Page:158
పదహారవ రోజు
IV. బిల్వఫలం - శిల - మృగతృష్ణ -
ఉపమానాలు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఆత్మతత్త్వబోధకులు కొందరు బిల్వఫలము (మారేడు పండు) ను ఉపమానంగా చేసుకొని తమ అనుయాయులకు ఆత్మతత్త్వము బోధిస్తూ ఉంటారు. రమణీయము, విస్మయోల్లాసకరము, సంక్షిప్తము అగు ఆ బిల్వోపమానం అనే చమత్కారం చెపుతాను. ఇది జ్ఞానప్రదమని లోకప్రతీతి.
❖
ఒక పెద్ద బిల్వఫలం ఉన్నది. అది విమలము, విపులము, ప్రస్ఫుటము కూడా. ఆ ఫలం యొక్క సత్తా అసంఖ్యాక యోజనాలు విస్తరించి ఉన్నది. వందలవేల మహాయుగాలు గడచిపోతున్నప్పటి ఆ ఫలం క్షయం కావటం లేదు. అవదు. దాని రసము అక్షయము. దాని సారయుక్తమగు రసము అమృతము వలె అత్యంత మధురం. ఆ బిల్వఫలం అతి పురాతనమైనది. అది ఎంతటి పురాతనమో ఎవరమూ చెప్పలేం. అయితే ఏం? బాలచంద్రుని కళల వలె అది ఎప్పటికప్పుడు నూతనము, కోమలమూ కూడా! అది అత్యంత శోభతో అచలంగా, దృఢంగా ఉన్నది. మహాప్రళయ వాయువులు కూడా దానినేమీ కదల్చలేకున్నాయి. దాని వైశాల్యము ఇన్ని కోట్ల యోజనములని చెప్పజాలము. ఈ జగత్తు యొక్క స్థితికి అదే కారణం. అయితే దాని మూలమేమిటో కారణమేమిటో ఎవరికీ తెలియదు.
ఈ కనబడే బ్రహ్మాండ సమూహములన్నీ ఒక కొండ మీద వెదజల్లబడిన ఆవగింజల వలె ఆ బిల్వఫలం లోపలే వెదజల్లబడి ఉన్నాయి.
ఈ పంచేంద్రియ-మనస్సులకు విషయమగుచున్నదేదైనా సరే… ఆ ఫల రసమును అతిక్రమించ జాలదు. అది రాలటానికి చోటే లేదు. ఎందుకంటే అది అంతటా, అన్నిటా ఆక్రమించుకొని, అంతయూ తన యందే కలిగి ఉంటోంది. ఆ ఫలరసమును అతిక్రమించినది, అతిక్రమించగలిగినది ఎవరూ, ఏదీ లేదు. లేవు. ఈ జన్మ - జర - మరణము లనేవి దానిని స్పర్శించక, దాని యందే భ్రమాత్మకమై ఒదిగి ఉంటున్నాయి.
బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇంద్రాదులు గాని, మరెవ్వరైనా గాని దాని ‘ఉత్పత్తి’ అనే మూలం కనుగొన లేకపోతున్నారు.
శ్రీరాముడు : మహర్షీ! ఆ బిల్వఫలం ఏ వృక్షమునకు కాసింది? ఆ వృక్షం ఎక్కడుంది.
Page:159
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ ఫలమునకు వృక్షముగాని, అంకురముగాని, తత్సంబంధితమైన కొమ్మలు గాని ఏమీ లేవు. అది ఏకపిండ ఘానాకారమై తోచుచున్నది. ఏకరసమై ఉన్న అద్దానికి ఉత్పత్తి పెరుగుట - తరుగుట అనే పరిణామ లక్షణాలేవి అగుపడుటలేదు. అది సమస్త ఫలాల సారమా… అని అనిపిస్తోంది. మహాకృతి కలిగిన అద్దాని యందు గుజ్జు - గింజలు లేక …అది నిర్వికారమై, నిరంజనమై ఉన్నది.
అది శిలవలె నిర్లిప్తమై ఉన్నది. చంద్రబింబము వలె అద్దాని నుండి అమృతానందం నిత్యమూ స్రవిస్తోంది. స్వసంవేద్యమగు నిరతిశయానందమున ప్రకాశిస్తోంది. శీతలమగు, వినీలమగు స్వయంప్రకాశముచే వెలుగొందుచూ సకల సౌఖ్యములకు ఆలవాలమై ఉన్నది. అద్దానిని చూచి ‘అది పర్వతము వంటి ఒక జడమగు మట్టి ముద్ద’ అని కొందరు భ్రమిస్తున్నారు. ఈ జనులంతా అద్దాని యందే ఇమిడి ఉండి కూడా అద్దాని స్వరూప స్వభావములేమిటో గ్రహించలేకపోతున్నారు. అనేకులు అద్దాని ఉనికి గురించి కూడా తెలియకయే వందల, వేల ఉపాధులలో సుఖదుఃఖ భావములు కల్పించుకొని అతిదీర్ఘకాలం గడిపివేస్తున్నారు.
అది అగోచరములగు సర్వ ఆనందముల సారస్వరూపమైయున్నది. అది అనంతమై, త్రివిధ (సృష్టి, స్థితి, లయ - త్రికాల) పరిచ్ఛేదరహితమై ఉన్నది. నిత్యమై, అనునిత్యమై స్వాత్మచమత్కృతి చేత ప్రభవించుచున్నది. ఆత్మచమత్కృతి యొక్క అధ్యాసయే ఆ బిల్వఫలం యొక్క అనుభవం. బుద్ధికి ఆవల ఉన్నదై, ఆ బుద్ధి యొక్క సన్నివేశ వైచిత్రానికి తానే కారణమై ఉంటోంది. అది బుద్ధిని కల్పించు కుంటూనే బుద్ధికి ఆవల, ఈవల కూడా ప్రసరించి ఉంటోంది. తన స్వరూపాన్ని ఒక వైపు ఏమాత్రం వదలకుండానే మరొకవైపు స్థూల - సూక్ష్మ అణు కార్య - కారణములను వ్యక్తీకరిస్తోంది. అది సనాతనము. అయితే ఏం? దానికి వార్ధక్యము మొదలైన దశలు లేవు. అది తన యందు ‘స్త్రీ, పురుష, జడ, జంతు’ అనే కల్పనలు నిర్వర్తించుతూ ఆ కాల్పనికాలకు సంబంధించక స్పృశించబడక ఉంటోంది. ‘ఇది అన్యము, ఇది భిన్నము’ - అనే కల్పనాతరంగం ఆ నిశ్చల ఫల రసము నందే ఏర్పడటం జరుగుతోంది.
ఆ బిల్వఫలం వాస్తవానికి ఏమిటి?
ఏదీ కాదు. స్వప్రకాశకుడగు చిన్మయము దృష్ట్యా అది అవిద్యాదులకు ముందే ఉన్న ఆత్మ చమత్కృతియే. అద్దానికి ద్వైతము అనేది పొసగదు. దానికి బాహ్యము ఉంటే కదా… ద్వితీయం
గురించి యోచన?
ఆ బిల్వఫలం స్వశక్తిచే తనయందు కావాలని అహంకారాదులను కల్పించుకుంటోంది. అక్కడి నుండి ఆకాశ కాలములకు సంస్థానమగుచున్నది. అది సంకల్పములను వికసింపజేయటం ద్వారా రాగద్వేష హేయ ఉపాధేయాదులను తనపట్ల ఆపాదించుకుంటోంది. ఆశలు, నిరాశలను తనకు తానే కారణమై రచించుకుంటోంది. ‘ఇది, అది, నాది, నీది’ మొదలైనవి తనకు అంతర్విభాగ మైనప్పటికీ తనకు ద్వితీయమైనట్లు కల్పన చేసుకుంటోంది.
Page:160
ఓ రాఘవా! ఆ బిల్వఫలంలోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అయితే ’బ్రహ్మాండాలు ఉన్నాయి’ - అనేది కూడా కల్పన మాత్రమే. అంతేకాదు. ’ఎదుట, వెనుక, దూరం, దగ్గిర, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్కాలం’ - అనునవన్నీ కూడా ఆ బిల్వ ఫలము నందలి అనుభూతిపరమైన కల్పిత విషయాలు మాత్రమే. కల్పనలకు ఆటపట్టైన ఆ ఫలము జీవులతోకూడిన బ్రహ్మాండ మండలములకు క్రీడామండపము వలె గోచరిస్తోంది.
ఆ ఫలము యొక్క చమత్కృతిచే అందు వేలాదిజీవులు వర్షపుంజంలోని బుడగల వలె క్షణ క్షణం శరీర ధారణం, శరీర త్యాగం చేస్తున్నారు. అందులోంచి రుద్రగణం బయలుదేరి, వారు ఈ సృష్టి యందు ఆశగొనిన విషయబద్ధులను ‘ప్రళయం’ అను ఒకానొక కాలవిభాగంలో కలిపివేసి వినాశనం చేసివేస్తున్నారు. సృష్టిసంహారాలు, స్వర్గ వైభవాలు, నరక దుఃఖాగ్నులు, జగత్భావ, అభావాలు … అన్నీ కూడా తెరపై క్రీనీడలలాగా ఆ ఫలమునందే కల్పిత ఆరోపిత దృష్టులచే దర్శించబడుతున్నాయి.
ఆ బిల్వఫలములోని ఒకానొక చిన్నమూల గల ఒక బిందువులో ఈ అసంఖ్యాక పాలపుంతలతో కూడిన నక్షత్రాల సమూహమంతా విరాజిల్లుతోంది. అది బ్రహ్మము అనే మహాసముద్రపు ఒడ్డున అంతు లేకుండా వెలయుచున్నది. ఆకాశమే దానికి ఆశ్రయం. కానీ ఆకాశమంతా ఉన్నది అందులోనే!
ఆ ఫల మధ్యంలోగల మహాసముద్రాలలో జలం బదులుగా ’క్రియలు, వాటి నుండి ఫలితములు, ఆ ఫలితముల నుండి మరికొన్ని క్రియలు" అనే భీకర తరంగాలు అవిశ్రాంతంగా ఘోషణ శబ్దములతో ప్రవహిస్తున్నాయి. ఆ తరంగాలలో ‘జీవులు’ అనే నీటిచుక్కలు చిందరవందరగా ప్రతిబింబిస్తున్నారు.
ఆ జలంతో ‘కాలము’ అనే ఉపరితలవాయువీచికల ప్రభావంచే ప్రళయము, మహాప్రళయము అనే సుడిగుండాలు ఏర్పడి ఉంటున్నాయి.
కాలము - గాలి ఆకాశంలో అటూ ఇటూ వీస్తున్నట్లు ఆ నిశ్చల బిల్వఫలంలో కాల వీచికలు వీస్తున్నాయి. ఈ చంద్రుడు మొదలైన జోతిష్పదార్థాలన్నీ ఆ కాల ప్రవాహంలోని చిన్న చిన్న చారలు. అది బయటకు క్షణ, విఘడియ ఘడియ, దిన, మాస, సంవత్సర, యుగ, చాతుర్యుగ, మన్వంతర, అయనముల - రూపంలో ఉంటోంది. దాని యొక్క మరొక విశిష్టమైన వైపు ‘కాలాతీతమైనది’. ఈ జరా, మృత్యు, విద్య, అవిద్య, సమృద్ధ, అసమృద్ధాది - విశేషములన్నీ కాలబద్ధం మాత్రమే. ఆ బిల్వఫలమో… కాలమునకు అతీతమైనది.
88
అయితే… ఆ బిల్వఫలం సంకల్పమాత్రం చేతనే ఇన్ని విశేషములతో, వర్ణింపశక్యం గాని మరెన్నో రీతులుగా వెలయుచున్నది. అది ఏకమే అయి ఉండి ద్వైతమును ధరిస్తోంది. మరి, దానిని ఏకం అనాలో, ద్వైతం అనాలో, మరింకేమనాలో తెలియని అద్దాని పరిశీలకులు అద్దాని గురించి అనేక సిద్ధాంతపరమైన వాగ్వివాదములు చేసుకుంటున్నారు.
Page:161
‘అది వివిధాత్మికము కాదు సర్వదా ఏకాత్మికమే’ అనేది వేదాంత శాస్త్ర పరిశోధన యొక్క సమాధానం. ఎందుకంటావా? అద్దానిలో స్వజాతి విజాతీయములు, స్వపరములు లేనే లేవు. ఉన్నట్లు అనిపించేదంతా వాస్తవం కాదు.
దానికి ఉనికి ఉన్నది. కానీ స్వరూపం లేదు. అది అంతా తెలుసుకొనుచున్నది… కానీ, అది తెలియబడుట లేదు. అది స్వయంగా ఆనందస్వరూపం… కానీ సుఖదుఃఖాల కల్పనలన్నీ దానివే. అది సకల ద్వైత వికల్పములకూ ’ఉపశాంతి’యగు ఏకైక సమరూపము.
అదియే ‘చిచ్ఛక్తి’ అనబడే ఆదిశక్తి. అది సర్వాత్మకమైన ’మహదృహ్మ బిల్వఫలం’.
శ్రీరాముడు : భగవంతుడా! సర్వసారజ్ఞా! ఆత్మానుభవులు ఉపయోగించే బిల్వఫల ఉపమేయం (Metaphor) ‘చిదనబ్రహ్మసత్త’ గురించేనని నాకు అర్థమయింది. ఈ ’నీవు - నేను’ అహంకారాలన్నీ ఆ చిత్ యొక్క రూపాలేనని, ఇక ఇందు ద్వైత ఐక్య కల్పనా భేదాలు లేవని గ్రహిస్తున్నాను. అయితే … ఒక బిల్వఫలం ఎప్పటికైనా వాడిపోతుంది కదా…?
శ్రీవసిష్ఠ మహర్షి : ఏ ఉపమానమైనా బ్రహ్మతత్త్వాన్ని సంపూర్ణంగా విశదీకరించలేదు. విజ్ఞులు ఒక్కొక్క ఉపమానాన్ని ఒక్కొక్క విషయ పరిజ్ఞానం కొరకై వాడుతూ మనకు అందిస్తూ ఉంటారు. ఉపమానా లనేవి ఆశ్రితుడగు శిష్యుని సామాన్య, దైనందికానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి సుమా!
కనుక “బిల్వఫలంలోని గుజ్జు నాశనమైతే బిల్వఫలం కూడా నశిస్తుంది కదా! అట్లాగే బ్రహ్మాండాలు (జగత్తులు) నశిస్తే బ్రహ్మము కూడా నశిస్తుంది”…అని అనుకోకు. బ్రహ్మమునకు పెరుగు-తరుగులు ఉండవు. అది ఏ క్షణంలోనూ మరొకటిగా అగుటలేదు …అవదు. మిరియపు గింజలో కారం అంతర్లీనమై ఉన్నట్లు జగత్తులలో బ్రహ్మము సారం-రసం అయి, అంతర్లీనంగా అనునిత్యమై ఉంది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఆధ్యాత్మ వాఙ్మయంలో ఆత్మతత్వమును ప్రవచించే బహు ప్రచారమై ఉన్న మరొక ఉపమానం కూడా చెప్పుతాను …విను.
ఒకచోట ఒక గొప్ప శిల ఉన్నది. అది అతి నునుపుగాను, స్పష్టంగాను, ప్రకాశవంతం గాను, మృదువైన స్పర్శతో కూడి మహావిస్తారమై ఉన్నది. ఆ మహావిశాల శిలపై అనేక పద్మాలు నగిషీ చేయబడి ఉన్నాయి. ఆ పద్మముల దళాలు ఒకదానినొకటి తాకుతూ ఉన్నాయి. ఆ శిల్పి ఎవరో కానీ… అందులో కొన్ని పద్మములు బాగా వికసించి ఉన్నాయి. మరికొన్ని కొంత వికసించి ఉన్నాయి. కొన్ని పైకి లేచి ఉన్నాయి. ఇంకొన్ని ముడుచుకుని ఉన్నాయి. కొన్ని క్రిందకు వ్రేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంకొన్ని పడుకొనిన భంగిమలో కనిపిస్తున్నాయి. అయితే అన్ని పద్మముల మొదళ్ళు కలిసియే ఉన్నాయి. వాటిలో కొన్ని పద్మముఖములు పరస్పర సంలగ్నములై ఉన్నాయి.
కొన్ని ఊర్ధ్వ, అధో మూలములు కలిగి ఉన్నాయి. కొన్నిటికి మూలములే కనిపించటం లేదు.
Page:162
శ్రీరాముడు : గురువర్యా ! నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు సాలగ్రామ క్షేత్రంలో (ఒక విష్ణుక్షేత్రం) ఒక పెద్ద కొండరాయిని చూచాను. ఆ శిల మీరు వర్ణించినట్లు పద్మములచే అలంకారితమైన వనం సుదీర్ఘంగా చిత్రీకరించబడి ఉంది. మీరు చెప్పేది వింటుంటే ఆ గండశిల గుర్తుకు వచ్చింది. ఒక ఘడియకాలం ఆ శిల్పచాతుర్యం గమనిస్తూ ఉన్నాను కూడా … ఇంక చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : …మంచిది. నేను దృష్టాంతంగా తీసుకుని వర్ణించి చెప్పే పెద్ద శిల శిల్పచాతుర్యం తీర్థయాత్రలు చేస్తూ చూచావు కదా! పద్మవన చిత్రీకరణను, శిలను ఒకే చూపుతో చూడటం
జరిగింది కదా!
శ్రీరాముడు : అవును. చూడకేం! శిల - - శిల్పములు ఒక్కచోటే ఒక్కటిగానే ఉన్నాయి కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అదే రీతిగా … ‘దృష్టమయమైన బ్రహ్మము’ను నీవు అనుక్షణం చూస్తూనే ఉన్నావు. శిల్పరచనలో కనిపించేదానికంతటికీ శిలయే స్థానము, మూలము, వాస్తవరూపము, ఆలంబనము, అధిష్ఠానము కదా! బ్రహ్మమే ఈ సర్వజీవులకు అట్టి ఆలంబనము అయి ఉన్నది. బ్రహ్మము ప్రాణమునకే ప్రాణమగు "చిదన ఆనందం” అయి ఉన్నది.
శ్రీరాముడు : ఈ “శిల - దానిపై చెక్కబడిన పద్మవనం" అనే దృష్టాంతం చెప్పుటలో మీ ఆంతర్య మేమిటో వివరంగా చెప్పమని నా విన్నపం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘుకుల తిలకమా! నేను ఉదహరిస్తున్న ఆ అపూర్వమగు శిల బ్రహ్మమే అయి ఉన్నది. ఆ బ్రహ్మ శిలపై ఈ జగద్విశేషములన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఏం? శిల్పముపై కనిపించేవన్నీ శిలయే అయినట్లు, ఇక్కడ పరిపరి విశేషములతో కూడిన జగత్తు అనబడేది లేదు. బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మమునందు బ్రహ్మమునకు వేరైనదేదీ లేదు… ఉండదు.
శిలలో ప్రతి అణువూ శిలాతత్త్వమే కదా! "ఘనత్వము, ఏకాత్మకము” అనునవి ‘చిత్’ నందు ఉన్నాయి గదా! అందుచేత ఆ చితన్ను శిలతో పోలుస్తున్నారు.
అత్యంత విశాలము, సూక్ష్మము అగు ఆకాశమునందు వాయువు ఉన్నట్లు ఆ చిత్ శిలయందు దృశ్యము ఉన్నది. ఈ ఆకాశము, భూమి, వాయువు, పర్వతములు, దిక్కులు . ఇక్కడ జగత్తులో వెలయుచున్నాయి. ఇక్కడ చిన్న రంధ్రంలో కూడా ఖాళీ లేదు. అయితే, ఈ జగత్తు వేరే ఏదో వస్తువై ఉన్నట్లు అనిపిస్తోంది. శిలపై పద్మవనం చూస్తున్న వానికి రకరకాల భంగిమలలో పద్మములు కనిపిస్తూ ఉన్నాయి. “సరోవరం… అందులో పద్మములు” అనే పరిశీలనతో చూచేవారి దృష్టిపథంలో శిల గురించిన దృష్టి ఏమరువబడుతుంది కదా!
‘చిత్’ నుండి ఈ జగత్తు వేరు కాదు. సర్వమూ శుద్ధ చిదాత్మకమే! వేరుగా అనిపించేదంతా కల్పన… లేక… మాయ మాత్రమే.
శ్రీరాముడు : అయితే, మహర్షీ! చిత్ శిలయందు చెక్కబడే ఈ జగత్ శిల్పానికి తన ఊహ - - తెలివి - కల్పనచే కర్తృత్వం వహించే శిల్పి ఎవరు?
Page:163
శ్రీవసిష్ఠ మహర్షి : ఇంకెవరు? ద్రష్టయే (చూచువాడే!) ద్రష్ట తన సంకల్పస్వరూపమైన మనస్సుచే ఈ చిత్ శిలయందు భూత - వర్తమాన - భవిష్యత్ ‘అనుభవములు’ అను చిత్రములను చిత్రిస్తున్నాడు.
ఇక ఈ కాల భంజకములు (Compartments of Time) వాస్తవములుగా తోచుచున్నప్పటికీ, వాస్తవములు కాదు. బ్రహ్మశిలయందు విభిన్నములగు పదార్థములు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి బ్రహ్మము ఏకమగు ఘనపిండమే.
ఈ నీకు కనబడే సృష్టి చిత్ శిలయే అయి ఉన్నది. ఇప్పటి ఒక శిల్పము ఆ రూపము పొందక ముందు అంతవరకూ ఎక్కడ దాగి ఉన్నది?
శ్రీరాముడు : అంతకు ముందు ఆ శిల్పం శిలలోనే మౌనంగా దాగి ఉండి ఉంటుంది కదా? శిలా విభాగంలో శిల్పం చెక్కబడింది.
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లాగే సుషుప్తి దశలో ఈ జగత్తుకు సంబంధించిన అనుభవ సంస్కారం ద్రష్ట యందే నిశ్శబ్దమై ఇమిడి ఉంటోంది. శిలయందు చిత్రించబడిన పద్మమునకు (ఆ శిలకు వేరుగా) ఉత్పత్తి ఏముంటుంది? వినాశనమేమి? ఆ రీతిగానే చితనందు చిత్రించబడే ఈ జగత్తులకు కూడా ఉత్పత్తి లేదు… వినాశనమూ లేదు. శిలయందు శిల్పంలాగా ఆ ఆత్మయందు జగదృశ్యం సందర్శించ బడుతోంది.
సాధ్వియగు ఒక స్త్రీ హృదయంలో సుదీర్ఘ కాలం దూర ప్రాంతంలో ఉండిపోయిన ఆమె భర్త యొక్క రూపము, సంభాషణా చమత్కారాలు, కరస్పర్శాది అనుభవాలు, హాస్య-లాస్యాలు ఉన్నట్లు, అనంత వికారములు కలిగిఉన్న ఈ ఈ బ్రహ్మాండములు కూడా ద్రష్టలోనే రూపము కలిగిఉన్నాయి కాని, బాహ్యమున కాదు.
శ్రీరాముడు : మహర్షీ ! ‘వికారములతో కూడిన ఈ బ్రహ్మాండములు, వీటి భేదములన్నీ దర్శిస్తున్న ద్రష్ట… ఉభయములు చిన్మాత్రమే’ అను యుక్తి యుక్తియుక్తమే కదా? ఉచితమే కదా? శ్రీవసిష్ఠ మహర్షి : బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మాండములు మనోకల్పనా వైచిత్ర్యము మాత్రమే! నీటియందు నీటి బొట్టు విలీనమైనట్లు ఈ జగత్తుకు సంబంధించిన వర్తమానానుభవ వికారములన్నీ చిన్మాత్ర దర్శనము (Perceiving Absolute self) నందు విలీనమైపోగలవు.
చిత్ అనంతం కదా! దాని వికారాలు కూడా అనంతమే. అయితే, నామరూపాలుగా ఆవిర్భవించే వన్నీ కాలానుగతంగా ఆ రూపనామాలు కోల్పోతాయి కదా! ఈ జగత్తులో ప్రతిదీ రూపాదులు పొంది, కొంత సమయం తరువాత కోల్పోతున్నది. వాటి అనుభవం ద్రష్ట యొక్క అవగాహనను అనుసరించి మాత్రమే ఉంటున్నది.
కవులచే వర్ణించబడే గంధర్వనగరం నామమాత్రమే అయినట్లు, ఈ జగత్సృష్టులు కూడా నామ మాత్రములే! ఒక కవి యొక్క రచనలో తారసపడే పాత్రల మధ్య తీవ్రము, సంచలనయుక్తము,
Page:164
భాషా ప్రయుక్తము అయినట్టి భావావేశాలు ఏమౌతున్నాయి. కథతోనే ముగుస్తున్నాయి కదా! సృష్టి అనబడే ఒకానొక దృష్టిని మొట్టమొదట చైతన్యమే గ్రహిస్తోంది. ఆ గ్రహించబడేదంతా కాలానుగతంగా చైతన్యమునందే లయం అగుచున్నది. జలం అనేక తరంగాకారాలు ధరించి, ఆ తరువాత ఆ తరంగాకారాలను తనయందు లీనం చేసుకోవటం లేదా!
దృశ్యజగత్తు నందు స్ఫురించుచున్న ఈ వస్తు వికారములన్నీ వాస్తవానికి అర్థశూన్యములు. అన్నీ చైతన్యమునందు ప్రతిభాసించి ఆ ప్రతిభాసక చైతన్యమునందే లయిస్తున్నాయి. శ్రీరాముడు : ఈ వస్తు వికారాలు జీవుని ఆశ్రయించటానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంటుందా? శ్రీవసిష్ఠ మహర్షి : ఇక్కడి వస్తువికారాదులకు స్వతంత్రమైన ఉనికిలేదు. వాటిని దర్శిస్తున్న చైతన్యము అట్లు సంకల్పించుట చేతనే అవి ఆ విధంగా తారసపడుచూ, అనుభవమౌతున్నాయి. కనుక ఈ సర్వం సంకల్ప మాత్రమే. ఆత్మ విచారణా సమన్వితమగు అత్యుత్తమ సంకల్పం నందు అనగా స్వస్వరూపం యొక్క అఖండ అప్రమేయ నిత్యత్వములు సంకల్పించుచున్న సమయంలో తదితరమైన సంకల్పములు తమ రూపము కోల్పోతాయి. అప్పుడు “నిర్విషయ - నిర్విశేష - అనిర్వచనీయ” స్వస్వరూపానందానుభవం సంభవించగలదు. అదియే ఈ సంసారమునకు సముచిత సమాధానం.
బ్రహ్మము అనంతము. నిరర్థకమైన క్రియలు - - వర్ణన, గ్రహణములు కూడా బ్రహ్మమే! ఈ వికారాదులన్నీ బ్రహ్మమునందే ఉదయిస్తున్నాయి. బ్రహ్మమునందే అస్తమిస్తున్నాయి. కనుక సర్వదా, సర్వము పట్ల నిశ్చింతుడవై, అనంత స్వభావుడవై ఉండుము.
మృగతృష్ణ - ఈ సృష్టిని మృగతృష్ణతో పోల్చవచ్చు. మృగతృష్ణలో గల చిన్నతరంగం, పెద్దతరంగం -అన్నీ భ్రమాత్మకములైనవే కదా? పెద్దతరంగం పెద్దగా, భ్రమాత్మకమనీ, చిన్నతరంగం చిన్నగా భ్రమాత్మకమనీ అనం కదా? ఈ జగత్తు భ్రమచే దర్శించబడుచూ, స్వస్వరూప జ్ఞానముచే ‘రాహిత్యము’ వహిస్తోంది.
పుష్పం, ఫలం మొదలైన వృక్ష విభాగములన్నీ బీజము యొక్క అనువృత్తములే కదా! అట్లాగే ఈ సమస్తం చిత్ సత్త యొక్క అనువృత్తియే. అనగా… విత్తనంలోని సత్త ’అంకురం, శాఖ, పల్లవంమొదలైన రూపములుగా క్రమంగా వికృతిని పొంది వాటికి తానే కారణమౌతోంది కదా!
చిత్ నందలి సత్తయే ఈ తదితర జగత్తుగా ప్రభవిస్తోంది. కనుకనే ’ఈ జగత్తుకు కారణం చిత్ సత్తయే’… అని సిద్ధాంతీకరించ బడుతోంది. చిత్ సత్తా సర్వదా ఏకమే అయి ఉండి కూడా, ద్వైత భావమునకు కారణమయి ఉంటోంది.
ఈ జగత్తు ఎక్కడినుండి కలిగింది? ఆత్మవిషయమై ఏమఱుపుకు సంబంధించిన జాడ్యకల్పన నుండే కలిగింది.
అయితే… చిత్తు జడముగా మారుతోందా? ..లేనేలేదు. అది అట్లు మారదు. మారజాలదు. తెలుసుకొనుచున్న వాని ఉనికి, విస్తారముల చేతనే ‘తెలియబడుచున్నది’ అనేది మనగలుగుతోంది.
Page:165
అయితే, తెలుసుకొనుచున్నదేదో, అది తెలియబడుచున్నదానిగా, ఘనీభవించటం లేదు. ‘చిత్ - అచిత్’ అనబడే రెండు వస్తువుల ఉనికియే లేదు. ఏకో సత్…! ఉన్నది ఒక్కటే. రెండవదగు దానికి స్వయం సంబంధమైన ఉనికి లేదు.
మహాశిలయందు చెక్కబడిన అనేక రూపములు శిలయే అయినట్లు, ఈ జగత్తు బ్రహ్మమునకు వేరుగా లేదు. రేఖలు, ఉపరేఖలతో గూడిన మహాశిలవలె బ్రహ్మమే ఈ మూడు లోకములకు ఆలవాలమైయున్నది.
శ్రీరాముడు : స్వామీ! ఈ నేను - నీవు అనునవన్నీ ఎప్పుడు, ఎక్కడ ఆరంభమౌతున్నాయి? శ్రీవసిష్ఠ మహర్షి : శిలయందు పద్మవనం శిల్పిచే చెక్కబడింది కదా! శిల్పి తన కల్పనాచాతుర్యం అనుసరించి శిల్పం తయారు చేస్తున్నాడు. కల్పన యోచన నుండి, యోచన వాసనల నుండి ఉద్భవిస్తు న్నాయి. జనుల అభిరుచిని అనుసరించియే శిల్పి శిల్పములో దృశ్యవిశేషాలను చిత్రీకరించుచున్నాడు కదా! అట్లాగే, ఈ దృశ్యజగత్తు కూడా జనుల సంస్కారాలను అభిరుచులను అనుసరించే కల్పించ బడుతోంది.
శిల్పి యందలి కల్పనా సమూహములకు పుట్టుక ఏమి? చావు ఏమి? అట్లాగే చిత్ నుండి కల్పనచే బహిర్గతమగుచున్న ‘నేను’ ‘నీవు’ అనునవన్నిటికి జన్మలేదు. క్షయమూ లేదు.
అజ్ఞానముచే ‘నేను’, ’నీవు’తో సహా ఈ తదితర జగత్తులు ఉన్నట్లు తోచుచున్నది. జ్ఞానముచే ఈ ‘నేను’ ‘నీవు’, త్రివిధ కర్మలు - - ఇంద్రియగోచర జగత్తులు భావనామాత్రమని తెలియవస్తోంది. కనుక, ’నేను’, ‘నీవు’ మొదలైనవాటికి ఉత్పత్తికి కారణం స్వస్వరూపము యొక్క వాస్తవ స్వభావము ఏమరుచుటయే. ఆ ఏమరుచుటనే ‘అజ్ఞానం’ అని పిలుస్తున్నాం. స్వస్వరూపము యొక్క ఏమరుపే ‘తెలియక పోవటం’ అని విజ్ఞులు పిలుస్తున్నారు. అట్లు తెలియకపోవుటచేతనే కొందరు జీవులు ఈ జగత్తుని వస్తుసమూహములను ఎప్పటికప్పుడు సంకల్పదర్పణము ద్వారా దర్శించుచూ ఇవన్నీ నిత్యమని భావిస్తున్నారు.
శిలలోని శిల్పవిభాగం, శిల్పరహిత విభాగం అంతా కూడా శిలకు ఏమాత్రం వేరు కాదు కదా?… అట్లాగే ఇక్కడ తోచుచున్న జగత్కర్త, ఆయన కర్తృత్వం, తత్కార్యమగు ఈ జగత్తు …అంతా కూడా చిత్స్వరూపం (ఎరుక స్వరూపం) మాత్రమే! ఆత్మ దర్శనమైనదా… ఈ జగత్తు, దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. దీనినే వేదాంత వాఙ్మయ రచయితలు ‘కేవలీస్థితి’ అని జగత్ రాహిత్యం అని వర్ణిస్తున్నారు.
ఒక చమత్కారమేమంటే… ఈ జగత్తు గాని, ఆ బ్రహ్మము గాని ఎవరి చేతా సృష్టించబడుట లేదు…! నాశనము చేయబడుట లేదు!
పర్వత శిఖరం పర్వతం నుండి వేరు కాదు కదా. శిఖరం పర్వతం యొక్క వికారం కూడా కాదు. పర్వతము సదా శిలామయము మాత్రమే. బ్రహ్మము, సృష్టి కేవలం ఉల్లాస విలాసాలను (లీల) సూచిస్తున్నాయి.
Page:166
ఆయా శిల్పుల వివిధములైన - విరుద్ధములైన మనో కల్పనా భేదముల వలన శిలలో వివిధ రీతులుగా శిల్పాలు అనబడే ఆకారాలు గోచరిస్తున్నాయి. అట్లాగే ప్రకృతి సిద్ధంగా కూడా శిలలు అనేక రూపాలను (ఆకారాలను) దాల్చుచూ ఉండటం జరుగుతోంది కదా! అంతమాత్రం చేత ఆయా శిల్పా లన్నీ శిల కంటే వేరుగా ఉంటున్నాయా? ఈ జగత్తు నానావిధ జీవుల విరుద్ధ కల్పనా భేదాలతో కూడి ఉన్నది. ఏది ఏమైనా బ్రహ్మం సర్వదా స్వస్వరూపం నందే స్వస్వరూపం గానే వెలయుచ్నుది.
ఇక్కడి వైచిత్ర్యం ఏమంటే… ఎచ్చట ఏ ఆకృతి కల్పించబడుచున్నదో, అచ్చట ఆ ఆకృతియే వెలయుచున్నది. ఇందు వస్తుగతమైన భేదమేమీ లేదు. కనబడుచున్న వస్తువులన్నిటిలో బ్రహ్మ స్తతయే వెలయుచున్నది. బ్రహ్మ సత్తయే పదార్థముల సత్త. నిద్రించేవాడు స్వప్నంలో చూచే వస్తువులకు, ఆ స్వప్నమునకు సంబంధించిన కల్పనకు భేదమేమైనా ఉన్నదా? లేదు. అయినా కూడా ఆ స్వప్న సమయంలో అభేదాన్ని గుర్తించక అప్పటికి మాత్రం ఆ స్వప్నద్రష్ట వివిధములైన అనేకానుభూతులు పొందుచున్నాడు కదా! అటువంటిదే జాగ్రదవస్థ కూడా! ఈ జాగ్రత్ద్రష్ట తాను చూచే పదార్థములకు తన కల్పనలకు అభేదం తెలియక ఇక్కడ అనేకత్వానుభూతి అనుభవిస్తున్నాడు. ఈ జగత్తు వికసించినా …ఇది నామమాత్రమే! బ్రహ్మసత్త మాత్రమే వాస్తవము. ఇదంతా వాసనామాత్రమే! స్వతహాగా ఇది చిల్డ్రనప్రకాశమవటం చేత, నిత్య ప్రశాంతము. ఈ సృష్టి బ్రహ్మమందు తోచుచున్నప్పటికీ ఎక్కడా ’ద్వైతము’ అనేది ఉండజాలదు.
శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చిత్ను అచేతనమగు బిల్వఫలంతోను, శిలతోను పోల్చారు కదా! దాని తాత్పర్యమేమిటో కూడా కొంచెం వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ‘చిత్’ తత్త్వము స్వరూపమునకు సంబంధించిన ఉత్సుకతను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ సృష్టి సంభవిస్తోంది. సృష్టి అంటే స్వసత్త “యుగ - సంవత్సరములు - వస్తు సంబంధ అనుభూతి విశేషాలు” అను స్వప్నమునందు తన ప్రవృత్తిని ప్రవేశింపజేయుటయే.
వాస్తవానికి ఇక్కడ స్వగత భేదములకు తావు లేవు. దేశకాలాదులు బ్రహ్మము యొక్క కల్పనయే కాబట్టి, అవి కూడా చిన్మయములేనని చెప్పటానికి అర్హమగుచున్నాయి. కనుక ఇక్కడ ’ఇది చిత్-ఇది అచిత్’ అనే విభేదం చేయజాలము.
‘శబ్దములు, శబ్దార్దములు, వాసనలు, సంకల్ప వికల్పములు - - వాటినన్నిటినీ అట్లు గ్రహిస్తున్న జ్ఞాత మొదలైనవన్నీ ఏకాత్మకములే’ అని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఇక ‘అసత్తు’ అని దేనిని చెప్పవలె? ఫలం, అందలిగుజ్జు, రసం - ఇవన్నీ ఒకే వస్తువు అయినప్పటికీ ‘ఇది రసం, ఇది గుజ్జు’ అని వ్యవహరించబడుతోంది కదా! చిత్తు కూడా ఒకే విధమైన సర్జనమైనప్పటికీ వివిధ నామరూపాలతో వ్యవహరించబడుచున్నదని స్పష్టీకరించుకో. వాస్తవమైన ఏకైక స్వసత్తను ఏమరచి ఉండటమే అసత్తు!
Page:167
ఈ సృష్టి వైచిత్ర్యములన్నీ పెక్కు కాక పోయినప్పటికీ పెక్కుగానూ, అవికృతము గాకున్నను వికృతముగా కనిపించుచున్నాయి.
అయితే రాతితో మలచబడిన పద్మంలాగా, అద్దంలో ప్రతిబింబించే జంతు వృక్షాదులతో కూడిన అరణ్యంలాగా ఈ జగత్తు చిత్ నందు ప్రతిఫలిస్తోంది.
నిజానికి ఈ జగత్తు బాహ్యమున లేదు. మరి ఎక్కడున్నది? ద్రష్టయగు నీయందే… నీ వల్ల… నీ యొక్క సంకల్పప్రతిపాదితంగా ప్రకాశిస్తోంది. చిత్ నందు చిత్చే కోరుకోబడే జగత్తులన్నీ ఇచ్ఛానుసారంగా స్ఫురిస్తున్నాయి.
ముత్యపుచిప్పలో ముత్యాలు ఉన్నట్లు ‘చితశక్తి’ అనే పేటికలో జగత్తులు అనే ముత్యాలు ఉన్నాయి. సరియైన విచక్షణ, విమర్శన లేకుండా చూడటంచేత ఈ జగత్తులు ద్రష్టయొక్క దృష్టిచే నిర్మించ బడినవైనట్లు కాకుండా …మరింకెవరి చేతనో ఎన్నడో ఎందుకో నిర్మించబడియున్నట్లు అనిపిస్తోంది. సూర్యభగవానుడు తన ఉదయాస్తమయములచే రాత్రింబవళ్ళు కల్పిస్తున్నట్లు, ఆ చిత్ సూర్యుడు కూడా తన యొక్క సంకల్ప, వికల్పములచే ఈ జగత్తులను తోపింపజేయటం, ఇంతలోనే తనయందు విలీనమొనర్చటం చేస్తున్నాడు.
ద్రష్ట ప్రసరించని దృశ్యము లేదు. దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే! దృశ్యము ‘ద్రష్ట యొక్క కల్పన’ అను ముడిపదార్థంతో తయారయి ఉంటోంది.
సముద్రంలో కనిపిస్తున్న తరంగాలకు ఆధారం ఏమిటి? సముద్రజలమే కదా! ఆ తరంగాలు జలం నుండి వేరైనవా? నిరాకారమైన జలం తరంగాల రూపం సంతరించుకుంటున్నప్పటికీ, జలం సర్వదా తన నిరాకారత్వం కోల్పోతుందా? లేదే! అట్లాగే ఈ జగత్తులు చిత్ సత్తనుండి తన అఖండ - అప్రమేయ - నిత్యసాక్షీస్వభావాన్ని కోల్పోవటం లేదు. కోల్పోబోదు. ఓ రామచంద్రా! “ఇప్పుడు ఉన్నవి ఇతఃపూర్వం ఉండి నశించినవి, ఇక ముందు రాబోయేవి అయిన జగత్తులన్నీ కూడా చిత్ శిలయందు చెక్కబడిన శిల్పములు వంటివే. చిత్ జలంలోని తరంగముల వంటివే”… అని ఆత్మసద్విమర్శకులమగు మేమంతా గ్రహించి ఉన్నాము.
భావపదార్ధములన్నీ అభావ పదార్థముయొక్క చమత్కారమైన ఒక అంశ మాత్రమే! అట్టి పదార్థసారంతోనే (నేను చెప్పిన దృష్టాంతంలోని) బిల్వఫలం నిండి ఉన్నది. కాబట్టి, సర్వపదార్థములూ ‘బిల్వఫలంలోని రససారమే’ అని రూఢి చేసుకో. ఈ తెలియబడుచున్నవన్నీ మృణ్మయములు కాదు. చిన్మయములే! భావనలలోంచి ఉదితములగుచున్న అనుభవములే! ఆ చిన్మయములైనవాటి యొక్క తత్త్వము చిత్తేగాని, మరింకేమీ కాదు.
శిలను విడచి ’ఈ శిలయందు అనేక పద్మములు ఉన్నాయే!’ అనునది ఏదో మాటవరుసకే అవుతుందిగాని, శిల నుండి బయటగా … మరొకటిగా పద్మములు ఉన్నట్లు అవదే! చిత్ నుండి వేరు చేసి చూస్తే ఈ జగత్తు ‘అసత్తు’ అవుతుంది. శిలానిర్మితపద్మంలో శిల లేకుండా చూడు… అక్కడ
Page:168
పద్మమెక్కడున్నది? ఇక్కడ తారసపడే నానాత్వమంతా ఒకే శిలపై చెక్కబడిన ఆకారములవంటిది మాత్రమే. ఇందులో సందేహించవలసినపనేమీ లేదు.
శిల గురించి పూర్తిగా ఏమరిచినప్పుడు ‘ఇది పువ్వు, ఇది కాయ, ఇది మనిషితల, ఇది జంతువు, ఇది మిత్రుడు, ఇది మనసైన్యం, ఇది శత్రుసైన్యం’ - అనబడు శిల్పకళా విశేషాలన్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి కదా. ‘సర్వమూ శిలామయమే’ అనే దృష్టితో చూస్తున్నప్పుడు … ఆ విభేదాలు ఏమౌతాయి? అర్థరహితమౌతాయి కదా! ఈ జగత్తుల ఉత్పత్తి, క్షయాలు అట్టివే! ద్రష్ట యొక్క స్వస్వరూప, స్వస్వభావముల దృష్ట్యా పరిశీలిస్తే ఇక్కడ సర్వదా అవిభక్తమైన (Indivisible) చిదనజ్ఞానమే లభిస్తుంది. శ్రీరాముడు : అసలు ‘అనేకత్వము’ అనే భ్రమ ఎందుకు ఏర్పడుతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : దాహముచే పరితపిస్తున్న కొందరు మూర్ఖ, అవిజ్ఞాత జీవులు జలం కొరకై అటూ ఇటూ చూస్తున్నారు. వారిలో ఒకడికి మృగతృష్ణ, అందులో జలం కనిపించాయి. ‘అదిగోరోయ్! అక్కడ జలం ఉన్నట్లే ఉన్నది’ …అని పొలికేక వేసి పరుగులు తీస్తున్నాడు. ఇక తదితర అమాయక జీవులు ‘అక్కడ జలం లేకపోతే మనవాడు కేక ఎందుకు వేస్తాడులే’- అని అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. ‘ఈ ఎండలో ఈ ఎడారి ఇసుకమయమే కదా! ఇక్కడ నీరు ఎట్లా ఉంటుంది? మెరుస్తున్నంత మాత్రం చేత అది జలమే అవవలసిన పనిలేదు కదా?’ అని వారు విమర్శించటం లేదు. వారి ఆర్తి అలాంటిది.
అయితే …“ఆ సువిశాల ఎడారి, ఇసుక ప్రాంతంలో నీరు ఉండటానికి అవకాశం లేదు” అని గ్రహించినవారు, “అది గాలి వీచికలు, సూర్యకిరణముల మేళవింపు మాత్రమే…” అని గ్రహించి తదితర అమాయకజనుల వలె నిష్ఫలమైన శ్రమకు లోనుకాకుండా ‘అసలు, నిజమైన జలం ఎక్కడ లభిస్తుంది’ అని వెతికి వాస్తవమైన జలం ఉండే స్థానం వైపు పయనిస్తున్నారు.
ఈ జీవుడు తనను సత్ - అసత్మయమగు శరీరమాత్రుడుగా తలచుచున్నాడు. కాని ఆతడు వాస్తవానికి చిన్మాత్రుడు. తెలియబడుచున్న సర్వమునకు ఆధారభూతుడు. పరస్వరూపుడు.
యథా సమ్యక్ పయోరాశిః కోటరే కలనోన్ముఖమ్ |
ద్రవత్వాత్స్పన్దతే స్పన్దం తథేదం చిల్డ్రనాన్తరమ్ ॥ (శ్లో॥ 16, సర్గ 47)
జలము స్వతహాగా స్పందనరహితమైనప్పటికీ ద్రవత్వస్వభావం చేత పల్ల ప్రదేశములందు కదిలే స్వభావం కలిగి ఉన్నట్లు తోచుచున్నది కదా! అదేవిధంగా చితనము తనయందు స్వతహాగా చలన - సంచలనములు కలిగి ఉండనప్పటికీ, జగత్తును స్వీకరించుచున్నప్పుడు స్పందనసహితము వలె తోచుచున్నది.
శిలయందు ఉన్న (చిత్రంచబడిన) శంఖము వాస్తవానికి శిలయే అయినట్లు, చిత్ శిలయందు ప్రకటితమగుచున్న ఈ జగత్తు అనబడేది చిన్మయస్వరూపముకాక మరింకేదీ కాదు. అయినప్పటికీ, సాధారణ బుద్ధికి ఇదంతా మరింకేదోగా కానవస్తోంది. ప్రియశిష్యా! రామచంద్రా! నీవు మాత్రం ఈ దృశ్యమునంతటినీ - స్వశరీర - మనో - బుద్ధి - - చిత్త - అహంకారములతో సహా, సర్వదా చిన్మాత్రంగానే దర్శించు. దీని యందు ఏ సమయమందూ ఎట్టి వికారములూ లేనే లేవు.
Page:169
ఈ జగత్తు వాసనామాత్రమగుట చేత అనిత్యం… ఇది బ్రహ్మం నందే ఉండుట చేత నిత్యం.
నిజమైన పద్మము యొక్క తీవ్రధ్యాస గలవారికి శిలలోని పద్మము, పద్మమునకు సంబంధించిన అనుభూతిని కలుగజేస్తోంది. శిలను ఏమరచేటట్లు చేస్తుంది. శిలాప్రతిమలపై చిత్రించిన శృంగార చిత్రం కాముకుడగు వానికి తదనుగుణమైన స్ఫురణోత్సాహం కలుగజేస్తోంది. అయితే, అది వాస్తవానికి శిలే కదా…! ఈ జగత్తు ద్రష్ట యొక్క భావన, అవగాహన, ఉద్దేశము, అనుభూతులను అనుసరించి తదనుగుణంగా అనుభవమౌతుంది. అఖండము, నిత్యము, నిర్మలము, అప్రమేయము - అగు బ్రహ్మానుభూతి సమన్వితునికి ఇదంతా స్వచ్ఛం, అద్వితీయం అగు బ్రహ్మముగానే అనుభవమౌతోంది. శిలచే చిత్రించబడిన ఎలుగుబంటి దూరంగా ఉండి చూచే బాలురవంటి వారికి ’అరె! ఆ ఎలుగుబంటి నా వైపే గుఱ్ఱున చూస్తోందే!" అని అనిపించవచ్చు. దగ్గరకు వెళ్ళి చూస్తేనో… అది నిష్క్రియమగు శిలయేనని తెలిసిపోతోంది కదా! బ్రహ్మభావాభ్యాస ప్రభావంచే ప్రకాశించే ప్రశాంత హృదయులకు ఈ జగత్తు అనుద్వేగకరమగు మౌనతత్త్వముగా తెలియవస్తోంది.
శిల యందు శిలత్వము, శిల్పత్వము, శిల్పాంతర్గత కథనము - ఉన్నట్లు బ్రహ్మమున బ్రహ్మత్వము, ఈ జగత్తు కూడా ఉన్నాయి.
చెట్టు, చెట్టు యొక్క ఆకారము ‘ఒక్కటే’ అయినట్లు … బ్రహ్మము, జగత్తు వేరు వేరు కాదు. రెండు చిన్మయములే! ఈ కనబడేదంతా మృణ్మయదృష్టి కలవారికి మృణ్మయంగాను, చిన్మయ దృష్టి కలవారికి చిన్మయంగాను అనుభూతమౌతోంది.
ఓ రాఘవా! మరొకసారి ప్రకటిస్తున్నాను. ’చిత్తు’లాగానే ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి వినాశనాలు లేవు. ఎండమావులను ప్రకాశింపజేస్తున్నది ఆకాశంలోని సూర్యుడే కదా! బ్రహ్మమే ఈ జగత్ప్రకాశానికి కారణమగుచున్నది. ఒకే జలం ఎండ వేడిమిచే ఆవిరి, మేఘాలు, వడగళ్ళుగా అగుచున్నది కదా! తత్త్వజ్ఞులకు ఈ సర్వ పదార్థముల మూలం బ్రహ్మమేనని తెలుసు. వారు గొప్ప పర్వతం నుండి ఒక గడ్డిపరక వరకు సర్వమూ బ్రహ్మమయమేనని గ్రహించియే సంచరిస్తున్నారు.
జలపరమాణువునందు ఏ రసశక్తికలదో … స్థూలమగు జలమునందు కూడా అదే గోచరిస్తుంది కదా! ఆ చితశక్తియే పంచీకృత అపంచీకృతములగు స్థూలసూక్ష్మ భూతములందు నిండి ఉన్నది. ఒకే విధమైన ‘శక్తి’ గడ్డిలోను, ఆకులలోను, లతలలోను, ఈ కనబడే నానావిధపదార్థములందూ దాగి ఉన్నది కదా! (సర్వమ్ శక్తిమయమే!) బ్రహ్మమే ఈ నానా విధములుగా తోచుచున్న వివిధ వస్తువులతో పరివ్యాప్తమైయున్నది. నెమలి గుడ్డులో నెమలి పింఛము యొక్క రంగురంగులు దాగి ఉన్నవి కదా! పరమాణువు నందు పదార్ధస్వభావమంతా ఒదిగి ఉంటోంది. బ్రహ్మమునందు
Page:170
గుణములు, ఆ గుణములకు ఆధారమగు ఆవిర్భావ, తిరోభావములు, వాటిని అనుభూతి పొందే గుణి…అన్నీ కూడా రసస్వరూపమై ఒదిగి ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ బ్రహ్మమునందు ఆపాదితములైనవేనని గ్రహించు.
వివేకదృష్టితో పరికించి చూచేవానికి “ఈ నానాత్వమునకు కారణమైన బ్రహ్మము అద్వయము” అని తెలిసిపోతోంది. వాస్తవానికి అది ద్వైత - అద్వైతములకు కూడా అతీతమైనది. సత్ - -
అసత్తులయందు సమత్వమున ఏదైతే సర్వదా వెలయుచున్నదో… అదియే బ్రహ్మము. అనుభూతములన్నీ బ్రహ్మమునందే, బ్రహ్మముచేతనే ఉదయిస్తున్నాయి. అద్దాని సమక్షమునందు అనుభూతి ఉంటోంది. లయిస్తోంది.
ఈ జగత్తు చిద్రసముతో నిండిఉన్నదై, తనకు తానే ఉనికిని కల్పించుకుంటోంది. జగత్తు అనే రసము బ్రహ్మము నందే ప్రకాశిస్తోంది. బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. జగత్తంతా బ్రహ్మరసముచే నింపివేయబడి ఉన్నది. ఇక భేదమెక్కడికి?
4.స్వస్వరూపానంద సుస్థిరత్వం
శ్రీవసిష్ఠ మహర్షి : ఒక నెమలి గ్రుడ్డులో - నెమలి యొక్క రూపం, పింఛం, ఆ పింఛంలోని రంగుల వలయాలు, జూలు, పెద్ద రెక్కలు, సన్నటి పొడవైన కాళ్ళు, గోళ్ళు- మొదలైనవన్నీ దాగి ఉన్నాయి కదా! అట్లాగే విశుద్ధమగు చిత్ అండముతో అహంకారము-బుద్ధి-చిత్తము మొదలైన వాటితో కూడిన అంతర్ జగత్తు …దిక్కులు - ఆకాశం మొదలైన వాటితో కూడిన బాహ్యజగత్తు అనభ్యుతములై (As non-Provoked) వెలయుచున్నాయి.
ఆ చిదనానందమే ఈ సర్వ శరీరావయవాలకు రసమై - “ప్రాణంగాను - - విషయసుఖసారాలైన చిత్తవృత్తి భేదాలుగాను, భోగ్య - భోగాది వస్తువులుగాను" - అద్దంలోలాగా ప్రతిబింబిస్తున్నది.
మనం ప్రతిబింబితమైన విషయానందమును చూస్తున్నప్పుడు …ఆ ప్రతిబింబమునకు మూలమైన చిదనరూప నిరతిశయానందము యొక్క ఉనికిని ఒప్పుకోక తప్పదు. ఆ నిరతిశయానందం స్వాత్మానుభవ రూపమే సుమా! స్వాత్మానుభవరూపమునే తురీయమని కూడా అంటున్నారు. అట్టి నిరతిశయానందాన్ని మునులు, దేవతలు, గణములు, సిద్ధులు, మహర్షులు అగు వారిలో అనేకులు అనుభవిస్తూనే ఉన్నారు. నిర్నిమేషులై స్థిరపడిన దృష్టిని అధిరోహించి, దృశ్యదర్శన రహితులై నట్టి మహనీయులెందరో ఆ స్వస్వరూపానందమున తేలియాడుచున్నారు. అట్టి దృశ్యదర్శనరహిత మైనట్టి స్వస్వరూపంలో నిలకడ పొందలేక ప్రాణ చలన చిత్త విక్షేపములకు చోటిచ్చుటచేతనే ఈ జీవులలో అనేకులకు ఆ ఆనందం అనుభవానికి రావటం లేదు. ఇంతకు మించి వేరే కారణమేదీ లేదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు ఉదహరిస్తున్న “స్వస్వరూపానంద సుస్థిరత్వం” మరికొంత విస్తారంగా వివరించండి.
Page:171
శ్రీవసిష్ఠ మహర్షి : స్వస్వరూపము యొక్క మహత్తరానుభవమనునది ఎరిగి ఉన్న ఆత్మజ్ఞులు ఈ కర్మలలో నిమగ్నమగుచున్నప్పటికీ…వారు బాహ్య వస్తువులు చింతనలో ఒక్క నిమిషం కూడా నిమగ్నమవటం లేదు. జ్ఞానజ్ఞేయములను సర్వదా త్యజించివేసి ఉంటున్నారు. అనగా ’తెలుసుకునేది, తెలియబడేది’ అను ద్వంద్వమునకు ఆవల తమ స్వరూపమును ప్రతిక్షేపించుకుని ఉంటున్నారు. అట్టి దృష్టి-అవగాహన-భావన-అనుభవములను శాస్త్ర పరిభాషలో ‘సమాధి’ అని పిలుస్తున్నారు. ఒక చిత్రంలోని మనిషికి స్పందనాస్పందనములు ఉండవు కదా! స్వస్వరూపానుభవి యొక్క అంతరంగం స్పందనాస్పందరహితంగా ఉంటుంది. వారు చిత్తమును, చిత్తమునకు ఆశ్రయమై ఉంటున్న విషయములను సదా త్యజించినవారై … తత్ఫలితంగా ‘భూమానందము’ అని చెప్పబడే ’సర్వ సమభావన’ను పొందుచున్నారు.
ఆ పరమేశ్వరుడు అంతరమున స్వస్వరూపానందమయుడై ఉండి కూడా బాహ్యమున ‘మాయ’ అగు ఈ జగత్తును నడిపిస్తున్నారు కదా! అదే రీతిగా … జ్ఞానోదయమై, స్థిర స్వభావులైన మహానుభావులు అంతరమున స్వస్వరూపమును ప్రతిక్షేపించుకుని, ఇక బాహ్యమున వ్యవహారములు సలుపుచూ ఉన్నారు. ఓ రామా! నీవు కూడా నిరభ్యంతరంగా ఇప్పటికిప్పుడే అజ్ఞానమయములైన ద్వైత భావములను వదలివేయి.
శ్రీరాముడు : అప్పుడు కర్మలు నిర్వర్తించటం సులువు కాదేమో!
శ్రీవసిష్ఠ మహర్షి : కాలానుగుణంగా సంప్రాప్తించే కర్మలలో పాల్గొనుచూ భూమానందము, లేక సమాధిని అవధరిస్తున్న వారెందరో ఉన్నారయ్యా! నీ అంతరంగ సునిశ్చితబుద్ధిని బయటనుండి నిన్ను అడ్డుకోగలిగేది ఈ చరాచర సృష్టిలో ఏదీ లేదు.
చంద్రకిరణములు వృక్షములందు, ఆకులందు, చిగుళ్ళయందు ప్రవేశించి వాటిని రసభరితం చేస్తూనే తన ప్రశాంత తత్త్వమును కొనసాగిస్తున్నాయి కదా! చంద్రకిరణములు ఒకానొక చోట అగ్నిగుండముపై ప్రసరించినంత మాత్రం చేత చంద్రమండలం తన చల్లదనం కోల్పోతుందా?… లేదు కదా! మహాత్ముల బుద్ధి - ‘చిత్తవృత్తులు, బాహ్యవిషయముల’తో కూడుకుని ఉన్నప్పటికీ సర్వదా నిరతిశయానందమును అభివ్యక్తం చేస్తూనే ఉంటోంది. వారి వాక్కు, యోచన - అన్నీ కూడా ‘ఇచ్ఛ, ఆశయ, ద్వేష, ఉద్వేగ, నిరుత్సాహములను’ అధిగమించి ఉంటున్నాయి. అందుచేత అన్నివేళల, అన్ని స్థితులందు విక్షేపరహితమైన ఆహ్లాదమును వారు ప్రాప్తించుకుని ఉంటున్నారు.
చంద్రుని వెన్నెలకు రూపమేముంది?… అదేవిధంగా శుద్ధసంవిత్తుకు ఎట్టి రూపమూ లేదు. స్వస్వరూపానుభవజ్ఞులు రూపాతీతమైన అనుభవమునందు వెలయుచున్నారు.
అట్టి స్వస్వరూపానుభవం చూడబడజాలదు. ఉపదేశించబడజాలదు. అది దూరం కాదు. దగ్గర కాదు. అది కేవలం అనుభవయోగ్యం అని చెప్పాలి. దానికి దేహేంద్రియ మనోప్రాణములు లేవు. సంకల్ప-వాసనలు లేవు. అది జీవుడు కాదు. స్పందన కాదు. సంవిత్తు కాదు. జగత్తు కాదు. అత్యంత సన్నిహితం-దూరం-మధ్యం కాదు. శూన్యం- అశూన్యం- శూన్యాశూన్యాలు కూడా కాదు. శ్రీరాముడు : మరి అట్టి స్వస్వరూపమును గుర్తించటం, అధిరోహించటం ఎట్లా?
Page:172
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ నా వాక్యములు ఉత్తమవివేకంతో విచక్షించుకో. అది అధిరోహించవలసినది నీవేగాని, నేను గురువుగా ఇంతకు మించి స్పష్టపరచలేను.
ఇక్కడి దేశకాలాదులచే ’స్వస్వరూపానందప్రతిష్ఠ’ను నిర్వచించలేం. ఎందుకంటే అది దేశకాలాదు లందలి పదార్థమేదీ కాదు. అయితే ఏం? దేశకాలాదులుగా పరిచ్ఛిన్న స్వభావం ప్రదర్శిస్తున్నది అదే! అది విషయములన్నింటికీ వేరయి కూడా, తానే అనంతములగు వాసనలతో గూడిన హృదయ కోశమును కలిగి ఉంటోంది. అద్దాని స్వస్వరూపమహిమ వలననే దృశ్యవస్తువులు ఆవిర్భవించి విలయమొందుతున్నాయి. స్వస్వరూపసత్తకు శాస్త్రములు ‘ఆత్మ’ అను పేరుపెట్టాయి. అది నిష్కారణమై, కారణములన్నిటికీ కారణమై చెన్నొందుచున్నది. ఈ వాయువు, అగ్ని మొదలైనవన్నీ దాని రూపమును మార్చలేవు. ఇహలోక, పరలోకములు ఆ స్వస్వరూప సద్రూపమును మరొక తీరుగా చేయజాలవు. వేలకొలది దేహములు ఉత్పన్నమై, వినాశమగుచుండగా ఆ స్వస్వరూపం మాత్రం స్వస్థానముననే ఉండి వాటన్నిటికీ సాక్షి మాత్రమై వెలుగొందుతోంది. అద్దాని వెలుగుచేత … అద్దాని సమక్షంలో ఈ వేలాది దేహములు వస్తున్నాయి, పోతున్నాయి.
ఆత్మాకాశము యొక్క బయటగాని, లోపలగాని ఎట్టి వికారములు మార్పు చేర్పులు లేవు. ఈ దేహములకు స్ఫురిస్తున్న వికారములేవీ ఆత్మకు ఉండజాలవు. అట్లని ఈ దేహములు ఆత్మ కాక మరొకటేదో నని అనుకోవద్దు. ఇక్కడ వికారములు స్ఫురించటానికి కారణం ’బోధ’ యొక్క వికృతియే గాని మరొకటేదీ కాదు. అందుచేత పరిపక్వమైన స్వబుద్ధిని సంపాదించిన జ్ఞానులు ఈ విశ్వమును ’ఆత్మ’గానే గ్రహిస్తున్నారు.
శ్రీరాముడు : అట్టి అఖండమగు స్వస్వరూపసమేతుడనగు నాకు ఇక్కడ కర్తవ్యమేమిటి? అకర్తవ్యమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి
ప్రజ్వలన్నపి కార్యేషు నిర్వాణో నిర్మమో భవ |
యదిదం దృశ్యతే కించిజ్జగత్థావరజంగమమ్ || (శ్లో 18, సర్గ 48)
తత్సర్వం బ్రహ్మ నిర్ధర్మ నిర్గుణం నిర్మలాత్మకమ్ |
నిర్వికారమనాద్యన్తం నిత్యం శాస్త్రం సమాత్మకమ్ ॥ (శ్లో 19, సర్గ 49)
ఇక్కడ అవిశ్రాంతంగా కార్యములు ఒనర్చుచున్నప్పటికీ, నీవు నిర్వికారమగు ఆత్మను ఇక్కడ దర్శిస్తూ ఉండు. ముక్తాత్మ స్వరూపుడవై సర్వప్రకాశకమగు స్వీయ కాంతితో ప్రకాశించు.
కనులకు కనబడుచున్న ఈ స్థావరజంగమాత్మక జగత్తు అంతా నిర్గుణము, నిర్మలాత్మకము ఉపాధిధర్మ విరహితము అగు బ్రహ్మమేనయ్యా! అది ఆద్యంతహీనము, నిత్యము, శాంతము, సన్మాత్రము అయి ఉన్నది ఇక నీకు సందేహమెందుకు?… వికారాదులెందుకు?
వత్సా! ఈ కాల-కర్మ-కారణ-కర్మ-క్రియ-నిదాన-సృష్టి-స్థితి-లయ-స్మరణ-విస్మరణాదులన్నీ కూడా బ్రహ్మమేనని గ్రహించు. బ్రహ్మముతో మాత్రమే ఐక్యము సంపాదించుకో. అప్పుడిక ఈ సంసారచక్రములో పడి పరిభ్రమించటం జరగనే జరగదు.
Page:173
శ్రీరాముడు : హే పరమ బ్రహ్మజ్ఞా! గురుదేవా ! "నిరతిశయము మహోత్తమము”అగు బ్రహ్మవస్తువు నందు దేశ-కాల-నిమిత్తములు అనే పరిచ్ఛేదమే లేదని మనం అనుకుంటున్నాం కదా! అట్టి వికారాలకు తావు లేనపుడు మరి అది భావ-అభావముల రూపంలో ఎట్లు, ఎందుకు ప్రకాశిస్తోంది? శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మకు భూత భవిష్యత్తు వర్తమానములతో పరివర్తనమంటూ లేదు. అది కాలముచే బద్ధమైనది కాదు.
పాలు పెరుగుగా మారుతున్నప్పడు ‘పాలు పెరుగుగా పరివర్తనమౌతోంది’ అని అంటున్నాం. ఆ పరివర్తనమునే ‘వికారం, పరిణామం’ అనే మాటలతో వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఇక పెరుగు తిరిగి పాలుగా మారే ప్రసక్తి ఉండదు కదా! బ్రహ్మం-జగత్తు అట్టి పాలు- పెరుగు వంటివి కాదు. బ్రహ్మమునకు పరివర్తనం లేదు. అది జగత్తుగా మొదలే మారటం లేదు.
అయితే … ఈ జగత్తు యొక్క ఆదిమధ్యాంతము లందు కేవల నిర్మల బ్రహ్మమే వెలయుచున్నది.
పాలకు ఉండే వికృతి బ్రహ్మానికి లేదు. బ్రహ్మం ’అనాది, అనంతం’ - అగు వస్తువు. అందుచేత అవయవసంయోగం, అన్యద్రవ్య సంబంధం మొదలైనవి బ్రహ్మమునకు సంబంధించి లేవు. ఇక సర్వసమమగు బ్రహ్మమునందు ఒకనికి కనిపించే ఈ జగత్తు స్వయంకృతభ్రమకు సంబంధించిన వివర్తం మాత్రమే. బ్రహ్మమును భావన చేసేవానికి భావ - అభావ జగత్తు మిథ్యగానే తెలియవస్తోంది. బ్రహ్మము అనగా సంస్పర్శరహితమగు చిదాత్మయే కదా! అద్దానిలో జ్ఞానజ్ఞేయములు లేవు.
బ్రహ్మమునందు జ్ఞానజ్ఞేయములు కూడా లేవు. అది సృష్టికి పూర్వమున, పరమున కూడా ఉన్నది. అద్దాని యందు జగత్తు మొదలైన భ్రమలు లేనేలేవని గ్రహించు. పూర్వమున, పరమున ఒకే తీరుగా ఉన్న బ్రహ్మము మధ్యలో మాత్రం మరొక తీరుగా అగుచున్నదా? లేదు. లేనే లేదు. మధ్యకాలంలో ఇంకొక రీతిగా తోచటం కేవలం భ్రమ మాత్రమే.
“ఆత్మ ఆది-అంతము లందు, మధ్యలోను సర్వత్రా సర్వవైపులా సమస్వరూపమున వెలయు చున్నది.” ఇక ఈ దృశ్య దర్శన వివర్తము ఉంది చూచావు?… ఇది ఆత్మ సంబంధీయమే కాని, ‘ఆత్మతత్త్వం మాత్రం కాదు. ఆత్మ సంబంధీయమైన దానితో ఆత్మ వికారం పొందుట లేదు.
సర్వశక్తిమంతమగు బ్రహ్మము లేక ఆత్మ రూపరహితము… ఏకము… నిత్యము కూడా. అందుచేత ఈ భావవికారాలకు అది ఎన్నడూ వశమగుటలేదు.
శ్రీరాముడు: మరి పరిపూర్ణము - నిర్మలము — సద్రూపము ఏకము అగు బ్రహ్మమున
‘అజ్ఞానం’ అనతగ్గ అవిద్య ఎక్కడ నుండి వస్తోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు ‘బ్రహ్మతత్త్వం’
ఒక్కటే వెలయుచున్నదని మరొక్కసారి చేతులెత్తి ప్రకటిస్తున్నాను అది అనాది … అనంతము! ఇక అవిద్య ఏమంటావా?… అవిద్య అనునదే లేదు. ఇది నిశ్చయమగు సత్యము.
Page:174
ఇక బ్రహ్మము యొక్క సద్భావం గురించి, అసత్ విభాగం గురించి వేరువేరుగా చెప్పుకోవటం కేవలం ఉపదేశ సౌలభ్యం కొరకు మాత్రమే. ‘ఇది బ్రహ్మతత్త్వము’… అని అనుభవజ్ఞుడగు గురువు శిష్యులకు ప్రతిపాదించి చెప్పుకొస్తున్నప్పుడు, ఆ శిష్యులకు అవగతమవటానికి వీలుగా అనేక వాచ్య-వాచక శబ్దములన్నీ కల్పించబడుచున్నాయి. అంతేకాని, అదంతాకూడా బ్రహ్మమునుండి వేరైన మరొకదానిని వర్ణించడం కానే కాదు. నీవు, నేను, జగత్తు, భూ, దేవలోకములు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు –1 అన్నీ కూడా ఆద్యంతరహితమగు బ్రహ్మము కాక మరింకేమౌతాయి? అవిద్య అనేది ఒకించుక కూడా లేదు. ఇక వివర్తము, అవిద్య, భ్రమ… అనునవన్నీ నామమాత్రమే. అవన్నీ ఆత్మ యొక్క ఏమరుపును ఉద్దేశిస్తున్నాయని గ్రహించు. అవిద్య అనునది సత్యం యొక్క అభావం మాత్రమే నని ఈ సభలోని, తదితర ప్రపంచంలోని అనేకమంది తత్త్వజ్ఞులు ఎరిగియే ఉన్నారు.
ఓ రాఘవా! ‘లేనిదే’ అగు అవిద్య ఎట్లా ఉదయిస్తుంది? …అది సత్యమెట్లా అవుతుందయ్యా! శ్రీరాముడు : ప్రభూ ! మరి మీరు ఉపశమన (ప్రకరణ) ప్రవచన సందర్భంలో “అవిద్యను ఎట్లా సంబోధించాలి?” - అను విషయంలో అనేక విశేషాలు చెప్పారు కదా! దాని మాట ఏమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : అవును, చెప్పాను. అప్పుడు కొంత అజ్ఞానదశలో ఉండటం చేత నీకు అలా కల్పించి చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు క్రమేపీ సంభాషణలు ఆత్యంతిక జ్ఞాన విషయాన్ని సమీపిస్తున్నాయి. ఇప్పుడు నీవు ప్రబోధితుడవు అయ్యావు. ఇక నీకు అట్లు చెప్పవలసిన పని లేదు.
అవిద్య జీవుడు మొదలైన కల్పనలన్నీ అజ్ఞానదశలో శిష్యులకు ఉపదేశించటానికి పండితులచే కల్పించబడ్డాయని నీకు ముందే చెప్పాను కదా!
మనస్సు అజ్ఞానదశలో ఉన్నప్పుడు శాస్త్రోక్తము అయిన ‘అవిద్యా ఉపదేశము’ లేకుండా ఎన్ని విధములుగా “తత్త్వమ్, సో హమ్" వంటి మహావాక్యాల పరమార్థటం ఉపదేశించినప్పటికీ ఆ మనస్సులో ప్రబోధము ఉదయించటం లేదు. ఒక విద్యార్థికి అతని దశను అనుసరించి అతని పరిభాషలో విషయాన్ని బోధించవలసి ఉంటుంది. ఉత్తరోత్తరా ప్రారంభంలో ఉపయోగించే యుక్తులు
అవసరం ఉండదు కదా!
శిష్యుడు యుక్తులతో బోధింపబడి ఆత్మతత్త్వం విశదీకరించబడి, ఆ తరువాత ‘తత్ త్వమ్ - ఆ అఖండమగు ఆత్మయే నీవు’… నీవు చూస్తున్న నీవు, కూడా - అని సుస్పష్టీకరించబడుతోంది.
నూరురకాలుగా ప్రయత్నించి కూడా సాధించబడని ఒక కార్యం యుక్తిచే సాధించబడుతోంది కదా! అజ్ఞానికి సందేహములు తొలగని వారిని సమీపించి ‘అంతయూ ఆత్మయేనయ్యా’ అను సిద్ధాంతం చెప్పితే లాభమేమిటి? అది ఒక శిలను-మిత్రునిగా భావించి తన కష్టములు చెప్పుకొని ఉపాయాలకు సంప్రతించటం వంటిదే అవుతుంది.
మూఢుడు యుక్తి వలన, ప్రాజ్ఞుడు తత్త్వము వలన బోధించబడుచున్నారు. యుక్తి సహాయంతో బోధించకపోతే మూర్ఖుడు ప్రాజ్ఞుడు అయ్యేదెట్లా?… నీవు ప్రబోధం పొందే వరకు ‘యుక్తి’తో బోధించాను. ఇప్పుడు ప్రబుద్ధుడవటం చేత సూటిగా తత్త్వమునే చెప్పుచున్నాను.
Page:175
నాయనా! ఇక వినుబ్రహ్మాహం త్రిజగద్భహ్మ త్వం బ్రహ్మఖలు దృశ్యభూః | ద్వితీయా కలనా నాస్తి యథేచ్ఛసి తథా కురు ॥ (23, 849)
నీవు, నేను, త్రిజగత్తులు, దృశ్యములు -మొదలైనవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే! ఇక్కడ ఇంకొక వస్తువన్నది లేదు. ఇది గ్రహించి ఆపై, నీ ఇష్టానుసారం వ్యవహరించు. గ్రహించిన తరువాత యథారీతిగా వ్యవహరిస్తుంటే బ్రహ్మము యొక్క వాస్తవ తత్త్వమునకు వచ్చే హాని ఏమీ ఉండదు. అసంవేద్యమహాసంవిత్కోటిమాత్రం జగత్ప్రయమ్ | ఏకప్రత్యయవాన్తః కుర్వన్నపి న లిప్యతే ॥ (శ్లో॥ 24, సర్గ 24)
‘సర్వవిధ భ్రాంతులు లేనట్టి - జ్ఞేయము కాజాలనట్టి చైతన్య బ్రహ్మమొక్కటే సర్వే సర్వత్రా అనుశ్రుతమైయున్నది’… అని గ్రహించి కార్యములను నిర్వర్తించే వానిని ఆ కర్మసంగ దోషములుగాని, దుఃఖ దోషములుగాని అంటవు.
ఓ రాఘవా! “కూర్చుని ఉన్నప్పుడు ఊపిరి పీల్చుచున్నప్పుడు, నిద్రించుచున్నప్పుడు, చదువునపుడు, వ్రాయునపుడు కూడా "నేను సర్వదా ప్రకాశరూపుడు, చేతనుడు, సర్వవ్యాపియగు పరమాత్మనే” అనియే భావించు. నీవు కనుక మమకారము కించిత్ కూడా లేక, నిరహంకారుడవై, ప్రాజ్ఞుడవై ఉంటే తక్షణమే సర్వ జీవులూ ఎందులో వెలయుచున్నారో … అట్టి శాంత చిదేకరసమగు బ్రహ్మము
అవుతావు.
సత్యం, ఆద్యంతరహితం, ప్రకాశమయం - అగు ఆ పరమపదమే నీవు. నీవు సర్వదా సర్వ వ్యాపివయి, ఏకాత్మకుడవై, శుద్ధచైతన్య స్వరూపుడవై వెలయుచునే ఉన్నావు. ప్రపంచంలోని కుండలన్నీ కూడా మట్టికి అభిన్నమైనవే కదా! బ్రహ్మ మొదలుగా సర్వమునందు సదాత్మ ఒక్కటే వెలయుచున్నది.
ప్రకృతి ఆత్మ కంటే వేరు కాదు. ఘటం (కుండ) యందు మట్టి యొక్క మృణ్మయతే వెలయు చున్నది కదా! ఆత్మయే ప్రకృతియందు వెలయుచున్నది.
ఒకచోట నిశ్చలమైన నీరే మరొకచోట సుడిగుండాలు ప్రదర్శిస్తోంది కదా! ఆత్మ యొక్క ఒకానొక స్పందనయే ఈ ప్రకృతి. కనుకనే ప్రకృతి ఆత్మయే అవుతుంది. ’వాయువు-వాయువు యొక్క స్పందనం’ పేరుకు మాత్రమే వేరు కదా! ఆత్మ - ప్రకృతులు వేరు వేరుగా అగుపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి వేరు వేరు కాదు. అట్టిది రజ్జు- సర్ప భ్రాంతి వలె అజ్ఞానము చేత ఉదయించి, మరల జ్ఞానముచే తొలగిపోతోంది.
చిత్రక్షేత్రంలో ‘కల్పన’ అనే బీజం ఉదయించి ‘చిత్తం’ అను అంకురమునకు త్రోవతీస్తోంది. అదే సంసారం. అది భూత - భవిష్యత్తుల కల్పనకు కారణమౌతోంది. ఆ కల్పనా బీజం ‘ఆత్మ విజ్ఞానం’ అనే అగ్నిలో దగ్ధమైతే ఆపై ‘వాసనలు’ అనే నీరు పోసినాకూడా, కారణరూపమైన చిత్తాంకురం చిగురించదు.
ఓ రామా! నీవు ఆత్మబోధను పొందావు. పొందిన బోధనను ఆకళింపు చేసుకుని అజ్ఞాన ప్రసూతము, భ్రమయుక్తము అగు ద్వైతభావమును పరిత్యజించివేయి.
Page:176
ఆత్మైక్యభావరూపమైన నిరతిశయానంద వైభవమునందు పరిపూర్ణుడవగుము. అభయాత్ముడవు కమ్ము. త్రికాలములందూ కూడా ‘దుఃఖము’ అనునది స్వతహాగా లేదు… ఇదియే మేము చెప్పు పరమార్థసారము.
శ్రీరాముడు : హే మహర్షీ!
జ్ఞాతం జ్ఞాతవ్యమఖిలమ్, దృష్టం ద్రష్టవ్యమక్షతమ్ | పరేణ పరిపూర్ణాః స్మో బ్రహ్మజ్ఞానామృతేన తే ॥
తప్పకుండా తెలుసుకోవలసి ఉన్నదానిని నేను తెలుసుకున్నాను. చూడవలసినది చూస్తున్నాను. మీరు ప్రసాదించిన జ్ఞానామృతం గ్రోలి పరిపూర్ణుడనయ్యాను.
పూర్ణాత్పూర్ణమిదం పూర్ణం పూర్ణాత్పూర్ణం ప్రసూయతే |
పూర్ణేనాపూరితం పూర్ణం స్థితా పూర్ణే చ పూర్ణతా ॥ (శ్లో॥ 2, సర్ద 50)
పూర్ణము నుండి పూర్ణము పూర్ణ స్వరూపమున వెలయుచూ వెలువడుచున్నది. పూర్ణము పూర్ణమున ప్రకాశిస్తోంది.
హే బ్రహ్మజ్ఞా! పిల్లలు తండ్రిని వేడుకతో ప్రశ్నిస్తారు చూచారా! అట్లా మిమ్ములను మరల ప్రశ్నిస్తున్నాను. దయచేసి కోపగించుకోకండి! ఇట్లా పదే పదే ఆయా కోణముల నుండి ప్రశ్నించటం చేత మీ నుండి జాలువారే అమృతవచనములు నా తదితరుల జ్ఞాన విజ్ఞానములను పెంపొందిస్తాయి అనునదే నా సదుద్దేశం. హే మహాత్మా ! ఇప్పుడు నా ప్రశ్న వినండి
ఒక మృతుని యొక్క కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం - మొదలైన ఇంద్రియాలు కనబడు చున్నప్పటికీ అవి ఎందుచేత విషయములను గ్రహించలేకపోతున్నాయి? సజీవుని ఇంద్రియాలు ఎందుచేత విషయాలను గ్రహించగలుగుచున్నాయి? ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి తెచ్చిన విషయాల సమాచారం హృదయంలో “అనుభవం” అను రూపంలో ఎలా రూపం పొందగలుగు చున్నాయి?… 1. ఇంద్రియం, 2. విషయం - ఇవి రెండూ వేరు వేరైనవి కదా! అవి పరస్పరం ఆకర్షించ గలగటం ఎట్లా జరుగుతోంది? దృశ్యం యొక్క పరిజ్ఞానం హృదయంలో ఎలా ప్రకటితమౌతోంది?
హే పరమేశ్వరా! వసిష్ఠమహర్షీ! ఇప్పటి వరకూ జరిగిన ప్రసంగంలో మీరు ఈ విషయాలు వివరించి ఉండవచ్చు. అయినా, మళ్ళా మీ నుండి ఈ విశ్లేషణా ప్రవచనాలు వినాలని అనిపిస్తోంది. ఒకే విషయం అనేక సోదాహరణాలతో చెప్పటం, వినటం చేత ఈ మీ ప్రవచనం ఆత్మతత్త్వమును మరింతగా విశదపరచగలదని నా ఉద్దేశం! నా అభ్యర్థన!
శ్రీవసిష్ఠ మహర్షి : ప్రత్యక్ష ప్రమాణములైనట్టి ’ఇక్కడి వస్తు సముదాయాలు, ఇంద్రియాలు, ఆ
Page:177
ఇంద్రియ ద్వారాలలో కాపురముంటున్న చిత్తం’ వీటి అసలు రూప - - తత్త్వ - స్వభావము లేమిటో విశేషంగా విచారణ చేసిన వారికి ‘ఇవన్నీ చైతన్యము కంటే వేరు కానే కాదు’ అని తెలియవస్తోంది
ఆకాశము వలె అత్యంత శుద్ధమైన చైతన్యము మాయతో కూడినదై పూర్వ - - పరవాసనలను (ఇంద్రియ వ్యవహార పరంపరలను) నిరంతరం భావన చేస్తోంది. అట్టి వాసనల యొక్క ఆవరణను వేదాంత పరిభాషలో ‘పుర్యష్టకం’ అని పిలుస్తున్నారు.
ఆ బ్రహ్మమే ‘ఇంద్రియాల యొక్క విషయాలు, ఇంద్రియాలు, చిత్తం’… అనే ప్రకృతి లేక పుర్యష్టకంగా స్వయంగా… స్వయం కల్పన (లేక) మాయచే… వివర్తము చెందుతోంది. పుర్యష్టకంగా వివర్తం చెందిన చిత్ చిత్తవృత్తులను దాల్చుచు తన యొక్క అజ్ఞానానికి తానే కారణమై ఉంటోంది.
ఇక మృత్యువు విషయానికి వద్దాం. మృత్యు సమయంలో ఏం జరుగుతోంది?… ప్రాణశక్తి ప్రసరణచే చరించే ఈ దేహం కాలానుగతంగా శిథిలత్వం సంతరించుకుంటోంది. అనగా, ఉపకరణ మాత్రమైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు గల ఈ జడదేహం నిర్వీర్యమై నిరుపయోగమై పోతోంది. మృత్యు సమయంలో పుర్యష్టక సమన్వితమైన సూక్ష్మదేహం ఈ స్థూల దేహం నుండి వెలువడటం చేత ఈ ఇంద్రియాలు సామర్థ్యం కోల్పోతున్నాయి. యంత్రశక్తి కోల్పోయిన యంత్రంలాగా ఇది నిస్తేజమై పోతోంది. శరీరం నిరుపయోగమైనప్పటికీ వేలకొలది జగత్తులను ప్రతిఫలించగల ‘దర్పణం’ వంటిదగు పుర్యష్టకం (5 ఇంద్రియార్థాలు, మనస్సు, బుద్ధి, చిత్తం) ఉండియే ఉంటోంది. శ్రీరాముడు: అట్టి ‘పుర్యష్టకం’ గురించి మరికొన్ని విశేషాలు చెప్పవలసినదిగా ప్రార్థన. శ్రీవసిష్ఠ మహర్షి : బ్రహ్మము ఆద్యంతరహితము, నిరామయము, తేజోమయము కదా! అట్టి బ్రహ్మము తనయొక్క చిద్విలాసంచేత తన కొరకై తాను ఆకాశము మొదలైన సూక్ష్మభూతములను సృష్టించుకుంటోంది. అది స్వయంగా కల్పనారహితమే! అయినప్పటికీ, అది జగత్తుకు బీజమై అపంచీకృత భూతపంచకము కలిగియున్న దగుచున్నది. తద్వారా బ్రహ్మాండమును సృష్టించి, అందు ప్రతిబింబిస్తోంది. సూత్రప్రాణమై శరీరమధ్యమున సూక్ష్మరూపంతో ప్రవేశిస్తోంది. అట్లు ప్రవేశించిన చైతన్యమును ‘జీవుడు’ అని అంటున్నాం.
ఆ జీవుడు వాసనల వలన అవయవములను కల్పించుకుంటున్నాడు. ఆ అవయవములతో కలిగిన సంబంధం చేత భౌతికమైన పుష్టిని పొంది బాహ్య అభ్యంతరములకు ‘స్పందితుడు’ అగుచున్నాడు. ’అహం’ భావము వలన అహంకారమును,
మననము వలన మనస్సును,
నిశ్చయము వలన బుద్ధిని
ఇంద్రియ స్నేహము వలన పదార్థజగత్తును,
దేహభావము వలన దేహమును
ఇట్లే తదితర విషయములన్నీ పొందుచూ పుర్యష్టకము (శబ్ద స్పర్శ-రూప రస గంధ-మనోబుద్ధిచిత్తముల సమ్మేళణం) అని పిలువబడుటకు అర్హుడగుచున్నాడు.
Page:178
జ్ఞానేంద్రియ వ్యాపారములు ప్రవర్తిస్తున్నప్పుడు జ్ఞాతృత్వముగాను,
కర్మేంద్రియ వ్యాపారములతో ప్రవర్తితమైనప్పుడు కర్తృత్వముగాను
వాటి ఫలములను పొందునట్లు భావిస్తున్నప్పుడు భోక్తృత్వముగాను
వాటన్నిటా ఉదాసీనము పూనినప్పుడు సాక్షిత్వముగాను,
భోగములందు అధ్యస్థమౌతున్నప్పుడు చిత్ప్రధానముగాను
విషయములను పర్యాలోచించినప్పుడు జీవుడుగాను,
జడప్రధానంగా యోచిస్తున్నప్పుడు పుర్యష్టకంగాను,
… చెప్పబడటం, స్వీకరించటం జరుగుతోంది.
❖
ఇట్లు శరీరమున ప్రవేశించిన జీవుడు కాలక్రమంగా తాదాత్మ్యబుద్ధిని పొంది ఆయా కాల సంభవములగు సుఖదుఃఖములను పొందుచున్నాడు. పుర్యష్టకము యొక్క స్వభావమును అనుసరించి అనంతవాసనాకల్పితములగు రూపములను ఆతడు ధరిస్తున్నాడు. నేలపై ఉంచబడిన బీజము … నీళ్ళు చల్లినప్పుడు… అది చిగురించి ఒక మహావృక్షమవుతోంది చూచావా? ఈ జీవుడు కూడా వాసనా సేవితుడై జగత్ రూపాన్ని ధరిస్తున్నాడు. మిథ్యాజ్ఞాన కారణంగా తన యొక్క ఆద్యరూపాన్ని ఏమరచి తనను ఈ శరీరాదులుగా భావించుకుంటున్నాడు. సముద్ర తరంగాలలో పడిన చెక్క ముక్క పైకి క్రిందికి తేలియాడుచూ ఎక్కడెక్కడికో తీసుకుపోబడుతుంది. అట్లాగే వాసనాక్రాంతుడగు జీవుడు కూడా సంసార సముద్రంలో పడి ఉత్కృష్ట, నికృష్ట జన్మల వైపు బలవంతంగా ఈడ్వబడుచున్నాడు.
అయితే …సనకుడు, సనందనుడు మొదలైన మహనీయుల వంటి శుద్ధాత్మలు తమ ఇతః పూర్వపు సాధనాబలం చేత ఈ కల్పంలో తమ ప్రథమ జన్మయందే ’బోధ’ను పొందుచున్నాడు. భవబంధ విముక్తుడై పరమపదమున వెలయుచున్నాడు. మరికొందరు జీవులు కొద్దిజన్మల తరువాత, ఇంకా కొందరు జీవులు చాలా జన్మలు ఎత్తి చాలా కాలం శ్రమించిన తరువాత ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నారు. క్రమక్రమానుసారం పరమపదమును పొందుచున్నారు.
ఇదీ …శరీరం దాల్చే విధానం.
ఇంద్రియముల సాయంతో వస్తువులను గ్రహించటం, చిత్తము యొక్క శరీరముగా వివర్తమొందిన చైతన్యం ‘పంచేంద్రియములు, మనస్సు’తో కూడి ప్రవర్తించటం ఆరంభిస్తోంది. ఆయా వస్తువులతో కూడిన బాహ్యదృశ్యము తన వద్దకు అరుదెంచుచుండగా తాను ఈ చక్షువులు ఆక్రమించియున్న ఆకాశమునందు ప్రవేశించి అందలి చైతన్యముతో ఏకమగుచున్నది.
ఇంకొక రకంగా చెప్పాలంటే … ఆ జీవుడు ‘చైతన్యస్పర్శ’ అను అధ్యాసతో వస్తువునకు సంబంధించిన ఒకానొక ఏకత్వము పొందుచున్నాడు. ఆయా విషయములన్నీ అజ్ఞానము చేత అట్లట్లు లభిస్తున్నాయి. అట్టి బాహ్య విషయములతో సంపర్కం జీవచైతన్యముతో కూడిన శరీరములోని
Page:179
ఇంద్రియములకు మాత్రమే ఏర్పడటం జరుగుతోంది. మృతుని దేహంలో చైతన్యం ప్రసరించక పోవటంచేత కేవల జడ ఇంద్రియములకు ‘అనుభవం’ అనేది ఉండటం లేదు.
’బయట వస్తువు
స్వచ్చతరమగు అంతఃకరణ
లందు అనుభవం
నేత్రరశ్మి + వృత్తులు
ప్రతిబింబించడం
‘ధ్యాస’ అను ప్రతిబింబం తిరిగి వచ్చి కల్పనలకు కర్త అయిన జీవుని అంతరంగంలో ప్రవేశించి ‘అనుభవము’ అనబడుదానికి యోగ్యమగుచున్నది. ఇక జీవుడు ఎట్టి కల్పన చేస్తున్నాడో … అట్టి అనుభవాన్నే పొందుచున్నాడు. అంతేగాని… ‘అనుభవం’ అనేది బయట ఎచ్చటనో లేదు.
❖
ఈ నేత్రగోళములు నియమించబడినప్పుడు బాహ్యమైన గోడ కుండ మొదలైన చిత్తవృత్తులు అందులో ప్రవేశిస్తున్నాయి. అటు కన్ను గోళాలలో ప్రవేశించిన ప్రతిబింబంతో జీవుడు తన ధ్యాస అను శక్తితో కూడినప్పుడు మాత్రమే ఇది ‘కుండ, గోడ’ మొదలైన దృశ్యానుభవం ఏర్పడటం జరుగుతోంది. ఇట్టి సంయోగసంజనితానుభవం ఒక బాలునకు, పశువుకు, లతకు కూడా ఏర్పడుతోంది.
జీవుని లోపల ఎక్కడో ఉన్న దివ్యకిరణములు బాహ్యంగా దూరమున ఉన్న విషయములను ఆలింగనం చేసుకుని ఆ విషయమునకు సంబంధించిన జ్ఞానమును జీవునికి అందిస్తోంది. దానికి జీవుడు స్వసంస్కారానుసారంగా అనుభవంగా గ్రహిస్తున్నాడు. అట్లాగే ఆకాశం నుండి శబ్దం చెవి యందు ప్రవేశించుట చేత, గంధము వాయువు నుండి నాశికా పుటములలో ప్రవేశించుట చేత వాటి వాటి జ్ఞానాన్ని జీవుడు ‘అనుభవం’ అను రూపాన్ని ఇస్తున్నాడు. కనుక దృశ్యం పట్ల ఏర్పడే అనుభవ అభినివేశ, తిరస్కార, నిర్లిప్తాదులకు అసలైన కారణం జీవుడే (ద్రష్టయే).
జీవుని యందు ఏదైతే ప్రతిబింబిస్తోందో… అద్దానినే ‘జగత్తు’ అనే పేరుతో పిలుస్తున్నారు. అంతేగాని, ‘జగత్తు’ అనగా, - ఈ ఎదురుగా కనిపించే చెట్లు - ఇళ్ళు - వాకిళ్లు - ఊళ్ళు కాదు. శ్రీరాముడు : హే జ్ఞానశ్రేష్ఠా! అత్యంత జడమైన అద్దంనందు, నీటియందు, లేత చిగురాకులయందు ప్రతిబింబము వలె కనిపించేదేమిటి? …ఆ ప్రతిబింబానికీ, ఈ జీవునిలో ప్రతిబింబించు ‘జగత్తు’ అనుదానికి భేదమేమైనా ఉన్నదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత జడములైన అద్దం-ప్రతిబింబం, చిత్త వృత్తులు-వస్తువు యొక్క అనుభవం ఒక్క తీరైనవే. అయితే ఈ జీవుని ద్రష్టత్వం, ఈ జీవుడు చూస్తున్న జగత్తు …రెండు భ్రాంతియే.
ఈ జగత్తునందు నీకు విశ్వాసం కలుగకుండు గాక! వాస్తవానికి ఉన్నది చిత్సాగరం ఒక్కటే. ఈ అహంకారములన్నీ అనంత చిత్సాగరంలో చిన్నచిన్న తరంగాల వంటివి మాత్రమే.
అట్టి చిత్సాగరంలో దేశ కాలాదులనేవే లేవు. తరంగములన్నిటిలో జలం అనుశ్రుతమై ఉన్నది
Page:180
కదా…! అట్లాగే ఆత్మ అహంకారములన్నిటిలో అనుశ్రుతమై ఉన్నది. ఉన్న సత్యం ఇది. కాబట్టి ఎల్లవేళలా తదితరములపట్ల అనాసక్తచిత్తుడవై వెలయుము.
‘ఈ సుఖదుఃఖములన్నీ మిథ్య’ అని నీ బుద్ధి గ్రహించి శాంతియుతమై ఉండుగాక! భవమాయ అను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండెదవు గాక! ఏకాగ్రచిత్తంతో ఆనందమయమైన సామ్యభావమును అవలంబించు. బ్రహ్మభావమున నివిష్ణుడవు కమ్ము.
శ్రీరాముడు : స్వామీ వసిష్ఠ మహర్షీ ! మీ వంటి ఉత్తమోత్తమ భవరోగ వైద్యుని సమీపించినట్టి రోగికి ఇక భయమెక్కడిది? మీరు చెప్పేది పరమసత్యం. మాకు వేరుగా ఏ ఆధారాలు అక్కర్లేదు.
అయినా సవినయంగా ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను - ఆత్మయే స్వరూపంగా గల జీవునకు-కల్పనయే మూలంగా గల పుర్యష్టకమునకు సంబంధం ఎట్లా, ఎందుకు, ఏ కారణంగా, ఏ ప్రయోజనం కొరకు ఏర్పడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : శుద్ధ బ్రహ్మం నందు ఈ చక్షురాది ఇంద్రియాలు గాని వాటికి విషయాలైనవి గాని లేవు. అవన్నీ మొట్టమొదట సమష్ఠి జీవుని యందు (హిరణ్యగర్భుడు, పద్మజుడు, బ్రహ్మదేవుడు మొదలైనవి ఆ సమష్ఠి జీవుని పురాణనామాలు) అనుభూత మగుచున్నాయి. అవే ఈ వ్యష్టిజీవుని యందు కూడా అనుభవమౌతున్నాయి.
ఆ హిరణ్యగర్భుని యందు భావనాబలంచే పుర్యష్టకం, విషయాలను గ్రహించు శక్తి ద్యోతకమౌతున్నట్లే వ్యష్టిజీవుని యందు కూడా అవి ఉదయిస్తున్నాయి.
#
ఇక్కడ వ్యష్టిజీవుడు, దేహముల గురించి కొన్ని విశేషాలు ప్రస్తావిస్తానుమాతృగర్భమున ఉన్న వ్యష్టిజీవుని (పిండానికి) 6వ మాసంలో పుర్యష్టకం, కళ్ళు మొదలైన ఇంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇక అప్పటి నుండి ఆ పుర్యష్టకానికి సంబంధించిన మాధ్యమం ద్వారా గాంచుచున్నాడు. సర్వప్రథముడగు సమష్టి జీవుని మనస్సులో లాగానే వ్యష్టిలో కూడా సంవేదన (The act of knowing) ఇంద్రియాలు సుసంపన్నమౌతున్నాయి. ఇక సంవిత్తు (The Knower) అంటావా? వ్యష్టిలో సంవిత్తు, సమష్టి జీవుని (హిరణ్యగర్భుని) సంవిత్తు ఒక్కటే. అనగా సృష్టికి ముందు సంవిత్తు నందు ‘వ్యష్టి - సమష్టి’ అనే భేదం లేదు.
సంవిత్తు సర్వదా విశుద్ధమే. అద్దాని యందు జలతరంగంలాగా ‘అహం’ అనే అభిమానం పునాదిగా గల పుర్యష్టకం బయల్వెడలుతోంది.
సంవిత్తు సర్వదా ఏకమాత్రము, అనంతము, విశుద్ధము అఖండము, అనిర్దేశమూ కూడా!
Page:181
నిర్దోషము, నిర్మలము అగు సంవిత్తు నందు మరొకదాని ఉనికి అసంభవం. అద్దాని యందు గుణదోషములు గాని, మనస్సు గాని, మరింకేమియు గాని లేవు.
సంవిత్తు ఒక్కటే సత్యం. మిగిలినవన్నీ అసత్యములు. ఈ స్థూలములు, ఈ దేశకాలములు, ఈ వ్యష్టి - సమష్టి… ఇవన్ని పరిచ్ఛిన్నములు.
సంవిత్తు మనస్సు యొక్క రూపం, మనస్సుకు ఉద్భవస్థానం. మనస్సు అనగా - మననమునకు గోచరమగు ‘బుద్ధి’ వృత్తి … యొక్క అధ్యాసయే కదా!
వాస్తవానికి ఆ సంవిత్తు మనస్సు కాదు. బుద్ధికాదు. జీవుడు కాదు. పుర్యష్టకం కాదు. జ్ఞానప్రకాశమే సంవిత్ తత్త్వం యొక్క స్వరూపం - అని గ్రహించు. మూఢులు అద్దానిని ‘లేదు’ అనివచిస్తున్నారు. కాని అదియే మనస్సు, ఇంద్రియాలకు అతీతమై వెలయుచు “పరమాత్మ” అనబడుచున్నది. ‘ఆ బ్రహ్మము లేక సంవిత్ నుండి చిన్మూర్తియు, మననాత్మకుడు అగు జీవుడు ఉద్భవిస్తున్నాడు’ …అనుమాట కూడా భ్రమయే అయినప్పటికీ, ఉపదేశ సౌకర్యార్థం అట్లని విజ్ఞులచే శిష్యపాఠంగా చెప్పబడుతోంది.
శ్రీరాముడు : స్వామీ! అత్యంత విశుద్ధుడు, సంవిత్ స్వరూపుడు అగు ఈ జీవునికి మరి ఈ ఆవరణ భూతమైన ’సంసారం’ అనే వ్యాధి ఎక్కడి నుండి ఎట్లా వచ్చింది? ముందుగా ఈ విషయం చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! ఒకనికి వ్యాధి వచ్చి గొప్ప బాధపడుచున్నాడు. ఇప్పుడు ‘ఈ వ్యాధి ఇతనికి ఏమి తింటే వచ్చింది? ఏం చేస్తే వచ్చేది కాదు?’ అను మీమాంస ముఖ్యమా?… చికిత్స ముఖ్యమా?… చెప్పు!
శ్రీరాముడు : చికిత్స చేసి వ్యాధిని రూపుమాపటం ముఖ్యం…!
శ్రీవసిష్ఠ మహర్షి : అవును కదా! ఇప్పుడీ జీవుని అవిద్య వచ్చి బాధిస్తోంది. “ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఏం చేస్తే వచ్చింది?“ అను ప్రశ్నలకన్నా, …ఇప్పుడేం చేయాలి? అవిద్య ఎట్లా తొలగుతుంది? ఏ ఏ విచారణాది ప్రయత్నములకు ఉపక్రమించాలి?”… అనునది ముఖ్యం. ఈ విషయం మన సంవాదంలో మనం చెప్పుకొనియే ఉన్నాం. ఇప్పుడు “అవిద్య అంటే ఏమిటి? విద్య ఏమిటి?” అనునది విచారణ చేయటం అత్యంతావశ్యకం. అట్లా విచారణ చేస్తూరాగా… స్వస్వరూపం పరిశేషించగలదు. తత్సంబంధమైన తదితర విషయాలన్నీ వాటంతట అవే అవగతమౌతాయి.
‘సంవిత్’- జ్ఞానస్వరూపం. అట్టి జ్ఞానము ప్రశాంతమైనది. అదియే నిఖిల వస్తువులలో నిండి ఉన్నది. ఒక చిన్న మణిలో పెద్ద పర్వతం ప్రతిబింబిస్తున్నట్లు జ్ఞానమునందే ఈ ఆకాశము మొదలైనవి ప్రతిబింబిస్తున్నాయి. వ్యవహారరీత్యా సత్యములని అనిపిస్తున్నప్పటికీ ఈ పదార్థాలన్నీ వాస్తవం కాదు. అయితే ఇవన్నీ జ్ఞానమునందే వెలయుచున్నాయి. అట్టి సంవిత్థానము కొరకు నీవు జగత్ సంబంధ మైన సర్వ విషయములు సమర్పించి వేయి. జీవన్ముక్తమున వెలయుచూ నిర్మలుడవై ప్రకాశించు. శ్రీరాముడు : ఈ దృశ్యజగత్తులో కనిపించే పదార్థముల అసలు రూపం ఏమిటి?
Page:182
శ్రీవసిష్ఠ మహర్షి : దృశ్య జగత్తులో కనిపించే పదార్థాలన్నీ అవిద్య చేతనే అట్లు పదార్థరూపంలో కనిపిస్తున్నాయి. వాటియొక్క అసలురూపం అవిద్యయే! ఒక్కసారి అవిద్యనే పరికించి చూచావా వీటన్నిటి యొక్క అవిద్యారూపం తొలగిపోయి, ఇక మరల ఉదయించదు.
శ్రీరాముడు : హే ఆప్తబంధూ ! కనులకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వస్తుజాలమును అసత్తుగా అంగీకరించటం …ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓహో! అదా నీ సందేహం! అట్లా అయితే ఈ కనబడే వస్తువులన్నీ అందరికీ ఒకే తీరుగా కనిపిస్తూ ఉండాలి కదా! అది అట్లా జరుగుతోందా? ఒక గడ్డిపరక ఆవుకు మృష్టాన్న భోజనంలా కనిపిస్తోంది. మరి మనిషికో? అట్లా కనిపిస్తోందా?…లేదు.
వస్తువులన్నీ కూడా ఎండమావులలాగా భ్రమాత్మకములే! అవి అసత్తు అయి ఉండి కూడా అజ్ఞానం వల్ల సత్స్వరూపంగా తోచుచున్నాయి. నాయనా! భ్రమ తొలగాలంటే జ్ఞానోదయం కావాలి. అప్పుడే వాటి వాస్తవ స్వరూపం గోచరిస్తుంది.
‘జీవుడు’ ‘పుర్యష్టకం’ మొదలైనవన్నీ అవిద్యా భ్రమలేనయ్యా! అయితే సత్యమగు ఆత్మ యొక్క సాన్నిధ్యంలోనే అవిద్య యొక్క కల్పన కలుగుతోంది. అట్టి కల్పనావిభాగమును మనం అసత్ అని అంటున్నాం. ‘అవిద్య చేతనే ఈ జీవుడు తదితరజీవులు’ మొదలుగా గల కల్పనలు దర్శించబడు చున్నాయి …అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి.
శ్రీరాముడు : అవిద్య అంటే ఏమిటో, దాని ఆనుపానులు ఎట్లు ఉంటాయో మరల ఈ సందర్భమునకు ఉచితమగునట్లు వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! విషయ రహితం, వ్యాపకరహితమగు చిత్ తత్త్వం ఒకానొకప్పుడు నిశ్చల జలంలోని తరంగంలాగా “అంతరంగ బాహ్యత్వములు" అనే విభాగమునకు సంబంధించిన ఒకానొక ఉత్సుకత పొందుతోంది. ‘బాహ్యకళ’ అను కళంకముచే పుర్యష్టకాదులుగా ప్రభవిస్తోంది. అనగా చిత్ చిత్తత్వమును స్వీకరించడం జరుగుతోంది. అట్టి చిత్తత్వముతో ఏ వస్తువును ఏ రూపంగా భావిస్తున్నదో …అది అట్లే ప్రాప్తింపజేసుకుంటోంది. బాలుడు మనస్సులో భూతమును కల్పించుకొని రాత్రిపూట కనబడే మోడువారిన చెట్టును ఒక భూతంలాగా భావించి అనుభూతి పొందుతాడు చూచావా? జీవచైతన్యము కూడా స్వయంగా పంచతన్మాత్ర (శబ, స్పర్శ, రూప, రస, గంధముల) కల్పనను సత్యమైనట్లు భావనను ఆశ్రయించి జీవరూపమును పొందుతోంది. ఆ తరువాత తన యందు ఇంద్రియాలు ఏర్పడుటను కూడా గాంచుచున్నది. అంకురం నుండి వృక్షశాఖలు ఏర్పడి … ఆ వృక్షశాఖలు అంకురము కంటే వేరైనట్లు తోచుచున్నాయి కదా! అట్లాగే ఈ దృశ్య జగత్తు చిత్ కంటే వేరుగా తోచుచున్నది. చిత్ స్వరూపుడగు ఈ జీవుడు మనస్సు-కుండ మొదలైన బాహ్య
Page:183
వస్తువులను తన వాసనానుసారంగా సత్యములే అని భావిస్తున్నాడు. చంద్ర కిరణములుగా గాంచ బడుచున్నది చంద్రప్రకాశమేగాని మరొకటి కాదు కదా! … విషయేంద్రియ సంబంధం వలన కలుగుచున్న విషయసుఖములు ఆ చైతన్యము యొక్క ఆత్మానందమే!
మిరియం యొక్క కారం మిరియం నుండి వేరు కాదు. శూన్యం అనేది ఆకాశం నుండి వేరు కాదు. విషయ విజ్ఞానాలన్నీ ఆత్మనుండి వేరు కాదు. “సంసార విషయాలు భోగించాలి” అనేది ఆత్మ యొక్క ‘సంకల్పం’ అను ఆవరణ నుండే బయలుదేరుచున్నాయి. ఆ తరువాత “అట్టి బంధ నియమం నుండి వైతొలగాలి” అను పురుషార్థం ఆశ్రయించబడినప్పుడు ఆ భ్రమేచ్ఛ తొలగి స్వస్వరూపప్రకాశం అనుభవమౌతోంది. ఈ రెండవ పురుషార్థం కొరకు శాస్త్రాలు పారలౌకిక కర్మలు, కార్యక్రమాలు ప్రతిపాదిస్తున్నాయి. ఖండసారి పానకమే పటిక బెల్లం అవుచున్నది చూచావా? ఆత్మయే ప్రవృత్తిని వదలి నివృత్తి మార్గం కొరకై శాస్త్రాలను అనుసరించుట, తద్వారా నివృత్తి ఫలాన్ని పొందటం జరుగు తోంది. ఒకటి మరొకదాని ప్రయత్న దార్ద్యం వలన ఓడింపబడుతోంది. ఈ విధంగా ఈ ప్రవృత్తినివృత్తి అను రెండు మార్గములు అనంతకాలంగా వెలయుచున్నాయి. కానీ…
సంనివేశవికారాదిదేశకాలాదిసంభవాత్ |
సంభవత్యత్ర సత్వీశే దేశకాలాద్యసంభవాత్ ॥ (శ్లో॥ 28, సర్గ 51)
ఆత్మ ఆకాశము వలె పరివర్తనను కలిగిఉన్నది కాదు. ఎందుకంటే దేశకాలాది పరిచ్ఛిన్నములు, సంయోగ వియోగాలు, తదితర వికారాలు ఉన్న చోట మాత్రమే పరివర్తనం అనేది సంభవిస్తుంది. ఆత్మ యందు అవన్నీ ఏవీ లేవు. కనుక ఆత్మకు పరివర్తనం అసంభవం.
వసంతకాల రసం వనంలో ప్రవేశించినప్పుడు అది ఒకచోట పుష్పం గాను, మరోచోట లేచిగురు రెమ్మలుగాను మారుచున్నది. ఏది ఎట్లు ఏర్పడుచున్నా రసం ఒక్కటే! కాని ఆ రసం వివిధమైన ప్రకటన లను కలిగి ఉంటోంది. వాటి నుండి వివిధ కార్యాలు నెరవేర్చబడుచున్నాయి. అట్లే ఆత్మ తనయందు “ఇది కుండ, ఇది గోడ” అను రూపంలో ద్వైతభావం పొందుతోంది. వాస్తవానికి అద్దాని సత్త అద్వితీయ మైనది. మేఘము మొట్టమొదట సూర్యకిరణ రూపముననే ఉండి ఆ తరువాత తన కిరణ ప్రభావంతో జలాన్ని స్వీకరించి మేఘ స్వరూపం సంతరించుకొని … మరల వర్షించి తరువాత యథారూపంగా సూర్యకిరణ తత్త్వంగా శేషిస్తోంది కదా! సదసద్రూపమగు ఆత్మ కూడా జగత్తుగా మారి ఆ తరువాత వచ్చే జగత్తులకు తానే కారణకారణమై ఉంటోంది. సర్వేశ్వరుడగు ఆత్మయందు “ఇది ఇట్లు అవుతుంది … అది అట్లు కాదు” అను రూపముగల భావనలన్నీ విస్తరించి ఉన్నాయి. ఈ క్రమమును ఖండించటం ఎవరి వల్ల అవుతుంది?
పరిశీలించి చూస్తే స్వచ్ఛమగు ఆకాశమునకు మార్పు చేర్పులు ఏమి ఉంటాయి? ఆకాశమునందు ఆకాశమే ఏర్పడి ఉన్నట్లు ఆత్మ యందు ఆత్మయే సర్వదా నెలకొని ఉన్నది. ఆత్మ యందు ఆత్మయే ఎల్లప్పుడు ప్రకాశిస్తోంది కాని … అందు మరొకటేదీ ఏర్పడటం లేదు, ప్రకాశించటం లేదు.
Page:184
కానీ… ఏకము, అద్వితీయము అగు చిన్మయము స్వాభావికంగా భావనలు పొందుతోంది. అట్లు భావననుండే ద్వైతము అనుభూతమౌతోంది. అట్లు పొందుచున్నప్పుడు వస్తువులు శక్తిగను, జీవుడుగను ప్రతిబింబిస్తోంది. బంగారం చేత తయారయిన ఆభరణాలు బంగారం యొక్క ఉనికి చేతనే పచ్చటి ఛాయలు వెదజల్లుచున్నాయి కదా! బంగారం, ఆభరణం లాగా మనస్సు నందు చైతన్యము, జడము కలసి ఉంటున్నాయి.
ఈ ఆత్మను ఎవరు ఎట్లు గ్రహిస్తున్నారో … అది అసత్యమైనప్పటికీ అట్లే జరుగుతోంది. ఇక అద్దానికి తిరుగు లేకుండా పోతోంది. బంగారము అన్ని ఆభరణములలోనూ ఉన్నది కదా!
చిత్తు సర్వవ్యాపకము!… అద్దాని చైతన్యము మనస్సులో కూడా ఉన్నది.
చిత్త-దేహాలకు కారణమైన ఈ చైతన్యం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా భావించుకుంటోందో… అప్పుడు అక్కడ ఆ రీతిగా దేవ, నం, స్థావరాది భావాలను పొందుతోంది. ఈ చిత్తం తన యందలి వాసనావికాస వైచిత్రాన్ని అనుసరించి నానావిధ ఆకారాలను, కాలనియమాలను “ఉపాధుల ఆగమన, నిష్క్రమణములను” పొందుతోంది. అదంతా స్వప్నంలాగా భాసిస్తోంది. స్వప్నంలో “నగరంపూతోట-జనులను” చూస్తున్నట్లే జీవుడు ఒక ఉపాధికి సంబంధించిన శబ్ద, స్పర్శ, రూపాది విషయాలు, తదితర ఉపాధులతో సంబంధ బాంధవ్యాలు పొందుతోంది. ఆ ఉపాధి తరువాత వేరే మరొక ఉపాధి, దానితో వేరే మరికొన్ని సంబంధాలు … ఈ విధంగా ఈ వ్యవహారం జీవుని పట్ల చర్విత చర్వణంలాగా జరిగిపోతోంది. మెళుకువతో ఉన్నవాడు నిదురపోవటం, ఆ నిదురలో స్వప్నం, ఆ స్వప్నంలో ఏవేవో విశేషాలు గాంచడం, ఆ గాంచుచున్నప్పుడు మెళుకువ (జాగ్రత్) కు సంబంధించి ఏ విషయమూ దృష్టి - జ్ఞప్తులందు ఉండకపోవడం మరల మెళుకువకు వచ్చినప్పుడు యథాతథంగా ఉండి ఉండటం జరుగుతోంది చూచావా? ఈ జీవుడు కూడా ఒక ఉపాధితో ప్రవేశించటం, ఉపాధి సహితుడై చరిస్తూ కొంతకాలం తరువాత ఉపాధిరహిత యథాతథస్థితి పొందటం జరుగుతోంది. ఏ స్వప్నమూ శాశ్వతం కాదు. కాని స్వప్న ద్రష్ట మాత్రం శాశ్వతం కదా! అట్లాగే ఏ ఉపాధీ శాశ్వతం కాదు. ఉపాధులద్రష్టగా తానుమాత్రం శాశ్వతం!
శ్రీరాముడు : ఈ జనన మరణాలు జీవుని పట్ల ఎందుకు ఏర్పడుచున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్య వలన జీవుడు ప్రతిభాసను గాంచుచున్నాడయ్యా! నిజానికి జన్మించటం, మరణించటం కూడా వాస్తవములు కావు.
శ్రీరాముడు : మరణానంతర ప్రతిభాస కూడా ఈ జీవించి ఉన్నప్పటి ప్రతిభాస వంటిదేనా?… ఆ రెండిటికీ గల సంబంధమేమిటి? విభేదమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : మరణానంతర ప్రతిభాస ఈ దేహం ఉన్నప్పటి వంటి ప్రతిభాస వంటిది కాదు. ఎందుకంటే ఈ దేహం ఉన్నప్పుడు జీవుడు బాల్య యౌవన - వార్ధక్యములు తదనుగుణమైన
Page:185
సంబంధ బాంధవ్యములు, అనుభవములు పొందుతున్నాడు కదా! అవన్నీ కాలానుగతంగా కాలబద్దమై ఏర్పడుతున్నాయి.
ఇక మరణాంతర ప్రతిభాసకు వస్తే … ఆ స్థితి కాలబద్ధమైనది కాదు. కానీ వాసనాబద్ధమైనది. వాసనలు శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు ఈ జీవుని ప్రభావితం చేస్తూ తదనంతర స్థితిగతులను నిర్ణయిస్తున్నాయి. అనగా “మరొక శరీరం పొందటం” అనేది కేవలం వాసనలవలననే జరుగుతోంది గాని, కాలం వలన జరగటం లేదు.
అలాగే స్వప్నమునకు -– జీవజాగ్రత్ జగత్తుకు మరొక తేడా ఉన్నది. స్వప్నంలో చూడబడుచున్న జగత్తు ఆ సమయమందలి ఊహ - - వాసనల సమ్మేళనముచే ఏర్పడుచున్నది. ఆ స్వప్నంలోంచి ఆ స్వప్న ద్రష్ట అటు ‘గాఢనిద్ర’ అను జడస్థితికో, (లేక) ‘మెళుకువ’ అను జాగ్రత్తికో పయనించి అప్పటి వరకూ గాంచుచున్న స్వప్నాన్ని అంతటితో అక్కడే త్యజిస్తున్నాడు. అది ఊహ యొక్క రాక పోకల వంటిది.
ఇక… జాగ్రత్ విషయానికి వస్తే… ఆ జీవుడు అనంతకాలంనుండి కలిగి ఉంటున్నట్టి వాసనలలో ఏవేవైతే మరణసమయంలో గోచరమౌతాయో… అవి భావి శరీరానికి కారణమౌతున్నాయి. శ్రీరాముడు : మరణ సమయంలో గోచరించే వాసనలకు ఏదైనా ప్రత్యేకమైన కారణమున్నదా? శ్రీవసిష్ఠ మహర్షి : అట్టి మృత్యు సమయ వాసనాదార్ధ్యం అనేదానికి కారణం అనేక జన్మ పరంపరల అభ్యాసమేగాని … దానికి మరొకటేదీ కారణం కాదు. జీవితాంతం ఆశ్రయిస్తూ వస్తున్న వివశత వలన “నేను అస్వాతంత్రుడను" అనే భావన గట్టిపడి అది పునర్జన్మకు మూలకారణమౌతోంది. శ్రీరాముడు : తండ్రీ! మరి అందుకు ఉపాయమేమిటి? ఇక గత్యంతరం లేదా? ఈ జన్మ మృత్యు పునర్జన్మల పంజరంలో జీవుడు కొట్టుకుంటూ ఉండాల్సిందేనా?
శ్రీవసిష్ఠ మహర్షి : మార్గాంతరం (గత్యంతరం) ఎందుకు లేదు? ఉండబట్టే మనం ఈ సంవాదమునకు ఉద్యుక్తులమయ్యాం కదా! శాస్త్రాలు ఈ జీవునకు కొన్ని మహావాక్యాలు ప్రసాదిస్తున్నాయి. (అహమ్ బ్రహ్మాం స్మి…తత్త్వమ్… సోహమ్… సర్వమ్ ఖల్విదమ్ (బ్రహ్మ) ఇట్టి మహావాక్యార్థం యొక్క నిరంతర మననం వలన “ నేను అఖండ-అప్రమేయమైన బ్రహ్మాన్ని; సర్వతత్వ స్వరూపుడను” …అను సదవగాహన సుస్థిరమౌతుంది. అదే బ్రహ్మభావన. దానిని బ్రహ్మసాక్షాత్కారం అని కూడా పిలుస్తున్నారు.
అట్టి బ్రహ్మభావన మాత్రం వాసనామయస్వప్నం వంటిది కాదు. దానినే వివిధ శాస్త్రాలు “చిత్బ్రహ్మము, శివము, అద్వైతము, చతుర్థము” మొదలైన శబ్దములతో ప్రవచిస్తున్నాయి. ఆ చిత్ భగవానుడు ”తత్ జాగ్రత్“ దృష్టిచే, లేక, “తురీయ దృష్టి” చేత గాంచబడుచున్నాడు.
ఓ రాఘవా! ఇక్కడ ఏ జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు కనిపిస్తున్నాయో… ఇవన్నీ ఆ బ్రాహ్మీ స్థితి సముపార్జించిన యోగి దృష్టిలో లేవు. అందుచేత ఆ మూడిటిచే ఆతడు లభ్యుడు, అనుభవ గమ్యుడు కాడని గ్రహించు. అట్టి మహనీయుడు వాసనారహితుడవటంచేత ఆతడు వాసనా సహితులగు వారిచే గుర్తించబడుట లేదు.
Page:186
ఈ కనబడే జీవులంతా కూడా అట్టి నిర్మల, నిరంజన చైతన్యమేగాని మరింకొకటేదీ కాదు. అట్టి అద్వితీయుడగు చిదాత్మయే ఇక్కడ మనకు జీవుడుగా ప్రకటితుడగుచున్నాడు. తన యొక్క చిత్స్వభావం వల్ల ఇక్కడ పూర్వపు “దృష్ట - అదృష్ట” వస్తువులను విషయాలను గుర్తు ఉండి, గుర్తు లేక కూడా స్వప్నమునందు లాగా గాంచుచున్నాడు.
నిరంతర భావనాపరంపరల విశేషం చేత ఈ సంసారజీవునికి ఇంతవరకూ చూడబడిన విషయాలు, అభిప్రాయాలు, అనుభవాలు, అభిరుచులు క్రమంగా సన్నగిల్లి ఆ స్థానంలో కాలక్రమేణా కొత్తవి వచ్చి చేరుతున్నాయి. కొన్ని కొద్దికాలంలో లుప్తమైపోతున్నాయి. మరికొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి. జలంలో తరంగంలాగా పుట్టిన ప్రతిభావన ఒక రోజుకు లయించ వలసిందే! కానీ ఇంతలో నూతన తరంగంలాగా వాసనానుసారంగా నూతన భావనలు వచ్చిపడుతున్నాయి. దీని కంతటికీ ఒక క్రమముగాని, నియమము గాని ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే, అవన్నీ ఆపాదితాలైనవే కదా! పైగా, పురుష ప్రయత్నం వాసనలను జయించగలుగుతుంది - అని మనం అనుకున్నాం కదా!
ప్రాక్తనీ వాసనాద్యాపి, పౌరుషేనైవ జీయతే |
హ్యః కుకర్మాద్యయత్నేన ప్రయాతి హి సుకర్మతామ్ ||
నిన్న చేయబడిన ఒక అపక్రమమైన కార్యము ఈ రోజు ఆచరించబడే సుకర్మయొక్క ప్రభావంచేత సక్రమమమైపోగలదుగా! ఉత్తమ ప్రయత్నశీలురు వాసనలు తప్పక జయించగలుగుతారు.
ఈ జీవుడు, దేహము మొదలైనవన్నీ వాసనల యొక్క పరిణామమే సుమా! ఇవన్నీ ఉపశమించాలంటే ఉపాయం ఒక్కటే. ఆ ఉపాయము, లేక లక్ష్య స్థానమునకు శాస్త్రకారులు ‘మోక్షము’ అను పేరు పెట్టారు. మోక్షము అంటే ‘నేను - ఈ జగత్తు కూడా సర్వ వాసనలకు సంబంధం లేనట్టి అప్రమేయమగు శివము లేక ఆత్మత్తత్వమే’ అను అచంచల దృఢ నిశ్చయం.
మోక్షము లభించే వరకు ఈ జీవుడు - జన్మ - పునర్జన్మలు తప్పునవి కావు. ఈ ఇంద్రియములు - దేశకాలములు వికసించటం, ముకుళించటం మోక్ష పర్యంతమూ కొనసాగుతూనే ఉంటుంది. వాసనలు శేషించునంతవరకూ దీనిని నిరోధించటం ఎవరితరం కాదు. బాలుని స్వకీయ కల్పనలే భూతములను సృష్టిస్తున్నాయి. అట్లాగా, వాసనయే పంచభూత పరికల్పితమైన ఈ శరీరములను తోపింపజేస్తున్నాయి. శరీరంగా కల్పించబడుచున్న వాసనలు మోక్ష పర్యంతమూ ఉంటూనే ఉంటాయి.
‘పుర్యష్టకం’ అంటే ఏమిటి? ’మనస్సు, బుది, అహంకారము, పంచతన్మాత్రలు’ …అను వాటితో గూడిన ఆతివాహికమైన సూక్ష్మ శరీరమే కదా! అయితే, చిదాత్మ యొక్క స్వరూపం అమూర్తం (formless) - అపంచీకృతం (భూమి, అగ్ని మొదలైన పంచభూతములచే తయారు కాబడినది
కాదు) కూడా!
Page:187
ఈ భౌతికమైన ఆకాశం పంచీకృతం. చిత్యా? అది దేనితోనూ తయారుకాబడినది కాదు. ఈ జీవుని లింగదేహం (సూక్ష్మదేహం, అతివాహిక దేహం) భావనామయం మాత్రమే! అందులో పంచభూతాలు లేవు. కాల, ఆకాశాలు లేవు. కనుక మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో కూడిన సూక్ష్మదేహం కూడా అపంచీకృతమే!
శ్రీరాముడు :“మోక్షము” అనునది స్థూల దేహానికా? సూక్ష్మదేహానికా?
శ్రీవసిష్ఠ మహర్షి : స్థూలమైన దానికి ముక్తి లేదు. బంధమూ లేదు. అసలు ముక్తి అంటే ఏమిటని అనుకుంటున్నావ్? వైరాగ్యాదులు అభ్యసిస్తూ రాగా… కల్పనలన్నీ తొలగిపోతాయి. కల్పనలున్నది ఆతివాహిక (లేక, లింగ) దేహంలోనేగాని స్థూల దేహంలోకాదు. కల్పనలన్నీ అతిక్రమించబడగా నీ కల్పనారహిత స్వస్వరూపం నీకు అవగాహన కావటమే, అనుభవ లభ్యమగుచుండుటమే ముక్తి
మోక్షం కూడా! కల్పనలకు ఆది మూలము అయిన నీవే ఆ సద్వస్తువు కదా! జడ కల్పనలన్నీ స్వస్వరూపంలో విలీనమొనర్చబడగా అప్పుడు సుషుప్తినిబోలిన చైతన్యం యొక్క అనుభవమాత్రమైన ముక్తిస్థితి ఈ జీవునకు లభిస్తుంది.
చూచావా? అది లభించటం, లభించకపోవటం ఈ జీవుని చేతిలోనే ఉన్నది. ‘అది నాకెట్లా లభిస్తుంది? అది సులభమా?’ అనే మీమాంస ఈ జీవుడు ఎంతగా త్యజించవలసియున్నదో నీవు గమనిస్తున్నావు కదా!
స్వప్నంతో పోల్చతగ్గ ఈ సూక్ష్మ శరీరం మోక్షం లభించనంత వరకు స్థావర జంగమాత్మక యోనులలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఒకే దేహం ఒకప్పుడు జాగ్రత్ను, మరొకప్పుడు స్వప్నమును, ఇంకొకప్పుడు సుషుప్తిని పొందటం చూస్తూనే ఉన్నాం కదా! సుషుప్తిలో మనస్సు ఈ జాగ్రత్ - స్వప్నములను విలీనం చేసుకుని బీజభావమున దీపిస్తోంది.
స్థావరాది యోనులలో సుషుప్తి అత్యంత ఘనీభూతమై ఉన్నది. కించిత్ జాగ్రత్తో కూడి వృక్షయోనులలో కొంత తక్కువగా, కొంచెం ప్రబోధము ఉన్నది. అట్టి ప్రబోధం మనుష్యులలో మరింత జాగృతంగాను, ఉత్సాహంగాను ఉన్నది. సుషుప్తి కూడా కొంత చోటు చేసుకునియే ఉన్నది. అదియే గాఢనిద్రా పరవశస్థితి.
చిత్తము యొక్క జాడ్యప్రకర్షణయే సుషుప్తి… చిత్త భ్రమణమే సంసృతి… తత్వబోధయే విముక్తి.
ఇక తురీయావస్థ స్వస్వరూపమునందు జాగృత్ వంటిది - అని శాస్త్రములు మనకు బోధిస్తున్నవి. ఆత్మశాస్త్ర ప్రవచనముల ప్రబోధము వలన జీవుడు నిర్మలుడై విశుద్ధుడై ‘పరమాత్మ’ అగుచున్నాడు. జీవుడు స్వస్వరూపము విషయమై ప్రబోధితుడవటమే ముక్తి అని అనబడుతోంది. అట్టి ముక్తి జీవన్ముక్తి అని, విదేహముక్తి అని రెండు విధములుగా చెప్పబడుతోంది. దేహపరిమితమైన సర్వ స్పృహలు జయించి… అనంత దేహత్వము - సర్వ దేహాతీతత్వములను సంతరించుకున్నప్పటి నిశ్చల స్వస్వరూపానుభవమే విదేహ ముక్తిగా చెప్పుచున్నారు.
Page:188
ఏదైతే జాగృత్ - స్వప్న - సుషుప్తులలో మార్పు చేర్పులు లేక, నిర్విషయమై నిరాధారమై, అస్పృశ్యమై అనునిత్యం అనుశ్రుతంగా ప్రసరించి ఉన్నదో … అట్టి ఈ జీవుని వాస్తవ స్వరూపమును ’తురీయ’ మంటున్నారు. దానినే బోధ అని కూడా పిలుస్తున్నారు. తనను తాను తురీయముగా అవగాహన చేసుకొను అవస్థ తురీయావస్థ. తురీయావస్థ నుండి జీవుడు తురీయాతీతమును సంపాదించు కుంటున్నాడు. అదియే ’చిన్మాత్రము, బ్రహ్మ స్వరూపం పొందటం!’
బుద్ధి యొక్క పురుషకార ప్రయత్నము వలన “బోధ” లేక, “తురీయము” అనునవి లభించటం జరుగుతోంది. అట్టి పురుషకారబలంచేత, తత్త్వజ్ఞానబలం చేత పరమాత్మను గురించిన ప్రమాణములన్నీ ఈ శరీరము కలిగియున్నప్పుడే గ్రహించి తన్మయుడౌతున్నాడు. “ఇంతవరకు సత్యమని నమ్మిన శరీరములు - భయములు - అన్నీ కూడా దీర్ఘమైన స్వప్నవిభ్రమం" - అని గ్రహిస్తాడు.
ఎందుకంటే జీవుని అంతరమున చిత్కళ కాక మరింకేమీ లేదు. ఆ చిత్కళనే అన్యభావంగా గాంచి ఈ జీవుడు నిష్కారణంగా శోకిస్తున్నాడు. ఈ జీవునిలో ఆ పరమాత్మగాక ఇంకేమీ లేదు. ఇక, ఇక్కడ అక్కడ కనబడే జగత్తు ఏమిటంటావా?
యత్రయత్ర జగత్ దృష్టమ్, అహో! మాయావిజృంభితమ్! స్థాల్యన్తః క్వధత్ అంబూనాం, యథానానా భ్రమోదయః జీవాణూనాం తథైవాంతః మిథ్యా సంసరణోదయః బన్గోస్య - “వాసనాబద్ధో”, మోక్షస్యాతొ వాసనాలయః” II
ఇక్కడ ఏ ఏ జగత్తు కనబడుచున్నదో … ఇదంతా వాసనావిజృంభణము మాత్రమే. మూకుడులో మరుగుచున్న నీరు రకరకాల రూపవిన్యాసములను దాలుస్తూ కనబడుతుంది చూచావ్? అట్లా చిత్ చైతన్యము సంసారమునందు అనేకానేక జీవుల రూపంలో వారి అంతరంగముల రూపంలో కనబడుతోంది.
వాసనల చేతనే అట్లా కనిపిస్తోంది. జీవునకు వాసనా బంధమే బంధము. ఆ వాసనలు లయించుటయే మోక్షం. జడమగు సుషుప్తి వాసనలకు పరమావధి.
తురీయాతీతమో … వాసనారాహిత్యం …! జీవుని నిజస్వరూపం వాసనారహితమైన తురీయమే అయున్నది. అది మరచి వాసనల ననుసరించటం చేతనే స్వప్నంలోలాగా స్థావరాది వివిధ భావనలు జీవుడు పరిగ్రహిస్తున్నాడు.
వాసనలు తీవ్రంగా ఉన్నప్పుడు స్థావరయోనులు పొందుచున్నాడు. వాసనలు మధ్యస్థాయిలో ఉన్నప్పుడు జంతుయోనులను పొందుచున్నాడు. వాసనలు తక్కువగా ఉంటే మనుష్య, గంధర్వ రూపములు పొందుచున్నాడు.
వాసనల పెరుగు తరుగులే తదనంతర ఉపాధులను నిర్ణయిస్తున్నాయి. సుషుప్తి తొలగి, ఆపాదమస్తకం ప్రాణాహంకారము ప్రసరించినప్పుడు ‘నేను ఇట్టి శరీరమును కలిగి ఉన్నాను. ఇది నా బాహ్యమైన జగత్తు’ అను భావనకు బద్ధుడగుచున్నాడు.
Page:189
ఓ రామచంద్రా! ఇదంతా స్వప్నంలో కనిపించిన తటాకంలో జలతరంగం వంటిది మాత్రమే! వృత్తులచే వాస్తవానికి విచ్ఛిన్నుడు కానట్టి ఈ జీవుని అంతఃకరణం నుంచి కళ్ళు మొదలైన ఇంద్రియముల ద్వారా ‘ఎరుక’ అను స్రవంతి ఈ కుండ - - గోడ మొదలైన వస్తువులపై ప్రసరించి వాటిని ‘ఎరుగుట’ అను రసముతో నింపివేస్తోంది. అప్పుడు ‘గ్రహించునది - గ్రహించబడునది’ అను
రూపంలో వాసనల యొక్క సత్త విచిత్రంగా స్ఫురిస్తోంది.
ఇట్లు అంతఃస్థితమగు ఆత్మచైతన్యమే గ్రాహ్య - గ్రాహక - వాసనా రూపమున ‘దృశ్యము’ అనబడు మృగతృష్ణగా ప్రకాశిస్తోంది. సకల గ్రాహ్య - గ్రాహక సంబంధములు వాసనాధ్యస్తములైన భ్రమలు మాత్రమే. మరింకేమీ కాదు. ఇక ఈ దృశ్యము వాస్తవమెట్లా అవుతుంది చెప్పు? నిజానికి ఇక్కడ ఆత్మ గ్రహించునది గాని, త్యజించునది గాని ఏదీ లేదు. చిదాత్మ ఒక్కటే బయట - లోపల కూడా ప్రకాశిస్తోంది. ఈ త్రిజగత్తులు చిత్ చమత్కృతియే.
నిజంగా, అవలోకిస్తే సముద్రంలో తరంగాలు, సుడులు, బుడగలు, జలమునకు వేరుగా ఉన్నాయా? లేదు. సముద్రమంతా జలమయమే కదా! ఈ జగత్తునందు వాసనలు అవస్థలు దృష్టి యొక్క అవస్థలు మాత్రమే.
అనాద్యము, ఆద్యము కూడా అయినట్టి అయిన పరమపదమే ఇదంతానయ్యా!