Page:634
XI. వీతహవ్యుడు - అంతర్మథన యోగము
-
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసారమును యుక్తియుక్తంగా అధిగమించివేసిన మహనీయు లెందరో ఈ భూమిపై ఉన్నారు. ‘వీతహవ్యుడు’ అనే ఒక ముని తీవ్రమైన విశ్లేషణ విచారణల ద్వారా ఆత్మ పదమునందు దృఢమైన ఆరూఢత సంపాదించారు. ఆయనకూడా ఇంద్రియ ప్రబోధ రూపంగా ఉత్తమ సమాలోచన నాశ్రయించి ఆత్మోన్నతి పొందియున్నారు. నీ యొక్క ఉత్తమ దృష్టి సముపార్జన కొరకై ఆయన సంబోధన, సమాలోచన వివరిస్తాను. అధ్యాత్మ వాఙ్మయంలో ఇది మహత్తరమైనదిగా శ్లాఘించబడుతూ ఉంటుంది.
వీతహవ్యుడు ఒకప్పుడు అనేకమంది మునులుండే ఒక ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఎంతో సాధన చేశాడు. అట్లా కొంతకాలమైన తరువాత సమాధిని సముపార్జించాలని అక్కడినుండి బయలుదేరాడు. చాలాకాలం సరైన ఏకాంత ప్రశాంత ప్రదేశం కొరకై అడవులలోనూ, కొండలలోనూ సంచరించాడు. ఎంతగానో వెతకి వెతకి సొలసి, విరక్తుడయ్యాడు. కాలక్రమంగా అతనిలో వివేకముతో కూడిన పరిజ్ఞానం రూపుదిద్దుకొన్నది.
అరెరే! శారీరక, మానసిక వ్యధాపూర్వకమైన ఈ సంసారము ఎంత భ్రమదాయకమైనది! ఇందులోని ఆయా క్రియా కార్యక్రమాలన్నీ చివరకు ‘భయం’ అనే ఒడ్డుకు చేరుస్తున్నాయే!”
అని తలచి చకితుడైనాడు. “ఇక నేను అసారమగు ఈ సంచార వ్యాసంగం త్యజిస్తాను. ఏదో ఒకచోట ఆసీనుణె స్వకీయమైన విచారణ ప్రారంభిస్తాను" అని తలచాడు ఆ మునీంద్రుడు. తిరిగి పూర్వ ప్రాంతంలో గల తన పర్ణశాల జేరాడు. కాస్త సేద తీర్చుకున్న తరువాత ఆ పర్ణశాలలోనే ఒకచోట శుద్ధమగు మృగ చర్మమును పరచాడు. పద్మాసనం వేసుకున్నాడు. పాదములపై వ్రేళ్ళుంచి స్థిరాసనం స్వీకరించాడు. ఇంద్రియములలోకి మరల మరల ప్రవేశిస్తున్న మనస్సును మెల్లమెల్లగా వెనుకకు మరలుస్తూ ఉపాయములచే నిరోధించి, క్రమంగా మనస్సును ఇట్లు సంబోధించారు.
ఓ మనస్సా! నీవు ఎంత చంచలమైనదానివి! ఎంత నిగ్రహించినా కూడా… మహత్తరంగాలచే కొట్టుకుపోబడుచున్న ఆకులాగా క్షణంలో అస్థిరత్వం పొందుచున్నావే!
ఈ నా నేత్రములు మొదలైన ఇంద్రియములు బహు భ్రమణయుక్తమై ఎన్నెన్నో విషయాలవైపు మరలుచున్నాయే? వాటివెంట ఈ మనస్సు, బుద్ది కూడా ‘తగుదునమ్మా’ అని బయలుదేరుతున్నాయి. కాలితో తన్నబడుచున్న బంతిలాగా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఈ మనస్సు ఇంద్రియముల
Page:635
నుండి బలం పుంజుకుంటోంది. ఇంద్రియములో?… మనస్సు నుండి బలం పుంజుకుంటున్నాయి. మనస్సు కొన్ని వృత్తులను ఆశ్రయిస్తోంది. ఇంతలోనే ఆ వృత్తులను త్యజించి, మరల నూతన వృత్తులలో ప్రవేశిస్తోంది. నేను దేనిని నిగ్రహించాలని అనుకుంటానో, దాని వైపుకే పరుగులు తీస్తోంది. చెట్ల కొమ్మలపై గంతులు వేసే కోతిలాగా అనేక పదార్థముల పరంపరను ఆశ్రయిస్తోంది. ఈ మనస్సును నియమించాలంటే ముందుగా దీనిని ఇంద్రియములనుండి వెనుకకు మరల్చాలి. ఎట్లా?
ఓ ఇంద్రియములారా! సముద్ర తరంగములవలె అతి చంచలముగా ప్రవర్తిస్తున్నారు కదా! ఆత్మ దర్శనము చేయటానికి మీకు ఇంకా సమయం కుదురుట లేదా? ఆశలతో, అల్ప ఆశయాలతో ఇంకా ఎంతకాలం సంచరిస్తారు? అనర్థదాయకమైన మీ చపలత్వం కొంచెంసేపు ఆపండి! ఒక్కసారి నేను చెప్పేది వినండి! మీరు చేస్తున్న కర్మలను, వాటి పర్యవసానమును కొద్దిసేపు పరిశీలించండి. మీరంతా మనస్సుకు ద్వారములు వంటి వారే కదా! కనుక, మీరు జడరూపము మాత్రమే. జడ స్వరూపులై, జడమాత్రమగు దృశ్యమును ఆశ్రయిస్తున్నారు. జలతరంగాలలో జలం పోస్తున్నట్లు మీరు నాచే దృశ్యముపై ప్రసరింపజేయబడుచున్నారు. మృగతృష్ణలో జలం కోసం వెతికే మృగాల వలె, మీరు దృశ్యము వైపు విజృంభిస్తున్నారు. జ్ఞానరహితులై, దుర్వినయులై కుమార్గము లందు ప్రవృత్తులవుచున్నారు. గుడ్డివాడు ముళ్ళపొదలవైపు వెళ్ళుచున్నట్లు, మీరు నన్ను పతనము వైపుకు నడిపించుచున్నారు.
ఏమి మీ చమత్కారం! చిదాత్మస్వరూపుడనగు నేను సాక్షీమాత్రుడనై సమస్తమును నెఱవేర్చుచున్నాను కదా! మధ్యలో మీరెందుకు వ్యర్థంగా భ్రమింపజేస్తున్నారు?
రజ్జు, సర్పభ్రాంతిలాగా (త్రాడును చూచి పాము అనుకొనునట్లుగా) అసద్రూపములగు ఈ ఇంద్రియములు విజృంభిస్తున్నాయి. “ఇవి నా నేత్రములు" అని ఎఱుగుచున్నది ఎవరు? నేను కదా! సర్వప్రకాశకుడు, సర్వసాక్షియగు ఆత్మయే నేను. నాచే ఎఱుగబడుచున్నదానితో నాకేమి సంబంధం? …కనుక, మీరున్నప్పుడు, లేనప్పుడు నేనున్నాను. మీరు ఏర్పడనప్పుడు, నిర్వికారుడనై, నిర్విషయుడనై, పరమాత్మస్వరూపుడనై, నేనుండియున్నాను. మీరు ఏర్పడినంతమాత్రంచేత, లేక, శిథిలమైనంతమాత్రంచేత నాయొక్క ‘ఉనికి’ కుంటుబడుతుందా? అసాధ్యం!
సూర్యుడు ఆకాశంలో నిజేచ్ఛచే ఉదయించి ప్రకాశిస్తూ ఉంటే, జనులు తమతమ దైనందిన కార్యక్రమములు నిర్వర్తించుకుంటుంటారు. ఆ కార్యక్రమములతో సూర్యునకు ఏమి సంబంధం ఉంటుంది? అట్లాగే, నా చైతన్య సత్తయొక్క ఉదయముచే మీరు, మీమీ చేష్టలు నిర్వర్తిస్తున్నారు. మీ చేష్టలతో నాకేమి సంబంధం? వాటి పట్ల ఇష్టముగాని, అయిష్టముగాని ఎట్లా ఏర్పడగలవు? చైతన్య స్వరూపుడనైన నేను మీ చర్యలకు దుఃఖించటమేమిటి? సుఖించటమేమిటి?
ఓ చిత్తమా! నీవు ఇంద్రియములను మోసగించి దుఃఖభాజకములగు విషయములలో ప్రవేశింపజేస్తున్నావు. అయితే చమత్కారం చూచావా? ఆ ఇంద్రియ విషయములచే నిజానికి నీవే మోసగించబడుచున్నావు సుమా! ‘దేహాభిమానము’ అనే జాడ్యమును నీయందు కలిగియుండి….
Page:636
తత్ప్రభావంచేత ఈ జగత్తులో ఇక్కడా, అక్కడా సంచరిస్తూ, అనర్థములన్నీ మూటగట్టుకుంటున్నావు. కుక్కలాగా నీచపదార్థముల వైపు మూతి సారిస్తున్నావు. భిక్షకుడులాగా క్షణక్షణం ఏదో ఒకటి అర్థిస్తూనే ఉన్నావు.
“నేను చేతనుడను… నేను జీవించువాడను… నేను ప్రత్యేకమైన వాడను… అను రూపంలో ఉంటున్న నీయందలి వాసన అత్యంత అసత్యమైనది. అట్టి భావన మిధ్యారూపమున ఉదయించి, దుఃఖమును కలుగ జేస్తోంది. స్వతఃసిద్ధమైన ఉనికి నీకు లేదు. ఇక చపలత్వమెందుకు? నీవు నా స్వరూపము కాదు. ఎందుకంటే, నా స్వరూపము సంవిత్తుకు అన్యమై ఏదీ ఎక్కడా ఉండదు. కనుక ‘చిత్తము’ అను పేరుతో చెప్పబడే నీవు దేనికైనా కర్తవా? భోక్తవా? లేక, కర్తృత్వ, భోక్తృత్వముల మధ్య ఉండే ఆశయే నీ స్వరూపమా? మొట్టమొదట తియ్యగా కనిపించి చివరకు చేదును చవి చూపటమేమిటి? దుఃఖాలు ఉండటమేమిటి? యథార్థానికి నీకు స్వరూపమే లేదు. మరి నీకు బంధుమిత్రులు ఎక్కడి నుండి వస్తారు? స్ఫటికానికి ఎదురుగా ఏ రంగు కాగితం ఉంటే ఆస్ఫటికంలో ఆ రంగు ప్రవేశిస్తున్నట్లు… నీవు శుద్ధస్వస్వరూపానికి గుణములను ఆపాదించి చూపుచున్నావు. పోనీ, ఆత్మ నిన్ను కల్పన చేసుకున్నదా? ఆత్మకు కర్తృత్వ - భోక్తృత్వ - అన్యత్వములు ఏ క్షణంలోనూ ఉండవు కదా! నీవు ఆత్మవే అయి ఉంటే నీయందు వికల్పములు ఉండకూడదే? ఆత్మ తనకు తానే పూర్ణమై ఉండగా, ఈ ‘భావాభావములు, సుఖ దుఃఖములు’ సంభవించటమెలా సాధ్యం? కనుక నీయందు కనిపించే కర్తృత్వ, భోక్తృత్వములు మిథ్యాభ్రమ మాత్రమే!
ఇప్పుడు ఒక యుక్తి నాకు తెలియవస్తోంది. ఆకాశంలో సూర్యబింబం ఉంటేనే క్రింద నీళ్ళలో సూర్యప్రతిబింబం లభ్యమౌతోంది. కనుక చైతన్యబింబం ఉన్నప్పుడే ‘మనస్సు’ అనే ప్రతిబింబం ఏర్పడగలుగుతోంది. శిలాప్రతిమ స్వయంగా నాట్యం చేయజాలనట్లు, కత్తిస్వయంగా కూరగాయలను కోయజాలనట్లు… మనస్సు స్వయంగా ఏదీ చేయజాలదు. బింబం కదలకపోయినా, తరంగ విన్యాసముచే ప్రతిబింబం కదలగలదు కదా! కనుక ఓ మనో ప్రతిబింబమా! నీవు నీ బింబమగు ఆత్మను ఆశ్రయించు. అప్పుడు “బింబస్వరూపుడనగు నాకు రాక, పోకలు, చావు, బ్రతుకులు ఉండజాలవు” అని సుగ్రాహ్యం కాగలదు.
ఒక మనుజునిచే ఒక వస్తువు నరకబడిందనుకో… ఇప్పుడా వస్తువును నరికిందెవ్వరు? మనుజుడు నరికాడా? కత్తి నరికిందా? మనుజుని ఇచ్ఛ చేతనే కదా, కత్తి నరికింది! పాత్ర నుండి పాలు గొంతులో ప్రవేశించినా కూడా… త్రాగుచున్నది ఆ వ్యక్తియేగాని… కర్తృత్వం పాలకు, పాత్రకు ఆపాదించం కదా! చిత్తము కూడా ఆత్మయొక్క ఒక ఉపకరణంవంటిదే! చిత్తముచే చేయబడేది ఆత్మకు ఆపాదించవలసిందేగాని… చిత్తమునకు కర్తృత్వం ఆపాదించటం కుదరదు.
కనుక ఓ చిత్తమా! సర్వజ్ఞుడగు పరమాత్మచే నీవు ప్రబోధితుడవై ఆయా యోచనలు నిర్వర్తిస్తున్నావు. యోచనలు ఆత్మవే గాని …నీవి కావు. ఆత్మయే తన కర్తృత్వ, భోక్తృత్వ, కరణ ఉపకరణాదులచే ఈ జగత్తునంతా సంచయం చేసివేస్తోంది. ఆత్మయగు పరమేశ్వరుడే సర్వమునూ
Page:637
ప్రబోధితం చేస్తున్నాడు. మూఢులైనవారు మాత్రమే మనస్సు - చిత్తములకు కర్తృత్వం ఆపాదిస్తున్నారు. ఆత్మసత్తచే జగత్తు యొక్క సత్త ఏర్పడి ఉంటోంది. “మనస్సు అనబడేది ఏదీ లేదు” అని తీక్షమైన జ్ఞానమున్న చోట ప్రస్ఫుటమౌతోంది.
నేను ఆత్మను. భ్రమమాత్రమగు చిత్తమునకే జన్మ, జరా, మరణాది కర్మలు గాని… వాస్తవ రూపుడునగు నాకు అవన్నీ ఉండవు. అందుచేత ఈ చిత్తము యొక్క జాడ్యములగు జన్మ, జరా, మరణాది భావానుభవములు నేను పొందకుండెదనుగాక! ఇంద్రజాలంలో వస్తువుల భ్రమలాగా భ్రమించబడుచున్న తరుణంలో చిత్తమనేది ఏర్పడుతోంది.
విజ్ఞానమాత్రమగు బ్రహ్మముయొక్క సమక్షమున చేత ఈ జగత్తంతా వికాసము పొందుతోంది. ఈ వికాసము చిత్తముది కాదు. సముద్రంలో జలమే అనేక తరంగములగుచున్నట్లు బ్రహ్మము యొక్క చిత్ శక్తియే ఈ దేవ - మనుష్య - జంతు ఆదిగాగల జగద్రూపంగా విజృంభిస్తోంది.
ఓ చిత్తమా! నీవే గనుక చిన్మయుడవైతే నీవు మరొక దానికొరకై దేబరించేదానవు కాదు. భూత -భవిష్యత్తులందు ఏకమై, అనేకమై, సర్వ వ్యాపకమై, సర్వదా ఏర్పడి ఉండే ఆత్మని ఎందుకు దర్శించలేకపోతున్నావు? ’నీవు, నేను’ - అను అభాస అంతా స్ఫురిస్తున్నది ఆత్మయందే. ఇక దుఃఖం ఎవరికి? నీడకు ఆకారం కనబడుచున్నా కూడా, దానికి స్వయంభూతమైన ఉనికి లేనట్లు. ఆత్మకు అన్యమైనట్టి దేనికీ ఉనికి లేదు.
కనుక చిత్తము కేవలం జడము, అసద్రూపము, కల్పితము, అభ్యాసవశము మాత్రమే.
సర్వమూ ఆత్మయే అయి ఉండగా… “ఈ బాల శరీరం నాది… ఈ వృద్ధ శరీరం నాది… ఈ పుత్ర, కళత్ర, పౌత్రులు, ఈ గృహ, ఆరామాలు నావి" అనుకుంటూ నేను చిత్తమును పెంపొందించు కున్నాను. ఆహా! అదంతా వ్యర్థమైన చింతనగాక మరేమిటి? ఈ దేహమే లేని వస్తువై క్రీడలో ఉపయోగించే క్రీడోపకరణము వంటిదై ఉండగా… అట్టి దేహముతో ఏర్పడే సంబంధాలు వాస్తవమైనవి ఎట్లా అవుతాయి?
ఆత్మకు దేహమే లేదు. కుందేటి కొమ్ముచే ఎవ్వరైనా పొడవబడతారా? ఛాయ వెళ్ళి ఒక గోడను కూల్చగలదా? ఈ దేహము తత్సంబంధములచే ఆత్మ నిరోధింపబడజాలదు. దుఃఖింప
బడజాలదు.
చేతనము, జడము (ఆత్మ - దృశ్యము)ల మధ్య ’చిత్తము’ అనబడే మూడవ వస్తువు ఏర్పడుటకే వీలులేదు. ఆత్మ యొక్క దృశ్యమునకు సంబంధించిన అభ్యాసవ్యసనమే చిత్తము.
కనుక ఇప్పుడు మార్గమేమిటి?… నేను సత్యవస్తుజ్ఞానమును ఆశ్రయించాలి. అప్పుడు చిత్త, జడ దృశ్య దృష్టులన్నీ ఉపశమిస్తాయి. అట్టి ఉపశమన స్థితి యొక్క “సాక్షాత్కార వృత్తి” నాకు
అలవడు గాక!
అప్పుడిక చిన్మాత్రరూపమే స్వానుభవముగా శేషించగలదు.
Page:638
“అట్టి స్వానుభవము యొక్క ఒకానొక చమత్కారమే ఈ చిత్తము” - అని అప్పుడు అనుభవం అవక ఏం చేస్తుంది?
ఇట్లు తలచుచు వీతహవ్యముని అంతరంగములో మౌనము, నిశ్చలత్వములను వహించియున్నారు.
శ్రీవసిష్ఠ మహర్షి : వింటున్నావా రామా! ఆ విధంగా అంతరంగ మౌనం వహించి వీతహవ్యముని కొన్ని గంటలు గడిపారు. ఇతఃపూర్వపు దృశ్యాభ్యాసము యొక్క సంస్కార ప్రభావం చేత కాబోలు… ఆతని యందు కించిత్ ద్వితీయ వాదం పొడచూపింది. ఆ ద్వితీయమైనదే చిత్తము కదా! అప్పుడు ఆతని అంతరంగంలో కొంత వాదోపములు పొడచూపాయి. అట్టి క్రమమేమిటో వివరిస్తాను. వినువీతహవ్యుని చిత్తము: మిత్రమా! వీతహవ్యా! “చిత్తము చేతనే ఆత్మను దర్శించగలం” అని శ్రుతులు చెప్పటం విన్నావు కదా!
వీతహవ్యుడు : అవును… విన్నాను.
చిత్తము : “అన్ని ఉపకరణములలో కెల్లా చిత్తమే (మనస్సే) గొప్పది” …అని కూడా శాస్త్రములచే చెప్పబడింది కదా!
వీతహవ్యుడు : అవును. అట్లా కూడా చెప్పబడింది.
చిత్తము : మరి నీవు … “చిత్తమనునదే లేదు" …అని నా ఉనికినే ఖండిస్తున్నావే? వీతహవ్యుడు : ఓ… అదా నీ వాదన! ఒకడు తన ముఖమును చూచుకోవటానికి అద్దం ఉపయోగిస్తాడు చూచావా! అంతమాత్రం చేత దర్పణం చైతన్య జీవ సమన్వితమా?
ఆత్మ స్వరూపుడనగు నేను నా స్వరూపమును ఏమరచి అజ్ఞానదశను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు… నా స్వరూపమును నాకు గుర్తుచేయటానికి శాస్త్రములచే, శ్రుతులచే, గురువులచే ‘చిత్తము’ అనబడే నీవు కల్పించబడుచున్నావు. నీకొక ప్రత్యేకమైన … ఆత్మకు వేరైన… ఉనికి ఉన్నదని వారి ఉద్దేశం కాదమ్మా!
తత్త్వమసి (నీవు అదియే అయి ఉన్నావు…) అనే వాక్యార్థ సిద్ధికొరకు శిష్యుడిని తయారు చేయటానికి “ఇది దృశ్యము, ఇది కల్పన, ఇది సంబంధము, ఇది చిత్తము”… మొదలైన మొట్టమొదటి పాఠములలో నీకు చోటు కల్పిస్తున్నారు. అంతమాత్రం చేత నీయొక్క ఆత్మకు అన్యమైన ఉనికి అంగీకరిస్తున్నట్లు కాదు. ఆత్మసాక్షాత్కారమైన తరువాత, ఇక నీకు పాత్రగాని, ఉనికిగాని ఉండదు.
Page:639
మధ్యే మార్గ పాఠ్యవిశేషంగా మాత్రమే కనబడి, విషయం రూఢి అవగానే నీవు ఆ జ్ఞానంలో లయం అవుతావు.
ఓ చిత్తమా! పంచేంద్రియాలు ఉపయోగిస్తున్న జీవుడు ఏ సమాచారంతో వాటిని ఉపయోగిస్తు న్నాడో… ఆ సమాచారమే నీ స్వరూపం. సర్వసమాచారములకు ముందున్న ఆత్మస్వరూపం గ్రహించ బడుచుండగా… ఇక నీకు చోటు కనబడదు. అనగా చైతన్యప్రకాశము యొక్క ఒకానొక దృక్పథమే నీ స్వరూపం కదా! చైతన్య ప్రకాశమును ఎరిగిన తరువాత ఇక నీకేం పాత్ర ఉంటుంది? నీవు దేనిచే… దేని వలన ఏర్పడుచున్నావో… అది ఎరిగిన తరువాత ఇక నీ గురించి తర్జన భర్జనలు
ఎవరికి కావాలి?
కాబట్టి నేస్తం! ఓ చిత్తమా! నీవు దేనికీ కర్తకాదు. అందుచేత దేనికీ దుఃఖ భాజుడవు కావద్దు. “ఈతడు నా వాడు… ఇవి నావి” అని క్లేశములు ఆశ్రయించవద్దు. జడమగు నీవు జడములగువాటిని ఆశ్రయిస్తే జడంగానే ఉండిపోతావు. అట్లాకాకుండా, నీ ఉత్పత్తి స్థానమైన చైతన్యమును ఆశ్రయిస్తే చైతన్యముగా రూపుదిద్దుకోగలవు. నీ నియామకుడగు ఈశ్వరునికి ఈ జగత్తునందు చేయబడిన - చేయబడబోవుచున్న - చేయబడియుండిన దేనితోనూ ఏమీ సంబంధం ఉండదు. నీవు కూడా అట్టి అసంబంధమును ఆశ్రయించు.
చిత్తము : నేను భావాభావ స్వరూపుడనే. ఒప్పుకుంటాను. అయితే నన్ను ఉపయోగించి ఉత్తమజీవులు ఆత్మజ్ఞానం సంపాదిస్తున్నారు కనుక. “నేను ఆత్మకు ఉపకారినే” అని ఎందుకు అనుకోరాదు? వీతహవ్యుడు : నీవు ఆత్మకు ఉపకారం చేసేంతవాడివా? కార్య - - కారణ సంఘాతమునందు ఏర్పడే అభిమానముచే నీవు అప్పుడప్పుడు “నేను ఆత్మకు ఉపకారం చేస్తున్నాను” …అనే భ్రాంతిని పొందుచు న్నావు. పంచప్రాణములు, మనోబుద్ధులు, దశేంద్రియములు… అన్నీ జడాలే కదా! ఇక ఇంద్రియాలచే ఏర్పడే భోగ, యోగములచే ఆత్మకు ఒరిగే నూతన ప్రయోజనమేమున్నది?
చిత్తము : అదేమిటి? ఈశ్వరునకు భోగానుభవం పొందించుట యందు నేను వర్తించుచున్నానని ఎందుకనుకోకూడదు?
వీతహవ్యుడు : అట్లాగా? ఈశ్వరుడు నిత్యతృప్తుడు కదా! ఆయన భోగానుభవం కొరకు నీవు బయలుదేరటమేమిటి?
స్వాభావిక ప్రకాశయుక్తుడు, సర్వవ్యాపి, ఏకరూపుడు అగు చిదాత్మయే ఈ జగత్తంతా సర్వరూపములుగా వ్యాపించి ఉన్నాడు. వానికి అన్యముగా ఏ కల్పనా ఉండదు. ఏకమూ, అనేకమూ కూడా ప్రకాశింపజేయుచున్నట్టి ఆత్మ తన యందు ఈ జగత్తును క్రీడావినోదంగా రచించుకొనుచున్నది. సమస్తము దానియందు సిద్ధించుచుండగా… ఇక దానికి అలభ్యమైనదేమి ఉంటుంది? ఆతడు ఒక దానిని ఇచ్ఛగించటమేమిటి? ఆ ఇచ్ఛను నీవు నెరవేర్చటమేమిటి?
పట్టపురాణి రాజమార్గంలో రథం ఎక్కిపోతుంటే ఒక మూర్ఖయువకునకు మన్మథవికారం జనించినట్లు… సర్వమూ ఈశ్వరస్వరూపమైన ఈ ప్రపంచమును చూస్తున్నప్పుడు నీకు ఇచ్ఛ, క్షోభ జనిస్తున్నాయి.
Page:640
చిత్తము : సరేనయ్యా! నీ మాటలు ఒప్పుకుంటున్నాను. అయితే ఆత్మతో సంబంధం కలిగి నేను ఇట్లాగే ఉంటాను. నన్ను తిరస్కరించటం దేనికి?
వీతహవ్యుడు : అది కూడా సరికాదు… కుదరదు. ఎక్కడైనా ఫలం ప్రాప్తించేటప్పుడు పుష్పం మిగిలి ఉంటుందా? పుష్పము, ఆ పుష్పము యొక్క ఫలం ప్రక్కప్రక్కన ఉండటం ఎలా సాధ్యం? నీవు ఆత్మకు ప్రక్కన ఉండటమనేది అయోగ్యమైనదే.
“ఒక రెండిటి యొక్క సంబంధం”…. అంటే ఏమిటి?
ఒకదాని యొక్క క్రియతో రెండవదాని క్రియ కలవటం. లేక,
ఒకదాని నుండి రెండవది ఆవిర్భావం పొందటం. లేక,
రెండిటి యొక్క ఏకత్వం. లేక,
సంబంధం ఏర్పడక ముందు ఆ రెండూ వేరు వేరుగా ఉండి. ఇప్పుడు ఏకమగుటకు సంసిద్ధపడుతూ ఉండాలి.
ఈ నాలుగు ప్రక్రియలూ చిత్తమునకు - - ఆత్మకు కుదిరేవి కావు.
చిత్తము : కార్యవ్యవహారం దృష్ట్యా నాకు ఆత్మకు సంబంధం కనబడుతోంది కదా? వీతహవ్యుడు : ఎట్లా కుదురుతుంది? ఆత్మ సర్వదా స్వయంప్రతిపత్తి కలిగినట్టి నిష్క్రియచైతన్యము. నీవేమో స్వయంప్రతిపత్తి లేని జడమువు. మరొకదానిచే నియమించబడితేగానీ, నీవు దేనినీ
నిర్వర్తించలేవు.
ఆత్మ నిర్వికారము… స్వయంభువము… ఆనందస్వరూపమూ…!
నీవేమో సుఖదుఃఖ భరితమూ… క్రియోన్ముఖము… ఉపకరణమాత్రము…!
మీ ఇద్దరికీ ఏకాకారత్వం ఎట్లా పొసగటం?
చిత్తము : పోనీ… పాలు నీరు వేరు వేరైనవై కూడా కలుస్తున్నట్లు, నేను ఆత్మ వేరు వేరై ఉండి కలుస్తున్నామని అనుకోవచ్చు కదా?
వీతహవ్యుడు : నీకు - ఆత్మకు, పాలు-నీరు వలె అర్థసంబంధం కుదరదు. మీ ఇద్దరివీ విరుద్ధ సంబంధములనీ ఇంతకు ముందే అనుకున్నాం కదా!
చిత్తము : లేకపోతే… అగ్ని - జలముల వలె మా ఇద్దరివీ విరుద్ధ సంబంధమని అనుకుందామా? వీతహవ్యుడు : అగ్ని - జలముల వలె ఒకదానిచే మరొకటి నశింపజేయబడటం నీకు, ఆత్మకు ఏర్పడటం లేదు. కనుక ఆ ఉపమానం కూడా కుదరదు.
ఓ చిత్తమా! నీవు సంవిత్తు (ఆత్మ) యొక్క ఛాయవే కదా! ఈ ప్రపంచంలో ఆయా పదార్థాలు ఒకే గుణములు కలిగియున్నప్పుడు కలిసి ఉంటాయి. విరుద్ధగుణములు కలిగినప్పుడు విడిపోతాయి. నీవు ఆత్మనే ఆశ్రయించు. ఆత్మనుండి చ్యుతి పొందనప్పుడు నీవు కూడా ఆత్మవే అవుతావు. చిత్తము : నాకు దృశ్యపదార్థముల ఉనికి కనిపిస్తోంది కదా!
Page:641
వీతహవ్యుడు : అంతర్దృష్టి జ్ఞానంచే దృశ్య పదార్థమంతా లేనిదే అగుచున్నది. దృశ్యం రహితమైతే దుఃఖరహితమగు ఆత్మయే శేషిస్తోంది. అట్టి ఆత్మచే సంతుష్టిపొందు. నిరంతర ధ్యానముచే సమాధి నిష్టుడవై.. ఆత్మదర్శివై ఉండు.
చిత్తము : నేను కూడా సుఖము కొరకే దృశ్యమునందు వెతకుచున్నాను.
వీతహవ్యుడు : … కదా? నీవు కనుక జడమాత్రములగు దేహ-ఇంద్రియ-దృశ్యములందు ‘సంకల్పము’ అను రజోగుణమును ఆశ్రయించుటచే ‘చ్యుతి’ పొందటం ప్రారంభించావా… ఇక అది నీకు, నాకూ కూడా దుఃఖప్రదమే కాగలదు. మిత్రమా! చిత్తమా! ఈ విషయం మనం మరువకూడదు.
చిత్తము : కర్తృత్వమంతా ఆత్మదేనని అంటున్నావుకదా! ఇక నాకు బోధించటమెందుకు? నీవు చెప్పదలచుకొన్నది ఆత్మతోనే విన్నవించుకో….
వీతహవ్యుడు : సంకల్ప - వికల్పములకు చోటు ఉండనట్టి, “కల్పన” అనే ధూళి ఏర్పడజాలనట్టి ఆత్మయందు కర్తృత్వం సంభవిస్తుందా? “ఆకాశమునకు కాళ్ళు - చేతులు ఉంటాయి” అని ఎవ్వరైనా అంటే, దానికి అర్థమేమన్నా ఉన్నదా? అట్లాగే ఆత్మకు కర్తృత్వం సంభవించదు. అయితే… ఆత్మయే తనయందు ఏకరూపముగానూ, అనేక రూపముగానూ సంభవిస్తోంది.
చిత్తము : అదెట్లా సంభవం?
వీతహవ్యుడు : నీకొక చిన్న దృష్టాంతం చెపుతాను. నీరే బుడగలుగా, తరంగములుగా, నురుగుగా, ఆవర్తములుగా, సుడులుగా సంభవిస్తోంది. "బుడగ గుండ్రంగా ఉన్నది. కనుక, జలం గుండ్రంగా ఉంటుంది”… అని ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? ఆవర్తమునకో, లేక తరంగానికో లేక బుద్బుదమునకో ఆకారం ఉండవచ్చు. జలానికి ఆకారం ఉన్నదా? లేదు. కనుక… ఆత్మయే ఆత్మ యందు ఆభాస మాత్రంగా జగద్రూపమై వెలయుచున్నది. జలం మధ్యలో మండుచున్న బొగ్గు ఉండజాలదు. ఆత్మ యందు రెండవ కల్పనయే సాధ్యం కాదు.
చిత్తము : ‘ఆత్మ యొక్క కల్పనయే చిత్తము’ అని అనవచ్చునేమో?
వీతహవ్యుడు : ఆత్మదేవుడు కల్పనారహితుడు. ఇక మనస్సో…. జడమైనది.
చిత్తము : ఇక ఆత్మ - మనస్సుల మధ్యగా “ఇది వేరు… అది వేరు. ఇది శుభము, అది అశుభము”… అనే కల్పన ఎక్కడుంటుంది?
వీతహవ్యుడు : ఉండదు. “కల్పన చేసే మనస్సే లేదు”… అని అనుకుంటున్నప్పుడు. ఇక కల్పన ఎక్కడుంటుంది?… కాబట్టి ఈ సమస్తమూ విషయవర్జితమై, నిత్యనిర్మలమైనట్టి చైతన్యమే అవుతుంది… మరింకేమీ కాదు.
ఇక్కడ కల్పన లేదు…. బంధములేదు. ఆత్మ సంవిత్తు మాత్రమే సర్వదా అన్ని వైపులా వ్యాపించియున్నది.
Page:642
చిత్తము : అయితే ‘నేను వేరు - ఇది వేరు’ అనే కల్పన ఎక్కడుంటుంది? ఎక్కడి నుండి వస్తోంది? వీతహవ్యుడు : ఎక్కడా ఉండజాలదు. అనాదియై, రూపరహితమై, సర్వవ్యాపకమైనట్టి ఆత్మయందు ‘నేను నీవు’ మొదలైనవి ఎవరు ఆరోపించగలరు? ఆకాశంలో ఎవ్వరైనా అక్షరాలు వ్రాయగలుగుతారా? కనుక, నేస్తం! చిత్తమా! నీవు ఆత్మదృష్టిని అలవరచుకో.
ఆత్మ నిత్యోదయమైనట్టిది. సర్వవస్తువుల సారభూతమైనది. అది దిక్కులన్నీ వ్యాపించి పరిపూర్ణ మొనర్చుచున్నది. అట్టి ఆత్మను ప్రత్యక్షముగా గ్రహించనంతకాలం మిథ్యారూపమగు మృగ తృష్ణాజలం లాగా ‘చిత్తము - జగత్తు’ మొదలైనవి అనుభవం కాగలవు.
ఆత్మను మనం గ్రహించినామా…. దుఃఖములన్ని ఉపశమించిపోతాయి. కనుక, ఓ చిత్తమా! నీవు సుఖ దుఃఖ భ్రాంతిని, మోక్షము పొందాలనే సంచలనమును వదలిపెట్టు.
మనస్సుచే బద్ధులం కావటం… చిత్తముచే నిరోధించబడటం… ఇవన్నీ భ్రాంతియేగానీ యథార్థంకాదు. సత్స్వరూపమగు ఆత్మ ఒక్కటే వాస్తవం.
అంతా విని వీతహవ్యుని చిత్తం కొంత కుదుటపడింది. ప్రశాంతత పొందింది.
వీతహవ్యుడు - ఇంద్రియముల సంవాదం
శ్రీవసిష్ఠ మహర్షి : ధీరుడు, ముని శ్రేష్ఠుడు అగు ఆ వీతహవ్యుడు తన చిత్తమునకు ఏకాంతంలో బోధించి ప్రశాంతపరచారు. అప్పుడు ఆతని ఇంద్రియములు కొంత సమయం తరువాత కొంత ప్రకోపించటం ప్రారంభించాయి. వాటిని కూడా ఇట్లు సంబోధించారు.
వీతహవ్యుని ఇంద్రియములు : ఓ మునీ! ఈ జీవుని ఉనికికి మాపాత్ర ఎంతో ఉన్నది. కనులు లేనివాడు చూడలేడు. చెవులు లేనివాడు వినలేడు. ఇంద్రియాలు లేకపోతే జగత్తే ఉండదు. జగత్తు లేకపోతే జీవుడు ఉండడు. కనుక ఈ జీవుడు మా వలననే మనగలుగుచున్నాడు.
వీతహవ్యుడు : ఓ ఇంద్రియములారా! అవిద్యాకారణంగా ఆత్మకు వేరుగా మీ యొక్క ‘సత్త’ అనుభవమౌతోంది. మీరు మీ విషయములను ఆశ్రయిస్తున్నంత కాలం నాకు దుఃఖ పరంపరలే వచ్చిపడుచున్నాయి. కాలక్రమేణా మృత్యువు అనివార్యమే కదా! మిమ్ములను గ్రుడ్డిగా ఉపయోగించి నందుకు ప్రయోజనంగా ఈ జీవునకు ఎన్నో నరకములు వచ్చిపడుచున్నాయి.
అందుచేత మీరు "మేము ఆత్మ కంటే వేరైన ‘సత్త’ గల వారము”… అనే మిథ్యావాదనను కాస్త వదలిపెట్టండి. నేను ఇంతక్రితం చిత్తముతో జరిపిన సంవాదమును మీరు కూడా విన్నారు కదా! జ్ఞానవశం చేతనే ఆత్మోపదేశం లభిస్తుంది.
Page:643
ఇంద్రియములు : మేమంతా ఎక్కడినుండి ఉత్పత్తి అయ్యాం?
వీతహవ్యుడు : మనం నిజం చెప్పుకోవాలంటే మీ ఉత్పత్తి అజ్ఞానవశం చేతనే ఏర్పడుతోంది. అజ్ఞానం క్షయించినప్పుడు మీకు ’సత్త’యే ఉండదు. అనగా మీరు స్వతఃగా లేనివారై, ఉపకరణ మాత్రులై ఉండిపోగలరు.
ఇంద్రియములు : మా వలన జీవునికి సంతోషం కలుగుతోంది కదా! అట్లాగే జీవుని వలన మాకు సంతోషం కలుగుతోంది?…
వీతహవ్యుడు : మీరు కాలంచే ఏర్పడి, కాలంచే బలహీనులై, కాలంచే నశించుచున్నారు కదా! అందుచేత… ఇరువైపులా దహించబడే అగ్నిలాగా మియొక్క రాకపోకలు జీవునకు వాస్తవమైన సుఖం కలిగించుట లేదు చూడండి!
మీరు ఉంటున్నంత కాలం ‘భ్రాంత జీవులు’ అనే తరంగాలతో కూడిన ఈ సంసార నదీ జలం కాలసాగరంలోకి నిరంతరం ‘ఉరుకులు, పరుగులు’ ఎత్తుతూ ప్రవేశిస్తోంది. మీ వలననే పరస్పరాహంకారం ఉత్పన్నమౌతోంది. ఫలితమేమిటి? రాగము, ద్వేషము, క్షయము, వధ, పరాజయం, చింత - మొదలైన అపశబ్దాలు వినబడుచున్నాయి. ఇక దుఃఖ పరంపరల వర్షధార గురించి చెప్ప నవసరమే లేదు. "భావాభావములు, హృదయవేదనలు, సంపదలచే, ఆపదలచే ఏర్పడే దుఃఖ వియోగాలు” అనే దుర్భరవాసనలన్నీ ఆ కాలసాగర జలంలోంచి నలువైపులా ప్రసరిస్తున్నాయి.
మిమ్ములను ధరించి అటూ ఇటూ సంచరించే ఈ దేహము యొక్క గతులను చూస్తుంటే ఇంకా జాలి వేస్తోంది. అనేక మనోంతర్గతమైన చపల చింతలు మీ మధ్య తిరుగాడుచున్నాయి. లోభము మీ కణ కణములనిండా నిండి ఉంటోంది.
ఇంకేమున్నది….? లోభమున్నచోట శమదమాది ఉత్తమగుణములకు చోటు దొరుకుతుందా? ఒక వేళ, కొంచెం శమం ఏర్పడినా కూడా ‘ఉద్వేగం’ వచ్చి, దానిని తుడిచిపెట్టి పోతోంది. ఇంద్రియములు : మా వలన జీవునికి క్రియా వ్యవహారములు సుసాధ్యమౌతున్నాయి కదా? వీతహవ్యుడు : నిజమే. కానీ, మిమ్ములను దుర్వినియోగపరచుకొనే జీవుల హృదయాలు దుర్వ్యసనాలు హృదయమంతా విస్తరిస్తున్నాయి. ‘మహామోహం’ అనే చీకట్లో ‘అజ్ఞాన సమాచారములు’ అనే గుడ్లగూబలు కాపురాలు చేస్తూ, నివాసాలు కట్టుకొని ఉంటున్నాయి.
ఓ ఇంద్రియములారా! మీ వలన జీవునకు లాభాలు వచ్చిపడుతున్నాయంటారా? ఆహా, ఎంతమాట? మీకు తెలియుట లేదో ఏమో? మీరు వచ్చి చేరటం చేత లెక్కలేనన్ని అనర్థాలు కూడా వచ్చిపడుచున్నాయి. మిమ్ములను అడ్డంపెట్టుకుని పిశాచములవలె అనేక పాపకార్యములు విజృంభిస్తున్నాయి. మీరు గనక పరిశుద్ధులై ఉంటే వివేకము, ఉత్తమగుణములు ఎక్కడో చాటు మాటుగా దాక్కొని ఉండేవా? మోహమనే మంచు ఇట్లా కురుస్తూ ఉండేదా? ‘రజోగుణము’ అనే ధూళితో హృదయం కప్పబడి ఉండేదా? ఈ విక్షేపములు కలిగించే వికల్ప సమూహములు నాపై
Page:644
దాడి చేసేవా? మీరు మంచి మిత్రులై ఉంటే, హృదయంలో తదితరులపట్ల ‘మైత్రి’ జనించి, ఆత్మానుభవమునకు విత్తుగా అయ్యేదే! ఈ విధంగా చింతాపరంపరలు నన్ను ఉద్వేగ పరచేవా? అహో! ఇదంతా మీ ప్రభావం కాదా?
ఇంద్రియములు : మా మూలంగా మా సొంతదారగు జీవునికి అనర్థములు కలగటానికి కారణం ఆతడు అజ్ఞానముచే మమ్ములను అజ్ఞాన విషయాలవైపుగా వినియోగించటమే కదా! వీతహవ్యుడు: అవును. ఒప్పుకుంటున్నాను. మేఘములు శమించగా… ఆకాశంలో సూర్యుని వెలుగు ప్రస్ఫుటమగునట్లు, హృదయంలోని అజ్ఞానం తొలగితే అంతః కరణంలో జ్ఞాన ప్రకాశం ప్రత్యక్షమౌతుంది. అప్పుడు హృదయం ప్రసన్నమై, విశాలమై, గంభీరమై, క్షోభావర్జితమై ప్రశాంతత పొందగలదు. వైషమ్యాలచే పరాజితం కాని హృదయం దానంతట అదే ఉపశమించగలదు.
అమృతాపూరపూర్ణేన నిత్యానన్దమయేన॥
స్త్రీయతే పురుషేణాన్తః శీతేన శశినా యథా ॥ (శ్లో 22, సర్గ 83)
అప్పుడు… మనుజుడు ఆత్మానందముచే నిత్యానందమయుడై పరిపూర్ణుడై శీతల చంద్రుని వలె విరాజిల్లగలడు! కనుక…. అజ్ఞానం నశించాలి.
ఓ ఇంద్రియములారా! జ్ఞానసముపార్జనకై మీరు నాచే చక్కగా నియోగించబడిన వారై స్నేహితులవలె ఉభయ శ్రేయస్సుకు కారణమయ్యెదరుగాక!
ఇంద్రియములు : అజ్ఞానముచే వినియోగించబడుచున్నప్పుడు మేము జీవునకు మరింత అజ్ఞానమును మూటకట్టుకొని తెస్తున్నాం. సరే! అజ్ఞాన నాశనమునకై మా యొక్క పాత్ర, ప్రయోజనము, ప్రాముఖ్యము ఎట్టిది?
వీతహవ్యుడు : చాలా గొప్పది. మనం కలిసి ఉన్న ‘జీవితము’ అనబడే ఈ కొద్ది సమయం సద్వినియోగపరచుకొని మన ఈ కలయికను శుభప్రదం చేసుకొనెదముగాక!
అజ్ఞానం నశిస్తే, అంతఃకరణంలో ‘ఆత్మాకారవృత్తి’ సుస్పష్టమౌతుంది. అప్పుడు ఈ చరాచర దృశ్య ప్రపంచమంతా మటుమాయమై దీని స్థానంలో ‘సంవిత్ చైతన్యము’ మాత్రమే మనకు అనుభవమౌతుంది. తత్ఫలితంగా ఆనందముచే పరివ్యాప్తమైన ఆత్మయొక్క పూర్ణ స్వరూపము అనుభూతమౌతుంది. అట్టి అనుభవం, అవగాహన, ఆశాజాలమున బంధించబడి, కేవలం దేహ సంగులై ఇంద్రియసంగులై చరించే వారికి లభించదు. మీ సహకారంతో తప్పకుండా జ్ఞానం ప్రవృద్ధం కాగలదు. మిమ్ములను సముపార్జించుకున్నదే అందుకు కదా! జ్ఞానాగ్నిచే “జర (ముసలి తనం), జన్మ" మొదలైనవి తారసబడే సంసారమార్గం సంక్షయించగలదు. జ్ఞానం ఉన్నచోట తుష్టి, పుష్టి, కాంతి మొదలైనవి వచ్చి చేరుతాయి. వివేకి అయినవాడు అవివేకమున పడకుండా సంస్కృతి (సంసారం) యందు చిక్కకుండా ఆత్మ యందే విశ్రాంతి పొందుతూ ఉంటాడు. కనుక ఓ ఇంద్రియములారా! మీరు చిత్తచాంచల్యముచే ప్రేరితులు కాకండి.
Page:645
దృశ్యము పట్ల మౌనం వహించి ఉండండి. ఆత్మ భగవానునివైపుగా దృష్టిని, ప్రయత్నమును సారించండి. అప్పుడు ఆత్మాకారవృత్తిచే ఏర్పడే ప్రయోజనములన్నీ మనకు కలుగుతాయి. ప్రశాంత దాయకమగు గుణసంపదలు వచ్చి పడతాయి.
ఇంద్రియములు : కానీ– ఇక్కడ అభిరుచులు, అవి నెరవేరినప్పుడు సంతోషం ఏర్పడుచున్నాయి కదా? వీతహవ్యుడు : ‘ఆశించుట’ అను చిత్తముయొక్క వృత్తిచేత అభిరుచులు ఏర్పడుచున్నాయి. ఆశలకు అడ్డుగోడ పెట్టినప్పుడు మాత్రమే ఉత్తమ గుణసంపదలకు చోటు దొరుకుతోంది. అయితే, ఏదైనా ఆశించేటప్పుడు దాని గుణదోషములను, తదనంతర దుష్ప్రభావములనూ చక్కగా పరిశీలించటమే విజ్ఞత కదా? “ఆత్మ యొక్క సత్త, దృశ్యం యొక్క పరిణామాలు” - ఈ రెండిటిలో ఏది శ్రేయస్సును కలుగజేస్తుందో… దానినే ఎన్నుకోవాలి. అంతేగాని, ఏది ప్రియమో, దానిని కాదు. నాకు మాత్రం అవస్తువగు ఈ ప్రపంచంలోని వస్తుజాలానుభవం, ఈ భూత భవిష్యత్తుల పట్ల ఏర్పడే ఆవేదనల కన్నా ‘ఆత్మ సత్త’యే సుఖదాయకమను అభిప్రాయం కలుగుతోంది. దేనిలో అయితే… ఎట్టి అన్య పదార్థముల ‘సత్త’ ఉండదో… అట్టి ఆత్మనే మనం ఆశ్రయిద్దాం. ఉత్తమ సుఖమగు ఆత్మ మనకు ఎదురుగానే ఉండగా… మనం ఎక్కడెక్కడో ఏదేదో ఆశించి ఎందుకు వెతుక్కుంటూ పోవాలి? “నా యందు సత్యమై, ప్రసిద్ధమై ఉన్నట్టి ఆత్మయే మన స్వరూపం" అని ఎరిగి ఆపై ఉభయ శ్రేయస్సు పొందుతూ కలిసి ఉందాం. అప్పుడు చైతన్యమే మన రూపం అవుతుంది. చిత్తచాంచల్యమును తిరస్కరిద్దాం. అంతేగాని, అసద్రూపములను మనం ఆశించవద్దు. భావించవద్దు.
ఓ ప్రియ ఇంద్రియములారా! మనం సద్గురువుల ప్రవచనాలు విన్నాం. వేద - వేదాంగాలు అంతిమసారంగా ప్రతిపాదిస్తున్నదేమిటో గమనించాం. వాటి సారమేమిటి? అసారం ఏమిటి? "దృశ్యము పరిత్యజించబడుగాక. పరిశుద్ధము - అఖండము - - అద్వితీయము అగు ఆత్మయే మనచే మననము చేయబడు గాక!” అని కదా!
మిత్రులారా! ఇంద్రియములారా! ఈ నా నిర్ణయమును మీరు శిరసావహించెదరుగాక! ఇంద్రియములు : ఓ వీతహవ్యా! నీవు చెప్పు మార్గంలో మేము జీవించి ఉండమేమో? వీతహవ్యుడు : "మేము జీవనము సాగించువారము… లేక ఈ జీవుని జీవింపజేయువారము” అనే మిథ్యయగు యోచనను, సుఖ భ్రాంతిని మీరు వదలిపెట్టండి. మీరు నా యొక్క సాధనవస్తువులు మాత్రమే. సాధనలు లేనంత మాత్రం చేత సాధకుడు - - సాధ్యము లేకుండా పోతాయా? అది అట్లుండగా… మీ అస్థిత్వము నాకు వేరైనవి కావు. మయావినా (నేను లేకుండా) మీకు అస్థిత్వం అనేది భ్రాంతి మాత్రమే. అట్టి భ్రాంతి ఈ మన విచారణచే పూర్తిగా తొలగిపోగలదు.
విూకంటూ ఏ స్వరూపం లేదు. భావనలేదు. కార్యక్రమం లేదు. మిమ్ములను ఉపయోగిస్తున్న నా వలనే మీకు ‘ఉనికి’ అనే గౌరవం కలుగుతోంది. మీకంటూ ఏదైనా స్వరూపం అనుభవమౌతుంటే, అదంతా ఆత్మ యొక్క అవిచారణా ఫలితమే అయి ఉన్నది. విచారణచే మీ స్వరూపం కూడా వైషమ్య రహితమగు సన్మాత్రముగానే తెలిసిపోతోంది. వెలుతురు లేకపోవటమే చీకటి అయినట్లు…
Page:646
విచారణ లేకపోవుటచేతనే 1. మీరు 2. మీ వలన విషయములు… అనుభవమౌతున్నాయి. ప్రకాశముచే అంధకారం తొలగునట్లు సమగ్రవిచారణచే మీరు స్వతఃగా లేనివారే అగుచున్నారు. ఇంద్రియములు : ఇంతకాలం నీవు మాపైనే ఆధారపడి జీవించావే?
వీతహవ్యుడు : ఇంతకాలం నేను అల్పవివేకమును మాత్రమే కలిగి ఉన్నాను. సంకల్ప మాత్రంచే ఊహలో దయ్యం ఉద్భవమగున్నట్లు, అల్పవివేకంచే మీరంతా స్వల్పాకృతి పొంది చివరికి దుఃఖ కారకులగుచున్నారు. సృష్టికర్తనగు నాయొక్క ‘ఆద్యంత సంకల్పము’ చే సంకల్పకాలంలోనే మీరు సంక్షయించగలరు…లేక అధిగమించబడగలరు.
ఇదానీముదితం నిత్యం స్వప్రాగ్రూపే క్షయం గతే | వివేకస్య ప్రసాదేన వివేకాయ నమోనయః ॥ (శ్లో 36, సర్గ 83)
వివేకోదయంచే పూర్వపు అవిద్య నశించి మీ యందు, నా యందు, ఈ దృశ్యము నందు ఆత్మ స్వరూపమే ఉదయించగలదు. అట్టి వివేకమునకు ఇదే నమస్కారం.
ఓ ఇంద్రియములారా! మీరు ప్రబుద్ధము పొందితే పరమేశ్వర స్వరూపమే పొందుతారు. చిత్తత్వము నశించితే పరమేశ్వరత్వము ప్రకాశిస్తుంది. ఇతఃపూర్వంకూడా మీ స్వరూపం పరమేశ్వర ప్రకాశమే. ఇప్పుడు దృశ్యమును అధిగమించి, ఆత్మవస్తువును ఆశ్రయించుటకు ఉపకరించుటచే పరమ పవిత్రులౌతున్నారు. దీపం వెలిగిన తరువాత చీకటిలాగా మీలో దోషములు తొలగిపోతు న్నాయి. నిద్ర లేచినవాడు మౌఢ్యమునుండి ప్రబుద్ధుడగుచున్నట్లు, జ్ఞాన - - విజ్ఞాన ప్రభావంచే మీ యందు పరమేశ్వరత్వం ప్రకాశిస్తుంది. ఏదైతే మీ వెంట అవివేకముచే జనించిందో అది వివేకముచే నశిస్తోంది… ప్రకాశముచే చిమ్మచీకటి నశిస్తున్నట్లు…!
‘ఆత్మ విచారణ’ ఉంటే చాలు, మీరు కోరుకున్నాకూడా మీకు సుఖ సిద్ధిలభిస్తుంది. అందుచేత శాస్త్ర సిద్ధాంతయుక్తులచే ’ఇంద్రియములు - ఇంద్రియ విషయములు ఆత్మకు అన్యంగా లేవు” అని నాచే మరల మరల నిర్ణయింపబడుగాక!
ఓ ఇంద్రియములారా! ఇప్పుడు మీరు సంసారమును దాటివేసినవారయ్యారు. మీరు పూర్వం ఆత్మకంటే అన్యంగా ఉండి ఉండలేదు. ఇప్పుడు అన్యంగా లేరు. ఇకముందు అన్యంగా ఉండబోరు. మీకు శుభమగు గాక! మిస్వరూపమేమిటో ఎరిగిన తరువాత నేనిప్పుడు దుఃఖరహితుడనగుచున్నాను. పూర్ణతృప్తుడను, శాంతుడను అగుచున్నాను. “స్వాత్మయందు స్థితి కలిగి యుండుట" అనే తురీయపదమునందు విశ్రాంతి పొందుచున్నాను. చిత్తమునకు, ఇంద్రియములకు స్థితియే లేదు.
ఆత్మ ఒక్కటే అవశ్యం కలదు! ఆ ఆత్మయే నేను. దానికి అన్యంగా ఎచ్చటా ఏదీ లేదు. బోధ స్వరూపుడనై నేనే సర్వదా అంతటా, అన్నిటా వెలయుచున్నాను.
శుద్ధ చిద్రూపమగు ఆత్మయందు "ఈ ఆత్మయే నేను. అది నేను కాదు” అనే కల్పన కూడా ఉండదు. ఇక మరింకే కల్పనలు అసలే ఉండవని వేరే చెప్పాలా?
Page:647
ఏకమై, అద్వితీయమైనట్టి ఆత్మ యందు ’ఆత్మకు వేరుగా ఏదీ లేదు” అనే కల్పనమాత్రం ఎట్లా సంభవం?
అందుచేత ‘ఆత్మను నేను’ అనే కల్పనకూడా ఇప్పటికిప్పుడు త్యజిస్తున్నాను. ఏమరొక చింతనకూ చోటివ్వకుండా జల తరంగముల అవినాభావంలాగా మౌనం వహించి ఉంటున్నాను. వాసనారహితుడనై, ప్రాణసంచారమునకు సంబంధించనివాడనై, సర్వదోష వినిర్ముక్తుడనై ఉండెదనుగాక! ‘చిదాభాసము’ అను ప్రతిబింబాశ్రయం లేనివాడనై, స్వయముగా అఖండము, అప్రమేయము అగు ఆత్మనై ఉంటాను. తటాకంలోని జలంలోను, కుండలోని జలంలోను, సముద్రజలంలోను ప్రతిబింబించే సూర్య ప్రతిబింబములకు సూర్యునితో ఏం సంబంధమున్నది? అన్నిటిలోనూ ప్రకాశిస్తున్నప్పటికీ ఆ ప్రకాశముయొక్క కర్తృత్వము లేనివాడను. ఆకాశంలో ప్రకాశించే సూర్యునిలాగా స్వయం ప్రకాశకుడను. అన్ని ఉపాధులలోని జ్ఞానతత్త్వమును, చిదాత్మస్వరూపుడను. మనశ్చేష్టలకు, ఇంద్రియచేష్టలకు సంబంధించని వాడనగు నేను ఇప్పుడు మౌనమును, విశ్రాంతిని పొందుచున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ వీతహవ్యుడు వింధ్యపర్వత ప్రాంతంలోని తన పర్ణశాలలో సుఖాసీనుడై సమాధియందు నిశ్చలుడయ్యారు. సర్వ శారీరక, మానసిక చేష్టలు త్యజించారు. సుందరమగు ఆత్మానందమొక్కటే ఇప్పటి ఆతని అనుభవం. సముద్రజలం తరంగత్వం త్యజిస్తే ఆ జలం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అతని మనస్సు ఆ రీతిగా అయింది. కట్టెలన్నీ కాలిపోయిన తరువాత అగ్ని ఉపశమించినట్లు, ఆతని దేహంలో ప్రాణసంచారం ఉడిగిపోయింది. నేత్రములు బాహ్యసంచలనం త్యజించి అర్ధనిమీలిత మయ్యాయి. ఆ కన్నుల మిగతా అర్ధభాగం పూర్తిగా అంతర్ముఖమయ్యాయి. నాసాగ్రం ఉత్తేజమై ఊర్ధ్వస్థితి పొందింది. శిరస్సు, శరీరము, కంఠము సమంగా స్థితి పొందాయి. ఆతడు ఒక కొండపై మలచబడిన శిల్పంలాగా కన్పట్టసాగాడు.
అట్టి మౌన-ప్రశాంత-క్షోభారహిత-చ్యుతిరహిత… ఆనందస్థితిలో ఉండగా 300 సంవత్సరాలు గడచిపోయాయి. అంతదీర్ఘకాలం ఆతనికి అర్ధముహూర్తంలాగా గడిచిపోయింది.
ఆతడు తన జీవన్ముక్త బలం చేత జ్ఞాని, ధ్యాని అయ్యారు. అంతకాలం ఆతడు సమాధి నుండి లేవనే లేదు, దేహమును త్యజించలేదు. అంతటి దీర్ఘకాలంలో ఆ పర్ణశాలకు బయట ఏర్పడే మేఘ గర్జనలు గానీ, సమీపంలోని సామంతరాజుల వేట కోలాహలాలు గాని, కోతుల కిచకిచలు, ఏనుగుల ఘీంకారాలు, సింహముల నాదాలుగాని, పిడుగులశబ్దాలు, భూకంపములచే ఏర్పడిన శిలాపాత శబ్దాలు, దావాగ్ని చిటపటలుగాని ఆతని సమాధికి విఘాతం కల్పించలేకపోయాయి.
ఆ సమయంలో కాలం కేవలం స్వతంత్రంగా, నిష్కారణంగా, మౌనంగా గడిచిపోయింది.
Page:648
జలతరంగాల లాగా అనేక వర్ష, వేసవి కాలాలు వచ్చాయి… పోయాయి. నీళ్ళు అనేకసార్లు పర్ణశాలలో ప్రవేశించాయి. కొద్దికాలంలోనే ఆ వీతహవ్యుని భౌతిక దేహం బురదలో కూరుకు పోయింది. అయినా ఆతనికి ఏమాత్రం వ్యధగాని, ఆతని సమాధి స్థితికి విఘాతంగాని కలుగలేదు.
ఆతని పట్ల 300 సంవత్సరాలు కొద్ది క్షణాలులాగా గతించిపోయాయి. ఆ తరువాత ఆతని ఆత్మప్రభువు స్వయంగా సమాధి నుండి మేలుకొన్నారు.
శ్రీరాముడు : స్వామి! ఆ వీతహవ్యుని దేహం 300 వందల సంవత్సరాల భూమిలో కూరుకుపోయినా, అది చెడకుండా ఎట్లా ఉన్నది? ప్రాణాలు ఎట్లా నిలిచాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : భూమిలో కూరుకుపోయినప్పుడు ఆతని దేహమును రక్షించింది చైతన్యముగాని, ప్రాణములు కాదు. ఎందుకంటే సమాధిని స్వీకరించిన మరుక్షణం ఆతని దేహంలో ప్రాణములు తమ సంచలనము నుండి ఉపశమించి అవి సూక్ష్మత్వం పొందాయి.
శ్రీరాముడు : 300 సంవత్సరముల వరకు శరీరమునందు ప్రసరించకుండా సూక్ష్మత్వం పొందిన ఆతని ప్రాణములు మరల ఎందుకు ఉత్తేజం పొంది పునఃప్రసరణకు ఉపక్రమించాయి? శ్రీవసిష్ఠ మహర్షి : ఆతని హృదయాంతరంగంలో ఎక్కడో ఒక మూల ఇంకా ప్రారబ్ధం శేషించియున్నది. అనగా కార్య - కారణములకు సంబంధించిన దేహసంబంధ కర్తృత్వ సంస్కారం ఎక్కడో రవ్వంత మిగిలియున్నది. అందుకే ఆతని చైతన్యం ప్రబలంగా హృదయంలో ఆవిర్భవించింది. స్వమనోరూపం ధరించింది. అయినా కూడా, ఆతడు స్వవిచారణచే జీవన్ముక్తత్వము అవధరించాడు కదా! కనుక ఆతని హృదయము నిర్మలత్వం కలిగియే ఉన్నది. సమాధి విఘాతానికి కొంత ముందుగా ఆతని మనస్సు ఆ పర్ణశాల నుండి బయల్వెడలింది.
వింధ్యపర్వత ప్రాంతంలో ప్రశాంతముద్రను అవధరిస్తూనే ఆయన తన స్వసత్తమనస్సులతో హిమాలయముల వైపుగా బయలుదేరాడు. అక్కడ గల కైలాసపర్వతం సమీపించాడు. ఆ పర్వతం దగ్గరగా ఉండే ఒక కదంబవృక్షం (కడిమి చెట్టు క్రింద గట్టువంటి ఎత్తు ప్రదేశంలో కూర్చుని ధ్యాన చిత్తంతో కొద్ది సంవత్సరములు గడిపాడు. మరల అక్కడి నుండి బయలుదేరి ఆ ప్రాంతంలోనే విద్యాధరత్వం స్వీకరించి సంచరించాడు. ఆ సమయంలో దేవతలచే ఆరాధింపబడుతూ ఇంద్రత్వం అవధరించి ఐదు యుగముల కాలం గడిపివేశాడు.
శ్రీరాముడు : మహర్షీ! ఆతడు కైలాసపర్వతప్రాంతంలో సంచరిస్తూ ఉండటం, ఇంద్రత్వంతో దేవతలచే ఆరాధింపబడుచూ ఐదు యుగముల కాలం గడపటం - ఇవన్నీ ఆతనికి ఎట్లు తారసపడ్డాయి? ఆతని భౌతిక దేహం వింధ్యపర్వత ప్రాంతంలోనే ఉండిపోయిందిగా? ఆతడు మనస్సుతో కదా, పర్ణశాల నుండి బయల్వెడలింది?
శ్రీవసిష్ఠ మహర్షి : అవన్నీ ఆతడు తన హృదయ ప్రదేశంలోనే పొందాడు. అనుభవించాడు. దేహం మాత్రం వింధ్యపర్వత ఆశ్రమంలోనే 300 సంవత్సరాలు ఉన్నది.
Page:649
శ్రీరాముడు : ఆ విశాల ప్రదేశములను అల్పకాలంలో, అల్పమగు ఆతని హృదయప్రదేశంలో ఎట్లా అనుభవించారు? ఇదంతా జరిగినదని మీరు చెప్పుచున్నప్పుడు దేశకాలముల యొక్క ‘అనియమము’ ఏర్పడుచున్నట్లు అనిపిస్తోందే? ఆతని పట్ల ఈ దేశ కాలాలకు ఒకప్పుడు నియమము, మరొకప్పుడు అనియమము ఏర్పడుతోందా ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒకప్పుడు శక్తి స్వరూపరహితమై ఉంటుంది. మరొకప్పుడు స్వరూపయుక్తమై ఉంటోంది. అది ఎక్కడ ఏ రూపంలో ఉదయిస్తే ఆ రీతిగా అనుభవమౌతుంది. అట్లాగే చైతన్యము కూడా! అది ఎక్కడ ఏ రూపంగా సంకల్పపూర్వకంగా ఆవిర్భవిస్తే అక్కడ ఆ రూపంగానే అనుభవం కాగలదు. చేతనము తన స్వభావమును అనుసరించి శీఘ్రంగా ఆయా రూపములు పొందుతోందని గ్రహించు. ఇక ‘నియమం’ విషయం అంటావా? చైతన్యప్రభావంచే బుద్దియందు ఎప్పుడు ఎచ్చట నియమం (లేక) ఎట్టి అనుభవం స్వీకరించబడుతుందో… అప్పుడు అచ్చట తదనుకూలమైన నియమమే ఉదితమౌతూ ఉంటుంది.
ఒక ప్రశ్న- ఈ దేశ కాల నియమ క్రమములన్నీ వాస్తవానికి ఎక్కడ ఉన్నాయి? శ్రీరాముడు : అవును… ఎక్కడున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఇవన్నీ బుద్ధిమయమగు చిదాత్మయందు అధ్యస్తమై ఉన్నాయి. అంతేగాని దేశ కాల వ్యవహారములన్నీ బయట ఎక్కడో లేవు.
చైతన్యము స్వరూపరహితంగా ఎరుగబడునప్పుడు… అట్టి చైతన్యమునందు అల్ప దేశకాలములు
గాని, వాటిలో విశాల దేశ కాలములుగాని సంభవించవు.
కానీ… చైతన్యము స్వరూపసహితంగా ఎరుగబడినప్పుడు దేశకాలముల అనుభూతులు సంభవిస్తాయి. చైతన్యము యొక్క బుద్ధిపూర్వకమైన అనుభవమును అనుసరించి అల్పదేశకాలముల పరిధిలో విశాల దేశకాలముల అనుభవం సంభవించవచ్చు. లేదా, విశాల దేశ కాలాల పరిధిలో అల్పదేశకాలముల అనుభవం ప్రాప్తించవచ్చు.
ఈ కారణం చేత వాసనారాహిత్యం విజయపూర్వకంగా సాధించినప్పటికీ ఆ వీతహవ్యుడు కించిత్ ప్రారబ్ధ సంస్కారశేషం చేత తన హృదయస్థమైన ’చిదాకాశము’నందు వివిధ జగత్తులు, ఇంద్రత్వం, దేవతలచే పూజలు గాంచటం జరిగింది.
శ్రీరాముడు : జ్ఞానులలో కూడా వాసనలు ఉంటాయా? ఉంటే, ఆ వాసనలకు, ఈ సంసారజీవుల వాసనలకు భేదమేమైనా ఉంటుందా?
శ్రీవసిష్ఠమహర్షి : : భేదం ఉంటుంది. బాగుగా వేయించిన విత్తనం బయటకు చూడటానికి మామూలు విత్తనంలాగానే ఉంటుంది. కానీ, లోన ‘అంకురించుట’ మనే స్వభావం కలిగి ఉండదు కదా! జ్ఞానులలో శేషించి ఉండే వాసనలు ‘తదనంతర జన్మములు - పరిణామములు’ కలిగి ఉండవు. వారి ఆయా కార్యక్రమములు వారియందు ఇచ్చ, అభిలాష, అభినివేశము కలిగించవు. సాంసారిక
Page:650
జీవుడు ప్రతి కర్మచేత అద్దాని ప్రయోజనము వైపు తరలించబడుచున్నాడు. నిత్యానిత్య వివేకియగు జ్ఞానిని కర్మలు తాకలేకపోతున్నాయి.
ఇక మనం వీతహవ్యుని తదనంతర వృత్తాంతంలోకి వద్దాం. అటు తరువాత ఆ వీతహవ్యుడు త్రికాలజ్ఞుడయ్యాడు. అనేక విద్యలందు నిపుణుడైయ్యాడు. ఒక కల్పము కాలం నిర్మల జ్ఞానంతో మహేశ్వరగణమునకు నాయకత్వం వహించాడు. ఎవడు ఎట్టి సంస్కారం కలిగి ఉంటాడో… ఆతడు అట్లే ఈ దృశ్య విషయములు పొందుతూ ఉంటాడని అనుకొన్నాం కదా! ప్రారబ్ధకర్మ యొక్క దృఢ సంస్కారం జీవన్ముక్తుడైన వాని యందు కూడా ఆవిర్భవిస్తూ ఉంటుంది. అందుచేతనే వీతహవ్యుడు మనం చెప్పుకొనే అనుభవాలన్నీ పొందటం జరుగుతోంది.
శ్రీరాముడు : మహాత్మా! సందర్భోచితమనుకుని ప్రశ్నిస్తున్నాను. జీవన్ముక్తుని యందు కూడా బంధమోక్షముల దృష్టి ఉంటుందా?
శ్రీవసిష్ఠ మహర్షి : "ఒక జీవుడు ఈ దృశ్యమును ఏ దృష్టితో చూస్తున్నాడు…?” అను దానిని బట్టి గదా, బంధమోక్షములు ఉండేవి! అందరికీ ప్రత్యక్షమైయుండే ఈ జగత్తు అంతాకూడా జీవన్ముక్తుని దృష్టి యందు శాంతమై, నిర్మలమై ప్రశాంతాకాశసదృశమై, కేవలం బ్రహ్మమే, అయి ఉంటోంది. ఇక వారికి ‘ఇది ఇంతవరకు బంధం, ఇక్కడ నుండి ఇది మోక్షం’ అనే అల్ప సంభావనయే ఉండదు. ప్రారబ్దానుగతంగా, లేక, సంస్కారానుగతంగా ఏది ఎట్లు ప్రాప్తించినా కూడా… లేక, ప్రాప్తించకున్నా కూడా వారు దేని పట్లా అభ్యంతర - నిరభ్యంతరములు అనుస్వాదించరు. కలిగి ఉండరు.
జీవన్ముక్తత్వము "1. దృష్టికి, 2. అవగాహనకు, 3. ప్రభావితమగుటకు” సంబంధించినది. అంతేగాని అది కర్మలందు పాల్గొనటానికి, పాల్గొనక పోవటానికి సంబంధించినది కాదు. మరల చెపుతున్నాను…
సంవిద్రూపమగు చిదాకాశము ఎచట ఏ విధంగా భావనా పూర్వకంగా భాసిస్తుందో అచట ఆ విధంగానే అంతటా వ్యాప్తిపొందినదై ఉంటోంది.
ఏ అనుభవములు రాక, పోకలు చేస్తున్నప్పటికీ వీతహవ్యుడు మాత్రం స్వస్వరూపధ్యానం (ధ్యాస) వీడటం లేదు. "నేను అఖండము, అప్రమేయము, నిర్గుణము అగు బ్రహ్మమునే” అనే స్పష్టాతి స్పష్టమైన నిశ్చయమును కలిగి ఉండుటచే… తదితరంగా తారసపడేదంతా ఆతనికి స్వప్న తుల్యంగానే అనిపిస్తోంది. ఆత్మ స్వభావము నుండి ఏమాత్రం చ్యుతి పొందకుండానే ఆతడు అనేక జగత్తులను క్రీడా మాత్రంగా అనుభవించాడు….!
శ్రీరాముడు : వీతహవ్యుని జగదనుభవములు మనకు తారసపడుచున్న జగదనుభవము వంటిదేనా? ఆతని బ్రహ్మాండానుభవములకు, మన జగద్దర్శనమునకు ఏదైనా భేదముంటుందా?
శ్రీవసిష్ఠ మహర్షి : వీతహవ్యుని హృదయమునందలి చైతన్యము నావంటి - నీవంటి - సర్వజీవుల వంటి హృదయ చైతన్యమే. అయితే ఆత్మతో ఏకీభావం పొందినవానికి తదితర జీవులందరి అనుభవం
Page:651
తనదే కాగలదు. ఓ రామా! అందరి దృశ్యానుభవం వంటిదే ఆతనిది కూడా! ఎటొచ్చీ, ఆయన అభ్యాసవశం చేత ఆత్మతత్త్వమును ఎరిగి ఉన్నారు.
ఆయనకి అనుభవములగుచున్న బ్రహ్మాండములు అసంఖ్యాకములై, రూపరహితములై ఉన్నాయి. ప్రతిభాసాదృష్టిచే అత్యంత సువిశాలములై ఉన్నాయి. ఆతనికి అవన్నీ స్వయం కల్పితంగానే అనుభవమగుచున్నాయి. అట్టి స్వకల్పిత బ్రహ్మాండమునందు ఒక సమయంలో ‘నేను ఇంద్రుడను’ అను అనుభవం ఆయన పొందారు. ఇంకొక సమయంలో ఇంకొక బ్రహ్మదేవుని కల్పంలో ప్రవేశించి గణపతి అయి, కైలాసమున ఉండేవారు. అవన్నీ కూడా మానసికమైనవే సుమా! అయితే భౌతిక అనుభవములకు - మానసికానుభవములకు నిత్యానిత్య వివేక దృష్టిలో భేదం లేదు.
అజ్ఞానదృష్టి కలవానికి, “నాచే దర్శించబడుచున్న ఈ బ్రహ్మాండములు, ఈ దృశ్యపరంపరలు నాకు ఎదురుగా మరెవ్వరో కల్పించి చూపిస్తున్నారు” అనే స్వయంకల్పితభ్రమ కొనసాగుతూనే ఉంటుంది.
అజ్ఞాన జీవుల ప్రయాణములు కూడా ఇట్టివే. అయితే వారు జన్మలు… వాటి నుండి వాసనలు… ఆ వాసనల నుండి జన్మలు… ఇట్లా పరంపరలుగా సాగుతూ ఉంటోంది. జీవన్ముక్తుని విషయం అట్లా ఉండుట లేదు. ఆతనిపట్ల సంకల్పములు స్వబుద్ధికి అధీనమై ఉంటున్నాయి. అందుకు కారణం, “నేను ఆత్మస్వరూపుడను కదా!"… అను అవగాహనయే!
శ్రీరాముడు : వీతహవ్యుని జగత్తులన్నీ మానసికమైనప్పుడు, అవి బాహ్యమున ఇంద్రుడు అవటం మొదలైన రూపాలుగా సంప్రాప్తిస్తున్నాయా? అవి బాహ్యమైనవైతే… ఆతడు విద్యాధరుడు, ఇంద్రుడు మొదలైన ఉపాధులు ఆశ్రయించాడా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆతని అనుభవాలన్నీ మానసికమైనవే. అయినా ఆతని వివిధ మనోప్రసరణలలో (విద్యాధరుడు ఇంద్రుడు - గణపతి మొదలైన అనుభవాలలో) తదితర సంబంధిత జీవులు సచేతనులై ప్రాప్తించారు. అట్టి వివిధానుభవముల తరుణంలో ‘నేను వీతహవ్యుడను’ అను ఎరుకను వదలలేదు. అయితే ఆతని దృష్టి అత్యంత పవిత్రమై ఉండుటచే “నేను దేహాదులకు సంబంధించని ఆత్మ సత్తను” అను బ్రాహ్మీదృష్టిని ఆయన వహించియే ఉన్నారు.
మనకు కనబడే ఈ సచేతన సృష్టికూడా మనకు భ్రాంతి, స్వప్నమాత్రమై ఆ వీతహవ్యునికి ప్రాప్తించినట్లే ప్రాప్తిస్తోంది. మనచే చూడబడుచున్న ఈ జగత్తు మనకు స్వప్నమువంటిదే అయినా, ఇక్కడ మనకు తదితర సచేతన జీవులు తారసపడుచున్నారు. జ్ఞాన దృష్టి దృఢపడితే నేను, నాకు తారసపడే ఈ సచేతనజీవులు - అంతయూ ఆత్మయే - అను అనుభవం స్పష్టపడి ఉంటూనే, తదితరమంతా యథారీతిగా ఉండగలదు.
బ్రాహ్మీదృష్టి, సాంసారిక దృష్టి - ఈ రెండిటి చమత్కారమును నీవు గ్రహించు. ఇక్కడ నీకు తారసపడే తండ్రీ, గురువులు, సభికులు, సోదరులు, అయోధ్యా ప్రజలు - అంతా ఆత్మానుభవం దృష్ట్యా - - భ్రాంతి మాత్రమే. అనగా అదంతా మనస్సు యొక్క కల్పిత భ్రమ మాత్రమే. అట్లే
Page:652
వీతహవ్యుని విషయంలో కూడా జరుగుతోంది. అయితే ఆతని జగత్తు దీనికి సదృశమైనది (ఈ జగత్తులో ఒకానొక చోటు) కాదు. అయితే, ఈ జగత్తు - ఆతని జగత్తు … రెండూ లేనివే. కేవలం బ్రహ్మమే ఇక్కడా, అక్కడా కూడా భాసిస్తోందని మాత్రం గ్రహించు.
*
భూత - భవిష్యత్ - వర్తమాన కాలములందలి, ఏఏ జీవునికైనా సరే… దృశ్యమానమయ్యే ‘జగత్తు’ అనబడేదంతా మనోమయమైనదేగాని మరింకేమీ కాదు. ఎంతవరకు దీని వాస్తవరూపం ఎరుగబడదో… ఎంతవరకు వజ్రంలాగా, పంజరంలాగా భావానుభవపరిమితమై ఉంటోందో… అంతవరకు చిదాకాశము ఎరుగబడకయే ఉంటోంది.
అజ్ఞానాన్మన ఏవేద మిత్థం సంప్రవిజృమృతే |
ప్రత్యుల్లాసవిలాసాభ్యాం జలమమ్బునిధానివ ॥ (శ్లో 43, సర్గ 85)
సముద్రంలో జలం తరంగాలరూపంలో విస్తరిస్తోంది చూచావా? మనోమయజగత్తు కూడా ఆత్మయందు ‘ఉత్పత్తి-వృద్ధి-క్షయము’ల రూపంలో విస్తరిస్తోంది.
శ్రీరాముడు : ఈ మనోమయజగత్తులను ఎవరు కల్పిస్తున్నారు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఎవరూ కల్పించటం లేదు. నిర్వికారమై నిరాకారమై, చిదాకాశస్వభావమై ఉన్న బ్రహ్మమే స్వయముగా, స్వమాయచే తనయొక్క కించిత్ ప్రదేశంలో మనోమయ జగత్తుల రూపంగా చేష్టితమగుచున్నది. అనగా, తనను తానే చిత్తము రూపమున కల్పించుకొనుచున్నది. అట్టి చిత్తము యొక్క మననశక్తియే మనోరూపం పొందుతోంది. ఆ మనస్సుచే తనయందు ఈ సువిశాల జగత్తును కల్పించుకొనుచున్నది. మనస్సే ఈ దృశ్యమంతా అంతర్లీనంగా వ్యాపించియున్నది. కానీ యథార్థానికి బ్రహ్మము కంటే భిన్నంగా ఇది దేనిచేతా వ్యాపించబడిఉండలేదు.
అనగా రామా! మరొక రీతిగా చెప్పాలంటే… నీకు ఏది జగత్తె కనిపిస్తోందో… అదంతా నీవు నీ స్వకీయ మాయచే అట్లు నిర్మించుకొని అనుభవిస్తున్నావు. నీ స్వరూపవిస్తీర్ణమునే జగత్తుగా గాంచుచున్నావు.
ఆత్మ దృష్టిని గ్రహించినప్పుడు నీవు ఈ నా వాక్యాల సారం గ్రహిస్తావు. ప్రతిజీవుని యొక్క దృశ్యజగత్ చమత్కారమంతా ఇట్టిదే! వీతహవ్యుడు ఆత్మదృష్టిని గ్రహించి, తదితర జగత్తులను గాంచుచున్నాడు.
శ్రీరాముడు : హే మహర్షీ! వీతహవ్యముని ఇంద్రత్వం, గణపతిత్వం మొదలైనవన్నీ పొందారని చెప్పారు కదా! అవన్నీ తన భౌతిక దేహంతోనే పొందారా?
Page:653
శ్రీవసిష్ఠ మహర్షి : లేదు… అవన్నీ మనస్సుతోనే పొందారు. అయితే, ఆతని మనోదేహం భౌతికదేహ దృశ్యాది కల్పనంతా మనవలెనే గాంచటం జరిగింది.
శ్రీరాముడు : ఆతని భౌతికదేహం వింధ్యపర్వత ప్రాంతంలో ఆశ్రమంలోనే ఉండిపోయింది కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అక్కడే మట్టిలోనే కూరుకుపోయి ఉన్నది.
శ్రీరాముడు : అయితే ఆయన మరల ఆయా అనుభవాల తరువాత ఆ శరీరంలో ప్రవేశించారా? ఎట్లా ప్రవేశించారు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ చమత్కార వైనమేమిటో చెపుతాను, విను“ఈ సర్వజగత్తు బ్రహ్మమే” అని మరికొంత నిర్ణయించుకున్న తరువాత ఆ వీతహవ్యుని మనస్సు తనకు తాను అనంతాత్మ స్వరూపంగా రూపుదిద్దుకున్నది. ప్రారబ్ధానుసారం ఆ
అక్కడే పర్ణశాలలో ఉంచుకొని విద్యాధరత్వం, ఇంద్రత్వం, గణపతిత్వం పొందింది.
ఒక సమయంలో ఆ వీతహవ్యుడు పరమేశ్వరుని గణనాయకుడై ఉన్నారని అనుకున్నాం కదా! ఆ సమయంలో ఒక రోజు ఆయా కార్యవ్యవహారములు నిర్వర్తించిన తరువాత కైలాసంలోని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆత్మధ్యానం చేయసాగాడు. ఆ సమయంలో కొంతసేపు తాను ఇతఃపూర్వం పొందియున్న అనేక దేహపరంపరల గురించి చమత్కారపూర్వకంగా పునశ్చరణ చేయసాగాడు. నశించినవి ఇంకా నశించనివి అయిన అనేక దేహాలు పరికించాడు. అట్టి నశించని దేహములలో వింధ్యపర్వత ప్రాంతంలో భౌతికస్థితిలో భూమిలో కీటకంలా పాతుకుపోయి ఉన్న వీతహవ్య నామధేయము గల భౌతిక దేహం దివ్యదృష్టిచే గమనించాడు.
ఆ దేహం వర్షాకాలపు ప్రవాహంచే కొట్టుకుపోబడి కొంత దూరప్రాంతంలోని ఒక కాలవ సమీపంలోని మట్టిలో లోపలగా ఎక్కడో కూరుకుపోయి ఉన్నది. వీపు వెనుక భాగమంతా బురదతో కప్పబడి ఉన్నది. శరీరమంతా నీటి ఆకులతో కప్పబడి ఉన్నది. పైన నీటి మొక్కలు మొలచి ఉన్నాయి. బాహ్యానికి అక్కడొక మురికినీటి గుంట మాత్రమే కనబడుతోంది గాని, మట్టిలో జీవఛాయ ఉన్న దేహమున్నదని ఎవరికీ ఏమాత్రం అనిపించే అవకాశమే లేదు.
తన అపంచీకృత గణపతి సూక్ష్మశరీరంతో ఇదంతా దర్శించిన ఆ మునికి తిరిగి ఆ శరీరంలో ప్రవేశించాలని అభిలాష ఏర్పడింది. ఇట్లు తనలో యోచించాడు.
వీతహవ్యుడు : ఇప్పుడు ఈ అపంచీకృత సూక్ష్మశరీరముతో రుద్ర గణమునకు నాయకుడనై ఇన్ని యుగాలు ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు నేను వీతహవ్య నామధేయమైన స్థూలశరీరంలో ప్రవేశించాలి. అయితే ఆ దేహము యొక్క సర్వాంగాలు భౌతికంగా 300 సంవత్సరాలు ప్రాణసంచారం లేక పోవటంచే బిఱుగా బిగదీసుకుని ఉన్నాయి. అందులో ప్రాణసంచలనం ఉద్దరించటమెట్లా? ఈ విషయం తన రుద్రగణంలో ఒక మిత్రుడు, పూర్ణజ్ఞాని అయిన ఒక సహచరుని సమీపించి చర్చించసాగాడు.
Page:654
వీతహవ్యుడు : మిత్రమా! నేను మరల శిథిలమై వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక ప్రదేశంలో బురదలో ఎక్కడో అంతర్భాగములో నిస్తేజంగా పడి ఉన్న వీతహవ్యభౌతిక దేహంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను. నా యొక్క కించిత్ ధ్యాసచే నా ప్రాణశక్తి అప్రసరణరూపంగా ఆ దేహంలో ఇంకా ఏర్పడియే ఉన్నది. ఆ దేహమును ఉత్తేజ పరచటమెట్లా?
రుద్రగణ సహచరుడు : స్నేహితుడా! మీరు ఆయా దేహములందు చేసి ఉన్న ఉత్తమజ్ఞాన సముపార్జనచే అత్యంత నిర్మలాత్మస్వభావులైనారని అందరూ అనుకుంటున్నారు కదా! మరల మీకు ఆ దేహలీలచే వచ్చే ప్రయోజనమేమున్నది?
వీతహవ్యుడు : నిజమే! నాకు ఆ దేహము గ్రహించుట చేతగాని, త్యజించుట చేతగాని క్రొత్తదైన ప్రయోజనమేమిలేదు. అయితే దేహగ్రహణము ఎట్టిదో… దేహత్యాజ్యము అట్టిదే కదా! కొంతకాలం క్రితం నేను ఆ శరీరంలో ప్రాణమును స్తంభింపజేసి, మనో దేహముతో బయల్వెడలి గణపతిత్వం వంటి ఆయా ప్రారబ్ధనియమాకమైన విధులను నిర్వర్తించాను. ప్రాణములు స్తంభన రూపంగా ఆ వీతహవ్య దేహంలో ఇంకనూ నిలచి ఉన్నాయి. కనుక ఆ దేహము పరమాణు రూపం పొందేంత వరకు ఆ దేహము ధరించి ఆ దేహము యొక్క వినాశనముతో బాటే నేను విదేహముక్తుడనౌతాను. స్వాత్మపదమును పొందుతూ నిర్విఘ్నంగా శాంతిని పొందుతాను.
రుద్రగణ సహచరుడు : మంచిది. మీ అభిమతానుసారం అట్లే అగు గాక! ఆ దేహములోని ప్రాణ శక్తిని తిరిగి ఉత్తేజపరచటం మీరు ఎరిగి ఉన్నదే! అయినా, అడిగారు కదా… చెప్పుచున్నాను. సూర్యమండలంలోని సూర్యగణనాయకుడగు పింగళుని ఆశ్రయించండి. ఆతడే దేహముల ప్రాణశక్తికి అధిపతి. మీరు కోరితే ఆయన తప్పక సహకరిస్తారు. దర్పణంలో ప్రతిబింబం ప్రవేశించినట్లు మీరు సూర్యమండలంలో ప్రవేశించండి. మీకు కార్యసిద్ధి కాగలదు.
అపంచీకృతమగు గణపతి స్వరూపుడైన వీతహవ్యుడు అప్పుడు ఆ సహచరునికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నారు. కొలిమితిత్తిలోని అవకాశంలాగా సూక్ష్మమైనట్టి తన లింగదేహముతో సూర్యమండలములోకి ప్రవిష్టుడయ్యారు.
అప్పుడు మననశీలుడు, ఉదారబుద్ధి యగు సూర్యభగవానుడు తన హృదయంలో ప్రవేశించిన వీతహవ్యమునీంద్రుని చూచారు. ఆతని కోరిక ఏమిటో క్షణంలో తెలుసుకొన్నారు. ఆ మునీంద్రుడు తన పూర్వ పర దేహములన్నీ మననం చేయుచూ… వింధ్య పర్వత ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయి ఉన్న వీతహవ్యదేహంలో ప్రవేశించి, దానిని చేష్టాసహితం చేసి, ఆ దేహపతనానంతరం విదేహముక్తిని ఆశ్రయించాలని ఉద్దేశిస్తున్నాడని గమనించారు. ఆకాశమధ్యంలో ఉండే పింగళుడు అనే తన సూర్యగణనాయకుని పిలిచి అర్హమైన రీతిలో ఆజ్ఞాపించారు.
అప్పుడు వాయురూపమగు వీతహవ్యుని సూక్ష్మశరీర సంవిత్తు పూజ్యాతి పూజ్యుడగు సూర్య భగవానునికి సాష్టాంగదండ ప్రణామం ఆచరించింది. సూర్యభగవానునిచే సన్మానపూర్వకంగా
Page:655
ఆశీర్వదించబడిన వాడై, ఆ వీతహవ్యుడు స్వకార్య నిర్వహణకు సంసిద్ధుడైయ్యారు. తన దేహం ఉన్న చోటికి పయనిస్తున్న పింగళుని హృదయంలో ప్రవేశించారు. పింగళుడు ఆకాశమును వీడి ఆ శరీరము కూరుకుపోయి ఉన్న చోటికి ప్రవేశించారు. సారసపక్షి బురదనుండి కమలమును తీయునట్లు పింగళుడు బురదలోంచి వీతహవ్యుని భౌతిక దేహం బయటకు తీశాడు.
అప్పుడాముని సూక్ష్మశరీరం పింగళుని హృదయంలో నుండి ఆ భౌతిక దేహంలో ప్రవేశించింది. పింగళుడు తన సంకల్పశక్తిచే తిరిగి ప్రాణములను యథాతథంగా ప్రకోపింపజేసి ఆ తరువాత స్వస్థానమునకు తిరిగి వెళ్ళిపోయారు.
వీతహవ్యుడు ఆ శరీరముతో అక్కడి నుండి లేచి సమీపంలో గల సరోవరం ప్రవేశించాడు. స్నానం ఆచరించి కృతజ్ఞతలతో, భక్తితో సూర్యస్తవంచేశారు. మనోభూషితమగు తన మునుపటి శరీరంతో ప్రకాశించాడు. జీవన్ముక్తులందు స్వతఃసిద్ధంగా ఉండే సమత్వము, పరమశాంతి, మైత్రి, ప్రసన్నత్వము, కరుణ మొదలైన గుణములతో శోభించారు.
సర్వ సంగవినిర్ముక్తమైన మనస్సుగల ఆ ముని అక్కడ నది ఒడ్డున ఒక రోజు గడిపాడు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ ముని అక్కడి నుండి బయలుదేరి వింధ్య పర్వత ప్రాంతంలో తనకు ఇతః పూర్వం బాగా పరిచయమైయున్న ఒక గుహలో ప్రవేశించాడు. అక్కడ గల ఒక ఎత్తైన శిలపై సుఖాసీనులైనాడు.
వీతహవ్యుడు : (తన అంతరంగంలో) అమ్మయ్య! ఈ ప్రపంచం యొక్క సారాసారమేమిటో ఎరిగినాను. ఇతఃపూర్వమే ఇంద్రియములను, చిత్తమును సమాధానపరచాను కదా! ఇక దీర్ఘ చింతనలతో నాకేమి పని ఉన్నది? కల్పనలన్నిటినీ మృదువైన తీగ త్రుంచినట్లు త్రుంచివేస్తున్నాను. ఇక ఈ ప్రపంచమును, పదునాలుగు లోకములను నా దృష్టి నుండి త్యజించివేస్తాను. ఏకమగు చిన్మాత్ర స్వరూపుడనౌతాను.
ద్వైతమును స్వీకరించనప్పుడు నాకు ఈ జాగ్రత్ సుషుప్తివంటిదే అవుతుంది కదా! అయితే, జాగ్రత్హితస్థితిలో ఆత్మను దర్శించుటకై మేలుకొని ఉంటాను. కనుక, నా సుషుప్తి జాగ్రత్తో సమానమౌతుంది. తురీయపదమును అవలంబించి, ఈ శరీరం పతనం అయ్యే వరకు ఆ పదమును వీడను. మనస్సుకు పూర్తిగా అతీతుడనై, ఆ మనస్సు యొక్క సాక్షీతత్వమునందు ప్రవేశిస్తాను. అంతటా వ్యాపించి ఏకమైయున్నట్టి వికారరహితమగు పరమాత్మయందు స్థాణువువలె స్థితిపొంది
ఉంటాను.
x
Page:656
ఈ విధంగా వీతహవ్యుడు పూర్ణ నిశ్చయుడయ్యాడు. ఆ గుహలోనే ఆరు రోజులు ధ్యానతత్పరు డయ్యాడు. తదనంతరం ఒక బాటసారి చెట్టు క్రింద కొద్ది క్షణములు విశ్రమించి లేచు విధంగా, మరల ఆ సమాధి నుండి మేల్కాంచాడు. సిద్ధుడై, చాలాకాలం ఈ భూమిపై సంచరించాడు.
అట్టి సంచార సమయంలో ఏ వస్తువునూ ప్రశంసించేవాడు కాదు. దేనినీ నిందించేవాడు కాదు. సదా సర్వదా హర్ష శోక భయ రహితుడై ఉండేవాడు. నడచుచున్నప్పుడు, కదలుచున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు అతని హృదయంలో మనస్సు విషయమై మథనం కొనసాగుతూ ఉండేది.
అంతర్మథనం -
వీతహవ్యుడు : ఓ చపల శ్రేష్ఠ! మనస్సా! ముందు ముందు కూడా నీవు నా వెంటనంటి ఉండదలచుకుంటే… నాకేమీ అభ్యంతరం లేదు. అయితే నీవు నీ చపలత్వం మాత్రం విడిచిపెట్టవలసి ఉంటుంది. సరియే కదా!
ఓ ఆశా పాశములారా! ఓ ఇంద్రియములారా! ఈ ఆత్మ మీది కాదు. మీరు శిథిలమై కాలముచే మ్రింగబడినప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కదా? ఇంక అది మీదెట్లా అవుతుంది? ఆత్మకు మీతో సంబంధము లేదని ఎరిగిన మరుక్షణం మీరు నాచే జయింపబడినవారే అగుచున్నారు. మీరు ఈ ప్రపంచంలో ప్రవేశించి ఆశించేవి, ఆశ్రయించేవీ… అన్నీ కూడా అర్థం లేనివి, వ్యర్థమైనవి అవుతున్నాయి.
మీరు ఆత్మకు చెందరు… ఆత్మ మీకు చెందినది కాదు. విఫలస్వరూపులగు మీరు ఆత్మ స్వరూపుడనగు నాపై దండయాత్ర సలపటమా?… ఎట్లా సాధ్యం? “మేమే సత్యం, మేమే ఆత్మ? మేమే లేకపోతే జీవుడి గతి నిర్గతే” అనే ప్రలాపములు నాకు ఆత్మవిస్మరణ సమయంలో మాత్రమే వినబడుచున్నాయి. ‘అనాత్మ యందు ఆత్మత్వం’ అంటే అదే. ‘వస్తువు నందు అవస్తుత్వం’ అంటే కూడా అదే. అవిచారణచే జనించేది విచారణచే నశిస్తోంది.
ఓ ఇంద్రియములారా! కరణ భూతములగు మీరు వేరు. మిమ్ములను అభిమానించు స్వభావముగల జీవులు వేరు. ప్రాణప్రేరితమగు క్రియా కారణత్వము వేరు. భోక్తయగు చిదాభాసుడు వేరు. గ్రహించునట్టి మనస్సు వేరు. అద్వైతమగు బ్రహ్మము వేరు … ఈ ఆరింటిలో దేనికదే తమ తమ స్వభావము కలిగి ఉండగా, ఎవరి పని వారిదే అయి ఉండగా ఒకదానిని మరొకటి ఎట్లా పరిమితం చేస్తుంది?
అడవిలో పెద్ద పెద్ద వృక్షములు లభిస్తున్నాయి. వాటిని ఛేదించటానికి కంసాలిచే తయారు చేయబడిన గొడ్డలి, బాసిక మొదలైన సాధనములు ఇనుముతో తయారవుతున్నాయి. కొట్టిన చెట్టు కొమ్మలను కట్టి నివాసస్థలానికి తేవటానికి వెదురు చర్మపు త్రాళ్ళు ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఏవేవో ఎక్కడెక్కడో లభించే సామాగ్రిని ఉపయోగించగా ‘గృహం’ తయారవుతోంది. ఈ శరీరం విషయం కూడా అట్టిదే!
Page:657
కార్యకారణ సంఘాతం చేత కళ్ళు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి… నోరు మాట్లాడుతోంది… చేతులు కదులుచున్నాయి… అల్ప దీర్ఘ ఫలప్రదములగు ఆయా ఇంద్రియములు తమతమ జ్ఞానేంద్రియములచే నియమించబడుచున్నాయి.
కాకతాళీయంగా కార్యవ్యవహారమంతా సిద్ధిస్తోంది. ఈ శరీరవ్యవహారమంతా ఇట్లుండగా… దీని ఆగమన నిష్క్రమణములచే ఎవరికి ఏమి లాభం? ఏమి నష్టం?
ఇప్పుడు అవిద్య పూర్తిగా తొలగిపోయింది. ఆత్మవిద్య సుస్పష్టమయింది. సత్తు అనుకున్నది అసత్తుగానూ, అసత్తు అనుకున్నది సత్తుగానూ తెలిసిపోయింది. విఘ్నములన్నీ ఉపశమిస్తున్నాయి. ఎప్పటికీ ఉండతగినదేదో … అది అప్రమేయమై, ప్రాప్తాప్రాప్తములచే స్పర్శించబడనిదై ఎప్పటికీ
ఉండియే తీరుతోంది.
ఇక, మిగతాదంతా, ఏది ఎట్లుంటోందో… అట్లే ఉండుగాక! నేను సర్వదా ప్రత్యేకమైన స్వరూపం గల వాడినే. ఈ దేహాదులు, తదితర దేహసంబంధములు నాకు సంబంధించినవి కావు.
అంతేకాదు. నాయందు ఏది తేజోరూపమై వెలయుచున్నదో… అదియే అన్ని దేహములందూ అట్లే వెలయుచున్నది. అందుచేత అందరూ, అన్ని జీవులూ, అన్ని లోకాలూ నా వారే! నావే! నేనే! అయితే, నాయందు నేను కానిదేమి ఉంటుంది?… నేను కానిదంతా లేనిదే! కాబట్టి ’నీవు - ఆతడు’ అనునవన్నీ ఒకే సమయంలో ‘నేనే’ అయి, ‘నేనుకానివి’ అయిఉంటున్నాయి.
ఇక మౌనమే నా అనుభవం, స్వరూపం, స్వభావం కూడా!
శ్రీవసిష్ఠ మహర్షి : మునిశ్రేష్ఠుడు, మహాతపస్వి అగు ఆ వీతహవ్యుడు ఈ ప్రపంచంలో సంచరిస్తూనే పునరాగమనరహితమగు బ్రహ్మ పదమున స్థితి పొందారు. చింతారహితుడు, అజ్ఞాన వర్జితుడు అయ్యాడు. అప్పుడు కూడా ఆయా పదార్థములనుండి కలిగే అనర్థములు నివారించటానికి ధ్యాన యోగం అవలంబిస్తూ ఉండేవాడు. సదా ఆత్మ సుఖమును చవిచూస్తూ ఉండేవాడు. ఆయా పదార్థములు, స్నేహాదులు తారసపడుచున్నప్పటికీ ఆతనికి వాటిపట్ల ’త్యాజ్య గ్రాహ్య’ దృష్టి ఉండేది కాదు. మనస్సునందు జనించే ఇచ్చ, అనిచ్ఛాదులకు ఆతడు అతీతుడై ఉంటూ ఉండేవారు. ఎల్లప్పుడూ కేవలీభావము (A sense of Absoluteness) అవధరించి ఉంటూ ఉండేవారు. “నాకు జన్మ కర్మలు ఉండవు” అను ఎరుకచే సంసారపరిత్యాగము కాగా, అప్పుడు శేషించియున్న బ్రహ్మానందమునందు తేలియాడుతూ ఉండేవాడు.
అట్లు చాలా రోజులు గడచిన తరువాత ఆయన పర్వతములోగల ఒక గుహలో ప్రవేశించారు. మహనీయులు తమ అభ్యాసమును విడువరు కదా! ఒక్కసారి మరల ఈ జగజ్జాలమంతా వీక్షించ టానికి ఆ గుహలో ఆసీనులై పద్మాసనమువైచుకుని… తనలో తాను ఇట్లు ప్రసంగించుకోసాగారు.
Page:658
వీతహవ్యముని : ఓ రాగమా! నీ విప్పుడు ఆత్మానురాగత్వము పొందుము. ఓ ద్వేషమా! నీవిక నిర్దోషిత్వం పొందుము. మీ ఇద్దరితో ఇప్పటికే చాలాకాలం క్రీడించాను కదా!… ఇక చాలు.
ఓ భోగములారా! మీ అందరికి ఇదే తుది నమస్కారం. తల్లి తండ్రులచే పిల్లవాడు లాలించ బడినట్లు… మీచే కోట్లాది జన్మలుగా లాలించబడ్డాను. ఇక చాలు, మీతో సమాగమం. ఇక
ఉపశమించండి.
ఓ ఇంద్రియ విషయములారా! మీ శబ్ద - - స్పర్శ - రూప - రస - - గంధ స్వరూపములతో పరమ పదమగు ఈ వర్తమాన నిర్వాణ గతిని మరిపించటానికి ప్రయత్నించకండి. మీకో నమస్కారం.
ఓ ప్రియమిత్రమా! దుఃఖమా! నీవు నాకు అనేకసార్లు ‘రోదన’ కలిగింపజేశావు. అయినా నీవు నాకు ప్రియమిత్రుడవే. ఎందుకంటే, నీచే సంతృప్తుడనైన నేను ఆదరముగా ఆత్మను అన్వేషించాను. ఈ ఆత్మమార్గోపదేశంలోకి నన్ను ప్రేరేపించింది నీవే. నీకు మరల మరల నమస్కరిస్తున్నాను. మేడపైకి వెళ్లువాడు మార్గంలోని మెట్లను వదలునట్లు నేను నిన్ను ఇక్కడే త్యజిస్తున్నాను. నీ కృపచే ఆత్మపదం లభించింది. ‘దుఃఖము’ అనే పేరుతో పిలువబడుచున్నప్పటికీ, చివరకు సుఖమునే ప్రాప్తింపజేసిన ఓ నేస్తం! నీకు జోహార్లు. కృతజ్ఞతలు.
ఈ ప్రపంచమున అసారమగు జీవితం కలిగియున్న దేహమనే సహచరుడా! - ధ్యానము, యోగసాధన మొదలైనవాటి యందు నీవు నాకు గొప్ప ఉపకరణముపై సహకరించావు. నీ సహాయంతో నాకు ఆత్మ సామీప్యత లభిస్తోంది. నీవు సాధనపరులకు మంచి మిత్రుడుగాను, దుర్వ్యసనపరులగు సత్సాధనరహితులకు చెడ్డ మిత్రుడుగానూ అవుతూ ఉంటావు. నీయొక్క, నాయొక్క వియోగం అనాదియగు నియతియొక్క స్వభావమే అయిఉన్నది కదా! ఒక జీవుడు ’స్వార్థ గతి’ని ఆశ్రయించినా, లేక, ‘పరమార్థగతి’ని అభిలషించినా… ఒకనాటికి నీతో వియోగం తప్పునది కాదు. అనేక జన్మలుగా నీతో సంయోగ, వియోగములు అనుభవిస్తూ వచ్చాను. ఆత్మ జ్ఞానవశంచేత నీతో అవినాభావత్వానికి హాని కలుగుచున్నది.
ఆత్మభావం నాకందించి, తద్వారా, నీకు నీవే సమర్పణ చేసుకుంటున్నావు. నీత్యాగం మరింకెవరికి వస్తుంది? నిన్ను మరింకెవరూ నాశనము చేయుట లేదు. నిన్ను నీవే నాశనమొనర్చు కొనుచున్నావు.
ఓ తృష్ణగారూ! - నేను శాంతిని పొందుచుండగా, నీవిక ఒంటరిదానివై శుష్కించుచున్నావా? నీ వలన ఎవరికీ శాంతి ఉంటుంది? అందుచేత నీవు ఉపశాంతి పొందటంలో లోకమునకు శుభకరమే. కనుక సెలవు.
ఓ కామమా! - నీ వినాశనము కొరకై నేను అభ్యాస - వైరాగ్యాదులను ఆశ్రయించాను. నీవు ఉన్నంతకాలం తదితర జీవులకు నేను అశాంతిని, భేదమును కలిగించాను కదా! నీవు ప్రకోపించుటచే నేను అనేక ఉపాధులు నష్టపరుచుకున్నాను. ఇప్పుడిక మనిద్దరికీ శాశ్వత వియోగం సంభవించబోతోంది. చాలా సంతోషమైన, పవిత్రమైన క్షణములివి. కనుక ఇక శాంతించు.
Page:659
ఓ నా సుకృత దేవతలారా! - మీకు నమస్కారం. మీరు నన్ను అనేక నరకములనుండి లేవనెత్తి ‘తపస్సు, ధ్యానము’ అను స్వర్గలోకమునకు తీసుకొని వచ్చారు. అందుకు కృతజ్ఞతలు. అయితే, నేను సుకృత, దుష్కృతముల పరిధిని అధిగమించి యోగమార్గంలో ఆత్మావలోకనమును సమీపిస్తున్నాను. తద్వారా కృత్యములన్నీ అధిగమించి కృతకృత్యుడనగుచున్నాను. మీకు నా కృతజ్ఞతలు.
ఓ పాపవృక్షమా! - నీవు “దుష్క్రియలు” అనే క్షేత్రంలో పుట్టావు. "ఇంద్రియ పటాటోపములు” అనే వాయువు ఆస్వాదించావు. ‘దుష్ట అపకార బుద్ధి’ అనే బురదలో పెరిగావు. కోపం - ఆవేశం - ద్వేషం - దురవగాహన - - అపరిపక్వదృష్టి - మదం మాత్సర్యం మొదలైన బురదసారాన్ని స్వీకరించి ఇంతకింత అయ్యావు. నరకయాతనలు, అధమ ఉపాధులు అనే పూలను పూచావు. ‘నీచ జన్మలు - అజ్ఞాన దశలు - అల్ప క్రియలు’ అనే కాయలుగల నీతో కూడి అనేక జన్మలు గడిపాను. నేనెపుడైతే కళ్ళు తెరచి గురువులను, జ్ఞానులను, శాస్త్రములను శరణువేడానో మరుక్షణం నీవు ఎండిపోవటం ప్రారంభించావు. ఇప్పుడు నీవు చచ్చి మోడుబారి ఎండిపోయిన చెట్టుగా అయిపోవటం ముదావహం. ఆత్మను దర్శించిన తరువాత నీలో ఉండే కొంచెం చావకూడా చచ్చిపోయింది. ఇక కూకటి వ్రేళ్ళతోసహా నీవు నేలకూలినట్లే.
ఓ మోహమా? - ఆత్మను దర్శించుచున్న ఈ శుభతరుణంలో నీ నీడకూడా కనిపించటం లేదు. వెలుతురు ఉన్నచోట చీకటి ఉండజాలదు కదా! వెలుతురు లేకపోవటమే చీకటి యొక్క నిర్వచనమయినట్లు, అఖండమగు నా ఆత్మయొక్క స్వభావం ఎరుగకపోవటమే నీయొక్క నిర్వచనం. అందుచేత, ఆత్మ సద్విమర్శనామాత్రంచేత నీవు రహితమగుచున్నావు కదా! మంచిది.
తపస్విని వంటి ఓ పర్వత గుహా! - నీవు వీణానాదము వంటి ప్రతి ధ్వనులతో నన్ను మౌనంగా పలకరించేదానివి. నేను సమాధిలో ప్రవేశించియున్నప్పుడు నన్ను సఖిలాగా సేవించావు. ఆకులు నాపై వ్రాలుచున్నప్పుడు నీ పలకరింపుల చిలకరింపులవలె అనిపించేది. పూర్ణానందస్వరూపమగు ఆత్మయందు విశ్రాంతి కలుగజేయుటద్వారా నాకు మహోపకారం చేశావు. నీ సహకారంతో నాలోని లోభమంతా నశించింది. నాకు స్నేహితునివలె సఖివలె ఇంతకాలం ఉన్నావు. అనేక సంకటములచే ఖిన్నుడనై సమాధి విఘ్నములచే ద్రవీభూతుడనై ఉన్న సమయంలో నిన్ను ఆశ్రయించి, సమీపించాను. అర్ధనారీశ్వరుడగు శివుని ఆశ్రయించి భక్తులు ఉత్తమ ఫలితం పొందినట్లు, నేను నిన్ను ఆశ్రయించి మహదానందమగు ఆత్మావలోకనం పొందాను. నీవు చేసిన సహాయం ఏమని వర్ణించగలను? నీకు శుభమగుగాక!
ఓ దండమా (చేతి కబ్జా)! - నేను అడవులలోనూ, గోతులలోనూ సంచరిచేటప్పుడు నాకు ఆలంబనమయ్యావు. వార్ధక్యంలో పరమ మిత్రుని వంటి నీకు కృతజ్ఞతలు.
ఓ దేహమా! - “అస్థి పంజరము - రక్తము - రోమములు రోమములు - ప్రేగులు" ఇవే కదా, నీ ముఖ్యతత్త్వమంతా? నీవు వాటిని గ్రహించి ఏ క్షణమైనా నీ ప్రకృతిలో ప్రవేశించవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. నీ నుండి చమట మొదలైన జలప్రకోపములు, మలము మొదలైన దుర్గంధములు
Page:660
బయల్వెడలుచుండగా… నిన్ను పవిత్రం చేస్తూవస్తున్న జలము మొదలైన వాటికి ఇవే కృతజ్ఞతలు. భోజన, శయన క్రియలకు సహకరించిన పదార్థ, ఉపకరణ సమూహములకు కూడా నా కృతజ్ఞతలు. నీకు అందించిన ఆహార పదార్థములను తయారు చేయటంలో శ్రమించిన సకల సహజీవులకూ ఇవే నా కృతజ్ఞతలు. నీవిప్పుడు ఉండినా, ఊడినా నాకొక్కటే!
ఓ ప్రాణములారా! - మీరు నా పూర్వకాలిక సహజమిత్రులు కదా! ఇప్పుడు నేను చేస్తున్న మిత్రుల వందన క్రమమునకు మీరు కూడా అర్హులే. మీతోకూడి నేను అనేక విచిత్రయోనులందు విశ్రమించాను. పర్వత కుంజములలోనూ, లోకాంతరములలోనూ విహరించాను. సిద్ధుల క్షేత్రము లలో ప్రవేశించాను. అనేక కార్యవిలాసములలో పాల్గొన్నాను. వివిధమార్గములలో సంచరించాను. వెయ్యేల? ఈ ప్రపంచంలో మీతో కూడి అనుభవించని పదార్థములేమున్నాయి? ప్రియమిత్రులగు ప్రాణములారా? మిమ్ములను ఎంతో కాలం పట్టి ఉంచాను. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ప్రకృతిలోకి పోయి లీనమగుటకు స్వతంత్రం ఇస్తున్నాను. నేను బ్రహ్మముతో ఐక్యత పొందుచున్నాను కదా!
సమస్తమూ అయి ఉన్న ఓ ప్రాణములారా! ఏది ఎచ్చోట పుట్టినా, చివరికి నశించి స్వస్థానం పొందవలసిందే కదా! ఇప్పుడు ఉన్నతములైనవి మరొకప్పటికి నిమ్నస్థానం చేరుచున్నాయి.
సంయోగముచే ఏర్పడినవన్నీ ఒకనాటికి వియోగంపొంది తీరవలసిందే. ఇక మన వియోగము కొరకు వగచవలసిన పనేమున్నది?
ఓ నేత్రప్రకాశమా! నీ స్వస్థానమగు సూర్యమండలము ప్రవేశించెదవుగాక!
ఓ ఘ్రాణేంద్రియమా! నీవు నీ నిజాశ్రయమగు భూమిని జొచ్చెదవు గాక!
ఓ కర్ణేంద్రియములారా! మీరు మీ ఆకాశబిలమునందు లయమొందెదరుగాక!
ఓ జిహ్వేంద్రియమా! నీయొక్క రసశక్తి జలమయమగు చంద్రమండలమున ప్రవేశించుగాక! పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు వాటివాటి ప్రకృతియందు లీనమగుగాక!
ఆత్మయే అయిఉన్న నేను సూర్యుడులేని వెలుగువలె, తుపాను తాకిడిలేనట్టి సముద్రజలంలాగా, మేఘరహితమగు ఆకాశము చందమున, తైలంలేని దీపం మాదిరి, కల్పాంతమందలి సృష్టినిబోలి, ప్రశాంతమును పొందుచున్నాను. ఓంకారార్ధమాత్ర యొక్క లక్ష్యభూతమైన బ్రహ్మరూపమునందు ఐక్యత సంపాదించుకుంటున్నాను… సర్వకార్యపరంపరా వర్జితుడనగుచున్నాను… సర్వ దృశ్యాతీతుడ నగుచున్నాను.
మనస్సును అధిగమించి ఉచ్చెస్వర్యముతో ’ఓంకారము’ను ఉచ్చరిస్తున్నాను. మనస్సుకు అతీతుడ నగుచున్నాను. బ్రహ్మరంధ్రమున సర్వశాంతిని అనుసరించుచూ బ్రహ్మచారిత్వమును పొందుచున్నాను. శాంతుడనై, మోహరహితుడనై ఆత్మయందు పూర్ణరీతిగా స్థితిని సంపాదించు కొనుచున్నాను.
Page:661
శ్రీవసిష్ఠ మహర్షి : ఇట్లు మననవర్జితుడై, సర్వ ఇచ్ఛలు త్యజించినవాడై, ఆ వీతహవ్యమునీంద్రుడు పెద్ద స్వరముతో, ఓంకారం సుదీర్ఘంగా ఉచ్చరించసాగారు. క్రమంగా ఆరవ, ఏడవ భూమికను అధిరోహించారు. స్వహృదయమందే సర్వ సమమగు బ్రహ్మముయొక్క ప్రాప్తిని దర్శించసాగాడు. ఆ వీతహవ్యుడు ‘అ’ కార, ‘ఉ’ కార, ’మ’కార, ‘అర్ధ’ మాత్రలకు సంజ్ఞలైనట్టి "స్థూల - సూక్ష్మ -
అవ్యాకృత - తురీయ” పాద భేదములచే ప్రణవమును స్మరిస్తూ ఉన్నారు. “విరాట్ - - హిరణ్యగర్భ అవ్యాకృత” లక్షణములు గల తురీయమును భావన చేయసాగాడు.
మొట్టమొదటగా - - “జాగరిక స్థానమున బహిర్జ్ఞ కలదు” అను అధ్యారోపణ చేతనూ, “అంతఃప్రజ్ఞగానీ, బహిర్ప్రజ్ఞగానీ లేదు" అను అపవాదముచేతనూ …ఈ ముల్లోకములనూ, వాటి ఉత్పత్తి స్థానములతోసహా త్యజించివేశాడు.
సంకల్పములచే కల్పాంతమువరకూ కల్పించబడిన ఈ స్థూల - సూక్ష్మ కారణముల యొక్క బాహ్యాభ్యంతరములన్నీ వీక్షించసాగాడు. ఆయన దర్శించుచున్న శుద్ధతత్త్వమగు ఆత్మ అవ్యయమైనది. ప్రకాశ, అంధకారరహితమైనది. సూర్య - చంద్ర - నక్షత్రములు లేనట్టి నిర్మలాకాశమును పోలి ఉన్నది.
ఆయనిప్పుడు స్వయముగా క్షోభరహితుడై చింతామణి వలె, పూర్ణ చంద్రుని వలె, చలనము ఉడిగిన చక్రము వలె ప్రకాశించుచున్నారు. శాంతి, నిర్మల, పూర్ణ సముద్రము వలె తురీయాత్మ యందు స్థితి కలిగియున్నాడు.
వాయువు గంధమును త్యజించునట్లు ఆతడు ఇంద్రియతన్మాత్రజాలమును త్యజించివేశాడు. క్రమంగా ‘దీర్ఘ ప్రణవనాదము’ అనే సూత్రమును కూడా త్యజించాడు. ఒక ప్రాజ్ఞుడగు బుద్ధిమంతుడు తననుండి రాగమును త్యజించినట్లు, ఆకాశము చీకటిని త్యజించి వెలుగు సంతరించుకుంటున్నట్లు ఆ మహాముని తనయందలి తమోగుణమునంతటినీ త్యజించివేశాడు.
ఆ తరువాత ఆతని హృదయంలో ఒకానొక ప్రకాశం ఆవిర్భవించింది. అరనిముషకాలంలో ఆయన ఆ ప్రకాశమును కూడా త్యజించివేశాడు.
అప్పుడాతని హృదయంలో తమస్సుగానీ, ప్రకాశముగానీ లేవు. తమఃప్రకాశ రహితమైనట్టి స్థితిని పొందిన ఆతనియందు కల్పనాహేతువైనట్టి కించిత్ మనస్సు స్ఫురించింది. ఆ స్వల్ప ఛాయారూప మనస్సును కూడా ఆతడు అర్ధనిమిషంలో ఛేదించివేశాడు.
అటు తరువాత గాలిలేనిచోట దీపంగా స్ఫుటప్రకాశరూపము పొందాడు. అప్పుడాతని యందు కొద్దినెలల వయసుగల పసిబాలునిలో ఉండేటంతటి పరిజ్ఞానము మాత్రమే శేషించియున్నది. ఆ పరిజ్ఞానమును కూడా మరొక అర్ధనిమిషంలో త్యజించివేశాడు.
Page:662
దీనినే “చైతన్యము విషయదశను పరిత్యజించటం” అనికూడా అంటారు. ఈ విధంగా… సాక్షిమాత్రంగా శేషించు స్థితిని పొందాడు. ఆ పదమునే శాస్త్రములు “పశ్యంతి” అను శబ్దముచే ఏకీస్థితిగా విశ్లేషించారు. ఆ తరువాత సుషుప్త పదమును అవలంబించి పర్వతమువలె నిశ్చలుడయ్యాడు.
మహాసమర్ధుడగు ఆ ముని అప్పటినుండి జగత్ప్రహితమైన సుషుప్తిపూర్వక జాగ్రత్ను పొందుచూ అచ్చటనే స్థిరంగా ఉండిపోయాడు. ఆ తరువాత తురీయ పదమును పొందాడు. ఆ తురీయపదంలో విషయానందరహితుడైనప్పటికీ, స్వస్వరూపానంద సహితుడైనాడు. అన్యసత్తారహితుడైనప్పటికీ ఆత్మ సత్తాసహితుడైనాడు. వాక్కు అగోచరమగు స్థితి పొందాడు.
ఆ స్థితిలో ప్రకాశ్యవిషయమే ఉండదు కదా! అది ’చిన్మయము’ అని చెపుతారు. ఇది సర్వమునకూ కేవల సాక్షీభూతమైనది. “ఇది కాదు… ఇది కాదు నేతి, నేతి” అనుకుంటూపోగా, చిట్టచివరకు శేషించేది అదే. సమము, విశాలము, పరమపవిత్రము, సర్వజీవులకు అంతర్గతము అదే. ఆయన సర్వ వివర్జితమగు బ్రహ్మరూపుడయ్యాడు.
ఏది శూన్యవాదులకు శూన్యమో, బ్రహ్మవేత్తలకు బ్రహ్మమో, విజ్ఞానవాదులకు విజ్ఞానమో, సాంఖ్యవాదులకు పురుషుడో, యోగవాదులకు ఈశ్వరుడో, శైవులకు శివుడో, వైష్ణవులకు విష్ణువో, ఆత్మవేత్తలకు ఆత్మయో, సౌతాంత్రిక, వైభాషికులకు నైరాత్మ్యమో, మాధ్యమికులకు చిత్ - అచిత్ల మధ్యలోగల నిర్విషయస్థితియో, జీవన్ముక్తులకు సర్వ రూపమో - అట్టి సద్రూపము ఆతడే అయి… చెన్నొందుచున్నాడు. షట్శాస్త్ర సిద్ధాంతసారమై సర్వహృదయస్థమై, స్వస్వరూపమై, సర్వవ్యాపకమై, సర్వరూపమైనట్టి సద్రూపమే ఇప్పుడాతడు. సర్వధా నిష్క్రియమై, సూర్యుడు మొదలైన స్వప్రకాశక వస్తువులను కూడా ప్రకాశింపజేయునదై, నిజానుభవమైనట్టి సద్రూపమే ఆతడు.
ఉపాధి భేదంచేత అనేక రూపుడు కూడా తానే అయ్యాడు.
మాయా భేదం చేత రాగయుక్తుడై ఉంటున్నది కూడా తానే. సర్వరూపుడు, సర్వమునకు భిన్నమైనవాడు తానే అగుచున్నాడు. "సర్వరూపములు తానై, ‘సర్వసాక్షి’ అను రూపంగా వేరై”…. ఉన్నవాడయ్యాడు.
చూచావా… రామా! ఆ విధంగా ఆ వీతహవ్యమహాముని ముక్తుల దృష్టిలో చూస్తే, మనం చెప్పుకుంటున్నట్లు జన్మ జరావర్జితము, అనాది, ఏకము, విమలము, నిష్కళంకము అయినట్టి ఆత్మ సంస్థితుడే అయ్యాడు.
ఇక బుధుల దృష్టిలో ఈశ్వరుడే ఆతడు. కార్యభేదములచే అనేక రూపులైనదంతా ఆతడే. సర్వకళారహితుడై, సర్వులకు వందనీయుడైనాడు. ఓం నమో వీతహవ్యాయనమః
Page:663
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ విధంగా సంసారసీమాంతరమును పొంది, సర్వ దుఃఖములూ దాటివేసిన ఆ వీతహవ్యముని పూర్ణమనో నాశనముచే పరబ్రహ్మమున విలీనుడైనాడు. ప్రశాంతిని, పరమ తృప్తిని పొందాడు. సముద్రంలో జలబిందువు ఉన్నట్లు, పరిణామ రహితమగు స్వాత్మ పదమున స్థానం పొందాడు.
శ్రీరాముడు : మహర్షీ! ఆయన శరీర స్థితి ఎట్లున్నది?
శ్రీవసిష్ఠ మహర్షి : చెపుతాను విను. ఆతడు సంపూర్ణముగా ఆత్మానుభవ సమన్వితుడైనాడు కదా! ఇక ఆతనిచే అంతవరకూ ఉపయోగించబడిన భౌతిక దేహం యజమానిలేని ఇల్లులాగా నీరసం పొందింది. చేష్టారహితమై మ్లానత పొందింది. ఆ దేహము నుండి ప్రాణములు బయల్వెడలి ఆకాశంలో లీనమైనాయి. దేహములో గల పంచభూతములన్నీ పంచమహాభూతములందు విలయం చెందాయి. మాంసము, బొమికలతో కూడిన జీర్ణ శరీరశేషము చైతన్య సాగరమున ప్రవేశించింది. రక్త - మాంస - - మేధ - మజ్జాది ధాతువులు సప్తధాతువులందు విలీనమయ్యాయి. శరీరమునందలి తత్వములన్నీ వాటివాటి కారణములందు లయించాయి. వీతహవ్యుని స్వస్వరూపము స్వయం ప్రకాశరూపమై పరమవిశ్రాంతిని పొందింది.
ఓ రాఘవా! నీవు కూడా వీతహవ్యమహామునిలాగానే విచారణ చేయి. చక్కగా ప్రదీపితమై ఉన్న ఆత్మతత్త్వమును దర్శించి, అద్దాయనిందు ఆరూఢుడవై విశ్రాంతి పొందుము.
ఇప్పటివరకు ఈ వీతహవ్యుని గాథ ఈ 14 రోజులుగా నీకు చెప్పినదీ, చెప్పుచున్నదీ, చెప్పబడబోయేదీ - ఇదంతా నేను స్వయముగా విచారణ చేసి చూచినది సుమా! త్రికాలదర్శిని, చిరంజీవిని అవటం చేత ఇవన్నీ స్వయంగా సందర్శించి, నీకు చెప్పుచున్నాను. నాకు అనుభవమైనదే నీకు చెప్పటం జరుగుతోంది కాని, ఏవో ఊహ, అపోహలపై ఆధారపడి కాదు. నీవు కూడా ఆయా మహనీయులవలె నిర్మల దృష్టిని అవలంబించి జ్ఞానమును పొందుము. జ్ఞానముచే మాత్రమే ముక్తి లభించగలదు.
జ్ఞానాన్నిర్దుఃఖతామేతి జ్ఞానాదజ్ఞానసంక్షయః |
జ్ఞానాదేవ పరాసిద్ధిర్నాన్యస్మాద్రామ వస్తుత ॥ (శ్లో 12, సర్గ 88)
అజ్ఞానం నశించాలంటే జ్ఞాన సముపార్జన ఒక్కటే మార్గం. జ్ఞానము చేతనే పరమసిద్ధి లభించగలదు. యథార్థానికి జ్ఞానముకంటే ఉత్తమమైనది ఇంకొకటేదీ ఉండదు.
మునీశ్వరుడగు వీతహవ్యుడు జ్ఞానముచేతనే ఆశలన్నీ తెగతెంచివేశాడు. జ్ఞానం చేతనే చిత్తమును చూర్ణం చేయగలిగాడు.
Page:664
శ్రీరాముడు : స్వామి ! ఇప్పుడు వీతహవ్యునకు, జగత్తుకూ గల సంబంధమెట్టిది?
శ్రీవసిష్ఠ మహర్షి: ఆ వీతహవ్యుని సంవిత్తు, లేక, శుద్ధజ్ఞానతత్త్వము స్వహృదయమైనట్టి బ్రహ్మమునందే ఈ జగత్తును గాంచుచున్నది. అనగా "జగత్తు అనునది నాయొక్క సంకల్ప ప్రయోజనమేగాని మరింకేమి కాదు” అనునట్టి చ్యుతిలేని ఎరుకను కలిగి ఉంటోంది.
శ్రీరాముడు : ఇప్పుడాతనికి తనకు మాత్రమే సంబంధించిన ఒక ప్రత్యేక జగత్తు ఏమైనా ఏర్పడి ఉన్నదా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పుడు వీతహవ్యుడు సర్వదా ఏర్పడియున్న నిత్యసత్యమును అనుభవించుచున్నాడు. ఇక్కడ వాస్తవ, నిత్య సత్యమేమిటి!
నేత్రము మొదలైన ఇంద్రియములకు ఇక్కడ తారసపడుచున్నదంతా మనస్సుయొక్క కల్పనయే కదా! ఈ నేను, నీవు, శరీరము, పదార్థములు అంతా కూడా మనోస్వప్న మాత్రమే. ఈ జగత్తంతా మనో మాత్రమే అయి ఉండగా ఇక దీనియందు స్వకీయమైనదేది? పరకీయమైనదేది? వీతహవ్యునిలో కల్పన అంతా రహితమైపోయింది. పరమార్థమును అతడు పొంది ఉన్నాడు. ఇప్పుడు అతని యందు రాగద్వేషముల ఛాయ కూడా లేదు. అభిమానము, కామ్య కర్మలు మొదలైన మాలిన్యంలేదు. వాటివలన కలిగే ఇంద్రియవికారాలు లేవు. స్థూల - సూక్ష్మ - - కారణ శరీరాలు కూడా లేవు. తజ్జనితమైన సంగమములు లేవు. శోకరహితుడు, వివేకియు అగు ఆతడు స్వస్వరూపభూతమగు నిర్మలాత్మతత్త్వమును సాక్షాత్కరించుకుని మౌనం వహించి ఉన్నాడు. అంతే, ఇక అంతకుమించి చెప్పాలంటే ఆతడు వాక్ అతీతుడని గ్రహించు.