Page:587
పదునాల్గవ రోజు
X. వివేక దృష్టి
ఆత్మ - దేహముల సంబంధం
పదునాల్గవ రోజు యథావిధిగా సభ ప్రారంభమైనది.
శ్రీరాముడు : తండ్రీ! మహర్షీ! నిన్నటి రోజు చివరిలో “ఈ జీవుడు దేహముతో కూడి అనేక దేశ
- కాలములలో ప్రవేశ - నిష్క్రమణములను నిర్వర్తించటం” గురించి మీరు ప్రసంగిస్తున్నారు.
శ్రీవసిష్ఠ మహర్షి : మంచిది. మనం ఈ దేహం విషయమై మరికొన్ని విశేషాలు విచారణ చేద్దాం.
ఓ రామచంద్రా! ఒక్క విషయం మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.
దేహేజాతే న జాతో2 సి! దేహనష్టే న నశ్యసి | త్వమాత్మన్యకలంకాత్మా! దేహస్తవ నకశ్చన ॥
ఈ దేహం జనించుటచే నీవు జనించుట లేదు. దేహం కంటే ముందుగానే నీవు ఉన్నావు.
దేహము ఉన్నంతకాలం దేహాశ్రయుడిగా ఉండనే ఉన్నావు.
దేహం నశించినంత మాత్రం చేత నీవు నశించవు. దేహత్యాగిగా నీవు ఉండనే ఉంటావు. నీ విషయం, నా విషయం, ఈ సభలోని ప్రతి ఒక్కరి విషయం, భవిష్యత్లోని సర్వజీవుల విషయం ఇట్టిదే.
నీవు వాస్తవానికి స్వాత్మ యందు అకళంకరూపుడవై వెలయుచున్నావు. ఈ దేహంతో నీకేమి సంబంధమే లేదు. మనందరిలోని ప్రతిఒక్కరి విషయం ఇట్టిదే!. కుండ పగిలినా కుండలోని రేగు పండుకు ఏమీ కానట్లు (కుండ బదర న్యాయం) ఈ శరీరం నశిస్తే జీవుడు నశిస్తాడనుకోవటం కేవలం కల్పన, భ్రమ మాత్రమే. నశ్వరమగు ఈ దేహం నశిస్తే అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోతోంది. “నేను ఈ శరీరంతో నశించుచున్నాను” అని తలచే మూఢ చిత్తునకు ధిక్కారమగు గాక!
దృష్టాంతంగా ఒక రథం తీసుకుని చెప్పుకుందాం. రథచోదకుడు, వెళ్ళవలసిన ప్రదేశం గురించి ఇష్ట, అనిష్టములు లేనట్టి గుఱ్ఱములు, రథము, త్రాళ్లు - ఒకదాని వంటిది మరొకటి కాకపోయినప్పటికీ - అన్నీ ఒక చోటికి చేరి ప్రవర్తిస్తున్నాయి కదా! అట్లాగే దేహి, ఇంద్రియములు, దేహము, మనస్సు … ఇవన్నీ ఒక చోటికి వచ్చి ఆయా కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాయి. తటాకంలోని స్వచ్ఛమైన నీటికి, బురదకూ ఉన్న సంబంధమే ఆత్మకు, ఈ దేహేంద్రియములకూ
Page:588
గల సంబంధమని గ్రహించు. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్న ఒక బాటసారి మార్గమధ్యంలో ఒక సత్రంలో బస చేస్తున్నాడనుకో… ఆతనికి ఆ రాత్రి శయనించే గదిలోని వస్తుజాలముతో ఏర్పడే ’నావి’ అను మమత్వాభిమానం వంటిదే ఈ శరీరమునకు సంబంధించిన మమకారములు సుమా! ఆ గదిలోని వస్తువులతో ఏర్పడే “సంయోగముచే సుఖము, వియోగముచే దుఃఖము”లకు ఏమి అర్థమున్నది చెప్పు? ఆ బాటసారి అజ్ఞుడైతే సత్రంలో ప్రవేశించి, ”ఆహా! ఇవి నావి, ఆ గది ఆతనిది, వీటిపై నాకే హక్కు? అయ్యో! ఇక తెల్లవారబోతోంది. వెళ్లి పోవలసి వస్తుందేమోగదా! ఎట్లా? నే వెళ్ళిన తరువాత ఇవన్నీ ఏమౌతాయి? ఏమో మరి!”… అని భ్రమించి అనేక దుఃఖాలు పొందుతాడు. ఆ బాటసారి కనుక జ్ఞాని అయితే “ఈ సత్రంలోని గది గాని, ఇందులోని సామగ్రి గాని ఈ సత్రం యజమానివి గాని, నావి కావు. నేను ఇక్కడ బస చేస్తూ, ఇక్కడి వాతావరణమునకు అనుకూలుడనై ఉంటాను. వీటిని సొంతమనుకొని మమకారం నే నెందుకు కలిగి ఉండాలి? ఇవి నావి కానప్పుడు వీటిని త్యజించటమేమిటి? కోల్పోవటమేమిటి?” అని గ్రహించి ఉంటాడు. వాటిని ఉపయోగిస్తూనే తాను వాటికి వేరై ఉంటాడు. ఆతనికి, అక్కడి వస్తువులకు గల సంబంధమే ఆత్మకు ఈ దేహాదులతో గల సంబంధం సుమా!
ఒక బాలుడు బాగా అల్లరిచేస్తున్నాడనుకో… ఆతని దాది ఆతనిని సమీపించి “ఓయీ! బాలుడా! నీవు ఇట్లాగే అల్లరి కొనసాగించావా… ఆ చీకటిలో నుంచి ఒక బేతాళుడొచ్చి నిన్ను పట్టుకుపోతాడు. ఆతనికి పెద్ద పెద్ద దంతములు, చింతనిప్పుల్లాటి ఎఱ్ఱటి కళ్ళు ఉంటాయి. తలపై రెండు కొమ్ములు కూడా ఉంటాయి. మరి ఆతనిని పిలవమంటావా?” అని భయపెట్టుచున్నదనుకో. ఆ బాలుడు చీకటి వైపు చూచి అక్కడి ఆ విశేషణములు గల ఒక ఆకారమును ఊహించుకుని “వద్దులే! నేను అల్లరి చేయను” అని ఊరుకుంటాడు చూచావా? ఆ బాలుని కళ్ళకు కల్పిత బేతాళుడు అగుపించినట్లు జీవునకు ”ప్రీతి, అందము, సుఖము, దుఃఖము, గ్రాహ్యము, త్యాజ్యము” మొదలైనవన్నీ మిథ్యారూపంగా ఏర్పడుచున్నాయి. అయితే, వాటికి, ఆత్మకు సంబంధమే లేదు. ఆ కలుగుచున్నదంతా కల్పిత బంధమే.
❖
ఒక మహావృక్షము నుండి లభించిన కొయ్య నుండి వేరు వేరు విగ్రహములు తయారు చేయబడుచున్నట్లు, సమ్మిళితములైన పంచ భూతముల నుండి ఈ జనసమూహమంతా వేర్వేరుగా నిర్మించబడుచున్నారు. అందుచేత ఈ అనేక శరీరములను చూచి నీవు భ్రమ పొందవద్దు. ఒక పెద్దకట్టెల మోపులో ఉన్నవన్నీ కట్టెయే (కొయ్యయే) కాని, మరింకేమి కాదు కదా! ఈ దేహం కూడా మనం పరిశీలించి చూస్తే ఇందు పంచభూతములు తప్పించి మరింకేమీ లేదు.
ఓ జనులారా! ఈ పంచభూతములు ‘ఉత్పత్తి-క్షోభ-వినాశనము’ లందు మీరు ఎందుచేత హర్ష శోకవశులగుచున్నారో కాస్త చెపుతారా?… అగ్ని యందు పడి, మిడత భస్మమౌతున్నట్లు మీరు కూడా పాంచభౌతిక సంఘాతమైన ‘కామము’ అను పేరు గల విషయాగ్నియందు ఎందుకు పడుచున్నారు? అందు ఏ గొప్ప, శాశ్వత విశేషం మీకు కనబడుతోంది?
Page:589
ఇవన్నీ అజ్ఞానుల యందు మాత్రమే ప్రీతి జనింపజేస్తున్నాయి, కాని జ్ఞానులకు పంచభూత రూపములుగానే కనిపిస్తున్నాయి.
పరస్పర సంబంధం లేని రెండు వేర్వేరు వస్తువులను ఒకచోటికి తీసుకువచ్చి ఉంచామనుకో… ఆ రెండు వస్తువులకు ఒకదానిపై మరొక దానికి “రాగము” ఏర్పడుతోందా? లేదే! అలాగే ‘చిత్తము - శరీరము’ లకు ఒక చోట ఉన్నా ఒకదాని పట్ల మరొకదానికి రాగము ఏర్పడవలసిన పనేమున్నది? పనిలేదు. అయినా కల్పనచే ఏర్పడుచున్నది. అట్లాగే మట్టితో చేసిన అనేక సైనికుల బొమ్మలతో ఒక యుద్ధరంగమును నిర్మించి ఆట బొమ్మలలో ఉంచామనుకో… ఆ సైనికుల బొమ్మలన్నీ ఒకే మట్టితో తయారు చేయబడినప్పటికీ “ఇటు సైన్యం మన రాజ్యానిది… అటు సైన్యం శత్రు రాజులది”… అనే విశేషణము ఆపాదించబడుచున్నది కల్పన చేతనే కదా! ఈ బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, ఆత్మల సంసర్గము మమత్వరహితంగా గాంచబడు గాక! శిలా విగ్రహములకు పరస్పరానుబంధం ఉండనట్లు ఆత్మకు ఈ దేహ, ఇంద్రియాల పట్ల రాగం ఉండకుండు గాక! వాటి కొరకు విలపించటం అత్యంత అసంగతమైన విషయమని ఆత్మ స్వరూపుడవగు నీవు గ్రహించు. తరంగం ఎక్కడెక్కడివో కొన్ని గడ్డిపరకలను ఒక చోటికి జేర్చునట్లు ఆత్మ పంచభూతములను ఒక చోటికి జేర్చి, తద్వారా ఈ జగత్తును గాంచుచున్నది. కెరటముల ప్రభావం చేత కొట్టుకురాబడుచున్న కొన్ని గడ్డిపరకలు కలుస్తున్నప్పుడూ, విడిపోతున్నప్పుడూ రాగ ద్వేషాలు, హర్ష- శోకాలూ పొందుతాయా? లేదు కదా! ఈ పుత్రులు, పశువులు, అయినవాళ్ళు, కానివాళ్ళు అన్నరూపంలో ఏర్పడివున్న ప్రాణులన్నీ పంచభూత మాత్రములై ఆత్మ మహాసముద్రంలో కలవటం, విడిపోవటం చేస్తున్నాయి. ఇందులో శోకించటానికి గాని, సంతోషించటానికి గాని, ఏ విశేషమున్నది? జలంలో ఆవర్తములవలెనే ’చిత్తములు’ అనురూపం పొందిన ఆత్మ పంచభూతములను ఒక చోటికి చేర్చి వినోదిస్తోంది.
సంచలనముచే మాలిన్యము పొందిన జలం క్రమంగా సంచలన రహితమగుచున్నప్పుడు ఆ మాలిన్యమును వదిలి శుద్ధరూపం పొందుతుంది చూచావా? జ్ఞానము యొక్క సహాయంచే విషయ రూపమును త్యజించుచున్న జీవుడు స్వయముగా బ్రహ్మరూపమును పొందుచున్నాడు. ఆకాశమున సంచరించే సిద్ధపురుషులు, దేవతలు వాయుమండలము నుండి భూమండలమును చూస్తూ ఉంటారు చూచావా! జ్ఞానము పొందిన జీవులు ఈ పంచభూతసముదాయమునుండి విడివడినవారై, తమ దేహముతో సహా సర్వబాహ్యవస్తు సముదాయమును తమ స్వస్వరూపముకంటే వేరైనదిగా గాంచు చున్నారు. దేహాతీతులైన జ్ఞానులు పంచభూతములను తమకు వేరైనదిగా, అసంబంధమైనదిగా గాంచుచుండుటచే తమయొక్క జన్మరాహిత్యమును ప్రత్యక్షముగా గాంచగలుగుచున్నారు. లేదా, “ఇదంతా మమాత్మవిన్యాసమే” అనురూపంగా ఆస్వాదిస్తున్నారు. సూర్యకాంతి మణి వలె స్వయం ప్రకాశమును అవధరిస్తున్నారు.
మద్యము త్రాగి మత్తులో ఉన్నవాడు తన యొక్క పూర్వస్థితులను, తదితర పరిచయములను, తన ఎదురుగా ఉన్న వస్తుజాలమును అస్పష్టంగా గాంచుతూ ఉంటాడు. ఆ మత్తు దిగిపోయిన తరువాత
Page:590
మరల ఇతఃపూర్వజ్ఞానమును సుస్పష్టంగా తిరిగి పొందుతాడు. అట్లాగే దేహాతీతత్వము అవధరించిన మహనీయుడు ప్రమాణ, ప్రమేయముల నుండి విడివడి వికారరహితుడై తన ఆత్మను గాంచుచున్నాడు.
ఓ రామా! వివిధ సముద్రజలములు తరంగముల కల్లోలంచేత తేలియాడే గడ్డి పరకలతో సంయోగ - వియోగములు చేస్తున్నట్లుగానే… ఆత్మయే సమస్త వస్తు సంయోగ - వియోగాది క్రియా విశేషములను స్వయంకల్పితంగా నిర్వర్తిస్తోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో కొందరు నేను వర్ణిస్తూవస్తున్న విశేషాలతో శరీరాతీతులై, ఆత్మతో ఏకత్వం పొందినవారై ఉన్నారు. వారు వీతరాగులై, పాపరహితులై బ్రహ్మపదమున వెలుగొందు చున్నారు. అట్టి వారిలో కొందరు బోధకులై బ్రహ్మతత్త్వ ప్రవచనం చేస్తున్నారు. అట్టి మహనీయులకు దిగ్విజయమగు గాక!
సముద్రంలోని మహాతరంగములు తమ యందు అమూల్యమైన రత్నములు కలిగి ఉండి కూడా, వాటి యందు ఆశ లేకుండానే యథాతథసంచలనంతో సంచరిస్తూ ఉంటాయి కదా! ఆ మహాత్ములు కూడా జ్ఞానులై, వాసనారహితులై అనాసక్త చిత్తముతో వ్యవహారములు ఆచరిస్తున్నారు.
తీరమున ఉన్న భవనం చూచి సముద్రం క్షోభ చెందుతుందా? మోదం పొందుతుందా?… గాలికి దుమారం లేచినంత మాత్రం చేత ఆకాశం మలినమై పోతుందా?… ఈ ప్రపంచ వ్యవహారములచే ఆత్మజ్ఞాని మలినం పొందడు, మార్పు పొందడు. చేర్పు పొందడు.
శ్రీరాముడు : అట్టి మహనీయులు అందరిలాగానే ఈ ప్రాపంచిక రాగ ద్వేషముల మధ్య
మనగలుగుతారా?
శ్రీవసిష్ఠ మహర్షి : స్వచ్ఛమైనట్టి, మలినమైనట్టి చంచల జలతరంగములచే సముద్రము రాగము గానీ, ద్వేషము గాని పొందుతోందా? లేదు. ఆత్మజ్ఞాని కూడా భోగములచే రాగము గాని, ధన, జనాదుల రాకపోకలచే ద్వేషము గాని పొందుట లేదు.
యన్మనో మననం కించిత్సమగ్రం జగతి స్థితమ్ | తచ్చేత్యోన్ముఖచిత్తత్వవిలాసోల్లసనం విదుః || (శ్లో 28, సర్గ 72)
“ఈ జగత్తులో ఉన్నది. ఉండబోయేది మనస్సు యొక్క సంకల్ప - వికల్పములు మాత్రమే” - అని అతనికి తెలుసు. “ఇదంతా విషయోన్ముఖమైన చైతన్యము యొక్క విలాసము మాత్రమే” అని ఆత్మజ్ఞాని ఎరిగియే ఉంటాడు.
ఈ అహంకారము, ఈ త్రికాలస్థమగు విషయములు, ఈ దృశ్య, దర్శన సంబంధములు - సర్వమూ మనోవిజృంభణము మాత్రమే!
Page:591
దృశ్య - - దర్శనముల మధ్య దృక్ (That which is seeing) ఉన్నది. దృశ్యము దృక్ యొక్క ఆధీనంలో ఉన్నది. దృక్ ఈ దృశ్యమును ఎట్లు చూస్తే అట్లే ప్రాప్తిస్తూ ఉంటుంది. దృక్ యొక్క అధీనంలో ఉండే ఈ దృశ్యము సత్తయా?… కాదు! అసత్తయా?… కాదు!
ఇట్లు సత్త అని గాని, అసత్త అని గాని నిర్ణయించబడజాలనిది, హర్షశోకములకు అర్థమెట్లా అవుతుందో చెప్పు? కనుక ఈ దృశ్యము స్వయంసిద్ధము కానే కాదు. స్వయంసిద్ధమైనది ’దృక్’ మాత్రమే. అదియే ఆత్మ! ఆత్మ సర్వదా అసంగమైనది.
శ్రీరాముడు : అయితే ఈ జీవులకు హర్ష శోకములు ఎందుచేత కలుగుచున్నాయి?
శ్రీవసిష్ఠమహర్షి : రామా! ఇప్పుడు నీకు కొన్ని కొన్ని సందర్భములలో హర్ష శోకములు కలుగుచున్నాయి. కదా! నిన్నొక చిన్న ప్రశ్నవేస్తాను - అట్లా ఏర్పడే హర్ష శోకములు సత్యమైనదాని గురించా? లేక… అసత్యమైనదాని గురించా? కాక సత్యాసత్యమైన దాని గురించా?
అసత్యమైనది మిథ్యయే కదా! మిథ్య, అవాస్తవం అయినదాని గురించి హర్షమెందుకు? శోకమెందుకు?
శ్రీరాముడు : …!
శ్రీవసిష్ఠ మహర్షి : ఇక సత్యమైనదాని గురించి అంటావా? అది ఎల్లప్పుడూ సత్యమై నిత్యమై లభించియే ఉన్నది కదా! …మరి హర్షమెందుకు? శోకమెందుకు? …ఎందుకంటే నిత్యమైనది మాత్రమే సత్యము కదా!
ఇక "సత్యా సత్యమైనదాని గురించి” అని అంటావా?… ఎక్కడైనా విరుద్ధ ధర్మములు ఒక చోట ఒనగూడుతాయా? ఒకే చోట, ఒకేసారి వెలుగు చీకటి ఏర్పడినవై ఉంటాయా? అందుచేత ’సత్యాసత్యమైనది’ అనే మాటయే మిథ్య. మరి నీవు దేనికైనా సరే, ఎందుకు విమోహితుడవు కావాలి చెప్పు?
ఉత్తమ నేత్రములు గల ఓ రామచంద్రా! నీవు మొట్టమొదట మిథ్య అయినట్టి అసమ్యక్ దర్శనం (The illusion of seeing the variety and missing the unity) త్యజించు. సమ్యక్ దర్శనమును అవలంబించు. సమ్యక్ దర్శనమునందు సుస్థిరుడైనవాడు ఇక్కడెక్కడా ఏ స్థితిగతులలోనూ మోహం
చెందడు.
ఆత్మ తన యొక్క దృశ్య దర్శన సంబంధమైన విస్తారముచే తనకు తానే మనస్సు అను రూపంగా ప్రకటించుకొనుచున్నది. అందుకే విజ్ఞులు "దృశ్య దర్శనములకు సంబంధించిన అనుభవ రూపమగు సుఖవృత్తి కూడా బ్రహ్మము యొక్క రూపమే” అని చమత్కారంగా విశ్లేషిస్తూ ఉంటారు. అలాగే, ఈ ఉపాధి కృతమైన భేద దృష్టి తొలగిపోయినప్పుడు… అప్పుడు ఏర్పడే సుఖము శివము, లేక, అఖండ బ్రహ్మమే. … కాబట్టి ‘బ్రహ్మము’ అంటే ఏదో, ఎక్కడో ఉన్నట్టిది కాదు. శ్రీరాముడు : సంసారము అనగా ఏమిటి?
Page:592
శ్రీవసిష్ఠ మహర్షి దృశ్య దర్శనముల మధ్య గల ఒకానొక అజ్ఞానపూరితమైన సంబంధమునే మనం ‘సంసారము’ అనే శబ్దంతో ఉద్దేశిస్తున్నాం. దృశ్య దర్శనముల మధ్య గల అనుభవం అజ్ఞానులకు సంసారముగా ప్రాప్తిస్తోంది.
అదే అనుభవం ద్రష్ట-దర్శనముల సంబంధమేమిటో ఎరిగిన ప్రపంచాతీతులకు మహాభ్యుదయ యుక్తమగు “మోక్షము” అను అనుభవం చేతికందిస్తోంది.
అనుభవం దృశ్యవృత్తితో కూడి ఉంటే బంధము. వృత్తి రహితమైనప్పుడు, అప్పుడు శేషించే అనుభవమే ముక్తి.
శ్రీరాముడు : ముక్త స్థితిలో ‘అనుభవం’ అనేది ఉంటుందా? ఉండదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అనుభవమే ఆత్మయొక్క ముఖ్యదేహం. అయితే దేహి దేహము కంటే అత్యంత సూక్ష్ముడు. అనుభవం యొక్క ఉనికి-లేములు ఆత్మను స్పర్శించవు.
ద్రష్ట 7T దృశ్యము
దృశ్యాతీతానుభవం దృశ్యపరిమితానుభవం
↓ ముక్తి బంధము
జ్ఞానము యొక్క బలిమిచే ఈ జీవుని సుఖసంవిత్తు వికారరహితమౌతుంది. అనగా, వృద్ధి క్షయ రహితమౌతుంది. వృద్ధి, క్షయ రహితమగు సుఖానుభవం పూర్ణానందస్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.
కనుక రఘు రామా! నీవు దృశ్య - దర్శన వర్జితమైనట్టి సుఖమును ఆశ్రయించు. దానినే ‘కేవలానుభవ దృష్టి’ అని కూడా శాస్త్రములు చెప్పుచున్నాయి. అట్టి దృష్టిచే అప్పుడు ఉచిత సమయంలో సంసారబంధ రహితుడవౌతావు.
అట్లు జీవుడు కేవలమగు (That which is Absolute) తన సుఖస్వరూపమును ఆశ్రయిస్తూ ఉండటం చేత ఆతని యందు స్వస్వరూప దృష్టి ప్రకాశించగలదు. దృశ్యం రహితమైనప్పుడు, అప్పటి అనుభవమునకు, ద్రష్టకు భేదమేమీ ఉండదు. ఆ మార్గంలో లభిస్తున్న స్థితియే తురీయావస్థ. అదియే ముక్తి. ఏ జీవుడైనా సరే… దృశ్యదర్శన వర్జితుడై పరమాత్మ బుద్ధిని సంపాదించుకొంటే అది ముక్తస్థితి అవుతుంది.
ముక్తరూపమగు తురీయస్థితి యందు ఆత్మ ఏ తీరుగా ఉంటుంది? అది స్థూలమా? …కాదు. సూక్ష్మము కూడా కాదు. ప్రత్యక్షముగాని, అప్రత్యక్షముగాని కాదు.
అద్దానిని చైతన్యము, జడము, సత్తు, అసత్తు మొదలైన పేర్లచే నిర్వచించలేం. దాని రూపం అహంకారం గాని, మరింకేదో గాని కాదు. “ఏకము, అనేకము, సమీపము, దూరము, ప్రాప్యము,
Page:593
అప్రాప్యము” = మొదలైన వాచ్య వాచక శబ్దములు అద్దానికి ఆపాదించలేం. అది స్వరూపమని, సర్వవ్యాపకమని, పదార్థమని, అపదార్థమని, పంచభూతాత్మకమని, అపంచభూత రూపమని చెప్పలేం. అద్దాని గురించి చెప్పటానికి మాటలు లేవు… చాలవు. కానీ అన్ని శబ్ద-అర్ధముల సమగ్ర ఆత్యంతిక సమన్వయం అదే!
శ్రీరాముడు : నామ - రూపాలు లేనట్టిది ఉన్నట్లా? లేనట్లా?
శ్రీవసిష్ఠమహర్షి : ఒక్క విషయం మాత్రం నిస్సంకోచంగా ప్రకటిస్తున్నాను. ఈ జీవునికి ఆరవ ఇంద్రియం మనస్సు. మనస్సుకు రూపమేమున్నది. అయితే, ఈ దృశ్యరూపమున సంతరించుకుని ఉన్నదంతా మనస్సు మాత్రమే. మనస్సుకు పరమై, ఆ మనస్సుకు కారణము, స్థానము, ఆధారము ఆత్మయే కదా! అట్టి ఆత్మతత్త్వమును, "అది ఏదీ కాదు” - అనటం కూడా సత్యవాక్కు కాదు. ఈ జగత్తును యథారూపమున గాంచగలుగుచున్న ప్రపంచాతీతులకు “ఇదంతా ఆత్మయే” అని అనుభవ మగుచున్నది. సర్వం ఆత్మయే!
ఈ జగత్తంతా ఆత్మమయమే అయి ఉన్నది. ఆత్మకు భిన్నంగా ఏదీ ఎక్కడా లేదు. ఆత్మయే పృథివిలో కాఠిన్యంగా, జలంలో ద్రవత్వంగా, తేజస్సులోని ప్రకాశంగా, ఆకాశంలో అవకాశంగా ప్రకాశిస్తోంది. ఒక నటుడు అనేక చోట్ల అనేక వేషాలు వేస్తున్నట్లు, ఆత్మ సర్వరూపములూ తానే అయి, తాను మాత్రం అవేవీ కాకయే ఉంటోంది.
చైతన్యమే లేకపోతే వస్తువుల సత్తా ఏమాత్రం సిద్ధించేది కాదు. అంతేకాదు… “ఆత్మకు భిన్నంగా నేను ఉన్నాను” అనే మాట ఉన్మత్త ప్రేలాపన మాత్రమే.
ఓ మహాత్మా! రామచంద్రా! సమస్త దేశ కాలములు, అందలి అనంత కోటి కల్పములు, ఆ కల్పముల మధ్య కనిపిస్తున్న అనేక బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండములలోని వివిధ జీవుల గమనాగమనములు ఇవన్నీ ఆత్మయే అయి ఉన్నాయి. ఆత్మకు వేరుగా మరొక కల్పన ఏదీ ఉండ జాలదు. కాబట్టి ఆత్మకు సంబంధించిన నిశ్చయబుద్ధి కలిగి ఉండు. ఆ బుద్ధికి కూడా పరుడవై ఉండు. బిడ్డా! సర్వదా ప్రపంచాతీతుడవై ఉండు. ప్రపంచస్వరూపుడవై ఆస్వాదించు.
శ్రీరాముడు : హే మహర్షీ! మేము వస్తుదృష్టి నుంచి వైతొలగి ఆత్మ దృష్టికి చేరినప్పుడుకదా ముక్తి! అది సుసాధ్యమేనంటారా? దృష్టిని జ్ఞానమయం చేయటమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! “ఇది ఉత్తమోత్తమమైన వజ్రం" - అని తెలిసిన తరువాత ఏదైనా త్యజించి అద్దానిని పొందాలని జనులు అనుకోవటం సహజమే కదా! విచారణదృష్టితో ఈ జగత్తును గమనిస్తున్న ఉత్తమ పరిశీలనపరులు ఇందలి సత్యాసత్యమేమిటో గ్రహిస్తున్నారు. ద్వైతత్యాగం చేసి ఆత్మ స్వరూపమగు ముక్తిని స్వభావంగా ఆకాంక్షిస్తున్నారు. పొందుచున్నారు.
Page:594
నేనే ఆకాశమును. నేనే సూర్యుడను. దైత్యులు, దేవతలు, ఆ దేవతలు ఉండే స్వర్గలోకం నేనే! మేఘమండలం, పృథివి, సముద్రం, ధూళి, అగ్ని కూడా నేనే. వెయ్యి మాటలు అనవసరం. ఈ జగత్తంతా నేనే… ఈ ముల్లోకములందు ఆత్మ అయినట్టి నేను మాత్రమే సత్యమై ఉన్నాను… ఆత్మయే అయి ఉన్న నేను పరిచ్ఛిన్నుడను ఎట్లా అవుతాను నాకు అన్యమైనదంటూ, ఈ దేహంతో సహా ఈ మూడులోకాలలో ఏదీ లేదు…
ఇట్లు విచారణ చేసి నిశ్చింతుడవై ఉండు. జగత్తంతా ఆత్మమయమై ఉండగా… అట్లు గాంచటంలో ఏం కష్టం? అట్టి సంభావనను కించిత్ అలవరచుకుంటే ఇక నీవు హర్షశోకములకు వశుడవు గావు. అవి నిన్ను ఏమాత్రం ఓడించలేవు. కనీసం స్పర్శించనైనా లేవు.
తన్మయే2స్మిన్కిల జగత్యఖిలే సంస్థితే2 నఘ |
కిమాత్మయం పరం కిం స్యాత్కమలేక్షణ కథ్యతామ్ || (శ్లో 7, సర్గ 73)
ఈ జగత్తులో ఏదేది ఎట్లు తారసపడినా సరే, ఆత్మజ్ఞానికి అదంతా తనకు అన్యమైనదిగా అనిపించదు. అందుచేతనే అతడు హర్షశోకాలు పొందడు. అజ్ఞుడు మాత్రమే వాటిని పొందుచున్నాడు.
ఇంతకు ముందే మనం చెప్పుకొనియున్నట్టి మూడురకాల అహంకారదృష్టుల గురించి … ఈ సందర్భంలో ఉచితం కనుక, మరల ప్రస్తావిస్తున్నాను విను1. ‘నకించిదహమ్’ దృష్టి - - "నేను ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనవాడను. ఈ సర్వలోకములలోని ప్రతి ఒక్క పదార్థమునకు పరమైనట్టి చిత్ స్వరూపమగు ఆత్మయే నేను”-
అను దృష్టిని ‘న కించిదహమ్ దృష్టి’ అని పిలుస్తున్నారు. అట్టి దృష్టిని పెంపొందించుకున్న సాధకుడు "నేను ఒక పదార్థమునే కాదు కదా! ఇక నన్ను ఏది ఎట్లా బంధించగలుగుతుంది?”- అను వివేకమును సముపార్జించుకుంటున్నాడు. “పదార్థమునకు పరిమితులుంటాయి. పదార్థము లన్నిటికీ పరము, అప్రమేయము అయినట్టి నేను స్వభావసిద్ధంగానే అపరిమితుడను” - - అను ఔన్నత్యదృష్టిని తత్త్వజ్ఞాని సంతరించుకుంటున్నాడు.
సర్వత్ర సర్వమహమ్ దృష్టి - “ఆత్మయే సర్వమై అంతటా వ్యాపించి, అన్నీ తానే అయి ఉంటోంది. నేను ఆత్మను కాబట్టి అన్నిటా వ్యాపించి, అంతయూ అయి ఉన్నది నేనే. నేలపై ఆహారం కొరకై అటూ ఇటూ తిరుగుచున్న ఒక పురుగు దగ్గర నుండి, ఈ మూడు లోకములనూ పరిపాలించి శాసిస్తున్న త్రిమూర్తుల వరకు ప్రసరించియున్నది నేనే.” ఇక ఈ దృష్టిని అవలంబిస్తున్న సాధనపరులకు దుఃఖం ఎక్కడి నుండి రాగలదు చెప్పు?
“ఇదమ్ దేహమహమ్” దృష్టి - ఈ మూడవది అతి తుచ్ఛమైన దృష్టి. “ఈ దేహమే నేను” - అను భావన (లేక) దృష్టి (లేక) అహంకారము సర్వదుఃఖములకు, అశాంతులకు కారణమగుచున్నది.
Page:595
ప్రియమైన రామచంద్రా! నీవు ఈ మూడవ అహంకారమును మొదటి రెండిటితో, లేక ఆ రెండిటిని ఒక దాని సహాయంతో మొదలంట్ల త్యజించి వేయాలి. అప్పుడు నీయందు నిరహంభావ రూపమైనట్టి చిన్మాత్రము శేషిస్తుంది. అద్దానినే అవలంబించు. అద్దాని యందు తత్పరుడవై ఉండు.
ఆత్మ సర్వదా సర్వమునకు అతీతమైనదైనప్పటికీ, సర్వసత్తలకు పరమైనప్పటికీ, అయ్యది తనయొక్క మాయా శక్తిచే ఈ జగత్తును స్వీకరించి పొందుచున్నది. దీనిని పరిపూర్ణమొనర్చుచూ, స్వయంప్రకాశరూపమై వెలుగొందుచున్నది. అందుచేత నాయనా! ఇక నీకు సందేహాలు అనవసరం. తాత్సారం చేయవలసిన పనిలేదు. ఇప్పటికిప్పుడే “నిత్యోదితమగు ఆత్మయే నేను” అనే నిత్యానుభవాన్ని ఇప్పుడే గ్రహించు. అట్టి ఎరుక - దృఢనిశ్చయములచే ’దేహము, దేహసంబంధములు’ మొదలైన వాసనలతో కూడుకునియున్న నీ హృదయగ్రంథిని త్యజించు.
అనుభవం - అయితే ఒక్క విషయం. మనం ఎంతో వివరంగా ఈ 14 రోజులుగా అనేక విషయాలు చెప్పుకుంటున్నాం ఈ మన సంవాదం మరికొన్ని రోజులు కొనసాగబోతోంది. మంచిదే. అయితే, ఆత్మ అనుమాన శబ్దప్రమాణములచే పొందబడేది కాదు మరి! సర్వదా, సర్వవిధములా సర్వరూపమైనట్టి ఆత్మ స్వానుభవము చేతనే ప్రత్యక్షం కాగలదని గ్రహించు. అందుకుగాను ఈ జీవుడు ఈ ఉపాధిచే ఏర్పడే సర్వ సంబంధములను, సర్వసందర్భములను అధిగమించ గల ఒకానొక సమగ్రమైన దృష్టిని సముపార్జించాలి. అదియే ఉపాధిని జయించటం, లేక త్యజించటం కూడా. ఉపాధికి సంబంధించిన కర్తృత్వ వృత్తితో కూడిన అంతఃకరణమును పరిశుద్ధపరచుకోవాలి. అందుకు మార్గం ఉత్తమమైన పరిశీలనయే. అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణముల సహాయంతో ఉదయించగల జ్ఞానం నిన్ను భగవంతుడగు ఆత్మగా శేషింపజేయగలుగుతుంది. ఆ జ్ఞానం అణువణువునా ప్రవేశించి నిరంతరానుభవంగా రూపుదిద్దుకోవాలి సుమా!
దేవదేవుడగు ఆత్మ సత్తు కాదు… అసత్తు కూడా కాదు. అణురూపం కాదు… బృహద్రూపం కూడా కాదు. సదసత్తుల మధ్య గల సత్యాసత్య స్వరూపం కూడా కాదు. కానీ… “సర్వం అదియే.” అదెట్లా అంటావా? ఒక జీవుడు ఒకనికి తండ్రి మరొకరికి కుమారుడు, ఇంకొకరికి భర్త, వేరొకరికి మిత్రుడు… అన్నీ అతనే గాని, వాటిలో ఏ ఒక్కటీ అతనిని నిర్వచించలేవు కదా! ఇది కూడా అట్టిదే.
ఆత్మ గురించి అనేక మాటలలో చెప్పుకుంటున్నాం. కాని యథార్థానికి అది వచించటానికి అలవి అయ్యేది కాదు. దానికి అన్యమైనదేదీ లేదు. కాబట్టి, ఇది గమనిస్తూనే, అత్యంత శ్రద్ధతో కూడిన శ్రోతవై నీవు సర్వత్రా నిర్వికారమగు ఆత్మనే దర్శిస్తూ ఉండు.
శ్రీరాముడు : స్వామి! ఇంతకీ ఈ ఎదురుగా కనబడే అనాత్మ రచయిత ఎవరు?
శ్రీవసిష్ఠ మహర్షి : ’ఇది ఆత్మ - ఇది ఆత్మ కాదు’ అనునట్టి ఈ నామరూప విభాగమంతా ఆత్మయే సర్వవ్యాపకమగు తన అజ్ఞానశక్తిచే తనయందు కల్పించుకొనుచున్నది.
Page:596
సంస్థితః స హి సర్వత్ర త్రిషు కాలేషు భాస్కరః | సూక్షత్వాత్సుమహత్వాచ్చ కేవలం న విభావ్యతే ॥ (శ్లో 20, సర్గ 73)
ప్రకాశవంతమగు ఆ ఆత్మ త్రికాలములందు ఎల్లెడలా స్థితి కలిగియే ఉన్నది. అయితే అది అతి సూక్ష్మము, మహత్తరము కదా! అందుచేత స్థూలములగు ఈ దేహాదులందు ఆసక్తబుద్ధి గల మనుజులకు అది భావించటానికి అశక్యమై ఉంటోంది. ప్రయత్నించనివారికి అది అసంగతం గాను, అయోమయం గాను ఉండిపోతోంది. ప్రయత్నించేవానికో… అతిసులభం!
స్వప్న ద్రష్ట స్వప్నాంతర్గత సర్వపదార్థములలోను నిండి ఉన్నాడు కదా! అట్లాగే ఆత్మ సృష్టి సర్వపదార్థములందూ నిండియున్నది. కాని స్వభావ వశంచేత ‘బుద్ధి’ (లేక) ’లింగశరీరము’ నందు మాత్రమే ప్రతిబింబితమగుచున్నది. నీవు నిట్టనిలువుగా నిలబడ్డావనుకో… ఎదురుగా మరొక చోట చూచేవారికి కనిపించవు. కానీ ఆ ఎదురుగా ఒక నిలువుటద్దం అమర్చినప్పుడు అందులో ప్రతిబింబించుతావు. అనగా, అద్దం అక్కడ లేనప్పుడు కూడా నీ బింబం ప్రసరిస్తున్నప్పటికీ, నిలువుటద్దం లేనప్పుడు నీ రూపం అక్కడ చూడలేం కదా! ఆత్మ కూడా అంతటా ప్రసరించుతూ కూడా పుర్యష్టకము లేక లింగశరీరము (Subtle body) ఉన్న చోటే ప్రతిబింబిస్తోంది. గాలి అంతటా నిండి ఉన్నప్పటికీ, దాని ఉనికి తెలిసిరాదు. కాని వింజామరలు వీచినప్పుడు గాలి యొక్క ఉనికి స్పర్శకు లభ్యమగుచున్నది.
ఆత్మ అంతటా ఉన్నప్పటికి లింగదేహం ఉన్నచోట అహంకార రూపమున వ్యక్తమై అనుభూత మగుచున్నది. చిత్స్వరూపమై, సర్వవ్యాపకమైనట్టి ఆత్మ దేహము లందు మాత్రమే ఉన్నదను మాట సమగ్రం కాదు. అయితే వాయువు వీస్తున్నప్పుడు ధూళి ఎగురుచున్నట్లు, లింగదేహము ఉన్నచోట జీవుడుగా స్ఫురించుచున్నది. ఆకాశంలో సూర్యుడు ఉదయించినంత మాత్రం చేత జనులు నిదురలేచి తమ దైనందిన కార్యక్రమములు ప్రారంభించుకుంటున్నారు. పరమప్రేమాస్పదమై, నిరతిశయానంద రూపమైనట్టి ఆత్మ స్ఫురించినప్పుడే లింగ శరీరమున విషయభోగేచ్ఛ సంభవమగుచున్నది.
సర్వమూ ఉన్నది ఆత్మ యొక్క ప్రీతి కొరకే!
సూర్యోదయానంతరం జనులు ఆయా కార్యక్రమములు ప్రారంభిస్తున్నప్పుడు, ఆ కార్యములు ఫలించటం, విఫలం కావటం సూర్యునికి హాని వృద్ధులు కలిగించవు కదా! ఆత్మ దేవుని సత్తచే స్థితి పొంది ఉంటున్నట్టి ఈ దేహము ప్రవృద్ధమగుచున్నప్పటికీ (లేక) నశించినప్పటికీ ఆత్మకు ఏ హాని వృద్ధులూ ఉండవు.
ప్రాణికోట్లన్నిటి యొక్క ఆత్మ ఏ కాలమందూ కూడా జనించుటలేదు, మరణించుట లేదు. అది దేనినీ గ్రహించదు, వాంఛించదు. దానికి బంధము గాని, ముక్తి గాని లేవు. అది స్వయముగా అవధరించి అనాత్మయందు ఆత్మత్వము దర్శించుచూ, రజ్జు-సర్ప భ్రాంతిలాగా “ఈ దేహం మాత్రమే నేను. ఈ దేహము నా ఉనికి” అనే భ్రాంతి పొందుతోంది. అట్టి భ్రాంతి పొందుచున్నప్పుడు అది దుఃఖ భాజకము అవుతోంది.
Page:597
ఏది ఏమైనా అనాదియగు ఆత్మ ఎన్నడూ ఉత్పన్నము కాలేదు. కాబట్టి నశించుట కూడా లేదు. అది తనకు భిన్నమైనదేదీ వాంఛించటం లేదు. దానికి భిన్నంగా ఏదైనా ఉంటే కదా… వాంఛించటానికి? అది దేశ కాలములచే అపరిచ్ఛిన్నము. కనుక బంధింపబడజాలదు. బంధమే లేని దానికి ముక్తి ఎక్కడిది? అది స్వస్థానము నుండి చ్యుతి పొందుటయే లేదు. కానీ, అవిచారణవశం చేత మూఢులగు జనులు, పాపం, నిష్కారణంగా దుఃఖం పొందుచున్నారు. ఆత్మ కొరకై ఎక్కడెక్కడో వెతుకుచున్నారు.
ఓ రామా! నీవు చక్కగా ఈ జగత్ క్రమము యొక్క పూర్వాపరములను విచారణచేయి. అంతే గాని, మూఢునిలాగా వ్యర్థంగా దుఃఖం పొందవద్దు.
విజ్ఞుడైనవాడు బంధమోక్షములు అనే రెండుకల్పనలనూ త్యజించివేస్తున్నాడు. ఆత్మస్థుడై అంతరంగంలో ఒక యంత్రంలాగా మౌనముతో వ్యవహరిస్తున్నాడు.
న మోక్షో నభసః పృష్టే న పాతాలే న భూతలే | మోక్షో హి చేతో విమలం సమ్యగ్జానవిబోధితమ్ | || (శ్లో 35, సర్గ 73)
ఓ జనులారా! మోక్షము అనబడేది ఎక్కడో ఆకాశంలో గాని, పాతాళంలో గాని, భూతలమందు గాని లేదు. ఉత్తమ ఆత్మ జ్ఞానముతో బోధితమగుచున్న నిర్మల చిత్తమే మోక్షం. ఒకానొకడు సర్వవాంఛిత పదార్థముల పట్ల ఆసక్తి త్యజించాడనుకో… అట్లు ఆసక్తి మొదలంట తొలగుటచే సంభవించే చిత్తము యొక్క ‘స్వవినాశనం’ లేక చిత్తరాహిత్యం ‘మోక్షము’ అనే శబ్దంతో ఆత్మజ్ఞులు ఉద్దేశిస్తున్నారు.
నిర్మల ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ జీవుడు దీనుడుగానే ఉంటాడు. లేక "నాకు మోక్షము కలుగు గాక!” అను అభిలాషాసక్తుడై ఉంటాడు. చిత్తము బ్రహ్మత్వదశను పొందినప్పుడు, ఇక, ఆతనికి వేరే మోక్షమనబడేదేదీ అవసరమై ఉండదు.
ఓ సంసారాతీతమైన స్వరూపము కలవాడా! రామచంద్రా! ‘ఇది బంధము, ఇది మోక్షము’ అనే తుచ్ఛకల్పనను నీవు త్యజించు. మహాత్యాగము అవధరించియుండుటచే నీవు మోక్షరూపుడవై ఉంటావు. సర్వ వికల్పములు నశించిపోగా అంతఃసంగరాహిత్యముచే నిత్యోదితమైన శోభ కలిగి ఉండు. యథారీతిగా ఈ భూమండలమున దీప్తించే మణివై వెలుగొందుము.
శ్రీరాముడు : మహర్షీ! ఈ స్థూల సూక్ష్మ శరీరములన్నీ ఎందుకు, ఎప్పటి నుంచి, ఎట్లు ఉత్పన్న మవుతున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) నీ ప్రశ్నకు ఒకవిధంగా సమాధానం చెప్పాలంటే… “కామ్య కర్మ వాసనలే!”
Page:598
ఆత్మ తన ప్రేమాస్పదమగు స్వరూపమును ఏమరచినప్పుడు ఈ కామ్య కర్మ వాసనల క్రమముతో కూడిన సృష్టి అంతా పెంపొందుతోంది. తత్ఫలితంగా ఈ స్థూల-సూక్ష్మ-వ్యష్టి-సమష్టి శరీరములన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కొంచెం కల్లు సేవిస్తే గొప్పమత్తు వచ్చిపడుతుంది చూచావా? ఈ స్థూల-సూక్ష్మ-వ్యష్టి సమష్టి శరీరాలతో కొంచం అహంభావం ఏర్పడితే చాలు… అతి విశాలమగు మాయ తనంతట తానే జనిస్తోంది. ఆత్మ యొక్క ‘అన్యధా’ భావం చేత మాయ వచ్చిపడుతోంది. ఇక ఆపై పుణ్య, పాపవాసనలతో కూడిన అనర్థ పరంపర ప్రకటితమౌతోంది. ఆ అనర్థము నుండి వికారయుక్తమైన ఈ జగత్తంతా ఉత్పన్నమై ఎదురుగా నిలుస్తోంది. మహాసముద్రంలో కెరటములు, బుడగలు, సుడులు ఏర్పడుచున్నట్లు ఆత్మ మహాసముద్రంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాసన, ఇంద్రియములు మొదలైనవి కల్పిత నామధేయములతో స్ఫురిస్తున్నాయి.
మనస్సు : పదార్థముల గురించి మననం చేయటం. చిత్తము : పదార్థములయొక్క స్ఫురణ కలిగిఉండటం. బుద్ధి : పదార్థములను నిర్వచించటం, నిశ్చయించటం. అహంకారం : పదార్థములను అభిమానించటం.
చిత్తాహంకార యోర్ద్విత్వం వచస్యస్తి న వస్తుతః |
యచ్చిత్తం సహ్యహంకారో యో హంకారో మనోహితత్ II (శ్లో 5, సర్గ 74)
ఇవన్నీ ఒకే అంతఃకరణము యొక్క వివిధ పేర్లే కదా! అయితే, చిత్తము - - అహంకారములకు మాటలోనే గాని భేదమేమీ లేదు. ఏది చిత్తమో, అదే అహంకారం కూడా! మంచు, తెలుపుదనం వేరు వేరైనవా? ఆ రెండిటిని విడదీసి చూడగలమా? అట్లాగే … మిగతావి కూడా!
వస్త్రం నశిస్తే, దాని రంగు కూడా నశిస్తుంది కదా! … మనస్సు, అహంకారములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నాశనం పొందుతోంది.
శ్రీరాముడు : మనస్సు, అహంకారం నశిస్తేనే మోక్షం కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : మనస్సు ఉండటం, దానిని వదలటం - అవన్నీ చిన్న పిల్లల ముద్దు మాటల వంటివి మాత్రమే. బిడ్డా! నీ స్వరూపం దేనిచేతా ఎన్నడూ బంధింపబడని ఆత్మయే అయి ఉండగా, మనస్సు అనబడేదేదో నిన్ను బంధించటమేమిటి? నీవు దానినుండి విముక్తికై దేవులాడటమేమిటి? కాబట్టి, నీవు తుచ్ఛమగు “నేను ఈ మనస్సును కట్టేసి ఆపై ఇప్పుడు మోక్షం పొందవలసియున్నది” అను పట్టుదల రూపంలో ఏర్పడుచున్న మోక్షబుద్ధినికూడా నిస్సంకోచంగా వదిలి వేయవయ్యా! ‘నాకు బంధం కలదు’ అనే బంధబుద్ధిని, “ధన-ధార పుత్రాదులగురించి ఏర్పడే ఆశ నిరాశలచే బంధించబడే నిస్సహాయ పదార్థమును” అనే నిస్తేజకల్పనలను సుదూరంగా అట్టేబెట్టు. “నాకు మోక్షం కలుగ వలసియున్నది” అనే భవిష్యత్ ప్రాప్తబుద్ధి మనస్సులో ఉన్నంత కాలం సంసారమునకు సంబంధించిన ఛాయలు ఏర్పడి ఉన్నట్లేనని గ్రహించు.
Page:599
ఉన్న రహస్యమంతా మనస్సులోనే ఉన్నది. మనస్సు ఉత్కంఠితము (Inquisitively emotional) అగుచూ ఉండగా, క్రమంగా అది ఈ దేహాకారమును ధరించుచున్నది. ఫలితంగా… సర్వ దోషములూ వచ్చిపడుచున్నాయి.
శ్రీరాముడు : అయితే బంధమోక్షములనబడేవి లేవంటారా?
శ్రీవసిష్ఠ మహర్షి : మహత్తరము అద్వితీయమూ అగు ఆత్మ సర్వమునకు అతీతమై ఉండి సర్వమునందు సర్వదా వ్యాపించి ఉండగా, ఇక బంధమెవరికి? మోక్షమెవరికి? అందుచేత మోక్షం విషయం అట్లా ఉంచి, ముందు నీ మనస్సును ఇంద్రియ విషయ మననరహితం, అఖండాత్మమననసహితం చేయి.
ప్రాణవాయువు చలనధర్మం కలిగి ఉన్నది కదా! అది ఈ శరీరమున చలింపజేస్తూ ఉండగా ఈ హస్తపాద నాలుకలు తదితర అంగములు రసభరితమై చలిస్తున్నాయి. అవయవములను ప్రాణవాయువులే చలింపజేస్తున్నాయి. అయితే… సర్వవ్యాపియగు చైతన్యము తాను చలించదు. దేని చేతా చలింపబడదు.
దీపం సర్వపదార్థములను ప్రకాశింపజేస్తూ తాను యథారీతిగానే వుంటున్నట్లు, చైతన్యము సర్వ పదార్థములందు ప్రతిబింబించుచూ తాను స్వస్వరూపమునందే నెలకొని ఉంటోంది. అది జ్ఞానము ద్వారా సర్వమును ప్రకాశింపజేస్తోంది.
ఒకవైపు చైతన్యము అప్రమేయమై, నిత్యమై, జ్ఞానస్వరూపమై, శుద్ధమై వెలుగొందుచుండగా అల్పబుద్ధులగు సంసార జీవులు ’ఈ దేహములే మేము.. ఇవి మా అంగములు. అవి మా ధనములు’ ధనములు మొదలైన దుఃఖదాయకమగు మిథ్యామోహం ఆశ్రయిస్తున్నారు. మా ప్రకటన, నినాదములపట్ల ఏమీ విననట్లే ఉంటున్నారు. ఎందుకోమరి?
కేవలాత్మ (The Absolute self)కు విరుద్ధమైన ధర్మములు గల ఈ దేహము నందు, జలంతో తరంగముల లాగా, రాగము మొదలైనవి ఏర్పడి ఉంటున్నాయి. అట్టి రాగాదులచే ఆవరించబడిన అనిత్యదృష్టిచే క్రమంగా ఎరుగబడేవి, పొందబడేవి, పరిణమించేవి.. మొదలైన క్రియాక్రమములన్నీ సంప్రాప్తిస్తున్నాయి.
మృగతృష్ణ ఎందుకు కనబడుతోంది. ఎండ, వేడిమి, గాలి వీచికల ప్రతిబింబముల కలయిక ధర్మములు తెలియకపోవటం చేతనే కదా! ఆత్మయొక్క ధర్మము తెలియక పోవటం చేతనే ‘నేను పుట్టాను, పుట్టేవాడను, కర్తను,. భోక్తను’ మొదలైన మిథ్యావాసనలు కలుగుచున్నాయి. శ్రీరాముడు : స్వామి! మనస్సు ఎందుకు మిథ్యావాసన వైపు ఈడ్వబడుతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి: అవిద్యను మిథ్యగాగాక, సత్యముగా తలచటం చేతనే ఆ మార్గంలో మనస్సు ఈడ్వబడుతోంది. మనస్సు ప్రమత్త (Passive & Dull) అయినప్పుడు శబ్ద స్పర్శాది విషయముల వైపు పయనిస్తోంది. విషయాభిలాషితమైన మనస్సు అవిద్యను ఆశ్రయిస్తోంది. ఆ అవిద్యను తనకు అనుభవప్రదాత (Source of experience)గా స్వయముగా తీర్చిదిద్దుకుంటోంది. కాబట్టి స్వయం
Page:600
కల్పితమే అవిద్య. అంతేగాని దానిని మరెవరో ఈ మనస్సుకు అందిస్తున్నది కాదు. ఈ అవిద్య మిథ్యా రూపములుగా ఎరుగబడు గాక! అట్లు ఎరుగబడిన మరుక్షణం అది స్వయంగా నశించి ఎటకో చిత్తగిస్తుంది. “అది మృగతృష్ణయే” అని తెలిసిపోయిన తరువాత అక్కడకు వెళ్ళి “ఇక్కడ జలం ఉండాలే? ఏమైపోయింది?” అనే వాక్యం ఉత్పన్నం కాదు కదా! తెలుసుకొనబడిన తరువాత అవిద్య మనస్సును ఈడ్వజాలదు.
❖
చీకటి పోవటానికి దీపం వెలిగిస్తే చీకటి స్వయంగానే తొలగుతుంది చూచావా? ఆత్మజ్ఞానం ఉదయించిన మరుక్షణం వాసనలన్నీ వాటంతట అవే తొలగుతాయి.
శ్రీరాముడు : అవిద్య మొదలంటా తొలగాలంటే ఉపాయమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : నీవు ఆయా అధ్యాత్మ శాస్త్రములందిస్తున్న యుక్తులచే "అవిద్య లేదు” అను నిశ్చయం పొందావనుకో, అప్పుడు అవిద్యను నశింపజేయగలుగుతావు. అందుచేత రామా! సింహము బోనును పగలగొట్టి బయల్వెడలునట్లు - - నీవు అవిద్యా నిర్మూలనం చేయాలి. “జడమగు ఈ దేహం కొరకై ఏర్పడి ఉన్న భోగాలతో నాకేమి పని?” - అనే నిశ్చయమును పెంపొందించుకోవాలి. అట్టి నిశ్చయం యొక్క బలంతో దృశ్యమునందు నీకు ఏర్పడే ఆశ అను దానిని నశింపజేయాలి. ఆశాపరికరే రామ నూనం పరిహృతే హృదా!
పుమానాగతసౌన్దర్యో హ్లాదమాయాతి చన్ద్రవత్ ॥ || (శ్లో 24, సర్గ 74)
అప్పుడు ఆశ యొక్క పరివారమైన దేహాభిమానం, కామక్రోధాదులు తొలగుతాయి. తన ప్రయత్నముచే సుందరగుణములు సంపాదించుకున్న మనుజుడు తాను ప్రసన్నుడగుచూ, తదితర పరిసరములను కూడా ప్రసన్నం చేయగలుగుతాడు. అట్టి జ్ఞాని అధిక శోభాన్వితుడై మహద్రూపముచే తన యందు తానే ఇముడక… అపరిచ్ఛిన్నుడై ఉంటాడు. స్వాత్మయందు ప్రశాంతుడై, క్షోభావర్జితుడై, సుస్థిరుడై అత్యంత ధైర్యపూర్వకమైన మోక్షలక్ష్మితో శోభిల్లుతూ ఉంటాడు. అమృతము త్రాగిన వాని వలె, కుండలో వెలిగేదీపంలాగా దేదీప్యమానమైన మణిలాగా ఆత్మ జ్ఞాన ప్రకాశంతో శోభిల్లుతాడు. సర్వాత్మకుడై, సర్వవ్యాపకుడై, సర్వేశుడై, సర్వాకారుడై, నిర్వికారుడై ఎల్లప్పుడూ ఆత్మనే వీక్షిస్తూంటాడు. ఆ స్థితిలో ఆతడు ఒక్కసారి తన గడచిపోయిన రోజులలోని చంచల చిత్తమును చూచి నవ్వుకుంటూ ఉంటాడు.
విషయసంగమును వీడుటచే, అభిమాన - సంతాపములను అధిగమించుటచే ఆతడు పవిత్ర చిత్తుడౌతాడు. ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడు. ‘కామము’ అనే బురదను కడిగివేసుకొని ఉంటాడు. ‘బంధము’ అనే భ్రమను మొదలంట్ల నరికి వేస్తాడు. శీతోష్ణ, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విడివడినవాడై, ఈ సంసార సముద్రమును దాటివేస్తాడు. సర్వోత్తమమగు విశ్రాంతిని, సర్వాతీతము, అలభ్యము అగు స్థానమును పొందుతాడు. పునరాగమనరహితుడై మోక్షసామ్రాజ్యమును అలంకరిస్తాడు. మనోవాక్కాయములచే సర్వజనులూ అభిలషించే చరిత్ర కలిగి ఉంటున్నాడు.
Page:601
అట్టి ఆత్మజ్ఞాని దేనినీ ద్వేషించడు. వాంఛించడు. ఆతనికి సుఖ దుఃఖాదులు ఉండవు. దేనినీ గ్రహించడు, తిరస్కరించడు. నిందించడు. స్తుతించడు. స్వస్వరూపము యొక్క ఆవిర్భావము గాని, తిరోభావముగాని పొందడు. ప్రసన్నుడుగాడు. దుఃఖితుడు కాడు. సర్వకార్యములను త్యజించినవాడై, సర్వోపాధివర్జితుడై, సర్వాశలనుండి వినిర్ముక్తుడై ఉంటాడు. అందుకే మనం ఆతనిని ’జీవన్ముక్తుడు’ అని పిలుస్తున్నాం.
#
ఓ రామచంద్రా! సర్వ ఈషణములను (All urges, desire) పరిత్యజించివేయి. జలధారను సంపూర్ణంగా విడచివైచిన మేఘంలాగా నీ చిత్తము మౌనం వహించి ఉండుగాక! ఆశారాహిత్యమును ఆశ్రయించి ఉండు.
ఆశారాహిత్యం గల అంతఃకరణంవలన కలిగే సుఖం ఈ స్వర్గ - మర్త్య - పాతాళములలో మరెక్కడా దొరికేది కాదయ్యా! నీయొక్క నైరాశ్యము (ఆశారాహిత్యం)చే ఈ జగత్తునంతటినీ ప్రశాంతమయం, శీతలం చేసివేయి. ‘ఆశించుట’ అను దురభ్యాసము నుండి విడివడిన మనస్సు కలిగినవాడవై ఉదారచిత్తుడవై, మౌనివై, జ్ఞానివై శోభించు. ఏదీ కోరనట్టి మనస్సు కలవాడవై, ఉదార - జ్ఞాన - మౌన శోభితుడవై ప్రకాశిస్తూ ఉండగా… అట్టి శోభకు వసంత సౌకుమార్యము కూడా దీటు రాదు సుమా!
ఆశయే లేని మనస్సు ఇచ్చే సుఖం త్రిలోకాధిపత్యంలో కూడా ఉండదు.
ఓ సాధూ! నీకు రెండవరోజు సంవాదంలో చెప్పాను. కోరిక శమించటమే ‘శమము’ అని అంటాం. అట్టి శమము సంపాదించినవాని అంతఃకరణం శాంతమయమౌతుంది. అప్పుడు నీ పట్ల ఆపదలన్నీ క్షయిస్తాయి. అట్టి శమం, శాంతం, నైరాశ్యం అను పర్యాయపదాలచే అలంకృతుడవై అటుపై ఈ భూమినంతటినీ గోప్పద తుల్యంగా చూడు. లోకముల ఆధిపత్యమును కూడా తృణ ప్రాయంగా దర్శించు.
ఈ మనుజులలో అనేకులు ధన సంచయం, పుత్ర కళత్రాదులతో సమాగమం వస్త్రాలంకరణం, వస్తు సముదాయం, అన్నపానాది క్రియా పరంపరలు - గొప్పగొప్ప విషయాలుగా గాంచుచున్నారు. ఆశలన్నిటినీ అధిగమించియున్న మహనీయులు ఆ వ్యవహారములన్నీ చూచి పకపకా నవ్వుకుంటు న్నారు. ఎవరి హృదయంలో ‘ఆశ’ అనే ఛాయ ఏర్పడటానికే జంకుతుందో… అట్టి మహనీయులతో మనం పోల్చగలిగినది ఈ ముల్లోకాలలో ఏదీ లేదు. “ఇది నాకు కావాలి,. అది నాకు వద్దు” అను రాగద్వేషములకు ఎవని చిత్తంలో చోటు దొరకదో… అట్టి స్వాధీన చిత్తుని గురించి చెప్పటానికి నా దగ్గరున్న ఉపమాన-ఉపమేయాలన్నీ ఏమాత్రం సరిపోవు సుమా! అట్టివారు మా మహర్షులకు కూడా ప్రాతఃస్మరణీయులగుచున్నారు.
❖
Page:602
అందుచేత రామా! నీకు మరల మరల గుర్తుచేస్తున్నాను. నీవు ఆశారాహిత్యమును అభ్యసించు. ఆశ్రయించు. అది సర్వసంకటవర్జితమని, పూర్ణసుఖస్వరూపమని బుద్ధియొక్క పరమసౌభాగ్యమని మహనీయులు ప్రవచిస్తున్నారు.
ఓ రాఘవా! అసలు ఇక్కడ తారసపడుచున్న ఆశతోగాని, నిరాశతోగాని నీకు (లేక, ఈ జీవునికి) ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏర్పడివుండి …నీకు ఆకర్షణ వికర్షణ కలుగజేస్తున్న ఈ జగత్తంతా స్వతఃగా మిథ్య మాత్రమే. ఇక నీవు వీటి పట్ల నాకు ఉండు గాక… లేకుండు గాక అను ప్రియాప్రియములకు సంబంధించిన కల్పనలతో ఎందుకు శ్రమించాలి చెప్పు?
ఓ సర్వజనులారా! నేను ఇంతగా బోధించిన తరువాత కూడా "ఈ దేహం, ఈ పదార్థాలు నావి. ఈ దేహము ఏర్పడుచున్న తరువాత సిద్ధిస్తున్న వాటిచే నేను పరిమితుడను” అను దృష్టిని వదలటానికి ప్రయత్నించక పోవటం ఉచితమేనా చెప్పండి? సద్వివేచన చేయమని నా ప్రార్థన.
ఆత్మైవేదం జగత్సర్వం నానాతేహ న విద్యతే ॥
ఏకరూపం జగజ్జాత్వా ధీరైర్నామ న ఖద్యతే ॥ (శ్లో 54, సర్గ 74)
ఓ రామా!ఈ ప్రపంచమంతా ఆత్మయే. ఇక్కడ అనేకత్వమనునదే లేదు. మీరు ఏకమైన ఆత్మ రూపంగా ఈ జగత్తును ఎరిగి ఈ జగత్తును ధీరస్వభావులైన వారు ఎలాంటి భేదమొందక ఉన్నారు.
ఓ రాఘవా! "ఈ పదార్థములన్నీ యథార్థదర్శనముచే ఆత్మ రూపంగానే తెలియవస్తున్నాయి” అని నీవు నీ బుద్ధికి మరల మరల గుర్తు చేయి. అప్పుడది అకృత్రిమమైన పరమ ధైర్యం పొందుతుంది. నిజమైన ఆశారాహిత్యం ఉదయిస్తుంది. ఇక ఆపై భావాభావకల్పితరహితుడవై… సర్వ వస్తువుల ఆద్యంతములందు ఉన్నట్టి ‘సత్ చిన్ మాత్రము’ ను మాత్రమే అవలంబించి వుండు. ఇదీ నీవు ఈ జగత్తును గాంచవలసిన విధానం సుమా!
సింహమును చూడగానే లేడి ఏం చేస్తుంది? ఎక్కడికో దూరంగా పారిపోతుంది కదా! వైరాగ్యంచే ధీరమైనట్టి మనస్సు గలవానిని చూచి “రాగ-ద్వేష-ఆవేశ-భ్రమ-ఉద్వేగ-ఆశ-నిరాశాది భావనోద్రేక”- భరితమైన ఈ సంసారం తోక ముడిచి ఎక్కడికో పారిపోతోంది. ధీరబుద్ధి గల ఆత్మ జ్ఞాని ఒక కామోన్మత్త అయిన అతి సుకుమార స్త్రీని, శిథిలమైన శిలా విగ్రహమును ఒకేరకంగా చూస్తాడు. అందుచేత విషయభోగాలు ఆనందింపజేయటం గాని, ఆపదలు భిన్నపరచటం గాని జరుగదు. ఈ దృశ్య వైభవమంతా కలసి ఏకమై దండయాత్ర చేసినా సరే ….ఆతనిని స్వాత్మ నుండి తొలగించలేవు. ఆతని ఉదార బుద్ధి ఇక్కడి మోహాలను క్షణంలో చూర్ణం చేసివేస్తుంది. రాగ ద్వేషా దులు ఆతనిని ఆక్రమించలేవు. చలింపజేయలేవు, తానే వాటిని ఆక్రమించి అధిగమించి ఉంటాడు. శ్రీరాముడు : మహర్షీ! మీరు మాకు విడమర్చి చెప్పుచున్న ఆత్మజ్ఞుల దృష్టి మాకు ఎంతోసంతోషమును, ఉత్సాహమును కలుగుజేస్తోంది. మేమంతా పూర్ణ జ్ఞానులుగా తీర్చిదిద్దబడటమే ఈ సంసారమును
Page:603
అధిగమించటానికి తరుణోపాయం కదా! అందుచేత జ్ఞానుల దృష్టి అవగాహన కార్యక్రమముల గురించి మీ నుంచి ఎంతైనా మేము వినవలసిందే. అందుచేత, ఆత్మజ్ఞానుల జగత్ సందర్శనం
గురించి మరికొంత వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క జగత్ సందర్శనం గురించి మనం అనేక మార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా కూడా మరల మరల విశదీకరించుకోవటం అవసరమే.
ఆతడు దేనిపట్లా ప్రీతి గొనడు. విజ్ఞాన దృష్టిని వదలడు. క్షోభను దరిజేరనీయడు. అనాసక్తతను బలపరుచుకుంటూ ఉంటాడు. దేహాతీతత్వం అవధరిస్తూ ఉంటాడు. వికారరహితుడు, నిరంతర ఆత్మసంలగ్నధ్యానమయుడు అయి ఉంటాడు. సర్వముచే అస్పృశ్యుడై ఉంటాడు.
శ్రీరాముడు : మీరు ఉపయోగించిన విశేషణములు - 1. అప్రీతి 2. విజ్ఞాన దృష్టి 3. అనాసక్తత 4. దేహాతీతత్వం 5. వికారరాహిత్యం 6. అస్పృశ్యత్వం - - గురించి కొంచెం వివరించి చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : సరే. నీవు కోరినట్లు కొంచం వివరించి చెపుతాను విను -
ప్రీతి గొనకపోవటం - జ్ఞాని ఒక లతను సుందర స్త్రీని, మట్టిని-బంగారాన్ని, నచ్చేవాటినినచ్చనివాటిని ఒకే రీతిగా చూస్తాడు. ఉభయ సమయములలోనూ నిర్వికారుడై, నిర్లిప్తుడై ఒక పర్వతంలాగా స్థిరాకృతితో ఉంటాడు. పవిత్రమైన ఆశయం, కార్యక్రమంతో ప్రయాణం చేస్తున్న ఒక బాటసారి రహదారి ప్రక్కన కనబడిన శ్మశానమును చూచినప్పుడు ఆతనికి దానిపట్ల ప్రీతి కలుగుతుందా? జ్ఞాని ఇక్కడ కనబడే సందర్భముల పట్ల, భోగములపట్ల ఏమాత్రం ప్రీతి గొనడు.
విజ్ఞాన దృష్టి కలిగి ఉండటం!- కళ్ళు తెరిచినంత మాత్రం చేత మరే విశేషప్రయత్నం లేకుండానే ఎదురుగా ఉన్న వెలుతురు కనబడుతుంది కదా! ఆత్మజ్ఞాని ప్రవాహపతితంగా వచ్చిపోతున్న ఆయా సంఘనలను, సందర్భములను, భోగసముదాయమును సక్తత లేని చిత్తంతో లీలామాత్రంగా అనుభవిస్తాడు. కాకతాళీయంగా తారస పడే ఈ వనిత, ధనము మొదలైన భోగములు అనుభవించ వలసి వస్తున్నప్పటికీ, ధీరునకు అవి సంతోషమునుగాని, దుఃఖమునుగాని కలిగించలేవు. సముద్ర మధ్యంలో స్థిరంగా ఉన్న పర్వతాన్ని ఓ రెండు కెరటాలువచ్చి తాకినంత మాత్రం చేత అవి పర్వతమును కదిలించగలవా? ఆత్మ యొక్క ప్రత్యక్షమును ఏకాగ్రతతో దర్శించుచున్నట్టి తత్త్వజ్ఞానిని ఈ దృశ్య ప్రపంచములో ఏర్పడుచున్న సుఖ దుఃఖములు తాకజాలవు. తాకినప్పటికీ, ఆతని ఆత్మ సందర్శనాన్ని ఏమాత్రం భంగపరచలేవు. ఆతడు ఎప్పటికి ఏది ప్రస్తుతమో… అదే నిర్వర్తించుచూ… ఆపై ఇక తన దృష్టినంతా ఆత్మజ్ఞాన మార్గంలో నియమించి ఉంచుతాడు.
క్షోభ పొందకపోవటం! - అనేక లోకములు నిర్మించవలసివచ్చుచున్నప్పటికీ ఆత్మ పరాయణుడగు బ్రహ్మదేవుడు వ్యగ్రుడగుచున్నాడా? ఆయా ఋతువులు వచ్చిపోతున్నప్పుడు పర్వతాలు ఏమైనా
Page:604
క్షోభ పొందుచున్నాయా? లేదే! సర్వభూతస్థమై ఉన్న తన ఆత్మస్వరూపమును ఆశ్రయించి ఉన్నట్టి జ్ఞాని కూడా సమయోచితమైన క్రియాదులలో ఏర్పడే సంయోగ - - వియోగములు చూచి వ్యగ్రుడుకాడు, క్షోభ చెందడు.
అందరిలాగానే ఆతడు కూడా నవ్వవలసినచోట నవ్వుతాడు, ఏడవవలసినచోట ఏడుస్తాడు. కాని, సర్వ విషయముల పట్ల ‘ఇది మిథ్యయే కదా’ అను అవగాహన, దృష్టులను వదలకుండా ఉంటాడు. అంతేకాదు. తదితరజనులకు అది గుర్తుచేస్తూ ఎంతో స్థైర్యం కలుగజేస్తాడు. భోగములను మిథ్యారూపంగా గాంచుచూ, కాఠిన్యం లేకుండా … జితేంద్రియుడై సంతాప వర్జితుడై ఉంటాడు. దేశ కాల క్రమానుసారంగా సుఖము, దుఃఖము, సంపద, ఆపద - మొదలైన వాటి పట్ల నిర్లిప్తుడై, సాక్షీభూతుడై, అతీతుడై ఉంటాడు.
అనాసక్తుడై ఉండటం! - ఓ ప్రియ దశరథ రామా! ఈ శబ్దస్పర్శాది కర్మేంద్రియ వ్యాపార విషయాలలో పాల్గొనవలసి వచ్చినప్పటికీ, నీవు నిత్యమూ అనాసక్తుడవై ఉండు. వాటి యందు నీ చిత్తము అనాకర్షితమై ఉండు గాక! సంలగ్నం కాకుండు గాక!
అయితే… “ఈ బంగారం మలినమైనది" అని ఎప్పుడంటాం? బైట ధూళివంటివి ఉన్నప్పుడా? …కాదు. లోపల రాగి వంటి అల్పలోహాలు ఉన్నప్పుడు మాత్రమే కదా!… అంతఃకరణంలో ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే “ఈ జీవుడు సక్తుడు” అని అనిపించుకుంటాడుగాని, బాహ్య కార్యక్రమములచే కాదని నీవు గ్రహించు.
దేహముతో అప్రమేయత్వం వహించి ఉండటం! - ఎప్పుడైతే ఈ దేహమును తనకు భిన్నమైనది గానూ, ఆత్మను వివేకదృష్టితోనూ మననపూర్వకంగా సందర్శిస్తూ ఉంటాడో, ఆతడు ఈ అవయవములు ఛేదించబడుచున్నప్పుడు కూడా అంతరంగంలో విక్షేపరహితుడై ఉంటున్నాడు. ఒక్కసారి నిర్మలజ్ఞానం సంపాదించావా…. ఇక ఆ ఆనందమయ వివేక దృష్టి నిన్ను విడచి ఎక్కడికీ పోదు.
తిరోగమనం స్వీకరించకపోవటం! (Non deviation Non distraction) - ’నా స్వరూప స్వభావాలు సర్వదా ఆత్మయే. ఆత్మ ఇట్టిది“ అని ఆత్మను ఎరిగినవాడు మరింకెప్పుడూ, ఎన్నటికీ అజ్ఞత్వం పొందడు. వర్షాకాలంలో పర్వతం మీద నుంచి జారి ప్రవహించిన జలం మరల వెనుకకు మరలుతుందా? త్రాడు పట్ల ఏర్పడిన ‘ఇది పామేమో?” అనే భ్రాంతి తొలగిన తరువాత, ఆ త్రాడును చూచినప్పుడు భయం మొదలైన వికారములు ఏర్పడతాయా? అగ్ని యందు స్ఫుటం ఒనర్చబడిన బంగారం తన శుద్ధసహజ ఛాయ పొందిన తరువాత, దానిని నీళ్ళలో ముంచినంత మాత్రం చేత తన బంగారు కాంతులు పోగొట్టుకొంటుందా? చెట్టు నుండి తెగిజారిన పండును మరొకసారి కొమ్మకు అతికించినా కూడా, అతికి ఉండదు కదా? అట్లాగే ”ఈ దృశ్యం స్వతఃగా అవాస్తవం" అనే సుజ్ఞానం నిశ్చలమైన తరువాత ఇక గుణములతో బంధం ఏర్పడదు. రాళ్ళగుట్టలోంచి మణిని వేరుచేసి మెడలో ధరించిన తరువాత, మరల ఆ మణిని రాళ్ళగుట్టలోకి విసరివేసే మూర్ఖుడెవడైనా ఉంటాడా? అవిద్య నుండి విద్యను ఎరిగిన తరువాత ఈ దృశ్యమునందు మరల ఎవడు మగ్నుడౌతాడు? సశాస్త్రీయమైన శివ తాండవం చూచిన తరువాత ఒక కోతి కుప్పిగంతులను చూచి ఆనందించేవాడెవ్వడో చెప్పు?
Page:605
దృశ్య వికార రాహిత్యం! - “ఇది పాలు కాదు. సున్నపునీరు మాత్రమే“ అని ఉత్తమ విచారణచే గ్రహించిన తరువాత ”అయ్యో! నేను త్రాగలేకపోయానే?” అనే వేదన చెందే మూర్ఖుడెవడు? అట్లాగే ఉత్తమ విచారణచే వాసన నివృత్తి అవుతుంది. ఇక దిగులు పడటానికి, వేదన చెందటానికి ఇక్కడ ఏదీ మిగలదు. ఉత్తములగువారు “ఇది మజ్జిగ” అని భ్రమించుటచే త్రాగాలని కోరుకుంటారేమో గాని “కాదు… తెలిసిపోయింది… ఇది కల్లు” అని గ్రహించిన తరువాత త్రాగాలని అనుకుంటారా? తత్త్వజ్ఞుడు “సర్వము ఆత్మయే” అను ఎరుకను అవధరించిన తరువాత అందమైన స్త్రీ శరీరమును ఒకానొక లిఖిత చిత్రమువలె చూస్తాడుగాని, వికారాదులు పొందడు.
చిత్రంలో లిఖించబడిన స్త్రీ అంగములన్నీ ఆయా రంగుల సమ్మేళనము మాత్రమే కదా! అట్లాగే స్త్రీ పురుషుల జుట్టు - గోళ్ళు మొదలైన అవయవములన్నీ పంచభూతముల సముదాయమేనని
గ్రహించి ఉంటాడు.
పటికబెల్లం తీపిని ఆస్వాదించిన తరువాత, ఆ తదుపరి త్రాగే నీళ్ళు పటికబెల్లపు తీపిని మరిపింపజాలదు కదా! ఆత్మానందం పొందినవాడు తదితర విషయ సుఖములను చూచినంత మాత్రం చేత ఆత్మను ఏమరువడు.
నిరంతరమైన నిమగ్నం - ఒకానొక ముగ్ధస్త్రీ దూరప్రాంతం వెళ్ళి ఇంకా రావలసియున్న తన భర్తయందు… ఆసక్తి కలిగియున్నదనుకో… ఆమె గృహకృత్యములందు తలమునకలై ఉన్నప్పటికీ తన అంతఃకరణమునందు తన భర్త యొక్క రాకచే ఏర్పడే స్నేహానుభవమునే మననం చేస్తూ ఉంటుంది కదా! శుద్ధ బ్రహ్మముతో సమాగమం, విశ్రాంతి పొందు ప్రయత్నశీలుడగు జీవుడు ఆ బ్రహ్మానందమును అనుభవిస్తూనే ఈ ప్రాపంచిక క్రియలందు పాల్గొంటూ ఉంటాడు. ఇవేవీ ఆతని ఆత్మానుభవమును నిరోధించలేవు. ఇంద్రాది దేవతలంతా కలిసికట్టుగా వచ్చి కూడా ఆతని బ్రహ్మానందానికి ఖేదము కలిగించలేరు. మనస్సును అధిగమించిన ఆత్మజ్ఞానికి ‘చ్యుతి’ కలిగించగలిగే శక్తి ఈ ప్రపంచములోని ఏ పదార్థమునకూ ఉండదు.
విషయములచే స్పర్శించబడకపోవటం! - వివిధ పుష్పరసములన్నీ తేనె యందు ఏకమై పోతున్నాయి. ప్రపంచములోని ఆనందములన్నీ బ్రహ్మానందమునందు సమరసమై పోతున్నాయి. తత్త్వజ్ఞుడగు మనుజుని బుద్ధిని ఎవరు దేనిని చూపించి ఏమరిపించగలరు? తన ప్రియుని పట్ల ఆసక్తమైన బుద్ధిగలస్త్రీ ఎన్ని విఘ్నములు, నిరోధములు కల్పించబడుచున్నాకూడా, అవన్నీ లెక్కచేయక ప్రియునియందే మనస్సు కలిగి ఉంటుంది చూచావా? అవిద్యారహితుడగు జ్ఞాని ఆత్మానందమును అనుభవిస్తూనే ఉంటాడు. కష్టములన్నీ వచ్చి పడుగాక! అవయవములు ఛేదించబడుగాక! విషాద సంఘటనలు తారసపడుగాక! సిరులు వచ్చుగాక…. పోవుగాక! ఆతని ఆత్మానుభవం చెక్కుచెదరదు. “నిష్కళంకము, అత్యున్నతము, అంతర్గతము అగు ఆత్మను నేను” - అనునది ఏమరువడు.
ఆత్మజ్ఞాని ఈ చిత్తమును ఒక బాహ్యమగు ఉపకరణమువలె చూస్తాడు. కనుక ప్రారబ్ధకర్మలందు, దారిద్ర్యాది దశలందు, సంకటములందు ఆతని ఆత్మానుభవ స్రవంతికి అడ్డు ఉండదు. నగరంలో
Page:606
ఉన్నా, అరణ్యంలో ఉన్నా, పర్వతములపై ఉన్నా, తపోవనంలో ఉన్నా, ఊపిరిసలపనన్ని పనులలో ఉన్నా… అవేవీ ఆతనికి హర్షశోకములుగా పరిణమించవు. ఆతడు సర్వదా ఈ సర్వముచే అస్పృశ్యుడై
ఉంటాడు.
శ్రీరాముడు : ఆత్మజ్ఞాని గురించి మీరు చెప్పే విశేషాలన్నీ ఆమోదయోగ్యమేనని ఒప్పుకుంటున్నాను. అయినా కూడా, ఈ రాజ్యాదులు, ఈ ధన జనాది విషయసంపర్కములు ఎదురుగా ఏర్పడి ఉండగా మనస్సు విజ్ఞతను, ఆత్మదృష్టిని ఎట్లా అలవరచుకోగలుగుతుందోనని… నాకు కొంచం అనుమానంగానే ఉన్నది. అనేకులు సంసారదృష్టిని వదలలేకపోవటం మనకు కనబడుతూనే ఉన్నది కదా! శ్రీవసిష్ఠమహర్షి : ఉత్తమ ఉదాహరణలు కొద్దియే కావచ్చు. మనం ఆత్మజ్ఞానుల ప్రేరణాదులనే అనుసరణీయంగా స్వీకరించాలి గాని… సంఖ్యాపరంగా ఎక్కువ మంది కాబట్టి, అజ్ఞానుల సాంసారిక దృష్టిచే ఎందుకు సంక్షోభం పొందాలి?
ఆత్మ జ్ఞానం సంపాదించి కూడా యథాతథంగా ఈ ప్రాపంచిక కార్యక్రమములు నిర్వర్తిస్తున్న మహనీయులు ఎందరో ఉన్నారు. నీకు కొన్ని దృష్టాంతాలు చెపుతాను విను- జనక మహారాజు గురించి మనం చెప్పుకున్నాం. ఆతడు అందరు రాజులు లాగానే రాజ్యకార్యములందు నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ సదా దుఃఖరహితుడై దేనికీ ఏమాత్రం వ్యాకులత పొందక ఉన్నాడు కదా!
మీ పితామహుడు దిలీపుని గురించి తెలుసు కదా! సర్వ కార్యములు నిర్వర్తిస్తూనే అంతః కరణంలో వీతరాగుడై చిరకాలం అయోధ్యను పాలించలేదా? మనువు రాగకళంకం లేని మనసుతో జీవన్ముక్తుడై ప్రజలను ఏలారు. మాంధాత చక్రవర్తి అనేక యుద్ధాలలో పాల్గొనుచూ బ్రహ్మజ్ఞానియై వెలుగొందారే! అట్లాగే, పాతాళంలో బలిచక్రవర్తి “ఇదంతా సమయోచితమే” …అను అవగాహనతో ఏవేవో క్రియావ్యవహారములు నిర్వర్తిస్తూనే తాను మాత్రం సదా త్యాగి అయి, ఆసక్తిరహితుడై, జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. దానవుల ప్రభువైన ‘సముచి’ అనేకసార్లు దేవతలతో యుద్ధం చేస్తూ వివిధములైన ఆచార విచార తత్పరుడై కూడా …దేనికీ ఏ మాత్రం ఖిన్నుడగుట లేదు. ‘వృత్రాసురుడు’ అనే రాక్షసుడు అత్యంత ఉదారచిత్తుడై, మాననీయుడై, తన దేహంతో అనేకసార్లు దేవతలతో యుద్ధం చేసి చివరికి పిల్లవాడు ఆట బొమ్మను వదిలినట్లు శరీరమును ఇంద్రుని చేతిలో త్యజించాడు. పాతాళాధీసుడైన ప్రహ్లాదుడు వాక్కు అగోచరమైన అక్షయసిద్ధి పొంది కూడా సాంసారిక మాయలో నిశ్చింతగా పాల్గొన్నాడు.
అట్లాగే శంబరాసురుడు కూడా! ఆతడు ఒక వైపు అనేక మాయలను సృష్టిస్తూ దానవుల కొరకు విష్ణువుతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. మరొక వైపు అనాసక్తుడై కుశల బుద్ధితో ఉత్తమజ్ఞానాన్ని ఆశ్రయించి ఉండేవాడు. పరమ చిదాకాశమున ఏకత్వరూపుడై ఉంటూనే సంక్లిష్టమైన యుద్ధసన్నివేశాలు రచిస్తూ ఉండేవాడు.
Page:607
సర్వదేవతాముఖ రూపుడైన అగ్నిదేవుడు ఒక్కసారే అనేక యజ్ఞ, యాగాలలో హవిస్సు స్వీకరిస్తూనే, ముక్తుడై… అప్రమేయుడై ఈ చరాచర సృష్టిని ఆక్రమించియున్నారు. ఆ చంద్రుడు తన యందు అమృతమును ధరించి ఈ భూమిపై ఓషధ రచనకు కారకుడగుచూ తాను నిర్వికారుడై పరమజ్ఞానముతో ప్రకాశిస్తున్నాడు. దేవతల పౌరోహిత్యం, గురుత్వం, భార్య కొరకు చంద్రునితో యుద్ధం… మొదలైనవి నిర్వర్తిస్తున్న బృహస్పతి తాను మాత్రం సర్వదా ముక్తస్వరూపముతో తేజరిల్లు చున్నారు. అట్లాగే శుక్రాచార్యుల విషయం తెలుసుకదా! ఆయన సర్వుల అభీష్టమును పాలించుచూ, తదనుకూలంగా నీతిశాస్త్రరచన చేశారు. అసురులకు గురువై, వారినందరినీ ఒక త్రాటిపై నడిపిస్తు న్నారు. వాళ్ళకు దిక్కు - శ్రేయోభిలాషి ఆతడే. అయితే ఏం? నిర్వికారబుద్ధితో సాక్షిమాత్ర పూర్వకంగా కాలగమనం కొనసాగిస్తున్నారు. వాయుదేవుడు ఊర్ధ్వ అధోలోకాలను, ప్రాణములందలి అవయవాలను చలింపజేస్తూ ఉంటారు. సదా సర్వ ప్రదేశములందూ సంచరిస్తూ, ముక్తుడే అయి ఉంటున్నారు. ఆయనకు ప్రియుడెవ్వరు? అప్రియుడెవ్వరు?
నాయనా! రామా! బ్రహ్మజ్ఞులై కూడా తమకు నియమితములైన కార్యములను ప్రశాంత బుద్ధితో నిస్సంగులై నిర్వర్తించే మహనీయులెందరో ఉన్నారు. పరబ్రహ్మమూర్తియగు బ్రహ్మదేవుని చూడు. ఆయన ఈ లోకములన్నిటి యొక్క ఊర్ధ్వ-అధో-మధ్య గతి పరివర్తనములను రచించి ఉన్నవారే కదా! అయినప్పటికీ సమచిత్తము కలిగి తన సుదీర్ఘమగు ఆయువును గడుపుచున్నారు.
ముక్తుడగు విష్ణుభగవానుడు దేవతల సుఖం కొరకై అనేక యుద్ధములు చేస్తున్నారు. భక్తుల కొరకై మానవ - జంతు ఉపాధులను పొందుచూ బాల్య - యౌవన - వార్ధక్యాలు అనుభవిస్తున్నారు. శిలాకారంగాను, శిల్పాకారంగాను (జడంగా కూడా), స్త్రీ - చేప - తాబేలు వరాహం వంటి జంతు, నర అవతారాలు స్వీకరిస్తూ అనేక కల్పములు భక్తుల హృదయాలలో సంచరిస్తున్నారు. ఇంత వ్యాసంగం నిర్వర్తిస్తూ కూడా తాను అప్రమేయుడై, అఖండుడై వైకుంఠమున వెలయుచున్నారు! ఆయన ఏ క్షణమైనా తన ముక్త స్వరూపమును వదలుచున్నారా? లేనే లేదు.
త్రినేత్రుడగు మహేశ్వరుడు ఒక సామాన్యకాముకుని వలె జగజ్జననియగు పార్వతీదేవితో తాండవ నృత్యం చేస్తున్నారు. గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలైన ప్రమథగణం అందుకు లయపూర్వకంగా తాళం వేస్తూ గానాదులు చేస్తున్నారు. అంతటి తన్మయంతో ఆనంద వైభవంగా నృత్యం చేస్తూనే ఆయన భక్తుల పిలుపు వినగానే వారి ముందు పార్వతీసమేతంగా ప్రశాంతమంగళ స్వరూపంతో ప్రత్యక్షమగుచున్నారు. ఉపయుక్తమైన ఉపాధులు కల్పించుకొని భక్తులు పొందే బెత్తపు దెబ్బలు తాము పొందుచున్నారు. ఆదిశక్తి స్వరూపిణియగు అమ్మవారు పార్వతీదేవి నిత్యముక్త అయి కూడా పరమశివుని శరీరార్దభాగం స్వీకరించి, తన బిడ్డలు భక్తితో ఆక్రందన చేస్తున్నప్పుడు ఆ పరమశివుని ప్రేరేపించి వారికి సకల శుభములు కలుగజేస్తున్నారు కదా! ఇంత తతంగం జరుగుచున్నా, పార్వతీపరమేశ్వరులు ఆత్మతత్త్వమును అవధరించే ఉంటున్నారే!
మహాధీశాలి, వీరుడు, పరమ జ్ఞానసముపేతుడు, జ్ఞానరత్నములకు సముద్రము వంటివాడు అగు ఆ కార్తికేయుడు (కుమారస్వామి) నిత్యముక్తుడైయుండి లోక కళ్యాణార్థం తారకేశ్వరునితో
Page:608
యుద్ధం నిర్వర్తించారే! మహాధైర్యయుక్తుడై, ధ్యానముచే విశుద్ధమైన బుద్ధిని సముపార్జించియున్న భృంగీశ్వరుడు ముక్తత్వము వహిస్తూనే ఒకసారి తన తల్లి పార్వతీదేవి పాదాలకు తన రక్తమాంసములను సమర్పించివేశారే.
అదిగో… అక్కడ చూడు. అక్కడ కోటి సూర్యుల ప్రకాశంతో ఈ సభలో ఆసీనులైన ఆ నారద మహర్షిని చూచావా? ఆయన తన తంబురను మీటుతూ ‘నారాయణ, నారాయణ’ అని ఉచ్చరిస్తు త్రిలోక సంచారం చేస్తున్నారు. తాను ఎక్కడికి వెళ్ళితే అక్కడ సర్వమూ పవిత్రం చేస్తున్నారు. ఆయన సర్వదా ముక్తుడే! ఆయనకు పొందవలసినదీ, పొందబడనిదీ అంటూ ఏదీ లేదు. ఆయన లోక కళ్యాణార్థం పరమేశ్వర నిర్ణయం అవధరిస్తూ అనేకమంది జనులతో సంభాషిస్తూ ఏవేవో ఉపాయాలు, చెపుతూ ఉంటారు. పురాణద్రష్టలు ఆయనకు ‘కలహభోజనుడు’ అని బిరుదు ఆపాదించారు. ఆయన ఆయా క్రియాదులు నిర్వర్తించినంతమాత్రంచేత ఏ క్షణంలోనైనా తన జ్ఞాన, ముక్త స్వరూపం ఏమాత్రం ఏమరుచుట లేదుసుమా!
ఇక్కడ చూడు! దీప్యమానతేజస్సుతో వెలుగొందుచూ, ఈ మన సంవాదనకు ప్రారంభకులై, ప్రోత్సాహకులై ఈ సభను పావనం చేస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుని చూస్తున్నాం కదా! ఈయన తన తపోశక్తిచే జ్ఞాన-విజ్ఞాన పరివేష్టితులైనారు. సర్వమునూ ఎరిగిన సర్వమాన్యుడగు ముక్తపురుషుడు ఈయన. అయితే కూడా…. ఇప్పుడు లోకకళ్యాణం కొరకు యాగసంరంభమంతా చేస్తూ యాగరక్షణ కొరకై నీ ఆగమనాన్ని యాచించటానికి అయోధ్యకు వచ్చారు. తానింకా పొందవలసినదంటూ ఏదీ లేక పోయినా కూడా, లోకాలకు ‘రామతత్త్వం’ ప్రకటితం కావాలనే గొప్ప ఆశయంతో దశరథ మహారాజును ఆశ్రయిస్తున్నారు. ఆయన ముక్తపురుషుడై ఉండి కూడా కర్మలను ఏమైనా తిరస్కరిస్తున్నారా?… లేదే!
జీవన్ముక్తుడగు ఆదిశేషుడు ఈ భూమినంతా ధరిస్తున్నారు. నిర్విషయుడై ఉండి, సూర్య భగవానుడు ఆకాశంలో సంచారం చేస్తూ ఈ భూమిపైగల సకల జీవరాసులకొరకై దివారాత్రములు కల్పిస్తున్నారు. మహాజ్ఞానియగు పరశురాముడు తన ఆత్మస్వరూపమును ఆస్వాదిస్తూనే దుష్టశిక్షణ చేస్తున్నారు.
చూచావా రామా! ఇంకా ఈ ముల్లోకములలో ఎందరో శతాధికసంఖ్యలలో యక్షులు అసురులు, మనుష్యులు, దేవతలు తాము ముక్తులై ఉండి కూడా ఈ జగద్రచనలో వారివారికి నియామకమైన ఆయాకర్మలను ముక్త బుద్ధితో నిర్వర్తిస్తున్నారు. అట్టి మహాత్ములు ఈ భూమిపై ఈ వర్తమానంలో ఎందరో ఉన్నారు.
అట్టి జీవన్ముక్తులలో కొందరు శోక, మోహదాయకములైన దార - పుత్ర - - ధనాది ఐశ్వర్యముల మధ్య ఉన్నారు. యుద్ధము, జాతి సంరక్షణము, వ్యాపారము మొదలైన లౌకిక వ్యాసంగములలో నియమితులైయున్నారు. కానీ, వారి అంతఃకరణం మాత్రం ప్రశాంతతతో నిండిపోయి ఉంటోంది.
Page:609
మరికొందరైతే జడస్వభావులై ఏదీ పట్టించుకోకుండా లౌకిక దృష్టితో చూస్తే పిచ్చివారిలాగా సంచరిస్తున్నారు. వారి దృష్టిలో వారికి దేనివల్లా ఏలోటూ ఉండదు. అట్టివారిలో కొందరి పేర్లు కూడా ఎవ్వరూ విని ఉండకపోవచ్చు.
భృగు, భరద్వాజాది మరికొందరు ఉత్తమజ్ఞానమును ఆశ్రయించి కూడా ఎక్కడో అడవులలో ఆశ్రమం నిర్మించుకొని తమను ఆశ్రయించిన శిష్యులను తీర్చిదిద్దుచున్నారు. మరికొందరు రాజ్యాలు ఏలుతూ వెసులుబాటులేని క్రియా సంరంభములో ఉంటున్నారు. సప్తర్షులు, తదితర మహనీయులు అగు మరికొందరు ఆకాశంలో జ్యోతిశ్చక్రమున నెలకొని ఉన్నారు. అగ్ని, వాయు, తుంబుర, యమ, వరుణాది ఇంకొందరు దేవతా కార్యములను నిర్వర్తిస్తూ బ్రహ్మజ్ఞాన సమన్వితులై ఉన్నారు. బలి, సుహోత్ర, అంధక, ప్రహ్లాదాది మరికొందరు పాతాళంలో వసించుచూ ఆత్మజ్ఞానమును పదిల పరచుకొనియే ఉన్నారు.
అయితే ఒక్క విషయం నీవు ఇక్కడ గమనించాలి.
తిర్యగ్యోనిష్వపి సదా విద్యక్తే కృతబుద్ధయః |
దేవయోనిష్వపి ప్రాజ్ఞా విద్యన్తో మూర్ఖబుద్ధయః II
జంతు ఉపాధులు పొందినప్పటికీ కొందరు మహాజ్ఞానులై వెలయుచున్నారు. తెలివితేటలతో కూడిన దేవయోనులలో జన్మించికూడా మరి కొందరు సంసారాసక్తతతో కూడిన తమ మూర్ఖబుద్ధిని
వదలటమే లేదు.
సర్వరూపమై… సర్వవ్యాపకమైన ఆత్మయందు సర్వమూ, సర్వవిధములా సర్వత్రా సంభవమే అగుచున్నది. ఆహో! అనంత కార్య తత్పరుడగు ఆ పరమాత్మ యందు నీడవలె ఏర్పడుచున్న నియతి ఎంత చిత్ర విచిత్రమైనది! ఇదంతా ఆ పరమాత్మ యొక్క రచనా వైచిత్రమే కాక, మరింకేమిటి?
ఏది ఏమైనప్పటికీ ఆత్మ భగవానుని విన్యాసం సదా యథాతథంగానే ఏర్పడి ఉంటోంది. విధిరైవం విధిర్థాతా సర్వేశః శివ ఈశ్వరః | ఇతి నామభిరాత్మానః ప్రత్యక్చేతన ఉచ్యతే ॥
మనందరి ’ఆత్మ’ అయినట్టి ఆ ప్రత్యక్ చైతన్యమే "బ్రహ్మ - దైవము - విష్ణువు - ధాత - ఈశ్వరుడు - శివుడు” - మొదలైన అనేక పేర్లతో చెప్పబడుతోంది.
-
ఈ జగత్తులో అసంఖ్యాకంగా పదార్థాలున్నాయి. ప్రతి పదార్థంలోనూ అనేక తదితర పదార్థాలు ఇమిడి ఉన్నాయి. ఇసుకలో బంగారు రేణువులుంటున్నాయి. ఆ బంగారు రేణువులోని ప్రతిఒక్కదానిలో తదితరమైన సూక్ష్మపదార్థముల అమరిక ఉంటోంది. అనేక పదార్థముల సంయోగ వియోగములచే దృశ్యపాంచ భౌతికజగత్తు ఏర్పడి ఉంటోంది. యుక్తమైన దానిలో అయుక్తత (Wrong aspect in
Page:610
right things) దాగి ఉంటున్నది. అయుక్తమనుకున్నదానిలో కూడా యుక్తితో చూస్తే యుక్తత కనిపిస్తోంది. పాపం అయుక్త మనుకుంటాం. కానీ పాపభీతి చేతనే లోకము ధర్మమున ప్రవృత్తమై ఉంటోంది. అసత్యమైనది ఎదురుగా ఎంతో కాలం కనబడుచుండుటచే, “ఇది సత్యమే కదా!” అని భ్రమ కలుగజేస్తోంది.
’శూన్యధ్యాన యోగం’ చేత కూడా ఆ “శూన్య సాక్షి” అయిన నిత్యాత్మ పదం ప్రాప్తిస్తోంది. ఇంద్రజాలంలో కుందేటికి కొమ్ములు మొలిపించబడునట్లు… ఇప్పుడు లేని వస్తువులు దేశకాల విలాసములచే ఉత్పన్నమగుచున్నాయి. వజ్రం వలె అత్యంత దృఢంగా కనిపిస్తూ ఉంటున్న వస్తువులు కూడా అకారణంగా నశించుటచే అందలి వివిధ పదార్థములన్నీ రూపాంతరం పొందుచున్నాయి.
ఈ నాశోత్పత్తి సమన్వితమైన అనేక పదార్థములతో కూడిన ఈ జగత్తును చూస్తున్నంత మాత్రంచేత ద్రష్టస్వరూపుడగు ఈ జీవుడు హర్షామర్ష, వినోదవిషాదాది వికారములు ఎందుకు పొందాలి? ఇక్కడ ఎట్టి ఇచ్ఛలేకుండానే ఉండటం ఉచితం సుమా!
ఈ ప్రపంచంలో అసత్తు సత్తువలె ఉంటోంది. ద్రష్టస్వరూపమగు సత్తు అసత్తువలె తోచుతోంది. ఇది గమనిస్తున్న విదిత వేద్యుడు (తెలియవలసినది తెలుసుకున్నవాడు) ఇంత మాత్రం చేత తన శాంతస్థితి నుండి చ్యుతి పొందడు. కనుక రామా! నీవు ఇక్కడ ఏర్పడే ఇచ్ఛ, అనిచ్ఛలను ఎంత శీఘ్రంగా త్యజిస్తే అంతమంచిది.
వివేకం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏమాత్రం ముక్తి లభించదు. ఇక్కడ కోట్ల కొలది జనులు వివేకము కొరకై ప్రయత్నమైనా చేయకుండా "మాకాపని ఉన్నది… ఈ పని ఉన్నది” అని ఇక్కడి పంచేంద్రియ విషయ సమూహాలలో మునగటానికే ఇచ్చగించుచున్నారు. ఇక్కడ వివేకము కొరకై ప్రయత్నించే వారికి ముక్తి తప్పకుండా సుసాధ్యమే. ఇదే జగత్తులో ఇవే కార్యక్రమములు నిర్వర్తిస్తూనే మరొక వైపుగా వివేక, విజ్ఞానాదులను ఆశ్రయించి మోక్షస్వరూపులై విరాజిల్లారు… విరాజిల్లుచున్నారు… విరాజిల్లగలరు.
ఓ ప్రియ సహజీవులారా! సర్వశ్రోతలారా! వివేకముచే ముక్తి సుసాధ్యం… సులభం కూడా. అవివేకముచే అది అసాధ్యం… అలభ్యం. ఆ తరువాత మీ ఇష్టం. మీరు సన్మార్గం ఎన్నుకుని నిష్ఠతో ప్రయత్నిస్తూ ఉంటే సర్వాత్మస్వరూపుడగు ఆ భగవానుడు మీకు తప్పక మార్గదర్శకుడు కాగలడు.
అందుచేత ఓ రామచంద్రా! మనస్సును జయించటం ద్వారా నీవు వివేకమును అభివృద్ధి చేసుకోవటం ఉచితం, శుభప్రదం కూడా.
మోక్షమును ఇచ్ఛగించేవారు ఆత్మదర్శనం కొరకు ‘వివేకము’అనే ప్రయత్నం ఆచరించాలి. ఆత్మదర్శనము చేత మాత్రమే సర్వ దుఃఖములు సమూలంగా నశించగలుగుతాయి. రాగవర్జితులు, సంగరహితులు, మహాధీమంతులు, అయినట్టి సుహోత్రుడు, జనకుడు మొదలైనవారు ఇప్పుడు ఈ భూమిపై సంచరిస్తున్నారు. అట్లాగే అన్ని కాలములందూ అట్టి సుజ్ఞానవంతులగు వివేకులు ఈ
Page:611
భూమిపై ఉంటూనే ఉంటారు. వారు ఏ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఈ భూమిని పరమపవిత్రం చేస్తున్నారు.
తస్మాత్త్వమపి వైరాగ్యవివేకోదితధీరధీః |
జీవన్ముక్తో విహర భో సమలోష్టాశ్మకాఞ్చనః ॥ || (శ్లో 48, సర్గ 75)
కనుక రామా! నీవుకూడా వివేక, వైరాగ్యములను ఆశ్రయించు. ధీరబుద్ధిచే సువర్ణమును, మట్టిని సమబుద్ధితో చూడగల మహత్తర దృష్టిని అలవరచుకో. “ఆతడు అధికుడు, ఈతడు అధముడు, నేను కొరగాను, నేను గొప్పవాడను, అవి పొందాలి, ఇవి తొలగాలి"… ఈ రూపంలో ఉంటున్న సంసారజాడ్యమును త్యజించు. వివేక సూర్యస్వరూపుడవై సర్వస్థితులందు వర్తించెదవుగాక!
ముక్తి - ఓ నిష్కళంక స్వరూపా! రాఘవా! పదార్థములందలి ‘అసంగము’ చే కలుగు మనశ్శాంతి యొక్క రూపమే ముక్తి. అట్టి ముక్తి దేహము ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా సంభవమే. “ఈ దేహము నేను… ఈ దేహ సంబంధముచే కలుగు గృహములు, బంధువులు మొదలైనవన్నీ నావి”… అను రూపముగా ఉండే భ్రాంతితో కూడిన ప్రీతిని నివారించటమే ముక్తి. ఈ దేహాదులందు ఏమాత్రం ప్రీతి, ఆసక్తి లేకుండానే జీవితం సాగిస్తున్నవానిని ’జీవన్ముక్తుడు’… అని అంటున్నాం. అట్లాగాకుండా, ఈ దేహాదులందు ఆసక్తి కలిగి జీవించేవాడు బద్ధుడు.
రాగద్వేషములు… ఈ రెండూ లేనివాడు ముక్తుడే - మోక్షము కొరకై “వినటం, మననం చేయటం, నిధిధ్యాస (అనన్యత్వం - ఏకాగ్రత్వం)… ఆత్మా హమ్భావన అనే సాధన చతుష్టయంతో ప్రయత్నించాలి. ‘బ్రహ్మతత్త్వ నిశ్చయం’ అనే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. బుద్ధి శుద్ధత్వం పొందేవరకూ అట్టి ప్రయత్నమునుండి విరమించకూడదు.
“దుఃఖము ఉన్నది” …అనునది రాగము ఉన్నది అనటానికి గుర్తే సుమా! రాగద్వేషములు తెలివిగా ఈ మనుజుని తమ వశం చేసుకుంటున్నాయి. అది గమనిస్తూ కూడా ఊరుకొని ఉంటే ఎట్లా? “ఈతడు మభ్యపెట్టి, మోసంచేసి, అంతా దోచుకుంటాడు” - అని తెలిసికూడా, ఒక దొంగకు తాను దాచుకున్న గుప్తధనం చూపిస్తూ వెంటబడతాడా, ఎవడైనా?
జడస్వభావపూర్వకమైన వాదోపవాదములను, మందబుద్ధిని…. ఎట్లాగైనా సరే… వదలిపెట్టి పరమాత్మను ఆశ్రయించాలి. ‘యుక్తి, యత్నము’… ఈ రెండూ కూడా ఎంతో అవసరం. ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో ఒక చిన్న పని కూడా చేయలేమని అందరికీ తెలుసు కదా! ఇక, మోక్షం విషయం మాత్రం వేరే చెప్పేదేమున్నది? సన్మార్గపూర్వకమైన ప్రయత్నములను వదలిపెట్టి, కేవలం ‘పిచ్చా పాటి’తో ‘మానవ జీవితము’ అనే అవకాశం వృథా చేసుకుంటే ఎట్లాగయ్యా…?
కనుక ఓ సర్వజనులారా! మీరంతా ప్రయత్నశీలురయ్యెదరుగాక! ఈ విషయం నేను ఎంతో శ్రమించి మరల మరల గుర్తు చేస్తున్నాను. నాయనలారా! మహాధైర్యమును అవలంబించండి. అవరోధములను చూచి వెనుకాడవద్దు. ఉత్తమ ఫలితం లభించేవరకు ఆత్మ విచారణ చేయండి. దృఢ ప్రయత్నం ఉండాలేగాని… ఈ ప్రపంచంలోని అన్ని సంఘటనలు కలిసి కూడా … అట్టివానిని
Page:612
ఆ ప్రయత్నము నుండి విరమింపజేయలేవు. అంతేగాని… పరిమిత అవగాహనలతో కూడిన ఏవేవో వాదోపవాదములతో ఆత్మప్రకాశము వైపుగా గల మార్గము నుండి చ్యుతి పొందకూడదు. మీరంతా అచ్యుతలయ్యెదరు గాక! వేదరహస్యము ఎరిగిన మహాత్ములు సత్యజ్ఞానానంద స్వరూపమగు ఆత్మ పదమును పొంది, అద్దానిని మనకు విశదీకరించి చెప్పుచున్నారు.
“ప్రయత్నిస్తేనే ఆత్మ పదము లభిస్తుంది గాని, అది ఏదో గాలి వాటుగా లభించేది కాదు” అని నా విన్నపం.
శ్రీరాముడు : స్వామి! ఈ జీవుడు ఏ హేతువు చేత జగత్తులలో ప్రవేశిస్తున్నాడు? ఆతడు ఒక జగత్తును వదలి ఇంతలోనే మరొక జగత్తులోకి ప్రవేశిస్తున్నాడు కదా! ఈ సుదీర్ఘ ప్రయాణానికి అంతెక్కడ?
శ్రీవసిష్ఠ మహర్షి: మనం కొంతసేపటి నుండి వివేకోదయం గురించి చెప్పుకుంటున్నాం కదా! జీవునికి ఎదురుగా నిలిచి ఉన్న ఈ జగత్తులన్నీ బ్రహ్మము నుండే అవివేక ప్రభావం చేత ఉద్భవిస్తున్నాయి. అవివేకముచేతనే స్థితి పొంది ఉంటున్నాయి. మరల వివేకముచే నశిస్తున్నాయి. ‘బ్రహ్మము’ అనే సముద్రంలో ఏర్పడే ‘జగత్ సమూహములు’ అనే తరంగపరంపరలను ఎవరు లెక్కించగలరు? సూర్యకిరణములలో ఉండే త్రసరేణువులను ఎవరు లెక్కించగలుగుతారు?
అసమ్యక్ దర్శనం (Perception of Duality) జగతిస్థితికి హేతువు. సమ్యక్ దర్శనముచే ఈ సంసారజలమంతా వినాశనం పొందగలదు. మిక్కిలి దుష్కరము, అత్యంత భయంకరము అయినట్టి ఈ సంసారసాగరాన్ని అధిగమించాలంటే అందుకు ‘ప్రయత్నం - యుక్తి’ రెండూ ఉండాలని అనుకున్నాం గదా!
‘సంసారము’ అనగా ఏమిటో ఎరిగిన విజ్ఞులు ‘జీవితము’ అనే సదవకాశమును దుర్వినియోగ పరచుకోరు. ఎందుకంటే, ఈ సంసారము… ‘మోహము’ అను జలంతో, ‘మరణము’ అనే సుడులతో ’పుణ్యపాపములు’ అనే తరంగములతో, ‘నరకము’ అనే బడబాగ్నితో, ‘తృష్ణ’ అను ప్రకంపనములతో, ‘మనస్సు’ అనే సుడిగుండముతో, ‘జీవితము’ అనే నదీసంగమ స్థానముతో, ‘భోగములు’ అనే ఎఱలతో, ‘రోగములు’ అనే క్రూర సర్పాలతో, ‘ఇంద్రియములు’ అనే మొసళ్ళ ఘర్ఘరనాదంతో, ‘ఆశలు’ అనే ఉప్పురసంతో …ప్రాప్తిస్తోంది.
ఆహా! ఏమి దీని ప్రభావం! ఇందు స్త్రీలు తమ క్రీగంటి చూపులతో బుద్ధిమంతులైన వారిని కూడా కొద్ది క్షణాలలో తమ పాదాక్రాంతం చేసుకుంటున్నారే! ఇందులో ప్రవేశించిన జీవులు క్షణంలో తమ ఉపాధికి ముందే గల స్వస్వరూపం ఏమరుచుచున్నారే! మనస్సులోంచి ఆశలు పుడుతున్నాయి. ఆ ఆశలు ఆ మనస్సునే భ్రమింపజేస్తున్నాయి.
Page:613
ఈ చంచల సంసారం దాటివేయటమే పౌరుషం. అంతేగాని, ఏదో రాజ్యంపై దండయాత్ర చేసి గెలవటం పౌరుషం కాదు. ఉత్తమ బుద్ధి, ఉపాధి, అవకాశములు లభించి కూడా సంసార సముద్రం దాటటానికి పయనించని వారిని ఏమని పిలవాలి?… కొద్దిమంది మాత్రం తమ యొక్క బ్రహ్మజ్ఞాన బలం చేత ఈ సంసార సముద్రమును ఆపోశన పట్టివేస్తున్నారు. ఈ జగత్తునంతటినీ బ్రహ్మమయం చేసి సాక్షీస్వరూపులగుచున్నారు.
ఓ రామా! నీవు అట్టి శ్రేష్ఠులగు బ్రహ్మజ్ఞానులతో కూడి విచారణచేయి. బుద్ధిచే ’ఇదంతా బ్రహ్మమే’ అని గ్రహించు. ఆ తరువాత ఇందు క్రీడించు. అట్లు శోభించటమే ఉచితంగాని, ఇందు బద్ధుడవై ఉండటం ప్రజ్ఞ - - అని అనిపించుకోదు. ఓ రఘుకులతిలకమా! రామచంద్రా! ఈ చిన్న వయస్సులోనే నీవు విచారతత్పరుడవైనావు. ఈ సంసారము గురించి చక్కగా చింతన చేస్తున్నావు. ఈ విషయం నీ గురువైన నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తోంది. నీవు ధన్యుడవు. నీలాగే, ఎవ్వడైనా సరే… ఈ సంసారమును అత్యుత్తమ బుద్ధితో విచారణ చేస్తే ఆతనిని ఇక మోహము సమీపిస్తుందా? దాని వల్ల కాదు.
మొట్టమొదట చక్కగా విచారణ చేయాలి. సర్పమువలె భయమును గొలిపే విషయభోగములను ప్రక్కకు నెట్టివేయాలి. వివేక దృష్టిని అలవరచుకోవాలి. ఆత్మ విషయమై సమాచారం సంపాదించాలి. ఆ తరువాత గరుత్మంతుడు సర్పములను భక్షిస్తున్నట్లు ఈ శబ్ద స్పర్శాది విషయములపై ఆధీనత్వమును చెలాయించాలి. శబ్ద స్పర్శాది విషయములు నీకు దాస్యం చేయాలేగాని, నీవు వాటికి దాసుడవు, బద్ధుడవు అవటం పురుషకారం ఎట్లా అవుతుంది.
ఏదైనా ఒక వస్తువును, పొందాలనుకోవటానికి ముందు ఆ వస్తువు యొక్క తత్వం, ప్రయోజనం పరిశీలించి మాత్రమే స్వీకరిస్తాం. ఎందుకు? దాని ఉత్తరోత్తర ప్రయోజనం ఫలయుక్తంగా ఉండాలని ఉద్దేశ్యం కదా! అట్లా కాకుండా, ‘పైకి బాగున్నది’, అని అవిచారణ పూర్వకంగా వస్తువును తెచ్చుకున్నా మనుకో! ఏమౌతుంది?
శ్రీరాముడు : చిన్న పిల్లవాడు పెద్దలు చెప్పినా, వినకుండా తిను బండారాలు కావాలని ఏడ్చి తింటే… తెల్లవారే సరికి కడుపు నొప్పితో బాధపడినట్లంటారా?
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అట్లా అల్పజ్ఞానియగు జీవుడు ఆత్మ విషయం ప్రక్కకు పెట్టి ఇంద్రియ విషయాలను అంటిపెట్టుకొని ఉంటున్నాడు. అందుకే దుఃఖాలు, దిగుళ్ళు ఆతనిని వదలటం లేదు.
వసంతకాలంలో వృక్షములన్నీ రససమృద్ధమై ప్రకాశించునట్లు, ఆత్మతత్వ దర్శనం చేసేవాని బలము, బుద్ధి, తేజము వృద్ధిచెందుతాయి.
రఘునందనా! తెలుసుకోవలసిన ఆత్మ వస్తువును నీవు చక్కగా తెలుసుకున్నావు సుమా! కనుకనే…. నీవు ఆనందామృత పూర్ణుడవై అతి శీతల స్వభావుడవై, తాపత్రయరహితుడవై, స్వచ్ఛుడవై పూర్ణచంద్రునివలె విరాజిల్లుతున్నావు. అందుచేతనే పురుషోత్తముడవగు నిన్ను చూచి ఈ సభకు వేంచేసిన మహనీయులెందరో మహదానందపడుచున్నారయ్యా!
Page:614
8.జీవన్ముక్తుల పవిత్ర దృష్టి
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జీవుడు తన ఆనంద స్వభావం ఆస్వాదించగలుగుటకు ముక్తి ఒక్కటే ఉపాయం కదా! అట్టి ముక్త పురుషులగు మహనీయులెందరో ఈ సభకు వేంచేసియుండటం ఈ అయోధ్యలోని మా అందరి అనేక పూర్వజన్మల పుణ్యఫలం. దృశ్యం నుండి మొదలంట విడివడియుండి జీవన్ముక్తులై ప్రకాశించే మహనీయులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జీవన్ముక్తులగు నారదుడు, విశ్వామిత్ర మహర్షి మొదలైనవారి ’దృష్టి - అవగాహనలు’ మేము ఎంతగానో మరల మరల తెలుసుకుని ఉండటం మాకు ఎంతో అవసరమని నేను అనుకుంటున్నాను. అందుచేత జీవన్ముక్తుల పవిత్ర దృష్టి గురించి ఇంకా మరికొన్ని విశేషాలు వివరించమని మిమ్ములను వేడుకుంటున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : రామా! మనం జీవన్ముక్తుల లక్షణములు, దృష్టులు, అవగాహనల గురించి వేరు వేరు సందర్భాలలో చెప్పుకున్నాం. ఇంకా ముందు ముందు అనేక కోణాల నుండి చెప్పుకోబోతున్నాం. జీవన్ముక్తత్వమే ఈ మన సంవాదం యొక్క అత్యుత్తమ లక్ష్యం. కనుక పదే పదే పునశ్చరణ అవసరమే. పునరావృత్తి దోషంగా సభికులు భావించరనే నా అభిప్రాయం. అందుచేత మరల పునశ్చరణ పూర్వకంగా జీవన్ముక్త స్వరూపం గురించి కొన్ని విశేషాలు సమీక్షిస్తూ ఉదహరిస్తాను, విను.
సర్వేచ్ఛారహితుడగు ఆత్మజ్ఞాని ఈ ప్రపంచమును వ్యవహార దృష్టితో చూస్తున్నప్పుడు ఒక సుషుప్తుని వలె (గాఢనిద్ర పోయే వానివలె) అసంబంధపూర్వకంగా ఉంటాడు. పరమార్థ దృష్టిచే “ఇదంతా అసద్రూపమే కదా” అని గ్రహించి ఉంటాడు. లయించిపోయినట్టి మనస్సు కలవాడై ఆనందోన్మత్తుడై మెలగుచూ ఉంటాడు. అతని బుద్ధి అంతర్ముఖమగుటచే ఉదారత్వం వహించి ఉంటుంది. తాను అందరిలాగానే ఇంద్రియములను, వస్త్రములను, ధనాదులను కలిగి ఉన్నప్పటికీ తన అంతర్ముఖ దృష్టిచే ఒక స్తంభంలాగా తదితరుల వ్యవహారములను చూస్తూ ఉంటాడు. ప్రశాంత బుద్ధితో అంతా గమనిస్తూ… జనులు పొందే సంరంభమును చూచినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు.
భావిపదార్థములను అభిలషించడు. వర్తమాన పదార్థములపట్ల ప్రీతి కలిగి ఉండడు. గడచిన వస్తువుల గురించి చింతించడు. కానీ… సర్వము ఆచరిస్తూనే ఉంటాడు.
దృశ్య - - (లౌకిక) వ్యవహారములందు తనను తాను సుదూరంగా అట్టేబెట్టుకొని సుప్తప్రాయుడై ఉంటాడు. ఆత్మ విషయంలో మాత్రం అత్యంత జాగరూకుడై ఉంటాడు. వ్యవహారములందు కుశలుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం…. అంతఃపురంలో బాలకుణ్ణి బుజ్జగిస్తున్న దాది తన సొంత ఇంటిలోని బిడ్డ గురించే అదంతా చేస్తున్నట్లు…. ఆత్మ కొరకై వ్యవహారనిరతుడై ఉంటాడు.
అన్తః సర్వపరిత్యాగీ నిత్యమన్తరనేషణః | కుర్వన్నపి బహిః కార్యం సమమేవావతిష్ఠతే ॥ In (శ్లో 9, సర్గ 76)
Page:615
బాహ్యమున అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ అంతరంగంలో ఏమి చేయనివాడుగా ఉంటాడు. సర్వమూ మొదలే పరిత్యజించి, కోర్కెలేమి లేనివాడై, సమరూపుడై ఉంటాడు.
యథా ప్రాప్తములైన క్రియల విషయంలోనూ, వర్ణాశ్రమ ధర్మముల విషయంలోనూ, పితృ పితామహాది క్రమం చేత ప్రాప్తించే ఆస్థి రాజ్యాధికారాల విషయంలోనూ, బంధు మిత్ర సమాగమాది ఆయా సందర్భములలోనూ తాను నిర్వర్తించవలసినది తదనుకూలంగానే నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే ఏం? సర్వ విషయములలోనూ ఆతడు వర్తిస్తున్నప్పటికీ “అహమ్ కర్తాస్మి… నేను దీనికి కర్తను”… అనే కర్తృత్వాభినం రహితం చేసుకొని, ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖములు సమీపిస్తున్నప్పుడు వాటిని ఆత్మ రూపంగా ఎరిగి ఉంటాడు. అందుచేత ఇష్ట-అయిష్ట ఫలముల పట్ల సమరూపుడై, ఉదాసీనుడై ఉంటాడు.
దేని కొరకూ వాంఛించడు… ద్వేషించడు. శోకించడు… హర్షించడు. అనుకూల, ప్రతికూల కర్మాచరణ సమయములలో అనాసక్త చిత్తంతో వ్యవహరిస్తూ ఉంటాడు.
భక్తులందు భక్తుని వలె, ధీరులందు ధీరుని వలె, దుఃఖితులందు దుఃఖితుని వలె, యౌవన వృత్తాంతములందు యువకుని వలె ఉంటూనే… తాను సర్వదా తన అఖండ, అప్రమేయ స్వస్వరూపమును ఏమరువడు.
ఆతని నోటివెంట పుణ్యప్రదమైన, శుభప్రదమైన మాటలే వస్తాయి. ఆతని వాక్యాలు సమగ్రత్వం, సుదీర్ఘ దృష్టి, సర్వహితము, లోక కళ్యాణము స్వభావసిద్ధంగా సంతరించుకుని ఉంటాయి. అభిమాన రహితంగా ఉంటాయి. కనుక, “ఈతడు ఏపాటివాడు?” అని చూపరులకు అనిపించవచ్చు. అయితే సూక్ష్మబుద్ధికి మాత్రం ఆతడు ధీరబుద్ధి సహితుడని, ఆందోళనారహితుడని, ఆనందోదయ సమన్వితుడని, కోమలస్వభావుడని తెలిసిపోతుంది. పుణ్యస్వభావుడై, ప్రసన్నముఖుడై పూర్ణప్రజ్ఞాసహితుడై, భేద - -
దుర్దశలు లేనివాడై ఆతడు ఉంటాడు.
సర్వ ప్రాణులను తన స్వరూపముగా గాంచుటచే ఆతడు సర్వులపట్ల అకృత్రిమమైన స్నేహము కలిగియుండి…. లోకబాంధవుడై ఉంటాడు. ఉదారచరితుడై, సర్వావస్థలయందునూ సమరూపుడై, సౌమ్యుడై, సుఖ సాగరుడై, తన సాంగత్యముచే అందరి దుఃఖములనూ హరింపజేసేవాడై ఉంటాడు. తాను ఎక్కడుంటే అక్కడ పూర్ణచంద్రునివలె అమృత కిరణములను, సమగ్రజ్ఞానభావములను ప్రసరిస్తూ ఉంటాడు.
ఆతనికి సుకృతముల చేతగాని, దుష్కృతములచేతగాని, భోగ త్యాగములచేతగాని, బంధు మిత్ర సమాగమములచేతగాని, కర్మ, నైష్కర్మ్యములచేతగాని, స్వర్గ పాతాళాదిలోకముల ప్రాప్తిచేతగాని, బంధ మోక్షములచేతగాని ప్రత్యేకించి క్రొత్తగా వచ్చిపడే ప్రయోజనమంటూ ఏదీ ఉండదు.
ఈ జగత్తంతా ఏకమగు బ్రహ్మముగా, తనకు సర్వదా అనుభవమగుచున్నట్టి, తాను ఇదంతా ఆత్మతత్త్వముగా గాంచుచున్నట్టి ఆ జీవన్ముక్తునికి ఇక బంధమేమిటి? మోక్షమేమిటి? ఈ బంధ
Page:616
మోక్షముల భావనలచే ఆతని మనస్సు ఎన్నటికీ దీనత్వం పొందదు. ‘సమ్యక్ జ్ఞానము’ అను అగ్నిచే ఆతని సంశయములన్నీ భస్మీభూతం కాగా ఆతని చిత్తము సర్వత్రా ప్రియత్వము, ఆనందత్వము, నిర్మలత్వము, అప్రమేయత్వము, అఖండత్వము అన్ని వైపులా అనుభవిస్తూ ఉంటుంది. ఆతని మనస్సు భ్రమ - విభ్రమ వినిర్ముక్తమై (Having been relieved of all Illusions and fantacies), బ్రహ్మరూపమై, నశించక… ఉదయించక ఉంటుంది.
ఆతడు సర్వావస్థలయందునూ ఆకాశమువలె సమరూపుడై వెలయుచూ ఉంటాడు. ఊయలలో పడుకుని ఉన్న పసిబాలుడు ఎట్టి ఇచ్ఛ - సంకల్పములు లేకుండానే కాళ్ళు - చేతులు కదులుస్తాడు… నవ్వుతాడు చూచావా? ఆత్మజ్ఞాని ఎట్టి రాగాదులు లేకుండానే తన ఈ కాళ్ళు - చేతులను ఆయా చేష్టలలో నియమిస్తాడు. అట్లు నియమిస్తూనే తాను మదిరోన్మత్తుని వలె బ్రహ్మానందంలో ఓలలాడుచూ, పునర్జన్మ భయరహితుడై ఉంటాడు. ఇతఃపూర్వం తాను రాగసహితంగా నిర్వర్తించియున్న కర్మలు గుర్తుకు వస్తున్నప్పుడు, అదంతా చూచి నవ్వుకుంటాడు. వాటి ఊసులన్నీ అధిగమించి ఉంటాడు. ఇతఃపూర్వపు సంఘటనలను స్మరించడు… విస్మరించడు.
సర్వం సర్వప్రకారేణ గృహాతిచ, జహాతిచ |
అనుపాదేయ సర్వార్డ్తో బాలవచ్చ విచేష్టతే …
అన్నీ గ్రహిస్తాడు… త్యజిస్తాడు. ఏదీ గ్రహించకయే బాలునివలె చేష్టలు సల్పుచూ ఉంటాడు. జ్ఞాని… అజ్ఞాని - జ్ఞానికి, అజ్ఞానికి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటో చెపుతాను, విను-ఇద్దరు కూడా దేశకాల క్రియాక్రమానుసారం కార్యములందు ప్రవృత్తులగుచున్నారు. అయితే, జ్ఞాని ఆయా క్రియాజనితమైన సుఖదుఃఖములకు వశీభూతుడు కాడు. బాహ్యమందు మనస్సుచే ప్రాప్తించిన కార్యాలను మాత్రం శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. అంతరంగంలో క్రియా వర్ణితుడై ఉంటాడు. ఎందుకంటే బాహ్య పదార్థములన్నీ అసత్తేనని ఆతనికి తెలుసు. అందుకే వాటి ఫలముల కొరకై ఆతడు పరుగెత్తడు. ఆ ఫలములన్నీ అల్పము, సంకుచితము, స్వల్పకాలికము అగు ప్రయోజనములే కలిగి ఉంటాయని తెలుసు. దుఃఖదశలను గాంచడు. సుఖ స్థితిని అపేక్షించడు. కార్యసాఫల్యమునకు సంతోషించడు. కార్యవిఫలత్వముచే దుఃఖించడు. సూర్యగోళము చల్లబడు గాక! చంద్రమండలం అకస్మాత్తుగా అగ్నిజ్వాలలు వెదజల్లు గాక! అగ్ని అధోముఖంగా జ్వలించుగాక! అవన్నీ కూడా ఆత్మ జ్ఞానికి ఆశ్చర్యం కలిగించలేవు. "ఆత్మయందే అవన్నీ స్ఫురిస్తున్నాయి”… అను నిశ్చయము కలవాడై విస్మయ జాలమునందు కూడా ఆశ్చర్యచకితుడు కాడు.
దయచే ఆతడు దీనము వహించడు. అట్లని క్రౌర్యము నాశ్రయించడు. అవమానములందు లజ్జితుడు కాడు. దుష్కార్యములచే నిర్లజ్జ కలిగియుండడు. గర్వి, ప్రమత్తుడు, ఖిన్నుడు, హర్షి, ద్వేషి, భయ శోకయుతుడు అవడు. విశాలాకాశము వంటి జ్ఞానము గల ఆతనికి ఎవరిపైనా కోపం ఉండదు. ఆకాశంలో విత్తనం మొలకెత్తుతుందా?
Page:617
ఓ రఘురామా! నిరంతరం జనన మరణములతో కూడియున్న ఈ "జగత్ స్థితి” యందు సుఖంగాని, దుఃఖంగాని ఎట్లా ఉంటాయి? ఇక ఎదురుగా ఇక్కడుండేదంతా, ఈ దేహముతో సహా, పంచభూత సమన్వయమే కదా! స్వయముగా చపలము ప్రవర్తించే చోట సుఖ దుఃఖముల ప్రసక్తి ఏమిటో చెప్పు? ఎట్లా ఉండగలవో నాకర్థం కాదు. ఇక్కడ నిరంతరం ప్రాణికోట్లు జన్మిస్తున్నాయి. మరణిస్తున్నాయి. ఈ ఉత్పత్తి వినాశములను చూచి జగదృష్టిగల అజ్ఞానులు మాత్రమే హర్ష శోకములు పొందుచున్నారు. జగత్ రహస్యం తెలిసినట్టి సమర్థులగు జీవన్ముక్తులు ఇక్కడి ఉత్పత్తి వినాశనములను చూచి ఏమాత్రం స్పర్థ చెందరు.
రాత్రియందు కొద్దిక్షణాల నిద్రలో సుదీర్ఘకాలపు స్వప్నములు సంభవమౌతున్నాయి చూచావా? ఉత్పత్తి వినాశనాలతో కూడిన ఈ జగత్ సృష్టులలో ఏది సంభవం? ఏది అసంభవం? క్షణికమైన ఈ తుచ్ఛ ప్రపంచంలో “దీని గురించి సంతోషం… దాని గురించి దుఃఖం” అని ప్రసంగించుకోవటంలో అర్థమేముంది? అప్పుడాతనికి సుఖం యొక్క అభావమే సిద్ధిస్తుంది. తత్ప్రయోజనంగా సుఖం యొక్క వ్యతిరేకానుభవమైన ‘దుఃఖము’ అనుదానికి రూపం ఏర్పడ జాలదు. అనగా శోక మోహాదులను విస్తరింపజేసే దుఃఖానుభవమే జీవన్ముక్తునకు ఉండదు. సుఖ దుఃఖ సంక్షయము యొక్క ప్రభావంచే ’ఇది త్యాజ్యము - ఇది గ్రాహ్యము” అనునది కూడా ఆతనికుండవు. త్యాజ్యగ్రాహ్యములు లేవు కనుక, ఇష్ట, అనిష్టములు ఇంకెక్కడుంటాయి? శుభాశుభ దృష్టి నశించటంచేత భోగేచ్ఛ తొలగి ఆశారాహిత్యం బలంపుంజుకుంటుంది. అప్పుడు మనస్సే విలయమౌతోంది. మనోనాశనకారణంగా సంకల్పముల కల్పన ఉండదు. నువ్వులు బాగుగా వేగిపోయిన తరువాత ఇక నూనె గురించిన ప్రసంగమెక్కడిది?
“నా స్వస్వరూపమగు ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ ఉండజాలదు" అను దృఢ జ్ఞానముచే సంకల్ప, వికల్పములు నశిస్తాయి. ఇక ఈ సర్వ దృశ్య పదార్థములు ఆకాశమువలె స్థితి పొందుతాయి. అప్పుడు ‘పరిచ్ఛిన్నము’ అనునదేదీ ఉండదు. అట్టి మహాత్ముడగు ఆత్మజ్ఞాని ఎట్టి పదార్థప్రాప్తికీ సంబంధించనట్టి అకృత్రిమమగు ఆనందప్రాప్తిచే ప్రమోదితుడై ఉంటాడు. ఈ స్వప్నతుల్య జగత్తునందు యథా ప్రాప్తములైన పదార్థములను చిత్తముతో అవలోకించుచూ నిశ్శబ్దత్వము వహించి ఉంటాడు. ఈ ప్రపంచము పట్ల ప్రశాంత, మౌన రూపమగు నిద్ర వంటి స్థితి పొంది ఉంటాడు. అట్లు ప్రారబ్ధక్షయము అయ్యే వరకూ జీవితమును గడుపుచూ నిత్యతృప్తుడై ఉంటాడు. నిర్హేతుక ఆనందమును, అనిర్వచనీయ సంతృప్తిని పొంది ఉంటాడు.
ఏ జీవుడైనా సరే… జ్ఞాన నిర్మలహృదయ సముపార్జనచే ‘జీవన్ముక్తుడు’ అగుటకు తప్పక అవకాశమున్నదని సర్వజనులకు మనవిచేస్తున్నాను.
Page:618
శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒక మండుచున్న కొరివిని చేతిలోకి తీసుకొని వర్తులాకారంగా త్రిప్పుచున్నావనుకో… అక్కడ ఒక వర్తులాకారపు వస్తువేదో ఉన్నట్లు భ్రమగొలుపుతుంది కదా! శ్రీరాముడు : అవును మహర్షీ! అట్లా అనిపిస్తుంది.
శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి అక్కడ వర్తులాకారపు వస్తువేమి లేదుకదా! కొరివియే భ్రమచే అట్లా అనిపిస్తోంది. అట్లాగే మనస్సు యొక్క సంచలనము లేక చాంచల్యముచే మిథ్యా రూపమగు ఈ జగత్తు భాసిస్తోంది.
తటాకపునీటిలోకి మట్టి బెడ్డను విసిరితే జలంలో ఆవర్తాలు ఏర్పడతాయి. ఆవర్తాలు జలం కంటే వేరైనవి కావు కదా! ఆత్మయందు ఏర్పడే చిత్తస్పందనము చేతనే ఈ జగత్తు కన్పించటం జరుగుతోంది. ఇది మిథ్య అయి ఉండి కూడా ‘సత్యము - నిత్యము’ వలే తోచుచున్నది. అవిచారణ కారణంగా ఈ జీవుడు భ్రమపూర్వకమైన ఈ జగత్తును గాంచుచూ ఇందులో సుఖ-దుఃఖ-ఉద్వేగ భావ పరంపరలకు లోను అగుచున్నాడు.
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! ఈ చిత్తము దేనిచే చలిస్తోంది? ఏ విధంగా దీని చలనం మనం నిరోధించవచ్చు? ఈ మనస్సును దహింపజేయటం చాలా ఆవశ్యకం కనుక… ఈ రెండు ప్రశ్నలకు సమాధానం విశదీకరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : "మంచు - తెల్లదనం” … ఈ రెండూ వేరు వేరు కాదు కదా! ’అగ్ని - ఉష్ణము’ వేరు వేరా? నువ్వులు - నూనె, పుష్పంలోని పుప్పొడి కణాలు - పుష్పసుగంధం… ఈ ద్వంద్వాలు ఒకదాని కన్నా మరొకటి ఎట్లా వేరు, వేరైనవి అవుతాయి?
అట్లాగే చిత్తము, దాని స్పందనము ఒక దాని కంటే మరొకటి వేరు వేరు కానే కాదు. వాటి యందు గల “చిత్తం - స్పందనం” అనే భేద శబ్దములు కేవలం భ్రమ చేతనే కల్పించబడుతున్నాయి. గుణి గుణములు (The possesser of attributes & Attributes) ఈ రెండిటిలో ఒకటి లేదంటే రెండవది కూడా లేనట్లే కదా! చిత్తము - స్పందనములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశించి పోతుంది. అట్టి చిత్తము యొక్క నాశనము కొరకు రెండు విధములైన ఉపాయాలు ఉన్నాయి1.యోగము, 2.జ్ఞానము. … అందు ‘యోగము’ అనేది చిత్తవృత్తి నిరోధకరూపమైనది. శ్రీరాముడు :‘యోగము’ అనగా ఏమిటో, దాని వలన జీవునకు సుఖము, శాంతి ఎట్లా లభిస్తాయో చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణాపాన నిరోధకమగు యోగయుక్తి గురించి మనం ముందు ముందు నిర్వాణప్రకరణ ప్రారంభంలో "భుశుండోపాఖ్యానం”లో కొన్ని, కొన్ని విశేషాలు సంభాషించు కోబోతున్నాం. అయితే ఇక్కడ నీవు అడిగావు కనుక కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
Page:619
ఈ దేహమును మనం చూస్తున్నాం కదా! దీనిలోని ప్రతి శాఖ యందు అనేక నాడీ సమూహాలు ఉన్నాయి. అట్టి 72000 దాకా ఉండే నాడీ సమూహాలలో నిరంతరం వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. అట్లు శరీరమంతా నిరంతరం ప్రసరిస్తూ ఉండే వాయువునే ‘ప్రాణము’ అని అంటాం.
ఈ ప్రాణము శరీరంలో అధో - ఊర్ద్వ గమనములు చేస్తూ ఉంటోంది. తన సంచలనముచే వివిధ రకములైన క్రియలను నిర్వర్తించు ప్రాణమును ఆయా చోట్ల నిర్వర్తించే వేరు వేరు క్రియలను అనుసరించి ఐదు పేర్లను శాస్త్రజ్ఞులు కల్పించారు.
సుగంధమునకు ఆధారం పుష్పమే కదా! చిత్తమునకు ప్రాణమే ఆధారం.
అన్తఃప్రాణ పరిస్పన్దాత్సంకల్పకలనోన్ముఖీ |
సంవిత్సంజాయతే యైషా తచ్చిత్తం విద్ధి రాఘవ ॥ (శ్లో 13, సర్గ 78)
లోన ప్రాణచలనము అగుచుండుటచే, సంకల్పోన్ముఖమై జనించునట్టి, జ్ఞానవృత్తే “చిత్తము”. అట్టి జ్ఞానవృత్తిని ‘సంవిత్తు’ అని కూడా అంటారు.
ప్రాణములు స్పందించుట చేతనే జ్ఞాన వృత్తుల (ఎఱుగుచుండుట అను రూపం గల వృత్తుల) స్పందనము కూడా కలుగుచున్నది. జ్ఞానవృత్తులు చిదాభాసుని (Reflection of Absolute Self) ఉనికితో నిండి ఉంటున్నాయి. జలము యొక్క స్పందనముచే తరంగములు ఉత్పత్తి అగుచున్నట్లు జ్ఞానవృత్తుల స్పందము చేత విషయానుభవం కలుగుతోంది. దృశ్యజగత్తు యొక్క వాస్తవరూపం విషయానుభవమే!
ప్రాణ స్పందనమే చిత్తం అని చెప్పుకున్నాం కదా! కనుక ప్రాణములు గనుక నిరోధించబడితే… అప్పుడు చిత్తము కూడా తప్పక ఉపశమించగలదు. అట్లు చిత్తము, లేక, మనస్సు ఉపశమిస్తే ‘జగత్తు’ అనే అనుభవం కూడా విలయ మొందుచున్నది.
శ్రీరాముడు : మునీంద్రా! ఈ దేహంలో 72000 నాడులున్నాయి కదా! వాటన్నిటి యందు నిరంతరం గమనాగమనములు సలుపుచున్న ప్రాణవాయువులు మొట్టమొదట నాసిక ద్వారా ప్రవేశిస్తున్నాయి కదా! అట్టి నాసిక మొదలైన రంధ్రములందు గల ఆకాశంలో వాయువును నిరోధించటమే ప్రాణాయామమని వినియున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అట్టి ‘నిరోధము’ అనే యోగములోగల వివిధ మార్గములను విశదీకరిస్తాను… విను.
Page:620
భావములు త్యజించబడతాయి. అట్టి ధ్యానముచేతనూ, అనేకత్వపుజాడ్యము తొలగుచున్నప్పటి ‘ఏకత్వము’ యొక్క దృఢాభ్యాసంచేతనూ ప్రాణచలనము నియమించబడగలదు.
ప్రాణాయామం - - సుఖ పూర్వకంగా క్రమక్రమంగా నివర్తించబడే ’పూరకము - - కుంభకము - రేచకము’ అను విభాగములు గల ప్రాణాయామము యొక్క దృఢమైన అభ్యాసంచేతా, ఏకాంత ధ్యానయోగంచేతా ప్రాణచలనము నిరోధించబడగలదు.
ప్రణవోచ్చారణ - ‘ఓం’ కారమును సుదీర్ఘంగా ఉచ్చరిస్తూ… అద్దాని యందలి ‘అ-ఉ-మ’ లకు అంతర్లీనమై ఉండే ‘చతుర్థమాత్ర’ను అవలంబించి … అద్దాని శబ్దార్థము (That which is intended by Om)ను భావన చేయటం మరొక మార్గం. అట్టి పవిత్ర భావనచేస్తుండటంచేత క్రమంగా బాహ్య విషయములకు సంబంధించిన అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. సాంసారిక దృష్టులన్నీ శమిస్తాయి. అప్పుడు ప్రాణస్పందనము నిరుద్ధమౌతుంది.
వివిధ యోగాభ్యాసములు - - ఇప్పుడు వివిధ యోగాభ్యాసముల గురించి, తద్వారా చిత్తము నిరోధించటం గురించి చెప్పుచున్నాను విను1. పూరకము - వాయువును నాసికాపుటముల ద్వారా సుదీర్ఘంగా స్వీకరించటం, మరల క్రమపూర్వకంగా త్యజించటమును ‘పూరకము’ అని అంటున్నాం. పూరకమును పదే పదే అభ్యసిస్తూ వస్తే …క్రమంగా అట్టి అభ్యంతర పూరకముచే ప్రాణసంచలనము ‘పర్వతంపై నిలచే నిశ్చల మేఘం లాగా’ ఉపశమిస్తుంది. క్రమంగా మనస్సు నిశ్చలమౌతుంది.
కుంభము - పూరకముచే నాసికాపుటముల ద్వారా స్వీకరించిన వాయువును నిండు కుండలాగా దీర్ఘకాలం శరీరంలో స్థంభింపజేయటం… అట్లు స్థంభించిన తరువాత పూరకంలోలాగానే వాయువును తిరిగి వదలటం. ఈ అభ్యాసం చేత కూడా ప్రాణము స్తంభితమౌతుంది.
రేచకము - - వాయువును నాసికారంధ్రముల ద్వారా బహిర్గతం చేసి, మరల వాయువు ప్రవేశించ కుండా కొద్ది క్షణములు నిలువరించటం. అట్టి దృఢాభ్యాసం చేత విశాలమగు ప్రాణము ఆకాశరూపమును పొందుతుంది. అభ్యాససమయంలో, వాయువు నాసపుటములను స్పృశించక పోవుటచే ప్రాణ చలనము, తద్ద్వారా క్రమంగా మనోచంచలత్వము నిరోధించబడతాయి.
తాలువు-ఘంటికల యోగముద్ర - నోటిలోపలి దవడ యొక్క మొదటి భాగంలో వ్రేలాడుచుండే ఘంటిక (కొండ నాలుక)ను నాలుక చివరికొసతో అణిచిపెట్టి ప్రాణమును బ్రహ్మ రంధ్రమున ప్రవేశింప జేసి ధారణ ఒనర్చటం చేత ప్రాణస్పందన నిలువరించబడుతోంది. తీవ్ర యోగాభ్యాసులగు కొందరు దీనిని అభ్యాసం చేస్తున్నారు.
పరధ్యానం - “ఈ జగత్తుకు సంబంధించిన ఏవేవో విశేషాలు తెలుసుకోవాలి, గ్రహించాలి” అను రూపం గల ఒకానొక వృత్తి ఈ జీవునిలో అనుక్షణం బయల్వెడలుతోంది. అట్టి వృత్తినే ‘సంవేదన వృత్తి’ అని అంటారు. ఈ జీవుని ఆ ఆ సంవేదనా వృత్తి తన స్వకల్పనా వికారమును త్యజించి నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసం చేత సూక్ష్మ హృదయాకాశంలో లయం చేయబడిందనుకో… అప్పుడు కూడా ఈ ప్రాణస్పందన నిలిపివేయబడుతుంది.
Page:621
ఖేచరీ ముద్ర - నాసికాగ్రం వద్ద గల పండ్రెండు అంగుళముల వరకు గల నిర్మలాకాశంలో మనోదృష్టులన్నిటిని తరలించి తెచ్చి నిలిపామనుకో… అప్పుడు కూడా ప్రాణస్పందము నిరోధించ బడుతోంది.
బ్రహ్మరంధ్ర లయ ముద్ర - పండ్రెండ్రు అంగుళముల మేర ఉన్న శిరస్సు యొక్క ఉపరి భాగపు ప్రాంతమందు గల బ్రహ్మ రంధ్రమునందు అభ్యాసవశం చేత ప్రాణ వృత్తులను లయింప జేయుటచే ప్రాణస్పందమును నిశ్చలం చేయటం.
భ్రూముద్ర - ఈ నేత్రేంద్రియము అభ్యాస వశంచేత భ్రూమధ్య భాగంలో (Space between two eye - brows) చిరకాలం నిరోధించబడినప్పుడు సైతము ప్రాణము ఉపశాంతి పొందగలదు. అట్లు శాంతికి ఉపక్రమించిన ప్రాణము బ్రహ్మ రంధ్రమునందు ప్రవేశపెట్టుటచే ప్రాణము పూర్తిగా నిరోధించబడుతుంది.
గురు అనుగ్రహం - ఈశ్వరానుగ్రహం - అనేక జన్మలలో చేసిన, పుణ్యం త్యాగకర్మల ప్రభావంచే పరిశుద్ధుడు సంసిద్ధుడు అయినట్టి జీవుడు ఒకానొక జన్మలో గురువు యొక్క కరస్పర్శాది అనుగ్రహము చేతనో, ఈశ్వరానుగ్రహము చేతనో ‘ఆత్మజ్ఞానం’ కాకతాళీయంగా పొందుతుంటాడు. లేదా, ఒక్కసారిగా తీవ్ర ప్రయత్నమును స్వీకరించి కొద్దికాలంలో ఆత్మజ్ఞానం పొందటం జరగవచ్చు. అట్టి ఆత్మజ్ఞానం క్రమంగా సమస్త కల్పనలూ, సర్వ ఆశలు అధిగమించినదై ప్రకాశించగలదు. అట్టి స్థితిలో ప్రాణచలనము స్వయముగా నిశ్చలమగుచున్నది.
ధ్యానము - ఈ చిత్తమును తన హృదయాకాశంలో చిరకాలం లగ్నంచేస్తూ ఉంటే అట్టి అభ్యాసియగు యోగసాధకుడు స్వయముగా వాసనారహితుడే అవుతాడు. చిత్తమును భగవన్నామ స్మరణం వంటి అభ్యాసాలలో నియమించుటచే కూడా, అదేవిధంగా, క్రమంగా హృదయాకాశంలో ఆచిత్తము సుస్థిరమవగలడు. అట్టి ఆత్మ ధ్యానము చేయుటచే ప్రాణస్పందనము నిరోధించబడుతోంది.
ఇట్టి ఆయా ఉపాయములచే, అభ్యాసములచే ప్రాణము నియమించబడగా, “చిన్మాత్ర స్వభావుడగు ఆ పరమాత్మ నా యొక్క స్వాత్మరూపమే”… అని ఎరుగబడగలదు.
శ్రీరాముడు : హే మహాత్మా! నాదొక చిన్న సందేహం. ఈ విశాల దృశ్యమంతా కూడా ’హృదయము’ అనే దర్పణంలో ప్రతిబింబించటం జరుగుతోంది కదా! అట్టి ఈ ప్రాణుల హృదయం ఎట్లు తయారు చేయబడింది? దీని రూపము ఎట్టిది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ సమస్త ప్రాణుల హృదయము రెండు విభాగములు కలిగి ఉంటున్నది1. త్యాజ్య (భౌతిక) హృదయం - పరిచ్ఛిన్నమగు ఈ భౌతిక రూపమునందు గల వక్షస్థల ప్రదేశంలో మాంస పిండ రూపంలో ఉన్నది చూచావా? ఇది త్యాజ్య హృదయం. హృదయం యొక్క ఈ విభాగం వాస్తవానికి హృదయమునకు ఉపకరణము వంటిది. ఇది జడమైన శరీరము యొక్క ఒక అవయవమై ఉన్నది.
Page:622
ఈ హృదయం యొక్క రూపము ఏమిటంటావా?… దాని రూపము ఎఱుక (Awareness) (లేక) జ్ఞానము (Knowledge Absolute) (లేక) సంవిత్తు. నేను మన సంవాదము యొక్క సౌలభ్యము కొరకు హృదయమును రెండు విభాగములు చేసి చెప్పాను. అయితే, జడము… శిలాసదృశము… మాంసపిండము అయిన త్యాజ్య (భౌతిక) హృదయం వాస్తవమైన హృదయం కాదని, గ్రాహ్య హృదయం అసలైన హృదయమనీ గ్రహించు.
వాసనాత్యాగపూర్వకంగా ఈ చిత్తమును సంవిత్ రూపమగు శుద్ధ - గ్రాహ్య హృదయంలోనికి ప్రవేశింపచేయాలి. అంతేగాని, దానిని శబ్దస్పర్శాది ఇంద్రియ విషయాలలో అట్టేబెట్టి రోజులు జడపూర్వకంగా గడపరాదు. చిత్తం ప్రబలంగా హృదయాకాశంలో… ఏ మార్గము (లేక) ఉపాయం చేతనైనా సరే… నియోగించబడినప్పుడు ప్రాణ చలనం నిరుద్ధమవుతుంది. వివిధ ఆచార్యులు, లోకమునకు వివిధ మార్గాలు, తదితర క్రమములు ప్రసాదించారు. శ్రద్ధగా, లక్ష్యమును ఎరిగి ఆచరించినప్పుడు ప్రాణ స్పందనము నిరోధించబడుతోంది.
మనం పైన చెప్పుకున్న ఆయా యోగయుక్తులన్నీ అభ్యాసవశం చేత…. ఈ సంసారం త్యజించి మోక్షం సముపార్జించాలనుకున్న సాధకులకు … తప్పకుండా ఉత్తమ ఉపాయములై సహకరిస్తున్నాయి. ప్రాణాయామము మొదలైనవి అభ్యాసముచే దృఢపడుతూ వైరాగ్యమునకు సహకరించి, తద్వారా, వాసనలు నిరోధించబడతాయి. అట్టి వాసనానిరోధము యొక్క సాఫల్యముచే ఈ జీవుడు ఔన్నత్యము సంపాదించి ’ఆత్మతత్త్వము’ను గ్రహించగలడు.
కాలువలో ప్రవహిస్తున్న నీరు గట్టు కట్టినపుడు తన ప్రవాహ వేగమును ఉపసంహరించుకొని వెనుకకు మరలక తప్పదుకదా! మనం ఇంతవరకు చెప్పుకున్నట్టి "భ్రూమధ్యం నుండి, నాసికా ప్రదేశము నుండి, కంఠప్రదేశము నుండి 12 అంగుళముల వరకు గల ప్రదేశంలో చిత్తమును సుస్థిరం చేయటం” (ఖేచరీముద్ర) అనే అభ్యాసం చేత మనస్సు యొక్క పరిపరివిధత్వం ఉపశమిస్తుంది. ప్రాణముల నిరంతర సంచలనము శమిస్తుంది. అట్లాగే నాలుక యొక్క చివరిభాగంతో తాలువు (దవడ) నందు వ్రేలాడి ఉండే కొండనాలుకను పలుమార్లు స్పృశించటం అభ్యసించడం చేత కూడా త్వరితగతిలో ప్రాణసంచలనంపై ఆ సాధకునకు అధీనత్వం లభిస్తోంది.
అయితే ఒక ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆయా యోగాభ్యాసాలన్నీ అంతిమ ప్రయోజనమగు "అఖండ - అప్రమేయానుభూతి” అను రూపంగల మోక్ష స్థితిని
Page:623
ప్రసాదించుటకు ముందు కొన్ని వికల్పములు ఏర్పడే అవకాశం ఉన్నది. సాధకుడు నిష్కాముడై ఉంటే వికల్పములన్నీ వాటంతటవే తొలగుతాయి. “పరమ ఉపశమనము” అనే ఫలమును దృశ్య విషయఫలాసక్తి లేని సాధకునకు త్వరితగతిని కలుగచేస్తాయి. అయితే ప్రాణయోగాభ్యాస విధివిధానములను గురుముఖతః ఎరిగి అభ్యసించవలసినదని నా విన్నపం.
అభ్యాసము చేతనే మానవుడు శోకరహితుడై ఆత్మారాముడుగా విరాజిల్లగలడు. కొంచెం శ్రద్ధ, పట్టుదల కలిగియుండి సాధన చేస్తే అంతఃకరణమునందు సుఖి కాగలడు.
అభ్యాసమునకు మించిన గురువు, మిత్రుడు, ఉపాయం, మార్గం వేరే ఉండవు. అభ్యాసముచే క్రమక్రమంగా ప్రాణస్పందనము సన్నగిల్లుతుంది. మనస్సు శాంతి పొందుతుంది. మనస్సు శాంతిస్తే నిర్వాణపదము లేక బ్రహ్మపదము, లేక మోక్షము శేషించగలదు.
ప్రాణస్పందనమే మనస్సు. మనస్సు వల్లనే ఈ సంసారభ్రమ అంతా కలుగుతోంది. కాబట్టి ప్రాణస్పందనము ఉపశమిస్తే సంసార దుఃఖము తనకు తానుగా నశించుచున్నది. అప్పుడు బ్రహ్మము నందు కల్పనాయుక్తమై ఉంటున్న మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, దేహం, ప్రారబ్ధం, బంధం, మోక్షం’ మొదలుగా వాక్సముదాయమంతా నివృత్తి చెందుతుంది. బ్రహ్మపదమే శేషిస్తుంది.
యత్రసర్వమ్, యతఃసర్వమ్, యత్సర్వమ్, సర్వతశ్చయత్ I
యత్ర నే౨దమ్, యతో నే దమ్, యన్నే దమ్, నేదృశం జగత్ ॥
ఈ జగత్తుగా గోచరించేదంతా ఎందులో ఉండి ఉన్నది? దేని నుండి ఇదంతా ఆవిర్భవిస్తోంది? ఏది అంతటా వ్యాపించియున్నది? ఈ సర్వము స్వతఃగా ఏదై ఉన్నది? కానీ…
ఎందులో జగత్తు అనబడేదేదీ ఉండజాలదు? దేనినుండి మరొకటేదీ ఆవిర్భవించజాలదు? దేని రూపమైతే ఈ కనబడే జగత్తు, ఇందలి ఏ వస్తువూ కాదు? ఏ అంశంలోనూ దేనికి ఇది సామ్యము (comparison)కాదు?
అట్టి నిత్యనూతన అకళంక అప్రమేయ బ్రహ్మము, సాధకునికి ఒకానొకదశలో అనుభవమ వుతుంది. ఈ కనబడే జగత్తు నాశవంతమూ, వికల్పమయమూ కదా! ఇక్కడ నిర్గుణపరమాత్మకు సదృశమైనదేది లభిస్తుంది? అందుకే… ఏ దృష్టాంతమైనా బ్రహ్మమును సమగ్రంగా తెలియజెప్ప గలదా?… లేదు. సాధన యొక్క పరిపక్వస్థితిలో ఈ జీవుడు అనబడే చిద్రూపము… “గాంచువాడు, గాంచబడుచున్నది, గాంచుట” అను త్రిపుటితో సహా సర్వరూపరసాది బాహ్యవృత్తులకూ సాక్షిరూపత్వము అనుభవించ గలదు. నాటకము చూస్తున్న రాజుగారు రంగస్థలంపై ప్రవేశించి పాత్రధారుల రసావేశంలో జోక్యం కలిగించుకొనటం ఎంత రసాభాసయే గదా! యోగి తన సాక్షి స్వరూపము ఎరిగిన తరువాత ఈ జగత్తు అనే కల్పనతో తాదాత్మ్యం చెంది రసాభాస పొందడు. అతడు సర్వదా సాక్షి రూపమునే ఉంటాడు.
అట్టి చిద్రూపమే తేజోవంతములైన అన్ని పదార్థముల కంటేకూడా ప్రకాశవంతమైనది.
Page:624
ఈ కామము మొదలైన సర్వ అభ్యంతర వృత్తులనూ ప్రకాశింపజేస్తున్నది అదే! ‘చైతన్యము’ అనే మహావృక్షము నుండి వివిధ రసయుక్తములగు ఈ జగద్రూపఫలములు నిరంతరం ఉత్పన్నమై నశిస్తున్నాయి. ఏ మహామతి అయితే ఈ సర్వసీమములకు ఆవల ఉన్నట్టి ఆ బ్రహ్మపదమును ఆవలంబించి ఉంటాడో… ధీరుడు, బ్రహ్మజ్ఞుడు అగు ఆతనిని ‘జీవన్ముక్తుడు’ అని మనం పిలుస్తున్నాం. అట్టి జీవన్ముక్తునకు సర్వభోగాభిలాషలు నశించిపోతాయి. హిత - అహిత కల్పనంతా ఉపశమించి పోతుంది. ఆతడిక ఎట్టి వ్యవహారమునందునూ హర్షముగాని, శోకముగాని పొందడు. ఆతడే ముక్త మానసుడు. ఆతడే పురుషోత్తముడు.
శ్రీరాముడు : మహాత్మా! “యోగయుక్తస్థితి” పొందటానికిగాను చిత్తమును నశింపజేయాలి కదా! అట్టి చిత్తనాశనమునకై ఉపాయమగు ‘ప్రాణనిరోధం’ గురించి చెప్పారు. అట్లాగే మరొక ఉపాయమైనట్టి ’సమ్యక్జ్ఞాన సముపార్జనం’ గురించి కూడా చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి :“ఆద్యంత రహితుడు, అసాధారణుడు అగు పరమాత్మ ఒక్కడే ఈ జగత్తునందు కలడు. ఆతనికి అన్యంగా ఎక్కడా ఏదీ లేదు” …. అను ఏ మహత్తర నిశ్చయం ఉన్నదో… అద్దానినే విజ్ఞులు ‘సమ్యక్ జ్ఞానం’ అని పిలుస్తున్నారు. అట్టి సమ్యక్ జ్ఞాని, “కుండలన్నీ మట్టియే. వస్త్రములన్నీ దూదియే. జీవులన్నీ ఆత్మయే” అను భావన కలిగి ఉంటాడు.
మిథ్యాజ్ఞానముచే జన్మాదులన్నీ కలుగుచున్నాయి. మిథ్యా జ్ఞానము చేతనే కదా, బాటయందు మెలికలు తిరిగిపడియున్న త్రాడును చూచి ‘ఇది పాము’ అని భ్రమకలగటం! సమ్యక్ జ్ఞానం అనగా, “పాము అన్నది నా భ్రమ. ఇక్కడ ఉన్నది త్రాడే” అని తెలియవచ్చుట వంటిదే!
సంకల్పాంశ వినిర్ముక్తమైనది, విషయవర్జితమైనది అగు తత్త్వమునకు ‘సంవిత్తు’ (Absolute Existence & Knowledge)అని పేరు పెట్టారు. అట్టి సంవిత్తు తన యొక్క స్వప్రకాశ స్వభావం చేత సర్వే సర్వత్రా నిండియున్నది. దానికి అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. అదే మోక్ష స్థానమూ… బ్రహ్మమూ కూడా. ఆ సంవిత్తు ఒక చోట శుద్ధరూపంగా ఎరుగబడినప్పుడు ఆ స్థానమును ’పరమాత్మ’ అని అంటున్నాం. అది సర్వ పదార్థరూపమయినప్పటికీ… అశుద్ధ రూపకల్పనచే అదే ‘అవిద్య’గా అగుచున్నది. దృశ్యపరిమిత దృష్టి కలిగిఉన్నప్పుడు పరమాత్మయే జీవాత్మగా పిలువ బడుతోంది.
“లేక అది అవిద్యను గాంచుచున్నది!” అని కూడా అనవచ్చు… ఓ రామచంద్రా! ఏదైతే తెలుసుకొనుచున్నదో అదే తెలియబడవలసినది. ఈ అభిప్రాయాన్నే వేదాంత పరిభాషలో - జ్ఞానమే జ్ఞేయమై ఉన్నది …సంవిత్తే సంవేద్యము" - అని చెప్పబడుతోంది.
Page:625
నీవు ఆ పరమాత్మగా ఆరాధించు లక్ష్యార్థము ఏమై ఉన్నది?… నీ వాస్తవ శుద్ధరూపమే! అదియే సర్వదేహుల యొక్క శుద్ధ రూపము కూడా! అనగా… నీవే సర్వమై, శుద్ధమై, శాశ్వతమై, అఖండమై, అప్రమేయమై… స్వతఃగా పరమాత్మవే అయి ఉన్నావు.
“నేను దేహముచే, ప్రదేశముచే, కాలముచే బద్ధుడను“ అను భావన కలిగి ఉన్న సంవిత్తును “జీవుడు” అను పేరుతో పిలుస్తున్నాం. సంవిత్తు వాటికి అతీతమైన భావమును స్వీకరించియున్నప్పుడు, అట్టి సంవిత్తు యొక్క స్థితిని “శివము, మోక్షము” మొదలైన శాస్త్రీయ నామములతో చెప్పుకుంటున్నాం. జీవుడు వ్యక్తిగతమైన విశేషముల దృష్ట్యా చూస్తే, భ్రమయుతుడేగాని, “వాస్తవస్వరూపుడు” (నిజం) కాదు. ఈ జీవుని యొక్క శివస్వరూపం సర్వదా వాస్తవమై వెలుగొందుతోంది.
కనుక రామా! సంవిత్తు… సంవేద్యము; జ్ఞానము… జ్ఞేయము; తెలుసుకుంటున్నవాడు… తెలియబడుచున్నది - ఇవన్నీ ఒకే అర్థం కలిగియున్నాయి.
ఈ అన్ని ద్వంద్వములమధ్యా ద్వైత కల్పనయే లేదు. అజ్ఞానవశం చేతనే ఆత్మ తనను తాను జగద్రూపంగా సంచయమొనర్చుకొనుచున్నది. ఏది ఏమైనా కావచ్చు…. ఆత్మకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.
ఈ ముల్లోకములలో కనబడేదంతా సత్యమగు ఆత్మయే అయిఉన్నది. “ఈ జగత్తంతా ఆత్మయే”… అనే నిశ్చయం నీ యందు స్థిరపడిందా, ఇక నీకు పూర్ణ కామత్వము సిద్ధిస్తుంది. సర్వమూ ఆత్మగా దర్శించ బడుచున్నప్పుడు ఇక భావాభావములు ఎక్కడుంటాయి? బంధమోక్షముల ప్రసక్తి ఎక్కడ?… ఎవరికి?
శ్రీరాముడు : మరి శాస్త్రములు బంధమోక్షముల గురించి ప్రస్తావిస్తున్నాయి కదా….?
శ్రీవసిష్ఠ మహర్షి: ముముక్షు విజ్ఞానం విస్తారింపజేయటానికి మాత్రమే శాస్త్రములు ‘బంధమోక్షములు’ అనే కథనమును ప్రతిపాదిస్తున్నాయి. ఇంతకీ ఈ జీవులు ఆత్మ అను ఏ వేరైన దానికై వేచివుండాలో చెప్పు?… కనుక ఇప్పటికి లభించనిదేదో అప్పుడు లభించాలి - అను ఉద్వేగం అనుచితమే అవుతుంది. ఆత్మ లభించి ఉండనిదెప్పుడు? ఆత్మస్వరూపం కానిదేది.
‘చిత్తము’ అనబడేది ఆత్మకు అన్యంగా ఏదీ ఎక్కడా ఉండజాలదు. బ్రహ్మమే సర్వదా ఈ దృశ్యము రూపమున శోభిస్తోంది. ఈ జగత్తంతా చిదాకాశమే. బంధమోక్షముల ప్రేలాపన వ్యర్థమైనదే సుమా! మహత్తుకు కూడా మహత్తు అయినట్టి బ్రహ్మమే ’విశాలము… విస్తారము’ అయిన ఈ దృశ్యము రూపమున ఉన్నది.
అందుచేత ఓ ప్రియజనులారా! మీ రంతా ‘ద్వైతము’ అనే భావనను మీయందు రహితం చేయండి. యత్నశీలురై, అట్టి యత్నపూర్వక శ్రద్ధచే“ఆత్మ అనగా నేనే” అను ఎరుకను సుస్థిర పరచుకోండి. ఆత్మ స్వరూపులు కండి.
❖
Page:626
ఓ రామా! కట్టె, శిల, వస్త్రము, దేహము మొదలైన పదార్థాలన్నీ వాస్తవానికి ‘శక్తి’ యొక్క వివిధ తత్త్వములే కదా! "అధిష్ఠానమగు సన్మాత్ర దృష్టి”తో చక్కగా విచారిస్తే వాటియందు లేశమైన భేదం కనిపించదు. వాస్తవం ఇది అయి ఉండగా, ఇక నీవు దేని కొరకు సంకల్పోన్ముఖుడవు అవుచున్నావో చెప్పు? నీవు దేనిని ’వస్తువు’గా చూస్తున్నావో… అది తన యొక్క ఆద్యంతములందు నాశనము లేనిదే అయి ఉన్నది.
వస్తువు యొక్క వాస్తవ తత్త్వమునకు ఉత్పత్తి, వినాశనములు లేవు. వాటి ఆద్యంతముల స్వరూపం ఆత్మయే. కనుక నీవు నిశ్చింతగా ఆత్మమయుడవై ఉండుము.
స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తంతా పరబ్రహ్మరూపమగు చిదాకాశమే అయి ఉండగా ఇక ఇందు సుఖ దుఃఖములెచట? కాబట్టి రామా! నీవు సంతాపం పొందవలసిన పనిలేదు. ఒకే జలం చిత్ర విచిత్ర తరంగముల రూపమున స్ఫురిస్తోంది కదా! ఆత్మయే ఈ ద్వైతాద్వైతములుగా ఉత్పన్నమగుచూ సమూహంగా స్ఫురిస్తోంది. తత్త్వము తెలిసినవానిని ఈ విషయభోగములు ఏమాత్రం తాకనైనాలేవు. బంధించలేవు. పిల్లగాలులు పర్వతమును చలింపజేయగలవా? మహత్తరమగు ఆత్మను గురించిన విచారణ సల్పుచున్నట్టి జ్ఞానియొక్క మనస్సును ఈ తుచ్ఛప్రాపంచిక ఇంద్రియ వ్యవహారములు ఏమాత్రం భిన్నం చేయలేవు. అయితే, అల్పజలం గల తటాకంలో కొంగలు చేపలను పుటుక్కున మ్రింగివేస్తున్నట్లు, అల్పవిచారణతో కూడిన ఆశలతో నిండిన మనస్సు గల మూఢజీవుని దుఃఖములు వచ్చి నిరంతరం మ్రింగివేస్తున్నాయి.
అందుచేత రామా! “ఇదంతా ఆత్మయే! అవిద్య అనబడేదానికి స్వయం ప్రభావం (Independent Existence) లేదు” అను దృష్టిని అభ్యాసం చేయి. అప్పుడు పరిశుద్ధమగు పరమాత్మగా శేషిస్తావు. ఆత్మారాముడవై విరాజిల్లుతావు. వివిధ జలాశయములలోని తరంగములు, ఫేనము (నురుగు) బుద్భుదములు (బుడగలు) జలమునకు వేరు వేరు కానట్లే… వివిధ కల్పనలన్నిటిలో ఆత్మ కాక మరేదీ ఎక్కడా లేదు. సర్వ ప్రయత్నములచే, ఉత్తమోత్తమ విచారణ చేసి ఈ విషయం చక్కగా గ్రహించు. ఈ సర్వ ఉపాధులందు స్పురించుచున్న ‘నేను… నేను’ అను సంవిత్తుతో సహా… ఇక్కడా - - అక్కడా - ఎక్కడా అన్ని వేళలా ఆత్మయే ఉన్నది.
ఆత్మకు అన్యంగా “నేను” అనేది లేదు. కనుక… నేను ఆత్మనే.
ఈ మాత్రం గ్రహించటంలో కష్టమేమున్నది చెప్పు? “ఆ భగవంతునికి వేరుగా మరెక్కడో నేను ఉన్నాను” - అను భావన చేతనే సర్వ అనర్థములూ వచ్చి పడుతున్నాయి. “ఆత్మ తప్పితే మరింకెక్కడా ఏదీ ఉండదు”…అను దృఢనిశ్చయముచే సర్వ అనర్థములూ తొలగిపోతున్నాయి. అందుచేత… సమ్యక్ ఆత్మదర్శివి కమ్ము. అప్పుడు… మనస్సుకు తారసపడుచున్న సర్వబంధముల నుండీ విముక్తుడవౌతావు.
విముక్తుడవై ఇక ఆ తరువాత ముందులాగానే ఏది ఎట్లు ఉచితమో, విధి విధానమో అట్లే వ్యవహరిస్తూ ఉండు. ఇక నీచే చేయబడేదేదీ నిన్ను స్పృశించజాలదు. నీ మనస్సు హానివృద్ధులను
Page:627
అధిగమించగలదు. అట్టి నిత్య - సత్య - అఖండ - అప్రమేయ - సర్వగత ఆత్మ స్వరూపుడవై చెన్నొందుచున్నప్పుడు నీవు సర్వులకూ నమస్కారయోగ్యుడవౌతావు.
ఇట్టి అవగాహనాపూర్వకమైన అనుభవస్థితిని పెంపొందించుకొనుటయే ’జ్ఞానమార్గము’ అను పేరుతో శాస్త్రజ్ఞులు మనకు ప్రతిపాదిస్తున్నారు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీ యొక్క "సమ్యక్ జ్ఞానమార్గం” సుగమం కావటానికి ఉపకరించ గల ఒకానొక విచారణను అందిస్తాను. దీని సహాయంతో ఈ భోగములు ఎదురుగా ఉన్నప్పుడు కూడా వాటి కొరకై ప్రీతి గొనవలసిన అగత్యం లేనేలేదని శ్రోతలు గమనించగలరు.
ఎడ్లు బండిని లాగుతూ ఉంటాయి. అయితే ఆ బండిలోని పదార్థములను అనుభవించేది ఎడ్లా?… కాదు. ఆ బండి యజమాని కదా! అట్లాగే… ఈ నేత్రములు కేవలం రూపాన్ని చూస్తాయి. కానీ ఆ రూపము వలన కలిగే సుఖం, దుఃఖం, ఆశ్చర్యం మొదలైనవి అనుభవించేది నేత్రములు కావు. నేత్రములందు ప్రవేశించిన సంవిత్స్వరూపుడగు ఈ జీవుడే సర్వం అనుభవించువాడు సుమా!
ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను విచారించాలి. నేత్రేంద్రియములు రూపమునందు లగ్నమయినప్పుడు ఆత్మకు ఎందుకు క్షోభకలుగుతోంది? తన గాడిద గుంటలో పడినంత మాత్రాన చాకలి దిగులుగా చతికిలపడి కూర్చుంటాడా? బాటలోని బురద పాదాలకు అంటినప్పుడు “ఏమిరా దేముడా!” అనుకుని మనం ఊరుకుంటున్నామా? కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటున్నాం. నేత్రం ఒక ఉపకరణము. ఇక దృశ్యము అట్టి ఉపయోగములలోని ఒకానొక సందర్భము’. అందుచేత ఈ జీవులు నేత్రములు సదవగాహనతో, సరిఅయిన మార్గంలో నియమించి ఉపయోగించుకోవటమే వినియోగం. అదియే ‘యోగం’. అందుచేత ఈ నేత్రాది ఇంద్రియములను సరి అయిన సమాచారం జోడించి ఆపై ఆయా క్రమములందు ఉపయోగించడం అత్యవసరం. అట్టి సంబోధనను జ్ఞానులు ఎట్లు ఆశ్రయిస్తున్నారో చెపుతాను…. విను.
88
ఓ నా నేత్రములారా! మీరు ‘ఎంత బాగు!’ అని అనుకుంటూ ఈ మొదలైన ఆయా అందంగా కనిపించే విషయాలలో బురదలో చిక్కుకున్నట్లు చిక్కుకోకండి. ఎందుకంటారా? ఏవేవి ‘అందంగా కనిపిస్తున్నాయి’ అని భావించి, శ్రమించి మీరు బయలుదేరుతున్నారో… అవన్నీ కూడా కొద్ది క్షణాలలో తీవ్రమైన మార్పులు చెందబోతున్నాయి. పైగా మిమ్ములనే నశింపజేస్తున్నాయి.
అంతఃస్థితమైయున్న చిదాత్మయే బయట కూడా ఆయా సర్వ పదార్థములందూ ప్రకాశించు చున్నది. అంతఃస్థితమై యుండే “అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ –
Page:628
ఆనందమయములు” అనబడే పంచకోశములు ఆత్మయొక్క ప్రకాశముచే స్థితి పొంది ఉంటున్నాయి.
అందుచేత అవి “ఆత్మకు అభిన్నములు” అయి, అనుగమించబడుచున్నాయి. తీక్ష బుద్ధిగల ప్రాజ్ఞుడు తన కార్యక్రమములలో అధిక భాగం ఆత్మ సంబంధములగు కార్యక్రమములలో ఇంద్రియ, మనస్సులను నియమించి ఉంచుతాడు. ఇక యథాప్రాప్తములైన పదార్థానుభవమునకు సంబంధించిన క్రియలయందు “ఉదాసీనత్వము” వహించి నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతేగాని, మూఢుని వలె ఈ రూప నామముల బురదలో తాదత్మ్యం పొందడు. ఈ దృశ్య పదార్థములన్నీ ఉత్పత్తి, వినాశనం కలిగి ఉన్నవేకదా! పైగా, ఇవన్నీ కూడా అవిచారణ చేతనే పైకి రమణీయంగా కనబడి ఆకర్షిస్తున్నాయి. మిథ్యయగు రూపములను ఆశ్రయించి మృత్యుముఖంలో ప్రవేశించవలసిన అగత్యం ఏమిపట్టింది?
ఓ ఇంద్రియములారా! ఆ పరమాత్మ సర్వ పదార్థములనూ ప్రకాశింపజేయుట యందు అతి సమర్థుడై ఉంటున్నాడు. అయినా కూడా, ఈ రూపాది విషయములందు ఉదాసీనుడై సాక్షి స్వరూపుడై ఉంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ దృశ్యముపట్ల సాక్షివలె ఉండండి. సదసద్రూపమగు ఆత్మనే వీక్షిస్తూ ఉండండి. అంతేగాని ఆత్మకు వేరైనట్లు భావనచేసి నిరుపయోగమైన సంతాపమంతా పోగుచేసుకోండి. ఇక్కడ తారసపడుచున్న “భార్య, భర్త, కుమారులు, మిత్రులు, అమిత్రులు, ఐనవారు, కానివారు” - మొదలైనవారంతా ‘ఇదంతా ఆత్మయే’ అను దృష్టిని దృఢంగా కలిగి ఉండండి. ఆపై ఇక ఏమి చూడాలనుకుంటే అది చూడండి. భ్రమమాత్రం పొందకండి.
నేత్రాదులు సేకరించే దృశ్యము గ్రహిస్తున్న ఓ చిత్తమా! నదీజలంలోని తరంగము యొక్క ఆకారం ఎంత అనిత్యం? ఈ "జాతి - వస్తు - ప్రదేశ - సందర్భముల”… సంబంధాలన్నీ అంతే అనిత్యం. ఆకాశంలో కనిపించే మేఘము యొక్క ఆకారం లాగా మిథ్యయే అయినట్టి ఈ వస్తు సముదాయముల ఆగమన, నిష్క్రమణములలో లాభాలాభములేమి ఉంటాయి? కనుక నీవు ప్రశాంతంగా శమించి ఉండు.
అద్దంలో ప్రతిబింబంలాగా, ప్రళయకాలజలంలో నశించబోయే చేపలాగా చిత్తమునందు ఈ జగత్తు స్ఫురిస్తోంది. మధ్యలో భ్రమలాగా ఏర్పడి, భావోద్వేగాలను ఉత్పత్తి చేస్తోంది.
ఈ పదార్థములన్నీ సూర్య ప్రకాశం ఆశ్రయించుటచేతనూ, పదార్థములను ఆశ్రయించుట చేత సూర్యప్రకాశమూ వ్యక్తమగుచున్నాయి. ఈ విధంగా ఆధార ఆధేయములు జడమై స్ఫురిస్తున్నాయి. ఇక అట్టి సమావేశము చూచి జీవుడు “అంత అందంగా ఉన్నది!” అని అనుకుంటూ భ్రాంతికి లోనై నిష్కారణంగా కామాదులు ఎందుకు పొందాలి? ఈ జీవునకు వాస్తవానికి ఏ పదార్థంతోనూ ఎట్టి సంబంధం లేనే లేదు. ఇక వ్యధ దేనికి?
Page:629
జ్ఞానముచే అజ్ఞానము తొలగినప్పుడు ఆ మూడు వేరువేరుగానే కనిపిస్తాయి. అప్పుడా మూడూ శుద్ధ స్వరూపంగా, అధిష్టానమాత్రం (Made up of Absolute Self)గా శేషిస్తాయి. కొయ్య, లక్క కలిసి ఉన్నప్పటికీ వాటికి ఒక దానితో మరొకదానికి సారూప్యత ఏకత్వం ఉండదు కదా! “రూపము - ప్రకాశము - సంకల్పము” - ఈ మూడూ కూడా మనస్సు యొక్క ఉనికి చేత, చర్య చేత ఒకచోటికి వచ్చి ఒనగూడుచున్నాయి. అజ్ఞానము సంక్షయించుటచే మనస్సు లయించిందనుకో… అప్పుడు ఆ మూడూ కలియజాలవు.
శరీరంలో కళ్లు, చెవులు, ముక్కు నోరు, చర్మము, కాళ్ళు, చేతులు వివిధ ధర్మములను నెరవేరుస్తున్నాయి కదా! అయితే మనస్సే ఇన్ని ఇంద్రియములను ఆయాధర్మములకై ప్రేరేపిస్తోంది. అట్టి మనస్సు ఇంద్రియ ధర్మములవైపుకే ప్రీతిరూపంగా ప్రసరిస్తోందిగాని, ఆత్మను ఎరుగుటలేదు. ఇంటికి అసౌకర్యం కలుగజేసే వస్తువును ఇంటిలోంచి తీసివేస్తాము చూచావా? పిశాచమువలె అల్ప, స్వల్పకాలిక వస్తువులవైపుగా ప్రసరిస్తున్న ఈ మనస్సును సర్వప్రయత్నములచే తన దుష్ట మార్గము నుండి విరమించేటట్లు చేయాలి.
ఓ మనస్సా! నీవు మిథ్యారూపంగానే విజృంభిస్తున్నావు! కానీ “ఆత్మ ఇంద్రియవిషయములను మననము చేయుట”యే నీ యొక్క స్వరూపమని నాకు తెలిసిపోయింది. అనగా, నేను మననము చేయుచుండటమే నీ స్వరూపమూ, ఉనికి కూడా! ఇప్పుడిప్పుడే నీ ఆనుపానులు తెలిసిపోతున్నాయి. ఆద్యంతమూ నీవు అసద్రూపమే కనుక నీవు భూత - వర్తమానములందు కూడా మృత ప్రాయుడవే. పంచేంద్రియముల ద్వారా శబ్ద -స్పర్శ - రూప - రస - గంధాలు ఏర్పడుచుండగా, నాకు వాటికి మధ్య నీవు ఎక్కడినుంచి వచ్చావు? ఈ జీవుడు నిన్ను తనవానిగా, తనంతటివానిగా ఎంచుటచేతనే అతని ఉపకరణార్థం నీవు బయల్వెడలుచున్నావు. అంతేగాని, వాస్తవానికి సర్వదా అసంగమగు చైతన్యమునకు నీవు సంబంధించిన దానవు ఏమాత్రం కానేకావు.
ఓ మనస్సా! నీయొక్క విజృంభణం నాకు కొంచంకూడా సంతోషం చేకూర్చటం లేదు. ఒక ఐంద్రజాలకుని మాయచే ప్రేరితమైన దానివలే నీవు క్షణకాలంలో ఉద్భవించి వివిధములైన విషయాకృతులను అవధరిస్తున్నావు. వ్యర్థంగా ఎక్కడెక్కడో తగుల్కొనుచున్నావు ఎందుకు?…
సరే! ఇంతవరకు ఏదైనా జరిగి ఉండనీ. ఇకపై ఏం చేయాలి అనే విషయానికివద్దాం. ఇక నీవు ఉంటే ఉండు. లేదా, తొలగిపో. నాకు మాత్రం నీతో ఏమీ సంబంధంలేదు. మిథ్యారూపుడవగుటచే నీవు ఎప్పుడూ గతించినదానివే అవుతావు. విచారణ దృష్టితో చూస్తే నీకు ఉనికియే లేదు.
ఓ మనస్సా! నిత్యమృతుడా! నీవు తత్త్వరహితుడవు. జడుడవు. భ్రాంతి మయుడవు. శరుడవు అజ్ఞానసహితుడవు. అజ్ఞానికి మాత్రమే నీవు దుఃఖం కలిగించగలవు. విచారవంతుని నీవు ఏమీ చేయలేవు. అజ్ఞానకారణం చేతనే ఇంతకాలం ‘ఈ మనస్సును తొలగించేది ఎట్లా?’…అని నేను మథనపడ్డాను. ఇప్పుడో… నేను ఆత్మను దర్శించాను. ఆత్మకు వేరైనదేదీ ఎక్కడా ఉండజాలదు. కనుక నీవు లేవు.
Page:630
మసక చీకట్లో కనబడిన ఏవేవో ఆకృతులన్నీ దీపం వెలగగానే మటుమాయ మౌతాయి చూచావా? జ్ఞానదీపం మాయందు వెలగనంత కాలం రాగ ద్వేష-మోహ-క్రోధ-మద మాత్సర్యాదుల క్రీనీడలతో భ్రమింపజేశావు. నిన్ను చాలాకాలం నిరోధించలేకపోయాను. మా దేహములలోనే ఉన్న ఆత్మవస్తువును ఎంతో కాలం కనుమరుగు చేశావు.
ఇక చాలించు నీ నాటకం. అజ్ఞాన పిశాచం తొలగగా ఈ దేహం శమ, దమాది ఉత్తమ గుణములకు ఆలవాలమై సజ్జనుల సద్వచనములు వినుటకు అర్హమగుచున్నది. ఎంత సంతోషించ వలసిన విషయం!
ఓ ‘మనస్సు’ అనే బేతాళమా! నీవు ఇతఃపూర్వమూ లేవు. ఇప్పుడూ ఉండజాలవు. ఇకముందూ ఏర్పడజాలవు. ‘అసత్’ స్వరూపమగు నీవు ఇంకా సిగ్గు పడక …నవ్వుచున్నావా? నా ఈ గృహ దేహం నుండి “తృష్ణ-క్రోధము-మోహము” మొదలైన నీ పరివారాన్ని తీసుకొని ఇక బయలుదేరు.
అమ్మయ్యా! ‘వివేకము’ అనే మంత్రమును ఆశ్రయించుటచే ‘మనస్సు’ అనే బేతాళుడు బయటకు పంపబడ్డాడు. గుహలోంచి తోడేలును వెడలగొట్టినపుడు ఆ గుహ ఎంత ప్రశాంతంగా ఉంటుంది! మనస్సు సంయమిస్తే అంతటి ప్రశాంతత లభిస్తుంది. ఏ ప్రాణికైతే "నేను ఈ దేహమాత్ర స్వరూపుడను” …అనే బుద్ధి ఉంటుందో, ఆ ప్రాణిని ‘క్షణభంగురము, జడము, శఠరూపము’ అయినట్టి ఈ మనస్సు తన వశం చేసుకోగలుగుతోంది. ఆతనిని బంధించి తన ఇష్టం వచ్చినట్లు ఆట ఆడిస్తోంది. అయితే ఆ ప్రతాపము, ఆ ఆశ్రయశక్తి మనస్సుది కాదు. అదంతా అజ్ఞానము యొక్క ప్రతాపం మాత్రమే. “ఈ శరీరమునకు పరము, అద్వితీయము అగు ఆత్మశక్తినే నేను” అను ఎరుక గలవాని ముందు ఈ మనస్సు ఒక ఉపకరణం మాత్రంగా ఉండి పోతుంది. అట్టి వానిని అది బాధించజాలదు. ఆత్మసందర్శిని ఈ జగత్తు యొక్క ఉనికి లేములు తన సర్వ సమ స్వరూపం నుండి విఘ్నము కలిగించ లేవు. దీనమగు చిత్తము పూర్ణమగు ఆత్మను వశం చేసుకోవటమేమిటి?
కనుక నేను చిత్తము (మనస్సు)ను అంగీకరించనక్కర్లేదు… తిరస్కరించనక్కర్లేదు. ఆత్మ సందర్శన ప్రభావం చేత అది మృతప్రాయమై నా పూర్ణ స్వభావము నందు ఒక మూల ఒదిగి ఉండు గాక.
“మనస్సు కలదు… నేను దానిని తొలగించుకోవాలి“ అనే దుర్వ్యసనం, భ్రమ, ప్రయాస… అన్నీకూడా ”స్వయం స్వరూపమగు ఆత్మ ఒక్కటే ఉన్నది" అను అవగాహన సహాయంతో తొలగిపోతున్నాయి. ఇప్పుడు దయ్యం వదలినవానివలె వ్యర్థత్వమంతా వదలి జీవన్ముక్తుడవై ఆత్మయందు ఆత్మచే ప్రశాంతుడనగుచున్నాను.
చిత్తముతో కూడి ఇంతకాలం నేను ప్రదర్శించిన హావభావములు చూచి ఇప్పుడు నవ్వువస్తోంది. నైర్మల్యం తొలగుటచే పరిశుద్ధుడను, సుఖుడను అగుచున్నాను. ‘విచారణ’ అనే మంత్రస్తవంచే చింతలన్నీ ఉడిగి, విషయవైషమ్యాలు తొలగి శాంతుడనైనాను. అహంకార దుష్టరాక్షసుడు మరణించాడు.
Page:631
అయినా… నాకు మనస్సు ఏమిటి? ఆశ ఏమిటి? తుచ్ఛమైన అహంకార మేమిటి? ఈ పుత్రాదులు నావా? …కావు. కానప్పుడు వాటి కొరకై నేను రోదించటమేమిటి? నాకు మనస్సు అక్కర్లేదు… ఆశ అక్కర్లేదు. నేను సర్వదా అద్వితీయుడను… కృతార్థుడను, చిత్స్వరూపుడను, నిర్మలుడను, నిర్వికల్పుడను, నిత్యుడను. అట్టి నా ఆత్మకు నేనే పలుమార్లు జేజేలు పలుకుతూ నుతిస్తున్నాను… నమస్కరిస్తున్నాను.
నాయందు శోకముగాని, మోహముగాని లేవు. అహంకారము, అభిమానము మొదలైనవి ఉండవు. అవన్నీ నాకు బాల్య చాపల్యము వంటివి. సర్వమునకు సర్వదా నేను సాక్షిని. నా సాక్షి స్వరూపమునందు ఆశ, కర్మ, సంసారము, కర్తృత్వము, భోక్తృత్వము, దేహములు - మొదలైనవి ఏర్పడజాలవు. సాక్షియగు నన్ను చేరగలిగినది, నాతో సమానమైనది ఏదీ లేదు. ‘నేను’ అను కల్పనకు ముందే ఉన్నదేదో అదే నా వాస్తవరూపం.
నేను ‘ఆత్మ’ అనే శబ్దమునకు వాచ్యుడను కాదు. ఏ శబ్దమునకూ నన్ను సంపూర్ణముగా ప్రవచించగల, ప్రకటించగల, నిర్వచించగల సామర్థ్యం లేదు.
అయితే ‘అహం’ అను ప్రత్యయమునకు అన్యమైనదంటూ ఏదీ లేకపోవటం చేత… అంతయూ నేనే. సర్వలోకములకూ ఆదికారణం, ఈ లోకములను వహించేది, ఈ లోకములు స్వరూపంగా కలిగి ఉన్నది, అంతరమున ఈ లోకములేవీ లేనివాడను నేను. అందుచేత ‘ఇది తొలగాలి… ఇది ఉండాలి’ అనేదేదీ నాకు ఆపాదించబడజాలదు. ఏ దేశ-కాల వస్తువులూ నన్ను పరిచ్ఛిన్నం చేయజాలవు.
నిర్వికారాయ నిత్యాయ నిరంశాయ మహాత్మనే |
సర్వస్మై సర్వకాలాయ మహ్యమేవ నమోనమః ॥ (శ్లో 45, సర్గ 80)
నిర్వికారమై, నిత్యమై, అంశరహితమై, సర్వరూపమై, సర్వకాలస్వరూపమై, రూపరహితమై, నామవర్జితమై, ప్రకాశస్వరూపమై, మహత్తరమై, ఏకమైనట్టి పరమాత్మను నేను.
సమరూపమై, సర్వవ్యాపకమై, సూక్ష్మమై, ఏకమై ఈ జగత్తు నంతటినీ ప్రకాశింపజేయుచున్నట్టి ఓ నా చైతన్య సాక్షి పరతత్వమా! నీవూ నేనూ ఒక్కటే కదా! మరి నీకు నేను నమస్కరించటమెట్లా? నేల, పర్వతము, నది మొదలైన వాటితో కూడిన ఈ పదార్థ సంచయజగత్తు గాని; కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైన అమరికతో కూడిన ఈ దేహం గాని నేను కాదు. ఇవి ఉన్నా లేకున్నా ఫరవాలేదు.
ఇవి నాకు సంబంధించినవి కావు. నేను వీటికి సంబంధించను. లేదా… స్వయంప్రకటనచే అవన్నీ నేనే. ఉన్న చోట ఉంటూనే అంతటా ఉన్నాను. మనోవికల్పరహితుడను… సమత్వముచే శోభించువాడను. విశ్వమును లీలామాత్రంగా ప్రకటించువాడను. జగద్రహితుడను… శరీరములు లేనివాడను. జరాజన్మ రహితుడను. అచ్యుతుడను… చిత్స్వరూపుడను. గుణాతీతుడను…. ఈశ్వరుడను. నమస్కరించువాడిని, ఆ నమస్కారం స్వీకరించువాడను…నేనే!
Page:632
శ్రీవసిష్ఠ మహర్షి : హే మహాబాహో! రామచంద్రా! తత్వవేత్తయొక్క నిశ్చయం ఎట్లా ఉంటుందో మనం ఇంతవరకు చెప్పుకున్నాం.
ఎప్పుడైతే జీవుడు “ఈ ప్రపంచమంతా ఆత్మయే. ఆత్మకు ద్వితీయంగా దృశ్యంలేదు” అనే నిశ్చయం సంపాదిస్తాడో … అప్పుడు ఆతనిని శాస్త్రజ్ఞులు ‘తత్త్వవేత్త’, ’అద్వితీయుడు’ అని పిలుస్తున్నారు. అట్టివానికి తన చిత్తము కూడా ఈ దృశ్యములో అంతర్భూతమై తదితర దృశ్యముల లాగానే మిథ్యగా ఎరుగబడుచున్నది. ఆతనికిక దృశ్యంలో ఉద్భవం సంభవించదు.
ఈ జగత్తంతా అవిద్యయొక్క (లేక) మాయ యొక్క కార్యమే. అన్య చిత్తదృష్టిచే ఇది లేనిదే అవుతుంది. ఎవరికి వారికే వారివారి చిత్తమును అనుసరించి ఈ జగత్తు పరిపరివిధములుగా తోచుచున్నది. ‘ఆకాశవృక్షం’ అనే ప్రతీతి నీవు విన్నావుకదా! ఆకాశంలో వృక్షం ఎలా ఉంటుంది! ఈ జగదనుభవం కూడా అట్టిదే. వాస్తవానికి ఇదంతా శుద్ధ చిన్మాత్ర స్వరూపమే.
నౌకలో ఉన్న బాలునికి ఒడ్డున ఉన్న వృక్షాలు కదులుతున్నట్లు అనిపిస్తాయి. అవి నిజంగా వర్తులాకారంగా కదులుచున్నాయా?
కదులుచున్న యంత్రం (Giant Wheel)పై కూర్చున్నవానికి ఎదురుగా ఉన్నకొండ గిఱ్ఱున తిరుగుచున్నట్లు అనిపిస్తుంది. క్రింద నిలబడ్డవానికో… ఆ కొండ స్థిరంగానే కనబడుతోంది కదా!
అజ్ఞానికి ఈ చిత్తము వాస్తవమైనదానివలె అనిపిస్తోంది. ఈ బాహ్యాభ్యంతర పదార్థములన్నీ చిత్తము నుండే అసద్రూపంగా ఆవిర్భవిస్తున్నాయి. అందుచేత తత్వవేత్త వాటిని అతిసహజంగా మొదలంట త్యజించి ఉంటాడు. సంశయరహితుడై సంతాపవర్జితుడై తనకు రావలసినది, పోవలసినది ఏదీ లేనివాడై ఉంటాడు. ఈషణారహితుడై స్వానుభవముచే తన పారమార్థిక స్వరూపమునందు శుద్ధ చైతన్య చక్రవర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు.
ఈ ఎదురుగా కనులకు కనబడే దృశ్యమును అభావించినప్పుడు నేత్రముల కార్యక్రమం అజ్ఞానరహితమై, అప్పుడు తృష్ణాచాపల్యం కూడా నశించగలదు. మోహపంజరం విచ్ఛిన్నం కాగా, నిరహంకారం రూపుదిద్దుకొని దృశ్యాసక్తి తొలగుతుంది. అప్పుడిక కర్మలెవరికి? ఆ కర్మల ఫలితములు ఎవరికి సంబంధించినవి? సంచిత ప్రారబ్ధ-ఆగామి కర్మల స్వభావంతోసహా చిత్తము ఉపశమించ గలదు. అజ్ఞాన నిద్ర పటాపంచలౌతుంది. అప్పుడీ జీవుడు ప్రబుద్ధుడు కాగలడు.
ఈ జగత్తంతా కూడా ‘శాంతము, ఏకము’ అగు బ్రహ్మమే. ఇక్కడ అనేకత్వముగాని, ఆత్మ కంటే భిన్నమైనదిగాని సంభవించజాలదు. ఇక తత్త్వవేత్తకు అంతఃకరణంలో విచారించటానికి ఏముంటుంది? ఆతనికి ఎక్కడ చూచినా ఆత్మయే అనుభవవిశేషమగుచున్నది. ఆతనికి అసత్ విషయమైన దేనితోనూ పనే ఉండదు. ఈ జీవదశలన్నీ అతనికి అసంగతమే అవుతాయి.
Page:633
"ఆద్యంతరహితమగు పరమపదమును నేను” అను అనుభవముతో సౌమ్యుడై, సూక్ష్ముడై సర్వవ్యాపకుడై ఆత్మనే ఆస్వాదిస్తూ ఉంటాడు. చిత్తము ఉన్నా లేకున్నా చిత్తముచే తారసపడే సర్వ విషయములకు అతీతుడై, విరక్తుడై ఉంటాడు. ఆతనియందు ఆత్మ యొక్క సర్వసమౌన్నత్యము సర్వదా ఉదయించియే ఉంటుంది. పరిచ్ఛిన్నత్వమును గడచిన కలవలె త్యజించి అపరిచ్ఛిన్నుడై ఉంటాడు. అవిచారణా సమయంలో అడ్డుగోడవలె ఏర్పడియున్న ఇతఃపూర్వపు అహంకారం ఇప్పుడు ఏమైపోయిందో కూడా ఆతనికి తెలియదు. దీపం వెలిగించగానే చీకటి, ఆ చీకటిలో స్ఫురించే క్రీనీడాకారాలూ ఎటు పోతాయో ఎవరు చెప్పగలరు?
చిత్తము నశించిన తరువాత ఇక ‘విచారణ చేస్తున్నవాడు ఉన్నవాడా? ఉండనివాడా?’ అను మీమాంస అంతా అనవసరమగుచున్నది. అట్టి వికల్పము ఆశ్రయించవలసిన ఆగత్యం ఆతనికుండదు. అట్టి తర్జన భర్జనతో మనస్సును పునరుజ్జీవింపజేయవలసిన ఆవశ్యకత ఆతనికేముంటుంది? అందుచేత అంతఃకరణమునుండి సంకల్పములన్నీ పారత్రోలి, ‘ఓం’ కారమునకు లక్ష్యమైయున్న తురీయావస్థయందు సంస్థితుడై ఉంటున్నాడు.
వింటున్నావా, రామా! జ్ఞాని ఇట్టి విచారణచే ఉత్తమౌన్నత్యమును అవధరిస్తున్నాడు. అశ్నన్గచ్ఛన్స్వపం స్తిష్ఠన్నితి రాఘవ చేతసా |
సర్వత్ర ప్రజ్ఞయా తజ్ఞః ప్రత్యహం ప్రవిచారయేత్ ॥ (శ్లో 17, సర్గ 81)
కాబట్టి నీవు నడుచుచున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ‘ఆత్మ ప్రజ్ఞ’తో కూడి ఉండుము. స్వచిత్తముతో ప్రతిరోజూ ఆత్మ విచారణ కావిస్తూ ఉండు. సాధు చిత్తులగు ఎందరో మహనీయులు ఒక వైపు తమతమ వర్ణాశ్రమ ధర్మములను నిర్వర్తిస్తూ… వేటి చేతా స్పృశించబడక, తమ ఆత్మప్రజ్ఞను కాపాడుకుంటూనే వర్తిస్తున్నారు.
మాన మదరహితులై శరత్కాలంలోని పూర్ణచంద్రునిలాగా ప్రసన్నతతో వెలుగొందుచున్నారు. ప్రవాహపతితములైనట్టి తమకు నియమించిన కార్యముల మధ్య నీటిలోని తామరాకు వలె వ్యవహరిస్తున్నారు. మహా ధీమంతులై, మహా వివేకులై ఈ ప్రపంచమున వెలయుచున్నారు. వారే నీకు సోదాహరణులగు గాక!
‘వివేకదృష్టి’ అను పేరుగల ఈ విభాగంలోని విశేషమంతా ఒకప్పుడు వింధ్య పర్వతంపై బృహస్పతి సోదరుడగు సంవర్తుడు చేసియున్న సంవాదముయొక్క సారాంశమై ఉన్నది. ఆతనిలాగానే విచారణతో కూడిన బుద్ధితో ఆత్మదృష్టిని అవలంబించు. ఆతనిలాగానే ఉత్తరోత్తర భూమికాక్రమంచేత ఈ సంసార సాగరమును అవశ్యం దాటగలుగుతావు.