CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

వసిష్ఠ రామ సంవాదం

(యోగ వాసిష్ఠమ్)

మూడవ సంపుటం నిర్వాణ ప్రకరణము

i

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము

(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)

మూడవ సంపుటం,

నిర్వాణ ప్రకరణము

అనుసృజన:

వై.హెచ్.రామకృష్ణ

రామतज्ञोसः प्रचोदयात Bha

మఠం

రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాదు - 500 029

ii

Published by Adhyaksha Ramakrishna Math

Domalguda, Hyderabad - 29

O Ramakrishna Math, Hyderabad All rights reserved

I- 1M–08–2010 12026

12028 (Set)

Printed at: RP Printers, Hyderabad.

Bound at Pridhvi Binders, Hyderabad.

iii

ప్రవేశిక

అఖండ రామాయణంలోని చివరి ప్రకరణం అయిన నిర్వాణ ప్రకరణంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఆరు ప్రకరణాల్లోకీ శ్లోక సంఖ్యాపరంగా ఇది పెద్దదవటమేకాదు; ఇందులో చర్చించిన అంశం కూడా గంభీరమైనది. మొదటి ప్రకరణాల్లో చర్చించిన అంశాలు సూక్ష్మమైనవైతే, ఇందులో చర్చించిన విషయం సూక్ష్మతరం, సూక్ష్మాతి సూక్ష్మం అని పేర్కొనవలసి ఉంటుంది. నిజానికి అన్నింటిలో చర్చించిన విషయం ఒక్కటే ఐనప్పటికీ ఏ స్థాయినుంచి, ఏ భూమికనుంచి, ఏ కోణం నుంచి విషయాన్ని విశ్లేషిస్తున్నాం అన్న దాన్ని బట్టి చర్చించిన అంశం విభిన్నంగా వ్యక్తమవుతుంది.

ఈ ప్రపంచ మంతా ఉదయాస్తమ రహితమై, అఖండప్రకాశ రూపమై, నిర్మలమై, శిలవలె మౌనరూపమై, నిర్వికారమైనట్టి శాంతమగు బ్రహ్మయే అయిఉన్నది అంటుంది ఈ ప్రకరణం. ఇది కేవలం భావన కాదు. పరమ సత్యం. మనకు అనుభవమౌతున్న జగత్తు అవిద్యారూపం. అజ్ఞాన జనితం. బ్రహ్మానికి వేరైన సత్తాలేనిది. కావున ఈ ప్రకరణం నుంచి మనకు, ద్రష్ట దర్శన దృశ్య త్రిపుటిని భేదించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి, ఏకత్వరూపంగా మిగిలిపోవలసిందని శాస్త్రమాత ఉద్భోధము.

వాయువు, వాయు స్పందన ఏవిధంగా వేరుకావో అదేరీతిన చైతన్యం లేదా చిత్తు మరియు విషయ జగత్తు వేరు కావు. చిత్ స్పందనే జగత్తు.

చైతన్యానికి వేరుగా ఏమీ లేదని, ఇంద్రియాలు, వాటికి అధిష్ఠానమైన మనస్సు, మనోకల్పితమైన విషయ ప్రపంచంతో సహా సర్వం బ్రహ్మమయమని ఈ ప్రకరణం నుంచి జ్ఞాని గ్రహిస్తాడు. దేహం అందులోని చిత్ రెండూ వేరు కావన్న భావం కలిగిన సాధకుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. నిర్వాణ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సర్వం చిన్మయమని గ్రహించిన వ్యక్తి శోక మోహరహితుడై, భేదదృష్టి వీడినవాడై ఏకత్వానుభవం పొంది కేవాలానంద స్వరూపుడిగా నిలుస్తాడు.

నిర్వాణ ప్రకరణం లో చెప్పిన విషయాన్ని సులభంగా గ్రహించాలంటే ముందు ప్రకరణాల్లో పేర్కొన్న విషయాన్ని అవగతం చేసుకుని ఉండాలి. ఉత్పత్తి, స్థితి ప్రకరణాలు దృశ్యావిర్భావానికి మరియు దృశ్యానుభూతికి కారణాలు బోధించాయి అని అనుకున్నట్లైతే; నిర్వాణ ప్రకరణం సముద్రం నుండి ఉద్భవించే తరంగాలు ఏవిధంగా సముద్రానికి భిన్నం కావో అదేవిధంగా దృశ్యజగత్తు కూడా చిదభేదం కాదని ఉద్ఘాటిస్తుంది. మనోనిర్మితమైన వస్తు ప్రపంచం మనస్సుతో సహా చిత్ శక్తియే. చిద్విలాసమే. చిదాంతర్గతమే. చిద్రూపమే. చిన్మయమే. చిత్స్ఫురణయే అని తెలుపుతుంది. ఐతే జగత్తు చిదభిన్నం ఐనప్పుడు పురుష ప్రయత్నం చేయటం, మోక్షాన్ని పొందటం అన్నీ అసంగతాలు కావా అంటే మనకు ఇంద్రియగోచర జగత్తుకు సంబంధించిన ఎరుక ఉన్నంత సేపు ఆ ఎరుక తొలగే వరకూ ప్రయత్నం చేయాల్సిందే. అంటే మొదటి ప్రకరణాల్లో చెప్పిన విచారణ అనే పురుష ప్రయత్నాన్ని అనుష్ఠించి మనస్సును పరిశుద్ధ మొనర్చుకున్న జిజ్ఞాసువు మాత్రమే ఈ ప్రకరణం లో పేర్కొన్న కేవలాద్వైతాన్ని అనుభవ మొనర్చుకోగలడు. అలా కాకుండా ఇందులోని ఉత్కృష్ట భావనలను అపరిశుద్ధ మనస్కుడికి బోధిస్తే విరుద్ధంగా, విపరీతంగా అర్థంచేసుకునే ప్రమాదముంది. అందువలన శాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని అందులో పేర్కొన్న క్రమంలోనే చదవాలి.

— - ప్రకాశకులు

iv

విషయ సూచిక

VI. నిర్వాణ ప్రకరణం (పూర్వార్ధం) : 1

I. ప్రకరణ పరిచయం 3

పదిహేనవ రోజు 1.అవ్యక్త ఆత్మ స్వరూపం…3; 2. లేనిది లేనిదానిగా చూడాలి…7; 3.మేలుకొలుపు…9; 4.అయోమయం నుండి స్వస్థానానికి…10; 5. మోహం ఎట్లా తొలగు తుంది?…11; 6. అజ్ఞానాంధకార విభూతులు… 15; 7. అవిద్యా సంభ్రమం…18; 8. కార్య అవిద్య-కారణ అవిద్య… 20; 9. అవిచారణమాంద్యము-చికిత్స…24; 10. కర్తవ్య ములు జ్ఞానమునకు అడ్డు కావు… 28; 11. వివేక భేరీ నినాదం…30; 12. ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం… 34; 13. ఆత్మానుభూతిపరులు… 39

II. ప్రాణ నిరోధ యోగోపదేశము భుశుండో పాఖ్యానం 41

1.యోగసాధన - జ్ఞానము… 41; 2. వసిష్ఠ - భుశుండ సమాగమం…43; 3.భుశుండుని జన్మవృత్తాంతం… 45; 4. నిర్లిప్తుడను-అప్రమేయుడను…47; 5. ధారణచే మహాప్రళయ సాక్షిత్వం…50; 6. సుదీర్ఘ సృష్టి చమత్కారం…52; 7.చిత్ర విచిత్ర సంఘటనలు…54; 8. చాంచల్యరాహిత్యం - అమృతత్వం… 56; 9. ప్రాణవాయుగతుల ఉపాసన…59; 10. రేచక -పూరక-కుంభకములు : ప్రాణాపానముల ఉత్పత్తి - లయస్థానములు…64; 11.ప్రాణాపాన ముల సమాధానం…71; 12. వీడ్కోలు… 74; 13. దేహభావం భ్రమ మాత్రమే…75; 14. సంకల్పము-మాంసమయ దేహం…82; 15. అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా?… 84

III. దేవతార్చన (శ్రీ సాంబశివ - వసిష్ఠ సంవాదము) 89

1.అర్చన-నిర్వచనం…89; 2. సర్వమయ మహాచిత్… 95; 3. చిత్తు: జడ-చైతన్య విభాగములు …99; 4. చిత్తుయొక్క విన్యాసం-వివశత్వం…100; 5. చైతన్యం సర్వదా సర్వత్రా యథాతథం …102; 6. అజ్ఞానము యొక్క చమత్కారం!… 107; 7. అపరిమితంలో పరిమితమా?… 112; 8. సంకల్ప రాహిత్యం…115; 9. చైతన్యము - విశ్వము… 117; 10. నిజాత్మ భగవానుడు… 121; 11.తస్మై సర్వాత్మనే నమః… 124; 12. చిదాత్మ యొక్క దర్శన ప్రదర్శనములు…126; 13. బాహ్యపూజ - అంతర్పూజ…128; 14.ఆత్మాభిషేకం… 132; 15. అనంత స్వస్వరూప మునకు అల్పత్వం ఆపాదించటమా?… 137; 16. అవిద్యనుండి… విద్యకు !…139; 17.గురువులు…143; 18.జగత్తుకు మూలం భావనయే!… 144; 19.దృష్టియే సృష్టి…148; 20. అనుక్షణిక పూజాభావం… 151; 21. కల్పనాజగత్తు - జీవబాటసారులు… 154

IV. బిల్వఫలం - శిల - - మృగతృష్ణ ఉపమానాలు 158

పదహారవ రోజు 1.బిల్వఫల ఉపమానం… 158; 2.శిల- శిల్పి - శిల్పము… 161; 3. ఇక భేదమెక్కడిది?…166; 4. స్వస్వరూపానంద సుస్థిరత్వం…170; 5. ఆత్మ సర్వదా నిర్మలమే!…

V

173; 6. శరీరముయొక్క రాకపోకలు… 176; 7.భ్రమలు తొలగాలంటే జ్ఞానోదయం కావాలి…180; 8. అవిద్యయొక్క ఆనుపానులు…182; 9. జన్మ - జన్మాంతరములు… 184; 10. మోక్ష తత్త్వము… 186

V. శ్రీకృష్ణార్జున సంవాదం 190

1.అనాసక్తి యోగం… 190; 2. ఆత్మకు జననమరణాలు లేవు… 191; 3. కర్మ రహస్యం… 193; 4.పరాపరములు… 197; 5. నేను సర్వదా అకర్తను… 199; 6. ఆత్మార్పణం…200; 7. అకామకామి… 203; 8. దేహి దేహము వాసనలు…205; 9. వాసనాక్షయం

ఆత్మానుభవం…207; 10. స్వధర్మ నిరతి…210; 11. మనోకల్పన…211; 12. అసాధ్యం కాదు సుసాధ్యమే…213; 13. నేర్పుతో కూడిన ప్రయత్నము… 215; 14. ఆత్మయొక్క కృతనిశ్చయం…216; 15. జీవన్ముక్తుని పరమ లక్షణములు… 219; 16.స్వకంఠాభరణం… 221

VI. జీవుడు - - స్వప్నపరంపరలు 225

1.స్వప్నసదృశ సిద్ధాంతం… 225; 2. స్వప్నంలో ఇంకొక స్వప్నం…230; 3. రాజహంస - రుద్రుడు…235; 4.వివిధ ఉపాధుల సమావేశం… 239; 5. దృశ్య వృత్తి - దృశ్య నిర్వృత్తి… 242; 6.గణపతిత్వం…244; 7. సంకల్పిత దేహములు…245; 8. మోహవశాత్తుగా సుదీర్ఘ పయనం…249; పదిహేడవ రోజు 9. సూక్ష్మ దేహంతో అన్వేషణ… 251; 10. బ్రహ్మైక్య ప్రతిపాదన…254; 11. పరమ నిశ్శంక స్థితి…257; 12. మౌన ధారణ…259; 13.ప్రాణ - మనోసంయోగం…263; 14. విదేహముక్తి - మౌనము… 266

VII. బేతాళ ప్రశ్నలు 272

  1. ఆరు ప్రశ్నలు…272; 2. సర్వసమత్వము… 280

VIII. భగీరథ యత్నం 281

  1. శ్రీత్రితల-భగీరథ సంవాదం… 281; 2. సర్వ పరిత్యాగం… 286; 3. పునః పట్టాభిషేకం

  2. గంగావతరణం… 289

IX. చూడాలోపాఖ్యానం (మోక్ష నిర్వచనం) 292

1.శిఖిధ్వజ రాజ్యపాలన… 292; 2. ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క ఆవశ్యకత… 294; 3. ఆత్మ ప్రబోధం కలిగించేవే అనుసరణీయాలు!… 296; 4. తనయందు తానై ఉన్న ఆత్మసత్త…298; 5.నిర్మలశాంత స్వరూపం…299; 6. చూడాల స్వకీయ విచారణ… 301; 7. సుషుమ్నానాడి …306; 8. వాసనలు - ఉపాధులు…310; 9.ఆధి- వ్యాధులు… 314; 10.ఆధి వ్యాధుల ఉపశమనోపాయాలు…318; 11. యోగశక్తులు… 320; 12. చైతన్య జడముల పరస్పర హేతుత్వం…322; 13. అగ్నిలో శీతలం! విజ్ఞానం (లేక) ప్రజ్ఞ నుండి జడ వ్యవహారం!…324; 14.చిత్ - జడపరిణామ చమత్కారం… 327; 15.సాధన ఉపాసన…332; 16. కుండలిని అష్టసిద్ధులు - జ్ఞానసాధన క్రమం… 333; 17. వెతికేది చిల్లిగవ్వ కోసం - దొరికేది

vi

చింతామణి…338; 18. శిఖిధ్వజ వనవాసం…342; 19. చూడాల శిఖిధ్వజ పునః దర్శనం…346; 20.సుఖ దుఃఖాదులన్నీ - స్వయంకల్పిత మాత్రములే!…349; 21. స్ఫటిక ఘటంలో జననం…357; పద్దెనిమిదవవ రోజు 22.క్రియ - జ్ఞానములు…359; 23. మణి సాధకుడు - గాజుమణి… 364; 24. తప్పించుకుని కూడా మరల చిక్కిన ఏనుగు… 367; 25. ఒక బంధం నుండి మరొక బంధంలోకి…370; 26. జ్ఞానము కొరకు త్యాగం…373; 27.సర్వత్యాగమంటే వస్తు త్యాగమా?…375; 28. మనస్సును అధిగమించటమే “సర్వత్యాగం”… 381; 29. బ్రహ్మముకాక మరింకెక్కడా ఏ ఇతరమైనదీ లేదు… 386; 30.‘అహంకారం’ అనేది ఒక భ్రమ మాత్రమే… 395; 31. బ్రహ్మము యథాతథంగా ఉండి ఇక్కడ వినోదిస్తోంది!… 400; 32. భావనయొక్క అభావన… 405; 33. చిత్తమనేది లేదు!…409; 34.ఈ జగత్తే బ్రహ్మము…415; 35. దృశ్యము ద్రష్టను పరిమితం చేయలేదు …418; 36. తరంగాలన్నీ జలమే! చిత్తములన్నీ చిత్తే…. 422; 37. ఋషి వాక్య మననం …429; 38. కుంభ పునరాగమనం…431; 39.లోక సంచారం… 435; 40. నియతిని పాలించటమే ఉచితం!… 436; 41. దుర్వాస మహర్షి శాపం…440; 42. గాంధర్వ వివాహం .444; 43. ఇంద్రుని ఆహ్వానం… 446; 44. తుది పరీక్ష… 449; 45. చూడాల - శిఖిధ్వజ సమాగమం…453; 46. పునః రాజ్య ప్రవేశం…460

X. బృహస్పతి - - కచ సంవాదం 461

1.సర్వ త్యాగం అంటే ఏమిటి?…461

XI. మిథ్యా పురుషుడు 467

  1. ఆకాశాన్ని భద్రపరచుకోవటమెట్లా?…467; 2. అహంకారమే ఆ మిథ్యా పురుషుడు!… 469; 3.అహంకారము ఆత్మకు అన్యమైనది కాదు…472

XII. శ్రీ శివ = - భృంగీశ్వర సంవాదం (మహాకర్త - మహాభోక్త - మహాత్యాగి) 476

  1. జీవన్ముక్త లక్షణములు… 476; 2. మహాకర్త… 477; 3. మహాభోక్త…479; 4. మహాత్యాగి… 481; 5. చిత్త శామ్య స్థితి…483

XIII. మను - ఇక్ష్వాకు సంవాదము (నే నెవరు!) 485

1.ఈ కనిపించేదంతా ఏమిటి!… 485; 2. కొంగు క్రింద బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికొచ్చి నట్లు!…487; 3.జగత్తు చిత్ దర్పణంలోని ప్రతిబింబము మాత్రమే… 490; 4.’అహమ్’ నుండి ‘అనహమ్’…492; 5. సచ్చిదానందమును సంతరించుకో… 496; 6. జీవన్ముక్త మాహాత్మ్యం…498; 7.జీవన్ముక్తుడు - సామ్యస్థితి…500; 8. మూడు అవస్థలు - తురీయం …502; 9.తురీయమునకు ఉపాయం…506; 10. భూమికా ప్రవేశం…508; 11.జన్మ - జన్మాంతర ప్రయత్నం…513; 12.ఉత్తరోత్తర భూమికా సంప్రయాణం…514; 13. ఇచ్ఛను

అధిగమించాలి…517

XIV. శ్రీ వాల్మీకి మహర్షి ప్రవచనం 521

vii

1.ఆత్మావలోకనం… 521; 2. ఆత్మానంద సాగరం…532; 3. రామానంద సాగరం… 540;

4.ఫలశ్రుతి…545

నిర్వాణ ప్రకరణం (ఉత్తరార్ధం) 549

1. ప్రకరణ పరిచయము 551

1.సంకల్పరాహిత్యము… 551; 2.‘యోగం’ అంటే ఏమిటి?… 555; 3. కర్మ అంటే ఏమిటి…556; 4.కర్మ త్యాగము…562; 5. అహంత్వమే సంసారం… 568; 6. తితిక్ష… 572

II. శ్రీ భుశుండ - విద్యాధర సంవాదము 576

  1. బరువైన 18 వస్తువులు… 576; 2. ఇంద్రియముల దురాక్రమణం… 578; 3. దృశ్యమును వదలాలి - దృక్ను పట్టుకోవాలి… 583; 4.నేను - నీవు మొదలైనవి ఉండజాలవు!…587; 5.బాహ్యాభ్యంతర చిద్రూపుడు… 589; 6. నీవే ఆ బ్రహ్మమువు (తత్త్వమసి)…591; 7. తటస్థ భావముతో జగద్దర్శనం…594; 8. అహంభావము కల్పిత మాత్రమే!… 596; 9. చంచల మనస్సే జగత్తు యొక్క రూపం… 599; 10.ద్రష్టయే దృశ్య జగత్తుకు రచయిత… 602; 11.ఇంద్ర - త్రసరేణు న్యాయం…604; 12. ఆత్మసాక్షాత్కార పర్యంతం దృశ్యం ఉంటోంది …606; 13.ఇంద్రత్రసరేణు న్యాయ సారాంశం…610; 14.అంతఃకరణ శుద్ధి…613; 15.బ్రహ్మజ్ఞానాగ్ని జ్వాల…615; 16. గాలిలో ఎగిరే జగత్ దూదిపుంజాలు …617; 17.సమష్టి రూప విరాట్ పురుషుడు - వ్యష్టి…623; 18. వ్యష్టి - విరాట్టు ఒక్కటే!…627; 19. జ్ఞాని - జ్ఞానబంధువు… 631; 20. జ్ఞానియొక్క నిర్వచనం… 632; 21.జీవాత్మయే పరమాత్మ!…634; 22. అహంకారాత్మ - దేహాత్మ… 638; 23. జ్ఞాని అజ్ఞాని - వారి వ్యవహార విశేషాలు… 641

III. శ్రీ వసిష్ఠ - - మంకి సంవాదము 644

1.ప్రక్కదోవ పట్టుచున్న బహుదూరపు బాటసారి… 644; 2. సంసార పంజరం…650; 3.ఏదైతే తెలుసు కొంటోందో - అదియే తెలియబడవలసినది!…653; 4. బ్రహ్మమయమ్ జగత్…660; 5. మనస్సును అధిగమించటం ఎట్లా?…665; 8. వాసనాక్షయం యొక్క ఆవశ్యకత…673; 9.ప్రవాహపతితం కర్మ - అసంగపూర్వక నిర్వహణ… 677; 10. ఆత్మ అవాఙ్మానసగోచరం…680; 11. మనమందరమూ అద్వితీయాత్మస్వరూపులమే!… 682; 12.“అనహమ్” ఏవ ముక్తిః… 686; 13. అనంత స్వస్వరూపంలో అల్ప దృశ్య విభాగం…670; 14.తత్త్వజ్ఞులతో సాంగత్యం - స్వవిచారణ…696; 15. పరలోకవ్యాధి - ఇహైవ చికిత్స …700; 16. దృష్టియే సృష్టి…705; 17.ప్రపంచసహిత ప్రపంచరహిత అఖండైక్య దృష్టి …712; 18. ఇచ్ఛా జాడ్యం… 716; 19. ఇచ్ఛయొక్క ఉపశాంతి… 722; 20.ప్రబుద్ధుడు అప్రబుద్ధుడు…726; 21. జగత్తే పరమాత్మ స్వరూపం… 733; 22. సర్వరూపియగు చిదాత్మ …739; 23.జగద్ర్భాంతి… 744; 24. వివేకముచే స్వాత్మభూతుడగు పరమాత్మారాధన…747; 25.‘అశాంతి’ నుండి విశ్రాంతికి… 754; 26. మనస్సు - పదార్దములు… 760

viii

VII. మనోమృగ విశ్రాంతి 765

1.సమాధి వృక్షము - చల్లటి నీడ… 765; 2. మనో మృగము… 767; 3. ధ్యానము….. ఉత్తరోత్తర స్థితులు…769; 4. బ్రహ్మమునందు విశ్రాంతి - ఉపాయాలు…774; 5.అనురక్తి నుండి సమాధికి… 777; 6. ముముక్షువు - మొట్టమొదటి మెట్లు… 780; 7. ఈశ్వరుడు ఎక్కడున్నాడు?…785; 8. వివేకి యొక్క దర్శనం-మననం-అనుభవం…790; 9.అనన్యం…793; 10.వాసనలు తరగతులు…798; 11.ఈ జగత్తు ఉత్పత్తి రహితము

మిథ్య - నిరాకారము… 801; 12.సృష్టి ప్రళయములు…807; 13.మహా కల్పాంతము…811; 14. బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా… 815; 15.జలమందు ద్రవత్వం - బ్రహ్మమునందు జగదత్వం…818; 16. జగత్ సర్వం అనుత్పన్నం… 821

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము

VI. నిర్వాణ ప్రకరణం

(పూర్వార్ధం)

Page:3

పదిహేనవ రోజు

I. ప్రకరణ పరిచయం

  1. అవ్యక్తి ఆత్మ స్వరూపం

సూర్య భగవానుడు తన సహస్ర కిరణ జాలములను లోకములపై ప్రసరింపజేయటంతో ఉదయారంభమైనది. రామలక్ష్మణాదులు మహర్షి వసిష్ఠులవారి ఆశ్రమం ప్రవేశించి మహర్షిని సుస్వాగతపూర్వకంగా ఆశ్రమంనుండి సభాప్రాంగణమునకు రథముపై తోడ్కొని వచ్చారు. సభ యథారీతిగా ప్రారంభమైంది.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మానంద స్వరూపులగు ప్రియశ్రోతలారా! లోకకళ్యాణ, చిరుదరహాసాలంకారుడ వగు ఓ రామచంద్రా! ఈ రోజు నుండి మనం నిర్వాణము గురించిన సంవాదంలో ప్రవేశిస్తున్నాం.

ఓ రామచంద్రా! ముముక్షు వ్యవహారం మొదలుగా మనం అనేక విషయాలు చెప్పుకోవటం జరిగింది. క్రమంగా నీవు నీ చిత్త విహంగాన్ని హృదయమనే పంజరంలో ఉంచి వశపరచుకుంటు న్నావు కదా? నాయనా! హంస పాలు స్వీకరించేటప్పుడు, అందులోని జలభాగాన్ని వదలి పాలసారమే గ్రహిస్తుంది కదా! అట్లాగే మన ఈ సుదీర్ఘ సంవాదములోని అసంగతమైనది, దుర్బోధ్యమైనది ఏదైనా ఉంటే.. అది విడిచి, సారాన్ని జాగ్రత్తగా గ్రహిస్తున్నావని నేననుకుంటున్నాను.

  1. వాసనాక్షయం, 2.మనో నాశనం, 3. ప్రాణ నిరోధం, 4. జ్ఞానాభ్యాసం…

ఈ నాలిగిటి గురించి అనేక విశేషాలు మనం ఉపశమన విభాగంలో చెప్పుకున్నాం. వాటినన్నిటినీ నీవు చక్కగా స్వబుద్ధితో పరిశీలించి, అనుగమించాలి. ఈ పథం అనుసరిస్తే నీవు బద్ధుడవు కావు. అట్లా గాకుండా, శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నము ఆశ్రయించక, కేవలం దిగులుపడుతూనో …లేక ఇంద్రియ విషయ సేవనతోనో రోజులు గడిపేస్తూ ఉంటే … వింధ్యపర్వత శిఖరం నుండి అమాయక ఏనుగు పతనమైనట్లు ఈ జీవుని అధఃపతనం అనివార్యం. మన ఈ సంవాదములోని అంతర్లీనసారాన్ని గ్రహిస్తూ, తమ తమ సాధనలను కొనసాగించుకుంటూ ఉండమని సర్వజనులకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. శ్రద్ధ, అవగాహన పెంపొందించుకోకపోయాడా, బాటసారి చీకటి పడుటచే ఒక అడవిలో చిక్కుకున్నట్లు, ఈ జీవుడు ఈ సంసారారణ్యంలో చిక్కుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను.

ఓ రామా! సంగరహితుడవై యథాప్రాప్తములైన లోకవ్యవహారములను ఆచరించుటయే శాస్త్ర సిద్ధాంతం. దీనిని నీవు గ్రహించి ఉదారచిత్తుడవగుము.

Page:4

ఇంతవరకూ ఉపశమనము గురించిన విభాగంలో చిట్ట చివరివరకూ మనం చెప్పుకొన్న విషయాలలోని గంభీరార్థం జ్ఞాపకం ఉంచుకుంటున్నావు కదా!

ఇప్పుడిక శాశ్వత సిద్ధి ప్రసాదించగల మరికొన్ని విశేషాలు చెప్పుకోబోతున్నాం. అయితే, అభ్యాస-వైరాగ్యాలను నిరంతరం అలవర్చుకుంటూ ఉండవలసిందే. తద్వారా తత్త్వచింతన సుస్థిరరూపం పొందుతుంది. తత్త్వం చక్కగా గ్రహించటంచేత దుర్బేధ్యమైన వాసనావేశం బలహీనపడుతుంది. అప్పుడు శోకరహితమైన ‘తత్పదం’ తప్పక లభిస్తుంది. మన ఈ వర్తమాన సంవాదం అందుకు తప్పక సహకరించగలదు. అందుచేత మీమీ శాస్త్రప్రవచితమైన, ఆశ్రమోచితమైన అభ్యాసాలు చక్కగా నిర్వర్తిస్తూ ఉండండి.

దేశ-కాల-కారణములచే పరిచ్ఛేదమొందజాలని బ్రహ్మమే ఈ జగత్తు రూపంగా వెలయు చున్నది. అయితే, చమత్కారంగా ద్వైత భ్రాంతిని మాత్రం కలుగజేస్తోంది. నిర్విషయమై, సమమై, శాంతమయమైనట్టి బ్రహ్మమొక్కటే ఉన్నది. ఇక్కడ అన్యత్వానికి తావేలేదు. ఈ విషయం పదే పదే నిరూపించుకున్నాం. నిరూపించుకోబోతున్నాం కూడా!

ఇక అహంకారమంటావా… అద్దానిని లేని దానిగానే చూడు. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతరం (పురుగు నుండి, బ్రహ్మదేవుని వరకూ) ప్రశాంతంగా సర్వశరీరములలోనూ ప్రసరించి ఉన్న ఆత్మను దర్శించగలగటమే “అపరోక్షానుభవం.” నిజానికి చిత్తము గాని, అవిద్య గాని మనస్సు గాని, జీవుడు గాని లేనేలేవు. ఇవన్నీ ఆ బ్రహ్మమునందు ఏర్పరచబడుచున్న కల్పనలు మాత్రమే. భోగములు, అద్దాని పట్ల ఏర్పడే వృత్తులు, ఆసక్తి, అనుభవం - ఇవన్నీ కూడా సముద్రంలోని తరంగాలులాగా బ్రహ్మములోనే ఉద్భవిస్తున్నాయి. స్వర్గ-భూ-పాతాళ లోకములలోను, భూతవర్తమాన-భవిష్యత్తులలోను, బ్రహ్మదేవునిలోనూ, స్తంభములో కూడా… ఆ పరబ్రహ్మమొక్కటే జ్వాజ్వల్యమానంగా ప్రకాశించుచున్నది. దానికి భిన్నమైనదంటూ ఏదీ లేదు. గ్రాహ్య - త్యాజ్యము లలోనూ, బంధుమిత్ర వ్యవహారములందు, తదితర సర్వ ఉపాధులలోనూ ఆద్యంతరహితమై విజృంభి స్తోంది ఆత్మయే.

అజ్ఞాన భ్రమ ఉన్నంతవరకు జలంలో తరంగభావనలాగా ’జగత్ కల్పన’ అనే చిత్తము యొక్క ద్వితీయ ఆవృత్తి ఉండనే ఉంటోంది.

“నేను దేహమును, ఈ దృశ్యమంతా నిజమే అయి ఉన్నది, ఇది నేను, అవి నావి” …ఇటువంటి కల్పనలు, భావతమకములు ఉన్నాయంటే మనోచాంచల్యము ఏర్పడుచున్నట్లే! జీవుడు సజ్జన. సద్విషయ - సద్వివేక సాంగత్యం ద్వారా పూర్ణత్వం సంతరించుకోనంత వరకు చిత్తం నీచత్వం పొందుతూనే ఉంటుంది. సర్వసమదర్శనం ద్వారా విశ్వభ్రాంతిని బలహీనపరచుకుంటే గాని తన స్వరూపమేమిటో ఈ జీవునకు అర్థం కాదు, తోచదు కూడా! అజ్ఞానం అనే గుడ్డితనం వలన మోహం, మోహం వలన మూర్ఖత్వం, మూర్ఖత్వం ద్వారా విషయ ఆశలు, విషయవాసనలు వచ్చి పడుతున్నప్పుడు మరి జీవుడు ఉపాయాలను ఆశ్రయించాలి కదా? హృదయవనంలో ఆశల దుర్గంధం నిరంతరం ఉబుకుతుంటే ‘ఆత్మవిచారణ’ అనే చకోరం ఎట్లా ప్రవేశిస్తుంది? భోగములను ఆశించటం

Page:5

కాస్త ఆపి, సమచిత్తం పెంపొందించుకోకపోతే ఈ జీవుని పీడించే పాశాలు తెగేదెట్లా? తృష్ణను జయించి శీతల మనస్కుడు కాకపోతే ఈ జీవునికి స్వస్వరూప ప్రబోధం వినబడేదెట్లా? అవునా, కాదా? శ్రీ రాముడు: ఔను మహర్షీ! అయితే, ‘చిత్తం’ అనబడేది అనే పిశాచి అసలు ఉత్పన్నం కాకుండేదెట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ ఎదురుగా కంటికి కనబడే వస్తువులను “లేనివి”గా, అతి దగ్గరగా అనుభవ మయ్యే ఈ దేహమును "బాహ్యమగు ఉపకరణ మాత్రం”గా చూడగలిగిన నాడు జీవునికి చిత్తం ఉత్పన్నమే కాకుండగలదు. ‘నేను పుట్టుక - చావుల మధ్య ఇరుక్కున్న ఒక అల్ప జీవుడను’ అనే ప్రారంభ భ్రమతో బాటు తదితర అసంఖ్యాక భ్రమలకు కారణమగుచున్న ‘జగత్తు’ అనబడేది అంతరంగంలో శాంతించటమే అన్నిటి కన్నా అతి ముఖ్యమైన ఉపాయం. అందుకు శ్రవణ-మనననిధి-ధ్యాసనల ద్వారా హృదయంలో ఆత్మ సాక్షాత్కరించటమొక్కటే మార్గం. మిథ్యాభ్రమలు కలిగించే అజ్ఞానం శాంతించి ’పరమార్థదర్శనం’ అనే సూర్యుడు ఉదయిస్తే చిత్తం దానంతట అదే ఎండుటాకు వలె నేల రాలుతుంది. నిప్పులో పడ్డ నేయి వలె లేకుండాపోతుంది.

శ్రీరాముడు : మహాత్మా! మహాత్ములలో కూడా ‘చిత్తం’ ఉంటుందా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఉంటుంది. అయితే సముద్రం ఒడ్డున నీరు ఎండిన చోట నీటి జాడలు కనిపి స్తాయి చూచావా! అట్లా పేరుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల చిత్తం పరాపరదర్శనంతో కూడుకొని ఉంటుంది. జీవన్ముక్తమై ఉంటుంది. శుద్ధసత్వమయమగుటచే నామకః మాత్రమే అయి ఉంటుంది. వారిలో వాసనలు సత్వమయమై ఉండటం చేత వారిది చిత్తము అని అనిపించుకోదు. ’సమరసము’ అను రుచితో కూడిన ఆ తత్త్వజ్ఞులు అమనస్కులే! వారు లోకహితైషులై ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు. శుద్ధులై, శాంతులై, మహోన్నతులై, సంయతీంద్రియులై తమ లోపల, బైట అద్వైతజ్యోతి సమన్వితులై ఉంటారు. ద్వైత వాసనలు వారిని సమీపించలేవు. ఈ దృశ్యము అనే తృణములు (గడ్డిపరకలు) వారి జ్ఞానము అనే అగ్నికి ఆహుతై అవిషయములగుచున్నాయి. వారి సంచారములు, మనోధర్మములు లోకకళ్యాణోద్దేశ్యం మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి చిత్తంలో ఇక భ్రమలేవీ ఉండవు.

దగ్ధమైన బీజం మరల అంకురిస్తుందా? ఆ మహా మహితాత్ముల హృదయాకాశంలో మోహం ఉద్భవించదు.

దేనినైతే మనం ‘చిత్తము’ అని పిలుస్తున్నామో అది మూఢులకు పదే పదే జన్మజరామరణములు కలిగించటానికి కారణమౌతోంది. జ్ఞానుల చిత్తం ఒక మహాశిల్పి చేతిలోని ఉలిలాగా గొప్ప ఉపయుక్త మగు ఉపకరణమగుచున్నది. అనగా, అదే చిత్తము “జ్ఞానానందమయ దృష్టి”ని సంపాదించుకోవటానికి పరికరమగుచున్నది. అట్టి చిత్తము అజ్ఞాని యొక్క చిత్తంలాగా పదే పదే పునరుత్పత్తి పొందటం లేదు. శ్రీరాముడు : ఏకత్వం తాండవిస్తోందని చెప్పబడే ఈ జగత్తు మాకు పరిపరి విధాలుగా కనబడటానికి కారణమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వస్వరూపము, సర్వ స్వరూపము అగు బ్రహ్మమును ఏమరచుట చేతనే!

Page:6

బ్రహ్మబృంహైవ హి జగజ్జగచ్చి బ్రహ్మబృంహణమ్ | విద్యతే నానయోర్భేదశ్చిÓన బ్రహ్మగోరివ॥ (శ్లో. 51 సర్గ 95)

అయితే ఈ జగత్తు, బ్రహ్మము, శుద్ధ చిత్తము - ఈ మూడు వేర్వేరు కాదని గ్రహించు. అవి అభేదమైనవే! మిరియములో కారం ఉన్నట్లు… మూడు జగత్తులూ చిత్లోనే ఉన్నాయి. శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తు ఉత్పత్తి, ప్రళయముల మాటేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : జగత్ యొక్క ఉత్పత్తి, ప్రళయములు కేవలం కల్పిత మాత్రములే. ఇక అది ఉండటం ఉండకపోవటం (సత్ - అసత్) అనునదంతా ఖండజ్ఞానముచే ఏర్పడుచున్నదే! భ్రాంతి చేత చైతన్యమునందు జడత్వము ఆపాదించబడి, గాంచబడుతోంది. ఫలితంగా అట్లు జడ భావనచే చూస్తున్న ద్రష్టయగు ఈ జీవుని ఇక సర్వ అప్రతిష్ఠలు, సర్వ అల్పావగాహనలు చుట్టుముట్టుచున్నాయి. అతను దుఃఖితుడౌతున్నాడు. మరి ఆ దుఃఖాలు తొలగక్కర్లేదా?

శ్రీరాముడు : ఈ జీవుని అంతరాంతరాలలో దుఃఖం పేరుకుని ఉన్న మాట మాత్రం నిజం. అది తొలగవలసిన అగత్యమున్నదనునది అత్యావస్యకం కూడా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అందుకు విచారణ చేయాలి. కాస్త విచారణ చేస్తే, “ఈ జడ జగత్తు వాస్తవమే కాదు” అని తేలుతోంది. కల్పనలన్నీ కల్పనలను ఆశ్రయించే స్వభావం గల ఈ జీవునియందే ఉన్నాయి గాని… జగత్తునందు కాదు.

ఈ దృశ్యమును చిన్మయముగా భావించగలిగిన చిత్తము శుద్ధమైనట్లే. అద్దానిలో బైట, లోపల ఇక కల్పనలు ఉండవు.

ఆత్మయే స్వరూపముగా గల ఈ జీవుడు స్వస్వరూపమును ఏమరచినప్పుడల్లా అల్పత్వము పొందుతున్నాడు. అందుచేత సర్వ జనులారా! మీ యొక్క సత్యస్వరూపం ఈ నామ రూపాత్మక దేహం కాదు. జగత్తులోని ఒక పదార్థం కాదు. అది ఆద్యంత రహితమై, నిరంశమై, చిదాత్మకమై అఖండమై ఈ కనబడే దాని కంతటికీ అతీతమైయున్నదని గుర్తు చేస్తున్నాను. మరల మరల ఆ పరిపూర్ణత్వమును స్మరించి, అద్దానిచే శాంతులై అప్పుడు ఈ సర్వమును పరికించండి. అప్పుడు, “జగత్తు - చిత్తము – బ్రహ్మము ఒక్కటే వేర్వేరు కాదు” అను గూడార్థం మీకు తప్పక గోచరించగలదు. స్ఫటికము వలె శుభ్ర స్వరూపుడగు ఈ జీవుడు తనకు తానే కల్పనచే ఈ సంసారరూపంగా క్రీడయందు వలె తాండవమాడుచున్నాడు.

ఓ రామచంద్రా! ఈ కనబడే పదార్దములేవీ నీవు అయి ఉండలేదు. అవి నీ యందు లేవు. నీవు వాటియందు లేవు. ఓ అవ్యక్తరూపా! చిదనాత్మా! చిదానంద స్వరూపుడా! ఆద్యంతవివర్జితుడా! సర్వవ్యాపీ! శుద్ధ చిత్త సమన్వితుడా! స్వాంత స్థితుడా! లీలామాత్రజగద్ధారీ! మావంటి మునులందరికీ ధ్యేయమైనవాడా! నీ వాస్తవ స్వస్వరూపమునకు వేనవేల నమస్కారాలయ్యా! ప్రతి ఒక్క జీవుడు నీ స్వరూపమే! నీవే ప్రతి ఒక్క జీవుని స్వరూపం కూడా! మేమంతా నీస్వరూపమే! ఆత్మారాములమే!

Page:7

  1. లేనిది లేనిదానిగా చూడాలి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! సముద్రంలో అనంత సంఖ్యలో తరంగాలు లేవటం లయించటం జరుగుచున్నట్లు, ఈ జగత్తులు అనంత సంఖ్యలో ఆత్మయందు ఉత్పన్నమై లయిస్తున్నాయి. ఎవ్వడైతే అద్వైత భావనచే భావాభావ వివర్జితుడై ఉంటాడో, ముక్త స్థితిలో ఉంటాడో అతనియందు ఈ జగద్వాసనలే కానరావు. స్వప్నానికి రూపం లేనట్లే, ఈ జగత్తులకు వాస్తవమైన రూపమేదీ లేదు!

అసలు ఈ ‘జగత్తు - జీవుడు’ అనునవి చిత్తము యొక్క కల్పనలే సుమా! ఇక మిగతావాటి గురించి వేరుగా చెప్పేదేమున్నది?… అందుచేత జగద్వాసనలు (Worldly tendencies) క్షయించాలి. వాసనలు క్షీణమొందగానే నీవు చిత్సముద్రుడవౌతావు. మహా గంభీరుడవు, సౌమ్యుడవు, ఆత్మారాముడవు కాగలవు.

అగ్ని నుండి వేడి, పుష్పము నుండి సుగంధం, కాటుక నుండి నలుపు, చెఱుకు నుండి తీపి, తేజము నుండి వెలుతురు, జలము నుండి తరంగం వేరుకానట్లు… ‘చిత్తము’ అనే స్వకీయ సంకల్ప వ్యవహారము కంటే జగత్తు అనబడేది వేరు కాదు.

చితో న భిన్నో ‘అనుభవో’, భిన్నో న అనుభవాత్ ’అహం’। న మత్తో భిద్యతే ‘జీవో’, న జీవాత్ భిధ్యతే ‘మనః’ ||

మనసో న ఇంద్రియం భిన్నం, పృధక్ దేహశ్చ న ఇంద్రియాత్ న శరీరాత్ జగత్ భిన్నం, జగతో నా న్యదస్థి హి ||

చిత్ కంటే అనుభవం వేరు కాదు. అనుభవం ‘అహం’ (నేను)కు వేరు కాదు. ’అహం’ జీవుని కంటే వేరు కాదు. అట్టి జీవుడు మనస్సు కంటే అన్యమైనవాడు కాదు. మనస్సు ఇంద్రియార్థములకు వేరుగా లేదు. ఇంద్రియార్థములు ఇంద్రియాల కంటే వేరు కాదు. ఇంద్రియాలే శరీరం. అట్టి ఇంద్రియ విషయాలే ఈ జగత్తు ఇంక వేరే ఏమున్నది? … ఈ విధంగా చూస్తే ఈ జగత్తు చిదాకాశమే

అయి ఉంది.

జ్ఞానదృష్టికి ఇదంతా స్వకీయ కల్పనామాత్రమే! జ్ఞాని యొక్క భావనలో ఇదంతా తొందరగా గాని, నెమ్మదిగా గాని, అసలుగా గాని ప్రవర్తించుటయే లేదు.

అఖండమైన ఆత్మజ్ఞానం లభించిన వారికి ఆకాశ స్వరూపమగు పరబ్రహ్మమొక్కటే తనలో - తనతో తానై దృశ్యజగత్తుగా వెలయుట స్ఫురిస్తోంది. తదితరమైనదేదీ వారికి అగుపించుటయే లేదు. అట్టి మహనీయులకు శూన్యం శూన్యంలోను, సత్యం సత్యంలోను, పూర్ణం పూర్ణంలోను తెలియవస్తున్నాయి.

జ్ఞాని అందరి వలే లోక వ్యవహారాలు నిర్వర్తిస్తున్నప్పటికీ… అతనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అతనికి దేనిపట్లా కూడా ఆసక్తి అనేది ఉండదు. అందుచేత అతనికి కర్తృత్వ భోక్తృత్వాలు కూడా ఉండవు. కనుక ఏది ఎట్లు చేస్తున్నా, ఏదీ చేయనివాడే అవుతాడు. ఆసక్తితో కూడి ఉన్నప్పుడు

Page:8

మాత్రమే క్రియలు సుఖ దుఃఖములుగా పరిణమించటం జరుగుతోంది. ఆసక్తి లేకపోతే కర్తృత్వం ఉండదు. సుఖ దుఃఖాలూ ఉండవు.

అనంతమగు ఆకాశమే తూర్పు - - పడమర - పైన - క్రింద… మొదలైన వాక్య వ్యవహారాలుగా ఏర్పడుచున్నది కదా! బ్రహ్మమే కర్తృత్వాభిమానం చేత జగత్తుగా సంకల్పించబడుతోంది.

ఎవని చిత్తము ఆకాశము వలె శుద్ధమైనదో, ఎవడు సదాచారపరాయణుడో, ఎవడైతే మట్టి

- చెక్క లాగా సంతోష దుఃఖములకు అచలితుడో, ఎవడు తనను చంపవచ్చిన శత్రువును కూడా అకృత్రిమ స్నేహంతో పరబ్రహ్మంగా దర్శించగలుగుతాడో… అట్టివాడే పరమసత్యాన్ని దర్శించటానికి అర్హత సంపాదించుకో గలుగుతాడు.

శ్రీరాముడు: మహాత్మా! ఈ జీవుడు ఎప్పుడు సుఖ దుఃఖములకు అతీతుడవగలుగుతాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : నదిలోని నీరు గట్టుమీద ఉన్న వృక్షమును మొదలంట సమూలంగా పెకలించు నట్లు హృదయంలోంచి మదము, మాత్సర్యము మొదలైన వాసనలు మొదలంటా నిర్మూలించ బడినప్పుడు మాత్రమే ఈ జీవుడు సుఖదుఃఖాతీతుడు కాగలుగుతాడు. రాగ ద్వేషాలకు అసలు కారణములేమిటో విచారించి, హృదయగుహలోంచి ఈ సర్వ వికారములను వెడల గొట్టకపోతే, కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించిన అసాధువులాగా ఎంత విన్నా, ఎంత చదివినా ఏం లాభం?… అట్టివాడు తెలుసుకుంటూ కూడా తెలియనివాడే అవుతాడు.

అంతేకాదు. ఎవని యందైతే కర్తృత్వ భోక్తృత్వాభిమానములు సమూలంగా తొలగి ఉంటాయో, బుద్ధి నిర్లిప్తమై ఉంటుందో… అతడు ఈ లోకంలో ఉన్నవారందరినీ చంపినా కూడా చంపనివాడు గానే ఉంటాడు.

శ్రీరాముడు: అట్టి నిరంహంకారం ఎట్లా సాధ్యం?

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వతహాగా లేని దానికి ‘ఉన్నది ఉన్నది’ అని సద్భావనను కల్పించటమే మాయ. ఇంక అహంకారమో… స్వతఃసిద్ధంగా లేనే లేదు.

జ్ఞానాన్ని అవలంబించటం చేత ఈ విషయం సుస్పష్టమౌతోంది. లేనిది లేనట్లుగా గ్రహించటమే జ్ఞానం. జ్ఞాని హృదయంలో దృశ్య ప్రపంచవాసనలకు చోటు లభించదు. అట్టివాడు సామంతులను లోబర్చుకుంటున్నట్లు ఈ సంసార వ్యవహారములను నిర్ద్వంద్వంగా జయించగలుగు చున్నాడు.

ఈ ప్రపంచంలోని పదార్ధములు కనిపిస్తున్నప్పుడు, కనిపించనపుడు, వైభవ-దారిద్ర్యములు వచ్చి పోవునపుడు, ఆరోప - - అపవాద దశలందు, తదితరజనులతో ఏర్పడే సంయోగవియోగ సందర్భములందు ఎవనికి సంతోషము గాని విషాదముగాని కలుగవో అట్టి మహనీయుని శాస్త్రములు ’జీవన్ముక్తుడు’ అని పిలుస్తున్నాయి. ఓ సర్వసభికులారా! మీరు జీవన్ముక్తులయ్యేందుకు సాధనలు కొనసాగించెదరు గాక!

Page:9

  1. మేలుకొలుపు

శ్రీరాముడు: స్వామీ! నిర్మలమగు చిదాత్మ “మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, తదితర జీవులు" అనువాటిలోకి వెళ్ళి వెళ్ళి చిక్కుకున్నదే? ఎందుచేత? అట్టి బంధం విడివడేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి: నీవు చెప్పే మనస్సు, బుద్ధి మొదలైనవి చిన్మయసత్తను అతిక్రమించి ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావా? బృహత్ స్వరూపమైన ఆత్మయే నానాత్వమంతా భ్రమింపజేస్తోంది. మెల్లకన్నువానికి ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపిస్తుందే! వరుసలో నిలబెట్టిన దర్పణములలో ఒకే వ్యక్తి యొక్క అనేక ప్రతిబింబములు అనేక కోణములలో అగుపిస్తాయి చూచావా! ఇదీ అంతే!

అంధకారం తొలగితే ఆ చీకటిచే కల్పించబడిన క్రీనీడలు కూడా తొలగుతాయి కదా! మూర్ఖ సమన్వితమగు భోగవాసనలు ఉపశమిస్తే అజ్ఞానం కూడా వినష్టమైపోతుంది. ‘తృష్ణ’ అనే విశూచివ్యాధి ఉపశమిస్తుంది. చిత్తవాసనలు తమ బంధువులగు అనేక ఆవేశ కావేషాలతో సహా తొలగుతాయి. దారం తెగిపోగానే దానికి గుచ్చబడిన ముత్యములు జారిపోవునట్లు సర్వ సంసార సంస్కారాలు సన్నగిల్లుతాయి.

అమనస్కం - ఆ ఓ రామా! సంకల్పములు త్యజించుటచే అనాసక్తిపూర్వకమగు అమనస్కం లభిస్తుంది. శాస్త్రములు చేయిఎత్తి చూపుడువేలుతో చూపుచున్నది ‘ఆత్మ’ అనుపేరుతో గల ఆ అమనస్కమే! ఈ మర్మాన్ని గ్రహించక ఆత్మ అనగా మరేదో బాహ్య విషయంగా గ్రహించేవారు శాస్త్రహంతకులేనని నా అభిప్రాయం. అట్టివారు శాస్త్రములలోని పైపై మధ్యేమార్గ విషయములను మాత్రమే గ్రహించేవారు సుమా!

అజ్ఞానమే సర్వ జాడ్యములకూ కారణం. గాలి వేగం తగ్గితే పద్మం కదలికలు మాని నిశ్చలత్వం పొందుతుంది. అట్లాగే అజ్ఞానం క్షీణిస్తే ఇక ఈ దృశ్య వ్యవహారాలేవీ మనస్సును వ్యాకులపరచలేవు. నాయనా! రామా! నీవు ఈ వాక్యములను విని ఆసక్తి-అనాసక్తులను విడుస్తూ మనోస్థిరత్వం పొందుచున్నావనే అనుకుంటున్నాను.

ప్రియ శ్రోతలారా! అంతఃపురంలో నిదురిస్తున్న రాజు భేరీనినాదం విని నిదురలేస్తాడు చూచారా? మీరు కూడా నా ఈ ఉపదేశ వాక్యాలు విని అజ్ఞాన నిద్ర నుండి జాగృతమవ్వండి. ఓ రామచంద్రా! సామాన్యుల హృదయాలలో కూడా ఈ మన సంవాద వాక్యాలు హత్తుకుపోతాయి. ఇక అతి ఉదారహృదయుడవైన నీ పట్ల వ్యర్థమెందుకవుతాయి? ఎండచే ఎండి ఉన్న నేల నీరు పడగానే వేగంగా పీల్చున్నట్లు, “అత్యంత ప్రయత్నశీలము, జిజ్ఞాస సమన్వితం" అగు నీ హృదయంలో ఈ ప్రవచనాలు స్థిరత్వం తప్పకపొందుతాయి. మహనీయుల అనుభవాలు నీకు శిరోధార్యమౌతాయని, ఆయా విశేషాలన్నీ హృదయంలో పదిలపరచుకుంటున్నావని నాకు తెలుసు.

Page:10

  1. అయోమయం నుండి స్వస్థానానికి… !

శ్రీరాముడు : హే మహర్షీ! పరమ పవిత్రమగు తమ ముఖ కమలం నుండి వెలువడుచున్న గురువాక్యములు నాకు అత్యంత విశ్రాంతిని, ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. మీ ప్రవచనం వింటున్నప్పుడు నా యొక్క స్వానుభవమేమిటో చెపుతాను వినండి.

హే ప్రభూ! అమృతతుల్యములగు మీ వాక్యములలోని అంతర్లీన గానామృతం గ్రోలుచున్నాను. బాహ్యాంతరాలలో సంచరించే నా చిత్తం క్రమంగా శాంతమును సంతరించుకుని నా స్వరూపంతో ఐక్యం పొందుతోంది. చాలా సంవత్సరాలు అనావృష్టిచే శుష్కమైన పొలం ఒక రోజు కుండపోత వర్షంచే తడిసి ఆనందం పొందునట్లు… నా మనస్సు మీ వాక్యధారలచే అభిషిక్తమై పరమానందం పొందుతోంది. ఏనుగు మొదలైన జంతువులు ప్రవేశించని సరస్సు నిశ్చలమగునట్లు నేను నిశ్చల ప్రశాంతతను అనుభవిస్తున్నాను. పొగమంచు తొలగితే రహదారిలో దూరం నుండి వస్తున్న వాహనాలు సుస్పష్టంగా కనబడునట్లు… ఈ కనబడే దృశ్యంలో యథాతథమగు బ్రహ్మము సుస్పష్టమౌతోంది. దిక్ మండలమంతా ప్రసన్నంగా దృశ్యమానమౌతోంది. ఆశలు అనే మృగతృష్ణ యొక్క ఆనుపాను లేమిటో తెలిసిపోతున్నాయి. ఆసక్తి అనే వృథా శ్రమ దరిజేరటం లేదు. వసంతకాలంలో చెట్లు చిగురిస్తుంటే కోయిల ఆనందంగా కుహూనాదాలు చేస్తున్నట్లు నేను విషాదములన్నిటి నుండీ తొలగినవాడనై ఆనందభరితుడనగుచున్నాను. ఎచ్చటైతే అమృతాస్వాదన కూడా స్వల్పాతిస్వల్ప విషయమై ఉంటుందో, అట్టి ఆత్మానందం నాకు తారసపడుతోంది.

ఆత్మయే స్వరూపముగా గల నాకు ఇదే నా నమస్కారం. అట్టి ఆనందం ప్రసాదిస్తున్న మీకు నమస్కారం!

సూర్యుడు ఉదయించగానే పిశాచమునకు సంబంధించిన భ్రమలు ఇంకా మిగులుతాయా? జ్ఞానోదయమగుచుండగా కల్పనలన్నీ నశిస్తున్నాయి. సంశయములన్నీ తొలగుతున్నాయి. శరత్కాలం లోని ఆకాశంలాగా నా హృదయం నిర్మలము, శాంతము, అనంతము - అయిన ఆనందమును పొందుతోంది. ’ఆత్మయందు కళంకం ఎట్లా, ఎప్పుడు, ఎక్కడి నుండి ఎందుకొచ్చింది?’ …ఇటువంటి సంశయాలన్నీ చీకటి రాత్రిలో ఉదయించిన పూర్ణచంద్రుని కిరణాలచే ఏర్పడిన దృశ్యమాన జగత్తులాగా విశదమగుచున్నాయి. సర్వము సర్వదా సర్వత్రా ఆత్మయే ఏర్పడి ఉండగా… ఇక ‘ఇది వేరు, అది వేరు’ అనే మిథ్యాకల్పనలకు తావెక్కడిది?

హే సద్గురూ! ఏదో తెలియని ఆవేదనకు, అగమ్యమునకు ఆలవాలమైన నా 15 రోజుల క్రితం స్థితినీ, ఇప్పటి నా స్థితినీ పోల్చి చూచినప్పుడు, అప్పటి నా మనోవేదనలను తలచుకోగానే నవ్వు వస్తోంది. ‘ఆశలు-అవి తీరుట’ మొదలైన దృష్టుల నుండి వైదొలగి తృష్ణారహితమగు స్థానం చేరుకున్నాను. మీ ‘వాక్’ అను అమృతధారలతో స్నానం చేసిన నేను ఇప్పుడు సర్వాత్మభావనను, సంపూర్ణ స్వభావమును సంతరించుకుంటున్నాను. తమ దయచేత బ్రహ్మభూమికను అధిరోహిస్తున్నాను.

Page:11

ఇప్పటి నా దృష్టికి సూర్యమండలము కూడా పాతాళము వలె అధోవిషయమగుచున్నది. ‘ఆసక్తి - అనాసక్తి’ అనే సముద్ర తరంగముల నుండి లేచినవాడనై స్వస్వరూపమునందు సుప్రతిష్ఠితుడ నగుచున్నాను. స్వమహిమ యందు సర్వోత్కృష్ట రూపముతో వెలుగొందుచున్నాను.

ఆత్మయే స్వరూపముగా గల నేను నమస్కరింపతగినవాడనగుచున్నాను. అట్టి నాకు పదేపదే ఇవే నా నమస్కారములు.

ప్రభూ! ఇన్ని మాటలెందుకు? మీ వచనాలు నా హృదయ పద్మకోశంలో ప్రవేశించి అనుభవ జ్ఞానమును ప్రసాదిస్తున్నాయి. తద్వారా నిత్యానంద స్వరూపమగు జీవన్ముక్త స్థితి పొందుచున్నాను.

  1. మోహం ఎట్లా తొలగుతుంది?

శ్రీవసిష్ఠ మహర్షి: శ్రీరామా! చాలా సంతోషం. నీ వాక్యములచే నేను ప్రసన్నుడనై నా ప్రవచనాన్ని కొనసాగించటానికి ఉద్యుక్తుడను, సముత్సాహుడను అగుచున్నాను.

ఇప్పుడు నీకు ‘మోహం ఎట్లా తొలగుతుంది?’ అనే విషయమై కొన్ని విషయాలు చెపుతాను. నీకు భేద బుద్ధి తొలగిందని నాకు తెలుసు. అయినా కూడా ఎల్లవేళలా జ్ఞానాభివృద్ధి అవసరమే. అందుచేత యథావిధిగా శ్రద్ధతో విను. మనం చెప్పుకోబోయే విశేషాలు ప్రీతికి, మనోసౌమ్యతకు తోడ్పడతాయి. ఈ తత్త్వము గ్రహించినవారి దుఃఖములు వాటంతట అవే తొలగిపోగలవు.

ఏ జీవుడైతే పంచభూతాత్మకమైన ఈ దేహమునందు ఆత్మ భావన సలుపుచున్నాడో, (ఎవడైతే ‘నేను ఈ దేహమును మాత్రమే’ అని తలచుచున్నాడో)… అతనిని అతని ఇంద్రియములే మరల మరల పరాభవిస్తున్నాయి. ‘అనాత్మ భావన’ అను దోషము యొక్క ప్రభావం అట్టిది మరి! అట్లా కాకుండా ఏ జీవుడైతే ఆత్మ జ్ఞాన పరాయణుడై, ఆత్మ తృప్తుడై ఉంటాడో… అతని ఇంద్రియములు అతనిని తమ మిత్రునిగా భావించి సేవిస్తాయి. ఆసక్తి-అనాసక్తులు త్యజించిన జీవునకు ఈ దేహము గాని, మరొక దేహం గాని పొందవలసిన అగత్యం గాని, అభినివేశం గాని ఉండదు. వాటి రాక పోకలకు ఆతడు అప్రమేయుడై మౌనంగా, లీలగా, క్రీడగా ఈ సర్వమును ఆస్వాదిస్తున్నాడు.

ఆత్మకు, శరీరమునకు సంబంధమే లేదు. చీకటి వెలుగుల వలె ఆ రెండూ పరస్పర విరుద్ధాలై ఉన్నాయి. అందుచేత జడము, తుచ్ఛము, వినాశనశీలము, కృతఘ్నము అగు శరీరము అనబడే ఒక జడ వస్తువుకు ఏమి కావలసివున్నదో అదే అగుగాక! సర్వ శక్తిమంతము, ఉదయాస్తమయ రహితము, నిర్లిప్తము, అప్రమేయము, వికార రహితము అగు ఆత్మకు ఈ శరీరము ఉండటం చేత గాని, (లేక) లేకపోవుట చేత గాని కలిగే హాని లేదు. మేలు లేదు. ఆత్మయొక్క ’నిత్యోదయము (Ever Wakeful) అనే లక్షణం ఈ భౌతిక శరీరానికి ఎట్లా వర్తిస్తుంది? చిన్మయమగు నీ స్వస్వరూపాన్ని నీవు భావన చేస్తూ ఉంటే ‘నేను మృణ్మయమగు ఈ శరీరమును’ అనే జడభావన చీకటిలో

మటుమాయమౌతుంది.

Page:12

శ్రీరాముడు : అయితే మహర్షీ! ఈ లోక వ్యవహారములు శరీర సహాయంతోనే నిర్వర్తించబడుచున్నాయి

కదా!

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ లోక వ్యవహారములు ఆత్మ-శరీరముల కలయికచే జరుగుచున్నట్లు అనిపించ వచ్చు గాక! అయినా కూడా వాస్తవానికి అవి రెండూ విరుద్ధ ధర్మాలు గల వస్తువులు. అత్యంత సూక్ష్మ మగు ఆత్మకు, అత్యంత స్థూలమగు శరీరానికి సంయోగమే అసంభవం. ఇక ఒకదానిలో మరొకటి ఐక్యమవటం ఎట్లా సిద్ధిస్తుంది? కనుక శరీర భావన, ఆత్మభావన ఒకచోట ఏర్పడి ఉండజాలవు.

ఆత్మభావన లేనప్పుడు శరీరభావన ఉన్నట్లే!… శరీరభావన లేనప్పుడు ఆత్మభావన ఉంటున్నట్లే! సద్వస్తువగు బ్రహ్మం జడం కాజాలదు. ఆరోపిత దృష్టిచే బ్రహ్మం దేహంగా అగుచున్నట్లు భ్రమ గొలుపుచుండవచ్చుగాక! అయినప్పటికీ సర్వ వ్యాపియగు ఆత్మకు శరీరముతో సంబంధం లేదు. శరీరము యొక్క ధర్మములు ఆత్మ యొక్క ధర్మములు వేరు వేరు.

దేహేన దేహగస్యాపి కమలస్యేవ వారిణా |

మనాగపి న సంశ్లేషో బ్రహ్మణో దేహసత్తయా ॥ (శ్లో॥ 14, సర్గ 60)

నీటిలో తామర పువ్వు ఉన్నంత మాత్రంచేత నీరు, తామరపువ్వు ఒక్కటి అవనట్లు… దేహికి దేహమునకు సంబంధం లేదు. ఏదైనా సంబంధం కనిపిస్తుంటే, అది ఆరోపితం మాత్రమే. దేహము ఉన్నంత మాత్రంచేత బ్రహ్మమునకు ఎట్టి దోషమూ అంటదు.

బ్రహ్మము సర్వదా నిర్దోషము, సమము. ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనుకో. అంతమాత్రం చేత ఆ ఇంటియొక్క లక్షణములు మనిషివౌతాయా? …లేక, మనిషి యొక్క లక్షణాలు ఇంటివి అవుతాయా? ఇదీ అంతే.

ఒకచోట గాలి వేగంగా వీస్తోందనుకో. ఆ గాలి యొక్క వీచికలు ఆకాశమును అంటుతాయా? శరీరము యొక్క లక్షణములైనట్టి జన్మ-జరా-మరణములు, ఆత్మకు అంటవు. అట్లాగే ఇక్కడి సుఖ-దుఃఖాలు, ఆసక్తి - అనాసక్తులు కూడా ఆత్మకు అంటవు. అందుచేత ’వీటివేటికీ సంబంధించనట్టి ఆత్మ’ను గ్రహించి పరమానందమును నిరభ్యంతరంగా పొందవచ్చు. ఇక ఈ శరీరములు, మనస్సు వగైరా బ్రహ్మా మహాసముద్రజలంలోని తరంగముల వంటివిగా చూడు. నిజానికి జలానికి తరంగాల లాగా, ఆత్మ చైతన్యమునకు అవన్నీ పరికల్పితములు మాత్రమే!

నీళ్ల కదలికచే కనబడే నీళ్లలోని సూర్యప్రతిబింబము యొక్క కదలికలను సూర్యబింబానికి ఆపాదించలేం కదా! శరీరంలో మనకు కనిపించే మార్పుచేర్పులను శరీరికి ఆపాదించటానికి వీలు లేదు. ఆత్మ ఏ క్షణంలోనూ ఎట్టి క్షోభా పొందటానికి ఆస్కారమే లేదు. అందుచేత ఈ జగత్తు ఏమిటో అవగాహన చేసుకోవటానికి ముందుగా కాస్త ‘సమదృష్టి’ స్థిరపడేటట్లు అభ్యాసం చేయి. అప్పుడు ‘సత్యవస్తు జ్ఞానం’ ఏర్పడి వాస్తవమేమిటో నీకే గోచరించగలదు. దేహమునకు సంబంధించిన అజ్ఞాన దృష్టులు తొలగాలంటే దేహి గురించిన వాస్తవ జ్ఞానమొక్కటే అసలైన ఔషధం.

Page:13

‘చీకటి’ అంటే ఏమిటి? వెలుగు లేకపోవటమే కదా! జ్ఞానం కలిగి ఉండకపోవటమే (అనగా) దేహి యొక్క స్వరూపం ఎరిగి ఉండకపోవటమే ‘అజ్ఞానం’. ఈ దేహము యొక్క పరికల్పనకు అట్టి అజ్ఞానమే కారణం. ఆత్మయొక్క స్వభావం గ్రహించని కారణంగా ‘మోహము’ అనే ఒక విషవృక్షం మొలచి నలువైపులా శాఖలు విస్తరించుకుంటోంది. ‘జ్ఞానముయొక్క రీతి ఏమిటి? ఆత్మ యొక్క స్వభావమేమిటి?’… అనే ప్రశ్నలకు వివరణాత్మకమైన సమాధానం గ్రహించకపోవటం చేతనే విపత్తులన్నీ వచ్చిపడుచున్నాయి. బ్రహ్మము యొక్క స్వరూపమేమిటో తెలియకుండా ఊరకే ఇక్కడా అక్కడా సంచరించటం ఏమాత్రం సముచిత విషయం కాదు. గాలి వీస్తున్నప్పుడు తోటలోని మొక్కలు అటూ ఇటూ కదలుచున్నట్లు ఇంద్రియ ద్వారములనుండి ప్రాణవాయువులు ప్రసరిస్తూఉంటే వారు ఆ లోకములలోనూ, ఈ లోకములలోనూ ప్రవేశించి ఊరికే గ్రహించటం, విసర్జించటం, ఆలాపించటం మొదలైన పనులు ఈ జీవులలో అనేకులు చేస్తున్నారు. ఒక్కొక్క ఉపాధి స్వీకరించటం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ప్రవాహంలో అవయవాలు క్షీణింపజేసుకోవటం, ఉన్మత్తులై ఏవేవో ఆశ - నిరాశలు మూటగట్టుకోవటం… ఇవీ సంసార జీవులు ఇక్కడ చేస్తున్న సుదీర్ఘకార్యక్రమాలు!

నీళ్లలో పడి నానిన చెక్కముక్కలాగా రాగద్వేషములకు వశులై మునిగి తేలుచూ అనేక జన్మలు వారు గడిపివేస్తున్నారే గాని ‘ఇంతకీ నేనెవ్వరు?’ అనే ప్రశ్నను శోధించటం లేదు. వచ్చి పోతూ ఉండే భావాలలో మాత్రమే కొట్టుమిట్టాడుచున్నారే?

జీవులందరూ జ్ఞాన విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలి సుమా! అజ్ఞానం అత్యంత నీచదశలను పొందింపజేయగలదు. కమ్మరి ఉపయోగించే తిత్తిలో గాలి వెలువడునట్లు జ్ఞానరహితు లగు జీవులలో ప్రాణ వాయువులు ప్రయోజనమేమీ లేకుండానే సంచరిస్తున్నాయి. వారు ప్రాణములు కలిగి ఉండి ఉపయోగం లేనివారే అగుచున్నారు. వారి చలనములన్నీ ప్రయోజనం లేనివే. వ్యర్థమైనవే. వింటి యొక్క నారి శబ్దం చేస్తున్నట్లు అజ్ఞానులగు జీవులు ఏవేవో గర్విత-నీరస-జాతి-ప్రాంత కల్పనలతో కూడిన శబ్దాలు పలుకుతూ ఈ భూమిపై సంచరిస్తున్నారు. అడవిలోని దుష్టఫలములు తిని పిట్టలు పిచ్చి ఎక్కి కేకలు వేసివేసి చివరికి చస్తున్నట్లుగా ఆత్మజ్ఞానము లేని ఫలాభిలాషలను ఆశ్రయించి సంసార జీవులు చివరికి ఉన్మతస్థితులను, మృత్యువు యొక్క రుచులను తెచ్చి పెట్టుకుంటు న్నారు. అజ్ఞాన కార్యక్రమములతో తృప్తి పొంది లోకవ్యవహారములు సలుపుతూ కాలం గడపటం నా ఉద్దేశంలో కాలుచున్న శిలపై చల్లటి చోటు వెతకటం వంటిది. అజ్ఞానులతో కూడి రోజులు దొర్లించటం మోడువారిన చెట్టుక్రిందకి విశ్రాంతికై పరుగులు తీయటం వంటిది. అజ్ఞాన విషయ సమాచార వినోదములతో కాలం వెళ్లబుచ్చటం ఆకాశమును అట్టలతో మోదటం వంటిది. రుచికరమైన పదార్థములను బురదలో ముంచటం వంటిది. అజ్ఞానవిషయాలు సంభాషించటం ఆకాశములోని మేఘములను చూచి కుక్కలవలె మొరగటం వంటిది.

‘అజ్ఞానమాపదాం నిష్ణా’ - అజ్ఞానమే అన్ని ఆపదలకూ పుట్టినిల్లు. దాని వలన కలిగే అనర్థాలకు అంతులేదు.

Page:14

‘సంసారము’ అనబడేది అజ్ఞానము చేతనే కదా… ఉత్పన్నమౌతోంది! సుఖ-దుఃఖాలు, నిష్టురత్వం. వేదన-రోదనలు, ఆవేశకావేశాలు, ఈ శరీరము, దీనిచే ఏర్పడే సంబంధాలు… ఇవన్నీ అజ్ఞాన వృక్షము యొక్క ఫలములే!

అనాత్మ అయినట్టి ఈ శరీరమే తానుగా తలచు మూర్ఖునికి దుఃఖమెన్నటికీ తొలగదు. సత్యమును వదలి అసత్యం వెంట పరుగులుదీస్తూ ’ఈ మాయ నాపట్ల తొలగదేమి?’ - అని కేకలు వేసి ఏం లాభం? అసత్యదర్శనంచే పదే పదే కాలు జారిపడి లేచుచుండటమే సుఖమనుకొనే వారికి నేను సత్యం ఎట్లా తెలియపర్చగలను? తమ చర్మమును చాకుతో కోసుకుంటూ, “మేము కాయనే కోస్తున్నాం… అంతా మాకు తెలుసు" అని పలికే వానికి ఎవ్వరేం బోధించగలరు?

శ్రీరాముడు: నిజమే స్వామీ! అయితే, ఆనందమయమగు ఆత్మయే స్వరూపముగా గల ఈ జీవునకు దుఃఖం ఎక్కడి నుండి వచ్చిపడుతోంది?

శ్రీవసిష్ఠ మహర్షి : చక్కటి నేలపై కొంత కాలానికి పిచ్చిచెట్లు లేచునట్లుగా, సుఖ స్పర్శల నుండి దుఃఖాలు పుట్టుకొస్తున్నాయి. దేహమనే బూరుగు నుండి ‘వాసనలు’ అనే పాములు పడగలెత్తుచున్నాయి. అవి మనస్సను మదగజమును కట్టిపడేస్తున్నాయి. చేనులో కలుపు మొక్కలలాగా అజ్ఞాని (ఆత్మ సమాచారం పరికించనట్టి వాని) హృదయంలో ఆశలు లేస్తున్నాయి. దుష్కృత్యములు నీచ బాటలలో నడిపిస్తూ ఈ జీవుని ‘నరక యాతనలు’ వేచి ఉన్న చోటికి తీసుకుపోతున్నాయి.

అనేక కల్పితానందములు, కాలక్షేపములు మూర్ఖుని సంతోషింపజేయటానికే కాబోలు, ఈ జగత్తుచే విరచించబడుచున్నాయి. అతని ఆసక్తికి అనుగుణంగా సృష్టి కర్త ఇక్కడి వ్యవహారములను మలచుచున్నాడు. ఈ జీవుడిక పరనింద, ఈర్ష్య, రాగము మొదలైన వ్యతిరిక్త, దుర్వాసనల వైపుగానే ఆకర్షితుడగుచున్నాడు. ఇక సరి అయిన సమయం చూచుకొని చింతలన్నీ అతని హృదయంలో ప్రవేశిస్తున్నాయి. జన్మనుండి ఆశ నిరాశలు, వాటి నుండి భావి ఉపాదులు, ఆ ఉపాధుల నుంచి మరల ఆశ నిరాశలు, జీవుని పట్ల కొనసాగుతూనే పోతున్నాయి. అతడు మరలమరల బాల్య - యౌవన వార్ధక్య - మృత్యువులను చర్వితచర్వణంగా పొందుచున్నాడు.

జ్ఞానులు - ఇక జ్ఞానుల వ్యవహారమంతా వేరొక విధంగా ఉంటోంది. అజ్ఞానులకు సుదీర్ఘం గానూ, దాటనలవికానిదిగానూ ఉంటే, జ్ఞానులు తమ స్వరూపమును సాక్షీభూతమగు చైతన్యమాత్రంగా గాంచుచున్నారు. అందుచేత ఈ సంసారతతంగమంతా గోష్పాదప్రాయం (ఆవు డెక్క ఏర్పరిచే గుంటంత) అగుచున్నది. ఇక్కడ కనబడే అన్నపానాది విశేషములలో అతడు తగుల్కొనుట లేదు.

#

అజ్ఞానికి ఈ జగత్తు యొక్క విన్యాసాలేమిటో, వీటి అంతు ఎక్కడో తెలియటం లేదు. పంజరంలో చిక్కుకున్న చిలుకలాగా అతడు వాసనాపరంపరలో చిక్కుకుని ఉంటున్నాడు. అతని చిత్తవృత్తులు బాహ్య వస్తు జాలముల వైపుకే ప్రసరిస్తున్నాయి గాని, అంతర్ముఖం కావటం లేదు. బోయవాడు పక్షులను పట్టుకోవటానికి బియ్యపు గింజలు చల్లునట్లు ఈ ప్రపంచం నిండా ఇంద్రియములకు ప్రియాప్రియములు కలిగించగలిగే అనేక వస్తువులు, విషయాలు, విశేషాలు

Page:15

కల్పించబడ్డాయి. అతడు ఇంద్రియ భోగమత్తుడై ‘ఇళ్లు, వాకిళ్లు, ప్రతిష్ఠలు, బంధువులు, ఆనందములు, అనుభవములు, చెట్లు, పూలు, ఆకాశం, నేల’ మొదలైన వాటికి తాను సంబంధితుడై పోతున్నాడు. అనేక భేదకల్పనలకు లోను అగుచున్నాడు. కల్పనామాత్రమైన కల్పవృక్షం వివిధ చిత్ర విచిత్ర పదార్థాలను కల్పించి అభీష్ట సిద్ధిని భ్రమింపజేస్తుంది చూచావా! ఎన్ని అభీష్టములు ఈడేరితే ఏం ప్రయోజనం? …కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి కదా! ఈ ప్రపంచంలో కూడా పూర్ణానంద కరమగు వస్తువేదీ లభించుటయే లేదు.

ఆహాఁ! ఏమి ఈ మోహము యొక్క మాహాత్మ్యం! కల్పనామాత్రమైన అజ్ఞానవనంలో ‘భోగాభిలాషలు’ అనే పక్షులు నివసిస్తున్నాయి. ‘ఉత్పత్తి’ అనే ఆకులతో, ‘పుణ్యపాపములు’ అనే ఫలాలతో ‘భోగములు’ అనే పూలగుత్తులతో ‘కామ క్రోధములు’ అనే లతలతో ఈ అజ్ఞానవనం విరాజిల్లుతోంది. సూర్యుడు అస్తమించగానే చీకట్లు కమ్ముకుంటున్నట్లు జ్ఞానదృష్టి మరుగున పడగానే సర్వ దోషములు ప్రవేశిస్తున్నాయి. ఓ రామా! అజ్ఞాన వృక్షశాఖలు ‘నానావిధ జగత్తులు’ అనే ఫలములను ప్రసాదిస్తున్నాయి. అవి పైకి మాత్రమే మధురంగా ఉండి లోన మిథ్యాత్వం, భంగురత్వం, ఆద్యంతత్వము కలిగి ఉంటున్నాయి. అట్టి అజ్ఞానవనమును సమూలంగా నశింప జేస్తే గాని ఈ జీవునకు శాంతి లభించదు సుమా!

  1. అజ్ఞానాంధకార విభూతులు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! అజ్ఞానాంధకారం యొక్క విభూతులు ఏమని వర్ణించాలి! హృదయంలో మదం ఉద్భవించగా దృష్టి అధోగతిపాలగుచున్నది. స్త్రీల చిలిపి చూపులచే ఆకర్షితుడై ఈ సంసార జీవుడు క్షణంలో తన దృక్పథములన్నీ అధోగతి పాలు చేసుకొని ఆ చిలిపి చూపులకు ఆహారమగుచున్నాడు. అతడు మన్మథునకు ఆంతరంగికదాసుడై ఉన్మత్త వేషధారుడగుచున్నాడే!

అహో! ప్రజలు కొంచెం దూరంగా ఆలోచించటం లేదే! ఏ దేహములైతే అజ్ఞానమోహాన్ని కలిగించి స్వస్వరూపం పట్ల ఏమరుపు కలిగిస్తున్నవో అట్టి స్త్రీ పురుష శరీరములు కొద్ది సంవత్సరముల తరువాత ఏమి కానున్నాయి? కుక్కలకు, గ్రద్దలకు ఆహారం అగుచున్నాయి. కవులు మాత్రం ఈ స్త్రీ-పురుష శరీరములను చంద్రునితోను, మంచి గంధముతోను, పూలలోని సున్నితమగు పుప్పొడితోను పోలికలు కల్పించి జనులకు భ్రమ కల్పిస్తున్నారు. రక్తమాంస భరితమగు ఈ శరీరభాగములను సువర్ణ కలశములతోనూ, పద్మమాలికలతోను, దొండపండ్లతోనూ ఉత్ప్రేక్షలు కల్పించి కవులు భ్రమను ఇనుమడింపజేస్తున్నారయ్యా! అల్పములగు కణపులతోను, ఎముకలతోను కూర్చబడిన ఈ స్త్రీపురుష శరీరములు ఆయా అలంకారములు, పట్టు వస్త్రములు ధరించి చూపులకు విందొనర్చుచుండగా ఈ అజ్ఞాన జీవులు ‘ఆహా!ఓహో!’ అనుకుంటూ కేరింతలు కొట్టడమా! ఇదంతా భ్రమ, పిచ్చి కాక మరేమిటో చెప్పు?

Page:16

ప్రారంభంలో కొంచెం ఆనందం చూపి, క్రమంగా దుఃఖముల పాలు జేయగల అతిస్వల్ప, తుచ్ఛమైన మత్తు పదార్థములు ఈ జీవునిచే ఊడిగం చేయించుకుంటున్నాయే! ధనము, నారీజనము, తదితర సంపదలు ఇవన్నీ జీవునికి దుఃఖం తొలగించగలుగుతున్నాయా? ఏమి చిత్రమో గాని, ఎన్నెన్ని పొందినా కూడా, ఎప్పటికప్పుడు దుఃఖములు శతాధికమే అగుచున్నాయే! ఒక సుఖానికి ఒక దుఃఖం ఎదురుచూస్తూనే ఉంటోంది. ఈ సుఖదుఃఖాలు ఒకదానికొకటి కారణమగుచూ వస్తూ, పోతున్నాయి… ఈ జీవుడు ఇది గమనించడం? ఇక్కడి ప్రయాసలన్నిటికీ అసలు కారణమేమిటో

వెతకడేం?

కామ్యకర్మలతో అర్థవాద వాక్యములతో మాయారణ్యం పరిఢవిల్లుతోంది. మోహం అవిశ్రాంతంగా నిరంతరంగా అనేక ప్రవృత్తులను ఉత్పత్తి చేసుకుంటూ పోతోంది.

ప్రతి విషయం మొదట సుఖంగా ఉన్నట్లే ఉంటోంది. ఇంతలోనే అది అనేక రాగద్వేషములను కల్పిస్తోంది. చివరికి విషలత యొక్క రసంలాగా శారీరక మానసిక రుగ్మతలకు కారణమగుచున్నది. ఇక అది హృదయమును దుఃఖింపజేస్తోంది. ఎండింపజేస్తోంది. స్వకీయ కల్పిత కార్యక్రమములే ధూళి వలె లేచి వివేక సూర్యుణ్ణి కప్పివేస్తున్నాయి.

ఈ జీవుడు మొండితనంతో ఇంద్రియ విషయములను నమ్ముకొని కూర్చుంటున్నాడు. ఇక కాలయముడు తన నిష్ఠుర కార్యక్రమములతో శ్రమించి ప్రోగుచేసుకున్న సర్వవస్తు జాలములను కడుపారా మ్రింగి త్రేన్చుచున్నాడు. ఈ జీవుడు అందుకు ఎర అగుచూ, ఒక ఉపాధిని వదిలి మరొక ఉపాధిని ఆశ్రయిస్తూ వక్ర గమనములు చేస్తున్నాడే గాని, వివేక దృష్టిని పెంపొందించుకోవటం లేదు. ’ఆత్మ సమాచార శ్రవణం’ అనే చంద్రోదయం కాకుండానే అనేక యౌవన రాత్రులు వ్యర్థంగా గతిస్తున్నాయి. ప్రాపంచిక విషయాలను మరలమరల ఉచ్చరిస్తున్న ఈ నాలుక అలసి అలసి చివరికి ఒకనాటికి శిథిలమైపోతోంది. దుఃఖము, శోకము, దారిద్ర్యములతో కూడిన అనేక పరిస్థితులు ఉవ్వెత్తున ఎగురుచున్నాయి. కట్టుదిట్టము లేని జీవిత ప్రాంగణంలో ‘లోభము’ అనే గుడ్లగూబ ప్రవేశించి యథేచ్ఛగా సంచరిస్తోంది. ‘ముసలితనం’ అనే పిల్లి వచ్చి ‘యౌవనం’ అనే ఎలుకను పట్టుకొని, చెవులు సాగదీసి మరీ చంపుతోంది. పైకి మెరుస్తూ లోన నిస్సారంగా ఉండే అనేక కల్పిత వ్యవహారాలు ఈ జీవుని చుట్టుముట్టి ఉన్నాయి. అనేక ప్రవృత్తములతో కూడిన ఈ జగత్ప్రృహం ఆకాశాన్ని ఆక్రమించుకుని ఉంటోంది.

ఈ విశాల సంసార సముద్రం నిత్యం అనేక శరీరములను చప్పరించి మ్రింగుచున్నది. కృత్రిమమైనట్టి ఈ వినీలాకాశం అనేక సూర్యులను, గ్రహములను ధరించి ఉంటోంది.

ఈ జగత్తు ‘ఆశలు’ అనే త్రాడుచే కట్టబడి ‘వాసనలు’ అనే కమ్ములు గల ఇంద్రియ పంజరంలో నియమించబడి ఉన్నది. జీవులు ఈ జగత్ పంజరంలోకి ప్రవేశించి ఇక్కడ చిక్కుకొని కొన్నాళ్ళకు నశిస్తున్నారు. ఇక్కడి జనులు ఏవేవో ఆరోపిత దృష్టులను ఆశ్రయించి స్వస్వరూపమగు ఆత్మను విస్మరించి ఇక్కడ సంచరిస్తున్నారు. ‘మేము అంతటివాళ్లం. మా జాతి ఇంతటిది’ అని చెప్పుకొని

Page:17

మురుస్తూ ఈ రక్తమాంస నిర్మితమైన దేహ నరక భూములలో చిక్కుకుంటున్నారు. అయ్యో! దేవతా జన్మలు పొందిన జీవులు కూడా స్వర్గమార్గంలో ఎగిరే పక్షులలాగా సంచరిస్తున్నారే గాని, ఆత్మజ్ఞానం విషయమై వివేకులవటం లేదే? ప్రవృత్తిచే కామ్యకర్మలవైపు ఆకర్షితులై ఈ జీవులలో అనేకులు ఊర్ధ్వ, అధోలోకాలలో పచార్లు చేస్తున్నారే గాని, ఆత్మజ్ఞానులుగా తమను తాము తీర్చిదిద్దుకోవటం లేదు.

ఈ భవసాగరంలో ‘సృష్టి’ అనే క్షుద్ర చేప ‘కాలము’ అనే ముసలి కొంగకు ఆహారం అవుతోంది. కామం అనే కుమ్మరి క్షణభంగురమైన అసంఖ్యాక ‘శరీరాలు’ అనే కుండలను తయారు చేసి, ఈ సృష్టి చక్రమును త్రిప్పుచున్నాడు. కల్ప ప్రారంభం నుండి అనేక యుగములు గడచి పోయాయి. అనేక జగత్తులు పుట్టాయి. నశించాయి. వర్తమాన జగత్తులో ఒక మూల ఒదిగి ఉన్న ఈ జీవుడు అనేక ఆశనిరాశల మధ్య ఆసక్తి, అనాసక్తుల మధ్య చిక్కుకుని సుఖ దుఃఖాలు నిర్వచించు కుంటూ, కొట్టుమిట్టాడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా ఏవేవో విపరిణామములన్నీ పొందుతున్నాడు. యుగములు, మన్వంతరములు గడచిపోతున్నాయి. ఇంత జరుగుచున్నా మూర్ఖులబుద్ధి ఏదీ గుర్తించటం లేదు. ఏం ఆశ్చర్యం!

ఆహా! ఈ కనబడే శరీరాలన్నీ ‘వాసన’ చే ప్రేరితమై సంచరిస్తున్నాయి కదా! శత్రువులను చీల్చిచండాడి, ముల్లోకములూ ఏలుతున్న ఇంద్రుడంతటి వాడు కూడా వాసనల చేతనే ప్రేరేపించబడి, చరిస్తున్నాడే! వాసనల మూలం ఆసక్తియే!

ఆసక్తియే సృష్టికి మూలం - ఏదో నియతి ఈ ‘సృష్టులు’ అనే ధూళి కణములను లేవదీసి కాల సర్పం ముంగిట పడవేయుచున్నది. ఈ కనబడే వస్తుజాలమంతా ‘వినాశనము’ అనే బడబాగ్నిలో ప్రవేశించి నశించటానికే ఉద్యుక్తమౌతోంది. ఆకస్మికములు, విచిత్రములు, స్వభావసిద్ధములు అగు ఈ వస్తుజాలములను చూచి జీవుడు నమ్మిక కలిగి ఉండటమేమిటి? వీటిలో ఏ ఒక్కదానికైనా నిశ్చలమైన ఉనికి ఉన్నదా? లేదే! సముద్ర తరంగాలు ఎంత నిశ్చలమో…. ఈ ద్రవ్య శక్తులు అంతే నిశ్చలం. ‘కాలం’ అనే ఉన్మత్తసింహం ’జగత్తులు’అనే గున్న ఏనుగులను వేటాడి హింసించి, భక్షించటం మనం స్పష్టంగా చూస్తున్నాం కదా!

ఈ జగత్తులన్నీ వాసనాఫలములను అన్వేషిస్తూ జన్మించి, కొద్దిసేపు కనిపించి మరల ఎటకో మటుమాయమౌతున్నాయి.

‘విధి’ అనే ఒకానొక చిత్రకారుడు ‘చిత్తము’ అనే పటము మీద ‘పంచేంద్రియములను రంగులతో’ సంసార చిత్రములను సృష్టిస్తున్నాడు.

కాలము యొక్క ప్రవాహం ఎంతటి చిత్రమైనది! క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు - - రూపంలో ఎంతవేగంగా ముందుకు సాగిపోతోంది! అది అసత్తు నుండే తన ప్రవాహం ప్రారంభించింది. భావాభావసమన్వితులై, రాగద్వేషభరితులై ఈ జీవులు కాలం వెంట దొర్లించబడుచున్నారు. బ్రహ్మదేవుని నుండి క్రిమికీటకముల వరకు గల

Page:18

జీవులన్నీ తమ యొక్క సుకృత, దుష్కృతములకు సంబంధించిన చింతలచే పీడింపబడుచున్నారు. అదృశ్యంగా ఎక్కడో ఉండి కాల స్వరూపుడు స్థావరజంగమము లన్నిటినీ క్షణభంగురంగా చేసి వేస్తున్నాడు. స్థావరములు ఆ కాలుని కన్ను కాస్త కప్పి తమ శరీరములను నేలలో దాచి శీత వాత తాపములను సహిస్తూ జగత్తుకు స్థావర ఫలములను ఇస్తున్నాయి. ఇక ఈ జంగమ జీవులు ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లే ఈ భూమిపై అటూ ఇటూ సంచరిస్తున్నారు. త్రిలోకముల దృశ్యపరంపరలు సృష్టించే అజ్ఞానాంధకారంలో ప్రవేశించి ఘంఘమధ్వనులు చేస్తున్నారు. ‘కాలుడు’ అనే భిక్షుకుడు బ్రహ్మాండము అనే భిక్షపాత్రలో అనేక జీవులను పొంది భక్షించి ఆకలితీరక మరల భిక్షకై కేకలు వేస్తూనే ఉన్నాడు. ఈ త్రిలోకములు, ఈ సూర్య చంద్రులు, త్రిమూర్తులు, ఈ భూ పర్వత ప్రాంతాలు, ఈ స్థూలసూక్ష్మకారణ దేహములు, ఆ కాలుని శరీర విభాగములే కాబోలు. బ్రహ్మలు, బ్రహ్మాండములు క్షణికములై కాలుని ముందు ప్రభవించి చటుక్కున మటుమాయ మవుతున్నాయి.

కల్పములు నిమిష కాలంలో గడచిపోతున్నాయి. ఒక్క నిమిషంలో అనేక కల్పములు ఏర్పడు తున్నాయి. త్రిమూర్తులంతటి వారు ఒక్క నిమిషంలో అంతర్హితులగుచున్నారు. విషయరహితం, వస్తురహితం అయిన బ్రహ్మపదమున సంభవం కానిదేమున్నది.

ఓ రామచంద్రా! జగత్ సంబంధములగు నానావిధ కల్పనలన్నీ అజ్ఞానము వలననే కలుగు చున్నాయి. ఈ బాల్య యౌవన వార్ధక్యాలు, ఈ సంపద, లేక ఆపద, ఉపతాపములు - - ఇవన్నీ అజ్ఞానాంధకారము యొక్క విభూతులు మాత్రమే.

  1. అవిద్యా సంభ్రమం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! ‘చిత్’ అనే పర్వతసమీపాన ఏర్పడి ఉన్న ‘సంసారము’ అనే అరణ్యంలో ’అవిద్య’ అనే లత ఎట్లా పెంపొందుచున్నదో చెబుతాను విను.

’బ్రహ్మాండం, త్రిలోకాలు, జీవులు, జననమరణాలు, సుఖదుఃఖాలు, జ్ఞానాజ్ఞానాలు’ అనే విశేషములతో ఈ అవిద్య ఏర్పడి ఉంటోంది. ధ్యాసచే ఇంద్రియ ద్వారాలతో కూడిన ఈ ఉపాధులు ఏర్పడుచున్నాయి. ఉపాధిని ఉపయోగించుటచే సుఖబుద్ధి కలుగుతోంది. అట్టి సుఖబుద్ధి ఆసక్తికి కారణమగుచూ అవిద్యను ఉదయింపజేస్తోంది. యజ్ఞము, దానము మొదలైన సత్రియలు సుఖమును ఫలింపజేసి, మధురఫలాలను ఇస్తున్నాయి. దొంగతనం, హింస మొదలైన దుష్క్రియలు దుఃఖాలు అనే చేదుఫలాల నిస్తున్నాయి. దారిద్ర్యము, అవమానము, మొదలైన అనేక దుఃఖకర విషయాలచే ఈ జీవులు అనేక బాధలకు లోను అగుచున్నారు.

శ్రీరాముడు : హే మహర్షీ! అవిద్య ఎట్లా ఉదయిస్తోంది?

శ్రీవసిష్ఠ మహర్షి : ఏదైతే లేనేలేదో…. అద్దానిని ‘ఉన్నది’….అని సంకల్పించుటచేతనే అవిద్య ఉదయిస్తోంది. ఆ అవిద్య సృష్టిని కల్పిస్తోంది. భావనల యొక్క దృఢత్వం చేత పదార్థములకు

Page:19

సంబంధించిన సుఖదుఃఖములు రూపం పొందుతున్నాయి. అజ్ఞానం చేత అవిద్య వృద్ధిచెందుతోంది. అజ్ఞానఫలములను ప్రసాదిస్తోంది. అయితే ’ప్రత్యక్ తత్త్వవిమర్శ’కు సంబంధించిన జ్ఞానం వలన ఉన్నతమగు భూమికలను అధిరోహింపజేయగల బుద్ధి ఉదయిస్తోంది. ఆ బుద్ధి, బుద్ధికే సాక్షియగు సప్తమ భూమికను అధిరోహించటానికి దోహదపడుతోంది. ఏది తెలుసుకోవటానికి బుద్ధి ప్రయత్నిస్తోందో ఆ తెలియబడేదే తనగుచున్నది. (బ్రహ్మైవ, స బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి - అను వేదవాక్యార్థం ఫలిస్తోంది).

కల్పనలతోనూ, వాసనలతోనూ, తీవ్రమగు దృశ్య సంబంధములతోనూ, రాగములతోనూ అవిద్య ప్రవృద్ధమౌతోంది. అవిద్య కొన్ని కార్యములకు, ఆ కార్యములు మరింత అవిద్యకు కారణమగు చున్నాయి. హృదయంలో విద్యను అవిద్య కప్పివేస్తోంది. విషయవాసనలే దాని ఆలంబనం. ఈ జీవుడు అవిద్యచే ఆవరించబడినవాడై పశువులు, ఇళ్లు, పుత్రులు, పౌత్రులు మొదలైనవాటి సమాగమం చేత కాలం గడుపుతున్నాడు. ఋతువులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈలోగా ముసలితనం వచ్చి మీద పడుతోంది. ఏమీ తెలియకుండానే ముసలితనం వచ్చిపడిన తరువాత ఇక్కడ ఇళ్లు, వాకిళ్లు, పుత్రులు, పౌత్రులు అతనిని రక్షిస్తాయా? ఎందుకు ఇంతకాలం జీవించినట్లు? ఏమి పొందినట్లు? అజ్ఞానంలో మునిగి తేలుతూ జీవితమంతా వెచ్చించినందుకు ఫలితంగా అతని ఉత్తర గతులు నికృష్టంగానే ఉండబోతున్నాయి. విచారణ లేకపోవటం చేత ముసలితనం దుర్భరమే అగుచున్నది. చేతిలోని పండు నేలజారినట్లు ఒకనాడు ఈ దేహం నేలకూలుతోంది. ఇంద్రియములు ఉన్నన్నాళ్లు అజ్ఞాన దిశలకే పరుగులు తీసిన ఆ జీవుడు కళ్ళెదురుగా ఇంద్రియములు బలహీనపడటం అనుభవిస్తున్నాడు. అవి జీవించిన కాలమునకు సంబంధించిన, విషయాస్వాదన సామర్థ్యము కోల్పోగానే ఎంతటి నిస్సారస్థితి అనుభవిస్తున్నాడో… చెప్పనలవికాదు.

ఈ జగత్తంతా అవిద్య చేతనే ప్రవర్తిస్తోంది. సూర్యచంద్రనక్షత్ర గ్రహమండలాలు అవిద్య చేతనే నిర్విరామంగా, ఆకాశంలో శ్రమించి సంచరిస్తున్నాయి. అవిద్య చేతనే మహత్తరమగు ఆత్మ స్వరూపుడగు ఈ జీవుని అల్ప వస్తువులు కూడా ఆకర్షించి విచలితుణ్ణి చేస్తున్నాయి. ఇంద్రియములు, తృష్ణ, సంకల్పములు - ఇవన్నీ అవిద్య చేతనే తైతక్కలాడుచున్నాయి. అవిద్య యొక్క ఊడలు సప్త సముద్రములలోనికి, అఖాతములలోనికి, పాతాళ, దేవలోకాలకు విస్తరించి ఉన్నాయి. రాగ ప్రవృత్తిచే కామ్యకర్మలకు ఉపక్రమిస్తున్న జనులు తమ చుట్టుప్రక్కల గల జనులను కూడా తమవలె అవిద్య కర్మలవైపుగా ప్రోత్సాహపరచుచూ తద్వారా అవిద్యను పెంచి పోషిస్తున్నారు. కుకర్మలతో కృత్రిమ ఉపాయములతో, స్వర్గసుఖ నిర్వచనములతో మూర్ఖజనులచే అవిద్య పరిపోషించబడుతోంది.

అయితే ఇదే జగత్తు వివేకులకు అవిద్యా నిర్మూలనమునకు ఉపయోగిస్తోంది. ఆయా శాస్త్రోచిత విధి విధానాలన్నీ నివృత్తి సంపద పెంపొందించుటకు ఉపకరిస్తున్నాయి. వారికిక్కడ మోక్ష సంపద, బ్రహ్మానందవర్షము లభిస్తున్నాయి.

Page:20

అందుచేత తప్పు జగత్తులో లేదు. జీవుడు జగత్తును ఉపయోగించే, సమన్వయించుకునే విధానంలోనే జ్ఞాన అజ్ఞాన ప్రవృద్ధములు దాగి ఉన్నాయి.

ఈ జగత్తు అనేక సాంసారిక విషయములకు ఆలవాలమై ఉండవచ్చుగాక! అనేక అల్ప కార్యక్రమములు, ద్వైతవ్యవహారములు తారసపడుగాక! ఇట్టి అవివేక జగత్తులో ఉంటూ వివేకులు ఇక్కడ భిన్నత్వం నుండి సమరసము, అచ్యుతము అగు ఏకత్వానుభూతి సాధిస్తున్నారు. విషంలోంచి అమృతం సాధిస్తున్నారు. ఇదంతా క్షణికం, మార్పు చేర్పుల మయం కావచ్చు గాక. ఇది జ్ఞానవిచారణకు ఉపయోగించగలదు. అయితే వివేకివై జీవించటం నీవు నేర్చుకోవాలి. జ్ఞాన సముపార్జన, నిర్మల హృదయసముపార్జనకై నీ దృష్టిని సారించాలి. వివేచనాపూర్వకంగా ప్రయత్నించే వారికి ఈ జగత్తు ఉద్ధారణోపాయములు ప్రసాదించగల సామర్థ్యం కలిగియున్నదని నీవు గ్రహించు.

ప్రపంచం నిండా అవిద్య ఉండుగాక. నీ యందు అద్దానిని ప్రవేశించనీయకు. పడవ నీళ్లలో ఉన్నా ఆ నీరు పడవలోకి ప్రవేశించగలుగుతుందా? సమగ్ర సూక్ష్మ అవగాహన పెంపొందించుకునే వివేకులను చూసి ఇక్కడి అవిద్య దాసో హమనగలదు. అవివేకులకు అనేకత్వముతో కూడిన అనుభవం ప్రసాదిస్తూనే వివేకులకు అభేదమగు అనుభవం ఈ జగత్తు ప్రసాదించగలదు.

వత్సా! రామా! ఒక గడ్డి పరక నుండి హరిహరాదుల వరకు స్ఫురిస్తున్న ఈ దృశ్య ప్రపంచ మంతా అవిద్యా మాత్రమే సుమా! అట్టి ఈ అవిద్యను నశింపజేయవలసి ఉన్నది. దీనిని సమూలంగా దాటివేస్తే ఆత్మానుభవం అనే లాభం కలుగుతుంది. అట్లు దాటివేయటానికి నీవు అనుక్షణం సిద్ధంగా ఉండు.

  1. కార్య అవిద్య - - కారణ అవిద్య

అప్పుడు వసిష్ఠుని వాక్యములు వింటున్న శ్రీరామచంద్రుని అందమైన రెండు కళ్లూ ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.

శ్రీరాముడు: హే మహానుభావా! అవిద్య గురించి, వివేకము గురించి, జ్ఞానసముపార్జన గురించి, ఈ జగత్తు జ్ఞానసముపార్జన నిమిత్తం వివేకులకు సాధనంగా అవటం గురించి మీరు చెప్పే విషయాలన్నీ శిరోధార్యాలే. ఒప్పుకోవలసిందే. అవన్నీ ప్రత్యక్ష సత్యాలుగా నాకు అవగతమౌతున్నాయి.

అయితే మీరు చివరిగా చెప్పిన విషయం నాకు కొంచెం తికమకగా ఉంది. ‘శుద్ధ సత్త్వ స్వరూపులగు హరిహరాదులు కూడా అవిద్యలోని విభాగమే’ అనే వాక్యం యాదృచ్ఛికంగా చెప్పారా? లేక, అదే మీ ఉద్దేశమా? ఎందుకంటే ఆ వాక్యం నాకు విభ్రాంతిని కలిగిస్తోంది. ఈ విషయం నాకు చక్కగా వివరించ ప్రార్థన.

అప్పుడు వసిష్ఠ మహర్షి రాముని ఉద్వేగం చూచి పకపకా నవ్వారు.

Page:21

శ్రీవసిష్ఠ మహర్షి : రామా! నీ ప్రశ్న నాకు సంతోషం కలుగజేసిందయ్యా! చెబుతాను, శ్రద్ధగా విను.

మనందరి స్వస్వరూపమైనట్టి ఆ సచ్చిదానంద వస్తువు నిజానికి సంవిత్ (knower), సంవేద్యము (That being known), సంవేదము (The act of knowing)- అనే మూడింటిచే స్పర్శించబడేది కాదు. అది శాంతం, సర్వాత్మకం, అనుభవైకవేద్యం. అది చెప్పటానికి గాని, చూడటానికి గాని అలవి కానిది.

సృష్టికి పూర్వం అది అట్లే ఉన్నది. అయితే ఆకారరహితమగు జలంలో ఆకార సహితమగు తరంగాలు ఏర్పడుచున్నాయి కదా! అట్లాగే సృష్టికాలంలో అది నామరూప సహితమై ఒప్పారుచున్నది. ‘బ్రహ్మము’ అనే సంజ్ఞతో పిలువబడుచున్న అట్టి వస్తువు నుండి ‘జగత్తులు’ అనబడే కళలు లేచి వేరు వేరు స్వరూప-స్వభావాలు ప్రదర్శిస్తున్నాయి. అట్టి ప్రదర్శన చేతనే గుణములు అనే భేదములకు ఆపాదయోగ్యమగుచున్నది. సూర్యుని తేజము ఒకచోట ముదురు ఎండగా, మరొక చోట లేత ఎండగా, ఇంకొక చోట నీడగా ఏర్పడుచున్నట్లు ఈ స్థూల - సూక్ష్మ- మధ్యమాలుగా ఆ సచ్చిదానంద వస్తువే కల్పన స్వీకరిస్తోంది. ప్రథమంగా మనస్సు, మధ్య స్థితిలో హిరణ్యగర్భుడు, స్థూల స్థితిలో ఈ విరాట్గా అగుచున్నది ఆ బ్రహ్మమే.

అవిద్యాం ప్రకృతిం విద్ధి గుణత్రితయధర్మిణీమ్ |

ఏషైవ సంస్కృతిర్జన్తోరస్యాః పారం పరం పదమ్ ॥ || (శ్లో॥ 6, సర్గ 9)

ఇట్టి గుణత్రయములతో కూడుకునియున్న ప్రకృతియే అవిద్య. అదియే సంసారం. అట్టి త్రిగుణములకు ఆవల పరమపదము వెలయుచున్నది. కార్య కారణ విద్యల అసాధారణత్వమును అనుసరించి త్రిగుణములు త్రైవిధ్యమై (3x3=9) రకములుగా వెలయుచున్నది.

1) తమోతమము >స్థావరము (రాయి-రప్ప వగైరా)

2) తమోరజము

3) తమోసత్వము

4) రజోతమము

5) రజోరజము

6) రజోసత్వము

7) సత్వతమము

8) సత్వరజము

9) సత్వసత్వము > (త్రిమూర్తులు)

అవిద్యను అనుసరించి ఈ దృశ్యప్రపంచమంతా పై తొమ్మిది మిశ్రమములను ఆశ్రయించి కనబడుతోంది. దైవీసత్వములో పుట్టిన వారి అవిద్య ప్రాకృత గుణరహితం (Sans worldly qualities) అయి ఉంటుంది. అట్టి దైవీసాత్వికులై హరిహరాదులు నిర్మలపదమున వెలయుచున్నారు. సాత్వికమైన ప్రకృతి యొక్క అంశను ఆశ్రయించి ఎవరైతే సాత్విక స్వరూపులగు హరిహరాదులను ఆశ్రయిస్తున్నారో, వారు క్రమేపీ వారి యొక్క శ్రద్ధ, ప్రయత్నముల బలిమిచే శుద్ధ సాత్వికులు అవుతారు.

Page:22

సత్యాంశమునకు చెందిన శివాది దేవతలు ముక్త పురుషులు. ఈ ప్రపంచమున్నంత వరకూ వారు వెలయుచూ ఉంటారు. నీ దృష్టిలో ఈ ప్రపంచమే లేనప్పుడు వారలు కూడా ఉండరు.

ఈ విధంగా శివకేశవాది దేవతలు అవిద్యలోని విభాగమే అయినప్పటికీ వారిని ఆరాధించటం చేత కార్య-అవిద్య నశించగలదు. కారణ అవిద్య శేషిస్తుంది. స్వస్వరూప జ్ఞానముచే ఆ కారణ అవిద్య కూడా తొలగి అది విద్యకు ఆధారమగుచున్నది. శివకేశవాది దేవతలను ఆరాధ్యంగా గ్రహించి చేసే ఆరాధన ఆ జీవునకు దేహభావాతీతుడగుటకు, శుద్ధ బ్రహ్మస్వభావుడగుటకు ఉపకరిస్తోంది. శ్రీరాముడు : ఈ ప్రపంచం ఎక్కడి నుండి వస్తోంది? ఎప్పుడు లేకుండా పోతోంది.

శ్రీవసిష్ఠ మహర్షి : విత్తులోంచి చెట్టు, మరల చెట్టులోంచి విత్తు, విత్తులోంచి చెట్టు, మరల చెట్టు లోంచి విత్తు ఉత్పన్నమగుచున్నట్లు… కార్యం నుండి కారణం, కారణంలోంచి కార్యం ఉత్పత్తి అవుతున్నాయి. కార్య-కారణ సంబంధమే ‘ప్రపంచం’ అని వ్యవహరించ బడుతోంది. అట్టి కార్యకారణముల సంబంధమే అవిద్య. కార్య కారణములకు అంతర్గతంగా శుద్ధ సత్వస్వభావమైన విద్య పరివేష్ఠితమై ఉన్నది. కనుకనే విద్యలోంచి అవిద్య ప్రకటితమౌతోంది. అనగా ఈ ప్రపంచం అనే అవిద్య శుద్ధమగు విద్యలోంచి ఉత్పన్నమై మరల ఒకప్పటికి విద్య యందు విలీనమైపోతోంది. శ్రీరాముడు : సాత్వికము, పూర్ణము అగు విద్య నుండి తద్విరుద్ధ స్వభావము, స్పర్ధయుక్తము, అపూర్ణము అగు అవిద్య ఎట్లా ప్రభవిస్తోంది?

శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ విద్య-అవిద్యల భేదం జలము-తరంగములకు ఉన్న భేదంలాగా కల్పిత మాత్రమేనని గ్రహించు. సత్యము, నిత్యము అయిన దానిని ఆశ్రయించి ప్రశాంత మానసుడవై ఉండటమే విద్య. అనిత్యములైన వాటిని అనాలోచితంగా ఆశ్రయిస్తూ ఉంటే అవిద్య అంతకంతకు వృద్ధి అవుతోంది. నిత్యసాత్వికములకు ప్రతీకగా శివకేశవాది నామరూపములను సాధన ద్రవ్యంగా గ్రహించుటచే ఈ జీవుడు విద్య వైపుగా పయనిస్తున్నాడు.

శ్రీరాముడు : విద్య-అవిద్యలు ఒకదానికొకటి వ్యతిరిక్తమైనవి కావా?

శ్రీవసిష్ఠ మహర్షి : ద్విత్వభావనయే అవిద్య కదా! పరమార్థమగు అద్వైత భావనచే భేదభావన తొలగుతుంది. జల-తరంగములకు భేదం లేనట్లే విద్య-అవిద్యలకు భేదం లేదు. భేదమే లేదు కాబట్టే అవిద్యలోని ఒకానొక విభాగము విద్యను ప్రసాదించగలుగుతోంది.

శ్రీ రామచంద్రా! ఈ విద్య-అవిద్యలను అతిక్రమించినప్పుడు ఏది మిగిలి ఉంటోందో… అది అన్ని సమయాలలోను ఏర్పడియే ఉన్నది. అయ్యది జ్ఞానాజ్ఞానాలకు అతీతం. అది అనుభవైకవేద్యము మాత్రమే. అక్కడ అన్ని శబ్దములూ నిశ్శబ్దమౌతాయి. అది వాద ప్రతివాదముల చేతనూ, నామరూపాల చేతనూ, శబ్ధార్థాల చేతనూ అందించబడగలిగేది కాదు. అయితే వాద ప్రతివాదాలు, నామరూపాలు, శబ్దార్థాలు సాధన రూపంలో ఉపకరిస్తున్నాయి. అవన్నీ అనుభవజ్ఞానం యొక్క సమక్షంలో సాధ్యం యొక్క సంప్రాప్తి కాగానే లౌకికవ్యవహార సాధనాలలాగానే ప్రక్కకు తొలగుతాయి. సాధ్యం (లేక) జ్ఞేయమునకు ప్రతిరూపమగు చిహ్నం గాని, సంకేతం గాని, శబ్దం గాని లేదని అనుకున్నాం కదా!

Page:23

అదియే నా యొక్క నీ యొక్క సత్యస్వరూపం.

నాయనా! ఈ జ్ఞానజ్ఞేయములు, విద్యావిద్యలు ‘లేవు’ అనియే గ్రహించు. వివేకముతో సద్వినియోగపరచుకో. చివరికి సర్వ కల్పనలు దాటివేయి. అప్పుడు శేషించే దానిలో ఈ క్షణమందే ఎప్పటికీ సుస్థిరుడవై ఉండు. వాస్తవానికి ఇక్కడ ఏదీ లేదు. ఉన్నట్లు కనబడుచున్నదంతా చిద్వస్తువును ఆశ్రయించే ఉన్నది. ఆ చిద్వస్తువు సర్వ ఉపాధులలోనూ సమంగా ఏర్పడి ఉన్నది.

అయ్యది సామాన్య వస్తువువలె తెలియబడేది కాదు. అయితే, దాని అభాస(Reflection) వల్లే వస్తువులన్నీ తెలియబడుచున్నాయి. అందుచేత అవిద్య కూడా సత్ అనియే పిలువబడుతోంది. సత్ వాచకమైన అవిద్య విద్య వలన తొలగిపోతోంది. కాబట్టి, అట్లా తొలగుచున్న దానిని మిథ్య అంటున్నాం.

అందుచేత రామా! నీయందు విద్య - అవిద్యలలో అవిద్య విభాగకల్పన తొలగాలి. అందుకు ఉపకరించే అవిద్యాంశ నాశ్రయించటమే ఉపాయం. అవిద్యా సంక్షయం చేత విద్యావిభాగం కూడా తొలుగుతుంది. అప్పుడు విద్యా ఫలాభియుక్తమగు ఉపాధిశూన్య, అవ్యాప్త పూర్ణానందత్వం శోభిల్లు తుంది. అట్లు శేషించే విషయరహిత స్థితిచే పరమార్థం దర్శనమౌతుంది. సర్వాత్మక సంబంధితమైన తత్త్వదర్శనానంతరం ఇక మిగిలినదీ, పొందవలసినదీ ఏమీ ఉండదు.

ఆ జ్ఞానాజ్ఞాన అతీత స్థితి ఆకాశము కంటే ఉన్నతము, శూన్యము అయి ఉన్నది. అయితే, అది చిదాత్మకమే గాని శూన్యం కాదు. అది ఉపాధిపరిమితమని అనుకోకూడదు. చిదానందము ఉపాధి వ్యవహారములన్నిటినీ అతిక్రమించినదై ఉన్నది.

పాలలోంచి నేయిలాగా, సూర్యకాంత మరియందు అగ్నిలాగా, అగ్ని నుండి విస్ఫులింగముల లాగా, ఆ ఆత్మచైతన్యము నుండి ఈ దేశ కాల నిమిత్తములు వెలువడుతున్నాయి. “సముద్రం నుండి అలలు వేరా? మణినుండి శుభ్రకాంతులు వేరుకాదు కదా? అట్టి సాక్షీమాత్ర చైతన్యం నుండి ఈ చరాచరజగత్తు కూడా ఏదో వేరైనది కాదు”…. అని ప్రవచించబడుతోంది.

లోపలా, వెలుపలా బ్రహ్మము కాక వేరొక వస్తువే లేదు. వస్తువుల కదలిక ఆకాశమునకు ఆపాదించబడునట్లు, గుణరహితమగు ఆ చిద్వస్తువునకు గుణములు కల్పించబడుచున్నాయి. శివ కేశవాది తత్త్వములకు గుణకల్పన చేసి ఆరాధన కొరకై ఉపయోగించబడుచున్నాయి. బ్రహ్మము యొక్క సామీప్యతచే ఈ దేహములు స్పందిస్తున్నాయి. నీటిలోని నురుగు మొదలైనవి నీటి కంటే వేరు కానట్లు ఈ దృశ్యమంతా బ్రహ్మము యొక్క వికల్పమే కాబట్టి, బ్రహ్మము కంటే వేరు కాదు. సర్వేశ్వరుడు సాధకుల భక్తి సౌలభ్యము కొరకై ప్రతీకలుగా ప్రసాదిస్తున్నట్లు గ్రహించబడుగాక!

ఆకాశము కంటే సూక్ష్మము, అమూర్తము, రూపశూన్యము అగు ఆ చిద్వస్తువునందు వాస్తవానికి దానికన్యమైనదేదీ ఏనాడూ ఉండియుండ లేదు. ఇక శివకేశవు లంటావా? ఇదంతా కూడా ఉండబోదు.

Page:24

  1. అవిచారణమాంద్యము - చికిత్స

శ్రీవసిష్ఠ మహర్షి : అందుచేత రామా! నీకు కనిపిస్తున్న ఈ స్థావరజంగమ జగత్తు, ఇందు సంచరిస్తున్న ఈ శరీరధారులు, ఈ సర్వమూ వాస్తవానికి బ్రహ్మము కంటే వేరు కాదని గ్రహించు. అట్టి బ్రహ్మమునకు వాస్తవానికి పుట్టటం, పోవటం అనే జాడ్యమే లేదు. దానికి జీవకల్పన లేదు. కనుక ‘నేను జీవుడను’ అను భావమే వ్యర్థము. ఇట్టి భావము వలన ఈ జీవుడు పొందగలిగేదేమిటో చెప్పు?… ‘నేను బ్రహ్మమునే’ అని ఎందుకు తలచరాదు?

ఈ జీవుడు మొట్టమొదట దేహముతో సంబంధం కల్పించుకుంటున్నాడు. క్రమంగా బాహ్య భోగాభిలాష అభివృద్ధి చేసుకుంటున్నాడు. ‘నేనెవరు? ఈ దృశ్యమేమిటి? దేనితో నాకు ఏ సంబంధం ఉన్నది? నేను దేనికి కర్తను? దేనికి భోక్తను?’ అని సద్విమర్శకు ఉపక్రమించకుండానే దేహమున్నంత వరకు కాలం గడిపివేస్తున్నాడు. త్రాడు నందు పాము యొక్క భావనను కల్పించుకొని చూస్తున్నట్లు ఈ వింత వస్తుజాలముల మధ్య, సంఘటనల మధ్య రాత్రింబవళ్లు వెళ్లబుచ్చుచున్నాడు.

వివేక దృష్టితో పరిశీలించినప్పుడే భ్రాంతి తొలగుతుంది. తెలియబడినప్పుడు సర్వమూ ఆత్మయే అగుచున్నది. జ్ఞానము యొక్క పరాకాష్ఠ అదే!

స్వస్వరూప చైతన్యమే స్వసత్తారోపితమైన మలినబీజమును ఆశ్రయించి అవిద్యగా రూపం పొందుతోంది. అవిద్యను దాటి పోయినప్పుడు సర్వ ఉపాధులకూ అతీతమైన ఆత్మతత్త్వం యొక్క ఉనికి ఎరుగబడుతోంది. చిత్తము యొక్క తాదాత్మ్యమే జగత్తు యొక్క రూపం. ఒకచోట ఇల్లు ఉన్నదనుకో. ఆ స్థలాకాశమును ఇల్లు ఆరోపించి చూస్తాం కదా! చిత్తమున్న చోటనే భ్రాంతిమయ జగత్తు ఉంటోంది. చిత్తము నశిస్తే భ్రాంతి తొలగుతుంది. రథంలో ప్రయాణించేవాడు పరిసరాలు పరుగులు తీస్తున్నట్లు భ్రమించుచున్నట్లు, చిత్తం తాను కదలుచూ ఆత్మకు కల్పనలు కల్పించి వ్యాకుల పడుతోంది. పట్టుపురుగు లాగా చిత్తము తనలోంచి స్రవించే వస్తుసంబంధ అభ్యాసమును వస్తువులలోంచి లభిస్తున్నట్లుగా భ్రమించి బంధమును అనుభవిస్తోంది. వాసనాతంతువులచే పరిమితమును ఆచ్ఛాదించుకొని తన అపరిమితత్వమును ఏమరుచుచున్నది. అంతర్చాలకత్వంను (Inner Childishness) అభవించుచూ ఆ విషయం తానే ఎరుగజాలకున్నది.

శ్రీరాముడు: స్వామీ! ఇక్కడ గల స్థావరములు "ఘనీభవించిన మూర్ఖత్వమా…?” అన్నట్లుగా పడి ఉన్నాయి. అవివేకము యొక్క పరమావధిని ధరించి వాటియందు చైతన్యము మూగగా ఉన్నది. కదా! ఆత్మ చైతన్యం దృష్ట్యా వాటిని ఎట్లా అన్వయించుకోవాలి?

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ స్థావరములలోని చైతన్యమును - మత్తుగా త్రాగి రహదారి ప్రక్కన గాఢ నిద్ర అనుభవిస్తూ పడి ఉన్న బాటసారిలోని జీవత్వపు ‘ఎరుక స్థితితో’ - పోల్చవచ్చు. అవి నిద్రా పరవశుని వలె సుఖదుఃఖములను గ్రహించు యోగ్యతను కోల్పోయి ఉన్నాయి. ‘ముందు వెనుకల గురించి చింతించుట’ అనే మననశక్తి కూడా వాటియందు లేదు. ముగ్ధ నిర్విషయ రూపము

Page:25

ఆశ్రయించి వందల వేల సంవత్సరాలు గడుపుతున్నాయి. అయితే దేహియగు ఈ జీవుడు కూడా జీవించి ఉన్న కాలంలో మూడవవంతు అట్టి ముగ్ధ - మౌన - జడ నిష్ప్రపంచక - నిర్విషయ రూపమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా!

అట్టి స్థావర జన్మలు ఆత్మజ్ఞానముచే లభించే సాత్వికోన్నత స్థితికి బహుదూరంగా ఉన్నాయని చెప్పబడుతోంది. అంతర్భావములు నిద్రాణమై ఉండి, ఆ భావములకు ప్రతిస్పందనము నిర్వహించ లేని స్థితిలో ఉండుటచే ఆ స్థావర స్థితి అత్యంత దుఃఖకరమగు స్థితి. కర్మేంద్రియిలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కూడా జడ - శూన్య స్థితిలో ఉండటం చేత అవి సత్తామాత్రములై మూగ - జడ స్థితిని అనుభవిస్తున్నాయి.

శ్రీరాముడు : వేదవేద్యులగు మహర్షీ! ఒక యోగి మనస్సును నశింపచేసి జ్ఞానకర్మేంద్రియాలను అధిగమించిన వాడై చైతన్యమాత్రుడై ఉండుటయే సర్వోత్కృష్టమగు మోక్షము యొక్క స్వరూపమని అంటారు కదా! మరి, స్థావరములలో నిర్విషయ - మనోరహిత సత్తకు, జ్ఞాని యొక్క మనోరహిత స్థితికి అత్యంత సుదూరమైన ‘తేడా’ ఉన్నదని అంటున్నారే? స్థావరాలలోని సత్త మనోరహితమైనదే కదా! శ్రీవసిష్ఠ మహర్షి: స్థావరాలలో బుద్ధి పూర్వకమైన విచారణ అంటూ ఏదీ ఉండదు. అట్టి స్థితి దుష్కృతముల - దుర్వాసనల - దురవగాహనల వలన లభిస్తోంది. దానికి శాస్త్రములు ప్రతిపాదించే ఆత్మజ్ఞానం పొందటానికి యోగ్యత, అర్హత ఉండవు. ఇక మోక్షస్థితి అంటావా? శాస్త్ర విహితమైన కర్మానుష్ఠానం చేత చిత్తము శుద్ధి సంపాదించగా ఏర్పడే అవగాహన కదా! శ్రవణ - మనన- నిధి ధ్యాసాది అనేక ప్రయత్నముల ప్రభావం చేత వాసనలు సమూలంగా నాశనం కాగా, ఏర్పడే నిత్యోదిత చైతన్య పరిపూర్ణ స్థితి అది.

  1. దుర్వాసనల భారంచే

స్పందన కోల్పోయినట్టి స్థావరములు

మనో జడ స్థితి.

  1. వాసనారాహిత్యంచే ఏర్పడే

పూర్ణ చైతన్య అమనస్కస్థితి > ఆత్మీస్థితి

వాసనారహిత అమనస్కస్థితికి, నిద్రాణమైన జడస్థితికి, అస్థిమశకాంతరం (ఏనుగుకు - - ఒక దోమకు ఉన్నంత) తేడా ఉన్నది. ఆత్మతత్త్వమును చక్కగా గ్రహించుట చేత ఏర్పడే వాసనాపరిత్యాగమే ‘కైవల్యపదవి’ అని పిలువబడుతోంది.

విత్తనంలో అంకురలక్షణాలన్నీ మౌనంగా దాగి ఉన్నట్లు, గాఢనిద్ర పోయేవానిలో సంకల్పములు ఉండి కూడా ప్రస్ఫుటం కాకుండా ఉన్నాయి. అట్లాగే జడములలో వాసనలు సుషుప్తమై వెలయు చున్నాయి. ఆ వాసనలే మరల జాగ్రత్ స్థితికి, పునర్జన్మకు కారణములగుచున్నాయి. మరి స్థావరాలకు మరల జన్మ లేదనటం ఎట్లా సంభవం? సుషుప్తంలో అణిగి ఉన్న వాసనలతో కూడి, మనోధర్మరహితమై,

Page:26

జడత్వము ఆశ్రయించి ఉన్న స్థావర జన్మలు కూడా దుఃఖసహితములగు అనేక వందల జన్మలు పొందటానికి వేచియే ఉన్నాయి. అనగా, జడ ధర్మమును ఆశ్రయించిన స్థావరములు మరల సుషుప్త ధర్మము వహించి జన్మలు పొందవలసిన అగత్యం ఉన్నది.

ఒకవేళ, జడధర్మమే మోక్షమని అనుకుంటే, ఇక శాస్త్రోక్తమైన ప్రయత్నములను వదలి మత్తు పదార్థములను స్వీకరించి, మత్తుగా పడి ఉండటం మంచిది కదా! కనుక, జడత్వమనేది మోక్షమని

అనిపించుకోవటానికి వీలు లేదు.

విత్తనంలో పుష్పలక్షణములు, మట్టియందు కుండధర్మములు అంతఃస్థితమై ఉన్నట్లు స్థావరము లందు పునర్జన్మ సంస్కారవాసనలు దాగి ఉన్నాయి. వాసనాబీజములు నిర్భీజములై సమూలంగా నశించటమే ‘తురీయం’ అని అనిపించుకుంటుంది. అంతే కానీ, జీవజంతు జాలం సుషుప్తి పొందినంత మాత్రంచేత అది ‘సిద్ధి’ అని అనిపించుకోదు.

శ్రీరాముడు: వాసనలు వృద్ధి చెందటానికి కారణమేమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : అజ్ఞానముతో కూడిన దృశ్యతదాత్మ్య అభాసయే అందుకు కారణం. వాసన, అగ్ని, ఋణం, వ్యాధి, శత్రుత్వము, అనురాగము, వైరము - ఇవన్నీ కొంచెం మిగిలి ఉన్నా మరల ప్రవృద్ధమౌతూ ఉంటాయి. వాసనలు ఇచ్ఛ - ఆశలు సహాయంతో క్రమాభివృద్ధి పొంది మహానర్థాలకు కారణమగుచున్నాయి. వివేకి అయినవాడు వాటిని సమూలంగా నిశ్శేషంగా త్యజించాలి. తీవ్ర ప్రయత్నంలో ఉద్భూతమయ్యే జ్ఞానాగ్నిచే వాసనాబీజాలను దగ్ధం చేయాలి. సత్తా సామాన్య రూపస్థితి పొందినవాడు ఈ శరీరము ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా అద్వైత-నిత్య శాంత స్థితి పొందుతాడు. అట్టివాడు ఇక జన్మించడు. దుఃఖములను పొందడు.

స్థావరములు తరగని వాసనా బీజములతో, ఉత్పత్తి పొందబోవు రసభావంతో, (అయితే) అంతర్గతంగా - చిచ్ఛక్తి సమన్వితములై నిద్రించుచున్నాయి.

ఆత్మశక్తియే జడములందు జడరూపంగానూ, రాయియందు కాఠిన్యంగాను, కాష్ఠంలో (చెక్కలో) ధ్వంస రూపంగానూ, కత్తియందు పదును రూపంగానూ, మట్టికుండ యందు జలధారణ సమర్థం గానూ, వస్త్రము నందు చలి నివారణ శక్తిగానూ, బంగారము నందు ఆభరణత్వంగానూ వెలయు చున్నదని సునిశిత బుద్దితో గ్రహించు. వాసనాబీజశక్తి విత్తనమునందు దాగి ఉండి తగిన వాతావరణం లభించగానే వికాసం పొందే మహావృక్షములాగా, జగదనుభవంగా బయల్వెడలుతోంది. అట్టి వికాసము నుండి అనేక రూపనామ పరంపరలను పొందుతూ మహాప్రయాణం చేస్తోంది.

నిజానికి ఆత్మ చైతన్యమునకు నామరూప ఉపాధిత్వంగాని, స్థావర జంగమత్వం గానీ లేదు. రూపరహితమగు ఆకాశమునందు మేఘముల ఆచ్చాదనచే రూపముగా స్ఫురిస్తున్నట్లు, ఆవృతచైతన్యం జడాది దృశ్య దశలను పొంది కనిపించటం జరుగుతోంది. కనుక, రామా! ఈ అజ్ఞానముచే ఆవరించబడిన చిచ్ఛక్తి యొక్క వాస్తవ స్వరూపమేమిటో గమనించు. అంతేగాని అవాస్తవమగు

Page:27

స్థావర జంగములను చూచి భ్రమించకు. భూతాకాశము రూపరహితమైనట్లే ఆత్మాకాశం సదా, సర్వదా విషయరహితం.

అసన్మయము అగు ‘అజ్ఞానము’ అనే నిస్సార వస్తువు నలువైపులా వ్యాపించి భ్రాంతిబుద్ధికి రకరకములుగా, స్థావర జంగమాత్మకంగా తోపింప జేయుచున్నదయ్యా! అయితే ఆత్మ దృష్టితో అల్ప దృష్టిని జయిస్తే ఈ సంసారము బ్రహ్మమే అవుతుంది గానీ, భ్రమను కలిగించజాలదు. దీని నంతటినీ ఆత్మదృష్టితో చూస్తున్నపుడు సర్వదుఃఖములు నశించుచున్నాయి. ఆత్మదృష్టికి విరుద్ధంగా ‘ఆవరణ’ కల్పించుకొనుటయే అవిద్య. అవిద్యలోంచి దృశ్యజగత్తుకు సంబంధించిన జడ-జీవాది స్ఫురణలు కలుగుచున్నాయి.

శ్రీరాముడు: ఈ నామరూపాత్మక ఆవరణ కల్పిస్తున్న అవిద్య యొక్క అసలైన రూపమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్యకు రూపమంటూ ఏదీ లేదు.

అవిద్యారూపరహితా యావదేవావలోక్యతే ॥

తావదేవ గలత్యాశు తుహినాణుర్యథాతపే ॥ ॥ (శ్లో॥ 31, సర్గ 10.) సర్వరూపశూన్యమైన అవిద్య ఎంతవరకు విచారించబడితే అంతవరకూ ఎండకు మంచులాగా, కరిగి పోవుచున్నది. నిద్రలోంచి లేస్తున్న మనుజుడు ఎంతవరకు జాగ్రత్వృత్తులు వచ్చి జేరితే అంతవరకూ నిద్రమత్తు తొలగినట్లే కదా! “ఇది ఏమిటి?”- అని ఎంతవరకు పరిశీలిస్తామో అంత వరకు విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఎంతవరకు వెలుతురు విస్తరిస్తే అంతవరకూ చీకటి దూరమౌతూ ఉంటుంది. అట్లాగే, ప్రయత్నపూర్వకంగా ఎంతవరకూ అవలోకిస్తూఉంటే అంతవరకు అవిద్య క్షీణిస్తూ వస్తుంది.

ఒకడు ఒక చీకటి గదిలో నిలబడి ఉన్నాడనుకో! “ఈ చీకటి యొక్క అసలైన రూపమేమిటి?” అని తెలుసుకుందామని దీపం వెలిగించి వెతికితే, ఆ దీపపు వెలుతరులో చీకటి రూపమేమిటో కనబడుతుందా? దీపం వెలగగానే చీకటి మటుమాయమౌతుంది. ఎందుకంటే, వెలుతురు లేక పోవటమే చీకటి కదా! జ్ఞానం ప్రభవించిందా, అజ్ఞానము యొక్క నామ రూపములు కూడా లభించవు. నెయ్యి యొక్క ఘనస్వరూపం (పేరు నెయ్యి యొక్క ఘనాకారం) పరిశీలించటానికి వేడి చేశామనుకో, ఆ ఘనాకారం యొక్క పొడవు వెడల్పులు ఏమగుచున్నాయ్? మటుమాయమౌచున్నాయి కదా! అట్లాగే, అవిద్య విచారించబడినప్పుడు, ఆ విచారణ యొక్క తీవ్రత చేత, ఆ అవిద్య ’ఇది’ అని నిర్దేశింపబడక పారిపోవుచున్నది.

కొంచెం మాత్రమే విచారిస్తే కొంచెమే తొలగుతోంది. అసలు విచారణయే చేయకపోతే, అసద్రూపమగు భ్రమగా అనుభవమగుచు అది అవస్తువు అయి కూడా జీవుని ఈ నిబిడాంధకార రూపంలో చుట్టుముట్టుతోంది. కనుక రామా! అవిచారణామాంద్యమును వదలి, విచారణ చేసి చూడు అప్పుడు నీకు ‘అవిద్య లేనిదే’ అని తెలియబడగలదు. విచారణ చేయకుండా, ధ్యాన-భక్తియోగాది ప్రయత్నాలు లేకుండా రోజులు గడపుతూ ఉంటే ఈ అవిద్య తనంతట తానే తొలగుతుందా? … లేనే లేదు.

Page:28

శ్రీరాముడు: కార్యకారణములచే రూపాంతరం చెందుచూ, కనబడుచున్న ఈ అవిద్యాదృశ్యతరంగం విలీనమవటానికి ఉపాయమేమిటి?

శ్రీ వసిష్ఠమహర్షి : “రక్త మాంస-బొమికలచే పంజర రూపంలో తయారై కనిపిస్తున్న ఈ శరీరంలో చిక్కుకుని ఉన్న నేనెవడను?” అని విచారణ చేయటమే అందుకు ఉపాయం. సర్వ అసద్రూపములను మొదలంటా త్యజించివేయటాన్నే ‘అవిద్యా క్షయం’ అని పిలుస్తున్నాం. అప్పుడు శేషించి ఉన్నదే ఆత్మ కదా! ఒకడు ఒక భుజకీర్తిని ధరించునప్పుడు మరల తొలగించినప్పుడు అతడు యథాతథంగానే ఉంటున్నాడు కదా! ఈ జగత్తులను ధరిస్తున్నప్పుడు, త్యజించునప్పుడు కూడా ‘ఆత్మ’ ఒకే తీరుగా ఉండి ఉంటోందని గ్రహించు. ఆత్మ ఎప్పుడూ ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. “అది సదా యధాతథం” - అని వేదోపనిషత్తుల గానం కదా!

అవిద్య తొలగినప్పుడు శేషించి ఉండే వస్తువు శాశ్వతము-సద్రూపము అగు బ్రహ్మమే కదా! ఆత్మ సర్వమును ధరిస్తోంది. మరల పాము కుబుసమును విడుచునట్లు విడచివేస్తోంది. ఆత్మ యొక్క సమక్షమునందే అవిద్య ప్రవర్తించటం నివర్తించటం కూడా జరుగుతోంది.

-

అట్టి సారభూతమగు ఆత్మయే నీవు కదా! ఆత్మ అనుభవైకవేద్యము. నాలుక ఒక మధురమైన వస్తువును ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అనుభూతిని ఏ వర్ణనల చేతనూ మరొకరెవరికీ అందించగలిగేది కాదు. అట్లాగే, ఎవరికి వారే స్వస్వరూప సందర్శనంచే అది ఆస్వాదించవలసిందే! ఆత్మయే ప్రతిఒక్కని శాశ్వత స్వరూపం, వాస్తవ స్వస్వరూపం అయిఉన్నది.

రామా! మరల చెప్పుచున్నాను. ‘అవిద్య’ అనేది అసలు లేనేలేదు. ఈ కనబడేదంతా అఖండిత మగు బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమే అవిద్యగా భ్రమచే అనిపిస్తోంది. సత్ - అసత్ కల్పనలన్నీ బ్రహ్మము నందే, బ్రహ్మము చేతనే, బ్రహ్మము గానే కలుగుచున్నాయి.

‘కుండ’ మట్టికాదని, ‘వస్త్రము’ దూది కాదని, ‘శకటం’ కొయ్య కాదని, అనిపించటం తెలివి తక్కువతనమే కదా! ‘ఇది బ్రహ్మము కాదు’ అని అనిపించటమే అవిద్య. ‘ఇదంతా బ్రహ్మమే’ అను నిశ్చయమే అవిద్యా క్షయం. ఇక్కడున్నదంతా శివం - శాంతం - అద్వైతం తప్పితే ఇక ఇక్కడా, ఎక్కడా, ఇప్పుడూ, మరెప్పుడూ, ఏదీ, మరేదీ లేదు. లేనే లేదు. ఉండజాలదు.

  1. కర్తవ్యములు జ్ఞానమునకు అడ్డు కావు

శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! మరలమరల ఆత్మతత్త్వ విషయమై వినటం మననం చేయడం వంటి అభ్యాసముల వలన మాత్రమే ఈ దృశ్యం ఇక హృదయంలో చిగురించకుండా ఉండగలదు. అనాత్మభావనపోయి ఆత్మభావన సంతరించుకోవాలంటే విషయం ఆరూఢం కావాలి. అందుచేతనే ఒకే విషయం మరల మరల నేను చెప్పటం జరుగుతోంది. కనుక నేను చెప్పేది పరిశీలకుడవై విను.

Page:29

అజ్ఞానమేతద్బలవదవిద్యేతరనామకమ్ |

అభ్యాసేన వినా సాధో నాభ్యుదేత్యాత్మభావనా ॥ (శ్లో.2, సర్గ.11.)

ఈ ‘అవిద్య’ అనబడే అజ్ఞాన అనాత్మ భావనలు వందల వేల జన్మలలో మూటకట్టుకున్న ద్వైతవాసనలవలన బలం పుంజుకుని దట్టంగా పెనవేసుకుని ఉన్నది.

ఇది అనేకసార్లు జాగ్రత్లో కళ్లు మొదలైన ఇంద్రియములు ఉపయోగిస్తున్నప్పుడు, ‘స్వప్నం’ అనే ఊహయందు పొందిన అనుభవపరంపరల చేతనూ, అనేకసార్లు చావు పుట్టుక లందలి భావోద్రేకముల చేతనూ ప్రాబల్యం పొంది ఉంటోంది. అందుచేత శ్రవణ మననాది తీవ్రయత్నములు ఎంతో అవశ్యకమై ఉన్నాయి.

ఇక ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది పంచేంద్రియాలకు అగోచరమైనది. ఆరవ ఇంద్రియము, సంకల్ప స్వరూపము అయిన మనస్సు కూడా లయించగా, అప్పటికీ సత్తామాత్ర రూపమై వెలయు చున్నది, ఇంద్రియముల వలన కలుగుచున్న వృత్తులకు ఆవల ప్రత్యక్ష, వృత్తిరహిత స్వభావమై ఆత్మ ప్రకాశిస్తోంది. మరి అట్టిది భౌతికమైనదిగా ఎట్లా కనిపిస్తుంది చెప్పు?

కాబట్టి రామా! హృదయ వృక్షమును దట్టముగా పెనవేసుకుని ఉన్న అజ్ఞాన- లతను సంక్షయింప జేయాలి సుమా! “మరల మరల జ్ఞానమును అభ్యసించటం” అనే చురకత్తిని ఉపయోగించి ఆ అజ్ఞాన-లతను త్రెంచి స్వస్వరూపమును సిద్దింపజేసుకోవాలి.

శ్రీరాముడు : మహర్షీ! ఈ జీవుని జీవితము రాజ్యపాలన, అన్నపానాదుల సముపార్జన మొదలైన శరీరరక్షణ వ్యవహారములకే అధికభాగం సరిపోతోంది కదా!

శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! రామా! ఈ అన్నపానాది లౌకిక వ్యవహారములు జ్ఞానసముపార్జనకు, అవిద్యా నాశనమునకు, అడ్డుగా ఉన్నాయని అమాయక జీవులు మాత్రమే భ్రమిస్తున్నారు. అది సరికాదు. నీవు అట్టి అల్ప అభిప్రాయములను దరిజేరనీయవద్దు. జనక మహారాజు రాజ్యపాలనాది వ్యవహారములను నిర్వర్తిస్తూనే జ్ఞానాభ్యాసపరుడై, జ్ఞానిఅయి విహరించటం అందరం చూస్తున్న విషయమే. అభ్యాసబలం చేతనే ఆతడు కర్మనిరతుడై కూడా ’నేను సర్వకర్మ వ్యవహారములకూ అతీతుడను’ అను నిశ్చయాత్మక బుద్ధిని అభ్యాసఫలంగా సంపాదించుకున్నాడు. పూర్ణజ్ఞాన నిశ్చయము గల విష్ణుమూర్తి అనేక అవతారములతో గర్భవాసం అనుభవించి, జన్మించి ధర్మరక్షణ, భక్తపాలన చేస్తూనే స్థిరచిత్తుడై నిశ్చలుడై, నిర్లిప్తుడై ఉన్నారు. సర్వదా అంబతో కూడుకొనియున్న శివభగవానుడు, సరస్వతీదేవితో కూడుకొనియున్న బ్రహ్మదేవుడు, రాగరహితులై, అఖండజ్ఞాన సమన్వితులై అవిద్యకు ఆవల నిశ్చలులై ఉన్నారు. సృష్టి-లయ కార్యములలో నిమగ్నమై ఉన్నారు. అయినా కూడా వారు భక్తులకు కరుణతో, వరములను, జ్ఞానమును ప్రసాదిస్తున్నారు. గుణ సహితులై వర్తిస్తున్నారు. అట్టి మహనీయుల నిశ్చయమే నీకు కూడా కలుగుగాక!

దేవతల గురువగు బృహస్పతికి, అసురుల గురువగు శుక్రాచార్యులకు, త్రిలోకసంచారియగు నారదమహర్షికి, పులస్త్య- అంగీరస - ప్రచేతస - - భృగు - క్రతు - అత్రి - - శుకాది ఋషిసత్తములకు,

Page:30

ఈ సభకు వేంచేసి ఉన్న అనేకమంది మహనీయులకు, జీవన్ముక్తులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు, నాకు కర్మల వ్యవహారం పట్ల ఎట్టి నిశ్చయం ఉండి… కర్మలు నిర్వర్తించటం జరుగుతోందో, అట్టి నిశ్చల ఆత్మ్యైక్యస్థితి, అపరోక్ష, అద్వైతజ్ఞానానుభూతి పెంపొందించుకుంటూ, నీకు విధించిన కార్యములను నిర్వరిస్తూ ఉండు. కర్మల తదనంతరం జ్ఞానం కాదు. జ్ఞానివై కర్మలు నిర్వర్తించు. శ్రీరాముడు: భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మీరు చెప్పిన మహనీయులందరూ ఏ నిశ్చయమును అనుసరించి, అవిద్యాశోకరాహిత్యమగు పదవిని అలంకరించి ఈ దృశ్యజగత్తులో సంచరిస్తున్నారో - అది - వివరించమని ప్రార్థిస్తున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి : సునిశిత బుద్ధితో నేను చెప్పేది గ్రహిస్తున్నట్టి నీకు వారి సునిశ్చయమేమిటో వివరించి చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే వివేక భేరీనినాదం సర్వ వేదాంత సిద్ధాంతసారమే అయి ఉన్నది.

  1. వివేక భేరీ నినాదం

వివేకుల భేరీ నినాదం ఇట్లా ఉంటుంది. ఈ కనబడే జగత్తుల యొక్క స్థితిగతులన్నీ ఘనీభూతమై ఏర్పడి ఉన్నట్లుగా అనిపిస్తోంది కదా! అయితే వివేకులగు మహనీయుల దృష్టిలో ఇదంతా మాయకమై ఉండి కూడా పవిత్రబ్రహ్మ స్వరూపంగానే వ్యవస్థించియున్నది.

బ్రహ్మ చిద్ర్బహ్మ భువనం బ్రహ్మ భూతపరమ్పరాః | బ్రహ్మాహం బ్రహ్మ మచ్చత్రుర్బహ్మ సన్మిత్రబాన్ధవాః | || (శ్లో 17, సర్గ 11.)

బ్రహ్మమే జీవచైతన్యముగా ప్రకటితమౌతోంది. చైతన్యాభాసకమగు ఈ చతుర్దశభువనములు (14 లోకములు), వాటిలో ఉండే అసంఖ్యాక జీవులు కూడా బ్రహ్మమే! నేను, నా బంధువులు, నా శత్రువులు, నన్ను ఆక్షేపించేవారు అందరూ బ్రహ్మమే అయి ఉన్నారు.

భూత, భవిష్యద్వర్తమాన కాలములు సముద్రంలోని తరంగముల లాగా బ్రహ్మమునందే విజృంభిస్తున్నాయి. పదార్థ సంపదలు కూడా బ్రహ్మమే. బ్రహ్మము బ్రహ్మముచేతనే పరిలక్షించబడటం (Being aimed at), గ్రహించబడటం, ప్రేరేపించబడటం, అనుభవించబడటం… జరుగుతోంది. బ్రహ్మము తనయందు తానే తన మాయాశక్తిచేత వివర్తము చెందుతూ ’తదితరం” గా వర్ధిల్లుచున్నది. నన్ను అధిక్షేపించుచూ, ఉపేక్షించుచూ, ప్రశ్నించుచూ, వేధించుచూ కనబడేదేదైతే ఉన్నదో - ‘అదంతా’ బ్రహ్మమే కనుక బ్రహ్మమునకు నేను ప్రియమొనర్చెదను గాక!

ఆకాశంలో మేఘముల సమావేశం ఏదో వనముయొక్క ఆకారంలాగా ఉన్నట్లు భ్రమచే తోచుచున్నది చూచావా? అది పసిపిల్లవాడి అమాయకదృష్టి వంటిదే కదా! అట్లాగే రాగద్వేషాది వ్యవస్థలన్నీ కేవలం ద్రష్టయొక్క కల్పిత దృష్టుల ఫలితం మాత్రమే. బ్రహ్మనిష్ఠని అవేమీ స్పృశించలేవు. అఖండబ్రహ్మైక్యవేద్యులకు సర్వసంకల్పములు మొదలంట్లా నశించి ఉంటాయి. అందుచేత వారిపట్ల

Page:31

రాగమునకు సంబంధించిన సంకల్ప ప్రసంగం ఉండదు. వారి రాకపోకలు, కాళ్లుచేతుల కదలికలతో సహా సర్వ కార్యక్రమములూ పూర్ణస్వభావమై, బ్రహ్మరససమన్వితములై ఉంటాయి. వారు సర్వేసర్వత్రా స్వస్వరూపమునే దర్శించటం చేత ఇక ఎవరి మీద ద్వేషం? “ఈ జగత్తంతా నా హృదయాకాశ విన్యాసమే”… అని వారు ఆస్వాదిస్తున్నారు.

ఆనందైక రసమగు బ్రహ్మమే అంతటా, అన్నిటా, అన్నివేళలా ప్రకాశించుచుండగా… ఇక సుఖమేమిటి? దుఃఖమేమిటి? అన్ని వైపులా బ్రహ్మమే బ్రహ్మమునందు దీపిల్లుచున్నది. ఇక నేనో? బ్రహ్మము కంటే వేరుగా నేను మరెచ్చటా లేను.

కుండ - మట్టి - దూది అంతా బ్రహ్మమే. నాతో సహా అంతా బ్రహ్మమే అయి ఉండుట చేత, ఇష్టం అయిష్టం మొదలైన కల్పన అంతా మిథ్యయే. అట్టి కల్పనల యొక్క అవసరంగాని, అనవసరంగాని లేదు. ఈ దేహ బ్రహ్మము మరణ బ్రహ్మమునందు ప్రవేశిస్తోంది. ఉభయ స్థితులూ బ్రహ్మమే అయి ఉన్నాయి. కనుక మరణము గురించి భయపడటం గాని, కోరుకోవటం గాని చేయవలసిన పనేమున్నది?

ఎవరైనా సుఖదుఃఖాలు అనుభవించే వారు ఇక్కడున్నారని అనుకుంటే, అది అజ్ఞానాంధకారంలో త్రాడును చూసి పాము అని అనుకోవటం వంటిదే.

అంతయూ బ్రహ్మమే కాబట్టి ‘ఇది నేను చేశాను’ అని భావించవలసిన పని లేదు. తరంగముల కదలికలు నీరు నుండి వేరుగా ఉన్నవి కాదు కదా. నీటిలో కదలికలే లేకపోతే ఇక తరంగములకు ఉనికి-నామ-రూపములు ఎక్కడినుండి వస్తాయి? బ్రహ్మమే లేకపోతే సుఖదుఃఖములకు ఉనికియే ఉండేది కాదు.

కెరటములు జలమే కదా! ఇక కెరటములకు ‘జలములో లయించుట’ అనే వ్యవహారం ఎక్కడున్నది? అట్లాగే ఈ జీవుడు బ్రహ్మమును సంపాదించుటయో, తాను బ్రహ్మము నందు లయించుటయో ఏముంటుంది? ఈ జీవుడు బ్రహ్మమే కదా! ఇక్కడేదీ మరణించుట లేదు. తరగుట లేదు. పెరుగుట లేదు. అయితే, తరంగములు ’చలించుట’ అను చలనస్వభావమును వీడకయే నిజస్వభావమున జలముగా వెలయునట్లు ‘ఈ పాంచ భౌతిక దేహాన్ని నేను’ అను జడస్వభావమును ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా స్వస్వభావమగు తత్త్వరూపమున వెలసి ఉండెదను గాక! తరంగములు నిశ్చలత్వం పొందితే జలంగానే ఉంటాయి కదా! అనిశ్చలంగా ఉన్నప్పుడు కూడా అవి జలమే! బంధము-మోక్షము అను ఉభయ స్థితులలో బ్రహ్మమే ఉన్నది. నేను అజ్ఞానినైనా, సుజ్ఞానినైనా కూడా బ్రహ్మమే అయి ఉన్నాను.

బంధ-మోక్షములు లేనే లేవు. ఒకవేళ ఉంటే… వాటి వాస్తవ స్వరూపం బ్రహ్మమే! శాస్త్రాలు (ఉపనిషత్ మొదలైన గ్రంథాలు) అతాత్త్వికమగు జడ రూపమును పరిత్యజించి… తద్వ్యతిరిక్తమగు ‘తత్త్వభావన పొందటం’ అనుదాని గురించి ప్రవచిస్తున్నాయి. అదంతా కూడా ఆభరణము నందు బంగారమును, తరంగము లందు జలమును గాంచుట వంటిది మాత్రమే. ‘తత్త్వభావన’ అనగా

Page:32

“నీవు’గా ’నేను’గా కనిపించేదంతా బ్రహ్మమే - - అను భావన. ఈ క్షణం తరువాత ఎప్పుడో ఎక్కడో పొందవలసిన మరొక స్థితి, స్థానములు కాదు. “ఇది బ్రహ్మం కంటే వేరొకటి”… అను బ్రహ్మవ్యతిరిక్త భావమే ప్రకృతి అని, మాయ అని పిలువబడుతోంది.

ఈ జీవజడాది రూపములన్నీ బ్రహ్మము నందే ఆరోపించబడుచున్నాయి. భేదభావన ఉన్న చోట మాత్రమే మోహం, దుఃఖం ఉంటాయి. వాస్తవము, నిత్యము, అప్రమేయము అగు బ్రహ్మమును ఎరుగుటచే ఇక అవి ఉండవు. తెలియని వారికి ఈ జగత్తు దుఃఖమయం. తెలిసిన వారికి ఇదంతా అఖండానందరసైక పూర్ణము. గ్రుడ్డివానికి ఈ జగత్తంతా అంధకారమయం. జ్ఞానచక్షువులు కలవారికి ఇదంతా ప్రకాశమయం. అజ్ఞానికి ఈ జగజ్జాలం బంధమయం. జగదేక ఆత్మజ్ఞానం చేత ఇదంతా దివ్యానందమయం.

ఓ బిడ్డలారా! సకల జీవులారా! మమాత్మ స్వరూపులారా! రాత్రిపూట శిశువు చీకటి వైపు చూచి భూతములను ఊహించి భయపడునట్లు, మీరు ఈ జగత్తులోకి వచ్చి వ్యామోహితులై ఇక్కడి అల్ప లాభాలాభములను చూచి ఉలిక్కిపడుచున్నారు. ప్రాప్తవయస్కుడు చీకటికి ఏమాత్రం భయపడ నట్లుగానే, జ్ఞానము ప్రాప్తించినవాడు ‘బ్రహ్మము’ అనే నిండుకుండ అయి తనను తాను దర్శించుకొను చున్నాడు. విశ్వమంతా తన రూపంగా ఆస్వాదిస్తున్నాడు. అందుచేత, అతనికి ఎట్టి భయ దుఃఖాలు అంతరమున కలగటమే లేదు. తరంగములు లేవటం, పడటం మిథ్యయే అయినట్లు ఇక్కడ జీవించటం, మరణించటం అనేవి మిథ్యయే. ఇదంతా భ్రాంతిచేతనే కల్పితంగా ఆత్మయందు దృశ్య సంబంధిత భ్రమగా కలుగుతోంది. బాల్యాజ్ఞానంలాగా ‘ఇది ఉన్నది - అది లేదు’ అనే పరికల్పన ఆత్మ యందు ఆత్మచే ఏర్పరుపబడుతోంది. ఇక్కడ ఉన్న విశేషం ఇంతకుమించి ఇంకేమీ కాదు.

ఒక దీపం యొక్క కిరణపుంజములు బయలుదేరి నిష్కారణంగానే తదితర పదార్థములను ప్రస్ఫుటింప జేయుచున్నట్లు బ్రహ్మము నుండి బయలుదేరిన చిత్పుంజములు జగత్తును ప్రస్ఫుటింప జేయుచున్నాయి. బ్రహ్మము ‘జగతి నిర్వచనము’ అనే ఆత్మశక్తిని ప్రకటించుచున్నప్పటికీ అది సర్వదా తనయందు తానే వెలయుచున్నది.

కెరటముల మధ్య గల జలకణములు కించిత్ ఘనీభవించటం చేత జలంలో నురుగు ఏర్పడుతోంది. ఆ జలకణములు తునిగినప్పుడు, తిరిగి జలముగానే రూపం దిద్దుకుంటోంది కదా! అట్లాగే ఏదో కారణం చేత ఆత్మ కల్పితరూపములను సంతరించుకుంటోంది. ఆ కారణం నిరోధించ బడినప్పుడు తిరిగి బ్రహ్మముగానే శేషిస్తోంది. సముద్రంలో జలం లేకపోతే కెరటములు గాని, బుడగలు గాని ఉండేవా? బ్రహ్మమే లేకుంటే మనోబుధ్యాది అంతఃకరణములుగాని, ఈ శరీరములు గాని ఏర్పడగలిగేవే కాదు. సముద్రం ప్రశాంతమయినప్పుడు కెరటాలు, నురుగు, వీచికలు, జలకణాలు శమించగా, ఇక ప్రశాంతజలత్వం స్వాభావికమే అయినట్లు కల్పనలు త్యజించినప్పుడు ఈ జీవుడు స్వాభావికంగానే స్వతఃసిద్ధము, నిర్మల-సర్వాత్మ స్వభావమగు బ్రహ్మముగానే ప్రకాశిస్తున్నాడు. ఈ శరీరములు, ఈ సంపద-ఆపదలు, ఈ హర్ష- విషాదములు, ఈ ధర్మార్థ కామ పురుషార్థములు

Page:33

- అన్నీ కూడా తిరిగి బ్రహ్మము నందే ప్రవేశిస్తున్నాయి. ‘బ్రహ్మమున జగత్తులు ఉండటం’ అనగా ‘బంగారమునకు ఆభరణమునకు సంబంధించిన ఆకారము ఉండటం’ వంటి కల్పితం మాత్రమే. ఈ విచిత్రం ఇంతవరకే గాని మరింకేమీ కాదు. మూఢులు స్వస్వరూప అజ్ఞానావేశం చేత ద్విత్వం కల్పించుకొని బాధపడుచున్నారు.

ఈ మనస్సు బుద్ధి, శబ్ద స్పర్శ రూప రస గంధము లనబడే పంచతన్మాత్రలు, ఇంద్రియాలు - ఇవన్నీ ‘ఏకైక బ్రహ్మమే’ అయి ఉన్నాయి. అట్లే అనేక ఆత్మలు ఎక్కడా లేవు. కొండగుహలో చేయ బడిన ‘ఓహో’ అను ధ్వని ప్రతిధ్వనించి ఆ గుహలో అనేక వైపుల నుండి అనేకసార్లుగా ’ఓహో… ఓహో’ ధ్వని వినబడుతుంది. అవి మరొకరెవరో పలుకుతున్నట్లు అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ద్వితీయ భ్రాంతి కలుగుతోంది. ’వాచారంభం… మొదలే అసంభవం ’అనునట్లుగా ’నేను, నీవు, ఇది, అది, చిత్తము, అనుభవము’ - మొదలైనదంతా ఆత్మయందు ద్వైతభ్రాంతిని కల్పించుచూ, లేచుచున్నది.

కలలో ఒక జీవుడు తన కల్పితరూపములగు అనేక రూపములను దాల్చి తానే ఆ రూపములతో ప్రతిస్పందిస్తున్నాడు చూచావా? బాగా పరిశీలించిన తరువాత స్వస్వరూప బ్రహ్మమే ఈ జీవ జగత్ భావములను ప్రదర్శించుచున్నట్లు జ్ఞానులు గ్రహిస్తున్నారు. అందుచేత ఆత్మలో ‘భ్రమింపజేయుట’ అను ద్విత్వమునకు సంబంధించిన చమత్కారం అప్రసిద్ధమైనదేదీ కాదు. అయితే బురదలో పడి ఉన్న మణి బురదయొక్క తాపటం చేత ‘అది మణి’ అని గ్రహించకపోవటం, ఏదో గులకరాయి ముక్కలాగానే గ్రహించబడటం జరుగుచున్నట్లు, బ్రహ్మమని భావించకపోవటం చేత బ్రహ్మమే అజ్ఞానముగా పరిఢవిల్లుతోంది. ఇది ఎంత చిత్రం!

అయితే మనం చెప్పుకున్న తత్త్వజ్ఞులు సర్వము బ్రహ్మముగా దర్శిస్తున్నారు. తన ఆత్మయే అంతంతరమునందు స్వయం ప్రభువై స్వయం జ్యోతిస్వరూపమై, మహత్తుగా అంతటాఅన్నిటా ఆక్రమించి ఉన్నట్లు గ్రహిస్తున్నారు.

అజ్ఞానులకు మాత్రమే ఖండభావన కలుగుతోంది. అజ్ఞానులే ‘అజ్ఞానం… అజ్ఞానం’ అని వాపోవుచున్నారు. మణి అని తెలియగానే బురదచే కప్పబడిన రాయి మణిగా గుర్తించబడునట్లు, అంతా బ్రహ్మమే అని తెలియబడగానే నాలుగు దిక్కులందూ బ్రహ్మమే అనుభవమగుచున్నది. బ్రహ్మం సర్వశక్తిమంతము. అందుచేత అన్యకారణమేదీ లేకుండానే స్వశక్తి చేతనే అది ఎట్లు భావన చేస్తే అట్లే అనుభవమగుచున్నది. చివరికి పూర్ణముగా భావించినప్పుడు పూర్ణముగానే అగుచున్నది.

బ్రహ్మము కర్మ-కర్త-కరణ-కారణ రహితం. అది అనామయమైనది. అందుచేత, వేదజ్ఞులు దానిని స్వయంభువం (తనంతటతానే ప్రభవించునది) స్వయం ప్రభువు, స్వయం కారణం అని వర్ణిస్తున్నారు. బ్రహ్మమే అపరిజ్ఞాతమైనప్పుడు ‘అజ్ఞానము’ అని ‘మాయ’ అని పిలవబడుతోంది. అది తన అజ్ఞానాన్ని వినాశనమొనర్చుకుని పరిజ్ఞాతమైతేనో? అదే జ్ఞానంగా అగుచున్నది. గ్రహించక, శత్రువుగా భావిస్తాం చూచావా! గ్రహించిన తరువాతనో… శత్రుభ్రమ అనే అజ్ఞానం తొలగి అతడే మిత్రుడిగా తెలియవచ్చుచున్నాడు కదా! విచారణ-వైరాగ్యములు లోపించుట చేతనే జీవ-జగత్తులలోని

Page:34

బ్రహ్మము అస్పష్టంగా ఉండిపోతోంది. ఈ జీవ జగద్రూపము అయుక్తమని, విచారించినప్పుడు నిలబడజాలదని, అసద్రూపమని గ్రహించిన తరువాత బ్రహ్మభావము తనంతటతానే తక్షణమే సుస్పష్టమై ఉదయించగలదు. ‘ముత్యపుచిప్పలో వెండి ఉండజాలదు’ అని తెలిసిపోయిన తరువాత ఇంక అందులోంచి వెండిని పొందటానికి ప్రయత్నం ఉండదు కదా! బ్రహ్మమును ఎరిగిన తరువాత ఇక “ఈ జగత్తులో ఏదో పొందటల్లేదే?”… అనే దుఃఖభ్రమ ఉండదు.

ఈ జగత్తు బ్రహ్మమున ఉండటం అసంగతమని తెలిసి రాగానే భోగ్యవస్తువుల పట్ల విరాగం స్వయంసిద్ధమౌతుంది. ఎప్పుడైతే ద్వైతము అసత్యమని, అసంభవమని అసంగతమని గ్రహిస్తామో… మరుక్షణం ‘బ్రహ్మభావన’ అనే సూర్యుడు స్వయంగా ఉదయిస్తున్నాడు. అటు తరువాత ’ఇది సత్యం, ఇది మిథ్య’ అను భావనను కూడా త్యజించి మహనీయులు పరమవైరాగ్యాన్ని అవధరిస్తూ ధన్యులగు చున్నారు.

‘నేను-నాది’ అను గ్రహణాగ్రహణముల కారణంగా అహంకారము ఆత్మవస్తువును స్ఫురించ కుండా అడ్డుతగులుతోంది. అయితే వివేకులగు మహనీయులు ఆత్మవస్తువును అహంకారము తాక లేదని, హింసించలేదని ఎరిగియే ఉంటున్నారు. “కార్య కారణ సంఘాతమగు ఈ శరీరమే నేను కాదు. ఇక తదితరం గురించి వేరే చెప్పేదేమున్నది?" అని గ్రహించి జనకాది మహాత్ములు స్వతఃగానే బ్రహ్మభావాన్ని ఆశ్రయించి ఉంటున్నారు. ’నేను బ్రహ్మమును’ అనుజ్ఞానం సంపాదించుకొని, పదిల పరచుకొని ఉండటం చేత వారి సర్వభావనలు అనుక్షణం తమ స్వరూపంలోనే తక్షణమే విలీనమగు చున్నాయి. ‘ఇదంతా కూడా బ్రహ్మమే’ అనుభావనాపటిమచే వారు నీవు - నేను మొదలైన వాటిని నీళ్లలో పడిన ఉప్పుబొమ్మలాగా స్వాహా చేసివేస్తున్నారు. ‘ఆస్తి-భాతి-ప్రియము-నామము-రూపము’ అను ఐదు రీతులుగా చెప్పబడే ఈ జగత్తు, ఇందలి వస్తుజాలములు వారు బ్రహ్మమునందు, లయం చేసి గ్రహించటం చేత వారు మోహమును, దుఃఖమును, కర్మత్వమును తొలగించివేస్తున్నారు. సర్వదా పరమ శాంత-నిర్మల-నిర్లిప్త స్వరూపులై వెలయుచున్నారు. అట్టి బ్రహ్మోక్య స్వరూపులగు మహనీయులగానం ఏమిటో చెపుతాను విను.

12 ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం

శ్రీవసిష్ఠ మహర్షి: ఆత్మ స్వరూపము యొక్క మహోన్నత్యం గ్రహించిన ఆత్మానుభవసమన్వితుల ‘సుప్రకటన’ ఏమిటో చెపుతాను విను.

ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం - అహో! నేను స్వస్థుడనైనాను. సర్వసమరస స్వభావుడనైనాను. వాస్తవమునకు నేను బ్రహ్మమును. కనుక సర్వదా స్వభావ సిద్ధంగానే శోకరహితుడను. జ్ఞానమును సంపాదించకోవటంచేత ‘కల్పనలు’ అనే కలనుండి విముక్తుడనయ్యాను. నేను దేనినీ గ్రహించటం లేదు. త్యజించటం లేదు. ఈ శరీరమును నమ్మి ఉండవలసిన అవసరం లేదు. అట్లా అని త్యజించ

Page:35

వలసిన అగత్యమేమీ లేదు. ఇందలి రక్త - మాంస - - అస్థి - ధాతువులు, ఈ మొత్తం శరీరం నా యొక్క ఒకానొక చిత్కళమాత్రమే.

బ్రహ్మము అనబడే నిత్యసత్యమును నేనే. సూర్యునితోను, నక్షత్రములతోను నిండియున్న ఈ సర్వ ఆకాశము కూడా నా చేతనే ఆక్రమించబడియున్నది. చిత్చైతన్యము రూపముతో ఈ సృష్టిని, తదితర సృష్టులను పూర్ణం చేసి ఉంటున్నాను.

ఈ భూమి దీనిపైగల జీవరాసులు, మొక్కలు, పొదలు, అడవులు, కొండలు, సముద్రం, సముద్ర ప్రాణులు కూడా నేనే. బ్రహ్మోకత్వం పొందుటచే అవన్నీ నాకన్నా వేరుగా ఉండవు. ఇవ్వటం, పుచ్చుకోవటం, ముడుచుకోవటం, నింపటం, కదలటం, వదలటం, మొదలైన ప్రాణి ధర్మములన్నీ నేనే అయి ఉన్నాను. చిదాత్మరూపుడనై విభిన్న రూపములను ధరించి లతలందు, కాండలందు, విత్తనములందు, అంకురములందు తిష్ఠవేసుకొని ఉంటున్నాను. ఇదంతా చిదాంతర్గతమై నా స్వరూపమే అయి ఉన్నది. శాంతరసాత్మకమగు పరబ్రహ్మమునైన నేను అంతటా అన్నిటా అనవరతమూ జాజ్వల్య మానంగా వెలుగుచున్నాను. ‘సర్వమేకాత్మ పరంబ్రహ్మ’ అను నిశ్చయము కలిగి ఉండుటచే వేదములు ఉపయోగించే సశబ్దములగు ‘చిదాత్మ, బ్రహ్మము, సత్యము, సత్, అమృతము, జ్ఞానము, శివము, శాంతము, అద్వైతము, సర్వము’ మొదలైనవి నాపట్ల సముచితములౌచున్నాయి. వేదాలు - ఉపనిషత్తులు నా స్వరూపగానమే చేస్తున్నాయి.

సర్వమేకాత్మ పరంబ్రహ్మజ్ఞాన స్వరూపుడనగు నేను సర్వముగాను, కేవల చిన్మాత్రము గాను, బాహ్యానికి అభాసమాత్రం గాను, అమలం గానూ, సర్వభూతాత్మబోధకం గాను, సర్వత్రా వెలయు తత్త్వము గాను, శాంతము గాను, చైతన్యము గాను, చిద్రహ్మము గాను ఏర్పడి ఉన్నాను.

మనోబుద్ధ్యాది అన్ని ఇంద్రియవ్యాపారములందు అనుశ్రుతంగా స్వప్రకాశస్వరూపంగా, విభేద రహితంగా ప్రవేశించియున్నాను. శబ్ద స్పర్శాదులతో నిర్మించబడిన ఈ జగత్తుకు మూలకారణంగా, అక్షయ స్వరూపుడనై ఉంటూ ఇంద్రియ ద్వారముల నుండి సంకల్ప-వికల్ప రూపములుగా ప్రసరిస్తున్నాను. తెంపులేని తేజోపుంజములతో అనామయమగు చిద్రహ్మముగా లోపల, బయట ప్రసరించుచూ నేను నేనుగానే వెలుగొందుచున్నాను.

యోగిపుంగవులు మౌనవ్యాఖ్యల ద్వారా ప్రకటిస్తున్న పరబ్రహ్మతత్త్వాన్ని నేనే. నిత్యానుభవ స్వరూపుడనగుట చేత నా స్వరూపమును ఎవరూ ఎక్కడా తిరస్కరించజాలరు. సమస్త కర్మచక్రములు నా వలననే ప్రవర్తించుచున్నాయి. నిర్లిప్తము, సుషుప్తి సదృశము, చిద్ర్బహ్మము అగు నా రూపమే వనములలో ప్రశాంత స్వరూపంగా వెల్లివిరియుచున్నది. ఒక పురుగు అనుభవించే ఆనందము నుండి బ్రహ్మదేవుని ఆనందం వరకూ గల అన్ని ఆనందములూ నా అనంతానంద సముద్రంలోని కణలేశము మాత్రమే. నాయొక్క బ్రహ్మానంద సాగరములోని కొన్ని చిన్న కణములు ఈ భూత భవిష్యత్ -వర్తమాన బ్రహ్మాండములుగా, దేశకాల పరిచ్ఛన్నములగు ఖండ-సుఖములుగా ఒకింత ప్రతిబింబిస్తు న్నాయి. కాముకుడగు జీవుడు చంద్రుని చూచినప్పుడు, అందమైన స్త్రీ నాసాగ్రం చూచినప్పుడు

Page:36

ఏర్పడే ఆహ్లాదం నా అవిచ్ఛిన్నసత్తాత్మక నిర్విషయ చిద్రూపానందం యొక్క ఒక అల్పకణము మాత్రమే. రాత్రిపూట పూర్ణచంద్రుని చూస్తున్నప్పుడు ఆ చూచువాని చూడబడే చంద్రుని మధ్య ఏర్పడి ఉన్న నిర్విషయ చిదానందమును నేనే.

నా స్వరూపమునకు సుఖ దుఃఖ - కల వికలనములు లేవు. నిర్మల సత్యానుభవరూపాత్మకమైన చిత్ బ్రహ్మాత్మను కదా! దూరంగా ఉన్న వస్తువులను దర్శింపజేయుచున్న పంచభూతాల సమ్మేళనముల మేళవింపుకు కారణమగుచున్న తత్త్వశక్తిని నేనే. ఖర్జూరము మొదలైన మధుర ఫలాలలోని మాధుర్యం అను రసశక్తిని నేనే. ఏ చితశక్తి జీవుని రూపంలో అత్యంత సామాన్యములగు సుఖదుఃఖములను పొందుచున్నదో, అది చితశక్తిస్వరూపుడనగు నన్ను ఎరుగుటచే వినిర్ముక్తమగుచున్నది. జ్ఞాన-అజ్ఞాన ఉభయ స్థితులలోనూ, ఉభయ స్థితుల మధ్య నెలకొనియున్నది నేనే.

నేను లాభాలాభములకు, సుఖదుఃఖములకూ అందువాడను గాను. సమత్వముచే అప్రసంగ వ్యవహారం, నిరాకారం, భేదానందాతీతం - అగు చిద్రసబ్రహ్మమునే గాని, మరింకేమీ కాను. భూమి-సూర్యుల మధ్య ఏర్పడి ఉన్న ద్రష్ట యొక్క నిర్విషయ దృష్టిని, శాంతచిత్స్వరూపుడను నేను.

జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో అధ్యస్తము, అతీతము (Inside Placed - Placed beyond) అయినట్టి తురీయము అనబడు అనామయ చిత్ర బ్రహ్మాత్మక రూపం నాదే. నేను ఈ అసంఖ్యాక జీవరాశులనబడే క్షేత్రాలలో సమస్థితుడనై ఒప్పారుచున్నాను. జ్ఞాన ప్రకాశవంతమగు నా చిద్రూపము అత్యంతమనోహరము. సంభోగానందలవము, అమృతాస్వాదన మాధుర్యము ఎవరికీ మాటలలో చెప్పనలవి కానట్లు స్వాత్మానుభవేకవేద్యమగు నా బ్రాహ్మీస్వరూపమును ఎవరూ ఎన్ని వాక్యములు ఉపయోగించినా చెప్పజాలరు.

తామరతూడులలో దారం పైకి కనబడకుండా లోపల ఉండి ఆ తూడు నిలచుటకు కారణమగు చున్నది కదా! ఆధారము పరిశీలనాత్మకదృష్టికి మాత్రమే అగపడుచున్నది. అట్లాగే అన్ని శరీరములలో ప్రసరించి ఉండి, ఆ ఆ శరీరములు నిలచుటకు కారణమై, విచారించినవారికి మాత్రమే సుస్పష్టమగుచున్న చైతన్య స్రవంతిని నేనే. సమస్తభువనములూ పూర్ణంగా ఆక్రమించుకొని ఉన్నప్పటికీ ఈ భువనాలలోని వస్తుజాలములకు నేను దుర్లక్ష్యమే అయిఉంటున్నాను.

మేఘమాలను స్పందింపజేస్తున్న చిదానందరూపుణ్ణినేనే! ప్రేమాస్పదంగా కనిపించే అంతటి లోనూ, పాలలోని నేయివలె అంతర్లీనమై, అంతః స్నేహంగా ఉపలక్షితమై అనుభూతియోగ్యమగుచున్న చిచ్ఛక్తి నేనే. పాలలో నేయి అంతటా వ్యాపించి ఉన్నట్లు ‘క్షయం’ అంటూ లేనట్టి చిత్ ఈ సృష్టి అంతా నేను నిండి ఉన్నాను. పర్వత పదార్థముల లోపలా, వెలుపలా సర్వదా సర్వగతమై వెలయు సత్తా సామాన్యం నా స్వరూపమే. దర్పణంలాగా సర్వమును తనయందు ప్రతిబింబింప జేయగల సర్వగత బ్రహ్మము అనగా నేనే గాని, మరింకొకటేదో కాదు.

#

ఎట్టి మాలిన్యములకూ చోటు ఉండనట్టి శుద్ధచిత్ స్వరూపుడను కదా! నా స్వరూపము సర్వ తేజస్సులనూ ప్రకాశింపజేయునట్టిది. సర్వ సంకల్పములనూ ఫలింపజేయునట్టిది. ఈ సర్వము

Page:37

నాదే కనుక సర్వలోభములకూ నేను పరాకాష్ఠ కూడా. అట్టి నా యొక్క నిత్యస్వరూపమును నేను ఆరాధిస్తున్నాను. సాధన సమయంలో బాహ్యంలోని వస్తువును భగవానునిగా ఆరాధించాను. ఇప్పుడు నా ఆరాధ్యం నేనేనని గ్రహిస్తున్నాను. ఆరాధకుడు, ఆరాధన ఆరాధ్యం కూడా నేనే. నేను, తదితరులు కూడా ఉపాసిస్తున్నది నన్నే.

అట్లు నా ఆరాధ్యమగు స్వస్వరూపమే కుండ, వస్త్రము, తటాకము, గొయ్యిలందు కూడా సద్రూపముగా వెలుగొందుచున్నది. అండజ- స్వేదజ - - జరాయుజ - ఉద్బీజ జీవులలోని చైతన్యము అదే! నా సత్వబుద్ధనిత్య స్వరూపము జాగ్రత్ దశలోకూడా సర్వవిశేషాతీత్వకారణంగా నిర్వికారమై ఉండుటచే ‘నిత్యనిద్రితం’ అనటానికి కూడా అర్హమగుచున్నది. గాఢనిద్రలో ఏ క్షణంలోనైనా జాగ్రత్న స్వీకరించటానికి నిత్యసిద్ధమై ఉండుటచే ‘నిత్యజాగ్రత్’ అని కూడా చెప్పబడటానికి అర్హమగుచున్నది.

ఈ జగత్తులో అనేక జీవులచే అనేక నామరూపములతో మంత్ర - తంత్రములతో ఉపాసించ బడుచున్నది ఏదైతే ఉన్నదో, అది నా స్వరూపమే అయి ఉన్నది. అగ్నియందు ఉష్ణం గాను, మంచు నందు చల్లదనం గాను, అన్నము నందు మాధుర్యం గాను, కత్తియందు వాడి గాను, చీకటియందు నలుపు గాను- పైకి కనిపించక అనుభవరూపమున స్ఫురించుచున్నాను. అట్టి సర్వాంతర్యామియగు నన్ను నేనే ఉపాసించుకొనుచున్నాను. ఉపాసించబడుచున్నాను.

వెలుపలా, లోపలా వెలుగుచూ అత్యంత సామీప్యమున ఉండిన నా ఆత్మస్వరూపమును ఎరుగకపోవుటచే నేను ఇంతకాలం అజ్ఞానినై ఎక్కడెక్కడో వెతికాను. ఏవేవో మార్గాలలో ఉపాసించాను. సర్వసంకల్పములకు అతీతమై సర్వ సంరంభములకు ఆవల ఉండి, కామ క్రోధ-భోగ ంక్షలకు విరహితమై, కారణరహితమై, నిరహంకారమై… ఏ నా సత్యస్వరూపమైన చిదాత్మ కలదో, అద్దానికి మరల మరల నమస్కారం. నమస్కారం!

నా స్వరూపమే అన్నిటా వెలయుచూ నిర్లిప్తంగా ఆద్యంతరహితంగా ఏకరస స్వరూపంగా ఏర్పడి ప్రకాశిస్తోంది కదా! అద్దానిని సూక్తములచే భజిస్తున్నాను. మూడులోకములలోని ముక్త పురుషులచే గానము చేయబడుచు, అన్నిటా ప్రతిబింబించుచూ, జాగ్రత్లో ఇంద్రియములను ఉపయోగిస్తూ, స్వప్నంలో ఊహయందు సంచారం చేస్తూ, సుషుప్తిలో నిశ్శబ్దమగుచు, బహిరంగంలో జగత్తులనూ, అంతరంగంలో సంకల్పములనూ ఉంచుకొని ప్రచ్ఛన్నంగా ఉండి ఉండే ఆ చిదాత్మను నేను సర్వదా పొందియే ఉన్నాను. అది సృష్టికాలంలో సర్వసత్తలు కల్పించుకుంటోంది. ప్రళయ కాలంలో ఆ సర్వసత్తలు తన యొక్క అసత్ యందు లయం చేసుకుంటోంది. అట్లు సర్వసత్తలు తన యందు లయం చేసుకొనే ఆత్మసత్త ఇప్పటికే నేనైయున్నాను. నేను అదై ఉన్నాను. అది నేనై ఉన్నది. అదియే నేను. సో హమస్మి!

సర్వ రూపములందూ విహరించుచూ, సర్వమునకూ స్నేహధారియై, తన అధోభాగమున భావాభావములను రచించుకొనుచూ, అవి లేనప్పుడూ చలన రహిత నిశ్చల దీపంలాగా ఉంటూ, నిరుపాధిక ప్రేమకు స్థానము, ఆధారమూ అయి ఉంటూ, అవివేక దృష్టిచే జడదేహ ధర్మములు

Page:38

ఆపాదించబడుతూ, ముక్తులకు ముక్తస్వరూపమున గోచరిస్తూ, ‘చిత్’ దీపమై ఉన్న నన్నే అందరూ అన్నిటా ఉపాసిస్తున్నారు. అట్లు ఆరాధించేవారు, ఉపాసించేవారు నాకు వేరైనవారు కారు.

‘జీవము’ అనే తటాకంలో ‘హృదయము’ అనే పద్మమునందు రహస్యంగా దాగి “కాళ్లు-చేతుల కదలికలు” అనే బాహ్యప్రదర్శనా సదృశమైన ‘చిదాత్మ’ అనబడే నా పరరూపమునకు నా జీవరూపముచే భక్తితో సాష్టాంగ ప్రణామములు చేస్తున్నాను. ఆ చిదాత్మ ఎక్కడో పుట్టినది కాదు. దాని యందు ఏదీ జనించుటలేదు. ఎవరి చేతా హరింపబడేది గాదు. అది పూర్వమూ ఇప్పుడూ ఎప్పుడూ సత్యతత్త్వమై వెల్లివిరిసియున్నది. అది శబ్ద-స్పర్శ రూప-రస-గంధముల రూపమున ఒకచోట కించిత్ అభివ్యక్తమగుచూ… మరొకచోట ఆత్మజ్ఞానుల హృదయ స్థానంలో శాంతి వహించి ఉంటూ నదిలో గల వివిధ స్థానములలోని జలంలాగా అన్ని స్థితులలోనూ ఒక్కటే అయి ఉన్నది. ఆకాశకోశం వలె బట్టబయలే అయి ఉన్నది. సర్వలోకములకూ నామరూపములను ఒసగుచూ, తాను మాత్రం నామరూప రహితమై ఉన్నది. మహామహిమశాలి అయిఉండి కూడా తన యొక్క అజ్ఞాన విభాగముచే ఉపాధులలో ప్రవేశించి తన ముంగిటే తాను ‘ఆశ’ అను భిక్షం ఎత్తుచూ ‘ఆదిభిక్షువు’ అని అనిపించు కుంటోంది. సర్వమునకు కర్త అయి ఉండి వాస్తవానికి అకర్తగానే ఉంటోంది. అట్టి సర్వాత్మనే ఇంకా ఇంకా ఉపాసిస్తాను. ఆస్వాదిస్తున్నాను.

అదియే నేను. నేనే అది. నాఉపాసన నా కొరకే! ఉపాస్యము నేనే! సరే, ఉపాసకుడను నేనే నని చెప్పాలా…?

నేను సకల ప్రపంచరూపుడను. ఇదంతా నాదే. ఇన్ని ఉపాధులలోనూ అహంకారముగా ఒప్పుచున్నది నేనే. అయినా కూడా నేను మరేదీ అగుటలేదు. నా తత్త్వమేమిటో తెలిసిన నేను ఇక సర్వరుగ్మతలనుండి విముక్తుడను. ఈ జగత్తు కృత్రిమమగు మాయ అగుగాక. లేక, సత్యమే అగుగాక! రెండు అవగాహనలలోనూ ‘అవగాహనాసాక్షినై’ నేను ఉండనే ఉన్నాను.

ఇంతకుమించి నా గురించి నేను చెప్పుకోవటానికి మాటలు లేవు. చాలవు.

ఓ రామచంద్రా! చూచావా! శివకేశవులు, జనకాది తదితర మహనీయులు ఇట్టి అవగాహన సృష్టీకరించుకొని, అటుపై ఈ సృష్టిలో తమతమ విహితమగు కార్యములను నిర్వర్తిస్తున్నారయ్యా! మనం చెప్పుకున్నదంతా ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపమునకు సంబంధించిన నిర్వివాద సత్యము. ఎవ్వరైనా ఈ స్వస్వరూపస్తోత్రం పఠించుటచే సత్యసంకల్పులగుచున్నారు. ప్రతిఒక్కరు స్వస్వరూప భావము పొందుటకు అర్హులే అయి ఉన్నారు సుమా!

స్వస్వరూపమునకు, తదితరంగా ఉంటున్న వికల్పములన్నీ స్వయంకల్పిత నిరోధములే గాని మరింకేమీ కాదు.

Page:39

  1. ఆత్మానుభూతిపరులు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవన్ముక్తులగు జనకుడు మొదలైనవారి ఆత్మావగాహన ఏమిటో నీకిప్పుడు విశదీకరించి చెప్పాను. వాళ్లంతా ఎట్లా విగతజ్వరులై సత్యములలో కెల్లా సత్యం, శాంతం అయిన పదమున వెలయుచున్నారో గమనించావు కదా! ఆ విధంగా వారు పరిపూర్ణాత్మను పొంది, సమబుద్ధులై సర్వాసక్తులనూ త్యజించి, నిర్లిప్తులై నిరహంకారులై జీవన్మరణాలకు నిందాప్రశంసలకు పట్టుబడక ఈ జగత్తులో యథేచ్ఛగా సంచరిస్తున్నారయ్యా! స్వభావ సిద్ధంగానే వినమ్ర స్వభావులై, మేరువు వలె ధీరులై, సర్వ ఉత్ప్రేక్షలను (Sense of Comparisons) త్యజించి, సూక్ష్మలక్ష్యమును భేదించిన వారై ఈ ప్రపంచంలో విహరిస్తున్నారు. అంతరంగము నిండా ’సమ దృష్టి’ని నింపివేసి ద్వీపములందు, దేవతోద్యానములందు, తూగుటుయ్యలలందు, పర్వత స్థాణువు లందు, వీధులందు, గృహములందు నిశ్చింతగా చరిస్తున్నారు. అట్టి మహనీయులలో కొందరు ఛత్ర చామరములు కలిగియుండి ధర్మార్థకామములకు సంబంధించిన ఆయా కార్యక్రమములు నిర్వర్తిస్తూ రాజ్యములు ఏలుచున్నారు. మరికొందరు వేద స్మృతులచే నిర్దేశించబడిన శిష్టాచార క్రియలను తాము నిర్వర్తిస్తూ, తదితరుల చేత నిర్వర్తింపజేస్తూ చరిస్తున్నారు. ఇంకొందరు మౌనము వహించి తమ సమున్నత భావతరంగములచే ఈ జగత్తుపై అవ్యాజమైన ప్రేమ స్రవింపజేస్తున్నారు. ఇంకొందరు ఈ జగత్తులోని దుష్టస్వభావజీవులను శిక్షిస్తూ, సాత్వికులకు రక్షణ కల్పిస్తూ ‘యుద్ధము’ మొదలైన అనేక అవిశ్రాంత వ్యవహారములు నిర్వర్తిస్తున్నారు. వారంతా నిర్భయులై శత్రుభావరహితులై, ప్రశాంతచిత్తులై ఉంటున్నారని గ్రహించు. స్త్రీ, హాస్య, ఆహార, విహార, భోగ్య, అభోగ్యాలలో తదితర జీవులలాగానే కనబడుచున్నప్పటికీ వారు సమచిత్తులై, జ్ఞానమునుండి తొలగనివారై ఉంటున్నారు.

అట్టి ఆత్మోత్కృష్టలబ్ధులలో కొందరు ఉద్యానవనములలో విహరిస్తూ అప్సరస గీతములను వింటున్నారు. ఈ విశ్వామిత్రాది మరికొందరు సర్వజనుల క్షేమసుఖములను ఉద్దేశించి వేదనిర్దేశితమైన యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తున్నారు. ఇంకొందరు గృహస్థాశ్రమంలో ఉంటున్నారు. ఇంకా కొందరు భయంకర యుద్ధభూమిలో ఉంటున్నారు. ద్వంద్వయుద్ధంలో పాల్గొనుచున్నారు. వాళ్లు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా… తమ మనస్సునందు మాత్రం ఎట్టి ఆసక్తిలేక, ఉపాధి శూన్యులై స్థిర-శాంతి-సత్వ పదమును అధిరోహించి ఉంటున్నారు. కులశైలములు సముద్రంలో మునుగు గాక! ఆ ఆత్మైక్య స్వరూపులు ఈ ప్రపంచంలో తారసపడే సంఘటనలలోనూ, సంకటములలోనూ మునుగరు. ఈ మహదైశ్వర్యములు వారిని తాకవు. నిశ్చలులై సర్వదా చిరునవ్వుతో సంచరిస్తున్నారు. రమణీయము, విలాసపూర్ణము అగు ఆత్మసామ్రాజ్యం పొందిన తరువాత ఈ జగత్తులోని ఆటుపోట్లు ఎంతటివి? వనంలో గ్రీష్మకాలమందు బంతిమొక్కలు వాడినట్లుగా వారు మానము పొందరు. మంచుచే లతలు విస్తరించినట్లు వారు విషయ భోగసమూహములను చూచి ఆనందించరు. నిందించరు. శ్రీరాముడు : వారికి అట్టి పరమోత్కృష్టమగు అవగాహన అలవడుటకు ముఖ్యమైన కారణం ఏది?

Page:40

శ్రీవసిష్ఠ మహర్షి : కర్తృత్వాభిమానం జయించి ఉండటం చేతనే వారికదంతా సాధ్యమగుచున్నది. వారు అంతా గ్రహిస్తూనే ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. కార్యములు ఆచరిస్తున్నప్పుడు శత్రువులను జయిస్తున్నప్పుడు పొంగటం లేదు. శత్రువులచే ఆక్రమించబడుచున్నప్పుడు క్రుంగటం లేదు. సుఖదుఃఖములు రావచ్చుగాక! పోవచ్చు గాక! అవి వారికి హర్షకోశములు కలిగించలేక పోతున్నాయి. ఆత్మైక్యానుభూతిపరులై ఉండటం చేత ఇక్కడి విపత్తులు చూసి మోహించటం లేదు.

అవి తొలగగానే కేరింతలు కొట్టటం లేదు. చిన్నపిల్లలు గంతులేస్తుంటే ఇంటి యజమాని చిరునవ్వుతో చూస్తూ పట్టించుకోకుండా ఉండునట్లు అతడు ఈ జగద్వ్యవహారములను చూస్తున్నాడు. తమ వర్ణాశ్రమధర్మాలను ఆచరిస్తూ నిష్క్రియమగు అపరమేరువువలె ధీరత్వం వహించి ఉంటున్నాడు.

ఓ రామా! నీవు కూడా ఈ క్షణమే సర్వదోష వినాశనమగు ఆత్మైక్యదృష్టిని అవలంబించు. ఈ దృశ్యమునకు సంబంధించిన అల్పాహంభావనమును వదలిపెట్టి ‘ఆత్మా-హమ్’ కార భావనను పూని ఎప్పటివలె విహరించు. ఈ సర్గ పరంపరలను యథాదృష్టితో అవలోకించుచు, మేరువు వలె స్థిరత్వమును, సముద్రము వలె గాంభీర్యమును వహించి భ్రమరహితుడవై వెలయుము. అంతే గానీ, అట్టి సర్గముల వెంటబడవలసిన అవసరం నీకేమున్నది? ఈ కనబడేదంతా ప్రకాశపూర్వకమగు చైతన్యము మాత్రమే కదా! ఇక్కడ సత్యాసత్యములు అయినవి గాని, కానివిగాని, మరింకొకటేదో గాని లేవు. సంసారద్వైతభావము క్షయింపచేయి. భ్రాంతిబుద్ధిని జయించు. అనాసక్త బుద్ధిని ఆశ్రయించిన వాడవై బ్రహ్మత్వమును అవలంబించు. అంతేగాని, ఈ సంసారమును చూచి ఉద్విగ్నుడవై శోకమోహాలు పొందకు. భ్రాంతిచే లేచుచున్న ‘చిత్తభ్రమలు’ అనే గడ్డిపరకలచుట్టూ నీ మనస్సు

ఎందుకు తిరుగాడాలి?

శ్రీరాముడు: హే భగవాన్! వసిష్ఠమహర్షీ! సూర్యకిరణస్పర్శచే వికసించే పద్మంలాగా తమ అనుగ్రహం చేత ఇప్పుడు నేను ప్రబోధితుడనైనాను. ఆహా! ఏమి ఆశ్చర్యం! మీ వాక్య ప్రభావం చేత హృదయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న మోహం కూడా తొలగుతోంది. ఎండవేడికి మంచు కరుగునట్లు భ్రాంతి తన నామరూపాలతోసహా తొలగుతోంది. సందేహాలు కనపడటమే లేదు.

ఇక మీరు ఎట్లా సెలవిస్తే అట్లే చేయటానికి సిద్ధంగా ఉన్నాను.

హే సాధూ! ఇన్నాళ్లకు నా మోహ మాత్సర్యములు తొలగి, శోకరహితుడ నయ్యాను. ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపుడనై వెలయుచున్నాను. ’నేను బద్ధుడను, మోక్షమును సంపాదించాలి’ అను భ్రమవాక్యాలు తొలిగాయి. ఇప్పుడు ఏకాంతబుద్ధితో జ్ఞానసంపద ప్రవృద్ధం చేసుకోవటానికి, రాజ్యపాలన చేయటానికి కూడా సంసిద్ధుడనై ఉన్నాను. ఆత్మారాముడనై సర్వేసర్వత్రా ఆత్మరూపంగా ఆక్రమించి విరాజిల్లుచున్నాను.