Page:41
II. ప్రాణ నిరోధ యోగోపదేశము భుశుండోపాఖ్యానం
శ్రీరాముడు : హే సద్గురు బ్రహ్మన్! శ్రీవసిష్ఠ మహర్షీ! ఈ నిర్వాణ ప్రకరణ పరిచయ వాక్యాల రూపంలో మీరు చెప్పిన ప్రారంభ విశేషాలు వినిన తరువాత ‘సమ్యక్ జ్ఞానఫలమగు జీవన్ముక్తిని ఎట్లా సంపాదించవచ్చు?’ అనే విషయం తెలియుచున్నది.
ఇంతవరకూ ‘జ్ఞానార్జన ద్వారా ముక్తి ఎట్లా సంపాదించవచ్చు?’ అన్న విషయం మీరు ప్రవచించారు. అయితే ’ప్రాణస్పందనమును నిరోధించి వాసనావిలయమును, జీవన్ముక్తిని ఎట్లా సంపాదించవచ్చు?’ అనే విషయం వినాలని ఉన్నది. ప్రాణనిరోధం ఎట్లు చిత్తశాంతికి ఉపకరిస్తోందో చెప్పమని ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : ’యోగము’ అనేది సంసార విముక్తికి తరుణోపాయమని మనం ప్రతిపాదించు కుంటున్నాం కదా! చిత్తమును ఉపశమింపజేయగల అట్టి యోగము రెండు విధములు1. ఆత్మజ్ఞాన విచారణ (జ్ఞాన యోగం), 2.ప్రాణములను నిరోధించటం (ప్రాణాయామ యోగం) శ్రీరాముడు : మహాత్మా! ఈ రెండింటిలో ఏది సులభం? ఏది తక్కువ క్లేశంతో సుసాధ్యం? ఏది రమ్యమైనది? దేని వల్ల త్వరగా సర్వదుఃఖాలు నశిస్తాయి? ‘యోగ’ శబ్దానికి అసలైన అర్థమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : ‘యోగము’ అను శబ్దాన్ని జ్ఞాన సముపార్జన, ప్రాణ నిరోధం - అను రెండింటికీ శాస్త్రములు ఉపయోగిస్తున్నాయి. చిత్తముయొక్క ఆ వృత్తిని ఏ మార్గంలో నిరోధించగలిగితే అదే ‘యోగం’ అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అయితే సాంఖ్యశాస్త్రానుసారం యోగము’ అను శబ్దానికి ‘ప్రాణనిరోధం’ అను దానికే ముఖ్యంగా ఉపయోగించబడింది. ఈ జ్ఞాన - - ప్రాణనిరోధాలు రెండూ వేదజ్ఞులచే రెండు ఉపాయాలుగా ప్రతిపాదించబడుచున్నాయి. ఈ రెండూ చివరికి ఒకే అంతిమ ప్రయోజనానికి దారి తీస్తాయని సాంఖ్యశాస్త్రంతో సహా సకల శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి.
కొందరికి యోగం అసాధ్యంగానూ, కష్టతరంగానూ కన్పట్టుచున్నది. మరికొందరి అనుభవం మరొక రీతిగా ఉంటోంది. వారు జ్ఞాన విచారణ కష్టసాధ్యమని, ప్రాణ నిరోధం లేకపోతే నిశ్చలత్వం అసాధ్యమని అభిప్రాయం ప్రకటిస్తున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ’జ్ఞానవిచారణ’ అనేది సకల జనులకూ సుసాధ్యమేనని నేను తలచుచున్నాను.
Page:42
వివేకముతో కూడిన తీవ్ర విచారణచే అజ్ఞానము ఒకసారి దూరం చేయబడిందా… ఇక అది
కలలో కూడా మరల కనిపించదు.
జ్ఞానము సర్వదా ఈ జీవుని యందు వెలయుచునే ఉన్నది. విచారణచే అజ్ఞానము తొలగితే చాలు… ఇక జ్ఞానం స్వయంగా ప్రకాశించగలదు. దానికొరకై ప్రాణనిరోధం, హఠయోగం వంటి ఆర్భాటాలు తప్పక ఆచరించవలసినవి కాదని నా అభిప్రాయం. ‘ప్రాణనిరోధం’ అను కార్యక్రమంలో ఆసనము, అనుకూలమైన ప్రదేశం, నియమ- నిబంధనములకు సంబంధించిన క్రమక్రమం ఉంటాయి కదా! జ్ఞాన విచారణ ఎక్కడైనా, ఎప్పుడైనా చేయ తగ్గది.
మరొక్క విషయం. ప్రాణ నిరోధయోగ నియతి యొక్క పరాకాష్ఠ, పరిసమాప్తి జ్ఞాన సముపార్జన తోనే సుమా! ఇంకొక్క ముఖ్యవిషయం కూడా విను. తీవ్ర సంవేదన (A Strong wish to reach the sense of self) ఉన్నవారికి ‘ఏది సుసాధ్యం? ఏది కష్టతరం’… అనే ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే ఈ రెండిటి మేళవింపుచే పోనుపోను కేవలానుభవము శేషించగలదని అనేకమంది సాధకుల నిత్యానుభవం.
నీకు ఇంతవరకూ అంతఃస్థమగు ’నిర్మలజ్ఞానము’ యొక్క స్వరూప స్వభావాలేమిటో ఎక్కువగా చెప్పుతూవస్తున్నాను కదా! అయితే ప్రాణాపాననిరోధము జ్ఞానకాముకులకు ‘ఆత్మ’ సాక్షాత్కార హేతువు కాగలదు. అది ఆకాశగమనము వంటి కొన్ని భౌతికమైన విద్యలకు (అష్టసిద్ధులకు కూడా కారణం కాగలదు. దేహాన్ని ఆశ్రయించి నిర్వర్తించబడే అట్టి ప్రాణనిరోధయోగం గురించి చెప్పుచున్నాను విను.
అభ్యాసపూర్వకమైన ప్రయత్నం చేత ప్రాణాపానాలు వశం కాగలవు. అవి నిరోధించబడుచున్న కొలదీ చిత్తంలో సమత్వానుభవం అధికమౌతూ ఉంటుంది. ప్రాణచలనం స్థిరత్వం పొందుచుండగా వాసనలు క్షయిస్తున్నాయి. చిత్తవృత్తుల ప్రకోపం సన్నగిల్లుతూ ఉంటుంది. అట్టి అభ్యాసం చేత చిత్తం కొండలా స్థిరబడుతుంది. గాలి చెట్లను కదల్చవచ్చునేమోగాని కొండను కదల్చగలదా?… అట్లాగే దృశ్యములు ఆ సాధకుని చిత్తమును చలింపజేయలేవు. ఇట్టి నిశ్చల చిత్తస్థితిలో వాక్కుకు అగోచరమైన, సర్వనిర్వచనములకూ అతీతమైన పరమానందస్థితి లభిస్తుంది. అతడు అనంతాత్మైక్య స్థితిని అధిరోహించగలడు.
చిత్తవృత్తులే జగత్తు. చిత్తవృత్తిరాహిత్యమే సర్వవేదాంత సిద్ధాంతసారం.
అట్టి ఉత్కృష్ట స్థితి జ్ఞానవిచారణ-ప్రాణనిరోధములనబడే రెండింటివలనా సాధ్యమే. స్థిర సంకల్పము నిస్సంకల్పమునకు దారి తీస్తుంది. నిస్సంకల్పం లభించిన తరువాత ఇక ఏ ప్రయత్నముల అవసరమూ ఉండదు. సర్వత్యాజ్యం వలన నిత్యము - - అఖండము - అప్రమేయము అగు ఒకానొక ఉత్కృష్టానుభూతితో కూడిన అనుభవస్థితి లభించగలదు.
Page:43
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! యోగమార్గము గురించి, తద్వారా సంకల్పశమము గురించి, కాలముయొక్క అతి విచిత్రమైన ‘గతి’ గురించి, సృష్టిపరంపరల చమత్కారం గురించి విశదీకరించగల ఒక సంవాదమును నీకు వివరిస్తాను. ఈ సంవాదము నాకు ‘భుశుండుడు’ అను పేరుగల కాకి జాతివాడగు యోగితో జరిగింది. ఆ మహానుభావుని అనుభవములేమిటో చెబుతాను విను.
‘పరబ్రహ్మము’ అనబడే మహాసాగరంలోని జలకణము వంటి ఒక అల్పవిభాగంలో ఈ జగత్తులన్నీ వెలయుచున్నాయి. ఈ సృష్టికి కారణస్వరూపుడుగా కమల సంభవుడగు బ్రహ్మదేవుడు వెలయుచున్నారు. అట్టి బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మానస పుత్రుడను నేను. తపోధ్యానముల బలం చేత సప్తర్షిమండలంలో స్థానం సంపాదించాను. వైవస్వత మన్వంతరం వరకు నేను ఇట్లే ఉండబోవుచున్నాను.
అట్టి నేను ఒకానొకనాడు ఏదో సందర్భంలో స్వర్గంలోని ఇంద్రసభకు వెళ్లాను. అక్కడి సభలో ఈ నారదుడు మొదలైన మహర్షులందరూ ఉన్నారు. అప్పుడు జరిగిన ప్రసంగంలో ‘చిరంజీవత్వం’ గురించి సంభాషించుకోవటం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే పేరుగల ముని లేచి నిల్చున్నారు. ఆయన “మాననీయుడు, ప్రమాణకుశలుడు, అవసర మాత్ర ప్రసంగి" అని ప్రసిద్ధి. సభంతా నిశ్శబ్దమైనది. శతతాపముని ప్రసంగించటం ప్రారంభించారు.
శతతాపముని : ఓ సభికులారా! మీరంతా ‘చిరంజీవత్వం’ గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షియగు ఒక చిరంజీవుని గురించి చెబుతాను వినండి.
మేరు పర్వతం యొక్క పద్మరాగమయమైన ఒక శిఖరం ఉన్నది. ఆ శిఖరంపై కల్పతరువు ఉంది. దానిలో దక్షిణంగా ఒక ప్రాంతంలో బంగారు లతలతో నిర్మించబడిన ఒక పెద్ద పక్షులగూడు ఉన్నది. ఆ పక్షులగూడులో ‘భుశుండుడు’ అనే ఒక కాకి ఉన్నది. ఆ కాకి తన హృదయంలో ఎట్టి రాగం లేనిదై ఉన్నది. ఆ వాయసమును పోలిన చిరంజీవులు భూమి మీదగాని, తదితర లోకాలలోగాని మరొకరు ఉండరు… ఉండబోరు. అతడు మహామతి, ఆసక్తిరహితుడు, శ్రీమంతుడూ కూడా! అతడు శాంతుడై, మనస్సును జయించిన వాడై, త్రికాలవేత్త అయి పరమ విశ్రాంతి అనుభవిస్తూ దీర్ఘకాలం గడుపుతున్నాడు. అట్టి వికల్పరహితమగు జీవనము పొందటమే ధన్యం. అతని వంటి పరమ పురుషార్థమగు యోగజీవనము అత్యంత దుర్లభమని నా అభిప్రాయం.
ఆ శతతాపముని భుశుండిని దృష్టాంతంగా తీసుకుని చిరంజీవత్వమునకు సంబంధించిన అనేక విశేషాలు ముచ్చటించారు. అప్పుడు సభ్యులడిగిన అనేక ప్రశ్నలకు వివరణ కూడా ఇచ్చారు.
సభ ముగిసింది. సభలోని వారంతా తమతమ నివాస స్థానములకు జేరుటకు బయలుదేరారు. నాకు మాత్రం శతతాపముని చెప్పిన భుశుండుని దగ్గిరకు స్వయంగా వెళ్లి సంభాషించాలని,
Page:44
‘యోగము’ గురించి వివరణాత్మకంగా ఆయన చెప్పే విశేషాలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. తిన్నగా మేరు పర్వత శిఖరాగ్రం వైపుగా బయలుదేరాను.
బ్రహ్మ - విష్ణులోకములకు ఆలవాలమైన ఆ మేరుశిఖరం యొక్క అగ్రభాగంలో గల ఒక ప్రదేశంలో కొన్ని కాకులు సభదీర్చి ఉన్నాయి. భుశుండ వాయసము సభా మధ్యంలో ఉంది. వారు తాత్త్విక విషయములు సంభాషించుకుంటున్నారు. నన్ను చూడగానే మహామహుడగు ఆ భుశుండ వాయసము దిగ్గున లేచి నన్ను సమీపించి, తన సంకల్ప జనిత హస్తములతో నాకు పుష్పాంజలి సమర్పించారు. ఆసనం అధిరోహింపజేసి అర్ఘ్యపాద్యములు సమర్పించి కుశల ప్రశ్నల తరువాత మధురాక్షరములతో స్నేహపూర్వకంగా ఇట్లు పలుక ప్రారంభించారు.
భుశుండుడు : హే భగవాన్! వసిష్ఠమహర్షీ! మీకు సుస్వాగతం. నా అనేక జన్మజన్మార్చిత పుణ్యఫలంగా ఈ రోజు మహామహిమాన్వితమగు మీ దర్శనం లభించింది. ధన్యుడనైనాను. మీ పవిత్ర హృదయంలో సర్వదా సర్వసమత్వ అఖండభావన వెలయుచూ, మీ పెదవులు ఎల్లప్పుడూ లోకకళ్యాణమునకు కారణమౌతూ ఉంటాయి. ఈ మాయామయజగత్తులో సంచరించే మావంటి అల్పజ్ఞాన జీవులకు మీ దర్శనం అమృతతుల్యం వంటిది. మీ చరణ దర్శనము చేతనే మీ శుభాగమనమునకు కారణ మేమిటో నాకు తెలియవచ్చింది. మీ పవిత్ర పాదస్పర్శ వలన నేను, ఇక్కడి తదితర వాయసములు గొప్ప పుణ్యం సంపాదించుకున్న వారమైనాము. దేవలోకము నందు ఇంద్రసభలో ‘చిరంజీవి’ ఐన మా ప్రసంగంరాగా… అది మా పట్ల మీ దర్శనభాగ్యంగా పూలజల్లు కురిసింది.
శ్రీవసిష్ఠ మహర్షి : హే ఉత్తమ విజ్ఞాన సమన్వితుడా! మిత్రమా! భుశుండా! మీ మధురమైన పలుకులు వింటుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతోంది. మీరు తత్త్వము ఎరిగినవారు. ఆత్మ దర్శనముచే పునీతులు. భయంకరములగు భవసర్పములు మిమ్ము ఏమాత్రం సమీపించలేక పోతున్నాయి. మీ చిరంజీవత్వం గురించి శతతాపముని దేవసభలో ఎంతో ప్రశంసించి పరోక్షంగా మీ దర్శనం చేసుకోవటానికి అవకాశం కల్పించారు.
ఓ మహానుభావా! మీ చరిత్ర ఏమిటి? ఎచ్చట జన్మించారు? మీ ఆయువు ఎంత? ఎవరిచే నిర్దేశింపబడి ఇక్కడ నివసిస్తున్నారు? ఇంతటి ఆత్మైక్యజ్ఞానం, ప్రశాంత మనఃస్థితి ఎట్లా పొందగలిగారు? ఈ విషయములను నాకు వివరించి చెప్పవలసినదిగా మిమ్ము అర్థిస్తున్నాను. మహాత్ముల చరిత్రలు
వినటం మహదానందకరమగు విషయం కదా!
భుశుండుడు : త్రిలోక పూజ్యులు, సప్తర్షులలో అగ్రగణ్యులు అగు మీరు వినగోరినది తప్పక చెప్ప వలసిందే! మీ వంటి మహనీయులతో సంభాషిస్తేచాలు… మేఘములు వేంచేయగానే సూర్యతాపం తొలగునట్లు మా వంటివారి పట్ల అశుభాలన్నీ వినష్టమైపోతాయి. సావధానులై, ఉద్వేగరహితులై
వినండి.
❖
Page:45
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ తరువాత వర్షమేఘశ్యాముడు, సర్వాంగసుందరుడు, సరళ బుద్ధి సమన్వితుడు, హర్ష మాత్స ర్యరహితుడు, ఈ జగత్తులన్నిటినీ తన చేతిలోని ఫలం వలె చూడ గలుగువాడు, భోగములన్నీ గడ్డిపరకలలాగా పరిత్యజించినవాడు, పుట్టుక, దృశ్యముల రహస్యం ఎరిగిన వాడు, పరాపరదర్శి, ధీరుడు, స్థిరుడు, జ్ఞాన సముద్రంలో విశ్రమించినవాడు, పరిపూర్ణ మనస్కుడు, శుద్ధుడు, విశ్రాంతి పొందిన బుద్ధి కలవాడు, వేదోపనిషత్ పాఠముల అంతర్లీనగాన మేమిటో ఎరిగినవాడు, ఆత్మజ్ఞానం అవధరించినవాడు, ఎల్లప్పుడూ నవశరీరధారి అగు ఆ భుశుండుడు చిరునవ్వుతో గంభీరములు, శుద్ధములు, అమృతసమానములు అగు మాటలతో యోగ సాధనా విశేషం గురించి చెప్పసాగారు. భ్రమరమునకు తేనె ప్రసాదించే పుష్పంలాగా నాకు తన కథను ఇట్లా వినిపించసాగారు.
భుశుండుడు : హే వసిష్ఠ మహర్షీ! మొట్టమొదట నా జన్మవృత్తాంతం చెబుతాను వినండి. దేవదేవుడైన ఆ హరుడు కైలాసంలో దేవాభివందితుడై వెలయుచున్నారు కదా! ఒక లత వృక్షమును ఆశ్రయించి ఉండునట్లు జగదంబ, పార్వతీదేవి ఆయన అర్థ శరీరమును ఆక్రమించుకొని ఉన్నది. ఆ సాంబశివుని జటాజూటంలో, గంగామాత అలంకారమై ప్రకాశిస్తూ ఉంటుంది. క్షీరసాగర మథనమున ఉద్భవించిన వాడు. అమృతమును ప్రవహింపజేయువాడు, దర్పణభూతుడు అగు చంద్రుడు ఆ సాంబశివునికి చూడామణిగా అలరారుచున్నాడు. కాలకూటవిషం ఆయన కంఠాన్ని అలంకరించియున్నది. ఆయన ప్రళయకాల సమయములో తన మూడవకంటి చూపుచే లేవదీయబడిన పరమాణుధూళి నుండి ‘మాయ’ అనే వీబూదిని నిర్మించి ‘జ్ఞానము’ అనే జలముతో తడిపి తన నుదుటన అలంకరించి ఉంటాడు. సర్వ శరీరములలోని అస్థులే ఆయన రత్నహారం. ఆకాశమే ఆయన వస్త్రం. సర్వజీవుల భౌతికదేహములు చేరవలసిన శ్మశానమే ఆయన నివాసం. ఎఱ్ఱటి వస్త్రం కపాలమాల ధరించి ఆయన సంచరిస్తూ ఉంటారు. జీవుల భుజములే ఆయన భుజకీర్తులు. దిక్పాలకులంతటి వారిని దహించుట, ఈ జగత్తునంతటినీ ఆహారపు ముద్దగా చేయుట, అసురులకు భయమును గొలుపు భీషణ నృత్యములు చేయుట మొదలైనవన్నీ ఆయన లీలలు. ఆ పరమేశ్వరుడు సత్య సంకల్పుడు కదా! తన కించిత్ యోచనచే ఈ జగత్తులన్నిటినీ శుభప్రదం చేస్తూ ఉంటాడు. ఆయన విలాసంగా చెయ్యి ఊపినంత మాత్రం చేత త్రిపురములను భస్మం చేయగలిగిన వాడు. ఆయన యొక్క ధ్యాన నిష్ఠ స్నేహ-రాగవర్జితమై, సర్వ భావములకు అతీతమై కొండవలె నిశ్చలంగా ఉంటుంది. ఆ శివుని నివాసంలోనే జయ, విజయ, జయంతి, అపరాజిత, సిద్ధ, రక్త, అంబుస, ఉత్పల - అను అష్టమాతృకలు వసిస్తూ ఉంటారు.
ఆ అష్ట మాతృకలలో ఒకరగు అంబుసకు ‘చండుడు’ అను కాకి వాహనంగా ఉన్నది.
Page:46
ఒకసారి ఆ అష్టమాతృదేవతలు ఏదో కారణంచేత ఆకాశంలో సమావేశమైనారు. అప్పుడొక గొప్ప ఉత్సవం కల్పించబడింది. ఆ ఉత్సవంలో వారు తుంబుర భైరవులను పూజించారు. తరువాత మధురపానమత్తులై తమలో తాము ఇట్లు సంభాషించుకున్నారు.
“మన అష్టమాతృ దేవతలను ఆ ఉమాపతి కొంత చులకన చేసి చూస్తున్నట్లు మాకు అనిపిస్తోంది. కనుక మనం మన శక్తులేమిటో పరాక్రమములేమిటో చూపించాలి. వారిని వినోదింపజేయాలి. అప్పుడిక ఆయన మనలను చులకన చేయరు. మన పట్ల ప్రేమాస్పదులౌతారు.”
ఇట్లా నిశ్చయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా వారు రుద్రశక్తియగు ఉమ యొక్క వదనమును ఇతర అంగములను తమ మంత్ర బలంతో వివర్ణం చేసివేశారు. ఆ తరువాత వారు శివుని అర్ధాంగమగు ఉమను అపహరించి తమ మండలానికి తీసుకుని వచ్చారు. వారు ఆమెను అవహేళనం చేయలేదు. ఆమెను తమ మంత్రశక్తిచే బలికి తేబడిన జీవిగా సంకల్పించారు. ఆమె ఒక్కొక్క అవయవమును చేబూని నృత్యగీతికలతో ఆనందధ్వనులు చేస్తూ, అరచుచూ ఉత్సవం చేసుకున్నారు. వారి చప్పట్ల-సింహగర్జనల శబ్దములు ఆకాశమును నింపివేశాయి. కొండగుహలు ప్రతిధ్వనించాయి. వాళ్లు సురాపానం గుటకలు వేస్తూ, హాస్యనృత్య పానములు చేయుచూ ఉన్మత్తవృత్తులై ఉత్సవం చేసుకోసాగారు. ఒకరి నోట్లో ఒకరు ఉపాహారాలు అందించుకుంటూ ఒకరినొకరు త్రోసుకుంటూ, పట్టుకొనుచూ విచ్చలవిడిగా సంచరిస్తూ శిష్టాచారములను తారుమారు చేయసాగారు.
ఇక వారివారి వాహనాలు కూడా రక్తపానం చేసి నృత్యం చేయసాగాయి. బ్రహ్మవాహనమగు హంస, అలంబుని వాహనమగు చండుడు కూడా ఆ వాహనముల సమూహంతో కలిశారు. వారు కూడా పానోన్మత్తులై నృత్యం చేస్తూ సురతేచ్ఛపొందారు. ఆ హంసలు అంబుస యొక్క వాహనమగు కాకితో అన్యయోని సంభోగం పొందాయి. ఆ చండుడు అను కాకి ఏడు హంసలకు భర్త అయి వారి ఇచ్ఛానుసారం క్రీడించగా ఆ హంసలు గర్భమును దాల్చాయి.
ఆ తరువాత నృత్యోత్సవం ముగిసింది. మాయారూపిణులగు ఆ అష్టమాతృకలు యజ్ఞ భోక్తములను శూలి(శివుడు)కి ఆహారంగా సమర్పించారు. అప్పుడు ఆ చంద్రశేఖరుడు తనకు తన ప్రియపత్నినే బలిగా ఇవ్వటం గమనించి కోపగించాడు. అప్పుడా మాతృగణములు తమ అంగముల నుండి తిరిగి ఉమను సృష్టించి ఆ శివునికి ఇచ్చి అదే ఉత్సవంలో శివకళ్యాణం చేశారు. అప్పుడది చూసి శివపార్వతులు సంతోషించారు. ఉత్సవం ముగిసింది. అందరూ తమ తమ నెలవులకు వెళ్లిపోయారు.
గర్భవతులైన హంసలు తమ యజమానియగు బ్రహ్మణిని (సరస్వతీ దేవిని) సమీపించి జరిగినదంతా వివరించి క్షమాభిక్ష వేడుకున్నారు. అప్పుడు హంసవాహినియగు సరస్వతీదేవి ఆ
హంసలకు విశ్రాంతి ప్రసాదించి తాను నిర్వికల్ప సమాధినిష్ఠురాలైనది.
ఆ హంసలు ఆ తరువాత విష్ణుభగవానుని నాభి ప్రదేశంలో ఉండే కమలంలో ప్రవేశించి అక్కడ విహరించసాగాయి. అవి కాలక్రమేణా 21 అండములను ప్రసవించాయి. ఆ అండములలోంచి
Page:47
21 కాకులం ఉద్భవించాం. అట్లు ఉద్భవించినట్టి నేను, నా సహోదరులగు 20 కాకులు సరస్వతీ దేవిని సమీపించాం. మా స్తోత్ర పాఠములచే ఆ మాతను నిర్వికల్ప సమాధి నుండి విరమింపజేశాం. ఆ తల్లి మాకు తత్త్వమును బోధించినది. ఆమె దయ వలన పవిత్రమగు ముక్తిని దర్శించాం.
ఆ తరువాత మేము 21 మందిమి పితృదేవులగు చండుని సమీపించి భక్తి ప్రవత్తులతో సాష్టాంగదండ ప్రణామం చేశాం. వారి పాదపద్మములను భక్తిప్రపత్తులతో పూజించాం అప్పుడాయన మాతో ఇట్లా సంభాషించారు.
పితృదేవులగు చండుడు : పుత్రులారా! పుత్రవాత్సల్య యగు ఆ సరస్వతీదేవి దయవలన కల్పిత తంతువులచే నిర్మించబడిన సంసారము నుండి బయటకు వెలువడితిరి కదా?
మేము : అవును తండ్రీ! జగజ్జననియగు బ్రాహ్మీమాత దయ వలన మేము తెలుసుకొనవలసినదంతా తెలుసుకున్నాం. ఇక మేము ఏకాంతంగా ఉండవలసిన స్థానమేదో సెలవివ్వలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాం.
చండుడు : కుమారులారా! నేను ఇతఃపూర్వం మేరు పర్వతములోని ఒక శిఖరం సమీపంలో ఒక గొప్ప గూడు నిర్మించి ఉన్నాను. మీరు అక్కడ నిశ్చింతగా నివసించండి. అక్కడ సద్విచారణసమన్వితులైన అనేక వాయసములు (కాకులు) నివసిస్తున్నారు. మీరు కూడా అక్కడే నివసిస్తూ భోగమోక్షములు
రెండు పొందండి.
ఇట్లు పలికి ఆయన మమ్ములను ఆశీర్వదించి ఆహార పానీయములతో ముద్దు చేసి పంపారు. మేము అక్కడి నుండి బయలుదేరాం. సూర్యమండలమును, స్వర్గలోకమును దాటి బ్రహ్మలోకమునకు వచ్చాం. లోకమాతాపితరులగు సరస్వతీ - బ్రహ్మదేవులకు కొంతకాలం శుశ్రూష చేసి వారి నుండి బ్రహ్మతత్త్వం విన్నాం. వారి బోధలను, ఆశీర్వచనములను పొంది మరల అక్కడి నుండి బయలుదేరాం. లోకపాలకుల పురములను దాటి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మౌనం అభ్యసిస్తూ అనేక సంవత్సరాలు
గడిపాం.
హే మహానుభావా! వసిష్ఠా! మేమెట్లా పుట్టామో, పెరిగామో, ఎట్లా జ్ఞానం పొందామో, ఎట్లా ఉపశాంతి మనస్కులమైనామో…. మీకంతా వివరించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఇక మిగిలినది చెప్పటానికి ఆజ్ఞాపించ ప్రార్థన…
శ్రీవసిష్ఠ మహర్షి : మిత్రమా! భుశుండా! మీ నిరహంకారత్వమును, వినమ్రతను చూచి నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా! ఏదీ! తరువాత విశేషాలు చెప్పండి. వందల-వేల-లక్షల సంవత్సరాల పూర్వం మీరు చూచిన జగత్తు ఎట్లా ఉన్నది? ఇప్పటి ఈ జగత్తు ఎట్లా ఉన్నది?
Page:48
భుశుండుడు : మునీంద్రా! ఈ జగత్తు పూర్వ తత్పూర్వకల్పములలో ఎట్లా ఉన్నదో, ఇప్పుడు కూడా అట్లే వెలయుచున్నది. నేను అనేక కల్పవృక్షముల మీద వ్రాలి ఉన్నాను. ఈ వర్తమానకల్పమును కూడా పూర్వ తత్పూర్వ కల్పములను చూచినట్లే దర్శిస్తున్నాను.
మిమ్ములను ఇప్పుడు నిర్విఘ్నంగా చూడగలగటం కూడా నా జన్మజన్మల పుణ్యఫలం అయి ఉన్నది. మరల మరల నాచే, నాతోటి కాకులచే అర్ఘ్యపాద్యములను, ఫలహారములను, చందన తాంబూలాదులను స్వీకరించండి… ఇప్పుడు నా నుండి ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆజ్ఞాపించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : పక్షిరాజా! ఇప్పుడు నాదొక చిన్నసందేహం. మిమ్ము పోలిన శక్తిశాలురు, బుద్ధిమంతులు అగు మీ మిగతా 20 మంది సోదరులు ఏరి? వారు కనబడరేం? మీరొక్కరే కనిపిస్తున్నారేమిటి? వారందరూ ఏమైనారు?
భుశుండుడు : మహర్షీ! చెపుతాను, వినండి. మేము ఇక్కడికి వచ్చి చేరిన తరువాత ఒకదాని వెనుక మరొకటిగా అనేక రోజుల సమూహములు గడచిపోయాయి. అనేక యుగములు గతించాయి.
ఒకప్పుడు మేం 21 మందిమీ కలిసియే ఉన్నాం. కొంతకాలం తరువాత అనుంగు సోదరులందరూ తమ భౌతిక దేహములను తృణప్రాయంగా త్యజించి శివసాన్నిధ్యం పొందారు.
దీర్ఘాయుషో మహాన్తో పి సన్తో పి బలినో2పి చ | సర్వ ఏవ నిగీర్యన్తో కాలేనాకలితాత్మనా || (శ్లో॥ 10, సర్గ 20)
అలక్షితస్వరూపమగు కాలము మహాబలవంతులనూ, దీర్ఘాయుష్కులనూ, మహాత్ములను కూడా మ్రింగివేస్తుంది కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : భుశుండా! మరి మీ విషయమేమిటి? ద్వాదశాదిత్యులను కూడా తన కంఠమున అలంకరించుకొని చెలరేగు మహాప్రళయ వాయువులు మిమ్మేమీ చేయలేదా? అవి స్పృశించకుండా మీరెట్లా దేహసమేతులై ఏర్పడి ఉన్నారు? ఉదయాస్తమయములను కలుగజేసే కాలము భూమిపై గల అన్ని వస్తువులనూ దహిస్తుంది కదా! మిమ్ములను సమీపించనే లేదా? తీవ్ర శీతోష్ణములను ఎట్లా సహించి ఉన్నారు? ప్రళయకాలమేఘములు మిమ్ము కష్టపెట్టనేలేదా? జగత్తంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్యయౌవనులై మీరీ గూటిలో ఎట్లా మనగలిగారు?
భుశుండుడు : బ్రహ్మజ్ఞా! నా ఈ పక్షిజన్మ గురించి మీకు తెలియనిదేమున్నది? ఆకాశంలో సంచరిస్తూ సర్వజనులచే దూషించబడే ఈ పక్షిదేహం అన్ని ఉపాధులలోకి తుచ్ఛమైనది. ఇట్టి తుచ్ఛజీవముల కొరకే ఆ విధాత నిర్జనములైన వనములూ, శూన్యమయమగు ఆకాశమును నిర్మించారు. ఇట్టి పక్షి జాతి యందు ఆశాపాశములచే బద్ధుడైన జీవునికి కలుగు దుఃఖపరంపరలు వర్ణించసాధ్యమా?
అయితే… మేము నిత్యమూ ఆత్మతృప్తిని పొంది ఉన్నాం. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టులమై ఉన్నాము. అనగా “మాస్వస్వరూపము సర్వదా యథాతథం కదా!” అను ఆత్మోపాసనచే సంతృప్తులమై కాలమునకు కేవల సాక్షిత్వం వహించి ఉంటున్నాం.
Page:49
నిర్విషయ, నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ ‘జన్మలు పొందుట’ అను భ్రమలకు లోను కాకుండా నిజగృహంలో కాలం వెళ్లబుచ్చుచున్నాం. ఏదీ కోరుకోవటం లేదు. ఏదీ త్యజించటం లేదు. అనగా మేము జీవించి ఐహిక, ఆ ముష్మికములను కోరం. మరణించి ఈ దేహమును త్యజించకోరం. నిత్యశుద్ధనిరతిశయానంద స్వరూపులమై ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నామో అట్లే స్వస్వరూపమున నివసించుచూ కాలము యొక్క గమనమునకు కూడా కేవల సాక్షీభూతులమై ఉంటున్నాం.
అందుచేతనే మేము కాలమునకు బద్ధులవటం లేదు. మేము లోకము యొక్క జనన మరణములు అనేకం చూచాం. కానీ ‘ఈ జగత్తు మిథ్యయే!’ అనే నిర్ణయం కలిగి ఉన్నాం. వేద వాక్యములు, గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి సుదృఢత్వం పొందాయి. మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. ఆత్మసింహాసనం అధిరోహించి, సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. వాస్తవానికి మా పితృదేవులు చండునిచే నిర్మించబడిన అతిపొడవైన, బంగారు లతానిర్మితమైన ఈ పక్షులగూటిలో దివారాత్రములు తెలియవు. అయినా కూడా స్వబుద్ధితో కాలముయొక్క గతిని, త్రికాలములను గ్రహించగలుగుచున్నాం.
హే మహానుభావా! మా మనస్సు తత్త్వజ్ఞానబలం చేత సారాసారవిభేదమంతా వీడినదై అవాఙ్మనస గోచరమైన స్థానంలో పరమవిశ్రాంతి పొందుతోంది. సుస్థిరతను శాంతిని సర్వదా అనుభవిస్తోంది. సంసారవ్యవహారములచే పుట్టుచూ తుచ్ఛమైన అనేక ఆశాపాశములచే బంధింపబడి అటూ ఇటూ ఎగురుతూ గంతులేసే తదితర భూకాకముల వలె మేము దేనికీ భయమును గాని, ఉద్వేగాన్ని గాని, ఆశగాని, ఇష్టాద్వేషాలుగాని పొందటం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలూ పొందటానికి మాపట్ల కారణమేలేదు. అనిష్ట-వినష్టములకు ఏమాత్రం ధైర్యం కోల్పోవక పరమ శాంతితో కూడిన దృక్కులతో అప్రమేయత్వం వహించి ఉన్నాం. భయంకరమైన ఆపదలు ఒనగూడి నప్పుడు కూడా మేము పాషాణమువలె స్థిరత్వం వహించి ఉన్నాం. స్ఫటికమువలె కేవలం సాక్షీ భూతంగా వెలయుచున్నాం. ఆరంభంలో సుఖకరంగాను, క్రమంగా పేలవంగానూ ఉండే ఈ జగత్తు నందలి అనేక పదార్థ సమూహములు వస్తున్నాయి. పోతున్నాయి. అయితే వాటి రాక పోకలు మమ్ము ఏమాత్రమూ బాధించటం లేదు. అవి ఎటునుండి వస్తున్నాయో, ఏమి కానున్నాయో మేము మా వివేకబలం చేత మున్ముందుగానే ఎరిగి ఉంటున్నాం. హే భగవాన్! వసిష్ఠ మహర్షీ! ఈ భూతజాలములు, వాటి సమ్మేళనములు జనించినను, మరణించినను మరణించకున్ననూ మాకు ఏం సంబంధం? ‘భూతములు’ అనే నదీ ప్రవాహములు మరల మరల ఎటునుండో వచ్చి, కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఇక మేమో, ఒడ్డున ఉండే కొండలాగా ఇక్కడ తటస్థంగా ఉన్నాం. వాటివేటినీ లెక్కగొనుచున్నవారము కానేకాము.
మేము ఇక్కడేదీ గ్రహించటం లేదు. త్యజించటం లేదు. మా పాదములు సంసారము నందు జాగ్రత్తగా మసలుచుండటం చేత మృదువుగా ఉన్నాయి. ఈ సంసారము వలన జనించే అజ్ఞాన పరంపరల పట్ల నిర్మొహమాటముతో కూడిన అనాసక్తి కలిగి ఉండటంచేత జడమాత్రంగా,
Page:50
అర్థరహితంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ తీరుగా ఈ కల్పవృక్షముపై గల ఈ గూటిలో ఎట్టి చింతలూ లేకుండా చిరంజీవులమై ఉన్నాము. శోకభయరహితులగు మీ వంటి వుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడినవారమై తత్ఫలితంగా మాయారహితులమై ప్రకాశిస్తున్నాం.
ఎప్పుడైనా అనుకోకుండా ఈ మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారములను సరిచూడటానికి కాస్త ఇటూ అటూ వెళ్లిందనుకోండి…. వెంటనే తత్త్వమును నెమరువేయుటచే వాటి రాగద్వేషాది లంపటం (బురద)లో మేం వశీభూతులం కావటంలేదు. మొట్టమొదలే మా మనస్సు నిర్వికారము, క్లేశరహితము అగు ఆత్మయందు ఉపశమించి ఉంటోంది. మా చిత్రంగములు సర్వదా సర్వత్రా బ్రహ్మాకారమును పొంది ఉన్నాయి. పున్నమినాటి చంద్రుని చూచిన సముద్ర తరంగముల వలె ఎప్పుడైనా భావతరంగములు లేచుచున్నప్పటికీ మేము సముద్ర స్వరూపులమై ఈ సముద్రతరంగముల వంటి భావములను వీక్షిస్తున్నామేగాని, భావముగా దిగజారటంలేదు. సర్వ భావముల కంటే కూడా ప్రత్యేకమైయున్న మా స్వరూపమును ఆస్వాదించుటే మా యొక్క యోగసాధనం.
హే మహాత్మా! పాల సముద్రం మధించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందమునకు కారణమైనదో… మీ ఈ రాకచే మేము అంతటి ఆనందం పొందుతున్నాం. ఈషణాత్యాగులగు మీ వంటి మహాత్ముల దర్శనముతో సమానమై ఆత్మ కళ్యాణ విషయం ఇంకేమున్నది? మా భావాతీత యోగసాధనం మరింతగా ఇనుమడిస్తోంది.
ఆపాతమాత్రరమ్యేభ్యో భోగేభ్యః కిమవాప్యతే | సత్సఙ్గచిన్తామణితః సర్వసారమవాప్యతే ॥ (శ్లో 39, సర్గ 20.)
ఆపాతరమణీయములగు ఈ ప్రాపంచిక భోగముల వలన ఏం లాభం? తమరి ‘దర్శనము’ అనబడు ‘సత్సంగచింతామణి’ నుండి సర్వసారమగు జ్ఞానమే లభిస్తుంది.
హేమహర్షీ! మీ వాక్యములు ధీరగంభీరములు, స్నిగ్దకోమలములు. సరళమాధుర్యములు అయి ఉన్నాయని అనేకమంది శ్రోతల అభిప్రాయం. మీరు త్రైలోక్యతత్త్వ సారమును ఎరిగినవారు. హే సాధూ! సాధుసంగమం సకలభయములనూ తొలగిస్తుంది. మేము ఆత్మతత్త్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులం అయ్యాం. మా దుష్కృతములన్నీ నశించినట్లే. మా జన్మ సార్ధకమైనదని తలచుచున్నాం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! కాలవాయువీచికలు ఈ స్థానమును స్పృశించనే లేదా? అయితే మీరు కాలముయొక్క అనేక చమత్కృతులు గాంచి ఉంటారే!
భుశుండుడు : ఘోరములగు కల్పాంతవిక్షోభములు అరుదెంచిననూ, విషమగాలులు వీచిననూ పితృ సంకల్ప నిర్మితమైన ఈ గూడు ఉన్నట్టి కల్పవృక్షం మాత్రం కంపించక స్థిరంగానే ఉన్నది.
Page:51
లోకాంతరములు విహరించే వారికి కూడా ఈ స్థానం అగమ్యమై ఉండటం వలన నేను నిశ్చింతగా ఎట్టి బాధలు లేకుండా ఇక్కడే ఉన్నాను. సప్తద్వీప సమన్వితమైన ధరావలయమును చాపచుట్టినట్టు చుట్టి హిరణ్యాక్షుడు అపహరిస్తూ ఉంటే శ్వేతవరాహమూర్తి ఆకాశం నుండి ఉద్భవించి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని యథాస్థానంలో ఉంచినప్పుడు గానీ… దేవరాక్షస గణం క్షీరసముద్రమును మధిస్తుండగా కూర్మమూర్తి మందర పర్వతమును తన భుజములపై ధరించినప్పుడు గానీ… దేవ రాక్షసుల మధ్య భయంకరమగు సంగ్రామం జరుగుచున్నప్పుడు గానీ… సూర్య - చంద్రమండలములు పడిపోగా ఈ జగత్తులు అత్యంత క్షోభ చెందినప్పుడు గానీ… కాలనేమి భుజస్కంధముల మధ్య చిక్కిన మేరు పర్వతం కొంచెం చలించినప్పుడు గాని… అమృతకలశమును గొనివచ్చుచున్న గరుడుని రెక్కలహోరుకు సిద్ధులు పడిపోవుచున్నప్పుడుగాని… గరుడుడు జన్మించి భూమండలమును జలమయం చేస్తున్న వేళ సంకర్షణ రుద్రుడు సహస్రశీర్షములతో భూమిని దాల్చినపుడు గాని… ఆదిశేషుడు తన వేయి తలలనుండి కల్పాగ్ని జ్వాలలను విరజిమ్ముచున్నప్పుడు గాని… …ఈ కల్పవృక్షం చలించలేదు. మా స్వస్థానంలో యథాతథంగానే ఉన్నాము.
ఓ ఋషిసత్తమా! చెడుచోట్ల ఉండే వారికే ఆపదలు వస్తాయి గాని, అచల స్థానమున ఉండే
మాకు ఆపదలెందుకు కలుగుతాయి?
శ్రీవసిష్ఠమహర్షి : ఓ మహాబుద్ధీ! కల్పాంతవాయువులు వీచి, ఆ ప్రభావంచే సూర్యచంద్రులే గతితప్పుచుండగా….మీరు ఎట్లు చలించకుండా విజ్వరులై ఉన్నారు?
భుశుండుడు : మహర్షీ! ఒక కృతఘ్నుడు కష్టకాలం వచ్చిపడినప్పుడు మిత్రుని త్యజించి ఎచటకో వెళుచున్నాడు చూచారా! ఆ తీరుగా కల్పాంతమున వ్యవహారజగత్తు అదృశ్యమగుచున్నప్పుడు నేను ఈ నీడను త్యజించుచున్నాను. ఆ సమయంలో నేను సర్వకల్పనలూ వీడి, క్రియారహితుడనై ఆకాశంలో ప్రవేశిస్తాను. ద్వాదశాదిత్యులు తమ తాపవేగముచే భూమి యొక్క ఉదరమును ఖండ ఖండితంగా చేస్తున్నప్పుడు ‘నేను వరుణడను’ అను ధారణ చేసి ధీరుడనై, చలించకుండా ఉంటాను. కొండలను పిండి చేస్తూ ప్రళయవాయువులు వీస్తున్నప్పుడు ‘నేను పార్వతీదేవిని’ అను ధారణ చేత ఆకాశంలో చంచలరహితుడనై స్థిరత్వం వహించి ఉంటాను. మేరువు మొదలైన పర్వతములు కరిగి పోవుచూ సర్వ జగత్పదార్థములూ ఏకద్రవంగా మారిపోవుచుండగా నేను వాయువువలె ప్రవహిస్తూ ఉంటాను. స్థూల - సూక్ష్మాది తత్త్వములతో కూడిన బ్రహ్మాండమంతా విలీనమై పోవుచుండగా నేను ‘పరమపదము’న అచలుడనై సుషుప్తునివలె ధారణ అవలంబించి ఉంటున్నాను.
మరల బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేవరకూ అట్లాగే పరమపదమున ధారణను కొనసాగిస్తు న్నాను. తదనంతర సృష్టి ప్రారంభం కాగానే ఈ బ్రహ్మాండమున ఈ కల్పవృక్షంపై గూటిలో ప్రవేశిస్తున్నాను. ఈ విధంగా అనేక కల్పాంతములకు సాక్షినై ఉన్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : అంటే…..మీ స్వకీయమైన ధారణశక్తి చేతనే కల్పాంతములకు కూడా పట్టుబడక, కల్పాంతములందు అఖండితంగా ఉన్నారన్న మాట! అత్యంతాశ్చర్యం!
Page:52
నాదొక చిన్న ప్రశ్న. మీ వంటి ఇతర యోగులు మీ వలెనే ధారణ చేయక, వారు వేరు వేరు అధికార శరీరములను పొందటమో, లేక ముక్తిని ప్రాప్తింపజేసుకోవటమో చేస్తున్నారేమిటి? భుశుండుడు : మీ ఈ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధాన మొక్కటే - పరమేశ్వరుని నియతి అట్టిది! అది అనుల్లంఘనీయం. నేను ఈ తీరుగానూ, నావంటి ధారణసమర్థులగు తదితర యోగులు ఆయా తీరులుగానూ ఉండవలెననునది సర్వాత్మకుని సంకల్పమనుకోవాలి. బ్రహ్మజ్ఞాన ప్రతిపాదక మగు ఒక మహత్తర గ్రంథం కొందరికి మీమాంసా మాత్రంగా. మరికొందరికి స్వస్వరూపజ్ఞాన ప్రసాదితంగా ఎందుకుంటోందో ఎవరం ఏమి చెప్పగలం? ఇదంతా ’భగవత్ సంకల్పమాత్రమైన సృష్టి యొక్క నియతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. ఏది ఎట్లా జరుగవలెనో ఎవరికి నిర్ణయింప శక్యం? ఏది ఎట్లా ఉండవలెనో అది అట్లాగే వెలయుచున్నది. ఇదే ’స్వభావము’ అని ’నియతి’ అని, ‘నిశ్చయం’ అని పిలువబడుతోంది. ఇంతకు మించి ఏ సమాధానమూ నాకు తెలియదు.
ఇక నా విషయం చెప్పమంటారా? ప్రతిసారి నా ప్రాణయోగసాధన కారణంగా ఒనగూడిన సంకల్పవశంచే కల్పాంతప్రళయ సమయంలో ఆకాశంలో ప్రవేశిస్తున్నాను. మరల తదనంతర సృష్టిలో ఇచ్చటికే వచ్చి ఉంటున్నాను.
6 సుదీర్ఘ సృష్టి చమత్కారం
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత దీర్ఘాయువు కలిగి, మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ, యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది, అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తు న్నారు. సర్వమూ కాలయమునకు ‘ఎర’ అగుచుండగా మీరు మాత్రం మీ ధారణా శక్తిచే కాలముచే బంధింపబడకుండా ఉన్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళహృదయా! అనేక విధములగు సృష్టులను, ప్రతిసృష్టులను, సామాన్య ప్రళయములను, అవాంతర ప్రళయములను, మహాప్రళయములను చూచిఉన్నారు కదా! సృష్టులలో ఏఏ ప్రత్యేక విషయములు సందర్భోచితమో… అవి చెప్పమని నా విన్నపం. భుశుండుడు : మహాత్మా! వినండి - ఈ సుమేరుపర్వతం క్రిందగల భూమి అంతా వృక్షములు గాని, గడ్డిగాని, శైలము (Rock) గాని లేక, కేవలం శూన్యంగా ఉండటం చూచాను. భూమి 11000 సంవత్సరాల కాలం భస్మరాశితో నిండి ఉన్నది. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవటం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు. కాలమునకు కొలతబద్ద లేకపోయినా నేను నా విజ్ఞానదృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను.
భూమి సగం పగలు, సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలోని అంతర్భాగంలో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జన శూన్యమైపోయింది.
Page:53
ఒకప్పుడు భూమి అంతా నాలుగు యుగములవరకూ రాక్షసస్త్రీలకు అంతఃపురమైయున్నది. మరొకప్పుడు ఈ జగత్తంతా సముద్రజలంచే ఆక్రమించబడుటచే ఇక త్రిమూర్తులు, మేరు పర్వతం తప్ప మరింకేమీ లేదు. రెండు యుగముల కాలం భూమిపై ఇతర సృష్టి ఏదీలేక, కేవలం వన వృక్షములచే నిబిడీకృతమైయున్నది.
ఒకసారి నాలుగు యుగముల కాలం సృష్టంతా పర్వతములతోనూ, స్థాణువులతోనూ నిండి పోయింది. ఆ సమయంలో జనులకు సస్యవ్యవసాయాది వృత్తులు లేవు. పదివేల ఏండ్లు భూమి చనిపోయిన రాక్షసుల దేహములతో, భీకర మృగములతో నిండిపోయి ఉన్నది.
ఒకసారి అనంత సృష్టిలోని ఏమూల నుండో ఒక గొప్ప ‘కారుచీకటి’ బయలుదేరింది. ఆ గాఢాంధకారం ప్రసరించిన చోట నక్షత్రాలు కూడా అంతర్హితమైపోయాయి. నక్షత్రాలు మటుమాయ మవటం చూసిన విమానచారులగు ఆకాశచరులు భయంతో కేకలు వేస్తూ తమ ఉపాధులు కోల్పోవడం నేను చూచాను.
మరొకసారి వింధ్యపర్వతం గాలిలో లేచి దక్షిణదిక్కును రాళ్లమయంగా చేసివేయటం చూచాను. అప్పుడు ‘వింధ్యపర్వతాన్ని నిరోధించటానికి అగస్త్యమహర్షి లేకపోయారే’ అని నేను అనుకున్నాను.
హే బ్రహ్మాజ్ఞా! ఇట్టివేయగు అనేక విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మీకు పెద్దగా చెప్పవలసిన విషయాలు కాదు. కొన్ని ముఖ్యవిషయాలు చెబుతాను. నేను వందకు మించిన మనువులను చూచాను. నానావిధ కార్యక్రమములతో నిండిన వందలాది చాతుర్యుగములు గాంచాను.
ఏది ఏమైతేనేం? ‘స్వాత్మతత్త్వము’ దృష్ట్యా చూచినప్పుడు విరాట్-బ్రహ్మాండమే కనిపిస్తుంది. సమాహితచిత్తానికి ఈ సర్వమూ ‘నరులు- సురులు’ అనే భేదం కనిపించదు. ‘జీవులు’ అనబడు ప్రకాశాత్మకమగు తేజోపుంజములతో కనిపించే విరాట్ పురుషుడు మాత్రమే గోచరిస్తాడు.
అనేక వైవిధ్యములతో కూడిన ఈ విచిత్ర సృష్టిలో మద్యపానాసక్తులు, నిందిత కర్మిష్ఠులు, దృశ్య ప్రసంగాలతో బ్రతుకులు గడిపే జీవులు ఉన్నారు. వారు ఒక దుఃఖం నుండి మరొక దుఃఖం నకు, ఒక భయం నుండి మరొక భయమునకు ప్రయాణించటం చూస్తూ ఉంటే నా హృదయం కించిత్ ద్రవిస్తుంది. మీవంటి బ్రహ్మజ్ఞానుల వాక్యములు వారు వినకపోవటం నాకు చమత్కారం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రియవర్తనులగు జనులు లేకపోవటంచేత ఒక్కొక్క భూవిభాగం సారహీనమై ఉండటం చూస్తూ ఉంటాను. అయితే, "అంతా మాయయే కదా!”… అని తెలిసి ఉండటం చేత సర్వము పట్ల కృతకృత్య మౌనస్వభావంతో చూస్తూ ఉన్నాను.
ఒక్కొక్కప్పుడు స్త్రీ - పురుష సంయోగం లేకుండానే మానసిక సంకల్పంచే జనించిన భృగువు మొదలైన మహనీయుల జననం చూచాను. అవాంతర ప్రళయం తటస్థించినప్పుడు భూమిపై పర్వతములు, వృక్షములు జీవులు నిర్మూలనమయ్యేవి. అప్పుడు భూమియే నిరుపయోగమయ్యేది. అప్పుడు యోగసిద్ధి పొందిన మానవులు, దేవతలు నాలాగానే ఆకాశమును ఆశ్రయించటం గమనిస్తూ ఉండేవాడిని. ఈ సృష్టి ఒక్కొక్కప్పుడు ఇంద్రుడుగాని, రాజుగాని లేక, ఉత్తమ - మధ్యమ
Page:54
ఇక ఈ సృష్టికి మునుముందటి ఆయా ప్రయత్నములు, భువనత్రయవిభాగం ఏర్పడటం, పర్వతములు రూపు దిద్దుకోవటం, జంబూద్వీప ఆవిర్భావం, వర్ణాశ్రమ ధర్మముల రచన, భూమండల విభాగం, నక్షత్రచక్ర సంస్థాపన, ధ్రువనక్షత్రోదయం, ఈ సూర్యచంద్రుల ఉత్పత్తి…. ఇవన్నీ నిన్న మొన్నటి సంగతులు.
అట్లాగే ఇంద్ర - ఉపేంద్రుల వృత్తాంతం, దేవ దానవ-మనుష్య చక్రవర్తులు నియమించ బడటం, మత్స, కూర్మాది అవతారములు, సముద్ర మథనం, గరుడుని జన్మ, సముద్రాలు ఏర్పడటం ఇవన్నీ ఈ రోజు జరిగిన సంఘటనలవలె నా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నా కన్నా వయస్సులో చిన్నవారు, ఈ కల్పమువారు అగు మీరు చూచినవే కదా!
ఒక కల్పంలో గరుడవాహనుడగు విష్ణువు సృష్టికి యజమాని అయి ఉంటున్నారు. ఇంకొక కల్పంలో హంసవాహనుడగు బ్రహ్మదేవుడు యజమాని. మరొక కల్పంలో వృషభవాహనుడగు ఈశ్వరుడు అంతటికీ యజమాని. ఒక కల్పంలో బ్రహ్మదేవుడైన జీవుడు మరొక కల్పంలో శివుడ గుచున్నాడు. ఏమి ఈ సృష్టి చమత్కారం!
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండమహాశయా! చిత్రవిచిత్రములైన ఈ సృష్టికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు, సంఘటనలు వినాలని అనుకుంటున్నాను.
భుశుండుడు : ఈ సృష్టిలోని అనేక వస్తుజాలములు కాలగర్భంలో కలిసిపోతున్నట్లే, అనేక చిత్ర విచిత్ర సంఘటనలకు నేను సాక్షినై ఉండటం జరిగింది. వాటిలో అనేక సామాన్య విషయాలు నా స్మృతి పథంలో కూడా లేవు. కొన్ని విశేషాలు గుర్తున్నవి చెపుతాను వినండి.
మహనీయులగు మీరు, భరద్వాజుడు, తదితర అనేక మహర్షులు, గణేశుడు, గౌరి, గాయత్రి మొదలైన వారి జన్మవృత్తాంతాలన్నీ నాకు నిన్న మొన్నటి సంఘటనలు. నేనిట్లా చూస్తుండగానే మీకు ఎనిమిది జన్మలు గతించాయి. ఈ ఎనిమిదవ జన్మలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఆ జన్మలన్నీ బ్రహ్మపుత్రుడుగా జరిగినవి కావు. ఒకసారి ఆకాశం నుండి, మరొకసారి జలం నుండి, వాయువు నుండి, అగ్నినుండి, పర్వతాల నుండి జన్మించటం జరిగింది. ఇప్పుడీ వర్తమాన ’సర్గ’ను బోలినవే ఇతఃపూర్వం మూడు చూచాను. అంతకుముందు సర్గలు ఇందుకు భిన్నంగా ఉండేవి.
భూమి నీటిలో మునిగిపోవుచుండగా కూర్మమూర్తిచే ఐదుసార్లు కాపాడబడటం చూచాను. కూర్మ - వరహామూర్తులచే కాకుండా, మరికొందరిచే ఈ భూమియొక్క విధ్వంసనా యత్నములు విఫలం చేయబడటం చూచాను. దేవతలు, రాక్షసులు అమృతం కొరకు సముద్రమథనం చేయటం ఐదుసార్లు నాకు గుర్తున్నది. కొన్ని సర్గలలో పరశురాముడు జన్మించి రాజవంశ నిర్మూలనం
Page:55
చేయగా, మరికొన్ని సర్గలలో అతడు జన్మించటం జరుగలేదు. హరి అనేక కలియుగాలలో బుద్ధుడుగా జన్మించటం నేనెరుగుదును. చంద్రమౌళియగు శివుని యొక్క త్రిపురాసురల సంహారాలు, దక్షయజ్ఞ విధ్వంసములు నా జ్ఞప్తిపథంలో ఉన్నాయి.
ఓ మునీంద్రా! వేరు వేరు యుగములలో వేదములకు సంబంధించిన పఠన - - నియమ నిష్ఠ - బ్రహ్మచర్య - గురుశుశ్రూషాది విధివిధానములు వేరు వేరు రీతులుగా ఉంటున్నాయి. ఒకే కథనం బోధిస్తూ కొన్ని పురాణాలు వివిధ యుగములలో విభిన్న పాఠములు, వ్యాఖ్యలు కలిగి ఉంటున్నాయి. వేదవేత్తలగు వ్యాస వాల్మీకాదులు మరల మరల భారతరామాయణాది ఇతిహాసాలు రచిస్తూ ఉండటం నాకు తెలుసు. ఇప్పుడెక్కడా ఎవ్వరికీ తెలియని ‘అఖండ రామాయణము’ అను లక్ష శ్లోకములలో రచించబడిన ఇతిహాసం గురించి నాకు తెలుసు. ఆ లక్ష శ్లోకములలో జ్ఞానము కరతలామలకం చేయబడింది. ఆ గ్రంథమే ఇప్పుడు వాల్మీకిచే 32000 శ్లోకములలో బోధించబడి కొద్దిమంది శిష్యుల పఠన విషయమై ఉంటోంది. దీనిని మీరు కాలక్రమేణా ఒక సందర్భంలో అవతారమూర్తియగు శ్రీరామచంద్రునికి బోధిస్తారు. ఇప్పటి రామాయణ కథ ఇతఃపూర్వం 11 సార్లు తిరిగి రాయబడింది. అవన్నీ వాల్మీకియో, మరొకరో తిరిగి రాశారు. పూర్వపు అనేకమంది వ్యాసులు రాసిన మహాభారతములు అనేక మార్లు విస్మరించబడి, మరల విరచించబడ్డాయి. 6 మార్లు వ్యాసులో, మరొకరో రాసిన భారతములు విస్మరించబడ్డాయి. ఇప్పుడు 7వ సారి భారతం వ్రాయబడుచున్నది.
పురాణములు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి. పదార్థ సమూహములు కూడా ఎప్పుడూ ఒక్కతీరుగా ఉండటం లేదు. విష్ణుమూర్తి శ్రీరాముడుగా 11 సార్లు అవతారం ఎత్తడం నాకు తెలుసు. శ్రీ నరసింహస్వామి 3 సార్లు అవతారం ఎత్తి మూడు వేర్వేరు యుగాలలో హిరణ్యకశ్యప వధ చేయడం నాకు గుర్తుంది.
హే మునీశ్వరా! ఇంతదాకా ఏదో మీరు ప్రశ్నించారు కాబట్టి నా జ్ఞాపకపేటికలోంచి కొన్ని విశేషాలు చెప్పాను. ఇంతకూ అసలు సత్యమేమిటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా!
భ్రాంతిమయమగు ఈ జగత్తు అస్సలు స్వతఃగా లేనేలేదు. జలముపై బుడగల వలె ఇదంతా క్షణికమే అయి ఉన్నది. సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నవానికి సముద్రజలంలో కెరటాలు వచ్చి పోవుచున్నట్లు అంతరమున గల చైతన్యమునందు అనిత్యములగు ఈ ఈ సృష్టిపరంపరలు చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఈ సర్వమూ సంకల్పమాత్ర భ్రాంతియే కదా. అనేక సృష్టులు ఒకే తీరుగా ఉండటం, అనేక తీరులుగా ఉండటం, సగం ఒకే తీరుగా ఉండటం, ఈ త్రిలోకములు ఏర్పడటం, అందులో జీవులు వచ్చిపోవటం, వివిధ జీవుల కర్మలు–ఇవన్నీ కూడా ఒకే జలంలోని అనేక తరంగములవంటివేనని మీకూ తెలుసుకదా!
ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్రమమంతా విపర్యయం పొందుతోంది. దీని పుట్టుక, ఉనికి, నాశనము తారుమారగుచున్నది. నా బంధువుల, భృత్యుల ఆశ్రమములు వేరు వేరగుచున్నాయి. నా నివాస స్థానం ఒక్కొక్కసారి ఒక్కొక్కచోటికి మారుతూ వస్తోంది. ఒకసారి వింధ్యశృంగముపైన,
Page:56
మరొకసారి సహ్యపర్వతంపైన ఇంకొకసారి మేరు పర్వతంపైనా గూడు మారుచున్నది. ఒకసారి ఎందరో బంధుజనులు నా వెంట ఉండి ఉంటున్నారు. మరొకసారి దీర్ఘకాలం ఒంటరిగా ఉంటున్నాను. ఇట్లు యుగయుగాలుగా, కల్పకల్పాంతాలుగా నేను మాత్రం ఈ తీరుగానే ఉండిపోతున్నాను. దిశలు, అందలి వస్తువులు తారుమారగుచున్నప్పటికీ నేనుమాత్రం ’ప్రత్యభిజ్ఞానబలం’ చేత ఎట్టి మార్పులూలేక, ఆ సర్వమునూ సాక్షీమాత్రుడనై గమనిస్తున్నాను. ఈ జగత్తు, జగత్తులూ అంతా కూడా
సత్-అసత్మయమని, ఆత్మయందు ఉద్భవించుచున్న భ్రమ మాత్రమేననీ నాకు తెలుసు. అందుచేత నా బుద్ధికి ఏ క్షణంలోనూ ఎటువంటి మోహం కలగటం లేదు. ఆత్మయొక్క మాయాశక్తిచేతనే ఈ పదార్ధములన్నీ ఈ విధంగా విజృంభిస్తున్నాయి. దిక్కుల భేదం వలన వ్యవస్థయే మారిపోయినట్లు అనుభవమౌతుంది కదా! అట్లాగే తల్లి-తండ్రి, భార్య-భర్త, అన్న-తమ్ముడు కాలగతి యొక్క మహిమచే మిత్రులు, శత్రువులు కూడా అగుచున్నారు. పురుషులు స్త్రీలుగా అగుచున్నారు. ఆచార వ్యవహారముల నియమ నిబంధనములు మారిపోతున్నాయి.
ఒకొక్కకాలంలో జనులు వేదాలను, వేద నిషేధాలను పూర్తిగా వదిలి చరిస్తున్నారు. ఒక చిన్న రచన, ఒకచిన్న క్రియా విశేషం మొత్తం ఆచార వ్యవహారాలను సమూలంగా మార్చివేసిన సంఘటనలు నా జ్ఞప్తిపథంలో ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై అనేక యుగములు గడుపగా ఈ బ్రహ్మాండమున దేవ రాక్షససమూహములు లేవు. అందుచేత ఇది క్రియారహితమై ఉన్నది.
ఈ నా దీర్ఘజీవితంలో 10కి పైగా మనోమాత్ర నిర్మిత సృష్టులు వేరువేరు నవలల వలె గాంచియున్నాను. ఆ మానసిక సృష్టులలో పంచభూతాత్మికమైన దేహములు లేవు. కేవలం ఊహలే పరస్పరం ప్రవర్తించి సకల అనుభవరూపంగా స్ఫురిస్తూ ఉంటాయి. అనేక దేశ, కాలములతో, ప్రదేశ, - వేషభాషలతో, విచిత్ర కార్యక్రమములతో, పరస్పర విరుద్ధములైన నిర్వచనములతో ఈ సృష్టి అంతా పరిఢవిల్లుతోంది.
8 చాంచల్యరాహిత్యం - అమృతత్వం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ విహంగరాజమా! ఈ బ్రహ్మాండమంతా ఇంత చమత్కారంగా మరల మరల విచలితమగుచున్నది కదా! ఇందలి జీవులు మృత్యువుచే అనేకమార్లు బాధింపబడుచున్నారు. మరి అట్టి మృత్యువు మిమ్ములను మాత్రం సమీపించనేలేదు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? భుశుండుడు : సర్వజ్ఞా! మీకు అంతా తెలుసు. అయినా అడుగుచున్నారు. అయితే, ప్రభువు కోరి నట్లే భృత్యువు నిర్వర్తిస్తాడు కదా! బ్రహ్మవేత్తలగు మీరు ప్రశ్నించారు గనుక మరల విశదీకరించి చెబుతాను. మీ ఆజ్ఞను పాలించుటయే మిమ్ములను ఆరాధించటం కదా!
ఆభరణములేవీ లేనివానికి దొంగలు వచ్చి దొంగిలించగలిగేదేమి ఉంటుంది? అట్లాగే ఎవని హృదయంలో అయితే ‘వాసనా తంతువులు’ అనే దోషం ఉండదో అట్టి వానిని మృత్యువు హింసించ
Page:57
జాలదు. ఎవనికి ఆశాపాశజనితమైన మనోవ్యాధులు ఉండవో, అట్టివానియందు మృత్యువు వచ్చి కలిగించగల మార్పు చేర్పులేమీ ఉండవు. మనస్సు యొక్క చాంచల్యము జయించబడిందా - ఇక ‘నేను క్షయించుచున్నాను’ అను భావన నిరర్థకమై, నిరోధించబడుతోంది.
ఆశయే అన్ని చింతలకూ కారణం. ‘ఆశించుట’ అను జీవునియొక్క అవిజ్ఞానజనిత స్వభావమే మృత్యువుకు విషాగ్నిజ్వాలలు వెడలగ్రక్కగల శక్తిని ప్రసాదిస్తోంది. మనస్సులో ‘ఇది కష్టం- అది కాదు’ అనే తరంగపరంపరలు మొట్టమొదట బయల్వెడలుచున్నాయి. అవి రాగద్వేషములను కల్పన చేస్తున్నాయి. రాగద్వేషములు, లోభగుణమునకు కారణమగుచున్నాయి. లోభం కోపాగ్నులను జనింపజేసి హృదయంలో జ్ఞానజలమును ఆవిరిగా చేసేస్తున్నది. ఎక్కడినుంచో కామము వచ్చి హృదయమును పిప్పి చేసేస్తున్నది.
తత్ఫలితంగా మృత్యువు విలయతాండవం చేయగలుగుతోంది. ఎవరైతే అద్వితీయమును నిర్మలమును, పవిత్రమునగు ఆ పరమపదమును ఆశ్రయిస్తారో… వారియొక్క విశ్రాంతి స్థానమును బాధించగల సమర్థత మృత్యువునకు లేదు. ఈ శరీరం అనే ఉద్యానవనంలో ’మనస్సు’ అనే చంచల స్వభావం గల కోతి సంచరించకపోతే ‘మృత్యువు’ అనే వననాశనం ఎందుకు జరుగుతుంది?
మహాత్మా! ఈ జీవుడు సమాహితచిత్తమును సంపాదిస్తేచాలు, అన్ని రుగ్మతలూ తొలగుతాయి. సంసారదోషమునకు కారణములైన దృశ్య దోషములు సమాహితచిత్తుని ఏమాత్రం బాధించలేవు. ఈ శారీరక మానసిక దోషములు అతని దగ్గరకు వెళ్లలేవు. సమత్వము అనుదానిని అనుభూతిగా చేసుకున్నవానికి ఇక్కడి స్మృతి-విస్మృతులు, జాగ్రత్-స్వప్న సుషుప్తులు ఉండియూ, లేనివే అగుచున్నాయి.
ఎవని హృదయంలో కామక్రోధవికారములు జనింపజేసి, అంధకారమయం చేయగల చింతలు ఉండవో- అట్టివానినే మనం ‘సమాహితచిత్తుడు’ అని పిలుస్తాం. ఎవని కర్మలైతే దానం, ప్రతిగ్రహణం, త్యాగం, యాచన - - మొదలైన దోషములు లేకుండా ఉంటాయో, అతని చిత్తము సమాహితత్వము అవధరిస్తున్నట్లు. ఈ ధనాది ఆర్జనలు, కృషి, నిర్మాణాది కార్యములు, రాగద్వేషాది గుణము, హృదయ భేదకములగు తదితరుల దూషణవాక్యములు, కఠినములగు ఆయా సామాజిక స్థితిగతులు సమాహితచిత్తునిలో ఏ మార్పుదుఃఖము, ఆవేశము, నీరసము మొదలైనవి కల్పించలేవు సరికదా… నదుల జలాలన్నీ సముద్రం కోరకుండానే సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు, మహత్తర గుణములను వెంటబెట్టుకుని లాభజనకములగు సుఖములన్నీ వాటంతట అవే ఆ సమాహిత చిత్తుని సమక్షమునకు చేరుకుంటాయి.
కనుక ‘మృత్యువు అనునది నాపట్ల నిష్క్రియము, నిర్వీర్యము అయిపోవాలి’ అని ఏ జీవుడైనా అనుకుంటే, అతడు తన మనస్సును ముందుగా భోగాభిలాషారహితంగా తీర్చిదిద్దుకోవాలి. భ్రమలన్నీ ఒక్కటొక్కటిగా బయటకు పంపివేయాలి. అప్పుడా మనస్సు తనయందు పారమార్థిక సుఖమునకు చోటు కలిగి ఉంటుంది. క్రమంగా సత్యసంకల్పత్వం సంతరించుకుంటుంది.
Page:58
‘అనేకత్వము’ అనేదే అపవిత్ర దృష్టిపిశాచం ఈ జీవుడు సత్యసంకల్పుడు కావాలంటే -
అనగా, తాను అనుకున్నది పొందాలంటే, ముందుగా ‘ఇక్కడి అనేకత్వము ఉన్నది’ అనే అపవిత్రదృష్టి దరిజేరకుండా చూచుకోవాలి. అప్పుడు మనస్సు పవిత్రమై, పరమపదమున స్వస్థి పొందుతుంది. ఇక మృత్యువు నిష్క్రియం అయిపోగలదు.
మృత్యువుకు అతీతుడు కావాలంటే1. ‘పరిపక్వదశ’ ప్రసాదించగల ధ్యాన - కర్మ - పఠనాది కార్యక్రమములను శ్రద్ధా-ఆసక్తులతో తీవ్రతరం చేసుకోవాలి.
భూతవర్తమానభవిష్యత్తులందు ఏదైతే నిత్యమై, అనంతమై సాధుజన సేవితమై సర్వహితకరమై యున్నదో, అట్టి పదము వైపుగా ఈ మనస్సును ప్రవర్తింపజేయాలి. బుద్ధికి కూడా పరమప్రకాశమై, అమృతసారమై, ఎనలేని, తెంపులేని సుఖప్రదమగు మహాస్థానమునందు మనస్సును సంలగ్నం చేయాలి. అట్టివారి మహత్తర దృష్టియందు మృత్యువుతో సహా ఈ ఎదురుగా కనిపించేదంతా లేనిదే అగుచున్నది.
హే మహర్షీ! దేవతాస్త్రీ సాంగత్యాదులలో కూడిన దివియందుగాని, పర్వత, రాజ్య, సముద్ర, వనములతో కూడిన భూలోకమునందు గాని, నాగ, అసుర కన్యలతో కూడిన పాతాళలోకము నందుగాని నిత్యము, స్థిరము, సుఖము అయినది ఒక్కటి కూడా ఏదీ లేదుకదా! ఈ బ్రహ్మాండ సాగరంలోని మూడు లోకములూ ఆధి వ్యాధులనే తరంగములతో కదులుచూ, దుఃఖములు అనే సుడిగుండములతో, తుచ్చములగు అనేక అల్పాశయక్రియావ్యవహారములతో నిండి ఉన్నాయి. ఇందులో ఎక్కడ నిజమైన సుఖము, శాంతి ఉన్నాయి చెప్పండి? కాస్త హృదయమును సరళం చేసి కొంచెం మనస్సును ఆనందపరచే చిత్తవృత్తులు కూడా ఏమాత్రం స్థిరత్వం కలిగి ఉండుటలేదు కదా! ఇక్కడి సంకల్పవికల్పములేమైనా జీవునకు శాశ్వత శుభమును కలుగజేస్తున్నాయా? లేదు. ఇక ఈ ఇంద్రియసుఖములంటారా? ప్రతిదీ కాస్త సుఖం, గంపెడంత దుఃఖం! అవి మూర్ఖజీవుని అల్పాయుష్షులను తమవైపు ఆకర్షించి అతనిని చివరికి దుఃఖిగాను, రిక్తహస్తునిగాను చేసివేస్తున్నాయే! అవి అందించే విషయసుఖములను సమాహితచిత్తుని విశ్రాంతి, ప్రశాంతతలతో సరిపోల్చగలమా? ఏమాత్రం కుదరదు.
న పరమేకమహీతలరాజతా నచ వరం విబుధామరరూపతా |
నచ వరం ధరణీతలనాగతా స్థితిముపైతి హి యత్ర సతాం మనః ॥ (శ్లో॥ 33, సర్గ 23.) విశ్రాంతి పొందిన సాధువుల మనస్సుతో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలుగా కనిపించే ఏకచ్ఛత్రాధిపత్యముగాని, దేవలోకత్వముగాని, పాతాళరాజ్యాధికారంగాని కించిత్ కూడా తులతూగలేవు.
Page:59
మనస్సు విశ్రాంతి పొందిందా… ఇక, శాస్త్ర పాండిత్యంతోను, వక్తృత్వాది గుణములతోను, కర్మకాండతోను పనేమున్నది? అనుభవైకవేద్యమైనది కరతలామలకమౌతుంది.
అసలు ఆత్మకుస్వభావసిద్ధమే అయి ఉన్న శాంతి దేనిచే బాధించబడుతోంది?…
ఈ దేహము యొక్క వ్యాధులచే నా పని అయిపోతోంది… నాకు స్వర్గ సుఖములు కావాలి… నాకు పతనం అనివార్యం… ఈ దేహమనోబుద్ధులే నా రూపం… ఇటువంటి అల్పభావ పరంపరలే స్వస్వభావమగు శాంతిని పాడుచేస్తున్నాయి.
మూఢునికి మాత్రమే ఈ జగద్విషయాలు మొట్టమొదట బహురమ్యంగా కనిపిస్తున్నాయి. క్రమేణ అవి అతనిని పట్టుకుని మృత్యువుకు ఉపాహారంగా అందజేస్తున్నాయి. మహాత్ములు మాత్రం ఈ ఎదురుగా కనిపించే సర్వమునూ అవలీలగా ఆవలకు నెట్టివేసి ఉంటున్నారు. ‘ఆశ’ అను దానిని దగ్గరకు రానీయకుండా, శాశ్వతసుఖ విశ్రాంతిని తమ సొంతం చేసుకుంటున్నారు. “మృత్యువు దైనందికమైన నిద్ర వంటిదే” అని గ్రహించి జన్మ, జీవన్-మృత్యువులను అధిగమించినట్టి ”తేజోమయ ఆత్మా హందృష్టి" ని అలవరచుకొని ఉంటున్నారు.
భుశుండుడు : హే బ్రహ్మవేత్తా! బాగా వింటున్నారు కదా!
ఏకైవ కేవలా దృష్టిః నిరాపాయా గతభ్రమా విద్యతే సర్వవిత్త్వేషు సర్వశ్రేష్టా సమున్నతా॥
నిజానికి ’భ్రమరహితము-సర్వశ్రేష్ఠము-మహోన్నతము’ అగు “అద్వైతదృష్టి” ఒక్కటే సమస్త జ్ఞానమునకు సమున్నత సత్ఫలమైయున్నది.
ఆత్మచిన్తా సమస్తానాం దుఃఖానాం అన్తకారిణీ
చిర సంభృత దుఃస్వప్న సంసారభ్రమహారిణీ॥
ఈ జీవుడు అనాదికాలం నుండి తనవెంట అవిద్యాకామ్యకర్మలను తెచ్చిపెట్టుకుంటూ ప్రతిజన్మలోనూ పెంచి పోషించుకుంటున్నాడు. ఇప్పుడాతనికి దుఃస్వప్నసంసార భ్రమ నుండి, సర్వ దుఃఖానుభవముల నుండి విముక్తి అత్యంతావశ్యకం. అందుకు సరి అయిన ఔషధం సేవించాలి కదా! ఏమిటా ఔషధం? ఈ సర్వమును, సర్వులనూ ’ఏకాత్మ స్వరూపం’గా దర్శించటమే ఔషధం. అట్టి ’ఆత్మచింతన’ అనునది ప్రశస్తమగు పవిత్రమైన మనస్సునందే ఉదయిస్తోందిగాని, మరెక్కడో కాదు. అయితే స్వల్పత్వం ఆశ్రయించే వారికి దుశ్చింతలు, అనర్థాలు, దుఃఖాలు ఉండనే ఉంటున్నాయి. అవి మొదలంటా వినాశనమైనప్పుడు మాత్రమే స్వస్వరూపాత్మజ్ఞానం అబ్బుతోంది. వెన్నెల వస్తే కారుచీకటి మటుమాయం అవుతుంది కదా! సర్వసంకల్పములు వర్ణించినప్పటి ఆత్మచింతన మనస్సులోని మాయ, భ్రాంతి, మోహము అనే మకిలిని కడిగివేస్తోంది.
Page:60
అయితే ఒక్క విషయం! సర్వసంకల్పములకు సమాధానమై, అత్యంత శ్రేష్ఠమైన ’నిరంతరాత్మ చింతన’ అనేది మీవంటి జ్ఞానసమన్వితులగు మహాత్ములకు అత్యంత సులభమై ఉంటోంది. మాలాటి మందమతుల విషయానికి వస్తే అది సుదుర్లభమే అవుతోంది. మావంటి వారిని మా చేతనే కల్పించుకొనిన అజ్ఞానం ఆవరించి ఉంటోంది. మా సునిశ్చయాలు క్షణంలో స్వల్ప సంఘటనలచే చంచలమౌతున్నాయి.
అయితే ‘నిరంతరాత్మచింతన’ అనే రాణిని మీవలె మేము పొందలేకపోయినప్పటికీ, రాణిగారికి కొందరు ప్రియచెలికత్తెలున్నారు. వారు కూడా ఆమెవలెనే మహాఘనులే. వారు కూడా జ్ఞానచంద్రుని చల్లని కిరణములైయున్నారు. అట్టి ఇష్టసఖులలో ఒక చెలికత్తెను నేను పొందాను. దాని పేరు "ప్రాణచింతన”
ఈ ప్రాణచింతన కూడా సర్వదుఃఖక్షయకారకమే. సౌభాగ్యమును వర్ధిల్లింపజేయగలదు. ఒక జీవుడు జీవించుటకే హేతువగుచున్న ప్రాణచింతన-అనుయోగాభ్యాస మూలముననే నేను చిరంజీవుడనయ్యాను.
శ్రీవసిష్ఠ మహర్షి భుశుండమహాశయా! ముందుగా ‘ప్రాణచింతన’ అంటే ఏమిటో వివరించి చెప్పండి. తద్వారా మీ చిరంజీవత్వము యొక్క రహస్యమును కూడా విశదపరచ ప్రార్థన. భుశుండుడు :
సర్వ వేదాంత వేత్తాసి! సర్వసంశయనాశకః |
మామ్ ఏతత్ పరిహాసార్థం, మునే! పృచ్ఛసి వాయసమ్ ||
స్వామీ! వసిష్ఠమహర్షీ! మీకు వేదాంత శాస్త్రమంతా తెలుసు. ముముక్షువుల అందరి సంశయములనూ మీరు దూరం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదో పరిహాసార్థం ఈ కాకి చేత పలికిస్తున్నారు. అయినప్పటికీ మీవంటి మహనీయులతో ఏర్పడే ఉత్తర ప్రత్యుత్తర సంవాదముచే ఆ విషయమై మరికొంత చక్కగా పునశ్చరణ చేసుకోవటానికో, ఆలోచించుకోవటానికో మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. వినండి చెపుతాను.
పశ్య ఇదం, భగవన్! సర్వం దేహగేహం, మనోరమమ్ |
త్రిప్రకారమహాస్థూణం, నవద్వార సమావృతమ్ || పుర్యష్టకకలత్రేణ, తన్మాత్ర స్వజనేన చ ॥ అహంకార గృహస్థేన సర్వతః పరిపాలితమ్ ||
ప్రకృతిచే ప్రసాదించబడిన అత్యంత రమణీయమైన ఈ దేహమును చూస్తున్నారు కదా! ఈ దేహమనే ఇంటికి ‘వాత-పిత్త- కఫములు’ అనే మూడు స్థంభాలు ఉన్నాయి.
వాతము = వాయువు; పిత్తము = ధాతువులు (పైత్యరసాదులు); కఫము కఫము = = శ్లేష్మము
ఈ దేహమునకు 9 ద్వారాలున్నాయి2 కన్నులు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవులు,
1 నోరు, 1 గుదస్థానము, 1 మర్మాయవము
Page:61
ఈ దేహమనే ఇంటికి యజమాని అహంకారం.
ఈ ఇంటికి గృహిణి ‘పుర్యష్టకం’. పుర్యష్టకం అనగా
జ్ఞానేంద్రియ పంచకం : చెవులు, చర్మము, కళ్లు, నాలుక, ముక్కు,
కర్మేంద్రియ పంచకం : వాక్కు, కాళ్లు, చేతులు, పాయువు, ఉపస్థ
వాయు పంచకం : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. (వాయువు యొక్క వేరు చలన దిశలను అనుసరించి చెప్పబడినవి)
భూతపంచకము : భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము.
అంతఃకరణ చతుష్టయం : మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 6. అవిద్య : ఆత్మదృష్టి నుండి చ్యుతి
కామము : లేనిదేదో ఆశించే స్వభావం. “ఏవో మార్పు చేర్పుల చేత గాని ఆనందం లేదు” అని తలచటం.
కర్మము : క్రియావ్యాసంగము.
పంచతన్మాత్రలే ఆ ఇల్లాలికి సహకరించే పనిమనుషులు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములే ఆ పంచతన్మాత్రలు. వాళ్లు ఈ శరీర గృహము యొక్క బాగోగులు చూస్తున్నారు. మన మనో నేత్రాలకు ఈ శరీర గృహం ఎదురుగా కనిపిస్తోంది కదా!
చెంప ప్రక్కగా ఉన్న చెవులే దీని మిద్దెలు (పై మెట్లు). ‘వెంట్రుకలు’ అనే రెల్లుతో ఈ గృహం కప్పబడి ఉన్నది. ముఖంలోని కళ్లు ద్వారముల వంటివి, రెండు భుజములు శరీర గృహంలోని ఉపమందిరముల వంటివి. బాహ్యమున ఉన్న ఆయావిషయ పరిజ్ఞానాలు, ఈ గృహానికి ద్వార పాలకుల వలె ఉండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల రూపమున వార్తలు లోనికి తేవటం జరుగుతోంది.
ఈ శరీర గృహంలో ‘ఆత్మ’ అనే ఒకానొక వెలుగు ప్రసరిస్తుండుటచేతనే ఇది వర్తిల్లగలుగు తోంది. ఈ గృహయజమానియగు జీవుడు జాగ్రత్తులో ఉన్నప్పుడు వరండాలో పచార్లు చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ శరీరగృహం లోపల రక్త మాంసములనే పేడ నీళ్లచే అలుకబడినట్లుగా ఉంటోంది. బొమికలు అనే కొయ్య చేత, నరములు అనే త్రాళ్ల చేత ఈ శరీరగృహం పడిపోకుండా గట్టిగా నిలచి ఉన్నది.
ఓ మునినాయకా!
ఇడాచ పిఙ్గలాచ అస్య, దేహస్య ముని నాయక |
సుస్థితే కోమలే మధ్యే పార్శ్వకోష్టే నిమీలితే ॥
ఈ దేహము యొక్క మధ్యభాగంలో రెండు కోమలమైన సూక్ష్మనాడులు ఉన్నాయి. శాస్త్రకారులు
వీటికి - 1. ఇడ, 2. పింగళ - - అని పేర్లు పెట్టారు.
Page:62
పద్మయుగ్మత్రయం యస్త్రమ్ అస్థిమాంసమయం మృదు ఊర్ధ్వ-అధోనాలమ్ అన్యోన్యమ్ ఇలత్ కోమల సద్దలమ్ సేకేన వికసత్ పత్రం సకలాకాశచారిణా చలన్తి తస్య పత్రాణి మృదువ్యాప్తిని వాయునా చలత్సు తేషు పత్రేషు స మరుత్ పరివర్ధతే॥ వాతాహతే లతా పత్రజాలే బహిరివాభితః వృద్ధిం నీతః సనాడీషు కృత్వా స్థానమనేకథా ఊర్ధ్వ–అధో వర్తమానాసు దేహే అస్మిన్ ప్రసరత్యథ ప్రాణ-అపాన-సమానాదైః తతః సహృదయానిలః సంకేతైః ప్రోచ్యతే తబ్జెః విచిత్రాచార చేష్టితైః॥
ఈ రెండు నాడులూ అప్రకాశితభావంతో వెలయుచున్నాయి. ఈ రెండు నాడుల మధ్య ఒక స్థానంలో ‘అస్థిమాంస మయము, అతిసున్నితము’ అగు హృదయం ఉన్నది. ఆ హృదయపద్మం యొక్క నాళములు పైకి క్రిందకు వ్యాపించి ఉన్నాయి. హృదయము యొక్క దళములు అత్యంత కోమలంగా, పరస్పర మిళితంగా ఉన్నాయి. అట్టి హృదయ స్థానం నుండి శక్తి బహిర్గతంగా, అంతర్గతంగా ప్రయాణిస్తూ ఉన్నది. అదియే ప్రాణశక్తి, ప్రాణతత్వం.
ఇది ఇట్లా ఉండగా, ప్రాణతత్త్వము ముక్కు చివర నుండి పాదముల వరకు దేహాకాశమున విస్తరించి ఉన్నది. ముక్కు నుండి వాయువు పీల్చబడుతోంది కదా! అలా స్వీకరించబడుచున్న వాయువును ‘అపానవాయువు’ అని అంటారు. అపానవాయువు యొక్క సేచనము (Intake) వలన హృదయ కమలం వికసించటం జరుగుతోంది. (1) స్వీకరించబడుచున్న (2) విడచిపెట్టబడుచున్న వాయువు వలన హృదయ కమలం వికసించటం, ముకుళించటం జరుగుతోంది.
ఈ వాయువులు హృదయముచే ఆకులను కదలించుచుండగా, క్రమంగా వాటి వీచికలు నలుదిక్కులా వ్యాపించి నాడీఛిద్రములందు ప్రవేశించి వృద్ధిపొందుచున్నాయి. అట్లా అభివృద్ధి చెంది దేహమున భిన్నభిన్న స్థానములను కల్పించుకుంటున్నాయి.
ప్రాణవాయు వ్యాపారములు -
అపానవాయువు : అధోముఖముగా ప్రసరిస్తోంది.
వ్యానవాయువు : నాడులు సంకోచింపచేయటం విస్తరింపజేయటానికి పనిచేస్తోంది.
ఉదానవాయువు : ఊర్ధ్వముఖంగా చలిస్తూ ఉంటుంది.
సమానవాయువు : దేహమందలి వివిధ ప్రదేశాల సమానత్వాన్ని నెలకొలుపుతూంటుంది.
సప్రాణవాయువు : మొత్తం చలనమును సుస్థిరీకరిస్తూ ఉంటుంది.
ఈ ఐదు పేర్లు ఒకే ప్రాణవాయువు యొక్క (లేక, ప్రాణశక్తి యొక్క ఊర్ధ్వ, అధోనాడీ
మండలమున ప్రవేశించినప్పటి విభిన్న కృత్యముల పేర్లు సుమా!
Page:63
చంద్రబింబము నుండి కిరణములు వెలువడుచున్నాయి చూచారా? అట్లాగే ప్రాణశక్తి అంతా హృదయము నుండి వెలువడి దేహమధ్యమునకు, ఊర్ధ్వ-అధోభాగములకు వ్యాపిస్తోంది. అట్లు వ్యాపించుచూ నాడీసమూహములో ప్రకాశిస్తోంది. అట్లా ప్రవేశించి ’గమన (పోవటం), ఆగమన (రావటం), కర్షణ (కదల్చటం), హరణ (విభాగించటం), విహరణ (కలపటం), పతన (పడవేయటం), ఉత్థాన (లేపటం) - మొదలైన క్రియలను చేస్తూ ఉంటోంది.
హృదయపద్మము నందలి వాయువును విజ్ఞులు ప్రాణము అని పిలుస్తున్నారు. అట్టి ప్రాణ వాయువు ఈ శరీరమును ఉద్దీపించగల శక్తులన్నీ కలిగియున్నది. ప్రాణవాయువు యొక్క ఒకానొక శక్తి వల్ల కళ్లు కదలుచున్నాయి. మరొక శక్తి వల్ల స్పర్శ గ్రహించబడుతోంది. ఇంకొక శక్తి ముక్కులో ప్రవేశించి ఆఘ్రాణము (Smell) యొక్క అనుభవం కలిగిస్తోంది. వేరొక శక్తి వల్ల అన్నం జీర్ణమగు చున్నది. అట్టి ఒకానొక శక్తి వలన గొంతులోని నాళములు ప్రవర్తించి మాటలు వెలువడుచున్నాయి. ఇంతెందుకు? యంత్ర నిర్మాత ఇచ్ఛానుసారం యంత్రశక్తి యంత్రమును చలింపజేస్తూ వివిధ కార్యములను నిర్వర్తింపజేస్తోంది చూచారా? వాయుదేవుడు ఈ శరీరమునందు ప్రవేశించి వివిధ కార్యములను ఒనర్చుచున్నాడు.
తత్ర ఊర్ధ్వ-అధో ద్విసంకేతౌ ప్రసృతావనితా, మునే! I ప్రాణ-అపానావితిఖ్యాతా ప్రకటౌ ద్వావరానితౌ |
“తయోః అనుసరన్ నిత్యం, మునే! గతిమ్ అహం స్థితః”||
ఓ మునీంద్రా! నా హృదయమున ఊర్ధ్వగమనం నిర్వర్తించే ప్రాణవాయువు. అధోగమనం నిర్వర్తించే అపానవాయువు ప్రకాశ్యభావమున వెలయుచున్నాయి కదా! ఇక నేను, నిత్యముసర్వదా వీటియొక్క గతిని గమనిస్తూ, అనుసరిస్తూ ఉన్నాను.
ఈ ప్రాణాపానములు సదా శీతఉష్ణములై ఆకాశమున తిరుగుచూ ఈ శరీరము అనే యంత్రమును మోయుచుండగా, నేనుమాత్రం నిర్విషయుడనై ఎట్టి శ్రమ పొందక ప్రశాంత స్థితియందు ఏర్పడి ఉంటున్నాను.
ఈ ప్రాణాపానములు హృదయకాశమునకు సూర్యచంద్రుల వంటి అగ్నిసోమ (Hot & Cool) స్వభావయుతమై ఉంటున్నాయి. ఈ శరీరమనే పురమునకు మనస్సు అంగరక్షకుడు. మనస్సు అనే రథమునకు ఈ ప్రాణాపానములు రెండు చక్రములవంటివి. అహంకారమనే రాజుకు రెండు ప్రియమైన గుఱ్ఱములవంటివి.
ఓ బ్రహ్మజ్ఞా! ఇక నేను చేస్తున్నదేమిటో మరికొంత విశదీకరించి చెపుతాను వినండి.
ఈ ప్రాణద్వయం (ప్రాణ అపానములు) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులందు సర్వదా సమభావమున ఈ దేహమునందు వెలయుచున్నాయి కదా! వాటి యొక్క ’గతి’ని అనుసరిస్తూ నేను సుషుప్తునివలె కాలమును గడుపుచున్నాను. వీణతంతువులోని వేయవవంతు ఎంతటి సూక్ష్మంగా ఉంటుందో… అంత సూక్ష్మప్రసరణతో వాటిని అనుసరిస్తూ ఉంటున్నాను.
Page:64
అవిరతగతయోః “గతిః” విదిత్వా హృదిమరుతోరను సృత్య చోదితాం తామ్ । న పు నరిహ హి జాయతే మహాత్మన్, ముదితమనాః పురుషః ప్రణష్టపాశః ॥
ఈ ప్రాణాపానద్వయం సర్వదా హృదయపద్మమున సంచరిస్తున్నాయి. ఇవి అనేక శాస్త్రములచే అనేక పేర్లతో వర్ణించిచెప్పబడినవి.
ఈ వాయుగతులను ఉపాసించే జీవుడు మృత్యుపాశమునుండి వెలువడగలుగుతాడు. పరమానంద లాభమును పొందుతాడు. అతడు మరల జన్మించుట లేదు. అట్టిప్రాణోపాసకు మనస్సు సర్వదా సంతోషముతో నిండినదై సర్వపాశముల నుండి విడివడుచున్నది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! మీరు ప్రాణ అపానముల గతిని అనుసరిస్తూ ఉంటున్నానని అన్నారు కదా! మీ సాధన, సాధ్యముల గురించి మరికొంత వివరించండి. భుశుండుడు : ఉపాధ్యాయుడు అన్నీ తెలిసియే విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉంటారే! జగద్గురువులగు మీరు అన్నీ ఎఱిగి ఉండి కూడా కేవలం వినోదార్థమై ప్రశ్నిస్తున్నారు. అయినా మీ వాక్కు శిరోధార్యం
కదా! వినండి.
పాణో అయమ్ అనిశం, బ్రహ్మమ్! స్పందశక్తిః సదాగతిః | స బాహ్య - అభ్యన్తరే దేహే ప్రాణో అయమ్ ఉపరి స్థితః m
అపానో2పి అనిశం, బ్రహ్మన్! స్పందశక్తిః సదాగతిః | స బాహ్య - అభ్యన్తరే దేహే త్వపానో యమ్ వాక్ స్థితః జాగ్రతః స్వప్నతశ్చైవ ప్రాణాయమో అయమ్ ఉత్తమః ప్రవర్తతే! ||
ఓ బ్రహ్మజ్ఞా ! ఈ దేహమునకు లోపల వెలుపలా కూడా ప్రాణవాయువు తనయొక్క స్పందనశక్తిని ప్రదర్శిస్తూ సంచారం చేస్తోంది. అట్లాగే స్పందన శక్తియుతమైన అపానవాయువు కూడా! జంటగాయకులలో ఒకరు గానం చేస్తూ ఆపుచుండగా మరొకరు అందుకుంటూ ఉంటారు చూచారా? అట్లాగే ఈ ప్రాణ అపానములు జాగ్రత్ - స్వప్న సమయములలో దేహమునకు బాహ్యమున, అంతరమున కూడా ఒకటి నిస్పందనమగుచుండగా రెండవది స్పందన సంతరించు కోవటం జరుగుతోంది. అట్టి ప్రాణ-అపానముల యామమునకు (గతికి) సంబంధించిన జ్ఞానము సంపాదించుకొని ఉండటం జీవునికి పరమశుభప్రదమైయున్నది. ప్రాణాపానముల గతిని అనుసరించి రేచకము - పూరకము - కుంభకము అనే మూడు ప్రాణవాయు స్థితులు ఇటు దేహము యొక్క అంతరమున, అటు దేహమునకు బాహ్యమున నిరంతరం సహజసిద్ధంగా ఏర్పడుచున్నాయి.
Page:65
బాహ్యోన్ముఖత్వం ప్రాణానాం యద్ధృదంబుజకోటరాత్ I స్వయసేనాస్తయత్నానాం తం ధీరా ‘రేచకమ్’ విదుః II
‘హృదయము’ అనే పద్మకోటరం నుండి అప్రయత్నంగానే (స్వాభావికంగా) ప్రాణశక్తి వెలికి వస్తూ ఉంటుంది. అట్టి ‘బాహ్యోన్ముఖత్వము’ అనే అసంకల్పిత చర్యనే ‘రేచకము’ అని విజ్ఞులు పిలుస్తున్నారు.
ద్వాదశాంజుల పర్యంతం బాహ్యమ్ ఆక్రమతాం అధః | ప్రాణానాం అంగసంస్పర్మో యః స ‘పూరక’ ఉచ్యతే ॥ బాహ్యాత్ పరాపతత్య అన్తరపానే యత్నవర్జితః |
యో_యం ప్రపూరణః స్పర్శో విదుస్తమపి ‘పూరకమ్’ ॥
బాహ్యమున (నాసికాగ్రం ముక్కు కొన నుండి 12 అంగుళముల దూరము నుండి ప్రాణము తన స్పందన ప్రారంభించి దేహమును సంస్పర్శించుచూ… ఆ 12 అంగుళాల ప్రదేశమును అపానవాయు రూపంగా (బాహ్యం నుండి అంతరమునకు విడువబడినదిగా) నిండి ఉంటోంది. ఇది అప్రయత్న పూర్వకంగా జరుగుతోంది. ఇది బాహ్యపూరకం.
అట్లాగే నాసిక నుండి అపానవాయువు హృదయం వరకు ప్రాణములు అపాన రూపంగా ప్రవేశించి ఉంటోంది. ఇది అంతరపూరకం. అట్లు యత్నరహితంగా బాహ్య -అంతరములందు ప్రాణవాయువు పూరించి ఉండు స్థితియే “బాహ్య - అభ్యంతర పూరకములు” అని సూచింపబడింది.
అపానే 9 స్తంగతే ప్రాణో యావత్న అభ్యుదితో హృది | తావత్ సా ’కుంభకావస్థా’ యోగిభిర్యానుభూయతే ॥
అటు తరువాత హృదయంలో ప్రవేశించిన అపానవాయువు ఉపశమనం పొందుతోంది. అట్టి సమయంలో హృదయ మధ్యం (అపానవాయువు ఉపశమించి - - ప్రాణవాయువు ఇంకా ఉదయించక) …ప్రాణవాయు రహితమై ఉంటోంది. అట్లు హృదయంలో ప్రాణవాయువు లేనంత వరకు ’కుంభకము’ అని చెప్పబడుతోంది. అట్టి కుంభ స్థితి యోగాభ్యాసము చేత మాత్రమే అనుభూతమౌతోంది.
రేచకః కుంభకశ్చైవ పూరకశ్చ త్రిధాస్థితః అపానస్య ఉదయస్థానే ద్వాదశాన్తాత్ అధోబహిః స్వభావాః సర్వకాలస్థాః సమ్యక్ యత్నవివర్జితాః యే ప్రోక్తా స్ఫారమతిభిఃతాన్ శృణు త్వం, మహామతే!
Page:66
ఈ విధంగా ‘ప్రాణాయామము’ అనునది రేచక పూరక కుంభకములనబడే మూడు విధాలుగా ఒప్పుచున్నది. బాహ్యమున అపాన ప్రారంభ స్థానము నుండి నాసాగ్రము (Nostrils) వరకు గల 12 అంగుళముల ప్రదేశంలో ప్రాణాయామ ప్రక్రియ సాధారణ సమయంలో అసంకల్పితంగా, అప్రయత్నపూర్వకంగా నిరంతరం జరుగుతోంది. అట్లాగే నాసాగ్రం నుండి హృదయప్రదేశం వరకు కూడా నిరంతరం త్రివిధమైన (పూరక కుంభక-రేచకములు) ప్రాణాయామం జరుగుతోంది.
ఓ మహామతీ! నిర్మల బుద్దులగు యోగులు తమ సాధనా సారమగు అనుభవం ఎలా ఉంటోందో వినండి.
కుంభకానుభవం -
ద్వాదశాబ్ధులపర్యన్తాత్ బాహ్యత్ అభ్యుదితః, ప్రభో |
యో వాతఃతస్య తత్రైవ స్వభావాత్ పూరకాదయః ॥
హే ప్రభో! నాసాగ్రం - బాహ్యమున 12 అంగుళముల దూరంలో గల స్థానం …ఈ రెండిటి మధ్య గల 12 అంగుళముల ప్రదేశంలో వెలయు వాయువు నందు రేచక, పూరక, కుంభకము లనే త్రివిధ ప్రాణాయామ ప్రక్రియ నిరంతరం జరిగి పోతున్నదని అనుకున్నాం కదా! మృత్ అన్తరస్థ అనిష్పన్న ఘటవద్యా స్థితిః బహిః | ద్వాదశాబ్ధుల పర్యన్తో నాసాగ్రసమసంముఖీ |
వ్యోమ్ని నిత్యమ్ అపానస్య తం విదుః "కుంభకం” బుధాః ॥
అట్టి ప్రక్రియలో ఆ రెండిటి మధ్య అపానవాయువు ఆకాశము వలె వెలయుచున్నది. బాహ్యమున 12 అం.ల స్థానము వద్ద (At the point at a distance of 12" from Nose) ప్రాణములు అపానవాయువు (Inward Bound air)గా ఇంకనూ రూపుదిద్దుకొనని సమయమొక్కటి ఉన్నది. మట్టి యందు ఇంకను రూపుదిద్దుకొనని కుండయొక్క ఆకారము వలె ప్రాణవాయువునందు అపానత్వము దాగి ఉన్న స్థితి అది. అనగా వాయువు కదులుటకు సిద్ధమై ఇంకా నిశ్చలత్వమును వీడనప్పటి స్థితి. అపానవాయువు యొక్క అప్పటి నిస్పంద స్థితిని ‘బాహ్యకుంభకం’ అంటున్నారు.
అనగా…
బహిరస్తం గతే ప్రాణే యావన్నాపాన ఉద్గతః |
తావత్ పూర్ణం సమావస్థం బహిష్ఠం కుంభకం విదుః ||
.. బహిరస్థమైన ప్రాణము తన చలనమును త్యజించి కూడా ఇంకా అపానత్వము (Reverse motion) అవధరించక ‘సమావస్థ’లో ఉండి ఉన్నంత సమయం… ఆ స్థితి బాహ్యకుంభకం అనిపించు కుంటోంది.
పూరకానుభవం -
బాహ్యోన్ముఖస్య వాయోర్యా నాసికాగ్రావధిర్గతిః ।
తం బాహ్యపూరకం తు ఆద్యం విదుర్ యోగవిదో జనాః ॥
Page:67
నాసాగ్రాదపి నిర్గత్య ద్వాదశాస్త్ర అవధిర్గతిః | యోవా యోస్తం విదుర్దీరా అపరం బాహ్య పూరకమ్ || ద్వాదశాన్తాద్యదుత్థాయ రూపపీ వరతా పరా | అపానస్య బహిష్ఠం తమ్ అపరం పూరకం విదుః ॥
అపానవాయువు చలనము ప్రారంభించి నాసికాగ్రం (ముక్కుపుటలు) చేరుచుండగా ఆ 12 అంగుళముల ప్రదేశంలో బాహ్యపూరకం జరుగుతోంది. ముక్కు పుటల నుండి హృదయ స్థానము వరకు వాయువు ప్రవేశించియున్న సమయంలో అంతరపూరకం జరుగుతోంది.
రేచకానుభవం -
యత్త దన్తర్ముఖత్వంస్యాదపానస్యోదయం వినా |
తం బాహ్య రేచకం విద్యాచిన్యమానమ్ విముక్తిదమ్ ||
బాహ్యమున నిష్పందమగు ప్రాణవాయువు యొక్క స్పందనమునకు సంబంధించిన ప్రయత్నమే బాహ్య రేచకం. అట్లాగే హృదయమున గల ప్రాణవాయువు బయల్వెడలుటకు ఉపక్రమిస్తున్న ప్రయత్నమే అంతర్చకం.
బాహ్య-అభ్యంతర కుంభకాదులను-ప్రాణాపానములస్వభావమును గమనించటం :
బాహ్యానాం, అభ్యంతరాంశ్చ ఏతాన్ కుంభకాదీన్ అనారతమ్ | ప్రాణాపాన స్వభావాంస్తాన్ బుద్ధ్వా భూయో న జాయతే | అష్టావేతే మహాబుద్ధే రాత్రిందివమను స్మృతాః ॥
ఈ బాహ్య-అభ్యంతరీయమునగు ప్రాణ-అపానముల యొక్క కుంభక - రేచక - - పూరకముల అనావృత్త (Non-Moving, Non-Avocative) స్థానములను గ్రహిస్తూ ఉండగలిగిన మహనీయునకు ఇక పునర్జన్మకు కారణములుండవు. అనగా అట్టి జీవుడు పునర్జన్మరహితుడగుచున్నాడు.
నాచే ఈ చెప్పబడుచున్న ‘బాహ్యపూరక కుంభక-రేచకములు, అంతర్పూరక-కుంభక -రేచకములు, బాహ్య-అంతరంగ అనావృత్త స్థితులు’ అనబడే వాయులీయమైన 8 అవస్థలు రాత్రింబవళ్లు బుద్ధిపూర్వకంగా అభ్యసించుచు రాగా, అట్టి జీవునకు తప్పక సులభంగా ముక్తి లభిస్తుంది. అనగా అతడు మనోవృత్తులను క్రమంగా జయించి ’స్థిరత్వము’ను అనుభూతం చేసుకో
గలుగుతాడు.
ఈ దేహవాయువులు అతి చంచలములైనవి సుమా! అయితే, అభ్యాసబలంచేత వాటి చంచలత్వం జాగ్రత్తులోను, స్వప్నంలోను, సుషుప్తిలోను, కదులుచున్నప్పుడు, కదలకుండనప్పుడు అన్ని కాలము లందూ, అన్ని వేళలందూ నిరుద్ధం (control) కాగలవు. అనగా, అవి అభ్యాసవశంగా బుద్ధికి లోబడి ఉండగలవు. బుద్ధిపూర్వకంగా ఈ రేచక - పూరక - కుంభకములను అనుష్ఠించు జీవుని మనస్సు ఆయా భోజనాది కార్యములు ఆచరిస్తున్నప్పటికీ కర్తృత్వశూన్యమై వెలయగలదు.
Page:68
ప్రాణచింతనారతుడగు వాడు అల్పసమయంలోనే దృశ్యవస్తువులను పరిత్యజించి కైవల్యమును పొందుచున్నాడు. ఒక శాకాహారి బాటప్రక్కన పడి ఉన్న చచ్చిన ఎద్దు యొక్క చర్మమాంసములను ఏ విధంగా ఏవగించుకుంటాడో ఆ విధంగా ప్రాణాయామ సాధకుడు విషయాకర్షణలకు స్వభావ సిద్ధంగా దూరంగా ఉంటాడు.
నాచే ఇంతవరకూ వర్ణించబడిన ప్రాణచింతనను అభ్యసించిన అనేకులు కృతబుద్ధులై పొంద వలసిన దానిని పొందారు. సర్వావస్థలందునూ అట్టి ప్రాణదృష్టిని అవలంబించినవారు మరల బంధములను ఆశ్రయించటానికి కారణములుండవు. ప్రాణాపానములను నిరుద్ధం చేసి, తత్త్వజ్ఞానం పొందగలిగినాడు - ఇక అతడు సర్వదా సర్వకార్యములు ఒనర్చుచున్నప్పటికీ తనకు తాను సర్వదా నిర్మల స్వభావముననే వెలయుచున్నాడు. అతడు మోహమును పొందక, సుఖంగా ఉంటున్నాడు.
ప్రాణవాయువు హృత్పద్మదళము నుండి లేచి 12 అంగుళ భాగమువరకు ప్రసరించి నిశ్చలంగా ఉండటమే "ప్రాణము యొక్క అభ్యుదయం.”
అట్టి ద్వాదశాంగుళ స్థాన శేషప్రాంతం (Residual space) నుండి హృదయ పద్మమున ప్రవేశించి నిశ్చలంగా ఉండుటయే "అపాన వాయువు యొక్క అభ్యుదయం.”
ప్రాణవాయువు ద్వాదశాంగుళ పరిమిత శూన్యస్థానమునకు ప్రవహించుచున్నప్పుడు, అదే సమయంలో అపాన వాయువు అదే మార్గం అవలంబించి లోనికి జొచ్చుచూ ఉంటుంది.
ప్రాణవాయువు బహిరాకాశము వైపుకు ఉన్ముఖమై ఒక అగ్నిశిఖవలె, సూర్యకిరణ కాంతివలె ప్రవహించుచుండగా, అపానవాయువు హృదయాకాశము వైపు నీటి వలె క్రిందికి ప్రవహిస్తోంది. చంద్రరూపమున, చంద్రకాంతుల వలె, శీతల ప్రదేశ జలం వలె చల్లబరుస్తోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : మిత్రమా! ఈ ప్రాణా-పానముల గమన లక్షణముల గురించి, వీటికి దేహముతో గల అవినాభావ సంబంధం గురించి మరికొంత వివరించండి.
భుశుండుడు : అంతర్గతమైన ప్రాణవాయువు సూర్యుని లేక అగ్ని రూపమున ఈ శరీరమును పరిపక్వమొనర్చుచూ ఉంటుంది. ప్రాణవాయువు హృదయాకాశమును ముందుగా తప్తమొనర్చి, ఆ తరువాత ముఖాగ్రభాగమును (The outerspace of face) కూడా తప్తమొనర్చుచున్నది.
అపానవాయువో… నిమేష మధ్య కాలంలోనే ముందుగా ముఖాగ్రభాగమును తప్తమొనర్చి ఆ తరువాత హృదయాకాశము వైపుగా కూడా ప్రవహించి నైర్మల్యం చేస్తోంది.
ఎక్కడైతే ప్రాణము అపానమును దాని కళలతో సహా గ్రహిస్తోందో అట్టిది బ్రహ్మస్థానము. ఆ బ్రహ్మపదమును పొందువారు ఇక జగత్మలను పొందరు.
అట్లాగే, అపానము ఎక్కడైతే ప్రాణమును, దాని కళలను గ్రహిస్తుందో అచ్చోటి పరమ పదమును పొందినవారు జన్మరహితులగుచున్నారు.
Page:69
ఓ మునిసత్తమా! ప్రాణవాయువే బహిరంతరాకాశములందు సూర్యుని రూపమున ప్రకాశి స్తోంది. అట్లా ప్రకాశిస్తూ, ఇంతలోనే ఆహ్లాదకరమగు చంద్రరూపమును పొందుతోంది. తిరిగి, తాపయుక్తమును పొందుతోంది. ప్రాణవాయువులు సూర్యత్వమును త్యజించి, చంద్రత్వమును పొందుటకు ముందు ‘ప్రాణాపానములు ఉత్పత్తికి పూర్వసమయం’ అని యోగులు గ్రహిస్తున్నారు. అట్టి పూర్వసంధి సమయంలో ఒకానొక ‘ప్రాణవాయువు లయత్వం పొందిన స్థితి’ ఏర్పడి ఉంటోంది. ఆ స్థితిలో అశరీరత్వము, నిష్క్రియత్వము, నిర్మనస్కము, అప్రమేయత్వము మొదలైన ఆత్మ యొక్క వాస్తవస్వభావములు అనుభూతములౌతున్నాయి. అట్టి అతీతత్వ స్థితిలో ఆ యోగి, లేక సాధకుడు దేశకాలాది సర్వ పరిచ్ఛిన్నములకూ అతీతుడై, అనిర్వచనీయ తేజోరాశి అయి వెలుగొందుచున్నాడు. అనగా, అతడు ఈ మనస్సు-హృదయముల మధ్య ‘ప్రాణాపానముల మధ్యస్తము’ అను సాధన సహాయంతో స్వాధిష్ఠానమగు తన రూపమును గ్రహిస్తున్నాడు. అట్టి స్వస్వరూపమగు పరమాత్మ యొక్క అనుసంధానమును బడసి పునర్జన్మరహితుడగుచున్నాడు.
యోగి తన హృదయంలోనే మధ్యగా ఉదయాస్తమయములు (ప్రాణా-పానముల ఉత్పత్తి, లయం, ఉభయములూ రహితమైన స్థితి), గమనాగమనములు కలిగి తేజోవంతుడగుచున్నాడు. ఎవడు తన యందు మనఃసహితమగు ఆత్మభగవానుని (లేక, ప్రాణయోగ పరిభాషలో చంద్ర సహితుడగు సూర్యుని) గాంచుచున్నాడో… ఆతడే యథార్థ ద్రష్ట. ఈ బయట ఉన్న చీకటి ఉన్నా ఫరవాలేదు. లేకున్నా ఫర్వాలేదు. ఎవ్వడైతే తన హృదయమున ఉన్న అంధకారాన్ని నిర్మూలించు కుంటాడో, ఆతడే ప్రకృతిసిద్ధమగు సిద్ధిని బడసినవాడు. ‘బయట చీకటి తొలగాలి’ అని అనుకుంటే, అప్పుడు జగత్తును ఉద్దేశిస్తున్నట్లే కదా! కానీ ఈ ద్రష్ట దృశ్యము కంటే అత్యంత సూక్ష్ముడు. హృదయంలో అంధకారం క్షీణించిందా, ఇక మరుక్షణమే ఆత్మ అవలోకితమగుచున్నది. ఉదయ అస్తమయముల వంటి ఈ ప్రాణాపాన సమన్వితమగు ప్రాణశక్తి యొక్క ఆరాధన హృదయమున గల పెనుచీకటిని తొలగించుటకు సమర్థమగుచున్నది. ప్రాణతత్త్వమును చక్కగా, బుద్ధిపూర్వకంగా గ్రహించి… అనుకరించు వారికి ముక్తి కరతలామలకమగుచున్నది. అందుచేత శ్రద్ధగా ప్రాణ తత్త్వమును ఆశ్రయించి జ్ఞానసూర్యుని దర్శనం పొందవచ్చు.
అపానము ఎక్కడ అస్తమిస్తోందో, ఆ హృదయ విభాగ స్థానమునందు ప్రాణశక్తి ఉదయించి బహిర్ముఖమగుచున్నది.
ఈ ప్రాణ - అపానముల ఉదయాస్తమయములు ‘నీడ తొలగిన చోట ఎండ రావటం, ఎండ వచ్చే చోట నీడ తొలగటం’ వంటిది. ప్రాణ- అపానాలలో ఒకటి తొలగిన చోట రెండవది ఉత్పన్నమౌతూ ఉంటుంది. మొట్టమొదట ఈ యోగరహస్యాన్ని చక్కగా, సుస్పష్టంగా గ్రహించాలిప్రాణవాయువు అస్తమించగా అపానవాయువు అభ్యుదయస్థితి - బాహ్యకుంభకం అపానవాయువు అస్తమించి ప్రాణవాయువు ఉదయించు స్థితి - అంతఃకుంభకం ఈ బాహ్యకుంభకం గాని, అంతఃకుంభకం గాని, రెండూ గాని అవలంబిస్తూ వస్తే, ఇక అట్టి సాధకునకు శోకమునకు స్థానమే ఉండదు.
Page:70
‘ప్రసరించు ప్రాణమునంతటినీ రేచకం ఒనర్చి, ఇక స్వచ్ఛమగు కుంభకం అభ్యసించగలిగితే సకల మానసిక రుగ్మతలూ తొలగటం ఖాయం.
బాహ్యరేచక కారణమగు ప్రాణవాయువు లోపలికి ప్రవేశించుటను గాంచినవాడు జన్మరహితుడే అవుతాడు. ప్రాణ - అపానములు రెండు విలీనం పొందితే ఇక శాంతాత్మపదం లభ్యం అవుతుంది.
#
బాహ్య అంతర ’కుంభక’రూపమగు అపానము ప్రాణమును గ్రహించటానికి ఉద్యమిస్తు న్నప్పుడు, ఆ సమయంలో చేసే విచారణచే ఈ దేశకాలములు చిన్మాత్రరూపములుగా గ్రహించ బడతాయి. అనగా, ప్రాణము అపానమును హృదయమునందుగాని, వెలుపలగాని గ్రహించటానికి ఉద్యమిస్తున్నప్పుడు, ఆ సమయంలో చేసే విచారణ దేశకాలముల అపరిచ్ఛిన్నత యొక్క అనుభూతికి దారి తీస్తుంది. అప్పుడు దుఃఖరహితపదము సుస్థిరమౌతుంది.
కనుక మహర్షీ! ప్రాణాపానములు రెండు పరస్పరగ్రస్తములైనప్పుడు ఈ సాంసారిక దృష్టికి తారసపడే దేశకాలములు స్వతఃసిద్ధంగానే విలీనం చెందుతాయి.
ప్రతిజీవుడు….ప్రాణవాయువు అస్తమించిన తరువాత అపానవాయువు ఇంకా ఉదయించని స్థితిని రోజంతా పొందుచూనే ఉన్నాడు. దానిని యోగ పరిభాషలో ’అయత్న సిద్ధమగు బాహ్య
కుంభకం’ అని అంటారు.
అయితే నిర్యత్న సిద్ధమగు అంతఃకుంభకమే పరమపదము. “అదియే ఆత్మయొక్క నిశ్చలస్థితిని ఉపాసించటం” అని యోగులు గమనిస్తున్నారు. అదియే విశుద్ధము-పరము అగు చైతన్యము.
ప్రాణాపానముల సూక్ష్మ లయస్థానం - మేము అసిధారగా నిరంతరం ఉపాసిస్తున్న ఆత్మ విషయమై
చెపుతాను… వినండి.
పుష్పంలో సుగంధం ఉన్నట్లు ప్రాణమునకు ఈవలఆవల చిదాత్మ వెలయుచున్నది. అది ప్రాణము కాదు. అపానము కాదు. జలమునందు దాహము యొక్క ఔషధత్వం అంతర్లీనమై ఉన్నట్లు చిదాత్మ ఈ దేహం నందు ఆక్రమించుకొని ఉన్నది. అది సజీవము కాదు. నిర్జీవం కాదు.
ఆ చిదాత్మ ప్రాణలయమునకు సన్నిహితం. ప్రాణచలనములకు దూరస్థం. ప్రాణాపానములకు మధ్యస్థము.
ఆ చిదాత్మ ప్రాణములకే ప్రాణం. జీవమునకు పరమ జీవనము. ఈ దేహం మొత్తం మీద అగ్రగణ్యుడు అతడే. మనస్సు యొక్క మననం… బుద్దియొక్క బోధకం… అహంకారమునకు అహంకారోత్పత్తి కారణం… - ఇదంతా కూడా ఆ చిదాత్మయందు వెలయుచున్నది. అతడే అంతా అయి వెలయుచున్నాడు. ప్రాణ-అపాన అంతర్గతుడై ఉన్నాడు.
అతడు ‘పరంజ్యోతి’ అని, ‘శుద్ధబ్రహ్మపవిత్రమూర్తి’ అని ‘సర్వపాపపావనుడు’ అని విద్వత్కవులు వర్ణించి చెప్పుచున్నారు. అతడే ఈ ‘మనస్సు, బుద్ధి, అహంకారము’ అనే భావనలను పొందుచున్నాడు. అయితే తన యొక్క స్వస్వరూపము నుండి ఏమాత్రం చ్యుతుడు కాకయే వెలుగొందుచున్నాడు.
Page:71
అట్టి నిష్కళంకచిదాత్మమూర్తి, ‘అపానవాయువు అస్తమించక-ప్రాణవాయువు ఉదయించని’ అనిర్వచనీయమైన చోట అత్యంత సుస్పష్టంగా వెలుగొందుచున్నాడు.
అతడు సర్వవ్యాపకుడు అయి ఉండి కూడా ప్రాణాపానముల మధ్య నాసాగ్ర - ఆకాశప్రదేశంలో దృఢానుభూతిని ప్రసాదిస్తున్నాడు. ఎక్కడైతే ప్రాణాపానములు అస్తమించి, మరల ఉదయించక ఉంటున్నాయో ఆ తావు ఆ చిదాత్మయే.
బాహ్య అభ్యంతరీయములగు ప్రాణఅపానముల ఉత్పత్తి స్థానము, యోగము యొక్క ప్రారంభప్రదేశం, యోగి యొక్క అంతిమ లక్ష్యము అదే. జీవుడు ఈ ‘ప్రాణ-అపానములు’ అనే రథాన్ని అధిరోహించి ఉంటున్నాడు. ప్రాణాపానములకు అతడే శక్తి అయి ఉండి, అల్పమేధస్కులకు పరిఛిన్నుని వలె తోచుచున్నాడు. ప్రాణాపానములవలె తోచుశక్తి ఆతడే. 1. హృదయమున ‘ప్రాణవాయుకుంభకం’ గాను, 2. బయట ‘అపానవాయుకుంభకం’గాను, 3. బయటనుండి లోపలికి ’పూరకం’గాను ఆయా భావములందు ఆతడే వివర్తమొందుచున్నాడు.
అంతేకాదు ఆతడు… ప్రాణాపాన పరిచారకుడై,… అద్దాని అస్థిత్వబోధకుడై, …ప్రాణోపాసన అభ్యాసమునకు లభ్యుడై, …రూపహీనుడై, …జాజ్వల్యమానంగా వెలుగొందుచున్నాడు.
ప్రాణస్పంద హేతువు అతడే సుమా! ప్రాణములు శక్తిస్వరూపమైతే, ఇక, ఆత్మభగవానుడు… ‘ఆ శక్తి ఎవరిదో’…ఆతడు సుమా! ఇంద్రియ విషయ స్పర్శ కారణము, విషయానందములకు కల కారణము అతడే.
హే మహర్షీ! ఎవ్వనియందైతే ఈ విభేదనావిభాగ కళంకం ఏమాత్రం లేదో, నిజానికి ఈ కల్పనా సమూహములన్నీ ఎవని నాశ్రయించుకుని ఉన్నాయో, ఎవని వైభవము స్వానుభవమే అయి ఉన్నదో- ఆ సకల దేవతావందితుడు, సర్వశ్రేష్ఠుడు అగు పరమాత్మను మేము ప్రాణ సశాంతస్థాన సేవనం ద్వారా ఉపాసిస్తున్నాం. నిరంతరం శరణు వేడుతూ తరిస్తున్నాం. జగత్తులోని నా రూపం ‘జీవాత్మ’ ఈ ’జీవుడు’ అనుజగన్నాటకంలోని జగత్తులోని నా పాత్రకు ఆధారమైనదే నా “పరమాత్మ రూపం”. జీవాత్మచే ప్రాణోపాసన ద్వారా పరమాత్మను ఉపాసిస్తున్నాం. ఇదే మా ’చిరంజీవము’ యొక్క మర్మగర్భ రహస్యం.
భుశుండుడు :
ఏషాహి చిత్తవిశ్రాంతిః మయా ప్రాణసమాధినా ॥
క్రమేణానేన సంప్రాప్తా స్వయమాత్మని నిర్మలే ॥ ||
నేను ప్రాణములను దిగ్విజయంగా సమాధానపరచాను. చిత్తమున విశ్రాంతి పొంది క్రమముగా నిర్మలాత్మ స్వరూపుడనయ్యాను.
Page:72
శ్రీవసిష్ఠ మహర్షి : అనగా, మీరు ఉద్దేశపూర్వకంగా ప్రాణాపానములను అవలంబిస్తూ ఉన్నారా? భుశుండుడు : ప్రాణాపానములకు అంతర్గతమైనయున్న చిదాత్మను అవలంబిస్తున్నాను. అందుచేత… ఒక ప్రక్క ఆ మేరు పర్వతం చలిస్తున్న సమయంలో కూడా నేను కించితూడా, ఒక అరనిమిషం కూడా చలించటం లేదు. కూర్చున్నప్పుడు, నిలబడేటప్పుడు, నడుస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు ఈ నా ‘ఆత్మసమాధి’ చెదురుటయే లేదు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తులో నిత్య-అనిత్యాలైన ఇష్ట-అయిష్టాలైన, సుఖ దుఃఖ కారకాలైన ఆయా విషయాలు వచ్చిపోతూ ఉండటం సహజం కదా! ఆ సమయంలో మీ అభ్యాసమెలా ఉంటోంది? భుశుండుడు : ఆ సమయంలో అంతర్ముఖుడనై స్ఫటిక స్వచ్ఛ భావమగు ఆత్మయందు వెలసి ఉండటం చేత అవన్నీ స్పందింపజాలకున్నాయి.
వాయువు నిరోధింపబడిన నిరోధింపబడుగాక! ప్రబల నదీప్రవాహం అడ్డగించబడిన అడ్డగించ బడుగాక! నేను ఆత్మసమాధి విరుద్ధములగు ఏ విషయములనూ ఏమాత్రం స్మరించటమే లేదు. నాయొక్క దృశ్యవిషయ స్మరణరాహిత్యబలం చేత ఇక్కడ ఏవీ కూడా నా ఆత్మ సమాధికి విఘ్నం కలిగించ లేకున్నాయి.
హే మహర్షీ! ఈ ప్రాణ - అపానగతులను అనుసరిస్తూనే అంతరంగుడు, బహిర్నిలయుడు కూడా అయిన పరమాత్మను దర్శిస్తూ ఉండటంచేత అత్యంత స్వభావసిద్ధంగా సర్వశోకవిషయములకు అతీతుడనై ఉంటున్నాను. ఉత్తమోత్తమ పదమును అలంకరించి ఉన్నాను. ధీరస్వభావుడనై మహా ప్రళయం మొదలుకొని అసంఖ్యాకజీవులు కాలప్రవాహంలో మునగటం, తేలటం సాక్షీభావంగా దర్శిస్తూ వస్తున్నాను. ధీరోదాత్తుడనై, చిరంజీవుడనై ఇక్కడే వెలయుచున్నాను. సర్వఫలేచ్ఛలను జయించివేశాను. దేని పట్లా ఎట్టి అభిమానమూ లేకుండానే ఆయా ప్రాప్తములైన కర్మలు నిర్వర్తిస్తూ ప్రపంచం పట్ల సుషుప్తునిలాగానూ, అనుభవం విషయంలో ‘కేవలీస్వభావం”తోనూ ఉండి ఉంటున్నాను. ‘ఇది ఇష్టం, ఇది కాదు…ఇది గ్రహించాలి. ఇది త్యజించాలి’ అనే చింతలన్నీ ఆత్మదర్శనదృష్టిచే అత్యంత స్వల్పమైనవిగా గాంచుచున్నాను. కేవలం పరమాత్మయందే వెలయుచుండుటచే రాగము లేదు. మనోరాగ (జాడ్య) రహితమగుటచే చిరంజీవినయ్యాను. ప్రాణాపానసమయోగసమయంలో నిర్వర్తించే ‘సమనుస్మరణ’ యొక్క ప్రభావముచేతనే నాకు కేవలాత్మానుభవసంతుష్టియందు ప్రవేశం లభించింది. ’ఇది పొందాను; అది పొందలేదు; ఇక ఇది పొందుతానో, లేదో…?’ మొదలగు చింతలు దరిజేరనీయకపోవటమే నా చిరంజీవత్వము యొక్క రహస్యం.
నా విషయం గాని, పరుల విషయం గాని, దేనినీ… ఎన్నడూ స్తుతించటం లేదు, నిందించటం లేదు. అందుచేతనే ఇట్టి మహత్ శుభమును పొందగలిగాను. శుభములకు పొంగటం, అశుభములకు క్రుంగటం… ఇదంతా స్వల్పత్వాన్ని తెచ్చిపెట్టుకోవటమే కదా! ఆ రెండిటి విషయంలోనూ సంతోష దుఃఖములను అనుసరించకుండా యథాతథంగా నేను ప్రాణాపానములను ఆశ్రయించటం కొన సాగించటం చేతనే చిరంజీవత్వం నాకు స్వభావసిద్ధమవుతోంది. సర్వ ద్వైతబాధ లక్షణములను
Page:73
త్యజించిన వాడనై ‘పరమ త్యాగము’ అవలంబించి సర్వమునూ సర్వదా త్యజించి ఉన్నాను. అందుచేత ఏర్పడిన బుద్ధిబలంచేత జీవితాభినివేశమనతగు మరణమును కూడా త్యజించివేశాను.
ప్రాణానుకరణ బలం చేత నా మనస్సు చాపల్యరహితమై శోకహీనమై క్రమంగా స్వస్థతను, సమాహితస్థితిని పొందింది. ఆకాశమువలె కాష్టమును, స్త్రీని, కొండను, గడ్డిపరకను ఒకే స్పందనతో గాంచుచున్నాను.
“ఈ రోజు ఏంచేశాను? రేపు ఏంచేయాలి?“ అనే చింతన నాకు లేదు. ఈ శరీరానికి సంబంధించిన హాని-వృద్ధులతో నేను సంబంధం పెట్టుకోవటం లేదు. “ఇతడు మిత్రుడు, అతను కాదు, ఇతను మాకంటే వేరు, వీళ్లు అయినవాళ్లు, వాళ్లు కాని వారు” - అనే క్రీనీడ దరి జేరకుండా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానాగ్నిని ప్రజ్వరిల్లజేయుచున్నాను. “చైతన్యభగవానుడగు నేనే నానాత్వముగా కూడా ఏర్పడి, తద్వారా నాకు కనిపించేదంతా అయి ఉన్నాను. కనుక నాకు వేరైన నానాత్వం ఎక్కడా లేదు. ఉండదు” - అను అచ్యుత భావన సృష్టీకరించుకొని ఉంటున్నాను. ప్రాణ-అపానముల మధ్య నిత్యతృప్త స్వభావంచే వెలసి ఉండటం చేత ‘ఈ దేహమే నేను’ అనే అభిమానం నాకు కలగటమే లేదు.
గాఢ నిద్రపోయేవాని దృష్టిలో ఈ జగత్తు మొదలంటా ’లేనిది’గా అవుతుంది. చూచారా? అట్లాగే సర్వకర్మల ఆరంభదశనుండి ‘ఈ జగత్తు లేదు’ అని గ్రహించియే ఉంటున్నాను. ఆయా కాలములందు వచ్చి వెళ్లే అర్థానర్థములను ఈ కుడి-ఎడమ చేతులను చూస్తున్నట్లు సమానభావముతో గాంచుచున్నాను.
‘స్వరూపచ్యుతి’ లేనట్టి ‘స్థైర్యశక్తి’తో ఇతరుల పట్ల సర్వభూతాత్మభావన కలిగినవాడనై చూస్తున్నాను. స్నేహమయమైన మనోదృష్టులతో అంతటినీ ఋజువుగా (Straight forwardly), అకుటిలముగా (Non viciously) దర్శిస్తున్నాను. ఈ శరీరం మీద, తల నుండి క్రింద పాదములవరకు - ఎచ్చటా, దేని మీదా కొంచెం కూడా అభిమానం లేదు. ‘అహంకారం’ అనే బురదను ‘ప్రాణాపానముల సంధి’ అనే జలంతో పరిశుభ్రపరిచి స్వస్థుడనై ఉన్నాను. అభిమాన శూన్యుడనై ఉండటం చేత ఏది శారీరకంగా ఈ ఈ కార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ మనస్సు మాత్రం నిత్య నిర్మల నైష్కర్మ్య సిద్ధిని బడసింది. ఎప్పుడైనా ఏదైనా నూతన విషయం కొంచెం తారసపడినప్పుడు నా మనస్సు ‘ప్రాణాతీత - అలౌకిక - - అనిర్వచనీయ చిదాత్మోపాసన’ వలన గర్వదోష రహితమై ప్రవర్తిస్తోంది.
ఇతరులను పరాభవించే సందర్భము, సామర్థ్యము ఏర్పడినప్పుడు కూడా నేను ఇతరులను పరాభవించను. నా బుద్ధి స్థిరత్వం పొంది ఉండటం చేత ఒకవేళ ఇతరులు పరాభవిస్తున్నప్పటికీ నాకు దుఃఖలేశం కూడా కలగటం లేదు. సర్వభూతములందున్న చిదాత్మను సదా దర్శిస్తూ ఉండటం చేత సర్వసమదర్శినై సర్వత్రా ఏర్పడి ఉండగలుగుచున్నాను.
అందుచేతనే నేను చిరామయజీవిని. సర్వదా సమాహితుడనై ఉంటూ, ఇక ఆశాపాశజనితమగు చిత్తవృత్తులను హృదయంలోనికి జొరనివ్వటం లేదు.
Page:74
బహిర్విషయములందు మౌనం వహించి వాటినన్నిటినీ అసత్తుగా గాంచుచున్నాను. ఆత్మ విషయము నందు అనుక్షణం ప్రబుద్ధుడనై ఈ చేతులను చూస్తున్నట్లుగా దాని సత్తను గాంచుచున్నాను.
పరుల కష్టసుఖముల పట్ల అవి నాకే అబ్బినట్లు దుఃఖించుచు, సుఖించుచున్నాను. అందరికీ నేను ప్రియుడనే.
ఆపదల పట్ల నిర్లిప్తుడనై అచలుడనై, ధీరుడనై ఉన్నాను. ‘అయ్యా! భుశుండా! నీవు జగన్మిత్రుడవయ్యా’ అని నాకు నేను సర్వదా గుర్తు చేసుకుంటున్నాను. ఈ సంపదల హెచ్చుతగ్గులు నేను పొందటం లేదు. నేను నేను గాను. నాకు ‘నా’ అనువారు ఎవరూ లేరు. నేను ఎవరికీ చెందను. నాకు ఎవరూ చెందరు. …అయినా కూడా ఈ దృశ్యమాన జగత్తంతా నేనే!
“నేనే దేశ కాలములను విభజిస్తున్న ఆకాశమును” - అనే సమాధానము సంపాదించుకున్నాను. ‘అంతయూ నిండియున్న అద్వితీయుడను’ అను ఆత్మాహంకారబుద్ధి నాయందు అణువణువునా ఏర్పడి ఉన్నది. ప్రాణాపానముల లయస్థానంలో నన్ను నేను ప్రతిక్షేపించుకొని ఈ తదితరమంతా దర్శిస్తున్నప్పుడు ‘ఇక్కడ కనబడే మట్టి - మట్టికుండ, కొయ్య - శకటము’ ఇవన్నీ ’చిత్’గా అత్యంత స్పష్టమై నాకు గోచరిస్తున్నాయి.
అట్టి దృష్టిబలం చేత నేను అనామయ చిరంజీవత్వం పొందాను. ఈ పాంచభౌతిక దేహంతో ‘భుశుండవాయసము’ అని ఒక ప్రక్క పిలువబడుతూనే, ఇక్కడ ఉండి ‘బ్రహ్మసాగరంలో తరంగములు’ అనతగ్గ ఈ త్రిలోకముల జన్మ-స్థితి-లయములకు మూలస్థానంగా నన్ను నేను గాంచుచున్నాను.
ఈ జగత్తులన్నీ ఉత్పత్తి అగుచున్నదెక్కడ? ఇవన్నీ భావనయొక్క ఘాత - ప్రతిఘాతములే అని నేను గ్రహించాను. "సర్వసాక్షియగు ఆత్మయందే మనోబుద్ధులను ఆశ్రయించి ఈ జగత్తులు ఉత్పత్తి - పతనములను పొందుచున్నాయి’ అని గమనిస్తున్నాను.
12 వీడ్కోలు
భుశుండుడు : హే మహర్షీ! ప్రాణాపానముల మధ్యస్థమగు అనుభవయోగముచే నేను ఎట్లా చిరంజీవుడనైనానో చెప్పాను. మీ యొక్క దర్శనముచే ఆత్మజ్ఞానానుభవం పొంగిపొరలుతోంది. అందుకే జ్ఞానసాగరస్వరూపులుగు మీముందు స్వతంత్రించి నా ఆత్మానుభవమును వర్ణించాను. శ్రీవసిష్ఠ మహర్షి : హే భగవంతుడా! భుశుండా! మీరు చెప్పిన వాక్యముల వెనుక దాగిన మహత్తర తత్త్వాన్ని చూచి నేను ఆశ్చర్యపడుచున్నాను. మీరు మహాత్ములు. చిరంజీవులు. ద్వితీయ బ్రహ్మ వలె వెలుగొందే మిమ్ములను దర్శించే మహద్భాగ్యం ఈ రోజు నా కబ్బింది. ధన్యుడను. హే ప్రభూ! పావనమొనర్చ గల అఖండితమగు ఆత్మైక్యవాక్యాలు మీరిప్పుడు పలికారు.
Page:75
నేను దేవతల ఐశ్వర్యములను, విద్వాంసుల జ్ఞానసంపదను చూచాను. మిమ్ములతో పోల్చగల తత్త్వజ్ఞాన సంపన్నులు చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. మీవంటి పూర్ణతప్తస్వరూపులు తారసబడటం అత్యంత దుర్లభమని నేను ఘంటాపథంగా చెప్పగలను.
అనేక ముత్యపు చిప్పలు వెతికిన తరువాత ఎక్కడో ఒకచోట అత్యంత విలువైన ముత్యం గల ముత్యపుచిప్ప కనుగొనినట్లు మీ దర్శనం ఈ రోజు లభించింది. ముక్తపురుషులు, పుణ్యాత్ములు అగు మీతో సంభాషించటం ఒక మహత్తర యోగసాధనా ఫలంగా నేను భావిస్తున్నాను.
ఇక నాకు సెలవు ఇప్పించ ప్రార్థన. మధ్యాహ్న కృత్యములు ఆచరించటానికై స్వగృహమైన సప్తఋషి మండలం జేరవలసియున్నది.
అప్పుడు భుశుండుడు తాను ఆసీనుడై ఉన్న వృక్షం నుండి నా ముందుకు వచ్చి నిలిచారు. సంకల్ప కల్పితమైన రెండుచేతులతో పువ్వులు కోసి నాకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు. ఆకాశ మున పయనమై వెళ్లుచున్న నన్ను సాగనంపుతూ ఆమడదూరం ఎగురుతూ వచ్చి అనుజ్ఞను పొంది వెనుతిరిగారు. సాగరంలో తరంగం అదృశ్యమైనట్లు నేను అక్కడ నుండి అదృశ్యుడనై నిజాశ్రమం జేరాను. సాధుజన సంగమం ఎంతటి మధురమైనదో, ఆనందప్రదమైనదో చెప్పటానికి నాకు మాటలు చాలవు.
ఓ రాఘవా! ఈ సంఘటన కృతయుగారంభంలో 200 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగింది. ఇప్పుడు త్రేతాయుగం వచ్చింది 4000 ఏళ్లు గడచిన తరువాత నీవు జన్మించావు. భుశుండుడు ఆ కొండపైనే అజరారూపంలో ఉండి ఉన్నాడు.
విన్నావు కదా రామా! భుశుండుని కథలోని అంతరంగ కథనాన్ని గ్రహించి నీవు నీ ఉచిత అనుచితములను నిర్ణయించుకో. ఈ కథనం పఠించినవాడు జరామరణముల పట్ల భ్రాంతి తొలగి అసత్యమగు మాయను సత్వరం దాటివేయ గలడు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భుశుండుని వృత్తాంతం విన్నావు కదా! ఆతడు ప్రాణాభ్యాస పూర్వకంగా ప్రాణనియామకదృష్టిని అవలంబించి ’జ్ఞానయోగం’ నిరంతరం ఆశ్రయించి ఉంటున్నాడు. తత్ఫలితంగా బ్రహ్మపదమును పొంది ఉన్నాడు. నీవు కూడా అభ్యాస - వైరాగ్యములను ఆశ్రయిస్తే ఆతడు పొందిన స్థితి తప్పకుండా పొందగలవు. నిర్లిప్తబుద్ధితో ప్రాణాపానములను అభ్యసించే వారికి చిదాత్మైక్యభావం చాలా సులువుగా లభిస్తోంది.
ఇప్పుడు నీకు రెండు విజ్ఞాన దృష్టుల గురించి చెప్పటం జరిగింది - 1. ప్రాణ నిరోధము, 2.జ్ఞాన విచారణ… ఈ రెండిటిలో నీకు ఏది నచ్చితే ఆ మార్గంలో ప్రయత్నించు. లేదా, రెండింటినీ మేళవిస్తూ నీ సాధన కొనసాగించు. అతి త్వరలో ఆత్మైక్యానుభవం నీ ముంగిట వచ్చి వాలగలదు.
Page:76
శ్రీరాముడు : ఓ భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మీరు భూలోకసూర్యులై జ్ఞాన కిరణములను ప్రసరింపజేసి మా ఆత్మ స్వరూపమును కప్పిపెట్టి ఉంచే హృదయాంధకారమును పటాపంచలు చేస్తున్నారు… ఇక మేము ప్రబుద్ధులమై, ప్రవిష్టులమై స్వస్వరూపమున ప్రవేశిస్తున్నాం. అపర వసిష్ఠులవలె వెలయుచున్నాం.
మీరు ఇప్పుడు అలౌకిక ఆనందప్రాప్తికి కారణముగల భుశుండుని విశేషాలు చెప్పారు. ప్రాణాపానముల ‘గతి’ని వివరిస్తూ ఈ అస్థి - చర్మ నిర్మితమగు ఈ శరీరం గురించి కొన్ని సూక్ష్మతరమైన విషయాలు చెప్పారు.
అయితే స్వామీ!… అసలు ఈ శరీరం ఎట్లా నిర్మించబడింది? ఇది ఎటు నుండి ఇక్కడకు వస్తోంది? ఇది ఎట్లా స్థితి కలిగి ఉంటోంది? ఇందులో నివసించేవాడు మరెక్కడి నుండి వచ్చి ఇక్కడికి చేరాడు? ఈ శరీరానికి - శరీరికి సంబంధం కలగటానికి కారకులగుచున్నదెవరు?… ఈ విషయాలు విశదీకరించమని నా ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : నీ ప్రశ్నలకు ఏదైతే సమాధానమైయున్నదో… అయ్యది పరమార్థతత్త్వాన్ని చక్కగా గ్రహించటానికి, దోషములన్నీ దూరీకరించటానికి మనకు ఉపకరించగలదు. నీ ప్రశ్నలకు సమాధానం విను.
అస్థి-చర్మయుతమై, రక్త మాంస విలేపితమగు ఈ శరీర గృహం ఎవరూ నిర్మించి ఉండలేదు. జీవుని శ్వాస వలె, వాయువు యొక్క చలనములాగా, నది యొక్క ప్రవాహం వంటిదై కన్పట్టు ఈ శరీరం "ప్రవాహపతితంగా, కాకతాళీయంగా” ఏర్పడుతోంది. జలంలో ప్రతిబింబించే చంద్రుని లాగా ఈ దేహచమత్కారం ఒక ’అలీకము (Illusion) లేక “అభాస” మాత్రమే. చంద్రుడు జలంలో ప్రతిబింబించటానికో, లేక దృశ్యము దర్పణంతో ప్రతిబింబించటానికో ఒక కర్త కావాలా? అక్కర్లేదు కదా! మిథ్యామయమగు ఈ శరీరం కూడా ప్రతిబింబిత చంద్రుని లాగా ’సత్-అసత్’రూపమై వెలయుచున్నది. దీని కర్తృత్వం ఎవ్వరికీ ఆపాదించలేం!
వస్తుతః ఆకాశంలో ఒక్క చంద్రుడు మాత్రమే ఉన్నప్పటికీ మెల్లకన్ను గలవానికి భ్రాంతి చేత రెండు-మూడు చంద్రులు ఉన్నట్లు అగుపడుతుంది. చూచావా? ఈ శరీరం కూడా అట్లే అగబడుచున్నది. ఇది స్వతఃగా లేదు. కాని దేహభ్రాంతి ఉన్నవానికి ఇది ఉన్నట్లే అగపడుతోంది. అందుచేతనే ‘ఇది సదసదాత్మకం’ అని విజ్ఞులు వర్ణించి చెప్పుచున్నారు. ఒక విధంగా ఉన్నది, మరొక విధంగా లేదు.
స్వప్నము వాస్తవానికి మిథ్యయే కదా! నీటి కంటే వేరుగా నీటిబుడగ ఉన్నదా?… అయినప్పటికీ అవి వేరు వేరుగా కనిపిస్తున్నాయి. నీటి బుడగ అనేది ఆకారం దృష్ట్యా మాత్రమే అయినప్పటికీ నీటి దృష్ట్యా అసత్యమే కదా!
అట్లాగే ఆకారాదుల దృష్ట్యా ఈ దేహము సత్యమువలె అనిపిస్తున్నప్పటికీ, ఆత్మదృష్ట్యా ఈ దేహము మిథ్యయే అని గ్రహించు.
Page:77
ప్రతిభాస కారణంగా ఎడారిలో ఎండమావులు కనిపించి అమాయక జీవులకు జలభ్రాంతిని కల్పిస్తున్నాయి. అదే, అనుభవముగలవానికి, లేదా, దగ్గరకు పోయి చూచినవానికో ‘ఇక్కడ జలము ఉండదు. తరంగాలూ ఉండవు’ అని తెలిసిపోతోంది. అట్లాగే అల్పజ్ఞానానుభవం ఆవరించి ఉన్నప్పుడు శరీరము యొక్క ఉనికి ఘనీభూతమై ఉంటోంది. ఆత్మబోధచే, “ఈ శరీరము-దీనిచే ఏర్పడే అనుభవజ్ఞానం అసత్ మాత్రమే’ అని తెలియవస్తోంది. ’అభాసమాత్రమే’ అగు ఈ శరీరము ప్రముఖమైనట్లు, దీని అనుభవమును గాంచుచున్న ఆత్మవస్తువు శరీరముకంటే ప్రత్యేకము, ఉత్కృష్టము, అసంబంధితము అయికూడా అముఖ్యమైనట్లు భ్రమ ఏర్పడి ఉంటోంది.
శ్రీరాముడు : ఈ శరీరము ఆత్మకు ఏర్పడటానికి అసలు కారణం?
శ్రీవసిష్ఠ మహర్షి : ’నేను ఈ శరీరమును’ అను రూపంలో గల ఆత్మయొక్క చమత్కారమైన స్వయంకృత సుదృఢభావనావేగమే శరీరము యొక్క అనివార్య భ్రమకు కారణం. అయితే జ్ఞానదృష్టికి ‘ఈ శరీరభావన కేవలం భ్రమ’ అని తెలియవస్తోంది.
ఓ రామా! ఈ శరీరభ్రాంతి జీవునకు ఉండవలసిన అవసరమే లేదు. ఈ క్షణమే నిశ్శంకగా నిశ్చింతగా దీనిని విడచివేయవచ్చు… ఎందుకంటావా?… కేవలం సంకల్పమాత్రంచే ఇట్టి వేలాది స్వప్న సదృశంగా శరీరాలు కలుగగలవు. లయించగలవు. ఇట్టి సంకల్ప నిర్మిత శరీరాలలో దేనిని గ్రహిస్తావు?… దేనిని త్యజిస్తావు?
శ్రీరాముడు : శరీరం పోయినప్పుడు కూడా ఈ జీవుడు ఉంటాడు కదా! అప్పుడు జీవుడు ఉంటున్నది ఎందులో? శరీరాలు ఏ మూలనుండి వచ్చి పడుతున్నాయి?
శ్రీవసిష్ఠమహర్షి : హాయిగా మృదువైన తల్పంపై నిదురిస్తున్న ఒకవ్యక్తి స్వప్నంలో ఏర్పడే దేహములతో దిక్కులన్నీ తిరిగివస్తున్నాడు. ఆ స్వప్న సంబంధిత స్వ-పర దేహాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ దేహంతో ఈ జీవుడు స్వప్నానుభవం చవిచూస్తున్నాడు?
జాగ్రత్లో కూడా మనస్సు అనేక చోట్ల తిరిగి వస్తోంది. ఏ శరీరంతో అంతా ఊహ చేతనే కల్పించబడుతోంది కదా! ఈ జాగ్రత్లో ఏర్పడే ‘రాజ్యం ఏలటం, పరస్పర ప్రేమాభివేశాలు, సంబంధ బాంధవ్యాలు, క్రీడా వినోదాలు’- అన్నీ కూడా ’ఊహ’యే తమయొక్క మూలముగా కలిగి ఉన్నాయి. స్వప్నంలోని దేహాలన్నీ ఊహచే నిర్మించబడుచున్నట్లే, ఈ జాగ్రత్లోని వ్యవహారాలకు కూడా ఊహయే మూలం. అందుకే ఇది ‘జాగ్రత్స్వప్నం’ అని, స్వప్న వ్యవహారమును ’స్వప్నజాగ్రత్’ అని పిలుస్తూ ఉంటారు.
స్వప్నంలోని బంధువుల వలెనే ఈ జాగ్రత్ దృశ్యానుభవమంతా మనోకల్పితమే. అట్లాగే ఈ మాంస-అస్థిమయ పృథ్వీ-జల-ఉష్ణ-వాయు ఇత్యాది సమావేశరూపమైన పార్థివ శరీరం కూడా మనోకల్పితమే నని గ్రహించు. సంపదలు, శరీరము, దేశము మొదలైనవన్నీ చిత్తము నందలి సంకల్పములచే కల్పించబడే విలాసములు మాత్రమే.
Page:78
దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్తవిభ్రమమ్ | దీర్ఘం వాపి మనోరాజ్యం సంసారం రఘునన్దన ॥ (శ్లో. 28, సర్గ 28)
రఘునందనా! నీవీ సంసారమును దీర్ఘస్వప్నం గానో, దీర్ఘచిత్తభ్రాంతి గానో, దీర్ఘ మనోరాజ్యం గానో గ్రహించు. నా ఈ వాక్యములలోని వాస్తవత్వం ‘జ్ఞానసూర్యుడు’ నీలో ఉదయించిన మరుక్షణం సుస్పష్టంగా అవగతమౌతుంది. జాగ్రత్ సమయంలో స్వప్నం ’లేనిదే’ అయినట్లు జ్ఞానలాభసమయంలో ఈ జగత్ మిథ్యయే అయి కనబడుచున్నది.
ఇతఃపూర్వం కమలజన్ముడగు బ్రహ్మదేవుని ఉత్పత్తి గురించి చెప్పేటప్పుడు ‘సంకల్పకల్పనామయ మగు మనస్సే ఆడంబరమగు ఈ విచిత్రజగద్రచనకు ఉపక్రమిస్తోంది’ అని అనుకున్నాం కదా! అట్లాగే నీకు కనబడుచున్న ఈ శరీరం కూడా మనస్సు యొక్క ప్రతిభాస మాత్రమే. మనస్సు దేనిని ఎట్లా భావిస్తే అది అట్లే అవుతోంది. మనస్సు యొక్క కల్పిత అభాసయే జీవునిచే జగత్తుగా చూడబడుతోంది.
పూర్వదేహం తరువాత ఈ దేహం కల్పించబడినట్లు ఈ దేహం తరువాత కల్పించబడబోయే దేహాలు కూడా కల్పితమాత్రములే. వాసనాధిక్యతను అనుసరించి ఈ శరీరము సంఘటితమౌతోంది. భవిష్యత్ కూడా అట్లాగే సంఘటితమవబోతోంది. అయితే స్వతఃగా పూర్ణుడవైన నీవు ఈ శరీర-జగత్ సంకల్పములన్నిటికీ అతీతమైనవాడవు సుమా! నీ యొక్క పురుషకారమును ఉపయోగించి మనస్సును అంతర్ముఖం చేస్తే వాస్తవ స్వరూపమేమిటో గోచరమౌతుంది. అప్పుడు ‘ఇదంతాచిన్మాత్రమే’ అని గ్రహించగలుగుతావు.
ఓ రామా! ఈ ఎదురుగా పంచేంద్రియములకు తారసపడుచున్న దృశ్యజగత్తును ‘అన్యధా’గా భావించావా, అన్యమే అవుతుంది.’ ‘ఇది, అది, నేను, నాది, మేము, మాది, వారు, వీరు’ - మున్నగు భావనలు ఇతఃపూర్వం అనేకసార్లు మననం చేయటం చేత ఆ భావనాదార్ద్యం చేత ఇదంతా ఆత్మ స్వరూపుడగు ఈ జీవునకు నీకు వేరై ఉన్న దానివలె భ్రమింపజేస్తోంది. భావన యొక్క గొప్పతనం ఎంతటిదంటే, ఏ భావన దృఢంగా చేయబడుతుందో అదియే సత్యమై అనుభవమౌతుంది. కాముకునకు తన ప్రియురాలే అన్ని వైపులా కనబడుతుంది. అది భావన యొక్క ప్రభావమే కదా! రాత్రి కల కనే టప్పుడు అప్పటికి అది పరమసత్యంలాగానే అనుభవమౌతోంది. ఎందుచేత? మరి అప్పటి భావన అట్టిది.
భావనాబలం చేతనే ఈ సంసారం సత్యంగా తోచటం జరుగుతోంది. స్వప్నంలో కొద్ది నిమిషాల కాలం అనేక రోజులుగా తోస్తోంది చూచావా! అట్లాగే, సంకల్పమాత్రం, క్షణికం అగు ఈ సంసారం దీర్ఘాతిదీర్ఘంగా తోచుచున్నది. ఎండమావులు తటాకరూపంలో స్ఫురిస్తున్నట్లు అసత్యమైన, భౌతిక పరమైన ప్రియాప్రియ సంబంధ బాంధవ్యాలు సంకల్ప పరంపరల బలం చేతనే నిలచి ఉంటున్నాయి.
ఒక చిత్రమైన కంటిజబ్బు వలన ఆకాశంలో మయూరపింఛాలు కనిపిస్తాయి. దోష రహితమైన చూపు గలవానికి ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. సమదృష్టి గలవాడు సంకల్పమాత్రజనితమగు ఈ సంసార సంరంభమును చూచి దూరంగా ఉండి నవ్వుకుంటున్నాడు. సంసార దోషముచే
Page:79
పరితప్తుడైన జీవుడు ఇక్కడ దుఃఖము, భయము, వేదన, అవమానము, మమకారము, నిరుత్సాహము కలిగించ గల అనేక విషయపరంపరలు గాంచుచున్నాడు. బాలుడు స్వసంకల్పిత మనోరాజ్యంలో పులిని, నక్కను, దయ్యమును ఊహించి ఉలిక్కిపడి బిగ్గరగా ఏడ్చునట్లు సంసారాసక్తుడు అడుగడుగుకు అనేక ఆందోళనలు తెచ్చిపెట్టుకుని మరీ అనుభవిస్తున్నాడు.
శ్రీరాముడు: ఆ భయం తొలగేది ఎట్లా, మహర్షీ?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మ ఒక్కటే ఇదంతా ప్రసరించి భాసిస్తూ ఉండగా ఇక భయాదులు ఎవరికి, ఎవరి వలన కలగాలి? భయము పొందుచున్న జీవుడు తన అజ్ఞానం తొలగించుకున్నాడా… ఇక ఆతడు నిర్మలుడు, శుద్ధుడు అయి ఈ జగత్ మోహమునకు లోనవడు. కనుక ‘సమ్యక్ దర్శనం’ అను అభ్యాసమే ఉత్తమమైన ఉపాయం. జ్ఞానం సుస్థిరమైన చోట ఇక సంసారం ఉండదు. సమ్యక్ దర్శనంచే మనోబుద్ధులను విశుద్ధపరుస్తూ తద్వారా జ్ఞానం సుస్థిరపరచాలి.
శ్రీరాముడు : సమ్యక్ దర్శనం అంటే ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తంతా అభాసమాత్రమేనని, ఇది సత్తుగాని, అసత్తుగాని కాదని గ్రహించటం. జీవితం, మరణం, స్వర్గము, జ్ఞానం, అజ్ఞానం, నీవు, నేను, సమస్త సంసారం, దిక్కులు - ఇవన్నీ చిదాభాస అని తెలియటమే సమ్యక్ దృష్టి ప్రయత్నబలం చేత తప్పకుండా యథార్థదర్శనం ఈ జీవునకు సాధ్యపడుతుంది.
యథార్థదర్శనం లభించిన తరువాత ఇక మనసు సత్యము, నిత్యము అయిన ’సర్వగత స్వస్వరూపం’ నుండి చ్యుతి పొందదు. ఈ ప్రపంచం యొక్క సత్ - అసత్ లక్షణాన్ని గ్రహించి క్రమంగా నిష్కామంతో కూడిన పరమశాంతిని పొందుతుంది. మనస్సు దేనినీ నిందించదు. స్తుతించదు. దుఃఖించదు, సంతోషించదు. ఆ జీవుడు తాపత్రయరహితమగు పూర్ణత్వమును ఆశ్రయించి ఉండటం చేత సమాధాన పూర్వకమైన ప్రశాంతానందమును పొందుతాడు.
అందరికీ మరణం అనివార్యమే అయినప్పుడు నా మరణం గురించి గాని, నా బంధువుల మరణం గురించి గాని దుఃఖించవలసిన పనేమున్నది?
జన్మించిన ప్రతివాడు అంతో ఇంతో సంపదలు, ఆపదలు అనుభవించక తప్పేది కాదు. ఇక ఇందులో సంతోషించవలసినదీ, వేదన చెందవలసినదీ ఏమున్నది?
బృంహత్యుదేతి స్ఫురతి బుద్బుదౌఘ ఇవార్ణవే |
ఇదం హి జగతాం జాలం కిమత్ర పరిదేవనా ॥ (శో 57, సర్గ 28)
సముద్రంలో అసంఖ్యాకంగా తరంగాలు లేచి పడుచున్నట్లు ఈ సంసార సముద్రంలో జగత్తులు లేచి, పెరిగి, విప్పారి, చివరకు లయించిపోతున్నాయి. ఇందుకు గాభరా ఎందుకు?
ఇట్లా ఉంటుంది… అతని అవగాహన సద్వస్తువు ఎప్పటికీ సద్వస్తువే. అసత్తు అసత్తే. అసత్ ఎన్నటికీ ‘సత్’ అవజాలదు. మాయ ఆత్మ సమక్షం యొక్క వైచిత్ర్యం మాత్రమే. ఇక ఈ
Page:80
శరీరమంటావా… ఇది అవిద్యా కామ్యకర్మ యొక్క విచిత్ర దోషముచే ఉదయిస్తోంది. భూత -
భవిష్యత్ - వర్తమానకాలాలలో ‘నేను’ అనబడేది ఆత్మకు వేరై లేనేలేదు. ఇక ఇక్కడ దుఃఖమునకు తావెక్కడిది?
తత్త్వదర్శియందు "ఈ శరీరము కంటే నేను భిన్నుడను. చిదాత్మయే అయి ఉన్నాను. ఇక క్రొత్తగా సంపాదించే సద్భావమేమిటి? ఇప్పుడు అసద్భావం ఉండటమేమిటి? నేను దేని కొరకై క్రొత్తగా ఎందుకు దుఃఖించాలి?” అను రూపంలో ఉండే దృఢనిశ్చయం తొలగదు. అందుచేత, అతని మనస్సు ఈ సంసారంలో ఉదయించనే ఉదయించదు. సకల బాహ్య వస్తువులందు ఉద్వేగము తొలగి కేవలీ బ్రహ్మభావన అఖండశాంతపూర్వకంగా సంతరించుకుంటుంది. తిత్తిరపక్షి తన గూటిని నిర్మించుకోవటానికి కోమలమైన తృణకణములను ఎంచుకుంటున్నట్లు ఆ బ్రహ్మవేత్త సంసారములోని అసారము నంతా వదిలి, దాని విశేషాల పట్ల ఏమాత్రం ఆసక్తి, నమ్మకం లేక, కేవలం బ్రహ్మజ్ఞాన సంబంధిత విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటాడు.
గట్టిత్రాటి చేత ఎద్దు కట్టబడినట్లు, ఇష్ట-అయిష్ట-రాగ-ద్వేషాది రూపమైన ‘సంసారాసక్తి’ చేతనే మనిషి బంధించబడి నీచత్వమునకు, స్వల్పత్వమునకు ఈడ్వబడుచున్నాడు.
అందుచేత రాఘవా! నీవు ఈ సంసారం ఏర్పడుచున్న వైనమంతా జాగ్రత్తగా గమనించు. ‘ఆసక్తి, అనాసక్తి’ అను రెండిటినీ త్యజించి నిరామయుడవై సంచరించు. కేవలం కర్తవ్యమైనదానిని మాత్రమే ఆచరించు. అకర్తవ్యమును ఎన్నడూ ఆచరించవద్దు. ‘ఈ జగత్తు అభాస మాత్రమే’ అని గుర్తు పెట్టుకుంటూ ఉంటే, క్రమంగా అట్టివాని హృదయం శీతలమౌతుంది. ఈ సర్వపదార్థముల మీదా భ్రాంతి త్యజించి సర్వమూ బ్రహ్మచైతన్యముయొక్క అభాసమాత్రంగా గ్రహించు. ఆ తరువాత చిత్త కల్పనాకళంకమగు ఆ అభాసభావన కూడా త్యజించి భావాభావరహితుడవై వెలుగొందుము. చిదాకాశమయుడవు కమ్ము. నీ రూపమును సర్వగామి, సర్వవర్ణనలకు అతీతము, సర్వసమము అగు నిత్యనిర్మలాకాశముగా గాంచుము. ఆపై అనుభవమాత్రమే గాని, మనం మాటలు ఉపయోగించి ఏమి చెప్పుకోలేం.
1.నేను ‘అహమ్’ అను ప్రత్యయ పరిమితుడను గాను, 2. ఈ భోగజాలమంతా సత్యం కాదు. …ఈ రెండు భావాలు అంతరంగంలో సుస్థిరమైన మరుక్షణం ఈ ఆడంబర దృశ్యజగత్తు వ్యర్థమగు ‘మోహము’ అనే అనర్థాన్ని కలిగించజాలదు. (లేదా)
పై దృష్టులలో నీకు ఏది రమ్యమని అనిపిస్తే, అది ఆశ్రయించు. లేదా… రెండింటినీ మేళవించి సమాశ్రయిస్తూ, క్రమంగా, అంతరంగంలో ఉండే రాగద్వేషాలను క్షయింపజేసి, అటుపై ఈ జగత్తులో హాయిగా విహరించు. ఓ రామా! స్వర్గ - మర్త్య - పాతాళ లోకములలోని దేని పట్లా రాగద్వేషములు లేనివాడు నిబద్ధింపబడడు. ఇది సత్యం.
L H
Page:81
మూఢులగు జనులు రాగద్వేషసహితులై అనేక కార్యక్రమములలో నిమగ్నమై ఉపాధియున్న దినములన్నీ అల్ప ఆశయములతో గడిపివేస్తున్నారు. చివరికి ఆ కార్యక్రమములన్నీ వ్యర్థ విపరీత ప్రయోజనములకే దారి తీస్తున్నాయి. తగలబడుతున్న వనంలోంచి సాత్వికజీవులగు జింకలు పరుగులు లంకించుకుంటున్నట్లు, రాగద్వేష దూషితమైన చిత్తములోంచి సాత్వికగుణాలు బయటకు వెళ్ళిపోవుచున్నాయి.
రాగద్వేషములు ప్రవేశించని హృదయం కల్పతరువు. అతని వద్ద లభించనిదేమీ ఉండదు. చమత్కారం చూచావా, రామా? కొందరు శాస్త్రప్రవచనపాటవాలు కలిగిఉండికూడా తమలోని రాగద్వేషములు గుర్తించి, త్యజించలేకపోతున్నారు.
“నేను సంపదలకు అర్హుడను. అనర్హులంతా సంపదలు సంపాదిస్తున్నారు. నేను పొందవలసినవి పొందలేకపోతున్నాను”… ఇట్టి అనేక తుచ్ఛదనేచ్ఛలను, సంసారప్రమత్తతలను ఆశ్రయించి శాశ్వతవస్తువును కోల్పోవుచున్నారు ఈ జనులు…!
ధనము, బంధువులు, మిత్రులు, ప్రతిష్ఠలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఆ పరమేశ్వరమాయ ప్రియాప్రియములగు భావాభావములు కల్పించి ఈ జగద్వ్యవహారాన్ని తనదైన శైలిలో నడుపుతోంది.
ఈ క్షణిక జగత్తునందు అనురాగమేమిటి? విరాగమేమిటి? దీనిపట్ల ఉపేక్షయే మేలు. భోగ లోలుడగు వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ‘మాయ’ అనే మాంత్రికుడు ఈ జగత్తులోని వస్తువులను, వ్యవహారములను, సంఘటనలను రచించుకొని పోతున్నాడు. ఇక్కడ కనిపించే ధన, జన, దేహము లన్నీ మిథ్యయే గాని వాస్తవం కాదు. మధ్యలో ఏర్పడి, మధ్యలోనే లేకుండా పోయేవి వాస్తవమెట్లా అవుతాయి? ఆది - మధ్య - అంతములలో ఉండేది కేవలం ఆత్మ ఒక్కటి మాత్రమే. ఆద్యంతములలో సత్యము గానిది మధ్యలో మాత్రం సత్యమెట్లా అవుతుంది?
శ్రీరాముడు: మీ ప్రతిపాదన తిరస్కరించటానికి వీలు లేనిదని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, జీవులంతా మనోవ్యధచే బాధింపబడుచున్నారు కదా! రంగుటద్దాలవంటి మాయపొరలు తొలగేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి: త్రికాలముల చేత బాధించబడేది ఏదైనా సరే అట్టి దానిపై ఆసక్తిగొన్నామా, ఇక అట్టి ఆసక్తి యొక్క పరిణామం మనోవ్యధయే అగుచున్నది. ‘ఒకడు అభూతకల్పన కల్పిస్తే మరొకడు అందులో ప్రవేశించి పచార్లు చేస్తున్నాడు’ అనే వాక్యం ఎట్టిదో ఈ సంసారభ్రమ కూడా ఒక మాయా జీవుడు కల్పిస్తే అనేక మంది మాయాజీవులు ఇందులో ప్రవేశించి గొప్ప ఆసక్తితో గంతులు వేస్తున్నారు.
ఓ రామా! నీవీ సంసారభ్రమయందు పడవద్దు సుమా! ప్రాణివర్గముతో కూడిన ఈ సంసారమును తత్త్వజ్ఞులు ఒక గారడీని చూచినట్లు చూస్తున్నారు. మూఢులను మాత్రం ఇది ఎంతో కలవరపెడుతోంది. ఇదంతా సుదీర్ఘమైన స్వప్నంలో కనిపించే ఒక నగరం వంటిది. ‘అజ్ఞానము’
Page:82
అనే నిద్రకు ఉపపక్రమించేవానికి మాత్రమే ఈ సంసారస్వప్నం వాస్తవానుభవమై ప్రాప్తిస్తోంది. సర్వత్రా అనుశ్రుతమగు ఈ సుదీర్ఘ స్వప్నసదృశ సంసారమును ఖాతరే చేయవద్దు. శ్రీరాముడు: ఈ జీవునికి సంసారమనేది ఎక్కడ నుండి వచ్చిపడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి: చెప్పాను కదా! ఇదంతా గాఢమగు అజ్ఞాన నిద్రనుండే వచ్చిపడుతోంది. నిధిని పొందినవాడు దరిద్రమును త్యజించునట్లు, నీవీ సంసారమును త్యజించు, ఓ రామా! ఉత్తిష్ఠ! సూర్యుని చూడగానే పద్మము వికసించునట్లు నీవు అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము స్వస్వరూపము అగు ఆత్మ యందు మెళుకువ తెచ్చుకో. ప్రబుద్ధుడవై లేచి సర్వత్రా నిండియున్న నీ అనామయ ఆత్మ స్వరూపమును గాంచుము. సుశీతలమగు జ్ఞాన వాక్యములను నేను నీపై వర్షింప జేయటం నీవు ప్రబుద్ధుడవై, పరమజ్ఞానమును పొందటానికే కదా! ఈ నా మేలుకొలుపు వాక్యం (ఉత్తిష్ఠవాక్యం) ప్రతిఒక్క శ్రోతకు, ప్రతిఒక్క పాఠకునికి ఉద్దేశ్యించినదే సుమా!
ఓ సర్వసభికులారా! మీరంతా మీ యొక్క సత్యస్వరూపమును దర్శించెదరు గాక! వాస్తవానికి మనలో ఎవ్వరికీ జన్మదుఃఖ దోషభ్రాంతులు తమంతట తాముగా లేవు. అందుచేత భ్రాంతిపూర్వకమగు జగద్విషయములను ప్రక్కన ఉంచి, ఆత్మయందు సుస్థిరులై వెలయుదురు గాక! ఓ రామచంద్రా! నీ యందు వికల్పదోషములకు తావే లేదయ్యా! సారవంతము, విక్షేపరహితము అగు దృష్టిని పొందినవాడవై పరమశుద్ధమగు పరబ్రహ్మమున వెలసియే ఉన్నావయ్యా!
స్వస్థచిత్తుడైన రాఘవుడు వసిష్ఠమహర్షి వాక్యాలు వింటూనే ఆత్మయందు విశ్రమించి పరమానందం పొందాడు. ఆ సభలోని అనేక మంది సభికులు కూడా ప్రబోధులైనవారై తమ స్వస్వరూపమునందు తాము ఉపశమనం పొందారు. పొలం నీరుతో నిండగానే రైతు ఆ జల ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపుతాడు చూచావా! అట్లా వసిష్ఠమహర్షి శ్రీరాముని అంతరంగ ప్రశాంతానుభవమును గమనించి తన వచనామృతాన్ని కొద్ది సేపు ఆపారు.
కొద్ది క్షణాలైన తరువాత శ్రీరాముడు చురుకైన, సుకుమారమైన తన కళ్ళు తెరచి చిరునవ్వుతో తన సంతృప్తిని ప్రకటిస్తూ తిరిగి వినటం కొనసాగిస్తున్నట్లు కళ్ళలో ఉత్సాహం ప్రకటించాడు. అది చూచి మహర్షి ప్రియశిష్యుని హృదయంలో బోధను సుస్థిరం చేసే ఉద్దేశంతో తన వాక్యములను
కొనసాగించారు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీవు చక్కగా బోధింపబడి ఆత్మతత్త్వమును పొందావు. చాలా సంతోషం. అయితే అద్దాని నుండి చలించి, మరల సంసారంలో ప్రవేశించనేవద్దు సుమా! శ్రీరాముడు: మహర్షీ! ఈ సంసారచక్రం యొక్క పరిభ్రమణానికి అసలైన నాభిస్థానం ఏది?
Page:83
శ్రీవసిష్ఠ మహర్షి : ’సంకల్పించుట’ అనునదే సంసారముయొక్క నాభిస్థానం. హృదయం రాగ ద్వేషములతో సంక్షుభితమై ఉన్నంతకాలం ఈ సంసారము యొక్క నాభి ఎంత ఆపటానికి ప్రయత్నించినా ఆగక తీవ్రవేగంగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సంసారచక్ర పరిభ్రమణం నిరోధించా లనుకుంటే ప్రజ్ఞ-సౌజన్య-శాస్త్రయుక్తమైన పురుషప్రయత్నం కావాలి. చిత్తమును మూర్ఖ కార్యక్రమముల నుండి విరమింపజేయాలి. అసదాత్మకమగు ఈ జగత్తు ‘అంతానిజమే’ అను రీతిగా అనుభవమవటానికి కారణం అజ్ఞానరూపమగు సంకల్ప పరిభ్రమణమేనయ్యా! ‘సంకల్పించుట’ అను స్వభావం చేత ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు శరీరమును ఆశ్రయించి, విషయవాసనలను కల్పించుకొని జన్మజన్మాంతర పరంపరలను పొందుచున్నాడు.
శ్రీరాముడు : చిత్ర పటంలోని రంగుల రేఖనమువలె ఈ దేహం కారణంగా జీవుడు అనేక సుఖదుః ఖములను నిరంతరం పొందుచూనే ఉన్నాడు.
శ్రీవసిష్ఠ మహర్షి: అవును. అయితే, ఈ దేహము గురించి వగచవలసిన పనేమిటి? చిత్రంలోని శరీరంకంటే కూడా ఈ పాంచభౌతికశరీరం తుచ్ఛమైనది.
ఈ మాంసమయదేహం మనం ఎంతగా రక్షించాలని ప్రయత్నించినా కాలక్రమేణా శిథిలం కాక తప్పదు. అందుకనే, ఈ మాంసమయదేహం కంటే చిత్రపటంలోని మానవుడే నయమని చమత్కారంగా అంటూ ఉంటారు. ఇట్టి మాంసమయ దీర్ఘసంకల్ప శరీరములపట్ల విశ్వాసముగాని, అనురాగంగాని, నమ్మకంగాని ఏర్పరుచుకోవలసిన పనేమున్నది?
ఈ మాంసమయదేహం కంటే స్వప్నమయదేహమే కొంతనయం. ఎందుకంటే స్వప్నదేహం చాలా స్వల్పకాలికం కనుక, అది మాంసమయదేహము పొందేంతగా పెద్ద సంఖ్యలో సుఖదుః ఖములు పొందదేమో!
ఈ మాంసమయ శరీరమును జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే ఇది ఆత్మయొక్క సంకల్పబలం చేతనే నిలచి ఉంటోంది. ఇది వాస్తవానికి మిథ్యయే. మూఢులు మాత్రమే దీని గురించి వ్యర్థంగా దుఃఖం పొందుచున్నారు. నిద్ర పోయేవాని కల కరిగిపోతే నష్టం ఏముంటుంది? మెల్లకన్ను వానికి కనిపించే రెండవ చంద్రుడు కనిపించకుండాపోతే అతడు కోల్పేయేదేమున్నది? ఎండమావులలో నీరు తొలగితే అది విచారించవలసిన విషయమా? అట్లాగే రామా! "సంకల్ప మాత్రము, స్వభావ నశ్వరము అగు ఈ మాంసమయదేహం వృద్ధి చెందినా నశించినా దేహి లేక శరీరికి వచ్చే నష్టమేమీ లేదు’.. అనే దృఢభావం నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండు.
కల చెదిరి మెళుకువ వస్తే, “కలలో మరణించాను. మెళకువలో జన్మించాను”… అని అనము కదా! వాస్తవానికి ఈ దేహసంబంధమైన జన్మ-జీవన్-మృత్యు-పునర్జన్మలు ఇంతమాత్రమే!
భూషితే దూషితే దేహే న హి కించిచ్చితః క్షతమ్ |
న చిదన్తముపాయాతి నాత్మా చలతి రాఘవ ॥ (శ్లో 27, సర్గ 29)
Page:84
నిజానికి ఈ శరీరం దూషించబడినా, భూషించబడినా చైతన్యమునకు అవి సంబంధించవు. ఆత్మ దేనికీ విచలితం కాదు.
స్వస్వరూపమగు బ్రహ్మమునకు వికృతి పొందే అవస్థయే ఉండదు. మరి ఈ దేహము క్షీణిస్తున్నప్పుడు ఆ ’క్షతి’దేనికి? గుండ్రంగా తిరిగే చక్రయంత్రాన్ని అధిరోహించినవానికి నాలుగు దిక్కులలోని వస్తువులన్నీ గిఱ్ఱున తిరుగుచున్నట్లు అగుపిస్తాయి చూచావా? ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు ‘మనస్సు’ అనే చంచల స్వభావాన్ని అధిరోహించి “ఈ దేహంతో బాటే పుడుతున్నాను. దీని తోనే జీవిస్తున్నాను. ఇది వినష్టమైతే ఇక నా పని ఆఖరు" - అని భ్రమిస్తున్నాడు. నీవు మాత్రం ధీర బుద్ధి కలవాడవై, ఈ భ్రమలయందు కూలవద్దు.
సంకల్పమే ఈ దేహము యొక్క నిర్మాత. ఒకడు చీకట్లో త్రాడును చూసి ‘పాము’ అని అనుకుని అనేక భావవికారాలకు లోనయినట్లు, ఈ దేహము జీవునికి సద్వస్తువువలె భ్రమింపజేస్తోంది. ఇక ఈ శరీరంతో గాంచబడేవన్నీ భ్రమకాక మరేమౌతాయి? వీటి కర్తృత్వమే అసత్యమైనప్పుడు ఇక కార్యములుమాత్రం సత్యమెట్లా అవుతాయి? భ్రాంతి సమయంలో ఈ జగత్రియలందు పాల్గొనే ఈ దేహము సత్యమైనదానివలె గోచరిస్తోంది. ఏది ఏమైనా దీనికి స్వకీయమైన కర్తృత్వం లేదు. కర్తృత్వమునకు కారణం ఇచ్ఛ కదా! జడమగు ఈ దేహమునకు ఇచ్ఛ-అనిచ్ఛలు ఎక్కడుంటాయి?
అందుచేత ‘ఈ జగత్తుకు కర్త అనువారెవ్వరూ లేరు’ అని సిద్ధాంతీకరించబడింది. ప్రకంపన రహితమగు దీపము గదిలో జరిగే కార్యములకు సాక్షిమాత్రమే వెలయుచున్నది చూచావా? ఆత్మ సర్వదా “కేవలద్రష్ట” అయి వెలయుచున్నది. ఆకాశమున సూర్యభగవానుడు ఉండి నిర్లిప్తుడై, నిమిత్తమాత్రుడై దినకృత్యములకు కారణభూతుడగుచున్నట్లు నీవు కూడా ఆత్మత్వం సంతరించుకుని ఈ రాజ్యకార్యాదులకు నిమిత్తమాత్ర కారణుడవై ఉండుము. ఓ సర్వజనులారా! మీరంతా మీ కుంటుంబాది సర్వ కర్తవ్యములందు నిమిత్తమాత్రులై ఉండటం అలవర్చుకోండి.
శ్రీరాముడు : తండ్రీ! ఈ అహంకారం ఎప్పటి నుండి ఎందుకు ఎక్కడినుండి వచ్చిపడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : అసత్యము, శూన్యము అగు ఈ దేహగృహంలోకి ఎప్పుడో వచ్చి అహంకారం ప్రవేశించింది. బాలుడు తన అజ్ఞానంచే కల్పించుకొనిన ’బూచోడు’తో పోల్చతగిన ఈ అహంకార దేహాత్మస్వభావము ఎప్పుడు వచ్చి చేరిందో చెప్పలేం.
అయితే సాధుజనులగు జ్ఞానులు ఈ అహంకారభూతమును దగ్గరకు రాకుండా చూచుకుంటూ
ఉంటారు.
అస్య మా భృత్యతాం గచ్ఛ త్వమహంకారదుర్మతేః |
అస్య భృత్యతయా రామ నిరయః ప్రాప్యతే ఫలమ్ || (శ్లో 40, సర్గ 29)
Page:85
ఓ రామా! నీవు ఈ అహంకార భూతమునకు దాసుడవు కావద్దు. దానిని సేవించే వారికి అది మరల మరల నరకలోక దర్శనం చేయించగలదు సుమా!
మహాపురుషులగు జ్ఞానులు ఈ అహంకార మమకారములు అల్లంత దూరంగా ఉండగానే తమను సమీపిస్తున్నట్లు గుర్తిస్తున్నారు. గుర్తించగానే సమాధి - జ్ఞానయోగము మొదలైనవి ఆశ్రయించి తగు జాగ్రత్త పడతారు. ఆ రెండిటినీ పారత్రోలి, ఇక ఆపై ఈ సంసారశూన్యనగరమును చూచి ఏమాత్రం భీతి చెందరు. ఇక తదితర జీవులనేకులు ఈ శరీరగృహములలో నివసిస్తూ అనంతకోటి శరీరములను వినాశన మొనర్చుకొనుచున్నారు. ఎప్పటికప్పుడు ‘ఈ శరీరమే నేను’ అను బుద్ధిని పదిలపరుచుకుంటున్నారేగాని, అట్టి దోషబుద్ధిని విడవటానికి యత్నించరేం? ఇది ఎంత ఆశ్చర్యం! దీనికి కారణమేమిటో నేను చెప్పలేను. అట్టి మూర్ఖత్వం కొనసాగించుటే అన్ని అనర్థములకు మూల కారణమనుటలో ఏమాత్రం సందేహం లేదు.
గ్రస్తే చిత్తపిశాచేన దేహసద్మని యే మృతాః |
పిశాచస్యేవ యా బుద్ధిర్నాపిశాచస్య రాఘవ ॥(శ్లో 45, సర్గ 29)
ఎవరైతే తమ చిత్తమును విడువకయే ఈ శరీరమును కోల్పోతారో వారి పిశాచబుద్ధి యథాతథంగా కొనసాగుతూనే ఉన్నది. ఓ సాధూ! అహంకార పిశాచ నివాసస్థానమగు ఈ దేహం పై విశ్వాసం కలిగి రోజులు గడిపేవాడు పిశాచంతో సమానుడే!
ఈ దేహగృహం శాశ్వతమైనది కాదు. ఈ విషయం ఎవరికి తెలియదు? తెలుసు. అయినా కూడా తగినంతగా పట్టించుకోవటం లేదే! ఏమి ఆశ్చర్యం!
కనుక, ఇంద్రియాల యొక్క, ఇంద్రియ విషయాల యొక్క నశ్వరత్వమును జ్ఞప్తియందు ఉంచుకుని నీవు అహంకారమును సంపూర్ణంగా విడచివేయి. ఆత్మవస్తువును ఆశ్రయించి ఉండు. అహంకారగ్రస్థులై నరకములకు పోదలచుకున్నవారిని కాపాడ గల బంధువు లెవరూ ఉండరు. అహంకారంతో కూడి ఏపని చేసినాసరే, అది విషాన్నంలాగా దుష్ఫలితాలనే ఇస్తుందని సర్వజనులకూ గుర్తు చేస్తున్నాను. ఏ జీవుడైతే వివేకవైరాగ్యములను త్యజించి అహంకారానికే పట్టం కడతాడో, అట్టివాడు అనేక విధముల నష్టం పొందటమే అవగలదని సర్వజీవుల శ్రేయోభిలాషులమగు మేం మునులం హెచ్చరిస్తున్నాం. వారు ఆయా చర్యలచే కాలాగ్నికి ఇంధనమగుచున్నారని వాత్సల్య భావంతో హెచ్చరిక చేస్తున్నాం. వారికి ఇహపరములలో సుఖం లేనేలేదు.
శ్రీరాముడు : మరి మేము ఈ అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ అహంకారం ఉంటే ఉండనీ! ఊడితే ఊడనీ. నీవుమాత్రం మనస్సుతో అహంకారం వైపుగా చూడనేవద్దు. అది లేనిదానిగా, నిష్ప్రయోజన మైనదానిగా భావించి
Page:86
ఉదాసీనుడవగుము. దానిని లోలోన తిరస్కరించి, దానిని అసలు పట్టించుకోకపోతే, ఇక అది నిన్నేమి చేయలేదు.
శ్రీరాముడు : మహర్షీ! ఈ శరీరంలో ‘చిత్తము’ అనే పిశాచం ఉండి ఆత్మను కలుషితం చేస్తోంది కదా? ఎంతవిన్నా మేము ఈ చిత్తమును రహితం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి? శ్రీవసిష్ఠ మహర్షి : శరీరగృహంలో ‘చిత్తము’ అనే పిశాచం ఉన్నప్పటికీ అనంతవిలాసుడగు ఆత్మకు కలుగగల దోషమేమీ లేదు. ఆకాశము సర్వే సర్వత్రా వ్యాపించి ఉండి భూ-అగ్ని-జల-వాయువులను తనయందు కలిగి ఉండి కూడా, వాటితో ఏమాత్రం సంబంధం లేకయే ఉంటోంది కదా! అట్లాగే ఆత్మయందు ఈ మనోచిత్త అహంకారాలు ఉన్నప్పటికీ ఆత్మకు వాటితో సంబంధం లేదు. చిత్తము యొక్క రూపం ఇష్టమే కదా! ఎవడైతే ’ఈ శరీరమే నేను ఈ ఇంద్రియ విషయములు నాకు ముఖ్యము’ అను చిత్తాహంకారములకు హృదయంలో పెత్తనం ఇచ్చి ఉంటాడో అట్టివాడు పడేపాట్లు నేను మాటలతో చెప్పలేను. ‘హాఁ! నేను చచ్చాను. అయ్యా! నేను శరీరం తప్పించి గతిలేని వాడను. శరీరం ద్వారా ఏర్పడే సంబంధాలే వాస్తవం. నేను దుఃఖిని. ఒక జీవుడను. అల్పుడను’ అని తలచటమే అహంకార – చిత్తముల విన్యాసం. అది గమనించి హృదయగృహంలో పెత్తనం ఆత్మభగవానునికి ఇవ్వాలి. ‘నేను అసంగుడను, అప్రమేయుడను. నిత్యుడను. సర్వాత్మకుడను. శుద్ధుడను’ అను ఆత్మస్వభావాన్ని ఆశ్రయించి ఉండాలి. ఆత్మకు మనోచిత్తాహంకారాది మరి దేనితోనూ సంబంధం లేదు. అనగా, ‘నా స్వస్వరూపము మనోచిత్తహంకారాలు కావు’ అను ధ్యానం కలిగి ఉంటే క్రమంగా ఈ చిత్త పిశాచం ఆటకట్టినట్లే.
శ్రీరామచంద్రా! ఈ జడము, అనివార్య వినాశన సమన్వితము, సర్పరజ్జువు వలె భ్రాంతి భూయిష్ఠము అగు శరీరమును గ్రహించేపని చేస్తున్నది అహంకారమేగాని, ఆత్మకాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియమైనది. అది పుట్టదు, పెరగదు, ముదుసలి అవదు, చావదు. ఒక పెద్ద వృక్షం పుట్టి, పెరిగి నశించేది ఆకాశంలో అయినప్పటికీ, ఆ జన్మ - వృద్ధి - హాని లతో ఆకాశమునకు సంబంధం లేదుకదా! ‘నేను సర్వదా దేనికీ సంబంధం లేని ఆత్మస్వరూపుడను’ అని అనునిత్యం అభ్యసించాలి. అంతేగాని ’ఈ చిత్తం, ఈ అహంకారం ఉన్నాయే? ఏం చేయాలి? ఎట్లా తొలగించు కోవాలి?’… అని ఎంతగా పరితపించినా ఎన్ని జన్మలు ఆ విధంగా గడపినా లాభం లేదు. సంబంధం ఉండవలసిన అగత్యం లేనివాటితో సంబంధం పెట్టుకోవటమే చిత్తము యొక్క రూపం. అదే అహంకారం. అదే సంసారం.
దీపము తన యందు ఎట్టి ఇచ్చ లేకుండానే గదిలోని ఆయా వస్తువులను కనబడేట్లు ప్రకాశింపజేస్తోంది. అట్లే ఆత్మప్రకాశం చేతనే ఈ ‘చిత్తము’ అనేది రూపుదిద్దుకుని ప్రకాశమాన మవుతోంది. గదిలోని ప్రకాశమానమయ్యే వస్తువులకు - దీపమునకు సంబంధం లేదు కదా! జడ స్వరూపమగు ఈ చిత్తాహంకారాలకు - ఆత్మకు సంబంధం లేదు. భూమికి - ఆకాశమునకు ఏం సంబంధమయ్యా?
Page:87
ఓ రఘునందనా! వాస్తవానికి నీవు సర్వజ్ఞమగు ఆత్మయే గాని మరింకేమీ కాదు. మరి నీవు ఈ చిత్తాహంకారాలను చూచి ఎందుకు మోహం చెందాలి? అట్టి మోహమును దగ్గరకు రానీయకు. శూన్య స్వరూపమగు మనః పిశాచము ఆత్మను తాకనైనా లేదు. అయితే అది ‘నేను ఆత్మను స్పృశిస్తున్నాను. సంతోషింపజేస్తున్నాను. దుఃఖింపజేస్తున్నాను’… అని మాత్రం అనుకుంటూ ఉంటుంది.
అది ‘రాజుగారికి నేను ఎంత చెపితే అంతే’ అని సేవకుడు అనుకోవటం వంటిది.
సంసారకారి, ధైర్యమును నాశనం చేసేది, అమంగళకరము అగు ఈ చిత్తవిభాగాన్ని విడచిపెట్టి అప్పుడు శేషించేదేమిటో - అద్దానినే ఆశ్రయించి ఉండు.
ఓ సర్వసభికులారా! మరల మరొక్కసారి మీకందరికి గుర్తుచేస్తున్నాను. చిత్తపిశాచముచే ఆక్రమించబడిన అంతరంగం కలవారిని శాస్త్రములు గాని, గురూపదేశములు గాని, బంధుజనులు గాని, మరెవ్వరైనా గాని రక్షించలేరు.
ఇంద్రియ వ్యాపారముల పట్ల ఏర్పడే సత్యత్వబుద్ధి - ఆకర్షణలే చిత్తము యొక్క రూపం. కొంచెం బురదలో ఉన్న దున్నపోతునైతే బయట పడవేయవచ్చు గాని, లోతైన బురదలో ఇరుక్కుని ఉన్న దున్నపోతును లేవదీయటం తేలికైన పని కాదు కదా! ఇంద్రియ వ్యాపారాలలో లోతుగా మునిగి ఉన్న ధ్యాసగల వానిని సంబోధనల చేత ఎట్లా కాపాడటం? అదే కొంచెం ధ్యాసగల వానికో?… అట్టి ధ్యాస తగ్గుముఖం పట్టుచున్న వానికో?… శాస్త్రార్ధములు సులభంగా చిత్తశమనం ప్రసాదించ గలుగుతాయి. అందుచేతనే శాస్త్రములు అనేక అభ్యాసములను ప్రతిపాదిస్తున్నాయి.
చిత్తం జగత్తును కలచివేస్తోంది. ఈ దేహపురమును అజ్ఞానమయం చేసివేస్తోంది. అంతరంగం నందు చిత్తము బీభత్సపూర్వకమైన తాండవం చేస్తుంటే భయపడనివారెవ్వరు?
ఆహా! రామా! ఈ జగన్నగరంలో కొద్ది దేహగృహాలలో మాత్రమే చిత్తపిశాచం యజమానియగు ఆత్మకు అంకితమై ఉంటోంది. అందుచేత ఆ కొద్ది దేహగృహాలు సాధుత్వమునకు నివాస వసతులకు యోగ్యమై ఉంటున్నాయి. మిగతా జగత్తు చిత్త పిశాచమునకు మాత్రమే నివాసయోగ్యమౌతోంది. ఈ జగదరణ్యం అధికభాగం ‘మోహము’ అనే చెత్త కుప్పలచే నిండి ఉంటోంది.
కేవలం ధృతి పూర్వకమైన పురుష ప్రయత్నంచేతమాత్రమే మమకార - అహంకార భూతపిశాచములను పారత్రోలటం సాధ్యం.
నీవు మాత్రం అజ్ఞాన ఏనుగును సంహరించే సుజ్ఞాన సింహంలా ఈ సంసారారణ్యంలో విహరించు. అంతేగాని గడ్డిపోచలను తింటూ క్షణక్షణం భయముతో రోజులు గడిపే లేళ్ళలాగా విషయములను భక్షిస్తూ ఆయుష్షు వృథా చేసుకోకు. బంధుజనుల పట్ల ఏర్పడే మమకారాదుల వలన, విషయేచ్ఛల వలన ఏర్పడే ఆనందం అత్యంత క్షణికమాత్రమని గ్రహించు. ఇక దాని పరిణామమో, మహాభయ - - దుఃఖ - భ్రాంతి. ఇది గమనించి, సాధుజనులమార్గమును అనుసరించు. మహార్థము (The final essence)ను విచారించు. ఆత్మను ఒక్కదానినే ఆశ్రయించు. అంతేగాని,
Page:88
అపవిత్రము - తుచ్ఛము - దుర్బరము - - క్షణభంగురము - దురాకృతిసమన్వితము అగు ఈ శరీరము కొరకై విషయసుఖములందు మునుగవద్దు. ఎందుకంటే అట్టి మార్గంలో ‘చింత’ అనే క్రూరమగు రాక్షసి పొంచి ఉండి, నీ జ్ఞానధనం మ్రింగి వేయటానికి ఎత్తులు వేస్తూ సిద్ధంగా ఉన్నది.
ఈ శరీరమును ‘సంకల్పము’ అను పేరుగల ఒకడు నిర్మించాడు… ’అహంకారము’ అను మరొకడు వచ్చి దీనిని ఆశ్రయించాడు… ‘మనస్సు’ అను ఇంకొకడు ఇక్కడి సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు… ఈ మూర్ఖ సంసారచక్రం విచిత్రంగా పరిభ్రమిస్తోంది.
జీవులంతా ఇది ఎంతగానో గమనించవలసిన విషయం సుమా!