CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:665

XII.ఉపశమన ప్రకరణము - సమీక్ష

  1. యోగుల దేహ - మనముల వైచిత్ర్యం

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ ఉపశమన ప్రకరణంలోనూ, ఇంతకు ముందటి ప్రకరణాలలోనూ మనం చెప్పుకున్న అనేకమంది మహనీయుల అంతిమానుభవమును గమనిస్తున్నావు కదా! నీవు కూడా ఆత్మజ్ఞుడవై, రాగ - ద్వేష - భయ వర్జితుడవై ఈ ప్రపంచమున విహరించు.

మహాధీమంతులగు జ్ఞానులు కొందరు రాజులై రాజ్యభారం నిర్వర్తిస్తున్నారు. మరికొందరు మునులై లోక కళ్యాణార్థం అనేక సంరంభములతో కూడి యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తున్నారు.

ఓ రఘురామా! ఇక్కడ కనబడే సుఖదుఃఖ క్రమములచే ఆత్మ ఎన్నడూ వశీభూతం కాదు. అట్టి సర్వవ్యాపియగు ఆత్మయే నీవై ఉండగా ఇక భేదమెందుకు? వ్యర్థంగా దుఃఖములు పొందవలసిన పనేమున్నది? అనేకులగు ఆత్మజ్ఞానులు ఆయాస్థితులందు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. కానీ వారు దేనిని చూచీ దుఃఖం పొందటం లేదు. దేనికొరకూ శోకించుట లేదు. నీవు కూడా స్వస్థుడవై ఉండు. సర్వత్యాగివై, సముడవై, సుఖవంతుడవై ఉండు. ఆత్మవంతుడవగు నీకు ఈ జన్మా లేదు. మరొక జన్మా లేదు. సింహాలు నెమళ్ళకు వశం కావటమేమిటి? జీవన్ముక్తులు, సర్వం ఎరిగినవారూ అగు మహాత్ములు ఏది ఎట్లున్నప్పటికీ హర్ష క్రోధాది వికారాలకు వశులు కారు. కాబట్టి ఖండత్వము త్యజించి అఖండత్వము నాశ్రయించు.

శ్రీరాముడు : ఈ సందర్భంలో నాదొక చిన్న సందేహం. మనం ఇప్పటివరకు చాలా మంది జీవన్ముక్తుల గురించి చెప్పుకున్నాం. వారిలో కొంత మందిలో ఆకాశగమనము మొదలైన దివ్యశక్తులు కనిపించటం లేదు. మరికొందరిలో కనిపిస్తున్నాయి. జీవన్ముక్తులయందు అతీంద్రియశక్తులు

ఉంటాయా? ఉండవా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఆకాశగమనము మొదలైన సిద్ధులు దేనికి సంబంధించినవి? అగ్ని యొక్క ఊర్ధ్వజ్వలనం లాగా అవన్నీ పదార్థములకు సంబంధించిన స్వాభావిక శక్తులే కదా! ఇక్కడ తారసబడే భౌతిక, అతీంద్రియ శక్తుల విచిత్ర వ్యవహారమంతా పదార్థ స్వభావం మాత్రమే! అందుచేత ఆత్మజ్ఞులైనవారికి క్రొత్తవి పొందాలనిగాని, ఉన్నవి తొలగాలని గాని అభినివేశం ఉండదు.

ఒకానొకడు ఆత్మజ్ఞాని కాకపోవచ్చు. ముక్తుడు అవకపోవచ్చు. అయినప్పటికీ మణి, ఔషధము మొదలైన ద్రవ్యశక్తులు కలిగియుండుటచేతనూ, యోగాభ్యాసం మొదలైన ఆయా క్రియాశక్తులచేతనూ “ఆకాశగమనము, మాయమవటం, ప్రత్యక్షం కావటం" మొదలైన సిద్ధులు పొందగలుగుతాడు. అంతమాత్రం చేత ఆతడు ఆత్మజ్ఞుడు అని అనిపించుకోడు.

Page:666

‘ఆత్మజ్ఞుడు’ అంటే ఏమిటి?… "స్వయముగా ఆత్మచే ఆత్మను ఎరిగి, ఆ ఆత్మయందు సంతృప్తుడై ఉండువాడు” అని కదా! ఆత్మజ్ఞుడు అవిద్యవైపు పరుగులెందుకు తీస్తాడు? ఈ ప్రపంచంలో పదార్థము లన్నీ అవిద్యామయములే అయిఉన్నాయి. అవిద్యను త్యజించిన ఆత్మజ్ఞాని భౌతిక విషయములగు అతీంద్రియశక్తులలో మునిగి ఉంటాడా! ఊహూ!

శ్రీరాముడు : అతీంద్రియశక్తులు ఎట్టి వారికి లభిస్తాయి? ఆత్మజ్ఞాని వాటిపట్ల ఎట్టి ఉద్దేశం, అభిప్రాయం కలిగి ఉంటాడు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు ఆత్మజ్ఞాని అయిఉండకపోయినప్పటికీ, ద్రవ్య - కాల - క్రియాదులచే శాస్త్రోక్తంగా ప్రయత్నిస్తే ‘ఆకాశగమనము’ మొదలైన విద్యలు తప్పక లభిస్తాయి.

ఇక ఆత్మజ్ఞాని విషయమంటావా?… ఆతడు సమస్తమునకు అతీతుడై ఇచ్చారహితుడై ఉంటాడు. “ఇది కావాలి… పొందితేనే నేను సంపూర్ణుడనైనట్లు" అని సంభ్రమము కలిగియుండడు. ఆతనికి ఆకాశగమనములచే గాని, సిద్ధులచే గాని, తుచ్ఛమగు భోగములచే గానీ, ప్రభవములచే గాని, గౌరవ, ప్రతిష్ఠ, మాన్యాదులచే గాని, జీవన మరణములచే గాని క్రొత్తగా అభిలషించవలసిన ప్రయోజనమేమీ కనబడదు. ఆత్మజ్ఞుడెప్పుడూ నిత్యసంతోషి అయి, శాంతచిత్తుడై, రాగరహితుడై, వాసనావర్జితుడై, నిత్యసంతృప్తుడై ఉంటాడు. ఒకవేళ ఒక ఆత్మ జ్ఞానిలో అతీంద్రియ శక్తులు ఉండటం సంభవించినప్పటికీ వాటిని ఆతడు ప్రారబ్ధవిశేషములు మాత్రంగానే చూస్తాడు. ఆకాశము వలె ఆతడు ఏ భౌతిక వస్తువుచేత పరిమితుడవకుండా మహదాకారము కలిగి, ఆత్మయందే నెలకొని ఉంటాడు. ఆతనికి జీవన్మరణముల పట్ల కూడా సంగము ఉండదు. సంసారస్వభావ యుక్తంగా ఇక్కడ సంభవిస్తూ ఉండే ఆకస్మిక సుఖ దుఃఖములచే ఆతడు తన స్వాభావికమైన తృప్తిని వీడకయే ఉంటాడు. ప్రతికూల-అనుకూల ప్రారబ్ధములు తారసపడుచున్నప్పుడు, వాటిని ఒక వైపు చూస్తూ కూడా… మరొకవైపు “అఖండాకార వృత్తి” అనే పుష్పాలతో ఆత్మను పూజిస్తూనే ఉంటాడు. నదుల నుండి వచ్చే నీరు సముద్రంలో లయమైపోవునట్లు, సర్వ అనుభవములూ అతనిని సమీపించి లయమైపోతాయి గాని, పునర్వృత్తులకు కారణం కాజాలవు.

నైవతస్య కృతేనార్ధో నాకృతేనేహకశ్చన |

నచాస్య సర్వభూతేషు కశ్చితర్ధతవ్యపాశ్రయః ||

“ఇది నేను చేశాను. నాకొచ్చిన ప్రయోజనమేమున్నది? ఇది చేయలేదా? ఎట్లా?” - అనునట్టి ప్రయోజన ప్రత్యవాయువులు (Benefit - Eventualities) ఆతని దృష్టిలో ఉండవు. సర్వభూతములందూ ఆశ్రయించవలసినదంటూ ఆతనికేదీ ఉండదు.

ఓ రామా! ఒకడు ఆత్మజ్ఞానరహితుడైనప్పటికీ సిద్ధులను అపేక్షించి సాధకద్రవ్యాదులతో, మంత్ర నియమాదులతో ప్రయత్నిస్తే ఆతనిని ధనం సంపాదించటంలో నిమగ్నమైనవానితో పోల్చ వచ్చు. ధనికుడైనంత మాత్రంచేత ఒకడు ఆత్మజ్ఞాని అగుచున్నాడా? లేదే! అట్లాగే సిద్ధులు సంపాదించి నంత మాత్రంచేత ఒకనిని ఆత్మజ్ఞానిగా నిర్ధారణ చేయలేం. అందుకే శాస్త్రజ్ఞులు ‘సిద్ధులు సంపాదించటం - - ఆత్మజ్ఞానం’ … ఈ రెండూ వేరు వేరు విజ్ఞాన శాఖలుగా చూస్తూ ఉంటారు.

Page:667

“మణి, మంత్రము మొదలైన యుక్తుల చేత ఆకాశగమనాది సిద్ధులు లభిస్తాయి” - అనేది ఆయా శాస్త్రములలో ప్రసిద్ధమైయున్న నియతిక్రమం అయి ఉన్నది. అట్టి నియతి క్రమమును దేవతలుగాని, మరింకెవ్వరైనా గాని మరొక విధంగా చేయజాలరు. దేవతలకు, పక్షులకు, తదితర కొన్ని జీవ జంతుజాలమునకు ఆకాశగమనాది సిద్ధులు వస్తు స్వభావంగా స్వతఃసిద్ధంగానే ఏర్పడుచూ ఉన్నాయి. చంద్రుడు తన శీతలత్వము త్యజిస్తాడా? సూర్యుడు తన కిరణాలలోని ఉష్ణమును వదలి ఉంటాడా? అవన్నీ కూడా వాటి వాటి నియతిని వదలకయే ఉంటాయి కదా! సర్వజ్ఞుడైనా, మహజ్ఞుడైనా, మరెవ్వరైనా నియతిని అనుసరించే చరిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లంతటివారు కూడా నియతికి లోబడే లోకములను పరిపాలిస్తూ ఉంటారు.

కనుక రామా! నీవు చెప్పిన ఆకాశగమనాదులన్నీ ద్రవ్య, కాల, క్రియా, మంత్రప్రయోగ అభ్యాసముల స్వాభావిక సిద్దులని గ్రహించు. అంటే ఏమిటో చెపుతాను …విను.

విషం ఉన్నదనుకో, అది ‘ప్రాణులను చంపుట’ అనే పాదార్థికధర్మం కలిగి ఉంటోంది. మద్యము ‘మత్తు కలిగించుట’ అను ధర్మమును కలిగి ఉంటోంది. తేనె ‘పైత్యము మొదలైన రస దోషములను నిగ్రహించుట’ అనే ధర్మం కలిగియున్నది. అలాగే ఉమ్మెత్త ఫలములు కొన్ని మానవ శరీర దోషములను నివారిస్తాయి. అవన్నీ ఆయా పదార్థముల ధర్మములు.

అట్లాగే ఆ శరీరంలో కొన్ని గూఢ శక్తులు ప్రకృతిచే పదిలపరచబడి ఉన్నాయి. యోగముచే, ద్రవ్య, కాల, క్రియాదుల సహాయంతో ప్రాణములను కేంద్రీకరించుటచే ఆయా సిద్ధులు సాధకునకు లభిస్తాయి. శరీరంలోని కొన్ని కేంద్రస్థానాలలో ప్రాణములను ప్రతిక్షేపించి యోగాభ్యాసం చేయుటచే శరీరం గాలిలో తేలియాడగలదు. దూరశ్రవణము, భవిష్యత్ గ్రహణము, దూరంగా ఉండి ఆశ్రితులకు రోగనివారణం చేయటం మొదలైనవి కూడా అట్టి యోగాభ్యాసకులకు సాధ్యపడగలవు. అయితే…

ఆత్మజ్ఞాని ద్రవ్య, క్రియా, కాల రూపముగల అవిద్యకు పరమైన అభ్యాసం కలిగియుంటాడు. అఖండము. అప్రమేయము, నిత్యము అగు స్వస్వరూపాత్మయే ఆతని సాధనయొక్క సాధ్యము కదా! అందుచేత ఆతడు సిద్ధుల విషయంలో కర్తృత్వాకర్తృత్వములు వహించి ఉండడు. ఎందుకంటే, ఈ ద్రవ్య, దేశ, కాల, క్రియాదులన్నీ కూడా “తత్త్వజ్ఞాన జనితమైనట్టి పరమాత్మ పదము”నకు ఉపయోగ పడేవికావు. అయితే, కొందరికి సమగ్ర సృష్టి చమత్కారమును అనుసరించి ప్రకృతిచే సిద్ధులు ప్రసాదించ బడుతూ పరమాత్మకు సంబంధించినవని గమనించి, తాను ఇచ్ఛారహితుడై ఉంటాడు.

ఇక మరికొందరో… అట్టి సిద్దుల పట్ల ‘పొందాలి’ అను రూపముతో కూడిన ఆవేశం కలిగి ఉంటారు. ఎవనికైతే కోర్కెలు ఉంటాయో, ఆతడు మాత్రమే సిద్దులు సంపాదించటానికి ప్రయత్నపరుడై, ఆవే పరుడై తాపత్రయపడుతూ ఉంటాడు. కోర్కెలే ఆత్మజ్ఞాన సముపార్జనలో విఘ్నకరములు కదా!

ఇక ఆత్మజ్ఞాని ఎల్లప్పుడూ పరిపూర్ణుడై ఉంటాడు. కనుక ఆతనికి ఎట్టి కోర్కెలూ ఉండవు. సర్వ కోర్కెలూ శమించగా, ఆత్మలాభోదయం అయిన తరువాత… ఇక, తద్విరుద్ధమైన అల్పలాభముల పట్ల ఆసక్తిగాని, కోరికగాని ఎవరికుంటుంది? సర్వ సహజీవులను తన ఆత్మ యందు, సర్వ జీవుల యందు తన ఆత్మను సదా సందర్శిస్తూ ఉంటాడు.

Page:668

జ్ఞాని విషయంలో కావచ్చు, ఆజ్ఞాని విషయంలో కావచ్చు… ఒక్క మాట మాత్రం నిజం. ఒకడు తనకు ఎట్టి ఇచ్ఛ జనిస్తుందో, అట్లే ప్రయత్నములు చేస్తూ ఉంటాడు. ప్రయత్నం కొనసాగుతుంటే కాలక్రమేణా అద్దానినే పొందుతాడు. ఇప్పుడే మనం వీతహవ్యమహా ముని విదేహముక్తి గురించి చెప్పుకున్నాం కదా! ఆతడు జ్ఞానాభిలాషి అయి, జ్ఞానము కొరకే ప్రయత్నించాడు. జ్ఞానాభ్యాసం కొరకు వింధ్యారణ్యం ప్రవేశించాడు. జ్ఞానమును పొందాడు. మధ్యలో ఎక్కడా విరమించలేదు. కనుక…. పొందవలసినది పొందాడు. అట్లాగే సిద్ధులు (Supernatural powers) కూడా. అవన్నీ ఆయా జీవులు ఇచ్చతో దేశ, కాల, క్రియాదియుక్తులచే ప్రయత్నించి సముపార్జించుకునేవే. అవన్నీ ప్రయత్నరూప వృక్ష ఫలములే. అయితే, ఆత్మ సుఖం పొందే మహాత్ముల దృష్టిలో అవన్నీ అల్పకాలిక స్వల్పవిషయములే అయి ఉంటున్నాయి.

మహతాం నిత్యతృప్తానాం తజ్ఞానాం భావితాత్మనామ్ |

ఈహితం సంప్రతానాం నోపకుర్వన్తి సిద&ధయః ॥ (శ్లో 38, సర్గ 88)

ఓ రామా! నిత్యతృప్తులును, భావితాత్ములును, అభిలషితమగు ఆత్మసుఖమును పొందినవారును అగు ఆత్మజ్ఞూలైన మహాత్ములకు సిద్ధులేమియు ఉపకరింపవు.

శ్రీరాముడు : హే మహర్షీ! మీ సమాధానంతో నేను ఎంతో తృప్తి పొందాను. మనం ’ఉపశమన ప్రకరణం’ సమీక్షించుకుంటున్న సందర్భంలో ఇప్పుడే మీరు చెప్పి ఉన్న ’వీతహవ్య అంతర్ మథనం’లో నాకు కలిగిన రెండు సందేహాలు మీ ముందుంచాలని ఉన్నది.

శ్రీవసిష్ఠ మహర్షి : సంతోషం. అడుగు.

శ్రీరాముడు : 1. వీతహవ్యుని దేహం వింధ్య పర్వత ప్రాంతంలోని ఆతని పర్ణశాల సమీపంలో బురదలో చిక్కుకుని 300 సంవత్సరాలు ఉన్నది కదా! అంతకాలం ఆతని దేహం హింసక జీవులచే ఎందుకు భక్షింపబడలేదు?

  1. వీతహవ్యుడు దేహభావం విడచి సమాధిలోకి వెళ్ళి, ఆ సమాధి ఉపసంహరించటానికి ముందే మనస్సుతో ఏవేవో అనుభవాలు పొందాడు. శరీరం తిరిగి పొందటానికి ముందే విదేహముక్తి పొందవచ్చు కదా? మరల సూర్యుని ఆరాధించి భౌతిక దేహం ఆశ్రయించటం దేనికి? అట్లాగే దేహంలో ప్రవేశించిన మరుక్షణమే విదేహముక్తి పొందవచ్చు కదా! మరల ఒక గుహలో ప్రవేశించి ఇంద్రియములు, చిత్తము మొదలైన వాటితో సంభాషించి, ఆ తదుపరియే విదేహముక్తిని ఆశ్రయించ వలసిన పనేమున్నది!

శ్రీవసిష్ఠ మహర్షి : అందుకు కారణము లేమిటో చెపుతాను… విను.

యోగాభ్యాసము లేని జీవునియొక్క సంవిత్తు అనేక రాగద్వేషములతో కూడిన మలిన వాసనలు కలిగిఉంటుంది కదా! తత్ఫలితంగా అట్టి జీవుల దేహములు "దుఃఖించుట, ఆవేశకావేషాదులు పొందుట - నీరసించుట” మొదలైన దీనస్థితి పరంపరలన్నీ పొందవలసివస్తోంది. అయితే, ఉత్తమ

Page:669

శ్రీరాముడు : ఎట్టి యుక్తిచే యోగి యొక్క శరీరం ‘ఛేదన’ మొదలైనవి పొందక, వక్రీభూతమౌతుంది? అట్టి యోగయుక్తి లేక, ప్రాణనిష్ఠ యొక్క రూపమెట్టిది? అది అందరికీ సాధ్యపడుతుందా? లేక, కొందరికి మాత్రమేనా?

శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణశక్తికి మనస్సుకు భౌతిక దేహమునకు ఒకానొక విచిత్రమైన సంబంధం ఉన్నది. ఆ సంబంధమును అనుసరించే వీతహవ్యుని దేహంలో ప్రాణములు సంచలన రహితమైనప్పుడు సూక్ష్మత్వం పొందటం, దేహం దీర్ఘకాలం శిథిలం కాకపోవటం, మనస్సు ప్రారబ్ధ కర్మలు అనుభవించి తిరిగి శరీరంలో ప్రవేశించటం, మనస్సు శరీరంలోకి అడుగుపెట్టగానే ప్రాణాలు పునఃసంచలనం ప్రారంభించటం, శరీరం ఉత్తేజమవటం - ఇవన్నీ జరిగాయి. ప్రాణశక్తిని ఎరిగిన యోగులకు ఈ విషయాలు సుపరిచయాలే. ఈ విశేషాలు మనం ఉత్పత్తి ప్రకరణంలో కొన్ని సందర్భాలలో ప్రస్తావించుకోవటం జరిగింది. ఇప్పుడు సందర్భోచితమే కనుక, ఈ శరీర - - మనో - ప్రాణాలకు ఏర్పడి ఉన్న పరస్పర సంబంధముల విషయమై కొన్ని విశేషాలు చెపుతాను. అప్పుడు నీ మొదటి సందేహం తొలగగలదు.

చిత్తము జీవునిలో ఉండే ప్రియ, అప్రియముల స్వభావం చిత్రీకరిస్తూ ఉంటోంది. మనస్సు మననస్వభావం జీవుని నడిపిస్తూ ఉంటుంది.

చిత్తము ఎప్పుడెప్పుడు ఏ పదార్థములందు సంలగ్నమై ఉంటుందో, అప్పుడప్పుడు అది ఆయా పదార్థముల రూపమే పొందుతూ ఉంటుంది. ఈ చిత్తము, “ఈతడు నాకు అయిష్టుడు” అని భావోద్వేగం పొంది ఒకనిని చూస్తున్నప్పుడు ఆతడి అనేక కదలికలు అట్టి అయిష్ట వికారములను మనస్సుకు కలిగిస్తాయి. “ఇతడు నాకు స్నేహితుడు, ఇష్టుడు” అని అనుకుంటుంటే అతని అవే కదలికలు, చర్యలు సంతోషమును కలుగజేస్తూ ఉంటాయి. ఈ విషయం అందరికీ అనుభవమయ్యే విషయమే.

ఒక రాగద్వేష రహితుడైన బాటసారి త్రోవలో పొలములను, వృక్షములను చూస్తున్నప్పుడు ఎట్టి మనోవృత్తులకూ లోనుకాడు. అట్లుగాక, ఆయా రాగద్వేష మనోవృత్తులతో సంతప్తమైన చిత్తము గలవాడు ఆ బాట నుండి వెళ్ళుచున్నప్పుడు, “ఈ చెట్లు మావి, ఆ పొలం ఒకప్పుడు మాది, ఈ స్థలం మా ఊరివారిది, ఇక్కడి తోటలు మా బంధువులవే, ఆ తోపులు వేరే వర్గం వారికి చెందినవి” - అను మనోవికారములన్నీ పొందుతాడు. ఇది కూడా అందరికీ ప్రతిరోజూ అనుభూతమయ్యే విషయమే.

అట్లాగే తనకు రుచించే పదార్థములను చూచిన మనస్సు చపలం పొందుతుంది. వెంటనే ఆ చంచల మనస్సు దేహంలో కొన్ని వృత్తులను, భౌతిక సంఘటనలను కలిగిస్తుంది. ఆ దేహం అందుకు ప్రతిస్పందిస్తోంది. ఆ విధంగానే అదేవ్యక్తి తాను ద్వేషించే చూచాడనుకో… ఆతని మనస్సు అరుచి, ఏహ్య వృత్తులు పొందుతుంది. ఆ వృత్తులు ఆతని దేహంలో వికారాదులు

Page:670

కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనస్సుకు, భౌతిక దేహానికి ఏర్పడే పరస్పర ప్రవృత్తి ప్రభావాలు అందరు ఎరిగినవే.

ఇప్పుడు ఈ చిత్తవృత్తులు తదితరులపై ఎట్టి ప్రభావం కలిగిస్తాయో గమనిద్దాం. ఒక జీవుడు ’దయ, ప్రేమ’వంటి ప్రవృత్తులను మరల మరల ప్రకటించుటచే, ఆతడు కాలక్రమేణా తదితరులపై కూడా ఒకానొక ప్రభావము కలిగి ఉంటాడు. అనగా తదితర జీవులు కూడా ఆతనిని దయ, ప్రేమలకు అర్హుడుగా గాంచుతారు. అట్లాకాకుండా, ఈ జీవుడు ద్వేష - ఆవేశ - క్రోధాదులు మరల మరల ప్రకటించుటచే అట్టి జీవుడు అదే రీతి అయిన ప్రతి స్పందనకు అర్హుడగుచున్నాడు. ఈ విధంగా ఆయా వృత్తులు అదేవిధమైన అసంకల్పిత ప్రతిస్పందనలుగా తదితరులపై ప్రభావిత మవుతూ ఉంటాయి. ఎందుచేత?

ఒక చిత్తము యొక్క అంతర్గత వృత్తులు అదేవిధమైన సంస్కారములతో కూడిన తదితర చిత్తములలో ప్రతిబింబపూర్వక ప్రభావమును కలిగి ఉంటూ ఉంటాయి కాబట్టి!

ఇప్పుడు మనం రాగ - ద్వేష - వైషమ్య రహితుడగు యోగి విషయానికి వద్దాం. సంవిద్విలాసం చేత (Presence of Pure - Self) పూర్ణమానసుడగు యోగి శరీరముపై హింసక జీవుల చిత్తము ప్రసరిస్తున్నదనుకో… అప్పుడు తేలు, కీటకం మొదలైన ఆ హింసక జీవుల చిత్తము నందు యోగి యొక్క సంవిత్తు ప్రతిబింబించగానే అవి ’సమత్వము’అనే అనుభవమును పొందుచున్నాయి. అనగా వాటిలో హింసించు స్వభావము ఉపశమించి, ‘సాత్వికము, శాంతము’ రూపు దిద్దుకుంటున్నాయి. ఒక యాత్రికుడు మార్గ మధ్యంలోని ‘దేవాలయం, యోగుల ఆశ్రమం’ మొదలైన పవిత్ర విషయాలను చూస్తున్నప్పుడు తన లోని సాంసారిక ఉద్వేగమును మరచి కించిత్ సాత్వికతతో వినమ్రుడగుచున్నాడు. అట్లాగే హింసించు స్వభావం గల జీవులు ఆ యోగి యొక్క సంవిత్తు ప్రభావం చేత దైవీ గుణముల వైపుగా ప్రభావితమై ఉంటాయి. మహనీయులగు ప్రశాంతపురుషుల ఆశ్రమాలలో (పురాణాలలో వర్ణించిన కణ్వమహర్షి ఆశ్రమం మొదలైనవి) సింహము, పులి, పాము, తేలు మొదలైన స్వాభావిక హింసక జీవులు శాంతి, అహింస, ప్రేమలను వహించటానికి ఇదియే హేతువు. సమదర్శియగు యోగి యొక్క సంసర్గముచే అవన్నీ రాగ ద్వేషములనుండి విడివడుచున్నాయి. అట్టి కారణం చేత వీతహవ్యుని శరీరమును సమీపించిన కీటకాదులు కుట్టటం, హింసించటం, భక్షించటం మొదలైన స్వాభావిక క్రియలందు ప్రవృత్తం కాలేకపోయాయి.

ఆ హింసక జీవులు ఆ స్థానం విడచి దూరం వెళ్ళగానే మరల తమ స్వాభావికమగు హింసించు స్వభావమునందు ప్రవృత్తమౌతూ ఉంటాయి.

గమనిస్తున్నావా, రామచంద్రా! ఉదాహరణకు, ఒకడు తన సహజీవులపట్ల అకృత్రిమమైన స్వభావసిద్ధమైన ప్రేమ, కరుణ దైనందికంగా అభ్యసిస్తున్నాడనుకో. ఆతని పట్ల సహజీవులు కూడా అదేరకంగా అకృత్రిమమైన, స్వభావసిద్ధమైన ప్రేమతో అసంకల్పితంగా స్పందిస్తూ ఉంటాయి. కోపంగా ఉండే స్వభావం గలవారు, తిరిగి అసంకల్పితంగా కోపగించబడతారు. ఒకని గుణములే

Page:671

తిరిగి ఆ గుణముల ప్రతిస్పందనకు సహకారికారణములు అగుచూ ఉంటాయి. ఈ రీతిగా ఈ జీవుడు తనకున్నదే తాను పొందుచున్నాడు సుమా!

కారణం?… ఒకే చిత్ శక్తి అన్ని జీవులలోనూ ప్రసరించి ఉన్నది కదా! అందుచేత జీవులన్నీ ఒకదానిచే మరొకటి పరస్పరం స్వస్వభావానుసారం ప్రభావితమవటం సహజమే!

శ్రీరాముడు : జీవమున్నచోటే చిత్ శక్తి అజీవుని మనస్సునందు ప్రతిబింబిస్తుందా? లేక, చిత్ శక్తి (ఆత్మతత్త్వం) ‘జీవం, మనస్సు’ లేని చోటకూడా ఏర్పడియే ఉంటుందా?

శ్రీవసిష్ఠ మహర్షి : చిత్ శక్తి అంతటా ఆక్రమించియే ఉన్నది. కొయ్య, మట్టి, శిల, లోహం -అన్నిటి యందూ సత్తా సామాన్యరూపమున చిత్ శక్తి ఏర్పడి ఉండనే ఉన్నది. అయితే కాష్ఠ - లోష్ఠ శిలాదులందు మూగబాలుని వలె మౌనరూపమున ఉంటోంది. సూర్యకాంతి అంతటా ప్రసరించి ఉన్నప్పుటికీ సూర్యబింబం జలంలో మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఆ చిత్ శక్తి కేవలం పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనో, బుద్ధి యుక్తము అగు సూక్ష్మ శరీరమునందు మాత్రమే మనోచంచలనసహితమై, పరిచ్ఛిన్నమై కన్పట్టుచున్నది.

పై కారణాల చేత ‘నిర్వికారస్థితి, బ్రహ్మభావన’ పొందిన ఆ వీతహవ్యుని దేహం సర్వత్రా సమరూపమున ఉన్న భూజలాదులందలి సంవిత్తు యొక్క ప్రతిభచే, వికారములు పొందక నిశ్చలమై భూమిలో ఉండిపోయింది.

ఓ రామచంద్రా! ఈ విషయంలో నీకు మరొక యుక్తి కూడా చెపుతాను విను. అసలు దేహం శిథిలం అవటానికి కారణమేమిటి?… అంతఃకరణము యొక్క ’చేష్ట’లేక ‘స్పందన’ దేహ శైథిల్యమునకు, నాశనమునకు కూడా కారణమగుచున్నది.

దానినే మనం ‘శరీరము యొక్క చేష్ట’ అను అభిప్రాయంతో చూస్తూ ఉంటాం. అట్టి స్పందన రూపమగు ‘దేహనాశనము’ అనే వికారం ప్రాణజనితములగు జగద్వ్యవహారములలో మనకు ప్రసిద్ధమై కనబడుతోంది.

ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు స్పందమే (చలనమే) దేహచలనము (జీవనము). ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు అస్పందమే దేహనిస్తేజము (మరణము).

అయితే, అట్టి ప్రాణముల చలనము ఉపశమింపబడి, దేహంలో ఒక స్థానంలో యోగుల చేత ఉద్దేశపూర్వకంగా కేంద్రీకరించబడినప్పుడు, సంచలన రాహిత్యం చేత ఆ జీవుని ఆ ప్రాణములు శిల వలె దృఢీభూతమై ఉంటాయి. అట్టి కేంద్రీకృత ప్రాణముల ప్రభావం చేతనే వీతహవ్యుని భౌతిక శరీరం ఎట్టి మార్పు పొందకుండా దీర్ఘకాలం ఉండిపోయింది.

బాహ్యమున హస్తపాదాదులతోనూ, అభ్యంతరమున ప్రాణములతోనూ కూడిన ఈ శరీరం ప్రాణవాయువుల స్పందనచేతనే ప్రవర్తిస్తోంది. ప్రాణవాయువుల స్పందనమే ’చిత్తము యొక్క

Page:672

బీజము’ అని కూడా గ్రహించు. ఎవనియందైతే ప్రాణవాయువుల స్పందన యోగాభ్యాసం చేత నిరోధించబడి, సుస్థిరీకరించబడి ఉంటుందో - అట్టివాని దేహమునకు వృద్ధి క్షయాలు ఉండవు. అట్లు ప్రాణముల బాహ్య, అభ్యంతర స్పందనము ఉపశమించినప్పుడు దేహమున ఉన్న చర్మము, మాంసము మొదలైన ధాతువులు తమ స్థితిని ఎన్నడూ వీడకయే ఉంటాయి. అనగా, యోగముచే స్థంభింపబడిన ధాతువులు ప్రాణసంచలనము నిరోధించినప్పుడు మేరువువలె స్థిరత్వం పొందుతాయి. అట్టి ధీరులగు యోగుల శరీరములు కాష్ఠములాగా (కొయ్యలాగా) స్థిరమై, అచంచలత్వం పొందుతాయి. అప్పుడు తదితర ప్రాపంచిక జీవులకు ఆ శరీరం చంచలత్వం లేని మృతదేహపు అవయవములవలె కన్పట్టుచూ ఉంటుంది. కానీ, ఆ యోగి ప్రాణశక్తి యొక్క ప్రత్యుత్సాహం మౌనసంకల్ప రూపంగా దేహము నందు దాగి ఉంటుంది.

ఈ కారణంచేత యోగుల శరీరములు వందల, వేల సంవత్సరములు కూడా నీటిచేత తడవక, భూమియందు శిలలాగా శిధిలముకాక ఉండగలవు.

ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకు వద్దాం. "జ్ఞానశ్రేష్ఠుడగు ఆ వీతహవ్యడు శరీరంలో తిరిగి ప్రవేశించకుండా కైలాసం నుండే విదేహముక్తిని ఆశ్రయించవచ్చు కదా?” అని ప్రశ్నించావు కదా?

ఆత్మజ్ఞానులు, వీతరాగులు, మహాధీమంతులు, సర్వసంసారగ్రంథులు ఛిన్నమైనట్టివారు అగు మహాత్ములు తమ దేహం విషయంలో సర్వస్వతంత్రులై ఉంటారు. అట్టి యోగులగు తత్వజ్ఞుల మనస్సు కాకతాళీయ న్యాయముచే ప్రారబ్ధంగా ప్రాప్తించి ఉన్న ఆయా విధులందు భావన కలిగి ఉండటం స్వభావసిద్ధంగా ఏర్పడి ఉంటోంది. ఈశ్వరశక్తి గాని, మరింకే శక్తి గాని ఆ యోగి యొక్క వర్తమాన, పూర్వజన్మల ప్రారబ్ధశేషానుభవమునకు అనుకూలంగానే ప్రవర్తిస్తాయి. దానిని మరింకెవరూ మరొక విధంగా తీర్చిదిద్దలేరు. ఇది ఎట్లా అంటే, సర్వమునకు అతీతత్త్వము సముపార్జించుకున్న జ్ఞాని కూడా ఒక ఉపకారికి ప్రత్యుపకారం చెయ్యాలని అనుకోవటం వంటిది.

వీతహవ్యుని సంవిత్తు కాకతాళీయంగా “నేను నా పూర్వప్రాణ సహిత వీతహవ్యదేహంలో ప్రవేశించి మరికొంత విచారణ చేస్తాను. ఆ తరువాత విదేహముక్తిని ఆశ్రయిస్తాను” అను సంకల్పమును ప్రారబ్దానుసారంగా ఆశ్రయించింది. అందుచేతనే రుద్రగణంలోని సహచరుని సంప్రదించి సూర్య భగవానుని శరణువేడింది. ఆ సంవిత్తు “నాకు నేనుగా శరీరంలో ప్రవేశిస్తాను” అని అనుకోకపోవటానికి కారణం కూడా ప్రారబ్ధ శేషమే. సంవిత్తు ఇతఃపూర్వపు స్వయంకల్పితమగు ప్రారబ్ధమును అనుసరించే వర్తించటము ఈ చరాచర సృష్టి నియతి యొక్క చమత్కారమేనని అనుకోవాలి. యోగమును పరాకాష్ట వరకు ఆశ్రయించి ఉండుట చేతనే ఆతడు శరీర త్యాజ్యం విషయంలో సర్వస్వతంత్రుడైనాడు. వాసన సంపూర్తిగా రహితమై ఆతడు సర్వబంధముల నుండి వినిర్ముక్తుడై “నేను అఖండము, అప్రమేయము, నిత్య ఆత్మనే” అనునట్టి ఆత్మరూపమున ఆవిర్భవించారు. అట్టి స్థితిలో ‘సదేహం, విదేహం’ -అన్నీ ఆతని సర్వస్వాతంత్ర్య స్వభావమును అనుసరించే ఉంటాయి.

Page:673

ఆతడు సర్వ శక్తియుతుడగు పరమేశ్వరుడే అయ్యాడు. అందుచేత ఆతడు దేనిని వాంఛించాడో

దానినే శీఘ్రంగా పొందటం జరిగింది. విచారణచే చిత్తము నశించగా “మహామైత్రి, మహాకరుణ” - మొదలైన మహత్తర గుణములు ఆతనికి స్వభావసిద్ధం అగుచున్నాయి. ఓం నమో వీతహవ్య పరమేశ్వరాయనమోనమః

  1. చిత్తోపశమనం

శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా రామా! మనం ఈ ప్రకరణంలో ముఖ్యంగా గమనించవలసినదేమిటి? చిత్తము ఉపశమిస్తే జీవునకు సర్వ శుభములు కలుగుతాయి. ఎక్కడ చిత్తము నశిస్తే, అక్కడే ‘మైత్రి, కరుణ’ మొదలైన సద్గుణములన్నీ స్వతఃగా ఉత్పన్నమై ప్రకటితమౌతాయి. అనగా అవి ’స్వాభావ సిద్ధత’ను సంతరించుకుంటూ ఉంటాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! ఒకనిలో తీవ్రము, సూక్ష్మము అగు ఆత్మవిచారణచే చిత్తము ఆత్మయందు లయించిందనుకోండి. అప్పుడాజీవుడు నిర్వికారుడు, నిర్విషయుడు అవుతాడు కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును.

శ్రీరాముడు : అప్పుడిక ‘మైత్రి, కరుణ’ మొదలైన గుణములు ఉత్పన్నమవటానికి చోటు ఉంటుందా? చిత్తమే ఉండనప్పుడు, గుణములెక్కడ ఉంటాయి? మరి అట్టి గుణములు ఉత్పన్నమౌతాయని ఎట్లా చెప్పుచున్నారు?

హే మహావక్తా! మునిశ్రేష్ఠా! ఒకసారి చిత్తము బ్రహ్మమునందు లయమయిన తరువాత ఇక ఆపై మైత్రి కరుణ మొదలైన గుణములు కలిగేది ఎద్దానికి?…

లయించిన చిత్తమునకా? లేక అధిష్ఠానమగు ఆత్మకా? కాక, అధిష్ఠానమగు ఆత్మలోనా? లేదా, బింబరూపమగు చైతన్యమునందా? కాదా, ’చిదాభాసుడు’ అనబడే చైతన్య ప్రతిబింబమగు జీవాత్మయందా?…

ఈ విషయం దయచేసి విశదపరచండి. ఎందుకంటే… “మృగతృష్ణలోని జలం గడ్డకట్టి ఉన్నది, మరొక చోట ప్రవాహపతితమై యున్నది” అను వ్యతిరిక్త వాక్యాలులాగా చిత్తమే ఉండనప్పుడు ఇక గుణముల ప్రసక్తి ఎక్కడిది?

శ్రీవసిష్ఠ మహర్షి : పూర్ణము, సుఖ స్వరూపము అగు ఆత్మ సంవిత్తు ఒకానొక సమయంలో ఒక చోట మలిన వాసనాజాలము కలిగి ఉంటోంది. అట్టి మలిన వాసనా జాలము జన్మ సమూహములకు, సుఖదుఃఖ భరిత అధ్యాసలకు కారణమగుచున్నది.

‘మలినవాసనలు’ అంటే ఏమిటి?… “నేను ఈ శరీరమును. శరీర పరిమితుడను. ఈ

శరీరంలో గల ఇంద్రియములే నా ఉనికి. ఈ ఇంద్రియ విషయములచే నేను బద్ధుడను. ఇంద్రియాలు

Page:674

లేకుంటే నాకు ఉనికి (సత్) లేదు. ఇంద్రియములు ఉంటే, వాటి విషయములచే నియమితుడ నగుచున్నాను.” …ఇట్టి దృష్టిని ఆత్మ సంవిత్తు కలిగి ఉంటోంది. అదియే అజ్ఞచిత్తము. అదియే మలినమగు మనస్సు. అదియే సంసారము యొక్క రూపము. ‘జీవుడు’ అనగా అట్టి అజ్ఞాన దృష్టి, మనస్సు గల చిదాత్మయే కదా!

మరల చెప్పుచున్నాను. అజ్ఞాని యగు జీవుని యందు వాసనా జాలముచే ఏదైతే దృఢంగా ప్రతిష్ఠించబడియున్నదో… అద్దానిని మనస్సు అని చెప్పుకుంటున్నాం. అట్టి మనస్సు సమరూపం పొందినప్పుడు అట్టి జీవుని మనం జీవన్ముక్తుడు అని అంటున్నాం. దోషపూరితమగు మనస్సు నశిస్తేనే ఈ జీవుడు బంధభావములనుండి విడివడగలడు.

శ్రీరాముడు : మహాత్మా! నశించే మనస్సేది? నశించని మనస్సేది? అసలు మనస్సు అనేది నశిస్తుందా? మనస్సు నశిస్తే ఆ జీవునకు వ్యవహారసామర్థ్యం ఉంటుందా? మనస్సు నశించిన తరువాత మైత్రి, కరుణ మొదలైనవి ఎట్లా ఏర్పడి ఉంటాయి?

శ్రీవసిష్ఠమహర్షి : ప్రశ్నించువారిలో ఉత్తముడవగు, ఓ రామచంద్రా! ఇప్పుడు నీకు ‘మనో నాశనము’ లేక, ‘చిత్తోపశమనము’ అంటే ఏమిటో విశదపరుస్తాను. అప్పుడు నీ సందేహాలన్నీ పటాపంచలౌతాయి.

ఒకడు ఒక పెద్ద కొండను సమీపించి నోటితో ఊదుతూ ఉంటే… ఆ కొండ రెపరెప లాడుతుందా? ఏ ధీరుడైతే తనకు తారసపడే ఆయా సుఖదుఃఖ దశలు వచ్చిపోతున్నంత మాత్రం చేత తన యొక్క అఖండ - అప్రమేయ, నిత్య, నిర్మల ఆత్మ భావననుండి చ్యుతుడు కాడో - అట్టివాని చిత్తము, లేక మనస్సు నశించినట్లే. ఏ విజ్ఞాన సమన్వితుడినైతే ‘ఈ అల్ప దేహమే నేను. తదన్యంగా మరింకేమి గాను’ అను రూపంగల దేహాత్మభావన ప్రభావితమై ఉండజాలదో - ఆతనికి చిత్తము లేనట్లే. పునర్జన్మ కారకమగు సాంసారిక భావన ఉన్నప్పుడే దానిని ‘చిత్తం’ అని పిలుస్తాం. ఎప్పుడైతే చిత్తము ఆత్మ స్వభావమును సంతరించుకుంటుందో ఇక అది ఆత్మస్వరూపమే అవుతుంది.

సంసారమున్న చోటే చిత్తము ఉంటుంది. సంసారము రహితమైతే ఇక అది ’చిత్’యే అవుతుంది. దానిని మనం చిత్తము అనిపిలువం. కనుక ‘చిత్తం లయించింది’ అన్నంత మాత్రంచేత “ఆలోచనలన్నీ అంతమై ఆతడు నిష్క్రియుడు అవుతాడు“ - అని అనుకోవద్దు. “సర్వ ఆలోచనలకు ఉత్పత్తి స్థానమైన స్వాత్మస్థానము నందు ప్రతిష్ఠితుడౌతాడు” అని గ్రహించు.

చిత్తము నశించినవాని యందు “ఆపద, సంపద, విపత్తు, మహోత్సవం’ వంటివన్నీ కొండను తాకే పిల్లగాలుల వలె బాహ్యస్థమైపోతాయి. ఈ ప్రపంచ విషయములన్నీ వాటి రాక పోకలతో సహా అప్రభావితమగునప్పుడే ‘చిత్తము రహితమైనది’ అని శాస్త్రములు అంటున్నాయి.

చిత్తము యొక్క రూపమేమిటి? మూఢత్వం కలిగి ఉండటమే. పరమార్థమును వదలి దృశ్యమును మననం చేస్తూ కార్య కారణములకు అధీనమయి ఉండుటయే దృశ్యతాదాత్మ్యం. మూఢత్వం

Page:675

తొలగితే మేఘాలు తొలగినప్పుటి సూర్యుని వలె సత్స్వభావం పూర్ణంగా ఉదయించగలదు. అట్టి సత్స్వభావము నుండి చ్యుతి పొందనప్పుడు చిత్తము రహితమైనట్లే. జీవన్ముక్తుడు సత్స్వభావమును ఆశ్రయించి ఉంటాడు. ఆతనిలో శేషించే దృశ్యవ్యవహారమును ‘శుద్ధ చిత్తము’ అని కూడా అంటారు.

శుద్ధ చిత్ స్వభావుడు - “శుద్ధ చిత్ స్వభావుడు (లేక) శుద్ధసంవిత్ స్వరూపుడు” అగు జీవన్ముక్తుని యందు అత్యంత అకృత్రిమంగా పరిమిత దృష్టులన్నీ తొలగిపోయి ఉంటాయి. అందుచేతనే ఆతనియందు మైత్రి, కరుణ మొదలైనవి స్వభావసిద్ధంగా ప్రకటితమౌతాయని నేను చెప్పటం జరిగింది. వారు స్వభావసిద్దంగానూ, అకృత్రిమంగానూ ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు. అంతేగాని, పునర్జన్మ కారకమగు ఆశ చేతనో, ప్రతిష్ఠకొరకో కాదు. ఎందుకంటే, ‘నేను ఆత్మను’ అను అనుభవం గల చిత్స్వభావుడు తన స్వరూపమునే సర్వే సర్వత్రా గాంచుచున్నాడు. అమ్మ ఏ ప్రతిఫలం కోరకుండా పుత్రునియందు అవ్యాజమైన ప్రేమ తన స్వభావంగా కలిగి ఉంటుంది కదా!

జీవన్ముక్తుడు సర్వులను తనవలెనే గాంచుచూ ఉంటాడు. అందుచేత ఆతని అప్పటి ’మైత్రి, కరుణ’ అసంకల్పితములు, స్వభావసిద్ధములు. అందుచేత, అవి పునర్జన్మ హేతువులు కాజాలవు.

“అసలు చిత్తము అంటే ఏమిటి?"… ఈ దేహము కంటే విలక్షణమైనట్టి ‘సత్త’ స్వరూపుడగు దేహి తన స్వరూప సత్తను ఏమరచి ఈ దేహములో ఏర్పడి ఉన్న ఇంద్రియములకు విషయములు అగుచున్న వాటిలో భావనా పూర్వకంగా ప్రవేశించి, వాటి ప్రభావములగు సుఖ-దుఃఖ భావ పరంపరలను అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా పొందటాన్నే శాస్త్రజ్ఞులు ‘చిత్తము’ అని పిలుస్తున్నారు. తత్త్వశాస్త్రములు (మోక్ష శాస్త్రములు) జీవునకు విషయముల నుండి వెనుకకు మరలి, స్వస్వరూప సత్త యందు అచ్యుతుడై ఏర్పడి ఉండటం ఉద్బోధిస్తున్నాయి. దానినే ’చిత్త నాశనం’ అంటున్నాయి.

ప్రతి జీవుని యందు సర్వదా ఏర్పడి ఉన్నది ఏకైక స్వసత్తయే కదా! అందుచేత విషయములచే ఏర్పడిన ‘గుణ - కర్మ’ భేద విభాగమంతా స్వసత్తయందు ఉద్బోధితుడైనవానికి ఉపశమించిపోతాయి. సత్వము అనే చంద్రకిరణ స్వరూపమగు సంతుష్టి ప్రకటితమగుచుండగా ఆ జీవన్ముక్తునికి సాత్విక గుణములు స్వభావ సిద్ధమైపోతాయి. అంతేగాని అవి ప్రతిఫలాపేక్ష చేతనో, కర్తృత్వాభిమానంతోనో ఏర్పడే గుణ ప్రకటనకాదు. “నా బిడ్డకు స్నానం చేయించాను. తుడిచాను. లాలించాను మరి నాకు ప్రతిఫలం ఏమిటి? ఎవరు ఇస్తారు?" అని తల్లి గొప్పలు చెప్పుకోదు కదా! ఆమె ప్రేమ లాగానే జీవన్ముక్తుని ప్రేమ మొదలైనవి అత్యంత స్వతఃసిద్ధమైనవి అవుతాయి.

అరూపమనోనాశనం - ఇది నిష్కళాత్ములగు విదేహముక్తులకు మాత్రమే కలుగుతుంది. అప్పుడు సర్వగుణములు నిర్మలము, పరమపావనము అగు విదేహముక్తపదము నందు లయించి పోతాయి. అనగా… ‘అరూపము’ అనబడే చిత్తనాశస్థితి విదేహముక్తులకు మాత్రమే విషయమౌతుంది. అది రూపరహితం, దృశ్యరహితం అయినది. దానిని మనం మాటలలో చెప్పుకోలేము.

అట్టి అరూప చిత్తనాశనపదము గుణము కాదు. అగుణము కాదు. సమృద్ధిగాని, అసమృద్ధి గాని కాదు. చంచలముగాని, ఉదయముగాని, అస్తమయంగాని, హర్షముగాని, శోకముగాని,

Page:676

తేజ - అంధకారములుగాని, పగలు - రాత్రులుగాని కాదు. “దిక్కులు, ఆకాశము, ఊర్ధ్వ అధో విభాగము, రచన, రాగము, విరాగం, సత్త, అసత్త, సత్తఅసత్తల సంధి రూపం” …ఈ శబ్దాలన్నీ అరూపచిత్త నాశనము గురించి ప్రవచించలేవు.

అది అంధకార, తేజోరహితమైనది. సూర్య, చంద్ర, నక్షత్ర వర్జితమైనది. శరత్ కాల ఆకాశం లాగా అది నిర్మల పదమై అలరుచున్నది. ఆకాశము వాయువునకు స్థానమగుచున్నట్లు… బుద్ధిని, సర్వసంసారాడంబరాన్ని అధిగమించిన మహాత్ములకు ఆ ’అరూపసత్త’యే స్థానభూతమై ఒప్పుచున్నది. అజ్ఞానరజ శూన్యమైనట్టి, ఆకాశంవలె విశాలమైనట్టి, చిత్తలేశమైనా లేనట్టి అరూపసత్త యందు విదేహముక్తులు ఏర్పడి ఉంటున్నారు. ఈ జగత్తులలో కనిపించే సమష్టిబుద్ధి, సమష్టి సంచలనము మొదలైనవి విదేహముక్తుల వినోద విహారమే సుమా!

  1. శరీర తదాప్యం - నివారణ

శ్రీరాముడు : హే మహాత్మా! మహర్షీ! అనేక సంరంభములచే అలరారుచున్న ఈ జగత్తు ఎదురుగా ఉండి జీవుడు నిర్విశేషమగు బ్రహ్మమును సంతరించుకోకుండా అడ్డగించుచున్నది కదా! అనేక దుః ఖములతో కూడి ఎదురుగా నిలచి ఎంతో భ్రమింపజేస్తున్న ‘సంసారము’ అనబడే ఈ వృక్షమునకు అసలు బీజమేది? ఆ బీజం ఎక్కడినుండి వచ్చింది? దానికి ఉత్పత్తి స్థానమేది? ఆ స్థానమునకు ఎక్కడి నుండి, ఎట్లా ఉత్పత్తి ఏర్పడింది?

మా బోధ యొక్క అభివృద్ధి కొరకై అసలు ఈ సంసారమంతా ఎక్కడి నుండి వచ్చిపడుతోందో…

ఆ మూలము గురించి విశదీకరించండి.

శ్రీవసిష్ఠ మహర్షి : “ఈ దేహమే సంసారమునకు అసలైన బీజం” అని చెప్పబడుతోంది. నీకు బయటగా కనబడే ఈ దేహము యొక్క అసలైన రూపం జీవుని యొక్క అంతరంగంలో ఏర్పడి ఉన్నది. శుభ, అశుభ భావనలే దీని అంకురం. కాండమునుండి కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు వృద్ధిచెందుతాయి చూచావా? “సంసారము” అనబడే అంతఃకరణము యొక్క దోషవిభాగము నుండి కార్య, కారణములు, ఆశలు, సుఖ దుఃఖములు, ఉపాధులు అనునవన్నీ ఉత్పన్నమగుచున్నాయి.

సంసారమునకు స్థానం అంతఃకరణమే. శరీరం అనగా “నేను ఈ శరీరమును” అను అంతః కరణము యొక్క వ్యవహారమేనని విజ్ఞులు గమనిస్తున్నారు. మనస్సే పదార్థములు అభివృద్ధి, వినాశములకు స్థానమని సుతీక్షమైన అవగాహన గలవారు తప్పక గ్రహిస్తున్నారు. ఆశించేది, ఆ ఆశల వెంట పరుగులు తీసేది, వాటివలన కలిగే సుఖదుఃఖములను నిర్వచించేదీ, వాటిని త్యజించేదీ అంతా మనస్సే. భూత - వర్తమాన - భవిష్యత్ దేహములను, ఆ దేహములచే పొందే దృశ్య పరంపరలనూ, అన్నిటినీ మోస్తున్నది మనస్సే. జాగ్రత్ నుండి స్వప్నంలోకి వెళ్ళిన మనస్సు ఊహానగరమును సృష్టించుకొని, అందులోకి ప్రవేశించి అనేక అనుభవములను పొందుతోంది.

Page:677

మనస్సు ‘సంకల్పించుట’ అను ప్రక్రియను తన యొక్క మూలముగా కలిగి ఉన్నది. కుమ్మరి యొక్క ఆలోచనలను అనుసరించి మట్టితో అనేక ఆకారములు గల కుండలన్నీ తయారగుచున్నట్లు, మనస్సుచే దృశ్యత్వము, ఆ దృశ్యమునకు విషయములగు ఈ జగదనుభవములు తయారగుచున్నాయి. వృత్తి అను రూపముగల మనస్సుకు రెండు మూలాస్థానములు ఉన్నాయి –

  1. దృఢవాసనలు (Dense Tendencies), 2. ప్రాణస్పందము.

ప్రాణములు చలించి నాడులను స్పృశించటానికి సిద్ధమగుచున్నాయి. మరుక్షణం చిద్వికారమగు మనస్సు లేక చిత్తము కూడా శీఘ్రంగా ప్రకటితమౌతోంది.

నాడీ మార్గ రంధ్రముల గుండా ప్రాణములు చలించకపోతే అప్పుడు ద్రష్టకు ఇంద్రియములు బాహ్యానుభవమే ఉండేది కాదు. కనుక ప్రాణస్పందమే చిత్తము ద్వారా ‘జగత్తు’ అను పేరిట ప్రసిద్ధి కెక్కుచున్నది. ప్రాణ స్పందము ద్రష్ట యొక్క ప్రభావమే అయి ఉన్నది.

అంతటికీ కారణం? ఆత్మయే తన స్వరూపముగాగల ద్రష్టయే. కనుక ద్రష్టయే ప్రాణస్వరూపుడై తన చిత్తము ద్వారా ఈ జగత్తును గాంచుచున్నాడు.

జగత్ ప్రళయం - ప్రాణ స్పందము యొక్క ఉపశమనము జరిగినప్పుడు చైతన్యము యొక్క నిష్క్రియరూపమగు ప్రశాంత స్థితి ఏర్పడి ఉంటోంది. దానిని వేదజ్ఞులు ’జగత్ప్రళయం’గా వర్ణించి చెప్పుచున్నారు.

జగత్ సృష్టి - నిష్క్రియమగు చైతన్యము ఒకప్పుడు ప్రాణ స్పందమును ఆశ్రయిస్తోంది. అప్పుడు నిశ్చలంగా ఉన్న బంతి నెట్టబడుటచే చలనము పొందుచున్నట్లుగా, చిత్తమున వృత్తులు విజృంభిస్తున్నాయి. అట్టి వృత్తిజ్ఞానం దేహములందు స్ఫురిస్తోంది. అదియే ‘జగత్ సృష్టి’ అని వేదజ్ఞులచే పిలువబడుతోంది.

ఈ విధంగా జగత్ సృష్టి, జగత్ ప్రళయమనేవి ఆత్మ స్వరూపుడగు ఈ దేహి, లేక, ప్రాణి యొక్క స్పందనకు సంబంధించినవే గాని, పంచభూత సమ్మేళనములగు ఈ ఎదురుగా కనబడే వస్తుజాలముల ఉత్పతి, వినాశనములకు సంబంధించినది కాదని సూక్ష్మదృష్టితో గ్రహించు.

అతి సూక్ష్మమగు గంధము (Smell) సర్వత్రా వ్యాపించి ఉన్న వాయువుచే సంచలనము పొంది నలువైపులా ప్రసరిస్తోంది చూచావా? సర్వత్రా వ్యాపించియున్న సంవిత్తు ప్రాణముల చలనముచే ప్రబోధితమై దేహములందు ప్రతిబింబిస్తోంది.

శ్రీరాముడు : తన స్వరూపమేమిటో ఏమరచిన ఈ జీవుడు చిత్తవృత్తులను ఆశ్రయించి, ఈ జగత్తును పొందుచూ, చమత్కారంగా క్షోభను పొందుచున్నాడు.

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అందుచేత, చిత్తవృత్తిని నిరోధించటంచేత ఈ జీవునకు పరమ శ్రేయస్సు లభించగలదు. ప్రాణాయామాదుల అభ్యాసంచేత ప్రాణ స్పందనమును నియమించినప్పుడు ఈ జీవునకు క్షోభ తొలగగలదు.

Page:678

చిత్తవృతి, చిత్తమౌనము - చిత్తవృత్తి ఉదయించిన వెంటనే బాహ్యవిషయములందు అనురాగం జనిస్తోంది. ఇక ఆపై అది దేహములను కల్పించుకొని బాహ్యవిషయ భోగములవైపు ఆసక్తిగా వెడలుచున్నది. అందుకు ఫలితమేమిటి? అది అనంత దుఃఖములను తెచ్చిపెట్టుకుంటోంది. చిత్తమే చిత్తమునకు వృత్తుల రూపమున బంధమౌతోంది.

అట్టి చిత్తము బాహ్యవిషయములందు ’మౌనము’ వహించి అభ్యంతరస్థమైనట్టి ఆత్మజ్ఞానవిషయంలో మేల్కొనినదనుకో… అప్పుడేమౌతుంది? అప్పుడాద్రష్ట, లేక, జీవుడు పొందతగిన విమల పదమును పొందినట్లే.

అందుచేత ఓ సభికులారా! ప్రాణచలనం కారణంగా ఉత్తేజమగుచున్న వాసనల రూపమున ఏర్పడుచున్న అజ్ఞాన చిత్తము వృద్ధికాకుండా చూచుకోవటం ఎట్లాగో కొంచెం యోచించండి. అప్పుడు మాత్రమే ఈ జన్మాది వికారములనుండి (నేను జన్మిస్తున్నాను మొ॥న భ్రమల నుండి) ముక్తులు కాగలుగుతారు. ఎందుకంటే, మలిన సంవిత్తు యొక్క వృద్ధిచే ఈ జీవులకు అనేక ఉపాధిపరంపరలు జనించి, నశిస్తున్నాయి. అజ్ఞాన చిత్తము యొక్క అనర్థజాలములచే ఈ ప్రపంచమంతా వ్యాప్తమై ఉంటోంది.

ఈ తీరునంతా గ్రహించిన యోగులు ప్రాణాయామముచేతనూ, ధ్యానము చేతనూ, శాస్త్రములచే అందింపబడుచున్న తదితర సాధనములచేతనూ, సద్గురువులచే ప్రసాదింపబడిన ఆయా విధి, విధానములతో కూడిన యుక్తుల చేతనూ, సర్వే- సర్వత్రా స్వస్వరూపాత్మ విన్యాసంగా సందర్శించుట చేతనూ, ఈ చిత్తమును విషయములనుండి ఉపశమింపజేయుటకు యత్నములు చేస్తున్నారు.

చిత్తనిరోధం కొరకు ప్రాణ ప్రసరణముల ప్రాణాయామపరాయణులు నిరోధం అభ్యసిస్తూ ఉంటారు. ప్రాణనిరోధం, చిత్తశాంతిని కలిగించగలదు. అది స్వస్థతకు, సమత్వమునకు, సుఖ స్వస్వరూపానుభవమునకు సహకరిస్తోంది.

  1. అభావన ద్వారా అమనస్కం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు అడిగిన చిత్తబీజము విషయమై సమాధానంగా జ్ఞానులచే ప్రవచించబడిన మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. నేనిప్పుడు చెప్పే విశేషాలు జీవునకు స్వయంగా అనుభూతం కాగల విషయాలే!

T

ఈ జీవుడు అనేక జన్మల అభ్యాసవశంచేత ఈ దేహమును ‘ఇది నేను… ఇది నాది’ అను సంస్కారముతో గాంచుచున్నాడు. అట్లా దర్శించేటప్పుడు - “ఈ దేహమునకు ముందు ఏమైయున్నది? ఈ దేహానంతరం ఉన్న విశేషమేమిటి? ఈ దేహముకంటే విలక్షణమై నాకు సంబంధించి ఏర్పడి ఉన్నదేది” అను పరిశీలనాత్మక దృష్టిని కోల్పోవుచున్నాడు. అనగా…

Page:679

ఆతడు పూర్వా పరములను వదలి, వర్తమానము నందు ఈ దేహముచే అనుభవమయ్యే విషయములందు మాత్రమే పరిశీలన భావనలను కలిగి ఉంటున్నాడు. అట్టి పరిమిత, సంకుచిత దృష్టినే ‘వాసన’ అని అంటారు. కొన్ని పరిమిత భావనలను స్వీకరించి అభ్యాసవశంగా ఈ దేహాదులు జీవుడు పొందుచున్నాడు. అంటే, ఆతడు ఎట్టి పరిమిత భావనలను ఆశ్రయిస్తున్నాడో, అట్టి ఆకృతినే పొంది, ఆ పరిమిత భావనలందు తనను తాను ఏర్పరచుకొనుచున్నాడు. అట్లు ఏర్పరచుకొను అభ్యాసమే సంసారమునకు బీజము. అట్టి పరిమిత ఆకృతి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆయా వాసనలకు వశీభూతుడై పూర్వాపరములను ఏమరుచుచున్నాడు. తన పరిమిత భావములకు కనబడుదానిని ‘ఇదియే సద్వస్తువు’ అని తలచుచూ, వివశుడై ఆ సమయంలో తనయొక్క వాస్తవ స్వరూపమును గాంచటం (లేక మననం చేయటం) మానివేస్తున్నాడు. ఇదియే "స్వస్వరూపం నుండి చ్యుతి పొందటం” అని అంటారు. కడుపు నిండా కల్లు త్రాగినవానికి ఈ ఎదురుగా ఉండే పదార్థాలన్నీ మరొకవిధంగా ఆ మత్తులో కనిపిస్తాయి చూచావా? వాసనలందు సంస్థాపితమైన జీవునకు ఈ జగత్తంతా అభినివేశ మయంగా కనిపిస్తోంది. విషం మ్రింగినవాడు ఆ విషమునకు వశీభూతుడై పిచ్చికేకలు వేస్తున్నట్లు, అంతఃకరణంలో ఏర్పడిన వాసనలచే అజ్ఞానయుతుడైన జీవుడు సకల మానసిక వ్యధలచే బాధింప బడుచున్నాడు. విషయములే విషములుగా ప్రాప్తిస్తున్నాయి.

ఎద్దానితో అయితే… ఈ జీవునకు అనాత్మయందు - - ఆత్మబుద్ధి; అవస్తువగు దేహాదులందు వస్తుబుద్ధి …అనే మిథ్యా జ్ఞానం కలుగుతోందో దానినే ‘చిత్తము’ అని పిలుస్తున్నాం. అనగా దృఢమైన అభ్యాసం కారణంగా ఈ పదార్థములతో అభేదవాసన పుట్టుకొస్తోంది. అందులోంచే అతి చపలమైన చిత్తము బహిర్గతమౌతోంది. ఆ చిత్తము జీవునకు జన్మ - జరా - మృత్యువులతో కూడిన ఈ ఉపాధి, ఆకార వికారములను సంతరింపజేస్తోంది.

ఎప్పుడైతే జీవుడు ‘త్యజించటం - గ్రహించటం’ అనే బుద్ధిని అవలంబించక, వాసనారహితుడై ఉంటాడో - అప్పుడిక ఆతని యందు చిత్తమనేదే జనించదు. ఆతడు “భావించకపోవటం, అభావన” అభ్యసిస్తాడనుకో… అప్పుడు ఆతనిలో పదార్థములకు సంబంధించిన మననం సన్నగిల్లుతుంది. ఇక లేశమైనా మననం శేషించనప్పుడు ‘అమనస్కం’ ఉదయిస్తుంది. ఆకాశంలో కమలం ఉదయించ నట్లు అమనస్కస్థితిలో చైతన్యమునందు చిత్తమే ఉదయించదు.

రాగవశం చేత వస్తువును చూచి “ఇది వాస్తవము” అని అనుకుంటూ ఉండటమే చిత్తము. నాఉద్దేశంలో చిత్తమునకు మరింకే రూపమూ లేదు.

ఏతావన్మాత్రకం మన్యే రూపం చిత్తస్య రాఘవ ॥

యద్భావనం వస్తునోస్తర్వస్తుత్వేన రసేన చ ॥ (శ్లో 40, సర్గ 91)

“వాస్తవము, శాశ్వతము అగు దృష్టితో చూస్తే ఇక్కడి పదార్థాలేవీ భావావేశముచే సమర్థించుటకు యోగ్యమే కాదు" - అను భావన (లేక) అవగాహనకు వచ్చిన జీవుని స్వరూపం నిర్మలాకాశంలాగా స్వచ్ఛమై ఉంటుంది. ఇక అందు చిత్తోదయం ఎట్లా అవుతుంది?

Page:680

కాబట్టి రామా! నీవు ‘బాహ్యవస్తువిస్మరణ’ రూపమగు ‘నిరోధయోగము’ ను అవలంబించు. అప్పుడు సర్వ దృశ్యమార్జవం (Washing off) లేక దృశ్యరహితత్వం ఏర్పడగలదు. ఈ దేహము పొందినందుకుగాను అంతకు మించిన ప్రయోజనం మరింకేదీ ఉండదు. అభావసంపాదకమైనట్టి అచిత్తత్వమే ఆత్మవస్తు దర్శనం కూడా.

అంతఃకరణముచే సర్వమూ త్యజించబడగా అప్పుడు శేషించి ఉండే శీతలాశయవర్తియగు వాసనారహిత చిత్తము ఒకవేళ ఈ ప్రపంచంలో వర్తించవలసిన వచ్చినప్పటికీ దానికి సంసార దోషం అంటదు. ఉడకబెట్టిన చిక్కుడు విత్తనంలాగా అది ఆకారం కలిగియున్నప్పటికీ అచిత్తత్వముతో సరిసమానమే అవుతుంది. వాసనావశంచేతనే విషయములు ధ్యానింపబడుచున్నాయి.

దృశ్యమునందు ఏమాత్రం ఆలాపన, అనురాగములు లేనివాని చిత్తం అచిత్తత్వ దశ పొందినట్లే. అదియే ఉపశమనము. అదియే సత్వము.

ఘన వాసనలు మరల మరల జనన మరణములకు కారణములు అగుచున్నాయి. వాసనా రహితుడగు జీవన్ముక్తుడు ఈ ప్రపంచ కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, సదా సత్వమునందే సుస్థిరుడై ఉంటాడు. ఈ ప్రపంచంలో రాగరహితులైనట్టి, పునర్జన్మాంకురము లేనట్టి జీవన్ముక్తులు ఎందరో యథావిధిగా సంచరిస్తూ ఉన్నారు. వారు జ్ఞాన సంపన్నులై, సత్యరూపులై ఈ దేహానంతరం చిదాకాశ స్వరూపం సంతరించుకొనుటకు అర్హులై ఉంటున్నారు. వారంతా చిత్తరహితులని, అమనస్కులని మనం తప్పక గ్రహించవచ్చు.

  1. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్నవానియందే! శ్రీవసిష్ఠ మహర్షి : బీజం మొలకెత్తాలంటే నేల, నీరు రెండూ కావాలిగా!

ద్వే బీజే రామ చిత్తస్య ప్రాణస్పన్దనవాసనే |

ఏకస్మింశ్చ తయోః క్షీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః || (శ్లో 48, సర్గ 91)

చిత్తబీజమునకు కూడా రూపం దిద్దుకోవాలంటే -ప్రాణ స్పందనము, వాసన - - అనే రెండు ఉండాలి. ఈ రెండిటిలో ఒకటి శమిస్తే రెండవది తనంతట తానే శమిస్తుంది.

నువ్వులలో నూనె దాగి ఉన్నట్లు, వాసనలలోనే భావిపునర్జన్మ పరంపరలన్నీ దాగి ఉన్నాయి. బీజం-వృక్షంలాగా వాసనలవల్ల జన్మలు, జన్మల వల్ల ఇంకొన్ని వాసనలు ఏర్పడుచున్నాయి. ప్రాణం, వాసనలను సమన్వయపరుస్తూ చిత్తం తనకు తానే ఇంద్రియ సుఖదుఃఖానుభవాలు కల్పించుకుంటోంది.

ప్రాణములు

విషయసమన్వితమగు → విషయానందము మరికొన్ని విషయములతో చిత్తము ఇంద్రియములు కూడుకొన్న చిత్తము

Page:681

చిత్తంలోంచి “ప్రాణములు, విషయానందం” ఉత్పన్నమౌతున్నాయి. వాటి నుండి మరల చిత్తము మరింత ప్రోద్బలమౌతోంది. అట్లాగే ప్రాణముచే వాసనాస్పందనము, వాసనాస్పందనముచే ప్రాణములు పరస్పరం ప్రవృద్ధం చేసుకుంటున్నాయి. వాసనలు ప్రాణస్పందనమును ఉద్బోధించటాన్ని ’సంవిత్ ప్రక్షోభము’ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.

ప్రాణములు హృదయగుణములగు రాగద్వేషాదులను ప్రేరేపించుతూ ఉండటం తమ ధర్మంగా కలిగి ఉంటున్నాయి. సంవిత్తు రాగసహితమైనప్పుడు ‘చిత్తము’ అనే బాలకుడు పుట్టుకొస్తున్నాడు.

ఈ విధంగా ప్రాణ స్పందనము, వాసనలు - ఈ రెండూ కూడా చిత్త రూపమునకు కారణములై ఉంటున్నాయి.

శ్రీరాముడు : మహాప్రభో! చిత్తమే కదా, సర్వ వ్యాపకములకూ మూలం! మరి నిరోధించబడటమెట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణ స్పందన, వాసనలలో ఒక్కదానిని నీవు నిరోధించగలిగితే రెండవది తనకు తానే పట్టుబడుతుంది.

చిత్తము ‘మననము’ అనే స్వభావం కలిగి ఉంటోంది. చిత్తమనే వృక్షమునకు కాచిన ఫలమే ఈ శరీరం కూడా. సర్వక్రియలూ చిత్తము చేతనే సంకల్పించబడుచున్నాయి. అది తనయందు తృష్ణ రాగము అనే దోషములను అంతరాంతరంలో పొందుపరచుకుని ఉన్నది. అదే అజ్ఞాన కార్యములకు సాధనములవంటివైన ఇంద్రియములకుకూడా మూలం. అట్టి చిత్తం నశిస్తే క్షణంలో వాసనలూ పోతాయి. ప్రాణ స్పందనా నిరోధించబడుతుంది.

సర్వదిక్కులను మలినపరుచుచున్నది ఈ చిత్తమే. అది సర్వప్రాణుల స్వస్వరూపమగు చిత్ రూపమును ఆవరించుకొని ఉంటోంది. అది ఎట్లా జనించింది? అజ్ఞానకారణం చేతనే! అది వ్యాప్తమై ఉండి, ఈ దేహమునందే నెలకొని ఉంటోంది. అత్యల్పవృత్తులచేకూడా సంక్షుభితమౌతోంది. అన్ని వైపులా కదులుతూ పిచ్చిగంతులు వేయటంలో దానికదే సాటి. ఎంత కాలం గడచిపోతున్నా… ఎన్ని ఉపాధులు మంటగలిసిపోతున్నా… అది తన అంతఃకరణసాక్షి, విషయరహిత స్థానము, ఉపాధిరహితము అగు బ్రహ్మప్రకాశమును గాంచదే?

అట్టి నిత్య సంచలనరూపమగు ఈ చిత్తం ప్రాణ స్పందనిరోధంచే క్షణంలో లయమొందగలదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయములు - ప్రాణస్పందన, వాసనలు… రెండిటికీ కూడా శబ్దస్పర్శాది విషయములు బీజమగుచున్నాయి. శబ్దస్పర్శాది విషయములు పొందవలెనని ఇచ్ఛ, అభినివేశము, పట్టుదల - - జీవునియందు ఏర్పడగానే “నాయనా! బయలుదేరు! మేం అందుకు సాయపడతాం” అంటూ ఆ జంట (ప్రాణస్పందము-వాసనలు) ముందుకొస్తున్నది.

శ్రీరాముడు : స్వామి! "ఇచ్ఛ, ప్రాణస్పందన, వాసనలు, చిత్తము, శబ్దస్పర్శాది విషయములు” - వీటిని మీరు ఉదహరిస్తూ… దీనికి అది బీజమని, దానికి ఇది బీజమని చెప్పుకొస్తున్నారు. ఏది బీజం? ఏది వృక్షం? ఏది ముందు? ఏది వెనుక? మీరు చెప్పే విషయాలలో అది నేను గుర్తించలేక పోతున్నాను.

Page:682

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. ఈ సంవాదం అట్లా ఉన్నమాట నిజమే. అయితే విత్తు ముందా? చెట్టు ముందా? చెట్టులోంచి విత్తు వస్తోంది? విత్తులోంచి చెట్టు వస్తోందా? అక్కడ తేల్చిచెప్పగలదేవి ఉండదు కదా! అయితే…

ఉపాయమేమిటో నేను సుస్పష్టపరచుచున్నాను కదా! ఇక సమాధానం ఉండని ప్రశ్నలతో గాభరాబడవలసిన పనేమున్నది?… శబ్దస్పర్శాది విషయములనుండి విరమించుటచే వాసనలు సన్నగిల్లుతాయి. ప్రాణస్పందం నిరోధించబడుతుంది.

అట్లాగే… ప్రాణనిరోధాభ్యాసంచే వాసనలు సన్నగిల్లుతాయి. శబ్దస్పర్శాది విషయముల ప్రకోపం శమిస్తుంది. క్రమంగా వాసనలు ఉపశమిస్తాయి. అప్పుడు చిత్తం అచిత్తమౌతుంది.

మరొక విషయం. “ఆత్మ, సంవితు, ద్రష్ట, శరీరి" అను పేర్లతో జీవుని స్వస్వరూపము పిలువబడుచున్నది అట్టి చైతన్యమే అన్నిటికీ స్థానమై ఉంటున్నది.

నువ్వులు లేకుండా నూనె లభిస్తుందా? సంవిత్తు (The Knower) యే లేకపోతే వృత్తి జ్ఞానం ఎవరికి? శబ్దాది విషయములకు అనుభవరూపమగు సంవేద్యము (Object being known) ఎట్లా ఏర్పడుతుంది?

పైగా… ఈ బాహ్య - అభ్యంతర విషయములన్నీ సంవిత్తుకంటే వేరైనవి అనుకుంటున్నావా?… కానేకాదు. సంవిత్తు స్వప్నమున స్ఫురించుచూ ఆ స్వప్నంలో పదార్థములను, ప్రదేశములను, స్వమరణమును కూడా గాంచుచున్నది చూచావా? (ఒక్కొక్కడు తాను చనిపోయినట్లు కూడా కల గంటాడు కదా!) అదే సంవిత్తు జాగ్రత్లో కూడా ప్రవేశించి అట్టి స్వసంకల్పవశం చేతనే పదార్థముల అనుభవమును గాంచుచున్నది. అంతే కాదు…

ఏ సంవిత్తైతే వివేకోదయం చేత స్వసంకల్పము ద్వారా పదార్థానుభవములన్నీ త్యజించి తనను తానే ఎరుగుచున్నదో… ఆ ఎరుక కూడా స్వప్న, జాగ్రత్లవలెనే స్వప్నతుల్యమేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఎందుకంటే అద్వితీయానుభవం దృష్ట్యా ‘ఇది నేను, ఇది స్వరూపం’ అనునవి మాత్రం ఎక్కడుంటాయి? కనుక కేవలానుభవస్థితిలో,

స్వప్న సంవిత్తు ఉండదు… జాగ్రత్ సంవిత్తు ఉండదు… సంవిత్ యొక్క సంవిత్తు ఉండదు… స్వసంకల్ప భ్రమచే పసిబాలుడికి గాలిలో భూతాలు కనిపిస్తున్నట్లు, సంవిత్తు యొక్క స్వవ్యసన, సంకల్ప భ్రమచే ఈ జగత్తు ఆ సంవిత్తుకు కనిపిస్తోంది. కనుక జగత్తు యొక్క అసలైన బీజం, స్థానం దీనిని ఎరుగుచున్నవానియందే ఉన్నదని గ్రహించు.

తెలియబడుచున్నదంతా తెలుసుకుంటున్నవానినుండే బయలుదేరి, ఆతనియందే ఏర్పడి ఉండి, మరొకప్పటికి ఆతనియందే ఉపశమిస్తోంది. సంసారము యొక్క జగత్తు యొక్క “ఆదిబీజం” తెలుసుకుంటున్నవాడే.

Page:683

  1. దృశ్య అదర్శనం

శ్రీవసిష్ఠ మహర్షి : మసక చీకట్లో అంతదూరంగా నిలచియున్న ఒక పెద్ద శిలా స్థంభము భ్రమ కారణంగా ఒక పురుషుని రూపంగా అనుభవమౌతుంది చూచావా? అట్లాగే జీవునికి ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అట్టి దృశ్యసందర్శనంలో పాల్గొనే వివిధ విశేషాలు ఈ విధంగా ఉంటాయి.

  1. సంవిత్తు = The Knower or That Which is Knowing (Knower prior to knowing) 2. విషయసంవిత్తు = The Knower while engaged in material world.

(అట్లాగే స్వప్నసంవిత్తు, జాగ్రత్ సంవిత్తు, సుషుప్త సంవిత్తు కూడా)

  1. సంవేద్యము = That Which is being Known

  2. సంవేదనము = Knowing

  3. ఆత్మ సంవిత్తు = Knower Which is engaged in knowing the Knower’s Self. (one’s

own self)

సూర్యకిరణములు కిటికీలోంచి ప్రసరిస్తున్నప్పుడు అందు దండాకారంగా పరిభ్రమిస్తున్నట్లు త్రసరేణువులు అగుపిస్తాయి. నావలో పయనించేవానికి అచంచలమగు పర్వతములు, వృక్షములు వెనక్కు వెళ్ళిపోతున్నట్లు కనబడతాయి. చీకట్లో చూచిన త్రాడు పాములాగా భ్రమింపజేస్తుంది. కంటి దోషం చేత ఆకాశంలో రెండు చంద్రబింబాలు అగుపిస్తాయి. ఈ భ్రమలన్ని సరి అయిన దృష్టితో చూస్తే నశిస్తాయి.

అదేవిధంగా సంవిత్తే తెలియబడుచున్నదానివలె విషయరూపమున, దృశ్యరూపమున భాసిస్తోంది. అట్లా కనిపిస్తున్నదంతా సమ్యక్ దృష్టిచే నశించిపోతాయి. అనగా, దృశ్యము - దృశ్యవిషయములు అనబడే సంవేద్యమునకు సంబంధించిన మిథ్యా జ్ఞానమంతా సమ్యక్ జ్ఞానముచే నశించగలదు. సంవేద్యమంతా సంవిత్తుకు వేరైనది కాదు - అని మరొకసారి ప్రకటిస్తున్నాను.

ఓ రామచంద్రా! ఈ కనబడే మూడు లోకములూ శుద్ధ సంవిత్ మాత్రమే అయి ఉన్నది. అంతకు వేరుగా సంవేద్యము (తెలియబడేది) అంటూ ఎక్కడా ఏదీ లేదు.

సమ్యక్ జ్ఞానం - తెలియబడేవాని రూపమే తెలియబడుచున్న దానియందు స్ఫురిస్తోందనీ, ఆతనికి వేరుగా తెలియబడేదంటూ లేదను నిశ్చయం కలిగి ఉండటం.

అందుచేత రామా! నీవు సంసారమును జయించివేయాలనుకుంటే “ఇతఃపూర్వం గాంచినవి, ఇప్పుడు గాంచుచున్నవి, ఇకముందు గాంచాలని అనుకుంటున్నవి" - వాటినన్నిటినీ నీ నీ చిత్తము నుండి తొలగించివేయాలి. అనగా, “ఇవన్నీ మిథ్యారూపమైనవే కదా!” అను ఎరుకను దృఢపరుచు కోవాలి. అట్లు తొలగించుకోనంతకాలం జీవునకు ఈ జన్మ, కర్మలతోటి సంబంధం ఎప్పటికీ తొలగదు. శుద్ధవిభాగచిత్తము సహాయంతో మలిన విభాగచిత్తమును తొలగించుటయే మోక్షం.

Page:684

దృశ్యము సత్యమని భావన చేయటమే అవిశ్రాంతమగు జననమరణ వ్యసనమునకు లేక సంసారమునకు నాంది, బీజమూనూ.

చిదేకరసం - విషయముల అదర్శనమును ‘చిదేకరసం’ అని కూడా అంటారు. అట్టి అదర్శనమునకు సంబంధించిన ప్రయత్నం జడరహితమగు ఆత్మస్వభావంగా పరిణతి చెందుతోంది. కనుక… నీవు ‘విషయములను దర్శించుట’ అనునది త్యజించివేయుము. విషయ రహిత, స్వయం ప్రబుద్ధమగు ఆత్మయే నీవై ఉన్నావు. కనక పూర్ణానంద స్వరూపుడవై నిశ్చింతగా ఉండుము.

ఓ సభికులారా! ఓ సర్వజనులారా! ఈ మన ప్రియ రామచంద్రునిలాగానే మీలో ప్రతి ఒక్కరూ శుద్ధాత్మ స్వరూపులేగాని, జడమగు ఈ దేహం కాదు. లేక, మరొక వెలుగుచే ప్రకాశింపబడే మనోబుద్ధి అహంకారాదులు కాదు. మీచే దర్శించబడేదంతా మీయొక్క స్వస్వరూప విలాసమే! (ప్రకరణయే! క్రీడయే! ఉల్లాసమే! కుతూహలమే!) ఈ విషయం ప్రపంచమునకు ఘంటాపదంగా ప్రకటించిన ఎందరో మహనీయుల చరిత్రలు మనం చెప్పుకున్నాం. ఇంకా నిర్వాణ ప్రకరణం చిట్టచివరివరకు వారి చరిత్రలు చెప్పుకోబోతున్నాం.

చిత్తమునకు కూడా అతీతులైనట్టి ఓ పరిశుద్ధాత్మ స్వరూపులారా! సర్వజనులారా! మీరంతా అంతటి మహత్తర స్వరూపులై ఉండగా, “అబ్బే! నేనొక సామాన్య జీవుడినండి! స్వల్పుడను. ఆ భగవంతుడు ఎక్కడో చొరరాని చోట ఉన్నాడు. నావంటి స్వల్పునకు అది చాలా కష్టం. ఇక ఎప్పటికో ఏదో చేసి ఆ చోటికి వెళ్ళాలి…” మొదలైన రూపంగల అల్ప, మూర్ఖ భావాలలో కునుకులు తీస్తూ రోజులు గడపవలసిన పనేమున్నది? ఒద్దు. ఇక నిదుర లేవండి. జాడ్యం వదలండి.

"మీ వాస్తవ స్వరూపతత్త్వమేమిటో గ్రహించండి” అని వేడుకుంటున్నాను.

కాబట్టి రామా! నీవు ఈ దృశ్యమును అంతరంగమునందు త్యజించినవాడవై పూర్ణ “బ్రహ్మానంద” రూపముగా శేషించి ఉండుము. అట్లు పరిగ్రహించుచు, ఆపై యథావిధిగా ఈ భూప్రదేశంపై విహరించుచూ దీనిని పవిత్రము చేయి.

  1. అజడం - జడం

శ్రీరాముడు : ప్రభూ! మా స్వస్వరూపము యొక్క పూర్ణత్వమును చేయి ఎత్తి చూపుచున్న సద్గురు ప్రవచనములకు సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తున్నాను. మన ఈ ప్రస్తుత విచారణ యొక్క నిస్సంశయము కొరకై ఒక చిన్న ప్రశ్న మీ ముందుంచుచున్నాను.

జడత్వం త్యజించినప్పుడు శుద్ధ జ్ఞానస్వరూపం శేషిస్తుంది కదా! అట్లాగే, శుద్ధ జ్ఞానమును ఏమరచినప్పుడు జడప్రాయములగు ఈ దేహాదులు, వాటి అనుభవములు సంక్రమిస్తున్నాయి.

కనుక ఒక జీవుడు ఈ జడశరీరమును ఇట్లే కలిగియుండగా ’శుద్ధ సంవేద్యము’గా, లేక చైతన్య స్వరూపంగా శేషించటం ఎట్లా కుదురుతుంది? శరీరం ఉన్నంతవరకు జడత్వం ఉంటుంది కనుక శరీరం ఉన్నంతకాలం శుద్ధాత్మతత్త్వానుభవం కష్టసాధ్యమేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే

Page:685

జడము - అజడము ఒకేసారి, ఒకే చోట ఏర్పడజాలవుకదా! వెలుగు - - చీకటి ఒకేసారి ఒకే చోట ఏర్పడి ఉండజాలవు కదా!

శ్రీవసిష్ఠ మహర్షి : సంవిత్తు, విషయ సంవిత్తుగా, ఆత్మ సంవిత్తుగా రెండు రూపములను దాల్చుచున్నది.

బాహ్యపదార్థములను సత్యమని నమ్మటమే ‘విషయ - సంవిత్తు’ అనబడుతోంది. అయితే, జీవన్ముక్తునికి మాత్రం ఈ భూత భవిష్యత్ వర్తమానములందు ఎచ్చటా ’ఇది సత్యమే’ అను రూపంలో ఉండే సత్యత్వబుద్ధి ఉండదు. అనగా, అతడు తన అంతరంగ ప్రదేశంలో విషయసంవేదరహితుడై కాష్ఠశిలాదుల వలె (కొయ్య - రాయిలాగా) ఉంటాడు. స్వయంప్రకాశకుడై జడత్వరహితుడై ఉంటాడు. తాను సర్వ విషయములకు అర్థము(Meaning)ను ప్రసాదిస్తూ, సర్వ అర్థములకు అతీతమైన స్థానము నందు సంస్థితుడై ఉంటాడు.

‘పదార్థములు అసత్యము’ అని ఎరుగుటయే ‘శుద్ధసంవిత్తు’ అని అంటున్నాం కదా! విషయ సంవిత్తుకు అతీతుడై, శుద్ధ సంవిత్తుని ఆశ్రయించినప్పటికీ, సర్వకార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతడు ఏ విషయములచే పరిమితుడు గాని, విషయములకు ప్రమేయుడు గాని కాదు. విషయము లందు అసత్య బుద్ధి కలిగి ఉండి ఎవని చిత్తము ఈ విషయములందు లేశమైనా తగుల్కొనదో… ఆతడు ‘విషయరహితుడు - అజుడు - - జీవన్ముక్తుడు’ కూడా అవుతాడు.

బుద్ధిమంతుడగు ఉత్తమజ్ఞాని తన చిత్తమును మొదలంట్ల వాసనారహితం చేసుకునేందుకే సర్వప్రయత్నములు చేస్తాడు. క్రమంగా ఆత్మయందు సర్వ పదార్థ భావనలూ మొదలంటా తొలగించి వేస్తాడు. పసిబాలుడు ‘అన్నీ నావే’ అన్న భావనలో ఉంటున్నట్లు అతడు ‘అంతయునాదే, అన్నీ నేనే’ అన్న పరమజ్ఞానభావన కలిగి యుంటాడు. అదే సమయంలో ’అనాది, అసంగము’ తో కూడిన అవగాహన సంపాదించుకుని ఉంటాడు. విజ్ఞానదృష్టిచే అంతా తెలిసి, ఏమీ చెప్పజాలక మూగవాని వలె తదితర జీవులతో కలిసి ఉంటాడు. ప్రజ్ఞాస్వరూపుడు, శుద్ధ జ్ఞాని, బుద్ధిమంతుడు అయిన ఆ మహాత్ముడు జడత్వరహితము, వ్యాపకము, స్వచ్ఛము - - అగు స్థానంలో తనను తాను ప్రతిక్షేపించు కుంటాడు. కనుక విషయములను పొందుతాడేమోగాని, వాటి యందు తగుల్కొనడు. దేహము ఉండీ దేహము లేనివాడై ఉంటాడు. సుఖ-దుఃఖములను గాంచవచ్చునేమోగాని, తన అపరిమిత త్వమును వీడడు. ఆకాశములో అనంతత్వము ఏర్పడి ఉంటుంది చూచావా! సర్వవాసనలూ త్యజించిన వానికి స్వభావసిద్ధమగు అనంతానందము ఏర్పడియే ఉంటుంది. చిత్తరహితులగు అనేకమంది యోగులు ఆ పరమానంద స్వరూపమునందే సంస్థితి కలిగి ఉంటున్నారు. అద్దానియందే ప్రవృత్తులై, తన్మయులై ఉంటున్నారు. వారి సర్వ సంవేదములు (All their Perceptions) బ్రహ్మాకారము, బ్రహ్మ ప్రకాశముల మధ్య విలీనమైపోతున్నాయి. ఓ రామచంద్రా! ఎవ్వడైతే తాను నడుస్తున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఈ దృశ్యసంవేదమునకు సంబంధించిన వృత్తి జ్ఞానం త్యజించివేస్తాడో… అట్టివాడు ఈ శరీరం ఉన్నప్పుడు, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇది లేనప్పుడు కూడా సుఖవంతుడై, అజడుడై, పరమానంద స్వరూపుడై ఉంటాడయ్యా!

Page:686

అపారగుణ సాగరా! రఘురామా! నీవు కూడా అట్టి దృష్టినే అభ్యాసంచే అవలంబించు. కొంచెం శ్రమతో కూడియున్నప్పటికీ ప్రాణాయామాది సాధనలచే ఈ సంసార దుఃఖ సాగరమును దాటివేయి. ఒక చిన్న బీజంనుండి ఆవిర్భవించి మఱివృక్షం విశాల ఆకాశాన్ని ఆక్రమించి ఉంటోంది చూచావా! ‘స్వసంకల్పము’ అనే చిన్న చోటు నుండి ఆవిర్భవించిన ఈ విషయ ప్రపంచము స్వతః గా మిథ్యయే అయి ఉండి కూడా సువిశాలమగు ఆత్మాకాశాన్ని ఆక్రమించి ఉంటోంది. సంవిత్తు ‘మరల మరల సంకల్పించుట’ అను గుణమును ఆశ్రయించి, అందుకు ఫలితంగా జన్మ సమూహముల బీజమును తనకు తాను సృష్టించుకుంటోంది.

జనయిత్వాత్మన్ ఆత్మానమ్, మోహయిత్వా పునఃపునః ।

స్వయం మోక్షం నయత్యన్తః సంవిత్స్వం విద్ధి రాఘవ ॥

ఓ రాఘవా! సంవిత్తును మరింకొకరెవరూ జనింపజేయుట లేదు. అది తనను తానే జనింపజేసుకుంటోంది. మోహింపజేసుకుంటోంది. మరొకప్పుడు హృదయస్థమగు ఆత్మతత్త్వమును గాంచుటచే స్వయంగా తనకు తానే ముక్తిని ప్రసాదించుకొనుచున్నది. అది ఎప్పుడు ఎట్లా భావిస్తే, ఆ క్షణంలో అట్లే అగుచున్నది. అది ఎంతకాలం రాగాదులు కలిగి ఉంటుందో - అంతకాలం తన చిద్రూపమును పొందక, వస్తుతత్వమునందే నిమగ్నమై ఉంటోంది.

ఈ మనకు కనిపించే దేవ, మానవ, అసుర, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష జీవుల రూపములన్నీ కల్పిత రూపములేగాని, వాస్తవరూపములుగావు. ఆత్మయే అనాదిసిద్ధమై ఉన్న మాయతో కూడుకున్నదై ఈ విధంగా జగన్నాటకమంతా ఆడుచున్నది. పట్టుపురుగు తనలోంచి ఉత్పన్నమయ్యే పట్టుదారంచే కట్టుబడి చిక్కిఉంటుంది చూచావా? సంవిత్తు తననుండి బయల్వెడలిన విషయముల పట్ల గల ఉత్సుకతచే బంధింపబడి, దుఃఖించుచు… మరల చిరకాలమునకు స్వయముగా కేవలత్వము స్వీకరిస్తోంది. ‘జగత్తులు’ అనే సముద్రమునకు సంవిత్తే జలరూపమై ‘కుతూహలం’ అను స్వభావంతో అంతటా వ్యాపించి ఉంటోంది. ఈ దిక్కుల రూపంలోను, ఆ పర్వతముల రూపంలోనూ స్ఫురించేది అదే. ఈ ఆకాశం, భూమి, వాయువు, నదులు, దేహములు - ఇవన్నీ సంవిత్ సముద్రములోని అనేక ఆకారములతో కూడిన తరంగములవంటివి మాత్రమే!

  1. వేరు వేరు ఉపాయాలు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ ప్రపంచమంతా సంవిన్మాత్రమే! ఇక్కడ రెండవ వేరైన కల్పనయే లేదు. కల్పన చేయుచున్నవాడే కల్పితమైన సర్వముగా ఆవిర్భవిస్తున్నాడని గ్రహించు. అదియే బ్రహ్మజ్ఞానం. అట్టి సత్య జ్ఞానముచే సంవిత్తు అద్వైత బ్రహ్మరూపము పొందుతోంది. అనగా తనయొక్క సర్వ న్యూనాధికములనూ త్యజించి స్వాత్మయందు స్థిరత్వం పొందుతోంది. ఇంక అది దేనియందు తగుల్కొనక సర్వస్థితులందూ స్వస్వరూపముయొక్క సమ్యక్ జ్ఞానం కలిగి ఉంటుంది.

Page:687

శ్రీరాముడు : సంవిత్తు నుండి ‘సన్మాత్రము’ అనే బీజం ఎలా వెల్లివిరిసి ఏర్పడి ఉంటోందో వివరించ ప్రార్థన!

శ్రీవసిష్ఠ మహర్షి : సంవిత్తు, లేక, బ్రహ్మము నుండే ప్రతిబింబ సంవిత్తు జలంలోంచి తరంగంలాగా ఆవిర్భవిస్తోంది. సూర్యుని నుండి కిరణంలాగా ప్రకటితమయ్యే అట్టి సంవిత్తు రెండు రూపములు కలిగి ఉంటోంది.

  1. పలువిధ ఆకారములుగల సంవిత్తు విభాగం జలంలోని అనేక తరంగాలులాగా!

  2. ఏకమగు సన్మాత్ర విభాగం - - అనేక తరంగములలోని ఏకైక జలంలాగా!

ఈ నీవు, నేను, కొండలు, కుండ, వస్త్రం - ఇవన్నీ ‘సత్త’ యొక్క వివిధ రూపములు మాత్రమే. నీవిక ఈ సర్వవిధ విభాగములూ త్యజించి సర్వదా సర్వుల స్వరూపం అయినట్టి ఏకమాత్రసత్తను ఆశ్రయించు. అదియే ఈ చరాచర సర్వజగత్తుకు అధిష్ఠానమైయున్నది. సర్వ విశేషములు త్యజించబడగా… అప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి నిర్లిప్తమగు ఆ ‘సన్మాత్ర సత్త’ యొక్క ఏకమగు మహద్రూపం అనుభవం కాగలదు. అదియే బ్రహ్మపదము సుమా! శ్రీరాముడు : అరూపమగు ఆత్మయందు రూపసహితమగు ఈ జగత్తు ఎలా ఏర్పడి ఉంటోంది? శ్రీవసిష్ఠ మహర్షి : కుండకు ఆకారం ఉన్నది. దాని మూల పదార్థమగు మట్టికి ఆకారం ఉన్నదా? లేదే! వస్త్రం యొక్క స్వభావము గాని, స్వరూపముగాని దూదిలో కనబడుతోందా? లేదు. అయితే, వస్త్రమంతా తయారయినది దూదితోనే కదా! సన్మాత్రము ప్రకటితమగుచున్నప్పటికీ, అద్దానియందు ‘నేను - నీవు’ అనునవేవీ లేవు.

శ్రీరాముడు : మరి ‘కాలము’ మాట ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : కాలసత్త కూడా వస్తుసత్తలాగానే ప్రమేయస్వభావముచే కల్పనా పూర్వకమై ఏర్పడి ఉంటోంది. ఆత్మసత్త అప్రమేయమై అవిభక్త రూపమున ఏర్పడి ఉంటూనే వస్తుప్రమేయముచే కాలబద్ధముగా, విభక్తరూపమున కన్పట్టుచున్నది. విభాగము లేనిచోట విభాగము భ్రమచే అనుభవ మగుచున్నదని గ్రహించు.

కనుక రామా! “ఈ దృశ్యమంతా ఏకైక సత్తాయే” అను భావన చేయి. ”సర్వ దృశ్యవస్తువులందూ ఏర్పడి ఉన్నది ఆ ఏకైక సత్తయే” అను దృష్టిని బలపరచుకో. అట్టి భావనచే సర్వదిశలను, ఆ దిశ లందుగల సర్వ పదార్థములనూ పరిపూర్ణమొనర్చుము. నీయొక్క సత్తయే నీయందును, నీచేగాంచబడే దృశ్యమునందును వెలుగొందుచున్నదయ్యా! సూర్యుని నుండి అనంత కిరణములు బయలుదేరి అసంఖ్యాక వస్తువులను ప్రకాశింపజేయుచున్నట్లు ఏకైక సత్త ఈ సర్వ శరీరములను, చిత్తములను, తదితర అసంఖ్యాకవస్తు సమన్వితమగు జగత్తును ఎరుకచే ప్రకాశింపజేయుచున్నది.

"ధర్మము - ధర్మిష్టి, సత్ - - అద్దాని విషయములు” లయమొందినప్పుడు, అప్పటికి ఇంకా శేషించియుండేది ఆ ఏకైక సత్తయే. అద్దానియందు ఉపాధులు మొదలైనవి ఉండకపోయినప్పటికీ భూత, భవిష్యత్తులలో ఏర్పడే సర్వ జీవులు అదే!

Page:688

నిర్వికారమగు అట్టి ఆత్మపదమున స్థిరపడినవాడు అరుచికరమగు ఈ సంసారమునకు తిరిగిరాడు. అదియే ‘మోక్షసాధన’ అని, ‘పురుషోత్తమ ప్రాప్తి’ అని చెప్పబడుతోంది.

అట్టి పదమే సర్వకారణములకు కారణమైయున్నది. ఇక దానికి మరో కారణమైనదేదీ ఉండదు. కారణములకు కారణం, సారమునకు సారమగు ఆ శుద్ధ పరబ్రహ్మమే ఈ జీవుని స్వరూపమై ఉండగా… ఈతడు అజ్ఞానదృష్టిచే భేదకల్పనను ఆశ్రయించి "నేను నిస్సారుడను, నిస్సహాయుడను, అల్పమేధస్కుడను”… అని వాపోవుచున్నాడు. దానికంతటికీ కారణం స్వస్వరూపాన్ని ఏమరచి దృశ్యవిషయములందు తాదాత్మ్యమొందటమే సుమా! ఈ జీవుడు జ్ఞానాన్ని పెంపొందించుకో నంతకాలం, అప్రమేయమగు తన బ్రాహ్మీస్వరూపమును ఎరిగి ప్రశాంతుడవనంతకాలం ఈ జన్మ · కర్మల ప్రహసనం తప్పేది కాదు. “నేను భేదాభేదములకు అతీతుడను. ఆద్యంతములు లేనట్టి నేను ఈ జన్మ - జీవన - మృత్యువుల వంటి అల్ప సంఘటనలచే ఎట్లా పరిమితుడనౌతాను?” - -

అని ఈ జీవుడు గ్రహించుగాక! అట్టి సదవగాహనకు ఉపకరించటానికే ఆత్మజ్ఞులైనవారిచే ఈ యోగవాసిష్ఠాది శాస్త్ర ప్రవచనములు జీవునకు అందించబడుచున్నాయి.

తత్త్వమెరిగిన తరువాత రామా, ఇక నీకు బంధమేమిటి? మోక్షమేమిటి? మేఘములు ఆకాశంలో ప్రయాణిస్తున్నంత మాత్రం చేత ఆకాశముయొక్క అనంతత్వానికి వచ్చే లోటేమిటి? కించిత్ అజ్ఞానం వచ్చి ఒకానొక సమయంలో ఆవరించి యున్నంతమాత్రం చేత ఈ జీవుని అనంతత్వానికి వచ్చే లోటేమీ ఉండదు - - అని సర్వజనులు గ్రహించండి. నిశ్చింతులై ఉండండి.

ఒడ్డున ఉన్న చెట్లు తటాకంలో ప్రతిబింబిస్తున్నట్లు నిర్లిప్తము, అసంగము అగు ఆత్మ యందు ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది. ఈ పదార్థములన్నీ తమ యందు ప్రత్యక్ చైతన్యము అంతస్థమై ఉండుట చేతనే ప్రీతివంతమౌతున్నాయి. నాలుకకు రుచులు వ్యక్తమగుచున్నట్లు ఆ ఆత్మసముద్రము నందే సర్వానందములు వ్యక్తమగుచున్నాయి. ఈ విషయములో ఇవి స్వయంగా స్వాదురహితం (Tastless) అయినప్పటికీ, అవి ఆత్మ సంయోగముచేతనే స్వాదుత్వం పొందుచున్నాయి. ప్రియమైన వాటన్నిటి కంటే ప్రియాతిప్రియమైనది ఆత్మవస్తువే.

ఆనందమయమగు ఆ పరమాత్మ నుండే సమస్త బ్రహ్మాండ సమూహములన్నీ ఉత్పన్నము లగుచున్నాయి. అవన్నీ వానియందే స్థితికలిగి ఉంటున్నాయి. ఆ పరమాత్మ తత్వము… గురుతరమైన వాటన్నిటికంటే గురుతరమైనది.

సూక్ష్మతరమైన వాటన్నిటి కంటే సూక్ష్మాతిసూక్ష్మమైనది. స్థూలములైన వాటన్నిటి కంటే అత్యంత స్థూలమైనది. సమీపమైనవాటన్నిటి కంటే సమీపమైనది. జ్యేష్ఠతరములైన వాటన్నిటి కంటే జ్యేష్ఠతరమైనది.

ఆ పరమాత్మ స్థానం సర్వప్రయత్నములకు ఆత్యంతికమైనది. అక్కడ సర్వ శ్రమలు రహిత మౌతాయి. కనుక అన్నిటికంటే సులభమైనది అదే! అదియే తేజమును తేజము. అంధకారములన్నిటి కంటే అంధకారం అదే! దిక్కులన్నిటికీ దిక్కు అది. అది లోకములకు సంబంధించినది కాదు. కాని

Page:689

లోకంలోని సర్వ విషయాలు అదే! భావా భావముల, దృశ్యా దృశ్యముల, చైతన్య అహంకారముల రూపంగా ప్రకాశించేదంతా అదే.

ఓ శుద్ధాంతర్గత స్వరూపుడా! రామచంద్రా! ఏఏ ఉపాయములచే నీవు పరమ పవిత్రమగు ఆ ఆత్మపదమునందు స్థితి పొంది ఉండగలవో, సర్వ ప్రయత్నములచేతనూ అవి ఆచరించు. శ్రీరాముడు : అందుకు వేరు వేరు ఉపాయములు ఉన్నాయి కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. యోగ, జ్ఞానాది వేరు వేరు ఉపాయాలు ఉన్నాయి. అయితే ఓ సర్వ జనులారా! వేరు వేరు ఉపాయములు ఉన్నంత మాత్రంచేత “వారు వేరు.. మేము వేరు” అ భ్రమలను ఆహ్వానించి, తత్ఫలితంగా ఆత్మ వస్తువును పోగొట్టుకొనకుండెదరు గాక! “ఆ ఆత్మ పదము అతి పవిత్రము, భేదాభేదరహితము, పరమ పదము” - అని గ్రహించి, అటుపై మీకు అనుకూలములైన మార్గములలో మీమీ ప్రయత్నములు కొనసాగించండి. అంతేగాని తదితరులు ఎందుకు ఎంతవరకు తప్పుచేస్తున్నారో లెక్కలు కట్టుకుంటూ మీ పురోభివృద్ధిని ఆటంక పరచుకోకండి. జన్మజరా వర్జితమగు ఆత్మ పదమును వదలి తుచ్ఛ తృణములకై ప్రాకులాడి మహత్తరమైన “మానవ ఉపాధి” అనే అవకాశాన్ని వ్యర్థం చేసుకోవాలనుకునేవారికి ఇక నేను చెప్పేదేమున్నది?

ఓ సర్వ సదేహ మిత్రులారా! ఈ సర్వమూ ఆత్మచే ఆక్రమించబడియున్నది. అద్దాని సాక్షాత్కారము కొరకు ప్రయత్నించి ఈ చిత్తమును ఉపశమింపజేయండి.

ఎప్పుడైతే మీరు మీ యొక్క సర్వవ్యాపక, విషయాతీతస్వరూపమును ఎరుగుతారో అప్పుడు సర్వ పునరావృత్తులు శమించి ఈ సంసార భయము నుండి విముక్తులు కాగలరు.

  1. మూడు అభ్యాసాలు ఒకేసారి!

శ్రీరాముడు : మహనీయుడగు ఓ వసిష్ఠమహర్షీ! మీ యొక్క ప్రవచనం అమోఘం. ఒక చిన్న ప్రశ్న- "ఈ సంసారమునకు బీజమేమిటి?” అను విషయంలో మీరు అనేక విషయాలు ప్రస్తావించారు. ఒక దానికి మరొకటి ఎట్లు బీజమగుచున్నదో కూడా వర్ణించి చెప్పారు. 1. దృశ్యప్రపంచము 2. శరీరము 3. చిత్తము 4. వాసనలు 5. ప్రతిబింబ చైతన్యము 6. బింబ చైతన్యము… మొదలైనవన్నీ సంసార ప్రాప్తికి బీజమగుచున్న వైనమంతా వివరించారు. అయితే, వీటిలో అసలైన దుఃఖబీజమేది? సాధన దృష్ట్యా వీటిలో దేనిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని, ప్రవృత్తింపజేయుటచే, లేదా, నివృత్తింప జేయుటచే…. జీవుడు త్వరగా దుఃఖమును జయించి, సంసారమును నివృత్తింపజేసి ఆత్మ పదమును అధిరోహించగలడో - - అద్దాని గురించి చెప్పండి.

శ్రీవసిష్ఠమహర్షి

ఏతేషాం దుఃఖ బీజానాం ప్రోక్తం యద్యన్మయోత్తరమ్ |

తస్య తస్య ప్రయోగేణ శ్రీఘ్రమాసాద్యతే పదమ్ ॥

Page:690

రామయ్యా! ఏదేది ఎట్లు సంసారమునకు బీజమగుచున్నదో - అద్దాని విషయమై మనం వివరణ సమాధానాల రూపంలో ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఈ జీవుడు యత్నపూర్వకం లాగా దేని స్థానమేమిటో గ్రహించి, వాటిని సద్వినియోగపరచుకొని క్రమంగా అనేక భేదములతోకూడిన సంసారము నుండి భేదరహితమగు సత్తా సామాన్య స్థితి జేరుకోవాలి. సాధన ఏదైనా, “శ్రద్ధతో, పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నామా? లేదా?” - అనేది ముఖ్యం. పురుషప్రయత్నముచే వాసనలను -

త్యజించి ‘సత్తా సామాన్యము’ (Sense of equality) యొక్క పరాకాష్ఠ అయినట్టి చిత్ రూపంతో ఐక్యత పొంది, అక్కడ క్షణమైనా నిశ్చలస్థితి కలిగియున్నావనుకో… తక్షణమే నీవా ఉత్తమ పదము పొందినట్లే. భేదములన్నీ ప్రయత్నం చేసి జయించు. ఇక ఆపై బోధరూపమగు ఆత్మానుభవం కొద్ది ప్రయత్నంతోనే ప్రాప్తించగలదు. ’ఏకము’ను వదలి ’అనేకము’ను అంటిబెట్టుకొని ఎంతకాలం ఏ సాధనల ద్వారా ప్రయత్నిస్తూ పోయినా, ఆ తత్పదము దుర్లభంగానే ఉండిపోతుంది.

మనం ఇతఃపూర్వమే రెండు విభాగాలు గురించి చెప్పుకున్నాం - సంవిత్ (తెలుసుకుంటున్నది); సంవేద్యము (తెలియబడుచున్నది).

“తెలుసుకుంటున్నది” అయినట్టి సంవిత్ తత్వమునందు ధ్యాననిష్ఠతో ప్రయత్నశీలుడవై ఉంటే, ఆ ప్రయత్నము ఆత్మ పదమునకు చేరవేయగలదు.

తెలియబడుచున్నదాని కన్నా ముందే, దానికి ఆవల ‘తెలుసుకుంటున్నది’ ఉండి ఉన్నది కదా! అందుచేత ’తెలియబడేది’ సాధనగా తీసుకొని ఎంతకాలం ఎంతగా ప్రయత్నించినా చివరికి సంవిత్తును, ఆశ్రయించకుండా ఆత్మ పదమును అధిరోహించలేవని గ్రహించు.

లేదా, ఒక పని చేయి. “నేను ఏది చింతన చేస్తున్నానో, ఎక్కడ నడుస్తున్నానో, ఎక్కడ ఉన్నానో, ఎక్కడ ఆయా క్రియలు నిర్వర్తిస్తున్నానో - - అచటచట సంవిత్తే ఏర్పడి, ఆక్రమించుకొని ఉన్నది. అనగా సంవేద్యము సంవిత్తును ఆక్రమించుకుని ఉండజాలదు. సంవిత్తే సంవేద్యమును ప్రవర్తింప జేస్తోంది" అని ఆరూఢపరచుకొని, అప్పుడిక నీ సాధన కొనసాగించు. వాసనలను త్యజించడానికి యత్నములుచేయి. అప్పుడు నీ శారీరక, మానసిక దుఃఖములన్నీ తప్పక నశిస్తాయి.

సంవిత్ను ఆశ్రయించటం… శోధిత ‘తత్’ అంటారు.

సంవేద్యమును ఆశ్రయించటం… శోధిత త్వమ్ అంటారు.

ఉత్తమ పురుష ప్రయత్న ప్రాశస్త్యం గురించి నీకు ముముక్షు ప్రకరణాదిగా చెప్పుకుంటూనే వస్తున్నాను. కనుక ప్రయత్నించటం, అది కొనసాగించటం, ఆత్మ పదమును అధిరోహించటం అనేదే నీ మార్గం.

అయితే అన్ని ప్రయత్నాలకన్నా కష్టమైనదేది?… వాసనలను త్యజించటం. ఒక పెద్ద కొండను మొదలంట లేపి గాలిలోకి విసరటం సుసాధ్యపడవచ్చునేమో గాని, వాసనాత్యాగం అంత తేలిక కాదు.

మనస్సు లయం కానంతవరకూ వాసనలు ఉండనే ఉంటాయి. వాసనలు క్షయించనంతవరకూ

Page:691

చిత్తము శమించదు. తత్త్వజ్ఞానం కలుగనంతవరకు వాసనలు శమించవు. చిత్తము శమించనంతవరకూ వాసనలు ఉంటూనే ఉంటాయి.

  1. మనోనాశనం 2. వాసనాక్షయం 3. తత్త్వజ్ఞానం ఈ మూడూ పరస్పర కారణం కలిగి ఉన్నాయి. అందుచేతనే అందులో ఏ ఒక్కటి మాత్రమే సాధించాలన్నా జీవునకు కష్టసాధ్యమే అవుతోంది. అందుచేత రాఘవా! వివేక యుక్తమగు ఉత్తమ ప్రయత్నంచేసి భోగములతో ఏర్పడే ఇచ్ఛను జయించాలి. వాసనా క్షయం, మనో నాశనం, తత్త్వజ్ఞానం - అనే మూడిటిని ఒక్కసారే చక్కగా ఆశ్రయించాలి. పరమ శివుడు త్రిపురాసురిడిని ఒక్కసారే మూడు పురములలో మట్టుబెట్టినట్లు ఈ మూడిటిని జీవుడు సాధించుకోవాలి.

ఈ మూడిటినీ ఒకేసారి మరల మరల అభ్యసించకపోతే ఆ బ్రహ్మపదం ఎన్ని సంవత్సరములు గడచిపోతున్నా లభించదు. చిరకాలం అట్లా అభ్యసిస్తే ఆ ప్రయత్నం తప్పక ఫలప్రదమౌతుంది.

అట్లా కాకుండా, ఆ మూడిటిలో ఒక్కొక్కదానినే తీసుకొని వాసనాక్షయం అయిన తరువాత మనస్సు సంగతి చూస్తాను… అప్పుడు మనస్సును కూడా నశింపజేసి ఆ తరువాత తత్త్వజ్ఞానం సంపాదిస్తాను… అనుకుని ప్రయత్నాలకు ఉపక్రమించావా - దోషభూయిష్టములతో కూడిన మంత్ర సాధనాకార్యక్రమంలాగా, పథ్యమును వదలి ఔషధం సేవించటంలాగా నిష్ప్రయోజనమౌతాయని హెచ్చరిస్తున్నాను. ముగ్గురు శత్రువులు మీద పడుచున్నప్పుడు అందులో ఒక్కొక్క శత్రువుతో మాత్రమే యుద్ధంచేసి శత్రునిర్మూలనం చెయ్యాలంటే ఎట్లా కుదురుతుంది? ముగ్గురితో ఒక్కసారే యుద్ధంచేయటానికి సంసిద్ధుడవు కావాలి కదా! అట్లాగే… వాసనాక్షయం, మనోనాశనం, తత్త్వజ్ఞాన సముపార్జన - అనే మూడిటిలో ఒక్కొక్కదానిని విడివిడిగా ఆశ్రయిస్తే పరమాత్మను పొందలేమని నా అభిప్రాయం. బుద్ధిమంతుడైనవాడు ఆ మూడిటినీ ఒక్కసారే అభ్యసిస్తే తప్పకుండా సంసార సాగరమును విచ్ఛిన్నం చేయగలడు. ఇది సుసాధ్యమే! ఇందులో సందేహం లేదు. నీవావిధంగా ఆచరించి నిస్సంగభావం పెంపొందించుకుని బ్రహ్మపదమున సంస్థితుడవయ్యెదవుగాక! అప్పుడు హృదయ గ్రంథులన్నీ తమంతట తామే తొలగుతాయి.

  1. యుక్తి - ఉపాయం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామయ్యా! ఈ జీవుని యొక్క ఇప్పటి సంసార స్థితి ఎక్కడి నుండి వచ్చిపడింది? అనేక జన్మలలో అభ్యసించినదే ఇట్లు ప్రయోజనరూపంలో సంప్రాప్తమౌతోంది. ఇది చిరకాలాభ్యాసం లేనిదే తొలగేది కాదు. అందుచేత ఆతడు నడుస్తున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, వినుచున్నప్పుడు, తాకుచున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు - అన్ని సందర్భములలోనూ పరమ శ్రేయమగు మోక్షసాధనకొరకు వాసనాక్షయం,

Page:692

మనోనాశనం, తత్వజ్ఞానం అనే మూడిటినీ సదా అభ్యసిస్తూనే ఉండాలి. దృశ్యముపట్ల ఏర్పడే ఆకర్షణ, వికర్షణలను తగ్గించుకుంటూ మరొక వైపునుండి “ప్రాణాయామం” వంటి యోగాభ్యాసాలను ఆశ్రయించునుగాక! వాసనాత్యాగ, ప్రాణనిరోధముల సహాయంతో చిత్తము అచిత్తత్వం పొందుతుంది.

ప్రాణాయామాభ్యాసం చేతను, యోగాభ్యాసకుశలురైన గురువులు మనకు ప్రసాదిస్తున్న తదితరయుక్తులచేతను, హిత - మిత - పవిత్ర భోజనముచేతను, యమ నియమాదుల రూపంలో గల విధి, విధానముల చేతను, ఆసనజయముచేతను ప్రాణచలనం నిరుద్ధం కాగలదు.

నిర్వివాదము, సన్మాత్రము అగు ఆత్మయే సర్వ వస్తువుల ఆద్యంతములందూ ఏర్పడి ఉన్నది - అను యథార్థదర్శనం అభ్యసించుచూ వస్తే అప్పుడు వాసనలు ప్రవర్తించటం సన్నగిల్లగలదు. బహిర్ముఖములగుచున్న జనుల దృష్టులతో సాంగత్యం కొనసాగించకపోవటం చేతనూ, సాంసారిక మనోరథములు వదులుకుంటూ రావటం చేతనూ ’ఆత్మదర్శనజ్ఞానం కలుగుతుంది. దాని చేతనే వాసనాక్షయం కూడా కలుగుతుంది. ఈ శరీరం, దీని తీరు, ఇది పుట్టి, పెరిగి, నశించే విధం - పరికిస్తూ ఉండటంచేత కూడా వాసనలు సంక్షయిస్తూ ఉంటాయి. వాసనల విభవము సన్నగిల్లు చుండగా, ఇక చిత్తము ప్రవర్తించటం మానివేస్తుంది. గాలి వీచటం ఆగితే ఆకాశంలోని ధూళి కూడా శమిస్తుంది! ప్రాణ స్పందనమే చిత్త స్పందనమైయున్నదని అనుకున్నాం కదా!

ధూళి గుట్టల నుండి ధూళి లేస్తున్నట్లు ఈ ప్రాణ సంచలనం కారణంగా ప్రపంచమున అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. అందుకనే ఏకాంతంలో కూర్చుని ప్రాణస్పందననిరోధం కొరకై పలుమార్లు మిక్కిలి ప్రయత్నం చేయాలి. ఇష్టపూర్వకంగా అట్టి ప్రయత్నములు చిరకాలం చేస్తూ ఉండగా, ఆత్మ పదము తప్పక పొందుతావు. అంకుశం లేకపోతే దుష్ట ఏనుగు మాట వింటుందా? ఆధ్యాత్మ శాస్త్రములచే ఉదహరించబడుచున్న ఆయా ఉత్తమ ప్రయత్నములు చేయకపోతే చిత్తమును జయించటం అంత తేలికైన విషయం కాదు. ఏ ఉత్తమ ప్రయత్నాన్ని ఆశ్రయించకుండా మీనమేషాలు లెక్కకట్టుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటుంటే అట్టి జీవుని బ్రహ్మరుద్రాదులు కూడా కాపాడలేరు. కనుక ఓ జనులారా! లేవండి. లేచి నడుంకట్టండి. నడుంకట్టి సత్ప్రయత్నశీలురవండి. అల్పమార్గాలు ఆశ్రయించి. అల్పప్రయోజనములవైపు తరలి వెళ్ళాలనుకోవటం ఉచితమా? కానే కాదు.

  1. అధ్యాత్మ విద్యాప్రాప్తి; 2. సాధు, మహాత్ములతో సాంగత్యం; 3. వాసనా త్యాగం; 4.ప్రాణ స్పంద నిరోధం… ఇవే చిత్తమును జయించటానికి ప్రబలమైన ఉపాయాలు.

ఓ సభికులారా! ఈ చిత్తమునకు మించిన శత్రువు భూనభోంతరాళాలలో మరింకేదీ లేదు. దీనిని సరి అయిన రీతిలో నియమించారా… ఇంతకు మించిన మిత్రుడు మరొకడెవ్వడూ ఉండడు. గాలికి ఎగిరిన దుమ్ము జలధారలచే అణిగిపోవునట్లు చక్కటి యుక్తులచే చిత్తము శీఘ్రంగా

జయింపబడగలదు.

శ్రీరాముడు : మహాత్మా! హఠయోగంచే ఈ శరీరమును పరిశ్రమింపజేసి, ఎంతో శ్రమకు ఓర్చి కొందరు చిత్తమును ఉపశమింపజేయటానికి ప్రయత్నిస్తున్నారు కదా! వారు దేహము శుష్కింపజేసి,

Page:693

కష్టతరమగు హస్తపాదాదుల నియమములచే మనోవాక్ ఇంద్రియములను స్వాధీనపరచుకొని, శోషింపజేసి చిత్తమును తమ వశం చేసుకోవాలని ఉద్దేశిస్తున్నారు. అట్టి ఉద్దేశము ఉచితమేనా? మేము కూడా చిత్తశత్రువును జయించటానికి అట్టి హఠయోగం ఆశ్రయించవలెనని మీ అభిప్రాయమా? శ్రీవసిష్ఠ మహర్షి : సద్గురువులగు మార్గదర్శకులచే ఎన్నో సులభమైన ఉపాయాలు ప్రవచించబడ్డాయి. ధ్యానం, ప్రాణాయామం, నామస్మరణ, కర్మ ఫలసమర్పణ, పూజ, దానాదులు - - ఎన్నో సున్నితమైన సరళమైన ఉపాయాలు ఉన్నాయి. అట్టి సుఖకరము, సులభ సాధ్యము అగు ఉపాయాలను వదలి, భగవద్దత్తమగు ఈ ఉపాధిని శుష్కింపజేస్తూ మంత్రతంత్రాదులచే హఠంగా చిత్తమును వశపరచుకోవా లనుకోవటం మా ఉద్దేశంలో ఏమంత ఉచితం కాదు.

ఎవ్వనికైనా, దీపాన్ని వదలి మసితో (కాటుకతో) చీకటిని తుడిచి వేయాలనుకోవటం, పిడికిలి గుద్దులతో మదపుటేనుగును నిలిపి ఉంచాలనుకోవటం తేలికైన పనేనా? చిత్తమును, చిత్తమునకు ఉపకరణమగు ఈ దేహమును స్వస్థపరచి క్రమంగా మనస్సును సుస్థిరీకరించటానికి ’యుక్తి’ని ఆశ్రయించాలి. సర్వ శక్తి సమన్వితమగు చిత్తము ముందు ఏ శక్తి ఎట్లు ఉపయోగిస్తుంది? యుక్తిని వదలి మొండిగా, మూర్ఖంగా హఠం మొదలైన భయమును గొలిపే బలవత్పూర్వక యత్నములు చేయు వారిని ఆత్మ శాస్త్రజ్ఞులు ‘శరులు, మొండివారు’ అని పిలుస్తున్నారు. అట్టివారు ఒక భయమునుండి మరొక భయమునకూ, ఒక క్లేశము నుండి మరొక క్లేశమునకూ పయనిస్తున్నారని గ్రహించు. వారికి ధైర్యం, విశ్రాంతులు లభించటంలేదు. తాము భయపడుచు, తదితరులను భయపెట్టుచూ, మూర్ఖము, బుద్ధిహీనము అగు లేళ్ళు పరుగులు తీస్తున్నట్లు హఠం కొనసాగిస్తున్నారు. అల్పము, భేదాశ్రయము అగు వారి బుద్ధి ఎక్కడా విశ్వాసం సంపాదించలేక భీతినే పొందుతోంది. జ్ఞానబలిమి లేక వారి చిత్తము అనేక చింతలందు వ్యాప్తమై ఉంటోంది. నదీ జలంలో తృణములు (గడ్డిపరకలు) లాగా వారి మనస్సు రాగద్వేషాదులందు కొట్టుమిట్టాడటమే జరుగుతోంది.

అందుచేత, హఠంచే “నేను వేరు, ఈ తదితర జనులు వేరు. ఆ పరమాత్మ వేరు. క్రూరమైనట్టి ఏమైనా నియమములచేత గాని నేను దైవమును గాంచలేను" - అని అనుకోవటం వేదవేదాంతాల అంతర్లీన గానం పెడచెవిని పెట్టటమేనని మా అభిప్రాయం. ఓ మిత్రులారా! మీరు ఆవేశకావేషాలతో హఠం ఆశ్రయిస్తే తుచ్ఛ విషయములే ఎదురౌతాయి గాని, సర్వసమదృష్టి పూర్వకమగు ఆత్మానుభవం కాకపోవచ్చునని హెచ్చరిక చేస్తున్నాను.

మరికొందరు ఆత్మ విషయ విచారణను ఆశ్రయించక, కేవలం, యజ్ఞ, తప, తీర్థాదులకే తమ యత్నములను పరిమితం చేసుకుంటున్నారు. ఏది ఎందుకు ఉన్నదో గ్రహించలేకపోతున్నారు. తమలో సర్వదా వేంచేసియున్న ఆత్మ భగవానునివైపు తమ దృష్టిని మరల్చుకోవటం లేదు. ఫలితంగా అసలు విషయమేమిటో గ్రహించకుండానే అరణ్యంలో దారితప్పిన జింకలాగా అనేక మానసిక వ్యధలతో చిరకాలం గడిపివేస్తున్నారు. జ్ఞానముచే ఆత్మజ్ఞానము కొరకై సత్ప్రయత్నము లందు

Page:694

నియమితులవటం మంచిది గాని, గుడ్డిఎద్దు చేలో పడ్డట్లు సంకుచిత దర్శనమునకు బద్ధులు కాకూడదని అట్టివారికి గుర్తుచేస్తున్నాను. “నా బాహ్య అభ్యంతరములందు సర్వదా ఆత్మయే సమస్తంగా ఏర్పడి ఉన్నది. అది సర్వ శుద్ధము, అఖండము, అప్రమేయము” - - అను భావమే ఆత్మీభావన. అట్టి ఆత్మీభావనను ఆశ్రయించకుండా, కేవలం కథలకు, వర్ణనలకు, ఆకారాదులకు పరిమితులైతే ఎట్లా? చిత్రపటంలోని పండు ఆకలి తీర్చగలదా? ‘త్వమ్’ భావనాపరిమితులవటంచేత బహువిధ దుఃఖాల చేతనూ, రాగాది దోషములచేతనూ వారు పలువైపుల నుండి పీడితులగు చున్నారు. తమ చెంతనే తమ స్వరూపమై వెల్లివిరిసియున్న ఆత్మ యొక్క అభేద తత్త్వమును గ్రహించ లేకపోతున్నారు. శ్రీరాముడు : అట్లా ఎందుకు జరుగుతోంది మహర్షీ? వారికి తరుణోపాయమేమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : వారి ప్రయత్నములు ‘వృథా’ అని నా ఉద్దేశం కాదు. అయితే దేహాత్మభావన త్యజించ నంతకాలం ఒకప్పుడు స్వర్గమును, మరొకప్పుడు నరకమును పొందవలసిన అగత్యం ఏర్పడుచూనే ఉంటుంది. "అనిత్యము, స్వర్గ - నరక - భవభోగముల నిమిత్తమై పతనోత్పతనములు పొందేది అయినట్టి ఈ దేహం నేను కాదు. నా స్వరూప, స్వభావములు దేహముకంటే విలక్షణమైనవి”

- - అను ఆత్మజ్ఞానం ఆశ్రయిస్తే అన్ని రుగ్మతలు వాటంతట అవే తొలగుతాయి. అందుచేత దేహాత్మభావన విడచుచూ, జ్ఞాన దృష్టితో వారివారి ప్రయత్నములు నిర్వర్తించెదరుగాక! అట్టివారిపై గల అవ్యాజమైన ప్రేమ చేతనే ఆ పరమేశ్వరుడు మనకు ఈ యోగవాసిష్ఠాది ఆత్మ సమాచారాలు, గ్రంథములు ప్రసాదించుచున్నారు. అందుచేత రామా! తటాక జలంలాగా వృత్తులను పొందుచూ, కొనసాగిస్తూ ఉంటే సరిపోదు. వృత్తిరహితము, సర్వసాక్షి, సర్వ సంకల్ప వికల్పములకు ఆవల ఉన్నది, సంవిత్ అని చెప్పబడుచున్నదియు అగు ఆత్మతత్త్వమును దర్శించాలి. అందుకు సదుద్దేశంతో చేసే ఆయా యజ్ఞ, తప, తీర్థాది, ప్రయత్నములు నిర్మల హృదయ సముపార్జన రూపమున తప్పక సహకరిస్తాయి. అందుచేత… తెలియబడుదాని నుండి - - ’తెలివి’ లేక తెలుసుకొనుచున్న దానివైపుగా, సంవేద్యము నుండి - - సంవిత్తు వైపుగా, శోధితత్వమ్ (Creation) నుండి-శోధితతత్ (Creator) వైపుగా సాధకులు పురోగమించెదరు గాక!

కాబట్టి రామా! ఆత్మానుభవార్థమై క్రమక్రమంగా సర్వదోష దృష్టులు వదలివేయుము. శుద్ధ సంవిత్తును ఆశ్రయించు. వీతరాగుడవై ఉన్నచోటనే సుస్థితుడవు, స్వస్థుడవు, ఆత్మానుభవ సమన్వితుడవు కమ్ము. ఈ సాంసారిక రుగ్మతలన్నిటికీ రహితస్థానం అదే!

జ్ఞానవానేవ సుఖవాన్! జ్ఞానవానేవ జీవతి! | జ్ఞానవానేవ బలవాన్! తస్మాత్ జ్ఞానమయోభవ ॥

ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడే సుఖిస్తున్నాడు. జ్ఞానవంతుని జీవితమే సఫలం పొందుతోంది. జ్ఞానవంతుడే బలసమన్వితుడు కూడా! అందుచేత నీవు జ్ఞానమయుడవు కమ్ము.

మహాత్మా, రామచంద్రా! విషయవర్జితం, సర్వోత్తమం, అనాది, కల్పనా రహితం, నిర్వికారం అయినట్టి ’సంవిత్’ పదమును నీవు ఆశ్రయిస్తూ ఉండు. కల్పనావర్జితుడవగుము. హృదయాకాశమున

Page:695

ప్రశాంతుడవై సుస్థితుడవు కమ్ము. బ్రహ్మమును సమాధియందు సంభావించు. మరల వ్యుత్థాన కాలంలో (సమాధి నుండి బయల్వెడలినప్పుడు) శమముతో లోన - బయట నింపివేసి, ఆపై యథోచితములగు క్రియలను నిర్వర్తిస్తూ ఉండు. మనం ఇప్పటివరకూ చెప్పుకున్నట్టి జీవన్ముక్తుని గుణసంపదను సంతరించుకున్నవాడివై అకర్తృత్వ పదమును పొందియుండుము.

  1. జ్ఞానవానేవ బలవాన్

శ్రీవసిష్ఠమహర్షి : ఎవ్వరైనాసరే…. కాస్తయినా విచారణ చేసి తన చిత్తమును కొంచమైనా నిగ్రహించగలిగితేనే తమ జీవితమును కొంతైనా సఫలం చేసుకున్నట్లు. విచారణ అనే కోమలమైన కల్పవృక్షాంకురం హృదయంలో స్ఫురించిందా - అది త్వరలో అభ్యాసయోగం చేత క్రమంగా అనంత శాఖాయుతం కాగలదు. నిండు సరస్సును పక్షులు, చేపలు స్వయంగానే వచ్చి ఆశ్రయిస్తాయి చూచావా? కొంచెం ప్రౌఢవిచారణ గల వైరాగ్యయుతుడగు మానవుని శమము, దమము, దయ, దాక్షిణ్యము, స్నేహము, సాత్వికము - మొదలైన శుద్ధగుణములు స్వయంగా వచ్చి ఆశ్రయిస్తాయి.

ఉత్తమ విచారవంతులు, యథార్థమగు ఆత్మత్త్వమును గాంచువారు అగు బుద్ధిమంతులు, మహనీయులు ఈ భూమిపై ఎందరో ఉన్నారు. అట్టి జ్ఞానులను బ్రహ్మదేవుని వరకు గల మహదైశ్వర్యములు కూడా ఏమాత్రం ప్రలోభింపజేయలేవు. ‘ఆత్మసాక్షాత్కారము’ అను సమ్యక్ దర్శనమును సంపాదించుకున్న ఆ మహనీయులను ఇక్కడి ప్రాపంచిక సంఘటనలుగాని, మానసిక వృత్తులుగాని, శారీరక - - మానసిక వ్యధలుగానీ సమీపించవు. వారు తమను - తదితరులను కూడా సర్వాతీతమైనట్టి ఏకైక ఆత్మవస్తువుగా దర్శిస్తూ ఉంటారు.

వాయువేగముతో కూడిన ప్రళయకాల మేఘమును వీథిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు తమ పిడికిళ్ళతో పట్టుకోగలరా? ముగ్ధస్త్రీలు ఆకాశంలో ప్రశాంతంగా ప్రకాశిస్తున్న చంద్రబింబమును పట్టుకొని తమ పేటికలో బంధించగలరా? ఐదు ఆరు దోమలు ఒక చోటికిజేరి మదగజమును నిరోధించగలవా? కొన్ని చిరుకప్పలు ఒకటై కొండచిలువను దిగమ్రింగగలవా? జ్ఞేయమగు ఆత్మ వస్తువును గ్రహించిన వివేకి ఈ ప్రపంచమున సంచరిస్తున్నప్పటికీ, ఇక్కడి పదార్థములు, ఇంద్రియాలకు గోచరించే వస్తుజాలాదులు, సంసార జనుల అభిప్రాయాదులు ఆతనిని ఆకర్షించలేవు. చ్యుతుని చేయలేవు. ఆత్మజ్ఞుని ఆకర్షించగల వస్తువిక్కడేమున్నది? ఆత్మానుభవమునకు మించినదేమున్నది? ఓ రామచంద్రా! దుర్బల విచారణయుక్తుని ఈ విషయ శత్రువులు ఇట్టే నిర్జించివేస్తున్నాయి. ఇక వాయువీచికలచే ఎండుటాకులు ఎగురుచున్నట్లు ఆతడు సంసార ప్రదేశంలో అటూ ఇటూ ఈడ్చుకు పోబడుచున్నాడు. కానీ ప్రౌఢవివేకం గలవానిని ఈ రాగాది వృత్తులు లేశంకూడా బాధించలేవు. పిల్లగాలులు వెళ్ళి మేరుపర్వతాన్ని ఏంచేస్తాయి? అదృఢమైన విచారణ గలవానిని క్రిందు - మీదు

Page:696

చేయటానికి స్వల్ప సంఘటనలు, కొద్దిపాటి చింతలు చాలు. అవే విషయాలు విచారయుక్తుని ముంగిట వ్రాలినప్పుడు, ఆతని జ్ఞానబలాన్ని చూడగానే రాగము-ద్వేషము మొ||వి తోక ముడుస్తున్నాయి. అవి ఎటకో పలాయనం చిత్తగించవలసిందే!

ఎవ్వడైతే నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడూ ఆత్మ విచారయుతుడై ఉంటున్నాడో… ఆతని చిత్తము అల్లరిపోకడలకు దూరంగా ఉండి, ఈ మాయాజాల జగత్తును ప్రశాంతంగా గమనిస్తోంది. అట్లాగాకుండా మాయాజాలంలో ప్రవేశించి రాగాదులచే ప్రహర్షితుడైయ్యేవాడు మృతునితో సమానమేనని జ్ఞానుల అభిప్రాయం. ఓ రామా! నీవు సర్వదా అమృత స్వరూపుడవై ఉండెదవుగాక!

"కిమ్ ఇదంస్యాత్ జగత్? కింస్యాత్ దేహమ్?” - ఇత్యనిశం శనైః | విచారయత్ అధ్యాత్మదృశా, స్వయం వా, సజ్జనైః సహ ||

"ఈ ప్రపంచమేమిటి? ఈ దేహమేమిటి?” అని నిరంతరం మరల మరల అధ్యాత్మదృష్టితో తనకు తానుగానో, లేక సజ్జనులతో కూడియో విచారణ చేస్తూ ఉండాలి. దీపం వెలిగించగానే గదిలో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! ’ప్రమోదము’ అనే చీకటిని నశింపజేయగల విచారణచే ఉత్తమ వివేకం ప్రాప్తిస్తుంది. అప్పుడీ జగత్తు ఏమిటో, ఏమై ఉన్నదో, ఏమికాబోతున్నదో… అంతా సుస్పష్టమౌతుంది.

జ్ఞానేన సర్వదుఃఖానాం వినాశ ఉపజాయతే ॥ కృతాలోకవిలాసేన తమసామివ భానునా॥

సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలైపోతోంది చూచావా? జ్ఞానంచే సర్వదుఃఖాలు సంక్షయిస్తాయి. చంద్ర ప్రకాశముచే జగత్తంతా ప్రశాంతమయమగుచున్నట్లు, జ్ఞానము ప్రవృత్తమగు చుండగా జ్ఞేయం స్వయంగా, పూర్ణరీతిగా గ్రహించబడుచూ, హృదయాకాశం ఆహ్లాదమయం

కాగలదు.

ఓ రాఘవా! శాస్త్రవిచారణచేయి. అట్టి శాస్త్రవిచారణ నీకు బ్రహ్మతత్త్వమును ఎరుగజేయగలదు. జ్ఞేయము తోటి అభిన్నత్వం ప్రసాదించేదే జ్ఞానం. విచారణచే జనించే పరమోత్తమమగు అవగాహనను విజ్ఞులు ‘జ్ఞానం’ అని పిలుస్తున్నారు. కల్లు త్రాగినప్పుడల్లా మత్తు వస్తుంది చూచావా? సమ్యక్ జ్ఞానం సంపాదించినప్పుడు స్వయముగా జ్ఞేయుడై ఉంటాడు. ’జ్ఞేయం’ అంటే- సమం, నిర్మలం అగు బ్రహ్మమే. సాంసారిక జ్ఞేయం (That which is being Known while in wordly ignorance) జ్ఞానసముపార్జనచే స్వయంగా అవిద్యారహితం అగుచున్నది. జ్ఞానవంతుడు దేని యందునూ సంలగ్నం కాక సంగదోష రహితుడై, జీవన్ముక్తుడై పూర్ణమనోరథుడై సమ్రాడాత్మస్వరూపుడై ఉంటాడు.

రామచంద్రా! జ్ఞాన సమన్వితుడైనవాడు మధురధ్వనులందుగాని, విషయభోగములందుగాని, సుందర వనితాది శబ్దములందుగాని, నృత్య, మధుర గీతాదులందుగాని తన చిత్తం లగ్నంచేయడు.

Page:697

కర్కశ శబ్దములు తాను పలుకడు. అవి ఆతని చెవిని సోకవు. విషయములందు, వన క్రీడలందు ప్రీతి కలిగి ఉండడు. హంసకు మరుభూమి యందు ఆసక్తి ఉంటుందా? శాకాహారికి మాంస ఖండములను చూచినప్పుడు నోరూరదు కదా! ఆత్మచే పరితృప్తుడైనవానికి ప్రాపంచిక పదార్థములను చూచినంతమాత్రంచేత లోభ, మోహాలు పుట్టవు. ఆతనికి "యమ, సూర్య, చంద్ర, నక్షత్ర, వాయు, రుద్ర” - మొదలైన స్థానములందు గాని, మందర కైలాసాది పర్వత ప్రదేశములందు గాని, లౌకికమైన కళలందు గాని, సువర్ణరత్నమాణిక్యాదు లందుగాని, రంభ ఊర్వశి మొదలైన దేవతా స్త్రీల దేహ సౌందర్యములందు గాని ఆసక్తి ఉండదు. అవి ఎదురుపడినప్పుడు అపేక్షించడు, ద్వేషించడు. తన ఆత్మ దృష్టిని, మౌనధ్యానమును వీడడు. తన శత్రువులను చూచినప్పుడు కూడా అచలుడై, పరిపూర్ణచిత్తుడై, మౌని అయి ఉంటాడు.

వేదవిహితుడగు విప్రునకు మద్యపు వాసనపై ప్రీతి ఉంటుందా? ఉండదు కదా!

ఆత్మ జ్ఞానియగు మహనీయుడు ప్రియా ప్రియములందు సమబుద్ధిని కలిగి ఉంటాడు. పుష్పములందు, లతలందు, చందన - అగరు - కర్పూర - కస్తూరి - లవంగాది సుగంధములచే ఆతడు ప్రత్యాకర్షితుడు కాడు. సముద్రపు గుడగుడ శబ్దముల హోరు, ఆకాశంలో జనించే ప్రతిధ్వనులు, సింహగర్జనలు, శత్రువుల భేరీ నినాదములు, డమరుక శబ్దములు, కర్ణకఠోరమగు ధనుష్టంకారాలు ఆత్మజ్ఞానిని కొంచంకూడా భీతిల్లజేయలేవు. ఏనుగుల ఘీంకారాలు, బేతాళ కలహాలు, పిశాచ, రాక్షసాదుల హీహీనాదాలు ఆతనిని చలింపజేయలేవు. పిడుగుల శబ్దములచేగాని, పర్వతముల విస్ఫోటకముచేగాని, బాణ, వజ్రఘాతములచేగాని ఆతని అనుక్షణికమగు స్వస్వరూపానుభవము కలతపడదు. అంపపు ఘర్షణలు, తీక్షఖడ్గ ఛేదనపు మెఱుపులు, తీవ్ర పదజాలములు ఆతని నిశ్చల ఆత్మానుభవం ముందు నిష్ప్రయోజనమే అవుతాయి. వనవాటికయందు గాని, మరుభూమియందు గాని, జన సమూహంలో ఉన్నప్పుడుగాని, అనేకమంది వినమ్రులగు జనుల మధ్య పలుకులు పలుకుచున్నప్పుడు గాని, తిరస్కాం, పురస్కారములు అందించబడుచున్నప్పుడు గాని… ఆతనికి ఆనందము, దుఃఖము - - రెండూ ఉండవు.

నిప్పుకణికల వంటి ఇసుక ఎడారులలో అడుగులు వేస్తున్నప్పుడుగాని, మృదువైన పచ్చిక బయళ్ళలో చిరుగాలులు అనుభవిస్తున్నప్పుడు గాని, ఖడ్గ ప్రహారములందు గాని, సుఖ శయ్యలందు గాని, ఎత్తైన పర్వతములపై సంచారం చేస్తున్నప్పుడుగాని, లోతైన బావులందు ఉండవలసి వచ్చినప్పుడు గాని ఆతడు ఒక్క తీరుగానే ఉంటాడు. సంపదలు, ఆపదలు వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు ఆతనికి భయము గాని, ఆనందము గాని ఉండదు. తలపై భారము మోస్తున్నవాడు, ఆ భారాన్ని క్రిందకు త్రోసి వస్త్రముచే ముఖం తుడుచుకుంటూ విశ్రాంతి అనుభవిస్తాడు చూచావా? ఆ జ్ఞానసమన్విత హృదయుడు సర్వవేళలా అంతర్ముఖుడై అట్టి విశ్రాంతి, ఆనందములను ఆస్వాదిస్తూ ఉంటాడు. భీతి, వ్యాకులత, గర్వములుగాని, ధైర్య, అధైర్యములు గాని లేనివాడై సముడై, స్వస్థచిత్తుడై అకృత్రిమ మగు పూర్ణ స్వభావము వహించి ఉంటాడు.

Page:698

ఓ రామచంద్రా! జ్ఞాని యొక్క సర్వ సమత్వమహిమ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆతడు అపవిత్రములు, అపథ్యములు, గోమయముచే తడిసి రసహీనమయి ఉన్న ఆహారమును కూడా మృష్టాన్నమువలె ఆరగించగలడు. తనయొక్క ‘అసక్తత’ అను బలంచేత రుచికర, అరుచికర పదార్థములను ఆస్వాదిస్తున్నప్పుడు సమచిత్తుడై ఉండగలడు. తృణములు - కేశములు - ఎముకలు రక్తము మొదలైనవి చూస్తున్నప్పుడు కూడా ఆతడు సంతుష్టుడు, కృష్ణుడు కాడు. పురుగులో కూడా ఆతనికి బ్రహ్మదేవుడు కనిపిస్తాడు.

జీవితస్యాపి హర్తారం దాతారంచ ఏకరూపయా |

దృశా ప్రసాద - మాధుర్య శాలిన్యా పరిపశ్యతి ॥

జీవహర్త, జీవదాత - ఈ ఇద్దరినీ ఆతడు ప్రసన్న మాధుర్యములతో కూడిన ఏకదృష్టితో వీక్షించగలడు. దీర్ఘకాలం ఉండే దేవతల శరీరములందుగాని, అల్పకాలస్థమగు ఈ మానవ శరీరములందు గాని, ఈ రెండిటికీ సంబంధించిన భోగ్య - అభోగ్య, రమణీయ - అరమణీయము లందుగాని ఆతడు సర్వసమత్వం వహించి ఉంటాడు. వాటిచే ఆతనికి సంతోషము గాని, దుఃఖం గాని కలుగవు. …వేద్యమగు ఆత్మను ఎరిగి ఉండుటచే ఆతని చిత్తము రాగరహితమై ఉంటుంది. ఈ జగత్తు యొక్క స్థితియందు ఆతనికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. ’ఇక్కడి విశేషములన్నీ మిథ్యయే కదా?…” అను సునిశ్చయం కలిగి ఉంటాడు. ఇంద్రియములకు విషయస్థితి యొక్క ఆవశ్యకత్వం కలుగజేయక, నిశ్చింత బుద్ధిచే ప్రభవిస్తూ ఉంటాడు.

నాయనా రామా! లేళ్ళు లేచిగుళ్ళను భక్షిస్తాయి చూచావా? తత్త్వజ్ఞుడు కానివానిని… ఆత్మ యందు విశ్రాంతి పొందని వానిని… స్వస్వరూపస్థితి ఎరుగనివానిని ఈ ఇంద్రియములు కబళించి వేస్తున్నాయి. ఇక ఆతడు వాసనాతరంగములచే చుట్టబడి సంసారసముద్రంలో కొట్టుకుపోవుచూ అనేక వేదనలు, రోదనలు ఎదుర్కొంటున్నాడు. ఇంద్రియములనే మొసళ్ళు ఆతనిని గుటుక్కున మ్రింగటానికి సిద్ధపడుచున్నాయి. అందుకే, మానవుడు విచారణయుతుడు కావాలి" అని ఈ ఉపశమన ప్రకరణ సమీక్షలో మరల మరల గుర్తుచేస్తున్నాను. జల ప్రవాహం పర్వతమును పెకలించ గలదా? విచారయుతుడై, భవ్యపదమున స్థితి కలిగి ఆత్మయందు విశ్రాంతి పొందిన బుద్ధిని సంపాదించుకున్న వానిని ఇక్కడ కనబడే వికల్పములు ఏమీ చేయలేవు. సర్వ సంకల్పములకూ సీమాంతరమగు పరమపదమున విశ్రమించేవారు, ఆత్మ పదప్రాప్తి పొందినవారు ధన్యులు. వారికి రాజాధిరాజత్వం కూడా తృణప్రాయమే అవుతుంది. ఎవరి చిత్తమైతే పూర్ణమై, విస్తృతమై, ఆత్మాకారం పొంది ఉంటుందో - - అట్టి వారికి ఈ జగత్తు ఊరికి చివర ఉన్న శిథిల గృహం వంటిది. వారికి క్షణకాలం అనంత కల్పములు కూడా ఒక్కటే అవుతాయి. వారు సర్వదా సమత్వం వహించి ఉంటున్నారు. ఈ ప్రపంచమంతటినీ ’సంవిన్మాత్రము’గా ఎంచుచున్నారు. దీనిని సర్వ సాక్షియగు ఆత్మగానే చూస్తున్నారు. అందుచేత సర్వజగన్మధ్యంలో ఉన్నప్పటికీ ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. జ్ఞానులై విహారం చేస్తున్నారు.

Page:699

సంవిన్మాత్రపరిస్పన్దే జగతే వస్తుపన్జరే

కింహేయం? కిం ఉపాదేయమ్? ఇహ తత్వవిదాం మతమ్||

ఈ జగద్వస్తు పంజమరంతా సంవిత్తు యొక్క స్పందనమే కదా! అందుచేత తత్వవేత్తలకు ఇందు గ్రహించతగినదేముంటుంది? త్యజించతగ్గదేమున్నది? ఎరుగబడుచున్నదంతా సంవిన్మాత్రమగు ఎరుగుచున్నదానిలోనే ఉండగా అది వదలటమేమిటి? పట్టుకోవటమేమిటి? కనుక రామా! నీవు సర్వ భ్రమలూ విడచిపెట్టు.

అజ్ఞాన జీవులకు అభిలషితములగుచున్న వర్తమాన - - భవిష్యత్ విషయజాతమంతా తత్త్వజ్ఞుని దృష్టిలో శూన్యాకాశమువంటిది మాత్రమే. తాను మాత్రం సర్వదా సంవిత్స్వరూపుడై సర్వదా సర్వత్రా ఏర్పడి ఉంటున్నాడు.

ఆదావర్తేచ యన్నాస్తి, వర్తమానే_పి తస్య చ

కంచిత్తాలలవం దృష్టా సత్తాసౌ సంవిదో భ్రమః ||

ఏదైనా ఒక వస్తువు మొదట్లోనూ - చివరలోనూ లేకుండా వర్తమానంలో మాత్రం కొద్దికాలం గోచరిస్తోందనుకో! దానియొక్క ఉనికి సంవిత్తు యొక్క భ్రమ మాత్రమే అయి ఉన్నది. అద్దానికి స్వతఃసిద్ధమైన సత్త లేనట్లే అగుచున్నది. ఈ జగత్తులోని ఆయావిశేషాలు చూస్తున్నప్పుడు ఇట్టి దృఢ నిశ్చయం కలిగి ఉండు. భావాభావములందు కూలుచున్న బుద్దియొక్క విభాగమును పరిత్యజించు. నిస్సంగుడవు, ప్రకాశస్వరూపుడవు, సంవిన్మాత్రుడవు అయి ఉండు, భావాతీతుడవగుము.

ఓ రామచంద్రా! ఎదురుగా ఉన్న ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలనే ఉపకరణములను ఉపయోగించి కర్మలు చేయి. లేదూ… సమాధి వహించి కర్మలను త్యజించు. సంగదోషరహితుడవై ఉంటే ఆ ఉభయ స్థితులు నిన్ను అంటజాలవు. అసంగబుద్ధిచే మనస్సు ద్వారా ఉపకరణమాత్రములగు ఈ అవయవములతో వ్యవహరించావా… ఇక మనోరథదశలు, సుఖదుఃఖదశలు నిన్ను సమీపించ నైనా లేవు.

గత సంగమనా దృష్ట్యా పశ్యన్నపి, న పశ్యతి ఏతదన్యస్థ చిత్తత్వాత్ బాలేనాపి అనుభూయతే ॥

సంగములేని మనస్సు కలవాడు కంటితో చూస్తున్నప్పటికీ చూడనివాడే అవుతాడు. ఒక చిన్న దృష్టాంతం చెపుతాను. మనస్సు, భావన ధ్యాస మరెక్కడో ఉన్నాయనుకో. అప్పుడు మనం బాటలో పోతున్న ఒక వ్యక్తినో, వాహనమునో కళ్ళతో చూస్తున్నా… చూడని వారమే అవుతాము కదా! చిన్న పిల్లవాడినుండి పెద్ద వాళ్ళవరకు ఇట్టిది అనుభూతమగుచున్న విషయమే! అన్యవస్తువుపై దృష్టి కలిగియున్నప్పుడు ఎదురుగా ఉన్నది చూడనివారమే అగుచున్నట్లు సంగము లేకుండా ఇంద్రియములతో క్రియలు నిర్వర్తించినా కూడా… నిర్వర్తించని వాడవే అవుతావు.

కాబట్టి అసంగ చేతస్కుడు (One who has no attachment) అగు మనుజుడు చూచినా చూడని వాడే! వినినా… వినని వాడే! తాకుచున్నా… తాకని వాడే! వాసన చూస్తున్నా… చూడని

Page:700

వాడే! కళ్ళుతెరచినా.. తెరవని వాడే! మూసినా.. మూయని వాడే! ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ కేరింతలు పెట్టుచున్నప్పటికీ ఇంటాయన ధ్యాస ఎక్కడో ఉంటే, ఆ శబ్దములు చెవిన పడుచున్నప్పటికీ ఆతడవి వినకయేపోవటం సభికులందరికీ సుపరిచయమైన విషయమే కదా! ఆత్మలో ధ్యాస కలిగి ఆ రీతిగా ఇంద్రియములను ఉపయోగించటం, ఇక ఇంద్రియ విషయములలో ఆత్మను ప్రవేశింపజేయకుండటం అభ్యాసంచే సుసాధ్యమే!

‘సంగము’ అంటే ఏమిటి? అభిలాష - - అభినివేశములే కదా!

సంగఃకారణమ్ అర్థానామ్, సంగః సంసారకారణమ్ |

సంగః కారణమ్ ఆశానామ్, సంగః కారణమ్ ఆపదామ్ ॥

ఓ రామయ్యా! సంగమే సర్వ పదార్థములకు కారణం. సంసారమునకు కూడా హేతువదే. సమస్త ఆశలకు, ఆపదలకు అదే మూలం. సంగము వదలగలిగితే మోక్షమే లభిస్తుందయ్యా! సంగము త్యజించిన మరుక్షణం “నేను జన్మించువాడను. కర్మిష్ఠుడను. మరణించువాడను” - అను అల్పభావములన్నీ తొలగిపోతాయి. కనుక నీవు సర్వ పదార్థములందూ సంగమును వదలి జీవన్ముక్తుడవు కమ్ము.

శ్రీరాముడు : సర్వ సంశయములనూ నివృత్తింపజేయగల హే సద్గురూ! ఈ రోజు మన సంవాదము ముగించేముందుగా … ‘సంగము’ అనగా ఏమిటో సంక్షిప్తంగా వివరించ ప్రార్థన.

శ్రీవసిష్ఠమహర్షి :

భావాభావే పదార్థానామ్ హర్షామర్షవికారతా । మలినా వాసనాయైషా సాసంగ ఇతి కథ్యతే ||

పదార్థముల సంయోగ - - వియోగములందు (అవి లభిస్తున్నప్పుడూ - తొలగుచున్నప్పుడూ) హర్ష - శోకములు కలుగుచున్నాయి కదా! ఎందుకు కలుగుచున్నాయి? అంతరంగంలో ఉండే - "ఇది నాకు చెందినది. నేను దీనికి చెందినవాడను. అవి నాకు చెందాలి. ఇవి నాకు తొలగాలి” ఇటువంటి రూపములతో ఏర్పడే మలిన వాసనలే సుమా! అట్టి మలిన వాసనలే ‘సంగము’ అని నిర్వచించబడింది. జీవన్ముక్తులు సర్వదా ఎట్టి సంగమూ లేకుండానే ఈ భూమిపై సంచరిస్తున్నారు. వారి శరీరములలో ఉండే సంస్కారం లేక వాసన శుద్ధవాసన అని అంటాం. ఎందుకంటే వారి వాసనకి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి1. అది హర్ష - శోక వివర్జితమై ఉంటుంది. 2. దానియందు పునర్జన్మ హేతువులు ఉండవు. ప్రారబ్ధక్షయ పర్యతం మాత్రమే ఉండే శుద్ధ వాసన ‘అసంగము’తో సమానం అవుతుంది. అట్టి అసంగము లేక శుద్ధవాసనచే నిర్వర్తించబడే కర్మ బంధమును కలిగింపజాలదు.

ఇక సంసారాసక్తులగు మూఢచిత్తుల సంగము గురించి చెపుతాను విను. వారి వాసనలు హర్ష - శోకములతో కూడి ఉంటాయి. వాసనలతో జన్మ - జీవించుటచే మరికొన్ని వాసనలు - -

Page:701

ఆ వాసనల నుండి మరల పునర్జన్మ ఈ విధంగా ఉంటుంది. వారి తతంగం. పునర్జన్మకు కారణము కాగలవాసనలే ’సంగము’ - అని చెప్పబడుతోంది. అట్టి వాసనలతో చేయబడే కర్మలన్నీ చివరికి బంధము కొరకే అగుచున్నాయి. అందుచేత రఘురామా! ఆత్మకు వికారము కలుగజేస్తున్న వాసనా రూపమయినట్టి సంగమును నీవు త్యజించివేయి. సర్వదా స్వస్థుడవైయుండుము.

అప్పుడు కర్మలు చేసినప్పటికీ, జలంలో ఉండే కమలంలాగా, వాటిచే నీవు స్పృశింపబడకయే ఉంటావు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు, “నేను ఏ దృష్టితో ఈ ఈ కర్మలు చేస్తున్నాను?”– అని నీకు నీవే ప్రశ్నించుకో! దృష్టిని శుద్ధ పరచుకొనుటచే… “నేను కర్మాతీతుడను. అకర్తను. శుద్ధమగు ఆత్మ స్వరూపుడను. నిస్సంగుడను” అని గ్రహించగలవు. అట్లు గ్రహించిన తరువాత నిర్వర్తింపబడే కర్మలన్నీ అసంగమే అవుతాయి. హర్షామర్ష విషాదములచే వైరూప్యము పొందక, రాగ భయ క్రోధములు లేనివాడవై ఉంటే, నీవు ఇప్పటికిప్పుడే అసంగుడవౌతావు. దుఃఖముచేగ్లాని పొందక, సుఖముచే ప్రసన్నత పొందక, ఆశాపాశవశ్యముకాక, సర్వవిషయములను త్యజించినవాడవై ఉంటేనే అసంగుడవయినట్లు సుమా!

లోకవ్యవహారములలో ఉన్నప్పుడు, సుఖ - దుఃఖాది దశలు పొందవలసివస్తున్నప్పుడు నీవు బ్రహ్మము తోటి ఏకత్వము త్యజించకపోవటమే అసంగమునకు గుర్తు.

ఎప్పుడైతే నీ చిత్తము ఆత్మ సంవేద్యముతో కూడి ఉంటుందో, ఎరుగబడిన బ్రహ్మముగానే సర్వదా శేషించి ఉంటుందో - - అప్పుడది సర్వ సంగములను అధిగమించినట్లే. అటుపై, యథా ప్రాప్తములైన క్రియలను ఆచరిస్తున్నప్పటికీ అసంగుడవే. ఇందులో సందేహం లేదు.

అనాయాసంగా, అకృత్రిమంగా చేకూరు అసంగత్వమే జీవన్ముక్తుని ’సుస్థిర స్థితి’ అయి ఉన్నది. ఓ దాశరథీ! నీవు అద్దానినే ఆశ్రయించు. స్వస్థుడవై, వీతరాగుడవై, మౌనివై, ఇంద్రియపాశములను నిగ్రహించినవాడవై, ఉత్తమ జ్ఞానివై, ఆర్యుడవై, మాన-మద మాత్సర్యరహితుడవై ఉండుము. మనం పదే పదే చెప్పుకుంటున్న జీవన్ముక్తుల స్వభావమును సంతరించుకో. సంతాపరహితుడవై ఉండు.

భోగ - విక్షేపాదులకు కారణంకాగల వస్తు సముదాయం నీ చుట్టూ చేరవచ్చుగాక! లేక, ఒక్కొక్కటే తొలుగుతూ ఉండుగాక! వాటితో నీకేమి సంబంధం? నీవు జ్ఞానివై, సమచిత్తుడవై ఉంటే, వాటి ప్రాప్తాప్రాప్తములు నిన్నేమి చేయలేవు. అదీన స్వభావుడవై నీకు నియమించబడిన ఆయా ధర్మములను వాటి సహజ సంక్రమిత ప్రాప్తములను బట్టి ఎప్పటికప్పుడు నిర్వర్తించు. అన్యమేమీ ఆచరించని వాడవు, యోచించని వాడవు కమ్ము. అయినప్పటికీ సర్వమునకు అకర్తవై ఉండు. ఫలాభిలాష, క్రియాభినివేశము లేకుండానే జ్ఞాని ప్రవాహపతితము, ప్రకృత క్రమమును అనుసరించి తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అట్లా నిర్వర్తిస్తూనే స్వాత్మయందు క్రీడించుచున్న అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోబోతున్నాం.

పెరుగు చిలకబడినప్పటికీ తన తెలుపుదనం కోల్పోతోందా?… మహామతియగు జ్ఞాని తన యొక్క పూర్వసిద్ధ స్వభావమగు శమ - - దమ - · శాంత - సహకార - సంతోష - సమదర్శనములను Page:702

ఎన్నటికీ వీడడు. ఆతనికి చక్రవర్తి పదవి లభించుగాక! క్రిమికీటక ఉపాధులు లభించుగాక! అకస్మాత్తుగా ఇంద్ర పదవి ప్రాప్తించుగాక! బ్రహ్మదేవుని పదవి వచ్చి తలుపుతట్టుగాక! అందులో ఆతనికి సంతోషించవలసినదిగాని, దుఃఖించవలసినదిగాని ఏదీ కనిపించదు. పున్నమినాటి రాత్రంతా చంద్రుడు ఒకే రీతిగా ప్రకాశిస్తాడు చూచావా? ఆతడు కూడా ఆయా అన్ని స్థితులందూ ఏక రూపంగానే భాసిస్తూ ఉంటాడు. ఓ రామా! హృదయంలోంచి సర్వ క్రోధ, భేదములనూ, తదితర భూతాకారములను బయటకు పారత్రోలివేయుము.

అంతిమ పురుషార్థమైనట్టి ‘మోక్షము’ అను కార్యమునందు మాత్రమే ప్రతిష్ఠితుడవు, తత్పరుడవు అయి ఉండుము. వాసనలన్నీ క్షయించుగాక!

నీ బుద్ధి శుద్ధమై ఆత్మ పదమును అందింపజేయునదై ఉండుగాక! అవిద్యను, తత్కార్యములను దగ్ధమొనర్చుటలో సమర్థమగు గాక! అట్టి బుద్ధిచే నిరతిశయ పరమానందమున సంస్థితుడవయ్యెదవు

గాక!

అప్పుడు జనన మరణాది బంధములచే నీవు పరిమితుడవు కావు. సర్వదా అపరిమితుడవై ఉంటావు. అట్టి ఆత్మ తేజోమూర్తివైన నీవు సర్వులకూ వందనీయుడవౌతావు.

(14వ రోజు విచారణ పూర్తి అయింది).

ఉపశమన ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు

ఓం తత్సత్

ఓ రామా! మలినము, చంచలము అయిన ‘అహంకారము’ను హృదయము నుండి పారద్రోలివేయి. మరుక్షణం అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వేశుడు, వాసనారహితుడు, శాంత చిత్తుడు అగు ఆ ఆత్మదేవుడు నీ హృదయమున స్వయముగా ప్రభువై విరాజిల్లుతాడు.

‘తత్త్వవిచారణ’చే ‘ఆత్మ’ అను జ్యోతి ప్రాప్తించగా, సమస్తదోషములు తొలగిపోతాయి. అట్టి ఆత్మ స్వరూపుడగు జీవుడు ఈ జననమరణములలో, ఐహిక పారలౌకిక స్థితులలో ఉద్వేగరహితుడై ఉంటున్నాడు. అతడు స్వదేహనగరంలో తాపత్రయరహితుడై విలాసంగా విహరిస్తున్నాడు.

వసిష్ఠ మహర్షి

పుట:176

CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93–83972–14–2 (Set)

దోమలగూడ, హైదరాబాదు–29

రామకృష్ణ email : publication@rkmath.org

మఠం 9789383972142

Vasishta Rama Samvadam : Vol 2 ISBN 93–83972–11–11000/- (set) www.rkmath.org