస్తున్నావా? ఈ సంసారము ఏర్పడి ఉన్నంతకాలం నాకు క్షేమం కూడానా? అయ్యో నా రాత!
యావన్నాధిగతం జ్ఞేయం యావతీజ్ఞాన చిత్తభూః | యావతీర్ణో న సంసారస్తావన్మే కుశలం కుతః ॥ (శ్లో 10, సర్గ 66)
జ్ఞేయమగు బ్రహ్మమును ఎరుగనంతవరకూ, కామసంకల్పములు నశించనంతవరకూ, సంసార సముద్రం దాటనంతవరకూ ఈ జీవునకు క్షేమమనే మాటెక్కడిది చెప్పు?
గొడ్డలితో వృక్షమును నఱుకునట్లు చిత్తమునుండి పుట్టే ఆశావృక్షమును మరల చిగురించకుండా మొదలంటా నరికినప్పుడే సౌఖ్యమనే మాట. జ్ఞానము కలుగనంతకాలం సమత్వం ఉదయించదు. సమత్వం లేనంతవరకు ఆత్మబోధ హృదయంలో ప్రవేశించదు. ఆత్మబోధ అనే ఔషధం సేవించకపోతే ఈ సంసారము అనే మహమ్మారి మరలమరల రకరకాల రూపాలలో పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక, ఈ శరీరములు పుట్టటం, బాల్యయౌవనవార్ధక్యమరణములు పొందటం, మధ్యేమార్గంలో ఏర్పడి ఉండే బంధు, సంపదల కొరకై రోదన - వేదనలు ఈ విధంగా చర్వితచరణంగా జరిగిపోతూనే
ఉంటుంది.
జీవించి ఉన్నంతకాలం ఈ విధంగా అనేక మనోవ్యాకులతలతో కాలం గడచిపోతోంది. ఇక మరణించిన తరువాతనో, పశువు మొదలైన యోనులందు జన్మించి పాపకర్మల ఫలితం అనుభవించ వలసిందే కదా! కాదంటావా, స్వర్గాదులను చేరి పూర్వసంచితమైన పుణ్యకర్మల ఫలితం అనుభవించాలి. నా దృష్టిలో ఈ రెండూకూడా విరసములూ, నీరసప్రాయములే అయి ఉన్నాయి. అదంతా దీర్ఘకాలంగా ఏర్పడి ఉండగల వ్యర్థ ప్రయాసయేనని నా కనిపిస్తోంది. ఒక అనుభవం తరువాత మరొక అనుభవం…. ఈ ప్రయాసకు అంతు ఎక్కడ? విశ్రాంతి ఎక్కడ? శాంతి ఎక్కడ?
అయ్యో! ఈ జీవులు అజ్ఞానభావములు, తృష్ణ అనే సర్పములను ప్రక్కనే ఉంచుకొని విషయ భోగక్రియలందు మరల మరల పొరలుచున్నారే! శుభాశుభముల చేత, న్యూనాధిక దుఃఖముల చేత, అల్పసుఖములచేత అనేక రాత్రింబవళ్ళు గడచిపోతున్నాయి! మిథ్యాక్రియాకారకులగు ఈ జీవులు మిథ్య అయిన క్రియలను, వాటి ఫలములను, దురాశలను, తదనుగుణమైన కర్మలను మరల మరల ఆశ్రయిస్తూ తమ ఆయువును నశింపజేసుకుంటున్నారు. ఈ మనస్సు తన ఉత్పత్తి స్థానమైన పరమాత్మను త్యజించి, వివేకం పోగొట్టుకుని ‘ఆసక్తి’ తృష్ణ’ అనే మత్తు పదార్థములను సేవించి, తూలుతూ ఎటో పరుగులు తీయుచున్నది. పిచ్చి అరుపులు అరుస్తోంది. ‘అభిలాష’ అనే ఒక దుష్టవ్యాధి పొందిన ఈ జీవుడు వ్యర్థంగా పరమ పురుషార్థమును పోగొట్టుకొనుచున్నాడే! మనోచాపల్యం చేత కాబోలు అల్పము, నీరసము అగు విశేషముల వెంట తాను చేసే పరుగులు ఆపలేకపోతున్నాడు.
Page:565
మిత్రమా! ఇక ఈ దేహం గురించి ఏం చెప్పమంటావు? ఇది నిష్ఫలమగు క్రియలచే నీరసం పొందుతోంది. అల్పత్వము, శ్రమ, రోగము, దౌర్బల్యము ఇందులో దాగిఉన్నాయి. ఎండుటాకులాగా ఎప్పుడు నేలకూలుదామా అని ఎదురుచూస్తోంది. ఈ దేహము యొక్క ముఖము రజో గుణముచే కొట్టబడుచున్నదై, పుత్రకళత్రాదుల దురుసువచనములచే అవమానించబడుచున్నదై, కాంతిని పోగొట్టుకొని ధూసరమగుచున్నది. యౌవనకాలంలో మిసమిసలాడుచున్నప్పటికీ ఆ యౌవనం గడచిపోగానే రసవిహీనమై ఎండుటాకువలె మిగులుతోంది. కాలక్రమేణా శుష్కిస్తోంది. వయసు చెల్లుతున్నకొద్దీ ఈ దేహవృక్షం నుండి ఒక్కొక్క భోగశక్తి నేల రాలుతోంది. ఆ యౌవనపు శోభలూ, ఆ పటాటోపాలూ వార్థక్యం వచ్చేసరికి ఎక్కడికి పోతాయో?… రోజులు గడుస్తున్న కొద్దీ బ్రతుకు దీనమగుచున్నదే!
ఒక్కసారి ఈ మనస్సును గమనించండి మిత్రమా! ఇది ‘భోగములు’ అనే విషసర్పములచే పూర్ణమై పైకి పెదవి విప్పలేనట్టి అనేక అంతర్ దుఃఖములను కలిగి ఉంటోంది. ఎందుకో… కారణాలు ఏమిటో ఈ మనస్సుకే తెలియదాయె! చివరికి ఇది ‘మోహాంధకారము’ అనే నూతిలో బావురు కప్పలాగా మిగిలిపోతోంది. నీచ వస్తువులను, తుచ్ఛవిషయక్రమములను ఆశ్రయించటంలో దీనిని కుక్కలతోను గ్రద్దలతోనూ, పందులతోనూ కూడా పోల్చటానికి వీలులేదు. ‘తృష్ణ - - అనురాగము’ అను వాయువీచికలు ఈ మనస్సు అనే పతాకమును క్షణకాలం కూడా స్థిరత్వం లేకుండా రెపరెపలాడేట్లు చేస్తున్నాయి.
ఈ జీవుడు ఎన్నెన్నో ఆశాపరంపరలు కలిగిఉంటున్నాడు. ఆ ఆశల వెనుక ఏవో ఆశయములు …ఆ ఆశయములన్నీ దుఃఖములవైపు, అజ్ఞాన భూముల వైపు అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కర్మలు, వాటిచే ప్రయోజనములు, వాటి నుండి ఏవేవో దుఃఖములు, అవి తొలగటానికి మరల కర్మలు… ఈలోగా పాపము, అల్పము అయిన దృష్టులు… ఏమిటిదంతా? అవిశ్రాంతంగా శరీరం తోనూ మనస్సుతోనూ అనేక కర్మవ్యవహారములలో చిక్కుకున్న ఈ జీవునికి శాంతి కరువు అవుతోంది. “ఇవి నేను చేయవలసినవి… ఇది సంపాదించవలసినవి… ఇవి దాచవలసినవి" అనుకుంటూ ఈతడు రోజులు గడుపుచున్నాడు. ఇంతలో శరీరం వార్ధక్యమునకు, రోగములకు గురి అవుతోంది. ఒక అనుకోని క్షణంలో మృత్యువు అనే గ్రద్ద వచ్చి వాలుతోంది. గ్రద్ద కోడిపిల్లను నోటకరుచుకొని పోవునట్లు ఈ శరీరమును నోట కరచుకొని వెళ్ళిపోతోంది. ఈ జీవుని తెలియని లోకాలలో త్రోసివేస్తోంది.
జీవితము అనే దుష్టనది యౌవనోత్సాహాలు అనే తరంగములతో, కామక్రోధములు అనే సుడులతో ఎటువైపుకో ప్రవహిస్తోంది. అట్టి జీవితము అను దానికి కర్త, భోక్త కూడా అయినట్టి ఈ జీవుడు ఆశ నిరాశల మధ్య మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ తనకు తెలియకుండానే ఎచ్చటెచ్చటికో దొర్లింపబడుచున్నాడు. ‘ధనము, జనము, బాంధవ్యము, ఇళ్ళు, వాకిళ్ళు’ మొదలైన వాటిని చూపించి ఈ జీవితము జీవుని తన వశం చేసుకొని, క్షణకాలం అలరించి చివరికి ఏది ఏమిటో తెలిసే లోపలే దుఃఖమహాసముద్రంలోకి తీసుకొని వెళ్ళి పడవేస్తోంది. ఈ అనంత బంధు మిత్ర సమాగమం,
Page:566
ఆశాపరంపరలు, కాలక్షేపాలూ ఇవన్నీ జీవునిలో సత్యదృష్టిని కకావికలు చేస్తున్నాయి. కాల సాగరంలోకి పోయి కలిగియున్నవన్నీ కలిసిపోతున్నాయి. ఎక్కడా ఏదీ మిగలటంలేదు. అసలీ తతంగమంతా ఏమిటో, ఎక్కడికో, ఎందుకో, ఎప్పటివరకో, ఎవరు ఎవరికొరకు ఎంతకాలంగా కల్పిస్తున్నారో ఏమాత్రం అర్థం కావటం లేదు. అర్థవంతమైనవనుకున్నవన్నీ అనర్ధంగా అయిపోతు న్నాయి. అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఇక ఏమి శాంతి? ఎక్కడి శాంతి? అంతా కూడా అగమ్యగోచరంగా ఉన్నది. "అహా! ఇవన్నీ నా సంపదలు” అనుకున్నవన్నీ క్షణంలో విడచి వెళ్ళు చున్నాయి. లేదా కొద్ది క్షణాల తరువాత ఈ జీవుడే వాటిని విడచి ఎటకో వెళ్ళిపోతున్నాడు.
ఈ జన్మ మృత్యువులు, ఈ చింతలు, ఈ దుష్ట క్రియాచారములు జీవుణ్ణి మలయమారుతంలోని ఎండుగడ్డి పరకలాగా దొర్లించుకుపోతున్నాయే! ఇక్కడి కార్యసముదాయములు చింతలను, ఆర్తులను, ఆందోళనలను కలుగజేయటంచేత ఈ జీవునికి ఒక్కక్షణమైనా విశ్రాంతి ఉన్నదా? లేదు. “ఇది చేశాను, ఇది చేస్తున్నాను, ఇది చేయబోతున్నాను” అను ఒకానొక మానసిక వ్యసనముచే, చింతలచే బంధింపబడిన ఈ ఈ జీవుడు ‘నావారు - కానివారు’ అని తలచుచూ తద్వారా పొందుచున్న రోదన – భేదములకు ఎక్కడైనా అంతు ఉన్నదా? అతిచంచలమగు ఈ మనస్సు క్షణంలో వృద్ధి చెందుతోంది. మరొక క్షణంలో ఏవేవో దీనాలాపనలు ప్రారంభిస్తోంది.
చూచావా సోదరా! ఈ విధంగా ఈ జీవుడు దేహాదులందు ఆత్మబుద్ధి కలిగి ఉంటున్నాడు. అనాత్మరూపములగు అనేక దుఃఖములను తనకుతానే సేకరిస్తున్నాడు. దీనత్వం పొందుచున్నాడు. అనేకసార్లు సుఖదుఃఖములచే జరామరణములచే కొట్టబడుచున్నాడు. ఈ జగత్తు నందు పొరలుచున్న ఈ జనులు రసశూన్యులై, ఎండిన ఆకులవలె చివరికి శైథిల్యమును పొందుచున్నారు. అయినా కూడా కుక్క దాలిగుంటలో కునుకులు తీస్తూ ఏమీ తెలియక ఏదీ గమనించనట్లు వారు ముందూ వెనకా చూచుకోకుండా బ్రతికివేస్తూ అనేక దుర్గతులకు ఎర అగుచున్నారు. అట్టి అసంఖ్యాక అమాయక సంసార జీవులలో ఈ నీ బాల్య స్నేహితుడగు ఈ భాసుడు అనబడే నేను కూడా ఒకడిని. ఇంకేం సుఖం? ఏమి శాంతి?
విలాసుడు : స్నేహితుడా! ఈ జీవుడు - - జీవనములను చాలా చక్కగా విశ్లేషించావు. ఈ సంసార దుఃఖములకు అంతులేని మాట నిజమే. నీవు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం విచారణ ప్రారంభిద్దాం.
మనకు కలుగుచున్న బంధములకు హేతువేమిటి? చిత్తమే కదా! ఒక పాశము వలె బంధ హేతువగుచున్న ఈ చిత్తమును ఖండింపగలిగామా మరింకేమీ అవసరం లేదు. ఒక చిన్న పిట్ట సముద్రమును దాటలేకపోవచ్చు. కాని గరుడపక్షి సప్తసముద్రాలను కూడా దాటివేయగలదు
Page:567
కదా! ‘వివేకం’ అనే బలం సంపాదిస్తే మనకీ సంసారసాగరం చాలా తేలికగా దాటివేసే గోప్పదజలం కాగలదు. ఇదే జగత్తులో దేహాతీతులు, చిన్మాత్రమునందు స్థితిని సంపాదించినవారు కూడా ఉన్నారు. వారు ఒకబాటసారి జనసమూహమును చూస్తున్నట్లు - ఈ శరీరమును తదితర జగత్తును గాంచగలుగుచున్నారు. మనం ఆ మార్గంలో ఎందుకు ప్రయత్నించకూడదు?
ఈ శరీరం అభివృద్ధి చెందవచ్చు. లేదా, సంక్షోభం పొందవచ్చు. శిథిలం కావచ్చు. అయితే ఏం? చిన్మాత్రస్వరూపులం అయినట్టి మనకు వచ్చే లోటేముంటుంది చెప్పు? రథం చెడినంత మాత్రం చేత రథసారథి చెడతాడా? మనస్సు బాగుండవచ్చు. చెడవచ్చు. చైతన్యమునకు ఏమి నష్టం? సముద్ర జలం తరంగముల రూపంలో విస్తరిస్తుందనుకో… ఆ మాత్రానికి సముద్రము యొక్క పూర్ణత్వానికి ఏమి హానియో చెప్పు?
కమలం, జలం కలిసి ఉండవచ్చు. వృక్షం (కొయ్య), జలం కలిసి ఉండవచ్చు. అయినా కూడా కమలము - జలములకు, వృక్షము - జలము ఏమాత్రం సంబంధం లేదు కదా! అట్లాగే మనలోని పరమాత్మ స్వరూపమునకు, ఈ భోగములకూ ఏ మాత్రమైనా సంబంధం ఉన్నదా? లేదు. సముద్రానికి, అందులోని పర్వతానికి సంబంధం లేనట్లే చైతన్యమునకు బంధహేతువగు సంసారమునకు సంబంధమెక్కడిది?
కనుక నేస్తం! ఆత్మకు ఈ దేహమునకు ఏమాత్రం సంబంధం లేదు. నేను, నీవు ఆత్మస్వరూపులం కాని దేహమాత్రులం కాదే! “నా స్వరూపం ఈ దేహమే” అను దేహాత్మ బుద్ధియే నీవు చెప్పిన అనర్థాలన్నిటికీ కారణం. ఆత్మ, దేహముల పట్ల అజ్ఞానం చేత ఏర్పడుచున్న అభేద బుద్ధి కారణంగా సుఖ దుఃఖాది చిత్తవృత్తులు వృద్ధి చెందుచున్నాయి. ఒక దృష్టాంతం విను. ఒక నది ఉన్నది. ఆ నది యొక్క ఒడ్డున ఒక పెద్ద మఱి వృక్షం ఉన్నది. ఆ పెద్ద చెట్టు నదీ జలంలో ప్రతిబింబిస్తోంది. అంత మాత్రంచే ఆ వృక్షానికి నదీజలానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అవి రెండూ ఒక్కటే అవుతాయా? లేదు కదా! అట్లాగే ఆత్మ యందు ఈ దేహాదుల ఉనికి ప్రతిబింబిస్తోంది. అయినా కూడా ఆత్మకు దేహమునకు సంబంధం లేదు. ఆత్మయే మనిద్దరి స్వరూపంగానీ ఈ దేహాదులు కాదు కదా! ఈ దేహము, బుది, ఆలోచన, దృశ్యము మొదలైనవి ఆత్మదేహులగు మనం ఉపయోగించే ‘ఉపకరణాలు’ మాత్రమే కదా!
ఒక దర్పణములో కనబడే, ప్రతిబింబములు సత్యములా? కాదు దర్పణంలో వస్తువు లేదు కదా! పోని అసత్యములా! వస్తువు యొక్క కదలిక ఆ దర్పణంలో కనిపిస్తోంది కదా! “కనబడుతోంది. కాబట్టి అసత్యము” అని అనలేం. అందుచేత “దర్పణంలో కనబడే వస్తుజాలం సత్యం కాదు. అసత్యం కాదు. అనిర్వచనీయం. ఆత్మయందు ప్రతిబింబిస్తున్న ఈ శరీరము, దృశ్యము, అనుభవము, మనస్సు - - మొదలైనవన్నీ అనిర్వచనీయం” అని ఆత్మజ్ఞుల అభిప్రాయం. దృశ్యములో ఏది మారినా, మారకున్నా కూడా అది ప్రతిబింబిస్తున్న దర్పణం ఏ మార్పు చేర్పులూ పొందదు కదా! దృశ్యము యొక్క కలిమిలేములచే ద్రష్టలేక, ఆత్మ ఏమీ పొందడు, కోల్పోడు. కొయ్య, శిల, జలము ఛేదించబడి నప్పటికీ దుఃఖములు పొందుచున్నాయా? లేదు. ఈ దేహము కూడా పృథివి మొదలైన పంచభూత
Page:568
పరిణతియే కదా! దాని సంయోగ వియోగములచే గానీ, అది పునాదిగా కలిగి ఉన్న పుత్ర మిత్రాదులతో ఏర్పడే సంబంధ, బాంధవ్యములచేగానీ హాని, ఆహ్లాదం ఎందుకు ఏర్పడాలి? భాసుడు : ఔను. ఏర్పడవలసిన పనిలేదు. కానీ మిత్రమా! ఈ సుఖ దుఃఖాలు పరిగెత్తుకుని వచ్చి మీద పడుచున్నాయి కదా!
విలాసుడు : ఒక కట్టెతో సంయోగం (తాడనం) పొందినప్పుడు జలంలో చలనం, శబ్దము మొదలైనవి కలుగుచున్నాయి. అట్లాగే చేతనముతో ఏర్పడిన సామీప్యత చేత జడమగు ఈ దేహము నుండి శబ్దము, చలనము మొదలైన క్రియలు సంభవిస్తున్నాయి. సుఖ దుఃఖాది వృత్తులు, అనుభవములు ఏర్పడుచున్నాయి. అయితే సుఖ-దుఃఖానుభవములు జడశరీరమునకు సంబంధించినవా? జడమైన దానికి అనుభవమే ఉండదు కదా! కనుక అవి శరీరానివి కావు. పోనీ ఆత్మకు సంబంధించినవా? ఆత్మ సర్వదా నిత్యము, నిర్మలము, శుద్ధము, అప్రమేయము కదా! మరి సుఖ దుఃఖములు ఎవరికి, ఎట్లు ఎందుకు కలుగుచున్నాయి?… అజ్ఞానము చేతనే, అజ్ఞానము కలిగియున్న జనులకు కలుగు చున్నాయి. అజ్ఞానం తొలగిన మరుక్షణం సుఖ దుఃఖాదులు ఉండవు. సర్వము చిన్మాత్రము నందు లయించగా, చిన్మాత్రానుభవమే సర్వత్రా గోచరిస్తుంది. అనగా ఈ “దేహం, దేహాన్ని అభిమానించు వాడు” ఇద్దరూ సంయోగముచే ఒకచోట ఒనగూడినా ఇద్దరూ సుఖ-దుఃఖములకు అనర్హులే. మధ్యలో అజ్ఞానం వచ్చి, సుఖ దుఃఖములను ఏర్పరచి ఉంచుతోంది. అజ్ఞానము అనగా? సత్యాసత్యము లను, నిత్యానిత్యములను వివేకదృష్టితో చూడకపోవటమే.
అజ్ఞాని యొక్క దృష్టికి ఈ ప్రపంచము సత్యమైనదానివలె గోచరిస్తోంది. జ్ఞాని యొక్క దృష్టికో, ఇది స్వప్నతుల్యంగా అసత్యంగానే ఉంటోంది. ఇద్దరూ ఇదే ప్రపంచంలో సంచరిస్తూ ఒకే విధంగా కార్యక్రమములు నిర్వర్తిస్తూ, ప్రక్కప్రక్కనే ఉంటున్నా కూడా… వారిద్దరూ వేరువేరు దృష్టి అవగాహనలు కలిగి ఉంటున్నారు. ఎంత చమత్కారం!
గొడ్డలిలో కాష్ఠము (Wood), లోహము బాహ్య సంయోగంచే కలిసియే ఉంటున్నాయి. ఆ రెండిటికీ అభ్యంతర సంయోగం జరుగుతోందా? …లేదే! జ్ఞాని ఈ జగత్తులో సంచరిస్తున్నప్పుడు అభిమానశూన్యుడై, ఆసక్తిరహితుడై ఉంటున్నాడు. మనోవృత్తి దృష్ట్యా చూస్తే ఆతనికి సుఖ దుఃఖా దులు కలిగి ఉండవచ్చు గాక! అభ్యంతరంలో (In the inner Recess) తాను ఆయా అనుభవము లన్నిటికీ వేరై ఉంటున్నాడు. మిత్రమా! భాసుడా! మరల ఒకసారి ఒక ప్రకటన చేస్తున్నాను.
జలం జలంలోని ప్రతిబింబమువలె ఆత్మకు, దేహమునకు ఏమాత్రం సంబంధం లేదు.
విషయ రహితమగు శుద్ధ జ్ఞానం అంతటా, అన్నిటా సర్వదా వ్యాపించియున్నది. ఇక ద్వైత భావముచే కళంకితమైన తదితర జ్ఞానం అంటావా? అదంతా సత్యమే కాదు.
భాసుడు : కాకపోవచ్చు. కాని మనకు తదితరజ్ఞానం అనుక్షణికమై సత్యం వలె సంప్రాప్తిస్తోంది కదా! విలాసుడు : ఎందుచేతనో మనం గ్రహించాలి. బాలుడు “అదిగో! ఆ చీకట్లో పెద్ద దయ్యం ఉన్నది.
Page:569
నాకు కనిపిస్తోంది” అని తండ్రితో పలికాడనుకో. ఎంతో భయపడుచున్న ఆ బాలునికి ఆ తండ్రి ఏం చెపుతాడు? "బిడ్డా! నీవు పగలు ఆడుకునేటప్పుడు మట్టిచెట్టు చూచావే! అదే ఆ ఆకారం. అక్కడ దయ్యం లేదు, గియ్యం లేదు. నీకేం భయం అక్కర్లేదు” అని చెపుతాడు కదా! ఆ బాలుడు దయ్యం గురించి భావన చేసినట్లు, దుఃఖరహితమగు ఆత్మ తనయందు దుఃఖములకు సంబంధించి భావన చేస్తోంది. ఒకడికి స్వప్నంలో ఎక్కడో ఉన్న, లేదా, ఎప్పుడో గతించిన బంధువులు కనిపిస్తారు. వారితో ఆ స్వప్నంలో ఏర్పడే సమాగమం వాస్తవమా? … కాదు కదా! ఆత్మకు, దృశ్యమునకు గల సంబంధం కూడా అట్టిదే!
స్థాణువును చూచి ‘భూతం’ అని అనుకుంటే స్థాణువు భూతం అవుతుందా? కాదు. కానీ ఆ దుష్టభూతము యొక్క అనుభూతిని అమాయక బాలుడు పొందుచున్నాడు. ఆత్మకు విషయములతో సంబంధం లేనప్పటికీ అంతఃకరణము యొక్క నిశ్చయముచే సంబంధం ఏర్పడుతోంది.
కనుక, దేహములకు ఆత్మకు ఏ సంబంధం మనకు తోచుచున్నదో… అదంతా మిథ్యయే. ఒక కొయ్యబొమ్మ నీళ్ళలో పడినంత మాత్రం చేత నీరు ఆ బొమ్మలో ప్రవేశిస్తుందా? అట్లాగే దేహ ధ్యాస లేనట్టి ఆత్మ కూడా దుఃఖములచే బాధించబడదు.
భాసుడు : అంటే అర్థం ఏమిటి? దేహధ్యాస చేతనే దుఃఖము ఉండటం జరుగుతోందనా? విలాసుడు : అక్షరాలా అంతే. దేహభావన చేతనే ఆత్మ దుఃఖం పొందుతోంది. కాబట్టి దేహాత్మ భావన త్యజించుటచే ఆత్మ ముక్తి నొందగలదని విజ్ఞుల స్పష్టమైన అభిప్రాయం. అదే అనుసరణీయం కూడా!
ఒక తటాకంలో ఉన్నట్టి నాచు, ఆకులు, కాష్ఠము, జలము - పరస్పరం ఒకచోట ఉన్నప్పటికీ, వాటిలో ఒకదానితో మరొక దానికి అంతరంగ సంబంధం లేదు. కనుక అవి ఒకదాని పట్ల మరొకటి దుఃఖరహితంగానే ఉంటాయి. ఈ దేహ-ఇంద్రియ-మనస్సు-ఆత్మలు ఒక్కచోటే ఉన్నప్పటికీ అంతరంగ సంబంధం లేకపోతే దుఃఖరాహిత్యమును పొందగలం.
వృక్షమునకు కారణం బీజమే అయినట్లు, ప్రపంచంలోని సర్వప్రాణులకూ "అంతరంగంలో గల సంగము” ఈ జరా మరణ మోహములకు కారణమగుచున్నది. ఏ జీవుని యందు అంతః సంగము (Attachement inwardly) ఉంటుందో ఆతడు మాత్రమే ఈ సంసార సాగరమున మగ్నుడు అగుచున్నాడు. అంతఃసంగ రహితుడో… సంసార సాగరమును దాటిన వాడగుచున్నాడు. అంతః సంగము గల చిత్తము అనంతశాఖాయుతమై ప్రకటితమౌతోంది. అంతఃసంగము లేని చిత్తము సంగరహితమై తనకు తానే వినష్టమగుచూ అచిత్తముగా, చితస్వరూపంగా పరిణమిస్తోంది.
విషయాసక్తము కాని చిత్తము సంసారమున ఉన్నప్పటికీ ఇబ్బందేం లేదు. అట్టి చిత్తము స్ఫటికమణిలింగమువలె అతి పవిత్రమైనది. అది విముక్తమే అవుతుంది. అట్లా కాకుండా చిత్తము విషయాసక్తమై ఉన్నదా … అది గొప్పతపస్సు చేస్తున్నదైనా దృఢబంధము కలదిగానే ఉంటుంది.
Page:570
అన్తఃసక్తం మనో బద్ధం ముక్తం సక్తివివర్జితమ్ | అన్తఃసంసక్తిరేవైకం కారణం బన్ధమోక్షయోః II (శ్లో 34, సర్గ 67)
అంతఃసంసక్తియుతమైన మనస్సు బద్ధము. అంతఃసంసక్తిరహితమైన మనస్సు ముక్తము. కనుక, అంతఃసంగమే బంధ మోక్షములకు కారణం.
ఒక నౌక కొన్ని పదార్థములను తీసుకుపోతున్నదనుకో… అందులోని పదార్థములు దోషములు, ఆ నౌక పయనిస్తున్న జలంలోని తత్వాదులు వేరు వేరు కదా! …అంతఃసంగము లేనివానికి కార్యములు ఆచరిస్తున్నప్పటికీ, కర్తృత్వము ఉండదు.
ఒకడు సుఖంగా పట్టు పరుపులపై పరుండికూడా స్వప్నంలో పులి, అరణ్యము మొదలైనవి చూచినప్పుడు అవన్నీ అనుభవించుచున్నవాడే అవుతాడు. కొండమీదనుంచి దూకటం, పులి మీద బడటం వాస్తవం కాకపోయినా, అనుభవంమాత్రం సిద్ధిస్తోంది. అనగా, ఇక్కడ జరుగుచున్నదేమిటి? చిత్తము తాను ఒక అనుభవమునకు కర్త అయినప్పుడు ఇంద్రియములు పని చేయకపోయినా, కర్తృత్వము, భోక్తృత్వము సిద్ధిస్తోందా!
కనుక మనం చిత్తమును అకర్తృత్వమునకు అలవాటు చేయాలి. చిత్తముయొక్క అకర్తృత్వముచే అభిమానరాహిత్యము సిద్ధించగలదు. చిత్తమును సర్వకార్యక్రమములకు అతీతస్థితిలో ప్రస్థానం చేయాలి. అప్పుడు జడపదార్థమాత్రమైన ఈ దేహం మననేం చేయగలదో చెప్పు?
అకర్తయగు మనస్సు - మనం ఈ మనస్సును సక్తత (Attachment) లేనిదానిగా సిద్ధింపజేద్దాం. అది క్రమంగా సర్వక్రియలకు ‘నా హమ్ కర్తా! (నేను కర్తను కాదు’ అను అభ్యాసం ఆశ్రయిస్తూ ఉండుగాక! అప్పుడు మన మనస్సు అకర్తయే అవుతుంది. కర్తగాని మనస్సు కర్మఫలభోక్తకూడా కాదు. కర్తృత్వ, భోక్తృత్వములు తొలగినప్పుడు ’సంచిత-ప్రారబ్ధ-ఆగామి కర్మలు స్పృశించజాలవు. అప్పుడది తన యొక్క అధిష్ఠానమగు శుద్ధ చైతన్యముగా శేషించగలదు. తరంగములు శమిస్తే ప్రశాంతజలమే శేషిస్తుంది కదా!
భాసుడు : నీవు చెప్పేదంతా బాగానే ఉన్నది. కానీ, మనస్సు ఎదురుగా ఉన్న వస్తువులను పొందకుండా ఎట్లా ఉంటుంది? ఎదురుగా జగత్తు ఉండగా అకర్తృత్వం, అసంగం ఎట్లా సాధ్యం? విలాసుడు : ఒకానొకని మనస్సు దూరంగా ఉన్న ఏదో ఉత్సాహభరితమైన దృశ్యమును చూడటంలో లగ్నమై ఉన్నదనుకో… అప్పుడతడు సమీపంలోని శబ్ద, స్పర్శలు గుర్తించలేకపోవటం మనకు అనుభవ మగుచున్న విషయమే కదా! అనగా, దీని అర్థం ఏమిటి? మనస్సు ఎక్కడ లగ్నమైతే అక్కడ అనుభవం ప్రాప్తిస్తోందిగాని, శరీరం ఉన్నచోట కాదు - అని కదా! ఈ చిన్న అనుభవాన్ని ఆసరాగా తీసుకుంటే, “అసంసక్తుడు (Non - Attached) అయినట్టివాడు ఈ ప్రపంచంలో ఏకార్యంచేసినా, లేక జనులను సంహరించినా లిప్తుడు కాడు” - అనే మహత్తరమైన సిద్ధాంతం మనం గ్రహించగలుగుతాం.
సంసక్తి లేని మనుజుడు విక్షేపరహితమైన సుఖమును పొందుతాడు. ఇందులో నాకేం సందేహం లేదు. ఆతడు బాహ్యమున క్రియలు ఆచరించ వచ్చు. లేదా ఆచరించక పోవచ్చు. అట్టి వానికి
Page:571
కర్తృత్వ, భోక్తృత్వములు ఉండవు. అంతఃసంగము లేని మనస్సు అకర్త. అదియే ముక్తము, శాంతము, ఉక్తము, నిర్లిప్తము కూడా.
ప్రియనేస్తం! సర్వపదార్థముల అంతరమున ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మకు బాహ్యంగా పరస్పర సమ్మిళితమైనట్టి పంచకోశములు (అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ కోశాలు) ఇంద్రియార్థాలు (శబ్ద-స్పర్శ-రూప - రస గంధములు), భోగ్య పదార్థాలు గోచరిస్తున్నాయి.
జీవుడు పంచకోశముల సమ్మేళణముచే బాహ్యపదార్థములను ఆశ్రయించటమే సంసారము. ఈ జీవుని స్వరూపం, స్వభావం, ఆనందమయమే అయినప్పటికీ, సంసారమును ఆశ్రయించుటచే ఆత్మానందము నుండి విడివడుచున్నాడు. పూర్ణుడై కూడా అసంపూర్ణానుభవం తెచ్చిపెట్టుకుంటున్నాడు. అట్టి బాహ్యపదార్థ ధ్యానం నిరసించాలంటే ఒక్కటే ఉపాయం, అది “సర్వదుఃఖప్రదమగు అంతరంగ విభాగమును మొదలంటా జయించటమే”.
అందుకొరకై మనం ప్రయత్నిద్దాం. నదీజలం సముద్రజలంలో ప్రవేశించినప్పుడు ఆ సముద్ర జలంతో ఏకత్వం పొందుచున్నట్లు ఈ చిత్తము కూడా తనలోని అంతర్సంగదోషం త్యజించినప్పుడు ఇప్పటి సంసారదశనుండి విడివడినదై ఇతఃపూర్వపు శాంతరూపమును పొందుచున్నది. ఆకాశమువలె సునిర్మలమైనదా ….ఇక అప్పుడు ముక్తరూపమగు ఆత్మతో ఐక్యమొందుచున్నది.
(Attachment - Non Attachment)
భాసుడు : అత్యుత్తమ శ్రేయోభిలాషియగు ఓ సచివుడా! “సంగమే అంతటికీ కారణం” - అనే నీ వాక్యం నా కళ్ళు తెరిపిస్తున్నాయి. అయితే జీవునకు అసలు ‘సంగము’ అనే బంధం ఎట్లా కలుగుతోంది? మరల, మోక్షం ఎట్లా ఏర్పడగలదు? సంగమును నివారించటమెట్లా?
విలాసుడు : ఈ జీవుడు విచారణ చేయకపోవుటచేతనే అనర్థములన్నీ వచ్చిపడుతున్నాయి. ఆతడు ఎందుకో “ఇది దేహము, ఇది దేహి” - అను విభాగం చేసి విచారణ చేయటానికి ఉపక్రమించటమే లేదు. పైగా, ఇక్కడ ఏర్పడి ఉండే పరస్పరధర్మములు గురించి కొన్ని విపరీత భావాలను పొందుచూ, “ఈ దేహమే నేను, ఆ దేహమే ఆతడు” అను దృష్టిని, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. అదే సంసక్తి. ఆ సంసక్తియే జీవుని బద్ధునిగా చేస్తోంది. మనం దానిని తొలగించుకోవటానికి ఉపక్రమించాలి.
ఇందు తారసపడే ప్రతి శరీరధారీ అనంతాత్మస్వరూపుడే. అట్టి అనంతాత్మ తత్త్వమును దురభ్యాసవశం చేత దేశ కాల వస్తు పరిచ్ఛేదమగు సంకుచిత దృష్టితో గాంచుచున్నాం. భాసుడు : అట్టి దురభ్యాసం ఎట్లా మనకు అలవడింది? దాని యొక్క రూపమేమిటి?
Page:572
విలాసుడు : అపరిచ్ఛిన్న సుఖస్వరూపమగు ఆత్మను విస్మరించి మనం విషయసుఖము కొరకై ఏర్పడి ఉండే అభ్యంతర సంసక్తి వైపుగా అభిముఖమవుతున్నాం. అట్టి అభిముఖత్వమే బంధానికి కారణమ గుచున్నది. ఇక జీవన్ముక్తుడో, “ఇదంతా కూడా ఆత్మయే కదా! ఇక నేను దేనిని కోరాలి? దేనిని త్యజించాలి? అట్టి శ్రమ నాకు అనవసరం” …అను అసందిగ్ధమైన (Beyond doubt) అసంగ స్థితిని కలిగి ఉంటున్నాడు.
అసంసక్తుడు -
భాసుడు : అసంసక్తుని మనఃస్థితి, కార్యక్రమములు ఎట్లా ఉంటాయో చెప్పు. విలాసుడు : ఆతని అవగాహన ఇట్లా ఉంటుంది“పరిచ్ఛిన్నమగు అహంకారానికి నేను విషయమే కాదు. నాకు భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి, మిథ్యారూపములు మాత్రమే అయిన ఈ దేహాదులు ఉండు గాక! ఉండకుండు గాక! నేను మాత్రం వీటన్నిటికీ వేరైన వాడను. సర్వదా అసంగుడను.”
అట్టి దృఢ నిశ్చయము కలిగిన అంతఃకరణము గలవాడు ముక్తభాజుడే అవుతాడు. ఆతనికి "అయ్యో! ఈ కర్మలు చేయవలసి వస్తోందే! వీటిని త్యజించాలి కదా” అను కర్మత్యాజ్యాసక్తి ఉండదు. ఫలేచ్ఛ లేకపోవడం చేత కర్మలందు ప్రవేశించడు. కర్మలు సిద్ధించినా, సిద్ధించకపోయినా సమభావము కలిగి ఉంటాడు. హర్షశోకములకు వశుడు కాకుండా ఆత్మ తత్త్వము నందు మాత్రమే నిష్ఠ కలిగి
ఉంటాడు.
సర్వకర్మఫలాదీనాం మనసైవ న కర్మణా |
నిపుణం యః పరిత్యాగీ సో సంసక్త ఇతి స్మృతః II (శ్లో 8, సర్గ 68)
నేర్పుతో సర్వకర్మలను ఆయా క్రియలతో కాక మనస్సుతో త్యజించివేసి ఉంటాడు. ఆతని యొక్క ఆత్మజ్ఞాన ప్రభావం చేత సర్వ దుశ్చేష్టలు స్వయంగా, అకృత్రిమంగా అడగి పోతాయి. ఆత్మ శ్రేయస్సు కొరకై శ్రవణ-మననాది సత్రియలందు మాత్రమే శ్రద్ధాసక్తులు కలిగి ఉంటాడు.
సంసక్తి - మిత్రమా! భాసా! సంసక్తి వలననే దుఃఖరాశి అంతా విస్తరించి, వేలాది శాఖలుగా ప్రకటితమౌతోంది.
“ఒక గాడిద పెద్ద బరువు మోస్తూ త్రాడుచే ఈడ్వబడటం… ఒక వృక్షం శీత-వాత-తాపాలను మౌనంగా అనుభవిస్తూ కదలక మెదలక ఉండటం… ఒక పురుగు అనేక శరీరబాధలకు లోనగుచున్న ప్పటికీ కూడా భూరంధ్రంలో కాలం గడపటం… ఒక పక్షి బాణ, శిలాదుల ప్రహారమునకు భయ పడుతూ చెట్టుపై ఉండి ఆకలితో అలమటించటం… ఒక లేడి గడ్డి పరకలు కొరుక్కు తింటూ ఎప్పుడు ఏ కిరాతకుడు బాణం వేస్తాడోనని భయంతో వెనుకకు, ముందుకు బెదురుచూపులు చూడటం… పుణ్య పాపాధికారులగు జనులు పదే పదే అంగములను పోగొట్టుకుంటూ మృగ-క్రిమికీటక ఉపాధులను పొందటం, తృణములుగా స్థావరముగా పుట్టి జరామరణ పరంపరలను రుచి చూడటం.”
Page:573
. ఇవన్నీ కూడా సంసక్తి యొక్క ప్రభావం చేత ఏర్పడుచున్న ఫలవిస్తారమే. అది అనేక అనర్థములతో కూడి ఉన్నదై, బయట, లోపల కూడా అనేక పదార్థములవైపుగా విస్తరించి ప్రవర్ధమాన మగుచున్నది. ‘సంసారము’ అనునది సంసక్తి యొక్క రూపమే.
అయితే ఈ సంసక్తి రెండు రకాలుగా ఉంటూ రెండు వ్యతిరిక్త దిశలలో నియమించబడి ఉంటోంది.
వంద్య (ప్రశంసింపతగిన) సంసక్తి - ఇది వందనీయులగు తత్వవేత్తలలో ఉండే సంసక్తి. సంసారవర్జితమై, వివేకము చేత, ఆత్మతత్త్వబోధ చేత జనిస్తుంది. దీని ప్రభావం చేతనే శంఖ-చక్ర -గదాధారుడగు విష్ణువు వివిధ క్రియలచే ముల్లోకములనూ పాలిస్తున్నారు. నిరాలంబుడగు సూర్య భగవానుడు ప్రతిరోజూ గగనమార్గంలో యాత్ర సలుపునది ఈ వంద్యసంసక్తి చేతనే. అట్లాగే బ్రహ్మదేవుడు సృష్టికల్పన చేస్తున్నది, మహాకల్పాంతము తరువాత విదేహముక్తి వైపుగా పయనిస్తున్నది ఈ వంద్యసంసక్తి ప్రాభవం చేతనే. దీనిచేతనే విభూతిభూషితుడగు శివుడు ‘గౌరి’అను బంధమున ఆసక్తుడై స్వశరీరమున స్థితి కలిగి ఉండి భక్తుల పాలిటి కొంగుబంగారం అగుచున్నారు. దీని ప్రభావం చేతనే బ్రహ్మాండమున సిద్ధలోకములు, తదితర పాతాళలోకములు జరామరణ వర్జితములైన మహర్లోకం, జనోలోకం, తపోలోకం, చరాచర ప్రకృతి రచన, స్థితి కలిగి ఉన్నాయి.
వంధ్య (సంకుచితమైన ప్రయోజనం కలిగి ఉండే) సంసక్తి - ఇది అజ్ఞానులలో ఉంటుంది. పరమపురుషార్థ రహితమైనది. ఆత్మతత్త్వ జ్ఞానరహితము. దేహధారులు దేహధారణ వైపుగా ఆకర్షించబడుటకు ఇది కారణం. దీని యొక్క రూపం సంసార దృఢసక్తియే. గ్రద్ద ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ క్రింద ఉన్న మాంసపు ముక్కపై ధ్యాస కలిగి ఉన్నట్లు వంధ్యసంసక్తి వశం చేత మనస్సు నందు వ్యర్ధసౌందర్యాభిలాష కలిగి జీవుడు ‘భోగములు’ అనే లంపటంలో పడుచున్నాడు.
మిత్రమా! భాసుడా! “సంసక్తి” యొక్క ప్రాభవం ఏమని చెప్పమంటావయ్యా! సంసక్తి వశం చేతనే గాలి వీస్తోంది. పంచభూతాలూ స్థితి పొంది ఉంటున్నాయి. ఈ చరాచర జగత్తంతా ప్రవృత్త మౌతోంది. స్వర్గంలో దేవతలు, భూమిపై మనుజులు, పాతాళంలో సర్పములు, అసురులు, మేడి పండులో పురుగులు సంసక్తి చేతనే స్థితి కలిగి ఉండటం జరుగుతోంది. దాని వశం చేతనే జలాశయ తరంగాలలో అసంఖ్యాకమైన ప్రాణికోట్లు ఉత్పన్నమగుచున్నాయి, చస్తున్నాయి లేస్తున్నాయి,
పడుచున్నాయి. సంసక్తత చేతనే దేశసంచారం తరువాత కూడా నీకు సందేహాలు కలిగి ఉండటం జరుగుతోంది. మత్సన్యాయానుసారం బలవంతుడు బలహీనుని బాధించటం, శుష్కప్రతాపాలు జనులు ప్రకటించటం, నక్షత్ర మండలముల ఉదయాస్తమయాలు, చంద్రుని శీతల ప్రకాశం, ఇంద్రాది దేవతల సాంసారిక చర్యలు - అన్నిటికీ మూలం ఆయా జీవుల సంసక్తత వలననే.
నేస్తమా! అంతేకాదు. చిత్ర విచిత్ర వస్తుజాలముతో కూడిన ఈ ఎదురుగా ఉండే దృశ్య జగత్తును చూస్తున్నావు కదా! ఇదంతా వాసనా వశం చేత ఎవ్వరో చిదాకాశమున లిఖించారు. వాసనకి గల మరో పేరు సంసక్తత.
Page:574
భాసుడు : అవును. ఈ జగత్తు బహుచమత్కారములైన విశేషాలతో కూడుకుని ఉన్నది. ఆసక్తి గల ఎవ్వరో దీనిని రచించారు.
మనఃసబ్జెకరన్గేణ శూన్యే వ్యోమ్ని జగన్మయమ్ | యదిదం రచితం చిత్రం తత్సత్యం న కదాచన ॥ (శ్లో 40, సర్గ 68)
విలాసుడు : శూన్యాకాశంలో మనఃసంసక్తి అనే రంగుతో లిఖించబడిన ఈ జగతిచిత్రము సత్యమైనది ఎన్నటికీ కాదు.
భాసుడు : కాదా?
విలాసుడు : కానే కాదు. ఎందుకంటే ఇదంతా సంసక్తత గల జీవునిచే కల్పించబడి, సంసక్తత గల జీవగణముచే పొందబడుచున్నది. తృష్ణయే సంసక్తతకు నాంది.
సంసక్తత బహు ప్రమాదభరితమైనది కూడా అని గ్రహించు. అగ్నిశిఖచే తృణములుగా భక్షింపబడుచున్నట్లు ఆసక్త చిత్తుడు దుఃఖములచే శుష్కించుచు జ్వలించుచున్న నరకాగ్నులకు ఎండుకట్టె వలె అగుచున్నాడు. అనగా నరకాగ్నులన్నీ అట్టి ఆసక్తిసహిత జీవుల చేత, వారి కొరకే జ్వలిస్తున్నాయి. ఆతడు పొందని దుఃఖమంటూ ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలోని దుఃఖజాలమంతా సక్తచిత్తుని కొరకు విస్తరిస్తూ రారమ్మని ఆహ్వానిస్తోంది. అవిద్య అంటే మరేమో కాదు. మనఃసంగమే అవిద్య. అదియే ఈ భారభూతములగు జరామరణములను కలుగజేసి కాలువ నీళ్ళులాగా విస్తరింపజేస్తోంది.
మనం ఇంతసేపూ చెప్పుకున్నది ఒక్క వాక్యంలో చెప్పాలంటే… అంతర సంసక్తియే అసలైన బంధం. దాని పరిత్యాగమే విమోచనం.
ఆసక్తి రహితమైన మనస్సు అనంతాకాశం వలె ప్రశాంతంగా ఉంటుంది. అట్టి మనస్సు ఉన్నట్లు కనబడుచున్నప్పటికీ లేనిదే కనుక, మనం జ్ఞానదృష్టిని సంపాదించాలి. జ్ఞానముచే విషయ వినాశనం సిద్ధిస్తుంది. విషయ రాహిత్యముచే మనస్సు సంసక్తి రహితంగా ఉంటుంది. సంసక్త రహితమైన మనస్సును సంపాదిస్తే… అదియే ముక్తి. అట్టివాడే ముక్తుడు.
విలాసుడు : కనుక స్నేహితుడా! మనం సర్వదా సర్వ వ్యవహారములు ఆచరించుచున్నప్పటికీ, సర్వులతో కూడి ఉంటున్నప్పటికీ, నిషిద్ధములైన, అనిషిద్ధములైన లౌకిక, శాస్త్రీయ కర్మలను నిర్వర్తించ వలసి వస్తున్నప్పటికీ వివేకవంతులమై ఉండాలి. మనస్సును అసంసక్తమైన దానిగా ఉంచటం అభ్యసించాలి.
భాసుడు : అనగా మనస్సును ఏం చేయాలి?
విలాసుడు : మనం మనస్సును …సాధ్య-అసాధ్యముల గూర్చిన క్రియలందు గాని, గతించిన సంఘటన (లేక) అనుభవములందు గాని ఉంచవద్దు. అట్లాగే దానిని వర్తమాన పదార్థములందు
Page:575
గాని, ఆకాశమునందు గాని, దిక్కులందు గాని, వృక్ష జంతు జీవులందు గాని, తదితర ఆధిభౌతిక పదార్థము లందు గాని నిలుపవద్దు. అదే విధంగా, స్త్రీ పుత్రాదులందు గాని, ఇంద్రియవిషయ వృత్తులందు గాని, ఆధ్యాత్మిక వస్తుసముదాయమునందు గాని, భ్రూమధ్యమున గాని, నాశికాగ్రశమునందు గాని, ముఖమునందు గాని, కంటియందు గాని… నియమించవద్దు.
అంతేకాదు. మన మనస్సును అంధకారమునందు గాని, ప్రకాశమునందు గాని, హృదయాకాశమున గాని, జాగ్రత్ స్వప్న సుషుప్తులందు గాని, సత్వ-రజః-తమో గుణములందు గాని, గుణసమ్మేళనములందు గాని, కార్యవర్గమునందు గాని, కారణమగు అవ్యక్తమునందు గాని, సృష్టి యొక్క ఆదిమధ్యాంతములందు గాని, దగ్గిరలో గాని, దూరంగా గాని, నామరూపాత్మకమగు పదార్థ సమూహములందు గాని, శబ్ద- స్పర్శ- రూప రస గంధములందు గాని, భూతభవిష్యత్ జ్ఞానమునందు గాని, చిరంజీవాది సిద్ధులందు గాని మనం ఆసక్తం చేయరాదని నా సూచన, ప్రతిపాదన కూడా. ‘సర్వాసక్తి రాహిత్యం’ అంటే అదే.
భాసుడు : బాగానే ఉన్నది కాని, మరి ఈ మనస్సును ఎక్కడ ఉంచాలి. అనుక్షణం ప్రాప్తిస్తున్న క్రియా వ్యవహారముల మాటేమిటి? మనం వీటిని నిర్వర్తించుదామా! వద్దా?
విలాసుడు : మనం బ్రహ్మమున మాత్రమే స్థితికలిగి ఉందాం. సంగరహితులమై బ్రహ్మభావమును పొందిన తరువాత ఇక ఈ ప్రాప్తించే వ్యవహారములు నిర్వహించవలసి వచ్చినా ఒక్కటే? అక్కర్లేక పోయినా ఒక్కటే. మేఘములకు ఆకాశమునకు సంబంధం లేనట్లు ఆత్మరతులమగు మనకు "ఈ కర్మలు - వాటిని నిర్వర్తించుటచే ఏర్పడే ఫలితములు” మొదలైన విశేషములతో ఏమాత్రము సంబంధం ఉండదు… ఏర్పడదు.
భాసుడు : అంటే మనం బుద్ధికి కూడా సాక్షిత్వం వహించి ఉంటామా?
విలాసుడు :“నేను బుద్ధికి సాక్షిత్వం వహిస్తున్నాను" అను రూపమున ఉండే ప్రయత్నపూర్వక ప్రయాసను కూడా వదలివేద్దాం. శాంతులమై, చిదనరూపులమై దేదీప్యమానమగు మణి వలె స్వాత్మ యందు స్థితికలిగి ఉందాం. క్రియాఫలేచ్ఛా రహితులమై ఉందాం. నిరంతరాత్మోదయం
కలవారల మగుదాం.
సంసక్తి కారణమగు అవిద్యాకామవాసనలకు మనయందు ప్రవేశార్హత ఉండకుండు గాక! ఇక క్రియలంటావా, అవి మనం ఒనర్చుచున్నప్పటికీ వాటి ఫలితములను మనం పొందవద్దు. ప్రారబ్దం క్షయం అయ్యేవరకూ ఈ దేహం ఉంటే ఉండనీ. దీని యొక్క ఉనికి గాని, లేమి గాని మనకు సంబంధించని విషయాలై ఉండు గాక! ఈ దేహమును, దీనితో ఏర్పడే విశేషాలను ఆత్మదృష్టితోనే చూస్తూ ఉందాం.
Page:576
విలాసుడు : మిత్రమా! భాసా! నేను అనేక ప్రదేశాలు సంచరించాను. నాకు విశాలాంతఃకరణులగు కొందరు మహనీయులు తారసపడ్డారు. వారంతా అసంసక్తి సుఖము (The pleasantness of non - attachment or non - relatedness)ను పొందుచూ, ఇదే ప్రపంచమున వ్యవహరిస్తూ కూడా భయ శోక వర్జితులై ఉంటున్నారు. మహాప్రక్షోభం కలిగించగల “ధనం నశించటం, దుర్బలత్వం, అవమానాలు వచ్చి పడటం” మొదలైన సందర్భాలలో కూడా ఏమాత్రం క్షోభను కలిగి ఉండకుండా ఉంటున్నారు. పరమార్థ సుఖముచే అంతఃకరణమునందు పూర్ణులై, ముఖంలో పూర్ణచంద్రశోభ వీడకుండా ప్రశాంతచిత్తులై ఇదంతా దర్శిస్తున్నారు. చిల్లగింజలు నీళ్ళలో వేస్తే నీరు నిర్మలం అయి ప్రకాశిస్తున్నట్లు, ఈ ఉపాధిని ఉపయోగించి సునిర్మలత్వాన్ని సంపాదించి సంచరిస్తున్నారు. విషయాసక్త రహితులు, సంతాపరహితులు, ఉత్తమమనస్సు గలవారు అగు మహనీయులు ఎక్కడుంటారో ఆ పరిసరాలు కూడా పరమ పవిత్రమౌతాయి.
జ్ఞాని నిత్యమూ ఆత్మయందే లీనమై ఉంటాడు. కనుక తదితర సర్వవిషయములూ చలిస్తున్నప్పటికీ తాను మాత్రము సర్వసమయము లందూ స్వస్థుడై ఉంటాడు. బాహ్యంలో కనిపించే సంచలనములు, క్షుభితమైన స్థితి - గతుల విన్యాసములు ఇక అతనిలోనికి ప్రవేశించలేవు.
భాసుడు : అంటే, ఇక్కడ ఉండే ఆయా పరిస్థితులకు ఆతడు స్పందించడంటావా?
విలాసుడు : జలంలో ప్రతిబింబించే సూర్యుడు తరంగముల అస్త వ్యస్తములకు సంక్షుభితమగుచున్నట్లు కనిపించినా కూడా, బింబ స్వరూపుడగు ఆకాశ సూర్యుడు ఆ ప్రతిబింబ సంబంధమైన అస్తవ్యస్తములచే స్పర్శించబడతాడా?
భాసుడు : లేదు. ఎట్లా స్పర్శించబడతాడు? ఆకాశంలో వెలుగుచున్న సూర్యునకు, జలంలో ప్రతి బింబించే ప్రతిబింబమునకు స్పర్శసంబంధం ఏమి ఉంటుంది?
విలాసుడు : బాగా చెప్పావు. తరంగములలోని సూర్య ప్రతిబింబము పొందే చిందరవందరలకు వాస్తవ సూర్యునికి ఏమాత్రం చెందనట్లు, వ్యవహారతత్పరుడు కావలసివచ్చిన జ్ఞానికి ఆ వ్యవహారా లలోని ప్రియాప్రియములు, సఫల విఫలములు, కార్య కారణములు - తనకు సంబంధించనివై ఉంటాయి. వ్యవహార తత్పరుడై ఉంటూనే “నేను నిత్యము, సత్యము, నిష్కళంకము అగు ఆత్మను. ఈ కర్మలు, తత్ఫలములు, సంబంధములు నన్నెట్లా అంటుతాయి?” అనే ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఆతనిని స్పృశించ గలిగేదీ, ఆశ్చర్యపరచ గలిగేదీ, మృత్యువుతో సహా… ఈ భూనభోంతరాళాలలో ఏదీ ఉండదు… ఉండజాలదు. మనం జ్ఞానులం కావటానికి ప్రయత్నించడమే ఉచితం కదా! మనం ప్రబుద్ధులం కావాలి.
భాసుడు : ప్రబుద్ధులు అనగా ఎవరు? ఎట్లా ఉంటారు? సంసారంలో చరించేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది?
Page:577
విలాసుడు : జ్ఞానభరితము, నిర్మలము అగు బుద్ధిని సంపాదించినవారిని ప్రబుద్ధులు అనే పేరుతో చెప్పుకుంటున్నాం. అట్టి “ప్రబుద్ధులు ఆత్మోదయ సమన్వితులు” అగు మహనీయులు ఎల్లప్పుడూ ఆత్మ యందే రమిస్తూ ఉంటారు. వారు బాహ్యానికి నెమలి పింఛము యొక్క చివరి భాగంలాగా చంచలంగా ఉండవచ్చు గాక! అంతరమున మాత్రం మేరు పర్వతంలాగా అచంచలంగా ఉంటారు. తెల్లగా ప్రకాశిస్తున్న మణిలో ఎదురుగావున్న ఎఱ్ఱటి వస్తువులు ప్రతిబింబిస్తుంటే, అంతమాత్రం చేత, ఆ ఎఱుపు మణికి అంటుతుందా?
ఆత్మదశ పొందిన చిత్తము సుఖ దుఃఖములచే రంజితం కాదు. కమలం జలంలో ఉన్నప్పటికీ జలం కమలమును అంటదు కదా! ఏ జీవుడైతే జీవేశ్వర తత్త్వమును ఎఱిగి, సచ్చిదానందమగు ఆ పరమాత్మ యందు సంలగ్నమైన చిత్తము కలవాడై ఉంటాడో అట్టివానిని ఈ సంసార విషయాలు, విశేషాలు ఏమాత్రం కలుషితం చెయ్యలేవు. పరమాత్మ జ్ఞానం పొంది, సర్వకల్పనా వర్జితుడై ధ్యానం యొక్క భావ-అభావము లందు కూడా ఆత్మానుభవమగ్నుడై ఉండే వానిని ’ఆత్మారాముడు, స్వసక్తుడు’ అని కూడా పిలుస్తూ ఉంటారు. అట్టి వాడు భగవంతుడే అవుతాడు.
భాసుడు : మనం అసంగత్వం పొందేదెట్లా?
విలాసుడు : ఆత్మారాములము (ఆత్మ యందు రమించువారు) అయినప్పుడే ఈ ప్రపంచంతో మనం అసంగత్వం పొందగలుగుతాం. “ఆత్మజ్ఞానోత్కర్ష” చేత మాత్రమే సంసక్తి నశిస్తుంది. దానికి వేరే మరింకో మార్గమేదీ లేదు.
మనం ఈ జాగ్రత్ స్వప్నములలో తోచుచున్న ద్రష్టత్వమునకు కూడా అతీత భావులమవుదాం. భావాతీతమై ఉన్నట్టి మన యొక్క రూపం ద్వంద్వరహితం, నిత్యం, ఆత్మోదయాన్వితం అని శాస్త్రములచే అభివర్ణింపబడింది కదా! మనం శాస్త్రములు సూచిస్తున్న ఆత్మ యొక్క విశేషణముల పట్ల దృఢమైన భావనను ఆశ్రయించి ఉంటే ఆత్మ ప్రకాశరూపులమై వెలుగొందగలం. చంద్రబింబం క్రమంగా తన కళలను త్యజిస్తూ అమావాస్య వచ్చేసరికి తన యొక్క బింబ భూతమగు సూర్యుని యందు ఐక్య మవుతుంది చూచావా? (ఇక్కడ సూర్యుడు బింబంగాను చంద్రునియందు కనబడే ప్రకాశము ప్రతిబింబ వశంగా ఉద్దేశించబడింది).
మనం “నేను నిత్యుడను. ద్వంద్వరహితుడను. ఆత్మయోగాన్వితుడను. జన్మ మృత్యువులకు కూడా సాక్షి మాత్రుడను. ఇవి నా సమక్షంలో జరిగేవి. నేను వీటికి సంబంధించినవాడను కాను. అఖండుడనగు నాకు ఆద్యంతాలు లేవు" అనునట్టి బ్రహ్మభావమును పొందుదాం.
మన చిత్తము తన చిత్త దశను వదలగా, మనం చిత్తరహితులమౌదాం. సర్వకల్పనా రహితమైనట్టి ప్రశాంత స్థితిని పొందుదాం. “జాగ్రత్ నందు సుషుప్తి” అంటే అదే. అప్పుడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సుఖదుఃఖములు అనే త్రాటిచే బంధించబడం. ఆ విధంగా సర్వాతీతులమైన మనను వేధించ గల, ఆశ్చర్యపరచ గలదేదీ పదునాలుగు లోకాలలో ఉండజాలనప్పుడే మనిద్దరి జన్మలు సార్థకత పొందినట్లు.
Page:578
భాసుడు : మిత్రమా! ఇంతకీ చిత్తమునకు సంతాపం కలుగజేస్తున్నట్టి అసలైన కారణమేమిటి? విలాసుడు : ఇష్ట-అనిష్టములు, లాభ-అలాభములకు సంబంధించిన ఆశ నిరాశలు అనునవి జీవాహంకారమునకు కారణమగుచున్నాయి. జీవాహంకారమే చిత్తమునకు సంతాపం కలుగజేస్తోంది. భాసుడు : నిజమే! ఐతే ఇప్పుడీ జీవాహంకారం తొలగాలంటే మనం ఏం చేస్తే ఉపాయం? విలాసుడు : "నేను బ్రహ్మమును. సర్వమును. పూర్ణమును” అనునట్టి ఆత్మదశను మన చిత్తము పొందేట్లు మనం చేయాలి. ఎందుకంటే, అట్లు పొందిన చిత్తమును మరింకేదీ ఏ విధంగానూ బాధించలేదు. ఆత్మశాస్త్రజ్ఞులు అట్టి చిత్తము యొక్క స్థితిని “జాగ్రత్సుషుప్తి” అని పిలుస్తూ ఉంటారు. అది నిరహంకృతమైన స్థితి. విజ్ఞుడు అట్టి చిత్తముతో హృదయ నిర్మల లక్ష్యముతో ఆయా కర్మలు (కర్తవ్యములను) నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే, ఆ కర్తవ్యములచే కూడా ఆతడు బంధించబడడు.
మనం కూడా అట్టి జాగ్రత్ సుషుప్త వృత్తిని అవలంబించి, ఆపై ప్రారబ్ధ పరిపాకముచే సంప్రాప్తించే మన వర్ణాశ్రమోచితమైన కర్మలు ఆచరిద్దాం. కానీ దేనినీ ఆచరించని వారుగానే ఉందాం. జ్ఞానులు కర్మగ్రహణం కానీ, కర్మత్యాజ్యం గానీ కోరరు. ప్రారబ్ధానుసారంగా ఏది ఎట్లు ఉచితమో, సందర్భమో అది అంతవరకు ఆచరించుచూ అకర్తవ్య భావమును అవధరిస్తూ ఉంటారు. మన మార్గం కూడా అదియే అగుగాక!
ఇష్టానిష్టముల విషయంలో సుషుప్తబుద్ధి కలిగియుండి మనం కార్యములు ఆచరిద్దాం. అప్పుడు మనం దేనికీ కర్తలం కాము. "అకర్తృత్వ స్వభావం” గ్రహించి ఆపై యథాతథంగా చేయవలసినవి చేద్దాం. చేయగూడనివి మానుదాం. సంకల్ప వికల్పరహితులమై ఉందాం.
మూడు నెలల పసిబిడ్డ ఊయలలో ఊగుతూ ఏ సంకల్పం లేకుండానే నవ్వటం, కేరింతలు కొట్టటం, కాళ్ళు చేతులు విదల్చటం చేస్తుంది చూచావా? మనం కూడా ఫలములను చింతించకుండానే క్రియలు ఆచరిద్దాం. విషయవర్జితులమై, విషయాతీతులమై, చైతన్యపదము నందు సంస్థితులమై ఉండటం అభ్యసిద్దాం.
ఆత్మజ్ఞానం పొందిన తరువాత జీవుడు ఏ కర్మలు నిర్వర్తిస్తాడో… వాటి యందు ఆతడు ’నేను కర్తను’ అనే భావం పొందడు. అకర్తృత్వం ఆతనికి స్వభావమే అవుతుంది. చిత్తము నందు వాసనలు లేకపోవటం చేత ఆతని అంతఃకరణము శీతలత్వం పొంది ఉంటుంది. సర్వ అవస్థలందూ సమరూపుడై, పరిపూర్ణుడై మహాతేజస్వి అయి ఉంటాడు. అన్ని ఋతువులలోనూ కొండ ఒకే తీరుగా ఉంటుంది కదా!
వృక్షములు, పచ్చిగరిక మొక్కలు గల పర్వతం గాలి వీస్తున్నప్పుడు ఆకుల కదలికచే కదలుచు న్నట్లు కనబడుతుంది. ఆకులు కదలవచ్చునేమో గాని, పర్వతం కదులుతుందా? ధీరాత్ముడు బాహ్యము నందు లౌకికక్రియలచే చంచలము పొందినప్పటికీ అంతరమున అచంచలుడై ఉంటున్నాడు. అట్టి చంచల రహితమైన అంతరంగస్థితి మనం సంపాదించాలి. ఆపై ఈ శరీరములు ఉన్నా, లేకున్నా లేక, మరి ఏదైనా ఎట్లా ఉన్నా మన కేమి నష్టం?
Page:579
జగత్తు యొక్క రాహిత్యము అనునది మనుజునకు అభ్యాసవశం చేతనే దృఢపడుతుంది. మొట్టమొదట జగత్ రహితమైనట్టి ఒకకానొక సుషుప్తస్థితిని అభ్యసించాలి. అట్టి స్థితి అభ్యాసయోగంచే దృఢపడినప్పుడు దానినే తత్త్వజ్ఞులైన మహాత్ములు ‘తురీయ స్థితి’ అని పిలుస్తారు. మనం అందుకు ప్రయత్నిద్దాం. సర్వ విఘ్నములనూ దూరీకరించి మహాభ్యుదయం పొందుచూ, జ్ఞానానందమయులమై ఆపై ఈ జగద్రచనను ఒక లీలవలె దర్శించటం అభ్యాసం చేద్దాం. భయ-శోక-ఆయాసములు లేని వారమై, సంసార భ్రమరహితులం అగుచూ, అట్టి తురీయావస్థలో సంస్థితులమై ఇక ఈ సంసారమున మనం పడవద్దు.
భాసుడు : పవిత్రమన ‘స్వాత్మ పదవి’ ని పొందినవాడు ఇక ఈ జగత్తులో ఏం చేస్తూంటాడు? విలాసుడు : అట్టి ధీరబుద్ధి కలవాడు ఈ ప్రపంచమును చూచి, అజ్ఞానకారణం చేత ప్రకటిత మగుచున్న ఇందలి జీవుల ఉద్వేగాదులను గమనిస్తూ నవ్వుకుంటున్నాడు. ఒక ఎత్తైన మేడపై చివరి భాగంలో నిలబడి ఉన్నప్పుడు క్రింద రహదారిలో చరించు జనులను, రథాలను చూస్తున్నట్లు …. మనం కూడా దూరంగా ఉంటూ, ఈ సంసార విన్యాసమును దర్శిద్దాం. క్రొత్త ప్రదేశంలోని జన సమూహం లాగా అసంబంధీకులమై గాంచుదాం. బ్రాహ్మీస్థితిని ఆశ్రయించి జాగృత్-స్పప్న-సుషుప్తుల కంటేకూడా అతీతమైన మహదానందమైన స్థితిని పొందుదాం. యోగులు ఆశ్రయించే తురీయమును కూడా అధిగమించి అనిర్వచనీయము, శబ్దములకు అందనిది అగు అఖండ, అప్రమేయ స్వభావులం అవుదాం. తురీయాతీతు లమవుదాం.
పరిగలితసమస్త జన్మపాశః సకల లీనతమోమయాభిమానః ।
పరమరసమయీం ప్రయాతి సత్తాం జలగతసైన్ధవఖణ్ణవన్మహాత్మా ॥ (శ్లో 33, సర్గ 70)
అలా తురీయాతీతుడైన వ్యక్తికి తమోగుణాత్మకమగు అభిమానమంతా రహితమవుతుంది. లెక్కలేనన్ని జన్మలకు హేతుభూతములగు వాసనలు సన్నగిల్లు తాయి! కర్మపాశములు తొలగిపోతాయి. నీళ్ళలో పడ్డ ఉప్పులాగా మనస్సు స్వస్వరూపమునందు లయమయి, పరమానందమగు ఆత్మ సత్తను అవధరిస్తుంది! … అందువలన మనం ఉత్తమ ప్రయత్నం వదలకుందుము గాక!
శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా, రామా! ఆ విధంగా వారిద్దరూ మొట్టమొదట కుశల ప్రశ్నలతో ప్రారంభించి పరమోత్తమగు సన్మార్గమును విచారణ చేశారు. కాలక్రమంగా నిర్మల జ్ఞానం పొంది నిర్మలులయ్యారు. ముక్త స్వరూపులయ్యారు.
కనుక, జీవుడు ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే అవస్థాత్రయం యొక్క వాస్తవ స్వరూపం చక్కగా విచారిస్తూ ఉండాలి సుమా! వాటిని సాక్షిస్వరూపమగు ‘చిన్మాత్రము’ నందు సర్వ భావాభావములను లయం చేయాలి. అప్పుడు శేషించేది ’తురీయము’ లేక కేవలీపదము.
Page:580
శ్రీ రాముడు : భాస - - విలాసుల సంవాదం వినిపించేటప్పుడు మీరు ‘తురీయాతీత స్థితి’ అనే పదం వాడారు. అది విదేహమైనదా? సదేహమైనదా? ఆతడు జీవన్ముక్తుడా? ఏ వేద వాక్యం ఆతనికి అన్వయిస్తుంది?
శ్రీవసిష్ఠ మహర్షి : తురీయమునకు ఆవల ఉన్న తురీయాతీత పదం, ఈ విదేహ, సదేహముక్తులకు, వేదవాక్యాలకు విషయమే కాదు. మనుజులకు ఆకాశము విషయమే కాదు కదా! అయితే అన్నీ కూడా ఉపశమించేది అందులోనే. వాయువునకు ఆకాశమే గమ్యస్థానమైనట్లు, విదేహముక్తులకు కూడా ఆ తురీయాతీతమే గమ్యస్థానం. పూర్ణమగు జ్ఞానమును పొందిన జీవుడు ఈ జాగ్రత్-స్వప్న -సుషుప్తులలోని జగత్తును కొంతకాలం క్రీడాపూర్వకంగా గాంచుచూ, ఒకానొకప్పుడు ద్వంద్వాతీతుడై పరమానంద భరితుడై తుర్యాతీతత్త్వము అవధరిస్తున్నాడు.
శ్రీరాముడు : ఈ శరీరం ఆ స్థితిలో ఉంటుందా? ఉండదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్టి ప్రశ్నకు మనం కొన్నిసార్లు సమాధానం చెప్పుకున్నాం. అయినా మరల సమాధానమిస్తున్నాను. విను.
ఈ దేహం క్షయం పొందినప్పుడు, లేక వృద్ధి పొందినప్పుడు… తదనుగుణంగా జ్ఞానం క్షయం పొందుతుందని గాని, వృద్ధి పొందుతుందని గాని అనుకుంటున్నావా? లేదు. అది భ్రమ మాత్రమే. వృద్ధి క్షయాలు అనేవి శరీరమువే గాని, అవి జ్ఞానమునకు లేదా మనస్సుకు సంబంధించిన ధర్మాలు కావు. మరి ఈ భౌతికదేహం యొక్క వృద్ది క్షయాల విషయం నీకెందుకు? అందువల్ల ఏం ప్రయోజనం? దేహం ఏ అవస్థలో ఉన్నప్పటికీ నీవు మాత్రం కేవలం ఆత్మబోధ యొక్క స్థిరత్వం గురించే యోచించు, ప్రయత్నించు. ఈ ప్రకృతికి మునుముందుగా నీవు ఎట్లున్నావో…. అట్లే ఉండు.
ఓ రాఘవా! నీవు జ్ఞానివేనయ్యా! ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్త అవస్థల గురించి, వీటిచే స్పర్శింపబడజాలని సత్య స్వరూపమగు బ్రహ్మము గురించి నీవు ఎరిగియే ఉన్నావు సుమా! శ్రీరాముడు : ఎరిగి ఉన్నదానిని పొందవలసి ఉన్నది కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : “సో హం - తత్వమ్ - అహమ్ బ్రహ్మాస్మి - జీవోబ్రహ్మేతి నాపరః - సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ - ఆత్మ సత్యం జగత్ మిథ్యా - - ఏకమేవా ద్వితీయమ్ బ్రహ్మ” మొదలగు అఖండ వాక్యార్థముల స్వరూపమగు ఆత్మను నీవు పొందియే ఉన్నావు. ‘క్రొత్తగా ఆత్మను పొందాలి’ అనే మోహమును దూరంగా ఉంచు. ఈ వాక్యములు నేను సర్వ దేహధారులను ఉద్దేశించి చెప్పుచున్నాను. ”భౌతిక ధర్మములగు జన్మ, జరా, మృత్యువులను నేను పొందుచున్నాను” అను పేలవమైన భావనను మీరంతా వదలివేయండి. "నేను పూర్ణుడను, అఖండుడను, శాశ్వతుడను, ముక్తుడను” అను రూపము గల దుఃఖరహితమగు మహదైశ్వర్యమును సంపాదించండి. అంధకారం గానీ, మేఘములు గానీ లేనట్టి నిర్మలాకాశంలా శోభించండి. ఇష్టానిష్టములను త్యజించి, శీతలాత్మ ప్రకాశముచే పరిఢవిల్లండి.
Page:581
శ్రీరాముడు : మనస్సులో నుండి దృశ్యమునకు సంబంధించిన భ్రమలు ఎట్లా తొలగించుకోవటం? అది అంత తేలికైన విషయమా?
శ్రీవసిష్ఠ మహర్షి : మంత్ర ప్రభావం చేత ఆకాశగమన సిద్ధిని పొందిన ఒక యోగి నేలపై నిలబడి ఒక చోటి నుండి ఇంకో చోటికి దూర సుదూర ప్రాంతాలకు నడచి వెళ్ళే శ్రమను కోరుకుంటాడా? లేదు కదా! ఆత్మభావనచే సుసంపన్నమైన నీ మనస్సు నీచ వస్తువులను ఆశ్రయించ వలసిన పనేముంది? ఈ బ్రహ్మాండమంతా దేశ కాల వస్తుపరిచ్ఛేద రహితమగు ’శుద్ధ చిన్మాత్రము’ చే పరిపూర్ణమై ఉండగా, “ఈ శరీరాదులు నేను. ఈ ధనము రాజ్యము మొదలైనవి నావి, నా వారు, కాని వారు” అనుకుంటూ భ్రమలకు చోటివ్వవలసిన పనేమున్నదో చెప్పు?
వ్యాపకమగు పరమాత్మకు ‘ఆత్మ’ అనే పేరు కల్పించుకున్నాం. యథార్థానికి ఆతడు నామ రూప భేదములకు అతీతము, అత్యంత దూరము అయినవాడు. అతనిని మనస్సే సమీపించలేదు. ఇక గుణ, నిర్గుణములు ఎట్లా ఆతనికి వర్తిస్తాయి చెప్పు? నాటకంలో ఒకడు నిర్వర్తిస్తున్న పాత్ర యొక్క లక్షణములు మొదలైనవి ఆ పాత్ర ధరిస్తున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత విశేషాలు నిర్వచించి చెప్పగలవా?
ఇక నీకు కనబడుచున్న వేర్వేరు భేదముల మాటేమిటంటావా? సముద్రము అనగా జలమే కదా! జలమునకు ‘పెద్ద తరంగాలు చిన్న తరంగాలు’ అనే భేదమెక్కడిదయ్యా! అద్దంలో ప్రతిబింబం కనబడుచున్నంత మాత్రం చేత అద్దంలో అద్దమునకు వేరైనదేదో పదార్థం ప్రవేశించిందంటావా? ఇక్కడి వేరువేరు లక్షణ విలక్షణములన్నీ జగన్నాటకాంతర్గత కల్పిత విశేషాలే!
సముద్రమంతా జలమే అయినట్లు, దర్పణంలో కనిపించేదంతా దర్పణమే అయినట్లు ఈ జగదాకారంగా విస్తరించి కనబడేదంతా పరమాత్మకు ఒక్క క్షణం కూడా భిన్నమైనది కాదు. పరమాత్మకు భిన్నమైన జగత్తునందు “దేహములు, అనుబంధములు, నావి, నీవి” అను భావనలకు చోటెక్కడ? అట్లాగే “నేను జీవుడను, అజ్ఞుడను, పాపిని, కర్మబద్ధుడను” అనునదంతా స్వస్వరూపజ్ఞానం లేనప్పుడు ఏర్పడే ప్రేలాపనలు మాత్రమే.
ఈ దేహాదులందు కనిపిస్తున్న నీ వెవడవు? వాటియందు నీకు చెందినదేది? చెందనిదేది? ఈ చెందిన చెందని విషయాల యొక్క తత్త్వమేమిటి? కొంచం యోచిస్తే భ్రమలు వాటంతట అవే
తొలగుతాయి.
యథార్థానికి ద్వైతం గాని, దేహాలు గాని లేవు. సూర్యుడున్న చోట అంధకారం పొసగదు కదా! ఆత్మతో "నీవు, నేను, ఆతడు, నీది, నాది, జన్మించుట, చచ్చుట, వృది, క్షయము” అను వ్యవహారమంతా ఏమాత్రం పొసగదు. ఒకవేళ ‘ద్వైతము కలదు’ అని ఎవ్వరైనా ప్రతిపాదించినా, ఆ ద్వైతముతో ఆత్మకు సంబంధం లేదు. శీతోష్ణములవలె, చీకటి వెలుగుల వలె అవి రెండూ పరస్పర విరుద్ధములైన విషయాలు. ఒకటి దర్శించుచున్నవానికి రెండవది అగుపించదు. అయితే ‘ఉనికి’ అనునది స్ఫురించే ప్రతిచోటా జడ చేతనాలు కలసి ఏర్పడి ఉంటాయి. ఆ రెండిటికీ ఒకానొక అవినాభావం ఉంటోంది.
Page:582
అంతమాత్రం చేత “చిన్మాత్రమగు ఆత్మకు దేహముతోటి తాదాత్మ్యము కలదు” అని ఎవరైనా వాదిస్తారేమో. అటువంటి అభిప్రాయం “దావాగ్నిలో మంచు ముక్క రూపుదిద్దుకుంటోంది” అని అనుకోవడం లాంటిది సుమా! ఒకానొకడు మృగతృష్ణను దూరంగా ఉండి చూస్తున్నాడనుకో… "సూర్యుని తేజస్సు గాలివీచికలపై ప్రసరించినప్పుడు నాకు అట్లు జలతరంగములవలె భ్రమచేత అనిపిస్తోంది” అను జ్ఞానము యొక్క ప్రభావం చేత “అక్కడ తటాకం ఉన్నది” అను భావము నశిస్తుంది కదా! ఒక్క సత్య వస్తువు దర్శనముచే మాత్రమే మిథ్యా దృష్టి నశిస్తుంది.
ఓ రామా! ఒక్క విషయం మాత్రం నీ “జ్ఞప్తి - ఎఱుక” పథం నుండి ఏ మాత్రం కోల్పోవద్దు. అదేమిటంటే… చిత్స్వరూపమగు ఆత్మ నిర్మలమై, నిత్యమై, స్వయంప్రకాశకమై, వికారరహితమై, అఖండమై, అప్రమేయమై సర్వదా వెలుగొందుచున్నది. అదియే నీయొక్క నా యొక్క వాస్తవ స్వరూపం.
నా ఈ వాక్యాలు వినటం జరుగుచున్న ఈ సభలోని, ఈ సభకు బాహ్యములోని అందరి స్వరూపం అదే! ప్రతి ఒక్కని వాస్తవ స్వరూపం అదే! నీవు గాని, నేను గాని, ఇక్కడి ప్రియ సభికులు గాని, భూత-భవిష్యత్-వర్తమానములలో తదితరులు గాని… ఆత్మకు వేరుగా మరేదీ అయి ఉండలేదు. అయి ఉండబోము. మనమందరమూ ఆత్మస్వరూపులమే అయి ఉన్నాము.
ఇక ఈ దేహానికి వస్తే ఇది అనిత్యము, మలయుతము. ఈ దేహం స్వయం ప్రకాశకం కాదు. ఇది మరొకదానిచే ప్రకాశింపబడుచున్నది. ఆత్మయగు నేను వికారరహితుడను. ఈ శరీరమో… వికారసహితమైనది. అట్టి ఈ శరీరంతో ఆత్మకు సంబంధమెట్లా కలుగుతుంది చెప్పు?
ఈ దేహము ప్రాణవాయువుచే చేష్టితమగుచున్నది. అన్నము, జలము మొదలైన వాటిచే వర్ధితమగుచున్నది… ఇంతలోనే ఎప్పుడో కృశించుచున్నది. దీనితో నేను వర్ధిల్లను, కృశించను… కనుక ఈ విధంగా దేహముతోటి జీవునకు సంబంధం పొసగనే పొసగదు.
పోనీ, ద్వైత దృష్టితో ఈ శరీర, ఆత్మలను పరిశీలించామనుకో… “ద్వైత సిద్ధి” అనగా “జీవునకు వేరైన మరొక సత్త కలదు” అని కదా? మరి ఆ రెండవ సత్త ఏమిటి? …అది కూడా చైతన్యమే కదా! చైతన్యము, జీవునకు గాని; చైతన్యము, ఆ రెండవ సత్తకు గాని భేదం ఉండదు.
పంజరంలో సింహం - చూచావా రామయ్యా! ఈ శరీరము, ఆత్మలను విచారణ దృష్టితో చూడకపోవడం చేతనే సర్వ అనర్థములు వచ్చి పడుతున్నాయి.
శ్రీరాముడు : జగత్ృష్టి అంతటికీ సారభూతమైనట్టి ఈ అంతఃకరణమునకు కారణమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రశ్నకు సమాధానం పెద్దలు “అజ్ఞానమే, మూఢత్వమే, అవిచారణయే” అని చెప్పుచున్నారు. ఆత్మయే “విపరీత సంస్కారములను గ్రహించుట” అను మోహముచే తన స్వసత్త యొక్క జ్ఞానమును త్యజించి భ్రమ బీజసహితమగు చిత్తాకార పరిణామమును ధరిస్తోంది.
స్వయం ప్రకాశమానుడు, స్వయం జ్యోతి స్వరూపుడు అగు సూర్యభగవానుని చూడు. గ్రహణసమయంలో ఆతని పట్ల ‘రాహువు’ అను తమస్సు ఏర్పడుతోంది చూచావా? వాస్తవానికి
Page:583
సూర్యునిలో తమస్సు (Darkness) ఎట్లా ఉంటుందయ్యా? "సూర్యగ్రహణము” అనునది భూమిపై చరించే జీవుల యొక్క దృశ్యచమత్కారమే కదా!
అట్లాగే, మిక్కిలి అసంభవమైనప్పటికీ ఆత్మను జనన-మరణాదులు అనే అజ్ఞానం కప్పి ఉంచుతోంది. అనర్థహేతువులైన ఈ చిత్తం సత్యమగు ఆత్మతత్త్వం యొక్క ఎరుకచే, లేక, జ్ఞానముచే… గదిలో దీపం వెలిగించిన తరువాత చీకటి లాగా… క్షణంలో నశించగలదు. చిత్తమును పరిశుద్ధ పరచనంత కాలం అజ్ఞానం జనిస్తూనే ఉంటుంది.
ఓ జనులారా! మీరంతా ఈ చిత్తము గురించి, ఇందులో ఏర్పడివున్న దోషదృష్టుల గురించి బాగా విచారణ చేయండి. ఈ చిత్తమునకే ‘జీవుడు, మనస్సు, అంతఃకరణము’ మొదలైన పేర్లు కూడా ఉంటున్నాయని గ్రహించండి.
శ్రీరాముడు : ప్రభూ! మనం కొనసాగిస్తున్న ఈ విచారణ యొక్క ఆరూఢత కొరకు ఒక విషయం ముందుగా చెప్పండి. ఈ చిత్తమునకు ’జీవుడు అంతఃకరణము’ మొదలైన సంజ్ఞలన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయి. ఎట్లా రూఢి పొందుచున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : అనేక తరంగాలు ఎక్కడినుండి వచ్చాయి? జలం నుంచే కదా! అట్లాగే సమస్త పదార్థములు సమష్ఠిచిత్తము నుండే ప్రాదుర్భవిస్తున్నాయి. ఆత్మతత్వముతోటి ఏకత్వధ్యాస’ చే ఇది నీవు తప్పక గ్రహిస్తావు.
ఒక్కసారి సముద్రమును చూడు. అందు జలం ఒకచోట చంచలములైన అసంఖ్యాక తరంగాలు కలిగి ఉంటోంది. ఇంకొకచోట స్పందనరహితంగా, తరంగాలు లేకుండా ప్రశాంతంగా ఉంటోంది. స్పందనరూపమగు ఆత్మ ఒకచోట నిర్మలంగా, శుద్ధంగా, మరొక చోట ప్రతిబింబరూపంగా ఉంటోంది. శిల మొదలైనవి చలన రహితంగా తమ యందు తామే స్థితి కలిగిఉన్నాయి. కాని మానవుడు, తదితర జంతువులు చేష్టాయుతులై చలనము కలిగి ఉన్నారు. శరీరములన్నిటి యందూ ఆయా వివిధ రూపములలో పరమాత్మయొక్క శక్తి ఉండియున్నది. అయితే ఆ శక్తి కొన్ని దేహములలో కల్పితరూపమైన అజ్ఞానం కలిగి ఉంటోంది. ఆ పరమాత్మయే కల్పితమగు అజ్ఞానమును ఆశ్రయించి, ప్రసిద్ధుడై అట్లు ఉంటున్నాడని గ్రహించు.
ప్రతిబింబ దశను పొందిన పరమాత్మయే ఆజ్ఞానావరణను కలిగి ఉన్నప్పుడు “జీవుడు” అను పేరుతో మనం పిలుస్తున్నాం. వాస్తవానికి ఈ జీవుడు ‘సంసారము’ అను మాయాత్మకమైన పంజరంలోని సింహమని గ్రహించు.
ఆత్మ ఒకచోట తన ప్రతిబింబిత మోహకళచే జీవధారణ చేస్తోంది. ప్రాణములను ప్రీతిగా భావించి వాటిని పొంది ‘జీవుడు’ - అని అనిపించుకుంటోంది. ఆత్మయే ’జీవుడు’ గా అగుపిస్తోంది.
Page:584
“నేను, నేను” అని అనుకొనుచు అహంకారముగా అగుచున్నది. అహంకారము ఆత్మయే. ‘నిశ్చయించెదను గాక’ అను వ్యవహారములో ప్రవేశించి ’బుద్ధి’గా అగుచున్నది. బుద్ధి ఆత్మస్వరూపమే! సంకల్ప, వికల్పములను ఒనర్చుటనే ‘మనస్సు’ అనుపేరుకు అర్హమగుచున్నది. మనస్సు ఆత్మ చమత్కారమే! ఆత్మయే!
మనోదేహములకు కారణమగుటచే ‘ప్రకృతి’ అగుచున్నది. ప్రకృతి ఆత్మయొక్క ఐశ్వర్యమే! ఆత్మయే! వర్ధిల్లుటచే ‘దేహము’గా అగుచున్నది. దేహతత్వం కూడా ఆత్మయే!
అజ్ఞానాధిక్యతచే ‘జడము’ అని, చైతన్య ప్రాధాన్యము ప్రకటించినప్పుడు ‘చేతనము’ అని వచించబడుతోంది. జడ, చేతనములు ఆత్మవిన్యాసములే! ఆత్మయే!
శ్రీరాముడు : అసలు మనసు అనగా ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : రామయ్యా! మనం అనేక కోణాల నుండి ఇప్పటివరకు చెప్పుకున్న తరువాత మరల “మనస్సు అంటే ఏమిటి?” అని ప్రశ్నిస్తుంటే నాకు కొంచం నవ్వు వస్తోంది. అయినా నీవు అడగటం సముచితమే. విను. మరొక కోణం నుండి చెపుతాను.
“అజ్ఞానము - దానికి సాక్షి” …మధ్య గల స్థితే పరమాత్మాభాసితమగు మనస్సు. ఆ మనస్సు అనేకత్వము పొంది "జీవుడు, బుద్ధి, చిత్తము, అహంకారము”… మొదలైన వేషములను, సంజ్ఞలను ధరిస్తోంది. నవరసాలు పోషించే నటుడు ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్కరస సమన్వితమైన వేషం వేస్తున్నట్లు, మనస్సు అనేక ధర్మములను అవధరించి ప్రవర్తిస్తోంది.
మనస్సు యొక్క స్వరూపం ఆత్మయే. అయితే రామా! నీవిక్కడ ఒక విషయం అత్యంత సూక్ష్మ బుద్ధితో గ్రహించాలని మనవి చేస్తున్నాను. హెచ్చరిస్తున్నాను. అజ్ఞానులు, దుర్బుద్ధులు, మూఢులు అగు కొందరు తార్కికులు “ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది చిత్తము, ఇది జీవుడు, ఇది దేవుడు” అని అనేక నిర్వచనములలో ప్రవేశించి ఆయా సంజ్ఞలలో వ్యర్థంగా అభినివేశం కలిగి ఉంటున్నారు. విజ్ఞులు వాటిని సాధనములులాగా, ఉపకరణములుగా, సోపానములుగా చూస్తారేగాని, సాధ్యముగా కాదు. సాధకుడు సాధనములు ఎక్కడ పరిమితమౌతాయో గ్రహిస్తు ఉండాలని నా మనవి. శ్రీరాముడు : మీ హెచ్చరికలో నాకు అత్యున్నతమైన పరమార్థమే గోచరిస్తోంది. అయితే మరొక సందేహం. శరీరం ఉన్నంత వరకు సంసారము ఉండియే తీరుతుంది కదా! సంసారం ఉన్నంత వరకు అజ్ఞానం ఉంటుందికనుక, సంజ్ఞల అవసరం ఉండియే ఉంటుంది కాదా? కాబట్టి సంసారమునకు కారణం ఈ దేహమేనని అనవచ్చా?
శ్రీవసిష్ఠ మహర్షి : జీవుడే సంసారమునకు కారణమగుచున్నాడుగాని, మూగము, దీనము అయిన ఈ దేహం సంసారమునకు ఏమాత్రం కారణం కాదు. కవిత్వం పెల్లుబికేది కవిలోంచిగాని, కలంలోంచి కాదే!
ఒక కుండలో నీళ్ళు ఉన్నాయనుకో… కుండపగిలితే నీళ్ళు నశిస్తాయా? ఆధారము, ఆధేయము - ఈ రెండిటిలో ఒకటి నశించినంత మాత్రం చేత రెండవది నశించదు. ఒక ఆకు ఎండిపోయిందనుకో
Page:585
…అప్పుడు అందులోని రసం ఏమయింది? నశించిందా?… లేదు! అది సూర్యకిరణములలో ప్రవేశించింది. మరొక రూపుదిద్దుకున్నది. అంతే.
శరీరం నశించినా ఆత్మ నశించదు. ఆత్మను ఆశ్రయించి, ఆత్మేచ్ఛచే నిర్మితమై ఈ శరీరాదులు ఏర్పడి ఉంటున్నాయి.
అందుచేత… ఆత్మ వాసనా సహితమైతే ఈ శరీరం వాసన యందే ఉంటుంది. ఆత్మ యందు వాసనలు రహితమైతే ఈ శరీరం చిదాకాశంలో ఉంటుంది.
ఏ దుర్బుద్ధి అయితే “ఈ శరీరం నశించిందా … నా పని అయిపోయినట్లే. నేను నశించినట్లే” అని అనుకుంటాడో, అట్టివానికి తల్లి స్తనంలో బేతాళం అనుభవమౌతుందని నా అభిప్రాయం.
మననముచే బంధం ఏర్పడుతోంది. ఎప్పుడైతే ఉపాధులకు, సంస్కారములకు సంబంధించిన మననము తొలగుతుందో … అప్పుడు అట్టి జీవుడు స్వతఃసిద్ధంగా తనయొక్క బ్రహ్మస్వభావమును సంస్మరిస్తాడు. నిరతిశయానందమును పొందుతాడు.
అయితే… శరీరం నశించినా చిత్తం ఉంటుంది. చిత్తమే జీవుని సూక్ష్మదేహం. చిత్తములో వేటి వేటి గురించి ధ్యాసలు, మననములు ఆధిక్యత కలిగి ఉంటాయో… ఆ అనుభవములకు అనుకూలంగా తరువాతి ఉపాధులు ఏర్పడుచున్నాయి.
శ్రీరాముడు : ఒకవేళ చిత్తమే నశించిందనుకోండి….? అప్పుడే మౌతుంది?
శ్రీవసిష్ఠ మహర్షి : అప్పుడింకేమున్నది? స్వస్వరూపమగు ఆత్మయే శేషించటమే పరమానంద దాయకమగు ‘మోక్షము’ అయి ఉన్నది.
కనుక… దేహము నశించుటచే ఏదీ నశించుటయే లేదు! …ఇక చిత్తము నశించినప్పుడు స్వస్థానమే లభించగలదు. మరింక చింత దేనికో చెప్పు.
“ఈతడు మరణించాడు, నశించాడు" - అను కథనమంతా మిథ్యా కథనమే. అదంతా కూడా అసత్ కల్పన మాత్రమే.
ఈ జీవుడు స్వస్వరూపము విషయమై అజ్ఞానము ఏర్పడి ఉన్నంతవరకూ వేర్వేరు ఉపాధులను, దేశ కాలములను, స్థితి గతులను గ్రహించుచూనే ఉన్నాడు. ఒకానొకప్పుడు శాస్త్రపరిశీలనచే, స్వప్రయత్నముచే తన స్వరూపమేమిటో గ్రహించి ఈ జన్మ, కర్మల, చక్రమును నిరోధిస్తున్నాడు… లేక త్యజిస్తున్నాడు. లేనివిగా చూస్తున్నాడు. మోక్షము అనగా అదే!
‘మరణము’ అనే నదిలోని తరంగములచే కొట్టుకుని పోవుచున్న గడ్డిపరకలవలె కొందరు జీవులు దేశకాలముల కల్పనాపరంపరలలో అనేకసార్లు ప్రవేశ - నిష్క్రమణములను నిర్వర్తించుకుంటూ పోతున్నారు. ఒక దేశ కాలములలో ప్రవేశమే తన జన్మ అని, దాని నుండి నిష్క్రమణమే తన మరణమని భ్రమలను స్వీకరిస్తూ అనేకసార్లు “నేను దుఃఖిని, సుఖిని, నీచుణ్ణి, గొప్పవాడిని” ఇత్యాది యోచనా లంపటంలో మ్రగ్గుచున్నాడు. కొండముచ్చు ఒక చెట్టు వదలి మరొక చెట్టును ఎక్కుచున్నట్లు ఆతడు ఒక శరీరం వదలి మరొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. కొంతకాలానికి అది వదలి ఇంకొకటి…
Page:586
చర్వితచరణంగా బహుదూరపు బాటసారిలాగా పయనం సాగిస్తూనే ఉన్నాడు. విస్తృతమైన వేరొక దేశ కాలములలో ప్రవేశించి “నేను ఇప్పుడే పుట్టాను” అని తలచుచూ ఉన్నాడు. పిల్లి తన కూనలను ఒక ఇంటిలోంచి మరొక ఇంటిలోకి చేరుస్తున్నట్లు అతడు తన వాసనలు ఒకచోట నుండి మరొక దేశకాలములకు గొనిపోవుచున్నాడు.
శ్రీరాముడు : ఈ జీవునికి ప్రయాసతో కూడిన ఈ ప్రయాణం ఎంత కాలం?
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అది జన్మ, మృత్యు, వార్ధక్య, వ్యాధుల ప్రయాసతో కూడిన ప్రయాణమే. వాసనలతో కూడి ఉన్నంతవరకు ఆప్రయాస కొనసాగుతూనే ఉంటుంది. దున్నపోతుకు ముక్కు త్రాడు వలె వాసనలచే కట్టుబడిన ఈ జీవుడు “ఉపాధి-దేశము-కాలము” …అను మూడు పదార్థములు గల అనేక స్థానాలకు ఈడ్వబడి అనేకసార్లు దుఃఖాలను, శిథిలత్వాన్ని పొందుచున్నాడు. వారి వాసనలే వారినట్లా బాధిస్తున్నాయి. అంతేగాని వారిని మరింకెవరో బాధించుట లేదు.
అజ్ఞాన ధోరణులు, కుమార్గములు ఆశ్రయించుటచే ఆతడు అనేక జీవితములను వృథా చేసుకుంటున్నాడు. వెట్టివాడు చేత సంచిని భుజాన వేసుకొని చెత్త చెదారమును నింపుకుంటూ భారంగా అడుగులు వేస్తూ దుఃఖితుడగుచున్నట్లు, ఈ జీవుడు తెలివిగా వాసనలు తొలగించుకో వలసింది పోయి, మరింకా పెంచుకుంటున్నాడు.
చూచావా! ఆతడు తన హృదయంలో జనిస్తున్న వాసనలచే పట్టుపురుగులాగా బంధితుడై దారిద్ర, వియోగాది దుఃఖముల భారం వహిస్తూ, వివిధ యోనులలో అవిశ్రాంతగా సంచారం చేస్తున్నాడు. అనేక దుర్దశలచే జర్జరీతుడగుచున్నాడు. చిరకాలం నరక సమూహములలో పడి లేస్తున్నాడు.
❖
సభ ముగించబడింది. శాంతి మంత్రాలు ప్రవచించబడ్డాయి.
ఆ సభలో ప్రతి ఒక్కరు “ఆహా! మూఢులమై మూర్ఖులమై మేము సంసారారణ్యంలో ఎంతటి సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తున్నాం! మహర్షి గుర్తుచేయకపోతే మా గతి ఏమిటి? ఇది ఎంతటి సుదినం! ఇక్కడి సంయోగ - వియోగాలలో ధ్యాసంతా కలిగియుండి ఉత్తరోత్తర విషయాలే యోచించటం లేదే! ధ్యాసను స్వస్వరూపం వైపు మరలించకపోతే ప్రయాస తప్పదుకదా! ఓ మహర్షులారా! ఓ రామచంద్రా! మీకు ధన్యవాదాలు. మాకు గుర్తుచేయవలసింది గుర్తుచేశారు! సర్వదా కృతజ్ఞులం” అని తమలో తాము చెప్పుకుంటూ గృహోన్ముఖులైయ్యారు.
(పదమూడవ రోజు విచారణ పూర్తి అయింది)